[[@YHRK]] [[@Spiritual]]

Turēyātēta Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


శుక్ల యజుర్వేదాంతర్గత

6     తురీయాతీతోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో॥ ఓం తురీయాతీతోపనిషత్ వేద్యం యత్ పరమాక్షరమ్
తత్ తుర్యాతీత చిన్మాత్రం స్వమాత్రం చింతయేత్ అహమ్ ॥

తురీయాతీత సన్న్యాస పరివ్రాజ అక్షమాలికా
అవ్యక్త ఏకాక్షరం పూర్ణ సూర్యాక్ష్య అధ్యాత్మ కుండికా ॥


ఈ తురీయోపనిషత్చే ప్రతిపాదించబడుచున్నది, పరమాక్షరమైనది, చిత్ స్వరూపము, కేవల స్వస్వరూపము అగు “తుర్యాతీత చిన్మాత్రము”ను చింతన చేయుచున్నాము. తురీయాతీత అద్వైత స్వరూపులగుచున్నాము. తురీయాతీతులగు సన్యాస పరివ్రాజకులకు తులసీమాలవంటిదగు అవ్యక్త - ఏక - అక్షర - పూర్ణ - జ్ఞాన సూర్య తేజో విభవమును ఉసాసిస్తున్నాము. “తత్ చిత్ కేవలీ స్వరూపము”నకు నమస్కరిస్తూ ఉన్నాము.

1.) అథ తురీయాతీతా అవధూతానాం
కోఽయం మార్గః? తేషాం కా స్థితిః?
ఇతి పితామహెూ భగవన్తం
పితరమ్ ఆదినారాయణమ్ పరిసమేత్య, ఉవాచ ||

పితామహుడగు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణునితో :
తండ్రీ! శ్రీమన్నారాయణా! ఇప్పుడు దయతో తురీయాతీతులగు అవధూతల గురించి విశదీకరించ ప్రార్థన.

అవధూతగా అగుటకు మార్గమేమిటి?
వారి స్థితి ఎటువంటిది? వారు ఏ తీరైనవారు? ఎట్లు ఎక్కడ ఎట్లా ఉంటారు?

అని పితామహుడు, భగవంతుడు అగు బ్రహ్మదేవుడు వారి పితృదేవులు అగు ఆదినారాయణ స్వామిని సమీపించి అడిగారు.

2.) తమ్ ఆహ భగవాన్ నారాయణోః

యో అయమ్ అవధూతమార్గస్థో
లోకే దుర్లభతరో!
న తు బాహుళ్యో! యత్ ఏకో భవతి,
స ఏవ నిత్య పూతః।
స ఏవ వైరాగ్య మూర్తిః
స ఏవ జ్ఞానాకారః
స ఏవ వేద పురుషః
ఇతి జ్ఞానినో మన్యస్తే
మహాపురుషో ॥

బ్రహ్మదేవునితో భగవంతుడగు ఆదినారాయణుడు:
ఓహెూ! అవధూతలగురించి చెప్పమంటున్నారా! మంచిది. అయితే అట్టి ఆ అవధూత మార్గములో ఉన్నవారు 14 లోకాలలో చాలా దుర్లభము, అరుదు. ఇతరులకు తెలియగల బాహ్య లక్షణాలు (సన్న్యాసికో, వానప్రస్తుకో ఉన్నట్లు) ఉండవు. ఎక్కడో ఏకాకి అయి తనకు తానై ఉంటారు. ఆతడు ఎల్లప్పుడు విషయములన్నీ దాటివేసి, దేనిచేతనూ స్పృశించబడక, పరమపవిత్రుడై ఉంటారు. మూర్తీభవించిన వైరాగ్యముతో కూడినవాడై ఉంటాడు. స్వభావ సిద్ధముగానే దేనిపట్లా రాగము ఉండదు. అందరిలో వేంచేసియున్న ఆత్మ వస్తువు ఒక్కటే ఆతనికి ప్రేమవస్తువై ఉంటుంది.

ఆతనికి ఈ భౌతిక దేహము దేహమే కాదు. ఆత్మ జ్ఞానాకారుడై, ఆత్మ సందర్శన-ఆత్మతదాత్మ్యమే ఆతని దేహము. జ్ఞానమే ఆతని ఆకారము. తెలుసుకొనవలసినది తెలుసుకొని, అట్టి అఖండాత్మయై వెలుగొందుచున్నారు. తెలియబడేదంతా ఈతని దేహమే! అందుచేత “వేదపురుషుడు” అని జ్ఞానులు ఆతని గురించి చెప్పుకుంటూ ఉంటారు. మహత్తును ఆశ్రయించిన మహా పురుషుడు.

యః తత్ చిత్తం మయ్యేవ అవతిష్ఠతే
అహమ్ చ తస్మిన్ ఏవ అవస్థితః,
సోఽయమ్ ॥

ఆదౌ తావత్ క్రమేణ
కుటీచకో, బహూదకత్వం
ప్రాప్య, బహూదకోఽహమ్
సత్తమ్ అవలంబ్య,
హంసః పరమహంసోభూత్వా

అట్టి మహాపురుషుని యొక్క చిత్తము సర్వాంతర్యామిని, సర్వ తత్త్వ స్వరూపమును, సర్వమును, సర్వసాక్షిని అగు నాయందే ఎల్లప్పుడు అవతిష్ఠమై ఉంటుందయ్యా!
ఇక నేనో! ఆ మహనీయునియందే అవతిష్ఠుడనై ఉంటాను. అందుచేత నాకు-అవధూతకు భేదమే ఉండదు.

అట్టి పరమహంస తత్త్వమగు అవధూత మార్గమును అనుసరించు యోగి మొట్టమొదట ‘కుటీచకుడు’ అయి, ఆపై “బహూదకత్వమును” ప్రాప్తించుకొంటున్నారు. “అంతటా ఉండి ఉన్న బహూదకుడను నేను”….. అను భావనను సమీపించి, “అహమత్యమ్”ను ఆశ్రయిస్తున్నాడు. “సోఽహమ్” అను హంస మంత్రము యొక్క ప్రత్యక్ష మనన ధారణలచే, “పరమహంస” అగుచున్నాడు.


స్వరూపానుసంధానేన
సర్వ ప్రపంచం విదిత్వా,
దండ కమండలు కటిసూత్ర
కౌపీనా ఆచ్ఛాదనస్య
విధ్యుక్త క్రియాదికం
సర్వమ్ అప్పు సన్న్యస్య,
దిగమ్బరో భూత్వా,
వివర్ణ జీర్ణ వల్కలాం జీన
పరిగ్రహమపి సన్త్యజ్య,
తత్ ఊర్ధ్వమ్ అమన్త్రవత్ ఆచరన్,
క్షౌర, అభ్యంగస్నానో
ఊర్ధ్వపుణ్డ్రాదికం విహాయ,
లౌకిక వైదికమపి ఉపసంహృత్య,
సర్వత్ర పుణ్య అపుణ్య వర్ణితో

పరమహంస రూప - అనుసంధానముచే “ఈ విశ్వమంతా నా దేహమే” అనే స్వరూపత్వమును స్వీకరించు చున్నాడు. ఈ ప్రపంచమంతా నిండిన తన రూపమును ఎరిగినవాడై ఉంటున్నాడు. ఇక కనిపించేదంతా తానై ఉండగా కళ్ళు మూతలతో పనేమున్నది? సన్న్యాసాశ్రమసంబంధమైన దండము-కమండలము-యజ్ఞసూత్రముకాషాయ వస్త్రములు - వీటన్నిటితో ఆతనికి సంబంధము ఉండదు. ఆశ్రమ సంబంధము-విద్యుక్త ధర్మములు, దండ-కమండల-కటి (మొల) సూత్రములు, ఆశ్రమ నియమ సంబంధమైన ఆయా ధర్మములు జలముతో సమంత్రంగా త్యజించివేయుచున్నారు.


దిగంబరుడు (పరిమిత వస్త్రములను త్యజించి, సర్వదిక్కులు తన వస్త్రముగా ధారణ కలవాడై) ఉంటున్నారు. ఇతఃపూర్వపు వివర్ణములగు వల్కాజినములను (నార వస్త్రములను) పరిగ్రహణము కూడా సంత్యజిస్తున్నాడు. కృష్ణాజినము (చర్మవస్త్రము) కూడా వదలి వేస్తున్నారు. నిత్యక్రియలను బాహ్యమంత్రోచ్ఛారణతో నిర్వర్తించడం కూడా త్యజిస్తున్నారు. క్షౌరము (Hair Cutting), అభ్యంగన స్నానము (నదీ-తటాక స్నాన నియమములను), ఊర్ధ్వ పుండ్రములను (విభూతి రేఖలు), బొట్టు ఇటువంటివి కూడా త్యజిస్తున్నారు. లోక సంభంధమైన వైదిక సంబంధమైన కర్మలను ఉపసంహరిస్తున్నారు. సర్వత్ర పుణ్య-అపుణ్య క్రియా సంబంధమైన భావ-ఉద్రేక-విశేషాలు వర్జిస్తున్నారు.

జ్ఞాన-అజ్ఞానమపి విహాయ,
శీతోష్ణ సుఖదుఃఖ మాన-అవమానం నిర్జిత్య,
వాసనాత్రయపూర్వకం నిన్ద-అనిన్ద గర్వ మత్సర దంభ దర్ప
ఇచ్ఛా ద్వేష, కామ-క్రోధ-లోభ-మోహ
హర్షా అమర్షా అసూయా
ఆత్మ సంరక్షణాదికం దగ్ధ్వా
స్వవపుః కుణపా ఆకారమివ పశ్యత్,
అప్రయత్నేన అనియమేన
లాభా అలాభౌ సమౌకృత్వా

జ్ఞాన-అజ్ఞానముల నిర్వచనములను కూడా వదలుచున్నారు. శీత-ఉష్ణ, సుఖ-దుఃఖ, మాన-అవమానములు మొదలైన ద్వంద్వములను జయించివేసి
ఉంటున్నారు. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన… అనబడు త్రివిధ వాసనాపూర్వకమైన నిన్ద-అనిన్దలను, గర్వ - మత్సర (Nature of Hearting others), దంభ (లేనిది ఉన్నట్లు చూపు), దర్ప (ఉన్నది గొప్పగా చూపు), ఇచ్ఛ-ద్వేష, కామ, క్రోధ,లోభ, మోహ, హర్ష-అమర్ష, అసూయ, తన క్షేమమే తనకు ఆశయమని అనుకోవటం … ఇవన్నీ ఆతడు దగ్ధము చేసివేసుకొని ఉంటారు.

తన ఈ భౌతిక శరీరమును కూడా ఆతడు ఒక మరణించినవాని దేహమును ఆతని బంధువులు చూచు రీతిగా తానే ఇప్పటికిప్పుడే చూస్తున్నారు. కర్మలకు ఆవల అప్రయత్నశీలులై, ఏ నియమములు నియమించుకొనని వారై, లాభ-అలాభములను ఒకే తీరుగా దర్శించుచూ అతీతుడై ఉంటున్నారు.

3.) గోవృత్యా ప్రాణసన్దారణం కుర్వన్,
యత్ ప్రాప్తం, తేనైవ నిర్లోలుపః
సర్వ విద్యా పాణ్ణిత్య ప్రపంచం భస్మీకృత్య,
స్వరూపం గోపయిత్వా,
జ్యేష్ఠ అజ్యేష్ఠత్వ అపలాపకః, (మాట్లాడక)
సర్వోతృష్టత్వ సర్వాత్మకత్వా
అద్వైతం కల్పయిత్వా ఒక గోవువలె ఏది ప్రాప్తిస్తే అది ప్రాణములను నిలుపుకోవటము మాత్రమే ఉద్దేశ్యించి తృప్తి కలిగి ఉంటున్నారు. వేద-ఉపనిషత్ ప్రతిపాదితమగు సర్వవిద్యా (మహాన్ ఆత్మ విద్యా) పాండిత్యము కలిగి ఉన్నవాడై ఈ దృశ్యమును తనయందు భస్మముగా చేసి, ఇద్దాని, స్వభావస్వరూపములను తనయందు దాచుకొన్నవానివలె ఉంటున్నారు. పెద్దవారు-చిన్నవారు, జ్ఞానులు-అజ్ఞానులు, గొప్పవారు-కానివారు… ఇటువంటి భావాలు, మాటలు లేనివారై, సర్వోత్కృష్టము, సర్వాత్మకము అగు అద్వైతము మాత్రమే కల్పించుకొంటూ…. సర్వ ప్రాపంచక లోక - లోకాంతరములైన సర్వ కల్పనలను కల్పన చేయనివాడై ఉంటారు.
అమత్తో, అవ్యతిరిక్తః
’కశ్చిత్ న అన్యో అస్తి’ ఇతి
దేవ గుహ్యాది ఇన్దనమ్
ఆత్మని ఉపసంహృత్య,
దుఃఖేన నో ఉద్విగ్నః,
సుఖేన న అనుమోదకో, రాగే నిస్పృహః,
సర్వత్ర శుభ-అశుభయో అనభిస్నేహః
సర్వేంద్రియో పరమశ్చ
పూర్వ ఆపన్న ఆశ్రమ ఆచార
విద్యాధర్మ ప్రభావమ్ అనుస్మరన్,
త్యక్త వర్ణాశ్రమ-ఆచారః,
సర్వదా దివా నక్తం సమత్వమేవ
అస్వప్నః సర్వదా సంచారశీలో,
దేహమాత్రా అవిశిష్టో,
జల స్థల కమండలుః
సర్వదా అనున్మత్తో

