[[@YHRK]] [[@Spiritual]]

Paingala Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


శుక్ల యజుర్వేదాంతర్గత

10     పైఙ్గలోపనిషత్

(పైంగలోపనిషత్)

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో॥ ‘పైఙ్గలోపనిషత్’ వేద్యం పరమానన్ద విగ్రహమ్।
పరితః కలయే రామం పరమాక్షర వైభవమ్॥

పైఙ్గలోపనిషత్ (పైంగల ఉపనిషత్) పరిశీలనచే పరమానంద విగ్రహము, పరమాక్షర వైభవము - అగు ఆత్మారామ తత్త్వము సుస్పష్టమవగలదు.


ప్రథమో అధ్యాయః

1.) అథ హ పైఙ్గలో
యాజ్ఞవల్యమ్ ఉపసమేత్య
ద్వాదశవర్ష శుశ్రూషా పూర్వకం,
“పరమ రహస్య కైవల్యమ్ అనుబ్రూహి”
ఇతి పప్రచ్ఛ॥

ఒకప్పుడు పైఙ్గలుడు అనే శ్రద్ధ - గురుభక్తి గల ఉత్తమ అభ్యాసి మహనీయుడు అగు యాజ్ఞవల్క్యని ఆశ్రమం చేరి 12 సంవత్సరాలు గురు శుశ్రూష నిర్వర్తించారు.

అటు తరువాత ఒకానొక రోజు ఆ పైఙ్గలుడు తత్త్వజ్ఞానాభిలాషి అయి, తన గురువగు యాజ్ఞవల్క్యుడు సుఖాశీనుడై ప్రశాంతముగా ఉన్న సమయములో - ఆయనను సమీపించి, గురు నమస్కారములు వినమ్రతతో సమర్పించారు. 

పైఙ్గలుడు - “గురుదేవా! పరమ రహస్యమగు ’కైవల్యము’ గురించిన సమాచారమును అనుగ్రహ భాషణముగా ప్రసాదించ వేడుకొనుచున్నాను” …. అని అభ్యర్థించారు.

2.) సహెూవాచ యాజ్ఞవల్క్యః :-
సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్।
(సత్ ఏవ, సౌమ్య! ఇదమ్ అగ్ర ఆసీత్।)

తం నిత్యముక్తమ్।
అవిక్రియమ్।
సత్యజ్ఞానానందమ్।
పరిపూర్ణమ్।
సనాతనమ్।
ఏకమేవ, అద్వితీయం బ్రహ్మ।

యాజ్ఞవల్క్యుడు :-
ఓ సౌమ్యుడా! పరబ్రహ్మానందస్వరూపా! ప్రియ శిష్యా! ఈ ఎదురుగా కనబడుచున్న దృశ్య వ్యవహారమంతటికీ మునుముందే నీవు తెలుసుకోవాలనుకుంటున్న ’సద్వస్తువు’ అగు ఆత్మ ఉండి ఉన్నది.

అట్టి సత్ ఆత్మకమగు తత్త్వము నిత్యముక్తము. అద్దానికి బంధమే లేదు.
అట్టి ఆత్మ ఎట్టి కర్తవ్య వ్యవహారములకు సంబంధించినది కాదు. అవిక్రియము. (క్రియా రహితము). నిష్క్రియము.
సత్య (యమ్ సత్) - జ్ఞాన (కేవల తెలివి) - ఆనంద స్వరూపము. సర్వదా పరిపూర్ణము.
జన్మ-కర్మలకంటే మునుముందే ఉండి ఉన్నట్టిది కాబట్టి ‘సనాతనము’.
అట్టి సత్ స్వరూప పరమాత్మ (లేక) బ్రహ్మమునందు ప్రకృతిగా ప్రదర్శనమగుచున్నది.

తస్మిన్ మరు, శుక్తికా, స్థాణు,
స్ఫటిక ఆదౌ జలరౌప్య
పురుషరేఖాదివ,
లోహిత - శుక్ల - కృష్ణ గుణమయీ,
గుణసామ్యా, అనిర్వాచ్యా
మూల ప్రకృతిః ఆసీత్।

→ యడారియందు యండమావులలో కనిపించే జలమువలె.., (మరు)
→ ముత్యపు చిప్పయందు వెండివలె …. (శుక్తికా)
→ స్థాణువు [చీకటిలో చూచిన చెట్టు మ్రోడు (లేక) శిల] యందు దొంగ యొక్క ఆకారము - కదలుచున్నట్లుగా కనిపించి భయము కలిగినట్లు…,
→ స్పటికములో గీతలు, గాలిబుడగలు, పురుషాకారము కనబడు తీరుగాఎరుపు-తెలుపు-నలుపు రంగుల (రజో-సత్వ-తమో గుణముల) మేళవింపుతో కూడి (త్రిగుణములతో కూడి), “ఇది ఇట్టిది” అని చెప్పటానికి అనిర్వాచ్యమైన “మూల ప్రకృతి” ఆసీనమైయున్నది.

తత్ ప్రతిబింబితం యత్
తత్ ‘సాక్షి చైతన్యమ్’ ఆసీత్।
సా పునః వికృతిం ప్రాప్య
సత్వా ఉద్రిక్తా, అవ్యక్తా
ఆభ్యావరణశక్తిః ఆసీత్।

తత్ ప్రతిబింబం యత్
తత్ ‘ఈశ్వర చైతన్యం’ ఆసీత్।

ఆత్మయందు మూల ప్రకృతి వాస్తవానికి లేనిదే! లేనిది ఉన్నదగుచున్నది! ఆశ్చర్యం! (జలములో దృశ్యము ప్రతిబింబించు తీరుగా)… అట్టి మూలప్రకృతియందు పరబ్రహ్మము కూడా ప్రతిబింబిస్తూ (జీవాత్మగా) సాక్షి చైతన్యరూపమైయున్నది. ఆ మూల ప్రకృతి మరల వికారములు (వికృతి)ని పొందుచున్నది. తనయొక్క సత్వగుణము (ఉనికి అను స్వభావముచే) ఉద్రిక్తత పొంది, అవ్యక్తము (వ్యక్తీకరించుచూ, తాను వ్యక్తము కానిది) అను నామము గల ఆవరణశక్తిగా ఆశీనమై ఉంటోంది.

అట్టి ‘ఆవరణశక్తి’ లేక ‘ఆవరణ తత్వము’ నందు పరబ్రహ్మము ప్రతిబింబిస్తూ "ఈశ్వర చైతన్యము”గా వెలయుచున్నది.

3.) స స్వాధీన మాయః సర్వజ్ఞః
సృష్టి - స్థితి - లయానాం
ఆదికర్తా జగత్ అంకుర రూపో భవతి।

తస్మిన్ విలీనమ్
సకలం జగత్ ఆవిర్భావయతి।

ప్రాణికర్మవశాత్ ఏష పటో
యద్వత్ ప్రసారితః।
ప్రాణికర్మక్షయాత్
పునః తిరో భావయతి।


ఈశ్వరుడు :-
- మాయను తన స్వాధీనమునందు ఉంచుకున్నవాడు.
- మాయను ఉపాధిగా కలవాడు.
- దేహమునకు మునుముందు, దేహమున్నప్పుడు, అటు తరువాత స్థితి-గతులను ఎరిగినట్టివాడు కాబట్టి సర్వజ్ఞుడు.
- సృష్టి-స్థితి-లయములకు (దృశ్యప్రారంభం-కొనసాగటం-ఉపశమనములకు) ఆదికర్త!
- బీజములో మహావృక్షము యొక్క అంకురము ఉన్నతీరుగా ఈ జగత్తును తనయందు అంకురరూపముగా కలిగి ఉన్నవాడు.

తస్మిన్ ఏవ అఖిలం విశ్వం
సంకోచిత పటవత్ వర్తతే
ఈశా అధిష్ఠిత - ఆవరణశక్తితో
రజ - ఉద్రిక్తా, మహత్ - ఆఖ్యా
“విక్షేపశక్తిః” - ఆసీత్।

ఈశ్వరుడే తనయందు ఒకప్పుడు విలీనమగుచున్న సకల జగత్తును (జగత్ భావనను)… మరొకప్పుడు తిరిగి ఆవిర్భవింపజేయుచున్నారు. అట్టి ఆ ఈశ్వరుడే సర్వ ప్రాణులకు సంబంధించిన స్వీయ వాసనల రూప కర్మలను అనుసరించి ఈ ‘జగత్’ అను ఇంద్రియ విషయ ప్రపంచమును సంప్రదర్శనముగా నిర్వర్తిస్తున్నారు. ఆయా ప్రాణులకు సంబంధించిన సంస్కార రూప కర్మ వ్యవహారములు మరొకప్పుడు సంక్షయిస్తూ ఉండగా, తననుండి బయల్వెడలిన అనేకత్వ రూప ప్రాణులను తనయందు తిరోభవింపజేయుచున్నారు.

ఆ ఈశ్వరునియందే ఈ విశ్వమంతా కూడా మడిచిపెట్టబడిన పొడవైన చీర (వస్త్రము) వలె దాగినదై ఉంటోంది. (మట్టి బొమ్మలో మట్టివలె) ఈశ్వరునియందే అధిష్ఠితమైయున్న “ఆవరణశక్తి" నుండి రజోగుణముచే ఉద్రిక్తమైనట్టి ‘మహత్’ అను పేరుగల విక్షేపశక్తి ఏర్పడుచున్నది.

తత్ ‘ప్రతిబింబితమ్’ యత్,
తత్ ‘హిరణ్యగర్భ చైతన్యమ్’ ఆసీత్ |
స మహత్ తత్త్వా అభిమానీ
స్పష్ట - అస్పష్ట వపుః భవతి॥

ఆ ‘మహత్’ నందు ప్రతిబింబించిన బ్రహ్మము….. అద్దానియందు "హిరణ్యగర్భ చైతన్యము” (లేక, సృష్టి కల్పనా చైతన్యము) ప్రతిబింబితముగా ఉనికి పొందినదగుచున్నది. ఆ హిరణ్యగర్భుడు (సృష్టికర్త) మహత్ తత్త్వము (లేక) విక్షేపము (The Factor of making show) నందు అభిమానము (Interested) కలవాడై సుస్పష్ట - అస్పష్టరూప దేహము (శరీరము) ధరించుచున్నాడు.

4.) హిరణ్యగర్భ అధిష్ఠిత విక్షేపశక్తిః
తత్ తమో ఉద్రిక్తా,
అహంకారా అభిధా
’స్థూలశక్తిః - ఆసీత్।
తత్ ప్రతిబింబితమ్ యత్,
తత్ ‘విరాట్ చైతన్యమ్’ ఆసీత్|

స తత్ అభిమానీ స్పష్టవపుః
సర్వ స్థూలపాలకో ‘విష్ణుః’
ప్రధాన పురుషో భవతి।

హిరణ్యగర్భునిచే అధిష్ఠితమైయున్న మహత్ - స్వరూప ‘విక్షేపశక్తి’ యొక్క ‘తమోగుణ ఉద్రిక్తత’ చేత ‘అహంకారము’ అను స్థూలశక్తి జనించుచున్నది. ఆ విధంగా అహంకారము (సమిష్టి అహంకారము) నందు ప్రతిబింబిచుచున్న తత్ పరబ్రహ్మము విరాట్ (విశ్వ స్వరూప) చైతన్యముగా విరాజిల్లుచున్నది.

ఆ విరాట్టునందు కూడా, అట్టి విరాట్ అభిమానియై, సర్వత్ర వెలయుచు, సర్వ స్థూల దేహములకు ఉనికిని కల్పించి పరిపాలించు పరబ్రహ్మమే… సర్వదా ప్రతిబింబిస్తున్నది. అనగా, అట్టి ప్రధాన పురుషుడుగా (లేక) విష్ణు భగవానుడుగా (విరాట్ అభిమానిగా) పరమాత్మయే ప్రతిబింబిస్తున్నారు.

అందుచేత పరమాత్మ సర్వదా అద్వితీయుడే! ఆయనకు ద్వితీయమై ఎక్కడా ఏదీ లేదు.

తస్మాత్ ఆత్మన ఆకాశః సంభూతః।
ఆకాశాత్ వాయుః।
వాయో అగ్నిః।
అగ్నే ఆపః।
అద్భ్యః పృథివీ।

తాని పంచతన్మాత్రాణి
త్రిగుణా భవంతి।

అట్టి విష్ణు భగవాన్ స్వరూప ఆత్మ నుండి ఆకాశము,
ఆకాశము నుండి వాయువు,
వాయువు నుండి అగ్ని,
అగ్ని నుండి జలము,
జలము నుండి పృథివి జనిస్తున్నాయి. ఆవిర్భవిస్తున్నాయి.

ఈ పంచభూతముల నుండి సూక్ష్మభూతములగు శబ్ద - స్పర్శ - రూప - రన - గంధములు అనబడు తన్మాత్రలు, త్రిగుణములతో (సత్వ-రజో-తమో గుణములతో) కూడి ప్రకటితమగుచున్నాయి.

‘స్రష్టు’ కామో జగత్ యోనిః
తమోగుణమ్ అధిష్ఠాయ।

“సూక్ష్మ-తన్మాత్రాణి భూతాని
స్థూలీకర్తుం” - సో అకామయత।

కేవలుడగు ఆ మహావిష్ణు ఆత్మ భగవానుడు “నేను సృష్టించెదను గాక!" అను కోరిక (స్రష్టుకామః) కలవాడయ్యారు. జగత్కర్త అయి ’తమోగుణము’ను అధిష్ఠించారు.

శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ సూక్ష్మ తన్మాత్ర సహిత సూక్ష్మ పంచభూతములను (స్థలము - చలనము - తేజస్సు - ద్రవము - స్థూలములను) “స్థూల మహా భూతములుగా చేసెదను గాక….. అని సంకల్పించారు.

సృష్టేః పరిమితాని భూతాని
ఏకమ్ ఏకమ్
ద్విధా విధాయ,
పునః చతుర్థా కృత్వా
‘స్వ - స్వ ఇతర’ ద్వితీయాంశైః
పంచ - పంచధా సంయోజ్య,
పంచీకృత భూతైః
అనంతకోటి బ్రహ్మాండాని,
తత్ తత్ అండోచిత
చతుర్దశ భువనాని,
తత్ తత్ భువనోచిత
గోళక స్థూలశరీరాణి అసృజత్॥

సృష్టికి పరిమితము - అవసరము అయినంత వరకు సూక్ష్మ పంచభూతములను ఒక్కొక్కదానిని ‘2’ భాగములుగా విభజన చేస్తున్నారు. ఆ రెండు - రెండు సూక్ష్మ పంచభూత విభాగములలో మొదటి 1/2 భాగమును అట్లాగే ఉంచి, రెండవ అర్థ భాగమును ’4’ భాగములుగా విభాగించుచున్నారు. ‘4’గా విభజించిన పంచభూత ద్వితీయార్ధ భాగములలోని ఒక్కొక్క భాగమును తదితర ’4’ సూక్ష్మ భూతములలోని మొదట అర్ధభాగముతో ప్రతి భూతమును ‘5’ భాగములుగా పంచీకరణము చేయబడుచున్నాయి.

ఈవిధంగా పంచీకరించబడిన పంచ సూక్ష్మభూతములతో
- అనంతకోటి బ్రహ్మాండములు,
- అట్టి ప్రతి ఒక్క బ్రహ్మాండకోశములో 14 లోకములు,
- ఆయా లోక నివాసమునకు సానుకూల్యమైన గోళక స్థూల శరీరములను
… ఇవన్నీ మహావిష్ణువు యొక్క స్వకీయ పుష్టకామము (ఇష్టము) నుండి సృష్టించబడుచున్నాయి.

5.) స పంచభూతానాం రజో అంశాంశ్చ
చతుర్థా కృత్వా, భాగత్రయాత్
పంచ వృత్త్యాఽఽత్మకమ్
‘ప్రాణమ్’ అసృజత్।

ఇంకా ఈశ్వరుడు - పంచభూతముల యొక్క రజోగుణ అంశ భాగమును ‘4’ భాగములుగా చేసి…, ఆ 4 భాగములలో ‘3’ భాగముల నుండి (ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన-సమాన అనబడు) పంచ వృత్యాత్మకమైనట్టి ‘ప్రాణము’ లేక ప్రాణశక్తిని సృజించుచున్నారు.

అథ తేషాం తుర్యభాగేన
‘కర్మేంద్రియాణి’ అసృజత్।
స తేషాం సత్తా అంశం
చతుర్థా కృత్వా భాగత్రయ
సమష్టితః పంచవృత్యాఽఽత్మకమ్
‘అన్తఃకరణమ్’ అసృజత్।

ఆ తరువాత (3 భాగములు ప్రాణ సృష్టికై ఉపయోగించబడగా), 4వ భాగము నుండి పంచకర్మేంద్రియములను సృజించుచున్నారు.
(కర్మేంద్రియములు : వాక్కు, కాళ్ళు, చేతులు, పాయువు, ఉవస్థ).

ఆ తరువాత ఆ ఈశ్వరుడు పంచభూతముల యొక్క ‘సత్వాంశ’ (సాత్విక విభాగము) ‘4’ భాగములుగా చేసి అందులో 3 భాగముల నుండి పంచవృత్యాత్మకము (దృశ్యభావ-మనో-బుద్ధి-చిత్త-ఆహంకారములు) అగు ‘అంతఃకరణము’ను సృష్టించుచున్నారు.

స తేషాం సత్త్వ తురీయభాగేన
‘జ్ఞానేంద్రియాని’ అసృజత్।
సత్త్వసమష్టిత ఇంద్రియ -
పాలకాన్ అసృజత్।

ఆపై ఆ ’సత్యాంశ’ యొక్క 4వ భాగము (తురీయభాగము) నుండి పంచజ్ఞానేంద్రియ తత్త్వములను ఈశ్వరుడు సృజియించుచున్నారు. (జ్ఞానేంద్రియములు = చర్మము, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు). అట్టి సత్వ సమిష్టి చేత ఇంద్రియ పాలక ప్రజ్ఞా స్వరూపులగు దేవతలను సృజియించుచున్నారు.

స తేషాం సత్త్వ తురీయభాగేన
‘జ్ఞానేంద్రియాని’ అసృజత్।
సత్త్వసమష్టిత ఇంద్రియ -
పాలకాన్ అసృజత్।

ఆపై ఆ ’సత్యాంశ’ యొక్క 4వ భాగము (తురీయభాగము) నుండి పంచజ్ఞానేంద్రియ తత్త్వములను ఈశ్వరుడు సృజియించుచున్నారు. (జ్ఞానేంద్రియములు = చర్మము, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు). అట్టి సత్వ సమిష్టి చేత ఇంద్రియ పాలక ప్రజ్ఞా స్వరూపులగు దేవతలను సృజియించుచున్నారు.

తత్ ఆజ్ఞయా అహంకార సమన్వితో
విరాట్ - సర్వస్థూలాని అసృజత్।
హిరణ్యగర్భః తదాజ్ఞయా
సూక్ష్మాణి అపాలయత్॥

ఆ ఈశ్వరుని ఆజ్ఞచే అహంకార సహిత, విరాట్ (బ్రహ్మదేవుడు, సృష్టి ప్రజ్ఞా పురుషుడు) ఈ కనబడే సమస్త స్థూలములను సృజియించుచున్నారు. ఈశ్వరాజ్ఞను అనుసరించి సృష్టికర్తయగు ఆ హిరణ్యగర్భుడు బ్రహ్మాండములోని సూక్ష్మతత్త్వములన్నీ కూడా పరిపాలించ సిద్ధమైనారు. (కానీ అంతా జడ స్థితియందున్నది). ఒక చక్రవర్తి రాయి రప్పలను పరిపాలించడు కదా! చైతన్యరూపులగు జనులను కదా, పరిపాలించేది!

6.) అణ్డస్థాని తాని తేన వినా
స్పన్దితుమ్ - చేష్టితుం వా న శేకుః।

ఈ విధంగా అండము (బ్రహ్మాండము)నందు వ్యాపించి - స్థితములైనట్టి కర్మేంద్రియ-జ్ఞానేంద్రీయ తత్త్వములు - చైతన్యమూర్తియగు ఈశ్వరుని సాన్నిధ్యము లేకుండా - తమకు తాముగా స్పందించలేకపోయాయి. క్రియా స్పందనము (చేష్టితము) నిర్వర్తించలేకపోయాయి. (అనగా, జడములుగా ఉండి ఉన్నాయి).

‘తాని చేతనీ కర్తుం’ - సో అకామయత।

అప్పుడు ఈశ్వరుడు, “నేను బ్రహ్మాండములో విసృజింపజేసినట్టి కర్మ - జ్ఞానేంద్రియ తత్త్వములు, దేవతా ప్రజ్ఞలు తమకు తాముగా స్పందములు, చేష్టితములు కాలేక, జడములుగా ఉన్నాయి. ఆనందము ఏమున్నది? కనుక వీటిని పరస్పరత్వముతో కూడిన చేతనములుగా చేసెదను గాక!” అను కోరిక పొందారు.

బ్రహ్మాండం, బ్రహ్మరంధ్రాణి
సమస్త వ్యష్టి మస్తకాని
విదార్య, తదేవ అనుప్రావిశత్।
తదా జడాన్యపి, తాని
చేతనవత్ స్వస్వకర్మాణి చక్రి రే।

బ్రహ్మాండములను, బ్రహ్మరంధ్రములను, సమస్త వ్యష్టిశరీరముల (Individual Physical Bodies) యొక్క మస్తకముల ద్వారా, వాటి వాటియందు చైతన్య స్వరూపుడై ఆ ఈశ్వరుడు తనకుతానై ప్రవేశించారు. ఆయా భౌతిక శరీరములు మొదలైనవి మొట్టమొదట ’జడములు’గా ఉన్నప్పటికీ.., ‘ఈశ్వర చైతన్యము’ అనే చిత్ జ్యోతి ప్రవేశించగానే, ఆవన్నీ కూడా చైతన్యవంతములయ్యాయి. అటు తరువాత ఈశ్వరాజ్ఞచే తమకు నియమితములైన ఆయా ధర్మములను నిర్వర్తించసాగాయి.

సర్వజ్ఞ ఈశో, మాయా లేశ సమన్వితో,
‘వ్యష్టి దేహమ్’ ప్రవిశ్య,
తయా మోహితో జీవత్వమ్ అగమత్ ।

ఈశ్వరుడు స్వతఃగా సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు, మాయను తనయొక్క కళావిశేషముగా కలిగియున్నవాడు. అయితే అట్టి ఈశ్వరుడు తన కల్పన అగు వ్యష్టి దేహములలో ప్రవేశించినవాడై, మోహితుడుగా అగుచు (మోహము పొందినవాడై) ‘జీవత్వమును’ పొందుచున్నారు. “నేను ఒక జీవుడను" అను భ్రమతో కూడిన ఆవరణ పొందసాగుచున్నారు.

శరీరత్రయ తాదాత్మ్యాత్
కర్తృ-భోక్తృత్వతామ్ అగమత్,
జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - మూర్ఛా - మరణ ధర్మయుక్తో ।

ఇక ఆపై (స్థూల-సూక్ష్మ-కారణ) దేహత్రయముతో తదాత్మ్యము పొందినవాడై, “నేను కర్తను - భోక్తను" అను కర్తృత్వ - భోక్తృత్వముల స్వకీయ కల్పనకు బద్ధుడు అగుచున్నాడు. అట్టి ఈశ్వరుడు, “నేను స్థూల దేహిని, నేను సూక్ష్మదేహిని, నేను కారణ దేహిని”… అని త్రిదేహ భ్రాంతిని పొంది, అవియే తానుగా భావించుచూ క్రమంగా మేలుకొని జాగ్రత్ దశ, స్వప్నదశ, సుషుప్తి, మూర్ఛ, మరణము అను ఈఈ (5) ధర్మములు తనవిగా పొందుచున్నాడు.

ఘటీ యంత్రవత్ ఉద్విగ్నో
జాతో - మృత ఇవ
కులాల చక్రన్యాయేన
పరిభ్రమత్ ఇతి ॥

కులాల (కుండలు తయారు చేసే చక్రయంత్రమువలె ఉద్విగ్నుడై “నేను జనిస్తున్నాను. మరణిస్తున్నాను”… అనునవి భావిస్తూ చావు-పుట్టుకల మధ్య పరిభ్రమించటము ప్రారంభిస్తున్నాడు.


ద్వితీయో అధ్యాయః

1.) అథ పైఙ్గలో యాజ్ఞవల్మ్యం ఉవాచ :-
సర్వలోకానాం సృష్టి - స్థితి - అంతకృత్, విభుః, ఈశః
కథం జీవత్వమ్ అగమత్ - ఇతి?
పైఙ్గలుడు :  హే మహాత్మా! యాజ్ఞవల్క్య సద్గురుదేవా! మీరు చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. సర్వలోకాలను సృష్టించి - స్థితింపజేసి - లయింపజేయగల మహా సామర్ధ్యవంతుడు, సర్వాంతర్గతుడు, సర్వము తన విభూతియే అయి ఉన్నట్టి విభుడు, సర్వత్రా విస్తరించియున్న ఈశ్వరుడు…. ఈ విధంగా పరిమితము, సంకుచితము అగు జీవభావము ఎందుకు పొందుచున్నారు? ఎందుకు జీవుడుగా అగుచున్నారు? దయచేసి వివరించండి.
సహెూవాచ యాజ్ఞవల్యః :-
స్థూల సూక్ష్మ కారణ దేహ ఉద్భవ పూర్వకం
జీవ-ఈశ్వర స్వరూపం వివిచ్య కథయామి - ఇతి।
సావధానేన ఏకాగ్రతయా శ్రూయతామ్ ॥

యాజ్ఞవల్క్య మహర్షి :  ఓ ప్రియ పైఙ్గలా! స్థూల-సూక్ష్మ-కారణ దేహ పూర్వకముగా ఏ విధంగా జీవ- ఈశ్వర తత్త్వము ప్రదర్శితమగుచున్నదో …. తత్ ’విచారణ’ను వివరిస్తున్నానయ్యా! సావధాన చిత్తుడవై ఏకాగ్రతతో వినుచుండెదవు గాక! ఇది నీవు అడిగిన ప్రశ్నకు ఆత్యంతిక సమాధానం కాగలదు.

ఈశః పంచీకృత మహాభూత లేశాన్ ఆదాయ,
వ్యష్టి - సమష్ట్యాత్మక స్థూల శరీరాణి
యథాక్రమమ్ అకరోత్।

ఈశ్వరుడు (మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లు) స్వీయకల్పన అగు పంచీకృతములైన మహాభూతములను స్వీకరించినవారై, వ్యష్టి - సమిష్టి రూపములుగా - (5 x ½) , (½ + ⅛ + ⅛ + ⅛ + ⅛ + ⅛) - ఇటువంటి అనేక సంమిశ్రములతో స్థూల దేహములను యథా ప్రకారముగా (ఒక పిల్లవాడు మట్టితో ఆకారములు ఆడుకొనుటకై తయారు చేసుకొను రీతిగా) సృష్టించుచున్నారు.

కపాల - చర్మ - ఆన్త్రా - అస్థి - మాంస - నఖాని పృథివ్యంశాః ।

అట్టి ఈశ్వర సంకల్పానుసారంగా (½ పృధివి + ⅛ జల + ⅛ అగ్ని + ⅛ వాయు +⅛ ఆకాశ) అంశతో కూడిన పృథివి యొక్క అంశలుగా కపాలము, చర్మము, నరములు, మాంసము, గోరులు… ఇవన్నీ (భౌతిక దేహములో) ఏర్పడినవగుచున్నాయి.

రక్త - మూత్ర - లాలా - స్వేద ఆదికా అబంశాః ।

జలముయొక్క అంశలుగా భౌతికదేహములో రక్తము, మూత్రము, లాలా జలము, స్వేదము (చెమట) …. ఇవన్నీ ఏర్పాటు కాబడినవగుచున్నాయి.

క్షుత్ - తృష్ణ - ఉష్ణ - మోహ - మైథువా అగ్న్యంశాః ।

అగ్నియొక్క అంశలుగా ఆకలి, దాహము, ఉష్ణము (Heat), మోహము, మైథునము (Sexual Feelings) మొదలైనవి రూపుదిద్దుకుంటున్నాయి.

ప్రచారణ - ఉత్తరణ - శ్వాసాది వాయ్వంశాః ।

వాయువుయొక్క అంశలుగా నడవటము, దాటటము, దూకటము, శ్వాస మొదలైనవి ప్రదర్శితమగుచున్నాయి.

కామ - క్రోధ ఆదయో వ్యోమాంశాః ।

వ్యోమ (ఆకాశ) అంశలుగా కోరిక (కామము), క్రోధము… మొదలైనవి ప్రత్యక్షమై సంప్రదర్శితమగుచున్నాయి.

ఏతత్ సంఘాతం కర్మణి సంచితం, ‘త్వక్’ ఆదియుక్తం,
బాల్యాది అవస్థా - అభిమానాస్పదం
బహుదోషా ఆశ్రయమ్ ’స్థూలశరీరమ్’ భవతి ॥

ఈవిధంగా వాటన్నిటి యొక్క సంఘాతము (Mixing) చేత (సంచిత - పారబ్ధ - ఆగామి) కర్మలు, చర్మమయ దేహపరంపరలు, బాల్య - కౌమార - యౌవన - వార్ధక్య - మరణ - పునర్జన్మాది అవస్థలు, అనేకరూపములైన అభిమానములు… ఇటువంటివన్నీ ఒకచోటికి చేరినవై “స్థూలదేహము” రూపము అగుచున్నది. ఇవన్నీ పంచీకృత మహాభూత విశేషములు.

2.) అథ అపంచీకృత మహాభూత
రజో అంశ భాగత్రయ సమష్టితః ‘ప్రాణమ్’ అసృజత్।

ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన-సమానాః ప్రాణ వృత్తయః ॥

ఇక, అపంచీకృత మహాభూతములయొక్క రజో గుణ స్వభావము (Inclination to Function, Work, act) యొక్క త్రిగుణాంశలు అన్నీ చేరి ‘ప్రాణము’ అను చలన శక్తిని సృజించుచున్నాయి.

అట్టి ‘ప్రాణశక్తి’ యొక్క చలన వృత్తులను అనుసరించి, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనునవి పంచప్రాణ వృత్తులు!

నాగ - కూర్మ - కృకర - దేవదత్త - ధనంజయా ‘ఉపప్రాణాః’।

హృద - ఆసన - నాభి - కంఠ సర్వాంగమ్ ‘స్థానమ్’।

“నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయము.”… అని పిలువబడేవి పంచ ఉపప్రాణ వృత్తులు…!

హృదయము, గుదము, నాభి (బొడ్డు) కంఠము, సర్వాంగములు… ఇవన్నీ ప్రాణశక్తి స్థానములు.

ఆకాశాది రజోగుణ తుర్యభాగేన కర్మేంద్రియమ్ అసృజత్।

వాక్-పాద-పాణి-పాయూ-ఉపస్థాః తత్ వృత్తయః।

వచన - ఆదాన గమన - విసర్గ - ఆనందాః తత్ విషయాః।

మహాభూతములగు “ఆకాశము-వాయువు-అగ్ని-జలము-పార్ధివము”లకు సంబంధించి రజోగుణ ’4’వ భాగములతో కర్మేంద్రియములను ఈశ్వరుడు సృష్టించుచున్నారు.
(ఈశ్వరుడు = దేహ-దేహాంతరములకు సాక్షిగా ఉండి సర్వము చైతన్యపరచు తత్త్వము).

రజోతత్వము యొక్క వ్యావృత్తులు : వాక్కు, పాదములు, పాయువు, ఉపస్థ అనబడు కర్మేంద్రియ వృత్తులు.

రజోగుణ విషయములు : వచనము (మాట్లాడటము), అర్పించటము, గమనము, విసర్జనము, ఆనందము.

ఏవం భూత సత్త్వాంశ భాగత్రయ సమష్టితః అంతఃకరణమ్ అసృజత్।

అంతఃకరణ మనో - బుద్ధి - చిత్త - అహంకారాత్ తత్ వృత్తయః।

సంకల్ప - నిశ్చయ - స్మరణా -అభిమానా - అనుసంధానాః తత్ విషయాః।

గళ - వదన - నాభి - హృదయ - భ్రూమధ్యమ్ స్థానమ్।

అట్టి సూక్ష్మ భూతముల సత్వాంశముల మూడింటితో కూడినవై ‘అంతఃకరణము’ సృజించబడుతోంది.

సత్వాంశ భూత అంతఃకరణము యొక్క వృత్తులు : మనస్సు (ఆలోచన), బుద్ధి (విచక్షణ), చిత్తము (ఇష్టము), అహంకారము (నేను - నాది రూపము)…. అయి ఉన్నాయి. (అంతఃకరణ చతుష్టయం).

సత్వాంశ భూత అంతఃకరణము యొక్క విషయములు : సంకల్పము, నిశ్చయము, స్మరణము, అభిమానము అనుసంధానము చేయటము.

అంతఃకరణ స్థానములు :  గళము (గొంతు), ముఖము (వదనము), నాభి (బొడ్డు), హృదయము, భ్రూమధ్యము.

స భూత సత్త్వ తురీయభాగేన జ్ఞానేంద్రియమ్ అసృజత్।

శ్రోత్ర - త్వక్ - చక్షుః - జిహ్వ - ఆఘ్రాణాని తత్ వృత్తయః।

శబ్ద - స్పర్శ - రూప - రస -గంధాః తత్ విషయాః।

దిక్ - వాతా - అర్క - ప్రచేతో - అశ్వినౌ - వహ్ని - ఇంద్ర - ఉపేంద్ర మృత్యుకాః।

చంద్రో - విష్ణుః - చతుర్వక్త్రః - శంభుశ్చ కరణాఽధిపాః॥

అట్టి సూక్ష్మభూత సత్వము యొక్క “4వ భాగము” నుండి జ్ఞానేంద్రియములు జనిస్తున్నాయి.

జ్ఞానేంద్రియ తత్త్వము యొక్క పంచ వృత్తులు : శ్రోత్రము (చెవులు), త్వక్ (చర్మము), చక్షువులు (కళ్ళు), జిహ్వ (నాలుక), ఆఘ్రాణము (ముక్కు).

సూక్ష్మభూత - సత్వాంశము నుండి ప్రకటితమగు జ్ఞానేంద్రియ విషయాలు : శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు.

జ్ఞానేంద్రియములకు అధిష్ఠాన దేవతలు : అష్ట దిక్పాలకులు : వాయువు, సూర్యుడు, ప్రచోతుడు (వరుణుడు), కర్మేంద్రియ దేవతలు - అశ్వనీ దేవతలు, అగ్నిదేవుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మృత్యుదేవత.

మనో - బుద్ధి - చిత్త అహంకార అధిష్టాన దేవతలు : వరుసగా చంద్రుడు, విష్ణువు, చతుర్ముఖ బ్రహ్మ, శంభుడు.

