[[@YHRK]] [[@Spiritual]]

Subāla Upanishad (Saubāla Bēja Brahma Upanishad)
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


శుక్ల యజుర్వేదాంతర్గత

15     సౌబాల బీజ బ్రహ్మోపనిషత్

(లేక) సుబాలోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో॥ బీజ అజ్ఞాన మహామోహా అపహ్నవాత్ యత్ విశిష్యతే,
నిర్బీజం త్రైపదం తత్త్వం ‘తదస్మి’ ఇతి విచింతయే ॥

‘బీజ-అజ్ఞానము’ అనే మహామోహము తొలుగగా, అప్పటికీ శేషించు “నిర్బీజ-త్రైపదస్థానమే” నేను అని చింతన చేయాలి.


ప్రథమః ఖండః

1.) తదాహుః కిం తదాసీత్ ?
తస్మై సహెూవాచ :-
న సత్। న అసత్। న సదసత్। ఇతి।
తస్మాత్ తమః సంజాయతే।
తమసో →‘భూతాదిః’।
భూతాదే → ‘ఆకాశమ్’।
ఆకాశాత్ → వాయుః।
వాయోః → ‘అగ్నిః’।
అగ్నేః → ‘ఆపః’।
అధ్భ్యః → ’పృథివీ।
తత్ ‘అణ్డం’ సమభవత్।
తత్ సంవత్సర మాత్రం
ఉషిత్వా, ద్విధా కరోత్, అధస్తాత్॥

శిష్యుడగు రైక్యుడు :  (సర్వము మొట్టమొదట అఖండ బ్రహ్మమే అయి ఉండగా) అప్పుడిక ఏమి జరిగినది? (ఏమి జరుగుటచే ఈ కనబడేదంతా.. ఏర్పడినదైనది?)

సద్గురువు ఘోరాంగీరస : మొట్టమొదట ఆత్మ మాత్రమే ఉన్నది. అది సత్తు కాదు! అసత్తు కాదు! సదసత్తు కూడా కాదు.

అట్టి పరమాత్మ నుండి మొదటగా తమస్సు జనించింది. తమస్సు నుండి భూతాది (సూక్ష్మ - పంచభూతా - ప్రారంభ తత్త్వము) బయల్వెడలింది. భూతాది నుండి - ఆకాశము ప్రదర్శితమైనది.

ఆకాశము నుండి సంచలన రూపమగు వాయువు, వాయువు నుండి - తేజోరూపమగు ‘అగ్ని’, అగ్ని నుండి - ద్రవ-జలన రూపమగు ‘జలము’. జలము (ద్రవము) నుండి-పృథివి.

అవన్నీ ఒక గ్రుడ్డు - అండము (Egg) రూపముగా అయినాయి. అది సంవత్సరము మాత్రముచే (కాలముచే) రెండుగా అయినది. అట్టి సంవత్సరము నుండి ’భూమి’. ప్రదర్శనమగుచున్నది. (సంవత్ = సత్తునుండి; వరము = ప్రదర్శితము)

2.)  (తత్ అధస్తాత్).. భూమిః। ఉపరిష్టాత్.. ఆకాశమ్|
మధ్యే.. పురుషో దివ్యః। సహస్ర శీర్షా పురుషః,
సహస్రాక్షః సహస్ర పాద్। సహస్ర బాహుః ఇతి।
సో అగ్రే భూతానామ్ మృత్యుః అసృజత్।
త్ర్యక్షరమ్। త్రి శిరస్కం! త్రి పాదం! ఖండపరశుం!
తస్య ‘బ్రహ్మా’ అభిధేతి। సో బ్రాహ్మణమేవ వివేశ।
సమాన సాన్ ‘సప్తపుత్రాన్’ అసృజత్|
తేహ విరాజః సప్త మానసాన్ అసృజన్।
తేహ ప్రజాపతయో|
బ్రాహ్మణో అస్య ముఖమ్ ఆసీత్।
బాహూ రాజన్యః కృతః। ఊరూ తదస్య యత్ వైశ్యః।
పద్భ్యాగ్ం శూద్రో అజాయత।
చంద్రమా మనసో జాతః।  చక్షోః సూర్యో అజాయత।
శోత్రాత్ వాయుశ్చ, ప్రాణశ్చ
హృదయాత్ సర్వమిదం జాయతే ॥

భూమికి పైన ఆకాశము! అట్టి ’ఆకాశము-భూమి’ మధ్యగా - దివ్య పురుషుడు.

ఆ పురుషుడు వేలాది శిరస్సులు, వేలాది కళ్ళు, (ధ్యాసలు), వేలాది పాదములు (నడకలు), వేలాది బాహువులు (క్రియావ్యవహారములు) - కలవాడు. ఆతడు భూతసృష్టికి ముందు మృత్యువును (మార్పు - change factor) సృష్టించారు.

ఆ మృత్యువుకు ‘3’ అక్షరములు, 2 శిరస్సులు, మూడు పాదములు, ఖండ పరశువు (గండ్రగొడ్డలి) కలిగి ఉన్నది. ‘బ్రహ్మ’ అను పేరు గల ఆయన బ్రాహ్మణములయందు ప్రవేశించారు. (కర్తృత్వ రూపముగా బ్రాహ్మణ నామధేయుడైనారు). ఆ బ్రహ్మదేవుడు సృష్టి కొరకై ‘7’గురు మానస పుత్రులను సృష్టించారు. వారే సప్తమానస పుత్రులు. ఆ ’7’గురు ప్రజాపతులు, విరాట్టులు.

ఆ బ్రహ్మ (సృష్టికర్త) యొక్క -
    ముఖము నుండి (బ్రహ్మము గురించిన భావనలతోకూడి) బ్రాహ్మణులు పుట్టారు.
    బాహువుల నుండి క్షత్రియులు (క్రియా సామర్థ్యము),
    ఊరువుల (తొడల నుండి) వైశ్యులు (పరిపోషకులు),
    పాదముల నుండి శూద్రులు (సేవాభావులు),
    మనస్సు నుండి.. చంద్రుడు!
    కనుల నుండి.. సూర్యుడు!
    చెవుల నుండి వాయువు, ప్రాణము జనించాయి.
ఆయన హృదయము నుండి సర్వ జగత్తు జనించింది.

ద్వితీయః ఖండః

1.) అపానాత్ నిషాదా,
యక్ష-రాక్షస-గంధర్వాశ్చ అస్థిభ్యః । పర్వతా లోమభ్య।
ఓషధి వనస్పతయో లలాటాత్। క్రోధజో రుద్రో జాయతే।

తస్య ఏతస్య మహతో భూతస్య నిశ్వసితమ్ ఏవా ఏతత్.. ఋగ్వేదో; యజుర్వేదః; సామవేదో; అథర్వవేదః; శిక్షా; కల్పో; వ్యాకరణమ్; నిరుక్తమ్; ఛందో; జ్యోతిషామ్ ఆయనం; న్యాయో; మీమాంసా, ధర్మశాస్త్రాణి, వ్యాఖ్యానాని ఉప వ్యాఖ్యానాని చ సర్వాని చ భూతాని॥

ఆయన (సృష్టికర్త బ్రహ్మ) యొక్క -
    అపాన వాయువు నుండి నిషాదులు,
    ఎముకల నుండి యక్ష-రాక్షస- గంధర్వులు,
    రోమముల నుండి - పర్వతములు,
    లలాటము (ముఖము నుదురు) ప్రదేశము నుండి ఓషధులు, వనస్పతులు,
    ఆయన క్రోధము నుండి రుద్రుడు,
… జనించారు.

ఆ మహాభూతము యొక్క (మహతో భూతస్య) నిట్టూర్పు (నిశ్వాసము) నుండి -
ఋక్- యజుర్-సామ-అధర్వణ వేదములు, వేదాంగములు, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము - న్యాయము, మీమాంస, ధర్మశాస్త్రము, వ్యాఖ్యానములు, ఈ సర్వ జీవరాశులు జనించాయి.

2.) హిరణ్యజ్యోతిః అస్మిన్ అయమ్ ఆత్మా అధిక్షియన్తి భువనాని విశ్వా ఆత్మానం ద్వివిధా కరోత। అర్ధేన ’స్త్రీ’ అర్ధేన ’పురుషో’।

దేవోభూత్వా దేవాన్ అసృజత్। ఋషిః భూత్వా ఋషీన్,
యక్ష రాక్షస గన్ధర్వాన్ గ్రామ్యాన్ ఆరణ్యాంశ్చ పశూన్ అసృజత్।
ఇతరా గౌః, ఇతరో అనడ్వాన్। ఇతరా బడబేతరో అశ్వ।
ఇతరా గర్దభి - ఇతరో గర్దభ। ఇతరా విశ్వంభరా ఇతరా విశ్వంభరః।

సో అన్తే వైశ్వానరో భూత్వా
సందగ్ధ్వా సర్వాణి భూతాని।
పృథివీ అప్సు ప్రలీయత। ఆపః తేజసి ప్రలీయంతే॥
తేజో వాయౌ విలీయతే। వాయుః ఆకాశే విలీయత।
ఆకాశమ్.. ఇంద్రియేషు। ఇంద్రియాణి.. తన్మాత్రేషు।
తన్మాత్రాణి.. భూతాదౌ విలీయన్తే।
భూతాదిః.. మహతీ విలీయతే।
మహాన్.. అవ్యక్తే విలీయతే।
అవ్యక్తమ్.. అక్షరే విలీయతే|
అక్షరమ్.. తమసి విలీయతే|
తమః.. పరే దేవ ఏకీభవతి।

పరస్తాత్ న సత్! న అసత్! న సదసత్।

ఇతి ఏతత్ నిర్వాణానుశానమ్।
ఇతి వేదానుశాసనమ్। ఇతి వేదానుశాసనమ్॥

ఎవనిలో ఈ విశ్వము ఇందులోని త్రిభువనములు కల్పితమై కనిపిస్తున్నాయో, ఆతడే హిరణ్య జ్యోతి స్వరూపుడగు ఆత్మ. ఆతడు తనను తాను రెండుగా, చేసుకొన్నారు. సగము ‘స్త్రీ’. సగము పురుషుడు. (ప్రకృతి - పురుషుడు, స్వభాము-స్వభావి). (స్త్రీ = స + ర + త = రజో = సత్వ తమోగుణ ప్రకృతి).

దేవదేవుడై దేవతలను సృజించారు. ఋషీశ్వరుడై ఋషులను యక్షులను, రాక్షసులను, గంధర్వులను, జన నివాసయోగ్యమగు గ్రామ్యములను, అరణ్యములను, పశువులను కూడా సృష్టించారు. (తేజస్సుచే ప్రకాశింపజేయ సాగారు). ఆవు-ఎద్దు, ఆడ-మగ గుర్రములు, ఆడ-మగ గాడిదలు, విశ్వంభరుడు - విశ్వంభరి (భరించువాడు - భరించబడునది) … మొదలైనవన్నీ సృష్టించారు.

చివరకు తానే వైశ్వనరాగ్ని అయి, అన్ని భూతములను దహించసాగారు.
➤ పృథ్వి - జలమునందు విలీనమయి, జలము - తేజస్సు నందు లీనమయి, తేజస్సు - వాయువు నందు లీనమై, వాయువు ఆకాశము నందు లీనమయి ఉండసాగాయి.
➤ ఆకాశము - ఇంద్రియములందు, ఇంద్రియములు - శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ తన్మాత్రలయందు, తన్మాత్రలు భూతాది యందు విలీనమై కనబడసాగాయి.
➤ భూతాది కాస్తా.. మహతి యందు (మహత్తు నందు), మహత్తు - అవ్యక్తము నందు, అవ్యక్తము.. అక్షరము నందు, అక్షరము.. తవస్సు నందు, విలీనమయి ఉండసాగాయి.
➤ తమస్సేమో.. పరము నందు ఏకత్వము పొంది ఉండసాగింది.

అట్టి పరము యొక్క స్వరూపము సత్తు (ఉన్నది) కాదు. అసత్తు (లేనిది) కాదు. సదసత్ (ఉండీలేనిది) కాదు.

ఇట్లు వేదముల యందు నిర్ణయించి వర్ణించబడింది. అనుశాసనము అయి ఉన్నది.

తృతీయః ఖండః

1.) అసత్ వా ఇదమ్ అగ్ర ఆసీత్।

అజాతమ్, అభూతమ్; అప్రతిష్ఠమ్;
అశబ్దమ్; అస్పర్శమ్; అరూపమ్;
అరసమ్; అగన్ధమ్; అవ్యయయ్; మహాన్తమ్;
బృహన్తమ్, అజమ్।

ఆత్మానమ్ మత్వా ధీరో న శోచతి।

అప్రాణమ్; అముఖమ్; అశ్రోత్రమ్;
అవాక్; అగమనో; అతేజనమ్;
అచక్షుష్కమ్; అనామ-గోత్రమ్;
అశిరస్కమ్; అపాణి-పాదమ్;
అస్నిగ్ధమ్; అలోహితమ్; అప్రమేయమ్;
అహ్రస్వమ్; అదీర్ఘమ్; అస్థూలమ్, అనణ్వన్;
అనల్పమ్; అపారమ్; అనిర్దేశ్యమ్;
అనపావృత్తమ్; అప్రకాశ్యమ్; అసంవృతమ్;
అనన్తరమ్, అబాహ్యమ్ ॥

ఈ జగత్తు మొట్ట-మొదట అసత్తుయే (అనగా వాస్తవానికి లేనిదియే) అయి ఉన్నది. ఆత్మ మాత్రమే మొట్టమొదట ఉండి ఉన్నది.

అట్టి ఆత్మ.. పుట్టుకలేనిది, పాంచభౌతిక రూప రహితము, ప్రతిష్ఠ లేనిది. (అది ఎందులోనూ లేదు. అద్దానిలో ఏదీ లేదు). శబ్ద-స్పర్శ-రూప-రస-గంధరహితము, మార్పు చేర్పులు లేని అవ్యయము, మహన్తమైనది (అనన్తమ్). బృహన్తము (Greatest) . జన్మరహితము.

‘నా ఆత్మ ఇట్టిది’ అని తెలుసుకొనినప్పుడు ఇక ఈ జీవుడు ఏ మాత్రమూ దేనికో దుఃఖించడు.

అట్టి ఆత్మ ప్రాణ స్వరూపము కాదు. ‘ముఖము’ (Face) కాదు. వినికిడి (శోత్రము) కాదు. వాక్కు-మనస్సు-కాదు. తేజస్సు కాదు. చూపు-కనబడునది కాదు. నామగోత్రములు లేవు. శిరస్సు కాళ్లు చేతులు లేవు. స్నిగ్ధము (నును పైనది) అను లక్షణము లేదు. లోహధర్మము లేదు. దేనికీ సంబంధించనిది కాబట్టి అప్రమేయము. పొట్టి-పొడుగులు లేనిది. స్థూలము కాదు. సూక్ష్మము (అణువు వంటిది) కాదు. అల్పము కాదు. అధికము కూడా కాదు. దేనికో చుట్టుకొని లేదు. అది దేనిచేత ప్రకాశించబడుట లేదు. సంవృతము (కప్పబడినది కాదు. అంతరమునగాని, బాహ్యమున గాని ఉన్నది కాదు.

‘ఇది’ అని ఆత్మ గురించి చెప్పలేము.

2.) న తత్ అశ్నాతి కించన।
న తత్ అశ్నాతి కశ్చన।
ఏతద్వై సత్యేన, దానేన,
తపసా, అనాశకేన బ్రహ్మచర్యేణ,
నిర్వేదనేన, అనాశకేన షట్ అబ్దేనైవ సాధయేత్।

ఏతత్ త్రయం వీక్షేత
1) దమం 2) దానం 3) దయామ్ ఇతి।

న తస్య ప్రాణా ఉత్క్రామన్తి।
అత్రైవ సమవలీయన్తే,
బ్రహ్మైవసన్, బ్రహ్మాప్యేతి,
య ఏవం వేద॥

అది దేనిచేతా తినబడదు. అది దేనినీ తినటము లేదు. అద్దాని అనుభవమును ’సత్యము, త్యాగము, తపస్సు, ఏకాగ్ర బ్రహ్మచర్యము, జగత్ సంబంధమైన పూర్తి నిశ్చింత, అనాశకమైన షడంగము (ఆరవ అంగమైన మనస్సు)ల చేత ఈ జీవుడు సిద్ధించుకోవాలి. ప్రయత్నశీలుడు కాని వానికి అట్టి ‘ఆత్మ’ యొక్క ‘భావన’ సిద్ధించటం లేదు.

అట్టి ఆత్మ భావనకు గాను ఇంద్రియ నిగ్రహము (దమము), దానము; దయలను గుణములుగా వృద్ధి చేసుకోవాలి. ఈ మూడు పెంపొందించుకోవాలి.

అట్టి ఆత్మను అనుభవముగా సిద్ధించుకొనిన జీవుడు జీవించునప్పుడు, మరణించునప్పుడు కూడా బ్రహ్మమును ఎరిగి ఉండుటచే - ఇక ఆతని ప్రాణములు బయటకు పోవు. పైకి పోవు. మరి? ఆత్మయందే లీనమై ఆత్మత్వమునే పొందుచున్నాయి. ఆత్మయే అయి ఉంటున్నాయి.

చతుర్థః ఖండః

1.) హృదయస్య మధ్యే లోహితం
మాంసపిణ్డమ్, యస్మిన్..,
తత్ దహరం ’పుణ్డరీకం’,
’కుముదమ్’ ఇవ అనేకధా వికసితం।
హృదయస్య దశ ఛిద్రాని భవన్తి।

యేషు ప్రాణాః ప్రతిష్ఠితాః
స యదా ప్రాణేన సహ సంయుజ్యతే,
తదా పశ్యతి నద్యో నగరాని బహూని వివిధాని చ।

యదా వ్యానేన సహ సంయుజ్యతే
తదా పశ్యతి దేవాంశ్చ, ఋషీంశ్చ।

యదా అపానేన సహ సంయుజ్యతే
తదా పశ్యతి యక్ష-రాక్షస-గంధర్వాన్।

యదా ఉదానేన సహ సంయుజ్యతే,
తదా పశ్యతి దేవలోకాన్,
దేవాన్, స్కన్దం, జయన్తం చ ఇతి।

యదా సమానేన సహ సంయుజ్యతే,
తదా పశ్యతి దేవలోకాన్, ధనాని చ।

యదా వైరంభేణ సహ సంయుజ్యతే,
తదా పశ్యతి దృష్టం చ - అదృష్టం చ,
శ్రుతం చ - అశ్రుతం చ,
భుక్తం చ - అభుక్తం చ,
సత్ చ - అసత్ చ .. సర్వం పశ్యతి|

యథా ఇమే ఆదశనాడ్యో భవన్తి, తాసామ్ ఏకైకస్యాం
ద్వా-సప్తతిః, ద్వాసప్తతిః శాఖానాడీ సహస్రాణి (72000) భవన్తి॥

ఈ హృదయము యొక్క మధ్య భాగములో ఎర్రటి మాంస పిండము ఉన్నది. హృదయము యొక్క దహరాకాశము నుండి భావములు, జగత్తులు బయల్వెడలుచున్నాయి. అద్దాని యందు తామర మొగ్గ వలె, కలువ ఆకారము వలె అనేక విధములుగా వికసించియున్న హృదయ పద్మము నందు దశ (10) ఛిద్రములు (Holes) ఉన్నాయి.

ఆ (10) ఛిద్రములందు గల ప్రాణ శక్తి - దేహములో సంచరించే ప్రాణ వాయుతో సంయోగము పొందుచున్నప్పుడు ఈ జీవుడు అనేక నదీ ప్రవాహములను, వివిధమైన నగరములను చూస్తూ ఉంటాడు.

ఎప్పుడు ఈ జీవుడు తన వ్యాన వాయు చలనములతో ఆ ఛిద్రములలో నిక్షిప్తమైయున్న ప్రాణశక్తి స్థానములను కలుస్తాడో అప్పుడు ఈ జీవుడు దేవతలను, ఋషులను చూస్తాడు.

అపానముతో కూడి సంయుజ్యము పొందునో (కలియునో), అప్పుడు ఆ యోగికి యక్ష-రాక్షస-గంధర్వులు కనిపిస్తారు.

ఉదాన ప్రాణముతో కలిసినప్పుడు - దేవలోకములను, దేవతలను, స్కందుని, జయంతుని దర్శనము అగుచున్నది.

సమాన ప్రాణముతో కలియటం జరిగినప్పుడు దేవలోకమును, దేవతా సంపదలను (ధనమును) చూడటం జరుగుతోంది.

వైరంభనితో (ఉప ప్రాణముతో) సంయుజ్యత (Association) పొందినప్పుడు
✤ దృష్ట - అదృష్టములు (చూచినవి, చూడనివి)
✤ విన్నవి - విననివి,
✤ తిన్నవి - తిననివి,
✤ సత్య - అసత్యములు,
… సర్వము దర్శించగలడు.

హృదయ మాంస పిండము నుండి ‘10’ నాడులు బయల్వెడుచున్నాయి. ఆ ఒక్కొక్కనాడి నుండి ’72000’ చొప్పున ఉపనాడులు విస్తరించి ఉంటున్నాయి.

2.) యస్మిన్ అయమ్ ఆత్మా స్వపితి
శబ్దానాం చ కరోతి।
అథ ద్వితీయే సంకోశే స్వపితి,
తత్ ఇమం చ లోకం, పరం చ లోకం పశ్యతి।
సర్వాన్ శబ్దాన్ విజానాతి।
స ‘సంప్రసాద’ ఇతి ఆచక్షతే।

ప్రాణః శరీరమ్ పరిరక్షతి।

హరితస్య, నీలస్య, పీతస్య, లోహితస్య
శ్వేతస్య నాడ్యో, రుధిరస్య పూర్ణాః।

ధాత్ర ఏతత్ దహరం పుణ్డరీకం
కుముదమ్ ఇవా అనేకధా వికసిత।
యథా కేశః సహస్రధా భిన్నః
తథా ‘హితా’ నామ నాడ్యో భవన్తి॥

ఆ హృదయ మాంసము నందు ఆత్మ తన స్వరూప స్వభావములను ఏమరచి నిదురించినప్పుడు శబ్దము చేయును. రెండవ సం-కోశము (విభాగము) నందు నిదురించుచున్నప్పుడు ఇహలోకమును, పరలోకమును దర్శించుచున్నాడు. ఆ ఆత్మ పురుషుడు సర్వశబ్దములను తెలుసుకొనుచున్నాడు. అద్దానిని ‘సంప్రసాదము’ అని పిలుస్తారు. (ఆత్మ తనను తాను ప్రక్కగా పెట్టుకొని ద్వితీయమును కల్పించుకొని దర్శించుటయే “సంప్రసాదము”).

ఆత్మయొక్క శక్తి రూపమగు ప్రాణము శరీమును రక్షించుచున్నది.

హృదయకోశము - హరితము (పచ్చని) నీలము, నల్లని, పసుపు పచ్చని, ఎర్రని, తెల్లని, నాడులు కలిగి ఉండి, వాటిలో రక్తము నిండియున్నది.

ఈ హృదయ మాంస పిండము గల దహరము (భావనా జనన స్థానమగు దహరాకాశము) తామర మొగ్గవలె, కలువ పువ్వు వలె అనేక విధములుగా వికశించి ఉన్నది. ఒక తల వెంట్రుక ’వెయ్యి’గా చీలిస్తే ఎట్లా ఉంటుందో, హృదయ కోశము నుండి బయల్వెడలు 10 నాడులయొక్క ’72000’ ఉపనాడులు అట్టి పరిమాణములో ఉంటున్నాయి.

3.) హృత్-ఆకాశే పరే కోశే దివో
అయమ్ ఆత్మా స్వపితి యత్ర సుప్తో..,
- న కంచన కామం కామయతే।
- న కంచన స్వప్నం పశ్యతి।
- న తత్ర దేవా, న దేవలోకా, న యజ్ఞా వా,
- న మాతా, న పితా, న బంధుః,
- న బాంధవో, న స్తేనో,
- న బ్రహ్మహా తేజస్కాయమ్,
- అమృతం సలిల ఏవ।

ఇదం సలిలం వనం భూయః
తేనైవ మార్గేణ అజాగ్రాయ
ధావతి ‘సామ్రాట్’ ఇతి। హో వాచ॥

అట్టి హృదయాకాశమునందు - సర్వకోశములకు, దివ్యలోకములకు వేరైన కోశమునందు ఆత్మ సుషుప్తిని పొందుచున్నది.
అట్టి సుప్తస్థితిలో…
- ఏ కోరికలు కోరుకోడు. (జాగ్రత్త ఉండదు)
- ఏ స్వప్నానుభవ దృశ్యము ఉండదు.
- అక్కడ దేవతలు - దేవలోకములు కూడా లేవు.
- యజ్ఞము ఇత్యాది క్రియ-కార్యక్రమాలు ఉండవు.
- తల్లి - తండ్రి - బంధువుల బాంధవ్యములు కూడా ఉండవు.
- అక్కడ దొంగ (మనో భావకుడు) లేడు. బ్రహ్మలేరు. సృష్టి లేదు. తేజోదేహము లేదు.
- అది అమృతమయము. (మార్పుకు సంబంధించనిది)
- అమృతమే జలము. జలమే (సలిలమే) అమృతము.

ఆ అమృతమే జలము, వనము కూడా! ఆ మార్గమున ‘అజాగ్రము’ (జన్మరాహిత్య స్థానము)నకు వెళ్లువాడు ‘సామ్రాట్’ అని చెప్పబడుచున్నాడు.

పంచమః ఖండః

1.) స్థానాని స్థానిభ్యో యచ్ఛతి।
నాడీ తేషాం నిబన్ధనమ్।

సర్వత్రా స్థానము గలవానికి (దేహమున) స్థానము ఇవ్వబడుచున్నది.
వాటికి నిబంధనము (కట్టబడిన త్రాళ్లు) - నాడులు.

చక్షుః అధ్యాత్మం।
ద్రష్టవ్యమ్ అధిభూతమ్।
ఆదిత్యః తత్రా అధిదైవతమ్।
నాడీ తేషాం నిబన్ధనమ్।

యః చక్షుసి, యో ద్రష్టవ్యే,
య ఆదిత్యే, యో నాడ్యాం,
యః ప్రాణే, యో విజ్ఞానే,
య ఆనన్దే యో హృద్యాకాశే,
య ఏతస్మిన్ సర్వస్మిన్
అన్తరే సంచరతి, సోఽయమ్ ఆత్మా
తమ్ ఆత్మానమ్ ఉపాసీతా..,
అజరమ్, అమృతమ్, అభయమ్,
అశోకమ్, అనంతం||

చక్షురింద్రియము (చూపు) → అధ్యాత్మము!
చూడబడునది → అధిభూతము!
ఆదిత్యుడు (ఆది-తు-యః = మొట్టమొదటే ఉన్నవాడు) → అధిదైవతము!
వాటికి నాడులు నిబంధనము.

ఏదైతే చక్షువులయందును, (ఇంద్రియములందు), చూడబడుచున్న దానియందును, ఆధిదైవతమగు ఆదిత్యునియందును, నాడియందును, ప్రాణము (శక్తి) యందును, విజ్ఞానము (ఎరుక) యందును, ఆనందము (Experiencing) యందును, హృదయాకాశమునందును ఈ సర్వమునందును, దీని అంతరమునందును సంచరించుచున్నదో.. (లేక ఏ తత్త్వముయొక్క పురుషకారము ఆక్రమించుకొనినదై ఉన్నదో) - అదియే ‘ఆత్మ!

అట్టి ఆత్మ జన్మరహితము కాబట్టి అజరము (కదలికలు లేనిది కూడా). మరణ రహితము కాబట్టి అమృతము. సర్వరక్షకము కాబట్టి అభయము. దుఃఖములన్నీ అద్దాని ఎరుకచే తొలగుతాయి కాబట్టి అశోకము. అద్దానికి ఆది-అంతములు లేవు, కనుక ‘అనంతం’.

అదియే ఉపాస్యము.

శ్రోత్రమ్ అధ్యాత్మమ్।
శ్రోతవ్యమ్ అధిభూతమ్।
దిశః తత్ర అధిదైవతమ్।
నాడీ తేషాం నిబన్ధనమ్।

యః శ్రోత్రే, యః శ్రోతయితవ్యే,
యో దిక్షు, యో నాడ్యాం, యః ప్రాణే, యో విజ్ఞానే,
య ఆనన్దే, యో హృద్యాకాశే, య ఏతస్మిన్ సర్వస్మిన్
అన్తరే సంచరతి.. సోఽయమాత్మా
తమ్ ఆత్మానమ్ ఉపాసీత
అజరమ్, అమృతమ్, అభయమ్ అశోకమ్, అనంతం||

వినబడటము → అధ్యాత్మము
వినబడుచున్నదంతా → అధిభూతము!
పది దిక్కులు కూడా → అధిదైవతము!
వాటికి నాడులు నిబంధనము!

చెవులయందు, వినబడుచున్నదానియందు, దిక్కులయందు, నాడులయందు, ప్రాణము నందు, విజ్ఞానమునందు, ఆనందమునందు, హృదయాకాశము నందు.. వాటి యొక్క అన్నిటి అంతరమునందు ఏది స్వయం ప్రభాభాసమై సంచరించుచున్నదో.. అదియే ఆత్మ! జరామరణ రహితము, అభయము, అశోకము, అనంతం అగు అట్టి ఆత్మయే ఉపాసించవలసినట్టి వస్తువు. అన్యము కాదు.

నాసా అధ్యాత్మం।
ఘ్రాతవ్యమ్.. అధిభూతమ్।
పృథివీ తత్ర.. అధి దైవతమ్।
నాడీ తేషాం.. నిబన్ధనం।

యో నాసాయాం, యో ఘ్రాతవ్యే,
యః పృథ్వివ్యాం యో నాడ్యాం,
యః ప్రాణే, యో విజ్ఞానే య ఆనన్దే..
యో హృద్యాకాశే..,
య ఏతస్మిన్ సర్వస్మిన్
అన్తరే సంచరతి, సో అయమాత్మా!
తమ్ ఆత్మానమ్ ఉపాసీతా, అజరమ్, అమృతమ్,
అభయమ్, అశోకమ్, అనంతం||

వాసన ధర్మము గల ముక్కు స్థానము → అధ్యాత్మము.
వాసనగా పొందబడుచున్నది → అధిభూతము.
పృధివి (వాసన స్థానము) → అధిదైవతము.
నాడులు - అద్దాని నిబంధనము.

ఈ ముక్కు నందు, వాసన చూడబడుచున్నదానియందు, పృథివియందు, నాడులయందు, ప్రాణశక్తియందు, తెలివి (విజ్ఞానము) నందు, ఆనన్దము నందు, హృదయాకాశము నందు ఏదైతే కేవల చిత్స్వరూపమై సంచరిస్తోందో.. అదియే ‘ఆత్మ’. ఇవన్నీ ఎద్దాని రూపమో… అదియే ఆత్మ!
అజరము - అమృతము
అభయము - అశోకము
అనంతము అగు ఆత్మవస్తువే ఉపాసించవలసినట్టిది.

2.) జిహ్వా అధ్యాత్మమ్।
రసయితవ్యమ్.. అధిభూతం।
వరుణః తత్ర.. అధిదైవతమ్।
నాడీ తేషామ్.. నిబన్ధనమ్।

యో జిహ్వాయాం, యో రసయితవ్యే,
యో వరుణే, యో నాడ్యాం, యః ప్రాణే, యో విజ్ఞానే,
య ఆనన్దే, యో హృద్యాకాశే య ఏతస్మిన్ సర్వస్మిన్
అన్తరే సఞ్చరతి, సో అయమ్ ఆత్మా
తమ్ ఆత్మానమ్ ఉపాసీతా
అజరమ్, అమృతమ్, అభయమ్, అశోకమ్, అనంతం||

రుచి - నాలుక → అధ్యాత్మము.
రుచి చూడబడటము రుచిచూడబడుచున్నవి → అధిభూతము.
వరుణ భగవానుడు → అధిదైవతము.
- ఆ రెండు నిబంధించబడినది - నాడుల చేత, రుచి చూస్తున్న ఈ నాలుకలో, రుచి చూడబడుచున్న వస్తువులో, రుచి ప్రదాతయగు వరుణదేవునిలో, ఆ రుచి చూచే క్రియకు కాలవలసిన శక్తియందు, అద్దాని ఎరుక యందు, రుచి యొక్క అనుభూతియందు, అవన్నీ ఏర్పడి ఉన్న హృదయాకాశము (దహరాకాశము) నందు.. అంతరముగా ఏది స్వానందరూపంగా సంచరిస్తోందో.. అదియే ‘ఆత్మ’!
అది అజరము, అమృతస్వరూపము, అభయము, అశోకము, అనంతం.
అట్టి ఆత్మయే ఉపాస్య వస్తువు. ఈ జీవుడు ఉపాసించవలసినది అద్దానినే!

3.) త్వక్ అధ్యాత్మమ్।
స్పర్శయితవ్యమ్ అధిభూతమ్।
వాయుః తత్ర అధిదైవతమ్।
నాడీ తేషామ్ నిబన్ధనమ్

యస్తు వచి (యస్త్వంచి), యః స్పర్శయితవ్యే,
యో వాయౌ, యో నాడ్యామ్, యః ప్రాణే, యో విజ్ఞానే,
య ఆనన్దే, యో హృద్యాకాశే,
య ఏతస్మిన్ సర్వస్మిన్ అన్తరే సఞ్చరతి..,
సోఽయమాత్మా!
తమ్ ఆత్మానమ్ ఉపాసీతా
అజరమ్ అమృతమ్, అభయమ్, అశోకమ్, అనంతం||

స్పర్శ (చర్మము) → అధ్యాత్మము.
స్పర్శచే అనుభూతమగుచున్నది → అధిభూతము.
వాయుదేవుడు అద్దానియొక్క → అధిదైవతము.
నాడీ సమూహము అద్దాని - నిబంధనము.

ఏదైతే చర్మము నందు, స్పర్శించబడు వస్తువుల యందు, అధిదేవతయగు వాయువునందు, అద్దానిని కదిల్చే చైతన్యమగు ప్రాణ శక్తియందు,
స్పర్శ యొక్క విజ్ఞాతము (ఎరుకయందు), అద్దాని అనభవము నందు, అవన్నీ ఉనికి కలిగియున్న హృదయ (దహర) ఆకాశము నందు ఏదైతే తేజోరూపమై సంచారములు చేయుచున్నదో.. అదియే ‘ఆత్మ’!
అట్టి ఆత్మను-అజరము, అమృతము, అభయము, అశోకము, అనంతంగా ఉపాసించెదరు గాక!

4.) మనో అధ్యాత్మమ్!
మన్తవ్యమ్ అధిభూతమ్।
చంద్రః తత్ర అధిదైవతం।
నాడీ తేషామ్ నిబన్ధనమ్।

యో మనసి, యో మన్తవ్యే
యః చంద్రే, యో నాడ్యాం
యః ప్రాణే, యో విజ్ఞానే,
య ఆనన్దే, యో హృద్యాకాశే
య ఏతస్మిన్ సర్వస్మిన్ అన్తరే సఞ్చరతి..,
సోఽయమాత్మా! తమ్ ఆత్మానమ్ ఉపాసీతా..,
అజరమ్, అమృతమ్ అభయమ్, అశోకమ్, అనంతం||

ఆలోచనా శక్తి - స్వభావము → అధ్యాత్మము.
ఏది ఆలోచించబడుతోందో అది → అధిభూతము
అద్దానికి చంద్ర భగవానుడు → అధి దైవతము
దేహములోని నాడులు - అద్దాని నిబంధనము.

అట్టి మనస్సు నందు, ఆ మనస్సు ఆలోచించుచున్న విషయములందు, మనస్సుకు అధిదేవతయగు చంద్రునియందు, మనోసంబంధితమైన నాడులయందు, అవన్నీ పని చేయటానికి కావలసిన ప్రాణశక్తి యందు, అద్దాని ‘ఎరుక’ యందు, అద్దాని ఆనన్దము (అనుభూతము) నందు, అవన్నీ ఏర్పడియున్న హృదయాకాశమునందు, వాటి అన్నిటికీ అన్తరంగాను ఏది స్వయం చైతన్యమై సంచారములు చేయుచున్నదో, అదియే ‘ఆత్మ’.
అజరము - అమృతము - అభయము - అశోకము - అనన్తము అగు అట్టి ఆత్మనే ఉపాశించాలి.

బుద్ధిః అధ్యాత్మమ్।
బోధవ్యమ్.. అధిభూతమ్।
బ్రహ్మా తత్రా.. అధిదైవతమ్।
నాడీ తేషాం.. నిబన్ధనమ్।

యో బుధౌ, యో బోద్ధవ్యే,
యో బ్రహ్మణి, యో నాడ్యాం
యః ప్రాణే, యో విజ్ఞానే
య ఆనన్దే, యో హృద్యాకాశే
య ఏతస్మిన్ సర్వస్మిన్ అన్తరే సఞ్చరతి..
సోఽయమాత్మా! తమ్ ఆత్మానమ్ ఉపాసీతా
అజరమ్, అమృతమ్, అభయమ్, అశోకమ్, అనంతం||

ఈ బుద్ధి → అధ్యాత్మ స్వరూపము.
బుద్ధికి అవగతమగుచున్నదంతా → అధిభూతము.
బ్రహ్మదేవుడు అద్దానికి → అధిదైవతము.
నాడీ విభాగము అద్దాని నిబంధనము.

అట్టి బుద్ధియందు, ఆ బుద్ధిచే నిర్ణయాత్మకమగుచున్న సర్వమునందు, బుద్ధిచే తెలియబడుచున్న వాటియందు, బుద్ధి యొక్క అధిదేవతయగు బ్రహ్మదేవుని యందు,తత్సంబంధమైన దేహములోని నాడుల యందును, ప్రాణశక్తి యందును, వాటి విజ్ఞానము (ఎరుక) యందును, వాటి అనుభవము (ఆనన్దము) యందును, అవన్నీ ఉన్నట్టి స్థానము (హృదయాకాశము) నందును, వాటన్నిటి అంతరంగానూ ఏది సర్వదా స్వానందరూపమై సంచారము చేయుచున్నదో అదియే ‘ఆత్మ’.
అజరము అమృత స్వరూపము, అభయము, అశోకము, అనన్తము అగు అట్టి ఆత్మయే సర్వదా ఉపాసించవలసిన వస్తువు.

అహంకారో అధ్యాత్మమ్।
‘అహమ్ కర్తవ్యమ్’.. అధిభూతమ్।
రుద్రః తత్రా.. అధిదైవతమ్।
నాడీ తేషాం.. నిబన్ధనమ్।

యో అహంకారే, యో అహమ్ కర్తవ్యే,
యో రుద్రే, యో నాడ్యాం,
యః ప్రాణే, యో విజ్ఞానే,
య ఆనన్దే, యో హృద్యాకాశే,
య ఏతస్మిన్, సర్వస్మిన్ అంతరే సఞ్చరతి..
సోఽయమాత్మా!
తమ్ ఆత్మానమ్ ఉపాసీతా
అజరమ్, అమృతమ్, అభయమ్, అశోకమ్, అనంతం||

అహంకారము (అహం స్వరూపము) → అధ్యాత్మము.
‘నాకు భోక్తృత్వము - కర్తృత్వము ఉన్నది’ అనునదే → అధిభూతము.
రుద్ర భగవాడును → అధిదైవతము.
అద్దాని దేహములోని నాడులు నిబంధనము.

ఏదైతే - అట్టి అహంకారము నందు ‘అహమ్ కర్తవ్యము’ నందును, అధి దేవతయగు రుద్రదేవుని యందు, ఆ సంబంధితములైన నాడులయందును, ‘శక్తి’ రూపప్రాణమునందును, అహంకారము యొక్క ’ఎరుక యందును, అద్దాని అనుభూతి యందును వాటన్నిటి యొక్క అంతరమున స్వస్వరూపమై ఏది సంచారము కలిగినదైయున్నదో.. అదియే ఆత్మ.
ఆత్మయే అన్ని రూపాలుగా ఉన్నదగుచున్నది.
అది అజరము అమృతస్వరూపము, అభయము, అశోకము, అనన్తము కూడా.
అట్టి ఆత్మయే ఎల్లరకు సర్వదా ఉపాసనా వస్తువు అయి ఉన్నది.

5.) చిత్తమ్ అధ్యాత్మమ్।
చేతయితవ్యమ్.. అధిభూతమ్।
క్షేత్రజ్ఞః తత్రా.. అధిదైవతమ్।
నాడీ తేషామ్.. నిబన్ధనమ్।

యః చిత్తే, యః చేతయితవ్యే,
యః క్షేత్రజ్ఞే, యో నాడ్యాం, యః ప్రాణే, యో విజ్ఞానే,
య ఆనన్దే, యో హృద్యాకాశే,
య ఏతస్మిన్, సర్వస్మిన్, అన్తరే సఞ్చరతి,
సోఽయమాత్మా! తమ్ ఆత్మానమ్ ఉపాసీతా
అజరమ్, అమృతమ్, అభయమ్, అశోకమ్, అనన్తమ్||

చిత్తము → అధ్యాత్మము.
ఈ చిత్తము ఏదేది చింతన చేయుచున్నదో.. అదంతా కూడా → అధిభూతము.
సర్వక్షేత్రములలోని క్షేత్రజ్ఞుడు → అధిదైవతము.
తత్సంబంధమైన దేహములోని నాడులు - నిబన్ధనము.

ఏదైతే చిత్తమునందు, చిత్తము వ్రాలుచున్న విషయములందు, సర్వ దేహములలోని క్షేత్రజ్ఞునియందు, చిత్త సంబంధమైన నాడులయందు, ప్రాణశక్తి యందు, చిత్తసంబంధమైన విజ్ఞానము (లేక ఎరుక) యందు, అద్దాని అనుభూతి యందు, అవన్నీ ఏర్పడి ఉన్న హృదయాకాశము నందు - వాటన్నిట్టి యొక్క అంతరముగా ఏర్పడి ఉన్నదో, అట్టి స్వకీయ సత్తా రూపమై సంచరించుచున్న తత్త్వమే ఆత్మ.
అజరము, అమృతము, అభయము, అశోకము, అనన్తము అగు అట్టి ఆత్మయే ఉపాసించవలసినట్టిది.

వాక్ అధ్యాత్మమ్।
వక్తవ్యమ్.. అధిభూతమ్।
అగ్నిః తత్రా .. అధిదైవతమ్।
నాడీ తేషామ్ నిబన్ధనమ్।

యో వాచి, యో వక్తవ్యే యో అగ్నౌ,
యో నాడ్యాం, యః ప్రాణే,
యో విజ్ఞానే, య ఆనన్దే, యో హృద్యాకాశే..,
య ఏతస్మిన్ సర్వస్మిన్ అన్తరే సఞ్చరతి..,
సోఽయమాత్మా! తమ్ ఆత్మానమ్ ఉపాసీతా..
అజరమ్, అమృతమ్, అభయమ్, అశోకమ్, అనన్తమ్||

వాక్ శక్తి → అధ్యాత్మము.
చెప్పటము అనునది → అధిభూతమ్.
అగ్నిదేవుడు → అధిదేవత.
దేహనాడులు - నిబంధనము.

వాక్కులోను, చెప్పబడుచున్న మాటలయందును, వాటి అర్థ-ఉద్దేశ్యములయందు, అధిదేవతయగు అగ్నియందు, నాడులందు, ప్రాణతత్యము నందు, మాటల ఎరుకయందు, శబ్దాననుభవము నందు, అవన్నీ ఏర్పడి ఉన్న హృదయాకాశమునందును - ఏది అంతర్లీనమై స్వానుభవ రూపి అయి సంచరించుచున్నదో - అదియే ‘ఆత్మ’. అట్టి ఆత్మ అజరము అమృతము. అభయ స్వరూపము. అశోకము. అనన్తము కూడా!

6.) హస్తాః అధ్యాత్మమ్।
ఆదాతవ్యమ్.. అధిభూతమ్।
ఇంద్రః తత్రా అధిదైవతమ్।
నాడీ తేషామ్ నిబన్ధనమ్।

యో హస్తే, య ఆదాతవ్యే,
య ఇన్ద్రే, యో నాడ్యాం, యః ప్రాణే
యో విజ్ఞానే, య ఆనన్దే, యో హృద్యాకాశే..
య ఏతస్మిన్ సర్వస్మిన్ అన్తరే సఞ్చరతి..
సోఽయమాత్మా! తమ్ ఆత్మానమ్ ఉపాసితా..
అజరమ్, అమృతమ్, అభయమ్, అశోకమ్, అనన్తమ్॥

హస్తములు (చేతులు) → అధ్యాత్మము.
చేతులతో స్వీకరించుచున్నదంతా పట్టుకొనుచున్నదంతా → అధిభూతము.
ఇంద్ర దేవుడు → అధిదైవతము.
అద్దాని దేహములోని నాడులు - నిబంధనములు.

ఈ చేతులు, ఈ చేతులతో పట్టుకోబడుచున్న వస్తువులు, హస్తముల అధిదేవతయగు ఇంద్రభగవానుడు, చేతులకు సంబంధించిన నాడులు, ప్రాణశక్తి, జ్ఞానము (ఎరుక), సంబంధించిన ఇవన్నీ ఏర్పడియున్న హృదయాకాశము - వీటన్నిటియొక్క అంతరమున అనుభవి అయి సంచారము కలిగి ఉన్నట్టిదే ఆత్మ. అట్టి ఆత్మను అజరము-అమృతము-అభయము-అశోకము- అనన్త లక్షణములతో ఉపాసించాలి.

7.) పాదాః అధ్యాత్మమ్।
గన్తవ్యమ్.. అధిభూతమ్।
విష్ణుః తత్రా.. అధిదైవతమ్।
నాడీ తేషామ్ నిబన్ధనమ్।

యః పాదే, యో గన్తవ్యే,
యో విష్ణౌ, యో నాడ్యాం, యః ప్రాణే, యో విజ్ఞానే,
య అనన్దే, యో హృద్యాకాశే,
య ఏతస్మిన్ సర్వస్మిన్ అన్తరే సఞ్చరతి
సోఽయమాత్మా! తమ్ ఆత్మానమ్ ఉపాసీతా..
అజరమ్, అమృతమ్, అభయమ్ అశోకమ్, అనన్తమ్॥

పాదములు → అధ్యాత్మము.
నడుస్తూ వెళ్లు ప్రదేశము → అధిభూతము.
విష్ణుభగవానుడు → అధిదైవతము.
దేహములోని నాడి - నిబన్ధనము.

పాదములయందు, నడుచుచున్న ప్రదేశము నందు, దైవమగు విష్ణువునందు, దేహలోని పాద సంబంధమైన నాడులందు, ప్రాణశక్తి యందు, విజ్ఞానము (ఎరుక)యందు, అనుభూతియందు.. వాటన్నిటి అంతరమునందు ఉనికి - ఎరుక - ఆనందములతో కూడి సంచారము చేస్తున్నది ఆత్మయే! అజరము, అమృతము, అభయము, అశోకము అగు ఆత్మయే ఉపాసన వస్తువు.

పాయుః అధ్యాత్మమ్।
విసర్జయితవ్యమ్ - అధిభూతమ్।
మృత్యుః తత్రా.. అధిదైవతమ్।
నాడీ తేషామ్.. నిబన్ధనమ్।

యః పాయౌ, యో విసర్జయితవ్యే,
యో మృత్యౌ, యో నాడ్యాం,
యః ప్రాణే, యో విజ్ఞానే, య ఆనన్దే, యో హృద్యాకాశే,
య ఏ తస్మిం తు సర్వస్మిన్ అన్తరే సఞ్చరతి..,
సోఽయమాత్మా! తమ్ ఆత్మానమ్ ఉపాసీతా..,
అజరమ్, అమృతమ్, అభయమ్, అశోకమ్, అనన్తమ్॥

పాయువు (విసర్జనము) → అధ్యాత్మము.
విసర్జించబడునది → అధిభూతము.
మృత్యువు (యముడు) → అధిదేవత.
నాడులు - నిబంధనము.

ఎవ్వరైతే-పాయువు (విసర్జనావయము)నందు, విసర్జించబడుదానియందు, మృత్యువునందు, నాడులందు, ప్రాణశక్తియందు, ఎరుక యందు, అనుభవమునందు, హృదయాకాశమునందు వాటి యొక్క అంతరమునందు కూడా చిత్-చైతన్యమై సంచరించుచున్నదో అదియే ఆత్మ. అట్టి జన్మమృత్యువులు లేని అమృతమ్ అభయమ్-అశోకమ్-అనన్తమ్ ఆత్మయే ఎల్లప్పుడు ఉపాసించవలసిన వస్తువు.

8.) ఉపాస్థో అధ్యాత్మమ్।
ఆనన్దయితవ్యమ్.. అధిభూతమ్।
ప్రజాపతిః తత్రా.. అధిదైవతమ్।
నాడీ తేషామ్.. నిబన్దనమ్।

య ఉపస్థే, య ఆనన్దయితవ్యే,
యః ప్రజాపతౌ, యో నాడ్యాం
యః ప్రాణే, యో విజ్ఞానే, య ఆనన్దే, యో హృద్యాకాశే
య ఏతస్మిన్ సర్వస్మిన్ అన్తరే సఞ్చరతి..
సోఽయమాత్మా! తమ్ ఆత్మానమ్ ఉపాసీతా..,
అజరమ్, అమృతమ్, అభయమ్, అశోకమ్, అనన్తమ్॥

ఉపస్థ (మర్మాంగ) → అధ్యాత్మము.
ఆనందించబడునది → అధిభూతము.
ప్రజాపతి → అధిదైవము.
నాడులు - నిబంధనము.

ఏ తత్త్వమైతే ఉపస్థయందు, ఆనందించబడుచున్న దానియందు, ప్రజాపతియందు, నాడులయందు, ప్రాణశక్తియందు, ఎరుక- అనుభూతల యందు, హృదయాకాశమునందు, వాటి వాటి అంతరమున సర్వ ప్రకాశకమై సంచారము చేయుచున్నదో.. అదియే ‘ఆత్మ’. అదియే ఉపాసించతగినది. అది జరామరణ రహితమని, అభయమని, శోకరహితమని, ఆద్యంతరములు లేనట్టిదని ఎరిగి ఉపాసించాలి.

ఏష సర్వజ్ఞ! ఏష సర్వేశ్వర!
ఏష సర్వాధిపతిః! ఏషో అంతర్యామి!
ఏష యోనిః సర్వస్యః సర్వసౌఖ్యైః ఉపాస్య
మనో, న చ సర్వసౌఖ్యాన్ ఉపాస్యతి|
వేద-శాస్త్రైః ఉపాస్యమానో।
న చ వేదశాస్త్రాణి ఉపాస్యతి।
యస్యాత్ అన్నమిదమ్ సర్వమ్,
న చ యో అన్నమ్ భవత్యతః।

ఆట్టి సర్వము తానే అయి, సర్వమును ప్రకటిస్తూ - వెలిగించువాడై సర్వమునకు అంతర్యామి అయినట్టి ఆత్మ భగవానుడే సర్వజ్ఞుడు, సర్వ నియామకుడు. కాబట్టి సర్వేశ్వరుడు. సర్వమునకు అధిపతి కూడా! ఈ సర్వమునకు జనన స్థానము ఆత్మపురుషుడే కాబట్టి అంతటికీ యోని.

సర్వసుఖములను ఉపాసించు మనస్సు ఆయనయే అయినప్పటికీ ఆయన దేనినీ ఉపాసించనివాడు. వేదములు-శాస్త్రములు ఉపాసిస్తున్నది ఆయననే! అంతేగాని, ఆయన శాస్త్రములను ఉపాసించుట లేదు. ఆయన వేదశాస్త్రములు ఉపాసించే ధర్మము ఆపాదించలేము। 

ఎవ్వడికి ఈ కనబడేదంతా అనుభవరూపమో (అన్న స్వరూపమో), ఎవ్వడు అనుభవ రూపము కాడో (తాను అన్న రూపము కాడో)… దృశ్యము రూపము కాడో.. ఆయన ఆత్మ!

9.) పరం సర్వనయన ప్రశస్తాత్
అన్నమయో → భూతాత్మా,
ప్రాణమయ → ఇంద్రియాత్మా,
మనోమయః →సంఙ్కల్పాత్మా,
విజ్ఞానమయః → కాలాత్మా,
ఆనన్దమయో → లయాత్
ఆత్మా-ఏకత్వాత్|
నాస్తి ద్వైతం, కుతో మర్త్యమ్?
నాస్తి అమృతం కుతో నాశః?
న అన్తః ప్రజ్ఞో! న బహిః ప్రజ్ఞో!
న ఉభయతః ప్రజ్ఞో|
న ప్రజ్ఞానఘనో!
న ప్రజ్ఞో, న అప్రజ్ఞోపి
నో విదితం! వేద్యం నాస్తీతి।
ఏతత్ నిర్వాణమ్ అనుశాసనమ్|
ఇతి వేదాఽనుశాసనమితి!
ఇతి వేదాఽనుశాసనమ్ ॥

ఈ విధముగా ఆత్మ ఎటువంటిదంటే..
ఈ కళ్లకు కనిపించుచున్న అన్నమయ ప్రపంచానికి భూతాత్మగాను…,
- ప్రాణమయుడై ఇంద్రియాత్మగాను……
- మనోమయుడై సంకల్పాత్మగాను….
- విజ్ఞానమయుడై కాలాత్మగాను….,
లయాత్మకత్వముచేత ఆనందమయుడై ఉన్నారు. ఇన్నీ ఆత్మయే!

ఆత్మకు వేరుగా ఏదీ ద్వితీయమై లేదు. ద్వైతమే లేనప్పుడు, ‘మరణము’ అను స్వభావము (మర్త్యము) ఎక్కడిది? మృత్యువే లేనప్పుడు, అమృతము మాత్రము ఎక్కడిది, అంతా ఆత్మయే!

అట్టి ఆత్మ ఎట్టిదని చెప్పాలి? అది అంతః ప్రజ్ఞయా (Is it inside Intellect)? కాదు. లోపల గల మనోబుద్ధి చిత్త అహంకారములా? కాదు. బయట కనిపించే ప్రజ్ఞ కూడా కాదు. ఉభయ ప్రజ్ఞ కూడా కాదు. అట్టి ఆత్మ కేవల ప్రజ్ఞ కాదు. ’అప్రజ్ఞ’ కూడా కాదు.

అది తెలియబడునది, తెలుసుకోకలిగినది కూడా కాదు. తెలుసుకొంటున్నది, తెలియబడుచున్నది అదియే కదా! అట్టి ఆత్మ యొక్క అనుభవమే నిర్వాణము.

ఇది విదిత వేద్యుల నిర్ణయము, వేదములచే అనుశాసనము, ఆత్మ అనుభవమాత్ర సిద్ధము।

షష్టః ఖండః

1.) నైవ ఇహ కిఞ్చన అగ్ర అసీత్।
అమూలమ్, అనాధారా,
ఇమాః ప్రజాః ప్రజాయంతే।
దివ్యో దేవ ఏకో నారాయణః।

చక్షుశ్చ ద్రష్టవ్యం చ నారాయణః।
శ్రోత్రం చ, శ్రోతవ్యం చ నారాయణో।
ఘ్రాణశ్చ, ఘ్రాతవ్యం చ నారాయణో।
జిహ్వా చ రసయితవ్యం చ నారాయణో।
త్వక్ చ, స్పర్శయితవ్యం చ నారాయణో!
మనశ్చ-మన్తవ్యం చ నారాయణో
బుద్ధిశ్చ-బోధవ్యం చ నారాయణో
అహంకారశ్చ-అహం కర్తవ్యం చ నారాయణః।
చిత్తం చ - చేతయితవ్యం చ నారాయణో!
వాక్ చ - వక్తవ్యం చ నారాయణో।
హస్తా చ - ఆదాతవ్యం చ నారాయణః।
పాదౌ చ - గన్తవ్యం చ నారాయణః।
పాయుశ్చ - విసర్జయితవ్యం చ నారాయణ।
ఉపస్థశ్చ - ఆనన్దయితవ్యం చ నారాయణో।
ధాతా, విధాతా, కర్తా - వికర్తా - దివ్యో..,
దేవ ఏకో నారాయణః ॥

సృష్టికి మనుముందు ఆత్మ తప్పితే ఎక్కడా ఏదీ లేదు. ఏ ఒక్క మూలము, ఆధారము లేకుండానే ఈ జీవులంతా పుట్టుకొస్తున్నారు. ఏకములోంచి అనేకముగా పుట్టుచూ, ఇదంతా సర్వదా ఏకమే అయి ఉన్నది. ఏకమగు నారాయణ స్వరూపమే ఇదంతా కూడా! (మట్టి పోయి మట్టి బొమ్మలు రావు కదా).

చూచే కళ్ళు - ఆ కళ్లకు కనబడుచున్నది నారాయణుడే!
చెవులు - ఆ చెవులకు వినబడుచున్నదీ కూడా నారాయణుడే!
ఘ్రాణేంద్రియము (ముక్కు) - వాసనగా పొందబడుచున్నదీ కూడా నారాయణుడే!
ఈ నాలుక - నాలుకకు అనుభవమగుచున్న రుచి పదార్థములు నారాయణుడే!
ఈ చర్మము - స్పర్శానుభవరూపమగు వస్తు సముదాయము.. నారాయణుడే!
ఈ మనస్సు - అది రచిస్తూ ఉన్నట్టి విషయాలు కూడా నారాయణుడే!
ఈ బుద్ధి, బుద్ధికి తెలియబడుచున్నదంతా నారాయణుడే!
అహంకారము - ఇది ‘నా కర్తవ్యము’ అనిపిస్తున్నవన్నీ కూడా నారాయణుడే!
ఈ చిత్తము, చిత్తము ఆశిస్తున్నది, చిత్తమునకు ఇష్టమగుచున్నది.. అంతా నారాయణుడే!
వాక్కు - ఆ వాక్కుచే పలు కబడుచున్నదంతా కూడా నారాయణుడే!
చేతులు, చేతులతో పట్టుకోబడుచున్నవి - ఇవ్వబడుచున్నవి.. ఇవన్నీ నారాయణుడే!
పాదములు - నడకలు - నడతలు నారాయణుడే!
విసర్జకాయవమగు పాయువు - విసర్జించబడుచున్నది కూడా నారాయణుడే!
మర్మాంగము (ఉపస్థ), అద్దాని చేత ఆనందముగా పొందబడుచున్నదీ నారాయణుడే!
ధాత (మూల కర్తృత్వము) - విధాత (సృష్టికాల్పికుడు) - కర్త - అకర్త. ఇవన్నీ కూడా దివ్యదేహ దేవాదిదేవుడు ఏకోనారాయణుడే!

2.) ఆదిత్యా రుద్రా, మరుతో, వసవో, అశ్వినా, ఋచో, యజూగ్ంషి, సామాని, మన్త్రా అగ్నిః ఆజ్యమ్ ఆహుతిః నారాయణః। 

ఉద్భవః సంభవో, దివ్యో, దేవ - ఏకోనారాయణో।

మాతా, పితా, భ్రాతా, నివాసః శరణం, సుహృత్, గతిః నారాయణో।

విరాజా - సుదర్శనా - జితా - సౌమ్యా - మోఘా - కుమారా - అమృతా - సత్యా - సుమధ్యమా - నాసీరా - శిశుః - అసురా - సూర్యా - భాస్వతీ.. విజ్ఞేయాని నాడీ నామాని దివ్యాని।

గరతి, గాయతి వా, వర్షతి॥ (సర్వం నారాయణో॥)

ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, మరుత్ గణము, వస్తుతత్త్వ దేవతలు, అశ్వినీ దేవతలు, ఋక్కులు, యజస్సులు, సామగానములు, మంత్రములు, అగ్ని, అగ్నికి సమర్పించు ఆజ్యము (నెయ్యి) ఆహుతి.. అన్నీ నారాయణుడే!

ఉద్భవించుచున్నవి. సంభవించుచున్నవి, దివ్యమైనవి, దేవతలు.. ఏకోనారాయణుడే!

తల్లి తండ్రి, సోదరుడు, నివసించే ఇల్లు, శరణము (దిక్కు), సుహృత్, గతి - ఇవన్నీ నారాయణుడే!

దివ్యమగు దేహములోని ’నాడులు’అయినటువంటి - విరాజ, సుదర్శన; జిత; సౌమ్య; మోఘ; కుమార; అమృత; సత్యః సుమధ్యమ; నాసీర; శిశు; అసూర; సూర్య; భాస్వతి; - (మొదలుగా గల నాడులు) నారాయణుడే!

తాగేవి; పాడేవి; వర్షించేవి…. ఇవన్నీ నారాయణుడే!

3.) వరుణో అర్యమా చంద్రమా
కలా కవిః అర్థాదా(తా) (ధాతా)
బ్రహ్మా ప్రజాపతిః మఘవా
దివసాశ్చ, అర్ధ దివసాశ్చ
కలాః కల్పాశ్చ ఊర్ద్వంచ దిశశ్చ
సర్వం నారాయణః ।

పురుష ఏవ ఇదగ్ం సర్వం
యత్ భూతం, యచ్ఛ భవ్యం ।

తత్ విష్ణోః పరమం పదగ్ం
సదా పశ్యన్తి సూరయః ।

దివీవ చక్షుః ఆతతం ।

తత్ విప్రాసో విపన్యవో
జాగృవాగ్ంసః సమిన్థతే,
విష్ణోః యత్ పరమమ్ పదమ్ ।

తత్ ఏతత్ నిర్వాణా ।
అనుశాసనమ్ ఇతి ।
వేదా అనుశాసనమ్ ఇతి ।
వేదా అనుశాసనమ్ ॥

జలదేవత అగు వరుణుడు, పిత్రు దేవతయగు అర్యముడు, మనో అధి దేవతయగు చంద్రుడు, కల (Dream), కలకు ఆవల ఉన్నది, ఈవల ఉన్నది…, సృష్టికంతటికి కర్తయగు బ్రహ్మదేవుడు, ప్రజాపతి (జీవులకు పతి); మఘవుడు (ఇంద్రియాధిపతియగు ఇంద్రుడు); కల, కల్పనపైన ఉన్నది, క్రింద ఉన్నది, 10 దిక్కులు, ఆ పది దిక్కులలో ఏర్పడినది…. సర్వము నారాయణుడే!

ఇప్పుడు కనబడు సర్వము, ఇతః పూర్వము ఉండి ఉన్నది, ఇక ముందు ఉండబోయేది. సర్వము ఆ పరమపురుషుడే!

విద్వాంసులైన శూరులు ఎల్లప్పుడూ అంతట పరమపదమగు ఆ విష్ణుతత్త్వమునే చూస్తూ ఉన్నారు. ‘కనబడేదంతా అదే’ అని ఎరిగి ఉంటున్నారు.

ఆయన చక్షువులే దివ్యలోకములన్నీ వ్యాపించి ఉన్నవి.

పండితులైన, నిత్యానిత్యవివేకులైన, వేదార్థము తెలిసిన - విప్రులు సర్వదా జాగరూకులై ఆ విష్ణు పదమునే సర్వత్రా ఎరిగి, చూస్తూ, గమనిస్తూ పరమపద ధ్యానులై ఉంటున్నారు.

అట్టి ఆత్మయే నిర్వాణానుశాసనము.
అది ఎరుగుటయే నిర్వాణానుశాసనము.
వేదములు అనుశాసనము చేస్తున్నది ఆత్మగురించే!

సప్తమః ఖండః

1.) అన్తఃశరీరే నిహితో గుహాయామ్
అజ ఏకో నిత్యో ।

యస్య పృథివీ శరీరం,
యః పృథివీమ్ అంతరే సఇ్చరన్,
యం పృథివీ న వేద।

యస్య ఆపః శరీరమ్,
యో ఆపో అన్తరే సఞ్చరన్
యమ్ ఆపో అస్య న విదుః।

యస్య తేజః శరీరమ్,
యః తేజో అన్తరే సఞ్చరన్,
యం తేజో న వేద।

యస్య వాయుః శరీరమ్,
యో వాయుమ్ అన్తరే సఞ్చరన్,
యం వాయుః న వేద।

యస్య ఆకాశః శరీరమ్
య ఆకాశమ్ అన్తరే సఇ్చరన్
యం ఆకాశో న వేద।

ప్రతి శరీరమునందు అంతశ్శరీరుడై, హృదయ గుహయందు దాగి, జన్మరహితము, నిత్యము, అయి ఈ పృథివిని ఆ పరమాత్మ (లేక నారాయణుడు) తన శరీరముగా కలిగి ఉన్నారు.

పృధివినంతటా అంతరమున ఆత్మా నారాయణుడు సంచరించుచున్నప్పటికీ కూడా, పృథివికి ఆ తన అంతర్యామియగు నారాయణుని గురించి (పరమాత్మతత్వము గురించి తెలియుట లేదు.

జలము ఎవ్వని శరీరమో, జలమునందు అంతర్యామి అయి వసిస్తున్నారో, అయినప్పటికీ జలము ఎవ్వరిగురించి తెలుసుకొని ఉండుటలేదో. ఆయనయే
ఆత్మానారాయణుడు.

ఇక్కడి తేజస్సు ఎవ్వరి శరీరమై ఉన్నదో, ఎవ్వరు తేజస్సు యొక్క అంతరముగా సంచరిస్తున్నారో, అయినా కూడా తేజస్సు ఎవని గురించి ఎరుగుట లేదో, ఆయనే తేజో - శ్రీమన్నారాయణుడు.

ఎవనికి వాయువు శరీరమై ఉండి, వాయువుసందు అంతర్యామిగా సంచరిస్తున్నప్పటికీ, వాయువుకు ఆ విషయము గురించి ఆయన గురించి) తెలియుట లేదో ఆయనే వేదాన్త ప్రాణేశ్వర నారాయణుడు.

ఎవనికి ఆకాశమంతా తన శరీరమైయుండి, ఆకాశమునకు అంతర సంచారుడై ఉన్నారో, కానీ ఆకాశము అది గమనించటమే లేదో.. ఆయనే ఆకాశ శ్రీమన్నారాయణుడు.

యస్య మనః శరీరమ్,
యో మనో అన్తరే సఞ్చరన్,
యం మనో న వేద।

యస్య బుద్ధిః శరీరమ్,
యో బుద్ధిమ్ అన్తరే సఇ్చరన్,
యం బుద్ధిః న వేద।

యస్య అహంకారః శరీరమ్,
యో అహంకారమ్ అన్తరే సఞ్చరన్,
యమ్ అహంకారో న వేద।

యస్య చిత్తం శరీరం,
యః చిత్తం అన్తరే సఞ్చరన్,
యం చిత్తం న వేద।

ఎవనికి మనస్సు శరీరమై ఉండి, మనస్సు యొక్క అంతరమున సంచరిస్తున్నప్పటికీ మనస్సుకు ఆయన గురించి ఎరుక కలుగుట లేదో.. ఆయనే యోచనా వేదనారాయణుడు.

ఎవరికి బుద్ధి శరీరమై ఉండి, బుద్ధికి అన్తర- సంచారుడై ఉండగా కూడా, బుద్ధికి అది తెలియట లేదో ఆయనే బుద్ధి - ప్రజ్ఞా నారాయణుడు.

ఎవనికి అహంకారము శరీరమో అహంకారము యొక్క అంతరమున సన్చరిస్తున్నారో.. కానీ అహంకారమునకు అది తెలియవచ్చుటలేదో.. ఆయనే సోఽహమ్‌కార నారాయణుడు.

చిత్తము ఆయన శరీరమే అయి, అద్దానికి అంతరమున సంచారుడై ఉన్నప్పటికీ ఎవని గురించి చిత్తమునకు తెలియుట లేదో, ఆయనయే చిత్ చైతన్య
నారాయణుడు!

యస్య అవ్యక్తం శరీరమ్, యో అవ్యక్తమ్
అన్తరే సంచరన్,
యం అవ్యక్తం న వేద;

యస్యా అక్షరమ్ శరీరమ్
యో అక్షరమ్ అంతరే సంఇ్చరన్,
యం అక్షరమ్ న వేద;

యస్య మృత్యుః శరీరమ్,
యో మృత్యుమ్ అన్తరే సఞ్చరన్,
యం మృత్యుమ్ న వేద।

అవ్యక్తము ఎవరికి శరీరమై యుండి, అద్దానికి అన్తర సంచారుడై ఉండగా కూడా, అవ్యక్తము ఆయనను సందర్శించలేకపోతోందో, ఆయనే వ్యక్తావ్యక్త నారాయణుడు.

అక్షరము ఆయన శరీరమే. అక్షరములో అంతర్యామిగా ఉన్నారు. కానీ అక్షరమునకు ఆయన సంచారము తెలియవచ్చుట లేదు. ఆయనే అక్షర
నారాయణుడు.

మృత్యువు ఆయన శరీరమే అయి ఉండి, మృత్యువుకు అంతర్యామిగా ఆయన సంచరిస్తూ ఉండగా, మృత్యువుకు ఆయన గురించి ఎరుక కలగుట లేదు. ఆయనే అమృత నారాయణుడు! సర్వదా ఏకో నారాయణుడు!

2.) స ఏష సర్వభూతా అన్తరాత్మా,
అపహత పాప్మా, దివ్యో దేవ ఏకో నారాయణః॥

ఆయన సర్వ జీవరాసులకు అంతరాత్మ! దివ్యస్వరూపుడు! దేవాది దేవుడు! జీవుల దోషములను తొలగించువాడు!

ఏతాం విద్యాం అపాన్తరతమాయ దదా।
అపాన్తరతమో - బ్రహ్మణే దదౌ।
బ్రహ్మా - ఘోరాంగిరసే దదౌ।
ఘోరాంగిరా - రైక్వాయ దదౌ।
రైక్వో - రామాయ దదౌ।
రామః సర్వేభ్యో భూతేభ్యో దదాః।
ఇత్యేవం.. నిర్వాణమ్ అనుశాసనం।
ఇతి వేదానుశాసనమ్ ।
ఇతి వేదానుశాసనమ్ ||

ఆయనఆత్మ విద్యను (నారాయణ తత్త్వజ్ఞానమును) అపాన్తరతమాయునకు ప్రసాదించారు.
అపాంతరమాయుడు ఆ విద్యను సృష్టికర్తయగు బ్రహ్మదేవునికి ఇచ్చారు.
బ్రహ్మదేవుడు ఘోరాంగిరసునకు ఇచ్చారు.
ఘోరాంగిరసుడు అట్టి ఆత్మానారాయణ విద్యను రైక్యునకు ప్రసాదించారు.
రైక్వుడు రామచంద్రునకు ఇచ్చారు.
ఆ రాముడు (సర్వజీవులను ప్రేమించుచూ, లోకో రమయతి ఇతి - కాబట్టి) సర్వ జీవులకు ప్రసాదించుచున్నారు.
ఇది నిర్వాణ (మోక్ష)మార్గ అనుశాసనము.
వేదములచే ఎలుగెత్తి గానము చేయబడుచున్నా వేదవాక్ నిర్వచనము.

అష్టమః ఖండః

1.) అన్తశ్శరీరే నిహితో గుహాయాం
శుద్ధః, సోఽయమాత్మా

సర్వస్య మేదో, మాంస క్లేదాన కీర్ణే,
శరీరమధ్యే అత్యంత ఉపహితే,
చిత్రభిత్తి, ప్రతీకాశే గంధర్వ నగరోపమే,
కదళీ గర్భవత్ నిస్సారే,
జల బుద్బుదవత్ చంచలే,
నివసనన్తమ్ ఆత్మానమ్..!

అచిన్త్య రూపమ్; దివ్యమ్; దేవమ్; అసంగమ్;
శుద్ధమ్, తేజసః కాయమ్,
సర్వ రూపమ్; సర్వేశ్వరమ్; అచిన్త్యమ్; అశరీరమ్;
నిహితం గుహాయామ్;
అమృతం; విభ్రాజమానమ్; ఆనందమ్;
తం పశ్యతి విద్వాంసః।

తేన యేన పశ్యన్తి?

పరమశుద్ధమగు ఆ ఆత్మాదేవుడగు శ్రీమన్నారాయణుడు ఈ శరీరములోనే హృదయగుహ సర్వదా ప్రకాశమానుడై వేంచేసి ఉన్నారు.

ఈ భౌతిక దేహము మేదస్సు (క్రొవ్వు) - మాంసమయమై తడితో కూడుకుని ఉన్నది కదా! అట్టి ఈ దేహము యొక్క మధ్య భాగమున బొమ్మలు చిత్రించబడిన గోడవలె, గంధర్వ నగరము వలె, అరటి స్తంభము వలె నిస్సారమైన సంసారకల్పన ఉన్నది. జలములో బుడగవలె అతి చంచలముగా ఉన్నది. అట్టి సంసారాంతర్గత వస్తువు అగు ఈ దేహములో ఆత్మ - నివాసము కలిగి ఉన్నది.

అట్టి ఆత్మ-అచిన్త్య రూపము. దివ్యము. దేవతాస్వరూపము. దేనికీ సంబంధించక సంగరహితమై యున్నది. పరమశుద్ధము.. చీకట్లన్నీ పటాపంచలు చేయు దివ్య తేజోరూపము, సర్వము తన స్వరూపముగా కలిగి ఉన్నట్టిది. సర్వమునందు అంతర్హితముగా విస్తరించి ఉన్నట్టిది. మనస్సుకు విషయము కాక, భావాతీతమై ఉన్నట్టిది. ఉపాధి రహితము. హృదయగుహ యందు మౌనముగా దాగి ఉన్నది. మనోబుద్ధులకు సాక్షిగా చక్షువులకు అందనిదై ఉన్నది. అమృతస్వరూపమై, సర్వత్రా ఎదురుగా విభ్రాజమానమై ఉన్నది. ఆనంద స్వరూపము. విద్వాంసులగు విజ్ఞులు ఈ సర్వమును అట్టి ఆత్మగా దర్శించుచున్నారు.

అట్టి ఆత్మను దేనితో దర్శిస్తున్నారు? భౌతిక చక్షువులతోనా? ఏది అంతా సాక్షి అయి అంతా చూస్తోందో, విద్వాంసుడు అద్దానిని సాక్షి అయి చూస్తున్నాడు. ఆత్మ అయి ఆత్మను దర్శించుచున్నాడు. ఆయనను ఎవరు దర్శించగలరు?

నవమః ఖండః

1.) అథ హి ఏనం రైక్వః పప్రచ్ఛః
భగవన్। కస్మిన్ సర్వే అస్తం గచ్ఛంతి? ఇతి।

రైక్వుడు :   భగవన్! గురుదేవా! ఈ సర్వము తిరిగి దేనిలో అస్తమించుచున్నది?

తస్మైస హో వాచ :-
చక్షురేవా ఆప్యేతి యః చక్షురేవా అస్తమేతి!
ద్రష్టవ్యమ్ ఏవా ఆప్యేతి యో, ద్రష్టవ్యమేవా అస్తమేతి;
ఆదిత్యమేవా ఆప్యేతి య, ఆదిత్యమేవా అస్తమేతి;
విరాజమేవా ఆప్యేతి యో, విరాజమేవా అస్తమేతి;
ప్రాణమేవా ఆప్యేతి యః ప్రాణమేవా అస్తమేతి;
విజ్ఞానమేవ ఆప్యేతి యో విజ్ఞానమేవ అస్తమేతి;
అనన్ద మేవ ఆప్యేతి య, ఆనన్దమేవ అస్తమేతి;
తురీయమేవ ఆప్యేతి యః, తురీయమేవ అస్తమేతి;
తత్ అమృతమ్; అభయమ్; అశోకమ్; అనన్తం;
నిర్బీజమేవ ఆప్యేతి।
ఇతి హోవాచ ॥

గురువరేణ్యుడు :
➤ ఈ కళ్లు దేనిదేనిని దృశ్యముగా పొందుచున్నాయో అట్టి ఇదంతా కళ్లలోనే అస్తమిస్తున్నది. చూడబడుచున్నదంతా చూపుయందే అస్తమించుచున్నది. చూచుచున్నవానియందే చూడబడేది అయిస్తోంది.
➤ ద్రష్టవ్యము ఎవరు పొందుచున్నారో - ఆతనియందే ద్రష్టవ్యము లయిస్తోంది.
➤ ‘ఆదిత్యము’గా పొందబడేది ఆదిత్యునియందే అస్తమిస్తోంది.
➤ సూర్యకిరణములు వస్తువుపై పడి ఆ తర్వాత కిరణములు సూర్యుని యందేలయించున్నట్లుగా, ఏది విరాజమానము (Manifestation) అగుచున్నదో, అదంతా విరాజమై ఆ విరాజమానత్వమునందే అస్తమించుచున్నది. ఆ విరాజమానమగుచున్న దానిలో అయిస్తోంది.
➤ ఏది ప్రాణము పొందుచున్నదో - అట్టి దానియందే (ఆత్మయందే) ప్రాణము అస్తమించుచున్నది.
➤ ఏది ఆనందమును పొందుచున్నదో, అద్దానియందే ఆనన్దము అస్తమించుచున్నది.
➤ ఏది తురీయమును పొందుచున్నదో, తిరిగి తురీయము ఆతనియందే (ఆత్మయందే) అస్తమించుచున్నది.
➤ ఎందులో ఇవన్నీ బయల్వెడలుచున్నాయో, అట్టి ఆత్మ అమృత స్వరూపము. అభయము. అశోకము. అనన్తము.
అప్పుడు ఆత్మ నిర్బీజమును పొందుచున్నది.

శ్రోత్రమేవ ఆప్యేతి యః శ్రోత్రమేవ అస్తమేతి।
శ్రోతవ్యమేవ ఆప్యేతి యః శ్రోతవ్యమేవ అస్తమేతి।
దిశమేవ ఆప్యేతి యో దిశమేవ అస్తమేతి।
సుదర్శనమేవ ఆప్యేతి యః, సుదర్శనమేవ అస్తమేతి।
అపానమేవ ఆప్యేతి యో అపానమేవ అస్తమేతి।
విజ్ఞానమేవ ఆప్యేతి యో, విజ్ఞానమేవ అస్తమేతి।
ఆనన్దమేవ ఆప్యేతి య, ఆనన్దమేవ అస్తమేతి।
తురీయమేవ ఆప్యేతి యః, తురీయమేవ అస్తమేతి।
తత్-అమృతమ్, అభయమ్, అశోకము, అనన్తమ్,
నిర్బీజమేవ ఆప్యేతి।
ఇతి హోవాచ ॥

➤ ఏది (ఆత్మయే) శ్రోతమును (వినికిడి) పొందినదో, అదియే శ్రోతమును అస్తమింపజేయుచున్నది.
➤ ఏది వినబడుచున్న దానిని పొందుచున్నదో, అది వినబడుచున్న దానిని తనయందు తిరిగి అస్తమింపజేయుచున్నది.
➤ ఏది దిక్కులను పొందుచున్నదో, అది దిక్కులను తిరిగి తనయందే అస్తమింపజేయుచున్నది.
➤ ఏది సుదర్శనము (సౌందర్యమును) పొందుచున్నదో ఆదియే సుదర్శనమును తనయందు అస్తమింపజేయుచున్నది.
➤ అపానమును పొందుచున్నట్టిదే అపానమును తిరిగి తనయందు అస్తమింపజేయుచున్నది.
➤ విజ్ఞానమును పొందుచున్నట్టిదే విజ్ఞానమును తనయందు అస్తమింజేయుచున్నది.
➤ ఆనందమును పొందుచున్నతత్వమే ఆనందమును అస్తమింపజేయుచున్నది.
➤ తురీయమును ఏది పొందుచున్నదో, అదియే తనయందు ఆ తురీయమును తనయందు అస్తమింపజేయుచున్నది.

అప్పుడు తిరిగి అమృతము, , అభయము, అశోకము, అనన్తము, నిర్బీజము అగు ఆత్మను పొందుచున్నది. ఆత్మ ఆత్మనే పొందుచున్నది. ఆత్మ ఆత్మయందే లయిస్తోంది.

2.) నాసామేవ ఆప్యాతియో నాసామేవ అస్తమేతి।
ఘ్రాతవ్యమేవ ఆప్యాతి యో ఘ్రాతవ్యమేవ అస్తమేతి
పృథివీమేవ ఆప్యేతి యో, పృథివీమేవ అస్తమేతి।
జితామేవ ఆప్యేతి యో, జితామేవ అస్తమేతి।
వ్యానమేవ ఆప్యేతి యో, వ్యానమేవ అస్తమేతి।
విజ్ఞానమేవ ఆప్యేతి యో, విజ్ఞానమేవ అస్తమేతి।
ఆనన్దమేవ ఆప్యేతి య, ఆనన్దమేవ అస్తమేతి।
తురీయమేవ ఆప్యేతి యః, తురీయమేవ అస్తమేతి।
తత్ అమృతమ్, అభయమ్, అశోకమ్, అనన్తమ్
నిర్బీజమేవ ఆహ్యేతి।
ఇతి హెూవాచ ॥

➤ ముక్కును పొంది ఆత్మయే ముక్కును ఆస్తమింపజేయుచున్నది.
➤ వాసన (Smell)ను పొందుచున్నదే వాసనను అస్తమింపజేయుచున్నది.
➤ (ఆత్మయే) పృథివిని పొందినదై, పృథివిని తన యందు అస్తమింపజేయుచున్నది.
➤ జితా (సానుకూల్యము-అనుభూతిని కల్పించుకొన్నట్టిదే - అట్టి సానుకూల్యత (జిత)ను మరల తనయందు అస్తమింపజేసుకొనుచున్నది.
➤ ఏది వ్యానప్రాణ ప్రసరణను ప్రవర్తింపజేయుచున్నదో అదియే వ్యానమును తనయందు అస్తమింపజేసుకొనుచున్నది.
➤ విజ్ఞానమును పొందుచున్న ఆత్మయే విజ్ఞానమును ఆస్తమింపజేయుచున్నది.
➤ ఆత్మ ఆనన్దమును ఒకప్పుడు పొందినదై, మరొకప్పుడు ఆనందమును ఉపసంహరిపజేస్తూ తనయందు ఆస్తమింపజేయుచున్నది.
➤ తురీయమును పొందిన పరతత్వమే తురీయమును అస్తమింపజేయుచున్నది.

ఆ విధముగా అస్తమింపజేయుచున్నప్పుడు ఆత్మ అమృతత్వమును అభయమును, అశోకమును, అనన్తమును పొందినదిగా అగుచున్నది. నిర్బీజస్వరూపమై వెలుగొందుచున్నది.

3.) జిహ్వామేవ ఆప్యేతి యో, జిహ్వామేవ అస్తమేతి।
రసయితవ్యమేవ ఆప్యేతి యో, రసయితవ్యమేవ అస్తమేతి।
వరుణమేవ ఆప్యేతియో, వరుణమేవ అస్తమేతి।
సౌమ్యమేవ ఆప్యేతి యః సౌమ్యమేవ అస్తమేతి।
ఉదానమేవ ఆప్యేతి య ఉదానమేవ అస్తమేతి।
విజ్ఞానమేవ ఆప్యేతి యో విజ్ఞానమేవ అస్తమేతి।
ఆనన్దమేవ ఆప్యేతి య అనన్దమేవ అస్తమేతి।
తురీయమేవ ఆప్యేతి యః తురీయమేవ అస్తమేతి।
తత్ అమృతమ్, అభయమ్, అశోకమ్, అనన్తమ్,
నిర్బీజమ్, ఏవ అవాప్యేతీతి॥
ఇతి హెూవాచ ॥

➤ ఏది (ఆత్మ) జిహ్వను పొందుచున్నదో, అద్దానిచేతనే జిహ్వ అస్తమింపజేయబడుచున్నది.
➤ ఏది రుచికరమగు పదార్ధములను కల్పనచే పొందుచున్నదో, ఆ రుచి (రసయితవ్య), పదార్థానుభవమును తనయందు అస్తమింపజేసుకొనుచున్నది.
➤ ఏ (ఆత్మ)తత్త్వము వరుణుని (జలదేవుని) పొందినదో, అద్దాని (ఆత్మ) చేతనే వరుణుడు అస్తమింపజేయబడుచున్నారు.
సూర్యుని పొందిన ఆత్మయే తనయందు సూర్యుని అస్తమింపజేసుకొనుచున్నది.
➤ ఏది ఉదానము పొందినదో అట్టి ఆత్మయే ఉదాన ప్రాణమును తన యందు అస్తమింపజేసుకొనుచున్నది.

అట్టి ఆత్మ సర్వదా అమృతము, అభయము, అశోకము, అనంతము, నిర్భీజము కూడా!

4.) త్వక్ చమేవ అవాప్యేతి య, త్వక్చమేవ అస్తమేతి,
స్పర్శయితవ్యమ్ ఏవ ఆప్యేతి, యః స్పర్శయితవ్యమేవ అస్తమేతి;
వాయుమేవ ఆప్యేతి యో, వాయుమేవ అస్తమేతి;
మోఘమేవ ఆప్యేతి యో, మోఘమేవ అస్తమేతి;
మేఘమేవ ఆప్యేతి యో మేఘమేవ అస్తమేతి;
సమానమేవ ఆప్యేతి యః సమానమేవ అస్తమేతి;
విజ్ఞానమేవ ఆప్యేతి యో, విజ్ఞానమేవ అస్తమేతి;
ఆనన్దమేవ ఆప్యేతి య,
ఆనన్దమేవ అస్తమేతి;
తురీయమేవ ఆప్యేతి యః
తురీయమేవ అస్తమేతి;
తత్ అమృతమ్, అభయమ్, అశోకమ్,
అనన్తమ్, నిర్భీతమ్ ఏవ ఆప్యేతి ఇతి
హోవాచ

➤ ఏ ఆత్మానారాయణుడు చర్మమును పొందుచున్నాడో.. ఆయనయే చర్మతత్వమును తన యందు తిరిగి లయింపజేసుకుంటున్నారు.
➤ అట్లాగే స్పర్శానుభవ వస్తు కల్పన ఎవ్వరు (కల్పించుకొని) పొందుచున్నారో, అట్టి ఆత్మయందే స్పర్శయిత్వమంతా అస్తమించుచున్నది.
➤ ఎవ్వరు వాయువును పొందుచున్నారో, అట్టి ఆత్మయందే వాయు తత్త్వము అస్తమించిన దగుచున్నది.
➤ ఎవ్వరు మోఘమును (పాపమును) పొందుచున్నారో అట్టి మోఘము అట్టి ఆత్మయందే తిరిగి లయించుచున్నదగుచున్నది.
➤ ఏ తత్త్వము సమాన ప్రాణము కల్పించుకొనుచున్నదో ఆ సమాన ప్రాణము మరల ఆ తత్త్వము నందే లయించుచున్నదగుచున్నది.
➤ ఏ ఆత్మవిజ్ఞానము’ను పొందుచున్నదో, ఆ విజ్ఞానము అట్టి ఆత్మయందే లయించుచున్నది.
➤ ఏది ఆనందమున పొందుచున్నదో అద్దాని యందే ఆనందము లయిస్తోంది.
➤ ఏది తురీయము పొందుచున్నదో అట్టి తురీయము అద్దానియందే (జలంలో తరంగంవలె) కరిగిపోవుచున్నది. లయము పొందుతోంది.

అవన్నీ బయల్వెడలి తిరిగి లయించుచున్నట్టి ఆత్మ-అమృతము, అభయము, అశోకము, అనన్తము అయి నిర్భీజత్వము పొందినదగుచున్నది.

వాచమేవ ఆప్యేతి యో, వాచమేవ అస్తమేతి;
వక్తవ్యమేవ ఆప్యేతి యో, వక్తవ్యమేవ అస్తమేతి;
అగ్నిమేవ ఆప్యేతి యో, అగ్నిమేవ అస్తమేతి;
కుమారమేవ ఆప్యేతి యః, కుమారమేవ అస్తమేతి;

➤ ఏది వాక్కును పొందుచున్నదో, అద్దానియందే వాక్కు అయించినదగుచున్నది.
➤ ఏది చెప్పబడుచున్నదంతా తననుండి బయల్వెడలదీయుచున్నదో,..
➤ చెప్పబడుచున్నదంతా ఆ చెప్పుచున్న వక్తవ్యమునందే అస్తమించుచున్నది.
➤ అగ్ని ఎవరిచే పొందబడుచున్నదో ఆది ఆగ్నియందే ఆస్తమించుచున్నది.
➤ కుమారము (ఉపప్రాణము)ను ఏది పొందుచున్నదో, అట్టి కుమారము అద్దానియందే (ఆత్మయందే) అయించుచున్నది.

5.) వైరంభమేవ ఆప్యేతి యో వైరంభమేవ అస్తమేతి।
విజ్ఞానమేవ ఆప్యేతి యో విజ్ఞానమేవ అస్తమేతి।
ఆనన్దమేవ ఆప్యేతి య ఆనన్దమేవ అస్తమేతి।
తురీయమేవ ఆప్యేతి యః తురీయమేవ అస్తమేతి।
.. తత్ అమృతమ్, అభయమ్, అశోకమ్, అనన్తమ్,
నిర్బీజమేవ ఏవ ఆప్యేతి| ఇతి హో వాచ ….

➤ వైరంభమును (ఉపప్రాణము) పొందిన ఆత్మయందే ఆ వైరంభము తిరిగి అస్తమించుచున్నది.
విజ్ఞాన-అనన్ద-తురీయములు పొందుచున్న ఆత్మయందే అవి లయించినవగుచున్నాయి.

అట్టి ఆత్మ అమృత రూపము! అభయ ప్రదాత! శోకరహితము! అనన్తము! నిర్భీజ రూపము. (వాక్కు మొదలైనవి స్వస్వరూపమునందు అస్తమించగా) కేవలము అగుచున్నది.

6.) హస్తమేవ ఆప్యేతి యో, హస్తమేవ అస్తమేతి;
ఆదాతవ్యమ్ ఏవ ఆప్యేతి య, ఆదాతవ్యమేవ అస్తమేతి;
ఇన్ద్రమేవ ఆప్యేతి య, ఇన్ద్రమేవ అస్తమేతి;
అమృతమేవ ఆప్యేతి యో, అమృతమేవ అస్తమేతి;
ముఖ్యమేవ ఆప్యేతి యో, ముఖ్యమేవ అస్తమేతి;
విజ్ఞానమేవ ఆప్యేతి యో, విజ్ఞానమేవ అస్తమేతి,
ఆనందమేవ ఆప్యేతి య, ఆనందమేవ అస్తమేతి;
తురీయమేవ ఆప్యేతియః, తురీయమేవ అస్తమేతి;
తదమృతమ్, అభయమ్, అశోకమ్,
అనన్తమ్, నిర్బీజమేవ, అవాప్యేతి॥
- ఇతిహోవాచ

➤ హస్తమును పొందినదే హస్తమును తనయందు అస్తమింపజేసుకుంటోంది.
➤ ‘తీసుకొనునది’ని పొందిన ఆత్మయందే ఆత్మచే ‘తీసుకొనుటము’ ను అస్తమింపబడుతోంది.
➤ ఇంద్రుని సంకల్పించుకొని పొందిన ఆత్మయే, ఇంద్రుని తనయందు అస్తమింపజేసుకుంటోంది.
➤ అమృతమును పొందినదే అమృతమును తనయందు లయింపజేసుకుంటోంది.
➤ “ఇది ముఖ్యముకదా” - అని ముఖ్యమును కల్పించుకున్న ఆత్మయే ముఖ్యమును తనయందు అంతర్గతముగా చేసుకుంటోంది.

వాటికి సంబంధించిన విజ్ఞాన-ఆనందములు-అమృతము, అభయము, అశోకము, అనన్తము, నిర్భీజము అగు ఆత్మ నుండే పొందబడినవై, ఆత్మయందే లయించుచున్నవగుచూ, కేవలాత్మయే శేషించుచున్నది.

7.) పాదమేవ ఆప్యేతి యో పాదమేవా అస్తమేతి।
గంతవ్యమ్ ఏవ ఆప్యేతి యో గంతవ్యమేవ అస్తమేతి।
విష్ణుమేవ ఆప్యేతి యో విష్ణుమేవ అస్తమేతి।
సత్యమేవ ఆప్యేతి యః సత్యమేవ అస్తమేతి।
అంతర్యామమేవ ఆప్యేయతి యో, అంతర్యామమేవ అస్తమేతి;
విజ్ఞానమేవ ఆప్యేతి యో, విజ్ఞానమేవ అస్తమేతి;
ఆనన్దమేవ ఆప్యేతి యః, ఆనన్దమేవ అస్తమేతి;
తురీయమేవ ఆప్యేతి యః తురీయమేవ అస్తమేతి।
తత్ అమృతమ్, అభయమ్, అశోకమ్,
అనన్తమ్, నీర్భజమేవ ఆప్యేతి - ఇతి||
- హోవాచ

➤ పాదములు ఎయ్యది పొందుచున్నదో, అద్దానియందే పాదములు అస్తమించుచున్నాయి.
➤ ‘వెళ్లటము-నడవటము’ అనేది ఎద్దానిచే పొందబడుచున్నదో అది అద్దానియందే లయించుచున్నది.
➤ ఏ పరమాత్మ తత్త్వము విష్ణువును పొందుచున్నదో, విష్ణువు అద్దానియందే లయించుచున్నారు.
➤ ఏది సత్యమును పొందటము జరుగుతోందో, ఆ సత్యము అద్దానియందే (ఆత్మయందే) అయించుచున్నది.
➤ ఏది (ఆత్మ) అంతర్యామిత్వము పొందుచున్నదో, అద్దానిచేతనే అంతర్యామిత్వము కూడా అస్తమింపజేయబడుచున్నది.
➤ విజ్ఞానము పొందబడగా, ఆ విజ్ఞానము విజ్ఞానమునందే అస్తమిస్తుంది.
➤ ఆత్మయే ఆనందమును, తురీయమును పొందును.

విజ్ఞానమును, ఆనందమును, తురీయమును అస్తమింపజేసి ఆ అమృత-అభయ-అశోక- అనన్త - నిర్బీజ వస్తువునే పొందుచున్నది. అట్టి ఆత్మయే ఏకము, సర్వముగా శేషించుచున్నది.

పాయుమేవ ఆప్యేతి యః, పాయుమేవ అస్తమేతి;
విసర్జయితవ్యమేవ ఆప్యేతి యో, విసర్జియితవ్యమేవ అస్తమేతి;
మృత్యుమేవ ఆప్యేతి యో మృత్యుమేవ అస్తమేతి;
మధ్యమామ్ ఏవ ఆహ్యేతి యో మధ్యమామ్ ఏవ అస్తమేతి।
ప్రభంజన మేవ ఆప్యేతియః ప్రభంజనమేవ అస్తమేతి।
విజ్ఞాన మేవ ఆప్యేతి యో, విజ్ఞానమేవ అస్తమేతి।
ఆనందమేవ ఆప్యేతి య, ఆనన్దమేవ అస్తమేతి|
తురీయమేవ ఆప్యేతియః తురీయమేవ అస్తమేతి।
తత్ అమృతమ్, అభయమ్, అశోకమ్,
అనన్తమ్, నిర్బీజమేవ ఏవ ఆప్యేతి॥
- ఇతి హోవాచ।

ఇంకా విను.
➤ పాయువు పొందుచున్నటిదే పాయువును అస్తమింపజేస్తోంది.
➤ విసర్జనత్వమును పొంది ఆ విసర్జనత్వమును తనయందు అస్తమింపజేస్తోంది.
➤ మృత్యువును కల్పించుకొని, మృత్యువును తనలో అస్తమింపజేస్తోంది.
➤ మధ్యమమును పొందినవే, ఆ మధ్యమమును తనయందు అస్తమింపజేస్తోంది.
➤ ఏది ప్రభన్జనమును పొందుతోదో, ఆ ప్రభన్జనమును తానే తనయందు అస్తమింపజేస్తోంది.
➤ అద్దాని విజ్ఞానము కూడా తనయందే (ఆత్మ) అస్తమింపజేసుకుంటోంది.

విజ్ఞానమును, ఆనందమును, తురీయమును అస్తమింపజేసుకుని ఆ అమృత-అభయ-ఆశోక-అనన్త, నిర్భీజస్వరూపము (కేవలాత్మ)ను పొందుచున్నదగుచున్నది. ఆత్మ ఆత్మగా నిర్బీజమై శేషించుచున్నదగుచున్నది.

8.) ఉపస్థమేవ ఆప్యేతి య, ఉపస్థమేవ అస్తమేతి।
ఆనందమయితవ్యమ్ ఏవ ఆప్యేతి య, ఆనందయితవ్యమేవ అస్తమేతి;
ప్రజాపతిమేవ ఆప్యేతి యః ప్రజాపతిమేవ అస్తమేతి;
నాసీ(నా) రామేవ ఆప్యాతి యో నాసీ (నా) రామేవ అస్తమేతి।

➤ ఏది తననుండి ఉపస్థను పొందుచున్నదో అట్టి ఉపస్థను ఉపస్థత్వమునందే లయింపజేస్తోంది.
➤ ఆనందమును పొంది అద్దానిని ఆనందితవ్యమునందే అస్తమింపజేస్తోంది.
➤ ఆత్మయే ప్రజాపతిని పొందుచున్నది. ఆ ప్రజాపతిని ఉపశమింపజేసుకుంటోంది.
➤ నాసీరుని పొందుతోంది. (అగ్ర ఈశ్వరుని పొందుతోంది) నాసీరము - దర్పము - ఈశ్వరత్వములను కూడా తిరిగి తనయందు లయింపజేసుకుంటోంది.

9.) కూర్మీరమేవ ఆప్యేతి యః, కూర్మీరమ్ ఏవ అస్తమేతి,
విజ్ఞానమేవ ఆప్యేతి యో, విజ్ఞానమేవ అస్తమేతి;
ఆనందమేవ ఆప్యేతి య ఆనన్దమేవ అస్తమేతి;
తురీయమేవా ఆప్యేతి యః, తురీయమేవా అస్తమేతి;
తత్ అమృతమ్ అభయమ్ అశోకమ్
అనన్తమ్ నీర్బజమ్ ఏవా ఆప్యేతి||
ఇతి సహోవాచ

➤ కూర్మీరమును (పంచ ఉపప్రాణములలో ఒకానొకటి) ప్రదర్శిస్తూ ఇంతలోనే అద్దానిని తనయందే ఉపసంహరించుకొనుచున్నది.
➤ ఆయా ప్రదర్శన ఉపసంహరణ సంబంధములైన ఆనంద తురీయములను పొంది వాటిని కూడా తిరిగి తనయందు ఉపసంహరించుకొనుచున్నది.
➤ అమృతము-అభయము-ఆశోకము-అనన్తము-నిర్భీజములగు ఆత్మత్వము పొంది ఆత్మగానే శేషించుచున్నది. ఆత్మ ఆత్మయందే శేషించినదై ఉన్నదగుచున్నది.

10.) మన ఏవ ఆప్యేతి యో, మన ఏవ అస్తమేతి;
మన్తవ్యమేవా ఆప్యేతి యో, మన్తవ్యమేవా అస్తమేతి;
చంద్రమేవ ఆప్యేతి యః చంద్రమేవ అస్తమేతి;
శిశుమేవ ఆప్యేతి యః, శిశుమేవా అస్తమేతి;
శ్యేనమేవ ఆప్యేతి యః, శ్యేనమేవ అస్తమేతి;
విజ్ఞానమేవ ఆప్యేతి యో, విజ్ఞానమేవ అస్తమేతి;
ఆనన్దమేవ ఆప్యేతి య, ఆనన్దమేవ అస్తమేతి;
తురీయమేవ ఆప్యాతి యః, తురీయమేవ అస్తమేతి;
.. తత్ అమృతమ్, అభయమ్, అశోకమ్,
అనన్తమ్, నిర్భీజమ్, ఏవ ఆప్యేతిః ఇతి
-హోవాచ

➤ మనస్సును పొంది, ప్రదర్శించి, ఆ మనస్సును అస్తమింపజేసుకుంటోంది.
➤ ఆలోచించు విషయములన్నీ కల్పన చేసుకొని ఆ మనోవిషయములన్నీ లయింపజేసుకొని చంద్రతత్త్వము (కేవల మనోరూపము) పొందిన దగుచున్నది.
➤ ఆ కేవల మనోరూపమగు చంద్రుని కూడా అస్తమింపజేసుకుంటోంది.
➤ శిశువు (ఉపప్రాణము)ను పొందుచున్న ఆత్మయందే శిశువు అస్తమించిన దగుచున్నది.
➤ శ్యేనము (మరొక ఉపప్రాణము)ను ఎవరు పొందుచున్నారో, ఆయనయందే అస్తమించినదగుచున్నది. ఆత్మయే ’విజ్ఞానము’కు పొందుచున్నది.

విజ్ఞానము - ఆనందము- తురీయము ఏ ఆత్మ పొందుచున్నదో, అదియే తనయందు అస్తమింపజేసుకున్న దై - అమృతము, అభయము, అశోకము, నిర్బీజము అగు కేవలాత్మ స్వరూపము సంతరించుకొనుచున్నది.

బుద్ధిమేవ ఆప్యేతి యో, బుద్ధిమేవ అస్తమేతి;
బోద్ధవ్యమేవా ఆప్యేతి యో, బోద్ధవ్యమేవా అస్తమేతి;
బ్రహ్మాణమేవ ఆప్యేతి యో, బ్రహ్మాణమేవ అస్తమేతి;
సూర్యమేవ ఆప్యేతి యః, సూర్యమేవ అస్తమేతి;
కృష్ణమేవ ఆప్యేతి యః, కృష్ణమేవ అస్తమేతి;
విజ్ఞానమేవా ఆప్యేతియో, విజ్ఞానమేవా అస్తమేతి;
ఆనందమేవ ఆప్యేతి య, ఆనందమేవ అస్తమేతి;
తురీయమేవ ఆప్యేతియః తురీయమేవ అస్తమేతి;
తత్ అమృతమ్, అభయమ్, అశోకమ్,
అనంతమ్, నిర్బీజమేవ ఏవ ఆప్యేతిః ఇతి |
హో వాచ-

➤ ఏది ’బుద్ధి’ని కల్పించుకొనుచున్నదో అదియే తిరిగి బుద్ధిని తనయందు అస్తమింపజేసుకొనుచున్నది.
➤ బుద్ధికి విషయమగు బోధవ్యమును పొందుచున్నది. బోధవ్యమును కూడా తన యందు అస్తమింపజేసుకొనుచున్నది.
➤ సృష్టికర్తయగు ’బ్రహ్మ’ను కల్పించుకొని, ఆ బ్రహ్మను ఆస్తమింపజేయుచున్నది.
➤ సూర్యుని పొంది ఆ సూర్యుని తనయందు అస్తమింపజేయుచున్నది.
➤ కృష్ణము (నిబిడాంధ కారము)ను ఏది పొందుచున్నదో అది తనయొక్క కృష్ణత్వమునందు ఆ నిబిడాంధకారమును అస్తమింపజేయుచున్నది.
➤ విజ్ఞాన ఆనందతురీయములను పొంది వాటిని కూడా తానే తనయందు అస్తమింపజేయుకొనుచున్నది.

ఆ విధంగా అన్నీ అస్తమింపజేసుకొన్నదై అమృతము - అశోకము- అనంతము - నిర్బీజము అగు స్వస్వరూపము మాత్రమే పొందినదై ప్రకాశించుచున్నది.

11.) అహంకారమేవ ఆప్యేతి యో, యో అహంకారమేవ అస్తమేతి;
‘అహమ్ కర్తవ్యమ్’ ఏవ ఆప్యేతి యో, ’అహమ్ కర్తవ్యమేవ’ అస్తమేతి;
రుద్రమేవ ఆప్యేతి యో, రుద్రమేవ అస్తమేతి;
అసురమేవ ఆప్యేతి యో, అసురమేవ అస్తమేతి;
శ్వేతమేవ ఆప్యేతి యః, శ్వేతమేవ అస్తమేతి;
విజ్ఞాన మేవా ఆప్యేతియో, విజ్ఞానమేవ అస్తమేతి;
ఆనన్దమేవ ఆప్యేతి య ఆనన్దమేవ అస్తమేతి;
తురీయ మేవ ఆప్యేతి యః, తురీయమేవ అస్తమేతి;
తత్ అమృతమ్, అభయమ్, అశోకమ్, అనన్తమ్, నిర్బీజమేన ఆప్యేతి ఇతి |
హో వాచ -

➤ ఏది అహంకారము పొందుచున్నదో అట్టి అహంకారమును తానే తనయందు అస్తమింపచేసుకొనుచున్నది.
➤ అహమ్కర్తవ్యము (కర్తవ్యములు కలవాడను) అనునది పొంది, అద్దానిని కూడా తనయందే విరమింపజేసుకొనుచున్నది.
➤ రుద్రమును పొంది ఆ రుద్రము (రౌద్రము)ను తన యందే అస్తమింపజేసుకొనుచున్నది.
➤ అసురత్వమును పొంది అది కూడా తనయందు లయింపజేసుకుంటోంది.
➤ శ్వేతమును (సాత్వికతను) పొంది శ్వేతమును తన యందే అదృశ్యపరచుకొనుచున్నది.
➤ విజ్ఞానము - అనన్దము- తురీయమును పొంది వాటిని తనయందు అస్తమింపజేసుకొనుచున్నది.

అమృతము - అభయము - అశోకము - అనన్తము - నిర్బీజము అగు ఆత్మస్వరూపమై శేషించినదగుచున్నది.

12.) చిత్తమేవ ఆప్యాతి యః చిత్తమేవ అస్తమేతి;
చేతయితవ్యమేవ ఆప్యేతి యః చేతయితవ్యమేవ అస్తమేతి।
క్షేత్రజ్ఞమేవ ఆప్యేతి యః క్షేత్రజ్ఞమేవ అస్తమేతి;
భాస్వతీమేవ ఆప్యేతి యో, భాస్వతీమేవ అస్తమేతి;
నాగమేవ ఆప్యేతియో, నాగమేవ అస్తమేతి;
విజ్ఞానమేవ ఆప్యేతి యో, విజ్ఞానమేవ అస్తమేతి;
ఆనందమేవ ఆప్యేతి య, ఆనందమేవ అస్తమేతి;
తురీయమేవ ఆప్యేతియః, తురీయమేవ అస్తమేతి;

.. తత్ అమృతమ్ అభయమ్ అశోకం, అనన్తమ్ నిర్బీజమేవస్య ఆప్యేతి ఇతి।
హోవాచ

➤ చిత్తమును పొందినదై ఆత్మ ఆ చిత్తమును తిరిగి తనయందే అస్తమింపజేసుకొనుచున్నది.
➤ చేతయితవ్యమును పొంది ఆ చిత్త విషయములగు చేతయితవ్యమును తనయందే లయింపజేసుకొనుచున్నది.
➤ క్షేత్రజ్ఞత్వమును ఆత్మ పొందుచూ, అద్దానిని తనయందు ఆత్మయే అస్తమింపజేసుకొనుచున్నది.
➤ భాస్వతి (తెలియబడునదంతా) పొంది, ఆ భాస్వతిని తనయందు లయింప జేసుకొనుచున్నది.
➤ నాగమును పొంది ఆ ’నాగము’ను తనయందు అస్తమింపజేసుకొనుచున్నది.
➤ విజ్ఞాన- ఆనంద-తురీయములను పొంది ఆ విజ్ఞాన- ఆనంద తురీయములను తనయందే అస్తమింపజేసుకొనుచున్నది.

అప్పుడు అమృతము; అభయము; అశోకము; అనన్తము, నిర్భీజము అగు స్వస్వరూపాత్మానందమై విరాజిల్లుచున్నది.

13.) య ఏవం నిర్బీజమ్ వేద, నిర్బీజయేవ స భవతి।
న జాయతే| న మ్రియతే। న ముహ్యతే। న భిద్యతే।
న దహ్యతే। న ఛిద్యతే। న కమ్పతే। న కుప్యతే।
న సర్వదహనో। అయమ్ ఆత్మా - ఇతి యా చక్షతే।
నైవమ్ ఆత్మా ప్రవచన శతేనాఽపి లభ్యతే॥
న బహుశ్రుతేన। న బుద్ధి జ్ఞాన।
న శ్రుతేన। న మేధయా॥
న వేదైః। న యజ్ఞైః। న తపోభిః ఉగ్రైః ।
న సాంఖ్యైః। న యోగైః। న ఆశ్రమైః। న అన్యైః।
ఆత్మానమ్ ఉపలభన్తే।
ప్రవచనేన ప్రశంసయా ప్యుత్థానేన తమేతం బ్రాహ్మణాః
శుశ్రువాంసో అనూచానా ఉపలభన్తే।

శాంతో, దాంతో ఉపరతః తితిక్షుః సమాహితో భూత్వా
ఆత్మన్యేవ ఆత్మానం పశ్యతి।
సర్వస్య ఆత్మాభవతి, య ఏవం వేదః॥

♠︎ ఎవరైతే ఆత్మ యొక్క మరింకొకటేదీ జనించనట్టి - శుద్ధాత్మ స్వరూపమును ఎరుగుచున్నాడో, ఆతడు నిర్బీజాత్మ స్వరూపమే అగుచున్నాడు.
♠︎ అట్టి ఆత్మ సాక్షాత్కారముచే అట్టివాడు జనించడు. మరణించడు। మోహము పొందడు। అసలు భేదమనునదే పొందడు. ఖండింపబడడు. దహించబడడు, కంపనము పొందడు. కోపగించడు। దహించబడడు। అంతా ఆత్మగా దర్శించుచున్నాడు.
♠︎ అట్టి “ఆత్మతత్త్వ స్వానుభవము” వందల ప్రవచనముల చేత కూడా లభించేది కాదు. ఎంతగానో విన్నా లభ్యమవదు. బుద్ధి యొక్క తెలియతేటలకు కూడా లభించదు. వేదజ్ఞానముచే పొందబడజాలదు. యజ్ఞములచేతగాని, ఉగ్ర తపస్సుచేతగానీ లభ్యమయ్యేది కాదు. అది సాంఖ్య యోగ విశ్లేషణాజ్ఞానముచే కూడా ప్రాప్తించునది కాదు। ఏదో ఆశ్రమముల మార్పు చేతగాని మరింకేదైనా నిర్వర్తిస్తే గాని ఆత్మలభించునది కాదు.
♠︎ మరి? 1) ప్రవచన ప్రశంసచేత, 2) ఆత్మయందు వ్యుత్థానము (Wake Up) చేతను 3) బ్రహ్మవేత్తలు చెప్పేది వినాలనే కోరికచేతనూ, వినుచూ ఉండగా తనకు తానే లభింపజేసుకోవలసినట్టిది.

శాంతుడు (Peaceful by silencing all worldly Avocations), దాంతుడు (ఇంద్రియములను నిగ్రహించినవాడు), ఉపరతుడు (ఆత్మభావనయందు నియమితుడు) తితిక్ష ఓర్పులతో కూడుకున్నప్పుడు ఆత్మయే ఆత్మను దర్శించుచున్నది. ఇది ఎరుగటచే సర్వము ఆత్మయే అగుచున్నది.

దశమః ఖండః

1.) అథ హి ఏనం రైక్యః పప్రచ్ఛః
‘భగవన్। కస్మిన్ సర్వే సంప్రతిష్ఠితా భవంతి?’ ఇతి।
తస్మైహోవాచ: రసాతల లోకేషు ఇతి।

రైక్వః: కస్మిన్ రసాతల లోకా ఓతాశ్చ ప్రోతాశ్చ ఇతి?
సమాధానం (సహోవాచ): భూర్లోకేషు ఇతి

రైక్వ హో వాచ : కస్మిన్ భూలోకా
ఓతాశ్చ-ప్రోతాశ్చ ఇతి?
సమాధానం : భువర్లోకేషు ఇతి

రైక్వేవాచ : కస్మిన్ భువర్లోకా
ఓతాశ్చ ప్రోతాశ్చ ఇతి?
సమాధానం : సువర్లోకేష్వితి|

రైక్వోవాచ: కస్మిన్ సువర్లోకా
ఓతాశ్చ ప్రోతాశ్చేతి?
సమాధానం : మహర్లోకేషు ఇతి

రైక్వుడు : గురుదేవా! భగవన్! సర్వము దేనియందు ప్రతిష్ఠితమైయున్నది?
గురుదేవుడు : అంతాకూడా రసాతలలోకములో ప్రతిష్ఠితమై ఉన్నదయ్యా!

రైక్వుడు : అయితే మహనీయా రసాతల లోకము ఎందులో ఓత-ప్రోతముగా ఉన్నది?
గురుదేవుడు : ’భూలోకము’ నందు ఓత-ప్రోతమై ఉన్నది. భూలోకము భువర్లోకమునందు ఓత-ప్రోతము.

రైక్వుడు : భువర్లోకము ఎద్దానియందు ఏర్పడినదై (నిలువుగాను - అడ్డంగాను) యున్నది?
గురుదేవుడు : ’సువర్లోకము’ నందు ఓత్-ప్రోతమైయున్నది.

రైక్వుడు : స్వామీ! మరైతే ‘సువర్లోకము’ ఎందులో ఓత-ప్రోతమైయున్నది?
గురుదేవుడు : మహర్లోకము నందు.

రైక్వోవాచ : కస్మిన్ మహర్లోకా
ఓతాశ్చ ప్రోతాశ్చేతి?
సమాధానం : జనోలోకేషు ఇతి

రైక్వో సహెూవాచ : కస్మిన్జనోలోకా
ఓతాశ్చ-ప్రోతాశ్చేతి?
సమాధానం : తపోలోకేషు ఇతి

రైక్వోవాచ : కస్మిన్ తపోలోకా
ఓతాశ్చ-ప్రోతాశ్చ ఇతి?
సమాధానం : సత్యలోకేష్వితి!

రైక్వః సహెూవాచ: కస్మిన్ సత్యలోకా
ఓతశ్చ ప్రోతాశ్చ-ఇతి।
సమాధానం : ప్రజాపతి లోకేష్వితి|

రైక్వేస్సహెూవాచ : కస్మిన్ ప్రజాపతి లోకా
ఓతాశ్చ ప్రోతాశ్చ-ఇతి।
సమాధానం : బ్రహ్మలోకేష్వితి

రైక్వుడు : అప్పుడు మహర్లోకము ఎందులో ఓత్ - ప్రోతమై ఉన్నదగుచున్నది?
గురుదేవుడు :‘జనో లోకము’ నందు.

రైక్వుడు : అట్లాగైతే జనోలోకము ఎందులో ఓత-ప్రోతమై ఉన్నది?.
గురుదేవుడు : తపోలోకము నందు.

రైక్వుడు : మరిక తపోలోకము ఎందులో ఓత-ప్రోతమై ఉన్నది?
గురుదేవుడు : ’సత్యలోకము’ నందే!

రైక్వుడు : ఓహో! మరప్పుడు సత్యలోకము ఎందులో ఓత-ప్రోతమై ఉండి
గురుదేవుడు : ’ప్రజాపతి లోకము’ నందు

రైక్వుడు : అయినప్పుడు, ప్రజాపతి లోకము ఎందులో ఓత-ప్రోతమై ఉన్నది?
గురుదేవుడు : అదా? ‘బ్రహ్మలోకము’ నందు!

రైక్వేస్సహెూవాచ : కస్మిన్ బ్రహ్మలోకా
ఓతాశ్చ-ప్రోతాశ్చ ఇతి?
సమాధానం : సర్వలోకేషు, ఇతి

రైక్వేవాచ : కస్మిన్ సర్వలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి?
సమాధానం : సర్వలోక ఆత్మని బ్రహ్మణి-మణయ ఇవౌతాశ్చ ప్రోతాశ్చేతి.

గురుస్సహోవాచ : ఏవమ్ ఏతాన్లోకాన్ ఆత్మని షతిష్ఠితాత్, వేద।  ఆత్మైవ స భవతి॥

నిర్వాణానుశాసనమ్ ఇతి।
ఇతి వేదానుశాసనమ్।
ఇతి వేదాను శాసనమ్।

రైక్వుడు : ఆటువంటప్పుడు, బ్రహ్మలోకము’ ఎందులో ఓత-ప్రోతమై ఉన్నది?
గురుదేవుడు : బ్రహ్మలోకము సర్వలోకములందు ఓత-ప్రోతమై ఉన్నది.

రైక్వుడు : సర్వలోకములు ఎందులో ఓత-ప్రోతమై ఉన్నాయి?
గురుదేవుడు : ’సర్వలోకములు కూడా బ్రహ్మము’ అనబడు ఆత్మయందు - సూత్రము నందు మణులవలె ఓత ప్రోతమై ఉన్నాయి.

ఓ శిష్యా! రైక్వా! ఈ విధంగా ఎవ్వడైతే సర్వలోకములు ఆత్మయందే ప్రతిష్టితమై ఉన్నాయని గమనిస్తాడో తెలుసుకుంటాడో.. ఆతడు ’ఆత్మ’యే అగుచున్నాడు.

ఇది నిర్వాణ - అనుశాసనము।
ఇది వేదానుశాసనము।
వేదాను శాసనము।

ఏకాదశః ఖండః

1.) అథ-హైనం రైక్వః పప్రచ్ఛః :-
భగవన్| యో అయం
విజ్ఞానఘన ఉత్రామన్, స కేన
కతరవాద్వా అవస్థానమ్ ఉత్సృజ్య అపక్రామతీతి?

తస్మై (గురు) సహెూవాచః :-
హృదయస్య మధ్యే లోహితం మాంసపిండం, యస్మిన్,
తత్ దహరం పుండరీకమ్ కుముదమివ,
అనేకథా వికసితం। తస్య మధ్యే సమద్రః।
సముద్రస్య మధ్యే కోశః।
తస్మిన్ నాడ్యః శతస్రో భవంతి।
తత్ర రమారమేచ్ఛా పునర్భవేతి
(రమా-అరమా-ఇచ్ఛా-పునః భవ ఇతి)
తత్ర రమా పుణ్యేన పుణ్యం లోకం నయతి।
అరమా పాపేన పాపమ్ ఇచ్ఛయా యత్ స్మరతి…,
తత్ అభిసంపద్యతే…,

రైక్వుడు :  హే గురుదేవా! ప్రభూ! భగవాన్, అట్టి విజ్ఞాన ఘనుడగు ఆత్మాదేవాది దేవుడు ఉత్క్రమణము (Waking up) పొందుచున్న వాడై దేనిచేత, ఏ స్థానము నుండి బయల్వెడలి, ఏ స్థానము వైపుగా బయల్వెడలుచున్నాడు.

గురుదేవుడు :  హృదయము యొక్క మధ్య భాగములో ఎర్రటి మాంస పిండము ఉన్నది. అద్దాని మధ్యలో దహరము (హృదయ దహరాకాశము అంతరంగ చతుష్ఠయమునకు జనన స్థానము - ‘ఎరుక’ అనే వెలుగుతో కూడిన ఆకాశము) ఉన్నది. అట్టి హృదయ దహరము తామర మొగ్గ, కలువల వలె అనేక విధములుగా వికసించినదై ఉన్నది. ఆ దహర మధ్యలో సముద్రము. ఆ సముద్ర మధ్యలో కోశము. దానిలో వందలాది సూక్ష్మమగు శక్తి నాడులు. ముఖ్యంగా నాలుగు నాడులు -
(1) రమా (2) అరమ(3) ఇచ్ఛా (4) పునర్భవ.

→ ‘రమా’ నాడియందు రమించు ఇచ్ఛగలవాడు పునర్జన్మ పొందుచున్నాడు. అట్టి ‘రమా’ నాడియందు పుణ్యకార్యముల సహాయముతో ఈ జీవుడు పుణ్యలోకములు పొందుచున్నాడు.
→ ‘అరమా’ యందు పాపము చేత పాపలోకములు పొందుచున్నాడు.
→ ఈ జీవుడు ‘ఇచ్ఛా’ నాడియందు సంచరించువాడు. ఏది స్మరిస్తూ ఉంటే అదియే పొందటము జరుగుతోంది.

2.) పునర్భవాయ కోశం భినత్తి।
కోశం భిత్వా శీర్ష కపాలం భినత్తి
శీర్ష కపాలం భిత్వా పృథివీం భినత్తి।
పృథివీం భిత్వా ఆపో భినత్తి।
ఆపో భిత్వా తేజో భినత్తి।
తేజో భిత్వా వాయుం భినత్తి।
వాయుం భిత్త్వా - ఆకాశం- భినత్తి
ఆకాశం భిత్వా - మనో భినత్తి।
మనో భిత్వా భూతాదిం భినత్తి।
భూతాదిం భిత్వా మహాన్తం భినత్తి।
మహాన్తం భిత్వా అవ్యక్తం - భినత్తి
అవ్యక్తం భిత్వా అక్షరం భినత్తి!
అక్షరం భిత్వా మృత్యుం భినత్తి!
మృత్యుర్వై పరే దేవ ఏకీ భవతీతి।

పరస్తాత్ న సత్, న అసత్, న సదసత్।

ఇతి ఏతత్ నిర్వాణానుశాసనమ్ ।
ఇతి వేదానుశాసనమ్।
ఇతి వేదానుశాసనమ్॥

→ పునర్భవ నాడీ సంచారముచే ‘కోశము’ - ఎప్పటికప్పుడు నశిస్తూ క్రొత్త చిగుళ్ళు చిగురిస్తూ ఉంటోంది.
→ కోశము యొక్క మూలము నశిస్తే ‘శీర్షకపాలము’ భేదించబడుచున్నది.
→ శీర్షక పాలము భేదమవగా, ’పృథివి’ భేదించబడుతోంది.
→ పృథివి భేదించబడుటచే జలము భేదించబడుతోంది.
→ జలము భేదించబడగా తేజస్సు భేదనమగుచున్నది.
→ తేజస్సుచే వాయువు ఛేదన పొందుతోంది.
→ వాయువు ఛేదించి, ఆకాశమును భేదించుచున్నది.
→ ఆకాశ భేదనముచే మనస్సు భేదనము (బ్రద్దలు) చేయబడుతోంది.
→ మనస్సు భేదనము చెందుటచే ‘భూతాది’ కూడా భేదనము అగుచున్నది.
→ భూతాది భేదమవగా, అప్పుడు ‘మహాన్తము’ భేదనము పొందుతోంది.
→ మహాన్త భేదనము చేత ‘అవ్యక్తము’ భేదనమగుచున్నది.
→ అవ్యక్తము యొక్క భేదనము అక్షతము యొక్క భేదనములకు దారితీయుచున్నది.
→ అక్షతము బేధనమగుచుండగా ‘మృత్యువు’ (క్షతము) కూడా భేదనమగుచున్నది.
→ మృత్యువు - రూపరహితమై పరము అగు అఖండ పరమాత్మతో ఏకమగుచున్నది.

అట్టి పర స్వరూపము సత్తుకాదు. అసత్తు కాదు. సత్+అసత్తు (సదసత్తు) కాదు.

ఇది నిర్వానుశాసనము!
ఇది వేదానుశాసనము!
వేదానుశాసనము!

ద్వాదశః ఖండః

1.) నారాయణాద్వా ‘అన్నం’ ఆగతమ్।
పక్వం బ్రహ్మలోకే మహాసంవర్తకే।
పునః పక్వమ్| ఆదిత్యే పునః పక్వమ్| క్రవ్యాది।
పునః పక్వమ్| జ్వాలకీల క్లిన్నం పర్యుషితమ్। పూతమ్।
అన్నమ్ అయాచితమ్; అసం క్లప్తం,
తత్ అదశ్నీయాత్। న కంచన యాచేత।

అన్నమ్ - అనుభవమగుచున్నదంతా! అనుభవముగా పొందేదంతా! నారాయణుని నుండే అన్నము వచ్చుచున్నది. బ్రహ్మలోకమున పక్వమై (దృశ్యానుభవముగా సిద్ధించినట్టి) మహాసంవర్తకమున పక్వమైన తరువాత, ఆదిత్యుని యందు ఆతరువాత క్రవ్యాదిగా పదార్థప్రారంభ దశ. పక్వమైన అన్నము నారాయణుని నుండే బయల్వెడలుచున్నది. మరల (రెండవసారి) పక్వమైనది, జ్వాలాకలచే పచనమై చమర్చబడినది. (చల్లబడినది). పర్యుషితమైనది (వండి ఝాము దాటినది). అన్నము అయాచితమై ప్రాప్తించేది. అందుచేత అసంక్లిప్తంగా భావించాలి. అనగా అన్నమును ఎప్పుడూ మానసికంగా స్వీకరించకూడదు. (తానుగా) యోచించరాదు.

త్రయోదశః ఖండః

1.)  "బాల్యేన తిష్ఠాసేత్। బాలస్య భావో,.. అసంగో
నిరవద్యో, మౌనేన పాండిత్యేన
నిరవధికారతయా
ఉపలభ్యతే కైవల్య ముక్తం నిగమనం”

ప్రజాపతిః ఉవాచ।
మహత్ పదమ్ జ్ఞాత్వా,
వృక్షమూలే వసేత,
కుచేలో, అసహాయ, ఏకాకీ సమాధిస్థ,
ఆత్మకామ, ఆప్తకామో,
నిష్కామో, జీర్ణకామో
హస్తిని, సింహే, దంశే, మశకే
నకులే, సర్ప యక్ష రాక్షస గంధర్వే
మృత్యో రూపాణి విదిత్వా -న బిభేతి, కుతశ్చనేతి॥

సద్గురువు :  ప్రియ సర్వమానవులారా?
బాలుని వలె ఎప్పుడూ ఉండాలి - అని ఉద్దేశ్యము కలిగి ఉండండి!
బాల భావనతోబాటు అసంగము (Unattached) అయి ఉండండి. నిరవద్యము (విభాగించబడజాలని రూపంగా) అవండి! అప్పుడు, మౌన నిరూపము, నిత్యానిత్య పాండితీరూపము, నిరవధికము (హద్దులు లేనిది), నిగమములచే (వేదములచే) గానము చేయబడుచున్నది అగు - ‘కైవల్యముక్తి’ - లభించగలదు.

ఒకప్పుడు ప్రజాపతి జీవులను ఉద్దేశ్యించి ఇట్లు పలికారు.
శ్రీ ప్రజాపతి :  ఓ బిడ్డలారా!
‘ఆత్మయే నేను’  అను మహత్పదమును చక్కగా, ముందుగా తెలుసుకొని ఉండండి. వృక్ష మూలమున కూర్చుని ఉండండి. మాసిన గుడ్డలతో ఏకాకి అయి ‘సమాధి’ యందు స్థితులై ఉండండి. ఆత్మను మాత్రమే కోరుకొనుచు, ఆప్తకాములై (ఆత్మకామము సిద్ధించుకొన్నవారై) మెలగండి. నిష్కాములై, జీర్ణకాములై ఉండండి. ఏనుగు నందు, సింహమునందు, దోమయందు, ముంగిస యందు, సర్ప-యక్ష-రాక్షస-గంధర్వుల యందును ‘ఇదంతా ఈతని పట్ల మార్పు చెందబోవుచున్నది. కనుక ఇదంతా మృత్యురూపమే’ అని గమనిస్తూ ఉండగా ఇక సర్వభయములు తొలగుతాయి. అభయము సిద్ధిస్తుంది. దేనికీ భయముండదు.

2.) వృక్షమివ తిష్టాసేత్ ఛిద్యమానోపి,
న కుప్యేత! న కమేత।
ఉత్పలమివ తిష్ఠాసేత్
ఛిద్యమానోఽపి న కుప్యేత, న కన్పేత।
ఆకాశమివ తిష్ఠా సేత్, ఛిద్యమానోఽపి
..న కుప్యేత, న కమ్పేత। సత్యేన తిష్ఠాసేత్।
సత్యో అయమాత్మా…!

సర్వేషామేవ గన్ధానాం పృథివీ హృదయమ్।
సర్వేషామ్ ఏవ రసానామ్ ఆపో హృదయమ్!
సర్వేషామ్ ఏవ రూపాణామ్ తేజో హృదయమ్।
సర్వేషామ్ ఏవ స్పర్శానాం వాయుః హృదయమ్।
సర్వేషామ్ ఏవ శబ్దానామ్ ఆకాశమ్ హృదయమ్।
సర్వేషామ్ ఏవ గీతానామ్ అవ్యక్తం హృదయమ్।
సర్వేషామ్ ఏవ సత్వానామ్ మృత్యుః హృదయమ్।
మృత్యుర్వై పరే దేవ ఏకీ భవతీతి పరస్తాత్ |
న సత్। న అసత్। న సదసత్।
ఇత్యేతత్ నిర్వాణానుశాసనమ్।
ఇతి వేదానుశాసనమ్।
ఇతి వేదా అనుశాసనమ్॥

నాయనలారా! ఒక వృక్షము వలె ఉండాలని కోరుకునెదరు గాక! నరకబడుచున్నప్పుడు కూడా వృక్షము కోపించదు. కంపించదు కదా! ఒక ఫలమును కత్తిపీటతో కోస్తున్నప్పుడు కూడా ఏ మాత్రము కోపము - కంపన పొందని విధంగా సుతిష్ఠితులై ఉండాలి. ఖండించబడుచున్నప్పుడు కూడా ఆకాశము వలె కోపము-కంపన (Anger and Disturabance) పొందనివారై ఉండండి. పరమ సత్యమును ఆశ్రయించి, అవధరించినవారై ఉండండి. ఎందుకంటే మీరు సర్వదా ఆత్మస్వరూపులే.

సర్వగంధములకు (వాసనలకు)స్థానమేది? పృథివియే! గంధమునకు పృథివియే హృదయము.
సర్వ రసములకు హృదయస్థానము జలము.
సర్వ రూపానుభవములకు తేజస్సుయే హృదయస్థానము.
సర్వ స్పర్శానుభవములకు వాయువే హృదయ (ఉత్పత్తి) స్థానము.
సర్వ శబ్దములకు ఆకాశమే హృదయము.
సర్వ గీతములకు అవ్యక్తమే హృదయస్థానము.
సర్వ సత్యములకు (ఉన్నట్లుగా కనబడేవన్నిటికీ) మృత్యువే హృదయము,
మృత్యువునందు అన్నీ కూడా ఏకమై యుండి మృత్యువుకు ఆవల పరమై ఆత్మస్వరూపమున్నది.
అట్టి పరస్వరూపము సత్ - ‘ఉన్నది’ కాదు. అసత్ - ‘ఉండనిది’ కాదు. సదసత్తు - ‘ఉండి లేనిది’ కాదు.
ఇది నిర్వాణానుశాసనము.
ఇది వేదానుశాసనము
వేదాను శాసనమే!

చతుర్దశః ఖండః

1.) పృథివీ వా అన్నమ్। ఆపో అన్నాదాః।
ఆపోవా అన్నమ్। జ్యోతిః అన్నాదమ్।
జ్యోతిర్వా అన్నమ్। వాయుః అన్నాదో।
వాయుర్వా అన్నమ్। ఆకాశో అన్నాద।
ఆకాశో వా అన్నమ్! ఇంద్రియాణి అన్నాదాన్।
ఇంద్రియాణి వా అన్నమ్! మనో అన్నాదం।
మనో వా అన్నమ్! బుద్ధిః అన్నాదా।
బుద్ధిర్వా అన్నమ్। అవ్యక్తమ్ అన్నాదమ్।
అవ్యక్తం వా అన్నమ్। అక్షరమ్ అన్నాదమ్।
అక్షరం వా అన్నమ్। మృత్యుః అన్నాదో।
మృత్యుర్వై పరే ‘దేవ’ - ఏకీభవతి ఇతి||
పరస్తాత్ ’న సత్। న అసత్! న సదసత్!
ఇతి ఏతత్ నిర్వాణానుశాసనమ్|
- ఇతి వేదానుశాసనమ్|
- ఇతి వేదానుశాసనమ్॥

అన్నము = అనుభవించబడునది; అన్నాదమ్ = అనుభవించుచున్నది.
పృథివి - అన్నము (అనుభవించబడు స్వరూపము); జలము - అన్నాదము (పృథివికి స్థానము).
జలము అన్నము; జ్యోతి (అగ్ని) - అన్నాదము (జలమునకు చోటు)!
జ్యోతి అన్నము; వాయువు అన్నాదము (జ్యోతికి - అగ్నికి వాయువు ఉనికి స్థానము)!
వాయువు అన్నము; ఆకాశము వాయువునకు అన్నాదము (వాయువు చలించు చోటు)!
ఆకాశము అన్నము. ఇంద్రియములు అన్నాదము (ఆకాశమునకు స్థానము)!
ఇంద్రియములు అన్నము. మనస్సు అన్నాదము (ఇంద్రియములు ఉనికి కలిగి ఉన్న చోటు)!
మనస్సే అన్నము. బుద్ధి అన్నాదము. (మనస్సుకు బుద్ధి జనన స్థానము)!
బుద్ధి అన్నమైతే, అవ్యక్తము అన్నాదము!
అవ్యక్తము అన్నమైనప్పుడు అక్షరము అన్నప్రదాత!
అక్షరము అన్నము, అప్పుడు మృత్యువు అన్నప్రదాత!
మృత్యువు ఆమృత్యువుకు పరము (ఆవల)గా ఉన్న ఆత్మదేవునితో ఏకీభూతము పొందుచున్నది.
అట్టి పరస్వరూపము సత్-అసత్-సదసత్ కూడా కాదు.
ఇదియే నిర్వాణానుశాసనము! వేదానుశాసనము!

పఞ్చదశః ఖండః

1.) అథ హి ఏనం రైక్వః పప్రచ్ఛ -
భగవన్! యో అయం విజ్ఞాన ఘన ఉత్క్రామన్
స కేన, కతరత్త్వ అవస్థానం దహతి? ఇతి।

తస్మై సహోవాచ -
యోఽయం విజ్ఞానఘన ఉత్క్రామన్
- ప్రాణం దహతి
- అపానం, వ్యానం, ఉదానం,
సమానం, వైరమ్భమ్, ముఖ్యమ్,
అన్తర్యామమ్, ప్రభఞ్జనమ్, కుమారమ్,
శ్యేనమ్, శ్వేతమ్, కృష్ణమ్, నాగం దహతి।
పృథివి-ఆపః-తేజో-వాయుః-ఆకాశం దహతి।
జాగరితం స్వప్నం సుషుప్తం చ తురీయం చ
- మహాన్తం చ లోకం, పరం చ లోకం, దహతి।
లోకాలోకం దహతి।
- ధర్మ-అధర్మమ్ దహతి।
- అభాస్వరం, అమర్యాదం,
నిరాలోకం, అతఃపరమ్ దహతి।
- మహాంతం దహతి।
అవ్యక్తం దహతి।
అక్షరం దహతి। మృత్యుం దహతి।
మృత్యుర్వై పరే దేవ
ఏకీ భవతీతి।
పరస్తాత్..
న సత్। న అసత్। న సదసత్।
ఇత్యేతత్ నిర్వాణానుశాసనమ్।
ఇతి వేదాఽనుశాసనమ్।
ఇతి వేదాఽనుశాసనమ్॥

రైక్వుడు :  భగవాన్! గురుదేవా! విజ్ఞానఘనుడగు జ్ఞాని ఉత్క్రమించుచున్నప్పుడు (పైకిపోవుచున్నప్పుడు, మీఱుచున్నప్పుడు) అట్టి అతడు ఏ ఏ స్థానములను దహించుచున్నాడు? ఉద్దీపించుచున్నాడు? (ఉత్క్రమణము = దాటివేయుట).

గురుదేవుడు :  ఆ యొక్క విజ్ఞాన ఘనుడు దేహము నుండి ఉత్క్రమించుచ్నుప్పుడు -
➤ ఆతని ప్రజ్ఞ ప్రాణమును దహించుచున్నది.
➤ అంతేకాకుండా అపానమును, వ్యానమును, ఉదానమును సమానమును దహించుచున్నది.
➤ ఉప ప్రాణములగు వైరమ్భమును, ముఖ్యమును, అంతర్యామమును, ప్రభంజనమును, కుమారమును, శ్యేనమును, శ్వేతమును, కృష్ణమును, నాగమును కూడా దహించుచున్నది.
➤ ఆతని ప్రజ్ఞ పంచభూతములగు పృథిని, జలము, తేజస్సు, వాయువు, ఆకాశములనూ కూడా దహించుచున్నది.
➤ త్రిస్థానము - త్రిదశలగు జాగ్రత్-స్వప్న-సుషుప్తులను దహించుచున్నది.
➤ చతురీయము (తురీయము)ను కూడా కాల్చుచున్నది.
➤ మహత్తును ఈ లోకమును పరలోకమును కూడా దహించుచున్నది.
➤ లోకాలోకములను దహించి వేస్తోంది.
➤ ధర్మ-అధర్మములను కాల్చుచున్నది.
➤ అభాస్వరమును (వెలిగించనట్టి దానిని), అమర్యాదమును (పట్టించుకోని విషయములను), నిరాలోకమును అంతఃపరమును (అంతరంగమును → మనో-బుద్ధి-చిత్త-అహంకారములను) కాల్చివేయుచున్నది.
➤ మహాంతమును, అవ్యక్తమును కూడా దహిస్తోంది.
➤ ఇహ-పరములను కాల్చివేయుచున్నది.
➤ అక్షరమును దహిస్తోంది.
➤ మృత్యువును కూడా దహించి వేస్తోంది.
➤ మృత్యువు ఆ పరదేవుని యందు (పరమాత్మ యందు) ఐక్యము పొందినదై, ఏకీభూతమగుచున్నది.

అప్పటికీ శేషించునదే కేవల సహజ పరస్వరూపము! అది నత్తు కాదు! అసత్తుకాదు! సదసత్తు కూడా కాదు.

ఇతి - నిర్వాణానుశాసనమ్|
ఇతి - వేదానుశాసనమ్
వేదానుశాసనమ్ ఇతి॥

షోడశః ఖండః

1.) సౌబాల బీజ బ్రహ్మోపనిషత్..
న అప్రశాన్తాయ దాతవ్యం|
న అపుత్రాయ, న అశిష్యాయ,
- న అసంవత్సర రాత్రోషితాయ,
- న అపరిజ్ఞాత కులశీలాయ దాతవ్యం।
నైవచ, ప్రవక్తవ్యా!

యస్య దేవే పరాభక్తిః! యథా దేవే తథా గురౌ।
తస్య ఏతే కథితా హి అర్థాః ప్రకాశన్తో మహాత్మన।

ఇత్యేతత్ నిర్వాణానుశాసనమ్।
ఇతి వేదాఽనుశాసనమ్।
ఇతి వేదాఽనుశాసనమ్॥

పరమ సత్యమును ప్రతిపాదించుచున్న ఈ ’పౌబాల బీజ బ్రహ్మోపనిషత్ పాఠ్యాంశమును
- ప్రశాంతముగా ఉండనివానికి బోధించరాదు.
- పుత్రుడు / శిష్యుడు కానివాడికి ఇవ్వకూడదు. (పిత్రుభక్తి, గురుభక్తి లేని వానికి సంబోధించకూడదు).
- ఒక్క సంవత్సరము గాని, ఒక రాత్రి గాని శ్రోతయొక్క ప్రజ్ఞ-ఆశయములను పరిశీలించకుండా చెప్పకూడదు.
- కులశీలములు, కులధర్మములు తెలియని వానికి ఇవ్వనూ కూడదు. బోధించనూ కూడదు.

ఎవ్వనికి దైవభక్తి, గురుభక్తి ఉంటుందో ఆట్టి మహాత్ముని యందు మాత్రమే ఈ ఉపనిషదార్థము ప్రకాశించగలదు.

ఇదియే ఆత్మనిర్వచితమ్.
నిర్వాణానుశాసనము.
వేదానుశాసనము.
వేదానుశాసనమితి।

ఇతి
సౌబాల బీజ బ్రహ్మోపనిషత్
(లేక)
సుబాలోపనిషత్ సమాప్తః ।
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥


శుక్ల యజుర్వేదాంతర్గత

15     సౌబాల బీజ బ్రహ్మ ఉపనిషత్

(లేక) సుబాల ఉపనిషత్

అధ్యయన వచన పుష్పము

1.) ప్రథమ ఖండము - సృష్ట్యాది

ఒకానొకప్పుడు రైక్వుడు అను వేద విద్యాపారంగతుడు తన గురువు అగు ఘోరాంగీరస మహామునీశ్వరుని ఆశ్రమం చేరి ’గురుశుశ్రూష’ చేస్తూ భక్తి ప్రపత్తులతో ఆ సద్గురువు సూచించిన మార్గములో దీర్ఘకాలము తపో-ధ్యాన-యోగాభ్యాసములను నిర్వర్తించారు.

క్రమంగా రైక్వుని బుద్ధి నిర్మలము, అధ్యాత్మ విద్యాశ్రవణమునకు అర్హము అగుచున్నట్లుగా గురువులగు శ్రీఘోరాంగీరసుల వారు గమనించారు. ఒకరోజు రైక్వుని, తదితర కొంతమంది శిష్యులను ఏకాంతమునకు ఆహ్వానించి తపస్సు - ధ్యాన యోగ సంబంధమైన అనేక విశేషాలు, రహస్యాలు వివరించసాగారు. ఆ విధముగా వింటూ, రైక్వుడు ఇక పరబ్రహ్మతత్త్వశాస్త్రమగు ’ఆత్మానారాయణ విద్య’ గురించి గురువును పరిప్రశ్నించటము ప్రారంభించారు.

ఘోరాంగీరస మునీంద్రుడు : ప్రియరైక్వా! ప్రియబిడ్డలారా!

సాధనలన్నిటి యొక్క పరాకాష్ట - ప్రయోజనము - మీ సహజ స్వరూపమగు ఆత్మగురించి ఎరుగుటయే! అట్టి అఖండమగు బ్రహ్మమే మొట్టమొదటి - ఆ తర్వాత - ఇప్పుడు - ఇంక ఎప్పటికీ ప్రకాశనమానమై ఉన్నదని, అది మీకు - నాకు - ప్రతి ఒక్కరికీ అద్వితీయమని ఎరుగటయే ఈ జగదనుభవ - సందర్భము యొక్క ముఖ్య ప్రయోజనము.

రైక్వుడు :  హే సద్గురూ! మొట్టమొదట అఖండమగు బ్రహ్మమే ఉండి ఉండగా, ఏమి జరుగుటచే ఈ ఎదురుగా కనిపిస్తున్న ద్రష్ట-దృశ్యముల తతంగమంతా ఏర్పడినదగుచున్నది? తదాహుః, కిం తదాసిః?

ఘోరాంగీరస మునీంద్రుడు : ఔను! మనము చెప్పుకొనుచూ వస్తున్న విధంగా మొట్టమొదట ‘బ్రహ్మము’ మాత్రమే ఉన్నది. అదియే ‘పరమాత్మ’, పరతత్త్వము’, ‘కేవలము’ అని కూడా అంటున్నారు. అయ్యది ’ఉనికి (సత్) అనునది ఒక లక్షణముగా కలిగి ఉన్నది.

అయితే, అది సత్తు (ఉన్నది) కాదు! అసత్తు (లేనిది) కాదు!
సత్+అసత్తు (ఉన్నది+లేనిది) = అని కూడా కాదు! (ఉండీ లేనిది కాదు).

అందుచేత ’సత్-అసత్’ శబ్దముల పరిధుల సహాయముతో నిర్వచించలేము. కేవల తేజోరూపమగు అద్దాని నుండి ఊహ-భావన-కల్పనా రూపమగు ‘తమస్సు’ - అనిర్వచనీయంగా బయల్వెడలుచున్నదని మాత్రం అనగలం.. అట్టి ’తమస్సు’ నుండి పంచభూతాత్మకమగు ‘భూతాది’ బయల్వెడలుతోంది.

ఈ విధంగా నిర్విషయపరబ్రహ్మము నుండి సవిషయ సంబంధమైన ’తమస్సు’…,
    తమస్సు నుండి భూతాది (The Materialism),
    భూతాది నుండి ఆకాశము (Space),
    ఆకాశము నుండి వాయువు (స్పందన, చలనము),
    వాయువు నుండి - అగ్ని (తేజస్సు - ఉష్ణము),
    అగ్ని నుండి జలము (ఆపః - ద్రవము - ప్రవాహరూపము),
    ఆపః నుండి - పృథివీ (Solid)
ఈ తత్త్వాలన్నీ బయల్వెడలుచున్నాయి.

అది ఒక సమమగు అణము వంటిదిగా రూపుదిద్దుకొంటోంది. అదియే ‘బ్రహ్మాండము’ అనబడుచున్నది. అది సంవత్సరము (‘సంవత్-సరమ్’) కేవల సత్, సరస్సులో నిశ్చల జలమువలే కొంతకాలము అట్లే ఉండి, రెండు విధములుగా విభజనమగుచున్నది.

1) భూమి (క్రింద), 2) ఆకాశము (పైన)

భూమి - ఆకాశముల మధ్య పురుషకారముతో కూడిన దివ్య పురుషుడు ఉదయిస్తున్నారు. ఆ పురుషాకారము - సహస్ర శీర్షా పురుషః, సహస్రాక్షః, సహస్ర పాద్, సహస్ర బాహుః - వేలాది శిరస్సులను, వేలాది కనులను, పాదములను, బాహువులను (ఆలోచనలు దృష్టులు, నడకలు, కార్యనిర్వహణములు) - (ఒక కథారచయిత కథలో అనేక పాత్రలు రచించు తీరుగా) అవధరించుచున్నారు.

అన్నిటికీ అగ్రముగా (ముందుగా)  ‘మార్పు (Factor of Change)’ అను రూపము గల మృత్యువు కల్పించబడుచున్నది.

ఆ మృత్యువు నుండి -

    త్వక్షరమ్ -‘3’ అక్షరములు గల, (సృష్టి-స్థితి-లయలు)
    త్రి శిరస్కమ్ ‘3’ శిరస్సులు గల, (ద్రష్ట - దర్శన దృశ్యములు)
    త్రి పాదమ్ ‘3’ పాదములు గల (జాగ్రత్-స్వప్న-సుషుప్తులు)

… అనేవి ఖండపరశువు (గండ్రగొడ్డలి) వలె నియామకమగుచున్నాయి.

అప్పుడు ‘సృష్టించటము’ - అనే స్వభావముతో కూడిన పురుషకారము ఉదయించుచున్నది. ఆ ప్రథమ పురుషకారుడు - బ్రహ్మము యొక్క తేజస్సుచే - సృష్టికర్తయగు ’బ్రహ్మదేవుడు’గా స్తుతించబడుచున్నారు.

అట్టి బ్రహ్మము + (వేదములలోని) సృష్టి బ్రాహ్మణము (బ్రహ్మము +అహమ్) నుండి (లేక, బ్రాహ్మణముల నుండి) ఈ సృష్టి బయల్వెడలసాగింది. వారి నుండి ముందుగా మనో రూపులగు మానస - పుత్రులు జనించారు. వారు సప్త మానస పుత్రులై సృష్టిలో విరాజిల్లసాగారు.

    ముఖము నుండి - బ్రాహ్మణులు (యోచనముల - అభిమానులు), — [Thinking]
    బాహువుల నుండి - రాజన్యులు (సామర్ధ్యముల - అభిమానులు), — [Functioning]
    ఊరవుల (తొడల) నుండి - వైశ్యులు (పరిపోషణముల - అభిమానులు), — [Maintaining]
    పాదముల నుండి - శూద్రులు (ఇంద్రియానుభవముల - అభిమానులు), — [Enjoying]
ఇవన్నీ - వీరంతా బయల్వెడలుచున్నారు.

ఇంకా…. పురాణ పురుషుడగు హిరణ్యగర్భ పురుషుని దేహము నుండి మరికొన్ని కూడా బయల్వెడలుచున్నాయి.

    మనస్సు నుండి చంద్రుడు (ఓషధ - వనస్పద తత్త్వములు),
    చక్షువుల నుండి - సూర్యుడు (తేజస్సు - ఆదిత్యుడు),
    చెవుల నుండి వాయువు, ప్రాణశక్తి,
ఆయన హృదయములోనే ఈ కనబడేదంతా జనించుచున్నది.

ఈ దృశ్య సృష్టి అంతా కూడా కేవలాత్మ నుండి జనించిన సృష్టికర్తయగు హిరణ్యగర్భుని (బ్రహ్మదేవుని) మనోవికాసమే! హృదయాంతర్గత విన్యాసమే!


2.) ద్వితీయ ఖండము - సృష్టి పరికరములు

ఆ సృష్టికర్తృత్వ (సృష్టి అహంకార) పురుషుని
- అపానవాయువు (నిచ్ఛ్వాస వాయువు) నుండి నిషాదులు,
- ఎముకల నుండి యక్షులు, రాక్షసులు, గంధర్వులు,
- రోమముల నుండి పర్వతములు,
- లలాటము నుండి ఓషధులు, (ఆహార ధాన్యములు), వనస్పతములు (ఫలములు, పప్పు ధాన్యములు),
- ఆయన క్రోధము నుండి రుద్రుడు,
- ఆ మహాభూత స్వరూపుని ఊపిరి నుండి - ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము, వేదాంగములు, శిక్ష, కల్పన, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము, న్యాయము, మీమాంస, ధర్మశాస్త్రము, వ్యాఖ్యానము, తర్కశాస్త్రము..,
- అంతేకాక ఈ సర్వజీవరాశులు, వారివారి స్వభావములు, జీవన విధానములు
… ఇవన్నీ జనించసాగాయి.

ఎవనిలో ఈ విశ్వము, ఇందులోని త్రిలోకములు, జీవజాతులు, వారి వారి ఆహార - విహారములు, పరస్పరానుకూలములు, పరస్పర ప్రతికూలములు…, ఇవన్నీ కనిపిస్తున్నాయో… ఆతడే హిరణ్య జ్యోతి స్వరూపుడగు ‘బ్రహ్మ’!

ఆ సృష్టికర్త - సృష్టిగమన విధానముగా తనను తాను రెండు రూపములుగా కల్పించుకొనుచున్నారు.
1. పురుషుడు 2. స్త్రీ
(పురుషుడు = పురుషకారము తనదైనవాడు, స్త్రీ = స-ర-త = సత్త్వ-రజో-తమోగుణ - వర్తన).

దేవదేవుడుగా అయి అశరీర దివ్యప్రజ్ఞలతో మనోదేహమాత్రులగు దివ్య స్వరూప - దేవతలను సృష్టించారు.

ఋషీశ్వరుడై - ఋతు ఎరిగి ఆ ఋత్ (యదార్థమును) శబ్దపూర్వకముగా గానము చేయగా వేదవాక్కులు బయల్వెడలాయి.

అట్లాగే తన కల్పనా రూపమగు సృష్టియందు యక్షులను, రాక్షసులను, గంధర్వులను, జననివాసయోగ్యములగు గ్రామములను, జంతు నివాస యోగ్యములగు అరణ్యములను, గ్రాసము స్వీకరించి క్షీరమును ప్రసాదించు పశువులను - ప్రసాదించారు. అందులో పునరుత్పత్తి చమత్కారము సుసృష్టితము అవసాగింది.

ఆవు-ఎద్దు; ఆడగుర్రము-మొగగుర్రము; విశ్వంభరుడు-విశ్వంభరి మొదలగువన్నీ సృష్టించారు. అట్లు సృష్టించబడుచున్న జీవులందరికీ ఆహారము-ఆహార విధానము కల్పించారు.

చివరిగా తానే వైశ్వానర రూపుడై ‘జఠరాగ్ని’ దేహముతో తన కల్పనలను - ‘సందగ్ధా’ - దహించసాగారు.

కల్పనా సందగ్ధము

పృథివి - జలమునందు, జలము - తేజస్సు (అగ్ని) యందు, తేజస్సు-వాయువునందు, వాయువు - ఆకాశమునందు, ఆకాశము ఇంద్రియములందు, ఇంద్రియములు (శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ) పంచతన్మాత్రల యందు, తన్మాత్రలు - ’భూతాది’ యందు, భూతాది - సర్వజీవులులోని అఖండ అహంకార స్వరూపమగు ’మహతి’ యందు, మహాన్ (మహత్) - అక్షరము నందు, అక్షరము - తమస్సు నందు, తమస్సు - పరతత్త్వము నందు ’విలీన ధర్మము’ను పరికల్పన చేయసాగారు.

ఆ విధంగా అన్నీ విలీనమగుచున్నప్పుడు కూడా, శేషించియుండే పరబ్రహ్మతత్త్వము - అట్టి పరబ్రహ్మమును సత్తు కాదు! అసత్తు కాదు! సదసత్తు కాదు!

ఇతి నిర్వాణశాసనమ్! వేదాను శాసనమ్!


3.) తృతీయ ఖండము - ఆత్మ లక్షణములు

రైక్వుడు :  మహాత్మా! మునిసత్తమా! ఈ పాంచభౌతిక జగత్తు అంతా కూడా అనేక చిత్ర విచిత్ర సంప్రదర్శన విశేషములతో కూడి కనిపిస్తోంది కదా! ఇంతగా 14 లోకముల అనేక అనేక చమత్కారములతో కూడిన ఈ జగత్తు మొట్టమొదట ఎక్కడ ఉండి ఉన్నది? ఎట్లా బయల్వెడలుతోంది? ఎవరివలన?

ఘోరాంగీరస మునీశ్వరుడు : మొట్టమొదట ఇది అసత్తే అయిఉన్నది. ‘జగత్తు’ అనునది ఆత్మాంశ అగు ద్రష్ట యొక్క భావన
ఊహ-అభిమాన-ఆవేశ ఫలస్వరూపమే। 

ఒక భావనచే ఒక తీరుగా, మరొక భావనచే మరొక తీరంగా ఉండటము చేత ఇది అసత్తు (స్వతఃగా లేనిది)గా చెప్పబడుచున్నది.

ఇది 1) ద్రష్టయందు స్వప్నమువలె 2) ఆత్మయందు - స్వతఃగా లేనిదై, 3) ఆత్మకు ద్వితీయము కానిదై ఉన్నది.

ఈ దృశ్యము సత్-అసత్ అని, (ఉన్నది - లేదు అని కూడా) అనవచ్చు! ఏ ఆత్మయందు- జలమునకు తరంగాకారము వలెను, మట్టికి ‘కుండ’ ఆకారము వలెను ఈ జగత్తు అనుభవమగుచున్నదో, అట్టి ఆత్మను తెలుసుకుంటే మాత్రమే ఈ జగత్తు యొక్క వాస్తవ రూపము (కల్పనామాత్రమని) తెలియబడగలదు. 

‘మట్టిబొమ్మ యొక్క ఆకార విశేషాలు - (ఇది ఏనుగుబొమ్మ - ఇది బొమ్మ ఇది రాముని బొమ్మ.. మొదలైనవి) ఎంతగా తెలుసుకొన్నప్పటికీ.. అంతా తెలిసినట్లు కానేకాదు. మట్టి గురించి తెలిస్తే “మట్టియే ఒకరు తన ఊహనుబట్టి ఒక బొమ్మగా చేశారు. మట్టి ఆకారముగా అవటము లేదు. కానీ ఆకారముగా ఉన్నది మట్టియే!” - అని తెలిసిపోతుంది. మట్టి యొక్క తత్త్వమేమిటో తెలిస్తే (ఆ మట్టితో ఏ ఆకారమైనా చేయవచ్చు కాబట్టి).. మట్టి బొమ్మ గురించి తెలిసినట్లే! ఆకారము గురించి ఎంతగా తెలిసినా మట్టి గురించి తెలియనంత కాలము - మట్టి బొమ్మ గురించి పూర్ణముగా తెలియనట్లే।

కనుక ఆత్మ ఎట్టిదో తెలిస్తే “జగత్తు మొదలే అసత్తు! ఆత్మకు వేరుగా ఏదైనా, జగత్తు గురించి తెలిసినా, అది అసత్తే నాటకములో రెండు పాత్రల సంబంధము ఎటువంటిదో - ఈ జగత్తులోని జీవుల పరస్పర సంబంధాలు అట్టివి" - అని తెలియగలదు.

మరి ఆత్మ ఎట్టిది?

ఆత్మతత్త్వ విశేషాలు

అజాతమ్ :  శరీరమునకు జన్మ-వృద్ధి-క్షయ-నాశనములు ఉన్నాయి. శరీరి (One who is using the body) కి? అవి లేవు! ఆత్మకు ‘జన్మ’ అను ధర్మమే లేదు.

అభూతమ్ : శరీరము పంచభూత నిర్మితము. ’నేను’అను భావనతో ప్రదర్శితమగుచున్న ’శరీరి’కి? పంచభూత (పృథివి-జల-అగ్ని-వాయు-ఆకాశములచే) నిర్మితుడు కాడు. ఈ విధముగా ఆత్మ-అభూతము.

అప్రతిష్టమ్ : శరీరము ఇక్కడ ప్రతిష్టితమై ఉన్నది. (లేక) అక్కడికి వెళ్లి ఆ ఇంటిలో ప్రతిష్టితమై ఉన్నది అని అనగలము! ఎందుకంటే అది ఆకాశము (చోటు)లో ఉంటుంది. మరొకప్పుడు నశిస్తుంది. ‘నేను’ అనునది? ఒక చోట ఉన్నట్టిది కాదు.. ఆత్మ దేహములలో ప్రతిష్టితమై లేదు. ఆత్మ యందే దేహములన్నీ (ధరించబడిన) పూదండవలె గుచ్చబడినవై ఉన్నాయి. అందుచేత ‘ప్రతిష్ఠతముగా కనిపించేవన్నీ ఆత్మ నుండే ప్రదర్శితమగుచున్నాయి. ఆత్మయో, అప్రతిష్టితము! ఒకచోట ఉన్నట్టిది కాదు!

అశబ్దము : సర్వమునకు పరమై, సర్వమునకు ఉత్పత్తి-స్థితి-లయ స్థానమగు పరతత్త్వ స్వరూపము శబ్దముచే చెప్పబడగలిగేది కాదు. మరి? శబ్దమునకు అది ఆధారము, అందుచేత ‘అశబ్దము’ అనబడుచున్నది. శబ్దములు అద్దానిని నిర్వచించి “ఇది ఇట్టిది! ఇంతే” అని చెప్పి ముగించలేవు.

అస్పర్శమ్ : ఆ పరస్వరూపము ‘స్పర్శ’కు విషయమైనది కాదు. శరీరమును తాకగలము. అంతేగాని ’శరీరి’ని తాకలేము కదా! భౌతిక జగత్తు స్పర్శకు విషయము కావచ్చుగాక! ఆత్మను స్పర్శించనూలేము, ‘ఈ తీరైనది’ అని అననూలేము.

అరూపమ్ : ఈ శరీరమునకు రూపము ఉన్నది. దీనిని ఉపయోగిస్తున్న ’శరీరి’కి రూపము ఎక్కడిది? రూపమే లేని దానికి ఎల్లలు ఎక్కడివి? పరబ్రహ్మమునకు నామ-రూపములు లేవు. అరూపము!

అరసమ్ : పరమాత్మ ఒక పదార్ధము వలె రుచికి విషయము కాదు. అద్దాని స్వకీయ కల్పనయగు దేహములోని ఒక ఇంద్రియము (నాలుక)చే కల్పనా విభాగుడగు దేహి రుచిని ఆస్వాదించుచుండవచ్చుగాక! “దేహి” ని తన అంశగా గల పరతత్త్వము - నాలుకలో రుచిచూడబడు విషయము వంటిది కాదు. అరసమ్!

అగన్ధమ్ : అది పుష్ప సువాసన వలె ముక్కుకు వాసనానుభవముగా అగునదికాదు. అందుచేత అగన్ధము.

అవ్యయమ్ : కనబడేవన్నీ ఇప్పుడున్న స్థితిని మరొకప్పటికి కోల్పోతూ ఉంటాయి. (యత్ దృశ్యమ్-తత్ నశ్యమ్). పరమాత్మ జీవాత్మ-జగత్తులను ప్రదర్శించుచున్నది. అవన్నీ కాలబద్ధమై, మార్పుచెందు స్వభావము కలిగి ఉండవచ్చుగాక! పరమాత్మకు మాత్రం మార్పు-చేర్పులు ఉండవు. నటుడు పాత్రగా కనిపిస్తాడేమోగాని, పాత్రగా అవడు కదా! మార్పు చేర్పులు లేవు కనుక ఆత్మ అవ్యయమైనది.

మహాన్తమ్ : ఒకడికి కలలో అనేక మంది కనిపిస్తూ ఉంటే, వారందరిలోని ‘నేను’ (లేక) ఆత్మ అనునది తానే కదా! ‘నేను’ అనునది (జాగ్రత్‌లో కూడా) ‘నాది’ అనుకొన్న అన్నిటిలో ప్రవేశించినదై ఉంటోంది. అహమ్ అజ్ఞాన దృష్టిచే ఒక్క దేహపరిమితము వలె కనిపిస్తూ ఉన్నప్పటికీ, సుజ్ఞాన దృష్టిచే ‘నేను’ అనునది - ’అందరిలోని నేనైన నేను’గానే ఉన్నది. అందుచేత పరమాత్మ మహాన్తము. ఆత్మ రూప-నామ-కాల-ప్రదేశములకు పరిమితము కాదు. కనుక మహాన్తము!

బృహన్తమ్ : ‘నాటకములోని పాత్రలన్నీ నాటక రచయిత యొక్క రచనా కళావిశేషమే (The Art of Drama - Writing) అయిన తీరుగా - సర్వబ్రహ్మాండములు తనలోనే కలిగి ఉండుటచే పరమాత్మ బృహత్తరమైనది. (The biggest of the Biggest). అందుచేతనే ‘బ్రహ్మము’ అని కూడా పిలువబడుతోంది.

అజమ్ - అజాతమ్ : ఆత్మ దేనినీ తనకు వేరుగా జనింపజేయటమూ లేదు. తాను జనించటము లేదు. సర్వస్వరూపమై యుండియే,… ఆత్మ సదా అప్రమేయమై, నిత్యమై, సత్యమై ప్రకాశించుచున్నది. కాబట్టే ‘పరము-పరతత్త్వము-పరమాత్మ’ అని పిలువబడుచున్నది. ఆత్మ సర్వదా జన్మరహితము. దేనినీ జనింపజేయటమూ లేదు. అజము, అజాతము కూడా!

ఈ విధముగా ఎవ్వరైతే స్వస్వరూపమే అయి ఉన్న ఆత్మను తెలుసుకుంటారో, - ఆత్మానమ్ జ్ఞాత్వా మత్వా ధీరో న శోచతి - అట్టి ఉత్తమ బుద్ధి కలవారు దేనికొరకూ శోకించరు, దుఃఖించరు. ఆత్మ నిత్యమై, తదితరమైనదంతా కల్పితమై ఉండగా, ఇక దుఃఖము దేనికొరకు?

🙏

ఓ రైక్వాయనా! తదితర శ్రోతలారా! ఎందులోంచి ఈ కనబడేదంతా జలములో తరంగమువలె భావన - ఊహగా ప్రదర్శితమగుచూ, ప్రతిష్ఠితమై, మరల మరొకప్పుడు లయించుచున్నదో… అట్టి పరతత్త్వము గురించి ఇంకా కొన్ని విశేషములను చెప్పుచున్నాను. వినండి!

అప్రాణము : ప్రాణము (ప్రాణశక్తి) అద్దానిది. శక్తి వేరు - శక్తిమంతుడు వేరు కదా! ప్రాణశక్తి ఆత్మ నుండి బయల్వెడలుచున్నట్టిది. ఆత్మ ప్రాణశక్తికి, ప్రాణమునకు జనన స్థానము, తనకు ఉపకరణము అయిన మనస్సుకు కూడా ఉత్పత్తి స్థానమై ఉన్నట్టిది. అందుచేత అది అప్రాణము! ప్రాణము తనదై ఉన్నట్టిది; అంతేగాని ప్రాణ రూపము కాదు - ప్రాణముపై ఆధారపడి ఉన్నట్టిది కాదు!

అముఖమ్ : కళ్లు-చెవులు-ముక్కు-నాలుక- చర్మము.. ఇవన్నీ కలిగియున్నట్టి ముఖము అద్దాని ఉపకరణ వస్తువు. ’ఈ కనబడే సర్వము అద్దాని ముఖమే’ - సర్వతోముఖమ్! అది శరీరము లేకపోయినా కూడా ఉండి ఉంటున్నట్టిది. కనుక - అముఖము.

అశ్రోత్రమ్ : అది చెవుల రూపము కాదు. వినికిడి రూపమూ కాదు. వినికిడి అద్దాని చిత్కళ. చెవులు అందుకు ఉపకరణాలు. అవి స్వతఃగా జడములై, ఆత్మచే ఉపయోగించబడుచున్నవై, ఆత్మచే చైతన్యము పొందుచున్నాయి. అందుచేత ’వినికిడి’ అనే ధర్మమునకు ఆత్మ బద్ధము కాదు. నేను ఉపయోగించు వస్తువు యొక్క ధర్మములు ‘నావి’ కాని, ‘నేను’ కాని అవవు కదా! పరతత్త్వము ఈ విధముగా అశ్రోత్రము.

అగమనో : ఆత్మ ఒకచోటి నుండి బయలుదేరి - మరొకచోటికి నడిచి వెళ్ళునది కాదు. ‘ఈచోటు- ఆ ప్రదేశము’.. ఇవన్నీ శరీర ధర్మాలు.. ‘ఈ లోకము-ఆలోకము’.. అనునవో? మనోధర్మాలు. ఆత్మకు రాకపోక ధర్మాలు లేవు. నేను ఇంట్లో ఉన్నప్పుడు - ఉద్యోగ ప్రదేశములో ఉన్నప్పుడు - స్నేహితులతో ఉన్నప్పుడు - సత్సంగములో ఉన్నప్పుడు - ‘నేను’ అనునది ప్రదేశాలు మారుస్తోందా? అంతా ఒక్క ‘నేనే’ కదా! అట్లాగే ఆత్మకు ఆగమన-నిష్క్రమణములు లేవు. జాగ్రత్‌లో ‘ఈతడు వెళ్ళాడు - వచ్చాడు’ అనునవి చెప్పుకుంటున్నాం. జాగ్రత్-స్వప్న-సుషుప్తులు, దేహ-దేహాంతరములు తనలో కలిగి ఉండే ఆత్మ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళగలదు? గమనములు లేనిది! ఉదాహరణకు, ఒకడు కలలో ఈ ఊరినుంచి ఆ ఊరికి వెళ్ళినప్పటికీ, కల తనదైనట్టి ఆతడు ఎక్కడినుండి ఎక్కడికీ వెళ్ళుచుండుటలేదు కదా!

అతేజసమ్ : ఆత్మ యొక్క తేజోరూపమే సూర్య - చంద్ర-నక్షత్ర - అగ్నిలలో తేజోరూపముగా అగుపిస్తోంది. తేజోరూపమును ప్రదర్శిస్తూ దర్శించుకొనుచున్నది కూడా ఆత్మయే! అంతేగాని ఆత్మ తేజోరూపము కాదు. ఒకని ముఖ తేజస్సు ఆతనిది కావచ్చునేమో! అంతేగాని ‘ఆతడు’ కాదు కదా! ఆత్మ అతేజసము.

అచక్షుష్కమ్ : జాగ్రత్-స్వప్నములలో ఉపకరణమై ఉంటున్న చక్షువులు - చూపు అద్దాని చిత్కాళా విశేషాలు. ఆత్మ ‘చూపు’రూపము కాదు. చూపులకు విషయము కాదు. చూపు-చూపులకు విషయములు ఈ రెండూ కూడా ఆత్మ సాన్నిధ్యముచే ప్రవర్తితమగుచున్నాయి. ఒకడు కళ్లు మూసుకొని- ఏదీ చూడటము మానివేసినప్పటికీ - తాను లేకుండా పోడు కదా! ఈ విధముగా ఆత్మ చక్షువులకు చూపుకు పరిమితమైనది కాదు. విషయము కాదు.

అనామగోత్రమ్ : లౌకికమైన - సాంఘికమైన జీవనా విధి విధానాలలో ఒకనిని గుర్తించటానికై కల్పించబడే నామ - గోత్రములు సాంఘిక-లోకాంతర్గత సంబంధమైన కల్పనలు మాత్రమే! ఆత్మకు నామము - గోత్రము ఆపాదించ వీలుకాదు. ‘నేను’ అనుదానికి దేహ నామము - గోత్రము - జాతి ఎట్లా ఆపాదించగలము? అందుచేత ఆత్మ నామ - గోత్ర సంబంధమైనది కాదు. ఆత్మ అనామమ్! అగోత్రమ్!

అశిరస్కమ్ : అన్ని శిరస్సులు తనవై ఉన్న దానికి (సహస్ర శీర్షి పురుషః) ఇది అద్దాని శిరస్సు- అని ఎట్లా అంటాము? అన్ని రూపాలు తనవే అయినదానికి ‘ఇది రూపము’ అని అనలేము కదా! ’ఆత్మకు శిరస్సులేదు. కానీ, శిరస్సును వెలిగించునది ఆత్మయే’!

అపాణి పాదమ్ : అన్ని హస్తములు (చేతలు-చేతులు), అన్ని పాదములు (నడకలు-నడతలు) అద్దానివే! అది పాణి పాదము అగుచున్నదా! ‘నేను’ అను దానికి ఈ దేహము, దీని యొక్క చేతులు - కాళ్లు ఉపయోగించబడు ఉపకరణములు మాత్రమేగాని, ‘నేను’ అనునది కాళ్లు-చేతులుగా అవదు కదా! ఈ విధముగా పరతత్త్వము చేతులు కాళ్లు.. లేనట్టిది. అంతటా తానే అయి, సమమై ఉన్నట్టి పరమాత్మకు చేతులతోను, కాళ్లతోను పని ఏమున్నది? (సర్వతః పాణిపాదమ్ తత్).

అస్నిగ్ధమ్ : ఒక వస్తువుకు నునుపు గఱుకు ఉన్నట్లుగా ఆత్మ నునుపైన గఱుకైన వస్తువు వుంటిది కాదు.

అలోహితమ్ : అద్దానికి లోహధర్మములు (రూపము-గుణము-రంగు-రసాయన ధర్మాలు మొదలైనవి) లేవు. అందుచేత అలోహితము.

అప్రమేయమ్ : అది దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-త్రిగుణ-అహంకార-అవ్యక్త-మహత్- మొదలైనవాటికి సంబంధించినది కాదు. అవి ఆత్మకు సంబంధించినవి కూడా కావు. ఆత్మ సర్వదా విడిగా ఉండి, అద్దాని తేజో విలాసముచే.. అవన్నీ దృశ్యమానమగుచున్నాయి. అందుచేత ఆత్మ సర్వదా ప్రమేయము లేనిది! (Neither Related to nor limited to whatever outwardly appearing). అప్రమేయము!

అహ్రస్వమ్ - అదీర్ఘమ్ : వస్తువులకు వలె ఆత్మకు పొట్టి-పొడవు ధర్మాలు లేవు. ఒకడు పొట్టిగా ఉంటే ‘నేను’ అనునది పొట్టిగా ఉండినట్లా? పొడవుగా ఉంటే, ‘నేను’ అనునది పొడవుగా ఉన్నట్లా? కాదు కదా!

అస్థూలమ్ - అణన్వమ్ : ఆత్మస్థూల వస్తువు (Material Object) కాదు. అణువు వలె సూక్ష్మమైనది కూడా కాదు. అవన్నీ జడమగు పదార్థ ధర్మాలు.. వాటన్నిటికీ చైతన్య స్వరూపమై ఆత్మయే ఆధారముగా ఉన్నది.

న అల్పమ్ - న అపారమ్ : ఆత్మ అల్పము కాదు. అపారము కాదు. అవన్నీ వస్తు గుణ సంబంధమైనవి. ‘శక్తి-శక్తిమంతుడు’ కూడా అయినట్టి ఆత్మ అల్పము-అనిగాని అపారము అనిగాని ఎట్లా అంటాము? అనన్యమగు ఆత్మకు చిన్న పెద్ద తేడాలు ఆపాదించటమెట్లా?

అనపావృతమ్ –అసంవృత్తము : ఆత్మదేనినీ చుట్టుకొని ఉండటము లేదు. ఆత్మను మరొకటేదీ పట్టుకొని ఉండటము కూడా లేదు. అందుచేత అనపావృతము, అసంవృతము కూడా!

అప్రకాశ్యమ్ : మరొకటేదీ ఆత్మను ప్రకాశింపజేయలేదు. ఆత్మసర్వదా స్వయం ప్రకాశకము. సూర్యుని చూడటానికి దివిటీ కావాలా? ఆత్మను ప్రకాశింపజేయ గలిగినది ఏదీ ఎక్కడా లేదు. అందుచేత అప్రకాశ్యము.

అనన్తరమ్ - అబాహ్యమ్ : ఆత్మలోన ఉన్నది కాదు. బయట ఉన్నది కాదు. (అన్తర్బహిశ్చ తత్ సర్వమ్ వాప్య నారాయణ స్థితః). అంతా అదే అయి ఉండగా, అద్దానికి బాహ్యమేమున్నది? అంతరమేమున్నది? భౌతికాకాశమునకే బాహ్య-అభ్యంతరములు లేవు. ఇక ఆత్మాకాశము మాట వేరుగా చెప్పాలా?

న తత్ అశ్నాతి కించనః నతత్ అశ్నాతి కశ్చనః : అట్టి ఆత్మ ఏదీ అనుభవించటమూ లేదు. అది ఎవ్వరి చేతనూ అనుభవించబడటమూ లేదు. అది ఏదీ తినుట లేదు. ఏదీ అద్దానిని తినటమూ లేదు. నాటకములో ఒకడు నటిస్తూ ఉంటే.. పాత్ర పొందుచున్నదేదీ పాత్రధారుడు పొందుచున్నట్లు కాదు కదా! నాటకములోని పాత్రధర్మములకు - నటునికి ఏమి సంబంధం?

ఓ రైక్వా! ప్రియబిడ్డలారా!

అట్టి ఆత్మ వస్తువును అర్థము చేసుకోవటము కోసమే మనము ఈ ‘జీవితము’ అనే అవకాశమును ఉపయోగించుకోవాలి.

సత్యము - దానము - తపస్సు - చెక్కు చెదరని (అంతా బ్రహ్మమే అను భావనతో కూడిన) బ్రహ్మచర్యముతో - ఈ ప్రాపంచక సర్వ విషయముల పట్ల ‘నిర్వేదన’ (Non-Worrying) పెంపొందించుకున్నప్పుడు ఆరవ (6) అంగమగు మనస్సు సహాయంతోను, మీలోనే సర్వదా వేంచేసినదై యున్న ఆ ఆత్మవస్తువును - సాధయేత్ - సాధించుకోవాలి! సిద్ధింపజేసుకోవాలి.

అట్టి ఆత్మ దృష్టి (లేక) ఆత్మదర్శనము కొరకై ఉపాయములను వినండి.

దమము - ఇంద్రియ నిగ్రహము
దానము - సర్వము పరమాత్మకు చెందినదిగా భావించి, సహజీవులకొరకై సమర్పణ భావము కలిగి ఉండటము.
దయ - సహ జీవుల పట్ల దయ, ప్రేమ కలిగి ఉండటము
… ఇటువంటి శాస్త్ర-మహనీయ ప్రవచితములగు ఉపాయములను ఆత్మదర్శన - ఆశయముతో ఆశ్రయించిన వారై ఉండండి.

అంతేగాని ఇంద్రియ విషయములకు వశులై, ‘అంతా నాదే’ అనే మమకార-అహంకారములతో లోభ గుణముతో, కోప-తాప-ఆవేశములుచే పరవశులై…., ‘మానవజన్మ’ అనే అవకాశము దుర్వినియోగ పరుచుకోకండి!

ఎవ్వడు సర్వ ప్రయత్నములచే సర్వదా, సర్వమై, సర్వమునకు సాక్షి అయి ఉన్న బ్రహ్మమును ఇక్కడే - ఇప్పుడే సంశయ రహితముగా ఎరిగి ఉంటాడో.. ఆతని ప్రాణములు దేహమును విడచినప్పుడు మరెక్కడికో పోవు.

న తస్య ప్రాణా ఉత్క్రామస్తే! మరి?
అత్రైవ సమవలీయన్తో బ్రహ్మైవసన్? ఆ ప్రాణములు బ్రహ్మమును ఎరిగి ఉండుటచేత బ్రహ్మమునందే విలీనమగుచూ..,
బహ్మ ఆప్యేతి య ఏవం వేద! బ్రహ్మమునే పొందుచున్నాయి. (బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి!) బ్రహ్మమును ఎరుగుటచే ఆతడు బ్రహ్మమే అగుచున్నాడు. ఇది వేదములు ఎలుగెత్తి గానం చేస్తున్న సత్యవాక్కు!


4.) చతుర్థ ఖండము - హృదయ పద్మము

ఘోరాంగీరస మునీశ్వరుడు : నాయనలారా! ఇంకా వినండి.

హృదయస్య మధ్యే లోహితం మాంస పిండం।
హృదయము యొక్క మధ్య ప్రదేశములో లోహితము (పద్మరాగము వలె ఎరుపు రంగుతో కూడిన) మాంస పిండము ఉన్నది.

ఆ హృదయ మాంసపిండము యొక్క అంతర్గతంగా తామరమొగ్గ - కలువల వలె హృదయాకాశ పుష్పము అనేక విధములుగా (నును రెక్కల వంటి విభాగములతో) వికశితమైయున్నది.

తత్ దహరం పుండరీకమ్। అదియే దహరము  “దహరాకాశము” అనబడుచున్నది.

హృదయస్య దశ ఛిద్రాని భవన్తిః యేషు ప్రాణాః ప్రతిష్ఠితో।  అట్టి హృదయకుశుమమునకు సూక్ష్మమగు 10 ఛిద్రములు (గుండ్రటి చిల్లులు)
ఉన్నాయి. ఆ పది ఛిద్రములలో సూక్ష్మ ప్రాణములు ప్రతిష్టితమై ఉన్నాయి.

ఆ హృదయ కుశుమములో సంచరించుచున్న పంచ ప్రాణములలో మొదటిదైన ప్రాణవాయువుతో (బయట నుండి లోనికి వచ్చి నిలుచు ప్రాణధ్యాసతో) సంయుజ్యము పొందుచున్నప్పుడు అట్టి వానికి-అనేక నదీ సంబంధమైన - నగర సంబంధమైన - ఇత్యాది దృశ్యములు కనబడుచూ ఉంటాయి.

యదా వ్యానేన సహ సంయుజ్యతే తదా పశ్యతి దేవాంశ్చ, ఋషీంశ్చ।  ఎప్పుడైతే తన యొక్క దేహములోని వ్యాన ప్రాణచలనముతో (ప్రాణాయామ విధానంగా), హృదయ ఛిద్రములలో ఉన్న దహరాకాశ స్థానములలో ప్రవేశింపజేసి…., (తన వ్యాన చలనమును ఆ హృదయములోని దహరాకాశములో ప్రవేశింపజేస్తాడో) ఏకము చేస్తాడో, అప్పుడాతడు దేవతల-ఋషుల దర్శనము చేయగలుగుచున్నాడు. వారితో సంభాషణము సిద్ధించుచున్నది.

యదా అహనేన సహ సంయుజ్యుతే తదా పశ్యతియక్ష రాక్షస గంధర్వాన్! ఎప్పుడు అపానము హృదయ పుష్పములోని ఛిద్రములో ప్రవేశించి అక్కడి దహరముతో ఏకము చెందుతుందో, అప్పుడు యక్ష-రాక్షస-గంధర్వుల దర్శనము అగుచున్నది.

ఉదాన చలనముతో కూడి - హృదయ పుష్పఛిద్రాంతర్గత ప్రాణశక్తితో దహరములో ధ్యాస ప్రవేశించినప్పుడు దేవలోకములు, దేవతలు, స్కందుడు, జయంతుడు, (ఇంద్రకుమారుడు) మొదలైన వారి దివ్యదర్శనము అగుచున్నది.

సమాన ప్రాణముతో కూడి హృదయ పుష్పఛిద్రములోని దహరాకాశములో ధ్యాసతో కలిసినప్పుడు దేవలోకము నందనవనము, పారిజాతవనము, కామధేనువు, కల్పవృక్షము మొదలైన దేవతా సంపదలు దర్శనమగుచున్నాయి.

(ఉపప్రాణ రూపమగు) - వైరంభ ఉపప్రాణముతో మరియు ధ్యాసతో కూడి హృదయ పుష్ప ప్రవేశము చేసి, ఆ పుష్ప ఛిద్రములోని దహరముతో కలియుటచే, అట్టియోగి వైరంభ ప్రాణ సంయోగముచే - చూచినవి-చూడనివి, విన్నవి-విననివి, భుజించినవి-భుజించనివి, సత్యము-అసత్యము - ఇటువంటివన్నీ చూడగలుగుచున్నాడు.

ఈ విధంగా దేహ దశప్రాణముల సహాయముతో హృదయాకాశ ప్రాణదశ దళములతో యోగాభ్యాసులు ఏకము చేసి సిద్ధిని పొందుచున్నారు. ఇప్పుడిక హృదయాకాశ ప్రాణదశ దళములతో యోగాభ్యాసులు ఏకము చేసి సిద్ధిని పొందుచున్నారు.

♠︎

ఇప్పుడిక హృదయ దహరాకాశ - దశప్రాణ కుసుమ దళముల నుండి, పిండభాగమునకు వద్దాము.

ఆ హృదయ పిండము నుండి 10 ముఖ్యనాడులు బయల్వెడలుచున్నాయి. ఆ ప్రతి ఒక్కనాడి నుండి ‘72000’ ఉపనాడులు బయల్వెడలుచున్నవై ఉన్నాయి.

జీవాత్మ ప్రజ్ఞ ఆ హృదయ పిండమునందు ప్రవేశించి నిదురించుచున్నప్పుడు (విశ్రాంతి పొందినప్పుడు) ఒకానొక శబ్దము వెలువడుతూ ఉంటుంది. హృదయకోశము యొక్క రెండవ భాగము నందు ఈ జీవాత్మ ప్రజ్ఞ ప్రవేశించి నిదురిస్తున్నప్పుడు, ఇహ-పరలోక విభాగములన్నీ చూస్తూ ఉంటోంది. సర్వశబ్దార్థములను (మహావాక్యార్థములను) ఎరుగగలుగుచున్నది. ఇట్టి రెండవ హృదయ కోశ విభాగ ప్రవేశమును యోగశాస్త్రములో ’సంప్రసాద’.. అని పిలుస్తున్నారు. హృదయ పిండములో ఒకవైపు నిద్రా మౌనము, రెండవవైపు విశ్వము.

ఆ ప్రాణశక్తి ఈ భౌతిక దేహమును ఎల్లప్పుడు పర్యవేక్షిస్తూ, పరిరక్షించుచూ ఉన్నది.

దేహములో ఆకుపచ్చని-నల్లని-పసుపుపచ్చని-ఎర్రని-తెల్లనినాడులు ఉన్నాయి. అవి అన్నీ - రుధిరస్య పూర్ణాః- రక్తముతో పరిపూర్ణములై ఉన్నాయి. హృదయ మాంసపిండము నందలి దహరము (ఆకాశము) తామర మొగ్గవలె, కలువపువ్వు వలె అనేక విధములుగా వికసించి ఉన్నది. 10 నాడులను ఆశ్రయించి ఉన్న 72000 ఉపనాడులు – వెంట్రుకలో వెయ్యవ వంతు (1/1000) పరిణామములో శక్తిరూపముగా ఉండి శరీరమంతా విస్తరించి ఉన్నాయి. హృదయాకాశములోని విశ్వశక్తియే (దహరమే) వాటన్నిటికీ పుట్టినిల్లు, ప్రదర్శనా ప్రారంభస్థానము, వికశిత ప్రదేశము.

సుషుప్తి

అట్టి హృదయాకాశము నందు జీవాత్మ. సర్వకోశములకు-దివ్యలోకములకు-వేరై, పంచకోశములందు గాఢనిద్రా ముద్ర వహిస్తూ ఉంటున్నాడు.

ఏ జీవాత్మ అయితే హృదయదహరాకాశము నందు సుషుప్తి (గాఢనిద్ర) పొందుచున్నాడో..
- అట్టి సుషుప్త స్థితిలో ఏ కోరికలు కోరడు. (జాగ్రత్ ఉండదు)
- స్వప్నాంతర్గత దృశ్యము కూడా ఆతనికి ఉండదు.
- అట్టి గాఢ నిద్ర (సుషుప్తి) అనుభవములో దేవతలు, దేవలోకములు, యజ్ఞయాగాది క్రియాకార్యక్రమములు, తల్లి తండ్రిబంధువులు - ఇత్యాది సంబంధ బాంధవ్యములు, సొమ్ము-సొంతదారు- దొంగ మొదలైనవి, ఇవన్నీ కూడా ఉండవు. అది జడత్వము వహించినప్పటి మౌన స్థానము.

అమృతమార్గము

ఎక్కడైతే సృష్టి, సృష్టికర్త, శరీరము మొదలైనవన్నీ రహితమవుతాయో, (వాస్తవానికి మొదలే లేనివౌతాయో), ఆస్థానము (ఆ అనుభవము) జీవునికి అమృతమయము. అది కేవల సాక్షీ స్వస్థానము. అదియే ‘అమృత మార్గము’ అని ‘సలిల మార్గము’ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ దృశ్యమును దాటివేసి, అట్టి అమృతమార్గములో (లేక) సలిల మార్గములో అడుగులు వేయుచున్నవాడు (సర్వదృశ్యములు దాటివేసి నిరామయ-నిష్ప్రపంచ కేవలాత్మస్థానము వైపు లక్ష్యముతో అడుగులు వేయువాడు అట్టివాడు) ‘సామ్రాట్’ అను శబ్దముతో (అధ్యాత్మశాస్త్రములో) చెప్పబడుచున్నాడు.


5.) పంచమ ఖంఢము - ఆత్మ అనగా ఏది?

అజరమ్ - అభయమ్ - అమృతమ్ - అశోకమ్ - అనన్తమ్ - కేవలాత్మ

స్థానాని స్థానిభ్యో యచ్ఛతి।  స్థానములను స్థానులకు (స్థానము కలవాటికి) ఇచ్చుచున్నట్టిదే ‘చైతన్యాత్మ’ అట్టి స్థానములందు-స్థానులయందు సంచరించుచున్నట్టిది కూడా ఆ చైతన్య స్ఫూర్తి రూపమే!

ఆత్మ సర్వదా 1) అజరము (జన్మలేనిది) 2) అమృతము (మరణము లేనిది - అజరామరము), 3) అభయము, 4) అశోకము 5) అనంతము అయి ఉన్నది. స్వస్వరూపమగు ఆత్మను ఈ ఈ పంచ-అకారములుగా (అజర-అమృత-అభయ-అశోక-అనంత స్వభావసమిత్వముగా) గమనించి ఉపాసించాలి!

అట్టి ఆత్మ సర్వాత్మకము-సర్వతత్త్వస్వరూపము అయినప్పటికీ కూడా.. ఉపాసన కొరకై (యోగ శాస్త్రములో) ఉపాసక ద్రష్టలచే చెప్పబడుచున్న ఉపాసనా స్థానములను ఇప్పుడు వివరిస్తున్నాను. శ్రద్ధాళువులై వినండి.

చూపు - PERCEPTION - THE FACULTY OF SEEING

ఈ భౌతిక చక్షువులు (చక్షు ఇంద్రియము) ‘అధ్యాత్మము‘.
చూడబడుచున్నవన్నీ ‘అధిభూతము’.
ఈ చూపును ప్రసాదించు దివ్యశక్తి - ‘ఆదిత్యుడు’. ఆతడే ‘అధిదైవతము’.

దేహములో గల నాడులు చూపుశక్తిని ప్రసరణ మార్గము. (విద్యుత్తుకు విద్యుత్ తీగలవంటివి).

(1) చక్షురింద్రియములోను, (2) కనబడే దృశ్యములోను, (3) ప్రాణశక్తి యందు, (4) నాడులందు, (5) ఆదిత్యునియందు, (6) చూపు యొక్క విజ్ఞానము (ఎరుక) నందు, (7) ఆనందము (అనుభవము) నందు, ఉండి, అవన్నీ తానే అయి, వాటన్నిటి అంతరమున ఏది సర్వదా సంచారములు చేయుచున్నదో.. అదియే ఆత్మ! అట్టి ఆత్మను అజర-అమృత-అభయ-అశోక-అనన్తరూపముగా గమనిస్తూ ఉపాసించాలి.

వినికిడి - THE FACULTY OF HEARING

వినికిడి చెవులు అధ్యాత్మము.
వినబడుచున్నదంతా అధిభూతము.
దశ (10) దిక్ దేవతలు - అద్దాని అధిదైవతము.

నాడులు - నిబంధనము. ఏది నాడులయందు, వినికిడియందు, వినబడుచున్నదానియందు, దిక్కులయందు, దిక్ దేవతలయందు, వినికిడి శక్తి (ప్రాణశక్తి) యందు, వినికిడిచే పొందు ‘అనుభూతి (ఆనందించటము)’ యందు, అవన్నీ ఉండినవై యున్న హృదయాకాశమునందు - అవన్నీ తానే అయి ఉండి వాటి అన్నిటి యొక్క అన్తరమునందు ఏది సర్వదా సంచరించుచున్నదో అదియే మనమంతా ఎల్లప్పుడు ఉపాసిస్తూ ఉండవలసిన అజర-అమృత-అభయ-అశోక-అనన్త లక్షణ సమన్వితమగు ఆత్మ! అదియే సర్వదా ఆరాధ్యము!

ఘ్రాణము వాసన - THE FACULTY OF SMELLING

ఈ వాసన చూచుచున్న ముక్కులో అనుభవమగు ’వాసన’యే (Smell itself) అధ్యాత్మము.
వాసనగా ఎందులోంచి వచ్చి (పుష్పములు మొదలైనవి) ముక్కుకు చేరుచున్నవో, అవన్నీ కూడా అధిభూతము.
వాసన ప్రసాదించు ఈ భూదేవత (పృథివి) అధిదైవతము.

దేహములోని నాడులు అందుకు నిబంధనము.

ఏది వాసన తన్మాత్రతో కూడిన ‘ముక్కు’ యో, ఏది ‘వాసన’గా లభించు వస్తు సమూహమో, ఏవి వాసన సిద్ధించుటకై దేహములో నాడులుగా ఉన్నాయో, ఏ ప్రాణశక్తి వాటినన్నిటినీ అనుసంధానము చేయుచున్నదో, ఏది వాసనను తెలుసుకొను ‘ఎరుక’ రూపముగా ఉన్నదో, ఏ పృథివి వాసనశక్తిని ప్రసాదించు అధిదైవమో, ఏది వాసన - అనుభూతి (Experience) (లేక) ఆనందము రూపముగా ఉన్నదో, ఏ హృదయాకాశములో అవన్నీ స్థానము కలిగినవై ఉన్నాయో, అవన్నీగా తానే అయి ఉన్నదే అంతరాత్మ! వాటి అన్తరాన్తరములో సంచరిస్తూ కూడా ఉన్నది. అట్టి అజరము అమృతము - అభయము - అశోకము - అనన్తము అగు ఆత్మయే మనకు ఆరాధ్య వస్తువు!

జిహ్వ - THE FACULTY OF TASTING

నాలుకలోని రుచి (రుచి అనుభవి) అధ్యాత్మము.
రుచిచూడబడుచున్న సర్వ వస్తు సముదాయము ఆధిభూతము.
వరుణుడు జిహ్వకు అధిదైవతము.

నాడులు అందుకు నిబంధనము.

జిహ్వ (నాలుక) యందు, రుచిచూడబడుచున్న పదార్ధముల యందు (రసయితవ్యములందు), దివ్యపురుషుడగు-వరుణదేవునియందు, జిహ్వమునకు సంబంధించిన నాడులందు, ప్రాణశక్తి యందు, రుచియొక్క జ్ఞానము - అనుభవములందు, హృదయకాశము నందు, ఉండి, అవన్నీ తానే అయి ఉండి, - అంతేకాకుండా వాటన్నిటి అంతరముగాను-ఏదైతే - సంచారములు చేస్తూ కూడా ఉన్నదో - అదియే అజరము, అమృతము, అభయము, అశోకము, అనన్తము అగు ఆత్మ! అదియే ఉపాసించవలసిన వస్తువు.

త్వక్ (చర్మము) - THE FACULTY OF TOUCH

చర్మము - స్పర్శ – (స్పర్శానుభవి) అధ్యాత్మము.
స్పర్శాననుభవమునకు విషయములగుచున్న జగత్తులోని వస్తు జాలమంతా అధిభూతము.
వాయువు (వాయుదేవుడు) అద్దానికి అధిదైవము.

స్పర్శనాడులు అద్దానియందు నిబంధనము.

ఈ చర్మము - స్పర్శయు, ఏది స్పర్శకు విషయమగుచున్నదో అట్టి (ప్రపంచములోని) వస్తు జాలము, అధి దైవమగు వాయుదేవుడు, నాడులు, ప్రాణము, విజ్ఞాన-ఆనందములందు తెలుసుకొనుచున్నట్టిది - అనుభవరూపము, అవన్నీ ఏర్పడినవైయున్న హృదయాకాశము వీటన్నిటిగా ఏది తానే అయి ఉంటుందో, వీటి యొక్క అంతరము నందు - ఏదైతే సంచారములు సలుపుచున్నదో.., అదియే సర్వులు ఊపాసించవలసిన ఆత్మ! అట్టి మన ఆత్మ భగవానుడే మనకు ఉపాస్య విగ్రహము!

మనస్సు - THE FACULTY OF THINKING

ఆలోచన (ఆలోచించువాడు) అధ్యాత్మము.
దేనిదేని గురించి ఆలోచించబడుచున్నదో అది అధిభూతము.
చంద్రభగవానుడు. అధిదైవతము.

దేహములోని నాడులు - అద్దాని నిబంధనము.

ఏదైతే - మనస్సు నందు, ఆమనస్సు ఆలోచించుచున్న విషయములందు, నాడులయందు, అవన్నీ పనిచేయటానికై ప్రాణశక్తియందును, అద్దాని విజ్ఞానము (ఎరుక)-ఆనందము (అనుభూతి-Experiencing) యందును, అవన్నీ ఏర్పడియున్న హృదయాకాశమునందును-ఆయా రూపములుగాను, వాటన్నిటి అంతరముగాను ఏ ఆత్మ సంచారములు చేయుచున్నదో, వాస్తవానికి, అవన్నీ తానే అయి ఉన్నదో…, అదియే అజర-అభయ-అశోక-అనన్త-అమృత స్వరూపమగు ఆత్మ! ఈవిధంగా ఆత్మను ఉపాసించాలి.

బుద్ధి - THE FACULTY OF DISCRIMINATION

బుద్ధి (బుద్ధి తనదైన జీవుడు) అధ్యాత్మము.
అట్టి బుద్ధికి అవగతమగుచున్నదంతా అధిభూతము.
బ్రహ్మదేవుడు ఈ బుద్ధికి అధిదైవతము.

నాడీ విభాగము నిబంధనము.

అట్టి బుద్ధియందు, ఆ బుద్ధిచే నిర్ణయాత్మకమగుచున్న దానియందు (బోధవ్యమునందు), బుద్ధికి అధిదేవత అగు బ్రహ్మదేవునియందు, నాడులయందు, ప్రాణశక్తియందు, విజ్ఞాన - ఆనందములయందు, హృదయాకాశము నందు, వాటి బాహ్య-అంతరములందు ఏది సంచరించుచూ ఉన్నదో.. ఆ ఏవేవన్నీ తానే అయి ఉన్నదో…, అట్టి ఆత్మనే ఉపాసించాలి.

అహంకారము - THE SENSE OF INDIVIDUALISTIC ‘I’

అధ్యాత్మికమగు అహంకారమునందు, అధిదైవతమగు రుద్రుని యందు, దేహనాడుల నిబంధనము నందు, ‘నేను కర్తను - కర్తవ్యము కలవాడను’.. అను అధిభూతమునందు, సంబంధిత ప్రాణశక్తినందు, హృదయాకాశమునందు సంచరించుచున్న, అవన్నీ స్వయముగా తానే అయిఉన్న - అజర-అమృత-అభయ-అశోక-అనన్త ఆత్మయే సర్వదా సర్వులకు ఉపాసనా వస్తువు.

చిత్తము - THE FEATURE OF LIKING / INTERESTEDNESS

అధ్యాత్మము అగు చిత్తమునందు, అధిభూతమగు - చిత్తమునకు ఇష్ట విషయములందు, (వ్రాలుచున్న విషయములందు), సర్వదేహములలోని అధిదైవతము అగు క్షేత్రజ్ఞునియందు, వాటి సంబంధమైన దేహనాడులయందు, ప్రాణశక్తియందు, చిత్త సంబంధమైన విజ్ఞాన-ఆనందములయందు, అనుభూతుల యందు, అవన్నీ ఏర్పడియున్న హృదయాకాశమునందు, వాటన్నిటి అంతరముగాను సంచరించుచున్నట్టిదే ‘ఆత్మ’. అవన్నీ కూడా ఆత్మయే! అట్టి ఆత్మ అజరము, అమృతము, అభయము, అశోకము, అనన్తము! అద్దానిని ఉపాసించుచుండెదముగాక!

వాక్కు - THE FACULTY OF TALKING

వాక్ శక్తి (మాటలాడువాడు) అధ్యాత్మము.
చెప్పబడు మాటల రూపముగా అధిభూతము.

నిబన్ధనమగునది - దేహనాడీ మండలము.

అధిదైవతమగు అగ్ని, ప్రాణశక్తి శబ్దము యొక్క విజ్ఞానము (ఎరుక), శబ్దానుభవము (ఆనందము), అవన్నీ ప్రవర్తించే హృదయాకాశము… వీటన్నిటి రూపముగాను, వీటన్నిటియందు అంతర్గతమై సంచరించుచున్న, ఇవన్నీ తానే అయి ఉన్న ఆత్మయే ఉపాస్యము.

హస్తములు - THE ABILITY OF HOLDING WITH HANDS

హస్తములు (చేతులు) - అధ్యాత్మము.
చేతులతో పట్టుకొనబడుచున్నదంతా - అధిభూతము.
ఇంద్రదేవుడు - అధిదైవతము.

దేహములోని నాడులు - నిబంధనము.

ప్రాణశక్తి, ఎరుక, అనుభవము; హృదయాకాశము.. వీటన్నిటిలో సంచరించుచూ, ఇవన్నీ తానే అయినట్టి అజర-అమృత-అభయ-అశోక అనన్త స్వరూపమగునదియే ఆత్మ! ఆత్మయే ఉపాస్య వస్తువు!

పాదములు - THE FEATURE OF WALKING

పాదములు - అధ్యాత్మము.
విష్ణుభగవానుడు - అధిదైవతము.
నడక-నడత-అధిభూతము.

నాడులు-నిబంధనము; ప్రాణము-శక్తి; అధిభూతము నడుచుప్రదేశములు; విజ్ఞాత-ఆనందములు; హృదయాకాశము స్థానము-అన్ని రూపములు-తానేఅయి, వాటి అన్నిటి అంతరముగా ప్రకాశమానమవటము, సంచారములు చేయుటము - ఇవన్నీ నిర్వర్తించుచున్నట్టిదే - ఆత్మ! ఆత్మను అన్ని రూపములుగా అయి ఉన్నట్లు ఉపాసించాలి. సర్వమునకు ఆత్మయే అంతర్యామి. ఆత్మయే కూడా!

పాయువు (విసర్జనావయము) - THE FEATURE OF DISCORDING / LEAVING

అధ్యాత్మమగు పాయువు నందు, విసర్జించబడుచున్న అధిభూతము నందును, అధిదైవతము అగు మృత్యువు నందును, బంధనములగు నాడులయందును, ప్రాణశక్తియందు, విజ్ఞాన- ఆనందములయందు, హృదయాకాశమునందును ఏది సర్వదా సంచరించుచూ ఉన్నదో.. అవన్నీ ఏది తానే అయి ఉన్నదో .., అదియే ఆత్మ!

ఉపస్థ - మర్మాంగము - THE FACULTY OF REPRODUCTIVITY

ఉపస్థ (మర్మాంగము) - అధ్యాత్మము: పొందబడుచున్న ఆనందము అధిభూతము; ప్రజాపతి - అధిదైవతము;

నాడులు - నిబంధనములు. ప్రాణశక్తి, ఎరుక-అనుభూతులు - హృదయాకాశము.

ఇవన్నీ తానే అయి, ఏది వీటన్నిటి యందూ సంచారము చేయుచున్నదో.. అదియే ‘ఆత్మ’. అట్టి ఆత్మ అజరము (జననరహితము). దేహధర్మములగు వార్థక్య-మరణములు లేని అమృత స్వరూపము! అభయస్వరూపము అట్టి స్వభావ లక్షణములు గల పరతత్త్వమగు ఆత్మయే మనకు ఉపాస్య వస్తువు అయి ఉండునుగాక!

అట్టి పరమాత్మ సర్వజ్ఞుడు (ఈ జీవుడు కించితుడు). ఆత్మదేవుడు సర్వమును నియమించుచుండటచే సర్వేశ్వరుడు ! సర్వమునకు అధిపతి! సర్వమునకు అంతర్యామి! ఈ కనబడే జగత్తు కంతటికీ జనన స్థానము. ఈ దృశ్యములో ఆయా సౌఖ్యములను ఉపాసించు ఈ మనస్సు ఆ పరమాత్మ స్వరూపమే అయినప్పటికీ.. ఆత్మదేనినీ ఉపాసించటమూ లేదు. సర్వము ఉపాసించుచున్నది ఆత్మనే!

వేద-శాస్త్రైః ఉపాస్యమానో॥  వేదములు - శాస్త్రములు ఎలుగెత్తి గానము చేస్తున్నది, ఉపాసనచే ఉద్దేశ్యిస్తున్నది, అట్టి సర్వస్వరూప-స్వస్వరూప పరబ్రహ్మమునే! అంతేగాని, ఆ పరమాత్మ వేద శాస్త్రములను ఉపాసించువాడు కాదు.

ఎవ్వనికి ఈ కనబడేదంతా స్వీయ - అనుభవరూపము, ఆస్వాదన రూపము, యస్యాత్ అన్నమిదమ్ సర్వమ్-అయి ఉన్నదో.., ఆయనయే ఆత్మ భగవానుడు!

న చ యో అన్నమ్ భావిత్యః - ఎవ్వడు మరొక దేనికీ అనుభవరూపము, ఆస్వాదనరూపము, అనుభూతిరూపము (అన్నమ్) కాడో, ఆయనయే ఆత్మ చైతన్యుడు.

అట్టి ఆత్మయే - పంచ - (అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయ-ఆనందమయ) కోశములలో రాజ్యము ఏలుచున్నది.

ఆయనయే భూతాత్ముడు, ఇంద్రియాత్ముడు, సంకల్పాత్ముడు, కాలాత్ముడు, లయాత్ముడు కూడా!

ఆ పరమాత్మకు వేరుగా దృశ్యము లేదు. ఎందుకంటే ద్రష్ట (దృశ్యమును తన దృష్టితో చూచువాడు) ఆయనయే! - దృష్టి, దృశ్యము ఆయనయే! ‘దృక్’గా ఉండి, ఆ తరువాత స్వప్నద్రష్ట-జాగ్రద్రష్ట - సుషుప్తి ద్రష్టలను కల్పించుకొని, (ఆ మూడు తానే అయి), త్రిదష్టల అనుభవమునకై స్వప్న-జాగ్రత్-సుషుప్తి దృశ్యరూపుడగుచు, మరొకప్పుడు.. అవన్నీ తనయందు లయము చేసుకొనుచున్నాడు.

ఇదంతా ఆత్మ దేవుని మహత్మ్యమే!

అన్నమయ– ప్రాణమయ-మనోమయ - విజ్ఞానమయ - ఆనందమకోశములు ఆయన ప్రత్యక్ష రూపములే!

వాటి కర్తృత్వము వహిస్తున్న భూతాత్మ - ఇంద్రియాత్మ-సంకల్పాత్మ-కాలాత్మ-ఆనందాత్మ.. కూడా ఆ ఆత్మదేవుడే!

ద్వితీయమైనదంతా ఆత్మా భగవానుని నుండే బయలుదేరి, ఆయనయందే తైతక్కలాడుచూ ఆయన యందే లయించుచున్నది. అప్పుడు ఆయన మాత్రమే శేషించుచున్నారు.

ఆత్మభగవానుడే 1. సృష్టిమయాత్ముడు 2. స్థితిమయాత్ముడు 3. లయమయాత్ముడు 4. క్రియా-నిష్క్రియమయాత్ముడు 5. కేవలాత్ముడు కూడా…!

కనుక ఓ రైక్వనామధేయ ఆత్మస్వరూపా!

ఆత్మసర్వదా అద్వితీయము! నీకు వేరు కాదు! నీ జీవాత్మత్వమంతా ఆత్మ దేవుడవైయున్న నీయొక్క సంకల్ప - వికల్ప కళా ప్రదర్శన విన్యాసమే!

ఓ ఆత్మదేవా! నీకు నమస్కారము! మరి ఇప్పుడు చెప్పు! మనస్వరూపమెట్టిది? ఈ దేహభావ కల్పనా పరంపరలు పొందటము, అవి తనయందు పరిపోషింపజేసుకుంటూ ఉండటము, దేహ-దేహ భావనలను తన యందు లయింపజేసుకోవటం, ఇవన్నీ నిర్వర్తిస్తున్న ఆత్మయే నీ-నా సహజ స్వరూపము!

ఈ దేహధారణ-విసర్జన… ఆత్మ రూపులమగు మనకు వస్త్రధారణ - విసర్జన వంటిది అయి ఉండగా, ఆత్మకు ద్వితీయమే లేదు.

ఇక - కు తో మర్త్యమ్? - ‘మరణము’ అనునది ఎక్కడ? మరణించువాడు ఎవ్వడు? అద్వితీయమగు ఆత్మకు (జీవాత్మకు) - క్రొత్తగా మనము సంపాదించి ఇవ్వవలసిన అమృతత్వము అనునది మాత్రమూ ఎక్కడిది? అదీ లేదు! మృతము లేదు. అమృతము లేదు. ఆత్మ మాత్రమే ఉన్నది!

అట్టి ఆత్మ…., ఏదై ఉన్నది? మరికొంత వివరించుకుందాము.

అంతః ప్రజ్ఞయా? లోపల గల మనోబుద్ధి చిత్త- అహంకార ప్రజ్ఞయా?.. కాదు.
బహిఃప్రజ్ఞయా? ఈ ద్రష్ట దర్శన దృశ్య రూప ప్రజ్ఞయా? కాదు.
అంతర్భహిః ఉభయ ప్రజ్ఞయా? ఇంద్రియములు - ఇంద్రియ విషయములా? కాదు!
ప్రజ్ఞాన ఘనమా (ఘనీభూతమగు కేవల ప్రజ్ఞయా)? .. అది కూడా కాదు.

ఆత్మ - తెలుసుకొనుచున్న రూపము అవటము లేదు. తెలియబడుచున్న దాని రూపము కూడా అవటము లేదు. అవన్నీ వాస్తవానికి
లేవు. ఎందుకంటే అవి ఆత్మ యొక్క స్వయం కల్పితాలు కాబట్టి.

ఒక నవలా రచయిత ఒక పాత్రను, ఆ పాత్రకు కొన్ని స్వభావములు కల్పిస్తే, అవి వాస్తవంగా ఉన్నవి అవుతాయా? లేదు కదా! రచయిత మాత్రమే ఉన్నాడు. పాత్రలు కల్పనలో మాత్రమే ఉన్నాయి.

అట్లాగే…, ఆత్మచే స్వయం కల్పితమగు -

… ఈ మూడూ ఆత్మకు వేరుగా లేవు.

ఆత్మకు ఎప్పుడూ ఎక్కడా ద్వితీయమే లేదు. ఎక్కడైనా ఏదైనా కనిపిస్తూ ఉంటే.. అది ఆత్మకు సర్వదా అభిన్నమేనని గ్రహించబడు గాక!

ఇతి ‘నిర్వాణ అనుశాసనము’!
ఇతి వేదములు సిద్ధాంతీకరించి ప్రకటిస్తూ ఉన్న పరమసత్యము!

‘ఆత్మకు ద్వితీయమైనది ఎక్కడా ఏదీ లేదు! ఆత్మ అద్వితీయము’ -  ఇతి వేదానుశాసనమ్!


6.) షష్ఠమ ఖండము - ఏకో నారాయణో!

రైక్వుడు :  మహాత్మా! ఘోరాంగీరస గురువర్యా! ఈ కనబడే వివిధ రూపములు - స్వభావములు గల జీవరాశులు.. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? వీరందరికీ మూలము ఏమిటి? ఆధారమేది?

ఘోరాంగీరస మునీశ్వరుడు : నాయనా! ఉన్న సత్యమును ప్రకటించమంటావా? అయితే, విను. మొట్టమొదట అఖండమగు ఆత్మయే ఉన్నది. ఇప్పుడూ, ఆత్మ (సర్వదా) అఖండమే అయిఉన్నది! ఆత్మ ఎల్లప్పటికీ అద్వితీయమే! ఏకములోంచి అనేకము ఏర్పడుచున్నప్పటికీ ఏకము సర్వదా ఏకమే! (దృష్టాంతానికి) బంగారము నుండి ఎన్ని పేర్లుగల ఆభరణములు తయారగుచున్నప్పటికీ, అంతా సర్వదా బంగారమే అయి ఉన్నది కదా! కలలో ఎన్ని నామ రూప ఆకారాదులు కనిపించినా, అవన్నీ స్వప్న సంచాలకుని ఏక-అఖండ స్వప్న చైతన్య రూపమే కదా!

నైవ ఇహ కించిత్ నాఽగ్ర ఆసీత్! సృష్టికి ముందు ఇక్కడ ఏదీ లేదు.

అమూలమ్, అనాధారా ఇమాః ప్రజాః ప్రజాయంతే! ఆత్మకు వేరుగా ఏమూలమూ (Root Cause) గానీ, ఏ ఆధారమూ (Source) గాని లేకుండానే ఈ జీవరాశులన్నీ ఏర్పడినవగుచున్నాయి. అందుచేత మొట్టమొదట నారాయణుడై ఉన్నారు. ఇదంతా నారాయణస్వరూపమే! నారాయణునికి వేరుగా సృష్టిలేదు. జీవులులేరు! అన్ని జీవుల రూపముగా ఉన్నది నారాయణుడే! దివ్యో దేవ ఏకో నారాయణః। నవలా రచయితకు చెందని ఏ సంఘటన నవలలో ఉండగలదు?

చక్షుశ్చ, ద్రష్టవ్యంచ నారాయణః | చూచే కళ్లు - ఆ కళ్లకు కనిపిస్తున్న దృశ్యములు, ద్రష్టలు, దృష్టులు, వినే చెవులు - ఆ చెవులకు వినబడే శబ్దములు, ఆ శబ్దముల అర్థములు, వాసనచూచే ముక్కు-ఆ ముక్కు అనుభమగు వాసనలు-అనుభూతులు, రుచి చూచే నాలుక ఆ నాలుకకు రుచికరమగుచున్నవి.

చర్మము-స్పర్శగా ప్రాప్తించున్నట్టి స్పర్శానుభూతి-ఇవన్నీ వేరు వేరుగా కనిపిస్తున్నప్పటికీ, వాటి వాస్తవ స్వరూపము-ఏకో నారాయణుడే! ఆత్మకు అభిన్నమగు ఆత్మకామ-సంకల్ప చమత్కారములే! నీ కళ్ళతో చూచేది, నీ చెవులతో వినేదీ నీవే కదా! (వినేది, చూచేది, మాట్లాడేది, ఆలోచించేది, ఇష్టపడేది ఒక్కడేగాని వేరు వేరు జీవాత్మ విభాగములు కాదు కదా!)

చూపుయే - చూడబడు దృశ్యరూపముగాను, వినికిడియే వినబడు శబ్దరూపముగాను, వాసనయే వాసన ఇచ్చు వస్తువుల రూపముగాను, రుచియే రుచి పదార్ధములుగాను, స్పర్శయే- స్పర్శించబడునవిగాను దీపించుచున్నవి. ఉభయము నారాయణుడే!

మనస్సు - అట్టి ఈ మనస్సు ఆలోచించు విషయములుగా ఉన్నది కూడా నారాయణుడే! మనశ్చ-మన్తవ్యశ్చ నారాయణో!

అట్లాగే…,

       బుద్ధి - ఆ బుద్ధికి తెలియబడుచున్న విషయములు;
       అహంకారము - అహమ్ కర్తవ్య భావనలు;
      చిత్తము - ఇష్టమగుచున్న విషయాలు;
       వాక్కు - చెప్పబడుచున్నవి - మాట్లాడబడుచున్నవి;
       చేతులు - ఆచేతులతో పట్టుకోబడుచున్నవి;
       పాదములు - ఆపాదముల సంచారాలు చేస్తున్న ప్రదేశములు, నడకలు, నడతలు;
       పాయువు - విసర్జితములు;
      ఉపస్థ (జననేంద్రియము) - ఆనందము

… ఇవన్నీ ఏకో నారాయణ స్వరూపమేనయ్యా!

ఈ సృష్టి, దీనికి కర్తృత్వాహంకారము ధారణ చేస్తున్న ధాత (బ్రహ్మదేవుడు - సృష్టికర్త); దీనిని విధి -విధానముగా నడుపుచున్న విధాత, కర్త-వికర్త…. ఇవన్నీ కూడా దివ్యదేవాది దేవుడగు ఆదినారాయణుడే! దీనికంతటికీ ఆయన ఆది-మధ్య-అన్తస్ప్వరూపుడు! ఆది మధ్యాంతరహితుడు!

ఎందుకంటే…..,

మొట్టమొదట సృష్టికి మునుముందుగా ఏమున్నదో.. ఇప్పటికీ అదే ఉన్నది.

నారాయణ తత్త్వమును పరిశీలించినవారికి ఇక్కడ అనేకంగా కనిపించేదంతా సర్వదా ఏకముగానే అనిపించుచున్నది. ఇదంతా అజ్ఞానదృష్టికి అనేకము! విజ్ఞాన దృష్టికో - ఏకోనారాయణుడు.

సమస్తము సర్వదా ఏకోనారాయణ దివ్యతత్త్వమై ఉండగా,…. ఏది ఎప్పుడు ఎక్కడ పుట్టినదని చెప్పాలి? నీవు-నేను కూడా నారాయణానంద స్వరూపులమే!

ఇంకా వినండి!

ప్రప్రథమ ప్రకాశరూపుడగు ఆదిత్యుడు, (యత్ ఆదిః - పురుషో . ఇతి ఆదిత్యః)…,
→ ఇదంతా తనయందు క్షణక్షణం లయం చేసుకుంటున్న రుద్రుడు…..,
→ ఎప్పటికప్పుడు మార్పు- చేర్పులను పర్యవేక్షిస్తున్న మరుత్ గణము…..,
→ విశ్వము- దేహము తన చేతనములచే (కదలికలచే) సంరక్షిస్తున్న వాయువు…..,
→ కాలము-స్థానము-దేహాంతర విశేషములు ప్రవేశించి ఉన్నట్టి వసువులు……,
→ ఓషధ-ఆహార – అనుపాన తత్త్వములను నడుపుచున్న అశ్వినీ దేవతలు……,
→ ఋగ్వేదములోని ఋక్కులు, యజుర్వేదములోని యజ్ఞ-యాగవిధుల రూపములగు యజస్సులు, సామవేదములోని సామగానములు,
→ ప్రకృతితత్త్వములను ప్రకటించు అధర్వణవేదమంత్రములు…..,
→ యజ్ఞవస్తువులగు మస్త్రము, అగ్ని, నేయి, ఆహుతి, యాణీకుడు మొదలైనవి;
→ కర్మలు - ఫలములు, లోకములు, ఇవన్నీ ఏకోనారాయణ తత్త్వమే! నారాయణ స్వరూపమే! నారాయణ! నారాయణ! నారయణ!

ఇంతేకాకుండా..

→ ఉద్భవిస్తున్నవి, సంభవిస్తున్నవి, దివ్య అశరీర శక్తిస్వరూపులగు దేవతలు,

… అంతా ఏకోనారాయణ స్వరూపమే!

→ తల్లి, తండ్రి, తమ్ముడు, అన్న, నివాసము, శరణము (విశ్రాంతి స్థానము), సుహృత్ (శ్రేయోభిలాషులు), కానివారు, అయినవారు, స్థితులు, గతులు…,

అంతా … ఏకోనారాయణయేవ!

→ జలదేవతయగు వరుణుడు,
→ పిత్రు లోకాధిపతియగు అర్యముడు,
→ మనో అధిదేవతయగు చంద్రుడు,
→ కల-కల్పన, వాటికి ఆవల, ఈవలగా ఉన్నది,
→ పైన- క్రింద-ప్రక్కన ఉన్నది, కనబడుచున్నది కనబడకుండా ఉన్నది….,

సర్వమ్ నారాయణమ్ । ఏకో నారాయణో!

ఓ రైక్వా! నీవు-నేను - ఈ శిష్యులు, ఇక్కడివారు, అక్కడివారు, ఇక్కడ- అక్కడ, అప్పుడు- ఇప్పుడు - ఇంకొకప్పుడు… ఉన్నది చూస్తున్నది - భావిస్తున్నది, లేనిది - కనబడనిది - భావాతీతము.. అంతా నారాయణుడేనయ్యా! ఆత్మానారాయణుడే! ఏకో-నారాయణుడే నీ ఆత్మగా, నా ఆత్మగా నాటక పాత్రలవలె వేరువేరైనట్లు - భ్రమదృష్టి కలిగియున్నప్పుడు - అనిపిస్తున్నారు.

విద్వాంసులగు మహనీయుల (సూరుల దృష్టి) ఎట్లా ఉంటోందంటే…,

తద్విష్ణోః పరమమ్ పదగ్ం సదా పశ్యన్తి సూరయః!
ప్రజ్ఞావంతులగు మహనీయులు ఎల్లప్పుడూ అంతటా ‘పరమపదము’ అను శబ్దముచే చెప్పబడు ‘విష్ణుతత్త్వము’నే అంతటా చూస్తున్నారు. ‘ఈ కనబడేదంతా ఎల్లప్పుడూ అదే కదా!’.. అని ఎరిగియే ఆస్వాదిస్తున్నారు. చూస్తూ, గమనిస్తూ నిత్యము పరమపద ధ్యానులై ఉంటున్నారు. పర ధ్యానములో ఇహ ధ్యానమును అంతర్విభాగం చేసివేస్తున్నారు.

దివీవ చక్షుః ఆతతమ్! ఆ శ్రీమన్నారాయణుని, వ్యాప్తనారాయణుని చక్షువులే, (లేక) ఆయనయొక్క దృష్టులే దివ్యలోకములలో,
ఊర్ధ్వ-ఆధో లోకములలో అంతటా వ్యాపించినవై ఉంటున్నాయి.

తత్ విప్రాసో విపన్యవో జాగృవాగ్ంసః | సమిన్థతే విష్ణోః యత్ పరమమ్ పదమ్! వేదార్థము ఎరిగి, నిత్యానిత్య వివేకముతో కూడియున్న పండితవరేణ్యులగు విప్రులు - సర్వదా జాగరూకులై - సర్వేసర్వత్రా ఆ ’విష్ణుపదము’నే సందర్శిస్తున్నారు. గమనిస్తున్నారు.

ఈ రీతిగా విష్ణుతత్త్వ ధ్యానులై ఉంటున్నారు. నాటకములోని ఒక సందర్భమును చూస్తూ…, “ఇది నాటక రచయిత యొక్క కల్పనలోని అంతర్విశేషమే!…. అనునది మరుస్తామా? లేదు కదా?

అట్టి ఆత్మ యొక్క సర్వప్రకటితతత్త్వమే ఇదంతా! ఇదియే నిర్వాణాను శాసనము! వేదాను శాసనము! ఆత్మానారాయణానుశాసనము! మహర్షుల వాక్కు! సత్య వాక్కు! సత్యద్రష్టల అనునిత్యానుభావం!


7.) సప్తమ ఖండము - అంతర్యామి - అవిజ్ఞేయో!

ఆ ఆత్మానారాయణుడు సర్వదేహుల హృదయగుహలలో ఏకస్వరూపుడై ఉన్నారు. అంతః శరీరుడై, నిత్యుడు, జరాజన్మరహితుడు అయి, దేహ-దేహాంతరములుగా నిత్యప్రకాశమానుడై వెలుగొందుచున్నారు.

అట్టి ఆత్మానారాయణ తత్త్వము గురించి మరికొన్ని విశేషాలు చెప్పుచున్నాను. అంతా వినండి!

🙏 ఈ పృథివి అంతా ఆ ఆత్మానారాయణుడు తన శరీరముగా కలిగి ఉంటున్నారు. పృథివికి అంతరమున సర్వదా సంచరించువాడై ఉంటున్నారు. కానీ, పృథివిచే ఆయన ఎరుగబడుటయే లేదు.

🙏 జలము ఆయన శరీరమై, జలము యొక్క అంతరమున సంచరించువాడై ఉన్నప్పటికీ, జలమునకు ఆయన గురించి తెలియరావటము లేదు.

🙏 తేజస్సు ఆయన శరీరమై, తేజస్సుకు అంతర్యామి అయి సంచరిస్తూ ఉన్నప్పటికీ, తేజస్సు ఆయనను గమనించటము లేదు.

🙏 ఆయన వాయుః శరీరుడై వాయువు యొక్క ’అంతర్యామి’గా సంచరిస్తూ ఉండగా కూడా, వాయువు ఆయనను గుర్తించలేక పోతోంది.

🙏 ఆయన ఆకాశమును తన శరీరముగా కలిగి ఉండి, ఆకాశమునందు అంతరమున సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఆకాశము ఆయనను గమనించటము లేదు.

🙏 ఈ మనస్సు ఆ ఆత్మానారాయణుని శరీరమే! మనస్సుకు అంతర్యామి అయి, సంచారులై సర్వదా వ్యవహరిస్తున్నదీ ఆయనే! అయినా కూడా మనస్సు అట్టి ఆత్మభగవానుని గుర్తించే యోచనయే చేయటము లేదు.

🙏 ఈ బుద్ధి ఏ ఆత్మ యొక్క శరీరమో, ఏది బుద్ధికి అంతర్గతమై సర్వదా ఉత్తేజిత రూపముగా పచార్లు చేయుచున్నదో, అట్టి ఆత్మను ఈ బుద్ధి చూడటమూ లేదు. అర్థము చేసుకోవటమూ లేదు. ఆత్మానారాయణుడు లౌకిక బుద్ధికి విషయమగుటలేదు.

🙏 ఆయన అహంకార శరీరుడై అహంకారమును లోనుండి ప్రవర్తింపజేయు సంచాలకుడై ఉంటూ ఉన్నప్పటికీ, ఈ అహంకారము బయట చూపులకు పరిమితమవుతోందే గాని, తన యందు ఆధారుడు, సంచాలకుడు, సంచారుడు అగు ఆత్మను తన స్వరూపముగా భావించటము లేదు. ఎరుగుటయూ లేదు.

🙏 ఈ ‘ఇష్టము’ రూపము గల చిత్తము ఏ ఆత్మ యొక్క శరీరమే అయి ఉన్నదో, ఏ ఆత్మ అయితే - చిత్తమును తన సంచార ప్రదేశముగా కలిగి యున్నదో; అట్టి ఆత్మను చిత్తము తన యొక్క ప్రియమగు వస్తువుగా గమనించటమే లేదు. బాహ్య విషయముల పట్ల మాత్రమే స్పందన కలిగినదై ఉంటోంది.

🙏 ‘అవ్యక్తము’ ఎవ్వరి శరీరమో, అవ్యక్తమునకు ఎవ్వరు అంతర్యామియో, అంతర్-ప్రవర్తకుడో, అట్టి ఆత్మను ఈ అవ్యక్తము ఏ మాత్రము గాంచటమే లేదు.

🙏 ఏ ఆత్మానారాయణుడు అక్షరము (క్షరము కానిది మార్పు లేనిది) అగు తత్త్వమును తన శరీరముగా అవధరించిన వారై ఉన్నారో,.. ఏ అక్షరము జీవాత్మకు సర్వదా అభ్యంతరము అయి (Inner Zone) ఉన్నదో, అట్టి మహత్తర అఖండాత్మ విశేషమును ఆ అక్షరము ‘ఇది కదా నేను’.. అను దర్శనమునకు ఉపక్రమించటమే లేదు.

🙏 ఏ పరతత్త్వ చైతన్యమునకు మృత్యువు తన శరీరమే అయి ఉన్నదో, మృత్యువు యొక్క అంతరమున నిండిఉన్నదో ఆత్మ అయి ఉన్నదో.. అట్టి ఆత్మ తత్త్వమును మృత్యువు ఏ మాత్రము గుర్తు కలిగి ఉండటము లేదు. గమనించటము లేదు!

ఈ కనబడే సర్వశరీరములలోనూ ఏది అంతరాత్మయో, ఆ తీరుగా అంతరాత్మ అయి కూడా…, దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారముల దోషములచే స్పృశించబడటమే లేదో.., దివ్యస్వరూపమై, దేవాదిదేవుడై ఇప్పుడే - ఇక్కడే నీ-నా-వారి-వీరి సర్వ శరీరములలో జ్యోతి స్వరూపమై వెలుగొందుచున్నాదో అట్టి కేవలాత్మయే సందర్భములన్నిటికీ ఆవల గల అహమ్-త్వమ్-తత్ల సహజ సత్యస్వరూపము.

ఏకోనారాయణుడు!

అఖండ పరస్వరూపము!

నిత్యోదిత చైతన్యానంద తత్త్వ స్వరూపుడు! తత్త్వ పురుషుడు!

🙏🙏🙏

🌺 ఇట్టి ’ఆత్మవిద్య’ను లేక ’ఏకోనారాయణ విద్య’ను సర్వజీవులపై గల అవ్యాజమైన ప్రేమను నింపుకొని ఉన్న శ్రీమన్నారాయణుడు అపాంతరమాయకు (ఆకాశవాణికి) ఇచ్చారు.
⤿ ఆ అపాంతర మాయ సృష్టికర్తయగు బ్రహ్మదేవునికి ప్రసాదించటము జరిగింది.
⤿ బ్రహ్మదేవుడు ఘోరాంగీరసునకు బోధించారు.
⤿ ఆ ఘోరాంగీరసుడు రైక్వునికి, ఆ విద్యను తెలియజేశారు.
⤿ రైక్వుడు శ్రీరామునికి ఇచ్చారు.
⤿ సర్వజీవులపై గల వాత్సల్యముతో శ్రీరామచంద్రుడు.. లోకములకు అందించటం జరిగింది.

ఇతి నిర్వాణానుశాసనమ్! వేదానుశాసనమ్! వేదానుశాసనమితి!


8.) అష్టమ ఖండము - ఆత్మ అచిన్త్యమ్! అభిన్నమ్! ఇదమ్ సర్వమ్ !

అన్తశ్శరీరే నిహితో గుహాయాం శుద్ధః సో అయామాత్మా! పరమశుద్ధుడగు ఆత్మ ప్రతి ఒక్క దేహములోని హృదయగుహలో ప్రకాశమానుడై ఉన్నది.

ఈ భౌతిక దేహము మేధస్సు (మెదడు, క్రొవ్వు, వప ల)తో - మాంసమయమై, ’రక్తము’ అనే ద్రవము (తడి)తో కూడుకొనియున్నది.

అట్టి ఈ దేహము యొక్క మధ్య ప్రదేశములో ‘హృదయము’ ఉన్నది. హృదయంలో దేహమున్నది. దేహములో హృదయమున్నది.

→ బంగారములో ఆభరణాకారం, ఆభరణాకారంలో బంగారము ఉన్నతీరుగా,
→ అనేక రంగుబొమ్మలు చిత్రించబడిన ఒక ‘గోడ’వలె,
→ అనేక కల్పనా విశేషములతో కూడిన గంధర్వ నగరము వలె,
→ అనేక పరస్పర సంబంధ - అనుబంధ - ఇష్ట - అయిష్ట వ్యవహారములు తనయందు కలదై హృదయము ప్రదర్శితమవుతోంది.
→ అరటి స్థంభమువలె లోన శూన్యమై నిస్సారముగా ఉన్నది.
→ జలములో కనిపించే ‘బుడగ’ వలె అతి చంచలము కూడా!
… అట్టి “సంసారములోని ఒక వస్తువు’ అనతగినట్టి - ఈ భౌతిక దేహాంతర్గత హృదయంలో ‘ఆత్మ’ అనబడు మహత్తర-దివ్యచైతన్యతత్త్వము దాగి ఉన్నది.

అట్టి ఆత్మ…,
↳ ఆలోచనలకు అందనిది. అచిన్త్యము. ఆలోచనలకు ఆవల ఆలోచించువాని కేవల రూపమగుటచే ఆత్మ ఆలోచనకు అవిషయంగా చెప్పబడుతోంది. ఆలోచనలకు ఆ ఆలోచించువాడు దొరుకుతాడా? దొరకడు కదా!
↳ అత్యంత పవిత్రము. దివ్యమైనది. దోషములచే స్పృశించబడనిది!
↳ దేనికీ సంబంధించక, ప్రత్యేకమై ఉన్నది. అసంగముగా ఉన్నది. మౌనస్వరూపము!
↳ పరమశుద్ధ ప్రకాశముతో కూడి ఉన్నట్టిది!
↳ మహాతేజవంతమై ప్రకాశించుచున్నట్టిది!
↳ అది సర్వస్వరూమై, సర్వ నియామకము అయి ఉండుటచే సర్వేశ్వరము కూడా!
↳ అది అశరీరము కాబట్టి అచిన్త్యమై ఉన్నది.
↳ హృదయగుహలో సర్వకారణమై, తనకు వేరే బాహ్యమైన కారణము ఏదీ లేనిదై ఉన్నది. అకారణం తు!

అట్టి ఆత్మ అమృతస్వరూపము! సర్వమును వెలిగించుచూ ఉన్నట్టి విభ్రాజమానము! పరమానంద ఐశ్వర్య సమన్వితము!

విద్వాంసులు..ఆ ఆత్మనే అంతటా దర్శించుచున్నారు. “ఈ సర్వము ఆత్మకు అభిన్నము” అనునది వీడక, ప్రశాంతమగు దృష్టి కలిగి ఉంటున్నారు. ఇంద్రియములకు విషయములుగా కనిపించేదంతా ఆత్మస్వరూపమేనని ఎరిగి ఉంటున్నారు.


9.) నవమ ఖండము - ఆత్మయందే అస్తమయం

రైక్వుడు :  భగవన్! సద్గురు శ్రీ ఘోరాంగీరస మహాశయా! ఈ కనబడుచున్నదంతా, తిరిగి ఎందులో అస్తమించబోవుచున్నది? ఎందులోకి నిష్క్రమించుచున్నదగుచున్నది.

శ్రీ ఘోరాంగీరస మహాముని : బిడ్డా! అనుభవము (Experience) అనునది అనుభవి (One who is experiencing) యొక్క అనుభవత్వపు చమత్కారమే కదా!

అందుచేత,
→ వస్తువు ఆ వస్తువుయొక్క అనుభవమునందు,
→ అనుభవము ‘అనుభవి’ యందు,
→ అనుభవి - జీవాత్మయందు,
→ జీవాత్మ - సర్వాత్మయందు స్వభావంగా అస్తమిస్తున్నాయి.

ఈ కనులతో ఏఏ దృశ్యములు పొందబడుచున్నాయో అవన్నీ కూడా చక్షువులలోనే లయించినవి (అస్తమించినవి) అగుచున్నాయి. ఆ ‘కనులు’ అనే ఇంద్రియములను ఉపయోగించిన ద్రష్టత్వము దృశ్యానుభవము కూడా ద్రష్టయొక్క (అప్రదర్శిత) దృక్ స్వరూపమునందే అస్తమించుచున్నాయి.

సూర్యకిరణములు సూర్యుని నుండి బయల్వెడి, ఆయా వస్తువులపై పడి, అటు తర్వాత (సూర్యాస్తమయానికి) సూర్యునియందే అస్తమిస్తున్నాయి కదా! అట్లాగే కనులచే పొందబడిన దృశ్యము, ద్రష్టత్వ భావన, జీవాత్మ భావన - ఇవన్నీ కూడా అధిదైవితము అగు ఆదిత్యుని యందు అస్తమించినవి అగుచున్నాయి. (ఆది తత్ యత్ - మొట్టమొదటే ఉన్నట్టిది = ఆదిత్యుడు).

విరాజము (Manifestation) చేత ఏదేది పొందబడుచున్నదో (లేక) విరాజమానమగుచున్నదో.. అదంతా కూడా విరాజత్వము (The Feature of Manifestation) నందే అస్తమించినదగుచున్నది.

అట్లాగే….,
→ ప్రాణశక్తి నుండి పొందిన ప్రాణచలనము ప్రాణశక్తియందు,
→ విజ్ఞానముగా పొందబడినదంతా మూలవిజ్ఞానతత్త్వము నందు;
→ ఆనందము రూపముగా పొందినది ఆనందమునందు,
→ తురీయముగా పొందబడుచున్నది తురీయమునందును అస్తమించినవగుచున్నాయి.

అట్టి చక్షుత్త్వము, ద్రష్టత్వము, ఆదిత్యత్వము, విరాజము, విరాజమానత్వము, ప్రాణము, విజ్ఞానము, ఆనందము, తురీయము - ఇవన్నీ వాటి జన్మస్థానము అగు అమృత-అభయ-అశోక- అనన్త-నిర్బీజ రూపమగు… ఆత్మయందే అస్తమించి, ఆత్మరూపముగానే శేషించుచున్నవగుచున్నాయి.

అట్లాగే….,
→ శ్రోత్రముగా పొందబడినది ’వినికిడి’ యందు (వినబడుచున్నవన్నీ కూడా ‘వినటము’ యందును),
→ వినటము దిక్ తత్త్వమునందు,
→ సుదర్శనము (సుందరము)గా భావించబడుచున్నది సుందరభావనయందు,
→ విజ్ఞానముగా పొందబడునది విజ్ఞాన స్వభావము నందు,
→ ఆనందముగా పొందబడుచున్నదంతా ఆనందానుభవము నందు,
→ తురీయముగా పొందబడుచున్నది తురీయభావన యందు
… అస్తమించినవగుచున్నాయి.

వినికిడి, వినటము, దిక్ భావన, సుదర్శన- అనుభూతి, విజ్ఞానతత్త్వము, ఆనందానుభూతి.. ఇవన్నీ కూడా ఆత్మ నుండి బహిర్గతమై, మరల అట్టి అజర అమృత-అభయ-అశోక-అనన్త స్వరూపమగు ఆత్మ యందే అస్తమించి, ‘నిర్బీజాత్మ స్వరూపము’ అగుచున్నాయి.

అదే విధంగా….,
→ ముక్కుగా పొందబడుచున్నది (ఆత్మ యొక్క) - నాసికత్వమునందు,
→ ఆఘ్రాణముగా (వాసన రూపము)గా పొందబడునది-ఆఘ్రాణత్వమునందు,
→ ఆ ఆఘ్రాణత్వము అధిదేవతయగు పృథివీతత్త్వమునందు,
→ జితా (జయింపబడినదంతా) జితా భావనయందు,
→ వ్యానము వ్యాన (విస్తరణ)తత్త్వమునందును,
అవన్నీ - వాటివాటి విజ్ఞానము (ఎరుక) - ఆనందము (అనుభవము)నందు, ఆనందముగా అనుభవ సాక్షియందు అస్తమించినవి అగుచున్నాయి.

ఆ విజ్ఞాన-ఆనంద-తురీయములు (ఎరుక-అనుభూతి-అనుభూతిసాక్షులు) అమృత-అభయ-అశోక-అనన్త-నిర్భీజలక్షణ సమన్వితమగు ’కేవలాత్మ’యందు అస్తమించుచున్నాయి.

ఏదేది ఎందులోంచి బయల్వెడలుచు, ప్రదర్శితమగుచున్నదో.. అది అందులోనే అస్తమించుచున్నది.

చివరిగా చెప్పాలంటే, పైన ఉదహరించుకొన్నవన్నీ ఆత్మనుండే బయల్వెడలి, ఆత్మయందు లయించగా, ఆత్మ నిర్బీజముగా (ఇతఃపూర్వమువలెనే) అగుచున్నది.

ఇంకా కూడా….,

జిహ్వమేవ ఆప్యేతి యో, జిహ్వా మేవా అస్తమేతి | ఏదైతే ‘ఇది నాయొక్క నోటికి సంబంధించిన అనుభవము అనుభూతి” అగుచున్నదో అదంతాకూడా (జిహ్వానుభవముగా ప్రదర్శితమైనదంతా) ‘జిహ్వానుభవము నందు అస్తమించుచున్నది. రుచి రూపముగా పొందబడుచున్నది - రుచి యొక్క అనుభవము నందు, రుచి అనుభవమంతా రుచికి అధిదేవతయగు వరుణునియందు, సౌమ్యము, సౌమ్యత్వము నందు, ’ఉదాసీనము’- ఉదాసీనత్వమునందు … అవన్నీ ఎరుక (విజ్ఞానము) - అనుభూతి (ఆనందము)- తురీయము (ఆనంద సాక్షి) అగు ఆత్మయందు తిరిగి అస్తమిస్తున్నాయి.

→ చర్మము - చర్మానుభూతి యందు, చర్మానుభూతి, స్పర్శానుభూతి యందు, ఆ స్పర్శానుభూతి - అద్దాని అధి దేవతయగు వాయుదేవుని యందు, మోఘము (పాపము) మోఘతత్త్వము నందు (పాపభావనయందు), సమానానుభూతి - సమాన భావనయందు, అస్తమించుచున్నాయి. ఆయా భావనలన్నీ విజ్ఞాన-ఆనంద తురీయములతో సహా (ఎరుక అనుభూతి-సాక్షిత్వములతో సహా) - అమృత-అభయ-అశోక-అనన్త-నిర్బీజ రూపమగు ‘ఆత్మ’ యందు అస్తమించినవి అగుచున్నాయి.

→ వాక్కుగా పొందబడునది. (చెప్పుచున్నదంతా) వాక్శక్తి యందు, చెప్పబడుచున్నవన్నీ వక్తవ్యతత్త్వము నందు, ఆ రెండూ అధిదైవతమగు, అగ్నియందు, కుమార ఉపప్రాణము కుమార తత్త్వము నందు, వైరంభము - వైరభతత్త్వమందు …

→ హస్తములు హస్త భావనయందు, హస్తములచే ధారణ చేయబడేదంతాహస్తధారణాతత్త్వము నందు, వాటి అధిదైవతముఅగు ఇంద్రుడు - ఇంద్రత్వము నందు,

→ అమృతముగా (జన్మరహితము) పొందబడునది అమృత భావనయందు,

→ పాదములు -నడకలు.. వాటి వాటి భావనయందు, అవి అధిదేవతయగు విష్ణువునందు,

→ ‘ఇది సత్యము’ అని ఎద్దానిచే భావన చేయబడుచున్నదో, అది అద్దాని భావనా వైశిష్ట్యము నందు,

→ ఏది ‘అంతర్యామి’ని పొందుచున్నదో అట్టిది, ఆత్మ యొక్క అంతర్యామిత్వము నందు’

… అస్తమించినవగుచున్నాయి.

వాటికి సంబంధించిన విజ్ఞానము-ఆనన్దము-తురీయము(ఎరుక - అనుభూతి-సాక్షి).. ఎద్దానిచే కల్పించబడుచున్నాయో, అట్టి ఆత్మయందే లయించుచున్నాయి.

అట్టి అమృతరూపము, అభయము, అశోకము, అనన్తము, నిర్భీజము అగు ఆత్మయందు అవన్నీ ఒకప్పుడు బయల్వెడలి, మరొకప్పుడు అస్తమించినవగుచున్నాయి.

ఇదియే ఇక్కడి స్వకీయ సృష్టి - స్థితి - లయ ఆత్మ విన్యాస వినోదము.

ఇంకా మరికొంతగా చెప్పుకోవాలంటే..

→ పాయువు (విసర్జన) అద్దానిస్వభావ లేక భావతత్త్వమందు,

→ విసర్జనము చేయబడునదంతా విసర్జన భావనయందు,

→ విసర్జనా భావన మృత్యువునందు,

→ మధ్యమము - మధ్యమమునందు (All that as In-Between in the Sense of feeling of the In between),

→ ప్రభన్జనము ప్రభంజనత్వమునందు (Show in the Show),

→ ఉపస్థ ఆనందమునందు, ప్రజాపతి - ప్రజాపతిత్వమునందు,

→ ఉపప్రాణములగు కూర్మము మొ||వి ఉపప్రాణతత్త్వమునందు,

→ మనస్సు అద్దాని ఉత్పత్తిస్థాన విభాగమగు మహా-మనస్సునందు,

→ ఆ మనస్సుచే ఆలోచించబడుచున్నవన్నీ, మానస తత్త్వమునందు, అవి రెండూ అధిదైవమగు చంద్రభాగవానుని యందు,

→ శిశువు - శిశుత్వమునందు, శ్యేనము (స్వభావము) - శ్యేనత్వము (స్వభావత్వము)నందు….,

→ బుద్ధి - బుద్ధితత్త్వమునందు,

→ బుద్ధిచే విచారించబడునవి - బోధత్వమునందు,

→ అవి అధిదైవతము అగు బ్రహ్మదేవునియందు

→ తృష్ణ తన జనన స్థానమగు జీవునిలోని తృష్ణత్వమునందు,

→ అహంకారము - అహంకారభావన యందు,

→ అహమ్-మమకర్తవ్యమ్ (నాకర్తృత్వము, నా భోక్తృత్వము - మొదలైనవన్నీ) - అహంకర్తృత్వ భావన యందు,

→ ఆ అహంకారము, అహంకర్తృత్వము - అహంకారమునకు అధిదేవతయగు రుద్ర భాగవానుని యందు,

→ అసురము - అసురభావనా తత్త్వమందు,

→ శ్వేతము - శ్వేతభావనయందు (సత్త్వ భావనలు - సత్త్వ గుణమునందు),

→ చిత్తము - చిత్తభావనాతత్త్వమందు,

→ చిత్తముచే ప్రియముగా అనుభూతమగుచున్నవన్నీ కూడా చిత్త ప్రియత్వము నందు,

→ చేతయితమంతా చేతయితము ఉద్భవించు స్థానమునందు,

→ క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రజ్ఞత్వము ఉదయించు స్వస్థానమునందు (ఆత్మయందు)

→ వెలిగించబడుచున్నవన్నీ ఆ వెలుగుకు ఉత్పత్తి స్థానమగు కేవల తేజస్సునందు,

→ నాగము (ఉపప్రాణము), అద్దాని ఉదయస్థానము అగు ప్రాణశక్తియందు,

→ దేహ ప్రాణశక్తి - విశ్వప్రాణమునందు, వాటివాటి విజ్ఞాన (ఎరుక) ఆనంద(అనుభూతి) తురీయ (సాక్షి)త్వములతో సహా అవన్నీతిరిగి ఏకము - అఖండము - అప్రమేయము - నిత్యము - ఆనందము - కేవలము - అమృత - ఇహపర పరాత్పరము అగు - “స్వస్వరూపాత్మ” యందు స్వభావసిద్ధంగా అస్తమిస్తున్నాయి! అమృతము-అభయము- అశోకము-అనన్తము-నిర్భీజము అగు పరమాత్మయందే సర్వము విలీనములగుచున్నాయి.

అట్టి నిర్బీజమగు ఆత్మ యొక్క తత్త్వమేమిటో ఎరిగినవాడు ‘నిర్బీజాత్మస్వరూపుడు’ (Absolute Self Sans the creation) అయి సర్వత్రా విరాజిల్లుచున్నాడు. సృష్టి కొనసాగుచున్నప్పటికీ ’సృష్టి రాహిత్యము’ను ఆస్వాదిస్తూ ఉంటున్నాడు.

అట్టివాడు తనను తాను ఆత్మస్వరూపమే అని ఎరుగుచూ,

ఓ రైక్వా! వివరించుకొనియున్నట్టి ఉపసంహార (లేక) పైన అస్తమయ చమత్కారము ‘త్వమ్’ పరంగా సారము (The Essence) చెప్పుచున్నాను. విను.

→ ‘నీవు’ పొందుచున్న విశేషములన్నీ నీయొక్క నీ నీ ద్రష్టత్వ స్వభావమునందు,
→ ద్రష్టత్వము ‘దృక్’ స్వభావమునందు,
→ ‘దృక్’ కాస్తా నీ జీవత్వ స్వభావమునందు,
→ జీవత్వమంతా - నీ ఈశ్వర స్వభావమునందు,
→ నీ ఈశ్వరత్వము ఆత్మ స్వభావమునందు,
ఆత్మ స్వభావము నీ యొక్క అశోక-అజర-అనన్త-నిర్బీజ-అభయ ‘స్వతత్త్వము’నందు అస్తమిస్తున్నాయి. ఉపశమిస్తున్నాయి.

🌺

రైక్వుడు :  గురుదేవా! ఘోరాంగిరస మహాత్మన్! మరి ఆత్మతో ఏకత్వము ఏ ప్రవచనముల ప్రభావముచే, ఏఏ వేదాధ్యయ, యజ్ఞ యాగ ఇత్యాది ప్రయత్నములచే లభించగలదు?

ఘోరాంగీరస మునివరేణ్యుడు : నాయనా! రైక్వా!

నైవమ్ ఆత్మా ప్రవచన శతేనాపి లభ్యతే, న బహు శ్రుతేన…! అట్టి కేవల ఆత్మభావన - ఆత్మ గురించి వందలసార్లు ఉపన్యసించినప్పటికీ లభించటము లేదు. ఎంతగానో వినినా కూడా, (లేదా) సొంత బుద్ధి పాటవముచేత గానీ, శ్రుతిజ్ఞానముచేత గాని, మేధస్సుచేత గాని, వేద మంత్రముల పఠనముచేత గాని, ఎన్నో యజ్ఞాలు చేయటముచేత గాని, ఉగ్రమైన తపస్సుచేత గాని, సాంఖ్యశాస్త్ర పఠణముచేత గాని, ప్రాణాయామము ఇత్యాది యోగాభ్యాసములచేత గాని, ఆశ్రమములలో సుదీర్ఘనివాసము చేతగాని - లభించటము లేదయ్యా!

ఎట్లా పొందవచ్చో, ఆత్మజ్ఞులు మనకందిస్తున్న కొన్ని బాటలు ఇక్కడ ఉదహరిస్తున్నాను.

1 సత్సంగముచే ఆత్మ గురించిన ఉపనిషత్-అర్ధములను విశ్లేషించుకొనుచూ ప్రవచనములపై మరల మరల బుద్ధి సారించుచూ ఉండగా…,
2 బ్రహ్మముగా ఇదంతా దర్శిస్తూ బ్రాహ్మణాచారము (బ్రహ్మముగా భావించటము - అనే ఆచారము) పాటించుచూ ఉండగా…,
3 ఆత్మతత్త్వమును ప్రశంసించుచూ,
4 ఆత్మతత్త్వమునందు నిదుర లేచుచూ,
5 బ్రహ్మవేత్తలు చెప్పేవి ఇష్టంగా వినుచూ, హృదయమున పదిలపరచుకొనుచుండగా, “నీవు తత్ స్వరూపుడవే అని పలుకు తత్త్వవేత్తల పలుకులు వినుచుండగా
6 శాంతమును ఆశ్రయిస్తూ,
7 ఇంద్రియని గ్రహమును అవలంభిస్తూ…, ఇంద్రియములను ఆత్మధ్యానము, ఆత్మ భావన, ఆత్మజ్ఞాన సమాచార సముపార్జనకై నియమిస్తూ,
8 తితిక్ష - సహాయంతో (ఓర్పుగా) జగత్ విషయ-సందర్భములను మాయగా గమనిస్తూ, అంగీకార బుద్ధితో (Let them be as they be) - సమభావన కలిగినవాడై, ఓర్పుతో సహిస్తూ, సమహితత్వము, ఉత్తమ సమాధానముచే, సర్వజీవుల పట్ల సమభావన కలిగి ఉండటము చేత…,

… ఇటువంటి ప్రయత్నములు కొనసాగుచుండగా ఆ యోగి ఆత్మచేత ఆత్మను దర్శించుచున్నాడు.

ఆత్మ గురించి ఎరిగి, సర్వము (తెలుసుకొనువాడు తెలియబడునది, అనుభవము తనదైన వాడు అనుభవముగా పొందబడుచున్నది మొదలైనదంతా - ) ఆత్మగా దర్శించటమే ఆత్మతత్త్వానుభూతి యొక్క స్వాభావికత్వమునకు సుమార్గము.

ఆత్మదర్శనము, ఆత్మసాక్షాత్కారము అనగా సర్వము స్వస్వరూపాత్మకు అభిన్నముగా అనిపించటము.


10.) దశమ ఖండము - ఆత్మయందు ఓత-ప్రోతము

రైక్వుడు :  భగవాన్! గురుమహరాజ్! ఈ కనబడే సర్వము ఎందులో ప్రతిష్ఠితమై ఉన్నది?

ఘోరాంగీరస మునీశ్వరుడు : ఈ కనబడేదంతా రసస్వరూపమై రసాతల లోకములో సంప్రతిష్ఠితమై యున్నది. రసో వై బ్రహ్మమ్!

రైక్వుడు :  అట్టి రసాతలము ఎందులో పూవువలె గ్రుచ్చబడి, ఓత-ప్రోతమై యున్నది? “ఓతము - తనయందే ఇదంతా! ప్రోతము ఇద్దానియందంతా తానే!

రసాతలము → భూలోకమునందు,
భూలోకము → భువర్లోకమునందు,
భువర్లోకము → సువర్లోకమునందు,
సువర్లోకము → మహర్లోకమునందు,
మహర్లోకము → జన లోకమునందు,
జనోలోకము → తపో లోకమునందు,
తపోలోకము → సత్య లోకమునందు,
సత్యలోకము → ప్రజాపతి లోకమునందు,
ప్రజాపతి లోకము → బ్రహ్మ లోకమునందు,

లోకములో లోకము

పూలదండలో పూలవలె,
బంగారములో ఆభరణము ఆభరణములో బంగారమువలె,
జలములో తరంగము - తరంగములో జలమువలె
‘ఓత - ప్రోతము’ అయి ఉన్నాయి.

అట్టి బ్రహ్మలోకము సర్వలోకములందు ఓత-ప్రోతమై అంతర్-సంచారక, అంతర్-ప్రత్యక్షమై ఉన్నది.

మరి సర్వలోకములు ఎందులో ఉన్నాయి?
సర్వలోకములు ఆత్మయందు ఓత-ప్రోతమై ఉన్నాయి. పరబ్రహ్మమునందు స్థానము కలిగియున్నాయి.

మణులలో దారమువలె ఈ సర్వలోకములలో పరబ్రహ్మము అంతర్గతమై, ఇవన్నీ నిలచి ఉండటానికి మూల కారణమైయున్నది.

ఎవ్వడైతే ‘ఈ లోకములన్నీ ఆత్మయందే భావనామాత్రముగా ప్రతిష్ఠితములై ఉన్నాయి అని గ్రహిస్తాడో, ఆతడు తనను ఆత్మగానే ఎరుగుచూ, సర్వలోకములను తన యందు ధరించినవాడగుచున్నాడు.

ఇది నిర్వాణానుశాసనము - ఇతి వేదానుశాసనము. వేదవాఙ్మయము బల్ల గుద్ది సిద్ధాంతీకరించు పరమసత్యము.


11.) ఏకాదశ ఖండము - ఆత్మయందే పునః ప్రవేశము

రైక్వుడు :  ఓ గురుమహాదేవా! విజ్ఞాన ఘనుడగు ఆత్మభగవానుడు సర్వదేహములలో సర్వదా సమముగా వేంచేసినవారై ఉన్నారని మీరు శెలవిచ్చారు కదా! నా సందేహము ఏమిటంటే, అట్టి సర్వతత్త్వ స్వరూపుడగు ఆత్మతత్త్వము, ఎప్పుడు ఈ జీవునిదేహములో ఉత్క్రమణము (ప్రవేశము) పొందుచున్నారు? దేనిచేత దేహములో ప్రకాశిస్తున్నారు? ఏ స్థానము నుండి బయల్వెడలి ఈ భౌతిక దేహములోనికి వేంచేయుచున్నారు? ఇక్కడి నుండి (దేహ పతనానంతరము) తిరిగి ఎటువెళ్లుచున్నారు?

గురుదేవుడగు ఘోరాంగీరస మునీంద్రుడు :

తత్ర ‘రమా’ పుణ్యేన పుణ్యం లోకం నయతి।
అట్టి నాడులలో - రమా (ఇంద్రియ విషయములతో, జగత్ దృశ్య విషయములలో మనోబుద్ధులను నియమించి, వాటియందు రమిస్తూ రోజులు గడపటం) వలనను…, అట్టి ’రమా’ నాడి యందు రమించు ఇచ్ఛ గలవాడు పునర్జన్మ, జన్మ పరంపరలు పొందుచున్నాడు.

పుణ్య కార్యములు నిర్వహిస్తూ (ఆశ్రయిస్తూ) ఈ ’రమా’ నాడి యందు రమించువాడు క్రమంగా పుణ్యలోకములు పొందటము జరుగుతోంది.

అరమా పాపేన।
‘అరమా’ యందు రమించువాడు ఆసురీభావన సంపన్నుడై పాపలోకములు చేరవలసి వచ్చుచున్నది.

ఇచ్ఛయా యత్స్మరతి, తత్ అభి సంపద్యతే।
‘ఇచ్ఛ’ అను మరొక ముఖ్యనాడి యందు సంచరించువాడు - ఇచ్ఛచే ఏది స్మరిస్తూ ఉంటే, అది పొందటం జరుగుతూ ఉంటోంది.

పునర్భవాయం కోశం భినత్తి।
పునర్భవనాడియందు సంచరించుజీవుని పట్ల కోశములు ఛేదనము పొందుచున్నాయి.

పంచకోశములు ఖండించబడుచుండగా ‘శీర్షకపాలము’ - భేదనము పొందుచున్నది. కోశం భిత్వా శీర్ష కపాలం భినత్తి।

మృత్యుర్వై పరే దేవ ఏకీభవతి। ఇకప్పుడు మృత్యువు - ’పరము-పరమాత్మ’లో ఏకత్వము పొందుచున్నది. 

“ఇహమునకు (అనగా ‘జీవాత్మ’కు) యజమాని, ఏకస్వరూపుడు, అఖండుడు”, అను ఆయా శబ్దార్ధములచే ఉద్దేశ్యించబడుచున్న ’పరము’తో తదితరమైనదంతా ఏకీభూతము అగుచున్నది. (All this is getting united with the other side of one’s own self).

ఓ రైక్వా!

అట్టి మనలో ప్రతి ఒక్కరి మనందరి పర స్వరూపము (ఇహస్వరూపమునకు ఆవల ఉన్నట్టిది) - అఖండము. అద్దానిలో నేను - నీవు - జగత్తు - బంధము - మోక్షము - విజ్ఞుడు - అజ్ఞుడు.. ఇత్యాది భేదములే లేవు. అది ఏకము, అనన్తము, అద్వితీయము, నిత్యము, నిర్మలము, సత్యము, నిరామయము, నిరాలంబము’ ఇత్యాది - మహదార్థములచే, మహత్ శబ్దములచే చెప్పబడుచున్నది.

ఓ శ్రోతలారా! అట్టి పరస్వరూపము సర్వదా మన యొక్క సహజ స్వరూపము! తదితరమైనదంతా ఆపాదితము, కల్పితము, సందర్భమాత్రము ఊహాజనితము. అసత్తు కూడా!

అట్టి మనయొక్క అఖండ అప్రమేయ పరస్వరూపము…., ‘సత్తు’ - ఉన్నది (That is here present) అనవచ్చా? ఇంద్రియములకు మాత్రమే ఉన్నట్లుగా కనిపిస్తున్న వస్తువును మాత్రమే మనము లౌకికముగా ‘సత్తు’ - ఉన్నది అని అంటాము. ఆత్మయో ఇంద్రియములకు విషయమే కాదు! కనుక ‘సత్తు’ - ఉన్నది” - అని (ఇంద్రియానుభవముల దృష్ట్యా) అనలేము!

పోనీ, అసత్తుయా? ఇంద్రియములు ఆ పరస్వరూపము యొక్క చైతన్యతత్త్వము (కదలించు స్వభావము) చేతనే ప్రవర్తమానమగుచున్నాయి. పరతత్త్వమే లేకపోతే (విద్యుత్తు లేకుంటే బల్బు వెలగని విధంగా ఫాన్ తిరగని విధంగా) ఇంద్రియములు తమకు తాముగా ప్రవర్తించలేవు. కనుక పరస్వరూపము, అసత్తు కాదు. ఇంద్రియములను చేతనముగా చేయుదానిని ‘అసత్తు’ అని ఎట్లా అంటారు?

లేక సదసత్తుయా? కొంతసేపు సత్తు గాను, మరికొంతసేపు అసత్తుగాను ఉంటోందా? స్వస్వరూపము సత్ - అసత్ మిశ్రమమా? ‘నేను ఉన్నాను’ అనునది సత్తు. ’నేను మెళకువలో లేను. నేనునిద్రలో ఉన్నాను’.. అను ఉనికిని భావన చేయుచూ సత్-అసత్ భావనలకు మునుముందే ఉన్నట్టిది. సత్-అసత్ భావనలకు (అనుభూతులకు) సాక్షియై ఉన్నది. కనుక అది ‘సదసత్తు’ (ఉండీ లేనిది - లేకా ఉన్నది) కూడా కాదు.

అద్దాని ఉనికిని, ప్రతిభను మోక్షశాస్త్రము, ఆత్మజ్ఞులు గానంచేస్తూ మనకు వినపిస్తున్నారు! అందుచేత నిర్వానుశాసనము!

తెలియబడేదంతా ‘వేదము’! తెలుసుకొంటున్నవాడు ఉంటేకాదా, తెలియబడేది? ‘అట్టి కేవల చిత్స్వరూపుడగు తెలుసుకొనువాడు ఉన్నాడు’.. అనటానికి తెలియబడునది ఉండటమే సాక్ష్యము. ప్రమాణము. అందుచేత ఆ పరస్వరూపము.. ’వేదానుశాసనము’… ‘వేదానుశాసనమితి’!


12.) ద్వాదశ ఖండము - అన్నమ్ - అన్నాదమ్ - సర్వమ్ బ్రహ్మమ్!

అన్నమ్ = అనుభవముగా పొందబడుచున్నది. జగత్ రూపముగా భావించబడుచున్నది. దృశ్యముగా దర్శించబడుచున్నది.
అన్నాదమ్ = అనుభవి.

అట్టి పరస్వరూపము సర్వదేహములలో వేంచేసియున్న శ్రీమన్నారాయణునికి ’అన్నము’ అగుచున్నది.

ఈ విధంగా..

అన్నమ్ = అనుభవమునకు విషయమగుచున్నట్టిదంతా కూడా!

నారాయణాద్వా అన్నమ్ ఆగతమ్! అన్నమ్ (అనుభవమగుచున్నదంతా కూడా) సర్వాంతర్యామి - సర్వదేహనివాసి - సర్వతత్త్వ స్వరూపుడు అగు శ్రీమన్నారాయణుని నుండియే బయల్వెడలుచున్నది.

అనుభవించబడుచున్నదంతా (అనుభూతమగుచున్నదంతా)… బ్రహ్మమే! నారాయణ స్వరూపమే!

పక్వ బ్రహ్మలోకే.. బ్రహ్మలోకమునందు పక్వమైనట్టి ‘అన్నము’ (All that being experienced).
పక్వ మహాసంవర్తకే.. ప్రళయ మేఘముల నుండి పరిపక్వత పొందుచున్నదై,
పునః పక్వమ్ ఆదిత్యే.. తిరిగి జగత్-ఆది స్వరూపుడగు ఆదిత్యభగవానునిచే పక్వము పొందినదై,
పునః పక్వమ్ క్రవ్యాది.. తిరిగి మాంసమయదేహము నందు ఆ అన్నము పక్వమగుచూ,
పునః పక్వమ్ జ్వాలాకీల కిన్నః - అగ్ని (జ్ఞానాగ్ని) జ్వాలలచే ఉడకబెట్టబడినదై,
పర్యుషితమ్ - ఉడకబెట్టి - చల్లార్చబడినదై,
పూతమ్ - పవిత్రమై బ్రహ్మమునందే చివరికి చేరుచున్నది. కనుక, పరబ్రహ్మముగానే అనుభూతము అగుగాక! ఈ కనబడే ‘అన్నము’ శబ్దముచే చెప్పబడుచూ, అనుభూతముగా (జీవాత్మ నుండి దృశ్యానుభవము వరకు) ఏది అగుచున్నదో, అదంతా కూడా ఆత్మానారాయణుని నుండే బయల్వెడలుచూ ఆత్మానారాయణ స్వరూపమే అయి ఉన్నది.

అన్నమ్ పూతమ్, అయాచితమ్, అసంక్లప్తం తత్ అదశ్నోయాత్! న కించన యాచేత!

దృశ్యమును నారాయణ స్వరూపముగా (అన్నమును పరబ్రహ్మ స్వరూపముగా) భావించి ఉపాసించాలి! ఈ అనుభవమగుచున్న దానిపట్ల ‘నారాయణ స్వరూపము’ అను పవిత్ర భావన కలిగి ఉండాలి. అంతేగానీ అసంక్లిప్తముగా (జగత్ భావాలతో, కామ క్రోధ-లోభ-మోహ-మద-మాత్యార్యాలతో కలిపి) భుజించరాదు. ఆస్వాదించరాదు.

న కఞ్చన అయాచితమ్ - అది అట్లాగే ఉండాలి - ఇట్లాగు ఉండకూడదు”. అనే యాచనతో ఈ అన్నమ్ (దృశ్యము)ను స్వీకరించరాదు.

నారాయణ స్వరూపముగా భావిస్తూ అనుభవమయ్యేదంతా సర్వదా ఆత్మానారాయణత్వముగా ఉపాసించబడుగాక! పరబ్రహ్మస్వరూపముగా దర్శించబడుగాక! (అన్నమ్ పరబ్రహ్మ స్వరూపమ్)!

(అన్నమ్ బ్రహ్మ! అహమ్ బ్రహ్మ! భోక్తా చ బ్రహ్మ! అనుభవమగుచున్నదంతా బ్రహ్మమే! నేను బ్రహ్మమును! దృశ్యానుభవి అగు నా జీవాత్మ బ్రహ్మమే! అనుభవించువాడు - అనుభవించబడునది - ఉభయ ప్రేరకుడు అంతా బ్రహ్మమే!)


13.) త్రయోదశ ఖండము - బాలవత్ - సుబాలవత్

ప్రజాపతి ఆప్త వాక్యములు

ఘోరాంగీరసుడు : ఓ రైక్వా! తదితర శ్రోతలారా! ఓ పరబ్రహ్మానంద స్వరూపులారా!

ఈ జగత్తులో ఏరీతిగా ఉండాలో, సంచరించాలో, ఇక్కడ కొన్ని విశేషాలు మీముందు ఉంచుచున్నాను. వినండి!

బాల్యేన తిష్టాసేత్! ‘నేను ఈ దృశ్యములో ఒక బాలునివలె ఉండాలి’.. అని కోరుకొనెదరు గాక!
(NOTE: ఇందుకే ఈ ఉపనిషత్తుకు ‘సౌబాలబీజ బ్రహ్మోపనిషత్’ (లేక) ‘సుబాలోపనిషత్’ అను పేరు ఇవ్వబడింది)!

బాల స్వభావో : ఒక చిన్న పిల్లవానికి ’ఆట బొమ్మ’ ఎంతో ఆనందము ఇస్తున్న విధంగా, ఈ జగదనుభవమంతా (దృశ్యవ్యవహారమంతా) ఈ దేహములు ఇంద్రియములతో సహా, - ఇంద్రియ విషయములతో సహా - “ఆడుకొనే వస్తువుల సంఘములు” వలె దర్శించబడుగాక! దీనినే బాలోపాసన అని కూడా అంటారు! అంతా చిన్న పిల్లల ఆటలలో సంఘటనల వలె భావించాలి!

అసంజ్ఞో : బాలునికి దేనితోనూ సంగము ఉండదు. ఆడుకునేటప్పుడు ఆడుకోవటం, అల్లరి చేసేటప్పుడు అల్లరి, రుచిగా తినేటప్పుడు తినటం, అమ్మ జోలపాట పాడేటప్పుడు పాట విని వినోదించటము, నిద్రపోయేటప్పుడు నిద్ర.. ఆస్వాదిస్తూ.. ఉంటాడు. దేనికీ పరిమితుడై ఉండదు. అట్లాగే ఇక్కడి సంగతి - సందర్భ సంబంధ- సంవేదనలను పొందుచూ కూడా ఏ ఒక్కదానితోనూ సంగము లేకుండా ఈ జీవుడు వేరుగా ఉండాలి. అసంగులమై మనము ఉందాము. కథ చదువుతూ ఉండేవాడికి కథలోని విశేషాలన్నీ (కష్ట-సుఖ-సంగత-అసంగతాలన్నీ) నవలాపరణ వ్యాసంగ విశేషాలే కదా! అంతేగాని, క్రోధ-తాప-ఆవేశములు పొందవలసిన పనేమున్నది? ఈ దృశ్య జగత్తు అటువంటిదే!…. అనునదే సౌబాలబీజ భావన.

నిరవద్యో : ఇక్కడి గుణములతో సంబంధము కలిగి ఉండక, గుణాతీతులమై, దృశ్యాతీతులమై, గుణములకు బద్ధులము కానివారమై తదితరులలో కన్పించే త్రిగుణ సాక్షిగా చూస్తూ ఉండెదము గాక! వేరు వేరుగా కాక, ఏకమును దర్శించెదముగాక! ఏకమునందు ఇక్కడ అనుభూతమగు ‘అనేకమంతా’ (ఏకం చేసి) దర్శించెదము గాక!

మౌనేన : సర్వ జగత్ విశేషాల పట్ల, విషయముల పట్ల - అప్రమేయులమై ‘మౌనము’ వహించిన వారమై ఉండెదము గాక!

పాండిత్యేన : నిత్యానిత్య విలేకులు చెప్పుచున్న పరమాత్మ సంబంధమైన పాఠ్యాంశములను నెమరవేసుకుంటూ, హృదయస్థము చేసుకుంటూ పవిత్రమగు ఆత్మజ్ఞాన దృష్టిని వదలక - ఉండెదముగాక! దృశ్యము నందు జ్ఞానదృష్టి, మహావాక్యార్ధ పాండిత్యము కలిగి ఉండి సంచరించెదము గాక!

నిరధికారతయా ఉపలభ్యతే కైవల్య ముక్తం-ఇతి నిగమనమ్ : మనము పైన చెప్పుకొన్నవిధంగా బాలునివలె ఉండాలి. నిరధికారముగా ఉండాలి! వేదములచే గానము చేయబడుచున్నట్టిది-అగు ’కైవల్యముక్తి’కి ఇక్కడే, ఇప్పుడే మనము యోగ్యులము అవాలి.

ఓ రైక్వా! తదితర బిడ్డలారా! ఒక సందర్భములో ఈ సృష్టికి కారణభూతుడగు ప్రజాపతి చెప్పిన ఒక పాఠ్యాంశమును మనము ఈ సందర్భములో గుర్తు చేసుకుందాము.

ప్రజాపతి శ్రేయో వాక్యములు

ప్రజాపతి :  ఓ సర్వజీవులారా! బిడ్డలారా! ’నేను దేహ-మనో బుద్ధి-చిత్త-అహంకార దేహపరిమితుడును కాను! సర్వదా ఆత్మ స్వరూపుడను!” అను పరమ సత్యమును సదా మననము చేసుకొంటూ ఉండండి! మహత్ పదమ్ జ్ఞాత్వా  ‘మహత్పదము’ అనగా ఏమో తెలుసుకొని ఉండండి.

వృక్షమూలే వసేత్ కుచేలో, అసహాయ, ఏకాకీ - సమాధిస్థ మాసిన గుడ్డలతో, అసహాయులై (ఏ ఒక్కటీ సహాయముగా కలిగి ఉండవలసిన అవసరము లేనివారై), ఏకాకి అయి (ద్వితీయము అనునదంతా దాటివేసినవారై), ఇక (ఈ సంసార) వృక్ష మూలమున ఆశీనులై, ప్రశాంతచిత్తముతో సర్వమును దర్శిస్తూ ఉండండి! ’సర్వమునందు సమమగు సంవిదాత్మను దర్శించటము’..అను సమాధియందు సుఖముగా కూర్చునియున్నవారై ఉండండి!

ఆప్తకామో - దృశ్యములో ఏదీ కోరక- కోరికలన్నీ తీరిపోయినవారై…,

ఆత్మకామో - ఆత్మదర్శనము (సర్వము ఆత్మగా దర్శించటము) ఒక్కటి మాత్రమే కోరుకొనుచున్నవారై….,

నిష్కామో - ఏ కోరికలూ లేనివారై, కోరికల తీరమును దాటివేసినవారై.., ఉండండి!

జీర్ణకామో - సర్వకామముల రహస్యమును ఆత్మాభావనయందు జీర్ణము చేసుకొన్న వారై ఉండండి!

యో హస్తిని - ఇత్యాది మృత్యోరూపాణి విదిత్వా నబిభేతి కుతశ్చనేతి।  ఇక్కడ దృశ్యములో కంటికి కనిపిస్తున్న ఏనుగునందు, సింహము నందు, ఒక ఈగ-దోమయందు, ముంగిసయందు, సర్పమునందు, యక్ష రాక్షస గంధర్వ కింపురుష దేవ ఇత్యాది జాతులందు, సహమానవుల యందు ‘ఇదంతా మృత్యురూపమే! మార్పుచెందురూపమే! దీనికి ఆవల ఆత్మ! ఆ ఆత్మయే ఈ ఈ రూపాలన్నీ! కనిపించేదంతా అనేకముగా కనిపించుచున్నప్పటికీ ఇదంతా అఖండమగు ఆత్మగా నాకు సునిశ్చయమై అనిపించును గాక!’.. అను ఉపాసనను స్వీకరించినవారై ఉండండి! అప్పుడిక సర్వ భయములు తొలగుతాయి. అభయము సిద్ధించగలదు.

ఓ బిడ్డలారా! వృక్షమివ తిష్ఠాసేత్, ఛిద్యమానోపి, న కుష్యేత న కమ్పేత | ఈ సంసారణ్యమును జయించివేయాలి, ఒక వృక్షమువలె ఉండాలని కోరుకొనిదెరు గాక! ఎట్లా అంటే, వృక్షము నరకబడుచున్నప్పుడు కూడా ఏ మాత్రమూ కోపించదు. కంపించదు. ఫలములను కోసుకొంటున్నప్పుడు ఏ మాత్రము కోపము -కంపన లేనిదై ఉంటుంది. ఆవిధంగా ఈ దృశ్యమునందు జీవితయాగము సాగిస్తూ, ఆత్మతత్త్వమునందు సర్వదా తత్పరులై ఉండండి.

ఆకాశమివ తిష్ఠాసేత్, ఛిద్యమానోఽపి, .. న కుప్యేత! న కమ్పేత! ఖండించబడుచున్నప్పుడు కూడా ఆకాశము కోపము- కంపము పొందదు కదా! ఒకచోట ఒక గోడ కట్టినంత మాత్రము చేత ఆకాశము తన అఖండత్వము ఏ మాత్రము త్యజించకుండానే ఉంటుంది కదా! అట్లాగే మీరంతా పరమసత్యమగు ‘ఆత్మా హమ్’ భావనను సర్వదా సుస్థిరముగా ఆశ్రయించి ఉండెదరు గాక!

సత్యేవ తిష్ఠాసేత్! సత్యో అయమాత్మా! మీరంతా సత్యమునందే ప్రతిష్టితులమై ఉండండి! ఆ సత్యము ఏమిటంటారా? పరబ్రహ్మమే అజ్ఞాన దృష్టికి జీవాత్మవలె అగుపిస్తోంది! ఈ జీవాత్మ సర్వదా పరబ్రహ్మమే! ఈ సత్యమునే అనేక సంభాషణలతో నిరూపించుకుంటున్నాము. మహర్షుల ఆప్తవాక్యములు ఉపనిషత్తుల రూపంగా అదియే ప్రకటిస్తున్నాయి.

ఇదంతా - పరమాత్మ హృదయ స్థానము నందే!

సర్వేషామ్ ఏవ గంధానామ్ పృథివీ హృదయమ్। సర్వ గంధములకు పృథివియే (భూమియే) హృదయస్థానము!
సర్వేషామేవ రసానామ్ ఆపో హృదయమ్। సర్వ రసములకు జలమే హృదయస్థానము!
సర్వేషామేవ స్పర్శానామ్ వాయుః హృదయమ్।  సర్వ స్పర్శానుభవములకు వాయువు హృదయ స్థానము!
సర్వేషామ్ శబ్దానామ్ ఆకాశమ్ - హృదయమ్। సర్వశబ్దములకు ఆకాశమే హృదయము!
సర్వేషామేవ గీతానామ్ అవ్యక్తమ్ హృదయమ్। సర్వ గీతములకు అవ్యక్తమే హృదయము!
సర్వేషామేవ సత్వానామ్ మృత్యుః హృదయమ్। ఉనికి గల సర్వ పదార్థములకు మృత్యువు (మార్పు)యే హృదయము!

మృత్యువునందు - ఉనికి గల సర్వ పదార్ధములూ - ఏకీభూతమగుచున్నాయి. అట్టి మృత్యువు యొక్క స్థానము పరతత్త్వము యొక్క హృదయము. పరమాత్మ సర్వదా ప్రతి ఒక్కరి సహజ స్వస్వరూపమే అయి ఉన్నది. అట్టి పరమాత్మ సత్తు కాదు. అసత్తు కాదు. సదసత్తు కాదు. అట్టి పరమాత్మను సర్వాంతర్యామిగా, సర్వతత్త్వ స్వరూపునిగా ఉపాసించండి! అప్పుడు మీరే పరమాత్మ స్వరూపులై ప్రకాశించగలరు!

ఇదియే నిర్వాణానుశాసనము
వేదానుశాసనమ్|

14.) చతుర్దశ ఖండము - ఆత్మయేవ అన్నం అన్నాదమ్

అన్నము = అనుభూతమగు వస్తువు!
అన్నాదమ్ = అనుభవి. అనుభవ ప్రదాత.

ఘోరాంగీరస మునీశ్వరుడు :

ఈ పృథివి అన్నము (అనుభవము) - జలము అన్నాదము (అన్నప్రదాత)
జలము అన్నము - జ్యోతి ‘అన్నాదము’ (ప్రదాత)
జ్యోతి అన్నము - వాయువు అన్నాదము
వాయువు అన్నము - ఆకాశము అన్నాదము
ఆకాశము అన్నము - ఇంద్రియములు అన్నాదము
ఇంద్రియములు అన్నము - మనస్సు అన్నాదము. (మనస్సుచే ఇంద్రియములు ఉపయోగించబడుచున్నాయి)
మనస్సు అన్నము - బుద్ధి అన్నాదము. (బుద్ధికి మనస్సు ఉపకరణము)
బుద్ధి అన్నము - అవ్యక్తము అన్నాదము.
అవ్యక్తము అన్నము - అక్షరము అన్నప్రదాత.
అక్షరము అన్నము - మృత్యువు అన్నాదము.

మృత్యువునకు ఆవల పరమాత్మ అనంతప్రకాశమానుడై, స్వభావానందస్వరూపుడై, ఏక-అఖండ స్వరూపుడై విరాజిల్లుచున్నారు.

పరమాత్మయే సర్వమునకు అన్నాదము (One for whose consumption is all this!). ఈ సర్వము పరమాత్మకు అన్నము!

అట్టి పరతత్త్వము… సత్తు కాదు! అసత్తు కాదు! సదసత్తు కాదు!

ఇతి నిర్వానుశాసనము
ఇతి వేదానుశాసనము


15.) పంచదశ ఖండము - ఆత్మ జ్ఞానాగ్ని దేనిని దహిస్తోంది?

రైక్వుడు :  గురుదేవా! ఘోరాంగీరస మహాశయా!

యో అయం ‘విజ్ఞానఘన’ - ఉత్య్రామన్, స కేన, కతరత్వ అవస్థానం దహతి?
ఆత్మాజ్ఞానముచే ఏ ఆత్మజ్ఞాన-విజ్ఞాన ఘనము ఉత్రమనము, అట్టి జ్ఞానాగ్ని దేనిచే ఏ స్థానమును దహించున్నది?

ఘోరాంగీరస మహామునీంద్రుడు :
ఆత్మ జ్ఞానియొక్క విజ్ఞాన ఘనాగ్ని ప్రజ్వలితమై మొట్టమొదట ’ప్రాణము’ను దహించుచున్నది. ప్రాణముతో బాటే అపాన-వ్యాన-ఉదాన-సమానములను కూడా దహిస్తోంది.

అట్లాగే వైరంభమును, ముఖ్యప్రాణమును, అంతర్యామమును, ప్రభంజనమును, కుమారమును, శ్యేనమును, శ్వేతమును, కృష్ణమును, నాగమును, ప్రాణ-ఉపప్రాణములు - ఇవన్నీ ఆతని ఆత్మజ్ఞానాగ్ని దహించి వేయుచున్నది.

ఆ తరువాత ఆ విజ్ఞాన ఘనుడు - పంచభూతములైనటువంటి పృథివి, ఆపః, తేజో, వాయుః ఆకాశములను దహిస్తున్నారు. ఆత్మకు అభిన్నముగా భావించి, ఏకము చేయుచున్నారు.

మృత్యువుకు ఆవల గల పరతత్త్వ స్వరూపము (లేక) కేవలీ స్వస్వరూపము మాత్రము ఆ దహనముకు విషయమే అయి ఉండదు.

అట్టి పరతత్త్వము - న సత్! న అసత్! న సదసత్!

ఇతి నిర్వాణుశాసనమ్!
ఇతి వేదానుశాసనమ్!

16.) షోడశ ఖండము - అర్హత - ఫలశ్రుతి

మహత్తర సత్యమగు సర్వగత - స్వస్వరూప ఆత్మతత్వము గురించి సహేతుక వివరణతో ప్రతిపాదిస్తున్న ఈ శుక్లయజుర్వేదాంతర్గత ‘సౌబాల బీజ బ్రహ్మోపనిషత్ (లేక) సుబాలోపనిషత్’ లోని విషయాలను, వివరణలను, చర్చనీయాంశాలను -

ఒక సంవత్సరకాలముగాని, (లేక) ఒకరాత్రి కాలముగాని శ్రోతయొక్క ఆశయము - పట్టుదల- ప్రజ్ఞలను పరిశీలించకుండా ఈ ఉపనిషత్ విషయములు చెప్పవద్దు.

కులశీలత్వము - కులధర్మము ఎరుగని వానికి కూడా బోధించరాదు.

ఎవ్వనికైతే దైవభక్తి-గురుభక్తి హృదయమునందు వికశించి ఉంటుందో, అట్టివానికి తప్పక బోధించాలి. అట్లు బోధించుటచే ఇందలి తత్త్వార్థము అగు ఆత్మ వస్తువు సుస్పష్టముగా, హృదయస్థమై ప్రకాశమానమవగలదు.

లోక కళ్యాణమస్తు!
ఇతి నిర్వాణానుశాసనమ్! వేదానుశాసనమ్!

ఇతి
🙏 సౌబాల బీజ బ్రహ్మ ఉపనిషత్ (లేక) సుబాల ఉపనిషత్ । 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