[[@YHRK]] [[@Spiritual]]

Akshi Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


కృష్ణయజుర్వేదాంతర్గత

4     అక్ష్యుపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। యః సప్త భూమికా విద్యా వేద్యానంద కళేబరమ్
వికళేబరకైవల్యం రామచంద్రపదం భజే ।।

సదేహ - సప్తభూమికా విద్యా విజ్ఞాన-ఆనంద స్వరూపుడు, విదేహ - కైవల్య స్వరూపుడు అగు శ్రీరామచంద్రమూర్తి పాదపద్మములకు శరణు.

ఓం సాకృతి మహర్షియే నమః
ఓం ఆదిత్య సద్గురవే నమః

ఓం
1. అథ హ సాంకృతి భగవాన్
ఆదిత్య లోకం జగామ।
తమ్ ఆదిత్యమ్ నత్వా,
‘చాక్షుష్మతీ’ విద్యయా తమ్ అస్తువత్।
ఓం!
ఒకానొక సందర్భమున మహర్షి సాంకృతి తత్త్వజ్ఞానార్థి అయి భగవానుడగు సూర్యుడు పాలిస్తున్న ఆదిత్యలోకములో ప్రవేశించారు. సర్వ జీవన ప్రదాత, త్రిమూర్తి స్వరూపుడు అగు ఆదిత్యదేవాది దేవుని దర్శించారు. చాక్షుష్మతీ విద్య (స్తోత్రము)తో, ‘‘అస్తు’’ ప్రవచనాలతో ఆదిత్య భగవానుని స్తుతించారు.
చాక్షుష్మతీ స్తుతి
ఓం నమో భగవతే….,
శ్రీ సూర్యాయ-అక్షితేజసే నమః।
ఓం ఖేచరాయ నమః।
ఓం మహాసేనాయ నమః, ఓం తమసే నమః
ఓం రజసే నమః। ఓం సత్త్వాయ నమః।
హే శ్రీ సూర్యభగవాన్! అక్షి (దృక్) తేజోస్వరూపుడనై సర్వము వెలుగించు పరమాత్మా! మీకు వినమ్రుడనై నమస్కరిస్తున్నాను.
ఓ ఆకాశ సంచారీ!
జగత్తులన్నిటికీ సేనానాయకా!
హే తమో-రజో-సత్వ- త్రిగుణాత్మ ధారిణే!
విరించి - నారాయణ- శంకరాత్మనే! నమో నమో నమో నమః।।
ఓం అసతో మా సతోగమయ (సద్ గమయ)।
తమ సో మా జ్యోతిః గమయ।
మృత్యోః మా అమృతం గమయ।
హే సద్గురూ! జగత్ గురూ! స్వామీ! నన్ను కల్పనామాత్రము - అసహజము అగు అసత్తు నుండి ‘సహజము’ అగు సత్తునకు జేర్చవలసినదని ప్రార్థిస్తున్నాను. లేని దానినుండి స్వతఃగానే ఉన్నట్టి స్థానమునకు తీసుకువెళ్ళండి.
నాకు తోడుగా ఉండి, ‘అజ్ఞాన’ రూపమగు ‘తమస్సు’.. అనే నిబిడాంధకారము నుండి నన్ను ‘సుజ్ఞానము’ అనే జ్యోతిస్థానమునకు గొనిపొండి!
మార్పు-చేర్పుల పరిధి అగు మృత్యువు నుండి అమృత స్థానమునకు తీసుకొని పొండి!
ఉష్ణో భగవాన్ శుచి రూపః।
హంసో భగవాన్ శుచి రూపః।
ప్రతి రూపః।
ఉష్ణ రూపముచే సర్వదేహులకు దేహశుచిని ప్రసాదించు పరమాత్మా! జీవితేశ్వరా! హంసరూపులై మనోబుద్ధి చిత్త అహంకారాల దోషముల నుండి నిర్మలత్వమును ప్రసాదించు స్వామీ!
విశ్వరూపం। ఘృణినమ్।
జాతవేదసగ్ం। హిరణ్మయమ్।
జ్యోతిరూపం తపంతమ్।
బింబస్వరూపులై ఈ జీవులకు, జగత్తులను మీ ప్రతిబింబము వలె కలిగి ఉంటున్న మహాత్మా! ఈ విశ్వమంతా స్వరూపముగా కలిగియున్నట్టి విశ్వరూపా! జగత్తులను కిరణములతో వెలుగించు ఘృణీశ్వరా! కిరణములు - వెలుగు -జ్వాలతో జగత్తులో మూలమూలలా నింపుచున్న స్వామీ! అగ్ని స్వరూపా! సృష్టికి కారకుడవగు హిరణ్మయా! సర్వమును తపింపజేయు మహామహనీయా!
సహస్ర రశ్మిః। శతథా వర్తమానః పురుషః।
ప్రజానామ్ ఉదయతి, ఏష సూర్యః।
ఓం నమో భగవతే
శ్రీ సూర్యాయ ఆదిత్యాయ। అక్షి తేజసే।
అహో వాహినీ। వాహినీ వా। స్వాహేతి ।।
సహస్ర కిరణ సమేత జ్యోతి స్వరూపా! వందల విశేషములతో కూడిన మహాపురుషా! పురుషోత్తమా! సర్వజీవుల యొక్క ఉత్పత్తికి స్థాన భూతమైన వాడా! సూర్యభగవానుడా! సూర్యదేవా! ఆదిత్య దేవా! దృక్-దష్ట-దర్శనములతో కూడినట్టి అక్షితేజో రూపా!
ధృతి-ఉత్సాహ-ఆనందములను జీవులందరికి ప్రసాదించు స్వామీ! సప్తాశ్వ రథమారూఢా! మీకు స్తుతి పూర్వక నమస్కారము.
2. ఏవం చాక్షుస్మతీ విద్యయా
స్తుత శ్రీ సూర్యనారాయణః సుప్రీతో అబ్రవీత్।
ఈ విధంగా ‘చాక్షుష్మతీ’ మహా విద్యచే సాంకృతి మహర్షి స్తుతించగా ఆదిత్య భగవానుడు సుప్రీతులైనారు. సుప్రసన్నులైనారు.
చాక్షుస్మతీం విద్యాం
బ్రాహ్మణో యో నిత్యం అధీతే,
న తస్య అక్షిరోగో భవతి।
న తస్య కులే అంధో భవతి।
అష్టౌ బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా
అథ ‘విద్యా సిద్ధిః’ భవతి।
య ఏవం వేద, స మహాన్ భవతి।।
బ్రహ్మమును ఆశ్రయించుచూ, ఉపాసించునట్టి ఎవ్వరైతే ఈ చాక్షుస్మతీ విద్యాస్తోత్రమును పఠిస్తూ ఉంటారో, అట్టి వారికి దృష్టి దోషము, కంటి రోగము ఉండదు.
- అట్టి వాని కులములో గ్రుడ్డివారు పుట్టరు.
- ఈ మంత్రమును వ్రతముగా నిర్వర్తించి ‘8’ మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టి గౌరవించితే ‘విద్యాసిద్ధి’ కలుగగలదు. ఎవ్వరు ఇందలి తత్త్వార్థాన్ని తెలుసుకొంటారో, అట్టివారు మహానుభావులు, మహాన్ స్వరూపులు కాగలరు
3. అథ హ సాంకృతిః ఆదిత్యం పప్రచ్ఛ:
భగవన్। బ్రహ్మవిద్యాం మే బ్రూహి।… ఇతి!
ఆ విధంగా స్తోత్రం సమర్పించిన తరువాత సాంకృతి మహర్షి ఆదిత్య భగవానునితో ఇట్లు పలికారు.
‘‘భగవాన్! నాకు బ్రహ్మవిద్యను బోధించమని అర్థిస్తున్నాను.’’
తమ్ ఆదిత్యో హో వాచ
సాంకృతే! శృణు, వక్ష్యామి।
తత్త్వజ్ఞానగ్ం సుదుర్లభం,
యేన విజ్ఞానమాత్రేణ ‘జీవన్ముక్తో’ భవిష్యసి।
ఆదిత్య భగవానుడు ఇట్లు సంభాషించసాగారు:
ఓ సాంకృత మహర్షీ! తప్పక చెప్పుతాను. అయితే ఎద్దానిని ఎరిగినంత మాత్రము చేతనే ఈ జీవుడు ‘జీవన్ముక్తుడు’ అగుచున్నాడో అట్టి తత్త్వజ్ఞానము బోధించటము, బోధించబడటమూ సుదుర్లభమే। తేలికైనది కాదు. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్పుచున్నాను. వినండి.
సర్వమ్, ఏకమ్, అజగ్ం శాంతమ్,
అనన్తమ్, ధృవమ్, అవ్యయమ్ .. పశ్యన్ భూతార్థచిత్-
రూపగ్ం → శాంత ఆస్య యథా సుఖమ్।
అవేదనం విదుః ‘యోగమ్’,
చిత్తక్షయమ్, అకృత్రిమమ్।।
ఏదైతే సర్వము అయి ఉన్నదో, సర్వదా ఏకమేనో, జన్మ-కర్మ ఇత్యాదులు లేనట్టిదో, పరమ శాంతస్వరూపమో, ఆద్యంతరహితమో (లేక) అనన్తమో, ఎల్లప్పుడూ ఏర్పడియే ఉన్నదగుటచేత ధృవమో, మార్పు-చేర్పులు లేనందువల్ల అవ్యయమో,.. అట్టి ఆత్మను గురించి ఎరిగి శాంతుడవై, యథాసుఖముగా ఉండండి. ఇదియే మహదాశయము అగును గాక.
(1) ఆత్మ గురించి ఎరుగుటయు (2) అశ్రమపూర్వకంగా, అకృత్రిమంగా- స్వాభావికంగా ఆత్మతో అనునిత్యమైనట్టి అనన్యత్వము- ‘యోగము’ అని ఎరిగెదరు గాక!
4. యోగస్థః కురుకర్మాణి। నీరసో వా అథ మా కురు।
విరాగమ్ ఉపయాతి
అంతర్వాసనాసు అనువాసరమ్,
క్రియాసు ఉదార రూపాసు
క్రమతే మోదతే -న్వహమ్।
గ్రామ్యాసు జడచేష్టాసు, సతతం విచికిత్సతే।।
ఓ సాంకృతి మునివరేణ్యా! ఈ జీవుడు తనకు నియమితమైన కర్మలను ‘యోగస్థుడు’ అయి నిర్వర్తించాలిసుమా! అంతేగాని రాగముతో కాదు. ‘‘ఎందుకొచ్చిందిరా బాబూ’’.. అని నీరసపడుతూ కాదు. యోగస్థుడవై కర్మలు చేస్తే, క్రమంగా కర్మఫలముల పట్ల విరాగము ఏర్పడుచున్నది. అట్టివాని క్రియలు ఉదారత్వము, ఇష్టము సంతరించుకుంటాయి. అప్పుడు, ఆత్మానందమునకు చోటు లభించగలదు. ముముక్షువు-అజ్ఞాన భావములతో కూడిన, జడమైన(మూర్ఖమైన) కర్మలను విడనాడి ఉండును గాక! (సంశయించునుగాక! కర్మలను విచక్షించుకొనును గాక!)
నోదాహరతి(న ఉదాహరతి) మర్మాణి, పుణ్యకర్మాణి సేవతే।
అనన్య-ఉద్వేగ కారీణి, మృదుకర్మాణి సేవతే।
ఉద్వేగము కలిగించని పుణ్యకర్మలను సర్వదా సేవించుచుండునుగాక!
శాస్త్రములకు ప్రతికూలము కానట్టివి. మృదువైనవి, తదితరులకు సంతోషమును కలుగజేయునవి అగు కర్మలనే సేవించుచుండును గాక!
పాపాత్ బిభేతి సతతం, న చ భోగం అపేక్షతే।
స్నేహ ప్రణయ గర్భాణి, పేశలాని ఉచితాని చ,
దేశ-కాల ఉపపన్నాని వచనాని అభిభాషతే
మనసా కర్మణా వాచా
సజ్జనాన్ ఉపసేవతే।।
బ్రహ్మ విద్యను అభిలషించి అభ్యసించువాడు పాపపు కర్మల పట్ల ‘‘అమ్మో! అనుచితము కదా!’’ అని భయమును స్వాభావికంగానే కలిగి ఉండునుగాక! ఇంద్రియ భోగముల పట్ల అపేక్ష లేకుండునుగాక! ఉపేక్ష కలిగి ఉండును గాక! స్నేహపూరితమైన మృదుత్వ భావములు కలిగి ఉండాలి. ఉచితానుచితములు ఎరిగి వర్తిస్తూ ఉండాలి.
మనసా వాచా కర్మణా (మనోవాక్ కాయములచే) సజ్జనులపట్ల, మహనీయులపట్ల ఆత్మజ్ఞుల పట్ల ‘సేవాభావము’ - కలిగి ఉండాలి.
యతః కుతః చిదానీయ
నిత్యగ్ం శాస్త్రాణి అపేక్షతే।।
తదా-సౌ ప్రథమామ్ ఏకాం
ప్రాప్తో భవతి భూమికామ్,
ఏవం విచారవాన్ యస్యాత్
సంసార - ఉత్తారణం ప్రతి।।
ఎక్కడో అక్కడి నుండి ఉత్తమ శాస్త్రములను తీసుకువచ్చి ఆ ఆత్మజ్ఞాన ప్రవచిత శాస్త్రములను నిత్యము ప్రియముగా పరిశీలించాలి.
ఇట్టి కార్యక్రమములచే ఈ జీవుడు ప్రథమ భూమికను ఆశ్రయించిన వాడు అగుచున్నాడు. సంసారము నుండి తరించుటకై ‘విచారణ’ చేయుటకు అది మార్గమై ‘శుభేచ్ఛ’ అను ప్రధమ భూమిక యందు ప్రవేశము లభిస్తోంది.
స ‘‘భూమికావాన్’’ ఇత్యుక్తః।
శేషస్తు ‘‘ఆర్యః’’ ఇతి స్మృతః।।
అట్టి వానిని ‘‘భూమికావంతుడు’’ అని కూడా పిలుస్తున్నారు. ఇక తరువాతి తరువాతి భూమికలలో ప్రవేశిస్తున్న వానిని ‘ఆర్యుడు’ అని అంటూ ఉంటారు.
5. ‘‘విచార’’ నామ్నీమ్ ఇతరామ్
ఆగతో, యోగభూమికామ్,
శ్రుతి-స్మృతి-సదాచార-
ధారణా-ధ్యాన కర్మణః
ముఖ్యయా వ్యాఖ్యయా
ఖ్యాతాన్ శ్రయతి శ్రేష్ఠ పండితాన్।।
‘శుభేచ్ఛ’-ను కొనసాగిస్తూ ఈ ముముక్షువు ‘విచారణ’ అను రెండవ భూమిలో ప్రవేశించుచున్నాడు. శ్రుతులను (వేదాంత శాస్త్రమును), స్మృతులను (ధర్మశాస్త్రములను, పురాణములను), పరిశీలించ ప్రారంభిస్తున్నాడు. సదాచారమును ఎరిగి వర్తించుచున్నాడు. స్తోత్ర పఠణము, ధారణ, ధ్యానము.. మొదలైన కర్మలయందు ఉత్సాహము పొందుచున్నాడు. వ్యాఖ్యాతల ప్రాముఖ్యమగు వ్యాఖ్యానములు వినుట యందు అభిరుచి పొందుచున్నాడు. అందుకొరకై శ్రేష్ఠులగు పండితులను ఆశ్రయించుచున్నాడు.
పదార్థ ప్రవిభాగజ్ఞః,
కార్య-అకార్య వినిర్ణయమ్
జానాతి అధిగతశ్చ
అన్యో గృహం గృహపతిః యథా।।
మద-అభిమాన-మాత్సర్య-
లోభ-మోహాతిశాయితామ్ బహిరపి
ఆస్థితామ్, ఈషత్ త్యజతి
అహిరివత్ త్వచమ్ (త్వక్‌చమ్)।।
క్రమంగా → పాంచభౌతిక దృశ్యము, దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జీవాత్మ, ఈశ్వరుడు, పరమాత్మ.. → ఇటువంటి పదార్థ విభాగములను తెలుసుకొనటమునందు ఆసక్తుడు అగుచున్నాడు. ఇంటి యజమాని ఇంటిలోని విషయములను శాసించి నియమించునట్లుగా ఆతడు చేయవలసినవి, చేయకూడనివి. ఆలోచించి మరీ నిర్ణయించు కుంటున్నాడు. విన్నవి, వినవలసినవి విచక్షించి, అటుపై నిర్ణయపూర్వకంగా ఆశ్రయిస్తున్నాడు.
ఒక పాము ఏ విధంగా కుబుసమును విడచి, ఆచోటునుండి అద్దాని ధ్యాస లేనిదై వెళ్లిపోతుందో,.. ఆ విధంగానే ఆత్మజ్ఞానాభిలాషి మదము (గర్వము), (నేను ఇంతటి వాడిననే) అభిమానము, మోహముతో కూడిన బుద్ధి - మొదలైన వాటిని పాము కుబుసము వలె విడచి వేయాలి.
ఇత్థం భూతమతిః శాస్త్ర-గురు-సజ్జన సేవయా,
స రహస్యమ్ అశేషేణ యథావత్ అధిగచ్ఛతి
‘‘అసంసర్గ’’ అభిధామ్ అన్యాం
తృతీయాం యోగభూమికామ్
తతః పతతి అసౌ కాంతః
పుష్పశయ్యామ్ ఇవ అమలామ్।
శాస్త్ర-గురు బోధలపై బుద్ధిని నిలపాలి. వ్యక్తిగతమైనదంతా (రహస్యమును) అశేషంగా దాటివేసిన వాడై ఉండాలి. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొనే - తెలియజెప్పే రీతిగా ఉండాలి.
అటువంటి ప్రయత్నములచే ఆ ముముక్షువు (సాధకుడు) క్రమంగా ‘‘అసంసర్గము’’ అని పిలువబడే ‘3’వ యోగ భూమిలో ప్రవేశించుచున్నారు. ఒక కాంతివంతుడు పుష్పశయ్యపై (పూలపాన్పుపై) ఆశీనుడై ఉండు విధంగా ఈ అసంసర్గ (3వ) యోగ భూమికలో ఆసీనుడు అగుచున్నారు.
యథావత్ శాస్త్ర వాక్యార్థ -
మతిమ్ ఆధాయ నిశ్చలామ్,
తాపసా శ్రమవిశ్రాంతైః అథ్యాత్మ కథన క్రమైః
శిలా శయ్యాసన - ఆసీనో
జరయతి ఆయుః ఆతతమ్।

వనావని విహారేణ చిత్త-ఉపశమ శోభినా,
అసంగ సుఖ సౌఖ్యేన, కాలం నయతి నీతిమాన్।
‘‘సోఽహమ్-తత్త్వమ్ - జీవో బ్రహ్మేతి నాపరః’’ మొదలైన మహావాక్యార్థములను, ‘‘దృశ్య - ద్రష్ట - దృక్ - దేహ - మనోబుద్ధి చిత్త- అహంకారము’’ మొదలైన శబ్దముల తాత్త్వికార్థమును తెలుసుకొనుచుండుట వలన బుద్ధి నిశ్చలత పొందుతుంది. తపస్సు వలన మనస్సు విశ్రాంతి పొందుతుంది. ఆధ్యాత్మిక కథనముల వలన, సమాధి - ప్రాణాయామ - ఆసనముల వలనను,… ఏకాంత విహారము వలనను - చిత్తము దృశ్యము నుండి ఉపశమించుచూ మలినత్వము పోయి ప్రకాశముతో విరాజిల్లగలదు. అట్టివాడు అసంగము (Non attatchment with all worldly things) అను సుఖము పొందుతూ, సాత్వికుడై, అయి, నీతిమంతుడుగా కాలము వెళ్లబుచ్చుచూ ఉంటున్నాడు.
అభ్యాసాత్ సాధు శాస్త్రాణాం, కరణాత్ పుణ్యకర్మణామ్,
జంతోః యథావత్ ఏవేయం, వస్తు దృష్టిః ప్రసీదతి,
‘‘తృతీయాం భూమికాం’’
ప్రాప్య, బుద్ధో అనుభవతి స్వయమ్।।
సాధు సంగము యొక్క, శాస్త్ర విషయముల యొక్క అభ్యాసము చేతను, పుణ్యకర్మల నిర్వహణము వలనను ఈ జీవుని యొక్క ‘వస్తు దృష్టి’ తగ్గుతూ.. ఆత్మదృష్టి ప్రవృద్ధమగుచూ ఉంటుంది.
అప్పుడు ఆ ఆర్యుడు (యోగాభ్యాసి) ‘‘అసంసర్గము’’ - అనబడు 3వ యోగభూమికలో ప్రవేశించినవాడగుచున్నాడు. పైన చెప్పుకొన్న అభ్యాసములచే ఆతని బుద్ధి 3వ యోగ భూమిక (అసంసర్గ యోగభూమిక) యొక్క అనుభవము స్వయముగా పొందుచున్నది.
ద్విప్రకారమ్ అసంసర్గం సత్యభేదమ్ ఇమం శృణు।
ద్వివిధో అయం అసంసర్గః,
(1) సామాన్యః (2) శ్రేష్ఠయేవ చ।।
ఓ సాంకృతి మహర్షీ! ‘అసంసర్గము’ అను 3వ యోగభూమిక అభ్యాసము యొక్క ఆధిక్యతచే రెండు తీరులుగా ఉంటుంది. వాటి భేదమేమిటో చెప్పుచున్నాను. వినండి!
(1) సామాన్య అసంసర్గము (2) శ్రేష్ఠ అసంసర్గము
‘‘→ నాహం కార్తా, న భోక్తాచ
న బాధ్యో, న చ బాధకః’’
-ఇతి అసంజనమ్ అర్థేషు
‘‘సామాన్య - అసంగ’’ - నామకమ్।
ప్రాక్ కర్మ నిర్మితం సర్వం
ఈశ్వరాధీనమేవ వా,
సుఖం వా, యది వా దుఃఖం
నైవ- అత్ర మమ కర్తృతా।
-భోగ-అభోగా మహారోగాః।
- సంపదః పరమ ఆపదః।
- వియోగాయైవ సంయోగా
ఆధయో వ్యాధయో అధియామ్,
- కాలశ్చ కలనా ఉద్యుక్త
సర్వభావాన్ అనారతమ్।
అనాస్థయేతి భావానాం యత్
అభావనమ్ అంతరమ్,
వాక్యార్థ లబ్ధ మనసః ‘‘సామాన్యో అసావసంగమః’’।
సామాన్య అసంసర్గ యోగ భూమిక
- ‘‘నేను దేనికీ కర్తను కాదు.. భోక్తనూ కాదు! జలములో ప్రతిబింబించే ప్రతిబింబ రూపము కదలికలకు సూర్యబింబము కర్తకాదు కదా!’’
- ‘‘నేను బాధించబడువాడను కాను. బాధించువాడను కాను।’’
… ఈ విధంగా విషయములతో సంగము లేని భావనను ‘‘సామాన్య- అసంగము’’ అని అంటారు.
నాటకంలోని పాత్ర యొక్క కర్తృత్వ-భోక్తృత్వాలు పాత్రధారునికి సంబంధించి ఏముంటాయి? అంతా నాటక రచనా చమత్కారమేగా! మహాత్ముల సహవాసం చేత ముముక్షువుయందు ఇట్టి అతీతత్వము రూపుదిద్దుకుంటోంది.
- ‘‘కథలోని సంఘటనలు రచయిత యొక్క రచనా చమత్కారము అయినట్లుగా ప్రపంచములో జరిగేదంతా ఈశ్వరాధీనము.
- ఇక్కడి సుఖ దుఃఖాలకు నా కర్తృత్వము ఏదీ లేదు.
- ఇక ఇక్కడి భోగ-అభోగములు నా అధీనంలోనో, మరొకరి ఆధీనంలోనో ఉన్నాయనుకోవటము మనస్సు యొక్క మహారోగము మాత్రమే!
ఇక్కడి సంపదలకు నేను సంబంధించిన వాడినని అనుకోవటం, అవి నాకు సంబంధించినవని తలచటం - మహావ్యాధి వంటిది.
- ఇక్కడి వియోగములు, సంయోగములు మానసిక (ఆధి)- శారీరక (వ్యాధి) బాధారూపములే. సుఖ-దుఃఖములు సంయోగ-వియోగములు, ఆధి-వ్యాధులు, తదితర భావములు - ఇవన్నీ కాలచమత్కారములు మాత్రమే! అభావనచే అవన్నీ స్వతఃగా లేవు’’.
ఈ విధంగా అభావనచే జగత్ భావములను జయించి మనస్సు మహావాక్యముల మననము నందు నియమించటమే ‘‘సామాన్య అసావసంగమము’’ (లేక) సామాన్య అసంసర్గము.
అనేన క్రమయోగేన సంయోగేన మహాత్మనామ్
‘నాహంకర్తా! ఈశ్వరః కర్తా’
కర్మ వా ప్రాక్తనం మమ,
కృత్వా దూరతరే మానమ్
ఇతి శబ్దార్థ భావనామ్,
యత్ మౌన మానసం, శాంతం
తత్ ‘శ్రేష్ఠాసంగ’ ఉచ్యతే।।
విశేష అసంసర్గ యోగభూమిక
ఈ విధంగా క్రమయోగము చేతను, మహాత్ములతో ఏర్పడే ఆత్మతత్త్వము గురించిన సంభాషణచేతను, ఆయా ప్రాణాయామాది యోగసాధనల చేతనూ..,
- నేను కర్తను కాదు. ఎదుటివాడూ కాదు.
- అంతా ఈశ్వరకర్తృత్వమే। ఈశ్వరుడే కర్త!
- లేదా, ప్రాక్తన (ఇతః పూర్వపు) కర్మల ప్రభావమే ఇదంతా!
- ఇక్కడ సందర్భపడుచున్న సర్వ సంఘటనలకు, సంబంధ- బాంధవ్యములకు దూరంగా ఉండెదనుగాక!.. అను శబ్దార్థ భావనతో (అవగాహనతో) ఎవ్వరి మనస్సు మౌనము - శాంతము వహించి ఉంటుందో.. అట్టి వాడు శ్రేష్ఠాసంగయోగ భూమికను’ అధిరోహించినవాడు - అని చెప్పబడుచున్నాడు.
సంతోషామోద మధురా, ‘ప్రధమ - ఉదేతి భూమికా’,
భూమి ప్రోదిత మాత్రో
అంతః - అమృత అంకురికా ఏవ సా।
ఏషా హి పరిమృష్ఠ, అంతర న్యాసాం ప్రసవైక భూః
‘‘ద్వితీయాం చ-తృతీయాంచ
భూమికాం’’.. ప్రాప్నుయాత్ తతః।।
మొదటి యోగభూమిలోనే ఒకానొక మధురమైన (ప్రాపంచక విషయములకు సంబంధించినట్టి) సంతోషము, ఆనందము అభ్యాసమౌతుంది. అది తడిసిన భూమిపై నాటిన అమృతరూపమగు అంకురము వంటిది. ఆ ‘‘అమృతభావన’’ మొలకెత్తి, పరివృద్ధి పొందుచూ అమృతత్వమునకు దారితీయుచున్నది. ‘శుభేచ్ఛ’ యొక్క ప్రవృద్ధియే స్వయముగాను, స్వభావసిద్ధముగాను రెండవ-మూడవ భూమికలకు దారిచూపుతోంది. ప్రసాదిస్తోంది
7. శ్రేష్ఠా సర్వగతా హి ఏషా
‘తృతీయా భూమికా’ అత్ర హి।
భవతి ప్రోజ్ఝిత - అశేష సంకల్పకలనః పుమాన్।
భూమికా త్రితయ అభ్యాసాత్
అజ్ఞానే క్షయమ్, ఆగతే,
సమంసర్వం ప్రపశ్యంతి
చతుర్థీం భూమికాం గతాః।
అద్వైతే స్థైర్యమ్ ఆయాతే, ద్వైతే చ ప్రశమం గతే।
‘3’వ భూమిక ఇక్కడ అత్యంత శ్రేష్ఠము
ఎందుకంటే - అసంసర్గభూమిక- శ్రేష్ఠ యోగ భూమిక యందు యోగి అసంఖ్యాక సంకల్పముల నుండి, వాటి వాటి దోషముల నుండి విడుదల పొందుచున్నాడు.
మొదటి మూడు యోగ భూమికల నిరంతరమైన శ్రద్ధతో కూడిన అభ్యాసముచే అజ్ఞానము క్షయిస్తుంది. ఆ యోగి ఇక ఆపై 4వ యోగభూమిక తనుమానసలో ప్రవేశిస్తున్నాడు. సర్వమును ‘సమదృష్టి’తో చూడ నారంభిస్తున్నాడు. చంచల దృష్టి తొలగుతోంది. ద్వైతదృష్టి ఉపశమిస్తూ అద్వైత స్థైర్యమును పొందుచున్నాడు.
పశ్యంతి స్వప్నవత్ లోకం
చతుర్థీం భూమికాం గతాః।।
భూమికా త్రితయం ‘‘జాగ్రత్’’,
చతుర్థీ ‘‘స్వప్న’’ ఉచ్యతే।

చిత్తం తు శరదాహ్రాంశ విలయం
ప్రవిలీయతే।
ఈ 4వ యోగభూమికలో ప్రవేశించినవాడు ఈ జగత్తును స్వప్న సదృశంగాను, మొత్తము దృశ్యమును కేవలము కలవంటిదిగాను దర్శిస్తున్నాడు. అందుకే
- మొదటి 3 భూమికలు జాగ్రత్తు.
- 4వ భూమిక స్వప్నము అని అంటూ ఉంటారు.
శరత్ కాలములో మబ్బులు ఆకాశంలో తునాతునకలై చెదరిపోతాయి. చూచారా! అట్లా ఈ 4వ యోగ భూమిలో చిత్తము మటుమాయమైపోతోంది. చిత్తము తన యొక్క ఉనికిని కోల్పోతోంది. చిత్తము ‘కేవల చిత్’ అగుచున్నది.
‘సత్త’ అవశేషేన ఏవ (సత్తావశేషఏవ) అస్తే, పంచమీం భూమికాం గతాః
జగత్ వికల్పో నోదేతి, చిత్తస్య అత్ర విలాపనాత్।

పంచమీం భూమికాం ఏత్య, ‘సుషుప్త పద’ నామికామ్
శాంత అశేష విశేషాంశః, తిష్ఠతి అద్వైత మాత్రకః।
ఇక క్రమంగా 5వ యోగ భూమికలో ప్రవేశించగా, ఆ యోగి ‘‘కేవల సత్తా స్వరూపము’’ సంతరించుకుంటున్నాడు. ఇక ఆతనికి జగత్ సంబంధమైన వికల్పమే ఉండదు. చిత్తము లయిస్తోంది. అద్దాని దృశ్య సంసార సంబంధమైన గీతికలన్నీ ముగుస్తాయి.
5వ యోగ భూమికను ‘సుషుప్తపద’ అని పిలుస్తున్నారు. ఆ యోగి పరమశాంతము, అంతకుమించిన ఏమీ లేని అశేష-నిశ్శేషాంశము అగు అద్వైతమునందు తిష్ఠ కలిగి ఉంటున్నాడు.
గళిత ద్వైత నిర్భాసో, ముదితో, అంతః ప్రబోధవాన్,
‘సుషుప్త మనఏవ’ అస్తే, పంచమీం భూమికాం గతః।
అంతర్ముఖతయా తిష్ఠన్
బహిర్-వృత్తి పరోఽపి సన్।
పరిశ్రాంతతయా నిత్యం
నిద్రాళుః - ఇవ లక్ష్యతే।
భేదమునకు సంబంధించిన ద్వైత దృష్టులు మొదలంట్లా తొలగుతాయి. మనస్సు సుషుప్తస్థితి పొందుతోంది.
బాహ్యమున ఆయా బాహ్య విషయ సంబంధమగు బహిర్వృత్తి కలిగి ఉంటున్నప్పుడు కూడా అంతర్ముఖుడై గురి చెదరని వాడై, తిష్టితుడుగా ఉంటాడు.
పరమశాంతము, శ్రమ అనునది కించిత్ కూడా లేనట్టి పరిశ్రాంతత్వము సంతరించుకొనుచూ, జగత్ విషయంలో గాఢనిద్రయందు ఉన్న వాని వలె ఉంటాడు.
కుర్వన్ అభ్యాసం ఏతస్యాం
భూమికాయాం వివాసనః, షష్ఠీం ‘తుర్యాభిదామ్’
అన్యాం క్రమాత్ పతతి భూమికామ్।।
అట్టి ‘సుషుప్త పద’ అనే 5వ భూమికను అభ్యసిస్తూ వాసనలన్నీ తొలగుచుండగా, ఆ యోగి ‘తుర్యాభిద’ అని పిలువబడుచున్న ‘6’వ - యోగ/జ్ఞానభూమిలో ఎప్పుడో ప్రవేశము పొందుచున్నాడు.
8. యత్ర న అసత్, న సత్ రూపో,
న అహమ్, న అపి అనహమ్ కృతిః
కేవలం క్షీణ మనన
ఆస్తే అద్వైతేఽతి నిర్భయః।
నిర్‌గ్రంథిః శాంత సందేహో
జీవన్ముక్తో విభావనః।
ఓ సాంకృతి మహర్షీ! భూమికల అభ్యాసి ‘జీవన్ముడు’ ఎప్పుడగుచున్నాడో వినండి! యోగి ఎక్కడైతే అసత్‌రూపిగాని, సత్‌రూపిగాని కాడో; అహంకారము గాని, అనహంకారముగాని ఉండవో, సర్వమననములు లయించగా, అద్వైతరూపుడై (తనకు ద్వితీయము లేనివాడై) - భయరహితుడై ప్రకాశించు చున్నాడో, గ్రంథులేవీ లేనివాడై ఉంటాడో; (బ్రహ్మ-విష్ణు-రుద్ర) గ్రంథులు విభేదమైపోగా, స్వస్వరూపము-జగత్- పరబ్రహ్మముల ఏకత్వము విషయంలో సర్వసందేహాలు సశాంతించినవై ఉంటాయో.. ఆతడే ‘‘జీవన్ముక్తుడు’’.
అనిర్వాణోఽపి నిర్వాణః, చిత్రదీప ఇవ స్థితః।।
‘షష్ఠ్యాం భూమా’ అవసౌ స్థిత్వా
సప్తమీం భూమిమ్ ఆప్నుయాత్।
‘విదేహముక్తితా’ ప్రోక్తా సప్తమీ యోగభూమికా।
నిర్వాణము-అను సంబంధము కూడా ఉన్నవాడు కాదు. నిర్వాణుడు మోక్షరూపుడై చిత్రములోని దీపమువలె నిశ్చలుడై ఉంటాడు.
అట్టివాడు 6వ యోగభూమికలో ప్రవేశించి జీవనన్ముక్తుడగుచున్నాడు. జీవన్ముక్త స్థితి నుండి ఏడవ యోగ భూమికను పొందుచున్నాడు.
అట్టి 7వ జ్ఞాన/యోగ భూమికను ‘విదేహముక్తి’ - అనిపిలుస్తున్నారు.
అగమ్యా వచసాం, శాంతా,
సా సీమా సర్వభూమిషు।
లోకానువర్తనం త్యక్త్వా,
త్యక్త్వా దేహానువర్తనం,
శాస్త్రానువర్తనం త్యక్త్వా
స్వాధ్యాస-అపనయం కురు।
అట్టి సప్తమ భూమిక అగు విదేహముక్తి వాక్కుతో ‘ఇట్టిది’ అని వర్ణించి చెప్పలేము. విదేహ ముక్తునిది పరమ శాంతస్వరూపము. ఇది అన్ని భూమికలకు పరాకాష్ఠ. యోగ పరాకాష్ఠ! జ్ఞానపరాకాష్ఠ!
ఓ సాంకృతి మహర్షీ! అట్టి పరాకాష్ఠ అగు విదేహముక్త స్థితిలో ఇక లోక- అనువర్తన మంతా త్యజించబడుతుంది. అట్లాగే శాస్త్రనియమములు, విధి విధానములు కూడా త్యజించబడుచున్నాయి. సర్వ లోకధ్యాసలు దాటి వేయబడుచున్నాయి. ఆతడు లోకాతీతుడు-లోకాంతర్గతుడు కూడా అయి ఉంటున్నాడు.
‘ఓంకార మాత్రమ్’ → అఖిలమ్
విశ్వ ప్రాజ్ఞాది లక్షణమ్।
వాచ్య వాచకతా భేదాత్
భేదేన అనుపలబ్ధితః
‘అ’కారమాత్రం విశ్వస్స్యాత్
‘ఉ’కారః తైజసః స్మృతః
ప్రాజ్ఞో ‘మ’కార ఇత్యేవం
పరిపశ్యేత్ క్రమేణ తు।
ఏ స్థానము నుండి అయితే
-విశ్వుడు (జాగ్రత్),ప్రాజ్ఞుడు (స్వప్నము), తేజసుడు (సుషుప్తి)లుగా కనబడే ఈ సర్వము ఓంకార మాత్రమగు స్వస్వరూపము యొక్క లక్షణ విశేషములు అయి ఉన్నవో..,
- అట్టి ఏకము - అఖండము అగు ‘ఓం’ కారములో ఈ విశ్వము (విశ్వశ్యాత్) ‘అ’కార మాత్రము, స్వప్నము ‘ఉ’ కారమాత్రము (తేజసము), ‘మ’కార మాత్రము (పాజ్ఞుడు), అంతర్ విశేషముగాను, ఓంకార రూప ఆత్మ నిర్విశేష తత్త్వముగాను క్రమేణా దర్శించబడుచున్నదో.. అదియే సప్తమ భూమిక!
సమాధికారాత్ ప్రాగేవ
విచింత్య అతి ప్రయత్నతః
స్థూల సూక్ష్మ క్రమాత్ సర్వం
చిదాత్మని విలాపయేత్।
చిదాత్మానం నిత్య శుద్ధ-బుద్ధ-ముక్త సత్ అద్వయః।
పరమానంద సందోహో
‘‘వాసుదేవో అహమ్ ఓమ్’’ ఇతి।
7వ భూమిలోని వానిచే → అకారమాత్ర విశ్వుడు, ఉకారమాత్ర తేజసుడు, ‘మ’కార మాత్ర ప్రాజ్ఞుడు అభేదంగా → చూడబడుచున్నాయి.
- ఆ ఏకత్వము అను ‘సమాధి’ రూప కేవలీ ఆత్మ గురించి ప్రయత్న పూర్వకంగా తీవ్ర చింతన చేయాలి. ఇక్కడి స్థూలమైన దానిని సూక్ష్మముగా దర్శిస్తూ సూక్ష్మములో లయం చేయాలి. సూక్ష్మమును ‘కారణము’ అగు జీవాత్మయందు, జీవాత్మను అనేక దేహముల సందర్శకుడగు ఈశ్వరుని యందు, ఈశ్వరుని జన్మాదులే లేనట్టి ఆత్మ యందు లయింపజేయాలి.
ఇప్పుడిక ఆ చిదాత్మతో ద్రష్టత్వమును దృశ్యత్వమును ఏకం చేయాలి.
‘‘నిత్యశుద్ధము, కేవలబుద్ధి స్వరూపము, నిత్యముక్తము, కేవల సత్ (ఉనికి) స్వరూపము, పరమానందముచే సర్వదా నిండిఉన్నది -అగు వాసుదేవుడనే నేను. నేను సర్వదా సర్వత్రా ఆ వాసుదేవ స్వరూపుడనే’’ అను కేవలీ ఏకత్వ, అద్వైతత్వములను పుణికిపుచ్చుకోవాలి!
ఆది-మధ్యా-అవసానేషు
దుఃఖగ్ం సర్వమ్
ఇదమ్ యతః।
తస్మాత్ సర్వం పరిత్యజ్య
తత్త్వనిష్ఠోభవ। అనఘ!
వాసుదేవాఽహమస్మి!
‘‘వాసుదేవ మిదగ్ం సర్వమ్! ఇదగ్ం సర్వమ్ అహమేవ - ఇదంతా నేనే!’’.. అను 7వ భూమికకు వేరై కనిపించేదంతా ‘‘ఇది దుఃఖభాజకమే’’.. అని గమనించబడి, త్యజించి వేయబడుచున్నది. స్వాత్మయే సర్వాత్మగా, సమస్త జగత్తుగా దర్శించటమే సర్వదుఃఖముల నివారణోపాయము.
అందుచేత ఓ పాపరహితుడా! సాంకృతి మహర్షీ! ఇక్కడ కనబడేదంతా బుద్ధితో త్యజించినవాడవై ఉండు. నీయొక్క కేవలీసహజమగు వాసుదేవాఽహమ్’ నందు తత్త్వనిష్ఠ కలిగినవాడవై ఉండు.
అవిద్యా తిమిర - అతీతగ్ం,
సర్వ భాస వివర్జితమ్,
ఆనన్దమమలగ్ం సిద్ధం,
మనో వాచామ్ అగోచరమ్।
ప్రజ్ఞాన ఘనమ్ అనన్దమ్।
బ్రహ్మాఽస్మి - ఇతి విభావయేత్।।
‘అవిద్య’ అనే అంధకారమునకు ఆవల సర్వదా వేంచేసి ఉన్నట్టిది,
- సర్వ అభాసలను (Illusions and miscenceptions) త్యజించి వేసినట్టిది..,
- నిర్హేతుకానంద స్వరూపము (Happyness with out any reason/issue) అయినట్టిది…,
-నిత్య నిర్మలమై సర్వదా సిద్ధించి ఉన్నట్టిది…,
- మనో - వాక్కులకు గోచరము కానట్టిది..,
అగు ‘‘బ్రాహ్మీస్థితి’’ యందు స్వప్రకాశమానుడవై సర్వదా వెలుగొందుము.

ఇతి అక్ష్యుపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



కృష్ణ యజుర్వేదాంతర్గత

4     అక్షి ఉపనిషత్

అధ్యయన పుష్పము

ఒకప్పుడు భగవానుడగు సాంకృతి మహర్షి ఆదిత్యలోకం ప్రవేశించారు. బ్రహ్మతత్త్వజ్ఞానార్థి అయి తన ఇష్టదైవమగు ఆదిత్య భగవానుని దర్శించారు. సకల జీవులకు, సర్వమునకు ఆది స్వరూపుడు (యత్-ఆదిః తమ్) అగు ఆ సూర్యభగవానుని చాక్షుష్మతీ మహవిద్యాస్తోత్ర పూర్వకంగా ఈ విధంగా స్తుతించసాగారు.

చాక్షుష్మతీ మహావిద్యాస్తోత్రము


ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ-అక్షితేజసే నమః। ఓ ఆదిత్య దేవా! శ్రీ సూర్యనారాయణా! భగవతే! నమస్కారము! మీరు సర్వదేహములలో ‘దృక్’ అనబడు (parceiver) - తేజో అక్షిరూపులై వెలుగొందుచున్నారు.
ఓం ఖేచరాయ నమః। ఆకాశమంతా ఆక్రమించి సంచారముచేయు స్వామీ।
ఓం మహాసేనాయ నమః। ‘14 జగత్తులలోని సర్వజీవులు’ అనే మహాసేనకు సేనానాయకుడా!
ఓం తమసే నమః। ఓం రజసే నమః। ఓం సత్త్వాయ నమః। సత్యము-రజస్సు-తమము అను త్రి-గుణములు ధారణగా కలిగి ఉన్న త్రిగుణాత్మధారిణే! విరించి-నారాయణ- శంకరాత్ముడా! నమో నమః।।
ఓం అసతో మా సత్-గమయ (సద్గమయ)। హే జగద్గురూ! అవాస్తవము, మనో కల్పనామాత్రము అగు ‘అసత్తు’ నందు చిక్కుకున్న నన్ను బయల్వెడలదీసి ‘వాస్తవము-నిత్యము’ అగు ‘సత్యము’ వైపుగా నడిపించండి
తమసో మా జ్యోతిర్గమయ। ఇంద్రియ విషయ పరంపరలో నిండియున్న అజ్ఞాన నిబిడాంధకారములో సత్యము ఎరుగలేకపోతున్న నన్ను ఆత్మజ్ఞానజ్యోతి వెలుగొందుచున్న ప్రదేశమునకు తరలించండి.
మృత్యోర్మా అమృతం గమయ। దేహముతో పుట్టుచూ - మరణిస్తూ ఉండే పరిమిత సంకుచిత దేహములకు పరిమిత-పరంపరల మృత్యుస్థితి నుండి జన్మ-మృత్యువులచే స్పృశించబడజాలవి ‘అమృతత్త్వము’నకు దారిచూపండి. సమస్తమునకు సాక్షి అగు ‘కేవలీస్థానము’ దరి జేర్చండి.
ఉష్ణో భగవాన్ శుచి రూపః। స్వామీ! మీరు ఉష్ణరూపమున జగత్తులోని అణువణువు పరిశుభ్రపరచి ‘శుచి’ని ప్రసాదించుచున్నారు. ‘
హంసో భగవాన్ శుచి రూపః। సోఽహమ్’ అను హంస రూపమున జీవాత్మల అజ్ఞాన జాడ్యమును కడిగివేసి హృదయములను పరిశుభ్రము చేయు వాత్సల్యస్వరూపులు.
ప్రతిరూపః। ఆకాశంలో బింబస్వరూపముగాను, ఈ జీవులు-జగత్తులు మొదలైనవన్నీగా కనబడుచున్న ప్రతిబింబస్వరూముగాను ఇహ-పరములందు వెలుగొందు ఏకాత్మస్వరూపులు మీరు!
విశ్వరూపం। ఘృణినమ్। మీ శత సహస్ర కిరణజాలములతో సృష్టినంతటినీ తపింపజేయుచున్నారు! ఈ విశ్వమంతా మీరూపమే కాబట్టి విశ్వస్వరూపులు కూడా!
జాతవేదసగ్ం। హిరణ్మయమ్। జ్యోతిరూపం తపంతమ్ సహస్ర రశ్మిః।
శతధా వర్తమానః పురుషః।
అనేక అసంఖ్యాక పురుషకారములతో నిండియున్నట్టి పరమ పురుషులు. వర్తమానమునందు అనేక రూపములుగా సంవర్తించువారు!
ప్రజానామ్ ఉదయతి, ఏష సూర్యః। ఈ జీవులందరూ ఉదయిస్తున్న స్థానమే మీరు. సర్వజీవుల జనన స్థానము కాబట్టి ‘‘సూర్యుడు’’ అను శబ్దార్థముతో అభివర్ణించబడుచున్నారు.
ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే। భగవంతుడవగు ఓ సూర్యభగవాన్! మీకు నమస్కారము! సర్వజీవులకు ఆదిస్వరూపులు కాబట్టి ఆదిత్య దేవులు!
అహో వాహినీ వాహినీ వా స్వాహేతి। ఆనందస్వరూపులై సర్వజీవులకు ఆహ్లాదము-ఆరోగ్యములతో కూడిన జీవన ప్రదాత! హే సప్తాశ్వ రథమారుఢా! మీకు స్తుతి పూర్వకంగా ఆత్మప్రదక్షిణ నమస్కారపూర్వక సాష్టాంగదండ ప్రణామములు!

ఆదిత్య భగవానుడు : ఓ సాంకృతి మహర్షీ! తవ విరచితమైన చాక్షుష్మతీ విద్యా-స్తుతికి నేను సంతోషించి సుప్రీతుడనగుచున్నాను. ఏ బ్రహ్మతత్త్వార్థ జిజ్ఞాసి అగు బ్రాహ్మణుడు (బ్రహ్మతత్త్వము) ఆశయముగా కలిగి ఉంటాడో అట్టివాడు చాక్షుష్మతీ స్తోత్రముచే ఆత్మతత్త్వమును అతి త్వరగా సిద్ధింపజేసుకోగలడు. ఆతనిని సంసారమునకు సంబంధించిన దృష్టిదోషము (గ్రుడ్డితనము) కలుగదు. కంటి దోషములు ఉండవు. అట్టివాని కులములో గ్రుడ్డివారు (అల్పాశయములు కలవారు, ఇంద్రియ విషయ ఆవేశపరులు, ఆకారణంగా సత్‌వస్తువును, ఆత్మతత్త్వమును కించపరచు భావములు కలవారు) ఉండరు.

మీరు గానం చేసిన చాక్షుష్మతీ విద్యాస్తోత్రమును ఒక వ్రతంగా స్వీకరించి కొన్నిరోజులు (21 రోజులు, 29 రోజులు.. ఈ రీతిగా) గానం చేస్తూ, వ్రతంతో ఒక విధిగా ‘8’ మంది బ్రాహ్మణులకు భోజన సంతర్ప చేసి గౌరవించి వ్రతమును ముగించువారు.. ‘విద్యాసిద్ధి’ పొందగలగు. అఖండాత్మను స్వస్వరూపముగా అనుభూతిని సిద్ధించుకోగలరు.

మీరు గానం చేసిన చాక్షుష్మతీస్తోత్రము యొక్క అంతరార్థమును ఎరిగి, అట్టి తత్త్వార్థమును స్వస్వరూప సంగతిగా ఎవ్వరు సమన్వయించుకుంటూ తెలుసుకుంటారో… అట్టి వారు మహానుభావులు కాగలరు.

ఓ సాంకృతి మహర్షీ! ఇప్పుడు చెప్పండి. ఏమి వరము కావాలో కోరుకోండి. సిద్ధింపజేస్తాను. ఏమి కోరి ఆదిత్య లోకమునకు వేంచేశారు?

సాంకృతి మహర్షి : హే సర్వాధారుడవగు, సర్వమునకు మునుముందు స్వరూపుడవగు ఆదిత్య భగవాన్! మహాత్ములగు తమ దర్శనం వృధా కాకూడదు కదా! అందుచేత మీ నుండి ‘బ్రహ్మవిద్య’ను కోరుకొనుచున్నాను. హే సద్గురూ! విద్యలలో కెల్ల ఆదివిద్య, శాశ్వతమగు ఆత్మతత్త్వమును అభివర్ణిస్తూ ప్రతిపాదించునది అగు ‘బ్రహ్మవిద్య’ను బోధించండి, ప్రసాదించండి!

ఆదిత్య భగవానుడు : ఓ సాంకృతి మహర్షీ! తప్పక అడుగవలసిన ‘విద్య’నే అడుగుచున్నారు. మీరు అడుగుచున్న తత్త్వజ్ఞానము సంబంధించి రెండు విశేషణములను చెప్పుచున్నాను. వినండి.

(1) సుదుర్లభమ్ : అతి దుర్లభమైన విషయం. చెప్పటము, వినటము.. ఈ రెండూ కష్టతరమైనవేదే! ఎందుకంటే, అది అతి సూక్ష్మమైన (Very subtle) విద్య అయి ఉండటము చేత సుమా! వక్త-శ్రోతల అఖండ అనునిత్య స్వస్వరూపమే అది!

యేన విజ్ఞానమాత్రేణ జీవన్ముక్తో భవిష్యతి : ‘బ్రహ్మవిద్య’ లేక ‘తత్త్వ విద్య’ అతి దుర్లభమే అయినప్పటికీ, అద్దానిని ఎరిగినంతమాత్రము చేతనే ఈ జీవుడు ‘జీవన్ముక్తుడు’ కాగలడు. కనుక తప్పక ప్రతిజీవుడు ఎరుగవలసిన విద్య. కాబట్టి చెప్పుతాను… శ్రద్ధగా వినండి.

┄ ┄ ┄

ఈ జీవుని స్వస్వరూపమగు ‘ఆత్మ’ ఎట్టిది?

సర్వమ్ : స్వప్నమంతా స్వప్నద్రష్టయొక్క స్వప్నచైతన్యమే అయి ఉన్న తీరుగా, ఈ కనబడుచున్నదంతా కూడా ద్రష్టయగు జీవుని యొక్క జాగ్రత్ చైతన్య - స్వస్వరూపమే! అందుచేత ఆత్మ స్వస్వరూపము-సర్వస్వరూపము కూడా అయియున్నది.

