[[@YHRK]] [[@Spiritual]]

Adhyātma Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


శుక్ల యజుర్వేదాంతర్గత

1     అధ్యాత్మోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


ఓం పరమశివాయ, అపాంతరతమ మునివర్యాయ, బ్రహ్మదేవాయ, ఘోరాంగిరసాయ, రైక్వాయ, శ్రీరామాయ … మహత్ సత్ గురు పరంపరాయ నమో నమో నమో నమో నమః!

శ్లో॥ యత్ర అంతర్యామి - ఆది (ఇత్యాది) భేదః
తత్త్వతో న హి యుజ్యతే ।
నిర్భేదం పరమాద్వైతం
స్వమాత్రమ్ అవిశిష్యతే ॥

ఎచ్చటైతే అంతర్యామి బహిర్యామి - ఇత్యాది భేదములేవీ మొదలే లేనివి’ అగుచున్నాయో, ఆ స్థానమే భేదరహితము - పరమాద్వైతము అగు స్వస్వరూపమాత్రముగా సర్వత్రా ఏర్పడినదైయున్నది! శేషించియున్నదగుచున్నది.

1.) అంతః శరీరే నిహితో గుహాయామ్।
అజ ఏకో నిత్యమ్।
అస్య పృథివీ శరీరం,
యః పృథివీమ్ అన్తరే సన్చరస్య
యం పృథివీ న వేద।
యస్య ఆపః శరీరం,
య ఆపో అన్తరే సంచరస్యమ్,
(యం) ఆపో న విదుఃl
యస్య తేజః శరీరమ్
యః తేజో అన్తరే సంచరస్యమ్,
(యం) తేజో న వేద
యస్య వాయుః శరీరం, యో వాయుమ్ అన్తరే సంచరస్యమ్,
(యం) వాయుః న వేదః ॥

సర్వ దేహములలోని బుద్ధి గుహయందు ఆత్మ భగవానుడు వేంచేసి ఉన్నారు.
ఆయన జన్మరహితుడు. అనేకముగా కానట్టివారు, ఏకరూపులు, నిత్యులు.

ఈ భూమి అంతా ఆయన శరీరమే! ఈ భూమియొక్క అంతరమున సంచరించుచున్నట్టి వారు. కానీ, ఆయన గురించి ఈ భూమికి తెలియవచ్చుట లేదు. (పృథివియందు తెలుసుకొనువాడుగా వేంచేసి యుండి, పృథివికి తెలియబడటం లేదు).

ఆ పరమాత్మ జలమును తన శరీరముగా కలిగి ఉన్నారు. ఈ జలములో అంతరంగా సంచరిస్తున్నారు. అయితే జలము ఆ విషయం గమనించటంలేదు.

తేజస్సు పరమాత్మ శరీరమే! ఆయన తేజస్సులో అంతః సంచారి! కానీ ఈ తేజస్సు ఆయనను గుర్తు పట్టటం లేదు.

పరమాత్మ వాయు శరీరుడు కూడా! వాయువుకు అంతరముగా వాయుదేవుడై సంచరిస్తున్నారు. ఆ విషయం వాయువుకు అనుభవమవటం లేదు.

యస్య ఆకాశః శరీరమ్,
య ఆకాశం అన్తరే సంచరస్యమ్।
(యమ్) ఆకాశో…. న వేద।
యస్య మనః శరీరమ్,
యో మనో అన్తరే సంచరస్యమ్,
(యం) మనో న వేద
యస్య బుద్ధిః శరీరమ్,
యో బుద్ధిమ్ అన్తరే సంచరస్యమ్
(యం) బుద్ధిం న వేద
యస్య చిత్తం శరీరమ్,
యః చిత్తం అన్తరే సంచరస్యమ్,
(యం) చిత్తం న వేదః
యస్య అహంకారః శరీరమ్,
యో అహంకారమ్ అన్తరే సంచరస్యమ్,
(యం) అహంకారో న వేద
యస్య అవ్యక్తమ్ శరీరమ్,
యో అవ్యక్తమ్ అన్తరే సంచరస్యమ్,
(యం) అవ్యక్తమ్ న వేద।
యస్య అక్షరమ్ శరీరమ్,
యో అక్షరమ్ అన్తరే సంచరస్యమ్,
(యం) అక్షరమ్ న వేదః
యస్య మృత్యుః శరీరమ్,
యో మృత్యుమ్ అన్తరే సంచరస్యమ్,
(యం) మృత్యుః న వేద

స ఏష సర్వభూతాంతరాత్మా,
అపహత పాప్మా, దివ్యో దేవ ఏకో నారాయణః॥

ఈ ఆకాశము ఆ పరమాత్మ యొక్క శరీరమే! ఆకాశమునందు అంతరహృదయుడు ఆయనయే! ఆకాశ-అంతర సంచారుడు! కానీ విచిత్రం! ఆకాశమునకు అది ఎరుక అవటం లేదు.

ఆ పరమాత్మ మనః శరీరుడు. మనస్సంతా అంతరమున నిండి ఉన్నది ఆయనే! కానీ మనస్సుకు ఆయన గురించి ఏమీ తెలియరావటం లేదు.

ఈ బుద్ధి ఆయనయొక్క శరీరమే! బుద్ధికి అంతరముగా ప్రకాశించుచున్నది ఆయనే! ఆశ్చర్యం! ఈ బుద్ధి అది గమనించటం లేదు మరి!

ఆయన చిత్తమును తన శరీరముగా కలిగి ఉన్నవారు. చిత్తము యొక్క అంతరములో సంచారకుడు కూడా! ఆయన ఎవరో ఈ చిత్తము ఏమాత్రమూ గ్రహించటము లేదు.

ఆ ఆత్మ భగవానుడు అహంకారశరీరుడు కూడా! అహంకారము యొక్క అంతరములో అంతర్యామి! అయితే అహంకారమునకు ఆయన గురించి ఎరుక లేదు.

ఆయన అవ్యక్త శరీరుడు. అవ్యక్తముయొక్క అంతరముగా సాక్షి అయి నిండి ఉన్నదీ ఆయనే! ఏమి చిత్రం! ఆయనను అట్టి ఈ అవ్యక్తము తెలుసుకోవటమే లేదు.

ఆయన ’అక్షరమును’ శరీరముగా కలిగి ఉన్నవారు. అక్షరము యొక్క అంతరమున ఆయన సంచరిస్తూ ఉన్నప్పటికీ, అక్షరమునకు ఆయన గురించి తెలిసిరావటమే లేదు.

మృత్యువు ఎవ్వరియొక్క శరీరమైయున్నదో, ఎవ్వరైతే మృత్యువు యొక్క అంతర్యామి కూడానో అట్టి మృత్యువునకు ఆయన తెలియబడకయే ఉన్నారు.

అట్టి పరమాత్మ సర్వ జీవులయొక్క అంతరాత్మ! ఆయన నిత్య నిర్మలుడు! పాప దోషములచే స్పృశించబడనట్టివాడు! దివ్య స్వరూపుడు ……… ! దేవాది దేవుడు! ఏకము అఖండము అగు శ్రీమన్నారాయణుడు!

2.) ’అహమ్-మమ’ - ఇతి యో భావో
దేహ-అక్షదాః అనాత్మని,
“అధ్యాసో” అయం నిరస్తవ్యో
విదుషా బ్రహ్మనిష్ఠయా।
జ్ఞాత్వా స్వం ప్రత్యగాత్మానం
బుద్ధిః తత్ వృత్తి సాక్షిణమ్।
సోఽహమ్ ఇత్యేవ తత్ వృత్త్యా
స్వా - అన్యత్రా ఆత్మమతిం త్యజేత్॥

ఒక్కొక్క దేహములో ఒక్కొక్క తీరుగా కనిపించే “నేను-నాది” మొదలైనవన్నీ దేహాత్మ భావన వలన కలుగుతోంది. అది దేహ దృష్టికి పరిమితమైనది. అది ఆత్మ దృష్టి కాదు. కాబట్టి “అనాత్మము”.

‘నేను ఈ దేహముచే పరిమితుడను’ అను దేహ ధ్యాస (లేక) దేహపరిమిత దృష్టియే “అధ్యాస” అని పిలవబడుతోంది. అది మిథ్యాదృష్టి. అట్టి మిథ్యా అధ్యాసను “బ్రహ్మనిష్ఠ” అనే ఉపకరణముతో విజ్ఞులు నిరస్తవ్యులై (లేనిది లేనట్లు దర్శించువారై) జయిస్తున్నారు.

ఈ నా దేహమునకు - సర్వ దేహములకు వేరుగా ఉన్న “ప్రత్యగాత్మ”“బుద్ధికి - ఆ బుద్ధి యొక్క వృత్తులకు కేవలసాక్షి” గా, స్వం-అఖండమైన “నేను” గా వెలుగొందుచున్నట్లు గ్రహించాలి. “సో హమ్ - సర్వ దేహములలోని సర్వ బుద్ధి వృత్తులకు కేవలసాక్షిగా ఉన్న ఆ ప్రత్యగాత్మయే నేను” - అను ‘తత్ వృత్తిని’ ఆశ్రయించాలి.

ఇక “దేహాత్మను. దేహమే నేను. జీవాత్మత్వము పొందాను. ఈ జాతి నాది"… మొదలుగా గల అన్యమగు దేహాత్మబుద్ధిని జయించాలి.

లోకా అనువర్తనం త్యక్త్యా,
త్యక్త్యా దేహా-అనువర్తనమ్
శాస్త్రా-అనువర్తనమ్ త్యక్త్వా
స్వాధ్యాసా అపనయం కురు॥

బిడ్డలారా! “ఆత్మ మరెక్కడో ఉన్నది. ఇంకెప్పటికో లభిస్తుంది"- అను రూపము గల అన్యత్రా ఆత్మబుద్ధి (ఆత్మ వేరు నేను వేరు అను బుద్ధి)ని త్యజించాలయ్యా! ఎట్లా?
మూడు అనువర్తనములు వదలుము. నాలుగవ అనువర్తనమును ఆశ్రయించండి.
1. లోక విషయాలు - లోకంలో కనిపించే (లేక) లోకాలలో కనిపించే భిన్నత్వము - లోకానువర్తనము. ఇది వదలి ఉండండి.
2. ఈ దేహమే నేను … అనునది దేహానువర్తనము. దీన్ని కూడా వదలివేయండి.
3. శాస్త్రాలు నాకు తెలుసు. అతనికి తెలియదు అను శాస్త్రానువర్తనము. ఇదీ వదలాలి!
4. ఈ మూడు అనువర్తములు వదలి, స్వీయాత్మ సంబంధమైన “నేను ఆత్మస్వరూపుడను కదా…” అనే ఆత్మానువర్తన భావనతో తదితర పరిమిత స్వాధ్యాసలు వదలి ఉండండి.

3.) స్వాత్మన్యేవ సదా స్థిత్వా
మనో నశ్యతి యోగినః
యుక్త్యా శ్రుత్యా స్వానుభూత్యా
జ్ఞాత్వా సర్వాత్మ్యమ్ ఆత్మనా
నిద్రాయా లోకవార్తాయాః
శబ్దాదేః ఆత్మవిస్మృతేః,
క్వచిత్ న అవసరం దత్వా
చిన్తయా ఆత్మానమ్ ఆత్మని ।
మాతా పిత్రోః మల-ఉద్భూతం
మల-మాంస మయం వపుః,
త్వక్త్వా చణ్ణాలవత్ దూరం
బ్రహ్మీభూయ కృతీ భవః
ఘటా ఆకాశ మహా ఆకాశ ఇవ
ఆత్మానం పరాత్మని
విలాప్యాఽఖండ భావేన
తూష్ణీం భవ సదా మునే ।
స్వప్రకాశం అధిష్ఠానం
స్వయంభూయ సదా ఆత్మనా
బ్రహ్మాణమపి పిణ్డఽణ్డమ్
త్యజ్యతాం మలభాండవత్|
చిదాత్మని సదా ఆనన్దే దేహారూఢామ్
అహం ధియమ్.
నివేశ్య లింగమ్ ఉత్సృజ్య
‘కేవలో’ భవ సర్వదా॥

“స్వ ఆత్మ”యందే ఎల్లప్పుడు స్థితిని సంపాదించుకొనుచున్న యోగి యొక్క - అనాత్మమైన - ప్రతిబింబిత విషయముల మనన రూపమగు - మనస్సు… స్వయముగా వినాశనమగు చున్నది. (స్వాత్మకు అభిన్నరూపంగా లయం పొందుచున్నది).

యుక్తి (ఉపాయము) - శ్రుతి (శాస్త్ర- గురు వాక్యముల - పాఠముల తాత్పర్యము)స్వానుభవము… (స్వకీయ ప్రాణాయామ - భక్తి ఇత్యాది ప్రయత్నములచే రూపుదిద్దుకొనే అనుభవము - స్వ విచక్షణ) ఈ మూడిటి సహాయంతో సర్వాత్మకమైన స్వీయాత్మను తెలుసుకొని, … లోకములో జీవుల పరస్పర సంబంధముల రూపముగా కనిపిస్తున్న లోకవార్తా విషయ రూపములగు శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదులపట్ల నిద్రామౌనము వహించు. దేహాత్మ భావనలను విస్మరించినవాడవై, “వీటన్నిటితో నాకేమి అవసరం?” అని భావిస్తూ, ఆత్మతో సర్వాత్మభావనను చింతన చేయాలి.

ఈ భౌతిక దేహము ఎటువంటిది? తల్లి-తండ్రుల మలము నుండి ఉద్భవించినట్టిది. అట్టి ఈ దేహము మల-మూత్ర-మాంసమయమే గాని ఇందులో సారమైన వస్తువు ఏదీ లేదు. మురికి-మలము-మూత్రము వంటి చండాలమగు వస్తువులను వదలి దూరంగా ఉంటాము కదా! ఆవిధంగా దేహాత్మభావనను “సర్వదేహ సాక్షియగు పరమాత్మయే నేను” అను భావన సహాయంతో త్యజించి బ్రాహ్మీభూయ ఆకృతుడవు - బ్రహ్మభావనా కృతకృత్యుడవు అగుము.

ఒకచోట అనేక కుండలు ఉంటే ఆ కుండలన్నిటిలో ఉండే ఆకాశము - అంతటా ఉన్న ఆకాశములో అఖండమగు అంతర్విభాగమేగా! అట్లాగే ఘటాకాశము, మహాకాశమువలె సర్వ దేహాలలోని జీవాత్మ - పరాత్మయొక్క ప్రదర్శనమే! ఈవిధంగా సర్వ దేహాలలోని ఆత్మను “పరాత్మ”గా గానం చేస్తూ, అఖండ భావనను ఆశ్రయించినవాడవై “నేను వేరు - నీవు వేరు" అను దృశ్య-రూప ఖండ భావనలపట్ల తూష్ణీకరించి ఉండుము.

స్వయం ప్రకాశము, సర్వదేహములకు అధిష్ఠానము (సర్వ జీవులు ఎందులో ఉండి ఉన్నారో, అట్టి పరాత్మ)ను నేనే! తన చేత తానే ఉనికి గల స్వయం భూయమగు సదాత్మనే నేను! …. అను భావనతో స్వాత్మను ఆశ్రయించుము. ఇక ఆపై మలముతో నిండిన కుండలను దూరంగా ఉంచివేయు రీతిగా పిండాండమును (భౌకతికమగు ఈ దేహమును), బ్రహ్మాండ రూపముగా కనిపించే దానిని (బాహ్య భౌతిక సువిశాల జగత్తును) కూడా త్యజించి వేయుము.

ఈ భౌతిక దేహ ఘటములో కనిపిస్తూ ఉంటున్న అహమ్ (నేను)-ధియమ్ను (బుద్ధులను) సదానంద స్వరూపుడు- సర్వ దేహములలో వెలుగొందు చిదాత్ముడు అగు పరమాత్మత్వయందు నిలిపి,… ఆపై ఇక నామరూపాత్మకంగా (సందర్భానుచితంగా మాత్రమే) కనిపించేదంతా వదలి…. సర్వదా కేవల స్వరూపుడవై ఉండుము.

4.) యత్ర ఏష జగత్ - ఆభాసో
‘దర్పణాన్తః పురమ్’ యథా,
‘తత్ బ్రహ్మాఽహమ్’ ఇతి జ్ఞాత్వా
కృతకృత్యో భవ, అనఘ!
‘అహంకార’ గ్రహాన్ ముక్తః
స్వరూపమ్ ఉపసద్యతే
చంద్రవత్ విమలః పూర్ణః
సదా ఆనందః స్వయం ప్రభః|
క్రియా నాశాన్ భవేత్, చిన్తా నాశోI
అస్మాత్ వాసనాక్షయఃl
వాసనా ప్రక్షయో మోక్షః
సా “జీవన్ముక్తిః” ఇష్యతే |
సర్వత్ర సర్వతః సర్వః
బ్రహ్మమాత్రా-అవలోకనమ్
సత్ భావ భావనా దార్దాత్
‘వాసనాలయమ్’ అశ్నుతే॥

ప్రమాదో బ్రహ్మనిష్ఠాయామ్
న కర్తవ్యః కదాచనః |
“ప్రమాదో మృత్యుః” ఇతి ఆహుః,
విద్యాయాం బ్రహ్మవాదినః ॥

బిడ్డా! పాపరహితుడా! శ్రోత (శిష్య) దేవా! పుణ్య పాపములచేత స్పృశించబడజాలని ఆత్మస్వరూపా! నిర్మలానంద రూపా!

ఒక దర్పణంలో ఎదురుగా ఉన్న నగరము (పురము) దృశ్యము (ప్రతిబింబితమై) కనబడువచ్చు గాక! అంత మాత్రముచేత, దర్పణము (అద్దములో) పురము (నగరము) ఉన్నదని అనము కదా! అట్లాగే “ఏ ‘ఆత్మ’ అనే అద్దములో జగత్తు అనబడునది ఆభాసిస్తోందో, అట్టి దర్పణరూప బ్రహ్మమే నేను” అని తెలుసుకొని కృతకృత్యుడవు అవవయ్యా!

చంద్రగ్రహణమప్పుడు చంద్రబింబమును ఆవరించిన (కేతు)గ్రహము వదలగానే పూర్ణ చంద్రుడు ప్రకాశమానమౌతాడు కదా! అదేవిధంగా అహంకారము అనే గ్రహమును వదలించుకొని, విముక్తుడవై - పూర్ణచంద్రునివలె స్వయమాత్మానంద ప్రభతో శోభించవయ్యా!


రజోగుణ-సంసర్గముచే ఏర్పడుచున్న (లేక), ఏర్పడే ఏదో చేయాలి, చేయాలి… అనే క్రియ-ఆశల వలన రూపుదిద్దుకొనే చింతలను వదలివేస్తూ ఉండగా, క్రమంగా వాటికి సంబంధించిన వాసనలు కూడా తొలగుతాయి. ఆవిధంగా వాసనలు ప్రక్షాళణం కావటమే మోక్షము. ఆతడే ‘జీవన్ముక్తుడు’ అని పిలువబడుచున్నాడు.

“ఓ పరమాత్మా! ఈ కనబడేదంతా నీ దర్శనా విశేషమే! కనుక ఇదంతా ’నేను’తో సహా, నీవేనయ్యా!” అను ఉత్తమ బుద్ధితో, అంతటా, ఎల్లప్పుడు సర్వమూ ‘బ్రహ్మము’గా అవలోకనము చేయటము చేత ఏర్పడుచున్న సద్భావనా ధారుడ్యమే (అంతా సత్ చిత్ ఆత్మ స్వరూపమే - అనే భావనా బలిమియే) “వాసనాలయము” అయి ఉన్నది. అటువంటి బ్రహ్మనిష్ఠ కలిగి యుండటములో ఏమాత్రమూ ఏమరపు-అశ్రద్ధ, బద్ధకము, మత్తు పనికిరాదు. “ఏమరుపు - అశ్రద్ధ - బద్ధకము రూపమగు ప్రమాదమే మృత్యువు సుమా!” అనునదే బ్రహ్మవేదులు గుర్తు చేసే బ్రహ్మవిద్యా మార్గము!

5.) యథా అపకృష్టం శైవాలం క్షణమాత్రం న తిష్ఠతి,
ఆవృణోతి తథా మాయా
ప్రాజ్ఞంవాఽపి పరాఙ్ముఖమ్|
జీవతో యస్య కైవల్యం
విదేహెూఽపి స కేవలః,
సమాధి నిష్ఠతామ్ ఏత్య
నిర్వికల్పో భవ, అనఘ।
అజ్ఞాన హృదయగ్రంథేః
నిశ్శేష విలయః తథా,
సమాధినా వికల్పేన యదా అద్వైతాత్మ దర్శనమ్|
అత్ర ఆత్మత్వం దృఢీ కుర్వన్ ‘అహమ్’ ఆదిషు సన్యజన్,
ఉదాసీనతయా తేషు తిష్ఠేత్ ఘట - పటాదివత్|
బ్రహ్మాది - స్తమ్భపర్యంతం
మృషామాత్రా ఉపాధయః |
తతః పూర్ణం స్వమాత్మానం
పశ్యేత్ ఏకాత్మనా స్థితమ్ ।
స్వయం బ్రహ్మా । స్వయం విష్ణుః ।
స్వయం ఇంద్రః ।  స్వయం శివః ।
స్వయం విశ్వం ఇదం సర్వం!
స్వస్మాత్ అన్యత్ న కించన ॥

నీటిలోని నాచును ప్రవాహ వేగం ప్రక్కకు నెట్టినా కూడా, తిరిగి యథారీతిగా తల ఎత్తుకొని నిలబడువిధంగా, ఒకడు ఆత్మ సమాచారము దృష్ట్యా మహా
ప్రాజ్ఞవంతుడయినప్పటికీ కించిత్ పరాఙ్ముఖము (ఏమరపు)చే మాయ ఆక్రమించుకొనగలదు. కనుకనే నిత్య జాగరూకత అత్యవసరము.

జీవించి ఉన్నంత కాలము (దేహము ఉన్నప్పటికీ) కేవలమగు విదేహ ముక్తిని సిద్ధించుకోవాలి. అట్లా సముపార్జించుకొన్నవాని సమాధినిష్ఠ దేహము తొలగినా కూడా కొనసాగగలదు. అట్టి నిర్వికల్పుడవగుము. కేవల స్వరూపుడవై శేషించుము.

సమాధిచే ఎప్పుడైతే నిర్వికల్పుడవు (కల్పనా రహితుడవు) అవుతావో, ఇకప్పుడు హృదయములోని అజ్ఞాన గ్రంధులు నిశ్శేషంగా విలయించిపోగలవు. ఆద్వైతాత్మ దర్శనము పొందగలవు. (పరాత్మ-జీనాత్మ-జగత్ దృశ్యముల అభేదత్వమే అద్వైతము). అట్టి సమాధి నిష్ఠుడు “నేను ఆత్మస్వరూపుడను” అను ఆత్మతత్వమును దృఢీకరించుకుంటున్నవాడై, ఆహమ్-త్వమ్ (నేను నీవు) మొదలైన వాటిని మొదలంట్లా త్యజించి వేసి, (లేక) స్వస్వరూపమునందు లయింపజేసి ఉదాసీనుడై ఉంటాడు. కుండ-వస్త్రము వలె దృశ్యానుభవ పరిమితిని దాటి, మౌనము వహించి ఉంటాడు.

సృష్టికర్తయగు బ్రహ్మ దేవుని నుండి ఒక స్థంభము వరకు కనబడుచున్న ఉపాధులన్నీ మిధ్య(lusion) మాత్రమే! … అను అవగాహన కలిగి, యోగి
“ఇదంతా నా యొక్క పూర్ణానందాత్మ స్వరూపమై ఏకాత్మయందు స్థానము కలిగి ఉన్నది" … అను దృష్టి - అవగాహనలతో దర్శిస్తున్నాడు. నా ఆత్మయే స్వయముగా సృష్టికర్తయగు బ్రహ్మ ! స్థితి స్వరూపుడగు విష్ణువు! లయకారుడగు శివుడు! ఇంద్రియముల అధిపతియగు ఇంద్రుడు. ఈ విశ్వమంతా కూడా స్వయమాత్మ స్వరూపమే! మమాత్మకు వేరై ఎక్కడా ఏదీలేదు! కనుక అంతా నేనే!

6.) స్వాత్మని ఆరోపితా అశేషా
భాస వస్తు నిరాసతః
“స్వయమేవ పరంబ్రహ్మ,
పూర్ణమ్।  అద్వయం। అక్రియమ్। "
అసత్ కల్పో వికల్పోఅయం, విశ్వమ్
ఇతి ఏకవస్తుని,
నిర్వికారే నిరాకారే నిర్విశేషే అభిధా కుతః?
ద్రష్టృ-దర్శన-దృశ్య-ఆది భావశూన్యే నిరామయే
కల్పాఽర్ణవ ఇవ అత్యన్తః పరిపూర్ణే చిదాత్మని,
తేజసీవ తమో యత్ర
విలీనం భ్రాంతి కారణమ్?
అద్వితీయే పరే తత్త్వే
నిర్విశేషే భిధా కుతః?
ఏకాత్మకే పరే తత్త్వే
భేదకర్తా కథం వసేత్?
సుషుప్తా సుఖమాత్రాయాం
భేదః కేన అవలోకితః?
చిత్తమూలో వికల్పో అయం
చిత్త అభావేన కశ్చన?
అతః చిత్తం సమాధే హి
ప్రత్యక్ రూపే పరాఽత్మని!

నిరాకారమగు బంగారమునందు సాకార పరిభాష అగు ఉంగరము-గాజు మొదలైనవి ఆపాదించబడుచున్న విధంగా, అసత్య వస్తురూపమగు ఈ ప్రపంచమంతా కూడా సత్యమగు ఆత్మయందే ఆరోపితమై ప్రతి-భాసిస్తోంది! అట్టి పరమాత్మ స్వయముగా పరబ్రహ్మమై, పూర్ణమై, సర్వమై, సర్వాంతర్యామి అయి, తనకు ద్వితీయమైనదంటూ ఎక్కడా ఏదీ లేనిదై విరాజిల్లుచున్నారు.

సంకల్పముచే అనేకముగా కనిపిస్తున్న ఈ విశ్వమంతాకూడా అసత్కల్పనయే! అసంకల్పత్వము, అవికల్పములచే లేనిదై, ఏకవస్తు స్వరూపమగుచున్నది. నిర్వికారము, నిరాకారము, నిర్విశేషము అగు ఆత్మయే మనకు ఉండగా, ఇందులో నీ-నా ఆత్మ ఎక్కడున్నది? చూచువాడు - చూపు - చూడబడునది … (ద్రష్ట దర్శన దృశ్య) ఆదిగా గల త్రిపుటిలు-భావనాశూన్యము, నిరామయము అగు ఆత్మయందు-ఎక్కడున్నాయి? లేవు!

కల్పార్ణవము వలె (సముద్రమువలె) చిదాత్మ అత్యంత పరిపూర్ణమైనది. తేజో రూపమగు ఆత్మ భ్రాంతి అనే తమస్సులో విలీననునటమెక్కడిది? కుదరదు! కథా రచయిత కథలో మునిగిపోవటమెక్కడిది? అద్వితీయమగు పరమతత్త్వము నిర్విశేషమైయుండగా, ఇక అద్దానిలో త్రిపుటీకల్పన, నేను నీవుల ఉనికి ఎట్లా ఉంటాయి? స్వప్నంలో, అనుభవమయ్యే ’నేను-నీవు’లు ఉన్నాయా? ఉంటే తెల్లవారే సరికి ఏమౌతున్నాయి? వాస్తవానికి లేవు!

సర్వదా ఏకాత్మకమైయున్న పరమ తత్త్వమునందు భేదము కల్పించు బాహ్యవిషయుడగు కర్త ఎట్లా ఉంటాడు? భేదము చేయు మరొకడుంటే ఆత్మ
ఏకము, అద్వితీయము ఎట్లా అవుతుంది? సుషుప్తిలో ఉన్న వానికి ఏక సుఖమేగాని భేదావలోకమే ఉండదు కదా!

జగత్తు అనబడునది చిత్తము యొక్క వికల్పన మాత్రమే అయి ఉండగా… చిత్తము అభావముచే తనకుతానుగా లేనప్పుడు, ఇక జగత్తు ఎక్కడిది? చిత్తము భేదములను త్యజించి సమాధాన స్థితి పొందినప్పుడు ప్రత్యక్ రూప పరమాత్మయందు ఐక్యమగుచున్నది.

7.) అఖండానందమ్-ఆత్మానం
విజ్ఞాయ స్వస్వరూపతః
బహిః అంతః సదానంద
రసాఽస్వాదనమ్ ఆత్మని ।
వైరాగ్యస్య ఫలం బోధో
బోధస్య ఉపరతిః ఫలమ్ ।
స్వ-ఆనందానుభవాత్ శాన్తిః
ఏషైవ ఉపరతేః ఫలమ్ ॥
యత్ ఉత్తరోత్తరా భావే
పూర్వ రూపం తు నిష్ఫలమ్,
నివృత్తిః పరమాతృప్తిః
ఆనందో అనుపమః స్మృతః ॥
మాయో ఉపాధిః జగద్యోనిః
సర్వజ్ఞత్వాది లక్షణః
పారోక్ష్య శబళః సత్యాత్
ఆత్మకః తత్ పదాభిధః ।
ఆలంబనతయా భాతియో ‘అస్మత్’
‘ప్రత్యయ’ శబ్దయోః
అన్తఃకరణ సంభిన్న బోధసత్వా అపరాభిదః ।
మాయా అవిద్యే విహాయైవ
ఉపాధి పర జీవయోః
‘అఖండం సచ్చిదానందం పరబ్రహ్మ’ విలక్ష్యతే ॥

అఖండాత్మానంద పరమాత్మ నాకు వేరైనది కాదు. అద్దాని కంటే నేనూ వేరు కాదు. మరెవ్వరూ వేరుకాదు! అని స్వస్వరూప జ్ఞాన పూర్వకంగా తెలుసుకొన్నవాడు ఇక ఆపై లోపల-బయట ఉన్నదంతా తనయందే, తానుగానే రసాస్వాదనము చేయుచున్నాడు. తానే ఉభయుడై తనయందు భేదము లేనివాడగుచున్నాడు.

వైరాగ్యమునకు ఫలము ఆత్మబోధ (జ్ఞానము) అగుచున్నది. ఆత్మ జ్ఞానమునకు ప్రయోజనంగా ఇంద్రియ విషయములలో రతించటం, రమించడం సన్నగిల్లి, ఆత్మయందు రమించటం (ఉపరతి) స్వయంగా రూపు దిద్దుకుంటోంది. ఉపరతిచే ఈ జీవుడు ఆత్మరసానందభరితుడగుచున్నాడు. అదియే పరమోత్తమ ఫలము.

దృశ్యముతో తదాత్మ్యము అను స్థితి నుండి-వైరాగ్యము-ఆత్మజ్ఞానము-ఉపరతి-స్వాత్మానందము - ఇవన్నీ ఒకటి పొందితే, అప్పుడు వెనుకటిది నిష్పల రూపము పొందుచూ ఉన్నవి. అనగా, ఇవన్నీ కూడా, తరువాతది పొందనప్పుడు అంతకు ముందటిది నిష్ఫలమే! చివరికి వృత్తి రహిత స్థితి (నివృత్తి). అది పరమతృప్తిని, పరమానందమును స్వభావంగా ప్రసాదిస్తున్నది.

మాయను ఉపాధిగా కలిగి ఉండటము, ఈ జగత్తుకు కారణము తానే అయి ఉండి ఉండటము, ఉపాధికి ముందు - ఇప్పుడు - ఉపాధి నశించిన తరువాత కూడా ఎల్లప్పటి స్థితి - స్థానము ఎరిగి ఉండటము, కేవల సాక్షి ధర్మ విశిష్టత్వము మొదలైనవన్నీ కూడా-ఈశ్వరుని గుణ సంపదా విశేషములు అగుచున్నాయి.

ఇక జీవుడో! అంతఃకరణ సహితుడై, దృశ్యమును ఆలంబనముగా కలిగి ఉండి, ఆత్మకు ఉపకరణ వస్తువు వంటివాడై ఉన్నాడు. జీవాత్మగా పిలువబడుచూ కూడా, ఆత్మకు అభిన్నుడే అయి ఉన్నాడు. దేహమును ఉపాధిగా కలిగి ఉన్నాడు.

ఎప్పుడైతే ఈ జీవుడు స్థూల-ఉపాధి భావన-అను మాయ, అవిద్యలను విడిచి పెట్టినవాడగుచున్నాడో, అప్పుడు విలక్షణ అఖండ సచ్చిదానందము అగు పరబ్రహ్మత్వమును ఆస్వాదిస్తున్నాడు.

8.) ఇత్థం వాక్యైః తత్ అర్థ -
అనుసంధానం ‘శ్రవణం’ భవేత్|
యుక్త్యా సంభావితత్వ
అనుసంధానం ‘మననం’ తు తత్||
తాభ్యాం నిర్విచికిత్సే అర్థే
చేతసః స్థాపితస్య తత్
ఏకతానత్త్వమ్ ఏతద్ధి
‘నిది ధ్యాసనమ్’ ఉచ్యతే !
ధ్యాతృ - ధ్యానే పరిత్యజ్య
క్రమాత్ ధ్యేయ - ఏక గోచరమ్,
నివాత దీపవత్ చిత్తం
“సమాధిః” అభిధీయతే ॥
వృత్తయస్తు తదానీం అపి
అజ్ఞాతా ఆత్మగోచరాః
స్మరణాత్ అనుమీయనే
వ్యుత్థతస్య సముత్థతాః
అనాదిత్ అవిహ సంసారే,
సంచితాః కర్మకోటయః
అనేన విలయం యాంతి
శుద్ధ ధర్మో వివర్ధతే ॥

శ్రవణము: ఈ ఉపాధి - ఉపాధిని ఉపయోగిస్తున్న దేహి… ఈ రెండిటికి సంబంధించిన వేదాంత అధ్యయనముచే, [(1) మాయ-అవిద్య (2) అఖండ సచ్చిదానందత్వము…. మొదలైన] మహావాక్యాలు, వాటి అర్థము వినటము, అనుసంధానమును చేయటమే శ్రవణము అంటారు.

మననము: విన్న వాక్యముల అర్థమును సమన్వయించుకోవటమును ‘మననము’ అంటున్నారు.

ఆ విధంగా వేదమహావాక్యాల శబ్ద-అర్థముల శ్రవణ-మననములచే తెలియవచ్చు స్వస్వరూపాత్మ స్వభావమును తెలుసుకోవాలి. ఆత్మ గురించిన సంశయాలను తొలగించుకోవాలి. అఖండ-సచ్చిదానంద ఆత్మ తత్వమునందు బుద్ధిని నిలపాలి.

నిదిధ్యాస: దృష్టి-ధ్యాస-ఏక భావనలను బుద్ధియొక్క అనన్యానుభవముగా చేసే ప్రయత్నము నిదిధ్యాస (ఏకాకార వృత్తి)-అంటారు.

ఆత్మ దృష్ట్యా సర్వదా ఏకమే అయి ఉండి కూడా… ధ్యాస (Avocation) కారణంగా ఇక్కడంతా అనేకత్వముగా స్థూల దృష్టికి అనుభవమౌతోంది. శ్రవణ-మనన-నిది ధ్యాసల సహాయంతో “ధ్యానము చేయువాడు (Perciver) - ధ్యానము (Perception)”లను పరిత్యజించి క్రమంగా ఏకము-అఖండము అగు ఆత్మవస్తువుయందు - గాలి కదలికలు లేనిచోట దీపము నిశ్చలమయి ఉన్నట్లు- చిత్తమును నిశ్చలము చేయుటయే సమాధి.

చిత్తమును వృత్తి రహితం చేసి నివాత స్థితిలో దీపము (గాలి వీచనిచోట దీపము) వలె వృత్తి రహితం చేస్తే లభించే ‘వృత్తి రహిత చిత్త స్థితి’ అనబడే సమాధి స్థితిలో కూడా వృత్తి ఉంటుంది. ‘ఆత్మయే దర్శించటము’ అనే ఒక వృత్తి ఇంకా శేషించియే ఉంటుంది. అయితే అట్టి స్మరణరూప వృత్తి ‘అంతా మమాత్మయే’ అనే వృత్తిరూపము కలిగి ఉంటుంది. కనుక నివృత్తి రూపమే!

చిత్తమును నిర్మలముగా ఉంచటం అనే సాధనావృత్తి నుండి కొంచెము ఈవలకు రాగానే, మరల ప్రాపంచక వృత్తులు బయల్వెడలతాయి-అనునదియే సంచిత కర్మల రూపమగు సంసారము. అట్టి ఇతఃపూర్వపు దృశ్యతాదాత్మ్య పూర్వక సంసారము సమాధి సాధనచే తొలగి, అఖండత్వము-అప్రమేయత్వము- నిత్యత్వము … మొదలైన ఆత్మధర్మము రూపుదిద్దుకోవాలి. అట్టి ఆత్మధర్మము పెంపొంది, “ఇదంతా మమాత్మస్వరూపమే.”… అనే శుద్ధ ధర్మమునకు దారి చూపగలదు.

9.) ధర్మమేఘమ్ ఇమం ప్రాహుః
సమాధిం యోగవిత్తమాః |
వర్షతి ఏష యథా ధర్మాః
అమృతధారాః సహస్రశః ॥

అమునా వాసనాజాలే
నిశ్శేషం ప్రవిలాపితే,
సమూలా ఉన్మీలితే
పుణ్య-పాపాఖ్యే కర్మ సంచయే ॥

వాక్యమ్ అప్రతిబద్ధం సత్ -
ప్రాక్ - పరోక్షో న భాసతే।
కర ఆమలకవత్ బోధమ్
‘అపరోక్షం’ ప్రసూయతే ॥

వాసనా అనుదయో భోగ్యే
వైరాగ్యస్య తదా అవధిః,
అహం భావ-ఉదయా అభావో
బోధస్య పరమాఽవధిః|
లీనవృత్తేః అనుత్పత్తిః
మర్యాదా ఉపరతి అస్తుసా,
స్థితప్రజ్ఞో యతిః అయం
యః సదా ఆనందమ్ అశ్నుతే
బ్రహ్మణ్యేన విలీన ఆత్మా
నిర్వికారో వినిష్క్రియః ॥

మండుటెండలచే, తీవ్రమైన వడగాలులచే వేడెక్కియున్న ఒక ప్రదేశము మేఘములు వచ్చి వర్షించినప్పుడు - మొత్తమంతా చల్లబడుతుంది కదా! అట్లాగే సమాధి (చిత్తమును నిర్విషయము చేసి ధారణచేయు సాధన)చే “ఆత్మ ధర్మము” అనే అమృతధార వర్షించి ఈ కనబడు దానినంతా ఆత్మ భావామృతమయంగా చేస్తోంది. అందుకే యోగ వేత్తలు “సమాధి ఆత్మధర్మ వర్షమునకు మేఘము వంటిది” అని అభివర్ణిస్తున్నారు.

హృదయములో దట్టంగా పేరుకొనియున్న వాసనాజాలమే ఈ జీవుని పుణ్య-పాప కర్మ పరంపరల అంగీకారానుభవ కారణమగుచున్నాయి. నిర్వికల్ప సమాధి యొక్క అభ్యాసముచే పుణ్య-పాప కర్మ సంచయమంతా సమూలంగా తొలగిపోగలదు. నేను ఇంకా ఏదో చేస్తే గాని సుఖము లేదు. (లేదా) ఆత్మ లభించదు - అనునది సమాధియొక్క అభ్యాసముచే సన్నగిల్లుతోంది. ఆత్మయొక్క ‘అహమేవ’ భావన స్వతః సిద్ధము, స్వయం సిద్ధము అగుచున్నది.

