[[@YHRK]] [[@Spiritual]]

Paramahamsa Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


శుక్ల యజుర్వేదాంతర్గత

9     పరమహంసోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో॥ పరమహంసోపనిషత్ వేద్య అపార సుఖాకృతీ।
త్రైపాద శ్రీరామతత్త్వమ్ “స్వ-మాత్రమ్” ఇతి చిన్తయే ॥

పరమహంసోపనిషత్ విషయమును తెలుసుకొన్నవాడు అపారమైన ఆత్మ సుఖమును అంది పుచ్చుకొనుచున్నాడు. జాగ్రత్-స్వప్న-సుషుప్తి త్రిపాద సాక్షియగు రామతత్త్వము స్వమాత్రమ్ ఇతి॥ “శ్రీరామ తత్త్వము, శ్రీరామబ్రహ్మము నేనే అయి ఉన్నాను” అని చింతన చేస్తూ, అట్టి అనునిత్యానుభూతిని సిద్ధింపజేసుకుంటున్నాడు. ఆత్మారామో అహమేవ - నమో నమః॥


అథ యోగినం పరమహంసనం కోఽయం మార్నస్తేషం
కా స్థితిరితి నారదో భగవంతముపగత్యోవాచ .
1.) ఓం
అథ, “యోగినామ్ పరమహంసానామ్
కో మార్గః?
తేషామ్ కా స్థితిః?”
ఇతి నారదో భగవంతమ్
ఉపసమా ఇతి ఉవాచ।

“ఓం” కార తత్త్వ భగవానునికి నమస్కరిస్తూ ….
బ్రహ్మమానస పుత్రులు, దేవర్షి, లోక కళ్యాణమూర్తి అగు నారదులు శ్రీమాన్ భగవంతుడు, పితామహుడు, సృష్టికర్త, అశ్రితవత్సలుడు అగు బ్రహ్మదేవుల వారిని సమీపించి ఇట్లా అడిగారు.

తండ్రీ! లోక పూజ్యా! జగద్గురూ! యోగులయొక్క పరమహంసా మార్గము, విధానము ఏ తీరుగా ఉంటాయి? వారి స్థితి - సంప్రదాయములు ఎట్టివి?


తం భగవానాః .
యోఽయం పరమహంసమార్గో లోకే దుర్లభతరో
న తు బాహుల్యో యద్యేకో భవతి స ఏవ నిత్యపూతస్థః
స ఏవ వేదపురుష ఇతి విదుషో మన్యంతే మహాపురుషో
యచ్చిత్తం తత్సర్వదా మయ్యేవావతిష్టతే తస్మాదహం చ
తస్మిన్నేవావస్థీయతే .
అసౌ స్వపుత్రమిత్రకలత్రబన్వ్వాదీఞ్శిఖాయజ్ఞోపవీతే
స్వాధ్యాయం చ సర్వకర్మాణి సంన్యస్యాయం బ్రహ్మాండం చ
హిత్వా కౌపీనం దండమాచ్ఛాదనం చ స్వశరీరోపభోగార్థాయ చ
లోకస్యోపకారార్థాయ చ పరిగ్రహేత్తచ్చ న ముఖ్యోఽస్తి
కోఽయం ముఖ్య ఇతి చేదయం ముఖ్యః .. 1..
2.) తమ్ భగవాన్ ఆహ:
యో అయమ్ పరమహగ్ంస మార్గో
లోకే దుర్లభతరో।
న తు బాహుళ్యో! యత్ యత్ ఏకో భవతి।
స ఏవ నిత్య కూటస్థః
స ఏవ వేద పురుషః
ఇతి విదుషో మన్యంతే।
మహాపురుషో యత్ చిత్తమ్
తత్ సదా మయ్యేవ తిష్ఠతే।
తస్మాత్ అహం చ తస్మిన్ ఏవ
అవస్థీయతే॥
అసౌ స్వపుత్ర-మిత్ర-కళత్ర
బంధ్వాదీన్,
శిఖామ్, యజ్ఞోపవీతగ్ం
స్వాధ్యాయం చ,
సర్వ కర్మాణి సన్న్యస్య,
అయమ్ బ్రహ్మాండం చ హిత్వా,
కౌపీనమ్, దండమ్, ఆచ్ఛాదనం చ
స్వశరీర ఉపబోగార్థాయ
లోకస్యైవ ఉపకారార్థాయ చ
పరిగ్రహేత్|
తత్ చ న ముఖ్యోఽస్తి |
కోఽయమ్ ముఖ్య?
ఇతి చ యత్
అయమ్ ముఖ్యః ॥

భగవంతుడగు బ్రహ్మ దేవులవారు చెప్పనారంభించారు.

నాయనా! నీవు అడుగుచున్న పరమహంసల మార్గము లోకములో దుర్లభతరమైనదయ్యా! బాహుల్యము కాదు. పరమహంసా స్థానములో ఉండి ఉంటున్నవారు అతి కొద్దిమంది! ఎక్కడో ఒక్కొక్కరు! తదితర ఆశ్రమముల వలె అధికంగా ఉండరు.

పరమహంస - నిత్యకూటస్థుడై (మూల రూపుడై), నిత్యపవిత్రుడై, నిర్మలాత్మ స్వరూపుడై - సర్వము స్వస్వరూపంగా దర్శిస్తూ ఉంటారు.
వేదములు ఆతనిని “వేదపురుషుడు” అని అభివర్ణిస్తున్నాయి. విదితవేద్యుడు (తెలుసుకోవలసినది తెలుసుకొన్నవాడు) - అని విదుషులు (పండితులు) అతని గురించి చెప్పుకొస్తున్నారు. ఉద్దేశ్యిస్తున్నారు.
ఆతని చిత్తము సర్వదా-సర్వత్రా పరమపుషుడను, మహాపురుషడను, సర్వాంతర్యామిని అగు నాయందే సంలగ్నమై, ప్రతిష్ఠితమై ఉంటున్నది. ఆయన అంతా, అంతటా సర్వమునూ పరబ్రహ్మముగానే దర్శిస్తూ ఉంటారు.
అందుచే సృష్టికర్తనగు నేను ఆతనియందు పరిపూర్ణానుభవమూర్తిగా అవస్థితుడనై ఉంటాను. పరమహంస అగు అతనికి - పరబ్రహ్మ స్వరూపుడనగు నాకు భేదమే ఉండదు.
ఆతడు తనయొక్క లోక సంబంధమైన పుత్రులను, మిత్రులను, బంధువులను సత్-న్యాసముచే పరబ్రహ్మ రూపముగా స్వీకరిస్తూ, బాహ్య విశేషాలను సన్న్యసించి ఉంటాడు.

అంతేకాదు. శిఖ (పిలక), యజ్ఞోపవీతము, స్వాధ్యాయము, తదితర సర్వకర్మలను - సత్ వస్తువగు బ్రహ్మమునకు అభిన్న దృష్టితో - బ్రహ్మీ భావముతో దర్శిస్తూ ఉంటారు. బ్రహ్మాండమును సన్న్యసించినవాడై ఉంటారు. ఇంతెందుకు? “ఈ బ్రహ్మాండమునందు నాది అయినది లేదు. నాది కానిది లేదు”… అని సత్-న్యాసి అయి ఉంటారు.

ఈ శరీర ధారణ - రక్షణ కొరకు మాత్రమే కౌపీనము (వస్త్రము), దండము ధరించి, దేహము మొదలైన ఇక్కడ సర్వమును ఉపకరణ భావంతో చూస్తూ ఉంటారు.

పుత్ర-మిత్ర-కళత్రములనుగాని, శిఖ-యజ్ఞోపవీత - స్వాధ్యాయనములు గాని, దేహ ఆచ్ఛాదనములు-పరికరములు గాని… ఇవన్నీ కూడా ఏది పరిగ్రహించినా “ఇది లోక శుభము - సహజీవులకు సౌకర్యము - ఆనందము కలుగజేయును గాక!” అని మాత్రమే ఉద్దేశ్యముగా కలిగి ఉంటారు. తనకొరకై ఏదీ స్వీకరించరు. కలిగి ఉండరు. త్యజించరు.

ఓ నారదా! బాహ్యమగు సంబంధములు - వస్త్రధారణలు మొదలైనవి ప్రాముఖ్యమైన విశేషాలు కావయ్యా! ఆ పరమహంస విషయమై మనం చెప్పుకోబోవుచున్న ఆత్మజ్ఞానానంద విశేషాలే ముఖ్యమైనవిగా దృష్టిలో పెట్టుకొనెదవు గాక! ఒకడు బుద్ధిచే పరమహంస అవుతాడుగాని…. దేహముచే కాదు! దేహాది ఆయా అహంకారములచే కాదు! ఆశ్రమమును బట్టి కాదు!


న దండం న శిఖం న యజ్ఞోపవీతం న చాచ్ఛాదనం చరతి పరమహంసః .
న శితం న చోష్ణం న సుఖం న దుఃఖం న మానావమానే చ షడూర్మివర్జం
నిందాగర్వమత్సరదమ్మదర్పేచ్ఛాద్వేషసుఖదుఃఖకామకోధలోభమోహహర్షసు
ఉయాహంకారాదీంశ్చ హిత్వా స్వవపుః కుణపమివ దృష్యతే
యతస్తద్వపురపధ్వస్తం సంశయవిపరీతమిథ్యాజ్ఞానానాం యో హేతుస్తేన
నిత్యనివృత్తస్తన్నిత్యబోధస్తత్స్వయమేవావస్థితిస్తం
శంతమచలమద్వయానందవిజ్ఞానఘన ఏవాస్మి .
తదేవ మమ పరమ్ధామ తదేవ శిఖా చ తదేవోపవీత చ .
పరమాత్మాత్మనోరేకత్వజ్ఞానేన తయోర్భేద ఏవ విభగ్నః సా సధ్యా .. 2..
3.) న దండమ్, న కమండలుమ్,
న శిఖా, న యజ్ఞోపవీతమ్,
న చ ఆచ్ఛాదనమ్ చరతి పరమహగ్ంసో|
న శీతమ్, న చ ఉష్ణమ్, న సుఖమ్
న దుఃఖమ్, న మాన-అవమానే
ఇతి షడూర్మి వర్ణితో|
న శబ్దమ్, న స్పర్శమ్, న రూపమ్,
న రసమ్, న గంధమ్, న చ మనోఽపి
ఏవం నిందా గర్వ మత్సర దంభ దర్ప
ఇచ్ఛా ద్వేష సుఖ దుఃఖ
కామ క్రోధ లోభ మోహ హర్ష
అసూయ అహంకార - ఆదీంశ్చ హిత్వా…,
స్వవపుః కుణపమివ దృశ్యతే
యతః తద్వపుః అపధ్వస్తం!|
సగ్ంశయ మిథ్యా జ్ఞానానామ్ యో హేతుః,
తేన నిత్య నివృత్తః తత్ నిత్యబోధః,
తత్ స్వయమేవ అవస్థితిః|
తగ్ం శాంతమ్ అచలమ్ అద్వయానంద
చిద్ఘన ఏవ, అస్మిన్
తదేవ మమ పరమంధామ।
తదేవ శిఖా।
తదేవ ఉపవీతమ్ చ।
పరమాత్మా-ఆత్మనోః ఏకత్వ జ్ఞానేన
తయోః భేద ఏవ విభగ్నః
సా ‘సంధ్యా’ ॥

ఏదేది దేహము కొరకు, లోకము కొరకు ధారణ చేస్తూ ఉంటాడో, అవన్నీ మనస్సుతో త్యజించి, అతీతుడై ఉంటాడు. దండముగాని, కమండలముగాని, శిఖగాని, యజ్ఞోపవీతముగాని, వస్త్ర అచ్ఛేదనముగాని పరమహంసకు ముఖ్యం కాదు. ఒకవేళ ధరిస్తే అది లోక మర్యాద కొరకు మాత్రమే!
శీతలము - ఉష్ణము, సుఖము-దుఃఖము, మానము - అవమానము… ఈ షడూర్మిలు [“6” ఊర్మిలు (తరంగములు)] ఆ పరమహంస దృష్టిలో ఉండవు. సర్వము హంస (ఆత్మ)కు అభిన్నమై, తదితరమైనదంతా లీలా వినోదంగా అగుపిస్తాయి.

“శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాలు దేహసంబంధమైనవి. మనస్సు జగన్నాటకమునకు అంతర్గతమైనది. అవి నాకు సంబంధించినవి కావు”… అని దర్శిస్తూ ఉంటారు.

నింద-స్తుతి, మత్సరము, దంభము, దర్పము, ఇచ్ఛా-ద్వేషములు, సుఖ-దుఃఖములు, కామ-క్రోధ-మద-మాత్సర్యములు, హర్ష-శోకములు, అసూయాద్వేషములు అహంకారములు-ఇవన్నీ-ప్రక్కకు నెట్టి, వాటన్నిటికీ ఆవల జ్వాజ్వల్యమానంగా వెలుగుచున్న ఆత్మనే సర్వదా - సదా - సర్వత్రా దర్శిస్తూ ఉంటారు. “ఇవన్నీ పైపై మెరుగులు. అసలు వస్తువు ఆత్మవస్తువే”… అని ఆత్మకు అన్యమైనవన్నీ గమనిస్తూ ఉంటారు. “ఈ నాదిగా అనిపించే శరీరము వాస్తవానికి శవము వంటిదే! ఎందుకంటే ఇది నశించు వస్తువులలో ఒకానొకటి మాత్రమే! గాలి తాకిడికి నశించే ఈగ-దోమ దేహాల వంటిదే!” - అని దర్శిస్తూ ఉంటున్నారయ్యా!

మిథ్యా జ్ఞానము కారణంగానే నిందాస్తుతి, నేను - నీవు, అహంకారాలు మొదలైనవి నిజంగానే ఉన్నవైనట్లు కనబడతాయి. కానీ లేవు“ - అను అవగాహనతో ఉంటారు. మిధ్యా జ్ఞానము నుండి నిత్య నివృత్తుడై, నిత్య హంస బోధస్వరూపుడై, నేనే ఇవన్నీ గదా! - అని అస్వాదిస్తున్నారు. పరమ శాంత స్వరూపులై, ఆత్మ భావననుండి అచలులై, ద్వితీయమనునది ఏకించిత్
లేనివారై, ఆనంద చిద్ఘనులై ”నేను పరంధాముడను (I am that - placed in the Finest Zone of All Pervading SELF) " అని గ్రహించి ఉంటారు. తత్త్వమ్ - సోఽహమ్ భావుడై చరిస్తూ ఉంటారు. అదియే నాకు కూడా ’పరమధామము’ అయి ఉన్నది. ఆత్మయే నేను-నీవు-ఇదంతా కూడా … అను భావనయే ఆతనికి శిఖ, ఉపవీతము. జీవాత్మ-పరమాత్మల భేదమును నశింపజేసి దర్శించటమే ఆతని సంధ్యోపాసన!


సర్వాన్కామాన్పరిత్యజ్య అద్వైతే పరమస్థితిః .
జ్ఞానదండో ధృతో యేన ఏకదండో స ఉచ్యతే ..

కాష్ఠదండో ధృతో యేన సర్వాశి జ్ఞానవర్జితః .
స యాతి నరకాంధోరాన్మహారౌరవసంజ్ఞకాన్ ..

ఇదమంతరం జ్ఞాత్వా స పరమహంసః .. 3..
4.) సర్వాన్ కామాన్ పరిత్యజ్య
అద్వైతే పరమే స్థితిః,
జ్ఞానదండో ధృతో యేన "ఏకదండీ” స ఉచ్యతే!
కాష్టదండో ధృతో యేన
సర్వాశీ జ్ఞాన వర్జితః,
తితిక్షా జ్ఞాన వైరాగ్య శమాది
గుణవర్ణితః….
భిక్షామాత్రేణ యో జీవేత్, -
స పాపీ యతి వృత్తి హా॥
స యాతి నరకాత్ ఘోరాన్
మహారౌరవ సంజ్ఞికాన్।
ఇదమ్ అంతరమ్ జ్ఞాత్వా
స పరమహగ్ంసః॥

ఏ మహాశయుడైతే…,
- దృశ్య సంబంధమైన సర్వ కామములను పరిత్యజించినవాడై,
- పరతత్వమగు పరమేశ్వరుడే ఈ సకల రూపధారి వలె జగత్ దృష్టికి-కనిపిస్తున్నారని,
- ఈ అనేకంగా కనిపించేదంతా ‘ఏకమ్’ అయి ఉన్నదని, పరమమగు అద్వైతస్థితిని ఆశ్రయించి ఉంటాడో..,
- దృఢముగా బుద్ధితో అట్టి “జ్ఞాన దండము”ను చేత ధరించి ఉంటాడో… ఆతనిని ఏకదండో (ఏకదండుడు) అని అంటాము.

ఎవ్వడైతే…,
- కేవలము కొయ్యదండమును చేతిలో ధరించి, ఆత్మజ్ఞానవర్జితుడై, “సర్వము ఆత్మయొక్క సంప్రదర్శమే” అనే ఆత్మ దృష్టిని చేబూనకుండా, సర్వ ప్రాపంచికమైన ఏవో విషయాలను పొందాలి అనే ఆశలను కొనసాగిస్తూ ఉంటాడో..,
- తితిక్ష-జ్ఞాన-వైరాగ్య-శమ-దమ ఇత్యాది దైవీ-మహనీయ గుణ సంపత్తిని ఆశ్రయించక, కేవలము లోక సంబంధమైన సన్న్యాసాశ్రమ సంబంధమైన వస్త్ర ఇత్యాది ధారణను, వస్తు సంపద కొరకై భిక్షకత్వములతోను జీవిస్తూ ఉంటాడో..,
ఆతడు ఆత్మద్రోహి! ఆతడు పాపవృత్తుడు అగుచున్నాడు! నరక ద్వారములను తనకు తానే తెరిచి పెట్టుకుంటున్నాడు! అట్టివాడు చివరికి ’మహారౌరవము’ ఇత్యాది సంజ్ఞలచే చెప్పబడు నరకములను చేరుచున్నాడు.

ఈ విషయము, సుస్పష్టముగా తెలిసియుండి, ఇకప్పుడు యోగి (ముముక్షువు) - పరమహంస మార్గమునే ఆశ్రయించును గాక! పరాత్పరత్వము నుండి చ్యుతి పొందకుండును గాక! అట్టి అంతరము తెలిసినవాడే పరమహంస!


ఆశాంబరో న నమర్కారో న స్వధాకారో న నిందా న స్తుతిర్యాదృచ్ఛికో
భవేద్భిక్షుర్నాఽఽవాహనం న విసర్జనం న మంత్రం న ధ్యానం
నోపాసనం చ న లక్ష్యం నాకక్ష్యం న పృథగ్నాపృథగహం
న న త్వం న సర్వ చానికేతస్థితిరేవ భిక్షుః సౌవర్ణాదీనం
నైవ పరిగ్నహేన్న లోకం నావలోకం చాఽఽబాధకం క ఇతి
చేద్బాధకోఽస్త్యేవ యస్మాద్భిక్షుర్హిరణ్యం రసేన దృష్టం
చ స బ్రహ్మహా భవేత్ .
5.) ఆకాశాంబరో, న నమస్కారో
న స్వాహాకారో, న స్వధాకారో,
న నిందా స్తుతిః, యదృచ్ఛికో భవేత్ స భిక్షుః॥

న ఆవాహనమ్| న వివర్జనమ్|
న మంత్రమ్! న ధ్యానమ్। న ఉపాసనం చ
న లక్ష్యమ్, న అలక్ష్యమ్ |
న పృథక్, న అపృథక్ అహమ్।
న సత్వమ్, న సర్వమ్ చ
అనికేతః స్థిరమతిః ఏవమ్|
స భిక్షుః||

సౌవర్ణాదీనామ్ నైవ పరిగ్రహేత్,
న లోకనమ్ న అవలోకనం చ
న బాధకో, న చ అబాధకః| క ఇతి చేత్ బాధకో ఆస్త్యేవ,
యస్మాత్ భిక్షుః హిరణ్యగ్ం రసేన దృష్టమ్ చేత్,
స బ్రహ్మహా భవేత్| 
యస్మాత్ భిక్షుః హిరణ్యమ్
రసేన స్పృష్టమ్ చేత్ స పౌల్కసో భవేత్||

భిక్షకుడు -
దిగంబరుడు. దేహాదుల వస్త్రధారణను అధిగమించి తన యందు, సర్వులయందు ఆత్మనే దర్శించువాడు. నమస్కారము గాని, దేవతా సంబంధమైన స్వాహా కారము గాని, పితృదేవతా సంబంధమైన స్వధా కారముగాని, నిందా-స్థుతులు గాని లేనివాడై, ఏది ఎంతవరకు, ఎట్లా లభిస్తే అంతవరకు లీలా-క్రీడా-కల్పనా మాత్రమేనని స్వీకరించువాడు. ఆతడు దేనినీ ఆహ్వానించడు, విసర్జించడు. మంత్రము-ధ్యానము, ఉపాసనము, లక్ష్యము, అలక్ష్యము, భేదము, అభేదము, నేను-నీవు-అతడు, ఇక్కడి సమస్తము, ఇల్లు, వాకిలి… ఇవన్నీ ఉండీ…. వాస్తవానికి ఏవీ లేనివాడై ఉంటాడు.

స్థిరచిత్తుడై సర్వత్రా ఆత్మయొక్క అనన్య దర్శనంతో ఆనందంగా ఉంటారు. అతడే భిక్షువు. (భిక్షువు = చీకటిని క్షయింపజేసుకొన్నవాడు). ఆతడు - బంగారము, గృహాలు మొదలైన సంపద సంబంధమైన విషయములను పరిగ్రహించడు. ఆతనికి లోకములు లేవు, అవలోకనము లేదు. సర్వదా కేవల దృక్ అయి చెన్నొందుతాడు. ‘అవలోకనము’ను దాటివేసి ఉన్నవానికి లోకాలేమి ఉంటాయి?

ఆతనికి బాధకులు ఉండరు. అబాధకులు ఉండరు. బాధించువాడుగాను ఉండడు. బాధింపబడనివాడు అయి ఉండడు. బాధ ఉండదు. ఏ భిక్షకుడైతే ఇతరులను బాధిస్తాడో, బంగారమును, సంపదలను “ఇష్ట” దృష్టితో చూస్తాడో,… అతడు బ్రహ్మతత్త్వ మార్గమునుండి చ్యుతుడౌతాడు. ఇష్టంగా స్పృశిస్తే, ఆ భిక్షువు “పౌల్కసుడు”గా అయి, నూతిలో పడిన రాయివలె అల్ప జన్మలకు త్రోవ చేసుకొన్నవాడౌచున్నాడు.


యస్మాద్భిక్షుర్హిరణ్యం రసేన గ్రాహ్యం చ స ఆత్మహా భవేత్ .
తస్మాద్భిక్షుర్హిరణ్యం రసేన న దృష్టం చ న
స్పృష్టం చ న గ్రాహ్యం చ .
సర్వే కామా మనోగతా వ్యావర్తంతే .
దుఃఖే నోద్విగ్నః సుఖే న స్పృహా త్యాగో రాగే సర్వత్ర
శుభాశుభయోరనభిస్నేహో న ద్వేష్టి న మోదం చ .
సర్వేషామింద్రియాణాం గతిరుపరమతే య ఆత్మన్యేవావస్థీయతే
యత్పూర్ణానందైకబోధస్తదబ్రహ్మాహమస్మీతి
కృతకృత్యో భవతి కృతకృత్యో భవతి .. 4..

ఇతి శ్రీపరమహంసోపనిషత్సమాప్తా
6.) యస్మాత్ భిక్షుః హిరణ్యగ్ం రసేన గ్రాహ్యంచేత్,
స ఆత్మహా భవేత్||
తస్మాత్ భిక్షుః హిరణ్యగ్ం
రసేన న దృష్టం చ, న స్పృష్టం చ, న గ్రాహ్యం చ
సర్వే కామా మనోగతా
వ్యావర్తంతే। దుఃఖే చ న ఉద్విగ్నః
సుఖే నిస్స్పృహః| త్యాగే-రాగే సర్వత్ర
శుభాశుభయోః అనభిస్నేహెూః,
న ద్వేష్టి, న మోదతే చ॥
సర్వేషామ్ ఇంద్రియాణామ్ గతిః
ఉపరమో, య ఆత్మన్యేవ అవస్థీయతే,
తత్ పూర్ణానందైక బోధః, స “బ్రహ్మైవాహమ్ అస్మి"
ఇతి కృతకృత్యో భవతి
కృతకృత్యో భవతి।
ఇత్యుపనిష్యత్

ఓ నారదా! బిడ్డా! ఏ బిక్షువు గురించి మనము ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నామో, ఆతడు బంగారమును, సంపదలను మమకారంతో, ఆశతో ఎప్పుడైనా గ్రహిస్తూ ఉంటే అప్పుడు ఆతడు ఆత్మద్రోహి, కరణ (ఇంద్రియవిషయ) వివశుని క్రిందే లెక్క!