ఏకమ్ : ఆత్మను ‘జీవాత్మ-పరమాత్మ-ఈశ్వరాత్మ-దృశ్యాత్మ-దేహాత్మ’.. ఈ ఈ తీరులుగా విభాగించి మొట్టమొదటగా శాస్త్రములు వివరిస్తున్నప్పటికీ, అట్టి భేదము లేవీ ఆత్మకు లేవు. అందుచేత ఆత్మ సర్వదా ‘ఏకము’గానే ఉన్నది. అనేకము అవటం లేదు. ఆత్మకు అనేకత్వము లేనేలేదు.

అజగ్ం : ఈ దేహములకు, లోకములకు, పాదార్థికంగా కనిపిస్తున్న సర్వవస్తుజాలమునకు ఆది-అంతములనేవి ఉంటాయి. కానీ ఆత్మ జన్మరహితమైనది. జన్మ-వృద్ధి-జరా-హాని-మరణ-మార్పు-చేర్పు ధర్మములు ఆత్మకు లేవు.

శాన్తమ్ : వృద్ధి - క్షయాలు, మార్పు - చేర్పులు ఉండనట్టిది కాబట్టి ఆత్మసర్వదా పరమశాంత స్వరూపము. ఆత్మయొక్క శాంతత్వము, మౌనత్వము, సర్వత్వము సర్వదా యథాతథము. జాగ్రత్ స్వప్న సుషుప్తులు మొదలైనవన్నీ ఎందులో సశాంతిస్తున్నాయో,- అదియే ‘ఆత్మ’

అనన్తమ్ : నామరూపాత్మకమైన దానికంతటికీ ‘అన్తము’ ఉండవచ్చుగాక! ఆత్మ రూపరహితమైనది. అందుచేత పొడవు-వెడల్పు - ఆవల-ఈవల పరిధులు ఉండవు. అన్తము గల వస్తువైతే ‘ఆవల లేదు’, (లేక) ‘‘ఈవల ఉన్నది’’ - ఈఈ మొదలైన ఆయా ధర్మములు ఉంటాయి. ఆత్మకు అట్టి పరిధులు లేవు. కనుక అనన్తము. ఆద్యన్త రహితమ్! అకాల పరిమితమ్! త్రికాల - అబాధ్యము.

ధృవమ్ : ఆత్మసర్వదా కదలనిదై, యథాతథమై ఉన్నది. ఒకచోట నుండి మరొకచోటుకి పోవునది కాదు. అందుచేత ధృవము. భూతాకాశములో వాయు-అగ్ని-జల-స్థూలముల కారణంగా ‘‘ఇచ్చట-అచ్చట’’ అనునవి ఉండవచ్చుగాక! ఆత్మ అఖండము, అప్రమేయము, నిశ్చలము కూడా! సర్వదా ఉన్నచోటే ఉంటున్నది.

అవ్యయమ్ : ఆత్మ తరుగునదికాదు. పెరుగునది కాదు. చిన్న-పెద్ద-ఎక్కువ-తక్కువ-తరుగుదల-పెరుగుదల మొదలైన ధర్మాలు ఆత్మకు లేవు. కనుక సదా అవ్యయము.

┄ ┄ ┄

ఓ సాంకృతి మునిసత్తమా! ఈ విధంగా స్వస్వరూపమగు ఆత్మను ఎరిగినవాడవై, సర్వమును (భూతార్థములను) ఎరుగుచున్నట్టి తత్త్వముగా తెలుసుకొన్నవాడవై సుఖ-శాంతులను పొందియుండుము.

‘చిత్తము’ కారణంగానే అనేక భేదములతో కూడిన జగత్తు చిత్తమునకు అనుభవమగుచున్నది. ఫలితంగా చిత్తము వేదన పొందటము జరుగుతోంది. భేదదృష్టులను త్యజిస్తే చిత్తము క్షయిస్తుంది. చిత్తము క్షయించగా ఏర్పడగల ‘‘అకృత్రిమమగు అవేదనము - A natural state of Self sans all worries .. అనునదే ‘యోగము’ అను శబ్దము యొక్క తాత్వికార్థము. అవేదనయే యోగముగా చెప్పబడుచున్నది.


సాంకృతి మహర్షి : మహనీయా! సవిత్రు మండల (సత్-విత్ మండల) మధ్య వర్తీ! సూర్యనారాయణ దేవాదిదేవా! దేహమున్నంత వరకు మాకు నియమించబడిన కర్మలు నిర్వర్తించవలసినదేకదా! చిత్తము ఉంటేనే కర్మలు మేము చేయగలుగుతాము. కర్మలు అనివార్యమైనప్పుడు చిత్తమూ అనివార్యమే కదా! మరి మీరు చెప్పుచున్న చిత్తక్షయము, తద్వారా అకృత్రిమమగు అవేదనము - అనే యోగస్థితి - ఎట్లా సిద్ధిస్తాయి? అది ఎట్లా సాధ్యం?

ప్రథమ యోగ భూమిక - ‘‘శుభేచ్ఛ’’

ఆదిత్య భగవానుడు : అవును! దేహధారులందరికీ కర్మలు తప్పవు. నేనూ కర్మలు త్యజించటము లేదే! త్యజించమని చెప్పటమూ లేదు. చెప్పినా అది సాధ్యమయ్యేది కాదు. అనివార్యము. అయితే,

యోగస్థః కురుకర్మాణి
యోగము నందు స్థానము పొందియుండి ‘కర్మయోగి’వై కర్మలు నిర్వర్తించాలి సుమా! అంతేగాని ‘అనురాగి’ అయికాదు.

ఆత్మ గురించిన ధర్మము ఎరిగి ఉండుట, ఆత్మధర్మముతో మమేకమగుచు చిత్తము యొక్క ధర్మము అగు ‘వేదనము’ను దాటి ఆవేదనము ఆశ్రయించుచుండటమే ‘యోగము’!

ఆ విధంగా యోగి అయి ఈ జీవుడు నియమితమగు కర్మలు నిర్వర్తించాలేగాని, నీరసముగా ‘రాగి’ అయి, ‘ఈసురో’ అనుకొంటూ, ‘నా కర్మ ఇట్లా మరి’ అని వేదన పొందుచూ కర్మలు నిర్వర్తించకూడదు. నీరసోవా అధ మా కురు! కర్మలు ఉత్సాహంగా నిర్వర్తిస్తూ పరమాత్మకు సమర్పించు భావనచే ‘నీరసము’ జయించబడగలదు. సమర్పితమైన ‘కర్మ’ అకర్మయే అగుచున్నది.

యోగి వై కర్మలు చేస్తూ ఉంటే క్రమంగా ‘రాగము’ అనే జాడ్యము తొలగి ‘విరాగము’ స్వయముగా రూపుదిద్దుకుంటోంది. అంతరంగములో, జన్మజన్మలుగా పేరుకొనియున్న అంతర్వాసనలు క్రమంగా సన్నగిల్లుతూ వస్తాయి. ఆతని క్రియలన్నీ ప్రేమాస్పదమౌతాయి. ఉదారరూపము (Sacrificial form) సంతరించుకుంటూ వస్తాయి. అప్పుడు ‘ఆత్మానందము’ అనే స్వభావసిద్ధమగు ‘మోదము’ రూపుదిద్దుకొనసాగుతుంది.

నాయనా! ఈ జీవుడు మూర్ఖరూపమగు (గ్రామ్యరూపమగు) జడచేష్టలను విరమిస్తూ రావాలి సుమా! ఇతరులను దూషించటము, బాధించటము, నిరుత్సాహము, దురావేశము, పేరాశ, అసూయ, ద్వేషము, మూర్ఖత్వము, ఇతరులకు కలిగే బాధ గమనించకపోవటము మొదలైన గ్రామ్యరూపమగు జడచేష్టలను త్యజిస్తూ ఉంటేనే బుద్ధి నిర్మలమౌతుంది.

ఉద్వేగము లేనట్టి, ప్రాపంచకమైన వ్యక్తిగత అభీష్టములకు పరిమితము కానట్టి పుణ్యకర్మలను ఆశ్రయిస్తూ ఉండగా బుద్ధి నిర్మలము, సునిశితము, విస్తారము కాగలదు.

అందుచేత శాస్త్రములకు, ఆర్యుల అభిప్రాయములకు అనుకూలము అయినట్టి (ప్రతికూలము కానట్టి) ఉద్వేగము (తనకు గాని-తదితరులకుగాని) కలిగించనట్టి - మృదువైన రీతిగా ఈ జీవుడు కర్మలు నిర్వర్తించునుగాక! పాపకర్మల పట్ల ‘వీటి పర్యవసానము దీర్ఘము-తీవ్రము అగు దుఃఖములకు హేతువు కదా!’’- అను భయమును కలిగి ఉండాలి సుమా! రాగి అయి భోగములను అపేక్షించి కర్మలుచేయుటము శ్రేయస్కరం కాదు.

స్నేహ-ప్రణయ (ప్రేమ-ఆప్యాయతల) భావాలు అంతరమున కలిగి ఉండి, ఉచిత-అనుచితములను ఎరిగిఉండి, కర్మలు నిర్వర్తించాలి.

అంతేకాదు. కర్మల విషయంలో ఆత్మతత్త్వజిజ్ఞాసికి మరొక సూచన కూడా!

మనసా-వాచా-కర్మణా సజ్జనాన్ ఉపసేవతే!
మనో వాక్ కాయములచే సజ్జనులను సేవించునుగాక! సేవచే దేహ - మనో - అహంకార జాడ్యములు తొలగగలవు.
ఆత్మతత్త్వజ్ఞానము నిర్వచించు, అభివర్ణించు, స్వస్వరూపముగా నిరూపించు -శాస్త్ర గ్రంథములను తెచ్చుకొని ప్రియముగా సత్య-వివేచన - వివేక దృష్టులతో పరిశీలిస్తూ ఉండాలి.

ఓ సాంకృతి మహర్షీ! ఇప్పటివరకు చెప్పుకున్న మార్గములలో అభ్యాసము కొనసాగించుచుండగా ఆతడు మొట్టమొదటి ‘శుభేచ్ఛ’ (Object Setting) అను ప్రథమ జ్ఞాన (లేక) యోగ భూమికలో ప్రవేశించినవాడగుచున్నాడు.


రెండవ యోగ భూమిక - ‘‘విచారణ’’

ఇక అక్కడి నుండి ‘సంసారము’ అనే బంధము ఏమైయున్నదో గుర్తించి, గమనించి,.. అట్టి సంసార భ్రమబంధము నుండి విడివడుటకై ‘విచారణవంతుడు’ అగుచున్నాడు. అట్టి ‘విచారణ’ అనబడు రెండవ జ్ఞాన-యోగ భూమికను ప్రారంభించువాడు ‘ఆర్యుడు’ అని చెప్పబడుచున్నాడు. ఈ విధంగా శుభేచ్ఛ అను మొదటి భూమికను కొనసాగిస్తూ ‘విచారణ’ అను రెండవ భూమికలో ప్రవేశించి సాధనపరుడు అగుచున్నాడు.

ఈ రెండవదగు విచారణ యోగ భూమికలో ఈతడు శ్రుతులను (వేద-ఉపనిషత్ శాస్త్రములను), స్మృతులను (పురాణ-ధర్మశాస్త్రములను) శ్రద్ధగా, ఉత్తమ ఆశయముతో పరిశీలించ ప్రారంభిస్తున్నాడు. గూఢ అంతరార్థములను వివేకముతో అర్థం చేసుకొను యత్నములలో నిమగ్నుడగుచున్నాడు. సదాచారములను ఎరుగుట, అభ్యసించటములను వృద్ధి చేసుకుంటున్నాడు.

‘‘స్తోత్ర పఠనము’’, ‘‘ధారణ’’, ‘‘ధ్యానము’’, మొదలైన కార్యక్రమములందు సముత్సాహము పొందుచున్నాడు. ఆత్మతత్త్వ నిరూపణ విషయముల గురించిన వ్యాఖ్యాతల వ్యాఖ్యానములను వినటము, చర్చించటము, అనుమాన నివృత్తి చేసుకోవటము.. మొదలైన క్రియా విశేషములలో అభిరుచి పూర్వకముగా ప్రవర్తించసాగుచున్నాడు. జ్ఞాన విశేషములను వినటము, విశ్లేషించుకోవటానికి శ్రేష్ఠులగు పండితులను దర్శించుచుండటము - ఆశ్రయించటము చేయుచున్నాడు.

పదార్థ ప్రవిభాగజ్ఞః : శాస్త్రములు ఆత్మజ్ఞానమును విశదీకరించుటకై విశ్లేషించి చెప్పుచున్న పాంచభౌతిక దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త. అహంకార-జీవ-ఈశ్వర-పరమాత్మ ఇత్యాది విశేషముల యందు వాటి పరాకాష్ఠార్థములయందు ఆతడు క్రమంగా ఆసక్తుడు అగుచున్నాడు.

కార్య-అకార్య వి నిర్ణయమ్ జానాతి అధిగతశ్చ అన్యో గృహం-గృహపతిః యథా : ఇంటి యజమాని ఇంటిలో జరుగవలసినవి- జరుగకూడనివి శాసించువిధంగా, ఆ విచారణవేత్త-‘‘చేయవలసినవి (సాధనలు)- చేయకూడనివి (ఆసురీ సంపత్తి)’’ - ఆలోచించి మరీ నిర్ణయించుకోసాగుచున్నాడు, ‘‘విన్నవి - వినవలసినవి - వినకూడనివి’’ నిర్ణయపూర్వకంగా విశ్లేషించుకొనుచున్నాడు. ఒక పాము కుబుసమును విడుస్తుంది చూచారా! ఆ విధంగా ఈ ‘విచారణ’ అను భూమికలో ప్రవేశించినవాడు మదము (గర్వము), లౌకికమైన స్వాభిమానము, మాత్సర్యము, లోభము, మోహాతిశయము, భార్యా పుత్రేషణ - ధనేషణ-లోకేషణ (త్రయీ ఈషణములను) - ఇవన్నీ త్యజించుటయందు యత్నశీలుడు అగుచున్నాడు.

ఓ సాంకృతి మహర్షీ! ఈ ‘విచారణ’ అను రెండవ భూమికలో ప్రవేశించినవాడు…,
➤ శాస్త్ర-గురు బోధలపై బుద్ధిని నిలపటం చేస్తున్నాడు.
➤ గురుసేవ, సజ్జన సేవలను ఆశ్రయిస్తున్నాడు.
➤ శాస్త్రములు, గురువులు చెప్పే బోధల అంతరార్థమును, రహస్యార్థమును తెలుసుకోయత్నిస్తున్నాడు.
➤ ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా తెలుసుకోనారంభిస్తున్నాడు.
➤ ఆకళింపుతో హృదయస్థం చేసుకోసాగుచున్నాడు.


మూడవ యోగ భూమిక - “అసంసర్గము”

పై విధములైన ఒకటవ-రెండవ భూమికా యోగాభ్యాసములచే క్రమంగా ఆ యోగి పుష్పశయ్య (పూల పాన్పు)పై ఆశీనుడైనట్లుగా ‘అసంసర్గము’ (Non-Attachment) అను మూడవ యోగ భూమికలో ప్రవేశించగలడు. (అసంసర్గపుష్ప శయ్యపై ఆశీనుడగుచున్నాడు).

దృశ్యము - ద్రష్ట - దృక్ అనే త్రిపుటిని, మనో-బుద్ధి-చిత్త-అహంకారములనే అంతరంగ చతుష్టయమును, సోఽహమ్, తత్త్వమ్, సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ, జీవో బ్రహ్మేతినాపరః.. ఇత్యాది మహావాక్యార్థములను - స్వవిచారణ పూర్వకంగా, సశాస్త్రీయంగా తెలుసుకోవటం ప్రారంభిస్తున్నాడు.

➤ తపస్సు వలన మనస్సు విషయములపై వ్రాలటము, లోకసంగతులలో సంచారములు చేయుటము మానివేయసాగుచూ ప్రశాంతత పొందసాగుతోంది.
➤ తాత్త్వికార్థగ్రహణముదే బుద్ధి నిశ్చలత పొందసాగుతుంది.
➤ ఆధ్యాత్మిక కథనములు వినుచూ ఉండటం చేతను, ఆసనము - ప్రాణాయామము - సమాధి.. మొదలైన యోగమార్గసాధనములు ఆశ్రయించటము చేతను బుద్ధి పరిపక్వము, సునిశితము కాసాగుతుంది.
➤ చిత్తము ‘‘ఏకాంతము’’ ఆశ్రయిస్తూ ఉంటుంది. ఫలితంగా దృశ్య వ్యవహారపరంపరల నుండి ఉపశమించనారంభిస్తోంది. మలినములు (కోపము-ఆవేశము-పరదూషణ- ఆత్మస్తుతి - ఆత్మనింద మొదలైనవి) తొలగుచుండగా చిత్తము నిర్మలత్వముతో కూడి ప్రకాశమానమవనారంభిస్తోంది.
➤ క్రమంగా చిత్తము అసంగము (Non-Attachment with worldly matters and incidents) వలన కలుగుసుఖము ఆస్వాదించసాగుతుంది. ఆతని ప్రవర్తన నిష్కాపట్యమును సంతరించుకోసాగుతుంది.
- సాధు సంగము వృద్ధి అగుచుండుటచేతను,
- శాస్త్రమార్గముల అభ్యాసము చేతను,
- పుణ్యకర్మల ప్రవృద్ధి చేతను
అట్టి యోగి పట్ల వస్తు దృష్టి (స్థూలదృష్టి) తరుగుచూ, సూక్ష్మదృష్టి (ఆత్మదృష్టి) రూపుదిద్దుకోసాగుతుంది.

అభ్యాసవశంగా ఆ యోగి ‘3’వ భూమికలో (అసంసర్గములో) సుస్థిర స్థానమును సక్రమంగా సంపాదించుకొనుచున్నాడు. ఆతని బుద్ధి అసంసర్గ యోగభూమికలో ఉత్తరోత్తర స్థితులు పొందసాగుతోంది.

సాంకృతి మహర్షి : ‘అసంసర్గము’ అను ‘3’వ యోగ భూమికలో ‘ఉత్తరోత్తర స్థితులు’.. అని దేనిదేనిని అంటున్నారో.. దయచేసి వివరించండి.

ఆదిత్య భగవానుడు : అసంసర్గము యొక్క స్థితి రెండు మెట్లుగా చెప్పబడుతోంది.
(1) సామాన్య అసంసర్గము (2) విశేష అసంసర్గము.

1. సామాన్య అసంసర్గ యోగ భూమిక

ఈ భూమికలో ప్రవేశించిన యోగి యొక్క భావనలు, అవగాహనలు ఈ తీరుగా ఉంటాయి.

➤ నేను దేనికీ కర్తను కాదు.. భోక్తను కాదు. జలంలో తరంగముల కదలికలకు సూర్యుని ప్రతిబింబము కదలుచున్నట్లు కనబడుచున్నంత మాత్రముచేత ఆ కదలికల కర్తృత్వము ఆకాశములోని సూర్యబింబమునకు ఉండదు కదా!
➤ నేను దేని చేతనూ బాధించబడువాడను కాను. దేనిని బాధించువాడను కూడా కాదు.
➤ నాటకంలోని పాత్ర యొక్క (నాటకంలోని) కర్తృత్వ భోక్తృత్వాలు నటునికి ఆపాదించలేము. అట్లాగే, నటుని యొక్క వ్యక్తిగతమైనదేదీ నాటకములలోని సందర్భములకు సంబంధించి ఉండదు కదా! జగత్తులో వ్యక్తిగతమైనదేదీ నాయొక్క ఆత్మకు ఆపాదించజాలము.
➤ కథలోని సంఘటనలన్నీ కథారచయిత యొక్క కల్పనా చమత్కారమే! అట్లాగే ఈ ప్రపంచంలో కనిపించేది, జరుగుచున్నట్లు అనిపించేది-ఇదంతా జగత్ రచయిత అగు ఈశ్వరాధీనం (లేదా) ఇతఃపూర్వక కర్మలచే నిర్మితము.
➤ ఇక్కడి భోగ, అభోగాలు మహారోగాలు. సంపదలన్నీ ఆపదలు. ఇక్కడి సంయోగములన్నీ వియోగమునకు దారి తీసేవే.
➤ ఇక్కడి సుఖ-దుఃఖాలకు నాకు కర్తృత్వము లేదు. భోక్తృత్వము లేదు. పాత్రయొక్క దుఃఖాలు పాత్రధారునివిగా అవుతాయా? వ్యక్తిగతమౌతాయా? కావు కదా!
➤ ఇక్కడి భోగ-అభోగములు నా అధీనంలో ఉన్నాయనో, నాకు సంబంధించినవనియో అనుకోవటము (లేక) మరొకరి ఆధీనంలో ఉన్నాయని అనుకోవటము కూడా.. మనస్సు యొక్క అల్పచింతనా వ్యవహారము మాత్రమే. మనో వ్యాధి మాత్రమే.
➤ మనస్సు ఏమనుకొంటే అది అట్లే మనస్సుకు అనిపిస్తోంది. అంతకుమించి ఏ విశేషమూ లేదు. మనస్సు దేనిని ఏ తీరుగా భావన చేస్తూ, చూస్తూ ఉన్నదో,…. అదియే ‘జగదనుభవము’గా మనస్సుచే పొందబడుతోంది.
➤ ఇక్కడి సుఖ-దుఃఖములు సంయోగ వియోగములు, బాధ-అబాధలు, ఆధి-వ్యాధులు అన్నీ కాలము యొక్క చమత్కారములు మాత్రమే! అంతే కాకుండా, ఇవన్నీ భావనను అనుసరించి మాత్రమే ఉన్నాయి. భావన లేకుంటే అవేవీ లేవు. కాబట్టి ఆత్మభావనచే అన్నీ సశాంతించగలవు.

ఈ విధమైన అవగాహనలచే అసంసర్గయోగి భావించటము ‘సామాన్య అసంగము’ అని అంటారు. ఇట్టి భావనలచే సర్వజగత్ భావములు జయించబడుచున్నాయి. మహావాక్యముల అర్థమననముచే మనస్సు నియమించబడి అతీతత్వము సంపాదించుకోవటమే - సామాన్య అసంగ లక్షణము.

2. విశేష అసంసర్గ యోగ భూమిక

పై విధమైన సామాన్య అసంసర్గము యొక్క అభ్యాసముచే ఆ యోగి క్రమంగా విశేష అసంసర్గ యోగభూమికలో ప్రవేశించుచున్నాడు.

➤ మహాత్ములతో ఏర్పడు ‘ఆత్మతత్త్వము’ గురించిన అనునిత్య-విశ్లేషణపూర్వక సంభాషణచేతను,
➤ రేచక-పూర్వక.. అంతర్ కుంభక.. బాహ్య కుంభక ప్రాణాయామాది అభ్యాసములచేతను (ప్రాణయోగ సాధనల చేతను),
➤ ‘‘నాఽహంకర్తా! నేను దేనికీ కర్తను కాదు. అట్లాగే ఎదుటివాడు కర్త కాదు. ఈశ్వరుడే సర్వమునకు కర్త!’’… అను అకర్తృత్వ అభోక్తృత్వ భావనల చేతను..,
➤ ‘‘నాకు తదితరుల వలన కలుగు అసౌకర్యములకు, ఇతరులు కలిగించు బాధలకు ఆ ఇతరులు కర్తకాదు. నా యొక్క ప్రాక్తన కర్మలే (ఇతః పూర్వము నాచే నిర్వర్తించబడిన కర్మలే) కర్త’’ - అని భావించుచుండటము చేతను…,
➤ నాటకంలో పాత్ర పొందు కష్ట - సుఖములు, లాభ - నష్టములు, సంపద - ఆపదలు, ఆ పాత్రగా నటిస్తున్న వానివి కావు, నాటకములోనివి మాత్రమే! అట్లాగే…., ‘‘ఈ జగన్నాటకంలో నా జీవాత్మ పాత్ర యొక్క కష్ట - సుఖములు, లాభ - నష్టములు, సంపద - ఆపదలు జగన్నాటకంలో నేను వహిస్తున్న పాత్రవేకాని.. నావికావు’’.. అను ఎరుక- అవగాహన - భావనల చేతను,
‘‘శ్రేష్ఠ-అసంగయోభూమిక’’ రూపుదిద్దుకొని పరిపుష్ఠిపొందుతోంది.

ఈ జీవుడు అయోగి (యోగాభ్యాసి కానివాడు) అయినప్పుడు తాను పొందుచున్న సందర్భములకు, సంఘటనలకు, సంబంధ- బాంధవ్యములకు, సుఖ-దుఃఖములకు, సంపద-ఆపదలకు, పుణ్య-పాపములకు సమీపంగా (very close) మనస్సును నిలిపి, వాటితో అభేదత్వము - సంగత్వము - మమేకత్వము పొందుచున్నాడు.

యోగి విషయంలోనో? అవన్నీ తన జగదంతర్గత స్వరూపమునకు అతి సమీపముగా ఉన్నప్పటికీ కూడా, తాను అతిదూరంగా ఉండుటను అభ్యసిస్తున్నాడు. అట్లు ఎరుగుటయే ‘నాఽహమ్‌కర్తా’ అయి ఉన్నది. ఇదియే యోగి విలక్షణ లక్షణము.

ప్రాపంచక సర్వ విశేషముల పట్ల, విషయ పరంపరల పట్ల ఎవ్వరి మనస్సు మౌనము - ప్రశాంతత వీడకుండా దర్శనము చేయుచున్నదో, సర్వశబ్దార్థములను దాటివేసి ఉంటోందో ఆతడే ‘శ్రేష్ఠ అసంగ యోగి’ అని పిలుబడుచున్నాడు.

┄ ┄ ┄

ప్రథమ భూమికలో మనము చెప్పుకొన్న ‘‘యోగస్థః కురు కర్మాణి’’, ‘‘నీరసోవా అధ మా కురు’’; ‘‘విరాగమ్’’, ‘‘క్రియాసు ఉదారరూపాసు’’; ‘‘గ్రామ్యాసు జడచేష్టాసు సతతం విచికిత్సతః’’, ‘‘పుణ్యకర్మాణి సేవనమ్’’; ‘‘పాపాత్ బిభేతి’’; ‘‘న భోగం అపేక్షత’’; ‘‘స్నేహ ప్రణయగర్భాని’’, శాస్త్రాణి అపేక్షతా….’’ మొదలైన ఆయా విశేషములతో కూడిన ప్రథమ యోగ భూమిక (శుభేచ్ఛ) యొక్క అభ్యాసముచేత క్రమంగా (విషయములకు సంబంధించని) సంతోషము, ఆనందము స్వాభావికమౌతూ వస్తాయి.

అట్టి ప్రథమ భూమిక-తడిసిన భూమిపై నాటిన అమృతరూపమగు విత్తనముయొక్క అంకురము వంటిది-అగుచున్నది.

ఆత్మస్వరూప-స్వభావములకు ఒకానొక అకృత్రిమ మాధుర్యము, అమృతభావన అంకురిస్తున్నాయి. ‘శుభేచ్ఛ’ యొక్క శ్రద్ధ - మహదాశయములతో కూడిన అంతర-ప్రవృత్తి -బాహ్యప్రవర్తనలే ఈ జీవుని - స్వయముగా స్వభావ సిద్ధంగా ‘2’వ మరియు ‘3’వ యోగ భూమికలకు దారిచూపుతోంది. తెర ఎత్తుచున్నది.

అన్ని భూమికలలో కూడా తృతీయ భూమిక శ్రేష్ఠమైనది. ఎందుకంటారా? ‘అసంసర్గము’ అనే శ్రేష్ఠయోగ భూమిలో అసంఖ్యాక సంకల్ప పరంపరాప్రవాహము నుండి ఈ జీవుడు విడివడుచున్నాడు. అట్లు విడివడుచుండగా, సంకల్ప ప్రవాహముల వేగము, వాటి దోషపరిణామములు, దుఃఖ స్థితిగతులు నిరోధించబడినవి అగుచున్నాయి. అసంసర్గము అను 3వ భూమికలో శ్రేష్ఠ-అసంసర్గమును చేరినవాడు ఇక ఆపై భూమికలలో సులభముగాను, సుఖకరముగాను ప్రవేశిస్తూ.. ఉత్తరోత్తర భూమికాస్థానములను తేలికగా అందుకొంటున్నాడు.

మొదటి ‘3’ భూమికల నిరంతరమైన శ్రద్ధతో కూడిన అభ్యాసముచే అజ్ఞానము క్షయిస్తూ వస్తుంది. ప్రాపంచక విశేషాలన్నీ ‘‘ఇవన్నీ కాలబద్ధం. అనేక స్వప్నములు చూచువానికి ఒక స్వప్నంలో తారసపడే కొన్ని కొన్ని విశేషాల వంటివే ఈ జీవిత సంఘటనలు’’…. అను దృష్టి ప్రవృద్ధమౌతూ ఉంటుంది. ఇక ఆపై ఆ యోగి క్రమంగా 4వ యోగ భూమికలో ప్రవేశము పొందుచున్నాడు.


నాలుగవ యోగ భూమిక - “తనుమానస” - “స్వప్న భూమి”

ఆతనికి సర్వ జీవులు ఆత్మ స్వరూపంగా కనిపించసాగుతారు.

సమం సర్వం ప్రపశ్యంతి చతుర్థీం భూమికాం గతాః।
ఆతనికి, ‘‘సమం సర్వషు భుతేషు తిష్ఠంతమ్ పరమేశ్వరమ్’’ - అను సర్వసమత్వముపట్ల సందేహములు తొలగసాగుతాయి.

✤ సర్వజీవులలోను ఆత్మ సర్వదా సమముగా వేంచేసియున్నది.
✤ ఆత్మయందే సర్వజీవులు సర్వదా ప్రదర్శితులై ఉన్నారు.
✤ ఈ కనబడేదంతా ఆత్మయే! ఆత్మయందే ఈ సర్వముగా కనిపిస్తోంది.
అను మనో భూమికయే ఈ నాలుగవది.

ఇందులో 2 ముఖ్యమైన లక్షణాలు :

(1) పరమాత్మయే జీవాత్మగా అజ్ఞాన దృష్టికి అగుపిస్తున్నారు. జ్ఞాన దృష్టికి ఈ జీవాత్మ సర్వదా పరమాత్మ స్వరూపుడే. ఈ జీవాత్మ స్వయముగా-సహజముగా పరమాత్మయే! కల్పితమగు ‘సందర్భము’గా మాత్రమే జీవాత్మగా అగుపిస్తున్నాడు. కనుక జీవాత్మ-జగత్తు అనునవి రెండూ పరమాత్మ రూపమే! అట్టి పరమాత్మయే నా యొక్క అనునిత్య దివ్య రూపము’’ అనే అద్వైత స్థైర్యము రూపుదిద్దుకుంటోంది.

(2) ద్వైతమంతా ఉపశమించసాగుతోంది. ఈ 4వ భూమిలో ప్రవేశించినవాడు - పశ్యంతి స్వప్నవత్ లోకం చతుర్థీం భూమికామ్ గతాః-ఈ వర్తమాన దృశ్యజగత్తంతా కూడా రాత్రిపూట వస్తూ ఉండే అనేక అసంఖ్యాత స్వప్నములలో ఒకానొక రోజుకు సంబంధించిన స్వప్నములోని ఒక దృశ్యము వంటిది మాత్రమే-అను దృష్టి, భావన, సంకల్పము సిద్ధించుకొంటూ ఉంటాడు.

అందుకే…,
- మొదటి మూడు భూమికలు ‘జాగ్రత్’ వంటివి,
- 4వ భూమికయో.. ‘స్వప్నము’ వంటిది-అని అభివర్ణించబడుతోంది.

సాంకృతి మహర్షి : హే సద్గురూ! భాస్కరా! ఈ 4వ యోగ భూమికలో ప్రవేశించినవాని చిత్తము ఏ తీరుగా, ఏ రూపము కలిగి ఉంటుంది?

ఆదిత్య భగవానుడు : వర్షాకాలంలో కారుమబ్బులు ఆక్రమించుకొని ఆకాశం మేఘావృతమై కనిపిస్తూ ఉంటుంది. అదే, శరత్కాలంలో? ఆకాశంలోని మబ్బులు తునాతునకలై గాలిచే ఎటెటో కొట్టుకుపోయి ఆకాశం నిర్మలంగా కనిపిస్తుంది కదా!
అట్లాగే.. చిత్తం తు శరదాహ్రాంశ విలయం ప్రవిలీయతే।… చిదాకాశంలో ‘చిత్తము’ అనే మేఘము ముక్కలు ముక్కలై ‘ఆత్మజ్ఞానవీచికలు’ అనే వాయు తరంగాలచే ఎటెటో కొట్టుకుపోబడుతాయి.

ఈ విధంగా జగత్ దృశ్యమంతా కూడా ‘స్వప్న దృశ్యము’గా ఆ యోగాభ్యాసి చిరునవ్వు-ప్రశాంతతలతో చూస్తూ-చూస్తూ ఉండగా,… క్రమంగా ఆతడు 5వ యోగ/జ్ఞాన భూమికలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ సమయములో ఇక చిత్తము తన ఉనికిని కోల్పోవనారంభిస్తుంది. చిత్తము కేవల చిత్ స్వరూపముతో ఏకత్వము పొందసాగుచున్నది.


ఐదవ యోగ / జ్ఞాన భూమిక - ‘‘సుషుప్త పద’’

5వ యోగ జ్ఞాన భూమికలో ప్రవేశించుచుండగా ఆ యోగి కేవలసత్తాస్వరూపము (A form of Al-Pervading Absolute Self)ను సంతరించుకొనుచున్నాడు.

ఆతని పట్ల ఇక జగత్ సంబంధమైన వికల్పములేవీ ఉండవు. ‘‘నేను వేరు - జగత్తు వేరు - నీవు వేరు - ఆతడు వేరు’’.. అను భేదానుభవమంతా కూడా ఉండీ లేనిదగుచున్నది. ‘అంతా సర్వదా ఏకాత్మయే’ - అను అనుభూతి యందు వేడి తగిలినప్పటి మంచుగడ్డ యొక్క ఆకారము వలె - కరిగిపోతోంది. చిత్తము - కేవల చిత్ స్వరూపమును సంతరించుకొని ఉంటోంది. చిత్తము లయిస్తూ ఉండగా, అద్దాని యొక్క ఇతః పూర్వపు ప్రపంచ సంబంధమైన భేదభావ గీతికలు (The murmuring about differences / diversities) సన్నగిల్లుతూ ‘నిశ్శబ్దత’ను సంతరించుకో సాగుతాయి. గాఢనిద్రలో ఉన్న వాడి వలె ఈ జగత్తును మొదలే కించిత్తు కూడా లేనిదానిగా ఆతడు చూస్తున్నాడు.

అందుచేతనే - పంచమీ భూమికామ్ ఏత్య సుషుప్త పదనామికామ్।ఈ 5వ యోగ భూమికను ‘సుషుప్తపద’ అని పిలుస్తున్నారు.

ఈ 5వ భూమికలో ప్రవేశించిన యోగి బాహ్యంగా అందరి వలెనే ఉంటూ ఉన్నప్పటికీ,
అంతరమున…,
✤ పరమ శాంతుడై ఉంటాడు. దృశ్యమంతా తనయొక్క ద్రష్టత్వమునందు మొదలంట్లా సశాంతించినదై, ఆత్మతో అభిన్నత్వము వహించి ఉంటాడు.
✤ ‘‘స్వస్వరూప-సర్వస్వరూప ఏకాత్మకు మించి మరింకెక్కడా ఏదీ మరొకటి లేనే లేదు కదా!’’ - అను స్వాభావిక భావన సంతరించికొని ఉంటాడు.

అశేష-విశేషాంశ నిశ్శేష రూపమగు శాంత-అద్వైతమునందు నిశ్చలుడై ఉంటాడు. శాంత-అశేష-విశేషాంశః సుషుప్త పద నామికామ్ ‘‘అద్వైత మాత్రకః’’ తిష్ఠతి! శాంత - అద్వైత అశేష (నిశ్శేష) సర్వస్వరూపుడు - తానే అయి సర్వమును ఆస్వాదిస్తూ ఉంటాడు.

దర్పణంలో కనబడే దృశ్యమంతా వాస్తవానికి దర్పణము (అద్దము)లో ఏ మాత్రము లేకయే, దర్పణమునకు అభిన్నమైయున్నది కదా! అట్లాగే 5వ యోగ భూమికా ప్రవేశి - ‘‘నాయందు నేనే ‘నీవు-జగత్తు’ రూపమును దర్పణము (అద్దము)లోని ప్రతిబింబము వలె కలిగి ఉన్నాను.

నేనే ఇదంతా అయి, ఇదేమీ నేను కాకయే ఉన్నాను. బంగారు ఆభరణములో ఆభరణమంతా బంగారమే అయి, బంగారము యథాతథంగానే ఉంటోంది కదా! ఇదంతా నేనే! ఇదేమీ నేను కాదు కూడా. నాకు వేరుగా జగత్తు లేదు. ‘నీవు’ మొదలైనవి లేవు. మరింకొకటేదీ ఎన్నడూ లేదు. అద్వితీయమహమ్। బంగారము నుండి ఆభరణమును విడదీయలేనట్లే నానుండి వేరుగా జగత్తు లేదు. నేను కేవల సత్తా స్వరూపుడను. ఈ జగత్తు నా సత్తా స్వరూపము’’ - అను అనుభూతి, అనుభవము కలిగి ఉంటున్నాడు.

ఆతని మనో-చిత్తములు సుషుప్తస్థితిని సంతరించుకొని, ఆ స్థితి వీడకయే జగత్తును ‘‘క్రీడా-లీలా అవిషయ విశేషము’’గా కలిగి ఉంటున్నాడు. ఇక ఆతని యందు ద్వైతమునకు సంబంధించిన దృష్టియే ఉండదు. ఒకడు నాటకంలో నటిస్తూ ‘‘ఇది నాటకమే’’.. అని ఎరిగి ఉన్నట్లు ఈ పంచమభూమికా స్థాన యోగి ‘‘అంతా ఆత్మయే! నేనే!’’.. అని గ్రహించి స్వభావసిద్ధమైన నిత్యానుభూతిని ప్రసిద్ధం చేసుకొని ఉంటున్నాడు.

అంతర్ముఖతయా తిష్ఠన్, బహిర్-వృత్తిపరోపిసన్! బాహ్య జగత్ వృత్తులు ప్రదర్శిస్తూ కూడా అంతర్ముఖుడే అయి ఉంటున్నాడు. ‘‘ఆత్మయగు నాయందే నేను జగత్ చమత్కారముగా ప్రదర్శనమగుచున్నాను’’ అను అంతర్ముఖత్వమును కించిత్ కూడా వీడకయే ఉంటున్నాడు. త్రిమూర్తి స్వరూపుడు, త్రిమూర్తి స్వభావుడు అగుచూనే, విషయరహిత కేవల సాక్షిగా కూడా స్వానుభవి అగుచున్నాడు.

అంతర్ముఖత్వము: ‘‘నా యందు నేనే సర్వజగత్ ఊహకల్పనామయుడను’’ - అను ‘‘అనునిత్యానుభూతి’’ గల ఆ యోగి ఎల్లప్పుడు అంతరమును పరమశాంతుడై ఉంటాడు. నిత్యము ప్రవిశ్రాంతుడై పరమ విశ్రాంతిని అనుభవిస్తూ, ‘వాసనారాహిత్యము’ను అనుభవిస్తూ ఉంటాడు. అందుచేతనే ఈ భూమికను ‘సుషుప్తపదము’ అని పిలుస్తున్నారు. ఇట్టి 5వ యోగభూమికా అభ్యాసము చేస్తూ ఆ యోగి ఎప్పుడో ‘తుర్యాభిద’ - అనబడు ఆరవ (6) యోగ భూమికలో ప్రవేశము పొందుచున్నాడు.


ఆరవ యోగ / జ్ఞాన భూమిక - “తుర్యాభిద”

ఈ ‘తుర్యాభిద’ అనబడు 6వ యోగ భూమికలో ప్రవేశించినవాడు జీవన్ముక్తుడు. ఈ జీవుడు జీవన్ముక్తుడు అవటము గురించి చెప్పుచున్నాను. వినండి.

➤ యత్రన అసత్-న సత్ రూపోః, ఏ స్వస్వరూపము అసత్‌గాని సత్ అనిగాని అనలేమో, ఏది సత్-అసత్‌భావములకు అతీతమో, సాక్షియో, అప్రమేయమో…,
➤ న అహమ్ - న అనహమ్… ఏది అహమ్ - అనహమ్‌లకు కూడా అతీతమైనదో, జాగ్రత్త-స్వప్న-సుషుప్తులలోని ‘నేను’ ను నియమించునదై, అహమ్-అనహమ్‌లచే నిర్ణయము - పరమితము కాదో..,
➤ కేవలం ‘క్షీణమనన’ ఆస్తే అధ్యయతేతి (అద్వైతేతి) నిర్భయః … మననము - మనస్సు ఎద్దానిదో, ఏది మనస్సులయించినా కూడా అద్వయమై, ద్వితీయము లేదు కాబట్టి నిర్భయమై ప్రకాశించుచున్నదో…,
➤ స్వయంప్రకాశకః…, ఏది తన ఉనికిచే జాగ్రత్ స్వప్న సుషుప్తులను ప్రకాశింపజేయుచు, మనో - బుద్ధులను ప్రవర్తింపజేయుచూ…. అవన్నీ తానే అయి ఉంటోందో.., నిర్‌గ్రంథిః - ఏది గ్రంధులకు సంబంధించినది కాదో,
➤ శాంతసందేహో.. స్వస్వరూపము - జీవుడు - జగత్తులకు సంబంధించిన సర్వ సందేహములు సశాంతించిన స్థానమో…,
అట్టి స్వస్వరూప-సహజ స్థానమునే ‘జీవన్ముక్తి’.. అని అంటున్నారు. అనగా ఈ జీవుడు అట్టి స్వస్వరూపు సునిశ్చితచే సుస్థానుడై, సుస్థాపితుడై ‘జీవన్ముక్తుడు’ అని పిలిపించుకోబడుచున్నాడు.

అట్టి జీవన్ముక్తుడు అనిర్వాణుడు (బద్ధుడు) అయినా, (లేక) నిర్వాణుడు (ముక్తుడు) అయినా…, ఉభయస్థితులలోను చిత్రములోని దీపము వలె నిర్విషయుడు, నిర్లక్షణుడు అయి ఉంటున్నాడు.

నాటకంలో దీపంలాగా అన్నీ ప్రకాశింపజేయుచూ, దేనికీ సంబంధించనివాడు అయి ఉంటున్నాడు.

ఈ విధంగా జీవన్ముక్త స్వరూపమగు ‘‘తుర్యాభిద కేవలజ్ఞాన భూమిక’’ను అభ్యసిస్తూ అట్టివాడు క్రమంగా ‘విదేహముక్తి’ అనబడు సప్తమ (7వ) జ్ఞానైశ్వర్య-యోగపరాకాష్ఠ భూమికలో ప్రవేశము పొందుచున్నాడు.


సప్తమ యోగ / జ్ఞాన భూమిక - ‘‘విదేహ ముక్తుడు’’

ఆదిత్య భగవానుడు : ఓ సాంకృతి మహర్షీ! సప్తమ భూమికను చేరిన యోగి యొక్క సంస్థితిని ‘ఇటువంటిది’ అని చెప్పుటకు అలవికాదు. వచసామ్ అగమ్యా! పరమ శాంతమైనది. అదియే ఈ జీవుని అంతిమ పరమస్థానము. అట్టి సప్తమ భూమిక - లోకవిషయములు అన్నీ పరిత్యజించబడునట్టిది. దేహముల రాక-పోకలను దాటివేసినట్టిది. శాస్త్ర నిర్వచనముల-నియమముల నిర్దేశ్యముల పరిధులను కూడా అధిగమించి వేసినట్టి స్థితి. సర్వలౌకిక పారలౌకిక ధ్యాసలన్నీ అధిగమించినట్టిది. వాటికి ఏమాత్రము పట్టుబడనట్టి కేవల సర్వసమన్విత -సర్వాతీత స్వస్థానము అది. సర్వధ్యాసలు దాటి పోవటము అయినట్టిది. ‘ధ్యాస’ అనునది తనయందలి అనన్య-చమత్కారముగా ఆస్వాదించు స్థానము.

అట్టి స్థానము ‘ఓం’ అను ఏక-అక్షర బ్రహ్మ సంజ్ఞతో చెప్పబడుతోంది. ఈ విశ్వుడు-ఆతని అనుభవమైనట్టి జగత్తు, తేజసుడు-ఆతనికి అనుభవమగు స్వప్నము, ప్రాజ్ఞుడు-ఆతనికి అనుభవమగు సుషుప్తి-ఇవన్నీగా కనబడుచూ, వీటికి వేటికి సంబంధించనిది. ఇవన్నీ అద్దాని ప్రకటనయే అయి ఉన్న కేవల స్వస్వరూపము. ఏకము అఖండము అగు ఆ కేవలీ ఆత్మయే నిర్విశేష-తత్త్వము.

సప్తమ భూమికలో యోగి సర్వము తానే అయి, దేనితోనూ కూడా అభేదమై ప్రకాశించు స్వస్వరూపాత్మతత్త్వము తానే అయి ఉంటాడు. అకార - ఉకార మకారములు, జాగ్రత్-స్వప్న-సుషుప్తులు- ఇవన్నీ కూడా ఆత్మకు భిన్నం కాదు. అది ఈ ఈ రూపములుగా అగుచుండటమూ లేదు.

అట్టి 7వ భూమిక (విదేహముక్తత్వము)లో ప్రవేశించిన వానికి- అ కారమాత్ర విశ్వుడు (జాగ్రత), ఉ కారమాత్ర తేజసుడు (స్వప్నము), ‘మ’ కారమాత్ర ప్రాజ్ఞుడు (సుషుప్తి) - వేరుగా ఏమాత్రమూ లేరు. తాను తానుగా ఉంటూనే అవన్నీ తానై ఉంటున్నాడు.

ఓ సాంకృతి మహర్షీ! అట్టి స్వస్వరూప కేవల ప్రకాశము ‘సమాధి’ అను స్థితికి కూడా మునుముందే ఉన్నట్టిది. సమాధి స్థితిని కూడా దాటిపోయినట్టిది.

సాంకృతి మహర్షి : అట్టి 7వ భూమికా ప్రవేశమగు ‘విదేహముక్త’ రూపము సంతరించుకొనుటకు యోగులు ఆశ్రయించు యోగమార్గము గురించి దయచేసి వివరించండి.

ఆదిత్య భగవానుడు :
(1) ఇక్కడ పాంచభౌతిక నిర్మితంగా స్థూలమై దర్శించబడేదంతా, సూక్ష్మతత్త్వములగు శబ్ద-స్పర్శ- రూప-రస-గంధములుగాను, మనోనిర్మితంగాను గ్రహిస్తూ స్థూలమును సూక్ష్మరూపంగా దర్శించాలి.
(2) స్థూల సూక్ష్మములన్నీ వాటివాటి క్రమములతో సహా (ఆకాశాత్-వాయుః వాయురాగ్ని మొదలైనవన్నీ) జీవాత్మయందు, అనేక దేహముల జీవాత్మను ఈశ్వరత్వమునందు, ఈశ్వరత్వమును చిదాత్మయందు దర్శించాలి.
(3) సర్వము చిదాత్మయొక్క సంప్రదర్శనముగా దర్శించాలి.
(4) అట్టి చిదాత్మలో - ద్రష్ట-ద్రష్టత్వ-దృశ్యములనబడే త్రిపుటిలను/త్రిపురములను ఏకముచేయాలి.

నేను స్వతఃగా స్వయముగా నిత్యశుద్ధము, నిత్యబుద్ధము, నిత్యముక్తము అగు కేవల సత్‌స్వరూపుడను!

నేనే ఈ సర్వజగత్ రూపుడను. అంతేగాని ఒక భౌతిక దేహపరిమితుడను కాను!

జగత్తు నాకు ద్వితీయము కాదు. నేను జగత్తుకు ద్వితీయుడనుకాదు. జీవాత్మకు జగత్తుకు వేరుగా నేను లేను. నాకు వేరుగా జీవాత్మ-జగత్తులు లేవు. నాకంటే ఏదీ వేరు కాదు. కనుక అద్వితీయుడను. పరమానందమగు సర్వజీవులలో సర్వదా స్వస్వరూపముగా ప్రకాశించు అఖండాత్మను నేనే! అందుచేత వాసుదేవస్వరూపుడు.

అహమ్ వాసుదేవోఽస్మి = నేను వాసుదేవ స్వరూపుడను.
వాసుదేనమిదగ్ం సర్వమ్ = ఈ జీవులు - ఈ కనబడేది అంతా వాసుదేవస్వరూపమే।
అహమ్ ఏవ‌ ఇదగ్ం సర్వమ్ : ఈ కనబడేదంతా అఖండాత్ముడగు నేనే!
– అనునదే ‘7’వ భూమికను సిద్ధించుకొన్న యోగి యొక్క (విదేహముక్తుని యొక్క) అనునిత్య సహజ స్వాభావికానుభావము.

ఇంతగా చెప్పుకున్నా కూడా, అది అనిర్వచనీయము. స్వానుభవమాత్రము. మాటలకు అందని మౌనస్వరూపము.


కాబట్టి…,
ఓ నిర్మల హృదయుడా! దోషరహితుడా! సాంకృతి మహర్షీ!

తస్మాత్ సర్వం పరిత్యజ్య తత్త్వనిష్ఠో భవ! ఇంద్రియ విషయమై ఎదురుగా కనిపిస్తున్న ఈ దృశ్యజగత్తును బుద్ధితో మొదలంట్ల త్యజించినవాడవై ఉండెదరుగాక!

‘‘వాసుదేవస్సర్వమితి। అహమ్ వాసుదేవోఽస్మి ’’.. భావనను ప్రవృద్ధి పరచుకోండి. అదియే ‘విదేహముక్తి’ యొక్క ముఖ్యలక్షణము.

అనుకోవటము→అభ్యాసము. అనిపించటమో→ విదేహముక్త సిద్ధి. (1) తత్ త్వమ్ - నీవు తత్ ఆత్మస్వరూపుడువే (2) నేను కూడా అట్టి ఆత్మానంద స్వరూపుడనే అను నిష్ఠ కలిగి యుండుము.

బ్రాహ్మీస్థితి :
→ ‘అవిద్య (ఆత్మధర్మమును ఏమరచి ఉండటము) అనే అంధకారమునకు ఆవల సాక్షి అయి (తమసః పరస్తాత్) ప్రకాశించుచున్నట్టిది…,
→ సర్వ ఆభాసలకు (For all kind of Illusions) ఆవల సర్వదా ఆభాసరహితమై వెలుగొందుచున్నట్టిది..,
→ నిర్హేతుకమైన-స్వభావసిద్ధమైన ఎట్టి కారణ-కార్య సందర్భములపై ఆధారపడనట్టి ఆనందానుభవరూపమైనది..,
→ దృశ్య దోషరహితమై, నిర్మలమై, ఈ జీవుని పట్ల సర్వదా-సదా సిద్ధించియే ఉన్నట్టిది…,
→ ‘ఇట్టిది’ అని మాటలతో చెప్పజాలనిది, అవాక్-మానస గోచరమైనది…,
→ ఘనీభూతమైన ప్రజ్ఞా ఆనందస్వరూపమైనట్టిది…,
అగు బ్రహ్మమే నేను! అహమ్ బ్రహ్మఽస్మి । నాఽహమ్ దృశ్య-దేహ-ఇంద్రియ-ఇంద్రియార్థ-మనో-బుద్ధి-చిత్త-అహంకారాదిమ్। అని గ్రహించి బ్రహ్మముగా ప్రకాశించెదరు గాక! ఇది సత్యము। సత్యము। సత్యము।



🙏 ఇతి అక్షి ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।