[[@YHRK]] [[@Spiritual]]

Kausheetakee Brahmana Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


శుక్ల యజుర్వేదాంతర్గత

4     కౌషితకీ బాహ్మణోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో|| శ్రీమత్ కౌషీతకీ విద్యా వేద్య, “ప్రజ్ఞామాత్ర పరాక్షరమ్”|
ప్రతియోగి వినిర్ముక్త "బ్రహ్మమాత్రం”విచిన్తయే||

కేవల ప్రజ్ఞాతత్త్వ స్వరూపము - పరము - అక్షరము - వాదోపవాదములకు ఆస్కారము లేని విధంగా సుస్పష్టము అగు ఏ బ్రహ్మము యొక్క మహదత్వము ఈ కౌషీతకీ విద్యచే తెలియవచ్చుచున్నదో, ఇద్దానిచే బోధింపబడుచున్నదో అది జీవునకు బంధవిముక్తము ప్రసాదించుటకై విచిన్తన చేయబడునుగాక!

ప్రథమో అధ్యాయః

1.) ఓం
చిత్రో హ వై గార్గ్యాయణిః
యక్ష్యమాణ - ఆరుణిం వవ్రే,
సహపుత్రం శ్వేతకేతుం ప్రజిఘాయ।
‘యాజయేతితం’
హసీనం పప్రచ్ఛ;
“గౌతమస్య పుత్రా! తే సంవృతం
లోకే యస్మిన్ అధ అస్య అస్యన్
మహెూబుద్ధో ఊర్ధ్వలోకే
దాస్యసి?” ఇతి।
పూర్వం ‘చిత్ర’ అనే పేరుగల గార్గ్యాయనీ (గోత్రజుడు) ఉండేవారు. ఆయన ఒక యజ్ఞము చేయసంకల్పించారు. అప్పుడు ఆయన ‘ఆరుణి’ అనే మహర్షిని సమీపించి తాను తలపెట్టిన యజ్ఞమును విధివిధానాలతో సహా నిర్వర్తింపజేయవలసినదిగా, ఋత్విక్ (ఉండవలసినదిగా) అభ్యర్థించారు.

అప్పుడు ఆ ఆరుణి మహర్షి తన కుమారుడైనట్టి శ్వేతకేతువును పిలచి, ”శ్రీ గార్గ్యాయణి కోరిన విధంగా ఈయనచే యజ్ఞమును దగ్గిర ఉండి ఋత్విక్‌వై చేయించు నాయనా!“…అని ఆజ్ఞాపించారు. అందుకు శ్వేతకేతువు అంగీకరిస్తూ “పితృదేవా! తమ ఆజ్ఞ” - అని సంసిద్ధతను సూచించారు. అప్పుడు చిత్ర నామధేయుడగు గార్గ్యాయణి ముని ఒకచోట శ్వేతకేతువును కలిసికొని, ”ఓ శ్వేతకేతూ! నాచే యజ్ఞము చేయించటానికి మీరు అంగీకరించారు. చాలా సంతోషం! నాదొక చిన్న విన్నపము. మీరు యజ్ఞవిధి - యజ్ఞఫలంగా నన్ను ఊర్ధ్వ లోకములను చేర్చగలరా? లేదూ, అందుకు ఉత్తమమైన ఉపాయం చెప్పి త్రోవ చూపించగలరా?" అని అభ్యర్థించారు.

సహెూ వాచ :-
‘న అహమ్ ఏతత్ వేద,
హంత! ఆచార్యం ప్రచ్ఛాని।’ - ఇతి
సహ పితరమ్ ఆసాద్య
పప్రచ్ఛేత్ ఇతి
మాప్రాక్షీత్ కథం
బ్రూవాణి - ఇతి।
శ్వేతకేతు :  అయ్యా! “యజ్ఞకర్తను ఊర్ధ్వ లోకాలుజేర్చటం" అనే ప్రక్రియ సంబంధమైన విషయం నాకు తెలియదు! నేను మీచే యజ్ఞము చేయించగలను! అంతవరకే! మీరు అడిగినది - మా నాన్నగారు ఆరుణి మహర్షిని అడిగి తెలుసుకుంటాను అన్నారు. అప్పుడు శ్వేతకేతు తండ్రి ఆరుణి మహర్షి వద్దకు వెళ్ళారు. ఊర్ధ్వ లోకాలు యజ్ఞఫలంగా పొందేది ఎట్లా?’  అని అడిగారు.
సహెూ వాచ :-
‘అహమ్ అపి ఏతత్ న వేద।
సదస్యేవ వయం స్వాధ్యాయమ్
అధీత్య హరామహే యన్నః
పరే దదత్య ఏహి ఉభౌ గమయిష్యావ’! ఇతి!
సహ సమిత్పాణిః చిత్రం గార్గ్యాయణిం
ప్రతిచక్రామోపాయని ఇతి।
అప్పుడు ఆ ఆరుణి మహర్షి ’నాయనా! ఆ విషయం నాకు కూడా తెలియదు. అయితే మరి, తెలుసుకుందాములే! ఈ చిత్ర - గార్గ్యాయణి యజ్ఞం చేసేచోట అక్కడి సదస్సులో వేదాధ్యయనం చేసి, స్వాధ్యాయనం చేసి, అప్పుడు అక్కడ వీరి దగ్గరే తెలుసుకుందాము” అని పలికారు.
ఒకరోజు ఆరుణి ఋషి, ఆయన కుమారుడు శ్వేతకేతువుతో కూడా సమిత్పాణులై (శిష్య భావంతో దర్భలు చేబూని) చిత్ర గార్గ్యాయనిని సమీపించారు. “హే మహాత్మా! చిత్రగార్గ్యాయనీ! మునీంద్రా! మా ఇద్దరినీ మీరు (బ్రహ్మతత్వ బోధకై) శిష్యులుగా అంగీకరించండి. మేము మీ ఆశ్రమంలో వేద వేదాంత అధ్యయనం చేస్తూనే, మీ యజ్ఞమును జరిపిస్తూ ఉంటాము”… అని పలికారు.
తం హెూ వాచ :-
‘బ్రహ్మోర్ఝో (బ్రహ్మజ్ఞో) అసి | గౌతమ!
యో మామ్ ఉపాగా దేహి,
త్వా జ్ఞపయిష్యామి!’ ఇతి||
అప్పుడు చిత్ర గార్గ్యాయని గౌతమ నామధేయుడగు ఆరుణితో…..,
“ఓ గౌతమా! మీరు బ్రహ్మజ్ఞానియే! ఎందుకంటే తెలియనిది తెలియనట్లు ఒప్పుకున్నారు కదా! సరే! నాతో రండి. మీకు తెలియునట్లు నాకు తెలిసింది తెలియజేస్తాను” - అని పలికారు.
2.) సహెూ వాచ :-
యేవా ఏకేచ అస్మాన్ లోకాత్
ప్రయంతి చంద్రమసమ్ ఏవ తే సర్వే గచ్ఛంతి।
తేషాం ప్రాణైః ‘పూర్వపక్ష’ ఆప్యాయతే,
అథా ‘పరపక్షే’ న ప్రజనయతి,
ఏతత్ వై స్వర్గస్య లోకస్య ద్వారమ్|
యత్ చంద్రమాస్తం యత్ ప్రత్యాహ,
తమ్ అతిసృజతే
య ఏనం ప్రత్యాహ, తమ్
ఇహ వృష్టిర్భూత్వా వర్షతి।
త ఇహ కీటో వా, పతంగో వా
శకునిర్వా, శార్దూలో వా, సింహెూ వా,
మత్స్యో వా, పరశ్వా వా, పురుషో వా
అన్యోవై తేషు స్థానేషు ప్రత్యా జాయతే,
యథా కర్మ యథా విద్యం! తమ్ ఆగతం పృచ్ఛతి,
‘కో అసీ’? ఇతి, తం ప్రతిబ్రూయాత్|
విచక్షణా దృతవో రేతః
ఆభృతం పంచదశాత్ ప్రసూతాత్
పిత్రాపతత్ స్తనమా పుంసి ।
కర్తర్యేర యధ్వం పుంసా కర్త్రా మాతరి మాసి
షిక్తః సజాయమాన - ఉపజాయామానో,
ద్వాదశ - త్రయోదశ ఉపమాసో
ద్వాదశ - త్రయోదశేన పిత్రా సంత ద్విదేఽహమ్।
తవ ఋతవో! మర్త్యవ ఆరభధ్వం తేన సత్యేన
తపసర్తు రస్మ్యార్తవో అస్మి ఏకోఽసి,
త్వమ్ అసీతి, తమ్ అతిసృజతే॥
చిత్రగార్గ్యాయని :-
అయ్యా! గౌతమ గోత్రోద్భవులగు ఆరుణి శ్వేతకేతులారా! వినండి.
➤ ఎవ్వరైతే ఈ దేహమును త్యజిస్తారో, అట్టివారు (మరణించినవారు) చంద్ర లోకమునకు వెళ్ళుచున్నారు. ఇక అక్కడినుండి మరల బయల్వెడలుచున్నారు. ఆ చంద్రలోకము స్వర్గలోకమునకు ద్వారమైయున్నది.
➤ పూర్వపక్షము (శుక్లపక్షము)న చంద్రలోకమును చేరి, స్వర్గలోకమును చేరినవారు స్వర్గలోక ద్వారములతో ప్రయాణించి స్వర్గలోకమే చేరుచున్నారు.
ఎవ్వరైతే పరపక్షము (కృష్ణపక్షము)లో చంద్రలోకము చేరుకొంటున్నారో…వారు తిరిగి భూలోకమునకు తిరిగిరావలసి వస్తోంది. మరల భూతసృష్టిలో ప్రవేశించుచున్నారు. అట్టి వారు వర్షము ద్వారా భూలోకమునకు వస్తున్నారు. వారువారు నిర్వర్తించిన కర్మల - తెలియవచ్చిన జ్ఞానము యొక్క ప్రభావమును అనుసరించి భూమిపై కీటకముగానో, దోమగానో, తుమ్మెదగానో, పక్షిగానో, పులిగానో, సింహముగానో, జలములో చేపగానో, క్రూరమృగముగానో ఆయా గర్భస్థానములలో ప్రవేశించుచున్నారు.
➤ వారు భూలోకమునకు వచ్చినప్పుడు ‘మేమెక్కడ ఉండాలి?’ అని అడుగుతుండగా, అప్పుడు కర్మదేవతలు ఆ జీవుని ‘మీరెవరు?’ అని ప్రశ్నిస్తున్నారు.

దానికి ఆ జీవుడి సమాధానం వినండి.
➤ ఓ కర్మదేవతలారా! నేను చంద్రలోకం నుండి తిరిగి వస్తున్నాను. కృష్ణపక్షములో చంద్రలోకమును ప్రవేశించిన కారణంగా తిరిగి భూలోకము చేరుచున్నాము. ఇక్కడ ఉత్తమమైన పురుష రేతస్సులో ప్రవేశించాలనునది నా కోరిక. 15 నెలల కాలం ఉత్తమ జన్మ రేతస్సులో ఉంచిన తరువాత, నన్ను మానవ పితృగర్భ రేతస్సులోను, (మానవ) మాతృగర్భములోను 12–13 నెలలు ఉంచి మరల మాకు మానవ జన్మను ప్రసాదించవేడుకుంటున్నాను.
➤ ఓ ఋతుదేవతలారా! సత్య - తపస్సుల ప్రభావం చేత నేను మీ స్వరూపమే (ఋతుదేవతగానే) అగుచున్నాను. నేను ఎవరు? మీరెవ్వరు? మీరు - నేను ఒక్కటే! మనము ఇక కలిసియే ముందుకు సాగుదాము గాక! సృష్టిలో మరల ప్రవేశించెదము గాక….

♠︎ ఈ విధంగా భూమిపైకి వచ్చిన ఆ జీవుడు కర్మ - ప్రజ్ఞానుసారము ఋతు దేవతల సహకారముతో కర్మఫలములను అనుసరించి తిరిగి భూమి పై దేహధారిగా అగుచున్నాడు.
3.) తమ్ ఏతం దేవయానమ్ పంథానమ్
అసాద్య, ‘అగ్నిలోకమ్’ - ఆగచ్ఛతి ।
స వాయు లోకమ్। స వరుణ లోకమ్ ।
స ఆదిత్య లోకమ్! స ఇంద్ర లోకమ్ ।
స ప్రజాపతి లోకమ్! స బ్రహ్మలోకమ్ ।
తస్య హ వా ఏతస్య బ్రహ్మలోకస్య
‘ఆరో’ హ్రదో ముహుర్తాయేష్టి హా ।
విరజానదీ…, ఈల్యో వృక్షః,
సాయుజ్యమ్ సంస్థానమ్
అపరాజితమ్ ఆయతనమ్ |
ఇంద్ర-ప్రజాపతీ ద్వార గోపౌ
‘విభుం’ ప్రమితం ‘విచక్షణా’ సంధ్య
అమితౌ జాః పర్యంకః ప్రియా చ।
మానసీ ప్రతిరూపాచ్చ చాక్షుషీ పుప్పాణి ఆదాయా
వయతౌ వై చ జగత్యంబాశ్చ |
అంబా అవయవాశ్చ, అప్సరసో అంబయా,
నద్యస్తమ్ ఇత్థం విదా గచ్ఛంతి।
తం బ్రహ్మాహాభి ధావత మమ యశసా విరజాం
వాయం పాలయన్ నదీ ప్రాపం న వా అయం
జిగీష్యతి| ఇతి|
➤ ఇక చంద్రలోకము నుండి ఊర్ధ్వ లోకములగు స్వర్గ, బ్రహ్మ లోకముల వైపుగా శుక్లపక్ష మార్గములో ప్రయాణించు జీవుని గురించి (అనగా, ఆత్మజ్ఞానము ఎరిగిన జీవుల ముందున్న ప్రయాణం గురించి):
➤ ఆతడు ముందుగా అగ్నిలోకము చేరుచున్నాడు. ఆ తరువాత వాయు లోకము, వరుణ లోకము, ఆదిత్య లోకము, ఇంద్ర లోకము, ప్రజాపతి లోకము, బ్రహ్మ లోకము క్రమంగా జేరుచున్నాడు.
➤ అక్కడ బ్రహ్మలోకములో ‘ఆరము’ అనే సరస్సు ఉన్నది. అక్కడ యేష్టివా (కొన్ని బ్రహ్మ ముహూర్తములు) గడుపుచున్నాడు. ఇంకా అక్కడ విరజా నది (విః + అజా – జన్మరాహిత్యమును, శుభ్రము - సుసంగతము చేయునది) ఉన్నది. ‘ఈల్య’ అనే కల్పవృక్షమున్నది. తరువాత సాయుజ్యము (Salvation) అనే పట్టణము ఉన్నది. అపరాజితము (అజేయము) అనే ప్రాకార సమన్వితమైన భవనమున్నది. ఆ భవనములో ద్వారపాలకులుగా, ఇంద్రుడు, ప్రజాపతి మొదలగు లోకపాలకులు ఉంటారు. ఆ భవనంలో ఇంకా విభు (సర్వమునకు అధికారి) అనే ప్రమితము (సభా మంపడము) ఉన్నది. ఆ సభా ప్రాంగణంలో విచక్షణ (common sense) అనే మహాతేజోవంతమైన సింహాసనము, ‘అమితౌజము’ అనే ప్రియభూమినీ పర్యంకము కలిగి ఉండటము జరుగుచున్నది. అక్కడ ‘మనసీ’ మరియు ‘చాక్షుసీ’ అనే ఇద్దరు దేవకాంతలు చేతిలో పుష్పములు ధరించి అక్కడ నుండి దారి చూపుచూ ఉంటారు. జగదంబ - (ప్రకృతి రూప) అంబ సౌష్ఠవము, సౌందర్యము వర్ణిస్తూ ఉంటారు. అప్సరసలు, మాతృదేవతలు, నదీమతల్లులు తత్త్వగానము చేస్తూ ఉంటారు.
➤ వారు ఆతనితో “బ్రహ్మదేవుడి దర్శనం మీకు అవుతుంది. ఈలోగా “బ్రహ్మలోక యశస్సు ఆస్వాదించండి. మానసికంగా మరల విరజానదీ స్నానము చేయండి. మీకు శోకము - వార్ధక్యము ఉండకుండు గాక!” అని ఆశీర్వదిస్తారు.
4.) తం పంచశతాని అప్సరసాం
ప్రతి ధావంతి।
శతం మాలా హస్తాః
శతమాంజన హస్తాః
శతమ్ చూర్ణ హస్తాః
శతమ్ వాసో హస్తాః,
శతమ్ ఫణా హస్తా స్తం,
బ్రహ్మాలంకారేణ అలంకుర్వన్తి।
స బ్రహ్మాలంకారేణ
అలంకృతో బ్రహ్మవిద్వాన్
బ్రహ్మైవ అభిప్రైతి!
స ఆగచ్ఛతి, ‘ఆరం’ హ్రదం తన్
మనసా ఆత్యేతి।
అమృత్వా సంప్రతి విదో మజ్జంతి।
ఆగచ్ఛతి ముహూర్త
అన్యేష్టి హాః తస్మాత్, అపద్రవంతి।
బ్రహ్మతత్త్వజ్ఞుల బ్రహ్మలోకానుభవములు
➤ అక్కడ (బ్రహ్మలోకంలో) ‘500’ మంది అప్సరసలు ఆయనను (బ్రహ్మతత్త్వ జ్ఞానిని) సేవించటానికి సంసిద్ధులై ఉంటారు. ఆ బ్రహ్మజ్ఞాన సమన్వితుని సన్మానిస్తూ ఉంటారు. అందులో మొదటి 100 మంది పుష్పమాలాహస్తులై ఉంటారు. మరొక 100 మంది సుగంధ ద్రవ్యములును చేతులతో ధరించి ఉంటారు. ఇంకొక 100 మంది ఆయా సుందర ద్రవ్యములు చేతిలో ధరించి ఉంటారు.
➤ అనేక పుష్పమాలికలతో వారంతా ఆ జీవుని బ్రహ్మదేవునితోపాటే అనేక అలంకారాలు అలంకరింప జేస్తారు. అందముగా తయారుజేస్తారు. పూర్వ - అపరిశుభ్రతలు తొలగిస్తారు. ఆ విధంగా బ్రహ్మవలె పంచశత అప్సరసలు అలంకరించుచున్నారు.
➤ ఆ బ్రహ్మ విద్వాంసునికి బ్రహ్మదేవుని సన్నిధానమునకు దారిచూపుచున్నారు. ఆతడు మార్గములో మనస్సుతో ‘ఆరం’ అనే సరస్సులో మానసిక స్నానం చేస్తున్నాడు. ఆ సుందర సరస్సులో స్నానం చేసి ఆనందము, ఆహ్లాదము పొందుచున్నాడు. ‘ఋతమ్’ అను ఋక్కులసారమగు పరమసత్య వస్తు భావము పొందుచున్నాడు. అక్కడ ‘యేష్టిహా’ అని పిలవబడు కొన్ని బ్రహ్మముహూర్తములు గడుపుచున్నాడు. ఉత్సాహము పొందుచున్నాడు.
స ఆగచ్ఛతి విరజాం నదీం
తాం మనసైవ ఆత్యేతి తత్ సుకృత - దుష్కృతే
ధూనుతే। తస్య ప్రియా జ్ఞాతయః సుకృతం
ఉపయంత్య ప్రియా, దుష్కృతం తత్ యథా రథేన।
ధావయన్ రథచక్రే పర్యవేక్షత
ఏవమ్ అహెూ-రాత్రే పర్యవేక్షత
ఏవం సుకృత - దుష్కృతే సర్వాణి చ ద్వంద్వాని।
స ఏష విసుకృతో - విదుష్కృతో
బ్రహ్మవిద్వాన్ బ్రహ్మైవ అభిప్రైతి||
➤ అక్కడి నుండి విరజానది జేరి అక్కడ మనోస్నానం చేసి సుకృత-దుష్కృతములు తాను భౌతిక దేహముతో నివశించి వచ్చిన లోకములకు సమర్పిస్తూ, త్యజిస్తున్నాడు.
➤ సుకృత ఫలములను తనకు ప్రియులైన జ్ఞాతులకు (పుత్రుడు మొదలైన వారికి), శిష్యులకు ఇచ్చి వేస్తున్నాడు. దుష్కృతఫలములను లోక కంటకులగు అప్రియులకు అందజేస్తూ వదలి వేస్తున్నాడు.
➤ ఈ విధంగా నడుస్తూ నడుస్తూ ఉన్న ఒక రథము యొక్క రెండు చక్రములు ఊడి పోయి, ఆ రథము నిస్తేజమై నేలపై కూలిపోవు విధముగా - పుణ్యపాపములు, సుఖదుఃఖములు, స్వర్గ-నరకములు, చీకటి వెలుగులు - మొదలైన ఆయా ద్వంద్వములన్నీ అతని పట్ల వీగిపోతున్నాయి. ఆతనిని విడిచి వెళ్ళిపోతున్నాయి.
➤ సర్వ ద్వంద్వములను విడచివేసినవాడై, ఆ బ్రహ్మ విద్వాంసుడు ’బ్రహ్మము’ను చేరుచున్నాడు. బ్రహ్మమే అయి ప్రకాశించుచున్నాడు. (బ్రహ్మ లోకం చేరుచున్నాడు).
5.) స ఆగచ్ఛత ‘ఈల్యం’ వృక్షం,
తం బ్రహ్మగంధః ప్రవిశతి।
స ఆగచ్ఛతి సాయుజ్యం।
సంస్థానం తం బ్రహ్మ స ప్రవిశతి।
స ఆగచ్ఛతి అపరాజితమ్ ఆయతనమ్
తమ్ బ్రహ్మతేజః ప్రవిశతి।
స ఆగచ్ఛతి ఇంద్ర, ప్రజాపతి
ద్వారగోపౌ తావస్మాత్ అప ద్రవతః|
స ఆగచ్ఛతి విభు ప్రమితం।
తం బ్రహ్మయశః ప్రవిశతి।
స ఆగచ్ఛతి విచక్షణామ్
ఆనందీం సా ప్రజ్ఞా ప్రజ్ఞయా
హి విపశ్యతి|
స ఆగచ్ఛతి అమితౌజసం పర్యంకం!
తం స ప్రాణః|
తస్య భూతం చ - భవిష్యచ్చ పూర్వౌ పాదౌ శ్రీశ్చ
ఏరాచ అపరౌ, బృహద్రథ అంతరే!
అనూచ్యే భద్ర యజ్ఞా
యజ్ఞీ యే శీర్షణ్యమ్
ఋచశ్చ, సామాని చ
ప్రాచీనా గానం యజూంషి।
తిరశ్చీనాని సోమాంశవ
ఉపస్తరణమ్ ఉద్గీథ
ఉపశ్రీ శ్రీః ఉప బర్హణం|
తస్మిన్ బ్రహ్మః | తే ఇతమిత్థం
విత్సాదేన ఏవ అగ్ర ఆరోహతి
తం బ్రహ్మ ఆహ,
“కోఽసీతి?” తం ప్రతి బ్రూయాత్|
➤ బ్రహ్మ సింహాసనము సమీపించే ముందు ఆతడు ‘ఈల్య’ అనే (బ్రహ్మలోకములోని) జ్ఞాన-వృక్షము క్రిందికి చేరుచున్నాడు. అప్పుడు ఆ ఈల్యవృక్షము నుండి ’బ్రహ్మము’ అనే సుగంధము ఆతనిలో ప్రవేశించుచున్నది.
➤ తరువాత ఆతడు ‘సాయుజ్యము’ అనే పట్టణము చేరుచున్నాడు. అక్కడ కూడా బ్రహ్మానంద ఉత్సాహము (ఆ పట్టణము నుండి) ఆతనియందు చేరుచున్నది.
➤ అక్కడి నుండి ’అపరాజి’ అనే భవనమును చేరుచున్నాడు. ఆ అపరాజి భవనము నుండి బ్రహ్మతేజస్సు ఆతనియందు ప్రవేశము పొందుచున్నది. అప్పుడు ఆతడు ఇంద్రుడు, ప్రజాపతి అనువారు ఇరువురు ద్వారపాలకులుగా ఉంటున్నట్టి బ్రహ్మసౌధమును చేరుచున్నారు. వారు బ్రహ్మదేవుని సమీపించ మార్గమును బ్రహ్మక్రాంతి ద్వారా చూపుచున్నారు. అప్పుడు ఆతడు ‘విభుః’ అనే రాజ్యసభావేదిక జేరుచున్నాడు. ఆతనిలో మరికొంత బ్రహ్మతేజస్సు (యశస్సు) ఆతనిని అనుగమించుచూ ఆతనిలో ప్రకాశిస్తోంది.
➤ ఆ తరువాత ఆతడు ‘విచక్షణ’ అనే బ్రహ్మసింహాసనమును సమీపించుచున్నాడు. ఆతడప్పుడు ప్రజ్ఞచే సృష్టికర్త - ప్రజాస్వరూపుడు అగు పరబ్రహ్మమూర్తిని దర్శించుచున్నాడు. ఆ బ్రహ్మభగవానుని సింహాసనముయొక్క పర్యంకమును సమీపించుచున్నాడు. అక్కడ ‘అమితౌజసము’ అనే వాహనము కనిపించగలదు.
➤ ఆ అమితౌజసమే ప్రాణవాయువు! ప్రాణశక్తి! భూత-భవిష్యత్ కాలములు ఆ అమితౌజసముయొక్క రెండు ముందు కాళ్ళు! సంపద - ప్రతిష్ఠ అద్దానికి వెనుకకాళ్ళు. భద్రయజ్ఞము - యాజ్ఞేయము అద్దాని రెండు శిరస్సులు. (యజ్ఞవిధులు - యజ్ఞభావన…ఆ శిరస్సులు). బృహత్-రథంతర సామగానములు (బాహ్య జగత్ గానము - అంతరంగ జగత్ గానము) అద్దాని సామవేదగానములు. అవి ఆ పర్యంకము యొక్క రెండు
యజ్ఞోవేదయజస్సులు. అనగా, ఆ బ్రహ్మపర్యంకము యొక్క అడ్డముగా ఉండు చెక్కలు. సోమలతలు దానిపై తివాసీ. ‘ఓంకార’ నాదస్వరూప ఉద్దీథము దానిపై ఉపశయనము (దిండు) ఆ పర్యంకముపై ఇతమిద్ధము (ఈ జగత్తు యొక్క వాస్తవ - సహజ రూపము నిర్వచించు బ్రహ్మవాఙ్మయము) ప్రకాశమానమగుచుండగా, ఎత్తైన ఆసనంపై శ్రీ బ్రహ్మదేవుడు ఆసీనులై ఉంటారు.
➤ బ్రహ్మమే తానై సర్వము ఆస్వాదించే పరమానంద పరబ్రహ్మస్వరూపులను ఆ బ్రహ్మదేవ భగవానుడు ఇట్లా ప్రశ్నిస్తున్నారు. ’ఎవరు నాయనా నీవు? ఈ ప్రశ్నకు ఆ జీవుడు తన వాస్తవ స్వరూపమేమిటో, ఏమని తలచుచున్నాడో అట్టి బ్రహ్మమునకు సంబంధించిన సమాధానం ఇట్లా సోదాహరణం!
6.)  ఋతుః అస్మ్యార్తవో!
అస్మ్య ఆకాశాత్ యోనేః
సంభూతో హ వై।
తత్ సంవత్సరస్య తేజోభూతస్య।
భూతస్య ఆత్మ భూతస్య,
త్వమ్ ఆత్మ - అసి।
“యః త్వమ్ అసి - సో అహమస్మి” ఇతి||
తమ్ ఆహః కోఽహమస్మి? ఇతి॥
సత్యమితి భ్రూయాత్|
కిం తత్ సత్యమ్? ఇతి||
యత్ అన్యత్ దేవేభ్యశ్చ, ప్రాణేభ్యశ్చ
తత్ పదథ, యత్
దేవాశ్చ, ప్రాణాశ్చ!
తత్ యమ్ తదేతయా
వాచాభి వ్యాహ్రియతే
‘సత్యమితి’ ఏతావత్ ఇదం।
సర్వమిదమ్||
సర్వమ్ అసీతి ఏవైనం
తత్ ఆహ, తమ్ ఆహ।
కేన పౌంస్నాని నామాని ఆప్నోతి? ఇతి॥
ప్రాణేన ఏతి బ్రూయాత్!
కేన స్త్రీ నామాని ఇతి? వాచ - ఇతి।
కేన నపుంసక నామాని? ఇతి।
మనసా ఇతి|| కేన గంథాని ఇతి?
ఘ్రాణేన - ఇతి।
బ్రూయాత్ కేన రూపాణి? ఇతి।  చక్షుషా - ఇతి।
కేన శబ్దాని - ఇతి? శ్రోత్రేణ - ఇతి।
కేన అన్న రసానీతి? జిహ్వయా - ఇతి।
కేన కర్మాణీతి? హస్తాభ్యామ్ - ఇతి।
కేస సుఖ-దుఃఖే - ఇతి? శరీరేణ ఇతి।
కేన ఆనందం రతిం,
ప్రజాతిమ్? ఇతి।
బ్రహ్మ భగవానుడు :  బిడ్డా! ఇక్కడ బ్రహ్మలోకములో ప్రవేశించావు. నా దర్శనానికి వచ్చావు. అట్టి నీవు ఎవరు? చెప్పు చూద్దాం!
బ్రహ్మజ్ఞానియగు బ్రహ్మలోక ప్రవేశి : స్వామీ! కాలమునకు ముందే ఉండి ఉండి, లీలావినోదినై కాలమునందు ప్రవేశించినట్టివాడను. నేను కల్పించుకొన్న సంబంధముచే కాలస్వరూపుడను అయ్యాను. ఋతు స్వరూపుడనై ఋతు ధర్మములు ఆశ్రయించాను. ఆకాశమునుండి యోని (స్త్రీగర్భము) నందు సంభూతుడవై, దేహినగు నేను దేహధారిని అయ్యాను. అనేక లోకములలో సంచరించి, బ్రహ్మతత్వానుభవ సిద్ధి కొరకై ఇప్పుడు మీ దర్శనమునకు వచ్చాను. అనంతకోటి జీవాత్మలలో నేనూ ఒకడిని. అయితే జీవాత్మలగు మేమంతా అఖండాత్మ స్వరూపులమే కదా! కనుక నేను అఖండ - అప్రమేయ ఆత్మస్వరూపుడను.
హే బ్రహ్మ భగవాన్! మీరూ ఆత్మస్వరూపులే! ఆత్మసాగర స్వరూపులగు మీయందు నేను ఒక తరంగమును.
అందుచేత ఏది మీరై ఉన్నారో …అదియే నేనై ఉన్నాను ‘స్వామీ!’
బ్రహ్మదేవుడు :  ఓహెూ నేనే నీవా? నేను ఏది అయి ఉన్నానో, అదియే నీవై ఉన్నావా? సంతోషము. మరి నేనెవరు?
బ్రహ్మలోక ప్రవేశి :  మహాత్మా! మీరు సత్యలోక పాలకులు కదా! అందుచేత, నిత్య సత్యస్వరూపులై ఉన్నారు. సత్ - సత్య స్వరూపులు!
బ్రహ్మ భగవానుడు :  అట్లాగా? ఏమిటా సత్యము?
బ్రహ్మలోక ప్రవేశి :  ఇంద్రియ దేవతలకు, ప్రాణశక్తికి కూడా ఆవల, చైతన్య స్వరూపులు తేజోనివాసులై ప్రకాశిస్తూ ఉన్నారు. ఏ చైతన్యము - దేవతలు, ప్రాణశక్తి కూడా అయి ఉన్నదో, అట్టి చిత్- ఆత్మానంద స్వరూపులు మీరు! ఏది సత్ + యమ్…సత్యమో అదియే మీరు. సత్ స్వరూపులు. సత్యలోక యజమాని! ఈ సమస్త జగత్తు మీ రూపము - మీరే అయి ఉన్నారు. ఇదంతా మీ సత్యస్వరూపమే! ఇదంతా మీరే! దీనంతటికీ వేరై ఉన్నదీ మీరే!
బ్రహ్మ భగవానుడు :  సర్వమునకు ఆవలగా ఉండి, ఇదంతా నా పురుషకార (something framed by my workmanship)గా నన్ను పురుషకారస్వరూపునిగా ఎట్లా తెలుసుకోగలిగావు? ఎట్లా పరబ్రహ్మస్వరూపుడగు నన్ను చేరావు?
బ్రహ్మలోక ప్రవేశి :  ప్రాణోపాసనచే ప్రాణవాయుతత్వము ద్వారా ప్రాణి స్వరూపిడుగా ఉపాసించి, మిమ్ము చివరికి పరమ - పురుష రూపునిగా తెలుసుకున్నాను.
బ్రహ్మ భగవానుడు :  మరి స్త్రీ రూపమును ఎట్లా తెలుసుకొన్నావు?
బ్రహ్మలోక ప్రవేశి :  వేదోపనిషత్ వాక్యార్థముల ద్వారా “స్త్రీ - ప్రవృత్తిరూపము. మీరేప్రకృతి స్వరూపము. పురుషుడు - పరబ్రహ్మస్వరూపులగు !” అని గురువాక్య మహిమచే తెలుసుకున్నాను.
శ్రీ బ్రహ్మ భగవానుడు :  మరి నపుంసకరూపములు ఏమని తెలుసుకొంటున్నావు?
బ్రహ్మలోక ప్రవేశి :  మనస్సు (ఆలోచన Common sense) - ద్వారా నపుసంక రూపములు కూడా మీరేనని గ్రహిస్తున్నాను.

బ్రహ్మ భగవానుని ప్రశ్న బ్రహ్మలోకప్రవేశి యొక్క సమాధానం
గంధము ఎట్లా ఎరుగుచున్నావు? ఘ్రాణము (ముక్కు) తో!
రూపములో? కళ్ళతో!
శబ్దములో? చెవులతో!
అన్నరసమును? జిహ్వ (నాలుక)తో
కర్మలు ఎట్లా నిర్వర్తించావు? చేతులతో!

ఉపస్థేన - ఇతి।
కేన ఏత్యా ఇతి? పాదాభ్యామ్ - ఇతి।
కేన ధియో విజ్ఞాతవ్యం? కామాన్ - ఇతి?
ప్రజ్ఞ - యేతి!
ప్రబ్రూయాత్ తమ్ ఆపో
హైవ ఖలు మే హి
అసావయంతే
లోక ఇతి। సాయా
బ్రహ్మణి
చితిర్యా వ్యష్టిస్తాం।
చితిం జయతి తాం,
వ్యష్టిం వ్యశ్నుతే
య ఏవం వేద! య ఏవం వేద!
సుఖదుఃఖాలు ఎవరికి చెందినవి? దేనిచే ఏర్పడుచున్నాయి?
అవన్నీ శరీర సంబంధమైనవి. శారీర తాదాత్మ్యము వలన కలుగుచూ వస్తున్నాయి.
ఆనంద రతి ఎవరికి సంబంధించినది? ఏ విధంగా తెలుసుకుంటున్నావు?
అది ప్రజాపతి చేత ఉపస్థేంద్రియ సంబంధమై కలుగుచున్నాయి.
నడవటం ఎట్లా దేనిచేత తెలుసుకుంటున్నావు?
పాదములలో గల బ్రహ్మీశక్తిచే పాదములు శక్తిపొంది కదలుచూ ఉన్నాయి.
కామములు, సంకల్పములు, భావములు దేనిచేత తెలుసుకొన్నావు?
బుద్ధి ప్రజ్ఞచేత! ప్రజ్ఞచేతనే అన్నీ తెలియబడుచున్నాయి.
ఈ కనబడే ఈ దృశ్య జగత్తంతా ఏమి అయి ఉన్నదని తెలుసుకొంటున్నావు?
ఇదంతా కూడా నాయొక్క రసమయ విన్యాసమే! (ఆపో) రసస్వరూపము!
ఇదంతా నాదే. ఇది మీది కూడా! ఈ లోకాలన్నీ మీ నా స్వస్వరూపమగు బ్రహ్మమే!
నేనుగా ఉన్నది మీరే కాబట్టి మీది-నాది, మీరు-నేను ఏకమే! అఖండమే!
ఇదంతా ఎవ్వరైతే చిదానంద రూపంగా, కేవలచిత్ రసాత్మకంగా బ్రహ్మమే అని తెలుసుకొనుచున్నారో వారు అఖండమగు బ్రహ్మమే అగుచున్నారు కదా!
ఇదంతా బ్రహ్మమే అని నేను ఆర్యవాక్యానుసారంగా ఎరుగుచున్నాను. ఫలితంగా బ్రహ్మమే నేను!

ద్వితీయోఽధ్యాయః

1.)  “ప్రాణో బ్రహ్మ” ఇతి హస్మాహ కౌషీతకీః।
తస్య హవా ఏతస్య ప్రాణస్య బ్రహ్మణో
మనోభూత్వా వాక్ పరివేష్టృ
చక్షుః శ్రోతం సంశ్రావయితృ
తస్మై వా ఏతస్మై
‘ప్రాణాయ బ్రహ్మణ’
ఏతాః సర్వా దేవతా
అయాచమానాయ॥
బలిం హరంతి, తథో ఏవ అస్మై
సర్వాణి భూతాని యయా ఆచమానాయైవ
బలిం హరంతి య యేవం వేద!
తస్య ఉపనిషత్ నయా చేత్ ఇతి
తత్ యథా గ్రామం భిక్షిత్వా!
లబ్ధ్వా ఉపవిశేత్ న హమతో
దత్తమ్ అశ్నీయామ్ - ఇతి
య ఏవ ఏనం పురస్తాత్
ప్రత్యాచక్షీరం స్త ఏవైనమ్
ఉపమంత్ర యంతే।
దదామత ఇత్యేష ధర్మో యాచితో భవతి
అనంతరస్తు తేవ ఏనమ్
ఉపమంత్రయంతే దదామత ఇతి||
చిత్రగార్గ్యాయణి :   ప్రాణమే (ప్రాణశక్తియే) బ్రహ్మము అని ఈ మన కౌషీతకీ బ్రాహ్మణోపనిషత్ ఎలుగెత్తి పలుకుచున్నది! అట్టి ప్రాణ (శక్తి) రూప బ్రహ్మమే సంకల్పములను ఆశ్రయించినప్పుడు మనోరూపమును దాల్చుచున్నది. ఆ మనస్సు పలుకులు పలుకుచున్నప్పుడు వాక్ ఇంద్రియముగాను, చూచుచున్నప్పుడు చక్షుః ఇంద్రియముగాను, వినుచున్నప్పుడు శ్రవణేంద్రియముగాను అగుచున్నది.

ఈ విధంగా  ‘సర్వేంద్రియ ప్రదర్శనా సంపద స్వరూపియగు ప్రాణమే బ్రహ్మము‘ అని ప్రాణతత్త్వమును బ్రహ్మముగా - గమనించుచున్నవారికి ఆయా దేవతలు కూడా వారి వారి సంపదలు ఆయాచితంగానే ఆతనికి ప్రసాదిస్తూ ఉంటారు. అట్లాగే ప్రాణోపాసనా రహస్యము తెలిసి, ప్రాణోపాసన నిర్వర్తించు యోగులు ప్రాణతత్వము ఎరిగిన వారై వారియొక్క తమ ఇంద్రియ సంపదలను ప్రాణదేవుని ఇహరూపంగా గమనించి, ఇంద్రియ విషయములన్నీ ప్రాణదేవతా భావనతో ప్రాణోదేవికి సమర్పించాలి.

అందుచేత నాయనలారా! “ఇంద్రియ విషయములను అభిలషించటము గ్రామములో భిక్షాటనము చేయుటవంటిది"గా భావించి, యాచన చేయకండి’ అని ఈ ఉపనిషత్ బోధ! ఇది గ్రహించి ‘లభించిన దానితో సరిపెట్టుకొని ఉండాలి. ఇతరులను (ఇంద్రియ విషయ పరంపరలను) యాచించి - దత్తామ్ (ఇవ్వబడినది - దానం చేయబడినది)…సిరిసంపదలవంటివి స్వీకరించ ఇచ్ఛగించాడు-యాచకుడే!

(ఇద్రియ విషయములను) యాచన చేయని స్వభావము కలవారు ఎప్పుడూ భాగ్యవంతులే! (కౌపీనవంతః ఖలు భాగ్యవంతః!). ఇంకా కూడా, “నాకు ఏదో లభించాలి! ఇవ్వబడును గాక!” అను భావన కొనసాగించువారు యాచకులు అగుచున్నారు. ‘యాచన’ (Desiring) త్యజించువారు గౌరవించబడి, దేవతలచే వారివారికి అవసరమైనవన్నీ ఇవ్వబడుచున్నాయి.

2.) "ప్రాణోబ్రహ్మ” - ఇతి హస్మాహ పైంగ్యః॥
తస్య హవా ఏతస్య ప్రాణస్య।
బ్రహ్మణో వాక్ పరస్తాత్ చక్షుః
ఆరుంధే చక్షుః పరస్తాత్।
శ్రోతమ్ ఆరుంధే శ్రోత్రం పరస్తాత్ |
మన ఆరుంధే మనః పరస్తాత్|
ప్రాణ ఆరుంధే తస్మైవా ఏతస్మై
త్రాణాయ బ్రహ్మణ ఏతాః|

సర్వాదేవతా అయాచమానాయ।
బలిం హరంతి। తథో ఎవా
అస్మై సర్వాణి భూతాని
అయాచమానాయ బలిం హరంతి।
య ఏవం వేద తస్య ఉపనిషత్
న యాచేత ఇతి తత్ యథా గ్రామం భిక్షిత్వా!
లబ్ధ్వా ఉపవిశేత్ న అహమ్ అతో దత్తమ్ అశ్నీయామి
ఇతి య ఏవ ఏనం పరస్తాత్।
ప్రత్యాచక్షీరం స్త ఏ వైనమ్
ఉపమంత్ర యంతే దదామత
ఇతి ఏష ధర్మో యాచితో భవతి అన్యతరస్తు
ఏవైనమ్ ఉపమంత్రయంతే దదామత ఇతి|
ప్రాణమే బ్రహ్మము. అట్టి ప్రాణశక్తి ‘పైంగ్యము’ (ప-మట్టి బొమ్మలో మట్టివలె, ఈంగ్యము - నిండి ఉన్నది) అని పిలువబడుచూ ఉన్నది. సర్వదేహములకు ‘అంతర్యామి’గా ఉన్నది.
అట్టి ప్రాణరూపబ్రహ్మమే …
- వాక్కును పలికించుచున్నది.
- కళ్లను చూచుశక్తితో నింపి ఉంచుచున్నది.
- చెవులను వనికిడి శక్తితో స్పందింపజేయుచున్నది.
- మనస్సును భావనా చైతన్యముతో ఆలోచన చేయునట్లుగా సిద్ధింపజేయుచున్నది.
సర్వ దేవతలు తమ తమ దివ్య శక్తులను తిరిగి ప్రాణమునకే సమర్పించుచున్నారు. ఈ విధంగా ప్రాణమే బ్రహ్మము!

అట్లాగే జీవులంతా కూడా ఆయాచితంగా తమ ఇంద్రియానుభవాలన్నీ ప్రాణేశ్వర భగవానునికి సమర్పిస్తూ… ప్రాణ పరమాత్మకే సర్వదా బలిహరణము (సమర్పణము) చేయుచుండటం జరుగుతోంది.
ఇట్టి  ‘ప్రాణాత్మకు బలిహరణము (సమర్పణము)’ అను ఈ ఉపనిషత్ ప్రతిపాదితమైన సత్యమును గ్రహించువారు ఇంద్రియ విషయ యాచనను అనుసరించరు.
అట్టి అర్థమును గ్రహించినవాడు ఇంద్రియ విషయములను అభిలషించనివాడై, ఇంద్రియ గ్రామమునందు నిత్యముక్తుడుగా సగౌరవించబడుచున్నాడు.
దేహములోని ఇంద్రియ దేవతలు, ఏ బాహ్య విషయములను అభిలషించక, సర్వము ప్రాణదేవునికి సమర్పించువానికి తమ తమ మహిమలను ప్రసాదించి గౌరవించుచున్నారు…‘అయాచిత ధర్మము’ అను వ్రతము నిర్వర్తించువారు సర్వము పొంది మహత్ భాగ్యులు అగుచున్నారు.
ప్రాణశక్తికి ఇంద్రియ విషయ సమర్పణ (బలి) తత్త్వము ఎరిగి, సర్వము పొందుచున్నారు.

3.) అథాత ఏక ధనావరోధనం
యత్ ఏకధనమ్ అభిధ్యాయాత్।
పౌర్ణమాస్యాం వా అమావాస్యాం వా
శుద్ధపక్షే వా పుణ్యే నక్షత్రే
అగ్నిమ్ ఉపసమాధాయ, పరిసమూహ్య|
పరిస్తీర్య పర్యుక్ష్య పూర్వ దక్షిణం,
జాన్వా వాచ్య!
స్రువేణ వా, చమసేన వా, కంసేన వా,
ఏతా ఆజ్యా ఆహుతిః జుహెూతి,
వాక్-నామ దేవతా అవరోధినీ
సామే అముష్మాత్ ఇదమ్ అవరుంధా!
తస్యై స్వాహా ప్రాణో నామ దేవతా అవరోధినీ
సామే అముష్మాత్ ఇదమ్ అవరుంధా!
తస్యై స్వాహా “చక్షుః” నామ దేవతా అవరోధినీ
సామే - అముష్మాత్ ఇదమ్ అవరుంధా!
తస్యై స్వాహా “శ్రోతం” నామ దేవతా అవరోధినీ
సామే - అముష్మాత్ ఇదమ్ అవరుంధా|
తస్యై స్వాహా “మనో” నామ దేవతా అవరోధినీ
సామే - అముష్మాత్ ఇదమ్ అవరుంధా!
తస్యై స్వాహా “ప్రజ్ఞా” నామ దేవతా అవరోధినీ
సామే అముష్మాత్ ఇదమ్ అవరుంధా!
తస్యై స్వాహేతి!
అథ ధూమ గంధమ్ ప్రజిఘాయ,
ఆజ్య లేపేన అంగాని అను- విమృజ్య వాచం।
యమోభి ప్రవ్రజ్యార్థం బ్రవీతి
దూతం వా ప్రహిణుయాత్ లభతే హైవ
చంద్రలోకమునుండి ఊర్ధ్వమగు ‘స్వర్ణ’ ఇత్యాది ఆనందలోకములు చేరు ఆశయముగలవారు ఏ విధంగా అగ్నికార్యోపాసనలు నిర్వర్తిస్తున్నారో…. చెప్పుచున్నాను.
→ నిండు పౌర్ణమి తిథి రోజునగాని, అమావాస్య రోజునగాని, శుక్లపక్షములో పుణ్య నక్షత్రము రోజునగాని…ఏదో ఒక శుభదినమున (మంచి రోజున) అగ్నికార్యము (యజ్ఞము) ప్రారంభించుచున్నారు. పవిత్రమైన ప్రదేశమును ఎంచుకొనుచున్నారు. ఆ ప్రదేశమును పరిశుభ్రముగా చేయుచున్నారు.
→ పవిత్రముగా చేయబడిన వాతావరణమును తయారు చేసుకొని అగ్నిని వ్రేల్చుచున్నారు. స్రువము (చెంచా,గరిట), చమసము (కొయ్యపాత్ర), కంచు పాత్రలను ఉపయోగించి, అగ్నిలో ఆజ్యము (నేయి) సమర్పిస్తూ యజ్ఞశాస్త్రమంత్రములు నిర్ణయించే దేవతా సంబంధమైన ‘మంత్రము’ గానం చేస్తూ ఉన్నారు. ఆ దేవతను ఉద్దేశ్యించి ఆజ్యము సమర్పించుచున్నారు. ఆ ప్రాణ నామ దేవతను ధ్యానిస్తూ ….., ‘స్వాహా’ అని పలుకుచూ సమర్పించుచున్నాను.
→ ‘వాక్’ ఇంద్రియ ప్రాణ దేవతకు వాక్కులన్నీ బలిహరణముగా సమర్పించుచున్నాను. స్వాహాఁ! (ఇదం న మమ!)
→ ‘చక్షురింద్రియ ప్రాణదేవతకు నేను దృశ్యదర్శనములన్నీ సమర్పిస్తున్నాను - స్వాహా’ అని సమర్పిస్తున్నాను! నాకు చక్షుదేవత ఆముష్మిక సుఖము ప్రసాదించునుగాక!
→ శ్రోత దేవతకు సర్వశ్రోత (వినికిడి) ఫలములన్నీ ‘స్వాహా’ అని సమర్పించుచున్నాను. ఆ చక్షుదేవత నాకు ఆముష్మిక సుఖము ప్రసాదించునుగాక!
→ మనస్సుతో చేస్తున్న ఆలోచనలన్నీ… ఈ ఇహకార్యక్రమములన్నీ మనో నామ ప్రాణదేవతకు ’స్వాహా’ అని సమర్పిస్తున్నాను. నా ఇహ (ఐహిక) మనో కార్యక్రమ ఫలములను స్వీకరించి నాకు ఆముష్మిక సుఖములను ప్రసాదించునుగాక!
→ ప్రజ్ఞానామ దేవతకు నా బుద్ధి ఇహంలో చేస్తున్న క్రియా విశేషాలన్నీ ‘స్వాహా’ అని ఈ ఆజ్యము రూపంగా అగ్ని ద్వారా సమర్పిస్తున్నాను. ఆ ప్రజ్ఞా ప్రాణదేవత ఆముష్మిక సుఖము ప్రసాదించునుగాక!

ఈ విధంగా అగ్నికి ఆజ్యమును ‘స్వాహాయేతి’ అని సమర్పిస్తూ ఆ ధూమగంధము (మసి)ని అంగములకు పాముకొంటూ, భావనాపూర్వకంగా సర్వ ఇంద్రియ వ్యాపారములను ఆయా అధి దేవతలకు సమర్పించి వేయాలి. సర్వేంద్రియ దేవతలను ప్రాణతత్త్వ ప్రదర్శనములుగా సమర్పించాలి.
అట్టి యజ్ఞకర్త ఏది (ఆముష్మికము లేక ఐహికము) కోరుకొని ‘స్వాహా’ అని పలుకుచూ అగ్నియందు ఆజ్యము సమర్పిస్తూ, ఇంద్రియాధిదేవతలకు ఇహ ఇంద్రియ కర్మలన్నీ సమర్పిస్తున్న భావన చేస్తూ ఉంటాడో, ఆతడు ఆ కావాలనుకొనేవన్నీ పొందగలడు.
4.) అథాతో దైవస్మరో యస్య ప్రియో
బుభూషే యస్యైవా ఏషాం వై తేషామ్ ఏవై తస్మిన్
పర్వణి అగ్నిమ్ ఉపసమాధాయ
ఏతయైవ ఆవృత ఏతా ఆజ్య హుతీః జుహెూతి
వాచం తే మయి జుహెూమి అసౌ స్వాహా!
ప్రాణం తే మయి జుహెూమి అసౌ స్వాహా!
చక్షుః తే మయి జుహెూమి అసౌ స్వాహా!
శ్రోత్రం తే మయి జుహెూమి అసౌ స్వాహా!
మనః తే మయి జుహెూమి అసౌ స్వాహా|
జుహెూ తే మయి జుహెూమి అసౌ స్వాహా ఏతి।
అథ దూమగంథం, ప్రజిఘాయ ఆజ్య లేపేన అంగాని
అనువిమృజ్య వాచం యమోభి ప్రవ్రజ్య సంస్పర్శం
జిగమిషేత్ అపి వాతాద్వా!
సంభాషమాణః తిష్ఠతే ప్రియోహైవ
భవతి స్మరంతి! హైవ భవతి, స్మరంతి హైవ స్యాత్||
అప్పుడు ఆ అగ్నికి ‘స్వాహా’ శబ్దముతో ఆహుతులను, దేహేంద్రియములలోను, జగత్తులోనుగల ఇంద్రియ దేవతలకు సమర్పిస్తూ ఉండగా దైవస్మరణకు ఫలప్రసాదముగా దివ్యమహిమలను ఆ దేవతలు ప్రసాదించుచున్నారు. ఆజ్యమును (నేయి) ఆహుతిగా అగ్నికి సమర్పిస్తున్నప్పుడు ’జుహెూమి’ అని యాజ్ఞీకుడు యజ్ఞకర్తచే వాక్యములు పలికిస్తున్నారు.

ఓ వాక్ దేవతా! ఓ ప్రాణదేవతా! ఓ చక్షు దేవతా! ఓ శ్రోత దేవతా!
ఓ మనో దేవతా! ఓ ప్రజ్ఞా దేవతా! ఓ దేవదేవా!
"తేమయి జుహెూమి అసౌ స్వాహా! (స్వాహా ఏతి)!
అని పలుకుచూ, ఆ యజ్ఞకర్త ధూమగంధమును (భస్మ గంధనము) లేపనముగా అంగాంగములకు లేపనము చేయుచున్నారు. ఆ తరువాత మౌనముగా అగ్నిగుండమును సమీపించి, ఆ అగ్నిగుండ నలు చదరములను రెండు అరచేతులతో స్పృశించి రెండు కనులు మూసుకొని ఆయా ఆహ్వానిత దేవతల మహిమను ఒక్కొక్కటిగా మనస్సుతో తలచుకుంటూ కృతజ్ఞతలు చెప్పుచున్నారు. ప్రియమైన స్తోత్ర సంభాషణతో ఆయా ఆవాహిత దేవతలను కర్మణా, మనసా, వాచా స్మరిస్తూ తను విన్నపమును మనస్సుతో వాక్కుతో విన్నవించుకుంటున్నారు.
5.)  అథా అతః సాయమ్ అన్నం
ప్రాతర్థనమ్ అంతరమ్
‘అగ్నిహెూత్రమ్’ ఇతి చ ఆచక్షతే॥
యావత్ వై పురుషో భాసతే, న తావత్ ప్రాణితుం
శక్నోతి। ప్రాణం తదా వాచి
జుహెూతి। యావత్ వై పురుషః
ప్రాణితి, న తావత్ భాషితుం శక్నోతి వాచం,
తదా ప్రాణే జుహెూతి।
ఏతే అనంతే మృతాహుతీః జాగ్రచ్చ
స్వరూపం చ సంతతమ్
అవ్యవచ్ఛిన్నం జుహెూతి
అథ యా అన్యా ఆహుతయో
అంతవత్ యస్తాః కర్మమయి,
యో భవంతి ఏతత్ ఉవై పూర్వే విద్వాంసో
అగ్నిహెూత్రం జుహ్వాం చక్రుః ||
ఇప్పుడిక ఈ ’దేహము’ అనే యజ్ఞశాలలో అంతరముగా నిర్వర్తించు యజ్ఞము అగ్నిహెూత్ర కార్యక్రమము గురించి చెప్పుకుంటున్నాము.
ఏ సమయములో ఈ జీవుడు మాట్లాడుచూ ఉన్నాడో ఆ సమయములో ఆతడు, ఊపిరి పీల్చుటలేదు. అప్పుడు ఆతడు శ్వాసను వాక్కులో ఆహుతి చేయుచున్నాడు. ఆ వ్యక్తి శ్వాస పీల్చుచున్నప్పుడు వాక్కులు (శబ్దాలు) పలకలేడు. అనగా, అప్పుడు వాక్కును శ్వాస (లేక) ప్రాణాగ్నిలో ఆహుతి చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా వాక్ - ప్రాణశక్తులను ఒక దానియందు మరొకటి అవిచ్ఛినంగా, ఎల్లప్పుడూ (మెళకువ - నిద్రాసమయాలలో) ఆహుతిగా జీవించియున్నంత కాలం చేస్తూనే ఉన్నాడు.
అట్టి బహిరంగంగా ఈ జీవుడు నిర్వర్తిస్తున్న బహిరంగ ఆహుతులన్నీ అంతరంగ కర్మలు!

ఇది గమనించిన పూర్వీకులకు విద్వాంసులు ‘అగ్నిహోత్రమునకు నేయిని “ఆహూతులుగా ఇస్తూ ప్రాణ దేవతను, ప్రాణస్వరూపములే అయి ఉన్న చక్షువులు మొదలైన దేవతలను ఉపాసించి, అనుకొన్న స్థితిగతులు పొందటం” అనే యజ్ఞవిధిని మానవాళికి ప్రసాదించారు.
దేహంలోను బాహ్యంలోను జరుగుచున్నదంతా బ్రహ్మమే। సర్వము బ్రహ్మమే!
అట్టి బ్రహ్మోపాసనయే ఈ బాహ్య - అంతర యజ్ఞ కార్యక్రమ విశేషాలన్నీ కూడా!
అందుకే ఇదంతా ‘శుష్క అంగారమృక్’ అను పేరుతో ఉపాసిస్తున్నారు.
6.) అథ కథం  బ్రహ్మేతి  హస్మా హ
“శుష్క అంగారమృక్” ఇతి ఉపాసీత |
సర్వాణి హస్మై భూతాని శ్రేష్ఠ్యాయ
అభ్యర్చ్యంతే తత్ యజుః ఇత్యుపాసీతః |
సర్వాణి హా అస్మై భూతాని శ్రైష్ఠ్యాయ (ఇతి) యజ్యంతే
తత్ సామే ఇతి ఉపాసీత సర్వాణి హా
అస్మై భూతాని శ్రైష్ఠ్యాయ సన్ నమంతే|
తత్ ‘శ్రీ’ ఇతి ఉపాసీత |
తత్ ‘యశ’ ఇతి ఉపాసీత |
తత్ ‘తేజ’ ఇతి ఉపాసీత |
తత్ యథై తత్ శాస్త్రాణాం
శ్రీమత్ తమమ్, యశశ్వితమమ్,
తేజశ్వి తమమ్ భవతి।
తథ ఏవైవం విద్వాన్ సర్వేషాం
భూతానాం శ్రీమత్తమో,
యశస్వితమః, తేజస్వితమో భవతి।
తమ్ ఏతమ్ ఐష్టికం
కర్మమయమ్ ఆత్మానమ్
అధ్వర్యుః సంస్కరోతి।
తస్మిన్ యత్ ధర్మమయం ప్రభవతి।

తత్ ధర్మమయం ఋక్‌మయం|
హెూతా ఋక్‌మయమ్ |
సామమయమ్ ఉద్గాతా । స ఏష సర్వస్యై
‘త్రయీవిద్యా’యా ఆత్మైష ఉప
ఏవా-అస్య ఆత్మైతత్ ఆత్మా భవతి,
య ఏవం వేద|
‘సర్వజీవులు యజుర్వేద ఋక్కులతో తమ ఇంద్రియ కర్మలచే బ్రహ్మమునే అర్చించుచున్నారు’ అని భావించి, యజ్ఞకర్త యజుస్సులతో యజ్ఞవిధిగా బ్రహ్మోపాసన చేయుచున్నాడు.
సర్వజీవులు బ్రహ్మముయొక్క మహాత్మ్యము చేతనే ఇంద్రియ కర్మలచే ప్రాణ - ఇంద్రియ ధర్మముల సామగానము చేస్తున్నారు అని అవగాహన సమన్వయము చేసుకొనబడుగాక? ఈ సృష్టి, ఇందలి జీవుల సర్వ స్వభావాలు, అనుభవాలు - ఇవన్నీ ఆత్మభగవానునికి సమర్పిస్తున్న సామగాన స్తోత్రాలే!
"ఆ బ్రహ్మముయొక్క శ్రేష్ఠత్వము, మహదత్వము సర్వదా కీర్తించబడుచూ, ఉపాసించబడుగాక! ఆత్మయొక్క తేజో విభవములో ఆరాధించబడుగాక!” అని ఉద్దేశ్యించి యజ్ఞ (అగ్ని) కార్యము నిర్వర్తించాలి. అట్లు యజ్ఞ కార్యము బ్రహ్మోపాసనగా నిర్వర్తించువారు యశోసంపన్నులు, తేజోసంపన్నులు అగుచున్నారు.
’ఈ సర్వ జీవులు ఆ పరబ్రహ్మము యొక్క సౌందర్య - ఐశ్వర్య తేజో విభవమే’ అని యోగి ఆత్మకు నమస్కరించుచున్నాడు. అట్టి ఉపాసనచే తాను యశస్వి, తేజోమయుడు అగుచున్నాడు.
ఆత్మ భగవానుని ఉపాసించే ముఖ్య భావనలతో ఐష్ఠికములను (శాస్త్రములచే సూచించబడు యజ్ఞ-యాగములను) నిర్వర్తించువారు. (యజ్ఞకర్త - ఆధ్వర్యుడు) స్వభావసిద్ధముగా సంసారభావన - దృష్టుల నుండి సంస్కరించబడుచున్నారు.
ఆత్మ ధర్మములను పుణికిపుచ్చుకొని, బ్రహ్మమే తామై ప్రకాశించుచున్నారు!

ఆతడు సర్వమును…,
- ధర్మమయముగాను,
- ఋగ్వేద-ఋక్ స్తోత్రమయము గాను,
- ఋక్ మహిమా సమన్వితము గాను,
- సామమయముగాను, నాదానందమగు ఉద్గాత గాను,
- త్రయీ విద్యా - ఆత్మతత్త్వ స్వరూపము గాను
యజ్ఞవిధులను ఉపాసిస్తున్నాడు.
సర్వము ఆత్మమయముగాను దర్శించుచున్నాడు. వేదములలో చెప్పిన అగ్నికార్యముల ఆత్మోపాసనా రహస్యమును ఎరిగి, ఇంద్రియ విషయములచే అంతర్యజ్ఞమును, ఆహుతి అగ్నిలతో కూడిన బహిర్యజ్ఞము… నిర్వర్తించువాడు ఆత్మయే (బ్రహ్మమే) తానై ప్రకాశించుచున్నాడు!
7.) అథ అతః సర్వ జితః కౌషీతకేః
త్రీణి ఉపాసనాని భవంతి। యజ్ఞోపవీతం కృత్వాప
ఆచమ్య, త్రిః ఉదపాత్రం ప్రసిచ్య,
‘ఉద్యంతమ్ ఆదిత్యమ్’
ఉపతిష్టేత్ యత్ వర్గోఽసి
పాప్మానమే ఉద్వృన్ “ధీ” - ఇతి ఏతయైవ ఆవృతా
మధ్యే సంతమ్ ఉద్వర్గోఽసి పాప్మానమ్
అంతద్వ్యపావాత్య ఏతైవ ఆవృతాః ‘స్తయంతమ్’
యత్  వర్ణోఽసి పాప్మానం మే సర్వం వాత్యేతి
యత్ అహెూ-రాత్రాభ్యాం
పాపం కరోతి సంతత్ వృంక్తే ॥
బుద్ధి యొక్క పరిశుద్ధత - నిశ్చలతల కొరకై ‘3’ విధములైనటువంటి కౌషీతకీ సూర్య - త్రిసంధ్యోపాసనలు ఈ విధంగా యజ్ఞోపవీత పూర్వకంగా నిర్వర్తించబడుగాక!
యజ్ఞోపవీతమును ఉపవీతముగా ధరించి ‘3’ సార్లు ఉదక పాత్రతో ఆచమనం చేసి, ఉదకపాత్రపై ఉదక ప్రోక్ష్యం చేయాలి.
ఓ ఉదయిస్తున్న ఆదిత్య భగవాన్! “ఉద్యంతమ-ఆదిత్యా! సూర్యదేవా! నాకు దగ్గరై ఉపతిష్ఠులవండి. నన్ను సర్వ పాపవర్గముల నుండి ప్రక్షాళనము చేయండి!“ అని ఉపాసించాలి.
అట్లాగే మధ్యాహ్నము (12 గంటల వేళ) కూడా, ”స్వామీ! ఆదిత్యా! స్తయంతమాదిత్యా! నీవు సర్వపాపములను ప్రక్షాళన చేయు మహాత్ముడవు! నా యొక్క సర్వ పాప (అనాత్మ) భావములనుండి నన్ను సముద్ధరించండి”.
అదే విధంగా సాయం సంధ్యా సమయంలో కూడా ఆదిత్యో పాసన చేయుటచే సర్వపాప సంస్కారాల నుండి విముక్తులు అగుచున్నారు. లయానంతరము శేషించే స్వస్వరూపము అనుభవమగుచున్నది.
8.) అథ మాసిమా అస్య అమావాస్యాయాం
పశ్చాత్ చంద్రమసం దృశ్యమానమ్
ఉపతిష్టేత ఏతయైవ ఆవృతా హరిత తృణాభ్యాం వా
వృత్తస్యాత్ యత్ తే స్వసీమే
హృదయమ్ అధి, చంద్రమసి
శ్రితం। తేన అమృతత్వమ్
అస్య ఈశానం మాహం పౌత్ర మఘం రుదమితి।
స హ అస్మాత్ పూర్వాః ప్రజాః ప్రయంతీతి
న జాత పుత్రస్య అథా
జాత పుత్రస్య ఆహ (అ)యం సమేతాతు
ఆప్యాయస్వ సమేతు తే, సంతే
పయాంసి సముయంతువా।
రాజా యమ్ ఆదిత్యామ్ ఆత్వా
అంశుమ్ ఆప్యాయయంతితే, తాః తిస్ర ఋచో
జపిత్వా న అస్మాకం ప్రాణేన
ప్రజయా, పశుభిః ఆప్యాయయస్వ యో ఆస్మాన్
ద్వేష్టి యంచ వయం ద్యిష్మః
తస్య ప్రాణేన ప్రజయా పశుభిః
ఆప్యాయస్యేతి। దైవీమ్ ఆవృతమ్| ఆవర్త ఆదిత్యస్య|
ఆవృతమ్ అన్వావర్తయతి। దక్షిణం బాహుం అన్వా వర్తతే॥
ప్రతి నెల శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి తిథి వరకు ‘చంద్రమసము’ నందు దృశ్యమానమగు చంద్రోపాసన చేయబడుగాక! పచ్చటి గడ్డి పరకలకు (హరిత తృణములను) చంద్రభగవానునికి సమర్పిస్తూ, “ఓ చంద్రదేవా! నా హృదయసీమలో మీరు మనోరూపంగా సదా వేంచేసియే ఉన్నారు. సర్వదా అమృత కిరణములను ప్రసరిస్తూ ఉండండి! నన్ను ‘పౌత్ర మఘము’ (నా సంతానము, బంధువులు మొదలగువారి వలన నాకు దుఃఖములు) కలుగకుండునట్లు అగ్రహించండి!“ - అను భావనతో ఉపాసించాలి.

ఈ మంత్రమును ఉపాశించువారి సంతతి కూడా చంద్ర భగవానుని చల్లటి కిరణములచే రక్షింపబడుచుండెదరు. పుత్రులు లేని వారు (నజాత పుత్రులు), పుత్రులు కలవారు (జాతపుత్రులు) చంద్రభగవానునికి ప్రార్థనలు సమర్పించెదరుగాక!

ఓ చంద్రభగవాన్! నన్ను మీదరి చేర్చుకొనెదరుగాక! మీరు రస స్వరూపులు! మీయందు సర్వ రసములు ఉండి ఉన్నాయి. మీరు సర్వశక్తి సమన్వితులు. మా జీవితములు ఆప్యాయము (మధురము) అగునట్లు చేసెదరుగాక! అట్లే ఆదిత్యుడు (సూర్యభగవానుడు)కూడా మా జీవితములను ఆప్యాయ మాధుర్యములతో నింపెదరుగాక! ఈ తిస్ర-ఛందోరూపమైన ఋక్కులతో సూర్య చంద్రులను స్తోత్రములు సమర్పించాలి.

“ఓ సూర్య-చంద్రులారా! ప్రాణశక్తి వలనగాని, దుష్ట- అల్ప స్వభావులగు జనులవలన గాని, పశువులవలనగాని మాకు కష్టములు రాకుండా కాపాడండి! ప్రాణశక్తి, ప్రజలు, పశువులు మాయొక్క సాధనలందు సానుకూల్యురై ఉండెదరుగాక! దేహములోని దేవతలు, ఆదిత్యుడు మా చుట్టూ ఉండి రక్షించుచుండెదరుగాక! అనువర్తులు, సానుకూల్యురు అయ్యెదరుగాక! మా కుడిచేయి ఉత్తమ కర్మలయందు అనువర్తనమై, సానుకూల్యముగా ఉండును గాక!”
9.) అథ పౌర్ణమాస్యాం పురస్తాః
చంద్రమసం దృశ్యమానమ్
ఉపతిష్ఠ ఏతయైవ ఆవృతా
సోమో రాజాసి విచక్షణః
పంచముఖోఽసి, ప్రజాపతిః
బ్రాహ్మణస్తః ।
ఏకం ముఖం। తేన ముఖేన రాజ్జోఉత్సి।
తేన ముఖేన మాం అన్నాదం కురు।
రాజా త ఏకం ముఖం। తేన ముఖేన
విశోత్సిత, ఏనైవ ముఖేన మామ్ అన్నాదం కురు।
శ్యేనస్త ఏకం ముఖం। తేన ముఖేన పక్షిణో ఉత్సి,
తేన ముఖేన మాం అన్నాదంకురు।
అగ్నిస్త ఏకం ముఖం! తేన ముఖేన ఇమం లోకమత్సి!
తేన ముఖేన మామ్ అన్నాదం కురు।
సర్వాణి భూతాని ముఖం। తేన
ముఖేన సర్వాని భూతాని అత్సి।
తేన ముఖేన మామ్ అన్నాదం!
ఇత్యేవ పంచమం కురుమ్।
అస్మాకం ప్రాణేన ప్రజయా పశుభిః
అవక్షేపా యో। అస్మాన్ ద్వేష్టియంచ | వయం ద్విష్మః
తస్య ప్రాణేన ప్రజయా పశుభి
అవక్షీయన్వేతి స్థితిః దైవీమ్ ఆవృతమ్ ఆవర్త
ఆదిత్యస్య ఆవృతమ్ అన్వావర్తం త ఇతి
దక్షిణం బాహుమ్ అన్వావర్తతే||
పౌర్ణమి తరువాత - కృష్ణపక్ష చంద్రుడు తూర్పు దిక్కుగా కనబడుచున్నంత కాలము ఆ చంద్ర భగవానుని ఈ తీరుగా ప్రార్థన చేయాలి.

ఓ చంద్రదేవా! మీరు మీ కిరణములతో ఆకాశంలో రారాజువై ప్రకాశిస్తున్నారు! జ్ఞానానంద స్వరూపులు! గగన వీథులలో పంచముఖ ప్రజ్ఞాపతి బ్రహ్మమై విలసిల్లుచున్నారు.

మొదటి ముఖముతో ఆకాశరాణివై (రాజ్ఞి) జీవులందరికీ ఔషధ రూపముగా ఆహారము (అన్నము) ప్రసాదిస్తున్నారు. అట్టి మొదటి ముఖములో మాయందు అన్నమును భుజించువానిగా (ఆహార స్వీకరించువానిగా, ధాన్యమును రక్షించువానిగా) ఉండండి! మీ వాత్సల్యం మాపట్ల కొనసాగించండి. ‘అన్నాదుడు’ అయి ఉండండి! ఆహార స్వీకారానుభవములన్నీ మీకు సమర్పించుచున్నాము.

మరొక ముఖముతో ‘రాజాధిరాజు’ అయి ప్రకాశించుచున్నారు. ఈ ముఖముతో కూడా మాకు అన్నము ప్రసాదించండి.

ఇంకొక ముఖముతో పక్షిజాతినంతటినీ ఉత్తేజితం చేస్తున్నారు. ఆ ముఖముతో కూడా మాకు అన్నము దయచేయండి.

మరొక ముఖముతో అగ్నితేజోవిలాసులై ఈ లోకమును ప్రకాశింపజేస్తున్నారు. ఉజ్జీవింపజేస్తున్నారు. ఆ ముఖము కూడా అన్నాదమ్ (అన్నము - బ్రహ్మము) (దమ్- ఇచ్చునది)గా చేయండి!

సర్వజీవులు మీయొక్క వేరొకముఖము , సర్వభూత స్వరూప ముఖముతో కూడా మాకు అన్నప్రసాదితులు అవండి!

ఈ విధంగా పంచముఖములతో మాయొక్క ఆస్వాదనమును (అన్నాదమును) పరిపుష్ఠము చేయండి. మాయొక్క ప్రాణశక్తి, జనసంపద, పశుసంపద ‘లోటు’
పొందకుండును గాక! మా స్థితి-గతులకు తోడు అవండి! మమ్ము ద్వేషించువారి, మేము ద్వేషించువారి ప్రాణ ప్రజ పశుసంపదలను, స్థితులను, గతులను కూడా దేవతలు రక్షించెదరుగాక! దేవతలు ఆవృత్తులై తమ ఆవర్తనములతో అందరినీ రక్షించెదరుగాక! ఓ ఆదిత్యదేవా! సూర్యభగవాన్? ఆహూతులై మా దైవీ కార్యక్రమములను అన్వావర్తము (activate) చేయండి. మేము ఈ కుడిబాహువులతో పుణ్యకార్యములు ఎల్లప్పుడు చేయుచుండేట్లుగా అనుగ్రహించండి!
10.) అథ సంవేశ్యన్ జాయాయై హృదయమ్ అభిమృశేత్
యత్ తే సుసీమే హృదయో
హితమంతః। ప్రజాపతౌ మన్యే
ఇహ మాం తత్ విద్వాంసం మాహం
పౌత్రమఘం రుదమ్ ఇతి
న హాస్మాత్ పూర్వాః ప్రజాః ప్రైతి|
హృదయమే శరీర ఉపాసన :  జీవిత భాగస్వామిగా పరమాత్మచే ప్రసాదించిన భార్య (ప్రకృతి) యొక్క హృదయస్థానమును స్పృశిస్తూ “ఓ హృదయేశ్వరీ! నా హృదయముచే హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ‘హితము’ కలుగజేయమని" వేడుకొనుచున్నాను. ప్రజాపతి స్వరూపులుగా మిమ్ములను ఉపాసిస్తున్నాను. నాకు మీరు విద్వాంస-స్వరూపులు! నన్ను విద్వాంసులుగా చేయండి. మన సంతతికి వ్యాధులు రాకుండా రక్షించండి’.. అని ప్రార్థన! అట్లు ఇంటి ఇల్లాలిని ఉపాసించువారి సంతానమునకు కష్టములు ఉండవు.
11.) అథ ప్రోష్యాయన్ పుత్రస్య మూర్థానమ్ అభిమృశతి।
అంగాత్ అంగాత్ సంభవసి।
‘హృదయాత్ అధిజాయసే। ఆత్మావై పుత్ర నామ్నా!
స జీవ శరదశ్శతమ్। అసావితి నామాస్య
(అశ్మాభవ। పరశుర్భవ। హిరణ్యమస్తృతం భవ।
తేజోవై పుత్ర నామాసి, సజీవ శరదశ్శతం!
ఆసావితి నామాస్య గృహ్ణాతి।
యేన ప్రజాపతిః ప్రజాః
పర్యక్ గృహ్ణీత అరిష్ట్యై  తేన త్వా పరిగృష్ణామి
అసావితి యథాస్య దక్షిణే కర్లే జపతి
అస్మే ప్రయన్ధి మఘువన్
ఋజీషిత్ ఇతి ఇంద్ర శేష్ఠాని
ద్రవిణాని ధేహీతి।)
గృహ్నాతి మా చ్ఛేత్తా, మా వ్యధిష్ఠాః,
శతం శరద ఆయుషో జీవపుత్ర, తే నామ్నా
మూర్ధానమ్ అభిజిఘ్రామ్య అసావితి।
త్రిభిః మూర్థానమ్ అభిజిఘేత్
గవా త్వా హింకారేణ అభి హింకరోమి!
ఇతి త్రిరస్య మూర్థానమ్ అభిహిం కుర్యాత్
ఆత్మా వై పుత్రః : కుమారుని మూర్థమును (foreface) చేతులతో స్పృశించి ముద్దుపెట్టుకొని, “నా అవయములలోని దేవతల ప్రసాదముగా ఉన్నావు. నా హృదయమునుండి నీవు బయల్వెడలావు. నాయనా! నేనే నీవుగా ఉన్నాను! బిడ్డా! నిండు నూరేండ్లు జీవించెదవుగాక“! అని సంతానము పేరు చెప్పి పలకాలి. “బిడ్డా! సుఖమును పొందుము! పదునైన బుద్ధికలవాడువుకమ్ము! బంగారు రంగుతో ప్రకాశించుము! నూరేళ్లు జీవించుము” అని సంతానము పేరు చెప్పి ఆశీర్వదించును గాక! ”దేనిచేత ప్రజాపతి తన బిడ్డలగు సర్వజీవుల అరిష్టములను (కష్టములను) తొలగించుచున్నారో, అద్దాని చేతనే బిడ్డల కష్టములను నేను తొలగించుచున్నాను” - అని భావిస్తూ, కుమారుని కుడి చెవియందు మంత్రము చెప్పును గాక!

“ఓ శ్రేష్ఠుడవగు ఇంద్ర భగవాన్! మా సంతానమును అల్ప పాపబుద్ధుల నుండి కాపాడుచు సంపదలు ప్రసాదించండి"!

ఓ సంతానమా! బాధలు వ్యధలు లేకుండా మా సంతతి (పుత్రులు పౌత్రులు) అగు మీరు ఉత్తమ మార్గాణ్వేషులై, ధ్యానము, యజ్ఞము మొదలైన దైవీ కార్యక్రమములు నిర్వర్తిస్తూ నూరేళ్ళు యశస్సుతో వర్ణిల్లెదరుగాక!’ అని గోవు హీంకరిస్తున్న రీతిగా హీంకరించుచున్నాను.
ఇట్లు పలుకుచు, సంతానమును బ్రహ్మముగా భావన చేస్తూ ‘3’ సార్లు మూర్థమును (foreface) స్పృశించాలి!
12.) అథా అతో దైవః పరిమర ఏతత్ వై
బ్రహ్మ దీప్యతే। యత్ అగ్నిః,
జ్వలత్య అథైతత్ మ్రియతే|
యత్ న జ్వలతి, తస్య “ఆదిత్యమేవ”,
తేజో గచ్ఛతి వాయుం,
ప్రాణ ఏతత్వై బ్రహ్మ దీప్యతే
యథా మర్త్యో దృశ్యతే అథ ఏ తత్ మ్రియతే|
యత్ న దృశ్యతే తత్ “చంద్రమసమేవ”|
తేజో గచ్ఛతి వాయుం
ప్రాణ ఏతద్వై బ్రహ్మ దీప్యతే॥
యత్ చంద్రమా దృశ్యతే
యత్ విద్యుః విద్యోతతే
అథ ఏతత్ మ్రియతే॥
యత్ న విద్యోతతే, తస్య విద్యుతమేవ
వాయుమేవ, తేజో గచ్ఛతి|
వాయుం ప్రాణః తావా!
ఏతాః సర్వా దేవతా వాయుమేవ!
ప్రవిశ్య వాయౌ తృష్ణాన మూర్ఛంతే,
తస్మాత్ ఏవ పునః ఉదీరత
ఇత్యధిదైవతమ్ అథ “ఆధ్యాత్మమ్”
ఇప్పుడు సర్వదేవతలుగా ఏ బ్రహ్మము దీపించున్నదో… అద్దానిని ఆరాధిస్తున్నాము.

ఏదైతే అగ్నిగా జ్వలించుచున్నదో, అదియే సూర్యుడు.
ఏది జ్వలించుచున్నదో (అగ్నిగా వెలుగుచున్నదో….అందంతా ఆదిత్యుడే! అగ్నియే ఆదిత్యుడు! ఆదిత్యుడే ఆగ్ని!
అగ్నిలో గల (బ్రాహ్మీ శక్తి రూపమగు) ప్రాణశక్తియే వాయువు రూపముగా ప్రదర్శనమగుచున్నది.

బ్రహ్మమే ప్రాణశక్తి!
ఏదైతే కదలుచూ నామరూపాత్మకంగా కనిపిస్తోందో (మర్త్యో దృశ్యత్) అది నాశనము మార్పు చేర్పు కలిగినదై ఉంటోంది.
(యత్ దృశ్యమ్ తత్ నశ్యమ్) ఏది కదిలించునదై, దృశ్యముగా కనిపించటములేదో, అది చంద్రమసము (చంద్రశక్తి) అని గ్రహించబడు గాక!

తేజస్సు వాయువునందు ప్రవేశించుచున్నది. వాయువే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిగా బ్రహ్మమే దీపించుచున్నది.
ఏది చంద్రమసముగా (చంద్రునిగా) కనిపించుచున్నదో, ఏది విద్యుత్ ప్రకాశరూపముగా సృష్టిలో కనిపించుచున్నదో… అదంతా సూర్యతేజో రూపమే! అగ్నిరూపమే!
ఏది ప్రకాశమానమై కనిపించుటలేదో, అది కూడా విద్యుత్ (తేజో)రూపాంశమే! చీకటి కూడా తేజస్సుయొక్క మరొక అంశయే.
ఆ తేజస్సు వాయువునందు ప్రవేశించుచున్నది. వాయువు ప్రాణశక్తి రూపము.

ప్రాణశక్తియే ఇదంతా! కనుక సృష్టిదేవతలంతా ప్రాణశక్తి తత్త్వమగు వాయురూపులే!
దేవతలంతా వాయువునందు ప్రవేశించి, వాయు స్వరూపులై శాంతిస్తున్నారు.
వాయు రూపమునందు ఉండుటచే దేవతలు అమరులు. దేవతలు వాయురూపులై, వాయువు ప్రాణరూపమై, ప్రాణము బ్రహ్మరూపమై చెన్నొందుచుండటమే - ‘అధి దైవతము, అధ్యాత్మము……. అని పిలువబడుచున్నది.
13.) ఏతత్ వై బ్రహ్మ దీప్యతే
యత్ వచా వదతి,
అథ ఏతత్ మ్రియతే
యత్ న వదితి,
తస్య చక్షురేవ
తేజో గచ్ఛతి ప్రాణం
ఏతద్వై బ్రహ్మ దీప్యతే|
యత్ చక్షుషా పశ్యతి,
అథైతత్ మ్రియతే।
యత్ న పస్యతి,
తస్య శ్రోత్రమ్ ఏవ
తేజోగచ్ఛతి ప్రాణం|
ప్రాణ ఏతత్ వై బ్రహ్మ దీప్యతే!
యత్ శ్రోత్రేణ శృణోతి అథ ఏతత్ మ్రియతే|
యత్ న శృణోతి తస్య మన ఏవ తేజో గచ్ఛతి ప్రాణం|
ప్రాణ ఏతత్ వై బ్రహ్మ దీప్యతే|
యత్ మనసా ధ్యాయతి, అథ ఏతత్ మ్రియతే!
యత్ న ధ్యాయతి తస్య ప్రాణమేవ
తేజో గచ్ఛతి। ప్రాణం,
ప్రాణః తావా ఏతా సర్వా దేవతాః|
ప్రాణమేవ ప్రవిశ్య, ప్రాణే నృప్తాన
మూర్ఛంతే తస్మాత్ తదైవ పునః ఉదీరతే|
తత్ యది హ వా
ఏవం విద్వాంస ఉభౌ పర్వతాః
అభిప్రవర్తయాతాం
తత్ వర్షమాణో దక్షిణశ్చ ఉత్తరశ్చ
న హై వైనంస్తు తృణ్వీయాతామ్
అథ య ఏనం ద్విషంతి
యాంశ్చ స్వయం ద్వేష్టి!
త ఏవం సర్వే పరితో మ్రియంతే॥
ఏదైతే వాక్కుగా ప్రకాశించుచున్నదో, అది బ్రహ్మముయొక్క దీప్తియే! కాంతియే! తేజస్సే!
ఏదైతే మాట్లాడబడుచున్నదో, అది ముగించబడి నశించవచ్చుగాక!
వాక్కుగా ప్రకాశించే బ్రహ్మము అగ్ని రూప, ప్రకాశరూప, వాక్ తేజస్సుగా నశించదు.
ఏదైతే చూచుశక్తిగా కనబడుచున్నదో, అట్టి దృక్‌ శక్తిగా ప్రాణతేజస్సే ప్రదర్శితమగుచున్నది.
చూడబడునది మారుచున్నప్పటికీ దృక్‌ శక్తి మారదు.
బ్రహ్మమే ప్రాణశక్తిగా, చూపుశక్తిగా దీపించుచున్నది. చూపు శక్తికి నాశనము లేదు.
ఏది కళ్ళకు కనిపిస్తుందో, అది నశించబోతోంది. యత్ దృశ్యమ్ - తత్ నశ్యమ్!
ఏది కళ్ళకు కనబడకుండా ఉన్నదో, అట్టి బ్రహ్మమే దృశ్యమువలె కళ్లకు కనిపిస్తోంది.
కనుక కనిపించేదంతా కూడా మార్పుచేర్పులకు అతీతమగు బ్రహ్మమే!

ఏ తేజస్సు ప్రాణశక్తిగా అగుచున్నదో, ఆ ప్రాణతేజస్సే దేహములో ‘వినికిడి శక్తి’ అయి ఉన్నది.
బ్రహ్మమును వినికిడి శక్తియే ప్రాణము. వినబడని ప్రాణశక్తియే వినబడే శ్రుతశక్తిగా అగుచున్నది.
ఏది ప్రాణశక్తిగా ప్రకాశిస్తోందో, అదియే మనోశక్తి రూపమును దాల్చుచున్నది.
మనస్సు అనగా - ఆలోచన.
ఏది ఆలోచించబడుతోందో అది నశిస్తోంది (మార్పు చెందబోతున్నది. కానీ ఆలోచనాశక్తి నశించుటలేదు.
ఏది ఆలోచనకు విషయము కాదో, ఆలోచించబడటము లేదో… అదీ ప్రాణశక్తియే!
ఆలోచించునది- ప్రాణశక్తి! ప్రాణశక్తియే బ్రహ్మము.

ప్రాణము తేజస్సునందు ప్రవేశించుచున్నది. దేహములోని సర్వ ఇంద్రియ దేవతలుగా ప్రాణశక్తియే రూపుదాల్చుచున్నది.
ప్రాణశక్తి స్వరూపులై ప్రాణమునందే దేవతలు నివశిస్తున్నారు.
ఆ ప్రాణము అనంతమగు ఆత్మ శక్తియందు లయించుచూ, తిరిగి ఆత్మయందే, దేవతలతో సహా బయల్వెడలుచున్నది.
ఇంద్రియ దేవతలు, ఇంద్రియ విషయములు, ప్రాణశక్తి…ఇవన్నీ ఆత్మయందే ఆత్మగానే ఏర్పడినవై ఆత్మరూపముగానే ఏర్పడి - అయించి తిరిగి ఆత్మరూపముననే ఏర్పడుచున్నవగుచున్నాయి.
ఇట్టి బ్రహ్మతత్త్వమును ఎరిగినట్టి, అర్థము చేసుకున్నట్టి విద్వాంసుడు - ఇంద్రియ దృశ్యములను, విషయములను ఇంద్రియ శక్తి రూపంగాను, ఇంద్రియశక్తి దేవతలను ప్రాణశక్తిరూపంగాను, ప్రాణశక్తిని బ్రహ్మముగాను గ్రహించుచున్నాడు.
అట్టి యోగాభ్యాసి అవలీలగా (వింధ్య హిమాచల) ఉభయ పర్వతముల మధ్యగా ఉన్నదంతా ఉత్తర - దక్షిణ సర్వ దిక్కులలో ఉన్నదంతా తృణమును చుట్టినట్టుచుట్టగలడు.

ఎవరు ఈ జగత్తు యొక్క వాస్తవ రూపమగు బ్రహ్మమును ద్వేషిస్తారో…వారు తమను తామే ద్వేషించుకొంటున్నట్లు. ఎందుకనగా, తాము బ్రహ్మమే అయి, ఇదంతా బ్రహ్మమే అయి ఉన్నది కాబట్టి. బ్రహ్మము యొక్క సర్వవ్యాపకత్వ పాఠ్యాంశమును ద్వేషించువాడు ఆత్మ ద్వేషియే!
14.) అథా అతో నిః శ్రేయస ఆదానం
సర్వాహ వై దేవతా అహం శ్రేయసే
వివదమానా, అస్మాత్ శరీరాత్
ఉచ్ఛక్రుముః తత్ దారు భూతం శిష్య
అథ హైనం ‘వాక్’ ప్రవివేశ,
తత్ వాచా అవదః శిష్య ఏవ,
అథ హి ఏనం చక్షుః ప్రవివేశ
తత్ వాచా వద చక్షుషా పశ్యః
శిష్య ఏవ |
అథ హి ఏనం శ్రోత్రం ప్రవివేశ |
తత్ వాచా వద, చక్షుషా పశ్యః
శ్రోత్రేణ శృణ్యన్ శిష్య ఏవ॥
అథ హి ఏనం మనః ప్రవివేశ |
తత్ వాచా వద, చక్షుషా
పశ్యతి, శ్రోత్రేణ శృణ్వన్
మనసా ధ్యాయః శిష్య ఏవ
అథ హైనత్ ప్రాణః ప్రవివేశ |
తత్ తత్ ఏవ సముత్తస్థా తత్ దేవాః
ప్రాణే నిఃశ్రేయసం విచింత్య, ప్రాణమేవ
ప్రజ్ఞాత్మానం అభిసంస్థూయ।
సహ ఏతైః సర్వైః ఆస్మాత్ లోకాత్ ఉచ్చక్రముః||
తే వాయుః ప్రతిష్ఠా,
అకాశాత్మానః స్వర్యయుః తథో ఏవైవం
విద్వాన్ సర్వేషాం భూతానాం ప్రాణమేవ, ప్రజ్ఞాత్మానమ్
అభి సంస్తూయః స హైః తైః సర్వైః అస్మాత్ శరీరాత్
ఉత్క్రామతిః స వాయు ప్రతిష్ఠా, ఆకాశాత్మనః
స్వరేతి, తత్ భవతి|| యత్ర ఏతత్ దేవాః
తత్ ప్రాప్య, తత్ అమృతో భవతి,
యత్ అమృతా దేవాః ||
ఇప్పుడు మనము  ‘నిః శ్రేయసా ఆదానము’ గురించి చెప్పుకుందాము.

ఒకానొక సందర్భములో దేహములోని వేరు వేరు శబ్ద - స్పర్శ - రూప - రస - గంధ ఆదిగా గల దేవతలంతా ఎవరికి వారే - “మేమే గొప్ప” అని వాదోపవాదములు చేస్తూ…దేహమునుండి బయెల్వెడలసాగారు. అప్పుడు దేహములో శ్వాస నిలిచిపోయింది. ఇంద్రియములన్నీ నిస్తేజమై, ఎటూ పోలేక స్థంభించిపోయినాయి.

అప్పుడు ఏం జరిగింది? మొట్టమొదటగా వాక్కు దేవత దేహములో ప్రకాశించారు. వెంటనే ‘వాక్’ ఇంద్రియము పనిచేస్తూ, మాటలు చెప్పటం ప్రారంభించింది. కానీ తదితర ఇంద్రియములతో సమన్వయము కుదరలేదు.

తరువాత చక్షుదేవత కూడా దేహములో ప్రవేశించారు. మరుక్షణం చంక్షురింద్రియం (కళ్ళు) చూడగలగటం ప్రారంభించాయి. అప్పుడు ఆ జీవుడు మాట్లాడటము, చూడటము ప్రారంభించాడు.

అప్పుడు శ్రోత్ర (వినికిడి) ఇంద్రియ దేవత ఆ భౌతికదేహంతో ప్రకాశించారు. అప్పుడా జీవుడు వాక్కుతో మాట్లాడుచూ, కళ్లతో చూస్తూ, చెవులతో వినటం చేయసాగాడు. అప్పుడు మనో దేవత ఆ దేహంలో ప్రవేశించారు. అప్పుడా జీవుడు వాక్కుతో మాట్లాడుచూ, కళ్ళతో చూస్తూ, చెవులతో వింటూ, మనస్సుతో ధ్యానము (ఆలోచనలు) చేయసాగాడు.

కానీ, ఆ శరీరములో జీవశక్తి లేకపోవటంచేత ‘నిస్తేజత్వము’ తొలగలేదు. ఇంద్రియదేవతల సమన్వయత్వము లేకపోయింది. అప్పుడు ప్రాణశక్తి కూడా ఆ దేహములో ప్రవేశించసాగింది. వెంటనే ఆ దేహము జీవశక్తి పొందినదై సర్వేంద్రియములను సమన్వయపూర్వకంగా ఉపయోగించుకోసాగింది. ఇంద్రియ దేవతలందరూ ఒకరితో మరొకరు సంబంధీకులై, ఇక ఆపై ఆ జీవుడు ప్రవర్తించగలిగాడు. ఇంద్రియాలన్నిటికీ శ్రేయస్సు కలిగింది! అప్పుడు ఇంద్రియ దేవతలంతా ’మనకు త్రాణ ప్రాణశక్తియే! కనుక ప్రాణశక్తియే శ్రేష్ఠమైనది’ అని సిద్ధాంతీకరించుకున్నారు. ప్రాణదేవతకు తమను తాము సమర్పించుకున్నారు. ప్రాణదేవతతో మమేకమై ప్రాణరూపమగు వాయువునందు ప్రతిష్ఠితులై భౌతికదేహ పరిమిత శృంఖలములను విడచి, ఆకాశాత్మయందు ప్రవేశించి ప్రాణముతో సహా ఆత్మాకాశ స్వరూపులైనారు.

ఎవ్వరైతే ప్రాణాత్మయే సర్వోత్కష్టమైనదని, ఆత్మయే ప్రాణములుగా, తదితర సర్వదేవతలుగా ప్రకాశించుచున్నదని గ్రహిస్తారో… వారు ఆత్మత్వము ప్రాప్తించుకొనుచున్నారు. దేవతలు ఏ అమృతత్వమును పొందినారో, అట్టి అమృతత్వమును ఆ ప్రజ్ఞావంతులు పొందగలరు. పొంది అమరులై దివ్య లోకములు చేరి ఆనందించగలరు!
15.) అథాతః పితా పుత్రీయం
సంప్రదానమ్ ఇతి చ ఆచక్షతే।
పితా పుత్రం ప్రేష్య-ఆహ్వయతి
న వైః తృణైః ఆగారం సంస్తీర్య అగ్నిమ్ ఉపసమాధా
యోదకుంభం స పాత్రం
ఉపనిధాయా హతేన
వాససా సంప్రచ్ఛన్నః శ్వేత
ఏత్య పుత్ర ఉపరిష్టాత్ అభినిపద్యత,
ఇంద్రియై రస్యేంద్రియాణి
సంస్పృశ్య, అపివా అస్య
అభిముఖత ఏవ ఆసీత్,
అథ అస్మై సంప్రయచ్ఛతి।
వాచం మే త్వయి దధానీతి।
పితా! వాచం తే ‘మయి దధ’ ఇతి
ప్రాణం మే త్వయి దధానీతి।
పితా! ప్రాణం తే మయి
దదా ఇతి పుత్ర ।
పుత్రః! చక్షుః మే త్వయి దధాని ఇతి।
పితా! చక్షుః తే మయి దధః ఇతి।
పుత్రః! శ్రోత్రం మే త్వయి మయి దధాని ఇతి।
పితా! “శోత్రం తే మయి దధ” - ఇతి।
పుత్రో! “మనో మే త్వయి దధాని” ఇతి।
పితా! ”మనః తే మయి దధ” ఇతి।
పుత్ర! అన్న రసాత్ మే త్వయి దధాని ఇతి।
పితా! "అన్న రసాం తే మయి దధ” ఇతి ||
ప్రదాన యజ్ఞము
ఇప్పుడు తండ్రి (పరమాత్మ) పుత్రుని (జీవాత్మ సంజ్ఞను) పిలిచి, అతనితో యజ్ఞమునకు సంసిద్ధుడగుచున్నాడు. ముందుగా, గడ్డి మొదలైన పదార్థములను యజ్ఞవేదికా స్థానము నుండి తొలగించి ఆ పరిసరములును పరిశుభ్రపరచుచున్నారు. జలకుంభమును (నీటికుండను), తదితర పాత్రలతో సహా తెప్పించి పరిశుభ్రము చేయబడిన యజ్ఞవేదికపై ఉంచుచున్నారు. సుఖాశీనులగుచున్నారు. అగ్నిని ప్రజ్వలించుచున్నారు. పరిశుభ్ర వస్త్రములు ధరించి తండ్రి - కొడుకులు (పరమాత్మ-జీవాత్మ సంజ్ఞలు) ఎదురుబొదురుగా ఆసీనులగుచున్నారు. తండ్రి కుమారుని రసేంద్రియము (నాలుక)తో సహా సర్వేంద్రియములను స్పృశిస్తున్నారు. ఒకరికొకరు అభిముఖులై (ఒకరికి ఎదురుగా రెండవవారు) ఆసీనులై ఇక   “ప్రదానము” (giving) ఆరంభిస్తున్నారు.

తండ్రి :  బిడ్డా! కుమారా! నీలో నాయొక్క వాక్కును ప్రవేశింపజేస్తున్నాను.
కుమారుడు : పిత్రుదేవా! మీరు నాయందు ప్రవేశింపజేస్తున్న ’వాక్కు’ను నేను స్వీకరిస్తున్నాను.
తండ్రి : నా ప్రాణశక్తిని నీలోనికి ప్రవేశింపజేస్తున్నాను.
కుమారుడు : మీరు నాకు ప్రసాదిస్తున్న ప్రాణశక్తిని నేను భక్తితో స్వీకరిస్తున్నాను.
తండ్రి : కుమారా! నాలోని చూపుశక్తిని నీయందు సవిస్తరింపజేస్తున్నానయ్యా!
కుమారుడు : పితృదేవా! మీరిస్తున్న చక్షు శక్తిని నేను, ఇదిగో, స్వీకరిస్తున్నాను.
తండ్రి : ఓ వినయుడా! నాయొక్క శ్రోత్ర (వినికిడి) శక్తిని నీయందు ప్రతిక్షేపిస్తున్నాను.
కుమారుడు : పిత్రుదేవా! మీరు విస్తరింపజేస్తున్న శ్రవణ - శ్రోత్ర శక్తిని నేను పొందుచున్నాను.
తండ్రి : బిడ్డా! నా మనోశక్తిని నీయందు ప్రకాశింపజేస్తున్నాను.
పుత్రుడు : ఓ పిత్రుదేవా! మీరు నాయందు విస్తరింపజేస్తున్న మనస్సు (ఆలోచనాశక్తి)ని నేను స్వీకరిస్తున్నాను.
తండ్రి : నాయనా! నాలోని అన్న రస దేవతారూపమగు జిహ్వేంద్రియ తత్త్వమును నీకు అందిస్తున్నాను.
పుత్రుడు : నాన్నగారూ! మీరు అందిస్తున్న అన్నరసదైవీశక్తిని నేను పొందుచున్నవాడనగుచున్నాను.
పుత్రః! “కర్మాణి మే త్వయి దధాని” - ఇతి |
పితా! ”కర్మాణి తే మయి దధ” - ఇతి |
పుత్రః! సుఖ దుఃఖే మే త్వయి దధాని - ఇతి |
పితా! సుఖ - దుఃఖే తే మయి దధ ఇతి |
పుత్ర! “ఆనందం రతిం ప్రజాతిం
మే త్వయి దధాని” - ఇతి |
పితా! “ఆనందం రతిం ప్రజాతిం
తే మయి దధాని” ఇతి |
పుత్ర! “ఇత్యాం మే త్వయి దధాని” - ఇతి |
పితా! ”ఇతి యాన్తో మయి దధ” - ఇతి।
పుత్రో! “ధియో విజ్ఞాతవ్యం
కామాన్ మే త్వయి దధాని” ఇతి
పితా! ధియో విజ్ఞాతవ్యం
కామాం తే మయి దధ ఇతి
పుత్రో! అథ దక్షిణా ప్రాక్ ప్రాణ్ పరిక్రామతి।
తం పితా సమంత్రయతి।
యశో బ్రహ్మవర్చసమ్ అన్నాద్యం
కీర్తిస్త్వా జుషతామి। ఇతి।
అథ ఇతరః సవ్యమం సమన్వ వేక్షతే
పాణినాం అంతర్థాయి
వసనం తనువా (వసనాం తేనవా) ప్రచ్ఛాద్య
స్వర్గాన్ లోకాన్ కామాన్
అవాప్ను హి। ఇతి।
స యహి ఏకతస్స్యాత్ పుత్రస్య
ఐశ్వర్యే పితా వసేత పరివా వృజే యుః
యద్యువై ప్రయుజ్యాత్ ఏ వైసం
సమాపయతి। తథా,
సమాపయతవ్యో భవతి||

తండ్రి : బాలకా! నాయొక్క కర్మఫలములను నీయందు స్థాపించుచున్నాను.
పుత్రుడు : మీరు అందజేస్తున్న కర్మ - కర్మఫలములను నేను అందుకుంటున్నాను.
తండ్రి : ముద్దుల కుమారా! నాయొక్క సుఖ-దుఃఖములు నీకు అందజేస్తున్నాను.
పుత్రుడు : తండ్రీ! మీరు అందించే సుఖదుఃఖములను నేను అందుకుంటున్నాను.
తండ్రి : కొడుకా! నాయొక్క పునరుత్పత్తి - ప్రయోజనకరమగు ఆనందరతి శక్తిని నీకు జేర్చుచున్నాను.
పుత్రుడు : మీరు నాకు జేర్చుచున్న ప్రజాజనక ఆనందరతి శక్తిని నేను నాయందు జేర్చుకొనుచున్నాను. ఆనందము, రతి, సంతతిని స్వీకరిస్తున్నాను.
తండ్రి : కుమారా! అంతరంగ చతుష్టయములలో మొదటిదగు మనోవిభాగమును నీదరి జేరుస్తున్నాను.
పుత్రుడు : మీరు జేర్చే మనోశక్తి విభాగమును నేను అందుకుంటున్నాను. మీ మనస్సు నాయందుండునుగాక!
తండ్రి : నాయందలి ధీ శక్తిని (తెలుసుకొనే విజ్ఞాతవ్యశక్తిని), ‘కావాలి-చేయాలి’ అనే కామశక్తిని నీలో ప్రకాశింపజేస్తున్నాను.
పుత్రుడు : మీరు నాకు అందజేయుచున్న ధీ - విజ్ఞాతవ్య - కామశక్తులను నేను స్వీకరించుచున్నవాడనగుచున్నాను. ధీశక్తి, విజ్ఞానము, కామము, మీ నుండి నాలో ప్రవేశించి ప్రకాశించునుగాక!
తండ్రి : "పుత్రా! కుడివైపు తిరుగు!”… అని చెప్పి, కుమారుని మంత్రముగ్ధునిగా ఆజ్ఞాపించుచున్నారు.
అప్పుడు పుత్రుడు సమంత్రయుతుడు అగుచున్నారు.

అప్పుడు తండ్రి పుత్రునితో ’బ్రహ్మవర్చస్సును పొందుము. అన్నము (ప్రకృతి)ను పొందినవాడవగుము. కీర్తిమంతుడవగుము - అని దీవిస్తున్నారు. దీవిస్తూ పుత్రుని ఎడమ భుజముపై తన కుడిచేయి ఉంచుచున్నారు.

వస్త్రముతో పుత్రుని ముఖము కప్పి ‘ఓ మమాత్మస్వరూపుడువగు ప్రియపుత్రకా! స్వర్గాది సౌఖ్యము నీకు లభించునుగాక! కుమారా! నా సర్వస్వము నీకు సమర్పించుచున్నానయ్యా! నేను జీవించి ఉన్నప్పుడు అటు తరువాత కూడా నాయొక్క తేజస్సుచే దివ్య తేజోసంపన్నుడవై ‘జీవితము’ అనే ఈ అవకాశమును పుష్టి చేసుకొనుము. సద్వినియోగము చేసుకొనుము’ - అని దీవించవలెను.


తృతీయోఽధ్యాయః

1.) ప్రతర్దనో హ వై దైవో దాసిః
ఇంద్రస్య ప్రియం ధామా ఉపజగామ।
యుద్ధేన పౌరుషేణ చ
తం హి ఇంద్ర ఉవాచ :-
ప్రతర్దన! వరం తే దదానీతి।
ఒకానొకప్పుడు గొప్ప దేవ దానవ యుద్ధము జరిగింది. ఆ యుద్ధంలో ప్రతర్దనుడు దైవోదాసి (దివోదాసుని కుమారుడు) దేవతల కోరికపై ఆ యుద్ధములో పాల్గొని అనేకమంది రాక్షసులను సంహరించి, త్రిలోకాధిపతి అగు ఇంద్రునికి ప్రియం చేకూర్చారు. ఆతని సౌర్య-వీర్య-పరాక్రమాలకు, ఇంద్రుడు సంతోషించారు. దివోదాసీ పుత్రుడగు ప్రతర్దునుని తన అంతఃపురమునకు రప్పించి తన సంతోషమును తెలియజేస్తూ సన్మానించటానికై ఉపక్రమించారు.
సహెూవాచ : (ప్రతర్దానోవాచ):
‘త్వమేవ వృణీష్వ
యమ్ త్వమ్ మనుష్యాయ
హితతమం మన్యస’ ఇతి।
తం మహేంద్రౌ ఉవాచ:
న వై వరం పరస్మై వృణీతే
త్వమేవ వృణీష్వ
ఏతద్ధి  వరో వైతర్హి కిల మ ఇతి
సహెూవాచ - ప్రతర్దనోవాచ:
అథో ఖలు ఇంద్రః సత్యదేవ నేయాయః
సత్యం మహీంద్రః|
సహెూ వాచ (మహేంద్రౌవాచ):
మామ్ ఏవ విజానీహి ఏతదేవ,
అహం మనుష్యాయ హిత తమం
మన్యే యత్ మాం విజానీయాం
త్రిశీర్షాణం త్వాష్ట్రమ్ అహనమ్
అవాక్ - ముఖాని యతీంతు
సాలావృకేభ్యః ప్రాయచ్ఛం
బహ్వీః సంధా అతిక్రమ్య దివి|
ప్రహ్లాదీన తృణమ్ అహమ్। అంతరిక్షే
పౌలోమాన్ పృథివ్యాం కాలకాశ్యాం
తస్య మే తత్ర న లోమచనామ్ ఈయతే|
స యో మాం విజానీయాత్
న అస్య కేనచ కర్మణా లోకో
మీయతే, న మాతృవధే,
న పితృ వధేన, న స్తేయేన, న భ్రూణహత్యయా
న అన్య పాపంచ, న చ చక్షుషో,
కృషోముఖాత్ నీలం వేత్తీతి।
దేవేంద్రుడు : ఓ ప్రతర్దనా! నీవు దేవతలకు అందించిన సేవలకు మేమెంతో సంతోషించామయ్యా! నీకు ప్రియమైన ఏదైనా వరము ప్రసాదించదలచాము. కనుక ఏదైనా వరము కోరుకో! సంతోషంగా ఇస్తాను.
ప్రతర్జునుడు : ఓ మహేంద్ర భగవాన్! నేను మీ సేవగా యుద్ధములో పాల్గొన్నానే తప్పితే, ఏదీ కోరికాదు. అయినా కూడా మహనీయులగు మీ ఆజ్ఞను శిరసావహించకుండా ఉండలేను. అందుచేత మానవులకు ఏదైతే మహత్తరమైన హితము (హితతమము) అయి ఉన్నదో అది మీరే నిర్ణయించి ప్రసాదించండి!
మహేంద్రుడు : మానవులకు ఉత్తమ వరము - అని అడుగుచున్నావు కదా! నీకు
ఏది ఉత్తమోత్తమమో అది నేను - నిర్ణయించి నీకు ఇచ్చుట మర్యాద కాదయ్యా!
నీవే నీకు కావలసినదేదైనా వరము కోరుకో!
ప్రతర్దునుడు : స్వామీ! మీరు త్రిలోకాధినేతలు. సత్యస్వరూపులు. ఇంద్రియములకు
అధినేత.  ‘ఇంద్రుడు అనగా సత్యము’ అని లోకప్రసిద్ధి. అందుచేత నా కొరకు మీ
సత్య స్వరూపమును విశదీకరించమని అర్థిస్తున్నాను.


మహేంద్రుడు : నాయనా! నీవు తెలివిగా పరమ సత్యమగు బ్రహ్మమును గురించే అడుగుచున్నావు. “నేను సత్యస్వరూపమగు పరబ్రహ్మమునేనయ్యా! ‘సర్వేంద్రియానంద స్వరూపుడునగు నేను మహత్తరుడను! సర్వజన ప్రియుడను" - అని నన్ను తెలుసుకో! మూడు ముఖములుగల త్వష్ట్రుని (వృత్రాసురుని) సంహరించినవాడను. అనగా-జాగ్రత్ స్వప్న-సుషుప్తి త్రివృత్తులను జయించి, ఆ మూడింటికి ఆవలగల తురీయుడను, అవాక్ ముఖుడను. ఇంద్రియములకు ఆవల ప్రకాశించువాడను. సాలావృతములను (అడవి కుక్కలను- 4 వేదములను) అతిక్రమించి ఉన్నవాడను. నిత్యాత్మ ప్రకాశకుడను. ఆత్మస్వరూపుడనగు నన్ను ఆశ్రయించుటచే జీవులకు ఉత్తమ లోకములగు దివిలోకము మొదలగునవి ప్రసాదించువాడను. త్రిలోకాధిపతి ధర్మము నిర్వర్తిస్తూనే ప్రతి ఒక్కరి ఆత్మస్వరూపుడను. భక్తి జన పరాధీనుడను. అందు చేతనే మహాభక్తుడగు ప్రహ్లాదుని కోరికను బద్ధుడనై ఆయన పాలనలోని ప్రజలకు దివ్యలోకములను అనుగ్రహించాను. అంతరిక్షంలోని పౌలోమజనులకు, భూమిపై కాలకేశ్యులకు దేవతాలోక ప్రాప్తిని కలుగజేశాను.

జీవుల స్వస్వరూపమే అయి ఉన్న నా మహేశ్వర రూపము తెలుసుకున్న వారు ఇక ఏ కర్మలకు బద్ధులు కారు.

జీవులు వారి వారి లోకములలో పాపములు చేసి ఉన్నప్పటికీ, మాతృవధ - పితృవధ - దొంగతనము - భ్రూణహత్య మొదలైన మహాపాపములు చేసియున్నవారు కూడా, వారి ఆత్మ స్వరూపడనైయున్న నన్ను తెలుసుకొంటే, - ఇక వారు పాప పర్యవసానముల గురించి భయపడనక్కరలేదు! పవిత్రమగు ఆత్మ జ్ఞానముచే వారు నా వలన ఉత్తమలోకములు పొందగలరు.
2.) సహెూవాచ। (మహేంద్రౌవాచ)
ప్రాణోఽస్మిన్ ప్రజ్ఞాత్మా! తం మామ్
ఆయుఃI అమృతమ్ ఇతి।
ఉపాస్స్వాయుః (ఉపాత్ ప్రాయుః)|
ప్రాణః ప్రాణో వా ఆయుః ప్రాణ ఉ వా
అమృతం యావత్
అస్మిం శరీరే ప్రాణో వసతి,
తావత్ ఆయుః ప్రాణేన హి ఏవ
ఆముష్మిన్ లోకే అమృతత్వమ్ ఆప్నోతిః ప్రజ్ఞ యా
సత్య సంకతల్పః స యో మ ఆయుః అమృతమ్ ఇతి,
ఉపాస్తే సర్వమ్ అస్మిన్
లోకే ఆప్నోతి అమృతత్వం అక్షితం, స్వర్గే లోకే॥
తదైక అహుః ఏక భూయం వై
ప్రాణా గచ్ఛంతి ఇతి | నహి
కశ్చన శక్నుమ్ యాత్ సకృత్
వాచా నామ ప్రజ్ఞాపయితుం
చక్షుషా రూపం, శ్రోత్రేణ శబ్దం, మనసా ధ్యాతమ్,
ఇతి। ఏక భూయం (భూత్వా) వై
ప్రాణాభూత్వా ఏకైకం
సర్వాణి ఏవ ఏతాని ప్రజ్ఞాపయంతి।
వాచం వదతీం
సర్వే ప్రాణా అను వదంతి, చక్షుః పశ్యతి,
సర్వే ప్రాణా అనుపశ్యంతి,
శ్రోతం శృణ్వతి….
సర్వే ప్రాణా అనుశృణ్వంతి|
మనో ధ్యాయతి….సర్వే,
ప్రాణా అనుధ్యాయంతి।
ప్రాణః ప్రాణం తం సర్వే ప్రాణా అనుప్రాణంతి।
ఇతి ఏవమ్ హ ఏవై తదితి హి॥
మహేంద్ర ఉవాచ:
అస్తి ఇత్యేవ ప్రాణానాత్ నిశ్రేయ సాదానమితి।

నేను సర్వ జీవులలోని ప్రాణస్వరూపుడను। సర్వులలోని కేవల ప్రజ్ఞాస్వరూపునిగా నన్ను ఉపాశించు. ఆయువుగా (ప్రాణస్వరూపంగా) అమృతస్వరూపంగా నన్ను దర్శించు.
ప్రాణమునకే ప్రాణమగు ఆత్మరూపుడను! ప్రాణమే జీవజగత్తు, జీవుడు కూడా! అట్టి ప్రాణమునకు ప్రాణమగు ఆత్మ - అమృతము. మృతము లేనట్టిది. జీవాత్మ
సర్వదా అమృతస్వరూపుడే!  అట్టి జీవాత్మ ఈ భౌతిక దేహములో శ్వాస ఉన్నంతవరకే వర్తమాన దేహంతో నివసిస్తున్నాడు.
శ్వాస యొక్క ఉపాసనచే ఈ జీవుడు ఇక్కడే అమృతత్వము పొందగలడు.
ప్రజ్ఞ-సత్య సంకల్పములచే జీవుడు అమరత్వము పొందగలడు.
ఎవ్వరైతే నన్ను - జీవాత్మగా, పరమాత్మగా కూడా ఉన్నట్టివానిగా ఉపాసిస్తారో, వారు నానుండి ఈ స్వర్గలోకమునందు నివాసము పొందుచున్నారు. అమృత స్వరూపులై అమరులై అక్షితి పొందగలరు. స్వర్గలోకవాసులై ఆనందించగలరు.

ఇంకా దేహములోని - విశ్వములోని ప్రాణతత్త్వము గురించి ఈ విధంగా ప్రాణ - ఆత్మ యోజ్ఞగలచే చెప్పబడుతోంది. ప్రవచనములుగా బోధించబడుతోంది.

ఈ దేహములోని ప్రాణశక్తి అనంత ప్రాణశక్తిలోని అద్వితీయ విభాగమే అయి ఉన్నది. అనంత ప్రాణశక్తి నుండియే వ్యష్ఠి ప్రాణశక్తిగా బయల్వెడలి, దేహమునగల ప్రాణశక్తిగా కూడా ఉన్నది. అనంత ప్రాణశక్తియొక్క సంబంధము లేకపోయినట్లైతే వాగింద్రియం పలుకులు పలకలేదు. కళ్ళు రూపములు చూడలేవు. చెవులు శబ్దములు వినలేవు. మనస్సు ధ్యానము (ఆలోచనము) చేయలేదు. అనంత - అఖండ ప్రాణశక్తియే ప్రజ్ఞారూపంగా దేహములలో పంచప్రాణములుగా ఏకరూపము అయి - ప్రజ్ఞాపన (తెలివి) రూపములగు సర్వ శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ ఇంద్రియ కార్యములు నెరవేరుస్తోంది. విశ్వప్రాణశక్తి - దేహములోని పంచ ప్రాణ రూపములు ఏక రూపము దాల్చియే - ఈ విశ్వములోను, దేహములోను ఆయా సర్వ కార్యక్రమములు నిర్వర్తిస్తోంది. ఈ నోరు మాటలు మాట్లాడటానికి గాని, ఈ కళ్ళు చూడగలగటానికిగాని, ఈ చెవులు వినగలగటానికిగాని, ఈ మనస్సు ఆలోచించటానికిగాని సర్వ ప్రాణము (విశ్వప్రాణము + దేహములోని పంచప్రాణాలు) దేహమునందు ప్రాణశక్తిని ప్రదర్శించుటచేతనే జరుగుతోంది.

ప్రాణశక్తి ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమాన (పంచ) ప్రాణములు క్రియలు నిర్వర్తించుట చేతనే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో దేహము నిలుస్తోంది. ప్రాణమును ఉజ్జీవింపజేయుటచే ప్రాణచర్యా మహిమచేత ప్రాణశక్తి సర్వ కార్యములు నిర్వర్తిస్తోంది. అందుచేత ఈ ఇంద్రియములు ఈ జగత్ దృశ్యము - ఇదంతా ప్రాణశక్తి ప్రదర్శనమే!

ఓ ప్రతర్దనా! ఇదంతా కూడా నిశ్రేయమగు ముఖ్య ప్రాణము (సప్రాణము) యొక్క మధురమైన సంప్రదర్శనమే! సాదానమే! ప్రాణశక్తి సంప్రదర్శనమునకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు.

3.) జీవతి వాగపేతో, మూకాని
విపశ్యామో, జీవతి। చక్షుః అపేతో,
అంధాని విపశ్యామో జీవతి।
శ్రోత్రాఽపి ఏతో బధిరాని విపశ్యామో, జీవతి।
బాహుచ్ఛిన్నో జీవతి, ఊరుచ్ఛిన్న
ఇత్యేవం హి పశ్యామ |
ఇతి ప్రాణ ఏవ ప్రజ్ఞా ఆత్మే ఇదం
శరీరమ్ పరిగృహ్యో ఉత్థాపయతి।
అథ ఖలు తస్మాత్ ఏతమ్ ఏవ
ఉక్థమ్ ఉపాసీత యో వై ప్రాణః సా ప్రజ్ఞా
యా వా ప్రజ్ఞా, స ప్రాణః ||
సహహి ఏతావత్ అస్మిన్
శరీరే వసతః, సహ ఉత్క్రామతః తస్యైషైవ దృష్టిః |
ఏతత్ విజ్ఞానం యత్ర ఏతత్
పురుషః సుప్తః స్వప్నన్ న కంచన పశ్యతి।
యథా అస్మిన్ ప్రాణ ఏవైకధా భవతి తథైనం
వాక్ సర్వైః నామఅభిః సహ ఆప్యేతి చ
మనః సర్వైః రూపైః సహా  ఆప్యేతి
శోత్రం సర్వైః శబ్దైః సహా  ఆప్యేతి
మనః సర్వైః ధ్యాతైః సహా ఆప్యేతి
స యదా ప్రతిబుద్ధ్యతే|
యథాగ్నేః జ్వలతో విస్ఫులింగా
విప్రతిష్ఠిరన్ న ఏవమ్ ఏవై|
తస్మాత్ ఆత్మనః ప్రాణా
యథా ఆయతనం విప్రతిష్ఠింతే
ప్రాణేభ్యో దేవా| దేవేభ్యో లోకాః॥
తస్యైష ఏవ సిద్ధిః, ఏతత్ విజ్ఞానం
యత్ర ఏతత్ పురుష ఆర్తో మరిష్యన్
న బల్యం న్యేత్య మోహం నేతి తదాహుః
ఉదక్రమీః చిత్తం న శృణోతి। న పశ్యతి।
న వాచా వదతి।  యథా అస్మిన్ ప్రాణ ఏవై కథా భవతి,
తథైనం తథై ‘వాక్’ సర్వైః నామభిః సహ ఆప్యేతి।
చక్షుః సర్వై రూపైః సహా ఆప్యేతి!

ప్రాణశక్తి చేతనే ఇంద్రియ శక్తులు జీవిస్తున్నాయి. అంతేగాని ఇంద్రియ శక్తులచే ప్రాణము జీవించటం లేదు సుమా!… ఎందుకంటావా? ఒకని నోరు
మాట్లాడలేకపోయిందనుకో! అయినా కూడా ఆతడు మూగవాడుగా జీవిస్తున్నాడు కదా! కళ్ళతో చూడలేనివాడు గ్రుడ్డివాడుగా జీవిస్తూనే ఉన్నాడు. చెవులతో
వినలేనివాడు కూడా చెవిటివాడుగా జీవిస్తూనే ఉన్నాడు.

బహుచ్ఛిన్నుడు (మనస్సు ఒకచోట నిలువలేనివాడు) కూడా ఊరుచ్ఛిన్నుడై (పిచ్చివానిగా) జీవిస్తూనే కనిపిస్తున్నాడు కదా! కాళ్ళు చేతులు లేనివాడు కూడా
జీవిస్తూనే ఉన్నాడు. ప్రాణశక్తి చేతనే ప్రజ్ఞాత్మ (బుద్ధి) కూడా ఈ శరీరమును స్వీకరించుచూ, పనిచేయించగలుగుతోంది. అందుచేత ‘ప్రాణశక్తిచే అన్నీ పొందవచ్చు’ అని నిరూపించబడుతోంది. అందుచేత ప్రాణతత్త్వమే ముఖ్యముగా ఉపాశించబడవలసినది.

ప్రాణమే (ప్రాణశక్తియే) ప్రజ్ఞాత్మ. ప్రజ్ఞాత్మయే ప్రాణము కూడా! ఈ శరీరములో ప్రజ్ఞాత్మ - ప్రాణము ఏకరూపములే అయి వర్తిస్తున్నాయి.

ప్రజ్ఞాత్మయే ‘దృష్టి’ (perception) రూపముగా ఉంటున్నది. దృష్టియే జగత్తు! ఈవిధంగా, ఈ సర్వము ప్రజ్ఞాత్మరూపమే! ప్రాణశక్తి రూపమే!
ప్రజ్ఞాత్మ అనగా? జాగ్రత్‌లోని దృష్టికి విజ్ఞానము (ఎరుక, తెలివి) పరిమితము కాదు. (ఇక్కడి జాగ్రత్‌లో ఈ జీవుని తెలివితేటలు రూపపరిమితంకాదు). ఈ జీవుడు నిద్రించి కలకంటున్నప్పుడు ఇంద్రియములను ఉపయోగించటం లేదు. గాఢనిద్రలో ఉన్నప్పుడో! జాగ్రత్- స్వప్న విషయములే ఉండుట లేదు. సుషుప్తిలో వాక్కు కళ్ళు, చెవులు, మనస్సు మొదలైన ఇంద్రియాలన్నీ ప్రాణమునందు లీనమై ఉంటున్నాయి. నిద్రలేవగానే? దీపం వెలుగగానే కాంతి కిరణములవలె ప్రజ్ఞాత్మ (ప్రాణశక్తి) సర్వేంద్రియములలో వ్యాపింపజేసి, విషయములను సిద్ధింపజేయుచున్నది. అనగా తిరిగి ఇంద్రియ శక్తులను ప్రాణశక్తి తమతమ స్థానములలో నిలుపుచున్నది. ప్రాణశక్తి నుండి నిద్రాణమైన ఇంద్రియశక్తులు, మనస్సు, ధ్యాస బయల్వెడలుచున్నాయి. జాగ్రత్‌లో - విస్ఫులింగమువలె ప్రకటితమగుచున్నాయి.

ఇంద్రియ విషయములుగా ఇంద్రియ జగత్తుగా ప్రదర్శితమగుచూ ప్రకాశమానమగుచున్నది ప్రాణశక్తియే! ఆత్మయే ప్రాణశక్తిగా ప్రదర్శితమగుచున్నది ప్రాణశక్తియే ఇంద్రియ దేవతల రూపముగాను (శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాది దివ్యశక్తుల రూపమున) దైవీతత్వములగాను, లోకముల రూపముగాను విద్యమానమగుచున్నాయి. అందుచేత సర్వమునకు ఆధారము, ఆధేయముగా ఉన్నది ఆత్మయే! ఆత్మయే ఇదంతా!
4.) స యదా అస్మాత్ శరీరాత్
ఉత్క్రామతి ‘వాక్’ అస్మాత్ సర్వాణి
నామాని అభివిసృజతే,
వాచా సర్వాణి నామాని ఆప్నోతి।
ప్రాణో అస్మాత్ సర్వాన్ గంధాన్ అభిసృజతే।
ప్రాణేన సర్వాన్ గంధాన్ ఆప్నోతి।
చక్షుః అస్మాత్ సర్వాణి రూపాణి
అభివిసృజతే, చక్షుషా
సర్వాణి రూపాణి ఆప్నోతి।
శ్రోత్రమ్ అస్మాత్ సర్వాం శబ్దాని
అభివిసృజతే, శ్రోత్రేణ
సర్వాం శబ్దాన్ న ఆప్నోతి।
మనో అస్మాత్ సర్వాణి ధ్యాతాని
అభివిసృజతే, మనసా సర్వాణి ధ్యాతాని న ఆప్నోతి।
స ఏషా ప్రాణే సర్వాప్తిః యోవై ప్రాణః, సా ప్రజ్ఞా।
యావా ప్రజ్ఞా, స ప్రాణః |
సహ హి ఏతావత్ అస్మిం శరీరే
వసతః సహా ఉత్క్రామతో అథో ఖలు
యథా ప్రజ్ఞాయాం
సర్వాణి భూతాని ఏకీ భవంతి।
తత్ వ్యాఖ్యాస్యామః ||

ఈ శరీరములోని ఇంద్రియ దివ్యశక్తులు, మనస్సు పనిచేస్తూ ఉన్నాయి కదా! ఇప్పుడు ఈ జీవుడు దేహమును విడచినప్పుడు ఏమేమి తనవెంట తీసుకొనిపోవుచున్నాడు? విను.

వాక్ ఇంద్రియము తన జ్ఞప్తులను, సంస్కారములను ప్రాణదేవతకు అందిస్తోంది. ప్రాణశక్తితోబాటే సమస్త వాసనలను (All Tendencies ) ఆత్మ స్వరూపుడగు జీవుడు తనవెంట కొని పోవుచున్నాడు. ప్రాణము సర్వ గంధములను (సంస్కారములను) ఇంద్రియములనుండి సమీకరించుకొంటోంది. నేత్రములు తాము జీవితమంతా చూస్తూ ఉన్న అనేక అభిరుచుల యొక్క సానుకూల - వ్యతిరిక్త జ్ఞాపకములన్నీ (సంస్కార రూపంగా) ప్రాణమునకు సమర్పించుచున్నది. అట్లా సమర్పించినవానిని ప్రాణము స్వీకరించినదగుచున్నది.

అట్లాగే శ్రోత్రము (చెవులు) తాము జీవితమంతా వినియున్న అభినివేశముతో కూడిన విషయములను ప్రాణశక్తికి సమర్పించి మూగబోవుచున్నది. ప్రాణశక్తి సర్వశబ్ద సంస్కారములను, జ్ఞాపకములను (సూక్ష్మరూపంగా) స్వీకరించి తనయందు దాచుచున్నది.

మనస్సు తన ఆవేశముతో కూడిన ధ్యాసలన్నీ ప్రాణదేవతకు సమర్పించుకుంటూ దేహమును విడుస్తోంది. ప్రాణశక్తి ఆ ధ్యాసలను మనస్సునుండి స్వీకరించి తనయందు సూక్ష్మరూపంగా నిక్షిప్తం చేసుకుంటోంది. ఏదైతే సర్వ ఇంద్రియముల నుండి జ్ఞాపక - సంస్కారముల రూపంగా పొందుతొందో, అట్టి ప్రాణశక్తి స్వయముగా ప్రజ్ఞ రూపమే అయియున్నది.

ఏది ప్రజ్ఞయో, అదియే ప్రాణము కూడా! ఈ రెండూ ఏకరూపమే అయి, శరీరములో ఉండి, ఒకానొకప్పుడు ఈ శరీరము నుండి నిష్క్రమించుచున్నది. ఏ ప్రజ్ఞ సర్వదేహములలో ఏకస్వరూపమై యున్నదో, అట్టి ప్రజ్ఞానాత్మ (ప్రజ్ఞానం బ్రహ్మ) గురించి మనము ఇప్పుడు వ్యాఖ్యానించుకొనెదము గాక! ఓ ప్రతర్దనా! వినండి!

5.) వాగేవ అస్యా ఏకమ్ అంగమ్ ఉదూఢం।
తస్యై నామపరస్తాత్ ప్రతివిహితా భూతమాత్రా॥
ఘ్రాణమేవ అస్యా ఏకమ్ అంగమ్ ఉదూఢం।
తస్య గంధః, పరస్తాత్ ప్రతివిహితా, భూతమాత్రా॥
చక్షురేవ అస్యా ఏకమ్ అంగమ్ ఉదూఢం,
తస్య రూపం పరస్తాత్ ప్రతివిహితా భూతమాత్రా। శ్రోత్రమేవ
అస్యా ఏకమ్ అంగమ్ ఉదూఢం।
తస్య శబ్దః పరస్తాత్ ప్రతివిహితా భూతమాత్రా॥
జిహ్వైవ అస్యా ఏకమ్ అంగమ్ ఉదూఢం,
తస్యాన్ నరసః పరస్తాత్ ప్రతివిహితా భూతమాత్రా।
హస్తావేవ అస్య ఏకమ్ అంగమ్ ఉదూఢం।
తయోః కర్మపరస్తాత్ ప్రతివిహితా భూతమాత్రా। శరీరమేవ|
అస్య ఏకం అంగమ్ ఉదూఢం। తస్య
సుఖ-దుఃఖే పరస్తాత్ ప్రతివిహితా భూతమాత్రా।
‘ఉపస్థ’ ఏవ అస్యా ఏకమ్ అంగమ్ ఉదూఢం,
తస్యా ఆనందో రతిః ప్రజాతిః
పరస్తాత్ ప్రతివిహితా భూతమాత్రా॥
పాదావేవ అస్యా ఏకం అంగం ఉదూఢం।
తయోః ఇత్యా పరస్తాత్ ప్రతివిహితా
భూతమత్రా।  ప్రజ్ఞైవ అస్యా ఏకమ్ అంగమ్ ఉదూఢం
తస్యైధియో విజ్ఞాతవ్యం
కామాః పరస్తాత్ ప్రతి విహితా భూతమాత్రా॥
సర్వ దేహములలోని ఏకస్వరూపమగు ప్రజ్ఞ.

ఈ జీవునిలో వాక్కుశక్తి ఒక అంగముగా రూపము పొందుచున్నది. అది ఒక విభాగముగా ఉంటోంది. దానియొక్క బాహ్య రూపము ‘నామ-రూపాత్మకము’ అను భూతమాత్రరూపము! అది భౌతిక రూపము.

‘ఘ్రాణశక్తి’ మరొక విభాగపు అంగము. గంధము-అద్దాని బాహ్యరూపము. భౌతిక రూపము.

‘చక్షు (దర్శన)’ శక్తి ఇంకొక అంగరూపము. దర్శనము (కనబడునదంతా)- అద్దాని బాహ్యరూపము. అదియే భూతరూపము. (లేక) భౌతికరూపము.
వేరొక అంగము శబ్ద శక్తి. అద్దాని బాహ్యరూపము చెవులకు వినబడు సర్వశబ్దాలు! చెవులు, శబ్దము - భూతమాత్ర స్వరూపము (లేక) బాహ్యరూపము (లేక) భౌతికరూపము. జిహ్వ ఇంకొకటైన అంగము. అద్దాని బాహ్యరూపము రుచి. అది భూతమాత్ర స్వరూపము (లేక) భౌతికరూపము.

జీవునియందు రెండు చేతులు ఇంకొక విభాగము. ఆ చేతులయొక్క బాహ్యరూపము చేతలు (లేక) కర్మలు. అవి భౌతికరూపములు.

ఈ శరీర భావనాశక్తి ఇంకా ఒక విభాగము. అద్దాని బాహ్య భౌతిక రూపములు సుఖ-దుఃఖములు. ఉపస్థ మరొక శక్తి తత్వము. అద్దాని బాహ్యరూపము ఆనందము. దృశ్యజగద్రూపము ప్రజాపతి. రెండు పాదములు మరొక విభాగము. అద్దాని భౌతిక (బాహ్య) రూపము ’నడక’.

అంతఃకరణము వేరొక విభాగము. కోరికలు, సంకల్పములు…ఇవన్నీ ఆ అంతఃకరణము యొక్క బాహ్యరూపములు. ప్రజ్ఞ ఇంకొక విభాగము. తదితరమైనదంతా తెలుసుకోవటము తెలియబడు విషయాలు. అద్దాని బాహ్యరూపము (లేక) బాహ్యధర్మము (లేక) భౌతికరూపము.

6.) ప్రజ్ఞయా వాచం। సమారుహ్య వాచా సర్వాణి।
నామాని ఆప్నోతి ప్రజ్ఞయా ప్రాణం
సమరూహ్య, ప్రాణేన సర్వాన్ గంధాన్ ఆప్నోతి!
ప్రజ్ఞయా చక్షుః సమారుహ్య
చక్షుషా సర్వాణి రూపాణి ఆప్నోతి।
ప్రజ్ఞయా శ్రోత్రం సమారుహ్య
శ్రోత్రేణ సర్వాన్ శబ్దాన్ ఆప్నోతి।
ప్రజ్ఞయా జిహ్వాం సమరూహ్య,
జిహ్వయా హి సర్వాన్ అన్నరసాని ఆప్నోతి
ప్రజ్ఞాయా హస్తా సమారుహ్య హస్తాభ్యాం
సర్వాణి కర్మాణి ఆప్నోతి।
ప్రజ్ఞయా శరీరం సమారుహ్య శరీరేణ సుఖ-దుఃఖే ఆప్నోతి।
ప్రజ్ఞాయా ఉపస్థం సమారుహ్య
ఉపస్థేన ఆనందం రతిం ప్రజాతిమ్ ఆప్నోతి।
ప్రజ్ఞయా పాదౌ సమారుహ్య
పాదాభ్యాం సర్వా ఇత్యా ఆప్నోతి
ప్రజ్ఞయైవ ధియం సమారుహ్య
ప్రజ్ఞయైవ ధియో విజ్ఞాతవ్యం కామాన్ ఆప్నోతి।

అయితే, సర్వము గ్రహించుచున్నది (లేక) గుర్తించుచున్నది. (లేక) గమనించుచున్నది ప్రజ్ఞయే! సర్వము వాక్ - అర్థరూపంగా గమనిస్తున్నది, స్వీకరిస్తున్నది ప్రజ్ఞయే! ప్రజ్ఞయే ‘ప్రాణము’ అనే నామమాత్రరూపము పొంది, ఆ ప్రాణశక్తితో ‘ఇది గంధము’ అని గ్రహిస్తోంది. ప్రజ్ఞయే చక్షువులను ఉపయోగించి, ప్రజ్ఞారూపము అయినట్టి సర్వరూపములు పొందుతోంది. ప్రజ్ఞయే శ్రోత్రము (వినికిడి శక్తి) రూపము ఆశ్రయించినదై సర్వశబ్దరూపమును పొందుచున్నది. ప్రజ్ఞయే జిహ్వరూపము దాల్చినదై బాహ్యమున రుచిగా, పదార్థములలోని అన్నరస స్వరూపమై ఉంటున్నది.

ప్రజ్ఞయే ‘చేతులు’ రూపముగా అయి, బాహ్యమున సర్వకర్మల రూపమున చెన్నొందుచున్నది. (దేహికి దేహము ఐహిక మోహము) ప్రజ్ఞయే ’శరీరము’ రూపముగా అగుచూ సుఖదుఃఖ కల్పనల రూపముగా కూడా ప్రకాశమానమగుచున్నది. ప్రజ్ఞయే ‘ఉపస్థ’ రూపము దాల్చినదై, ఆనందరతిరూపముగా బాహ్యమున ప్రదర్శితమగుచున్నది. ప్రజ్ఞయే పాదశక్తి రూపము దాల్చినదై, బాహ్యమున చలన శక్తిగా ప్రవర్తితమగుచున్నది.

ప్రజ్ఞయే ధీశక్తి (బుద్ధి) రూపము దాల్చినదై, బుద్ధితో బాహ్యమున తెలియబడు సర్వకామముల స్వరూపము ధారణచేయుచున్నదగుచున్నది.

7.) నహి ప్రజ్ఞాపేతా ‘వాక్’ నామ కించన (ప్రజ్ఞపయే)
ప్రజ్ఞాపయేత్, అన్యత్ర మే మనో ఆభూత్|
ఇత్యాహ నాఽహమ్ ఏతం శబ్దం, నామ
ప్రాజ్ఞాసిషమితి।
నహి ప్రజ్ఞాపేతః ప్రాణో గంధం
కంచన ప్రజ్ఞాపయేత్, అన్యత్ర మే
మనో ఆభూత్ ఇతి ఆహ నామ ఏతమ్
‘గంథం ప్రజ్ఞాసిషమ్’ ఇతి।
నహి ప్రజ్ఞాపేతం
చక్షూ రూపం కించన ప్రజ్ఞాపయేత్,
“అన్యత్ర మే మనో ఆభూత్।
ఇత్యాహ। నాఽహమ్ ఏతత్ రూపం
ప్రజ్ఞాసిషమ్” - ఇతి।
“నహి ప్రజ్ఞాపేతం శ్రోత్రం శబ్దం కంచన ప్రజ్ఞాపయేత,
అన్యత్ర మే మనో ఆభూత్” - ఇతి।
ఆహ| నాఽహమ్ ఏతమ్ శబ్దం ప్రజ్ఞాసిషమ్ ఇతి
“నహి ప్రజ్ఞాపేతా జిహ్వా అన్నరసం
కంచన ప్రజ్ఞాపయేత్, అన్యత్ర
మే మనో ఆభూత్” - ఇత్యాహ
నాఽహమ్ ఏతమ్ అన్నరసం ప్రజ్ఞాసిషమ్ ఇతి
“నహి ప్రజ్ఞాపేతౌ హస్తౌ కర్మ కించన
ప్రజ్ఞాపయేతామ్, అన్యత్ర
మే మనో ఆభూత్” - ఇత్యాహ
నాహమ్ ఏతత్ కర్మ ప్రజ్ఞాసిషమ్ ఇతి|
నహి ప్రజ్ఞాపేతం, శరీరం సుఖదుఃఖే కించన
“ప్రజ్ఞాపయేత్ అన్యత్ర మే మనో ఆభూత్!” ఇత్యాహ॥
“న అహమ్ ఏతత్ సుఖ-దుఃఖే ప్రజ్ఞాసిషమ్” ఇతి
“నహి ప్రజ్ఞాపేత ఉపస్థ ఆనందం రతిం ప్రజాతిం
కంచన ప్రజ్ఞాపయేత్, అన్యత్ర
మే మనో ఆభూత్” - ఇత్యాహా!
”న అహమ్ ఏతమ్ ఆనందం రతిం ప్రజ్ఞాతిం
ప్రజ్ఞాసిషమ్”– ఇతి।
నహి ప్రజ్ఞాపేతౌ పాదావిత్యాం కంచన ప్రజ్ఞాపయే
తామ్, అన్యత్ర మే మనో ఆభూత్ - ఇతి ఆహ|
నాఽహమ్ ఏతమ్ ఇత్యాం ప్రజ్ఞాసిషమ్ ఇతి
నహి ప్రజ్ఞాపేతా ధీః కంచన సిద్ధ్యేత్।
న ప్రజ్ఞా తవ్యం ప్రజ్ఞాయేత||
‘ఎరుక’ లేక ‘ప్రజ్ఞ’ పాల్గొననప్పుడు ఏదీ అనుభూతము కాదు. ఉనికి పొందదు.

ప్రజ్ఞత్వంతో కూడిన ‘వాక్కు’తో మాత్రమే ఏదైనా విశదీకరించగలము. ఉట్టి మాటలతో, (ప్రజ్ఞ/తెలివి) తోడు లేకుండా ఉంటే, మాటలతో ఏది తెలియజేయబడగలదు? ఒకడు పరధ్యానంగా ఉండగా ఎదుటివాడు మాటలు వినికూడా, వినకుండా ఆ తరువాత, ‘అయ్యా! మీ మాటలు విన్నాను. కానీ, నా ధ్యాస ఎక్కడో ఉండటం చేత గమనించలేదండీ! మళ్లీ చెప్పండి’ అని అంటాడు కదా!

బుద్ధి తోడు కాకుండా కేవలము ప్రాణశక్తితో వాసనను ‘ఇది సువాసన’ అని గ్రహించగలమా? లేదు. వాసన వచ్చికూడా కూడా, ‘అయ్యా! నా మనస్సు ఎక్కడో ఉన్నదండీ! అందుచేత ఆ వాసనను నేను గమనించనే లేదండీ.!.….. అని అంటాము కదా! కనుక బుద్ధి (మనస్సు) చేరినప్పుడు మాత్రమే వాసన ఇట్టిదని గమనించగలం!

‘ప్రజ్ఞ’ తోడై ఉండకపోతే కళ్ళు చూస్తూ ఉన్నా అది ఆ జీవునికి అనుభవమవదు. ‘నా దృష్టి (మనస్సు) వేరే విషయంపై ఉన్నదండీ! అందుకని వాస్తవానికి చూడనే లేదు’ అంటాడు. ఆ రూపమును చూస్తూ చూడనివాడై ‘చూడలేదు’ అనునదే సిద్ధిస్తుంది.

ఒకడు చెవులతో వింటూ కూడా ఆ శబ్దముపై మనస్సు (ప్రజ్ఞ) కేంద్రీకృతం చేయకపోతే ఆ శబ్దము - అర్థము గ్రహించలేడు. ‘మీరు మాట్లాడుచున్నది నా చెవులకు చేరింది. కానీ నా ధ్యాస ఎక్కడో ఉండటం చేత నేను విననేలేదు మళ్ళీ చెప్పండి!’… అంటాడు.

తింటున్నప్పుడు ధ్యాస రుచి మీద లేకపోతే, రుచిని గుర్తించలేము. ‘నా జిహ్వ తింటూ ఉండగా నా ధ్యాస మరెక్కడో ఉన్నది. అందుచేత తింటున్న దాని రుచి నేను గమనించనే లేదు’…అని అంటాము.

ప్రజ్ఞ ఏకాగ్రం కాకపోతే రెండు చేతులతో పనిచేస్తూ ఏమి చేస్తూ ఉన్నామో గమనించనివారమే అగుచున్నాము. ‘ఆ పని చేస్తున్నప్పుడు నా ధ్యాస మరెక్కడో ఉన్నది. అందుచేత అది నా చేతులతో చేస్తున్నది నేను ఏమాత్రము గుర్తించనూ లేదు. గుర్తే లేదు’ అని అంటాము.

ప్రజ్ఞ (తెలివి, ధ్యాస) శరీరముపై కాకుండా మరెక్కడో బలముగా కేంద్రీకృతమైయున్నప్పుడు ’అయ్యా! నా ధ్యాస మరెక్కడో ఉండటము చేత నాకు శారీరక సంబంధమైన సుఖ-దుఃఖాలు, బాధ మొదలగునవి తెలియనే లేదు… అంటాము. కనుక, ప్రజ్ఞ (లేక) బుద్ధి తోడవకపోతే ఇంద్రియముల విషయానుభవములు మన పట్ల అనుభవరూపములై ప్రాప్తించవు. అవి స్వతఃగా లేనివిగానే అగుచున్నాయి.

‘ప్రజ్ఞ’ పాల్గొనకపోతే ఉపస్థ ఆనందరతిని పొందజాలదు. "ధ్యాస ఎక్కడో ఉన్నది. నేను ఆనందము పొందటం జరుగలేదు కదా?……అని మాత్రమే అనిపించగలదు. ఎప్పటికీ అది అనుభవరూపమును దాల్చనిదే అగుచున్నది.

‘ప్రజ్ఞ’తో నిర్వర్తించబడనప్పుడు కాళ్ళు నడుస్తున్నప్పటికీ అది తెలియబడదు. ’బాబూ! నాకాళ్లు నడుస్తూ ఉన్నప్పటికీ, ఆ విధంగానడుస్తున్నప్పుడు నా ప్రజ్ఞ మరేదో మరొక విషయము గురించి ఆలోచన చేస్తూ ఉన్నది. అందుచేత కాళ్ళ నడక - (దేనిని తాకుచున్నదీ మొదలగునవి) నాకు అనుభవములో లేవు…అని అంటాము.

కేవలము తెలివితో మాత్రమే బుద్ధి పనిచేయజాలదు. విషయములు తెలియజాలవు. మనస్సు (ధ్యాస) తోడైతేనే బుద్ధి తెలుసుకోవలసినది తెలుసుకుంటోంది.

8.) న వాచం విజిజ్ఞాసీత,
వక్తారం విద్యాత్।
న గంధం విజిజ్ఞాసీత,
ఘ్రాతారం విద్యాత్
న రూపం విజిజ్ఞాసీత,
రూపవిదం విద్యాత్।
న శబ్దం విజిజ్ఞాసీత,
శ్రోతారమ్ విద్యాత్
న అన్నరసం విజిజ్ఞాసీత,
అన్న రస విజ్ఞాతారం విద్యాత్।
న కర్మ విజిజ్ఞాసీత,
కర్తారం విద్యాత।
న సుఖ-దుఃఖే విజిజ్ఞాసీత,
సుఖ-దుఃఖయోః విజ్ఞాతారం విద్యాత్।
న ఆనందం రతిం ప్రజాతిం
విజిజ్ఞాసీత,
ఆనందస్య రతేః ప్రజాతేః
ప్రవిజ్ఞాతారం విద్యాత్।
న ఈత్యాం విజిజ్ఞాసీత,
ఈతారం విద్యాత్। న మనో విజిజ్ఞాసీతమ్,
మన్తారం విద్యాత్।
తావా ఏతా దశైవ భూతమాత్రా
అధిప్రజ్ఞం దశప్రజ్ఞా మాత్రా - అధిభూతం
యద్ధి భూతమాత్రానస్యుః|
న ప్రజ్ఞా మాత్రానస్యుః
యద్వా ప్రజ్ఞా మాత్రానస్సుః
(యత్ హి ప్రజ్ఞో మాత్రాన స్యుః)
న భూత మాత్రాస్స్యుః ||

ఇంకా మహేంద్ర భగవానుడు చెప్పటం కొనసాగిస్తున్నారు.

ఓ ప్రియప్రతర్దనా। ఆత్మగురించి ఎరుగుట అనగా ఏమి? విను!
వాక్కు, మాటలు, వాక్ ఇంద్రియము-ఇవి మాత్రమే తెలుసుకుంటే సరిపోదయ్యా! ఆ మాట్లాడేవాడు ఎట్టివాడో…తెలుసుకోవాలి.
గంధము (వాసన) గురించిన వివరాలు తెలుసుకుంటే సరిపోదు. ఆ గంధమును ఆస్వాదించేవాడు ఎవ్వడో తెలుసుకోవాలి.
ఒకానొకని రూపము తెలుసుకున్నంత మాత్రంచేత తెలుసుకోవలసి తెలుసుకున్నట్లు కాదు. రూపవిదుణ్ణి (రూపము తెలుసుకొనుచున్న వాడిని) తెలుసుకోవాలయ్యా!
శబ్దమును తెలుసుకుంటే సరిపోదు, వినేవాడి వాస్తవ రూపము ఏమిటో…అదయ్యా ముఖ్యంగా తెలుసుకోవలసినది!
రసము (రుచి) గురించి ఎంతగా తెలుసుకున్నా సరిపోదు నాయనా! ఆ రసమును (రుచిని) తెలుసుకొనుచున్న రసవేత్త ఎవ్వరు - ఏమిటి అనేది తెలుసుకోవాలి సుమా!
ఒకని కర్మల గురించి ఎంతగా ఏమని తెలుసుకున్నప్పటికీ సరిపోదు, ఆ ‘కర్త’ యొక్క సహజ రూపము ఏదియో, ఏమియో, ఎట్టిదో తెలుసుకోవాలి.
ఒకానొకని యొక్క సుఖ-దుఃఖముల గురించి ఎంతగా తెలుసుకొన్నప్పటికీ, అసలైన విషయము తెలిసినట్లు కాదు। ఆ సుఖ-దుఃఖములు తెలుసుకొనుచున్న వాని గురించి తెలుసుకోవాలి.
ఆనందరతి - పునరుత్పత్తిల గురించి ఎన్ని వివరాలు తెలుసుకున్నప్పటికి ఏమి ప్రయోజనం? ఆ ఆనందరతిని, ఎవ్వరు తెలుసుకుంటున్నారో…ఆయన గురించి - ప్రజ్ఞాతి సవిజ్ఞాతుమ్, విద్యాత్ - తెలుసుకోవాలి!
ఒక నడచుచున్న వాని నడతలు (About behaviour of a person) గురించి తెలుసుకుంటే చాలదు. నడతలు తనవై, నడచుచున్నవాడు ఎట్టివాడో… అది పరిశీలించి తెలుసుకోవాలి.

ఆలోచనా రూపమైన మనస్సు, అద్దాని తత్త్వము ఏమిటో వివరణలన్నీ తెలుసుకున్నా కూడా సరిపోదు. ఆ ఆలోచనలు చేస్తున్నట్టి ఆలోచించు వాని గురించి తెలుసుకోవాలి.

ఈ విధంగా వాచం, గంధము, రూపము, శబ్దము, అన్నరసము, కర్మ, సుఖ- దుఃఖాలు, ఆనందరతి ప్రజాతి, ఈత్వము (నడుతలు) మనస్సు, ఇవన్నీ కూడా తెలియబడేవి.

అది ప్రజ్ఞ యొక్క భౌతిక రూపములు. ‘భూతమాత్రములు’ అని అంటారు. ఇవన్నీ ప్రజ్ఞారూపములేగాని కేవల ప్రజ్ఞ కాదు. కేవల ప్రజ్ఞామాత్రము భౌతిక రూపములుగా అగుటలేదు. భౌతిక ప్రజ్ఞారూపములు కేవల నిర్మల ప్రజ్ఞారూపం కాజాలవు. ఈ విభేదమేమిటో గ్రహిస్తేనే స్వస్వరూప ఆత్మతత్త్వము విశదము కాగలదు.

9.) నహి అన్య తరతో రూపం కించన సిద్ధ్యేన్నో
ఏతన్ న నా తత్ యథా
రథస్య-ఆరేషు నేమిః అర్పితా, నాభా వరా అర్పితా
ఏవమ్ ఏవైతా భూతమాత్రాః
ప్రజ్ఞామాత్రా స్వర్పితాః ।
ప్రజ్ఞామాత్రాః ప్రాణే అర్పితాః
సవా ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞా
ఆత్మానందో, అజరో, అమృతో ।
న సాధునా కర్మణాభూయాత్
నో ఏవా సాధునా కర్మణా ।
కనీయా ఏష హి ఏవ ఏనం
సాధు కర్మ కారయతి। య మన్వానున్ ఏష త్యేష
ఏవైనమ్ అసాధుకర్మ కారయతి,
తం యమేభ్యో లోకేభ్యో
నునుత్సత ఏష లోకపాలః ।
ఏష లోకాధిపతిః ।
ఏష లోకేశ్వరః ।
సమ ఆత్మేతి విద్యాత్।
సమ ఆత్మేతి విద్యాత్।

ఇతి తృతీయోఽధ్యాయః ॥

ఓ ప్రతర్దనా!
ఇక్కడ ఒక ముఖ్యమైన విశేషము మనము గమనించెదము గాక! ఏది ఎందులోంచి సిద్ధించినదిగా అగుచున్నదో, అది ఆ మొదటి ఆధార వస్తువుకు వేరైనది కానేకాదు. సర్వము అంతర్యామియగు ఆత్మకు అభిన్నమై, వేరు కానిదే అయి ఉన్నది.
ఒక రథచక్రము యొక్క నాభి యొక్క కదలిక చేతనే సర్వము కదులుతోంది కదా! ఆత్మయొక్క కల్పనా చైతన్యమే సర్వదృశ్యమాన విశేషాలన్నీ కూడా!
భూతమాత్రమంతా (భౌతికంగా కనిపించేదంతా కూడా) ఆత్మప్రజ్ఞారూపమే!
ప్రజ్ఞయందే ప్రాణశక్తి అమరిక కలిగినదై ఉన్నది. ఆ ప్రాణ శక్తి ఆత్మానందరూపమే!
అజరము, అమృత స్వరూపము అగు ఆత్మయే!

ఒకడు సాధువర్తనుడు అయితే (మంచి పనులు చేసినంతమాత్రంచేత) ఆత్మ సాధువర్తనము కాదు. పాపకర్మలచే ఆత్మ పాపవర్తనమూ కాదు. సాధు-అసాధు (మంచి-చెడు) ద్వంద్వములు జడమగు దృశ్యమునకు (లేక) ప్రకృతికి సంబంధించినవి మాత్రమే! ఆత్మయో, పురుషుడు! సర్వపురుషకారములకు కారణకారణుడు! కానీ, కర్మబద్ధుడు కాదు.

అట్టి జ్ఞానముచే ఆత్మను ఎరిగినవాడు లోకములను దాటి వేస్తున్నాడు. లోకములకు వేరై, లోకములను చూచువాడు, కల్పించుకొనువాడు, పరిపాలించువాడు, లోకములకు అధిపతి అగుచున్నాడు. ఆత్మను ఎరిగి, ఆట్టి స్వస్వరూపముతో మమేకమగువాడు లోకములకు ఈశ్వరుడై, నియామకుడై వెలుగొందుచున్నాడు. కనుక ఈ దృశ్యజగత్తులలోని కార్యాకార్యములను అధిగమించి ఆత్మను ఎరిగినవాడు ఆత్మస్వరూపుడై, సాక్షియై, దృశ్య- అప్రవేశకుడై ప్రకాశించుచున్నాడు.

ఇతి తృతీయ అధ్యాయము.


చతుర్థోఽధ్యాయః

1.)  గార్గ్యో హ వై బాలాకిః
అనూచానః సంస్పష్ట ఆస।  సోఽయమ్ ఉశీనరేషు, సత్సు మత్స్యేషు,
కురు, పాంచాలేషు, కాశీ, విదేహి ఈష్వితి।
సద హా అజాతశత్రుం కాశ్యమ। ఏత్యో వాచ
‘బ్రహ్మ తే బ్రవాణి’ - ఇతి।
తం హెూవాచ అజాతశత్రుః సహస్రం దద్మస్త
ఏతస్యాం వాచి, జనకో, జనక ఇతి, వా ఉ జనా
ధావంతి - ఇతి॥
పూర్వకాలము గార్య బాలాకిర్య అనే పేరుగల ఋషీశ్వరుడు ఉండేవారు. ఆయన ఉశీనరదేశవాసి. ఒకసారి ఆయన మత్స్య-కురు-పాంచాల దేశాలలో పర్యటిస్తూ కాశీనగరం వచ్చారు. ఆ సమయంలో కాశీరాజ్యాన్ని అజాతశత్రువు అనే రాజు పాలిస్తూ ఉండేవారు. ఆయన ‘విదేహముక్తుడు’ అని లోకప్రసిద్ధి. ఆ బాలాకిర్య ఋషిని సగౌరవంగా తన మందిరమునకు ఆహ్వానించి సపర్యలు - సమర్పించారు.

బాలాకిర్య ఋషి :  ఓ అజాత శత్రు మహారాజా! మీరు విదేహరాజు జనకునితో సమానులు. మన ఈ సమాగమము సందర్భముగా మనము బ్రహ్మతత్త్వము గురించి వివరించుకొనెదము గాక!

అది విని మహారాజు వేయి గోవులను ప్రపత్తితో అతిథి పూజా పూర్వకంగా సమర్పించారు.

2.) సహెూవాచ బాలాకిర్య :-
ఏవ ఏష ఆదిత్యే పురుషః
“తమేవ అహం” ఉపాస - ఇతి?
తం హెూ వాచ అజాతశ్శత్రుః
మా మ ఏతస్మిన్ సమవాదయిష్ఠా|
బృహన్, పాండరవ, అసాధిష్ఠా
సర్వేషాం భూతానాం మూర్ధేతి వా
అహమ్ ఏతమ్ ఉపాస ఇతి
సయో హి ఏతమేవమ్ ఉపాస్తే
అధిష్ఠాః సర్వేషాం భూతానాం మూర్ధా భవతి॥
అజాతశత్రురాజు :  ఓ ఋషీశ్వరా! అవస్యము అట్లే!
బాలాకిర్య ఋషి : మనము కొన్ని ప్రశ్నలతో బ్రహ్మము గురించి చెప్పుకుందాము.
నేను తపస్సుచే ఆదిత్యునియందు, చంద్రునియందు, తేజస్సునందు, (విద్యుత్తునందు), పంచభూతములయందు, సర్వ లోకములందు ప్రవేశించి ఉపాసిస్తూ ఉంటున్నాను.
మహారాజా! ఆదిత్య పురుషుడగు సూర్యునిలో నేను బుద్ధితో ధ్యానముచే ప్రవేశించినప్పుడు, సూర్యునిలో ఉండి, నేను ఆరాధించవలసిన పరమపురుషుడెవ్వరు? అభివర్ణించవలసినది (లేక) ఆరాధించవలసినది సూర్యునియే (లేక) ఆదిత్య పురుషునే కదా? ఏమని వర్ణించాలి?
అజాతశత్రువు : ఆ ఆదిత్య పురుషుని నేను అభివర్ణించలేను. అయితే ఆ సూర్యతత్త్వమును ‘బృహత్తరము! మహత్తరమైనవాడు! సర్వమునందు అధిష్ఠానముగా ఉన్నవాడు, ఆధారమైనవాడు, సర్వజీవులకు శిరస్సు వంటివాడు, ఈ సృష్టికే శిరస్సు’ అగు ఆత్మపురుషుడే - అని ఉపాశిస్తు ఉన్నాను. ఈ విధంగా “ఆత్మ ప్రదర్శనముగా” సూర్యభగవానుని ఆరాధించువారు సర్వజీవులలో శ్రేష్ఠులు, శిరస్సు వంటి వారు సూర్యతేజస్సుచే ప్రకాశవంతులు అగుచున్నారు.

3.) స ఏవ ఏష బాలాకిర్య :-
‘ఏవైష చంద్రమసి పురుష ఏతమేవ అహమ్
బ్రహె్మూపాస ఇతి?
తం హెూవాచ అజాతశత్రుః
మా మ వై ఏతస్మిన్ సమవాదయిష్ఠాః
సోమో రాజన్ న అన్నస్య ఆత్మేతి వా,
అహమ్ ఏతమ్ ఉపాస। ఇతి। సయోహి ఏతమేవ
ఉపాస్తే అన్నస్య ఆత్మా భవతి॥
బాలాకిర్య ఋషి : చంద్రునిలో ప్రవేశించినప్పుడు, చంద్రునిలో ఉన్న నేను బ్రహ్మమును ఏ రీతిగా, ఏ పరమపరుషునిగా చంద్రుని ఉపాశించాలి?
అజాతశత్రు మహారాజు : ఆ పరమపురుషుని నేను అభివర్ణించలేను. అయితే ’చంద్రునిలో, తత్త్వము సోముడు! సృష్టికి రారాజు! అన్నము! బ్రహ్మమునకు అన్నము అగు చంద్రుని ఆత్మ బ్రహ్మమే అని భక్తితో ఉపాసిస్తున్నాను. ఈ విధంగా చంద్రుని ఉపాశించువాడు అన్నమునకు (సృష్టి ప్రదర్శనకు) ఆత్మగా అగుచున్నాడు.
4.) సహెూవాచ బాలాకిర్య :-
ఏవ ఏష విద్యుతి పురుష
ఏతమేవ అహమ్ ‘బ్రహ్మోపాస’ ఇతి?
తం హెూవాచ అజాతశత్రుః :
మా మ ఏతస్మిన్ సమవాదయిష్ఠాః తేజస్య ఆత్మేతివా,
అహమ్ ఏతత్ ఉపాస ఇతి।
స యో హై ఏతమేవమ్ ఉపాస్తే తేజస్య ఆత్మా భవతి॥
బాలాకిర్య ఋషి : విద్యుత్తులో తేజో పురుషరూపుడనై ఉన్నప్పుడు నేను ఏ పురుషుని బ్రహ్మముగా ఉపాసించాలి?
ఆజాతశత్రు మహారాజు : ఏ పురుషుడు బ్రహ్మముగా ఉపాసించాలో నాకు తెలియదు. అయితే ‘ఆ పరమ పురుషుడగు బ్రహ్మమే విద్యుత్ - తేజస్సుకు ఆత్మ’..అని మాత్రం ఉపాసిస్తున్నాను. ఈ విధంగా ‘తేజస్య ఆత్మేతివా!’ - అను రూపంగా ఆత్మను-భక్తితో ఉపాసించువాడు తేజస్సుకే ఆత్మ అయి విరాజిల్లగలడు. తానే అంతా తేజోరూపుడై ప్రకాశించగలడు.
5.) సహెూవాచ బాలాకిర్య :-
ఏవ ఏషః తనయిత్నౌ పురుష
ఏతమేవ అహం బ్రహ్మోపాస ఇతి?
తం హెూ వాచ అజాతశత్రుః
మా మ ఏతస్మిన్ సమవాదయిష్ఠాః ।
శబ్దస్య ఆత్మేతి వా అహమ్ ఏతమ్ ఉపాస - ఇతి।
సయోహి ఏతమేవమ్ ఉపాస్తే శబ్దస్య ఆత్మా భవతి॥
బాలాకిర్య ఋషి : ఆకాశమునందు శబ్ద - ఉరుము రూపముగా ఉన్నట్టి నేను ఏ పరమ పురుషుడగా బ్రహె్మూపాసన చేయాలి?
అజాతశత్రు మహారాజు : ఏ పరమపురుషుడగు బ్రహ్మముగా మీరు ఉపాసించాలో నేను చెప్పజాలను. అయితే ‘శబ్దమునకు ఆత్మగా ఉన్నది బ్రహ్మమే’ అను భావనతో నేను భక్తితో శబ్దమును ఉపాసిస్తున్నాను. ఆ పరమపురుషుడగు బ్రహ్మమును శబ్దమునకు ఆత్మగా ఉపాసించుటచే - అట్టివాడు శబ్దమునకు ఆత్మగా అగుచున్నాడు.
6.) సహెూవాచ బాలాకిర్య :-
ఏవ ఏష ఆకాశే పురుషః
తమేవ అహమ్ ఉపాస ఇతి?
తం హెూ వాచ అజాతశత్రుః
మా మ ఏతస్మిన్ సంవదిష్ఠాః ।
పూర్ణమ్, అప్రవర్తి, ‘బ్రహ్మ’ ఇతి వా
అహమ్ ఏతమ్ ఉపాస। ఇతి।
స యో హి ఏతమేవ ఉపాస్తే పూర్యతే
ప్రజయే పశుభిః నో ఏవ
స్వయం నాస్య ప్రజా పురాకాలాత్ ప్రవర్తతే॥
బాలాకిర్య ఋషి : ఆకాశమంతా పురుషడనై ఆక్రమించుకొని ఉన్న నేను బ్రహ్మమును (పరమపురుషుని) ఏ రీతిగా ఉపాసించాలి?
అజాతశత్రు మహారాజు : మీరు బ్రహ్మమును ఎట్లా ఉపాసించాలో, ఏమని ఉపాసించాలో నేను చెప్పలేను. అయితే, ’పరబ్రహ్మము పూర్ణపురుషుడు! నిష్క్రియుడు - అంతటా నిండి ఉన్నవాడు! అప్రవర్తి! స్వయం బ్రహ్మము!..’ ఆయనయే ఆకాశపురుషుడుగా ఉన్నారు - అని ఆయనను నేను ఉపాసన చేస్తున్నాను. ఆకాశమును బ్రహ్మము రూపముగా ధ్యానిస్తున్నాను. ఈ విధంగా ‘ఆకాశముగా ఉన్నది బ్రహ్మమే’ అని ధ్యానించువాడు గొప్ప సంతానముతో (ప్రజయా), పశుసంపదతో వర్ధిల్లగలడు. స్వయము, సృష్టికి పూర్వమే ఉన్న, కాలమునకు ముందే గల కాలః కాల స్వరూపము (పురాకాల స్వరూపము) పొంది బ్రహ్మానందించగలడు.
7.) సహెూవాచ బాలాకిర్య :-
ఏవ ఏష వాయౌ పురుషః తమేవ అహమ్ ఉపాస, ఇతి॥
తం హెూ వాచ అజాతశత్రుః
మా మ ఏతస్మిన్ సమవాదయిష్ఠా।
ఇంద్రో వైకుంఠో అపరాజితాన్
సేనేతి వా అహమ్ ఏతత్ ఉపాస ఇతి।
స యో హి ఏతమేవమ్ ఉపాస్తే జిష్ణుః హ వై పరాజిష్ణుః
అన్యతః తత్ జ్యాయాత్ భవతి॥
బాలాకిర్య ఋషి : వాయువులో ప్రవేశించి ఉన్నప్పుడు నేను ఆత్మ - పరమ పురుషుని ఉపాసించేది ఏరీతిగా?
అజాతశత్రు మహారాజు : ఆ పరమపురుషుని ఏమని ఉపాసించాలో తెలిసినవాడను, చెప్పగలినవాడను కాను. అయితే వాయువు యొక్క ఆత్మయే ఇంద్రుడు! వైకుంఠుడగు విష్ణువు! అపరాజితుడు!’ అని వాయువును భక్తితో ఆరాధిస్తున్నాను. ఈ విధముగా వాయువును బ్రహ్మముగా, పరమపురుషునిగా (నమస్తే వాయో! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి) అని ఉపాసించువారు పరాజయము లేనివారై, జిష్ణువై (విష్ణువై) ప్రకాశించగలరు. (వాయువు - ప్రాణతత్త్వ ప్రత్యక్ష రూపము).
8.) సహెూవాచ బాలాకిర్య :-
ఏవ ఏష అగ్నౌ పురుషః తమేవ అహమ్ ఉపాస ఇతి?
తం హెూ వాచ అజాతశత్రుః
మా మ ఏతస్మిన్ సమవాదయిష్ఠా।
విషా సహిః ఇతి వా అహమ్ ఏతమ్ ఉపాస ఇతి
సయో హి ఏతమేవాఽహమ్
ఉపాస్తే విషా సహిర్వా ఏష భవతి॥
బాలాకిర్య ఋషి :  అగ్నితత్త్వములో ప్రవేశించినప్పుడు నేను ఉపాసించవలసిన పరమపురుషుడు ఎవ్వరు? ఎట్టివారు?
అజాతశత్రు మహారాజు : ఓ ఋషీశ్వరా! అది నేను చెప్పజాలను! అయితే, ‘సర్వమును భస్మము చేయు అగ్నియొక్క రూపముగా ఉన్నది ఆ పరబ్రహ్మమే!…అని మాత్రం భక్తితో గానం చేస్తున్నాను! అగ్నియొక్క ఆత్మను బ్రహ్మముగా (పరమపురుషునిగా) ఉపాసించువాడు అగ్నివలె స్వయంప్రకాశవంతుడగుచున్నాడు!
9.) సహెూ వాచ బాలాకిర్య
ఏవ ఏషో అప్సు పురుషః తమేవ అహమ్ ఉపాస ఇతి?
తం హెూ వాచ అజాతశత్రుః
మా మ ఏతస్మిన్ సమవాదయిష్టాః॥ నామ్న్యస్య ఆత్మేతివా
అహమ్ ఏతమ్ ఉపాస ఇతి। స యో హి ఏతమేవమ్ ఉపాస్తే
నామ్నో అస్య ఆత్మా భవతి,
ఇతి అధిదైవతమ్, అథా అధ్యాత్మమ్॥
బాలాకిర్య ఋషి : జలములో (వరుణ) పురుషుడుగా నేను అవతరించి ఉన్నప్పుడు నేను పరమపురుషుడగు బ్రహ్మమును ఎట్లా ఉపాసించాలి?
అజాతశత్రు మహారాజు : అట్టి జలరూప పరమపురుషుడగు బ్రహ్మము ఎవ్వరో నాకు తెలియదు. ’ఈ వరుణ దేవుడే జలరూపుడే కాకుండా, సర్వనామరూపములకు ఆత్మ స్వరూపుడుగా అయి ఉన్నాడు… అని మాత్రం నేను భక్తిగా ఉపాసిస్తున్నాను. సర్వనామములు ఆత్మభగవానునిగా ఉపాసించువారు సమస్త నామములకు తానే ఆత్మగా అగుచున్నాడు. ఆత్మయే అధిదైవతముగా, ఆధ్యాత్మముగా ఉన్నది కదా!
10.) సహెూ వాచ బాలాకిర్య
ఏవ ఏష ఆదర్శే పురుషః తమేవ అహమ్ ఉపాస ఇతి?
తం హెూ వాచ అజాతశత్రుః
మా మ ఏవ ఏతస్మిన్ సమవాదయిష్ఠాః
‘ప్రతిరూప’ ఇతివా, అహమ్
ఏతమ్ ఉపాస ఇతి। సయో హి
ఏతమేవమ్ ఉపాస్తే ప్రతిరూపో హైవా అస్య
ప్రజాయామ్ అజాయతే నా ప్రతిరూపః ॥
బాలాకిర్య ఋషి : “అద్దములోనా ప్రతిబింబము ‘నేనే’ అయినట్లుగా జీవాత్మగా ఉన్నవాడనైన నేనే" - అని అనుకుంటూ ఉన్నప్పుడు - బ్రహ్మమును ఎట్లా ఉపాసిస్తూ, అర్థం చేసుకుంటూ ఉండాలి?
అజాతశత్రు మహారాజు : జీవాత్మనై పరమాత్మ (బ్రహ్మము)ను ఏ రీతిగా తెలుసుకొని ఉండాలో నాకు తెలియదు. జీవాత్మ పురుషుని పరమాత్మ పురుషుని ప్రతిరూపంగానే భక్తితో భావన చేస్తూ ఉన్నాను. పరమాత్మయే ఇహాత్మగా (జీవాత్మగా) చూచువారు సర్వుల ఆత్మరూపమే అగుచున్నారు. ప్రతిరూపిగా (జీవాత్మగా) అవరు! సర్వాత్మకుడౌతాడు. జీవాత్మయందు జీవాత్మగా కనిపిస్తున్న పరమాత్మను ధ్యానిస్తున్నాను.
11.) సహోవాచ బాలాకిర్య :
ఏవ ఏష ప్రాతి శ్రుత్కాయాం
పురుషః తమేవా అహమ్ ఉపాస ఇతి?
తం హోవాచ అజాతశత్రుః
మా మ ఏతస్మిన్ సమవాదయిష్ఠా।
ద్వితీయో అనపగ ఇతి వా,
ఆహమ్, ఏతమ్ ఉపాస ఇతి। సయో హై తమ్ ఏవమ్
ఉపాస్తే, విందతే ద్వితీయం। ద్వితీయవాన్ భవతి॥
బాలాకిర్య ఋషి : నాయొక్క నీడ అయినటువంటి ఛాయ పురుషునిగా అయినప్పుడు నేను ఆత్మోపానను ఎట్లా చేయాలి?
అజాతశత్రువు : ఆ మీయొక్క ఛాయా పురుషుని ఆత్మోపాసన గురించి, అక్కడి ఆత్మావగాహన గురించి నేను తెలిసియున్నవాడిని కాను. అభివర్ణించలేను. అయితే, “నాయొక్క ఛాయా పురుషుడు (ఉదా : నీళ్ళలోని నా ప్రతిబింబము) వెలుతురులో నా నీడ (ఛాయ) నాకన్నా వేరు కాదు కదా…” అని తలచే, ఛాయాపురుషుని ఆత్మను బ్రహ్మముగా ఉపాసిస్తున్నాను. బ్రహ్మమును ఏకాత్మ స్వరూపంగా ఆరాధించువాడు ఛాయా పురుష సమేతంగా - ఏకాత్మ స్వరూపుడై అద్వితీయత్వమును ఆస్వాదించుచున్నాడు!
12.) సహోవాచ బాలాకిర్య :
ఏవైష శబ్దః పురుషమ్ అన్వేతి తమేవ అహమ్ ఉపాస ఇతి?
తం హోవాచ అజాతశత్రుః
మా మ ఏతస్మిన్ సమవాదయిష్ఠా।
ఆయురితీవా అహమ్ ఏతమ్ ఉపాస ఇతి।
సయో హై తమేవమ్ ఉపాస్తే నో ఏవ స్వయం నాస్య
ప్రజా పురా కాలాః ‘సంమోహమ్’ ఏతి॥
బాలాకిర్య ఋషి : నన్ను నేను ‘అహమ్’ పురుషుడుగా దర్శించు సందర్భములో నేను ఆత్మను ఉపాసించు తీరు ఏమిటి?
అజాతశత్రు మహరాజు : నేను ‘అహమ్’ ప్రత్యయ భావనగా ఉన్నప్పుడు ‘ఆత్మ ఇట్టిది’ అని నేను తెలుసుకొనియుండలేదు. వర్ణించి ‘ఇది’ అని చెప్పలేను. అయితే ఆ ‘అహమ్’ ప్రత్యయమును ఆది అంతములతో కూడిన కల్పితమగు జీవభావనగాను, బ్రహ్మమునకు అది వాస్తవానికి అభిన్నమైనదిగాను ఉపాసిస్తున్నాను. అహమ్ పురుషుని బ్రహ్మము యొక్క స్వీయ కళా విశేషముగా ఉపాసించువారు ఈ జగత్తులో దేనికీ ‘సంమోహితులు’ కారు!
13.) సహోవాచ బాలాకిర్య :
ఏవ ఏష చ్ఛాయాయాం
పురుషః తమేవ అహమ్ ఉపాస ఇతి?
సహెూవాచ అజాతశత్రుః :
మా మ ఏ తస్మిన్ సమవాదయిష్ఠా|
మృత్యురితి వా అహమ్ ఏతమ్ ఉపాస ఇతి।
స యో హి ఏతమ్ ఏవమ్ ఉపాస్తే నో ఏవ
స్వయం న అస్య ప్రజా పురా కాలాత్ ప్రమీయతే॥
బాలాకిర్య ఋషి : నాయనా! నాయొక్క ఛాయపురుషకారమును (గుణములు దేహములు - సంబంధములు - అనుబంధములు - బాంధవ్యములు ఇత్యాదులతో కూడిన వ్యష్ఠిత్వము) నేనేనని అనుకున్నప్పుడు… ఏవిధంగా నిత్య వస్తువును ఉపాసించాలి?
అజాతశత్రు మహరాజు : ఛాయా పురుషుడు ఎట్టివాడో నేను అభివర్ణించలేను. అయితే అద్దానిని మార్పు చెందు క్షరస్వరూపమగు మృత్యుదేవతా రూపముగా భక్తితో ఉపాసిస్తున్నాను. ‘మృత్యువు ఆత్మచమత్కారమే’ అను కల్పనా విభాగ విశేషంగా ఆత్మను దర్శించుచున్నాను. అట్టి ఆత్మోపాసకుడు అకాల మృత్యువు పొందడు. ఆతని సంతానమునకు అకాల మృత్యువు ఉండదు.
14.) సహోవాచ బాలాకిర్య :
ఏవైష శారీరః పురుషః తమేవా అహమ్ ఉపాస ఇతి?
తం హో వాచ అజాత శత్రుః :
మా మ ఏతస్మిన్ సమవాదయిష్ఠాః|
ప్రజాపతిః ఇతివా అహమ్
ఏతమ్ ఉపాస ఇతి। స యో హై ఏతమ్ ఏవమ్
ఉపాస్తే ప్రజాయతే ప్రజయా పశుభిః ॥
బాలాకిర్య ఋషి : దేహిగా జాగ్రత్‌లో (విశ్వుడుగా) దేహముతో ఉన్నప్పటి నేను ఉపాసించవలసిన పరమ పురుషుడు ఎవ్వరు? ఏది?
అజాతశత్రు మహరాజు : ఆ ఉపాశించవలసి పరమపురుషుని నేను వర్ణించి చెప్పలేను. అయితే ఈ దేహములో చరించుచున్న దేహిని (లేక) పురుషుని నేను ‘సృష్టికర్తయగు ప్రజాపతి’గా భక్తితో కూడి ఉపాసిస్తున్నాను. ఈ విధంగా ‘దేహములో ఉన్న నేను’ ను ప్రజాపతికి, ప్రజాపతి బ్రహ్మమునకు చెందినదిగా ఉపాసించువారికి సంతానము, పశుసంపద సంవృద్ధి కాగలదు.
15.) సహెూవాచ బాలాకిర్య :
ఏవైష ప్రాజ్ఞ ఆత్మా యేనైతత్ సుప్తః - స్వప్నమ్ ఆచరతి
తమేవ అహమ్ ఉపాస ఇతి?
తం హెూవాచ అజాతశత్రు :
మా మ ఏతస్మిన్ సమవాదయిష్ఠా।
యమో రాజేతి వా అహమ్ ఏతమ్ ఉపాస ఇతి|
సయో హ ఏ తమేవమ్ ఉపాస్తే సర్వం హాస్మా ఇదం
శ్రేష్ఠ్యాయ గమ్యత్ (యమ్యతే) ॥
బాలాకిర్య ఋషి : సుషుప్తిలో సంచారము కలిగియున్న నాయొక్క ప్రాజ్ఞ పురుషుని, స్వప్నములో సంచరిస్తున్న నాయొక్క తేజస పురుషుణ్ణి నేను ఏ రూపంగా బ్రహ్మోపాసన చేయాలి?
అజాతశత్రువు : ఆ ప్రాజ్ఞ (సుషుప్త పురుష) తేజస (స్వప్నపురుష) గుర్తింపు ఉపాసనల గురించి నేను విశ్లేషించి చెప్పజాలను. అయితే అవి రెండు స్థితి-గతి-మార్పు-చేర్పులను అద్దానికి అధిపతియగు ఆత్మ స్వరూప - యమ భగవానుని ఉపాసించు చున్నాను. ఈ జాగృత్ విశ్వ - సుషుప్త ప్రాజ్ఞ - స్వప్న తేజస పురుషులను యమదేవుని (యమధర్మరాజు యొక్క) కళా విశేషాలుగా ఉపాసించువారు శ్రేష్ఠత్వము పొందుచున్నారు. బ్రహ్మముగా సంభావించుచున్నాను.
16.) సహోవాచ బాలాకిర్య :
ఏవైష దక్షిణే అక్షన్ పురుషః తమేవ అహమ్ ఉపాస ఇతి?
తం హో వాచ అజాతశత్రు:
మా మ ఏతస్మిన్ సమవాదయిష్ఠా, నామ్న ఆత్మా అగ్నేః,
ఆత్మా జ్యోతిష, ఆత్మేతి వా
అహమ్ ఏతమ్ ఉపాస ఇతి।
సయోహై తమేవమ్ ఉపాస్త ఏ తేషాం
సర్వేషామ్ ఆత్మా భవతి॥
బాలాకిర్య ఋషి : నా కుడి కంటిలో నివసిస్తున్న పురుషుడెవ్వరు? ఆతనిని నేను ఎట్లా ఉపాసించాలి?
అజాతశత్రు మహారాజు : కుడికంటిలో నివసిస్తున్న ఆత్మపురుషుని నేను అభివర్ణించి చెప్పలేను. అయితే కుడికంటిలోని దృష్టి తత్త్వమును నేను అగ్ని-జ్యోతి స్వరూపుడగు ఆత్మయొక్క తేజోరూపముగా భక్తితో ఉపాసిస్తున్నాను. ఎవరు కుడికంటిలోని చూపుశక్తిని ఆత్మయొక్క జ్యోతిరూపముగా ఆరాధిస్తారో అట్టి వారు సర్వము ఆత్మ స్వరూపముగా దర్శించగలరు.
17.) సహోవాచ బాలాకిర్య :
ఏవైష సవ్యే అక్షణ్ పురుషః
తమేవ అహమ్ ఉపాస ఇతి?
తం సహోవాచ అజాతశత్రుః
మా మ ఏతస్మిన్ సమవాదయిష్ఠాః। సత్యస్య ఆత్మా విద్యుత,
ఆత్మా తేజస, ఆత్మేతివా అహమ్-ఏతమ్ ఉపాస ఇతి।
సయో హై ఏతమేవమ్ ఉపాస్త ఏతేషాం
సర్వేషామ్ ఆత్మా భవతి। ఇతి॥
బాలాకిర్య ఋషి : నా ఎడమకంటిలో నివసిస్తున్న నేనైన పరపురుషుని నేను ఏ విధంగా ఉపాసించాలి?
అజాతశత్రు మహారాజు : ఎడమ కంటిలోని నేనైన పరమపురుషుని ఏ విధంగా అభివర్ణించాలో తెలియదు. అయితే - నేను ఆ ఎడమకంటి అంతర్గత పురుషుని సత్యాత్మ-సర్వాత్మ స్వరూపునిగాను, ఆత్మాతేజో-విద్యుత్ విలాసముగాను, స్వయమాత్మగాను భావించి ప్రేమగా ఉపాసిస్తున్నాను. ఎడమకంటి దృష్టి పురుషుని ఆత్మభావనగా ఉపాసించువారు సత్యమునకు, విద్యుత్తుకు, తేజస్సుకు ఆత్మయే తాముగా అయి ఉంటున్నారు.
18.) తత ఉ హ బాలాకి తూప్లీమ్ ఆస।
తం హో వాచ అజాతశత్రుః
ఏతావన్నూ బాలకా (బాలకీ) ఇతి। ఏతావత్ ఇతి - హెూవాచ।
తం హెూ వాచ అజాశశత్రుః
మృషావై కిల మా సంవదిష్ఠా బ్రహ్మ తే తే బ్రవాణీతి।
ఏతేషాం పురుషాణాం కర్తా
యస్యవై తత్ కర్మ సంఘైః వేదితవ్య - ఇతి
తత ఉ హ బాలాకిః సమిత్పాణిః
ప్రతిచక్రామ ఉపాయాని ఇతి।
తం హెూ వాచ అజాతశత్రుః
ప్రతిలోమ రూపమేవస్య
యద్యాత్ క్షత్రియో బ్రాహ్మణ,
ఉపనయేత్ ఏహి వ్యేవత్వా
జ్ఞపయిష్యామి। ఇతి|
తం హ ప్రాణాః అభిమథ్య
ప్రవవ్రాజ, తౌ హ సుప్తం పురుషం ఈయతుః।
తం హా అజాతశత్రుః
ఆమంత్రయాం చక్రే బృహన్
‘పాండరవాసా। సోమరాజన్’ ఇతి।
స తూప్లీమ్, ఏవ శిశ్యేత
త ఉ హై నం యష్ట్యా విచిక్షేప|
తత ఉ ఏవ సముత్తస్థౌ।
తం హెూవాచ అజాతశత్రుః
క్వైష ఏతత్, బాలాకే పురుషో
శయిష్ట? యత్ర ఏ తత్ అభూత్? యత ఏతత్
అగాత్? ఇతి తదుహ బాలాకిః “న విజిజ్ఞా”!
అప్పుడు బాలాకి ఋషి కొంతసేపు ఏమీ మాట్లాడనివారై మౌనము వహించారు.
అజాతశత్రు మహారాజు : ఓ బాలాకిర్య ఋషీశ్వరా! మీ ప్రశ్నలు ఇంతవరకేనా?
బాలాకిర్య ఋషి : హే మహాత్మా! అవును! నా ప్రశ్నలు ఇంతవరకే!
అజాతశత్రువు : ఓ బాలాకిర్యా! ఇప్పటివరకు మనము చెప్పుకున్న విశేషాలన్నీ మృతమ్-మృషమ్-భ్రాంతి మాత్ర విశేషాలు మాత్రమే. ఇప్పుడు ఇక బ్రహ్మము గురించి చెప్పుకుందామా? ఎందుకంటే బ్రహ్మముయొక్క భ్రాంతి రూపములగు కర్తృత్వము కర్మ సంఘముల గురించే ఎంత వరకు చెప్పుకొని ఏమి లాభం? వీటన్నిటికీ ఆధారమైయున్న బ్రహ్మము గురించి కదా, మనం అసలు తెలుసుకోవలసింది!

(అప్పుడు బాలాకి ఋషి తనలో “ఈ అజాత శత్రుమహారాజు నాకన్నా కూడా ఆత్మతత్త్వము ఎరిగినట్టివాడు”…అని భావించారు).

బాలాకిర్య ఋషి : అయ్యా! సమిత్పాణినై (చేతిలో యజ్ఞసమిధలు ధరించి) మీకు శిష్యుడునగుచున్నాను. మీరు ఆత్మతత్త్వమును ఎరిగే ఉపాయాలతో నాకు బోధించండి.

అజాతశత్రు మహారాజు : అయ్యా! క్షత్రియుడనగు నేను తపో - అధ్యయన సంపన్న బ్రాహ్మణులగు మిమ్ములను శిష్యులుగా స్వీకరించజాలనుకదా! అయితే ఆత్మ గురించి తెలియజెప్పుకుందాము. రండి!

అప్పుడు అజాత శత్రు మహారాజు బాలాకి ఋషి చేతిని అందుకొన్నారు. వారిద్దరూ అక్కడినుండి బయలుదేరారు. వారిరువురు ప్రాణాలు అలసిపోయి, గాఢనిద్రా పరవసుడైయున్న ఒకానొక మానవుడిని (ఆత్మ విద్యను నిరూపించుకొనే నిమిత్తము) సమీపించారు!

అప్పుడు ఆ గాఢనిద్రలో ఉన్న ‘జీవుని’, “ఓ తెల్లటి దుప్పటి - వస్త్రములు ధరించిన ఓ సోమరాజా" అని అజాత శత్రువు పిలిచారు. ఆ గాఢనిద్రపోతున్న జీవుడు నిద్రలేవలేదు. కొంత బిగ్గరగా పిలిచారు. అయినా లేవలేదు.
అప్పుడు ఒక చిన్న కర్రతో ఆ మహారాజు ఆ గాఢనిద్రలో ఉన్న వానిని గట్టిగా తట్టారు. వెంటనే ఆ గాఢ నిద్రపోవుచున్న జీవునికి మెళుకువ వచ్చి లేచి కూర్చున్నారు.
అప్పుడు అజాతశత్రు మహారాజు బాలాకిర్య ఋషితో ఇట్లా అనసాగారు.

అజాతశత్రుమహారాజు: హే బాలాకీ! ఈ పురుషుడు గాఢ నిద్రపోతూ ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు? నిద్రలో ఎక్కడ ఉండి ఏమి చేస్తూ ఉన్నాడు? గాఢ నిద్రలోంచి నిదురలేచి ఎక్కడికి వచ్చాడు?

బాలాకిర్య ఋషి : గురువర్యా! మీ ప్రశ్నయే అర్థము కాలేదు. నాకిక సమాధానమూ తెలియదు అని వేరే చెప్పేదేమున్నది?
19.) తం హెూ వాచ అజాతశత్రుః
యమేవైష ఏతత్, బాలాకే!
పురుషో శయిష్ట యత్ర ఏతత్
అభూద్యత? ఏతత్ ఆగాత్?
‘హితా’ నామ హృదయస్య
నాడ్యో హృదయాత్
‘పురీతతమ్’ అభిప్రతన్వంతి
యథా సహస్రధా కేశో
విపతితః, తావత్ ‘అణ్వ్యః’
పింగళ స్వాణమ్నా తిష్ఠంతే
శుక్లస్య, కృష్ణస్య, పీతస్య,
లోహితస్య - ఇతి తాసు తదా భవతి।
యదా సుప్తః స్వప్నం న కంచన పశ్యతి,
యథా అస్మిన్ ప్రాణ ఏవై కధా భవతి,
తథై నం వాక్ సర్వైః నామభిః సహ ఆప్యేతి|
చక్షుః సర్వైః రూపైః సహ ఆప్యేతి।
శ్రోత్రం సర్వైః శబ్దైః సహ ఆప్యేతి।
మనః సర్వైః ధ్యాతైః సహ ఆప్యేతి।
స యదా ప్రతిబుధ్యతే యథా అగ్నేః విస్ఫులింగా
విప్రతిష్ఠః అన్నేవమ్ ఏవై
తస్మాత్ ఆత్మనః ప్రాణా
యాథా ఆయతనం విప్రతిష్ఠంతే
ప్రాణేభ్యో దేవా! దేహేభ్యో లోకాః
తత్ యథా క్షురః క్షురధావే హి
ఏతస్య అస్య విశ్వంభరో వా విశ్వంభరః
కులాయ ఏవమేవ ఏష
ప్రాజ్ఞ ‘ఆత్మ’ ఇదం శరీరమ్ అనుప్రవిష్ట
ఆలోమభ్య | ఆనబేభ్యః ॥
అజాత శత్రు మహారాజు : ఓ బాలాకీ ఋషీశ్వరా! ఈతడు గాఢనిద్రలోకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్లాడు? ఎక్కడ ఉండి ఉన్నాడు? ఎక్కడి నుండి తిరిగివచ్చాడు? - అనునది యోగశాస్త్రముచే ఇట్లా వివరించబడుతోంది.

హృదయతలములో ‘హిత’ అనే నాడి ద్వారా ప్రయాణించి హృదయములోని ‘పురీతతము’ అనే స్థానమున ఈ జీవుడు చేరాడు. ఆ ’హిత’నాడి - ఒక వెంట్రుకకు వేయవవంతు (1/1000) పరిమాణములో ఉండే సన్నటి శక్తి నాడి. ఆ నాడీ మార్గము పింగళ (తెలుపు) - ఎరుపు - నలుపు - పసుపు - నీలము రంగుల విభాగములు కలిగి ఉన్నది.

అట్టి హితనాడిలో తెల్లటి భాగమును చూస్తున్నప్పుడు ఈ జీవునకు స్వప్నము ఉండదు. గాఢ నిద్రలో ఉంటాడు. ఈ జీవుడు ప్రాణశక్తితో మమేకమై, కేవల ప్రాణశక్తి స్వరూపుడై ఉంటాడు.

అప్పుడు అతని జాగ్రత్ - స్వప్నములలోని అనుభవ రూపములగు సర్వవాక్కులు - నామములు అన్నీ కూడా ఏకత్వము పొందుచున్నాయి.
దృష్టులు సర్వరూపములతో మమేకత్వము పొందుచున్నాయి.
వినికిడి సర్వశబ్దములతో ఏకత్వము పొందుతోంది.
మనస్సు సర్వధ్యాసలతో ఏకరూపమగుచున్నది.

ఎప్పుడైతే ఈతడు నిదుర లేచాడో… అగ్ని ప్రజ్వలించే తీరుగా, మొట్టమొదట ఈతని ప్రాణచైతన్యము అగ్నియొక్క విస్ఫులింగమువలె ప్రకాశమానమగుచున్నది. ఆ వెనువెంటనే ఇంద్రియ దేవతలు మేల్కొని వ్యవహార - వ్యక్తీకరణ ఉత్సాహం పొందుచున్నారు. వెనువెంటనే ఇంద్రియ విషయాలన్నీ యథారీతిగా ప్రవర్తమానమగుచున్నాయి. ఆత్మయందు మౌనరూపంగా ఉన్న ప్రాణశక్తి ఆత్మ సంకల్పముచే బయల్వెడలి, దేహమును నఖశిఖ పర్యంతరము ఉత్తేజింపజేస్తోంది.

ఆత్మనుండియే ప్రాణశక్తి (ప్రాణతత్త్వము) బయల్వెడలినదగుచున్నది.
ప్రాణశక్తి నుండి శబ్ద స్పర్శ రూప రస - ఇత్యాది దేహాంతర్గత - విశ్వాంతర్గత దేవతలు (దివ్యతత్త్వములు) బయల్వెడలుచున్నారు.
ఆ దేవతల నుండి 14 లోకాలు ప్రదర్శితమగుచున్నాయి.
ఈ విశ్వమంతా భరిస్తూ విశ్వమునకు నాభివలె ప్రజ్ఞానాత్మయే ఈ జాగ్రత్‌గా దృశ్య కల్పనయందు అంతటా (ఇంద్రియానుభవ బాహ్య ప్రపంచమంతా) ప్రవర్తించుచున్నది.
ఆత్మయే ప్రాణ రూపముగా దేహమునందు ప్రకాశించి, భౌతిక - అభౌతిక తత్త్వములన్నిటినీ ప్రదర్శించుచున్నదై ఉంటోంది.
అందుచేత అంతా ఆత్మప్రదర్శనమే! ఆత్మకు ఇదంతా అభిన్నమే! ఎందుకంటే ఆత్మ అలోమము! అద్వితీయము! అనభేభ్యము! అఖండము!
20.) తమ్ ఏతమ్ ‘ఆత్మానమ్’
ఏతమ్ ఆత్మానో అన్వ పశ్యంతి।
యథా శ్రేష్ఠినం స్వాస్తత్,
యథా శ్రేష్ఠైః తైః భుంక్తే,
యథావా శ్రేష్ఠినం స్వా భుంజంత
ఏవం శ్రేష్ఠినం స్వాస్త ఏవా అనర్థయాః ఇంద్ర
ఏతమ్ ఆత్మానం న విజిజ్ఞౌ
తావత్…ఏనమ్ అసురా అభిబభూవుః
స యదా విజిజ్ఞావ అథ
హత్వా సురాన్ విజిత్య,
సర్వేషాం భూతానాం శ్రైష్ఠ్యం,
స్వారాజ్యం ఆధిపత్యం, పర్యేతి।
తథో ఏవఏవం విద్వాన్
సర్వేషాం భూతానామ్
శ్రైష్ఠ్యం స్వారాజ్యం
ఆధిపత్యం పర్యేతి।
య ఏవం వేద।
య ఏవం వేద॥
ప్రాణ - ఇంద్రియ - ఇంద్రియ దేవతల - ఇంద్రదేవ - జగద్దృశ్య - జీవ-దేహ-జాగ్రత్-స్వప్న-సుషుప్తులతో సహా, ఈ దేహ - దేహాంతర దైవీతత్య ప్రదర్శనలతో - కలుపుకుని సర్వము ఆత్మానంద స్వరూపమే!

ఆత్మయే అయిఉన్న సర్వ విశేష సముదాయాలను తన నుండి ఆత్మయే బయల్వెడలదీసి, ఆత్మయే ద్రష్ట అయి, ఆత్మరూపమును దృశ్యముగా సందర్శము చేస్తూ ఉన్నది.

ఏ విధంగా అయితే శ్రేష్ఠుడైనవాడు అనేక శ్రేష్ఠమైన విశేషాలు కల్పన చేసుకొని, తాను కల్పించుకొనుచున్న ఆ శ్రేష్ఠ విశేషాలన్నీ తానే ఆస్వాదిస్తూ ఉంటాడో, కొంతమంది శ్రేష్ఠులను నియమించుకొని గొప్ప కార్యక్రమము నిర్వర్తిస్తూ ఉంటాడో, వారంతా ఆయా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండగా, సాక్షి అయి పర్యవేక్షిస్తూ ఉంటాడో, …. ఆత్మ కూడా ఈ సర్వ ఇంద్రియ దేవతలను, దేహములను, దిక్పాలకులను కల్పించుకొని ఇదంతా ఆస్వాదిస్తూ ఉన్నది. ఇదంతా ఆత్మకు సర్వదా అభిన్నము! ఆత్మ అద్వితీయము!

ఆత్మను ఏమరిచినప్పుడే సుఖ-దుఃఖ, బంధమోక్షాది భావాలన్నీ జీవునిచుట్టూ క్రమ్ముకుంటున్నాయి. ఆత్మజ్ఞానముచే, మొదలంట్లో పటాపంచలగుచున్నాయి.

త్రిలోకాధిపతి అగు ఇంద్రుడు ఆత్మను ఎరిగినప్పుడు ఆనందంగా లోకములన్నీ పాలిస్తున్నారు. ఆత్మను ఏమరచినప్పుడు అసురులు దండయాత్ర చేసి అమరావతిని ఆక్రమిస్తున్నారు. ఆ ఇంద్రుడు తిరిగి ఆత్మజ్ఞాని అయి అసురులను జయించి స్వారాజ్యసిద్ధి పొందుచున్నాడు.
అదేవిధంగా ఆత్మజ్ఞానము ఎరిగినప్పుడు ఆ విద్వాంసుడు సర్వభూతజాలమును ఆత్మ స్వరూపముగా ఎరిగినవాడై శ్రేష్ఠమగు ఆత్మస్థానమును చేరి ‘స్వారాజ్యాభిషిక్తుడు’ అగుచున్నాడు. ఆత్మయొక్క శ్రేష్ఠత్వము ఎరిగి ఆత్మాభిషిక్తుడై ఈ జీవుడు పరమానందమును పొందగలడు.

ఇతి కౌషీతకీ బ్రాహ్మణోపనిషత్ ।
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥


ఋగ్వేదాంతర్గత

4     కౌషీతకీ బ్రాహ్మణ ఉపనిషత్

అధ్యయన పుష్పము

ప్రథమ అధ్యాయము

ఓం
- కేవల ప్రజ్ఞాస్వరూపము
- తత్త్వజ్ఞానముచే ఆనందరూపమై లభించునది,
- సర్వమునకు, పరము (ఆవల) అయినట్టిది,
- వాద ఉపవాదముల మాత్రంచేత లభించనిది…, బుద్ధితో ఎవరికి వారే అర్థము చేసికొని ఆస్వాదించవలసినట్టిది,
- అత్యంత సుస్పష్టమైనట్టి స్వానుభవము-అగు ఏ స్వస్వరూప బ్రహ్మము గురించి తత్త్వజ్ఞులచే ఎలుగెత్తి గానము చేయబడుచున్నదో..,
అయ్యది ఈ కౌషీతకీ బ్రాహ్మణోపనిషత్ అధ్యయనముచే కరతలామలకమగును గాక! సుస్పష్టమగుచుండును గాక!

పూర్వము చిత్రుడు అను గార్యాయణ్ణి గోత్రుడు ఉండేవారు. శాస్త్రముల పరమార్థము, ఉద్దేశ్యములు ఎరిగిన మహాజ్ఞాని. ఆ చిత్రగార్యాయణి  ఒక సందర్భములో లోక కళ్యాణార్థం ఒక గొప్ప ‘యజ్ఞము’ చేయ సంకల్పించారు.

అందుకొరకై గౌతమ గోత్రజ్ఞుడగు ఆరుణి మునీంద్రులవారిని దర్శించి,
చిత్రగార్యాయణి : "అయ్యా ! నాచేత యజ్ఞము నిర్వర్తింపజేయటానికై ఋత్విక్కులై మీరు వేంచేయండి” అని అభ్యర్థించారు.

అప్పుడు అరుణి గౌతమ మునీంద్రుడు తన కుమారుడైన శ్వేతకేతువును పిలిచి, "బిడ్డా ! తత్త్వజ్ఞులలో శ్రేష్ఠుడుగా పేరొందిన ఈ చిత్రగార్యాయని కోరిన విధంగా నీవు యజ్ఞము చేయించు. ఋత్విక్కుగా ఆ కార్యక్రమము శ్రద్ధగా దిగ్విజయము చేయి” అని ఆజ్ఞాపించారు.

శ్వేతకేతువు : "పితృదేవా! తమ ఆజ్ఞను శిరసావహించుచున్నాను”.. అని అంగీకారము తెలియజేశారు.

అప్పుడు శ్వేతకేతువును సమీపించి చిత్రగార్గాయణి, “ఓ గురుపుత్రా ! నేను నిర్వర్తించు యజ్ఞమునకు ఋత్వికులుగా మీకు సుస్వాగతము! నాదొక చిన్న విన్నపము. నేను ఈ లోకబుద్ధిని దాటివేసి అన్యమైనట్టి ఊర్ధ్వలోకాలకెల్లా పరాకాష్ఠ అయిన లోకము చేరవలెననే ఆశయము కలవాడను. ఋత్విక్కులగు మీరు అట్టి ఉన్నతోన్నత స్థానమును మీ యజ్ఞనిర్వహణా సామర్థ్యముచే చేకూర్చండి. పరమోతృష్ణ స్థానమునకు త్రోవచూపండి !"… అని అడిగారు.

అప్పుడు శ్వేతకేతు, “మహాత్మా ! అట్టి పరమోత్కృష్టమైన స్థానము ఎట్టిదో, ఈ యజ్ఞనిర్వహణ మార్గంగా యజ్ఞకర్తను ఎట్లా జేర్చగలమో నాకు ఋత్విక్కుగా తెలియదు. సరేఁ ! ఉండండి మా పిత్రుదేవులగు ఆరుణి గౌతమ మునీంద్రుల వారితో తగు విధంగా ఈ విషయమై సంభాషించి మీ వద్దకు వస్తాను !” … అని పలికి తన పిత్రుదేవుని సమీపించారు.

శ్వేతకేతు :  తండ్రీ ! గౌతమారుణి మునీంద్రా ! మన చిత్రకార్యాయణ్యులు - "మానవులు యజ్ఞమార్గంగా భౌతిక లోకములన్నీ దాటివేసి, సర్వమునకు వేరైనట్టి పరమోత్కృష్టము - మేధస్సుకు పరాకాష్ఠ అయినట్టి ఉత్తమోత్తమ స్థానము - అయిన పరలోకమును చేర్చటం గురించి నన్ను అడుగుచున్నారు. అట్టి మహత్తర లోక యజ్ఞ మార్గ దర్శక గతి గురించి మీరే నాకు వివరించాలి.

అరుణిగౌతమ : బిడ్డా! అహమపి ఏతత్ న వేద. అట్టి పరమోత్కృష్ఠ స్థానము చేరు యజ్ఞవిధి గురించి నాకు కూడా తెలియదయ్యా ! సరేఁ! మనము ఆ యజ్ఞము జరిగేచోటే వేదాధ్యయనము, స్వాధ్యాయనము చేస్తూ విచారణ చేద్దాము. ఆ యాగకర్తయగు చిత్రగార్ధ్యాయణి ఆ తెలుసుకోవలసినది తెలుసుకున్నట్టి విదితవేద్యుడు. ఆయనయే మనకు మానవ జన్మాశయమగు ఆ పరమపదము గురించి వ్యాఖ్యానించి చెప్పగలరని నేను అనుకుంటున్నాను. ఒకవైపు వారి యజ్ఞము జరిపింపజేస్తూనే - మరొకవైపు వారికే శిష్యరికము చేస్తూ వారి దగ్గరే ఆ విశేషాలు విందాము.

ఇట్లా అన్న తరువాత ఆ తండ్రీ కొడుకులిద్దరూ చేత యజ్ఞ సమిధలను ధరించినవారై (శిష్యభావముతో గురువుకు యజ్ఞముకొరకై కావలసిన యజ్ఞ పరికరములు చేబూనినవారై, సమిత్పాణులై) చిత్రగార్యాయణి యజ్ఞము నిర్వర్తిస్తున్న ప్రదేశమును చేరుటకు సంసిద్ధులైనారు.

అరుణిగౌతమ : హే మహనీయా ! చిత్రగార్యాయణ్యా ! మీరు మా పుత్రుడు శ్వేతకేతువును అడిగినట్టిది జన్మకర్మల చక్రమును దాటివేసి - పునర్జన్మ రహితమగు ఆత్మజ్ఞాన జనితమైన ఆత్మసాక్షాత్కారమే అయి ఉన్నది. అట్టి ఆత్మానుభూతికి యజ్ఞ మార్గమును మేము ఎరిగిన వారము కాము. అట్టి ఊర్ధ్వమార్గమును గురువులనుండి ఎరిగినట్టి ఆత్మజ్ఞులు మీరే - అని లోక ప్రసిద్ధము. అందుచేత మీ యజ్ఞమును మీచే నిర్వర్తింపజేస్తూనే, మీకు శిష్యులమై విచారణచే ఆత్మతత్త్వమును, ఆత్మ సందర్శన మార్గమును ఎరిగెదము గాక! మాకు శిష్యత్వము అనుగ్రహించండి.

చిత్రగార్యాయణి : హే బ్రహ్మన్ ! గౌతమ బిరుదాంకితులగు అరుణీ ! త్వం బ్రహ్మతత్త్వజ్ఞోఽసి।  మీరు బ్రహ్మమును ఎరిగియే ఉన్నారు. కాబట్టే "బ్రహ్మమును ఎరిగినవాడిని కాను” అని అనగలుగుచున్నారు. నిరభిమానముగా ‘తెలియదు’ - అని యదార్థముగా అను వానికి తెలిసియేఉన్నది - అని కదా, ఉపనిషత్ శాస్త్రవాక్యము ! సరేఁ ! మీరు యజ్ఞస్థలమునకు నావెంట వేంచేయండి. మనము అర్థము చేసుకొను విధానంగా ప్రవచించుకొనెదము గాక!

యజ్ఞము ప్రారంభమై నిరాంటకముగా కొనసాగుచుండగా,…. ఒకానొకరోజు :

చిత్రగార్యాయణి : అయ్యలారా ! ఓ గౌతమారుణీ - శ్వేతకేతులారా ! వివిధ గురువులచే వివరించబడినంత వరకూ, నాకు తెలిసినంత వరకు చెప్పుకొందాము. మనము ముందుగా శాస్త్ర ప్రసిద్ధములైనటువంటి జీవుల యొక్క శుక్ల గతి - కృష్ణ గతి (లేక) పూర్వపక్ష - పరపక్ష మార్గముల గురించి కొన్ని విశేషాలు వివరించుకుంటున్నాము వినండి.

జీవులంతా దేహము త్యజించిన తరువాత సూక్ష్మ (మనో) దేహముతో చంద్రమసమును (చంద్రలోకమును) చేరుచున్నారు. ఇక అక్కడినుండి రెండు మార్గములలోను ప్రయాణము కొనసాగిస్తున్నారు. 1. ఆపై ముందు ముందుకు 2. తిరిగి వెనుకటి భౌతిక లోకములకు.

1.) పూర్వ (శుక్ల) పక్ష ఆప్యాయత జీవులు : (దేవయానం): శుక్ల (పూర్వ) పక్షములో బాహ్యమును (అన్యమును) నిరసించినట్టి అంతరంగ స్వరూపమగు ఆత్మ-తత్త్వమునందు (అనన్యమునందు) ప్రీతి కలిగి చంద్రలోకము చేరువారికి ఆ చంద్రస్థానము - ఊర్ధ్వమునగల స్వర్గలోకమున చేరటానికి - ముఖ్యద్వారముగా అగుచున్నది. వారు ఆ ముఖద్వారముగుండా ప్రయాణించి దేవతల స్థానములగు స్వర్గము మొదలైన ఊర్ధ్వలోకములను చేరుటకు ఉద్యుక్తులగుచున్నారు.

2.) అపర (కృష్ణ) పక్ష ఆప్యాయత జీవులు: (భూత-భౌతిక యానం): వీరు బాహ్య -దృశ్యమునందు అభిరుచి పెంపొందించుకొని ఉన్నట్టివారు. కృష్ణ పక్షములో చంద్రలోకము చేరుకొనుచున్న ఈ జీవులు భూతసృష్టియందు గల ప్రీతిచేత, ధ్యాసచేత భౌతిక రూపములు పొందుచూ తిరిగి పునరావృత్తి దోషముచే భూలోకములో ప్రవేశించవలసివస్తోంది. అట్లు భూతసృష్టికి (పాంచభౌతిక దేహరూపధారణల కొరకై) తిరిగి వచ్చుచున్నవారు వృష్టిరూపము దాల్చి వర్షించుట - ద్వారా భూ (భౌతిక) లోకమునకు వస్తున్నారు. అట్టివారు తమ ఇతఃపూర్వపు భౌతిక (పంచభూతనిర్మిత) దేహములతో నిర్వర్తించిన కర్మల ప్రభావముచే, నిర్మితమైన సంస్కారములను అనుసరించి భూమిపై కీటకము గానో, దోమగానో, తుమ్మెదగానో, పక్షిగానో, పులి- సింహము-నక్క మొదలగు జంతు రూపములుగానో, జలములో చేప ఇత్యాది సముద్రజంతువుగానో - ఆయా గర్భములతో ప్రవేశించుటకు సంసిద్ధులగుచున్నారు. అట్టి జీవులు భూలోకమునకు వచ్చినప్పుడు ఈ భూలోకములో "నేను ఎక్కడ ఉండాలి ? నా స్థానము ఏది ?”… అని పలుకుచుండగా,… వారికి కర్మదేవతల దర్శనమగుచున్నది.

ఆ కర్మదేవతలు, “మీరు ఎవ్వరు?" అని ఆ జీవులను ప్రశ్నిస్తున్నారు.

అప్పుడు వారు, “ఓ కర్మ దేవతలారా ! మేము చంద్రలోకమునుండి తిరిగి భౌతిక రూపములకు పునరాగమనం చేస్తున్నవారము" అని విన్నవించుకుంటున్నారు.

అప్పుడు ఆ కర్మదేవతలు ఆయా జీవులకర్మానుసారముగా నిర్మితమైన బుద్ధిని అనుసరించి (బుద్ధిః కర్మాణుసారిని) ఆయా ప్రవృత్తి ధర్మానుసారంగా - జంతుజాతులందు గర్భప్రవేశములకై దారిచూపుచున్నారు.

భక్తి జ్ఞాన వైరాగ్య సంబంధమైన ఉత్తమ కర్మలు నిర్వర్తించిన మరికొందరు సాత్విక గుణాధిక్యత, సత్వరజోగుణ సంపన్నులైన జీవులు తమతమ ఉత్తమ కర్మలను, తాము ప్రదర్శించిన సాత్విక గుణములను కర్మదేవతలకు విన్నవించుకొనుచున్నారు.

“ఓ కర్మ దేవతలారా! మేము నిర్వర్తించిన పుణ్యకార్యములను, ఉపాసన ఇత్యాది భగవత్ సంబంధమైన - మాచే నిర్వర్తించబడిన క్రియా విశేషాలను - మీకు వివరించుకుంటున్నాము. వినండి. ఆ తరువాత, ఇక్కడ భూలోకములో ఉత్తమమైన పురుష రేతస్సులో ప్రవేశింపజేయుటకై అభ్యర్ధిస్తున్నాము. మమ్ములను 15 నెలల కాలము ఉత్తమ జన్మకు సంబంధించిన రేతస్సులో నివాసము కల్పించండి. అటు తరువాత మానవుల సంబంధమైన పురుషరేతస్సులోను, మాతృగర్భములోను 12 - 13 నెలలు ఉంచి తిరిగి మాకు సులక్షణ సంపన్నమైన మానవ జన్మ ప్రసాదించండి ! ఓ ఋతు దేవతలారా ! మేము సత్యము - తపస్సులను ఆశ్రయించి ఉండుటచేత మీ రూపమే (ఋతు దేవతారూపమే) అగుచున్నాము. నేనెవ్వరు ? మీరు ఎవ్వరు ? మీరు - నేను ఒక్కటే ! మనము ఇక కలిసియే జీవనము కొనసాగించెదముగాక ! సృష్టిలో మరల ప్రవేశించెదము గాక !” … అని తమ దృశ్యతాదాత్మ్యమును వివరించుకుంటున్నారు.

ఈ విధంగా అభ్యర్ధనలు సమర్పిస్తూ భూమిపైకి వచ్చి, స్వకీయమగు కర్మ - ప్రజ్ఞలను అనుసరించి ఋతుదేవతల సహకారముతో తిరిగి అర్హమగు మానవ దేహమును ధరించటము జరుగుతోంది.

పూర్వపక్ష - శుక్లపక్ష దేవయానము

భౌతిక విశేషాల పట్ల ఉత్తమ వైరాగ్య సంపన్నులై, కర్మ - జ్ఞాన - భక్తి - యోగ సాధనలచే ఉత్తమమగు అర్హత సముపార్జించుకున్న జీవులు చంద్రలోకమునుండి ‘పునరావృత్తి’ పొందనివారై, చంద్రలోక ద్వారమునుండి స్వర్గ - ప్రజాపతి - బ్రహ్మలోకములవైపుగా ప్రయాణించుచున్నారు. ఓ ఆరుణిగౌతమ - శ్వేతకేతు స్నేహితులారా ! మనము ఇప్పుడు అటువంటి ’దేవయానము’ను ఆశ్రయించు ప్రజ్ఞాజీవుల గురించి చెప్పుకుంటున్నాము. వినండి !

అటువంటి ఆత్మతత్త్వజ్ఞాని, ఉత్తమ దైవీగుణ శీలుడు అగు జీవుడు భౌతిక స్థితి గతులచే ఆకర్షించబడనివాడై, ఊర్థ్వలోక ద్వారములలో ప్రవేశించుచున్నాడు.

ఆతడు మునుముందుగా అగ్ని లోకము చేరుచున్నాడు. క్రమంగా… వాయులోకము; వరుణలోకము; ఆదిత్యలోకము; ఇంద్రలోకము; ప్రజాపతిలోకము; బ్రహ్మలోకము చేరుచున్నాడు.

బ్రహ్మలోక యానము

బ్రహ్మలోకము ప్రవేశించుచూ, మొదటగా ‘అరము’ అనే పేరుగల సరస్సుకు ఈవలి వడ్డు చేరుచున్నాడు. అక్కడ కొన్ని ముహూర్తములు (యేష్టికాలము) గడుపుచున్నాడు. ఆ అరో సరస్సు దాటి, ఆవలి వడ్డు చేరి… అక్కడినుండి విరజానది (విః +అజ – జన్మరహితమైన ఉత్తమస్థానం, జన్మరాహిత్యము గురించి బోధపొందు స్థానము, విః+రజ = దోషరహితము) - చేరుచున్నాడు. ఆ తరువాత ‘ఈల్య’ అనే కల్ప వృక్షమును చేరుచున్నాడు. ఆపై ‘సాయుజ్యము’ అనే పట్టణము చేరుకుంటున్నాడు. ఆ పట్టణంలో ‘అపరాజిత’ అనే సౌధము చేరుచున్నాడు. ఆ సౌధమునకు ఇంద్రుడు - ప్రజాపతి (సృష్టిపాలకులు) ద్వారపాలకులై కనిపిస్తారు.

ఆ సౌధములో విభు (సర్వమునకు పాలకుడు నియామకుడు) అనే సభామండపము (ప్రమితము) ఉన్నది. ఆ సభామండపములో ‘విచక్షణ’ … అని పిలువబడే - గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్న - సింహాసనము గల గొప్ప ప్రదేశము ఉన్నది. అక్కడకు దగ్గిరే ‘అమితౌజము’ అనే లోక పావనియగు ఒక ప్రియభామినీ - మాతృ పర్యంకము కలదు. అక్కడే ‘మానసీ’, చాక్షుసీ (Thought, Perception) అనే పేర్లుగల ఇద్దరు దేవకాంతలు ఉంటారు. వారిద్దరూ చేతులలో చంద్రకాంత పుష్పములు ధరించి, అక్కడకు వచ్చియున్న జీవులకు జగత్ స్వరూప - స్వభావ - తత్త్వములను బోధిస్తూ, అభివర్ణిస్తూ, గానం చేస్తూ ఉంటారు. వారిద్దరూ జగదంబ (ప్రకృతి, జగత్తు రూపమున ఉన్న అంబ, అమ్మవారు) యొక్క మహిమ, సౌష్ఠవము, సౌందర్యము అభివర్ణిస్తూ ఉంటారు.

అక్కడ ఎందరో అప్సరసలు, మాతృదేవతలు (అష్టమాతృకలు), నదీదేవతలు…’ వీరంతా బ్రహ్మతత్త్వమునుగానం చేస్తూనే, “బిడ్డలారా ! రండి ! ఈ బ్రహ్మలోక తేజోవిలాసమును ఆస్వాదించండి. మీకు పరతత్త్వస్వరూపుడగు బ్రహ్మదేవుని దర్శన భాగ్యము లభించుగాక ! అందుకుగాను ముందుగా మరొకసారి విరజానదీ స్నానము చేసి పరిశుభ్రత పొందండి. అప్పుడిక మీకు శోకము - దుఃఖము - వార్ధక్యము మొదలైన సర్వదోషములు తొలగగలవు” … అని మార్గదర్శకులగుచున్నారు. మాతృవాత్యల్యంతో బ్రహ్మలోకమును ప్రవేశించినవారికి బ్రహ్మభగవానుని సందర్శనమునకు త్రోవ చూపుచున్నారు.

బ్రహ్మదేవుని మందిరము

కేవలానందస్వరూపులు, ఆత్మతత్త్వ ప్రజ్ఞాదురంధరులు, పరమవాత్సల్య స్వరూపులు, సృష్టికి ఆది అయినవారు, సృష్టి సంకల్పులు, సర్వజన పితామహులు, జగన్మాతయగు సరస్వతీసమేతులు, వేదములచే స్తుతింపబడువారు, సర్వజ్ఞానసహితులు, ఆర్తత్రాణ పరాయణులు అగు బ్రహ్మభగవానుడు బ్రహ్మాసనాశీనులై కోటి సూర్య మండలముల ప్రభాభాసుడై, తనను దర్శించువారికి బ్రహ్మానందమును-దర్శన మాత్రముచేతనే-కలుగుజేస్తూ ఉంటారు.

ఆ బ్రహ్మ భగవానుడు పంచశత (500) మంది అప్సరసలచే సేవించబడుతూ కనిపిస్తారు. వారంతా బ్రహ్మజ్ఞాన సమన్వితులైన జీవులను అత్యంత వాత్సల్యంతో - “బిడ్డలారా! రండి ! రండి ! లోక కళ్యాణమూర్తియగు బ్రహ్మదేవులవారి దర్శనముచే పునీతులయ్యెదరు గాక !” అని సన్మాన, ఆశీర్వాద పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటారు.

ఆ అప్సరసలతో మొదటి వందమంది సువాసనాభరితమైన నందన వన పుష్ప మాలికలను చేబూని, బ్రహ్మతత్త్వజ్ఞులగు జీవ బాటసారులకు సమర్పిస్తూ ఉంటారు. రెండవ వందమంది సుగంధ పరిమళ ద్రవ్యములను చేబూని, బ్రహ్మదేవుని దర్శించటానికి వచ్చేవారలను అలంకరింపజేస్తే ఉంటారు. అనేక పుష్పమాలికలతో, సుగంధములతో ఆ బ్రహ్మదేవుని దర్శించవచ్చిన జీవుని తల్లి తన బిడ్డలను అలంకరించునట్లుగా అలంకరిస్తూ ఉంటారు. ప్రయాణ బడిలిక తొలగేటట్లుగాను, సర్వ అపరిశుభ్రతలు పోవునట్లుగాను ఆ జీవుని తీర్చిదిద్దుతారు. వారు బ్రహ్మదేవుడు సుఖాసీనులై యున్న బ్రహ్మ సింహాసనమునకు దారి చూపుతారు.

ఆ దారిలో వచ్చు జీవులు అక్కడి అప్సరసల సూచనల ప్రకారము మరల ’అర’సరస్సులో, విరజానదిలో మానసిక స్నానం నిర్వర్తిస్తూ ఉంటారు. అప్పటిదాకా తమను వెంటనంటి వస్తున్న సుకృత - దుష్కృతములను తాము భౌతిక దేహముతో నివసించి వచ్చిన లోకమునకు సమర్పించివేస్తారు. సుకృతఫలములను తనకు ప్రియమైనట్టి, తనను సేవించినట్టి జ్ఞాతులకు, శిష్యకోటికి ఇచ్చివేస్తున్నారు. దుష్కృత ఫలములను - సాత్వికులను, భక్తజనులను బాధించుచు, పూజ్యులకు అప్రియము కలుగజేస్తూ, తోటిజీవులను వేధించు స్వభావము కలవారికి, వారు నడచు మార్గములయందు వదిలివేస్తున్నారు.

ఈ విధంగా, ఒకడు ప్రయాణించుచున్న రథము యొక్క రెండువైపులా రధచక్రములు ఊడిపోవు విధంగా, ఆ బ్రహ్మమందిర ప్రవేశ జీవునికి సంబంధించిన సుకృత - దుష్కృత కర్మలు ఆతనిని విడచినవగుచున్నాయి. అట్లాగే పుణ్య-పాపములు, సుఖ-దుఃఖములు, స్వర్గ నరకములు, చీకటి - వెలుగులు.. మొదలైన ద్వంద్వములన్నీ ఆతడు విడచివేసినవాడగుచున్నాడు.

బ్రహ్మ సింహాసనమును సమీపించేముందు ఆతడు మనస్సుతో బ్రహ్మలోకములోని ‘ఈల్య’ వృక్షము క్రిందకు చేరుచున్నాడు.

"బ్రహ్మమునకు సంబంధించిన అభివర్ణనము”… అనే సుగంధము ఆయనయందు ప్రవేశిస్తోంది. తరువాత ఆతడు ‘సాయజ్య’ పట్టణము చేరుచుండగా ఆతనియందు అనిర్వచనీయమగు ‘బ్రహ్మానందవీచికలు’ ప్రవేశము పొందుచున్నాయి. ’అపరాజి’ భవనము చేరుచుండగా బ్రహ్మతేజస్సు ఆతనియందు ధగధగ ప్రకాశమానమగుచున్నది. బ్రహ్మసౌధము చేరుచుండగా ఆ సౌధమునకు ద్వారపాలకులగు ఇంద్రుడు, ప్రజాపతి ఆతనికి బ్రహ్మదేవుని పర్యంకమువైపుగా దారిచూపుచున్నారు. ’విభు’ అను దివ్యసభామంటపమును మనస్సుతో సమీపిస్తూ ఉండగా ఆతనిలో ’బ్రహ్మయశస్సు’ ప్రవృద్ధి పొందుచున్నదగుచున్నది. ఆ తరువాత ‘విచక్షణ’ అనే బ్రహ్మ సింహాసనము సమీపిస్తూ ఉండగా ఆతనిలో వైరూప, వైరాజ, శార్వద, రైవత, అని చెప్పబడే ప్రజ్ఞలు ప్రవేశిస్తున్నాయి. అట్టి ప్రజ్ఞచే ఆత్మప్రజ్ఞాస్వరూపుడై విరాజిల్లుచున్నాడు. ఇకప్పుడు బ్రహ్మ భగవానుని పర్యంకమును సమీపిస్తున్నారు. 

“అమితౌజసము” అనే వాహనము (నెమలి)ను దర్శించుచున్నాడు. ఆ అమితౌజసము సృష్టిలోని ప్రాణశక్తి ! భూత - భవిష్యత్ కాలములు అద్దాని ముందుకాళ్ళు. సంపద - ప్రతిష్ఠ వెనుకకాళ్ళు. భద్రయజ్ఞము - యజ్ఞాయనము (యజ్ఞవిధులు - యజ్ఞభావన) అద్దాని శిరోభాగములు. బృహత్గానము - రథంతర గానము… అనే సామగానములు యజస్సులు. సోమలతలు ఆ పర్యంకముపై పరచిన తివాసీలు. ’ఓం’కారనాదము యొక్క ఉద్దీథము ఆ పర్యంకముపై అలంకరించబడిన ఉపశయనములు (దిండ్లు). ఆపర్యంకముపై ‘ఇతమిత్థము’ (ఈ జగత్తుయొక్క వాస్తవ స్వరూపమును నిర్వచించునట్టి బ్రహ్మతత్త్వ - ఉపనిషత్ వాఙ్మయము) ప్రకాశమానమగుచుండగా …,
ఎత్తైన పద్మాసనముపై సుఖాసీనులై, బ్రహ్మభగవానుడు దర్శనమిచ్చుచున్నారు.

బ్రహ్మమే తానై సర్వమును ఆస్వాదించు పరమానంద పరబ్రహ్మస్వరూపులగు బ్రహ్మ భగవానుడు ఆ బ్రహ్మలోకము జేరిన జీవునితో సంభాషించ ప్రారంభిస్తారు.

బ్రహ్మభగవానుడు :  వత్సా ! ఎవరు నాయనా నీవు ? నీ వాస్తవ స్వరూపమేమిటి ? నీ గురించి నీవు ఏమని తలచుచున్నావు? విశదీకరించు.

బ్రహ్మజ్ఞానియగు బ్రహ్మలోక ప్రవేశి :  నేనా స్వామీ? ‘కాలము’ అను కల్పనకు మునుముందే ఉన్నట్టివాడను. ఆత్మాకాశమే నా స్వరూపము - జన్మస్థానము. లీలావినోదినై కాలమునందు ప్రవేశించునట్టివాడను. కాలము నాకు నేనుగా కల్పించుకొనుసంబంధమే కాబట్టి కాలస్వరూపుడను కూడా! ఋతు స్వరూపుడనై అనేకసార్లు ఋతుధర్మమును ఆశ్రయించటం జరిగింది. సంవత్సర (కాల) స్వరూపుడనైనట్టి నేను ఆత్మాకాశమునుండి యోని (స్త్రీగర్భము) యందు సంభూతుడనైనాను. అస్మదాత్మ స్వరూపము సర్వదా యధాతథమై ఉండి కూడా, మరొకవైపు దేహమును ఆశ్రయించి, దేహధారిని, దేహిని అవుతూవస్తున్నాను. దృశ్యములను ఆస్వాదిస్తూ ద్రష్టను అగుచూ వచ్చాను.

స్వామీ ! భగవాన్ ! ఇంత వరకూ చెప్పినది - నాయొక్క దృశ్య సంబంధమైన విభాగం గురించి. ఇక, నా గురించి చెప్పుకుంటున్నాను. దయతో వినండి !

అనంతకోటి జీవాత్మలలో నేనూ ఒకడిని. అయితే అట్టి అనంతకోటి జీవాత్మలంతా అఖండాత్మస్వరూపమే కదా ! అందుచేత నేను అఖండము - సర్వమునకు ప్రమేయములేనట్టిది (అప్రమేయము) అగు ఆత్మస్వరూపుడను !

ఇక్కడి భూతజాలమంతా మీ యొక్క సృష్టియే కదా ! అందుచేత - భూతస్య త్వమ్ ఆత్మాసి ! - సర్వజీవులకు ఆత్మ స్వరూపుడు మీరే! మీ సృష్టిలో నేను కూడా ఒక దేహిని. జీవుడిని. కనుక నా ఆత్మస్వరూపులు మీరు. ఆత్మ సర్వదా ఏకమే గాని అనేకము కాదు కదా!

కనుక …, యత్ త్వమ్ అసి, సోహమస్మి! ఏది మీరు అయి ఉన్నారో, అదియే నేను! ఈ విధంగా…,

“నీవు ఎవ్వరు?” అను ప్రశ్నకు సమాధానముగా “త్వమేవాహమ్ | మీరు ఏదియో, అదియే నేను” అని మీకు విన్నవించుకొనుచున్నాను.

బ్రహ్మభగవానుడు :  ఓహోఁ! ఏది నేనై ఉన్నానో, అదియే నీవై ఉన్నావా ? బాగున్నది. అయితే నేను ఏదై ఉన్నాను ?

బ్రహ్మలోకప్రవేశి : హే భగవాన్ ! మీరు సత్యలోకాధిపతులు కదా! ప్రతి జీవుని నిత్య సత్య స్వరూపమే మీరై ఉన్నారు! సత్యమితిబ్రూయాత్ సత్యస్వరూపులు మీరని చెప్పబడుచున్నారు.

బ్రహ్మభగవానుడు : కిమ్ తత్ సత్యమ్-ఇతి? ఏమిటి ఆ సత్యము ?

బ్రహ్మలోకప్రవేశి : 

అట్టి నిత్యాత్మానంద స్వరూపులు మీరు ! యమ్ (త్) + సత్ = సత్యము ఏదైతే సర్వదా, సర్వకాల సర్వావస్థలయందును" ఉనికి (నేను ఉన్నాను కదా)”… అను రూపముగా (సత్ అయి) సర్వభూతముల యందు సర్వత్రా వేంచేసియే ఉన్నదో, దేనికి ’లేక పోవటము’ అనునదే లేదో… అదియే మీ పట్ల మనము చెప్పుకొను సత్యము.

మేమంతా మీరూపమే ! కాబట్టి మేమూ అఖండ సత్యమే! మీ యొక్క సత్యస్వరూపతేజస్సే భావనాత్మమైన ఈ త్రిజగత్తులు. కనుక ఇది (మీ స్వరూపమే కాబట్టి) ఈ జగత్తు కూడా సత్యమే !

ఇదంతా మీ సత్యస్వరూపమే! ఇదంతా మీరే ! మీ తేజో కిరణ విశేషమే నేను!

ఇదంతా మీరే అయి ఈ కనబడే అంతటికీ వేరై ఉన్నదీ మీరే ! అందుకే మీరు సత్యము, నిత్యము, కేవల సాక్షి, సర్వము కూడా !

బ్రహ్మభగవానుడు :  అదేమిటయ్యా ! నాచే సృష్టించబడిన జగత్తులు సత్యమేనా? మిధ్యకాదా ?

బ్రహ్మలోకప్రవేశి : ఈ జగత్కల్పనకు ఆవల పురుషుడవు, పూర్ణుడవు కదాస్వామి ! ఇక ఈ జగదృశ్యములంటారా ? ఇవన్నీ మీయొక్క పురుషకారమే ! పురుషునికంటే పురుషకారము ఎప్పుడూ వేరు కాదు కదా ! పురుషుడు సత్యమే, పురుషకారమూ సత్యమే కదా!

బ్రహ్మభగవానుడు : బాగున్నదయ్యా! సరేఁ! మరి, ఈ సర్వమునకు ఆవల గల పరమపురుషడనని, జలము యొక్క తరంగములవలె ఈ కనబడే విశ్వమంతా నాయొక్క తేజోరూప పురుషకార విలాసమేనని ఎట్లా తెలుసుకోగలిగావు? పరబ్రహ్మస్వరూపుడునగు నన్ను ఎట్లా సమీపించగలిగావు ?

బ్రహ్మలోకప్రవేశి : అదా స్వామీ ! ప్రాణేనేతి భ్రూయాత్ ! పెద్దలు - శాస్త్రములు మార్గము చూపుచుండగా ప్రాణోపాసనకు ఉపక్రమించాను. ప్రాణవాయు తత్త్వోపాసనచే మిమ్ములను సర్వగత ప్రాణస్వరూపునిగా ఉపాశించాను. ప్రాణ-దేవతగా ఆరాధించాను. సర్వమునకు పురుషునిగాను, పరమ పురుషునిగాను కర్మ-భక్తి-జ్ఞాన-యోగములతో ఉపాసించుటచేత మీయొక్క అపార కరుణ వీక్షణ నాపై ప్రసరించింది. అందుచేత మిమ్ములను దర్శించగలుగుచున్నాను.

బ్రహ్మభగవానుడు : ఓహో ! సర్వమునకు పురుషడను నేనేనా ? మరి ‘స్త్రీ’ అనబడునది ఏది ? కేన స్త్రీ నామాని ఇతి ? స్త్రీలింగమును ఏదిగా ఎట్లా తెలసుకుంటున్నావు?

బ్రహ్మలోకప్రవేశి : (ఏకో సత్ విప్రా బహుధా వదంతి ! ఏకమేవాఽద్వితీయమ్) బ్రహ్మ మొదలైన వేద ప్రతిపాదిత మహావాక్యములద్వారా ( వాచేతి) - “స్త్రీ-పురుషుడు, ప్రకృతి-పురుషుడు… ఈ ఉభయము పరబ్రహ్మమగుమీ లీలా విశేషములే !” అని గ్రహించుచున్నాను. ఆత్మజ్ఞులగు గురువుల వాక్యములు సృష్టికి - సృష్టికర్తకు గల అభేదమును మాకు విశదీకరిస్తూ వస్తున్నాయికదా స్వామీ ! (విశ్వమ్ విష్ణుః - ఈ విశ్వమే విష్ణువు). ఈ సృష్టి అంతా మీ కథా (నవలా) రచన! నవలలోని విశేషాలన్నీ ఆ రచయితకు వేరు కాదు కదా! సృష్టికర్తయగు మీకు ఈ సృష్టి వేరు కాదు.

బ్రహ్మ భగవానుడు : అట్లాగా ? మరి నపుంసకనామ - రూపములను ఏవిధంగా, ఏమని నీవు తెలుసుకొనుచున్నావు? కేన నపుంసక నామానీతి?

బ్రహ్మలోకప్రవేశి : హే జగద్గురూ ! దృశ్యములో నపుంసకమైనదంతా - మనస్సే అట్లా మననము చేస్తోంది - \i మనసేతి  అని గమనించుచున్నాను. మనస్సు మీ విన్యాసమే కదా! అందుచేత మనస్సు (Common sense) చే నపుంసకరూపములు మీరేనని విజ్ఞుడనై ఎరుగుచున్నాను.

బ్రహ్మ భగవానుడు బ్రహ్మలోక ప్రవేశి
- కేన గంధాని ఇతి? గంధమును ఎట్లా తెలుసుకుంటున్నావు.  ఘ్రాణేతి (ముక్కుతో) !
- కేన రూపాని ఇతి? రూపములు? చక్షువులతో (కళ్ళతో) !
- కేన శబ్దాని ఇతి? శబ్దములను?  శ్రోత్రేణ ఇతి ! చెవులతో !
- కేన అన్నరసాని ఇతి? అన్నరసము (రుచి)ని ఎట్లా ఎరుగుచున్నావు? జిహ్వ (నాలుక) తో !
- కేన కర్మాని ఇతి? కర్మలను ఎట్లా నిర్వర్తించావు? ఈ హస్తములతో ! హస్తాభ్యామితి !

బ్రహ్మ భగవానుడు : కేన సుఖ - దుఃఖేతి? సుఖ-దుఃఖములు దేనిచే నీకు ఏర్పడుచున్నాయి? ఏ రూపములుగా ఎరుగుచున్నావు?

బ్రహ్మలోకప్రవేశి : శరీరేణేతి! దేహముతో తాదాత్య్మము చెందిన సందర్భములలో మనస్సుకు సుఖ-దుఃఖములు అనుభవముగుచూ వచ్చాయి. తాదాత్మ్యము తొలగినప్పుడు సుఖము లేదు, దుఃఖము లేదు.

బ్రహ్మ భగవానుడు :  దేనిచేత ఆనందరతి అనుభవమవటం జరుగుతోంది ?

బ్రహ్మలోకప్రవేశి : అది ప్రజాపతి యొక్క జీవజాతి నిర్మాణ వేడుకచేత, ఉపస్థ - ఇంద్రియ సంబంధమై కలుగుతోంది.

బ్రహ్మ భగవానుడు : కేన ఏత్యా ఇతి ? నడకలు - నడతలు దేనిచేత నిర్వర్తించబడుచున్నాయి ?

బ్రహ్మలోకప్రవేశి : పాదములలో నిక్షిప్తమైన మీ యొక్క బ్రాహ్మీశక్తిచే పాదములు కదులుచూ నడక జరుగుతూ వస్తోంది.

బ్రహ్మ భగవానుడు : కామ సంకల్పములు, భావనలు దేనిచేత తెలుసుకుంటూ వస్తున్నావు? కేన ధియో విజ్ఞాతవ్యం కామానీతి?

బ్రహ్మలోకప్రవేశి : బుద్ధిచే కామము - సంకల్పములు తెలియబడుతూ, నిర్వర్తించబడుచూ వస్తున్నాయి.

బ్రహ్మ భగవానుడు : మరల మరొక్కసారి చెప్పు. ఈ కనబడే ఇంద్రియ విషయరూప దృశ్య జగత్తంతా - ఏ అర్థముతో పరమార్ధముతో - ఏమిటి? - అని తెలుసుకుంటున్నావు ?

బ్రహ్మలోకప్రవేశి : పితామహాఁ! లోకగురూ! పరబ్రహ్మమూర్తీ ! ఈ జగద్దృశ్య వ్యవహారమంతా కూడా నాయొక్క ఆపో (రసమయ) విన్యాసచమత్కారమే ! ఇదంతా నాదే ! నేనే!

ఇదంతా మీదే కూడా ! ఈ లోకాలు, లోకపాలకులు, లోకాంతర సర్వ విశేషాలు… ఇవన్నీ కూడా
మీయొక్క - నాయొక్క స్వస్వరూపమగు పరమానంద పరబ్రహ్మమే !

ఎవ్వడైతే ఇదంతా కూడా…, చిదానంద రూపముగాను, కేవల చిత్ రసాత్మకముగాను తెలుసుకొనుచున్నాడో… ఆతడు స్వయముగా సత్-చిత్-ఆనంద రూపమగు బ్రహ్మమే అగుచున్నాడు.

“ఇదంతా బ్రహ్మమే” అని ఆత్మజ్ఞుల - తత్త్వజ్ఞుల ఆప్త వాక్యానుసారముగా ఎరుగుచున్నాను.

కాబట్టి నేను బ్రహ్మమే ! మీరు బ్రహ్మమే ! నేనే ఇదంతా ! జీవాత్మగా - (నవలా రచయిత - నవలలోని పాత్రల వలె) నేను మీ యొక్క భావనా కల్పనను! కేవలాత్మగా - నేనే మీరు! నేను మీరే! నేను మీకు చెందినవాడనే! మీరే నా స్వస్వరూపులు! అహమ్ త్వమేవః తత్ త్వమ్| సోఽహమ్! త్వమేవాహమ్!


ద్వితీయ అధ్యాయము

ఏ ప్రాణతత్వము సర్వదేహములలోను బాహ్య - అభ్యంతరములలో వేంచేసి, సర్వమును శక్తియుతము, స్పందన యుతము చేయుచున్నదో, … అట్టి ప్రాణశక్తియే బ్రహ్మము - ప్రాణో బ్రహ్మేతి .. అని మన ఈ కౌషీతకీ బ్రాహ్మణోపనిషత్ చేతులెత్తి ప్రకటించుచున్నది.

అట్టి ప్రాణ రూపబ్రహ్మము (శక్తి) సంకల్పములను నిర్వర్తించు సందర్భములో మనో రూపమును దాల్చుచున్నది.

ఆ ప్రాణశక్తియే…,

మాటలు మాట్లాడుచున్నప్పుడు వాక్ ఇంద్రియముగాను,
చూచుచున్నప్పుడు చక్షురింద్రియముగాను,
వినుచున్నప్పుడు శ్రవణేంద్రియముగాను,

మొదలైనవిగా ప్రదర్శితము అగుచున్నది. ఈ విధంగా సర్వేంద్రియములు - ఇంద్రియ విషయములుకూడా తన స్వరూపమే అయివున్నట్టి ప్రాణమే బ్రహ్మము. ఎవ్వరైతే ప్రాణోపాసకులై ప్రాణతత్త్వమే దేహములోను - దేహ బాహ్యముగాను దర్శిస్తూ…. ఇంద్రియ దేవతలను తదితర సర్వజీవులను ప్రాణస్వరూపముగా భావిస్తూ, ఆస్వాదిస్తూ, ఆరాధిస్తూ ఉంటారో… ఆ సర్వదేవతలు తమతమ సంపదలను ఆయాచితంగా ఆ ప్రాణోపాసనా బ్రహ్మతత్త్వదర్శికి ప్రసాదిస్తూ ఉంటారు.

అట్టి ప్రాణతత్త్వమును ఎరిగిన ప్రాణోపాసనా రహస్య వేదులు
- ప్రాణశక్తిని బ్రహ్మముగా ఆరాధించువారై,
- తమ ఇంద్రియ సంపదలను, విషయ జగత్ దర్శనములను ప్రాణదేవుని ప్రదర్శనా రూపముగా గమనిస్తూ….,
- తమ ఇంద్రియ విషయానుభవములన్నీ ప్రాణోపాసనగా ప్రాణభగవానునికి బలిగా సమర్పించుచున్నవారై ఉంటున్నారు.

అందుచేత…,
“బిడ్డలారా ! శ్రోతలారా ! న యాచేత ఇతితత్ యథా గ్రామం భిక్షిత్వా ! సహజ ప్రాణాత్మ స్వరూపులగు మీరు ఇంద్రియ గ్రామములో ప్రకాశితులై, ఉండవచ్చు గాక! కానీ, ఇంద్రియ విషయములే పరమార్ధమైనట్లుగా జీవితమంతా అభిలషించుచూ రోజులు గడపటమనేది…,
ఒకడు సర్వసంపదలు కలిగియున్నవాడై ఉండి కూడా, తనదైన గ్రామములో తానే ప్రవేశించి బిక్షాటణమునకు ఉపక్రమించటము వంటిది (Begging at one’s own Doors). అని కౌషీతకీ బ్రాహ్మణోపనిషత్ గుర్తుచేయుచున్నది. ఇది గ్రహించి, “లభించిన వాటితో - తృప్తిచెంది ఉంటాను. ఇంద్రియ విషయ పరంపరలను ఆశించి ఆశించి యాచించి దత్తమ్ ఇతరులచే ఇవ్వబడు ఆయా సంపదల కొరకై ఇచ్ఛ కలిగి ఉండను”… అని గుర్తు కలిగినవారై జీవించండి. ఇంద్రియ విషయములను ఎవ్వరైతే యాచించుచూ ఉండరో, వారు భాగ్యవంతులే ! (కౌపీనవంతమ్ ఖలు భాగ్యవంతః). “ఇంకా ఎంతగానో నేను ఏవేవో దృశ్యజగత్తులలో పొందవలసినవి అనేకం ఉన్నాయి. అవన్నీ లభించుగాక! ఎట్లా లభిస్తాయోమరి?”… అని తలచువారు ఎల్లప్పటికీ యాచకులు గానే మిగిలిపోతున్నారు.

ఎవ్వరైతే ‘యాచన’ అనే స్వభావమును త్యజించినవారై ఉంటారో, … అట్టివారు దేవతలచే గౌరవించబడి, వారికి అవసరమైనవన్నీ ఆయా దేవతలచేత అయాచితంగానే ప్రసాదించబడుచున్నారు.

ప్రాణో హి బ్రహ్మ ! ప్రాణమే బ్రహ్మము ! అట్టి ప్రాణశక్తి సర్వదేహములలో అంతర్యామిగా ఉన్నప్పుడు (సర్వదేహములో అంతర్యామిగా ఉన్న ప్రాణశక్తిని దర్శించుచున్నప్పుడు)… ‘పైగ్యము’ అను పేరుతో పిలువబడుచున్నది. (పైగ్యయోగము).

అట్టి ప్రాణశక్తిరూప పరబ్రహ్మమే…
- నోటిలో ప్రవేశించినదై ‘వాక్కును పలికించుచున్నది. పలుకబడుచున్న పలుకులుగా కూడా (విషయములుగా కూడా) అగుచున్నది.
- కళ్ళలో ప్రవేశించి చూపు శక్తిగా ప్రదర్శితమై, చూడబడుచున్నదంతా కూడా స్వీయ ప్రదర్శనముగా కలిగి ఉంటోంది.
- చెవులలో వినికిడి శక్తిగా ప్రవేశించినదై, వినుటను స్పందింపజేస్తోంది. వినబడుచున్న సర్వశబ్ద స్వరూపమై కూడా ప్రకాశిస్తోంది.
- భావించు ప్రక్రియా శక్తిగా ఆలోచనల రూపమైనట్టి మనస్సును - ఆ ఆలోచనలకు విషయమైన మనో విషయముల (ఆలోచించబడుచున్న సర్వ ఆలోచనా విషయముల) రూపమును కూడా ధరించుచున్నది.

ప్రాణ దేవత వివిధ శక్తులతో దేహములో వినికిడి చూపు - స్పర్శ - ఆఘ్రాణము - రుచి మొదలైన ఆయా అధిదేవతా రూపములను దాల్చుచున్నది. ఆయా సర్వదేవతలు తమ దివ్యశక్తుల అనుభవములన్నీ తిరిగి ప్రాణశక్తికే సమర్పణము (బలి) చేయుచున్నారు.

ఈ విధంగా ప్రాణమే బ్రహ్మము ! జీవులంతా ప్రాణశక్తి స్వరూపులే ! జీవులంతా కూడా తమతమ జీవితాంతర్గతమైన ఇంద్రియానుభవాలన్నీ ప్రాణపరమాత్మకే సర్వదా బలిహరణము (సమర్పణము) చేయుచున్నారు.

ఈ రీతి అయినట్టి “జీవాత్మల ఇంద్రియ దేవతల సర్వానుభవములనూ కూడా - ప్రాణిశక్తికి బలిహరణము” అనే ప్రాణబ్రహ్మతత్త్వము గమనించినవారు ఈ ఉపనిషత్ చెప్పు బ్రహ్మతత్త్వము గ్రహించు వారై, ఇక ఇంద్రియవిషయ యాచనను కలిగి ఉండరు. ఇంద్రియ విషయములను, ఇంద్రియార్థములను తాను స్వీకరించక, పరమాత్మ (ప్రాణాత్మ)కు సమర్పించువాడు-ఇంద్రియాగ్రామమునందు సగౌరవించబడు వాడగుచున్నాడు.

ఆయాచిత ధర్మము (దృశ్యములో ఏదీ ఆశించకుండానే - బుద్ధియొక్క నిర్మలతను సంపాదించుకొనే నిమిత్తము మాత్రమే నిర్వర్తించబడు స్వధర్మము) నిర్వర్తించటము ఆత్మోపాసనయే అగుచున్నది.

ప్రాణతత్త్వమును తెలిసినవారు ప్రాణశక్తి భగవానునికి ఇంద్రియ విషయముల బలిగా సమర్పించినవారై మహత్ భాగ్యము పొందుచున్నారు. సర్వము పొందినవారై ఆనందయుతులగుచున్నారు.

ఊర్ధ్వలోకయానమునకై అగ్నోపాసనా విధి

చిత్రగార్యాయణి :  చంద్రలోకము నుండి తిరిగి భౌతిక లోకములకు రాకుండా ఊర్ధ్వగతిని, అభౌతికమగు ఆనందలోకములకు యానము ఉద్దేశ్యముగా కలవారు ఏ రీతిగా ఆగ్నోపాసనలకు ఉపక్రమించుటకై శాస్త్రములు సూచిస్తున్నాయో…. కొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఓ ఆరుణి గౌతమ - శ్వేతకేతు మిత్రులారా ! వినండి.

అగ్ని కార్యనిష్ఠ స్వీకరించువాడు నిండు పౌర్ణమి తిధి రోజున గాని, అమావాస్యనాడు గాని, శుక్లపక్షములో ఒకానొక పుణ్యనక్షత్రము రోజున గాని, ఏదైనా (విజయదశమి మొదలైన) ఒకానొక శుభదినమునగాని అగ్నికార్యవిధి (యజ్ఞకార్య విధి)ని నిష్ఠా భక్తులతో ప్రారంభము చేయుచున్నాడు.

ఒక పవిత్రమైన పరిసరములు గల యజ్ఞవేదికా స్థలమును ఎంచుకొనుచున్నాడు. ఆ పరిసర ప్రదేశములను పరిశుభ్రముగా, పవిత్రముగా తీర్చిదిద్దుకొనుచున్నాడు. సాలంకృతంగా చేయబడిన ఆ స్థలములో అగ్నిగుండమును నిర్మించుకొనుచున్నాడు. యజ్ఞ - అగ్నికార్యమునకు కావలసిన చక్కటి ఆకారము గల సమిధలను సిద్ధము చేసుకొనుచున్నాడు. ఒక శుభ తరుణములో మంత్రయుక్తముగా అగ్నిని ఆహ్వానించి, ఆ అగ్నిలో వేల్చుచున్నాడు. సువము (చెంచాగరిటతోను, చమసము (కొయ్యగరిట)తోను, (లేక) కంచుగరిట / పాత్రలో ఆజ్యము (నేయి)ని అగ్నిలో సమర్పిస్తూ యజ్ఞ శాస్త్రమంత్రములు నిర్ణయించి చెప్పు మంత్రోచ్ఛారణతో విధి - విధానములలో ఉపాసించాలి. యజ్ఞభావితులగు ఆయా దేవతా సంబంధమైన ఆహ్వాన సమర్పణ మంత్రములు గానం చేస్తూ నేయిని సమర్పించాలి. ఆ దేవతలను సాంగోపాంగముగా భావనచేస్తూ నేయిని అగ్నిలో వేయాలి. ఆయా దేవతలకు ‘స్వాహా’ అను శబ్దముతో ప్రాణాలు యొక్క అనురూపదేవతాభావనను ఆశ్రయిస్తూ సమర్పించాలి.

➤ ఓ ప్రాణస్వరూపమగు చక్షురింద్రియదేవతా ! చూపుకు అధిదేవతయగు ప్రాణస్వరూప సూర్యభగవాన్! స్వాహా ! ఇదిగో ! ఈ అగ్నిద్వారా ఆజ్యము స్వీకరించండి. మా చక్షుక్రియలన్నిటినీ, ఇదిగో… మీకు సమర్పిస్తున్నాము. మాకు ఐహిక సుఖములను, ఆముష్మిక సుఖములను ప్రసాదించండి.

➤ ప్రాణస్వరూపమగు శ్రోత్రేంద్రియ దేవతా ! స్వాహా ! అగ్ని ద్వారా ఆజ్యము స్వీకరించండి. మా వినుచున్న సర్వవిశేషాలు మీకు సమర్పిస్తున్నాము. మాకు ఇహ పరసుఖములు దయచేయండి !

➤ ఓ ప్రాణస్వరూపమగు మనోదేవతా ! స్వాహాఁ ! అగ్నిద్వారా ఆజ్యమును స్వీకరించండి ! దీనితోపాటే మా సర్వ ఆలోచనలను మీకు సమర్పిస్తున్నాము. మాకు ఇహ పర బంధములను, జ్ఞాన ప్రతిబంధకములను తొలగించండి !

ఈ విధంగా “ఇంద్రియములు - ఇంద్రియదేవతలు - ఇంద్రియ కార్యక్రమములు ప్రాణదేవతా రూపుడగు ఇష్టదైవమునకు చెందినవే”.. అను అంతర్భావన - అవగాహనలతో ’స్వాహాఁ’ శబ్దమును ఉపయోగిస్తూ అట్టి ’సమర్పణ’కు సంజ్ఞగా ఆజ్యమును అగ్నికి స్రువము చమసములతో సమర్పించే విధినిని, వేదమంత్రములను వేదములు మానవాళికి ప్రసాదిస్తున్నాము.

యజ్ఞకర్త ఈ విధమైన బాహ్య - అంతర ప్రక్రియతో ‘స్వాహాయేతి’ అని పలుకుచూ, అగ్నికి ఆజ్యము సమర్పించాలి. ఆ తరువాత, యజ్ఞవాటికలో శేషించే ధూమగంధమును (మసిని) ఒక్కొక్క అంగముపై పూసుకొంటూ “ఈ అంగముల వ్యాపారములన్నీ ఆయా అధిదేవతలకు, అధిదేవతల ద్వారా ఆయా వ్యాపారములు (Functions) ప్రాణశక్తికి సమర్పితమై, చివరికి ప్రాణాత్మను చేరినవగుగాక ! నేను ఆత్మసామీప్యతపొంది, దర్శించి ఆత్మచే ఆత్మస్వరూపుడనై ఆత్మయందు సుఖశాంతులు పొందుదునుగాక !" … అని యజ్ఞవిధులను ముగిస్తున్నాడు.

అట్టి యజ్ఞమును - ఏఏ ఐహిక (outward) - ఆముష్మిక (Inward) ప్రయోజనములను అభిలషించి, (లేక ఉద్దేశ్యించి) ఆ యజ్ఞకార్యము శాస్త్రవిధి అనుసారము అగ్ని-మంత్ర-దాన ధర్మముగ్ధంగా నిర్వర్తిస్తూ ఉన్నారో.. అట్టివారు - ఆయా ప్రయోజనములను తప్పక పొందుచున్నారు. (అనగా)…, అగ్నికి ఆహూతులను ‘స్వాహా’ శబ్లోచ్ఛారణతో సమర్పిస్తూ, దేహములోను - విశ్వములోను గల ఇంద్రియ - ప్రకృతి దేవతలకు సమర్పిస్తూ ఉండగా, వారంతా ‘జుహోతి’ శబ్దములను ఆజ్యముతో బాటుగా స్వీకరిస్తూ, ఆయా కోరుకొన్న ఫలములను యజ్ఞబద్దులై ప్రసాదిస్తున్నారు.

ఓ వాక్ దేవాతా ! వాచం ! తే మయి జుహోమి అసౌ స్వాహాఁ! ప్రాణం తే మయి జుహోమి అసౌ స్వాహా|

ఓ ప్రాణదేవతా! చక్షుదేవతా! శ్రోత్రం దేవతా! మనోదేవతా! జుహో తే మయి జుహోమి అసౌ స్వాహాయేతి ! - అని అంటూ దేవతల మహిమను, వారు ప్రసాదించిన శబ్ద - స్పర్శాదిగాగల ప్రాణశక్తులను తలచుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకొంటున్నారు. ప్రియమైన స్తోత్ర సంభాషణలతో వారు ఇతః పూర్వముగా ప్రసాదించిన విశేషములను మనసా-వాచా కర్మణా స్మరిస్తూ, తమతమ కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. విన్నపములను మనస్సుతోను, వాక్కుతోను విన్నవించుకుంటున్నారు. ఇట్టి యజ్ఞవిధిచే కోరినవి లభించగలవు.

దేహయజ్ఞశాల - అంతర ఆత్మయజ్ఞము

ఇప్పుడిక ఈ ‘దేహము’ అనే యజ్ఞశాలలో అంతరముగా నిర్వర్తించి అగ్నిహోత్రకార్యరూపమైన అంతర్యజ్ఞవిశేషాలు చెప్పుకొందాము.

ఏ సమయంలో ఈ జీవుడు మాట్లాడుచూ ఉన్నాడో, … ఆ సమయంలో ఈతడు ఊపిరి పీల్చటము లేదు.
ఆ సమయములో - ఆతడు ’శ్వాస’ను వాక్కులో ఆహుతి చేయుచున్నాడు.

ఆతడు శ్వాసపీలుస్తూ ఉన్నప్పుడు వాక్కును పలుకుటలేదు.
అప్పుడు వాక్కును - శ్వాసరూపమగు ప్రాణశక్తిలో ఆహూతిగా సమర్పిస్తూ - యజ్ఞము నిర్వర్తిస్తున్నవాడగుచున్నాడు.

ఈ విధంగా, ఈ జీవుడు జీవించి ఉన్నంతకాలము కూడా, అవిఛ్ఛిన్నంగా (Without a break) ఎల్ల వేళలా (మెళుకువ-నిద్రా సమయాలలో కూడా) ఒకదానియందు మరొకటి ఆహుతి చేస్తున్నంతకాలము ఈ జీవుడు సదేహి అయి జీవిస్తున్నాడు. అంతరంగమున ఈ జీవుడు నిర్వర్తిస్తున్న ఆహుతి కర్మలన్నీ విశ్వరచనా - యజ్ఞవిధిని అనుసరించియే ఉన్నాయి. పూర్వీకులగు విద్వాంసులు ఇది గమనించి, దృష్టియందు కలిగియున్నవారై…,
“అగ్నికి ఆజ్యము సమర్పిస్తూ ప్రాణ - ఇంద్రియ దేవతలను ఉపాసించి, తాము కోరుకొన్న ప్రకృతి సంపదలను, స్థితిగతులను సముపార్జించుకోవటము. ప్రకృతిని తమకు సానుకూల్యముగా సిద్ధించుకొనటము!”
… అనే యజ్ఞ విధిని సాధన ద్రవ్యముగా రచించి మానవాళికి ఉత్తమ గతుల మార్గముగా ప్రసాదించారు. దేహములోపల ఇంద్రియ నిగ్రహరూపంగా జరుపు యజ్ఞమునకు ‘ప్రాతర్ధనము’ అని పేరు.

ఈ దేహము యొక్క బాహ్య - అభ్యంతరములలో జరుగుచున్న - దేహి - దేహ - ఇంద్రియ దేవతా - జగత్ దృశ్య - - ఇటువంటి సర్వ వ్యవహారములు, యజ్ఞ విధివిధానములు, ఊర్థ్వలోకగతులు (Paths to Higher Plane) ఇవన్నీ కూడా బ్రహ్మమే ! సర్వము బ్రహ్మమే ! అట్టి బ్రహ్మమును ఈ దేహధారియగు జీవుడు ఉపాసించు విధి - విశేషమే ఈ బాహ్య - అభ్యంతర యజ్ఞ విధివిధానములు. అందుచేత ఈ ప్రక్రియా రూపమును “శుష్క అంగారమృక్" అను పేరుతో ఉపాసిస్తూ ఉంటారు. అనగా, నిత్యము సిద్ధించియే ఉన్న ఆత్మస్వరూపము సిద్ధించుటకై చేసే కర్మలు.

ఈ సృష్టి, ఇందలి సర్వజీవుల సర్వ అనుభవాలు.. ఇవన్నీ సర్వతత్త్వ ప్రదర్శనశీలుడగు ఆత్మభగవానునికి ఆత్మనివేదనలే ! బ్రహ్మము యొక్క శ్రేష్ఠత్వము, మహదత్వము కీర్తించటానికి, ఆత్మయొక్క తేజోవిభవములు ఆరాధించటానికే ఋగ్వేదములోని ఋక్కులు, (మంత్రములు), యజుర్వేదములోని యజస్సులు (దేవతావర్ణనములు), సామవేదములోని సామగానములు (ఛందోబద్ద స్వరములు), అధర్వణ వేదములోని ప్రకృతి శోభావర్ణనములు ఉద్దేశ్యిస్తున్నాయి.

ఇది గ్రహించి యజ్ఞవిధులు వేదములచే సశాస్త్రీయంగా రచించబడి - సూచించబడుచున్నాయి. యజ్ఞకర్త యజ్ఞము నిర్వర్తిస్తున్నారు. యజ్ఞకర్త - ఋత్విక్కులు, తదితర శ్రామికులు పాల్గొనువారు… వారంతా యశస్సు తేజస్సు పొందగలరు. వారంతా ఆత్మభావనచే, భౌతిక దృష్టులను త్యాగభావముతో దర్శించుచున్నప్పుడు, ఇక ఊర్ధ్వలోకములు చేరగలరు. స్వభావసిద్ధంగానే ఊర్ధ్వలోక అథి - ప్రత్యథి దేవతలు నిష్కామయజ్ఞకర్తలకు సుస్వాగతాలు పలికి, యజ్ఞకర్తకు ఊర్ధ్వ లోకములను సమర్పిస్తున్నారు.

“సర్వజీవులు పరబ్రహ్మము యొక్క సౌందర్య - ఐశ్వర్య - తేజో విభవములే”… అని గమనించి, యోగులు, ఇంద్రియ విషయ జగత్ దృశ్యమును దర్శిస్తూ నమస్కరించుచున్నారు. విద్వాంసుడగు అట్టి ఉపాసకుడు యశస్వి, తేజోమయుడు అగుచున్నాడు.

సర్వాత్మకుడగు ఆత్మభగవానుని ఉపాసించే ముఖ్యోద్దేశ్యము హృదయ పవిత్రతయే! ఉత్తమ భావన (Main Idea)లతో ఐష్టికములను (శాస్త్రములచే నిర్మితమగుచు, సూచించబడుచున్న యజ్ఞమంత్ర-విధి-విధానములను) నిర్వర్తించు యజ్ఞకర్త, ఆధ్వర్యుడు, తదితర యజ్ఞకార్యక్రమ నిష్ఠులు… యజ్ఞోపాసనా భావములచే పవిత్రులగుచున్నారు. వీరంతా కూడా స్వభావసిద్ధముగా సంసార భావములను అధిగమిస్తూ, వాటి నుండి సంస్కరించబడుచున్నారు. వేదములోని ఉపనిషత్ వాణిచే అట్టి సంస్కారము ’పరము’వైపుగా ఉద్దీథమగుచున్నాయి. వారు ఆత్మధర్మమును పుణికి పుచ్చుకొన్నవారై బ్రహ్మమే తామై ప్రకాశించుచున్నారు.

దృష్టియొక్క పరమ పవిత్రతచే
- సర్వము సృష్టికర్తయొక్క లీలా వినోదమగు సృష్టి ధర్మమయముగాను,
- ఋగ్వేదాంతర్గతమైనటువంటి ఋక్కులు శుద్ధసౌరభమయముగాను, ఋక్ (సత్య) మహిమ సమన్వితముగాను,
- యజుర్వేదాంతర్గతమగు యజస్సు (మంత్ర) తత్త్వమయముగాను,
- సామవేదాంతర్గతమై సామగానానంద ప్రదర్శనముగాను,
- త్రయీ విద్యాసమన్వితమగు ఆత్మతత్త్వ స్వరూప సౌందర్యముగాను, దర్శించుచున్నారు.

సర్వము ఆత్మమయముగాను, ఆత్మకు అభిన్నముగాను చూస్తూ సందర్శనానందము పొందుచున్నారు.

  1. వేదములచే అందింపడుచున్న అగ్నికార్యములయందు అంతర్గతమై రహస్యముగా దాగియున్న ఆత్మజ్ఞాన - ఆత్మస్తోత్ర - ఆత్మోపాసనా రసతత్త్వమును ఎరిగి నిర్వర్తించువాడు,
  2. దేహములో వేంచేసియున్న ప్రాణాత్మ భగవానుని తేజో విశేషములే ఇంద్రియ దేవతలని ఎరిగి, ఇంద్రియానుభవములన్నీ ఆత్మ - భగవానునికి పుష్పమాలగా సమర్పించు విధానమును ఎరిగి నిర్వర్తించువాడు

ఈ ఇరువురు కూడా ఆత్మ గురించి ఎరుగుచున్న మార్గములో ఉన్నవారే! క్రమంగా, ఆత్మయే (బ్రహ్మమే) తామై స్వయమఖండ ఆత్మతేజో రూపులై ప్రకాశించగలరు!

కౌషీతకీ బ్రాహ్మణ - త్రీణి ఉపాసనాని

బుద్ధి యొక్క నిశ్చలత - పరిశుద్ధతల కొరకై ‘3’ విధములైనటువంటి “కౌసీతకీ సూర్య త్రిసంధ్యోపాసన" అనబడు త్రిసూత్రయజ్ఞోపవీత సంబంధిత విశేషములను ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము. ఓ ఆరుణీ గౌతమ - శ్వేతకేతులారా! దయచేసి శ్రద్ధగా వినండి.

త్రిసూత్రములతో కూడిన యజ్ఞోపవీతమును చేతితో కలిగియుండి ‘3’సార్లు ఉదకపాత్రలోని ఉదకముతో ఆచమనం చేసి ఉదకమును సంప్రోక్ష్యం చేయాలి. (ఉదయం 6 గంటల సమయమున) ఉదయించుచున్న సూర్యుణ్ణి ఉద్దేశిస్తూ…

ఉదయం :  ఉద్యంతమ ఆదిత్యమ్| ఉపతిష్టేత్ యత్ వర్గోసి పాప్మానం మే ఉత్ - వృజ్ ఇతి, ఏతయైవ ఆవృతా మధ్యే సంతమ్ ఉత్-వర్గోఽసి || ఉద్యంతమ ఆదిత్యమ్! ఉదయించు ఆదిత్య భగవాన్! సూర్యదేవా! నా హృదయమునకు సమీపముగా ఉపవిష్టులయ్యెదరు గాక! నన్ను నాయొక్క సర్వ పాప - దోష దృష్టులనుండి ప్రక్షాళణము చేసెదరుగాక ! కాపాడెదరు గాక ! అని ఆరాధించాలి.

మధ్యాహ్నం : అట్లాగే మధ్యాహ్న సమయంలో (మద్యాహ్నం 12 గంటలకు) మధ్యాహ్న సూర్యుని ఉపాసిస్తూ, పాప్మానం అతద్వ్యపావాత్య ఏతైవా ఆవృతా స్తంయంతం యత్ వర్జోఽసి పాప్మానం మే సర్వం వాత్యేతి। "ఓ స్తయంతమాదిత్యా ! నీవు మా యొక్క సర్వమనో ఒ బుద్ధి దోషములను తొలగించ సమర్థుడవు ! మహాత్ముడవు ! అనాత్మ - పాప భావములనుండి మీరు నన్ను పరిశుద్ధము చేసి సంరంక్షించండి ! అని ఉపాసించుచుండెదము గాక ! -

సాయంత్రం : అదే విధంగా సాయంసంధ్య (సాయంత్రం 6 గంటల) సమయములో కూడా, యత్ అహో-రాత్రాభ్యాం పాపం కరోతి సంతత్ వృంక్తే |

“సాయంసూర్యభగవాన్। మేము మీ చైతన్య స్వరూపమును జ్ఞప్తి కలిగియుండి జ్ఞానులముగా అగుదుముగాక ! జడత్వము త్యజించెదము గాక ! - అని సాయం సంధ్యోపాసనను నిర్వర్తించెదము గాక!

ప్రతి నెల శుద్ధపాడ్యమి నుండి - పౌర్ణమి తిధి వరకు “చంద్రమసము”.

చంద్రమసము నందు దృశ్యమానమగు ఆకాశంలో సందృశ్యమానమగుచున్న ’చంద్రోపాసన’ నిర్వర్తించబడుగాక !

పచ్చటి గడ్డిపరకలను (హరిత తృణములను) చంద్ర భగవానునికి నివేదనగా సమర్పిస్తూ…,
“ఓ చంద్రభగవాన్ ! ఔషధ - వనస్పత ప్రదాతా! మీరు నా హృదయములో ‘మనస్సు’ రూపంగా సర్వదా వేంచేసి యున్నారు. ఎల్లప్పుడూ నా హృదయమునందు చల్లటి అమృత కరిణములతో ప్రకాశిస్తూ నా దృష్టిలోను, వాక్కులోను, భావములలోను మీ అమృత కిరణములను ప్రకాశింపచేయండి. నేను చేయు పౌత్రమఘము (నావారు నా సంతానము నా వంశము - నాకు సంబంధించినవారు) అనే భ్రమలనుండి, వాటి వలన కలుగుచున్న సంకుచిత భావములనుండి, దుఃఖములనుండి కాపాడండి. గురువై ఆత్మభావనను అనుగ్రహించండి !”

"యత్ యత్తే స్వసీమే హృదయమ్ అధి | చంద్రమసి శ్రితం |
తేన అమృతత్వమ్ అస్యేశానం | మాహమ్ పౌత్రమఘం రుదమితి।”

పై మంత్రమును ఉపాశించువారు వారి సంతతికూడా ఆచంద్ర భగవానుని చల్లటి కిరణములచే రక్షింపబడుచున్నారు. జాతపుత్రులు (పుత్రులు కలవారు), నజాత పుత్రులు (పుత్రులు లేనివారు కూడా చంద్రభగవానుని ఆత్మప్రజ్ఞాతత్త్వమును పై మంత్రముచే ఉపాసిస్తూ సర్వశుభములు పొందగలరు.

ఆపాయస్వ సమేతు తే ॥ సంతే పయాంసి సముయుంతు వా |
రాజా యమ్ ఆదిత్యామ్ ఆత్వా అంశుమ్ ఆప్యాయయంతే॥

ఓ చంద్రభగవాన్ ! మీరే మాకు ఆధారము! నన్ను మీ దరి చేర్చుకోండి | మీరు రస-ఆనంద స్వరూపులు. మీయందు సర్వ రసములు ప్రకాశించుచున్నాయి. సర్వశక్తి సమన్వితులు ! మీ రసములు మా యందు ప్రసరింపజేసి మా జీవితములను మధురముగాను, ఆప్యాయముగాను దయతో తీర్చిదిద్దండి ! మిమ్ములను ఉపాసిస్తూ ఉన్నాము.

అట్లే ఆదిత్యుడు (సూర్యుడు) మా మనస్సులను ఆప్యాయముగాను, జీవితమును పవిత్రముగాను తీర్చిదిద్దెదరుగాక !

ఈ విధంగా త్రిఛందోరూపమైన ఋక్కులతో ప్రత్యక్ష దేవతారూపులగు సూర్యచంద్రులకు స్తోత్రములు సమర్పించబడుగాక !

“ఓ సూర్య చంద్రులారా ! అనారోగ్యముల వలన గాని (ప్రాణ అసానుకూల్యతచేతగాని), మాపై ఇతరులు కలిగి ఉండే అల్పమైన అభిప్రాయములు వలన గాని, పశువులు ఇత్యాది జంతువుల వలనగాని మాకు కష్టములు రాకుండా కాపాడండి. ప్రాణశక్తి, సహ జనులు, బంధువులు, పశువులు మొదలైనవన్నీ మాకు అవిరోధమై, మా సాధన సంపత్తికి సానుకూల్యమగుదురు గాక ! మా దేహములోని దివ్యశక్తితత్త్వములు (దేవతలు), ఆదిత్యుడు కూడా మా చుట్టూ ఉండి రక్షించుచుండెదరు గాక ! అనువర్తులు, సానుకూల్యురు అగుదురుగాక ! మా కుడి చేయి ఉత్తమ కర్మలందు అనువర్తమై యుండుగాక !” అని సూర్య-చంద్రోపాసన నిర్వర్తించబడుచుండవలెను.

పౌర్ణమి తరువాత - కృష్ణపక్ష చంద్రోపాసన

పౌర్ణమి అయిన తరువాత, కృష్ణపక్ష చంద్రుడు తూర్పు దిక్కుగా కనబడుచున్నంత కాలము - చంద్రుడు ఈ రీతిగా ఉపాసించబడును గాక!

ఓ చంద్రదేవా! మీరు అమృత కిరణములతో ఆకాశములో ‘సోముడు’ - అను పేరుతో రారాజై ప్రకాశిస్తునారు. జ్ఞానానందస్వరూపులు ! గగన వీధులతో పంచముఖ ప్రజాపతియై విరాజిల్లుచున్నారు. చంద్రమసం దృశ్యమానమ్ ఉపతిష్ఠేత్, ఏత ఏవ ఆవృతి సోమో రాజాఽసి। విచక్షణః పంచముఖోఽసి।

మొదటి ముఖముతో - ఆకాశరాజువై జీవులందరికీ అత్యంత వాత్సల్యంతో ఔషధరూపంగా అన్నము (ఆహారము) ఇస్తున్నారు. తేన ముఖేన మాం అన్నాదం కురు ! మాకు ఆ ముఖముతో భౌతిక ఆహారము, బ్రహ్మజ్ఞాన ఆహారము కూడా దయచేయండి !

రెండవ ముఖముతో - పక్షి సంతతిని సంరక్షిస్తూ ఉత్తేజ పరచుచున్నారు. ఆ ముఖము మాకు పక్షిగణము ద్వారా అన్నప్రదాత అయి సర్వదా రక్షించెదరు గాక !

మూడవ ముఖముతో - అగ్ని (Heat) మీ మూడవముఖము. అగ్ని రూపులై ఈ జగత్తంతానిండి ఉన్నారు. ఆ ముఖముతో కూడా మాకు అన్నమును - అరుగుదలను వర్చస్సును ప్రసాదించండి.

నాలుగవ ముఖముతో - ఈ సర్వజీవుల భౌతిక రూపాలన్నీ మీ నాలుగవముఖము. ఆ ముఖముతో కూడా అన్నప్రదాత అయి వాత్సల్యము చూపెదరుగాక ! దృశ్యసౌందర్య రచనచే మా మనస్సును ఆహ్లాదపరచండి!

ఐదవముఖము - ప్రజాపతి - ఆత్మస్వరూపులై సర్వజీవుల హృదయాలలో సర్వదా ప్రకాశమానులగుచున్నారు. సర్వత్రా సర్వము అయినట్టి మీరు మాకు అన్న ప్రదాతలై కరుణించండి. ఈ సృష్టినంతా వరముగా ప్రసాదించుచున్నారు. మీ సృష్టి మాకు సానుకూల్యమగుచూ,… మమ్ములను రక్షించుచుండును గాక!

[అన్నము = ప్రకృతి / సర్వ ఇంద్రియ విషయ ప్రదర్శనలు / సృష్టి / భావన / అనుభూతులు]

ఈ విధంగా మీ పంచముఖములతో మా యొక్క అన్నమును (జగత్ దర్శనాకళను) ఆత్మామృతంతో పరమపవిత్రము చేయండి !

ఓ చంద్రభగవాన్ !
- మా యొక్క ప్రాణ - ప్రజ పశు సంపదలను రక్షించండి !
- మమ్ము ద్వేషించువారి - మేము ద్వేషించువారి ప్రాణ - ప్రజ - పశుసంపదలను కూడా రక్షించమని వేడుకొనుచున్నాము.

దేవతలు (ఇంద్రుడు - ఇంద్రియ దేవతలు) తమ తమ ఆవర్తములతో మమ్ములను రక్షించి శుభ - శాంతి - ఐశ్వర్యములు ప్రసాదించెదరు గాక ! బ్రహ్మవిద్యకు సంసిద్ధులముగా తీర్చిదిద్దెదరు గాక!

ఓ ఆదిత్యదేవా ! సూర్యభగవాన్!
మా చుట్టూ ఆవృతులై (While rounding up around us) మా యొక్క దైవీకార్యక్రమములను (Our Divine Schedules) అన్వావర్తము (activate) చేస్తూ ఉండండి ! ఈ దేహము మీది ! ఈ కుడి బాహువులు మీవి ! అందుచేత ఈ మీ కుడి బాహువులచే ఎల్లప్పుడూ మాచే పుణ్యకార్యములు చేయిస్తూ అనుగ్రహించండి ! ఈ చేతులు మీవే ! చేతలూ మీవే ! అందుచేత మేము సదా మిమ్ములను సంతోషపరచే కార్యక్రమములందే నియమించండి ! అల్ప-దుష్ట-ద్రోహ చింతనలు మా దరి చేరకుండా మీ తేజో కిరణములతో మమ్ము సదా సంరక్షించండి!

జీవిత భాగస్వామి (Life Partner) ఉపాసనా యజ్ఞము

అథ సంవేశ్యన్ జాయాయై హృదయమ్ అభిమృశేత్ ! యత్ తే సుసీ మే హృదయో హితమంతః |

ఓ శ్రోతలారా ! మీరు మీ జీవిత భాగస్వామిని (భార్యను / భర్తను పరమాత్మ ప్రసాదితంగాను, పరమాత్వ స్వరూపముగాను భావించి ఉపాసించండి. మీ జీవిత భాగస్వామి హృదయముపై (రోజుకొక్కసారి) అరచేతితో తాకుచూ…,
“ఓ జీవిత భాగస్వామీ ! నా హృదయముచే మిమ్ములను హృదయేశ్వరి (మరియు ) ప్రాణేశ్వరిగా భావిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రజాపతి (సృష్టికర్తకు) చెందిన వారు కాబట్టి ప్రజాపతి స్వరూపులుగా భావిస్తున్నాను. హితము కలుగజేయ వేడుకొనుచున్నాను. మీరు విద్యచే స్వతఃగా ఆత్మ స్వరూపులే! విద్వాంసులే ! ఆత్మయొక్క అంశయే ! నన్ను విద్వాంసునిగా (ఆత్మ విద్యను ఎరిగినవాడుగా) చేయండి ! మన సంతతికి ఎట్టి వ్యాధులు సోకకుండా రక్షించెదరు గాక !” అని ప్రార్థన చేయాలి.

ఈ విధంగా ఇల్లాలిని ఉపాసించువారికి, వారి సంతానమునకు కష్టములు ఉండవు ! (భార్యను దూషించువారి - భర్తను దూషించువారి సంతానము కష్టములు పొందగలరు - అని తలచబడును గాక !)

ఆత్మా వై పుత్రః - పుత్రోపాసనా యజ్ఞము

కుమారుని పరమాత్మ రూపముగా భావించటంచేత ప్రకృతి జనితమైన పుత్రవాత్సల్యమును ఆత్మోపాసనగా తీర్చిదిద్దుకోబడుగాక!

సాధన :  కుమారుని ‘మూర్థము’ (Fore face) ను కుడిచేతి వ్రేళ్ళన్నీటితో స్పృశించి, ముద్దుపెట్టుకొని, “పరమాత్మకు అభిన్నులై, పరమాత్మచే నియామకులైనట్టి నా దేహములోని దివ్యశక్తుల రూపులగు దేవతా ప్రసాదముగా నీవు నాకు పుత్రుడవయ్యావు! నాయనా ! నీవు నా హృదయమునుండి వికశించిన ఆత్మదేవుని స్వరూపమువు. మన ఇరువురము అఖండమగు ఆత్మయే సహజ స్వరూపముగా కలిగి ఉన్నాము. అందుచేత, నేనే నీవు, నీవే నేను! ఆత్మావై పుత్రః |

నీవు నిండు ఆయురారోగ్య ఐశ్వర్యములతో జీవితమును గడుపుచుండెదవు గాక ! - అని పలుకుచూ పుత్రుని (సంతానమును) దీవించును గాక !

బిడ్డా ! పుత్రా ! సుఖమును పొందుము. పదునైన బుద్ధి (Sharp Brain) కలవాడవు కమ్ము! బంగారు రంగుతో ఉత్తమ మనో బుద్ధులతో నిండు నూరేళ్ళు జీవించుము….. అని పుత్రుని పేరు చెప్పి, ఆతనిని వాత్సల్యముతో ఆత్మోపాసనాపూర్వకంగా స్పృశించాలి. ఆశీర్వదించాలి!

"ఏ మహిమచేత సృష్టికర్తయగు ప్రజాపతి సర్వజీవుల యొక్క అరిష్టములను, కష్టములను, బాధలను తొలగించుచున్నారో, … అదే విధంగా, ఆ మహిమచేతనే ఆత్మస్వరూపుడనగు నేను ఆత్మస్వరూపులగు నా బిడ్డల అరిష్టములను, కష్టములను, బాధలను తొలగించుచున్నాను.” అని చెప్పుచూ ఉచ్ఛరిస్తూ, భావిస్తూ ఈ క్రింది మంత్రము బిడ్డల చెవులలో పలుకును గాక !

“ఆత్మావై పుత్ర నామ్నా ! స జీవ శరదశ్శతమ్ | ఆసావితి నామాస్య | అశ్మాభవ | పరశుర్భవ | హిరణ్యం అస్తృతం భవః తేజోవై పుత్రనామాసి | స జీవ శరదశ్శతం | ఆసావితి నామాస్య గృష్ణాతి। యేన ప్రజాపతిః ప్రజాఃపర్యక్ గృష్ణాత అరిష్ట్య, … తేన త్వా పరిగృహ్ణామి |".

తన సంతానమును ఉద్దేశ్యించి

“ఓ సర్వశ్రేష్ఠుడవగు ఇంద్రభగవాన్! నన్ను మా సంతానమును అల్ప - పాప దృష్టులనుండి, ధ్యాసలనుండి, భావములనుండి కాపాడండి ! మా పుత్ర - పౌత్ర - ప్రపౌత్రులకు, వారి వారి సంతానమునకు రక్షకుడవండి ! శ్రేయోదాయకమగు సంపదలు ప్రసాదించండి ! వారికి బాధలు, వ్యధలు తొలగించండి ! ఓ సంతానమా ! మీరంతా కూడా ఉత్తమ మార్గాణ్వేషులై, దానము ధ్యానము - యజ్ఞము మొదలైనటువంటి దేవతలను సంతోషింపచేయు దైవీ కార్యక్రమములను ఏమరచకుండెదరు గాక ! అవి చక్కగా నిర్వర్తిస్తూ నిండు నూరేళ్ళూ వర్ధిల్లండి !” అని గోవు ఘీంకరించు రీతిగా పలుకుచుండెదరు గాక ! ఈ విధముగా అంటూ "ఓ సంతానమా ! ఆసావితి! ఆసావితి! ఆసావితి! మీరు సదా బ్రహ్మమే అయి ఉన్నారు సుమా !” … అని ’3’సార్లు వారందరి మూర్ధమును స్పృశిస్తూ ముద్దుపెట్టుకొనెదరు గాక !

దివ్యతేజో ఆరాధన

ఇప్పుడిక ఈ దేహములో బ్రహ్మమే సహజ స్వరూపముగా గల ఏఏ దేవతలు వేంచేసి దీపిస్తూ, ప్రకాశించుచూ ఉన్నారో,… వారిని ఆరాధించుచుండెదము గాక !

సర్వమ్ చంద్రమసి

నామ - రూపాత్మకమై - కదలుచుండు స్వభావముకలిగినదై - ఏదైతే మార్పు - నాశనము స్వభావముగా కలిగి ఉండి ‘మర్త్యో’ దృశ్యతే (మృత ధర్మసహితే, దివ్యతేజో ఆరాధన ఇతి మర్త్యా) … ప్రస్తుత వర్తమాత్రమానికి మాత్రము కనిపిస్తోందో, … అది చంద్రమస రూపశక్తియే ! (ఉదా : కదిలే దేహము)

ఏది సర్వము కదిలించుచుచు, తాను నామ రూపరహితమై యున్నదో అది కూడా చంద్రమసరూప శక్తియే !

కదిలేది - కదిలించేది - మార్పు చెందేది - మార్పు చెందనిదీ … రెండూ ఏకైక ప్రాణశక్తి యొక్క రూపములే ! బ్రహ్మమే !

వాయుమేవ తేజో గచ్ఛతి - వాయువే తేజస్సుగా అగుచున్నది

వాయుం ప్రాణా తావా - వాయువు ప్రాణశక్తి యొక్క రూపము !

ఏతాః సర్వదేవతాః వాయుమేవ | - దేహాంతర్గత - దేహబాహ్య దేవతలంతా ప్రాణశక్తితత్త్వమగు వాయురూపులే !

దివ్యశక్తులన్నీ (దేవతలంతా) ప్రాణవాయువు నుండి బయల్వెడలి, తిరిగి ప్రాణవాయు స్వరూపులై సశాంతిస్తున్నాయి.

వాయురూపులై ఉండటం చేత దేవతలు అమరులు, మరణము లేనివారు (ఈ జీవుల పట్ల దేహములుగా కనిపిస్తున్నవో?… ఇవి మరణ ధర్మము కలిగియున్నట్టివి).

అధిదైవత - ఆధ్యాత్మ ఉపాసన

దేవతలు సహజంగా వాయురూపులై ఉండటము,
వాయువు - ప్రాణతత్త్వమై ఉండటము,
ప్రాణశక్తి - బ్రహ్మమే అయిఉండటము
… ఈ విశేషమును  “అధిదైవతము ; ఆధ్యాత్మము”  అని కూడా చెప్పబడుచున్నది.

ఏదైతే “వాక్కు ప్రదర్శన శక్తి" గా ప్రకాశించుచున్నదో,… అది బ్రహ్మము యొక్క తేజస్సు. ఏదైతే మాట్లాడబడుచున్నదో (సంగతులు, కబుర్లు, కథానికలు మొదలగునవి) అది నశించవచ్చుగాక ! గతించవచ్చు గాక ! మార్పు-చేర్పులు చెందవచ్చు గాక! బ్రహ్మ తేజోరూపమైన ‘వాక్శక్తి’కి నశించటము, గతించటము అనునదే లేదు. అయితే వాక్ గా అనుభవమయ్యేదికూడా బ్రహ్మమే ! మరి, బ్రహ్మము సదా అద్వితీయము కదా!

ఏదైతే దృక్శక్తి (చూచుశక్తి)గా ప్రదర్శితమగుచున్నదో, … అది బ్రహ్మము యొక్క తేజోరూపము (లేక) ప్రాణశక్తిరూపము. ఏది కళ్ళకు కనిపిస్తూ ఉన్నదో, అది నశించబోతోంది (యత్ దృశ్యమ్ - తత్ నశ్యమ్). ఏది కళ్ళకు కనబడకుండా, కళ్ళతో చూపుశక్తి అయి ఉన్నదో అది ప్రాణశక్తి రూపము (లేక) బ్రహ్మతేజో రూపము కాబట్టి, … నశించుటయే లేదు. అయితే దృశ్యముగా కనిపించు వాస్తవ రూపము కూడా ప్రాణశక్తియే ! ప్రాణ బ్రహ్మమే మార్పు చెందు దృశ్యరూపముగా కూడా కనిపిస్తోంది.

ఏ బ్రహ్మము యొక్క తేజస్సు ప్రాణశక్తిగా ప్రదర్శిత మగుచున్నదో, … అయ్యదియే దేహములో వినికిడిశక్తిగా ప్రకాశమానమగుచున్నది. అనగా శ్రుత (వినికిడి) శక్తియే ప్రాణశక్తి రూపముగా గమనించబడుగాక ! అదియే మార్పు చెందు “వినబడువిషయములు”గా కూడా అగుచున్నది. ఈ విధంగా వినబడేదంతా పరబ్రహ్మతేజస్సే ! మార్పుచెందని వినికిడి శక్తి - మార్పుచెందే ‘వింటున్న మాటలు’ ఉభయము బ్రహ్మమే!

ఏది ప్రాణశక్తిగా ప్రకాశిస్తోందో,… అదియే మనోశక్తి (ఆలోచనాశక్తి)గా ప్రభావమగుచున్నది. "ఏది ఆలోచించబడుచున్నదో, అది మనోరూపమునకు (మనోశక్తి)కి వేరైనదికాదు. నిర్విరామంగా ఆలోచించబడుచున్న “ఆలోచనావిషయములు” కూడా … మనోరూపమే, కాబట్టి ప్రాణరూప పరబ్రహ్మమే ! ఆలోచనలు మార్పు చెందుతాయి, నశిస్తాయేమోగాని, ఆలోచనాశక్తికి నాశనము లేదు (అయినాకూడా ఉభయము బ్రహ్మమే ॥) !

ఆలోచనలు .. ప్రవర్తించినవై కొంతసేపటికి ఆలోచనాశక్తిలో ప్రవేశిస్తున్నాయి. ఆలోచనాశక్తి ప్రాణశక్తియందు, ప్రాణశక్తి ఆత్మయందు ప్రవేశించి సంశాంతిస్తూ ఉన్నాయి. మరల మరెప్పుడో బయల్వెడలుచున్నాయి.

ఆత్మతత్త్వము

ఆత్మనుండి - ప్రాణశక్తిని సర్వేంద్రియ దేవతలు - దేహము - విషయానుభవములు రూపుదాల్చుచు, మరల మరెప్పుడో వెనుకకు మరలి ఆత్మయందే ప్రవేశిస్తున్నాయి. ఆత్మ నుండి బయల్వెడలేదంతా ఆత్మకు భిన్నము కాదు. ప్రాణము తన జనన స్థానమైనట్టి అనంతమగు ఆత్మతత్త్వమునందు తన ఇంద్రియ దైవీశక్తుల రూపంగా ప్రదర్శనమవటము - ఆ దైవీశక్తులు తిరిగి ప్రాణమునందు ఉపసంహరణమవటము. తిరిగి మరొకప్పుడు బయల్వెడలటం … ఇవియే సృష్టి - స్థితి - లయ - పునరారంభ చమత్కారములు.

అయితే ప్రాణశక్తి ఇంద్రియ దేవతలు, జీవుడు (Experiences), దృశ్యము … ఇవన్నీకూడా ఆత్మ స్వరూపము కాని సందర్భమేలేదు.

సర్వము సర్వదా సర్వత్రా ఆత్మయే! కనుక ఆత్మనుండి ఏదీ బయల్వెడలటమూలేదు. వేరుగా ప్రకాశించటమనునదీ లేదు ! ఉపశమించటమూ లేదు. ఆత్మ సర్వదా యథాతథము.

బ్రహ్మతత్త్వమును ఈ రీతిగా తెలుసుకొనుచు, ఆస్వాదిస్తూ మమేకమగుచున్నట్టి బ్రహ్మతత్త్వజ్ఞాని (లేక) విద్వాంసుడు ఈ జగత్ దృశ్యము గురించి బ్రాహ్మీదృష్టితత్పరుడై ఉంటున్నాడు. “ఈ ఇంద్రియ విషయపరంపరల రూపమగు దృశ్యము, ఇంద్రియ దివ్యశక్తి స్వరూపులగు దేవతలు, ప్రాణశక్తి … సర్వము స్వస్వరూప బ్రహ్మమే!” … అని అనుభూతపరుచుకుంటూ, చిరునవ్వు చెదరక చూస్తున్నాడు. అట్టివాడు - వింధ్య హిమాలయ పర్వతముల మధ్యగానూ, ఆవల - ఈవలగాను ఉన్నదంతా తన యొక్క ఆత్మవైభవముతో - గాలి తృణమును (గడ్డిపరకను చుట్టి ఉన్నట్లుగా చుట్టి వేయగలడు. “నా ఆత్మశోభయే వింధ్య - హిమాచల పర్యంతము. ఇంకా ఆవల - ఈవల చుట్టుకొని ఉన్నది" … అను మననమును స్వభావ సిద్ధపరచుకొన్నవాడై ఉంటున్నాను.

ఎవ్వరు మనము వర్ణించుకొంటున్న సర్వతత్త్వ స్వరూప పరబ్రహ్మమును ద్వేషిస్తారో, వారు తమను తామే ద్వేషించుకొన్నట్లు సుమా ! ఎందుకంటే, తాము బ్రహ్మమే అయి ఉన్నారు కాబట్టి.

నిఃశ్రేయసా - ఆదానము - ప్రాణేశ్వరత్వము

చిత్రగార్యాయణి :   ఓ ఆరుణిగౌతమ - శ్వేతకేతు ఆత్మానంద స్వరూపులారా ! నిః "శ్రేయ-ఆదానము” అని చెప్పబడు ఆత్మతత్త్వ వివరణ రూపమగు ఒక ప్రాచీనమైనట్టి చమత్కార విశేషమును చెప్పుకుంటున్నాము. వినండి!

ఒకానొక సందర్భములో చెవులు - కళ్ళు - ముక్కు - చర్మము - నోరు (శబ్ద స్పర్శ రూప రస గంధ అధిష్ఠాన దైవశక్తులు, ఆరవదగు మనస్సు) - ఇవన్నీ ఒక చోట సమావేశమైనారు. ఎవరికి వారే - “ఈ దేహము నా వలననే శ్రేయస్సు పొంది జీవించగలుగుతోంది. నేనే లేకుంటేనా, … ఈ దేహము ఎట్లా నిలుస్తుంది ? నిలువదు“ … అని తమతమ ప్రత్యేకతలను, అగత్య - అనివార్యత్వముల గురించి ఎలుగెత్తి చెప్పుకొననారంభిస్తున్నాయి. వాదించుకోసాగాయి. ‘మేమే గొప్ప’ అంటూ క్రమంగా పోట్లాడుకోసాగాయి. “మేముంటేనే జీవుడు” - అని అనసాగాయి.

అప్పుడు అవన్నీ తమ గొప్పతనము తెలియజేయటానికై అప్పటికప్పుడే భౌతిక దేహమునుండి ఒక్కొక్కటిగా బయల్వెడలసాగారు.
అప్పుడు దేహములో శ్వాస నిలిచిపోయింది.

మొట్టమొదట - ఏనం వాక్ ప్రవివేశ - నోటిలో వాక్కు ప్రవేశించింది. నోరు శబ్దములు చేయసాగింది. అవి శబ్దములేగాని అర్థసహితమగు మాటలు కావు. భావన తోడుగా లేదు. ’బే-తే-కే-మ్-డే-గే’… అంటూ నోరు శబ్దములు మాత్రం చేయసాగింది.

ఆ తరువాత ‘చూపు’ కళ్లలో ప్రవేశించింది. కళ్ళు చూడగలుగుతున్నాయి. దేహములో వాక్కు - చూపు పనిచేయసాగాయి. అయితే ఆ రెండింటికి ఎటువంటి సమన్వయము లేదు. ఎదురుగా ఉన్నది చూడగలుగుతున్నాయి గాని “ఎందుకు - ఏమిటి - ఎట్టిది బాగు - ఓగు” ఇవ్వేమీ అనుభవంగా లేకపోయినాయి.

అప్పుడు శ్రోత్రము (వినికిడి శక్తి) చెవులలో ప్రవేశించింది. దేహము మాట్లాడగలుగుతోంది, చూడగలుగుతోంది, వినగలుగుతోంది, ఆలోచనలు చేయగలుగుతోంది. అవి సమన్వయమై కలిసి పనిచేయడం లేదు. శబ్దము - చూపు - వినికిడి ఆలోచన…. ఇవన్నీ - వేటి పనిలో అవి ఉన్నాయి. ఒకదానితో మరొకటి సంబంధము లేకపోయింది.

అట్టి పరిస్థితిలో ప్రాణశక్తి దేహములో ప్రవేశించింది. వెంటనే ఆ దేహము ఇంద్రియములు మనస్సు జీవశక్తి పొందినదైనది. ఆ జీవుడు సర్వేంద్రియములను సమన్వయించుకొని దేహమును ఉపయోగించుకోగలిగాడు. ప్రాణశక్తితో ఇంద్రియ శక్తులు శ్రేయస్సు పొందసాగాయి.

అప్పుడు ఇంద్రియ దేవతలంతా మనస్సుతో సహా, “అవును, మనకు త్రాణ ప్రాణశక్తియే ! ప్రాణశక్తి ఈ దేహములో ప్రవేశించకపోతే మనకు క్రియాశక్తి, ప్రయోజనశీలత్వము లభించవు. కనుక దేహములో ప్రాణ దేవతయే (ప్రాణశక్తియే) అన్నిటికంటే శ్రేష్ఠము. ఉన్నతము” … అని అంగీకరించారు.

అంతేకాదు “మనకు ఆధారము - ఆధేయము కూడా ప్రాణేశ్వరుడే!” అని తలచి, ప్రాణదేవతకు తమను తాము సంపూర్ణముగా సమర్పించుకోసాగారు. “మేము ప్రాణదేవతయొక్క ప్రేరణ స్వరూపులము. ప్రాణదేవత యొక్క కళలము (We are the artistic exhibition of PRANA ENERGY) అను భావమును పొందసాగాయి. ప్రాణేశ్వరునితో మమేకమై, ప్రాణరూపమగు వాయువునందు ప్రతిష్ఠితులైనారు. భౌతిక దేహ బాహ్య విషయ - భావనా సంబంధమైన బంధనములను త్రెంచుకొని ఆత్మాకాశమునందు (ఆత్మభావనయందు) ప్రవేశించారు. ప్రాణశక్తితో సహా ఆత్మాకాశమునందు ఏక-అఖండరూపులైనారు. విషయములను ఆత్మస్వరూపముగా దర్శిస్తూ పూర్ణత్వమును పునికి పుచ్చుకోసాగారు.

ఓ మిత్రులారా ! ఎవ్వరైతే - “ప్రాణాత్మయే సర్వోతృ్కష్టమైనది. ఏకము - అఖండము అగు ఆత్మయే పంచప్రాణములుగా, సర్వేంద్రియములుగా, విషయములుగా ఆయాధర్మములను దృష్టిలో పెట్టుకొని పిలువబడుచున్నది” … అని గ్రహిస్తారో, దర్శిస్తారో, (ఆత్మతో) మమేకమౌతారో, … వారు స్వయముగా ఆత్మత్వమును ప్రాప్తించుకొనుచున్నారు. (బ్రహ్మైవ - న బ్రహ్మవిత్). అట్టి మార్గములో ఆ ఇంద్రుడు మొదలైన దేవతలు, మనస్సు ఏ అమృతత్వమును పొందినారో, అట్టి అమృతానందమును ప్రజ్ఞావంతులమై మనము కూడా పొందగలము. పొంది అమరులమై (మృత్యు పరిధులను దాటివేసిన వారమై) దివ్య లోకములు చేరి ఆనందించగలము.

పిత్రు - పుత్ర యజ్ఞము (భారసాలోపాసన)

ఇప్పుడు .., తండ్రి (పరమాత్మ సంజ్ఞ) పుత్రుని (జీవాత్మసంజ్ఞను) పిలచి ఆతనితో కూడి యజ్ఞమును నిర్వర్తించు తత్త్వజ్ఞాన వాఙ్మయములోని ఒకానొక విధి గురించి మనం చెప్పుకుంటున్నాము. (పరమాత్మ తండ్రిని, జీవాత్మ పుత్రుడని, ఆత్మ ఉభయత్రా ఏకము అని - విశేష వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించి చెప్పటం జరుగుతోంది).

ముందుగా తండ్రి ‘పుత్రయజ్ఞము’ నిర్వర్తించటానికై సంసిద్దుడగుచున్నారు. యజ్ఞ ప్రదేశమును ఎన్నుకొని అక్కడ గడ్డి మొదలగునవి తొలగించి, యజ్ఞశాలను - యజ్ఞవేదికను తయారు చేసుకొనుచున్నారు. యజ్ఞస్థలమునకు బయటకూడా పరిశుభ్రముగా చదునుగా చుట్టూగల వాతావరణము యజ్ఞ సానుకూల్యముగా చేసుకొనుచున్నారు.

జలకుంభములను (పవిత్రనదీజలముతో కూడిన నీటికుండ)ను వేదికై (అభిషేకాదులకొరకై) తగిన స్థానముతో అమర్చుకొనుచున్నారు. ఇక తండ్రి కుమారులు (విశేషార్థంగా పరమాత్మ-జీవాత్మ The Abosolute ’self and the self in the incident) ఎదురు బొదురుగా ఆశీనులగుచున్నారు. అగ్నిగుండములో అగ్నిని మంత్రముగ్ధముగా ఆహ్వానించి యజ్ఞకార్యము (అగ్నికార్యము) నిర్వర్తిస్తున్నారు. అట్టి యజ్ఞకార్యము-ఆహుతులు-ఇవన్నీ ముగిసిన తరువాత…. ఒకరికొకరు అభిముఖముగా ఆశీనులగుచున్నారు. తండ్రి - కుమారుని రసేంద్రియము (నాలుక) మొదలుకొని కళ్ళు, చెవులు, పెదిమలు మొదలైన సర్వజ్ఞానేంద్రియములు బ్రహ్మభావనతో స్మృశిస్తున్నారు.

పిత్రు దేవునిచే ప్రదానము - పుత్రునిచే స్వీకారము

పిత :  బిడ్డా ! నా దేహములోని దేవతలచే ప్రాసాదితుడవగు మమజీవాత్మ స్వరూపా! నా ఆత్మ ప్రతిబింబమా ! నీలో నా వాక్ దేవతయొక్క అనుజ్ఞతో నాయొక్క వాక్కును నీయందు ప్రవేశింపజేస్తున్నానయ్యా !

పుత్రుడు :  పితృదేవా ! మీచే ఇవ్వబడు వాక్ శక్తిని నేను పుచ్చుకొనుచున్నాను.

పితౌవాచ।  పుత్రౌవాచ।
పుత్రా ! నా లోని ప్రాణశక్తిని నీయందు ప్రవేశింపచేస్తున్నాను.
పితృదేవా ! మీరు అనువర్తింపచేస్తున్న ప్రాణశక్తిని నేను స్వీకరించుచున్నాను.
పుత్రా ! నాలోని చక్షు (చూపు) శక్తిని నీయందు ఉంచుతూ, నీకు అందిస్తున్నాను.
నాన్నగారూ ! మీరు ప్రసాదిస్తున్న చక్షు శక్తిని నేను స్వీకరించుచున్నాను. సవిస్తరింపజేసుకొనుచున్నాను.
పుత్రా ! నాలోని శ్రోత్ర (వినికిడి) శక్తిని నీకు అందిస్తున్నాను.
పితృదేవా ! మీరు అందించే శ్రోత్ర శక్తిని నేను స్వీకరించుచున్నాను.
బిడ్డా ! నా మనోశక్తిని నీయందు ప్రవేశింపజేస్తున్నాను.
తండ్రీ! మీరు ప్రవేశింపజేస్తున్న మనోశక్తిని నేను పొందుచున్నాను.
నాలోని అన్నరసదేవతా రూపమగు జిహ్వేంద్రియతత్త్వమును నీకు అందిస్తున్నాను.
జిహ్వేంద్రియ శక్తిని నేను పుచ్చుకొనుచున్నాను.
నాయొక్క కర్మఫలములను నీకందిస్తున్నాను. నేను పుచ్చుకొనుచున్నాను.
నా సుఖ-దుఃఖములను నీకు ఇస్తున్నానయ్యా ! నేను పుచ్చుకొనుచున్నాను.
నాయొక్క పునః ప్రజా జనకము (Reproductive) అగు ఆనందరతిని నీకు జేర్చుచున్నాను.
మీ నుండి ఆనంద రతి - సంతతివిధిని నేను స్వీకరించుచున్నాను.
నా మనస్సును నీకు అందిస్తున్నాను.
మీ మనస్సును నేను పొందుచున్నాను.
ధీ (బుద్ధి) శక్తిని, తెలుసు కొనువ్యవస్థను, ఏదో ఒకటి కావాలి - చేయాలి అనే కామశక్తిని నీకు ఇచ్చుచున్నాను.
మీరు ఇస్తున్నట్టి - విజ్ఞాతవ్య - కామ శక్తులను నేను పుచ్చుకునుచున్నాను.
కుడివైపు తిరుగు ! నిన్ను మంత్ర మనన ధ్యాస కలవానిగా శక్తిని యిచ్చుచున్నాను.
కుడివైపు తిరిగి మీ ప్రసాదముచే సమంత్రితయుతుడను అగుచున్నాను.

ఈవిధంగా తండ్రి బిడ్డకు తనయందలి దైవీతత్త్వముల, విభవములను పుత్రునికి ప్రసాదించుచున్నారు. అప్పుడు తండ్రి పుత్రుని ఈ రీతిగా దీవిస్తున్నారు.

ప్రియపుత్రా ! బిడ్డా ! మమాత్మానంద స్వరూపా !
- బ్రహ్మవర్చస్సును పొందుము.
- అన్నము (ప్రకృతి - బ్రహ్మము)ను పొందినవాడవగుము.
- కీర్తిమంతుడవయ్యెదవు గాక !

ఇంకా కూడా, పుత్రుని ముఖముపై, తన ముఖముపై వస్త్రమును కప్పి …,
“ఓ మమాత్మా-అభిన్న స్వరూపా ! స్వర్గము మొదలైన ఉత్తమ ఊర్ధ్వలోక మార్గములు నీకు లభించునుగాక ! నా సర్వస్వము నీకు సమర్పిస్తున్నానయ్యా ! నేను జీవించి ఉన్నప్పుడు, నా ఈ భౌతిక దేహ పతనానంతరము కూడా నా యందలి తేజస్సు నీయందు ప్రవేశించి, నిన్ను పవిత్రుని చేయుచుండునుగాక ! దివ్య తేజో సంపన్నుడవై లోక శ్రేయస్సును దృష్టిలో కలిగి జీవించెదవు గాక ! ‘జీవితము’ అనే బ్రహ్మదేవప్రసాదితమైన మహత్తర అవకాశమును పరిపుష్ఠి చేసుకొనెదవుగాక ! సద్వినియోగపరుచుకొనెదవు గాక”
- అని తండ్రి పుత్రుని దీవించుచున్నాడు.

ఇతి పిత్రు - పుత్ర యజ్ఞః ||


తృతీయ ఆధ్యాయము

ప్రతర్దన మహేంద్ర సంవాదము

చిత్రగార్యాయణి :  ఓ ప్రియ ఆరుణిగౌతమ - శ్వేతకేతు ప్రియ మమాత్మానంద స్వరూపులారా ! ఇప్పుడు ఆత్మోపాసనను విశదీకరించే “ప్రతర్దన - మహేంద్ర సంవాదము”ను సందర్భోచితం కాబట్టి చెప్పుకొనెదము గాక !

ఒకప్పుడు దేవ - దానవుల మధ్య గొప్ప యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో దేవతల ఆహ్వానముపై ప్రతర్దనుడు అను దివోదాసీ పుత్రుడు దైవోదాసుడు దానవులతో యుద్ధం చేసి దేవతల విజయానికి సహకరించారు. ఆతడు తన సేనలతో దేవతలకు విజయము చేకూర్చినందుకు అందరూ ఎంతగానో మెచ్చుకున్నారు. దేవతలకు అధిపతియగు మహేంద్రుడు ప్రతర్దనుని సన్మానించదలచి తన అంతఃపురానికి ఆహ్వానించాడు.

మహేంద్ర భగవానుడు : ప్రతర్దన ! తే వరం దదానీతి ! ఓ ప్రతర్దనా ! నీవు దేవతా విజయమునకు అందించిన సేవలకు మేమంతా సంతోషించుచున్నాము. నీకు ప్రియమైన వరము ఏదైనా ఇచ్చి, నిన్ను సంతోషింపచేసి తిరిగి భూలోకమునకు పంపదలచుచున్నాము. కోరుకో !

ప్రతర్దనుడు : హే మహేంద్రభగవాన్ ! నేను దేవతలకు సేవాతత్పరుడనై భక్తితో యుద్ధములో పాల్గొన్నాను. ఏదీ కోరికాదు. అయినాకూడా, మహనీయుల ఆజ్ఞను తిరస్కరించలేము కదా ! అందుచేత, “మానవులమగు మాకు ఏదైతే మహత్తరమైన హితము కలుగజేయగలదని అనుకుంటారో, యమ్ త్వమ్ మనుష్యాయ హితతమమ్ మన్యసీతి - అది మీరే యోచించి, నాకు శుభము కొరకై ప్రసాదించండి.

మహేంద్రుడు : అత్యంత హితమైనది అని నేనే నిర్ణయించి వరప్రదానము చేయాలని … అడుగుచున్నావుకదా ! ఏది ఉత్తమోత్తమమో అది నాకు నేనుగా నిర్ణయించటము మర్యాద కాదయ్యా ! నీకుగా నీవు నీకు కావలసిన ఏదైనా వరము కోరుకో ! నేనే నీకొరకై నిర్ణయించి నీకివ్వటమనేది అతిథి మర్యాద అవుతుందేమో గాని, వరప్రదాన విధానము కాదు.

ప్రతర్దనుడు : స్వామీ ! మీరు మహత్ ప్రజ్ఞా స్వరూపులు. త్రిలోకములకు అధినేతలు. సచ్చిత్ ఆనంద స్వరూపులు. “ఖలు ఇంద్రః సత్యాదేవాయ | సత్యమేవ మహేంద్రః ! మహేంద్రుడు! సత్యము ఎరిగినవారు. సత్యస్వరూపులు” … అని ఉపాసకజనులు మిమ్ములను వేద సూక్తులతో యజ్ఞ యాగములతో స్తోత్రము చేస్తూ ఉంటారు కదా ! మరి సత్యము ఏదై ఉన్నదో, అద్దానిని నాకు బోధించమని వేడుకుంటున్నాను. మీయొక్క సత్యస్వరూపమేమిటో, ఎట్టిదో వివరించమని నా అభ్యర్ధన !

మహేంద్ర భగవానుడు : నాయనా ! నీవు తెలివిగా పరమసత్యమగు పరబ్రహ్మము గురించియే తెలుసుకోవాలనుకుంటున్నావు. నాకు సంతోషము కలుగజేస్తోంది.

నేను నిత్యము, సత్యము అగు పరబ్రహ్మ స్వరూపుడను. సర్వేంద్రియుడనగు నేను పరబ్రహ్మమే సహజ స్వరూపముగా కలిగి ఉన్నాను. సర్వదేహములలో వేంచేసియుండుట చేత సర్వజన ప్రియుడను ! నన్ను నీ ఆత్మ స్వరూపముగా ఎరుగుము. అంతేగాని బాహ్యమగు ఒక వ్యక్తిగా కాదు. ఎందుకంటే, నీవు అదియే ! తత్త్వమసి ! మూడు ముఖములుగల త్వాష్ణుని (వృత్రాసురుని) సంహరించినవాడను. అనగా జాగ్రత్ - స్వప్న - సుషుప్తును అధిగమించి, ఆవలగల తురీయ స్వరూపుడను! త్రివృత్తులను జయించిన వాడను! అవాఙ్ముఖుడను. వాక్కుకు ఆవల గల సర్వదేవతా స్వరూపుడను. ఇంద్రియములకు ఈవల - ఆవల కూడా ప్రకాశమానుడగుచున్నవాడను.

సాలావృతములను (అడవికుక్కలను - వేదములను) అతిక్రమించినవాడను. త్రిలోకాధిపత్య ధర్మము నిర్వర్తిస్తూనే, ప్రతిఒక్క జీవుని ఆత్మస్వరూపముగా వెలుగొందుచున్నవాడను. భక్తజనులకు అధీనుడనై, వారిని సేవిస్తూ శుభములు కలుగజేయువాడను. భక్తులకు కావలసినది ఇవ్వటము నా స్వభావము. అందుచేతనే మహాభక్తుడగు ప్రహ్లాదుని ఇష్టమేమిటో గ్రహించి ఆయన పాలనలోని ప్రజలందరికీ ఆయన అడుగకుండానే దివ్యలోకములను అనుగ్రహించాను. అంతరిక్షములోని పౌలోమజనులకు, భూమిపై కాలకాశ్యులు మొదలగు వారికి భక్తజన పరాధీనుడవై దివ్యలోకములను ప్రాప్తింపజేశాను. ఈ విధంగా భక్తులకు దాసానుదాసుడను. అనురక్తుడను. నన్ను ప్రేమించు వారికి ‘ప్రేమ’ను అందించువాడను!

నీవు నా సత్య స్వరూపము గురించి అడిగావు కదా ! విను.

నేను సర్వజీవుల సహజ స్వస్వరూపమే అయి ఉన్నాను. అందుచేతనే ‘మహేంద్ర’ (ఇంద్రియముల మహత్ స్వరూపము) అని పిలువబడుచున్నాను. లీలగా ఈ దేవ - దానవ యుద్ధమువంటి ఆయా గెలుపు-ఓటముల కల్పనలచే వినోదించువాడను. ఎవ్వరైతే నా యొక్క తమయందలి మహేశ్వరతత్త్వమును తెలుసుకుంటారో, అట్టివారు ఇక ఇంద్రియ వ్యవహారములచే బద్ధులు - నిబద్ధులు కారు. ఈ జీవులలో కొందరు మాతృవధ, పితృవధ, దొంగతనము, భ్రూణహత్య మొదలైన మహాపాతకములు చేసి ఉన్నప్పుడు కూడా వారు గనుక తమయందే వేంచేసి యున్న మహేంద్రాత్మతత్త్వమును శాస్త్రసాధనల సహాయంతోను, గురుముఖతఃగాను, స్వకీయవిచారణతోను తెలుసుకుంటారో, ఉపాసిస్తారో, దర్శిస్తారో, వారందరిని నేను కాపాడు వ్రతము కలవాడను. అందుచేత వారిక దుష్ట-పర్యవసానముల గురించి భయపడవలసిన అవసరము లేదు. ఆత్మజ్ఞానముచే వారు నావలన ఉత్తమలోకములు పొందగలరు.

ఓ ప్రతర్దనా! సర్వజీవులతో ప్రాణ స్వరూపుడనై వెలుగొందుచున్నాను. త్వమేవాహమ్! నీవుగా ఉన్నది నేనే! కనుక “నాకు కనబడే ఈ సర్వజీవులలోని కేవల ప్రజ్ఞా రూపుడను నేనే" - అని నిన్ను నీవు గ్రహించు. జీవుల ఆయువు రూపముగా, వాయువు (ప్రాణము) రూపముగా, అమృత స్వరూపముగా నన్ను దర్శించు.

ప్రాణమునకు కూడా ప్రాణమైయున్న వాడను. ప్రాణఃప్రాణోవా ! ప్రాణేశ్వరుడగు నేను ఈ జీవజగత్తు - జీవుడు కూడా ! అట్టి ప్రాణప్రాణము అమృత స్వరూపము. మార్పు (మృతము) లేనిది.

ప్రియ ప్రతర్దనా ! ఎవ్వరు నీకు జీవాత్మగా - గుణసహితులై కనిపిస్తున్నారో … వారంతా స్వతఃగా అమృతస్వరూపులేనయ్యా ! అట్టి జీవాత్మ ఈ దేహములలో ప్రవేశించి ఒక్కొక్క భౌతికదేహములో ఉండి, ఆ దేహములో శ్వాస ఉన్నతంవరకు జీవిస్తున్నాడు. మరల మరొక దేహములో నూతన వస్త్ర ధారణవలె ప్రవేశించి నా నుండి శ్వాస (ప్రాణచలనము) పొందుచున్నాడు.

అట్టి శ్వాసపై ధ్యాసచే, శ్వాసను ఉపాశించి ఈ జీవుడు అమృతత్వము పొందగలడు.

ఎవ్వరైతే నన్ను ‘జీవాత్మగాను - పరమాత్మగాను’ కూడా ఉన్నవాడుగా సర్వ సందర్భ - స్థితి - గతులలోను ఉపాసిస్తారో, వారు స్వభావసిద్ధముగా ఊర్ధ్వలోకములు పొంది ఆనందిస్తున్నారు. అమృతరూపులగుచున్నారు. జన్మ - మృత్యువుల పరిధిని దాటివేస్తున్నారు.

కనుక నీయందు వేంచేసియున్న ప్రాణతత్త్వమును ‘గమనించుట’ అను ఉపాసన ద్వారా జన్మ-మృత్యు చక్రమునుండి విడివడి అమృతలోకములు ప్రవేశించెదవు గాక !

జన్మ-మృత్యువులు “మమాత్మ యందలి స్వయం కల్పిత ఊహా విశేషములు. అంతేగాని, నేను వాటిచే బద్దుడను కాదు - అని గ్రహించి ఉండు.

ప్రతర్దనుడు :  మహాత్మా ! మహేంద్రా ! ఈ జీవుని భౌతిక దేహములోను - విశ్వములలోను గల ప్రాణతత్త్వముల సంబంధము ఏతీరైనదో వివరించండి !

మహేంద్రుడు :  

ఈ జీవుని భౌతిక దేహములో ప్రదర్శితమగుచున్న ప్రాణశక్తి - సముద్ర జలంలోని ఒక తరంగ జలము వలె - అనంతరూపమగు విశ్వప్రాణశక్తిలో అంతర్విభాగమే ! అనగా విశ్వప్రాణమే (సప్రాణమే) వ్యష్ఠి ప్రాణశక్తి రూపముగా కూడా అగుచున్నది.
(అంతటా ఉన్న అగ్ని ఒక దీపమును కూడా వెలిగించుతీరుగా).

అట్టి అనంత ప్రాణశక్తి యొక్క సంబంధము లేక పోయి ఉంటే…,
- వాక్ ఇంద్రియము పలుకులు పలకలేదు. ఎవ్వరూ పలుకగలిగేవారూ కాదు. పలుకగలిగే మాటలు ఉండజాలవు.
- కళ్ళు రూపములు చూడలేవు ! ఎవ్వరూ కనబడేవారు కాదు. ఏదీ కనబడేది కాదు.
- చెవులు శబ్దములను వినలేవు. ఎవ్వరూ వినిపించనూలేరు. ఏదీ వినబడేది కాదు.
- మనస్సు దృశ్య సంబంధితముగా యోచనలు చేయలేదు. ఏ ఆలోచనా రాగలిగేది కాదు.

ఆ అనంత ప్రాణశక్తి యొక్క ప్రజ్ఞారూపమే దేహములోని పంచప్రాణములు. ఆ అనంతవిశ్వశక్తియే ప్రజ్ఞాపన (తెలియబడునది, అనుభవమగుచున్నది)గా కూడా అగుచున్నది.

విశ్వప్రాణము + దేహములోని పంచవిధులు నిర్వర్తించు పంచప్రాణములు - సర్వప్రాణము (లేక సప్రాణము) ఈ మూడు ఏక - అఖండ ప్రాణతత్త్వ స్వరూపమే! శక్తియే ప్రాణముయొక్క సంప్రదర్శనము.

ప్రాణశక్తి దేహములో ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమాన క్రియలు నిర్వర్తించటము చేతనే దేహములో ఉచ్చ్వాస - నిశ్వాసలు జరుగుచున్నాయి. పంచ ప్రాణశక్తిచేతనే ఇంద్రియములు శక్తిని పొంది (1) ఇంద్రియ విషయములను (2) విషయరూపములే అయినట్టి జగత్ వ్యవహారమును - సిద్ధింపజేయటం జరుగుతోంది. కాబట్టి ఈ లోకములు, జీవులు, దృశ్యములు, లోకపాలకులు ఇదంతా కూడా ప్రాణశక్తి ప్రదర్శనమే! ముఖ్య ప్రాణము యొక్క ప్రియసందర్శనమే !

➤ ప్రాణశక్తి చేతనే ఇంద్రియ శక్తులు జీవిస్తున్నాయి.
➤ అంతేగాని ఇంద్రియములచే ప్రాణశక్తి జీవింపజేయబడటము లేదు.

ప్రవర్ధనుడు :  అది ఎట్లా స్వామీ ! ఇంద్రియాలు పనిచేయకుంటే ప్రాణము నిలువవు కదా !

మహేంద్రుడు :  ఊహూ ! కాదు!
- ఒకని నోరు మాట్లాడక పోయినప్పటికీ ఆతడు మూగవానిగా జీవిస్తున్నాడు కదా!
- మరొకనికి కళ్ళు కనిపించటము లేదనుకో. అయినా కూడా గ్రుడ్డివాడుగా జీవిస్తూనే ఉన్నాడు కదా !
- ఇంకొకడు చెవులతో ఏమీ వినలేని స్థితిలోకూడా, చెవిటివానిగా జీవిస్తున్నాడు. కదా !
- వేరొకని మనస్సు బహుచ్ఛిన్నముచేత - ఎదురుగా ఉన్నవాటిని గమనించలేని స్థితిలో కూడా ఉండినా ఊరుచ్ఛిన్నుడుగా (పిచ్చివాడుగా), ఆతడు జీవిస్తూనే ఉన్నాడు కదా!
ప్రాణశక్తి చేతనే ప్రజ్ఞాత్మ (బుద్ధి) కూడా ఈ శరీరమును స్వీకరించటము, విసర్జించటము నిర్వర్తిస్తోంది.
కనుక “ప్రాణశక్తిచే అన్నీ పొందవచ్చు. ప్రాణశక్తి లేకుంటే ఏ ఇంద్రియము ఉనికిని కలిగి ఉండడు” - అని నిరూపించబడుతోంది.
అందుచేత ప్రాణశక్తియే అన్నిటికన్నా ముఖ్యముగా ఉపాసించవలసినదై ఉన్నది.

ఇంకా విను.

ప్రాణతత్త్వమే - ప్రజ్ఞాత్మ |
ప్రజ్ఞాత్మయే - ప్రాణశక్తి అయి ఉన్నది. ప్రాణశక్తి - ఆత్మ ఒకదానితో మరొకటి అభిన్నము.

ఈ భౌతిక దేశములో ప్రాణశక్తి ప్రజ్ఞాత్మ ఉభయము ఏకరూపమే అయి ఉండి కూడా రెండు ధర్మములు నిర్వర్తించటం - జరుగుతోంది. (ఇది – ఒకే వ్యక్తి గృహధర్మములు - ఉద్యోగధర్మములు నిర్వర్తించేతీరుగా ) ప్రజ్ఞాత్మయే ద్రష్ట - దృష్టి - దృశ్యములరూపముగా కూడా త్రిధర్మములను నిర్వర్తించుచున్నదగుచున్నది. ఈ విధంగా ప్రజ్ఞాత్మ సహస్ర రూపములుగా ఆయా ధర్మములు ప్రదర్శించుచున్నది.

ఈ జగత్తు ఆత్మ స్వరూపమే!
దృష్టియే జగత్తు. దృష్టియే సృష్టి. దృష్టి లేకపోతే సృష్టియే లేదు.
దృష్టి లేనప్పుడు ‘జగత్తు’ అనునదానికి ఉనికియే ఉండదు. స్వప్న ద్రష్ట స్వప్న దర్శనమే చేయునప్పుడు, స్వప్నదృష్టియే కలిగి ఉండనప్పుడు స్వప్నమనునది ఎక్కడుంటుంది ? ఇదీ అంతే!

ప్రజ్ఞాత్మ జాగ్రత్కు మాత్రమే పరిమితమై ఉండటములేదు. ప్రజ్ఞాత్మయొక్క ప్రజ్ఞత్వమే జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు. అనగా, ప్రజ్ఞాత్మ జాగ్రత్‌లో కనబడే తెలివితేటలకు పరిమితము కాదు. జాగ్రత్ - స్వప్న - సుషుప్తులలోని అనుభవగు విషయమంతటికీ కూడా ఒకే తెలివితేటలు అనువర్తిస్తున్నాయి. కనుక ప్రజ్ఞాత్మను “జాగ్రత్లోని తెలివితేటలు” … అను దానికి పరిమితమని అన వీలు లేదు.

స్వప్న సమయంలో తెలివి (స్వప్న ప్రజ్ఞ) పని చూస్తూఉండగా, జాగ్రత్ సంబంధిత తెలివి (జాగ్రత్ ప్రజ్ఞ) వాటి వాటి - సమాచారములు అప్రదర్శితంగా ఉండవచ్చుగాక! లేకుండా పోవుటలేదు. సుషుప్తిలో జాగ్రత్ - స్వప్న తెలివి - సమాచారము మౌనత్వము పొంది ఉంటున్నాయి. నిద్రలేవగానే ? జాగ్రత్ తెలివి - సమాచారములు తిరిగి ప్రవర్తన శీలమగుచున్నాయి.

ఒకడు నిదుర లేచినప్పుడు తత్క్షణమే జరుగుచున్నదేమిటి ? దీపము వెలుగగానే కాంతి నలువైపులా ప్రసరిస్తూ, ఆక్షణమే గదిలోని వస్తువులన్నీ కనిపిస్తూ ఉంటాయికదా ! అదే విధంగా, ప్రజ్ఞాత్మ ప్రాణశక్తి ద్వారా ప్రాణశక్తిరూపంగా ఇంద్రియములను ప్రవర్తింపజేయుచున్నది. ఇంద్రియములు ఇంద్రియ విషయరూపములుగా ప్రదర్శితమగుచున్నాయి. ప్రాణశక్తి సర్వేంద్రియములలో వ్యాపించి ఇంద్రియ విషయానుభవములను సిద్ధింపజేయుచున్నది. ప్రాణశక్తియే ఇంద్రియ విషయరూపములుగా కూడా సంప్రదర్శనమగుచున్నది.

అనగా, నిదుర లేచుచూనే ప్రజ్ఞాత్మ స్వరూపమైన ప్రాణశక్తి ఇంద్రియ శక్తుల రూపమును దాల్చి ఆయాస్థానములలో ప్రకాశించి (చూపు-వినికిడి మొదలైన) ఇంద్రియ శక్తులను ఆయా స్థానములలో ఉంచి, వివిధ వ్యవహారానుభవములను స్వీయకల్పనగా పొందుచున్నది.

సుషుప్తిలో నిద్రాణమైయున్న ఇంద్రియ శక్తులు, (మనస్సు, దృశ్యధ్యాస, దృశ్యసంబంధమైన జ్ఞాపకములు - సంస్కారములు, అభినివేశములు … ఇవన్నీకూడా) జాగ్రత్ ఆరంభక్షణంలో (మెళుకువవచ్చుక్షణంలో) విస్ఫులింగములవలె వికశితమగుచున్నాయి.
ఇకప్పుడు ఇంద్రియ జగత్తు ప్రదర్శితమగుచూ ప్రకాశమానమగుచున్నది.

ప్రియ ఆత్మానంద ప్రాణేశ్వర స్వరూప ప్రతర్ధనా !

మనం చెప్పుకున్న విశేషాలను అనుసరించి కొన్ని ముఖ్యమైన సారవిశేషాలు వాక్యరూపాలుగా చెప్పుచున్నాను విను.

ఆత్మనః ప్రాణా : సర్వదా యథాతథమై, ప్రతిష్ఠితమైయున్న ఆత్మయే - ప్రాణశక్తిగా ప్రదర్శితమగుచున్నది.

ప్రాణేభ్యో దేవా - ప్రాణశక్తియే ఇంద్రియ దేవతల రూపము (ఇంద్రియ దివ్యశక్తులుగా) దాల్చుచున్నది. సర్వమునకు ఆధారము - ఆధేయము (That which is Dependent as well as that upon which depending) ఆత్మయే ! ఇంద్రియ దేవతలు - శరీరములోని శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములు చోదనము చేయు విశ్వ ప్రజ్ఞలు, తదనుభూతములు అంతా ఆత్మయే!

ప్రవర్ధనుడు : స్వామీ ! జగద్గురూ ! మహేంద్రా ! ఈ దేహములో ఇంద్రియ శక్తులు ప్రవర్తించుచున్నాయి. అట్లాగే మనస్సు సంచరిస్తోంది. ఇప్పుడు ఈ దేహమును విడచి వెళ్ళుచున్న జీవుడు తనవెంట ఏమేమి తీసుకొని పోవుచున్నాడు ?

మహేంద్రుడు :  ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు దేహము నుండి ‘ప్రాణశక్తిని’ విరమింపజేసి, ఆ ప్రాణశక్తిని తన వెంట తీసుకొనిపోవుచున్నాడు.

వాక్ ఇంద్రియదేవత … తనయందలి జ్ఞప్తులను, సంస్కారములను ప్రాణదేవతకు సమర్పించుచూ, తాను ప్రాణశక్తియందు ప్రవేశము పొందుతోంది. జీవుడు ప్రాణశక్తితో బాటే సర్వగంధములను (వాక్ సంస్కారములను - వాసనలను) తనవెంట తీసుకొని పోవుచున్నాడు.

అట్లాగే నేత్రములు (కళ్ళు) తాము జీవితమంతా చూస్తూ వస్తున్న నామ రూప సంబంధమైన అభిరుచుల యొక్క సానుకూల వ్యతిరిక్త జ్ఞాపకములను ప్రాణదేవతకు సమర్పించుకుంటున్నాయి.

చెవులు (శ్రోత్రము) కూడా జీవితకాలంలో వింటూ, అభినివేశము (Emotional Involvement or Entanglement) ) కలిగియున్న శబ్ద విశేషాలను ప్రాణశక్తికి సమర్పించుకొనుచున్నది.

ప్రాణశక్తి వాటినన్నిటినీ సూక్ష్మ సంస్కారముల రూపంగా స్వీకరించి, చిత్తవిభాగమునందు పదిలపరచుచూ, ఆత్మయందు ప్రవేశము పొందుచున్నది.

మనస్సు - దేహము యొక్క జీవితకాలములోని “ఆవేశముతోను, అభిరుచితోను కూడిన ఆలోచన"లను, ధ్యాసలను ప్రాణశక్తికి సమర్పించుకొనుచు, భౌతిక దేహమును త్యజిస్తోంది. ఆ ధ్యాసలను ప్రాణశక్తి మనో సూక్ష్మ రూపమున (ఆలోచనల సూక్ష్మరూపంగా) స్వీకరించి తనయందు నిక్షిప్తము చేసుకుంటూ ఆత్మను అనుసరించుచున్నది.

ఏ ప్రాణశక్తి అయితే సర్వ ఇంద్రియములనుండి జ్ఞాపకములను, అభ్యాస సంస్కారములను (దేహము విడచునప్పుడు) స్వీకరించుచున్నదో, అయ్యది ప్రజ్ఞారూపమే అయి అయి ఉన్నదిఉన్నది. . ప్రజ్ఞానము ప్రజ్ఞానము బ్రహ్మమే బ్రహ్మమే అయి ఉన్నది. (ప్రజ్ఞానమ్ బ్రహ్మ).

ఏది ‘ప్రజ్ఞ’ అని పిలువబడుచున్నదో, అదియే ప్రాణశక్తికూడా !

ప్రజ్ఞ - ప్రాణము … ఈరెండూ ఏకరూపమేగాని, వేరువేరు రూపములు కాదు. ఈ రెండూ ఏకరూపమై దేహములలో ప్రవేశ - నిష్క్రమణములు నిర్వర్తిస్తున్నాయి. అటువంటి సహజ ప్రజ్ఞా స్వరూపులమగు మనము మరి కొన్ని విశేషాలు చెప్పుకొనెదము గాక !

సర్వదేహములలో ఏకరూపమగు “అఖండ ప్రజ్ఞ”

మహేంద్రుడు :

వాక్శక్తి : ఈ దేహ నిర్మాణములో వాక్శక్తి ఒక అంగరూపమును దాల్చుచున్నది. అది ఈ దేహములో ఒక విభాగమగుచున్నది. అద్దాని బాహ్యరూపము - భౌతిక రూపము శబ్దము. గొంతు - నోరు అద్దాని దేహములోని స్థానము. బాహ్యమగు నామరూపాత్మకమంతా అద్దాని బాహ్యరూపము అగు భూతరూపము.

ఘ్రాణశక్తి : ఇది దేహములో మరొక అంగము. గంధము దానియొక్క బాహ్యరూపము. ముక్కు అద్దాని స్థానము. బయట గల వాసనలు దాని బాహ్యరూపము. భూత (భౌతిక) రూపము.

శబ్దశక్తి : ఇది వేరొక అంగము. చెవులు దేహములోని రూపము. వినబడు సర్వశబ్దములూ బాహ్యభౌతిక (భూత) రూపము.

రుచిశక్తి : ఇది మరొక అంగము. జిహ్వ (నాలుక) దీని శరీరములోని స్థానము. తినబడు పదార్ధములలో రుచియే ఈ రుచిశక్తి యొక్క బాహ్యభూత (భౌతిక) రూపము.

క్రియాశక్తి : రెండు చేతులలో వేంచేసి ఉండు శక్తి ఇది. సర్వచేతనములు (లేక) క్రియలు (కదలికలు) ఇద్దాని భూత (భౌతిక) రూపము.

శరీర భావనాశక్తి : ఇది ఇంకొక శరీర విభాగము. సుఖదుఃఖములు ఈ శరీరములో అంతర్గతము. ఇద్దాని బాహ్య రూపములే సుఖమని అనిపించేవి, దుఃఖమని అనిపించేవి, వస్తు - విషయ - సందర్భాదులు కూడా! అవి బాహ్య (భౌతిక) రూపములు.

నడక శక్తి : ఇది రెండు పాదములు స్థానముగా కలిగి ఉన్న శక్తి. అద్దాని భౌతిక (భూత) రూపము నడక. బాహ్యరూపము (భౌతికరూపము) నడచుప్రదేశములు.

అంతఃకరణ విభాగము : మరొక విభాగము. అట్టి ఈ అంతఃకరణములో "సంకల్పములు, కోరికలు, ఆశలు, ఆశయములు”…ఇవన్నీ అంతఃకరణములో అంతర్విభాగములు. బాహ్య విషయములు, రూపములు, సందర్భములు… ఇవన్నీ (ఈజగత్తంతా) అంతఃకరణము యొక్క బాహ్య భౌతిక (భూత) రూపము.

ప్రజ్ఞ - బుద్ధి విభాగము : ప్రజ్ఞ ఇంకొక విభాగము. తెలుసుకోవటము అద్దాని దేహములోని రూపము. ఇక తెలియబడుచున్నదంతా బుద్ధియొక్క బాహ్య భూత (భౌతిక) రూపము.

అయితే…,
సర్వము గమనిస్తూ గుర్తిస్తూ ఉన్నది ప్రజ్ఞయే కదా ! (Intellectual in everybody is operating for recognising whatever being seen, heard, tasted, touched, smelt etc.,).

అనగా ….
సర్వమునకు అర్థరూపముగా, అనుభూతిగా నిర్వచిస్తూ స్వీకరిస్తున్నది ప్రజ్ఞయే !

ప్రజ్ఞయే ‘ప్రాణము’ అను నామమాత్ర రూపము పొందినదై, ఆ తనయొక్క ప్రాణ శక్తితో కూడి, “ఇది గంధము, ఇది దృశ్యము; ఇదిశ్రుతము; ఇది రుచి; ఇది ఆలోచన; ఇవి చేతులు; ఇవి కాళ్ళు; ఇది శరీరము; ఇది సుఖదుఃఖములు; ఇది ఉపస్థ; ఇది వినబడునది; ఇది చూడబడునది; ఇది ఆఘ్రాణించబడునది; ఇది స్పర్శించబడునది; ఇది ఇష్టము, ఇది అయిష్టము; ఇది భావన; ఇది అర్థము కాబడునది; ఇది విసర్జనము…, గా అగుచున్నది.

ఈ విధంగా బాహ్య – అభ్యంతర రూపములుగా ప్రజ్ఞయే రూపము దాల్చుచున్నది.

‘ప్రజ్ఞ’ (లేక) ‘ఎరుక’ పాల్గొనకపోతే, ఏదీకూడా అనుభవరూపము పొందజాలదు. ఒకడు ప్రజ్ఞతో కూడి వింటున్నప్పుడు మాత్రమే, ఆతనికి ఏదైనా విషయము విశదీకరించగలము. ఉట్టి మాటలు మాట్లాడినంతమాత్రంచేత, చెప్పునది తెలియబడదు.

ఒకడు మాటలు వింటూ వింటూ ఉండగా, ధ్యాస మరెక్కడో ఉన్నప్పుడు, “ఏమిటీ ! మరల చెప్పండి ! మీరు మాట్లాడుతున్నప్పుడు చెవులు విన్నాయి గాని, నేను వినలేదు. నా ధ్యాస మరెక్కడో ఉందిలెండి ! అందుచేత వింటూ కూడా నాకేమీ తెలియలేదు” … అని అంటూ ఉంటాడుకదా !

ముక్కు వాసన పొందుచున్నప్పటికీ ప్రాణశక్తి వాసనను పొందినప్పటికీ, బుద్ధి - ధ్యాస మరెక్కడో ఉంటే? ఆ వాసన అనుభూతముగా మారదు. “వాసన ఎట్లాఉన్నది?“ అని ఆతనిని అడిగితే, “ఏమిటో ! నా ధ్యాస మరెక్కడో ఉన్నదండీ ! అందుచేత ఆ వాసన ఎట్లా ఉన్నదో నేను గుర్తించలేదు. కాబట్టి చెప్పలేను”… అని ఒకడు అంటూ ఉంటాడుకదా ! కనుక, బుద్ధి (ప్రజ్ఞ) తోడైనప్పుడు మాత్రమే, ”ఇది సువాసన. ఇది దుర్వాసన” అని గమనించబడగలదు !

అదే విధంగా చూపు విషయం కూడా ! ఒకడు కళ్ళతో అల్లంత దూరంలో బాటలో … ఎవరో వెళ్ళుచూ ఉన్నట్లు చూస్తూ ఉండవచ్చుగాక. కానీ ఆతని ప్రజ్ఞ (బుద్ధి, ధ్యాస) మరేదో అతి ముఖ్యమనుకొన్న విషయము గురించి ఆలోచన చేస్తున్న దనుకో. అప్పుడు ? "అటు వెళ్ళుచున్నట్లు నా కళ్ళు చూచాయండీ ! అయితే ఎవ్వరు అటు వెళ్ళారో మాత్రం నేను గమనించలేదు. గుర్తించలేదు. ఎందుకంటే, అప్పుడు నా మనస్సు ఎక్కడో మా పిల్లల గురించి ఆలోచిస్తోంది”… అని అనటం లోక ప్రతీతియేకదా ! అనగా మనస్సు అక్కడ ఉండకపోవటం చేత చూచికూడా చూడనివాడుగా అగుచున్నాడు.

ఒకడు మనస్సు (ప్రజ్ఞ)ను కూడా కేంద్రీకృతము చేయకపోతే శబ్దము వినీ గ్రహించలేడు. అర్థమును స్వీకరించలేడు. “ఆయన ఏం మాట్లాడారో మరి ! నాకు అర్థము అవలేదు" అంటాడు. అట్లాగే, సుఖ-దుఃఖాలు మొదలైనవి కూడా కదా !

ఈ విధంగా ప్రజ్ఞ (లేక), బుద్ధి - మనస్సుతో కూడి పాలు పంచుకోకపోతే ఇంద్రియములకు తారసబడే దృశ్యజగత్ విషయములు అనుభవ రూపములుగా సంతరించుకోవు. అప్పుడు అవన్నీ స్వతఃగా లేనివే అగుచున్నాయి.

ఇంకాకూడా చెప్పుకోవాలంటే…

ప్రజ్ఞ పాల్గొననప్పుడు ఉపస్థ ఆనందరతిని పొందజాలదు. ప్రజ్ఞతోడు కానప్పుడు, ఈ కాళ్ళ నడుస్తున్నప్పటికీ కూడా ఏఏ నేలను కాళ్ళ స్మృశిస్తున్నాయో, అది అనుభవమవదు. ఒక్క తెలివి ఉన్నంతమాత్రంచేత ఒకడు విషయాలు తెలుసుకోలేడు. అందుకు ధ్యాస (మనస్సు)తోడైతేనే తెలుసుకోగలడు.

కాబట్టి ఓ ప్రతర్దనా ! మనస్సుతో కూడిన ఇంద్రియముల అనుభవములు - మనస్సు తోడుగా లేనప్పటి ఇంద్రియ - మనో అనుభవములు గురించి సమీక్షిస్తూ…., ఇప్పుడు ప్రజాత్మతత్త్వమును గురించి విశ్లేషించుకుందాము.

న వాచం విజ్ఞాసీత ! వక్తారమ్ విద్యాత్ | మాటల గురించి కాదు! మాట్లాడేవాని గురించి తెలుసుకోవాలి!

ఒకడు నోటితో మాట్లాడే మాటలు తెలుసుకున్నంత మాత్రము చేత ఆతని గురించి మనము తెలుసుకున్నట్లు కాదయ్యా ! ఆ మాట్లాడువాడు ఎట్టి ప్రజ్ఞాస్వరూపుడో, అట్టి స్వతః ప్రజ్ఞాత్మను తెలుసుకున్నప్పుడే ఆతడు మనకు తెలియబడగలడు.

న గంధం విజిజ్ఞాసీతా ! ఘ్రాతారం విద్యాత్ ! వాసనల గురించి కాదు! ఆ వాసనలను ఆస్వాదించు వానిని తెలుసుకోవాలి!

గంధము గురించి తెలుసుకుంటే సరిపోదు. ఆ గంధము తెలుసుకునే వాని గురించి (One who is knowing) తెలుసుకొన్నప్పుడే ఆతని గురించి సమగ్రంగా తెలుసుకొన్నట్లు !

న రూపమ్ విజిజ్ఞా సీతా ! రూపవిదమ్ విద్యాత్ ! ఒకడు తెలుసుకొను రూపముల గురించి కాదు! ఆ రూపములు తెలుసుకొనుచున్నవాని గురించి తెలుసుకోవాలి!

ఒకని రూప జ్ఞానము గురించి తెలుసుకుంటే చాలదు. లేక, “ఈ ప్రపంచములో ఏ రూపము ఏనామము కలిగి ఉన్నది !“ మొదలైనవి తెలుసుకున్నంత మాత్రము చేత ఏ మాత్రము సరిపోదు. “రూపములు తెలుసుకుంటూ ఉన్నవాడు ఎవరై ఉన్నారు? ఎట్టివాడు”… అనునది తెలుసుకోవాలి.

న శబ్దం విజిజ్ఞాసీత ! శ్రోతారమ్ విద్యాత్ !
శబ్దముల గురించి ఎంతగా తెలుసుకున్నా సరిపోదు. “ఆ శబ్దములు వింటున్నవాడు ఎట్టివాడు ? ఎమైఉన్నాడు ?" … అనునది తెలుసుకోవాలి.

న అన్నరసం విజిజ్ఞాసీత్! అన్నరసవిజ్ఞాతారం విద్యాత్ !
పదార్థముల రుచిని గురించి ఎంతగా పరిశోధించి వాటి వాటి తత్వములను, స్వభావములను తెలుసుకున్నా అసలు విషయము తెలియదు. తెలుసుకోవలసినది తెలుసుకున్నట్లుకాదు. అది విదితవేద్యముకాదు) ఆ పదార్ధముల రుచిని ఎవరు తెలుసుకుంటున్నారో, ఆతనిని తెలుసుకోవాలి.

న కర్మ విజిజ్ఞాసీత । కర్తారం విద్యాత్ |
కర్మ విశేషాలు ఎంతెంతగా తెలుసుకున్నప్పటికీ అది సరిపోదు. ఆ కర్మలు ఎవ్వరు నిర్వర్తిస్తున్నారో…. అట్టి కర్తయొక్క కర్తృత్వభోక్తృత్వములకు మునుముందే ఉన్న కేవల స్వరూపము గురించి తెలుసుకోవాలి.

అనగా,
- అయ్యా ! ఈతడు ఇట్టి పనులు చేస్తున్నాడు. కనుక మంచివాడు. (లేక) గొప్పవాడు.
- ఆతడో ? అటువంటి పనులు చేస్తున్నాడు. కనుక గొప్పవాడు కాదు. లేదా, మంచివాడు కాదు.
ఇట్లా కర్మల గురించి విచారణ సమగ్రము కాదు. మరి ? "కర్మలు నిర్వర్తిస్తూ ఉన్న ఆతని - కర్మలకు మునుముందే ఉన్న - సహజ స్వరూప స్వభావాలు ఎట్టివి ?” … అనునది తెలసుకోవాలి !

న సుఖ దుఃఖే విజిజ్ఞాసీత ! అన్యత్ - సుఖ-దుఃఖయో విజ్ఞాతరం విద్యాత్ !
“అతని యొక్క (లేక) నాయొక్క సుఖ-దుఃఖాలు ఇటువంటివండీ !" … అని తెలుసుకున్నంత మాత్రం చేత ఒకని గురించి మనకు పూర్తిగా తెలిసినట్లు కానేకాదు. ఆ సుఖ-దుఃఖాలు ఎవరివో, ఆతని గురించి తెలుసుకోవాలి. (సుఖ-దుఃఖములకు వేరైన నీ-నా స్వస్వరూపము గురించి తెలుసుకుంటేనే సత్యమును ఎరుగుచున్నట్లు!

న ఆనందరతిం ప్రజాతిం విజిజ్ఞాసీత ! ఆనందస్య రతేః ప్రజాతేః ప్రవిజ్ఞాతారం విద్యాత్ !
శృంగారానంద రతి గురించి తెలుసుకొంటే ఏ మాత్రము సరిపోదు. ఆ శృంగార రతి ఆనందము పొందుచున్న - ఆనందము తనదైయున్న - ఆనందించువాని యొక్క ఆవల గల వాస్తవ రూపమేమిటో తెలుసుకుంటేనే, అసలైన స్వరూపము తెలుసుకున్నట్లు ।

న ఈత్యాం విజిజ్ఞాసీత ! ఈతారం విద్యాత్ !
ఈ జీవుని నడక, నడత గురించి తెలుసుకుంటే సరిపోదు. ఆ నడతలన్నీ - నడకలన్నీ ఎవరివై ఉన్నాయో … ఆతడు వాస్తవానికి ఏ స్వరూపం? ఎట్టివాడు? - ఇది తెలుసుకోవలసిన అసలైన నిత్యసత్యము !

న మనో విజిజ్ఞాసీత ! అన్యో తమ్ మన్తారమ్ విద్యాత్ |
మనస్సు అనగా ఏమి ? ఆలోచనకదా ! అట్టి మనస్సు (లేక) ఆలోచన ఎట్టిదో, ఏమేమి ఈ మనస్సు ఆశ్రయిస్తోందో, మనస్సు ఎట్లా జనిస్తోందో… ఇవి ఎంతగా తెలుసుకున్నా ఏమిలాభం? ఆ మనస్సు ఎవ్వరిదో … ఆతని గురించి మనము తెలుసుకోవలసినది !
ఆలోచనలకు ఆవల గల ఆలోచించువాని యొక్క - ఆలోచనలకు మునుముందే ఉన్న ఆతని రూపమేమిటి? - ఇదీ తెలుసుకోవలసినది!

ఓ ప్రతర్దనా ! వింటున్నావు కదా ! మనం ఇప్పటి దాకా చెప్పుకొన్న దశ విషయములు ‘అధిభూతములు’ అని అంటారు.

(1) వాక్కు, (2) గంధము, (3) రూపము, (4) శబ్దము, (5) రసము, (6) కర్మ, (7) సుఖదుఃఖాలు, (8) ఆనందరతి, (9) ఈత్వము
(నడత), (10) మనస్సు (ఆలోచనలు) ఇవన్నీ అధి భౌతికానుభవాలు మాత్రమే!

ఈ దశ భూత విషయములా మూడు లక్షణాలు కలిగిఉన్నాయి.
(1) ఇవన్నీ తెలియబడేవి. బుద్ధి ప్రజ్ఞకు / బుద్ధి స్థితి - గతులకు / బుద్ధి నిర్ణయమునకు సంబంధించినవి.
(2) ఇవి కాలబద్ధము. అనగా మార్పు - చేర్పులు చెందేవి. ఒకప్పుడు ఒకతీరుగా, మరొకప్పుడు మరొకతీరుగా అనుభూతమయ్యేవి.
(3) ద్వంద్వరూపములు. అనగా ఒకప్పుడు ఈ జీవునికి సంతోషమును కలుగజేసేవి, మరొకప్పుడు సంతోషమును పాడుచేసేవి అయి ఉంటున్నాయి. ఇవి తెలియబడేవి కాబట్టి "ప్రజ్ఞ యొక్క భూతరూపములు (లేక) భౌతిక రూపములు”…. అని కూడా చెప్పబడుచున్నాయి.

అంతేకాదు. ఇవన్నీ ప్రజ్ఞయొక్క వివిధ రూపములేగాని, ప్రజ్ఞ యొక్క వాస్తవ తత్త్వము కాదు. ఉదాహరణకు ‘దేహము’ అనేది ‘దేహి’ యొక్క రూపము. అంతేగాని దేహము - దేహి కాదు కదా ! దేహము కదల్చబడే జడవస్తువు. దేహియో, దేహమును కదిలించుచున్న చైతన్య రూపము.

అట్లాగే, దశవిధ ప్రజ్ఞాభూతములు, ప్రజ్ఞయొక్క అనుభూతములేగాని, ప్రజ్ఞయొక్క వాస్తవతత్వము అయిఉండలేదు.

ఒక పటిగబెల్లపు (ఖండసారి) ముక్క యొక్క ఆకారము పటిగబెల్లపురుచిని నిర్వచించదు కదా ! ప్రజ్ఞయొక్క భూతరూపముల గురించి మనము వివరించుకొన్నంతమాత్రము చేత ప్రజ్ఞయొక్క తత్త్వము తెలియబడదు.

ప్రజ్ఞ - ప్రజ్ఞ యొక్క భౌతిక (భూత) రూపములు ఈ రెండింటి బేధమేమిటో, సమన్వయమేమిటో మనము తెలుసుకుంటేనే,… ఈ జీవుని సహజ-నిత్య స్వస్వరూపముగు ‘ప్రజ్ఞాత్మ’ గురించి తెలుసుకోగలము. మనము తెలుసుకోవలసినది ప్రజ్ఞాత్మ గురించి సుమా!

ఏది ఎందులోంచి వస్తోందో…. అట్టి ఇది అదియే !

ఓ ప్రతర్దనా ! ఇక్కడ మరొక్క ముఖ్యమైన విషయం మనము గమనించాలయ్యా ! ఏది ఎందులోనించైతే సిద్దించినదిగా అగుచున్నదో, ఆ సిద్ధించుచున్నట్టిది మొట్టమొదటి దానికి వేరు కాదు ! కానేకాదు ! జలంలోంచి తరంగం బయల్వెడలితే,…. తరంగము జలమునకు వేరు కాదు కదా! మట్టి బొమ్మ మట్టికి వేరు కాదు కదా!

ఇది సిద్ధాంతము. ఈ సిద్ధాంతమును అనుసరించి మనము వివరించుకొన్న దశవిధ భూత ప్రజ్ఞా విశేషాలు (భౌతిక ప్రజ్ఞలు) కేవల రూపమగు ప్రజ్ఞాత్మకు వేరైనవి కావు. ఆధారమునకు (దేనిపై ఆధారపడి ఉన్నదో అద్దానికి… అధేయము (ఆధారపడి ఉన్నట్టిది) వేరు కాదు!

కనుక జగత్తుగాని, జగత్తుగా కనిపించుచున్న ఈ సర్వము గానీ … ఈ సర్వమునకు ఆంతర్యామి అయి ప్రకాశించుచున్న ‘ఆత్మప్రజ్ఞ’కు వేరైనదికాదు ! జగత్తు ఆ ప్రజ్ఞాత్మయే ! దశవిధ భౌతిక ప్రజ్ఞలు ‘కేవల ప్రజ్ఞ’ యొక్క రూపములే ! అనన్యములే!

ఒక రథ చక్రము యొక్క నాభి కదలికయే రధచక్రము యొక్క కదలికకదా! చక్రము కదలు చున్నట్లు భౌతికంగా కనిపిస్తున్నప్పటికీ, “చక్రనాభి (మధ్యస్థానము) కదలికయే ఇది” … అని ప్రజ్ఞచే గమనిస్తున్నాము !

ఓ ప్రతర్దనా !

ఆత్మయొక్క స్వకీయ ప్రజ్ఞా కల్పనా విశేషమే దృశ్యమానమగుచున్న ఈ సర్వజగత్ రూపము కూడా !
- ప్రజ్ఞయందే ప్రాణశక్తి అమరిక కలిగినదై ఉన్నది (రథ చక్రములో ఇరుసువలె)!
- అట్టి ప్రాణశక్తి రూపమే ఇంద్రియ దేవతలు!

అట్టి ప్రాణశక్తి - ఆనందము, అజరము, అమృత స్వరూపము అగు ఆత్మయే!

కర్మలన్నీ ఆత్మయొక్క ప్రజ్ఞా చమత్కారమే! అయితే, కర్మలకు - ఆత్మకు సంబంధమే లేదయ్యా !

ఒకడు సాధువర్తనుడు కాబట్టి “ఆత్మ సాధవర్తనమైనదని” … అనవీలు లేదు. అట్లాగే, మరొకడు అసాధువర్తనుడు కనుక “ఆత్మ అసాధువర్తనమైనది” అనటానికి కూడా కుదరదు. సాధు - అసాధు, మంచి - చెడు, పుణ్య - పాపము … ఈ విశేషాలన్నీ ‘ప్రకృతి’కి సంబంధించినవి.

ఇక ఈ జీవుడో? ‘పురుషుడు’ అయి ఉన్నాడు. ప్రకృతి - పురుషుడు అనునవి 1) కథలలోని పాత్రలకు, విశేషాలకు 2) కథా రచయితకు గల సంబంధము వంటివి. ఈ పురుషుని స్వరూపము ఆత్మయే ! ఆత్మయే ఈ పురుషుడు ! అట్టి ఆత్మ సర్వదా సర్వమునకు కారణకారణము. అంతేగాని ఆత్మకు కర్మ బంధములేదు. దశవిధ ప్రజ్ఞాభూత విశేషముల చేతనూ బద్ధము కాదు.

ఇదియే ఆత్మజ్ఞానము.

ఈ జీవుడు ఇది తెలుసుకొని, హృదయస్తం చేసుకుంటే ఆత్మచే బలవంతుడై సర్వలోకముల పరిధులను దాటివేయగలడు.

ఏష లోకపాలః ! ఏష లోకాధిపతిః ! ఏష లోకేశ్వరః! స మ ఆత్మేతి విద్యాత్ | స మ ఆత్మేతి విద్యాత్ |

అని తెలుసుకున్నవాడు లోకములను స్వీయకల్పనగా, తన స్వకీయ భౌతిక రూపంగా చూస్తూ … లోకపాలితుడుగా, లోక పాలకుడుగా, లోకాధిపతిగా, లోకేశ్వరుడుగా ఒక్కసారే అగుచున్నాడు. మహేంద్రుడనగు నేను, తదితర లోక పాలకులు కూడా - అట్టి వానికి నివేదనలు సమర్పిస్తున్నాము. సేవకులమై ఉంటున్నాము.

ఓ ప్రతర్దనా ! వింటున్నావు కదా ! కనుక…,
- ఈ ఇంద్రియములకు ఎదురుగా కనిపిస్తున్న దశవిధ ప్రజ్ఞాభౌతిక రూపములను అధిగమించివేయి !
- “ఆత్మైవాహమ్।” ఆత్మ స్వరూపమును సంతరించుకో !
- సర్వాత్మ స్వరూపుడవై స్వయం భూతానంద - ఘన స్వరూపుడవై వెలుగొందు !
- ఈ 14 లోకములు, లోక సంబంధములు, లోక స్థితిగతులు - ఇవన్నీ బాలానందము వలె నీయొక్క ప్రజ్ఞా సంబంధిత లీలా క్రీడా వినోదముగా సందర్శించు! -
- అప్రమేయుడవై, కేవలసాక్షివై, కేవల ప్రజ్ఞానందుడవై, ఆత్మాకాశ స్వరూపుడవై,
- నిర్గుణడవై, గుణములన్నీ నీవైన వాడవై,
- నిరాకారుడవై, జగదాకారుడవై, స్వయమ్ సర్వాకారుడవై,
- సర్వగుణాలంకృతుడవై, గుణరహితుడవై, సర్వ గుణ ప్రదర్శకుడవై,
- సర్వలోకములను ఆభరణముగా ధరించినవాడవై, అలోకుడవై, లోక స్వరూపుడవై…,
సర్వాత్మవై, ఆత్మగాసాక్షివై, బ్రహ్మమువై… ప్రకాశించుము!

|| ఇతి తృతీయో అధ్యాయః  ||

చతుర్థ అధ్యాయము

గార్గ్యబాలాకి - అజాత శత్రు సంవాదము

ఇదంతా ఆత్మగా దర్శించటమే ఆత్మజ్ఞానము

చిత్ర గార్యాయణి :  ఓ ఆరుణిగౌతమ - శ్వేతకేతు మమాత్మ స్వరూపులారా ! ఈ జగత్తంతా "స్వస్వరూపాత్మ యొక్క చిత్కళావిశేషము”గా దర్శించటమే ఆత్మసాక్షాత్కారము, ఆత్మజ్ఞానము, ఆత్మానంద ఆస్వాదనము కూడా ! ఈ విషయమును నిరూపిస్తూ, ఒకానొక సందర్భములో మా పూర్వీకుడగు గార్గ్యబాలాకి ఋషి - అజాతశత్రు మహారాజుల మధ్య ఒకానొక విజ్ఞానపూర్వకమైన ‘సంవాదము’ జరిగింది.

స్వస్వరూపాత్మ ప్రసాదితమగు ఆ విశేషాలు మనము ఇప్పుడు చెప్పుకుందాము. వినండి!

మహనీయులగు మా పూర్వీకుడు గార్ల్యబాలాకి ఋషి ఒకానొక సందర్భములో తన నివాసస్థానమైన ఉశీనర దేశము నుండి తీర్ధయాత్రలకు బయల్వెడలారు. మత్స-కురు పాంచాల దేశాలు పర్యటిస్తూ కాశీ నగరము వచ్చారు. అప్పటి కాశీదేశపు మహరాజు అజాతశత్రు బాలాకి ఋషి యొక్క రాక గురించి తెలుసుకొన్నారు. వారిని తన అంతఃపురానికి ఆహ్వానించారు. సపర్యలతో సంతోషింపజేశారు.

“స్వామీ ! మీ రాకతో మా అంతఃపురము, మా కాశీ రాజ్యము పావనమైనది !” … అని స్తోత్రాలు సమర్పించారు. అప్పుడు బాలాకి ఋషీంద్రులు అజాతశత్రురాజు సమర్పించిన పాదపూజకు, అతిథి సత్కారములకు ఎంతో సంతోషించి ”ఓ అజాతశత్రు మహారాజా! నీ సపర్యలకు, సత్కారాలకు సంతోషించానయ్యా | బదులుగా ఏమి ఇవ్వగలను? నీతో “బ్రహ్మము-బ్రహ్మతత్త్వము” గురించి సంభాషిస్తానయ్యా !” అని పలికారు.

అజాత శత్రు మహారాజు అది విని మహదానందము పొందారు. “మహాత్మా ! మేము ధన్యులము. మీరు మాపై బ్రహ్మజ్ఞాన వర్షము కురిపించ ప్రార్థన. గురు దక్షిణగా, ఇదిగో “వేయి గోవులు” మీ ఆశ్రమమునకు సమర్పిస్తున్నాను.” అని ఆ బాలాకితో పలికారు. అప్పటికప్పుడు రాజాజ్ఞానుసారం గొప్ప సత్సంగ సభ సిద్ధము చేయబడింది… ఋషీశ్వర - మహారాజ సంవాదము వినటానికై ఆత్మతత్త్వ జ్ఞానాభిలాషులైనటువంటి కాశీపట్టణ ప్రజలలో అనేకులు ఆ సభకు శ్రోతలై వచ్చారు. వారంతా” ఆహాఁ! మన అజాతశత్రు మహరాజు జనకమహారాజుతో పోల్చతగినవారుకదా ! మనందరినీ ఆత్మజ్ఞాన విశేషాలతో పవిత్రులవటానికి సర్వదా ఉద్దేశ్యిస్తూ ఉంటారు. ఆయనయే స్వయముగా ఆత్మతత్త్వజ్ఞుడు. ఆయన పాలనలో మనము పునీతులము !" … అని సంభాసించుకోసాగారు సత్సంగ సభ వేదవచనాలతో, భగవత్ స్తోత్రాలతో ప్రారంభమైనది.

బ్రహ్మము గురించి నిర్వచనము

బాలాకి ఋషీశ్వరుడు:  ఓం తత్ సత్! సర్వము తానైన పరమాత్మకు నమస్కరిస్తూ మనము ఈ సత్సంగ సమావేశమును ప్రారంభించెదముగాక! ఓ అజాత శత్రు మహారాజా! ముందుగా నాదొక ప్రశ్న. ఆత్మస్వరూపుడుగా నేను అంతటా, అన్నిటా సిద్ధించియే ఉన్నాను కదా ! ఏవైష ఆదిత్యే పురుషః ‘తమేవ అహమ్’ ఉపాస ఇతి ? ఆదిత్య పురుషునిలో ప్రవేశించి నేను ఏ పరమపురుషుని ఉపాసించవలసియున్నదో చెప్పండి?

అజాతశత్రు మహారాజు:  మామ్ మ ఏతస్మిన్ సమవాతయిష్ఠ! ఆదిత్యుడగు సూర్య భగవానునిలోగల మీరు ఏ స్వరూపమును పరమపురుషుడుగా, పురుషోత్తముడుగా ఉపాసించాలో నాకు తెలియదు. స్వామీ! అయితే “ఈ ఆదిత్యుని సూర్యతత్త్వమును బృహన్బృహత్తరము! పాండరవా-మహత్తరమైనది. ఈయన సర్వమునకు ఆధారము! సా ఆసాధిష్ఠా! ఈ కనబడే సర్వజీవులకు, సర్వజగత్తుకు ఆదిత్యుడే మొట్టమొదటిగా ఉండి (ఆది ఇతియః) ఈ సర్వము ఆధారము. సర్వమునకు అధిష్ఠానము కూడా! సర్వేషాం భూతానాం మూర్థేతివా! సర్వజీవులకు శిరస్సు వంటివాడు. ఈ ఈ సృష్టికి శిరస్సు ఆది స్వరూపుడగు ఆదిత్యుడే!“ … అని ఆదిత్యుని ఆత్మ దేవునిగా నేను ఉపాసిస్తున్నాను. “ఆత్మయే ఆదిత్య పురుషునిగా ప్రదర్శనమగుచున్నది” - అను సందర్శనము కలిగి ఉంటున్నాను.

ఆదిత్యుడగు సూర్యభగవానుని ఈ రీతిగా ఆరాధించుచున్న వాడు - సర్వేషాం భూతానాం మూర్ధా భవతి। - సర్వ జీవులకు మూర్ఖుడు) (ముఖ్యుడు), శిరస్సు వంటివాడు!" - అగుచున్నాడు.

బాలాకి ఋషీశ్వరుడు :  సరేఁ ! చంద్రునిలో బ్రహ్మముగా పురుషునిగా ఉన్న నేను ఎవ్వరిని, ఏ పురుషుని ఆరాధించాలి?

అజాతశత్రు :  హే మహనీయా ! చంద్రుని యందు ప్రవేశించిన మీరు ఏ పురుషుని బ్రహ్మముగా ఉపాసించాలో చెప్పలేను. తెలియదు. కానీ “చంద్రునిలో సోమతత్త్వముగా ప్రకాశించుచున్నది. అన్న ప్రదాత కాబట్టి, ఆయన సృష్టికి రారాజు. జీవులందరికీ మనో ఆత్మ భగవానుడు | బ్రహ్మమే చంద్రతత్త్వముగా ప్రదర్శనమగుచున్నది." … అను భావనలతో ఎల్లప్పుడూ చంద్రభగవానుని ఉపాసిస్తూ ఉన్నాము.

ఈ విధంగా చంద్రుని ఉపాశించువాడు సమస్త ఆహారములకు ఆత్మ స్వరూపుడై వెలుగొందుతాడని చెప్పబడుచున్నది కదా, మహనీయా!

బాలాకి ఋషీశ్వరుడు :  నిజమే ! మరి, విద్యుత్తులో తేజో ప్రకాశ పురుషడనై ఉన్న నేను ఏ పురుషుని, ఏ ఆత్మతత్త్వముగా ఉపాసించాలి? తేజో రూపుడై నేను, ఏతమేవ అహమ్ బ్రహ్మో పాస ఇతి ఎవరిని బ్రహ్మముగా ఉపాసించాలి?

అజాతశత్రు :  అదికూడా నేను వర్ణించి సమాధానము చెప్పజాలను. అయితే “పరమ పురుషుడగు బ్రహ్మమే విద్యుత్ - తేజస్సుకు ఆత్మ అయి ఉన్నారు" … అని విద్యుత్తును మేము ఉపాసిస్తున్నాము.

ఈ విధంగా “బ్రహ్మము తేజస్సుకే ఆత్మ అయి ఉన్నది”… అని ఉపాశించుటచే, తేజస్సుకే ఆత్మ స్వరూపుడై (ఆత్మఅయి) విరాజిల్లగలడు కదా!

బాలాకి ఋషీశ్వరుడు :  బాగున్నది. ఇక, ఆకాశమున ఉరుము - మెరుపులలో ప్రవేశించినప్పుడు నేను బ్రహ్మమును ఏ పరమపురుషుడుగా ఉరుము మెరుపులతో కూడి ఉపాసించాలి ?

అజాతశత్రు :  గురువర్యా ! ఆకాశము, ఉరుము - మెరుపులలో ఉన్నప్పుడు ఏ పరమపురుషుని ఉపాసించాలో నాకు తెలియదు. “శబ్దమునకు కాంతికి కూడా ఆత్మయే ఆ పరమపురుషుడు!” అని ధ్యానోపాసన చేస్తున్నాను. అట్టివాడు సర్వశబ్దములకు ఆత్మ స్వరూపుడు అగుచున్నాడు.

బాలాకి ఋషీశ్వరుడు :  అవునౌను ! ఆత్మ స్వరూపముచే ఆకాశమంతా నిండిఉన్నట్టి నేను ఏ పురుషుని, తెలుసుకొని ఆత్మోపాసన కొరకై సంసిద్ధుడవై ఆరాధించాలి?

అజాతశత్రు :  ఆకాశమంతా నిండి ఉన్న మీరు ఏ పురుషుని ఉపాసించాలో నేను అభివర్ణించలేను. అయితే పరబ్రహ్మమే ఆకాశ రూపమున ఉన్నదని భావించి ఉపాసిస్తున్నాను.

ఆత్మాకాశమే భూతాకాశముగా ప్రదర్శనమగుచున్నదని భావన చేస్తున్నాను. అప్పుడీ ఆకాశమును…,
- పూర్ణము (It is complete by itself) గాను,
- అప్రవర్తి, (అకర్త, అభోక్త, విషయ రహితము) గాను,
- (సర్వము తనకు తానే సృష్టించుకొని, అందులో ప్రవేశించి ఆస్వాదిస్తూ, సర్వము మరొకప్పుడు లయింపజేసుకొను బ్రహ్మమునకు అభిన్నముగాను…,
భావించి భక్తితో ఆకాశమునకు ప్రణామములు సమర్పిస్తూ ఉంటున్నాను! ఆకాశమును బ్రహ్మము రూపముగానే దర్శిస్తున్నాను.

ఆకాశముగా ఉన్నది బ్రహ్మమే !

ఇట్టి ధ్యానము చేయువారికి సత్సంతానము, పశుసంపద, … మొదలైనవి లభిస్తాయి ! ఆకాశ బ్రహ్మోపాసనచే అట్టివాడు కాలపరిధులను దాటిపోయి, కాల నియామక - కాలః కాల స్వరూపము సంతరించుకోగలడు కదా !

బాలాకి ఋషీశ్వరుడు : వాయురూపుడనై వాయువు నందు ప్రవేశించినప్పుడు…. నేను బ్రహ్మముగా ఉపాసించవలసిన పురుషుడెవ్వరు?

అజాత శత్రు : వాయ్వాత్మ స్వరూపులై వాయువునందు ఏ పురుషుని ఉపాసించాలో నాకు తెలియదు.

కానీ, “వాయువు యొక్క కదలిక (స్పందన)కు ఆధారము ఆత్మయొక్క చైతన్యశక్తియే! వాయు కదలిక చేతనే ఇంద్రియములు క్రియాశీలకమవగలుగు చున్నాయి. కళ్ళు చూడటానికి, చర్మము స్పర్శశక్తి ప్రదర్శించటానికి, చెవులు వినగలగటానికి … వీటన్నిటికీ కారణము వాయు స్పందన. ఆ స్పందమునకు ఆధారము ప్రాణశక్తి. కనుక ఈ వాయుశక్తియే ఇంద్రుడు ! అన్నిటినీ జనింపచేసి, తానే జనించుచు, ఈ సర్వముగా ఉన్న ‘జిష్ణువు’ ఇహంగా కనిపించేదాని కంతటికీ పరమై ఆవలయున్న పరాజిష్ణువు కూడా ! వాయువు విష్ణువు. వాయు తరంగములు జిష్ణుడు”… అని వాయువును ఆరాధిస్తూ ఉన్నాము.

ఈ వాయువే తదితర సర్వమునకు కారణమగు ఆత్మ. అన్యతః తత్ జాయా భవతి | (నమస్తే వాయుః! త్వమేవ ప్రత్యక్షమ్ బ్రహ్మసి) … అని భక్తితో దర్శిస్తున్నాము. ఈ రీతిగా వాయువును బ్రహ్మముగా ఉపాశించు వారు పరాజయము లేనివారై, అంతటా వేంచేసియున్న జిష్ణుస్వరూపులై విరాజిల్లగలరు కదా !

బాలాకి ఋషీశ్వరుడు :  బాగుబాగు, ఇక, అగ్నితత్త్వములో ఉన్న నేను ఏ పురుషుని ఉపాశించాలి ? ఏష ఏవ అగ్నౌ పురుషః తమేవ అహమ్ ఉపాస ఇతి?

అజాతశత్రు : ఓ ఋషి పుంగవా! అగ్ని పురుషునిలో మమేకత్వోపాసనచే ఏ పురుషుని ఉపాసించాలో చెప్పలేను. అయితే “ఓ ఆత్మభగవాన్! ఆత్మ అయి ఉన్న మీరు అగ్ని రూపమును దాల్చి సర్వమును ఉష్ణస్పర్శచే ఉజ్జీవింపజేస్తూ, సర్వమును భస్మము చేయగలిగినవారై ఉన్నారు. కనుక అగ్నిగా కనిపిస్తున్నది ఆత్మదేవుని దివ్య తేజో విభవమే!” … అని అగ్నిదేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నాము.

ఈ విధముగా అగ్నిని పరబ్రహ్మ తేజో విభవముగా ఉపాసించువాడు అగ్నివలె స్వయం ప్రకాశమానుడు అగుచున్నాడు కదా!

బాలాకి ఋషీశ్వరుడు :  నాయనా! అజాతశత్రూ ! ఈ జగత్ దృశ్యములో కనిపిస్తున్న ఆయా వాటివాటినన్నిటినీ ఆత్మయొక్క విలాస చమత్కారముగా ఉపాసించుచుండటమును నీ నుండి వింటున్నాను. ఇంకా అడుగుచున్నాను. జలమునందు గల రసస్వరూపుడగు జల (వరుణ) పురుషునిగా ఉండి నేను ఏ పురుషుని బ్రహ్మముగా ఉపాసించాలి?

అజాతశత్రు : జలములో ప్రవేశించినప్పుడు ‘కిం పురుషోపాసన?’ నాకు తెలియదు. “ఆత్మదేవా ! మీరే జలమునందు రస (వరుణ) రూపులై సర్వమునకు నామారూపాత్మకంగా చేసి ఉంచుచున్నారు. కనుక జలరూపముగా త్రాణ అయి, సర్వజీవుల దేహములను పరిరక్షిస్తూ, నామరూపములుగా - నామ అస్య ఆత్మీతిహ - అట్టి ఆత్మ భగవాన్ గా నిన్ను స్థుతిస్తున్నానయ్యా !” … అను ఉపాసన కలిగి ఉంటున్నాము. ఇట్లు జలమును సర్వ నామ - రూపప్రసాదినిగా ఆరాధించువారు, సర్వ నామములకు తానే ఆత్మస్వరూపుడై
- అధిదైవతముగా….
- అధ్యాత్మముగా ….
ప్రకాశించగలడు కదా!

బాలాకి ఋషీశ్వరుడు :  వాస్తవమేనయ్యా ! అయితే, ఏవ ఏష ఆదర్శే పురుషః తమేవ అహమ్ ఉపాస ఇతి? దర్పణములోని ప్రతిబింబమువలె దర్పణ పురుషుడుగా ఉన్నదెవ్వరు? అద్దానిని ఉపాసించటమెట్లా? (‘మనస్సు’ అనే) దర్పణముగా ఉన్నట్టి ఆత్మ పురుషుని దర్శించటము ఎట్లా ?

అజాతశత్రు :  అదాస్వామీ? (మనో) దర్పణ (ప్రతిబింబ) పురుషుని ఆత్మగా ఎట్లా ధ్యానించాలో నేను వివరించలేను. అయితే మనో దర్పణమునందు ఏది జీవాత్మ రూపముగా తెలియవచ్చుచున్నదో, ఆ జీవాత్మ పరమాత్మయొక్క ప్రతిబింబమే ! (జీవో బ్రహ్మేతి నాపరః మొదలైన) ఇట్టి మహావాక్యము సహాయంతో జీవాత్మ ప్రతిబింబమును పరమాత్మ యొక్క లీలా మానుష చైతన్యము - అని భావనచేస్తూ ఉపాసిస్తున్నాను. పరమాత్మయే ఇహాత్మ అనబడు ప్రతిబింబముగా (జీవుడుగా) దర్శించుచున్నవారు సర్వజీవులకు తామే ఆత్మ స్వరూపులు అగుచున్నారు. ఇక ప్రతిబింబమాత్రుడుగా ఉండడు కదా మహనీయా! అనేక దర్పణములలో ప్రతిబింబించే ఏకైక వస్తువువలె ఆత్మయగు తానే అనేక జీవదర్పణములలో ప్రతిబింబించువాడగుచున్నాడు.

బాలాకి ఋషీశ్వరుడు : బాగున్నదయ్యా ! సరేఁ! నా యొక్క నీడ అయినటువంటి త్రిగుణ స్వరూపి అగు - గుణరూపముగా ఉన్న ఛాయా పురుషుని మమాత్మ స్వరూపముగా దర్శించటమెట్లా ? ఏవ ఏష ప్రాతిశ్రుత్కాయాం పురుషః ‘తమేవాహమ్’ ఉపాస? ఇతి.

అజాతశత్రు : త్రిగుణ సమన్వితమైయున్న ప్రతి - దేహరూపము (ప్రతిశ్రుత్కాయాం)ను ఆత్మ పురుషుడునగా ఎట్లా దర్శించాలో చెప్పలేను. అయితే,  “నీళ్ళలో ప్రతిబింబము బింబము కంటే వేరు కానట్లు దేహముతో కనిపించే త్రిగుణాత్ముడగు దేహి (లేక) జీవుడు ఆత్మయొక్క ప్రతిబింబమే! కాబట్టి ఆత్మ స్వరూపమే…” అని భావిస్తూ ఉపాసిస్తున్నాను. (సందర్భంగా జీవుడు సహజంగా పరమాత్మ) ఛాయా - ప్రతి బింబరూపమగు గుణ సహిత దేహమును ఆత్మ ప్రదర్శనముగా ఉపాసించటంచేత, అప్పుడిక ఏకాత్మ స్వరూప ఆరాధన చేస్తున్నట్లే కదా ! ఏకాత్మగా ఆరాధించువాడు ఏకాత్మస్వరూపుడై అద్వితీయత్వమును ఆస్వాదిస్తూ, ఆనందించుచూ, ద్వితీయమును స్వకీయ మాయా విశేషంగా, అహమ్ ఆత్మగా భావిస్తూ ఉపాసిస్తున్నాను.

బాలాకి ఋషీశ్వరుడు : మరి, ఏవ ఏష శబ్దః పురుషమ్ అన్వేతి తమ్ ఏవ అహమ్ ఉపాస? అహమ్ శబ్ద పురుషరూపుడనగుచున్నప్పుడు బ్రహ్మమును, పరమపురుషుని ఎట్లా దర్శించాలి?

అజాతశత్రు :  అహమ్ ప్రత్యయముగా ఉండి ఆత్మను ఎట్లా దర్శించాలో చెప్పలేను. అయితే, ఆయురితివా అహమ్ ఏతమ్ ఉపాసతే| అ-హమ్ అక్షర ప్రత్యయము ఆది అంతముగల ఆయువు రూపముగా ఉన్నదికదా ! మార్పు చెందేదంతా మృత్యురూపము ! మార్పుచెందేది (మృత్యువు) అమృత స్వరూపమునందలి చమత్కారమే! కనుక అహమ్ జాగ్రత్లోనిదిగాను, కల్పిత భావనగాను, ‘అహమ్’ యొక్క వాస్తవ రూపము ఆత్మగాను, అహమ్ను ఆత్మకు అభిన్నమైనదిగాను భావించి ధ్యానిస్తూ ఉన్నాను. ‘అహమ్’ ప్రత్యయమును బ్రహ్మము యొక్క ఒకానొక స్వకీయ కళావిశేషముగా భావిస్తూ ధ్యానము చేస్తున్నవారు - ఈ జగత్తులో ఏది చూచినా సంమోహితులు కారు. వారు మోహమును జయించగలరు. న అస్య ప్రజా పురా కాలా సంమోహయతి! దేహమును విడచునప్పుడు కూడా మోహము దరిజేరదు.

బాలాకి ఋషీశ్వరుడు : ఈ జాగ్రత్ శరీర పురుషుడగు ‘విశ్వుడు’ అని పిలవబడువానిగా, ఆత్మ స్వరూపము దర్శించటము ఎట్లా? ఏ పురుషుని ఉపాసించాలి?

అజాతశత్రు : అది ఎట్లాగో చెప్పటం నా చేత కాదు. అయితే “ఆత్మయే సృష్టికర్త అగు ప్రజాపతి పురుషుడు కదా !" … అనే భావనతో ఉపాసిస్తున్నాను. నా ఈ దేహములో ఉండి జాగ్రత్ అనుభవ పొందుచున్న ఆత్మయొక్క - వైభవ చమత్కారముగా జగత్ దృశ్యమును ఉపాసిస్తూ ఉన్నాను. దేహములో ఉన్న జాగ్రత్-విశ్వుని ’నేను’ను ప్రజాపతికి చెందినదిగా భావనచేస్తూ ఉన్నాను. అట్టివారికి సంతానము, పశుసంపద ప్రవృద్ధమౌతూ ఉంటుంది కదా !

బాలాకి ఋషీశ్వరుడు : గాఢనిద్రలో సంచారము చేస్తున్నట్టి ప్రాజ్ఞ పురుషుడుగా ఉన్నప్పుడు - స్వప్నములో సంచారములు చేస్తూ ఉన్న స్వప్న (తేజో) పురుషుని, సుషుప్త పురుషుని ఆత్మగా ఉపాసించటమెట్లా?

అజాతశత్రు : సుషుప్త - స్వప్న సంచార పురుషులగు ప్రాజ్ఞ - తేజస పురుషులను ఆత్మ స్వరూపులు ఎట్లా దర్శించాలో నాకు తెలియదు. అయితే, … ఆ రెండింటి యొక్క నిర్మాణము, స్థితి, గతి అంతర్గత విశేషాలు … ఇవన్నీకూడా ‘మార్పు’కు అధినేత అయినట్టి యమ భగవానునివిగా అర్థము చేసుకుంటూ ఉన్నాను. మూల కారణ పురుషుడగు - యమో రాజే, తేవా అహమ్ రూపములుగా ఉన్నారను భావనచే భక్తితో ప్రణమిల్లుచున్నాను. ఎవరు ప్రాజ్ఞ-తేజసు పురుషులను మార్పు యొక్క అధినేతయగు యమ భగవానునికి చెందినవిగా దర్శిస్తూ, ఆత్మకు అభిన్నముగా ఆరాధన చేస్తూ ఉంటారో, వారు శ్రేష్ఠత్వము పుణికి పుచ్చుకోగలరు కదా! ఆత్మయేవ యమ పురుషః।

బాలాకి ఋషీశ్వరుడు : నా దక్షిణ (కుడి) కంటిలో గల ’చూపు’ అనుశక్తి రూపములోగల పురుషుడెవ్వడు ? ఆతనిని నేను పరమ పురుషునిగా ఎట్లా దర్శించాలి ?

అజాతశత్రు : అది నేను మాటలకు పరిమితము చేసి వర్ణించి చెప్పలేను. నాకు తెలియదు. అయితే ఈ కుడికంటిలోని దృష్టిశక్తిని “అగ్ని-జ్యోతి స్వరూపుడగు ఆత్మయొక్క తేజో రూపము” అని భక్తితో నమస్కారములు సమర్పిస్తున్నాను. ఎవ్వడైతే కుడికంటిలోని చూపుశక్తిని ఆత్మయొక్క తేజోరూపముగా భావిస్తూ ఉపాసిస్తాడో, ఆతడు అతి సులభముగా సర్వమును ఆత్మస్వరూపముగా దర్శించగలడుకదా! తేషాం సర్వేషామ్ ఆత్మా భవతి। అట్టివాడు అతి త్వరగా ఈ సర్వమునకు ఆత్మగా తానే అగుచున్నాడు.

బాలాకి ఋషీశ్వరుడు : అవును ! తప్పక దర్శించగలడు. ఏవ ఏష సవ్యే అక్షన్ పురుషః తామ్ ఏవ అహమ్ ఉపాస? మరి ఈ ఎడమ
కంటిలోని దృశ్య శక్తిని పరమపురుషునిగా ఉపాసించటమెట్లా?

అజాతశత్రువు : ఈ ఎడమ కంటిలో వేంచేసి ప్రకాశిస్తూ ఉన్న దృక్శక్తితో ఎట్లా ఉపాసించాలో తెలియదు. అయితే ఈ ఎడమకంటిలోని అంతర్గత దృష్టిపురుషుణ్ణి ఆత్మతేజో విద్యుత్ విలాసముగా, సత్యాత్మ స్వరూపునిగా, స్వయమాత్మగా భావిస్తూ ప్రేమగా స్తోత్రములు సమర్పిస్తున్నాము. ఎడమ కంటిలోని దృష్టిశక్తిని ఆత్మగా భావించి ఉపాసించువాడు సత్యమునకు, విద్యుత్కు, తేజస్సుకు కూడా ఆత్మరూపుడై వెలుగొందగలడు కదా, భగవాన్ !

అప్పుడు బాలాకిఋషి అజాతశత్రు మహరాజు యొక్క ఉపాసనా వర్ణనలను వింటూ వింటూ ఇక ఏమీ మాట్లాడలేనివాడై, “ఆత్మగా ఉపాసించటము”… అను స్వర్వాతీతదృష్టి గురించి మననము చేస్తూ మౌనంగా ఉండిపోయాడు. తూష్ణీభావుడైనాడు.

అజాతశత్రు : ఓ బాలాకిఋషి పుంగవా? మీ ప్రశ్నలు ఇంతవరకేనా? లేక ఇంకేమైనా ప్రశ్నలు మిగిలి ఉన్నాయా ? ఏతావన్ను ?

బాలాకి ఋషీశ్వరుడు : నా ప్రశ్నలు ఇంతవరకేనయ్యా ! ఇంకేమీ మిగిలియుండలేదు. ఏతావత్ ధీతి !

అజాతశత్రు : ఓ ఋషీశ్వరా ! నా వాస్తవమైన అభిప్రాయము నిర్మోహమోటముగా చెప్పుచున్నాను. వినండి. ఇప్పటివరకూ మీరు అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు … ఇవన్నీ కూడా వేదాంత శాస్త్రములో ‘మృషమ్’ అని అంటారు. అనగా ఇవన్నీ భ్రాంతి మాత్ర విశేషాలే ! ‘మనస్సు’ అనే కల్పిత వస్తువును (లేక) స్వప్నములో కనిపించే భ్రమాత్మకమైనటువంటి స్వాప్నిక విశేషాలను అర్థ ప్రతిపాదనతో నిర్ణయించటము వంటిదే !

ఎందుచేతనంటారా ?

మనము ఇప్పటివరకు బ్రహ్మము యొక్క స్వీయకల్పనా రూపములైనట్టి కర్తృత్వసంఘము గురించి మాత్రమే చెప్పుకున్నట్లు అవుతుంది. వీటన్నిటికీ ఆధారమైయున్న బ్రహ్మము గురించి చెప్పుకోవాలికదా ! అసలు మనము తెలుసుకోవలసినది బ్రహ్మము గురించికదా !

ఆ మాటలు మౌనముగా ఉండి వింటున్న బాలాకిఋషి “ఓహోఁ! ఈతడు నిజంగా బ్రహ్మజ్ఞానియే ! ఆత్మతత్త్వము ఎరిగినవాడు. అందుచేత ఈతనిని గురుభావనతో దర్శిస్తూ, శిష్యత్వమును అవధరిస్తాను”…. అని తలచాడు. సమిత్పాణియై, (చేతిలో యజ్ఞ సమిధ (కట్టె)లను ధరించి) లేచి, అజాతశత్రు మహారాజు ఆసీనులైయున్న ఆసనమును సమీపించారు.

బాలాకి ఋషీశ్వరుడు : మహారాజా ! మీరు బ్రహ్మజ్ఞులు. గురుతుల్యులు. “ఆత్మయే నేనై - నేనే ఈ సర్వమై”…. ప్రకాశించగల ఆత్మతత్త్వజ్ఞానమును సూటిగా నాకు బోధించమని మిమ్ములను అభ్యర్ధిస్తున్నాను.

అజాతశత్రు మహారాజు : (లేచి నిలబడి) ఓ ఋషీశ్వరా ! మీరు వేద వేదాంగలు పారంగతులు. తపోసంపన్నులు. అధ్యయన కోవిదులు. నేనో, … మీవంటి పెద్దలకు శుశ్రూషచేస్తూ, తాత్త్విక విషయాలు విని నేర్చుకొనుచున్న ఒక సామాన్యరాజును. మహనీయులగు మిమ్ములను శిష్యులుగా స్వీకరించలేను. అయితే మనము ‘ఆత్మ’ యొక్క మహిమ ఎట్టిదో, స్వరూప - స్వభావములు ఏమేమిటో, ఎటువంటివో, ఔన్నత్యము ఎంతటిదో మనము మనన పూర్వకంగా తప్పక వివరించుకుందాము. రండి ! మనము అట్లా ఆరుబయటకు వెళ్ళెదము గాక !

అప్పుడు ఆ ఇరువురు అక్కడి సభను ముగించుకొని, ఆ సత్సంగ సభాస్థలము నుండి బయల్వెడలారు. అజాతశత్రు మహారాజు తనకుడి హస్తముతో ఆ ఋషిపుంగవుని ఎడమ చేతిని ఆప్యాయంగాను, స్నేహపూర్వకంగాను పట్టుకొని… కాశీ పట్టణము పొలిమేరలకు నడుచుకుంటూ వెళ్ళారు. ఒకచోట గల ఒక ఇంటిలో ప్రవేశించారు. ఆ ఇంటి యజమాని ఒక మంచముపై విశ్రాంతి తీసుకుంటూ గాఢనిద్రా పరవశుడై ఉన్నాడు. ఆ ఇద్దరు, ఆతడు నిదురించియున్న మంచమును సమీపించారు.

అప్పుడు అజాతశత్రు మహారాజు - “తెల్లటి వస్త్రము ధరించి, తెల్లటి దుప్పటి కప్పుకొనియున్న మిత్రమా ! సోమరాజా ! నీ చిన్ననాటి స్నేహితుడను, అజాతశత్రు మహారాజును. నేను నీతో కాసేపు చిన్ననాటి బాల్య విశేషాలు ముచ్చటించాలని వచ్చానయ్యా ! నిదురలేఁ !” … అని మృదువుగా పలికారు.

కానీ గాఢ నిద్రలో ఉన్న ఆ సోమరాజు నిద్రలేవనే లేదు.

బాలాకి ఋషి ఇదంతా గమనిస్తున్నారు. “ఈయన తాత్త్విక విశేషములు, ఆత్మతత్త్వము చెప్పమంటే… ఇదేమిటి ? ఇక్కడికి నన్ను తీసుకువచ్చారు? ఇందులో ఏదో విశేషము ఉండి ఉంటుందిలే !” … అని మనస్సులో అనుకుంటూ ఉన్నారు.

అప్పుడు అజాత శత్రు మహారాజు గాఢనిద్రలో ఉన్న తన బాల్యమిత్రుడు సోమరాజును ఆ ప్రక్కనే ఉన్న ఒక చిన్న కర్రతో - కొంచము గట్టిగా తట్టారు. నిద్రపోతూ ఉన్న సోమరాజుకు మెళుకువ వచ్చింది…. నెమ్మదిగా కళ్ళు తెరచి అటువైపు ఇటువైపు చూచారు. మహారాజు కనిపించాడు. ఉలిక్కిపడ్డాడు. వెంటనే గబుక్కున లేచి, “మహారాజా ! ఏమి ఆశ్చర్యం ! మీరు మా ఇంటికి రావడమేమిటి? ఆజ్ఞ ఇస్తే నేనే వచ్చేవాడిని కదా !" అని చేతులు కట్టుకొని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు.

అప్పుడు అజాతశత్రు రాజు బాలాకిర్యఋషితో ఇట్లా సంభాషించసాగాడు.

అజాతశత్రురాజు :  ఓ ఋషి పుంగవా ! ఇప్పుడు మిమ్ములను కొన్ని ప్రశ్నలు అడుగుచున్నాను.
- నా బాల్యమిత్రుడు ఈ సోమరాజు రాత్రి నిద్రపోతూ ఎక్కడినుండి ఎక్కడికి వెళ్ళాడు ?
- గాఢ నిద్రలో ఉండగా, ఎక్కడ ఉండి ఉండటం జరిగింది ? ఆతడు అప్పుడు ఉన్నదెక్కడ?
- నేను నిద్ర లేపినప్పుడు ఎక్కడినుండి ఎక్కడికి వచ్చి ఉన్నాడు ? ఏచోటు నుండి ఈ ’జాగృత్’కు వచ్చాడు?

బాలాకి ఋషి : గురువర్యా ! అజాతశత్రు మహారాజా ! మీరు అడిగిన ప్రశ్నయే నాకు అర్థము కాలేదు. ఇక సమాధానము ఏమి చెప్పగలను ? ‘తెలియదు!’ అని మాత్రం అనగలను.

అజాతశత్రు మహారాజు : ఇప్పుడు ‘యోగపరిభాష’లో కొన్ని విశేషాలు చెప్పుకుందాము. ఈతడు ఇంద్రియానుభవములయినట్టి జగద్విశేషాలనుండి బుద్ధితో వెనుకకు మరలాడు. ఇంద్రియములను కూడా వదిలి ‘హిత’ అనే పేరుతో చెప్పబడే నాడిలో ప్రయాణిస్తూ ఆలోచన-భావనలకు జనన ప్రదేశమగు హృదయ స్థానమును చేరాడు. అట్టి హృదయ స్థానమును, పురీతతము అని పిలుస్తున్నారు.

ఈతడు ప్రయాణించిన హితనాడి భావచైతన్య శక్తిరూపము. ఒక వెంట్రుకలో వేయివవంతు (1/1000) పరిమాణము గల సన్నటి సూక్ష్మనాడి. అట్టి హితనాడి మార్గములో - ఆకుపచ్చ - తెలుపు - ఎరుపు - నలుపు - పసుపు - నీలిరంగు విభాగములున్నాయి. ఆ హితనాడిలో తెల్లటి విభాగమును మనస్సుతో దర్శిస్తూ ఉన్నప్పుడు, ఇక ఆతనిపట్ల జాగ్రత్-స్వప్నములు “స్ఫురణలో లేనివి”గా అగుచున్నాయి. అనగా, జాగ్రత్లోని ‘నేను’, స్వప్నములోని ‘నేను’ ప్రదర్శితమై ఉంటున్నాయి. విషయములను దాటివేసిన హృదయవిభాగము చేరిన జీవుడు ప్రాణశక్తితో ఏకత్వమును పొందినవాడై ఉంటాడు. అనగా, ఏ ఆలోచనలు చేయని వాడై, కేవల ప్రాణ స్వరూపుడగుచున్నాడు. ఈతడు అనుభవములను దాటివేసిన స్థానమును అప్పుడు చేరుచున్నాడు. అయితే, అట్టి గాఢనిద్రా సందర్భములో తనను తాను విడచి ఉంటున్నాడా? లేదు.

ఈతని జాగ్రత్-స్వప్నములలోని సర్వవాక్కులు, నామ-రూపములు, అనుభవ ప్రజ్ఞ … ఇవన్నీ సుషుప్తిలో ఏకరూపము పొందుచున్నాయి.
దృశ్యము దృష్టితోను, శబ్దము శ్రవణశక్తితోను, స్పర్శానుభవములన్నీ స్పర్శశక్తితోను, … ఏకత్వము పొందుచున్నాయి.
మనసః సర్వైః ఆప్యేతి| మనస్సులోని సర్వ ధ్యాసలు ఏకరూపము పొందుచున్నాయి.
మనస్సు ప్రాణశక్తిలో ప్రాణతరంగ రూపముదాల్చి అప్రకటితరూపము సంతరించుకొంటోంది.
ఈ జీవుడు కేవల ప్రాణస్వరూపుడై విషయ రాహిత్యమును ఆస్వాదిస్తున్నాడు.

గాఢనిద్రనుండి నిదురలేవగానే …. ?
అగ్ని ప్రజ్వలనమవగానే కాంతి బహిప్రదర్శనమౌతుంది చూచారా ? ఆ విధంగా, … ఎప్పుడైతే ఈ నా మిత్రుడు నిదురలేచాడో, …
- మొట్టమొదటి ప్రాణశక్తి అగ్ని విస్ఫులింగమువలె ఈతని స్వకీయ చైతన్య స్ఫూర్తిచే ప్రజ్వలితమైనది.
- ఆ వెనువెంటనే ఇంద్రియములలోనికి ప్రాణశక్తినుండి ఇంద్రియ దివ్యశక్తులు తిరిగి చేరుచున్నాయి.
- ఆ ఇంద్రియ శక్తులతోబాటే - అనుభూతులు, అనుభవములు, అభిప్రాయములు, ఆవేశ-కావేశములు, తదితర చారిత్రకమైన సమాచారములు కూడా చేరుచున్నాయి. అవన్నీ ప్రాణశక్తియొక్క సూక్ష్మ రూపములే !
- “ప్రాణశక్తి + మనస్సు + జ్ఞప్తులు” వీటన్నిటినీ తన బుద్ధితో ఉపయోగిస్తూ ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు కనులు తెరుస్తున్నాడు.
సంస్కారములను, మనస్సును ఉపయోగించి ఇతఃపూర్వపు ఇంద్రియ దృశ్యమును తిరిగి అనుభవములోనికి తెచ్చుకొనుచున్నాడు.
- ఇక కనులు తెరచి ఎదురుగా ఉన్న సమయ - సందర్భములను అనుసరించి ఇతఃపూర్వమువలె ప్రవర్తమానుడగుచున్నాడు.

ఇక్కడ నా ఈ మిత్రుడగు సోమరాజు కనులు తెరచిన తరువాత నన్ను చూచి “మహారాజా !” అని మిగిలిన సర్వ అంగములతో రాజదర్శన వ్యవహారములోనికి ఉద్దేశ్యము - ఆవేశములతో ప్రవేశించటము మనము చూచాము కదా !

గాఢనిద్రలో ఆత్మయందు మౌనరూపంగాను, నిర్విషయ ప్రదర్శనరూపంగాను ఉన్నట్టి ప్రాణశక్తి ఆత్మయొక్క స్వసంకల్పముచే బయల్వెడలి దేహము యొక్క నఖ-శిఖ పర్యంతము తనను తాను నింపివేసినదగుచున్నది.

కాబట్టి ప్రాణశక్తికి ప్రధమోత్పత్తి స్థానము ఏది ? ఆత్మయే!

ప్రాణశక్తినుండి శబ్ద - - స్పర్శ - రూప - రస - గంధ - మనో - దివ్య తత్త్వములు - దీపముయొక్క వేరువేరు కిరణములవలె, సప్తరంగుల సూర్యకాంతివలె (సప్తాశ్వరధమారూఢము) వలె - ప్రదర్శమానమగుచున్నాయి. ఆ ‘దేవతలు’ అనబడు (శబ్దము, మనస్సు మొదలగువాటి నుండి) ఈ 14 లోకములు ఒకే జలములోని వివిధ తరంగములవలె దర్శనమగుచున్నాయి.

ఆత్మయే ….,

ప్రాణరూపము దాల్చి,
భౌతిక - అభౌతిక తత్త్వములన్నీ ప్రదర్శించుచున్నదై,
మరొకప్పుడు సర్వమును తనయందు లీనము చేసుకొనుచున్నదై, మౌనము వహించినదై,
వాస్తవానికి జగత్తులు ప్రదర్శించుచున్నప్పుడు, ఉపశమింప జేస్తున్నప్పుడు కూడా ముందు - వెనుక కూడా పరమశాంతమై, మహామౌనస్వరూపమై, కేవల - నిర్విషయమై ఉంటోంది.

అందుచేత ఓ బాలాకి ఋషీశ్వరా !

ఎల్లప్పుడూ ఆత్మ యధాతథము ! మీరు-నేను-మనము విడచి వచ్చిన సభలోని జనులు - మనమంతా ఏకైకరూపమగు ఆత్మయే! అఖండాత్మ స్వరూపులమే! ఈ సర్వము ఆత్మకు అభిన్నము ! అట్టి సహజ రూపభావన గుర్తుకురావటానికే ఉపాసన !

చిత్రగార్యాయణి :  ఓ ఆరుణిగౌతమ - శ్వేతకేతు మమాత్మ స్వరూపులరా ! మనము ఈ “కౌషీతకీ బ్రాహ్మణోపనిషత్”ను సత్సంగ పూర్వకంగా ముగించుకుంటూ ఒక్కసారి కొన్ని విషయాలు సమీక్షించుకుందాము.

ప్రాణము-ఇంద్రియములు-మనస్సు- జగత్ దృశ్యము - ప్రాణులు - అధిష్టాన ఇంద్రియ దేవతలు - అంతరంగ చతుష్టయము - 14 లోకాల సర్వ అంతర్గత విశేషాలు, జాగ్రత్-స్వప్న-సుషుప్తులు… ఇవన్నీ కూడా ఆత్మ అనే జ్యోతి యొక్క తేజో విలాసములే ! ఆత్మ సూర్యుని కిరణజాలములే !

ఆత్మ తనకు అభిన్నమైన దృశ్యభావనను ఒకప్పుడు తననుండి ప్రదర్శితము చేస్తూ, మరొకప్పుడు తన యందే ఏకస్వరూపముగా, ఆత్మస్వరూపముగా లయింపజేసుకొనుచున్నది. ఇదంతా ఈ జీవునియొక్క దైనందికమైన స్వప్నానుభవము, స్వప్న-ఉపశమనము వంటిదే!

ఏ విధంగా ….

ఏవిధంగా ఒక కథా రచయిత అనేక పాత్రలు స్వభావములను ప్రారంభించి, కొనసాగించి, ముగించి…. కథను తనయందు మౌనరూపంగా లయము చేసుకుంటున్నాడో…,

ఆత్మకూడా …,

సర్వ ఇంద్రియ దేవతలను కల్పించుకొని ఈ దృశ్య వ్యవహారమంతా ఆస్వాదిస్తోంది !

అట్టి ఆత్మను ఏమరచినప్పుడు జీవునికి సుఖ-దుఃఖ, బంధ-మోక్ష మొదలగునవి భావాలు చుట్టు ముట్టి ఉంటున్నాయి. క్రమ్ముకుంటున్నాయి.

ఆత్మజ్ఞానముచే సర్వము స్వస్వరూపాత్మగా అనుభూతమై, ‘తదితరము’ అయినదంతా ఆత్మయందు ఏకత్వము-అను రూపముగా లయమగుచున్నది. ఏకమగుచున్నది! అనగా సర్వము ఆత్మకు అనన్యమగుచున్నది.

సోదాహరణముగా చెప్పాలంటే…, త్రిలోకాధిపతి ఇంద్రుడు కూడా ఆత్మజ్ఞానమును ఏమరచినప్పుడు అసురులు దండయాత్ర చేస్తున్నారు.

తిరిగి ఇంద్రుడు ఆత్మజ్ఞాని అయినప్పుడు అసురులను జయించి స్వారాజ్య సిద్ధి పొందుచున్నారు.

ఆత్మజ్ఞానము ఎరిగినప్పుడు ఈ జీవుడు ఆత్మగానే సర్వము ఆస్వాదిస్తున్నాడు. స్వారాజ్యభిషిక్తుడగుచున్నాడు. ఏమరచినప్పుడో, పరిమితత్త్వమును భావనచేసి ‘జీవుడు’ అని పిలువబడుచున్నాడు.

వాస్తవానికి ఈ జీవుడు సర్వదా ఆత్మయే ! ఆత్మయే జీవుడుగా కనిపిస్తోంది.

ఆత్మదృష్టిచే ఆత్మగా అనిపించగలదు !

కనుక జగత్ దృష్టికి కనిపించే జగత్తును ఆత్మ దృష్టితో దర్శించటమే యోగము - జ్ఞానము కూడా!

🙏 ఇతి కౌషీతకీ బ్రాహ్మణ ఉపనిషత్ సమాప్తః । 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