[[@YHRK]] [[@Spiritual]]

Nāda Bindu Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


ఋగ్వేదాంతర్గత

6     నాదబిందూపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్



వైరాజాత్మోపాసనయా సంజాతజ్ఞానవహ్నినా .
దగ్ధ్వా కర్మత్రయం యోగీ యత్పదం యాతి తద్భజే ..

శ్లో॥ వైరాజ - ఆత్మోపాసనయా సంజాత జ్ఞాన వహ్నినా ।
దగ్ధ్వా కర్మత్రయమ్ యోగీ యత్ పదం యాతి తత్ భజే ॥

సర్వత్రా విరాజమానమైయున్న ఏ ఆత్మతత్త్వముయొక్క ఉపాసన వలన జనించే జ్ఞానాగ్నిచే కర్మత్రయము (అగామి, సంచితము, ప్రారబ్ధము) దగ్ధము అగుచూ, యోగులు ఆత్మస్థానమును చేరుచున్నారో…, అట్టి సర్వాత్మకమగు ఆత్మపదమును భజించుచున్నాము!

హంస

ఓం వాఙ్మే మనసి ప్రతిష్ఠితా . మనో మే వాచి ప్రతిష్టితం .
ఆవిరావీర్మ ఏధి . వేదస్య మా ఆణీస్థః . శ్రుతం మే మా ప్రహాసీః .
అనేనాధీతేనాహోరాత్రాన్సందధామి .
ఋతం వదిష్యామి . సత్యం వదిష్యామి .
తన్మామవతు . తద్వక్తారమవతు .
అవతు మామవతు వక్తారం ..
ఓం శాంతిః శాంతిః శాంతిః ..

ఓం అకారో దక్షిణః పక్ష ఉకారస్తూత్తరః స్మృతః .
మకారం పుచ్ఛమిత్యాహురర్ధమాత్రా తు మస్తకం .. 1..
1.) ఓం
“అ” కారో దక్షిణః పక్ష
“ఉ” కారస్తు ఉత్తర స్మృతః
“మ”కారః పుచ్ఛమ్ ఇతి ఆహుః
అర్ధమాత్రా తు మస్తకమ్ ||
ఓం అను బ్రహ్మ సంజ్ఞాక్షర హంసకు -
→ “అ” కారము కుడి రెక్క అని,
→ “ఉ”కారము ఎడమ రెక్క అని,
→ “మ”కారము తోక అని,
→ అర్ధమాత్ర … మస్తకము (Face) అని సంజ్ఞాపూర్వకముగా చెప్పబడుచున్నది.

పాదాదికం గుణాస్తస్య శరీరం తత్త్వముచ్యతే .
ధర్మోఽస్య దక్షిణశ్చక్షురధర్మో యోఽపరః స్మృతః .. 2..
2.) పాదాదికం గుణాత్ తస్య
శరీరమ్ - తత్త్వమ్ ఉచ్యతే|
ధర్మో అస్య దక్షిణం చక్షుః
అధర్మో అధో అపరః స్మృతమ్ ॥
ఆ హంసకు
→ త్రిగుణములు (సత్వ-రజో-తమో గుణములు) — పాదములు.
→ తత్త్వమ్ (త్వమ్ తత్ అసి) — శరీరము
→ కుడి కన్నేమో — ధర్మము!
→ ఎడమ కన్నేమో — అధర్మము!

భూర్లోకః పాదయోస్తస్య భువర్లోకస్తు జానుని .
సువర్లోకః కటీదేశే నాభిదేశే మహర్జగత్ .. 3..
3.) భూః లోకః పాదయోః తస్య,
భువః లోకః అస్తు జానునీ।
సువర్లోకః కటీ దేశే,
నాభి దేశే మహత్-జగత్||
(మహర్జగత్ః = మహర్లోకము)
ఇంకా ఆ హంసకు
→ పాదములు — భూలోకములు.
→ జానువులు (భుజములు) — భువర్లోకము.
→ కటి (చుట్టూ) ప్రదేశమేమో — సువర్లోకము.
→ బొడ్డు ప్రదేశము — మహర్లోకము.

జనోలోకస్తు హృద్దేశే కంఠే లోకస్తపస్తతః .
భ్రువోర్లలాటమధ్యే తు సత్యలోకో వ్యవస్థితః .. 4..
4.) జనోలోకస్తు హృదయే
కంఠే లోకః తపః తతః
భ్రువోః లలాట మధ్యేతు
సత్యలోకో వ్యవస్థితః॥
→ హృదయము — జనోలోకము.
→ కంఠప్రదేశము తపోలోకము.
→ నుదురు-లలాట మధ్య ప్రదేశము (భ్రూమధ్య ప్రదేశము) — సత్యలోకము.

సహస్రార్ణమతీవాత్ర మంత్ర ఏష ప్రదర్శితః .
ఏవమేతాం సమారూఢో హంసయోగవిచక్షణః .. 5..
5.) సహస్రారమ్ ఇతీవ అత్ర
మంత్ర ఏష ప్రదర్శితః
ఏవమ్ ఏతామ్ సమారూఢో
హంసయోగ విచక్షణః ||
ఆ హంస యొక్క సహస్రార స్థానములో — ఓం-ప్రణవ మంత్రము సంప్రదర్శితమౌతోంది.
హంసయోగమును విచారణ చేయువాడు అట్టి హంసయోగమగు “ఽపిహమ్”ను అధిష్ఠించినవాడు అగుచున్నాడు.

న భిద్యతే కర్మచారైః పాపకోటిశతైరపి .
ఆగ్నేయీ ప్రథమా మాత్రా వాయవ్యేషా తథాపరా .. 6..
6.) న భిద్యతే కర్మచారైః,
పాపకోటి శతైః అపి,
ఆగ్నేయీ ప్రథమా మాత్రా
వాయవ్య ఏషా తథా పరా॥
ఆత్మకు (బ్రహ్మమునకు) సంజ్ఞ అయినటువంటి “సర్వము ఆత్మయే” అను అర్థమును చెప్పు - “ప్రణవము” ఉపాసించువానిని శతకోటి పాప కర్మలు కూడా ఇక బాధించలేవు.
”ఓం“ = ప్రణవము = జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు - తనవే అయినట్టి స్వస్వరూపము. ద్రష్ట దృశ్యముల ఐక్యరూపము.
అట్టి ప్రణవముయొక్క ఉపాసనకై …,
ప్రథమ మాత్ర ”అ“-అగ్ని దేవతా స్వరూపము.
ద్వితీయ మాత్ర ”ఉ"-వాయు స్వరూపము

భానుమండలసంకాశా భవేన్మాత్రా తథోత్తరా .
పరమా చార్ధమాత్రా యా వారుణీం తాం విదుర్బుధాః .. 7..
7.) భానుమండల సంకాశా
భవేత్ మాత్రా తథా ఉత్తరా
పరమా చ అర్ధమాత్రయా
వారుణీం తాం విదుః బుధాః॥
‘ఓం’కారము యొక్క ఉత్తర మాత్ర - “మ” కారము - సూర్య మండలమువలె మహా తేజో విరాజమానము.
ఈ సర్వమునకు ఆవలిగట్టు అయినటువంటి అర్ధమాత్ర - వరుణ దేవతా రూపము.
ప్రణవోపాసనను బోధించు బుద్ధిమంతులగు ప్రణవ తత్త్వ విదులు ఈవిధంగా ’హంస’ను వర్ణనగా పలుకుచున్నారు.

కాలత్రయేఽపి యత్రేమా మాత్రా నూనం ప్రతిష్ఠితాః .
ఏష ఓంకార ఆఖ్యాతో ధారణాభిర్నిబోధత .. 8..
8.) కాలత్రయే అపి యస్య ఇమా
మాత్రా నూనం ప్రతిష్ఠితాః
ఏష “ఓం” కార ఆఖ్యాతో
ధారణాభిః నిబోధతః॥
ఓంకార ప్రణవము సర్వ కాలములందు (భూత-వర్తమాన-భవిష్యత్తులందు) మాత్రలతో (Formation of Different Bits) సహా ప్రతిష్ఠితమై ఉన్నది.
అట్టి ఓంకార తత్త్వము - నిబోధము - విశదము అవాలంటే, అద్దాని మాత్రలతో సహా నిరంతరము ధ్యానించుచూ ఉండటము చేతనే సాధ్యము. అందుచేత ముందుగా ‘ధారణ’ గురించి చెప్పుకుంటున్నాం. (ధారణ = Constantly holding).

ఘోషిణీ ప్రథమా మాత్రా విద్యున్మాత్రా తథాఽపరా .
పతంగినీ తృతీయా స్యాచ్చతుర్థీ వాయువేగినీ .. 9..

పంచమీ నామధేయా తు షష్ఠీ చైంద్ర్యభిధీయతే .
సప్తమీ వైష్ణవీ నామ అష్టమీ శాంకరీతి చ .. 10..

నవమీ మహతీ నామ ధృతిస్తు దశమీ మతా .
ఏకాదశీ భవేన్నారీ బ్రాహ్మీ తు ద్వాదశీ పరా .. 11..
9.) ఘోషిణీ ప్రథమా మాత్రా
విద్యుత్ మాత్రా తథా పరా
పతంగినీ తృతీయ అస్యాః
చతుర్థీ వాయువేగినీ ॥
10.) పంచమీ నామధేయాతే తు
షష్ఠీ చ ‘ఇంద్రి’ అభిదీయతే|
సప్తమీ వైష్ణవీ నామ
అష్టమీ శాంకరీతి చ||
11.) నవమీ మహతీ నామ
ధృతిస్తు దశమీ మతా
ఏకాదశీ భవేత్ నారీ
బ్రాహ్మీతు ద్వాదశీ పరా॥
ఓంకారములోని మాత్రలు (విభాగములు)
ప్రథమమాత్ర (1)   — ఘోషిణీ మాత్ర! (శబ్దము)
ద్వితీయమాత్ర (2) — విద్యుత్తు మాత్ర! (తేజస్సు)
తృతీయమాత్ర (3)  — పతంగిని మాత్ర! (నిశ్చల వాయువు)
చతుర్థమాత్ర (4) — వాయువేగిని మాత్ర! (వాయు కదలికలు)
పంచమమాత్ర (5) — నామధేయ మాత్ర! (నామ-రూపాత్మకము)
షష్ఠమాత్ర (6)  — ఇంద్రిణి మాత్ర! (ఇంద్రియ తత్త్వము)
సప్తమమాత్ర (7)  — వైష్ణవి మాత్ర! (సర్వత్రా ఉనికి)
అష్టమమాత్ర (8)  — శాంకరీ మాత్ర! (శుభత్వము)
నవమీమాత్ర (9)  — మహతీ మాత్ర! (సర్వ దేహములలోని నేనైన నేను)
దశమీమాత్ర (10)  — ధృతి మాత్ర! (కేవల బుద్ధి)
ఏకాదశీ మాత్ర (11)  — నారీ మాత్ర ! (ప్రకృతి)
ద్వాదశీ మాత్ర (12) — బ్రహ్మీ మాత్ర! (పురుషుడు-బ్రహ్మము-కేవలము)

ప్రథమాయాం తు మాత్రాయాం యది ప్రాణైర్వియుజ్యతే .
భరతే వర్షరాజాసౌ సార్వభౌమః ప్రజాయతే .. 12..
12.) ప్రథమాయాం తు మాత్రాయాం
యది ప్రాణైః వియుజ్యతే
భరతే వర్షరాజా సౌ
సార్వభౌమః ప్రజాయతే॥
ప్రణవోపాసన చేస్తూ ఉండగా ప్రథమ మాత్ర (ఘోషిణి శబ్దతత్త్వము) ఉపాసిస్తూ ప్రాణములు వదలినవాడు - (ప్రాణయోగాభ్యాస సిద్ధిచే) తిరిగి భరతవర్షములో సార్వభౌముడై పుట్టుచున్నాడు.

ద్వితీయాయాం సముత్క్రాంతో భవేద్యక్షో మహాత్మవాన్ .
విద్యాధరస్తృతీయాయాం గాంధర్వస్తు చతుర్థికా .. 13..
13.) ద్వితీయాయాం సముత్ క్రాంతో
భవేత్ యక్షో మహాత్మవాన్।
విద్యాధరః తృతీయాయామ్
గాంధర్వస్తు చతుర్థికా
ద్వితీయ మాత్ర (విద్యుత్ ప్రకాశము)ను ఉపాసిస్తూ దేహము విడచినవాడు తేజోప్రకాశమానుడై, యక్షులలో మహాత్ముడై పుట్టుచున్నాడు.
తృతీయ మాత్ర (పతంగి కదల్చబడుచున్నది)ని ఉపాసిస్తూ దేహము విడిచినవాడు విద్యాధరుడు అయి జన్మిస్తున్నాడు.
నాలుగవ మాత్ర (వాయు వేగిని కదల్చుచున్నది)ని ఉపాసిస్తూ ప్రాణము విడచినవాడు గంధర్వుడుగా జన్మిస్తున్నాడు.

పంచమ్యామథ మాత్రాయాం యది ప్రాణైర్వియుజ్యతే .
ఉషితః సహ దేవత్వం సోమలోకే మహీయతే .. 14..
14.) పంచమ్యామ్ అథ మాత్రాయాం
యది ప్రాణైః వియుజ్యతే
ఉషితః సహ దేవత్వం
సోమలోకే మహీయతే॥
ఐదవ మాత్ర (నామధేయ నామరూపాత్మకమైనది)ను ఉపాసిస్తూ ప్రాణములు విడచినవాడు దేవత్వమును పొందినవాడై చంద్రలోకములో నివాసము పొందుచూ ప్రకాశమానుడగుచున్నాడు.

షష్ఠ్యామింద్రస్య సాయుజ్యం సప్తమ్యాం వైష్ణవం పదం .
అష్టమ్యాం వ్రజతే రుద్రం పశూనాం చ పతిం తథా .. 15..
15.) షష్ఠ్యామ్ ఇంద్రస్య సాయుజ్యమ్
సప్తమ్యామ్ వైష్ణవమ్ పదమ్
అష్టమ్యాం వ్రజతే రుద్రం
పశూనాం చ పతిం తథా॥
ఆరవ మాత్ర (ఇంద్రియాధినేతోపాసన)తో ప్రాణులు విడచినవాడు ఇంద్ర సాయుజ్యము పొందుచున్నాడు.
ఏడవ మాత్ర (వైష్ణవి)ను ఉపాసిస్తూ ప్రాణములు విడచినప్పుడు వైష్ణవ పదము (విష్ణుసాయుజ్యము) పొందుచున్నాడు.
ఎనిమిదవ మాత్ర (శాంకరి) ని ఉపాసిస్తూ ప్రాణములు విడచినప్పుడు రుద్రలోకము చేరి పశుపతిని పొందుచున్నాడు.

నవమ్యాం తు మహర్లోకం దశమ్యాం తు జనం వ్రజేత్ .
ఏకాదశ్యాం తపోలోకం ద్వాదశ్యాం బ్రహ్మ శాశ్వతం .. 16..
16.) నవమ్యాం తు మహర్లోకం
దశమ్యాంతు జనం ప్రజేత్
ఏకాదశ్యాం తపో లోకమ్
ద్వాదశ్యాం బ్రహ్మ శాశ్వతమ్||
తొమ్మిదవ మాత్ర (మహతి) ఉపాసనలో మరణము పొందినవాడు మహర్లోకము పొందుచున్నాడు.
పదవ మాత్ర (ధృతి) ఉపాసనలో ప్రాణములు విడుచువాడు జనోలోకము చేరుచున్నాడు.
పదకొండవ మాత్ర (నారి) ఉపాసనలో ప్రాణములు విడచువాడు తపోలోకము పొందుచున్నాడు.
పండ్రెండవ మాత్ర (బ్రాహ్మి) ఉపాసనలో ఉండగా ప్రాణములు వదులువాడు శాశ్వతమగు బ్రహ్మలోకమును పొందుచున్నాడు.

తతః పరతరం శుద్ధం వ్యాపకం నిర్మలం శివం .
సదోదితం పరం బ్రహ్మ జ్యోతిషాముదయో యతః .. 17..
17.) తతః పరతరం శుద్ధమ్
వ్యాపకమ్ నిర్మలమ్ శివమ్
సతా-ఉదితం పరం బ్రహ్మ
జ్యోతిషామ్ ఉదయో యతః||
ఇక ఆపై ఆ ఓంకారోపాసకుడు (పూర్ణమును ఉపాసించువాడు) - వ్యాపకము, నిర్మలము, శివము, శాంతము అగు స్థానము పొందుచున్నాడు. ఏదైతే సత్‌కు - జ్యోతిస్వరూపమునకు కూడా ఉదయించు స్థానమైయున్నదో అట్టి పరబ్రహ్మస్థానమును పొందుచున్నాడు. (ప్రణవనాద స్వరూపుడై ప్రకాశించుచున్నాడు). ‘ఆత్మను ఎరుగుట’ను దాటి ‘ఆత్మయే తాను’ అగుచున్నాడు.

అతీంద్రియం గుణాతీతం మనో లీనం యదా భవేత్ .
అనూపమం శివం శాంతం యోగయుక్తం సదా విశేత్ .. 18..
18.) అతీంద్రియం గుణాతీతమ్
మనోలీనం యదా భవేత్
అనూపమమ్ శివమ్ శాంతమ్
యోగయుక్తః సదా విశేత్||
ఓంకార యోగసాధనచే ఈ జీవుడు యోగయుక్తడు అయి మనస్సును లయింపజేస్తూ, ఇంద్రియములను జయించి, గుణములను దాటివేసినవాడై, ఇకప్పుడు అనూపము (చెదరనిది) శివము, శాంతము అగు "సదాశివ బ్రహ్మము”నందు ప్రవేశము పొందుచున్నాడు.

తద్యుక్తస్తన్మయో జంతుః శనైర్ముంచేత్కలేవరం .
సంస్థితో యోగచారేణ సర్వసంగవివర్జితః .. 19..
19.) తత్ యుక్తః తన్మయో జంతుః
శనైః ముచ్యేత్ కులే జనమ్ | (ముచ్యేత్ కళేబరమ్) |
సంస్థితో యోగధర్మేణ
సర్వ సంగ వివర్జితః॥
అట్టి యోగయుక్తుడు, ఓంకారార్థ తన్మయుడు అగు జీవుడు తాను క్రమంగా ముక్తుడగుచున్నాడు. యోగ ధర్మముచే సర్వ సంగములను దాటిపోతాడు. వివర్జితుడౌతాడు. అనగా సర్వమునకు ఈవల తానై, ఆవలి తనను తాను సాక్షిగా చూస్తూ ఆస్వాదిస్తున్నాడు.
తాను ముక్తుడవటమే కాకుండా, తన కులములోని జనులకు ముక్తిని ప్రసాదించువాడు కాగలడు. (స తరతి। స తరతి। స లోకామ్ తారయతి).

తతో విలీనపాశోఽసౌ విమలః కమలాప్రభుః .
తేనైవ బ్రహ్మభావేన పరమానందమశ్నుతే .. 20..
20.) తతో విలీన పాశో అసౌ విమలః కమలా ప్రభుః।
తేనైవ బ్రహ్మభావేన ‘పరమానందమ్’ అశ్నుతే॥
ఆతడు ఇక సర్వ సంసార పాశములను త్రెంచి వేసుకున్నవాడై నిర్మలుడు, సూర్య ప్రకాశమానుడు అగుచున్నాడు. బ్రహ్మభావము చే పరమానందమును పొందినవాడగుచున్నాడు. ఆత్మ భావముచే బ్రహ్మానంద భరితుడై ఉంటున్నాడు.

ఆత్మానం సతతం జ్ఞాత్వా కాలం నయ మహామతే .
ప్రారబ్ధమఖిలం భుంజన్నోద్వేగం కర్తుమర్హసి .. 21..
21.) ఆత్మానమ్ సతతమ్ జ్ఞాత్వా
కాలం నయ మహామతే।
ప్రారబ్ధమ్ అఖిలమ్ భుంజత్
న ఉద్వేగమ్ కర్తుమ్ అర్హసి॥
కాబట్టి ఓ సర్వ ప్రియ జీవులారా! బుద్ధిమంతులారా! మహామతులారా! ఆత్మను ఎరుగుటకు ఈ జీవితము ఒక అవకాశము. జీవిత కాలమంతా ఆత్మను తెలుసుకొనే మార్గములోనే మీరు గడపండి. విషయములలో కాదు. ఇక ప్రారబ్ధకర్మల విషయానికి వస్తే… వాటినన్నిటినీ ఉద్వేగ రహితముగా, జ్ఞానముతో అనుభవిస్తూ ప్రారబ్ధకర్మలు నిర్వర్తించండి! వాటికి ఉద్వేగపడవలసిన అవసరమే లేదు! మహదాశయులు అవండి!

ఉత్పన్నే తత్త్వవిజ్ఞానే ప్రారబ్ధం నైవ ముంచతి .
తత్త్వజ్ఞానోదయాదూర్ధ్వం ప్రారబ్ధం నైవ విద్యతే .. 22..
22.) ఉత్పన్నే చ ఆత్మవిజ్ఞానే ప్రారబ్ధమ్ నైవ ముంచతి।
తత్త్వజ్ఞాన-ఉదయాత్ ఊర్ధ్వం పారబ్ధమ్ నైవ విద్యతే॥
ఒకనిలో ఓంకార తత్త్వపాసనచే ఆత్మ జ్ఞానము జనించుటచే ఇక ఆతడు ముక్తుడే!
అయితే, ఆత్మ జ్ఞానము పొందినా కూడా ప్రారబ్ధకర్మ వదలదు. కానీ..,

దేహాదీనామసత్త్వాత్తు యథా స్వప్నో విబోధతః .
కర్మ జన్మాంతరీయం యత్ప్రారబ్ధమితి కీర్తితం .. 23..
23.) దేహాదీనామ్ అసత్వాత్తు
యథా స్వప్నే విబోధతః ।
కర్మ జన్మాంతరీయం యత్
ప్రారబ్ధమ్ ఇతి కీర్తితమ్ ॥
తత్త్వజ్ఞానము (త్వమ్-తత్ అసి-నీవుగా కనిపించునది తత్ పరబ్రహ్మమే (లేక) నేనే…అను) జ్ఞానోదయముచే ఇక “పారబ్ధకర్మ అనేది మొదలే లేదు”… అని సుస్పష్టము కాగలదు. ఒకడు నిద్రపోయి కలకంటూ ఉండగా ఆతని దృష్టికి భౌతిక దేహము, భౌతిక దృశ్యము అసత్తు - లేనిదిగా అయిపోతుంది కదా! అట్లాగే, ఆత్మతత్త్వ జ్ఞానికి జన్మజన్మాంతర సంబంధమైనటువంటి సంచిత-ప్రారబ్ద-ఆగామి కర్మ వ్యవహారములు స్వతఃగా లేనేలేవు - అను దృష్టి కలుగుచున్నది.

తత్తు జన్మాంతరాభావాత్పుంసో నైవాస్తి కర్హిచిత్ .
స్వప్నదేహో యథాధ్యస్తస్తథైవాయం హి దేహకః .. 24..
24.) తత్ తు జన్మాంతర అభావాత్
పుంసో నైవ అస్తి కర్హిచిత్
స్వప్నదేహెూ యథా అధ్యస్తః
తథైవా అయం హి దేహకః ॥
అట్టి ఆత్మ తత్త్వము ఎరిగిన బ్రహ్మజ్ఞాని దృష్టిలో (ఆత్మ దృష్ట్యా) వర్తమాన జన్మయేలేదు, రాబోయే జన్మలు అసలే లేవు. ఆతడు జన్మలకు వేరైన స్వస్వరూపాత్మను ఆస్వాదిస్తూ ఉంటాడు. “జన్మలకు మునుముందే ఉన్నట్టివాడను నేను” - అను సమన్వము కలిగి ఉంటాడు.

ఒకడు నిదురలేచిన తరువాత - “రాత్రి నాకు కలలో కనిపించినవన్నీ వాస్తవానికి ఏమాత్రమూ లేనివే!” అని ఎరిగి, వర్తమాన జాగ్రత్‌లో మామూలుగా వ్యవహరిస్తున్నాడు. అంతేగాని, “రాత్రి కలలోని నా దేహము మరణించింది. జాగ్రత్‌లో పుట్టాను” అంటున్నాడా?
అట్లాగే, ఆత్మ జ్ఞాని ”జాగ్రత్‌లో కనిపించేదంతా స్వప్నము వంటిదే కదా!"….. అని గ్రహించి ఆత్మనే అంతటా దర్శిస్తూ ఆత్మయందే రమిస్తున్నాడు.

అధ్యస్తస్య కుతో జన్మ జన్మాభావే కుతః స్థితిః .
ఉపాదానం ప్రపంచస్య మృద్భాండస్యేవ పశ్యతి .. 25..
25.) అధ్యస్తస్య కుతో జన్మ?
జన్మ అభావే కుతః స్థితిః?
ఉపాదానం ప్రపంచస్య
మృత్-భాండస్వా ఇవ పశ్యతి||
“జన్మలకంటే ముందే జన్మించువాడినైన నేను ఉన్నాను. నేను ఉన్నాను కాబట్టే జన్మలు. జన్మలు నాయందు ఉండవచ్చు గాక! నేను జన్మలలో ఉండటమేమిటి?”… అని గ్రహించి, గమనించువాని దృష్టిలో ఇక జన్మలెక్కడుంటాయి? జన్మలే లేనివానికి లోకములలోగాని, జాగ్రత్-స్వప్న-సుషుప్తులలో గాని ‘స్థితి’ (Placement) అనునదేముంటుంది? మట్టికుండలో…. మట్టి వేరుగా, కుండ వేరుగా రెండు విషయాలున్నాయా? లేవు. మట్టియే ఆకారము దృష్ట్యా “కుండ” అంటున్నాము. అట్లాగే “పరబ్రహ్మమగు నేనే జగత్తుగా కనిపిస్తున్నాను. జగత్తు బ్రహ్మమునకు వేరు కాదు" - అని ఆత్మజ్ఞాని చూస్తున్నాడు. నిశ్చలుడై గమనిస్తున్నాడు.

అజ్ఞానం చేతి వేదాంతైస్తస్మిన్నష్టే క్వ విశ్వతా .
యథా రజ్జుం పరిత్యజ్య సర్పం గృహ్ణాతి వై భ్రమాత్ .. 26..
26.) అజ్ఞానం చ ఇతి వేదాంతైః
తస్మిన్ నష్టే క్వ విశ్వతా?
యథా రజ్జుం పరిత్యజ్య
సర్పం గృష్ణాతి వై భ్రమాత్||
వేదాంత జ్ఞానముచే అజ్ఞానము తొలగిన తరువాత, ఇక ఆత్మకు వేరుగా విశ్వము (దృశ్యము) ఎక్కడ ఉన్నది? త్రాడును త్రాడుగా మరచి పాముగా భ్రమిస్తే అప్పుడు అక్కడ పాము “ఉన్నదిగా” అగుచున్నదా? లేదే! అట్లాగే సర్వదా ఆత్మయే అయి ఉండగా ఇక విశ్వము అనునది ఎప్పుడున్నది? ఎప్పుడూ లేదు. ఎక్కడా లేదు! (స్వప్నంలో కనిపించిన దృశ్యము ఎక్కడైనా ఉన్నదా?)

తద్వత్సత్యమవిజ్ఞాయ జగత్పశ్యతి మూఢధీః .
రజ్జుఖండే పరిజ్ఞాతే సర్పరూపం న తిష్ఠతి .. 27..
27.) తద్వత్ సత్యమ్ అవిజ్ఞాయ
జగత్ పశ్యతి మూఢధీః
రజ్జుఖండే పరిజ్ఞాతే
సర్పరూపం న తిష్ఠతి||
ఒకడు మూఢ బుద్ధి కలిగి ఉన్నవాడై ఎంతవరకైతే, “సత్యము ఏమిటి?” అని … పరిశీలించి తెలుసుకోడో, అర్థము చేసుకోడో… అంతవరకు “జగత్” అనబడునది ఎదురుగా ఉన్నట్లు అగుపడుచూ ఉంటుంది. ఒకడు సర్ప రజ్జు భ్రాంతిచే త్రాడును చూచి “అరెఁ! ఇక్కడ త్రాచు పాము ఉన్నదే!” - అని ఎంతవరకు భయపడుతూ ఉంటాడు? పరిశీలించనంతవరకు. పరిశీలించి, “ఇక్కడ ఉన్నది త్రాడు మాత్రమే! పాము అనునది నా భ్రమ. పాము మొదట్లోనూ లేదు, మధ్యలోనూ లేదు. ఇప్పుడూ లేదు!” … అని గమనించి శాంతము పొందుతాడు కదా!

అధిష్ఠానే తథా జ్ఞాతే ప్రపంచే శూన్యతాం గతే .
దేహస్యాపి ప్రపంచత్వాత్ప్రారబ్ధావస్థితిః కృతః .. 28..
28.) అధిష్ఠానే తథా జ్ఞాతే
ప్రపంచే శూన్యతాం గతే
దేహస్య అపి ప్రపంచత్వాత్
పారబ్ధ అవస్థితిః కుతః?
ఈ విశ్వము (లేక) జగత్ విషయము కూడా అంతే!
ఈ కనబడే విశ్వము ఎందులో ఉన్నది? ఆత్మ నందు. మట్టిలో కుండ ఉన్నట్లు ఈ జగత్తు ఏ ఆత్మలో ఉన్నదో, అట్టి అధిష్ఠానమగు ఆత్మ గురించి తెలుసుకున్న తరువాత (మట్టిని తెలుసుకున్న తరువాత మట్టికుండలోని మట్టికి వేరైన కుండవలె) ఈ ప్రపంచము లేదు అని తెలియవచ్చి, ఇది “శూన్యమే” అగుచున్నది. మరి ఈ భౌతిక దేహము సంగతేమిటి? ఇది కూడా ప్రపంచములోని ఒక భౌతిక వస్తువే కాబట్టి ఇది “లేనిదే (శూన్యమే)” అగుచున్నది. దేహమే లేనప్పుడు ఇక ప్రారబ్ద కర్మలు అనబడునవి ఎక్కడుంటాయి?

అజ్ఞానజనబోధార్థం ప్రారబ్ధమితి చోచ్యతే .
తతః కాలవశాదేవ ప్రారబ్ధే తు క్షయం గతే .. 29..
29.) అజ్ఞాన జన బోదార్థమ్
‘పారబ్ధమ్’  ఇతి చ ఉచ్యతే॥
తతః కాలవశాత్ ఏవ
ప్రారభే చ క్షయం గతే॥
మరి ప్రారబ్ధము అనుభవించక తప్పదని ఇందాక ఒకసారి అనుకున్నాం కదా! దాని మాట ఏమిటి? అదా? శాస్త్రములు అజ్ఞానికి బోధించటానికి, “నీవు కర్మలకు బద్ధుడవు కావయ్యా!”…. అని చెప్పటానికి మునుముందుగా, “నీ దుఃఖములకు కారణము ప్రారబ్ధము”….. అని కల్పించి చెప్పుచున్నాయి. “కాలవశంగా ప్రారబ్ధము తొలగుతుంది. అనుభవిస్తే అదేపోతుంది”… అని బోధిస్తున్నాయి. ఆతడు విజ్ఞాని అగుచుండగా - ఆత్మగురించి ఎరుగుచుండగా, “కర్మలే లేవు. ఇక ప్రారబ్ధమెక్కడిది?" - అని బోధించబడుతోంది.

బ్రహ్మప్రణవసంధానం నాదో జ్యోతిర్మయః శివః .
స్వయమావిర్భవేదాత్మా మేఘాపాయేంఽశుమానివ .. 30..
30.) బ్రహ్మ ప్రణవ సంధాన
నాదో, జ్యోతిర్మయ శివః
స్వయమ్ ఆవిర్భవేత్ ఆత్మా
మేఘాపాయే ఆంశుమాన్ ఇవ||
ఆకాశంలో దట్టంగా మబ్బులు క్రమ్ముకున్నాయి. సూర్యుడు కనిపించటం లేదు.అనగా, మబ్బులు సూర్యుడిని మ్రింగివేశాయని, ఆకాశంలో సూర్యుడు లేకుండా పోయారని ఎవ్వరైనా అంటారా? లేదు. ఎందుచేత? గాలి వీచికలచే మబ్బులు తొలగగానే మరల సూర్యుడు కనిపిస్తున్నాడు కదా!
అట్లాగే….
“ఓం” అను ప్రణవము యొక్క అనుసంధానముచే - “జగత్తు ఉన్నది. ఆత్మజ్యోతి స్వరూపుడనగు నా శివస్వరూపమును జగత్ భావాలు మ్రింగాయి ….." అనే భ్రమ కూడా తొలగుతుంది.  “ప్రపంచ భావములు” అనే మేఘములు - ఓంకారనాద వీచికలచే తొలగిపోవుచుండగా ఆత్మజ్యోతి స్వరూపుడగు శివుడు సహజముగా, స్వయముగా అనుభవము కాగలడు. అనగా తానే శివ స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు. ఈ జీవుడే ’సదాశివుడు’ అగుచున్నాడు.

సిద్ధాసనే స్థితో యోగీ ముద్రాం సంధాయ వైష్ణవీం .
శృణుయాద్దక్షిణే కర్ణే నాదమంతర్గతం సదా .. 31..
31.) సిద్ధాసన స్థితో యోగీ
ముద్రాం సంధాయ వైష్ణవీమ్|
శృణుయాత్ దక్షిణే కర్ణే
“నాదమ్ అంతర్గతం” సదా||
కాబట్టి ఇప్పుడు తొలగలవసినది ఏమిటి? జగత్ భ్రమ. అది తొలగితే ఆత్మ శివభగవానుడు స్వయముగా ప్రకాశించుచున్నారు. అందుకు మార్గము? యోగోపాసన.

కనుక యోగి -
🌺 సిద్ధాసనమును స్వీకరించుచూ,
🌺 వైష్ణవీ ముద్రను అణుసంధానము చేస్తూ,
🌺 బాహ్య విషయాలు బాహ్యముననే వదలివేస్తూ..,
🌺 అంతర్గతమగు ఓంకార బిందునాదమును కుడి చెవితో ఎల్లప్పుడూ వినుచుండుటను అభ్యసించాలి.

అభ్యస్యమానో నాదోఽయం బాహ్యమావృణుతే ధ్వనిం .
పక్షాద్విపక్షమఖిలం జిత్వా తుర్యపదం వ్రజేత్ .. 32..
32.) అభ్యస్యమానో నాదో అయమ్
బాహ్యమ్ ఆవృణుతే ధ్వనిమ్|
పక్షాత్ విపక్షమ్ అఖిలమ్
జిత్వా ‘తుర్యపదమ్’ ప్రజేత్|
ఈ విధంగా అంతర్గతంగా కుడి చెవికి అంతరంగమునుండి వినబడుచున్న “ఓం”… నాదమును వినుచుండగా…. ఇక బాహ్య వస్తు-విషయ-నామ-రూప ధ్వనులు, ధ్యాసలు వాటికవే ఉపశమిస్తూ వస్తాయి. అట్టివాడు ఏకపక్షము (Inner side) నుండి ద్విపక్షము (Outer-world) ను జయించి, తురీయపదమును (జాగ్రత్ - స్వప్నసుషుప్తులు తనవి. తాను వాటిలో పరిమితుడు కాడు… అను స్థానమును)… చేరుచున్నాడు.

శ్రూయతే ప్రథమాభ్యాసే నాదో నానావిధో మహాన్ .
వర్ధమానస్తథాభ్యాసే శ్రూయతే సూక్ష్మసూక్ష్మతః .. 33..
33.) శ్రూయతే ప్రథమ అభ్యాసే
నాదో, నానావిధో మహాన్
వర్ధమానః తథా అభ్యాసే
శ్రూయతే సూక్ష్మ-సూక్ష్మతః॥
అటువంటి ఓంకార అతరంగనాదము కుడిచెవితో వినటము … అనే యోగ సాధనలో, మొట్టమొదటగా అనేక విధములైన మహత్ నాదములు అంతర్గతముగా వినబడుతూ ఉంటాయి. క్రమంగా అభ్యాసము చేస్తూ ఉండగా, ఆ అనేక నాదములన్నీ ప్రక్కకు తొలగి, ఇక ఆ యోగికి సూక్ష్మాతి సూక్ష్మమైనట్టి (బుద్ధితో మాత్రమే గ్రహించగలుగు) “సూక్ష్మనాదము” విబడుతుంది. నిర్విషయాత్మ బుద్ధికి సూక్ష్మమగు స్వస్వరూపము స్వానుభవమగుచూ వస్తుంది.

ఆదౌ జలధిజీమూతభేరీనిర్ఝరసంభవః .
మధ్యే మర్దలశబ్దాభో ఘంటాకాహలజస్తథా .. 34..
34.) ఆదౌ జలధి జీమూత
భేరీ నిర్ఝర సంభవః
మధ్యే మర్దళ శబ్దాభో
ఘంటా కాహళజః తథా॥
అంతర్నాద ప్రణవనాదోపాసనలో మొట్టమొదట - ప్రారంభంలో సముద్ర తరంగముల ఘోష, మబ్బుల మోత, భేరీ నినాదము వంటివి…. (లో నుండి) వినబడుతాయి. “నాదము వినుట” అను సాధనలోని మధ్య దశలో
- మద్దెల శబ్దము
- గుడిగంట నాదము
- కాహళ (కామ్-కామ్) శబ్దములు
… కొంత నెమ్మదిగా ఆ యోగికి వినబడుతూ ఉంటాయి.

అంతే తు కింకిణీవంశవీణాభ్రమరనిఃస్వనః .
ఇతి నానావిధా నాదాః శ్రూయంతే సూక్ష్మసూక్ష్మతః .. 35..
35.) అంతేతు కింకిణీవంశ
వీణా భ్రమర నిస్వనః
ఇతి నానావిధా నాదాః
శ్రూయంతే సూక్ష్మ-సూక్ష్మతః॥
అంతర్గత ప్రణవనాదోపాసన యొక్క చివరి చివరి దశలలో
- చిరుమువ్వల కింకిణీ శబ్దము,
- వేణుగానము,
- భ్రమరము (తుమ్మెద) ఝంకార శబ్దము ….,
ఈవిధంగా ఆయా నానావిధములైన శబ్దములు సూక్ష్మ-సూక్ష్మంగా వినిపిస్తూ వస్తాయి.

మహతి శ్రూయమాణే తు మహాభేర్యాదికధ్వనౌ .
తత్ర సూక్ష్మం సూక్ష్మతరం నాదమేవ పరామృశేత్ .. 36..
36.) మహతి శ్రూయమాణేతు
మహాభేర్యాధిక ధ్వనౌ।
తత్ర సూక్ష్మం సూక్ష్మతరం
నాదమేవ పరామృశేత్||
“అంతర్గత ప్రణవ నాదోపాసన” అను యోగాభ్యాసికి ఎక్కువగా శ్రవణం చేస్తూ ఉన్న సందర్భాలలో ‘మహాభేరీ నాదము’ వినబడుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఆ యోగసాధకుడు పెద్ద శబ్దమును ప్రక్కకు పెట్టి సూక్ష్మమైన నాదములపై బుద్ధిని ఏకాగ్రత చేస్తూ, వింటూ ఉండాలి. “మ్”… అను సౌమ్యనాదమును గమనిస్తూ ఉండటానికి అధికాధికముగా బుద్ధిని సూక్ష్మతరం చేస్తూ ఉండాలి.

ఘనముత్సృజ్య వా సూక్ష్మే సూక్ష్మముత్సృజ్య వా ఘనే .
రమమాణమపి క్షిప్తం మనో నాన్యత్ర చాలయేత్ .. 37..
37.) ఘనమ్ ఉత్సృజ్య వా సూక్ష్మే
సూక్ష్మమ్ ఉత్సృజ్యవా ఘనే,
రమమాణమ్ అపి క్షిప్తమ్
మనో న అన్యత్ర చాలయేత్||
ఇంకొక ఉపాయము.
బుద్ధియొక్క మధురమైన ఏకాగ్రత చేత…,
- సూక్ష్మనాదమును వినుచున్నప్పుడు ఘననాదమును విడచిపెట్టుచూ ఉండాలి.
- ఘననాదమును వినుచున్నప్పుడేమో సూక్ష్మనాదమును విడచి (వినక) ఉండాలి.
ఈవిధముగా త్యాగ-ఆశ్రయ పూర్వకంగా వినుచూ ఉన్నప్పుడు మనస్సు తదితరమైన విషయములవైపుగా వెళ్ళకుండా…. అది అంతర్ - శబ్దమునే వింటూ ఆనందించునట్లుగా నియమితమౌతూ వస్తుంది.

యత్ర కుత్రాపి వా నాదే లగతి ప్రథమం మనః .
తత్ర తత్ర స్థిరీభూత్వా తేన సార్ధం విలీయతే .. 38..
38.) యత్ర కుత్రాపి వా నాదే లగతి ప్రథమం మనః,
తత్ర తత్ర స్థిరీభూత్వా తేన సార్థం విలీయతే||
ఈ మనస్సుకు ఒక ముఖ్య ’ధర్మము’ ఉన్నది. ఇది మొట్టమొదటగా - ఏకాగ్రంగా ఏనాదము (లేక శబ్దము) వింటే, అది పోయి అక్కడే ఏర్పాటును పొంది, ఆ అర్థములోనే విలీనమైపోతూ ఉంటుంది. అది మనస్సు యొక్క స్వభావము మరి!

విస్మృత్య సకలం బాహ్యం నాదే దుగ్ధాంబువన్మనః .
ఏకీభూయాథ సహసా చిదాకాశే విలీయతే .. 39..
39.) విస్మృత్య సకలమ్ బాహ్యమ్
నాదే దుగ్ధ-అంబువత్ మనః
ఏకీభూయ అథ సహసా
చిదాకాశే విలీయతే॥॥
అందుచేత (బాలుని లాలించినట్లుగా) మనస్సును లాలిస్తూ, సకల బాహ్య విషయములను, వృత్తులను విస్మరించే రీతిగా నయాన నియమించాలి. అంతరంగము నుండి వినబడు ప్రణవనాదముపైనే మనస్సుకు ఇష్టమగునట్లుగా లాలిస్తూ తీర్చిదిద్దాలి. అప్పుడు మనస్సు క్రమంగా అంతరంగ ప్రణవనాదముతో విలీనమై, పాలు-నీరు వలె (దుగ్ధ-అంబువత్) ప్రణవముతో కలసిపోయి, ఏకీభూతమగుచున్నది. చివరికి మనస్సు “చిదాకాశము”లో విలీనము కాగలదు.

ఉదాసీనస్తతో భూత్వా సదాభ్యాసేన సంయమీ .
ఉన్మనీకారకం సద్యో నాదమేవావధారయేత్ .. 40..
40.) ఉదాసీనః స్థితో భూత్వా
సదాభ్యాసేన సంయమీ
ఉన్మనీకారకం సద్యో
నాదమేవ అవధారయేత్||
ఈ మనస్సు - దృశ్య సంబంధమైన సంఘటనలు, సంబంధములు, బాంధవ్యములు, అవసరమేలేని వ్యవహారములు, పరుల తప్పులు, దూషణ ఇటువంటి అనేక విషయాలపై వ్రాలి వాటితో మమేకమౌతోంది.
అందుకని
- సంయమి అగు యోగి మనస్సుకు సదాభ్యాసముల సహాయంతో దృశ్య విషయాలపై ఉదాసీనంగా ఉండటం.
- అటువంటి మనస్సును ఉన్మనీకారకమైన (యోగ భావ పూర్వకమైన) “అంతరంగము నుండి నాదము వినుట” …
అనే అభ్యాసములను అవధారణ చేయించాలి. (మనస్సును సాక్షిగా దర్శించు మనో విభాగము ‘ఉన్మని’)

సర్వచింతాం సముత్సృజ్య సర్వచేష్టావివర్జితః .
నాదమేవానుసందధ్యాన్నాదే చిత్తం విలీయతే .. 41..
41.) సర్వచింతాం సముత్సృజ్య
సర్వచేష్టా వివర్జితః
నాదమేవ అనుసందధ్యాత్
నాదే చిత్తం విలీయతే॥
ఎప్పుడైతే ఈ చిత్తము
- సర్వ ప్రాపంచక చింతనలను వదలిపెట్టుచూ…,
- సర్వ దృశ్య - లోక సంబంధమైన చేష్టలను విడనాడుచూ….,
అంతరంగము నుండి వినబడు ప్రణవనాదముపై అనుసంధానము అగుచున్నదో, అప్పుడు ఆ నాదమునందే ఆచిత్తము విలీనమగుచూ, క్రమంగా లయము పొందుచున్నది. ఇక దృశ్య జగత్తును ప్రణవనాద స్వరూపంగా సందర్శించటం ప్రారంభిస్తుంది.

మకరందం పిబన్భృంగో గంధాన్నాపేక్షతే తథా .
నాదాసక్తం సదా చిత్తం విషయం న హి కాంక్షతి .. 42..
42.) మకరందం పిబన్ భృంగో
గంథాన్ న అపేక్షతే యథా,
నాదాసక్తం సదా చిత్తం
విషయం నహి కాంక్షతే॥॥
అత్యంత మధుర రసముతో కూడిన పూలపై వ్రాలుచున్న తుమ్మెద, ఆ పుష్పములలోని మకరందమును గ్రోలుటయందే నిమగ్నమౌతుంది. ఇక ఇతర దుష్ట
వాసనలు గల పూల గురించి, ఆలోచిస్తుందా? వాటిని పట్టించుకుంటుందా? లేదు.
అట్లాగే….
అంతరంగ ప్రణవనాదమునందు ఆసక్తితో లగ్నమైయున్న చిత్తము బాహ్య లౌకికఇంద్రియ విషయములను కాక్షించనేకాంక్షించదు. వాటన్నిటికీ ఏమాత్రము ప్రాముఖ్యత ఇవ్వదు.

బద్ధః సునాదగంధేన సద్యః సంత్యక్తచాపలః .
నాదగ్రహణతశ్చిత్తమంతరంగభుజంగమః .. 43..
43.) బద్ధః సునాద గంధేన
సద్యః సంత్యక్త చాపలః
నాదగ్రహణ తత్ చిత్తమ్
అంతరంగం భుజంగమమ్ ||
పాము నాగస్వరము వింటూ ఆ శబ్దానందముతో తన్మయమై ఇతర శబ్దములేవీ వినదు. “ఎవరిని కుట్టాలి?” … అని ఆలోచించదు కదా! అట్లాగే… అంతరంగము నుండి వినబడు ప్రణవ సునాదమును వినుచున్న చిత్తము, ఆ నాదమునకు బద్ధమై, తన యొక్క ఇతఃపూర్వపు చపలత్వము, చంచలత్వము విడచి పెట్టుచున్నది. ప్రణవనాదమునే ఆస్వాదిస్తూ ఉంటోంది. (అంతర్ హృదయమునుండి వినబడు ఘన-సూక్ష్మ శబ్దములపైనే చిత్తము వ్రాలుతూ ఉంటుంది).

విస్మృత్య విశ్వమేకాగ్రః కుత్రచిన్న హి ధావతి .
మనోమత్తగజేంద్రస్య విషయోద్యానచారిణః .. 44..
44.) విస్మృత్య విశ్వమ్ ఏకాగ్రమ్
కుత్ర చిత్ నహి ధావతి
మనో-ఉన్మత్త గజేంద్రస్య
విషయ-ఉద్యానచారిణః ||
పిచ్చి పట్టిన ఏనుగు అందమైన ఉద్యానవనంలో చపలంగా, పిచ్చిగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? అట్లాగే ఈ మనస్సు అనే పిచ్చిపట్టిన ఏనుగు విషయములపై, విషయ సుఖములపై వ్రాలటం అలవాటు చేసుకొని, ధ్యానములో విశ్వమును ఏమరచి కూడా,.. ఇంతలోనే ఎక్కడెక్కడో సంచారాలు చేస్తోంది. విషయముల ఉద్యానవనంలో సంచరిస్తోంది. ఆ ధ్యానికి పట్టు దొరకడం లేదు.

నియామనసమర్థోఽయం నినాదో నిశితాంకుశః .
నాదోఽన్తరంగసారంగబంధనే వాగురాయతే .. 45..
45.) నియా మన సమర్ధో యమ్
నినాదో నిశిత అంకుశః
నాదో అంతరంగ సారంగ
బంధనే వాగురాయతే॥
ఏనుగును అంకుశముతో ఎట్లా నియమించాలో తెలిసిన మావటివానిచేతిలోని అంకుశము వంటిది - యోగికి ప్రణవ నాదము. జగదరణ్యంలో జన్మ-కర్మలు అనే
ప్రదేశములో సంచరించే మనస్సు అనే సారంగము (లేడి)ని పట్టుకొనే గొప్ప వల వంటిది…. అంతరాంతర ’ఓం’కారనాదోపాసన!

అంతరంగసముద్రస్య రోధే వేలాయతేఽపి చ .
బ్రహ్మప్రణవసంలగ్ననాదో జ్యోతిర్మయాత్మకః .. 46..
46.) అంతరంగ సముద్రస్య
రోధే వేలాయతేఽపి చ
బ్రహ్మ ప్రణవ సంలగ్న
నాదో జ్యోతిర్మయాత్మకః॥
అంతరంగము అనే సముద్రమునకు - అదుపుచేసే చెలియ కట్ట వంటిది ప్రణవ నాదము. బ్రహ్మ ప్రణవము - జ్యోతిర్మయము అగు ప్రణవనాదము గురించి “వినుట” అను అభ్యాసము సహాయముతో చిత్తమును దృశ్యము నుండి విరామముపొంది, ఆత్మయందు సంలగ్నము కాగలదు.

మనస్తత్ర లయం యాతి తద్విష్ణోః పరమం పదం .
తావదాకాశసంకల్పో యావచ్ఛబ్దః ప్రవతతే .. 47..
47.) మనః తత్ర లయం యాతి
తత్ విష్ణోః పరమం పదమ్
తావత్ ఆకాశ సంకల్పో
యావత్ శబ్దః ప్రవర్తతే||
ఎంత వరకు శబ్దము ప్రవర్తిస్తూ ఉంటుందో.., అంతవరకు సంకల్పాకాశము (Thought Zone) పని చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు (జలంలో ప్రవేశించిన ఉప్పు బొమ్మ - ఆకారమువలె) లయిస్తుందో,… ఆ లయించు స్థానమే పరమపదమగు విష్ణు స్థానము. సర్వోత్కృష్ట స్థానము.

నిఃశబ్దం తత్పరం బ్రహ్మ పరమాత్మా సమీర్యతే .
నాదో యావన్మనస్తావన్నాదాంతేఽపి మనోన్మనీ .. 48..
48.) నిశ్శబ్దం తత్పరం బ్రహ్మ
పరమాత్మా సమీయతే
నాదో యావత్ మనః తావత్
నాదాంతే తు మనో-ఉన్మనీ॥
మనస్సు నిశ్శబ్దత సంతరించుకుంటుంది.
నిర్విషయ రూపము, నిశ్శబ్ద తత్పరము అగు పరబ్రహ్మమే - జీవునికి ఉనికి స్థానము మనస్సు - ఆ మనస్సుకు ఉత్పత్తి స్థానము అగు పరమాత్మ ఏకత్వము పొందుచున్నాయి.
నాదము ఉన్నంత వరకు మనస్సు ఉనికి కలిగి ఉంటుంది.
నాదము యొక్క సశాంతించు స్థానములో మనస్సు లయించు “మనో-ఉన్మనీ” అను మనోరహిత స్వానుభవము (ఆత్మానుభవము) శేషిస్తుంది. అప్పుడు జీవుడు ’పరబ్రహ్మము తానే’గా ఎరుగుచున్నాడు.

సశబ్దశ్చాక్షరే క్షీణే నిఃశబ్దం పరమం పదం .
సదా నాదానుసంధానాత్సంక్షీణా వాసనా భవేత్ .. 49..
49.) స శబ్దశ్చ అక్షరే లీనో
నిశ్శబ్దం పరమమ్ పదమ్
సదా నాద - అనుసంధానాత్
సంక్షీణా వాసనాతు యా॥
‘ఓం’ శబ్దము అక్షరమునందు లీనమగుచున్నది. నిశ్శబ్దము శేషిస్తోంది.
వాస్తవానికి శబ్దము లయము కాగా, శమించగా శేషించే నిశ్శబ్దమే పరమపదము.
మరి, అట్టి నిశ్శబ్ద రూప పరమపదమును పొందే విధమేది? ఎల్లప్పుడు నాదము (ఓంకారము)ను వింటూ అనుసంధానము చేస్తూ ఉండగా, వాసనలు సంక్షయించి, నిశ్శబ్ద పరమపద సుఖము - స్వభావసిద్ధంగా అనుభవమవుతోంది.

నిరంజనే విలీయేతే మనోవాయూ న సంశయః .
నాదకోటిసహస్రాణి బిందుకోటిశతాని చ .. 50..
50.) నిరంజనే విలీయేతే
మనో వాయూ న సంశయః
నాదకోటి సహస్రాణి
బిందుకోటి శతాని చ॥
ఎప్పుడు మనస్సు అనే వాయువు నిర్మలము - నిరంజనము అగు బ్రహ్మములో లీనమౌతుందో,… అప్పుడు ఇక వేల కోట్ల నాదములు, వందల కోట్ల బిందువులు కూడా ఆ మనస్సుతో బాటే, ఆ బ్రహ్మము (లేక) పరమపదమునందు లీనమగుచున్నాయి. ఇక ఈ జగత్తులో వినబడే శబ్దముల గురించి చెప్పేదేమున్నది?

సర్వే తత్ర లయం యాంతి బ్రహ్మప్రణవనాదకే .
సర్వావస్థావినిర్ముక్తః సర్వచింతావివర్జితః .. 51..
51.) సర్వే తత్ర లయం యాంతి
బ్రహ్మ ప్రణవనాదకే
సర్వావస్థా వినిర్ముక్త,
సర్వచింతా వివర్జితః॥
“అనేకముగా కనిపిస్తూ కూడా వాస్తవానికి ఒక్కటే”… అని అనిపించుట ద్వారా సర్వ బేధములు బ్రహ్మ ప్రణవనాదము నందు - ప్రణవనాదోపాసకుని దృష్టిలో-లయమును పొందుచున్నాయి. ఇక ఆయోగి సర్వ అవస్థల నుండి విముక్తుడగుచున్నాడు. సర్వ చింతలను వదలి వేయుచున్నవాడగుచున్నాడు.

మృతవత్తిష్ఠతే యోగీ స ముక్తో నాత్ర సంశయః .
శంఖదుందుభినాదం చ న శ్రుణోతి కదాచన .. 52..
52.) మృతవత్ తిష్ఠతే యోగీ
స ముక్తో న అత్ర సంశయః
శంఖ దుందుభి నాదం చ
న శృణోతి కదాచన॥
అంతరంగ హృదయము నుండి వినబడు ప్రణవనాదమును అభ్యాసము చేయు యోగి క్రమంగా సర్వ లోక సంబంధములైన విషయాలను - ఇవి నాకు చెందినవి కావు. నేను వీటికి చెందియుండ లేదు … నేను ఆత్మ స్వరూపుడను కదా! ఇదంతా ఆత్మయొక్క వినోద కల్పన అను దృష్టితో చూస్తాడు. ఏవిధంగా ఒక మరణించిన వాడు ఏలోక బంధములూ లేనివాడగుచున్నాడో,.. ఆవిధంగా యోగి (మరణించిన వానివలె) దేనికీ సంబంధము లేకయే ఉంటాడు. అన్నీ నిర్వర్తిస్తూ ఏమీ చేయనివాడై ఉంటున్నాడు.

ఎప్పుడు అట్టి దృష్టిని దృశ్యము పట్ల ఒకానొకడు సంపాదించుకుంటున్నాడో, ఆతడు అప్పుడు ముక్తుడే! ఇక ఆతని అంతర్హృదయ నాదోపాసనలో ప్రారంభంలో వినబడిన శంఖదుందుభి నాదాలు కూడా వినబడవు. కేవల-ఆత్మానందుడై ఉంటాడు.

కాష్ఠవజ్జ్ఞాయతే దేహ ఉన్మన్యావస్థయా ధ్రువం .
న జానాతి స శీతోష్ణం న దుఃఖం న సుఖం తథా .. 53..
53.) కాష్టవత్ జ్ఞాయతే దేహమ్
ఉన్మని-అవస్థయా ధ్రువమ్
స జానాతి న శీతోష్ణం
న దుఃఖం న సుఖం తథా॥
అట్టి యోగి-ఈ దేహము ఒక కట్టెవలె, బాహ్య జడవస్తువు వలె-అగుపించు యోగ స్థితిని-పొందుతున్నాడు. సీత-ఉష్ణములను, సుఖ-దుఃఖములను సమదృష్టితో చూడగలుగు అట్టి యోగి ధృవము అగు “ఉన్మనీ అవస్థ” అను యోగ, పరాకాష్ఠ పొందిన వాడగుచున్నాడు. (ఉన్మనీ = మనస్సును దాటివేసిన స్థితి, స్థానము)

న మానం నావమానం చ సంత్యక్త్వా తు సమాధినా .
అవస్థాత్రయమన్వేతి న చిత్తం యోగినః సదా .. 54..
54.) న మానం న అవమానంచ
సంత్యక్త్వా అథ సమాధినా
అవస్థాత్రయమ్ అన్వేతి
స చిత్తం యోగినః సదా!
ఆ మనస్సును ఆత్మయందు (లేక) ఆత్మ భావనయందు (లేక) “సర్వము నా ఆత్మయొక్క వినోద ప్రదర్శనమే” అను బుద్ధి స్థితియందు లయము చేసిన
యోగికి (మనస్సును దాటి వేసిన యోగికి) …
- ఇక మానము ఉండదు. అవమానము ఉండదు.
సమాధి స్థితిని పొందిన ఆతడు చిత్తమును చితనందు లయింపజేస్తూ జాగ్రత్ - స్వప్న సుషుప్తులకు కేవల-సాక్షిత్వముచే అధిగమించి సమాధి రూపమగు “తురీయావస్థ” అనబడు “అహమ్ బ్రహ్మ” స్థానము పొందుచున్నాడు. తానే ఈ సర్వమై ఆస్వాదిస్తున్నాడు.

జాగ్రన్నిద్రావినిర్ముక్తః స్వరూపావస్థతామియాత్ .. 55..
55.) జాగ్రత్ నిద్రా వినిర్ముక్తః
స్వరూపావస్థతామి యాత్||
ఆతడు జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల నుండి విడివడినవాడై - “ఈ మూడు అవస్థలకు వేరైనట్టి కేవలాత్మ స్వరూపుడిని కదా!” - అను స్వస్వరూపావస్థ (తురీయావస్థ - బ్రాహ్మీ స్థితి) యందు ప్రవేశించుచున్నాడు. సర్వము తానై, సర్వులు తన ఆత్మ స్వరూపులే అయి ఆస్వాదిస్తున్నాడు. స్వస్వరూపావస్థ పొందినవాడగుచున్నాడు.

దృష్టిః స్థిరా యస్య వినా సదృశ్యం
వాయుః స్థిరో యస్య వినా ప్రయత్నం .
చిత్తం స్థిరం యస్య వినావలంబం
స బ్రహ్మతారాంతరనాదరూపః .. 56..

ఇత్యుపనిషత్ ..
56.) దృష్టిః స్థిరా యస్య
వినా స దృశ్యమ్|
వాయుః స్థిరో యస్య
వినా ప్రయత్నమ్,
చిత్తం స్థిరం యస్య
వినా అవలంబమ్
స బ్రహ్మతారాం (పాం) తర
నాదరూపమ్|
ఇత్యుపనిషత్
అట్టి కేవల స్వస్వరూపావస్థ … స్థితిలో - “బ్రహ్మ తారాంతరనాద” రూపుడగుచున్నాడు.
ఓం కారస్వరూపుడగుచున్నాడు.

ఎప్పుడైతే …,
- ఎదురుగా ఈ దృశ్యము కనిపిస్తున్నప్పటికీ ఇదంతా ఆత్మస్వరూపమై దృశ్యమనునదే ఆతనిపట్ల వేరుగా లేనిదై ఉంటుందో,
- ఏ ప్రయత్నము లేకుండానే అతనియందు ప్రాణతత్త్వము స్థిరత్వమును (స్వభావసిద్ధంగానే) సంతరించుకుంటుందో…,
- ఏ సాధన వస్తువు - అంతర హృదయ ప్రణవనాదశృతము మొదలైనవేవీ లేకుండా కూడా ఆతని చిత్తము ఆత్మభావనయందు సుస్థిరము-నిశ్చలము స్వభావ సిద్దముగా అగుచున్నదో…
అట్టి బ్రహ్మ తారాంతర స్థితికి (లేక) బ్రహ్మ పారాంతర స్థానమునకు ఆ యోగి చేరుచున్నాడు.
ఓంకార ప్రణవనాదము వినటమును దాటి, ప్రణవనాదమే తానై ప్రకాశించుచున్నాడు.

ఓం వాఙ్మే మనసి ప్రతిష్ఠితా . మనో మే వాచి ప్రతిష్టితం .
ఆవిరావీర్మ ఏధి . వేదస్య మా ఆణీస్థః . శ్రుతం మే మా ప్రహాసీః .
అనేనాధీతేనాహోరాత్రాన్సందధామి .
ఋతం వదిష్యామి . సత్యం వదిష్యామి .
తన్మామవతు . తద్వక్తారమవతు .
అవతు మామవతు వక్తారం ..

ఓం శాంతిః శాంతిః శాంతిః ..

ఇతి నాదబిందూపనిషత్సమాప్తా ..

ఇతి నాదబిందూపనిషత్
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥


ఋగ్వేదాంతర్గత

6     నాదబిందు ఉపనిషత్

అధ్యయన పుష్పము

“హంస హంసోఽహమ్ సోఽహమ్ సోఽహమ్‌”ల ప్రతీక


ఓం
సర్వే సర్వత్రా – అంతటా విరాజమానమైయున్న ఏ పరమాత్మయొక్క ఉపాసన వలన జనించే జ్ఞానాగ్నిచే సంచిత ఆగామి - ప్రారబ్ధ కర్మత్రయము మొదలంట్లో నశించినదై… ఆత్మపదము స్వానుభవమగుచున్నదో…..
అట్టి పరమాత్మ పరంధామ తత్త్వమును భజించుచున్నాము.

హృదయము యొక్క అంతరాంతరము నుండి “ఉమ్-మమ్- (ఉమ్-ఉమ)” అని వినబడు నాదము - ప్రణవనాదము.

‘ఓం’… ప్రణవాక్షరము యొక్క సంజ్ఞ.

‘హంస’… ప్రణవనాదమునకు సూచన రూపము. ‘సో హమ్’ అర్థ ప్రతిపాదితము.

అక్షర పరబ్రహ్మమునకు సంజ్ఞయగు ప్రణవాక్షర ‘ఓం’కార ‘హంస’ను అభివర్ణించుకొనుచున్నాము.

అట్టి హంసకు -
✤ ‘అ’ కారము → కుడి రెక్క
✤ ’ఉ’ కారము → ఎడమ రెక్క
✤ ‘మ’ కారము → తోక
✤ ‘అర్ధమాత్ర’’ → ముఖము / మస్తకము
✤ త్రిగుణములు → (ఆ హంస యొక్క) పాదములు
✤ “తత్త్వమ్, తత్ త్వమ్ అసి” అను యజుర్వేద మహా వాక్యము-అనగా ’నీవు’గా కనిపించుచున్నది పరబ్రహ్మమే ! …. అను సందర్శనము → ఆ హంసయొక్క శరీరము
✤ కుడి కన్ను → ధర్మము
✤ ఎడమ కన్ను → అధర్మము
✤ పాదములు → భూలోకము (Zone of Matter)
✤ జానవులు (భుజములు) → భువర్లోకము (Zone of Thought) ⠀
✤ కటి (నడుము) చుట్టూ ప్రదేశము → సువర్లోకము (Zone of Divinity)
✤ బొడ్డు ప్రదేశము → మహర్లోకము (Zone as Al-pervading)
✤ హృదయము → జనోలోకము (Zone as Al-extended)
✤ కంఠ ప్రదేశము → తపో లోకము (Zone of cogitation)
✤ నుదురు-లలాట మధ్యప్రదేశము భ్రూమధ్యము → సత్యలోకము (Zone of Al-presence)
✤ సహస్రార - శిరో ఊర్ధ్వ ప్రదేశము → ‘ఓం’ ప్రణవ మంత్రము (All put together)

ఈ విధముగా ‘హంస’ యోగమును ఎరిగి ఉపాసించు హంసయోగి ‘సోఽహమ్’ స్థానమును అధిష్ఠించుచున్నాడు.

అట్టి “పరమహంస” ను ధ్యాన వస్తువుగా, నాద బిందువుగా స్వీకరించి, ప్రణవనాదమును ఉపాసించువానిని ఇక ఇతఃపూర్వపు శతకోటి పాపఫలములు కూడా సమీపించవు. బాధించవు.

‘ఓం’ ప్రణవము (అ + ఉ మ + అర్ధమాత్ర Mere Sound) (చూపుడు వేళ్ళతో చెవులు మూసినప్పుడు లోనుండి వినబడు నాదము)
       ప్రథమ మాత్ర ‘అ’ → అగ్ని స్వరూపముగా
       ద్వితీయ మాత్ర ‘ఉ’ → వాయు స్వరూపముగా
       ఉత్తర - తృతీయ మాత్ర  ‘మ’ → సూర్య మండల సంకాశమగు భానుమండల తేజస్సుగా
       సర్వమునకు ఆవలి గట్టు అయినటువంటి అర్ధమాత్ర (మ్ …. శబ్దము) → అ వరుణ భగవానుడుగా
అని ప్రణవతత్త్వ విదులు ప్రణవోపాసనను అధిష్టాన దేవతలతో ఏకము చేసి ‘ఓం’ ఉపాసించుటను సూచిస్తున్నారు.

అట్టి ‘ఓం’ సంజ్ఞార్థరూప ‘ప్రణవము’ అగు పరబ్రహ్మమే సర్వకాలములందును (ఇతః పూర్వకము, ఇప్పుడు, ఇకముందు కూడా) అంతటా అన్నిటా, అంతయూ అయి, ‘మాత్రలు’గా ప్రతిష్ఠితమైయున్నది.

అట్టి ప్రణవమగు ఓంకారము యొక్క జగత్ రూపధారణ ఎట్టిదో మనము వివరించుకొనెదము గాక! ప్రణవము యొక్క మాత్రల గురించి (About Varieties of Bit appearences) చెప్పుకుందాము.

ప్రణవము యొక్క జగత్ రూప మాత్రలు (Bit-wise manifestations)

1) ప్రధమ మాత్ర        …    ఘోషిణి       …    స్థూల రూపము
2) ద్వితీయ మాత్ర       …    విద్యుత్       …    తేజో రూపము
3) తృతీయ మాత్ర       …    పతంగిని       …    (నిశ్చల) వాయు రూపము
4) చతుర్థ మాత్ర       …    వాయు స్పందన       …    వాయు కదలికల రూపము
5) పంచమీ మాత్ర       …    నామదేయా       …    నామ రూపములు (Names and Forms)
6) షష్ఠీ మాత్ర       …    ఇంద్ర       …    ఇంద్రియ అధినాయకుడగు ఇంద్రుని పరిపాలనములు అగు ఇంద్రియముల రూపము
7) సప్తమ మాత్ర       …    వైష్ణవీ       …    సర్వమునందు ఏకరూపమై విస్తరించియున్న విష్ణుతత్త్వ రూపము : (Al-Present and Al-Pervading Absolute self)
8) అష్టమ మాత్ర       …    శాంకరీ       …    సర్వమునందుగల సుఖ-శాంతి-ఆనంద రూపము (Pleasantness)
9) నవమీ మాత్ర       …    మహతి       …    ఈ దృశ్య జగత్తంతా తన మహిమగా గల రూపము (One’s own focus)
10) దశమీ మాత్ర       …    ధృతి       …    పట్టుదల రూపము. దేహ - మనో బుద్ధి మొ॥ వాటిని ధరించు ధైర్య - ధారణ రూపము (Meditational upholding)
11) ఏకాదశీ మాత్ర       …    నారీ       …    సర్వజీవులలో ఉండే ఆశయ ఆవేశ రూపము (Instinct and Inspiration in all)
12) ద్వాదశీ మాత్ర       …    బ్రాహ్మీ       …    సర్వరూపములు తానై, సర్వమునకు వేరే కూడా అయి ఉన్నట్టి బ్రహ్మతత్వజ్ఞాన ఆనంద రూపము.

ఈ విధముగా యోగి ప్రణవోపాసనను వివిధ మాత్రల ఉపాసనగా నిర్వర్తించి, క్రమంగా బ్రాహ్మీతత్త్వమును చేరుచున్నాడు. ఒక్కొక్క మాత్రారూపమును ఆశ్రయించి (భావన చేస్తూ)… ఓంకారోపాసన నిర్వర్తించుచూ ఉండగా దేహానంతరము ఒక్కొక్క ప్రయోజనము పొందుచూ… చివరికి ఓంకార పరాకాష్ఠ స్థానము చేరి, ఓంకారార్థమగు పరమాత్మయే తానై, బ్రహ్మమే తానై, సర్వము తానై, సర్వమునకు వేరై… అనిర్వచనీయ ఆత్మత్వమును పుణికి పుచ్చుకొనుచున్నాడు. ఖండత్వమును దాటి వేసి, అఖండ - కాలఃకాల కేవలీ పరతత్త్వమై, నిర్గుణబ్రహ్మమై … సర్వమునకు ఆధారమగు పరబ్రహ్మమై వెలుగొందుచున్నాడు.

మాత్రోపాసన - లోక ప్రయోజనములు / ఫలశృతులు

ప్రణవమును ఒక్కొక్క మాత్రరూపంగా (As Different Bit - concentrations) యోగాభ్యాసము చేస్తూ ఉండగా ఒక్కొక్క ఫలము (ప్రయోజనము) సిద్ధిస్తూ ఉంటోంది. ఆ యోగి ఆయా ఉత్తమ స్థానములను చేరుచూ… ఉపాసన యొక్క పరాకాష్ఠచే చివరికి ప్రణవ స్వరూపుడై విరాజిల్లుచున్నాడు. ఇప్పుడు మనము ఒక్కొక్క మాత్రను ఆలంబముగా చేసుకొని ప్రణవోపాసన చేస్తూ పొందు చతుర్దశ భువన సంబంధమైన ప్రయోజనములు వర్ణించుకుంటున్నాము.

మాత్ర# మాత్రోపాసన చేస్తూ భౌతికత్వము (దేహము) విడుచువాడు (ప్రాణ-ఉపసంహరణ చేయువాడు) పొందుచున్న తదనంతర జన్మ స్థానము
1) ప్రథమ మాత్ర ప్రథమాయంతు మాత్రాయాం యది ప్రాణైః వియుజ్యతే!
మొట్టమొదటి మాత్ర యగు ’ఘోషిని’ (ఘన - స్థూల రూపమున) ఆలంబనముగా తీసుకొని ప్రణవోపాసన చేస్తూ ఉండగా దేహమును విడవటం జరిగితే …
భరతవర్షములో సార్వభౌముడుగా పుట్టుచున్నాడు
2) ద్వితీయ మాత్ర విద్యుత్ - (తేజో రూపమును) సముత్ కాంతిని ఆలంబనముగా తీసుకొని బ్రహ్మమును ప్రణవోపాసన చేయుచూ ప్రాణములు విడవటం జరిగితే … యక్షులలో శ్రేష్ఠుడై, మహనీయుడు - మాననీయుడుగా పుట్టడం జరుగగలదు.
3) తృతీయ మాత్ర పతంగిని ప్రాణవాయు రూపముగా (ప్రాణోపాసన) ఆలంబనం చేసుకొని ప్రణవోపాసన చేయుచుండగా … విద్యాధరుడుగా జన్మిస్తున్నాడు.
4) చతుర్థ మాత్ర వాయుస్పందన ఆలంబనముగా ప్రణవోపాసన చేయుచూ ప్రాణములు ఉపసంహరించటం జరిగితే … గంధర్వుడుగా అగుచున్నాడు.
5) పంచమ మాత్ర ‘నామధేయ’… నామరూపాత్మకమైనదంతా ప్రణవ స్వరూపముగా ఉపాసిస్తూ ఉండగా ప్రాణములు (దేహము) విడవటం జరిగినప్పుడు దివ్యరూపముతో చంద్ర లోకము ప్రవేశించి దేవతలతో సమానముగా పూజింపబడుచూ ఉంటున్నాడు.
6) షష్టీ మాత్ర ‘ఇంద్రి’ (ఇంద్రియ నియామకుడు - సొంతదారుడు అగు ఇంద్ర రూపంగా ఉపాసిస్తున్నప్పుడు) సర్వ బంధములను అధిగమించి సాయుజ్యము పొందుచున్నాడు.
7) సప్తమ మాత్ర ‘వైష్ణవి’ (అంతటా విస్తరించి [సత్రూపమై] ఉన్నతత్త్వము)ను భావన చేస్తూ ఉపాసించువాడు “అంతటా విస్తరించియున్నది నేనే కదా !” అన్న వైష్ణవ పదమును, విష్ణు సాయుజ్యము పొందుచున్నాడు.
8) అష్టమ మాత్ర  “శాంకరి” అను మాత్రగా ఉపాసిస్తూ ఉన్నప్పుడు రుద్రలోకం చేరి పశుపతితో మమేకము పొందుచున్నాడు. సర్వులకు శుభములు చేకూర్చు వాడగుచున్నాడు.
9) నవమ మాత్ర ‘మహతి’ (మహత్-ఇతి) అను మాత్రను ఆలంబనముగా చేసుకున్నవాడు ‘ఈ దృశ్యమంతా నా యొక్క మహిమయే కదా” అను భావన అనుభవమగు మహర్లోకము చేరుచున్నాడు.
10) దశమ మాత్ర ‘ధృతి’ … ధారణ… అను మాత్రను అవలంబించి ఓంకారోపాసన చేస్తున్నవాడు జనో లోకము (జీవులంతా తన రూపము అను భావన కలుగు స్థితి) చేరుచున్నాడు.
11) ఏకాదశ మాత్ర ‘నారీ’…. అను మాత్రను ఆవలంబనముగా చేసుకొనుచున్న ప్రణవోపాసకుడు “సర్వస్వభావములు నేనే” అనే భావనతో తపోలోకము చేరుచున్నాడు.
12) ద్వాదశ మాత్ర ‘బ్రహ్మీ’ … సర్వము బ్రహ్మమే । నేను-నీవు… ఇదంతా కూడా … అను మాత్రను ఆవలంబనముగా కలిగి ఉన్నవాడు శాశ్వతమగు బ్రహ్మలోకము పొంది “ఇదంతా నా సృష్టియే! నా దృష్టియే ఈ సృష్టి! నేనే!” అను రూపము గల బ్రహ్మానందమును పొందుచున్నవాడగుచున్నాడు.

ఈ విధంగా నాదబిందు యోగోపాసకుడు బ్రాహ్మీతత్త్వము యొక్క ‘12 మాత్రల ఉపాసనా క్రమముచే పరబ్రహ్మస్థానము చేరుచున్నాడు.

ఏ స్థానమైతే - సర్వ వ్యాపకము,  పరమ నిర్మలము, సర్వ శుభప్రదము, శివము, కేవల జ్యోతి స్వరూపము, జ్యోతి (Devine light) ఉదయించుచున్న జ్యోతిర్జోతి
అయి ప్రకాశించుచున్నదో - అట్టి బ్రహ్మీ స్థితి చేరి, ప్రణవ స్వరూపుడై ప్రకాశించుచున్నాడు.

హృదయము నుండి వినబడు ‘ఉమ్మ్….’ నాదయోగమును అనుష్ఠించుచున్న యోగి
- ఇంద్రియములను - ఇంద్రియ విషయములను దాటివేసినవాడై …,
- త్రిగుణములకు అతీతుడై …,
“యోగయుక్తుడు”… అగుచున్నాడు.

చెదరనట్టి, చ్యుతిలేనట్టి “శివము - శాంతము" అగు సదాశివ బ్రహ్మమునందు ప్రవేశము పొందుచున్నాడు. ఓంకారార్థ తన్మయుడు (తానే ఓంకారార్థముగా) అగుచున్నాడు. యోగధర్మముచే సర్వ దృశ్య - దేహ - మనో - బుద్ధి - చిత్త ధర్మములను దాటిపోయి, ఆత్మ ధర్మమునందు ప్రవేశించి, ‘ముక్తుడు’ అగుచున్నాడు. సర్వ సంగమముల (All Attachments) బంధములను త్రెంచి వేసినవాడై, సర్వమును తనయందే దర్శించుచున్నాడు. తాను సంగ వివర్జితుడు - ముక్తుడు అవటమే కాకుండా.. తనను ఆశ్రయించిన వారిని, కులము లోనివారిని, పరిసరములలోని వారిని క్రమముగా, ముక్తులుగా తీర్చిదిద్దుతున్నాడు.

శనైః ముచ్యేత్ కులేజనమ్ ॥ సంస్థతో యోగ ధర్మేణ సర్వసంగ వివర్జితః ॥
సర్వ సంసార పాశములను సాలెపురుగువలె తన ఆత్మవికాసముచే దిగమ్రింగి వేసినవాడై, నిర్మలుడు, సూర్యప్రభాప్రకాశమానుడు అగుచున్నాడు.

తేనైవ బ్రహ్మభావేన పరమానందమ్ అశ్నుతే !
బ్రహ్మ భావముచే పరమానందము పొందుచున్నాడు. బ్రహ్మమే తానైన స్థితిని పొందుచున్నాడు.

కాబట్టి ఓ సర్వ ప్రియ జీవులారా! స్వయమాత్మానంద స్వరూపులారా! సహజ ఓంకారాత్ములారా! బుద్ధిమంతులారా! మహాశయులారా! శ్రేయోదాయకమగు మా ఈ మాటలు వినండి. మీరంతా కూడా జీవితకాలమంతా “ఆత్మ’ను గురించి తెలుసుకునే ప్రయత్నములోనే ఉండండి. అంతేగాని, ఇంద్రియ విషయ పరిమితులై ‘జీవితము’ అనే మహత్తర అవకాశమును వృధా చేసుకోకండి. ఆత్మానమ్ సతతమ్ జ్ఞాత్వా కాలం నయ, మహామతే!

ఇక జీవితంలోని కష్ట-సుఖముల, సుఖ-దుఃఖముల, అనుకూల ప్రతికూల సందర్భముల మాటేమిటంటారా?

ప్రాబ్ధమ్ అఖిలమ్ భుంజన్, న ఉద్వేగమ్ కర్తుమ్ అర్హసి | మీరంతా మహామతులు అవండి! గొప్ప తెలివిగలవారై ప్రారబ్దములను (ఈ దేహముతో అనివార్యముగా అనుభవించవలసి వస్తున్న సుఖ-దుఃఖ మొదలగు విషయములను), ఆత్మ భావనతో సమగ్రమైనటువంటి అవగాహనముతో, ఉత్తమమైన ఆశయసిద్ధికొరకై ఉద్వేగరహితులై స్వీకరించండి. పరమానందమగు ఆత్మయే స్వరూపముగా కలిగి ఉన్నట్టి మీరు, ప్రారబ్ధముల గురించి ఉద్వేగము పొందవలసిన అవసరమేమున్నది? కించిత్ కూడా లేదు.

“నా ఆత్మ ఇట్టిది కదా! బంధరహితము! సర్వాతీతము! సర్వసాక్షి! కేవలానంద స్వరూపము! అప్రమేయము॥” - అను రీతిగా ఆత్మ గురించిన ఆత్మ జ్ఞానము మీలో ఉదయించిందా.. ఇక ప్రారబ్దము మిమ్ములను ఏమి చేయగలదు ?

“ఉత్పన్నేచ ఆత్మ విజ్ఞానే, ప్రారబ్ధము నైవ ముంచతి”
- "ఇది నా ప్రారబ్దమురా, నాయనా ”… అని ఆతడు ప్రారబ్ధములో మునగడు.
- ప్రారబ్ధము అతనిని ముంచనూ లేదు. ఇముడ్చుకొననూ లేదు. మబ్బులు ఆకాశమును మింగ్రగలవా? లేదు కదా? ఇదీ అంతే!

అంతే కాదు.
తత్త్వజ్ఞానోదయాత్ ఊర్ధ్వమ్ ప్రారబ్ధమ్ నైవ విద్యతే |
తత్త్వజ్ఞానము ఉదయించినదా… ఇక ఆపై ‘ప్రారబ్ధము’ అనబడేదీ ‘లేనిదే’ అగుచున్నది. ఒక దృష్టాంతము.

ఒకాయన నిదురిస్తూ కలకంటున్నప్పుడు అట్లా కలకంటూ ఉండగా, అతని దృష్టిలో పాంచభౌతిక దేహము ఉంటుందా ? ఏమాత్రమూ (దృష్టి - అనుభవములకు) ఉండదు కదా!
దేహాదీనామ్ అసత్వాత్తు యథా స్వప్నే నిబోధతః, కర్మ జన్మాంతరీయంతు ప్రారబ్ధ ఇతి కీర్తితమ్ । 

ఈ దేహము - ఇతఃపూర్వపు దేహము - రాబోయే దేహములకు సంబంధించిన సంచిత - ప్రారబ్ధ - ఆగామి కర్మలు కూడా, “స్వప్నదర్శి యొక్క భౌతికదేహావగాహన” వలె “మొదలే లేనివి” అగుచున్నాయి. ఆత్మ జ్ఞానికి ఈ జన్మయే లేదు. ఇక క్రితం జన్మలు - రాబోయే జన్మలు, అందుకు సంబంధించిన కర్మలు ఇంకెక్కడివి? ఆత్మజ్ఞాని సర్వదా జన్మ - కర్మలకు సంబంధమే లేనట్టి స్వస్వరూపాత్మను, సత్-చిత్-ఆనందతత్త్వమును ఆస్వాదిస్తూ ఉంటాడు.

స్వప్న దేహో యథా అధ్యస్తః తదైవ అయం హి దేహకః |
  ఒకడు నిదుర లేచిన తరువాత, “రాత్రి కలలో నాకు కనిపించిన, నాకు చెందిన ఆ భవనము ఏమైనట్లు? స్వప్నంలోని నా దేహము ఏమైనట్లు? ప్రదేశములో ఉన్నట్లు?” అని వెతుకుచున్నాడా? లేదే ! "ఆఁ! అదంతా నా ఊహలో నేను కల్పించుకొని, ఊహతో సహా అంతా నాలోనే లయం చేసుకున్నాను. అంతకుమించి కలలోని దేహము లేదు! భావన లేదు! స్వప్నంలోని గృహాలు లేవు” … అని క్షణంలో వదలివేసి జాగ్రత్ కార్యక్రమాలు స్వీకరిస్తున్నాడు కదా!

అట్లాగే…
జాగ్రత్‌లో నాకు ఇప్పుడు కనిపిస్తున్నదంతా స్వప్నములో నాకు కనిపించిన విశేషాలు వంటివే కదా! అంతా నాలోంచి బయలు దేరే ఊహతో నిర్మితమై, ఉహచే అనుభవించబడి, ఊహతోబాటే నాలో లయ అగుచున్నాయి. దేహము స్వభావంగా నశిస్తూ ఉండగా, దేహభావాలు - నాలో లయిస్తున్నాయి.
- అని వర్తమానములోనే, (ఈ జాగ్రతన్ను దర్శిస్తూ ఉండగానే,..) అవగాహన కలిగి ఉంటున్నాడు. ’ఈ జన్మ, రాబోయే జన్మ కలవంటిదే! కలలో వచ్చేదేమున్నది? పోయే దేమున్నది” అను అర్ధముతో కూడిన బుద్ధితో కలిగి ఉండియే, … ఇదంతా చూస్తున్నాడు!

అధ్యస్తస్య కుతో జన్మ? జన్మ-అభావే కుత స్థితిః?
నేను ఉంటే జన్మలు. జన్మలుంటే కర్మలు. అంతేగాని, జన్మలలో నుండి, కర్మలలో నుండి నేను జనించువాడను కాను. జన్మల కంటే మునుముందే నేనున్నాను. ముందే ఉన్న నాకు జన్మలెక్కడివి? జన్మచే జనించువాడను కానట్టి ఆదిస్వరూపమగు ఆత్మకు జన్మలు లేవు. జన్మలే లేనిదానికి ’జన్మలలో స్థితి’ అన్నదెక్కడున్నది? కనుక నేను జన్మలకు - కర్మలకు సంబంధించని అప్రమేయుడను. జన్మలే లేనట్టి నాకు లోకములు ఎక్కడున్నాయి ? ఆ లోకములలో స్థితి ఎక్కడున్నది? జాగ్రత్ - స్వప్న సుషుప్తులలో స్థితి (placement) అనునదేమున్నది? ఇక ఈ పాంచభౌతికమైనట్టి ప్రపంచము గురించి ఏమిటంటారా? దేహము ఏమిటి?
ఉపాదానం ప్రపంచస్య, మృత్ భాండస్యేవ పస్యతి!

మట్టి కుండ

“మట్టికుండ” అనునది ‘మట్టి+కుండ’ అనబడు ద్వంద్వ సమాసమా ? కాదు. మట్టియే ఒకానొక ఆకారముచేత ’కుండ’ అని చెప్పబడుతోంది. అంతేగాని ’మట్టికి వేరైన కుండ” అని ఏదైనా ఉన్నాదా ? లేదు. మట్టియే ఆకారము దృష్ట్యా ‘కుండ’ అని పిలువబడుతుంది. కుండగా కనిపించేది మట్టియే అయినప్పటికీ,…“మట్టి కాస్తా ’కుండ’ అనే దశగా మారినది” అనునది యుక్తియుక్తం కాదు కదా!

అట్లాగే …
పరబ్రహ్మస్వరూపుడనగు నేను జీవుడు, జగత్తు, భౌతిక దేహములుగా కనిపిస్తూ ఉండవచ్చును గాక!
పరబ్రహ్మమే స్వరూపముగా కలిగియున్న నాకు (మట్టికుండలో ‘కుండ’ విభాగమువలె).. భౌతిక దేహము లేదు. ఈ పాంచభౌతిక ప్రపంచమూ లేదు. ఒక వేళ ఉన్నాయనుకుంటే అస్మత్ జ్ఞానానంద ఆత్మయే దేహముగా, జగత్తుగా (నేను అజ్ఞాన దృష్టిని స్వీకరించినప్పుడు) అగుపిస్తోంది.

కుండ పగిలినా మట్టికి ఏమీ కాదు. ఈ “జాగ్రత్-స్వప్న” దేహ జగత్తులకు ఏమి అయినా, పరబ్రహ్మస్వరూపుడనగు నాకు ఏదీ అవదు.

తద్వత్ సత్యమ్ అవిజ్ఞాయ జగత్ పశ్యతి మూఢధీః ॥ 
ఎంతెంత వరకు ఒకడు మూఢ బుద్ధి కలిగి ఉంటాడో,… అంతవరకు ‘జగత్తు’ అనబడునది చూస్తూ ఉంటాడు.
ఎప్పుడైతే నిర్మల - సునిశిత బుద్ధి వికసిస్తుందో అప్పుడు “ఆహాఁ! నా అత్మయే నాకు జగత్తు రూపముగా నా బుద్ధికి కనిపిస్తూ వస్తోంది ! ఆత్మ గురించి తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు జగత్తుగా కనిపిస్తున్నదంతా - ఆత్మ జ్ఞానముచే ఆత్మగా అనిపిస్తోంది…” అని జగత్తును ఆస్వాదిస్తున్నాడు.

ఆత్మను ఎరిగిన తరువాత జగత్తు ఏమౌతోంది? ఎటు వెళ్తంది ? వెలుతురు వచ్చిన తరువాత చీకటి ఎటు వెళ్తోంది! ఇదీ అంతే!

సర్ప రజ్జు భ్రాంతి

పాము వలె ఉన్న త్రాడు

ఒకడు బాటలో వెళ్లుచూ, రహదారికి ప్రక్కగా గల బావిని చూచి “ఇక్కడ నీళ్ళు త్రాగుదాము”… అని అడుగులు నూతివైపు వేయసాగాడు. అది మసక చీకటిగా ఉన్న సమయము. అక్కడ బావి ప్రక్కగా కనబడిన ఏదో ఆకారము చూచి ” అయ్య బాబోయ్! పాము!”… అని ఎగిరి గంతులేశాడు. అయినా నిలబడి “పామేనా! చూద్దాము!”…. అని (శాస్త్ర - గురు పాఠములు అనే) కాంతి ఉపకరణముతో (Battery Llight) కొంచెము నిదానముగా పరిశీలించి చూచాడు. “అబ్బే! ఇది పాము కాదు. త్రాడు మాత్రమే।”… అని గమనించాడు. ఇక భయమేమున్నది? చేతితో ఆ త్రాడును ప్రక్కకు పడవేసి నూతిని సమీపించసాగాడు. ఆ త్రాడునే బొక్కెనకు కట్టి నీరు తోడుకోసాగాడు.

ఆ బాటసారి అటు చూడకముందు అక్కడ ఏమున్నది? త్రాడు ఉన్నది.
బాటసారి “పామేమో?”… అని అనుకున్నప్పుడు పాము వచ్చిందా? లేదు. అక్కడ పాము లేదు. త్రాడే ఉన్నది.
మరి బాటసారికి ‘పాము’ అని ఎందుకు అనిపించింది? తన అనుభూతి జ్ఞాపకములలో ఉన్న పామును గుర్తు చేసుకొని అక్కడ ఆపాదించాడు కాబట్టి!
(He emotionally attributed his past Experiences regarding a snake and its potential bite to the present context).

అతడు అప్పుడు ఏమి చేశాడు? వివేకముతో "అసలు అది ఏమిటి రా?” అని పరిశీలించాడు. (శాస్త్ర వాక్య విచారణ - గురువాక్యములు అనే వెలుగులో) తేరపార చూచాడు.

అప్పుడేమైనది ? “ఇది త్రాడు మాత్రమే! పాము అక్కడ లేనే లేదు”… అని అర్ధం చేసుకున్నాడు.

అంతకు ముందేమో -
యథా రజ్జం పరిత్యజ్య సర్పం గృహ్లాతి వై భ్రమాత్ !
త్రాడుకు సంబంధించిన అనుభవము వదలి, ‘పాము’ కు సంబంధించిన జ్ఞాపకాలన్నీ తెచ్చిపెట్టుకొని, పాముకు సంబంధించి దృష్టిలో భ్రమచేత దర్శించాడు.

మరి ఇప్పుడు? ‘త్రాడు’ అని తెలిసిన తరువాతో? రజ్జు ఖండే పరిజ్ఞాతే సర్ప రూపం న తిష్ఠతి! అది త్రాడు ముక్కగా తెలుసుకోగానే, ఇక ఆ సందర్భములోని సర్పముపు అనుభవం యొక్క ఉనికియే లేకుండా పోయింది.

అట్లాగే …
అజ్ఞానంచ, ఇతి వేదాంతైః తస్మిన్ నష్టే క్వ విశ్వతా?
తెలియబడుచున్న దానిలో ఈ విశ్వమంతా కనిపిస్తోంది. "తెలియబడునది తెలుసుకుంటున్నవాడు (ఆత్మ) ఎట్టివాడు?” అనే విషయము గురించి చెప్పుచున్న ఉపనిషత్ వాణిని విని, గ్రహించిన తరువాత (త్రాడు పట్ల పామువలె) ఈ విశ్వము లేనిదే అగుచున్నది. విశ్వము ఆత్మ స్వరూముగా దర్శించబడి, ఆస్వాదించబడుతోంది. ఒకవేళ విశ్వమనదేది కాసేపు ఉన్నదని అనుకున్నా, అదంతా ఆత్మకు ’ఆత్మగా’ ఆస్వాదించటానికి సాధన (లేదా) క్రీడా వస్తుపు మాత్రమే అగుచున్నది.

ఇదియే వేదాంత సారము! తత్త్వసారము!

విశ్వముగా కనిపించేదంతా ఉన్నది ఆత్మలోనే! ఆత్మయే! ఈ విశ్వమునకు అధిష్ఠానమగు ‘ఆత్మ’ గురించి తెలుకున్న తరువాత ఇక విశ్వము గురించి, 14 లోకాల గురించి క్రొత్తగా తెలుసుకోవలసినది ఏముంటుంది? మట్టి గురించి తెలుసుకుంటే, ఇక ఆయా మట్టి బొమ్మల తల-చేతుల గురించి క్రొత్త విశేషమేమున్నది? ఆత్మ జ్ఞానము చేత “విశ్వము ఆత్మకు వేరుగా లేదు”… అని తెలియవస్తోంది.

అప్పుడు విశ్వమును విశ్వముగా చూస్తే, ఇది శూన్యమే! (మట్టికి వేరుగా కుండను చూడదలచినవారికి… కుండ వేరుగా లేదు.. అని తెలియవచ్చు విధంగా).

ఇక ఈ భౌతిక దేహము గురించియా? ఈ దేహము కూడా విశ్వములోని ఒక వస్తువే కదా ? కనుక విశ్వము ‘లేనిదే - శూన్యమే’ అయినట్లు దేహము కూడా ‘లేనిదే - శూన్యమే’ అగుచున్నది. దేహము - దేహికి ఐహిక మోహము మాత్రమే (Existence of physical body is one of the many illusionary thoughts). “దేహమే లేనిది”… అని అనుకున్నప్పుడు ఇక “ప్రారబ్ధము” అనబడునది ఎక్కడున్నది? “కలలో ఒక ఇల్లు ఎందుకు కనిపించింది?”… అని విచారిస్తే అది ప్రారబ్ధమా? ఆగామియా? సంచితమా? భ్రమలో ఏదో ఒకటి కనిపించాలి కాబట్టి అది కనిపించింది. అట్లాగే ‘ప్రారబ్ధము అనబడునదేదీ లేనేలేదు’.. అని ఆత్మజ్ఞానముచే సుస్పష్టమగుచున్నది.

మరి ప్రారబ్ధము అనుభవించక తప్పదని, అనుభవము చేతనే అది తొలుగుతుందని ఇందాక ఒకసారి అనుకున్నాము కదా ? ఓహో! అదా?
అజ్ఞానజనబోదార్థమ్ “పారబ్ధమ్ ఇతి చ" ఉచ్యతే !
ఆత్మజ్ఞానము సంపాదించటానికి ఇంకా సంసిద్ధుడు కాని అజ్ఞానిని ఆత్మజ్ఞానానికి సిద్ధం చేయు ఉద్దేశ్యముతో - “కష్టములు ఆత్మజ్ఞాన దృష్టిచే లేనివే”… అను సమాధానము (దృశ్యముపై నమ్మకము ఉన్నంతవరకు) అర్ధమవదు, కనుక “ప్రారబ్ధము” అనునది విజ్ఞులచే (అజ్ఞులను సంస్కరించటానికై) కల్పించ చెప్పబడుచున్నది.

“కాలవశం చేత ప్రారబ్ధము తనకు తానే ‘నాస్తి’ రూపము ధరించి తొలగుతుంది. అనుభవముచే అదే పోతుంది”… అని చెప్పుచూ, ఆత్మజ్ఞులచే ఇకప్పుడు స్వస్వరూపమగు ‘ఆత్మ’ గురించి బోధించటం ప్రారంభమగుచున్నది. ఆత్మ గురించి తెలుసుకుంటూ ఉండగా, “మట్టికుండలోని మట్టికి వేరైన కుండ విభాగము” వలె, “త్రాడులో చూచిన పాము” వలె.. ఇక కర్మలే ‘లేనివి’ అగుచున్నాము. జన్మ-కర్మలే లేనప్పుడు ‘ప్రారబ్ధము’ అనునది మాత్రం ఎక్కడున్నది ?

బ్రహ్మము - ప్రణవము - అనుసంధానము

‘ఓం’ అనబడు ప్రణవనాదముతో ’బ్రహ్మము’ ను అనుసంధానముచేస్తూ ఉండగా ’జగత్తు బ్రహ్మమే’ అను అనుభవము (ఆత్మానుభవము) స్వయముగా ఆవిర్భవించగలదు. మేఘాలు తొలగగానే స్వయముగా సూర్య ప్రకాశము ద్యోతకమౌతోంది. ఇక సూర్య ప్రకాశము కొరకై మేఘములు తొలగించిన తరువాత ఏప్రయత్నమూ అవసరము లేదు కదా! జగత్తు సంబంధమైన అజ్ఞానము తొలగితే స్వభావంగానే ఆత్మతత్త్వ జ్ఞానము ప్రకాశించగలదు. కాబట్టి… ఇప్పుడు తొలగవలసినది ఏమిటి? దృశ్య జగత్తు పట్ల దట్టముగా బుద్ధిలోను, మనస్సులోను ఏర్పరచుకొనియున్న భ్రమ మాత్రమే! అట్టి జగత్ భ్రమ అనేక జన్మల దురభ్యాసముల రూపము కదా! అందుచేత తనకు తానుగా తొలగదు.

మరి, అందుకు మార్గము?

యోగోపాసనయే!

యోగ సాధన (అభ్యాసము) కొరకై -
⌘ సిద్ధాసనము (దేహముకు స్థిరమైన, ఏకాగ్రతకు అనుకూలమైన ఆసనము) స్వీకరించబడుగాక!
⌘ వైష్ణవీ ముద్ర (అంతటా నేనైయున్న నాలోని (నేనైన) నేను) అనుసంధానము చేయబడును గాక!
⌘ బాహ్య విషయములు బాహ్యముననే వదలబడును గాక!
శృణుయాత్ దక్షిణే కర్ణే ‘నాదమ్’ అంతర్గతం సదా! ’కుడి చెవు’తో హృదయాంతర్గతము (From the Recess of Heart) నుండి ఎల్లప్పుడూ వినబడు ఓంకార నాదమును ఏకాగ్రతతో వింటూ ఉండటము అభ్యసించబడు గాక!

అటువంటి “అంతర్గతమగు ప్రణవనాదమును ఎల్లప్పుడు వినుచుండటము”… అనే యోగాభ్యాసము ప్రారంభించినప్పుడు ఆ యోగి యొక్క అనుభవాలు కొన్ని వివరించుకుంటున్నాము.

కళ్ళు మూసుకొని ’వినికిడిని’ దేహమునకు ’అంతరము’గా (కుడిచెవిని చూపుడు వ్రేలుతో మూసి ఉంచి, అంతర్-నాదమును వినుట-మొదలైన విధాలుగా) నియమించుచున్నప్పుడు,

మొట్టమొదట :  శ్రూయతే ప్రథమాభ్యాసే ‘నాదో - నానావిధాన్ మహాన్’ … అనేక విధములైన పెద్ద - పెద్ద నాదములు వినబడుచూ ఉంటాయి.

"అట్టి అంతరనాదమును వినటము” అను అభ్యాసము కొంత కొనసాగుచుండగా… క్రమక్రమంగా వర్ధమానః తథా అభ్యాసే శ్రూయతే సూక్ష్మ సూక్ష్మతః…. అనేక పెద్ద పెద్ద నాదములన్నీ అభ్యాస బలముచే వాటికవే తొలగుతూ వస్తాయి. ఇక ఆ యోగాభ్యాసికి బుద్ధితో మాత్రమే గమనించబడునట్టి సూక్ష్మ - సూక్ష్మాతి నాదములు వినబడసాగుతాయి.

వరుస క్రమము = 1.) ఘననాదము 2.) మంద్రనాదము 3.) బుద్ధికి మాత్రమే తెలియవచ్చే నిశ్శబ్ద నాదము.

‘ప్రణవనాద శ్రవణ - ఉపాసన’లో దేహముయొక్క అంతరము నుండి వినబడు శబ్దముపై బుద్ధిని ఏకాగ్రపరచుచున్నప్పుడు -

మొట్టమొదటగా … సముద్ర తరంగములవంటి ఘోష, మబ్బులతో జనించే పిడుగు - మెఱుపుల మోత, భేరీ నినాదము వంటివి వినబడుచూ ఉంటాయి (ఘన నాదము).

మధ్య దశలో (నాద శృతోపాసన కొనసాగుచుండగా) … మద్దెల శబ్దములు, గంటల నాదములు, కాహళ శబ్దములు వంటివి వినబడసాగుతాయి (మంద్ర నాదము).

చివరి - చివరి (పరిపక్వ) దశలో … వేణుగాన నాదము, చిరుమువ్వల కింకిణీ నాదము, తుమ్మెదల ఝుంకారము వంటి సున్నిత - సుతిమెత్తని శబ్దములు వినబడసాగుతాయి. ఆ తరువాత బుద్ధికి మాత్రమే తెలియవచ్చే ఆత్మనాదము సిద్ధించగలదు.

యత్ర కుత్రాపి వా నాదే లగతి ప్రథమం మనః, తత్ర తత్ర స్థిరీభూత్వా, తేన సార్థం విలీయతే !

అంతర హృదయ స్థానము నుండి నాదములు వినుచున్నప్పుడు మొట్టమొదటి దశలో ఘనమైన భేరీ నాదములు, అటు తరువాత మంద్రనాదములు కూడా వినబడుతూ ఉంటాయి కదా ! అయితే, యోగి తన ధ్యాన స్థితిలో మహాభేరీ నాదములను వినిపించుకోకుండా క్రమంగా మంద్ర నాదములను మాత్రమే ఏకాగ్ర బుద్ధిలో వినిపించుకుంటూ రావాలి.

అటువంటి దశలో…

ఈ విధంగా అంతర్గత నాదములను వినటము అనే "యోగము” అభ్యసిస్తూ ఉండగా, మనస్సు తదితరములైన బాహ్య విషయముల వైపు వెళ్ళకుండా - సర్వ అవస్థలలోనూ కూడా - అంతరంగ శబ్దములనే వినుచూ వినోదించటము, ఆనందించటము ప్రారంభించగలదు.

ఈ మనస్సు కోతి వంటిది కదా? యోగి మొట్టమొదట ఏ నాదమును ఏకాగ్రత - అభిరుచిలతో వింటాడో.. మనస్సు ఆ శబ్దములోనే ప్రవేశించి, అక్కడే స్థిరమౌతూ ఉంటుంది. మనస్సు దేనిపై అభినివేశముతో వ్రాలితే, అద్దాని గురించే మరల మరల మననము చేస్తూ ఉండటమనేది అద్దాని యొక్క స్వభావము.

అందుచేత,
విస్మృత్య సకలమ్ బాహ్యమ్, నాదే దుగ్ధ - అంబువత్, మనః ఏకీ భూయ అథ సహసా చిదాకాశే విలీయతే |
ఈ చిత్తము-అను బాలుని లాలిస్తున్నట్లుగా లాలిస్తూనే సకల ప్రాపంచక బాహ్య వృత్తులను విస్మరించే మార్గములో నియమిస్తూ ఉండాలి. నయాన మనస్సును లాలించాలి. బయటకు సంబంధించిన సంభాషణ శబ్దములపట్ల అభినివేశమును తగ్గించుకుంటూ ఉండాలి. అంతరగము నుండి వినబడే నాదమే ప్రీతి అగు విధంగా అద్దానిని తీర్చిదిద్దాలి.

క్రమంగా అంతర్ హృదయ ప్రణవనాదముతో ఆ మనస్సు ‘పాలు-నీరు’ వలె ఏకీభూతమగుచున్నది. అటు తరువాత ఆ ఏకరూపము సంతరించుకున్న నాద - మనస్సులు ’చిదాకాశము’లో విలీనము అగుచున్నాయి.

ఈ మనస్సు (లేక) చిత్తము అనేక దృశ్య సంబంధములైన సందర్భములు, సంఘటనలు, సంబంధములు, బాంధవ్యములు, అనుబంధములు, ఆశ-నిరాశ-దురాశ -పేరాశలు, సంబంధమే లేని అనేక బాహ్య వ్యవహారములతో తలదూర్చటం, పరుష శబ్దములతో కూడిన పరదూషణ, ఏదో ఇంకా పొందాలనే తపనలు, సంపదల గురించి పరులతో పోల్చుకుంటూ పెంపొందించుకొనే ఆవేశ - కావేశాలు … ఇటువంటి అంతేలేని అసంఖ్యాక విషయపరంపలపై వ్రాలుచూ, వాటితో మమేకమగుచున్నది. నిమగ్నమగుచున్నది.

“సంయమి” అగు యోగి మనస్సుయొక్క చేష్టలను గుర్తిస్తున్నాడు. అందుచేత మనస్సును సదాభ్యాసముల సహాయముతో దృశ్య విషయముల పట్ల… ఉదాసీనత, వ్యధారాహిత్యమును నేర్పుచూ రావాలి. అంతర హృదయ నాదమును ఇష్టముతో శ్రవణము చేస్తూ (వినుచూ) ఉండగా ఇది సుసాధ్యం అవుతుంది.

ఎప్పుడైతే ఈ చిత్తము…
- ప్రాపంచక చింతనలన్నీ హృదయములోకి రాకుండా ప్రక్కకు పెట్టుచూ…,
- దృశ్య సంబంధమైన భావావేశములను విడనాడుచూ…,
- స్వధర్మమునకు ప్రతికూలమైన సర్వ సంగతములకు, మనో ఆవేశ-కావేశములకు, సర్వ చేష్టలకు విముఖత్వము కలిగి ఉంటూ…
…..హృదయము నుండి చెవులకు చేరు ప్రణవనాదమును వినుటయందు అభ్యాసశీలమౌతుందో..
అప్పుడిక, అట్టి అనుసంధానము యొక్క ప్రభావము చేత చిత్తము ఆ నాదమునందే విలీనమగుచున్నది.

శ్లో॥ మకరందం పిబత్ భృంగో గంథాన్ న అపేక్షతే యథా,
నాదాసక్తం సదా చిత్తం విషయం నహి కాంక్షతే ॥

పుష్పములపై వ్రాలుతూ మధురమైన తేనెను గ్రోలుచున్న తుమ్మెద ముళ్ళచెట్లపై గల దుర్వాసనతోడిన కుళ్ళుపై వ్రాలి, ఆ వాసనలను పొందాలని కోరుకుంటుందా? లేదు కదా! అట్లాగే, ప్రణవ నాదమును వినుటయందు సంలగ్నమగుచున్న చిత్తము బాహ్యమైన ఇంద్రియ విషయములకు, తత్సంబంధమైన లౌకిక విశేషములకు ఏ మాత్రమూ కూడా ప్రాముఖ్యతను ఇవ్వనే ఇవ్వదు. కోరుకోనే కోరుకోదు.

త్రాచుపాము పాములవాని యొక్క “నాగస్వరము’ వింటూ, అట్టి నాగస్వర సంగీతములో తన్మయమై పడగ విప్పి ఆడుచూ… ఇక తన కోపముతో కూడిన బుసను, (ఎవరిపై కాటు వేయాలా అనే….) తన చపలమును (నాగ స్వర తన్మయము కారణంగా) వదిలి ఉంటుంది కదా!

అదే విధంగా …,
ఈ చిత్తము కూడా అంతర హృదయమునుండి వినబడు ప్రణవనాదమును, అద్దాని “ఘన మంద్ర - సూక్ష్మ" నాదములను వినుచూ, అద్దానియందు తన్మయ మగుచూ, ఇక సహజ లక్షణమైనట్టి చపలత్వమును త్యజించినదై… నాదానందమును ఆస్వాదిస్తూ ఉంటుంది.

ఓ ప్రియ సహజాత్మానంద స్వరూపులగు శ్రోతలారా ! ఇంకా వినండి. పిచ్చి పట్టిన ఏనుగు ఉద్యానవనంలో భీకరంగా ఘీంకరిస్తూ సంచారాలు చేస్తూ ఉంటుంది చూచారా? అట్లాగే ఈ మనస్సు (ఆలోచన) - చిత్తము (ఇష్టము)… అట్టి పిచ్చి పట్టిన ఏనుగు లాగా ఇంద్రియ - విషయ జగత్ సంబంధమైన అనేక సంగతి - సందర్భ - అభిరుచి - ఆవేశ - సాపేక్షిక (Comparativity) విషయాలపై వ్రాలి, వాటితో తన్మయమై ఉండటం అలవాటు చేసుకున్నది. ఇప్పుడు “ఈ విశ్వమును మరచి ఉండాలి”.. అని ఒక్కొక్కప్పుడు తలచి కూడా… ఒక క్షణంలో చ్యుతి (Distraction) పొందుచున్నది. ఆత్మధ్యానమే కుదరటము లేదు. ఏనుగును ఎట్లా అంకుశముతో పొడిచి తన వశంలో ఉంచుకోవాలో తెలిసిన మావటీవాని వలె, ఇప్పుడు ఈ చిత్తమును వశం చేసుకోవాలి. అందుకు అంతరంగ నాదోపాసన గొప్ప అంకుశము. ఈ మనస్సు అనే సారంగమును (లేడిని) పట్టుకొనే గొప్ప వల వంటిది. బుద్ధి అంతరంగనాద శ్రవణముపై ఏకాగ్రవం అవటం - అనునది గొప్ప ఉపాయం.

ప్రాపంచకమైన ‘ఆలోచనలు’ అనే అసంఖ్యాక ఉత్తుంగ తరంగములు గల సముద్రజలమునకు ‘చెలియలికట్టు’ వంటిది… ఈ ప్రణవనాదోపాసన. “బ్రహ్మప్రణవరూపము - జ్యోతిర్మయము” అగు ప్రణవనాదోపాసన - అను శ్రవణ అభ్యాసము తప్పకుండా చిత్త గజమును (లేక) చిత్తము - అను లేడిని తనయొక్క అపరిశుభ్ర విషయ సంచారములనుండి నిరోధించగలదు.

శబ్దమును దాటి ఆత్మతో తన్మయమవటం

మనము ఇప్పటి వరకూ “అంతర హృదయమునుండి వినబడుచున్న ప్రణవనాదముపై బుద్ధిని, చిత్తమును ఏకాగ్రము చేయటము”.. అనే సాధన గురించి చెప్పుకుంటూ వస్తున్నాము కదా ! అయితే.., తావత్ ఆకాశ సంకల్పో యావత్ శబ్దః ప్రవర్తతే | ఎంతెంత వరకు ‘శబ్దము’ ప్రవర్తిస్తూ ఉంటుందో.. అంతంత వరకు సంకల్పాకాశము ప్రవర్తమానమౌతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ చిత్తము (లేక మనస్సు) - (జలములో ప్రవేశించిన ఉప్పు బొమ్మవలె) లయము పొందుచున్నదో… ఆ లయ స్థానమే “విష్ణు పదము” లేక “పరమ పదము”. అనగా, సరి అయిన సమయములో (At appropriate time) “అంతర నాద శ్రవణోపాసన” ను అధిగమించిన ఆత్మ స్థానమును ఆశ్రయించాలి.

మనస్సు లయించగానే ఆత్మపదము బుద్ధికి అనుభవము కాగలదు. ఆత్మను భావన చేస్తూ ఉండగా, సందర్శిస్తూ ఉండగా, మనస్సు స్వయముగా "నిశ్శబ్దము - తత్ పరం బ్రహ్మ - పరమాత్మ యందు లయించుచున్నది.

నాదము ఉన్నంతవరకు మనస్సు ఉంటుంది. నాదము శాంతించు స్థానములో మనస్సు కూడా లయిస్తుంది. భావనారూపమగు మనస్సు మౌనం వహించగా, అప్పుడు “మనోన్మనీ” (మనో - ఉన్మనీ) అని పిలువబడు “మనోరహిత - ఆత్మానుభవ బుద్ధి స్థితి’ (లేక) ‘ఆత్మా హమ్ ఆనంద స్థితి” స్వయముగా శేషించి ఉన్నదగుచున్నది.

సశబ్దశ్చ అక్షరే లీనో, నిశ్శబ్దం పరమం పదమ్ |
శబ్దతత్త్వమంతా అక్షరము (మార్పు చేర్పులు లేనట్టి స్వస్వరూప తత్త్వము) నందు లీనమగుచున్నది. అప్పుడిక ‘నిశ్శబ్దము’ అను అలౌకిక ఆత్మానుబవ స్థితి మాత్రమే శేషించుచున్నది. అయితే అది ఎట్లా లభించగలదని అడిగితే ..,
“సదా నాద అనుసంధానాత్ సంక్షిణే వాసనాతు యా”
సదా ప్రణవనాదములో ఈ మనస్సు అనుసంధానమగుచూ ఉండగా, క్రమంగా వాసనలు (Tendencies regarding outside world scenary) స్వయముగా క్షీణిస్తున్నాయి. అప్పుడు ఆత్మయే సహజమైన స్వాభావసిద్ధమైన అనుభవము అగుచున్నది.

ఎప్పుడైతే ‘మనస్సు’ అనే వాయువు సర్వ సంశయములు త్యజించి నిరంజనము, నిర్మలము అగు ’బ్రహ్మము’నందు విలీనము అవటం జరుగుతుందో..,

శ్లో ॥ నిరంజనే విలీయేతే మనో వాయూ, న సంశయః,
నాదకోటి సహస్రాణి - బిందుకోటి శతానిచ
సర్వే తత్ర లయం యాంతి |

అప్పుడిక కోటి సహస్రనాదములు, బిందుకోటి సహస్రములు… ఇవన్నీ కూడా మనస్సుతోబాటే ఆ బ్రహ్మమునందు విలీనమగుచున్నాయి. ఈ అనేకముగా కనిపిస్తూ ఉన్నదంతా వాస్తవానికి “ఏకము-అఖండము అగు బ్రహ్మమే”… అని అనుకోవటం ప్రవృద్ధమౌతుంది.

అనుకుంటూ ఉండగా ‘అనిపించటము’ ప్రారంభమౌతుంది. సర్వ భేదములు బ్రహ్మము రూపము చెంది భేదత్వమంతా కోల్పోవుచున్నాయి.

ఆ ప్రణవ నాదోపాసకుని దృష్టిలో ‘తాను-తదితరము’ అంతా కూడా ఏకరూప బ్రహ్మమవటము బుద్ధికి సుస్పష్టము, నిర్దుష్టము అగుచున్నది.

అట్టివాడు -
➤ సర్వ అవస్థల నుండి ‘విముక్తుడు’ అగుచున్నాడు.
➤ సర్వ చింతనలను మొదలంటా వదలి వేయుచున్నాడు.
➤ గాంభీర్యముగా బ్రహ్మత్వము స్వయముగా పుణికిపుచ్చుకొనుచున్నాడు. సర్వము తానై స్వప్రకాశమానుడగుచున్నాడు.

అంతరహృదయమునుండి మంద్రముగా వినబడు ఓంకార నాదమును విను అభ్యాసము చేయు నాదయోగి, మొట్టమొదట ఇంద్రియ బాహ్య (unrelated, unnecessary) అసంగతములను, ఆ తరువాత సంగత (related, unnecessary) విషయములను, అటుపై క్రమంగా ఇంద్రియములకు అంతర్గ చతుష్ఠయమైనట్టి మనో - బుద్ధి - చిత్త - అహంకారముల సంబంధమైన ప్రాపంచక విషయములను… సాక్షిత్వముచే దాటి వేస్తున్నాడు. కేవల సాక్షిత్వమును పుణికి పుచ్చుకొనుచున్నాడు.

→ ఇవి నాకు చెందినవిగావు….,
→ వీటికి నేను చెందినవాడిని గాను…
అను అతీత - అప్రమేయ - మౌన - దృష్టితో దృశ్య-దేహ-ఇంద్రియ-మనో-బుద్ధి-చిత్త-అహంకారములను చూస్తూ ఉంటాడు.

ఇవన్నీ …. ఎక్కడో! కల్పనయందు!  నేనో …. మరెక్కడో! కేవలీ స్వరూపమునందు - అను అవగాహన - బుద్ధి వీడకుండా చూస్తూ ఉంటాడు.

మృతవత్ తిష్ఠతే యోగీ, స ముక్తో! న అత్ర సంశయః॥

"ఎప్పుడో, ఎప్పుడని తెలియని క్షణంలో ఈ భౌతిక దేహపతనము ఈ జీవునిపట్ల అనివార్యము కదా! ఆ మరుక్షణం? ఈ దేహానికి సంబంధించిన సంపదలు, సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు సుఖాలు, దుఃఖాలు మొదలైన అనేక ప్రపంచ సంబంధమైన విషయాలు ఆ మృతుని వెంట వెళ్లుచున్నాయా? లేదే? అందుచేత నేను వాటినన్నిటినీ ఒక మృతునివలె ఇప్పుడే వదలి, సంబంధమే లేనివానివలె ఎందుకుండకూడదు? అవన్నీ నాకు సంబంధించనివిగాను, నేను వాటికి సంబంధించనివానినిగాను దర్శిస్తూ ఉంటాను” …. అను భావన, కలిగి హృదయ ప్రణవనాదోపాసనపై బుద్ధిని నిలుపుకొని సాధనకు ఉపక్రమిస్తూ, నిర్వర్తిస్తూ ఉన్న యోగి ఇక ముక్తుడే ! ఇందులో సందేహమే లేదు.

ఈ విధంగా ‘మృతవత్’.. భావనతో (ఈ భౌతికదేహమును మరణించిన వస్తువు అను భావనతో) ప్రణవనాదోపాసనను నిర్వర్తించు యోగి క్రమంగా ‘మనస్సు’ యొక్క స్థితిని దాటవేసి, మనస్సును కూడా తదితర బాహ్య వస్తువులవలె చూడగలడు. అట్టి మనో అతీత స్థితిని ‘ఉన్మనీఅవస్థ’… అని యోగ శాస్త్రజ్ఞులు పిలుస్తున్నారు. అది మనస్సు ఆత్మయందు ఆత్మభావనయందు లయమైన స్థితి.

అట్టి ఉన్మనీ అవస్థలో అంతర హృదయ ప్రణవనాదోపసనచే ప్రవేశించిన యోగి…..
- కాష్ఠవత్ జ్ఞాయతే దేహమ్ …. ఈ దేహమును ఒక జడమైన ’కట్టె’ను చూస్తున్న రీతిగా చూస్తూ ఉండగలడు.
- న జానాతి శీతోష్ణమ్ … అతడు శీత ఉష్ణ దేహతాపములను కూడా సాక్షివలె, “తనకు సంబంధించని-కాష్ఠదేహ సంబంధించిన” విషయములవలె దర్శిస్తూ ఉంటాడు. దేహబాధలకు కూడా సాక్షిగా అయి, వాటికి అల్లంత దూరమైన విషయాలుగా చూస్తూ ఉంటాడు.
- న దుఃఖం -న సుఖం … “నాకు సుఖము లేదు. దుఃఖము లేదు. నేను ఆ రెండింటికీ సంబంధించనివాడని”… అను ఉత్తమ బుద్ధిని కలిగి ఉంటాడు. అతని దృష్టిలో అవన్నీ పెద్దగా పట్టించుకోవాలసినవే కావు. ’అందరికీ ఉండేవే! పైగా అవి దేహ సంబంధమైనవి. మరి నేనో! ఆత్మ స్వరూపుడను కదా! నాకేమి సంబంధము?’ - అను అవగాహనతో పరాక్రమ సమన్వితుడై ఉంటాడు.
- న మానమ్, న అవమానమ్ … జగత్తులో అతడు మానవమానములకు పట్టుబడక, వాటిచే స్పృశించబడక ఉంటాడు.

అతడి దృష్టిలో జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు కూడా “లేనివే” అగుచున్నాయి. అవస్థాత్రయమను చిత్త సంబంధమైనవిగా మాత్రమే చూస్తూ, తాను ఆ చిత్తమును ‘చిత్’ స్వరూపమగు ఆత్మయందు లయింపజేసివేస్తాడు. “మనో - చిత్తములకు కనిపించేదంతా ఆత్మస్వరూపమే” అను అవగాహనను “చిత్తలయస్థితి” అని అంటారు. అట్టి స్థితి ’సమాధి’ అని కూడా పిలువబడుచున్నది. 

“జగత్తుగా కనిపించేదంతా ఆత్మానంద స్వరూపమే ! బ్రహ్మమే”.. అను భావన - అవగాహనలచే ఆ యోగి “సమాధి నిష్ఠుడు” అగుచున్నాడు.

అతని చిత్తము సర్వదా (అన్ని స్థితులలోను)… దేహము వస్తున్నప్పుడు ఉంటున్నప్పుడు - పోతున్నప్పుడు కూడా త్రి అవస్థలందు ఆత్మ భావన వీడనివాడై ఉంటున్నాడు.

అందుచేత,
“న చిత్తం యోగినః సదా”

అతడు చిత్తరహితుడుగా సమాధి స్థితుడుగా చెప్పబడుచున్నాడు. “చిత్తమే ఆతని పట్ల లేదు” అని అనబడుతోంది.

ఇక ఈ విధంగా ఆతడు జాగ్రత్ - స్వప్న అవస్థల నుండి విడివడినవాడై, వాటిచే తాను మార్పు - చేర్పులు పొందనట్టి అవగాహనతో, ఆత్మ నిష్ఠను వదలక ఉంటున్నాడు. అట్టివాడు “స్వరూపావస్థ స్థితుడు"… అని చెప్పబడుచున్నాడు.

స్వరూపావస్థ తామియాత్ !
స్వ స్వరూపము - సహజము అగు “పరబ్రహ్మరూపావస్థ” యందు సంస్థితుడగుచున్నాడు.

ఇక ఆతడు “బ్రహ్మతారాంతరాంతరుడు” (స్వస్వరూప అంతరాంతర స్వరూపుడు…,) అయి ఉంటున్నాడు.

ఎప్పుడైతే…
✤ ఈ దృశ్యము ఎదురుగా ఉన్నప్పటికీ స్థిరమైన దృష్టిచే దృశ్యమంతా ఆత్మగానే దర్శిస్తూ.. స్వాత్మకు వేరైన దృశ్యమనునది లేనివాడై ఉంటాడో…
✤ ప్రాణచలనము కూడా ఆత్మయందు, ఆత్మగా సంస్థితమై, అప్రయత్నముగానే ఆత్మగా అనుభూతమౌతుందో.. (స్థిరప్రాణమే చంచలముగా కూడా… అని తెలియవస్తుందో…),
✤ చిత్తము ఏ అవలంబనము (ప్రాణోపాసన - ఓంకార నాదోపాసన మొదలైన సాధనల ఆయా - ప్రయత్నములు లేకుండానే) - స్థిరత్వము సంతరించుకుంటుందో
- అతడే బ్రహ్మతారాంతరాంతరుడు.

సహజమగు ఆత్మయే స్వరూపముగా గల ఓ ప్రియ జనులారా ! మనమంతా కూడా అంతరంగ ప్రణవ ఓంకార శబ్దాపాసనము ఆశ్రయించి -

       దృశ్యమును నాదమునందు
       నాదమును ప్రాణమునందు
       ప్రాణమును ఆత్మయందు
లయం చేస్తూ…

దృశ్యమును మృతవత్ - గతించి పోయిన దానివలె దర్శిస్తూ ఉండెదము గాక! శబ్దమును మనస్సునూ దాటి, మనోన్మనీ స్థానము చేరి సమాధినిష్ఠులమై దేహమును ఒక జడకట్టుకొయ్యవలె దర్శిస్తూ సర్వ ద్వంద్వములకు, త్రి - అవస్థలకు సాక్షిస్వరూపులమై, జగత్ … దృశ్యము ఉండి కూడా - లేనివారలమై ఉండెదము గాక! చిత్తమును - ప్రాణమును స్థిరపరచి సమాధి సంస్థితులై  “బ్రహ్మమే నేను”, “సర్వము నేనే” అను స్థానమును ఆస్వాదించెదము గాక!

ఇతి
🙏 నాదబిందు ఉపనిషత్ 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