తనకు అన్యమైనది, వ్యతిరిక్తమైనది ఎక్కడా ఏమీ లేదు ఎవ్వరూ తనకు వేరు కాదు - అను భావనయందు అమత్తుడై (మత్తతతోనిదురించనివారై) ఉంటున్నారు. నాకు వేరైన దేవతలు - నాకు చెంది రహస్యము … ఇటువంటి దేవ-గుహ్య మొదలైన ఇంధనములను (కట్టెలను) ఆత్మయందు ఉపసంహరింపజేసుకొని ఉంటారు. దుఃఖ సంఘటనలకు ఉద్విగ్నిడు అవక, సుఖ సంఘటనలకు అనుమోదము (మోదఉద్వేగము-సంతోషావేశము) పొందక, రాగముచే నిస్పృహుడు కానివాడై ఉంటారు. సర్వత్రా సంభవించు శుభ - అశుభ సంఘటన - సందర్భములతో అభిస్నేహితుడు కారు. సర్వ ఇంద్రియ-ఇంద్రియ విషయములకు వేరై ఉంటారు.


పూర్వము తాను ఆశ్రమ ఆచారములను, నేర్చుకొన్న విద్య- నిర్వర్తించిన ధర్మముల సత్ప్రయోజనములను గుర్తుపెట్టుకున్నవాడై, అనుస్మరించువాడై ఇప్పుడు మాత్రము వర్ణాశ్రమ-ఆచారములను త్యజించివేసినవాడై ఉంటారు. రాత్రింబవళ్ళు ఎల్లప్పుడూ “సమత్వ దర్శనము”నందు మెళుకువ కలవాడై, ఏమరచనివాడై, ఆస్వస్నశీలుడై, అట్టి సమత్వ దర్శన సమనిత్వంగానే సంచారశీలుడై ఉంటారు.


మనో-బుద్ధి-చిత్త-అహంకారములన్నీ ఆత్మయందు లయింపజేసి, అన్ని దేహములు తనవైపోగా…, ఏకమాత్ర దేహుడై శేషిస్తున్నాడు. జల-స్థల ప్రదేశములన్నీ తన కమండలువు (సన్యాసులు జలము ఉంచుకొనుపాత్ర)గా కలిగి యున్నవారై, “దృశ్యము సత్యమే! బంధము! అడ్డు! నేను జన్మించాను! బద్ధుడను” … ఇటువంటి పిచ్చి లేనివాడై, అనున్మత్తుడై … ఉంటున్నారు.

బాల-ఉన్మత్త-పిశాచవత్ ఏకాకీ,
సంచరన్, అసంభాషణ పరః
స్వరూప ధ్యానేన నిరాలంబమ్ అవలంబ్య
స్వాత్మనిష్ఠా అనుకూలేన సర్వం విస్మృత్య
తురీయాతీతా-అవధూత వేషేణ
అద్వైత నిష్ఠాపరః ప్రణవాత్మకత్వేన
దేహత్యాగం కరోతి యః, సో అవధూతః!
స కృతకృత్యో భవతి!


ఒక బాలునివలె, ఇదంతా క్రీడా వినోదంగా చూస్తూ ఒక ఉన్మత్తునివలె ఇదంతా తనయందే దర్శిస్తూ… సంచరించువాడై ఉంటారు. లోక సంబంధమైన విషయాలేవీ సంభాషించనివాడై ఉంటారు. సర్వాత్మకము - సర్వము - పరము అగు స్వస్వరూపమును ధ్యానించుచూ ఆలంబమే లేని నిరాలంబనమును అవలంబించినవాడై ఉంటారు.

“స్వాత్మనిష్ఠ” అను మహత్తరమైన సానుకూల్యతను సంపాదించుకొని, ఇక తదితరమైనదంతా విస్మరించివేసినవాడై, లెక్కలోకి తీసుకొననివాడై ఉంటారు.

జాగ్రత్-స్వప్న-సుషుప్తుల కల్పనను ఆశ్రయించి, వాటియందు సంచరించుచు, వాటిచే పరిమితము కానిది తురీయము. ఇక మన అవధూతయో? ఆ తురీయమునకు కూడా ఆవలివాడై, తురీయాతీతుడై, తురీయ-సాక్షి అయి, తురీయ నియామకుడై ఉంటాడు. అవధూత వేషధారుడై స్వయం తురీయాతీతధారుడై ఉంటారు.

అద్వైతమే - (జీవాత్మను పరమాత్మగాను, పరమాత్మయే తానుగాను) సర్వదా, సర్వత్రా దర్శించు నిష్ఠను ఆశ్రయించినవాడై ఉంటారు. ఈవిధంగా ప్రణవాత్మ స్వరూపుడై దేహత్వమును మొదలంట్లో ఎవ్వడైతే త్యాగము చేసినవాడై ఉంటాడో… ఆతడయ్యా, అవధూత! ఆతడి గురించి ఏం చెప్పాలి? ఆతడు ఇక కృతత్యుడే! పొందవలసినది పొందినవాడే!


ఇతి తురీయాతీతోపనిషత్ |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||


ramakrishna-paramahamsa


శుక్ల యజుర్వేదాంతర్గత

6     తురీయాతీత ఉపనిషత్

అధ్యయన పుష్పము

ఒకానొకప్పుడు,… జగత్ సృష్టికర్త, పద్మగర్భుడు, సర్వజీవులకు పితామహుడు,… లోక కళ్యాణమూర్తి, సర్వజీవుల జీవనప్రదాత, ధాత అగు బ్రహ్మదేవుడు,… తన పిత్రుదేవులగు శ్రీమన్నారాయణ భగవానుని సందర్శనార్థమై విష్ణులోకమునకు వేంచేశారు. లక్ష్మీ నారాయణులకు స్తోత్ర-ఋక్ గానములను సమర్పించారు. లక్ష్మీ-నారాయణ సూక్తములతో ఆ ఆదిదంపతుల తాత్త్వికార్థమును ప్రదీపిస్తూ గానం చేశారు.

సర్వాంతర్యామి, సర్వతత్త్వ స్వరూపుడు, కేవలసాక్షి, సర్వాత్మకుడు, సర్వ రక్షకుడు, భక్తుల పాలిటి కల్పవృక్షము అగు శ్రీమన్నారాయణునితో ఆత్మతత్త్వము గురించిన అనేక విషయాలు ప్రశ్న - సమాధానాల పూర్వకంగా సంభాషించసాగారు.

పితామహుడగు బ్రహ్మదేవుడు : ఆదినారాయణా! తండ్రీ! సర్వలోక రక్షకా! సర్వకారణా! అకారణా! మీరు నాకు ఇప్పటి వరకూ అనేక అఖండాత్మ తత్త్వ విశేషాలు బోధిస్తూ ఉన్నారు కదా! అందుకుగాను ఆత్మార్పణపూర్వకంగా మీ పాదములు స్పృశిస్తున్నాను.

శ్రీమన్నారాయణుడు : బిడ్డా! బ్రహ్మదేవా! ఇంకా ఏమైనా అడగాలని అనుకుంటున్నావా? అడుగు!

బ్రహ్మదేవుడు : అవును పిత్రుదేవా! ఇక ఇప్పుడు ఈ విషయముకూడా నాపై దయతో వివరించమని నా విన్నపము.

- తురీయాతీతులగు అవధూతలు ఏ మార్గమును అనుసరించి, అట్టివారుగా అగుచున్నారు? కోఽయం మార్గః?
- వారి స్థితి ఎట్టిది? తేషాం కా స్థితిః?
- ఎటువంటి లక్షణములను పునికి పుచ్చుకున్నవారై ఉంటారు?
- జీవులకు అట్టి మార్గము అనుసరించుటకై గుర్తు చేయటమెట్లా?
- ఏ స్వరూప స్వభావాలు వారు కలిగి ఉంటున్నారు?

ఈ ఈ విషయాలు చెప్పమని అర్థిస్తున్నాను.

శ్రీమాన్ ఆదినారాయణుడు :

యో అయమ్ అవధూత మార్గస్థా లోకే దుర్లభతరో!
హే బ్రహ్మదేవా! మీరు అడుగుచున్న అవధూత మార్గమును ఆశ్రయించువారు లోకములో చాలా దుర్లభముగా ఉంటారు.

వారిని గుర్తించటము కూడా సులభము కాదయ్యా!
ఎందుకంటే, న తు బాహుళ్యా! - తదితర బ్రహ్మచర్య-గృహస్థ-సన్యాస-వాన ప్రస్థాశ్రమవాసులవలె బాహ్యమునకు సంబంధించిన లక్షణములు ఏవీ వారిపట్ల కనిపించవు.

కాబట్టి! యత్ యత్ ఏకో భవతి।  14 లోకములలో ఎక్కడో కొద్దిచోట్ల మాత్రమే తురీయాతీత - అవధూతలు తారసపడుతూ ఉంటారు. వారు అవాక్ మానస స్వరూపులు. అయినా కూడా, వారి గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు మనము చెప్పుకుందాము.

ఇది జీవులకు లక్ష్యశుద్ధిని కలుగజేసి జీవితమును సద్వినియోగపరచుకొని పరాకాష్ఠ చేరుటకు అవసరమైయున్న సమాచారము!

ఆత్మ తత్త్వమును శాస్త్రీకరించు విజ్ఞులు అవధూతల గురించి ఈవిధంగా వ్యాఖ్యానించి చెప్పుచున్నారు.

స ఏవ నిత్యపూతః| వైరాగ్యమూర్తిః జ్ఞానాకారః| వేదపురుషః - ఇతి జ్ఞానినో మన్యంతే!
వారు నిత్యనిర్మల స్వరూపులు. జన్మ-కర్మల వ్యవహారిక దోషములచే, సంసార సంబంధములచే, రాగ-ద్వేష-మద-మాత్సర్యాదులచే స్పృశింపబడక సర్వదా నిర్మలహృదయ విరాజిత వేషులై ఉంటారు. ఈ నామరూపాత్మక - కామరూపాత్మకమై భేద దృష్టికి కనిపించేదంతా రాగరహితంగా (without adding ‘I’ and ‘My’) విరాగులై సంసార దృష్టులన్నీ దాటివేసిన దృష్టితో, బాహ్మీదృష్టితో చూస్తూ ఉంటారు. మూర్తీభవించిన ఆత్మచైతన్యముగా క్రీడావినోదులై ఇదంతా దర్శిస్తూ ఉంటారు. వైరాగ్యమూర్తులై ఉంటారు.

దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త అహంకార పరిధులన్నీ దాటివేసి కేవల ఆత్మతత్త్వ జ్ఞానాకారమే తమ ఆకారముగా కలిగి, జ్ఞానాకారులై ప్రకాశిస్తూ ఉంటారు.

వేదములు అభివర్ణించే వేదపురుషుడు అయి ఉంటారు. అనగా, తెలియబడే అంతటికీ కారణులై, ఆధారులై, తెలియబడే అంతటికి ఆవల చైతన్యమూర్తులుగా ప్రకాశించు పరమ పురుషుడు తామే అయి, స్వానుభవులై, స్వయంప్రకాశులై సాక్షీభూతులగుచున్నారు. అందుచేత ఆ అవధూతయే వేదపురుషుడు.

మహాపురుషోయః, తత్ చిత్తం మయ్యేవ అవతిష్ఠతే। 
అట్టి తురీయాతీత అవధూత మహాపురుషుని చిత్తము ఎల్లప్పుడు సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూపుడునైన నాయందే సర్వదా నియమితమై ఉంటోంది. ఇక నేనో? అహం చ తస్మిన్ ఏవ అవతిష్ఠతః | నేను వారియందు స్వయముగా అవతిష్ఠితుడనై ఉంటున్నాను.

పితామహ బ్రహ్మదేవుడు : స్వామీ! ఒక యోగసాధకుడు అవధూతగా అవగలడా? ఏతీరుగా?

ఆదినారాయణుడు :  ఓ! అవును. అవగలడు! ఆ క్రమమేమిటో చెప్పుచున్నాను. వినండి!

మొట్టమొదట యోగాభ్యాసమును ఆశ్రయించి, ఒక ఏకాంత స్థానములో (లేక) గుడిశలో (లేక) కుటీర ప్రదేశములో (లేక) ఏదో ప్రదేశములో ధ్యానయోగమును కొనసాగిస్తూ, అట్టి యోగాభ్యాస బలిమిచేత, బాహ్యదృష్టులన్నీ బాహ్యమునందే త్యజించినవాడై అంతరంగ గృహస్థుడై కుటీచకుడు అగుచున్నాడు.

ఇక కుటీచకుడు మరికొంత ఉపాసనచే బహూదకత్వుడు అగుచున్నాడు. బాహ్య-అంతరముల ఏకస్వరూపమును, తత్ సంబంధమైన జ్ఞాన-విజ్ఞానములను, క్రమక్రమంగా ధ్యానోపాసనచే పెంపొందించుకొనుచున్నారు. సత్యము (సత్యమ్) భావనచే “బహూదకోఽహమ్ - సంసిద్ధుడు”గా రూపుదిద్దుకొనుచున్నాడు.

అట్టి బహూదకత్వముయొక్క అవలంబనచేత “హంస”… స్థితికి చేరుచున్నాడు. నేనే ఆ బ్రహ్మమును, ఆ బ్రహ్మము ’నేను’గా ఉన్నది అను సోఽహంస భావనను సుదృఢీకరించుకొనుచున్నాడు.

అట్టి హంసోపాసన కొనసాగుచుండగా “నేను-నీవు-అది-ఇది మొదలైనవాటితో కూడిన ఈ సర్వము సర్వదా నేనే” అను పరమహంసత్వము (That Absolute Self which is beyond all this, while making appearance as all this including individualistic ‘l’) పుణికిపుచ్చుకొనుచూ, పరమహంస అగుచున్నాడు. ఈ దృశ్య జగత్తంతా తన స్వరూపముగా అనుసంధానం చేస్తూ, ఈ కనబడే - వినబడే సర్వమును ఆత్మస్వరూపంగా ఆస్వాదిస్తున్నాడు.

“పరమహంస”గా అయినట్టి ఆయన ఇక ఆపై దండ-కమండలు-కటిసూత్ర (మొలత్రాడు), కౌపీన (గోచి-వస్త్రము) ఆచ్ఛానములను, "ఇది నేను చేయాలి! అది చేయకూడదు!” … ఇత్యాది (బ్రహ్మచారి - గృహస్థ - సన్యాస - వానప్రస్థ) ఆశ్రమ సంబంధమైన క్రియా వ్యవహారాలన్నీ కూడా జలముతో తర్పణముగా వదలివేస్తున్నారు. సన్న్యసించివేస్తున్నారు. దిక్కులన్నీ తన వస్త్రముగా భావించుచూ వస్త్రహీనుడు (దిగంబరుడు)గా అయి ఉంటున్నారు. వివర్ణమైనవి, జీర్ణమైనవి అగు వల్కలాజినములు (నారవస్త్రములు కూడా) మనస్సుచే వదలి ఉంటున్నారు. ఊర్ధ్వమ్ అమన్తవత్ ఆచరన్, లౌకిక - వైదికమపి ఉపసంహృత్యః బయటకు మంత్ర నియమనిష్ఠలను అనుసరించనివాడై, అమస్త్రవంతుడై ఉంటారు. లౌకిక-వైదిక ధర్మములకు నియమితులు, పరిమితులు కానివారై ఉంటున్నారు.

సర్వత్ర కూడా “వీరు పుణ్యవంతులు - వారు అపుణ్యవంతులు” … ఇటువంటి నిర్ణయాత్మక భావ పరిమితులన్నీ, పారిభాషికములన్నీ సర్వము ఆత్మ స్వరూపమే అయిఉండగా వీరు పాపులు-వారు పుణ్యులు అనే విభేదమెక్కడిది? అను ప్రశ్నయొక్క సమాధానమునందు లయము చేసినవారై ఉంటున్నారు. “ఇతడు జ్ఞాని - అతడు అజ్ఞాని, ఇది జ్ఞాన విధానములు అవి అజ్ఞాన విధివిధానములు” అనే భేదమును కూడా ఆతని సర్వాత్మత్వపు సందర్శనము సమక్షములో నిలువవు. శీత ఉష్ణములను సుఖ-దుఃఖములను, మాన - అవమానములను ఆయన సర్వదా జయించివేసినవారై ఉంటున్నారు. అవన్నీ స్వప్నములోని విషయాలవలె కల్పనామాత్రములై “సత్యదృష్టిచే మొదలే లేనివి” అగుచున్నాయి.

- వాసనలు = లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన అనబడే త్రివాసనాపూర్వకమైన (తనచే ఇతరులవైపుగాని, ఇతరులచే = తనవైపుగాని)…. నిందా-స్తుతులను,
- గర్వము = తనకు గల దానిని, బలమును, అధికారము మొదలైనవాటిని చూచుకొని, “నా అంతటివాడు ఎవ్వడున్నాడు?" - అనే రూపమైన ఆలోచనలు కలిగి ఉండటమును,
- మత్సరము = గర్వముతో ఇతరులకు కష్టము, బాధ కలిగించే పనులను చేయుటకు సంసిద్ధుడవటమును,
- దంభము = లేని గొప్పలు చెప్పుకొని ఆత్మస్థుతికి ఉపక్రమించటమును,
- దర్పము = ఉన్నది గొప్ప గొప్పగా చూపుకుంటూ ఇతరులను చులకన చేయటమును,
- రాగద్వేషములు = ఇష్ట - అయిష్టములు, ఇచ్ఛా-ద్వేషములు, తన తదితర భేదభావాలను,