ఏ భిక్షువు బంగాన్ని రసదృష్టితో చూడడో, స్పృశించడో, గ్రహించడో, మనోగతమైన సర్వకోరికలను బయటకు త్రోలివేసి ఉంటాడో… దుఃఖ సంఘటనలచే ఉద్నిగ్నత పొందడో, సుఖ సంఘటనలకు పొంగిపోడో, త్యాగి-వదిలినవాడై ఉంటాడో, ఇక్కడి త్యాగ - రాగ - శుభ - అశుభములపట్ల ఎట్టి అనుబంధ భావము-బంధము కలిగి ఉండడో…,
దేనినీ ద్వేషించడో, దేనికీ సంతోషించడో….,
సమస్త ఇంద్రియముల యొక్క గతులను మనస్సునందు ఉపశమింపజేసి (Having Withdrawn) ఉంటాడో…,
భిక్షకుడు పూర్ణానంద స్వస్వరూప బోధస్వరూపుడు అగుచున్నాడు!
తాను “బ్రహ్మవేత్త మాత్రమే” కాకుండా, “బ్రహ్మమే” తానై ప్రకాశించుచున్నాడు!
ఏది పొందాలో, అది పొందినవా….. కృతకృత్యుడు అగుచున్నాడు!

ఇతి పరమహంసోపనిషత్
ఓం శాంతిః శాంతిః శాంతిః


శుక్ల యజుర్వేదాంతర్గత

9     పరమహంస ఉపనిషత్

అధ్యయన పుష్పము

పూర్ణమదః పూర్ణమిదమ్ పూర్ణాత్ పూర్ణమ్, ఉదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే
ఓం శాంతిః శాంతిః శాంతిః

ఒక రోజు…
బ్రహ్మ మానసపుత్రుడు, దేవర్షి, నారదభక్తి సూత్రముల ప్రవక్త, త్రిలోక సంచారి, లోకములపై అవ్యాజమైన ప్రేమ కురిపించువారు, అనుక్షణ ‘నారాయణ’ శబ్దోపాసకులు, లోక కళ్యాణమూర్తి అగు శ్రీ నారద మహర్షి త్రిలోక సంచారాలు చేస్తూ బ్రహ్మలోకము వెళ్ళారు.

పిత్రుదేవులు, సర్వలోక స్రష్ట, ప్రజాపతి, భక్తవత్సలుడు, సృష్టిరచనా మహాప్రాజ్ఞా దురంధరులు, సకల జన శ్రేయోభిలాషి, లోకపితామహులు అగు బ్రహ్మదేవుని దర్శించుకున్నారు. తండ్రి పాదాలకు స-అష్టాంగ దండ ప్రణామములు సమర్పించారు. వారిరువురు లోకక్షేమము గురించి, తాత్త్వికవిశేషాల గురించి అనేక విషయాలు సంభాషించుకోసాగారు.

బ్రహ్మదేవులవారు :  బిడ్డా! నారదా! చెప్పు! ఇంకా ఏమైనా అడగదలచుకున్నావా?

శ్రీనారదమహర్షి : అవును తండ్రీ ! యోగినామ్ పరమ హంసానామ్ కోమార్గః? తేషామ్ కా స్థితిః? యోగమార్గ విశేషాలు మీరు ఇప్పటిదాకా శెలవిచ్చారు. అయితే యోగులలో మహామహనీయులగు పరమహంసలు ఉంటారు కదా! వారు ఏ తీరుగా, ఏ మార్గము ఆశ్రయించినవారై ఉంటారు? వారి యొక్క స్థితి - సంప్రదాయాలు, దర్శన - అవగాహనలు, మార్గాణ్వేషణలు, మార్గదర్శకత్వం ఎట్టివి? దయతో వివరించండి.

ప్రజాపతి - బ్రహ్మదేవులవారు : ప్రియకుమారా! నారదా! పరమహంసల ఆత్మానుభూతి అనిర్వచనీయము! వాక్ అతీతమ్! ‘ఇట్టిది’ అని నిర్ణయించి, నిర్వచించి చెప్పటం ఎవరివల్లా సాధ్యమయ్యే విషయం కాదు. వారిది వాక్కుకు - మనస్సుకు కూడా అందని స్థానము. అందుచేత వారి గురించి నీవు అడిగే విషయాలు చెప్పటం దుర్లభతరము. అనేకమంది యోగులలో ఆ స్థానము అధిరోహించువారు ఎక్కడో ఒక్కొక్కరు. బాహుళ్యో ఏకో భవతి! అయినా కూడా ఈ జీవుని మహదాశయము అదియే కాబట్టి, మహనీయులగు పరమహంసలకు నమస్కరిస్తూ, వారి విషయమై కొన్ని విశేషాలు ఇప్పుడు మనము చెప్పుకుందాము. శ్రద్ధగా వినిదెవుగాక!

సయేవ నిత్య కూటస్థః :  పరమహంస - నిత్య కూటస్థుడు. అనగా మూల రూపుడు. సర్వముయొక్క అంతరాంతమున సర్వమునకు ఆధారమై ఉన్నవాడు. ప్రకృతికి మూలము.

హంస సరోవర జలంలో ప్రశాంతంగా, ఆనందంగా సంచారాలు చేస్తుంది. అంతేగాని, ఏ పరిస్థితిలోను సరోవర జలంలో మునిగిపోదు కదా ! అట్లాగే పరమహంసలు సంసారంలో క్రీడావినోదంగా ఆత్మానందమును కించిత్ కూడా వీడక, విహరిస్తున్నారు. సంసార జలంలో ఏ మాత్రము మునిగిపోరు. నిత్య నిర్మల స్వరూపులై ఉంటారు. వారికి ఈ సంసారము యొక్క ఈ దృశ్యము యొక్క వాస్తవ - అవాస్తవ, సహజ - సందర్భ రూపమేమో తెలుసు.

అందుచేత విజ్ఞులు వారి గురించి చెప్పేటప్పుడు ‘వేద పురుషుడు’ అని అభివర్ణిస్తూ ఉంటారు. వేదములు ఎవరి గురించి చెప్పుచున్నాయో, వారే వేద పురుషులు. తెలియబడేదంతా ‘తామే’ అయి, తమయందు తామే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వేదపురుషులు. సర్వజీవుల అంతర్యామిత్వము ధరించి ప్రకాశిస్తూ ఉంటారు. కాబట్టి ’మహాపురుషులు’ కూడా! వారి చిత్తము ఎల్లప్పుడు పరబ్రహ్మస్వరూపమును ఆస్వాదిస్తూ, నా యందే సుప్రతిష్ఠితమై ఉంటోంది. నేను వారియందు స్వభావంగా అవస్థితుడనై, పరమ ప్రకాశశీలుడునై ఉంటున్నాను.

వారు సర్వస్థితి - గతులయందు, సర్వదా….,
- నన్నే అందరియందును,
- అందరిని నాయందును,
- నాయందు తనను,
- తనయందు నన్ను
సందర్శిస్తూ ఆత్మానందభరితులై ఉంటున్నారు. నాచే కల్పితమైన ఈ 14 లోకాలలో క్రీడా వినోదంగా సంచారాలు చేస్తూ ఉంటారు.

హంసవలె విహరిస్తూ సర్వము స్వస్వరూపముగా ఆస్వాదిస్తున్నారు. త్రిమూర్తులమగు మేము ఆ పరమహంసకు - స్వస్వరూపులమై, స్వ-అభిన్నులమై, వారి సహజానంద స్వరూపులమై ఉంటున్నాము. వారు తారసబడితే మేమే వారికి నమస్కరిస్తున్నాం.

శ్రీ నారదమహర్షి :  పిత్రుదేవా ! అట్టి పరమ హంసలు చతుర్విధ ఆశ్రమములు అధిగమించిన వారు కదా ! మరైతే, వారికి పుత్ర - మిత్ర - కళత్రాది లోకరీతి అయినటువంటి సంబంధ - అనుబంధ - బాంధవ్యములు ఉండవా ? ఉంటాయా ? సన్న్యాసాశ్రమవాసులవలె కౌపీనము, దండము, ఆయా భౌతిక విశేషాలు… ఇవన్నీ కలిగి ఉంటారా ? వేదాధ్యయనులవలె శిఖ - యజ్ఞోపవీతము - స్వాధ్యాయనము ధారణ చేస్తూ - నిర్వర్తిస్తూ ఉంటారా? ఈ లోకములను, లోక విషయములను వారు ఏ దృష్టితో చూస్తూ ఉంటారు? వారికి అసలు ఈ భౌతిక శరీరము, ఇంద్రియ దృశ్యము మొ॥వి అందరిలాగానే - ఉంటాయా? భావనయందు ఉండవా?

శ్రీ ప్రజాపతి :  వారు పుత్ర - మిత్ర - కళత్ర… ఇత్యాదులన్నీ ’మమాత్మస్వరూపం’గా దర్శిస్తూ, బాహ్య నామ - రూపాలు, సంబంధ - బాంధవ్యాలు బాహ్యముననే త్యజించినవారై ఉంటారు. అతీత దృష్టితో ఆత్మ స్వరూపంగా సందర్శిస్తున్నప్పుడు…, ఇక నీవు చెప్పే సంబంధాలు బంధాలు ఏముంటాయి ? పరమహంసత్వము బుద్ధి సంబంధమైనది. అంతేకానీ.. భౌతిక సంబంధమైనది, చతుర్విధ ఆశ్రమ సంబంధమైనది కూడా కాదు! వారు లౌకికంగా చూస్తే - తదితరులవలె సందర్భానుచితంగానే ఉంటారు. వారి అంతర్ దృష్టికి మాత్రం - సంబంధ - బాంధవ్యములన్నీ ఆత్మకు అభిన్నమై ఉంటాయి.

అంతేకాదు. వారు బాహ్య నియమాలు-ఆచారాలు అధిగమించినవారై ఉంటారు. తమ కొరకై తాము ఏదీ కలిగి ఉండరు. శిఖ యజ్ఞోపవీతము-సాధ్యాయము ఇట్టి ఆయా లక్షణాలతో వారు సంబంధితులు కారు. అసలు వారికి బ్రహ్మము తప్పించి బ్రహ్మాండమే లేదు.

ఒకవేళ లోకాచారాలను అనుసరించి కౌపీనము, దండము, వస్త్రములు మొదలైనవి ధరించవలసి వస్తే… ‘ఇవన్నీ ఈ శరీరరమునకు సంబంధిచినవి మాత్రమే! నాకు వీటితో సంబంధమే లేదు!’… అను భావన, అవగాహన కలిగి ఉంటారు.

ఏది ఎప్పుడు ఎక్కడ స్వీకరించవలసి వచ్చినా (లేక) విడువవలసివచ్చినా కూడా…,
“ఇదంతా తదితర జీవుల సానుకూల్యత కొరకు మాత్రమే అగును గాక ! ఏది నిర్వర్తించవలసి వచ్చినా కూడా, అది లోక సానుకూల్యము, లోకోపకారార్ధము అయి ఉండుగాక ! నాకు దేనితోనూ మొదలే సంబంధములేదు. కాబట్టి నాకొరకై పట్టుకోవలసిన పనీ లేదు. వదల వలసినదీ లేదు. ఏది ఎట్లు లోకసానుకూల్యమో, అది అట్లే ఉండునుగాక !”

పరోపకారార్థమ్ ఇదమ్ శరీరమ్ !
లోకస్యైవ ఉపకారార్థాయ చ పరిగ్రహేత్!
- అను సుస్థిర భావన కలిగి ఉంటారు.

(నానవాప్తమ వాప్తవ్యమ్, వర్తయేవచ కర్మణి అని శ్రీ కృష్ణ పరమాత్మ - గీతావాక్యం ప్రవచించిన తీరుగా …)
వారు - పుత్ర - మిత్ర - భార్య మొదలైనవి స్వీకరించినా, వదల వలసి వచ్చినా, అవన్నీ జగన్నాటక సందర్భములుగా చూస్తూ ఉంటారు. శిఖ - యజ్ఞోపవీత - స్వాధ్యాయనములు (వేదము వల్లించటం, స్తోత్రములు చేయుట మొదలైనవి) నిర్వర్తించటం… ఇవన్నీ కూడా లోకశుభము, సహజీవులకు సౌకర్యము, తదితరుల ప్రయోజనములు… ఇవి మాత్రమే దృష్టిలో పెట్టుకొని జగన్నాటక అంతర్విభాగ చమత్కారములుగా ఆ పరమ హంసలు దర్శిస్తూ ఉంటారు. నేను కల్పించుచున్న 14 లోకములలో పొందవలసినది, వదలవలసినదీ - తమ కొరకై - ఏదీ ఉండదు.

ప్రియపుత్రా! నారదా! ఇక్కడ మరొక్క ముఖ్య విషయం!

నీవు అడుగుతూ వస్తున్న :

ఇవన్నీ పెద్ద ముఖ్యమైన విషయాలు కావయ్యా! న ముఖ్యోప్తి! మరి? ఏది ముఖ్యము? కోఽయమ్ ముఖ్యః?

"నేను అనగా ఎవ్వరు? ఈ దేహమునా? జీవుడనా? నాతో సహా, సర్వ బ్రహ్మాండాలు ఎందులో మాయగా కల్పించబడి, స్థితించి లయింపబడుచున్నాయో… అట్టి అనునిత్య సత్యమగు బ్రహ్మము అనగా ఏమి?” అను ప్రశ్నలకు సరిఅయిన సమాధానము సంపాదించుకోవాలి.

అట్టి తత్త్వార్థ జ్ఞానమును పొంది, పరమ పవిత్రమగు ఆత్మదృష్టిని అనునిత్యం చేసుకోవటం ముఖ్యము. కనుక “బాహ్య ఆచారాలు విశేషాలు పరమహంసపట్ల ఉంటాయా? ఉండవా?"… అను ప్రశ్నయే పెద్దగా విశ్లేషించవలసిన పనిలేదు-అని గమనించు. వారి తదితర, అవగాహనల గురించి విను.

‘హంసో’ భావన (లేక) సోఽహమ్ : దేహత్వము నుండి ఆత్మత్వము చేరుచున్న పరమ యోగి (లేక) పరమహంసకు తాను ఆశ్రయించుచున్న హంసత్వమే (ఆత్మత్వమే) సర్వదా వెంటనంటి ఉంటుంది. మిగతావి చిన్న విషయాలు. అతనికి కమండలువు, శిఖ, యజ్ఞోపవీతము వస్త్రములు … వీటన్నిటితో పనియే లేదు… అవి ఉన్నా - లేకున్నా, అతని దృష్టిలో అవి విషయములే కావు. అట్లాగే శీత - ఉష్ణాలు, మొదలైన షడూర్మిలు… జలతరంగ ప్రాయాలు. జలములో తరంగాలుగా కనిపించేవన్నీ జలమే కదా ! షడూర్మిలు అయినట్టి ఇక్కడి ద్వంద్వాలన్నీ బ్రహ్మమునకు వేరుగా లేవు. ఉండజాలవు.

(NOTE: షడూర్మిలు = శీతలము-ఉష్ణము, సుఖము-దుఃఖము, మానము - అవమానము).

ఇక్కడి శబ్ద - స్పర్శ - రూప - రస గంధ విషయాలన్నీ దేహమునకు సంబంధించినవి. దేహముతో బాటు ఉండి, దేహముతో పోయేవి. దేహి స్వరూపుడగు ఆత్మతత్త్వానికి ఇవన్నీ ఉండటము వలన (లేక) లేకపోవటం వలన ఏ మార్పు - చేర్పులు లేవు. దేహము ఉన్నప్పుడు ’నేను’ ఉంటాను. దేహము లేనప్పుడూ నేను యథాతథ స్వరూపుడనే! శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాలు, వాటి వాటి విషయాలు నాకు సంబంధించినవి కావు. నేను వాటికి సంబంధించినవాడను కాను. (గాఢ నిద్రలో అవి నా అనుభవంలో లేవు. కాని నేను ఉన్నాను)….. అను సందర్శనము కలిగి ఉంటారు.

మనస్సు : న చ మనోఽపి : “శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాలు భావనామాత్రములే ! అట్లాగే మనస్సు కూడా ! భావనకంటే ముందుగానే ఉండేవాడను. భావికుడను (భావము తనదైనవాడు). మనస్సు లేనప్పుడు హంస (సోఽహమ్) స్వరూపమగు ‘భావికుడు’ (ఆత్మ) ఉన్నవాడు. కనుక మనస్సు నాకు సంబంధించినది కాదు. నేను మనస్సుకు సంబంధించినవాడను కాదు. ఎందుకంటే మనస్సుతో ప్రారంభము కాను. మనోలయముచే అంతమవను. మనస్సు నా నుండే నా ఆలోచన - అనుభూతి - భావనా కల్పితమై బయల్వెడలుచు, మరల నా యందే లయిస్తోంది. సర్వదా శేషించి ఉండి నేను మనోరహితుడను-అని ఎరిగి ఉంటున్నారు.

