[[@YHRK]] [[@Spiritual]]

Bhikshuka Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


శుక్ల యజుర్వేదాంతర్గత

11     భిక్షుకోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో॥ భిక్షూణాం పటలం యత్ర విశ్రాంతిమ్ అగమత్ సదా
తత్ త్రైపదం బ్రహ్మతత్త్వం బ్రహ్మమాత్రం కరో తు మామ్||

(కుటీచక - బహూదక - హంస - పరమహంస జ్ఞానతేజో మూర్తులు. అజ్ఞానాంధకారమును పటాపంచలు చేయువారు-అట్టి) భిక్షువుల పటలము (గుంపు) ఏ స్థానమునకు చేరిననా…. అనునిత్యమైనట్టి, తెంపులేనటువంటి ఆత్మ సుఖ విశ్రాంతిని ఆస్వాదిస్తున్నారో, అట్టి పరమపద స్థానముకొరకై వారినందరినీ మేము శరణు వేడుచున్నాము. స్తుతించుచున్నాము. బ్రహ్మతత్య (త్వమ్ తత్ బ్రహ్మమే) రూపమగు బ్రహ్మసూత్రమును చేబూని ఉపాసనావిధిని నిర్వర్తించుచున్నాము. ఈ సర్వమునూ బ్రహ్మతత్వముగా బ్రహ్మసూత్రముగా సందర్శించుటకై వారికి ప్రణిపాతులము అగుచున్నాము.

భిం = అంధకారమ్
క్షుకం = నిర్మూలన చేయు మహనీయులు

ఓం భిక్షూణాం పటలాయ నమోనమః
ఓం గౌతమాయ నమః
ఓం భరద్వాజాయ నమః
ఓం యాజ్ఞవల్క్యాయ నమః
ఓం వసిష్ఠాయ నమః
ఓం సకల కుటీచ భిక్షుకాభ్యః నమః।
ఓం సంవర్తక, అరుణి, శ్వేతకేతు, జడభరత, దత్తాత్రేయ, శుక, వామదేవ, హరీతకే ఇత్యాది పరమహంసాభ్యః - నమో నమో నమో నమః ||

సర్వ భిక్షక - పరమహంస జనే నమో నమో నమో నమః ||


1.) ఓం! అథ భిక్షూణాం మోక్షార్థినాం
“కుటీచక”, “బహూదక”, “హంస”
“పరమహంస” చ ఇతి చత్వారః॥

ఓం కార నాదమయుడగు పరమాత్మకు నమస్కరిస్తూ…,
మోక్షార్థులగు భిక్షక సన్యాస యోగులు ‘4’ విధములైన వారుగా చెప్పబడుచున్నారు.

1.) కుటీచక భిక్షక
2.) బహూదక భిక్షక
3.) హంస భిక్షక
4.) పరమహంస

(వీరి సంచార ప్రదేశము అష్టవిధ ప్రకృతి - భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనో, బుద్ధి, అహంకారములు).

కుటీచకో నామ…,
గౌతమ, భరద్వాజ,
యాజ్ఞవల్క్య, వసిష్ఠ,
ప్రభృతయో…,
అష్టౌగ్రాసాం
చరంతో
యోగమార్గే ‘మోక్షమ్’ ఏవ ప్రార్థయంతే!

1.) కుటీచక భిక్షక యోగులు
కుటీచక మోక్షార్థ భిక్షక యోగులకు దృష్టాంతంగా :
1.) గౌతమ మహర్షి 2.) భరద్వాజ మహర్షి 3.) యాజ్ఞవల్క్య మహర్షి 4.) వసిష్ఠ మహర్షి … మొదలైనవారు.

వీరు ‘8’ గ్రాసములలోనూ చరించువారై (8 ముద్దలు భుజించువారై) యోగమార్గములో ఉండి ’మోక్షము’ మాత్రమే ఉపాసించువారు.

2.) అథ ‘బహూదకా’ నామ
త్రిదండ కమణ్డలు శిఖా
యజ్ఞోపవీత కాషాయవస్త్ర ధారిణో
బ్రహ్మర్షి గృహే,
మధు మాంసం వర్జయిత్వా
అష్టా గ్రాసాన్, భైక్ష ఆచరణం కృత్వా,
యోగమార్గే మోక్షమేవ ప్రార్థయంతే|

2.) బహూదక మోక్షార్థ భిక్షక యోగులు
త్రిదండము, కమండలువు, శిఖ, యజ్ఞోపవీతము, కాషాయ వస్త్రములు ధరించినవారై ఉంటున్నారు.

బ్రహ్మర్షి గృహములందు భిక్షాచరణము (భిక్షాటనము) చేస్తూ ఉంటారు.

మధువు - మాంసములను వర్ణించినవారై (వదలినవారై), ‘8’ గ్రాసములను (8 ముద్దలను) భిక్షాటనముచే నిర్వర్తిస్తూ (తినుచూ), ‘యోగమార్గము’ లో ’మోక్షము’ను కోరుకొనువారై ఉంటున్నారు.

అథ ‘హంసా’ నామ,
గ్రామ ఏక రాత్రం,
నగరే పంచ రాత్రం,
క్షేత్రే సప్త రాత్రం,
తదుపరి న వసేత్I
గోమూత్ర గోమయ ఆహారిణో
నిత్యం చాంద్రాయణ పరాయణా
యోగమార్గే మోక్షమేవ ప్రార్థయంతే!

3.) “హంసా” మోక్షార్థ భిక్షక యోగులు
చాంద్రాయణమును ఆచరించువారు.
ఒక గ్రామములో ఒక రాత్రి మించి ఉండరు.
ఒక నగరములో ‘5’ రాత్రులు దాటి నివశించరు.
ఒక క్షేత్రములో ‘7’ రాత్రులు మించి వసించరు.
‘గోమూత్రము’ ‘గోమయము’… ఇవి ఆహారముగా కలవారై, ఎల్లప్పుడు చాంద్రాయణ పరాయణులై ఒకచోట నిలవక ఆకాశములో చంద్రునివలె
సంచారములు చేస్తూ వుంటారు.
వీరు ‘యోగమార్గము’లో మోక్షమును పొందు విధిని ఉపాసిస్తున్నవారై ఉంటారు.

అథ  ‘పరమహంసా’ నామ
సంవర్తక, అరుణి, శ్వేతకేతు,
జడభరత, దత్తాత్రేయ, శుక,
వామదేవ, హారీతక ప్రభృతయో…,
అష్టా గ్రాసాన్ చరంతో,
యోగమార్గే మోక్షమేవ ప్రార్థయంతే
వృక్షమూలే శూన్యగృహే శ్మశానవాసినో వా,
సామ్బరా వా, దిగంబరా వా!

4.) “పరమహంసా” భిక్షక యోగులు
పరమహంసా యోగులకు దృష్టాంతము:
సంవర్తకుడు, అరుణి, శ్వేతకేతు, జడభరతుడు, దత్తాత్రేయుడు, శుకుడు, వామదేవుడు, హారీతకుడు… మొదలైనవారు.

వీరు అష్ట గ్రాసములను స్వీకరించువారై (8 ముద్దలను గ్రహిస్తూ) యోగమార్గములో ’మోక్షము’ను ఆశ్రయిస్తు, ఆరాధిస్తూ, కోరుకొంటూ ఉంటారు. వృక్షమూలముల లోనో (చెట్టు మొదట్లో), శూన్య గృహములలోనో, శ్మశానవాసులుగానో ఉంటారు. వస్త్రములను ధరించియో, ధరించకయో ఉంటారు.

న తేషాం ధర్మ - అధర్మౌ,
లాభ - అలాభౌ, శుద్ధ - అశుద్ధౌ।
ద్వైతవర్జితాః సమ-లోష్ట-ఆశ్మ-కాంచనాః
సర్వవర్ణేషు భైక్ష - ఆచరణం కృత్వా,
సర్వత్రా ఆత్మైవ ఇతి పశ్యంతి ||

ఈ భిక్షువులంతా కూడా…, ధర్మ-అధర్మములు, లాభ-అలాభములు, శుద్ధ-అశుద్ధములు-అను ద్వైతములకు అతీతులై ఉంటారు. వదలివేసి ఉంటారు.

(ద్వైత వర్జితులై) మట్టి - రాయి - బంగారములను ఒకే దృష్టితో చూచువారై ఉంటారు.

వీరు సర్వ వర్ణములవారి గృహములలోను భిక్షాటనం చేస్తూ… సర్వత్రా ఆత్మతత్త్వమునే దర్శించువారై ఉంటారు. వీరికి ’ఆత్మ’కు వేరై వర్ణాశ్రమ ధర్మములు అగుపించవు.

3.) అథ జాతరూప ధరా।
నిర్ద్వంద్వా, నిష్పరిగ్రహా|
శుక్లధ్యానపరాయణా! ఆత్మనిష్ఠాః|
ప్రాణసంధారణార్థం యథోక్తకాలే
భైక్షమ్ ఆచరంతః||
శూన్య ఆగార దేవగృహ
తృణ కూట, వల్మీక వృక్షమూల,
కులాలశాలా, అగ్నిహెూత్రశాలా
నదీ పులిన, గిరికందర, కుహర
కోటర, నిర్ఝర స్థండిలే!
తత్ర బ్రహ్మమార్గే,
సమ్యక్ సంపన్నాః, శుద్ధ మానసాః,
‘పరమహంస’ ఆచరణేన
సన్న్యాసేన దేహత్యాగం కుర్వన్తి…!
తే ‘పరమహంసా’ నామ।
ఇత్యుపనిషత్

ఈ భిక్షువులంతా కూడా జాతరూపధరులై (అప్పుడే పుట్టిన బిడ్డవలె) జగత్ రహితులై ఉంటారు.
నిర్ద్వంద్వులై, ద్వంద్వాతీతులై ఉంటారు.
ఏదీ స్వీకరించనివారై, నిష్పరిగ్రహులై ఉంటారు.
నిర్మలమగు ఆత్మ (శుక్ల) ధ్యానపరాయణులై, ఆత్మయందు మాత్రమే నిష్ట కలిగియున్నవారై ఉంటారు.
ఈ దేహములో ప్రాణములను నిలిపి ఉంచటానికి మాత్రమే ఉద్దేశ్యించినవారై ‘భిక్షాటనము’ ఆచరిస్తూ ఉంటారు.
వారు ఉండే చోటులు : శిథిలమైన గృహములు (శూన్యాగారములు), దేవగృహము (గుడి), గడ్డి - పుట్ట - చెట్లు స్థలములలోను, కుమ్మరివారి ఇల్లు, అగ్ని హెరాత్రశాల….మొదలైనవి. నదీ తటములు, ఇసుక తిన్నెలు, కొండగుహలు, చెట్టు తొర్రలు, సెలయేళ్ళ గట్టులు,.. (ఇటువంటి) మొదలైనవి కూడా!

ఇక్కడ - అక్కడ ‘బ్రహ్మమార్గము’లో సంచరిస్తూ
- సమ్యక్ (సమరసభావ - సర్వత్రా సమదర్శన) సంపన్నులై,
- శుద్ధ మనస్సు - పరిశుద్ధ హృదయముతో కూడుకొన్నవారై,
- ‘పరమహంస’ ఆచార పరాయణులై,
- సత్ న్యాస రూప సన్న్యాసము అవధరించి,
- భౌతికత్వమంతా త్యజించివేసినవారై (దేహత్యాగనిరతులై)
…. ఉంటారు.

వారు పరమహంసలై భూదేవతను పులకింపజేస్తూ ఉంటారు.

ఇతి
భిక్షుకోపనిషత్
ఓం శాంతిః శాంతిః శాంతిః

nandi


శుక్ల యజుర్వేదాంతర్గత

11     భిక్షుక ఉపనిషత్

అధ్యయన పుష్పము

ఓం….ఆదిభిక్షుభ్యోం నమః ‘ఆది భిక్షువు’ అగు పార్వతీ మాతా సహిత పరమశివునికి నమస్కరిస్తూ…,

సర్వ సంసార బంధములను మొదలంట్లా త్రెంచివేసి-బంధనములు తొలగిన మదపుటేనుగు స్వేచ్ఛగా, ఆనందంగా అడవిలో సంచరించు రీతిగా-మోక్షాశయులై, మహదాశయులై, యోగానంద-స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార ప్రదేశములో సంచరించు “భిక్షక మహామహితాత్మ యోగ సంపన్న పటలము”నకు నమస్కరిస్తున్నాము. వారి గురించి - భక్తి - ప్రపత్తులతో ఇప్పుడు చెప్పుకుంటున్నాము.

కైవల్యపదరూపమగు మోక్షార్హులైనట్టి (మోక్షమే సర్వదా ఆశయముగా కలిగి ఉన్నట్టి) భిక్షకులు …. (భి - అంధకారమును, క్షుకులు - క్షయింపజేయువారు) గురించి, 4 విధములైనవారుగా విభజించి (మోక్షశాస్త్ర ప్రవక్తలు) వర్ణించుచున్నారు.

1.) కుటీచక భిక్షుకులు 2.) బహూదక భిక్షుకులు 3.) హంస భిక్షుకులు 4.) పరమ హంసలు

కుటీచక భిక్షుకులు (లేక) కుటీచక పరివ్రాజకులు

ఈ భిక్షుక పరివ్రాజక కుటీచకులు…, అష్టే గ్రాసాంశ్చరంతో - ‘8’ గ్రాసములందు సంచరిస్తూ ఉంటారు.

ఎనిమిది గ్రాసములు భుజిస్తూ ఉంటారు. [మూలాధార - స్వాధిష్ఠాన - మణిపూరక - అనాహత - విశుద్ధ - ఆజ్ఞా - బ్రహ్మరంధ్ర - సహస్రార (ఊర్ధ్వ తురీయాతీత)] … ఈ ‘8’ గ్రాసములు స్వీకరిస్తూ యోగాన్వేషకులగు సర్వజనులకు (ఆయా వేరు వేరు అష్ట దళములలో ఒక్కొక్క దళములో మాత్రమే చిక్కి, సంసార రోగమును అనుభవించు సంసార జీవులకు) తోడై, ఆత్మయోగ జ్ఞానమును సూచిస్తూ ఉంటారు. సద్గురువులై లోకాలలో సంచరిస్తూ, సాధకులకు యోగసహాయము అందజేస్తూ ఉంటారు.

అష్టదళ పరివేష్టితులై ఉంటూ, యోగ మార్గేణ మోక్షమేవ ప్రార్థయంతే! - యోగ మార్గములో మోక్ష సాధనాపరులు మోక్షమార్గ దర్శకులు అయి ఉంటున్నారు.

- సహస్రారము అనబడు 12 అంగుళములుగా విస్తరించియున్న తురీయాతీత నిర్మల - అఖండాత్మ స్థానములో యోగమార్గముగా ప్రవేశించటము.

ఇట్టి యోగ మార్గాణ్వేషకులకు సాధక - మార్గదర్శక గురువులై మోక్ష సాధనకు దారి చూపుతూ ఉండటము….
ఇవన్నీ నిర్వర్తిస్తూ ఉంటారు. (సవ్య-అపసవ్య మార్గస్థ, సర్వ అపత్ వినివారిణీ|)

మహాత్ములగు గౌతమ మహర్షి, భరద్వాజ మహర్షి, యాజ్ఞవల్క్య మహర్షి, వసిష్ఠ మహర్షి మొదలైన వారంతా కుటీచక భిక్షకులు.

కుటీచము → దేహమునందు (దేహాంతర్గత యోగ సిద్ధులు)

భిక్షుకులు → భిక్ష ప్రసాదించి భి-అంధకారము తొలగించే మార్గదర్శకులు. మోక్షమే ఆశయముగా కలవారు. దేహమే వీరి ప్రయోగశాల.

బహూదక భిక్షుకులు (విశ్వ - విశ్వాంతర సంచార యోగ సిద్దులు)

బహూదకానామ్…
- ’8’ గ్రాసములందు సంచరిస్తూ ఉంటారు.
- త్రిదండము, కమండలువు, శిఖ, యజ్ఞోపవీతము, కాషాయవస్త్ర ధారణ గుర్తులుగా కలిగి వుంటారు.
- బ్రహ్మర్షి గృహములలో సంచారులై ఉంటారు. బ్రహ్మలోకాంతర్గతంగా సర్వలోకములు సందర్శించువారు.
- మధు మాంసములను విసర్జించి ఉంటారు. (మనో-ఇంద్రియ పరిధులను దాటివేసి ఉంటారు).
- అష్ట గ్రాసములను (హృదయాంతర్గత అష్టదళములలో - Eight Fields of the Flower of Heart) భిక్షాచరణము (ప్రకాశమానులై
అంధకారము తొలగించే ఉనికి - ఆచరణ) కలిగి ఉంటారు.
- యోగ మార్గములో ఉండి మోక్ష మార్గమును ఉపాసించు వారు.
- మోక్ష మార్గమును ఆశ్రితులకు చూపువారు అయి ఉంటారు.

త్రిదండి :  (మనో దండ, వాక్ దండ, కర్మ దండములు అను) ‘3’ దండములు గల సన్న్యాసి. ఈ త్రిదండముల ఉపకరణముతో సత్యమును శోధించి సిద్ధింపజేసుకొన్నట్టివారు.

కమండలువు : సన్యాసులు జలము ఉంచుకొను పాత్ర. (లోకములోని జీవితమును పాత్రగా భావిస్తూ సదా ఆత్మను సహజ స్వరూపముగా భావించు యోగస్థితి).

శిఖ : సిగజుట్టు, శాస్త్ర సారముల గురించిన ఎరుకకు సంబంధించిన సంజ్ఞ. శిఖను నిర్వకల్ప పుష్పమాలికను చుట్టి, ప్రకృతి పీఠముపై ఆశీనులై ఉండువారు.

యజ్ఞోపవీతము : దేహము - దృశ్యములతో కూడిన జగత్తును యజ్ఞభావనతో దర్శించువాడు. త్రిగుణములను సృష్టి యజ్ఞ విభాగములుగా ఎరుగుచున్నవారు. క్రియాశీలకమగుచున్నప్పుడు యజ్ఞభావమును ఆశ్రయించి ’వ్యక్తిగతము’ను త్యజించి, సర్వగతులై సంచరించువారు.

కాషాయ వస్త్ర ధారణమ్ : సర్వమును సన్న్యసించి, విరాగి అయి ఉండటమును గుర్తుగా కలవారు.

బ్రహ్మర్షి గృహే చరంతమ్ : బ్రహ్మర్షుల బ్రహ్మము గురించిన ఋత్-సత్యవాక్కులను ("తత్ త్వమ్ | సోఽహమ్। జీవో బ్రహ్మేతి నా పరః। అయమాత్మా బ్రహ్మ త్వమేవాహమ్ | మొదలైన మహావాక్యోచ్ఛారణ) కలిగి ఉన్నవారు. బ్రహ్మర్షుల అధ్యాత్మ సంప్రదాయమునందు నివసిస్తూ, ప్రవచించువారు. ‘బహ్మర్షి గృహము’నందు ఆవాసము కలిగి ఉండువారు. ఆనంద జలధిలో స్నానము చేసి ’సుజ్ఞాన’ వస్త్రము ధరించువారు.

మధుమాంసం వర్జయిత్వా : ఇంద్రియములకు ప్రియమైనవి త్యజించి ఇంద్రియములను యోగ మార్గములో నియామకము చేయువారు. ప్రేయమును త్యజించి శ్రేయమును ఆశ్రయించువారు. జనులకు అది గుర్తు చేయువారు.

అష్టో గ్రాసాన్ భైక్షాచరణమ్ : అష్టగ్రాసములను (ముద్దలను) భిక్షగా స్వీకరించువాడు.

’హంసా’ భిక్షుకులు

వీరు ….. గ్రామము (ఇంద్రియములలో) ఒక రాత్రి!
నగరములో (అంతఃకరణములో) ‘5’రాత్రులు!
పుణ్యక్షేత్రములో…. (ఉపాసనా స్థానములలో) ‘7’ రాత్రులు!
- ఇంతకు మించి ఒకచోట నివాసము కలిగి ఉండరు.

గో మూత్రము, గోమయము (యథాప్రాప్తములైన వాటిని) ఆహారముగా కలిగి ఉంటారు.
(గోమూత్ర గోమయ ఆహారిణో…. సత్యమును చూపుట, ధర్మనిరతి, పరతత్త్వము, తద్వారా పరబ్రహ్మ చైతన్యమును బోధించువారు).

నిత్యం చాంద్రాయణపరాయణా : ఆకాశంలో పూర్ణచంద్రుడు ఒకచోట నిలువకుండా ఆకాశమంతా సంచారములు చేస్తూ ఉంటారు కదా! అట్లాగే ఈ హంసలు ఒకచోట నిలిచిపోయి ఉండక,.. సంచారములు చేస్తూ చాంద్రాయణ పరాయణులై ఉంటారు. 14 లోకములు వారికి విహార స్థానములులై, వారు బ్రహ్మమును ఎరిగి సంచారములు నిర్వర్తిస్తూ ఉంటారు.

పరమహంసలు

పరమ హంసల పటలములోనివారగు కొందరు మహనీయులను ముందుగా స్మరిస్తూ త్రిపదక్షిణ పూర్వ సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాము.

ఓం సంవర్తకాయనమః | అరుణియే నమః ॥ శ్వేతకేతాయన నమః| జడ భరతాయ నమః దత్తాత్రేయాయ నమః| శుకదేవాయ నమః| వామదేవాయ నమః।  ‘సో పరమ్ ఏవ అహమ్’ ఇతి పరమహంస॥ సోఽహమ్ పరమమ్ ఇతి పరమహంస॥

ఈ ఈ మొదలైనవారంతా పరమహంసలు! ఇహమును పరతత్త్వమునందు లయింపజేసి పరమహంసలై ’మానస సరోవరము నందు శాంతి - ఆనందములతోనూ, ఆత్మానందముతోను కూడి, లీలగా విహరించు హంసలు.

వీరు హృదయాంతరములోని అష్టదళ పద్మమునందు సంచరిస్తూ అష్టాగ్రాసాన్ చరంతో,… యోగ మార్గే మోక్షమేవ ప్రార్థయంతే॥ యోగ మార్గముగా మోక్షమే పరమార్ధముగా పరమలక్ష్యముగా, స్వభావముగా కలిగియుండువారు.

మూలాధారము నుండి → ఆజ్ఞా చక్రము వరకు,
ఆజ్ఞా చక్రము నుండి → బ్రహ్మరంధ్ర స్థానము - సహస్రారముల వరకు,
అద్దానిని దాటిన స్వయం ప్రకాశ సహస్రార -ఊర్ధ్వ ద్వాదశాంగుళ స్థానము వరకు,
యోగ మార్గములో మార్గదర్శకులై ఆశ్రితులకు సంసారబంధములనుండి విముక్తికై త్రోవచూపువారు.

భిక్షుకయోగ లక్షణములు

పరమహంసలగు భిక్షుక - తదితర భిక్షుకయోగులు ఉండే స్థలములు :

ఎటువంటి సాంసార లౌకిక విషయములు చేరని ఏకాంత ప్రదేశములు ఎన్నుకొంటూ వుంటారు.

గోచీ ధరించి గాని, దిగంబరులైకానీ చరిస్తూ ఉంటారు. వారిపట్ల “ధర్మ-అధర్మములు, లాభ-అలాభములు, శుద్ధ - అశుద్ధములు….” మొదలైన ద్వంద్వములకు స్థానమే ఉండదు.

సమ ‘లోష్ణ-అశ్మ-కాంచనాః’! వారి దృష్టికి మట్టి-రాయి-బంగారముల భేదము కనిపించదు. 

“మేము ఈ వర్ణముల వారి వద్ద భిక్ష స్వీకరిస్తాము. ఆ వర్ణములవారి వద్ద తీసుకోము” అను నియమము కూడా ఏమాత్రమూ కలిగి ఉండరు. వర్ణాశ్రమ ధర్మములకు నిబద్ధులు కాక, అతీతులై ఉంటారు. సర్వమూ బ్రహ్మమునందు సంయమింపజేస్తూ ఉంటారు.

సదా సర్వదా సర్వత్రా ఆత్మగానే సర్వమును దర్శిస్తూ ఉంటారు. ‘సర్వత్రా ఆత్మైవ’ ఇతి పశ్యంతి!

ఇంకా కూడా ఆ పరమహంసలు…., జాతరూపధరా! అప్పుడే పుట్టిన పసిబిడ్డవలె ప్రపంచములో ఏవిషయమునకు సంబంధించనివారై ఉంటారు. విషయములన్నీ వారిపట్ల అవిషయమై ఉంటాయి. ‘జననక్షణయోగము’ను ఉపాసించువారై ఉంటారు.
(జనించిన క్షణంలో ఉన్న తీరుగా ఇప్పుడు యోగము ద్వారా… అభ్యాసము చేయటము).

నిర్ద్వంద్వా :  ద్వంద్వమోహ వినిర్ముక్తులై ఉంటారు.

ఇటువంటి ఆయా ద్వంద్వములన్నిటినీ అధిగమించినవారై సర్వత్రా ఏకవస్తువు అగు అఖండాత్మయే ఈ సర్వముగా సందర్శిస్తూ ఉంటారు.

నిష్పరిగ్రహా : ఈ పాంచభౌతిక వస్తు ప్రపంచములో ఏదీ పరిగ్రహించరు. “ఈ ఇంద్రియ దృశ్యము నాకు చెందినది కాదు. (సర్వ సాంసారిక విషయలపట్ల కూడా దీనికి నేను చెందినవాడను కాను”….. అను ఎరుకను - సుస్పష్టముగా, నిర్దుష్టముగా కలిగి, శంకారహితులై ఉంటారు. “స్వప్నంలో కనిపించిన ’5’ అంతస్తుల మేడ ఎవరికి చెందింది? అసలు వాస్తవమైతే కదా! ఈ జాగ్రత్ జగత్ అట్టిదే!” అని గమనించువారై ఉంటారు.

శుక్లధ్యానపరాయణా :  సర్వదా శుక్ల (ఆత్మ) ధ్యాన పరాయణులై ఉంటారు. “ఆత్మౌపమ్యేవ సర్వత్రః” సర్వము సర్వదా ఆత్మయే అను ‘ధ్యాస’ను విడువరు.

ఆత్మనిష్ఠా :  ఎల్లప్పుడూ సర్వము ఆత్మ స్వరూపముగా దర్శించుటయందే నిష్ఠ కలిగి ఉంటారు. తదితరమైన లౌకిన నిష్ఠ-నియమములతో వారికి పని ఉండదు. ఏది చేసినా, మాట్లాడినా, ఎక్కడ చరించినా, ఏది ఎట్లా ఉన్నా, ఎవ్వరు ఏ రీతిగా స్పందన - అస్పందనములు కలిగి ప్రవర్తించినా, ఎవ్వరు ఏ గుణములు కలిగి ఉన్నాసరే, “వీరు సర్వదా స్వతఃగా మమాత్మ స్వరూపులేకదా!” అను అవగాహనను కించిత్ కూడా వదలి ఉండరు.

ప్రాణసంధారణార్థం యథోక్త కాలే ‘భైక్షమ్’ ఆచరంతః : "ప్రాణములను నిలుపుకోవటానికే ఆహారము” అను భావనను కలిగి ఉండి, తగిన సమయములో వారు భిక్షాటన చేస్తూ ఉంటారు.

దేహ త్యాగ సందర్భము

బ్రహ్మమార్గే సమ్యక్ - సంపన్నాః శుద్ధ మానసాః పరమహంస-ఆచరణేన - దేహత్యాగం కుర్వన్తి !

వారు “సర్వము బ్రహ్మమే” అను ఎరుకచే సునిర్మితమై బ్రహ్మమార్గములో ….,

- సంయోగ - వియోగాతీతమైన, సమరస భావనా సమన్వితమైన అఖండాత్మ-భావనా సుసంపన్నులై,
- ఆలోచనలకు ముందే ఉండి ఉన్నట్టి శుద్ధ-విషయరహిత-పరమ నిర్మల మనస్సుతో కూడి ఉన్నవారై,

పైన మనము చెప్పుకొను పరమహంస లక్షణ సమన్వితులై, ప్రశాంతముగా, ఆనందముగా, క్రీడా వినోదముగా ఉంటారు.

ఏతత్ మృత్యు సమయమునందు శిథిల వస్త్రమును విడచు రీతిగా పాంచభౌతిక దేహమును త్యజిస్తారు.

శూన్యాగార - దేవగృహ - తృణకూట - వల్మీక వృక్షమాల - కులాలశాలా - అగ్నిహెూత్ర శాలా నదీ పులిన - గిరికందర - కుహరకోటర నిర్ఘర స్థండిలే… తత్ర… సమ్యక్ సంపన్నాః శుద్ధ మానసాః పరమహంసా ఆచరణేన సన్న్యాసేన దేహత్యాగం కుర్వంతి!

బ్రహ్మ మార్గములో సుస్థితులైన ఆ యతీశ్వర పరమహంసలు “మేము ఇక్కడే ఉండాలి. ఇక్కడే మరణించాలి. అక్కడ కాదు!” … ఇటువంటి వేదన భావములు కలిగి ఉండరు. అంతేకాదు! ఈ భౌతిక దేహమును ఎల్లవేళలా సుదూరంగా విడచి వచ్చిన వస్త్రమువలె సందర్శించువారై ఉంటారు.

పాడుపడిన ఇల్లు, దేవాలయము, గడ్డి ప్రదేశము, పుట్ట, చెట్టు మొదలు, కుమ్మరివాని ఇల్లు, అగ్నిహెూత్ర శాల, నదీ తీరములోని ఇసుక తిన్నెలు, కొండగుహలు, చెట్టు తొర్రలు, సెలయేళ్ళగట్లు మొదలైన ఎక్కడైనా వారికి నివాసమునకు అర్హమైన ప్రదేశమే! అట్లాగే భౌతిక దేహ త్యాజ్యమునకు కూడా అవన్నీ అర్హమైన ప్రదేశములే!

ఎవ్వరెవ్వరైతే ఈ ఉపనిషత్‌లో చెప్పుకొన్న అంతర్లక్షణములు ఆశ్రయించి, మహదాశయశీలురై మానసికంగా అభ్యాస వశము చేసుకుంటారో, అట్టి ఏ ఆశ్రమవాసులైనా కూడా… వారు పరమహంసలే! పరమహంస స్థానము చేరుటకై పరమహంసలే మనకు మార్గదర్శకులు.

🙏 ఇతి భిక్షుక ఉపనిషత్ 🙏

సారాంశము :  మనమంతా భిక్షుకులమై ఆత్మజ్ఞానభిక్ష కొరకై ఈఈ దేహగృహములను ఆశ్రయిస్తున్నాము. ఈ ఉపనిషత్తులో చెప్పిన
రీతిగా పరమహంసలమై దేహము త్యజించాలి - అని ఋషిపుంగవుల సూచన!

ఓం శాంతిః! శాంతిః! శాంతిః!