3.) అథ అన్నమయ - ప్రాణమయ - మనోమయ -
విజ్ఞానమయ - ఆనందమయాః పంచకోశాః ।

ఇప్పుడు ఈ జీవ-జగత్తులకు సంబంధించిన పంచకోశములు గురించి వివరిస్తున్నాను.

పంచకోశములు :  1. అన్నమయ కోశము 2. ప్రాణమయ కోశము 3. మనోమయ కోశము 4. విజ్ఞానమయ కోశము 5. ఆనందమయ కోశము.

అన్నరసేనైవ భూత్వా, అన్నరసేన
అభివృద్ధిం ప్రాప్య, అన్నరసమయ
పృథివ్యాం యత్ విలీయతే,
సో అన్నమయకోశః
తదేవ స్థూల శరీరమ్॥

అన్నమయ కోశము (Matter) : ఇది అన్నరసముచే జనిస్తోంది. అన్న రసము చేతనే వృద్ధి చెందుచూ, చివరకు అన్న రసమయమగు పృధివియందు విలీనము అగుచున్నది. ఇదియే కంటికి ఎదురుగా కనిపిస్తున్న ’స్థూలదేహము’.

కర్మేంద్రియైః సహ ప్రాణాది
పంచకమ్ ప్రాణమయకోశః ।

ప్రాణమయ కోశము (Energy) : కర్మేంద్రియములతో సహా పంచ ప్రాణములతో కూడిన తత్త్వములు.

జ్ఞానేంద్రియైః సహ మనోమయకోశః ।

మనోమయ కోశము (Thought) : పంచ జ్ఞానేంద్రియములతో కూడిన మనోరూపము.

జ్ఞానేంద్రియైః సహ బుద్ధిః విజ్ఞానమయ కోశః ।

విజ్ఞానమయ కోశము (Knowing) : పంచ జ్ఞానేంద్రియములతో కూడిన ‘బుద్ధి’ తత్త్వము.

ఏతత్ కోశత్రయం ‘లింగశరీరమ్’ ।

ఇట్టి ప్రాణ-మనో-విజ్ఞాన-త్రికోశములను కలిపి “లింగశరీరము”  అని పిలుస్తున్నారు.

స్వరూప-అజ్ఞానమ్ ఆనందమయ కోశః ।
తత్ ‘కారణ శరీరమ్’ ।

ఆనందమయ కోశము (Enjoying) : స్వస్వరూపము యొక్క అజ్ఞానముచే అనుభవమగునది. దీనినే ‘కారణ శరీరము’ అని కూడా పిలుస్తున్నారు.

4.) అథ జ్ఞానేంద్రియ పంచకమ్,
కర్మేంద్రియ పంచకమ్, ప్రాణాది పంచకమ్,
వియత్ ఆది పంచకమ్, అంతఃకరణ చతుష్టయం,
కామ కర్మ తమాంస్య అష్టపురమ్ ॥

పుర్యష్టకము (అష్టపురి) :-

1.) జ్ఞానేంద్రియ పంచకము (5) (చెవులు-చర్మము-కళ్ళు-నాలుక-ముక్కు)
2.) కర్మేంద్రియ పంచకము (5) (కాళ్ళు-చేతులు-గుదము-శిశ్నము-నోరు)
3.) ప్రాణ పంచకము (5) (ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన-సమానములు)
4.) (ఆకాశ-వాయు-అగ్ని-జల-భూ) - భూతపంచకము (5)
5.) అంతఃకరణ చతుష్టయము (4) (మనో-బుద్ధి-చిత్త-అహంకారములు)
6.) కామము (1)
7.) కర్మము (1)
8.) తమస్సు (అజ్ఞానము) (1)

ఇది “పుర్యష్టకము”! (Eight Factored Townsip) (27 రీతులైనవి).

ఈశా ఆజ్ఞయా విరాట్
‘వ్యష్టి’ దేహమ్ ప్రవిశ్య,
బుద్ధిమ్ అధిష్ఠాయ,
విశ్వత్వమ్ అగమత్
విజ్ఞానాత్మా చిదాభాసో విశ్వో
వ్యావహారికో జాగ్రత్స్థూల దేహాభిమానీ, కర్మభూః
ఇతి చ ‘విశ్వస్య’ నామ భవతి।

జాగ్రత్ అభిమాన పురుషకారము : ఈశ్వరాజ్ఞను అనుసరించి విరాట్ పురుషుడు ‘వ్యష్టి దేహము’లో ప్రవేశించి, బుద్ధిని అధిష్ఠించినవాడై విశ్వమును (దృశ్యమును) పొందుచూ ‘విశ్వుడు’ అని పిలవ బడుచున్నాడు. ఆ విరాట్టు “విజ్ఞానాత్మ” అని, “చిదాభాసుడు” అని, “విశ్వుడు”  అని “వ్యావహారికుడు” అని, “జాగ్రత్ స్థూల దేహాభిమాని” అని “కర్మభూయిష్టుడు" అను పేర్లతో వర్ణింపబడుచున్నారు.

ఈశా ఆజ్ఞయా సూత్రాత్మా
వ్యష్టి సూక్ష్మ శరీరమ్ ప్రవిశ్య,
మనః అధిష్ఠాయ ‘తైజసత్వమ్’ అగమత్।
తైజసః ప్రాతిభాసికః స్వప్నకల్పిత
ఇతి ‘తైజసస్య’ నామ భవతి।

స్వప్న అభిమాన-పురుషకారము : ఈశ్వరాజ్ఞానుసారంగా ఒక్కొక్క వ్యష్టియొక్క సూక్ష్మ దేహములో ప్రవేశించి, ఆవిరాట్టు ’మనస్సు’ను, ’తేజస్సు’ను అధిష్ఠించి ’తైజసుడు’ అను పేరుతో స్వప్నాభిమానియై చెన్నొందుచున్నారు. అట్టి తైజసునకు ప్రాతిభాసికుడు, స్వప్నకల్పితుడు…. మొదలైన పేర్లు కూడా ఉన్నాయి.

ఈశా-ఆజ్ఞయా, మాయా-ఉపాధిః,
అవ్యక్త సమన్వితో, వ్యష్టి కారణశరీరమ్ ప్రవిశ్య
ప్రాజ్ఞత్వమ్ అగమత్।
ప్రాజ్ఞో అవిచ్ఛిన్నః పారమార్థికః సుషుప్త్య - అభిమాని
ఇతి ‘ప్రాజ్ఞస్య’ నామ భవతి।

సుషుప్త అభిమాన-పురుషకారము : ఈశ్వరాజ్ఞను అనుసరించియే ఆ విరాట్ పురుషుడు (ఈశ్వరుడు) మాయను ఉపాధిగా తీసుకొని ‘అవ్యక్తము’తో కూడుకున్నవాడై వ్యష్టియొక్క ‘కారణ శరీరము’నందు ప్రవేశించి “ప్రాజ్ఞత్వము” పొందుట జరుగుతోంది. అట్టి ‘ప్రాజ్ఞుడు’నకు ‘అవిచ్ఛిన్నుడు’, ‘పారమార్ధికుడు’, ’సుషుప్త్య అభిమాని… మొదలైన శబ్ద-తత్ శబ్దార్ధములతో పిలువబడుచూ ఉన్నాడు.

5.) అవ్యక్తలేశా - అజ్ఞాన ఆచ్ఛాదిత
పారమార్థిక జీవస్య "తత్త్వమసి”
ఆది వాక్యాని బ్రహ్మణా ఏకతాం జగుః ।

(సర్వము వ్యక్తీకరిస్తూ తాను వేరై ఉన్నట్టి) అవ్యక్త తత్వముచే ఆవరించబడిన పారమార్థిక స్వస్వరూపము వేద, ఆత్మజ్ఞ ఆప్తవాక్యములైనట్టి "తత్త్వమసి, సోఽహమ్” మహావాక్య మనన - నిదిధ్యాసలచే భిన్నత్వమునకు ఆధారమైనట్టి ఏకరస బ్రహ్మముగా అనుభవమగుచున్నది.

నేతరయోః వ్యావహారిక,
ప్రాతిభాసికయోః,
అన్తఃకరణ ప్రతిబింబిత
చైతన్యమ్ యత్, తదేవ
‘అనస్థాత్రయభాగ్’ భవతి।

ఇక్కడ ఎదురుగా ఇంద్రియములకు ఏ వ్యావహారిక భేదమంతా అగుపిస్తోందో, అట్టి ఇక్కడి భేదమంతా కూడా ‘అంతఃకరణము’ అనే తటాక జలంలో ప్రతిబింబించే చైతన్య బింబము (లేక) అంతఃకరణ దర్పణములో ప్రతిబింబమువంటిది మాత్రమే. అట్టి అంతఃకరణ ప్రతిబింబిత చైతన్యమే జాగ్రత్-స్వప్న-సుషుప్తి రూపములుగా ఒకదాని వెనుక మరొకటిగా ప్రదర్శితమగుచున్నది.

స జాగ్రత్-స్వప్న-సుషుప్తి అవస్థాః ప్రాప్య,
ఘటీ యంత్రవత్ ఉద్విగ్నో
జాతో - మృత ఇవ స్థితో భవతి।
అథ జాగ్రత్ స్వప్న సుషుప్తి మూర్ఛా
మరణావస్థాః పన్చ భవన్తి।

ఈశ్వరుడు సర్వసాక్షి, సర్వమునకు పరము, మహాసంపన్నుడు అయి ఉండి కూడా, స్వకల్పితమగు ‘ఊహ’ అనే ప్రాతిభాసికమునందు ప్రవేశించి జాగ్రత్-స్వప్న-సుషుప్తి అవస్థలు ప్రాప్తింపజేసుకుంటూ…. పైకి - క్రిందికి తిరిగే ఘటీయంత్రమువలె జీవన మృతుని వలె స్థితిపొందిన వాడగుచున్నాడు. జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - మూర్ఛ - మరణములు అనబడే పంచ అవస్థలు వరసగా పొందుచూ ఉన్నాడు.

తత్ తత్ దేవతా అనుగ్రహాన్వితైః
శ్రోత్రాది జ్ఞానేంద్రియైః
శబ్దార్థ విషయ గ్రహణ జ్ఞానమ్
"జాగ్రదవస్థా” భవతి।

జాగ్రత్ అవస్థ :-
శ్రోత్ర - త్వక్కు - చక్షువులు - జిహ్వ - ఘ్రాణము (వినికిడి-స్పర్శ-చూపు-రుచివాసనలనే) అనే జ్ఞానేంద్రియముల శబ్ద- అర్ధ విషయములను గ్రహించు జ్ఞాన స్థితియే ‘జాగ్రత్ అవస్థ’ అయి ఉంటోంది.

తత్ర భ్రూమధ్యంగతో జీవ
ఆపాద - మస్తకం వ్యాప్య కృషి
శ్రవణాది అఖిల క్రియా ‘కర్తా’ భవతి।
తత్ తత్ ఫలభుక్ చ భవతి।

లోకాంతరగతః కర్మార్జిత ఫలం
స యేవ భుంక్తే।

స సార్వభౌమవత్ వ్యవహారాత్
శ్రాన్తో అన్తర్భవనమ్ ప్రవేష్టుం మార్గమ్ ఆశ్రిత్య తిష్ఠతి॥

అట్టి జాగ్రత్ అవస్థలో భ్రూమధ్య ఆకాశగతుడై జీవుడు (ఈశ్వరుని యొక్క జీవ చైతన్యము), దేహములో కాలి బొటన వేలునుండి శిరస్సు వరకు వ్యాపించి ఉండి వినటము-చూడటము-స్పర్శ-రుచి చూడటము-వాసన… వీటన్నిటికీ కర్త అగుచున్నాడు. కర్తృత్వము వహిస్తున్నాడు. వాటి వాటికి కర్మఫలభోక్త కూడా అగుచున్నాడు.

ఈవిధంగా ఈశ్వర స్వరూపుడే అయి ఉన్న ఈ జీవుడు దేహాభిమానియై ఉంటూ, ఆ దేహము శిధిలమైనప్పుడు కర్మానుసారంగా మరొక లోకములో ప్రవేశించి, కర్మఫలములను అనుభవించటమును కొనసాగిస్తున్నాడు.

ఒక సార్వభౌముడు (చక్రవర్తి) అనేక కార్యక్రమములు నిర్వర్తించి అలసి తిరిగి అంతఃపురమునకు బయలుదేరు విధంగా, ఈ జీవుడు కూడా గాఢ నిద్రయందు ప్రవేశిస్తున్నాడు.

6.) కరణ ఉపరమే జాగ్రత్ సంస్కారోత్థ ప్రబోధవత్,
గ్రాహ్య - గ్రాహక రూప స్ఫురణమ్
‘స్వప్నావస్థా’ భవతి।

స్వప్న అవస్థ :-
జాగ్రత్‌లో ఇంద్రియానుభవములన్నీ విరమించబడినవై అంతఃకరణములోని సంస్కారార్థములను బాహ్యత్వము లేకుండగానే, అంతరములో “గ్రహించువాడు - గ్రహించబడునది" ఈ ఉభయముతో కూడి ఈ జీవుడు అనుభవించటము.

స్వప్నావస్థ = మనస్సు తనకు తానే ఉపకరణమై తనయందే దృశ్యానుభవం పొందటము.

తత్ర విశ్వ ఏవ జాగ్రత్ వ్యవహార లోపాత్,
నాడీ మధ్యం చరన్,
తైజసత్వమ్ అవాప్య
వాసనా రూపకం జగత్-వైచిత్ర్యం
స్వభాసా భాసయన్,
యథా ఈప్సితం స్వయం భుంక్తే।
చిత్తా - ఏకకరణా ‘సుషుప్త్యవస్థా’ భవతి।

ఆ జాగ్రత్ అనుభవ జీవుడగు విశ్వుడే జాగ్రత్ వ్యవహారమంతా ఉపశమించగా, నాడీ మధ్యగా ప్రవేశించి ‘తైజసత్వము’ (స్వప్నదృశ్యము) పొందుచున్నాడు కూడా! వాసనారూపకమగు ఈ జగత్ వైచిత్ర్యమంతా, వాస్తవానికి ఆత్మయొక్క స్వయం ప్రకాశ భాసక విశేషమే! అయితే, ఈ జీవుడు ఏ భావనతో చూస్తే అదియే స్వయముగా ఆ రీతిగా అనుభవ రూపమగుచున్నది. (యద్భావమ్-తత్భవతి)

భ్రమ విశ్రాంత శకునిః
పక్షౌ సంహృత్య నీడాభిముఖం యథా గచ్ఛతి…,
తథా జీవోఽపి జాగ్రత్ - స్వప్న
ప్రపంచే వ్యవహృత్య శ్రాన్తో (శాంతో)
అజ్ఞానం ప్రవిశ్య స్వానన్దమ్ భుంక్తే।

సుషిప్తి అవస్థ :-
చిత్తము అనేకీకరణమును త్యజించి ‘ఏకీకరణము’ సంతరించుకున్నప్పుడు ‘సుషుప్తి అవస్థ’ సిద్ధించుచున్నది.

ఒక పక్షి ఆహారము కొరకై ఎక్కడెక్కడో సంచారాలు చేసి-చేసి, సాయంకాలం చీకటి పడుచుండగా తిరిగి తాను నివసించే వృక్షముపై వ్రాలి రెక్కలు ముడుచుకొని ఇక విశ్రాంతి తీసుకుంటుంది చూచావా? అట్లాగే ఈ జీవుడు కూడా జాగ్రత్-స్వప్న ప్రపంచములో వ్యవహరించి, తిరిగి - తిరిగి, ఎంతో అలసిపోయి, అజ్ఞానము (తెలుసుకోవటమును ఉపసంహరించటము)ను ఆశ్రయించి ’స్వస్థానము’ను ఆస్వాదిస్తూ ఉండటమే ‘సుషుప్తి’.

7.) అకస్మాత్ ముద్గర దండా ఆద్యైః
తాడితవత్ భయా అజ్ఞానాభ్యామ్
ఇంద్రియ సంఘాతైః
కమ్పన్ ఇవ మృతితుల్యా మూర్ఛా భవతి।

మూర్ఛ :-
(స్పృహ కోల్పోవడం) అకస్మాత్తుగా ఏదైనా ముద్గర (ఇనప కడ్డీ మొదలగునవి) బలముగా తలకు తాకినప్పుడు, ఆ జీవుడు భయ-అజ్ఞానము (మతిమరపు)లకు లోనై, ఇంద్రియ సంఘాతముచే మృతితో సమానమైన కంపన పొందటమే ’మూర్ఛ’ రూపము.

జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - మూర్ఛా
అవస్థానామ్ అన్యా, బ్రహ్మాది
స్తంభ పర్యంతమ్ సర్వం జీవ భయప్రదా,
స్థూలదేహ విసర్జినీ “మరణావస్థా" భవతి|

మరణము :-
స్థూల దేహమును విడుచు చుండునట్టి స్థితి. జాగ్రత్-స్వప్న-సుషుప్తిమూర్ఛల కంటే అన్యమై అనుభవమగునట్టిది. బ్రహ్మ దేవుడు మొదలుగా, ఒక స్థంభము పర్యంతము సర్వ జీవులకు భయప్రదమైనది. స్థూల దేహ విసర్జనమే మరణము.

కర్మేంద్రియాణి, జ్ఞానేంద్రియాని, తత్ తత్
విషయాన్ ప్రాణాన్ సంహృత్య
కామకర్మాన్వితా, అవిద్యా భూత వేష్టితో
జీవో ‘దేహన్తరమ్’ ప్రాప్య, ’లోకాన్తరమ్’ గచ్ఛతి।
ప్రాక్ కర్మఫలపాకేనా, ఆవర్తాంతర
కీటవత్, విశ్రాంతిం నైవ గచ్ఛతి।

పునర్జన్మ :-
ఈ జీవుడు వర్తమాన భౌతిక దేహము త్యజించుచున్నప్పుడు (మరణించుచున్నపుడు) కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, వాటివాటి
వృత్తులైనటువంటి విషయములను, పంచప్రాణముల దేహాంతర్గత చలనములను ఉపసంహరించుకొని, “కామకర్మభావనలను, అజ్ఞానము (అవిద్య)”ను వెంటబెట్టుకొని, బహిష్కృతుడై, అవిద్యా-కామములచే మరొక దేహమును పొందుచూ, మరొక లోకములో ప్రవేశమానుడగుచున్నాడు. ఈ విధంగా పూర్వకర్మ ఫలముల ప్రభావముచే సుడిగుండములో పడిన కీటకమువలె దేహ-దేహాంతరములలోనికి సుదీర్ఘ ప్రయాణములు నిర్వర్తిస్తున్నాడు. (పునరపి జననం। పునరపి మరణం।).

సత్కర్మ పరిపాకతో, బహూనాం
జన్మనామ్ అంతే నౄణాం మోక్షేచ్ఛా జాయతే।

తదా సద్గురుమ్ ఆశ్రిత్య
చిరకాలసేవయా బంధాత్ (న్)
మోక్షం కశ్చిత్ ప్రయాతి।

మరొకప్పుడు తన సత్కర్మల పరిపాకము (ఫలప్రదము) అవటముచేత, అనేక జన్మలలో సంచరిస్తున్న ఈ జీవుడు “నాకు ఎక్కడినుండో బంధము వచ్చిపడింది. ఇప్పుడు మోక్షము ఆవశ్యకము" - అని మోక్షేచ్ఛ పొందుచున్నాడు.

అట్టి మోక్షేచ్ఛచే అప్పుడు సద్గురువును ఆశ్రయించి, చిరకాలము గురుసేవ చేసినవాడై…. మోక్షమును పొందుచున్నాడు.

అవిచారకృతో బంధో,
విచారాత్ మోక్షో భవతి।

తస్మాత్ సదా విచారయేత్।
అధ్యారోపా అపవాదతః
స్వరూపం నిశ్చయీ కర్తుం శక్యతే।

అవిచారణచే బంధము, విచారణచే మోక్షము కలుగుచున్నాయి!

అందుచేత ఓ పైఙ్గలా! విజ్ఞుడైనవాడు ఎల్లప్పుడు విచారణశీలుడై ఉండాలయ్యా! వేదాంతవేత్తలచే, వేదాంత శాస్త్రముచే అధ్యారోప - అపవాద సిద్ధాంతములను బుద్ధితో గ్రహించుచుండగా, స్వరూప నిశ్చలతను ఆశ్రయించి ‘అహమేవ ఆత్మా! …అను సునిశ్చయమును సంతరించుకొనుచున్నాడు.

తస్మాత్ సదా విచారయేత్।

జగత్ - జీవ - పరమాత్మనః
జీవభావ, జగత్భావ బాధే ప్రత్యక్ అభిన్నం
బ్రహ్మైవ అవశిష్యత ఇతి ॥

అందుచేత ఓ పైఙ్గల మహాశయా! ఈ జీవుడు జగత్తు-జీవుడు-పరమాత్మల గురించి అత్యంత శ్రద్ధ-ఆసక్తి-తెలివిలతో (బుద్ధులతో) విచారణ చేస్తూ ఉండాలి.

“ఈ జీవుని తత్త్వమేమిటి? ఈ జగత్తుయొక్క తత్త్వమేమిటి?….. అనునవి, వాటి స్వరూప స్వభావములను ప్రత్యక్ అభిన్నముగా (బ్రహ్మముగా) ఎరుగుటచే, ఇప్పుడిక ఇదంతా సర్వదా బ్రహ్మమే అయి శేషించినదగుచున్నది.


తృతీయో అధ్యాయః

1.) అథ హి ఏనం పైఙ్గలః పప్రచ్ఛ యాజ్ఞవల్క్యమ్ :
మహావాక్యవివరణమ్ అనుబ్రూహి। ఇతి ॥

పైఙ్గలుడు :  గురుదేవా! మహనీయా! మహాత్మా! యాజ్ఞవల్క్యా! నాపై కరుణతో ఇప్పుడు మహావాక్యములు - వాటి వివరణార్థములు విశదీకరించ ప్రార్థన!

సహెూవాచ యాజ్ఞవల్క్యః -
తత్త్వమసి। త్వమ్ తత్ అసి।
త్వమ్ బ్రహ్మాఽసి। అహమ్ బ్రహ్మాఽస్మి।
ఇతి అనుసంధానం కుర్యాత్।

యాజ్ఞవల్క్యుడు :

తత్ త్వమ్ అసి! - తత్ బ్రహ్మమే నీవు అయి ఉన్నావు!
త్వమ్ తత్ అసి! - నీవు బ్రహ్మమే!
త్వమ్ బ్రహ్మా అసి! - నీ సృష్టికి కారణము నీవే!
అహమ్ బ్రహ్మా అస్మి! - నేను పరబ్రహ్మమునే!

… ఈ ఈ మహావాక్యముల మహత్తర ఉద్దేశ్యార్థనమును ఎల్లప్పుడు అనుసంధానం చేయాలి.

తత్ర పారోక్ష్య శబళ ‘సర్వజ్ఞత్వ’ ఆది లక్షణో…,
మాయ-ఉపాధి సత్-చిత్-ఆనంద లక్షణో…,
జగత్ యోనిః తత్ పదవాచ్యో భవతి।

మొట్టమొదట పరమాత్మను ప్రథమ పురుష (Third Person)గా సర్వజ్ఞత్వ, సర్వతత్త్వ స్వరూపుడుగా, పరోక్షుడుగా ‘మాయ’ను ఉపాధిగా ధరించిన ఈశ్వరునిగా, సత్-చిత్-ఆనంద స్వరూపునిగా ధ్యానిస్తూ ఉండగా - ఈ ఎదురుగా కనిపిస్తున్న జగత్తు తత్ పద-స్వంపద వాచ్యార్థమై స్ఫురించగలదు. (క్రమంగా అది ‘ఉత్తమపురుష’ (First Person)గా రూపుదిద్దుకొనుచున్నది).

స ఏవా అంతఃకరణ సమ్భిన్న (సత్-భిన్న) బోధో,
‘అస్మత్’ ప్రత్యయా అవలంబనః,
‘త్వమ్’ పదవాచ్యో భవతి।
పర జీవోపాధీ మాయా-అవిద్యే విహాయ ‘తత్ త్వమ్’
పదలక్ష్యం, ప్రత్యక్ అభిన్నం బ్రహ్మ॥

ఈశ్వరుడే అంతఃకరణముతో కూడినవాడై “అస్మత్-నేను” అను ప్రత్యయమునకు అర్థరూపుడు అగుచున్నాడు. అవలంబనుడు అయి త్వమ్ రూపమునకు వాచ్యారూపుడు అగుచున్నాడు. ‘అస్మత్-త్వం’ యొక్క ఆత్యంతికార్థమే ఈశ్వర స్వరూపము!

ఈశ్వరునికి సంబంధించినది ‘మాయ’! జీవునికి సంబంధించినది ‘అవిద్య’! ఈ మాయా - అవిద్యలను విడచిపెట్టినప్పుడు ఇక తత్-త్వమ్ పదలక్ష్యము ప్రత్యగభిన్నమగు బ్రహ్మమే!

2.) తత్ త్వమ్ అసీతి, అహమ్ బ్రహ్మాఽస్మీతి,
వాక్యార్థ విచారః "శ్రవణం” భవతి|

శ్రవణము : తత్ త్వమ్ అసి, అహమ్ బ్రహ్మాఽస్మి - ఈ ఈ మహా వాక్యముల అర్థ విచారణయే ‘శ్రవణము’ అయి ఉన్నది. ఆచార్య- శిష్యుల వ్యవహారమంతా శ్రవణమే!

ఏకాంతేన శ్రవణాత్ అర్థానుసంధానమ్
‘మననమ్’ భవతి।

మననము : శ్రవణము చేసిన (వినినట్టి) - బోధించుచున్నట్టి మహావాక్యార్థముల అనుసంధానము (తత్-దృష్టితో “అహమ్-త్వమ్”లను సమన్వియించుకొనుచూ ఉండటము) “మననము” అని చెప్పబడుతోంది. ఇది అంతరంగముగా జరుగు స్వకీయ సాధన!

శ్రవణ - మనన నిర్విచికిత్సే అర్థే
వస్తుని ఏకతాన్, అతయా
చేతః స్థాపనం “నిదిధ్యాసనం” భవతి।

నిది ధ్యాస : శ్రవణ-మననముల అర్ధమునందు సంశయ రహితముగా, నిర్విచికిత్సగా (Keeping the Analytical feature also as silent) ఏకాగ్రముగా బుద్ధిని స్థాపించటమే “నిది ధ్యాస”! నిది ధ్యాస అను అభ్యాసమునందు (1) ఏకాగ్రత చేయువాడు, (2) ఏకాగ్రము చేయబడునది ఈ రెండు మాత్రమే శేషించి ఉంటాయి. ఆ రెండిటి ఏకత్వము సహజమై అనుభవమగుచున్నది.

ధ్యాతృ ధ్యానే విహాయ
నివాత స్థిత దీప ’ధ్యేయే’ ఏక గోచరం
చిత్తం ‘సమాధిః’ భవతి।


తదానీమ్ ఆత్మగోచరా వృత్తయః
సముర్థితా ‘అజ్ఞాతా’ భవంతి।

సమాధి : ధ్యాతృ (ధ్యానము చేయు కర్త) - ధ్యానము (ధ్యానింపబడునది) … ఈ రెండింటిని విడచి గాలి వీచనిచోట వెలుగుచున్న దీపము వలె చిత్తము, చంచలత్వము త్యజించి ఉండటమును “సమాధి స్థితి” అని పిలుస్తున్నారు. ఏది ఎట్లున్నా ఆత్మగా చూడటం - సమాధి.

ఆత్మనే సర్వత్రా దర్శించు ఏకైక వృత్తిచే ఆత్మకు వేరై ఏదీ కించిత్తు కూడా తెలియబడక, సర్వము ఆత్మగా స్మరించబడుచుండు స్థితియే సమాధి.

తాః స్మరణాత్ అనుమీయనే।
ఇహా అనాది సంసారే సంచితాః
కర్మకోటయో అనేనైవ విలయం యాంతి।

తతో అభ్యాస పాటవాత్
సహస్రశః సదా ‘అమృతధారా’ వర్షతి।

తతో యోగవిత్తమాః సమాధిం ధర్మం మేఘం -
ప్రాహుః ।

అట్టి సమాధి (ధ్యాతృ-ధ్యేయ రహిత ధ్యాన స్థితి) యొక్క సమాధి అభ్యాసముచే సంసార సంబంధమైన అసంఖ్యాక కర్మ పరంపరా బంధములన్నీ నీటిలో వేసిన ఉప్పుగడ్డల వలె విలయము పొందగలవు.

సమాధి అభ్యాసముచే క్రమంగా సహస్రారము నుండి సదా అమృతధారలు వర్షించగలవు.

అందుచేతనే యోగపండితులు "సమాధిస్థితి ఆత్మ ధర్మమును వర్షింపజేయు మేఘము వంటిది” - అని అభివర్ణిస్తున్నారు.

వాసనాజాలే నిశ్శేషమ్ అమునా
ప్రవిలాపితే, కర్మ సంచయే
పుణ్య పాపే సమూలా - ఉన్మీలితే,
ప్రాక్-పరోక్షమపి
కరతల ఆమలకవత్ వాక్యమ్
అప్రతిబద్ధా అపరోక్ష సాక్షాత్కారం ప్రసూయతే,
తదా ‘జీవన్ముక్తో’ భవతి।

జీవన్ముక్తి : సమాధి అభ్యాసము (ద్రష్ట-దర్శన దృశ్యములో లయింపజేసినట్టి కేవల దృక్ స్థానాభ్యాసము)చే సర్వ వాసనా జాలములు నిశ్శేషముగా నశించిపోగా, కర్మ సంచయముల సంబంధతపైన పుణ్య పాపములు సమూలముగా లయించిపోవుచున్నాయి. మహావాక్యముల (తత్ త్వమ్ - సోఽహమ్ ఇత్యాదుల) ముందు వెనుకల పరోక్షార్థము, అపరోక్షార్థముగా కరతల ఆమలకము అగుచున్నది. ఆపై ఇక, అప్రతిబద్ధము సర్వ అనుమానాలు తొలగినట్టి స్వభావసిద్ధమగు అపరోక్షజ్ఞానము అనుభవమగుచూ, ఆతడు ’జీవన్ముక్తుడు’  అగుచున్నాడు.

3.) ఈశః పంచీకృత భూతానాం
“అపంచీకరణం కర్తుం” సో అకామయత।

అపంచీకరణము - ఉపసంహారము

ఇప్పటివరకూ ఈశ్వర రచితమైనట్టి పంచీకరణ రూప జగత్ సృష్టి - స్థితుల గురించి చెప్పుకున్నాము కదా! ఇక ఇప్పుడు ఆ ఈశ్వరుడు స్వీయకృతమైన పంచీకరణమును “నేను అపంచీకరణము చేసెదను గాక!” అని (పిల్లవాడు ఆటలు విరమించి ఇల్లు చేరు రీతిగా….) భావించుచున్నారు. ’లయము’ను నిర్వర్తించటము గురించి చెప్పుకుందాము.

బ్రహ్మాండం, తద్గత లోకాన్
కార్యరూపాంశ్చ కారణత్వం
ప్రాపయిత్వా తతః సూక్ష్మాంగమ్ కర్మేంద్రియాణి
ప్రాణాశ్చ జ్ఞానేంద్రియాణి,
అంతఃకరణ చతుష్టయం చ ఏకీకృత్య,
సర్వాణి భౌతికాని కారణభూత - పంచకే
సంయోజ్య।

కార్య (That which produced, designed, executed) రూపములో ఉన్న బ్రహ్మాండములో అంతర్గతమైయున్న లోకములను - ఈశ్వరుడు “కారణరూపము”గా పొందించనారంభిస్తున్నారు.

సూక్ష్మాంగములైన కర్మేంద్రియములను, ప్రాణములను, జ్ఞానేంద్రియములను, అంతఃకరణ చతుష్టయమును ఏకీకృతము (ఏకముగా, ఒక్కటిగా) చేయుచున్నారు.

పంచభూతముల సంబంధమైన సర్వ దృశ్య వ్యవహారములను కారణ పంచభూతముల లోనికి ఉపసంహరిస్తున్నారు. అనగా ఆత్మ రూపమగు ఆభేద తత్త్వముగా భావించి, లయింపజేస్తున్నారు.

భూమిం → జలే,
జలం → వహ్నౌ,
వహ్నిం → వాయౌ,
వాయుమ్ → ఆకాశే చ,
ఆకాశమ్ → అహంకారే చ,
అహంకారమ్ → మహతి,
మహత్ → అవ్యక్తే,
అవ్యక్తం → పురుషే,
క్రమేణ విలీయతే।

పృథివి (భూమి)ని → జలము (ద్రవము) నందు,
జలమును → అగ్నియందు,
అగ్నిని → వాయువునందు,
వాయువులను → ఆకాశమునందు,
ఆకాశమును → అహంకారమునందు,
అహంకారమును → ‘మహత్’ యందు,
మహత్తును → అవ్యక్తమునందు,
అవ్యక్తమును → పురుషునియందు,
… క్రమముగా విలీనము సలుపుచున్నాడు.

విరాట్ హిరణ్యగర్భ ఈశ్వరా
ఉపాధి విలయాత్
పరమాత్మని లీయంతే।

విరాట్టు - హిరణ్యగర్భుడు - ఈశ్వరుడు … ఈ ఉపాధులన్నీ పరమాత్మ యందు విలీనమగుచున్నాయి.

4.) పంచీకృత మహాభూత సంభవ
కర్మసంచిత స్థూలదేహః।
కర్మక్షయాత్ సత్కర్మ పరిపాకతో
‘అపంచీకరణమ్’ ప్రాప్య,
సూక్ష్మేణా ఏకీభూత్వా
కారణరూపత్వమ్ ఆసాద్య,
తత్ కారణమ్ కూటస్థే ప్రత్యగాత్మని విలీయతే।

ఈ స్థూలదేహము కర్మ సంచయము (As a sequence and consequence of acts and activities)గా సూక్ష్మత్వము సంతరించుకోవటం జరుగుతోంది. సత్ కర్మలచే కర్మక్షయము ఏర్పడుచుండగా, సత్ కర్మల పరిపాకముచే, క్రమంగా భౌతిక దేహ సంబంధమైన వేరువేరైన శబ్ద-స్పర్శ- రూప- రస-గంధాది సూక్ష్మ తత్త్వములన్నీ ఏకీభూతము (ఏకరూపము)గా రూపొందుచున్నాయి. తదనంతరము అట్టి ఏకీభూతము కారణ రూపమగు పరమాత్మయందు (తత్, ప్రత్యగాత్మ యందు) విలీనమగుచున్నాయి.

