[[@YHRK]] [[@Spiritual]]

Nirālamba Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


శుక్ల యజుర్వేదాంతర్గత

8     నిరాలంబోపనిషత్

(అశఙ్క్య మునీశ్వర ప్రవచనములు)

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో॥ యత్ర ఆలంబ ఆలంబి భావో విద్యతే న కదాచన
జ్ఞ విజ్ఞః సమ్యక్ జ్ఞాలంబం నిరాలంబం హరిం భజే ॥

ఏ స్థానమందైతే ఆలంబన (ఆధారపడి ఉండి పోవటం) అను భావాలయొక్క ఆలంబనయే ఉండదో, (నేను మరొక వస్తువుపై ఆధారపడి ఉన్నాను - అను ఆలంబనా భావము రహితమౌతుందో), జ్ఞాన విజ్ఞాన పూర్వకమగు సమ్యక్ జ్ఞానము మాత్రమే ఆలంబనమై శేషిస్తుందో… అట్టి నిరాలంబమగు తత్త్వమును వివరించుకుంటున్నాము. సర్వమునకు ఆశ్రయమగుచూనే, తాను మాత్రం దేనిచేతా ఆశ్రయము-ఆలంబనము కలుగు అవసరమే ఉండనట్టివాడు, సర్వమునకు అప్రయమేయుడు, నిత్యోదిత జ్యోతి స్వరూపుడు అగు శ్రీహరికి నమస్కరిస్తున్నాము. ఆయనయే ప్రత్యక్ష జగత్ జ్యోతి స్వరూపుడు. సర్వ చీకట్లు తొలగించు దీపమును చూడటానికి మరొక దీపపు వెలుగుతో ఏమి పని? అటువంటి స్వయం జ్యోతి - ఆత్మ స్వరూపుడగు శ్రీహరిని శరణు వేడుచున్నాము. మనమంతా అట్టి ఆత్మజ్యోతి స్వరూపులం!


1.) హరిః ఓం
ఓం నమః శివాయ
గురవే సచ్చిదానంద మూర్తయే।
నిష్ప్రపంచాయ శాన్తాయ
నిరాలంబాయ తేజసే
నిరాలంబం సమాశ్రిత్య
సాలంబం విజహాతి యః,
స సన్న్యాసీ చ, యోగీ చ
“కైవల్యం పదమ్”  అశ్నుతే
ఏషామ్ అజ్ఞాన జన్తూనాం
సమస్త అరిష్ట శాంతయే,
యత్ యత్ బోధవ్యం అఖిలమ్
తత్ ఆశంక్య బ్రవీమి అహమ్।

ఓంకార స్వరూపుడగు శ్రీహరికి నమస్కరిస్తూ…!

“ఓం” అను అక్షరమునకు అర్థము అయి ఉన్నవారు, లోక గురువు, సాక్షాత్ సత్-చిత్-ఆనందములుగా మూర్తీభవించుచున్నవారు, ఈ పాంచభౌతిక
ప్రపంచమునకు, సర్వసంఘటనలకు ఆవల ఉన్నవారు, కేవలసాక్షి, పరమశాంత స్వరూపులు, తేజో రూపులు, పంచభూతముల - అంతరంగ చతుష్టయముల వంటి ఏ ఆలంబముతో అగత్యము - (అవసరము) లేనివారు అగు శివ భగవానునికి నమస్కరిస్తున్నాము.

ఈ జీవుడు దేహ-మనో-బుద్ధి-చిత్తములకు బద్ధుడై ఉపాధి పరంపరలు పొందడం జరుగుతోంది. ఇదియే సంసారము, సంస్కృతి కూడా! ఇదంతా కల్పన!

ఎవ్వరైతే అన్ని ఆలంబనములను (All Dependence) అధిగమించి, నిరాలంబమగు పరమ శివ తత్త్వమును ఆశ్రయిస్తారో, వారే యోగి, సన్న్యాసి కూడా! వారు కైవల్యపదము (లేక) కేవలీ స్థానమును సముపార్జించుకుంటున్నారు.

ఏది తెలుసుకొనుటచే జీవులపట్ల అజ్ఞానము తొలగినదై, వారికి సమస్త అరిష్టముల నుండి ముక్తి లభించగలదో.., సర్వ సందేహములు తొలగగలవో-అట్టి ఋషి వాక్యముల బోధసారము చెప్పుకుంటున్నాము. ఆశంక్య ముని యొక్క మహత్ వాక్యములను శ్రవణం చేస్తున్నాము. వారి ప్రవచనములను విశదీకరించుకుంటున్నాము.

శిష్య ప్రశ్నలు
2.) కిమ్ బ్రహ్మ?
క ఈశ్వరః?
కో జీవః?
కా ప్రకృతిః?
కః పరమాత్మా?
కో బ్రహ్మా?
కో విష్ణుః?
కో రుద్రః?
క ఇన్ద్రః?
కః శమనః?
కః సూర్యః?
కః చంద్రః?
కే సురాః?
కే అసురాః?
కే పిశాచాః?
కే మనుష్యాః?
కా స్త్రీయః?
కే పశు ఆదయః?
కిం స్థావరం?
కే బ్రాహ్మణాదయః?
కా జాతిః?
కిం కర్మ?
కిం అకర్మ?
కిమ్ జ్ఞానం?
కిమ్ అజ్ఞానం?
కిమ్ సుఖమ్?
కిమ్ దుఃఖమ్?
కః స్వర్గః?
కో నరకః?
కో బన్ధః?
కో మోక్షః?
క ఉపాస్యః?
కః శిష్యః?
కో విద్వాన్?
కో మూఢః?
కిమ్ ఆసురం?
కిం తపః?
కిం పరమంపదమ్?
కిం గ్రాహ్యం?
కిం అగ్రాహ్యం?
కః సన్న్యాసీ?
(కిం బ్రహ్మేతి?)

ఇతి ఆశంక్యా ఆహ॥

ఈ జీవుడు సంసారమునుండి విముక్తికై ఏ ప్రశ్నలు కలిగి ఉండి (అప్పుడిక సమాధానము పొందాలో) అవి ముందుగా ఆశంక్యముని అడుగుచున్నారు. (ప్రశ్న లేని బ్రతుకు ప్రశార్థకంబురా!).

“బ్రహ్మము” అనగా ఏమి?
“ఈశ్వరుడు” అనగా ఎవరు?
ఈ జీవుడు ఎవరు?
ప్రకృతి అనగా ఏదై ఉన్నది?
పరమాత్మ అనగా ఎవ్వరు?
బ్రహ్మ-విష్ణు-రుద్రులు ఎవ్వరై ఉన్నారు?
ఇంద్రుడు ఎవ్వరు?
యముడు - సూర్యుడు - చంద్రుడు ఎవ్వరు?
సురులు అనగా ఎవ్వరు? అసురులు ఎవ్వరు?
పిశాచులు ఎవ్వరు? మనుష్యులు ఎవ్వరు?
స్త్రీలు ఎవ్వరు?
పశువులు మొదలైనవి ఎవరు?
స్థావరము ఏది?
బ్రాహ్మణులు అనగా ఎవ్వరు?
జాతి అనగా ఏది, ఎక్కడిది? ఎట్లా ఏర్పడినదగుచున్నది?
కర్మ అనగా ఏమి? అకర్మ అనగా ఏమి?
జ్ఞానము అనగా ఏమి? అజ్ఞానము అనగా?
ఏది సుఖము? ఏది దుఃఖము?
ఏది స్వర్గము? ఏది నరకము?
బంధము ఏది? మోక్షము అనగా?
ఉపాసించవలసినది ఎవరిని? (ఉపాస్య గురువెవ్వరు?)
ఎవరు శిష్యుడు?
‘విద్వాంసుడు’ అని ఎవ్వరిని అంటాము?
‘మూఢుడు’ అని ఎవరిని అంటాము?
‘అసురత్వము’ అనగా ఏమి?
తపస్సు అనగా ఏమిటి?
పరమ పదము అని దేనిని అంటాము? ఎట్టి పదము?
గ్రహించవలసినది ఏది? (What is to be taken?)
గ్రహించ కూడనిది ఏది? (What is to be left off?)
‘సన్న్యాసి’ అనగా శబ్దార్థము ఏమై ఉన్నది?

ఓ ఆశంక్య భగవన్! మహానుభావా! ఇవన్నీ బ్రహ్మము గురించిన విజ్ఞానము దృష్ట్యా చెప్పండి!
ఈ ప్రశ్నలకు గురువు వద్ద సమాధానము పొందటమే అధ్యాత్మ శాస్త్ర పఠణము.

ఆశంక్యముని చెప్పుచున్నారు.

3.) సహెూ వాచ? (గురు సమాధానం)
బ్రహ్మమ్ ఇతి చ
మహత్ - అహంకార - పృథివీ -
అపః - తేజో - వాయుః - ఆకాశాత్
ఆత్మకత్వేన బృహత్ రూపేణ
అణ్డకోశేన, కర్మ జ్ఞానార్థ
రూపతయా భాసమానమ్।
- అద్వితీయమ్।
- అఖిల ఉపాధి వినిర్ముక్తమ్,
- తత్ సకల శక్తి - ఉపబృంహితం
- అనాద్యంతమ్|
- శుద్ధం, శివం, శాంతం, నిర్గుణం
ఇత్యాది వాచ్యం!
అనిర్వాచ్యం!
చైతన్యం బ్రహ్మ॥

బ్రహ్మము అనగా …

దృష్టులు (1) లౌకిక దృష్టి (2) జ్ఞాన దృష్టి అను రెండు విధములు.
వెలుగు వేరు - వెలుగులో కనబడునవి వేరు కదా!
ఆత్మ అనే వెలుగులో కనిపిస్తున్నవియే మహత్-అహంకార జీవాత్మాదులు.


మహత్తు = (సమష్టి అహంకారములు తనవైనట్టిది). అహంకారము =’నేను నాది’
రూపమైనది.
జీవాత్మ = వ్యష్టిగతమగు ‘నేను’.
పంచమహా భూతములు = పృథివి, ద్రవము, తేజస్సు (అగ్ని), వాయువు, ఆకాశము.
ఇవన్నీ ఒకచోటికి వచ్చి ఈ బృహత్ బ్రహ్మాండ రూపముగా కనిపిస్తున్నాయి. కర్మ-జ్ఞానముల అర్థ రూపంగా ఇవన్నీ ప్రదర్శనమగుచూ ఉన్నాయి.
అయితే, ఆత్మయొక్క తేజస్సుచే అవన్నీ సాకారమై కనిపిస్తున్నాయి. ఘనీభూతానుభవంగా ప్రాప్తిస్తున్నాయి.

ఇక బ్రహ్మము గురించి -
అద్వితీయం :  దేనికి వేరుగా మరొకటి ఏదీ లేదో, అదియే బ్రహ్మము.
ఏది ఉపాధులకు ఏమాత్రము బద్ధము కాదో, సర్వ ఉపాధులకు సంబంధించక వినిర్ముక్తమై ఉన్నదో,
- శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ-జీవాత్మ-ఈశ్వరాత్మలు మొదలగునవి సర్వశక్తి ప్రదర్శనలు తనవే అయి ఉండుటచే సర్వశక్తివంతమో…,
- ‘ఇది మొదలు - ఇది చివర’ - అనునది ఎద్దానికి లేదో, ఆద్యంతరహితమో..,
- ఎద్దానిని జీవాత్మ - ప్రకృతి - అహంకారములు మొదలైనవి ఏమాత్రము స్పృశించవో, పరమ శుద్ధమో,
- సర్వుల ఆత్మయే అయిఉండి, సర్వదా శుభప్రదమై యున్నదో, శివమో,
- పరమ శాంత స్వరూపమో…,
అదియే బ్రహ్మముగా చెప్పబడుతోంది.

ఇవన్నీ చెప్పుచూనే, శాస్త్రములు, “అది చెప్పనలవి కాదు. అనిర్వచనీయము" అని కూడా చెప్పి ఊరుకుంటున్నాయి. సర్వమును చేతన పరచుటచేత చైతన్యము అని, ప్రతి దేహమునందు సర్వోత్కృష్టమై వెలుగొందుచున్నది కాబట్టి బ్రహ్మము అని,“చైతన్య బ్రహ్మము” - అని అనబడుతోంది.

4.) ఈశ్వర ఇతి చ
బ్రహ్మైవ స్వశక్తి: ప్రకృత్యా
అభిధేయమ్ ఆశ్రిత్య…,
లోకాన్ సృష్ట్వా,
ప్రవిశ్యా, అంతర్యామిత్వేన
బ్రహ్మాదీనాం బుద్దీంద్రియ నియంతృత్వాత్ ఈశ్వరః॥
జీవ ఇతి చ
బ్రహ్మ - విష్ణు - ఈశాన - ఇంద్రాదీనాం
నామరూప ద్వారా
“స్థూలో9 హమ్”
ఇతి అథ్యాసవశాత్ జీవః|
బహుజీవః|
సోహమ్ ఏకోపి
దేహారంభక భేదవశాత్
బహుజీవః|

ఈశ్వరుడు అనగా …

బ్రహ్మము స్వశక్తియుతమగు స్వభావముచే వృత్తిని ఆశ్రయించుచున్నది. స్వకీయ శక్తి రూపముగు ప్రకృతిని కల్పించుకొనుచున్నది. ఆ ప్రకృతి కల్పనలోంచి
లోకాలను సృష్టించుకొనుచున్నది. తాను సృష్టించుకొన్న లోకాలలో ప్రవేశించుచూ, ఆ లోకములకు తానే అంతర్యామి కూడా అయి ఉంటోంది. బుద్ధి-ఇంద్రియములను నియమించుకొనుచున్నది. అట్టి అంతర్యామిత్వము, బహిర్యామిత్వము బుద్ధి-తమును కలిపి ‘ఈశ్వరుడు’ అని అంటారు. సర్వ నియామకుడు ఈశ్వరుడు.

జీవుడు :  “స్థూల దేహమే నేను” - అను స్థూలదేహాభిమాని. అట్టి స్థూల దేహాభిమానం చేత సృష్టి - స్థితి - లయ - ఇంద్రియ తత్యాలను, తనకు వేరైన బ్రహ్మ - విష్ణు - ఈశ్వర - ఇంద్ర మొదలైన నామ రూపాత్మక దేవతలుగా భావిస్తూ, అధ్యాస-పరిమిత దృష్టికి వశమై ఉన్నట్టి వాడు.
(నేను సాకారుడను. నామ-రూపములకు చెందినవాడను. ఇవి నాకు చెందినవి. ఇవన్నీ నాకు వేరై ఉన్నవి” - అను అధ్యాసకు, ఆయా భౌతిక దృష్టులకు బద్ధుడు, పరిమితుడు అయి ఉంటున్నవాడు.)

బహుజీవః :  అనేక జీవజాతులలో జన్మించుచూ, ఎప్పటికప్పుడు తాను ఆ జాతివాడని అనుకోవటం.
వాస్తవానికి జీవుడు - పరమాత్మ కూడా ఏకము - అఖండమే అయినప్పటికీ, దేహముతో కల్పించు కొనుచున్న అనేకత్వరూపమైన సంబంధముచేత స్వీయకలన యగు బహు జీవుల సంబంధ కల్పనావ్యవహారమంతా అనుభవిస్తూ, సమిష్ఠి జీవ స్వరూపుడు (లేక) సమిష్ఠి జీవాభిమాని (బహుజీవః) అగుచున్నాడు. (మా జాతి, మా ప్రదేశము మొదలగునవి ఇటువంటివి.)

5.) ప్రకృతిః ఇతి చ
బ్రహ్మణః సకాశాత్
నానా విచిత్ర జగత్-నిర్మాణ
సామర్థ్యక బుద్ధిరూప
బ్రహ్మ శక్తిరేవ ప్రకృతిః॥

ప్రకృతి అనగా …

బ్రహ్మము (లేక పరతత్వ స్వరూపము)నకు బుద్ధి Intellectual) రూపమగు మహత్తర శక్తి ఉన్నది. అట్టి బుద్ధి రూప బ్రహ్మశక్తి - ఊహ - కల్పనలచే, తన భావనా చైతన్యముచే (విషయ రూపములే అయి ఉన్న జగత్తుల నిర్మాణ సామర్థ్యము కలిగియున్నది. అట్టి బ్రహ్మము యొక్క బుద్ధి సంబంధమైన స్వకీయ “జగత్ కల్పనా సామర్థ్యము"ను ప్రకృతి అని పిలుస్తున్నారు.

పరమాత్మా - ఇతి చ
దేహాదేః పరతత్వాత్
బ్రహ్మైవ పరమాత్మా!
స బ్రహ్మః| స విష్ణుః| స రుద్రః|
స ఇంద్రః| స శమనః| స సూర్యః|
స చంద్రః| తే సురాః| తే అసురాః॥
తే పిశాచాః। తే మనుష్యాః|
సా స్త్రియః| తే పశు ఆదయః
తత్ స్థావరం|
తే బ్రాహ్మణాదయః|
సర్వం ఖలు ఇదం బ్రహ్మ
న ఇహ నానాస్తి కించన |
(నేహ నానాస్తి కించన) ||

పరమాత్మ అనగా …

ఈ దేహ - దేహాంతరముల ప్రారంభమునకు మునుముందే, వాటన్నిటికీ ఉత్పత్తి స్థానముగా ఏర్పడినదై ఉన్నదేది? ఏది ఈ దేహాదులకు ఆవల వాటికి పరమై, వాటికి సంబంధించనిదై ఉన్నది? - ఏది బ్రహ్మము అని ప్రతి జీవునిలోని పరాకాష్ఠ ఆత్యంతికమైనదిగా వేదార్థములచే అభివర్ణించబడుతోంది? అదియే పరమాత్మ!

అట్టి వాస్తవము - సహజము - మార్పు చేర్పులకు అందనిది అగు పరమాత్మయే….
➤ సృష్టికర్తయగు బ్రహ్మదేవుడుగా, (Creating visualisation)
➤ స్థితి కారకుడగు విష్ణువుగా, (Maintaining Visualisation)
➤ ఈ సృష్టికి లయకారుడగు రుద్రుడుగా, (Withdrawing Visualisation)
➤ ఇంద్రియాధిపతియగు ఇంద్రుడుగా, (Organising the seeing, hearing etc.,)
➤ మృత్యు (మార్పు) దేవతాధినేతయగు యముడుగా, (Change Factor)
➤ మనో స్వరూపుడు - ఓషధ ప్రదాత అగు చంద్రునిగా.., (Thought Factor)
➤ దేహములతో సహా ప్రకృతిలోని సర్వ తత్త్వములను తమ దివ్య ప్రజ్ఞలతో నడిపించే దేవతలు (లేక) సురులుగా…, సాత్వికులుగా…, (Divine Intellectuals)
➤ సృష్టికి, జీవులకు బాధలు కలిగించే అసురులుగా…, (Bothering Factors)
➤ భౌతిక దేహం లేకుండా పోయినా కూడా, కేవలం మనో దేహము - కారణ దేహములతో దృశ్యమువెంటనంటి ఉండు స్వబావము గల పిశాచములుగా, (Teasing Factors)
➤ దేహబద్ధులవలె కనిపించే మనుష్యులుగా, అనేక దేహసమూహములుగా,
➤ జీవుల దేహములను తమ గర్భమున ధరించి వారికి దేహ నిర్మాణ వ్యవహారములో సహకరించు స్త్రీలుగా, దేహ నిర్మాణ ప్రజ్ఞలగు ప్రకృతి శక్తులుగా…,
➤ పశువులు, స్థావరములు, బ్రహ్మ జ్ఞానులగు బ్రాహ్మణులుగా
… బ్రహ్మమే అగుచున్నది.

అంతా, ఇదంతా బ్రహ్మమే! ఏకమగు బ్రహ్మమే అయి ఉన్నది! ఇక్కడ అనేకము అనునది మొదలే లేదు. ఎప్పుడూ లేదు. బ్రహ్మము సర్వదా యథాతథము.

6.) జాతిః ఇతి చ
న చర్మణో, న రక్తస్య,
న మాంసస్య, న చ అస్థినః
న జాతిః ఆత్మనో!
జాతిః వ్యవహార ప్రకల్పితా|

జాతి అనగా …

చర్మమునకు “జాతి” అనునదియే లేదు. మరి రక్త - మాంసములకు? లేనే లేదు. బొమికలకు జాతి భేదమున్నదా? ఊహూ! లేదు. “ఆత్మ” అఖండము. అద్దానికి జాతి భేదమనునదే లేదు.
మరి? “జాతి” అనునది ఎక్కడ నుండి వచ్చింది? స్వతఃగా లేదు కానీ, లోక వ్యవహారము కొరకై కల్పించబడినది మాత్రమే! వాస్తవానికి అట్టి భేదమే వస్తుతః లేదు. (10 మంది ఒకేచోట గాఢనిద్ర పోతూ ఉంటే వారికి భేదానుభవమేమున్నది?)

‘కర్మ’ - ఇతి చ
క్రియమాణ ఇంద్రియైః కర్మాణి
“అహమ్ కరోమి” - ఇతి అధ్యాత్మ నిష్ఠతయా
కృతం కర్మైవ కర్మ॥

‘అకర్మ’ - ఇతి చ
కర్తృత్వ-భోక్తృత్వా ఆది అహంకారతయా
బంధరూపం, జన్మాది కారణం…, (ఇతి భావయిత్వా)
నిత్య నైమిత్తిక యాగ వ్రత
తపో దానాదిషు
అఫలాభిసస్ధానం -
యత్, తత్ అకర్మ

కర్మ అనగా …

సృష్టిశక్తిచే, క్రియాసమన్వితమై నిర్మించబడిన ఇంద్రియములు నిర్వర్తించు → చూడటము - వినడము- ఆఘ్రూణించటము - స్పర్శించటము -
రుచి చూడటం… ఇవన్నీ “ నేనే చేస్తున్నాను”… అనే జీవునియొక్క ఆధ్యాత్మ నిష్ఠచే నిర్వర్తించబడుచూ ఉన్నది. నేను ’కర్తను’ అనుకుని చేయునది - కర్మ.

అకర్మ అనగా …

నేనే చేస్తున్నాను-నేనే అనుభవించుచున్నాను… అను కర్తృత్వ- భోక్తృత్వ అహంకారములు హృదయములో ఉన్నంత వరకు అది జన్మ తదితర కర్మ పరంపరలకు మూల కారణముగా అగుచున్నది. నిత్య-నైమిత్తిక కర్మలు యాగ-వ్రత-తపోదానములు మొదలైన కర్మలను “అకర్తయగు పరమాత్మయొక్క తత్త్వానుభవము - పరమాత్మ తత్త్వము” కొరకై నిర్వర్తించుచున్నప్పుడు దృశ్యములో ఏదో పొందాలనే ఫలాభిలాష లేకపోతే- అకర్మయే అగుచున్నది. పరమాత్మ కొరకై నిర్వర్తించేదంతా అకర్మయే! ‘కర్మలన్నీ పరమాత్మచేత - పరమాత్మ కొరకై జరుగుచున్నది’ … అను భావనయే అకర్మ!

7.) జ్ఞానమ్ ఇతి చ
దేహ-ఇంద్రియ-నిగ్రహ
సద్గురూపాసన -
శ్రవణ మనన నిదిధ్యాసనైః
యద్యత్ దృక్ - దృశ్య స్వరూపం,
సర్వాంతరస్థం, సర్వ సమం,
ఘట పటాది పదార్థమివా అవికారం,
వికారేషు “చైతన్యం వినా
కించిత్ నాస్తి” ఇతి
సాక్షాత్కారా అనుభవ - “జ్ఞానం”।

అజ్ఞానమ్ ఇతి చ
రజ్జా సర్పభ్రాంతిః ఇవ - అద్వితీయే,
సర్వ-అనుస్యూతే, సర్వమయే బ్రహ్మణి
దేవ తిర్యక్ నర స్థావర
స్త్రీ పురుష వర్ణాశ్రమ
బన్ద మోక్ష ఉపాధి
నానాత్మ భేద కల్పితం జ్ఞానమ్  - “అజ్ఞానమ్”।

జ్ఞానము అనగా …

సామాన్యముగా ఈ జీవుడు తన తెలివిచే దేహ-ఇంద్రియములకు, నామ-రూపములకు పరిమితుడై, సంకుచితుడై దేహముతో చరిస్తున్నాడు. ఒకానొకప్పుడు ఇక్కడ నాకు సంబంధించిన సత్యము-నిత్యము ఏమిటి? … అను ప్రశ్నకు వచ్చి ‘ముముక్షువు’ అగుచున్నాడు. తెలివితో, “వీటికి ఆవల నాకు సంబంధించి ఏమిటి?“ అనే ప్రశ్నలతో సద్గురువును ఆశ్రయించుచున్నాడు. శ్రవణ-మనన-నిదిధ్యాసలకు ఉపక్రమిస్తున్నాడు. ఈ కనబడే సర్వమునకు ఆవల పరమైయున్నదాని వైపు దృష్టిని సారిస్తున్నాడు. వివేచనచే, సద్గురూపాసనచే, శాస్త్ర విచారణచే - ”దృక్-ద్రష్ట-దర్శన-దృశ్యరూపమైయున్నట్టిది, సర్వమునకు అంతస్థమై - అంతర్యామిగా ఉన్నట్టిది, సర్వులలోను సమస్వరూపమై ఉన్నట్టిది, (మట్టికి కుండ ఆకారము లేనట్లు, వస్త్రానికి చొక్కా ఆకారము లేనట్లు) అవికారమైనదే ఆత్మ!“ - అని తెలియబడగలదు. వికారరూపంగా కనిపించేదంతా అవికారమగు ఆత్మ చైతన్యమే! మరింకేమీ కాదు - అని తెలియవచ్చుచున్నది. అట్లు సాక్షాత్కరింపజేసేది ‘జ్ఞానము’.

అజ్ఞానము అనగా …

ఒకడు మసక చీకటిలో త్రాడును చూచి, “ఇది త్రాచుపామే! కాటేసిందంటే చచ్చానే! ఎట్లాగురా బాబూ?”.….. అని వికారములను, భయభ్రాంతులను పొందు తీరుగా… అద్వితీయము-సర్వమునందు పూదండలో దారమువలె అనుసృతము-సర్వము తనయందు కలిగి, సర్వమయము అయిఉన్నది-అగు బ్రహ్మము పట్ల.., "వీరు దేవతలు-అవి జంతువులు-వీరు నరులు-ఇవి స్థావరములు - వీళ్ళు స్త్రీలు - వారు పురుషులు-ఇవి వర్ణాశ్రమ వ్యవహారాలు -ఇది బంధము-అది మోక్షము-ఇది ఉపాధి - అది దృశ్యము… ఈఈ విధాలుగా నానాత్మకమైన భేదములను కల్పిస్తూ, వాటికి అర్థ-పరమార్థములు కల్పించే సమాచారములు, అభిప్రాయాలు … ఇది అజ్ఞానము.

8.) సుఖమ్ ఇతి చ
సత్-చిత్-ఆనంద స్వరూపమ్ జ్ఞాత్వా,
“ఆనంద రూపస్థితిః” ఏవ - “సుఖమ్” |

దుఃఖమ్ ఇతి చ |
అతః సంసార విషయ
సంఙ్కల్ప ఏవ - “దుఃఖమ్” |

సుఖము అనగా …

స్వస్వరూపముయొక్క, సర్వుల సహజ స్వరూపముయొక్క ఈ దృశ్య జగత్తు యొక్క … సత్-చిత్-ఆనంద … రూప స్థితిని తెలుసుకోవటం, తెలుసుకొన్న ఆత్మగా ఈ సృష్టిని దర్శించటము, తానే జగదానంద స్వరూపుడై ఆనందించటము… ఇది సుఖము.

దుఃఖము అనగా …

హృదయములో (అంతరంగంగా దృశ్యపరిమితమైన సంసార విషయ పరంపరలను సంకల్పించుకొని, అందుకు ఫలితముగా "ఈ దృశ్యమంతా ఎవ్వరో కల్పించి నన్ను నిబద్ధుని చేయుచున్నారే!… అను స్వకీయ కల్పవలే… దుఃఖము యొక్క రూపము.

స్వర్గ ఇతి చ |
సత్ సంసర్గః స్వర్గః|

నరక ఇతి చ |
అసత్ సంసార విషయ జనన
సంసర్గ ఏవ “నరకః”|

స్వర్గము అనగా …

జాగ్రత్-స్వప్న సుషుప్తులయందు, జన్మ-జన్మానంతరములయందు ఏ ఉనికి (నేను ఉన్నాను) … అనునది కలదో అట్టి సత్ వస్తువుతో సంసర్గము పొందుటము - స్వర్గము (సువర్గము). సత్సంగము స్వర్గతుల్యము!

నరకము అనగా …

వస్తుతః లేకపోయినప్పటికీ, ఉన్నట్లే అగుపించే సంసార విషయములతో జనిస్తున్న సంబంధము (లేక) సంసర్గము (ఏర్పడుచున్న బంధమే) నరకము.

బంధ ఇతి చ |

→ అనాది అవిద్యా వాసనయా,
‘జాతోఽహమ్’ ఇత్యాది
సంకల్పో “బంధః” |

→ పితృ మాతృ సహెూదర దారా
అపత్య గృహ ఆరామ క్షేత్రాది
మమతా సంసారావరణ
సంకల్పో “బంధః”|

→ కర్తృత్వాది అహంకార
సంకల్పో “బంధః”|

→ అణిమ-ఆది అష్టైశ్వర్య
ఆశా సిద్ధ సంకల్పో “బంధః”

→ దేవ మనుష్యాది ఉపాసనా
కామ సంకల్పో “బంధః”

→ యమ-ఆది అష్టాంగయోగ
అభ్యాసాది సంకల్పో “బంధః”|

→ వర్ణాశ్రమ ధర్మ కర్మ సంకల్పో బంధః |
అజ్ఞా (ఆజ్ఞా) భయ సంశయాత్మ
గుణ సంకల్పో “బంధః”|

→ యజ్ఞ వ్రత తపో దాన
విధి విధాన జ్ఞాన
సంకల్పో “బంధః” |

→ కేవల మోక్షాఽపేక్షా
సంకల్పో “బంధః”|

సంకల్ప మాత్ర సంభవో “బంధః”।

బంధము అనగా …

అనాది అయినటువంటి అవిద్యా వాసనల చేత (Because of Tendencies that stem up out of Ignorance - Ignoring Fundamental Truths), “అయ్యా నేను అప్పుడు జన్మించాను. నాకు జనన-మరణాలు ఉన్నాయి”… మొదలైన సంకల్పములు ఆశ్రయించటము, కొనసాగించటము.

ఇంకా… తండ్రి-తల్లి-స హెూదరులు -భార్య-ఉద్యానవనములు-గృహములుఆరామము-పొలములు… మొదలైనవాటిపట్ల - “ఇవి నాకు చెందినవి, నేను వీటికి చెందినవాడను” - అనే మమతలు, సంసారావరణ సంకల్పములు కలిగి ఉండటము, ఆవేశపూరితంగా భావించటము - ఇది బంధము.

“నేను దీనికి కర్తను. దానికి భోక్తను. ఇది నాది. అది నాకు చెందినది”… ఇటువంటి అహంకారముతో కూడిన సంకల్పములే బంధపు త్రాళ్ళు.

అణిమ - (అణురూపుడై ఉండుట), మహిమ (విరాట్రూపుడవటం), గరిమ (భూమికంటే కూడా బరువు కాగలగటం), లఘిమ (దూదికంటే కూడా, తేలికవడం), ప్రాప్తి (అనుకున్న వస్తువులు లభింపజేసుకోగలగడం), వశిత్వ (వశంచేసుకోవడం) ప్రాకామ్య (ఎక్కడైనా ప్రత్యక్షం కాగలగడం), ఈశిత్వ (సమస్తమునకు అధికారి) అష్ట సిద్ధులు ఆశించటం, ఆశించినది సిద్ధింపజేసుకునే సామర్థ్యము… ఇవన్నీ బంధమే!

ఒక దేవతనో, ఒక మానవునో మాత్రమే ఉపాసనచేసి ఏదో పొందాలనుకునేదంతా కూడా బంధమే!

“యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి… ఇవన్నీ అభ్యసించిన తరువాతగాని ఏదో (ఆత్మ) సిద్ధించదు కదా!”.. అనునదీ బంధమే. (ఎల్లప్పుడు సిద్ధించియే ఉన్నది ఎప్పుడో సిద్ధించటమేమిటి?)

వర్ణాశ్రమ ధర్మములు, కుల ధర్మములు, “ఇవియే ముఖ్యము”… అను సంకల్పములు కూడా బంధమే! (అవన్నీ సందర్భములకు చెందిన సత్యములు మాత్రమే కదా!)

సత్యమును పరిశీలించకపోవుటచే ఏర్పడు అజ్ఞానము, భయము, స్వస్వరూపమును గురించిన సంశయములు, త్రిగుణ సంకల్పములు….. బంధమే అగుచున్నాయి.

యజ్ఞ నిష్ఠలు, వ్రత విధానాలు, తపో నియమాలు, దానము, కర్తృత్వ-భోక్తృత్వ విధులు, జ్ఞాన సంబంధమైన శబ్దముల రకరకములైన విశ్లేషణా సమాచార సంకల్పాలు-ఇవన్నీ బంధమే!

“అన్నీ వదలాలి! మోక్షము ఒక్కటే ఎట్లాగో సంపాదించాలి” … అను రూపము గల సంకల్పములు కూడా బంధమే!

ఒక్క మాటగా చెప్పుకోవాలంటే, సంకల్పము, సంకల్పము వలన జనించేది… అంతా బంధమే!
- సంకల్పము కలిగి ఉండటము
- సంకల్పము తనదై ఉండగా తనను తాను ఏమరవటము
- ఏదో విషయాల పై సంకల్పములను దేహ-దేహాంతరములుగా కొనసాగిస్తూ పోవటము
.. ఇదంతా కూడా ‘బంధము’ - అనబడు దాని ముఖ్య నిర్వచనము! ముఖ్య రూపము!

9.) మోక్ష ఇతి |
నిత్య-అనిత్య వస్తు విచారాత్
అనిత్య సంసార సుఖ-దుఃఖ
విషయ, సమస్త క్షేత్ర మమతాది
సమస్త బంధ సంకల్ప క్షయో “మోక్షః”|

మోక్షము అనగా …

“ఇది నిత్యము-ఇది అనిత్యము“ … అని ఈ జీవుడు తన అనుభూతి. అనుభవము- సంగతి - సందర్భములను పరిశీలనతో విభాగించాలి. అనిత్యములగు సంసార రూప సుఖ దుఃఖ విషయములపట్ల, సమస్త క్షేత్ర - గృహ - ఆరామ - స్థలముల ”ఇవి నావి - నేను వీటికి చెందియున్నాను" అను సమస్త సంబంధ - అనుబంధ - బాంధవ్య సంకల్పములను క్షయింప చేసుకోవటమే మోక్షము.

ఉపాస్య ఇతి చ
సర్వ శరీరస్థ చైతన్య బ్రహ్మప్రాపకో
గురుః ఉపాస్యః ||

శిష్య ఇతి చ
విద్యాత్ అధ్వస్త ప్రపంచా అవగాహిత
జ్ఞానా అవశిష్టం బ్రహ్మైవ “శిష్యః” ||

ఉపాసించతగినవాడు అనగా …

సర్వ దేహములలో సర్వదా వేంచేసియున్న చైతన్య బ్రహ్మమే ఉపాస్యము. అద్దాని గురించి విశదపరచుచూ, తత్-త్వమ్ భావనను నిదురలేపువారు సద్గురువు. ఆత్మయే గురువు! గురువు ఆత్మ స్వరూపుడే!

శిష్యుడు అనగా …

గురువు బోధించు “తత్ త్వమ్”… ఆప్త జ్ఞానమహా వాక్యార్థమును ఆకళింపు చేసుకొంటూ, ఆత్మ విద్యా సమాచారమును హృదయస్థం చేసుకొనుచూ, “ఈ ప్రపంచము అస్మత్ స్వస్వరూప పరబ్రహ్మమునకు వేరు కాదు… ఆభరణమంతా బంగారమే అను విధంగా” .. అని బ్రహ్మమే తానై శేషించుచున్నవాడే శిష్యుడు … (అవశిష్యుడు). “సోఽహమ్”నందు నిదురలేచు ఆశయము అంగీకరించి ఉండువాడు శిష్యుడు.

10.) విద్వాన్ ఇతి చ |
సర్వాన్తరస్థ, స్వసంవిత్ రూపవిత్ విద్వాన్ |

మూఢ ఇతి చ |
కర్తృత్వాది అహంకార
భావనా ఆరూడో “మూఢః”|

అసురమ్ ఇతి చ |
బ్రహ్మ విష్ణు ఈశాన ఇంద్రాదీనామ్
ఐశ్వర్య కామనయా,
నిరశన జప-అగ్నిహెూత్రాదిషు
అంతరాత్మానం సంతాపయతి చ,
అతి ఉగ్ర రాగ ద్వేష హింసా డంభా ఆది
అపేక్షితం “తప ఆసురమ్”||

విద్వాన్ అనగా …

స్వసంవిత్ (స్వస్వరూప సత్ + విత్ యే) - సర్వము యొక్క అంతస్థముగా సుస్పష్టము చేయునది. నేను సర్వుల - సర్వముయొక్క అంతరమున ఉన్నవాడను అని ఎరుగువాడే విద్వాంసుడు.

మూఢుడు అనగా …

“నేనే కర్తను! నేను చేయుచున్నవన్నీ నావలననే అగుచున్నాయి! నేనే భోక్తను!” … ఇటువంటి కర్తృత్వాహంకార భావనలలో ఆరూఢుడై జీవించువాడు. నాటకంలో తన పాత్రకు తానెట్లా ‘కర్త’ అవుతాడు? నాటకమే అవుతుంది కదా! జీవుని కర్తృత్వము అట్టిదే!

అసురుడు అనగా …

సంపద-ఐశ్వర్యములపై, అధికారములకొరకై కోరికలతో చతుర్ముఖ బ్రహ్మ - విష్ణువు - ఈశ్వరుడు - ఇంద్రుడు మొదలైనవారిని ఉద్దేశ్యించి ఉపవాస జప - అగ్నిహోత్ర సంబంధమైన అనేక పరిశ్రమలతో కూడిన కార్యక్రమములకు సంసిద్ధుడగుచూ…… అంతరాత్మకు సంతాపము కలుగజేయువాడు. తీవ్రస్థాయిలో “నావారు - నా జాతి - నామతము”… అను రాగమును ఆశ్రయిస్తూ, తదితరులను ద్వేషించుచూ, “హింస-దంభము”… ఇత్యాదులను ఆశ్రయించువాడు. అనేక కోరికలతో, అపేక్షలతో ఏవేవో దృశ్య విషయాలు సిద్ధింపజేసుకోవటానికై తపములు ఆచరించువాడు. తన తపనలతో అంతరాత్మకు సంతాపములు కలిగించువాడు.

11.) తప ఇతి చ |
“బ్రహ్మ సత్యం జగన్మిథ్యా” - ఇతి
అపరోక్ష జ్ఞానాగ్నినా - బ్రహ్మాది
ఐశ్వర్యా ఆశా సిద్ధసంకల్ప
బీజ సంతాప రూపం “తపః” ||

తపస్సు అనగా …

“బ్రహ్మము సత్యము - జగత్తు మిధ్య - అను రూపముగల (ప్రత్యక్షము - పరోక్షము కానట్టి)- అపరోక్ష (ఆత్మ) జ్ఞానాగ్ని వెలిగించటము, వెలుగులో “బ్రహ్మమే సత్యము-ఈ జగత్తు మనో కల్పనా విలాసమే! కథ-నాటకము-మాంత్రికుని కల్పనలోని సందర్భ-సంఘటనలవలె-మిథ్యయే”… అని గమనిస్తూ…, బ్రహ్మదేవుని వరకు గల ఐశ్యర్యములను “ఆశించటము“ - అనే బీజములను జ్ఞానాగ్నిలో ఉడికించివేయటము. సర్వ సంకల్ప బీజ సంతాప రూపములను తపింపజేసి మసి చేయటము. ”ఆశించటము" అనే బీజమును అపరోక్ష జ్ఞానాగ్నిలో దగ్ధము చేయటము - తపస్సు.

పరమపదమ్ ఇతి చ |
ప్రాణ ఇంద్రియాది అంతఃకరణ గుణాదేః పరతరమ్
సత్-చిత్-ఆనందమయమ్, సర్వసాక్షికమ్,
నిత్యముక్త బ్రహ్మస్థానమ్ “పరమమ్ పదమ్”||

పరమపదము అనగా …

ప్రాణ - ఇంద్రియ - ఇంద్రియ విషయ - అంతఃకరణ - - త్రిగుణములకు పరతరము (Most Beyond) అయి, ఆవలగా సర్వదా ప్రకాశమై ఉంటున్న పదము. అది సత్-చిత్-ఆనందమయము. నాటకదీపము వలె సర్వమునకు కేవలసాక్షీమాత్రము. సర్వదా నిత్యముక్తము. పరబ్రహ్మతము అయినట్టి పరమ స్థానము. స్వస్వరూపానంద పరమపదము.

గ్రాహ్యమ్ ఇతి చ |
దేశ-కాల-వస్తు పరిచ్ఛేదరాహిత్య
చిన్మాత్ర స్వరూపమ్ “గ్రాహ్యమ్”||

అగ్రాహ్యమ్ ఇతి చ |
స్వస్వరూప వ్యతిరిక్త మాయామయ
బుద్ధి-ఇంద్రియ గోచర జగత్
సత్యత్వ చిన్తనమ్ “అగ్రాహ్యమ్”|

గ్రాహ్యము అనగా …

గ్రహించవలసినది. దేనిని స్వీకరించాలి? గ్రహించాలి? ఏదైతే దేశ (Place) - కాల (Time) - వస్తువు(Matter)లచే పరిచ్ఛేదము పొందటమే లేదో…, సర్వదా కేవల చిత్ మాత్రమై, తదితరములగు మార్పు చెందువాటినన్నిటినీ వెలిగించుచున్నదో,.. అదే గ్రాహ్యము. (ఆత్మగా గ్రహించటం - గ్రాహ్యము)

అగ్రాహ్యము అనగా …

గ్రహించకూడనిది. వదలివేసి ఉండవలసినది. ఏదేదైతే బుద్ధిఇంద్రియములకు ఎదురుగా గోచరమగుచు, స్వతఃగా లేక (యా మా) మాయామయమై, కల్పితమై, విషయముల రూపముగా అసుభవమగుచున్నదో…, అట్టి ఈ జగత్తుపట్ల - “ఇది సత్యము-నిత్యము”… అను గ్రహణమును త్యజించాలి. జగత్తును జగత్తుగా గ్రహించటము - గ్రహించకూడనిది. (జగత్తును బ్రహ్మముగా దర్శించే అభ్యాసము చేయాలి!)

సన్న్యాసీ ఇతి చ |
సర్వధర్మాన్ పరిత్యజ్య
నిర్మమో నిరహంకారో భూత్వా,
బ్రహ్మ - ఇష్టం శరణం ఉపగమ్య,
“తత్ త్వమ్ అసి”
“సర్వమ్ ఖలు ఇదమ్ బ్రహ్మ”
న ఇహ నానాస్తి కించన (నేహ నానాఽస్తి కించన)
ఇత్యాది మహావాక్యార్థ అనుభవజ్ఞానాత్
“బ్రహ్మైవాహమ్ అస్మి”
ఇతి నిశ్చిత్య, నిర్వికల్ప సమాధినా
స్వతంత్రో యతిః చరతి…,
→ స సన్న్యాసీ!
→ స ముక్తః
→ స పూజ్యః|
→ స యోగీ।
→ స పరమహంసః।
→ సో అవధూతః।
→ స బ్రాహ్మణః। ఇతి ||

సన్న్యాసి (సత్ + న్యాసి) అనగా …

బ్రహ్మచారి - గృహస్థ- వానప్రస్థ - సన్న్యాస సర్వ ఆశ్రమ ధర్మములను, నియమ-నిష్ఠలను దాటివేసిన వాడై, వాటినన్నిటినీ పరిత్యజించివేసినవాడై…, మమకారము-అహంకారములను వదలివేసినవాడై, బ్రహ్మమునందే ఇష్టము కలవాడు. అత్యంత ఇష్టముతో బ్రహ్మమునే భావనఆరాధన-అభిలషణ పూర్వకంగా శరణు వేడినవాడై., ఆశ్రయించు మార్గమును అనుసరిస్తూ ఉన్నవాడు. సత్‌ను - న్యసించినవాడు (స్వీకరించినవాడు).

- త్వమ్ కనిపించేదంతా తత్ బ్రహ్మ స్వరూపమే! తత్ త్వమ్!
- ఇదంతా ఈ సర్వము సర్వదా పరబ్రహ్మమే!
మొదలైన మహావాక్యముల పరమార్ధమును అనుభవ జ్ఞానముగా మలచుకొనుచున్నవాడు.

క్రమంగా ….. “నేను బ్రహ్మమునే! బ్రహ్మమే నేనుగా ఉన్నది"… అను నిశ్చయమును హృదయమునందు సుసంపన్నము చేసుకొనుచున్నవాడు.

ఎవ్వరు యతియై, ఈ దృశ్య జగత్తులో క్రీడా - లీలా వినోదిగా చరిస్తూ ఉంటాడో…, ఆతడే సన్న్యాసి! ముక్తుడు! పరమపూజ్యుడు! యోగి! పరమహంస! అవధూత! బ్రాహ్మణుడు!

ఫలశ్రుతి
శ్లో॥ ఇమాం నిరాలంబోపనిషదమ్ |
యో అధీతే గురు-అనుగ్రహతః,
• సో అగ్నిపూతో భవతి|
• స వాయుపూతో భవతి।
• న స పునరావర్తతే।
• న స పునరావర్తతే |
• పునః న అభిజాయతే|
• పునః న అభిజాయత।

ఫలశ్రుతి
ఎవ్వరైతే గురు అనుగ్రహపాత్రులై, గురుముఖతః ఈ నిరాలంబోపనిషత్ అభివర్ణిస్తున్న శబ్దార్థ తత్వములను ఆశ్రయిస్తారో, ఉపాసిస్తారో…
- వారు అగ్నిచే ఖనిజము శుభ్రమగురీతిగా పవిత్రులు కాగలరు.
- వారికిక పునరావర్త దోషము తాకదు. తిరిగి జన్మకర్మల స్రవంతిలో పడరు. (అనగా) “నేను పుట్టువాడను-చచ్చువాడను" - అను జనన-మరణ చక్రములో పడరు. పడరు. (దేహధారణ వ్యవహారమంతా అట్టివారి దృష్టిలో వస్త్రధారణ వంటిది మాత్రమే!)

ఇతి నిరాలంబోపనిషత్ |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||


శుక్ల యజుర్వేదాంతర్గత

8     నిరాలంబ ఉపనిషత్

అధ్యయన పుష్పము

ఓంకార స్వరూపుడు, సర్వాంతర్యామి, జగతురువు అగు శ్రీమన్నారాయణ స్వామికి నమస్కరిస్తూ ….

ఓం నమఃశివాయ ! హే పరమ శివా !
మీరు ’ఓం’కార అక్షర - సర్వాత్మానంద స్వరూపులు !
లోకగురువు! సద్గురువు! నమస్కరించినంత మాత్రముచేతనే మమ్ములను సముద్ధరించుటకై సంసిద్ధపడు ఆత్మగురువు!
మమాత్మస్వరూపులు !
సాక్షాత్ సత్-చిత్-ఆనంద స్వరూపులు!
సచ్చిదానందతత్త్వమే అయినట్టి జగత్ దృశ్యముగా మూర్తీభవించి కనబడుచున్న పరమానంద చిదన స్వరూపులు!
శివానందమూర్తులు!
ఈ చర్మచక్షువులకు కనిపిస్తున్న “పాంచభౌతిక జగత్తు”కు ఆధారమగుచూ, అప్రమేయులై “కేవలసాక్షి" అయి ఉన్న చైతన్య స్ఫూర్తి స్వరూపులు!
నిష్ప్రపంచ తత్త్వానందులు!
జగత్ తేజోసంపన్నులు!
నిరాలంబ ఆత్మచైతన్య దీప్తులు!
అట్టి మీకు నమస్కరిస్తున్నాము!

ఒకానొక సందర్భములో - తపోధ్యాన నిష్ఠులగు కొందరు శిష్యులు తమ ఆధ్యాత్మ-గురువగు అశంక్య మునీంద్రులవారిని దర్శించుకొన్నారు. భక్తితో నమస్కరించారు.

శిష్యులు :  ఓ గురుదేవా ! సత్చిత్ ఆనంద స్వరూపజ్ఞా ! మూర్తీభవించిన వేదాంత తత్త్వవిదా ! నిష్ప్రపంచ శాంతైశ్వర్య స్వరూపా! నిరాలంబ విదితవేత్తా ! తేజో స్వరూపా ! ఆశఙ్క్య మునీంద్రా ! మేము అనేక దృశ్య విషయములకు నిబద్ధులమైయుండటం చేత కైవల్యసిద్ధికై మార్గాణ్వేషులమై, మార్గ దర్శకులగు మిమ్ములను శరణువేడుచున్నాము. అజ్ఞాన శాంతికై మీ బోధచే మమ్ములను పునీతులుగా పవిత్రులుగా తీర్చిదిద్దమని అర్ధిస్తున్నాము.

మేము సన్న్యాసము ఆశ్రయించటము ఉచితమో, యోగులమై కర్మ విధులను ఆశ్రయించటమోఏది తగిన ఉపాయమో చెప్పండి ! మోక్ష స్థానము చేరు మార్గము శలవియ్యండి!

అశఙ్క్య మునీంద్రులు : బిడ్డలారా ! మీకు శుభమగుగాక ! ఈ ప్రపంచములో ఆయా సందర్భములు సంఘటనలు మొదలైనవి ఈ జీవుని ఆకర్షించి, జ్ఞానమార్గమునకు అవరోధములు అగుచుండటానికై యత్నించవచ్చుగాక ! అయితే, “ఇవి మాకు సంబంధించినవి, మేము వీటికి సంబంధించినవారము”… అను అవలంబనమును ఆశ్రయించవలసిన పనేమున్నది ? బాహ్య విషయములు బాహ్యముననే ఉంచి, హృదయములోకి ప్రవేశించనీయక “నిరాలంబత్వము”ను ఆశ్రయించాలి సుమా ! సహజముగానే మనమంతా ఆత్మస్వరూపులమని పూజ్యులగు బ్రహ్మతత్త్వవేత్తలచే సిద్ధాంతీకరించబడుచుండగా… ఇక దిగులెందుకు ?

నిరాలంబమ్ సమాశ్రిత్య సాలంబం విజహాతి యః
స సన్న్యాసీ చ, యోగా చ | కైవల్యపదమ్ అశ్నుతే ||

నాటకంలో పాత్రధారుడు నాటకములోని తాను నటిస్తున్న సంగతి - సందర్భ - సంబంధ - సంఘటనలకు “నేను బద్ధుడనుకదా” అని తలచడు కదా! ఎందుచేత? నాటకములోని సంఘటనలచే తన బాహ్యమగు నిజ - సహజస్వరూపమునకు (పరస్వరూపమునకు) వచ్చేదీ గాని, పోయేదీగాని ఏమీ ఉండదని ఎరిగి ఉండటము చేత! నాటకములోని పాత్ర దృష్ట్యా, ఆ పాత్ర నాటకమును అనుసరించి సావలంవనము (Dependent on Drama Sequences) కావచ్చుగాక ! తాను నిరావలంబనము (Not dependent on events in the drama) గానే ఉంటాడుకదా ! మీరు కూడా జగద్విషయములకు సావలంబనము (Discharging respective Functions the way the world expects (or) seeks) కలిగి ఉండి కూడా, నిరాలంబము ఆశ్రయించియే ఉండండి. నిరాలంబముచే సాలంబమను అంతరంగమున జయించినవారై ఉండండి.

ఎవ్వరైతే ‘నిరాలంబన’ చే సాలంబమును మొదలంట్లో జయించివేసి ఉంటారో… వారే సన్న్యాసులు. (సత్-న్యాసులు). వారే యోగులు.

శిష్యులు :  అందుకు మార్గము ?

ఆశఙ్క్య మహాముని : అందుకు అధ్యాత్మశాస్త్ర బోధయే మార్గము, సర్వశంకలు ఆత్మశాస్త్ర పరిశీలనచే జయించాలి. అజ్ఞత్వమును త్యజించాలి. విజ్ఞులు కావాలి. శాస్త్రములు చెప్పు శబ్దార్ధ నిర్వచనములయొక్క సరిఅయిన తత్త్వార్థమును ఎరిగి, హృదయస్థము చేసుకొనుచుండగా, నిరాలంబము అగు (Non dependence on worldly events. Keeping up the sense of beyondness by associating with absolute self) ఆత్మాఽహమ్ అభ్యాసము తప్పక సుసాధ్యమే !

 శిష్యులు :  స్వామీ ! అయితే ఆయా ఆధ్యాత్మ శాస్త్ర శబ్దముల (Jargons) తత్త్వార్ధమును విశదీకరించ ప్రార్థన. జీవుడు ఏ ఏ ప్రశ్నలకు సమాధానము ఎరుగుటచే తత్త్వశాస్త్ర హృదయము సుస్పష్టముకాగలదో, అవి చెప్పండి.

ఆశఙ్క్య మహాముని : ముందుగా కొన్ని ప్రశ్నలు గమనించండి!

⁉️ బ్రహ్మము అనగా ఏమి ? ఈశ్వరుడు అనగా ఎవరు ?
⁉️ ఈ జీవుడు వాస్తవానికి ఎవరు ? ప్రకృతి అనగా ?
⁉️ ‘పరమాత్మ’ అని దేనిని అంటున్నాం ?
⁉️ బ్రహ్మ - విష్ణు - రుద్ర - ఇంద్రుడు అను వారు ఎవ్వరు ?
⁉️ యముడు - సూర్యుడు - చంద్రుడు ఎవ్వరు ?
⁉️ సురుల అసురులు అనగా ఎవరు ?
⁉️ పిశాచులెవరు ? మనుష్యులెవరు ? స్త్రీలెవ్వరు ?
⁉️ పశువులు ఏమై ఉన్నాయి ? ‘స్థావరము’ అనగా ఏమి ?
⁉️ బ్రాహ్మణులు అనగా ? ‘జాతి’ అనునది దేనికి సంబంధించినది ?
⁉️ కర్మ - అకర్మలు అని వేటిని అంటారు ?
⁉️ ఏది జ్ఞానము ? ఏది అజ్ఞానము ?
⁉️ ఏది సుఖము ? ఏది దుఃఖము ?
⁉️ స్వర్గమేది ? నరకమేది ?
⁉️ గురువుగా సమీపించి ఉపాసించవలసినది ఎవరిని ? ఎప్పుడు ‘శిష్యుడు’ అని అనిపించుకోగలము ?
⁉️ విద్వాంసుడెవ్వడు ? మూఢుడెవ్వడు ?
⁉️ అసురుడెవ్వడు ? సురుడు ఎవ్వడు ?
⁉️ తపస్సు అనగా ? ఏది పరమపదము ?
⁉️ గ్రాహ్యము (గ్రహించతగినది) ఏది ? అగ్రాహ్యము (గ్రహించకూడనిది) ఏది ?
⁉️ ఒకడు ‘సన్న్యాసి’ (సత్-న్యాసి = సత్ వస్తువును ఆశ్రయించువాడు) అని ఎప్పుడు చెప్పబడగలడు ?

శిష్యులు : ఓ ఆశఙ్మ్యమునీంద్రా ! స్వామీ ! "బ్రహ్మ విద్య’ ను ఆశయముగా కలవారు పై శబ్దముల అర్ధములను ఏ విధంగా సమన్వయించుకోవాలో, తెలుసుకొని ఉండాలో మీరే దయచేసి వివరించ ప్రార్థన. ఈ ఈ శబ్దముల అర్ధమును గురుముఖతః వినటముచేత బ్రహ్మ విద్యను నేర్చుకున్నవారమవుతామని బ్రహ్మజ్ఞుల అభిప్రాయము కదా !

ఆశఙ్క్య మునీశ్వరుడు :  నాయనలారా ! మనము ఉదహరించుకొన్న ’ఆధ్యాత్మ విద్య - శబ్దార్థములు’ అన్నీ కూడా…

అనుభవము అనేది మహత్తరము, పరమ లక్ష్యము కూడా ! అనుభవము నుండి శబ్దములు ఉపయోగించబడి, బోధకొరకై ఉపకరణములుగా అగుచున్నాయి. అన్నిటికన్నా ముఖ్యము అనుభవము (Experience). అందుచేత, వేరు వేరు గురువులు కించిత్ భేదముతో శబ్దములను ఉపయోగించి ఉండవచ్చు గాక ! మీరు… తస్మాత్ సారమ్ విజానీయత్.. ముఖ్యోద్దేశ్య సారమేమిటో గ్రహించే ఉత్తమ బుద్ధిని కలిగి ఉండండి. అంతేగాని, కించిత్ అర్థభేదమును పెద్దవిగా చేసుకొని వాదోపవాదములను ఆశ్రయించవద్దు.

మనము ఇప్పుడు చెప్పుకున్న శబ్దముల ఉద్దేశ్యమేమిటో, వివిధ సిద్ధాంతములతో కూడిన “బ్రహ్మ విద్య”ను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుందాము. ఒకానొక ఉపకరణ రూపమగు సామాన్యార్ధాన్ని సూత్రప్రాయంగానూ (In brief, in nut-shall), సంభాషించుకుందాము. తత్త్వార్ధపూర్వకంగానూ, ముఖ్యోద్దేశ్యము యొక్క పరిశీలనచేస్తూ ఇక్కడ సూచనప్రాయంగా వివరించుకుందాము. వినండి !

ఏది ‘బ్రహ్మము’ అని చెప్పబడుచున్నది?

మహత్ అహంకార పృథివీ అపః తేజో వాయు ఆకాశా-ఆత్మకత్వేన, బృహత్ రూపేణ, అణకోశన కర్మఙ్ఞావర్ణరూపతయా భాసమానమ్ | అద్వితీయమ్ | అఖిల ఉపాధి వినిర్ముక్తమ్ । తత్ సకల శక్తి ఉపబృంహితమ్ । అనాద్యంతమ్। శుద్ధం, శివం, | శాంతమ్, నిర్గుణమ్… ఇత్యాది వాచ్యం | అనిర్వాచ్యమ్ | చైతన్యం బ్రహ్మ ||

ఇంద్రియ సంబంధమైన లోక (దృశ్య) కల్పనను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది రీతిగా ఆధ్యాత్మ శాస్త్రము విభజించి చెప్పుచున్నది.

1) మహత్తు = చిత్ కళా వైభవము. ‘ఎరుక’ యొక్క విన్యాసము. ‘అనుభవము’ అనే వికాసము (Sense of Experiencing). (ఒకని నటనా చాతుర్యము వంటిది).

2) అహంకారము = ఆ ‘చిత్’ అనే అనుభవ విన్యాసము నుండి బయల్వెడలిన ‘నేను’ అను రూపము గల వ్యష్ఠి అనుభవి (Experiencer) - సందర్భము పరిమితము. దేహము నేనైన నేను. (ఒకానొక నాటకములోని ఆతని ఒక పాత్ర వంటిది)

3) పంచ మహాభూతములు

  1. ఆకాశము (Spacing)
  2. చలనము-వాయువు (Movement)
  3. తేజస్సు-ఉష్ణము-అగ్ని (Light, Heat)
  4. ద్రవ్యము అపః జలము (Liquid)
  5. స్థూలము - భూమి (Solid). (నాటక స్థల అంతర్గత విశేషాలు)

ఇవన్నీ బృహత్ రూపము వహించి అనేక పాళ్ళలో అనేక పదార్ధ వైచిత్ర్యములు (Different forms by virtue of different permutations and combinations) గా ఈ ఎదురుకుండా కనిపించే బ్రహ్మాండ ఆకారముగా రూపు దిద్దుకుంటోంది. ఇదంతా కర్మ - జ్ఞానము (Function and knowing) అను రెండు రెక్కలచే (విన్యాసములచే) అనుభవముగా (Experience) సిద్ధించుచున్నది. బృహత్ బ్రహ్మాండము గా అనుభవికి అనుభవమౌతోంది కదా !

అయితే….
వెలుగులో వస్తువులు, వాటి వాటి ఆకారములు కనిపిస్తాయి. వెలుగు లేకపోతేనో అవి కనిపించవు. కానీ వస్తువులు వేరు - వెలుగు వేరు. అట్లాగే ‘ఆత్మ’ అనే మహత్తరమగు తేజస్సులో ‘కర్మ’ (ఆత్మ దేవుని క్రియాశక్తి) “జ్ఞానము” (ఆత్మ దేవుని ఎరుక)…లచే మనం చెప్పుకొన్న మహత్ అహంకార - పృధివీ - అపః - తేజో - వాయు - ఆకాశ - బృహత్ బ్రహ్మాండ”… విశేషాలన్నీ కూడా అర్ధవంతముగాను, అనుభవశీలముగానూ సిద్ధించుచున్నవగుచున్నాయి.

అయితే…,
ఎద్దాని తేజస్సులో పైన చెప్పుకొన్న మహత్తు, అహంకారము, పాంచభౌతిక దేహములు, పాంచ భౌతిక బ్రహ్మాండము - ఇవన్నీ అనుభశీలమగుచున్నాయో … అదియే ‘బ్రహ్మము’. అట్టి బ్రహ్మము గురించిన మరికొన్ని విశేషాలు వినండి.

అద్వితీయమ్ : అద్దానికి వేరుగా మరొకటనునది ఏదీ లేదు. అగ్నియే - అనేక దీపములలో వెలుగులు అయి ఉంటున్నట్లు; మట్టియే అనేక మట్టి బొమ్మల - కుండల ఆకారములుగా అగుపిస్తున్నట్లు ; బంగారమే అనేక ఆభరణములుగా ఆకారములతో పేర్లతో ప్రచారమగుచున్నట్లు, - బ్రహ్మమే మహత్ - అహంకార - పంచభూత - బ్రహ్మాండరూపములుగా లౌకిక దృష్టికి కనిపిస్తోంది కనుక బ్రహ్మము ‘.అద్వితీయము”… అని చెప్పబడుతోంది. బ్రహ్మమునకు ద్వితీయమైనది లేదు!

అఖిల ఉపాధి వినిర్ముక్తమ్ : ఈ కనబడే వేరు వేరు ఉపాధులన్నీ (All physical forms) బ్రహ్మమునకు చెందినవే అయినప్పటికీ కూడా, వీటిని బ్రహ్మమునకు ఆపాదించి చెప్పలేము. బంగారు ఆభరణముగా ఉన్నది బంగారమే అయినప్పటికీ, “బంగారము - ఆభరణముగా మారినది” అని (బంగారము దృష్ట్యా) అనము. కథలోని పాత్రలన్నీ రచయిత యొక్క రచనా విన్న్యాసమే అయినప్పటికీ రచయిత పాత్రగా అవడు కదా! రచయితకు వేరుగా పాత్రలు లేవు కదా!

మరొక దృష్టాంతము. దేహి యొక్క ఉనికిచే దేహము కదులుతోంది. కానీ "దేహి దేహముగా అగుచున్నాడు” అని అనము కదా!

అందుచేత “బ్రహ్మము - సర్వ ఉపాధులచే పరిమితము కాదు. ఉపాధులు అయ్యేది కాదు. సర్వ ఉపాధి వినిర్ముక్తము” అని చెప్పబడుతోంది.

సకల శక్తి - ఉపబృంహితమ్ : ఈ బ్రహ్మాండములో అగుపిస్తున్న ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియా శక్తి మొదలైనవన్నీ ఆ బ్రహ్మము నుండే బయలుదేరుచున్నాయి. బ్రహ్మమే ఆయా సర్వ శక్తుల రూపముగా ప్రదర్శితమగుచున్నది. అందుచేత - బ్రహ్మము సకల శక్తి సమన్వితము, (సకల శక్తి ఉపబృంహితము) అయిఉన్నది.

అనాద్యన్తమ్: ఈ దృశ్య బ్రహ్మాండములో ఇంద్రియ విషయములన్నిటికీ ఆది-అంతము (The Begining and The End) ఉంటోంది. ఇవన్నీ ఎందులో బయల్వెడలి, ఉనికి కలిగి, లయమగుచున్నాయో… అట్టి బ్రహ్మమునకు ఆది అంతము లేవు. కాలబద్ధముకాదు. కాల - హేతువులు అద్దాని యందు ఆద్దాని స్వకీయ భావ కల్పితములు. కనుక బ్రహ్మము ఆద్యంతరహితము.

శుద్ధమ్ : ఆకాశాన్ని వాయు - అగ్ని జల - పృధివిలు స్పృశిస్తాయా ? వాటి వాటి క్రియా విశేషములచే ఆకాశము దోషము పొందదు కదా! అట్లాగే సహజము-స్వస్వరూపము అగు బ్రహ్మము-దేశకాల వస్తు దోషములచే స్పృశించబడక, సర్వదా సదా శివస్వరూపమై, పరమ శుద్ధమై ఉన్నది. (దృష్టాంతనికి) కళ్ళతో ఒక వస్తువును చూచినంత మాత్రము చేత ‘చూపు’ అను శక్తికి వస్తువు ఆకారము అంటుతుందా? లేదు. సూర్య కిరణము మురికి వస్తువుపై పడినంత మాత్రం చేత ఆ మురికి కిరణమునకు అంటుతుందా? లేదు కదా ! అట్లాగే బ్రహ్మము నిత్య శుద్ధము. నాటక దీపమువలె ప్రాపంచక సంగతి - సంఘటనలకు సంబంధించనిది. వాటన్నిటిచే బ్రహ్మము స్పృశించబడదు. మార్పు-చేర్పులు పొందదు.

శివము :  సర్వ జీవులకు దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకార ప్రదాత అయి, ఆహారము .. మొదలైనవన్నీ తన దివ్యశక్తిచే ప్రసాదించుచున్నట్టిది. కనుక సర్వ సుఖప్రదాత ! శివము ! శుభ - ఆనంద రూపము!

శాంతము : సర్వమునకు కారణ-కారణమగుచూ కూడా తాను పరమ శాంత స్వరూపమైయున్నది. ఈ జగత్ దృశ్యములన్నీ బ్రహ్మమునందే ప్రకాశించి, బ్రహ్మమునందే సశాంతిస్తున్నాయి. సర్వము యొక్క సశాంతి రూపమే బ్రహ్మము.

నిర్గుణము : ప్రకృతి నిర్మితమగు సత్వ రజో - తమో త్రిగుణములకు బ్రహ్మమే ఆధారము. అనగా, త్రిగుణములకు మునుముందుగాను, త్రిగుణ వ్యక్తీకరణము సందర్భములోను, తదనంతరము కూడా ఉన్నట్టిది. కనుక బ్రహ్మము - నిర్గుణము, గుణరహితము. … ఈ విధముగా బ్రహ్మమును ఎరిగిన బ్రహ్మజ్ఞులు బ్రహ్మము గురించి సూచనలుగా చెప్పుచూనే, మరొక్క ముఖ్య విషయం కూడా ఎలుగెత్తి గానం చేస్తున్నారు. అది ఏమిటంటే…..

బ్రహ్మము అనిర్వాచ్యం : బ్రహ్మము గురించి మనస్సు - వాక్కు, కాయములను ఉపయోగించి “ఇట్టిది” అని సమగ్రంగా చెప్పజాలనిది. కనుకనే - అనిర్వాచ్యము. అవాక్ మానస గోచరము. బుద్ధికి ఈవల బ్రహ్మాండము వేంచేసి ఉండగా… బుద్ధికి ఆవల బ్రహ్మము సంప్రదర్శితమైయున్నది. అద్దానిని బుద్ధితో దర్శించటానికే ఇక మిగతా ప్రయత్నములు, సంభాషణము, శాస్త్రములు మొదలైనవన్నీ కూడా.

బ్రహ్మ-చైతన్యము : బ్రహ్మమే మనో - వాక్ - దేహ - బుద్ధి - చిత్తములను కదలునట్లుగా చైతన్యవంతము చేస్తోంది. కాబట్టియే - అవన్నీ ప్రవర్తిస్తున్నాయి. అందుచేత ‘చైతన్యము’ అను పేరుతో ఉద్దేశ్యించబడుతోంది. అట్టి చైతన్య బ్రహ్మమే “నేను” యొక్క “నీవు” యొక్క ఈ దృశ్య జగత్తు యొక్క నిత్య - సత్య సహజ స్వరూపము.

ఈశ్వర ఇతి చ | ఈశ్వరుడు అనగా…

బ్రహ్మేవ స్వశక్తిః ప్రకృత్యా అభిధేయమ్ అశ్రిత్య, లోకాన్ సృష్ట్వా, ప్రవిశ్యా,
అంతర్యామిత్వేన బ్రహ్మాదీనాం బుద్దీంద్రియ నియంతృత్వాత్ ‘ఈశ్వరః’ ॥

బ్రహ్మము అనంత శక్తియుతము. అద్దాని ‘స్వశక్తి’ యొక్క విన్యాసప్రదర్శనమే ‘ప్రకృతి’. అట్టి ప్రకృతిని కల్పించుకొని, ఆశ్రయించి అద్దానియందు బ్రహ్మముయొక్క ఒకానొక చిత్కళావిశేషమును ప్రవేశింపజేయుచున్నది.

అట్టి చిత్కళ యొక్క సృజనాత్మక శక్తి…

… సృష్టి కళాత్మకుడగు బ్రహ్మ దేవుని, ఇంద్రియములను, ఇంద్రియ వ్యవహార కల్పనలను కొనసాగించుచున్నది.

అట్టి సృష్టిపరంపరల సృజనాత్మక చిత్కళా స్వరూపుడే ‘ఈశ్వరుడు’.

జీవుడు ఒక్క దేహమునకు యజమాని అయి వ్యవహరిస్తున్న తీరుగా…, ఈశ్వరుడు అనేక లోకములను అనేక దేహములతో పర్యవేక్షణ చేయు తత్త్వస్వరూపుడు. సృష్టిని సృష్టికర్తయగు బ్రహ్మ-లోకపాలకులు మొదలైనవారిని నియత్రించు వాడు. లోకముల అంతర్యామి.

బుద్ధి-ఇంద్రియములను నియమించువాడు. కళాస్వరూపుడై, ఒక చిత్రకారునివలె ఈ సర్వమును కల్పించుకొని ఆనందించువారు.

ప్రతి దేహి కూడా స్వతఃగా ఆత్మస్వరూపుడు, ఇంద్రియ ప్రపంచ - దేహదేహాంతర నియామకుడై ఈశ్వరత్వమును తనయందు ప్రక్షిప్తమైయున్నవాడే!

ఈ జీవుని అనేక దేహముల జీవనతత్త్వము (అనేక నాటకములలో నటించే నటుని నటనాచాతుర్యము వలె) …. ‘ఈశ్వరత్వము’ అనబడుచున్నది. అది వ్యష్ఠి - సమష్ఠిలయందు పూర్ణమైయున్నది.

జీవుడు - జీవము

నామ రూపములను అభిమానించువాడు జీవుడు. సృష్టియొక్క దివ్యప్రజ్ఞరూపులగు బ్రహ్మ, విష్ణువు, ఈశానుడు, ఇంద్రుడు, యముడు, వాయుదేవుడు, వరుణుడు ఇత్యాది అష్టదిక్పాలకులు - మొదలైన దేవతల సంకల్పశక్తిచే కల్పించబడిన ఈ నామ రూపాత్మక పాంచభౌతిక జగత్తుయొక్క అభిమాని. నామ రూపాత్మక జగత్తు యొక్క సందర్శనాభ్యాసముచే బద్ధుడు.

… అను భావ-ఆవేశములు కలిగి ఉన్నవాడు జీవుడు. తాను పరమాత్మయే అయి ఉండి కూడా, తనయొక్క జీవాత్మత్వము తన కల్పనా విభాగమే అయి ఉండినప్పటికీ, భౌతిక-సాకార దృష్టులకు బద్ధుడై పరిమితుడై ఉంటున్నాడు. “ఎందుకో మరి, నేను బద్ధుడను. మోక్షము లభించేది ఎట్లా?" … అని దృశ్యములో బంధముక్తి ఉపాయములకై దేవులాడుచూ, తన యొక్క ఈశ్వరత్వము - సర్వాత్మకమగు పరమాత్మత్వము గమనించటం లేదు. జీవమునకు జీవుడు అధ్యాసవశంగా బద్ధుడై ఉంటున్నాడు. ‘స్థూలోఽహమ్’ ఇతి అధ్యాసవశాః .

జీవము :  ’నేను స్థూలరూపపరిమితుడు’ అను అధ్యాసము (Avocation) వశమైనవాడే జీవుడు! జీవుని ఆశ్రయ స్థానము-జీవము!

బహుజీవః :  ఈ జీవుడు బాహ్యమున వేరు వేరు జీవులతో స్నేహము-ద్వేషము-శత్రువు-మిత్రుడు అయినవాళ్ళు కాని వాళ్ళు జాతి-దేశము ఇటువంటి సమష్టిత్వమునకు సంబంధితుడు అగుచున్నాడు. సోహమ్ ఏకోపి, దేహారంభక భేదవశాత్ “బహుజీవః”|

ఈ జీవుడు సర్వదా సర్వత్రా ఏకము-అఖండము అగు ఆత్మయే స్వరూపముగా కలిగి ఉండి కూడా, బుద్ధియొక్క భేదవశముచేత “బహు జీవుడు-సమష్టి జీవుడు" అగుచూ, స్వయంరచిత-కల్పనకు బద్ధుడుగా ఉంటున్నాడు. “బంధువులు-మిత్రులు మొదలైన కొంతమంది ఇతరులతో కలుపుకొని నాకు ఉన్నప్పుడే నేను సారవంతుడను”…. అను సమిష్టి కల్పనపై మనస్సుచే ఆధారపడి ఉన్నవాడు.

ప్రకృతి

బ్రహ్మణః సకాశాత్ నానా విచిత్ర జగత్ నిర్మాణ సామర్థ్యక బుద్ధిరూప బ్రహ్మ శక్తి రేవ ప్రకృతిః |

బ్రహ్మము-తన యొక్క బుద్ధి రూపశక్తిచే అనేక చిత్ర విచిత్ర కల్పనల-సంకల్పముల-జగత్తుల నిర్మాణ సామర్ధ్యము కలిగి ఉన్నది.

అట్టి బ్రహ్మము యొక్క సాకారరూపమగు నానా విచిత్ర జగత్ నిర్మాణ సామర్థ్యముగల బుద్ధి ప్రకాశక రూప బ్రాహ్మీ శక్తియే ప్రకృతి.

బ్రహ్మము = శివుడు, ఆత్మ, శక్తిమంతుడు.
ప్రకృతి = బ్రహ్మము (ఆత్మ) యొక్క బుద్ధి భావనాశక్తి ; సంకల్ప శక్తి (భవాని, ఊహ, స్వభావి, సంకల్పి, సృష్టి, చంచల ఇవన్నీ ప్రకృతియొక్క వ్యవహార నామములు)!

పరమాత్మ

దేహాదేః పరతత్వాత్ బ్రహ్మైవ పరమాత్మ | (పరమ్ + ఆత్మ = పరమాత్మ)
పరమ్ … ఆవల ! దేనికి ఆవల ? ఈ ఉపాధుల ప్రారంభమునకు, సర్వభావములకు మునుముందే ఉన్న స్వస్వరూపమే పరమాత్మ!
(జన్మ - కర్మలకు ఆవల సర్వదా కారణ కారణంగా ప్రకాశమైయున్నదియే - అట్టి బ్రహ్మము ! అదియే పరతత్త్వము!

ఆ పరమాత్మయే…, (లేక) పరబ్రహ్మమే … (లేక) ప్రతి జీవుని కేవల స్వస్వరూపము. అట్టి పరమాత్మ - బ్రహ్మ, విష్ణు, రుద్రుడు - ఇంద్రుడు - శమనుడు (యముడు) - సూర్యుడు - చంద్రుడు - సురులు - అసురులు - మనుష్యులు - పిశాచములు - అయి వేరు వేరు ప్రదర్శన రూపములుగా ప్రకటనమగుచున్నారు.

పిశాచము = భౌతికదేహ రహితమగు మనో ప్రజ్ఞారూపి!

ఇన్ని రూపములు తనవే అయినట్టి తత్త్వమే ‘పరమాత్మ’ ! అదియే పురుషులు, స్త్రీలు, స్థావరము, పశువులు, బ్రహ్మమును ఎరిగి ఉపాసిస్తున్న బ్రాహ్మణులు … ఇవన్నీ కూడా!

ఒక్క మాటలో చెప్పాలంటే!

“సర్వం ఖలు ఇదం బ్రహ్మ | న ఇహ నానాస్తి కించన" (నేహ నానా స్తి కించన)! ఇదంతా ద్రష్ట - దర్శన - దృశ్యములతో సహా అంతా బ్రహ్మమే! ఇదంతా స్వప్నస్వరూపమగు పరమాత్మ ప్రదర్శనమే! ఇక్కడ నానాత్త్వము కనిపించవచ్చు గాక ! ఇదంతా ఈ విధంగా కల్పనా దృష్టి - భావనా దృష్టిచే మాత్రమే అనుభవమగుచున్నది. వాస్తవానికి ఇక్కడ నానాత్వమనునదే లేదు. సంకల్పముచే నానాత్వము ఉన్నది! స్వస్వభావతః లేనే లేదు! నేను-నీవు-లోకులు-లోకపాలకులు-లోకములు- ఇవన్నీ బ్రహ్మమునకు అభిన్నమగు కల్పనలు.

జాతి

న చర్మనో, న రక్తస్య, నామాంసస్య, న చ అస్థినః, న ఆత్మనో జాతిః ॥ 

ఈ లోకములో ప్రసిద్ధమై కనిపించే “ఈ జాతి - ఆ జాతి”… మొదలైనదంతా కూడా స్వతఃగా ఉన్నవి కావు. ఈ దేహములోని రక్తమునకు జాతిభేదము ఉన్నదా ? మాంసమునకు, బొమికలకు ఈ జాతి ఆ జాతి అనునదంతా ఉన్నదా? లేదు కదా! ఇక ఆత్మకో? ‘జాతి’ అనునది సంబంధించియే లేదు. మరి జనులలో ప్రసిద్ధమైయన్న ‘జాతి’ భేధమనుదంతా ఏమిటి? - వ్యవహార ప్రకల్పితః ॥ మానవులచే పరస్పర - వ్యవహారికంగా, కించిత్ సౌకర్యము కొరకై కల్పించుకొన్నది. అఖండము - అప్రమేయము అగు ఆత్మయందు జాతి బేధము ఎక్కడినుండి వస్తుంది ? అందుచేత వ్యావహారిక కల్పితమైన దానిని వ్యావహారిక పరిమితముగా మాత్రమే చూడాలి. వ్యావహారిక సౌలభ్యమును మాత్రమే దృష్టిలో కలిగి ఉండాలి. బంగారపు గాజులు, ఉంగరము, గొలుసులు, అరవంకె… మొదలైనవన్నీ ఆకార - ఉపయుక్తముల దృష్ట్యా వేరే! కానీ, బంగారము దృష్ట్యానో? ఒక్కటే!

ఈ పేరు గల వీధి పేరు - ఆ పేరు గల వీధి పేరు -
ఈ ఊరు - ఆ ఊరు
ఈ ప్రాంతము - ఆ ప్రాంతము
ఈ రాష్ట్రము - ఆ రాష్ట్రము
ఈ దేశము - ఆ దేశము
ఈ భాషవారు - ఆ భాషవారు
ఈ ఆచారము వారు - ఆ ఆచారము వారు
ఈ చదువు చదువు వారు - ఆ చదువు చదువు వారు
ఈ పాఠశాల విద్యార్థులు - ఆ పాఠశాల విద్యార్థులు
ఈ పేరువాడు ఆ పేరువాడు, నీవు - నేను - ఆతడు - ఆమె - ఈమె!

… మొదలైన ఇవన్నీ ఏవిధంగా వ్యావహారికము మాత్రమే! (పరస్పరము వ్యవహరించుకొనుటకొరకై ఒకానొక వీలైన విధానము మాత్రమే!…).

ఆ రీతిగానే ‘జాతి’ అనునది చూడాలి గాని వస్తుతః భేద దృష్టితో కాదు ! "జాతిః వ్యవహార ప్రకల్పితా” అనునది ఏమరువకూడదు.

ఆత్మ దృష్ట్యా, ఆధ్యాత్మ అధ్యయనము దృష్ట్యా, వేదాంత శాస్త్ర గ్రహణము దృష్ట్యా - “ఆయా భేదములన్నీ మొదలే లేవు. అవి ఏ సందర్భము కొరకై పరికల్పన చేయబడ్డాయో… అంత వరకే ఆ సందర్భము కొరకు మాత్రమే పరిగణము చేయబడును గాక”…. అను అవగాహనయే అఖండ బ్రహ్మజ్ఞానము. (ఉదా : ఒక తరగతి గదిలో “బాగా మార్కులు వచ్చినవారు - మధ్యరకంగా మార్కులు వచ్చినవారు - తక్కువ మార్కులు వచ్చినవారు”…. అను విభాగము సందర్భానుకూలము కావచ్చు గాక ! అంతేగాని, ”వీరు ఆ కులము వారు ఈ కులము” … అనునది విద్యార్జన దృష్ట్యా అసందర్భము కదా !)

కర్మ - ఇతి చ |

క్రియమాణ ఇంద్రియైః కర్మాణి “అహమ్ కరోమి” ఇతి  ఆధ్యాత్మ నిష్ఠతయా, కృతం కర్మైవ ’కర్మ’ |

ప్రకృతి చేతను (పంచభూతముల చేతను - అశరీరములగు సృష్టి ప్రజ్ఞలు {లేక దివ్య ప్రజ్ఞలు, దేవతలు} చేతను) నిర్మించబడుచూ, క్రియామానమగుచున్న ఈ ఇంద్రియములు నిర్వర్తించు కర్మలను ఈ దేహధారి “ఇవన్నీ నేనే చేయగలుగుచున్నాను. ఇంతటి వాడిని కాబట్టి చేస్తున్నాను”… అని అనుకుంటూ ఉండటమూ,
“అహం కరోమితి - నేను దీనికి కర్తను”… అని తలచటము,
అట్టి ఆధ్యాత్మ (వ్యష్టి) నిష్ఠతతోను, కర్మల పట్ల అభిమానముతోను కర్మలను నిర్వర్తించటమునే ‘కర్మ’ - అంటున్నారు!

“నేనే” కర్తను ! నేనే భోక్తను । నేనే ఈ ఇంద్రియములకు యజమానిని ॥ ఈ ఇంద్రియములు నావే॥ మరొకరి పాత్ర వీటిలో | లేదు | మరే దైవీశక్తీ లేదు । ఈ కాళ్ళు చేతులు నా తెలివితేటల చేతనే ప్రవర్తిస్తున్నాయి. కనుక నేనే వీటి క్రియా విశేషాలకు యజమానిని - కర్తను కూడా॥" … అని తలచు వానిని “ఈతడు కర్మిష్టుడు”… అని చెప్పబడుచున్నది. ఎవ్వడైతే “ఈ ఇంద్రియముల నిర్మాత జీవుడుగా నేను కాదు. కనుక వీటిచే నిర్వర్తిస్తున్నవి కేవలము నా వ్యష్ఠి సంబంధమైన తెలివికాదు”… అని ఎరిగి ఉంటాడో, అతడు ‘కర్మిష్టుడు’ అని పిలవబడడు. కర్తృత్వము ఉంటే కర్మిష్ఠుడు. లేదా…. అకర్మిష్టుడు.

అకర్మ - ఇతి చ |

కర్తత్వ - భోక్బత్యాది అహంకార తయా బంధ రూపమ్ | జన్మాది కారణం। నిత్య నైమిత్తిక యాగవ్రత తపోదానాదిషు అఫలాభిసస్థానం - యత్, తత్ “అకర్మ” |

కర్తృత్వ-భోక్తృత్వములను అహంకారముతో నిర్వర్తించటమే బంధరూపము. అదియే జన్మ పరంపరలకు కారణం ! ఎవ్వరైతే నిత్యము చేస్తున్న లౌకిక కర్మలనుగాని, ఉపాసన కర్మలను గాని, నైమిత్తక కర్మలను గాని (occasionally) (ఉదా : కార్తీక మాసవ్రతాలు, అప్పుడప్పుడు నిర్వర్తించే నోములు, ఏవైనా.. దేవుడు పెళ్ళి… ఇటువంటి సందర్భములలో నిర్వర్తించే కార్యక్రమాలు… ఇవన్నీ నిమిత్తాన్ని అనుసరించి చేసేవి కాబట్టి నైమిత్తిక కర్మలు) ‘అకర్తాఽహమ్’ (న అహం కర్తా) భావనతో చూస్తారో… వారు కర్మచేయనివారే !

ఇవన్నీ కర్తృత్వ - భోక్తృత్వ అభిమానములతో చేస్తూ ఉంటే బంధము అవగలవు.

“ఆత్మజ్ఞాన సమన్వితుడనై, సమర్పణ - ఉపాసనాభావంతో సర్వాత్మకుని ఆనందిపజేయటానికి ఉద్దేశ్యించెదనుగాక ”… అను అవగాహనతో నిత్య-నైమిత్తిక కర్మలు గాని, యాగ-వ్రత-తపో-దానములు మొదలైనవిగాని చేయువారు అకర్మిష్ఠులే!

“నాకు ఏమి లభించింది ?” అనే ఫలాభిసంధానమును వదలివేసి, విజ్ఞులు "దేహము ప్రసాదించిన పరమాత్మ ఉద్దేశ్యమును నెరవేరుస్తున్నాను. ఆ సర్వాత్మకుడగు, సర్వతత్త్వ స్వరూపునికి సమర్పిస్తున్నాను”.. అను అకృత్రిమ - స్వభావ సిద్ధమైన భావనతో కర్మలు నిర్వర్తించుచున్నారు. వారు కర్మలు చేయనివారే అగుచున్నారు. కాబట్టి వారికి కర్మ బంధము ఉండదు.

జ్ఞానమ్ - ఇతి చ |

దేహ ఇంద్రియ నిగ్రహ, సద్గురూపాసన, శ్రవణ మనన నిదిధ్యాసనైః ; యద్యత్ దృక్ - దృశ్యస్వరూపం ; సర్వాంతరస్థం ; సర్వసమం ; ఘటపటాది పదార్థమివ అవికారం. "వికారేషు (చ) చైతన్యం వినా కించిత్ నాస్తి-ఇతి సాక్షాత్కారనుభవమ్ జ్ఞానమ్||

దేహ ఇంద్రియ నిగ్రహమ్ : దేహ - ఇంద్రియములను - ఆయా విషయములకు, సందర్భములకు, సంబంధములకు, సంఘటనలకు ముడిపెట్టి సమర్పించివేయకుండా… నిగ్రహము (Forbearence and control) కలిగి ఉండటము.

సద్గురూపాసనమ్ : సాంసారికమైన తన యొక్క - తదితర సాంసారిక దృష్టిగల జీవుల యొక్క అభిప్రాయములను, ఆశయములను ప్రక్కనపెట్టి, ఆత్మ తత్త్వజ్ఞులు-తత్త్వమ్ అని ఎరగియున్నట్టివారు అగు, మహదాశయులగు సద్గురువులను సమీపించి, వారు ఏ జ్ఞాన దృష్టితో ఈ జగత్తు-దేహ-అంతరంగ స్థితి - గతులను దర్శించుచున్నారో… అట్టి సత్య దృష్టి, బ్రాహ్మీదృష్టి, తాత్త్విక దృష్టి … సంబంధమైన సమాచారమును వారి వద్ద సముపార్జించుకోవాలి. ఇదియే జ్ఞానమార్గము.

‘సత్’ను గురువుగా (పరాకాష్ఠగా) అభ్యసించి - దర్శించటము సద్గురూపాసనము. సత్యద్రష్టలగు మహనీయులను శరణువేడి శ్రవణం చేయడం - సద్గురూపాసనము.

శ్రవణ - మనన - నిదిధ్యాసనైః : గురువుల ‘తత్వమ్’ అని నిరూపించు ఆప్త వ్యాక్యాలను ముందుగా శ్రవణం చేయాలి. 

“వారు ఇట్లా కర్మ - జ్ఞాన - భక్తి - యోగ సాధనల గురించి, ఆత్మతత్త్వ స్వరూపము గురించి ఎందుకు పలుకుచున్నారు ? ఆత్మయొక్క బాహ్యర్థము - గూడార్థము ఏమిటి ? సద్గురువుల అసలు ఉద్దేశ్యము ఏమిటి? " … అను విశేషాలను మననము చేయాలి.

అనుమానాలు వస్తే, తిరిగి ఆత్మజ్ఞుల వద్ద అనునయముగా ప్రశ్నించి, వారి ఉద్దేశ్యములను - అనుభవములను - అవగాహనలను వాటి వాటి ప్రశ్న - సమాధానములను సమకూర్చుకోవాలి. వేదోపనిషత్ మహావ్యాకార్థ నిరూపణా సమాచారమును మననము చేసుకొంటూ విశ్లేషించుకోవాలి. విశదీకరణము చేసుకోవాలి.

ఈవిధంగా సద్గురువులు ప్రకటిస్తున్న ఆత్మసాక్షాత్కారము (లేక) బాహ్మీ దృష్టిని స్వీకరించి, మనో-బుద్ధులచే - అభ్యాసవశంగా దైనందికము, అనుక్షణికము చేసుకోవాలి. ఇది మననము.

గురువాక్యార్టాన్ని బుద్ధితో హృదయమునందు నిలిపి, హృదయాకాశంలో స్వస్వరూప పరబ్రహ్మమే అయిఉన్న సర్వలోకములను ‘ఆత్మాంతర్గతమ్’ అయినట్లు దర్శించుచుండటమే ‘నిదిధ్యాస’.

తెలుసుకొనుచున్న దానిని, అభ్యాసం చేస్తున్నద్ధానిని నిత్యానుభూతిగా సిద్ధింపజేసుకోవటమే ‘నిదిధ్యాస’. (To transform all that being
known and all that being practised - into every minute. Experience is ‘Nidi-Dhyasa’)

అదృక్ - దృశ్య రూపము : ఏ పరబ్రహ్మమైతే దృక్ - దర్శన - దృశ్యరూపములకు ’నాటక దీపము’ వలె సాక్షియై ఆవల ఉండి, కేవలము ఆధారమై, తానుమాత్రం నిరాలంబమై, నిరాధారమై ఉన్నదో… అట్టి బ్రహ్మము గురించిన సమాచారమే జ్ఞానము. అట్టి సర్వాధారమగు ఆత్మ వస్తువును ద్రష్ట - దర్శన - దృశ్య రూపమగు ఇంద్రియ జగత్తులో వెతికి లాభమేమున్నది ? “చూపు”కు, చూచువానికి ‘సాక్షి’ రూపమై ఉన్నది. దృక్-దృశ్యమంతా ఆత్మకు అభిన్నంగా తోచు విజ్ఞానమే జ్ఞానము.

సర్వాంతస్థమ్ : “అట్టి పరబ్రహ్మము మరెక్కడో దూరంగా ఉండి, ఎన్నటినో లభించేది కాదు. అది సర్వుల యందు, ఈ సర్వమునందు (ఆభరణములో బంగారమువలె, వస్త్రములో దారమువలె) అంతస్థమే (Internally and inwardly ever - present) అయి ఉన్నది” అని చర్చ - దృష్టాంతపూర్వకంగా నిర్ద్వంద్వముగా నిరూపించునదే జ్ఞానము.

సర్వసమమ్ : “అనేక కుండలలో ఒకేమట్టి (మృత్తికేవ సత్యమ్) … అను రీతిగా, అది సర్వదేహములో సర్వత్రా కూడా సమస్వరూపమై ఉన్నది. నాటకములోని పాత్రల స్వభావములన్నీ నాటక రచయిత యొక్క ఒకే భావనా - ఊహా చైతన్యమే - అయిఉన్న తీరుగా, ఆ పరబ్రహ్మము విజ్ఞులలోను-అజ్ఞులలోను, ఒక పురుగులోను సృష్టికర్తయగు బ్రాహ్మదేవుని యందు సమముగా ఉన్నది (సమమ్ సర్వేషు భూతేషు తిష్ఠన్తమ్ పరమేశ్వరమ్) - ఏ సమాచారము, విశ్లేషణ.. మొదలగునవి అట్టి అవగాహనను కలిగిస్తూ ఉన్నాయో… అదియే జ్ఞానము.

ఘట - పటాది పదార్థమివ అవికారమ్ : కుండకు ఆకారమున్నది. మరి ఆ కుండ ఏ మట్టితో నిర్మితమైనదో… అట్టి మట్టికి ఆకారమున్నదా ? మట్టి కుండను చూచి, "మట్టి కుండవలె గుండ్రముగా ఉండును’… అని ఎవ్వరైనా అనగలరా ? అట్లా అనము కదా!

వస్త్రమునకు, ఆ వస్త్రముతో తయారైన చొక్కా (Shirt) కు ఆకారము ఉండవచ్చు గాక | వస్త్రము యొక్క (లేక) చొక్కా యొక్క ఆకారమును “దారము యొక్క ఆకార ధర్మము”… అని అనగలమా? లేదు కదా ! అట్లాగే పరబ్రహ్మము (మట్టి - దారమువలె ఘట పటాదివ) నిరాకారము… అని విశదీకరించునది జ్ఞానము. 

“దేహము సాకారము కావచ్చు గాక ! ఆ దేహమును - కదల్చుచున్న దేహి గాని, సర్వ దేహములలో దేహిగా సంప్రదర్శనమగుచున్న ‘పరమాత్మ’ గాని నిరాకారులేకాని, సాకారము కాదు… అని సుస్పష్టపరచు విశదీకరణమే జ్ఞానము. పరమాత్మ సర్వదా అవికారుడు, నిర్వికారుడు ! ఈ జగత్తు… సవికారము. అస్థిరము. చంచలము కూడా.

“చైతన్యం వినా కించిత్ నాస్తి" - ఇతి సాక్షాత్కారముభవమ్ జ్ఞానమ్ :  “పరబ్రహ్మ చైతన్యమే ఈ విధంగా బ్రహ్మాండ దృశ్యముగా అజ్ఞాన దృష్టికి అగుపిస్తోంది. జ్ఞాన దృష్టిచే ఇదంతా ఆత్మ చైతన్యమే ! ఆత్మ చైతన్యమే నీవు! - సాక్షాత్ తత్ త్వమ్ అసి… అని ఏ సంభాషణ ప్రతిపాదించి నిరూపిస్తోందో… అదియే జ్ఞానము.

అజ్ఞానమ్

“రజ్జౌ సర్పభ్రాంతిః” ఇవా, అద్వితీయే, సర్వానుస్యూతే, సర్వమయే బ్రహ్మణి…,
దేవ తిర్యక్ నర స్థావర స్త్రీ పురుష వర్ణాశ్రమ బంధ మోక్ష ఉపాధి
(ఇత్యాది) నానాత్మ భేద కల్పితం జ్ఞానం - (ఇతి) … “అజ్ఞానమ్” |

ఏ పరబ్రహ్మమైతే సర్వదా ద్రష్టకు (శ్రోతకు నాకు నీకు మనందరిలో ప్రతి ఒక్కరికీ) అద్వితీయమై, సర్వస్వరూపమై, - పూదండలో దారమువలె సర్వమునకు అనుస్యూతమై, సర్వమయమై సర్వదా సర్వత్రా ఘనీభూతంగా వేంచేసియున్నదో… అట్టి పరబ్రహ్మతత్త్వమునకు భేదకల్పనయే అజ్ఞానము!… దేవతలు వేరు. తిర్యక్ జంతువులు వేరు. స్థావరములు ఇంకా వేరైనవి. స్త్రీలు వేరు. పురుషులు వేరు. అందరూ కూడా వర్ణాశ్రమ ధర్మాల చేత వేరు వేరు. బ్రహ్మచర్యాశ్రమము వారు - గృహస్థులు - వానప్రస్థులు - సన్యాసులు, వీరంతా వేరు వేరు తెగలకు చెందినవారు | ఇక్కడ బంధము ఉన్నది ! మోక్షమున్నది ! మోక్షము పొందినవారు వేరుగా ఉన్నారు. బద్ధులేమో ఇక్కడ ఉన్నారు. యోగాభ్యాసులు వేరు. భక్తులు వేరు. జ్ఞానులు వేరు. కర్మ యోగలు మరొక రీతివారు. ఈ విధంగా భేద కల్పన చేసి చూడటమే ‘భ్రాంతి’ అని ‘అజ్ఞానము’ అని చెప్పబడుచున్నది.

ఇట్టి భేద దర్శనమంతా ఎట్టిదో, ఇక్కడ ఒక దృష్టాంతము చెప్పుకుందాము.

రజ్జౌ సర్ప భ్రాంతిః : ఒక బాటసారి ఒకదారిలో వెళ్ళుచూ ఉండగా కటిక చీకటిలో కాలికి మెత్తగా ఏదో తగిలింది… “అమ్మ బాబోయ్! చాలా పెద్ద పాములాగుందే! చుట్టలు చుట్టుకొని ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది బుస్సున లేచి కాటేస్తుందా ఏమి? పోనీ వెనుకకు అడుగులు వేద్దామా… నా అడుగుల శబ్దమునకు ఈ త్రాచుపాము కాటేస్తే? చచ్చానే! ఇక్కడ దగ్గరలో ఎవ్వరూ లేరు కూడా! నన్ను ఎవ్వరు రక్షించేది?”… అని భయకంపితుడై వణకుచున్నాడు. పాము కాటుకు నేల మీద పడి విషము దేహములో ప్రవేశించటం చేత కొట్టుకు-కొట్టుకు చావటమునకు సంబంధించిన-ఎప్పటివో కొన్ని తాను చూచినవి, వార్తలుగాను, సమాచారములుగాను విన్నవన్నీ అతనికి గుర్తుకు రాసాగాయి.

ఇంతలో…
ఆ బాటలో ఎవరో ఒక పెద్ద మనిషి అటుగా వెళ్ళుచూ, “ఏమిటయ్యా బాబూ, నీ గోల?”… అని పలకరించాడు. అప్పుడా బాటసారి "అయ్యా! నా కాలికి ప్రక్కగా పాము ఉన్నది! త్రాచుపాము ! చచ్చినట్లే ! నన్ను కాపాడండి !”… అని అరవనారంభించాడు. అప్పుడు రెండవ పెద్ద మనిషి, “ఏమిటి? పామా ? ఏదీ ? చూద్దాం !”… అని విజ్ఞత-అనుభవములతో చూచాడు. అక్కడ ఉన్నది ఒక చాంతాడు!

అప్పుడా రెండవ ఆయన, “భలేవారండీ ! చూడండి ! ఇది త్రాడు !” అనగానే మొదటి బాటసారికి భ్రమలు, భయాలు, వణుకులు క్షణంలో మటుమాయమయినాయి.

“అయ్యా ! రక్షించారు ! మెత్తగా కాలికి తగులుచున్నట్లుగా ఉంటే, ఇది పామేమోనని భయపడి చచ్చానంటే నమ్మండి” అని అనుకుంటూ చిరునవ్వు తెచ్చుకుని, అక్కడి నుండి సాగిపోయాడు. త్రాడుయందు పామును అకస్మాత్తుగా అవిచారణగా చూడటము వంటిదే ఆత్మయందు ‘జగత్తు’ను ఆత్మకు భిన్నముగా దర్శించటము! ఇక్కడ అఖండమగు స్వస్వరూప - సర్వస్వరూప - అప్రమేయ బ్రహ్మమే సర్వదా సర్వత్రా వేంచేసి ఉండగా-అనేకత్వమును దర్శించటము, అనేక భేదములను ఆపాదించటము ఇవన్నీ మనస్సుతో కల్పించుకొని అనుభవములుగా పొందటము జరుగుతోంది! ఇదియే - అజ్ఞానము!

సుఖమ్

సత్ - చిత్ - ఆనంద స్వరూపం జ్ఞాత్వా, ’ఆనందరూపస్థితి’ ఏవ ‘సుఖమ్’ !

ఆత్మ యొక్క సత్ (ఉనికి) - చిత్ (ఎరుక, వెలిగించునది) - ఆనంద (అంతా అద్దాని అనుభూతియే వినోదమే) … అను తత్త్వమును తెలుసుకొని, సర్వము సచ్చిదానంద స్వరూపముగా దర్శించుచుండగా ఏర్పడు ఆనంద రూప స్థితియే “సుఖమ్”.

దుఃఖమ్

అంతః సంసార విషయ సంకల్ప ఏవ - దుఃఖమ్ |
అంతరంగములో (హృదయములో) కల్పన!

కథ చదువుచూ ఉన్నప్పటి కథలోని విషయాలకు, కల చూస్తూ కలలోని విషయాలకు ఆవేశపడు తీరుగా, నాటకం చూస్తూ, నాటకములోని సందర్భములకు మనస్సు స్పందించు తీరుగా, దృశ్య-ఇంద్రియ సంబంధమై సంగతులు, సంఘటనలు, వ్యవహార సంబంధములు-ఇవన్నీ సంకల్పించుకొని - మనస్సు భావావేశము పొందుతూ ఉండటమే దఃఖములన్నిటికీ మూలము. దృశ్య విషయములు ఆశించటము,… అల్పాశయములు-ఇవన్నీ దుఃఖములకు బీజము.

స్వర్గమ్

సత్ సంసర్గః స్వర్గః |

ఏది కల్పన (లేక అసత్తు) ? ఏది సత్తు (సహజ సత్యము) ? … ఈ రెండింటినీ బుద్ధితో విడదీసి, విభాగించి సత్ (సర్వదా ఉండి ఉన్న) వస్తువుతో సర్వదా సంసర్గము (Relatedness) కలిగి ఉండటము… అసత్ వస్తువుతో (సర్వభేదకల్పనలతో) అసంసర్గము కలిగి ఉండటము… ఇదియే ‘స్వర్గము’ (సు-వర్గ తి స్వర్గమ్). సత్తు గురించి సంభాషించుకొనుచూ, పరస్పరము సంతోషము పొందుచుండటమే ‘స్వర్గము’.

నరకమ్

అసత్ సంసార విషయ జనన సంసర్గ ఏవ ‘నరకః’ |

అసత్ = స్వతఃగా లేనిది.
సంసారము = లేని దానితో - కల్పనచే ఘనీతమైపోయిన సంబంధానుభవం.

కేవలము ఊహాజనితము, స్వకీయ కల్పనా నిర్మితము, తనకు తానుగా ఆశ్రయించిన భ్రమచే నిర్మిమై అనుభవమగుచున్నట్టిది ఈ దృశ్యము. అట్టి దృశ్యరూప సంబంధ-అనుబంధ మనోవికారములచే జనించు స్థితితో కలిగియున్న బంధమే-సంబంధమే (Relatedness) అసత్ సంసారము. అద్దాని సంసర్గముతో ఏర్పడు స్థితిని ‘నరకము’ అని పిలుస్తున్నారు.

బంధము

అనాది అవిద్యావాసనయా ’జాతో..హమ్… ఇత్యాది సంకల్పో ’బంధః’ |

ఈ విధమైన సంకల్పము కలిగి ఉండటమే “బంధము” |

మమతా సంసారావరణ సంకల్పోబంధః । 

"ఈ తండ్రి, ఈ తల్లి ఈ సహోదర - సహోదరిలు, భార్యా - పుత్రులు, నేను పుట్టిన ప్రదేశము, ఈ ఇల్లు - వాకిలి, ఈ ఆరామ క్షేత్రము (గుడి) … మొదలైనవన్నీ నాకు చెందినవి. నేను వీటిని బంధించినవాడిని. ఇది ఇంతే !”…. అనే ‘మమత’తో ఆవరించబడటమూ, సంకల్ప-వికల్ప పరంపరల మధ్య ఊయలు ఊగుచుండటమే బంధము!

కర్తృత్వాది అహంకార సంకల్పో బంధః |

ఇవన్నీ కర్తృత్వ - భోక్తృత్యాది రూపమగు అహంకార - మమకారములతో కూడిన సంకల్పములు. ఈ సంకల్పములన్నీ జీవునికి అప్పటికప్పుడుగాని (లేక) కాలక్రమేణ కానీ (By Eventuality) బంధమే - అగుచున్నాయి.

అణిమాది అష్టేశ్వర్య ఆశాసిద్ధ సంకల్పో బంధః| - అణిమాది అష్ట సిద్ధులు బంధమే. 

అణిమ = అణురూపుడై, ఎదుటివారి చూపుకి మాయమైనట్లుగా అగుపించగలగటము.
మహిమ = విరాట్ రూపుడై, ఆకాశము - · భూమి అంతటా నిండి ఉండటము.
గరిమ = కొండంత బరువుగా అవటము.
లఘిమ = దూదికంటే కూడా తేలికగా అయి అకాశంలో ఎగురగలగటము.
ప్రాప్తి = సంకల్పించిన వస్తువులను సృష్టించగలగటము.
ప్రాకామ్య = క్షణంలో అనుకున్న చోట ప్రత్యక్షము కాగలగటము.
ఈశిత = దృశ్యమును - ప్రదేశమును ఆక్రమించి, అద్దానికి అధికారి కాగలగటము
వశిత్వ = ఎదుటివారిని ఆకర్షించి, క్షణంలో వశము చేసుకోగలగటము.

ఈ ఈ అష్టసిద్ధులు జీవునకు ఏకాగ్రతతో కూడిన యోగభ్యాసముచే సిద్ధించలవు. అయితే, వీటికి సంబంధించిన దృశ్య ప్రయోజనములు జీవునికి ఆత్మజ్ఞానమార్గములో ప్రతిబంధములే అగుచున్నాయి. తనను తాను ఎరుగక, వాటిచే అస్వతంత్రుడుగానే మిగులుచున్నాడు. జ్ఞానమార్గంగా చూస్తే అవన్నీ (అష్టసిద్ధులు కూడా) ధన సంపద, జన సంపదవలె స్వల్ప విశేషాలు మాత్రమే! అవి బంధమే!

అష్టైశ్వర్యములతో సంబంధము బంధమే! : దాసీ జనము - భృత్యులు - భార్యా భర్తల పరస్పరత్వము - పుత్రులు - మిత్రులు - వాహనములు - ధనము - ధాన్యము … మొదలైనవాటికొరకై జీవుడు ఎన్నో మార్గములలోతాపత్రయపడుతూ ఉంటాడు. లేని వాడు, “అవన్నీ పొందితే బాగు కదా!” అని తలచుచూ, “ఎట్లాగురా, పొందేది?”… అని యోచనలు చేస్తూ ఉంటాడు. అవన్నీ ఉన్నవాడో? “ఇప్పుడు నేను పొందవలసినదంతా పొందాను. ఇక పొందవలసినదంటూ ఏమీ లేదు”… అనే స్వాంతన స్థితి పొందడు. వాస్తవానికి వాటికి సంబంధించిన - "ఉన్నవి, లేవు” మొదలగు సంకల్పమున్నీ ’బంధము’ కలిగించునవే అగుచున్నాయి.

దేవ మనుష్యాది ఉపాసనా కామ సంకల్పో బంధః : ఏవైనా లోక సంబంధమైన కోరికలతో, “అది పొందాలి ! ఇది కావాలి”… ఇటువంటి కామ సంకల్పముతో దేవతలను, మనుష్యులను ఉపాసించటము-ఈ జీవునికి “ఆత్మతత్త్వ సముపార్జన”… మార్గములో ప్రతిబంధకములే అయి ఉంటున్నాయి.

యమాది అష్టాంగయోగ అభ్యాసాది సంకల్పో బంధః |

సర్వదా సిద్ధించియే ఉన్న ఆత్మను గుర్తెరుగుటచే ఆత్మ స్వరూపసిద్ధి లభించగలదు. అన్య భావనలను జయించి “ఆత్మతో-అనన్యానుభవము”ను ఈ జీవుడు సంపాదించుకోవాలి. అది ఏమరచి అష్టాంగ యోగ సంకల్పములను ఆశ్రయిస్తూ “ఈ యోగసాధనయేనా కార్యక్రమము”… అని సంకల్పించువానికి… అది అతని పట్ల బంధము రూపమే అగుచున్నది. యోగము ఆత్మానుభవము కొరకు కాకుండా, యోగినని అనిపించుకోవటానికైతే, అది బంధమే!

“యమము (ఇంద్రియ నిరోధము), నియమము (ఇంద్రియ నియామకము) ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అను అష్టాంగ యోగములు ఎంతో కాలం అభ్యసించాలి. అప్పుడు కానీ, ఆత్మ సాక్షాత్కారము సిద్ధించదు”… అని అనుకోవటము, ఆ రీతిగా సంకల్పములు కలిగి ఉండటము కూడా బంధమే!

ఎందుకంటే…

ఎల్లప్పుడూ సిద్ధించియే ఉన్న పరమానందమగు పరబ్రహ్మతత్త్వము సిద్ధించటానికి ఎప్పుడో, ఏదో అష్టాంగ యోగములు నిర్వర్తించవలసిన
పనేమున్నది?

’కనిపించేదంతా అదే’ అయి ఉండగా, కన్నుమూతలు దేనికి?

ఒకడు ఒక నాటకములో నటిస్తూ, “ఇది నేను నటించు పాత్ర! నా సహజ రూపము ఈ (జగత్) నాటకమునకు సర్వదా వేరు” - అని తెలుసుకొని ఉండటానికి ఎంతసేపు పడుతుంది?

వర్ణాశ్రమ ధర్మ కర్మ సంకల్పో బంధః :  “అబ్బో ! మన వర్ణ ధర్మములు చాలా గొప్పవి ! తదితర వర్ణముల వారికి ఇంత గొప్ప వర్ణ ధర్మములు కావు. మనము ఇంకా ఇంకా ఈ నియమాలు పాటించాలి. నిష్టలు అనుసరించాలి!-ఇటువంటి సంకల్పము కూడా బంధమే!

అంతే కాదు..,

“ఇవి బ్రహ్మచారి - గృహస్థ - వానప్రస్థ - సన్న్యాస ఆశ్రమ ధర్మాలు. ఇవన్నీ - ఇట్లాగూ, అట్లాగూ పాటించాలి. లేదా, నకరం! ప్రమాదం! తప్పు!”… ఇటువంటి సంకల్పాలు కూడా ఈ జీవునికి బంధమే కలుగజేస్తున్నాయి.

అజ్ఞా (ఆజ్ఞా)-భయ సంశయాం త్మ గుణ సంకల్పో బంధః॥
అజ్ఞానము - ఆశలు… బంధమే!

వీరిని నేను ఆజ్ఞాపించాలి. వారి ఆజ్ఞలు నేను పాటించి తీరవలసినదే ! తప్పదు! ఏం చేస్తాం! కర్మ! ఏది ఎప్పుడు ఎట్లా ఎందుకు ఏదిగా పరిణమిస్తుందో తెలియనప్పుడు అంతా భయము కాక, మరింకేమిటి? మాకు అనేక సంశయాలు ఉన్నాయి. అవన్నీ తొలిగితే కదా, మోక్షము ! మరి ఈ మా సంశయాలు ఎప్పటికి, ఎట్లా తొలగుతాయి ? చాలా కష్టం ! మనమంతా త్రిగుణములలో చిక్కి ఉన్నాము. పరమాత్మ త్రిగుణాతీతుడు. ఈ గుణములు శమింపజేసుకొని పరమాత్మను జేరటం తేలికైనపనా? కాదు ! అందుకు మనము ఇంకా ఇంకా చాలా చాలా ప్రయత్నాలు చేయాలి లెండి !” ఇటువంటి సంకల్పములన్నీ జీవునికి బంధమే అగుచున్నాయి. ఎందుకంటే, అనునిత్యమగు సత్యమును స్ఫురింపజేటానికి మోక్షము కొరకై శాస్త్రములు సాధనరూపంగా కల్పించినదంతా అజ్ఞాన దృష్టిచేత బంధముగానే పరిణమిస్తున్నాయి. విజ్ఞాన దృష్టిచే మాత్రమే మోక్షప్రదాతలు అగుచున్నాయి.

యజ్ఞ - వ్రత - తపో - దాన - విధి - విధాన జ్ఞాన సంకల్పో బంధః |
యజ్ఞములలో ఎన్నో విధి విధానమలు ఉంటాయి. అవన్నీ కూడా ఇంకా ఎన్నో చేయాలి ! సోమయాజిని కావాలి. వ్రతములు తపస్సులు - దానములు ఇంకా ఎంతగానో విధి విధానంగా నిర్వర్తించాలి. ఇవన్నీ నాలాగే కొందరే చేయగలరు. యజ్ఞ-యాగ-తపస్సులకు సంబంధించి అనేక పద్ధతులు ఉంటాయి. అవన్నీ పాటించాలి మరి! చాలా మందికి చాలా విషయాలు తెలియటము లేదు. చెప్పితే కూడా విధి విధానాలు ఆచరించటం లేదు. అవియే ముఖ్యము! నాకే అవన్నీ ఎరుక!” ఈ విధంగా యజ్ఞ - తపో - దాన - విధి విధానముల గురించిన సమాచారములు, సంకల్పములు కూడా బంధమే అగుచున్నాయి.

కేవల మోక్షాం పేక్ష సంకల్పో బంధః |
“మోక్షమొక్కటే ముఖ్యం ! అందుకే ప్రయత్నించాలి. మిగతా విషయాలు పట్టించుకోకూడదు. మానివేయాలి" అను రూపముగల సంకల్పములూ బంధమే అగుచున్నాయి.  “బంధము మొదలే లేదు” అనునదే అత్యుత్తమ పాఠ్యాంశము. జీవాత్మ జగదంతర్గత వస్తువు. కల్పన చేయబడినట్టిది. నాటకంలోని పాత్రవలె అద్దానికి బంధము-అనునది లేదు. మోక్షము లేదు. పరమాత్మత్వము నిత్యముక్తము. కనుక బంధమే లేదు. బంధమే లేని దానికి మోక్షమను మాట ఏముంటుంది? ఈ విధంగా “నాకు ఎట్లాగైనా మోక్షము లభించాలి ! ఎట్లాగురా బాబూ ?”… అను సంకల్పము కూడా బాధయే ! చివరికి మోక్షము కావాలి అనునది కూడా సన్న్యసిస్తే గాని మోక్షస్థితి సిద్ధించదు. (ఇతి మోక్ష సన్న్యాస యోగః).

ఓ బిడ్డలారా ! ఒక్క మాటగా చెప్పాలంటే,…. అసలు ‘సంకల్పము’ అనునదే బంధము.

సంకల్పములు తనవి అయి ఉండగా, ఈ జీవుడు తనను తానే (ఆత్మను) - సంకల్పముల పరంపర కారణముగా ఏమరచుచున్నాడు. సంకల్పములు ఉన్నంతవరకు దేహ - దేహాంతరములు కొనసాగుచూనే పోతున్నాయి.

అందుచేత “సంకల్పమే బంధము - నిస్సంకల్పమే మోక్షము”… అని చెప్పబడుతోంది.

మోక్షము

నిత్య-అనిత్య వస్తు విచారత్, అనిత్య సంసార సుఖ-దుఃఖ విషయ… సమస్త క్షేత్ర మమతాది సమస్త బంధ సంకల్పక్షయో మోక్షః |

ఏది నిత్యమో - ఏది అనిత్యమో విభజించి, విభాగము చేస్తూ విచారణ చేయాలి.
ఇక ఆపై అనిత్యము, అసత్యము సంసార దుఃఖ రూపములు అగు సమస్త జీవాత్మ సంబంధమైన అహంకార మమకార సంబంధ కల్పనలను క్షయింపజేసుకొని ఉండటమే “మోక్షము”.

ఎవ్వరి దృష్టిలో… ఈ ప్రపంచంలోని ఈ దేహము-తదితరములైన సంబంధ అనుబంధ బాంధవ్యములతో సహా ఏవీ కూడా తనకు బంధము కాదో, తాను వాటి సంబంధించడో అవి తనకు సంబంధించి ఉండలేదో… అట్టి అప్రమేయ-ఆత్మజ్ఞాన దృష్టియే "మోక్షము”!

ఉపాస్యుడు (ఉపాసించ తగినవాడు)

ఏ సద్గురువైతే మన యొక్క - సర్వత్రా సర్వదా సిద్ధించియున్న - చైతన్య బ్రహ్మ స్వరూపమును మనకు తమ ఆప్త వాక్యముల ద్వారా గుర్తు చేస్తూ ఉంటారో (సాక్షాత్ ’తత్త్వమ్ అసి’ ఇతి వేదవచసా యో బోధయత్ ఆశ్రితాన్)…
ఆ మహానుభావుడగు, ఆ సద్గురువే మనము సదా ఉపాసించవలసినవాడు.

సర్వ శరీరస్థ చైతన్య బ్రహ్మ ప్రాపకో గురురూపస్యః |
“సర్వ దేహములలో వేంచేసియున్న చైతన్య బ్రహ్మ స్వస్వరూపమే గురురూపము” అని కూడా మీరు గ్రహించి ఉండండి ! స్వస్వరూపమగు ఆత్మయే గురువు!

శిష్యుడు

విద్యాధ్వస్త ప్రపంచాఽవగాహిత జ్ఞానా వశిష్టం బ్రహ్మైవ శిష్యః !  ఎవ్వడైతే గురువాక్యములు మననము చేస్తూ, గురుతత్త్వమేమిటో సందర్శించుచు…,

‘శిష్యుడు బ్రహ్మమే!’… అని ఎరిగి ఉన్నవాడే సద్గురువు.

విద్వాన్ ఇతి చ |

సర్వాన్తరస్థ స్వసంవిత్ విద్వాన్ |
స్వ స్వరూప సత్ - విత్ యే (సంవిత్తు) సర్వస్వరూపమై ప్రకాశించుచున్నది. అదియే తెలుసుకొనవలసినది. అది తెలుసుకొన్నవాడే విద్వాంసుడు. ‘నేనే ఇదంతా’ అను ఎరుకయే విద్య!

మూఢ ఇతి చ |

కర్తృత్వాది అహంకార భావనారూడో మూఢః "నేనే కర్తను-భోక్తను”… మొదలుగా గల భావనలయందు ఆరూఢుడైనవాడే మూఢుడు.

ఈ శరీరము-దీని నిర్మాతలగు అధిదేవతలు-జీవుడు-సంఘటన, సందర్భములు ఈశ్వరుడు (జగత్ రచనావిధి)… ఇవన్నీ ప్రతి కర్మకు కారణమగుచుండగా, “ఇదంతా నేనే చేస్తున్నాను! నా వలననే!" అని అనువాడు అసమగ్రమగు అవగాహనదృష్ట్యా మూఢుడే అగుచున్నాడు. కర్తృత్వము-అహంకారము-మమకారము-నావి-నావాళ్ళు-నా జాతి…. మొదలైనవన్నీ మూఢత్వముచే ఏర్పడున్నాయి.

అసుర ఇతి చ |

బ్రహ్మ విష్ణు ఈశానా ఇంద్రాదీనామ్ ఐశ్వర్య కామనయా నిరశన జప - అగ్నిహోత్రాది ఈష్వ |
ఎవ్వడైతే భౌతికమైన ఐశ్వర్య కాముకుడై బ్రహ్మ - విష్ణు - శివ - ఇంద్రుల సంపదలను కోరుకుంటూ, తదితరులను ద్వేషిస్తూ… ద్వేష భావాలతో సహ జీవులను బాధించే ఉద్దేశ్యముతో జప - తప - అగ్నిహోత్ర … ఇత్యాదులు నిర్వర్తిస్తాడో,…… ఆతడే అసురుడు!

అంతరాత్మానం సంతాపయతి చ, ఉగ్ర రాగ - ద్వేష - హింసా - డంబాది అపేక్షితం తప అసురమ్ |
తీవ్రమైన రాగము (Attachemt - Eg. జాత్యహంకారము), ద్వేషము (Hatred మరొకరికో, మరొకజాతికో హాని కలుగజేయాలనే తీవ్రమైన ఉద్వేగము), హింసా (ఇతరులను బాధించాలనే ఉద్దేశ్యము) - డంబము (“నేనెంత గొప్పవాడినో! అందరూ నన్ను చూచి భయపడాలి”… ఇటువంటి దర్పపటాటోప భావములతో) జప - తప హోమములు నిర్వర్తిస్తూ తనయందు, తదితరులయందు సమముగా వేంచేసియున్న ‘సమమ్ సర్వేషు భూతేషు’ అగు అంతరాత్మను క్షోభింపజేస్తూ చేయు తపస్సు ఆసురతపస్సు! అతడు ఆత్మజ్ఞానమునకు సుదూరుడై అనేక అజ్ఞాన ఉపాధులలో ప్రవేశించి అనేక దుఃఖ-బంధ పరంపరలను కోరితెచ్చిపెట్టుకున్నవాడగుచున్నాడు.

తప - ఇతి చ |

“బ్రహ్మ సత్యమ్-జగత్ మిథ్య"… ఇతి అపరోక్ష జ్ఞానాగ్నినా, బ్రహ్మాది ఐశ్వర్య, ఆశా సిద్ధ సంకల్ప బీజ సంతాప రూపం తపః।

గడ్డిపరక నుండి - బ్రహ్మ దేవుని వరకు సర్వ ఐశ్వర్యముల పట్ల ఆశ, అవి సిద్ధించాలనే సంకల్ప ‘బీజము’ (The root desire of possession) బంధమగుచున్నది.

బ్రహ్మసత్యము ఈ జగత్తు స్వప్నమువలె మిథ్య. ఇందులో ఏదైనా పొందాలని ఆవేశపడటము, పొందటానికై ఏవేవో యత్నాలు చేయటము, పొంది గొప్ప అనిపించుకోవాలనుకోవటము… ఇదంతా కలలో చూచిన దేహములను, వస్తువులను కోరుకొని, వాటికై జాగ్రత్తో వెతకటము వంటిది - అనే జ్ఞానాగ్నితో భ్రమ-అజ్ఞానములను దగ్ధము చేయటమే తపస్సు.

తపనయే తపస్సు. అజ్ఞాన దృష్టులను, ఆశలను, ఆశయములను, ఆవేశములను… వాటి వాటి బీజములతో సహా ‘జ్ఞానాగ్ని’తో దహించివేసే ప్రయత్నమును ‘తపస్సు’ అని పిలుస్తున్నారు.

పరమ పదమ్ ఇతి చ |

ప్రాణ ఇంద్రియాది అంతఃకరణ గుణాదేః పరతరమ్,
సత్ - చిత్ - ఆనందమయమ్,
సర్వ సాక్షికమ్,
నిత్యముక్త బ్రహ్మ స్థానమ్… “పరమమ్ పదమ్” |

ప్రాణముకు, ఇంద్రియములకు, (మనోబుద్ధి చిత్త అహంకారములనబడే) అంతఃకరణ చతుష్టయమునకు, సత్వ రజో తమోగుణములకు ఆవల నిత్యోదికమై వెలుగొందుచున్నట్టిది-‘పరమ పదము’. అట్టి పరమాత్మ (ప్రతి జీవుని యొక్క పర-ఆవల గల స్వస్వరూపము)…,

సత్ - ఉనికి
చిత్ - ఎరుక
ఆనంద - అనుభూతి స్వరూపము అయి ఉన్నది.

అంతరంగ - బహిరంగ జగత్తులకు కేవల సాక్షిగా ఉన్నది.

అయ్యది ‘నిత్యముక్తము’. ఈ దేహ - దృశ్య - సంబంధ - లౌకిక సంఘటన ఈ దేహము తరువాత వచ్చే స్థితిగతులు … ఇవన్నీ ఆత్మ సమక్షంలో ఆత్మ చైతన్యము నుండి స్ఫూర్తిని పొందటం చేత ప్రవర్తమానమగుచున్నాయి. ఆత్మకు దేనితోనూ బంధము లేదు. (జీవాత్మ జగత్ కల్పిత విశేషము కాబట్టి జగత్తుచే నిత్య బద్ధము).

సూర్య కిరణాలు తటాక జలముపై పడి, అక్కడి తరంగములు మెరుపులను ప్రదర్శించవచ్చుగాక! తటాక జలము సూర్య కిరణములను బంధించగలదా ? లేదు కదా !

ఆత్మ జ్యోతి యొక్క కిరణ పుంజములగు ఈ దృశ్య దేహ మనో చిత్త అహంకారాలు - ఆత్మను ఎట్లా బంధిస్తాయి? బంధించలేవు.

సర్వమునకు ‘పరము’ (ఆవల) అయిన ఆత్మ పదము నిత్యముక్తమేగాని, అద్దానికి ‘బంధము’ అనునదే ఎప్పుడూ లేదు. ఉండజాలదు. ఆత్మ స్వరూపమును బంధించగలిగేది ఎక్కడా ఏ మాత్రము లేదు.

బ్రహ్మస్థానమ్ : ఆ పరమ పదము సర్వ లోక స్థానములకు ఆవల ‘బాహ్మీ స్థితి, బ్రాహ్మీస్థానము’ అయి ఉన్నది. ఈ సకలము తానై, సర్వమునకు వేరై, కేవలీ స్వరూపమైనట్టిది ‘బ్రాహ్మీస్థితి’! వేదములచే వేదాంగములచే దారి చూపించబడుచున్నది. పరాకాష్ఠ స్థానముగా, ఈ జీవుడు శాంతి - ఆనందముల కొరకై తిరిగి చేరవలసిన స్థితిగా మహర్షులచే, ఆత్మజ్ఞులచే ఎలిగెత్తి గానము చేయబడుచున్నది. ఈ జీవుడు పొందవలసిన పరాకాష్ఠయే ‘పరమ పదము’ అని సూచించబడుతోంది. అదియే ‘పుట్టినిల్లు’. దారి తప్పిన రాజకుమార బాలుడు తిరిగి యువరాజ సింహాసనము చేరి ఆసీనుడవటము వంటిది.

గ్రాహ్యమ్ ఇతి చ | గ్రహించలసినది - పట్టుకొని ఉండవలసినది

దేశ కాలవస్తు పరిచ్ఛేదరాహిత్య చిన్మాత్ర స్వరూపమ్ గ్రాహ్యమ్। 

ఒకడు అనేక రకములైన విషయాలు తెలుసుకొంటూ ఉండవచ్చు.
తెలియబడే విషయాలు వేరు వేరైన విధములై ఉండవచ్చుగాక !
తెలుసుకుంటూ ఉన్న ‘తెలివి’ మాత్రము సర్వదా ఒక్కటే అయి ఉన్నది కదా !

అట్లాగే…
తేజోమయము ఎరుకస్వరూపము అయి, దేశము (Place Factor) చే గాని, కాలము (Time factor - past, present and future) చే గాని, వస్తువు (Matter) చే గాని పరిచ్ఛేదము (Divisibility. Becoming different from what it is now and here) కించిత్ కూడా ఏ మాత్రమూ పొందటమే లేదో అట్టి ’చిన్మాత్రము’నే ఈ జీవుడు ఆశ్రయించాలి.

ప్రతి జీవునిలోను రెండు విశేషాలు: 1) మార్పు చెందేవి + 2) మార్పు చెందనిది (గతాసమ్, అగతాసమ్).

మార్పు చెందు సర్వమును దాటి, ‘మార్పు చెందనిది’ని దర్శించాలి, ఆశ్రయించాలి. అదియే స్వీకరించ తగినది. గ్రాహ్యమ్! అది ’కేవల స్వస్వరూపమే’ అని, (అట్లాగే) ‘నీవు - జగత్తు’ల వాస్తవ రూపమే అనునదే - గ్రహించవలసిన గ్రాహ్యము.

అగ్రాహ్యమ్ ఇతి చ |  స్వీకరించకూడనిది - వదలి ఉండవలసినది

స్వస్వరూప వ్యతిరిక్త, మాయామయ, బుద్ధి - ఇంద్రియ గోచర జగత్ - సత్యత్వ చింతనమ్ - ఇతి అగ్రాహ్యమ్ !

సహజము - నిత్య నిర్మలము - అనునిత్యము - అఖండము అగు స్వస్వరూపమునకు వేరుగా (మాయచే) అనిపిస్తూ…
- కేవల “స్వీయమనో కల్పన” చే అనుభవమగుచుండుటచే మాయామయమై,
- బుద్ధి - ఇంద్రియములకు ఎదురుగా… తనకు వేరైనట్లుగా ; (ఉదా : స్వప్నము, స్వప్న ద్రష్ట యొక్క స్వప్న కళా చైతన్యమునకు వేరుకానప్పటికీ, వేరైనట్లు అగుపిస్తున్న రీతిగా)… కనిపిస్తున్న దృశ్య జగత్తును చూస్తూ…,
- ఇది సత్యమే! ఇక్కడ సుఖ - దుఃఖములకు నేను బద్ధుడను, ఇక్కడి స్థితిగతులు నన్ను ఇటు అటు దొర్లించుచున్నాయి”.
… అను ‘దృశ్య సత్యత్వ చింతన’ ను విడవాలి . అది వదలవలసిన వస్తువు. (అగ్రాహ్యమ్).

మార్పు చెందని ఆత్మను గ్రహించాలి. మార్పు చెందేది, ఆత్మకు వేరుగా మాయచే అనిపించేది అగు ’జగత్ దృశ్యము’ ను బుద్ధితో వదలి ఉండాలి!

సన్న్యాస ఇతి చ |

సర్వ ధర్మాన్ పరిత్యజ్య, నిర్మమో నిరహంకారో భూత్వా, బ్రహ్మేష్టం శరణం ఉపగమ్య, ‘తత్త్వమసి’, ‘సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ’, ’నే2 హనాస్తి కించన’ ఇత్యాది మహావాక్య అనుభవజ్ఞానాత్, ‘బ్రహ్మై వాహమస్మి’! ఇతి నిశ్చిత్య, నిర్వికల్ప సమాధినా స్వతంత్రోయతి చరతి, స సన్న్యాసీ |

సన్న్యాసి… (సత్ న్యాసి) అనగా ఎట్టివాడై ఉన్నాడో.. శ్రద్ధగా వినండి !

1) సర్వధర్మాన్ పరిత్యజ్య : బ్రహ్మచారి - గృహస్థ - వానప్రస్థ ఇత్యాది సర్వ ఆశ్రమ ధర్మములను అధిగమించివేసనవారై, దాటివేసి, పరిత్యజించివేసినవాడై ఉండువాడు సన్న్యాసి. దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకార ధర్మములచే పట్టుబడనివాడుగా ప్రకాశమానుడై ఉంటాడు.

2) నిర్మమో… “ఈ జగత్తులోకి నేను ఏదీ తేలేదు. తీసుకొని పోయేది లేదు. ఈ దేహము కూడా జీవుడుగా నా ప్రజ్ఞచే నిర్మితమైనది కాదు. ఒక రోజు ఇక్కడ వదలి వెళ్ళవలసిన వస్తువు. ఈ దేహము ఈ దృశ్యము నేను వచ్చి - వెళ్ళబోవు ఒకానొక ప్రదేశము వంటిది మాత్రమే ! కనుక ఇక్కడేదీ నాది కాదు. నేను అనుకున్న రీతిగా ఇది ఉండాలని కూడా నియమించుకోను”… అని మమకారరహితుడై ఉంటున్నవాడు సన్న్యాసి!

3) నిరహంకారో భూత్వా… “ఈ దేహము - ఇద్దానిలో కనిపించే చూపు - వినికిడి - ఆఘ్రాణము - స్పర్శ - రుచి… ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన శక్తులు. అట్టి ప్రకృతి ప్రసాదిత శక్తులతో నిర్వర్తించేది ప్రకృతి రూపిణికే చెందుతాయి. అంతే కాని, నావి ఎట్లా అవుతాయి ? అందరము అఖండ పరమాత్మ యొక్క సంప్రదర్శనమే! ఇట్లయి ఉండగా, నేను మరొకరికంటే గొప్పవాడిని ఎట్లా అవుతాను ? సర్వకిరణములు ఒకే సూర్య భగవానుని నుండి బయల్వెడలు చుండగా “ఇక్కడి ఈ కిరణము కంటే అక్కడి కిరణము గొప్పది” అనునది ఏమున్నది ?… ఈ రీతిగా నిరహంకారము అభ్యసించువాడు సన్న్యాసి.

4) బ్రహ్మేష్టమ్ శరణం ఉపగమ్య : సర్వస్వరూపము - సర్వాంతర్యామియగు బ్రహ్మమునే అత్యంత ఇష్టముగా శరణువేడుతూ ఉంటాడు. బ్రహ్మమునందే అశ్రితుడై, ప్రవేశమానుడై ఉంటాడు.

మహావాక్య అనుభవజ్ఞానాత్ : వేద వేదాంత శాస్త్రము ప్రదిపాదిస్తున్న మహావాక్య జ్ఞానమును మననము చేస్తూ, తదర్థాన్ని - హృదయమునందు నిలపి, దృష్టిని పరమ పవిత్రము చేసుకొనువాడు సన్న్యాసి!

“తత్ త్వమ్ అసి” - “తత్ (పరమాత్మ) స్వరూపము నీవు అయియే ఉన్నావు” - అను అభ్యాసము నిర్వర్తిస్తూ,
“సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ"  - ఈ కనబడుచున్నదంతా, ఈ సర్వము - బ్రహ్మమే అయి ఉన్నది - అను పవిత్రదృష్టిచే,
నేహనానాస్తి కించన ఇక్కడ అనేకముగా కనిపించేదందా సర్వదా ‘ఏకము’ అగు బ్రహ్మమే ! వాస్తవానికి ఇక్కడ నానాత్వములేనే లేదు

… మొదలైన వాక్యముల అనుభవజ్ఞానము (The knowledge that … transpires into experience) … అను నిస్సంశయ జ్ఞానం సహాయముతో -

బ్రహ్మైవ అహమస్మి - నేను బ్రహ్మమునే అయి ఉన్నాను.

… అని నిశ్చయమునకు వచ్చినవాడై ఉంటాడు. సర్వ సంకల్ప - వికల్పముల పరిధులను దాటి వేసినవాడై, … ఆత్మకు భిన్నమైన సర్వ వికల్పనల రహితము అయినట్టి నిర్వికల్ప సమాధి యందు ప్రవేశించినవాడై ఉంటాడు.

అట్టి యతియే… సన్న్యాసి(సత్-న్యాసి = సత్ వస్తువును ఉపాసిస్తూ పరిగ్రహించినట్టివాడు)! ఆయన నిత్యముక్తుడు ! అందరికీ పరమ పూజ్యుడు ! యోగి ! పరమహంస ! అవధూత ! బ్రాహ్మణుడు కూడా ! అట్టి సాధనా మార్గమును స్వీకరించుటచే ఈ జీవుడు నిరాలంబాత్మస్వరూపుడు అగుచున్నాడు.

ఎవ్వరైతే ఈ ‘నిరాలంబోషనిషత్" ప్రతిపాదించుచున్న పరమ సత్య వస్తు నిర్వచనములను గురు అనుగ్రహం చేత గురు ముఖతః వికల్పనా రహితుడై వినుచూ హృదయస్థము చేసుకుంటారో … వారు అగ్నివలె పరమ పవిత్రులగుచున్నారు! వాయువువలె నిర్మల హృదయులగుచున్నారు!

అట్టివారు పునః ఈ సంసారమున పడరు. పునరావృత్తి దోషము స్పృశించజాలని నిరాలంబ స్థానమును పుణికి పుచ్చుకొనుచున్నారు. జన్మరహితులై, తిరిగి ఈ జనన మరణ చక్రములో ప్రవేశించరు.

ఇతి నిరాలంబ ఉపనిషత్ |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||