“తత్ త్వము - సోఽహమ్” … మొదలైన వాక్యముల అర్థమేమిటి? ఎందుకలా అంటున్నారు? … అనే అర్థ మనన-విచారణలచే ప్రత్యక్ష - పరోక్ష జగత్రూప భాసనమంతా తొలగి…, “అరచేతిలో ఉసిరికాయ” వలె అఖండాత్మానుభవము అత్యంత సుస్పష్టము కాగలదు. అపరోక్ష ఆత్మ సాక్షాత్కారము ప్రాప్తించగలదు.

“ఏదో పొందాలి - చేయాలి - ఇంకా మారాలి” … ఇటువంటి భోగ వాసనలు ఉదయించక పోవటమే…. వైరాగ్యము యొక్క పరమావధి. పరిమితము సంకుచితము అగు “నేను - నాది” … అనునవి ఉదయించక, అభావ రూపము పొందటమే బోధ (లేక) సమాధి యొక్క పరమావధి. చిత్తము విషయములందు ప్రవేశించనట్టి వృత్తియొక్క అభ్యాసరత స్థితియే ఉపరతి యొక్క పరాకాష్ఠ స్థితి! అంతేగాని, పాండిత్యముచే ఉపరతి లభించదు.

ఎప్పుడైతే చిత్తము విషయముల మననము త్యజిస్తుందో అప్పుడు ఆ యతి స్థితప్రజ్ఞుడు అగుచున్నాడు. అట్టి స్థితప్రజ్ఞుడు సర్వదా ఆనందము పొందుచూ స్వభావంగా సదానంద స్వరూపుడగుచున్నాడు. ఎవ్వడైతే తన జీవాత్మత్వమును నిర్వికారము- నిష్క్రియము అగు బ్రహ్మమునందు విలీనము చేసి తాను బ్రహ్మమే అగుచున్నాడో, ఆతడే స్థితప్రజ్ఞుడు. ఆతని ఆత్మానందమునకు ఈ దేహ మనో-దృశ్యాదులు గాని, లోకలోకాంతరములు గాని అవధులను కల్పించజాలవు.

10.) బ్రహ్మా ఆత్మనోః శోధితయోః
ఏకభావా అవగాహినీ,
నిర్వికల్పా చ చిన్మాత్రా వృత్తిః
‘ప్రజ్ఞ’ - ఇతి కథ్యతే॥
సా సర్వదా భవేత్ అస్య
స ‘జీవన్ముక్త’ ఇష్యతే |
దేహ-ఇంద్రియేషు ‘అహం’భావ,
‘ఇదం’ భావః తదన్యకే,
యస్య నో భవతః క్వాఽపి
స ‘జీవన్ముక్త’ ఇష్యతే|
న ప్రత్యక్ బ్రహ్మణోః భేదం
కదాఽపి బ్రహ్మ సర్గయోః
ప్రజ్ఞయా యో విజానాతి
స ‘జీవన్ముక్త’ ఇష్యతే!
సాధుభిః పూజ్యమానే అస్మిన్,
పీడ్యమానేఽపి దుర్జనైః,
సమభావో భవేత్ యస్య
స ‘జీవన్ముక్త’ ఇష్యతే।
విజ్ఞాత బ్రహ్మతత్త్వస్య
యథాపూర్వం న సంసృతిః
అస్తిచేత్ న సవిజ్ఞాతా
బ్రహ్మభావో బహిర్ముఖః |
సుఖాది అనుభవో యావత్
తావత్ ప్రారబ్ధమ్ ఇష్యతే|
ఫలోదయః క్రియాపూర్వో
‘నిష్క్రియో’, న హి కుత్ర చిత్॥

‘ఈశ్వరుడు’ అనబడు ’తత్’ను జీవుడు అనబడు ’త్వమ్’ను, ఈ రెండిటియొక్క ఏకత్వముగా నిర్వచించునదే ‘బ్రహ్మము’ యొక్క శబ్దార్థము. ఈ శబ్దార్థ మహిమలను శోధించి పరిశీలించినప్పుడు - జీవ - జగత్ - ఆత్మల ఏకత్వముయొక్క అవగాహన- అనుభూతి-అనుభవము రూపుదిద్దుకుంటున్నాయి. అట్టి ఏకత్వానుభవ స్థితియే నిర్వికల్ప స్థానము. చిత్తమును వృత్తిరహితం చేసి, స్థితింపజేస్తూ ఉండటము అనే చిన్మాత్ర - వృత్తినే శాస్త్రములు ‘ప్రజ్ఞ’ అని పిలుస్తున్నాయి.

ఎవ్వనికైతే - “జీవుడు - జగత్తు - ఈశ్వరుడు సర్వదా ఏక స్వరూపమే! బ్రహ్మమే!“ అను అనుభవము అనునిత్యమౌతుందో, ఆతడే జీవన్ముక్తుడు. ఎవ్వరికైతే - ఈ దేహము - ఇంద్రియములు - ఇంద్రియ విషయములు అహంభావము - తదితర భావములు-ఇవన్నీ ఆత్మయొక్క చమత్కార విశేషములై, ”ఆత్మకు ఏమాత్రము భిన్నము కాకయే ఉన్నాయి” అని అకృతిమంగా - ….. స్వభావ సిద్ధంగా అనిపిస్తుందో… అతడే జీవన్ముక్తుడు.

బ్రహ్మమునందు -“ఇది బ్రహ్మము-ఇది సర్గము (దృశ్యము)”… అను భేదమే లేదు. “నాకంటే వేరుగా బ్రహ్మము లేదు, దృశ్యములేదు" … అని ప్రజ్ఞచే
సుస్పష్టముగా నిర్దుష్టముగా, స్వభావికంగా తెలుసుకొని ఎవడు ఉంటాడో, ఆతడే జీవన్ముక్తుడు.

కొందరు సాధుభావముతో తనను పూజిస్తున్నప్పుడు, మరి కొందరు దుర్జనులై తనను భాధిస్తున్నప్పుడు కూడా, “పరమాత్మయే ఇదంతా అహమేవ ఇదం సర్వమ్!” అను ఎరుకతో సర్వదా సమరస భావనయే కలిగి ఉంటాడో., అతడే జీవన్ముక్తుడు.

బ్రహ్మతత్త్వము ఏమిటో, ఎట్టిదో, ఏమియో ఎరిగిన తరువాత, ఇక పూర్వమువలె ఆతడు దృశ్యపరంపరా రూపమగు సంస్కృతి పొందడు. సమాధి నుండి బయల్వెడలి దృశ్యమును పొందుచున్నప్పుడు కూడా, బహిర్ముఖుడగుచూ కూడా బ్రహ్మమునే దర్శిస్తూ ఉంటే ఆతడు విజ్ఞుడు-(తెలుసుకోవలసినది తెలుసుకున్నవాడు) అగుచున్నాడు. తెలుసుకొనువాడు - తెలియబడునది బ్రహ్మమే అయినప్పుడు ఇంక ఎక్కడ మాత్రం ఏమున్నది? బ్రహ్మమునకు వేరే ఏదీ లేదు! తానే సర్వమై బ్రహ్మమై వెలుగొందుతాడు!

ఇతః పూర్వపు (ఇదివరకటి) కర్మలే సుఖ-దుఃఖాలుగా పరిణమిస్తూ ఉంటాయి - అనునదే ప్రారబ్ధము యొక్క నిర్వచనం! కర్మలకు మునుముందే ఉన్న నిష్క్రియమగు ఆత్మ స్వరూపమే సిద్ధించిన తరువాత, ఇక కర్మలు ఎక్కడ? కర్మలే లేవు. కర్మలే లేనప్పుడు ప్రారబ్ధము యొక్క ప్రసక్తి ఎక్కడిది?

11.) ‘అహంబ్రహ్మ’ ఇతి విజ్ఞానాత్
కల్పకోటి శత ఆర్జితమ్
సంచితం విలయం యాతి,
ప్రబోధాత్ స్వప్న కర్మవత్ |
స్వం అసంగమ్ ఉదాసీనమ్
పరిజ్ఞాయ నభో యథా,
న క్లిశ్యతే యతిః కించిత్
కదాచిత్ భావి కర్మభిః ||
న నభో ఘటయోగేన
సురాగంధేన లిప్యతే,
తథా ఆత్మో ఉపాధి యోగేన
తత్ ధర్మో నైవ లిప్యతే |
జ్ఞానోదయాత్ పురా ఆరబ్ధమ్ కర్మ
జ్ఞానాత్ న నశ్యతి।
అదత్వా స్వఫలం లక్ష్యమ్
ఉద్దిశ్యః ఉత్ సృష్ట బాణవత్|
వ్యాఘ్ర బుద్ధ్యా వినిర్ముక్తో
భాణః పశ్చాత్ తు గోమతౌ,
న తిష్ఠతి భినత్త్యేవ,
లక్ష్యం వేగేన నిర్భరమ్|
అజరోఽస్మి, అమరోఽస్మి - ఇతి
య ఆత్మానం ప్రపద్యతే,
తదా ఆత్మనా తిష్ఠతో యస్య,
కుతః పారబ్ధ కల్పనా?

ఒకడు నిదుర లేవగానే నిద్రపోతున్నప్పటి ఆతని సుదీర్ఘమైన స్వప్నము (కల)లోని విషయాలు స్వప్న దృశ్యముతో సహా మటుమాయమౌతున్నాయి కదా! అదే రీతిగా, కోటి కల్పములలో సముపార్జించుకొనియున్న సంచిత వ్యవహార పరంపరలన్నీ కూడా “నేనే బ్రహ్మమును. నేను బ్రహ్మమునే” అని ఎరిగిన మరుక్షణం - మొదలంట్లా మటుమాయమగుచున్నాయి.

ఏవిధంగా అయితే ఆకాశము దేని చేతనూ స్పృశించబడనిదై, సంబంధించనిదై ఉంటోందో…. “నేను అసంగుడను” అని ఎరిగిన ఆత్మజ్ఞాని కూడా అట్లా సర్వమునకు అసంగుడై, ఉదాశీనుడై ఉంటున్నాడు. ఇక ఆ యతి సంచిత కర్మలచేత గాని, భవిష్యత్ కర్మలచేత గాని సంబంధితుడు, బంధితుడు కాడు.

కుండలోని ఆకాశము (Space) కుండలో గల సుర (సారా, మత్తు పానీయము) యొక్క వాసన (Smell) చే దోషము పొందుతుందా? పొందదు కదా! దేహ- ఉపాధిత్వమును దాటి ఆత్మ-ఉపాధిత్వమును ఆశ్రయించు యోగి జీవుడు - జగత్తు-ఇంద్రియముల ధర్మములు మొదలైన వాటిచే స్పృశించబడడు. దోషము పొందడు. అజ్ఞాని మాత్రమే దేహ-మనో-ధర్మములను తనపై ఆపాదించుకుంటున్నాడు.

ఒక చిన్న విషయం! ఆత్మ జ్ఞానము ఉదయించినంత మాత్రముచేత, అట్టి జ్ఞానముచేత ప్రారబ్ధకర్మ యొక్క సందర్భములు తొలుగుతాయా? తొలగవు.
సంధించి వదలిన బాణము, ఇక ఆగమన్నా ఆగక, లక్ష్యము వైపుకే వెళ్ళు తీరుగా…. ప్రారబ్ధము ఆత్మజ్ఞాని పట్ల కూడా కొనసాగుతూనే పోతుంది.

ఒకడు, ‘అది పులి’ అని అనుకొని బాణమును విడచిన తరువాత, “అరెరే! అది పులికాదే! ఆవు కదా! ఓ బాణమా! ఆగాగు….” అని అన్నా కూడా, సంధించి విడచిన బాణము వెనుకకు మరలదు. అది వేగముగా పోయి లక్ష్యమును తాకక మానదు కదా!

అయితే, ఇంకొక విషయం కూడా! “జరామరణములకు, కర్మ-కర్మ ఫలములకు కించిత్ కూడా సంబంధించనట్టి ఆత్మను నేను"…. అని తెలుసుకొని, ఆత్మనే ఉపాసిస్తూ, ఆత్మయందే తిష్టత్వము (Placement) కలిగి ఉన్న వానిపట్ల పారబ్ధము అనుదాని కల్పనకు చోటు ఎక్కడిది? కలలోని గృహాలు నిజంగా ఉన్నాయా?

12.) ప్రారబ్ధం సిధ్యతి తదా,
యదా దేహా ఆత్మనా స్థితిః ।
దేహా ఆత్మభావో నైవేష్టః
ప్రారబ్ధం త్యజ్యతామ్ అతః ।
ప్రారబ్ధ కల్పనాఽపి అస్య
దేహస్య భ్రాంతిరేవ హి।
అధ్యస్తస్య కుతః సత్వమ్?
అనస్తి అస్య కుతో జనిః?
అజాతస్య కుతో నాశః?
ప్రారబ్దమ్ అసతః కుతః?
జ్ఞానేన అజ్ఞానకార్యస్య
సమూలస్య లయో యది,
తిష్ఠతి అయం కథం దేహ
ఇతి శంకావతో జడాన్?
సమాధాతుం బాహ్య దృష్ట్యా
‘పారబ్ధం’ వదతి శ్రుతిః
“న తు దేహాది సత్యత్వ”
బోధనాయ విపశ్చితామ్|
పరిపూర్ణమ్| అనాద్యతం |
అప్రమేయమ్। అవిక్రియమ్ ।
సద్ఘనమ్! చిద్ఘనం! నిత్యం!
ఆనన్దఘనమ్! అవ్యయమ్!
ప్రత్యక్! ఏకరసం! పూర్ణమ్!
అనన్తమ్! సర్వతోముఖమ్!
అహేయమ్! అనుపాదేయమ్!
అనాదేయమ్! అనాశ్రయమ్||

అందుచేత, దేహాత్మ భావ స్థితి కొనసాగుచున్నంత వరకు, జీవునికి “ప్రారబ్ధము ఉన్నదయ్యా” … అని బోధించబడుతోంది. దేహాత్మభావనను అధిగమిస్తున్న యోగి విషయంలో క్రమంగా ప్రారబ్ధకర్మల పట్ల, దృశ్యసంబంధమైన కోరికలపట్ల “అవి ఎక్కడున్నాయిలే!” … అను రూపము గల త్యాజ్యబుద్ధి ప్రవృద్ధమగుచున్నది. మరికొంత విచారణ చేస్తూ ఉండగా…, “మాయలోని ఒక వస్తువు మాత్రమే అయి ఉన్న ఈ దేహము-దీనికి సంబంధించిన ప్రారబ్ధకర్మలు …. భ్రాంతి (illusion) మాత్రమే”… అని తెలియవస్తోంది. అనగా, భ్రమ ఉన్నంత వరకే ప్రారబ్ధము, సత్యదృష్టిచే అది లేదు.

కల్పనా చమత్కారంగా కనిపించే దానికి సత్త (ఉనికి) ఎక్కడిది? ఉనికియే లేనిదానికి జననమెక్కడిది? జననము (ఉత్పత్తియే) లేని దానికి నాశనము ఎక్కడిది?… ఈ రీతిగా ‘ప్రారబ్ధము’ అనబడునది మొదలే లేనిదైయుండగా… అది జనించటమేమిటి? మరెప్పుడో అది తొలగటమెక్కడిది? అటువంటిదేమీ లేదు.

ఆత్మతత్త్వ జ్ఞానముచే అజ్ఞాన కార్య వ్యవహారము సమూలముగా శమించు చుండగా… ఇక ’జడమే’ అయినటువంటి ఈ దేహమునకు స్వకీయమైన ఉనికి ఎక్కడిది? లేనిదే అగుచున్నది. దేహము-దృశ్యము కూడా ఐహిక మోహములోని స్వప్న చమత్కారములౌతాయి. స్వప్నంలో దేహమే లేకుండా అనుభవాలు ఉంటున్నాయి కదా!

“నాకు ఈ బాహ్యమైన బాధలన్నీ ఎందుకొస్తున్నారా బాబూ" అని ఆవేశముగా జడమగు దేహమును దృశ్యమును నమ్మి శంక కలిగి ఉన్నవానిని కొద్దిసేపు
సమాధాన పరచటానికి మాత్రమే శ్రుతులు ప్రారబ్ధము గురించి చెప్పుకొస్తున్నాయి.

“దేహాదులు మొదలే సత్యము కాదు” అనే బోధ దర్శనమునకు, ఆత్మ సాక్షాత్కారమునకు అర్హుడగు విద్యార్థికి ప్రారబ్ధము లేదనియే చెప్పబడుతోంది!

స్వస్వరూపము, సహజ స్వరూపము అగు ఆత్మ
✤ పరిపూర్ణము               ✤ అనాద్యంతము, అప్రమేయము,
✤ నిష్క్రియము, సద్ధనము,     ✤ నిత్యము, ఆనంద ఘనము,
✤ అవ్యయము, ప్రత్యక్ రూపము      ✤  ఏకరసము, పూర్ణము,     ✤ అనన్తము,
- అన్నివైపులా ముఖద్వారములు కలిగినట్టిది.

ఆత్మకు - వదల వలసినదిగాని, స్వీకరించవలసినదిగాని ఇక్కడ ఏదీ లేదు-ఆత్మ ఒక చోటనుండి వచ్చునది కాదు. మరొకచోటికి వెళ్ళునది కాదు. దేనినీ ఆశ్రయించి ఉండునది కాదు.

13.) నిర్గుణమ్| నిష్క్రియమ్| సూక్ష్మమ్। నిర్వికల్పమ్ నిరంజనమ్।
అనిరూప్య స్వరూపం యత్, మనోవాచామ్ అగోచరమ్|
సత్-సమృద్ధం। స్వతస్సిద్ధం। శుద్ధం। బుద్ధం। అనీదృశమ్ |
ఏకమేవ అద్వయం  బ్రహ్మః
నేహ నానాఽస్తి కించన ॥
స్వానుభూత్యా స్వయం జ్ఞాత్వా
స్వమాత్మానమ్ అఖండితమ్,
స సిద్ధః సుముఖం తిష్ఠత్
నిర్వికల్ప ఆత్మనా ఆత్మని క్వ గతం? కేన వా నీతం? కుత్ర లీనం ఇదమ్ జగత్?
అధునైవ మయా దృష్టం నాస్తి
కిం మహత్ అద్భుతం?
కిం హేయం? కిం ఉపాదేయం?
కిం అన్యత్’ కిం విలక్షణమ్?
అఖండానంద పీయూష పూర్ణ బ్రహ్మమహార్ణవే,
న కించిత్ అత్ర పస్యామి, న శృణోమి న వేద్మి అహమ్।
స్వాత్మనైవ సదానందరూపేణాస్మి స్వలక్షణః|
అసంగోఽహమ్! అనంగోఽహమ్!
అలింగోఽహమ్! అహమ్ హరిః ।
ప్రశాంతోఽహమ్। అనంతోఽహమ్।
పరిపూర్ణః చిరంతనః।
అకర్తాఽహమ్। అభోక్తాఽహమ్।
అవికారోఽహమ్। అవ్యయః ।
శుద్ధబోధస్వరూపోఽహమ్। కేవలోఽహం సదాశివః ||

ఇంకా కూడా…… ఆత్మ…
నిర్గుణము! నిష్క్రియము! నిర్వికల్పము! దోషములచే స్పృశించబడదు! నిరంజనము! రూపరహితమయినది! మనస్సు - వాక్కులకు అగోచరమైనది!
సత్స్వరూపముగా సమృద్ధమైనది! స్వతః సిద్ధము! శుద్ధము! పరమ మౌనస్వరూపము! బుద్ధము! కళ్ళకు కనబడనిది!

బ్రహ్మము సర్వదా ఏకము. అద్వితీయము. “ఇక్కడ ఏకమేగాని, కించిత్ కూడా అనేకము లేదు. ఆత్మ స్వానుభవమేగాని, మరొకరిచే తెలియబడేది కాదు….. అని మహావాక్యములు చెప్పుచున్నాయి.

అట్టి స్వస్వరూపాత్మను ‘అఖండము’ అని స్వానుభవముచే ఎరిగినప్పుడు, అట్టి ఆత్మయోగి నిర్వికల్పాత్మను తనయందే సిద్ధింపజేసుకొనుచున్నాడు. ఆత్మయందే స్థానము కలిగియున్నవాని దృష్టిచే.., “ఈ జగత్తు ఎక్కడ ఉన్నది? ఎక్కడినుండి తేబడింది? ఎందులో లీనమౌతుంది?”…. అను ప్రశ్న మొదలంట్లా తొలగిపోతోంది.

“మహత్తరము, అద్భుతము అని చెప్పబడు జగత్తు” అనబడునది నా దృష్టికి కనబడటమే లేదయ్యా! స్వప్నంలోని వస్తువులకు ఉనికి ఎక్కడిది? “లేని జగత్తులో వదలవలసినదేది? పట్టుకోవలసినదేముంటుంది? ఈ రెండూ కానిదేది? ఈ దృశ్యములో విలక్షణమనతగినంటూ ఏమున్నది?” అఖండానంద స్వరూపమగు పూర్ణబ్రహ్మ మహాసముద్రములో సాకార-గుణ-సామ్యరూపమైనదేదీ నాకు కనబడటం లేదు. వినబడటం లేదు. ఆత్మకు వేరుగా ఏదీ తెలియబడటమూ లేదు.

స్వకీయ లక్షణము చేతనే సదానంద రూపమగు స్వాత్మ జగత్ దృశ్యమువలె విరాజిల్లుచున్నది. నేను నీవు ఆత్మస్వరూపులమే!

నేను దేనితోనూ సంగములేనివాడను! అంగ (అవయవ) రహితుడను! నామరూప రహితుడను. కదిలే దేహమును కదిలిస్తున్న చైతన్య స్వరూపుడనగు నాకు స్త్రీ - పురుష లింగభేదమేమున్నది! ‘హరి’ అని ఏ తత్త్వమును పౌరాణికులు పిలుస్తున్నారో అది నేనే! నన్నే! సర్వమై ఉన్నవాడను.

నేను సర్వదా పరమ ప్రశాంతమగు ఆత్మ స్వరూపుడను. ఆది అంతము లేనివాడను! పరిపూర్ణుడను! చిట్ట చివరికి శేషించు చిరంతనుడను! జన్మ-దేహ-జగత్ వికారములు లేనివాడను! అవ్యయుడను! శుద్ధబోధ స్వరూపుడను! కేవలుడను! ఎల్లప్పుడూ శివ స్వరూపుడను! సదాశివుడను!

14.) ఏతాం విద్యాం అపాంతరతమాయ దదౌ|
అపాంతరతమో బ్రహ్మణే దదౌ!
బ్రహ్మా ఘోరాంగిరసే దదౌ!
ఘోరాంగిరా రైక్వాయ దదౌ।
రైక్వో రామాయ దదౌ।
రామః సర్వేభ్యో భూతేభ్యో దదాః ।
ఇతి ఏతత్ నిర్వాణ అనుశాసనం
వేదాఽనుశాసనం।
వేదాఽనుశాసనం।

ఈ అధ్యాత్మోపనిషత్ వర్ణితమైనట్టి ఆత్మవిద్య అపాంతరతనుమునికి (నారాయణుడు అనే మహనీయునికి) సదాశివునిచే ఇవ్వబడింది. ఆ నారాయణుడు బ్రహ్మదేవునికి ప్రసాదించటం జరిగింది. ఆయన ఘోరాంగిరసునికి అందించారు. ఘోరాంగిరస మహర్షి రైక్వాయన మునీంద్రులకు అందించారు.
ఆ రైక్వుడు శ్రీరామునికి అందించారు.
ఆ శ్రీరాముని ద్వారా సర్వజీవులకు ప్రసాదించబడుచున్నది.
ఇది ఉపనిషత్ నిర్వాణానుశాసనము.
వేద ప్రవచన శాసనము!
వేదానుశాసనం!

ఇతి అధ్యాత్మోపనిషత్
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥


శుక్ల యజుర్వేదాంతర్గత

1     అధ్యాత్మ ఉపనిషత్

అధ్యయన పుష్పము

ఈ ఎదురుగా కళ్ళకు కనిపిస్తున్న సర్వభౌతిక దేహములలోని బుద్ధిగుహలలో అంతర్యామియై “అఖండమగు ఆత్మభగవానుడు” సర్వదా వేంచేసియున్నారు. ఆయన ఏకరూపుడై, అఖండుడై, నిత్యుడై ఈ అసంఖ్యాక శరీరములలో ఎల్లప్పుడు ప్రకాశించుచున్నారు. మహామహితాత్ముడై వెలుగొందుచున్నారు.

ఆయనది ఏ శరీరము? ఎక్కడ సంచరిస్తున్నారు? ఎవరికి ఆయన గురించి తెలుసు?

❋ ఈ పృథివి (భూమి) అంతా ఎవ్వరికి శరీరమై ఉన్నదో…, ఏది ఈ పృధివి యొక్క అంతరమున సంచారము కలిగియున్నదో…, అట్టి కేవలాత్మ పురుషుని గురించి పృధివికి తెలియకయే ఉన్నది !

❋ జలము - జలతత్త్వము ఎవ్వరికి శరీరమో, ఎవ్వరు జలమునందు అంతర్యామియై వెలుగొందుచూ సంచరించుచున్నారో…, అట్టి నిత్యాత్మ పురుషుని గురించైతే జలమునకు ఎరుక లేకయే అగుచున్నది !

❋ ఎవ్వరికి తేజస్సు (అగ్ని) శరీరమే అయి ఉన్నదో., ఎవ్వరు తేజస్సునందు అంతర్యామియై ప్రకాశించుచున్నారో…, అట్టి తేజో-ఆత్మభగవానుని గురించైతే తేజస్సుకు తెలియవచ్చుట లేదు !

❋ ఏ తత్త్వమైతే వాయువును తన శరీరముగా కలిగిఉన్నదో… వాయువునకు అంతః సంచారి అయి చైతన్యవంతము చేయుచున్నదో… కదలికలకు దివ్యశక్తిత్వము ప్రసాదిస్తోందో.., అట్టి చైతన్యాత్మ గురించి వాయువుకు తెలియుట లేదు. దేనికి ఆకాశము శరీరమై ఉన్నదో అట్టి చైతన్యాత్మ గురించైతే ఆకాశము ఎరిగి ఉండుట లేదు !

❋ ఏది మనస్సును తన యొక్క శరీరముగా కలిగియున్నదో…, అట్టి మనస్సుకు ఏది అంతర్యామియై, అంతర - ఆధారమైయున్నదో.., అట్టి మనోజనన స్థానమగు ఆత్మ గురించైతే మనస్సుచేత “ఇది ఇట్టిది” అని యోచించబడటము లేదే !

❋ ఏ మహత్ తత్త్వమైతే బుద్ధిని తన శరీరముగా కలిగి ఉండి వ్యవహరిస్తోందో.., ఏదైతే బుద్ధియందు అంతరముగా వేంచేసి సంచారము కలిగియున్నదో.., చిదాత్మగురించైతే బుద్ధి అవగాహనము కలిగి ఉండటమే లేదుమరి !

❋ ఏ కేవలీ తత్త్వమైతే చిత్తమును తన శరీరముగా కలిగి ఉండి వ్యవహరిస్తోందో.., చిత్తము యొక్క అంతరమున వ్యవహారశీలి అయి సంచారములు నిర్వర్తిస్తోందో…, ఆ చిత్-తత్త్వము గురించి చిత్తమునకు ఎరుక కలగటము లేదే !

❋ ఏ పర-ఆత్మ తత్త్వమైతే (సర్వ దేహములలోని) అహంకారములను తన శరీరముగా కలిగియున్నదో.., ఏదైతే అహంకారమునకు అహంకారమై అంతర్యామి అయి సంచరిస్తోందో., అట్టి ఆ అహమ్ తత్త్వము గురించి అహంకారమునకు ’ఇది ఇట్టిది’… అను అవగాహన కలుగుటలేదు!

❋ ’అవ్యక్తము’ను తన శరీరముగా కలిగి ఉండి, ఆ అవ్యక్తమునకు అంతర్యామిఅయి సంచరిస్తూ ఉన్నా కూడా, ఆ అవ్యక్తమునకు అద్దానిని గురించి (ఆత్మగురించి) తెలియవచ్చుటయే లేదు !

❋ ‘అక్షరము’ను తన శరీరముగా కలిగి ఉండి, అద్దానికి అంతర్యామిఅయి సంచారములు నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ, ఆ అక్షరముచే అట్టి కేవలాత్మ గురించి ఎరుగబడటము లేదు !

❋ ఆత్మ మృత్యువు తన శరీరముగా కలిగి ఉండి, మృత్యువుకు అంతర్యామిగా సంచరిస్తున్నప్పటికీ, ఆ మృత్యువునకు అట్టి అమృతాత్మ తెలియబడటము లేదు !

అట్టి…. ఆత్మభగవానుడే సర్వజీవుల అంతరాత్మ ! సర్వాంతర్యామి! అంతర హృదయ విహారి ! ఆయనయే దోషరహితమైన యోగులకు అనుభవమగుచున్న ఏకో నారాయణః ||

స్వప్నంలో ఉండి, స్వప్న దృశ్యమును ’అనన్యము’గా అనుభవిస్తున్న నేను,…. “స్వప్నమంతా నాదైన నేను”ను గమనించకపోవటం వంటిదే అదంతా!

బిడ్డలారా! శ్రోతలారా!

మన యొక్క స్వస్వరూపాత్మ ఎంతటి మహత్తరమైనదో పై వాక్యములను అనుసరించి గమనిస్తున్నారు కదా ! మరి “అది ఎందుకు అనుభవమునకు లభించటం లేదు?”… 1. ఆత్మను గురించిన ఏమరుపు. 2. దృశ్యసంబంధమైన అభ్యాస - వ్యసనము.

ఆత్మ అఖండము కాబట్టి….,

ప్రతి జీవుని యొక్క ఆత్మ మనము చెప్పుకొన్న రీతిగా మహత్తరము, అఖండము కూడా! అయితే హజ రూపమగు ఆత్మను ఏమరచుటచేతనే, ఈ జీవుడు ‘నేను - నేను’ అను భావనా సంకల్పమునకు మునుముందే ఉన్న స్వస్వరూపమునకు సంబంధించిన సమాచారమును పరిశీలించటం లేదు. సందర్భ స్వరూపమునకు మాత్రమే పరిమితమై, “నేను బద్ధుడను….” అను అభినివేశమునకు చోటు ఇస్తున్నాడు. సందర్భ సంబంధమైన (That which is incidentally related) అహమ్ - మమ (నేను - నాది) లను మాత్రమే తనకు సంబంధించిన పూర్తి సమాచారమని భావించి ఈ జీవుడు దుఃఖితుడు అగుచున్నాడు. ఆత్మతత్త్వమును ఎరిగిన మహనీయులు ఈ జీవునికి ఆతని సహజమగు ఆత్మ గురించి ఎలుగెత్తి గుర్తు చేస్తున్నారు.

అహమ్ - మమ ఇతి యో భావో, దేహాక్షాదాః అనాత్మని !

అందుచేతనే, ఈ దృశ్యాంతర్గతంగా స్వీయకల్పితమైనట్టి, ‘నేను నాది’ అను ఏ పరిమిత సంకుచిత భావములు అనుభూతమగుచున్నాయో …. వాటిని ఉపనిషత్ వాణి విశ్లేషించి పరమ సత్యమును ప్రబోధిస్తోంది !

1) “ఈ దేహమే నేను” అను దృష్టియే దేహాత్మ భావము. మనము దేహి (one who is operating the body) అయి ఉన్నాము. అంతేగాని ‘దేహము’- కాదు. దేహము మనకు ఉపకరణము (Instrument being used) మాత్రమే !

2) ఈ ’అహమ్ మమ’ అను లోకసంబంధమైన, లోకాంతర్గతమైన భావనలు సహజమగు స్వీయాత్మ యొక్క ఔన్నత్యమును అనుభవమునకు రాకుండా కప్పి ఉంచుచున్నాయి. కాబట్టి ‘అనాత్మ’ అని చెప్పబడుచున్నాయి.

“నేను ఈ భౌతిక దేహపరిమితుడను” అను పరిమిత (సంకుచిత, అపరిశీలనాత్మకమైన) భావన అపరిశీలన కారణంగా ఏర్పడుతోంది కాబట్టి “అధ్యాస” (Peception or avocation that took form due to non - examining of the Finest and first fact of One’s own self)… అని పిలువబడుతోంది.

అయం అధ్యాసో నిరస్తవ్యో - విదుషా బ్రహ్మనిష్ఠయా |

జగత్ స్వప్నాంతర్గతమైన "అహమ్ మమ” అనునవి స్వతఃగా ఉన్నవి కావు. నాటకంలో పాత్ర సంబంధమైన భావావేశముల - వంటివే! ‘దేహమే నేను’ అను రూపమైనట్టి దేహాత్మ భావనచే అవి రూపు దిద్దుకుంటున్నాయి…” అని విదుషులు (వివేక పాండిత్య సంపన్నులు) అగు బ్రహ్మనిష్ఠులచే ప్రవచించబడుతోంది.

వృత్తిసాక్షిః సోఽహమ్

ప్రియసహోదరా !
బుద్ధికి ఈవల ఈ ఇంద్రియ దృశ్య జగత్తంతా అనుభూతమై కనిపిస్తోంది కదా ! బుద్ధి యొక్క వృత్తుల రూపమే ఈ దృశ్య జగదనుభవమంతా! అట్టి బుద్ధికి, బుద్ధి వృత్తులకు ‘సాక్షి’ అయినట్టి స్వస్వరూపమే ’ప్రత్యగాత్మ’గా పిలువబడుతోంది.

“అట్టి బుద్ధికి సాక్షి అయి, బుద్ధికి బుద్ధి వృత్తులకు ఉత్పత్తి స్థానమై, వృత్తి రహితమైనట్టి ప్రత్యగాత్మయే నేను” అను “సోఽహమ్” వృత్తిని ఆశ్రయించాలి. అట్టి సాక్షివృత్తి సహాయంతో తదితరమైన (అన్యత్రా) బుద్ధి విభాగమును (లేక) జగత్ వృత్తి సహిత బుద్ధి విభాగమును త్యజించి "వృత్తిరహిత బుద్ధి సాక్షిత్వము”ను ఆశ్రయించాలి.

శ్లో|| లోకానువర్తనం త్యక్త్యా, త్యక్త్యా దేహాను వర్తనమ్,
శాస్త్రానువర్తనం త్యక్త్యా, స్వాధ్యాసా అపనయం కురు |

ఆ విధంగా “స్వా-ఆత్మ” యందే ఎల్లప్పుడూ స్థితిని సుస్థిర పరచుకుంటున్న యోగి పట్ల మనస్సు తనకు తానే నశించుచున్నది. క్రమంగా దృశ్య విషయముల పట్ల మననము సన్నగిలినదై, అట్టి లోక - దేహ శాస్త్ర విషయ మననము యొక్క స్థానములో - ప్రత్యగాత్మ భావన రూపుదిద్దుకుంటూ వస్తోంది. అది సుస్థిరీకరించుకొనుచూ ఉండగా “కేవల - మౌనరూప సాక్షిత్వము” అనే ఏకైక వృత్తిచే ఆత్మానుభావనము సదృఢపడగలదు.

ఇక ఆపై, “నా ఆత్మయే సర్వజీవుల ఆత్మ కూడా అయి ఉన్నది ! మమాత్మా సర్వభూతాత్మా !” అను సర్వాత్మత్వము సిద్ధిస్తోంది. వ్యష్ఠి సంబంధమైనట్లుగా కనిపించే ప్రత్యగాత్మత్వము సర్వాత్వముగా రూపు దిద్దుకొనును గాక ! అందుకు ‘3’ ఉపాయాలు చెప్పబడుచున్నాయి.

యుక్త్యా - శ్రుత్యా - స్వానుభూత్యా జ్ఞాత్వా సర్వాత్మమ్ - ఆత్మని

1) యుక్తి : మహనీయులగు ఆత్మజ్ఞులు, గురువులు ఆత్మస్వరూపము గురించి పలుకు ఆప్త వాక్యములు, వారు సూచిస్తున్న సాధన - అవగాహన సంబంధమైన ఉపాయములు, దృష్టాంత వాక్యములు, వివరణలు, విశ్లేషణములు మొదలైనవి.

2) శ్రుతి : వేదమహావాక్యములైనటువంటి తత్ త్వమ్ - (నీవు అదియే అయి ఉన్నావు). సోఽహమ్ - (నేను అదియే) జీవో బ్రహ్మేతి నా పరః - (జీవుడుగా కనిపించుచున్నది బ్రహ్మమే. మరొకటేదీ కాదు)…,

అహమ్ బ్రహ్మాఽస్మి - (నేను బ్రహ్మమే అయి ఉన్నాను), అద్వితీయమ్ పరమ్ బ్రహ్మ - (బ్రహ్మమునకు వేరుగా జగత్తు లేదు. నీవు నేను మొదలైనవి లేవు. సర్వమునకు పరమై, సర్వము దేనిలో ఉన్నదో అదియే బ్రహ్మము. నేను బ్రహ్మమును)… మొదలైన ప్రవచనముల శ్రవణము.

3) స్వానుభవము: యుక్తి - శ్రుతుల సహాయంతో తనకు తానే తన బుద్ధి యొక్క యోచనచే ఏర్పడే అనుభవము.

ఈ మూడు ఉపాయాలతో స్వాత్మ యొక్క సర్వాత్మత్వము ను జ్ఞాత్వా - తెలుసుకొంటూ ఆస్వాదించాలి. "స్వీయాత్మ” అనే - ఉపకరణముతో “సర్వాత్మత్వము” అనే సమున్నతమైన ఫలము - ప్రయోజనములను పొందాలి.

అందుకు అభ్యాసమేమిటి ?
నిద్రాయా లోక వార్తాయాః శబ్దాదేః ఆత్మ విస్మృతేః, క్వచిత్ న అవసరం దత్వా…,
- లోక వ్యవహారముల పట్ల, లోక సమాచార - సంబంధ - అనుబంధ - సంపద - ఆపద సందర్భముల పట్ల మౌనముద్రారూపమైన నిద్ర వహిస్తూ..,
- ఆత్మ పట్ల ఏమరపు (ఆత్మ విస్మృతికి) కారణమగుచున్న శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాదులను విస్మరించి (స్మరించక), వాటిపై ఆధారము కలిగి ఉండక,

చిన్మయా ఆత్మానమ్ ఆత్మని…!
అంతరములో ’ఆత్మచింతన’ను ఎప్పుడూ ఆశ్రయించాలి. “ఆత్మయే ఇదంతా”… అని అనుకుంటూ అనుకుంటూ ఉండాలి. అనిపించేంత వరకు అనుకుంటూ ఉండాలి. ఆత్మతో ఆత్మచింతన చేయాలి!

మాంసమయదేహము : ఈ భౌతిక దేహము ఎటువంటిది ?
- మాతా పిత్రోః మల ఉద్భూతమ్ | తల్లిదండ్రుల మలము నుండి జనించనట్టిది.
- మల మాంస మయమ్ వపుః | ఇది మలమాంసములతో నిండి ఉన్నట్టిది.

అటువంటి ఈ భౌతక దేహమునకు సంబంధించిన భావ - ఉద్వేగ - మమకారములను ఒక మల పదార్ధమువలె, మురికి వస్తువువలె త్యజించి ఉండాలి. త్యక్త్వా చండాలవత్ దూరమ్ - దేహాత్మ భావనను మురికిగుంట వలె త్యజించి, పరబ్రహ్మతత్త్వమును ఆశ్రయించాలి.
బ్రహ్మీభూయ కృతీభవ | బ్రహ్మీభూయ కృతకృత్యుడవు అగుము. బ్రహ్మీ భావనను ఆశ్రయించుము.

