భగవద్గీత

04. జ్ఞాన యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Krishna instructing Arjuna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

04–01

ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ ।
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ॥

ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమ్ అవ్యయమ్ ।
వివస్వాన్ మనవే ప్రాహ, మనుః ఇక్ష్వాకవే అబ్రవీత్ ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

ఓ అర్జునా! సర్వకర్మలు ‘‘నాయొక్క నియమిత ధర్మానుకూలమేనా? కాదా?’’ అని పరీక్షించుకుంటూ, ఆయా సర్వకర్మలను దేహమును ప్రసాదించి సంరక్షిస్తున్న దేవతలకు ఆనందకరంగా సమర్పించటం’’ - ఇదియే కర్మమార్గం.

సర్వాత్మకుడగు సర్వేశ్వరునికి సమర్పణ పూర్వకంగా ఆశ-నిరాశ-మమకారం-అహంకారములు లేనివాడవై, ఎట్టిమానసిక వేసట లేకుండా భగవత్‌సేవా పుష్ప సమర్పణగా స్వధర్మములను నిర్వర్తించటం ’కర్మమార్గం’అని నిర్వచించుకున్నాము కదా! యోగస్థుడవై నిర్వర్తించే కర్మలు నీకు మోక్షమార్గాలు కాగలవు.

ఇట్టి కర్మయోగ - మోక్ష మార్గమును సృష్టి ప్రారంభంలోనే సూర్యభగవానునికి బోధించాను. సూర్యభగవానుడు మానవజాతి యొక్క మనుగడ - ప్రవర్తనా విధానములను సశాస్త్రయుక్తంగా గ్రంథస్థం చేయ సిద్ధమౌచున్న మనువునకు బోధించియున్నారు. మనువు ప్రజాపాలకుడగు ‘ఇక్ష్వాకుడు’ అనే రాజర్షికి బోధించారు.

04–02

ఏవం పరమ్పరాప్రాప్తమిమం రాజర్షయో విదుః ।
స కాలేనేహ మహతా యోగో నష్టః పరన్తప ॥

ఏవం పరమ్పరా ప్రాప్తమ్ ఇమం రాజర్షయో విదుః ।
స కాలేన ఇహ మహతా యోగో నష్టః, పరంతప! ॥

ఇట్లా ఈ కర్మయోగం కాలానుగతంగా ఒకానొక పరంపరగా బోధింపబడుతూ రాగా రాగా, కాలక్రమేణా, అద్దానిని అనేకమంది రాజర్షులు గ్రహించి ఆచరించి చూపటం … జరుగుతూ వచ్చింది.

అయితే కాల చమత్కారం చేత క్రమంగా కర్మయోగ పాఠ్యాంశమైనట్టి ’‘స్వధర్మమును శ్రద్ధగా నిర్వర్తించి మోక్షమార్గం సుగమం చేసుకొనుట’’ను జనులు ఏమఱుస్తూ వస్తున్నారు. కర్మల ప్రయోజనంగా ఆత్మోన్నతిని పొందవలసినది పోయి, కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యాదులచే ప్రభావితులై దుఃఖితులు అవటం జరుగుతోంది.

04–03

స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః ।
భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ॥

స ఏవ అయం మయా తే అద్య యోగః ప్రోక్తః పురాతనః ।
భక్తో అసి మే సఖా చ ఇతి, రహస్యం హి ఏతత్ ఉత్తమమ్ ॥

అందుచేత పురాతన కాలంలో నాచే సూర్యభగవానునికి బోధించబడిన ఉత్తమమైన కర్మయోగ విశేషాలను, రహస్యాలను కర్మయోగ మార్గంగా మోక్ష సముపార్జన విశేషాన్ని - ఈ రోజు నాకు భక్తుడవు, సఖుడవు అగు నీకు కూడా చెప్పుచున్నాను. ఈ మన గీతా గానము ద్వారా మరల లోకములకు బోధించటం జరుగుతోంది.

అర్జున ఉవాచ :-

04–04

అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః ।
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ॥

అపరం భవతో జన్మ, పరం జన్మ వివస్వతః ।
కథం ఏతత్ విజానీయాం త్వమ్ ఆదౌ ప్రోక్తవాన్ ఇతి ॥

అర్జునుడు :

సూర్య భగవానునికి మీరు బోధించారా?

స్వామీ! ఒక్క నివిుషం! ఒక చిన్న ప్రశ్న!

🙏 మీరు …. కొన్ని సంవత్సరముల క్రితం భూమిపై జన్మించియున్నారు.
🙏 ఇక సూర్య భగవానుడు …. కొన్ని వేల - లక్షల ఏళ్ళ క్రితం నుండియే ఆకాశంలో ప్రకాశిస్తున్నారు.
🙏 ‘‘ఆ సూర్యభగవానునికి నేను కర్మయోగ రహస్యాలు మొట్టమొదటే బోధించాను’’ …. అనే మీ వాక్యం నేను ఎట్లా సమన్వయించుకోవాలో …. అది గమనించలేకపోతున్నాను. అర్థం చేసుకోలేకపోతున్నాను.

శ్రీ భగవాన్ ఉవాచ :-

04–05

బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున ।
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరన్తప ॥

బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ, అర్జున! ।
తాని అహం వేద సర్వాణి, న త్వం వేత్థ పరంతప! ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

ఓ అర్జునా! నా యొక్క సత్‌ - చిత్‌ తత్త్వం ఈ దేహంతోనే ప్రారంభమైనదని అనుకుంటున్నావా? కానే కాదు. నాకు అనేక దేహాలు వచ్చాయి. పోయాయి. నాకే కాదు. నీకు కూడా ఈ నీ వర్తమాన దేహం కంటే ముందు అనేక దేహాలు జనించి - గతించి ఉన్నాయి. (అట్లాగే, ప్రతి ఒక్క జీవునికి!)

‘దేహ - దేహానంతరములు’ అనే మాయకు ఆవల ఉండి నేను దేహముల రాక-పోకలను దర్శిస్తూ ఉండటం చేత, మాయచే కల్పించబడే ఈ దేహాలన్నీ నేను ఎఱుకయందు కలిగియే ఉన్నాను. ‘వర్తమాన దేహ తదాత్మ్యము’ అనే మాయయందు నీ దృష్టి పరిమితమవటం చేత …. అవన్నీ నీవు గమనించలేక పోతున్నావు. దృష్టిలో పెట్టుకోలేక పోతున్నావు. అంతమాత్రమే ఇదంతా!

04–06

అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ ।
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ॥

అజో అపి సన్ అవ్యయాత్మా భూతానామ్ ఈశ్వరో అపి సన్ ।
ప్రకృతిం స్వామ్ అధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా ॥

వాస్తవానికి నాకు జన్మలే లేవు. జన్మలకంటే మునుముందుగా జన్మించువాడు ఉండాలి కదా? లేకపోతే జన్మలు ఎవరికి? ఈ జన్మల ప్రహసనం యొక్క ప్రారంభానికి మునుముందుగా ఏర్పడి ఉండే ఆత్మ స్వరూపుడను నేను.

అనగా, జన్మ - కర్మలచే మార్పు - చేర్పులు పొందని అవ్యయమగు ఆత్మను.

ఇక నాకు ఈ దేహాలు ఎట్లా ఏర్పడుచున్నాయంటావా? నా యొక్క నియామక చమత్కారం చేతనే! నేను పంచ భూతములచే నిర్మించబడేవాడను కాను. వాటిని నేనే నియమించి దేహాలు పొందుతాను. నేను నా ప్రకృతిని అధీనం చేసుకొని ఆత్మమాయా చమత్కారంగా ప్రకృతియందు సంభవిస్తూ ఉంటాను. ప్రకటితం చేసుకుంటూ ఉంటాను. అనగా, నా ప్రకృతియందు నేను దేహరూపంగా ప్రత్యక్షమౌతూ ఉంటాను. నిర్గుణ తత్వం నుండి సగుణతత్వం ప్రదర్శిస్తూ ఉంటాను.

(NOTE: అందుకే శ్రీకృష్ణాస్వామిని ‘అవతారమూర్తి’ అని పురాణద్రష్టలు గానం చేస్తున్నారు.)

అలాగే, ప్రకృతికి ఆవల గల తమ యొక్క స్వరూపం ఏమరిచినప్పుడు … అట్టి అజ్ఞాన స్రవంతిలో కర్మల చోదనం చేత కూడా దేహాలు వస్తూ - పోతూ ఉంటాయి. అట్టి వానిని ‘జీవుడు’ అని పిలుస్తున్నారు.

04–07

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥

యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి, భారత! ।
అభ్యుత్థానమ్ అధర్మస్య తత్ ఆత్మానం సృజామి అహమ్ ॥

అవతరించటం - సంభవించటం

జన్మ-కర్మలకు అతీతమై, అప్రమేయమైన స్వస్వరూపం ఆస్వాదించటం, జన్మించటం, కర్మలతో స్వయంగా పెట్టుకున్న సంబంధంగా శరీరముల రాకపోకలు ఇదంతా ఎరిగి ఉండటమే - “అవతరించటం”! “సంభవించటము” కూడా!

అవతారం - ధర్మ రక్షణ - శిష్ట రక్షణ

ఆత్మ ధర్మ స్వరూపుడనగు నేను సృష్టి ధర్మాలకు గ్లాని (హాని) కలిగినప్పుడు, అధర్మము ప్రబలుచున్నప్పుడు - నన్ను నేనే ఈ సృష్టియందు సృష్టించుకుంటూ ఉంటాను.

04–08

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపన అర్థాయ సంభవామి యుగే యుగే ॥

సాధుజనులకు ఆశ్రయభూతుడనగు నేను - సాధుజనులను సంరక్షించటానికి, దుష్కృతులైన జీవులను సుశిక్షించటానికి, ధర్మమును సంస్థాపించి తద్వారా సృష్టికి శ్రేయస్సు కలుగజేయటానికి యుగయుగములలో, ఆయా సమయములలో, ఆయా ప్రదేశములలో అవతరిస్తూ ఉంటాను. (The Role of Mentor).

04–09

జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః ।
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఽర్జున ॥

జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవం యో వేత్తి తత్త్వతః ।
త్యక్త్వా దేహం పునర్జన్మ న ఏతి, మామ్ ఏతి సః, అర్జున! ॥

చూచావా….!

🌺 జన్మలనేవి ఏ క్షణంలోనూ ఏ మాత్రం లేని నేను నా ప్రకృతిని ఉపకరణంగా తీసుకొని యోగమాయచేత దేహరూపములతో ప్రకృతియందు దేహ స్వరూపంగా ప్రత్యక్షం కావటం …,

🌺 కర్మలకు ఆవల అతీతమగు ఆత్మ స్వరూపుడనై ఉండి కూడా ‘అవతరించటం’ అనే కర్మ నిర్వర్తించటం …,

🌺 ఇట్టి నా యోగమాయా చమత్కారం తత్త్వతః (వెనుకగల తాత్విక విశేష సమన్వయ పూర్వకంగా) ఎవరు గమనిస్తారో, తెలుసుకుంటారో …,

🌻 వారు కూడా (నా వలె) పునర్జన్మ రహితులౌతున్నారు.

🌻 జన్మ-కర్మలకంటే ముందే ఏర్పడియున్న నిర్విషయ - అఖండ - అప్రమేయ ఆత్మతత్వమే తమ స్వరూపంగా గ్రహించి … జన్మరాహిత్యం సంపాదించుకుంటున్నారు.

🌻 “నా జాగ్రత్‌-స్వప్న-సుషుప్తి జగత్తులను నాకు నేనే కల్పించుకొని ఆస్వాదిస్తున్నాను” అని గమనిస్తున్నారు!

04–10

వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః ।
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ॥

వీత రాగ-భయ-క్రోధా, మత్ మయా, మామ్ ఉపాశ్రితాః ।
బహవో జ్ఞానతపసా పూతా మద్ భావమ్ ఆగతాః ॥

తత్త్వతః తెలుసుకోవటం

అట్లా అనేకులు నా అవతార పురుషత్వం ఆశ్రయించి, తద్వారా జన్మరాహిత్యం (అనగా జన్మించినప్పటికీ - ‘‘నాకు జన్మలు లేవు’’ … అను అవగాహన) సముపార్జించుకొంటున్నారు. ఏ విధంగా? వారు ‘జ్ఞానము’ అనే తపస్సుచే హృదయంలో గల అజ్ఞానాంధకారం తొలగించుకొంటున్నారు.

→ ‘నాది’ అనే రాగము (Attachment),
→ ‘‘ఏదో కోల్పోతున్నామేమో? మును ముందు ఇక ఏమికానున్నదో?’’ అనే భయము,
→ ‘‘వీరు సానుకూల్యురు కాదు. వీరి సంగతి చూడాలి…’’ అనే క్రోధము

ఈ రాగ భయ క్రోధములే అజ్ఞానాంధకారము యొక్క ముడిపదార్థాలు (Raw materials). ‘‘నాది - నేను’’ అనే మమకార - అహంకారములను ‘సత్య ఉపాసన’ అనే ఉపకరణంతో తొలగించుకొని ‘జన్మకర్మలకు సంబంధించని ఆత్మయే నేను’ …. అని నేను చెప్పుచున్న - నాకు సర్వదా అనుభూతమగుచున్న ‘ఆత్మాఽహమ్‌’ భావనకు చేరారు. చేరుచున్నారు. చేరగలరు.

04–11

యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్ ।
మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః ॥

యే యథా మాం ప్రపద్యన్తే తాన్ తథా ఏవ భజామి అహమ్ ।
మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః, పార్థ! సర్వశః ॥

అన్య దేవతోపాసన

కొందరు జన్మ - కర్మల అతీతత్వమును సముపార్జించుకోవటం ఉపాసిస్తూ ఉంటే, …. ఇక మరికొందరేమో ….. రాగ - భయ - క్రోధములు ఇంకనూ సేవిస్తున్నవారై ఉంటున్నారు. ప్రాపంచికమైన స్థితి-గతులకై దేవతలను ఉపాసిస్తున్నారు. ఎవరు ఏ ఆశయము కొరకై ఉపాసిస్తున్నారో …. వారికి అది నేను ఆయా దేవతారూపుడనై వారు కోరుకొనే ఆ ఫలమును సిద్ధింపజేస్తున్నాను. అనుగ్రహిస్తున్నాను.

ఎవ్వరు ఏ రూపంగా ఎద్దానిని ఉపాసిస్తున్నారో … వారు ఆ రూపంగా ఉన్న నన్నే ఉపాసిస్తూ, నా నుండియే ఆయా పరిలక్షిత ప్రయోజనములు పొందుచున్నారు.

04–12

కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః ।
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ॥

కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః ।
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిః భవతి కర్మజా ॥

ఈ మానవలోకంలో ఒకానొక కర్మ సిద్ధాంతము పరఢవిల్లుతూ ఉంటుంది. ఎవరు ఏ ఫలములను కోరి ఆయా దేవతలను ఉపాసిస్తారో …. ఆయా ఉపాసనా క్రమమును అనుసరించి త్వరిత గతిగా ఆయా దేవతలనుండి ఆ ఉపాసకులు తాము కోరుకునే ఫలములను పొందుతూ ఉంటారు.

ఉపాసన - శ్రద్ధలను అనుసరించి ఎవ్వరు ఏది పొందాలని ఆయా శాస్త్ర విహిత కర్మలను నిర్వర్తిస్తారో … ఆ ఫలాలు తప్పక పొందుతారు.

04–13

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః ।
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ॥

చాతుఃవర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః ।
తస్య కర్తారమ్ అపి మాం విద్ధి అకర్తారమ్ అవ్యయమ్ ॥

ఈ విధంగా ఎవరు దేనిని పొందాలని ఉద్దేశించి ‘‘పూజ- దేవతార్చన - అనుస్మరణ’’ మొదలైన కార్యక్రమములను నిర్వర్తిస్తారో …. ఆయా జీవుల ఆ ఉద్దేశ్యములను అనుసరించి నాలుగురీతులుగా జీవులు విభజించబడుచున్నారు.

(1) బ్రహ్మయతులు : ‘‘ఇదంతా పరబ్రహ్మస్వరూపమే కదా! నాతో సహా సర్వము అద్వితీయ - నిరామయ - నిరాకార - నిర్గుణ బ్రహ్మము యొక్క చమత్కార సంప్రదర్శనమే’’ అనే అవగాహన పెంపొందించుకోవటానికి మనస్సు యొక్క (లేక దృష్టియొక్క) శుద్ధి కొరకై కర్మలు, ఉపాసనలు చేపట్టేవారు.
(బ్రహ్మయతులగు బ్రాహ్మణులు : సాత్విక ఉపాసకులు)

(2) క్షత్రియ స్వభావులు : వ్యవహార దక్షత, కార్యదీక్ష, పరిస్థితుల సానుకూల్యము, పేరు - ప్రతిష్ఠలు … ఇటువంటి వ్యవహారికమైన ఆశయములతో వాటి సముపార్జనకై పరమాత్మను ఉపాసించేవారు.
(క్షత్రియ స్వభావులు : రాజసికోపాసకులు, సామర్థ్యరాజసికులు)

(3) వైశ్య స్వభావులు : వస్తుసమృద్ధి - ధన - గృహ - సంపద మొదలైనవి పొందటానికి పరిలక్షితులై దైవోపాసనకు ఉపక్రమించేవారు.
(వైశ్య స్వభావులు - సంపద సంసిద్ధి రాజసికులు)

(4) శూద్ర స్వభావులు : ఇంద్రియ సంబంధమైన అనుభవముల సంప్రాప్తికై దైవోపాసనను ఆశ్రయించేవారు.
(శూద్ర స్వభావులు : ఇంద్రియానందాశ్రిత తామసికులు)

ఈ విధంగా సాత్విక - రాజసిక - తామసిక గుణ మిశ్రమములను అనుసరించి జీవులు నాలుగు రకాల వర్ణములు - స్వభావములు కలిగియుంటున్నారు. అయితే …. ఈ చాతుర్వర్ణ్యములకు రచయితను నేనే! గుణ-కర్మ విభాగములను అనుసరించి ఈ చాతుర్వర్ణ్య చమత్కారములతో కూడిన ఈ జగత్‌ రచన కొనసాగిస్తూ ఉన్నాను. నవలలోని నవరసాలు నవలారచయిత యొక్క నవనవోన్నత నాటకరచనా వ్యాసంగము నుండి నవోద్భవించినవే కదా!

అయితే, సర్వాంతర్యామినగు నేనే ఈ గుణ-కర్మ విభాగ పూర్వకములగు 4 వర్ణములకు (బ్రాహ్మణ స్వభావ - క్షత్రియ స్వభావ - వైశ్య స్వభావ - శూద్ర స్వభావ విభాగములకు) ‘‘కర్త’’ అయినప్పటికీ …, నన్ను సర్వవ్యవహార సరళికి ఆవల ఉన్నవాడుగా గమనించు. దర్శించు. నవరసములతో కూడిన నాటకములోని ఆయా వివిధ పాత్రలకు, వారి స్వభావ - సంభాషణలకు రచయితయే సృష్టికర్త అయినప్పటికీ … నాటక రచయిత నాటకములోని ఒక పాత్రకు సంబంధించినవాడు కాదు కదా! అట్లాగే ‘‘మనందరి ఆత్మ స్వరూపము జగన్నాటకములోని గుణ-కర్మ-బద్ధమైన ఒకానొక పాత్ర కాదు’’ ….. అని గమనించబడుగాక!

04–14

న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా ।
ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే ॥

న మాం కర్మాణి లింపంతి, న మే కర్మఫలే స్పృహా ।
ఇతి మాం యో అభిజానాతి కర్మభిః న స బధ్యతే ॥

ఓ అర్జునా! ఒక నాటకరచయిత వలె ‘‘సర్వజగదంతర్గత నాటక పాత్రల అంతర్యామి’’ యగు నన్ను నా విరచితమైన జగత్‌ నాటకంలోని పాత్రల గుణ - కర్మ - స్వభావాదులు స్పర్శించవు.

ఈ గుణ - కర్మ - స్వభావాలను అనుసరించి ‘‘పరమాత్మ ఇట్టివాడు’’ అని ఎట్లా అంటావు? నాటక రచనలోని పాత్రల స్వభావములు - స్వరూపములు కర్మలు రచయితకు ఆపాదించలేం! అంతేకాదు. ఆయా పాత్రల యొక్క కర్మల వ్యవహారం పట్ల నాకు ఎట్టి ఇష్ట - అయిష్టములు గాని ఉండవు. ‘‘నాటక రచయితకు తన నాటకంలోని ఈ ఈ పాత్రల ప్రవర్తనంటే ఎంతో ఇష్టం - లేక అయిష్టం’’…. అని అనం కదా! అట్లాగే నాకు ‘‘కర్మల స్పృహ - కర్మల ఆసక్తి’’ మొదలైనవి లేవు.

ఈ విధంగా ఎవ్వరైతే నన్ను జగన్నాటక సూత్రధారిని అయి ఉండికూడా……,
⭕️ కర్మల మరియు గుణముల సంబంధ ఆసక్తి - అనాసక్తులు,
⭕️ కర్మల మరియు గుణముల సంబంధ అభిమాన - ద్వేషములు,
⭕️ కర్మల మరియు గుణముల సంబంధ ఇష్ట - అయిష్టములు,
⭕️ కర్మల మరియు గుణముల సంబంధ బంధ - మోక్షములు……..,
ఏ మాత్రం అంటనట్టి ‘‘అప్రమేయము - అనునిత్యము - అఖండము’’ అగు సర్వాంతర్యామిగా గమనిస్తూ, దర్శిస్తూ, ఉపాసిస్తూ ఉంటారో .. అట్టివారు సర్వకర్మబంధముల నుండి స్వభావసిద్ధంగా విముక్తులు అగుచున్నారు.

అనగా, ‘‘కర్మల వలన నాకు బంధము’’ … అనే భ్రమ నుండి విడివడుచున్నారు.

04–15

ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః ।
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ ॥

ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైః అపి ముముక్షుభిః ।
కురు కర్మ ఏవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ ॥

ఓ అర్జునా!

‘‘పరమాత్మ కర్మలకు అతీతమైన అంతర్యామియగు ఆత్మస్వరూపుడు కదా!’’ అని గ్రహించియే, పూర్వంలో ఆయా ముముక్షువులు అట్టి తమ అఖండాత్మ స్వరూపమును నిర్దుష్టము - సుస్పష్టము చేసుకొనే ప్రయత్నంలో సాధనా పూర్వకంగా, కర్మయోగ విధానంగా స్వకర్మలు (జ్ఞానులై) నిర్వర్తించారు.

ఏ విధంగా పూర్వ-తత్‌పూర్వ ముముక్షువులు ఉపాసనా రూపంగా ఆత్మజ్ఞాన సమన్వితులై స్వధర్మములు నిర్వర్తించారో ….. నీవు కూడా అట్లాగే నిర్వర్తించు.

04–16

కిం కర్మ కిమకర్మేతి కవయోఽప్యత్ర మోహితాః ।
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ॥

కిం కర్మ? కిం అకర్మ? ఇతి, కవయో అపి అత్ర మోహితాః ।
తత్ తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్ ॥

చూచావా ఫల్గుణా! ‘‘ఏఏ కర్మలు చేయాలి?’’, ‘‘ఏ ఉద్దేశ్యంతో చేయాలి?’’ అనే విషయంలో ఎంతో వేద-వేదాంగ పరిణతి గల కొందరు పండితులు కూడా మోహం చెందుతూ ఉంటారు. అది దృష్టిలో పెట్టుకొని ‘కర్మతత్త్వము’ ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం. కర్మల యొక్క ఉద్దేశ్యము - ప్రయోజనము - ఆశయములు ఎట్లా ఉంటే, అవి ఆ కర్తను అశుభమగు సంసారము నుండి ఉద్ధరిస్తాయో …. అట్టి ‘‘జ్ఞాన సమన్వితమైన కర్మ నిర్వహణ’’, గురించి మరికొంత వివరిస్తున్నాను.

04–17

కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః ।
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ॥

కర్మణో హి అపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః ।
అకర్మణః చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతిః ॥

ముందుగా ఈ విషయాలు చక్కగా తెలుసుకోవాలి.

(1) కర్మల ద్వారా ఉపాసన : కర్మల స్వరూపం ఎటువంటిది? కర్మలనేవి ఎందుకున్నాయి?

(మనం చేయవలసిన కర్మలు పరమాత్మచే మనకు ఉద్ధరణకై అవకాశంగా ప్రసాదించబడినవి - కర్మ బ్రహ్మోద్భవం విద్ధి! Our functions are a facility accorded to us to reach God.)

(2) యజ్ఞకర్మ : ‘‘జగత్‌యజ్ఞములో నా స్వధర్మములు నాకు నియమించిన యజ్ఞకర్మ విభాగములు’’ అని గ్రహించి ఉండటం.

(3) విహిత - అవిహిత కర్మ నిర్ణయం : "నేను చేయవలసిన కర్మలు ఏమిటి (Do’s) ? - చేయకూడని కర్మలు ఏమిటి (Dont’s)?’’ అని శాస్త్రములను, పెద్దలను సంప్రదించి లోక-శాస్త్ర సానుకూల్యంగా, లోకహితం దృష్టిలో పెట్టుకొని అసంగమైన బుద్ధితో నిర్వర్తించటం, ‘‘వికర్మ’’ (చేయకూడని కర్మలు - ఉండకూడని దురుద్దేశాలు) → హృదయమునుండి తొలగించుకోవటం

(4) కర్మాతీత ఆత్మ సందర్శనం : కర్మలు నిర్వహిస్తున్న సహజీవులలోను, తనయందు, తదితరుల రూపంగాను, తన రూపంగాను …. ఏ ఆత్మతత్వము ప్రదర్శితమౌతోందో … అట్టి స్వస్వరూపాత్మ సర్వదా నిష్క్రియము. జన్మ - మృత్యు కార్యవ్యవహారములకు కూడా సర్వదా అప్రమేయమైనది. సంబంధించనది → ఇట్టి అకర్మతత్వాన్ని గ్రహించటం.

ఈ విధంగా కర్మ - యజ్ఞకర్మ - వికర్మ - అకర్మల శాస్త్ర ప్రవచిత గూఢార్థాన్ని చక్కగా గ్రహించి కర్మలు నిర్వర్తించటము జ్ఞానకర్మయోగము.

ఈ విధంగా కర్మతత్వము అతి గూఢమైనది, సూక్ష్మమైనది సుమా!

04–18

కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః ।
స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ॥

కర్మణి అకర్మ యః పశ్యేత్, అకర్మణి చ కర్మ యః ।
స బుద్ధిమాన్ మనుష్యేషు, స యుక్తః కృత్స్నకర్మకృత్ ॥

ఎవ్వరైతే …

↳ జగత్‌దృశ్యంలోని సర్వజీవులను వారివారి కర్మ వ్యవహారములతో సహా చూస్తూ కూడా …. వారందరిని కర్మాతీతమగు ఆత్మస్వరూపముగా దర్శిస్తారో, (అనగా) కర్మలలో అకర్మతత్వమగు ఆత్మను (సర్వవ్యవహారములందు పరమాత్మయే అంతర్లీనంగా ప్రసరించి ఉన్నారని) …. గమనిస్తారో,

↳ సర్వకర్మలు - వాటిని నిర్వర్తించే జీవులు ‘‘ఆత్మయందు - ఆత్మకు అనన్యమై (స్వదృష్టిభేదంచేత మాత్రమే ఆత్మకు వేరుగా ఎప్పుడైనా అనిపిస్తున్నట్లుగా), ఆత్మదృష్టి చేత సర్వము ఆత్మ స్వరూపంగాను ….. (పరమాత్మయే సర్వవ్యవహారములుగా కనిపిస్తున్నారని) ఆస్వాదిస్తారో …..

అట్టి దార్శనికులు అందరిలోకీ ‘ఉత్తమ బుద్ధి సమన్వితులు’ అని అనిపించుకుంటారు. అట్టి ఆత్మదృష్టిగల యోగులు ’‘సర్వకర్మల యొక్క ప్రయోజనం సొంతం చేసుకొన్నవారు’’ అగుచున్నారు.

దృష్టాంతానికి …. తరంగాలన్నిటిలో … ఒకే జలం ఉన్నదని, జలంలోనే …. తరంగాలన్నీ ఉన్నాయని గ్రహించిన తరువాత, అప్పుడు ‘‘ఈ ఈ తరంగాలను ఆశ్రయిస్తే గాని మరి జలం ఎక్కడున్నదో తెలియదు కదా?’’…. అనే మీమాంస ఇక మిగలదు కదా!

అటువంటి ‘‘ఆత్మీదృష్టి - ఆత్మసాక్షాత్కారం - ఆత్మతత్త్వానుభూతి - మమాత్మా సర్వభూతాత్మానుభూతి’’ సంపాదించుకోవటం అత్యంతికమైన ఆశయము. అట్టి మహాశయుడు తాను అనివార్యంగా చేయవలసి వస్తున్న కర్మలను (The functions that one has to inevitably and invariably discharge) ఆత్మీదృష్టి అలవరచుకొనే ఉపకరణములుగా మలచుకొనుచున్నాడు.

అది ఎట్లాగో చెపుతాను. విను.

04–19

యస్య సర్వే సమారమ్భాః కామసఙ్కల్పవర్జితాః ।
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పణ్డితం బుధాః ॥

యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః ।
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమ్ ఆహుః పండితం బుధాః ॥


కర్మ నిర్వహణకు ఎట్లా సంసిద్ధం కావాలి?

(1) కామసంకల్ప వర్జితాః సమారంభాః : ఎవనిచే కర్మలు ప్రారంభించేటప్పుడే ‘‘ఈ రీతిగా సర్వాత్మకుడగు పరమాత్మను ఉపాసిస్తున్నాను’’ అనే భావంతో నిర్వర్తిస్తాడో, ‘‘ఏదో ఇక్కడ పొందాలి’’… అనే దృశ్యవ్యాపకానికి అతీతత్వం వహించి నిర్వర్తిస్తాడో, అతడు వివేకి. చేసే కర్మలకు ఉత్తమోత్తమమైన బుద్ధి వికాసరూపమైన ప్రయోజనానికి స్వభావసిద్ధంగా అర్హుడు. ఎవడు కామ సంకల్పములను (అనగా నాకు లోకంలో కలిగే లాభం ఏమిటి? ఇత్యాది) వర్జించి ఉంటాడో, అతడు ఆత్మోన్నతి సముపార్జించుకొంటాడు.

(2) జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణుః : నిత్య-అనిత్య వివేకముతో నిర్మలమైన మనస్సు, జ్ఞానము సంపాదించుకొనే ఉద్దేశ్యముతో కర్మలు నిర్వర్తించటం ప్రారంభించేవాడు జ్ఞానాగ్నితో కర్మలు అనే ఉపకరణములను పరిశుభ్రపరచుకొని, తళ-తళ మెఱిసే బంగారంలాగా కర్మలను తీర్చిదిద్దుకొనుచున్నవాడు అగుచున్నాడు.

అట్టివాడే పండితుడు.

04–20

త్యక్త్వా కర్మఫలాసఙ్గం నిత్యతృప్తో నిరాశ్రయః ।
కర్మణ్యభిప్రవృత్తోఽపి నైవ కిఞ్చిత్కరోతి సః ॥

త్యక్త్వా కర్మఫలా సంగం, నిత్యతృప్తో, నిరాశ్రయః ।
కర్మణి అభిప్రవృత్తో అపి న ఏవ కించిత్ కరోతి సః ॥

(3) త్యక్త్వా కర్మఫలాసంగం : కర్మలు చేస్తూ ఆ కర్మలను పరమాత్మ సమర్పిత పుష్పములుగా భావన చేసెదవు గాక! అనగా, ‘‘కర్మలైతే చేస్తున్నాను. మరి ఎందుకు చేస్తున్నాను? వారి కోసం, వీరి కోసం, దీని కోసం, దాని కోసం కదా! ఈఈ ఫలితాల కోసం కదా! అవి లభిస్తాయో? లేదో మరి?’’… ఈ తీరైన కర్మఫలాసక్తి, కర్మ ఫలా సంగం (Attachment for the results) ఉండకుండుగాక! కర్మ ఫలముల పట్ల సక్తత (Attachment) లేకుండా కర్మలను చేస్తూ ఉంటే…. అప్పుడు ఆతడు ‘అకర్మిష్టుడు’ అవుతాడు. కర్మ ఆతనికి బంధం అవదు. అది కాస్తా సాధన, ఉపాసన రూపమే అవుతుంది.

(4) నిత్య తృప్తః : కర్మలు నిర్వర్తించటం అనివార్యం కదా! వాటిని నిర్వర్తిస్తూనే సర్వము ఈశ్వరానురూపమే - అనే రూపమైన ఒకానొక నిత్యతృప్తిని (A continuous state of satisfaction) అభ్యాస వశంగా అలవరచుకొన్నవాడు - ఇక తన తృప్తిస్థితికై ఇక కర్మ ఫలముల వరకు వేచి ఉండవలసిన పనేమున్నది? ఆతడు కర్మలు చేయనివాడే అవుతాడు. అనగా కర్మబంధములు ఆతనికి ఉండవు. ఏదేది పరమాత్మచేత ప్రసాదించబడినదో… అట్టి విశేషాలను జ్ఞాపకం పెట్టుకోవటంచేత నిత్యతృప్తి అలవడుతుంది.

(5) నిరాశ్రయః : ఎవడైతే కర్మలు నిర్వర్తిస్తూ కూడా దేనినీ ఆశ్రయించక, ఆ కర్మ ఫలములపై ఆధారపడినవాడు కాకుండా ఉంటాడో ….. అట్టివాడు కర్మరాహిత్యత్వము ఆస్వాదిస్తూ ఆత్మదృష్టిని అలవరచుకోగలుగుతాడు.

04–21

నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః ।
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ॥

నిరాశీః, యతచిత్తాత్మా, త్యక్త సర్వ పరిగ్రహః ।
శారీరం కేవలం కర్మ కుర్వన్ న ఆప్నోతి కిల్బిషమ్ ॥

(6) నిరాశీ : దేనినో ఆశించి కర్మలు చేసేవాడు ఆ కర్మసంబంధమైన ఆసక్తి - అనురక్తులచే, కర్మఫలములచే, కర్మ ప్రయోజనములచే పరిమితుడు - నిబద్ధుడు అవుతాడు. అట్లా కాకుండా, అంతరంగమునందు ఆశ-నిరాశాదులను తొలగించుకొని ‘‘దేహం ప్రసాదించి - సంరక్షిస్తున్న పరమాత్మకు కృతజ్ఞతా పూర్వకంగా ఈ ఈ కర్మలు నిర్వర్తిస్తున్నాను’’ …. అని భావన చేసేవారికి ‘‘ఆశలు-నిరాశలు’’ అనే దోషం హృదయములో చిగురించదు. అట్టివారు కర్మ దోషములచే స్పృశించబడరు. వారికి కర్మయే తపస్సు అవుతుంది.

(7) యత చిత్తాత్మా : ఈ మనస్సు ఏదేదో కోరుకుంటూ ఎటెటో అనుక్షణం పరుగులు తీస్తూ ఉంటోంది కదా! ఎందుచేత? మృగాలు ‘‘మృగతృష్ణ’‘లో జలం ఉంటుందని భ్రమించి పరుగులు తీయటం వంటిదే - ’‘ఏదో కావాలి - రావాలి’’ అని ఈ మనస్సు తపన కలిగి ఉండటం సుమా! అటువంటి మనస్సును పరిపరి విధాలుగా కర్మలు ప్రయోజనముల వైపుగా ప్రసరించకుండా చూచుకొనేవానికి కర్మల దోషాలు అంటవు. చిత్తమును అదుపులో కలిగి ఉంచుకున్నవాడు సరి అయిన దారిలో నియమించువాడు ‘‘యతచిత్తాత్ముడు’’ (లేక) ‘‘యతచిత్తుడు’’.

(8) త్యక్త సర్వ పరిగ్రహః : సకల విధములైన భోగసామాగ్రిని మనస్సుతో త్యజించి ఉంటాడు. ‘‘ఈ వస్తు సముదాయము - ఈ బంధములు, ఈ సంబంధ బాంధవ్యములు నావి కావు. పరమాత్మవి. పరమాత్మ స్వరూపములు’’ అను భావనతో ‘నావి’ అనే భ్రమను తొలగించుకొని ఉంటాడు. అందుచేత కర్మలకు సంబంధించిన పాప-దోషములు అతనిని తాకవు.

(9) శారీరం కేవలం కర్మ కుర్వన్‌ : తాను వేరుగా ఉండి ఈ శరీరమును ఇంద్రియములను ఆయా కర్మల వ్యవహారములలో నియమిస్తూ ఉంటాడు. వాటి వాటి విషయములలో తాను తాదాత్మ్యము పొందడు. పనిమనిషులు పనిచేస్తూ ఉంటే యజమాని ఆయా పనులలో తాను ప్రవేశించి వాటి యందు సంలగ్నుడౌతాడా? తనను తాను ‘‘నేను యజమానిని’’ అని మరచిపోతాడా? లేదుకదా! తాను వేరుగా అజమాయిషీ చేస్తూ వుంటాడు. జ్ఞానకర్మయోగి కూడా ఇంద్రియ - ఇంద్రియ విషయములను నియమిస్తూ, తాను మాత్రము వాటిచేత నియమితుడు కాక, అప్రమేయుడై ఉంటాడు. నియామకుడుగా మాత్రమే వుంటాడు.

04–22

యదృచ్ఛాలాభసన్తుష్టో ద్వన్ద్వాతీతో విమత్సరః ।
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే ॥

యదృచ్ఛా లాభ సంతుష్టో, ద్వంద్వాతీతో, విమత్సరః ।
సమః సిద్ధౌ అసిద్ధౌ చ కృత్వా అపి న నిబధ్యతే ॥

(10) యదృచ్ఛా లాభ సంతుష్టుడు : ‘‘పొందాలి - కావాలి’’ అనే ఆవేశమునకు లోను కాకుండా ఏదేది ఎంత వరకు లభిస్తుందో …. అద్దానితో సంతోషమును పొందినవాడై ఉంటాడు. ‘‘ఇది ఇంతవరకే నాకు లభించటం కూడా ఈ జగత్‌ రచయిత అగు పరమాత్మయొక్క సదుద్దేశ్యం. గురువు శిష్యునికి ఎట్టి శిక్షణతో చదువు నేర్పించాలో గురువుకు తెలుసునని శిష్యుడు భావిస్తాడు కదా! ఈ జగత్‌ గురువగు పరమాత్మ పాఠ్యాంశము యొక్క అంతర్విభాగమే ఈ కష్ట-సుఖాలు, ఈ ప్రాప్త-అప్రాప్తాలు కూడా!’’ …. అని గ్రహించి ఉంటాడు. అందుచేత ‘‘పొందాను - పొందలేకపోయాను (Gained and Did not gain) ’’ అనే విషయాలు గొప్ప విషయాలుగా భావించడు. మంచి విద్యార్థికి చదువు ముఖ్యం గాని పాఠశాలలోని వసతులు కాదు కదా! ఇవి గ్రహించి ఆతడు బంధరహితుడై ఉంటాడు.

(11) ద్వంద్వాతీతో : జ్ఞానకర్మయోగి ఈ ప్రపంచంలో తారసపడే తన మనస్సుకు, కష్ట-సుఖములకు, ఆపద-సంపదలకు, దూషణ - భూషణములకు, తిరస్కార - పురస్కారములకు అతీతుడై వాటిని ‘‘నిర్విషయపూర్వక ప్రజ్ఞ’‘తో దర్శిస్తూ ఉంటాడు. వాటిచే నిబద్ధితుడు కానట్టి ప్రజ్ఞను సముపార్జించుకొని ఉంటాడు.

(12) విమత్సరః : ’‘నేను ఇంతటి వాడను కదా! నా ముందు వాళ్ళు - వీళ్ళు ఎందుకు పనికివస్తారు?’’ …. ఇటువంటి మత్సరపూరితమైన భావాలు తొలగించుకొని ఉంటాడు. సర్వులకు సర్వశక్తియుక్తులు భగవత్‌ ప్రసాదితము, భగవత్‌ సంకల్పమే కాని ‘‘ఈ కాలు - చేయి నేను నిర్మాణం చేసుకున్నాను’’ అని ఎవరనగలరు? ఈ జగత్‌ నాటకంలో ఏ పాత్ర ఏమిటో - ఎంతవరకో - ఎందుకో చరాచర సృష్టికర్తకే తెలుసు. మనం తినే పదార్ధాలు జీర్ణమయ్యే విధానం - తత్‌ పరికరాలు మనం నిర్మించుకున్నవి కావు. సర్వజీవుల హావ-భావాలు, శక్తి యుక్తులు జగత్‌ నిర్మాతవే కాని, అవి మనవి ఎట్లా అవుతాయి?

🔥 మత్సరము (క్రోధము, ఈర్ష్య) ఉన్న చోట కర్మ బంధం అవుతుంది.
🌸 మత్సరము లేనిచోట నిర్వర్తించబడే కర్మ ముక్తి మార్గంగా రూపుదిద్దుకుంటుంది.

04–23

గతసఙ్గస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః ।
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ॥

గత సంగస్య ముక్తస్య, జ్ఞాన అవస్థిత చేతసః ।
యజ్ఞాయ ఆచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ॥

(13) గత సంగస్య ముక్తస్య : ఒక ఇష్టం లేని పని చేయవలసి వచ్చినా, (లేక) ఒక ఇష్టం ఉన్న పని చేయలేకపోతున్నా కూడా జ్ఞానకర్మయోగి తన సమత్వం కోల్పోడు.
- ఇది చెయ్యవలసివచ్చిందే ….! అనిగాని,
- అది చెయ్యలేకపోతున్నానే ….! అనిగాని,
ఆతడు దిగులు, వేసట పొందడు. సంగము (Involvment) - ముక్తము (Withdrawal from an act) ఒకే తీరుగా దర్శిస్తూ ప్రశాంత స్థితిని అనుక్షణికంగా ఆస్వాదిస్తూ ఉంటాడు. సంగము (Attachment) - ముక్తి (Relief) అను ఉభయములకు అతీతుడై, ఆధారపడనివాడై వుంటాడు.

(14) జ్ఞాన అవస్థిత చేతసః : ఆతడు నిత్య-అనిత్యములు ఏమిటో గ్రహిస్తూ, పరమాత్మకు కృతజ్ఞతా పూర్వకంగా, సేవా పూర్వకంగా సద్భావనతో కూడిన బుద్ధితో స్వకర్మలు నిర్వర్తిస్తూ ఉంటాడు. వివేకము - జ్ఞానము ప్రవృద్ధపరచుకుంటూ కర్మలను నిర్వహిస్తూ ఉంటాడు.

(15) యజ్ఞాయ ఆచరతః కర్మ : ‘‘ఈ సమగ్రమైన కార్యక్రమంలో నా పాత్ర నిర్వర్తిస్తున్నాను’’ అని గ్రహించి జ్ఞానకర్మయోగి కర్మ నిర్వర్తిస్తున్నాడు. సూర్య - చంద్ర - వాయు - వర్ష - భూ - అగ్ని తత్వాలు జగత్‌ యజ్ఞ కార్యక్రమములను యజ్ఞభావంతో నిర్వర్తిస్తున్నట్లే యోగి తన ధర్మములను కూడా యజ్ఞ భావితుడై ఆచరిస్తూ ఉంటాడు.

ఈ విధంగా జ్ఞానసమన్వితంగా కర్మలను నిర్వర్తిస్తూ ఉంటే …. అప్పుడు ఆ యోగి సర్వ కర్మబంధముల నుండి విముక్తుడు అగుచున్నాడు. జ్ఞానకర్మ నిష్ఠులు ఉపాసన పూర్వకంగా కర్మలు నిర్వర్తిస్తున్నారు. అట్టి కర్మయోగులు తాము చేసిన కర్మలను యజ్ఞకర్మోపాసన రూపంగా యజ్ఞభోక్తయగు పరమాత్మకు సమర్పించి ఉంటారు.

04–24

బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా ॥

బ్రహ్మ అర్పణం, బ్రహ్మ హవిః, బ్రహ్మ అగ్నౌ, బ్రహ్మణా హుతమ్ ।
బ్రహ్మ ఏవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా ॥

విధి - విధానములను అనుసరించి, లోక ప్రసిద్ధమైన వివిధ రకములైన యజ్ఞ కర్మ ఉపాసనలను క్రోడీకరించి జ్ఞానపరిపుష్టికై ఇక్కడ వివరిస్తాను. విను.

వివిధ కర్మయజ్ఞ ఉపాసనలు

Ⅰ.) బ్రహ్మ యజ్ఞోపాసన / బ్రహ్మకర్మ సమాధి నిష్ఠ
Ⅱ.) దైవ యజ్ఞోపాసన
Ⅲ.) బ్రహ్మాగ్ని యజ్ఞము
Ⅳ.) సంయమ యజ్ఞోపాసన
Ⅴ.) ఇంద్రియ యజ్ఞోపాసన
Ⅵ.) మనోనిగ్రహోపాసన
Ⅶ.) ద్రవ్య యజ్ఞోపాసన
Ⅷ.) తపో యజ్ఞోపాసన
Ⅸ.) యోగ యజ్ఞోపాసన
Ⅹ.) స్వాధ్యాయ యజ్ఞోపాసన
Ⅺ. ) జ్ఞాన యజ్ఞోపాసన
Ⅻ.) ప్రాణాయామ యజ్ఞోపాసన

వీటి గురించి వివరిస్తున్నాను. విను.

Ⅰ.) బ్రహ్మ యజ్ఞోపాసన / బ్రహ్మకర్మ సమాధి నిష్ఠ

బ్రహ్మ యజ్ఞోపాసన - కర్మ ప్రవృత్తి దృష్ట్యా చూచినప్పుడు :-

1. స్వకర్మనిరతిచే సమర్పించబడే సేవ
2. కర్మ నిర్వర్తించటానికి పరికరాలు
3. కర్మ నిర్వర్తించగలిగే సామర్థ్యము
4. కర్మ నిర్వర్తిస్తున్నప్పటి శ్రమ
5. కర్మ నిర్వర్తించే కర్త (జీవుడు)
6. ఆ కర్మ యొక్క ప్రయోజనము - ఫలము

ఈ ఆరు కూడా "బ్రహ్మమే - పరమాత్మ స్వరూపమే’’ అను దృష్టి - అవగాహనలతో, సర్వము పరమాత్మ ప్రదర్శనా చమత్కారంగా దర్శిస్తూ - ఉపాసిస్తూ, కర్మ నిర్వర్తించటము ‘బ్రహ్మకర్మ నిష్ఠ’. ఇచ్చువాడు-ఇవ్వబడునది-పుచ్చుకొనువాడు…. అంతా బ్రహ్మమే అను అవగాహనయే బ్రహ్మ యజ్ఞం అవుతుంది.

బ్రహ్మ యజ్ఞోపాసన - అగ్ని కార్యములతో కూడిన యజ్ఞము దృష్ట్యా చూచినప్పుడు :-

సర్వము యజ్ఞపురుషుడగు పరమాత్మ స్వరూపంగా …దర్శించటమే అది.

1. అర్పణం = అర్పించబడే విధానము
2. హవిష్షు = హోమద్రవ్యములు
3. బ్రహ్మణా = యజ్ఞం నిర్వర్తిస్తున్న ‘‘యజ్ఞకర్త’’
4. అగ్ని = యజ్ఞములో ప్రజ్వలించే అగ్ని
5. ఆహూతం = ఆ యజ్ఞంలో హోమం చేయబడేది
6. బ్రహ్మ కర్మ సమాధినా ఆగంతవ్యమ్‌ = బ్రహ్మకర్మ సమాధి దీక్ష యొక్క ఫలము
… ఇవన్నీ బ్రహ్మమే!

బ్రహ్మ యజ్ఞోపాసన - దానం దృష్ట్యా చూచినప్పుడు :-

‘‘దానం ఇచ్చేవాడు - ఇవ్వబడే ద్రవ్యం - పుచ్చుకునేవాడు - ద్రవ్య ప్రయోజనములు - దానము యొక్క అంతిమ ఫలం అంతా కూడా …. పరమాత్మ స్వరూపమే!’’

బ్రహ్మ యజ్ఞోపాసన - జీవితం దృష్ట్యా చూచినప్పుడు :-

‘‘జీవించే జీవుడు - జీవితమునకు కావలసిన పరికరములు - అద్దానికి సంబంధించిన సంబంధ అనుబంధములు - జీవిత సంఘటనలు - జీవితము యొక్క అంతిమ ప్రయోజనం - అంతా భగవత్‌ స్వరూపమే !’’ ….. అని తలచేవానికి సర్వము బ్రహ్మమయమై అనుభవమౌతుంది.

అట్టి అవగాహనకై సాధన నిర్వర్తించే వాడు ‘‘బ్రహ్మ యజ్ఞోపాసకుడు - బ్రహ్మకర్మ నిష్ఠుడు’’ అని చెప్పబడుచున్నాడు.

04–25

దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే ।
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి ॥

దైవమ్ ఏవ అపరే యజ్ఞం యోగినః పరి ఉపాసతే ।
బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞేన ఏవ ఉపజుహ్వతి ॥

Ⅱ.) దైవ యజ్ఞోపాసన / దేవతార్చనా యజ్ఞం

ఈ శరీరం - దీనిలోని వివిధ ఇంద్రియములు - వాటివాటి శక్తులు (కంటికి చూపు - చెవులకు వినికిడి - చర్మమునకు స్పర్శ - ముక్కుకు సువాసన - నాలుకకు రుచి - పొట్టకు జీర్ణశక్తి - ఆహారంలో రసశక్తి) …. అన్నీ కూడా దైవప్రసాదమేగాని, మానవ కల్పితం కాదు కదా!

‘‘అట్టి అధిదేవతా ప్రాసాదితంగా పొందబడే ఈ దేహంతో ‘దైవోపాసన’ అత్యంతావస్యకం’’ అని గుర్తించి కొందరు యోగులు ‘‘పూజ - ఉపాసన - నామస్మరణ’’ ఇటువంటి అర్చనను నిర్వర్తిస్తున్నారు. తద్వారా జీవితమును సాఫల్యము చేసుకొంటున్నారు. దేవతోపాసనను పరిపుష్టిపరచుకొంటున్నారు. ప్రసాదించిన దైవమును మననం చేస్తూ సర్వము దర్శిస్తున్నారు. భక్తి, ప్రపత్తులతో ఇష్టదైవతోపార్చన నిర్వర్తిస్తున్నారు!

Ⅲ.) బ్రహ్మాగ్ని యజ్ఞము

ఆత్మ యజ్ఞనిష్ఠులగు మరికొందరు యోగులు ‘‘ఈ జగత్తంతా పరమాత్మ - జ్యోతి స్వరూపమే’’ …. అని భావించి లోకోపకరమైన కర్మలు నిర్వర్తిస్తూ ఆ కర్మలు ‘బ్రహ్మము’ అనే తత్వానికి సమర్పిస్తున్నారు. ‘‘సహజీవుల సేవయే నా ఉపాసన’’ …. అని ఉద్దేశిస్తూ సంఘసేవా కార్యములు నిర్వర్తిస్తున్నారు. నిరాకార బ్రహ్మమే ఈ సాకార జగత్తుగా అగుచున్నదని ఉపాసిస్తున్నారు. బ్రహ్మాగ్ని యజ్ఞం నిర్వర్తిస్తున్నారు.

04–26

శ్రోత్రాదీనీన్ద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి ।
శబ్దాదీన్విషయానన్య ఇన్ద్రియాగ్నిషు జుహ్వతి ॥

శ్రోత్రాదీని ఇంద్రియాణి అన్యే సంయమ అగ్నిషు జుహ్వతి ।
శబ్దాదీన్ విషయాన్ అన్య ఇంద్రియ అగ్నిషు జుహ్వతి ॥

Ⅳ.) సంయమ యజ్ఞోపాసన

మరికొందరు యోగులు శబ్దము - స్పర్శ మొదలైన ఇంద్రియములను ఉపాసన - ధ్యానములందు నియమించి ‘‘సంయమము (Self-control) అనే అగ్నియందు ఇంద్రియములనే కట్టెలను వ్రేల్చుచున్నారు.

Ⅴ.) ఇంద్రియాగ్ని యజ్ఞోపాసన

ఇంకొందరు ’‘మౌనము - తపస్సు’’ మొదలైనవి నిర్వర్తిస్తూ ‘‘ఈ శబ్దము - స్పర్శ - రూపము - రసము - గంధము’’ మొదలైనవి ఇంద్రియ విషయములనుండి మనస్సును విరమింపజేస్తూ ఇంద్రియాగ్ని యజ్ఞం నిర్వర్తిస్తున్నారు.

04–27

సర్వాణీన్ద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ।
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ॥

సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చ అపరే ।
ఆత్మసంయమయోగ అగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ॥

Ⅵ.) మనోనిగ్రహోపాసన / ఆత్మ సంయమ యోగాగ్ని యజ్ఞం

ఇక మరికొందరు యోగులు సర్వ ఇంద్రియ కర్మలతో ‘‘అంతా ఆత్మతత్త్వ ప్రదర్శనమే కదా!’’ …. అనే భావనాభ్యాసము నిర్వర్తిస్తున్నారు.

‘‘ప్రాణ - మనో - ఇంద్రియములు కదలుతూ దృశ్యంలో ప్రవర్తిస్తున్నాయి. వాటిని కదిలిస్తున్నదేది? ఆత్మయే కదా! ఆ ఆత్మయే అన్ని దేహాలలో వేంచేసి ప్రాణ - మనో - ఇంద్రియములను కదిలిస్తోంది. కనుక, సర్వ దేహములలోని ఆత్మనే నేను ఉపాసిస్తున్నాను’’ …. అనే గ్రాహ్యముతో ఉపాసన కొనసాగిస్తున్నారు.

‘‘సర్వ ఇంద్రియ కర్మలు, ప్రాణ కర్మలు కూడా ఆత్మ యొక్క విన్యాసమే’’….. అని దర్శిస్తూ ఇంద్రియ - మనో కర్మలను ‘‘ఆత్మ సంయోగము’’ అనే అగ్నిలో వ్రేల్చుచున్నారు. మనస్సును ఆత్మయందు సంయమింపజేసి రమిస్తున్నారు. లయింపజేస్తున్నారు. మనస్సును కూడా ఆత్మరూపంగా భావన చేస్తున్నారు.

04–28

ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే ।
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ॥

ద్రవ్యయజ్ఞాః తపోయజ్ఞా యోగయజ్ఞాః తథా అపరే ।
స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాః చ యతయః సంశితవ్రతాః ॥

Ⅶ.) ద్రవ్య యజ్ఞోపాసన

కొందరు తమ సంపదలను అనేక జీవులకు సమర్పిస్తూ ద్రవ్య యజ్ఞం నిర్వర్తిస్తున్నారు. జీవతృప్తిని పరమాత్మోపాసన పరంగా నిర్వర్తిస్తున్నారు. ‘పరోపకారార్థం ఇదమ్‌ శరీరం’ అను అవగాహనను బుద్ధియందు ప్రతిక్షేపించుకుంటున్నారు.

Ⅷ.) తపో యజ్ఞోపాసన

తపనయే తపస్సు. సర్వాత్మకుడగు పరమాత్మ పట్ల ‘తపన’ ద్వారా తపస్సు నిర్వర్తిస్తున్నారు. ఏకాంతంగా ధ్యానయోగం ఆశ్రయిస్తున్నారు. ఇంద్రియములను, మనస్సును పరమాత్మ యొక్క ఉపాసనలో తపింపజేసుకుంటున్నారు.

Ⅸ.) యోగ యజ్ఞోపాసన

మరికొందరు ‘‘సమాధి’’ మొదలైన యోగ సాధనలను ఆశ్రయిస్తున్నారు. కర్మ-భక్తి-జ్ఞాన-సమర్పణము యోగాంగాలుగా తీర్చిదిద్దుకుంటున్నారు.

Ⅹ.) స్వాధ్యాయ యజ్ఞోపాసన

సంగీతము - సాహిత్యము - స్తోత్రము - గ్రంథపఠనములతో కొందరు యోగులు భగవదోపాసన కొనసాగిస్తున్నారు.

Ⅺ.) జ్ఞాన యజ్ఞోపాసన

వివేక వైరాగ్యములతో కూడిన ఆత్మ జ్ఞాన అధ్యయన, విచారణా యజ్ఞము.

04–29

అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే ।
ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః ॥

అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణే అపానం తథా అపరే ।
ప్రాణ అపాన గతీ రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః ॥

Ⅻ.) ప్రాణాయామ యజ్ఞోపాసన

మరికొందరు ప్రాణాయామ పరాయణలై,
⤿ ప్రాణము (Inhilation)ను ‘అపానము’ అనే అగ్నిలో వ్రేలుస్తున్నారు.
⤵ అపానము (Exhalation)ను ‘ప్రాణము’ అనే అగ్నిలో వ్రేలుస్తున్నారు.

ఈ విధంగా ప్రాణ - అపానముల గతిని అనుసరిస్తూ ప్రాణాయామ సాధన ద్వారా మనస్సును పరిశుద్ధం చేసుకొని ‘‘ఆత్మాఽహమ్‌’’ భావన వైపుగా ప్రయాణిస్తున్నారు.

04–30

అపరే నియతాహారాః ప్రాణాన్ప్రాణేషు జుహ్వతి ।
సర్వేఽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః ॥

అపరే నియత ఆహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ।
సర్వే అపి ఏతే యజ్ఞవిదో యజ్ఞ క్షపిత కల్మషాః ॥

ప్రాణాన్‌ ప్రాణేషు జుహోతి యజ్ఞం : మరికొందరు యోగులు పంచ ప్రాణములను సమిధలుగా ‘సప్రాణము’ అనే అగ్నియందే సమర్పిస్తున్నారు. వ్యక్తిగతమైన ప్రాణములను ‘సప్రాణము’ అనబడే విశ్వరూప-విశ్వాంతర్గత ప్రాణంలో లయింపజేసి ‘ఈ విశ్వము’ అనే సమిష్ఠి దేహమునకు అంతర్గత ప్రాణ తత్వం వహిస్తున్నారు. విశ్వరూపులై ప్రకాసిస్తున్నారు.

ఓ అర్జునా! ఇప్పుడు మనం చెప్పుకున్న వివిధ యోగులంతా యజ్ఞవిదులు. విశ్వయజ్ఞ తత్వమును గ్రహించినవారే సుమా! వారంతా యజ్ఞపరాయణులై తమ యొక్క మానసిక దోషములను, ఋగ్మతలను తొలగించుకుంటున్నారు. ఆత్మావలోకనమునకు ప్రతిబంధకములన్నిటిని ఏరిపారవేసుకొంటున్నారు.

అట్టి యజ్ఞసాధనంగా జీవితాన్ని మలచుకొని, తద్వారా ఆ యోగ సాధకులంతా యజ్ఞఫలంగా తమయొక్క అమృతాత్మస్వరూపమును సుస్పష్టముగాను, ఘనీభూతమైన అనునిత్యానుభవముగాను మలచుకొంటున్నారు. సనాతనమగు పరబ్రహ్మ స్వస్వరూపమును పునఃప్రతిష్ఠించుకుంటున్నారు.

04–31

యజ్ఞశిష్టామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్ ।
నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమ ॥

యజ్ఞ శిష్ట అమృత భుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ ।
న అయం లోకో అస్తి అయజ్ఞస్య, కుతో అన్యః? కురుసత్తమ! ॥

ఓ కురువంశజులలో శ్రేష్ఠుడా! అర్జునా! ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేస్తున్నాను. (నీ ద్వారా సర్వజీవులందరికీ కూడా గుర్తు చేస్తున్నాను).

ఇప్పుడు మనం చెప్పుకొన్న వివిధ యజ్ఞములలో కొన్నిగాని, ఏదో ఒకటి గాని, శ్రద్ధ - ఆసక్తులతో ఆచరించేవారి జీవితము మాత్రమే సద్వివినియోగమగుచున్నది. ఇక, అట్టి యజ్ఞ ఉపాసనకు సంసిద్ధులు కానివారు ఇహంలోగాని - పరలోకంలోగాని (whether outwardly or inwardly) సుఖముగా ఉండలేరు సుమా! జీవితము యొక్క ఉత్తమమైన ప్రయోజనం పొందటం లేదు.

04–32

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే ।
కర్మజాన్విద్ధి తాన్సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే ॥

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే ।
కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ॥

ఈ విధంగా మనం ఇప్పటివరకూ సంక్షిప్తంగా చెప్పుకొని ఉన్న వివిధ యజ్ఞ విధానములన్నీ వేద - వేదాంగ - పురాణ - ఇతిహాసాదుల ద్వారా విజ్ఞులగు మహనీయులు ఆత్మ - అవగాహన యొక్క ఉన్నతి కొరకై లోకంలో ప్రవచించటం - ప్రబోధించటం జరుగుతోంది.

అయితే ……,
మనం చెప్పుకొన్న యజ్ఞములన్నిటిలో దాగియున్న ఏకైక అంశము ఏమిటి?’’
‘‘ప్రయత్నం’’ (Effort)

ప్రయత్నపూర్వకమైన కర్మల నిర్వహణ చేతనే ఆ అన్ని యజ్ఞ విధానములు నిర్వర్తించబడగలుగుచున్నాయి. అనగా, ప్రయత్న పూర్వకమైన కర్మలు నిర్వర్తించటం చేతనే ఆయా వివిధ యజ్ఞములను యజ్ఞవిదులు నిర్వర్తిస్తున్నారు. అందుచేతనే ‘‘కర్మను నిర్వర్తించు! త్యజించకు!’’ అని గుర్తుచేస్తున్నాను. జీవితము అనునది కర్మభూమిగా అందుకే చెప్పబడుతోంది.

04–33

శ్రేయాన్ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరన్తప ।
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ॥

శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః, పరంతప! ।
సర్వం కర్మ అఖిలం, పార్థ! జ్ఞానే పరిసమాప్యతే ॥

జ్ఞాన యజ్ఞం ఉత్తమోత్తమమైనది

ఓ అర్జునా! వివిధ యజ్ఞములున్నాయని, వివిధ యోగులు వాటిని ఆత్మ శుద్ధికై ఉపాసిస్తూ కర్మయోగ మార్గంలో కర్మలు ఆశ్రయిస్తున్నారని అనకున్నాము కదా!

అయితే, ….. అన్ని యజ్ఞములకన్నా ‘‘నిత్యానిత్యముల వివేకము - ఆత్మను సర్వేసర్వత్రా సర్వ స్వరూపంగా అర్థం చేసుకొని ఆస్వాదించటం’’ ….. అను జ్ఞానయజ్ఞం ఉత్తమోత్తమమైనదిగా ప్రకటిస్తున్నాను.

’‘ఈ జీవాత్మగా ఉన్నదే పరమాత్మ. ఈ జీవుడే శివుడు. శివుడే ఈ జీవుడు. నరుడే నారాయణుడు" అని తత్త్వమును నిర్ద్వంద్వంగా నిరూపించే సమాచారమే జ్ఞాన యజ్ఞం.

సర్వ ప్రయత్నముల ఫలశ్రుతి - అంతిమ ఫలము ఆత్మజ్ఞానమే! కనుక, సర్వ కర్మలు ఆత్మ జ్ఞానముతో పరిసమాప్తమౌతాయి.

స్వప్న ద్రష్ట యొక్క ’‘ఊహ’’యే స్వప్నంలో స్వప్నాంతర్గత విశేషాలుగా ప్రదర్శితమగుచున్నట్లు - ద్రష్టయే ఆత్మను దృశ్యరూప జగత్తుగా పరికల్పించుకొని వినోదిస్తున్నాడని, ఈ ద్రష్ట-దృశ్యములను అఖండాత్మ స్వరూపమను, అఖండాత్మ తత్వమని (శివతత్వమని) గ్రహించటమే జ్ఞానయజ్ఞం.

04–34

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ।
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ॥

తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ।
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినః తత్త్వదర్శినః ॥

ఆత్మజ్ఞులగు గురువులు - మార్గ దర్శకులు

అటువంటి ఆత్మ జ్ఞానం (మమాత్మా సర్వభూతాత్మా ….. అనే అఖండాత్మ సాక్షాత్కార స్థితి) లభించేది ఎట్లా?

నీ యొక్క ఆత్మ ఎట్టిదో - అట్టి తత్త్వజ్ఞానము ఎరిగిన ఆత్మజ్ఞులగు మహనీయులు ఉన్నారు. అట్టి మహనీయులను సందర్శించు. వారిని సమీపించి, శరణాగతిచే ఆశ్రయించాలి. ‘‘అయ్యా! మీరే నాకు దిక్కు ! నేనెవరు? నా ఆత్మ ఎట్టిదో నాకు విశదపరచండి’’ అని విన్నవించుకోవాలి. నీకున్న సందేహాలేమిటో తెలియజేయాలి. వారు నీ శరణాగతికి, పట్టుదలకు సంతోషించినవారై నీకు ఆత్మ జ్ఞానం నిర్వచిస్తూ ప్రవచిస్తారు. వారితో చక్కగా అనుమానాలు వ్యక్తీకరించి, వారి వాక్య సారములు గ్రోలుటచేత నీవు ఆత్మ జ్ఞానివి కాగలవు.

⭕️ ఎందుచేత ఈ జన్మల చేత, కర్మల చేత వాస్తవానికి ఎటువంటి బంధమూ నీకు లేదో, నీవు అప్రమేయుడవో…,
⭕️ ఏఏ విచారణ చేత ఈ కనబడే సర్వము నీ యొక్క ఆత్మ స్వరూపమే అయిఉన్నదని నీవు గ్రహిస్తావో, ఆత్మదృష్టితో సందర్శిస్తావో,….
⭕️ ఏది తెలుసుకొన్న తరువాత ‘‘నేను బద్ధుడను. దేహముగా, జీవుడుగా దిగజారినవాడను’’ …. అనే మోహము మొదలంట్లా తొలగుతుందో…..
⭕️ తదితర జీవులంతా ఏ సదసద్విమర్శచే నీ ఆత్మ స్వరూపులుగా నీకు అనుభూతమగుచున్నారో ….
→ అట్టి నిత్య సత్యమగు నీ ఆత్మ యొక్క మహిమను విశదపరుస్తారు. వారు బోధించే ఆత్మ తత్వ సమాచారం చేత ఆత్మత్వము ఆస్వాదించగలవు.

04–35

యద్ జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాణ్డవ ।
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ॥

యద్ జ్ఞాత్వా న పునః మోహమ్ ఏవం యాస్యసి, పాండవ! ।
యేన భూతాని అశేషేణ ద్రక్ష్యసి ఆత్మని అథో మయి ॥


ఆత్మత్వము ఆస్వాదించటం

➤ ఏ సత్యము - నిత్యము అగు ఆత్మ యందే ఈ లోకాలన్నీ ఉన్నాయిగాని, ….. నీవు ఈ లోకాలలో ఒక దేహముగానో - జీవుడుగానో ఉన్నావనటం ఆత్యంతికమైన సత్యం కాదో …,
➤ ఏ నీ అమృతాత్మయందు మృత్యువు ఒక చిన్న చమత్కారమేగాని, నీ ఆత్మ స్వరూపం మృత్యువుకు విషయమయి ఉండుటయే లేదో …,
➤ ఏ ప్రబోధముచే ఒక అద్దము (Mirror) లోని దృశ్యంలాగా ఈ జగత్తంతా నీ మనోదర్పణంలోని ప్రతిబింబమాత్రమేనని, ప్రతిబింబిస్తున్న దృశ్యముచే దర్పణము మార్పు చేర్పులు పొందనట్లు మనస్సులో ప్రతిబింబించే విషయాలచే మనస్సు మార్పు చెందుచున్నదనటం హాస్యాస్పదమని సుస్పష్టమవుతుందో …,

↳ అట్టి ఆత్మజ్ఞానం పొంది సర్వమోహములు అప్పటికప్పుడే తొలగించుకుంటావు. దేహరూపం నుండి విడివడి, సర్వజగత్‌ రూపుడవుగా, జగత్‌ అతీతమగు, జగత్‌ సాక్షియగు ఆత్మ స్వరూపంగా ప్రకాశిస్తావు.

04–36

అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః ।
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సన్తరిష్యసి ॥

అపి చేత్ అసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః ।
సర్వం జ్ఞానప్లవేన ఏవ వృజినం సంతరిష్యసి ॥

జ్ఞానప్లవం (జ్ఞాననౌక)

ఓ అర్జునా! ఒకడు అతి తీవ్రంగా ప్రవహిస్తున్న నదిని దాటాలంటే ఏమి చెయ్యాలి? ఒక నావను సంపాదిస్తే సురక్షితంగా ఆవలి ఒడ్డు చేరగలడు గదా! అట్లాగే జన్మ - జన్మల ‘‘అజ్ఞాన - దైన్య - ఆవేశ - క్రోధ - లోభ - మాత్సర్య - కామ - స్వార్థ’’ చింతనలనే దురభ్యాసములు అంతరంగమునుండి దృశ్యము వైపుగా ప్రసరిస్తూ ఉండటం చేత ‘‘ఆత్మతత్వానుభవం’’ అనే ఆవలివడ్డు చేరే ఉపాయం కనిపించక ఈ జీవుడు అనేక ఉపాధి పరంపరలుగా మ్రగ్గుచున్నాడు.

కనుక, ఈ జీవుడు వర్తమాన, మానవ దేహమును - ఇక్కడి నియమిత స్వధర్మములను ఒకానొక అవకాశంగా గమనించి ‘జ్ఞానము’ అనే నావను పునర్నిర్మించుకొని, ఆవలివడ్డు అగు ‘‘ఆత్మ స్వరూపంగా దృశ్యమును ఆస్వాదించగలగటం’’ అనే స్థానం చేరాలి.

‘‘నేను దోషములు కలవాడినే! తప్పులనేకం చేస్తున్నానే!’’ ….. అని దిగులు చెందనే వద్దు. పాపులందరిలోని అత్యంత గర్హనీయమై వారందరిలోనూ అగ్రగణ్యుడు కూడా ‘జ్ఞానము’ అనే నావను అధిరోహించి అజ్ఞాన నదీ జలమును దాటివేయగలడు సుమా! ఇక అన్యుల గురించి చెప్పేదేమున్నది!

04–37

యథైధాంసి సమిద్ధోఽగ్నిర్భస్మసాత్కురుతేఽర్జున ।
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ॥

యథా ఏధాంసి సమిద్ధో అగ్నిః భస్మసాత్ కురుతే, అర్జున! ।
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా ॥

జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణుః

అనేక కట్టెలు గుట్టలుగుట్టలుగా పడి ఉండవచ్చు గాక! అయితే ఏం? ఒక్క అగ్ని కణం తెచ్చి ఆ కట్టెలను సమూలంగా, సమగ్రంగా, సామూహికంగా తగలబెట్టి భస్మం చేయవచ్చు కదా! అట్లాగే అనేక జన్మల అజ్ఞాన అభ్యాస పరంపరలు ఈ జీవుని చుట్టుముట్టి ఉండవచ్చు గాక! దిగులు పడవలసిన పనిలేదు. ‘జ్ఞానము’ అనే నిప్పురవ్వచే వాటినన్నిటినీ భస్మీభూతం చేసి వేయవచ్చు.

(త్రిగుణములను జ్ఞానాగ్నిచే భస్మం చేసి అలంకారంగా నుదుటిపై ధరించిన పరమశివుని వలె) సకల కర్మ పరంపరా వ్యవహారములను జ్ఞానాగ్నిచే భస్మం చేసి అకర్మస్వరూపమగు ఆత్మ స్వరూపమును (కర్మలు నిర్వర్తిస్తూనే) అవధరించవచ్చు. జ్ఞానమును ఆశ్రయిస్తే చాలయ్యా! సర్వ కర్మబంధ భావాలు వాటికవే స్వయంగా తొలగిపోతాయి!

04–38

న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే ।
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విన్దతి ॥

న హి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే ।
తత్ స్వయం యోగసంసిద్ధః కాలేన ఆత్మని విందతి ॥

ఓ అర్జునా ! ’జ్ఞానము’తో సమానమైన పవిత్రమైనది మరింకేదీ ఎక్కడా లేనే లేదు.

అయితే, అత్యంత పవిత్రమైన ఆత్మజ్ఞానం లభించేది ఎట్లా? అందుకు మార్గం ఏమిటి?

ఇంతకు మునుపు మనం ఈ ఉపాసనా యజ్ఞముల గురించి చెప్పుకున్నాం కదా!
Ⅰ.) బ్రహ్మ యజ్ఞోపాసన / బ్రహ్మకర్మ సమాధి నిష్ఠ
Ⅱ.) దైవ యజ్ఞోపాసన / దేవతార్చన యజ్ఞం
Ⅲ.) బ్రహ్మాగ్ని యజ్ఞము
Ⅳ.) సంయమ యజ్ఞోపాసన / ఆత్మ సంయమ యోగాగ్ని యజ్ఞం
Ⅴ.) ఇంద్రియ యజ్ఞోపాసన
Ⅵ.) మనోనిగ్రహోపాసన
Ⅶ.) ద్రవ్య యజ్ఞోపాసన
Ⅷ.) తపో యజ్ఞోపాసన
Ⅸ.) యోగ యజ్ఞోపాసన
Ⅹ.) స్వాధ్యాయ యజ్ఞోపాసన
Ⅺ. ) జ్ఞాన యజ్ఞోపాసన
Ⅻ.) ప్రాణాయామ యజ్ఞోపాసన

ఇటువంటి ఒక్కటో, రెండో, కొన్నియో, అన్నీయో కలగలుపుకుంటూ చేసే ప్రయత్నం చేతనే ఈ జీవుని యొక్క బుద్ధి తన దోషములను తొలగించుకొని, అప్పుడు ఆత్మదృష్టిని ప్రవృద్ధ పరచుకుంటుంది.

ఈ విధంగా ఎవరు యోగ సంసిద్ధుడై ప్రయత్నములను కొనసాగిస్తూ ఉంటారో …. అట్టివారి హృదయంలో ఆత్మజ్ఞానపుష్పం తనంతట తానే సరిఅయిన కాలంలో వికసిస్తోంది.

04–39

శ్రద్ధావాల్లభతే జ్ఞానం తత్పరః సంయతేన్ద్రియః ।
జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిమచిరేణాధిగచ్ఛతి ॥

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్ పరః సంయతేంద్రియః ।
జ్ఞానం లబ్ధ్వా పరామ్ శాంతిం అచిరేణ అధిగచ్ఛతి ॥

ఆత్మజ్ఞానమే ఏ జీవుడైనా ఆశ్రయించవలసినది, ఏ జీవుని విషయంలోనైనా - ఉద్ధరించగలిగేదీ కూడా!

శ్రద్ధ, పట్టుదల, ఆత్మ నమ్మకము, గురువాక్య - శాస్త్రవాక్య పరిశీలనము, సాధన, నిర్మలమైన అవగాహన పెంపొందించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం శ్రద్ధ. శ్రద్ధ వున్నచోట మిగతావన్నీ తామే వచ్చి చేరుతాయి.

‘‘శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం’’ - శ్రద్ధ గలవానికే జ్ఞానం లభిస్తుంది.

దృశ్యంలో శ్రద్ధ ఉంటే దృశ్య వ్యవహారాలే నిత్యము కొనసాగుతూ ఉంటాయి. తత్పరమైన ఆత్మ జ్ఞాన సంబంధమైన శ్రద్ధచే ఆత్మజ్ఞానం లభిస్తోంది. ఇంద్రియములను జగత్‌ విషయములవైపు నుంచి మరల్చి వివిధ యజ్ఞరూపములైన ప్రయత్నములలో నియమిస్తూ వస్తే, అప్పుడు ఆత్మ జ్ఞానమునకు అర్హుడవవుతావు. ఆత్మజ్ఞానం సంపాదించుకోవటం చేత అవిచ్ఛిన్నమగు పరమశాంతిని స్వభావసిద్ధంగా సముపార్జించుకోగలవు.

04–40

అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి ।
నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః ॥

అజ్ఞః చ అశ్రద్ధధానః చ సంశయాత్మా వినశ్యతి ।
న అయం లోకో అస్తి, న పరో, న సుఖం సంశయాత్మనః ॥

ఇక…..
→ ‘‘అజ్ఞానవిశేషాలే మధురంగా భావించటం, ఆస్వాదించటం’’ కొనసాగించేవారు,
→ శ్రద్ధ - పట్టుదల ఆశ్రయించనివారు,
→ సంశయములను తొలగించుకోవటానికి సిద్ధపడనివారు,
…. వీరి గురించి ఏం చెప్పను?

వారు మానవ జన్మచే లభిస్తున్న అవకాశములన్నీ వృధా చేసుకొని అజ్ఞానాగ్నుల వైపుగా ప్రయాణిస్తూ తమకు తామే ద్రోహం చేసుకొంటున్నారు. మరల మరల అల్ప దృష్టుల వైపుగా ప్రయాణములను శ్రమపడుతూ మరీ కొనసాగిస్తున్నారు. వారికి ఇక్కడ గాని మరొక చోటగాని, ఇహంలోగాని, పరంలోగాని, దృశ్యమునందుగాని, అంతరంగమునందుగాని సుఖము - శాంతి లభించటమే లేదు.

సంశయాత్మునకు (తన స్వరూపం గురించి తనకే తెలియక, తెలుసుకోవటానికి కూడా ప్రయత్నించనివానికి) దుఃఖమిశ్రితంగాని ఆనందం (Happiness sans all worries) లభించేది ఎట్లా ? న సుఖమ్‌ సంశయాత్మనః |

04–41

యోగసంన్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్ ।
ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనఞ్జయ ॥

యోగ సంన్యస్త కర్మాణం, జ్ఞాన సంఛిన్న సంశయమ్ ।
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి, ధనంజయ! ॥

అందుచేత ఓ అర్జునా!

1) యోగ సన్న్యస్త కర్మాణమ్‌ : కర్మయోగివై కర్మలను అధిగమించు. ఇప్పుడు మనం ఉదహరించుకున్నట్లు యోగ సాధనల సహాయంతో సర్వకర్మలు సన్యసించివేయి. కర్మ గురించిన సర్వ బంధములు త్రెంచివేయి! కర్మలకు అతీతత్వం సముపార్జించుకో! కర్మలయొక్క అతీత్వముకొరకై కర్మలు ఆశ్రయించు.

2) జ్ఞాన సంఛిన్న సంశయః : నిత్యానిత్య వివేకముతో కూడిన ఆత్మజ్ఞాన సముపార్జనచే ‘‘అఖండమగు ఆత్మయే నా స్వరూపం’’ అను స్థితికి అడ్డుగా ఉందన్న సర్వ సంశయములను తొలగించుకో. యోగ-జ్ఞానములు ఒక్కసారే ఆశ్రయించు.

3) ఆత్మవంతమ్‌ : ’‘ఈ దేహ - మనో - బుద్ధి - చిత్త - జీవాత్మలు నా స్వరూపము కాదు. వేద - వేదాంగ - వేదాంత శాస్త్ర ప్రతిపాదితమైన ‘ఓం’కార సంజ్ఞారూపమగు ఆత్మ స్వరూపమే నా వాస్తవ స్వరూపం’’ ….. అను ఆత్మవంతమగు స్థితిని సముపార్జించుకో.
అప్పుడు అనివార్యంగా చేయవలసియున్న కర్మలు కూడా నిన్ను కించిత్‌ కూడా నిబద్ధించవు. బద్ధునిగా చేయలేవు. కర్మలు నిర్వర్తిస్తున్నప్పటికీ కర్మబంధము నీకు ఉండదు.

04–42

తస్మాదజ్ఞానసంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః ।
ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత ॥

తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్‌స్థం జ్ఞాన అసినా ఆత్మనః ।
ఛిత్త్వా ఏనం సంశయం యోగమ్ ఆతిష్ఠ ఉత్తిష్ఠ, భారత! ॥

ఓ అర్జునా! ఆత్మ జ్ఞానం ఎక్కడ ఉన్నది? ప్రతిజీవుని స్వస్వరూపము ఆత్మయే కదా! కనుక, ప్రతి హృదయంలోను ఆత్మ జ్ఞానం జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూనే ఉన్నది. అయితే ఆ ఆత్మజ్ఞానం అభ్యాస వశంగా స్వయం కల్పితమైన అజ్ఞానముచే ఆవరించబడి ఉండటంచేత స్వబుద్ధికి అనుభవం కావటం లేదు. నీ జ్ఞానమునకు, నీ అజ్ఞానమే అడ్డుగోడగా నిలచి ఉంటోంది.

జ్ఞాన అసి (జ్ఞాన ఖడ్గం)

కాబట్టి అర్జునా! మనం చెప్పుకున్న ప్రయత్న (కర్మ నిర్వహణ) పూర్వకమైన ‘‘యజ్ఞ కర్మ’’ అనే ప్రయత్నములచే ‘జ్ఞానము’ అనే ఖడ్గమును ధరించినవాడవై నీ హృదయములో సంశయముల రూపంగా ప్రవృద్ధమైయున్న అజ్ఞాన వృక్షమును మొదలంట్లా నరికివేయి.

🌻 ప్రతి ఒక్కరి హృదయములోనే ఆత్మ జ్ఞానము ఉన్నది.
🌻 అది కామ-క్రోధ-మోహ-లోభములు మొదలగువాటిచే కప్పబడినది.
🌻 అనేక జన్మలు అజ్ఞానపూర్వకంగా గడచిపోతున్నాయి సుమా!
🌻 జీవితాన్ని శాస్త్ర ప్రబోధానుసారం యజ్ఞ కర్మయోగమయం చేయి. తద్వారా కర్మలను అధిగమించు.
🌻 జ్ఞానము కొరకై మహనీయులను ఆశ్రయించు.
🌻 సర్వ సంశయములు తొలగించుకొని జన్మ-కర్మలతో కూడిన సకల జగత్‌ దృశ్యములను ఆత్మ స్వరూపంగా గ్రహించి ఆత్మజ్ఞుడవు కమ్ము.

🌺 అట్టి ప్రయత్నములో ఉద్యమించటానికై జాగరూకుడవు కమ్ము. ఓ భారతా! ఉత్తిష్ఠ! ఉత్తిష్ఠ!

ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … జ్ఞాన యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