- అరిషట్ వర్గము….,
1.) కామము : ఇంకా ఏదో పొందాలి! కావాలి! సంపాదించుకోవాలి! లేనివి ఏవో సిద్ధించాలి! అనే కోరిక.
2.) క్రోధము : ఇతరులపై తీవ్రమైన, సుదీర్ఘమైన - ధర్మమును అనుకూలము కానట్టి, (ధర్మమునకు వ్యతిరిక్తమైనట్టి)
కోపము, పగ, ద్వేషము, ఆక్రోశము మొదలైన లక్షణాలు.
3.) లోభము : దోచుకొని, దాచుకొని, ఇతరులతో పంచుకొనవలసినవి పంచుకోక, తాను పొందవలసినవి పొందుచూ
ఇవ్వలసినవి ఇవ్వకపోవటం - (దేవ-ఋషి-పితృ-మానవ ఋణములపట్ల తిరస్కారము)
4.) మోహము : Illusion. సత్యమును ఏమరచిన ఊహ-అపోహలను నమ్మి ఆవేశపూరితుడవటము.
5.) మదము : గర్వముతో తదితరులను బాధించటము.
6.) మాత్సర్యము : తీవ్రమైన, క్రూరమైన పనులకు సంసిద్ధుడవటము.

- హర్ష (సంతోషము), ఆమర్ష (నిరుత్సాహము), అసూయలు,
- తన రక్షణతాను చూచుకొని, తన హాయి కోసం ధర్మమును విడచి ఆత్మ రక్షణయే జీవితాశయంగా కలిగి ఉండటము,

ఇవన్నీ ఆత్మ జ్ఞానాగ్నియందు భస్మముచేసుకొని ఉంటున్నాడు. దగ్ధం చేసివేసి చరిస్తున్నాడు.

ఓ బ్రహ్మదేవా! ఇంకా కూడా అవధూత మార్గము ఎట్టిదో, మరికొన్ని విశేషాలు వినండి.

స్వవపుః కుణపా ఆకారమివ పశ్యన్ … తన భౌతిక దేహమును ఒక జడమైన వస్తువుగాను, [బంధువులు మరణించిన వాని దేహము (శవము)ను చూచువిధంగా] శవాకారముగానూ చూస్తూ, చిరునవ్వు నవ్వుకుంటూ ఉంటాడు.

ఒకరు చెప్పారనో, ఒక నియమము పెట్టుకోవటము వంటిదో కాకుండా, సహజముగాను, అప్రయత్నపూర్వకముగాను లాభ అలాభ సందర్భ - సంఘటనలప్పుడు సమత్వము ఏమాత్రము వీడనివాడై ఉంటాడు.

తనకు సుఖము కలిగించేవారిపట్ల, కష్టము కలిగించేవారిపట్ల కూడా, “వారంతా, నాతో సహా సర్వదా అఖండాత్మ స్వరూపమేకదా!” అను ఆత్మదృష్టిని, అతీతదృష్టిని వీడనివాడై ఉంటాడు.

గోవృత్యా ప్రాణసర్థారనార్థమ్ కుర్వన్ యత్ ప్రాప్తం, తేనైవ నిర్లోలుపః |
ఆవు ఏది దొరికితే అదే తిని (తుచ్చమైన గడ్డి తిని) మానవులకు పవిత్రమైన ఆవు పాలు యిస్తోంది కదా! ఈ అవధూత కూడా తన ప్రాణములు నిలుపుకోవటానికి ఏది ఆహారముగా లభిస్తే అది తిని జీవిస్తూ లోక క్షేమము-శ్రేయస్సులను ఉద్దేశ్యించి ఉంటాడు. “నాకు తినటానికి అదే కావాలి, ఇది ఎందుకు తినాలి?” అనే అసంతృప్తికి చోటివ్వడు. “వాళ్ళకి ఉన్నదికదా! నాకు పెట్టరేమి?” అనే మీమాంసయే ఆతనికి ఉండదు.

“అయ్యా! నన్ను చూడండి! నేను ఎంతటి పండితుడినో” అని చెప్పుకోపూనడు. ప్రాపంచకమైన సర్వవిద్యా - పాండిత్యములను (సర్వవిద్యా పాణ్ణిత్య ప్రపంచమ్ భస్మీకృత్య) - భస్మీభూతము చేసుకొని ఉంటాడు. “నాకు అది తెలుసు. ఇది తెలుసు. ఇది ఇతరులకు తెలియటము ఎట్లారా బాబూ!” అనే భావన-ఆవేశము ఆతనికి ఉండదు.

తన స్వరూపము ఎట్టిదో ఎరిగి కేవలాత్మ స్వరూపుడై ఆస్వాదిస్తూ ఉంటాడు. “నేను ఆత్మజ్ఞానిని కావాలి. అది ముఖ్యము. అంతేగాని, నన్ను ఇతరులు “జ్ఞాని” అని అనుకోవటము నాకేమి అవసరము? దానివలన ఒరిగేదేమున్నది? ఆత్మ స్వరూపుడనై ఇదంతా మమాత్మానంద స్వరూపముగా ఆస్వాదించటమేనా అభ్యాసము, ఆశయము కూడా! అంతేగాని, నేను ఆత్మానంద తురీయాతీతుడను, అనేకులు పొందనిది నేను పొందాను అని లోకులు అనుకోవాలి … అనునది కించిత్తుకూడా ఆశయము కాదు” అను అవగాహనతో ఉంటాడు.

ఆతడు ఇతరుల గుర్తింపు కోరడు కాబట్టి, - స్వరూపం గోపయిత్వా - తన ఆత్మావగాహన తనయందే రహస్యముగా భద్రపరచుకుంటూ ఉంటాడు. “నేను ఇంతటివాడిని. ఆత్మానుభవుడను” … అని పదిమందిని పిలచి చెప్పడు. అసలు తెలియనివ్వడు! కానీ “నీవు ఆత్మవేనయ్యా!” అని ఎలుగెత్తి ఇతరులకు గుర్తుచేయు ఉత్సాహము కలిగియే ఉంటాడు.