“హంస జలములో సంచరిస్తూ ఉన్నప్పటికీ జలములో మునుగని విధంగా, ”హంస (ఆత్మ) స్వరూపుడనగు నేను“ ఆలోచనలలో మునిగిపోవువాడను కాను”. ఈ విధంగా పరమహంస యొక్క ”స్వయమాత్మా భావన" శబ్ద - స్పర్శ - రూప - రస - గంధ తన్మాత్రలను అధిగమించినదై ఉంటోంది.

ఆతడు అంతరంగ చతుష్టయమునకు కూడా జనన స్థానము తానే అయి ఉంటున్నాడు. సర్వమునకు అతీతత్వము - సాక్షిత్వము - అనన్యత్వము ఒక్కసారే వహిస్తూ ఆస్వాదిస్తున్నాడు.

ఓ నారదా! ఈ జీవునికి అసలు సంసార బంధము ఎటువైపు నుండి వచ్చిపడుతోంది? ఇది ఇక్కడ పరిశీలిద్దాం.

నింద :  ఇతరుల తప్పులను మననం చేయటం, మమకార-అహంకార దృష్టులతో కొందరిని నిందించటం, మరి కొందరిని స్తుతించటం.
గర్వము : “కొందరి కంటే ఈ ఈ సంపద, తెలివి, పాండిత్యము, జనాదరణ, సామర్ధ్యములదృష్ట్యా - అధికుడను కదా !” అనే గర్వము. ఇతరులపట్ల అల్పదృష్టితో కూడిన నిరాదరణ.
మత్సరము : ”బలవంతుడను. నాకేమి?” అని పలువురితో పోట్లాడే స్వభావం. బాధించటం, ధిక్కారంగా మాట్లాడటం. ఇతరులను బాధించే ప్రవృత్తి - వ్రర్తన కలిగి ఉండటం.
దంభము : తాను గొప్పవాడిననే ప్రదర్శనము. “నన్నే అందరూ గౌరవించాలి. నేను ఎవ్వరినీ గౌరవించఖర్లేదు” అని అనుకోవటం.
దర్పము : ఇతరులపై అధికారము పొగరు ప్రదర్శించటం. నా మాటే అందరు వినాలి. ఇతరుల మాటలు నేనెందుకు వినాలి? అని భావించు స్వభావము.
ఇచ్ఛా - ద్వేషములు : కొందరంటే ఇష్టం. మరికొందరంటే ద్వేషము.
సుఖ-దుఃఖములు : “ఇట్లా అయితే నాకు సుఖము. కాకపోతే దుఃఖము”… అను నిర్వచన పరంపరలు మనస్సులో పేర్చుకొని ఉండటం.
కామము : ఇంకేదో, ఏదేదో కావాలనే ‘తపన’.
క్రోధము : కోపము - పగ - ఆవేశము చూపటం
లోభము : తాను తినడు. ఇతరులకు పెట్టడు. దాచి దాచి మమకారము అధికం చేసుకోవటం.
మోహము : “ఏది నిత్యము? ఏది సత్యము ?" - అనునవి పరిశీలనాత్మక దృష్టితో చూచుటకు సంసిద్ధుడు కాకపోవటం. నామరూపాత్మకమైన భ్రమలు కొనసాగించటము. ఉత్తరోత్తర గతులు గమనించకపోవటం.
హర్షము - విషాదము : సందర్భములకు, సంఘటనలకు, సంబంధ - బాంధవ్యములకు పెద్దపీట వేసి…. క్షణక్షణం సంతోష - దుఃఖాలు పొందటం.
అసూయ : ఇతరుల సానుకూల్యతలను ఓర్చుకోలేక పోవటం. ప్రాతికూల్యతలను కోరుకోవటం.
అహంకారము : ’నేను నావి’ అని అహంకరించటం.

వీటిని తెలిసీ - తెలియకుండా ఆశ్రయించి అనేక బంధములను, దుఃఖ పరంపరలను, జన్మ - కర్మ గతులను ఈ జీవులలో అనేకులు కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇక పరమహంసా మార్గాణ్వేషకులగు యోగుల విషయమంటావా?

ఓ నారదా ! యోగి సర్వముపట్ల అభ్యసించు ఆత్మీయ భావనచే…. పరాకాష్ఠగా పరమహంస అయి, స్వయముగా సర్వాత్మ స్వరూపుడై వెలుగొందుచున్నాడయ్యా!

తత్ స్వయమేవ అవస్థితగ్ం-శాంతమ్ అచలమ్ ఆనంద చిదన ఏవ :
- సర్వము తానై, సర్వమునకు సాక్షియై, మౌన అస్వాదన చేయుచున్నారు.
- పరమ శాంత స్వరూపుడై, శాంత్యతీత అంతర్-హృదయుడై ఉంటున్నారు.
- “అహమాత్మా - ఆత్మయేనేను - నేనే ఇదంతా” అను భావము నుండి చలించనివాడై “ఈ విశ్వము - ఇందలి సర్వ దేహములు - స్పందనలు - ఆకార, విరాకారములు నేనే”.. అనే అద్వైత భావనా సమన్వితులై ఉంటున్నారు.
- కేవలానందచిదనుడు (A Solid manifestation fo Happy Awareness) అయి “ఇక్కడి ప్రతి ఒక్కరి రూపము నేనే! వీరంతా నా ఆత్మ రూపులే”… అను సుస్థిరానుభూతిచే వెలుగొందుచున్నారు.

అస్మిన్ తదేవ మమ పరంధామః -  “ఆ పరమాత్మ స్వరూపమే నా నివాసగృహము. పరమధామము” అని ఎరిగినవాడై ఉంటున్నారు.
అతడు సర్వమునకు పరమధాముడు అగుచున్నారు! మాకు కూడా వారు పరమధామము!

ఆత్మధ్యానయోగి యొక్క శిఖ, ఉపవీతము, సంధ్య ఏమేమిటై ఉన్నాయి?

ఆత్మ భావనయే అతనికి శిఖ. భౌతికమైన శిఖ - శిఖ కాదు.

ఆత్మావగాహనయే అతని ఉపవీతము. భౌతికమైన ఉపవీతము.. ఉపవీతము కాదు.

పరమాత్మా - ఆత్మనో ఏకత్వ జ్ఞానేన తయోః భేద ఏవ విభగ్నః - సా సంధ్యా!
→ జీవాత్మ - పరమాత్మ ఒక్కటే!
→ జీవుడుగా కనిపిస్తున్నది పరమాత్మయే !
→ పరమాత్మయే లీలావినోదంగా జీవాత్మ అయి వ్యవహరిస్తున్నారు.
… అను భావనచే తదితరమై భేదజ్ఞానమును భగ్నము చేసివేసినవారై ఉంటున్నారు. ‘సర్వము మమాత్మయే’ అను అనుక్షణికమైన అవగాహన-అనుభావన-అనుభూతి-అనుభవములే ఆయన యొక్క సంధ్యా వందన క్రియ. ఆవల ఈవల ఏకత్వమే అతని సంధ్య!

సర్వాన్ కామాన్ పరిత్యజ్య - అద్వైతే పరమే స్థితిః
వీరిట్లా ఉండాలి - వారట్లా కూడదు - ఇది కావాలి - అది వద్దు - ఇది కోరుకొనుచున్నాను - అది కోరుకోను … ఇట్లా అతడు భావించడు. సర్వ కామములు (కోరికలు. Expectations) పరిత్యజించినవాడై ’పరము’ అగు అద్వైతానంద స్థితిని అస్వాదిస్తూ ఉంటాడు. సర్వము ఆతనికి అఖండ చిద్విలాసము.

చేతితో అతడు ’జ్ఞానదండము’ను ధరించినవాడై ఉంటాడు. ‘ఏకదండీ’ అని చెప్పబడుచున్నారు. ఆత్మ జ్ఞానము - ఆత్మ భావన ఆత్మానుభావమే అతని త్రిదండము. ఇక అతనికి కాష్ఠ దండము ఒక విషయమే కాదు. అది ఉంటే ఉండవచ్చు. లేక, లేకపోవచ్చు. (Dress does not indicate real Address). ఆతడు సర్వదా ’ఏకదండీ ధారణ’తో ఏకత్వము ధరించి ఉంటారు.

శ్రీ నారద మహర్షి :  హే భగవాన్ ! అస్మత్ ప్రియ పిత్రుదేవా ! లోకంలో కొందరు “సర్వము సన్న్యసిస్తున్నాము” అని చెపుతూనే, సన్న్యాసాశ్రమము స్వీకరించి కూడా, కాష్ఠ దండమును ధరించి కూడా, మీరు చెప్పుకొంటూ వస్తున్న పమర హంస ధర్మాలు పుణికిపుచ్చుకోలేకపోతున్నారేమో? లోభము, క్రోధము, మాత్సర్యములకు లోను అగుచున్నారే ! వారు శుభ-సన్మార్గులు అయ్యేదెట్లా

శ్రీ ప్రజాపతి :  అవును. నిజమే ! శాస్త్రయుక్తంగా, భౌతికంగా సన్న్యసించి కూడా కొందరు సంసార భావాలు త్యజించే యత్నం చేయకుండా… ఆత్మద్రోహులు (Damaging the conceptual understanding of one’s own self) అగుచున్నారు. అట్టి బిడ్డల జాగరూకత - సముద్ధరణ కొరకై నీవు ప్రశ్నిస్తున్నావు. మంచిది. తత్ సంబంధంగా కొన్ని విషయాలు ఇక్కడ చెప్పుచున్నాను విను.

ఎవ్వడైతే వేదాంత శాస్త్ర - యోగ పాఠ్యాంశసారమైన ‘భిక్షకుడు’ అను సాధనజీవన విధానము స్వీకరించికూడా, లోక-ఈషణములు వదలక, పారలౌకికత్వము (హంసత్వము) ఆశ్రయించక… కాలము వెళ్ల బుచ్చుచున్నారో, రోజులు గడుపుచున్నారో…,

ఎవ్వడైతే భిక్షక సన్యాసి అయి కూడా…,

అతడు యతి వృత్తిని స్వీకరించి కూడా సంసారియే అగుచున్నాడయ్యా! పాపియే అగుచున్నాడు. తన యొక్క అల్ప జన్మ పరంపరలకు తానే ద్వారములను తెరచుకొన్నవాడగుచున్నాడు సుమా!

స యాతి నరకాన్ ఘోరాన్ మహారౌరవ సంజ్ఞికాన్।
యతి గుణములు ఆశ్రయించకుండా, బాహ్యమునకు మాత్రమే యతి రూపము ధరించువాడు ఘోరమైన - ‘మహారౌరవము’ ఇత్యాది నరక త్రోవలను ఎన్నుకొనుచున్నవాడగుచున్నాడు. యతి మార్గము నుండి ‘చ్యుతుడు’ అగుచున్నాడు.

ఇది గ్రహించి, యతులు పరమహంస మార్గములో జాగరూకులై వ్యవహరించెదరు గాక ! ఈ హెచ్చరిక వారి శ్రేయమును కోరి గుర్తు చేస్తున్నాను.

పరమహంస ఇది గమనించియే “సర్వం పరబ్రహ్మమేవ” దర్శనమునందు సుస్థితుడై ఉంటారు.

భిక్షువు అనగా ఎట్టివాడు ?

(భిక్షువు = పరమహంస మార్గాణ్వేషి - చీకటిని వెలుగుతో నింపువారు)

ఆకాశాంబరో :  “ఈ విశ్వమంతా నాచే ధారణ చేయబడుచున్నది. నాచే ధరించబడు వస్త్రము. ఈ పంచభూతములు, వాటి ధర్మములు, ఈ సర్వ జీవులు- నా ఆత్మ స్వరూపమునకు కట్టిన వస్త్రముపై గల రంగు చిత్రములవంటివి”.. అను భావన మననములను ఆశ్రయించి ఉంటారు.

న నమస్కారో : “హంస (ఆత్మ) స్వరూపుడనగు నాకు వేరు - అనునదే లేనప్పుడు, సర్వము ఆత్మ యొక్క లీలావినోద సంప్రదర్శనమ్ అయి ఉండగా, ఎవరు ఎవరికి ఏమని నమస్కరించాలి!” - అను చిరునవ్వు కలిగి ఉంటారు. అతని దృష్టిలో నమస్కరించబడు వారు - నమస్కారము - నమస్కరించువారు … ముగ్గురు ఏకమగు ఆత్మయే ! కనుక న-నమస్కారులై ఉంటారు. న (పరమాత్మ) - మ (జీవాత్మ) ఏకత్వ రసములో ఉండియే బాహ్య నమస్కారములను గమనిస్తూ ఉంటారు.

న స్వాహకారో - న స్వధాకారో : "ఇది దేవతలకు స్వాహారూపంగా సమర్పిస్తున్నాను. ఇది పితృదేవతలకు స్వధా రూపంగా సమర్పిస్తున్నాను”… అనునదేమీ కలిగి ఉండరు. “ఆత్మకు వేరుగా నేనుగాని, దేవతలుగాని, పితృదేవతలు గాని ఎక్కడున్నాము? అంతా అఖండమగు హంసతత్వమే కదా !”… అను అవగాన యొక్క మహదత్వము - అచంచలత్వముచే,…. వారు స్వాహాకారులవరు. స్వధాకారులు అవరు. అవి చేయుచున్న లౌకిక సందర్భములను వారు స్వ-ఆత్మోపాసనగానే భావిస్తారు.

న నిందా - స్థుతిః : వారి దృష్టిలో… నిందా స్థుతిలు గాని, నిందించువారు - స్థుతించువారుగాని ఆత్మ సమక్షంలో ‘లేనివి’ - అగుచున్నాయి. ఆ ఉభయులు కూడా అఖండమగు ఆత్మస్వరూపులుగా ఆతనికి అనుభూతులగుచున్నారు.

యాదృచ్ఛికో : ఆత్మ అకారణం. ఆత్మయే ఈ సర్వము. కనుక ఇదంతా అకారణం. ఒక స్వప్నంలో గుడిశ - తెలిసిన వ్యక్తులు - తెలియని వ్యక్తులు తారసపడటం ఎంతగా యాదృచ్ఛికమో, అకారణమో…, సకారణం కాదో …, ఈ దృశ్యము - దేహములు జన్మలు సంఘటనలు, సంబంధములు ఇవన్నీ కూడా అంతగానూ ఆత్మ సమక్షంలో యాదృచ్ఛికం ! అకారణం! సకారణం కాదు! మనోకల్పితము. - అను అవగాహన ఆ బిక్షువు కలిగి ఉంటారు!

ఆ భిక్షువుకు…, ఇంకా కూడా…,

న ఆవాహనమ్ :  నేను పరమాత్మను ఒకచోటికి ఎట్లా ఆహ్వానించాలి? కుదరదు. ఎందుకంటే ఇక్కడ లేకపోతే కదా, ఇక్కడికి ఆహ్వానించేది! అంతటానిండి ఉండి, అన్నీ తానే అయినవాడిని, ఎక్కడి నుండి ఎక్కడికి ఏమని ఆహ్వానించగలను?…. అని భావించి చిరునవ్వు చిందిస్తూ ఉంటారు.

న విసర్జనమ్ :  అంతా లయించిన తరువాత కూడా, ఏది చిట్ట చివరికి శేషించి ఉంటుందో, అట్టి ఆత్మను ఎవరు మాత్రం ఎప్పుడు వదలి ఉండగలరు? అది విడిచిపెట్టగలిగేది కాదు! ఆ పరమాత్మను ఆహ్వానించటమూ లేదు. విసర్జించటమూ కుదరదు అని ఎరిగి ఉంటారు.

న మంత్రమ్ :  మననము కొరకు మంత్రము. తన స్వరూపమే అయి, తనకు అద్వితీయమైయున్న ఆత్మను ఇక, మననము చేయవలసినదేముంటుంది. అందుచేత మంత్రసిద్ధిచే మంత్ర స్వరూపుడే తానై, న-మంత్రమ్ భావుడగుచున్నాడు. మంత్రముచే సిద్ధించు (లేక) మననముచే సిద్ధించు పరమ వస్తువు - ‘ఆత్మా హమేవ’ అని ఎరిగి ’తానే’ అయి ఉంటున్నారు.

న ధ్యానమ్ :  ధ్యాని - ధ్యానము - ధ్యానింపబడు పరమాత్మ ఏకస్వరూపమై, త్రివేణీ సంగమము అవటం చేత, ఆ పరమహంస భిక్షువుకు ధ్యానము అను క్రియయే ఉండదు. “అంతా పరతత్త్వమే! కనుక నేను పరతత్త్వమునే! కాబట్టి ఇదంతా నేనే”… అను సుస్థితి - స్వస్థత చేకూరగా ఇక దేనిని గురించి ధ్యానం ? ‘అన్యము’ అను మనోదోషమును తొలగించుకొని ‘అనన్యము’ను స్వభావ సిద్ధం చేయటానికి ధ్యానం! అనన్యత్వము సిద్ధించిన తరువాత వేరైన ధ్యానమే ఉండదు!

న ఉపాసనమ్ :  ఉపాసనము కూడా లేదు. అట్లాగే ఉపాసించబడునది వేరుగా లేదు. తనకు తానే ఉపాసించబడువాడై ఉంటాడు. పరమాత్మయే తానై ఆ బిక్షువు వెలుగొందుచుండగా, ఇక “భగవంతునికి సమీపంగా ఆసనము”… అనే ప్రసక్తి ఎక్కడిది? తాను ఆత్మకు అభిన్నమై ఉండగా దూరమైనది ఎప్పుడు ? కొత్తగా దగ్గర కావలిసిన పనేమి ? అందుచే ఆతనికి క్రొత్తగా ఉపాసన-ఉపవాస ప్రక్రియలు ఉండవు.

న లక్ష్యమ్-న అలక్ష్యమ్ : అతని లక్ష్యము లేదు. చేరవలసినది తానే అయి ఉండగా వేరే లక్ష్యము(Target) ఏముంటుంది? ఆత్మ (హంస) స్వరూపుడగు తాను కానిది ఏదీ లేదు. ఈ విశ్వమంతా తానే అయి ఉండగా తనకు సంబంధించనిది వేరుగా ఏమున్నది? (లేక) పట్టించుకోకూడనది మాత్రం ఏముంటుంది? కలలో కనిపించే దేనిని, “కల తనదైనవాడు” - పట్టించుకోకూడదు? మరొక దేనిని పట్టించుకోవాలి? అంతా తానే కదా!

అంతా నేనే అయి, ఏదీ కానట్టివాడను! న పృథక్ - న అపృథక్ - ఇదంతా నాకు వేరే! అయితే, వేరుగానూ లేను. ఒకటి గాను లేను ! కల్పన అగు జగత్తు వాస్తవానికి లేదు. ఆత్మకు వేరుగా జగత్తులేదు. న సత్త్వమ్ ! న సర్వమ్ చ! ఉన్నదీ లేదు. లేనిదీ లేదు. అంతా లేదు. కొంత లేదు.

ఇక్కడ ఏకము లేదు. అనేకము లేదు. మట్టితో అనేక బొమ్మలు కనబడుతూ ఉంటే…..
… అవన్నీ మట్టియేకదా ! కనుక అవి మట్టి దృష్ట్యా అనేకము కాదు.
… పోనీ ఒకే మట్టి యొక్క వివిధ ఆకారములా? మట్టికి ఆకారమే లేదు కదా! ఒకే ఆకారము గల మట్టి అనేక ఆకారములుగా అగుచున్నదని అనలేము కదా! ఆత్మ ఒక్కటి కాదు. అనేకము కాదు. ఆత్మ ఏదీ అవటం లేదు. అందుచేత “జీవులంతా ఏకాత్మరూపులే” అనే వాక్యముకూడా, నిరాకారమగు ఆత్మ వస్తువు యొక్క సమక్షంలో  “చిన్న వివరణ మాత్రమే (Petty detail)” అగుచున్నది.

అనికేతః :  బిక్షువుకు (లేక - పరమహంస మార్గాణ్వేషికి). ఒక గృహము లేదు. ఒక ‘చోటు’ అనునది లేదు. పోనీ ఈ విశ్వమంతా ఆయన నివాసమా ? (అత్యతిష్ఠతి దశాంగుళమ్!). ఈ విశ్వమును దాటి ‘10’ అంతలున్నారని వేదవచనం!

స్వప్న ద్రష్ఠ స్వప్నంలో ఒక చోట ఉన్నాడని గాని, మరొకటో లేడనిగాని, సప్నమంతా అతని నివాసమనిగాని అనలేము కదా !

స్వప్నమును అధిగమించి, స్వప్నమంతా తనదై, స్వప్నముచే నిర్వచించబడనివాడై ఉన్నారు కదా !

భిక్షువు (లేక) పరమహంస కూడా….,

స్థిరమతిః :  దేనిచేతా కూడా “అహమ్ బ్రహ్మ స్మి”“సో హమ్“ భావమునుండి అతడు చ్యుతి పొందరు. ఒక కథా రచయిత కథలోని సంఘటణలను రచిస్తూ, “నేను కథారచయితను” అనునది ఏమరుస్తున్నాడా ? నాటక రచయిత నాటకంలో మిత్రుల, శత్రువుల మధ్య సంభాషణ రచిస్తూ ” నేను నాటక రచయితను”… అని మరచి మిత్రుడుగా శత్రువుగా అగుచున్నాడా? లేదు కదా? అట్లాగే ఆ పరమహంస సర్వముచూస్తూ సర్వములో ఉంటూ సర్వము తానై ఉంటున్నారు. సర్వమునకు వేరై కూడా ఉంటున్నారు.

సంపదలు - ఆపదలు :  లోకంలో అందరూ విలువైనవిగా భావించబడే బంగారము మొదలైనవి భిక్షువు మనస్సుతో స్పృశించడు. ‘ఇవి
నావి కదా!’…. అని భావించడు.

అతనికి లోకములు లేవు ! అవలోకనము లేదు ! అతని దృష్టిలో బాధలు లేవు. బాధించువాడు లేడు, బాధింపబడునది లేదు. అతను బాధకు కూడా కేవల సాక్షియై, ఏదో తదితరమైన అసంబంధిత వస్తువును చూస్తున్నట్లుగానే చూస్తూ ఉంటారు.

శ్రీ నారద మహర్షి :  అయితే తండ్రీ ! భిక్షువు బంగారము ఇటువంటి సంపద సంబంధమైనవి తాకనేకూడదంటారా?

శ్రీ ప్రజాపతి :  అవునయ్యా ! ఏ భిక్షువు అయితే హిరణ్యము (బంగారము) మొదలైన సంపద సంబంధమైన వస్తువులను ’రస దృష్టి’తో “ఇవి ఉంటే గొప్ప కదా ! ఇవి ప్రసాదించగలనని అందరు అను కొనెదరు గాక” - ఇట్టి భావనతో సంబంధితుడు అవుతాడో …, అతడు పరబ్రహ్మ మార్గము (లేక) పరమహంస మార్గము నుండి చ్యుతుడై “పౌల్కసుడు” (One who got his path lost) అగుచున్నాడయ్యా ! ఇష్టంతో బంగారమును స్పృశిస్తే అది పరమహంస మార్గమునుండి భ్రష్టత్వము తెచ్చి పెట్టగలదని గ్రహించి ఉండాలి! అప్పుడు అతడు అల్ప జన్మలకు పిలిచి తెచ్చుకొన్నవాడు అగుచున్నాడు.

అందుచేత బిడ్డా! నారదా!

ఈ జీవుడు - పరమహంసా మార్గాణ్వేషియై…,

శుభాశుభయో అనభిస్నేహో ! :- ఈవిధంగా పరమహంసత్వమును సిద్ధింపజేసుకొనుచుండగా,

ఇంద్రియముల గతిని సర్వ విషయముల నుండి నిరోధించి, ఆత్మభావనచే - సర్వ భావనలను పరితప్తము చేసివేస్తున్నారు. “నేను చూస్తున్నది - వింటున్నది - ఆఘ్రాణిస్తున్నది - స్పృశిస్తున్నది - రుచి చూస్తున్నది… అంతా బ్రహ్మమే! బ్రహ్మమే బ్రహ్మమునందు ప్రవర్తిస్తూ బ్రహ్మముగానే ప్రకాశమానమగుచున్నది" అని ఆస్వాదించుచున్నారు.

ఆ భిక్షువు పరమహంస అయి, పూర్ణానంద ఏకబోధ స్వరూపుడుగాను, ‘బ్రహ్మైవాహమస్మి’ అను నినాదముతో వెలుగొందుచున్నారు. పొందవలసిన పొంది కృతకృత్యుడై దీపిస్తున్నారు. బ్రహ్మమే తానై ప్రకాశించుచున్నారు.

🙏 ఇతి పరమహంస ఉపనిషత్ | 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః ||