[[@YHRK]] [[@Spiritual]]

Mudgala Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


ఋగ్వేదాంతర్గత

9     ముద్గలోపనిషత్

మంగళ శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో॥ శ్రీమత్ పురుష సూక్తార్థం, పూర్ణానంద కళేబరమ్ ।
పురుషోత్తమ విఖ్యాతం, పూర్ణం బ్రహ్మ భవామి అహమ్ ॥

పూర్ణానందముగా తీర్చిదిద్దగల "పురుషోత్తమము” అని ప్రసిద్ధమై యున్న - శ్రీమత్ నారాయణ ప్రవచితమగు పురుష సూక్తార్ణమును సేవించి పూర్ణబ్రహ్మముగా అగుదుము గాక!

NOTE#1: ముద్గల ఋషిచే ప్రోక్తమైనది ఈ ఉపనిషత్.

NOTE#2: ఈ ఉపనిషత్ “పురుషసూక్తము”నకు వివరణ ఇచ్చుచున్నందు వలన వ్యాఖ్యానము చివరిలో “పురుషసూక్తము” మూల మంత్రములు అర్థసహితముగా అనుబంధముగా (Annexure) పొందుచేయబడినది..

1.) ఓం
(అథ) పురుషసూక్తార్థ నిర్ణయమ్,
వ్యాఖ్యాస్యామః ।
పురుష సంహితాయామ్
పురుష సూక్తార్థః సంగ్రహేణ ప్రోచ్యతే ॥

సర్వస్వరూపుడు - స్వస్వరూపుడు, ఓంకార సంజ్ఞార్థుడు అగు పరమపురుషుని గురించి పురుష సూక్తముచే గానము చేయబడుచున్నది. అట్టి పురుషసూక్తము’ ఏ అర్థమును అందిస్తోందో. “ఈ జీవుని వాస్తవ సహజ స్వరూపమగు పరమపురుష తత్త్వము గురించి - ఏమని నిర్ణయిస్తోందో, వ్యాఖ్యానిస్తోందో,… ఆ విషయాలు ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము. పురుష సంహిత లో వర్ణించి చెప్పబడిన పురుషసూక్తము యొక్క అర్థ విశేషాలను సంగ్రహముగా వివరించుకొనెదము గాక!

‘సహస్ర శీర్‌షా’ ఇతి అత్ర స శబ్ది అనంత వాచకః
అనంత యోజనం ప్రాహ ’దశాంగుల’ వచః తథా|

ప్రథమ మంత్రం :-
తస్య ప్రథమయా విష్ణోః
(సహస్రాక్షః సహస్ర పాద్
సభూమిం విశ్వతో వృత్త్వా
అత్యతిష్ఠత్ దశాంగుళమ్ ॥)



ద్వితీయ మంత్రం :-
(పురుష ఏవ ఇదగ్ం సర్వం
యత్ భూతం, యచ్ఛ భవ్యమ్ ॥)

ద్వితీయా చ అస్య విష్ణోః ‘కాలతో వ్యాప్తిః’ - ఉచ్యతే ॥

సహస్ర శీర్‌షా పురుషః | సహస్రాక్షః | సహస్రపాత్!
పురుషుడు = The worker of the Universe, వేయితలలు = సహస్రశీర్‌షా పురుషః అనునది - ఒక కథలోని అనేక పాత్రల ఆలోచనా విధానాలన్నీ ఆ కథా రచయిత యొక్క సంకల్పనా చమత్కారములైన తీరుగా - పురుషుడు (పరమాత్మ) అనంతరూపుడు - అనంతగుణుడు - అనంత నామాత్మకుడు… మొదలైన విధంగా - ఆయన అనంతతత్వము సూచించబడుచున్నది.

భూమిం - విశ్వతో వృత్వా స దశాంగుళమ్ అత్యతిష్ఠతి : అని అన్నప్పుడు - “ఈ భూమి - విశ్వము (దృశ్యము) పరిమితము కాదు - అపరిమితము. అనంతవిస్తీర్ణము - అని అభివర్ణించబడుచున్నారు. దేశతో వ్యాప్తిః శబ్దా దశాంగుల వచః తథా!
( కథా రచయిత యొక్క రచనా కళా విశేషమే కథంతా నిండి, తాను కథకు వేరుగా ఉన్నట్లు, స్వప్నము తనదైనవాడు-స్వప్నమంతా నిండి ఉండి - వేరుగా కూడా ఉన్న విధంగా) …”ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు…. అను అర్థమును సూచించేదే ‘విష్ణు శబ్దము’.

దశాంగుళమ్ అన్నప్పుడు దేశముగా (By virtue of Place and Matter) - విష్ణువు అనంతుడై విస్తరించి ఉన్నారు - అని విష్ణు ప్రథమ వర్ణన.

‘యత్ భూతమ్ - యశ్చభవ్యమ్’ అనునప్పుడు కాలముచే ఆయన అనంత కాలస్వరూపుడై విస్తరించి ఉన్నట్లు దేశతః - కాలతః అనంతుడు అగు విష్ణువే తత్పురుషుడు - అని సిద్ధాంతీకరించబడుతోంది - (విష్ణు ద్వితీయ వర్ణన)

2.) విష్ణోః మోక్షప్రదత్వం చ కథితం తు తృతీయయా |
‘ఏతావాన్’ ఇతి మంత్రేణ వైభవమ్ కథితమ్ హరేః |
‘ఏతేనైవ చ’ మంత్రేణ చతుర్వ్యూహో విభాషితః |
‘త్రిపాద్’ ఇతి అనయా ప్రోక్తమ్ అనిరుద్ధస్య వైభవమ్ |
‘తస్మాత్ విరాడ్’ ఇతి అనయా పాదనారాయణాత్ ధరేః I
‘ప్రకృతేః పురుషస్య’ అపి సముత్పత్తిః ప్రదర్శితా ।

ఉత అమృతస్య ఈశానః యత్ అన్నేన అతిరోహతి - అను ’3’వ మంత్రము
విష్ణువు అజ్ఞాన జీవులకు మోక్షమును ప్రసాదించుట కొరకై అన్నము (That being Experienced) రూపముగా వేంచేస్తున్నారు… అని వ్యాఖ్యానించబడుచున్నది.

ఏతావాన్ అస్య మహిమా అతోజ్యాయాగ్ంశ్చ పురుషః -
ఆ పురుషుని మహిమా విశేషమే ఈ దృశ్య జగత్తు - ఈ జీవులు కూడా ! ఆయన - మన కంటికి కనిపించే శక్తి కన్నా కూడా ఇంకా ఇంకా అనంత శక్తి - ప్రభావ - వైభవములు కలిగియున్నారు.
ఈ విశ్వము - ఇందులోని జీవరాసులు… (భౌతిక ప్రపంచమంతా మార్పు చేర్పులు పొందుతూ) ఆ పురుషునిలో 4వ వంతు మాత్రమే. ఈ భౌతిక ప్రపంచానికి ఆవల అమృతము - దివ్యము అగు మరిమూడు విభాగములు నిత్యమై ప్రకాశిస్తున్నాయి.

(1) విరాట్ పురుషుడు - భౌతిక కల్పనా కళాపురుషుడు భౌతిక - తత్త్వము - శరీర పురుషుడు (ప్రకృతి)
(2) ఛందః పురుషుడు - మనో పురుషుడు (కేవల మనస్సు)
(3) వేద పురుషుడు - బుద్ధి పురుషుడు (కేవల బుద్ధి)
(4) మహా పురుషుడు - ఆత్మ పురుషుడు

త్రిపాదూర్థ్వ ఉదైఃపురుషః - అన్నప్పుడు మార్పులేని - నిరుద్ధముకానట్టి - అనిరుద్ధ పురుష వైభవము చెప్పబడుతోంది!

తస్మాత్ విరాట్ - జాయత : దేహమునకు వేరైన - గుణ దోషములచే స్పృశించని ఆవల ‘3’ భాగముల నుండి చేతన - అచేతన రూపములుగా విరాట్ రూపుడై, భూవిభాగుడై “పాదనారాయణుడు”గా ప్రదర్శనమగుచున్నారు.

తస్మాత్ విరాడజాయతా - అనుమంత్రముచే ఆ నారాయణుని నుండి ప్రకృతిజీవుడు ఈ రెండు సముత్పన్నమై ప్రదర్శితమగుచున్నాయి - అని తెలియజేయబడుచున్నది.

‘యత్ పురుషేణ’ ఇతి అనయా సృష్టి యజ్ఞః సమీరితః ।
‘సప్త ఆస్యాసన్ పరిధయః’ సమిధశ్చ సమీరితాః ॥

యత్ పురుషేణ హవిషా దేవాయజ్ఞమ్ అతన్వత - దేవతలు - శరీర రచనా ప్రజ్ఞలు సృష్టించబడి, ఆ తరువాత సృష్టికొరకై ఆ దేవతలు “సృష్టియజ్ఞము” ను నిర్వర్తించటము గురించి చెప్పబడుతోంది.

సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తసమిధః కృతాః - దేవతలు పురుష స్వరూపమనే ‘హవిస్సు’గాను, శరదృతువును ఆజ్యముగాను, ఏడు స్వరములు ఛందస్సులు గాను, 7 × 3 ఉదాత్త - అనుదాత్త మొదలగువి సమిధలుగాను విరాట్ పురుషుని యజ్ఞపశువుగాను మానసిక యజ్ఞము సృష్టికొరకై నిర్వర్తించారు.

[దేవతలు =  సృష్టికర్త బ్రహ్మ యొక్క ప్రాణ - ఇంద్రియ స్వరూపులు. సృష్టియొక్క మూల స్వరూపములైనట్టి కేవల శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ ప్రదాతలగు దివ్య ప్రజ్ఞలు.]

‘తం యజ్ఞమ్’ ఇతి మంత్రేణ సృష్టియజ్ఞః సమీరితః ।
‘అనేన చ ఏవ’ మంత్రేణ మోక్షశ్చ సముదీరితః ॥

తం యజ్ఞమ్ బర్హిషి ప్రోక్షమ్ పురుషం జాతమగ్రతః - ఆ సృష్టియజ్ఞము సిద్ధించటానికి సృష్టికి పూర్వమే జనించిన విరాట్ పురుషుడు యజ్ఞపశువుగా వికసించారు.
సృష్టియజ్ఞములో అనేక ఆ సృష్టికి ఉపకరణములగు నామరూపాత్మకమైన వస్తు తత్త్వములు, జంతుతత్త్వములు, శక్తితత్వములు ఆ యజ్ఞపశువు నుండి … జనించాయి.
జీవుడు, బంధము, మోక్షము… వరకు సృష్టి సరంజామా అంతా ఉత్పన్నమైనది.

‘తస్మాత్’ ఇతి చ మంత్రేణ జగత్ సృష్టిః సమీరితా ।
‘వేదాహమ్’ ఇతి మంత్రాభ్యామ్ వైభవమ్ కథితం హరేః॥
‘యజ్ఞేన’ ఇతి ఉపసంహారః సృష్టేః మోక్షస్య చ ఈరితః
‘య ఏవమ్’ ఏతత్ జానాతి స హి ముక్తో భవేత్ । ఇతి ॥

తస్మాత్ యజ్ఞాః సర్వహుతః సంభృతమ్ పృషత్ ఆజ్యమ్ - అనుమంత్రము చే
ఈ దృశ్యజగత్ సృష్టియొక్క కల్పనా విధానమంతా చెప్పబడినది.

(1) వేదాఽహమ్ ఏతమ్ పురుషం మహంతమ్, ఆదిత్యవర్ణమ్, తమసస్తుపారే…
(2) ధాతా పురస్తాత్ ఆద్యం ఉదజహార, శక్రః ప్రవిద్వాన్ ప్రదిశః చతస్రః
- అను రెండు మంత్రములచే సర్వమును తానైన ‘హరి’ యొక్క వైభవము వర్ణించి చెప్పబడింది.

యజ్ఞేన యజ్ఞమ్ అజయన్త దేవాః తాని ధర్మాని ప్రధమాని ఆసన్ అను మంత్రము ద్వారా, “ఈ సృష్టికి మోక్షమే ఉపసంహారము”… అను విషయము విశదీకరించబడింది.
ఎవ్వడైతే మూలపురుషుడు తత్త్వ ప్రజ్ఞలగు ఇంద్రియదేవతలు - దేవతల యజ్ఞము - సృష్టి ప్రదర్శనము - ఉపసంహార రూపమగు మోక్షము… మొదలైనవి గానము చేయబడిన పురుషసూక్తార్ధమును తెలుసుకుంటాడో, ఆతడు తాను ముక్తుడౌతాడు. లోక సహ జనులకు కూడా ముక్తిని కలిగించగలడు.

3.) అథ తదా “ముద్గలోపనిషత్”
ఇతి పురుషసూక్తస్య వైభవమ్
విస్తరేణ ప్రతిపాదితమ్ ।
వాసుదేవ ఇంద్రాయ భగవత్ జ్ఞానమ్ ఉపదిశ్య
పునరపి సూక్ష్మశ్రవణాయ
ప్రణతాయ ఇంద్రాయ।
పరమ-రహస్య భూతమ్,
పురుషసూక్తాభ్యామ్
ఖండద్వయాభ్యామ్
ఉపాదిశత్ ।
ద్వౌ ఖండే ఉచ్యేతే
యో అయమ్ ఉక్తః సః ‘పురుషో
నామ రూప - జ్ఞాన అగోచరమ్ ।
సంసారిణామ్ అతి దుర్జేయమ్ (దుః జ్ఞేయమ్)
విషయం విహాయ
క్లేశాదిభిః సంక్లిష్ట దేవాది జిహీర్షయా
సహస్ర కలావయవ కల్యాణమ్ దృష్టమాత్రేణ
మోక్షదమ్ వేషమ్ ఆదదే ॥

ఈ విధంగా “ముద్గలోపనిషత్" ప్రతిపాదించబడిన పురుషసూక్త వైభవమును భగవంతుడగు వాసుదేవుడు ఇంద్రునకు జ్ఞానోపదేశము కొరకై సవిస్తరముగా బోధించారు.

అప్పుడు ఇంద్రుడు పురుషసూక్తవైభవమును విన్న తరువాత మరింత సూక్ష్మగ్రహణమునకై, అందులోని పరమ రహస్యమగు మరికొంత అంతరార్థము తెలుసుకోవాలనుకొని, తిరిగి జగద్గురువగు వాసుదేవునికి నమస్కరించారు.

అప్పుడు వాసుదేవ భగవానుడు పురుషసూక్తమంత్రముల యొక్క పరమరహస్యమగు సూత్రార్థమును రెండు ఖండములుగా (విభాగాలుగా విభాగించి) ఉపదేశించసాగారు.

తదాదిగా, రెండు (ఖండములుగా) విభాగములుగా చేసి పురుషసూక్తార్థమును చెప్పుచున్నారు.

పురుషసూక్తములో చెప్పిన పురుషుడు అనగా ఎవ్వరు? ఆయన నామ-రూపములకు సంబంధించినవాడు కాదు. ఇంద్రియ జ్ఞానమునకు అగోచరుడు. దృశ్యముపట్ల సత్యదృష్టి కలిగినవారై, ఇంద్రియ విషయములే ఆశయములుగా గల సంసార జీవులకు అందని వాడు దుర్జేయుడు. ఆయన నిర్విషయుడు. ఇంద్రియ విషయములకు వేటికీ సంబంధించనివాడు. ఇంద్రియ ధ్యాసలకు అందనివాడు. కానీ దేవతలయొక్క మరియు (కర్మ - భక్తి - జ్ఞాన - యోగమార్గములను అనుసరించు) సర్వ జీవులయొక్కయు - సంక్లిష్టములను, ఆపదలను తొలగించుటలో సముత్సాహము కలిగియున్నవారు. వేలాది కళా రూపములు, కళా అవయములు తనయందు కలిగి ఉన్నవాడై - కళ్యాణ ప్రదుడై దర్శన మాత్రముచే మోక్షప్రదుడు. సర్వ సులక్షణములుగల వేషమును స్వీకరించువారు. (నామ రూప రహితుడై ఉండి కూడా,… దేవతల కొరకు, భక్తుల కొరకు మంగళప్రద రూపులై కనిపించువారు. అవతారములు ధరించువారు).

4.) తేన వేషేణ భూమ్యాది లోకమ్ వ్యాప్య
అనంత యోజనమ్ అత్యతిష్ఠత్ ।
పురుషో నారాయణో భూతమ్ భవ్యమ్ భవిష్యత్ చ ఆసీత్ ।
స ఏష సర్వేషామ్ మోక్షదశ్చ ఆసీత్ ।
స చ సర్వస్మాన్ మహిమ్నోః జ్యాయాన్ ।
తస్మాత్ న కోఽపి జ్యాయాన్ ।
మహాపురుష ఆత్మానమ్ చతుర్థా కృత్వా,
త్రిపాదేన పరమే వోమ్ని చ ఆసీత్ ।
ఇతరేణ చతుర్థేన అనిరుద్ధనారాయణేన
విశ్వా న్యాసన్! స చ పాదనారాయణో
జగత్ స్రష్టుమ్ ప్రకృతిమ్ అజనయత్ ।
స సమృద్ధ కామః సన్, సృష్టికర్మ న జజ్ఞివాన్,
సో అనిరుద్ధనారాయణః తస్మై సృష్టిమ్ ఉపాదిశత్ ॥

ఆ రూపమే “పురుష నారాయణ" రూపము. ఆ రూపముతో ఆయన భూ - స్వర్గ - పాతాళ త్రిలోకములన్నీ వ్యాపించి అనంత యోజన విస్తీర్ణములను, అనేక బ్రహ్మాండములను ఆక్రమించుకొని ఉన్నారు. ఈ సర్వము తానై ఉన్నారు!

ఆ పురుష నారాయణుడే భూత-వర్తమాన భవిష్యత్ ఏకస్వరూపుడు ! ఆయన సర్వులకు ‘మోక్షప్రదుడు’ అయి ఉన్నారు.

ఆయన తదితర సర్వవస్తువుల కంటే - మహామహిమాన్వితుడు. సర్వ విషయములకు ఉత్పత్తిస్థానమైకూడా నిర్విషయుడు. సర్వము తన మహిమగా కలవాడు.

ఆ పురుష నారాయణుని మించినది మరెవ్వరూ లేరు. ఏదీ లేదు.

ఆ మహాపురుషుడు తనను తాను 4 విభాగములుగా రచించుకొనుచున్నారు.
తన యొక్క మూడు పాదములచే (విభాగములచే) ఆకాశమంతా నింపివేస్తున్నారు.
పరమాకాశ రూపంగా సంప్రదర్శితులు.
ఇక నాలుగవ పాదము (విభాగము) అగు ’అనిరుద్ధనారాయణుడు - సర్వభౌతిక ప్రపంచ రూపుడగుచున్నాడు. అట్టి విశ్వరూపుడగు పాదనారాయణుడు జగత్ సృష్టి నిర్వర్తించటానికై ‘ప్రకృతి’ని జనింప చేయుచున్నారు.
ఆ పాదనారాయణుడు పూర్ణకాముడు. కొత్తగా ‘ఇది పొందాలి’ అనునదేదీ లేదు.
అందుచేత సృష్టికి సంబంధించిన జిజ్ఞాస ఏమీ ఉండదు. త్రిపాదూర్ధ్వ పురుషుడగు అనిరుద్ధ నారాయణుని ఉపదేశము చేతనే ‘సృష్టి’ అను ప్రకృతి పాదనారాయణునిచే సంకల్పితముగుచున్నది. ఈ సృష్టి నారాయణ వినోద సంకల్ప రూపము!

5.) బ్రహ్మన్! తవ ఇంద్రియాణి యాజకాని ధ్యాత్వా,
కోశభూతమ్ ధృఢ గ్రంథిం, కళేబరం హవిః ధ్యాత్వా,
మాం హవిర్భుజమ్ ధ్యాత్వా,
వసంతకాలం ఆజ్యం ధ్యాత్వా, గ్రీష్మమ్ ఇధ్మం ధ్యాత్వా,
శరదృతుమ్ రసమ్ ధ్యాత్వా, ఏవమ్ అగ్నౌ హుత్వా,
అంగస్పర్శాత్ కళేబరం
వజ్రం హీష్యతే|
తతః స్వకార్యాన్,
సర్వప్రాణి-జీవాన్ సృష్ట్వా
పశ్చాత్ ద్యాః ప్రాదుర్భవిష్యంతి।
తతః స్థావర - జంగమాత్మకం
జగత్ భవిష్యతి |
ఏతేన జీవాత్మనోః యోగేన
మోక్షప్రకారశ్చ
కథిత, ఇతి అనుసంధేయమ్ |
య ఇమం సృష్టియజ్ఞమ్
జానాతి మోక్షప్రకారం చ
సర్వమ్ ఆయుః ఏతి |

నా అంశరూపుడవగు ఓ బ్రహ్మ దేవా ! సృష్టియజ్ఞము కొరకై ధ్యానము చేయుచుందురు గాక! మీరు ఇంద్రియములనే సృష్టియజ్ఞము నిర్వర్తించు యాజకులు అగుదురుగాక!

ధృఢ గ్రంధులు కలిగి, కోశములతో కూడిఉన్న కళేబరము (ఈ భౌతిక దేహము) హవిస్సుగా అగుగాక! హవిస్సుగా (ధ్యానము చేయుదురు గాక!)
(అనిరుద్ధ నారాయణుడగు) నేను హవిర్భోక్తనుగా భావించబడుగాక !

ముందుగా కాలమును కల్పించండి ! కాలస్వరూపుడనై నేనే ఉంటాను! అనగా కాలమును నాయందు కల్పించెదరు గాక!
వసంతకాలము - ఆజ్యము
గ్రీష్మఋతువు - ఇంధనము
శరదృతువు - హవిస్సు
సృష్టియజ్ఞమును ఈవిధంగా ఆరంభించి… అప్పుడు అగ్నియందు హోమము చేసెదరుగాక !

ఆ తరువాత అంగస్పర్శచే మీ సూక్ష్మ రూపములగు అంగములు వజ్రమువలె స్థూలత్వము సంతరించుకొనును గాక !

మీరప్పుడు ’స్వకార్యము’గా స్వీకరించి, సర్వప్రాణులను సృష్టించెదరుగాక ! అటు తరువాత, మీరు కూడా నామరూపాత్మకులై ఆవిర్భవించండి!
అట్టి మీ ఆవిర్భావమునుండి స్థావర - జంగమాత్మకమగు జగత్తు ఏర్పడును గాక!

సృష్టిలో మీ కల్పనను ఆస్వాదించు నా అంశ అగు జీవాత్మ - దృశ్యమును పొందుచూ ఉంటాడు. “నేను దేహముచే బద్ధుడను" … అనునది కలిగి ఉంటున్నాడు.

అట్టి జీవాత్మ … జగన్నాటకముల యొక్క విధివిధానంగా జీవాత్మ - పరమాత్మల సంయోగరూపమగు ‘మోక్షము’ కూడా సృష్టియందు పొందుపరచబడును గాక!

ఈ విధంగా సృష్టి - స్థితి - మోక్షము ప్రకారము తెలుసుకొనువాని ఆయుష్షు పవిత్రమగుచున్నది. నిర్విషయ నిరాకారము - సవిషయ సాకారము - జీవాత్మ - బంధము - జగత్ లీల - పరమాత్మత్వము - మోక్షము… ఇదంతా నారాయణ లీల!

6.) ఏకో దేవో బహుధా నివిష్టః
అజాయమానో, బహుధా విజాయతే ।  “తమ్ ఏతమ్ అగ్నిః” ఇతి అధ్వర్యవ ఉపాసతే ।  ‘యజుః’ ఇతి ఏష హి
ఇదమ్ సర్వమ్ యునక్తి! “సామేతి” ఛందోగాః ।  ఏ తస్మిన్ హి ఇదమ్ సర్వమ్ ప్రతిష్ఠితమ్ ।  ‘విషమ్’ ఇతి సర్పాః ।  ‘సర్ప’ ఇతి సర్పవిదః ।  ‘ఊర్గ్’ - ఇతి దేవాః ।  ‘రయిః’ ఇతి మనుష్యాః ।  ‘మాయా’ ఇతి అసురాః ।  ‘స్వధా’ ఇతి పితరః ।  ‘దేవజన’ ఇతి దేవజన విదః ।  ‘రూపమ్’ ఇతి గంధర్వాః ।  ‘గంధ’ ఇతి అప్సరసః ।  తం యథా యథా - ఉపాసతే
తథైవ భవతి ।  తస్మాత్ బ్రాహ్మణః పురుషరూపం
“పరం బ్రహ్మైవాఽహమ్’ ఇతి
భావయేత్ తద్రూపో భవతి, య ఏవం వేద ॥

పరమాత్మయగు శ్రీమన్నారాయణుడు సర్వదా ‘ఏకమే’ అయి ఉండి కూడా బహు విధములుగా కనబడుచున్నారు. తెలియబడరు. కానీ, తెలియబడేదంతా ఆయనయే!

ఆయన జన్మ రహితుడై ఉండి కూడా అనేక నామ - రూపములలో జన్మించుచున్నారు. అనేక రూపములతో అనేక రీతులుగా తనను తానే ఉపాసించుకొనుచున్నారు. అట్టి ఏకస్వరూపుడగు ఏకో నారాయణుని యజుర్వేద పారాయణులగు ఆధ్వర్యులు “అగ్నిస్వరూపుడు“ అని ఎరిగి, యజ్ఞములతో ఉపాసించుచున్నారు. యజస్సులు సర్వము ఏకముగా కలుపుచున్నది”… అని వారు భావిస్తున్నారు.

ఇక ఛందోగులు “గానమే బ్రహ్మము ! ఆ పరమాత్మయొక్క సామగానమే ఇదంతా“ (All this is a song sung by God) అను మార్గముగా ఉపాసిస్తున్నారు. ఆ పరమాత్మయందే మంత్రములు - గానములు మొదలైనవన్నీ కూడా ప్రతిష్ఠితమై ఉన్నాయి.

పరమాత్మయొక్క చిద్విలాస లీలయే ఈ ఏక - అనేక రూప చమత్కారమంతా ! అదంతా సృష్టిని సుందరవనముగా తీర్చిదిద్దుచున్నది.
సర్పములు (ఆ ఆదినారయణ పరమాత్మను) ‘విషము’గా ఆరాధిస్తున్నారు. సర్పవిదులు ఆ భగవానుని … (నాగరాజు, ఆదిశేషుడు ఇత్యాతి) సర్పరూపములుగాను…, దేవతలు ‘ఊర్గ్’ అను పేరుతోను, మానవులు ’తేజస్సు (కాంతి) రూపముగాను, జ్యోతి స్వరూపముగాను, అసురులు ‘మాయా’ రూపమని, పితరులు ’స్వధా’… రూపమని, దేవజనులు ’దేవజన’ రూపుడని (దేవజనులుగా ఉన్నట్టివాడని), ఉపాసిస్తున్నారు. గంధర్వులు - ”పరమాత్మ సర్వ రూపములు తానైనవాడు” అని ఆరాధిస్తున్నారు. అప్సరసలు ’గంథ’ రూపుడని అంటున్నారు. ఈ విధముగా వేరువేరు జీవులు ఆ పరమాత్మను అనేక రూప - తత్త్వ రీతులుగా ఉపాసిస్తూ ఉన్నారు.

ఒక చమత్కారము! ఎవరు ఏ రీతిగా - ఏ రూపముగా ఉపాసిస్తూ ఉంటే వారికి ఆ రీతిగానే పరమాత్మ పరాకాష్ఠ వస్తువుగా అనుభవమగుచున్నారు. య దేవ ఉపాసయేత్, త దేవ భవత్యితి!

అందుచేత, ‘బ్రహ్మము’ గురించి సమాచారము తెలిసిన వారు,.. ఇదమ్ జగత్ బ్రహ్మమ్-ఈ జగత్తు బ్రహ్మమే! “త్వమ్ బ్రహ్మమ్-నీవు బ్రహ్మమే”! “అహమ్ బ్రహ్మాస్మి“ ”నేను బ్రహ్మమును - బ్రహ్మమునే” అని అనుకుంటూ ఉండగా, తాము ‘బ్రహ్మమే’ అగుచున్నారు. (యత్ భావమ్ - తత్భవతి).

“బ్రహ్మమునే నేను”, “నీవుగా కనిపిస్తున్నదంతా బ్రహ్మమే”, “నేనే ఈ సర్వరూప పరబ్రహ్మమును" అని తలచువాడు, ఆవిధంగా అనుకుంటూ అనుకుంటూ ఉండగా, స్వభావ సిద్ధముగా, ఆతనికి పరాకాష్ఠయందు సర్వము బ్రహ్మమే అగుచున్నది! ఆటుపై తానే ‘బ్రహ్మము’ అగుచున్నాడు.

7.) తత్బ్రహ్మ - తాపత్రయాతీతమ్ ।
షట్ - కోశ వినిర్ముక్తమ్ ।
షట్ - ఊర్మివర్జితమ్ ।  పంచకోశాతీతమ్ । షట్-భావ వికారశూన్యమ్ ।
ఏవమ్ ఆది సర్వ విలక్షణమ్ భవతి ।
తాపత్రయం తు ఆధ్యాత్మిక ఆధి భౌతిక ఆధి దైవికమ్ ।
కర్తృ - కర్మ - కార్య ।
జ్ఞాతృ - జ్ఞాన - జ్ఞేయ ।
భోక్తృ - భోగ - భోగ్యమ్ ।
ఇతి త్రివిధమ్ ॥

బ్రహ్మమును ఆశ్రయించి, బ్రహ్మమే అయినప్పుడు - ఈ జీవుడు త్రితాపములకు అతీతుడు అగుచున్నాడు. ఆరు కోశముల నుండి వినిర్ముక్తుడు, - ఆరు ఊర్ములను దాటి వేసినవాడు, పంచకోశములకు ఆవలవాడు. ఆరు భావవికారములు లేనివాడు, సర్వ లక్షణ విలక్షణుడు- గా ప్రకాశించుచున్నాడు.
కనుక బ్రహ్మమును సర్వలక్షణ విలక్షణంగా ఉపాసించెదరు గాక!

తాపత్రయములు : (Tri - Worries)
ఆధ్యాత్మి - ఆధిభౌతిక - ఆధి దైవికములు

త్రైమాయాత్రివిధములు :
- కర్తృ - కర్మ - కార్యములు
- జ్ఞాతృ-జ్ఞాన - జ్ఞేయములు
- భోక్త - భోగ - భోగ్యములు

ఇవి త్రైవిధ త్రిమాయలు.

8.) త్వక్ - మాంస - శోణిత -
అస్థి - స్నాయు - మజ్జా షట్ కోశాః ।
కామ-క్రోధ - లోభ - మోహ - మద - మాత్సర్యమ్….
ఇతి అరిషట్ వర్గః ।
అన్నమయ ప్రాణమయ మనోమయ
విజ్ఞానమయ ఆనందమయా
- ఇతి పంచకోశాః
ప్రియత్వ - జనన - వర్ధన
పరిణామ - క్షయ - నాశాః
షట్ (6) భావాః ।
అశనాయా పిపాసా శోక
మోహ జరా మరణాని
షట్ (6) ఊర్మయః । కుల గోత్ర
జాతి వర్ణ ఆశ్రమ రూపాణి ఇతి ।
షట్ (6) - భ్రమాః ।
ఏతత్ యోగేన పరమపురుషో జీవో భవతి । న అన్యః ॥

షట్ కోశములు (6):  త్వక్కు (చర్మము); మాంసము, శోణితము; అస్థి (బొమికలు), స్నాయువు (సన్నటి నరములు), మజ్జా (ఎముకలలోని గుజ్జు).
అరిషట్ వర్గములు (6): కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఇవి అరి షట్ (ఆరుగురు) శత్రు వర్గములు.
పంచశోకములు (5) : అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయ కోశములు.
షట్ భావములు (6) : ప్రియత్వము - పుట్టుక - వర్ధనము - పరిణామము - క్షయము - నాశనము - అను భావములు.
షట్ ఊర్ములు (6) : ఆకలి (Hunger) - దాహము (Thirst) - శోకము (Worry) - మోహము (Illusion) - జరా (Feeling of Old Age) - మరణానీ (Death)
షట్ (6) భ్రమలు : కుల - గోత్ర - జాతి - వర్ణ - ఆశ్రమ రూపములు.

పరమ పురుషుడు - తాపత్రయములతోను (3); త్రివిధ త్రైమాయ (3x3) తోను, షట్ (6) కోశములతోను; అరిషట్ (6 శత్రు) వర్గములతోను; పంచ (5) కోశములతోను ; షట్ (6) భావములతోను, షట్ (6) ఊర్ములతోను సంబంధము కల్పించుకొని పరిమితత్వమును ఆశ్రయించు సందర్భమునందు జీవుడుగా చెప్పబడుచున్నాడు. న-అన్యః! పరమాత్మకు వేరుగా మరెవరో వచ్చి జీవాత్మగా కావటం లేదు. పరమాత్మయొక్క ఆట-ఆట విడుపులే ఇదంతా! జీవాత్మ పరమాత్మయే!

9.) య ఏతత్ ఉపనిషదం నిత్యమ్ అధీతే,
సో - అగ్నిపూతో భవతి | -
స వాయుపూతో భవతి |
స ఆదిత్యపూతో భవతి |
అరోగో భవతి |
మహాపాతకాత్ పూతో భవతి |
సురా పానాత్ పూతో భవతి |
అగమ్య ఆగమనాత్ పూతో భవతి |
మాతృగమనాత్ పూతో భవతి |
దుహితృ స్నుష అభిగమనాత్ పూతో భవతి |
స్వర్ణస్తేయాత్ పూతో భవతి |
వేదో జన్మహానాత్ పూతో భవతి |
గురోః అశుశ్రూషణాత్ పూతో భవతి |
అయాజ్య యాజనాత్ పూతో భవతి |
అభక్ష్య భక్ష్యణాత్ పూతో భవతి |
ఉగ్ర ప్రతిగ్రహాత్ పూతో భవతి |
పరదార గమనాత్ పూతో భవతి |
కామ - క్రోధ - లోభ - మోహ ఈర్ష్యాదిభిః అబాధితో భవతి |
సర్వేభ్యః పాపేభ్యో ముక్తో భవతి |
ఇహజన్మని ‘పురుషో’ భవతి |
తస్మాత్ ఏతత్ పురుషసూక్తార్థమ్
అతి రహస్యమ్ | రాజ గుహ్యమ్ ।
దేవ గుహ్యమ్ | గుహ్యాత్ అపి గుహ్యతరమ్ ।
న అదీక్షితాయ ఉపదిశేత్।
న అనూచానాయ, న అయజ్ఞ శీలాయ,
న అవైష్ణవాయ, న అయోగినే
న బహుభాషిజే, న అప్రియవాదినే
న అసంవత్సర వేదినే, న అతుష్టాయ
న అనధీత వేదాయా ఉపదిశేత్ ॥

ఉపనిషత్ ఫలశృతి

ఎవ్వరైతే ఈ ఉపనిషత్లు ఉత్తమ - సునిశిత - సూక్ష్మ బుద్ధితో రోజూ అధ్యయనము చేస్తూ ఉంటారో… అట్టివారు అగ్నివలె, వాయువువలె, ఆదిత్యునివలె పరమ పవిత్రులౌతారు.

అగ్ని - తాను కాల్చు వస్తువు దుర్వాసనను, తాను పొందుతుందా? వాయువు సువాసన జగత్తులోనే వదలుచున్నది గాని, తాను పొందదు కదా! సూర్య కిరణము తాను ప్రసరించువస్తువు యొక్క దోషము ఆ కిరణములను స్పృశిస్తుందా? లేదు కదా!
అట్లాగే…., ఈ ఉపనిషత్ ఉపాసకుడు తన శరీర - మనో బుద్ధి దోషములను తొలగించుకొని ఆరోగ్యవంతుడగుచున్నాడు. మహాపాతక దోషములను, సురాపాన దోషములను కడిగికొని పవిత్రుడగుచున్నాడు.
అగమ్య - ఆగమనము (తెలియకయే వచ్చినప్పటికీ), తెలుసుకోవలసినది తెలుసుకొని సవిజ్ఞేయుడు కాగలడు.
తల్లి గర్భములో ప్రవేశ - నిష్క్రమణముల (జన్మ-జన్మల) దోషముల నుండి విముక్తడగుచున్నాడు.
మహాపాతకములైనటువంటి ‘దుహితృ - స్నుష అభిగమనము’(కూతురు-కోడలు వంటివారి పట్ల వక్ర దృష్టి) నుండి, ‘బంగారము దొంగిలించియున్న దోషము’ నుండి, జన్మతః బ్రాహ్మణుడైకూడా వేదాధ్యయనము విడచియున్న దోషమునుండి, ‘గురు శుశ్రూష’ చేయని దోషము నుండి, దానము తీసుకోకూడనివి దానముగా పొందిన దోషమునుండి, పరాయి స్త్రీతో సంగమ దోషము నుండి … ఆయా దోషములు తొలగి పవిత్రుడు కాగలడు.

ఈ ఉపనిషత్ విద్య అధ్యయన పారాయణము చేయువాడు కామ క్రోధ-లోభ-మోహ-ఈర్ష్య మొదలైన వాటిచే బాధింపబడడు. సర్వ పాపములనుండి విముక్తుడు కాగలడు.

వర్తమాన జన్మలోనే “పురుషుడు పరమపురుషుడు - ఆత్మానందుడుగా “సర్వమునకు” కారణుడుగా - స్వతఃగానే సర్వకార్యకారణ స్వరూపుడుగా అగుచున్నాడు. ఇది అతిరహస్యమైనది, రహస్యములలో కెల్లా రహస్యమగు రాజగుహ్యము! దేవతలకు కూడా పరమరహస్యము! ప్రపంచములోని రహస్యములన్నింటికన్నా రహస్యమైనది.

అట్టి ఈ పురుషసూక్తార్థ రహస్యమును దీక్ష లేనివానికి బోధించ రాదు. ఉత్తమ సంప్రదాయముల పట్ల గౌరవము లేనివారికి, యజ్ఞభావముతో జీవితమును - స్వధర్మములను దర్శించనివానికి, (యజ్ఞశీలుడు, కానివానికి), విష్ణుభక్తి లేనివానికి, యోగాభ్యాసము లేనివానికి, అనేక లౌకిక విషయాలు సంభాషించటంలో తలమునకలైన వానికి, ఇతరులకు బాధ కలిగేటట్లు మాట్లాడువానికి, “ఎండాకాలము - వానాకాలము - చలికాలములవలె కష్ట - సుఖాలు, సుఖ-దుఃఖాలు వస్తూపోతూ ఉంటాయి”… అను సంవత్సర జ్ఞానము లేని వానికి, వాటిచే చంచల బుద్ధి పొందువానికి, ఎప్పుడూ అసంతృప్తి ప్రదర్శించువానికి, వేదములను నమ్మని వానికి - ఈ ఉపనిషత్ అర్థము ఉపదేశించ రాదు.

10.) గురురపి ఏవమ్ విత్
శుచౌదేశే, పుణ్య నక్షత్రే
ప్రాణాన్ ఆయమ్య, పురుషమ్ ధ్యాయన్,
ఉపసన్నాయ శిష్యాయ, దక్షిణే కర్ణే
‘పురుష సూక్తార్థమ్’ ఉపదిశేత్ ।
విద్వాన్ న బహుశో వదేత్ ।
(కింతు) యాతయామో భవతి ।
అసకృత్కర్ణమ్ ఉపదిశేత్ ।
ఏతత్ కుర్వాణో అధ్యేతా - అధ్యాపకశ్చ
ఇహ జన్మని పురుషో భవతి ॥

గురువు - శిష్యునికి బోధించునప్పుడు కూడా శాస్త్ర నియమము గౌరవించాలి. పాటించాలి.

శుచి అయిన ప్రదేశములో,
పుణ్య ప్రదమైన నక్షత్రములో,
ప్రాణోపాసన చే బుద్ధిని నిర్మలము, సునిశితము చేసుకొని,
పరమపురుషుని (ఆది నారాయణుని, సృష్టికి ఆవల ఉన్నవానిని) చక్కగా ధ్యానించి,
ఉత్తమగుణములు - అర్ధంచేసుకోగల తెలివి … మొదలైన ఆయా అర్హతలు గల శిష్యుని కుడిచెవిలో “పురుష సూక్తార్ధము”ను బోధించాలి.

విద్వాంసునకు, ఇద్దానిని అనేకసార్లు చెప్పరాదు. ఎందుకంటే చెప్పిందే అనేక సార్లు చెప్పితే సారవిషయము తెలియదు. ఇది వల్లెవేయడం వంటిది కాదు. గురువు చెప్పినది శిష్యుడు ఆలోచిస్తూ వినాలి. “ఆలోచించి గ్రహిస్తున్నాడా? లేదా ?” అని గురువు గమనించాలి.

వివేచన - విజ్ఞాన దృష్టి - ఉత్తమ ఆశయము లేనివాడు, అర్థము చేసుకోలేడు. విషయము అతనికి ’అసకృత్’ అవగలదు.
ఈ విధంగా జాగరూకతతో పురుష సూక్తార్దమును బోధించు గురువు - వినుచున్నట్టి శిష్యుడు కూడా…. పురుష సూక్తము నిర్వచిస్తున్న ఆ ‘పురుషుడు’.. తామే అగుచున్నారు. (బ్రహ్మవిత్ బ్రహ్మైవభవతి !)

ఇతి ముద్గలోపనిషత్ ।
ఓం శాంతిః శాంతి ః శాంతిః ॥


ఋగ్వేదాంతర్గత

9     ముద్గల ఉపనిషత్

అధ్యయన పుష్పము

NOTE: ఈ ఉపనిషత్ “పురుషసూక్తము”నకు వివరణ ఇచ్చుచున్నందు వలన వ్యాఖ్యానము చివరిలో “పురుషసూక్తము” మూల మంత్రములు అర్థసహితముగా అనుబంధముగా (Annexure) పొందుచేయబడినది..

“ఓం” సర్వ స్వరూపుడు - స్వస్వరూపుడు - ఆశ్రితవత్సలుడు - సర్వసాక్షి అగు శ్రీమన్నారాయణ పరంధామునకు ఓంకార స్వర - అర్థ - భావముల సమేతముగా సాష్టాంగదండ ప్రణామములు! ’పురుషోత్తమము’ అని చెప్పబడు - శ్రీమత్ నారాయణ ప్రవచిత పురుషసూక్తార్థమును సేవించి పూర్ణబ్రహ్మస్థానము సిద్ధింపచేసుకొనెదము గాక!

ఒకానొక సందర్భములో త్రిలోకాధిపతియగు ఇంద్రదేవుడు పురుషసూక్త తత్త్వార్థి, జ్ఞానార్ధి అయి, పరమ పురుషుడు, ఉత్తమపురుషుడు (The Abslute Self beyond all), ఉత్తమ పురుష - First Person in every body), భగవంతుడు (The Enlightner of all) అగు శ్రీవాసుదేవనారాయణ స్వామిని దర్శించారు. “స్వామీ! నాపై దయతో నాకిప్పుడు పురుషసూక్త రహస్యార్ధమును బోధించవలసినదిగా వేడుకొనుచున్నాను” - అని ప్రార్థించారు.

శ్రీ వాసుదేవస్వామి పురుషసూక్త వైభవమును ప్రవచించసాగారు. అదియే ముద్గల మహర్షిచే ప్రవచితమైనట్టి ముద్గలోపనిషత్!

వాసుదేవ నారాయణుడు :  ఓం పురుషసూక్తార్థ నిర్ణయమ్ వ్యాఖ్యాస్యామః ! ఇప్పుడు మనము ’పురుషసూక్తోపాసన’గా పురుష సూక్త శ్లోకములు అర్థనిర్ణయమును దృష్టిలో ఉంచుకొని వ్యాఖ్యానించుకొనెదము గాక! ఋగ్వేదములోని ’పురుష సంహిత’లో విస్తారంగా వర్ణించబడిన పురుషసూక్తార్థ హృదయమును సంగ్రహముగా (In a a Nutshell) ముందుగా చెప్పుకుంటున్నాము.

హరిః ఓం….,

సహస్ర శీర్‌షా పురుషః సహస్రాక్షః సహస్ర పాద్ - అనంత వాచకః ।

సహస్ర → అనంతవాచకమ్

ఒకాయన చాలా కథలు వ్రాశారు. ఆ కథలలోని అనేక అసంఖ్యాక పాత్రలు, వారి వారి స్వభావములు… అన్నీ కూడా, ఆ కథా రచయిత యొక్క ఊహాకల్పనలే కదా! “కథలోని కొన్ని పాత్రల స్వభావములు ఆయన స్వభావములే” అని కూడా అనలేము. అయన నుండే పాత్రల స్వభావములు కానీ, ఆయా స్వభావములు మాత్రం ఆయన కాదు. వాటన్నిటికీ ఆ రచయితయే ఆది స్వరూపుడు. అవన్నీ ఆయన కల్పనలే కాబట్టి, ఆ రచయితయే పురుషుడు. ఆది పురుషుడు. పరమపురుషుడు.

పురుష సూక్తములోని ‘పురుషుడు’ సర్వ బ్రహ్మాండములకు, అందులో ఉండే లోకములకు, ఆ లోకములలోని జీవులకు - లోకపాలకులకు కూడా ఊహగా సంప్రదర్శించు రచయిత. ఆయన భావనా చమత్కృతియే ఇదంతా ! ఆయన భావన ఆయన రూపమే కాబట్టి, ఆయనకు ఏదీ వేరు కాదు. ఈ అనంత శిరస్సులు (యోచనలు - భావాలు - సిద్ధాంతాలు); అనంత అక్షిలు (కళ్ళు) … (దృష్టులు అభిప్రాయాలు), అనంత పాదములు (నడకలు నడతలు) ! … ఆయనవే! ఆయనయే! ఆయన యొక్క పురుషకారాలే ! … ఈ - మంత్రము ఆయనయొక్క ‘అనంతత్వము’ సూచిస్తోంది. అయితే, వీటన్నిటికీ ఆయన వేరే! రచనలన్నిటికీ రచయిత సర్వదా వేరే కదా! నీవు - నేను… ఆ పురుషుని పురుషకార చమత్కారములమే! ఆ పరమపురుషునకు అభిన్నములు.

భూమిం - విశ్వతో స వృత్వా, దశాంగుళమ్ అత్యతిష్ఠతి !
ఆ పురుషుడు ఈ భూమి (The physical forms) - ఈ సర్వభౌతిక రూపములు ఈ విశ్వము (All subtle forms) అయి, అంతటితో ఆగక, ఇంకా అనంతముగా విస్తరించి ఉన్నారు. అనంత యోజనం ప్రాహ - దశాంగుల వచాః తథా ! ’అనంత యోజనములు విస్తరించి ఉన్నారు’ అనటానికై “దశాంగులము” - అని ప్రయోగము ఉద్దేశ్యించబడింది.

ఇదగ్ం - యశ్చ భూతమ్ - యశ్చ భవ్యమ్ - సర్వమ్ “పురుష” ఏవ : ఇత పూర్వము ఉన్నది, ఇప్పుడున్నది, ఇకముందు - ఉండబోవునది సర్వము ఆ పరమపురుషుడే! స్వాత్మపురుషుడే!

వ్యాపకుడు - విష్ణువు : స్వస్వరూపాత్మ విన్యాసుడే…
1.) విష్ణోః దేశతో వ్యాప్తః : దేశము (Place) స్వరూపుడై అనంతముగా వ్యాపించి ఉన్నారు…. (Extended infinitely as place factor)
2.) విష్ణోః కాలతో వ్యాప్తః : కాల (Time) స్వరూపముగా కూడా అనంతముగా వ్యాపించి ఉన్నారు. (Extended infinitely as Time factor as well)

ప్రధమయా విష్ణోః దేశతో వ్యాప్తిరీరితా! ద్వితీయాయ చ అస్య విష్ణోః కాలతో వ్యాప్తిః - ఉచ్యతే !
దృష్టాంతంగా ! (1) కధా రచయిత యొక్క రచనకళా విశేషమే - కధలోని దేశ - కాలమాన రూపములుగా పాఠకునకు అనుభూతమగు తీరుగా; స్వప్నము తనదైనవాడే - స్వప్నాంతర్గత ద్రష్టగా, స్వప్నములోని దేశ - కాలములుగా …, తన ఊహను తానే ఆస్వాదించుచున్న రీతిగా విష్ణువే విశ్వము. కానీ స్వప్నము తనదైనవాడు-స్వప్నమునకు వేరుగా - సాక్షిగా సర్వదా ఉండి ఉంటున్న విధముగా, ఈ విశ్వమునకు విష్ణువు వేరుకూడా ! దేశ కాలములుగా అనంతుడై ఉన్నవాడే విష్ణువు. ఆయనయే “పురుషసూక్త పురుషుడు"గా ఈ మంత్రములతో అభివర్ణించబడుచున్నారు. (One who is Al-present and Al-pervading).

ఉత - అమృతత్వస్య ‘ఈశానః’ యత్ అన్నేన అతిరోహతి !
అట్టి విష్ణువుయొక్క అంతటా ఆవరించిన ఈశానత్వమును ఎరిగినప్పుడు, ఇక సంసార భ్రమలు మరల జనించవు. ఈ మూడవ మంత్రము పరమపురుషుడు తన యొక్క మార్పు - చేర్పులు లేనట్టి అమృతస్థానము నుండి అజ్ఞాన జీవులకు మోక్ష ప్రధానము చేయుటకై ‘అన్నమ్’ (అనుభవించబడునది - భౌతికమైనది - - తెలియబడునది) రూపము ధరించుట వర్ణించబడుతోంది. ఆయన భౌతికంగా కనిపించేదంతా అతిక్రమించి, … ఆవల మార్పు చేర్పులు లేని అమృతరూపుడు కూడా!

ఏతావాన్ అస్య మహిమా, అతో జ్యాయగ్ంశ్చ పురుషః |
ఆ పురుషుని మహిమా విశేషములే ఇక్కడ కనిపిస్తున్న దృశ్య జగత్తులు, జీవులు చిత్ర విచిత్ర జీవిత విశేషములు, లోకములు, లోకపాలకులు, జన్మ - జీవన్ మరణములు మొదలైనవన్నీ కూడా ! వైభవమ్ కథితో హరేః |
ఆ పరమాత్మ స్వయం ప్రకాశ - అమృతత్వమును దాటి ఈవలకు వచ్చి, తనకు అభిన్నమగు ఈ జీవులపై అవ్యాజమగు మమకారముచే లీలా మానుష వేషంగా జగదవస్థను స్వీకరించుచున్నారు. అవస్థాసహితుడు, కర్మఫల భోక్త కూడా అయి ఉంటున్నారు. పరిపూర్ణుడగు ఆ పరమాత్మ మన కంటికి భౌతికంగా కనిపించే శక్తికంటే ఇంకనూ అనంతశక్తి సమన్వితుడు.

పాదో అస్య విశ్వా భూతాని - త్రిపాద అస్య అమృతం దివి : ఆ పురుషుని పూర్ణ స్వరూపములో 4వ వంతు విభాగములో మాత్రమే ఈ విశ్వజీవులంతా స్థానము కలిగి ఉన్నారు.

పురుషుని నాలుగవ వంతు → మార్పు చేర్పులు పొందుచున్న భౌతిక ప్రపంచము. ‘ప్రకృతి’ శబ్దార్థము.

పురుషుని మిగిలిన మూడు వంతులు → దివ్యమై, అమృతమై ప్రకాశించుచున్నట్టిది. మార్పు చేర్పులచే స్పృశించబడనిది.

ఈ మంత్రముచే చతుర్వ్యూహములు పురుషతత్త్వముగా చెప్పబడుచున్నాయి. - చతుర్వ్యూహో విభాషితః ॥

  1. పంచభూత - ప్రపంచ పురుషుడు - విరాట్ పురుషుడు - దేహాలు - జన్మలు - కర్మలు - దేహనాశనములు మొదలగునవి. మార్పు చేర్పులు గల విభాగము. భౌతిక రూప పురుషుడు. (Zone of changing factors)
  2. ఛందః పురుషుడు - శుద్ధ మనోపురుషుడు (విషయములను తనయందు కలిగియున్నట్టి, విషయములకు వేరైనట్టి కేవల మనో రూపుడు. మనస్సులో విషయాలు మారవచ్చుగాక ! మనస్సు మారునది కాదు). ఆలోచనలకు మునుముందే ఉన్న కేవల మనోతత్త్వ పురుషకారము.
  3. వేద పురుషుడు - శుద్ధబుద్ధి స్వరూపుడు. ’తెలియబడేవన్నీ తెలుసుకుంటూ ఉన్న’ - కేవల బుద్ధిరూపుడు. తెలుసుకొనుచున్నది తానే! తెలియబడేది తానే! తెలియబడేదాని కంటే మునుముందే ఉన్న కేవల బుద్ధితత్త్వ పురుషకారము. ప్రతిబింబముల కారణముగా దర్పణము మారదు కదా!
  4. మహా పురుషుడు - ఆత్మ పురుషుడు. ఈతడే పురుష సూక్తములోని పురుష శబ్దార్ధుడు. మనో బుద్ధులకు జననస్థానమైన సహజాత్మతత్త్వము.

“త్రిపాదూర్థ్వ ఉదైః పురుషః” అన్నప్పుడు, పాదో అస్య ఇహ భవాత్ పునః, “కేవలమనో - కేవల బుద్ధి - కేవలాత్మ స్వరూపుడు అని అన్నప్పుడు, చైతన్య త్రివిభాగ (3/4 th - Upper) పురుషుడు మార్పు చేర్పులు లేని వాడు! త్రిగుణ దోషములు అంటనివాడు! "అమృత పురుషుడు” ! ! - అని చెప్పబడుతోంది.

త్రిపాద్ ఇది అనయా ప్రోక్తమ్ అనిరుద్ధస్య వైభవమ్! ఊర్ధ్వమున అమృత స్వరూపమై 3వంతులై, 4వ వంతు విభాగంగా ఈ విశ్వము రూపమును, జీవులు రూపమును దాల్చుచూ, ఇదంతా తన వైభవముగా కలిగి ఉన్నారు. అందుచేత ఇదంతా అనిరుద్ధ పురుష వైభవము. “నిరుద్ధము లేనట్టి ఆత్మయొక్క వైభవమే ఈ జగత్ దృశ్యము”… అని పురుషతత్వము గురించి సూచన చేయబడుతోంది.

తస్మాత్ “విరాడ” జాయత, విరాజో “అధి పూరుషః”| పశ్చాత్ భూమిమ్ అథోపురః : సర్వవ్యాపకుడగు ఆ ఆత్మ పురుషుడు (లేక) నారాయణ పురుషుని నుండే విరాట్ పురుషుడు (ఈ బ్రహ్మాండముల తత్త్వము) జనిస్తున్నది. ఆ విరాట్ పురుషుని నుండి జీవాత్మపురుషుడు బయల్వెడలుచున్నారు | పరిపూర్ణుడగు పరమాత్మయే సృష్టి క్రీడానందము కొరకై విరాట్ పురుషుడు - జీవాత్మ పురుషుడుగా అగుచున్నారు (కథా సృష్టి రచయిత యొక్క కల్పనయే, కధా క్రమమును, అందులోని పాత్రల స్వభావములుగా ప్రదర్శితమగుచున్నట్లుగా!)

విరాట్ పురుషుడు → కథా రచయిత
విరాట్ రూపము → కథా విధానము (సంఘటణలతో కూడిన భౌతిక ప్రపంచము)
జీవ పురుషుడు → కథలోని పాత్ర (జీవులు)

ఆ విధంగా జీవ పురుషుడుగా అయిన విరాట్టు పురుషుడు విరాట్ విశ్వములో దేవ - మనుష్య జంతు - స్థావర - జంగము వివిధ రూపములన్నీ భావన చేసి, స్వయముగా ప్రదర్శితమగుచున్నారు. దేవతల దివ్య రూపములను పొంది, అటు తరువాత భూమండలమును, ఆపై సప్త ధాతువులతో కూడిన భౌతిక దేహములను సృష్టించుచున్నారు.

తస్మాత్ విరాట్ ఇతి అనయో పాదనారాయణాత్ ధరేః । ఆ హరినుండియే ప్రకృతి - పురుష రూపములు బయలు వెడలి, ఆయనచేతనే ధరించబడుచున్నాయి. అట్టి ధరించు నారాయణ అంశను ‘పాదనారాయణ ధారణ’ అని గానం చేయబడుతోంది.

అనగా… ప్రకృతేః పురుషస్య అపి సముత్పత్తిః ప్రదర్శితః! ప్రకృతి - పురుషులను (The Experiences and the Experiencer, perceptions and perceiver; The Body and user of the Body) … అనబడు ఉభయమూ ప్రదర్శించు పురుషవైభవమే ‘పాదనారాయణ పురుష’ వైభవం! ‘ప్రకృతి పురుష’ ప్రదర్శన వైభవము.

సృష్టియజ్ఞము

యత్పురుషేణ హవిషా, దేవా యజ్ఞమ్ అతన్వత | ‘వసంతో’ అస్య ఆసీత్ ఆజ్యమ్, గ్రీష్మ ఇధ్మ, శరత్ ధవిః :
దివ్యశక్తి స్వరూపులగు దేవతలు ‘సృష్టి’ అను కార్యము సిద్ధించటానికై నిర్వర్తించిన మానసిక యాగము (యజ్ఞము) గురించి చెప్పబడుచున్నది. ఆదినారాయణపురుషుని నుంచి కేవలాత్మ నుండి) భావనా మాత్రంగాను - సంకల్ప మాత్రంగాను జనించిన (సృష్టించబడిన) దివ్యశక్తి స్వరూపులు (శబ్దతత్త్వ దేవతలు, దర్శన శక్తిదేవతలు, రూపశక్తి దేవతలు, రసశక్తి దేవతలు, గంధశక్తి దేవతలు మొదలైన అభౌతిక దేవతలు).. ఉత్తర (ఆ తరువాతి) సృష్టి (భౌతిక బ్రహ్మాండము) సిద్ధించటానికై ఒక మానసికమైన యాగము ప్రారంభించారు.

అప్పుడు బాహ్య వస్తువులు లేవు కాబట్టి, పురుష రూపమునే మనస్సుగా, “యజ్ఞ హవిస్సు”గా తలచారు. మానసిక యాగము ప్రారంభించారు. వసంత గ్రీష్మ - శరత్ రుతువులు ఆ యాగమునకు ఆజ్యము (నేయి); సమిధలు; అగ్ని రూపములుగా అయినాయి. అనగా మనస్సుచే (ఆ దివ్యశక్తి స్వరూప దేవతలు సంకల్పముచే) ఋతు ధర్మాలు సృష్టి యజ్ఞము కొరకై భావన చేయబడ్డాయి.

యత్ పురుషేణ ఇతి అనయా సృష్టి యజ్ఞేన సమీరితః -
ఈ విధంగా పురుషుని సంకల్ప రూపులగు దేవతలు సృష్టిని సిద్ధింపజేయు యజ్ఞమును పరమ పురుషుని ఉద్దేశ్యమును సిద్ధింప జేయటానికై మనోకల్పిత మంత్ర - తంత్ర యుక్తంగా ఆరంభించారు.

సప్త - ఆస్య ఆసన్ పరిధయః, త్రిసప్త ’సమిథః’కృతాః |
దేవా యత్ యజ్ఞం తన్వానాః, అబధ్నన్ పురుషమ్ – పశుమ్ | తం |
యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషమ్ జాతమ్ అగ్రతః ||

సప్త (7) వ్యాహృతులు (అగ్ని యొక్క సప్న జిహ్వలు, పంచ భూత మనో - అహంకారములు పరిధులు (యల్లలు) గాను, వాటిని జాగ్రత్ - స్వప్న - సుషుప్తి భావనచే 7x3 = ‘21’ … తత్త్వాలు సమిధలు (Fire Wood Pieces) గాను, విరాట్ పురుషుని ‘యజ్ఞ పశువు’ గాను భావన చేశారు. ఆ యజ్ఞము (సృష్టియోగము) సిద్ధించటానికై సృష్టికి పూర్వమే స్వయం కల్పితమై ఉన్నట్టి విరాట్ పురుషుడు - యజ్ఞ పశువుగా స్వీయ సమర్పణ చేశారు. ఈ విధముగా "ఆత్మనారాయణ పురుషుని సంకల్ప స్వరూపుడు” అయినట్టి సృష్టికర్త బ్రహ్మనారాయణుని (బ్రహ్మదేవుని యొక్క ప్రాణ - ఇంద్రియ స్వరూపాలే - దేవతలుగా అయి మానసిక యజ్ఞము చేయువారైనారు. ఆ సృష్టి యజ్ఞమునందు…. ఇంద్రియశక్తిరూప దివ్య దేవతలు యజ్ఞకర్తలుగా పాల్గొనసాగారు.

సృష్టికి పూర్వమే ఉన్న విరాట్ పురుషుడు (బ్రహ్మ), సృష్టి ప్రారంభలో ఉన్న ఇంద్రియ స్వరూపులగు దేవతలు (విరాట్ పురుషునినుండి సృష్టికొరకై బయల్వెడలిన ఇంద్రియ తత్వరూపులు)… సృష్టిని మనోరచనగా సంకల్పించసాగారు.

విరాట్ పురుషుని ఉచ్ఛ్వాస - నిచ్ఛ్వాసల నుండి జనించిన ప్రాణశక్తి, ఆహుతి రూపులైనటువంటి “సాధ్యులు”, - వారికి అనుకూలురై ప్రాణ - ఆహుతులను ఎరిగిన మంత్ర ద్రష్టలు కల్పించబడ్డారు. వారే - మంత్రోచ్ఛారణలతో పరమపురుషుని ఉపాసించి సిద్ధాంతీకరించునట్టి ఋత్ (సత్య) వ్రతులగు ఋషులు. వీరందరూ కలిసి సృష్టిని సిద్ధింపచేయటానికై ఆ మానసిక యాగములో తమతమ పాత్రలు నిర్వర్తించసాగారు.

తం యజ్ఞం బర్హిసి ప్రౌక్షమ్… విరాట్టే హోమముగా ఉన్నట్టి ఆ వృషత్ - ఆజ్యము (గోవు నెయ్యి) తదితర భోగ్య వస్తువులు (All Matter for the materialization of the activity of creation) ఆ యజ్ఞగుండము నుండి జనించసాగాయి. ప్రాణవాయు ప్రదర్శన రూపములైనటువంటి జీవులు, పశువులు, … ఇవన్నీ ఏర్పడసాగాయి. అంతేగాకుండా, గ్రామ్యములు గ్రామ జంతువులైన మేకలు మొదలగువి ఋక్ - యుజుర్ సామ అథర్వణ వేదములు, అనేక సృష్టి ఉపకరణములు, తపో - ధ్యాన - యోగ - భక్తి తత్వాలు, అవతారమూర్తులు, ఇతిహాసాలు … ఇవన్నీ బయల్వెడలాయి.

అనేనచ ఏవ మంత్రేణ - మోక్షశ్చ సముదీరితః । … అట్లాగే ఈ జీవుడు - అనుభవము - ఆకర్షణ బంధము - సాధనలు - మోక్షము…. ఇవన్నీ కూడా రూపు దిద్దుకున్నాయి.

తస్మాత్ అశ్వా అజాయన్త ఏకఏచ - ఉభయాదతః |  గావోహ జజ్ఞిరే తస్మాత్, తస్మాత్ జాతా అజా - అవయః |
యత్పురుషం వ్యదధు : కతిధా వ్యకల్పయన్ ।
ఆ యజ్ఞమునుండి గుర్రములు, గాడిదలు, గోవులు, మేకలు, గొర్రెలు… ఇవన్నీ కలిగాయి.

అప్పుడు బ్రహ్మజ్ఞానము తెలిసినట్టి మహనీయులు పుట్టారు. వారు బ్రహ్మమును - సృష్టిని ప్రశంసిస్తూ ‘బ్రాహ్మణములు’ పలికారు. ఆ సంకల్ప యజ్ఞమునుండి ఈ దృశ్యములో కనిపించే సర్వ వస్తుజాలము, జీవజాలము, బంధము, భక్తి - జ్ఞాన - యోగ సమన్వితమైన మోక్షమార్గములు కూడా జనించాయి.

ఆ విధంగా, ఆ విరాట్రూప యజ్ఞపురుషుని నుండి సృష్టియొక్క కార్యక్రమములు కొనసాగటానికై అనేక దివ్యసాధనా పరికరాలు, తత్త్వాలు బయల్వెడలసాగాయి.

సృష్టి యజ్ఞ పురుషుని -

ఆయా స్వభావ ప్రజ్ఞలే చతుర్విధ స్వభావులగు జీవులుగా సృష్టియందు, వారివారి సృష్టి ప్రదర్శనా సంబంధములైన స్వధర్మములందు నిరతులగుచూ, ఈ సృష్టి పరిపోషణ యందు పాల్గొనసాగారు.

ఇంకా కూడా…, ఆ యజ్ఞ పురుషుని యొక్క …

ప్రాణాత్ వాయుః అజాయత 
ఆ యజ్ఞ పురుషుని ప్రాణముల నుండి యజ్ఞ పురుషుని ప్రాణశక్తినుండి భౌతిక దేహములకు అణువణువు ప్రాణశక్తిని అందజేయు వాయుదేవుడు బయల్వెడలారు.

నాభ్యా ఆసీత్ అంతరిక్షమ్  →
ఆ యజ్ఞ - వేదనారాయణ పురుషుని నాభినుండి  బొడ్డు నుండి ‘అంతరిక్షము’ పుట్టింది.

శీర్షో ద్యౌః సమవర్తతా 
శిరస్సు నుండి సమవర్తమగు ఆకాశము ఆవిర్భవించింది.

పద్భ్యాం భూమిః
పాదములనుండి భూమి జనించింది.

చెవులనుండి దిశః శ్రోత్రాత్ 
చెవులనుండి దిక్కులు, శబ్దతత్త్వము ప్రకటనమయ్యాయి.

తదా లోకాగ్ం అకల్పయన్…!
ఈ విధంగా లోకాలన్నీ కూడా ప్రాదుర్భవించాయి. కల్పన చేయబడ్డాయి.

‘తస్మాత్’ ఇతి మంత్రేణ జగత్ సృష్టిః సమీరితా ….
ఈ పురుషసూక్తములోని తస్మాత్ రూపమంత్రముతో సర్వ సృష్టి సిద్ధించిన విధము గానము చేయబడుతోంది.

ఇక
(1) వేద అహమ్ ఏతమ్ పురుషం మహాన్తమ్, ఆదిత్య వర్ణం తమసస్తు పారే, సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా అభివదన్ యదాస్తే
(2) ధాతా పురస్తాత్ ఆద్య ఉదాజహార, శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః |

ఈ రెండు మంత్రములచే ఆత్మ పురుషుని యొక్క మహిమ, వైభవము వర్ణించబడుతోంది.

‘వేదాహమ్’ ఇతి మంత్రాభ్యామ్, వైభవమ్ -
ఏ విరాట్ స్వరూప ఆదిపురుషుడైతే మహాన్త స్వరూపుడై, ఆది అయి ఆదిత్యుడుగా ప్రకాశించుచున్నారో; అజ్ఞానాంధ కారమునకు ఆవల తేజోమూర్తియై వెలుగొందుచున్నారో; సర్వ నామ రూపములు తనవే అవటం చేత విశ్వరూపుడు-రూప రహితుడు కూడానో; సర్వజీవ బుద్ధులలో విచిత్ర రీతులుగా సంకల్ప - వికల్పములను నిర్వర్తించుచున్నారో, మహా బుద్ధి స్వరూపుడో, సర్వదిక్కులందు ప్రసరించి దిక్కులన్నీ తన స్వరూపముగా దీప్తుడగుచున్నాడో, అట్టి మహత్తర పురుషుని గురించి ఏతమ్ పురుషమ్ వేద అహమ్! - మేము తెలుసుకొన్నాము - అని సూక్తద్రష్ట గానం చేస్తున్నారు. మనము తెలుసుకోవలసిన, దర్శించవలసిన, మమేకమవవలసిన తత్త్వము, పరమ పురుషుడు! ఉత్తమ పురుషుడు! శ్రీమన్నారాయణుడు !

ఏ విరాట్టు సమస్త జీవుల సృష్టికి కారణమో, ఆ పరమాత్మయే
- ఇది మానవుడు
- ఇది పశువు
- ఇది దేవత
- ఇది కీటకము
మొదలైన సర్వ రూపములను, శబ్దములను కల్పించి, ఆ నామ - రూపములతో కనబడే సర్వమునందు తానే చైతన్య స్వరూపుడై ప్రవేశించుచున్నారు. సర్వత్రా సర్వ రూపాలుగా వ్యాపించి ఉన్నారు.

అట్టి సూర్యునివలె స్వయం ప్రకాశకుడు, సర్వమునకు ఆది - అయినట్టి పరమ పురుషుని అనుక్షణమూ ధ్యానించాలి. ఉపాసకుల ధ్యానము - ఏకాగ్రతల ఆవస్యకతను - వసతిని దృష్టిలో ఉంచుకొని ఋషులు - విరాట్ పురుషుని నామ-రూపాత్మకంగా లోకములకు ప్రసాదించుచున్నారు. సకల దిక్కులలో ఉండి, సర్వ ప్రాణులను ఎరుగుచున్న ఇంద్రుడు ఆ పరమపురుషుని ఎరిగినవాడై, జనులకు ఉపాసనామార్గము చూపుచున్నారు.

తమేవమ్ విద్వాన్ అమృత ఇహ భవతి ! న అన్యః పంధా అయనాయ విద్యతే !
అట్టి విరాట్ పురుషుని ఇక్కడే, ఇప్పుడే ఎరిగినప్పుడు ఈ జీవుడు జనన మరణ చక్రమును అధిగమించి అమృతత్వము పొందుచున్నాడు. పరతత్త్వము ఎరిగి పరమాత్మ అయి వెలుగొందుచున్నాడు. సర్వ సాక్షియై సర్వమును స్వస్వరూపముగా సదా సందర్శించుచున్నాడు.అట్టి పరమ - విరాట్ పురుషుని ఇక్కడే, ఇప్పుడే ఎరుగుటయే అమృతత్వమునకు త్రోవ. ఇక వేరైన త్రోవయే లేదు.

యజ్ఞేన యజ్ఞమయజన్త దేవా, తాని ధర్మాని ప్రధమాన్యాసన్ |
తేహ నాకం మహిమానః సచస్తే, యత్ర పూర్వే సాధ్యాః, సన్తిదేవా ||

ఈ సృష్టికి మోక్షమే ఉపసంహారము - యజ్ఞేనేత్ ఉపసంహారః సృష్టేః మోక్ష ఈరితః … అనే అర్ధము ఈ మంత్రము గానము చేస్తూ ‘పురుషసూక్తము”ను అధ్యయనము చేయు వారికి దారి చూపుచున్నది.

ప్రజాపతి రూపులైన దేవతలు - మానసయజ్ఞమును నిర్వర్తించి - ఏ పరమ పురుషుని ధ్యానించటము వలన వారివారి వికార రూపములగు సర్వ భౌతిక - రుగ్మతలు తొలగుచూ, వారంతా సంసిద్ధి పొందిన వారగుచున్నారో….,

దేవలోకములోని పురాతన సాధ్యపురుషులు ఏ విరాట్ పురుషుని ధ్యానిస్తూ, ఉపాసిస్తూ, ఆరాధిస్తూ ఊర్ధ్వ లోకములలో ఉంటున్నారో…,

అట్టి కేవల సాక్షి - సత్ స్వరూప - సర్వ స్వరూప పురుషుని - ఈ ‘పురుషసూక్త గానము’ - ఉపాసించుటచే, ఉపాసకులు తప్పక పరమ పురుషత్వమును పొందుచున్నారు.

అర్బ్య సంభూతః - ఆ నారాయణుడు జలముతో రసస్వరూపంగా ఉద్భవించుచున్నారు.
పృధివ్యై రసాశ్చ - ఈ భూమి కూడా భూవలయము అగు జలమునుండే ఉద్భవించినది.
విశ్వకర్మణః సమవర్తతాది - పరమాత్మయగు విశ్వకర్మయే ఈ బ్రహ్మాండము - విరాట్నకు సంకల్పకర్త! ఆయనయే సమవర్తి!
తస్యత్వష్టా విదధత్ రూపమేతి - ఇదంతా ఆ విరాట్ పురుషుని ఇచ్ఛా విభవ - వినోదమగు వివిధ (అనేకములగు) రూపలీలా, క్రీడా చమత్కారమే !
తత్ పురుషస్య విశ్వమ్ ఆజానమ్ అగ్రే - దీనికంతటికీ ఆవల ఆధారముగా ఉన్నట్టి తత్పరాత్మ పురుషుని హేలయే, లీలయే, ఈ జగత్తు. సృష్టి ప్రారంభమునుండియే ఇదంతా అనేకత్వమంతా కలిగినదై ఉన్నది. ఆవల ఏకరూపుడు! ఈవల అనేకముతో కూడిన జగత్తు (లేక) విశ్వరూపుడుగా కూడా అయి ఉంటున్నారు.

ప్రతి జీవుడు కేవలాత్మ స్వరూపుడే కాబట్టి,…. ఆవల ఏకము, ఈవల ‘అనేకము’ కలిగినవాడై ఉంటున్నాడు.

అట్టి ఆదిత్య (One who is prior to and at the begining of the total creation) పురుషుని తెలుసుకొన్నవాడు ఇక్కడే అమృతుడగుచున్నాడు. తత్పురుషుడుగా తానే అగుచున్నాడు.

ఈ విధంగా ఆ పరమపురుషుడే - సృష్టికర్త అయి, దివ్యమగు శబ్ద స్పర్శ రూప రస గంధతత్త్వులగు దేవతల రూపుడై,
ఆ దేవతల సృష్టి యజ్ఞమునుండి జీవుడు - జగత్తుగా కూడా అయి,
ఆ జగత్తునందు జీవుడుగా బద్దుడై, క్రీడా వినోదమును కొనసాగిస్తూ….,
తిరిగి అంతా తనయందు ఎప్పుడో లయింపజేసుకొని పరమ పురుషుడు అగుచున్నాడు.

శ్రీ వాసుదేవ ప్రోక్త  సూక్ష్మార్థః

పురుషసూక్త ఫలశ్రుతిః య ఏవమ్ ఏతత్ జానాతి, సముక్తో భవతి ఇతి! ఎవ్వరైతే ఇక్కడి సృష్టి స్థితిలయ కారకుడగు పురుషుని ఈ “పురుష సూక్తము”తో మహర్షులు దర్శించి వివరించిన తీరును అధ్యయనము చేసి, అంతరార్థమును గ్రహిస్తారో, ఇందులో చెప్పబడిన పురుష సంకల్పిత ఇంద్రియ దేవతల యజ్ఞ సృష్టి - ఉపసంహారముల గురించి, ‘మోక్షము’ గురించి తెలుసుకుంటారో… వారు నిస్సందేహముగా ‘ముక్తులు’ అగుచున్నారు.
తత్ పురుష యేవ స్వయం భవతి! ఆ పురుషుడే స్వస్వరూపముగా దర్శించే దర్పణమే “పురుష సూక్తము”.

శ్రీ వాసుదేవుడు పురుషసూక్త ప్రవచితమైన సృష్టి - ఉపసంహార - మోక్ష స్థితి - గతి - స్థానముల గురించి త్రిలోకాధిపతియగు ఇంద్రునికి ఇంకనూ ఆయా విశేషములను వివరించి చెప్పారు. జ్ఞానోపదేశమును బోధించారు.

సర్వేంద్రియ అధినేత అగు ఇంద్రుడు శ్రీ వాసుదేవుడు సవిస్తరంగా చెప్పియున్నట్టు పురుష సూక్త వైభవము గురించి శ్రద్ధగా విన్నారు. వినిన తరువాత ఇంద్రదేవుడు కొంతసేపు మౌనము వహించి, తనలో “నా స్వామి వివరించిన పురుష సూక్తార్ధము మహత్తరము, మోక్షదాయకముకూడా ! అయితే సూక్ష్మ గ్రహణము కొరకై, మరి కొంతగా అంతరార్థమును వినాలని ఇంకా కోరికగా ఉన్నది"… అని భావించారు. లేచి, జగద్గురువగు శ్రీవాసుదేవునికి హృదయపూర్వకముగా ప్రణామములు సమర్పించి, అభ్యర్థన పూర్వకంగా నిలబడ్డారు.

అప్పుడు సర్వాంతర్యామియగు వాసుదేవ భగవానుడు చిరునవ్వుతో, ఇంద్రుని హృదయేచ్ఛను గ్రహించి, ప్రేమగా కూర్చోమని ఆదేశించి పురుషసూక్త మంత్రముల పరమ రహస్యమగు సూత్రార్థములను రెండు ఖండములుగా విభజించి ఉపదేశించసాగారు.

శ్రీ వాసుదేవుడు:

ఓ ఇంద్రదేవా ! పురుషసూక్త రహస్యార్ధము ముఖ్య ఉద్ద్యేశ్యము రెండు ఖండములుగా సూక్త ద్రష్టలచే చెప్పబడుచున్నది.

ప్రథమ ఖండము -
అవిజ్ఞేయత్వము - స్వకల్పిత మాయా బంధనము

అజ్ఞాన దృష్టి :  ఆ పరమ పురుషుడు అవిజ్ఞేయులకు ’మాయను’ కల్పించి భ్రమింపజేస్తున్నారు. అజ్ఞానదృష్టిని ఆశ్రయించి, “ఇంద్రియ జగత్తు సర్వస్వమైయున్నది. దేహముతో పొందేదే నేను పొందినట్లు! దేహమునకు నేను చెందినవాడను! దేహ పరిమితుడు! ఈ దేహము లేకుంటే నేను లేను. దేహమునకు సంబంధించిన జాతి బంధుత్వము ఇత్యాదులు మాత్రమే నాకు సంబంధించినవి”.. ఈ విధంగా పరిమిత - సంకుచిత దృష్టి పెత్తనము చేయుచున్నంతవరకు ఈ జీవునకు ’పురుషసూక్తము’ వర్ణించే పురుష తత్త్వము అనుభవమునకు రాదు.

ఇక్కడ ఇంద్రియములకు ఘనీభూతమై కనిపిస్తున్న దృశ్యముపట్ల ‘ఇది సత్యమే’ అనే దృష్టి కలిగినవారై, ఇంద్రియ విషయములే ఫలాశయములుగా గల సంసార జీవునికి నామ జ్ఞానములు దృష్ట్యా పురుషసూక్త పురుషుడు దురేయుడు! తెలియబడజాలడు!

“ఈ దృశ్యము సత్యమే” అను మూర్ఖ భావనయే ‘భవరోగము’. (భవము = ఉన్నది; నిజమే). తన వాస్తవ స్వరూపము గురించి, తనకు దృశ్యముతో గల - (నాటకము పాత్రవంటి) కల్పనా సంబంధము గురించి, తనకు తదితర జీవులతోను, ఈ భౌతిక దేహముతోను గల (స్వప్నసదృశ్యమై) నాటకీయత గురించి సరియైన సమాచారము సముపార్జించనంత వరకు కూడా…, ఈ జీవుని పట్ల దుఃఖము, శోకము, భయము, ఆదుర్దా… ఇత్యాదులు కొనసాగుచూనే ఉంటున్నాయి. అందుచేతనే జ్ఞానావస్యకత! అయితే, ఈ "అవిజ్ఞ రూపమున ఉన్నది, అవిజ్ఞులు” కూడా ఆ అద్వితీయుడగు పురుషునకు వేరైన వారు కాదు. కాబట్టి ‘మాయ’ పరమపురుషుని యొక్క (లేక) పురుషోత్తముని యొక్క ప్రధమ ఖండవిభాగమే అగుచున్నది.

ద్వితీయ ఖండము -
విజ్ఞేయత్వముచే మోక్షప్రదానత్వము 

ఎవ్వరైతే దృశ్య విషయములను అధిగమించి, దైవీ గుణములను పెంపొందించుకొనుచూ, ఆ పరమ పురుషుని చేరుటకు భక్తి - జ్ఞాన - యోగ - వైరాగ్య మార్గములలో ఉద్యుక్తులై ఉంటారో, పరమపురుషుడు వారి సర్వ అడ్డంకులను, క్లేశములను, కష్టములను తొలగించు స్వభావము కలిగి యుంటున్నారు. ఆయన అనంతరూపుడై (సహస్రరూపుడై) అనంత కళాప్రదర్శకుడై, కళ్యాణరూపుడై, ఆర్తత్రాణ పరాయణుడై వెలుగొందుచున్నారు. అట్టి బృహత్ - విశ్వరూపము, విరాట్ రూపము తెలుసుకొనిన వారికి ఆ రూపము దర్శించనంత మాత్రము చేత…, మోక్షప్రదాత అగుచున్నారు.

అరూపుడగు ఆ పరమాత్మ - సర్వ రూపములు, సర్వగుణములు, సర్వతత్వములు తనవే అయినట్టి విశ్వరూపమును ప్రదర్శించుచున్నారు. అట్టి పురుష నారాయణుని మహిమయే ఈ విశ్వము. పురుష సూక్తమంత్రములు అట్టి సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూపుడు, అగు పురుషనారాయణుని మోక్షార్థులగు జీవుల దృష్టికి తెచ్చి "విశ్వరూపము విశ్వేశ్వర రూపమే”… అనే మోక్షమార్గమునకు సంబంధించిన అవగాహనను బోధిస్తున్నాయయ్యా !

ఈ జీవుడు పురుషసూక్తార్థమును ఎరిగినప్పుడు “ఈ జగత్ దృశ్యమంతా, ఇందలి జాగ్రత్-స్వప్న-సుషుప్తి విశేషములతో సహా - ఆత్మగా నా మహిమయే” అని గ్రహిస్తున్నాడు.

తేన వేషేణ భూమ్యాదిలోకమ్ వ్యాప్య, అనంత యోజనమ్ అత్యతిష్ఠత్|
ఓ ఇంద్రదేవా ! ఆ పురుషనారాయణుని వేష రూపమే ఈ భూ - భువర్ - సువర్ మొదలైన లోకములలో - అంతర్ దృశ్యములుగా వ్యాపించి ఉన్నది. అనంత యోజన విస్తీర్ణమైనదంతా ఏకో-నారాయణరూపమే!

అంతేకాదు!

తత్ పురుషోనారాయణో భూతమ్ భవ్యమ్ భవిష్యత్చ ఆసీత్ |
త్రికాలములలోను సత్ స్వరూపుడు ఆయనయే ! స్వప్నము తనదైన వాడే, … స్వప్నమునకు మునుముందుగాను, స్వప్న సమయంలోను, స్వప్నము ముగిసిపోయిన తరువాత స్వప్నమంతా కూడా ఉండి ఉన్నట్టివారు కదా ! ఇక స్వప్నంలోని విషయాలో ? స్వప్నంతోనే ముగుస్తున్నాయి. స్వప్న ద్రష్ట చైతన్యుడికి వేరైనదంతా అసత్తు - ఆ స్వప్న ద్రష్ట మాత్రమే సత్తుకదా ! (దానికి ఆధారమగు పురుషుడే సత్యము).

అట్లాగే….
- జరిగిపోయిన కాలమునందు, వర్తమానమునందు రాబోవు కాలమునందు కూడా…,
- ఈ జగత్ సృష్టులకు ముందు - జగత్ సృష్టి అనుభవ కాలమందు - ఈ జగదనుభవము లయించి పోయినతరువాత కూడా…,
- ప్రతి దేహి పట్ల ఈ దేహము రాకముందు, ఇంద్రియ - విషయములతో కూడిన దేహ సందర్భములలోను, ఈ దేహము లయించిన తరువాత కూడా…,
సర్వకాల - సర్వావస్థలయందు, సర్వత్రా సర్వదా సర్వముగా ఉన్నది ఆ వ్యాప్యనారాయణుడే!

ఆ నారాయణ పురుషుడే…..
- ఆదినారాయణుడై,
- భూతనారాయణుడై,
- విశ్వవిభూతి నారాయణుడై,
- సర్వ వ్యాప్తనారాయణుడై,
- విరాట్ నారాయణుడై,
- జీవ - ఈశ్వర నారాయణుడై,
- అఖండ నారాయణుడై,
- జ్ఞాన - జ్ఞేయ నారాయణుడై,
- ద్రష్ట - దర్శన - దృశ్య త్రిమూర్తి నారాయణుడై
సర్వమై వెలుగొందుచున్నారు.

స ఏష సర్వేషామ్ మోక్షదశ్చ ఆసీత్!
ఆ సర్వతత్త్వ స్వరూప నారాయణుడే సర్వ జీవులకు దృశ్యబంధములను, పరిమితులను తొలగించగలుగు ‘మోక్ష ప్రదాత’ అయి ఉన్నారు. అంతటా ఉండి, పిలువగానే పలికి, ఈ జీవునకు సర్వబంధములు - అడ్డంకులు తొలగించి, సహజ స్వరూప ప్రదాత అయి, సర్వత్రా వెలయుచున్నారు.

సయేవ చ సర్వ అస్మాన్ మహిమ్నో జాయన్!
ఈ దృశ్య జగత్తులో మహిమగల అనేక వస్తుజాలములు ఉండవచ్చుగాక! అవన్నీ ఆ ఆదినారాయణుని మహిమ - రూపాలే! ఆయన కానిది, ఆయనకు వేరైనది లేక పోవుటచే, .. ఆ నారాయణ పురుషుడు మహిమాన్వితుడు! సర్వులు ఆయన రూపములే కనుక, మహామహితాత్ముడు కూడా!

తస్మాత్ న కోఽపి జాయన్ |
ఆయన అందరినీ ఎరిగియున్నారు. ఆయనను ఎవ్వరు ఎరుగరు. తెలుసుకొంటున్నదే ఆయన!

ఆయనకు మించినట్టిది మరొకటేదీ ఉండదు ! లేదు ! ఆయనయందే ఈ బ్రహ్మాండములన్నీ ఆయన భావకల్పనా చమత్కారముచే ప్రదర్శిత మగుచున్నాయి. ఆయనయే నేను ! ఆయనయే నీవు ! నీవు - నేను లోని ఏక - అఖండ సత్ తేజో విలాసుడు ! ఆయనను ఆయనయే ఎగురుచున్నారు! మరెవ్వరూ ఆయనను ఎరుగలేరు! ఈవల నుండి ఆయనను తెలుసుకోలేము. ఆయనగా ఉండి మాత్రమే ఆయనను తెలుసుకోగలం.

అట్టి కేవల ఆనంద - ఆత్మానారాయణ మహాపురుషుడు తన యొక్క ‘సృష్టి’ అనే క్రీడా వినోదమును సిద్ధింప జేసుకొనుటకై తనను తాను నాలుగు విభాగములుగా విభజించుకొనుచున్నారు.

1. మహిమ పురుషుడు : ఈతడే సర్వాత్మకుడగు పురుషుడు. ‘పురుషసూక్తము’లో వర్ణించిన జగద్రూప మహిమాన్వితుడు, జగత్ కల్పనా సృష్టికర్త కూడా ఈయనయే! ఈ జగత్తంతా కూడా ఈయన మహిమయే! (ఏతావాన్ అస్య మహిమా). ‘ఇదంతా నా మహిమ’ అను పురుషకారుడు.
2. వేద పురుషుడు : సర్వమును ఎరుగుచు - వెలుగొందు ‘చిత్ తత్త్వము’. ఎరుగుట (Knowing) అను తత్త్వమును ప్రదర్శించువారు. తెలియబడేదంతా తన తెలివిరూపంగా చూచుచున్న ఎరుకరూప పురుషకారుడు.
3. ఛందః పురుషుడు : శుద్ధ మానసుడై ‘ఇష్టము’ అను ఆనంద స్వరూపమును ప్రదర్శించు పురుషుడు. ఆలోచనలకంటే మునుముందే ఉన్నట్టి ఆలోచనా పురుషకార సమన్వితుడు. “దేనిగురించి యోచిస్తున్నాము?" - · అనునది ప్రక్కగా పెట్టి చూస్తే, “ఆలోచన రూపమగు కేవల పురుషకారము” .. గా ఉన్నవాడు. ఇష్టము-యోచన-తనవిగా కలిగియున్నట్టి పురుషకారుడు. ఆలోచనచే ప్రదర్శనమయ్యేదంతా ఆయనకు అనన్యము.
4. భౌతిక రూప పురుషుడు : నామ రూపాత్మకమై - మార్పు చేర్పులలో కనిపించు జగత్ పురుషుడు. భౌతిక బ్రహ్మాండ పురుషుడు. లోకాల సృష్టి - దేహాలు - జన్మలు - కర్మలు - బంధాలు, మోక్షాలు మొదలైన ఈ సకల విశేష సముదాయములతో కూడిన విరాట్ పురుషుడు. పాదనారాయణుడు! సృష్టికర్త! సృష్టిని కల్పించుకొని, ప్రవేశించి ఆస్వాదించుకొనుచున్న పురుషకారుడు.

ఓ త్రిలోకాధిపతీ ! ఇంద్రదేవా ! ఈ విధంగా మహా పురుషుని స్వకీయ కల్పిత విభజనా చమత్కారములలో మొదటి మూడు దివ్య - అమృత (మార్పు పొందని) అనిరుద్ధ నారాయణ విభాగములో ప్రదర్శితమగుచున్నాయి. నాలుగవది ఈ భౌతిక రూపముగా కనిపిస్తోంది. మార్పు - చేర్పులచే స్పృశించబడని అనిరుద్ధ (నిరుద్ధరహిత) నారాయణుడే పాదనారాయణుడై జగత్తును, ప్రకృతిని, జీవుని (The scene, Scene context and one who experiences the scene) కల్పించుచున్నారని గమనించు. పాదనారాయణుడే బ్రహ్మదేవుడై సృష్టిని సృష్టిస్తున్నారు. దృష్టియే సృష్టి! ఆత్మా నారాయణుని స్వకీయ చమత్కారమే దృష్టి-ద్రష్ట-బ్రహ్మ కూడా!

ఇంద్రదేవుడు :  హే మహాత్మా ! మోక్షప్రదాతా! జగద్గురూ ! సర్వజీవుల అంతర్యామీ ! వాసుదేవా ! ఈ సృష్టిని పాదనారాయణస్వరూపుడగు బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నారు కదా ? ఆయనకు జీవునివలెనే ఏదైనా కోరి ఈ సృష్టిని సృష్టిస్తున్నారా ? అయితే ఏది కోరి ఏ ఆశయ సిద్దికొరకై నిర్వర్తిస్తున్నారు. ఈ 14 లోకాలను, నాతో సహా ఈ లోకాధిపతులను, పంచతన్మాత్రలను, జీవులను - బంధమోక్షములను - ఇవన్నీ ఆయనచే సృష్టి కార్యముగా ఎందుకొరకై నిర్వర్తించబడుతోంది ? దీనంతటివలన సృష్టికర్త పొందులాభమేమిటి ?

శ్రీవాసుదేవుడు : ఓ త్రిలోకాధిపతీ ! ఇంద్రదేవా ! పాదనారాయణ స్వరూపుడగు సృష్టికర్త బ్రహ్మదేవుడు సర్వకోరికలు తీరి ఉన్నవాడు.

స సమృద్ధ కామః సన్, సృష్టికర్మ న జజ్ఞివాన్ |
సృష్టికర్త వాస్తవానికి ఆప్తకాముడు. “నేను సృష్టికార్యము నిర్వర్తించి, తద్వారా ఇది పొందాలి" అనునదేదీ ఆయనకు లేనే లేదు! మరి ఎందుకు సృష్టిస్తున్నాడంటావా ? సర్వులకు అంతర్యామి అయి సర్వమునకు పరమై, కేవల నిర్విషయ పరమానంద స్వరూపుడై, ఆదినారాయణుడై యున్నట్టి దివ్య స్వభావుడగు అనిరుద్ధ నారాయణుని చిద్విలాస విభాగమే (లేక) క్రీడావినోద సంకల్ప విభాగమే సృష్టికర్మను నెరవేర్చుచున్నది. స అనిరుద్ధ నారాయణః తస్మై సృష్టిమ్ ఉపాదిసత్|

ప్రతి ఒక్క జీవుని కేవలీ స్వరూపుడు (Absolute Self) అగు అనిరుద్ధ నారాయణుని లీలా వినోద భావనయే - సృష్టికర్త-సృష్టిప్రకృతి… ఇవన్నీ ఏర్పడుటకు మూలకారణం. ఆత్మా-నారాయణుడే లీలా వినోదముగా-సృష్టి నారాయణుడై ఈ జగత్ కల్పనను నిర్వర్తించుచున్నారు. అంతే!

అనిరుద్ధ నారాయణుడు తన నుండి సృష్టికర్తయగు బ్రహ్మదేవ ప్రజ్ఞను బయల్వెడల పరచి, ఇక ఆపై ఇట్లా ఆజ్ఞాపిస్తున్నారు.

సృష్టిక్రీడా కల్పన - మానసిక సృష్టియజ్ఞము

అనిరుద్ధ నారాయణుడు :  మమాత్మానందము నుండి జనించినట్టి (ఆత్మావై పుత్రః) ప్రియ మమ కుమారా ! బ్రహ్మదేవా !

నీవు నా సృష్టిక్రీడా వినోదరూపుడవై, మమాత్మకల్పనగా ఉదయించావు. ఇప్పుడు నా స్వీయాంశవైనట్టి నీవు నా సంకల్పమును నెరవేర్చెదవుగాక. అందుకుగాను, ఇప్పుడు కొన్ని సూచనలు ఇస్తున్నాను.

తవ ఇంద్రియాణి యోజకాని ధ్యాత్వా - ఓ నా సృష్టి అభిమాన స్వరూపా! ఇప్పుడు “నేను నా ఇంద్రియ తత్వములకు నియమించు యాజకుడిని (ఇంద్రియ పరికరములచే యజ్ఞము నిర్వర్తింపచేయువాడను" … అని ధ్యానించుచున్నవాడవగుము.

ధ్యాత్వా కోశభూతమ్, … పంచ కోశములైనట్టి అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ ఆనందమయ కోశముల ధ్యాసతో ధ్యానించినవాడవై (ధ్యాసయే ధ్యానము), షట్ కోశములైనట్టి చర్మము - మాంసము - శోణితము - ఆస్థి - స్నాయు - మజ్జలను సృష్టించుచుండెళివు గాక!

ధ్యాత్వా ధృఢగ్రంథిమ్, … “నేను సృష్టి (బ్రహ్మ) - స్థితి (విష్ణు) - లయ (రుద్ర) - గ్రంథుడను. దృశ్యములోని దేహ పదార్థమును. నేను దేహమును. నేను మనో ధర్ముడను. బుద్ధి ధర్ముడను. జన్మలు ధర్మముగా కలవాడను" … ఇటువంటి ధృఢమైన గ్రంధుల ధ్యాసతో ధ్యానించెదవు గాక!

కళేబరం హవిః ధ్యాత్ వా … “చతుర్ముఖ భౌతిక దేహ రూపమే నేను సృష్టి యజ్ఞమునకు సమర్పిస్తున్న హవిస్సు”… అను ధ్యాసతో కూడి, భావన చేయి.

మాం హరిర్భుజ్యమ్ ధ్యాత్వా … ఆత్మ రూపుడను, అనంతరూపుడను అగు నన్ను (నారాయణుని) హవిస్సుల భోక్తగా సంకల్పించుము.

వసంతకాలమ్ ఆద్యం ధ్యాత్వా … కాలము యొక్క ప్రధమ ఋతువగు వసంత కాలమును అగ్నిలో వేయు నేయి (ఆజ్యము)గా భావించుము.

‘గ్రీష్మ’-ఇధ్మమ్ ధ్యాత్వా … కాలముయొక్క ద్వితీయ ఋతువగు గ్రీష్మ ఋతువును ఇంధనముగా (యజ్ఞసమిధ)గా అనుకొనుచున్నవాడవై, శరత్ ఋతురసం ధ్యాత్వా కాలము యొక్క మూడవ కల్పిత ఋతువు అయినట్టి శరదృతువును రసరూపముగా భావన చేసి, అద్దానిని జీవ రసతత్త్వముగా సంకల్పన చేయుము.

ఏవమ్ అగ్నౌ హుత్వా, … ఇవన్నీ కూడా ‘సృష్టి యజ్ఞాగ్ని’ యందు సమర్పణ చేయుచూ….,

నీచే సంకల్పించబడిన భౌతిక దేహ నిర్మాణమును - అంగస్పర్శాత్ కళేబరం వజ్రం ఈష్యతే - మనోబుద్ధి చిత్త అహంకార శక్తులచే అంగాంగములను స్పృశిస్తూ ఘనరూపముగా తీర్చిదిద్దుము!

తతః స్వకార్యాన్ భావయిత్వా … ఇది నాకు ‘స్వకార్యము - స్వధర్మము’ అని భావన చూస్తూ…,

సర్వ ప్రాణి జీవాన్ సృష్ట్వా … సర్వ జీవ ప్రాణులను సృష్టించుచూ…,

పశ్చా ధ్యాః పాదుర్భవిష్యంతి … అటు తరువాత "ఇవన్నీ కూడా నా దేహములే”… అనే అనుభూతితో విశ్వస్వరూపుడవై, హిరణ్యగర్భుడవై, విరాట్ రూపుడవై ప్రాదుర్భవించుము. సృష్టియందు అనంత భౌతిక దేహసమన్వితుడవగుము.

ఇక అప్పటినుండి స్థావర - జంగమాత్మకమైన సృష్టి ఏర్పడినదగుచుండును గాక ! 

అంతేకాకుండా సృష్టితోబాటే (1) జీవుడు అజ్ఞాని అయి దృశ్యమునందు తన్మయుడగు విధము, (2) మరల ఆ బంధము తొలగించ ‘మోక్ష మార్గము’ అయినట్టి వైరాగ్య - క్రియా - యోగ - భక్తి - జ్ఞాన - సమర్పణ - యోగ అనుసంధానములను లీలా - క్రీడా - వినోద భావికుడవై కల్పించెదరు గాక !

అనగా, మోక్ష మార్గ విధి-విధానమును కూడా సృష్టిలో భాగముగా అనుసంధానము చేసెదరు గాక! అంతర్ భాగముగా అనుసంధానము చేసెదరు గాక ! సృష్టియొక్క తత్త్వమును సత్య దృష్టితో నిరూపించు ఋషి వాక్యములను ఋషి ప్రజ్ఞలను కూడా కల్పించెదవు గాక!

ఈ విధంగా పరమపురుషుని గురించి సత్యద్రష్టలగు ఋషులు పురుషసూక్తమును గానము చేయుచున్నారు.

శ్రీ ఇంద్రదేవుడు :  ఆదినారాయణ-ఇచ్ఛా - రూపము అయినటువంటి ఇట్టి సృష్టి విధానమును స్తోత్రం చేయు పురుష సూక్తమంత్ర ఋషులు ఏ ప్రయోజనమును ఆకాంక్షిస్తున్నారు?

శ్రీ వాసుదేవుడు : ఇప్పుడు మనము పురుషసూక్త విశేషార్ధము - రహస్యార్ధముగా చెప్పుకొన్న “సృష్టి యజ్ఞము” గురించి తెలుసుకొనిన ఉపాసకుడు మోక్షమార్గమును ఎరుగుచున్నాడు. ఈ భౌతిక దేహము సహాయముతో పొందిన అతని ఆయుష్షు (జీవితము) పవిత్రము, సత్ప్రయోజనకరము అవగలదు. ఇదియే బ్రహ్మ దేవునిచే మనో సంకల్పితులు (మానసపుత్రులు) అగు ఋషుల ఆశయం!

ఓ ఇంద్రదేవా! పరమాత్మ సర్వదా ఏకమే అయి ఉండి, బహువిధములుగా (అజ్ఞాన దృష్టికి) అగుపిస్తున్నారు. అనిపిస్తున్నారు. ఆత్మదృష్టి గలవారికి అనేకముగా కనిపించేదంతా కూడా ఏకమగు స్వస్వరూపాత్మ విభవమే - అని తప్పక అనిపించగలదు. ఇదియే పురుషసూక్త ముఖ్యార్థము, వాచ్యార్థము, వివేచనార్థము కూడా !

ఆ పరమాత్మ ‘దేహ - ఇంద్రియ - మనస్సులకు తెలియబడేవాడు కాదు. అయినాకూడా - అజాయమానో, బహుధా విజాయితే ఈ అనేకముగా తెలియబడేదంతా కూడా తానే అయి ఉన్నారు. ఏకమే…. అనేక రూపములై, తనను తాను అనేక రీతులుగా, అనేక విధములుగా ఆస్వాదించుచున్నది. ఏకో నారాయణుడే బహుప్రజ్ఞా నారాయణుడై ఈ సృష్టి అంతా తానే అయి, వివిధ జీవప్రజ్ఞలతో వివిధ రూపాలుగా భావనచేసి అనువర్తించుచున్నారు.

వివిధ ఉపాసనా విధులు

‘తమ్ ఏతమ్ అగ్నిః’ ఇతి అధ్వర్యవ ఉపాసతే - ఋగ్వేద సంబంధమైన యజ్ఞతత్త్వదర్శులు అగ్నిః త్వమేవ! త్వం అగ్ని తేజోరూపాయ!… అని పరమాత్మను అగ్ని స్వరూపునిగా తేజో విభవముగా, జ్యోతి స్వరూపునిగా భావనచేస్తూ ఉపాసిస్తున్నారు.

యజుః ఇతి ఏష హి, ఇదం సర్వమ్ యునక్తి - “యజుర్వేదములో అభివర్ణించిన యజ్ఞపురుషుడే ఇక్కడ అందరమూ ఉపాసించవలసిన దైవము”.. అని యజుర్వేద వక్తలు పరమాత్మను నిర్వచిస్తూ ఉపాసిస్తున్నారు.

సామ ఇతి ఛందోగాః - పరమాత్మను ఉపాసించాలంటే సామగానమే మార్గము. లేకపోతే మనస్సు పరమాత్మతో లగ్నంకాదు. అని ఛందోగులు అభిప్రాయపడుచున్నారు. ‘గానము చేతనే ఆయన సులభసాధ్యుడు’ …. అని గాన లహరి వినిపించుచున్నారు.

ఆ పరమాత్మయందే ఋక్కులు, యజుర్వేద యజ్ఞములు, సామవేద గానములు ప్రతిష్టితమై ఉన్నాయి. ఆ అఖండ - ఏక పరమాత్మయొక్క లీలా వినోద సృష్టి - అనే ఆటలోని అంతర్భాగములే ఈ ఏకానేక ఉపాసనా విశేషాలు కూడా! ఆ వివిధ రీతులైన ఉపాసనలు మోక్షమార్గమును అనేక మధుర పుష్ప సౌరభములతో తీర్చిదిద్దుతున్నాయి. అట్టి ఉపాసనా విధులు అసంఖ్యాకములు.

ఇంకాకూడా…, ఆయా వేరైన పరమాత్మను గురించిన మరికొన్ని ఉపాసనల గురించి ఇక్కడ ఉదహరించుకుంటున్నాము.

సర్పులు (ఒక కొండజాతివారు మొదలగువారు) విషనాగుల కంఠములో నుండి స్రవించు ’విషము’నే పరమాత్మోపాసనా మార్గముగా భావించి, కొలచుచున్నారు.

సర్పవిదులు (మరొక కొండజాతి వారు మొదలగువారు) పరమాత్మను (నాగరాజు ఆదిశేషుడు … ఇటువంటి) సర్పరూపములను, సర్పశిల్పములను ఆ పరమాత్మగా భావించి పూజిస్తున్నారు.

దేవతా జాతులవారు - ‘ఊర్గ్’ అనే విశ్వ శక్తితత్త్వ జగదీశ్వరీ (ఉమాదేవీ) దేవతయే పరమపురుష తత్త్వము - అని మనోవాక్కులతో సేవిస్తున్నారు.

మానవులలో కొందరు అంతరహృదయ యోగాభ్యాసులు యోగాభ్యాసములో కనిపించే జ్యోతి తేజస్సులనే పరమపురుష భావనతో ఆరాధిస్తున్నారు. రయి ఇతి మనుష్యాః|

అసుర జాతులతో మరికొందరు “పరమాత్మ మాయారూపుడు అని, మాయా దేవ్యోపాసనచే, పరమాత్మను మంత్రముగ్ధంగా మంత్రశక్తుల ప్రసాదితునిగా సేవిస్తున్నారు. నినేదనలు సమర్పిస్తున్నారు.

పితృలోకంలోని పితరులు ఆ పురుషుని “స్వధా” దేవతగా భావించి ప్రణతులర్పిస్తున్నారు. (స్వధామః మంత్రమును జపిస్తున్నారు).

దేవలోకములోని వారు (దేవజనవిధులు), “దేవజనస్వరూపుడే ఆ పరమాత్మ"… అని భక్తోపాసనలు సమర్పిస్తున్నారు.

అప్సరస జాతివారు ‘గంధ’ రూపమే ఆ పరమాత్మ అని భావించి సుగంధోపాసన నిర్వర్తిస్తున్నారు.

ఈ విధంగా ఆ పరమాత్మను అసంఖ్యాకమైన రూప - తత్త్వ స్వభావాలుగా భావనచేసి వేరువేరు జనులు వేరువేరుగా ఉపాసన ఆరాధన కొనసాగిస్తున్నారు. ఇక అశ్వత్థ నారాయణుడు ఎవరు ఏ రీతిగా ఉపాసిస్తూ ఉంటే వారివారికి ఆ రూపముగానే ప్రసన్నులై, కోరిన దృశ్యసంబంధమైన - అదృశ్య సంబంధమైన ఫలములను ప్రసాదిస్తున్నారు. ఆ ఆరాధకుడు ఆ తత్త్వమునే స్వయముగా సిద్ధింపజేసుకొనుచున్నాడు. తన్మయుడగుచున్నాడు.

(యేఽపి అన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయా న్వితాః తేపి మామేవ, కౌంతేయ! యజన్తి అవిధిపూర్వకమ్ - భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము)

అందుచేత… బ్రహ్మము గురించి, పురుషసూక్తములోని పురుషుని గ్రహించి తెలుసుకొన్న తరువాత…,

“పరం బ్రహ్మ ఏవ అహమ్ ॥ నేను పరబ్రహ్మమునే - అను ఉపాసన”
ఇట్టి భావనను ఆశ్రయించాలి.

పురుషసూక్త మంగళశ్లోకములను, అర్థయుక్తముగా గానము చేస్తూ, “సో హమ్ - తత్త్వమ్” - అను పరమార్థమును మననము చేయువాడు ’పురుష’ తత్త్వమును ఎరుగుచున్నాడు. ఎరిగి ఆ పురుషుడుగా తానే సంతరించుకొనుచున్నాడు.

పరమపురుష - స్వరూపుడగుచున్నాడు. బ్రహ్మమును ఉపాసించువాడు…., సర్వమును దాటి వేయుచూ బ్రహ్మమే తానగుచున్నాడు.
(బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి) !

ఆధ్యాత్మిక తాపములు : తనయొక్క స్వరూప స్వభావముల గురించి అసంపూర్ణ జ్ఞానముచే వచ్చిందే మనోవేదనలు.
ఆధిభౌతిక తాపములు : తేలు పామువంటి విషజంతువుల వలన వచ్చే శారీరక బాధలు. దేహము - ఇంద్రియములు మొదలైన వాటికి కలుగు ఆధి - వ్యాధులు.
ఆధిదైవిక తాపములు : ప్రకృతి సంఘటనలైనటువంటి అతివృష్టి, అనావృష్టి, తీవ్రమగు యండలు, అతివాయువులు, గాలివీచకపోవటం. ఇవి కాక, సంబంధ బాంధవ్యములకు సంబంధించిన అనుకోని సంఘటణల గురించిన దిగుళ్ళు.

పురుషసూక్తోపాసకుడు ఇటువంటి బాధలు ఈ మూడు తాపములను స్వభావసిద్ధంగా అధిగమించివేసి ఉండగలడు.

త్రివిధ - త్రితాపములచే స్పృశించబడనివాడై, కేవల పరమపురుష సాక్షిత్వము సంతరించుకొనుచున్నాడు.

✤ కర్త - కర్మ - కార్యములను: "నేను కర్తను. కర్మలచే బద్ధుడను. ఇక్కడి కార్యములు సుఖదుఖభరితంగా అనివార్యము…”
✤ జ్ఞాతృ-జ్ఞాన-జ్ఞేయములను… “తెలుసుకోవలసినవి, తెలిసినవి… ఇవన్నీ నాకు బంధములు, తెలియబడుచున్నవాటిచే నేను పరిమితుడను….,”
✤ భోక్తృ - భోగ - భోగ్యములను … నేను భోక్తను అనుభవించువాటికి నేను నిబద్ధుడను…

ఈ త్రిభావనలను కూడా దాటివేసి ఉంటాడు. అతీతుడై మౌనముగా “అప్రమేయ-ఆత్మా హమ్ భావన"తో చూస్తూ ఉన్నవాడవగలడు.

షట్ ఊర్ములు – వర్జితమ్ (6) : భౌతిక సంబంధమైన ఆకలి - దప్పిక - శోకము - మోహము, జర - మరణములు పరిధులను దాటి, వాటిని అత్యంత దైనందికమైన స్వల్పవిశేషాలుగా దర్శించగలుగుచున్నాడు.

పంచకోశాతీతమ్ : అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ - కోశములను దాటివేసి, వాటిని తనయందు దర్శిస్తూ, వాటిని స్వభావంగా అధిగమించినవాడై ఉండగలడు. (వాటియందు తనను కాదు, తనయందు వాటిని గమనించగలరు.

అన్నమయ - ఈ భౌతిక దేహముకంటే ముందే ఉన్నవాడను. ఇది నాకు ఒక ఉపకరణము మాత్రమే !

ప్రాణమయ - నా ప్రాణశక్తి (లేక) శక్తి అనునది నన్ను అనుసరించియే ఉంటుందేగాని, ఈ దేహముతో వచ్చి - పోయేదికాదు. నేను సర్వదా శక్తిమంతుడను.

మనోమయ - ఆలోచనలకంటే మునుముందు ఉన్న “ఆలోచించు” పురుషకారమును.

విజ్ఞానమయ - తెలుసుకోవటానికి మునుముందే ఉన్నట్టి “తెలుసుకొనుచున్నవాడను” నేను ! తెలుసుకొననప్పుడు కూడా నేనున్నాను. యథా గాఢనిద్రా సమయే !

ఆనందమయ ఆనందము దుఃఖము నావి కావచ్చు గాక! కానీ, అవి లేనప్పుడూ ఉంటాను.

ఈ విధంగా పంచకోశములు “నేనుంటేనే అవి ఆభరణములు వలె నన్ను ఆశ్రయించి ఉంటాయి కదా!”… అని గ్రహించి ఉండగలడు.

షట్ కోశ (6) అతీతమ్ : ఈ శరీరములో చర్మము-మాంసము-శోణితము-ఆస్థి (బొమికలు) స్నాయు (సన్నటి నరములు) - మజ్జ (బొమికలలో గుజ్జు) అనునవి ‘6’ కోశములు. ఈ శరీరమునకే కేవల సాక్షిని అయి ఉండటం చేత, నేను ఆ ఆరిటికి చెందిన వాడిని కాను. అవి నాకు చెందినవీ కావు.

షట్ (6) భావ వికార శూన్యమ్ : షట్ భావములు అయినటువంటి ప్రియత్వ - జనన - వర్ధన - పరిణామ - క్షయ - నాశనములు భౌతిక దేహమునకు సంబంధించినవి. నేనో ? దేహిని. ఈ భౌతిక దేహమును ఒక వస్తువువలె ఉపయోగించువాడను. నిత్యోదిత పురుషరూపుడను. అందుచేత ఆరు వికార భావములచే బద్ధుడను కాను. పరిమితుడను కాను.

ఏవమ్ ఆదిః : జన్మలు - కర్మలు కంటే ముందే ఉన్నట్టి ఆది స్వరూపుడను. ఆద్యంతరహితుడను!

సర్వవిలక్షణమ్ భవతి : నాకు చెందినవిగా చూడబడుచున్న లక్షణములన్నీ ఈ జగన్నాటకములో నాకు ఇవ్వబడి నేనునటించుచున్న పాత్రకు చెందినవి. నేను జగత్ ఆగమన - నిష్క్రమణములకు (రాక పోకలకు) కూడా సాక్షిని. పాత్రలయొక్క లక్షణాలు నటుడి వ్యక్తిగతమైనవిగా అవవుకదా! నాకు జన్మ-కర్మల పాత్రత్వము లేదు. సర్వలక్షణములకు విలక్షణమైన ఆత్మను!

అరిషట్ వర్గ దిగ్విజయో : ఆరుగురు శత్రువులపై యుద్దము ప్రకటించి, పురుషసూక్త పురుషతత్వ నిర్వచనముల సహాయముతో జయించి వేయగలడు.
వాటి వివరణలు :-

  1. కామ వర్గము : ఇప్పటికి లేనివేవో ఇంకా లభిస్తే గాని, ఏదో చెప్పరాని లోటు తొలగదు. ఇంకా ఇంకా ఏవేవో కావాలి ! పొందాలి! అంతదాకా లోటే!
  2. క్రోధ వర్గము : ఆవేశముతో కూడిన - మనోబుద్ధులను తీవ్రముగా ఆక్రమించి యున్న ‘కోపము’, కోప భావాలు, అభిప్రాయాలు వదలలేకపోవటం. (ఒకే సందర్భము గురించి 3 సార్లు కోపమువస్తే అది క్రోధ లక్షణము).
  3. లోభ వర్గము : "కలిగి ఉన్నవేవో పోగొట్టు కోవలసివస్తుందేమో? తొలగుతాయేమో?” అనే ఆవేదన. పంచుకోవలసినవి కూడా దాచుకోవాలనే తాపము.
  4. మోహ వర్గము : తప్పుడు - లోపములతో కూడిన అవగాహనలు. కామ-క్రోధములు, ఇత్యాది భావ ఆవేశములతోను, సత్య - సంకుచిత దృష్టుల కారణంగాను ఏర్పడు అసత్య దృష్టి. అసమగ్రమైన - సంకుచితమైన దృష్టి, భావనలు, అభిప్రాయాలు. సత్యమును సమగ్రంగా పరిశీలించక, జ్ఞానమును సంపాదించకుండానే… కొన్ని కొన్ని నమ్మికలకు, మమకారములకు, అహంకారములకు లోను అయి పెంపొందించుకొనటము. సంకుచితత్వముతో కూడిన అవగాహన.
  5. మదము : సంపదలనో, పదవులనో, స్థితి గతులనో, భౌతిక బలమునో, జనబలమునో చూచుకొని గర్వించుచుండటము. ఇతరులను తక్కువ వారిగా చూడటము. తక్కువ చేసి మాట్లాడటము. గర్వము.
  6. మాత్సర్యము : ఇతరులపై క్రోధముతో దర్పములు ప్రదర్శిస్తూ బాధించు ప్రవృత్తి. తనవలన తనకు గాని, ఇతరులకు గాని కలుగుబాధను గమనించకపోవటము. సర్వదా పరదూషణకు సంసిద్ధుడై, అందుకు త్రోవలు వెతకటము.

బ్రహ్మమును, పరమపురుషుని ఎరిగినవాడు స్వభావ సిద్ధంగానే, అంతదూరంగా ఉన్నప్పుడే పై అరిషట్వర్గమును గమనించి, గుర్తించి వాటి నుండి తన హావ - భావ జ్ఞాన - విజ్ఞానములను పరిరక్షించుకొనుచూ ఉంటాడు.

షట్భ్రమో పరిత్యజ్య :  పురుషసూక్తములో వర్ణించబడిన ’పురుషుడు’ యొక్క శబ్దార్ధమును, తాత్పర్యమును, ఎరుగుచూ, పురుషసూక్తమును గానము చేస్తూ ఉపాసించువాడు షట్ (6) భ్రమలకు లోనుకాడు. భ్రమ మాత్రంగా దర్శించగలుగుతాడు.

షట్ భ్రమలు (‘6’ Illusionary Conceptions):
(1) కులము (2) గోత్రము (3) జాతి (4) వర్ణము (5) ఆశ్రమము (6) రూపము

ఇవన్నీ సందర్భ మాత్ర విషయములుగాను, వస్తుతః భ్రమమాత్రముగాను చూస్తూ, సమున్నతమైన, భేధరహితమైన సమగ్రమైన ’పరాదృష్టి’ని పెంపొందించుకొని ఉంటున్నాడు.

జీవో :  ఎప్పుడు పరమపురుషుడు తన అఖండ అప్రమేయ - నిత్య - సర్వాతీత స్వరూపమును ఏమరచి - త్రి (3) తాపత్రయములతోను, త్రిగుణ రూపమగు త్రివిధ త్రయీమాయతోను, షట్ (6) కోశములతోను; అరిషట్ (6) వర్గములతోను; షట్ (6) ఊర్ములతోను; అంతరంగ (5) పంచ కోశములతోను, షట్ (6) (శరీరములోని) కోశ విశేషములతోను, షట్ (6) భావవికారములతోను (7) జన్మ - కర్మల తాదాప్యముతోను…, తన్మయుడై ఉంటాడో, … అప్పుడు (ఆ పరమపురుషుడు).. జీవుడుగా చెప్పబడుచున్నాడు.

ఎప్పుడు జీవుడు (పురుషసూక్త-అర్థోపాసనచే) వాటిని దాటుచున్నాడో, అప్పుడాతడు పరమపురుషుడుగా శేషించుచున్నాడు.

ఇతి ముద్గలోపనిషత్


ఫలశ్రుతి

ఎవ్వరైతే ఈ ఉపనిషత్ రహస్యార్థమును నిత్యము ఉపాసిస్తాడో…,

కామ క్రోధ - లోభ - మద - మాత్సర్య - ఈర్ష్య - అసూయ దురభిమానముల వంటివి అతనిని కించిత్ కూడా సమీపించజాలవు.
మనో - బుద్ధులను తాకనైనాలేవు.

సర్వపాపములనుండి విముక్తుడై, ఆ పురుష సూక్తార్థోపాసకుడు ఇక్కడే పురుషసూక్త పతిప్రాదితమగు పురుషుడు కాగలడు.

అందుచేత ఓ ఇంద్రదేవా ! నీ పాలనలోని ముల్లోక జనులు కూడా….

అతి రహస్యము, రాజ గుహ్యము, దేవ గుహ్యము, అయినటువంటి -
పురుష సూక్త మంగళ శ్లోకముల అర్ధ - అంతరార్ధము లను సేవించెదరు గాక!

దీక్ష - పట్టుదల - శ్రద్ధ - ఉత్తమ ఆశయము లేనివానికి ఈ ముద్గలోపనిషత్ తాత్పర్యమును బోధించవలదు. అట్లాగే, పూజ్యులపట్లశాస్త్రములు చెప్పు విధి విధానములపట్ల గౌరవములేనివారు, ద్రవ్య యజ్ఞ - తపో యజ్ఞ - ప్రాణాయామ యజ్ఞ - దైవ యజ్ఞ - ఇటువంటి కొన్ని యజ్ఞములను శ్రద్ధ-విజ్ఞతలతో నిర్వర్తించు ఆశయము లేనివారు, విష్ణు ద్వేషులు, ఏకాగ్రత -వివేచనాదృష్టి లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడువారు, ’వారు అప్రియులు ఇటువంటి బలమైన దురభిప్రాయములు పెంపొందించుకొని ఉండువారు, దేశ కాల నియమములపట్ల గౌరవము లేనివారు, అసంతృప్తితో చరించువారు….,
ఇటు వంటివారు వేద - వాక్యసారమగు ముద్గలోపనిషత్ బోధకు అర్హులు కాజాలరు.

గురువు శిష్యునకు బోధించే సందర్భములలో
- శుచి అయిన ప్రదేశము,
- పుణ్య నక్షత్రము,
- ప్రాణాయామ - అభ్యాసము, పరమపురుష స్తోత్రముతో నాంది పలకటము…., ఇటువంటివి పాటించబడుగాక !

ఈ ఉపనిషత్ వ్యాఖ్యానమును గురువు రహస్యముగా శిష్యుని ఎదురుగా కూర్చోబెట్టుకుని కుడిచెవిలో బోధించునుగాక !

విద్వాంసునికైతే ఎక్కువసార్లు చెప్పవలసిన పని ఉండదు. అతి త్వరగా గ్రహించి "పురుషసూక్త ప్రవచిత పరమ-పురుషత్వము” పొందుచూ, అనునిత్యాస్వాది కాగలడు.

ఈ విధముగా పురుషసూక్తమును వ్యాఖ్యానించు ఈ ముద్గలోపనిషత్తు - గురువు శిష్యునికి బోధించుచుండగా గురు - శిష్యులిరువురు ఇప్పుడే, ఇక్కడే ఈ జన్మయందే - పరమ పురుషత్వమును పుణికి పుచ్చుకొనగలరు.

🙏 ఇతి ముద్గలోపనిషత్ 🙏
శ్రీమన్నారాయణాభ్యోం నమః పితామహ బ్రహ్మదేవాభ్యోం నమః|
ముద్గలమహర్షిభ్యోం నమో నమో నమో నమః
ఓం శాంతిః శాంతిః శాంతిః


ముద్గలోపనిషత్ - నాంది (అనుబంధము)
పురుష సూక్తము

హరిః ఓం|
సహస్ర శీర్‌షా పురుషః
సహస్రాక్షః| సహస్ర పాత్|
స భూమిం విశ్వతో వృత్వా
అత్యతిష్ఠత్ దశాంగులమ్|
పురుష ఏవ ఇదగ్ం సర్వమ్
యత్ భూతమ్। యత్ చ భవ్యమ్|
(పురుషయేవేదగ్ం సర్వం)

’ఓం’కార స్వరూపుడై సర్వము తానే అయి ఉన్న హరిని స్మరిస్తున్నాము. నమస్కరిస్తున్నాము.
ఏ (పరమ) పురుషుడైతే…,
- వేలాది శిరస్సులలో (అసంఖ్యాక భావనలతో, యోచనలతో……
- వేలాది కనులతో (చూపులతో దృష్టులతో, ధ్యాసలతో….,
- వేలాది పాదములతో, (నడకలతో, నడతలతో)…..
ఈ భూమితో సహా విశ్వమంతా నిండి ఉండి, ఇంకనూ 10 అంగుళములు విస్తరించి దాటి ఉన్నారో…
అట్టి (మహా) పురుషుని ప్రత్యక్ష రూపమే - ఇప్పటి, ఇతఃపూర్వపు, ఇక ముందటి ఉనికి కలిగియున్నదంతా కూడా. త్రికాలములలో తెలుసుకొనవలసినది ఆయననే!

ఉత అమృతత్వస్య ఈశానః
యత్ అన్నేన అతిరోహతి।

అట్టి ప్రభువగు ఈశానుడు ఊర్థ్వమున అమృతస్వరూపుడుగాను, క్రిందుగా అన్నము (సర్వ అనుభవములతో కూడిన భౌతిక జగత్తుగాను) అతిశయించి ఉన్నారు.

ఏతావాన్ అస్య మహిమా
అతో జ్యాయాగ్ంశ్చ పూరుషః|

ఈ కనబడేదంతా కూడా ఆ పురుష - ఈశ్వరుని మహిమయే! ఈ కనబడే విశ్వశక్తులన్నిటికంటే ఆయన అత్యధికుడు! మహనీయుడు! మహాతిశయుడు!

పాదో అస్య విశ్వా భూతాని,
త్రిపాదస్య అమృతం దివి|

ఈ సమస్త భూతజాలము ఆ పురుషోత్తముని - 4వ వంతు విభాగము మాత్రమే! ఇది మార్పు-చేర్పుల విభాగము. ఈ భూ - విశ్వములను అతిక్రమించి, ఆయనయొక్క అమృత విభాగము - ముప్పావువంతుగా ప్రకాశమానమైయున్నది.

త్రిపాద్ ఊర్ధ్వ ఉదైత్ పురుషః
పాదో అస్య ఇహ భావాత్ పునః||

ఊర్ధ్వంగా 3/4వ భాగము (అవినాశనమై మార్పు చేర్పులు లేనిదై) నిత్యోదితమై, ఉత్కర్షణముగా ప్రకాశమానమై ఉన్నది. ఆయన 4వ భాగము విశ్వముగా విస్తరించి ఉన్నది.

తతో విష్వన్ వ్యక్రామత్
సా ఆశన, అనశనే అభి

ఆ పురుషుని 4వ విభాగము సృష్టి - సంహారములతో కూడి మాయా విభాగమై ప్రదర్శనమగుచున్నది. చేతన - అచేతనములుగా విస్తరించి ఉంటోంది.

తస్మాత్ విరాడ జాయత
విరాజో అధి పూరుషః
స జాతో అత్యరిచ్యత
పశ్చాత్ భూమిః, అథో పురః ||

ఆ పరమాత్మ నుండి మొట్టమొదటగా “విరాట్ పురుషుడు” బయల్వెడలారు. విరాట్ పురుషుని ఆధారంగా చేసుకొని ఆ పరమపురుషుడు అధిపురుషరూపము దాల్చారు. పరిపూర్ణుడగు ఆ అధిపురుషుడు ఉత్కృష్టరూపుడుగా ప్రకాశించసాగారు. తరువాత ఆ మహాపురుషుడు భూమిని సృష్టించారు. అటు తరువాత జీవులను, వారివారి దేహములను సృజించారు. పరిపోషకులగు దివ్యస్వరూపులగు దేవతలను కూడా సృష్టించారు.
(దేవము = అశరీరులై సృష్టిలో వ్యక్తీకరణమగు దివ్యప్రజ్ఞలు).

యత్ పురుషేణ హవిషా
దేవా యజ్ఞమ్ అతన్వతః

ఆ (పరమ) పురుషుని కల్పన నుండి బయలుదేరిన ఆ దేవతలు సృష్టికొరకై మనస్సులే హవిష్షుగా సృష్టి యజ్ఞమునకు ఉపక్రమించారు.

వసంతో అస్య ఆసీత్ ఆజ్యమ్|
గ్రీష్మ ఇధ్మః శరత్ హవిః|

ఆ సృష్టి యాగమునకు కాలరూపమగు వసంత ఋతువు ఆజ్యము (నెయ్యి) అయింది. గీష్మ ఋతువు సమిధలు. శరత్ ఋతువు హవిస్సు (యజ్ఞమునకు సమర్పించు వస్తు రూపము) అయినాయి.

సప్త అస్యాసన్ పరిధయః।
త్రిసప్త సమిథః కృతాః

(గాయత్రీ చంధస్సు మొదలైన) సప్త (7) ఛందస్సులు ఆ యజ్ఞవాటికకు ’7’ ఎల్లలు (పరిధులు) అయ్యాయి. (జాగ్రత్-స్వప్న-సుషుప్తులనే) 3 ×7 = 21 ఎల్లలుగా సమిధల (కట్టెల) రూపముగా అయ్యాయి.

దేవా యత్ యజ్ఞం తన్వానాః।
అబధ్నన్ పురుషం పశుమ్|

దేవతలు ఈవిధంగా సృష్టి కల్పనా యజ్ఞమును ప్రారంభిస్తూ… విరాట్ పురుషుని యజ్ఞ పశువుగా రూపుచేశారు.

తం యజ్ఞం బర్హిషి ప్రోక్షమ్|
పురుషం జాతమ్ అగ్రతః॥
తేన దేవా అయజన్త,
సాధ్యా ఋషయశ్చ యే।
తస్మాత్ యజ్ఞ్యాత్ సర్వహుతః,
సంభృతం పృషత్-ఆజ్యమ్|

సృష్టికి మునుముందే జనించియున్న ఆ విరాట్ పురుషుని యాగపశువుగా (అశ్వమేధయాగంలో గుర్రమువలె) చేసి మానసిక యజ్ఞము ప్రారంభిస్తూ, ఆ దేవతలు సంప్రోక్షము (జలమును చల్లటము) నిర్వర్తించారు.
ఆ విరాట్ పురుషుని నుండి జనించిన దేవతలు, సాధ్యులు, ఋషులు మానసిక యజ్ఞములో పాల్గొన సాగారు.
మానసిక - సర్వహుత యజ్ఞము జరుగుచుండగా యజ్ఞవాటిక నుండి (సర్వహుతము అనే ఆ యజ్ఞములోని అగ్నిగుండము నుండి) పృషత్ - ఆజ్యము (ఆవునెయ్యి) జనించింది.

పశూగ్ః తాగ్ః చక్రే వాయవ్యాన్,
ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే।

అక్కడి యజ్ఞవాటిక నుండి వాయు దేవతా తేజస్సులతో కూడిన గోవులు, అరణ్య జంతువులు, గ్రామ్య జంతువులు (పులులు, సింహాలు, మేకలు, కుక్కలు మొదలగునవి) పుట్టాయి.

తస్మాత్ యజ్ఞాత్ ‘సర్వహుతః’,
ఋచః సామాని జజ్ఞిరే|
ఛన్దాగ్ంసి జజ్జిరే తస్మాత్
యజుః తస్మాత్ అజాయత||
తస్మాత్ అశ్వా అజాయన్త,
యేకేచ, ఉభయా ‘దతః’I
గావో హ జిజ్ఞిరే తస్మాత్
తస్మాత్ జాతా అజావయః||

ఆ సర్వహుత యజ్ఞవాటిక నుండి ఇంకా ఋగ్వేదము, సామవేదము, (గాయత్రి మొదలైన) ఛందస్సులు, యజుర్వేదము బయల్వెడలాయి.
ఆ యాగ గుండము నుండి ఇంకా, గుర్రములు, క్రింద పలువరసలు కలవి, (ఖడ్గమృగములు మొదలగునవి), ఉభయ దంతములు గలవి, గోవులు అజావయములు (మేకలు, గొర్రెలు) మొదలైన జంతు జాలమంతా పుట్టింది.

యత్ పురుషం వ్యదధుః,
కతిథా వ్యకల్పయన్।
ముఖం కిమ్ అస్య? కౌ బాహూ?
కా ఊరు, పాదా ఉచ్యతే
బ్రాహ్మణో అస్య ముఖమ్ ఆసీత్
బాహూ రాజన్యః కృతః॥
ఊరూ తత్ అస్య యత్ వైశ్యః
పద్భ్యాగ్ం శూద్రో అజాయత

ఆ విరాట్ పురుషునకు ముఖము, బాహువులు, తొడలు, పాదములు మొదలైనవి కల్పించబడ్డాయి.
ఆ విరాట్ పురుషునికి ఏది ముఖము? బాహువులు ఏవి? తొడలు ఏవి? పాదములు ఏమని కల్పించబడ్డాయి?
- పరబ్రహ్మతత్త్వమును ప్రవచించు బ్రాహ్మణములు (స్తోత్రములు), స్తుతించు ప్రజ్ఞలు. ఆ విరాట్ పురుషుని ముఖము.
- క్రియా సామర్థ్యములగు రాజన్యము బాహువులుగా భావించబడినాయి.
- (కృషి-వాణిజ్య సూచికమగు) వైశ్యులు ఆయనకు తొడలు.
- పాదములు సేవా స్వభావులగు శూద్రులు. వీరంతా ఆయననుండే బయల్వెడలారు.

చన్ద్రమా మనసో జాతః|
చక్షోః సూర్యో అజాయతః

ఆయన మనస్సు నుండి చంద్రుడు, చక్షువుల నుండి సూర్యుడు (తేజస్సు) జనించారు.

ముఖాత్ ఇన్ద్రశ్చ అగ్నిశ్చ
ప్రాణాత్ వాయుః అజాయత॥
నాభ్యా ఆసీత్ అన్తరిక్షమ్ |
శీర్ష్ణోః ద్యౌః సమవర్తతః॥

ఆ విరాట్ పురుషుని ముఖము నుండి ఇంద్రుడు, అగ్ని, ప్రాణము నుండి వాయువులు జనించాయి.
నాభి నుండి - అంతరిక్షము, శిరస్సు నుండి - ద్యులోకము (ఊర్థ్వదేవతాలోకము) ఉద్భవమయ్యాయి.

పద్భ్యాగ్ం భూమిః, దిశః శ్రోత్రాత్|
తథా లోకాగ్ం అకల్పయన్||
వేద అహమ్, ‘ఏతం పురుషం మహాన్తమ్’
ఆదిత్య వర్ణమ్, తమసస్తు పారే,
సర్వాణి రూపాణి విచిత్య ధీరః
నామాని కృత్వా, అభివదన్ యదాస్తే।

పాదముల నుండి - భూమి,
చెవుల నుండి - దిక్కులు,
ఈవిధంగా లోకాలన్నీ సంకల్పించబడి సృష్టించబడ్డాయి.

ఈ సమస్త రూపములను స్వీయ బుద్ధితో చిత్ర విచిత్రములుగాను, అనేక నామరూపములుగాను భావనా కల్పన చేయుచున్న, వ్యాపింపజేయుచున్నట్టి ఆయనను దర్శిస్తూ ఉపాసిస్తున్నాము. అంధకారమునకు ఆవల ఆదిత్యవర్ణుడై వెలుగుచున్న ఆ విరాట్ పురుషుని మేము తెలుసుకొనుచున్నాము. ఆయన ఆజ్ఞానమునకు ఆవల సూర్య తేజోవిలాసుడై వెలుగొందుచున్నారు.

ధాతా పురస్త ఆద్యమ్ ఉదాజహార,
శక్రః ప్రవిద్వాన్ ప్ర-దిశశ్చ తస్రః|
తమ్ ఏవం విద్వాన్
అమృత ఇహ భవతి।
న అన్యః పంథా
అయనాయ విద్యతే|

ఏ విరాట్ పురుషుని-ధాత (ప్రజాపతి, బ్రహ్మ) ధారణ చేయుచున్నారో, అట్టి చమత్కృతిని మొట్టమొదటగా (విశాలమైన చెవులు గల) ఇంద్ర దేవుడు (ఇంద్రియముల అధిపతి) గ్రహించినవారై, నలుదిక్కులా వినిపిస్తూ వ్యాపింపజేయ సాగారు.

అట్టి విరాట్ స్వరూపమును తెలుసుకొని ఈ జీవుడు ఇక్కడే అమృతత్వమును సిద్ధించుకోవాలి. అట్టి పరమపురుషుని (స్వస్వరూపముగా) ఎరుగుటతప్పితే మోక్షమునకు, వేరు త్రోవ (దారి) లేదు. (లేక) దృశ్య దాస్యరూపమగు సంసార బంధ విముక్తికి వేరు త్రోవ (దారి లేదు.

యజ్ఞేన యజ్ఞమ్
అయజన్త దేవాః
తానిధర్మాణి ప్రథమా న్యాసన్||
తేహ నాకం మహిమానః సచస్తే,
యత్ర పూర్వే సాధ్యాః సన్తి దేవాః||

యజ్ఞకర్తలగు దేవతలు - మానసిక యజ్ఞముచే యజ్ఞ స్వరూపుడగు ఆ (స్వస్వరూప) పురుషుని సంకల్పంగా జగద్రూప ధర్మములను నిర్వర్తించసాగారు.

అట్టి మానసిక జగత్ సృష్టి యజ్ఞము నిర్వర్తించిన దేవతలు, సాధ్యులు దివ్యమగు మహిమలను పొందినవారై సృష్టిని నడిపించసాగారు. అట్టి మహిమను పురుషసూక్తార్థ గ్రహణముచే జీవుడు ఇక్కడే సృష్టి యజ్ఞపురుషోపాసనచే సిద్దించుకొనగలడు.

అద్భ్యః సంభూతః।
పృథివ్యై రసాచ్చ।
విశ్వకర్మణః సమవర్తత అధిI
తస్య త్వష్టా విదధత్ రూపమేతి,
తత్ పురుషస్య విశ్వమ్ ఆజానమ్ అగ్రే

అట్టి పరమపురుషుడు (శ్రీమత్ నారాయణుడు) జలమునుండి రసస్వరూపులై సృష్టియందు సంభవించారు. పృథివియందు రసస్వరూపులై ప్రకాశించసాగారు.
విశ్వకర్మ చేత ఆధిక్యత పొందినవారయ్యారు. నారాయణాంశ అగు విరాట్ పురుషుడుగా జగదీశ్వరుడగు ఆయనయే అవధరించుచున్నారు.
ఆ పురుషుడే విశ్వ స్వరూపుడై మొట్టమొదట జనించారు. ఈ విశ్వము విశ్వేశ్వర రూపమే! విశ్వేశ్వరుని నుండియే ఆయనకు అభిన్నమైనట్టి విశ్వము జనిస్తోంది.

వేద అహమ్ ఏతమ్ పురుషం మహాన్తమ్
ఆదిత్య వర్ణమ్, తమసః పరస్తాత్।
తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి।
న అన్యః పంధా విద్యతే అయనాయ।

అట్టి పరమ పురుషుని మహత్ శక్తి సంపన్నునిగాను, సూర్య తేజో విలాసునిగాను, అజ్ఞానమునకు ఆవల ప్రత్యక్షమై ఉన్నవానిగాను నేను తెలుసుకొనుచున్నాను. అట్టి పురుషుని (The wroker of the universe appearing here as work of the universe). ఈ జీవుడు తన సంసార బంధవిముక్తికై తెలుసుకోవాలి. తత్ ఫలితంగా ఇక్కడే ఈ జీవుడు తనయొక్క (‘త్రిపాదస్య అమృతం దివి’ అనబడు) అమృతత్వమును అనుభూతపరచుకోవాలి. అంతకుమించి వేరే త్రోవలేదు.

ప్రజాపతిః చరతి గర్భే అంతః
అజాయమానో, బహుథా విజాయతే|
తస్య ధీరాః పరిజానన్తి యోనిమ్।
మరీచీనాం పదమ్ ఇచ్ఛన్తి వేథసః|
యో దేవేభ్య ఆతపతి,
యో దేవానాం పురోహితః,
పూర్వోయో దేవోభ్యో జాతః॥
నమో రుచాయ బ్రాహ్మయే।
రుచం బ్రాహ్మణ జనయన్తః
దేవా అగ్రే తత్ అబ్రువన్|

ఈ జగత్తుయొక్క గర్భమున ప్రజాపతి (సృష్టికర్త) గా అయి ఆ చైతన్యమూర్తి ప్రకాశించుచున్నారు. ఆయన జన్మరహితుడు. కానీ ఈ దృశ్యములో కనిపించే పుట్టుకలన్నీ ఆయనవే! అనేక రీతులైన జన్మలు కలిగి ఉంటున్నారు. అదంతా కూడా ఒకని కలలో అనేకులు ప్రవర్తమానులగు విధంగా జరుగుతోంది. అట్టి ‘యోనిని ధీరులగు బుద్ధిశాలురు (జ్ఞానులు) స్పష్టముగా సందర్శించుచున్నారు. మరీచి మొదలైన ఉత్తమ పురుష సందర్శకుల స్థానము కోరుకొనుచున్నారు.

అట్టి ప్రజాపతి రూపుడగు పరమపురుషుడు
- సృష్టిలోని అశరీర దివ్య అజ్ఞారూపులగు దేవతలను ప్రకాశింపజేయుచు, సంప్రదర్శించుచున్నారు.
- ఆ పురుషుడు దేవతలకంటే మునుముందే ఉండి ఉన్నారు. దేవతలకు పురోహితులై (శ్రేయస్సు కలుగజేయువారై) ఉన్నారు.

ఋగ్వేద బ్రాహ్మణములచే స్థుతించబడుచున్న అట్టి పరమపురుషునికి నమస్కారము. దేవతలచే మొట్టమొదట ‘సర్వహుత’ యజ్ఞము ద్వారా ఉపాసించబడు యజ్ఞపురుషునికి ప్రణమిల్లుచున్నాము.

యస్తు ఏవం బ్రాహ్మణో విద్యాత్,
తస్య దేవా అసన్ (ఆసన్) వశే
హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ!
అహెూ రాత్రే పార్శ్వే!
నక్షత్రాణి రూపమ్।
అశ్వినౌ వ్యాత్తమ్|
ఇష్టం మనిషాణ।
అముం మనిషాణ|
సర్వం మనిషాణ।

ఏ బ్రహ్మజ్ఞానిఅయితే బ్రాహ్మణమును (మానసిక యాగమును) తెలుసుకొని ఉంటారో అట్టి వానికి దేవతలు కూడా వశులై ఉంటున్నారు.
హ్రీం శక్తి, లక్ష్మి (ఐశ్వర్యము)లను పత్నులుగా కలిగి ప్రదర్శించుచున్న పురుష తత్త్వమా!
రాత్రింబవళ్ళు మీకు పార్శ్వములుగా ఉన్నాయి. నక్షత్రములు మీ రూపము. అశ్వినీ దేవతలు మీకు ముఖాలంకారము!

ఓ పరాత్పరుడగు పరమ పురుషా!
మేము కోరుకొనుచున్న పురుషసూక్త జ్ఞానమును మాకు ప్రసాదించండి. సంపదలు ప్రసాదించండి!
ఇహ-పర సౌఖ్యములు ప్రసాదించండి! పరమపురుషత్వము మాకు సిద్ధించుటకై వెంటనంటి ఉండండి.

ఓం తత్ శం యో ఆవృణీ మహే!
(తచ్ఛంయోరావుణీమహే)
గాతుం యజ్ఞాయI
గాతుం యజ్ఞపతయే।
దైవీ స్వస్తిః అస్తు నః
స్వస్తిః మానుషేభ్యః|
ఊర్థ్వమ్ జిగాతు భేషజమ్|
శంనో అస్తు ద్విపదే!
శం చతుష్పదే ॥

ఏతత్ స్వరూప పరమాత్మయొక్క స్వకీయ మహిమయే ఈ విశ్వమంతా అయి ఉన్నదో, అట్టి ఈ సృష్టి యజ్ఞమును, సృష్టియజ్ఞపతిని స్తుతించుచున్నాము.
(We pray the work appearing as this universe and the worker ofthe universe)
దివ్య తేజో సంపన్నులు, జగత్ రచనా ప్రజ్ఞారూపులు అగు దేవతలు మాకు శుభము-శాంతి-ఐశ్వర్య-ఆనందముల రూపమగు ’స్వస్తి’ని ప్రసాదించెదరు గాక!
స్వస్తి = స్వస్వరూపమునందు స్థితి.
ఆ పరమ పురుషుని అమృత రూపమే ఊర్ధ్వమున ప్రదర్శించబడుచూ ఈ విశ్వమునకు ఆధారమైయున్నది.
ద్విపాదులగు సర్వ మానవులకు, చతుష్పాదులగు సర్వ జంతువులకు మీరు సుఖ ప్రదాతలయ్యెదరు గాక!
మా ఆధి భౌతిక - ఆధి దైవిక - ఆధ్యాత్మిక తాపములు (స్వస్వరూపమగు ఆత్మతత్త్వ జ్ఞానమునందు) శమించును గాక!

ఇతి పురుషసూక్తమ్ ।
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