[[@YHRK]] [[@Spiritual]]

Sānthi Slokas from Upanishads (Appendix in Upanishad Udyānavanam - Volume 1)
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


వేదోపనిషత్ - అంతర్గత

శాంతి - మంగళ శ్లోకములు

ఓం
1.) శివనామ నిభావితే
అంతరంగే, మహతి జ్యోతిషి మాననీ।

మయాఽర్థే దురితాని అపయాన్తి దూరదూరే।

ముహురాయాన్తి మహాన్తి మంగళాని।

ఏ పరమశివము మహత్తరమై, అఖండజ్యోతి స్వరూపమై, సర్వజీవుల హృదయాంతరంగములలో సదా వెలుగొందుచున్నదో - అట్టి పరమార్థమగు శివ
బ్రహ్మమును స్తుతించుచున్నాము.

మేము ఆరాధించు తత్త్వము - మా నుండి సర్వ దురితములను తొలగించును గాక!

మహత్తరము, మంగళ ప్రదము అగు పరబ్రహ్మ స్థానమునకు మమ్ములను తిరిగి చేర్చును గాక!

2.) స్మృతే సకల కల్యాణ భాజనం
యత్ర జాయతే
పురుషః యస్య అజమ్,
నిత్యమ్ ప్రజామి శరణమ్।
హరిః ఓం॥

సర్వ శుభములను చేకూర్చు కళ్యాణ భాజనుడు, జన్మరహితుడు, నిత్యుడు అగు ఏ పరమ పురుషుని గూర్చి స్మృతులన్నీ గానం చేస్తూ చూపుచున్నాయో,… అట్టి ఓం కార స్వరూప శ్రీహరియగు విష్ణు భగవానుని - మమ్ములను మాయ నుండి దాటించుటకై శరణు వేడుచున్నాము!

3.) ఓం వాక్ మే మనసి ప్రతిష్ఠితా।
మనో మే వాచి ప్రతిష్ఠితమ్।

ఆవిః ఆవీః మ (మే) ఏధి
వేదస్య మ (మే) ఆణీస్థః।
శ్రుతం మే మా ప్రహాసీః॥

అనేన అధీతేన,
అహెూ రాత్రాన్ సందధామి।

ఋతమ్ వదిష్యామి।
సత్యమ్ వదిష్యామి।

తత్ మాం అవతు।
తత్ వక్తారమ్ అవతు।
అవతు మాం।
అవతు వక్తారమ్।

ఓం శాంతిః శాంతిః శాంతిః॥

ఓం కార పరబ్రహ్మమును స్మరించుచున్నాము.
➤ నా వాక్కు - నేను పలుకు పలుకులు నా మనస్సునందు సుస్థిరమై, ప్రతిష్ఠితమై ఉండును గాక!
➤ నాయొక్క మనస్సు వాక్కునందు నెలకొని, ప్రతిష్ఠితమగును గాక!
➤ మనస్సు ఒక తీరుగా, వాక్కు మరొక తీరుగా ప్రవర్తనము కలిగి ఉండకుండును గాక!

➤ ఓ పరంజ్యోతి స్వరూప పరమాత్మా! నా అజ్ఞానాంధకారమును పోగొట్టుటకై విజ్ఞాన దీపమును వెలిగించండి!
➤ మా మనో-వాక్కులు విజ్ఞానము కొరకై సమర్థమగును గాక!
➤ మేము గురువుల నుండి, గ్రంథములనుండి ఎరుగుచున్నదంతా మా యందు సుస్పష్టము- సుస్థిరము అగును గాక!
➤ వినుచున్నదంతా యథా - అర్థసహితంగా బుద్ధి- హృదయములలో ప్రవేశించి వికసించి ఉండును గాక!

➤ అనేక రీతులుగా అధ్యయనము చేస్తున్న ఆత్మతత్త్వ విశేషాలు మేము రాత్రింబవళ్ళు - ఎల్లప్పుడు బుద్ధితో ’అవగతము’ తో కూడుకొని అనుసంధానము చేయుచుండెదము గాక!

➤ ఋక్కులు (వేదోపనిషత్తులు, వేదవేత్తలు, ఆత్మవేత్తలు) చెప్పుచున్న ఋతమునే పలికెదము గాక! యథార్థమునే పలికెదము గాక!
➤ ‘సత్’ స్వరూపమగు చిదానంద పరబ్రహ్మము గురించియే చెప్పుకొనుచుండెదము గాక!

➤ సర్వరక్షకుడగు ఆ పరబ్రహ్మ భగవానుడు నాకు, వక్తారుడై నాకు బ్రహ్మతత్త్యమును బోధిస్తున్న సద్గురువునకు సదా రక్షకుడై ఉండును గాక!
➤ నాకు, ఆచార్యులవారికి సర్వదా సర్వ సమృద్ధములు ప్రసాదిస్తూ… పరిపోషించుచుండును గాక!

➤ ఆధి ఆత్మిక, ఆధి దైవిక, ఆధి భౌతిక త్రితాపములు ప్రశాంతమగు ఆత్మయందు ఆత్మత్వము పొంది సశాంతించును గాక!

4.) ఓం పూర్ణమ్ అదః।

పూర్ణమ్ ఇదమ్।

పూర్ణాత్ పూర్ణమ్ ఉదచ్యతే।

పూర్ణస్య పూర్ణమ్ ఆదాయ।

పూర్ణమేవ అవశిష్యతే।

ఓం శాంతిః శాంతిః శాంతిః॥

‘పరాత్పర’ స్వరూపమగు ఆ బ్రహ్మము సర్వదా (సర్వకాల - అవస్థలయందు) సదా పూర్ణము. (The Witness of the Experiencer is complete by itself).

‘ఇహాత్మ’ స్వరూప విభాగ విశేషములగు జీవాత్మ (The Experiencer) - జగత్తు (All that being Experienced)లు కూడా పూర్ణమే!

పూర్ణమగు ‘పరాత్మ’ నుండియే పూర్ణమగు ‘ఇహాత్మ’ (జలంలో తరంగముల వలె) బయల్వెడలి సంప్రదర్శితమగుచున్నది.

(మట్టి నుండి కుండలు, బంగారము నుండి ఆభరణములు, జలము నుండి తరంగములు బయల్వెడలుచున్నప్పట్టికీ మట్టి - బంగారము - జలము సర్వదా యథాతథమైయున్న విధంగా…) పూర్ణమగు పరమాత్మ నుండి జాగ్రత్ - స్వప్న - సుషుప్తి అనుభవి స్వరూపుడగు జీవాత్మ బయల్వెడలి, సంప్రదర్శితుడగుచూ ఉన్నప్పటికీ…, (సర్వజీవుల) స్వస్వరూపమగు పరమాత్మ (లేక) పరబ్రహ్మము సర్వదా యథాతథమే! పూర్ణమే!

భ్రమాత్మకములగు తాపత్రయములు (ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మక తాపములు) - అట్టి ఓంకార పరబ్రహ్మమునందు సశాంతించునవై ఉండును గాక!

5.) హరిః ఓం।

సహ నావవతు (సహ నౌ అవతు)
సహ నౌ భునక్తు।
సహ వీర్యం కరవావహై।
తేజస్వినా (నౌ)
అధీతమ్ అస్తు!

మా విద్విషావహై।

ఓం శాంతిః శాంతిః శాంతిః॥

ఓంకార సర్వాత్మ స్వరూపుడగు శ్రీహరికి నమస్కరిస్తున్నాము.

శిష్య - ఆచార్యులమగు మనమిరువురము సర్వజగద్రక్షకుడగు ఆ పరమాత్మచే సదా సంరక్షించబడెదము గాక!
సర్వజీవ పరిపోషకుడగు ఆ పరంధాముడు శిష్య - ఆచార్యులమగు మన ఇరువురిని పరిపోషించును గాక!
(గురు శిష్యులమగు) మనము ఇరువురము ధైర్య - ఉత్సాహ - సాహసములచే వీర్యవంతులమై బ్రహ్మతత్త్వ అధ్యయనమునందు పరిశ్రమించెదము గాక! నిర్వర్తించెదము గాక!
ఆ పరబ్రహ్మతత్త్వము మనపట్ల తేజోవంతమై సు-ఫలప్రదమగును గాక!

(శిష్యునకు వినటము రాదు - ఆచార్యులకు చెప్పటము రాదు - ఇత్యాది) అల్ప భావములకు లోనై శిష్య - ఆచార్యులమగు మనమిరువరము పరస్పరము ద్వేషించుకొనకుండెదము గాక! ప్రేమించుకొనెదము గాక! మన ఇరువురి మధ్య ఆప్యాయత - ప్రపత్తులు వెల్లివిరియును గాక!

దృశ్య - ద్రష్ట - దర్శన త్రయములు ఆత్మరూపమునందు సశాంతించినవగును గాక!

6.)  ఓం
శం నో మిత్రః శం వరుణః।
శం నో భవతు అర్యమా।
శం న ఇంద్రో బృహస్పతిః।
శం నో విష్ణుః ఉరుక్రమః।




నమో బ్రహ్మణే।
నమస్తే వాయో।
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాఽసి।
త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ!

ఋతం వదిష్యామి|
సత్యం వదిష్యామి |
తత్ మా అవతు।
తత్ వక్తారమ్ అవతు|
అవతు మామ్।
అవతు వక్తారమ్।

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

→ (పంచ ప్రాణములలోని ’ప్రాణము’నకు, ’పగలు’కు అభిమాన దేవతయగు) మిత్ర భగవానుడు,
→ (’అపానము’నకు, ’రాత్రి కాలము’నకు అభిమాన దేవతయగు) వరుణ భగవానుడు,
→ (దృష్టితత్త్వాభిమాని, పిత్రులోకములో శ్రేష్ఠుడు అగు) అర్యమ భగవానుడు,
→ (త్రిలోకములలోని / ఈ దేహములోని ఇంద్రియ తత్త్వముల అభిమాని, అధి దేవత అగు) ఇంద్రభగవానుడు,
→ (దేవతలకు గురువు, బుద్ధ్యభిమాన దేవత అగు) బృహస్పతి భగవానుడు,
→ (త్రివిక్రమావతారంలో త్రిపాదములతో భూమి - ఆకాశములను, అహంకార తత్త్వమును కొలచి వేసిన) ఉరుక్రమ బిరుదాంకితుడగు విష్ణు భగవానుడు,
…. మాకు శుభములను సర్వ ప్రశాంతతలను ప్రసాదించును గాక!

ఓ వాయు భగవాన్! ప్రాణస్వరూపా! ప్రాణేశ్వరా! సర్వ స్వరూపము - సర్వసాక్షి అగు పరబ్రహ్మమా! సర్వాత్మకుడా! ఆత్మదేవా! సర్వస్థితుడవగు మీకు భక్తి
పూర్వకంగా నమస్కరిస్తున్నాము. మిమ్ములను ’ప్రత్యక్ష బ్రహ్మము’గా (దృశ్యజగత్తును/విశ్వేశ్వరుడుగా) దర్శించుచున్నాము. స్తుతించుచున్నాము.

ఋగ్వేదములోని ఋక్కులచే, సర్వవేదములచే అభివర్ణించబడుచున్న ‘ఋతము’ అగు పరమాత్మను స్తుతించుచున్నాము.
’సత్’ స్వరూప పరబ్రహ్మము గురించిన సత్యమును స్తుతించుచున్నాము.
అట్టి పరబ్రహ్మము నన్ను, నాకు తత్త్వజ్ఞానము బోధిస్తున్న ఆచార్యుల వారిని సదా రక్షించును గాక! ఉభయులను కాపాడును గాక!

భూ - భువర్ - సువర్ త్రిలోక సర్వభేదములు నిర్మల పరబ్రహ్మ స్వరూపమునందు సశాంతించినవగు గాక!

7.) ఓం
అహం వృక్షస్య రేః ఇవ।
కీర్తిః పృష్ఠం గిరేః ఇవ।
ఊర్ధ్వ పవిత్రో వాజినీ ఇవ
‘స్వమ్’ అమృతమస్మి!
ద్రవిణగ్ం సవర్చసమ్ సుమేధా।
అమృతో అక్షితః।
ఇతి త్రిశంకోః వేద అనువచనమ్।




ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

⭕️ ఈ ‘సంసారము’ అను వృక్షమునకు ‘ఆధారము’ అయి ఉన్న “రేః - చైతన్య స్ఫూర్తి” నేనే!
⭕️ పర్వతముయొక్క శిఖరాగ్రమువలె నా ’కీర్తి’యే వేద-ఉపనిషత్ వాఙ్మయ పర్వత శిఖరముపై ప్రకాశమానమైయున్నది.
⭕️ ఊర్ధ్వ పవిత్రత (ఘనత)గా సర్వత్రా ఉన్నది - నాలోని నేనైన ఆత్మయే! ఆకాశంలో ఎల్లప్పుడూ ప్రకాశించే సూర్యునికి ఉదయాస్తమయములు లేని తీరుగా నేను స్వయముగా… జన్మ - మృత్యువులకు చెందనట్టి, సంబంధించనట్టి ‘అమృత స్వరూపుడను’ అయియే ఉన్నాను.
⭕️ ఈ దృశ్యమంతా నాకు సంపద అయినట్టి బ్రహ్మ వర్చస్సు. సృష్టికళా విశేష సమన్వితుడను కదా!
⭕️ ఇదంతా నా చిదానందము! ఎరుక రూపము. వేదో వీక్షణము! బుద్ధి ప్రదర్శన చమత్కారము! మార్పు చేర్పులకు ఆవల, దృష్టికి ఆవల కేవల దృక్-అమృత-ఆనంద స్వరూపుడను!
→ ఇతి త్రిశంకు మహర్షి ప్రవచిస్తూ బోధించు వేద ప్రమాణముతో కూడిన అనువచనము.

దృశ్య - జీవ - ఈశ్వర భేదమంతా ఆత్మానందమునందు సశాంతించినవగును గాక!

8.) ఓం
యః (యం) ఛందసాం ఋషభో విశ్వరూపః।
ఛందోభ్యో అధి అమృతాత్ సంబభూవ।



సః మే ఇన్ద్ర మేధయా స్పృణోతు।
అమృతస్య దేవ ధారణో భూయాసమ్।
శరీరమ్ మే విచర్షణమ్|
జిహ్వా మే మధు మత్తమా।
కర్ణాభ్యాం భూరి విశ్రువమ్|
బ్రహ్మణః కోశోఽసి
మేధయా పిహితః।
శ్రుతం మే గోపాయ।




ఓం శాంతిః శాంతిః శాంతిః॥

↳ ఏ ప్రణవ నాదమును వేదములు ప్రప్రథమంగా పలుకుచున్నాయో, ఈ విశ్వమంతా ఎద్దానికి తన రూపమే అయి ఉన్నదో…,
↳ ఏ ‘ఓం’ కారము అమృత రూపమై, ఆత్మరూపమై వేద వాఙ్మయము నుండి ప్రవచన - నిర్వచన రూపంగా ప్రకటించబడుచున్నదో…,
↳ అట్టి మహత్తర ఆత్మ తత్త్వము నా ఇంద్రియములను, మేధస్సును (బుద్ధిని) విజ్ఞానరూపమై స్పృశించును గాక!

→ నేను ఇంద్రుడంతటి మేధస్సు కలిగియుండెదము గాక!
→ ఓ ఆత్మదేవా! నేను అమృతరూపమగు బ్రహ్మజ్ఞాన ‘ధారణ’ పొందినవాడను అయ్యెదను గాక!
→ ఈ నా శరీరము బ్రహ్మతత్త్యము యొక్క శ్రవణ - మనన - నిది ధ్యాసల నిమిత్తమై అర్హము, ఆరోగ్యవంతము, జలసమన్వితము అయి ఉండును గాక!
→ నా ఈ నాలుక - బ్రహ్మతత్త్వ విశేషాలను పలుకు మాధుర్యము కలిగి ఉండును గాక!
→ ఈ నా చెవులు ఆచార్యుల వద్ద నుండి బ్రహ్మతత్త్వ ప్రవచ వాక్యములు విరివిగా వినుటకు యోగ్యమై ఉండును గాక!
→ సంసార రూపములైనట్టి పంచకోశములకు సంబంధించిన బుద్ధిచే, మా యందు అంతరంగమున అనునిత్య ప్రకాశమైయున్న పరబ్రహ్మము కప్పబడినదై ఉన్నది.
→ ఓ ఆత్మ దేవా! మీ గురించి వినుచున్న మాటలచే (గురువాక్యములచే - వేదాంత సిద్ధాంతములచే), మీరు వినబడుచున్నవారై మమ్ములను గోపాయ - కాపాడండి!

మా యొక్క స్థూల - సూక్ష్మ - కారణ దేహములు ఆత్మ రూపము సంతరించుకొని ఆత్మగా సశాంతించునవై ఉండును గాక!

9.)  ఓం

ఆప్యాయన్తు మమ అంగాని
వాక్ ప్రాణః చక్షుః శ్రోత్రమ్ అథో బలమ్
ఇంద్రియాణి చ సర్వాణి।
సర్వమ్ బ్రహ్మ - ఔపనిషదమ్| (బ్రహ్మౌపనిషదౌ)

మా అహమ్ బ్రహ్మ నిరాకుర్యామ్|
మా మా హ్మ నిరాకరోత్
అనిరాకరణమ్ అస్తు।
అనిరాకరణమ్ మే అస్తు
తత్ ఆత్మని నిరతే
య ఉపనిషత్సు ధర్మాః,
తే మయి సన్తు।
తే మయి సన్తు।

ఓం శాంతిః శాంతిః శాంతిః॥

ఓంకార సంజ్ఞాస్వరూప సర్వతత్వ స్వరూపుడవగు ఓ పరమాత్మా! ఇది మా విన్నపము! వినండి.

⤿ ఉపనిషత్తులచే చేతులెత్తి ప్రకటించబడుచున్న బ్రహ్మము (లేక) సర్వాత్మకుడగు పరమాత్మ మా యొక్క సర్వ అంగములను, వాక్కును, ప్రాణమును, కళ్ళను, చెవులను (కాళ్ళు-చేతులు, నడతలు, పనులు, మాటలు, శక్తి, చూపు, నినుచున్నని - వీటన్నిటినీ) - బ్రహ్మోపాసనకై ఆప్యాయము, మధురము చేసి, సిద్ధము చేయును గాక!

⤿ బ్రహ్మము (బ్రహ్మజ్ఞానము) నన్ను నిరాకరించకుండును గాక!
⤿ నేను బ్రహ్మజ్ఞానమును నిరాకరించకుండుదును గాక!
⤿ బ్రహ్మము - నేను పరస్పరము ఆదరణ, ఆప్యాయత కలిగి ఉండెదము గాక!
⤿ ఉపనిషత్తులు చెప్పు ఆత్మ ధర్మము గురించిన సమాచారము - విశేషముల అధ్యయనము నందు మేము నిరతులమై ఉండెదము గాక!
⤿ అట్టి పరబ్రహ్మము మమ్ము కాపాడును గాక! రక్షించును గాక!

భూత - వర్తమాన - భవిష్యత్ త్రికాల కల్పనా విశేషమైనట్టిదంతా ఆత్మ స్వరూపమై ఆత్మయందు లయించి శాంత - ఆత్మత్యమును సంతరించుకొనును గాక!

10.) ఓం
భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః।
భద్రం పశ్యేమ అక్షభిః యజత్రాః।
స్థిరైః అంగైఃతుష్టువాగ్ం సః తనూభిః।
వ్యశేమ దేవ హితం యత్ ఆయుః॥

స్వస్తి నః ఇంద్రః వృద్ధశ్రవాః।
స్వస్తి నః పూషా విశ్వవేదాః।
స్వస్తి నః తార్క్ష్యో అరిష్టనేమిః।
స్వస్తి నః బృహస్పతిః దదాతు॥
ఓం శాంతిః శాంతిః శాంతిః।





భద్రం మే అపి వాతాయ మనః।
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

ఓ దేవతలారా!
➤ మీరు ప్రసాదించిన ఈ చెవులతో మేము భద్రమగు (శుభప్రదమగు) దాని గురించియే (బ్రహ్మ తత్త్యమునే) వినుచుండెదము గాక!
➤ యజన (యజ్ఞ - యాగ యోగ ప్రయత్న) శీలురమగు మేము భద్రమైన దానినే (సర్వము బ్రహ్మముగా) చూచుచుండెదము గాక!
➤ బలము - కలిగియున్న అంగములతో ఆరోగ్యవంతము అగు శరీరముతో, దేవతలచే ప్రసాదించబడిన ఆయుష్షును దేవతల హితముగా (దేవతలకు
ప్రియముగా) - గడుపుచుండెదము గాక!

↳ ఔన్నత్యముతో కూడిన వినికిడి గల, పురాణ ప్రసిద్ధుడగు ఇంద్ర భగవానుడు మాకు స్వస్తి కలిగించును గాక!
↳ విశ్వతత్త్వము ఎరిగిన సూర్యభగవానుడు దోషములను తొలగించి మమ్ములను పవిత్రులుగా తీర్చిదిద్దుదురు గాక!
↳ గరుడ రూపుడగు అరిష్టనేమి ప్రజాపతి మాకు స్వస్థత కలుగజేయుదురు గాక!
↳ బుద్ధి కుశలుడగు బృహస్పతి భగవానుడు మాకు అనుగ్రహమును ప్రసాదించెదరు గాక!
ఓం శాంతిః శాంతిః। శాంతిః॥

⌘ మా మనస్సులకు ప్రాణేశ్వరులగు వాయు దేవులవారు శుభము, భద్రము కలుగజేయుదురు గాక!
ఓం శాంతిః శాంతిః। శాంతిః॥

11.) యో బ్రహ్మానమ్ విదధాతి పూర్వమ్,
యో వై వేదాంశ్చ ప్రహిణోతి, తస్మై
తగ్ం అహమ్ ఆత్మబుద్ధి ప్రకాశమ్,
ముముక్షుర్వై శరణమ్
అహమ్ ప్రపద్యే।
ఓం శాంతిః శాంతిః శాంతిః॥

→ ఏ పరబ్రహ్మము ఈ జగత్తుకు మునుముందే ఉన్నదై, ఈ జగత్ రూపముగా విస్తరించినదై ఉన్నదో,
→ ఏది వేద - ఉపనిషత్తులచే ‘తత్వమ్’ శాస్త్రముగా స్తుతించబడుచున్నదో,
… అట్టి ఆత్మ నా బుద్ధికి ప్రకాశమానమగుటకై…,
ముముక్షువునై ఆచార్యులను, బ్రహ్మజ్ఞులను, వేదాంత శాస్త్రమును శరణు వేడుచున్నాను.
సర్వము శాంతి ఆత్మయందు సశాంతించును గాక!

శ్లో॥ ఓం మంగళమ్ గురుదేవాయ మహనీయ గుణాత్మనే।
సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళమ్॥
ఓం శాంతిః శాంతిః శాంతిః॥

🙏🙏🙏