ప్రత్యగాత్మ - పరమాత్మ : ఓ మునీ !

pot-space

ఒక కుండలో ఆకాశము (Space)-ఆ కుండ బయట గల ఆకాశము ఒక్కటే కదా! కుండలోని గాలి-బయటగల గాలి ఒక్కటే కదా !

అట్లాగే…,
ఘటాకాశ - మహాకాశ ఇవ ఆత్మానం - పరమాత్మని |
నా-నీ దేహములోని ఆత్మయే సర్వ దేహములలోని ఆత్మగా, సర్వ జీవాత్మల రూపమగు పరమాత్మగా విరాజమానమై ఉన్నది.

“అందరూ నాలో - అందరిలోనూ నేను” అను అఖణ భావమును ఆశ్రయిస్తూ, గానంచేస్తూ, ఇక ఆపై,

విలాప్యాఽఖణ్ణభావేన, తూష్ణీం భవ సదా మునే। 
ఓ మునీ! ఏ ఏ భేద భావములు కనిపిస్తూ ఉన్నాయో, వాటన్నిటిపట్ల మౌనము వహించి, తూష్ణీభావము కలిగి ఉండు. “అబ్బే! వాస్తవానికి భేదములేవీ లేవు! అభేదమే!” - అని అనుకుంటూ ఉండు.

“పరమాత్మకు నేనుగాని, మీరుగాని, మరొకరెవరైనా గాని భిన్నులము కాము. అట్టి స్వప్రకాశము, సర్వమునకు అధిష్ఠానము (సర్వమునకు ఆధారమై, వాస్తవతత్త్వమై ఉన్నట్టిది), స్వయంభువు (తన ఉనికికి తానే కారణమైనట్టిది) అగు సదాత్మస్వరూపమే నేను! అదియే ఇదంతా” - అను అఖండాత్మభావనను ఆశ్రయించు. అట్టి నిత్యోదిత చైతన్యాత్మ భావనను అఖండాత్మానుభూతిని గట్టిగా అవధరించు.

“స్వయం ప్రకాశమగు ఆత్మ స్వరూపుడను నేను" అనునది మాత్రమే ఆశ్రయించి ఉండు. ప్రయత్నపూర్వకంగా ధారణ చేయి.

శ్రోత :  ఇక్కడి అడ్డాండ - పిజ్జాండముల మాట ఏమిటి ?

గురువు : అవా ? బ్రహ్మాండమపి పిండమ్ త్యజ్యతాం మలభాండవత్ ! ఈ అడ్డాండ (Universal) - పిజ్జాండ (Individual) భౌతిక - వ్యవహరమంతాకూడా - మల పదార్ధములతో నిండి ఉన్న కుండను వదలినట్లు దూరముగా త్యజించి ఉండు.

మహత్ దియమ్ -  ఉత్తమమైన ధీశక్తి (బుద్ధిశక్తి) కలవాడవై, నామరూపాత్మకమై కనిపిస్తున్నదంతా (లింగము) వదలివేసి, సర్వదేహములలో సర్వదా ప్రకాశమానమై వెలుగొందుచున్న సదానంద స్వరూపమగు ’చిదాత్మ’పై బుద్ధిని నియమించు. కేవలీభవ సర్వదా! అట్టి ఉత్తమ బుద్ధికి సిద్ధించుచున్న కేవలీ స్వరూపుడవు (Absolute form of self) గా సర్వదా అయిఉండుము.

శ్రోత : స్వామీ ! ఈ ఎదురుగా కంటికి కనిపిస్తున్న దృశ్య జగత్తును ఏ విధంగా సమన్వయించుకుంటూ దర్శించాలి ?

గురువు : ఓ అనఘా ! ఇక్కడ ఏ దృశ్య జగత్తు ఇంద్రియ విషయరూపమై అగుపిస్తోందో…… ఇదంతా - దర్పణాంతః పురమ్ - దర్పణము (అద్దము) లో కనిపించే నగర దృశ్యముగా సందర్శించు. అద్దంలో దృశ్యము కనిపిస్తూ ఉన్నప్పటికీ,…. అద్దములో దృశ్యము ఉన్నదా? ఉండదు కదా!

“ఇదంతా ఏ పరబ్రహ్మమునందు అద్దములోని దృశ్యమువలె అగుపిస్తోందో… అట్టి తత్ బ్రహ్మానంద స్వరూపడను నేను" అను భావనను ఆశ్రయించి కృతకృత్యుడవగుము.

చంద్రగహణము సమయములో అన్ని వైపులా చీకట్లు క్రమ్ముకొని ఉంటున్న తీరుగా, అఖండమగు స్వస్వరూపమును “అహం-మమ”కారములు ఆవరించనవై ఉంటున్నాయి. గ్రహణం తొలగగానే పూర్ణ చంద్రుడు శోభాయమానంగా ఆకాశంలో వెలుగొందుచూ అమృత కిరణాలు లోకాలకు ప్రసాదిస్తారు కదా ! పరిమితమగు దేహ అహంకారము అధిగమించబడగానే ఈ జీవాత్మ యొక్క - పరమాత్మత్వము పూర్ణానంద - సదానందములతో కూడి, స్వయం ప్రభలను వెదజెల్లగలదు.

 శ్రోత :  గురుదేవా ! ‘మోక్షము’ అనుదాని రూపమేమిటి ?

 గురువు :  ఈ జీవుని హృదయంలో క్రియలకు సంబంధించిన, ఆశలకు సంబంధించిన, చిన్తలకు సంబంధించిన అనేక అభినివేశములు (Emotional Attachments) జన్మ - జన్మలుగా పేరుకొని ఉంటున్నాయి. వాటికి సంబంధించిన వాసనలు తొలగించుకొన్నాడా… అదియే ‘మోక్షము’ అయి ఉన్నది. అద్దానినే ‘జీవన్ముక్తి’ అని కూడా వ్యవహరిస్తున్నారు.

 శ్రోత :  మరి వాసనా విలయము ఎట్లా సాధ్యం ? మార్గం ఏమిటి ?

 గురువు :  బ్రహ్మనిష్ఠయే అందుకు మార్గము.

1) "సర్వత్రా, సర్వతః సర్వః (అంతటా, ఎల్లప్పుడు సర్వము)… బ్రహ్మమే” - అను బ్రహ్మావలోకనము చేయటం. (ఈ కనబడే సర్వజీవులు ఆ అఖండ పరమాత్మయొక్క ప్రత్యక్ష రూపాలే - అని అనుకుంటూ, అనిపించేవరకు తత్భావనను కొనసాగించటం).

2) సత్ భావనను దృఢపరచుకోవటం. అసత్ భావనలయినట్టి అరిషట్ వర్గములను తగ్గిస్తూ, జయిస్తూ క్రమంగా హృదయములో ‘రహితము’ చేసుకోవటము.

నాయనా ! బ్రహ్మనిష్ఠకు అతి ముఖ్యము - ప్రమాదకరము అగు ఒక గొప్ప అవరోధము గురించి గుర్తు చేస్తున్నాను.

 శ్లో ॥ప్రమాదో బ్రహ్మనిష్ఠాయామ్ న కర్తవ్యః కదాచన, ||
‘ప్రమాదో మృత్యుః’ ఇతి ఆహుః, విద్యాయాం బ్రహ్మవాదినః ॥ 
 (ప్రమాదము = బద్ధకము, అశ్రద్ధ, జాడ్యము)

బద్ధకము, అశ్రద్ధ… ప్రమాదమైన విషయాలు, “అట్టి జాడ్యము మృత్యువుతో సమానము” అని బ్రహ్మజ్ఞులు ఎలుగెత్తి గుర్తు చేస్తున్నారు. బద్ధకము-అశ్రద్ధలకు ఏ మాత్రము చోటు ఇవ్వరాదు. ‘మాయ’ చాలా బలవత్తరమైనది. అది అనేక విషయములు తెలిసి బోధించగలిగినట్టి జ్ఞానిని కూడా క్షణంలో భ్రమింపజేయగలదు. నీటి ప్రవాహమునకు నాచు ప్రక్కకు తొలగుచూ, ప్రవాహ వేగము సన్నగిలగానే మరల తల ఎత్తుచున్న రీతిగా… అభ్యాసము (Practice) కొరవడితే, మరల మాయ వచ్చిచేరగలదు.  ప్రాజ్ఞవ్వాపి పరాఙ్ముఖమ్ | ఎంతో పాజ్ఞుని కూడా పరాఙ్ముఖునిగా చేసివేయగలదు.

ఓ అనఘా ! ప్రియ చైతన్యస్వరూపా !

ఈ దేహము ఉన్నప్పుడే సమాధినిష్ఠుడవై “జగత్తు - దేహము నా కల్పన ! ఇక నేనో వీటికి సంబంధించని కేవల స్వరూపడను”… అను కేవలీ రూప విదేహముక్తిని (లేక) కైవల్యమును సముపార్జించుకొని నిర్వికల్ప స్వరూపుడవయ్యెదవు గాక ! “ఈ జగత్ దృశ్యము నా పట్ల ఏర్పడినది - ఉన్నది - తొలగాలి”… ఇత్యాది రూపమైనట్టి హృదయములోని గ్రంథులు (చిక్కుముడులు) - సమాధి యొక్క అభ్యాసముచే ఎప్పుడు నిశ్శేషంగా విడివడి విలయమౌతాయో, వికల్పమౌతాయో, అప్పుడు అద్వితీయము - అఖండము అగు ఆత్మ దర్శనము (ఆత్మానుభవము) సిద్ధిం న్నది. అటువంటి అఖండాత్మత్వము సిద్ధిం కొన్నవాడు ఇక ఆపై “నేను - నీవు - జగత్తు” మొదలైనవాటి పట్ల ఒక కుండ - వస్త్రమువలె (ఘట-పటాదివత్) - అత్యంత “ఉదాసీనుడు”, “వ్యధరహితుడు”… అగుచున్నాడు.

అవన్నీ విషయములే కానట్లుగా దర్శిస్తూ ‘ఉదాసీనము’ నందు మౌనముగా సంస్థితుడు అగుచున్నాడు.

ఓ ప్రియ శ్రోతా! బిడ్డా!
సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక స్థంభము వరకు ఏఏ అసంఖ్యాక ఉపాధి పరంపరలు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మిథ్య (illusion) మాత్రమే! పూర్ణ స్వరూపమగు మమాత్మ (స్వీయాత్మ) సర్వదా ఏకమే! అనేకము కాదు. అట్లు అయిఉండి, అజ్ఞాన దృష్టి చమత్కారముచే అనేకముగా కనిపిస్తోంది. జ్ఞాన దృష్టికో…, (అనేకముగా కనిపించేదంతా) ఏకమేనని అనిపించగలదు.

ఈ సర్వము అఖండాత్మ ప్రదర్శనమే? నేను, నీవు. ఇదంతా ఏకాత్మయే? కాబట్టి…

అఖండాత్మ స్వరూపుడనగు నేనే ఇదంతా!

మం|| శ్లో॥ స్వయం బ్రహ్మా | స్వయం విష్ణుః ।
స్వయం ఇంద్రః | స్వయం శివః |
స్వయం విశ్వం ఇదం సర్వమ్
స్వస్మాత్ అన్యత్ న కించన |

నేనే స్వయముగా సృష్టికర్తయగు బ్రహ్మను ! స్థితికారకుడగు విష్ణువును ! లయకారకుడగు శివుడను ! ఈ విశ్వమంతా నేనే ! నాకు వేరైనది ఎక్కడా ఏదీ కించిత్ కూడా లేదు! ‘ఇది ఆకారము’ అనునది ఏదీ లేనట్టి బంగారము నందు, ‘ఉంగరము-గాజు-గొలసు’… మొదలైన నామ రూపములు ఆపాదించబడి, వ్యవహార శీలము అగుచున్నాయి కదా ! అదే విధంగా స్వయముగా పూర్ణము - అద్వయము - అక్రియము”… అగు నా పరబ్రహ్మ స్వరూపముపై అశేష వస్తుజాలములతో కూడిన ఈ జగత్తంతా ఆపాదించబడుతోంది.

సంకల్పముచే - అనేక - విభిన్న విశేషములతో కూడిన ఈ విశ్వమంతా కూడా … వాస్తవానికి అసంకల్పనచే “ఏకవస్తు స్వరూపము (అఖండాత్మ స్వరూపమునకు అభిన్నము, స్వతఃగా చూస్తే లేనిది)” అగుచున్నది.

ఈ ఎదురుగా కనబడే ఇంద్రియానుభవ దృశ్యమంతా కూడా సర్వదా నిర్వికారము, నిరాకారము, నిర్విశేషము అగు ఆత్మయే! అట్టి అఖండాత్మయందు ఈ దృశ్యవ్యవహారము ఆపాదించబడుచుండగా ఆత్మ సర్వదా నిర్వికారము, నిరాకారము, నిర్విశేషము అయి యథాతధంగా కొనసాగుచూనే ఉన్నది.

అట్టి నిరామయమగు ఆత్మయందు ద్రష్ట - దర్శనము - దృశ్యమునకు సంబంధించిన వస్తుసమూహములు లేవు. ఎందుకంటే ఆత్మ స్వతఃగా భావనలకు మునుముందునుంచే ఉన్నది. మొట్టమొదట - మధ్య - చివర కూడా భావాతీతమై, త్రిగుణరహితమై ఉన్నది.

అసంఖ్యాకతరంగాలతో సముద్రము పరిపూర్ణమైనట్లుగానే (కల్పార్ణవము వలె) చిదాత్మ అత్యంత పరిపూర్ణ-తేజోరూపము. అట్టి తేజోరూపమగు చిదాత్మ అజ్ఞాన తమస్సునందు మునుగుతుందా ? ఎట్లా మునుగుతుంది ? ఏకాత్మమగు పరతత్త్వము అనేక బేధములు అవటానికి కారణమేదీ లేదు. కారణమే లేనప్పుడు కార్యరూపమగు ఖండత్వము ఎక్కడ ఉంటుంది, సర్వము అఖండాత్మ అయి ఉండగా?… “దీపము వెలుగుచూనే ఉన్నది. కానీ అది చీకటిచే కప్పబడినది" - అనునది అసంబద్ధము కదా! సర్వదా ఏకాత్మమైయున్న పరమతత్త్వమునందు ఖండత్వము భేదము కల్పించగల ‘కర్త’ ఎక్కడ, ఎట్లా ఉండగలడు ? ఆత్మకు వేరుగా ఆత్మకు ఖండత్వము - భేదము కల్పించువాడు మరొకడుంటే “ఆత్మ అఖండము (unpartitionable) - అద్వితీయము (అద్దానికి ద్వితీయమైనది లేనట్టిది”.. మొదలుగా గల ఆత్మ ధర్మాన్ని నిర్విచించే మహతత్త్వ వర్ణనలు నిష్ఫలమౌతాయి కదా !

దృష్టాంతానికి…,
సుషిప్తి దశలో సర్వజీవుల యొక్క సుషుప్తి అనుభవము ఒకే తీరైనది అగుచుండటమే “ఇక్కడ అనేకత్వము లేదు” అనుదానికి ఒక దృష్టాంతము. సుషుప్తి స్థితిలో - సుషుప్తా సుఖమాత్రాయాం భేదః కేన అవలోకితః? సుషుప్తి సుఖములో భేదము చూచే ద్రష్ట ఎక్కడున్నాడు? అట్లాగే అఖండమగు ఆత్మ (లేక) బ్రహ్మమునందు భేదమును దర్శించు ద్రష్ట (బ్రహ్మమునకు వేరుగా) ఎక్కడుంటాడు? ఉండడు!

ఇక “జాగ్రత్-స్వప్నములలో వేరు వేరు ద్రష్టలుగా అయి ఆత్మ కనిపిస్తున్నది కదా”… అంటావా?
చిత్తేన వికల్ఫోయం చిత్త అభావేన కశ్చన? జాగ్రత్ - స్వప్నములలో కనిపించే భేదమంతటికి చిత్తమే మూలము. చిత్తము సుషుప్తిలో అభావించబడుతోంది.
చిత్తము అభావించినప్పుడు సర్వభేదములు లేనివే అయి ఏకత్వము సిద్ధించుచున్నది. అనగా, చిత్తము ఉంటే భేదము కనిపిస్తోంది. చిత్తము లేనప్పుడో,… భేదమే లేదు!

అతః చిత్తమ్ సమాధేహి ప్రత్యక్ రూపే పరాత్మని. చిత్తము ఎప్పుడైతే సమాధి స్థితిని పొంది సమాధాన స్థితి పొందుచున్నదో అప్పుడు ప్రత్యక్ రూప (జీవాత్మ రూప) మంతా పరాత్మ స్వరూపమే అగుచున్నది. చిత్తము సుషుప్త మౌనము వహించి ఉండియే,… దృశ్యమును దర్శిస్తూ ఉండటము సమాధి.

“అఖండానంద ఆత్మయే నా యొక్క స్వస్వరూపము ! అది నాకు వేరు కాదు ! నేను అద్దానికి వేరు కాను!” అను స్వస్వరూపాత్మకు సంబంధించిన సత్యమును తెలుసుకొని, అట్టి దర్శనమును ఆశ్రయించి, అద్దానిని స్వభావము చేసుకొన్నవాడు…, ఈ బాహ్యమున కనిపించేదంతా కూడా….
1. తన యందే ఉన్నట్లుగాను, 2. ‘తానే’ గానూ, 3. తన రసాస్వాదనా చమత్కారంగానూ చూస్తూ, ఇదంతా తన ఆత్మగా ఆస్వాదిస్తున్నాడు. (త్రిపుర తాత్త్వికార్థం)

వైరాగ్యస్య ఫలం బోధో : ఇంద్రియ విషయములన్నిటిపట్ల రాగము తొలగించుకొన్నప్పుడు, ఇక ఆత్మకు సంబంధించిన బోధ జ్ఞానము (శాస్త్రములచే, ఆత్మజ్ఞులచే బోధింపబడు బోధస్వరూప ఆత్మజ్ఞానము) లభిస్తోంది. బోధ జ్ఞానముచే చిత్తము ఇంద్రియ విషయములలో రతించటం సన్నగిల్లుతోంది. అనగా, చిత్తమునకు చిత్త విషయములన్నీ కూడా ‘చిత్’ స్వరూపమై సిద్ధించుచున్నాయి.

బోధస్యా ఉపరతిః ఫలమ్ :  బోధ (ఆత్మ) జ్ఞాన సమాచారము యొక్క సముపార్జన - పరిశీలనలచే (లేక - ఆత్మజ్ఞానముచే) దృశ్య విషయముల నుండి చిత్తము శమిస్తూ, వెనుకకు మరలుచూ, “ఉపరతి (withdrawal)” అనే ఫలము సిద్ధిస్తోంది. దృశ్యము అతనిపట్ల శాంతిస్తోంది. ఆత్మయందు నియమితమౌతోంది. దృశ్యము ఆత్మగా శమించినదగుచున్నది.

స్వానందానుభవాత్ శాన్తిః : దృశ్యము శమించి శాంతించుచుండగా, స్వాత్మానందానుభము (ఈ సర్వము నేనైన నేను యొక్క అనుభవము) దృఢత్వమును సంతరించుకుంటోంది. ఇదియే ‘ఉపరతి’ యొక్క ఫలము. ఏష ఏవ ఉపరతేః ఫలమ్ !.

ఈ విధంగా ‘ఇంద్రియ విషయ తదాత్మ్యము’ అను “పరిమిత జీవా హమ్” (లేక) ‘సంకుచిత భావన’ నుండి…….
1) వైరాగ్యము 2) ఆత్మ జ్ఞాన సమాచారము 3) ఉపరతి 4) జగత్ దృశ్య ఉపశాంతి… అనునవి ఒకటి తరువాత మరొకటి ప్రయత్నశీలునికి లభిస్తూ వస్తున్నాయి.

వాటికి ఫలముగా “నివృత్తి-పరమానంద తృప్తి” రూపమగు ఆత్మానందము పొందబడుచున్నదని ఆత్మను ఎరిగిన మార్గదర్శకులు మార్గమును చూపుచున్నారు.

అయితే పైన చెప్పిన నాలుగిటిలో ఒకటి తరువాత ఆపై మరొకటి పొందనప్పుడు ఒక్కొక్కటి యొక్క వెనుకటి స్థితులు నిష్ఫలమే అవగలదు సుమా !

వైరాగ్య - బోధ - ఉపరతులు సంపాదించుకొని, మరి శాంతిని పొందక పోతే, ఆ మూడు సంపాదించుకొని ప్రయోజనం ఏమున్నది? అందుచేత పూర్ణ నివృత్తితో కూడుకొన్న మౌనరూప ప్రవృత్తి… సంపూర్ణ సత్ఫలముగా అగుచున్నది. (లేక) ఒకటి పొందగానే వెనుకటిదానితో పని లేకుండా పోతోంది).

తత్ - త్వమ్

‘తత్’ (పరమాత్మ) - స్వతఃగా విలక్షణుడు, నిర్గుణుడు, ఉపాధిరహితుడు. అట్టి పరమాత్మ యొక్క తటస్థ లక్షణములు :

1) మాయోపాధిః : మాయను తన ఉపాధిగా కలిగి ఉండటము.
2) జగరద్యోనిః : ఈ జగత్ జనించు యోని స్థానముగా అవటము.
3) సర్వజ్ఞః : ఈ దేహమునకు ఈవల ఆవల గల తత్త్వమును ఎరిగినట్టి ‘సర్వజ్ఞత్వము’
4) సాక్షిత్వః : దేహపరంపరలకు కేవల సాక్షిత్వము. దేహాతీత్వమునకు కూడా సాక్షి!
- మొదలైనవన్నీ కూడా ’తత్’ శబ్దార్థమగు ఈశ్వరుని లక్షణములు. (నాటక దీపమువలె దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారములకు
కూడా కేవల సాక్షి).

త్వమ్ (జీవాత్మ) : 1) భౌతిక ఉపాధిని ఆలంబనముగా కలిగి ఉండటము 2) జగత్తులో జనించినవాడివలె ఉండటము 3) నేను ఈ భౌతికదేహముచే పరిమితుడను - అను భావనను పరిపోషించుకొని ఉండటము 4) ఈ ఒక్క దేహమునకు సాక్షి మాత్రమే - అయి,
పరిమిత స్వాభావుడై ఉండటము… ఇవి జీవాత్మ లక్షణములు.

అట్టి జీవాత్మ పరమాత్మకు ఉపకరణమువంటివాడు. జీవాత్మ పరమాత్మ యొక్క ఒకానొక కళా విశేషము. జీవాత్మగా పిలువబడుచూ కూడా పరమాత్మకు అభిన్నుడే అయి ఉన్నవాడు.

ఎందుకంటే…,

మం||శో॥ మాయా అవిద్యే విహాయైవ, ఉపాధి పర-జీవయోః
అఖండ సచ్చిదానందం, పరంబ్రహ్మ విలక్ష్యతే !

ఈ ‘త్వమ్’ స్వరూప జీవాత్మ ఉపాధిపరిమితిని అధిగమించి, మాయారూపమగు అవిద్యను సాక్షిత్వముతో విడచిన మరుక్షణం, విలక్షణమగు “అఖండ - సత్ చిత్ ఆనంద - పరబ్రహ్మత్వము”ను స్వభావసిద్ధంగా పుణికి పుచ్చుకొనుచున్నాడు.

1.) శ్రవణము : ఇత్థం వాక్యైః ‘తత్’ అర్థమ్ అనుసంధానం ‘శ్రవణమ్’ భవేత్ ! 1. తత్ త్వమ్ పరమాత్మ 2. ఇదంత్వమ్ జీవాత్మ’ ఈ రెండింటిని సంబంధించిన శబ్దార్ధములను, మాయోపాధి - దేహోపాధిల (తత్-త్వమ్ల) తాత్పర్యమును వినటమును ‘శ్రవణము’
అని పిలుస్తున్నారు.

2.) మననము : ఈ విధంగా శాస్త్రవర్ణనములను ఆత్మజ్ఞుల ప్రవచనములను విని, అర్థము చేసుకొంటూ, - యుక్త్యా సంభావితత్వా, అనుసంధానం  – ‘మననం’ తు తత్ - యుక్తితో (యోగము - భక్తి - జీవసమాధి - అభావ సమాధి … ఇటువంటి మార్గములలో) ఆ పరమార్థమును బుద్ధికి సిద్ధింపజేసుకుంటూ, ఆ బుద్ధితో ఆ అర్థమును అనుసంధానము చేయుటము (Applying practically while even being with worldly scene) ను “మననము” గా చెప్పబడుతోంది.

3.) నిదిధ్యాసనమ్ :  తాభ్యాం నిర్విచికిత్సే అర్థే చేతసః స్థాపితస్య తత్ ‘ఏకతానత్వమ్’, ఏ తత్ ‘నిదిధ్యాసనమ్’ ఉచ్యతే | ఈ విధంగా వేదమహా వాక్యముల శ్రవణం (వినటం) - మననములచే తెలియవచ్చుచున్న స్వస్వరూపాత్మ పట్ల నిలకడ బుద్ధిని పెంపొందించుకుంటూ, అఖండ - సచ్చిదాత్మయందు ధ్యాస-భావనలను నిలుపుచూ, దృష్టి - ధ్యాసలను ఆత్మవైపుగా నడుపుచున్నప్పుడు తొలగు ‘అనేకత్వము’ను, రూపుదిద్దుకొని ‘ఏకత్వము’ ను ‘నిదిధ్యాస’… అని ఉద్దేశ్యిస్తున్నారు.

4.) సమాధి : 

ధ్యాతృ - ధ్యానే పరిత్యజ్య, క్రమాత్, ధ్యేయ ఏక గోచరమ్
నివాత దీపవత్ చిత్తం, ‘సమాధిః’ అభిధీయతే |
ఆత్మ దృష్ట్యా ఇదంతా కూడా సర్వదా ఏకమే గాని, అనేకము కాదు. ’ధ్యాస (Avocation)’ కారణంగా ఇక్కడున్నదంతా స్థూలదృష్టికి ‘అనేకము’గా అనుభూతమగుచున్నది. శ్రవణ - మనన - నిదిధ్యాసల సహాయముతో అట్టి ద్విత్వము - అనేకత్వములను పరిత్యజించి, క్రమంగా… “ఏకము - అఖండము అగు ఆత్మ వస్తువు" నందు ఈ చిత్తమును - గాలికదలికలు లేని చోట గల దీపమువలె - నిశ్చలత్వము సంతరించుకోవటము “సమాధి”.

అనగా..,
1) ధ్యాతృ (ధ్యానము చేయువాడు) 2) ధ్యానము … ఈ రెండింటిని అధిగమించి, ధ్యేయమగు ఏకాత్మను మాత్రమే ఈ చిత్తము సందర్శిస్తూ, గాలివీచని చోట దీపమువలె నిశ్చలత్వమును సంతరించుకోవటమును “సమాధి”  శబ్దార్థముగా అభివర్ణిస్తున్నారు.

ఈ విధంగా చిత్తమునుండి జగత్ సంబంధమైన వృత్తులను వెనుకకు మరల్చి, నివృత్తి చేయటం సమాధి సాధన. అట్టి చిత్త వృత్తిరహిత స్థితియగు సమాధి యందు “ఆత్మను దర్శించటము” అను ఏకైక వృత్తి మాత్రమే శేషిస్తుంది. అనగా, అట్టి సమాధి వృత్తి “ఇదంతా మమాత్మయే” అనే స్మరణమును మాత్రం కలిగి ఉంటుంది.

అయితే…,
“వృత్తులను శాసించి, వెనుకకు మరల్చి, ఆత్మయందు నియమించటము”… అనే సమాధి కొనసాగునంతవరకు దృశ్యవృత్తులు శమిస్తాయి కానీ, సమాధి అభ్యాసమును కొంచము విరమించగానే, మరల ఇంద్రియ విషయవృత్తులు తిరిగి వచ్చి పడతాయి. అనగా ’సమాధి అభ్యాసము’ సమయంలో కూడా చిత్తవృత్తులు రహితం అగుచున్నాయా? లేదు. కించిత్ రహస్యంగాను, మౌనంగాను దాగియే ఉండి, ఆ అభ్యాసమునుండి విరామము పొందగానే మరల తిరిగి వస్తున్నాయన్నమాట!

శ్రోత :  గురువర్యా ! సమాధి నుండి కొంచము విరామమును ఆశ్రయించగానే ప్రాపంచక చిత్త వృత్తులు వచ్చి పడుచున్నాయా ? ఎందుచేత ?

గురువు : ఎందుచేతనా? విను

శ్లో॥ అనాది-అవిహ సంసారే సంచితాః కర్మకోటయః
అనేన విలయం యాంతి, శుద్ధధర్మో వివర్ధతే |

ఈ జీవుడు అనాదిగా అనేక ఉపాధులతో కూడి ప్రోగుచేసుకొన్న కోటాను కోట్ల సంచిత కర్మల ధ్యాసలు, అభ్యాసములు చిత్తములో ప్రోగు అయి ఉన్నాయి.

శ్రోత : ఎంత పెద్ద ప్రమాదం ?

గురువు : బిడ్డా ! నిరుత్సాహపడనవసరము లేదయ్యా ! మరల మరల సమాధిని అభ్యసిస్తూ ఉండగా, ఆ అసంఖ్యాక కర్మ సంస్కారాల వ్యవహారమంతా విలయమై “సోఽహమ్! త్వమేవాహమ్! అహమ్ ఆది-మధ్య - అంతశ్చ! అహమేవమ్ ఇదగ్ం సర్వమ్”… మొదలైన మహా - వాక్య ప్రవచనార్థమగు ఆత్మ ధర్మము తప్పక ప్రకాశించగలదు. శుద్ధ ధర్మము ప్రవృద్ధము కాగలదు.

మేఘములు వర్షించి, నేలను తడిపి, సమృద్ధిగా ధాన్య సంపదను మానవాళికి ప్రసాదిస్తాయి చూచావా?
ఆ విధంగా…,

“ధర్మ మేఘమ్ ఇమం ప్రాహుః సమాధిః", యోగ విత్తమాః
వర్షత్య ఏష యథా ధర్మ - అమృతధారా సహస్రశః ||

సమాధి అభ్యాసము ఆత్మధర్మ-అమృత ధారలను సహస్రములుగా (వేలాది అమృతధారలుగా) వర్షింపజేయగలదు. అందుచేత సమాధిని "ఆత్మతత్త్వానుభవ ధర్మ మేఘము” అని యోగవేత్తలు పిలుస్తూ ఉంటారు. జగత్ దృశ్యమంతా స్వభావసిద్ధంగా (As a natural course) ‘స్వస్వరూపం’గా అనుభూతమవటమే ఆత్మ ధర్మ-అభ్యాస అమృత ధార!

శ్రోత : ఈ జీవుడు అసంఖ్యాకములగు పుణ్య - పాప కర్మల మధ్య చిక్కుకొని ఉంటున్నాడు కదా ! ఎందుచేత ?

గురువు : అనేక జన్మలుగా, అనాదిగా ఆశ్రయిస్తూ వస్తున్న ఉపాధి పరంపరల కారణంగా ఈ జీవుని హృదయములో వాసనాజాలములు అభిప్రాయములు - ఆవేశములు సంస్కార రూపంగా దట్టముగా పేరుకొని ఉండటం జరుగుచున్నమాట నిజమే. అట్టి వాసనాజాలములే ఈ జీవునిపట్ల పుణ్య - పాప కర్మల ఉద్వేగములకు కారణం అగుచున్నాయి. అయితే నిర్వికల్ప సమాధి యొక్క అభ్యాసము… (Repeatedly practising the thoughtless - Thought towards state of self) చేత మనము ఉదహరించుకొన్న - పుణ్య పాపకర్మల వాసనాజాలమంతా సమూలముగా నశించగలదు. “నేను ఇంకా ఏదో నిర్వర్తిస్తే గాని ఆత్మ యొక్క సాన్నిధ్యము లభించదు.

ఇంకా ఏదో చేయాలి ! ఎక్కడికో వెళ్ళాలి"… ఇటువంటి కర్మపరంపరావేశములన్నీ సమాధి యొక్క అభ్యాసముచే సన్నగిలుతూ ఉపశమించగలవు! స్వతఃగా సర్వదా స్వస్వరూపమునకు అభిన్నమై సిద్ధించియున్న ‘స్వాత్మ’ కొరకై క్రొత్తగా ఇప్పుడు సంకల్పించవలసినదేమున్నది? ర్వర్తించవలసినదేమున్నది?

శ్రోత : మహనీయా ! సద్గురూ! వేదమహావాక్యములను ఎట్లా ఆశ్రయించాలి ? ప్రయోజనము ఎట్టిది?

గురువు : “తత్ త్వమ్; సోఽహమ్; జీవోబ్రహ్మేతి నా పరః; అయమాత్మ బ్రహ్మ”… మొదలైన మహత్తరమైన అర్థమును ప్రసాదించు మహావాక్యములు వేద - ఉపనిషత్తులచే, వేద-వేదాంత స్వరములచే సర్వ జనులకు, సాధకులకు ప్రసాదించబడుచున్నాయి.
1) ఎందుకొరకు? 2) వాటి ఉద్దేశ్యార్థమేమిటి? … ఈ రెండు విషయాలు గ్రహించి, విచారణ చేస్తూ ఉండాలి. మననము చేస్తూ ఉండాలి. విచారణను దృష్టి యందు పదిలము - నిర్దుష్టము చేస్తూ ఉండగా, ఇక క్రమంగా.., ప్రత్యక్ష - పరోక్ష సంబంధమైన అజ్ఞానమంతా తొలగి అపరోక్ష జ్ఞానము ఉదయిస్తుంది. కరతలామలకము (చేతిలోని ఉసిరిపండువలె) కాగలదు.

వైరాగ్యము : వాసనా అనుదయో భోగ్యే, ‘వైరాగ్యస్య’ తదా అవధిః | - “ఏదో ఇంకా పొందాలి. చేయాలి. ఎక్కడికో వెళ్ళాలి” … ఇటువంటి లోక సంబంధమైన వాసనా ఆవేశము ఉదయించకపోవటమే వైరాగ్యము యొక్క అవధి, సిద్ది!

‘అహంభావము’ నుండి ఉదయించు భావనలను అభావించుటయే ‘బోధ’ లేక ’జ్ఞానము’ (లేక) సమాధి యొక్క పరమావధి!

ఉపరతి

“చిత్తము విషయములందు ప్రవేశించి తన్మయము కాకపోవటము, కేవలత్వము సంతరించుకోవటము ఉపరతి. వృత్తులు జనించకయే చిత్తము సందర్భములందు పాల్గొనటము ఉపరతి. ఉపరతి చిత్త వృత్తిరాహిత్యమునకు సంబంధించినదే గాని శాస్త్ర - శబ్ద పాండిత్యమునకు సంబంధించినది కాదు. (యోగః చిత్త వృత్తి నిరోధకః - పతంజలి).

స్థితప్రజ్ఞుడు

 శ్రోత :  హే భగవాన్ ! సద్గురూ ! ’స్థితప్రజ్ఞుడు’ అనగా ఎవ్వరు ?

 గురువు :  ఎప్పుడైతే చిత్తము విషయముల మననమున పూర్తిగా త్యజించినదై, సర్వే - సర్వత్రా చిదానందతత్త్వ దర్శనముచే - విషయముల పట్ల మౌనము, తూష్ణీభావము, - ఆత్మ పట్ల అనుక్షణిక - అకారణానందము ధరించినదై ఉంటుందో… అప్పుడు అతడు ‘స్థితప్రజ్ఞుడు’ అని చెప్పబడుచున్నాడు. అతడు స్వభావముచే ఆత్మానందభరితుడై, సర్వమును స్వస్వరూపాత్మ భావనచే దర్శిస్తున్నాడు.

తన యొక్క జీవత్వమును నిర్విశేష బ్రహ్మము యొక్క చిత్కళా కిరణముగా దర్శించుచున్నాడు. జీవత్వమును బ్రహ్మత్వమునందు విలీనము చేసి, తానే సర్వ రూప సాక్షాత్కార బ్రహ్మముగా, అకారణానందరూపముగా నిర్వచించుకొని ఉంటున్నాడు. “నా ఆత్మానందమునకు ఈ దేహము యొక్క రాక - పోకలు గాని, జగత్ దృశ్య విశేషాలు గాని, మనోబుద్ధి చిత్త అహంకారముల స్థితి - గతులు గాని అవధులు కల్పించలేవు”… అను దృష్టిని ప్రవృద్ధపరచుకొని, సుస్థిరీకరించుకొన్న వాడగుచున్నాడు. ఆత్మను బ్రహ్మమునందు విలీనము చేసినవాడై, హృదయమునందు నిర్వికారుడు - నిష్క్రియుడు - కేవల సాక్షి - సర్వమును లీలావినోదముగాను, ఇంద్రజాలము గాను దర్శించువాడు … అయి ఉంటున్నాడు.

నిర్వికల్పుడు - ప్రజ్ఞానం బ్రహ్మ

ప్రజ్ఞ = బ్రహ్మాత్మనోః శోదితయోః ఏక భావ అవగాహినీ, నిర్వికల్ప చ :-

ఈ జీవుని ఏ తెలివి (మరియు) విద్వత్తులచే …,
➤ ఒక దేహమునకు అంతర్గతుడగు ‘జీవుడు’!
➤ దేహ - దేహాంతర ప్రహసనములకు, సాక్షియగు ‘ఈశ్వరుడు’!
➤ దేహముల ఉనికి లేములకు సంబంధించనట్టి “పరబ్రహ్మము”!
ఈ మూడు శోధించబడి, ఈతడు ఏకీభావ (అంతా ఒక్కటే అను అనుభవ) సమేతుడై ఎప్పుడు ఉంటాడో, సర్వదా నిర్వికల్ప - కేవల చిన్మాత్ర ప్రవృత్తుడై ఉంటాడో… అట్టి తెలివియే ‘ప్రజ్ఞు’! సర్వము స్వకీయ-కేవల ప్రజ్ఞారూపముగా ఆస్వాదించుటయే “నిర్వికల్ప స్థితి”!

‘నేను జీవుడను’ అను భావనను “నేను సర్వస్వరూపమగు బ్రహ్మమునే”, “అఖండ బ్రహ్మమే నేను-నీవు-జగత్తుగా అనిపిస్తూ ఉన్నది”… అను ఆధ్యాత్మ భావనయందు లయము ఏకము చేయుటకు ఉపకరించు “అవగాహన”యే ప్రజ్ఞ.

చిన్మాత్ర వృత్తి రూపమగు (Absolute wisdom) కల్పనా రహిత - నిర్వికల్ప (A state of self sans sense of relativity) స్థితి ‘ప్రజ్ఞానము’ అని పిలువబడుచున్నది. “ప్రజ్ఞానమ్ బ్రహ్మ”లోని ప్రజ్ఞ అనగా కూడా అదియే !

జీవన్ముక్తుడు

ఈ ఎదురుగాగల ’అనేకత్వము’ను అధిగమించి, 1) ఏక భావ సంబంధమైన అవగాహన, 2) కేవల చిత్ భావనా రూపమైన చిత్ మాత్రవృత్తి - ఈ రెండూ ఎల్లప్పుడు కలిగి ఉండటమే “జీవన్ముక్తి”.

దేహ - ఇంద్రియేషు అహమ్ భావ ఇదం భావ తదన్యకే, యస్య నో
భవతః క్వాఽపి, స ‘జీవన్ముక్త’ ఇష్యతే |

ఎవ్వరికైతే “ఈ దేహ ఇంద్రియములు నాకు సంబంధించినవి. నేను ఈ దేహ ఇంద్రియములకు సంబంధించినవాడను”… అను ఇహ - అహమ్ భావము ఉండదో…, వారికి అన్యమగు ఆత్మసాక్షీ భావన (పరాహంభావన) రూపు దిద్దుకొని స్థిరపడుతుంది. ఎవ్వరు దేహ - ఇంద్రియ అహంకార - జగత్తులకు వేరై, వాటికి సంబంధించిన భావములకు తాను బద్ధుడుకాకయే ఉంటాడో… అతడే జీవన్ముక్తుడు. “ఇహాఽహమ్ భావన కూడా నా యొక్క పరాస్వరూపము యొక్క అంశ” అని ఎరిగి ఉండటమే జీవన్ముక్తి.

న ప్రత్యక్ - బ్రహ్మణోభేదమ్ కదాఽపి బ్రహ్మ - సర్గయోః, ప్రజ్ఞయో విజానాతి, - స జీవన్ముక్తః |

"బ్రహ్మమునందు - ఇది ద్రష్ట, ఇది దృశ్యము, ఇది జీవాత్మ, ఇది సర్గము (సృష్టి), ఇది పరమాత్మ అను భేదము ఎప్పుడూ ఈషణ్మాత్రంగా కూడా లేదు”… అని ప్రజ్ఞచే స్పష్టముగా ఎరిగి జీవిస్తూ ఉన్నవాడు జీవన్ముక్తుడు.

అట్టి దృష్టిని సుదృధీకరించు ప్రజ్ఞను పెంపొందించుకొన్నవాడు జీవన్ముక్తుడు.

సాధుభిః పూజ్యమానే అస్మిన్, పీడ్యమాన్యేఽపి దుర్జనైః ’సమభావో’ భవేత్ యస్య స జీవన్ముక్తః॥

సాధుజనులచే పూజింపబడుచున్నప్పుడు, దుర్జనులచే బాధించబడుచున్నప్పుడు కూడా "ఈ ఇరువురు కూడా బ్రహ్మమే ! మమాత్మ స్వరూపులే ! నేను ఒక సజ్జనుడు దుర్జనుడు- ఒక విజ్ఞుడు - ఒక అజ్ఞుడు - అందరము కూడా సర్వదా ఏకమాత్రమగు అఖండాత్మ స్వరూపులమే” - అను సమరస భావనను ఏమాత్రమూ వదలకయే ఉంటాడో… అతడే జీవన్ముక్తుడు.

ఓ ప్రియ మమాత్మ స్వరూపా ! బిడ్డా ! వత్సా!

బ్రహ్మతత్త్వము ఏమిటో ఎట్టిదో ఎరిగిన తరువాత, ఇక ఆ విజ్ఞుడు ఇతఃపూర్వమువలె ‘దృశ్యము సత్యమే’ అను సంసారరూప సంసృతిలో మునుగడు. సంసారములో ఉండటం జరిగినా కూడా, బ్రహ్మ భావముతోకూడి, దీనికంతటికీ ఆవల బహిర్ముఖుడై సర్వాతీతుడై ఉంటాడు. (Hands in the world. But Head in the forest). బయట-లోపల బ్రహ్మమునే దర్శించుచూ, తెలుసుకొనవలసినది తెలుసుకొనినవాడై ప్రశాంతంగా, పూర్వాపరాలు ఎరిగి ఉంటున్నాడు. తెలియబడేదీ - తెలుసుకొనుచున్నవాడు రెండు బ్రహ్మమే అయి ఉండగా, ఇక అతని దృష్టిలో ‘సంసృతి’ అనునది ఎక్కడ మిగిలి ఉంటుంది? ఉండదు.

శ్రోత :  మహాత్మా ! అనేక జన్మలుగా సముపార్జించుకొన్న సుకృత - దుష్కృత కర్మ ఫలాలను ‘సంచితము’ అని, వర్తమాన జన్మలో ఫలరూపములగుచున్న కర్మఫలములను ‘ప్రారబ్ధము’ అని, ఈ దేహానంతరము వెంటనంటి తదనంతర దేహ సందర్భమునకై వేచి ఉండే కర్మ ఫలాలలను ‘ఆగామి’ అని అంటారు కదా ! మరి జీవన్ముక్తుని పట్ల సంచిత - పారబ్ధ - ఆగామి కర్మలు కొనసాగుతాయా? తొలగిపోతాయా ?

గురువు : ఏ సుఖ - దుఃఖ ఇత్యాది అనుభవములుగా (లేక) అవగాహనలుగా తారసబడుచున్నాయో, వాటినే ’కర్మ ఫలములు’ అని పిలుస్తున్నారు. అవియే ప్రారబ్ధ కర్మలుగా వర్తమానములో ఫలీకరించుచున్నాయని శాస్త్రములు చెప్పుకొస్తున్నాయి.
అయితే,
ఫలోదయః క్రియా పూర్వో నిష్క్రియో న హి కుత్రచిత్ !
కర్మలవలన కదా, కర్మ ఫలాలు ! కర్మలకన్నా ముందే ఆత్మ ఉన్నది కదా !
అట్టి నిష్క్రియమగు ఆత్మ యొక్క అర్థ-పరమార్థములను సిద్ధించుకొన్న తరువాత, ఇక కర్మ ఫలాలు ఏమి చేస్తాయి? అవి ఉండవచ్చు, లేదా, లేకపోవచ్చు. కానీ జీవన్ముక్తుని దృష్టిలో “కర్మలు - కర్మఫలాలు కల్పనలోనివి ! స్వతఃగా లేవు”… అను అవగాహన సుస్థిరమై ఉంటోంది.

కలలోని సందర్భాలను ‘కర్మఫలాలు’ అని అంటామా? అనము కదా! "అహమ్ బ్రహ్మ! - నేను బ్రహ్మమును”… అని సుస్పష్టపరచుకొన్న తరువాత ఇక కర్మలకు మునుముందే ఉన్న తత్ స్వరూపుని పట్ల కోటికల్పములలో సంపాదించుకొన్న సంచితము కూడా విలయమైపోగలవు. స్వప్నతుల్యం కాగలదు.

శ్లో॥ ‘అహం బ్రహ్మ’ ఇతి విజ్ఞానాత్ కల్పకోటి శతార్జితమ్
సంచితం విలయం యాతి, ప్రబోధాత్ స్వప్న కర్మవత్ |

దృష్టాంతానికి..,
ఒకడు కలలో అనేక ప్రదేశాలు తిరుగుచూ, అనేక క్రియలు నిర్వర్తిస్తూ, అనేక వ్యవహారాలలో మునిగి ఉన్నాడు. గొప్ప గొప్ప గృహాలు మొదలైనవి నిర్మించుకొని, అనేక మందితో రకరకములైన సంబంధ - అనుబంధ - బాంధవ్యములలో మునిగి - తేలుచున్నాడు. కొన్ని కొన్ని విషాద - సంతోష సంఘటనలు కూడా అతనిని ముంచెత్తి ఉన్నాయి. అనేకమందిని కలసి, అనేక విషయాలు చర్చించటానికి ఇంటినుండి బయలుదేరుచున్నాడు.
ఇంతలో, మెళుకువ వచ్చింది.
అప్పుడేమౌతుంది ? స్పప్నదృశ్యమంతా క్షణంలో మటుమాయమౌతుంది కదా !

అట్లాగే ‘ఇదమ్ అహమ్ తత్ బ్రహ్మమేవ’  అని “సర్వకాలములలోని నేనైన నేను’ గురించి తెలుసుకొని, ఏకత్వము పొందిన తరువాత ఇక ఆపై ప్రాపరబ్ధము ఇత్యాది కర్మల గురించిన ఊసుయే ఉండదు.

ఇక, భావి (ముందుముందు) కర్మల విషయమో ? ఏ విధంగా అయితే ఆకాశము అంతా తన యందే కలిగి ఉండి దేని చేతనూ స్పృశించబడటము లేదో,
స్వం అసంగం ఉదాసీనం పరిజ్ఞాయం నభో యథా, న క్లిశ్యతే యతిః కించిత్ కదాచిత్ భావికర్మభిః | …
అదే రీతిగా “ఆత్మగా నేను దేనికీ సంగము లేనివాడను. ఉదాశీనుడను“ అని తెలుసుకున్న జీవన్ముక్తుడు “భావి (Future) కర్మలచేత కర్మఫలములచేత కూడా బద్ధుడను కాను !”.. అని గ్రహించినవాడై ఉంటున్నాడు. “సర్వదా పరమైయున్న నా సమక్షంలో స్వీయ కల్పనయే ఈ జన్మ-కర్మలు" - అను ఎరుకయే జీవన్ముక్తుని స్వభావం!

ఒకచోట ఒక కుండ ఉన్నది. దానియందు సురాపానము (కల్లు) ఉన్నది. ఆ కల్లు వాసన అక్కడి స్థలమును (ఆకాశమును) అంటుతుందా ? అంటదు. “నేను ఆత్మను. ఈ దేహము నాకు ఉపకరణము. ఉపాధి అనబడు “ఆత్మోపాధి యోగమును” ఆశ్రయించిన జీవన్ముక్తుని “జీవుడు-జగత్తు-ఇంద్రియములు-విషయములు-సుఖ-దుఃఖములు-కర్మ అకర్మలు”.. మొదలైనవన్నీ స్పృశించజాలవు.

శ్రోత :  ఆత్మ జ్ఞానము సముపార్జించుకున్న తరువాత, ఇక ఆపై ప్రారబ్ధకర్మ నశిస్తుందని మీ అభిప్రాయమా, స్వామీ !

గురువు : లేదు నాయనా! సంచిత-ప్రారబ్ధ-ఆగామి కర్మ ఫలానుభావముల గురించి వివరించు విజ్ఞులు, “ప్రారబ్ధము అనుభవముచేత మాత్రమే తొలగుతుంది. ఆత్మజ్ఞానికి కూడా అనివార్యమే”… అని చెప్పుతూ వస్తున్నారయ్యా! సంధించి విడచిన బాణము, ఆపై ఆగమన్నా ఆగకుండా లక్ష్యమువైపునకే కదలివెళ్ళు తీరుగా, ప్రారబ్ధము ఆత్మజ్ఞాని పట్ల కుడా ప్రవర్తితము అగుచున్నది. ఒకడు “పులేమో” అని అనుకొని విల్లు చేబూని బాణమును సంధించి విడచిన తరువాత, అప్పుడు “అది పులికాదు. ఆవు!” … అని తెలిసికొన్న మాత్రం చేత ఏమి ప్రయోజనం? ఆ విడచిన బాణము ఆగుతుందా? ఆగదుగదా! ప్రారబ్ధకర్మలు అట్టివేనని చెప్పబడుచున్నాయి.

అయితే… జీవన్ముక్తుని విషయమై ప్రారబ్ధకర్మలు ఉండి కూడా లేనివైపోతున్నాయి. ఎట్లా అంటావా? విను!

“నేను జన్మ - జరా - మరణములకు కించిత్ కూడా సంబంధము లేనట్టి చైతన్యాత్మను కదా!”… అని తెలుసుకొన్నవానికి బాహ్యంగా లోక సంబంధంగా కనిపించే కర్మ - కర్మ ఫలముల వలన క్రొత్తగా వచ్చేదేమున్నది? పోయేదేమున్నది? అట్టి వానికి ప్రారబ్ధ కర్మ ఫలములు తాను చదువుచున్న కథలోని సంఘటనల వలె కల్పన - భావన ఊహ మాత్రమే అయి ఉంటున్నాయి.

అందుచేత…,
ఎంతవరకైతే దేహాత్మ బుద్ధి కొనసాగుతుందో, అంతవరకు ‘ప్రారబ్ధ కర్మ’ ఉన్నట్లే అగుచున్నది. ఏది ఏమైతేనేం ! ఈ భౌతిక దేహము ఏ విధంగా కల్పనలోని విభాగమో, అదే విధంగా, ప్రారబ్ధకర్మ ఫలాల అనుభవము కూడా కల్పనలోని విభాగమే |

కల్పనా విభాగములే అయి ఉన్నప్పుడు కర్మ - కర్మ ఫలాలు సత్యము (ఉన్నవి) ఎట్లా అవుతాయి ? నేను నా ఊహలో అడవిలో - చిక్కుకున్నట్లుగా భావిస్తూ ఉన్నంత మాత్రంచేత, అడవిలో చిక్కుకొన్నవాడిని అవుతానా? లేదు కదా ! కలలో కొండ ఎక్కితే కొండ ఎక్కినవాడిని అవుతానా ? అవను కదా ! - అసత్తు (వాస్తవానికి లేనిది భావనచే మాత్రమే ఉన్నది) అయినట్టి కర్మఫలాలకు సంబంధించిన సంచిత - ప్రారబ్ధ - ఆగామికర్మ - కర్మ ఫలాలకు (అట్లాగే, ఈ దేహము మొదలైనవాటికి) జననమెక్కడిది ? పుట్టుక అనునదేమున్నది ? - జననమే లేనివాటికి నాశనమెక్కడిది ?

ఇప్పుడు - చెప్పు ! ప్రారబ్ధ - కర్మ ఫలాలు - అనునవి ఎక్కడున్నాయి? అసత్తుకు ఉనికి ఏమున్నది? ఆత్మతత్త్వ జ్ఞానముచే అజ్ఞాన కార్యవ్యవహారమంతా సమూలముగా లయము పొందుచుండగా ఇక “జడదేహత్వము - దేహము ఉన్నాయి. ఈ దేహత్వము నాకు పోయేది ఎట్లా?” … అను శంక ఎందుకు? ప్రసక్తి ఎక్కడిది?

శ్రోత : మీరు చెప్పేదానిని బట్టి “ప్రారబ్ధకర్మములు మొదలేలేవు” అనే అర్థము నాకు స్ఫురిస్తోంది. మరి శాస్త్రములు ఎందుకు సంచిత - పారబ్ధ - ఆగామి కర్మల గురించి విస్తారంగా అభివర్ణిస్తున్నాయి ?

గురువు : అదా ? సమాధాతుం బాహ్య దృష్ట్యా ‘ప్రారబ్ధం’ వదతి శృతిః |’నాకు ఈ బాధలు ఎందుకొస్తున్నాయి ?’… అనే ప్రశ్నతో గురువును సమీపించినప్పుడు, వెంటనే, ఆత్మ దృష్టిని చెప్పి “కర్మ ఫలములు మనోకల్పనయే” అని సూచించటం కుదరదు. అందుకు శిష్యుడు ఇంకా సిద్ధపడి ఉండడు. అందుచేత ముందుగా "దుష్టకర్మల వలన దుఃఖము, ఉత్తమ కర్మల వలన సుఖము లభిస్తున్నాయి” అను బోధచే ఆ మముక్షువును అతని సుఖ దుఃఖముల విషయమై సమాధానము పొందింపజేయుచున్నారు. ఉత్తరోత్తరా ఉత్తమ కర్మల యందు ప్రోత్సాహపరస్తున్నారు. ఉత్తమ కర్మలచే అమానిత్వ - అదంభిత్వాది భక్తి గుణములు రూపుదిద్దుకుని హృదయమున ప్రవృద్ధమగుచున్నాయి. భక్తి గుణములు బుద్ధిని నిర్మలము, సునిశితము, విస్తారము, అర్ధము చేస్తున్నాయి. అట్టి నిర్మలమగు బుద్ధి ప్రత్యగాత్మ - సర్వాంతర్యామిత్వము యొక్క అనుభవమునకు ఆ ముముక్షువును సంసిద్ధం చేస్తున్నాయి.

ఓ ప్రియ బిడ్డా ! వత్సా ! ఆత్మబంధూ ! అట్టి బుద్ధికి ఆవల నిత్యోదితమై, సర్వకారణ కారణమైయున్న ఈ జీవుని స్వస్వరూప - సర్వ స్వరూప - సర్వాంతర్గత పరమాత్మ తత్త్వము ఎట్టిదని తెలియవచ్చుచున్నదో,….. విను.

ప్రతి ఒక్కరి ఇహ స్వరూపమును ఆధారముగా కలిగి ఉన్న పరస్వరూపము ఎట్టిది ? ఆత్మగా ఈ జీవుడు ఎట్టివాడు?

పరిపూర్ణమ్ :  “తనకు తానే ’పూర్ణము’ అయి, ఉన్నదంతా తానే అయి, తన పూర్ణత్వమునకు మరొకటేదీ అవసరమే లేనట్టిది.

అనాద్యంతమ్ : ఆది అంతములు లేనిది.

అప్రమేయమ్ : గదిలోని దీపపు కాంతివలె దేనికీ సంబంధించనిది ! గదిలో వెలిగే దీపముయొక్క కాంతికి ఆ గదిలో వెలుగునందు కనిపించే వస్తు జాలమునకు బంధమేమి? సంబంధమేమి?

అవిక్రియమ్ : సర్వకర్మలకు సాక్షి. కనుక ఏవైనా క్రియ - కార్యక్రమములచే లభించేది కాదు ! అవగాహనచే లభించేది. ఆత్మకు ఆయా క్రియల కర్తృత్వము ఆపాదించ వీలు కాదు.

సద్ఘనమ్ : సత్ (ఉనికి) - అనే తేజముచే ఘనీభూతమైనది !

నిత్యమ్ : త్రికాలములలోను యథాతథము ! నిత్యమైనది, ఎల్లప్పటికీ ఉండునది.

ఆనన్దఘనమ్ : ఘనీభూతమైన ఆనందస్వరూపము. అనుభూతులన్నిటికీ ఆవల ఆధారమై వెలుగుచున్న కేవలీ స్వరూపము.

అవ్యయమ్ : మార్పు - చేర్పులు లేనిది |

ప్రత్యక్ : ప్రతి దేహములోను బుద్ధికి కూడా సాక్షి అగు ప్రత్యక్ ఆత్మ స్వరూపము ! సర్వసాక్షీ రూపమగు ఆత్మచైతన్యము.

ఏకరసమ్ : అనేకముగా కనిపిస్తూ సర్వదా ఏకరస స్వరూపము !

పూర్ణమ్ : జీవ - ఈశ్వర - పర స్వరూపియై సర్వదా పూర్ణమైయున్నది ! శూన్యము కానిది ! ఈ సర్వమును పూరించి, పూర్ణము చేయునది.

అనన్తమ్ : అంతమంటూ లేనిది ! (Infinite).

సర్వతోముఖమ్ : స్వప్నద్రష్ట స్పప్నమంతా అన్ని వైపులా నిండి ఉంటున్న తీరుగా, విశ్వమంతా అన్నివైపులా ఏర్పడి ఉన్నట్టిది. ఈ దృశ్యమంతా కూడా తన ముఖముగా కలిగి ఉన్నట్టిది.

అహేయమ్ :  ‘నా2ఇతి’ అని త్యజించగా చివరికి ఏమాత్రమూ వదలలేనట్టిది. “సహజ స్వస్వరూపమే” అయినట్టి దానిని వదలటమెట్లా! బంగారు ఆభరణము యొక్క ఆభరణాకారము మారవచ్చుగాక! మరొక ఆభరణంగా మలచినప్పుడు కూడా ఆవస్తువు బంగారత్వము కోల్పోదుకదా! అత్మత్వము అట్టిదే!

అనుపాదేయమ్ : ఆత్మ స్వీకరించబడగలిగిన ఏదో వస్తువుకాదు, పొందగలిగేదీ కాదు. ఎదైనా పొందాలంటే ఆ పొందే వానికి పొందబోయేది వేరుగా ఉండాలిగా! కానీ ఆత్మయో? స్వస్వరూపమే అయి ఉన్నది. తానే అయి ఉన్నట్టి దానిని తాను మరింకెప్పుడో క్రొత్తగా పొందటమనే ప్రసక్తి ఎక్కడిది?

అనాదేయమ్ : అది ఒకరు మరొకరికి ఇచ్చేది కాదు. : ఏది తానే అయి ఉన్నదో, అద్దానిని మరొకరు వచ్చి ఇవ్వటమేమిటి ? ఇస్తేగాని పొందలేమనే ప్రసక్తి ఎక్కడిది ? గురువులు, శాస్త్రములు అద్దానిని గుర్తు చేస్తున్నాయి! అంత వరకే!

అనాశ్రయమ్ : వెలుతురులో వస్తువులు, మనుష్యులు కనిపిస్తున్నారనుకో. వెలుతురు ఆ ఆకారాలను ఆశ్రయించినట్లా? లేక, ఆ వస్తువుల ఆకారాలు వెలుతురును ఆశ్రయించినట్లా? రెండు లేదు కదా! ఆత్మ దేనినీ ఆశ్రయించటమూ లేదు. ఏదీ అద్దానిని ఆశ్రయించి ఉండటమూ లేదు.

నిర్గుణమ్ : ఆధ్యాత్మతత్త్వమగు ఆత్మ త్రి-గుణములకన్నా ముందే ఉన్నది. త్రిగుణములు అద్దాని స్వీయమహిమ. అంతేగాని అది త్రిగుణములచే బంధించబడేది కాదు. కల తనదౌతుందేమో గాని, కలలో తాను చిక్కుకోడు కదా ! కనుక ఆత్మ గుణములకు ఆధారమై, నిర్గుణమైయున్నది.

నిష్క్రియమ్ : కర్మలకు ముందే ఆత్మ ఉన్నది. ఆత్మ ఉన్నది కాబట్టి కర్మలు, జన్మలు ఉన్నాయి. కర్మలకు మునుముందే ఉండటంచేత సనాతనము! నిష్క్రియము!

సూక్ష్మమ్ : ఆత్మ ఒక స్థూల వస్తువు కాదు. కళ్ళకు కనబడేది కాదు. బుద్ధికి ఆవల ఉండి, బుద్ధికి అనుభవరూపమై ఉండేది కనుక సూక్ష్మము.

నిర్వికల్పమ్ : ’కల్పనలో (in the one’s own creation)’ ఈ దేహము - జగత్తు ఉన్నాయి. కల్పనకు ముందే ‘కల్పించువాడు’ ఉన్నాడు. ముందే ఉన్నాడు కాబట్టి ఆయన (ఆత్మదేవుడు) కల్పన కాదు. వికల్పన కాదు. అన్నిటినీ కల్పించుకొని, ఆక్రమించుకొని యున్న అధ్యాత్మ-నిర్వికల్పము!

నిరంజనమ్ : మనస్సు - బుద్ధి - చిత్తము - అహంకారము - అవ్యక్తము - మాయ… వీటికి దోషములు ఉంటే ఉంటాయేమో ! వీటన్నిటికీ ఆవల గల ఆత్మ వాటిచే స్పృశించబడదు. నిత్యనిర్మలము. నిరంజనము. ఆకాశములాగానే ఆత్మను ఏదీ అంటదు.

అనిరూప్యస్వరూపమ్ యత్ : ప్రపంచములో రూపముగల దాని గురించి “దీని రూపము ఇది. ఇటువంటిది” అని నిరూపించి చెప్పగలం. ఆత్మ ప్రపంచములోనిది కాదు. అందుచేత, ‘ఆత్మ రూపము ఇట్టిది’ అని ఎట్లా చెప్పటం ? అందుచేత, ఎద్దాని స్వరూపము మనము మరొకరికి నిర్వచించి చెప్పలేమో అది అనిరూప్యము (You cann’t prove and explain its form), అనుభవైకవేద్యము మాత్రమే!

మనోవాచామగోచరమ్ : మనస్సుచేత, వాక్కుచేత ‘ఆత్మ ఇట్టిది’ అని ఎట్లా చెప్పటం ? ఆ రెండింటికి ఆధారమైయున్నట్టిది కదా ! మట్టి బొమ్మ తన ఆకారమును నిరూపణగా తీసుకొని మట్టి గురించి చెప్పగలదా? కలలోని వాడు “కల అనగా ఏమి?”… అనునది విశ్లేషించి చెప్పగలడా ? ఆత్మ మనస్సుకు వాక్కుకు విషయమే కాదు. ఆ రెండింటికి అగోచరము.

సత్ సమృద్ధమ్ : తాను సత్ వస్తువుతో (ఉనికితో) సమృద్ధమై, దృశ్యమునంతటినీ అట్టి సత్(Presence)చే సమృద్ధము చేయుచున్నది. స్వప్న ద్రష్ట స్వప్నమంతా తన ఉనికితో నింపుచున్నాడు కదా!

నవలా రచయిత నవలను అంతటినీ తన రచనా చైతన్యముతో నింపుచున్నాడు కదా ! ఆత్మ దృశ్య జగత్తునంతటినీ తన ఉనికితో నింపుచున్నది. ఆత్మయొక్క ’ఉనికి’ని ఆధారంగా చేసుకొనియే దృశ్యము ఉన్నదగుచున్నది!

స్వతఃసిద్దమ్: అధ్యాత్మమగు ఆత్మను మరొకరెవరూ సిద్ధింపజేయటము లేదు. తనకుతానే సిద్ధించియున్నట్టిది. ‘నేను’ అనునది మరొకరు సిద్ధింపజేయవలసిన పనేమి?

శుద్దమ్ : నిత్య నిర్మలమైనది. నిర్దోషము, కేవలము అగుటచేత ‘శుద్ధము’ అని అనబడుతోంది.

బుద్ధమ్ : కేవల బుద్ధి స్వరూపము. మౌనస్వరూపము. సర్వము తన బుద్ధిచే ఎరుగుచున్నట్టిది.

అనీదృశమ్ : ఇంద్రియములకు కనిపించేది కాదు. దృశ్యవస్తువు కాదు. అందుచేత అనీదృశము.

ఏకమేవ అద్వితీయమ్ బ్రహ్మ : విశ్వజగత్తులోను, ఈ దేహములోను మహత్తరమైయుండటం చేత ’బ్రహ్మము’ ! జీవులు జగత్తులు బ్రహ్మాండముల రూపముగా, అనేకముగా కనిపిస్తూ కూడా సర్వదా ఏకమే అయి ఉన్నట్టిది. అద్దానికి ద్వితీయమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. అందుచేత ఏకము. అద్వీతీయము. బ్రహ్మము ’అనుభూతమగుచున్నట్టిది’గా అయి, అనుభూతికి ఆధారమై అనుభూతిని ఆస్వాదించునదై ఆవల ఉన్నది.

నేహనానాఽస్తి కించన : ఇక్కడ అనేకము, నానాత్వము అనునది ఆత్మ దృష్ట్యా కించిత్ కూడా లేదయ్యా ! బ్రహ్మమే ఇదంతా ! బ్రహ్మమే అజ్ఞాన దృష్టిచే నానావిధములుగా అగుపిస్తూ ఆత్మ జ్ఞానదృష్టిచే “నానాత్వము కొంచము కూడా లేదు” అను సత్యము అనిపిస్తూ సుస్పష్టమగుచున్నది.

శ్రోత :  అటువంటి ఆధ్యాత్మతత్త్వమును చేరటము ఎట్లా ? మార్గాణ్వేషకుడనగు నాకు మార్గదర్శకులై మార్గము చూపండి. ఈ జగత్తు అప్పుడేమగుచున్నదో కూడా వివరించండి !

గురువు : బిడ్డా ! మమాత్మానందస్వరూపా ! అట్టి ఆధ్యాత్మమును అఖండతము (unpartitionable) అప్రమేయము, నిత్యసత్యమ అని స్వానుభావముచే స్వయముగా తెలుసుకోవటమే మార్గము.

‘అదియే నేను’ అని నీకు నీవే గుర్తించి గమనించి, ఉండెదవుగాక !

నిర్వికల్పమగు ఆత్మయందు ఆత్మజ్ఞాన సంపన్నుడై, సుముఖుడై, సంసిద్ధుడై, తిష్ఠపొందిన తరువాత… ఇక

కల్పనలో (లేక) కలలో భవనమువలె మొదలే లేనిది ఎటునుంచి వచ్చినట్లు? ఎటు పోతున్నట్లు? లేనిది సర్వదా లేనిదే!

శ్రోత : మహత్తరము-అద్భుతముగా ఈ ఎదురుగా కనిపించే జగత్తు ఎట్లా ఎవరి సంకల్పం చేత, ఎందుకు రూపుదిద్దుకుంటున్నట్లు ?

గురువు : 
అధునైవ మయా దృష్టం నాస్తి కిం మహత్ అద్భుతమ్ !
అత్యద్భుతము - మహత్తరము అని ఏ దృశ్య జగత్ గురించి విశేషణములు చెప్పుచున్నావో… అది నాకు ఆత్మకు వేరుగా అగుపించటమే లేదయ్యా ! మహా సముద్రము-సముద్రజలమును చూస్తూ “ఈ తరంగాలు స్వీకరిస్తాను ! ఆ తరంగాలు వదలుతాను” అని నిర్ణయాలు చేసుకుంటుందా? చేసుకోదు.

ఎందుచేత?

అంతా సముద్రజలమే కదా ! అట్లాగే నా యొక్క ద్రష్టత్వముతో సహా ఈ సర్వమూ కూడా - అధ్యాత్మమహాసముద్రములో ఆత్మతరంగములే అయి ఉండగా, ఇక్కడ స్వీకరించవలసినదేమున్నది ? త్యజించవలసినదేమిటి ? సముద్ర తరంగాలు సముద్ర జలమును బంధిస్తాయా? లేదు కదా! ఈ దృశ్య విశేషాలు ఆత్మను బంధించజాలవు!

ఇదంతా అఖండ ఆనంద పీయూష పూర్ణ బ్రహ్మముతో రూపితమైన అస్మత్ ఆత్మ మహాసముద్రమే! నేను ఆత్మ మహాసముద్రుడను! ఆహమ్ ఆత్మ-ఆనంద సాగరమస్మి! ఈ దృశ్యమంతా నాకు అన్యముగా గాని, విలక్షణమైనదిగాగాని కొంచము కూడా కనిపించటం లేదు. వినిపించటం లేదు. తెలియవచ్చుట లేదు. అట్లాగే నీవు కూడా అఖండానంద మహాసముద్రుడవై, అంతరంగ తరంగములవలె ఈ దృశ్య వ్యవహారములన్నిటినీ వీక్షించుము.


స్వాత్మనైవ సదానందరూపేణాఽస్మి స్వలక్షణః | (స్వాత్మ యొక్క స్వలక్షణముల చేత)

సదానందరూపేణాఽస్మి స్వలక్షణః : నేను ఎల్లప్పుడూ, ఎప్పుడూ ఆనందరూపుడనే : ! జన్మ - జ్ఞానము - అజ్ఞానము - దుఃఖము బంధము-పునర్జన్మ… ఇవన్నీ నా వినోదరూపాలు. జ్ఞానము ఉన్నప్పుడు లేనప్పుడు, జన్మలు ఉన్నప్పుడు-లేనప్పుడు, సమాధిలో ఉన్నప్పుడు-సంసారిగా ఉన్నప్పుడు … అన్ని సందర్భాల లోను సర్వదా ఆత్మానందస్వరూపుడనే! అస్మత్ ఆత్మ సదా సిద్ధించియే ఉన్నది కదా!

అసంగోఽహమ్ : దేనికీ సంబంధించినవాడను కాను ! నాటక కళాకారుడు నాటకములోని పాత్ర యొక్క గుణములకుగాని, వస్త్రధారణకుగాని, సంబంధ - బాంధవ్యములకుగాని సంబంధించినవాడు కాదు ; వాటితో అతనికి సంబంధమే లేదు కదా ! అట్లాగే నేను జీవాత్మత్వముతో, దృశ్యముతో,
సందర్భములతో సంగము లేనివాడను.

అనంగోఽహమ్ : ఈ దేహము యొక్క అంగములు, వాటికి సంబంధించిన శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములు నాకు చెందినవి కావు - నేను వాటికి చెందినవాడను గాను. అవన్నీ జగత్ నాటక పాత్రకు సంబంధించినవి మాత్రమే! నేను అంగరహితుడను.

అలింగోఽహమ్ : నామ రూప రహితుడను. ఆకారరహితుడను. స్త్రీ - పురుష - నపుంసకలింగ భేదములు లేనట్టి ఆత్మ స్వరూపుడను. స్వప్నములో రూపరహితుడనై దృశ్యరూపమును పొందుచున్న రీతిగా… జాగ్రత్లో కూడా అరూపుడనై ఇదంతా పొందుచూ ఆస్వాదిస్తున్నాను.

అహమ్ హరిః : ఈ నామ రూపాత్మకమై కనిపించేదంతటికీ ఆధారమై, సర్వాత్మకమైనటువంటి హరినే నేను! నేనే హరిని ! విహరించువాడను, హరించువాడను కూడా! ఇదంతా నేనే అయి ఉన్న వాడను!

ప్రశాంతోఽహమ్ : పరమ ప్రశాంతమగు ఆత్మ స్వరూపుడను. ఇక తదితరమైన జన్మ - కర్మలు, జాగ్రత్ - స్వప్న సుషుప్తులు, బ్రహ్మాండ పంపరలు… ఇవన్నీ నా యొక్క ప్రశాంతరూపమే! వినోదములే! విభవములే! మహిమలే! పరమప్రశాంతుడనై ఉండియే ఇవన్నీ అగుచున్నాను.

అనంతోఽహమ్ : నామ - రూపరహితుడను కాబట్టి ఆద్యంతరహితుడను. జగత్తులచేత గాని, జన్మల చేతగాని, కర్మలచేతగాని, గుణముల చేతగాని పరిమితుడను కాను. అపరిమితుడను! ఆనంతుడను.

పరిపూర్ణ : నాకు నేనేస్వయముగా పరిపూర్ణుడను. క్రొత్తగా రావలిసినదేదీ లేదు. ఉన్నదేదో పోవలసినదీలేదు.

చిరంతనః : ఎల్లప్పుడూ ఉండువాడను. నిత్య సత్యస్వరూపుడను. కేవలుడును. అన్తమునకు ఆవల చిరస్వరూపుడను!

అకర్తాఽహమ్ : నాకు చేయవలసినవీ లేవు. చేయబడుచున్నవీ ఏవీ లేవు. చేయకూడనివీ లేవు. ఆత్మగా కర్మలకు సంబంధించినవాడనే కాను. కనుక కర్తృత్వరహితుడను. అకర్తను. నాటకములోని ఒక పాత్రకు సంబంధించిన మంచి, చెడులకు రచయిత కర్త-అనము కదా! పాత్రధారుడూ కర్త కాదు కదా!

అభోక్తాఽహమ్ : అంతా మనస్సే అనుభవిస్తోంది. నేనో,… మనస్సుకు ఆవల, మనస్సుకు కేవల సాక్షినై అసంకల్పితుడనై ఉన్నాను. అందుచేత దేనికీ భోక్తను కాను. అభోక్తను. ఇక సుఖ దుఖములంటారా ? వాటికి నేను సాక్షిని ! అవన్నీ మనో లీలా వినోదాలు మాత్రమే ! నేను మనోరహితమగు కేవల చైతన్య స్ఫూర్తిని!

అవికారోఽహమ్ : ఎట్టి గుణ - రూప - నామ - దేహ - దుర్స్వభావ - సుస్వభావ వికారములూ లేనివాడను. దీపపు వెలుగులో నాటకం జరుగుతూ ఉంటే,… ఆ నాటకములోని సందర్భాలకు, పాత్రల గుణములకు, వికారములకు దీపకాంతికి ఏమి సంబంధం ! ఆత్మ యొక్క దివ్యతేజస్సులో ఈ బ్రహ్మాండాలు, త్రిమూర్తులు, సృష్టి స్థితి లయాలు - ఇవన్నీ ప్రదర్శితమగుచున్నాయి. జరుగుచున్నాయి. వాటికి సంబంధించిన వికారాలేవీ ఆత్మతేజో రూపుడనగు నాకు సంబంధించినవే కావు. నేను సర్వదా ఆత్మ స్వరూపుడను ! కాబట్టి సర్వదా, సదా అవికారుడను.

అవ్యయః : దేని చేతనూ మార్పు - చేర్పులు పొందనివాడను. వ్యయము (Spending) కానివాడను. అవ్యయుడను. అక్షరములతో ఒకడు ఒక వాక్యమును వ్రాస్తే, అక్షరములు తరుగుతాయా? పెరుగుతాయా? లేదు కదా!

శుద్ధబోధ స్వరూపోఽహమ్ : తెలుసుకోవటానికి తెలివి కావాలి కదా ! తెలియబడే అంతటికీ ఏ తెలుసుకొనే తెలివి ఉన్నదో… అది తెలియబడేదానికి మునుముందే ఉన్నది. ఆ మునుముందే ఉన్న తెలివి రూపుడను. శుద్ధభోధ స్వరూపుడను. తెలియబడే దానిచేత తెలివి మార్పు చేర్పులు - చెందుచున్నదా ? లేదు. అందుచేత నా శుద్ధ బోధ స్వరూపత్వము సర్వదా యథాతథము. తెలివి-తెలియబడుదాని స్వభావ స్వరూపములతో ప్రమేయము పొందదు కదా!

కేవలోఽహమ్ : సర్వమునకు కేవలస్వరూపుడను! The original form of all is what I am ? ఆభరణమునకు బంగారము కేవలమైనట్లు, పంచభూతాలకు ఆదిశక్తి మూలమైనట్లు, ఈ బాహ్య - అంతర వ్యవహారమంతటకీ మూలస్వరూపుడనై, కేవలుడనై ఉన్నాను. అన్నీ నా చేతనే, నేనే ఆధారమై చేయబడుచున్నాయి. ఆభరణాకారము బంగారు లోహము యొక్క ఉనికిపై ఆధారపడి ఉన్నట్లుగా… ఈ సృష్టి - స్థితి - లయములన్నీ కేవల స్వరూపుడనగు నాపై ఆధారపడి ఉన్నాయి.

సదాశివః : సదాశివుడను! ఎల్లప్పుడు శివస్వరూపుడను. జన్మలను పొందనప్పుడు శివస్వరూపుడనే ! స్వస్వరూపము ఏమరిచి దృశ్య తదాత్మ్యము పొందుచున్నప్పుడూ శివ స్వరూపుడనే ! సంసారమంతా ఉన్నప్పుడూ తొలగినప్పుడూ కూడా శివ స్వరూపుడునే ! కాలమునకు ఆవల కేవల శివ స్వరూపుడనై సర్వదా వెలుగొందుచున్నవాడను. భూత-వర్తమానభవిష్యత్తులచే మార్పు-చేర్పులు పొందను!

ఈ ఆధ్యాత్మోపనిషత్ పరమవిద్యను ఒకప్పుడు సదాశివుడు అపాంతరతమునకు (శ్రీమన్నారాయణునకు) బోధించారు. ఓం నమః శివాయ ! ఓం నమో నారాయణాయ ! అపాంతరతముడు సృష్టికర్తయగు బ్రహ్మ దేవునకు ఈ విద్యను బోధించారు.

ఓం నమో నారాయణాయ ! ఓం పితామహాయ బ్రహ్మ భగవాన్ నమః!

బ్రహ్మ దేవులవారు ఈ విద్యను ఘోరాంగిరసుడు అను తన మానస పుత్రునికి బోధించారు. ఆ ఘోరంగిరసుడు రైక్వునకు బోధించారు. రైక్వుడు శ్రీరామచంద్రునికి బోధించాడు. శ్రీరాముడు ఈ విద్యను తనను ‘రామా’ అని ప్రేమగా పిలచినంత మాత్రము చేతనే అట్టి సర్వజీవులకు ప్రసాదించుచున్నారు.

ఇది వేదప్రమాణము ! వేదానుశాసనము.

🙏 ఇతి అధ్యాత్మ ఉపనిషత్ 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః