[[@YHRK]] [[@Spiritual]]

Amruta Bindu Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


కృష్ణయజుర్వేదాంతర్గత

2     అమృత బిందూపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్



శ్లో।। అమృత బిందూపనిషత్ వేద్యం యత్ పరమాక్షరమ్।
తదేవహి త్రిపాద్రామచంద్రాఖ్యం। సః పరాగతిః।।
ఏదైతే పరము (Final) అక్షరము, అమృతతత్త్వమై యున్నదో అట్టి ఆత్యంతిక తత్త్వమును ఈ అమృత బిందూపనిషత్ మనందరినీ తట్టి నిద్రలేపి గుర్తు చేయుచున్నది. పరతత్త్వమార్గమును సుగమం చేయుచున్నది.


మనో హి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చ .
అశుద్ధం కామసంకల్పం శుద్ధం కామవివర్జితం .. 1..
ఓం
1. మనోహి ద్వివిధం ప్రోక్తం,
శుద్ధంచ - అశుద్ధమేవ చ।
అశుద్ధం → కామసంకల్పం,
శుద్ధం → కామవివర్జితమ్।।
మనం ఇప్పుడు పరతత్త్వమును ధ్యానిస్తున్నాము! మొట్టమొదటగా.. మనన రూపమగు మనస్సు రెండు విధములుగా ఉంటోందని విజ్ఞుల ప్రవచనము (1) శుద్ధము (2) అశుద్ధము.
మనస్సు యొక్క అశుద్ధ విభాగము దృశ్య సంబంధమైన - కామ - కామసంబంధమైన సంకల్పములు కలిగి ఉంటోంది. ఇక రెండవ విభాగము కోరికలు లేనట్టిదై, శుద్ధ స్వరూపము (The Absolute) అయి ఉంటోంది. జగత్ భావనకు మునుముందే ఉన్నట్టి మనస్సు ‘శుద్ధ మనస్సు’ అని ‘కేవల మనస్సు’ అని, ‘ఉన్మనీ’ అని చెప్పబడుతోంది. కేవల మనస్సు బ్రహ్మమే.

మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః .
బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం .. 2..
2. మన ఏవ మనుష్యాణాం
కారణం బన్ధ - మోక్షయోః।
బంధాయ విషయాసక్తం,
ముక్యైః నిర్విషయగ్ం స్మృతమ్।
ఈ జీవునకు బంధమునకు గాని, మోక్షమునకుగానీ.. కారణము మనస్సే! ఆత్మకు బంధము లేదు. మోక్షము లేదు.
దృశ్య విషయములందు ఆసక్తి కలిగి ఉండటమే బంధము.
మనస్సు విషయములను దాటిపోయి, సాక్షిత్వము వహిస్తూ, నిర్విషయత్వం సంతరించుకోవటమే ముక్తి.

యతో నిర్విషయస్యాస్య మనసో ముక్తిరిష్యతే .
అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షుణా .. 3..
3. యతో నిర్విషయస్య అస్య, మనసో ముక్తి రిష్యతే।
అతో నిర్విషయం నిత్యం, మనః కార్యం ముముక్షుణా।।
ముముక్షువు యొక్క మనోచర్యలన్నీ ఎప్పుడు ఆతని పట్ల నిర్విషయత్వం కలిగి ఉండటం జరుగుతుందో,…, అప్పుడు ఆతని మనస్సు ముక్తి పొందినదే అగుచున్నది. అట్టి మనస్సు యొక్క నిర్విషయత్వమే మోక్షము. ముముక్షువు అట్టి సాధనయందు నిమగ్నుడై ఉండును గాక.

నిరస్తవిషయాసంగం సంనిరుద్ధం మనో హృది .
యదాఽఽయాత్యాత్మనో భావం తదా తత్పరమం పదం .. 4..
4. నిరస్త విషయా సంగం, సం నిరుద్ధం మనో హృది
యదా యాతి ఆత్మనో భావం, తదా తత్ పరమం పదమ్।।
ఎప్పుడు విషయములందు ఆసక్తి (Inquisitiveness) విసర్జించి, మనస్సు హృదయములో నిరోధించబడినదై ఆత్మ భావన మాత్రమే కలిగి ఉంటుందో,.. అదియే ‘పరమపదము’.

తావదేవ నిరోద్ధవ్యం యావధృది గతం క్షయం .
ఏతజ్జ్ఞానం చ ధ్యానం చ శేషో న్యాయశ్చ విస్తరః .. 5..
5. తావత్ ఏవ నిరోద్ధవ్యం
యావత్ హృదిగతం క్షయమ్।
ఏతత్ జ్ఞానం చ, ధ్యానం చ।
శేషో న్యాయశ్చ విస్తరః।।
అందుచేత హృదయములో దృశ్య సంకల్పములు క్షయము అయేంత వరకు మనస్సును నిరోధిస్తూనే ఉండాలి. మనస్సును ప్రాపంచక విషయంగా నిరోధిస్తూ హృదయములో ఆత్మ భావన యందు ప్రతిక్షేపించటమే జ్ఞానము. అదియే యోగము. అదియే ధ్యానము కూడా! ఇక తదితర (పూజ స్తుతి మొదలైన) విషయాలన్నీ నిర్విషయ న్యాయము కొరకు విస్తరించబడి చెప్పబడే మధ్యే మార్గాలు మాత్రమే.

నైవ చింత్యం న చాచింత్యం న చింత్యం చింత్యమేవ చ .
పక్షపాతవినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా .. 6..
6. న ఏవ చిన్త్యం। న చ అచిన్త్యం। న చిన్త్యం చిన్త్యమేవ తత్।
పక్షపాత వినిర్ముక్తం, బ్రహ్మ సంపద్యతే తథా।।
- ఇక ఆత్మ ఎట్టిది? అది చింతనకు విషయం కాదు. అట్లా అని చింతన చేయలేనిదీ కాదు. మనస్సుకు విషయం కానవప్పటికీ చింతన చేయవలసినది అద్దాని గురించే! చిత్తము సర్వపక్షపాతములు విడిస్తే, అప్పుడిక బ్రహ్మమే శేషించగలదు.

స్వరేణ సంధయేద్యోగమస్వరం భావయేత్పరం .
అస్వరేణానుభావేన నాభావో భావ ఇష్యతే .. 7..
7. స్వరేణ సంథయేత్ యోగమ్,
అస్వరమ్ భావయేత్ పరమ్।
అస్వరేణ అనుభావేన
న (స)భావో భావ ఇష్యతే।।
పరమాత్మ శబ్దములకు విషయం కాదు. భావనకు కూడా అలభ్యం. అయినా కూడా స్వరము (సంభాషణ-గానము) భావనలతో యోగ మార్గంలో ఆత్మ వస్తువును అనుసంధానం చేయటమే సాధన. స్వరమునకు అవిషయమైనప్పటికీ స్వరముతో కూడిన భావనచే అద్దాని ‘సత్ స్వరూపము’ ఆస్వాదించబడగలదు. అనుభవమవగలదు.

తదేవ నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం .
తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం .. 8..
8. తదేవం నిష్కళం బ్రహ్మ,
నిర్వికల్పం నిరంజనమ్
‘‘తత్ బ్రహ్మా-అహమ్’’ ఇతి జ్ఞాత్వా,
బ్రహ్మ సంపద్యతే ధ్రువమ్।।
బ్రహ్మము సర్వదా నిష్కళంకమైనది. సంకల్ప - వికల్పములకు సాక్షి కాబట్టి నిర్వికల్పము. జన్మ-కర్మ-మనో-మాయ - ఇత్యాది దోషములచే స్పృశించబడటం లేదు. కాబట్టి నిరంజనము. తత్త్వశాస్త్రము ‘‘తత్‌త్వమ్’’.. అని గుర్తు చేస్తోంది. ‘‘అట్టి బ్రహ్మమే నేను’’… అని ఎరుగుటచే అధృవమును దాటి, ధ్రువమగు బ్రహ్మమును సముపార్జించుకొనగలము.

నిర్వికల్పమనంతం చ హేతుదృష్టాంతవర్జితం .
అప్రమేయమనాదిం చ యజ్జ్ఞాత్వా ముచ్యతే బుధః .. 9..
9. నిర్వికల్పం అనంతం చ,
హేతు దృష్టాంత వర్జితమ్
అప్రమేయం అనాదిం చ
యత్ జ్ఞాత్వా ముచ్యతే బుధః।।
అట్టి బ్రహ్మము నిర్వికల్పము. ఆద్యంత రహితము. అనంతము. అకారణము. దృష్టాంతాలతో-ఉపమాలంకారాలతో చెప్పబడగలిగేది కాదు. పుణ్య-పాప-జన్మ-జాగ్రత్-స్వప్న-సుషుప్తి.. ఇత్యాదులతో ప్రమేయము లేనిది. అది అనాది. వివేకి తన వివేకముతో అట్టి పరమాత్మను తనకు అభిన్నమైనదిగా గ్రహించి సర్వబంధముల నుండి వినిర్ముక్తుడు (Relieved) అగుచున్నాడు.

న నిరోధో న చోత్పత్తిర్న బద్ధో న చ సాధకః .
న ముముక్షుర్న వై ముక్త ఇత్యేషా పరమార్థతా .. 10.. var ముక్తః
10. న నిరోధో న చ ఉత్పత్తిః
న బద్ధో, న చ సాధకః,
న ముముక్షుః న వైముక్తః
ఇత్యేషా పరమార్థతా।।
వాస్తవానికి సర్వే-సర్వత్రా సర్వదా ఆత్మయే వెల్లివిరిసియున్నది. ఇక తదితరమైన దానికి దేనికీ వినాశనము లేదు. ఉత్పత్తి లేదు. అంతా ఆత్మయే అయి ఉండగా బద్ధుడెవడు? ముక్తుడెవడు? బంధవిముక్తికై సాధకుడెవడు? మోక్షార్థియగు ముముక్షువు ఎవడు? పరామర్థంగా చూస్తే ఇవేవీ లేదు.

ఏక ఏవాత్మా మంతవ్యో జాగ్రత్స్వప్నసుషుప్తిషు .
స్థానత్రయవ్యతీతస్య పునర్జన్మ న విద్యతే .. 11..
11. ఏక ఏవ ఆత్మా మన్తవ్యో
జాగ్రత్ స్వప్న సుషుప్తిషు।
స్థాన త్రయ వ్యతీతస్య
పునర్జన్మ న విద్యతే।।
ఆత్మ జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు వేరైనది. అఖండమగు ఆత్మయే జాగ్రత్ - స్వప్న-సుషుప్తులకు సాక్షి అయి ఉన్నది. ఆత్మ అనేకం అవటమే లేదు. ఏకమై ప్రకాశిస్తూ జాగ్రత్-స్వప్న-సుషుప్త మూడు స్థానములను కల్పన చేసుకొని, వాటి వాటి యందు లీలగా వ్యవహరిస్తోంది. అట్టి ఆత్మ యొక్క లీలా విన్యాసమును ఎరిగినవాడు ‘‘నేను జన్మించువాడను’’ అనే భ్రమ పునఃపొందడు. జన్మరహితుడౌతాడు. అందుచేత ఆత్మయే మననమునకు అర్హమైన సత్యవస్తువు.

ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః .
ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్ .. 12..
12. ఏక ఏవ హి భూతాత్మా
భూతే భూతే వ్యవస్థితః।
ఏకధా బహుధా చ ఏవ
దృశ్యతే జలచంద్రవత్।।
ఒకే చంద్రుడు ఆకాశములో ఉండి వేరు వేరు తటాకములలో వేరు వేరు ప్రతిబింబములుగా ప్రకాశిస్తున్నాడు కదా! అట్లాగే సర్వభూతాత్ముడు ఏకమే అయి ఉండి ఈ వేరువేరు జీవులలో వేరువేరు ఆత్మలుగా వ్యవస్థితుడైనట్లు అగుపిస్తున్నారు. ఆత్మ సర్వదా ఏకమే! అనేకముగా అగుటయే లేదు!

ఘటసంవృతమాకాశం నీయమానో ఘటే యథా .
ఘటో నీయేత నాకాశః తద్వజ్జీవో నభోపమః .. 13..
13. ఘట సంవృతమ్ ఆకాశం, నీయమానే ఘటే యథా,
ఘటో నీయత న ఆకాశః, తద్వత్ జీవో నభోపమః।।
ఒక చోట ఉన్న కుండను అక్కడి నుండి కదలుస్తున్నప్పుడు కుండను కదల్చగలమేగానీ, ఆ చోటును (ఘటాకాశమును) కదల్చలేం కదా! అట్లాగే ఈ దేహము త్యజిస్తూ ఉంటే దేహము నశిస్తోందేగానీ, ఆత్మాకాశము ఒకచోట నుండి మరొకచోటికి వెళ్లేది కాదు. స్థానమునకు ఆత్మ స్థానమై ఉన్నది.

ఘటవద్వివిధాకారం భిద్యమానం పునః పునః .
తద్భేదే న చ జానాతి స జానాతి చ నిత్యశః .. 14.. ?var తద్భగ్నం
14. ఘటవత్ వివిధాకారం
భిద్యమానం పునః పునః
తత్ భేదే చ న జానాతి
స జనాతి చ నిత్యశః।।
ఈ దేహఘటము (Physical Body) వివిధమైన ఆకారాలు కలిగి ఉండి, మరల మరల నాశనము పొందుతూ కూడా, జడమై ఉండటం చేత తన వినాశనము గురించి తాను ఎరుగటం లేదు. నిత్యుడగు దేహియే అనిత్యమగు దేహ వినాశనములను ఎరుగుచున్నది. అట్లు ఎరుగుచున్నట్టి దేహియే ఆత్మ! నిత్యమగు ఆత్మకు వినాశమెక్కడిది? దేహమునకు ఉనికి ఎక్కడిది?

శబ్దమాయావృతో నైవ తమసా యాతి పుష్కరే .
భిన్నే తమసి చైకత్వమేక ఏవానుపశ్యతి .. 15..
15. శబ్ద మాయ ఆవృతోనైవ
తమసో యాతి పుష్కరే।
భిన్నే తమసి చ ఏకత్వం ధ్యాయేత్
ఏక ఏవ అనుపశ్యతి।।
శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములనబడే పంచతన్మాత్రలు అనే అంధకారముచే ప్రజ్ఞ ఆవరించబడినదై ఉంటోంది. అట్టి శబ్దాది చీకటిని అధిగమించి, భిన్నత్వమును జయించి ఏకత్వమును ధ్యానించాలి. అప్పుడు అనేకత్వము అనుభవమేకాదు. ఏకత్వమే అనుభవము కాగలదు- అదియే సత్యము కాబట్టి!

శబ్దాక్షరం పరం బ్రహ్మ తస్మిన్క్షీణే యదక్షరం .
తద్విద్వానక్షరం ధ్యాయేద్యదీచ్ఛేచ్ఛాంతిమాత్మనః .. 16..
16. శబ్దాక్షరమ్ పరం బ్రహ్మా
తస్మిన్ క్షీణే యత్ అక్షరమ్,
తత్ విద్వాన్ అక్షరం ధ్యాయేత్
యది ఇచ్ఛేత్ శాంతిమ్ ఆత్మనః।।
వేదములు పరతత్త్వమును శబ్దాక్షరరూపంగా ‘సోఽహమ్, తత్త్వమ్, జీవో బ్రహ్మేతినా-పరః’’ ఇత్యాది శబ్దములతో సిద్ధాంతీకరిస్తోంది. ఆ శబ్దాక్షరములను విని, వాటిని అధిగమించి,….. వాటి అర్థాన్ని ధ్యాసతో ఉపాసించాలి. ఆ విధంగా తన్మాత్ర విషయాలను అధిగమిస్తూ శాంతమగు ఆత్మయందు ఇచ్ఛ (Interest)ను వృద్ధి చేసుకోవాలి.

ద్వే విద్యే వేదితవ్యే తు శబ్దబ్రహ్మ పరం చ యత్ .
శబ్దబ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్ఛతి .. 17..
17. ద్వే విద్యే వేదితవ్యే తు,
శద్దబ్రహ్మ పరం చ యత్।
శబ్ద బ్రహ్మాణి నిష్ణాతః,
పరంబ్రహ్మా అధిగచ్ఛతి।।
ముముక్షువు (సాధకుడు) శబ్ద బ్రహ్మమును విచారణ చేయాలి. అనుభవముగా (జ్ఞాన-విజ్ఞాన సహితంగా) తీర్చిదిద్దుకోవాలి. కనుక - విచారణ అనుభూతులనబడే ఉభయ విద్యల యందు అభిరుచి ఉపాసనలను వృద్ధి చేసుకోవాలి. శబ్ద బ్రహ్మము నందు నిష్ణాతుడైనవాడు క్రమంగా పరబ్రహ్మానందానుభవమును చేరుకొంటున్నాడు.

గ్రంథమభ్యస్య మేధావీ జ్ఞానవిజ్ఞానతత్పరః .
పలాలమివ ధాన్యార్థీ త్యజేద్గ్రంథమశేషతః .. 18..
18. గ్రంథమ్ అభ్యస్య మేధావీ
జ్ఞాన విజ్ఞాన తత్పరః,
పలాలమ్ ఇవ ధాన్యార్థీ
త్యజేత్ గ్రంథమ్ అశేషతః।।
జ్ఞాన (Theoritical) - విజ్ఞాన (Experiencing)ము లందు తత్పరుడైన ముముక్షువు బుద్ధితో గ్రంథాధ్యయనం చేసి మేధావి అగుచున్నాడు. ఇక, ఆ తరువాతనో? ధాన్యము సంపాదించినవాడు పొట్టును తొలగించి బియ్యమును వండుకుని తింటాడు కదా! అట్లాగే ఆ మేధావి గ్రంథము (Subject)ను త్యజించి అంతా ఆత్మస్వరూపంగా ఆస్వాదించటమును ప్రారంభిస్తున్నాడు.

గవామనేకవర్ణానాం క్షీరస్యాప్యేకవర్ణతా .
క్షీరవత్పశ్యతే జ్ఞానం లింగినస్తు గవాం యథా .. 19..
19. గవామ్ అనేక వర్ణానాం
క్షీరస్యా-పి ఏకవర్ణతా।
క్షీరవత్ పశ్యతే జ్ఞానం,
లింగినస్తు గవాం యథా।।
అనేక రంగులుగా ఆవులు ఉండవచ్చుగాక! అవన్నీ ప్రసాదించే పాలు? తెలుపే కదా! అనేక ఆకారములుగా కనిపించే ఈ సర్వ జీవులలో అఖండాత్మను దర్శించి ఆత్మోపాసకుడు ఆత్మవేత్త అయి తానే అఖండాత్ముడగుచున్నాడు. (అనేక జీవాత్మలను అనేక ఆవులుగాను, ఆత్మను పాలుగాను భావించాలి).

ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం .
సతతం మనసి మంథయితవ్యం మనో మంథానభూతేన .. 20..
20. ఘృతమివ పయసి నిగూఢం,
భూతే భూతే చ వసతి విజ్ఞానమ్।
సతతం మనసి మంథయతవ్యం
మనో మంథాను భూతేనతే ।।
ఏ విధంగా అయితే పాలలో నేయి అంతర్లీనమై ఉండి, పాలను కాచి తోడువేసి, చిలికినప్పుడు లభిస్తోందో.., ఆ విధంగా (పాలలో నేయి వలె) ప్రతి దేహిలోని ఆత్మజ్ఞానానుభూతి వేంచేసియే ఉన్నది. అందుచేత పెరుగు చిలికినట్లు మనస్సును శాస్త్ర ప్రవచన జ్ఞానముచే చిలికి ఆత్మానుభూతిని వెలికితీయాలి.

జ్ఞాననేత్రం సమాధాయ చోద్ధరేద్వహ్నివత్పరం .
నిష్కలం నిశ్చలం శాంతం తద్బ్రహ్మాహమితి స్మృతం .. 21..
21. జ్ఞాననేత్రం సమాధాయ చ
ఉద్ధరేత్ వహ్నివత్ పరమ్
‘‘నిష్కలం నిశ్చలం శాంతమ్
తత్ బ్రహ్మాఽహమ్’’
ఇతి స్మృతమ్।।
కట్టె-కట్టెను ఒరిపిడి చేసి అగ్నిని పుట్టిస్తామే! ఆ రీతిగా సాధనములతో జ్ఞాననేత్రము(దృష్టిని) సముపార్జించాలి. జ్ఞాన నేత్రాగ్నితో సర్వభేదములను భస్మము చేసివేయాలి. ‘‘నిష్కళంకమైన, నిశ్చలమైన, పరమశాంత స్వరూపమైన పరమాత్మయే నేను’’ అను నిశ్చయమును సుధృఢీకరించు కోవాలి!

సర్వభూతాధివాసం యద్భూతేషు చ వసత్యపి .
సర్వానుగ్రాహకత్వేన తదస్మ్యహం వాసుదేవః .. 22..
22. సర్వభూత అధివాసం చ
యత్ భూతేషు వసత్యపి।
సర్వ అనుగ్రహకత్వేన,
తత్ అస్మి ‘అహం’ వాసుదేవః।
తత్ అస్మి అహం వాసుదేవ।
సర్వభూతజాలములకు ఆధారము, సర్వభూతములలో (జీవులలో) వసించునది, సర్వజీవులపై అనుగ్రహము ప్రసరించునది అగు వాసుదేవుడను నేనే! అందరియందు ఆత్మగా వేంచేసియే ఉన్నాను. నేనే వాసుదేవుడను. త్వమ్‌గా కనిపించేదంతా నేనే!
ఇదే అమృతబిందూపనిషత్ ఎలుగెత్తిపాడుచున్నగానము

ఇతి అమృతబిందూపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



కృష్ణ యజుర్వేదాంతర్గత

2     అమృత బిందూపనిషత్

అధ్యయన పుష్పము

ఏదైతే అక్షరము, పరము, సత్యము, నిత్యము, ఆత్యంతికము అయి ఉన్నదో…. అట్టి పరతత్త్వధ్యాన - అనుభూతులను ఈ అమృత బిందూపనిషత్ స్వరము మనందరియందును నిదుర లేపుచున్నది. ఈ ఉపనిషత్ అధ్యయనముచే - ఆత్మధ్యానము ఉత్తేజితమై మనందరి యందును ప్రకాశమానమగుచున్నది.

‘ఓం’ సంజ్ఞాస్వరూపమగు ఆత్మేశ్వరునికి నమస్కారములు. అట్టి పరతత్త్వము గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము.

మనస్సు - ద్వివిధములుగా…!

భావనాస్వరూపము, అంతరింద్రియము, నవరస ప్రదర్శనా సమన్వితము అయి ఈ మనస్సు ప్రవర్తిస్తోంది. మనస్సే జగత్తు. మనస్సే జీవుడు.

అట్టి మనస్సు రెండు రీతులుగా ఉంటోందని విజ్ఞులచే గమనించబడి, అభివర్ణించబడుతోంది.

(1) అశుద్ధ విభాగము (Thought while engaged in world-related details): దృశ్య విషయములందు అభిలాష - అభినివేశము కలిగి ఉంటున్న విభాగము. ఆశ, వేదన, ఆవేశము, సంబంధ బాంధవ్యములు, సుఖ దుఃఖ నిర్వచనములు ఇవన్నీ నిత్యమేననే భావనను ఆశ్రయిస్తోంది. దృశ్యము పట్ల సత్యసంకల్పము కలిగియున్న మనోవిభాగము. కామసంకల్పముల సమన్వితము. ‘పొందాలి- కావాలి-ఉండాలి’ అని ఆవేదన చెందుచున్నట్టిది.

(2) శుద్ధ మనస్సు : ఆలోచనలకు మునుముందేగల కేవలమగు మనో చైతన్య విభాగము. (Zone of origin of thought prior to commencement of Thought. Thought on Absolute state as a concept). సర్వ కోరికలను దాటివేసి ఆత్మారామమై (ఆత్మయందు, సర్వసమరస భావనయందు) విరాజిల్లుచున్నట్టి మనో విభాగము. సర్వకామ (All desires and expectation) వివర్జితమైనది. దృశ్యమునకు అతీతమైన అంతర్దృష్టి కలిగి ఉన్నట్టిది. కేవలసాక్షి.

(1) విషయములను మననము చేయు మనస్సు (అశుద్ధ) - (దృశ్య సహితమైన దర్పణము)  
(2) విషయముల మననమునకు మనుముందే ఉన్నట్టి మనస్సు (శుద్ధ) - (ప్రతిబింబ శక్తి సమన్వితమగు కేవల-దర్పణము).

వాస్తవానికి మననమే మనస్సు యొక్క స్వరూపము (Thought while addressed / directed towards wordly aspects & concerns is a polluted one). మనస్సు ఆత్మకు చెందినదే. విషయ-అవిషయ మనస్సుకు జనన స్థానము ఆత్మయే!

ఆత్మసర్వదా ముక్తమే. ఆత్మకు బంధము లేదు. మోక్షము లేదు.

ఇక బంధము ఎవరికి? మనస్సుకు మాత్రమే!

మనస్సే బంధమునకుగాని, మోక్షమునకుగాని కారణమైయున్నది. మనయేవ మనుష్యాణాం కారణం బంధ-మోక్షయోః!
బన్ధాయ విషయాసక్తమ్। విషయముల పట్ల ఆసక్తి (inquisitiveness) - ఇదియే బంధము.

ముక్తైః నిర్విషయగ్ం స్మృతమ్। విషయముల పట్ల ఆసక్తి లేకుండుటయే (Non-inquesitiveness towards what is being seen, heared, spoken, touched, tasted experienced etc.,) (లేక) మనస్సు యొక్క నిర్విషయత్వమే = మోక్షము లేక ముక్తి.

విషయములకు మునుముందే గల మనన శక్తి = శుద్ధ మనస్సు.

ఆత్మస్వరూపుడగు జీవుడు మనస్సుకు ఉత్పత్తి స్థానమై, మనస్సుకంటే మునుముందే ఉన్నాడు. ఆలోచనలు చేయువాడు ఆలోచనలకంటే మునుముందే ఉండాలి కదా! ‘‘మనస్సు యొక్క (ఆలోచనల యొక్క) చర్యలన్నీ - నా ఉద్దేశ్యంలో నాకు విషయమే కాదు’’ అను అవగాహన - అన్వయముచే సంసారము లేనిదగుచున్నది. అట్టి నిర్విషయత్వము (లేక) విషయాతీతత్వమే ముక్తి. అంతేగాని ముక్తి అనబడేది మరెన్నడో ఎప్పుడో ఏర్పడేది కాదు.

అందుచేత ముముక్షువైనవాడు మనః కార్యములన్నీ నిత్యము నిర్విషయదృష్టితో దర్శించునుగాక! ‘‘నేను సదా నిర్విషయుడను. సవిషయమైనదంతా సందర్భములకు సంబంధించిన ఆరోపితము’’ - అను మననము ఆశ్రయించును గాక!

ఎప్పుడైతే మనస్సు విషయత్వము త్యజించి, హృదయంలో నిశ్చలమై సర్వము ఆత్మగా సందర్శించుచున్నదో, ఆత్మగా భావన చేయటం ఆరంభిస్తుందో, అప్పటి అట్టి హృదయ స్థితియే ‘ఆత్మపదము’గా, ‘పరమపదము’గా తత్త్వశాస్త్రముచే, తత్త్వవేత్తలచే అభివర్ణించబడుతోంది.

అందుచేత…., ఎంతెంతవరకైతే ఈ మనస్సు, ఉమ్మిపై వ్రాలే ఈగవలె విషయములపై వ్రాలుచూ ఉన్నదో, అంతంత వరకు శాస్త్రములచే - ఆర్యులచే చెప్పబడిన మార్గములో, సాధన కొనసాగించటము అత్యావశ్యకం.

ద్రష్ట-దృశ్యములతో సహా ఈ కనబడేదంతా ఆత్మయే! ఆత్మయే ఈ వేరువేరుగా అజ్ఞాన దృష్టికి కనిపిస్తోంది.
ఆత్మదృష్టిచే అంతా ఏకమేగాని, అనేకము లేదు. కాదు. అనేకంగా కనిపిస్తున్నప్పటికీ ఒక్కటిగా అనిపించటమే జ్ఞానము - ధ్యానము కూడా! ఇక తదితరంగా శాస్త్ర-పురాణ-ఇతిహాసాలలో వర్ణించబడేదంతా ఆ విషయమునే శ్రోతయొక్క అంచలంచెల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని - విస్తారంగా చెప్పబడుచున్నది. శాస్త్రము యొక్క అంతిమ న్యాయము-అంతా ఆత్మగా సందర్శించుటయే! పూజ, ప్రాణాయామము, తీర్థములు, యోగ-భక్తి సాధనలన్నీ అట్టి ఆత్మసందర్శనా స్థానమును చేర్చే ఉపాయాలు!

న ఏవ చిన్త్యం : ‘చింతన’ చేయబడేవన్నీ లౌకిక విషయాలే! ఆత్మయో, అలౌకికం. అందుచేత అది చింతన చేయబడేదేదీ కాదు. ఆత్మ స్వానుభవమునకు సర్వదా వీడని విషయమే.

న చ అచిన్త్యం : అయితే ఆత్మను చింతన చేయలేమా? చింతన చేయలేని విషయమైతే.. ఇక విచారణ - సత్సంగము ఇత్యాదులు తత్త్వశాస్త్రం ఎందుకు చెప్పుతుంది? శాస్త్రము మహావాక్యముల ద్వారా ప్రవచిస్తోందంటే.. అది చింతన చేయబడే విషయమేకదా! కనుక అచింన్త్యము కాదు.

న చిన్త్యం : చింతనయే అద్దానిరూపమా? కాదు. ఎందుకంటే ఆత్మ చింతనకంటే మునుముందే ఉన్నట్టిది. చింతన చేయువాడు చింతన కంటే మునుముందే ఉండాలికదా! చింతన చేసేవాడే లేకపోతే చింతన ఎలా ఉంటుంది? కనుక చింతన అద్దాని(ఆత్మ యొక్క) రూపముకాదు. ఆత్మ సర్వచింతనలకు ఆవల సముత్సాహభరితమైన వెలుగొందుచున్నట్టి తేజోరూపము.

చిన్త్యమేవ తత్ : చింతన చేత అద్దానిని తప్పక పొందవచ్చు. కనుక అది చింతన చేయ తగిన విషయమే! తత్ చిన్త్యమేవ!

ఎవ్వరైతే ‘‘వీరు నా వారు-వారు కాదు, ఇది ఇష్టం - అది కాదు; ఇది నాకు సంబంధించినది- అది కాదు. వీరు జ్ఞాన-సాధన-స్వభావ విశేషాలచేతనో (లేక) బంధుత్వముచేతనో ఆత్మీయులు - వారు కాదు’’ ఇత్యాది పక్షపాత దృష్టిని, బుద్ధిని జయించి వేసినట్టి - దాటివేసినట్టి దృష్టిని సంపాదించుకుంటారో…,

అట్టివారు…. బ్రాహ్మీదృష్టిని సముపార్జించుకోగలరు. సర్వపక్షపాత భావముల నుండి వినిర్ముక్తులైనవారు బ్రహ్మమును ఇప్పుడే - ఇక్కడే సముపార్జించుకుంటున్నారు.

విషయ సంబంధమైన చింతనల యందు అనుక్షణము మునిగి తేలుచున్న ఈ మనస్సుకు - నిర్విషయత్వమును, పక్షపాతరాహిత్యమును, అచిన్త్యమగు ఆత్మచింతనమును, దృశ్యమునంతా ఆత్మగా ఆరాధించుటమును నేర్పేది ఎట్లా? ఏమార్గంగా?

అందుకు యోగసాధనకు మనస్సును సంసిద్ధం చేయాలి. నియమించాలి. యోగాభ్యాసమును ‘ఓం’ (లేక ఓం నమఃశివాయ, ఓం నమోనారాయణాయ ఇత్యాది) శబ్దము లేదా స్వరముతో అనుసంధానం చేయాలి. స్వరేణ సంధయేత్ యోగం, అస్వరం భావయేత్ పరమ్। నాదముతో ఉపాసిస్తూనే, క్రమంగా, బ్రహ్మమును నాదరహితమైన తత్త్వముగా భావన చేయాలి.

అస్వరేణానుభావేన నభావో భావ ఇష్యతే

శబ్ద బ్రహ్మము యొక్క ఉచ్ఛారణను అభ్యసిస్తూ (స్వరమును ఉపయోగిస్తూ) బ్రహ్మమును స్వరరహితమైనదిగా భావన చేయాలి.

స్వరరహితమగు భావనచే క్రమంగా ‘‘బ్రహ్మము భావనకు విషయమే’’…. అనే భావాతీత-భావనానునభవము సుస్థిరమగుచూ రాగలదు. శబ్దముచే చెప్పబడజాలని ఆత్మ (బ్రహ్మము) భావనచే అనుక్షణికము ‘‘సత్‌స్వర్వరూపమే! - ఉన్నదే!’’ అగుచున్నది. ఆత్మ శబ్దమును దాటివేసినప్పటిది, భావనానుభవము. కాని అది శబ్దము ద్వారా సిద్ధించగల భావనానుభూతియే సుమా!

శబ్దమును ఆశ్రయించనిదే అర్థానుభూతి లభించదు. శబ్దమాత్రం చేత అర్ధానుభూతి లభించేదికాదు. శబ్దము సహాయంతో శబ్దమును దాటి, అనుభవమాత్రమగు ఆత్మయొక్క ఔన్నత్యము - అనుభూతి తప్పక లభించగలదు.

శబ్దము సాధన రూపము. ఆత్మానుభవము సాధ్యరూపము. అయితే శబ్దార్థములు ఒకేసారి మననము చేయబడుచుండునుగాక!

బ్రహ్మము ‘‘నిష్కళంక, నిర్వికల్ప, నిరంజన స్వస్వరూపము’’

సర్వుల సహజ స్వస్వరూపమగు బ్రహ్మము (లేక) ఆత్మ….,
- ఎట్టి దోషములు లేనిది. నిష్కళంకము.
- సంకల్ప - వికల్పములకు ఆవల ఉన్నట్టిది. ఆ ఉభయములకు కేవల సాక్షి. అందుచేత నిర్వికల్పము.
- నిత్యనిర్మలము. జన్మ-కర్మ-మనో-మాయా దోషములచే ఆత్మ స్పృశించబడదు. అందుచేత నిరంజనము.

తత్త్వశాస్త్రము-తత్-త్వమ్ ‘‘అదియే నీవు. తదితరమైనదంతా సందర్భానుచితంగా సత్యము వలె కనిపించుచున్నప్పటికీ.. ఇదంతా నీవు కాదు’’ - అని సిద్ధాంతీకరిస్తూ ఎలుగెత్తి గానం చేస్తోంది. తదితరులందరినీ తత్త్వస్వరూప దృష్టితో చూడటమే ఆత్మసందర్శనము, ఆత్మసాక్షాత్కారము కూడా!

‘‘తత్ నిష్కళంక - నిర్వికల్ప - నిరంజన బ్రహ్మము నేనే’’ అని గ్రహించుటచే, గమనించుటచే ఈ జీవుడు బ్రహ్మమే అయి ప్రకాశిస్తున్నాడు. నిత్యము - ధృవము అగు బ్రహ్మతత్త్వము తానే అయి ఆస్వాదిస్తున్నాడు.

యత్ నిర్వికల్పం-అనంతం, హేతువర్జితం, దృష్టాంతవర్జితం, అప్రమేయమ్,అనాదిమ్-జ్ఞాత్వా, ముచ్యతే బుధః।

ఈ విధంగా విజ్ఞుడగువాడు ఆత్మజ్ఞుడై ఆత్మ గురించి
➤ నిర్వికల్పము…, (సంకల్ప వికల్పములచే స్పృశించబడనిది),
➤ ఆద్యంతరహితమైనది, అనంతము.., (ఇది మొదలు, ఇది చివర - అనుదేమీ లేనట్టిది),
➤ కారణరహితము, నిర్హేతుకము (కార్య-కారణ-కర్తృత్వములకు సంబంధించనిది),
➤ అద్దానితో సమమైనది, బాహ్య-అంతరంగాలలో మరొక్కటేదీ లేనట్టిది, దృష్టాంతరహితము,
➤ (స్వప్న ద్రష్ట - స్వప్నమునకు సంబంధించిన వాడుగాని స్వప్నముచే బంధితుడుగాని కాదుకదా! అట్లాగే) దృశ్య-మనో-బుద్ధి-చిత్త అహంకారాదులకు సంబంధించినదికాదు. అప్రమేయము…,
➤ ఈ దేహమునకు, ఆలోచనకు, బుద్ధికి, చిత్తమునకు, అహంకారమునకు ‘‘ఇక్కడ ప్రారంభము అగుచున్నది’’.. అని అనవచ్చునేమో! ఆత్మయో.. అనాది. అనంతము. ఆద్యంతరహితము…,
అని మనస్సుతోను, బుద్ధితోను గ్రహిస్తున్నాడు.

ఆ విధంగా తెలుసుకున్నవాడై, ఇక సర్వ విషయముల నుండి విడివడినవాడగుచున్నాడు.

ఆత్మబుద్ధుడై ఆత్మత్వము పుణికిపుచ్చుకొనుచున్నాడు. బుద్ధిచే సర్వాతీతుడై, కేవలుడై, మౌనానందానుభూతుడగుచున్నాడు.

పరమార్థతః → ననిరోధో; న చ ఉత్పత్తి; న బద్ధా; న చ సాధకః, న ముముక్షుః; న వై ముక్తంః;

స్వప్నంలో అరణ్యదృశ్యము - ఆకారాలు - బంధువులు - జంతువులు ఇత్యాది కనిపించవచ్చుగాక. తెల్లవారి లేచి ‘‘అవన్నీ ఎక్కడున్నాయిరా?’’.. అని వెతుకుచున్నామా? లేదే! ‘‘అవన్నీ లేవులే!’’ అని అనుకుని జాగ్రత్‌లో యధాతథంగా ప్రవేశిస్తున్నాము కదా! ఇక్కడి జాగ్రత్ కూడా అట్టిదే! వాస్తవానికి ఆత్మయే సర్వే సర్వత్రా వెల్లివిరిసి ఉన్నది. ఇక తదితరమైనదంతా కూడా (అనగా దృశ్యాంతర్గత వస్తువులుగాని, ద్రష్టగాని, దేహాదులుగాని)….
→ వాటన్నిటికీ వినాశనము లేదు.
→ ఎందుకంటే వాటికి ఉత్పత్తియే లేదు.
ఇక్కడ వాస్తవమగు ఆత్మదృష్టిచే
→ బద్ధుడు లేడు.
→ సాధకుడు లేడు.
→ ముముక్షువు లేడు.
→ ముక్తుడు లేడు.

ఆత్మ సర్వదా అద్వితీయము. ఆత్మకు వేరైనది ఎక్కడా ఏదీ లేదు. ఇక జాగ్రత్-స్వప్న-సుషుప్తి-జగదాదులు, ద్రష్ట - ఇవన్నీ ఆత్మయొక్క స్వప్న సదృశ కల్పనచే ఏర్పడి, స్వప్న అభావనతోబాటే ‘లేనివి’ అగుచున్నాయి.

జాగ్రత్ - స్వప్న - సుషుప్తిషు ఏక ఏవ ఆత్మా మన్తవ్యో।

అందుచేత, ఓ ఆత్మానంద స్వరూపులగు శ్రోతలారా! జాగ్రత్-స్వప్న-సుషుప్తుల అంతర్గతంగా కనిపించే సర్వ విషయాలు, విశేషాలు ప్రక్కకు పెట్టెదరుగాక! ఆత్మ-జాగ్రత్-స్వప్న-సుషుప్తుల కంటే వేరైనది. పరమైనది.
- ఆ జాగ్రత్ ఎవ్వరిదో…,
- ఆ స్వప్నము ఎవ్వరిదైయున్నదో…,
- ఆ సుషుప్తి ఎవ్వరి అనుభవమైయున్నదో..,

అట్టి ఆవల ఉన్న (పరమ్) ఆత్మను మాత్రమే మననం చేయాలి. విచారణ చేయాలి. ఎవ్వడైతే జాగ్రత్-స్వప్న-సుషుప్తి స్థానములను దాటి ఆత్మయొక్క ఉనికిని, అద్దాని తత్త్వమును విచారణ చేసి అర్ధం చేసుకొనుచున్నాడో..,

ఇక ఆతనికి..
- ‘‘నేను దేహముతోను, జాగ్రత్-స్వప్న-సుషుప్తుల ప్రారంభంలోను పుట్టుచున్నాను.
- దేహాదులు తొలగుచున్నప్పుడు నేను మరణించువాడను’’.
అనే రూపముతో కూడిన భ్రమ రూపమైన కల్పన తొలగుతుంది.

‘‘దేహాలు నా కల్పనలో వస్తూ పోతూ ఉండవచ్చు గాక! నాకు వర్తమాన జన్మగాని, పునర్జన్మగాని లేదు!’’ - అని గ్రహించినవాడగుచున్నాడు. ఆతడు జాగ్రత్ స్వప్న సుషుప్తులను దాటిపోయి, (స్థానత్రయ వ్యతీతస్య) పునర్జన్మ రహితుడు (పునర్జన్మ న విద్యతే) అగుచున్నాడు.

ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః।

ఓ అమృత స్వరూపులగు మిత్రులారా! అనేక తటాకాలలో ఒకేసారి అనేక చంద్రబింబాలు (చంద్ర ప్రతిబింబాలు) అగుపించవచ్చును గాక! ఆకాశంలో అనేక చంద్రబింబాలు ఉన్నాయా? లేవుకదా! అట్లాగే ఆత్మ ఏకము-అఖండము. అనేక దేహాలలో వేరువేరుగా ఉన్నట్లు అగుపిస్తున్నప్పటికీ ఆత్మ నీవు-నేను ఇత్యాదులుగా మారటం లేదు! సర్వదా ఏకమేగాని, అనేకముగా అవటమే లేదు సుమా!

ఘటోనియత న ఆకాశః।

ఒక ఇంటిలో ఒకచోట ఒక మూలగా ఒక కుండ (ఘటము) ఉన్నది. ఎవ్వరో ఆ కుండను అక్కడి నుండి తీసి వేరొకచోట ఎందుకో ఉంచారు. ఇప్పుడు చెప్పండి! కుండతో బాటుగా కుండ ఆక్రమించుకొనియున్న ఆకాశమును అక్కడి నుండి కుండతో బాటు (ఘటాకాశమును - Space occupied by pot) మరొకచోటికి తరలించటం ఏమన్నా జరిగిందా? లేనేలేదు. కుండతోబాటు ఘటాకాశం తీసుకొనిపోబడటం లేదు. అట్లాగే ఒక దేహము వచ్చి పోయి మరొక దేహము వస్తున్నప్పుడు కూడా.. ఆత్మాకాశము ఒకచోటు నుండి మరొక చోటికి పోవటం లేదు.

పాంచభౌతికమైన ఆకాశము ఆత్మచే భావనాపూర్వకంగా కల్పించుకోబడుతోంది (ఆత్మాత్ ఆకాశః). అంతేగాని ఆకాశము (Space)లో ఆత్మ ఒకచోటు నుండి మరొక చోటుకుపోవటం లేదు. దేహాలు రావచ్చు. పోవచ్చు. ఆత్మయథాస్థానంలోనే తిష్ఠించుకొని (ప్రతిష్ఠితమై) ఉన్నది.

దేహమ్ భేద చ న జానాతి స జానాతి నిత్యశః

ఒక కుండ మట్టిచే నిర్మితమై, కొంతకాలానికి పగిలి తిరిగి మట్టిగానే అగుచున్నది. మట్టి కుండగా అవటమూ లేదు. మట్టి పగలటమూ లేదు. పగలటం అనబడేది కుండకు జరుగవచ్చుగాక! మట్టికి కాదు. కుండకు గల ‘‘పగలటము’’ అనే ధర్మము మట్టికి లేదు.

కుండ వంటి ఈ దేహఘటము అనేకసార్లు జనించవచ్చు. నశించవచ్చు. జడమగు దేహమునకు ‘‘పుట్టుచున్నాను’’ అనే అనుభవము లేదు. ‘‘చచ్చుచున్నాను’’ అనే అనుభవము లేదు.

చైతన్యమగు ఆత్మకు మాత్రమే ‘‘దేహము పుట్టుచున్నది - దేహము నశించుచున్నది’’ అనే రూపము గల అనుభవము కలుగుచున్నదై ఉంటోంది. అట్టి దేహముల రాక-పోకలకు సాక్షియై తదనుభవమును పొందుచున్న ఆత్మ-దేహముతో పుట్టుట లేదు. దేహములతో నశించటము లేదు.

నిత్యమగు ఆత్మ అనిత్యమగు ‘‘దేహములతో పుట్టటము - దేహములతో నశించటము’’ అనే ప్రసక్తి ఎక్కడిది?

ఆత్మసర్వదా నిత్యము. నిత్యసత్యము. దేహము కల్పితము. సందర్భానుసారంగా ఉన్నట్లు అనిపించేది మాత్రమే!
దేహము జడము.స్వానుభవము ఉండదు. ఆత్మయో, చైతన్యము. అది దేహానుభవములను కల్పించుకుంటోంది. త్యజిస్తోంది. కదిలే దేహములను-ఆలోచనలను కదిలించేది ఆత్మయే! కథలోని పాత్రల పరస్పర సంబంధములు కథారచయితకు ఆపాదించలేము కదా! ఆత్మకు అనుభవ కర్తృత్వ-భోక్తృత్వములు ఆపాదించబడజాలవు.

ప్రజ్ఞ - శబ్ద మాయావృతో।

జీవుడు ‘‘నేను ఖండుడను- బద్ధుడను- పరిమితుడను’’ అని అనుకోవచ్చుగాక! అది స్వీయ స్వప్న సదృశమైన కల్పన మాత్రమే!

అట్టి ఈ జీవుని సహజ రూపము అఖండమగు ఆత్మయే!

అట్టి ఆత్మసంబంధమైన అఖండజ్ఞానము ‘‘శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ విషయములు’’ అనే కారు చీకటిచే కప్పబడినదై ఉన్నది.

నివురుగప్పిన నిప్పులాగా అఖండాత్మ జ్ఞానము సర్వుల హృదయాలలో వేంచేసియే ఉన్నది. అయితే, విషయములచే కప్పబడినదై ఉన్నది.

అటువంటి శబ్ద-స్పర్శాది చీకటిని జ్ఞానదీపం చేత తొలగించాలి. ‘‘భిన్నత్వము - అనేకత్వము’’.. అనే చీకటిని ‘‘ఏకత్వము’’ యొక్క ధ్యానముచే పటాపంచలు చేయాలి. అప్పుడు ఆత్మయొక్క ఏకత్వము - అఖండత్వము స్వానుభవమై ప్రకాశించగలదు.

శబ్దాక్షరమ్ విద్వాన్ - అక్షరమ్ ధ్యాయేత్।

వేద వాఙ్మయము ఆత్మతత్త్వమును, పరతత్త్వదృష్టిని నేర్పటానికి శబ్దాక్షర రూపంగా మహావాక్యాలు ప్రసాదిస్తోంది.

🙏 సోఽహమ్
🙏 నేఽహనానాస్తి కించన
🙏 తత్ త్వమ్
🙏 అహమ్ బ్రహ్మాఽస్మి
🙏 జీవో బ్రహ్మేతి నాపరః
🙏 అయమాత్మా బ్రహ్మ
🙏 సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ
🙏 ఆత్మానమేవ వేదాఽహమ్ బ్రహ్మాస్మీతి
🙏 స్వరూపానుసంధాన వినా అన్యథా ఆచారపరో న భవేత్
🙏 యతో నిర్విషయస్య అస్య మనసో ముక్తి శిష్యతే।
🙏 ‘దేహోఽహమ్’ ఇతి నిశ్చయః।
🙏 విహాయ శాస్త్ర జాలాని యత్ సత్యం తదు పాస్యతామ్।।

వేదము ఇత్యాది శబ్ద బ్రహ్మమును మానవాళికి ధ్యానము చేయవలసిన మహావాక్యములుగా అందిస్తోంది. అట్టి శబ్దములు ఉద్దేశ్యిస్తున్న అక్షర పరబ్రహ్మమువైపుగా శబ్దముల సహాయంతో ప్రయాణించాలి.

పరమశాంతమగు ఆత్మను అవలోకించి మమేకం అయ్యే ఆశయమును శబ్ద బ్రహ్మము ద్వారా నిదురలేపాలి. క్రమక్రమంగా ఆ శబ్దముల అర్థాన్ని ఉపాసిస్తూ శబ్దములను త్యజిస్తూ రావాలి. శబ్దముల వాక్ పరిమితత్వమును దాటివేస్తూ అక్షరమగు ఆత్మయొక్క ధ్యాసను పెంపొందించుకొన్నవాడు పరమ శాంతము - సర్వమునకు అప్రమేయము అగు శాంతాత్మ స్వరూపుడుగా తనను తాను తీర్చిదిద్దుకొనుచున్నాడు.

కనుక ముముక్షువైనవాడు శబ్దముల ఇచ్ఛను జయిస్తూ, నామ-రూపముల పట్ల గల ఇచ్ఛను త్యజిస్తూ - క్రమంగా ఆత్మ పట్ల ఇచ్ఛను పెంపొందించుకొనును గాక! తత్ఫలితంగా ఆత్మస్వరూపుడై వెలుగొందటం జరుగగలదు.

అనగా..,
మునుముందుగా శబ్దములను (వేద ప్రతిపాదితమైన మహావాక్యములను) విచారణ చేయాలి.

శబ్ద బ్రహ్మణి నిష్ణాతః - పరంబ్రహ్మ అధిగచ్ఛతి।।

శబ్ద బ్రహ్మముయొక్క విచారణచే నిష్ణాతుడైనవాడు ‘పరబ్రహ్మము’నందు ప్రవేశించుచున్నాడు. పరావిద్యను రెండు విభాగాలుగా విభజించవచ్చు.

(1) శబ్ద బ్రహ్మము (2) అనుభవ బ్రహ్మము

అటు ‘‘అహమ్ బ్రహ్మఽస్మి - బ్రహ్మసత్యమ్, జగత్ మిధ్యా’’. ఇత్యాది మహావాక్యముల అర్ధాన్ని గురుముఖతః వినాలి. ఉపాసించాలి. అర్థం చేసుకుంటూ రావాలి.

శబ్ద బ్రహ్మము యొక్క పరమార్థము నందు మననము ద్వారా చక్కగా నిష్ణాతుడు (Expert) కావాలి. ధ్యానం చేయాలి.

అట్టి సాధనచే అనేకంగా కనిపించేదంతా ఏకమగు ఆత్మస్వరూపంగా అనిపించగలదు.

అట్టి వాడు దృశ్యమును అధిగమించి పరబ్రహ్మమును చేరుచున్నాడు.

గ్రంథమభ్యస్య మేధావీ జ్ఞాన - విజ్ఞాన తత్పరః - త్యజేత్ గ్రంథమ్ అశేషతః।।

ఒకాయన చక్కగా అన్నము తినాలనుకొన్నాడు. ఏం చేస్తాడు? ముందుగా ధాన్యము సంపాదిస్తాడు. ఆ ధాన్యమును శుభ్రంగా దంచుతాడు. పొట్టు (ఊక) - బియ్యమును వేరుచేస్తాడు. ఊకను ఆవల పారవేసి వచ్చి, బియ్యమును వండుకొని అన్నము తిని ఆకలి తీర్చుకుంటాడు. అంతేగాని.., వడ్లను వండుకొని తింటాడా? లేదు కదా!

అట్లాగే..,
ఆత్మతత్త్వాన్ని విశదపరచే గ్రంథాలను అత్యంత శ్రద్ధతో, ఉత్సాహముతో, ఇచ్ఛ (Interest)తో చదవాలి.

అయితే..,
(అనేకానిచ శాస్త్రాణి = శాస్త్రాలు అనేకము.
అల్పాయుః = ఆయువా అతి చిన్నది.
విఘ్న కోటయః = ఇందులో అనేక విఘ్నాలు.
తస్మాత్ సారం విజానీయామ్ = అందుచేత సారము గ్రహించాలి - అన్నతీరుగా..)

జ్ఞాన (Theoritical) -విజ్ఞాన (Practical) తత్పరుడైన ముముక్షువు ఆత్మశాస్త్రమును విశదీకరించే గ్రంథాలు పఠించాలి. సునిశితమైన బుద్ధితో అర్థసారాన్ని గ్రహించాలి.

….. ఇక అటు తరువాతనో…,

ధాన్యము సంపాదించినవాడు పొట్టును వేరుచేసి, త్యజించి బియ్యమును మాత్రమే వండుకుంటున్నట్లుగా…ఆ మేధావి సారమును గ్రహిస్తున్నాడు. తదితరమైన గ్రంథ చారిత్రాక ఇత్యాది విశేషమును (Historical events etc.,) త్యజిస్తున్నాడు.

‘‘అంతా ఆత్మస్వరూపమే!’’ అనే ఆత్యాంతిక భావాన్ని మాత్రమే గ్రహించి ‘‘మమాత్మా సర్వ భూతాత్మా’’ ‘‘అహం సర్వస్య ప్రభవో’’ మొదలైన రూపము గల అనుభవములో అతి త్వరగా ప్రవేశిస్తున్నాడు.

గవామ్ అనేక వర్ణానామ్ - క్షీరస్య ఆపి ఏక వర్ణతా।

ఒకాయనకు అనేక ఆవులు ఉన్నాయి. అందులో కొన్ని తెల్లవి, కొన్ని నల్లవి. కొన్ని గోధుమ రంగువి. మరికొన్ని తెల్ల-నల్లమచ్చలివి. కొన్ని చారలవి. అన్ని గోవులలో ఆతడు పాలు పిండుకుంటున్నాడు. ఒక బిందెలో పోసుకుంటున్నాడు. హాయిగా కుటుంబసభ్యులతో ఆ పాలు త్రాగుచున్నాడు. ‘‘ఈ పాలు తెల్ల ఆవులవి, ఆ పాలు నల్ల ఆవులవి’’.. అన్న భేదం కుండలోని పాలకు ఉంటుందా? లేనే లేదుకదా! అట్లాగే ముముక్షువు కూడా…,

అనేక గ్రంథములలో ఒకే ఆత్మతత్త్వాన్ని సార విషయంగా బుద్ధితో గమనించి స్వీకరిస్తున్నాడు.

{అన్ని శాస్త్ర (మత) గ్రంథములలోని ఆత్మసాక్షాత్కార సార విషయాన్ని స్వీకరిస్తున్నాడు.}.

ఇక్కడ స్త్రీలు -పురుషులు- సజాతీయులు - విజాతీయులు - పశువులు - పక్షులు.. ఇట్లా వేరువేరుగా అసంఖ్యాకంగా జీవాత్మలు కనిపిస్తున్నప్పటికీ ఆ ముముక్షువు అఖండమగు ఆత్మగా సర్వమును దర్శించి ఆస్వాదిస్తున్నాడు. అనేకములోని ఏకత్వాన్ని గమనించి ఆత్మతత్త్వమును ఆస్వాదిస్తున్నాడు.

‘‘అందరిలోను గల అఖండాత్మయే సత్యము!’’-అను పరమసత్యమును బుద్ధితో నేర్పుగా నేర్చి మనస్సుతో ఆస్వాదిస్తూ ‘‘అందరిలోని నేనైన నేను’’… అనే మహాహంకారమును స్వీకరిస్తున్నాడు. ఆత్మోపాసకుడై ఆత్మవేత్తయై అఖండాత్మ స్వరూపుడుగా అగుచున్నాడు.

ఘృతమివ పయసి నిగూఢం, భూతే భూతే చ వసతి విజ్ఞానమ్।

ఓ ప్రియమిత్రులారా!

నామ-రూపాత్మకంగా అనేక రూపాలతో కనిపించే ఈ సహజీవులందరిలో అఖండాత్మయే సత్యమైన వస్తువు. గుణభేదం చేత అనేకంగా కనిపించే సహజీవులలో సర్వదా అఖండాత్మ దాగి ఉన్నది.

పాలలో వెన్న దాగి ఉన్నది. అయితే పాలలో ఎక్కడున్నది? పాలంతా నిండి ఉన్నది. మరి వెన్న కనిపిస్తోందా? లేదు. ఆ పాలను కాచి, తోడు వేసి, పెరుగును చిలికితేనే వెన్న లభిస్తోంది కదా!

నాలోను - నీలోను, మనకు కనిపించే ప్రతి జీవునిలోను పరిశుద్ధమగు ఆత్మ దాగి ఉన్నది. సర్వజీవులలో ఆత్మ సమముగా పాలలో వెన్నవలె దాగి ఉన్నది. ఎల్లప్పుడు సర్వ శాస్త్రీయ మనోసాధనలతో ఆట్టి ఆత్మవస్తువుకై చిలకాలి. మనస్సును పరాకాష్టయగు ఆత్మయొక్క దర్శనమునకై సర్వవిధములా సాధనల యందు నియమించాలి. శాస్త్ర మహావాక్య జ్ఞానము, కర్మ-భక్తి-క్రియాయోగ సాధనలు- ఇవన్నీ ఉపయోగించి ‘ఆత్మ’ అనే వెన్నను వెలికి తీసుకోవాలి! స్వానుభవంగా అనునిత్య పరచుకోవాలి.

జ్ఞాననేత్రం సమాధాయ - ఉద్ధరేత్ వహ్నివత్ పరమ్।

కట్టెను కట్టెతో ఒరిపిడిచేసి అగ్నిని పుట్టిస్తాము. ఆ అగ్నితో రెల్లుగడ్డి (లేక) కొబ్బరిపీచును అంటించి, కట్టెలను కాల్చి వంట చేసుకుంటాం. ఆ రీతిగా ‘‘కర్మయోగం-భక్తియోగం-జ్ఞానయోగము-క్రియాయోగము-సర్వశరణాగతి యోగము’’.. మొదలైన కార్యక్రమములు అనే కట్టెల ఒరిపిడితో ‘ఆత్మజ్ఞానము’ అనే అగ్నిని వెలిగించాలి. అట్టి జ్ఞానాగ్నితో సర్వకర్మలను కాల్చివేయాలి. (జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణుః)

‘‘నిష్కలము (కల్మషరహితము), నిశ్చలము (మార్పు-చేర్పులు లేనిది), పరమ శాంతము అగు బ్రహ్మమే నేను!’’ … అని సుస్పష్టము, నిర్దుష్టము చేసుకోవాలి.

ఇదీ.. మానవ జీవితాశయము! మహదాశయము!

ఆత్మస్వరూపుడుగా మహత్తరుడను.

సర్వభూత అధివాసంచ - సర్వజీవులలో అధివాసుడను.
💐 సర్వజీవులలో సర్వదా వేంచేసియున్నట్టివాడను. యత్ భూతేషు వసత్యపి,
💐 సర్వజీవులకు సర్వము అనుగ్రహించునట్టివాడను. సర్వానుగ్రహత్వేన…,
💐 సర్వ జీవులలోను, సర్వ జీవులుగాను సర్వదా ఉన్నట్టివాడను.

అంతేగాని, ఒక దేహములోని ఒక జీవత్వము, (లేక) ఆయా జన్మ-కర్మల పరిమితుడనుగాను.

సర్వభూత నివాసోఽస్మి-అహమస్మి వాసుదేవః। వాసు దేవుడే నేను!
సర్వులుగా కనిపించే వాసుదేవుడను నేనే!
తత్ వాసుదేవమ్ అహమస్మి। తత్ అస్మి అహం వాసుదేవః।।



🙏 ఇతి అమృతబిందు ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।