జ్యేష్ఠ - అజ్యేష్ఠ అపలాపకః | అతని దృష్టిలో జ్యేష్ఠులు - అజ్యేష్ఠులు (గొప్పవారు - కానివారు) … అనునది ఉండదు. ఒకవేళ నోరు విప్పితే, “ఓ శ్రోతా! నీవు ఆత్మస్వరూపుడవేనయ్యా! అఖండాత్మయే నీ స్వభావము” …. అని గుర్తు చేస్తాడేగాని, “వారు గొప్పవారు. వీరు కాదు” ఈ రీతిగా సంభాషించరు.

సర్వదా, సర్వోత్కృష్టమగు సర్వాత్మకమైన అద్వైత స్థితినే పలుకుతారు - సర్వోత్కృష్టత్వ సర్వాత్మకత్వా అద్వైతం కల్పయిత్వా! ఆయన అద్వైతమగు “సమం సర్వేషు భూతేషు తిష్ఠంతమ్ పరమేశ్వరమ్”నే దర్శిస్తూ ఉంటారు.

“నేను వీరందరి ఆత్మస్వరూపుడను! అందుచేత అందరికీ చెందినవాడనే! వీరంతా నా ఆత్మస్వరూపులే! కాబట్టి అందరూ నాకు చెందినవారే”… అనే అద్వైత కల్పనను వదలి కొద్ది క్షణాలు కూడా ఏమర్చి ఉండడు. ద్వైతము అనే మత్తు పానీయమును దరిజేరనీయడు. ఏమాత్రము మత్తుడై ఉండడు.

అమత్తో, వ్యతిరిక్తః కశ్చిత న అన్యో అస్తీతి। 

అంతా అఖండాత్మయే అయి ఉండగా, అద్దానికి వేరుగా జీవుడనై నేనెక్కడ ఉంటాను? ఉండను! అఖండాత్మయే నేనై ఉన్నాను! సర్వాత్మకుడనగు నాకు వేరుగా, వ్యతిరేకులై ఎవ్వరు ఉంటారు! ఉండరు! లేరు! అంతా నేనే అయి ఉండగా, నాకు ఒకరు వ్యతిరేకులవడమేమిటి? … అను స్థితి - అనుభూతులను సుస్థిరీకరించుకున్నవాడై ఉంటారు. ఒక బంగారు ఆభరణములోని బంగారము, మరొక బంగారు ఆభరణములోని బంగారమును చూచి నీవు "పేదవాడికి చెందినదానివి. నేను ధనికునికి చెందినవాడను” అని సభేదము చేస్తుందా? చేయదు.

ఈ జీవుని రెండు - విషయాలు భ్రమింపజేస్తూ ఉన్నాయి.
1. నేను వేరు. దైవము వేరు. తదితర జీవులు వేరు.
2. నేను ఇతరులకు వేరైన వాడను. నాకు సంబంధించినది ఏదైతే ఉన్నదో, అది కొంత ఇతరులకు తెలియరాని రహస్యము.

ఇటువంటి అన్య దేవ-మమ గుహ్య - మొదలైనవి అజ్ఞానమునకు, అనాత్మబద్ధానుభవమునకు ఇంధనముగా అయి, మాయను హృదయములో కొనసాగునట్లుగా చేస్తున్నాయి. తురీయాతీతుడగు అవధూత “అన్యదేవత-మమగుహ్యము” మొదలైన పేర్లు గల ఇంధనమును తొలగించుకొంటున్నాడు. ఉపసంహరించుకొని ఉంటున్నాడు. “ఆ పరమాత్మ (లేక, దేవత) నా ఆత్మ స్వరూపమే” … అనే ఆత్మజ్ఞాన జ్యోతిని హృదయమందిరములో అఖండ జ్యోతిగా వెలిగింపజేసుకొని ఉంటున్నాడు. ఇంద్రియానుభవములన్నీ ఆత్మజ్యోతియందు పడవేసి భస్మభూషితాంగుడు అగుచున్నాడు. “నేను ఎవ్వరికీ వేరైన వాడను కాను. ఎవ్వరూ నాకు వేరైనవారు కారు” - అను అఖండాత్మత్వముచే నిత్యాభిషిక్తులై ఉంటున్నారు.

⌘ ⌘ ⌘

ఓ సృష్టికర్తా! చతుర్ముఖా! ఇంకాకూడా అవధూతల మార్గము గురించి వినండి.

దుఃఖేన నో ఉద్విగ్నః సుఖేన న అనుమోదకో | రాగే నిస్పృహా|
దుఃఖ సంబంధమైన సంగతి - సంఘటన - సందర్భములందు ఉద్వేగము పొందడు. ఉద్విగ్నుడు అవడు. సుఖ సందర్భములకు “ఆహాఁ! మంచిది! ఇట్లాగే ఉండాలి!” ఇటు అనుమోదము (Acceptance, saying O.K.) కలిగి ఉండడు. రాగము లేనివాడై సర్వప్రాపంచక విషయములపట్ల నిస్పృహుడై (As ignoring) ఉంటాడు.

ఇక ఇంద్రియములు - ఇంద్రియ విషయములగు శబ్ద స్పర్శ రూప రస గంధములకు వస్తే… సర్వేంద్రియో పరమశ్చ। అవధూత వాటన్నిటికీ సర్వదా పరమై, వేరై ఉంటాడు. “ఈ దేహములు, ఈ లోకములు నాకు స్వయం కల్పిత ఉపకరణ లీలా విశేషములు” అను భావనను పుణికి పుచ్చుకొని ఉంటారు.

బ్రహ్మదేవుడు : పిత్రుదేవా! ఆదినారాయణా! మీరు చెప్పుతూ వస్తున్న మార్గములో అడుగులు వేయు జీవుడు తప్పక పరమహంస-అవధూత కాగలడు - అని సుస్పష్టమగుచున్నది. అయితే ఈ సాధకుడు పూర్వాశ్రమములలో సాధన నిర్వర్తించియుండి క్రమంగా అవధూతత్వమును సంతరించుకొనగలడు కదా! అట్టి సందర్భములో ఆతని పూర్వ - తత్పూర్వ ఆశ్రమ ధర్మనిరతి, తత్ సంబంధమైన నియమ-నిష్ఠలతోకూడిన సాధనలు (అవధూతత్త్వమును సమీపిస్తున్నప్పుడు కూడా)… కొనసాగుతాయా? విరమించబడతాయా?

శ్రీమాన్ ఆదినారాయణుడు : బిడ్డా! “నేను ఈ ఈ ఆశ్రమ ధర్మాలు నిర్వర్తించి, అందుకు ప్రయోజనముగా అవధూతత్వము సంతరించుకొనుచున్నాను కదా!” అని అతడు గమనికలో కలిగియే ఉంటాడు. మేడపైకి వెళ్ళినవాడు “నేను మెట్లుపై నడచి … మెట్టుల సహాయంతో మేడ ఎక్కగలిగాను కదా!” అనునది ఏమరుస్తాడా? లేదు. పూర్వ బ్రహ్మచారి గృహస్థ-సన్యాస వానప్రస్త ఆశ్రమములలోని ఆశ్రమ ఆచారములను, విద్యా-ధర్మ ప్రభావములను అనుస్మరిస్తూ జ్ఞప్తిలో చెరిపివేసుకోడు. పూర్వ ఆపన్నా ఆశ్రమ ఆచార విద్యా ధర్మ ప్రభావమ్ అనుస్మరన్, …. వాటిని అనుస్మరిస్తూనే (జ్ఞాపకములో కలిగి ఉంటూనే), ఆ యొక్క వర్ణాశ్రమ ఆచారములన్నీ వదలివేస్తాడు. త్యక్తా వర్ణాశ్రమ ఆచారః| వాటినన్నిటి త్యజించి వేస్తాడు. మెట్ల వలన మేడపైకి వచ్చాను కదా … అని ఒకడు మేడపైకి సాగకుండా మెట్లపై చతికిలపడి కూర్చుని ఉండిపోడు కదా! ఆతీరుగా పూర్వ వర్ణాశ్రమ ధర్మాలు బుద్ధితో వదలియే ఉంటాడు.

సర్వదా దివా-నక్తమ్ సమత్వమేవ అస్వప్నః సదా సంచారశీలో॥
పూర్వాశ్రమ ధర్మాలు ఇప్పుడిక అనివార్యమనే స్థితిని దాటుతాడు. రాత్రింబవళ్ళు సర్వదా సమత్వమునందు అనుక్షణికుడై ఉంటాడు. జాగ్రత్ - స్వప్న కల్పనలను అధిగమించివేసినవాడై అస్వప్నశీలుడై, ఒకచోట ప్రదేశమునకు బద్ధుడు పరిమితుడు కాక, సదా జగత్ సంచారశీలుడై, జగత్ అతీతుడై ఉంటాడు.

దేహము ఈ భౌతికమాత్ర జగత్తులో కలిగి ఉండియే, - తాను జగత్తుకు ఆవల ఏకాత్ముడై ప్రకాశిస్తూ ఉంటాడు. జల-స్థలములను చేతిలో కమండలువు వలె (సన్యాసి చేతిలో ధరించే జలపాత్రవలె) ఒక చేతితో పట్టుకొని, తానుమాత్రము జన్మ-కర్మల కంటే ముందే ఉన్న ఆత్మస్వరూపుడై, పురాణపురుషుడై, “దృశ్యము” అనే పిచ్చి (ఉన్మత్తత) లేనివాడై సంచరిస్తూ ఉంటాడు. సాంసారిక ఆశయములు, దృష్టులు గల జీవులకు మాత్రము ఆతడు ఒక చిన్న పిల్లవాడువలె, పిచ్చివాడువలె ఉంటాడు. పిచ్చివానివలె ఏకాకిగా (Alone) సంచరిస్తూ, ఎవ్వరితోనూ ప్రాపంచక విషయాలు సంభాషించటానికి ఏమాత్రము సిద్ధపడక ఉంటాడు.

బాల ఉన్మత్త పిశాచవత్ ఏకాకీ సంచరన్, న సంభాషణ పరః | లౌకిక విషయాలైన సిరి-సంపద-ఆపద-బాంధవ్యాలు ఊసులు చెప్పుకొనేచోట ఆతడు నిలువనైనా నిలువడు.

ఎల్లప్పుడు ప్రతి జీవుని నిత్య-సత్య-సహజ స్వరూపమగు పర-ఆత్మ స్వస్వరూపమునందే మననము - ధ్యాస - సందర్శనము కలిగి ఉంటాడు. స్వరూపధ్యానేన నిరాలంబమ్ అవలంబ్య - అట్టి స్వస్వరూపము యొక్క అనునిత్యం ధ్యానముచే (Intensive and Uninterrupted Sense) నిరాలంబమును (Non-dependence and Non-Attachedness to any thing) అవలంబించినవాడై ఉంటాడు.

సాత్మానిష్ఠా అనుకూలేన సర్వం విస్మృత్య - అన్ని దృశ్య సంబంధమైన, ఇంద్రియ సంబంధమైన నిష్ఠలను మొదలంట్లా త్యజించినవాడై కేవలము స్వాం త్మానిష్ఠ యందు మాత్రమే నిశ్చలుడై, సుస్థిరుడై, ప్రతిష్టాపితుడై ఉంటున్నాడు.

ఈ విధంగా తురీయాతీతుడైన అవధూత దేహపరిధులను దాటివేసి, అవధూత శరీరమాత్రుడై, అవధూతత్వమును వస్త్రముగా కలిగియున్న వేషుడై, అద్వైత నిష్ఠాపరుడు అయి ఉంటున్నాడు. ఓం! ప్రణవాత్మకుడు! స్వయముగా ఆత్మస్వరూపుడై పొగలేని అగ్ని తేజస్సువలె సర్వత్రా వెలుగొందుచున్నాడు.

ఎవ్వరైతే ఈ విధంగా దేహత్వము, లోకత్వము, భావత్వము…. ఇవన్నీ దాటిపోయి ఉంటారో అట్టివాడే అవధూత! తురీయాతీతుడు!

ప్రతి జీవునికి తురీయాతీతత్వమును ప్రయత్నించి పొందే జన్మహక్కు, అవకాశములు ఉన్నాయయ్యా!

అవధూతత్వము పుణికి పుచ్చుకొన్నవాడు కృతకృత్యుడు - జన్మించినందుకు పొందవలసినది పొందినవాడు - అగుచున్నాడు.

అట్టి పూర్ణానంద కేవలాత్మ స్వరూపుడు తారసపడినప్పుడు నేను నమస్కరిస్తూ ఉంటాను!

🙏 ఇతి తురీయాతీత ఉపనిషత్ | 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః ||