[[@YHRK]] [[@Spiritual]]

Hamsa Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


శుక్ల యజుర్వేదాంతర్గత

18     హంసోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


హంసాఖ్యోపనిషత్ప్రోక్తనాదాలిర్యత్ర విశ్రమేత్ .
తదాధారం నిరాధారం బ్రహ్మమాత్రమహం మహః ..
శ్లో॥ హంసాఖ్య ఉపనిషత్ ప్రోక్త నాదా విః యత్ర విశ్రమేత్,
తత్ ఆధారమ్ నిరాధారమ్ బ్రహ్మమాత్రమ్ అహమ్ మహః ॥
హంసోపనిషత్ వివరించు - ‘హంసోఽహంస’ నాదము ఎక్కడ లయించినదగుచున్నదో, అట్టి సర్వమునకు ఆధారమై, తాను మాత్రం నిరాధారము అయినట్టి బ్రహ్మమే నేనే! "ఆ మహత్తరమగు బ్రహ్మము యొక్క వర్ణనము నా గురించే!” అని ఉపనిషత్ సూత్రీకరించుచున్నది!


గౌతమ ఉవాచ .
భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద .
బ్రహ్మవిద్యాప్రబోధో హి కేనోపాయేన జాయతే .. 1..
1.) గౌతమ ఉవాచ -
(హే సనత్ కుమార గురూ!)
భగవన్! సర్వధర్మజ్ఞ!
సర్వశాస్త్ర విశారద।
బ్రహ్మవిద్యా ప్రబోధో హి,
కేన ఉపాయేన జాయతే ॥

గౌతమ మునీంద్రులు :
హే భగవన్! సనత్కుమార శ్రీ గురుభ్యోనమః! సర్వ ధర్మములు ఎరిగి ఉన్నట్టి మహాత్మా! ఆత్మ-జీవుడు ఈశ్వరుడు -దేహము-మనోబుద్ధి చిత్త అహంకారాలు వాటివాటి ధర్మముల గురించిన తత్త్వజ్ఞులుగా లోక ప్రసిద్ధులగు మహనీయా! సర్వ శాస్త్రముల ఉద్దేశ్యము, సారవిశేషము ఎరిగినట్టి సర్వశాస్త్ర విశారదా!

మాకు బ్రహ్మవిద్య యొక్క ప్రబోధము ఎట్లా సులభముగా లభిస్తుందో…, దయచేసి బోధించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.


సనత్కుమార ఉవాచ .
విచార్య సర్వవేదేషు మతం జ్ఞాత్వా పినాకినః .
పార్వత్యా కథితం తత్త్వం శృణు గౌతమ తన్మమ .. 2..
2.) సనత్కుమార ఉవాచ -
విచార్య సర్వ ధర్మేషు మతమ్
జ్ఞాత్వా, పినాకినః,
పార్వత్యా కథితమ్ తత్త్వమ్
శృణు, గౌతమ!
తత్ మమ।

శ్రీ సనత్కుమారుడు :
నాయనా! గౌతమా! నీవు అడిగినట్లే, ఒకసారి జగన్మాతయగు పార్వతీదేవి భగవానుడగు పినాకినిని (పరమశివుని) ప్రశ్నించటం జరిగింది. శివభగవానుడు ఆ ప్రశ్నకు ఇచ్చిన సమాధానము - ఒకానొక సందర్భములో అమ్మవారు వాత్సల్య హృదయులై నాకు బోధించటం జరిగింది. లోకకళ్యాణ మూర్తియగు శివ భగవానుడు చెప్పిన విశేషాలే బ్రహ్మమును అధ్యయనము చేయు విద్యార్థులమై మనము ఇప్పుడు చెప్పుకుందాం.


అనాఖ్యేయమిదం గుహ్యం యోగినాం కోశసంనిభం .
హంసస్యాకృతివిస్తారం భుక్తిముక్తిఫలప్రదం .. 3..
3.) అనాఖ్యేయమ్ ఇదమ్ గుహ్యమ్
యోగినామ్ కోశ సన్నిభమ్,
హంసస్యా ఆకృతి విస్తారమ్|
భుక్తి-ముక్తి ఫలప్రదమ్ ॥

జగన్మాత పార్వతి :
హే పరమేశ్వరా! మీరు అనేక ధర్మ విశేషాలను విశ్లేషించారు. మనం విచారణ చేశాం.

ఇప్పుడు ఆత్మరూపమగు ‘హంస’ ధర్మముగా ఏది చెప్పబడుచున్నదో అది వివరించ ప్రార్థన.

పరమశివుడు :
ఓ ఆదిశక్తి స్వరూపిణీ! జగన్మాతా! పార్వతీ! అవును! ఇప్పటిదాకా అనేక ధర్మములను, ధర్మసూక్ష్మములను ఆఖ్యాన (కథా-చారిత్రక) విధానంగా చెప్పుకున్నాం. నీవిప్పుడు అడుగుచున్న ‘హంస-పరమహంస’ ధర్మము - కథలాగా, చరిత్రలాగా చెప్పుకో గలిగేది కాదు. అనాఖ్యేయం! పరమ రహస్యమైనది కూడా! యోగపుంగవులకు ధనాగారము వంటిది. (రాజులు ధనాగారం రహస్యంగా కలిగి ఉంటారు కదా!). అద్దాని ఫలమో - అపరిమితమైనది. భుక్తి-ముక్తి ప్రదము కూడా! ఇహ-పర శుభ ప్రదాత!


అథ హంసపరమహంసనిర్ణయం వ్యాఖ్యాస్యామః .
బ్రహ్మచారిణే శాంతాయ దాంతాయ గురుభక్తాయ .
హంసహంసేతి సదా ధ్యాయన్సర్వేషు దేహేషు వ్యాప్య వర్తతే ..
యథా హ్యగ్నిః కాష్ఠేషు తిలేషు తైలమివ తం విదిత్వా
మృత్యుమత్యేతి .
4.) అథ హంస పరమహంస
నిర్ణయమ్ వ్యాఖ్యాస్యామో
బ్రహ్మచారిణే, శాన్తాయ, దాన్తాయ గురుభక్తాయ
“హంసఽహంస” (హంసోఽహమ్ స)
ఇతి సదా ధ్యాయన్ ॥

ఇప్పుడు హంస!హంసో!సో హమ్! సోహమ్ పరమ్! పరమ హంసోఽహమ్! - అనాఖ్యాతమైనట్టి తత్త్వమును… వ్యాఖ్యానించుకుందాం. శ్రద్ధగా వినండి.

ముందుగా బ్రహ్మమును గురించి తెలుసుకొనే నేపధ్యములో “నేను బ్రహ్మమునందే చరిస్తున్నాను” అను భావనను ఆశ్రయిస్తూ, బ్రహ్మచారిత్వమును ప్రవృద్ధపరచుకుంటూ ఉండాలి. అందుకు మార్గంగా ఇంద్రియములను క్రమంగా విషయములనుండి విరమింపజేస్తూ…, భగవత్ ఉపాసనయందు (భక్తి-ధ్యానము-యోగసాధనము-పూజ-యజ్ఞ-యాగము ఇత్యాదులందు) నియమిస్తూ రావాలి. అందుకుగాను బ్రహ్మజ్ఞుడు - తత్త్వజ్ఞుడు - అనుభవజ్ఞుడు అగు గురువును - ఉపాసిస్తూ - గురుభక్తి - దైవభక్తి సంవృద్ధి పరచుకోవాలి!

ఇకప్పుడు - తత్ త్వమ్ - తత్ విశ్వమ్ (నీవుగా కనిపించేది పరమాత్మయే! విశ్వముగా కనిపించేది పరమాత్మయే!) నేను-నాది అంతా పరమాత్మయే!
“హం సోహమ్ స”
- ‘నేను’ గా ఉన్నది ఆయనయే!
- నాది అంతా ఆయనదే!
- ఆయనే నేను! నేనే ఆయన!
- ఈ జగత్తుగా, నీవుగా కనిపిస్తున్నదంతా నేనే! నేనుగా కనిపిస్తున్నది నీవే …
అనే అర్థమును, పరమార్థమును ధ్యానించటం ప్రారంభించాలి. అనుక్షణికంగా అట్టి ధ్యాస కలిగి ఉండటమే ‘ధ్యానము’.

5.) సర్వేషు దేహేషు
వ్యాప్య వర్తతే,
యథా హి అగ్నిః కాష్ఠేషు,
తిలేషు తైలమివ
తమ్ విదిత్వా
న మృత్యుమ్ ఏతి।

“సదాసోఽహమ్” - “హంసోఽహమ్”
మంత్రమును ధ్యానించటము భావనా సంబంధమైనది.
(శబ్దము నుండి →> అర్థమునకు  → భావనకు)

అదియే (సో) నేను (అహమ్) అను మంత్రము (మననాత్ త్రాయతే) మనన రూపము గురించి చెప్పుచున్నాను.

సః - ఆ పరమాత్మ ఎవ్వరు - అని ధ్యానించాలి?
- ఈ విశ్వములోని సర్వ దేహములలో వ్యాపించి ఉన్నవారు!
- సర్వ దేహములుగా - ‘దేహి’లుగా వర్తించుచున్నట్టి వారు!
- విశ్వ దేహులుగా ఉన్నట్టి వారు!

బాహ్యానికి దేహాలు కనిపిస్తున్నాయి. కానీ, అంతర్గతుడై పరమాత్మ (సః) ఈ సర్వ దేహములలో ప్రదర్శనమగుచున్నారు.
దృష్టాంతానికి :
→ కట్టెలు జడంగా కనిపిస్తాయి గాని అగ్ని అంతర్గతమై ఉన్నట్లుగా కళ్ళకు కనిపిస్తోందా? లేదు. కానీ ఆ కట్టెలను ఒరిపిడి చేసినప్పుడో? కట్టెలలోని అగ్ని బహిర్గతమౌతుంది. అట్లా పరమాత్మ సర్వ దేహాలలో దాగి ఉన్నారు.
→ నువ్వు గింజలను చూస్తే నూనె కనిపిస్తుందా? లేదు. కాని నూనె కావాలనుకొన్న వాడికి నువ్వులను ఇస్తే, “నాకు నూనె లభించినట్లే!”… అని భావిస్తాడు. ఎందుకు? నువ్వులను గానుగలో నూరితే నూనె లభిస్తుంది కాబట్టి! ఆ రీతిగా హంసోపాసకుడు సర్వ సహజీవులలోను సారవస్తువు అగు ఆత్మనే దర్శిస్తాడు.

అట్టి ఆత్మను తెలుసుకున్నవాడు. ‘మృత్యువు’ను అధిగమిస్తున్నాడు.


గుదమవష్టభ్యాధారాద్వాయుముత్థాప్యస్వాధిష్ఠాం త్రిః
ప్రదిక్షిణీకృత్య మణిపూరకం చ గత్వా అనాహతమతిక్రమ్య
విశుద్ధౌ ప్రాణాన్నిరుధ్యాజ్ఞామనుధ్యాయన్బ్రహ్మరంధ్రం ధ్యాయన్
త్రిమాత్రోఽహమిత్యేవం సర్వదా ధ్యాయన్ .
6.) గుదమ్ అవష్టభ్యా ఆధారాత్
వాయుమ్ ఉత్థాప్య,
స్వాధిష్ఠానమ్ త్రిః ప్రదక్షిణీ కృత్య,
మణిపూరకమ్ గత్వా,
అనాహతమ్ అతిక్రమ్య,
విశుద్ధౌ ప్రాణాత్ నిరుధ్యా,
ఆజ్ఞామ్ అనుయాయన్,
బ్రహ్మరంధ్రం ధ్యాయన్,
“త్రిమాత్రోఽహమ్”
ఇత్యేవమ్ సర్వదా ధ్యాయన్।
పశ్యతి - న ఆకారశ్చ (అనాకారశ్చ) జపతి।
(శిశ్నా - ఉభే పార్శ్వే భవతః ।)

ఓ పార్వతీ దేవీ! “నాలోని - ’నేను’గా ఉన్నది పరమాత్మయే! అందరిలో ‘నేను’ ఆ పరమాత్మకు చెందినదే!”… అనే హంసోఽహమ్ మననమునకై యోగశాస్త్రము ఈ భౌతిక దేహమును యోగోపకరణంగా ఉపయోగించటం నేర్పుతోంది.

హంస-సోఽహమ్ అని ధ్యానిస్తున్నప్పుడు -

🧘🏿‍♂️ ఎడమ కాలి మడమతో పార్ధివరూపమగు మూలాధార స్థానమైనట్టి గుదమును మూసి ఉంచి….. (లేదా) సంకల్పముతో మూలాధార స్థానమగు గుదమును బిగించి…,

🧘🏿‍♂️ గాలిని, నెమ్మది-నెమ్మదిగా ఊర్థ్యంగా పీల్చి, దేహమును గాలితో నింపి, ‘కుంభకము’ చేస్తూ….,

🧘🏿‍♂️ మూలాధారమునుండి వాయువును పైకి నెమ్మది నెమ్మదిగా బుద్ధిబలంతో (ధ్యాసతో) కదల్చుచ్చు…..

🧘🏿‍♂️ ప్రాణ-అపాన మేళనముతో, మూలాధార త్రికోణములో ఊర్థ్వ బిందు స్థానములో అగ్నిని భావన చేస్తూ…

🧘🏿‍♂️ ఉష్ణభావనతో మత్తుగా ఉండే కుండలినీ శక్తిని మేల్కొలిపి,

🧘🏿‍♂️ సుషుమ్నానాడి మార్గమును ఉత్తేజితం చేస్తూ….,

🧘🏿‍♂️ విరాట్ రూపుడగు మరమాత్మను ధ్యానిస్తూ..,

🧘🏿‍♂️ ప్లీహ-అగ్ని స్థాననుగు బొడ్డుకు (1 1/2 బెత్తల) క్రింద స్థానంలోగల స్వాధిష్ఠానమునకు ప్రయాణించి - స్వాధిష్ఠానచక్రమునకు మూడు ప్రదక్షిణములు చేసి….,

🧘🏿‍♂️ ఆ తరువాత నాభిస్థానములో ఉన్న జలధాతువును నియమించు కేంద్ర స్థానమయినట్టి మణిపూరక చక్రమునకు ఇచ్ఛాశక్తితో ప్రాణ-అపానాగ్నిని
నడిపించి,

🧘🏿‍♂️ ఇక అటు తరువాత వాయు స్థానచలన కేంద్రము - హృదయకేంద్రము అగు అనాహత చక్రమును ఇచ్ఛాశక్తితో చేర్చి, క్రమంగా అతిక్రమించి, అచ్చట నుండి కంఠస్థానము - ఆకాశ తత్వరూపము అగు విశుద్ధ చక్రమును చేరి…, అక్కడ ప్రాణాపానములను నిరోధించి…..,

🧘🏿‍♂️ ఆచోట నుంచి భ్రూమధ్య కేంద్రము, ద్రష్ట-దర్శన-దృశ్యములలయస్థానము అగు ఆజ్ఞాచక్రము అధిరోహించి, అనుసరించి స్థానములో యోగి “సహస్రార ప్రారంభ స్థానము అగు బ్రహ్మరంధ్రము"ను ధ్యానము చేయుచున్నాడు.

(ఇదంతా బుద్ధి-ఇచ్ఛల ప్రయాణ-సాధన సన్నివేశముగా గ్రహించబడును గాక! గమనించబడుగాక!)

బ్రహ్మరంధ్రోపాసనచే జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు ఆధారుడను- కల్పించుకొనువాడు అగు తురీయుడను నేను ….. అని సాకారతుర్యుడు ఇక నిరాకార తుర్యక్ తుర్యుడుగా అగుచున్నాడు. ’శిశ్నము’ యొక్క ఉభయ పార్శ్వము తానే అయి ప్రకాశిస్తున్నాడు.


NOTE: Original Sloka present down the line
7.) ఏషో అసౌ పరమహంసో
భానుకోటి ప్రతీకాశో
యేన ఇదమ్ సర్వమ్ వ్యాప్తమ్ ॥

అట్టి తుర్యక్-తుర్యుడే పరమహంస! ఆతడు కోటి సూర్య ప్రకాశమానమగు ఆత్మ స్వరూపుడై విరాజిల్లుచున్నాడు! తానే సర్వమునందు- సర్వముగా విస్తరించి ఉండి, తానే సర్వము అయినవాడై ఆనందిస్తున్నాడు! కుండలినీ తానే! సహస్రార స్థానము తానే! సుషమ్ననాడి కూడా తానే!
ఆ పరమాత్మ హృదయ పద్మదళములోని వాసియై ప్రకాశిస్తూ బ్రహ్మాండ కల్పనలుచేయుచూ వినోదిస్తున్నాడు.


NOTE: Original Sloka present down the line
8.) తస్యా అష్టధా వృత్తిః భవతి।

యోగ-చక్రములు
మరోవైపు జీవాత్మయై హృదయపద్మము యొక్క ‘8’ పుష్పదళములలో సంచారాలు చేస్తున్నాడు.

ఎనిమిది-దళములు
పూర్వ దళే పుణ్యే మతిః|
ఆగ్నేయే నిద్రా-ఆలస్యాదయో భవన్తి।
యామ్యే (దక్షిణదళే) క్రౌర్యే మతిః
నైరృతే పాపే మనీషా।
వారుణ్యామ్ (పడమర) క్రీడా।
వాయవ్యామ్ గమన-ఆదౌ బుద్ధిః
సౌమ్యే (ఉత్తరమున) రతిప్రీతిః|
ఈశాన్యే ద్రవ్యా దానమ్।
మధ్యే వైరాగ్యమ్|
కేసరే జాగ్రత్ అవస్థా।
కర్ణికాయామ్ స్వప్నో!
లింగే సుషుప్తిః
పద్మత్యాగే తురీయమ్।
యదా హంసో నాదే
విలీనో భవతి,
తత్ తురీయాతీతమ్ భవతి||

🌺 తూర్పువైపు దళమును అధిష్టించినప్పుడు : పుణ్యకార్యములందు ఆసక్తి కలిగి ఉంటున్నాడు.
🌺 ఆగ్నేయ దళము అధిష్ఠించినప్పుడు : (తమోగుణ సంబంధమైన) నిద్ర-ఆలస్యము మొదలైనవి కలుగుచున్నాయి.
🌺 దక్షిణ దళము అధిష్ఠించినప్పుడు (రజోగుణ సంబంధమైన) బుద్ధి క్రూరంగా ఉంటోంది.
🌺 నైరృతి దళము అధిష్ఠించినప్పుడు : పాపబుద్ధి కలుగుతోంది.
🌺 పడమటి దళము అధిష్ఠించినప్పుడు క్రీడలందు - ఆట - పాటలందు ప్రీతి కలుగుతోంది.
🌺 వాయువ్య దళము అధిష్ఠించినప్పుడు : నడవటం తిరగడం - దూర ప్రయాణాలు… ఇవి ప్రీతి అగుచున్నాయి.
🌺 ఉత్తర దిక్కుగల దళము అధిష్ఠించినప్పుడు : అజ్ఞానులకు కామరతియందు, సుజ్ఞానులకు ఆత్మరతియందు ఇష్టము కలుగుతోంది.
🌺 ఈశాన్య దిక్ దళము అధిష్ఠించినప్పుడు : ద్రవ్యము - ఆదానము (ఇవ్వడం - స్వీకరించటంలో) ప్రీతి!
🌺 మధ్య భాగం అధిష్ఠించినప్పుడు : వైరాగ్య భావాలు కలుగుచున్నాయి.
🌺 కేసరములందు (రేఖలందు) అధిష్ఠించినప్పుడు : జాగ్రత్ అధికంగా ఉంటుంది.
🌺 తొడిమల స్థానం పొందుతున్నప్పుడు : స్వప్నము
🌺 పద్మము యొక్క మూలభాగం అధిష్ఠిస్తుంటే : గాఢనిద్రా పరవశం

🌺 హృదయ పద్మమును దాటి అధిష్ఠించినప్పుడు : తురీయత్వం, కేవలసాక్షిత్వం, నిర్గుణత్వం, హంసో-సోఽహమ్ … అను పరమాత్మయందు అధిష్ఠితుడగుచున్నాడు. ‘తురీయాతీతుడు’ అగుచున్నాడు.

🌺 ఈ జీవాత్మ ఈవిధంగా అష్ట దళమును, హృదయపద్మ మధ్య ప్రదేశమును దాటిపోయి తురీయాతీతుడై, ఆత్మకు అభిన్నుడై, కైవల్యపదమును అందుకొనుచు, ‘పరమహంస’ అగుచున్నాడు.


అథో నాదమాధారాద్బ్రహ్మరంధ్రపర్యంతం శుద్ధస్ఫటికసంకాశం
స వై బ్రహ్మ పరమాత్మేత్యుచ్యతే .. 1..
9.) అథో నాద ‘ఆధారాత్’
“బ్రహ్మరంధ్ర” పర్యంతమ్
శుద్ధస్ఫటిక సంజ్కాశమ్ |
స వై “బ్రహ్మ”, “పరమాత్మ”
ఇతి ఉచ్యతే||

అట్టి యోగ సాధన పరిపక్వమగుచు, “తురీయ తురీయుడు”, “పరమహంస” అగుచుండగా…, హృదయ ఆధార (Central) (పుష్ప) స్థానము నుండి - సహస్రార స్థానములో గల బ్రహ్మరంధ్రము వరకు - “శుద్ధ స్ఫటికము” వలె శుద్ధము, శుభ్రము, తెల్లటి కాంతి పుంజములు వెదజల్లు నిర్మల (Transparent) అద్దము వలె కుండలినీశక్తి అనుభవము అగుచున్నది. అట్టి స్వరూపముచే (పరమహంస) “బ్రహ్మము-పరమాత్మయే వారు” అని చెప్పబడుచున్నారు.


అథ హంస ఋషిః . అవ్యక్తా గాయత్రీ ఛందః .
పరమహంసో దేవతా . అహమితి బీజం .
స ఇతి శక్తిః . సోఽహమితి కీలకం .
10.) అథ హంస ఋషిః|
“అవ్యక్త గాయత్రీ” ఛన్దః
‘పరమ హంసో’ దేవతా!
‘హం’ బీజమ్! ‘సం’ శక్తిః।
‘సోఽహమ్’ కీలకమ్ |

“నేను-నీవు-ఈ జగత్తు అంతా బ్రహ్మమే “… అను భావన-బుద్ధి కలిగి ఉండటమే “అజపా గాయత్రి”.
అట్టి అజపా గాయత్రికి…,
హంస (పరమాత్మ) → ఋషి;
అవ్యక్త గాయత్రి మనస్సుతో సర్వపూర్ణుడు అగు సవితృ (సత్ + విత్) భగవానుని భావనచేస్తూ బుద్ధితో ఆస్వాదించటము → ఛందస్సు;
పరమహంస అహమ్ స పరమో - స పరమోఽహమ్ → దేవత;
హమ్ (నేను) → బీజమ్;
సం (ఉనికి) → శక్తిః;  సోఽహమ్ (ఉనికి) → కీలకము;


షట్ సంఖ్యయా అహోరాత్రయోరేకవింశతిసహస్రాణి
షట్ శతాన్యధికాని భవంతి .
11.) షట్ (6) సంఖ్యా, అహెూ రాత్రయోః
ఏకవింశతి సహస్రాణి షట్ శతాని (21600)
అధికాని భవంతి।

షట్ సంఖ్యామ్ - షట్ (6) ఆధార దేవతలు → ఆధార దేవతలు : (గణేశ-బ్రహ్మ-విష్ణు-రుద్ర-త్రిపురేశ్వరీ-సదాశివులు. వీరు (6) జపకర్తలు).

రాత్రి-పగలు కలిపి → 21,600 - శ్వాసలు. శ్వాసయే జపము.


సూర్యాయ సోమాయ నిరంజనాయ నిరాభాసాయ తను సూక్ష్మం
ప్రచోదయాదితి అగ్నీషోమాభ్యాం వౌషట్
హృదయాద్యంగన్యాసకరన్యాసౌ భవతః .
సూర్యాయ సోమాయ నిరంజనాయ
నిరాభాసాయా తనుసూక్ష్మమ్ ప్రచోదయాత్||

అజపా మంత్ర జపాన్ని ’4’ భాగములుగా విభజించి….,
- మొదటి భాగము సూర్యునికి,
- రెండవ భాగము సోమునికి (చంద్రునికి)
- మూడవ భాగము నిరంజనుడగు సర్వేశ్వరునికి,
- నాలుగవ భాగము సూక్ష్మ స్వరూపుడు అగు నిరాభాసునికి సమర్పించాలి.

"మీరు యీ యోగోపాసనను స్వీకరించి మా బుద్ధిని ప్రేరేపించండి!” అని భావ-అభ్యర్థనలను సమర్పించాలి!


అగ్నీషోమాభ్యాం వౌషట్
హృదయాద్యంగన్యాసకరన్యాసౌ భవతః .
12.) అగ్ని షోమాభ్యామ్ వౌషట్
హృదయ అంగన్యాస -
కరన్యాసౌ భవతః||

హృదయాంగన్యాసములు : 
హం సామ్ హృదయాయనమః।
హం సీమ్ శిరసే స్వాహా|
హం సూమ్ శిఖాయై వషట్
హం సైమ్ కవచాయు హుమ్
అగ్ని సోమాభ్యాం-నేత్రత్రయాయవౌషట్
… అని చెప్పాలి.


ఏవం కృత్వా హృదయే
అష్టదలే హంసాత్మానం ధ్యాయేత్ .
13.) ఏవమ్ కృత్వా హృదయే
‘హంసమ్’ ఆత్మానమ్ ధ్యాయేత్ ॥

ఈవిధంగా (సోఽహమ్ మంత్రజపానికి) అంగన్యాసము-కరన్యాసము చెప్పుచూ….,
హృదయములో ఉన్నట్టి “హంస-ఆత్మభగవానుని" - అహమ్ బ్రహ్మాస్మి! ఆహమ్ బ్రహ్మాస్మి! అహమ్ బ్రహ్మాస్మి! అని ధ్యానము చేయాలి.


అగ్నీషోమౌ పక్షావోంకారః శిరో బిందుస్తు నేత్రం
ముఖం రుద్రో రుద్రాణీ చరణౌ బాహూ
కాలశ్చాగ్నిశ్చోభే పార్శ్వే భవతః .

ఏషోఽసౌ పరమహంసో భానుకోటిప్రతీకాశః .
యేనేదం వ్యాప్తం .
తస్యాష్టధా వృత్తిర్భవతి . పూర్వదలే పుణ్యే మతిః ఆగ్నేయే
నిద్రాలస్యాదయో భవంతి యామ్యే క్రూరే మతిః నైరృతే పాపే
మనీషా వారుణ్యాం క్రీడా వాయవ్యే గమనాదౌ బుద్ధిః సౌమ్యే
రతిప్రీతిః ఈశానే ద్రవ్యాదానం మధ్యే వైరాగ్యం కేసరే
జాగ్రదవస్థా కర్ణికాయాం స్వప్నం లింగే సుషుప్తిః పద్మత్యాగే
తురీయం యదా హంసో నాదే లీనో భవతి తదా
తుర్యాతీతమున్మననమజపోపసంహారమిత్యభిధీయతే .
14.) అగ్నీషోమౌ → పక్షా।
’ఓం’కార → శిరః
’ఉ’కారో→ బిందుః।
త్రినేత్రమ్ ముఖమ్ రుద్రో
రుద్రాణీ చరణౌ।
ద్వివిధం కంఠతః కుర్యాత్ ॥
ఇతి ‘ఉన్మనా’
‘అజపా ఉపసంహార’
ఇతి అభిదీయతే||

అట్టి యోగ పరాకాష్ఠ అందుకుంటున్న యోగి విశ్వస్వరూపుడౌతాడు.

★ విశ్వాతీతుడై, సూర్య-చంద్రులను (అగ్ని-సోమములను) తన బాహువులుగా భావము పొందుతాడు.
★ ’ఓం’కారము తన శిరస్సుగా అనుభూతి పొందుతాడు.
★ సబిందుకములు అయినట్టి ’అ’కార ’ఉ’కార-‘మ’కారములను తన త్రినేత్రములుగా దర్శిస్తాడు.
★ తనయందే ఈ సర్వము లయిస్తున్న రుద్రుని తన ముఖముగా - ఆత్మ భావన సిద్ధి కొరకై-ఉపాసిస్తున్నారు.
★ రుద్రాణి (ప్రకృతి) - పాదములు అగుచున్నాయి.

ఈవిధంగా ద్వివిధరూపములైన హంస ధ్యానమును - అనగా, “నేను”గా ఉన్నది ఆ పరమాత్మయే! ఆ పరమాత్మగా ఉన్నది నేనే! నేను పరమాత్మ అఖండము! - అని - ధ్యానమును చేయాలి.

ఇట్లు ధ్యానము చేస్తూ ఉంటే ‘అనుకోవటం’ అనే అవసరము లేకుండానే అన్నీ తానై ఉంటున్నాడు. అప్పుడు ఆతడు ‘ఉన్మనీ’ అని చెప్పబడుచున్నాడు. అట్టి స్థితి ‘అజపాసంహారము’ అని చెప్పబడుచున్నది. ఎందుకంటే జపించువాడు జపత్వము త్యజించి బ్రహ్మమే తానై చెన్నొందుచున్నాడు.


ఏవం సర్వం
హంసవశాత్తస్మాన్మనో హంసో విచార్యతే .
15.) ఏవమ్ హంసవశాత్
తస్మాత్ మనో విచార్యతే||

ఈవిధంగా ఈ జగత్తు పరమాత్మయే - పరమాత్మయే నేనై ఉన్నాను - నేనే పరమాత్మ అయి ఉన్నాను. … అను ధ్యానముచే…, ’సోఽహమ్’ జపభావన చేస్తూ ఉండగా…, హంస (పరమాత్మ)కు వేరొకటి ఏదీ లేదు. కనుక ‘నేను’ అనునది పరమాత్మకు వేరుగా లేదు, ఉండజాలదు… అను అనుమానమే లేనట్టి నిశ్చయ నిర్ణయమునకు వస్తున్నాడు.


స ఏవ జపకోట్యా నాదమనుభవతి ఏవం సర్వం
హంసవశాన్నాదో దశవిధో జాయతే.

చిణీతి ప్రథమః . చించిణీతి ద్వితీయః .
ఘంటానాదస్తృతీయః . శంఖనాదశ్చతుర్థః .
పంచమతంత్రీనాదః . షష్ఠస్తాలనాదః .
సప్తమో వేణునాదః . అష్టమో మృదంగనాదః .
నవమో భేరీనాదః . దశమో మేఘనాదః .
16.) అస్యైవ జపకోట్యా
నాదమ్ అనుభవతి।
స చ దశవిధ ఉపజాయతే।
‘చిణ్’ ఇతి ప్రథమః।
‘చిణ్ చిణీ’ ఇతి ద్వితీయః।
ఘంటానాదః తృతీయః।
శంఖనాదః చతుర్థః।
పంచమస్తమ్-త్రీనాదః।
షష్ఠః తాలనాదః।
సప్తమో వేణునాదః।
అష్టమో భేరీనాదః।
నవమో మృదంగనాదః।
దశమో మేఘనాదః।

“హమ్ సోఽహమ్ స” అని భృకుటి స్థానములో నుండి చేయు జపము యొక్క కోటి జపము (జపకోటి) చేత నోటితో జపించకపోయినప్పుడు కూడా - చెవులకు నాదము ప్రతి ధ్వనించసాగుతుంది. నాదానుభవము (కుడిచెవియందు) గంటవలె అనుక్షణికంగా కాగలదు. ఆనాదము ‘10’ రీతులుగా చెవులకు గంటానాదము వలె వినపడసాగగలదు.

మొదట నాదము → ’చిణ్’ శబ్దము.
రెండవనాదము → చిణ్ - చిణి శబ్దము.
మూడవ నాదము → ఘంటానాదము.
నాలుగవ నాదము → శంఖానాదము.
ఐదవ నాదము →→ తంత్రీనాదము, వీణానాదము, స-రి-గ-మ సంగీతము.
ఆరవ నాదము → తాళ (తాళముల) నాదము.
ఏడవ నాదము వేణునాదము.
ఎనిమిదవ నాదము → భేరీనాదము.
తొమ్మిదవ నాదము → మృదంగ నాదము.
పదవ నాదము → మేఘనాదము.


నవమం పరిత్యజ్య దశమమేవాభ్యసేత్ .
17.) నవమం పరిత్యజ్య
దశమమేవ అభ్యసేత్ ॥

ఈ వరుసలోని తొమ్మిది నాదములను పరిత్యజించి (వదలి) పదవ నాదమును భావనచేస్తూ అభ్యసించాలి! ఆశ్రయించాలి!


ప్రథమే చించిణీగాత్రం ద్వితీయే గాత్రభంజనం . తృతీయే
ఖేదనం యాతి చతుర్థే కంపతే శిరః ..
18.) ప్రథమే ‘చించిణీ’ గాత్రమ్|
ద్వితీయే ‘గాత్ర భంజనమ్’|
తృతీయే భేదనమ్ యాతి।
చతుర్థే కంపతే శిరః ॥

అనాహతము మొదలై చక్రములలో ప్రయాణిస్తూ - ’భృకుటి’కి ఆజ్ఞాచక్రము చేరి, అక్కడ ఆసీనుడై “హం సోహ మ్ స” అను మంత్రమును అజపాగాయిత్రిని భావనతో ఉచ్ఛరిస్తూ బ్రహ్మరంధ్రమువైపు ధ్యాస సాగిస్తూ ఉండగా…

- మొట్టమొదట ‘చిణ్ చిణ్’ అను ఒకానొక చిరుగంటానాదం శరీరంలో పుట్టుచున్నది.

- క్రమంగా రెండవ స్థితిలో ఆ చిణ్-చిణ్ ధ్వని దేహమంతా వ్యాపిస్తూ హృదయంలోను, సర్వ స్థానాలలోను మధురంగా వినిపిస్తుంది.

- మూడవ స్థితిలో భ్రుకుటి స్థానములో ఏకాగ్రత నిశ్చలమగుచూ ఇంద్రియ విషయములతో ఏర్పడే బంధము భేదనమగుచూ వస్తుంది. అప్పటి వరకు ముడుచుకొని ఉన్న హృదయ-కమల దళములు విచ్చుకోసాగుతాయి.

- నాలుగవ స్థితిలో బ్రహ్మరంధ్రమువైపుగా ఏకాగ్రత అధికమగుచూ ఉండగా శిరస్సు - తన్మయ సంబంధమైన చిన్న-చిన్న ప్రకంపనములు పొందుచున్నది.


పంచమే స్రవతే తాలు షష్ఠేఽమృతనిషేవణం . సప్తమే
గూఢవిజ్ఞానం పరా వాచా తథాష్టమే ..
19.) పంచమే స్రవతీ తాలూ!
షష్ఠే అమృత నిషేవణమ్।
సప్తమే గూఢ విజ్ఞానమ్।
పరావాచా తథా అష్టమే ॥

- ఐదవ స్థితిలో తాలువు - కంఠముల మధ్య తంత్రీనాదము జనిస్తూ ఉండగా, కంఠములో మధుర ద్రవము స్రవిస్తుంది.

- ఆరవ స్థితిలో తాలువులో జనించే మధురమగు అమృతరసమును ఆ యోగి గ్రోలుతూ ఉంటాడు.

- ఏడవ స్థితిలో జనించే వేణునాదము వింటూ ఉండగా నిగూఢమైన బ్రహ్మ జ్ఞానము కలుగుతూ - వృద్ధి చెందుతూ వస్తుంది.

- ఎనిమిదవ స్థితిలో వాక్కు - దృష్టి మొదలైనవన్నీ ఇహత్వము త్యజించి పరత్వము సంతరించుకుంటూ ఉంటాయి.


అదృశ్యం నవమే దేహం దివ్యం చక్షుస్తథామలం . దశమే
పరమం బ్రహ్మ భవేద్బ్రహ్మాత్మసంనిధౌ ..
20.) అదృశ్యమ్ నవమే దేహమ్।
దివ్యమ్ చక్షుః తథా అమలమ్।
దశమం చ ‘పరంబ్రహ్మ’ భవేత్
బ్రహ్మా ఆత్మ సన్నిధౌ ॥

- తొమ్మిదవ స్థితిలో భౌతికమైన ఇంద్రియ దృశ్యమును అధిగమించి ఆ యోగి “సర్వము ఆత్మయొక్క విన్యాసమే” అను దివ్య దృష్టి - దివ్య చక్షువులు, దోషరహితమగు- నిర్దోషంహి సమం బ్రహ్మ - భావనను పొందుచున్నాడు.

- పదవ స్థితిలో తానే ‘పరబ్రహ్మము’ అయి బ్రహ్మాత్మ సన్నిధి - సాయుజ్యములను సంపాదించుకుంటున్నాడు.


తస్మిన్మనో విలీయతే మనసి సంకల్పవికల్పే దగ్ధే పుణ్యపాపే
సదాశివః శక్త్యాత్మా సర్వత్రావస్థితః స్వయంజ్యోతిః శుద్ధో
బుద్ధో నిత్యో నిరంజనః శాంతః ప్రకాశత ఇతి ..

ఇతి వేదప్రవచనం వేదప్రవచనం .. 2..
21.) తస్మాత్ మనో విలీనే |
మనసిగతే సంకల్ప - వికల్పే,
దగ్ధ పుణ్య-పాపే, సదా శివః - శక్త్యా
ఆత్మా సర్వత్రా అవస్థితః ॥

ఈవిధంగా క్రమంగా మనస్సు విలీనం అవుతూ వస్తుంది. సంకల్పవికల్పములు, పాప-పుణ్య ద్వంద్వాలు ఆతని దృష్టిలో దగ్ధం అగుచున్నాయి. “అంతా ఆత్మయే” అని అనిపించసాగుతుంది. అప్పుడు ఆతడు శివ-శక్తి ఏకస్వరూపుడై, సర్వత్రా ఆత్మస్వరూపుడుగా తానే అయి… అంతటా, అన్నిటా, అంతగా, అన్నీగా అవస్థితుడగుచున్నాడు.

స్వయమ్ జ్యోతిః
శుద్ధో - నిత్యో - నిరంజనః
శాంత తమః
ప్రకాశయతి।
ఇతి వేదానువచనమ్ భవతి ॥

ఆ యోగి…,
- స్వయం జ్యోతి స్వరూపుడై,
- ఆత్మజ్యోతి స్వరూపుడై,
- శుద్ధుడు - నిరంజనుడు అయి
- పరమశాంత స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు.

పరమహంస అయి
- సర్వమునకు అభిన్నుడై అప్రమేయుడై,
- సర్వభూతములు తానై
- సర్వసాక్షిగా వేరై, సర్వము కలిగి - ఏమీ లేనివాడై విరాజిల్లుచున్నాడు.

వేదములు ప్రవచించే వేదాంతవేద్యుడై, సర్వము స్వయంప్రకాశ రూపముగా కలిగి వర్తిస్తున్నాడు. సర్వాత్మకుడు - సర్వతత్త్వ స్వరూపుడు ‘కేవలుడు’ అగుచున్నాడు.

ఇతి వేదానువచనమ్।

ఇతి హంసోపనిషత్ ।
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥


శుక్ల యజుర్వేదాంతర్గత

18     హంస ఉపనిషత్

అధ్యయన పుష్పము

ఒక సందర్భములో శ్రీ గౌతమమహర్షి ఆత్మ జ్ఞానాశయంతో, సర్వ సందేహముల నివృత్తి కొరకై
- బ్రహ్మ మానసపుత్రుడు,
- బ్రహ్మ జ్ఞాన ప్రకాశకులు,
- లోక కళ్యాణ మూర్తి,
- మహర్షులకు కూడా గురువు…,
అయినట్టి శ్రీ సనత్కుమారులు వారిని దర్శించారు. సాష్టాంగ దండ పణామములు సమర్పించారు. లోక గురువగు ఆ మహనీయుని ముముక్షు భావయుక్తుడై వినయముతో ఇట్లు పరిప్రశ్నించ సాగారు.

శ్రీ గౌతమ మహర్షి :  హే సనత్కుమార భగవన్! సర్వ ధర్మజ్ఞా! వేదాంతశాస్త్ర విశేషములైనట్టి జీవాత్మ - పరమాత్మ - ఈశ్వరులు, అంతఃకరణములైనట్టి మనోబుద్ధి - ఆదిగా గల చతుష్టయము, దేహము అనే ఉపకరణము, దేహాంతర్గత - ఉపాసనాయోగము, అద్వితీయమగు పరబ్రహ్మముతో ఐక్యము, అందుకుగాను సర్వ ఉపాయాలు - ఇవన్నీ సుస్పష్టముగా ఎరిగియున్నట్టి మహా మహనీయులు మీరు. సర్వ శాస్త్రములు, వాటి ఉద్దేశ్యము, తత్సారము, అంతర్గత పాఠ్యాంశములు ఎరిగినట్టి సర్వశాస్త్రకోవిదులు. మావంటి ముముక్షువులు ఆశ్రయించగానే తత్త్వరహస్యములను తెలియజేయు కరుణారసమూర్తులు. ప్రేమార్ద్ర హృదయులు. మా సంసార దోషము ఎట్టిదో ఎరిగి, మాకు దారి చూపగల సద్గురువరేణ్యులు. మార్గదర్శకులు. లోక కళ్యాణమూర్తులు.

హే సద్గురూ! సనత్కుమార గురువరేణ్యా! బ్రహ్మమానస పుత్రా!

ఏ ఉపాయముచేత అజ్ఞులమై, - (‘సంసారము’ అనే కాళరాత్రి ఆవరించగా), జడులమై నిదురిస్తున్న మాకు…, “ఆత్మవిద్యా ప్రబోధము” అనే మెళుకువ సులభంగా లభిస్తుందో… అది బోధించవలసినదిగా మిమ్ములను అర్ధిస్తున్నామయ్యా!

శ్రీ సనత్కుమారుడు :  నాయనా! గౌతమా! భక్తవత్సలురగు పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో ఒకానొక శుభ సందర్భంలో సుఖాశీనులై సంభాషించుకుంటూ ఉన్నారు. జగన్మాతయగు పార్వతీ దేవికి సంసార జీవులమగు మనందరిపై గల అవ్యాజమైన కరుణ-మాతృ వాత్సల్యము కలిగియుండటంచేత, మనయొక్క దుఃఖమయ సంసార దోష నివృత్తిని దృష్టిలో పెట్టుకొని అనేక ధర్మాలు, పౌరాణిక విశేషాలు, ఆధ్యాత్మ జ్ఞాన రహస్యాల గురించి ప్రశ్నించసాగారు. పరమాత్మ, సర్వాంతర్యామి, సర్వతత్త్వ స్వరూపుడు, లోక శుభంకరుడు అగు పినాకిని (శివ దేవుడు) శ్రీ పార్వతీమాతతో అనేక తాత్త్విక రహస్యాలు, ధర్మ విశేషాలు సంభాషించటం జరిగింది.

ఆ సమయంలో "పరమహంత తత్త్వము” గురించి కూడా కొన్ని విశేషాలు విశ్లేషించి చెప్పారు.

ఒకానొక (మరొక) సందర్భములో నేను లోకమాతయగు పార్వతీ దేవిని దర్శించుకోవటం జరిగింది. అమ్మ కదా! “బిడ్డా! ఏమైనా కోరుకో! ఇస్తాను“ అని అన్నప్పుడు నేనూ మీలాగానే ”అమ్మా! మేము బ్రహ్మ విద్యాపారంగతులమై, బ్రహ్మప్రబోధము పొందేది ఎట్లాగో చెప్పి, నన్ను సంసార దుఃఖములనుండి కాపాడవమ్మా!” అని ఆ వరాల తల్లిని అబ్యర్థించాను. అమ్మ ఆ సందర్భములో చెప్పియున్న పరమహంస తత్త్వమును ఇప్పుడు నీవు నన్ను అడుగుచున్న ప్రశ్నలకు సమాధానంగా చెప్పుచున్నాను. విను.

ఓ గౌతమ మునివర్యా! ప్రపంచ భావన అనే కలనము (కల్పిత భావన - మనోకల్పన)ను తొలగించుకొన్నప్పుడు, ఇక శేషించి ఉండే స్వస్వరూపమగు "సన్ మాత్రము” (కేవల సత్ స్వరూపము)నే బ్రహ్మజ్ఞులు ‘బ్రహ్మము’ అని పిలుస్తున్నారు.

అయితే…,
అట్టి బ్రహ్మము గురించి మనము ఒక కథలాగానో, సంఘటనలాగానో, కథానికలాగానో, చరిత్రలాగానో చెప్పుకో గలిగేది కాదు.అనాఖ్యేయం!

‘నేనే బ్రహ్మమును’ - అనబడు బ్రహ్మా హమ్ భావనానుభవమును ’పరమహంస ధర్మము - హంసధర్మము’ అని కూడా అంటారు. అట్టి ‘హంస ధర్మము’ అనునది పరమ రహస్యము. "నేను భౌతిక రూపము మాత్రమే కదా!”…. అని తలచుచున్న ఈ జీవుని యొక్క విస్తారమగు హంస రూపమును (లేక) సోం హమ్ రూపమును గుర్తు చేసేదే హంసో హమ్! మహా రాజులు తమ యొక్క ధనాగారమును అందరికీ తెలిసేటట్లుగా కాకుండా,… ఎక్కడో రహస్య ప్రదేశంలో నిర్మించుకొన్నవారై ఉంటారు కదా! అట్లాగే నీవు అడిగిన బ్రహ్మము (లేక) హంస ధర్మము అనునది పరమహంసలగు యోగులు రహస్యముగా అంతరంగమున దాచుకొని, అద్దాని విజ్ఞానముతో ఈ సర్వమును వినోదముగా సందర్శిస్తూ ఉంటారు. అది హంసయోగ స్థితి.

ఇది ఇట్లా ఉండగా….,

ప్రతి జీవుడు సర్వదా కేవలాత్మ స్వరూపుడే! కనుక సో హమ్ - హంస యోగమును తప్పక తెలుసుకోవలసిందే! అప్పుడే సంసార దుఃఖము తొలగుతుంది. అట్టి విజ్ఞానమును, శ్రద్ధ - భక్తి - శుశ్రూష కలవాడు తప్పక పొందగలడు. అట్టి బ్రహ్మ జ్ఞాన స్వరూపమైన “హంస ధర్మము” - భుక్తి ముక్తి ఫలప్రదము. ఇహ పర సాధనము కూడా!

ఓ గౌతమా! ఇప్పుడు మనము అనాఖ్యాతము-పరమహంసలు స్వానుభవ పాఠ్యాంశముగా నిర్ణయించి చెప్పుచున్నది. సోఽహమ్ రూపమైనట్టిది, పరమశివుడు పార్వతీ దేవికి వ్యాఖ్యానించి చెప్పియున్నది అగు ’హంసో హంస’ అను మంత్రోపాసన, యోగభ్యాసము, ధారణ, తత్త్వముల గురించి - అమ్మవారు - నాకు బోధించిన విశేషాలను చెప్పుకుంటున్నాము. శ్రద్ధగా వినెదరు గాక!

🙏

“హంసోఽహంస” అను పరమహంస ధ్యానమునకు సంసిద్ధమయ్యే ముందుగా ఆ యోగసాధకుడు పాటించవలసిన నియమములు, మార్గములు ఏమిటి? చెప్పుకుందాము! పరమహంస నిర్ణయములు ఎట్లా ఎట్లా ఉంటాయో కూడా సంభాషించుకుందాం!

బ్రహ్మచారిణే : "నేను బ్రహ్మము గురించి తెలుసుకొని, బ్రహ్మమును గురించిన ఆచారములను అనుసరిస్తూ, బ్రహ్మము వైపుగా అడుగులు వేసెదను గాక!” అని ముందుగా దృఢనిశ్చయమును పెంపొందించుకోవాలి.

“సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ - ఇతి ఆచరణేన బ్రహ్మచారో భవతి”

“ఇదంతా బ్రహ్మమే కదా” అని చెప్పే తత్త్వమ్ - సోఽహమ్ వాక్యార్థములను పరమలక్ష్యముగా కలిగి యున్నవాడు - “బ్రహ్మచారి” అగుచున్నాడు. (లౌకికార్థంగా “వివాహం కానివాడు - అనునది ఆధ్యాత్మికార్థము కాదు).

అందుకు మార్గము?
దాన్తాయ! - ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియముల సద్వినియోగము!
ఈ మనో-బుద్ధులు శబ్ద స్పర్శ-రూప-రస-గంధములకు సంబంధించిన విషయ పరంపరలలో అనేక జన్మల నుండి స్వప్నతుల్యంగా గడపుతూ ఉండగా, ఈ జీవుడు ఆత్మ తత్త్వజ్ఞానము ఏమరచుచున్నాడు. తన స్వరూపముపై అల్పత్వము, కర్మబంధత్వము కప్పుకొని అనేక మనో రుగ్మతలు తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఇప్పుడు హంసోపాసనకు ఉపక్రమించటానికి వీలుగా, ఇంద్రియములను నిగ్రహించాలి. దాన్తుడు కావాలి! వాటిని భక్తి-జ్ఞాన వైరాగ్య అభ్యాసముల వైపుగా నియమిస్తూ ఉండాలి.

→ ఇంద్రియములు మనస్సుకు ఉపకరణములు. అంతేగాని మనస్సు ఇంద్రియములకు బద్ధము కావలసిన పని లేదు.
→ మనస్సు మనకు ఉపకరణం. అంతేగాని మనస్సుకు మనం బద్ధులం కావలసిన పని లేదు.

అభ్యాసవశం చేతనే మనము మనస్సుకు, మనస్సేమో ఇంద్రియములకు బద్ధముగా అగుచుండటం జరుగుతోంది.

అందుచేత ఇప్పుడు ఇంద్రియములను సన్మార్గములోను, భగవత్ ఉపాసనయందు నియమిస్తూ రావలసిన అగత్యం ఏర్పడుతోంది.

గురుభక్తాయ : ఆత్మజ్ఞులగు మహనీయులు ఈ జగత్తును ఏ దృష్టితో అవగాహనతో చూస్తున్నారో… అది జీవులకు ముఖ్యము. అందుచేత, బ్రహ్మజ్ఞుడు, తత్త్వజ్ఞుడు అనుభవజ్ఞుడు అగు గురువును ఉపాశించాలి. గురుభక్తి - దైవభక్తి యొక్క సంవృద్ధి చేత బుద్ధి వికశితమై “పరమ సత్యము” యొక్క ప్రవేశము కొరకై సంసిద్ధమౌతుంది. సంసార దృష్టి నుండి బ్రహ్మీదృష్టి వైపుగా మరలుటకై సద్గురువును సమీపించాలి. సంశయములు తొలగుటకై వారి యొక్క ఆప్త వాక్యములు విని, వారు చెప్పు మార్గములో విశ్లేషించాలి.

వారు  తత్వమ్ (త్వమ్ [నీవు]గా కనిపిస్తున్నది - తత్ పరమాత్మయే) - అనే సార విషయం చెప్పుచున్నారు.

సదా ధ్యాయన్ “హంసోఽహంస”
హంస ధ్యానమును ఎల్లప్పుడు అభ్యసిస్తూ ఉండాలి. (హంస అహంమః - నేను ఆ బ్రహ్మమే అని సంజ్ఞ.

విశ్వమ్ విష్ణుః : ఈ విశ్వము రూపముగా కనిపిస్తున్నది విశ్వేశ్వరుడే! పరమాత్మయే!

తత్త్వమ్ : నాకు ఎదురుగా ‘నీవు’ అను సర్వనామ రూపంగా కనిపిస్తున్న వారందరు ఆ పరమాత్మయే! పరమాత్మయే ఈ అన్ని రూపాలలో, రూపాలుగా ఉన్నారు. (ఉదాహరణకు-మట్టితో అనేక బొమ్మలు చేసినప్పుడు ఆ అనేక బొమ్మలలో-బొమ్మలుగా ఉన్నది ఒకే మట్టి కదా! అట్లాగే ఒకే పరమాత్మ ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నారు… అనునదే ’తత్త్వమ్’ మహా వాక్యము యొక్క అర్థము- తాత్పర్యము)!

జోవో బ్రహ్మేతి : జీవుడుగా కనిపిస్తున్నది సర్వదా బ్రహ్మమే.

శివతత్త్వ జ్ఞానమ్ :  త్వమ్ తత్ శివయేవ … ఇతి జ్ఞానమ్.

త్వమేవాహమ్ : ‘నీవుగా నాకు కనిపిస్తున్నది నా ప్రియమగు ఆత్మయే!

సోఽహమ్ :  పరమాత్మయే ’నేను-నాది’గా ఉన్నారు. నేనుగా నాలో ఉన్నదంతా ఆ పరమాత్మయే! నేను పరమాత్మకు చెందిన వాడనే! అందుచేత నాకు నాదిగా చెందినది (నాది), ‘నేను’ గా అనిపించేది (నేను) - రెండూ పరమాత్మయొక్క విన్యాసమే!

ఈ మహా వాక్యముల ధ్యాసయే… ధ్యానము. ‘హంసోహమ్ సదా ధ్యానం’ … అయి ఉన్నది.

అట్టి ధ్యానమును ప్రవృద్ధపరచుకోవాలి. క్రమంగా “పరమాత్మకు వేరైనది - నాకు వేరైనది" అనునది త్యజించబడుచూ అంతా పరమాత్మ విన్యాసంగా అనుకుంటూ అనుకుంటూ ఉండటంచేత, అనిపిస్తూ - అనిపిస్తూ ఉండటమే ‘హంసో హంస’ ధ్యానము. అది బుద్ధి నిర్మలమై సమున్నత స్థానమును సంతరించుకొను స్థితి!

ఈవి ధంగా ‘దాసోహమ్’ సహాయంతో సర్వము సమర్పితముగా అగుచుండగా…,
“సదా సోఽహమ్”
“సోఽహమ్”
మంత్రమును ఏకరూపం చేస్తూ “హంసోహంస”ను ఎలుగెత్తి మనస్సుతో ఉచ్ఛరిస్తూ, భావము - అర్థమును దృష్టియందు బుద్ధియందు నిలుపుకుంటూ… ఆతడు ‘పరమహంస’ అయి విరాజిల్లుచున్నాడు.

అట్టి ’హంస ధ్యాని’ ధ్యానిస్తున్న హంస (పరమాత్మ) ఎట్టివారు? (లేక) ఆత్మ ఎట్టిది?

సర్వేషు వేదేషు వ్యాప్య వర్తతే!
స్వప్నము కనువాని (One whom the Dream belongs to) స్వప్న చైతన్యమే స్వప్నాంతర్గత ద్రష్ట, స్వప్న దృశ్యములు, విషయములు, వ్యక్తులుగా… అయి, ఆ స్వప్న ద్రష్టకు “నాకు ఈ స్వప్నము వేరైనదే!”…. అని అనిపిస్తోంది. అయితే స్వప్న ద్రష్టయొక్క స్వకీయ కల్పనయే స్వప్న రూపముగాను, స్వప్నములోని సర్వ విశేషాలుగాను దాలుస్తోంది కదా! కనుక, కల్పన అనబడేది - కల్పించుకొను వానికంటే వేరు కాదు. ఈ విషయం నిదుర లేచిన తరువాత సుస్పష్టమే అగుచున్నది కదా!

అట్లాగే….,
సర్వేషు వేదేషు  → జాగ్రత్ - స్వప్నములో తెలియబడేదంతా కూడా….,
(కో) వ్యాప్య వర్తతే  → ఎవ్వరైతే - తనకుతానే వ్యాపించి ఉండి, తానే జాగ్రత్ - స్వప్న - సుషుప్తి రూపుడై తన స్వరూపమును తానే ఆయా వివిధ రూపములుగా సందర్శించుచున్నారో ఆతడే హంస! హంసరూపుడు! ఆత్మ స్వరూపుడు! ఆత్మ!

అట్టి ’సోఽహమ్’ (నేనే ఆత్మరూపుడనై ఉండి, ఇన్నిగా నాచే నేనే ఆస్వాదించబడుచున్నాను)…. అను భావనను - అర్థమును ఉపాసిస్తూ ‘పరమహంస’ అగుచున్నాడు.

అట్టి ‘హంస’ (స్వస్వరూప - సర్వస్వరూప) ఆత్మ భగవానుడు ఎట్టివాడు?

యథా అగ్నిః కాష్లేషు : కట్టెలలో అగ్ని దాగి ఉండి ఒరిపిడిచే మాత్రమే ప్రదర్శితమగుచున్న తీరుగా ‘హంస (ఆత్మ)’ సర్వ జీవుల దేహాలలో సర్వదా వేంచేసియే ఉన్న స్వస్వరూపము. హంసోపాసన యొక్క ఆశ్రయముచే సంసార దృష్టులు నశించినప్పుడు హంస భావన బహిర్గతమై అనుభవమునకు వస్తోంది.

తిలేషు తైలమివ :  నువ్వు గింజలలో నూనెవలె (నువ్వు గింజలు గానుగ ఆడితే నూనె లభించినట్లుగా), సర్వ జీవులలో అంతర్యామిగా ఉన్న స్వస్వరూప పరమాత్మ శాస్త్ర ప్రవిచతమైన మార్గంలో సాధనలచే-అనుభవం కాగలడు.

అన్ని నువ్వు గింజలలోను తైలము ఒక్కటే అయినట్లు… జీవులు అనేకులైనప్పటికీ ఆత్మ సర్వదా ఏకమే అయి ఉన్నది.

అట్టి ఆత్మ తత్త్వమును, హంస ధర్మమును (సయేవ అహమ్! అహమ్ బ్రహ్మమేవ! నేను బ్రహ్మమే అయి ఉన్నాను అను ధర్మమును) తెలుసుకొన్నవాడై, హంసోపాసకుడు మృత్యువుయొక్క పరిధిని అధిగమించిన వాడగుచున్నాడు. 

తమ ఏవ విదిత్వా న మృత్యుమ్ ఏతి! సర్వము సర్వదా ఆత్మ విన్యాసంగా దర్శిస్తూ తాను ఆత్మస్వరూపుడై విరాజిల్లుచున్నాడు. పరమహంస అయి, సదా హంస తత్త్వము అనే జలముతో కూడిన మానస సరోవరంలో ప్రశాంతంగా వినోదంగా అనంత సుఖ స్వరూపుడై విహరిస్తున్నాడు. బ్రహ్మమానస సరోవంలో ‘హంస’ వలె, ఈ జగత్తులో హంస అయి విహరిస్తున్నారు.

దేహ ఉపకరణము - హంసోపాసన : ఇప్పుడు - ఈ ‘దేహము’ అనే వస్తువును ఒక ఉపకరణముగా ఉపయోగించి “హంసాభ్యాసము” (లేక) “హంసోపాసన” ఎట్లా సదాభ్యాసులు చేయటం జరుగుతోందో, (అట్టి మహనీయుల ఉపాసన అభ్యాసములు మనకు ప్రమాణం కనుక), అట్టి యోగాభ్యాసము మనము వివరించుకుంటున్నాము.

ఈ దేహమును ఉపయోగించుకోవటం - లోకంలో జీవులచే రెండు విధాలుగా జరుగుతోంది.

  1. సదభ్యాసులు :  ఈ దేహమును ఒక యజ్ఞ వస్తువుగాను, యోగోపకరణముగాను, ప్రకృతిమాతచే జీవుని మోక్షసాధన (లేక) పరమహంసత్వమును సముపార్జించుకోవటానికి ఆతనిపై గల వాత్సల్యముచే ప్రసాదించబడిన ఒక మహత్తరమైన సాధన వస్తువుగాను అర్థము చేసుకొని, ఈ భౌతిక దేహ వస్తువును సద్వినియోగం చేసుకొనుచున్నవారు.
  2. దురభ్యాసులు :  ఈ దేహమును పొంది, ఇందలి ఇంద్రియములచే ఏర్పడే సయోగము కారణంగా ఇంద్రియ విషయములను దర్శించుచున్న సందర్భములతో క్రమంగా తన్మయులు అయి ఉంటున్నవారు. “ప్రకృతి ప్రాసాదితమైన ఈ భౌతిక దేహమును నేను నా యొక్క ఆత్మ దివ్యత్వమును అనుభవానికి తెచ్చుకోవటానికై కదా, ఆశ్రయించాను!”…. అనునది ఏమరచినవారు. వారు, ”ఈ ఇంద్రియాలకు కనబడే విషయాలే నా సర్వస్వము. ఇక్కడే నా సుఖ దుఃఖాలు. ఇంద్రియ కల్పిత దృశ్యములో కొన్ని కొన్ని పొందితే నాకు సుఖం. లేదా, దుఃఖము” - అని భావిస్తూ విషయములలో తన్మయమై ఉండటం జరుగుతోంది. అట్టి సుఖ దుఃఖ తరంగాలలో పడి అనేక ఉపాధి పరంపరలను పొందుతూ, ఇంద్రియాతీతమైన హంసానుభవము - ఆత్మానుభవమునకు ప్రయత్నమే చేయకపోవటం జరుగుతోంది. ఇదియే సంసారము అని లోక ప్రసిద్ధమైయున్నది.

ఇప్పుడు…, కొందరు జీవులు ఏ తీరుగా ‘సదభ్యాసి’ అయి…., ఈ ‘దేహము’ అనే వస్తువును ప్రకృతిమాతచే ప్రసాదించబడిన ఒక మహత్తరమైన ఉపకరణము గాను, సంసార సాగరమును దాటించగలిగిన ‘నావ’ గాను గమనిస్తూ, భావించి, ఉద్దేశ్యించి, యోగమార్గంగా ’హంసోపాసన’ నిర్వర్తిస్తూ పరమహంసలుగా అగుచున్నారో…, అది చెప్పుకుందాము. అట్టి మహనీయుల అభ్యాసము - ఉపాసన-లక్ష్యసాధన-తదితర జనులకు ప్రమాణం కదా! కనుక అట్టి యోగాభ్యాసమును వివరించుకుంటున్నాము.

“హంసోఽహంస - సోఽహమ్” –  ఉపాసిస్తూ అందుకుగాను దేహమును ఉపకరణంగా ఉపయోగించే యోగాభ్యాసము. చక్రములు - దేహములోని భూ-జల-అగ్ని-వాయు-ఆకాశ-పంచభూతాతీత తత్త్వములను పర్యవేక్షించు “శక్తి కేంద్రములు”. ఆయా తత్త్వములకు ఆధిపత్యము వహించి దేహములో వాటిని త్రిప్పుచుండటంచేత ‘చక్రములు’. ప్రజ్ఞయొక్క విశేష ప్రదర్శనచేత “ప్రజ్ఞాకేంద్రములు” అని కూడా అనుచున్నారు.
అవి - 1) మూలాధారము (పృథ్వి) 2) స్వాధిష్ఠానము (జలము) 3) మణిపూరకము (అగ్ని) 4) అనాహతము (వాయువు) 5) విశుద్ధము (ఆకాశము) 6) ఆజ్ఞా (త్రిపుటి) 7) బ్రహ్మరంధ్రము 8) సహస్రారము.

గుదమ్ అవష్టభ్యా, ఆధారాత్
ఎడమకాలి మడతో ఈ పార్థివదేహము యొక్క దేహములోని భూతత్వమును పర్యవేక్షించుచున్న ’మూలాధార చక్రస్థానము’ అగు గుదస్థానమును మూసి…., (లేదా) సంకల్పశక్తిని ఉపయోగించి గుదస్థానమును నెమ్మదిగా బిగించి ఉంచి, అక్కడ కొంతసేపు తమ సంకల్ప శక్తిని సంకల్పపూర్వకంగా ఉంచటం అభ్యసిస్తున్నారు.

వాయుమ్ ఉత్థాప్య,
అటు తరువాత గాలిని ఆ చోటు నుండి నెమ్మదిగా కుంభించి, కుంభకాభ్యాసముచే గాలితో నింపి ఉంచి, నిలపి ఉంచి…, మూలాధార స్థానము నుండి ఆ కుంభక వాయువును ఇచ్ఛ-సంకల్పములతో (లేక, బుద్ధిపూర్వకంగా) పై పైకి నెమ్మదిగా కదల్చుచుచు…,

ప్రాణ - అపానములతో త్రికోణమును నిర్మించుకొని, అద్దాని యొక్క ఊర్ధ్వ బిందు స్థానములో ’అగ్ని’ని భావన చేస్తూ…

ప్రాణ-అపానములచే త్రికోణ ఊర్ధ్వ బిందు స్థానములో జనించిన ’ఉష్ణము’తో మూలాధారము నుండి, వెన్నెముక మధ్యన ఊర్ధ్వంగా ఉండి, అప్రబుద్ధంగాను, మత్తుగాను ఉండే మహత్తరశక్తి సంపన్నమగు ’కుండలిని’ని - సుషుమ్నానాడి మార్గంగా ఉత్తేజ పరచుచున్నారు.

అట్లు కుండలినీ శక్తిని నిద్రలేపుతూ విరాట్ పురుషుడగు పరమాత్మను ధ్యానములో నిలుపుతూ కొంతసేపు ధ్యానం చేస్తున్నారు.

తరువాత, ఇచ్ఛాశక్తితో కూడిన ప్రాణతత్వమును మూలాధార - త్రికోణ - ఊర్ధ్వ బిందువు నుండి సుషుమ్నానాడి ద్వారా ఉత్తేజితమైన కుండలినీశక్తితో సహ ఊర్ధ్వానికి ప్రయాణింపజేయుచున్నారు.

స్వాధిష్ఠానమ్ త్రిప్రదక్షిణీకృత్య …,
క్రమంగా బొడ్డుకు 1 ’/, బెత్తెల క్రిందిగా ఉండి, దేహములోని జలతత్త్వమును పర్యవేక్షిస్తూ ఉంటున్నట్టి, ప్లీహ-జల కేంద్ర స్థానమగు “స్వాధిష్ఠాన చక్రము”నకు బుద్ధిని చేర్చుచున్నారు. స్వాధిష్ఠాన చక్రస్థానమునకు బుద్ధి + ప్రాణ + మనో అగ్ని శక్తులతో కూడి ముమ్మారు (3సార్లు) ప్రదక్షిణము చేయుచున్నారు. కొంతసేపు ధ్యానమునందు బుద్దిని నిలుపుచున్నారు.

మణిపూరకమ్ గత్వా …,
ఆ తరువాత…, దేహములోని అగ్నిని నియమించు ధర్మము నిర్వర్తిస్తున్నట్టి, నాభి స్థానంలో అగ్నితత్త్వమై - శక్తిరూపంగా కేంద్రీకృతమైయున్న ‘మణిపూరక చక్రము’ను చేరుచున్నవారగుచున్నారు. అట్టి స్థానములో ఏకాగ్రతతో బుద్ధిని (మనో-ప్రాణ అగ్నిలతో సహా) కొంతసేపు నిలుపుచున్నారు. క్రమంగా అక్కడి నుండి కూడా ఊర్ధ్వంగా బయల్వెడలుచున్నారు.

అనాహతమ్ అతిక్రమ్య
అటుపై దేహములోని వాయుస్థానము - వాయు స్పందన కేంద్రము అయినట్టి, హృదయస్థానమున ఉన్నట్టి “అనాహత చక్రము”ను చేర్చుచున్నారు. ఆ అనాహత చక్రస్థానములో కొంతసేపు ధ్యానమును నిర్వర్తిస్తూ ఉన్నారు. క్రమంగా ఆ స్థానమును దాటుచు, సుషుమ్నానాడిలో మరికొంత ముందుకు - ఊర్ధ్వముగా పయనిస్తున్నారు.

విశుద్ధే ప్రాణాత్ నిరుధ్య
క్రమంగా - దేహములో ఆకాశతత్త్వ కేంద్ర స్థానము, కంఠ ప్రదేశములో నిక్షిప్తమైయున్నట్టిది, దేహములోని సర్వస్థానములను ప్రదేశములను పర్యవేక్షిస్తూ ఉన్నట్టిది-అయినట్టి "విశుద్ధ చక్రస్థానము”ను చేరుచున్నారు. అట్టి విశుద్ధ చక్ర కేంద్రబిందువు గల కంఠ స్థానములో ఉపాసన-తపస్సులను నిర్వర్తిస్తున్నారు. ఆచోట కొంతసేపు ప్రాణ - అపానములను నిరోధించి, ప్రాణాయామ పరాయణులై ఉంటున్నారు. అటు తరువాత, మరల ఊర్థ్వంగా ప్రాణశక్తి - మనస్సులను బుద్ధితో నడుపుచున్నారు.

ఆజ్ఞామ్ అనుయాయన్
క్రమంగా - కంఠప్రదేశమునుదాటి, కనుబొమ్మల మధ్య స్థానం చేరుచున్నారు. ఆకాశాతీత ఆకాశ నియమాకము. ద్రష్ట - దర్శన - దృశ్యములు ఏకరూపము పొందే పవిత్ర స్థానము. సర్వేంద్రియముల విషయములన్నీ అవిషయములై ఉండునట్టి నిరాకాశ స్థానము. త్రిపుటీ - త్రివేణీ సంగమ స్థానము (యోగ పరిభాషలో - గంగా -యమున - సరస్వతీ నదీ ప్రవాహములు కలయుచున్న ఏక స్థానము). అట్టి “ఆజ్ఞా చక్రము”ను ఆ హంసోపాసకులు ఇచ్ఛ - ప్రాణ - జ్ఞాన త్రిశక్తియుతంగా చేరుచున్నారు.

బ్రహ్మరంధ్రమ్ ధ్యాయన్ ‘త్రిమాత్రోఽహమ్’
ఇక ఇప్పుడు త్రిపుటీస్థానము అయినట్టి ఆజ్ఞాచక్ర అనుయాయులగుచున్నారు. నిర్విషయంగా, ప్రశాంతముగా సుఖాశీనులై, శిరస్సుయొక్క ఊర్ధ్వ భాగములో స్థానము కలిగియున్న బ్రహ్మ రంధ్రము వైపు దృష్టిని సారించుచున్నారు. సూక్ష్మమగు బ్రహ్మరంధ్రము పట్ల మనో-బుద్ధి-చిత్తములతో దృష్టి ధ్యాసలను నిలుపుచున్నారు.

క్రమంగా….,
త్రిమాత్రోఽహమ్

…. అను రూపమై త్రిమాత్రోఽహమ్ ధ్యానమును ఆశ్రయించుచున్నారు.

ధ్యాసను బ్రహ్మ రంధ్రమునందు నిలిపి,
బ్రహ్మమును సందర్శిస్తూ,
సర్వము బ్రహ్మమునందు, బ్రహ్మమును సర్వమునందు,
సర్వము బ్రహ్మముగాను,
దర్శించుచూ - ఆస్వాదిస్తున్నారు.

సాకారము అదే!
నిరాకారము అదే!
జీవాత్మ అదే!
పరమాత్మ అదే!

"ఇటు అటు గల ఇడ - పింగళ, అంతర్లీన శక్తి స్వరూపమగు కుండలిని, షట్ చక్రములు, జీవుడు - ఈశ్వరుడు, నేను - నీవు, - ఉన్నది - లేనిదీ అంతా బ్రహ్మమే! సర్వము బ్రహ్మమే!” - అని భావనను సుస్తీకరించుకొంటూ హంస ధ్యానమును కూడా దాటిపోయి, తానే హంస-పరమహంస అగుచున్నారు!

“పరిమితుడగు జీవుడను నేనే! అపరిమితుడగు ఈశ్వరుడను నేనే!" అను భావనచే తానే ‘హంస’ అయి ధ్యానమును త్యజిస్తున్నాడు కూడా! ధ్యాత - ధ్యానము - ధ్యేయము ఏకాత్మ స్వరూపమై అనుభవమగుచున్నప్పుడు, ఇక వేరే ధ్యానముతో పని లేదు.

అట్టి పరబ్రహ్మమూర్తి కోటి సూర్య ప్రభాభాసితుడై వెలుగొందుచున్నారు. సర్వము వ్యాపించినవాడై, సర్వములో - సర్వముగా “హంస” “పరమహంస” అయి బ్రహ్మానందమునందు తేలియాడుచున్నారు.

తస్య అష్ఠథా వృత్తిః భవతి
వాస్తవానికి స్వరూపతఃగా జీవాత్మ పరమాత్మయే! పరమాత్మయే మాయా వినోదియై హృదయ పద్మదళ నివాశి అయి ఉండి, అనేక విధములైన తత్త్వములతో కూడిన మాయాకాశంలో విహరిస్తున్నారు. అట్టి పరమాత్మయొక్క విన్యాసము అష్టవిధ ప్రకృతి విశేషాలుగా, అష్టదళ విన్యాసాలుగా విశ్వ తత్త్వజ్ఞులు చెప్పుతూ ఉంటారు.

అష్టవిధ ప్రకృతి

హృదయమధ్యస్థమ్…,
పరమాత్మ సర్వదా పరమాత్మగా, హంసరూపుడై అంతరహృదయ - అభ్యాంతరంగుడై ఉంటూనే…., తనయొక్క ఒక ‘అంశ’ అగు జీవాత్మగా అష్టదళములలో క్రీడా వినోదిఅయి సంచారములు చేస్తున్న విహారమే విశ్వములోని 14 లోకముల విన్యాసము, ఈ మాయా రచనా చమత్కారము కూడా!

పూర్వ దళే పుణ్యమతిః : తూర్పువైపు గల దళమునందు సంచరించుచున్నప్పుడు అట్టి సమయంలో ( ఆ జీవాత్మ) పుణ్య కార్యములందు ఆసక్తి కలిగినవాడై ఉంటున్నాడు. సత్వగుణ ప్రధానుడై ఉంటున్నాడు.

ఆగ్నేయే - నిద్ర - ఆలస్యాదయో భవంతి : జీవాత్మ ఆగ్నేయ దిక్కుగా ఉన్న హృదయ పద్మ దళములో ప్రవర్తించుచున్నప్పుడు నిద్ర - ఆలస్యము మొదలైన తమోగుణ ఆసక్తి సమన్వితుడై ఉండటం జరుగుతోంది.

యామ్యే - క్రౌర్యే మతిః : దక్షిణ దళమునందు పచార్లు చేస్తూ ఉన్నప్పుడు… కోపంగాను, ఆవేశంగాను, మూర్ఖపట్టుదలతోను, క్రూరంగాను, కోపంగాను కనిపిస్తున్నాడు. (రజో-తమో గుణాసక్తుడై ఉంటున్నాడు).

నైరృతీ-పాపే మనీషా : నైరృతి దళములో విహారాలు చేస్తున్న సందర్భములో (ఆ జీవాత్మ) పాపపు బుద్ధి కలిగి ఉంటున్నాడు. దొంగతనం చేసే స్వభావం, మోసం-దగా చేయాలనే ఉబలాటం, అసత్యమైన పలుకులు…. ఇత్యాదులు గుణ సంపదగా కలిగి నర్తిస్తున్నాడు.

వారుణ్యామ్ (పడమర) క్రీడా! : పడమట దళము అధిష్ఠించి ఉన్నప్పుడు క్రీడా వినోది అయి, హాస్యరస ప్రదర్శనం, ఇతరులను ఎగతాళి చేయటం, అంతా చాలా తేలికగా తీసుకొనే స్వభావం…. ఇటువంటివి ప్రదర్శించుచున్నాడు. (Child Ego State).

వాయవ్యాం గమనాదౌ బుద్ధిః:  వాయవ్యదళముపై ప్రవేశించి సంచరించుచున్నప్పుడు - ఒకచోట నిలువక, ఎట్లెట్లో సంచారాలు చేయాలని, దూర ప్రదేశాలు తిరిగి రావాలని, తీర్ధ ప్రదేశాలు చూచిరావాలనే అభిలాషలు వ్యక్తీకరిస్తున్నాడు. సంచార క్రియలు నిర్వర్తించి ఆస్వాదిస్తున్నాడు.

సౌమ్యే రతి ప్రీతిః : హృదయ పద్మముయొక్క ఉత్తరదిక్ దళమునందు సంచారములు పొందటం జరుగుతున్నప్పుడు అనేక విషయ పరంపరలతో సంబంధము పెట్టుకుంటూ, రమిస్తూ ఉండటంలో ప్రీతి కలిగినవాడై ఉంటున్నాడు.

ఈశాన్యే ద్రవ్యాదానే : ఈశాన్య దిక్ దళములో జీవాత్మగా సంచరించు సందర్భములో “ద్రవ్యము సంపాదించాలి! సంపదలు, వస్తువులు ప్రత్యేకమైనది కలిగి ఉండాలి! ఇంకా ఏదో పొందాలి! నాకున్నవి మరెవ్వరి దగ్గర ఉండకూడదు”…. ఇట్టి రూప ఆవేశము గల విషయ పరంపరలలో మునిగి - తేలుచున్నాడు. ఇందులో ఉత్తరాధికారి “నేను ఇతరులకు ఏదో దానం చేసినప్పుడే నాకు తృప్తి” అను భావ-ఆవేశము కలిగి ఉంటున్నారు.

మధ్యే వైరాగ్యమ్ : హృదయ మధ్య భాగంలో జీవాత్మ అధిష్ఠించినప్పుడు వైరాగ్య భావాలు కలుగుచున్నాయి. “ఈ ఇంద్రియ ప్రపంచ వ్యవహారములు, స్థితిగతులు నిత్యము కాదు, సత్యము కాదు. వీటన్నిటికీ ఆవల దృష్టి సారించెదను గాక”… అని తలచనారంభిస్తున్నాడు.

కేసరే జాగ్రదవస్థా :  హృదయపుష్ప కేసరములు (తంతువులు) అధిష్ఠించినప్పుడు “ఇంద్రియ బాహ్య విషయాలు - పదార్థములతో సంయోగ వియోగము”…. అనే జాగ్రత్ అవస్థయందు అధికప్రీతి కలవాడై ఉంటున్నాడు.

కర్ణికాయామ్ స్వప్నౌ : హృదయ పద్మముయొక్క కర్ణికలు (తొడిమల) వద్ద అధిష్ఠితుడైయున్నప్పుడు అంతరంగ మనో కల్పనా విశేషములయందు సంలగ్నుడై, ప్రీతి-ధ్యాస-ఇష్టము కలిగినవాడై వర్తిస్తున్నాడు. నిద్రాప్రియుడు అగుచున్నాడు.

లింగే సుషుప్తిః : హృదయపుష్పము యొక్క మూల-ప్రారంభ స్థానమునందు సంస్థితుడై ఉన్నప్పుడు గాఢ నిద్రా పరవశత్వము పొందుచున్నాడు. విషయరహితత్వము, విషయాతీత కేవలసాక్షిత్వములయందు ప్రీతికలవాడై ఉంటున్నాడు.

హృదయ పద్మదళమును దాటిపోయిన - అతీతమైన స్థానమునందు సంస్థితుడు అగుచు, అధిష్ఠానముగా అగుచున్నాడు. “జాగ్రత్స్వప్న-సుషుప్తులకు నేను యజమానిని. అవన్నీ నా రచనా వ్యాసంగములే కదా!”… అని గ్రహించుచు-తురీయుడు అగుచున్నాడు.

హృదయ పద్మ దళమును దాటిపోయి, భృకుటీ మధ్య స్థానము - నాశికకు ఊర్ధ్వము అగు ‘ఆజ్ఞాచక్రము’నందు సంస్థితుడై, బ్రహ్మరంధ్రమును దర్శించుచుండగా, అట్టి యోగి, హంసస్వరూపుడగుచున్నాడు.

యదా హంసో నాదే విలీనో భవతి, తత్ తురీయాతీతమ్ భవతి||
ఎప్పుడైతే “హంస-సోహమ్-హంసోఽహంస” నాదమునందు “అహమస్మి తత్” భావనతో విలీనుడగుచున్నాడో…. అప్పుడా యోగి తురీయాతీతుడై, వాక్చే వర్ణించి చెప్పబడుటకు అశక్యుడై, కేవల చిదానంద జగత్ + జగత్ సాక్షీ స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు. సర్వాకార - నిరాకారుడై హంసస్వరూపుడై పరమహంసయై పరమాత్మ అను సంజ్ఞకు సూచనార్థమై వెలుగొందుచున్నాడు.

శుద్ధ స్ఫటిక సంకాశమ్
అట్టి యోగి….,
యోగ సాధన యొక్క పరిపక్వతచే….,
తురీయ తురీయుడు అగుచుండగా…,

యోగ మార్గము

“ఈ సర్వముగా వ్యక్తమగుచు - వ్యక్తీకరించుచున్నది ఆత్మయే! కనుక, ఇదంతా ఆత్మకు అభిన్నము. నేను సహజంగా, స్వతఃసిద్ధంగా ఆత్మస్వరూపుడనే”…. అను అవగాహన అనుభూతిచే ఈ హంసోపాసకుడు, ’పరమహంస’ అగుచున్నాడు.

→ తానే బ్రహ్మమై శుద్ధ స్ఫటికమువలె వెలుగొందుచున్నాడు.
→ ‘పరమాత్మ’ తానే అయి పూర్ణమునందు పూర్ణమునకు పూర్ణమై - విలసిల్లుచున్నాడు.

హంస మహామంత్ర జపం

ఇప్పుడు…,

హంసోపాసకులు - హంసవ్రతులు అంగన్యాస - కరన్యాస పూర్వకంగా అజపాగాయత్రీ అగు ‘హంసోహంస’ మంత్రమును గానం చేస్తూ - సర్వత్రా ప్రకాశమానుడగు ఆత్మ భగవానుని ఉపాసిస్తున్న విధి గురించి చెప్పుకుందాము.

జపా గాయత్రి :

ఓం
ఓంకార స్వరూపుడగు పరమాత్మకు నమస్కరిస్తున్నాము.
భూర్భువస్సువః
భూ భువర్ సువర్లోకములన్నీ
తత్
ఎవ్వరియొక్క - సవితుః = సత్ + విత్
సవితుః వరేణ్యం
(సత్ విత్ - ఉనికి ఎరుకల - Presence & Awareness) - కేవల స్వరూపుడు, సవిత్రు దేవుడు, వరేణ్యుడు (శ్రేష్ఠాతిశ్రేష్ఠుడు) అగు ఆత్మ భగవానుని
ధీమహీ
ధీ మహిమచే - బుద్ధి శక్తి ఔన్నత్యము చేత….,
భర్గో దేవస్య
అస్య భర్గోః ఏవః - తేజో శక్తిచే (త్రిలోకములు) వెలుగొందుచున్నాయో …
ధియో యో నః
ఆయన మాయొక్క ధీశక్తులను
ప్రచోదయాత్
ప్రత్యుత్సాహ పరచి, తన వైపుగా ప్రచోదింపజేయును గాక! వికసింపజేయును గాక!

అజపా గాయత్రీ మహా మంత్రః :

అథ ‘హంస’ ఋషిః
పరమాత్మ (హంస) - ఋషి
అవ్యక్తా గాయత్రీ ఛందః
అవ్యక్తా గాయత్రీ ఛందో గానము - మౌనస్వరూపముగా ఆత్మ భావనా గానము.
పరమహంసో దేవతా
పరమహంస దేవత
‘హం’ బీజమ్
‘హం’ జీవాత్మ (అహమ్ / వ్యష్ఠిగతమైన నేను) బీజము గాను
‘సం’ శక్తిః
‘సం’ సత్ స్వరూప - సర్వస్వరూప - (సత్ / సమిష్టిగతమైన ‘నేను’) శక్తిగాను
‘సోఽహమ్’ కీలకమ్  ‘సోఽహమ్’… లక్ష్యార్ధముగాను
షట్ సంఖ్యా
పంచ భూతములు + మనస్సు = జీవాత్మ సాధన వస్తువులు గాను - ’షడాధార దేవతలు’గా అభివర్ణించబడు గణేషుడు- బ్రహ్మ-విష్ణు-రుద్ర- త్రిపురేశ్వరి - సదాశివుడు జపకర్తలు-జపనియామక గురువులు గాను
అహెూ-రాత్రయోః
ప్రతి రోజు రాత్రి - పగలులో జరుగుచున్న ‘21600’ శ్వాసలు జపరూపములై అజపాగాయత్రీ
ఏకవింశతి సహస్రాణి
మంత్రోచ్ఛారణలుగాను భావించబడుచున్నాయి. “పరమాత్మయే నా ఊపిరి” అని భావన
షట్-శతాని అధికాని భవంతి
చేయుట జరుగుచున్నది.

హంసోపాసకులచే పరమహంస ధ్యానము అనుక్షణికంగా నిర్వర్తించబడుచూ, సాగుతూ ఉంటుంది.

ఒక రోజులోని ఇట్టి అజపాగాయత్రీ ఫలమును నాలుగు విభాగములుగా సంకల్పించి ఏతత్ దేవతలకు లోక కళ్యాణార్థమై సమర్పించివేస్తూ ఉంటారు.

సూర్యాయ - మొదటి భాగము
→ సూర్యునికి (విరాట్ పురుషునికి, తేజోశక్తి ప్రదాతకు),
సోమాయ - రెండవ భాగము   → చంద్రునికి (ఓషధులు ఆహారము - పరిపోషణతత్వానికి-ఓజోశక్తి ప్రదాతకు), -
నిరంజనాయ - మూడవ భాగము
→ రంజన రహితమగు నిర్మలబుద్ధి దేవతలకు. నిశ్చల బుద్ధికి,
నిరాభాసాయ - నాలుగవ భాగము   → ఆభాస (ప్రతిబింబత్వము) అను దోషము లేనట్టి - అంటనట్టి నిరాభాసుడగు పరమాత్మకు!

సూర్యాయ - సోమాయ నిరన్జనాయ - నిరాభాసాయ తన్నో సూక్ష్మమ్ ప్రచోదయాత్ |

… అను మంత్రముచే "స్థూల దృష్టి దోషమును తొలగించి మా బుద్ధికి సూక్ష్మమైన బుద్ధిని ప్రసాదించండి…. అని జపా-అజపా గాయత్రీ మంత్ర ఫలాన్ని-సృష్టి శక్తులకు, భూమికి, పంచభూతములకు లోకకళ్యాణార్థమై సమర్పిస్తున్నాను”- అను భావనయే సాధన అగుచున్నది.

హృదయాది అంగన్యాసములు - అంగుష్ఠాది కరన్యాసములు :

అజపా గాయత్రీ ధ్యానము యొక్క అనుక్షణికత, ఏకాగ్రత, లక్ష్యసుద్ధికై హంసమహా మంత్రమును అంగ-కర న్యాసాలతో ముందుగా హృదయములోను, త్రిపుటియందు ఆవిష్కరిస్తూ ఉంటారు. సమయము = నిదురలేచిన మరుక్షణం! మరల నిదురపోవు వరకు!

హంస = నేను రూపంలో ఉన్న పరమాత్మ - నాలోని ‘నేను’ అందరిలోని ‘నేను’

హం సాం అంగుష్ఠాభ్యాం నమః
హం సాం హృదయాయ నమః
హం సీం తర్జనీభ్యాం నమః
హం సీం శిరసే స్వాహా
హం సూం మధ్యమాభ్యాం నమః
హం సూం శిఖయాయ వౌషట్
హం సైః అనామికాభ్యాం నమః
హం సైః కవచాయుహుమ్
హం సౌం .. కనిష్ఠికాభ్యాం నమః
హం సౌం నేత్రతయాయవేషట్
హం సః .. కరతలకర పృష్టాభ్యాం నమః
హం సః .. అస్త్రాయఫట్

అగ్నిషోమాభ్యామ్ ఇతి దిగ్బంధః |
… అని న్యాసము చెప్పుకొని,
“శ్వాసను ఉపాసనగా, నిశ్శబ్ద-మౌనము కొనసాగిస్తూనే సందర్శనంతో గమనించటం” అనే అజపాగాయత్రి చెప్పుచూ…,

ఏవం కృత్వా హృదయే హంసమాత్మానమ్ ధ్యాయేత్ ||
“నా హృదయంలోను, సర్వుల హృదయాలలోను ‘నేను’ రూపముగా సంచారాలు చేస్తున్న జీవాత్మ సర్వదా పరమాత్మయొక్క లీలా కల్పనా - క్రీడా - ఛాయా విశేషమే! కనుక తత్ త్వమ్! అహమ్ బ్రహ్మస్మి"…. అని ధ్యానం చేస్తున్నారు!

హంసోపాసనచే హంసయోగ స్థానమును (లేక) అపరోక్షానుభూతి పొందుచున్న పరమహంస యొక్క దృశ్యవిశేష దర్శనం ఎట్లా ఉంటుంది?

“జీవాత్మగా జగత్తులోను, పరమాత్మగా జగత్ సాక్షిగాను, ఇహ-పర స్వరూపుడనై ఉన్నది నేనే! అందరు నాకు అభిన్నము. అందరికీ నేను అభిన్నుణ్ణి!"

ఇట్టి హంస ధ్యానము చేయబడు గాక! ఇట్లు ధ్యానిస్తూ ఉండగా ఆ ముముక్షుత్వము (హంసోహంస) కూడా ఉపశమించగా, ఇక “ఉన్మనీ” (కేవల మనస్సు) - అను పేరుతో (హంసో తత్త్వజ్ఞులచే) పిలువబడుచున్నాడు.

ఉత్ + మనీ = మనస్సు జనిస్తున్న స్వస్వరూపస్థానము.

‘సోఽహమ్’ జపము ఉపశమించుచుండగా - సోఽహమ్ భావన స్వభావ సిద్ధమైపోతోంది. ’సాధన అవసరమే లేదు’ అని తెలుసుకొని - ఆస్వాదించటానికే సాధన - సాధనా క్రమం కూడా! ముఖ్య - భావన సిద్ధించిన తరువాత, ఇక భావనయే జపమగుచున్నది.

‘ఏవం హంసవశాత్ అస్మానో’ విచార్యతే!‘హంస’ అనబడే నేనైన పరమాత్మకు వేరుగా ఎక్కడా మరింకేదీ ఏదీ లేదు. నేను - నీవు జగత్తు - దేహాలు - జన్మ - మృత్యువులు …. అంతా హంస చమత్కారమే! అని బుద్ధి నిశ్చయమౌతుంది. ఇక అన్ని ప్రయత్నములు సశాంతించి, కేవలానుభవము శేషించటమే ’హంసోఽహమ్!’

‘హంస’ జపకోట్యా నాదం భవతి |

మనము చెప్పుకున్న "ఆజ్ఞా చక్రములో ‘హంస’ మంత్రమును అనుక్షణికం చేస్తూ బ్రహ్మరంధ్రమునందు దృష్టి పెట్టడం”… అనే జపకోటియొక్క ప్రభావం చేత, అట్టి అభ్యాసి అయినట్టి యోగికి హృదయకమలమునందు ‘సోఽహమ్’ అనుభవరూపమగు ఒకానొక నాదము ఉత్పన్నమై ఉంటోంది. ఆ శబ్దముయొక్క అనుభవము ఆ యోగి (లేక సాధకుడు, ముముక్షువుయొక్క) సంకల్పము లేకుండా స్వభావ సిద్ధముగా అనుభవము అవుతుంది. అది పదితీరులైన నాదము అయి ఉంటోంది. ఇది కుడిచెవియొక్క అంతర్విభాగము నుండి బయల్వెడలుచూ ఉంటుంది!.

చిణ్‌తి ….
ప్రథమః (1) మొట్టమొదట ‘చిణ్’ శబ్దనాదము
చిణ్ చిణి ఇతి ….
ద్వితీయః (2) ‘చిణ్’ - చిణీ’ … ఇతి
ఘంటానాదః
తృతీయః (3) టంగ్ ….. ఘంటానాదము
శంఖనాదః
చతుర్థః (4) ఉమ్…. శంఖానాదమ్ ఇతి
తంత్రీనాదః
పంచమః (5) ట్రింగ్ ….. తంత్రీనాదమ్ ఇతి
తాల నాదః
షష్ఠః (6) తధీంధీం …. తాల (గొంతుకతో) నాదమ్ ఇతి
వేణు నాదః
సప్తమః (7) ఈ…. వేణునాదమ్ ఇతి
భేరీనాదః
అష్టమా (8) ఢుం భేరీనాదమ్ ఇతి।
మృదంగనాదః
నవమో (9) తకిట తటకిట మృదంగనాదమ్ ఇతి |
మేఘనాదః
దశమో (10) ఝుంమ్ …. మేఘనాదమ్ ఇతి |

వరుసగా మొట్టమొదటి ‘9’ నాదములను వదలి, 10వది అగు ఒక్క మేఘనాదమును మాత్రమే స్వీకరించి హంసయోగాభ్యాసులు అద్దానిపై మనస్సు - బుద్ధి నిలిపి ఉంచటమును అభ్యాసం చేస్తున్నారు.

మరికొంత వివరణ - అంతరార్థములు

ప్రథమే చించినాగాత్రమే (చిణిత) : మొట్టమొదట “హంసోహంస” యోగోపాసకునకు దేహమంతాకూడా “చిణ్” నాదం వినబడనారంభిస్తుంది. ఆ శబ్దము అన్ని చక్రాలలోను, దేహమంతా వినబడుచున్నట్లు తోచుచూ ఉంటుంది.

ద్వితీయం గాత్ర భంజనమ్ (చిణ్-చిణిత) : రెండవ దశలో ’నేను దేహముచే బద్ధుడను. దేహ పరిమితుడను’ అనే బంధ భావన తొలగి …. “ఈ దేహము ప్రకృతికి చెందినది. ప్రకృతి నాకు నా యొక్క హంసోపాసనకు, ఆత్మయొక్క దివ్యత్వానుభూతికి ప్రసాదించబడిన మహత్తర వస్తువు. సదుపయోగము చేసుకొని, తిరిగి ప్రకృతికి ఇచ్చివేయవలసిన వస్తువు" అనే భావనా పరిపుష్ఠితో దేహమును దర్శిస్తాడు. కనుక ఈ దశలో దేహముతో సాంసారిక బంధము తొలగి, సాధనావస్తు సంబంధము ప్రవృద్ధమౌతూ వస్తుంది.

తృతీయమ్ భేదనమ్ యాతి। (ఘంటానాదానుభవమ్) : మూడవ దశలో ఈషణములు (Attachments – భార్యేషణ పుత్రేషణ - ధనేషన - గృహేషణ ఇత్యాదులు) భేదనమౌతాయి. “సృష్టి-స్థితి-లయాలు సత్యమే” అను బ్రహ్మ-విష్ణు-రుద్ర గ్రంధుల (మానసికమైన - కల్పన పట్ల సత్యదృష్టి బంధనములు) - చిక్కుముడులు విడిపోతూ వస్తాయి.

చతుర్థే కంపతే శిరః-శంనాదమ్ : నాలుగవదశలో హంసోపాసనతో పొందుచున్న ఆనందము యొక్క రుచితో శిరస్సు కంపిస్తూ ఉంటుంది. "ఆహాఁ! ఈ సాంసారికార్ధముచే చెలరేగుచున్న ఇంద్రియ విషయాలు ఎంతగా చిన్నవి!”…. అని అతీతత్వ భావన పొడచూపుతూ ఉంటుంది. హృదయములో శంఖనాదము బయల్వెడలి ఇంద్రియ విషయములను - బంధ భావనలను ప్రారద్రోలివేయనారంభిస్తుంది. విషయముల జోక్యము లేని ఇంద్రియములు కేవలీ సుఖ రూపముగా అనుభవమవసాగుతాయి.

పంచమీ స్రవతీ తాలూ (తంత్రీనాదః) : ఐదవ దశలో తంత్రీనాదము పుట్టుచుండగా గొంతుకలో రసము స్రవిస్తూ ఉంటుంది. ఒకానొక మధురమైన రసానుభూతి ఉదయిస్తూ వస్తూంది. “ఈ దృశ్యమంతా సర్వమూ మధురరసానుభూతి రూపమే” అని అనిపించసాగుతుంది.

షష్టే అమృత నిషేషణము (తాలనాదః) : ఆరవ (6) దశలో అమృతము స్రవిస్తుంది. చంద్ర-సూర్య మండలములు ఏకమై ఆ యోగి (లేక) ఉపాసకుడు అమృత స్వరూపమును - మార్పు చేర్పులు లేని సహజ రూపమును గ్రోలుతూ ఉంటాడు. దృశ్యము-ద్రష్టత్వము మొదలైనవి ఆతనికి, వాటివాటి కష్ట-సుఖ విషయాలతో సహా అమృత స్వరూపమౌతాయి.

సప్తమమ్ గూఢ విజ్ఞానం (వేణునాదమ్) : ఏడవ దశలో నిగూఢమగు ఆత్మజ్ఞానము - విజ్ఞానము యొక్క ఉత్తమ స్థితి కలుగుచూ ఉంటాయి. ఆత్మయొక్క అఖండత్వ-అప్రమేయ-నిత్యత్వ విశేషణాలు ఆతని బుద్ధికి “అవును కదా” అనిపించసాగుతాయి. అనుభవ రూపము సంతరించుకోసాగుతాయి.

పరా వాచా తథా అష్టమ (భేరీనాదము) : ఎనిమిదవ దశలో పరావాక్కుతో - పరా అనుభవముతో (తనయొక్క ఇహ స్వరూపమునకు సాక్షియై చెన్నొందుచున్న పర స్వరూపముతో) ఎడతెగని సంయోగము, అనుబంధము కలుగటం ప్రారంభమౌతుంది. “స్వప్న దృశ్యమునకు నేను వేరుగా ఉన్నట్లుగా, జాగృత్ దృశ్యమునకు కూడా వేరుగానే ఉన్నాను కదా!” అని తెలుసుకో సాగుతాడు.

అదృశ్యమ్ నవమే దేహమ్ (మృదంగనాదమ్) : తొమ్మిదవ దశలో అదృశ్య స్వరూపుడగు క్షేత్రజ్ఞానానుభవం (దేహి-అనుభూతి) ఆరంభించి ప్రవృద్ధమగుచూ, నిర్మలమగు దివ్య చక్షువులు (జ్ఞాన దృష్టి - ఆత్మదృష్టి) ప్రవృద్ధము-అనునిత్యము కావటం ఆరంభమౌతుంది.

ఈ జీవుడు ఈశ్వర స్వరూపుడై, జీవునకు సాక్షి-నియామకుడు పర్యవేక్షకుడు అయి ఆనందిస్తున్నాడు. “ఒక దేహములోని నేను” స్థితిని అధిగమించి, - “సహస్రశీర్షా - ఈ వేలాది అందరిలోని నేనైన నేను” ప్రవృద్ధం కాసాగుతుంది.

ఈ 9 నాదములు దాటిపోయి, 10వది అగు మేఘనాదముతో బుద్ధిని నిలిపినప్పుడు ఇక ఆ యోగి (సోఽహమ్ ఉపాసకుడు) …. పరబ్రహ్మ స్వరూపుడై వెలుగొందుచున్నాడు! (ఊర్థ్వభాహుః విరేమేష్య - అహమస్మి బ్రహ్మమ్)! "అందరిలోని నేను అందరుగా నేను! సర్వమునకు వేరైన నేను” అను త్రిమూర్తీ - ఏకస్వరూపము స్వభావసిద్ధమగుచున్నది!


హంసోపాసన …. సోఽహమ్ యోగము
ఫలశృతి

ఈ హంసోపనిషత్ వర్ణితము అగు “హంసోహంస! సో హమ్! హంసోపాసన!” చే, ఆయోగి (సాధకుడు) తన ఆత్మయొక్క విభవమే జగత్ రూపము-అని ఎరిగినవాడై…., పరమహంసగా ఆత్మ ప్రకాశమానుడగుచున్నాడు.

తస్మాత్ మనో విలీయతే … ఇతి ఉన్మనీ : ఆతని మనస్సు ఆత్మయందు విలీనమై ఆత్మస్వరూపముగా రూపు దిద్దుకొంటోంది.

దర్పణములో ఏదేది ప్రతిబింబించినా కూడా,… దర్పణములో ఆ వస్తువూ - ఆ రూపమూ ఉన్నాయా? వాస్తవానికి లేవు కదా! కేవల మనోరూపుడై, మనోవిషయములన్నీ దర్పణ ప్రతిబింబ మాత్రముగా అయి ఆతడు ప్రకాశిస్తున్నాడు.

దర్పణములో ఒక వ్యక్తి యొక్క కదలికలు ప్రతిబింబిస్తుంటే…, ఆ వ్యక్తి దర్పణములో ఉండి ఉన్నట్లా? కాదుకదా! నిర్మల మనోదర్పణములో ప్రతిబింబించే జగత్-నామ రూపాలు-సంఘటనలు మొదలైనవి వాస్తవానికి మనోదర్పణములోనూ లేవు! మరెక్కడా లేవు! ఆత్మ జ్ఞానముచే “అత్మకు వేరుగా మనస్సు అనబడునదేదీ లేదు!”…. అని తెలియవచ్చుచున్నది.

ఈవిధంగా “మనస్సు” అనబడేది ఆత్మకు అభిన్నమై అనుభూతమవటమే ’మనోలయము’! పరమహంస మనస్సు లేనివాడై, మనస్సుగా ఉన్నది ఆత్మతత్త్వమే… అని గమనిస్తూ, ’మనోసాక్షి’గా విరాజిల్లుచున్నాడు. మనస్సు ఆత్మస్వరూపమే అయిన తరువాత ఇక మనస్సుచే ఆత్మ బంధించటమనేది ఎక్కడిది? ఇది ‘ఉన్మనీ స్థితి’ గా కూడా అభివర్ణించబడుతోంది.

మనసిగతే సంకల్ప - వికల్పే … ఆ పరమ హంస సంకల్ప - వికల్పములను (Idea - Formation and withdrawl of Idea), సర్వవిషయములను ఆత్మయందు లయింపజేస్తున్నారు అనగా, ఆత్మకు అభిన్నమైనవిగా గమనించుచున్నారు. ఆత్మగా దర్శిస్తూ ఉంటున్నారు. అహమ్ బ్రహ్మాస్మి - అను అనుభవములో వ్యష్ఠి-జీవత్వ భావనలను జలంలో కరిగిపోతూ ఉన్న ఉప్పు బొమ్మవలె - దర్శిస్తున్నారు.

దగ్ధ పుణ్య పాపే : “సర్వము మమస్వరూపమగు పరబ్రహ్మమే! ఇక ఇందులో పుణ్యపాపములు ఎక్కడున్నాయి?”…. అని గమనించినవారై ఉంటున్నారు. మట్టితో రాక్షసుడి బొమ్మ - దేవత బొమ్మ తయారుచేసినప్పుడు…… రాక్షస బొమ్మలోని మట్టి - దేవతా బొమ్మలోని మట్టి … మట్టి దృష్ట్యా వేరు వేరు కాదు కదా! అట్లాగే ఆత్మ భగవానునికి ఎప్పుడూ ఎక్కడా భిన్నమైనది లేదని దర్శిస్తూ…. పుణ్య-పాప ఇత్యాది ద్వంద్వ భావములను ఆత్మజ్ఞానాగ్ని యందు దగ్ధం చేసినవాడై ఉంటున్నారు.

సదాశివః : “జ్ఞానిగాను-అజ్ఞానిగాను, ఎరిగినవాడు గాను, ఎరుగనప్పుడు, దేహము ఉన్నప్పుడు లేనప్పుడు - ఎల్లప్పుడు - సదా - శివస్వరూపుడనే”…. అని సదాశివత్వం పుణికి పుచ్చుకొని ఉంటున్నాడు.

శక్త్యా : శివ-శక్తి స్వరూపానుభూతి కలిగినవాడై ఉంటున్నాడు. “నేను నా ప్రకృతి” ఈ రెండిటి ఏకత్వములోని భిన్నత్వమే ఈ - జగత్ దృశ్యమైయున్నది… అని ఆస్వాదిస్తున్నారు. ఏకత్వము విడువకనే శివశ్శక్త్యా - భిన్నత్వమును వినోదిస్తున్నారు.

జీవాత్మగా ఉన్నది పరమాత్మయే! జీవాత్మలు అనేకంగా కనబడుచున్నప్పటికీ ఆత్మ అఖండము! అప్రమేయము! ప్రతి జీవుని ఈ జీవాత్మత్వము సందర్భ సత్యము మాత్రమే! పరమాత్మత్వమో, అనునిత్యసత్యము! సదాశివము!

సర్వ జీవులు తానై, సర్వసాక్షిగా వేరైన అఖండ - అప్రమేయ ఆత్మానందమే పరమహంసలు విహరిస్తున్న బ్రహ్మానంద క్షీర సాగరము.. ఆ పరమాత్మయే తానైన పరమహంస యొక్క అనిర్వచనీయ స్వానుభవం ఎటువంటిది? అవర్ణనీయం! వర్ణణాతీతం!

సర్వత్రా అవస్థితః | స్వప్నము తనదైన స్వప్న ద్రష్ట-స్వప్నములోని ఒకవిభాగంలో ఉంటాడా? లేదు.

అట్లాగే, ఆతడు -

… హంసోపాసకుడు, సోఽహమ్ భావకుడు, ’సో హమ్ స’ మంత్రార్థ తత్త్వవేత్త అగుచున్నాడు.

ఈ బ్రహ్మాండములుగా, ఈ సర్వలోకములుగా-ఆత్మ స్వరూపుడనైనట్టి నేనే - సర్వదా, సర్వత్రా “అవస్ధితుడనై ఉన్నాను” అను పరమ సత్యమును అనుక్షణికంగా ఆస్వాదిస్తున్నారు. స్వీయ కల్పన, రచనలవలె ఆస్వాదిస్తూ, సర్వము తానే అయి ఉంటున్నాడు.

స్వయం జ్యోతిః | మమాత్మయే జ్యోతి స్వరూపమై ఇక్కడ పంచభూతములను, జాగ్రత్ స్వప్న సుషుప్తులను, జీవ-ఈశ్వరతత్త్వములను, బ్రహ్మాండములను, బ్రహ్మాండంతర్గత దేహ-దేహాంతర పరంపరములను, సత్-చిత్-ఆనందములను, ఈ సమస్తమును వెలిగించుచున్నది. ప్రకటించుచున్నది. అట్టి ‘హంస’ జ్యోతిని వెలిగించు జ్యోతి మరొకటి లేదు.

జ్యోతిర్ణోతిః స్వయం జ్యోతిః ఆత్మజ్యోతిః శివోస్మ్యహమ్ | … అను స్వయం జ్యోత్యానంద వెలుగులును విరజిమ్ముతూ ఉన్నారు. ఆ పరమహంస, తాను స్వయంజ్యోతి అయి…, ఈ జగత్తులను, సర్వ సహజీవులను స్వయం జ్యోతి యొక్క కిరణరూపములుగా ఆస్వాదిస్తున్నారు.

శుద్ధో : అస్మత్ ‘హంస’ రూపము సదా శుద్ధము. జాగృత్-స్వప్న-సుషుప్తులతోగాని, అందులోని అంతర్గత కర్మ-పుణ్య-పాపాది సంగతుల చేతగాని స్పృశించబడనట్టి నిత్యముక్త స్వరూపము అని ఆ పరమహంస సందర్శిస్తున్నారు.

నిత్యో : "కాలమునకు నియామకమైయుండి, భూత వర్తమాన భవిష్యత్ త్రికాలములకు సాక్షినై, వాటికి సంబంధించక, మార్పుచేర్పులు చెందని కాలఃకాలము నాయొక్క పరమహంస స్వరూపము! హంసతత్త్వమై క్రీడగా కాలమును సంకల్పించుచున్నాను. నియమించుచున్నాను. అందులో సంచారాలు చేసే నాయొక్క జీవాత్మ తత్త్వమంతా ఆటలలోని ఆట వస్తువులుగా కల్పించుకొనుచున్నాను. పరిపాలించుచున్నాను. మరొకప్పుడు ఆ కాల-చక్రమును, కాలాంతర్గత సర్వ విషయములను లయింపజేసుకొనుచున్నాను. మరల ఎప్పుడో సృష్టులను కల్పించుకొనుచూ ఉన్న నిత్యోదిత స్వరూపమగు ’హంస’ను నేను!… అని పరమహంస తన హంసత్వమును అద్వితీయముగా (జగత్తంతా నేనే - అని ఎరిగినవాడై) అనుభూతయుతుడగుచున్నారు. స్వదేహ భావంగా ఆస్వాదిస్తున్నారు.

నిరంజనః : నిత్య నిర్మలమై, అస్పృశ్యమై ’హంస’యై సర్వత్రా వెలుగొందుచున్నారు!

శాంతతమః : సర్వతత్వానందము-కేవలీరూపము అగు అస్మత్ హంసస్వరూపము పరమశాంతమైనది! సర్వదా శాంతము - శివము - అద్వైతము - సగుణ - నిర్గుణాతీత కేవలసాక్షి!

ఆకాశము మేఘముల రాక - పోకలచే తనయొక్క సహజసిద్ధమగు అనంతతత్వము - అప్రమేయత్వములను కోల్పోతోందా! లేదు కదా! అట్లాగే పరమ శాంతమగు అస్మత్ హంసత్వము జన్మ-కర్మ-సృష్టి-స్థితి-లయ-కాలములచే తన సహజ సిద్ధమగు అనంతత్వము-అప్రమేయత్వము కించిత్ కూడా కోల్పోవటం లేదు.

సర్వదా శాంతము - శాంతతరము - శాంతతమము అయి హంస (ఆత్మ) అంతటా విరాజిల్లుచున్నది - అని గ్రహించి, క్షీరసాగరంలో శయనించే విష్ణుమూర్తివలె…. సర్వము పర్యవేక్షిస్తున్నారు. వీక్షిస్తున్నారు.

ఈ విధంగా ఆ పరమహంస హంస (కేవలాత్మ) స్వరూపుడై…, “సదాశివ - శక్త్యా” సమేతుడై, సర్వత్రా వ్యవహరిస్తూ…, నిరాభాసమై, స్వయంజ్యోతి స్వరూపమై, శుద్ధమై, శాంతమై, నిత్యమై, నిరంజనమై, సర్వమై, పరమ శాంతమై ప్రకాశమానమగుచున్నారు!

హంసోఽహమ్! హంసోఽహమ్! హంసోఽహమ్!
ఇతి వేదానువచనమ్!

🙏 ఇతి హంస ఉపనిషత్ | 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః ||