భగవద్గీత

01. అర్జున విషాద యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Drutarashtra and Sanjaya

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

ధృతరాష్ట్ర ఉవాచ :-

01–01

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ॥

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।
మామకాః పాండవాః చ ఏవ కిం అకుర్వత, సంజయ! ॥

ప్రతి జీవుని హృదయ క్షేత్రమనతగినట్టి ధర్మక్షేత్రమగు కురుక్షేత్రంలో ధర్మ - అధర్మముల మధ్య యుద్ధ సన్నివేశము అనివార్యం అయింది. భీష్మ - ద్రోణ - విదురాదుల ధర్మప్రవచనాలు దుర్యోధనాదుల చెవులకు ఎక్కనేలేదు. శ్రీకృష్ణ భగవానుని హెచ్చరిక వాక్యాలు పెడచెవిన పడిపోయాయి. శ్రీకృష్ణపరమాత్మయే స్వయముగా అర్జునుని రథసారథ్యం వహించారు.

ధృతరాష్ట్రుడు :- ఓ సంజయా! ‘ధర్మక్షేత్రము’ అను అభివర్ణనముతో లోక ప్రసిద్ధమైయున్న కురుక్షేత్రంలో యుద్ధ సన్నద్ధులై సమావేశమయినట్టి మా వారు - ఆ పాండవులు ఏమేమి చేయబూనారో….. ఏమేమి విశేషాలు జరిగాయో, వివరించు.

(ఈ దేహము కూడా క్షేత్రమే! ఇక్కడి ధర్మ-అధర్మముల మధ్య సంఘర్షణయే ఉభయ సేనలలోని వీరుల వ్యవహార నామముల అర్థాలు కూడా!)

(ఆత్మజ్ఞానమును ఏమరచి గుడ్డిగా తాను కాని అనాత్మను “నేను - నాది” అని గట్టిగా పట్టుకున్నవాడు “ధృతరాష్ట్రుడు”. అటువంటి ధృతరాష్ట్రుడు మన అందరిలో కూడా ఉన్నాడు కదా!)


01–01
సంజయ ఉవాచ :-

01–02

దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ।
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ॥

దృష్ట్వా తు పాండవ అనీకం వ్యూఢం దుర్యోధనః తదా ।
ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమ్ అబ్రవీత్ ॥

సంజయుడు :- ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఉభయసేనలు యుద్ధ సన్నద్ధులు కాసాగారు. అప్పుడు మీ జ్యేష్ఠపుత్రుడు దుర్యోధనుడు పాండవుల సేనను, వారు మొహరించియున్న తీరును పరికించి చూచాడు. సాలోచనగా ద్రోణాచార్యులవారిని సమీపించి ఈ వచనములు పలికెను.
01–02


Duryodhana and Drona


మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

దుర్యోధన ఉవాచ :-

01–03

పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ ।
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ॥

పశ్య ఏతాం పాండుపుత్రాణామ్, ఆచార్య! మహతీం చమూమ్ ।
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ॥

దుర్యోధనుడు :-

ఆచార్యవర్యా! అటు చూస్తున్నారా! పాండు పుత్రులు పెద్ద సైన్యమునే సమకూర్చుకుని సమీకరించుకున్నారే! ద్రుపదనందనుడు, మీ శిష్యుడు అగు దృష్టద్యుమ్నుడు పాండవ సేనను గొప్ప వ్యూహంగా కూడా మొహరించాడు.

01–03
01–04

అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి ।
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ॥

అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి ।
యుయుధానో విరాటః చ ద్రుపదః చ మహారథః ॥

ఇంకా చూడండి! వారి సైన్యంలో భీమ - అర్జునులకు సరితూగగల వీరులు చాలామంది కనిపిస్తున్నారు. యుయుధానుడు (సాత్యకి), విరాటుడు, మహారథి అయినట్టి ద్రుపదుడు ఉన్నారు.
01–04,
01–05,
01–06
01–05

ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ ।
పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ॥

ధృష్టకేతుః చేకితానః కాశిరాజః చ వీర్యవాన్ ।
పురుజిత్ కుంతిభోజః చ శైబ్యః చ నరపుంగవః ॥

ధృష్టకేతు, చేకితానుడు, వీరప్రసిద్ధుడైనట్టి కాశీరాజు, పురజిత్తు, కుంతిభోజుడు, రాజశ్రేష్ఠుడుగా ప్రసిద్ధిగన్న శైబ్యుడు కూడా ఉన్నారు.
01–06

యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ।
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ॥

యుధామన్యుః చ విక్రాంత ఉత్తమౌజాః చ వీర్యవాన్ ।
సౌభద్రో ద్రౌపదేయాః చ సర్వ ఏవ మహారథాః ॥

మహాపరాక్రమవంతుడగు యుధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడైన అభిమన్యుడు, ద్రౌపది కుమారులైన పంచ ఉపపాండవులు ….. వీరంతా మహారథులే!
01–07

అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ॥

అస్మాకం తు విశిష్టా యే తాన్ నిబోధ, ద్విజోత్తమ! ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ॥

ఇక మనవైపు మహావీరుల గురించి చెప్పవలసివస్తే, …….
01–07
01–08

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః ।
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ॥

భవాన్ భీష్మః చ కర్ణః చ కృపః చ సమితింజయః ।
అశ్వత్థామా వికర్ణః చ సౌమదత్తిః తథా ఏవ చ ॥

మీరు, భీష్మాచార్యులు ఉండనే ఉన్నారు. మన కర్ణుడు, కృపాచార్యులు, సమితింజయుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తుడు మొదలైన వారంతా ఉన్నారు.

01–08,
01–09
01–09

అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః ।
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ॥

అన్యే చ బహవః శూరా మత్ అర్థే త్యక్తజీవితాః ।
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ॥

వీరేకాక ఇంకా ఎందరెందరో వీరాధి వీరులు - మహాశూరులు నాకొరకై తమ ప్రాణాలు అర్పించి మరీ…, సిద్ధపడి యుద్ధభూమికి వచ్చి నిలచియున్నారు.
01–10

అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ ।
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ॥

అపర్యాప్తం తత్ అస్మాకం బలం భీష్మ అభిరక్షితమ్ ।
పర్యాప్తం తు ఇదమ్ ఏత ఏషాం బలం భీమ అభిరక్షితమ్ ॥

ఏదైతేనేం! భీష్మ రక్షితమగు మనసేనను - భీమ రక్షితమగు పాండవసేనను పోల్చి చూస్తూ ఉంటే,…… వారి బలగాలు పరిమితమైయున్నట్లు, మన సైన్యం అపారంగాను కనిపిస్తున్నాయి.
01–10
01–11

అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః ।
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ॥

అయనేషు చ సర్వేషు యథా భాగమ్ అవస్థితాః ।
భీష్మం ఏవ అభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ॥

సరే! ఇక యుద్ధరంగం సిద్ధమైనట్లే! మీరంతా కుడా యుద్ధవ్యూహానుసారంగా మీ మీ నియమిత స్థానములలో సంసిద్ధులవండి. మన సేనానాయకులగు భీష్మాచార్యుల వారికి అన్నివైపులనుండి సంరక్షకులై ఉండండి.

01–11
Warriors blowing their conches

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

సంజయ ఉవాచ :-

01–12

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః ।
సింహనాదం వినద్యోచ్చ్యైః శంఖం ధధ్మౌ ప్రతాపవాన్ ॥

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః ।
సింహనాదం వినద్య ఉచ్చ్యైః శంఖం ధధ్మౌ ప్రతాపవాన్ ॥

సంజయుడు :-

అప్పుడు కురువృద్ధులు, అమిత పరాక్రమవంతులు అగు భీష్మాచార్యులు దుర్యోధనునికి, తదితరులకు ‘ఉత్సాహం’ కలిగించే నిమిత్తం తమ యుద్ధ శంఖం పూరించారు.

01–12,
01–13
01–13

తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః ।
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ॥

తతః శంఖాః చ భేర్యః చ పణవానకగోముఖాః ।
సహసా ఏవ అభ్యహన్యంత స శబ్దః తుములో అభవత్ ॥

వెనువెంటనే అనేక శంఖాలు, భేరీలు, డోళ్ళు, మృదంగాలు మార్మ్రోగాయి. ఆ శబ్దాలు దిక్కులంతా విస్తరించాయి.
01–14

తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ ।
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ॥

తతః శ్వేతైః హయైః యుక్తే మహతి స్యందనే స్థితౌ ।
మాధవః పాండవః చ ఏవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ॥

అది విని తెల్లటి గుఱ్ఱములు పూన్చబడ్డ రథం అధిరోహించిన పార్థుడు, పార్థసారధి శ్రీకృష్ణుడు తమ దివ్య శంఖములను పూరించారు.
01–14,
01–15,
01–16,
01–17,
01–18,
01–19
01–15

పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః ।
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ॥

పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః ।
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ॥

హృషీకేశుడు (శ్రీకృష్ణుడు) ‘పాంచజన్యం’ పూరించారు. ధనంజయుడు ‘దేవదత్తం’ పూరించసాగారు. అప్పుడిక తదితర వీరులంతా తమ తమ శంఖాలు పూరించనారంభించారు. భీమకర్మ బిరుదాంకితుడగు భీమసేనుడు తన ‘పౌండ్రము’ అనే పేరుగల శంఖం పూరించారు.
01–16

అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ॥

అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
నకులః సహదేవః చ సుఘోషమణిపుష్పకౌ ॥

యుధిష్ఠిరుడు ‘అనంతవిజయము’ అనే శంఖం పూరించారు.
01–17

కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః ।
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ॥

కాశ్యః చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః ।
ధృష్టద్యుమ్నో విరాటః చ సాత్యకిః చ అపరాజితః ॥

శ్రేష్ఠ ధనుర్ధారుడగు కాశీరాజు, మహారథియగు శిఖండి, పాండవ సేనాధ్యక్షుడగు ధృష్టద్యుమ్నుడు, విరాటరాజు, పరాజయం ఎరుగని సాత్యకి తమ తమ శంఖాలు పూరించారు.
01–18

ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే ।
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ॥

ద్రుపదో ద్రౌపదేయాః చ సర్వశః పృథివీపతే ।
సౌభద్రః చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ॥

ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులగు పంచ ఉపపాండవులు, మహాపరాక్రమవంతుడుగా అభివర్ణించబడే సుభద్రా పుత్రుడగు అభిమన్యుడు, ….. ఒకరి తరువాత ఒకరుగా, ఒకేసారిగా కూడా తమ తమ శంఖాలు పూరించారు.
01–19

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ ।
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ॥

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ ।
నభః చ పృథివీం చ ఏవ తుములో వ్యనునాదయన్ ॥

ఆ శంఖనినాద శబ్ద తరంగాలు భూమిని, ఆకాశాన్ని పూరించివేశాయి. ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు జనించిన ధ్వని-ప్రతిధ్వని తరంగాలు మీ సైన్యంలోని వారందరి హృదయాలను కంపింపజేశాయి. ఉభయ సేనలలోని వీరుల శంఖారావాలతో అక్కడి దిక్కులు పిక్కటిల్లాయి.
01–20

అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ।
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ॥

అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ।
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనుః ఉద్యమ్య పాండవః ॥

ఇక కొద్ది సమయంలో యుద్ధం ప్రారంభం కాబోతోంది.

01–20,
01–21,
01–22,
01–23
01–21

హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే ।

హృషీకేశం తదా వాక్యం ఇదమ్ ఆహ, మహీపతే! ।

అప్పుడు అర్జునుడు, శ్రీకృష్ణునితో ఇట్లు పలికాడు.
Arjuna asks Krishna to place the chariot between the two armies

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

01–21

సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ॥

సేనయోః ఉభయోః మధ్యే రథం స్థాపయ మే, అచ్యుత! ॥

అర్జునుడు :-

కృష్ణా! ఉభయ సేనల మధ్య రథం నిలపండి!

01–20,
01–21,
01–22,
01–23
01–22

యావదేతాన్ నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ ।
కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే ॥

యావత్ ఏతాన్ నిరీక్షే అహం యోద్ధుకామాన్ అవస్థితాన్ ।
కైః మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే ॥

నేను ఎవరెవరితో యుద్ధం చేయబోతున్నానో కౌరవ - పాండవులకు తోడుగా ఏ ఏ రాజులు యుద్ధభూమికి వచ్చియున్నారో వారందరినీ ఒకసారి కలియచూద్దాం!
01–23

యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః ।
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః ॥

యోత్స్యమానాన్ అవేక్షే అహం య ఏతే అత్ర సమాగతాః ।
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః ॥

ఎవరెవరు సమావేశమైనారో, దుర్బుద్ధితో కూడిన ధార్తరాష్టృలకు సహకరించాలని ఎవరెవరు వచ్చారో ఒక్కసారి గమనిద్దాం.
సంజయ ఉవాచ :-

01–24

ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత ।
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ॥

ఏవమ్ ఉక్తో హృషీకేశో గుడాకేశేన, భారత! ।
సేనయోః ఉభయోః మధ్యే స్థాపయిత్వా రథ ఉత్తమమ్ ॥

ఉభయ సేనల మధ్య కొంచెము ఎత్తైన ప్రదేశములో తెల్లటి గుఱ్ఱములు కూర్చిన ఉత్తమమైన రథమును శ్రీకృష్ణుడు నిలిపెను.
01–24,
01–25
01–25

భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ ।
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ॥

భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీ ఈక్షితామ్ ।
ఉవాచ, “పార్థ! పశ్య ఏతాన్ సమవేతాన్ కురూన్” ఇతి ॥

శ్రీకృష్ణుడు, ‘‘అర్జునా ! నీవు కోరినట్లు ఇక్కడ సమావేశమైన రెండు సేనల మధ్య రథము నిలిపాను. ఇక యుద్ధసన్నద్ధులైన కురువీరులందరినీ పరికించి చూడవచ్చు’’ …. అని చెప్పారు. అర్జునుడు యుద్ధభూమి యొక్క నలువైపులా పరికించి చూచారు. ఎదురుగా భీష్మ-ద్రోణులు కనిపించారు.
01–26

తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ ।
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ॥

తత్ర అపశ్యత్ స్థితాన్ పార్థః పితౄన్ అథ పితామహాన్ ।
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ తథా ॥

అంతే కాకుండా అటు-ఇటు తండ్రులు, తాతలు, ఆచార్యులు, మేనమామలు, సోదరులు, కొడుకులు, మనుమలు, స్నేహితులు ….. అంతటా యుద్ధ సంసిద్ధులై కనిపించారు.
01–26.
01–27,
01–28
01–27

శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి ।
తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ ॥

శ్వశురాన్ సుహృదః చ ఏవ సేనయోః ఉభయోః అపి ।
తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ ॥

మరియు పిల్లను ఇచ్చినవారు, ఆత్మీయులు ఇరు ప్రక్కలా కనిపిస్తున్నారు. “వీరు అందరూ నా సంబంధీకులే! నా బంధువులే!” అని తలచుచు ఉండగా అర్జునుని మనస్సును ఆ యుద్ధ సన్నివేశ దృశ్యం కలచివేసింది.
Arjuna laments

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

01–28

కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ ।

కృపయా పరయా ఆవిష్టో విషీదన్ ఇదం అబ్రవీత్ ।

అర్జునుని గుండె బరువెక్కింది. ‘‘అయ్యో ! ఏమిటి ఇదంతా?’’ అని నిరుత్తరుడయ్యాడు. విషణ్ణ వదనుడయ్యాడు. శ్రీకృష్ణ భగవానునితో ఇట్లా పలకసాగారు.
01–26.
01–27,
01–28
అర్జున ఉవాచ :-

01–28

దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ॥

దృష్ట్వా ఇమం స్వజనం, కృష్ణ! యుయుత్సుం సముపస్థితమ్ ॥

అర్జునుడు :-

హే శ్రీకృష్ణా! ఇక్కడంతా నాకు నా స్వజనులే అన్నివైపులా కనిపిస్తున్నారయ్యా! అటూ-ఇటూ అంతా మావారే! యుద్ధమునకు తరలివచ్చినట్టి మావైపు - వారివైపు వారంతా మా మా బంధువులే! మా సంబంధీకులే!
01–29

సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ।
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ॥

సీదంతి మమ గాత్రాణి, ముఖం చ పరిశుష్యతి ।
వేపథుః చ శరీరే మే, రోమహర్షః చ జాయతే ॥

వీరందరినీ చూస్తుంటే నా అంగములు కృంగిపోతున్నాయి. నోరు ఎండి మాటలు పెగలటం లేదు. శరీరం కంపిస్తోంది. వెంట్రుకలు ఆవేదనతో నిక్కబొడుస్తున్నాయి.
01–29
01–30

గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే ।
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ॥

గాండీవం స్రంసతే హస్తాత్, త్వక్ చ ఏవ పరిదహ్యతే ।
న చ శక్నోమి అవస్థాతుం, భ్రమతి ఇవ చ మే మనః ॥

గాండీవం చేతిలోంచి జారిపడుతోంది. నా చర్మమంతా విపరీతంగా దహించివేస్తోంది. నేను ఏ మాత్రం ఇక్కడ నిలబడలేకపోతున్నానయ్యా! నా మనసంతా అనేక భ్రమలకు లోను అవుతోంది.
01–30,
01–31
01–31

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ ।
న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ॥

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని, కేశవ! ।
న చ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజనం ఆహవే ॥

నాకు అంతటా - అన్నివైపులా అనేక దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. ఈ మా అయినవాళ్లనంతా చంపి మేము పొందే శ్రేయస్సు ఏమిటో - నాకైతే ఏమీ అర్థం కావటమూ లేదు, ఏ శ్రేయస్సు కనిపించటమూ లేదు.
01–32

నా కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ।
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ॥

నా కాంక్షే విజయం, కృష్ణ! న చ రాజ్యం సుఖాని చ ।
కిం నో రాజ్యేన, గోవింద! కిం భోగైః జీవితేన వా ॥

నేను ఎవరిపై ఎవరికోసం గెలవాలి? గెలిచి ప్రయోజనం ఏమిటి? ఈ గెలుపు, ఈ రాజ్యం, ఈ సుఖాలు ఎవరికి కావాలి? నాకేం అక్కరలేదు. యుద్ధం చేసి రాజ్యం సంపాదిస్తే ఆ సంపదలు, ఆ సుఖాల జీవితం వలన నాకేమి లాభం?
01–32,
01–33,
01–34,
01–35
01–33

యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ ।
త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ

యేషాం అర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ ।
త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ ॥

ఎవ్వరికోసమైతే నేను రాజ్య భోగాలు, సుఖాలు కోరుకొంటానో …. అట్టి పుత్ర-మిత్ర తదితర బంధు జనమంతా తమ తమ ధన-మాన-ప్రాణాలు వదలుకొని యుద్ధభూమికి వచ్చి, యుద్ధంలో పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నారే!
01–34

ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః ।
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ॥

ఆచార్యాః పితరః పుత్రాః తథా ఏవ చ పితామహాః ।
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినః తథా ॥

అటు చూడండి. నా గురుదేవులగు ద్రోణాచార్యులు, నా తండ్రులు, నా కుమారులు, తాత భీష్మాచార్యులు, మేనమామలు, నాకు పిల్లనిచ్చిన మామలు, మనుమలు, బావమఱుదులు …. తదితర నా బంధువులు… అంతా ఇక్కడ యుద్ధరంగంలోనే కనిపిస్తున్నారు.
01–35

ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోఽసి మధుసూదన ।
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ॥

ఏతాన్ న హంతుమ్ ఇచ్ఛామి ఘ్నతో అసి, మధుసూదన! ।
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే? ॥

01–36

నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన ।
పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ॥

నిహత్య ధార్తరాష్ట్రాన్ నః కా ప్రీతిః స్యాత్, జనార్దన! ।
పాపమ్ ఏవ ఆశ్రయేత్ అస్మాన్ హత్వ ఏతాన్ ఆతతాయినః ॥

మా పెదతండ్రి కుమారులగు ఈ ధృతరాష్ట్ర పుత్రులను చంపి నేను ఎవరికి ప్రీతి కలిగిస్తున్నట్లు? పైగా, వీరంతా పంచమహాపాతకాలకు ఒడిగట్టినవారు. వీరిని చంపితే వీరి పాపాలన్నీ మేము మూటగట్టుకోవటమే అవుతుంది కదా!
01–36,
01–37
01–37

తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ ।
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ॥

తస్మాత్ న అర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ ।
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ? మాధవ! ॥

అయినా కూడా వీరంతా మాకు బంధువులేనాయె! మా వారినంతా చంపి మేము సుఖాలు పొందాలనుకోవటం ఎంత నీచమైన, విపరీతమైన విషయం!
01–38

యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః ।
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ॥

యది అపి ఏతే న పశ్యంతి లోభ ఉపహత చేతసః ।
కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ॥

ఓ జనార్దనా! ఆ ధార్తరాష్ట్రులు లోభముచేత, మలినమైన బుద్ధి కలవారై వంశనాశనము - మిత్రద్రోహము వంటి దుష్టకార్యముల పర్యవసానమేమిటో గమనించక యుద్ధం చేయాలని తహతహపడుచూ తయారై ఉండవచ్చు గాక!
01–38,
01–39
01–39

కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ ।
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ॥

కథం న జ్ఞేయం అస్మాభిః పాపాత్ అస్మాత్ నివర్తితుమ్ ।
కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిః, జనార్దన! ॥

ఈ పాపమునుండి మేమెందుకు విరమించకూడదు? లోకమంతా మేమేదో మంచివారమని ప్రశంసిస్తోంది కదా! మేము లోభమునకు, వంశ నాశనమునకు - మిత్ర ద్రోహమునకు సిద్ధం ఎందుకవ్వాలి? ఏది తప్పో - ఏది ఒప్పో గమనించి ఈ యుద్ధము నుండి విరమించవచ్చునే!
01–40

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ।
ధర్మే నష్టే కులం కృత్స్నమ్ అధర్మోఽభిభవత్యుత ॥

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ।
ధర్మే నష్టే కులం కృత్స్నమ్ అధర్మో అభిభవతి ఉత ॥

ఒకవేళ ఇది మన రాజ ధర్మం అంటావేమో? ఈ యుద్ధము జరిగిందా …. వంశనాశనం, కులక్షయం తప్పదు కదా! కులక్షయంతో, సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న కుల ధర్మాలు, జాతి ధర్మాలు మంట కలిసిపోతాయి! కుల-జాతి ధర్మాలు నశిస్తే ఇక మిగిలిపోయి ఉన్నవారంతా అనేక దోషములు పొంది, తద్వారా లోకమంతా అధర్మము ప్రకోపించదా చెప్పు?
01–40,
01–41,
01–42,
01–43,
01–44
01–41

అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ।
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ॥

అధర్మా అభిభవాత్, కృష్ణ! ప్రదుష్యంతి కులస్త్రియః ।
స్త్రీషు దుష్టాసు, వార్ష్ణేయ! జాయతే వర్ణసంకరః ॥

అధర్మము ప్రబలటం చేత కులస్త్రీలంతా చెడిపోతే లోకమంతా వర్ణసంకరం కాక మరింకేమున్నది?
01–42

సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ ।
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ॥

సంకరో నరకాయ ఏవ కులఘ్నానాం కులస్య చ ।
పతంతి పితరో హి ఏషాం లుప్త పిండ ఉదక క్రియాః ॥

అట్టి వర్ణసంకరము, వంశనాశనమునకు ఒడిగట్టిన మేమంతా నరకానికి త్రోవ కట్టక మానము కదా! అప్పుడు మా పితృదేవతలు శ్రాద్ధ - తర్పణములు పొందకపోవటంచేత అధోగతి పాలు కానున్నారే!
01–43

దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ।
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ॥

దోషైః ఏతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ।
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాః చ శాశ్వతాః ॥

ఈ విధంగా వర్ణసంకరం చేత వంశపారంపర్యంగా వస్తున్న కుల ధర్మాలు, జాతి ధర్మాలు నశించిపోతాయి కదా!
01–44

ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన ।
నరకేఽనియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ॥

ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం, జనార్దన! ।
నరకే అనియతం వాసో భవతి ఇతి అనుశుశ్రుమ ॥

అట్టి ధర్మాలు నశించినప్పుడు అందుకు కారణమైన మేము, మా పితృ దేవతలు అతి దీర్ఘకాలం నరక లోక వాసులు కావటం తప్పదని పెద్దలు అనగా, పురాణాలు చెప్పగా విని ఉన్నాం కదా! అందుచేత ధర్మము దృష్ట్యా చూచినా కూడా, మేము యుద్ధము చేయకపోవటమే ఉచితం.
01–45

అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ ।
యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ॥

అహో! బత! మహత్ పాపం కర్తుం వ్యవసితా వయమ్ ।
యత్ రాజ్య సుఖ లోభేన హంతుం స్వజనమ్ ఉద్యతాః ॥

ఆహాఁ! ఇప్పుడిదంతా గమనించాను కాబట్టి సరిపోయింది కాని, …. లేకపోతే త్రుటిలో ఎన్ని దోషాలు జరుగబోయేవో కదా! అరెఁ! ఇదంతా తర్కించుకోకుండా నేను ఎట్లా యుద్ధమునకు సిద్ధమయ్యాను? ఎంత పాపకార్యానికి ఒడిగట్టాను! ఇంతకూ, రాజ్యలోభం చేతనా, మేము ఇంతకు సిద్ధపడినది?
01–45,
01–46,
01–47
01–46

యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః ।
ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ ॥

యది మామ్ అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ।
ధార్తరాష్ట్రా రణే హన్యుః తత్ మే క్షేమతరం భవేత్ ॥

అయినదేమో అయింది. ఈ ఆయుధాలు వద్దు, నాకీ యుద్ధం వద్దు. నేను ప్రతీకారం వదలి ఆయుధాలు విసర్జించడం చేత, … ఆయుధధారులైన ఆ ధృతరాష్ట్ర పుత్రులు నన్ను అంతం చేయటం ఒకవేళ జరిగితే, … నాకు యుద్ధం కన్నా వారి చేతులలో అటువంటి మరణమే మంచిదని అనిపిస్తోంది! నా బంధువుల మారణహోమానికి బదులు నేను మరణించడమే మంచిది కదా!
సంజయ ఉవాచ :-

01–47

ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థే ఉపావిశత్ ।
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ॥

ఏవం ఉక్త్వా ఆర్జునః సంఖ్యే రథ ఉపస్థే ఉపావిశత్ ।
విసృజ్య సశరం చాపం శోక సంవిగ్నమానసః ॥

సంజయుడు :-

ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ అర్జునుడు ఇట్లా పలికి రథంలో చతికిలబడి కూర్చుండిపోయాడు. చేతిలో ఉన్న ధనుర్బాణాలు జారవిడిచాడు. ఆతని మనస్సు కకావికలమై, ఆతని ముఖమును దుఃఖము ఆక్రమించివేసింది. విషణ్ణమైన వదనంతో దిగాలుపడుతూ ఉండిపోయాడు.

ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … అర్జునవిషాద యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