విశ్వ తైజస ప్రాజ్ఞాః స్వస్వ ఉపాధి లయాత్
ప్రత్యగాత్మని లీయంతే।

ఇక విశ్వుడు (జాగ్రత్ అనుభవ అభిమాని), తేజసుడు (స్వప్నానుభవ అభిమాని), ప్రాజ్ఞుడు (సుషుప్తానుభవ అభిమాని)… ముగ్గురు అభిమానులు తమ తమ అనుభూత-అనుభవ శరీరములను త్యజించుచు ప్రత్యగాత్మయందు విలీనము పొందుచున్నారు.

అండం జ్ఞానాజ్ఞినా దగ్ధం కారణైః
సహ పరమాత్మని లీనం భవతి।

అండము (బ్రహ్మాండాభిమానము) జ్ఞానాగ్నియందు దగ్ధమై తన యొక్క కారణ తత్త్వముతో సహా స్వస్వరూప-పరమాత్మయందు లీనమగుచున్నది.

తతో బ్రాహ్మణః సమాహితో భూత్వా,
‘తత్-త్వమ్’ పదైక్యమేవ సదా కుర్యాత్।

తతో మేఘాఽపాయే, అంశుమాన్ ఇవ
ఆత్మా ఆవిర్భవతి।

ఈ కనబడేదంతా చివరికి బ్రహ్మమునందు విలీనము అగుటయే స్వభావముగా కలిగియున్నది. కాబట్టియే బ్రహ్మతత్త్వమును ఉపాసించు బ్రాహ్మణుడు సర్వసమదర్శనముచే సమాహితుడై, సర్వమును ‘తత్-త్వమ్’ అను దృష్టియందు (లేక) పదమునందు లయింపజేసినవాడై ఉంటున్నాడు.

అప్పుడు- మేఘములు తొలగగానే సూర్యుడు ప్రకాశించు రీతిగా, అజ్ఞానము తొలగగా, "సర్వము సర్వదా ఆత్మయే” అను ఆత్మ జ్ఞానముతో కూడిన ఆత్మానుభవానందము ఆవిర్భవించగలదు.

5.) ధ్యాత్వా మధ్యస్థమ్ ఆత్మానం
కలశాంతర దీపవత్
అంగుష్ఠమాత్రమ్ ఆత్మానమ్
అధూమ జ్యోతిరూపకమ్
ప్రకాశయంతమ్ అంతస్థమ్
ధ్యాయేత్ కూటస్థమ్ అవ్యయమ్|

ఓ పైఙ్గలా! మనమంతా సర్వదా హృదయములో పొగలేని దీపశిఖ వలె సర్వదా ప్రకాశించుచున్న అంగుష్ఠ మాత్ర పరమపురుషుడగు ఆత్మను కూటస్థముగా అవ్యయముగా ధ్యానించాలయ్యా! మనలో ప్రతి ఒక్కరియందు వెలుగుచున్న కూటస్థ ఆత్మజ్యోతియే ధ్యేయ వస్తువు.

ధ్యాయన్ ఆస్తే మునిశ్చైవ చ
అసుప్తేః అమృతేస్తు యః
జీవన్ముక్తః స విజ్ఞేయః।
స ధన్యః! కృతకృత్యవాన్।

జీవన్ముక్తపదం త్యక్త్వా
స్వదేహే కాలసాత్
కృతే విశత్య దేహముక్తత్వం
పవనో అస్పందతామ్ ఇవ।

ఎవ్వరైతే తనలోనే “పొగలేని జ్యోతివలె సదా ప్రకాశించుచున్న అంతర్ కూటస్థాత్మజ్యోతి స్వరూపమే నేను, ఈ సర్వ-దృశ్య గత స్వరూపమును కూడా!" అని నిరంతరము స్వీయాంతర్గత ఆత్మజ్యోతిని దర్శిస్తూ తదితర వ్యతిరిక్త భావనా-విషయముల పట్ల మౌనము వహించి, ధ్యానమును (ధ్యాస కలిగి ఉండటమును) జీవితాంతము మరువక చేస్తూ ఉంటారో… వారే జీవన్ముక్తులు! సవిజ్ఞేయులు - తెలుసుకోవలసింది తెలుసుకొన్నవారు! వారు ధన్యులు! కృతకృత్యులు!

వారు అనుక్షణికం-ఉపాసించు ఆత్మ జ్యోతి స్వరూపముచే జీవించి ఉన్నంత వరకు జీవన్ముక్తులై, ఇక అటు తరువాత, కాలవశాత్ గా వచ్చిన ఈ భౌతిక దేహమును తగిన సమయంలో త్యజించుచున్నారు. గాలి స్పందన రహితమగు రీతిగా జీవన్ముక్షత్వము త్యజించి ధ్యాతృ (ధ్యానము చేయువాడు ధ్యేయము (ఆత్మ జ్యోతి ధ్యానింపబడే విశ్వము) లను దాటివేసి, విదేహముక్తులగుచున్నారు.

అశబ్దమ్, అస్పర్శమ్, అరూపమ్ అవ్యయమ్
తథా అరసమ్, నిత్యమ్ అగంధవచ్చ యత్,
అనాది - అనంతమ్ (అనాద్యం తం),
మహతః పరమ్ ధృవమ్ తదేవ (అవ) శిష్యతి
అమలమ్ నిరామయమ్ ఇతి॥

ధ్యాన-ధేయములు కూడా ఆత్మానుభూతియందు లయమయినట్టి విదేహముక్తుని స్థితి ఎటువంటిది?
ఆశబ్దము (శబ్దాచ్ఛారణ మౌనం వహించినట్టిది)!
ఆస్పర్శమ్ (స్పర్శ సంబంధమైనది కాదు)!
అవ్యయమ్ (వ్యయము - మార్పు చేర్పులు లేనిది)!
అరసమ్ (రుచిగా చెప్పలేనిది)!
అనుక్షణిక - నిత్యమ్ (త్రికాలములలో యధాతథము)!
అగంధమ్ (వాసనానుభవము కాదు)!
అనాదిమ్ - అనంతమ్ (ఆద్యంతములు లేనిది)!
మహతః (‘నేను’ అను అహమ్కు మునుముందే ఉన్నటి మహత్ స్వరూపము)!
పరమ్ (సర్వమునకు పరమై, ఆవల ఉన్నట్టిది)!
ధృవమ్ (కదలికలు లేనట్టిది - సర్వము కదలుస్తూ, తాను కదలదు)!
అమలమ్ (ఏ దోషము అంటనిది)!
నిరామయమ్ (అద్దానియందు మరొకటేదీ లేనట్టిది)!
అది ఆదిశేష్యము! అన్నీ లయించినా కూడా అప్పటికీ శేషించియే ఉంటోంది.

చతుర్థో అధ్యాయః

1.) అథ హ పైంగలః పప్రచ్ఛ యాజ్ఞవల్క్యమ్ :-
జ్ఞానినః కిం కర్మ, కా చ స్థితి? ఇతి

పైఙ్గలుడు:  స్వామీ! ఆత్మజ్ఞాని యొక్క కర్మలు, స్థితి ఎట్టివి?

సహెూవాచ యాజ్ఞవల్యః :-
అమానిత్వాది సంపన్నో ముముక్షుః
ఏకవింశతి (21) కులం తారయతి।
బ్రహ్మవిత్ మాత్రేణ
కులమ్ ఏకోత్తరశతం (101) తారయతి।

యాజ్ఞవల్క్యుడు :  జ్ఞాని అమానిత్వము - అదంభిత్వము - అహింస - క్షాంతి ఇత్యాది (భగవద్గీతలో 13న అధ్యాయంలో చెప్పిన) జ్ఞాన గుణములు స్వభావసిద్ధంగా కలిగి ఉంటాడు. అట్టి గుణ సంపన్నుడగు ముముక్షువు 21 వంశములను (తరములను) తరింపజేయుచున్నాడు. బ్రహ్మమును ఎరిగి బ్రహ్మవేత్త అగుచుండుటచే ‘101’ వంశములను సముద్ధరిస్తున్నాడు.

ఆత్మానం రథినం విద్ధి।  శరీరం రథమేవ చ!
బుద్ధిం తు సారథిం విద్ధి।  మనః ప్రగ్రహమేవ చ।
ఇంద్రియాణి హయాని ఆహుః।
విషయాం తేషు గోచరాన్।
జంగమాని విమానాని, హృదయాని మనీషిణః।
ఆత్మ ఇంద్రియమనోయుక్తం భోక్తే!
- ఇతి ఆహుః మహర్షయః ॥

ఓ పైఙ్గలా! ఆత్మసాక్షాత్కారము గురించి దృష్టాంతపూర్వకంగా వినండి!

జీవాత్మ …. రథికుడు అని (దృష్టాంతంగా) తెలుసుకో!
శరీరము …. రథము వంటిది.
బుద్ధియో …. ఈ శరీర రథమును నడుపుచున్న సారధి.
మనస్సు …. గుర్రపు త్రాళ్ళు - కళ్ళెము.
ఇంద్రియములు …. శరీర రథమును లాగుచున్న గుర్రములు.
ఇంద్రియ విషయములు .… ఆ గుర్రముల ఆహారము రూపమగు పచ్చగడ్డి.
ఈ జీవుని హృదయము …. ఆ రథము యొక్క విమానము.
ఎటువైపుకు వెళ్ళాలో…తత్ కదలిక రూపము!

జీవాత్మ ఇంద్రియ-మనస్సులలో శరీర రథములోకూడి బుద్ధి సారధితో ఈ జీవుడు దృశ్యకల్పనా-జగత్తులో సంచరిస్తున్నాడు….. అనునది మహర్షుల ప్రవచనము.

తతో నారాయణః సాక్షాత్
హృదయే సుప్రతిష్ఠితః ॥

ఆ సర్వాత్మకుడు అగు ఆదినారాయణుడు సర్వ హృదయవాసిగా సుప్రతిష్ఠుడై ఉన్నారు.

ప్రారబ్ధకర్మ పర్యంతమ్
మహి నిర్మోకవత్ వ్యవహరతి।

చంద్రవత్ చరతే దేహీ
స ముక్తశ్చ అనికేతనః।

ఈ జగత్తులో ఆత్మజ్ఞాని ప్రారబ్దకర్మ శేషించి ఉన్నంత వరకు పాము కుబుసమును విడచు విధంగా సర్వము త్యజించియే ఉండి, ఈ జగత్తులో సంచారము చేస్తున్నారు.

ఏవిధంగా అయితే పూర్ణచంద్రుడు ఆకాశంలో స్వేచ్ఛగా, ఆకాశమునంతటా చల్లటి కిరణములతో నింపుతూ సంచరిస్తూ ఉంటారో… జ్ఞాని కూడా జ్ఞాన తేజస్సుచే నిత్యముక్తుడై గృహపరిమితులు లేనివాడై ఈ దృశ్య జగత్తులో దేహమున్నంత వరకూ సంచరిస్తూ ఉంటాడు. జీవన్-మృత్యువులకు అతీతుడై ఉంటాడు.

తీర్థే శ్వప చ గృహే వా
తనుం విహాయ, యాతి ‘కైవల్యమ్’’।
ప్రాణాన్ అవకీర్య యాతి కైవల్యమ్।

అటు తరువాత ప్రారబ్ధానుభావనంతరము ఒక తీర్థ స్థలంలోనో, లేక శ్వపచుని (పంచముని) ఇంట్లోనో (ఇక్కడ - అక్కడ అనే నియమము లేనివాడై), ఈ భౌతిక దేహమును త్యజించి, ప్రాణములను విశ్వప్రాణములతో ఏకం చేసి ’కైలవ్యపదము’ను అధిరోహించుచున్నాడు.

2.) తం పశ్చాత్ దిక్-బలిం కుర్యాత్,
అథవా ఖననం చరేత్
పుంసః ప్రవ్రజనం ప్రోక్తం
నేతరాయ (న ఇతరాయ) కదాచన।
నా శౌచం, న అగ్నికార్యం చ
న పిండం న ఉదకక్రియా|
న కుర్యాత్ పార్వణాదీని
బ్రహ్మభూతాయ భిక్షవే।

అట్టి విదేహముక్తుడగు మహాయోగి దేహము చాలించినప్పుడు, వారి భౌతిక దేహమును దిక్ బలి (ఒక ప్రదేశములో వదలగా పురుగులు మొదలైనవి ఆహారముగా పొందురీతిగా) గాని, ఖననముగాని (పాతిబెట్టుటకు గాని) చేయబడాలి! అట్టి సన్యాస యోగసిద్ధునికి మాత్రమే స్వేచ్ఛతో కూడిన ప్రవ్రజనము (నిత్య దేశ - లోక సంచారము) విధించబడినది. తదితరులకు కాదు! అట్టి బిక్షక సన్న్యాసికి మరణానంతరము శౌచక క్రియలు, అగ్ని కార్యములు, పిండోదకములు, శ్రాద్ధములు మొదలైన వాటితో పని ఉండదు. పార్వాణము (పిండపూజ) మొదలైనవి కూడా బ్రహ్మభూతుడగు భిక్షువుకు ఉండవు.

దగ్ధస్య దహనం నాస్తి,
పక్వస్య పచనం యథా।
జ్ఞానాగ్ని దగ్ధ దేహస్య
న చ శ్రాద్ధం, న చ క్రియా।

జ్ఞానాగ్నితో దేహభావనయే దహించివేసియున్న వానికి దేహదహనముతో పని ఏమున్నది? ఉడికించి వండిన కూరను మరల ఉడికించవలసిన పనేమున్నది? అట్లాగే ఎవ్వరి దేహభావన మొదలంట్లో ఆత్మజ్ఞానాగ్నితో దగ్ధమైనదో, ఆతనికి ప్రేత సంస్కారములగు శ్రాద్ధము, అగ్నికార్యము, పిండప్రదానములతో పని ఉండదు.

యావచ్చ ఉపాధి పర్యంతం
తావత్ శుశ్రూషయేత్ గురుమ్।
గురువత్ గురుభార్యాయాం
తత్ పుత్రేషు చ వర్తనమ్।

ఓ పైంగల మునీ! మరొక్క ముఖ్య విషయం! ఈ భౌతిక ఉపాధి ఉన్నంత వరకు ‘గురుశుశ్రూష’ను వదలనే కూడదయ్యా! కొనసాగించవలసినదే! ఒకవేళ గురువు గృహస్థుడై ఉంటే గురు భార్యను, గురుపుత్రుని కూడా గురువు వలె సేవించాలి సుమా!

శుద్ధమానస శుద్ధ చిద్రూపః సహిష్ణుః
“సోఽహమ్ అస్మి” ఇతి।
ప్రాప్తే జ్ఞానేన, విజ్ఞానే జ్ఞేయే పరమాత్మని
హృది సంస్థితే దేహే,
లబ్ధ శాంతిపదం గతే
తదా ప్రభా మనో-బుద్ధిః శూన్యం భవతి ॥

విషయములకు ఆది (వ్యుత్పత్తి) స్థానము అగు మనస్సు (శుద్ధ మనస్సు), తెలియబడే దానికి ఆవలగల చిత్ రూపము (శుద్ధచిత్)లను ఎరిగి ఓర్పు-నేర్పు గల సహిష్ఠుడైన వానికి “ఆ పరతత్వమగు ఆత్మయే నేను”…. అను “సోఽహమ్ అస్మి" భావన స్వభావ సిద్ధమగుచున్నది.
బ్రహ్మనిష్ఠుడై ‘బ్రహ్మమే నేను’ అను జ్ఞానము హృదయంతో వికశించుచుండగా, జ్ఞేయము యొక్క అనుభవము ప్రవృద్ధమగుచున్నది. హృదయ సంస్థితుడగు పరమాత్మను సందర్శిస్తూ పరమశాంతి పదము పొందుచున్నాడు. మనో బుద్ధులు ఆతనిపట్ల విషయశూన్యరూపములై  ‘కేవలము’ అగుచున్నాయి. అదియే కైవల్యము.

3.) అమృతేన తృప్తస్య
పయసా కిం ప్రయోజనమ్?
ఏవం స్వాత్మానం జ్ఞాత్వా
వేదైః ప్రయోజనం కిం భవతి?

ఒకాయన అమృత భాండమును కలిగి ఉండి, అమృతమును రుచి చూస్తూ ఉండగా, "అయ్యా! ఇదిగో పాలు పాయసము మీ కోసం తెచ్చాం. ఎంత రుచియో! కాస్త రుచి చూడండి!…. అని అంటే, ఆతడు అమృతమును ఆవల పారవేసి, పాయసము కొరకై అర్రులు చాచుతాడా? లేదు కదా! అట్లాగే, స్వాత్మ స్వరూపమేమిటో, ఎట్టిదో ఎరిగి ఆస్వాదిస్తున్న ‘తత్త్వానందానుభవి’కి వేద మంత్రముల - పఠనముల ప్రయోజనము - అమృతము ముందు సామాన్యమగు చెక్కెర పాయసము వంటిది అగుచున్నది.

జ్ఞానామృత తృప్త యోగినో
న కించిత్ కర్తవ్యమ్ అస్తి
తత్ అస్తి చేత్,
న స తత్త్వవిత్ భవతి।

ఆత్మ జ్ఞానామృతమును గ్రోలుచూ అత్యంత తృప్తిని పొందుచున్న యోగికి "అయ్యా! మీరు ఈ నియమములు పాటించండి! అవి అట్లా చేయకండి!”… అను కర్తవ్య-అకర్తవ్యములు, విధి-నిషేదములు నియమించ వీలు కాదు. ఆతనికి ఆ అవసరము లేదు. నియమ నిబంధన నిష్ఠలపై బుద్ధిని పరిమితము చేసుకొని ధ్యాస నిలుపుచున్నవాడు తత్త్వవేత్త అగుట లేదు.

దూరస్థోఽపి న దూరస్థః
పిండవర్జితః పిండస్థోఽపి,
ప్రత్యగాత్మా సర్వ వ్యాపీ భవతి।

ఆతడు భౌతికంగా దేనికి ఎంతదూరంగా ఉన్నప్పటికీ, ఆత్మత్వమునకు మాత్రం దూరముగా ఉండడు. తానే ఆత్మగా అనుభూతమొందుచుండగా, ఆత్మకు దూరమే ముంటుంది? ఆతడు ఈ మాంసపిండ శరీరములో ఉంటున్నప్పటికీ పిండ శరీర రహితుడై ఉంటాడు. జన్మించినా జన్మరహితుడు! నిర్వర్తిస్తూ కర్మ రహితుడు! యోచిస్తూ కూడా మనోహరితుడు! సర్వమునకు వేరై,ఆత్మస్వరూపుడై, సర్వ వ్యాపిగా సర్వమును సందర్శించుచున్నాడు.

హృదయం నిర్మలం కృత్వా
చింతయిత్వాఽపి అనామయమ్
“అహమేవ పరం సర్వమ్”
ఇతి పశ్యేత్ పరంసుఖమ్|

హృదయమును అత్యంత నిర్మలముగా తీర్చిదిద్దుకున్నవాడై, అనామయుడువిషయాతీతుడు - కేవల సాక్షియగు పరమాత్మనే చింతన చేస్తూ, “ఈ సర్వముగా ప్రత్యక్షమై ఉన్నది నేనే"! అను రూపముగా సందర్శిస్తూ పరమ సుఖమును పొందుచున్నాడయ్యా! “ఇదంతా నేనైన నేను”ను మధురముగా ఆస్వాదిస్తున్నాడు.

యథా జలే జలం క్షిప్తం
క్షీరం క్షీరే, ఘృతం ఘృతే,
అవిశేషో భవేత్, తద్వత్,
జీవాత్మ పరమాత్మనోః ॥

జలములో జలము పోసినప్పుడు అంతా కలిసిపోయి ఏకమగుచున్నది కదా! ఒక పాత్రలోని పాలను మరొక పెద్ద పాత్రలోని పాలలో పోస్తే ఏమౌతుంది? ఆ పాలు - ఈ పాలు కలసి ఒక పాలుగా అగుచున్నది. నేయిలో నేయి పోస్తే ఏకమగుచున్నది కదా! అట్లాగే జ్ఞాని తన జీవాత్మత్వమును పరమాత్మత్వమునందు ఏకం చేసివేసి అద్వైత స్థితుడై, ఏక స్వరూపుడై ప్రకాశించుచున్నాడు. ‘ఇది నా జీవాత్మ - అది నా పరమాత్మ’ అనునదేదీ ఇక రెండుగా శేషించటమే లేదు.

4.) దేహే జ్ఞానేన దీపితే
బుద్ధిః అఖండాకార రూపా యదా భవతి,
తదా విద్వాన్ బ్రహ్మజ్ఞానాగ్నినా
కర్మబంధం నిర్దహేత్।

ఓ ప్రియ మహాశయా! ఎప్పుడైతే దేహమునందు ఆత్మ జ్ఞాన దీపము ప్రకాశమానగుచున్నదో, అప్పుడిక బుద్ధి అఖండాకార రూపమును, అఖండాకారవృత్తిని సంతరించు కొనుచున్నది. ఇకప్పుడు ఆ ఆత్మజ్ఞాన విద్వాంసుడు ‘బ్రహ్మజ్ఞానము’ అనే అగ్నితో ‘కర్మబంధములు’ అనే త్రాళ్ళను దహించి మసి చేసివేస్తున్నాడు. ఇక బంధమెక్కడిది?

తతః పవిత్రం పరమేశ్వరాఖ్యమ్
అద్వైత రూపం, విమలాంబరాభమ్
యథా ఉదకే తోయమ్ అనుప్రవిష్టం,
తథా ఆత్మరూపో నిరుపాధి సంస్థితః।

ఆపై ఆ బ్రహ్మవేత్త పరమ పవిత్రుడై, “అద్వైతరూపుడు, నిత్య నిర్మల స్వరూపుడు (విమలారంభుడు)” అగు పరమేశ్వరునితో ఏకత్వము - ఐక్యము పొందుచున్నాడు. ఉదకము ఉదకములో ప్రవేశించినప్పుడు ఏకముగా అగు రీతిగా “నాకు దేహమే లేదు. ఈ సర్వము నేనే” అని ఎరిగి, నిరుపాధి సంస్థిత రూపమగు ఆత్మానందస్వరూపుడగుచున్నాడు. మృత్యువే లేనివాడై ‘అమృతుడు’ అగుచున్నాడు.

ఆకాశవత్ సూక్ష్మ శరీర ఆత్మా
న దృశ్యతే వాయువత్ అంతరాత్మా।
స బాహ్యమ్ - అభ్యంతర
నిశ్చలాత్మా, జ్ఞాన-ఉల్కయా
పశ్యతి చ అంతరాత్మా।

ఆకాశము కళ్ళకు కనిపిస్తోందా? లేదు. అట్లాగే ఆత్మ కళ్ళకు కనిపించేది కాదు. వాయువు ఎట్లా కళ్ళకు కనిపించక చలనముచే అనుభవమౌతుందో, అట్లాగే అంతరాత్మ అనుభూతికి మాత్రమే సిద్ధించుచున్నది. ఆత్మ బాహ్య - అభ్యంతరములందు నిశ్చలమై (చలనము - కదలిక లేనిదై) ఉన్నది. ‘ఆత్మజ్ఞానము’ అనే దీపము యొక్క జ్ఞానకాంతిలో జ్ఞాని అంతరాత్మను దర్శించుచున్నాడు.

యత్ర యత్ర మృతో జ్ఞానీ
యేన వా, కేన మృత్యునా,
యథా సర్వగతమ్ వ్యోమ
తత్ర తత్ర లయం గతః|

ఘటాకాశమివ ఆత్మానం
విలయం వేత్తి తత్త్వతః,
స గచ్ఛతి ‘నిరాలంబం’
జ్ఞానాలోకం సమస్తతః॥

ఆత్మతత్త్వ జ్ఞానియై ఆత్మ స్వరూపుడుగా ప్రకాశించు జ్ఞానయోగి ఎక్కడెక్కడైతే దేహము త్యజించవలసిన సందర్భము ఏర్పడునో (మరణ సమయం ఆసన్నమగునో) అక్కడక్కడే సర్వగతమగు ఆకాశమువలె, సర్వగతమగు అఖండ-ఆత్మ స్వరూపమునందే జీవాత్మత్వ లయమును పొందుచున్నాడు.

ఘటాకాశ మహాకాశో!  కుండ పగిలినప్పుడు కుండలోని ఆకాశము ఏమగుచున్నది? సర్వత్రా వెలయుచున్న ఆకాశముతో ఏకమగుచున్న రీతిగా, బ్రహ్మవేత్త ఇప్పుడే ఇక్కడే బ్రహ్మాకాశమునందు ఏకస్వరూప-లయ లయము పొందుచున్నాడు. ఆత్మతత్త్వ జ్ఞాని పరమాత్మయందు తన ఆత్మను లయము చేసి ఆలంబనయొక్క ఆవస్యకత లేనట్టి నిరాలంబ ఆత్మైక్య స్వరూపుడగుచున్నాడు.

5.) తపేత్ వర్ష సహస్రాణి
ఏకపాదస్థితో నరః,
ఏతస్య ధ్యాన యోగస్య
కలాం న అర్హతి షోడశీమ్|

ఒకడు వేలాది సంవత్సరములు ఒంటికాలితో తపస్సు చేసినప్పటికీ కూడా,.. . ధ్యాన యోగముచే జీవ-బ్రహ్మైక్యము సిద్ధించుకొను ఆత్మయోగ స్థితికి 16వ వంతు (1/16 వంతు) కూడా సమానము - (ఆ తపస్వి యొక్క స్థితి) కాదు.

ఇదమ్ జ్ఞానమ్, ఇదమ్ జ్ఞేయమ్,
తత్సర్వం జ్ఞాతుమ్ ఇచ్ఛతి,
అపి వర్ష సహస్రాయుః
శాస్త్రాంతం న న అధిగచ్ఛతి।

ఓ పైఙ్గల ప్రియమునీశ్వరా! ఇప్పుడు మనము వివరించి చెప్పుకొనుచున్నదే జ్ఞానము! ఇదియే జ్ఞేయము కూడా! అట్టి ఈ జీవ-బ్రహ్మైక్య రూపమగు అఖండ పరబ్రహ్మము గురించిన విచారణను ప్రక్కకు పెట్టి, శాస్త్ర విశ్లేషణ విషయాలు వందల - వేల సంవత్సరాలు ప్రయత్నించినప్పటికీ “అక్షర బ్రహ్మయోగము - జీవబ్రహ్మైక్యత్వము….. గ్రహించనంత వరకూ అవన్నీ లాభం లేదు.

విజ్జేయో అక్షర తన్మాత్రో
జీవితం చ అపి చంచలమ్ ।
విహాయ శాస్త్ర జాలాని
యత్ సత్యం తత్ ఉపాస్యతామ్||

చూడు! ఈ దేహ జీవితము అతిచంచలము కదా! పరోక్ష జ్ఞానమునకు పరిమితమై కాలమును వృధా చేసుకోకూడదు.
అందుచేత ఓ మునీశ్వరా! శాస్త్రజాలమును ప్రక్కకు పెట్టి ఏది పరమ సత్యమైయున్నదో అద్దానినే ఈ మానవుడు వివేకముతో ఉపాసించాలి సుమా! స్వస్వరూపమును అఖండ-సర్వస్వరూపముతో ఏకము చేయాలి!

అనంత కర్మ శౌచం చ
జపో యజ్ఞః తథైవ చ,
తీర్థయాత్రా అభిగమనమ్
యావత్ తత్వం న విందతి|

అంతులేకుండా కర్మలు, (మడి-దడి ఇటువంటి) స్నానాది శౌచములు, నదీ స్నానములు, జపములు, యజ్ఞములు, అనేకసార్ల తీర్థయాత్రలు చేయడం… ఇవన్నీ కూడా తత్త్వము తెలుసుకోకుండా ఆచరిస్తే ఏమిటి లాభము? తత్త్వమును ఎరుగుటకై ప్రయత్న రూపములు అయినప్పుడు మాత్రమే ఉత్తమ ప్రయోజనము.

“అహం బ్రహ్మేతి” నియతం
మోక్ష హేతుః మహాత్మనామ్|
ద్వే పదే బంధ-మోక్షాయ
న మమేతి - మమేతి చ|
‘మమేతి’ బధ్యతే జంతుః
‘న మమేతి’ విముచ్యతే||

“నేను బ్రహ్మమునే” అని ఎరుగుట మాత్రమే … మోక్షమునకు హేతువగుచున్నది అట్టి మార్గము (లేక) మహదాశయముచేతనే ఈ జీవుడు మహాత్ముడు కాగలడు. ఇంతెందుకు? ‘బంధము - మోక్షము’ గురించి రెండు మాటలే ఉన్నాయి.
1.) ‘మమేతి’ - నాది, నాకు సంబంధించినది …. ఇది జీవునకు బంధమగుచున్నది.
2.) ‘న మమేతి’ - నాది కాదు …. అనునది జీవుని బంధవిముక్తునిగా తీర్చిదిద్దుచున్నది.

మనసో హి ఉన్మనీ భావే
ద్వైతం నైవ ఉపలభ్యతే|
యదా యాతి ఉన్మనీ భావః
తదా తత్ ‘పరమమ్ పదమ్’ |
యత్ర యత్ర మనోయాతి, తత్ర తత్ర పరంపదమ్|
తత్ర తత్ర పరంబ్రహ్మ సర్వత్ర సమవత్ స్థితమ్|

దేహముతో సహా ఈ సర్వము జగన్నాటకము మాత్రమే! నాటకములో పాత్రధారునికి సొంతమనునది ఏమున్నది? జగన్నాటకంలో జీవుని విషయము అంతే! ఈ మనస్సు ఎక్కడికి వెళ్ళినా సరే, "అక్కడ బ్రహ్మమే ఉన్నది! ఇక్కడి బ్రహ్మమే అక్కడ! బ్రహ్మము సర్వదా ఏకము-అఖండమే కదా!!…. అను ఉన్మనీ భావము ఆశ్రయించినప్పుడు ఇక ’ద్వైతము, అనునది ఎక్కడున్నదో చెప్పు? ఎప్పుడైతే ఈ మనస్సు ఉన్మనీ (దేనినీ ఆలోచించని కేవలీ) భావాతీత స్థితి పొందుచున్నదో, అప్పుడు పరమపదము సిద్ధించుచున్నది.

ఉన్మనీ = జ్ఞానియొక్క మనస్సు ఎక్కడెక్కడికి వెళ్ళి వ్రాలుచున్నదో, అక్కడక్కడ సర్వత్ర సమవస్థితమైయున్న పరబ్రహ్మమును దర్శించటమే (అనుభవము కావటమే) ఉన్మనీ స్థితి.

హన్యాత్ ముష్టిభిః ఆకాశమ్,
క్షుధార్తః ఖండయేత్ తుషమ్,
‘నాఽహమ్ బ్రహ్మేతి’ జానాతి,
తస్య ముక్తిః న జాయతే ॥

ఏవిధంగా అయినా ఆకాశమును ముష్ఠిఘాతములతో (మడిచిన గుప్పెటతో) ఖండములుగా చేయవచ్చునేమో! ఆకలిగొన్నవాడికి ఆహారం ఇవ్వకుండా కూరగాయల వర్ణనతో ఆతని ఆకలి తీర్చవచ్చునేమో! అంతేగాని  “నేను జీవుడను మాత్రమే? సర్వతత్త్వ స్వరూపమగు బ్రహ్మమును నేను ఎట్లా అవుతాను?….. అను నాఽహమ్ బ్రహ్మభావన కొనసాగునంతవరకు ‘ముక్తి’ అనే ప్రసక్తియే ఉండదు. సాధ్యపడదు. ఈ జీవునిపట్ల బంధము, దుఃఖము, సాంసారిక ఆవేశములు తొలగవు. కొనసాగుచూనే ఉంటాయి.

6.) య ఏతత్ ఉపనిషదమ్ అధీతే,
సో అగ్నిపూతో భవతి।
స వాయుపూతో భవతి।
స ఆదిత్యపూతో భవతి।
స బ్రాహ్మ పూతో భవతి।
స విష్ణుపూతో భవతి।  స రుద్రపూతో భవతి।
స సర్వేషు తీర్థేషు స్నాతో భవతి।
సర్వేషు వేదేషు అధీతో భవతి|
స సర్వవేద వ్రత చర్యాసు చరితో భవతి।
తేన ఇతిహాస పురాణానాం
రుద్రాణాం శతసహస్రాణి జప్తాని ఫలాని భవంతి।
ప్రణవా నామయుతం జప్తం భవతి।

దశ పూర్వాన్, దశ ఉత్తరాన్ పునాతి।
స పంక్తి పావనో భవతి।  స మహాన్ భవతి।

బ్రహ్మహత్యా సురాపాన స్వర్ణస్తేయ
గురుతల్పగమన తత్సంయోగి పాతకేభ్యః పూతో భవతి॥

ఎవ్వరు ఈ ఉపనిషత్తులో చెప్పబడుచున్న జీవబ్రహ్మైక్య పాఠ్యాంశమును ఆమూలాగ్రము శ్రద్ధగా అధ్యయనము చేస్తారో వారు -
🔥 అగ్నివలె, వాయువువలె, ఆదిత్యునివలె, విష్ణువువలె, రుద్రునివలె పరమపవిత్రులగుచున్నారు.
🔥 సర్వ తీర్ధములలో - పవిత్రనదులలో స్నానము చేసిన పవిత్రత లభించ గలదు.
🔥 సర్వ వేదములు పఠించిన ప్రయోజనము సిద్ధించుచున్నది.
🔥 సర్వ వేద ప్రవచిత విధి - విధానములను వ్రతములను అనుసరించిన సత్ఫలములు వచ్చి చేరగలవు.
🔥 వేద - పురాణ - ఇతిహాసములను పఠించిన ప్రయోజనము, లక్షసార్లు ’రుద్రము’ను జపించిన సార్థకత పొందబడుచున్నది.
🔥 ప్రణవముతో కూడి లక్షలాది నామస్మరణను జపించిన స్థితితో సమానమగుచున్నది.

అట్టి జీవ-ఈశ్వర ఐక్య సిద్ధయోగి యొక్క వెనుకటి పది తరముల వారు, ముందటి పది తరముల వారు పవిత్రత సంతరించుకొనగలరు. అట్టివాడు ఏ పంక్తిలో ఉంటే …. ఆ పంక్తిలోనివారు పావనులగుచున్నారు. జీవ-బ్రహ్మముల ఏకత్వమును దర్శించువాడు మహానుభావుడగుచున్నాడు. మహదాశయ సిద్ధి పొందినవాడై ప్రకాశిస్తున్నాడు.

ఇతఃపూర్వపు మహాపాతకము లైనటువంటి బ్రహ్మహత్య, సురాపానము, బంగారము దొంగిలించడం, గురువుతో తల్పగమనము మొదలైన దోషములు ఏమైనా ఉంటే, అవి తొలగి జీవ-బ్రహ్మైక్య జ్ఞానసముపార్జితుడు, పవిత్రుడు అగుచున్నాడు.

7.) తద్విష్ణోః పరమం పదగ్ం
సదా పశ్యంతి సూరయః
దివీవ చక్షుః ఆతతమ్
తత్ విప్రాసో, విపన్యవో
జాగృవాంసః సమింధతే
విష్ణోః యత్ పరమం పదమ్|
ఓం సత్యమిత్యుపనిషత్॥

పగటి వెలుగులో నలువైపులా సుస్పష్టమగుచున్న కంటి చూపువలె, నిత్యానిత్యవివేక పండిత్యము గల సూరులు, వేదవరేణ్యులగు విప్రులు సర్వేసర్వత్రా విష్ణుతత్త్వమునే ఎల్లప్పుడు అన్నిటా అంతటా సందర్శించుచున్నారు. అదియే విష్ణుపదము! నిదుర లేచినవాడు పరిసరములన్నీ చూచురీతిగా పరమగు విష్ణుపదమును, విష్ణుసాన్నిధ్యమును ఇక్కడే పరికిస్తూ పరమానందభరితుడై ఉంటున్నాడు. జీవబ్రహ్మైక్యత్వము గుర్తుచేస్తూ, అట్టి పరమసత్యమును సర్వజనులకు ఈ ఉపనిషత్ సుస్పష్టపరచుచున్నది!
ఓం సత్! ఓం తత్సత్!

ఇతి పైఙ్గలోపనిషత్ |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||


శుక్ల యజుర్వేదాంతర్గత

10     పైఙ్గల ఉపనిషత్

(పైంగల ఉపనిషత్)

అధ్యయన వచన పుష్పము

మం॥ శ్లో॥ ‘పైఙ్గలోపనిషత్’ వేద్యం పరమానంద విగ్రహమ్
పరితః కలయే రామం పరమ అక్షర వైభవమ్॥

పరమానందవైభవము, పరమాక్షర వైభవము అగు ఆత్మారామతత్త్వమును పైఙ్గలోపనిషత్ సవివరించుచున్నది.

1.) ప్రథమ అధ్యాయము - కైవల్యపద విచారణ

‘పైఙ్గలుడు’ అనే గొప్ప తపస్వి. ఆత్మతత్త్వ జిజ్ఞాసి. మహామేధావి. ఆయన ఒకప్పుడు తత్త్వవేత్త అగు యాజ్ఞవల్క్య మహామునీశ్వరుని ఆశ్రమం ఆశ్రయించారు. గురుశుశ్రూష చేస్తూ గురుముఖతః నియమితుడై ధ్యాన యోగ సాధన నిర్వర్తించసాగారు. 12 సంవత్సరాలు ఆవిధంగా గడచిపోయినాయి.

ఒకానొకరోజు పైఙ్గలుడు ప్రశాంతంగా సుఖాసీనుడై ఉన్న ఆచార్యవర్యులగు యాజ్ఞవల్క్య మునీంద్రుని ఏకాంతంగా సమీపించారు.

పైఙ్గలముని :  గురువర్యా ! ఆత్మప్రజ్ఞానంద స్వరూపా! వేదవేదాంగతత్త్వజ్ఞా ! యాజ్ఞవల్మ్య సద్గురూ ! పరమరహస్యమగు "కైవల్య పదము” గురించి సంభాషించమని, విశదీకరించమని మిమ్ములను శిరస్సు వంచి, వినమ్రుడనై అభ్యర్థిస్తున్నాను.

యాజ్ఞవల్క్య మహర్షి :  ఓ సౌమ్యా ! ప్రియ పైఙ్గలా ! ఏ “కైవల్యపదము” గురించి మీరు తెలుసుకోవాలనుకొంటున్నారో అది సత్ (ఉనికి) - చిత్ (ఎరుక) - ఆనంద (అనుభూతి) లక్షణము. సర్వదృశ్య విలక్షణము అగు స్వస్వరూప - సర్వాత్మస్వరూపమే అది! అట్టి ఆత్మ ఇంద్రియములకు విషయముగా కనిపిస్తున్న ఈ దృశ్య వ్యవహారము రూపు దిద్దుకోవటానికి మునుముందే నిత్యసత్యమై వేంచేసి ఉన్నట్టిది. సదేవ, సౌమ్య | ఇదమ్ అగ్ర ఆసీత్! అందుచేత అది సనాతనము!

ఈ జీవుడు తనయొక్క సహజమగు కేవలీ స్వరూపమును ఎరిగి, మమేకమవటమే ‘కైవల్యము’.

ఈ జీవుడు ఇంద్రియ జగత్తును చూస్తూ "ఈ దృశ్య జగత్తులో నేను బద్ధుడనై ఉన్నాను. మరి నాకు మోక్షము, కైవల్యము లభించేది ఎట్లా?” … అని మరింకేదో స్థితి లభించటానికై వెతకుచున్నాడు. ఈ జీవుడు స్వతఃగా ఆత్మస్వరూపుడే అయి ఉండగా, అతనికి అది ఎన్నడో, ఎప్పుడో ఏదోనిర్వర్తించి, తద్వారా పొందాలి - అను ప్రసక్తి ఏమున్నది? ఇప్పుడే, ఇక్కడే ఈ జీవుని సహజ, అనునిత్య చిదానంద స్వరూపమే - కైవల్యసిద్ధి రూపమగు ‘ఆత్మ’!

స్వతఃగా పరాత్మకు బంధము లేదు. జగన్నాటకములో కనిపించే పరాత్మయొక్క స్వకీయ-అంశ అగు జీవాత్మ “నాటక కల్పితపాత్ర” వంటిది కాబట్టి, ముక్తి ఉండదు. ఈ విధంగా ఆత్మ ‘నిత్యముక్తము’. జన్మకర్మలకు మునుముందే ఉన్నట్టిది కాబట్టి ‘అక్రియము’.

నాటకంలో నటిస్తున్నవాడు పాత్రగా… అయిపోతున్నాడా? లేదే! పాత్రగా అతని నటనాచాతుర్యము మాత్రమే కనిపిస్తోంది. అంతవరకే ! అట్లాగే ఆత్మ దృశ్య విషయం కాదు!

ఆత్మకు రూపమే లేదు. కదల్చబడే దేహమునకు రూపమున్నదిగాని, కదిల్చేవానికి రూపమేమున్నది?

అది కేవలము-సత్య (యత్ - సత్ = ఉనికి) - జ్ఞాన (కేవలమగు ఎరుక) - స్వయమ్ ఆనందమయము. ఆత్మను మరొకటేదో లభించే అగత్యమేమీ లేదు. తనకు తానే పరిపూర్ణము (It is complete by itself).

సర్వమునకు మునుముందే ఉండి ఉన్నట్టి ఆత్మ తదితరమంతటినీ చేతనము చేయుచున్నది కాబట్టి చైతన్యస్వరూపము. సర్వమునకు మునుముందే ఉన్నది కాబట్టి ‘సనాతనము’.

ఆత్మ సర్వదా ఏకమే గాని అనేకము కాదు. భిన్నత్వములో ఏకరూపమై ఉన్నట్టిది. అద్దానికి ద్వితీయమైనదంటూ ఏదీ లేదు. కనుక ‘అద్వితీయము’. సృష్టికంటే మహత్తరమైనది. తనయందు సృష్టిని కల్పనా దృష్టిచే కలిగి ఉన్నట్టిది. కనుక మహత్తరము! బ్రహ్మము! పరబ్రహ్మము!

జగత్ దృశ్యము

ఆత్మయందు ఈ జగత్తు ఏ విధంగా ఏర్పడి ఉన్నదో… విను.

మరు : మరుభూమిలో (యడారి-యండమావులలో) నీరు ఉన్నట్లు అగుపిస్తుంది. యండాకాలంలో మృగములు, “అందులో నీరు కనబడుతోంది కదా ! వెళ్ళి త్రాగివద్దాము”… అని పరుగులు తీయసాగుతాయి. అక్కడ నీరు ఏమీ లేకపోగా… అల్లంత ఆవల దూరంలో ఉన్నట్లు మరల భ్రమ కొల్పుతూ ఉంటుంది. అందుకే ‘మృగతృష్ణ’ అంటారు. మృగతృష్ణ కనబడుచున్నప్పటికీ, దగ్గరకి వెళ్ళి చూస్తే జలము ఉండదు కదా! వాస్తవానికి ఆత్మయందు ‘జగత్తు’ అనబడునది లేదు. కానీ కనిపించటము జరుగుతోంది. విచారణ చేసినప్పుడు ‘ఆత్మ అద్వితీయమైయుండగా, ఆత్మకు వేరుగా జగత్ దృశ్యమెక్కడిది?’… అను పరమార్థము శేషించగలదు.

శుక్తికా : ఒకాయన నది ఒడ్డున ఇసుకలో నడిచి వస్తూ ఉంటే ముత్యపు చిప్పలు కొన్ని సూర్యకాంతికి మెరమెర మెరుస్తూ కనిపించాయి. “ఆహాఁ ! ఈనాడు సుదినము. లక్ష్మీకటాక్షము కాబోలు ! వెండి లభించింది ! ఏమి ఆనందము !” అని తలచి ఏరి ఏరి జేబులలో నింపుకొని ఇంటికి తెచ్చి భార్యను పిలచి ’ఏమేఁ ! సంపాదన లేదని రోజూ అంటున్నావు కదా ! ఇదిగో వెండి తెచ్చాను. నీవు ఇక లక్షాధికారివే ! ఇక మాటలాడకు !”.. అని పలికాడు. భార్య అన్నిటినీ పరిశీలించి “ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ వెండిలా మెరుస్తున్న ముత్యపు చిప్పలు మాత్రమే !”… అని గదమాయించింది. ముత్యపు చిప్పలు వెండి కాకపోయినా, ఆ పెద్ద మనిషిని భ్రమింపజేసినట్లు… ఈ జగత్తు ఆత్మ స్వరూపమే అయి కూడా, అనేక విషయ - వస్తు - సంగతి - సందర్భముల దృష్ట్యా వేరువేరువలె (అనాత్మ దృష్టికి) అనిపిస్తోంది. ఆత్మదృష్టిచే ఇదంతా స్వస్వరూపాత్మయే!

స్థాణు : ఒకడు చీకట్లో నడచివస్తూ, నిట్టనిలువుగా బాటకు ప్రక్కన నిలచి ఉన్న శిలను చూచి (లేక, మోడువారిన చెట్టును చూచి), “ఇక్కడ ఎవ్వరో దారిదోపిడి దొంగ ఉన్నట్లున్నాడే! ఏం చేద్దాంరా బాబు?”… అని అనుకొన్న రీతిగా…, ఈ జగత్ దర్శనమంతా “శిలాస్వరూపమును, మోడువారిన చెట్టును (దొంగేమో అనే అనుమానంతో) చూచే బాటసారియొక్క భ్రమ - అనుభవము” వంటిది. భ్రమచే అపరిశీలనాత్మక దృష్టికి అనేక బంధములు, సంబంధములతో కూడిన వ్యవహారపరంపరలు అనుభవమగుచున్నాయి.

స్ఫటిక : స్ఫటికమునందు కాంతి పుంజముల గీతలు, జలబిందువులు, పురుషాకారములు అద్దాని లోపలగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి స్ఫటికమంతా ఘనీభూతమైనట్టిదే గాని లోపల కాంతి గీతలు మొదలగునవి ఉంటాయా? ఉండవు. ఈ ఎదురుగా ఉన్నదంతా ఘనీభూత స్వస్వరూప పరబ్రహ్మమే అయి ఉండగా… జన్మ - జరా - మృత్యువులతోను 14 లోకముల విశేషములతోను నిండినదై ఉన్నట్లు (స్ఫటికములో కాంతి పరావర్తనచే భ్రమగా అంతరమున కాంతి పుంజ గీతలు గోళములు - పురుషాకారములు కనిపిస్తున్న తీరుగా) కనిపిస్తోంది. అనిపిస్తోంది. దృష్టి జ్ఞానమయమైతేనో అవన్నీ “లేనివే” అగుచున్నాయి.

ఈ విధంగా మనో కల్పనా రూపమగు సుదీర్ఘమైన సందర్శనముచే -
(1) ఆత్మను అనేకముగా చూచు స్వభావము (ప్రకృతి) గురించి,
(2) ఆ సందర్శిస్తున్న ద్రష్టయొక్క స్వయమాత్మ తత్త్వము (స్వరూపము) గురించి,
(3) జీవ - బ్రహ్మ ఏకరూపము గురించి,
- ఆత్మ తత్త్వవేత్తల ప్రవచన సార విశేషాలు కొన్ని ఇప్పుడు మనము చెప్పుకుందాము.

మూల ప్రకృతి : సత్ స్వరూపమగు ఆత్మకు “స్వయం కల్పిత రూపము” - “ఆత్మకు అభిన్నరూపము” అయినట్టిది అయి… ‘ఇట్టిది’ అని పదప్రయోగముచే నిర్వచించి చెప్పజాలనట్టిదగు కారణంగా - అనిర్వచనీయము అగు ’మూల ప్రకృతి’ బయల్వెడలుచున్నది.

అట్టి ప్రకృతి (ప్ర+కృ+తి) ‘3’ గుణములతో త్రిగుణాత్మకరూపమై - లోహిత-శుక్ల-కృష్ణ… (ఎరుపు - తెలుపు - నలుపుల సంజ్ఞగా, రజో- సత్వ-తమో గణ రూపమై) ప్రదర్శనమగుచున్నది.

ఏ పరబ్రహ్మమునుండి మూలప్రకృతి (The sense of External Quality) ‘నా నుండి వేరైన నేను’ రూపముగా బయల్వెడలుచున్నదో… అట్టి పరబ్రహ్మమే ఇదంతా జలములో సూర్యబింబ ప్రతిబింబమువలె ఆ మూల ప్రకృతి యందు ఆత్మయే త్రిగుణ రూపముగా ప్రతిబింబితమగుచున్నది.

తత్ ప్రతిబింబతమ్ యత్, - తత్ సాక్షి చైతన్యమ్ ఆసీత్ |

తత్ పరమాత్మ - ఒకవైపుగా స్వకీయమే అయినట్టి ప్రకృతి యందు ప్రతిబంబిస్తూనే, మరొకవైపు నుండి సాక్షి చైతన్యముగా ఉండి, ప్రకృతిని చైతన్య పరచుచున్నారు.

వికృతి : ఆ మూలప్రకృతియే వికృతి రూపమై వికారములు పొందుచున్నది. తన యొక్క సత్వగుణము నుండి ఉద్రిక్తత (Inclination, Inspiration) పొందుచున్నది.

సా పునః వికృతిం ప్రాప్య, సత్వోద్రిక్తా అవ్యక్తా ఆఖ్యా ఆవరణశక్తిః ఆశీత్ ॥ 

వ్యక్తీకరణము అనే క్రియను ప్రదర్శించు అవ్యక్తరూపమై, ’ఆవరణ శక్తి’గా రూపము (మూలప్రకృతి) పొందుచున్నది.

‘ఆవరణ శక్తి’ - ఈశ్వర చైతన్యము : తన యొక్క ఆవరణ శక్తియందు ఆత్మయే ప్రతిబింబిస్తూ ’ఈశ్వర చైతన్యము’గా వెలయుచున్నది.

🕉

పైఙ్గలుడు :  

కేవల అఖండ అప్రమేయ స్వరూపమగు ఆత్మ నుండి ప్రకృతి, ప్రకృతి నుండి వికృతి, వికృతి రూప అవ్యక్తము నుండి ఆవరణ శక్తి, ఆవరణ శక్తి నుండి ఈశ్వర శక్తి యొక్క చేతనత్వము (ఆత్మయొక్క స్వకీయ కల్పనచే) మృగతృష్ణలో నీరు వలె, చీకటిలోని స్థంభమును దొంగగా చూచిన విధంగా, జలములో ప్రతిబింబమువలెను, దర్పణంలో ప్రతిబింబమువలె బయల్వెడలుతోంది.

మీరు చెప్పిన దానిని బట్టి ఆ విధంగా గ్రహించుచున్నాను.

స్వామీ ! ’ఈశ్వరుడు - అని ఎద్దానిని అంటున్నారో? … వివరించ ప్రార్థన.

ఈశ్వరుడు

యాజ్ఞవల్క్యుడు :  

భౌతిక దేహమును తన ఉపకరణముగా కలవానిని (As an enstrustment) ’జీవుడు’  అంటున్నాము. అజ్ఞానము ఈతని ఉపాధి.

అట్లాగే ’మాయ’ను తన ఉపాధిగా కలవానిని (ఆధ్యాత్మ శాస్త్రములో) ‘ఈశ్వరుడు’ అని పిలుస్తున్నారు. ఈతడు ‘దేహముల ముందు స్థితి, దేహముల యొక్క రాక - దేహములతో జీవితము - దేహము యొక్క శిధిలము, పోక - దేహముతో తన స్థితి”… ఇవన్నిటినీ తన మాయా శక్తిచే ఎరిగి ఉన్నవాడు కాబట్టి ‘సర్వజ్ఞుడు’ అని అంటారు.

ప్రతి దేహిలో జీవ - ఈశ్వరుల సమాగమము ఏర్పడియే ఉన్నది.

జీవుడు జీవితాంతార్గత విషయములకు పరిమితుడై ఉండటం చేత “కించిజ్ఞుడు (కొంత మాత్రమే తన ఎరుక యందు కలిగి ఉన్నవాడు)”  అని అంటూ ఉంటారు.

ఈశ్వరుడు ఆ విధంగా - “స స్వాధీన మాయః సర్వజ్ఞః” - మాయను స్వఅధీనమునందు కలవాడు. దేహ దేహాంతరములు తెలిసియున్న సర్వజ్ఞుడు. ఇంకా కూడా  “సృష్టి - స్థితి - లయానాం ఆదికర్తా” అని కూడా చెప్పబడుచున్నాడు. సృష్టికి ముందే ఉండి, సృష్టిని కల్పించుకొని, కొనసాగించుకొని, మరొకప్పుడు తనయందు లయం చేసుకొని ఆ తరువాత కూడా శేషించి ఉంటున్నవాడు ‘ఈశ్వరుడు’. ఆ ఈశ్వరుడు జగత్తుకు అంకుర రూపుడు (విత్తనములోని ఉత్తరోత్తర ఉత్పత్తి శక్తి వంటివాడు).

దృష్టాంతానికి….,

పరమాత్మ యొక్క తేజో రూపుడగు ఈశ్వరుడు జగత్తును సృష్టించి, కొనసాగించి లయం చేసుకొనుచున్నవాడు, ఆ తదుపరి మరల జగత్ భావనచే జగత్తులను పునః ఆవిర్భవింపజేయుచున్నాడు (అదియే పునరావిర్భావము, పునఃసృష్టి).

ప్రతి ఒక్కరియందు ఈ 1. జీవిత్వము 2. ఈశ్వరత్వము 3. పరమాత్మత్వము ప్రవర్తమానములై ఉన్నాయి.

ఈశ్వరుడు - ప్రాణి కర్మవశాత్ ఏష పటో యద్వత్ ప్రసారితః, ప్రాణికర్మ క్షయాత్ పునః తిరోభావయతి।  - సర్వప్రాణులకు సంబంధించిన స్వీయవాసన-కర్మలను అనుసరించి ఈ జగత్తును ’ఇంద్రియ విషయ ప్రపంచము’గా ప్రసరింపజేస్తున్నారు. విస్తరింపజేస్తున్నారు. మరొక్కప్పుడు ఆయా ప్రాణుల సంబంధితమైన తన యొక్క సంస్కారరూప కార్యవ్యవహారములను సంక్షయింపజేసి, ఉపసంహరించుకొనుచున్నారు. అనగా, తన నుండి బయల్వెడలిన అనేకత్వరూపమగు వివిధ ప్రాణులను తనయందే తిరోధానము (Withdraw) నిర్వర్తించుచున్నారు.

ఒకామె క్రొత్త జరీ చీరను ధరించి, ఆతరువాత మడతపెట్టి లోన దాచి, మరింకెప్పుడో మరల మడత విప్పి ధరిస్తూ ఉంటుంది చూచారా? ఆ విధంగా ఈశ్వరుడు అనేక జీవుల భావనను జగత్ - ప్రదర్శనరూపంగా ధరించి, మరల తనయందు లయింపజేసి, మరింకెప్పుడో పునఃగా ఆవిర్భావము చేయుచున్నారు.

ఈ విధంగా,
తస్మిన్ ఏవ అఖిలమ్ విశ్వమ్ సంకోచిత పటవత్ వర్తతే |
ఉపసంహారణ తరువాత ఈ విశ్వమంతా కూడా మడిచి దాచిన వస్త్రమువలె ఈశ్వరునియందే దాచి ఉంచినదగుచున్నది. ఇదంతా ఆత్మయొక్క లీలా - క్రీడా విశేషమే | అందుచేత “ఇదంతా ఈశ్వర సంకల్పమే” అని మాయ, జగత్తుల గురించి సిద్ధాంతీకరించబడుచున్నది.

మహత్ - విక్షేపశక్తి : ఈశ్వరునిచే అధిష్ఠితమై (స్వకీయమై ప్రదర్శితమగు) ఆవరణ శక్తితో … ఆ ఈశ్వరుడు రజోగుణ రూపమగు (Inclination to do activity) ఉద్రిక్తత (Exhibition of Inquisitiveness and enthusiasm) పొందటమును - ’మహత్‌చే నిర్మితమగు విక్షేపశక్తి”గా చెప్పబడుచున్నది.

హిరణ్య గర్భ చైతన్యము : ఈశ్వరుడు దృశ్య జగత్ విషయపరంపరలందు, జగత్ దృశ్యమునందు ప్రతిబింబించు చమత్కారమే ఈ బ్రహ్మండ ప్రదర్శనము!

తత్ ప్రతిబింబితమ్ యత్, తత్ ‘హిరణ్యగర్భ చైతన్యమ్’ ఆసీత్ |
ఈశ్వరునిచే విషయములందు ప్రదర్శించబడుచున్న నిజచైతన్య శక్తియే “హిరణ్య గర్భ చైతన్యము”. అట్టి చైతన్యాభిమానియే ”హిరణ్యగర్భుడు”. ఈ సృష్టికి కర్తృ చైతన్య స్వరూపుడుగా (సృష్టికర్తృ అభిమానిగా) మహత్ తత్త్వుడై ప్రతిబింబిస్తున్నది పరబ్రహ్మమే! హిరణ్యగర్భుడు! అట్టి సృష్టి అభిమాని…,
సుస్పష్టుడు, అస్పష్టుడు కూడా!

ఈ విధంగా సుస్పష్ట - అస్పష్ట శరీరము కలవాడగుచున్నాడు.

అహంకారము : హిరణ్యగర్భునిచే (సృష్టికర్తచే) అధిష్ఠితమైయున్న… మహత్ స్వరూపము యొక్క విక్షేప శక్తియే (Distration Presentment) ‘అహంకారము’.

(తత్) హిరణ్యగర్భ అధిష్ఠిత విక్షేపశక్తి, తత్ తమో ఉద్రిక్తా ‘అహంకార అభిధా స్థూలశక్తిః ఆసీత్ |
సృష్టికర్త యొక్క తమోగుణ ఉద్రిక్త సంబంధమైన విక్షేపశక్తియే (The Energy of Distraction) ఈ అహంకారము అనే స్థూలశక్తిని జనింపజేస్తోంది.

విరాట్ (Universal) : ‘అహంకారము’ అనే జలమునందు ప్రతిబింబిస్తున్న పరమాత్మయే (లేక) పరబ్రహ్మమే “విరాట్ పురుషాభిమాని”గాను విశ్వరూప చైతన్యముగాను విరాజిల్లుచున్నారు.

విష్ణువు - ఆది పురుషుడు : విష్ణువు = అంతటా అంతర్లీనమై వేంచేసి, ఉండి అంతయు తానే అయి ఉన్న చైతన్యస్వరూపుడు.

ఆ విరాట్ అభిమాని సర్వత్రా వెలయుచు, సర్వ స్థూల దేహములకు ఉనికిని కల్పించువారై, సర్వ దేహములను పరిపాలించుచున్నారు. అట్టి పరిపాలనా దక్షత యందు కూడా పరబ్రహ్మమే ప్రతిబింబించుచున్నది. పరబ్రహ్మ చైతన్యము ’విష్ణు భగవానుడు’గా అభివర్ణితము అగుచున్నది.

అట్టి ఆదిస్వరూప పరమాత్మ వైభవ ప్రతిభయగు విష్ణు భగవానుని నుండి ఆకాశము (Space) మొట్టమొదటగా ఆవిర్భవించుచున్నది.

➤ అత్మాత్ - ఆకాశమ్ (ఉనికి నుండి చోటు)!
➤ ఆకాశమునుండి - వాయువు (చలనము)!
➤ వాయువు నుండి - అగ్ని (ఉష్ణము, తేజస్సు).
➤ అగ్ని నుండి ఆపః (జ్వలనము - జలము - ప్రవహించటము)
➤ అభ్యః (జలము) నుండి - పృథివి (స్థూలము).

అట్టి పంచభూతముల నుండి సూక్ష్మ పంచతన్మాత్రలు త్రిగుణములు (శబ్ద-స్పర్శ-రూప-రస-గంధముల సూక్ష్మ రూపములు) ప్రకటితమగుచున్నాయి.

పైఙ్గలుడు :  గురుదేవా ! అసలీ చిత్రవిచిత్ర సృష్టికంతటికీ మూల కారణమేమిటి ?

యాజ్ఞవల్క్యుడు :  కేవలాత్మస్వరూపుడు, ఆది స్వరూపుడు, పురాణపురుషుడు, ఆత్మానంద స్వభావుడు అగు ఆది మహావిష్ణువు అనిర్వచనీయ కారణం చేత “సృష్టికామోహమస్మి” అను రూపంగా “నేను సృష్టిని కల్పించుకొనెదను గాక” అనే స్రష్టకామము కలవాడయ్యారు. జగత్ కల్పనాచమత్కారము కొరకై “తమోగుణము’ ను అధిష్టించారు. అప్పుడిక జగత్కర్తగా అయ్యారు.

తన యొక్క “దివ్య-భావనా - ప్రభాకాంతి పుంజములు” అన తగు శబ్ద - స్పర్శ - రూప రస గంధములనబడే సూక్ష్మ - తన్మాత్రలను "వీటిని స్థూల రూపముగా చేసెదను గాక”… అని ఆ పురాణపురుషుడు సంకల్పించసాగుచున్నారు.

సృష్టి క్రమము : అట్టి సూక్ష్మతన్మాత్రల లీలా ప్రదర్శన - ఆస్వాదనల కొరకై 1. మొట్టమొదటగా స్థలము (Place) 2. చలనము 3. తేజస్సు 4. ద్రవము 5. స్థూలము అనబడే తన స్థూల పంచ మహాభూత కళా విశేషములను “నేను స్థూలము చేసెదను గాక ”… అని భావించారు. ’సృష్టి’కి ఎంతవరకు అవసరమో, అంతంతవరకు సూక్ష్మ పంచభూతముల సంమిశ్రములను ప్రారంభించసాగారు.

పరమాత్మ మొట్టమొదటయే ఉండి, భావనలను స్వీకరించువారగుటచే  “భావనారాయణుడు, ఆది నారాయణుడు”  అనికూడా పౌరాణికులగు తత్త్వవేత్తలు పిలుస్తున్నారు.

పంచ సూక్ష్మ పంచ మహాభూతముల “పంచీకరణము”

5 పంచమహాభూతములలో (ఆకాశ-వాయు-అగ్ని-జల-భూతత్త్వముల మునుముందటి వాటివాటి సూక్ష్మశక్తి రూపములలో) ఒక్కొక్కటిని రెండు రెండు 5 X 2 =10 గా విభజించబడసాగాయి.

ఈ విధంగా పంచ మహాభూతములలో ప్రతి ఒక్క భూతము, పంచీకరణము (భూతము యొక్క ప్రధమార్ధము + మిగతా పంచభూతములలో ద్వితీయార్థభాగములోని నాలుగు నాలుగువంతులు) చేత మహా విష్ణువు సృష్టిని కల్పిస్తున్నారు.

చైతన్య స్వరూపుడు కల్పనామయుడు అగుటచే - ’మాయావి’ అని చెప్పబడుచున్నారు. ఈవిధంగా సూక్ష్మమహాభూతముల ‘2’ విభాగములు, ప్రథమార్ధ + పావు పావు (1/4) ద్వితీయార్ధముల పంచీకరణము నుండి…,
- అనంతకోటి బ్రహ్మాండములను,
- అట్టి ప్రతి ఒక్క బ్రహ్మాండకోశములో ‘14’ లోకాలను,
- ఆయా లోకాలలో నివశించటానికి అనుకూలమగు అసంఖ్యాక సానుకూల్య పరిస్థితులను,
- నివాస సమార్ధ్యముతో రూపు దిద్దుకొను సానుకూల్యక గోళక స్థూలదేహములను, వాటికవసరమగు ఆహారాదులను,
- అసంఖ్యాక జీవరాసులు, వారి వారి జీవిత విధానములు, జనన - జీవన - మరణ - పునర్జన్మ - విధి విధానములు మొదలగునవన్నీ బయల్వెడలుచున్నాయి.

ఇవన్నీ మహావిష్ణువు యొక్క స్రష్టకామము (లీలా రూప క్రీడలో కోరుకొను వినోదము) వంటివి.

ఈ విధంగా ఈశ్వరుని ఇచ్ఛ (ఈశ్వరేచ్ఛ)గా ఇక్కడ కనబడుచున్నవన్నీ సృష్టించబడుచున్నాయి. (Being created out of playful inclination of Al-Pervading Divinity).

ప్రాణ సృష్టి :

స పంచభూతనాం రజో - అంశాంశ్చ - చతుర్థా కృత్వా, భాగత్రయాత్ - పంచవృత్యాత్మకమ్ ‘ప్రాణమ్’ అసృజత్ |
ఇంకా ఆ ఈశ్వరుడు - సూక్ష్మ పంచభూతములలోని రజో అంశ + తదితర ‘4’ భూతములలోని ’4’ రెండవ విభాగములు కలిపి
‘పంచీకరణ’ చేస్తున్నారు. అట్టి రజో పంచకమును ’4’ విభాగములుగా చేసి అందులో మొదటి మూడు విభాగములను కలిపి
పంచవృత్యాత్మకమైన (Five - Avocation Faceted) ’ప్రాణము’ను సృజించుచున్నారు.
పంచ వృత్యాత్మక ప్రాణములు - ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమానములు.

పంచకర్మేంద్రియ సృష్టి : సూక్ష్మ పంచభూతముల రజో అంశ మిశ్రమము యొక్క 3 భాగముల నుండి పంచవృత్యాత్మకమైన ప్రాణశక్తి (విశ్వప్రాణము) ఈశ్వరునిచే సృజించబడిందని చెప్పుకున్నాము కదా ! ఇక, ఆపై ఆ రజోంశ యొక్క నాలుగవ భాగము నుండి కర్మేంద్రియ పంచకము ఈశ్వరునిచే సృజించబడుతోంది.

కర్మేంద్రియములు : 1) వాక్కు 2) కాళ్ళు 3) చేతులు 4) పాయువు 5) ఉపస్థ

అన్తఃకరణ సృష్టి : అటు తరువాత ఈశ్వరుడు… సూక్ష్మ పంచభూతములలోని ‘సత్వాంశ’ను స్వీకరించి ’4’ భాగములుగా చేస్తున్నారు.అట్టి నాలుగు భాగములలోని ’3’ భాగముల నుండి పంచ వృత్యాత్మకమగు ’అంతఃకరణము’ను సృష్టి చేస్తున్నారు.

అంతఃకరణ పంచవృత్యాత్మకములు : 1) మనస్సు 2) బుద్ధి 3) చిత్తము 4) అహంకారము 5) ఈ నాలుగు వ్యక్తీకరించు అవ్యక్తము.

పంచ జ్ఞానేంద్రియ సృష్టి : అట్టి (పైన చెప్పుకొన్న) ‘సత్తాంశ’ యొక్క తురీయ భాగము (4వ భాగము) నుండి ఈశ్వరునిచే పంచజ్ఞానేంద్రియములు సృష్టించబడుచున్నాయి.

పంచజ్ఞానేంద్రియములు : చర్మము, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు

ఇంద్రియ పాలకులు : ఈ విధంగా కర్మేంద్రియములను జ్ఞానేంద్రియాలను సృష్టించిన తరువాత ఈశ్వరుడు ఇట్లా భావించారు.

“వీటన్నిటినీ దేహములలో పనిచేయించటానికి ఆహారరసము మొ||వి పొందటానికి, సామర్థ్యములు కొనసాగటానికి వీటిని దేహములలో ప్రవేశింపజేస్తూ పరిపోషిస్తూ - ఉపసంహరిస్తూ ఉండటానికి పర్యవేక్షణ కావాలి! అటువంటి పర్యవేక్షించగల - “దివ్యప్రజ్ఞ”ల అవస్యకత ఉన్నది.

వెనువెంటనే ఆదిస్వరూపనారాయణుడు దివ్యశక్తులతో కూడిన అశరీర దివ్య ప్రజ్ఞాసమన్వితులగు దేవతలను సృష్టించారు.

సత్వసమష్టిత ఇంద్రియ పాలకాన్ అసృజత్ |
ఈ విధంగా సత్వగుణమునుండి ఇంద్రుడు - వరుణుడు - వాయువు - చంద్రుడు ఇత్యాది సమష్టి ఇంద్రియ పాలకులు (దేవతలు) సృష్టిలో ఈశ్వర సంకల్పముచే ఆవిర్భవించారు.

అట్లు జనించిన ఇంద్రియ పాలకులగు దేవతలను తమ తమ ధర్మముల నిర్వహణకై ఈశ్వరుడు వారిని - తాని సృష్టాని అణ్ణి ప్రాచిక్షిపత్ |  - (సృష్టి కార్యక్రమము కొరకై) బ్రహ్మాండములలో ప్రవేశింపజేశారు. ఈ విధంగా పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు, పంచప్రాణములు, పంచ అంతరంగతత్త్వములు,… వాటినన్నిటినీ పర్యవేక్షిస్తూ పరిపాలించు దివ్య శక్తి సంపన్నులగు దేహతాప్రజ్ఞలు… ఇవన్నీ బ్రహ్మాండములలో ప్రవేశించి, అంతటా వ్యాపించినవైనాయి.

సమష్ఠి స్థూలరూప విరాట్ : ఇంకనూ ఈశ్వరాజ్ఞానుసారముగా అనేక విధములైన స్థూలాకారములు - దైవీ శక్తుల ప్రదర్శన సానుకూల్యత ఇంద్రియముల కార్యనిర్వహణల కొరకై - ‘విరాట్’ రూపముగా (In the form of Macro Appearence of matter) బ్రహ్మాండమునందు రూపుదిద్దుకున్నాయి. బ్రహ్మాండములోని స్థూల - సూక్ష్మతత్త్వముల నిర్మాణ - పర్యవేక్షణ కొరకై…, (అనేక పదార్ధములు ఇవ్వబడగా, తినే పదార్ధములు తయారుజేయు వంటవానివలె).. అహంకార సహిత విరాట్ అభిమాని అగు సృష్టి ప్రజ్ఞాపురుషుడు (బ్రహ్మదేవుడు) ఈశ్వర సంకల్పానుసారము రూపుదిద్దుకున్నారు. ఆయన స్థూల - సూక్ష్మ - కారణదేహములకు, దేవతా ప్రజ్ఞల నియామకుడు, కర్త, నిర్మాత, శక్తియుక్తుల ప్రసాదకుడు కాసాగారు. పరిపాలకుడై ఉన్నారు.

స్పందన - చేష్టత : ఇప్పటివరకు సృష్టించిన ఇంద్రియశక్తులు, దేవతా ప్రజ్ఞలు, సృష్టికర్తృత్వాభిమాని… ఇవన్నీ బ్రహ్మాండములలో ప్రవేశించాయి. అయితే అవన్నీ తమకు తాముగా ఏది ఎట్లా ఎందుకు పరస్పరములతో కూడిన సమిష్ఠ వ్యవహారములను నిర్వర్తించాలో ఎరుగక, జడస్థితిని మాత్రమే కలిగినవై ఉన్నాయి. సృష్టికర్త బ్రహ్మాండములోని పైన చెప్పుకొన్న పదార్థజాలములతో దేహాకారములు నిర్మించినప్పటికీ అవన్నీ స్వయం నిర్ణయ సామర్థ్యముతో వర్తించలేనివై ఉన్నాయి. అప్పుడు ఈశ్వరుడు “అచేతనములగు వీటిని సచేతనములుగా చేసెదనుగాక !" అని సంకల్పించారు.

బ్రహ్మాండములను, బ్రహ్మాండ రంధ్రములను, హిరణ్యగర్భ నిర్మితములగు వ్యష్టిదేహాకారములను స్పృశించసాగారు.

వ్యష్టి దేహముల మస్తకములను (ముఖము యొక్క ఊర్ధ్వ భాగములను) రంధ్రములు చేసి వాటన్నిటియందు చేతనారూపుడై ఈశ్వరుడు అసంఖ్యాక అంశలతో స్వయముగా ప్రవేశించసాగారు. ఆ విధంగా భౌతిక దేహములు మొట్టమొదటగా ‘జడములే’ అయి ఉన్నప్పటికీ ‘ఈశ్వర చైతన్యము’ యొక్క చిత్ జ్యోతి వాటిలో ప్రవేశించగానే… అవన్నీ కూడా ‘చైతన్యవంతములు’ అయ్యాయి.

ఇక ఆపై కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ప్రాణములు, దేవతాప్రజ్ఞలు, అంతఃకరణములు… ఇవన్నీ కూడా వ్యష్ఠి దేహములలో ఈశ్వర చైతన్య తేజస్సుచే సచేతనముగా అయి తమకు ఈశ్వరునిచే నియమించబడిన ధర్మములను (The functions stipulated) నిర్వర్తించసాగాయి. నాటకపాత్రలో నటునివలె, ఈశ్వరుడే దేహములలో జీవుడై ప్రకాశించి ప్రవర్తించసాగారు.

ఈశ్వరుడు - జీవుడు : ఈశ్వరుడు స్వతఃగానే సర్వజ్ఞుడు. జన్మ-మృత్యువులకు ఈవల ఆవల ఎరిగియున్నవాడు.

సర్వజ్ఞ-ఈశో, మాయాలేశ సమన్వితో, ‘వ్యష్టి దేహమ్’ ప్రవిశ్య తయా మోహితో ‘జీవత్వమ్’ అగమత్ |

ఈశ్వరుడు స్థూల - సూక్ష్మ దైవీశక్తులతో కూడిన బ్రహ్మండముల స్వకీయ రచయిత. ’మాయ’ లేక ‘కల్పన’ లేక ‘ఊహ’ లేక ‘భావన’ చే సర్వము తనయందు కల్పించి కొనసాగించి - లయింపజేయగల మహాసామర్థ్యము కలవాడు! ’మాయ’ను తన ఉపాధిగా కలవాడు. దేహములలో ప్రవేశించి చైతన్యము చేయగల మహా చైతన్య స్వరూపుడు!

ఈశ్వరుడు అంతటివాడు అయిఉండి కూడా…, ’వ్యష్టి దేహము’లో ప్రవేశించిన తరువాయి, అందులోని అంతరంగ విభాగములచే, కర్మ - జ్ఞాన ఇంద్రియ చర్యలచే మోహితుడై అనేక పరిమితములతో కూడిన ‘జీవుడు’ అను జీవత్వ స్థితి పొందినవాడగుచున్నాడు. ఈవిధంగా ఈశ్వరుడే ఈ వ్యష్టి దేహములో జీవుడుగా ప్రదర్శనమగుచున్నాడు.

ఈ జీవుడు స్వతఃగా ఈశ్వరుడే! అయితే, ఈ జీవుడు స్థూల - సూక్ష్మ - కారణ త్రిశరీరములతో తదాత్మ్యము చెందుచున్నవాడగుచున్నాడు. “నేను దీనికి కర్తను - దానికి భోక్తము (This is what I am doing. That is what I am getting / enjoying / undergoing) అనే భావనలలో ప్రవేశించి, వాటి యందు నిబద్ధుడు (Bounded by) అగుచున్నాడు. "నేను కొన్ని ధర్మములకు (Functions) బద్ధుడనై ఉన్నాను. జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - మూర్ఛా - మరణ ధర్మములు కలవాడిని …” అని తనను తాను దేహ స్వభావములకు, దేహధర్మములకు పరిమితునివలె దర్శిస్తున్నాడు.

ఘటములు (కుండలు తయారు చేసే) కులాల చక్రమువలె అనేక “దేహఘటములు” తయారు చేసుకొంటూ, ఆయా దేహ ములచే సంబంధితుడు - బంధితుడు అయి, “అవును ! నేను పుట్టుక - చావుల మధ్య ఇరుక్కొని ఉన్నాను. నాకు పుట్టుక తరువాత చావు తప్పదు. తరువాత ఏది ఎటో తెలియదు! అంతే!" అని అనుకుంటూ కులాల చక్రము (కుండలు తయారు చేసే చక్రయంత్రమువలె) చర్వితచరణుడై పరిభ్రమణములను సుదీర్ఘంగా కొనసాగిస్తూపోతున్నాడు.

“ఇదేమిటి ? ఈ ఉపాధులేమిటి? ఏమిటీ సుఖ - దుఃఖాలు? నాకు సంబంధ-బాంధవ్యములేమిటి? … ఎందుకొచ్చిన చావురా?”… అని అనుకుంటూనే అనేక ఉపాధులలో ప్రవేశ-నిష్క్రమణములను కొనసాగిస్తూ ఉన్నాడు. “నేను ఈ ఉపాధిచే, ఇందలి కర్మ - జ్ఞాన ఇంద్రియములచే, దృశ్య - దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారములచే నిబద్ధుడను. ఏదో చేస్తే గాని ఈ నా బంధనము తొలగదు. ఎవ్వరో రావాలి ! ఈ నా బంధనములు త్రెంచాలి”… అను భావనాపరంపరలచే చుట్ట చుట్టబడినవాడై ఉంటున్నాడు.

2.) ద్వితీయ అధ్యాయము- జీవేశ్వర న్యాయం

పైఙ్గలుడు :  మీరు చెప్పేదంతా మహదాశ్చర్యం! పరమాశ్చర్యం! ఈశ్వరుడు సర్వలోకములకు సృష్టి - స్థితి - లయ కర్త అని, సర్వకల్పనలకు ఆవల ఉన్నవాడని, కల్పనలన్నీ స్వయం కృతముగా కలిగి ఉన్న మహాశక్తిమంతుడని, కల్పనా మాత్రముగా ఇదంతా కల్పించచగలడు - ఉపసంహరించగలడు కూడా - అని, ఈ సృష్టి యొక్క అంతఃకృత అంతర్యామి అని, విభువు అని, ఒకవైపు నుండి అభివర్ణిస్తున్నారు.

ఇంతలోనే -
"ఆ ఈశ్వరుడే దేహములలో ప్రవేశించి, దేహములను తన చైతన్యశక్తితో చైతన్యవంతము చేసి, తాను సంకల్పించిన మనోబుద్ధి చిత్త అహంకార ఇంద్రియ – ఇంద్రియ విషయములకు తానే బద్ధుడై ‘జీవుడు’గా పిలువబడుచున్నాడు”… అని కూడా సిద్ధాంతీకరించుచున్నారు.

సర్వజ్ఞుడగు ఈశ్వరుడు-కించిజ్ఞుడగు ’జీవుడు’గా జీవిత దశ పొందటమేమిటి? జీవుడై తాను కల్పించిన దేహతత్వములలోని వ్యష్టి దేహములో బద్ధుడై, అంతరంగ చతుష్టయముచే నిబద్ధుడగుచూ ఉపాధి పరంపరలలో సుదీర్ఘ బాటసారివలె ప్రయాణించుచూ బంధ విముక్తి కొరకై దేవురిస్తూ వెతకటమేమిటి?

సర్వ లోకానామ్ సృష్టి-స్థితి-అంతకృత్ విభుః, ఈశః-కధం ’జీవత్వమ్’ అగమత్ ఇతి?

సృష్టి - స్థితి - లయకారుడు, సర్వమునకు యజమాని అయినట్టి ఈశ్వరుడు - ’జీవుడు’గా ఎట్లా అగుచున్నాడు ? సర్వశక్తిమంతుడగు ఈశ్వరునికి బంధముతో కూడిన ‘జీవుడు’ అను స్థితి ఎట్లా వచ్చిపడుతోంది?

యాజ్ఞవల్క్యుడు :  అవునయ్యా! ఇక్కడంతా జరుగుచున్నది ఇదియే!

ఈ తతంగమంతా సుస్పష్టమవటానికై …
స్థూల-సూక్ష్మకారణ దేహ ఉద్భవ పూర్వకం ‘జీవ- ఈశ్వర’… స్వరూపం వివిచ్య కథయామి!

అసలు “ఈ జీవునిపట్ల ప్రదర్శితమగుచూ అగుపిస్తున్న ‘స్థూల-సూక్ష్మ-కారణ’ దేహములకు మునుముందటి ఈశ్వర రూపమేమిటి? ఈ జీవుని ఇప్పటి-అప్పటి రూపములేమిటి?”… అనునది వివరణ చేసుకుంటే గాని, “ఈశ్వరుడు జీవుడుగా ఎందుకు అగుచున్నాడు? ఎట్లా అగుచున్నాడు?”… అనునది సమన్వయము కాదు.

అందుచేత మనము దేహత్రయమునకు మునుముందే ఉన్నట్టి జీవేశ్వర (జీవ+ఈశ్వర) రూపము గురించి విచారణ చేద్దాము.

సావధానేన ఏకాగ్రతాయ శ్రూయతామ్ | స్వాధ్యయన సావధాన చిత్తులై ఏకాగ్రతగా వినుచుండెదరుగాక !
ఎందుకంటే -

ఈ విషయముల యొక్క నిర్ధారణమునకు సహకరించగల విశేషాలు… మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. కనుక శ్రద్ధగా వినండి!

🌻

పరమాత్మ యొక్క చిత్కాళావిశేష స్వరూపుడగు ఈశ్వరుడు, మనం ఇంతకు ముందు చెప్పుకొన్న విధముగా అనంతమగు పరమాత్మ తత్త్వములో కొన్ని పంచీకృత మహాభూతలేశములను (అణువులను petty pieces) తీసుకొని -
1) వ్యష్టి స్థూల శరీరములను 2) సమష్టాత్మకమైన స్థూల శరీరములను
ఈ రెండు యథాప్రకారముగా తన సంకల్ప శక్తిని ఉపయోగించి నిర్మించుచున్నారు.

పృథివీ అంశా (Solid) తత్త్వముగా : ఈ వ్యష్టి-సమిష్టి దేహములను కలిపి ఉంచే చర్మము కపాలము నరములు - మాంసము - గోరులు (Nails) … ఇవన్నీ నిర్మితమగుచున్నాయి.

జల అంశా (liquid) తత్త్వముగా : దేహములలోని రక్తము, మూత్రము, లాలాజలము, స్వేదము (చెమట) మొదలగునవి రూపము సంతరించుకుంటున్నాయి.

అగ్ని అంశా తత్త్వముగా : ఆకలి, దప్పిక (దాహము), ఉష్ణము (Heat), మోహము (భ్రమ - Illusion), మైథునము (Sexual feelings) మున్నగునవి ఏర్పడుచున్నాయి.

వాయువు యొక్క అంశా తత్త్వముగా : నడవటము, దాటటము, దూకటము, ఉచ్ఛ్వాస - నిశ్వాసలు ఇవన్నీ ప్రదర్శితమగుచున్నాయి.

వ్యోమాంశ (ఆకాశాంశ) తత్త్వములుగా : కామము (ఏదో కావాలి పొందాలి అనే కోరికలు), క్రోధము - మొదలైనవి సంప్రదర్శనములగుచున్నాయి.

వాటన్నిటి యొక్క సంఘాతము - ప్రవర్తనము - విడిపోవటము అనే చర్యల చేత కర్మలు (Various Functions) ఏర్పడుచున్నాయి. దేహముల రాకపోకలు, వాటికి ఆధారమై సంచిత - ప్రారబ్ధ ఆగామి కర్మలు, ప్రతి దేహము యొక్క హాని వృద్ధులు, ఒక్కొక్క - దేహమునకు సంబంధించిన బాల్య - కౌమార - యౌవన - వార్ధక్యములు, ఇంకా కూడా అనేక వస్తువుల పట్ల - విషయముల పట్ల అభిమానములు, దురాభిమానములు, అభియోగములు (Attributions) మొదలైనవన్నీ… ఏర్పడుచున్నాయి. ఈ ఈ విశేషముల సంఘాతమే (Association) మనకు కంటికి కనిపిస్తున్న ఈ స్థూల దేహము యొక్క స్థూల - సూక్ష్మములతో కూడిన రూపము.

పంచప్రాణములు

ఇప్పుడిక అపంచీకృత (పంచీకరణమునకు మునుముందే ఉన్నట్టి) సూక్ష్మ పంచభూతత్త్వముల యొక్క “రజో అంశ విభాగము (inclination to function, work, act) యొక్క ‘త్రిగుణాంశ సమిష్టి’ నుండి ‘ప్రాణశక్తి’ బయల్వెడలు విశేషములు చెప్పుకుంటున్నాము.

రజోగునమునందు సత్త్వ - తమో అంశలు చేరుచుండగా ‘విశ్వ ప్రాణశక్తి’ ఉదయిస్తోంది.

అట్టి ప్రాణము పంచవృత్తులతో కూడుకొని ఉంటుంది.

1) ప్రాణము → దేహములో విశ్వప్రాణము యొక్క ప్రవేశిక అంశ
2) అపానము → ప్రాణ శక్తి దేహములోని వ్యర్ధములను బయటకు త్రోయు అంశ
3) వ్యానము → వ్యాపింపజేయు ప్రాణాంశ
4) ఉదానము → ఆహార రస ప్రసరణము
5) సమానము → సర్వత్ర సమత్వము పర్యవేక్షించునది.

ఈ ఈ పంచవృత్తులతో ప్రాణశక్తి దేహ రక్షణ కొనసాగించుచున్నది.

నాగము - కూర్మము - కృకరము - దేవదత్తము - ధనంజయము అనునవి దేహములోని పంచ ఉపప్రాణ చలనములు.

ప్రాణశక్తి స్థానములు : హృదయము, గుదము (ఆసనము), నాభి (బొడ్డు), కంఠము, సర్వాంగములు.

అంతఃకరణము : పంచభూతముల ’సత్వాంశ యొక్క త్రిభాగముల నుండి ‘అంతఃకరణము’ నిర్మితమగుచున్నది.

అంతఃకరణ వృత్తులు : మనస్సు (The Factor of thoughts), బుద్ధి (Analysing and selecting factor), చిత్తము (ఇష్టము, The factor of liking), అహంకారము (The sense of ‘I’ & ‘My’)

అంతఃకరణ విషయాలు : సంకల్పము, నిశ్చయము, అభిమానము, అనుసంధానము (Getting Connected)

అంతఃకరణ స్థానములు : గళము (గొంతు), వదనము (Fore-face), నాభి (బొడ్డు), భ్రూమధ్య ప్రదేశము (Point in between two eye brows)

జ్ఞానేంద్రియములు : సూక్ష్మ పంచభూతముల ’సత్వము’ గుణ సంబంధిత ‘4’ వ భాగము నుండి జ్ఞానేంద్రియములు జనిస్తున్నాయి. కళ్ళు - చెవులు - చర్మము - జిహ్వ - ముక్కు - ఇవి పంచ జ్ఞానేంద్రియములు.

జ్ఞానేంద్రియ పంచవృత్తులు : శ్రోత్రము (వినికిడి), త్వక్, చక్షువు (చూపు), జిహ్వ, ఆఘ్రాణము.

జ్ఞానేంద్రియ విషయములు : శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు

జ్ఞానేంద్రియ అధిష్ఠాన దేవతలు : వాయువు, సూర్యుడు, ప్రచోతుడు (వరుణుడు), అష్టదిక్ పాలకులు

కర్మేంద్రియ అధిష్ఠాన దేవతలు : అశ్వనీ దేవతలు, అగ్నిదేవుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మృత్యువు.

మనో - బుద్ధి - చిత్త - అహంకార అధిష్ఠాన దేవతలు : (వరుసగా) చంద్రుడు, విష్ణువు, చతుర్ముఖ బ్రహ్మ, శంభుడు.

పంచకోశములు

పంచకోశములు :  అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయ.

అన్నమయ కోశము :  

అన్నరసేనైవ భూత్వా, అన్నరసేన అభివృద్ధిమ్ ప్రాప్య,
అన్నరసమయ పృథివ్యాం యత్ విలీయతే,
సో ‘అన్నమయ కోశః’।
తదేవ స్థూల శరీరమ్॥

ఈ స్థూల దేహమే అన్నమయ కోశ సంజ్ఞ. ఇది అన్నము (ఆహారము) నుండి జనించి, ఆహారము స్వీకరించుటచే వృద్ధి చెందుతూ, తిరిగి మరెప్పుడో అన్నరసమయ స్వరూపమగు పృథివిలో విలీనము అగుచున్నది.

ఇది భూదేవతా ప్రసాదితముగా దర్శిస్తూ కృతజ్ఞతను (భూమిపట్ల, తల్లి - తండ్రుల పట్ల) కలిగి ఉండటము ఏమరువకూడదు! ఎందుకంటే ఈ భౌతిక దేహము మోక్షమును కూడా ప్రసాదించగల మహత్తరమైన ఉపకరణము కదా ! "ఇది మనది కాదు. పృధివి యొక్క సొత్తు. తిరిగి ఇవ్వవలసిన సందర్భము ఉంటుంది”… అని గుర్తెరిగి ఉండాలి. పవిత్రమగు ఆత్మ - జ్ఞానదృష్టిని ప్రవృద్ధపరచుకోవటానికై సద్వినియోగము చేసుకోవాలి!

ప్రాణమయ కోశము :  కర్మేంద్రియ పంచకము + పంచప్రాణములు… ఇది ప్రాణమయ కోశ రూపము.

మనోమయ కోశము :  జ్ఞానేంద్రియ పంచకము + మననరూప మనస్సు … కలసి మనోమయ కోశమగుచున్నది.

విజ్ఞానమయ కోశము :  జ్ఞానేంద్రియ పంచకము + బుద్ధి… కలిపి “విజ్ఞానమయకోశము” … అని పిలువబడుచున్నది.

లింగ శరీరము :  ప్రాణమయ + మనోమయ + విజ్ఞానమయ ‘3’ కోశములు కలిపి - ’లింగ శరీరము’ అని పిలువబడుచున్నది.

ఆనందమయ కోశము :  ఈ ఆనందము దృశ్య - దృశ్య విషయ సంబంధమైనది. ఇంద్రియ సంబంధమైనది. (ఆత్మ జ్ఞాన సంబంధమైనది కాదు). అందుచేతనే - స్వరూప - అజ్ఞానమ్ ఆనందమయమ్”… అని చెప్పబడుతోంది.

అష్టపురి

ఈ దేహమును  ‘అష్టపురీ దేహమ్’ అని పిలుస్తున్నారు. ‘8’ ముఖ్యమైన వస్తువులచే ఇది ప్రవర్తితమగుచున్నది.

1) జ్ఞానేంద్రియ పంచకము
(శ్రోత్ర - త్వక్ - చక్షు - జిహ్వ - ఆఘ్రాణ) - 5
(చెవి - చర్మము - కళ్ళు - నోరు - ముక్కు)

2) కర్మేంద్రియ పంచకము
(వాక్కు - చేతులు - కాళ్ళు - పాయువు [గుదము] - ఉపస్థ [జననేంద్రియము]) - 5

3) ప్రాణాది పంచకము
(ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమాన) - 5

4) ఆకాశము మొదలైన భూత పంచకములు
(ఆకాశ వాయు - అగ్ని - జల - భూ) - 5

5) అంతఃకరణ-చతుష్టయం
(మనో - బుద్ధి - చిత్త - అహంకారములు) - 4 (5వది అవ్యక్తము ఈ నాలుగిటిని వ్యక్తీకరించు పురుషకారము)

6) కామము (Desires, Expectations, Anticipations)

7) కర్మము (Functioning)

8) తమస్సు (Ignoring some thing while involving in something else).

ఈ ‘8’ కలిపి ఈ దేహమును అష్టపురము (A Township with ‘8’ factors) గా అభివర్ణించబడుతోంది.

విశ్వుడు - జాగ్రత్ అభిమాని

ఈశ్వరాజ్ఞను అనుసరించి విరాట్ పురుషుడు వ్యష్టి దేహములో ప్రవేశించి, బుద్ధిని అధిష్ఠించినవాడై, ’విశ్వము’ యొక్క అనుభవమును పొందుచున్నాడు. అట్టి విశ్వానుభవమును పొందుచున్న ఈశ్వరాంశను ‘విశ్వుడు’ అని పిలుస్తున్నారు.

అట్టి విశ్వుని యొక్క ముఖ్య లక్షణములు:

తేజసము - స్వప్న అభిమాని

ఈశ్వరాజ్ఞచే సూత్రాత్మ వ్యష్ఠి సూక్ష్మ శరీరము (భావనా శరీరరము, కోపము - ప్రేమ - ఆశ - నిరాశ - సుఖము - దుఃఖము … ఇటువంటి నవరసములు మొదలైనవి, అభిప్రాయ రూప భావనాపరంపరలు మొదలగునవి కూడా దాగి ఉన్న శరీరము)లో ప్రవేశించి, మనస్సును అధిష్ఠానముగా చేసుకొని అనుభవములు పొందుచున్న అభిమానిని ‘తేజసుడు’ - అని పిలుస్తున్నారు.

ఈతడు ప్రాతిభాసికగా (Reflective of one’s own ideations and visualizations as if it is all an outside experience) అనుభవములందు అభిమానుడై తనయందు తానే ఉంటున్నాడు.

స్వప్నకాల్పిక ప్రాతిభాసికములందు (Dream created sensuory reflection) చరించుచు, అందుకు వేరైనది తనకు ఎక్కడా ఏదీ లేనట్లు (జాగ్రత్ - సుషుప్తి తురీయముల ప్రసక్తి కలిగి ఉండకుండా) మనో దేహముతో అనుభవములు పొందుచున్నాడు. తన యందు తానే రతించుచూ, ‘తేజసుడు’ అని పిలువబడుచున్నాడు.

ప్రాజ్ఞత్వము - అవ్యక్త అభిమాని

ఈశ్వరాజ్ఞచే విరాట్ పురుషుడు వ్యష్టిజీవుడై… జాగ్రత్ - స్వప్నములలో సంచరించుచూ (ఉభయములను వ్యక్తీకరించుచూ), ఒకానొకప్పుడు ఉభయ వ్యక్తీకరణములను ఉపసంహరించుచున్నవాడు.

ఒక పక్షి సాయంకాలం వరకు ఆహారము కొరకై ఊరంతా తిరిగి, రాత్రి చెట్టుపై రెక్కలు ముడుచుకొని విశ్రాంతి తీసుకొను రీతిగా జాగ్రత్ - స్వప్న సంబంధిత సంస్కారములన్నీ అప్రకటితం చేస్తూ, తనయందు అవ్యక్త స్థానములో దాచి ఉంచి… తాను అవ్యక్తత్వము వహిస్తున్నాడు. మాయా ఉపాధిని స్వీకరించి అవ్యక్తత్వ సమన్వితుడై వ్యష్టికారణ - శరీరము నందు ప్రవేశించి (‘కార్య’ శరీరములను ఉపసంహరించుకొన్నవాడై) నిర్విషయ ప్రాజ్ఞత్వమును ఆస్వాదించుచున్నాడు.

అట్టి ప్రాజ్ఞుడు…,

“ప్రాజ్ఞుడు” అని ఈ గాఢనిద్రాభిమానిని పిలుస్తున్నారు.

బ్రహ్మణి ఏకత్వము (తురీయము)

4వది ఏకరూపమగు తురీయము. అవ్యక్తతత్వముచే ఆచ్ఛాదించబడినట్టిది. జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల కేవల సాక్షిత్వ రూప … అవ్యక్త-ఆచ్ఛాదితము.

ఇహ స్వరూపమునకు ఆవల గల పారమార్థిక స్థానము. ఇది ‘తత్త్వమసి - సోఽహమ్’ ఇత్యాది మహావాక్యముల అపరోక్షానుభవ స్థితి. సర్వ సమభావ సాక్షి స్థితి. అభేద సందర్శన స్థితి. జాగ్రత్ - స్వప్న - తురీయములలో ప్రవేశ-నిష్క్రమణములను నిర్వర్తించు ప్రజ్ఞ.

ఇక్కడ కనబడుచున్న భేద వ్యవహారమంతా కూడా అంతఃకరణము అనే తటాకమలో ప్రతిబింబించే ఆకాశ మేఘ - నక్షత్ర దృశ్యమువంటిది. ఇదంతా ప్రతిబింబిత న్యాయముగా చైతన్యమునందు ఒకానొక దృష్టికి దర్శితమగుచున్నట్టిది.

ప్రతిబింబ చైతన్యమే అవస్థా త్రయము (జాగ్రత్-స్వప్న-సుషుప్తులు) పొందుచున్నది.

ఆత్మ యొక్క ప్రాతిభాసికమాత్రుడగు ఈ జీవుడు భౌతిక ఉపాధిచే జాగ్రత్ - స్వప్న - సుషుప్తి దశలను ఒకటి తరువాత మరొకటిగా అంతులేకుండా పొందుచూ పోతున్నాడు.

వస్తుతః స్వతఃగా కేవల సాక్షి స్వరూపుడు - అప్రమేయుడు అయి ఉండి కూడా ఘటీ యంత్రములో చిక్కి పరిభ్రమణము చేయుచున్నవాని వలె…, జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల మధ్య అటూ ఇటూ తిరుగాడుచున్నాడు.

(కల కంటున్న వానికి తన జాగ్రత్ స్థితి విశేషములు అనుభవమునకు రాని విధంగా)… జాగ్రత్‌లో తన పరస్వరూపమును ఏమరచి, జీవన్మృతుని స్థితి (బ్రతికుండి కూడా చచ్చినవానితో సమానమగు స్థితి) పొందినవాడై ఉంటున్నాడు.

🌺🌸🌻


జీవాత్మ పంచ అవస్థలు

పైఙ్గలుడు : “జీవాత్మ పంచ అవస్థలు” గురించి జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - మూర్ఛ - మరణ అవస్థలుగా చెప్పబడుచున్నది కదా! అట్టి పంచ దశల అవస్థల గురించి మరికొంత వివరించ ప్రార్థన.

యాజ్ఞవల్క్యుడు :  సరేఁ ! ఈ జీవుని పట్ల పంచ అవస్థలు ఎట్టివో… మరికొన్ని విశేషాలు చెప్పుకుందాము.

1.) జాగ్రత్ అవస్థ

తత్ తత్ దేవతా అనుగ్రహాన్వితైః శ్రోత్రాది జ్ఞానేంద్రియైః శబ్దార్థ విషయ గ్రహణ జ్ఞానమ్ జాగ్రత్ అవస్థా భవతి|

ఈశ్వర సంకల్పానుసారంగా దివ్య ప్రజ్ఞస్వరూపులగు దేవతల కార్యక్రమములచేత, అనుగ్రహంచేత ఈ జీవుడు కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు పొందుచున్నాడు! అంతేకానీ, ఏ జీవుడైనా, “నా కాళ్ళు - కళ్ళు - చెవులు - చర్మము - ముక్కు - చూపు శక్తి వినికిడి శక్తి - స్పర్శ శక్తి - జీర్ణ శక్తి … ఇవి నేనే నిర్మించుకున్నాను” - అని అనగలడా? లేదు కదా ! ఈ విధంగా దేవతలచే ప్రసాదించబడిన కర్మేంద్రియ - జ్ఞానేంద్రియములను గ్రహించుచున్న శబ్ద - అర్థ గ్రహణ సంబంధమైన జ్ఞానమంతా ఎందులో పొందబడుచున్నదో అదియే "జాగ్రత్ అవస్థ” అగుచున్నది.

శ్లో॥ తత్రభ్రూమధ్యంగతో జీవ ఆపాదమస్తకం వ్యాప్య,
కృషి - శ్రవణాది అఖిల క్రియా, “కర్తా” భవతి ||

అట్టి “జాగ్రత్ అవస్థ”లో ఈ జీవుడు

స సార్వభౌమవత్ వ్యవహారాత్ శ్రాన్తో … అన్తర్భవనమ్ ప్రవేష్ఠుం మార్గం ఆశ్రిత్య తిష్ఠతి |
ఒక సార్వభౌముడు అనేక వ్యవహారములు నిర్వర్తించి, అలసిపోయి అంతఃపురములోని శయనాగారము ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటాడు చూచావా! అట్లా, ఈ జీవుడు కూడా జాగ్రత్-స్వప్న సీమలలో విహరిస్తూ, అనేక దృశ్య విషయములను నిర్వర్తించి-నిర్వర్తించి అలసిపోయి, ఇక విశ్రాంతి కొరకై జాగ్రత్ నుండి గాఢ - నిద్రలోకి ప్రవేశించుచున్నాడు. విషయరహితమగు జడవృత్తిని ఆశ్రయించి ఉంటున్నాడు.

2.) స్వప్న అవస్థ

కరణ ఉపరమే, జాగ్రత్ సంస్కారార్థ ప్రబోధవతీ, గ్రాహ్య - గ్రాహ్యక స్ఫురణమ్, “స్వప్నావస్థా” భవతి|
అలసి నిదురిస్తూ కరణములను జాగ్రత్ వ్యవహారముల నుండి ఉపసంహరించి, జాగ్రత్ సంస్కారములలోని కొన్ని విషయాలచే ప్రబోధింపబడుచూ, "గ్రహించువాడు (స్వప్న ద్రష్ట) - గ్రహించబడునది (స్వప్న దృశ్యము)… ఊహ అపోహల”తో కూడి కొనసాగుచుండటమే ‘స్వప్నము’.

బాహ్య ఇంద్రియములు నిష్క్రియము పొందుచుండగా, మనో ఉపకరణముతో - ‘జాగ్రత్’ వంటి… దృశ్యమే భావన చేసి, ఆ దృశ్య దర్శనమును అంతరంగములో కొనసాగించటము, ‘స్వప్నము’.

జాగ్రత్ ద్రష్టయగు విశ్వుడే జాగ్ర వ్యవహారరహితుడై అటుపై ‘తేజసుడు’ అను రూపమును దాల్చుచున్నాడు.

స్వప్నావస్థ సందర్భములో జాగ్రత్ వ్యవహారమంతా నిద్రాణమై, అస్పందమై దాచిపెట్టబడి ఉంటుంది.

జాగ్రత్ సమయంలో బాహ్యమున సంచరించుచున్న మనస్సు పాంచభౌతిక దృశ్యము నుండి వెనుకకు మరలి దేహములో నాభీ మధ్య భాగమునందు చరిస్తూ తనకు బాహ్యమువలె (తన ఊహయందే) అనుభవించబడుచున్నట్టిదే స్వప్నము.

మనస్సు విశ్వత్వమును వదలి తన తేజో రూపమునందు తానే ప్రవేశించి, జాగ్రత్ వాసనలను తన తేజో మండలమునందు పునశ్చరణం వలె కల్పించుకొని జాగ్రత్‌తో సమానముగా ‘సత్యమే’ అను భావనతో అనుభూతము చేసుకొనుచున్నది. కాబట్టి ‘తేజత్వము’ అని పిలువబడుతోంది.

ఆ తేజత్వ - అభిమానిని ‘తేజసుడు’ అని (వేదాంత వాఙ్మయముచే, ఉపనిషత్ వాఙ్మయముచే) పిలువబడుతోంది.

జాగ్రత్-అభిమానికి ఈ జాగ్రత్ సత్యము వలె అనిపిస్తూ, ‘స్వప్నము’ మాత్రం అసత్యము, ఊహామాత్రము, అళీకము (భ్రమ), కల్పితము అయి ఉన్నది. ఇక స్వప్న - అభిమానికి జాగ్రత్ అదేరీతిగా అసత్యము, ఊహామాత్రము, అళీకము, కల్పితము వలె అనిపిస్తూ, స్వప్నములోని సందర్భములు మాత్రమే సత్యము వలె అగుపిస్తూ ఉంటాయి. అయితే జాగ్రత్ సందర్భంలో జాగ్రత్ అభిమాని (విశ్వుడు), స్వప్నము సందర్భంలో స్వప్నాభిమాని (తేజసుడు) - ఈ రెండు ఒకే జీవుడు కల్పించుకొనుచున్నవే! ఈ జీవుని రెండు అంశలు వేరువేరైన అంశలు అని అనక తప్పదు.

తైజసత్వమ్ అవాప్య, వాసనా రూపకమ్ జగత్ వైచిత్ర్యం
స్వభాసా భాసయన్ యథా ఈప్సితం స్వయం భుక్తే ।

స్వప్నములో ఈ జీవుడు ఏది తనకు ఇష్టమో అది తన స్వప్నాకాశములో ప్రకాశించుచున్నట్టిదిగా పొందుచున్నాడు. ఈ విధంగా అనుభవించేదంతా ఈ జీవుని యొక్క స్వకీయ వాసనా వైచిత్ర్యమే। తనకు ఇష్టమైనదే తాను స్వప్నములో కల్పించుకొనుచున్నాడు.

3.) సుషుప్తి అవస్థ

జాగ్రత్ - స్వప్న సందర్భములలో చిత్తము అనేక విషయములను ఆశ్రయిస్తూ స్వవాసనలచే పరిపరి రీతులుగా ఒకేసారి ప్రసరిస్తూ ప్రవర్తించు స్వభావము కలిగి ఉంటోంది కదా !

చిత్తైక కరణా ‘సుషుప్త్యవస్థా’’ భవతి |
అనేక చోట్ల సంచరించే ఈ చిత్తము ఏకత్వమును పొందటము చేత ‘సుషుప్త్యవస్థ’ సిద్ధిస్తోంది.

‘చిత్తము’ తనకు తాను మాత్రమే కలిగి ఉన్నదగుచున్నది. సుషుప్త్యవస్థకు విషయములు ఉండవు. జడరూపమగు మౌనమే విషయము.

భ్రమ విశ్రాంత శకునిః కుక్షే సంసృత్య నీడాభిముఖం యథా గచ్ఛతి,
తథా జీవోఽపి జాగ్రత్ స్వప్న ప్రపంచే వ్యవహృత్య,
శ్రాన్తో, ‘అజ్ఞానం’ ప్రవిశ్య… స్వానన్దం’ భుంక్తే॥

ఒక పక్షి ఆహారము కొరకై ఎక్కడెక్కడో తిరిగి తిరిగి సాయంకాలము చీకటిపడుచుండగా, తిరిగి తాను నివశించే వృక్షముపై చేరి, రెక్కలు ముడుచుకొని గూటిలోనికి పోయి విశ్రాంతి పొందుతుంది చూచావా? ఆ విధంగా, ఈ జీవుడు కూడా జాగ్రత్ - స్వప్నములలో సంచారాలు చేసి, ఎప్పుడో జాగ్రత్ - స్వప్న విశేషాలన్నీ త్యజించి ‘సుషుప్తి’ అనబడే ‘అజ్ఞాన భూమిక’లో చేరి తన ఆత్మ సంబంధమైన ఒకానొక ఆనందమును (స్వానన్దమ్) తన చిత్తముతో అనుభవించుచున్నాడు.

4.) మూర్ఛ అవస్థ

మూర్ఛావస్థలో ఈ జీవుడు ఇంద్రియములు కంపనము పొంది, తన వశములో లేని స్థితిని పొంది అనుభవించుచున్నాడు.

అకస్మాత్ ముద్గరదండా ఆద్యైః తాడితవత్ |
ఒకానొకడు ముద్గరము (రాతి బండతో చేసిన రోకలి వంటి ఆయుధము) మొదలైనవాటి చేత తలపై మోదబడినప్పుడు, ఇంద్రియ సంఘాతములన్నీ బిగిదీసుకొని పోతాయి చూచావా? అప్పుడు ఇంద్రియాలు (శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాలు) వశం తప్పిపోయి, ఉపకరణములుగా ఉపకరించవు. ఆ విధంగా ఈ జీవుడు కూడా మరణమునకు ముందు, జీవించి ఉన్నప్పుడు కూడా మరికొన్ని ఆయా సందర్భములలోను ‘మూర్ఛావస్థ’ పొందటము జరుగుతోంది.

అప్పుడు స్వస్థతను కోల్పోయి జడునివలెపడి ఉంటున్నాడు. తన దేహమే తన యాజమాన్యములో లేని స్థితిని అనుభవించుచున్నాడు.

భయ-అజ్ఞానభ్యామ్ ఇంద్రియ సంఘాతైః కంపన ఇవ మృత్యుతుల్యా ‘మూర్ఛా’ భవతి। 

ఇట్టి మూర్ఛ దశలో ఈ జీవుడు భయ-అజ్ఞానములచే ఆవరించబడి, ఇంద్రియ సంఘాతము వశము తప్,పి వ్రేలాడుచున్నట్లు అనుభవము పొందుచు, మృత్యువుతో సమానమైన స్థితి పొందటము జరుగుతోంది.

5.) మరణ అవస్థ

ఈ అవస్థ జాగ్రత్-స్వప్న-సుషుప్తుల కంటే వేరై ఉన్నది.

బ్రహ్మాది స్థంభ పర్యంతమ్ సర్వం జీవభయ ప్రదా।
స్థూల దేహ వివర్జినీ। 

ఈ అవస్థ బ్రహ్మదేవుని మొదలు చిన్న పురుగు వరకు - స్థంభము పర్యంతము - జీవులందరినీ భయమును కలుగజేస్తూ ఉంటున్నది.

మృత్యువు - స్థూల దేహమును వదలటము ఈ జీవుడు ఇంద్రిమయులతో కూడిన ఈ స్థూల దేహమును (ఇల్లు ఖాళీ చేసి మరొక ఊరికి వెళ్ళి పోవు రీతిగా) పరిత్యజించటము జరుగుతోంది.

దేహాన్తర ప్రాప్తి - పునర్జన్మ!

మరణము సమయములో… కర్మేంద్రియాని, జ్ఞానేంద్రియాని, తత్ - తత్ విషయాన్, ప్రాణాన్ సంసృత్య, … కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, వాటివాటికి సంబంధించిన విషయములను ప్రాణ వృత్తులను విడచిపెట్టుచున్నాడు.

తన వెంట -
1) కామ్య - కర్మ భావములను (కోరికలను, కర్మలకు సంబంధించిన ఉద్వేగ - అనుద్వేగ సంస్కారములను) వెంటనిడుకొని (కామ కర్మాఽన్వితా)
2) (అవిద్యాభూత వేష్టితో) జీవో దేహాన్తరమ్ ప్రాప్య, దేహాన్తరమ్ గచ్చతి-జీవుడు మరొక దేహము కొరకై వెతుకుచూ లోక - లోకాంతరాలకు అవిద్యను వెంటనిడుకొని వేరు వేరు లోకాలలోకి) బయల్వెడలుచున్నాడు.

మోక్షేచ్ఛ

పైఙ్గలుడు :  హే గురుదేవా ! ఈ జీవుడు మీరు చెప్పిన విధంగా అనేక సంస్కారాలను, అవిద్యను మూటకట్టుకొని, మరొక దేహము కొరకై బయల్వెడలి, ఆ నూతన దేహములో అవన్నీ మూట విప్పి తిరిగి కామ్యకర్మలు - వాసనలు - సంస్కారములు - ప్రవర్తనలు కొనసాగిస్తూ ఉన్నాడని, అవిశ్రాంతంగా తిరుగుచూ, బహు శ్రమ పడుచున్నాడని, అనేక దుఃఖములు పొందుచున్నాడని నాకు అర్థం అవుతోంది. మరి జీవునికి అట్టి అవిశ్రాంత దుఃఖము తొలగటానికి ఉపాయమేమిటి?

యాజ్ఞవల్క్యుడు :  ప్రియ పైఙ్గల మహాశయా ! వినండి.

ఈ విధంగా అనేక ఉపాధులలో ప్రవేశ - నిష్క్రమణములు నిర్వర్తిస్తున్న ఈ జీవుడు తన యొక్క సత్కర్మల ఫలితంగా ఒకానొకప్పుడు కాకతాళీయంగా -

… ఇటువంటి ముఖ్య ప్రశ్నలకు (Fundamental questions for which answers are to be obtained)కు వస్తున్నాడు.

ఇక అతనిలో సరియగు సమాధానముల కొరకై జిజ్ఞాస ప్రారంభమౌతోంది. “దృశ్యము నాకు బంధము కాకూడదు. ఎట్లా?”… అను మార్గమును వెతకనారంభిస్తున్నాడు. మోక్షేచ్ఛ పొందుచున్నాడు.

విచారణ

ఇకప్పుడు అట్టి మోక్షముపట్ల (దృశ్యములోను, సంగతి - సందర్భములతోను, అనేక విషయ పంపరలతోను విడిపడాలని) పట్టుదల పొందుచున్నాడు. అద్దానికి సంబంధించిన వాఙ్మయమును (Literature-శాస్త్రములు) పరిశీలించటము ప్రారంభిస్తున్నాడు. ఆత్మజ్ఞులగు సద్గురువులను ఆశ్రయిస్తున్నాడు. సాధనలకు, గురుసేవకు చిరకాలము తనను తాను నియమించుకొనుచున్నాడు.

అట్లా ప్రయత్నిస్తూ “మోక్షము (నాకు స్వతఃగానే బంధము లేదు)”… అను నిశ్చల - సుస్థిర అవగాహనను నిర్మలమైన బుద్ధి సహాయముతో పునికి పుచ్చుకొనుచున్నాడు.

పైఙ్గలుడు :  అసలు ఈ జీవుని పట్ల ఏర్పడు బంధము యొక్క రూపమేమిటి ? మోక్షము ఎట్లా కలుగుతుంది ?

యాజ్ఞవల్క్యుడు :  

అవిచారకృతో బంధో - విచారణ చేయకపోవటం చేతనే “నాకు బంధము ఉన్నది”… అని అనిపిస్తోంది.

విచారాత్ మోక్షో భవతి - నేనెవరు ? ఈ దృశ్యమేమిటి నా స్వరూపము ఎట్టిది ? బంధము ఎట్లా, ఎందుకు కలుగుతోంది ? నిష్కారణముగా బంధమును నాకు నేనే స్వాభిమానినై తెచ్చిపెట్టుకుంటున్నానా ? బంధము వస్తుతః ఉన్నదా ? మనోకల్పితమా ? వాస్తవానికి మోక్ష స్వరూపుడనై ఉండి, బంధమును ఆపాదించుకుంటున్నానా ? మోక్షము నాపట్ల అనుక్షణికమయ్యేదెట్లా? ఈ రూపమైన విచారణచే క్రమముగా ఆత్మగురించి తెలుసుకొనుచుండగా…, బంధము తొలగి ఈ జీవుడు మోక్ష స్వరూపుడగుచున్నాడు.

అందుచేత ఓ పైఙ్గలా! తస్మాత్ సదా విచారయేత్! ఈ జీవుడు ఎల్లప్పుడు విచారణ చేసే కార్యక్రమంలో ఉండాలయ్యా!
దేనిని గురించంటావా?
1) ఈ దృశ్య జగత్తు 2) జీవుడు 3) ఈశ్వరుడు 4) పరమాత్మ
… వీటిని విడివిడిగా విచారిస్తూ, వీటన్నిటియొక్క పరస్పర ఏక-అఖండత్వము గురించి.

అధ్యారోపము (ఇదంతా అదే) - అపవాదము (ఇదంతా స్వతఃగా లేదు) … అను మార్గములలో పై నాలుగిటి స్వరూపము విషయములో నిశ్చలమైన అవగాహన పెంపొందించుకోవాలి.

విచారణచే అట్టి అవగాహన సుసాధ్యమే!

"జీవభావము, జగద్భావము… ఈ రెండిటి యొక్క మూలమేమిటి? ఎంతవరకు ‘కల్పన’ (auributes) అయి ఉన్నాయి? వీటిని దాటి ఆవల పరిశీలించినప్పుడు ఏది తెలియబడుచున్నది?”  … అనునది విచారణగా పరిశీలించి చూస్తే…

అప్పుడిక జీవాత్మకు అభిన్నమైనట్టి ‘బ్రహ్మము’ మాత్రమే శేషిస్తూ…, సర్వము సర్వదా బ్రహ్మముగా తెలియబడగలదు.
మహావాక్యముల విచారణయే అందుకు మార్గమని గుర్తు చేస్తున్నాను!

3.) తృతీయ అధ్యాయము - మహావాక్య విచారణ

పైఙ్గలుడు :  హే మహాత్మా ! సద్గురూ ! మహనీయా ! యాజ్ఞవల్క్య ఆత్మతత్త్వవేత్తా ! నాపై కరుణతో ఇప్పుడు వేద - వేదాంత వాఙ్మయము సూచిస్తున్న మహావాక్యముల తాత్పర్య - వివరణ బోధించమని వేడుకొంటున్నాను.

యాజ్ఞవల్క్యుడు :  ఆత్మ తత్త్వము ఎరిగిన మహనీయులు కొన్ని ‘మహావాక్యములు’ ప్రసాదించారు. ఆయా వాక్యాలన్నీ వేదాంత శాస్త్రముచే శాస్త్రవేత్తలకు సవివరణ పూర్వకంగా గ్రంధస్థమై ఉన్నాయి. చెప్పబడుచున్నాయి కూడా! వాటి యొక్క విచారణచే ఈ జీవుడు స్వస్వరూపాత్మ గురించి తెలుసుకొని, సర్వబంధముల నుండి తప్పక విముక్తుడు కాగలడు.

తత్ త్వమ్ అసి! ఆ పరబ్రహ్మమే - “నీవు”గా కనిపిస్తున్నది!

త్వమ్ తత్ అసి! నీవు పరబ్రహ్మమే అయి ఉన్నావు.

త్వమ్ బ్రహ్మాసి! నీవు బ్రహ్మమే అయి, అజ్ఞాన దృష్టిచే జీవుడువలె అనిపిస్తున్నావు. విచారణచే “నీవు బ్రహ్మమే ! ఆత్మ స్వరూపుడవే ! మమాత్మస్వరూపుడవే !” … అని ఎరుగబడుచున్నది.

అహమ్ బ్రహ్మాస్మి! ’నీవు బ్రహ్మమే’ అని తెలుసుకుంటే నాకు వచ్చే లాభం ఏమిటి? ఏమిటంటే, “నేను బ్రహ్మమే” … అని తెలుసుకొనగలుగుటకు అది మార్గము అగుచున్నది. నేను సర్వదా బ్రహ్మమే అయి ఉన్నాను!

ఈ ఈ మహావాక్యములను విచారణచే అనుసంధానము చేసి, గురువుల అభిప్రాయము సేకరించి, తత్త్వార్ధాన్ని బుద్ధితో సముపార్జించుకోవటము, దృష్టిని పవిత్రము - సమున్నతము చేసుకోవటము, ’బ్రహ్మమే నేను’ అయి ఉండటము… ఇదియే ‘మహవాక్య విచారణ మార్గము’. ఈ వాక్య విచారణలో ‘3’ మెట్లు (Phases) గురించి చెప్పుకుందాము 1) పరోక్షము 2) ప్రత్యక్షము 3) అపరోక్షము.

1.) పరోక్ష జ్ఞానము

తత్ర పరోక్ష్య శబళ, ‘సర్వజ్ఞత్వ’ ఇత్యాది లక్షణో ‘మాయోపాధి’ - ‘సత్ చిత్ ఆనంద లక్షణో’,
… జగత్ యోనిః ‘తత్’ పదవాచ్యో భవతి |

ఎదురుగా ఈ జగత్తు ఇంద్రియములకు కనిపిస్తోంది కదా! ఈ జగత్తును జీవుడు తన కళ్ళు - చెవులు - ముక్కు - నోరు - చర్మము - కాళ్ళు - చేతులు ఇత్యాది ఇంద్రియములతో అనుభవిస్తున్నాడు.

ఈ దేహములోను - దృశ్య జగత్తులోను అనేక చమత్కార విశేషాలన్నీ గమనిస్తే దీని వెనుక ఏదో మహత్తరమైన దివ్య ప్రజ్ఞ వేంచేసి ఉండి, ఇదంతా సృష్టించి - స్థితింపజేసి - నడిపిస్తూ లయింపజేస్తూ పునఃసృష్టి చేస్తున్నట్లు ఎవ్వరైనా ఒప్పుకోక తప్పదు. అట్టి పరమాత్మ నా ఈ దేహమును ఈ ఎదురుగా ఉన్న విశ్వజగత్తును సృష్టించినవారు కాబట్టి ఆయన యొక్క ‘సర్వజ్ఞత్వము’ మొట్టమొదటి లక్షణము .

ఇంకా ఆ పరమాత్మ - సర్వమును ఎరిగిన సర్వజ్ఞుడయి ఉండగా, ’జీవుడు’గా నేను ఆయనచే సృష్టించబడిన దేహమును పదార్థములను ఉపయోగించుకుంటూ కించిజ్ఞుడను (కొంచమే తెలిసినవాడిని).

ఆయన కల్పనయే ఈ ఎదురుగా కనబడే దృశ్య వస్తు సమూహమంతా ! నేను దేహముతో పుట్టటానికి ముందే ఇవన్నీ ఉన్నాయి కదా ! కల్పనకు ఆయన యజమాని ! కనుక ’మాయ’ ఆయన యొక్క ఉపాధి. {నాకు ఈ దేహము, తెలియకపోవటము (అజ్ఞానము) ‘ఉపాధి’ అయి ఉంటున్న తీరుగా}.

అట్టి సృష్టిని ఆదిపురుషుని తత్త్వమేమిటో, లక్షణములు ఎట్టిదో, .. విచారణ చేయటమే ‘పరోక్షజ్ఞానము’. అట్టి పరమాత్మోపాసనను ఇట్టి దైవోపాసన ద్వారా భక్తి-యోగములచే ఉపాసించుటచే పరమాత్మయొక్క మహదత్వము అనుభవమవగలదు. (విష్ణు, శివ, లలితా సహస్ర నామములు అట్టి పరోక్ష పరమాత్మయొక్క అభివర్ణనములు).

పైఙ్గలుడు :  అవును గురుసత్తమా ! అట్టి ఆది పురుషుడు, సృష్టికి మున్ముందే ఉండి.. ఇదంతా కల్పించువాడు అగు మహాప్రజ్ఞా స్వరూపుడగు - పరమాత్మ ఉండి ఉండక తప్పదు. ఆయన యొక్క లక్షణములు ఎట్టివి?

యాజ్ఞవల్క్యుడు :  అట్టి పరమాత్మ తత్త్వము గురించి తపో - ధ్యానములు నిర్వర్తించిన ఆత్మబంధువులగు మహనీయులు సత్ (ఉనికి) - చిత్ (ఎరుక, వెలిగించటం) - ఆనందములను ఆత్మ లక్షణములుగా విశదీకరిస్తున్నారు.

ఈ విశ్వము ఇద్దాని నిర్మాత యొక్క (విశ్వేశ్వరుని) సంకల్పరూపమే కదా ! కనుక ఈ జగత్తును ఆ పరమపరుషునిరూపంగా (The work of worker of the universe)గా ధ్యానము చేయటము ‘పరోక్షోపాసనా మార్గము’ అయి ఉన్నది.

పరోక్షమార్గములో ఈ దృశ్య జగత్తు జగదీశ్వరుని ఉపాధిగా భావన చేసి ఆరాధించబడుతోంది.

1.) నేను ఉపాసకుడను
2.) ఈ జీవితము-సందర్భములు…. ఇవన్నీ నాకు ఉపాసనా వస్తువులు
3.) శ్రద్ధ నాకు మార్గము
4.) సర్వతత్వస్వరూపుడగు పరమాత్మ నా ఉపాసనా వస్తువు
…. అను అవగాహనయే పరోక్ష జ్ఞాన సిద్ధికి మార్గము.

2.) ప్రత్యక్ష అభిన్నం బ్రహ్మ

క్రమంగా ఆ పరోక్షాపాసకుడు ప్రత్యక్షోపాసకుడు అగుచున్నాడు. ఎట్లాగో విను ।

స ఏవ అంతఃకరణ సంభిన్నబోధో ‘అస్మత్’ ప్రత్యయా, అవలంబనః ‘త్వమ్’ పదవాచ్యో భవతి |

ఈ జగత్తును ఉపాధిగా ధరించి ఉన్న ఆ పరమాత్మయే నాయందు ‘నేను’ అను రూపము గల ఉపాధిధారుడై ఉన్నాడు.

అట్లాగే ‘త్వమ్’ (‘నీవు’) రూపముగా కనిపించేదానిలో - ‘నేను’ అను ఉపాధిధారుడై కూడా ఉన్నారు.
‘త్వమ్’ పద వాచ్యార్ధము అయి ఉన్నాడు.
అప్పుడిక ‘తత్వమ్’ భావన ఉదయించి, ‘సోఽహమ్’ భావనతో ఏకమై ప్రకాశించుచున్నది. ’
నీవు’గా కనిపిచే ‘జగత్తు’గా కనిపించేది పరమాత్మ స్వరూపమే - అనునది ప్రత్యక్ష జ్ఞానము.

3.) అపరోక్ష జ్ఞానము

ప్రత్యక్ అభిన్నం బ్రహ్మ!
జీవాత్మ పరబ్రహ్మ స్వరూపుడే - అను ప్రత్యగాభిన్న బ్రహ్మము అనుభూతమగుచున్నది.

‘నేను’గా ఉన్నది పరబ్రహ్మమే! పరబ్రహ్మరూపుడను! కనుక ఇదంతా నేనే! సోఽహమస్మి! నీవుగా కనిపించేది నేనే! త్వమేవాహమ్! ఇది అపరోక్ష జ్ఞానము. “నేను విశ్వస్వరూపుడను” - అను విశ్వరూప సందర్శన యోగము - అపరోక్ష జ్ఞానము.



అట్టి అపరోక్ష జ్ఞానము సిద్ధించేది ఎట్లా?

శ్రవణము

మననము

ఏకాంతేన శ్రవణాత్ ‘అర్ధ-అనుసంధానమ్’ (ఇతి) మననమ్ భవతి!
ఆ విధంగా “తత్ త్వమ్ అసి | అహమ్ బ్రహ్మాఽస్మి! జీవో బ్రహ్మేతి నా పరః|” …. ఇత్యాది మహావాక్యములకు సంబంధించిన సమాచారమును తెచ్చుకొని, క్రమంగా అద్దాని మహార్థమును మననము చేస్తూ …,

… ఇత్యాది భావనలతో ఏకాంతముగా విచారణ చేయటమును, అర్థమును ఎవరికి వారే అనుసంధానము చేయటమును ‘మననము’ అంటారు.

మననముచే బుద్ధి క్రమంగా సూక్ష్మార్ధమును గ్రహించినదగుచున్నది. ‘అద్వితీయ ఆత్మాఽహమ్’ …. భావనను సునిశ్చియం అవటం ఆరంభమౌతోంది.

నిదిధ్యాసనమ్

శ్రవణ మననముల ద్వారా విన్న అర్థమును ఇక అనుమానాలేమీ లేకుండా చేసుకుంటూ, పరబ్రహ్మ వస్తువునందు చిత్తమును ఏకాగ్రపరచటము ‘నిదిధ్యాస’ అని చెప్పబడింది.

… అను ధ్యాసను ప్రతిక్షణము చెదరకుండా పరిపోషించుకోవటమే నిదిధ్యాస!

అనుకుంటూ - అనుకుంటూ ఉంటే అంతా బ్రహ్మముగా అనిపిస్తూ ఇక బ్రహ్మమునకు వేరుగా ఏదీ లేదను సునిశ్చితాభిప్రాయము యొక్క పరిపక్వతయే నిదిధ్యాస.

శ్రవణ మనన నిర్విచికిత్సే అర్థే వస్తుని ఏకతయా చేతః స్థాపనం…నిధిధ్యాసనం భవతి|
అనేకముగా కనిపిస్తున్నప్పటికీ ఏకత్వ సందర్శనమునందు చిత్తము సుస్థాపించబడటము నిదిధ్యాస!

నిదిధ్యాసలో భేద భావాలన్నీ లయమగుచూ 1) ధ్యాతనగు నేను 2) ధ్యాన స్వరూప పరబ్రహ్మ రూపమగు ఈ విశ్వ - విశ్వాంతరములు … ఈ రెండు మాత్రమే శేషించి ఉంటాయి. అందుచేత ‘ఏకాంత ధ్యానము’ అని కూడా అంటారు.

[నిర్విచికిత్స = సందేహములు తొలగటం.]

సర్వ విచికిత్సలు “అనునిత్య-ఆత్మానుభవము” వద్ద శమిస్తాయి. కనుక “నిర్విచికిత్స స్థితి, కేవలానుభవస్థితి" - సిద్ధించుచున్నాయి.

సమాధిః

ధ్యాతృ - ధ్యానే విహాయ, నివాతస్థిత దీప - ‘ధ్యేయ’ ఏక - గోచరమ్ చిత్తమ్… “సమాధిః” భవతి |

“నాకు కనబడేదంతా బ్రహ్మమే అయినప్పుడు, ‘ఇదమ్ సర్వమ్ బ్రహ్మమేవ’ అను సిద్ధాంతానుసారంగా నేను బ్రహ్మమునే అవుతాను. కనుక ఇదంతా నేనే”… అనే కేవల ధ్యేయ - ఏకైక స్థితి సమాధి అని చెప్పబడింది.

క్రమంగా ధ్యానము చేయువాడు - ధ్యానము చేయబడునది … ఈ రెండు వదలి వేయబడి గాలిలేనిచోట కదలకుండా వెలుగొందు దీపమువలె  “చూడబడే జగత్తంతా నేనే” అనే ధ్యేయ ఏక గోచర స్థితి - సమాధి!

అద్వితీయ (రెండవదేదీ లేనట్టి) స్వస్వరూప - అనునిత్యానుభవమును ’సమాధి స్థితి’ అని అంటారు.

“సమాధి స్థితి” అభ్యాసము యొక్క దివ్యఫలము.

ఆత్మను సర్వే - సర్వత్రా దర్శించుటయే ఏకైక వృత్తిగా శేషించుచుండగా, ఆత్మకు వేరైనదేదీ ఎక్కడా ఏ మాత్రమూ శేషించక, సర్వము ఆత్మగా స్మరించు - దర్శించు స్థితియే సమాధి నిష్ఠ ! తానే సర్వమై, ఇక మనో - బుద్ధి-చిత్త అహంకారాలు మౌనము వహించి ఉండు స్థితి కాబట్టి - అది మహామౌనస్థితి కూడా!

ఇహాది సంసారే సంచితాః కర్మకోటయ అనేనైవ విలయం యాంతి |
ఇహ (ప్రారబ్దము) - ఆగామి - సంచిత రూపములగు కోట్ల కోట్ల సంఖ్యలలో గల కర్మ పరంపరల రాసులు ఎన్నైనా సరే… సమాధి భావనచే విలయమై పోతున్నాయి. ఎందుకంటే - కనబడేదంతా తానే అయి ఉన్నప్పుడు తనకు వేరుగా కర్మఫల స్థితులేమి ఉంటాయి?

ఇట్టి సమాధి నిష్ఠ చేత ’సహస్రారము’ నుండి అమృత ధారలు వర్షించుచున్నాయి. ఈ దృశ్యమంతా అమృత స్వరూపమగు ఆత్మగా స్వభావసిద్ధంగా అనుభూతమవటమే అమృతధార! యోగవిత్తముని సమాధి ఆత్మ ధర్మములను వర్షించు మేఘము వంటిది.

అట్టి సమాధి ధారణాయోగికి -

… ముందు - వెనుకలన్నీ, పరమార్థములన్నీ చేతిలోని ఉసిరిపండువలె (కరతలామలకమువలె) సర్వమూ స్వభావ సిద్ధంగా సుస్పష్టమౌతాయి.

ప్రత్యక్ష - పరోక్ష - అపరోక్ష జ్ఞానమంతా తనకు తానే పరస్పర సానుకూలంగా సుస్పష్టమగుచున్నది. సర్వ ప్రతిబంధకములు తమకు తామే తొలగిపోగా, సర్వసందేహములు స్వయముగా పటాపంచలౌతాయి.

“ఆత్మ ఎదురుగానే ఉన్నది. అంతటా అన్నీ తానే అయి ఉన్నది. నాకు అద్వితీయమై కూడా ఉన్నది”! - పరోక్షము, ప్రత్యక్షము, అపరోక్షము.

“ఆత్మ ఇంద్రియ విషయము కాదు. కాబట్టి ప్రత్యక్షము కాదు. ఆత్మ గురించి వెతుకువానికి ‘స్వస్వరూపమే’ అయి ఉన్నది కాబట్టి పరోక్షము కాదు”… అని తెలియుచున్నది. అందుచేత ఆత్మ అపరోక్షమై సమాధినిష్ఠునికి స్వభావంగానే కేవలాత్మ అనునిత్యానుభవమగుచున్నది.

మహావాక్యార్థాలన్నీ ఘనీభూతానుభవమగుచున్నాయి. అతడే జీవన్ముక్తుడు!


అపంచీకరణము

పైఙ్గలుడు :  హేమహాత్మా ! గురుదేవా ! మీరు ఇంతక్రితము ఈ సృష్టి నిర్మాణ రూపమగు పంచీకృత జగత్ నిర్మాణ చమత్కారమంతా చెప్పియున్నారు. ఇప్పుడిక ఉపసంహరణ క్రియారూపమగు ‘అపంచీకరణము’ గురించి కూడా వివరించమని వేడుకొనుచున్నాను.

పరమాత్మ యొక్క స్వ-అంశ అగు ఈశ్వరుని యొక్క ఇచ్ఛానుసారంగా బయల్వెడలి, సూక్ష్మ - స్థూల పాంచభౌతిక జగత్తు సృష్టి - స్థితి - లయముల రూపంగా ప్రదర్శితమగుచూ, తిరిగి ఎట్లా ఉపసంహరణము (లయము) అగుచున్నాయి?

సృష్టి క్రమము (పంచీకరణము) మీరు విశదీకరించి ఉన్నారు కదా ! అట్లాగే ’లయక్రమము’ గురించి (అపంచీకరణము గురించి) వివరించమని నా విన్నపము.

యాజ్ఞవల్క్యుడు :  సృష్టి అంతా కల్పనయే! కల్పించు పరమాత్మ సర్వదా యథాతథము.

ఈ సృష్టి అంతా ఈశ్వర సంకల్పముచే ఉత్పన్నమైనదే! ఈశ్వర నిర్ణయానుసారంగా విధివిధాన నిర్మితమైనదై, ఈశ్వర సంకల్పము చేతనే పరిపోషించబడటము, కొనసాగటము జరుగుతోంది.

ఇట్టి సృష్టి ఒకానొకప్పుడు ఈశ్వరేచ్ఛానుసారంగా ఉపసంహరించబడటము, మరలా పునఃసృష్టి … ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.

ఇప్పుడు నీవు అడిగినట్లు సృష్టి యొక్క ఉపసంహారమునకు (పంచీకృతము కాస్తా అపంచీకృతమవటమునకు) సంబంధించిన కొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాము.

ఈశః పంచీకృత భూతానాం, “అపంచీకరణమ్ కర్తుమ్ ” - సో అకామయత |
ఈశ్వరుడు ఒకానొకప్పుడు “నాచే పంచీకృతమై (చిన్న పిల్లవాడు ఆడుకోవటంలాగా) లీలా వినోదమువలె కొనసాగుతున్న ఈ కల్పనారూప - బ్రహ్మాండ సృష్టిని (ఆ పిల్లవాడు ఆట నుండి విరమించి ఆట వస్తువులను బుట్టలో వేసుకొని ఇంటికి చేరే ప్రయత్నము చేయు విధంగా) … ఈ బ్రహ్మాండ లీలా కల్పనను ఉపశమించచేసెదను గాక! … అనే కోరిక పొందుచున్నారు.

ఇక ఆపై…..,

బ్రహ్మాండమును, అట్టి బ్రహ్మాండములోని లోకాలను ఆయా కార్యరూపములలో ఉన్నవాటిని - వాటి వాటి కారణ రూపములందు కలిపివేయుచున్నారు.

సృష్టి యొక్క సూక్ష్మాంగములగు కర్మేంద్రియ - జ్ఞానేంద్రియములను, అంతఃకరణ చతుష్టయమును (మనో బుద్ధి చిత్త అహంకారములను)… అన్నిటినీ ఏకీకృతము చేయ సాగుచున్నారు.

భావనచే సర్వ భౌతిక పదార్థములను వాటి వాటి కారణ సూక్ష్మభూతములందు సంయోజ్యము (కలిపివేయటం) ప్రారంభిస్తున్నారు.

→ భూమిని - జలమునందు ;
→ జలమును - వహ్ని (అగ్ని) యందు ;
→ వహ్నిని - వాయువునందు ;
→ వాయువును - ఆకాశమునందు ;
→ ఆకాశమును అహంకారమునందు ;
→ అహంకారమును - అద్దాని కారణభూతమగు ’మహత్తు’ నందు (సమిష్టి రూప అహంకారమునందు) ;
→ మహత్తును - అద్దాని కారణరూపుమగు ’అవ్యక్తము’నందు ;
→ అవ్యక్తమును - తత్ కారణ భూతమగు పురుషుని యందు ;
→ పురుషుని - విరాట్ పురుషునియందు
… క్రమక్రమముగా విలీనము (ఈశ్వరునిచే) చేయబడుచున్నాయి.

భావనచే తత్-తత్ ఉత్తరోత్తర దర్శనము చేయుచున్నారు.

ఆ విరాట్ పురుషుడు హిరణ్యగర్భునియందు, హిరణ్యగర్భుడు ఈశ్వరునియందు లయమొందుచున్నారు.

ఈశ్వరుడు మాయోపాధిని త్యజించినవారై ‘పరమాత్మ’ యందు లీనమగుచున్నారు. పరమాత్మగా భావించబడుచున్నారు!

స్థూలదేహ అపంచీకృతము

సూక్ష్మ మహాభూత పంచీకృతముచే సంభవిస్తున్నటువంటి - కర్మ సంచితమైన స్థూలదేహము… కర్మలు క్షయించటము జరిగినప్పుడు ‘అపంచీకరణము’ ప్రాప్తించుచున్నది.

స్థూల పంచభూతములు సూక్ష్మరూపముగా ఏకీభూతమగుచున్నాయి. కారణ రూపము పొందుచున్నాయి.

అట్టి కారణము అద్దానికి కారణమగు ‘కూటస్థ ప్రత్యగాత్మ’ (Absolute Self) యందు విలీనము అగుచున్నది.

ఇక విశ్వుడు (జాగ్రత్ అభిమాని), తేజసుడు (స్వప్నానుభవ అభిమాని), ప్రాజ్ఞుడు (గాఢ నిద్రాభిమాని) తమ తమ ఉపాధులు (Fields) లయమగుచుండగా, వారుకూడా ప్రత్యగాత్మయందు విలీనమగుచున్నారు.

ఈ బ్రహ్మాండము – బ్రహ్మాండాభిమానితో సహా - జ్ఞానాగ్నియందు దగ్ధమై, కార్య కారణములతో సహా పరమాత్మయందు లీనము అగుచున్నది.

ఏ విధంగా ఆకాశంలో మేఘములు తొలగగానే సూర్యుడు స్వయముగా ప్రకాశమానుడై అగుపిస్తున్నారో, ఆవిధంగా అజ్ఞానము తొలగుటచే ఆత్మానుభము, ఆత్మతో ఏకత్వము అనుభూతమగలదు.

పరమాత్మగా సర్వము శేషించినదై, అన్యత్వమంతా “రహితము-లేనిది”గా అగుచున్నది. అనన్యత్వము సిద్ధిస్తోంది.

అందుచేత, ఓ పైఙ్గలా !

ఈ జీవుడు ఈ సర్వమునకు ఆవల సర్వదా ప్రకాశమానమై ఉన్నట్టి, ఈ ఎదురుగా కనిపించే భేధములన్నిటి నుండీ దృష్టిని మరల్చి “తత్ త్వమ్ (నీవు బ్రహ్మమునే)” అను తత్త్వ భావనను ఆశ్రయించి తత్ పదముతో సర్వదా ఐక్యము పొందే ప్రయత్నమునందు సదా, సర్వదా స్వయం నియమితుడు కావటమే ఉచితము.

అప్పుడు స్వస్వరూప - పరబ్రహ్మతత్త్వముతో ఈ జీవుడు ఏకీభూతుడై, బ్రహ్మమే తానై ప్రకాశించగలడు.

ధ్యేయము

మనలో ప్రతి ఒక్కరి హృదయములో పొగలేని దీపమువలె జ్యోతిస్వరూపుడై, అంతరమున పరమాత్మ సదా వెలుగొందుచున్నారు.

అంగుష్ఠ మాత్రమ్ ఆత్మానమ్, “అధూమ జ్యోతి” రూపకమ్| ప్రకాశయంతమ్ అంతస్థమ్, ధ్యాయేత్ కూటస్థమ్, అవ్యయమ్ ।

బొటనవ్రేలు ప్రమాణమై, తత్ జ్యోతి స్వరూపమై, కూటస్థమై మార్పు చేర్పులు లేనిదై, పొగలేని అగ్నివలె సదా అంతస్థముగా తనలో ప్రకాశించుచున్న ఆత్మయే ఎల్లప్పుడు ధ్యానము చెవలసిన వస్తువు (ధ్యేయ వస్తువు).

జీవన్ముక్తులు

ఎవ్వరైతే తనయందు సర్వదా ప్రకాశించుచున్న కూటస్థ అవ్యయ జ్యోతి స్వరూప పరమాత్మను స్వస్వరూపునిగాను, ఈ విశ్వరూపునిగా కూడాగాను, సర్వ స్వరూపునిగాను నిరంతరము ధ్యాస కలిగి ఉంటారో…, తదితరమైన సర్వ విషయముల పట్ల మునులై మౌనము వహించి ఉంటారో, అట్టి వారు అమృత స్వరూపులు! వారే జీవన్ముక్తులు!

వారు సర్వ సంసార విషయ బంధముల నుండి విముక్తులై జగత్తునందు లీలగా, దేనిచేతనూ స్పృశించబడక జీవిస్తున్నవారు.

స విజ్ఞేయో।  వారు తెలుసుకొనవలసినది తెలుసుకొని ఉన్నవారు.

కృతకృత్యః। నిర్వర్తించవలసినది నిర్వర్తించినవారు, పొందవలసినది పొందినవారు.

స ధన్యః। వారు ధన్యులు.

కనుక జీవన్ముక్తుడు కావటానికై “నా హృదయమునందు సదా వెలుగొందు ఆత్మజ్యోతి రూప తేజో విభవమే నేను! ఈ సర్వేజీవులు, ఈ దృశ్య జగత్తు కూడా ఆత్మయే! ఆత్మనగు నేనే!” అని సదా ధ్యానము చేస్తూ ఈ జీవుడు అమృత స్వరూపుడు, కృతకృత్యుడు, ధన్యుడు అయి, జీవన్ముక్తుడై ప్రకాశించుచున్నాడు.

విదేహముక్తుడు

శ్లో॥ జీవన్ముక్తపదం, త్యక్త్యా స్వదేహే కాలసాత్ కృతే,
విశత్య దేహముక్తత్వం, పవనో ఆస్పందతామ్ ఇవ॥

ఈ విధంగా నేను - నీవు - జగత్తులను అఖండ - ఆత్మజ్యోతి రూపముగా దర్శించుచూ ధ్యానించువాడు క్రమంగా ‘జీవన్ముక్తము’ అను పదమును కూడా దాటి పోవుచున్నాడు. విదేహముక్తుడు అగుచున్నాడు.

1) జీవన్ముక్తుడనై అఖండాత్మ ధ్యానము చేయుచున్నట్టి ‘ధ్యాని’ స్వరూపుడనగు "నేను”
2) ధ్యాన విషయమగు అఖండాత్మజ్యోతి స్వరూపము
… అను ద్వంద్వమును కూడా త్యజించి వేస్తున్నాడు.

కాలవశాత్ వచ్చియున్న జీవాత్మత్వ భావనను త్యజించి, దాటివేసి, కాలమును దాటివేసి, ధ్యాని - ధ్యేయ - ధ్యానముల ఏకత్వముచే అనిర్వచనీయమగు ‘విదేహముక్తి’ యందు ప్రవేశించుచున్నాడు. తానే సర్వమై రెండవ వస్తువే లేనివాడై… వెలుగొందుచున్నాడు.

వాయువు వాయుతరంగముల భేదము అస్పంద వాయువునందు ఏ మాత్రము శేషించి ఉండని రీతిగా… ఆ విదేహముక్తుడు - సర్వము తానై ప్రకాశించుచున్నాడు. అది అనిర్వచనీయం!

జీవన్ముక్తుడు - సర్వము తనయందు దర్శించువాడు. తాను వాయుతరంగ స్వరూపుడై వాయువును దర్శించువాడు.

విదేహముక్తుడు - "సర్వము తానే” అయి వెలుగొందువాడు. తనకు వేరైనదంటూ ఏదీ లేనివాడు. స్పందరహిత - వాయు తరంగరహిత వాయు స్వరూపము వంటివాడు. ఉపాసన - ఉపశించబడునది - ఉపాసకుడు… అనే భేదము కూడా రహితమై ఉన్నవాడు.

జీవాత్మ - పరమాత్మల ద్వితీయత్వమంతా రహితమైపోగా, అద్వితీయత దివ్యజ్యోతి స్వరూపత్వము స్వభావసిద్ధమగు స్థితి!

దృశ్యము - త్వమ్ - తత్ …. ఈ మూడూ తానే అయి వెలుగొందుచున్నవాడు - విదేహముక్తుడు.

ఇంకా విదేహముక్తి ఎట్టిది ?

తదేవ అవశిష్యతి | సర్వము లయించినప్పుడు కూడా అదొక్కటే శేషించి ఉన్నట్టిది.

అది ’అరూపరూపం’!<>

విదేహముక్త స్వరూపమే ప్రతి జీవునియొక్క వాస్తవ - సహజ స్థానం! అది అనుభవైనకవేద్యము చేసుకొనుటయే మానవ జన్మయొక్క మహత్ ఉద్దేశ్యం! అసలు ఉద్దేశ్యం!

4.) చతుర్థ అధ్యాయము - ఆత్మజ్ఞానానుభవం

పైఙ్గలుడు :  స్వామీ ! జ్ఞానినః కిం కర్మ ? కా చ స్థితిః ? పూర్ణాత్మజ్ఞాని యొక్క కర్మలు ఎట్టివి ? అతని స్థితి ఏమిటి ? దయచేసి వివరించండి.

యాజ్ఞవల్క్యుడు :   అమానిత్వాది సంపన్నో ముముక్షుః। జ్ఞాని స్వతఃగానే అమానిత్వము మొదలైన జ్ఞానస్వభావములచే స్వభావసిద్ధముగా సంపన్నుడై ఉంటాడు.

జ్ఞాన లక్షణములు (భగవద్గీత - 13వ అధ్యాయము)


అజ్ఞాన సంపద

జ్ఞాన సంపద - జ్ఞాన లక్షణములు

మానిత్వము : వారికంటే - వీరికంటే కూడా నేనుకొంత ప్రత్యేకమైనవాడను! మా కులము జాతి మొదలైనవి గొప్పవి!
అమానిత్వము : నేను, వారు, వీరు అంతా అందరమూ అఖండాత్మ స్వరూపులము. ఇక నాకు ప్రత్యేకత ఎందుకు? జీవుడుగా చూస్తే ఒక చీమ కూడా గొప్పదే! అందు నా ఉపాసనా విషయమగు అఖండాత్మ వేంచేసియే ఉన్నది కదా!
దంభము: నా గొప్ప నేను చూపుకోవాలి కదా !

అదంభము : సర్వ స్వరూపమగు ఆత్మయే నేనై ఉండగా, ఆత్మ స్వరూపులే అగు తదితరులకు నా దంభము (లేనిది ఉన్నట్లు) గుర్తింపులతో పనేమున్నది?

హింస : ఇతరుల బాధ పడితే నాకేమిటంటా ? బలము-తెలివి-పదవి- ధనము మొదలైన సంపదలతో తదితరములను నా చెప్పు చేతలలో ఉంచటమే గొప్ప!

అహింస : అన్ని రూపాలు నేనే కనుక, ఒకరిని బాధించటము, హింసించము - నన్ను నేను బాధించుకోవటమే ! నా వలన ఒకరికి కలిగే సంతోషము నా సంతోషమే |

ఓర్పు లేకపోవటం : నాకున్న బాధలు ఎవరికున్నాయి ? అందరూ తప్పు చేస్తున్నారు! నేను అట్లా కాదు! ఇతరుల వలన నాకు బాధలు ఉంటున్నాయి! నా వలన ఇతరులకు కలిగే బాధలు -నేను వినను! నాకు చెప్పకండి!

క్షాంతి (ఓర్పు) : బాధలు అందరికీ ఉంటాయి. ఓర్పు కలిగి ఉండటమే నేర్పు. నేనూ ఇతరులకు కొంత బాధ కలిగించక తప్పదు. ఓర్పు పెంచుకోవటానికే బాధలు.

కుటిలత్వం : లోపల ఒక తీరు గాను, బయటకు మరొక తీరుగా ఉండటమే లౌకికము. అట్లు తప్పదు కదా ! చెప్పేదొకటి - చేసేది మరొకటి… ఇది ఉచితమే!

అర్జవమ్ : కుటిలత్వ రహితంగా, త్రికరణశుద్ధిగా (మాట - మనో - బుద్ధులయందు) ఏకభావము, సారుప్యత్వమే ఉచితము !

ఆచార్యులపట్ల తిరస్కారభావం : నాకు తెలియదా ? యింకొకడు నాకు చెప్పేదేమిటి ? గురువును నమ్మాలా? అక్కర్లేదు. ఎవ్వడు గురువు? ఎవ్వడు శిష్యుడు?

ఆచార్యోపాసనమ్ : మహనీయులు ఉన్నారు. వారి బోధలు, ఆప్త వాక్యములు నాకు శిరోధార్యములు, మార్గదర్శకములు.

అశుచి : ఈ రోజులలో ఎక్కువ మందిని నమ్మేటట్లుగా లేదు ! అందరూ చెడ్డవారే మరి ! ద్వేషము - కోపము - అసూయ - పరనింద - ఆత్మస్తుతి - అనుమానము మొదలైనవి - అశుచి భావాలు!

శౌచము : మానవుడన్న తరువాత లోపాలుంటాయి మరి ? నాలోనూ ఉన్నాయి. అంతా ఆ పరమాత్మ యొక్క జగన్నాటక చమత్కారమే! అందరిలోనూ మంచి కూడా ఉన్నది. అది నేను గమనించాలి. అందరూగా వేంచేసియున్న పరమాత్మయే నా ఉపాసనా రూపం!

సుఖాభిలాష : జీవితం వచ్చిందే ఇంద్రియాలతో విషయానుభవముల కొఱకాయె! అందుకని తినటము, త్రాగటము, గంతులేయటం - ఇదీ మన పని!

ఆత్మనిగ్రహమ్ : ఇంద్రియములు దేవతా ప్రసాదితములు. సద్వినియోగము కొఱకై నేను సక్రమంగా నియమించుకోవాలి ! లేదా అధమ గతులు తప్పవు !

ప్రేయస్సు : శబ్ద స్పర్శ రూప రస గంధములతో ఇష్టమైనవి పొందాలి కదా! ప్రియమైనవి పొందప్రయత్నించుటచే) ప్రేయో మార్గమే ఇప్పటి మన కర్తవ్యం!

ఇంద్రియార్థేషు వైరాగ్యమ్ : ఇంద్రియ విషయముల పట్ల రాగము లేకుండా విరాగికై ఉండటము చేతనే జీవితము సద్వినియోగమౌతుంది. రాగము బంధము! విరాగము ముక్తి!

అహంకారము : నేను - నాది… వీటిని పరిరక్షించుకోవాలి ! ఇవి నాకు సుఖప్రదము. ఇవియే నా సంపద! నా గొప్పతనం. నేను లోకంలో కాపాడుకోవాలి!

అనహంకారము : ‘నాది’ అనిపించేదంతా నేను తెచ్చుకోలేదు. పరమాత్మచే ఇవ్వబడింది. అందుచేత అంతా ఆయనదే ! నాదంటూ ఏమీ లేదు. ’అహమ్ - మమ’లకు సుదూరంగా ఉండటమే సుఖ ప్రదము. జాగ్రత్‌లోని ’నేను’చే నేనుగాని, మరెవ్వరముగాని పరిమితులము కాదు.

దోష అపరిశీలనమ్ : పుట్టాము. ఎట్లాగైనా హాయిగా ఉందాము ! అయిపోయే ! ఇంకేమున్నది? తరువాత ఏమిటో ఇప్పుడెందుకట? – దోషములు పరిశీలించకపోవటం.

జన్మ - మృత్యు - జరా - వ్యాధి దుఃఖ దోష అను దర్శనమ్ : జన్మ - మృత్యువు - ముసలితనము - వ్యాధులు … ఇటువంటి దుఃఖ దోషములు ఈ దేహానికి ఉంటున్నాయి. కనుక సమయం వృధా చేసుకోకూడదు. ఇంద్రియ వశములమై ఉండరాదు. ’జీవితము’ అనే అవకాశమును జ్ఞానము కొరకై సద్వినియోగం చేసుకోవాలి.

సక్తత : కొడుకులు… భార్య … భర్త… గృహములు… ఇవన్నీ నావి. నేను వీరందరికీ చెందినవాడను! నా సంపదే యివన్నీ! వీటిపట్ల మమకారమే నా సుఖం!

ఆసక్తిః అనభిష్వంగః పుత్రదార గృహదిషు : భార్య భర్త- పుత్రులు నా వారు… కానివారు… ఇవన్నీ పట్టుకొని వేలాడకూడదు. వీటితో ఆసక్తి (Attachment) అవసరం కాదు. ఇవన్నీ పరమాత్మవి! నేను సేవకుణ్ణి! - అసక్తతయే త్రోవ! (Non-Attachment is the way out of bondage!).

అన్య పరిమిత దృష్టి : జీవుడు - మంచివాడు - చెడ్డవాడు - దేవుడు - ప్రకృతి - జ్ఞానులు - అజ్ఞానులు … ఇవన్నీ వేరు వేరు విషయాలు ఇదంతా అనేక భేదాలతో కూడుకొని ఉన్నది. వాటిని బట్టి నేను బ్రతకాలి. (దృశ్యదృష్టి, సంసార దృష్టి).

మయి చ అనన్య యోగేన భక్తిః అవ్యభిచారిణిః : ఇదంతా పరమాత్మకు అనన్యము. పరమాత్మవలె అంతా ప్రేమాస్పదమే … అను భావనలతో భక్తి (ప్రేమ)ని వదలక పోవటము. భక్తితో అవ్యభిచారుడనై ఉండటము ముఖ్యము.

జనాభిప్రాయ ఆవశ్యకత్వం : నేను ‘భక్తుడను’ అని, ‘జ్ఞానిని’ అని, ‘యోగిని’ అని అందరూ గమనించరేం? నా గొప్పతనం పదిమందికి తెలియాలి కదా! నా యోగ-జ్ఞాన స్థితులను ఇతరులకు చెప్పి…. మెప్పు పొందాలి.

వివిక్త దేశ సేవిత్వం : భక్తి - ప్రేమ - జ్ఞానము - యోగము … ఇవన్నీ నాకు పరమాత్మతో ఉన్న ఏకాంత సంబంధము. మరొకరి గొప్ప నాకెందుకు ? అవ్యాజమైన ప్రేమరూపమగు భక్తిని ప్రవృద్ధం చేసుకుంటాను.

రతి : పదిమందితో కలసి లోకవ్యవహారాలు మట్లాడుకుంటూ, ఆ కబుర్లు - ఈ కబుర్లు చెప్పుకుంటే కాస్త కాలక్షేపం! (లోక వ్యవహారాల పట్ల ఆకర్షిత రూపమగు ‘రతి’)

అరతిః జన సంసది : లోక వ్యవహారాలు మాట్లాడుకుంటూ “వాళ్ళు అట్టివారు - వారిని నమ్మకూడదు”… అనే కబుర్లుకు దూరంగా ఉండటమే నాకు మంచిది. లేదా, బ్రాహ్మీ దృష్టికి దూరమవుతాను కదా!

ఆలస్యం : ముందుగా లౌకిక వ్యవహారాలు. ఆ తరువాత, ముసలివాడిని అయినప్పుడు, దేవుడి గురించి చూద్దాంలే !

ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వమ్ : ఆధ్యాత్మ శాస్త్రవేత్తలు ఆత్మబంధువులై ప్రేమాస్పదంగా నా సహజ స్వరూపం గురించి చెప్పే విశ్లేషణలు, విశేషాలు ఎప్పుడూ నేను మననము చేస్తూ, నిత్యమూ ఆధ్యాత్మ జ్ఞానము గురించిన దృష్టి కలిగి ఉండటము నాకు శుభము.

తత్త్వార్థమును అవలోకించకపోవటం : ఏమిటో ‘తత్ త్వమ్’ అంటూ ఏదో చెప్పుతారు. లోకార్థాలను వదలాలా ఏమిటి? లోక సంబంధ విషయాలు, లౌకిక ఆశయాలు వదిలితే ఎట్లా? ఇహజ్ఞానం ఇప్పటికి చాలు! పరజ్ఞానం తరువాత - అప్పటి మాట!

తత్త్వజ్ఞానార్థ దర్శనమ్ : “నీ సహజమగు అఖండాత్మ స్వరూపమును ఏమరచి సందర్భ సంబంధిత రూపమునకు పరిమితుడవై ‘బద్ధుడను’ అని అనకయ్యా!"… అని ఏ త త్త్వార్థ వాక్యాలు చెప్పబడుచున్నాయో వాటి అర్థమును బుద్ధితో దర్శించెదనుగాక! బుద్ధిని తత్వార్థ జ్ఞానముచే సునిశితము, విస్తారము, ప్రశాంతము చేసుకొనెదను గాక!

ఓ పైంగలా! ఈ విధంగా (భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచితంగా వివరణగా చెప్పబడిన) అమానిత్వము మొదలైన జ్ఞాన గుణములను జ్ఞాని కలిగియుండి, వాటిని పరిపోషించుకుంటూ, పరిరక్షించుకుంటూ ఉంటాడు. అట్టి అమానిత్వము మొదలైన జ్ఞాన గుణములు కలిగియున్న ముముక్షువు యొక్క ‘21’ తరములవారు తరించగలరయ్యా! అవన్నీ పునికి పుచ్చుకొన్న బ్రహ్మవేత్త వలన 101 కులాలు (తరాలు) పరమపవిత్రమగుచున్నాయి.


నిత్యానంద స్వస్థానం

“అసలీ దేహమును ఎందుకొరకై ఈ జీవుడు పొందుచున్నాడు?”… అని ప్రశ్నిస్తే… ‘ఆనందస్థితి సముపార్జించుకోవటానికి, స్వభావసిద్ధం చేసుకోవటానికి!”…. అనునది సమాధానము.

మరి అట్టి శాశ్వత - అఖండ ఆనందము లభించేది ఎట్లా ?

ఇంద్రియానందము సర్వదా దుఃఖమిశ్రితము, దుఃఖ పరిణామయుతము కూడా ! ఆత్మజ్ఞానము చేతనే శాశ్వతానందము లభించగలదు.

మరి ఆత్మజ్ఞానము లభించేది ఎట్లా ? ఈ జీవుడు ’జ్ఞాని’గా అయ్యేది ఏ మార్గంలో ? ఆత్మజ్ఞులగు మహనీయులు  “ఈ జీవాత్మత్వమును ఎట్లా దర్శించాలి?” అను ప్రశ్నకు ఒక దృష్టాంత పూర్వక సమాధానం చెప్పుచున్నారు. వినండి.

జీవరథము

ఆత్మానం రథినం విద్ధి : ఈ జీవాత్మ రథములో అధిరోహించియున్న రథికుడు. రథము ఉపయోగించి ప్రయాణించువాడు (Traveller and possessor of the chariot). ఆతడు చేరవలసినది పరమానంద స్థానము. దేహమును స్వీకరించటం, జీవుడుగా ధారణ చేయటం - అట్టి నిత్యానంద స్థితి కొరకు మాత్రమే! అంతేగాని, దృశ్యంలో ఏదో సొంతం చేసుకొని, తీసుకు వెళ్ళాలని కాదు.

శరీరమ్ రథమేవ చ : ఈ శరీరము - ఆత్మజ్ఞానానందము అనే పవిత్ర స్థానమునకు చేర్చటానికై ఎన్నుకొన్న ‘రథము’.

బుద్ధిం తు సారథిం విద్ధి : ఈ బుద్ధి - ఆనంద స్థానము చేరటానికి రథికుడు (జీవుడు) నియమించుకొన్న రథసారథి (రథమును నడుపువాడు).

మనః ప్రగ్రహమేవ చ : మనస్సు … బుద్ధి గుర్రములను నడుపుటకై తయారు చేసుకున్న ‘కళ్లెము’

ఇంద్రియాణి హయాని అహుః : పంచ జ్ఞానేంద్రియములు దేహరథానికి పూన్చిన గుర్రములు.

విషయాం తేషు గోచరాన్ : శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములు ఆ ఇంద్రియ గుర్రములకు ఎదురుగా కనిపించే మేత వంటివి. ఇంద్రియము - ఇంద్రియ విషయములు ఒక రాజుకు గుర్రములవలె ప్రయాణ పరికరములు!

జంగమాని విమానాని : కర్మేంద్రియపంచకము (జంగములు) ఆ దేహ రథవిమానము యొక్క ఇరుసు కదలికలు.

హృదయాని మనీషిణం : హృదయములోనే దేహరథ ప్రయాణము. ఆత్మానంద స్థానము స్వకీయ హృదయములోనే ఉన్నది.

ఆత్మ - ఇంద్రియ మనోయుక్తమ్ - భోక్తే ఇతి ఆహు మహర్షయః : జీవాత్మ - ఇంద్రియములు + మనస్సుతో కూడి ఈ - దేహమునకు భోక్తగా (Experiencer) ఉన్నాడు - అని మహర్షులు ప్రవచిస్తూ గుర్తు చేస్తున్నాడు.

♠︎ ♠︎ ♠︎

పైఙ్గల మహాశయా ! ఇదంతా ఇట్లా ఉండగా… సర్వాంతర్యామి అగు శ్రీమన్నారాయణుడు భోక్త అని, ’ప్రత్యగాత్మ’గా హృదయములో సుప్రతిష్టుతుడై ఉన్నారని సత్యద్రష్టలగు మహర్షులు (శృణ్వంతి విశ్వే, అమృతస్య పుత్రః, తస్యాంతమ్ సుషిరుగ్ం - సూక్ష్మమ్! తస్మిన్ సర్వమ్ ప్రతిష్ఠితమ్) అని గుర్తు చేస్తున్నారు.

ఆత్మదర్శి… ఈ దేహమును ఏ తీరుగా చూస్తున్నాడు? దేహము ఉన్నప్పుడు సర్వ నియమిత కర్మలు నిర్వర్తిస్తూనే…, పాము కుబుసమును విడచివేయునట్లుగా సర్వకర్మఫలములను పరిత్యజించినవాడై ఉంటున్నాడు.

ఏ విధంగా అయితే పూర్ణ చంద్రుడు “ఇది మాత్రమే నా గృహము”… అనునది లేకుండానే… ఆకాశంలో పరమ ప్రశాంతంగా ఆకాశమంతా సంచరిస్తూ తన అమృత కిరణములను అన్ని వైపులా ప్రసరింపజేస్తూ ఉంటారో…, అట్లాగే ఆత్మజ్ఞాని అమృత కిరణములు వెదజల్లుచూ ముక్తుడై ఈ భూమిపై పూర్ణచంద్రునివలె సంచారములు చేస్తున్నాడు.

అట్టి విదేహముక్తుడు కాల నిర్ణయానుసారం సమయము సందర్భము వచ్చిన తరుణంలో తీర్థస్థలంలోగాని, (లేదా) ఒక శ్వపచుని (శూద్రుని) గృహంలోనైనా గాని - వస్త్రమును తొలగించుకొను రీతిగా భౌతిక తనువును త్యజించుచూ, ప్రాణములను సప్రాణముతో ఏకం చేసి - ‘కైవల్య పదము’నందు ప్రవేశించుచున్నాడు. ‘ముక్త పదాభిషిక్తుడు’ అగుచున్నాడు.

ఆత్మసంయమ యోగి అగు ముక్తుడు - మరణ సంస్కారాలు

పైఙ్గలుడు :  మహాత్మా ! లోక సంబంధమైన విషయముగా అడుగుచున్నాను. అట్టి పూర్ణానంద ఆత్మజ్ఞాన సమన్విత విదేహముక్తుడు కైవల్యమును పొంది, అటు తరువాత కాలానుగతంగా దేహమును విడచినప్పుడు, ఆ మహనీయుడికి మృతదేహ సంస్కారములు చేయు శాస్త్ర విధి ఎట్టిది ?

యాజ్ఞవల్క్యుడు :  కైవల్యము బుద్ధి సంబంధమైనదే కానీ…. భౌతికదేహ సంబంధమైనది కాదు. అట్టి విదేహముక్తుడు భౌతిక దేహమును త్యజించి కైవల్యము పొందినప్పుడు,… వారి భౌతిక దేహమును…, శాస్త్రప్రవచనానుసారంగా…

సన్యాసి ఆశ్రమవాసికి మాత్రమే “ప్రవ్రజన దీక్ష" (ఎక్కడా ఒకచోట దీర్ఘకాలము ఉండకూడదను దీక్ష) నియమించబడింది. నేతరాయ కదాచన |  తదితరులకు కాదు.

బ్రహ్మాభూతుడగు భిక్షువుకు (భిక్షక సన్యాసికి) మరణానంతరము శౌచక క్రియలుగాని, అగ్నికార్యములు కానీ, పిండోదకక్రియలుకానీ, శ్రాద్ధములు గాని, పార్వణము (పిండ ప్రదానములు, ధర్మోదకములు) గాని ఉండవు.

దగ్ధస్య దహనం నాస్తి పక్వస్య పచనం యథా |
ఒకసారి చక్కగా ఉడికించి వండిన కూరను మరల ఉడికించవలసిన పని ఉండదు కదా !

అదే రీతిగా,
జ్ఞానాగ్ని దగ్ధ దేహస్య న చ శ్రాద్ధం | న చ క్రియా !
ఆ ముక్తుడు జ్ఞానాగ్నిచే “దేహము నాకు సంబంధించినది. దేహమునకు నేను సంబంధించినవాడిని”… అను దేహభావనయే మొదలంట్లా దగ్ధము చేసివేసినవాడై ఉంటున్నారు. అందుచేత ఇక వారిపట్ల దేహత్యాజ్యానంతరము శ్రాద్ధ - పిండ ప్రదాన క్రియల అగత్యమేమీ ఉండదు. ఆత్మజ్ఞాన సంపన్నుడగు ముక్తుడు దేహానంతరం క్రొత్తగా పొందవలసిన స్థితిగాని, గతిగాని ఏదీ శేషించి ఉండదు.


గురుశుశ్రూష

పైఙ్గలుడు :  ముముక్షువులమగు మేము ముక్తిని పొందే సులభోపాయం సూచించండి.

యాజ్ఞవల్క్యుడు : ‘తత్త్వమ్’ (నీ సహజ స్వరూపము శాశ్వతము - నిత్యము అఖండము అగు ఆత్మయే)… అను పరమ సత్యము - ఆత్మతత్త్వజ్ఞుడు అగు సద్గురువు యొక్క శాస్త్రార్థపూర్వక (మరియు) స్వానుభావ పూర్వక ప్రవచనముచేతనే ముముక్షువుకు సుస్పష్టము కాగలదు.

అందుచేత అనుభవజ్ఞుడగు సద్గురువును ఆశ్రయించి ‘సోఽహమ్’ .. భావమును శాస్త్రవ్యాఖ్యాన సహితంగా సునిశ్చయము చేసుకోవాలి.

‘తత్ త్వమ్’ అనునది గురుబోధ. ‘సోఽహమ్’ అనునది తత్త్వదర్శనముచే శిష్యుడు సంపాదించుకోవలసినది!

అందుచేత,
యావచ్చ ఉపాధి పర్యంతమ్, తావత్ శుశ్రూషయేత్ గురుమ్’..!
ఈ భౌతిక ఉపాధి భావనశేషించి ఉన్నంతవరకు గురుబోధనములను, గురుబోధా విశ్లేషణములను, గురు శుశ్రూషను ముముక్షువు విడవనేకూడదు. దేహమున్నంత వరకు గురువును ఉపాశించాలి. గురువును ఎంతటి భక్తి - ప్రపత్తులతో సేవిస్తారో, గురుపత్నిని, గురుపుత్రుని అంతటి భక్తి - ప్రపత్తులతో ఉపాసించుచుండటము ముముక్షవుకు శుభప్రదము.


శుద్ధ మానసము

యోచనలు ఏవైనా, ఎట్టివైనా కూడా…, వాటి వాటి యొక్క ఉత్పత్తి స్థానము మాత్రము మనస్సే ! అనగా సర్వ ఆలోచనలకు మునుముందే ‘మనస్సు’ అనునది ఉండి ఉన్నది.

1) ఏ స్థానము ఆలోచనలు జనించటానికి ఉత్పత్తి స్థానమో,
2) దర్పణములో ప్రతిబింబించు దృశ్యములోని శుభాశుభములు ఏ తీరుగా దర్పణమునకు సంబంధించక - స్పృశించక ఉంటాయో, ఆ తీరుగా ఏ స్థానము ఆలోచనల శుభాశుభములతో స్పృశించబడకున్నదో… అదియే ‘శుద్ధమానసము’.

’కేవల మనస్సు’ ను గమనిస్తూ ఉండటమే శుద్ధమానసమార్గ దర్శనము. అదియే కైవల్యము కూడా!


శుద్ధ చిద్రూపము

చిత్ = ఎరుక.

ఏదైతే ఎరుగబడుచున్నదో అదంతాకూడా చిత్ ప్రదర్శించు కళా విశేషము చేతనే ఎరుగబడుచున్నది. అనగా… ఎరుగబడుచున్న సర్వమునకు మునుముందే ‘ఎరుక’ రూపముగా చిత్ కళ ప్రకాశమానమైయున్నది.

ఏ విధంగా అయితే సూర్యకిరణము ఒకానొక వస్తువుపై ప్రసరించుచున్నప్పటికీ, ఆ వస్తువు యొక్క దోషములు సూర్యకిరణమును స్పృశించవో (సూర్యకిరణమును ఆ దోషము అంటదో), ఆ విధంగా… తెలియబడుచున్న విషయముల శుభాశుభములు కేవలమగు ‘చిత్’ అనబడు తెలివికి అంటదు. (అది కేవల చిత్ అయి ఉన్నది కదా!).

ఏ ‘చిత్రూపము’ ఎరుగబడుచున్నదానికంతటికీ మునుముందే ఉన్నదో… అట్టి చిత్ను “శుద్ధ చిద్రూపము”… అని పిలుస్తారు.

అట్టి శుద్ధ మానసము (కేవల మనోరూపము) మరియు శుద్ధ చిద్రూపము (కేవల చిత్) చేతనే “నేను” సర్వదా ఆత్మస్వరూపుడనే - “సోఽహమస్మి” అను మహత్తరార్థము సుస్పష్టము అయి, సుప్రకటితము అగుచున్నది.

(1) గురువాక్యముల నిగూఢార్థము,
(2) గురు - ఆప్తవాక్యముల ఆత్మ సందర్శన సూచనలు,
(3) గురు ప్రవచన - విశ్లేషనముచే ఆత్మ జ్ఞానము లభించుచున్నది.

గురుప్రసాదిత జ్ఞానముచే విజ్ఞానము (Application of what is heard) రూపము దిద్దుకొని ప్రవృద్ధమగుచున్నది.

జ్ఞానము = ఆత్మ గురించి తెలుసుకోవటము.

విజ్ఞానము = ఆత్మభావనను అనునిత్యం చేసుకోవటము. “మమాత్మ ఏవ ఇదగ్ం సర్వమ్” - అను దృష్టి తెలుసుకొన్న జ్ఞానముతో కూడిన జగత్ సందర్శనము.

అప్పుడు హృదయమునందే సంస్థితుడైయున్న పరమాత్మ అనుభూతము కాజొచ్చుచున్నారు. ఇక ఆపై పరమశాంతి స్వభావసిద్ధమై లభించుచున్నది.

అట్టి పరమశాంతిపదము అధిరోహించినట్టి ఆత్మతత్త్వ జ్ఞాని పట్ల, మనో - బుద్ధుల క్రియలు, వాటి ప్రభావములు, చర్యలు మొదలైనవి పరమశూన్య రూపమై ఉంటున్నాయి.

🙏

పైఙ్గలుడు :  గురోత్తమా ! విషయముల వలన కలిగే ఆనందము - ఆత్మానందము, ఈ రెండూ ఒక్కతీరైనవేనా?

యాజ్ఞవల్క్యుడు :  ఎట్లా అవుతాయి? కాదు. ఆత్మానందము సమక్షంలో విషయానందము ‘సూర్యునిముందు దివిటీ’ వంటిది.

అమృతేన తృప్తస్య పయసా కిం ప్రయోజనం? ఏవం స్వాత్మానం జ్ఞాత్వా వేదైః కిం ప్రయోజనం భవతి?

ఒకాయన అమృతమును గ్రోలుచూ తృప్తి - ఆనందములను పొందుచుండగా, మనము ఆయన వద్దకు వెళ్ళి “అయ్యా ! మేము మీ కొరకై కొంచము పాలు తెచ్చాము, అస్సలు… ఇది చూడండి, ఎంత రుచియో అమృతమును వదలండి!” అని అంటామనుకో! అతడు మన మాటలు విని అమృతమును త్యజించి వేసి ”బాగు ! బాగు ! రండి !” అని పాలను కోరుకుంటాడా? లేదు కదా !

అట్లాగే ఎవ్వరైతే ‘స్వాత్మ’ (The nature of one’s own Absolute Self) యొక్క తత్త్వమేమిటో తెలిసి ఆస్వాదిస్తూ ఉంటాడో, అట్టివానికి వేదముల వలన క్రొత్తగా వచ్చే ప్రయోజనమేదీ కనిపించదు.

వాస్తవానికి వేదములు కూడా స్వాత్మజ్ఞానమే ఉద్దేశ్యిస్తున్నాయి. అతనికి స్వాత్మతత్త్వమును మించినదేదీ మరెక్కడా కనిపించదు. వేదములు అనుభవము కొరకై ఉన్నాయి. అనుభవము తరువాత వేదములు ఎందుకు? (వేదము = తెలుసుకోవటం - శబ్దార్థము).

అంతేకాదు. ఆత్మజ్ఞానామృత పరితృప్తునికి కర్మలు చేయటంవలన గాని, చేయకపోవటంచేత గాని క్రొత్తగా వచ్చేదీ ఉందడు. పోయేదీ కనిపించదు. అతని దృష్టిలో తనకు కర్తవ్య-అకర్త్యములేవీ ఉండవు. అతని దగ్గరకు వెళ్ళి మనము "అయ్యా మీరు ఈ నియమములు పాటించండి! ఈ ఈ విధి-నిషేధములు తప్పక మీరు ఆచరించాలి. ఆ పూజ మొదలైనవి ఇట్లా చేయకండి! అట్లా చేయకండి!”… మొదలైనవన్నీ చెప్పితే, అవన్నీ ఆతని దృష్టిలో - చిన్నపిల్లవాడు పెద్దలతో పలికే తెలిసీ తెలియని మాటలవలె అగుచున్నాయి.

ఒకవేళ “నాకు ఇవన్నీ కర్తవ్యాలు… అప్పటికిగాని నేను పరమాత్మను చేరలేను. మరి అది మాటలా?"… అని ఒకడు అనుకుంటూ ఉంటే అప్పుడు “ఈతడు ఇంకా తత్త్వవేత్త కాలేదు” అని అనక తప్పదు.

ఇంకా విను!

ఇహ - పర సుఖమ్

విదితవేద్యుడు అగు (తెలుసుకొనవలసినది తెలుసుకొన్నట్టి) తత్త్వవేత్త….,

దూరస్థోఽపి న దూరస్థోః భవతిః।
ఈ జగత్తుకు ఆతడు దూరంగా ఉన్నప్పటికీ, అప్పుడు కూడా ఈ జగత్తును ఆత్మస్వరూపంగా దర్శిస్తూ ఉంటాడు కాబట్టి - దేనికీ దూరస్థుడు కాదు. ఎక్కడ దేనికి ఎంత దూరంగా ఉన్నా కూడా ఆత్మసంస్థితత్వమును విడవడు.

పిండవర్జితః పిండద్ధోపి భవతిః।
దేహముతో ఉండి కూడా దేహమును త్యజించినవాడై ఉంటాడు. దేహమును ధరించి ఉండవచ్చు గాక! దేహముగా అవడు! దేహమును తాను ధరించు వస్త్రము (ఉత్తరీయము, పంచె) వలె భావించి ఉంటాడు. దేహమునకు వేరై ‘దేహి’గా ప్రకాశమానుడై ఉంటాడు.

ప్రత్యగాత్మా సర్వవ్యాపీ భవతిః।
జీవాత్మగా ప్రత్యగాత్మరూపమున ఉండి కూడా, త్రిమూర్తులతో సహా సర్వులకు సర్వాత్మకుడై ఉంటాడు. సర్వవ్యాపి అయి చెన్నొందుచున్నాడు. సర్వభూతములు తానై, సర్వసాక్షిగా వేరై సర్వసమత్వము ఆస్వాదిస్తూ ఉంటాడు.

కాబట్టి ఓ పైఙ్గల మహాశయా ! నీవు జీవాత్మగా ఉండి కూడా… పరమాత్మవై ప్రకాశించెదవు గాక !

నేనే సర్వము అయి ఉన్న పరబ్రహ్మమును! సర్వస్వరూపుడను! సర్వసాక్షిని!

హృదయం నిర్మలం కృత్వా చింతయిత్వాఽపి అనామయమ్… “అహమేవ పరమ్ సర్వమ్”… ఇతి పశ్యేత పరమ్ సుఖమ్ !
నీవు హృదయమును నీ సాధనల ద్వారా నిర్మలము చేసుకో! అట్లా నిర్మలము చేసుకుంటూ ఆద్యంతములు లేనట్టి పరమాత్మ గురించి చింతన చేస్తూనే ఉండు. ఇది సాధన విధి!

అయితే… మరొకవైపుగా సాధ్య స్థితిని భావనచేస్తూ కూడా ఉండు! “ఈ సర్వముగా ఏ పరతత్త్వము అయియే ఉన్నదో, అట్టి పర
స్వరూపమే నేను! ”… అను నిశ్చలదృష్టిని కలిగియే ఉండుము. “నేను బ్రహ్మమునే కాబట్టి ఈ సర్వము నేనే!”… అను దృష్టి సునిశ్చితము చేసుకొన్నప్పుడే “పరమ సుఖము” లభిస్తుంది. అట్టి అవగాహనా దారుఢ్యముచే ‘పరమ్ సుఖము’ లభించి తీరుతుందయ్యా!

జీవ బ్రహ్మైక్యము - అద్వైత సిద్ధి!

ఒక బిందెలో గల నీళ్ళలో ఒక గ్లాసులో గల నీళ్ళు పోసినప్పుడు ఏమౌతుంది? జలే జలం క్షిప్తం? మొత్తము ఒకే రూపముగల
నీళ్లు (జలము) అవుతుంది కదా! ఒక పెద్ద పాత్రలోని పాలలో మరొక చిన్న పాత్రలోని పాలు పోసినప్పుడో? క్షీరం క్షీరా! పాలు-పాలు కలసిపోయి ఏకమౌతాయి కదా! నెయ్యి (Ghee ఘృతమ్)లో నెయ్యి పోస్తేనో? మొత్తమంతా ఒకే నెయ్యి అగుచున్నది కదా!

అట్లాగే …,

తద్వత్ జీవాత్మ పరమాత్మనో అవివేషో భవేత్ |
జీవాత్మను పరమాత్మతో ఏకము చేసినప్పుడు ఇక జీవాత్మ - పరమాత్మల భేదమే ఉండదు. ‘ఏకము’ అయిపోయి, విడదీసి చూపటానికి వీలే ఉండకుండా పోతుంది. (దీనినే ‘అద్వైతసిద్ధి’ అని పిలుస్తున్నారు.)

ఎప్పుడైతే అజ్ఞానాంధకారముచే ఆవరించబడిన ఈ ‘దేహము’ అనే గృహమునందు ‘ఆత్మజ్ఞానము’ అనే దీపము వెలిగించబడి, బుద్ధి అఖండాకార రూపము అనే వెలుగును సంతరించుకుంటుందో, అప్పుడా ఆత్మతత్త్వ జ్ఞాన విద్వరేణ్యుని హృదయమందు - “బ్రహ్మతత్త్వానుభూతి”చే జనించిన జ్ఞానాగ్నిచే కర్మ బంధములన్నీ కూడా వాటికవే దహించి వేయబడతాయి.

ఏ విధంగా అయితే ఉదకము (జలము) ఉదకములో ప్రవేశించి ఏకోదకము అగుచున్నదో, ఆ విధంగా బ్రహ్మజ్ఞాని -

… అగు పరతత్త్వమునందు ప్రవేశించి… పరతత్త్వమే తానై ప్రకాశించుచున్నాడు.

నిరుపాధి సంస్థితము (That which is without any ‘Body’) అగు ఆత్మయందు ఆత్మరూపుడై వెలుగొందుచున్నాడు. వెలుగునందు వెలుగై, జలమునందు జలమై, పరమాత్మయందు పరమాత్మ అయి స్వయమాత్మానందుడగుచున్నాడు.

పైఙ్గలుడు :  మహనీయా! ఆత్మ సాక్షాత్కారము (స అక్షాత్ - కళ్ళతో ఎదురుగా సాక్షాత్కరించుకోవటం) పొందిన ముక్తుడు ఆత్మను (లేక) బ్రహ్మమును ఏమని దర్శిస్తాడు? అతనికి బ్రహ్మము ఏ రీతిగా కనబడుతోంది? దైవ విగ్రహంలాగానా! దైవరూపంగానా? గురురూపంగానా? ఇంకేదైనా ఆకారంగానా?

యాజ్ఞవల్క్యుడు :  ఆకాశము కళ్ళకు కనిపిస్తోందా? లేదు! ఎందుకని? అత్యంత సూక్ష్మం కాబట్టి. కళ్లు స్థూలమైనది మాత్రమే చూడగలుగుతుంది కదా ! వాయువు ఆకాశం కంటే కొంత స్థూలము అయినప్పటికీ, కళ్ళకు కనిపించదు. కానీ స్పర్శచే వాయు కదలికలు తెలియబడుచున్నాయి.

ఆకాశము కంటే ఎంతో ఎంతో సూక్ష్మతమమగు ఆత్మ భౌతికమైన కళ్ళకు కనిపించేదా ? కాదు. అట్టి ఆత్మను ‘జ్ఞానము’ అనే చక్షువుచే నిర్మల బుద్ధిగల జీవుడు మాత్రమే బుద్ధితో దర్శించగలడు!

బాహ్యమున, అంతరమున (బాహ్యాంతరములలో) సదా సర్వదా స్వయం జ్యోతి స్వరూపమై ప్రకాశించుచున్నట్లుగా ఉత్తమ బుద్ధితో గమించవలసిందే! అది - స్వానుభవైక ము మాత్రమే! ఒకరు మరొకరిని కూర్చోబెట్టి అందజేసేది కాదు!

‘ఆత్మజ్ఞానము’ అనే దీపపు కాంతిలో జ్ఞాని అంతరాత్మను జ్ఞానచక్షువులతో దర్శిస్తూ… ఆ అంతరాత్మయందే ఈ బాహ్యమంతా ఆత్మకు అభిన్నమై వెలుగొందుచున్నదిగా దర్శిస్తున్నాడు.

ఒక కుండలోని ఆకాశము… ఆ కుండ పగిలినప్పుడు ఏమగుచున్నది? ఏ చోటపగిలితే అక్కడే ఆ చోటనే విశ్వాకాశములో (మహాకాశములో) కలిసిపోతుంది కదా! అట్లాగే ఆత్మజ్ఞానముచే ఆత్మతత్త్వ స్వరూపుడై ఉంటున్న ఆత్మజ్ఞాని ఎక్కడెక్కడ ఏ ఏ రీతులుగా ఈ పాంచభౌతిక దేహమును భావనచే త్యజిస్తున్నాడో, అక్కడక్కడే, అప్పటికప్పుడే జీవాత్మను సర్వగతమగు పరమాత్మాకారము (పరమాకాశము)నందు లయింపజేసినవాడై ఉంటున్నాడు. అఖండాత్మానంద స్వరూపుడై మహాత్ముడు అగుచున్నాడు.

యథా సర్వగతం వ్యోమ తత్ర తత్ర లయం గతః ఘటాకాశమివ |
ఘటాకాశము (కుండలో ప్రదేశము) మహాకాశములో (అంతటా ఉన్న ప్రదేశములో) విలీనమైనట్లు జ్ఞాని సర్వేసర్వత్రా ఆత్మనే ధ్యానిస్తూ, ఆత్మయందు ఆత్మగా నిరాలంబ యోగ దర్శనము (ఆలంబనము లేని అప్రమేయాత్మ దర్శనము) నిర్వర్తిస్తూ, అఖండాత్మ స్వరూపుడై (దేహము ఉన్నప్పుడు - లేనప్పుడు కూడా) యథాతథంగా విరాజిల్లుచున్నాడు.

తనయొక్క జీవత్వమంతా పరమాత్మత్వముతో ఏకమై పరమాత్మగా మాత్రమే శేషించినవాడగుచున్నాడు.

ధ్యానముచే అప్పటివరకు “జీవాత్మ ధ్యాని“ అయి ఉన్న యోగి, ”పరమాత్మధ్యాని" అయి ధ్యాన-ధ్యేయ రహితమగు ‘ధ్యేయవస్తు ఆత్మ’ గా ప్రకాశించడమే ధ్యాన యోగము యొక్క ఉద్దేశ్యము, మార్గము, అంతిమాశయము (The ultimate objective) కూడా !

జీవాత్మ తన జీవాత్మత్వమును పరమాత్మత్వమునందు లయింపజేసి, పరమాత్మగా శేషించటమే జీవుడు శాంతి కొరకై పొందవలసిన స్థితి.

అట్టి ఆత్మధ్యాన ఫలమగు జీవాత్మ యొక్క పరమాత్మైక్యముతో (పరమాత్మతో మమేకముతో) మరింకేదీ (చక్రవర్తిత్వము, ఇంద్రత్వము మొదలగునవి) సాటిరాదు.

ఒకడు వెయ్యి సంవత్సముల కాలము ఒంటి పాదముతో నిలబడి తపస్సు చేయవచ్చునుగాక ! ‘జీవ బ్రహ్మైక్య యోగము’ యొక్క ఫలములో ’16’వ వంతు ఫలమునకు కూడా అర్హుడు కాజాలడు.

“ఈ జీవాత్మ పరమాత్మకు అభిన్నము”… అనుట సోఽహమ్ దృ ష్టి (లేక తత్త్వ దృష్టి)! ”నేను - ఎదురుగా గల ప్రతి ఒక్క జీవుడు - ఈ సర్వ జగత్తు - ఈఈ బ్రహ్మాండములు” … ఇదంతా కూడా ఏకమగు పరబ్రహ్మముగా అనుభవమగుటకై బుద్ధిని సంసిద్ధపరచునదే ‘యోగం’.

కనిపించేదంతా అదే అయి ఉండగా కన్నుమూతలెందుకు ? "నీవు అదే ! నేను అదే !” అనే అభ్యాసముచేత మాత్రమే అట్లా అఖండాత్మగా అనిపించగలదు. అట్టి ఆశయము లేకుండా ఎన్నివందల ఏళ్ళు ఎంత తపస్సు మొదలైనవి చేసి ఏమి ప్రయోజనం ?

అహమ్ (జీవాత్మ) గా నేను - త్వమ్ గా నీవు - ‘ఇదమ్’ గా జగత్తు బ్రహ్మమే ! అఖండాత్మయే. ఆత్మకు వేరుగా ఏదీ లేదు ।”… అను రూపముగల “సోహమ్’ తత్త్వమ్ - సర్వం ఖల్విదమ్ బ్రహ్మ"…. అనునదే జ్ఞానము (తెలియబడవలసినది). అదియే జ్ఞేయము (తెలియవచ్చునది).

అది అనుకుంటూ అనుకుంటూ ఉంటే ఏ జీవునికైనా సరే, తాను ఎక్కడ - ఏ స్థితిలో ఉన్నా కూడా, తప్పక అనిపించగలదు.

“నేను నీవు - ఇది అంతా పరబ్రహ్మమే” అని అనిపించటానకి దేహ మనో - బుద్ధులను ఏ రీతిగా కించిత్ నియమించి - అభ్యాసము చేయాలో, అది చేయకుండా వందల సంవత్సరాలు వేల వేల శాస్త్రములు చదివి, మాత్రము ప్రయోజనమేమిటి ?

“మేము శాస్త్రాలు కొంతకాలం చదివి ఆ తరువాత ‘సర్వము అదే’ అను అభ్యాసమును ప్రారంభిస్తాము”… అని అనుకోవటం వలన కూడా లాభమే లేదు. శాస్త్రములను పరిశీలించి శాస్త్రముల అంతము చేరటము ఎవరికీ సాధ్యం కాదు.

ఇదమ్ జ్ఞానమ్, ఇదమ్ జ్ఞేయమ్ తత్సర్వమ్ జ్ఞాతుమ్ ఇచ్ఛతి, అపి వర్ష సహస్రాయుః శాస్త్రాంతం న అధిగచ్ఛతి |

‘ఇదంతా పరబ్రహ్మమే’ అని అనిపించే వరకు ‘అనుకోవటము’ అనే ప్రయత్నమునకు నాంది పలుకకుండా (Without making a start to perceive the unity in the diversity…) “శాస్త్రములన్నీ చదివి ఆ తరువాత అసలు విషయానికి వద్దాములేఁ "… అని శాస్త్ర పఠనము ప్రారంభించి వెయ్యేళ్లు కొనసాగిస్తే మాత్రం ఫలితం దక్కుతుందా ! లేదు.

అసలీ జీవుని వర్తమాన దేహముతో గల ఆయుష్షు ఎంత ? పోనీ వంద సంవత్సరాలు ఈ దేహంతో బ్రతుకుతాడని నమ్మకమున్నదా ? లేదే ! ఈ దేహము - ఈ ఆయుష్షు అతి చంచలమని, ఎప్పుడేమౌతుందో ఏమీ తెలియదని… మనలో ప్రతి ఒక్కరి పట్ల ఎదురుగా కనిపిస్తున్న సత్యమే కదా!

మానవ జన్మ పరమాత్మత్వమునకు మహత్తరమైన అవకాశమని మహనీయ ఆప్తవచనము కదా !

శాస్త్రములా … అనేకం (అనేకాని చ శాస్త్రాని)
ఆయుష్షు చూస్తే … అల్పము (అల్పాయుః)
మరల ఇక్కడ … ఎన్నో విఘ్నాలు (విఘ్నకోటయః)
… ఇదీ పరిస్థితి!

ఈ పరిస్థితిలో "శాస్త్రములన్నీ చదివి, తెలుసుకొని ఇక అప్పుడు అఖండాత్మ భావనకు ఉపక్రమిస్తాను”… అనునది కుదిరేది ఎట్లా ? మరి ? అఖండాత్మ భావనను ప్రారంభించి “అహమ్ -త్వమ్ - ఇదమ్ జగత్… వీటన్నిటి యొక్క పూర్వాపరాలన్నీ అఖండాత్మ స్వరూపమే |”… అని మననము చేసుకుంటూ, ఆశయము సంసిద్ధము చేసుకొంటూ ఉండాలి. అద్దానిని సుస్థిరము సునిశ్చితము - నిత్యాభ్యాసము కొరకై తనకు ప్రియము - అనుకూలము అగు శాస్త్రములను (అభ్యాసము కొరకై) ఆశ్రయించాలి. లేక యజ్ఞ - యాగ - పూజ - ప్రాణాయమము - మొదలైన ఇత్యాదులను సాధన రూపముగా ఆశ్రయించాలి! తీర్ధ యాత్రలు ఆత్మాఽహమ్ ఆశయముతోనే ఆశ్రయించి పుణ్యక్షేత్రములు సందర్శించాలి. అంతేగాని, తీర్థయాత్రలు ఆయా ప్రదేశముల సందర్శనము కొరకా? కాకూడదు.

అట్లా కాకుండా…
“అఖండాత్మ భావనకు ఇప్పుడు సమయం కాదు. చాలా చాలా నిర్వర్తించి అప్పుడు ఆ సంగతి చూద్దాం” అని శాస్త్ర-చారిత్రక పఠనము, కర్మలు, తీర్థయాత్రలు ఆశ్రయించి, ఇప్పటికి సరిపెట్టుకోవాలని పరిమితమవటము సరికాదు.

శాస్త్రములు అనుభవమునకు దారితీయవు. తెలియజేయు వరకే వాటి పాత్ర. అనుభవము నుండి శాస్త్రములు వస్తున్నాయి. అనుభవము కొరకై శాస్త్రములు ఉపకరణములు అవుతాయి. కనుక శాస్త్రములను ’ఉపకరణము’ గాను, అనుభవమును ఆశయముగాను ఉద్దేశ్యించాలి సుమా !

విజ్ఞేయో అక్షర తన్మాత్రో, జీవితం చ అపి చంచలం। (యోగ వాసిష్ఠము).  ఈ ‘జీవితము - దేహము’ అనే అవకాశము ఎంతకాలమో, ఎప్పుడు చేజారుతుందో చెప్పలేని విషయం కాబట్టి, క్షరమును ఉపయోగించుకుని అతి త్వరగా అక్షరతత్త్వమును ఇప్పుడే, ఇక్కడే కాలం వృధా చేసుకోకుండా తెలుసుకోవాలి. తెలుసుకొని అనుభవముగా మరల్చుకోవాలి.

వర్తమాన మానవ దేహముతో ఈ జీవితమనేది ఎంతకాలము ఉండబోతోందో… ఏ మాత్రము తెలియని… కాలనియమితమైన అవకాశము (Life is an unknown time bound opportunity).

అందుచేత…,
విహాయ శాస్త్రజాలాని … శాస్త్రములను ఉపయోగించుకొనుచూ, మెట్లను ఎక్కు రీతిగా క్రమంగా శాస్త్రజాలములను ఆ ప్రక్కకు పెట్టి..,
యత్ సత్యమ్, తత్ ఉపాస్యతామ్ | ఏది పరమసత్యమై యున్నదో… అది ఇప్పుడే, ఇక్కడే ఉపాసనా వస్తువుగా స్వీకరించాలి.

సత్యము యొక్క ఉపాసన కొరకై శాస్త్రముల సహాయము తీసుకోవాలి. అంతేగాని శాస్త్రముల కొరకై శాస్త్రములు కాదు । శాస్త్రముల కొరకై సత్యము కూడా కాదు.

అట్లాగే …,
అనంతకర్మ శౌచం చ, జపో యజ్ఞః తదైవ చ…,
మడి-ఆచారములు-జపము-యజ్ఞము … మొదలైన కర్మలకు కూడా అంతూ-పొంతూ ఉండదు. అందుచేత సత్యము యొక్క ‘ఉపాసన’ కొరకై ఆయా కర్మలను ఉపకరణములు (Instruments, Process)గా ఆశ్రయించాలి. అంతేగాని ఆ ఆచారాది కర్మలు కర్మల కొరకై కాదు. ఆత్మతత్త్వ జ్ఞానము కొరకే ఉద్దేశ్యించబడినట్లు గమనించాలి.

ఆ విధంగానే తీర్థయాత్రలు కూడా! అఖండమగు (That which is not divisible as I, You, He, That, There, Here etc) పరతత్త్వ స్వరూపానుభవము యొక్క సునిశ్చితము, నిశ్చంచలము కొరకై తీర్థయాత్రలు. అంతేగాని తీర్థయాత్రలు తీర్థయాత్రల కొరకే కానే కాదు. ప్రదేశ బాహ్య సౌందర్యముల ఆస్వాదనకొరకు కాదు. పరోక్ష - ఉపాసనకు పరిమితమవటానికి కాదు.

తీర్థయాత్రా అభిగమనమ్ యావత్ తత్త్వమ్ న విందతి | కేవలము తీర్ధయాత్రలు చేస్తూ పోతున్నంత మాత్రం చేత యావత్ తత్త్వము అనుభవమవదు. మరి? “తత్త్వమ్ (నీవుగా ఉన్నది తత్ పరమాత్మయే)”… అను భావన యొక్క దారుఢ్యము చేతనే ‘తత్త్వము’ సిద్ధించుచున్నది.

నా శ్రోతలు - నా శిష్యులు - నా గురువులు - నా ఇష్టదైవము - విజ్ఞులు - అజ్ఞులు - మానవులు - జంతువులు - దేవతలు - దేహముల రాకపోకలు - ఈ దేహముతో చూస్తున్నది - రాబోయే దేహముతో చూడబోతున్నది … ఇదంతా కూడా అఖండమగు ఆత్మయే… అను సిద్ధిబుద్ధి (లేక) ఎరుకయే తత్త్వభావన |

‘తత్ త్వమ్’ అను తత్త్వ భావనచే ‘నేను అదియే’ అను ‘అహమ్ బ్రహ్మాఽస్మి’ భావన ఉదయించి, క్రమంగా సుదృఢము అగుచున్నది.

అహమ్ బ్రహ్మేతి నియతమ్ మోక్షహేతుః మహాత్మనామ్ |
  ‘నేను బ్రహ్మము’ అను ఆత్మభావనా మార్గముచే “సర్వదా సర్వముగా ఉన్నది అఖండాత్మ స్వరూపుడనగు నేనే ।"… అను మహాత్మత్వము సిద్ధిస్తోంది. జీవాత్మ కాస్తా ‘మహాత్ముడు’ అగుచున్నాడు. మహాత్మత్వము మోక్ష హేతువు అగుచున్నది.

🕉


పైఙ్గలుడు : హే మహనీయా ! లోకగురూ ! అస్మత్ సద్గురూ ! అస్మత్ హృదయాంధకార విమోచక ప్రజ్ఞాదీప స్వరూపా ! యాజ్ఞవల్క్య
మహాత్మా ! చివరిగా నాదొక ప్రశ్న! స్వతఃగానే సర్వదా ఆత్మ స్వరూపుడే అయి ఉన్న ఈ జీవునికి - బంధము ఎక్కడి నుంచి వస్తోంది? ఆ బంధము ఎట్లా తొలగుతుంది?

యాజ్ఞవల్క్యుడు :  నాయనా ! మరలా చెప్పుచున్నాను. విను.

బంధము

పరమాత్మయే స్వయముగా - జగత్ రూప ఊహాభావనను వినోదము కొరకై కల్పించుకొని, ప్రవేశించి, సంచారాలు చేస్తూ (స్వప్నములోని వాడు జాగ్రత్‌ను ఏమరచిన రీతిగా) తన ఆత్మత్వాన్ని మరచి అహంకార మమకారాలు ఆశ్రయిస్తున్నాడు.

ఊహలో కనిపించిన విశేషముల అనుభవములందు తన్మయుడయి, “ఇదియే నేను ! నేను ఇంతమాత్రమే |“… అనే సుదృఢ భావనతో అనేక ఉపాధులు పొందటము, కొనసాగించటము, వదలటము, మరల పొందటము జరుగుచుండగా… ”నేను పరిమితుడను | జీవుడను | మోక్షము ఎక్కడ? ఎప్పుడు?" ఈ రూపమైన వేదన పొందుచున్నాడు.

స్వస్వరూపమగు అఖండాత్మను ఏమరచటము చేత ‘బంధము’ వచ్చిపడటం జరుగుతోంది.

మోక్షము

తన యొక్క సహజము - నిత్య సత్యము అగు అఖండాత్మత్వము తిరిగి గ్రహిస్తూ పరిమిత జీవాత్మత్వమును - పాము కుబుసమును వలె - త్యజించుటయే మోక్షము.

అందుకు మార్గముగా రెండు ఉపాయాలు ఇక్కడ ఉదహరించుకుందాము.

‘అహమ్’ ఇత్యేవ బంధోయ, ‘నా అహమ్’ ఇత్యేవ మోక్షయే॥

బంధము - మమేతి (నాది - నేను)
మోక్షము - న మమేతి (నాది కాదు! పరమాత్మది!)

జీవాత్మ సంబంధమైనదేదైనా కూడా ‘నాది’ అనుకోవటం చేత జీవుడు ‘బద్ధుడు’ అగుచున్నాడు.
‘నాది కాదు’ (న మమేతి)చే విముక్తి పొందుచున్నాడు.
బంధ-మోక్షములు అనగా ఇంతమాత్రమే !

పైఙ్గలుడు :  దేనివలన ‘మమ’ అనే బంధము కలుగుతోంది ? దేని వలన ‘న మమ’ అనునది సిద్ధించగలదు ?

యాజ్ఞవల్క్యుడు :  

అంతా మనస్సేనయ్యా ! ( మనయేవ మనుష్యాణాం కారణమ్ బంధమోక్షయో! )

ఆత్మ నుండి మనస్సు బయల్వెడలుతోంది. మనస్సు నుండి ‘అన్య’ (వేరు) అనే దృశ్యభావము (Outward Experiencing) బయల్వెడలుతోంది.

దృశ్యభావములు ఆత్మను ఆవరించినట్లు అనిపిస్తూ, ఆత్మకు బంధము ఆపాదించుచున్నాయి.

భావముల కంటే ముందే (ఆలోచనలకు మునుముందే) మనస్సు ఉన్నది కదా ! ఆలోచన సహాయంతో ఆలోచనలకు ఆవల గల మనస్సును ఆశ్రయిస్తే ‘ఆలోచనారహిత మనస్సు’ (లేక) కేవల మనస్సు అనుభవమవగలదు. కేవల ఆలోచనారహిత విభాగమగు మనోరూపము ‘ఉన్మనీ’ అని అంటారు.

ఎప్పుడైతే మనస్సు ఉన్మనీని (ఉత్+మనీ= ఆలోచనలకు ఆవలగల ఆత్మభావనను) ఆశ్రయిస్తుందో…
ఇక అప్పటి నుండీ “ద్వైతము" (జీవాత్మ వేరు… పరమాత్మ వేరు… అను దృష్టి) ఏమాత్రమూ శేషించదు. మిగిలి ఉండదు.

మనసో హి ఉన్మనీభావే ద్వైతమ్ నైవ ఉపలభ్యతే !
యదాయాతి ఉన్మనీభావః తదా తత్ పరమమ్ పదమ్ !

మనస్సు (భావన) లయించినట్టి ‘ఉన్మనీభావము’ రూపుదిద్దుకోగానే ఇక పరమపదము తనకు తానే లభించగలదు.

ఈ మన సంత్సంగపూర్వక సంభాషణను ఉపసంహరించబోతూ, ఒక ముఖ్యమైన విషయమును గుర్తు చేస్తున్నాను.

‘ఉన్మనీభావన’ సిద్ధించిన తరువాత మనస్సు ఉంటుందా ?”… అను ప్రశ్నకు సమాధానము చెప్పుచున్నాను.

మనస్సు అప్పటికీ ఉంటుంది. అయితే…

యత్ర యత్ర మనోయాతి తత్ర తత్ర పరం పదమ్ |
తత్ర తత్ర పరం బ్రహ్మ | సర్వత్ర సమవత్ స్థితమ్ |

ఉన్మనీ స్థితిలో, అప్పటికీ శేషించియున్న మనస్సు - ఎక్కడెక్కడికి వెళ్ళి వ్రాలుతుందో అక్కడక్కడ పరబ్రహ్మమే ఆ మనస్సుకు (ఉన్మనీకి) అనుభవమౌతుంది. అదియే పరమపదము |

🕉


ఓ పైఙ్గలా !

మరొక ముఖ్యమైన విషయం కూడా నీ ముందు ఉంచున్నానయ్యా!

హన్యాత్ ముష్టిభిః ఆకాశమ్…, ఒకడు తనయొక్క పిడికిలిని ఉపయోగించి ఆకాశమును పొడిచి ముక్కలుగా చేయగలడేమో !
క్షుదార్తః ఖండయేత్ తుషమ్…, ఒకానొకడు ఎంతో ఆకలిగొని ఉంటే, అతనికి ‘భోజనము’ గురించి, కాయగూరల రుచి గురించి ఉపన్యాసము చెప్పి, అతని ఆకలి తీర్చవచ్చునేమో మరి ? (పై రెండు కుదిరేవికావు. ఒకవేళ సాధ్యపడవచ్చునేమో) !
కానీ…

నాఽహమ్ బ్రహ్మేతి జానాతి తస్య ముక్తిః న జాయతే !

“అయ్యా ! మీరు ఎన్నన్నా చెప్పండి ! నేను జీవుడిని మాత్రమే ! పరబ్రహ్మము మరెక్కడో ఉన్నది. నేను ఎప్పటికోగాని దానిని పొందలేను ! సిద్ధించుకోలేను! అంతే !” అని తలచి “అహమ్ బ్రహ్మఽస్మి” అను వేద - సద్గురు ప్రవచిత పరమసత్యరూప మహావాక్యము యొక్క అర్థమును స్వీకరించటానికి, “ఇప్పటికే నేను బ్రహ్మమును! వాస్తవానికి ఎప్పటికీ బ్రహ్మమునే" అను అర్థమును మొదలే ఒప్పుకోనివానికి … ముక్తి అనే ప్రసక్తియే ఉండదు. అది అంతే!

‘తత్త్వమ్’ (నీవు బ్రహ్మ అను భావన) ద్వారా ‘సోఽహమ్’ చేరటానికి తత్త్వ శాస్త్రమును ఆశ్రయించువానికి ముక్తి ఎల్లప్పుడూ స్వాభావసిద్ధమగుచున్నది.

ఫలశ్రుతి

ఎవ్వరు ఈ ‘పైఙ్గలోపనిషత్’ ప్రతిపాదించు అనునిత్య ‘జీవబ్రహ్మైక్య రూప’ పరమ సత్యమును ఆమూలాగ్రమూ అధ్యయనము చేస్తూ, పరమాత్మత్వమును హృదయస్థం చేసుకుంటూ ఉంటారో…,

“జీవుడు - ఈశ్వరుడు - పరబ్రహ్మము”ల అఖండ - ఏకాత్మ స్వరూపమును ఎవరు సేవించి, ఉపాసించి, ప్రవేశించి, తత్స్వరూపము
సంతరించుకుంటారో…,

అట్టి జీవబ్రహ్మైక్య సద్భావనాసిద్ధుడు అగు ఆ మహానుభావుడు ఏ పంక్తిలో ఉంటే,… ఆ పంక్తిలోని వారంతా మహానుభావుల భావాలు పొందగలరు.

ఏ యోగి అయితే ఈ జీవుని బ్రహ్మముగా దర్శించే అభ్యాసము ప్రారంభించి, నిరంతరము కొనసాగిస్తూ ఉంటాడో, అతనితో సత్సంగ యోగముచే - బ్రహ్మహత్యా దోషము, సురాపనదోషము, బంగారము దొంగలించిన దోషము, గురుతల్పగమన దోషములు ఇవన్నీ కూడా తొలగి ఆతడు పవిత్రత సంతరించుకోగలరు. పాతకులు కూడా పునీతలు కాగలరు. (దుర్జనో సజ్జనో భూయాత్| సజ్జనో శాంతిమాప్నుయాత్|).

నిత్యానిత్య వివేకులు, వేదవేదాంగవేత్తలు, ప్రజ్ఞచే ప్రకాశించే సూరులు… వీరంతా కూడా వెలుగులో వస్తువులు కనిపిస్తున్న తీరుగానూ, నిదురలేచి కనులు తెరచినవానికి పరిసరములు సుస్పష్టమగు విధంగాను విష్ణుతత్త్వమునే అంతటా దర్శిస్తున్నారు. విష్ణు సాన్నిధ్యమును పొంది, పరమమానంద భరితులగుచున్నారు.

అట్టి సర్వతత్త్వ స్వరూపమగు విష్ణు తత్త్వమునకు నమస్కరించుచున్నాము.

జీవ - బ్రహ్మముల ఏకత్వమును గుర్తు చేస్తున్న యాజ్ఞవల్క్య - పైంగల సంవాద రూప పైఙ్గలోపనిషత్ అనేక మంది ముముక్షువుల చెవులలో మార్మోగును గాక! ఆత్మతత్త్వము వారి హృదయములయందు వెల్లివిరియును గాక !

🙏 ఇతి పైఙ్గల (పైంగల) ఉపనిషత్ 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః