[[@YHRK]] [[@Spiritual]]

ātma bōdha Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


ఋగ్వేదాంతర్గత

2     ఆత్మబోధోపనిషత్‌

శ్లోక - తాత్పర్య పుష్పమ్


శ్లో॥ శ్రీమన్నారాయణాకారమ్‌ అష్టాక్షరమహాశయమ్‌
స్వమాత్రానుభవాత్‌ సిద్ధమ్‌ ఆత్మబోధం హరిం భజే॥

  • శ్రీమత్‌ నారాయణాకారుడు
  • అష్టాక్షర మహాశయుడు,
  • ప్రతి ఒక్కరి స్వాత్మ స్వరూపుడే అయి ఉండి, స్వానుభవమే అయి ఉన్నవాడు……,
  • ఆత్మబోధ స్వరూపుడు అగు శ్రీహరిని అర్చించుచున్నాను.


1. ఓం ప్రత్యక్‌-ఆనందం।
బ్రహ్మ పురుషమ్‌। ప్రణవ స్వరూపమ్‌।
“అ” కార “ఉ’ కార “మ” కార ఇతి త్ర్యక్షరమ్‌ ప్రణవమ్‌।
తత్‌ ఏతత్‌ ‘ఓం’ ఇతి
యమ్‌ ఉక్త్వా, ముచ్యతే యోగీ జన్మసంసార బంధనాత్‌
ఓం నమో నారాయణాయ
శంఖ చక్ర గదాధరాయ।
తస్మాత్‌ ఓం నమో నారాయణాయ
ఇతి మంత్ర ఉపాసకో
వైకుంఠ భువనమ్‌ గమిష్యతి ।।
పరబ్రహ్మము (లేక) పరమపురుషుడు అనగా ఎవరు? ప్రత్యక్ - అకారణ - కేవల ఆనంద స్వరూపుడు! ప్రణవ స్వరూపుడు ఆయన!
ప్రణవము - “అ” కార, “ఉ”కార, “మ” కార …. త్రి-అక్షరములు!
అటువంటి ఆ ’3’ అక్షరముల ఏకస్వరూపమే ‘ఓం’!
అట్టి ప్రణవమగు “ఓం” కారమును ఉచ్చరిస్తున్న యోగి జన్మ-సంసార బంధములనుండి విముక్తుడగుచున్నాడు.
ఓం నమో నారాయణాయ। శంఖ చక్ర గదాధరాయ। - అట్టి నారాయణుడు ప్రణవ స్వరూపుడు.
“ఓం నమో నారాయణాయ” మంత్రమును ఉపాసించే ఉపాసకుడు వైకుంఠ పదమును చేరుచున్నాడు. మరల ఉపాధి గమ్యుడు కాడు!
2. యత్‌ ఇదమ్‌ బ్రహ్మపురమ్‌ పుండరీకమ్‌
తస్మాత్‌ తటిదాభ మాత్రమ్‌ దీపవత్‌ ప్రకాశమ్‌।
బ్రహ్మణ్యో దేవకీపుత్రో।
బ్రహ్మణ్యో మధుసూదనః‌।
బ్రహ్మపురము (లేక) బ్రహ్మీభావ స్థానము వికసించిన పద్మమువంటిది.
కేవల ప్రకాశమాత్రము. దీపమువలె స్వయంజ్యోతి స్వరూపము. దీపమును చూపటానికి మరొక దీపం కావాలా? అట్లాగే బ్రహ్మము సర్వమును వెలిగించుచున్నట్టిది. అద్దానిని వెలిగించు మరొకటేదీ లేదు. అవసరం లేదు కూడా!
దేవకీపుత్రుడగు శ్రీకృష్ణుడే ఆ పరబ్రహ్మమూర్తి!
బ్రహ్మణ్యః పుండరీకాక్షో|
బ్రహ్మణ్యో విష్ణుః, అచ్యుతః ।
సర్వభూతస్థమ్ ఏకమ్ నారాయణమ్|
కారణ పురుషమ్ |
అకారణమ్| పరం బ్రహ్మ ఓం|
ఆ పరబ్రహ్మమే పుండరీకాక్షుడు (పద్మనయనుడు), సర్వత్రా ఉనికిచే విష్ణువు. ‘చ్యుతి’ లేనివాడు కాబట్టి అచ్యుతుడు. సర్వజీవులలో ఏకస్వరూపుడై, సర్వదా వేంచేసి ఉన్నవారు కాబట్టి-సర్వతరంగములలోని ఏకస్వరూపమగు జలమువలె ఏకోనారాయణుడు!
ఆయన సర్వమునకు కారణుడు. కారణపురుషుడు. ఈ జగత్తంతా ఆయనయొక్క పురుషకారమే! కానీ, ఆయన మాత్రం అకారణుడు! ఆ నారాయణుడే పరబ్రహ్మము! ఆయనయే ఓం యొక్క అర్థము! పరమార్థము! ఆయనే మనమంతా కూడా!
3. శోక-మోహ వినిర్ముక్తో
విష్ణుమ్ ధ్యాయన్ న సీదతి।
ద్వైత - అద్వైతమభయం భవతి।
మృత్యోః సః మృత్యుమ్ ఆప్నోతి
య ఇహ నానేవ పశ్యతి।
హృత్పద్మమధ్యే సర్వం తత్ ప్రజ్ఞా నేత్రమ్|
ప్రజ్ఞానేత్రే ప్రతిష్ఠితమ్| ప్రజ్ఞానేత్రో లోకః
ప్రజ్ఞా ప్రతిష్ఠా।
ప్రజ్ఞానమ్ బ్రహ్మ
ఏతేన ప్రజ్ఞేన ఆత్మనా అస్మాత్ లోకాత్
ఉత్క్రమ్య ఆముష్మిమ్ తు స్వర్గే లోకే
సర్వాన్ కామాన్ ఆప్త్వా,
అమృతః సమభవత్। సమభవత్|
శోక-మోహములచే స్పృశించబడనివాడు నారాయణుడు. సర్వసర్వత్రా వేంచేసి ఉన్నవాడు. కనుక విష్ణువు!
అట్టి సర్వాత్మకుడగు విష్ణుభగవానుని ఎవరు ధ్యానిస్తే వారు ద్వైత-అద్వైత భేదభావనలనుండి (ఆ చిక్కుముడుల నుండి), సర్వ భయములనుండి విముక్తుడగుచున్నారు. అభయుడగుచున్నారు.
ఎవ్వరైతే ఇక్కడ జీవాత్మ వేరు - పరమాత్మ వేరు - ఇత్యాదిగా నానాత్వమునే దర్శిస్తూ (చూస్తూ) ఉంటారో, వారు ఒక చావునుండి వేరొక చావుకు పోతూనే ఉంటారు.
ఓ సర్వజనులారా! మీ హృదయ పద్మము యొక్క మధ్యభాగములో “సర్వము తత్ పరమాత్మయే! పర బ్రహ్మమే” - అను ప్రజ్ఞానేత్రము ఉండనే ఉన్నది. అది తెరువండి.
మీలో ప్రజ్ఞానేత్రుడే ఆ నారాయణుడు. ఆయన రూపమే ఈ లోకములన్నీ కూడా!
అనగా మీకు కనబడే ఈ లోకాలన్నీ మీ ప్రజ్ఞయందే ప్రతిష్ఠితమై ఉన్నాయి. మీరు లోకాలలో ఉండటము కాదు. మీ యందే లోకాలు!
అందుచేత “ప్రజ్ఞానం బ్రహ్మ” అను మహావాక్యము చెప్పబడుతోంది.

తెలుసుకొంటున్న ఆయన - తెలియబడునది ఈ రెండూ ప్రజ్ఞాస్వరూపమే! ఏక-అఖండ ప్రజ్ఞయే!
తెలుసుకొను-తెలియబడు ఉభయము రూపముగాగల ప్రజ్ఞయే ఆత్మ అని ఎరుగుచున్నవాడు - ఇక్కడి లోక విషయములన్నీ అధిగమించి ఆముష్మికమగు స్వర్గ ఇత్యాది ఉత్తమ లోకాలు చేరుచున్నాడు. సర్వ కోరికలు సిద్ధింపజేసుకున్న వాడగుచున్నాడు. క్రమంగా, లోక-లోకాంతరాలు దాటివేసినవాడై అమృతస్వరూపుడగుచున్నాడు. సర్వసమత్వము-సమభావన సముపార్జించుకొనుచున్నాడు.
4. యత్ర జ్యోతిః అజస్రం,
యస్మిన్ లోకే అభ్యర్హితమ్, తస్మిన్ మాం దేహి ప్లవమానా
అమృతే లోకే అక్షితే! అమృతత్త్వం చ గచ్ఛతి
ఓం నమః॥
ఓ శ్రీమన్నారాయణ స్వామీ! ఆత్మజ్యోతి స్వరూపా! ఎక్కడ ఎల్లప్పుడు ఆత్మజ్యోతి యొక్క జ్ఞానము నెలుగొందుచున్నదో, ఏ లోకములో ఆత్మజ్యోతి యొక్క ఉపాసన నిత్యము జరుగుచున్నదో, ఆ లోకమునకు నన్ను జేర్చండి! అమృతమయ లోకమును జేరి నేను మృతమునుండి (మార్పు నుండి) అమృతత్వమును పొంది “ఓం” తత్త్వ స్వరూపుడనగుదును గాక! (మృత్యోర్మా అమృతంగమయ)!
5. ప్రగళిత నిజమాయోఽహమ్।
నిస్తుల దృశిరూప వస్తుమాత్రోఽహమ్।
అస్తమిత - అహంతోఽహమ్।
ప్రగళిత జగత్-ఈశ-జీవ భేదోఽహమ్
ప్రత్యగభిన్న పరోఽహమ్
విధ్వస్త అశేష విధి-నిషేధోఽహమ్
సముదస్త ఆశ్రమకోఽహమ్
ప్రవితత సుఖపూర్ణ సంవిదేవ అహమ్।
(సత్ + విత్ ఏవ అహమ్)
స్వయం కల్పితమగు నాయొక్క మాయ వీగిపోగా, నేను కేవల దృక్ (దృశి) రూపుడునగుచున్నాను. కేవల ఆత్మవస్తు మాత్రుడను! “బ్రహ్మమేవాహమ్”కారము ఉదయించుచుండగా అంధకారరూపమగు జీవాహంకారము తొలగిపోవుచున్నది.
నాయొక్క జగత్-ఈశ్వర-జీవ… భేదములన్నీ వీగిపోవుచున్నాయి. ఆశేషముగు కర్మ-విధి-నిషేధ భేదములన్నీ ఎటో వెళ్ళిపోవుచున్నాయి. మటుమాయమగుచున్నాయి!
ఆ ప్రత్యక్ వస్తువగు ఆత్మతో మమ ఏకత్వము సంతరించుకొనుచున్నాను!
అనేక నియమములతో కూర్చి చెప్పబడు బ్రహ్మచారి-గృహస్త-వానప్రస్త-సన్యాస ఆశ్రమ ధర్మముల సంబంధమైన విధి - నిషేధములను అధిగమించుచున్నవాడనగుచున్నాను.
ఆత్మ స్వరూపుడుగా - అవన్నీ నాపట్ల లేనివే అగుచున్నాయి.
సర్వత్రా వ్యాపించి, పరమసుఖ స్వరూపమగు సత్+విత్=సంవిత్ స్వరూపడను నేను!
6. సాక్ష్యహమ్। అనపేక్షోఽహమ్|
నిజమహిమని సంస్థితోఽహమ్|

అచలోఽహమ్। అజరోఽహమ్| అవ్యయోఽహమ్।

పక్ష-విపక్షాది భేదవిదూరోఽహమ్। అవభోదైక రసోఽహమ్।
మోక్షానందైక సింధురేవాఽహమ్।

సూక్ష్మోఽహమ్ | అక్షరోఽహమ్।

విగళిత గుణజాల కేవలాత్మాఽహమ్|
నిస్త్రైగుణ్య పదోఽహమ్। 

కుక్షిస్థ అనేక లోక కలనోఽహమ్।
కూటస్థ చేతనోఽహమ్। 

నిష్క్రియ ధామాఽహమ్।  అప్రతర్క్యోఽహమ్|
ఈ సర్వమునకు కేవల సాక్షిని. దేనిపట్లా అపేక్ష లేనివాడను.
నిజమహిమచే సర్వత్రా సంస్థితుడనై ఉన్నవాడను.

దేహములు రావచ్చు, పోవచ్చుగాక! నేను యథాస్థానంలో ఆత్మగా అచలుడను! జరామరణములు నాకు లేవు! మార్పు-చేర్పులు లేనివాడను! అవ్యయుడను!

నాకు నావారు లేరు! కాని వారూ లేరు. పక్ష-విపక్షములు లేనివాడను! ఆత్మబోధైక రసస్వరూపుడను! మోక్షానందైక సముద్రడను!

స్థూలమును ఉపయోగించునట్టి సూక్ష్మాతిసూక్ష్మ (Very Subtle) స్వరూపుడను! క్షరము లేనివాడను! అక్షరుడను!

గుణములకు ఆవల గల నిర్గుణ కేవలాత్ముడను!
త్రిగుణరహితమగు సంస్థానమే నా సహజ స్వరూపము!

ఈ సకల లోకములు నా కుక్షియందే ఉంటున్నాయి! మూల ప్రకృతి స్వరూపుడను!
కూటస్థ (Root form) చైతన్య స్వరూపుడను!

నిష్క్రియ స్థానములో వెలయుచున్నవాడను!
చర్చించి, విశ్లేషించి, ఊహించి చెప్పటానికి అలవికానట్టి వాడను!

7. ఏకోఽహమ్।
అవికలోఽహమ్|
నిర్మల నిర్వాణమూర్తిరేవాఽహమ్।
నిరవయోవోఽహమ్।  అజోఽహమ్।
కేవల సన్మాత్ర సారభూతోఽహమ్|
నిరవధి నిజబోధోఽహమ్।
శుభతర భావోఽహమ్।
అప్రభేద్యోఽహమ్।
విభురహమ్।  అనవద్యోఽహమ్।
నిరవధి నిస్సీమ సత్వమాత్రోఽహమ్।

సర్వదా ఏకస్వరూపుడను! అనేకముగా అవటమే లేదు!
నాకు ఎట్టి వికలములు మొదలే లేవు!
సర్వదా సర్వత్రా మూర్తీభవించిన నిర్మల-నిర్వాణ స్వరూపుడను!
నేను అవయవముల స్వరూపము కాదు! నిరవయవుడను!
ఈ దేహమునకు జన్మ ఉండవచ్చుగాక! దేహి స్వరూపుడనగు నేను జన్మరహితుడను!
కేవల సత్ (ఉనికి - “నేను ఉన్నాను” అను రూపము) యొక్క సారభూతుడను!
నాకు అధికమైనది మరొకటేదీ లేనివాడను. నిరవధిక-నిజబోధ స్వరూపుడను!
శుభంకరుడను! శుభములన్నిటికీ ఆవల గల కేవల భావనా స్వరూపుడను!
అఖండుడను! అప్రభేద్యుడను (I am unpartitionable)!
మనో బుద్ధి చిత్త అహంకారములను నియమించువాడును! విభుడను!
వేరు వేరు భాగములుగా విభజించబడని వాడను! అనవద్యుడను!
అవధులనునవే లేనట్టి సత్వమాత్ర స్వరూపుడను!
8. వేద్యోఽహమ్ ఆగమాంతైః
ఆరాధ్యః సకల భువన హృద్యోఽహమ్|
పరమానంద ఘనోఽహమ్।
పరమానందైక భూమ రూపోఽహమ్।
శుద్ధోఽహమ్। అద్వయోఽహమ్।
సంతత భావోఽహమ్। ఆది శూన్యోఽహమ్।
తెలియబడేది - తెలుసుకొనేది - అంతా నేనే! వేద్యుడను. తెలియబడేదానికంతటికీ ఆవల తెలుసుకొనుచున్నట్టి వాడను. వేదములకు చివరగా
గల వేద-వేదాంత స్వరూపుడను! ఉపనిషత్తులన్నీ గానం చేస్తున్నది నా గురించే! సకల భువనములకు (14 లోకములకు) హృదయేశ్వరుడను! ఘనీభూతమైన పరమానంద స్వరూపుడను! పరమానంద భూమ (Highest Zone of Happyness) ఘనీభూత రూపుడను! నిత్యశుద్ధుడను! నాకు వేరైనదంటూ ఎక్కడా లేనివాడను! అద్వయోఽహమ్! మొదలు అనునదే లేనివాడను! సంతత భావ స్వరూపుడను! ఆది శూన్యుడను!
9. శమిత-అంత త్రితయోఽహమ్।
బుద్ధో ముక్తోఽహమ్। అద్భుతాత్మాఽహమ్|
శుద్ధోఽహమ్। అంతరోఽహమ్।
శాశ్వత విజ్ఞాన సమరసాత్మాఽహమ్।
శోధిత పరతత్త్వోఽహమ్|
బోధానందైక మూర్తిరేవాఽహమ్।
జాగ్రత్-స్వప్న-సుషుప్తులనే త్రితయములు శమించియున్నవాడను!
బుద్ధిచే సర్వదా ముక్తుడను! అద్భుతమగు ఆత్మస్వరూపుడను!
ఎట్టి జన్మ-కర్మాది దోషములు అంటనట్టి పరమశుద్ధస్వరూపుడను! సర్వజీవుల అంతరమున ఉన్నవాడను! అంతరాంతరస్వరూపుడను!
అందరిలో “తెలుసుకొనుచుండటము” అను రూపమైన శాశ్వత విజ్ఞాన సమరస స్వరూపుడను!
ఎవరికి వారే తమయందు వెతుగుచుండగా లభించగల పరతత్వ స్వరూపుడను!
మూర్తీభవించిన బోధానంద స్వరూపుడను!
10. వివేకయుక్తి బుద్ధ్యాఽహమ్|
జానామి ఆత్మానమ్ అద్వయమ్|
తథాపి బంధమోక్షాది వ్యవహారః ప్రతీయతే|
నివృత్తోఽపి ప్రపంచో మే
సత్యవత్ భాతి సర్వదా।
సర్ప ఆదౌ రజ్జుసత్తేవ, బ్రహ్మసత్తేవ కేవలమ్ |
వివేకము-యుక్తి (ఉపాయము)చే అంతరమున ఉన్నట్లు తెలియబడు ఆత్మను! ద్వితీయమనునదే లేనట్టి ఆత్మస్వరూపముగా తెలియబడుచున్నట్టి వాడను! అట్లా అయి ఉండి కూడా, బంధ-మోక్షముల విశేషములు గలవానివలె తెలియబడుచున్నది కూడా నేనే! ప్రపంచము నివృత్తి కాగా, శేషించుచున్న నివృత్తి ప్రపంచ స్వరూపుడను! అయినప్పటికీ కూడా, కల్పనామాత్రమై, సత్యమువలె భాసిస్తున్న ఈ ప్రపంచమంతా నా రూపమే! త్రాడు పామువలె అనుభూతమయ్యేవిధంగా…. వాస్తవానికి త్రాడు త్రాడుగానే ఉన్న తీరుగా, పాము కల్పితమైన ఆపాదనగా…. ఇదంతా కేవల బ్రహ్మసత్తయే! పాము అనునదే లేని విధంగా, ప్రపంచమనునదే లేదు.
11. ప్రపంచాధార రూపేణ వర్తతే, అతో జగత్ న హి|
యథా ఇక్షురస సంవ్యాప్తా శర్కరా వర్తతే,
తథా, ‘అద్వయ బ్రహ్మ’ రూపేణ
వ్యాప్తోఽహమ్ వై జగత్రయమ్।
బ్రహ్మాది - కీట పర్యంతాః ప్రాణినో మయి కల్పితాః
చెఱకు రసమంతా పంచదార (మాధుర్యము) వ్యాపించి ఉన్న తీరుగా, ఈ జగత్తతంతా నేనే వ్యాపించి ఉన్నాను. అయితే వాస్తవానికి జగత్తు అనబడేదేదీ మమాత్మకు వేరుగా (త్రాడులో పామే లేని తీరుగా) లేనే లేదు!
చెఱకురస మాధుర్యమువలె నేను త్రిజగత్తులన్నీ ఆత్మస్వరూపముచే వ్యాపించి ఉన్నాను. బ్రహ్మదేవుని నుండి కీటకము వరకు గల సర్వప్రాణులు నాయొక్క కల్పనయందు గల అంతర్విశేషములే!
12. బుద్బుదాది వికారాంతాః
తరంగాః సాగరే యథా,
తరంగస్థం ద్రవం సింధుః
న వాంఛతి యథా తథా,
విషయానంద వాంఛా మే
మా భూత్ ఆనంద రూపతః।
దారిద్ర్య-ఆశా యథా నాస్తి సంపన్నస్య, తథా మమ॥
బుడగలు, తరంగములు… ఇవన్నీ కూడా సముద్రజల స్వరూపములే! అయితే సముద్రము తనయందలి తరంగములలోని ద్రవత్వము “నాకు కావాలి” … అని కోరుకుంటుందా? తరంగ జలముయొక్క ద్రవత్వ స్వభావము సముద్రములోని చమత్కారమే కదా!
అట్లాగే ఆనందస్వరూపుడనేనగు నేను “దారిద్ర్యము పోవాలి - సంపదలు రావాలి! వచ్చి ఆనందమును కలుగజేయాలి” అని కోరుకోను. ఆనందమే స్వరూపముగా గల నాకు ధనాశ తీరటం వలన క్రొత్తగా వచ్చే ఆనందము ఏమున్నది? ఒక ధనికుడు పేదతనమును కోరుకోని తీరుగా, నేను జగత్ విషయమేదీ కోరుకొనటము లేదు.
13. బ్రహ్మానందే నిమగ్నస్య విషయాశా న తత్ భవేత్ ।
విషం దృష్ట్వా, అమృతం దృష్ట్వా
విషం త్యజేతి బుద్ధిమాన్, ఆత్మానమ్ అపి దృష్ట్వా
అహమ్, అనాత్మానమ్ త్యజామి అహమ్ ॥
బ్రహ్మానందమునందు నిమగ్నుడనై ఉన్న నాకు విషయానందములతో పని ఏమున్నది?
ఏ బుద్ధిమంతుడైనా … విషము - అమృతము - ఈ రెండూ తారసపడినప్పుడు
అమృతమును స్వీకరిస్తాడేగాని, విషమును కానే కాదు కదా! విషయములే విషము.
ఆత్మను ఎరుగుచూ - దర్శించిన తరువాత ఇక నేను స్వభావసిద్ధంగానే అనాత్మనంతా త్యజించి వేయుచున్నాను!
14. ఘటా అవభాసకో భానుః,
ఘటనాశే న నశ్యతి।
దేహావభాసకః సాక్షీ, దేహ నాశే న నశ్యతి!
న మే బంధో! న మే ముక్తిః ।
న మే శాస్త్రమ్। న మే గురుః ॥
కుండలో గల నీటిలో సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడనుకోండి. ఆ కుండ పగిలితే ఆకాశంలోని సూర్యుడు నశిస్తాడా? లేనే లేదు! అట్లాగే సర్వమునకు కేవలసాక్షిని, ఆత్మ స్వరూపుడను అగు నేను ఈ దేహనాశనముచే ఏమాత్రము నశించువాడను కాదు!
ఆత్మనగు నాకు బంధము లేదు. ముక్తి లేదు. జీవాత్మగా ఏదైనా బంధముంటే దానికి నేను పరిమితుడను కాదు! పరమాత్మగా నాకు బంధమే లేదు!
ఆత్మానందము రుచి చూస్తూ ఉండగా ఇక నాకు శాస్త్రము లేదు! గురువు లేడు! ఆత్మయేవ హి గురుః ।
15. మాయా మాత్ర వికాసత్వాత్
మాయాతీతోఽహమ్, అద్వయః ।
ప్రాణాః చలం తు తత్ ధర్మైః
కామైర్వా హన్యతాం మనః ।
స్వభావ-ఆనంద పూర్ణస్య
మమ దుఃఖమ్ కథమ్ భవేత్? ॥
ఈ కనబడేదంతా కేవలము మాయా విలాసమే! భావావేశముచే ఉన్నట్లుగా కనిపించేదంతా వాస్తవానికి లేనేలేదు. ఇక నేనో? అద్వయుడను! నాకు వేరైనదంటూ ఏదీ లేనివాడను! మాయాతీతుడను! మాయకు సాక్షిని!
- ప్రాణములు వాటి ధర్మమును అనుసరించి చలించుచున్నాయి.
- మనస్సో? అద్దాని స్వభావంచేత ఏదేదో కోరుకుంటూ ఉంటోంది! బాధలు పొందవచ్చు గాక!
ఇవన్నీ ఆతీరుగా అవవచ్చుగాక! నేను స్వభావము చేతనే ఆనంద-పూర్ణస్వరూపుడను!
అట్టి నాకు ప్రాణమువలనగాని, మనస్సువలన గాని దుఃఖము ఎట్లా కలుగుతుంది? కలుగదు! సముద్రంలో తరంగాలవలె నాలో ప్రాణ-మనస్సులు తరంగాలు!
16. ఆత్మానమ్ అంజసా వేద్మి।
క్వాపి అజ్ఞానం పలాయితమ్। కర్తృత్వమపి మే నష్టమ్।
కర్తవ్యమ్ వా అపి న క్వచిత్ ।
బ్రాహ్మణ్యం కుల-గోత్రే చ
నామ సౌందర్య జాతయః స్థూలదేహగతా।
ఏతే స్థూలాత్ భిన్నస్య, మే న హి!
అవును! పెద్దలు చూపు మార్గంగా నేను ఆత్మ గురించి తెలుసుకుంటున్నాను. ఇక అజ్ఞానం ఎటువెళ్ళుతోందో ఏమి చెప్పాలి? దీపము వెలిగించితే చీకటి ఎటుపోతోంది? నాకు ఇప్పుడు కర్తృత్వము లేదు! కర్తవ్యము లేదు. చేయువాడనుగాను! చేయవలసినదీ లేదు! బ్రాహ్మణ్యము, కులము, గోత్రము, పేరు, అందంగా ఉండటము… ఇవన్నీ కూడా ఈ స్థూల దేహానికి మాత్రమే చెందినవి! ఇక నేనో? ఈ స్థూల దేహమునకు భిన్నమైయున్న ఆత్మను కదా! అందుచేత అవి నాకు చెందినవి కావు.
17. క్షుత్ పిపాస అంధ్య బధిరస్య
కామక్రోధాదయో అఖిలాః లింగదేహ గతా ।
ఏతే హి అలింగస్య న సంతిహి ।
జడత్వ ప్రియమోదత్వ ధర్మాః కారణ దేహగాః
న సంతి మమ నిత్యస్య నిర్వికార స్వరూపిణః ॥
ఆకలి, దప్పిక, గ్రుడ్డితనము (చూపు లేకపోవడం), చెవులు పని చేయకపోవడం (వినలేకపోవటం), కామము, క్రోధము…. ఇటువంటివన్నీ కూడా లింగ దేహము (సూక్ష్మ దేహము) యొక్క లక్షణాలు. నేనో? లింగదేహ రహితుడను! అందుచేత అవన్నీ నాకు ఎప్పుడూ లేవు! జడత్వము, ప్రియత్వము, మోదకత్వము… ఇవన్నీ కూడా కారణ దేహము యొక్క లక్షణములు. నిత్యుడను, నిర్వికార స్వరూపుడను అయి ఉన్న నాకు అవన్నీ స్వతఃగానే లేనేలేవు!
18. ఉలూకస్య యథా భానుః అంధకారః ప్రతీయతే,
స్వప్రకాశే పరానందే తమో మూఢస్య జాయతే|
గుడ్లగూబ వెలుతురు చూడలేదు కనుక సూర్యకాంతి చీకటివలె, అద్దానికి తోచుచూ ఉంటుందే! అట్లాగే పరానంద స్వయం ప్రకాశమగు ఆత్మ మూఢ దృష్టికి “తమస్సు(Darkness)” వలె తోచుచున్నది. మూర్ఖత్వము తొలుగగా, విజ్ఞాన దృష్టికి అంతా ఆత్మయే!
19. చక్షుర్దృష్టినిరోధే అభ్రైః ‘సూర్యోనాస్తి’ -
ఇతి మన్యతే …,
తథా అజ్ఞాన-ఆవృతో దేహీ
‘బ్రహ్మ నాస్తి’ - ఇతి మన్యతే ।
యథా అమృతమ్-విషాత్ భిన్నమ్,
విషదోషైః న లిప్యతే, న స్పృశామి జడాత్ భిన్నో
జడదోషాత్ న ప్రకాశతః ॥
ఆకాశమంతా మేఘములు క్రమ్ముకొని ఉన్నప్పుడు సూర్యుడు లేనట్లుగా ఉంటుంది!
“కళ్ళకు కన్పించటము లేదు కాబట్టి సూర్యుడు లేడు” - అని ఒకడు అనవచ్చు.
అట్లాగే, ఈ దేహి అజ్ఞానముచే ఆవరించబడి ఉన్నప్పుడు “బ్రహ్మమే లేదు!” అని అనవచ్చుగాక! బ్రహ్మము లేనిది ఎప్పుడు? బ్రహ్మము కానిది ఏది?
అమృతము - విషము భిన్న భిన్నమైనవి కదా! విషము ప్రక్కనే మరొక పాత్రలో ఉన్నంత మాత్రం చేత అమృతము - అమృతము కాకుండా పోతుందా? జడమునకు వేరైనట్టి చైతన్య స్వరూపుడనగు నేను జడ సంబంధమైన దోషములచే స్పృశించబడువాడను గాను! నాకు జడత్వము అంటదు! నన్ను ముట్టదు.
20.  స్వల్పాఽపి దీపకణికా బహుళం నాశయేత్ తమః,
స్వల్పోఽపి బోధోఽపి
అజ్ఞానం బహుళం నాశయేత్ తమః|
కాలత్రయే యథా, సర్పో రజ్జా నాస్తి, తథా మయి ॥
దీపము వ్రేలెడంతే అయినప్పటికీ గదిలో అంతా విస్తరించియున్న చీకటినంతటినీ తొలగించివేస్తుంది కదా! అట్లాగే స్వల్ప ఆత్మజ్ఞానముచేత జన్మ జన్మలుగా విస్తరించియున్న బాహుళ్యమైనట్టి అజ్ఞానము తొలగగలదు!
త్రికాలములందు (పాము ఉన్నదనుకొనకముందు, పామును చూచినామని అనుకున్నప్పుడు, అది పామేకాదని తెలిసినప్పుడు కూడా)… అక్కడ త్రాడుయే ఉన్నది. పాము ఎప్పుడూ లేదు కదా! త్రికాలములలోనూ ఆత్మయే సత్యము!
21. అహంకారాది దేహాంతం జగత్ నాస్తి। అహమ్ అద్వయః|
చిద్రూపత్వాత్ న మే జాడ్యమ్ |
సత్యత్వాత్ న అనృతమ్ మమ।
ఆనందత్వాత్ న మే దుఃఖమ్,
అజ్ఞానాత్ భాతి సత్యవత్ |
ఇతి ఆత్మప్రబోధోపనిషదమ్
ముహూర్తమ్ ఉపాసిత్వా,
న చ పునరావర్తతే। న చ పునరావర్తతే ॥
అద్వయ స్వరూపుడను, ఆత్మరూపుడను అగు నాయందు అహంకారము మొదలుకొని
ఈ దేహము, జగత్తు మొదలైనవాటి వరకూ ఎప్పుడూ ఇవన్నీ లేనేలేవు! స్వప్నంలో
వాస్తవానికి ఇళ్ళు-నగరములు-మనుష్యులు ఉన్నారా? లేరు కదా!
నేను సర్వదా చిదానంద రూపుడను! అట్టి నాకు దేహ దృశ్య జాడ్యములు మొదలే లేవు!
సర్వదా సత్యస్వరూపుడనగు నాయందు మాయ, అనృతము (మాయా- యా మా) ఇత్యాదులు
లేనేలేవు! కేవలానంద స్వరూపుడనగు నాయందు దుఃఖాదులు లేవు! అజ్ఞానముచే లేనివి
ఉన్నట్లుగా, సత్యము వలె భాసిస్తున్నాయి. వాస్తవానికి నేనే సర్వదా సత్యమును! నిత్యమును!
నేనే సర్వదా సత్ రూప సత్యమును!
ఆత్మబోధాత్మకమగు ఈ ఉపనిషత్ను ముహూర్త కాలము (64 ని॥ కాలము)
ఉపాసించినా కూడా… అట్టివాడు పునః జన్మించడు! ఆతనికి ఈ జన్మా లేదు! పునర్జన్మా
లేదు! లేనిదే అగుచున్నది. జన్మలే లేనివాడికి ఈ జన్మ మాత్రం ఎక్కడున్నది?

ఇతి ఆత్మబోధోపనిషత్ సమాప్తః।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



ఋగ్వేదాంతర్గత

2     ఆత్మబోధ ఉపనిషత్

అధ్యయన పుష్పము


‘ఓం నమో నారాయణాయ’ అను అష్టాక్షర స్వరూపుడు - మనందరి ఆత్మస్వరూపుడై ఆ నారాయణుడు సర్వదా స్వానుభవమే
అయి ఉన్నారు. అట్టి వారిని ఆత్మబోధోపనిషత్‌తో అర్చించుచున్నాము.

‘ఓం’ కేవల విషయరహితానంద స్వరూపుడగు నారాయణ స్వరూపము. నారాయణుడు ప్రణవ స్వరూపుడు .

ప్రణవము ’ఓం’ =

‘ఓం’ కార ఉచ్చారణచే, జపించటం చేత, అట్టివాడు బ్రహ్మజ్ఞాని అగుచున్నాడు. బ్రహ్మము గురించి తెలుసుకుంటున్నాడు. ఫలితంగా
జన్మ మృత్యు సంసారము నుండి విముక్తుడగుచున్నాడు.

ఓం నమో నారాయణాయ - శంఖ చక్ర గదాధరాయ!

అను మంత్రమును జపించటం చేత ఆ ఉపాసకుడు జన్మ - మృత్యువుల పరిధిని దాటినవాడై, వైకుంఠ ధామమును సముపార్జించు
కొంటున్నాడు. ‘బ్రహ్మపురము’ చేరుచున్నాడు. తనయొక్క సగుణ - నిర్గుణ స్వరూపతత్త్వములను ఎరుగుచున్నాడు.

అట్టి బ్రాహ్మీస్థానము వికసించిన పద్మమువలె ఆత్మజ్ఞానోదయం! బ్రహ్మమును ఎరిగిన వాడు బ్రహ్మమే అగుచున్నాడు.

బ్రహ్మము కేవల ప్రకాశమాత్రము. దీపకాంతివలె స్వయంజ్యోతి స్వరూపము. దీపమును చూడటానికి మరొక దీపంతో ఏమి అవసరం ?
బ్రహ్మము ఆ రీతిగా స్వయం ప్రకాశం. స్వయం ప్రదర్శకం!

దేవకీ పుత్రుడగు శ్రీకృష్ణమూర్తి, మదుసూధనుడు, విష్ణువు, అచ్యుతుడు అగు శ్రీమన్నారాయణమూర్తి స్వయముగా పరబ్రహ్మమే! కృష్ణస్తు భగవన్ స్వయమ్ ! (నారాయణమ్ మహాజ్ఞేయమ్। అంతర్బహిశ్చ తత్ సర్వమ్ వ్యాప్య నారాయణ స్థితః)!

పరబ్రహ్మ స్వరూపుడగు నారాయణుడే సర్వ భూతజాలమునందు సర్వదా సమముగా వేంచేసియున్నారు!

సర్వ భూతములు (జీవులు) నారాయణుడే ! నారాయణుడే ఆ పరబ్రహ్మము ! కనుక సర్వజీవులు పరబ్రహ్మమే !

అట్టి ఏకము - సర్వభూతస్థము అగు నారాయణుడే సర్వమునకు కారణకారణుడు. సర్వమునకు నారాయణ పరబ్రహ్మమే కారణమయి
ఉండి కూడా… ఆ నారాయణుడు స్వయముగా అకారణుడు! ఆయనకు మరొక్కటేదీ కారణము కాదు.

ఓమ్ నారాయణాయ - ‘ఓం’ కార, సత్ - చిత్ - ఆనంద కారణ పురుష, అకారణ సర్వభూతస్థ - సర్వముతానైన పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాను.
నమో న = సర్వాత్మకుడు
మ = జీవాత్మ
నమో = జీవాత్మగా కనిపిస్తూ పరమాత్మగా అయి ఉన్నవారు
విష్ణు సర్వము తానై, సర్వముగా విస్తరించి ఉన్న పరబ్రహ్మము.

సర్వరూపములు తానై - సర్వమునకు సాక్షి అయి, సర్వ బ్రహ్మాండములకు తానె సూత్రధారి అయి, సర్వముగా కనిపిస్తూ - ఏకమే అయి ఉన్న ఆ విష్ణు భగవానుని ’ఓం నమోనారాయణాయ’
- అష్టాక్షరీమంత్ర సహాయముతో ధ్యానించువాడు, ధ్యాసను సులభముగా ఆ పరబ్రహ్మముపై నిలుపుచున్నాడు.
- శోకమోహ వినిర్మక్తమ్ విష్ణుమ్ ధ్యాయన్నసీదతః : శోకమోహముల నుండి (From all worries and from allillusions) విముక్తుడగుచున్నాడు.
- ద్వైత - అద్వైతమభయం భవతిః : ద్వైత - అద్వైత భేదభావాలన్నీ మొదలంటా తొలగిపోతున్నాయి.

తానే అభయస్వరూపుడగుచున్నాడు. స్వయం నారాయణ పరబ్రహ్మమై ప్రకాశించుచున్నాడు.

ఇదంతా ఏకమగు నారాయణ పరబ్రహ్మమే! ఇక్కడ అనేకమనునదే లేదు.

ఇదంతా ఎవ్వరైతే ఏకో నారాయణ స్వరూపముగా కాకుండా, అనేకముగా వేరు వేరై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నారో ……

మృత్యో స మృత్యుమ్ అప్నోతి య ఇహ నానేవ పశ్యతి

అట్టి భేద దృష్టి కొనసాగిస్తున్నవారు ఒక మృత్యువు నుండి మరొక మృత్యువును పొందుచూ పోవుచున్నారు.
ఒక జన్మనుండి → మరొక జన్మను,
ఒక చావు నుండి → మరొక చావును… పొందుచూనే ఉంటారు.

ఏకమగు నారాయణుని (లేక) సర్వముగా ఉన్న విష్ణుతత్త్వమును దర్శించినప్పుడు మాత్రమే అమృత స్వరూపులై, జన్మ జరా మరణ పునర్జన్మల చక్రము నుండి విడివడి అమృత స్వరూపమగు నారాయణ పరబ్రహ్మతత్వము తామే అయి ప్రకాశించగలరు. అట్టి సర్వత్రా విస్తరించి ఉండుటచే విష్ణువు! ఓంకార పరబ్రహ్మగుటచే నారాయణుడు! సర్వముతానే అయి ఉండుటచే శ్రీకృష్ణ చైతన్యమూర్తి! … ఆయన ఉన్నదెక్కడ! ఎక్కడికి వెళ్ళి ఆయనను దర్శించాలి !

ఆయన సర్వుల అంతర్ - హృదయేశ్వరుడు! హృత్ పద్మమునకు మధ్యగా వేంచేసి ఉండి, సర్వము తానే అయి కూడా సర్వమును వేరుగా స్వమాయచే దర్శించు జ్ఞాన విజ్ఞాన నేత్రుడు!

ఎరుక (లేక) ‘ప్రజ్ఞ’ అనే ప్రజ్ఞానేత్రమునందే కంటిలో చూపుగా, హృదయములో జగదర్శిగా, బాహ్యమున జగత్ దృశ్యముగా ఉన్నవారు. ప్రదర్శనమగుచున్నదంతా ఆ నారాయణుడే! ఈ సర్వము ఆయన యొక్క ప్రజ్ఞానేత్ర సందర్శనం!

ద్రష్టగా ప్రతిష్ఠుతుడై ఉన్నది ఆ ప్రజ్ఞానేత్రమే! ఆ ప్రజ్ఞా నేత్రమే దృశ్యరూపంగా - లోకములుగా ప్రతిష్ఠితమై ఉన్నది.

ఇదంతా నారాయణుని స్వరూప - ప్రజ్ఞావిశేషమ్ ! ప్రజ్ఞయే నారాయణుడు !

ప్రజ్ఞానం బ్రహ్మ ! ప్రజ్ఞానమే బ్రహ్మము ! తెలియబడుచున్నదంతా నేనైన నేనే బ్రహ్మమును!

తెలుసుకొనుచున్నది - తెలివి తెలియబడుచున్నది… ఈ త్రిపుటి ఏకమగు ప్రజ్ఞానారాయణ స్వరూపమే!

‘ప్రజ్ఞానమ్ బ్రహ్మ’ అను ఈ వేద మహావాక్యము యొక్క అర్థము తెలిసి, “నేను - నాచే గాంచబడేది… ఇదంతా కేవల ప్రజ్ఞారూపమగు - చిదానంద రూప పరబ్రహ్మమే! నారాయణుడే” అని తెలుసుకొన్నవాడు-ఈ “లోకములలో రాకపోకలు” అనే జన్మ-మృత్యు పరిధిని దాటి ఆముష్మిక స్థానమును చేరుచున్నాడు. అట్టివాడు అమృతస్వరూపుడై “కావాలనుకుంటే జన్మ! జన్మించి కూడా జన్మరాహిత్యము” అను స్వాతంత్ర్యము పొందగలడు ! సర్వకోరికలు సిద్ధించినవాడై సమము శాంతము అగు అమృతస్వరూపుడై విరాజిల్లుచున్నాడు. “ఓం నమః” అను ఇతి మోక్ష స్థానం చేరుచున్నాడు.


ఓం! ఓ సర్వాంతర్యామీ ! సర్వతత్త్వ స్వరూపా ! శ్రీహరీ ! శ్రీమన్నారాయణా ! విష్ణు దేవా ! శ్రీకృష్ణ పరబ్రహ్మమా !

మమ్ములను అసత్తు (కల్పన) నుండి - సత్తు (సత్యము) లోనికి, తమస్సు (చీకటి, అజ్ఞానము) నుండి - జ్యోతి లోనికి, (వెలుతురుకు), మృత్యువు నుండి - అమృతత్వము తీసుకొని పోవుటకై మీకు ‘ఓం నమో నారాయణాయ’ అని అష్టాక్షరీ స్తోత్రము చేయుచున్నాము.
- ఏ చోట ఆత్మత్వము పొగలేని అగ్నివలె జ్యోతిస్వరూపమై వెలుగొందుచున్నదో - యత్ర జ్యోతిః అజస్రం ,
- ఎక్కడ ఆత్మజ్యోతి నిత్యము ఉపాసించబడుచున్నదో - యస్మిన్ లోకే అభ్యర్హతమ్ ,
అట్టి అమృతప్రదమగు విష్ణులోకము మాకు ప్రసాదించండి ! అమృతమయ లోకమునుజేరి ఈ మృతత్వమును అధిగమించెదముగాక!
ఓంకార స్థానము పొంది ఆత్మతత్త్వ జ్ఞానులమై, బ్రహ్మమై ఆత్మస్వరూపులమై అమృత దృష్టిని అస్వాదించెదము గాక !

అమృతే లోకే అక్షితే, అమృతత్వం చ గచ్ఛతి ఓం నమయితి ! అమృతమగు - సర్వము ఆత్మగా దర్శించే - దృష్టిచే మేము ఓంకార స్వరూపానందమగు అమృతత్త్వమును సంతరించుకొనెదము గాక !

అమృత స్వరూపుడగు శ్రీమన్నారాయణోపాసనము సహాయంగా తీసుకొనుచున్నాను!

నా యొక్క కల్పనచే నా చుట్టూ నాకు నేనే కల్పించుకొన్న మాయావరణము వీగి పోగా, ఇక నేను కేవల ‘దృక్’ స్వరూపుడనగుచున్నాను.

నా యందు “బ్రహ్మమేవాహమ్, అహమ్ బ్రహ్మాస్మి” అను సూర్యోదయముచే భ్రమాత్మకమగు జీవాహంకారము - వెలుగు వచ్చినప్పటి చీకటివలె - తొలగిపోవుచున్నది. నా పట్ల జగత్తు-జీవుడు ఈశ్వరుడు ఇత్యాది భేదాలన్నీ స్వయంగా అంతర్హితమగుచున్నాయి.

వాటికి అవే అవన్నీ నాకు అభిన్నమై, నా యొక్క ప్రత్యక్పర స్వరూప ప్రదర్శనా విన్యాసమాత్రమై ఉంటున్నాయి. స్వప్నమంతా నాదే !

స్వప్నములోని నేను - నీవు కూడా నేనే ! స్వప్నమునకు వేరై ఉన్నవాడిని నేనే ! అట్టి ప్రత్యేక ఆత్మస్వరూపుడనై ప్రకాశించుచుండగా…
ఇక అంతకుముందున్నట్టి అంతులేని కర్మ పరంపరలు నాపట్ల స్వతఃగానే ‘లేనివి’ అగుచున్నాయి. ఇక నేను-బ్రహ్మచారి-గృహస్థవానప్రస్త-సన్యాసాశ్రమ సంబంధములైన విధి-నిషేధములను (Dos & Don’ts) అధిగమించినవాడనగుచున్నాను.

సర్వమునకు వేరై వెలుగొందుచున్న బ్రహ్మమే నేనగుచున్నాను.

నేనెవ్వరు ? కోఽహమ్ ? అహమ్ బ్రహ్మాస్మి , ‘బ్రహ్మము’ అనబడునది నేనే! పరమ పవిత్రము, సర్వత్రా వ్యాపించి ఉన్నట్టిది, పరమ సుఖస్వరూపము అగు కేవల సంవిత్ (సత్-ఉనికి; విత్-ఎరుక) స్వరూపుడను నేను !

సాక్ష్యహమ్ :  దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారములకు - వాటియొక్క సర్వ అవలోకనములతో సహా ఈ సర్వమునకు సాక్షీమాత్రుడను! సర్వమునకు కేవలసాక్షిని!

అనపేక్షోఽహమ్ :  దేనిపట్లా ఆపేక్ష (Attachment) లేనివాడను. అపేక్షా బంధరహితుడను. ఇదంతా ‘నేనే’ అయి ఉండగా, ఇందులో ఏదో కోరుకోవలసినది ఏముంటుంది? స్వప్నమంతా నాదైన నాకు స్వప్నములో ఒక ప్రదేశముపట్ల అపేక్ష దేనికి?

నిజమహిమ సంస్థితోఽహమ్ : సర్వమునకు వేరై, అప్రమేయుడనైనట్టివాడను ! ఈ లోకాలు, దేహాలు, సంబంధ - అనుబంధ - బాంధవ్యాదులు నన్ను ఆశ్రయించి ఉన్నాయి. వాటిలో నేను లేను. అవినాలోనూ లేవు. నా యొక్క మహిమయందే నేను సంస్థితుడనై ఉన్నట్టివాడను! మహామహిమాన్వితుడను! ఈ 14 లోకాలు నా మహిమ యొక్క కాంతి పుంజములు!

అచలోఽహమ్ : ఆత్మ స్వరూపడనై ఆత్మయందే వేంచేసి ఉంటాను. ఒకచోట నుండి మరొకచోటికి పోవువాడను కాను. స్వప్నమంతా తనదైనవాడు స్వప్నంలో ఈ ఊరి నుండి ఆ ఊరికి పోవుచున్నాడా? లేదు కదా? నేను అచలుడను.

అజరోఽహమ్ :  నేను ధరించిన ఒక వస్త్రము యొక్క రంగు - రూపు నేనౌతానా? లేదు. నేను ధరించిన ఈ దేహము యొక్క బాల్య - యౌవన - వార్ధక్య - మరణములతో నాకు సంబంధము లేదు. నేను జరామరణములు లేనట్టివాడను. దేహమునకు కేవల సాక్షిని.

అవ్యయోఽహమ్ : నేను ’జీవాత్మ’ను కల్పించుకొనుచూ, జన్మ-కర్మలు నిర్వర్తించవచ్చును గాక ! నా ఆత్మస్వరూపమునకు ‘వ్యయము’ అనునదేమీ లేదు. అవ్యయుడను. (పూర్ణాత్ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే).

పక్ష-విపక్షాది భేదదూరోఽహమ్ : నాకు ఎక్కడా అయినవాళ్ళు లేరు. కానివాళ్ళు లేరు. స్వపక్షము లేదు. విపక్షము లేదు. ఒకాయన ఒక నవల రాస్తే … అందులో కొన్ని పాత్రలు ఆయనకు తన పక్షము, మరికొన్ని పాత్రలు ఆయనకు పరపక్షము ఉంటాయా ? కలలో కనిపించేదంతా కల కనేవాని భావనయే అయి వుండగా, ఆ కల కనేవానికి “కొందరు నావారు మరికొందరు కాదు”… అనునదేముంటుంది! అంతా నావాళ్లే ! నేను సర్వదా ప్రత్యక్ ఆత్మ స్వరూపుడను కాబట్టి ఎవ్వరూ నావారు కాదు!

నాటకంలో ఒక పాత్ర వహిస్తున్నప్పుడు…
- అందరము కలసి నాటకం వేస్తున్నాము కనుక అందరు నావారే !
- నేను సర్వదా పాత్రకు వేరైన వ్యక్తిత్వము కలవాడను కనుక, అంతా నాటకమే కనుక ఎవ్వరూ నావారు కాదు.
ఈ విధంగా నాకు “నా పక్షము వారు (My Related) - కాని వారు (The other side people) అనునదేమీ లేదు ! అంతా నా ఆత్మ చైతన్య విశేషమే !

అవబోధైక రసోఽహమ్ :  ’ఎరుగుట’ తరువాత కదా, ఎరుగబడేది… అనునది ! ఆ ‘ఎరుగుట’ను ‘చిత్, బోధ’ శబ్దములతో కూడా చెప్పుకుంటున్నాం. అట్టి కేవల ఆవబోధరూపుడను! బోధైక రూపుడను! అట్టి ’బోధ’చే చెవులతో వినటం, కళ్ళతో చూడటం, మనస్సుతో ఆలోచనలు చేయటం… మొదలగునవి ఇవన్నీ నాచే నిర్వర్తించబడుచున్నాయి.

మోక్షానందైక సింధురేవాహమ్ : నేను దేహములకు - భావనలకు ఆవల ఉన్నవాడను. ఈ దేహాదులు నాకు అలంకారములేగాని బంధము కాదు. బంధరహితమగు ఆత్మానంద స్వరూపుడను! అఖండమోక్షానంద సముద్రుడను! ఈ జన్మలు, మనోబుద్ధి చిత్తాహంకారాలన్నీ నా యొక్క మోక్షానంద సముద్రములోని తరంగాల వంటివి!

సూక్ష్మోఽహమ్ :  ఈ స్థూలదేహము నేను కాదు. ఇది నాచే కదల్చబడే జడమగు వస్తువు వంటిది. నేను సూక్ష్మ చైతన్య స్వరూపుడను!
దేహాలకు - భావాలకు ఆవల వుండి వాటిని చైతన్యపరచువాడను! సర్వ స్థూలములకు ఆధారమై ఉంటున్న సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపుడను.

అక్షరోఽహమ్ : ఈ ప్రపంచంలో కనిపించేదంతా క్షయించటమే ధర్మముగా కలిగి ఉన్నది. ఇక నారాయణస్వరూపుడనగు నేనో? క్షరమునకు ఆవల అక్షరుడను! ఈ దేహము - జన్మ - శిశు బాల్య - కౌమార యౌవన - వార్ధక్యములు పొందుచుండగా… ఇద్దానికి వేరై, సాక్షినై అక్షరుడనైనట్టి ఆత్మస్వరూపుడను!

విగళిత గుణజాల కేవలాత్మాహమ్ : త్రిగుణ సంబంధమైన సర్వ గుణములకు ముందే ఉన్న నమో నారాయణుడను! ఆత్మస్వరూపుడను! నేను ఉన్నాను కాబట్టి గుణములు. అంతేగాని, గుణములచేత ’నేను’ కాదు! గుణములు నాకు సంబంధించిన సందర్భసత్యము మాత్రమే! నేనో, కేవల నిత్య సత్యమును! గుణములు లేనప్పుడు కూడా నేనున్నాను! కనుక గుణరహితుడను! గుణాతీతుడను ! కేవలాత్మ స్వరూపుడను!

నిమ్రోగుణ్య పదోఽహమ్ : సర్వదా త్రిగుణరహిత - త్రిగుణాతీత పదమును - స్థానమును అలంకరించి ఉన్నవాడను.

కుక్షిస్థానేక లోక కలశోఽహమ్ : ఈ లోకములు, లోకవిశేషములు, లోకాధిపతులు… ఈ వ్యవహారమంతా నా కుక్షియందే కలిగి ఉన్నట్టి ఆత్మస్వరూపుడును. జగత్తులు కలిగియున్నట్టి కలశమును (పూజా కలశమువంటి వాడను).

కూటస్థ చేతనోఽహమ్ :  తాను కదలక, సర్వమును కదలించు కూటస్థ చైతన్యమే నేను ! మూల ప్రకృతి స్వరూపుడను ! నా యందే సర్వము వెలయుచున్నది. నా వలననే సర్వము కదలుచున్నది. నిశ్చలుడనగు నా యొక్క చేతనా విశేషమే ఈ చంచల జగత్తులు.

నిష్క్రియ ధామాఽహమ్ :  క్రియలన్నింటికీ ఆవల అకర్తనై ఉన్నవాడను. అందుచేత నేనున్న చోటు నిష్క్రియ రూపము. మనో బుద్ధి చిత్త అహంకారముల యొక్క ఈ జగన్నాటక రచన నాటక దీపమువంటి నా (చిత్) వెలుగులో కొనసాగుతోంది.

అప్రతర్క్యోఽహమ్ :  బుద్ధిచే ఎవరికి వారే గమనించి ఆస్వాదించగల ఆత్మ స్వరూపుడను. అంతేగాని ఇద్దరు - ముగ్గురు కలసి తర్క - వితర్కములు చేస్తే లభించువాడను కాదు. అవన్నీ ఆత్మావగాహనా బుద్ధికి సహకారి కారణములు మాత్రమే.

ఏకోఽహమ్ : (ఒంటివాడ! చుట్టమొకడూ లేడు. పోతన భాగవతం-వామన చరిత్ర). నేను సర్వదా ఏక స్వరూపుడనే! అనేకముగా కనిపిస్తూ ఏకస్వరూపడునై ఉన్నవాడను. నటుడు అనేక నాటకములలో అనేక వేషములు వేసినప్పటికీ.. అతడు సర్వదా ఒక్కడే కదా! నాటకంలో అనేక పాత్రలు కల్పిస్తూ ఉన్నప్పటికీ నాటక రచయిత సర్వదా ఒక్కడే! స్వప్నంలో అనేక మంది కనిపిస్తున్నప్పటికీ స్వప్నము తనదైనవాడు ఒక్కడే! నేను సర్వదా ఏక స్వరూపుడను! అనేకముగా అగుటలేదు. అనేకముగా (అజ్ఞానదృష్టికి) కనిపిస్తూ కూడా, సర్వదా ఏకముగా (జ్ఞానముచే) అనిపించువాడను.

అవికలోఽహమ్ :  నాకు ఎట్టి వికారములు, వికలములు లేవు. నటుడు నవరసాలు నాటకంలో (నటించుచున్నప్పుడు) ప్రదర్శించుచున్నప్పటికీ… అతనికి ఏ రసము లేదు కదా! జన్మ-కర్మ వికల్పములేవీ నాకు లేవు ! వాటన్నిటికీ ఆవల ఉన్నవాడను.

నిర్మల నిర్వాణ మూర్తిరేవాహమ్ : నిర్మలమగు నిర్వాణ స్వరూపుడను. జగత్తులుగా మూర్తీభవించినట్టి నిర్మల స్వరూపుడను. మూర్తీభవించిన నిరాకారుడను? అమూర్తి మూర్తుడను!

నిరవయవోఽహమ్:  నా యొక్క ఇంద్రియశక్తుల ప్రదర్శనము కొరకై ఇంద్రియములకల్పన జరుగుతోంది. ఇంద్రిములకు వేరై, పరమై ఉన్న నేను ఇంద్రియాతీతుడను! ఇంద్రియరహితుడను. ఇంద్రియములు-ఇంద్రియ విషయములు నా సంకల్ప చమత్కారములు మాత్రమే!

అజోఽహమ్ :  ఈ దేహము జనిస్తోంది. క్షయిస్తోంది. నేనో ? ‘దేహి’ ని కదా ! కాలఃకాలస్వరూపమగు నా దేహిత్వమునకు జననమే
లేదు. అందుచేత అజుడను.

కేవల సన్మాత్ర సారభూతోఽహమ్ : ‘నేను’ అనే భావనకు ముందే ‘నేను ఉన్నాను’ అనునదే నా యొక్క సత్ స్వరూపము. ‘ఉనికి’ ఉన్నచోటే ‘ఎరుక’ ఉంటుంది కదా ! ఎరుకకు మునుముందే ఉన్నట్టి కేవల సత్ సార స్వరూపుడను.

నిరవధి నిజబోధోఽహమ్ :  నవల రచించువాని రచనాకళ ఒక నవలతో అంతము పొందదు కదా ! ఎరుగుట అను చిత్ శక్తి ఒక దేహము యొక్క శబ్ద - స్పర్శ - రూప - రస గంధముల ఎరుకచే ఖర్చు అయ్యేది కాదు. నా యొక్క బోధ (ఎరుక) తత్త్వము అవధులు లేనిది! నిరవధి ! అట్టి నిరవధి నిజ బోధ స్వరూపుడను. అవధులు లేని సత్ - చిత్ - ఆనంద - ఉనికి - ఎరుక - నిజకల్పనానంద స్వరూపడను. ఇదంతా నా వినోదము! అవధులు లేనివాడను.

శుభతర భావోఽహమ్ :  సర్వ శుభప్రదమగు భావనాస్వరూపుడను! సర్వ శుభ భావములకు ఆవల ఉన్నట్టి వాడను. సర్వ శుభంకరుడను! మహత్తరమైనట్టి శుభప్రదములన్నీ నాయందు కలిగి ఉన్నవాడను!

అప్రభేద్యోఽహమ్ : సర్వము ఆత్మయే! నేను ఆత్మ స్వరూపుడను! ఆత్మ సర్వాత్మకమగు ఆత్మయే అయి ఉండటం చేత, నాకు భేదమైనది, వేరైనది ఏదీ లేదు. దేనికీ భేదమైనవాడిని కాను. అప్రభేదుడు! దేనితోనైనా నాకు ఏకత్వమే ఉన్నది! నేను దేనికీ భేదమైనవాడిని కాను.

విభురహమ్ :  మనో బుద్ధి చిత్త అహంకారములు నాచే నియమించబడినట్టివి. వాటిచే దృశ్యము ఆస్వాదించబడుచున్నది. సర్వమునకు నియామకుడను! విభువును! సర్వము కల్పించునది, కల్పించి ప్రవేశించునది, ప్రవేశించి నన్ను నేనే ఏమరుచుచున్నదీ కూడా నేనే!

అనవోద్యోఽహమ్ :   నా స్వప్నములో నాకు కనిపించే “నేను - తదితరులు’గా నేను అగుచున్నానా ? లేదు. స్వప్నంలో కనిపించేదేదీ నన్ను జయించలేదు, నన్ను దాటిపోనూ లేదుకదా! ఈ జాగృత్ - సుషుప్తి విశేషములు కూడా అంతమాత్రమే! సర్వదా ఏకమై అవిభాగస్వరూపుడనై ఉన్నాను.

జాగ్రత్ (విశ్వడు) స్పప్నము (తేజసుడు), గాఢనిద్ర (ప్రాజ్ఞుడు).. నాచే నియమించబడుచూ, ఆస్వాదించబడవచ్చుగాక ! నేనే జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల అంతర్గతుడను. వేరు వేరుగా అవకుండానే అంతా ఆపాదించుకొని ఆస్వాదిస్తున్నాను. విభాగముగా అవటం లేదు కాబట్టి నేను సర్వదా అనవద్యుడను. అఖండుడను !

నిరవధి నిస్సీమ సత్వమాత్రోఽహమ్ : దేహానికి పొడవు - వెడల్పులు ఉండవచ్చు గాక! నేను దేహి చైతన్యమును. అవధులు లేనివాడను. ఏ ప్రదేశమునకు పరిమితుడను కాను. నిస్సీమ మహిమా స్వరూపుడను ! కేవల సత్ స్వరూపుడను. పంచభూతాలకు - దేహాలకు - లోకాలకు ఆవల సత్ స్వరూపుడనై ప్రకాశించువాడను. ప్రదేశముచే పరిమితుడను కాను. నన్ను దాటి మరింకేదో లేదు.

ఆగమాంతైః వేద్యోఽహమ్ :  వేదముల చివరగల ఉపనిషత్ వాణి ‘బ్రహ్మము’, ’అధ్యాత్మము’, ‘పరమాత్మ’ మొ॥ శబ్దములతో చెప్పుచున్న పరాకాష్ఠతత్త్వము నేనే! సర్వము ఎరుగుచున్న వేదాంత పురుషుడను! ఈ తెలియబడే అంతటినీ తెలుసుకుంటున్న వేదస్వరూపుడను! వేదాంత స్వరూపుడను! తెలియబడే జీవుడిని జగత్తును తద్రూపంగా తెలుసుకొనుచున్నవాడిని!

ఆరాధ్యః సకల భువన హృద్యోఽహమ్ : సకల భువనములలోని, 14 లోకములలోని సర్వజనుల హృదయ స్వరూపుడను! ఎవ్వరెవ్వరు ఎక్కడెక్కడ ఎవ్వరెవ్వరని ఆరాధిస్తూ ఉన్నప్పటికీ, అది ఆత్మవస్తువునే! అట్టి ఆత్మస్వరూపుడనే నేను! అందుచేత సర్వుల ఆరాధ్య వస్తువును.

పరమానంద ఘనోఽహమ్ :  ఆత్మస్వరూపంగా నేను ఎల్లప్పుడు ఘనీభూతమైన పరమానంద స్వరూపుడను! నా యొక్క ఆనందవిలాస చమత్కారమే ఈ జన్మ - ఇంద్రియ … విషయ విశేషాలన్నీ కూడా! ఇదంతా నాకు నేనే వినోదముగా కలిగి ఉన్నట్టివాడను?

పరమానందైక భూమరూపోఽహమ్ : పరమానంద భూమ (Zone of Natural and Highest happyness) రూపుడను. ఇహానందములకు సంబంధించని భౌమానంద స్వరూపుడను. ఆనంద క్రియా విశేషంగా, సర్వము కల్పించుకొనువాడను.

శుద్ధోఽహమ్ : దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారములచే ఏ మాత్రము ఆత్మ స్పృశించబడదు. నేను స్వతఃగా ఆత్మానంద స్వరూపుడును! కనుక సర్వదా శుద్ధుడను! నిత్య నిర్మలుడను!

అద్వయోఽహమ్ : అస్మత్ ఆత్మస్వరూపమునకు వేరైనది ఎక్కడా ఏదీ లేదు. అందుచేత నేను అద్వయ స్వరూపుడను! ద్వితీయమైనదేదీ లేనివాడను! ఇదంతా నేనే అయి ఉన్నాను! త్వమేవాహమ్| అహమ్ సర్వమిదగ్ం సర్వమ్। ’నీవు’గా ఉన్నది నేనే అయి ఉన్నవాడను.

సంతత భావోఽహమ్ :  ఎల్లప్పుడు భావనతో కూడి ఉండువాడను. (భావన = ప్రకృతి. అమ్మవారు) భావనా స్వరూపుడను! జాగ్రత్-స్వప్న-సుషుప్తులు, దేహ-దేహాంతరములు ఇవన్నీ భావనా చమత్కారములే! ఆత్మ - భావన కలసియే ఉంటాయి. (భవుడు + భావన) నేను సర్వదా భావనా సమన్వితుడనై ఉండువాడను.

ఆదిశూన్యోఽహమ్ :  ఆత్మకు ఆది - అంతములు లేవు. నేను ఆత్మస్వరూపుడనే కాబట్టి నాకు మొదలు అనునదే లేదు. స్వప్నద్రష్ట స్వప్నంతో ప్రారంభమౌతాడా? అంతమౌతాడా? నేను జన్మలతో ప్రారంభంగాను. అంతకు ముందే ఉన్నవాడను. ఎప్పటికీ ఉండువాడను ! ‘ఇది మొదలు’ అనునదేమీ నాకు లేదు.

శమిత - అంతత్రిత్రయోఽహమ్ : జాగ్రత్-స్వప్న సుషుప్తులు తురీయుడనగు నా నుండే బయల్వెడలి, తిరిగి నాయందే శమిస్తున్నాయి. త్రిగుణములు కూడా నానుండే బయల్వెడలి నా యందే తిరిగి సశాంతిస్తున్నాయి. అట్లాగే మనో-బుద్ధి-చిత్తములు కూడా! ద్రష్ట - దర్శనము - దృశ్యము ఈ మూడూ ఆత్మారాముడనగు నాయందు బయల్వెడలి చివరికి నా యందే శమమును పొంది - శాంతిస్తున్నాయి. సర్వము ఎందులోంచి బయల్వెడలుచున్నదో, ఎందులో శమిస్తున్నదో… అట్టి అధ్యాత్మరూపుడను!

బుద్ధో ముక్తోఽహమ్ :  నిర్మలమైన బుద్ధిచే నేను సర్వదా ముక్తుడనే! నాటకంలో నటించువాడు నాటకరచనకు బద్ధుడైనట్లుగా కనిపిస్తాడు! అట్లాగే జీవాత్మగా జగత్ నాటకంలో బద్ధునివలె కనిపిస్తానేమో! కానీ నాకు బంధమే ఉండజాలదు! బుద్ధిచే నిత్య ముక్తుడను.

ఎందుకంటే సర్వదా అద్భుతమగు ఆత్మస్వరూపుడను కాబట్టి!

శుద్ధోఽహమ్ ! అంతరోఽహమ్ : నిత్యశుద్ధుడను! సర్వమునకు అంతర్యామిని! సర్వదా అంతరాంతర స్వరూపుడను. కదిలే దేహమునకు అంతరమున ఉండి కదల్చుచుండువాడను ! భావనలకు ఆవల ఉండి, భావనలను కదిలించు చైతన్య స్వరూపుడను! ఆలోచనలకు అంతరముగా - ‘ఆలోచనలకు ఉత్పత్తి సాము’ అయి ఉన్నాను. జన్మ - కర్మలకు ఆధారుడను.

శాశ్వత విజ్ఞాన సమరసాత్మాఽహమ్ : ఎల్లప్పటికీ ఉండువాడను. సదాశివో హమ్ ! తెలియబడేదంతా కల్పించుకొని తెలుసుకొంటున్నట్టి శాశ్వత విజ్ఞాన స్వరూపుడను. తెలుసుకొనేవాడు తెలియబడే దానిచే ప్రారంభముకాడు, ముగియడు. అందుచేత శాశ్వత విజ్ఞాన స్వరూపుడను. తెలుసుకొనుచున్నప్పుడు, తెలుసుకొననప్పుడు కూడా నా యొక్క విజ్ఞాన స్వరూపము యథాతథము. సర్వదా సమరసమగు ఆత్మస్వరూపుడను!

శోధిత పరతత్త్వోఽహమ్ : ఈ దృశ్యములో దేహబద్ధుడుగా, జీవుడుగా కనిపించవచ్చును గాక ! నా స్వరూపము యొక్క వాస్తవతత్వము శోధించినప్పుడు - ఇహ స్వరూపుమునకు, స్వభావమునకు ఆవల గల పరతత్త్వ స్వరూపుడుగా తెలియవచ్చుచున్నాను. అందుచేత పరిశీలించనప్పుడు జీవుడుగాను, శోధించబడినప్పుడు పరతత్త్వము గాను తెలియబడువాడను. నటుడు వేరు - పాత్ర వేరు అయిన తీరుగా…. నేను వేరుగా, ‘ఇహము’లో కనిపించే నా కల్పనయగు ’జీవాత్మ’కు అతీతుడనై ఉన్నాను.

బోధానందైకమూర్తిరేవాహమ్ : మూర్తీభవించిన బోధానందరూపుడను. ఈ జగత్ దర్శనములు, ఈ జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు..ఇవన్నీ కూడా చమత్కారమగు నా ఆనందరూపములు ! ‘బోధ’ (Knowing) అను అస్మత్ కళాత్మక మూల పదార్థ విశేషముచే నిర్మితమైనట్టివి. ఏకమే అయి అనేకము కల్పించుకొనువాడను. కేవల బోధ - ఆనంద - ఏకైక రూపుడను.

వివేకయుక్తి బుద్ధ్యాఽహమ్ : వివేకముచే, బుద్ధి యొక్క సునిశిత్వము చేత… ఆత్మగా ఎరుగబడువాడను. దేహమునకు - త్రిగుణములకు ఆధారమైయున్న అస్మత్ ఆత్మ స్వరూపము - వివేకయుక్తమైన ఉత్తమ బుద్ధికి మాత్రమే తెలియబడుచున్నది.

జానామి ఆత్మానమ్ అద్వయమ్ : వివేక దృష్టిగలిగియున్నట్టి మహర్షులు, సద్గురువులు, “నేను అద్వయమగు ఆత్మస్వరూపుడను” అని తెలిసికొనినవారై “శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రః" అని గానం చేస్తున్నారు. (తత్త్వమ్; సోఽహమ్ ; జీవోబ్రహ్మేతినాపరః ; అయమాత్మా బ్రహ్మ…. ఇత్యాది) వేదవాక్యములచే నా యొక్క అద్వయమగు ఆత్మస్వరూపము తెలియపరచబడుచూనే ఉన్నది. సిద్ధాంతీకరించబడుచునే ఉన్నది. అట్టి పాఠ్యాంశములను అనుసరించి నన్ను నేను సర్వమునకు అద్వితీయముగా ఎరుగుచూ ఉన్నాను.

తథాపి బంధమోక్షాది వ్యవహారః ప్రతీయతే : నిత్యమోక్ష స్వరూపుడనే అయి ఉండి కూడా "బంధము మోక్షము” అను - విశేషాలన్నీ నా పట్ల ప్రతీతమై, ప్రసిద్ధమై ఉంటున్నాయి. ఆత్మగా నిత్య ముక్తుడనూ నేనే ! జీవుడుగా నిత్య బద్ధుడను నేనే!

ఆత్మను ఏమరచుటచే బద్ధుడను! ఆత్మజ్ఞానముచే ముక్తుడను!

అను ఆపాదనలు స్వీకరిస్తూ ఉన్నాను. వాస్తవానికి నేను సర్వదా ఆత్మస్వరూపుడనే ! అది లీలగా ఏమరచి ఎప్పటి నుండో వస్త్రమువలె ధరించు ఈ భౌతిక దేహమునకు సంబంధించిన ఇంద్రియ విశేషములకు అభ్యాసవశం చేత బద్ధుడనై, క్రమంగా అనేక దేహముల రాక - పోకలు అనుభవిస్తూ పోతున్నాను. ఎప్పుడో “ఈ జన్మ - కర్మలచే బద్ధుడను …” అని గమనించి “ఎట్లాగురా మోక్షము?”…. అని తత్ప్రయత్నములు ప్రారంభిస్తున్నాను. ఈ విధంగా బంధ మోక్షములు నా పట్ల ప్రతీతి పొందుచున్నాయి.

నివృత్తోఽపి ప్రపంచో మే సత్యవత్ భాతి సర్వదా : వాస్తవానికి స్వతఃగానే ఆత్మస్వరూపుడనగు నేను వృత్తిరహితుడను. (I am beyond all avocations). వృత్తులు నా నుండి బయల్వెడులుచున్నాయి. వృత్తుల కంటే మునుముందే వృత్తిరహితుడనైయున్నాను. ఈ ప్రపంచము నా యొక్క వృత్తుల స్వరూపము. (This world is the form of my flock of avocations).

సర్పాదౌ రజ్జు సత్తేన! బ్రహ్మసత్తేవ కేవలమ్! : కొందరు బాటసారులు ఏదో దూరప్రదేశం నుండి నడచివస్తున్నారు. క్రమంగా సాయం సమయమయింది. చీకటిపడింది. వారంతా ఒక గ్రామం సమీపిస్తూ ఉండగా వారికి బాట ప్రక్కన ఒక మంచినీటి బావి కనిపించంది. మంచినీళ్ళు త్రాగుదామనుకొని ఆ బాటసారులు బావి (Well) ని సమీపించారు. వారిలో ఒకరు నీరు తోడే ప్రయత్నంలో ఉండగా ఆ బాటసారులలో మరొకడు యథాలాపంగా వెనుకకు చూచాడు. “బాబోయ్” అని పెద్దగా అరుస్తూ గజ గజ వణకటం ప్రారంభించాడు. “ఏమిటిరా?” అని అంటూ ఇతర బాటసారులు కూడా వెనుకకు చూచారు ! అక్కడ పొడవుగా ఉన్న భయానకమైన ఆకారం !

"పాము! పాము! ఎంత పెద్ద పామో! అయ్యా! ఎవరైనా వచ్చి కాపాడండి! రక్షించండి! ఓ గ్రామ జనులారా! కర్రలు పట్టుకురండి! ఓ దూరంగా వుండే రైతులారా! బాబూ! కర్రలు తీసుకురండి! ఈ పాము ఒక్కసారి లేచి మమ్ములను కాటేస్తుందేమో! బాబూ రండి! బాబూ! రండి! చస్తామేమో!

అల్లంత దూరంలోగల ’గుడిశ’లో ఒక వృద్ధురాలు ఆ కేకలు విన్నది! "అయ్యో! పాపం! ఈ బాటసారులు భయపడుచున్నారు!” అని అనుకొన్నది.అప్పుడే వెలిగించిన దీపము (Lantern) పట్టుకొని ఒక దుడ్డుకర్రతో ఆ నూతివైపుగా వచ్చింది.

“ఏమిటర్రా గొడవా ? పెద్ద పామా ! ఇక్కడ పాములేమీ ఉండవే ! అయినారండి ! చూద్దాం !”
అని లాంతరు (దీపపు) వెలుగును అక్కడ సమీపంగా ప్రసరింపజేసింది !

“ఓహో! ఇదా! చాంత్రాడు - పాడైపోతే ఎవ్వరో ఇక్కడ నూతి ప్రక్కన పడవేశారు! ఇది పాము కాదు! కొండ శిలువ కాదు !” అని అందరినీ పిలిచి చూపించింది. “అమ్మయ్య ! బ్రతికామురా బాబూ!” అని అనుకుంటూ ఆ బాటసారులు, ఆ పాముగా కనిపించిన త్రాడు గురించి చెప్పుకుంటూ, కడుపునిండా బావినీళ్ళు త్రాగి, ఇక అక్కడ నుండి హాయిగా బయలు దేరారు! దీనిని “సర్పరజ్జు భ్రాంతి”  అంటారు.

1) అక్కడ మొట్టమొదటగా ఉన్నదేది ? చాంత్రాడు!
2) ఆ బాటసారులకు ఏదిగా కనిపించింది ? పెద్ద సర్పముగా!
3) ఆ సర్పము ఎక్కడినుండి వచ్చింది ? రాలేదు! అస్సలు పాము అక్కడ లేదు !
4) మరి సర్పముగా ఎందుకు కనిపించింది? త్రాడును చూచి బాటసారి పాత జ్ఞాపకాలు, సంస్కారాలు కారణంగా “పామేమో?” అని అనుకున్నాడు. పాము దృష్టితో త్రాడును చూచి "భయంకరమైన పెద్ద పాము” అని ఆపాదించాడు. తన ఆపాదన భయం చేత నిజమేననుకున్నాడు. ‘పాము’ అని అరిచాడు.
5) మరి తదితర బాటసారుల సంగతేమిటి? వారు “అది ఏమిటి?” అని పరిశీలించలేదు. “చీకటి కదా! పామే అయి ఉంటుంది”… అని అనుకొని అరవటం ప్రారంభించారు. “మన వాడు చెప్పాడు కదా ! పామే !” అని నమ్మనారంభించారు. పాము కాటేస్తే ఏమౌతుందో - ఊహించుకోసాగారు.
6) త్రాడు పాముగా కనిపించటానికి ఇంకేదైనా కారణమున్నదా ? అవును! మసక చీకటి.
7) ఆ మసక చీకటి ఏమైనది? ఏమీ కాలేదు. లాంతరు వెలుగుచే అంతా స్పష్టంగా కనిపించింది. అంతకుముందో, చీకటిలో త్రాడుగా కనిపించలేదు. అంతే !
8) ఇంతకీ పాము ఏమయినట్లు? ఏమీ కాలేదు. అస్సలు పామే లేదు. ఇంక ఏమైనదనే ప్రశ్న ఎక్కడిది? దానికి సమాధానము ఏమున్నది?
9) ఎప్పటి నుండి పాము త్రాడుగా అయ్యింది ?
ఎ) మొట్టమొదట అది త్రాడే!
బి) మధ్యలోనూ అది త్రాడే!
సి) చివరకీ త్రాడుగానే తెలియవచ్చింది! అంతే!

ఈ దృష్టాంతాన్ని ఎదురుగా ఘనీభూతమై అనేక దుఃఖములకు (దుఃఖాలయమ్ - అశాశ్వతమ్) ఆలవాలమై యున్న ఈ దృశ్య జగదనుభవమనకు…తత్పరంగా చూద్దాము.

1) ఇక్కడ మొట్టమొదటగా ఉన్నదేది ? స్వస్వరూపమగు పరబ్రహ్మమే !

2) బాటసారులవంటి మనకు ‘జీవుడు-దేహము’ గా ఇప్పుడు కనిపిస్తున్నదేది ? భరించలేనంతగా అనేక సంబంధ - అనుబంధ
- బాంధవ్య - సంపద - ఆపద - మార్పు - చేర్పులతో కూడిన దృశ్యజగత్తు !

3) ఇంతటి అనేక బాధ - దుఃఖములతో కూడిన ఈ జగత్ దృశ్యము ఎక్కడి నుండి వచ్చింది? దృశ్యము లేదు! జగత్తు లేదు! లేనే లేనిది "ఎక్కడి నుండి వచ్చింది?” అనే ప్రశ్నేమున్నది?

4) సరే! మరి ఇది జగత్ దృశ్యముగా ఎందుకు అనుభూతమౌతోంది? మనయొక్క పూర్వ - తత్ పూర్వ సంస్కారములు కారణంగా
“ఇదంతా నిజమే! ఉన్నది! భవము!” అని అనిపిస్తోంది. ఫలితంగా భవబంధముగా ప్రాప్తిస్తోంది! దృష్టి చేతనే సృష్టి సంసార, భావముగా పొందబడుచున్నది.

5) మరి అనేకమందికి కూడా ఈ జగదృశ్యము సత్తువలె, భవము వలె, నిజంగానే ఉన్నదానివలె, స్వస్వరూపపరబ్రహ్మమునకు వేరైనదాని వలె అగుపిస్తోందే? అనిపిస్తోందే? తదితరులలో అనేక మంది “ఈ జగత్తు - బంధాలు ఉన్నాయని అనేకమంది అంటున్నారుగా! ఉండియే ఉంటుంది!”– అని నమ్ముచూ తమ యొక్క పరబ్రహ్మత్వము (పరము - ఆత్మత్వము)ను ఏమరచి “మాకు కూడా బంధమున్నది!” అని ప్రకటించనారంభిస్తున్నారు. పదిమంది అంటున్నారు కాబట్టి, ఆత్మలేనిదానివలె, ఇంద్రియ జగత్తు సత్యమై ఉన్నదానివలె అనిపిస్తోంది! అంతమాత్రం చేత సత్యము అసత్యమవదు! ఆత్మయే ‘జగత్తు’ రూపంగా భ్రమచే అనిపిస్తోంది.

6) జగత్తు ఆత్మ యొక్క భావనా చమత్కారమే అయి ఉండగా, ఈ జగత్తు తన స్వరూపమునకు వేరై ఉన్నట్లు అనిపించటానికి ఇంకేదైనా
కారణమున్నదా? అవును ఉన్నది. అజ్ఞానము చేతనే ! ఆత్మయొక్క మహిమ ఎట్టిదో… సరిగ్గా పలిశీలించకపోవటమే అజ్ఞానము.

7) ఆత్మజ్ఞానము వికశించుచుండగా అజ్ఞానము ఏమౌతోంది? సమాధానం : దీపం వెలిగించగానే చీకటి ఏమౌతోంది ? ఏమీ
చెప్పలేం ! ఆత్మ జ్ఞానముచే అజ్ఞానము యొక్క ఊసు ఉండదు. ఆత్మజ్ఞానరాహిత్యమే అజ్ఞానము యొక్క రూపము!

8) జ్ఞానముచే సర్వము ఆత్మ తేజోరూపమగుచుండగా “అంతకుముందటి జగత్తు” ఏమైనట్లు ? ఏమీ కాలేదు. అస్సలు జగత్తు అనునదే స్వతఃగా లేదు. మొదలే లేనిది పోయిందనాలా ? విషయం తెలిసిందనాలా?

9) ఇదంతా ఎప్పటినుండి బ్రహ్మము అవగలుగుతోంది ?
- మొట్టమొదట ఇదంతా పరబ్రహ్మమే !
- జగత్తుగా ఆపాదించబడి భ్రమచే పొందబడుచున్నది. అప్పుడు కూడా పరబ్రహ్మస్వరూపమే !
- భ్రమ తొలగితే అంతా స్వస్వరూప పరబ్రహ్మమే ! బ్రహ్మమే అయి, బ్రహ్మముగానే ఉండి,…. ఈ జగత్తు బ్రహ్మముగానే శేషించుచున్నది - అగుచున్నది.

ప్రపంచాధార రూపేణ వర్తతే! అతో జగత్ నహి : బంగారము ఆధారము. ఆభరణము అధేయము. బంగారపు ఆభరణములో అంతా బంగారమే! ‘ఆభరణము’ అనునది ఆకారమాత్రమే! బంగారము కానిదేదీ లేదు. ఆకారమో కల్పితము!

పరబ్రహ్మము పై ‘జగత్తు’ అనబడునది ఆధారపడినదై ఉన్నది. జగత్తుగా కనిపించేదంతా పరబ్రహ్మ తేజో విలాసమే ! (‘ఆభరణము’ అనునది బంగారమునకు ఆకారమాత్ర భ్రమయే అయినట్లు) … పరబ్రహ్మమే సర్వదా ఉన్నది. నేను అట్టి పరబ్రహ్మస్వరూపుడను. ఇక ఈ జగత్తో - వాస్తవానికి లేనే లేదు. నన్ను ఆధారము చేసుకొని మాత్రమే ఉన్నది.

యథా ఇక్షురస సంవ్యాప్త శర్కరా వర్తతే… తథా … అద్వయ బ్రహ్మరూపేణ వ్యాప్తం హమ్ వై జగత్రయమ్ : చెఱకురసమంతటా తీపి (పంచదార) విస్తరించి ఉన్నది కదా ! అదే రీతిగా అద్వయ బ్రహ్మము రూపంగా ఈ త్రిజగత్తులు నేనే వ్యాపించినవాడనై ఉన్నాను.

బ్రహ్మాది కీటపర్యంతాః ప్రాణినో మయి కల్పితాః : సృష్టికర్తయగు బ్రహ్మము మొదలుకొని ఒక కీటక ప్రాణి వరకు అనేక - లోకములు, అనేక జీవరాసులుగా కనిపించేదంతా కూడా - పరబ్రహ్మ స్వరూపుడిగా … నా కల్పన మాత్రమే ! నా సంకల్పము యొక్క భౌతికరూపమే ఇదంతా! ప్రాణశక్తి సర్వదా ఏకమే అయి ఉండి, అనేక - అసంఖ్యాక ప్రాణులుగా ప్రదర్శనమగుచున్నది. నేను ఆత్మను! కనుక సప్రాణ స్వరూపుడను!

బుద్బుదాది వికారాంతాః తరంగాః సాగరే యథా : సముద్ర జలంలో తరంగాలు, బుడగలు ఉండవచ్చు గాక! వాటన్నిటికీ ఆధారం? సముద్ర జలమే కదా ! ఈ జన్మలు, ఆలోచనలు, భావాలు వీటన్నిటికీ ఆధారము ఆత్మయే ! నేను ఆత్మ స్వరూపుడను ! ఆత్మసాగరుడను. తదితరమైనదంతా ఆ సాగరములోని తరంగములు బుడగలు వంటివి!

తరంగ స్థల ద్రవం సింధుః న వాంఛతి యథా, తథా విషయానందవాంఛా మే మా భూత్, ఆనంద రూపతః : సముద్రజలం “నాకు కొన్ని తరంగాలు కావాలి ! మరికొన్ని వద్దు ! అని ఏమైనా కోరుకుంటుందా ? “నాకు ద్రవత్వం వస్తే బాగుండు !” అని … అనుకుంటుందా ? లేదు కదా!

అట్లాగే…,
ఆత్మానందరూపుడనైయున్న నాకు విషయానందములు కావాలని కోరుకోను.

దారిద్ర్య ఆశా యథా నాస్తి సంపన్నస్య - తథామమ : ఒక ఆగర్భ శ్రీమంతుని ఏకైక కుమారుడు అనేక గొప్ప సంపదలు గల సొంత తోట నుండి, తమ భవనమువైపుగా సేవకులతో వెళ్ళుచూ,… ఒక పూరి గుడిశను చూచాడు. ఆ గుడిశ వద్ద రెండు సత్తు కంచాలు బోర్లించబడి కనిపించాయి. “నాకు ఆ రెండూ కావాలిసిందే!” అని సేవకులను పురమాయించాడు. కానీ గుడిశ యజమాని "నేను ఇవ్వను! మా ఇద్దరు పిల్లలు ఊరుకోరు” అని చెప్పి ఇవ్వ నిరాకరించాడు. ఆ శ్రీమంతుని కుమారుడు ఇంటికి వెళ్ళిన తరువాత కూడా ఏడుపు వదలేదు. ఈ జీవుని ఆశ-నిరాశల దుఃఖము ఇట్టిదే! ఒక ధనికుడు “నాకు దారిద్ర్యము వస్తే బాగుండు!” అని కోరుకుంటాడా! సహజానంద రూపుడనగు నేను ఇంద్రియ విషయానందములను కోరుకోను. బ్రహ్మానందమునందు నిమగ్నమై యున్న నేను విషయానందములు లభించాలనుకోవలసిన పనేమున్నది ?

విషం దృష్ట్వా-అమృతం దృష్ట్యా … విషం త్యజేతి బుద్ధిమాన్ ! ఆత్మానమపి దృష్ట్యా - అహమ్ అనాత్మానమ్ త్యజామి : ఎదురుగా విషము, అమృతము ఉన్నాయనుకో ! బుద్ధిమంతుడుడైనవాడు అమృతమును కోరుకుంటాడు గాని, విషమును కోరుకోడు గదా ! ఆత్మానందము ఎట్టిదో గమనించిన తరువాత అనాత్మమగు లౌకిక పేరు - ప్రతిష్ఠలు, భౌతిక సుఖములు… ఇవన్నీ నేను త్యజించి వేసినవాడనై ఉంటున్నాను. ఘటావభాసకో భానుః ఇతి।

ఆకాశంలో సూర్యుడు పరంజ్యోతి స్వరూపుడునగు నేను ఆత్మాకాశ సూర్యుడిని! సర్వసాక్షిని!
నేలపై కుండలోని ప్రతిబింబ సూర్యుడు దేహంలో సాక్షిగా భాసించే జీవాత్మను
ఘటా అవభాసకో భానుః ఘటనాశే న నశ్యతి! దేహావ భాసకో సాక్షీ దేహనాశే న నశ్యతి |

ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నారు.

నేలపై ఒకచోట ఒక మట్టి కుండ ఉన్నది. అందులో జలము. ఆ జలములో సూర్యబింబము ప్రతిబింబిస్తోంది. అవభాసిస్తోంది.

ఏదో కారణం చేత ఆ మట్టి కుండ ఎవరిదో కాలు తగిలి, (లేక) ఏ కర్రయో తగిలి-పగిలిపోయింది. కుండలోని నీరు కాస్తా నేలపాలైనది. ఇప్పుడు ఆకాశంలోని సూర్యుడికి ఏమైనా అవుతుందా ? ఏమీ కాదు కదా !

అట్లాగే స్వయంజ్యోతి స్వరూపుడను, సర్వమునకు కూడా (జగత్ - దేహ - మనో - బుద్ధి - అహంకారాలకు కూడా) ’కేవల సాక్షి’ని అగు నేను ఈ దేహము నశించినప్పుడు కూడా నశించువాడను కాను. దేహముల పతనముచే ఏదీ పొందను. మరేదీ కోల్పోను.

నమే బంధో ! నమే ముక్తిః | నమే శాస్త్రమ్ | నమే గురుః | : సర్వదా సర్వత్రా పరమాత్మతేజో రూపుడనై విరాజిల్లుచున్నట్టి కేవాలాత్మానంద రూపుడునగు నాకు వేరైనదేదీ ఎక్కడా లేదు. నాకు మరొకరుగా బంధువు లేడు! నేను దేనికో బద్ధుడనే కాదు! జీవాత్మగా దేహ ఘటము (కుండ)లో ప్రతిబింబిస్తున్నప్పటికీ వాస్తవము - అనునిత్యము అగు పరస్వరూప సూర్యునిగా నాకు బంధమే లేదు. బంధమే లేని వానికి ‘ముక్తి’ అనే ప్రసక్తి ఎక్కడిది ? కనుక నాకు ముక్తి అనునదే లేదు ! శాస్త్రము (మోక్ష శాస్త్రము) నా గురించి అభివర్ణిస్తోంది. అంతేగాని నన్ను శాస్త్రము కల్పించుట లేదు. అనుభవము నుండి శాస్త్రము వస్తోంది. మరి నాకు శాస్త్రమేమున్నది? శాస్త్రముకంటే ముందే అనుభవి స్వరూపుడనై ఉన్నాను ! కనుక నాకు శాస్త్రము లేదు ! నేను ఏమరిచిన ఆత్మ గురించి గురువు గుర్తు చేస్తున్నారు! ఆత్మస్వరూపముగా నాకు గురువు అనునదీ లేదు! గురు-శిష్యులమగు మేము ఇరువురము ఏకాత్మ స్వరూపులము!

మాయా మాత్ర వికాసత్వాత్, మాయా - అతీతో హమ్ అద్వయః : ఇంద్రియ విషయరూపాలుగా కనిపిస్తున్న దృశ్య జగత్తంతా కూడా నా యొక్క మాయామాత్ర వికాసభావ కల్పనా చమత్కారం! ఇక నేనో ? స్వప్నముగా కనిపించేదంతా స్వప్నము తనదైన స్వప్నద్రష్టకు - అభిన్నము. కానీ స్వప్న ద్రష్ట సర్వదా వేరే కదా! అట్లాగే నేను నాకు ద్వితీయమనునదే లేనట్టి అద్వితీయుడను! అద్వయుడను! మాయకు అతీతుడను ! మాయకు సాక్షిని! మాయ నాదైనట్టివాడను ! మాయను కల్పించుకొని వినోదించువాడను. మాయా రూపంగా కనిపిస్తున్నది నేనే!

ప్రాణాఃచలంతు తత్ ధర్మైః కామైర్వా హన్యతామ్ మనః ॥ స్వభావ ఆనంద పూర్ణస్య ! మమ దుఃఖమ్ కథమ్ భవేత్ ? : ప్రాణశక్తి - దేహమంతా చలించటము, ఇంద్రియాలను వెలిగించటము, ఒక దేహము వదలి మరొక దేహమును ఆశ్రయించటము - ఇటువంటి ధర్మములు (Characteristic features) కలిగి ఉండి, తన వర్తనములు తాను కలిగి వుండి ఉంటోంది. ఇక మనస్సో? ఏవేవో క్రొత్త క్రొత్త అన్యమైనవాటిని కోరుకుంటూ, ఈ దృశ్య జగత్తులో సంచరిస్తూ తన పని తాను చేసుకుంటూ పోతోంది. మరి నేనెవరు? స్వభావంగానే పూర్ణానంద స్వరూపుడను. అటువంటి నాకు ప్రాణచలన ధర్మములవలన గాని, మనో చలన ధర్మముల వలనగాని దుఃఖం (Worry) ఎట్లా - ఏర్పడుతుంది? ఏర్పడదు! వాయుతరంగముల మేఘముల చలనము చేత ఆకాశమునకు వచ్చే లోటేమిటి? మేలేమిటి? కీడు ఏమిటి?

ఆత్మానమ్ అంజసావేద్మి! క్వాపి అజ్ఞానపలాయనమ్! : ఆత్మ యొక్క వాస్తవ స్వరూపమేమిటో కనులు తెరచి తెలుసుకొన్న తరువాత అజ్ఞానము ఎటో పలాయనము చిత్తగిస్తోంది, దీపం వెలుగగానే చీకటి ఎటో పలాయనమగుతీరుగా !

కర్తృత్వమపి మే నష్టమ్ ! కర్తవ్యమేవాపి న క్వచిత్ : “నేను సత్-చిత్-ఆనందరూపమగు ఆత్మను”… అని తెలుసుకొన్న తరువాత, ఇక ”వీటికి నేను కర్తను ! అవన్నీ నేను నిర్వర్తించవలసియున్న కర్తవ్యములు”… ఇటువంటి మనోధర్మాలు నా పట్ల ‘లేనివే’….అగుచున్నాయి. మనస్సు నాకు ఒక శిరోభూషణము. అంతవరకే! అట్టి మనోధర్మాలు నేను కాదు! నాటకములోని సంఘటణలకు పాత్రధారుడు కారణమా? కాదు కదా!

క్షుత్, పిపాసా, అంధ, బధిరస్య, కామ క్రోధాదయో అఖిలాః-లింగ దేహగతాత్! ఏతే అలింగస్య న విద్యతే! : ఆకలి, దప్పిక, కళ్లు కనబడటం, కనబడకపోవటం వినటం-వినలేకపోవటం, కామము, క్రోధము.. ఇవన్నీ లింగదేహము (సూక్ష్మ దేహము) యొక్క ధర్మాలు. ఇక నేనో? అలింగ స్వరూపుడను! ఆత్మజ్ఞానముచే ఆత్మగా ఎరుగబడుచున్నట్టి వాడను! అందుచేత ఆయా ధర్మాలన్నీ నాకు లేవు!

జడత్వ - ప్రియ - మోదత్వ ధర్మాః కారణదేహగాః న సంతి మమ ! నిర్వికార స్వరూపిణః : జడత్వము - చేతనత్వము ప్రియము అప్రియము ఇవన్నీ కారణదేహము (సంస్కార దేహము) యొక్క ధర్మాలు అయి ఉన్నాయి. నేను నిత్య - నిర్వికార స్వరూపుడను. కారణదేహమో, సవికారము. అందుచేత ఆయా కారణ దేహ ధర్మాలేవీ నాకు లేనే లేవు. వాటికి ఆవల నిత్యోదిత స్వరూపుడనై సర్వదా వెలుగొందువాడను.

ఉలూకస్య యథా భానుః అంధకారః ప్రతీయతౌ, స్వప్రకాశే పరానందే తమో మూఢస్య జాయతే : గుడ్లగూబ వెలుతురు చూడలేదు కాబట్టి “సూర్యుడే లేడు” అని అనుకొనే తీరుగా-తమస్సు చేత, మూఢత్వము చేత బుద్ధి ఆవరించబడియున్నప్పుడు “ఆత్మయే లేదేమో !”… అని అనిపించియుండవచ్చు గాక ! వాస్తవానికి ఆత్మజ్యోతి సర్వదా వెలుగుచూనే వున్నది !

చక్షు దృష్టి నిరోధే అభైః ‘సూర్యోనాస్తి“-ఇతి మన్యతే.. తథా అజ్ఞానావృతో దేహీ ”బ్రహ్మనాస్తి”.. ఇతి మన్యతే : ఆకాశంలో మేఘాలు క్రమ్ముకొని ఉండటం చేత ఒక పసిబాలుడు “ఆకాశంలో సూర్యుడే లేడు”.. అని అమాయకంగా అనుకుంటాడు చూచారా! ఆ విధంగా ‘అజ్ఞానము’ అను మేఘముచే బుద్ధి ఆవరించబడినప్పుడు.. ఈ దేహి ”బ్రహ్మమే లేదు” అని అనుకుంటూ ఉండవచ్చు గాక! వాస్తవానికి బ్రహ్మమే ఉన్నది. (బ్రహ్మ సత్యమ్-జగత్ మిధ్యా). జగత్తు స్వకీయ కల్పనా చమత్కారము, ఊహా వైభవము మాత్రమే.

యథా అమృతమ్ - విషాత్ భిన్నమ్ విషదోషైః న విప్యతే… న స్పృశామి జడాత్ భిన్నో, జడదోషాత్ ప్రకాశతే : అమృతము - విషము సర్వదా వేరు వేరే ! అమృతము విషదోషములను పొందదు. అట్లాగే జడమగు దృశ్యము - చైతన్యాత్మ స్వరూపుడనగు నేను ఎప్పుడూ వేరు వేరే ! నిత్య ప్రకాశ స్వరూపుడనగు నన్ను జడము యొక్క దోషము అంటజాలదు.

స్వల్పాఽపి దీపకణికా బహుళం నాశయేత్ తమః, స్వల్పోఽపి బోధోఽపి - అజ్ఞానమ్ బహుళం నాశయేత్ తథా : వ్రేలెడంత చిన్న దీపపు వెలుగుచే గదిలో దట్టంగా విస్తరించియున్న చీకటంతా తొలగించబడుతోంది కదా ! అదే రీతిగా కించిత్ బోధ(ఆత్మ జ్ఞానము)చే బహుళంగా విస్తరించియున్న అజ్ఞాన తమస్సు తప్పక తొలగిపోగలదు.

కాలత్రయే యథా సర్పో రజ్జా నాస్తి, తథామయి : సర్ప రజ్జు భ్రాంతిలో అక్కడ సర్పము ఉన్నదా ? లేదు. త్రాడు మాత్రమే ఉన్నది.

అట్లాగే కాలఃకాల స్వరూపమగు మమాత్మ స్వరూపము యొక్క సమక్షంలో…

అహంకారాది దేహాంతం జగత్ నాస్తి అహమ్ అద్వయః : అద్వయుడనగు పరతత్త్వ స్వరూపుడనై నేనే ఉన్నాను. ఇక అహంకారము మొదలుకొని చిత్త-బుద్ధి-మనో విషయములతో సహా ఈ పాంచ భౌతిక దేహము వరకూ గల జగత్తు అనబడునదేదీ మొదలే లేవు. ఆత్మ స్వరూపుడను, అద్వితీయుడను అగు నాకు వేరుగా ఎక్కడా ఏదీ లేనే లేదు. (స్వప్నంలో వస్తుజాలమెక్కడిది?)

చిద్రూపత్వాత్ న మే జాడ్యమ్ : సర్వదా కేవల చిత్ చైతన్య స్వరూపుడనై ఉన్నాను! అట్టి నాకు జడత్వమనునది ఎప్పుడూ లేదు. ఉండదు.

సత్యత్వాత్ న అనృతమ్ మమ : సత్య స్వరూపుడనగు నాకు చెంది అసత్యమనునది ఏదీ లేదు. సత్యస్వరూపుడనగు నేనే ఈ మనో-బుద్ధి-చిత్త-అహంకార-దేహ-జగత్ దృశ్యములుగా వెలుగొందుచున్నాను! సర్వము నేనే! అందుచేత ఏదీ అనృతము కాదు!

ఆనందత్వాత్ న మే దుఃఖమ్ : స్వతఃగా ఆత్మానంద స్వరూపుడనగు నాకు దుఃఖము ఉండటానికి వీలే లేదు! అవకాశమే లేదు!అజ్ఞానాత్ భాతి సత్యవత్! ఒకవేళ దుఃఖము ఉంటే అది అజ్ఞానము కారణంగా మనస్సుకు మాత్రమే ఉనికి కలిగి ఉన్నది.

సర్వదా సర్వత్రా ఆత్మగా నేనే సత్యము! నిత్యము! సకలము!
మనస్సు ఎట్లా ఉన్నా కూడా, అది ఆత్మ ధర్మము కాదు! ఆత్మయొక్క ఒక చమత్కారము మాత్రమే!

ఆత్మ స్వరూపబోధాత్మకమైనటువంటి ఈ ఆత్మాబోధోపనిషత్ ముహూర్తకాలము (64 ని॥ కాలము) ఉపాసించినా కూడా మరల జీవుడుగా అవటము అనే పునరావృత్తి దోషమే ఉండజాలదు. ఆత్మానంద స్వరూపుడై ఆ అధ్యయనుడు వెలుగొందుచున్నాడు.

🙏 ఇతి ఆత్మబోధోపనిషత్ సమాప్తః
ఓం శాంతిః శాంతిః శాంతిః 🙏