[[@YHRK]] [[@Spiritual]]

Jābāla Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


శుక్ల యజుర్వేదాంతర్గత

4     జాబాలోపనిషత్

(బృహస్పతి - యాజ్ఞవల్క్య సంవాదము & అత్రిమహర్షి - జనక చక్రవర్తుల సంవాదము)

శ్లోక తాత్పర్య పుష్పమ్


శాంతి పాఠమ్

ఓం
పూర్ణమదః ।
పూర్ణమిదమ్ ।
పూర్ణాత్ పూర్ణమ్ ఉదచ్యతే ।
పూర్ణస్య పూర్ణమ్ ఆదాయ ।
పూర్ణమేవ అవశిష్యతే ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

ఓంకార సంజ్ఞా స్వరూపుడగు ఆ పరబ్రహ్మము పూర్ణము.
(అధిష్ఠాన దృష్టిచే, పరమాత్మయే జగత్ రూపుడు కాబట్టి) ఈ జగత్తు కూడా పూర్ణమే!
ఈ జీవాత్మ-జగత్తులు కూడా పరమాత్మత్వముచే పరిపూర్ణము.
పరబ్రహ్మము నుండే జీవాత్మ-జగత్తులు (జలంలో తరంగాలువలె) బయల్వెడలుచున్నాయి.
పూర్ణ వస్తువునుండి పూర్ణమగు ఈ దృశ్యము బయల్వెడలుచూ కూడా, పూర్ణ పరమాత్మ పూర్ణమే అయి ఉన్నారు.
తరంగములు ప్రదర్శనమగుచున్నప్పటికీ జలము జలముగానే ఉన్నది కదా!
(జీవాత్మగా కనబడినంత మాత్రంచేత మనలోని ప్రతి ఒక్కరి పరమాత్మత్వమునకు వచ్చు లోటు ఏమీ లేదు).
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥


శ్లో॥ జాబాలోపనిషత్ఖ్యాతం సంన్యాసజ్ఞానగోచరం .
వస్తుతస్త్రైపదం బ్రహ్మ స్వమాత్రమవశిష్యతే ..

శ్లో॥ జాబాలోపనిషత్ ఖ్యాతమ్ సన్న్యాస జ్ఞాన గోచరమ్
వస్తుతః త్రైపదమ్ బ్రహ్మ స్వమాత్రమ్ అవశిష్యతే ॥
జగత్తును సన్న్యసించి, ఆత్మ వస్తువును ఆశ్రయించే జ్ఞాన విషయమును ఈ జాబాల ఉపనిషత్ వ్యాఖ్యానిస్తున్నది. “బ్రహ్మము స్వస్వరూపమాత్రమే" అను రూపముగల త్రైపదమును చూపి బ్రహ్మముగా సశేషింపజేయుచున్నది.

ఓం బృహస్పతిరువాచ యాజ్ఞవల్క్యం యదను కురుక్షేత్రం
దేవానాం దేవయజనం సర్వేషాం భూతానాం బ్రహ్మసదనం .
అవిముక్తం వై కురుక్షేత్రం దేవానాం దేవయజనం సర్వేషాం
భూతానాం బ్రహ్మసదనం .
తస్మాద్యత్ర క్వచన గచ్ఛతి తదేవ మన్యేత తదవిముక్తమేవ .
ఇదం వై కురుక్షేత్రం దేవానాం దేవయజనం సర్వేషాం
భూతానాం బ్రహ్మసదనం ..

అత్ర హి జంతోః ప్రాణేషూత్క్రమమాణేషు రుద్రస్తారకం బ్రహ్మ
వ్యాచష్టే యేనాసావమృతీ భూత్వా మోక్షీ భవతి
తస్మాదవిముక్తమేవ నిషేవేత అవిముక్తం న
విముంచేదేవమేవైతద్యాజ్ఞవల్క్యః .. 1..
1.) బృహస్పతిః ఉవాచః యాజ్ఞవల్క్యమ్!
యత్ అను కురుక్షేత్రం
దేవానామ్ దేవయజనమ్|
సర్వేషామ్ భూతానాం బ్రహ్మసదనమ్,
‘అవిముక్తమ్’ వై కురుక్షేత్రమ్ |
తస్మాత్ యత్ర క్వచ న గచ్ఛతి
తదేవ మన్యతే…, (మన్యేత) తదముక్తమేవ
“ఇదమ్ వై కురుక్షేత్రమ్
దేవానామ్ దేవయజనమ్,
సర్వేషాం భూతానామ్ బ్రహ్మసదనమ్”|
అత్ర హి జంతోః ప్రాణేషు ఉత్క్రమమాణేషు
రుద్రః - తారకమ్
బ్రహ్మ వ్యాచష్టే యేనా ఆసావత్
మృతీ భూత్వా ‘మోక్షీ’ భవతి।
తస్మాత్ అవిముక్తమేవ నిషేవేత
అవిముక్తమ్ న విమున్చేత్
ఏవమేవైతత్ యజ్ఞవల్క్యః ॥

మహత్తరము-ఉత్తమము-మహెూన్నతము అగు బుద్ధి సంపన్నులగు శ్రీ బృహస్పతుల వారు ఒకానొక సందర్భములో శిష్యుడగు యాజ్ఞవల్క్యునకు ఇట్లా బోధించసాగారు.

ప్రియ శిష్యా! యాజ్ఞవల్క్యా! నీకిప్పుడు ‘కురుక్షేత్రము’ అను వేదాంత శబ్దము యొక్క అర్థమును, తత్సంబంధిత విశేషములను చెప్పుచున్నాను. విను!

ఈ దేహమే కురుక్షేత్రము. “కురుక్షేత్రము" అనునది దేవతలకు, భక్తులగు దైవోపాసకులకు, సర్వభూతజాలమునకు బ్రహ్మపద స్థానము. అది ‘అవిముక్తము’ అని కూడా అంటారు.
ఎందుకంటే అది భౌతిక దేహమునందలి అభౌతికమగు పరాకాశ స్థానము!
(అవిముక్తము = ఆత్మ నుండి విముక్తము, విభక్తము కానట్టిది.)

అద్వితీయమగు ఆత్మ-అన్వేషకులకు ద్వితీయమగు ఉపాసనా స్థానము కురుక్షేత్రము! అందుచేత ఎవ్వడు ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా, “ఇది కూడా మోక్ష స్థానమగు కురుక్షేత్రమే! దేవతలు-దేవగణము-సర్వభూత జాలమునకు చెందిన బ్రహ్మసదనము! పరబ్రహ్మ స్థానము”! అని భావించాలి! అట్టి బ్రహ్మస్థానమగు కురుక్షేత్రమునందు (తత్ భావనయందు) ప్రాణము దేహమునుండి ఉత్రమణము పొందుచుండగా (ఇంద్రియ జగత్ విషయముల
నుండి ప్రాణశక్తి సమేతుడై ఈ జీవుడు బహిర్గతమగుచుండగా) లయకారుడగు రుద్ర భగవానుడు ఆ జీవులను తరింపజేయగల తారకమంత్రము ఉపదేశిస్తూ ఉన్నారు! పరబ్రహ్మ వాక్కులు ఘంటాపథముగా వినబడుచుండగా ఆ మృతుడు మోక్ష స్వరూపుడగుచున్నాడు. (సాంబ ఏకః సహాయః)

అందుచేత ఎవ్వరు ఎక్కడుంటే అక్కడ - అవిముక్తము - విముక్తి ప్రసాదము అగు ’కురుక్షేత్రము’ను మనో-బుద్ధి-చిత్తములతో ఉపాసించెదరు గాక! జగత్ - భేద విషయములను కాదు!


అథ హైనమత్రిః పప్రచ్ఛ యాజ్ఞవల్క్యం య ఏషోఽనంతోఽవ్యక్త
ఆత్మా తం కథమహం విజానీయామితి ..

స హోవాచ యాజ్ఞవల్క్యః సోఽవిముక్త ఉపాస్యో య
ఏషోఽనంతోఽవ్యక్త ఆత్మా సోఽవిముక్తే ప్రతిష్ఠిత ఇతి ..

సోఽవిముక్తః కస్మిన్ప్రతిష్ఠిత ఇతి .
వరణాయాం నాశ్యాం చ మధ్యే ప్రతిష్ఠిత ఇతి ..

కా వై వరణా కా చ నాశీతి .
సర్వానింద్రియకృతాందోషాన్వారయతీతి తేన వరణా భవతి ..

సర్వానింద్రియకృతాన్పాపాన్నాశయతీతి తేన నాశీ భవతీతి ..

కతమం చాస్య స్థానం భవతీతి .
భ్రువోర్ఘ్రాణస్య చ యః సంధిః స ఏష
ద్యౌర్లోకస్య పరస్య చ సంధిర్భవతీతి .

ఏతద్వై సంధిం సంధ్యాం బ్రహ్మవిద ఉపాసత ఇతి .
సోఽవిముక్త ఉపాస్య ఇతి.
సోఽవిముక్తం జ్ఞానమాచష్టే . యో వైతదేవం వేదేతి .. 2..
2.) అథ హి ఏనమ్ అత్రిః పప్రచ్ఛ యాజ్ఞవల్యమ్:
“య ఏషో అనన్తో అవ్యక్త ఆత్మా
తం కథమ్ అహం
విజానీయామ్?” ఇతి॥

సహెూ వాచ యజ్ఞవల్క్యః :
సో అవిముక్త ఉపస్యో య ఏషో
అనన్తో - అవ్యక్త ఆత్మా
సో అవిముక్తే ప్రతిష్ఠిత ||ఇతి||

అత్రిమహర్షి :
సో అవిముక్తః కస్మిన్ ప్రతిష్ఠిత? ఇతి॥

యాజ్ఞవల్క్యుడు :
వరణాయాం - నాశ్యాం చ మధ్యే
ప్రతిష్ఠిత | ||ఇతి||

అత్రిమహర్షి :
కా వై వరణా? కా చ నాశి? || ఇతి ||

యాజ్ఞవల్క్యుడు :
సర్వాని ఇంద్రియకృతాన్
దోషాన్ వారయతి - ఇతి
తేన వరణా భవతి |
సర్వాని ఇంద్రియకృతాన్ పాపాన్
నాశయతి - ఇతి తేన ‘నాశీ’ భవతి।

తరువాత మరొక సందర్భములో అత్రిమహర్షి యజ్ఞవల్క్య మహర్షిని సమీపించి ఇట్లా ప్రశ్నించారు.

మహాత్మా! యాజ్ఞవల్క్యా!
ఆత్మ అనంతము - అవ్యక్తము కదా! మేము వ్యక్తమగుచున్నదానినైతే గుర్తిస్తున్నాం. తెలుసుకోగలం. మరి అవ్యక్తము అని చెప్పబడుచున్న బ్రహ్మమును మేము తెలుసుకోవటం ఎట్లా? ఆత్మజ్ఞానులము అవటం ఎట్లా?

యాజ్ఞవల్క్యుడు : మీరు అడుగుచున్న ఆత్మ ‘అవిముక్తము’ నందు ప్రతిష్ఠితమైయున్నది. కనుక, అనన్తము - అవ్యక్తము అగు ఆత్మకొరకై అవిముక్తమును సందర్శించి ఉపాసించి తద్వారా ఆత్మ దర్శనం చేయాలి!

అత్రిమహర్షి : ఆ అవిముక్తము ఎక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది?

యాజ్ఞవల్క్య మహర్షి : ఆ అవిముక్తము వరణమునకు-నాశికు మధ్యగా ప్రతిష్ఠితము. (ఇతి వారనాశి).

అత్రిమహర్షి : వరణము అనగా ఏమి? నాశిక అనగా ఏమి?

యజ్ఞవల్క్యుడు : వరణము + నాశి = వారణాసి
వరణము ఆవరణము (Space). ఇంద్రియకృతమైన సర్వ దోషములను ఏ స్థానము వారిస్తుందో, ఇంద్రియ విషయ దోషములకు చోటు ఉండదో…. అది వరణము (లేక) వారణము.
సర్వ ఇంద్రియకృత పాపములను నశింపజేస్తుండటంచేత ‘నాశి’ కూడా! ఈవిధంగా ’వారనాశి’ని గుర్తెరుగాలి. సాంసారిక భ్రమలను వారింపజేసేది, నశింపజేసేది - వారణాసి.

అత్రిమహర్షి :
కతమచ్చా అస్య స్థానమ్ భవతి? ||ఇతి||

యాజ్ఞవల్క్యుడు :
భృవోః ఘ్రాణస్య చ యః సన్దిః
స ఏష ద్యౌర్లోకస్య
పరస్య చ సంధిః భవతి | ||ఇతి||
ఏతత్ వై సంధిం ‘సంధ్యామ్’
బ్రహ్మవిద ఉపాసత ||ఇతి||
సో అవిముక్త
ఉపాస్య ||ఇతి||
సో అవిముక్తమ్ జ్ఞానమ్ ఆచష్టే
యో వై తత్ ఏతత్ ఏవం
వేద || ఇతి ||

అత్రిమహాముని : వారణము నాశిల స్థానము ఏది? (దేహములో) ‘వారనాశి’ స్థానము అనగా ఏది?

యాజ్ఞవల్క్యుడు : భ్రూమధ్య-ఘ్రాణము (ముక్కు)లకు ఆ రెండిటియొక్క మధ్యలో అభౌతికశక్తి రూపమగు) స్థానమున్నది. అది ద్యౌర్లోకమునకు (భౌతిక ఆకాశమునకు పరమై) ఉన్నది. దీనిని యోగవేత్తలు (ఆత్మకు-లోకములకు) “సంధి” అని కూడా అంటున్నారు. అట్టి సంధి స్థానమై, ద్యౌర్లోకము (ఆకాశమునకు స్వర్గలోకమునకు) ఆవల ఉన్నట్టి సంధ్యా తత్త్వమును బ్రహ్మము గురించి ఎరిగిన బ్రహ్మవిదులు ధ్యానిస్తున్నారు. అదియే ’సంధ్యావందనము’ అదియే యుక్తము. అది భౌతికమునకు ఆవల! బ్రహ్మమునకు ఈవల! అదియే ఉపాస్యము.
- ఆ అవిముక్త స్థానమును సంధ్యోపాసనగా వేదజ్ఞులు సర్వదా మననముగా ఉపాసిస్తున్నారు.
- అది ఆత్మ జ్ఞానము ప్రసాదించు స్థానము.
- అది ఆత్మకు సామీప్య స్థానము. ఈ జీవుడు తత్ బ్రహ్మమును తెలుసుకొని మోక్షము పొందుటకు బుద్ధిని ఏకాగ్రము చేయును గాక!


అథ హైనం బ్రహ్మచారిణ ఊచుః కిం జప్యేనామృతత్వం బ్రూహీతి ..

స హోవాచ యాజ్ఞవల్క్యః . శతరుద్రియేణేత్యేతాన్యేవ హ వా
అమృతస్య నామాని ..

ఏతైర్హ వా అమృతో భవతీతి ఏవమేవైతద్యాజ్ఞవల్క్యః .. 3..
3.) అథ హి ఏనం బ్రహ్మచారిణః ఊచుః :-
కిం జపేన అమృతత్వం?
బ్రూహి _||ఇతి||

సహెూవాచ యజ్ఞవల్క్యః :-
శతరుద్రీయేణా ఇత్యేతాని
హ వా అమృతస్య
నామధేయాని భవన్తి ||
ఏతైః హ వా అమృతో భవతి ||ఇతి||
ఏవమేవైతత్ యాజ్ఞవల్మ్యః ॥

అది వింటూ, అక్కడ ఉన్న కొందరు బ్రహ్మచారులు (శిష్యజనులు) ఇట్లా అడిగారు.
"భృకుటి - నాశికల మధ్య గల సంధి స్థానమున గల పరాకాశ తత్త్వమును సంధ్యావందన క్రియతో బ్రహ్మవేత్తలు ఏ మంత్రముతో జపిస్తున్నారు? దేనిని జపిస్తూ మేము అమృతత్వమును సముపార్జించుకోగలం?

యాజ్ఞవల్క్యుడు :
అక్కడ శతరుద్రీయము యొక్క పఠనము సహాయముతో అమృతమగు ఆత్మతత్త్వమును మననం చేయుచున్నారు.
( “ఓం నమఃశివాయ”, (లేక) రుద్రము, నమకము, చమకము (లేక) ఇష్ట దైవ నామస్మరణ ఇత్యాదులతో) - అమృతాత్మను మననము చేయువాడు మృత్యువు మార్పుకు అతీతుడై అమృత స్వరూపుడగుచున్నాడు.

(ఇదం సర్వం శతథా రుద్రీయమేవ - ఇతి శతరుద్రీయం. అంతా ఈశ్వర ప్రదర్శనమే - అను బుద్ధి స్థితి.)


అథ హైనం జనకో వైదేహో యాజ్ఞవల్క్యముపసమేత్యోవాచ
భగవన్సంన్యాసం బ్రూహీతి .

స హోవాచ యాజ్ఞవల్క్యః .
బ్రహ్మచర్యం పరిసమాప్య గృహీ భవేత్ .
గృహీ భూత్వా వనీ భవేత్ . వనీ భూత్వా ప్రవ్రజేత్ .
యది వేతరథా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేద్గృహాద్వా వనాద్వా ..

అథ పునరవ్రతీ వా వ్రతీ వా స్నాతకో వాఽస్నాతకో
వోత్సన్నగ్నికో వా యదహరేవ విరజేత్తదహరేవ ప్రవ్రజేత్ .
తద్ధైకే ప్రాజాపత్యామేవేష్టి,న్ కుర్వంతి .
తదు తథా న కుర్యాదాగ్నేయీమేవ కుర్యాత్ ..

అగ్నిర్హ వై ప్రాణః ప్రాణమేవ తథా కరోతి ..

త్రైధాతవీయామేవ కుర్యాత్ .
ఏతయైవ త్రయో ధాతవో యదుత సత్త్వం రజస్తమ ఇతి ..

అయం తే యోనిరృత్విజో యతో జాతః ప్రాణాదరోచథాః .
తం ప్రాణం జానన్నగ్న ఆరోహాథా నో వర్ధయ రయిం .
ఇత్యనేన మంత్రేణాగ్నిమాజిఘ్రేత్ ..

ఏష హ వా అగ్నేర్యోనిర్యః ప్రాణః ప్రాణం గచ్ఛ
స్వాహేత్యేవమేవైతదాహ ..

గ్రామాదగ్నిమాహృత్య పూర్వదగ్నిమాఘ్రాపయేత్ ..

యద్యగ్నిం న విందేదప్సు జుహుయాత్ .
ఆపో వై సర్వా దేవతాః సర్వాభ్యో దేవతాభ్యో జుహోమి
స్వాహేతి హుత్వోధృత్య ప్రాశ్నీయాత్సాజ్యం హవిరనామయం
మోక్షమంత్రః త్రయ్యైవం వదేత్ .

ఏతద్బ్రహ్మైతదుపాసితవ్యం .
ఏవమేవైతద్భగవన్నితి వై యాజ్ఞవల్క్యః .. 4..
4.)
సన్న్యాసమ్

అథ జనకో హ వైదేహెూ
యాజ్ఞవల్క్యమ్ ఉపసమే
ఇతి ఉవాచ।


భగవన్! “సన్న్యాసమ్” అనుబ్రూహి ||ఇతి||

సహెూవాచ యాజ్ఞవల్క్యః :-
బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్ | (గృహస్థు)
గృహీభూత్వా పనీ భవేత్ | (వానప్రస్థము)
వనీభూత్వా ప్రప్రజేత్।
యదివా ఇతరథా - బ్రహ్మచర్యాత్ ఏవ
పవ్రజేత్||
గృహాద్వా, వనాద్వా, అధ పునః
- అప్రతీవా, ప్రతీవా
- స్నాతకోవా, అస్నాతకోవా
- ఉత్సన్నాగ్నిః, అనగ్నికోవా
యత్ అహరేవ విరజేత్
తత్ అహరేవ ప్రవ్రజేత్|
తద్దైకే ప్రజాపత్యా మే వేష్టిమ్ కుర్వన్తి
తదు తథా న కుర్యాత్
ఆగ్నేః యామేవ
కుర్యాత్! అగ్ని వై
ప్రాణః! ప్రాణమే వై తథా
తయా కరోతి।
పశ్చాత్ త్రైధా
తన్మయ్యామ్ ఏవ కుర్యాత్
ఏతయైవ త్రయో
ధాతవో యమతీ
‘సత్వమ్ - రజః ’ఇతి
అయమ్ తే యోనిః ఋత్విజో
యతో జాతో ప్రాణాత్ అరోచధాః,
తమ్ ప్రాణాత్ జానన్ అగ్న ఆరో హాథానో
వర్ధయా ‘రయిమ్’ ||ఇతి||

మరొక సందర్భములో విదేహ చక్రవర్తియగు జనక మహారాజు తత్త్వజ్ఞానాభిలాషితత్త్వ విద్యార్థి అయి, యాజ్ఞవల్క్య మహర్షులవారి ఆశ్రమమునకు వచ్చారు. మహర్షిని ఇట్లా పరిప్రశ్నించారు.

సద్గురూ! భగవన్! యాజ్ఞవల్కమహర్షీ! “సన్న్యాసము” అనగా ఏమై ఉన్నది? వివరించమని అర్థిస్తున్నాను.

యాజ్ఞవల్క్యుడు :
చతుర్ (4) ఆశ్రమముల గురించి ముందుగా వినండి. మొట్టమొదటగా, ఆచార్యులవారిని ఆశ్రయించి, శిష్యుడై విద్యను అభ్యసించాలి. ఈతనిని “బ్రహ్మచారి” అంటాము. ఇది బ్రహ్మచర్యాశ్రమము. చక్కగా పారలౌకిక విద్యలౌకికవిద్యలను ఎరిగిన తరువాత గుర్వాజ్ఞతో గార్హస్థ్యాశ్రమము స్వీకరించి, ధర్మపరుడుగా సంఘంలో సహజనులతో సేవాభావంగా జీవించాలి. ఆ తదుపరి సంఘ జీవనము విడచి ఉండు వానప్రస్థాశ్రమము. వానప్రస్థాశ్రమానంతరము సన్న్యాసాశ్రమము స్వీకరించాలి. లేదా బ్రహ్మ చర్యాశ్రమము తరువాత సన్న్యాసాశ్రమము స్వీకరించవచ్చు.

ఇక్కడ ఒక ముఖ్య విషయము :
- ఆచార నియమములు నిర్వర్తిస్తున్నా, లేకున్నా….
- గృహములో ఉన్నా, వనంలో ఉన్నా, (అరణ్యంలో ఏకాంతంగా ఉన్నా),
- వ్రతములు నిర్వర్తించువాడు అయినా, అవ్రతడు అయినా..,
- స్నాతకుడు (పరివ్రాజకుడు) అయినా, అస్నాతకుడై ఉన్నా
ఏ రోజు సర్వ దృశ్య విషయములపై విరక్తి పుడుతుందో, ఆ రోజే సన్న్యసించాలి.

బలీయమైన వైరాగ్యమే సన్న్యాసాశ్రమమునకు తగిన సమయం! (సత్-వ్యాసమ్ ఇతి సన్న్యాసమ్)

బ్రహ్మచారి-గృహస్థ-వానప్రస్త ఆశ్రమముల నుండి సన్న్యసించటానికై శాస్త్ర విహితము అయినట్టి ప్రజాపతియాగము నిర్వర్తించి, సర్వ లౌకిక విషయములను ప్రజాసత్యాగ్నిలో వ్రేల్చి, అటు పై సన్న్యసిస్తున్నారు.
ఆ విధంగా అగ్ని సంబంధమైన ఆగ్నేయాష్టి - సన్న్యాసాశ్రమజీవితానికి నాందిగా అగుచున్నది.
అగ్నిసాక్షిగా సన్న్యసించినట్లు అవుతుంది. అగ్నియే ప్రాణ స్వరూపము.
వ్యష్ఠి ప్రాణాగ్నిని విశ్వప్రాణాగ్నిలో యజ్ఞపూర్వకంగా వ్రేల్చి సన్న్యసించాలి.
అటు తరువాత సత్వ-రజో-తమో త్రిగుణాత్మకమైన సర్వ విషయ-విశేషములను ఆ తత్పురుషుడగు పరమాత్మ యొక్క ఆనంద-వినోద రూప భావన చేస్తూ ‘పరమాత్మ’ అను అగ్నియందు సమర్పణ చేయాలి.
త్రిగుణములకు ఆవలగల త్రిగుణాతీత చైతన్యధారణను ఆశ్రయించాలి.
సన్న్యాసాశ్రమము కొరకై పరతత్వ యజ్ఞము నిర్వర్తించాలి. సర్వలోక సంబంధమైన వ్యవహారముల పట్ల అరుచియే ఋత్విజునిగా భావన చేయాలి.
జ్ఞానాగ్నిని ప్రజ్వలించి, అద్దానిని తేజో ప్రవృద్ధమునందు సర్వస్వము ఆహుతి చేయాలి.

5.) అనేన మన్త్రేణ అగ్నిమ్ ఆజిఘ్రేత్
ఏష వా అగ్నేః యోని ర్యః
“ప్రాణః ప్రాణమ్ గచ్ఛ స్వాహా”
ఇత్యేవమేవ ఏతత్ ఆ హ,
గ్రామాత్ అగ్నిమ్ ఆహృత్య
పూర్వవత్ అగ్నిమ్ అఘ్రాపయేత్|
యత్ అగ్నిమ్ న విన్దేత్, అప్సు జుహుయాత్
“ఆపో వై సర్వా దేవతాః
సర్వాభ్యో దేవతాభ్యో జుహెూమి స్వాహా” ఇతి।

మొట్టమొదట గ్రామాగ్ని. “ప్రాణః ప్రాణమ్ గచ్ఛ స్వాహ” అని ఉచ్ఛరిస్తూ మంత్రపూర్వకముగా అగ్నిని ప్రజల్వింపజేసి, “ఈ ప్రజ్వలించు అగ్ని ఆత్మరూపమే” అనే భావనతో గ్రామాగ్నిని (ఉదా: కర్పూరాగ్నిని) అగ్నిగుండమునందు సమర్పించాలి. నేయి ఇత్యాది ఆహూతులన్నీ సమర్పించి యజ్ఞము పరిసమాప్తము చేసి ఆత్మ యజ్ఞమునందు ప్రవేశించాలి.

ఒకవేళ యజ్ఞ విధానపూర్వకమైన ఆహూతులు లభించకపోతే గ్రామ జలమును విశ్వజలమునకు సమర్పించి యజ్ఞవిధి నిర్వర్తించ వచ్చు.

“అపో వై సర్వా దేవతాః సర్వాభ్యో దేవతాభ్యో జుహెూమి స్వాహా”

“జలము సర్వదేవతా స్వరూపము. జలముతో సకల దేవతలకు హెూమము
చేస్తున్నాను”. అని ఉచ్ఛరిస్తూ…,

హుత్వా ఉద్ధృత్య ప్రాశ్నీయాత్ ఆజ్యం
హవిః అనామయం
మోక్ష మంత్రః త్రైయ్యేవమ్ విందేత్ |
తత్ బ్రహ్మ తత్ ఉపాసితవ్యమ్
’ఏవమేవ ఏతత్’ భగవన్, ఇతి వై యాజ్ఞవల్యః |

గ్రామ జలమును ఆహుతులుగాను, విశ్వజలమును యజ్ఞాగ్నిగాను భావనచేస్తూ విశ్వశ్రేయో భావాలతో జలయజ్ఞవిధిని సన్న్యాసయోగ యజ్ఞముగా నిర్వర్తించాలి. హవిస్సును నేతితో (బ్రహ్మముతో) కలిపి స్వీకరించి యజ్ఞము ముగించి, ఇక అటు నుండి,
“ఈ సర్వము తత్ బ్రహ్మమే….. నేను బ్రహ్మము…..“
“తత్ బ్రహ్మ! తత్ ఉపాసితవ్యమ్! ఏవమేన ఏతత్ భగవన్” అను భావనను యజ్ఞఫలంగా స్వీకరించాలి… అని యాజ్ఞవల్క్యుడు తెలియజేశారు.


అథ హైనమత్రిః పప్రచ్ఛ యాజ్ఞవల్క్యం పృచ్ఛామి త్వా
యాజ్ఞవల్క్య అయజ్ఞోపవీతి కథం బ్రాహ్మణ ఇతి .

స హోవాచ యాజ్ఞవల్క్యః .
ఇదమేవాస్య తద్యజ్ఞోపవీతం య ఆత్మాపః
ప్రాశ్యాచమ్యాయం విధిః పరివ్రాజకానాం .
వీరాధ్వానే వా అనాశకే వా అపాం ప్రవేశే వా
అగ్నిప్రవేశే వా మహాప్రస్థానే వా.

అథ పరివ్రాడ్వివర్ణవాసా ముండోఽపరిగ్రహః శుచిరద్రోహీ
భైక్షణో బ్రహ్మభూయాయ భవతీతి .

యద్యాతురః స్యాన్మనసా వాచా సంన్యసేత్ .
ఏష పంథా బ్రహ్మణా హానువిత్తస్తేనైతి
సంన్యాసీ బ్రహ్మవిదిత్యేవమేవైష భగవన్యాజ్ఞవల్క్య .. 5..
అథ హి ఏనమ్ అత్రిః పప్రచ్ఛః
యాజ్ఞవల్క్యం పృచ్ఛామి త్వా యాజ్ఞవల్క్యః!
అయజ్ఞోపవీతీ కథం బ్రాహ్మణ? ||ఇతి||

సహెూవాచ యాజ్ఞవల్యః
ఇదమేవా అస్య తత్ యజ్ఞోపవీతమ్
య ఆత్మా ఆపః ప్రాశ్యా,
ఆచమ్యా, అయం విధిః
పరివ్రాజికానామ్ విరాధ్వానేవా
ఆనాశకేవా, అపాం ప్రవేశేవా,
అగ్నిః ప్రవేశేవా, మహాప్రస్థానేవా |
అథ పరివ్రాట్ వివర్ణవాసామ్,
ముండో, అపరిగ్రహః శుచిః
అద్రోహీ భైక్షమాణో
బ్రహ్మభూయాయ భవతి ||ఇతి||

యది ఆతురస్యాత్ మనసా వాచావా సన్న్యసేత్
ఏష పన్దా బ్రహ్మణా హా అనువిత్తస్థః |
ఏనైతి సన్న్యాసీ బ్రహ్మవిత్ ఏవమ్ ఏష,
భగవన్ ఇతి వై యాజ్ఞవల్యః |

ఆ తరువాత అత్రిమహాముని ఈ రీతిగా ప్రశ్నించారు.
మహాత్మా! యాజ్ఞవల్క్యా! నా సందేహము విన్నవించుకుంటున్నాను.
యజ్ఞోపవీతము త్యజించినవాడు బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు? అవడేమో కదా?

యాజ్ఞవల్క్య మహాముని :
మనము ఇంతకు ముందు చెప్పుకొన్నవిధంగా ఎవడు ఆత్మయజ్ఞము చేస్తూ ‘ఆత్మభావన’ అనే పవిత్రమైన ఆచమనము చేసి పవిత్రుడగుచున్నాడో ఆ పవిత్రతయే ఆతని యజ్ఞోపవీతము. అదియే పరివ్రాజకత్వవిధి. సర్వ ప్రాపంచక విషయములపట్ల, అరుచి, ఆశలేనివాడై ఉండటము, అగ్ని-జలములందు దేహ సమర్పణము…. ఇవి మహాప్రస్థాన విధి విధానములు.

పరివ్రాజకుడై, వర్ణాశ్రమ ధర్మములకు అతీతుడై, కేశములు త్యజించి, అపరిగ్రహుడు-శుచి-అద్రోహి-భైక్ష వృత్తి వీటివీటిచే సన్న్యాసి అయి, బ్రహ్మమే అయి పవిత్రుడగుచున్నాడు. (బ్రహ్మ భావనయే ఆతని యజ్ఞోపవీతము). ఈతడే పరివ్రాట్.

మనసా-వాచా-కర్మనా సర్వ జగత్ సంబంధములైన “ఆతురత”లను మానసికంగా సన్న్యసిస్తూ ఉంటే, ఆ అనువిత్తస్థుడు అయినట్టి సన్న్యాసి, బ్రహ్మవేత్తయే! సర్వము వెలిగించువాడు కాబట్టి భగవంతుడే!


తత్ర
పరమహంసానామసంవర్తకారుణిశ్వేతకేతుదుర్వాసఋభునిదాఘజడ
భరతదత్తాత్రేయరైవతక-
ప్రభృతయోఽవ్యక్తలింగా అవ్యక్తాచారా అనున్మత్తా
ఉన్మత్తవదాచరంతస్త్రిదండం కమండలుం శిక్యం పాత్రం
జలపవిత్రం శిఖాం యజ్ఞోపవీతం చ ఇత్యేతత్సర్వం
భూఃస్వాహేత్యప్సు పరిత్యజ్యాత్మానమన్విచ్ఛేత్ ..

యథా జాతరూపధరో నిర్గ్రంథో నిష్పరిగ్రహస్తత్తద్బ్రహ్మమార్గే
సమ్యక్సంపన్నః శుద్ధమానసః ప్రాణసంధారణార్థం
యథోక్తకాలే విముక్తో భైక్షమాచరన్నుదరపాత్రేణ
లాభాలాభయోః సమో భూత్వా
శూన్యాగారదేవగృహతృణకూటవల్మీకవృక్షమూలకులాలశాలాగ్
నిహోత్రగృహనదీపులినగిరికుహరకందరకోటరనిర్ఝరస్థండిలేషు
తేష్వనికేతవాస్య ప్రయత్నో నిర్మమః
శుక్లధ్యానపరాయణోఽధ్యాత్మనిష్ఠోఽశుభకర్మ-
నిర్మూలనపరః సంన్యాసేన దేహత్యాగం కరోతి స పరమహంసో
నామ పరమహంసో నామేతి .. 6..

ఓం పూర్ణమద ఇతి శాతిః ..

ఇత్యథర్వవేదీయా జాబాలోపనిషత్సమాప్తా ..
6.) తత్ర పరమహంసా నామ
సంవర్తక, అరుణి శ్వేతకేతు
దుర్వాస ఋభు నిదాఘ
జడభరత దత్తాత్రేయ
రైవతక ….
ప్రభృతయో,…..
అవ్యక్తలింగా, అవ్యక్తాచారా,
అనునత్తా ఉన్నతవత్ ఆచరన్తః ॥
త్రిదణ్డం, కమణ్డలుం, శిక్యం,
పాత్రం, జలపవిత్రం, శిఖాం,
యజ్ఞోపవీతం
చేత్యేత్ తత్సర్వం ‘భూస్స్వాహ’ ఇతి

పరమహంసలు
ఓ అత్రిమహామునీ! తదితర ప్రియ మునీశ్వరులారా! శ్రోతలారా!

ఇప్పుడు మహామహనీయులు, ఆత్మతత్యానంద ఆస్వాదకులు అగు పరమహంసల గురించి మనము స్మరించుకుంటున్నాము. నమస్కరించుకుంటున్నాము.
(పరమహంస=సోహమ్ పరమమ్ = ఆవల ప్రకాశించు నిత్య-సత్యాత్మయే నేను).

సంవర్తకుడు, ఆరుణి, శ్వేతకేతువు, దుర్వాసుడు, ఋభు, నిదాఘ, జడభరతుడు, దత్తాత్రేయుడు, రైవతుడు… మొదలైనవారంతా పరమ హంసల కోవకు చెందినవారు. ప్రాతఃస్మరణీయులు. వారికి హృదయపూర్వక నమస్కారములు సమర్పిస్తున్నాము. వీరంతా స్వస్వరూపము ఆస్వాదిస్తూ, “మేము సాకారమంతా వ్యక్తీకరించు అవ్యక్తలింగ స్వరూపులము” అనే మహత్ భావనిష్ఠులు అగుచున్నారు. అవ్యక్తమైన ఆచారములు, బ్రహ్మతత్త్వ ప్రజ్ఞావంతులై ఉండి కూడా, పిచ్చివారివలె పైకి కనిపిస్తూ, అంతరంగమున ఆత్మ దృష్టిని మాత్రమే రహస్యంగా అభ్యసించువారు. కేవలానంద ఆత్మాఽహమ్ భావనను అనునిత్యంగా ధరించువారు.

అప్సు పరిత్యజ్య -
ఆత్మానమ్ అన్విచ్ఛేత్।
యథా జాత రూపధరో, నిర్ద్వంద్వో
నిష్పరిగ్రహః తత్త్వ బ్రహ్మమార్గే
సమ్యక్ సంపన్న శుద్ధ మానసః,
ప్రాణ సంధారణార్థమ్ యథోక్త కాలే
విముక్తో భైక్షమ్
ఆచరన్, ఉదరపాత్రేణ
లాభాఽలాభౌ సమౌ భూత్వా
శూన్యాగార - దేవగృహ
తృణకూట, వల్మీక, వృక్షమూల
కులాలశాలా,
అగ్నిహెూత్రశాలా
నదీ పులిన - గిరి కుహర - కన్దర
కోటర నిర్ఝరః తండిలేషు
తేషు అనికేతవాస్య,
అస్య ప్రయత్నో
నిర్మమ - శుక్ల ధ్యాన పరాయణో
అధ్యాత్మ నిష్ణో
అశుభ కర్మ నిర్మూలనపరః
సన్న్యాసేన దేహత్యాగం కరోతి,
స పరమహంసో నామ॥
ఇత్యుపనిషత్

విజ్ఞులగు ఆ మహనీయులు సన్న్యాసాచారములగు త్రిదన్దము, కమండలువు, శిక్యము
(ఉట్టి. జోలె), పాత్రను, స్నానాది పవిత్ర బాహ్య వేషములను, శిఖను, యజ్ఞోపవీతమునుఇవన్నీ కూడా మంత్రపూర్వకంగా జలములో పరిత్యజించి వేస్తున్నారు. ఆత్మ జ్ఞానమునందు మాత్రమే అనురక్తులై, ఆత్మ స్వరూపమాత్రులై వెలుగొందుచున్నారు.
(సన్న్యాసాశ్రమమును ఆశ్రయించువారికి కూడా ఇదియే మార్గము).

“బంధము తొలగాలి” అను సర్వ ఆశ్రమ మముక్షువులకు త్రోవ - సాధనము - ఆశయము - లక్ష్యసాధనకు ఒక్కటే! అది ఈ క్రింద చెప్పబడుచున్నదే!
యథా జాత రూపధరో : అప్పుడే పుట్టిన బిడ్డవలె వ్యవహార సంబంధములు హృదయంలో లేనివారు.
నిర్ద్వందో :  “పరమాత్మకు - పరమాత్మస్వరూపుడగు నాకు వేరైనది ఎక్కడా ఏదీ ఉండజాలదు కదా!” అనే నిర్ద్వంద్వత్వము వహించి ఉండాలి.
నిష్పరిగ్రహః : దేనినీ స్వీకరించనివారై ఉండాలి.
తత్త్వబ్రహ్మమార్గే : తత్త్వ జ్ఞాన సంపన్నులవటమే ఆశయముగా (Basic objective) కలిగి ఉండాలి.
సర్వత్రా సమస్వరూపమైన సమ్యక్ బుద్ధిని ప్రవృద్ధం చేసుకుంటూ ఉండాలి. నిర్మల మనస్కులగుచూ ఉంటారు!

‘పొట్ట’ అనే పాత్రలో ఎప్పుడు ఎంత వరకు ఏ ఆహారము లభిస్తే అది మాత్రమే.
సందర్భానుచితంగా - ప్రాణమును ధరించటమే ఆశయంగా - స్వీకరించాలి.
బ్రతకటం కోసం మాత్రమే తినాలి. తినటం కోసం బ్రతకకూడదు. సంసార బంధ విముక్తిని సిద్ధించుకొనుట కొరకే బ్రతకటం.
లాభాలాభములను ఒకే తీరుగా స్వీకరిస్తూ ఉండాలి.
శిధిల గృహము - దేవాలయము, గడ్డి ప్రదేశము - పుట్ట ప్రక్కన, చెట్టు మొదలు, కుమ్మరివాని గృహము, యజ్ఞము జరుగుచున్న అగ్ని హెూత్రశాల, నది ఒడ్డు, ఇసుక దిబ్బ, కొండ, కొండగుహ, చెట్టు తొఱ్ఱ, సెలయేరు, యడారి ప్రదేశము… అన్నీ కూడా ఒకే తీరైన స్థానములుగా, ప్రదేశములుగా అనిపించాలి! “అన్నీ నాకు వసతి గల గృహములే’….. అని భావించబడుగాక!

అటువంటి ప్రయత్నశీలుడై ఉంటూ, మమకార రహితుడై, నిర్మల స్వరూపుడగు పరమాత్మ ధ్యాన పరాయణుడై పరమహంసత్వము అభ్యసించాలి! అధ్యాత్మనిష్ఠుడు గాను, ఆత్మ విద్యయే మహదాశయముగాను, ప్రప్రథమ మనో లక్ష్యముగా కలవాడై ఉండాలి.
ఈవిధంగా శుభాశుభ కర్మల-కర్మఫలాలపట్ల సన్న్యాస మనస్కుడై, దేహాతీత భావనతో దేహమును త్యజించినవాడై (అతీతుడై) ఉండుగాక!
అట్టివాడు ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా… “పరమ హంస” అయి ప్రకాశిస్తున్నాడు.

ఇతి జాబాలోపనిషత్
ఓం శాంతిః శాంతిః శాంతిః


శుక్ల యజుర్వేదాంతర్గత

4     జాబాల ఉపనిషత్

(బృహస్పతి - యాజ్ఞవల్క్య సంవాదము & అత్రిమహర్షి - జనక చక్రవర్తి సంవాదము)

అధ్యయన పుష్పము

పూర్ణమదః పూర్ణమిదమ్ పూర్ణాత్ పూర్ణమ్ ఉదచ్యతే!
పూర్ణస్య పూర్ణమ్ ఆదాయ పూర్ణమేవ అవశిష్యతే ॥

పరమాత్మ సర్వదా పూర్ణస్వరూపుడు! సంపూర్ణుడు! ఈ జీవాత్మ కూడా (పరమాత్మ మహాసముద్ర జలముయొక్క తరంగ స్వరూపుడే కాబట్టి) పూర్ణస్వరూపుడే! సంపూర్ణుడే! ఈ జగత్తు పరమాత్మరూపమే కాబట్టి, ఇదియు పూర్ణమే!

అనగా, అద్వితీయుడగు పరమాత్మ ఏవిధంగా పరిపూర్ణుడో, అదేవిధంగా పరమాత్మకు అద్వితీయమైన ఈ జగత్తు పూర్ణమే!

జగదనుభవి అగు ఈ జీవుడూ పూర్ణుడే! పూర్ణస్వరూపుడగు పరమాత్మనుండే పూర్ణ స్వరూపుడగు జీవాత్మ - జగత్తులు ఉదయించుచున్నాయి.

పూర్ణుడగు పరమాత్మ నుండి పూర్ణమగు జీవాత్మ ప్రదర్శితుడగుచూ ఉండగా కూడా, పరమాత్మ ఎల్లప్పుడూ పూర్ణుడుగానే ఉన్నారు.

ఓ జీవాత్మా! నీ యొక్క పరమాత్మత్వమునకు జీవాత్మత్వము కారణంగాగాని, జగత్తు కారణంగాగాని వచ్చే అపూర్ణత్వము ఏమీ లేదు.

ఓం శాంతిః శాంతిః శాంతిః |

యాజ్ఞవవల్క్య మహర్షి, ఒకానొక సందర్భంలో - తన సద్గురువు, దేవతల గురువు, మహాబుద్ధి సంపన్నుడు, లోకకళ్యాణ మూర్తి, ఆశ్రితవత్సలుడు అగు బృహస్పతులవారిని సమీపించి, వేదాంత శాస్త్ర విజ్ఞానాభిలాషియై ఇట్లా ప్రశ్నించారు.

యాజ్ఞవల్క్య మహర్షి : మహాత్మా! లోక గురూ! అధ్యాత్మ శాస్త్ర పారంగతా! స్వామీ! హే బృహస్పతీ! వేదాంత శాస్త్రములో, “దేహమే దేవాలయము. దేహములో ’కురుక్షేత్రము’ అనే ముఖ్య ప్రదేశము, ప్రవేశ ద్వారము ఉన్నది”…. అని చెప్పుచూ ఉంటారు. అట్టి ‘కురుక్షేత్రము’ అగు యోగ స్థానము గురించి వివరించమని నా విన్నపము.

శ్రీ బృహస్పతి : ప్రియ శిష్యా! యజ్ఞవల్క్యా! వినండి.

ఏదైతే దేవతలకు, దేవతలను ఉపాసించే దేవయజనులకు (దైవోపాసకులకు) పరమాత్మ సందర్శన స్థానమో, సర్వ భూతజాలమునకు పరబ్రహ్మముయొక్క సాక్షాత్కారమునకు పవిత్ర-దివ్యక్షేత్రమై యున్నదో, … ’అవిముక్తము’ (బద్ధులగు జీవులు విముక్తికై ఆశ్రయించే ఉత్తమ ప్రదేశము, అవిముక్త గృహము) అని చెప్పబడుచున్నదో, అదియే కురుక్షేత్రము! అద్వితీయాత్మ యొక్క స్వగత-ద్వితీయ కల్పనా స్థానమే కురుక్షేత్రము. (The Zone of Functional Athma).

ఏ స్థానము చేరిన తరువాత ఈ జీవుడు సకల దేవతల సందర్శనము, బ్రహ్మ సదనము పొంది, ఇక మరొక స్థానమునకు వెళ్ళవలసిన అగత్యమే ఏమాత్రం కలిగి ఉండడో,… అదియే కురుక్షేత్రము. అది దృశ్యములోనిదిగాని, దృశ్యములో ఒక ప్రదేశ పరిమితమైనది గాని కాదు. అభౌతికమైనది.

ఈ జీవుడు తనయందే గల ఈ కురుక్షేత్రమును గమనించును గాక! ఈతడు ఎక్కడకు వెళ్ళినా, ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా…, తనయందలి కురుక్షేత్ర స్థానమును గుర్తించాలి! ఏ స్థానమైతే “ఇదమ్ కురుక్షేత్రమ్ - దేవానామ్ దేవయజనమ్, సర్వేషామ్ భూతానామ్ బ్రహ్మ సదనమ్ | నాయందలి ఇదియే ఆలోచనలకు జననస్థానమగు కురుక్షేత్రము. దేవతలు వేంచేసి యుండే స్థానము. సర్వ దేహులకు బ్రహ్మస్థానము. మోక్ష స్థానము. ఇక మరొకచోటికి బంధ విముక్తి, మోక్షము కొరకు వెతకవలసిన అగత్యం లేదు. అ తెలియవచ్చుచున్నదో, అదియే ‘కురుక్షేత్రము’ అని ఆత్మజ్ఞులచే ప్రవచించబడుతోంది. అదియే సర్వజీవులకు పుట్టిన ఇల్లు.

అట్టి కురుక్షేత్ర స్థానము పరమ పవిత్రము. జీవులందరికి సంసారము నుండి విముక్తి ప్రసాదించగల శ్రేయో స్థానము. పుట్టినింటికి వెళ్ళడం వంటిది. అట్టి కురుక్షేత్ర స్థానమును చేరువానికి ప్రాణ-ఉత్రమణ సమయంలో రుద్ర భగవానుడు ప్రత్యక్షమై, సంసారము నుండి తరింపజేయు ‘తారకము’ను ఉపదేశించుచున్నారు. (సర్వం వ్యర్థం మరణ సమయే సాంబ ఏకః సహాయః) కనుక ఈ కురుక్షేత్ర స్థానముగా జీవుడు ఏమరువక సర్వదా, తానెక్కడుంటే అక్కడే,… సర్వకాల సర్వావస్థలయందు మోక్షాశయమును ఆశ్రయించినవాడై ఉండాలి! కురుక్షేత్రమును ఉపాసనా స్థానముగా కలిగి ఉండటము శుభప్రదము.

అవిముక్త స్థానము

“అట్టి కురుక్షేత్ర స్థానము నన్ను విడచుటలేదు! నేను అద్దానిని విడిచి ఉండుచున్నవాడను కాను!” అను అర్థముచే, అద్దానిని ‘అవిముక్తస్థానము’ అను పేరుతో చెప్పుచున్నారు.

ఏది ‘బ్రహ్మము’ అను శబ్దముతో ఉద్దేశ్యించబడుతోందో…, దేనియొక్క ప్రకాశము - స్థానసముపార్జన చేత ఈ జీవుడు "నేను జన్మ-మృత్యువులకు సంబంధించినవాడను కాను. వాటిచే పరిమితుడను కాను!”… అను అమృతత్వము అనుభూతమౌతోందో, సర్వమునకు ఆవల అమృత స్వరూప కేవల సాక్షిగా ప్రస్థానప్రాప్తి జరుగగలదో…, ఏ స్థానము ధ్యానించుటచే ఆ ధ్యాని “నాకు ఈ జన్మ-కర్మలన్నీ వినోదమేగాని, విషాదమూ కాదు. బంధమూ కాదు. వీటికి వేరైనా వేదాంత - కార్యకారణాతీత స్వరూపుడను”… అను రూపముగల మోక్షి అగుచున్నాడో…,
అది అవిముక్త స్వరూపము, అవిముక్త స్థానముగా అభివర్ణించబడుతోంది!

నిషేత్ ఏవ విముక్తమ్|
అవిచ్ఛేత్ ఏవమ్ ఏతత్||

“బంధము ఉన్నట్లు భావించునప్పుడు, బంధము లేనట్లు తెలియవచ్చుచున్నప్పుడు కూడా, ఆ కురుక్షేత్ర స్థానము సర్వదా యథాతథము”. కనుక అది అవిముక్త స్థానము! ముఖములోని అట్టి స్థానమును బ్రహ్మోపాసనకు ‘వసతి స్థానము’ అని గమనించబడు గాక!

ఇతి బృహస్పతి ప్రబోధమ్||

అటు తరువాత, మరొక సందర్భములో ఉత్తమ జ్ఞాననిష్ఠుడగు అత్రి మహర్షి యాజ్ఞవల్క్యుని దర్శనం చేసుకొని, బ్రహ్మతత్త్వ విషయమై సంభాషించటం ప్రారంభించారు.

అత్రిమహర్షి :  హే గురువర్యా! యాజ్ఞవల్మ్యా! య ఏషో-అనన్తో అవ్యక్తాత్మా-తమ్ కథమ్ అహమ్ విజానీయామ్? మా ఈ ఇంద్రియములకు వ్యక్తీకరణములైన విషయాలు, పరిమిత వస్తువులు మాత్రమే తెలియ వస్తున్నాయి కదా! మరి ’అనంతము - అవ్యక్తము’ అగు ఆత్మను మేము ఎట్లా తెలుసుకోగలము? ఎట్లా సందర్శించగలము? దానికి ఇంద్రియబద్ధులమగు మాకు త్రోవ చూపించ ప్రార్థన.

యాజ్ఞవల్యుడు :   సో అవిముక్త ఉపస్యో య ఏథో అనన్తో - అవ్యక్త ఆత్మా అవిముక్తే ప్రతిష్ఠిత | మీరు చెప్పుచున్న ఆ అనంత - అవ్యక్తాత్మ మనందరిలోని ‘అవిముక్తము’ అను స్థానములో ఉపస్థితమై, ప్రతిష్ఠితమై యున్నదయ్యా! అందుచేత అవిముక్త సమేతముగా ఆత్మవస్తువును ప్రతిష్ఠించి ఉపాసించాలి!

అత్రిమహర్షి :  స్వామీ! ఆత్మ ప్రతిష్ఠితమగు ఆ అవిముక్తము ఎక్కడ ప్రతిష్ఠితమై యున్నది? సోఽవిముక్తః కస్మిన్ ప్రతిష్ఠిత?

యాజ్ఞవల్క్య మహాముని : వరణాయాం - నాశ్యాంచ మధ్యే ప్రతిష్ఠితః | వరణము నాశిక మధ్య స్థానములో ఆ ఆత్మ స్థానమగు అవిముక్తము ప్రతిష్ఠితమై యున్నది. (ఆజ్ఞా చక్రాకారము, ఇంద్రియములను దాటిని స్థానము)

అత్రిమహర్షి :  కా చ వరణా? కా చ నాశి? ’వారణము’ అనగా ఏమి? నాశిస్థానము అనగా? ఆ మధ్యగా ఏది స్థానము? అందుగల విశేషమేమిటి?

యాజ్ఞవల్క్య మహాముని :

వరణా = సర్వాన్ ఇన్షియకృతాన్ దోషాన్ వారయతి ఇతి వరణా! దేహ ఇంద్రియముల వలన కలుగుచున్న భ్రమాత్మకమైన సంసారమును, దోష-అల్ప దృష్టులను నివారణము చేయుచున్నదో…. అదియే ‘వారణము’ (వరణము).

చూపు - వినికిడి - స్పర్శ - రసము - గంధము ఇట్టి ఇంద్రియముల అనుభవమునకు ఆవల గల ‘ఆవరణము’.

నాశి = సర్వాన్ ఇన్రియకృతాన్ పాపాన్ నాశయతి తేన ‘నాశీ’! ఇంద్రియకృతములైన సర్వ పరిపంధ్య (శత్రు) - పాప క్రియలను నశింపజేస్తుంది కాబట్టి ‘నాశి’. పాప కర్మలనుండి విరమింపజేస్తుంది. ప్రతిబంధక దోష కర్మల నుండి విరమింపజేస్తోంది. కనుక ఆస్థానము ‘నాశి’ శబ్దముచే చెప్పబడుతోంది.

అత్రిమహర్షి :  కతమ్ చ అస్య స్థానమ్ భవతి? వారణాసి… వారణము-నాశి… ఈ రెండు ఎక్కడ ఉంటాయి? అవి ఉన్న స్థానము ఏది?

యాజ్ఞవల్యుడు :

భ్రూ - రెండు ముక్కు
కను బొమ్మల
ఘ్రాణస్యచ
మధ్య స్థానము
సంధిస్థానము

భృవో - ఘ్రూణస్య చ యః “సంధి”, స ఏష ద్యౌర్లోకస్య పరస్య చ సంధి భవతి||

భ్రూ (కనుబొమ్మల) - ముక్కు మధ్య సంధి స్థానము ఉన్నది. ఈ సంధి స్థానము అంతరము-ఆవల అయి, స్వర్గలోకమునకు (ద్యౌలోకమునకు) పరమై (ఆవల) ఆత్మాకాశము (భౌమాకాశము) సర్వదా వేంచేసియున్నది.

ఇంద్రియములకు ఆవల ఆవరణము! ఆవరణమునకు ఆవల ఆత్మ! అది వాత (వాయు) ఆవరణము!

వారణము - ఆత్మల సంధిస్థానమే ‘సంధ్యామ్’ (సంధ్యా స్థానమ్) అని అంటారు. బ్రహ్మవేత్తలు బ్రహ్మమును ఈ సంధ్యాస్థానమునందు ఆత్మోపాసనకు అతి సులభము - మధురము అగు స్థానముగా గమనించి బ్రహ్మమును ఉపాశిస్తున్నారు. బోధిస్తున్నారు.

అదియే అవిముక్తము. అట్టి అవిముక్తమును మహదాశయులగు ముముక్షువులు ఉపాశించెదరు గాక! తదేవ అవిముక్తోపాసనము!

అది ఆత్మజ్ఞానమును ప్రసాదించే సర్వేంద్రియాతీత స్థానము. అందుచేత అవిముక్తమును తెలుసుకోవటమే ఆత్మజ్ఞానము. మోక్ష స్థానమును ప్రసాదించునది.

ఈ విధంగా అవిముక్తము గురించి ఆయా విశేషాలు బోధించారు.

కొందరు బ్రహ్మచారులు తత్త్వాన్వేషులై యాజ్ఞవల్క్య మహాముని ఆశ్రమం వచ్చారు. స్వామికి నమోవాక్కములు సమర్పించుకొన్నారు.

బ్రహ్మచారులు :  హే యాజ్ఞవల్క్య మహామునీ! మాకు మా సాధన గురువులు మంత్రోపదేశం చేయగా మేము (శివపంచాక్షరి, షోడషాక్షరి, గౌరీ పంచాక్షరి, గాయత్రి ఇత్యాది) మంత్రోపాసనలను శ్రద్ధగా నిర్వర్తిస్తున్నాము.

ఇప్పుడు మా సందేహము : మంత్రము వలన మోక్షము లభిస్తుందా? మోక్ష ప్రదాతయగు ఉత్తమార్ధ ప్రతిపాదిత మంత్రము ఏది? అట్టి మంత్రమును - తత్త్వమును ఉదహరిస్తూ మాకు ఉపదేశించ వేడుకొనుచున్నాము.

యాజ్ఞవల్క్య మహాముని : మననముచే తరింపచేయునది కాబట్టే ’మంత్రము’ అంటున్నారు. (మననాత్ త్రాయతే ఇతి మంత్రః). శాశ్వత ప్రయోజనకారకము, ఉత్తమము అగు “ఆత్మజ్ఞానము - శాశ్వత బంధ విముక్తి” అను మహదాశయముతో గురువులు శాస్త్రములచే సూచించబడే మంత్రములను ఉపదేశిస్తున్నారు. గురువుల - శాస్త్రముల ఉద్దేశ్యము ఏమిటి?

→ ఇంద్రియార్థముల అల్పార్థముల నుండి, “కాల-సందర్భ బద్ధము” అగు విషయముల నుండి వెనుకకు మరలటానికి,
→ మనస్సు తన చాంచల్యమును త్యజిస్తూ ఏకాగ్రమౌతూ రావటానికి,
→ బుద్ధి నిర్మలము - సునిశితము - విస్తారము అయి, అమృత స్థానమును దర్శించటానికి,
→ ఈ జీవుడు అమృత స్వరూపమగు ఆత్మగా ప్రకాశించటానికి,

అటువంటి మహామంత్రములలో శతరుద్రీయ మహా మంత్రము బ్రహ్మతత్త్వజ్ఞాన శబ్లోచ్ఛారణా ఉపాసన మంత్రముగా చెప్పబడుతోంది.

శతరుద్రీయేణా ఏత్యేతత్ తాని హ వా
→ అమృతస్య నామధేయాని భవన్తి।
→ ఏతైః హ వా అమృతో భవతీతి |

అది అమృతత్వమును ప్రసాదించగలిగిన మంత్రము.

గురువుపై విశ్వాసముతో, మంత్ర దేవతపై భక్తి-ప్రపత్తులతో అమృత స్థానమగు ‘సోఽహమ్’ కొరకై మీరు ఇష్టమంత్రమును అభ్యసించండి! శ్రద్ధయే మంత్రసిద్ధికి కారణము.

విదేహ రాజ్యాధిపతి జనకమహారాజు ఉత్తమ కర్మయోగి! విజ్ఞాన సమన్వితుడు. మహాపురుషుల సంశ్రయమును సర్వదా ఆశ్రయించే ఉత్తమ సత్సంగాభిలాషి. కర్మలను బంధముగా కాకుండా, భగవదోపాసనగా మరల్చుకొను ఉపాయము తెలిసిన కర్మ-జ్ఞానయోగ సంపన్నుడు. రాజయోగి! బ్రహ్మజ్ఞుడు! పురుణాములచే ఉత్తమ దృష్టాంతముగా చెప్పబడు పురాణ పురుషుడు!

ఆయన ఒకసారి యాజ్ఞవల్క్య మహామునీశ్వరుల దర్శనార్ధమై ఆశ్రమానికి విచ్చేశారు. గురు నమస్కారములు, సపర్యలు సమర్పించారు. సత్సంగాభిలాషతో ఈ రీతిగా పరిప్రశ్నించారు.

జనకమహారాజు :  భగవన్! ‘సన్న్యాసమ్’ అనుబ్రూహి! సన్న్యాసము గురించి వాఖ్యానపూర్వక వివరణ ప్రసాదించమని అభ్యర్థన.

యాజ్ఞవల్క్య మహామునీశ్వరులు : సరే! మీరు కోరినట్లే కొన్ని విషయాలు ఇప్పుడు వివరించుకుందాం.

ఒకడు బ్రహ్మచర్యాశ్రమం ప్రారంభిస్తూ బ్రహ్మచారి అయి, ఆచార్యులవారిని ఆశ్రయిస్తున్నాడు.
1.) లౌకిక విద్య (లోకంలో ఎలా జీవించాలి?)
2.) పార లౌకికమగు బ్రహ్మ విద్య అభ్యసిస్తున్నాడు.
అటు తరువాత గురు అనుజ్ఞతో బ్రహ్మచర్యాశ్రమం ముగించుకొని, బయల్వెడలి గృహస్థాశ్రమము స్వీకరిస్తున్నాడు.

గృహస్థాశ్రమములో కర్మల ద్వారా పరమాత్మను ఉపాసిస్తూ కర్మయోగి అయి - కొంత కాలమైన తరువాత, అనుకూలమగు సమయములో - ఏకాంత వాసము కొరకై వనములో (అరణ్యముగాని, ఆశ్రమముగాని) ప్రవేశిస్తూ ‘వాన ప్రస్థాశ్రమము’లో ప్రవేశిస్తున్నాడు.

ఈ మూడు ఆశ్రమములు ఉత్తమ ఆశయముతో భవ్యముగా, విజయవంతముగా గడపిన తరువాత ’సన్న్యాసాశ్రమము’ స్వీకరించి పరివ్రాజకుడు అగుచున్నాడు.

ఒకవేళ సందర్భములు సానుకూల్యముగా ఉంటే…,

యది వేతరథా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్|
బ్రహ్మచర్యాశ్రమము తరువాత సూటిగా (గృహస్థ-వానప్రస్థంగా కాకుండా) సన్న్యాసము స్వీకరించవచ్చు. పరివ్రాజకుడు కావచ్చును.

ఇక్కడ ఒక ముఖ్యమైన విశేషము మనము చెప్పుకోవాలి.

ఒకడు ….,
గృహద్వా - వనాద్వా … గృహస్థుడు కావచ్చు, వన నివాసి కావచ్చు గాక!
అవ్రతీవా - ప్రతీవా … ఆచారాదులకు సంబంధించి సువ్రతుడు కావచ్చు. లేదా, అవ్రతుడు (వ్రత నియమములు పాటించనివాడు) కావచ్చు గాక!
స్నాతకో వా - అస్నాతకోవా … తీర్థయాత్రా నిష్ఠతో స్నాతకుడు కావచ్చు. ఒకచోటనే ఉండు అస్నాతకుడు కావచ్చుగాక!
ఉత్పన్నాగ్నికో వా - అనగ్నికో వా … దైనందికంగా అగ్నికార్యము నిర్వర్తించువాడు కావచ్చు - నిర్వర్తించనివాడు కావచ్చు గాక!

ఎవ్వడు ఎట్టివాడై ఏ స్థితి-గతులలో ఉన్నప్పటికీ కూడా,… ఏ రోజు ఈ జగత్ దృశ్య-జగత్ జీవిత-తత్సంబంధిత విషయ-విశేషాల పట్ల అనురక్తి తొలగిపోయి విరక్తి, విరజత్వము మనస్సులో ఉదయిస్తుందో, ఆ రోజే సన్న్యాసము (పరివ్రాజక జీవితమును) స్వీకరించటము సముచితము. (సత్-న్యాసము - ’సత్’ను ఆశ్రయిస్తూ, తదితరమైనది రాగరహితంగా (విరాగిగా) గమనించటము).

వైరాగ్యమే తగిన సమయము. వేరే వేరే కాల నియమములు లేవు. మరొక్క ముఖ్య విశేషం కూడా!

చతుర్విధ పంథా -
- బ్రహ్మమును అధ్యయనము చేయటము (బ్రహ్మచారిత్వము),
- జగత్తును ఆత్మగా ఎరిగి జగత్ గృహములో ప్రవర్తించటము (గృహస్థత్వము),
- జగదతీతత్వము (వాన ప్రస్థము),
- సత్ వస్తువును ఆశ్రయించటము (సత్ న్యాసము)
… ఒక్కసారే ఆశ్రయించాలి. అవి వేరు వేరు రీతులు కాదు. వేరు వేరు దశలు కావు!

సన్న్యాస స్వీకారము :
సన్న్యాసాశ్రమ (పరివ్రాజక) స్వీకార సందర్భములో కొందరు శాస్త్ర సూచనానుసారంగా ప్రాజాపత్యము నిర్వర్తిస్తున్నారు. మరికొందరు సన్న్యసిస్తూ అవన్నీ చేయకపోవచ్చును. అట్టివారు అగ్నిరూపమైన ప్రాణమును విశ్వప్రాణము అనే విశ్వాగ్నియందు (వ్రేల్చుచూ) సమర్పిస్తూ ‘అగ్నివేష్ఠి’ని నిర్వర్తించుచూ, మనస్సుతోనే ప్రాజాపత్యము నిర్వర్తిస్తున్నారు.

పశ్చాత్ త్రైధా తన్మయ్యామేవ కుర్యాత్
ఏతయైవ త్రైయో ధాతవో యమతీ “సత్వం రజః తమ” ఇతి ||

ఆ తరువాత త్రిగుణములను (సత్వ-రజో-తమో గుణములను) వాటివాటి అధిష్ఠానములందు ఆరోపిస్తూ సర్వకారణుడగు పరమాత్మకు చెందినవిగా భావించి సమర్పించివేయాలి. గుణములను -నిర్గుణస్వరూపుడగు ‘గుణి’ (లేక) నిర్గుణమగు ఆత్మ స్వరూపముయొక్క -లీలా వినోదముగా భావించటమే సమర్పించటం అగుచున్నది. విశ్వాగ్నిని విశ్వేశ్వరుని యందు వ్రేల్చుతూ త్యజించి, గుణాతీతత్వమును ఆశ్రయించటము.

సర్వ జగత్ విషయములపట్ల అరుచియే ఋత్విజుడు.

అందుకు ప్రతీకగా గ్రామాగ్నిని విశ్వాగ్నియందు హవిస్సు రూపంగా - సమర్పించబడు గాక!

ఒక వేళ (పరివ్రాజకత్వము స్వీకరిస్తున్న) ఆ తరుణంలో అగ్ని కూడా లభించని సందర్భములో…,

యత్ అగ్నిమ్ న విందేత్, అప్సు జుహుయాత్,
“అపో వై సర్వదేవతా! సర్వాభ్యో దేవతాభ్యో జుహెూమి స్వాహా!” ఇతి ||

ఇకప్పుడు “ఈ జలమును సర్వదేవతా స్వరూపముగా భావన చేస్తున్నాను. జలమును హవిస్సుగా సంకల్పిస్తూ సర్వస్వరూపమగు విశ్వజలమునందు సమర్పిస్తున్నాను వ్యష్ఠిత్వమును సమిష్ఠిత్వమునందు హెూమం చేస్తున్నాను” అని భావిస్తూ జలముతో ప్రాజాపత్యయాగము నిర్వర్తించవచ్చును.

హృత్వా ఉద్ధృత్య ప్రాశ్నీయాత్, స ఆజ్యం హవిః అనామయమ్।

హృదయమునందు హృదయముతో ఆత్మత్వమును సర్వాత్మత్వమునందు నేయిని అగ్నియందు సమర్పించువిధంగా సమర్పించివేయాలి!

మోక్ష మంత్రః త్రైయ్యేవమ్ విందేత్।

మోక్ష మంత్రములగు వేదమహావాక్యములను మూడిటిని ఆనందభరితంగా ఉచ్ఛరించును గాక! బుద్ధితో ఎలుగెత్తి గానము చేయుచుండును గాక!

→ తత్ త్వమ్ నీవు పరమాత్మవే! బ్రహ్మమే! ’నీవు’గా కనిపిస్తున్నదంతా పరమాత్మ ప్రదర్శనా విన్యాసమే!
→ సోఽహమ్ నేను పరమాత్మను (బ్రహ్మమే) అయి ఉన్నాను!
→ త్వమ్ ఏవ హమ్ - నీవే నేను. అహమేవ త్వమ్ - నేనుగా ఉన్నది నీవే.
అను మోక్షత్రయీ వేద మహావాక్యార్థాములను మనో-బుద్ధులతో మరల మరల స్మరించి - భావించ - దర్శించనారభించాలి!

ఆ పరబ్రహ్మమునే ఉపాసించాలి. తత్ ప్రయోజనంగా ఆ పరివ్రాజకుడు పరబ్రహ్మమే అగుచున్నాడు!

అప్పుడు అత్రిమహాముని ఇట్లు అడుగుచున్నారు.

అత్రిమహర్షి :  స్వామీ! ఒకడు బ్రహ్మచర్యాశ్రమము స్వీకరిస్తూ యజ్ఞోపవీతము ధరించటమనేది శాస్త్ర విధి కదా!

అయజ్ఞోపవీతీ కథమ్ బ్రాహ్మణ ఇతి? యజ్ఞోపవీతి (ధరించినవాడు) యజ్ఞోపవీతమును త్యజిస్తే బ్రాహ్మణుడుగా ఎట్లా అవుతాడు?

యాజ్ఞవల్క్యుడు : ఓ అత్రి మహర్షీ! యజ్ఞ పురుషుడు సర్వాంతర్యామి, సర్వతత్త్వ స్వరూపుడు అగు పరమాత్మయే! ఆయనయే మీలోను, నాలోను, సర్వ జీవులలోను ఆత్మ స్వరూపుడై విరాజిల్లుచున్నారు కదా!

ఇదమేవా అస్య తత్ యజ్ఞోపవీతమ్, ఇతి యత్ జ్ఞః ఉపవీతేతి - ఈ తెలియబడేదంతా నాయొక్క ‘ధారణయందు - తెలుసుకొనుచూ ఉన్న నేను నిర్వర్తించు సంచారమే! అను భావనయొక్క సుస్థిరతచే పరివ్రాజకుడు అగుచున్నాడు.

య ఆత్మా ఆపః ప్రాశ్యా, ఆచమ్యా, అయం విధిః పరివ్రాజినామ్…, ఆత్మయందు దృశ్యమును ఏకము చేయు ఆచమనమే పరివ్రాజవిధి,
జాగ్రత్ స్వప్న సుషుప్తి వ్యవహారమంతా ఆత్మకు అభిన్న భావనయే త్రిరాచమ్యము.

‘ఆత్మభావన’ = సర్వ తరంగాలలోను జలమే సత్యమైనట్లు సర్వ జీవులు పరమాత్మ అను మహా సముద్రములో తరంగాలే - అనే భావనతో ఆచమనము చేయుచుండటయే ధారణ. అట్టి ధారణయే వాస్తవమగు యజ్ఞోపవీతము.

ఇదియే సన్న్యాసవిధి! సన్న్యాసియొక్క యజ్ఞోపవీతము. ఇదియే సమస్త వ్రతములలోని ముఖ్య నియమము. అనగా సర్వ వ్రతములలోను ఆత్మభావనయే ప్రథమంగా నిర్వర్తించవలసిన యజ్ఞోపవీత ధారణ! ‘సర్వాంతర్యామిత్వము’ అనబడే యజ్ఞ పురుషత్వము! పవిత్రతయే యజ్ఞోపవీతము! ఇది బ్రహ్మచర్య - గృహస్థ - వానప్రస్థ - సన్న్యాసాది సర్వ ఆశ్రమవాసులకు ఆచరణీయ నియమమే!

ఒకడు….,
విరోధ్వా - నిర్విషయుడవవచ్చు గాక!
అనేవా అనాశకేవా - అనేక విషయములలో ఉండవచ్చు గాక! ఆహారి కావచ్చు. నిరాహారి కావచ్చు!
అపాం ప్రవేశేవా - జలములో ప్రవేశించి జల దిగ్బంధన విద్యా సమన్వితుడు కావచ్చు గాక!
అగ్నిప్రవేశేవా - అగ్నిలో ప్రవేశించవచ్చు గాక! అగ్ని దిగ్బంధన విద్యావేత్త కావచ్చు.
మహా ప్రస్థానేవా - మహాప్రస్థానమును ఆశ్రయించ వచ్చు గాక!

ఆత్మ అను జలమును స్వీకరించి ఆచమించువాడే, సర్వము ఆత్మ భావనయందు ఏకముచేయువాడే, శాస్త్రములు చెప్పుచున్న పరివ్రాజకత్వము ఆశ్రయించినవాడు అగుచున్నాడు.

యజ్ఞోపవీత ధారి → పరివ్రాట్ బ్రాహ్మణుడు → పరమహంస అనునవి…, ఇదమ్ సర్వమ్ మమ ఆత్మయేవ అను
అభ్యాసము యొక్క ఉత్తరోత్తర స్థితులు.

పరివ్రాట్ యొక్క బాహ్య విశేషాలు :-

వివర్ణవాసా - వర్ణరహితమైన వస్త్రధారణతో,
ముణ్డో -  కేశములు పరిత్యజించి,
అపరిగ్రహః - దేనినీ స్వీకరించక,
శుచిః - శుచి అయిన భావాలు, పవిత్రమైన మనస్సు - బుద్ధి కలిగియుండి…,
అద్రోహీ - ఎవ్వరిపట్లా కూడా ద్వేష - ద్రోహ భావాలు లేనివారై
భైక్షమానో - భిక్షాటకుడై (భి = అంధకారమును, క్ష = క్షయింపజేసుకొను వృత్తిని స్వీకరించువాడు)
బ్రహ్మభావమును మాత్రమే ఆశ్రయించి, బ్రహ్మమే తానై, సర్వమును తన ’ధారణ’గా కలిగి ఉంటున్నవానిని ‘పరివ్రాట్’ అని అంటున్నారు.

సన్న్యాసి : దేనిని సన్న్యసిస్తే సన్న్యాసి?

యది ఆతురస్యాత్ మనసా వాచా వా సన్న్యసేత్ |
“ఆత్మయందే నిష్ఠ” అను అనుష్ఠానముచే మనో - వాక్కుల సంబంధితమైన సర్వ ఆతురతలను త్యజించినవాడే సన్న్యాసి!

ఏష పన్దా బ్రహ్మణా హ అనువిత్తః
తేన ఏతి సన్న్యాసీ బ్రహ్మవిత్ |
సర్వ ప్రాపంచిక - భౌతిక సంపదలను, సిద్ధులను, మమకారములను సన్న్యసించి ’బ్రహ్మమే ఇదంతా! ప్రాణులంతా పరమాత్మ స్వరూపమే!’ - అను బుద్ధితో దృశ్యమును దర్శించు మార్గములో నడచుచున్నవాడే బ్రహ్మవేత్త అగు బ్రాహ్మణుడు.

ఏవమ్ ఏవై తత్ భగవన్ ఇతిః |
బ్రహ్మమును ఎరిగినవాడు బ్రహ్మమే అగుచున్నాడు. బ్రహ్మమును ఎరిగినవాడే బ్రాహ్మణుడు. బ్రహ్మమును స్వస్వరూపముగా ఎరిగి, గానము చేస్తున్నట్టి పరమహంసలు మనకు ప్రాతఃస్మరణీయులు. మార్గదర్శకులు. జగత్తులను, దృశ్యములను స్వస్వరూప పరబ్రహ్మముగా ఆస్వాదించు బ్రహ్మజ్ఞానానంద - ఆస్వాదులు.

ఉదాహరణకు : మహనీయులగు సంవర్తకుడు, ఆరుణి, శ్వేతకేతు, దుర్వాసుడు, ఋభు, నిదాఘ, జడభరతుడు, దత్తాత్రేయులు, రైవతుడు మొదలైన వారంతా మనకు ఆత్మ సందర్శన మార్గమును చూపుతూ ఆత్మ క్షీర సముద్రములో విహరించు రాజహంసలై విరాజిల్లుచున్నారు!

వీరంతా కూడా…,

అవ్యక్త లింగా - నామ-రూప ప్రతిష్ఠ - ప్రచారాదులకు అతీతులై…,
అనున్మత్తా ఉన్మత్త ఇవ - వారు పరబ్రహ్మ జ్ఞానులు. సంసారము వారిని స్పృశించజాలదు. వాస్తవానికి ఇంద్రియ విషయములపై బుద్ధిని నిలుపువారే ఉన్మత్తులు కదా! ఆ పరమహంసలు ఉన్మత్తులు (పిచ్చివారు) కాకపోయి కూడా, సంసార దృష్టితో చూచేవారికి ఉన్మత్తులవలె అగుపిస్తున్నారు.

సన్న్యాసి త్రిదండము, కమండులువు, శిక్యము (కావడి, ఉట్టి, జోలె), పాత్ర, జల పవిత్రత (స్నానాది నియమాలు), శిఖ, యజ్ఞోపవీతము ఇవన్నీ కూడా జలతర్పణ విధానంగాను, మంత్ర ముగ్ధముగాను త్యజించి…,

ఆత్మానమ్ అన్విచ్ఛేత్! → ఆత్మత్వమునే ఉపాసించాలి! ఆశ్రయించాలి. సాధ్య వస్తువును సమీపిస్తూ ఉండగా,… సాధన వస్తువులను యథాస్థానములో పరిత్యజించటంలోకరీతియే కదా!

యథా జాతరూప ధరో  → ఏవిధంగా అయితే అప్పుడే పుట్టిన పిల్లవానికి ప్రాపంచక సంబంధాలు, సంపదలు, మానావమానాలు, కష్ట-సుఖ, ఇష్ట-అయిష్ట భావాలు విషయమే కానట్లుగా ఉంటాయో, ఆవిధంగా పరమహంసలు ఉంటున్నారు.

నిర్ద్వంద్వో - ద్వంద్వరహితులై ఉంటున్నారు. “పరబ్రహ్మమునకు (పరమాత్మకు) వేరుగా ద్వితీయమైనది ఎక్కడా ఉండదు! ఉండజాలదు!” అను అవగాహనకు ఆశ్రయించినవారగుచున్నారు.

నిష్పరిగ్రహః  → దేనినీ స్వీకరించనివారై, అంతరంగమును విషయ రహితంగా పరిశుభ్రపరచువారై ప్రవర్తిల్లుచున్నారు. స్వప్నములో సత్యమైనది-నిత్యమైనది ఏది ఉంటుంది? అట్లాగే జాగ్రత్ కూడా అని వారు గమనిస్తున్నారు!

సత్వః బ్రహ్మమార్గే  → బ్రహ్మ మార్గమునందు బుద్ధిని నిలుపుచున్నారు!

సమ్యక్ సంపన్న శుద్ధ మానసః  → (సర్వేషు భూతేషు తిష్ఠన్తమ్ పరమేశ్వరమ్ అను రూపమైన సర్వే సర్వత్రా సమముగా ఉన్న పరమాత్మను దర్శించే మనోహర రూపమైనట్టి) - సమ్యక్, సుసంపన్న శుద్ధ మానసులై చరిస్తున్నారు.

ప్రాణ సంధారణార్థమ్ యథోక్తకాలే విముక్తో భైక్షమ్ ఆచరన్ ఉదర పాత్రేణ  → కేవలము ప్రాణధారణ నిమిత్తమై మాత్రమే ఆకలి వేసినప్పుడు (యధోక్తకాలంగా), ‘పొట్ట’ అనే భిక్షక పాత్రతో భిక్షమువలె ఆహారము వేయాలి. అంతేగాని ఆహారము కొరకు జీవించకూడదు.

ప్రాణధారణ ఎందుకు? సంసారబంధ విముక్తి కొరకై! ఆత్మ జ్ఞానము సంపాదించుకోవటానికై! ఆత్మజ్ఞానము సర్వ దుఃఖములు
రహితమవటానికి! ఇది ఎరిగిన సన్న్యాసి పరివ్రాజకుడై, పరమ హంస అయి విరాజిల్లుచున్నాడు.

లాబాలాభౌ సమౌ భూత్వా → లభించటము - లభించకపోవటము ఒకే తీరుగా దర్శిస్తూ, భిక్ష ఇచ్చేవారిని - ఇవ్వనివారిని పరబ్రహ్మ స్వరూపులుగానే భావిస్తూ…, శిధిలగృహము, దేవతల సంపదలు గల ప్రదేశము, దేవాలయము, గడ్డి దుబ్బు ప్రదేశము, పుట్ట, వృక్షమూలము, కుమ్మరి గృహము, యజ్ఞ యాగములు జరుగుచున్న అగ్నిహెూత్రశాల, నదిలోని ఇసుక దిబ్బ, కొండ, కొండగుహ, కొండక్రింద గ్రామము, చెట్టు తొఱ్ఱ, సెలయేరు, ఎడారి… ఈ ఈ ప్రదేశములలో ఒకే తీరైన ఆత్మాపమ్యేవ సర్వత్రా - భావనతో సంచరిస్తూ ఉంటున్నారు.

అనికేత వా → ‘ఇది నా ఇల్లు కదా’ అనే భావనయే దరిజేరనీయరు. సాధనశీలురై, ప్రయత్నపూర్వకంగా “నాది-నాకు సంబంధించినది - దీనికి నేను సంబంధించినవాడను” అను మమకారము లేనివారై, జగత్ కల్పనా రచనలో తమకు ఉచితమగు ఆశ్రమములందు ప్రవర్తిల్లుచున్నారు.

నిర్మలమగు పరమాత్మ ధ్యాన పరాయణులై…,
అనుక్షణము అధ్యాత్మ నిష్ఠతో…,
అశుభ - శుభ కర్మలను (కర్మ ద్వంద్వములను, ద్వంద్వ భావములను) నిర్మూలించుకొన్నవారై (వీరు మంచి వారు - వారు కాదు. వీరి కర్మలు గొప్పవి. వారివి కాదు మొదలైన ద్వంద్వ భావములను తొలగించుకొంటున్నవారై) …. నిర్మలులగుచున్నారు.

సన్న్యాసియై (సత్-న్యాసి అయి) దేహ భావమును త్యజించి ఉంటున్నారు.

ఈ రీతిగా ఉన్నవారు పరమహంస అని చెప్పబడుచున్నారు. సోహమ్ పరమమ్ - ఇతి పరమహంసా! “సర్వమునకు పరమైయున్న ఆత్మసాగర తరంగస్వరూపుడను నేను” అను నిశ్చితాభిప్రాయము కలిగియున్నవాడు “పరమహంస”.

ఇట్టి మార్గములో ఈ జీవుడు పరమహంస కాగలడు.

ఈ జీవుడు ఏ ఆశ్రమంనుంచైనా సరే, బుద్ధిచే సన్న్యాసి అయి, పరివ్రాజకుడై, దేహ సందర్భమును సద్వినియోగపరచుకొనును గాక!

ఇతి పరమహంసో నామే -
జాబాల ఉపనిషత్
ఇత్యుపనిషత్।
ఓం శాంతిః శాంతిః శాంతిః