[[@YHRK]] [[@Spiritual]]

Avadhoota Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


కృష్ణయజుర్వేదాంతర్గత

3     అవధూతోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। గౌణముఖ్య అవధూతాలి
హృదయాంబుజ వర్తి యత్,
తత్ త్రైపదం బ్రహ్మతత్త్వం
స్వమాత్రమ్ అవశిష్యతే।।

ఏ పరబ్రహ్మతత్త్వమైతే అవధూత మహాశయుల హృదయపుష్ప సుగంధ సౌరభమై వెల్లివిరుస్తోందో, ప్రతి జీవుని జాగ్రత్-స్వప్న- సుషుప్తుల త్రైపదమును అలంకరించి ఉంటుందో, అట్టి స్వయం స్వరూప స్వయం ప్రకాశాత్మయే సర్వదా అవశిష్యమైయున్నది.

ఓం
1. అథః హ
సాంకృతిః భగవంతమ్
అవధూతమ్ దత్తాత్రేయం
పరిసమేత్య పప్రచ్చ:
ఓంకార-పరతత్త్వ స్వరూప పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాము.
ఒకసారి,
పరతత్త్వజ్ఞాన జిజ్ఞాసియగు సాంకృతి మహర్షి.. → భగవంతుడు, అవధూత అగు దత్తాత్రేయస్వామిని సమీపించి, వినయ-విధేయతలతో ఇట్లా ప్రశ్నించసాగారు.
భగవన్! కో అవధూతః?
తస్య కా స్థితిః?
కిం లక్ష్మ? కిం సంసరణమ్? ఇతి।
హే భగవన్। ‘అవధూత’ అని ఎట్టివారిని పిలుస్తాము? వారి స్థితి ఎటువంటిది? వారి చిహ్నము ఏమిటి? వారు ఈ దృశ్యమును ఏరీతిగా చూచు సంబంధము కలిగి ఉంటారు?
తగ్ం హో వాచ,
భగవాన్ దత్తాత్రేయః,
పరమ కారుణికః :
అపార కరుణామయుడు, భగవంతుడు అగు అవధూత దత్తాత్రేయులవారు సాంకృతి మహర్షి యొక్క ప్రశ్నకు సంతోషము పొంది, - ఇట్లా వివరించసాగారు.
అక్షరత్వాత్ వరేణ్యత్వాత్
ఉద్ధూత సంసార బంధనాత్।
‘తత్ త్వమ్ అసి’ ఆది లక్ష్యత్వాత్
‘అవధూత’ ఇతి ఈర్యతే।।
ఓ సాంకృతి మహర్షీ! వినండి. మార్పు-చేర్పులు లేనట్టి స్వస్వరూప సహజాత్మత్వముతో మమేకత్వము పొందిన అక్షరుడు, సర్వశ్రేష్ఠమగు కేవలత్వమును ఆశ్రయించి ఉన్నవాడు, సర్వ(మనో-బుద్ధి-చిత్త- అహంకార-దేహ)బంధములన్నీ దాటివేసినవాడు (బంధ విముక్తుడు), ‘‘నీవుగా కనిపించేది అదియే। నేనే।’’.. (తత్త్వమసి, సోఽహమ్, త్వమేవాఽహమ్).. భావన యొక్క లక్ష్యశుద్ధి పొందినవాడు ‘అవధూత’ → అని పిలువబడుచున్నారు.
యో విలంఘ్య ఆశ్రమాన్,
వర్ణానాత్,.. ఆత్మన్యేవ స్థితః సదా,
అతివర్ణాశ్రమీ యోగీ ‘‘అవధూతః’’
స కథ్యతే।।
బ్రహ్మచారి-గృహస్థ-వానప్రస్థ-సన్యాస ఆశ్రమ ధర్మములను, సమస్త వ్యావహారిక ధర్మములను దాటిపోయి ‘ఆత్మ’యందే ఎల్లప్పుడు స్థితి (Placement) కలిగియున్నవాడు,
వర్ణాశ్రమధర్మములచే నియమితుడు పరిమితుడు కాక, సర్వాతీతమగు ఆత్మధర్మమును పుణికిపుచ్చుకొన్న యోగి ‘అవధూత’ అని చెప్పుకోబడుచున్నారు.
2. తస్య ప్రియం ‘శిరః’ కృత్వా,
‘మోదో’ దక్షిణ పక్షకః,
‘ప్రమోద’ ఉత్తరః పక్ష,
‘ఆనందో’ గోష్పదాయతే।।
ఆయన ప్రియత్వము (Absolute Love) శిరస్సుగా కలిగి ఉంటారు.
మోదము (Experiencing the world) కుడి విభాగముగాను, ప్రమోదము (ఆత్మా నందము) ఎడమ విభాగముగాను కలిగి ఉంటున్నారు. ఆనందము గోష్పదము. (అనగా) బ్రహ్మానందమును ఆశ్రయించినవారై, లౌకికానందములను ఆవుడెక్క ముద్రవలె (గోష్పదమువలె) సులభముగా దాటినవారు - అయి ఉంటున్నారు.
గోవాల సదృశం శీర్షే
నాపి మధ్యే
న చ అపి అధః
బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ఠేతి,
పుచ్ఛాకారేణ కారయేత్,
ఏవం చతుష్పథం కృత్వా,
తే యాంతి పరమాం గతిమ్।
ఆవు తోక వలె, శిరస్సు కలిగి ఉంటారు. (పైకి సామాన్యుడుగా కనిపిస్తూనే బ్రహ్మమే పుచ్ఛముగా అంతరమున కలిగి ఉంటారు).
మధ్యగాని, క్రిందగాని కాకుండా గోవుతోక ఆకారముగా బ్రహ్మపుచ్ఛము (దీర్ఘంగా వేలాడు వెనుక వైపు పిలకస్థానపు వెంట్రుకలు) కలిగి ఉండి బ్రహ్మపుచ్ఛము ధారణగా కలిగి ఉంటారు. ‘‘బ్రహ్మ పుచ్ఛము అనగా’’
(సోఽహమ్, త్వమేవాఽహమ్, తత్త్వమ్, జీవో బ్రహ్మా-తినా పరః - అను) 4 పాదములు (పథములు) నిర్వర్తించుచూ అట్టి అవధూత బ్రహ్మపుచ్ఛ - ధర్మముచే అలరారుచూ ఉంటారు. అట్టివారు పరమాగతిని సిద్ధించుకొని ఉంటారు.
న కర్మణా, న ప్రజయా - ధనేన
త్యాగేన ఏకే - అమృతత్వ మానశుః।।
ఓ సాంకృతి మహర్షీ। మార్పు-చేర్పుల రూపమగు ‘మృతము’ యొక్క పరిధినిదాటి (బ్రహ్మపుచ్ఛము అనబడు) ‘అమృతత్వము’ సిద్ధించుకునేది ఎట్లా? కర్మల వలనగాని, సంతానము మొదలైన బంధుమిత్ర పరివార శిష్యగణ ప్రజాసంపద వలనగాని, ధననముచే గాని అమృతరూపమగు మోక్షము లభించదు. మరి? సర్వత్యాగము చేత మాత్రమే అమృతత్త్వము ఈ జీవునకు సిద్ధించగలదు. అవధూత ఆ విధంగా సర్వత్యాగి - సత్‌న్యాసి అయి ఉంటున్నారు.
స్వైరం స్వైర విహరణం
సత్సగ్ం సరణమ్।
అవధూతలు - ‘సత్’ బ్రహ్మమును ఆశ్రయించి జగత్తులలో స్వైరవిహారము చేస్తూ ఉంటారు. వారికి జగత్ సంచారము ‘‘స్వస్వరూపాత్మయందు లీలా సంచారము’’తో సమానము.
స-అమ్బరా వా, దిగమ్బరా వా,
న తేషాం ధర్మ-అధర్మౌ
న మేధ్య - అమేధ్యౌ
వస్త్రములు ధరించియో, ధరించకయో ఉంటారు. వారు ధర్మ-అధర్మముల పరిధులకు పరిమితము (Do’s and Don’ts) కలిగి ఉండరు. ‘‘ఇది పవిత్రము. స్వీకరించెదను. ఇది అపవిత్రము. స్వీకరించును’’.. అనునది ఏదీ వారి పట్ల ఉండదు. సమస్తము ఆత్మమయంగా చూస్తూ ఉంటారు.
సదా సాంగ్రహణ్యేష్టా
అశ్వమేధాంతమ్
అంతర్యాగం యజతే।
స మహామఖో మహాయాగః।।
‘‘సర్వము సర్వదా సర్వత్రా బ్రహ్మమే’’ - అను బ్రాహ్మీదృష్టియే వారికి సాంగ్రహణయాగము. అట్టి మనస్సు అనే గుణముచే, బ్రాహ్మీ భావనచే సర్వదా అంతరము - అశ్వమేధము (అంతర్యామిగా అంతర్యాగం) చేస్తూ ఉంటారు.
అంతర్యామిత్వమే వారు చేయు మహాయజ్ఞము, మహాయాగము!
కృత్స్నమ్ ఏతత్ చిత్రమ్ కర్మ।
స్వైరం న విగాయేత్, తత్ మహా వ్రతమ్।
న స మూఢవత్ లిప్యతే,
యథా రవిః సర్వ రసాన్ ప్రభుంక్తే।
హుతాశనః చ అపి హి సర్వభక్షః।
అవధూత యొక్క కర్మలు లోకరీతిగా చూస్తే చిత్ర-విచిత్రాలుగా ఉంటాయి.
దృశ్య విషయంగా దేని గురంచీ మనో అంతర్గతంగా పట్టించుకోరు. ఇది ఆతనికి మహావ్రతము. (జగత్తును జగత్తుగా కాకుండా, ఆత్మగానే దర్శిస్తారు).
మూఢుని వలె రాగ-ద్వేష దోషములు దరికి రానీయరు. మనస్సుకు విషయ రజమును పూసుకోరు. ఆత్మ భావనను విడువరు.
సూర్యుడు సర్వరసములను పీల్చుచు తాను రసదోషములను పొందరు కదా! అగ్ని అన్నిటినీ భక్షిస్తూ కూడా తాను ఆయా పదార్థ దోషములను పొందదు కదా!
తథైవ (ఏతత్) యోగీ
విషయాన్ ప్రభుంక్తే
న లిష్యతే పుణ్యపాపైః చ శుద్ధః।।
అదేవిధంగా యోగి కూడా ఆయా సందర్భమగుచున్న సర్వ ప్రాపంచక విషయాలను పొందుతూ కూడా, వాటి వాటి పాప-పుణ్యముల దోషము పొందక ఎల్లప్పుడు పరిశుద్ధుడై ఉంటాడు.

అపూర్యమాణమ్ అచలమ్  
ప్రతిష్ఠగ్ం సముద్రమ్ ఆపః  
ప్రవిశంతి యద్వత్,  
తద్ వత్ కామాః యం  
ప్రవిశంతి సర్వే  
స శాంతిమ్ ఆప్నోతి। న కామ కామీ।

అచలము అగు సముద్రములో నదీజలము ప్రవేశించినప్పటికీ సముద్ర జలం పొంగక-కృంగక సశాంతించు రీతిగా, లోకసంబంధమైన సర్వకామములు ‘అకామకామి’ అగు అవధూతయందు ప్రవేశము పొందినప్పుడు ఆతడు పొంగడు, క్రుంగడు. అవన్నీ అతనియందు సశాంతిని పొందుచున్న వగుచున్నాయి. కోరికలను కోరుకొనువాడో → శాంతిని పొందలేడు. కోరికలు కోరుకొను స్వభావము కలవానిపట్ల కోరికలకు అంతు ఉండదు. కనుక కోరికలు తీరని అసంతృప్తి ఆతనిని వదలదు.
న నిరోధో, నచ ఉత్పత్తిః, న బంధో,
న చ సాధకః, న ముముక్షుః,
న వై ముక్త - ఇతి యేషా పరమార్థతా।
ఆతని యందు నిరోధము (బలవంతము) అనునది ఉండదు. ‘‘ఏదో కావాలి. మరేదో వద్దు’’ అని భావావేశ పరంపరలు ఆతనియందు జనించటమనునదేదీ ఉండజాలదు! ఆతడికి ఏ బంధము లేదు. సాధకుడు కాదు.ముముక్షువు (మోక్షము కోరువాడు) కాదు. పరమార్థముగా ఆతనికి బంధము లేదు. బంధము లేదు కాబట్టి ‘ముక్తి’ అనునదీ లేదు.
3. ఐహిక ఆముష్మిక వ్రాత సిద్ధ్యై ముక్తేశ్చ
సిద్ధయే। బహుకృత్యం
పురాస్యాత్ మే తత్ సర్వమ్ అధునా కృతమ్।
తత్ ఏవ కృతకృత్యత్వం
ప్రతియోగి పురస్సరమ్-
అనుసందధత్ ఏవాయం ఏవం తృప్యతి నిత్యశః।
దుఃఖినో అజ్ఞాః
సంసారం తు కామం పుత్రాది అపేక్షయా।
‘‘ఇహలోకంలో ఐహికంగాను, పరలోకంలో ఆముష్మికముగాను పొందవలసినది పొందటానికి (లేక) ఎంతగానో, ఇతః పూర్వము కర్మలు నిర్వర్తించి ఉన్నాను. ఇప్పుడు చేయవలసినది, ఇక ముందు చేయవలసినవి ఇంకెన్నో కర్మలు ఉన్నాయి. ఇతః పూర్వపు కర్మలకు ప్రతిగా ఇంకా కొన్ని చేయాలి’’ → ఇదియే సంసారము. సర్వము జగన్నాటకంగా దర్శించటమే సంసారమును జయించటము. దేనితోనూ ప్రమేయములేని ఆత్మతో అనునిత్యమగు అనుసంధానమే అసంసారరూపమగు ముక్తి.

‘‘ నేను దుఃఖిని. అజ్ఞానిని’’ అను భావన, ‘‘కొడుకు-బంధువుల కొరకై ఇంకా నేను ఏదో చేయాలి’’ → అను ఆపేక్షయే సంసార బంధము.
పరమానంద పూర్ణో అహగ్ం
సగ్ంసరామి కిమ్ ఇచ్ఛయా?
అనుతిష్ఠంతు కర్మాణి
పరలోక ధియా పరే। సర్వలోక-ఆత్మకః కస్మాత్
అనుతిష్ఠామి కిమ్ కథమ్? వ్యాచక్షతాం తే శాస్త్రాణి
వేదాన్ అధ్యాపయంతువా,
యే అత్ర అధికారిణో।
‘‘స్వతఃగానే నేను ఆత్మచే పరిపూర్ణ స్వరూపుడను. పరమానంద పూర్ణుడను. క్రొత్తగా ఇంకా పొందవలసినదేదీ లేనప్పుడు ఇక ఏది కోరికర్మలు నిర్వర్తించాలి? కనుక కర్మల ఆవశ్యకత నాకు ఏమున్నది? సర్వలోకములకు కూడా ఆత్మనైయున్న నేను పరము నందు ఏది ఎందుకు ఎట్లా పొందాలని కర్మలుచేయాలి? ఇహములో ఇంకనూ పొందనిదంటూ ఏముంటుంది? సంసారమనునది నాకు ఎక్కడిది? కొందరు వేదాధ్యయనము, శాస్త్రపఠనము, కర్మల నిర్వహణము చేస్తేగాని సిద్ధి పొందలేమని భావించెదరుగాక। వారు అవి నిర్వర్తించటానికి అర్హులు కావచ్చు! నాకు ఆయా కర్మలు క్రొత్తగా ఇచ్చునది ఆత్మస్వరూపము దృష్ట్యా ఏదీ లేదు’’.
మే తు న అధికారో, అక్రియత్వతః।
నిద్రా భిక్షే స్నాన శౌచే న ఇచ్ఛామి
న కరోమి చ। ద్రష్టారః చేత్ కల్పయంతు,
కిమ్ మే స్యాత్ అన్యకల్పనాత్?
‘‘నేను వాటి ఆవశ్యకత కలవాడిని కాదు. నేను ఆత్మగా అక్రియుడను. ఆత్మగా క్రియలకు సంబంధించినవాడనే కాను. అందుచేత నిద్ర, భిక్ష, స్నానము, శౌచము-ఇవన్నీ అనివార్యమని కోరుకోను. వాటిన్నిటిపై నాయొక్క ఆత్మత్వము ఆధారపడినదైలేదు.’’ - అని అవధూత ఎరిగి ఉంటాడు.
‘‘ద్రష్ట యొక్క కల్పనపై సత్యదృష్టి ఎవరికి ఉంటుందో వారికి కర్మలు ఉంటాయేమో! నాకు వేరైన ‘ద్రష్ట’ (లేక జీవాత్మ), కల్పన లేనేలేదు. ఆత్మకు అన్యమైనదే లేదు. నేను ఆత్మస్వరూపుడను. ద్రష్ట-దృశ్యములు మమాత్మకు కించిత్‌కూడా వేరు కాదు’’.
గుంజా పుంజాది దహ్యేత
న అన్యారోపిత వహ్నినా,
న అన్యారోపిత సంసార
ధర్మాత్, ఏవమ్ అహమ్ భజే।
శృణ్వం తు అజ్ఞాత తత్త్వాత్ తే జానన్
కస్మాత్ శృణోమి అహమ్?
కోతులు కొన్ని చలికాచుకోవటానికి గురివింద గింజలను ఎరుపువైపుగా ఒకచోట పెట్టి ‘‘ఈ గురివింద గింజల అనే అగ్నిలో చలికాచుకుంటు న్నాము’’.. అని అన్యారోపితకల్పనగా అనుకొంటాయి. చలి తగ్గినట్లే భావిస్తాయి. ఈ లోకవాసనలు, శాస్త్ర వాసనలు- అట్టి అన్యారోపితమైనవి.
అన్యారోపితమైన లోకంలో ప్రసిద్ధమైన సంసార ధర్మాలు గురువింద గింజ యొక్క ఎరుపుతో చలికాచుకోవటంగా భావించుచున్నాను. ఆత్మానుభవము పొందనప్పుడు (కథ-కథనములతో కూడిన) శాస్త్రములు వినవలసి రావచ్చుగాక! ఆత్మ నేనే అయి ఉండగా వాటితో క్రొత్తగా విని తెలుసుకోవలసినదేమున్నది?
మన్యంతాం సంశయాపన్నాః న మన్యే।
అహమ్ అసంశయః।
విపర్యస్తో నిదిధ్యాసే
కిమ్ ధ్యానమ్ అవిపర్యయే?
సందేహాలు ఉన్నప్పుడు శాస్త్రజ్ఞానం (జ్ఞానః సంచ్ఛిన్న సంశయః।) నేను అఖండమగు ఆత్మను! ఇందులో నాకు సందేహమే లేదు. ఆత్మనే నేనై ఉండగా ఆత్మభావనకు వేరైన విశేషాల గురించిన ధ్యాస- అనబడే విపర్యముతో పనేమున్నది? విపర్యయమే లేనప్పుడు ధ్యానము చేయటమనునది నాకు ఎక్కడిది? ఎందుకు? నాకు అనన్యమగు ఆత్మభావనయే నాకు ధ్యానము! అన్యధ్యానముతో పని లేదు.
4. దేహాత్మత్వ
విపర్యాసమ్,
న కదాచిత్ భజామి అహమ్।
అహమ్ మనుష్య ఇత్యాది
వ్యవహారో వినాప్యముమ్।
విపర్యాసమ్ చిరా
అభ్యస్త వాసనాతో అపకల్పతే।
ఓ సాంకృతి మహర్షీ! ‘‘ఈ దేహము నాకు సంబంధించినది కాదు. ఈ దేహమునకు నేను సంబంధించినవాడను కాను. ‘దేహాత్మత్వము’ అనే విపర్యయమును ఎప్పుడూ దరిజేరనీయను. పొందను. దేహాత్మత్వమును ఆశ్రయించను. ఈ దేహము ఉన్నప్పుడు, ఇది త్యజించినప్పుడు, మరొక దేహము వచ్చుచున్నప్పుడు-సర్వదా నేను నేనే కదా!’’-ఇది అవధూత యొక్క అవగాహన. ‘నేను మానవుడను’ ‘నేను దేవతను’ - ఇటువంటివన్నీ చిరకాలము అభ్యసించిన వాసనల వలన పరికల్పించబడేవి మాత్రమే.
‘‘నేను సర్వదా కేవలాత్మ స్వరూపుడను’’ అను సమున్నత సత్యభావన.. అను విపర్యాసము (అతీతభావన) చేత అనేక జన్మలుగా (దేహములుగా) అభ్యసించిన దేహాత్మవాసనలు ఇక కల్పించబడవు. మొదలంట్లా తొలగుతాయి.
ఆరబ్ధ కర్మణి క్షీణే వ్యవహారో నివర్తతే।
కర్మక్షయే తు ఆసౌ
నైవ శామ్యేత్
ధ్యాన సహస్రతః।
విరళత్వం వ్యవహృతేః
ఇష్టం చేత్ ధ్యానమ్ అస్తు తే।
ఓ మహర్షీ! ‘‘నేను కర్మబద్దుడను. సంచిత-ప్రారబ్ధ-అగామి కర్మలు ఉన్నాయి. ప్రారబ్ధకర్మల వ్యవహారమంతా అనుభవించుచుండగా కర్మక్షయము కలుగుతుంది’’ - మొదలైన కర్మబంధ వ్యవహార సరళి అంతా, ఆత్మ యొక్క అనుభవము చేతనే తొలగుతాయి. అంతేగాని వేయిసార్లు ధ్యానము చేసినా కూడా కర్మలు క్షయించవు. శమించవు.
‘ఆత్మాహమ్’ జ్ఞానముచే వ్యవహరిస్తూ అవ్యవహారినే అవుతాను. కనుక వ్యవహారములతో సంబంధమును విరళత్వం చేసుకోవాలి - (తగ్గించు కోవాలి) అనిపిస్తే.. అప్పుడు నీవు ధ్యానమునందు మగ్నుడవు అయితే అయ్యెదవుగాక! (లేక) వ్యవహరించటము కొనసాగించెదవు గాక! ఆత్మతత్త్వజ్ఞానము సమక్షంలో రెండూ ఒక్కటే. ధ్యానము- ఆత్మానుభవము ఏకత్వము పొందుచున్నాయి.
బాధికర్మ వ్యపహృతిం
పశ్యన్ ధ్యాయామి అహమ్ కుతః?
విక్షేపో నాస్తి యస్మాత్ మే,
న సమాధిః తతో మమ?
విక్షేపోవా సమాధిర్వా
మనసః స్యాత్ వికారిణః।
ఆత్మయందు వ్యపహృతి చేత నా పట్ల సర్వకర్మలు బాధించబడి నిష్పలస్థితి, నిరర్థకత పొందుచున్నాయి.
ఆత్మగా శేషించుచున్న నాకు ఇక ధ్యానము అను ప్రక్రియతో క్రొత్తగా పని ఎక్కడిది?
ఆత్మాఽహమ్ భావన నుండి విక్షేపమే పొందనట్టి నాకు సమాధి యొక్క అభ్యాసమంటూ వేరే ఎక్కడిది? ఎందుకొరకు?
విక్షేపము అయినా, లేక సమాధి అయినా కూడా → అదంతా మనస్సుకు సంబంధించిన వికారములు మాత్రమే! అంతేగాని, నాకు సంబంధించినవే కావు. నా స్వరూపమునకు విక్షేపమే లేదు. ఇక సమాధి ఎందుకు?
నిత్య- అనుభవరూపస్య
కో మే అత్ర అనుభవః పృథక్?
కృతం కృత్యం ప్రాపణీయమ్, ప్రాప్తం
ఇవ్యేవ నిత్యశః।
వ్యవహారో లౌకికో వా
శాస్త్రీయో వా అన్యథా అపి వా,
మమాకర్తుః అలేపస్య
యథా ఆరబ్ధం ప్రవర్తతామ్।
అథవా కృతకృత్యోఽపి
లోక అనుగ్రహ కామ్యయా
శాస్త్రీయేణైవ మార్గేణ వర్తే అహమ్।
సర్వకాల సర్వావస్థలయందు నా యందు నేనే ఏర్పడి ఉండగా నాకు ‘‘అనుభవము - అనుభవించువాడు - అనుభవించబడునవి’’.. అనునవి ఎట్లా వేరుగా ఉంటాయి? ఉండజాలవు! అవన్నీ సర్వదా నేనే!
ఆత్మగా క్రొత్తగా చేయవలసినదేమున్నది? అందుచేత, చేయవలసినదంతా చేస్తూ కూడా చేయని వాడనే అగుచున్నాను. ప్రాప్తించుకోవలసిన ఏదైనా ఉంటే, అదంతా ప్రాప్తింపజేసుకొన్నవాడనే అయి ఉన్నాను. ఇక శాస్త్రీయ వ్యవహారికంగాగాని, లౌకిక వ్యవహారికంగాగానీ, మరింకేదైనా విధంగా గానీ నిర్దోషాత్మ స్వరూపుడనైన నేను అలేప్యుడను (నిత్యనిర్మలుడను). అకర్తను. సర్వకర్తను.

ఎంతెంత వరకు ప్రారబ్ధము (క్రితం జన్మల కర్మఫలాలు సంస్కారాలు) ప్రవర్తిస్తాయో,, (వాస్తవానికి నేను కృతకృత్యుడను అయి ఉండి కూడా).. అంతంత వరకు లోకసానుకూల్యత కొరకు, శాస్త్రానుకూలతను కోరుకుంటూ కర్మలు నిర్వర్తిస్తూ వర్తిస్తూ ఉంటాను. కర్మలు చేస్తూ కూడా అకర్తనే. ఆత్మనగు నేను కర్మలకు నిబద్ధుడను నేను.
మమ కా క్షతిః?
దేవార్చన స్నాన శౌచ భిక్ష ఆదౌ
వర్తతాం వపుః, తారం
జపతు వాక్ తద్వత్
పఠత్వా ఆమ్నాయ మస్తకమ్
విష్ణుం ధ్యాయతు
ధీర్యద్వా బ్రహ్మానందే
విలీయ తామ్।
సాక్ష్యహమ్।
కించిత్ అపి అత్ర
న కుర్వే। న అపి కారయే।
కర్మల వలన పోయేదేమున్నది? వచ్చేదేమున్నది?
ఈ శరీరము దేవతార్చనయందు, స్నాన-శౌచక్రియల యందు, భిక్షాటణ మొదలైన ఆహార - విహార శరీరావసరములందు ప్రవర్తింప జేయబడుచూ ఉండవచ్చుగాకు! నోరు( ‘‘హరేరామ హరే రామ- శ్రీరామ రామ రామరమేతి’’… మొదలైన) తారకమంత్రము పలుకుచుండునుగాక! అట్లాగే ఆత్మస్వరూప-స్వభావములను విశదీకరించు ఉపనిషత్-ఉపనిషత్ మహావాక్యార్థములను నేను పఠిస్తూ ఉండవచ్చుగాక!
చిత్తము విష్ణు ధ్యానము చేయుచుండవచ్చుగాక! బుద్ధి ధీరత్వముతో బ్రహ్మానందము నందు లీనమై ఉండవచ్చునుగాక!
ఆ అన్ని సంగతులకు, సందర్భములకు సర్వదా కేవల సాక్షిని!
మనో బుద్ధి చిత్త అహంకారాదులకు కేవల సాక్షీస్వరూపుడనగు నేను ఏదీ నిర్వర్తించటమూ లేదు. దేనిచేతా ఏదీ చేయించటమూ లేదు.
కృత కృత్యతయా తృప్తః
ప్రాప్త ప్రాప్య తయా పునః।
కృతకృత్యత్వము చేతను, తృప్తప్రాప్త్యత్వము చేతన అత్యంత సంతృప్తిని ఆస్వాదిస్తూ సర్వమును సాక్షిగా, సర్వమునకు ఆవల ఉండి ప్రశాంతంగా గమనిస్తూ చూస్తూ ఉంటున్నాను. నాయొక్క ఆవల-ఈవల స్వరూపములతో సహా పూర్ణాత్ముడను. సంపూర్ణుడను. (I am complete by myself)
5. తృప్యత్ ఏవం (తృప్యన్నేవం)
స్వ మనసా మన్యతే అసౌ నిరంతరమ్।
ధన్యోఽహమ్।
నిత్యగ్ం స్వ-ఆత్మానమంజసా వేద్మి।
ధన్యోఽహమ్। ధన్యోఽహమ్।
బ్రహ్మానందః విభాతి మే స్పష్టమ్।
ధన్యోఽహమ్। ధన్యోఽస్మి।
అత్యంత తృప్తితో కూడిన మనస్సుతో నిరంతరము ఈ విధంగా గమనించువాడనై ఉంటున్నాను.
- నేను ధన్యుడను।
- ధన్యుడను।
- నిత్యము సత్యము అగు స్వాత్మాను సుస్పష్టముగా ఎరిగినవాడనై స్వాత్మగా ప్రకాశించుచున్నాను.
- నేను ధన్యుడను।
- నేను ధన్యుడను!
నాపట్ల బ్రహ్మానందము సుస్పష్టముగా భాసించుచున్నది.
ధన్యోఽహమ్। ధన్యోఽహమ్।
దుఃఖం సాంసారికం
న వీక్షే ఆద్య।
ధన్యో అహమ్।
ధన్యో అహమ్।
స్వస్య అజ్ఞానమ్
పలాయితమ్ క్వా అపి।
ధన్యోఽహమ్। ధన్యోఽహమ్।
కర్తవ్యం మే న విద్యతే కించిత్।
ధన్యోఽహమ్। ధన్యోఽహమ్।
ప్రాప్తవ్యమ్ సర్వమ్ అద్య సంపన్నమ్।
ధన్యోఽహమ్। ధన్యోఽహమ్।
తృప్తేః మే కో
ఉపమా భవేత్ లోకే?
ధన్యోఽహమ్। ధన్యోఽహమ్।
ధన్యో। ధన్యః। పునః పునః ధన్యః।।
నేను ధన్యుడను.
ధన్యుడను!
(ఆత్మగా నన్ను నేను ఎరుగుటచే) ఇప్పుడు సాంసారిక దుఃఖము నాకు కనబడటము లేదు.
నేను ధన్యుడను!
ధన్యుడను!
వెలుతురు రాగానే చీకటి మటుమాయమైనట్లు ఆత్మజ్ఞానము వెలుగుచుండగా అజ్ఞానపు చీకటి కోణములు ఎటువైపుకో పలాయనము చిత్తగించుచున్నాయి.
నేను ధన్యుడను। ధన్యుడను।
నాకు ఆత్మగా కించిత్ కూడా ‘కర్తవ్యము’ అనునది ఏదీ లేదు.
నేను ధన్యుడను। ధన్యుడను।
ప్రాప్తించవలసినదంతా ప్రాప్తించగా ఇప్పుడు సుసంపన్నుడనైనాను
నేను ధన్యుడను। ధన్యుడను।
నేను పొందుచున్న ఈ ఆత్మ తృప్తికి లోకములోని విశేషాలకు సంబంధమే లేదు.
నేను ధన్యుడను। ధన్యుడను!
మరల మరల ధన్యుడను.
ఫలశ్రుతి
అహోపుణ్యమ్, అహోపుణ్యమ్
ఫలితమ్ ఫలితమ్ దృఢమ్।
అస్య పుణ్యస్య సంపత్తేః
అహో వయమ్। అహో వయమ్।
అహో జ్ఞానమ్। అహో జ్ఞానమ్।
అహో సుఖమ్ అహో సుఖమ్ఊ
అహో శాస్త్రమ్।
అహో గురుః। అహో గురుః ఇతి।।
య ఇదమ్ అధీతే, సోఽపి,
కృతకృత్యో భవతి।
సురాపానాత్ పూతో భవతి।
స్వర్ణస్తేయాత్ పూతో భవతి।
బ్రహ్మహత్యాత్ పూతో భవతి।
కృతకృత్యాత్ పూతో భవతి।
ఏవం విదిత్వా స్వేచ్ఛాచారపరో,
భూయాత్ ‘ఓగ్ం’
ఫలశ్రుతి
ఏమి పుణ్యము! ఏమి పుణ్యము!
దృఢమైన ఫలితమే ఆత్మతత్త్వానుభవము.
ఆ పుణ్య సంపత్తి నేనే। నేనే।
ఆత్మయే (నేనే)
జ్ఞాన ఫలము!
ఆహా। ఆత్మయే సుఖము।
ఆహా"! శాస్త్రము…,
ఓహో! గురువు…
శాస్త్రము, గురువులు నాకు నాగురించిన పరమసత్యమును సుస్పష్టపరచు చున్నారు.
ఎవ్వడు ఈ అవధూతోపనిషత్ అధ్యయనము చేస్తాడో అట్టివాడు కూడా కృతకృత్యుడు అగుచున్నాడు!
సురాపానము, బంగారము దొంగిలించటము, బ్రహ్మహత్య మొదలైన మహాపాతక దోషముల నుండి కూడా పునీతుడు పవిత్రుడు కాగలడు.
కృతకృత్యుడు, పవిత్రుడు అవగలడు.
అవధూతోపనిషత్ పరమార్థమును ఎరిగినవాడు స్వేచ్ఛ ముక్తి పొందినవాడగుచున్నాడు. తిరిగి కేవలాత్మతత్త్వముతో సంయోగము పొందుచున్నాడు. ఓం తత్ సత్।।
సత్యమ్ ఇతి ఉపనిషత్।।
సత్యము నుండి చ్యుతి చెందను.

ఇతి అవధూతోపనిషత్ సమాప్తా।।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



కృష్ణ యజుర్వేదాంతర్గత

3     అవధూత ఉపనిషత్

అధ్యయన పుష్పము

‘ఓం’… వేద ప్రవచిత సంజ్ఞార్థ స్వరూపుడగు స్వస్వరూప-సర్వస్వరూప-జగత్‌స్వరూప పరమాత్మకు నమస్కరిస్తూ…,

ఒక సందర్భములో గొప్ప తపశ్శాలి, లోకకల్యాణ మహదాశయుడు, తత్వార్థన్యాసి అగు సాంకృతి మహర్షి…. భగవంతుడు, అవధూతశ్రేష్ఠుడు, ఆశ్రితజన మోక్ష ఫల ప్రదాత అగు దత్తాత్రేయ స్వామిని దర్శించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించారు.

శ్రీ దత్తాత్రేయ అవధూత : బిడ్డా! నీకు శుభమగుగాక! విచ్చేసిన కారణం?

సాంకృత మహర్షి : హే భగవాన్! తత్త్వార్థ జిజ్ఞాసినై మిమ్ములను దర్శించి మీ ప్రవచనములు విని సంసార బంధములను త్రెంచుకోవాలని ఉద్దేశ్యించాను.
స్వామీ!
⁉️ కో అవధూతః? ఎవ్వరిని ‘అవధూత’ అని అంటాము?
⁉️ కా స్థితిః? అట్టి అవధూత యోగి యొక్క స్థితి, స్థానము ఎట్టిది?
⁉️ కిం లక్ష్మ? వారి చిహ్నములు ఏ విధంగా ఉంటాయి?
⁉️ ఈ సంసారము వారి పట్ల ఎట్టి రూపము కలిగి ఉంటుంది?

అపార కరుణామయుడు, ఆశ్రితజన వాత్సల్య సాగరుడు, భగవంతుడు అగు దత్తాత్రేయులవారు సాంకృతి మహర్షి యొక్క ప్రశ్న విని సంతోషము ప్రకటించారు. ఈ రీతిగా ప్రవచించసాగారు.

దత్తాత్రేయస్వామి : ఎవ్వరైతే….
👉 అక్షరత్వాత్… తరగటము - పెరగటము; జనించటము - నశించటము, మార్పు-చేర్పులు;… ఇటువంటి ధర్మములు కించిత్ కూడా ఉండనట్టి అక్షరస్వరూపమగు ఆత్మతో మమేకత్వము పొందిఉంటారో..,
👉 వరేణ్యత్వాత్…. ప్రతి ఒక్క వ్యక్తికి చెందిన సర్వశ్రేష్ఠమగు కేవలీస్వరూపమును బుద్ధితో ఎరుగుచూ, చిత్తముతో భావించువారై ఉంటారో..,
👉 ఉద్ధూత సర్వ బంధనాత్… మనోబుద్ధి-చిత్త-అహంకార పరిధులను దాటివేసి, బంధ-సంబంధములన్నీ జయించివేసి ఉంటారో.., నాటక పాత్ర యొక్క బంధములు నటునివి కాని తీరుగా ఉంటారో…,
👉 తత్త్వమసి, సోఽహమ్ త్వమేవాఽహమ్, అయమాత్మా బ్రహ్మ… మొదలైన వేద ప్రవచితములైన మహావాక్యముల అర్థలక్ష్యము కలిగి ఉంటారో…
అట్టివారు శాస్త్రములచే ‘‘అవధూత’’ అని పిలువబడుచున్నారయ్యా!

వారు బ్రహ్మచారి-గృహస్థ-వానప్రస్థ-సన్న్యాస ఆశ్రమధర్మములకు, లోకగతమైన బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్ర వర్ణపరిమితులకు అతీతులై ‘ఆత్మ’యందు సదా సంస్థితులై ఉంటారు.

అనగా ఆతడు ఆశ్రమ-వర్ణ ధర్మములకు నియమితుడు, పరిమితుడు కాదు. సహజముగా ఆత్మ ఒక్కటే ఆతని పట్ల ‘‘ధర్మము (feature)’’అయి ఉంటోంది. అట్టి ఆత్మత్వము అకృత్రిమంగా పుణికిపుచ్చుకొనియున్న వానిని అవధూతగా చెప్పుకోవటం జరుగుతోంది.

ప్రియ-మోద-ప్రమోద-ఆనందములే ఆతని 4 శారీరక విభాగములు.

ప్రియమును శిరస్సుగా ధరిస్తున్నారు. మోదము (సంతోషము) దక్షిణ (కుడి) విభాగంగాను, ఆత్మానంద రూపమగు ప్రమోదమును ఉత్తర (ఎడమ) భాగముగాను కలిగి ఉంటున్నారు. ఆనందము వారి బాటలో గోష్పదము (ఆవు డెక్కంత) వంటిది.
సంతోషము - తృప్తి - ఆనంద- బ్రహ్మానందములచే ఆయన స్వరూప-స్వభావములు నిత్య ప్రకాశమానము అగుచున్నాయి.

గోవాల సదృశం శీర్షమ్.. వారి శిరస్థానము (శిరో ఊర్ధ్వభాగము) గోవు యొక్క తోక రూపముగా ఉంటుంది. మధ్యగా గాని, క్రిందగా గాని కాకుండా (‘సుషమ్న’ యొక్క చివరగా) ‘‘బ్రహ్మపుచ్ఛము (బ్రహ్మరంధ్రమున) - 1) తత్‌త్వమ్ 2) సోఽహమ్ 3) త్వమేవాఽహమ్ 4) త్యమ్ అహమేవతు’’ అను చతుష్పదముపై ఆశీనుడై ఉంటాడు. ఈ సర్వము దర్శిస్తూ పరాంగతిని (స్థానమును) సునిశ్చలము చేసుకొని ఉంటున్నారు. ‘‘ఆతడు అమృతస్వరూపుడు’’ అని శాస్త్రములచే శ్లాఘించ బడుచున్నాడు. మృత్యువు ఆతనిపట్ల అసంగతమౌతుంది.

సాంకృతి మహర్షి : మహాత్మా! అవధూత శ్రేష్ఠా! దత్తాత్రేయ స్వామీ! ఈ జీవుడు ఏఏ కర్మలచే (లేక) ఏది పొందటముచే మృతత్వమును అధిగమించి అమృతస్వరూపుడౌతాడు?

దత్తాత్రేయులవారు : నాయనా! సాంకృతి మునీ! కర్మల వలనగాని, సంతానముయొక్క ప్రాప్తి చేత గాని, ధన-జన-నారీ.. ఇత్యాది సంపదలు కలిగియుండుటం చేతగాని, (లేక) సంపాదించుట చేతగాని అమృతస్వరూపుడు కాజాలడు. మృతత్వస్వభావ పరిధులను అతిక్రమించలేడు.

త్యాగేన ఏకే అమృతత్వమానసుః। ఒక్క త్యాగముచేత మాత్రమే ‘‘నేను దేహముతో పుట్టుచున్నాను, దేహముతో మరణిస్తున్నాను దేహము యొక్క ప్రవృద్ధిచే సుఖము. హానిచే దుఃఖము’’ అను ‘‘మృత్యుపరిధి’’ని -అతిక్రమించగలడు. ‘‘నేను ఈ దేహముల రాకపోకలకు వేరై వస్త్రముల ధారణవలె దేహ గ్రాహ్య - త్యాజ్యములకు సాక్షిని’’… అని గ్రహించి, అమృతత్వమును ఆస్వాదించటానికి త్యాగమే ఉపాయమై యున్నది. త్యాగము చేతనే కైవల్యము. అంతేగాని, దృశ్య విషయ పరంపరలేవో లక్ష్యముగా కలిగి, వాటిని పొందటముచేత కాదు.

సాంకృతి మహర్షి : ప్రభూ! అవధూతల సంచార ప్రదేశములు ఏవేవి? వేటివేటితో సంబంధము కలిగి ఉంటారు? ఏఏ క్రియలు, కర్తవ్యములు నిర్వర్తిస్తూ ఉంటున్నారు?

దత్తాత్రేయస్వామి : నాయనా!

వారికి ‘‘ఇక్కడ ఉండాలి! అక్కడ ఉండకూడదు’’… అను నియమాలేవీ వర్తించవు. యధేచ్ఛానుసారంగా ఎక్కడైనా సంచరిస్తూ ఉండవచ్చు. వారికి ఈ దృశ్యమంతా సత్స్వరూపమగు ఆత్మకు కించిత్‌గాకూడా భిన్నమని అనిపించదు.

అంతేకాదు. వారు వస్త్రములు ధరించటం జరుగుచుండవచ్చు. వస్త్రములు ధరించకనూపోవచ్చు. ‘‘ఇది నాకు ధర్మము. అది నాకు ధర్మము కాదు’’.. అను పరిమితులు కలిగి ఉండరు.

ధర్మ-అధర్మములు (Do’s and Don’ts) వారికి వర్తించజాలవు. ఆపాదించలేము. ‘‘ఇదియే పవిత్రము. అదికాదు’’ అను భేదము వారు కలిగి ఉండరు. అందుచేత ‘‘పవిత్రము కదా!’’ అని స్వీకరించరు. ‘‘అపవిత్రము’’.. అని తిరస్కరించరు. లోకసంబంధమైన పవిత్ర, అపవిత్ర వస్తు-స్థితి-స్థానములను వారికి ఆపాదించలేము.

‘ఈ వ్యవస్థలో ఉంటారు. ఆ వ్యవస్థలో ఉండరు’.. అని వ్యవస్థలను వారికి ఆరోపించవీలులేదు.

అవధూతల యాగము : సర్వమును సర్వత్రా సర్వదా బ్రహ్మముగా చూడటమే, సర్వులకు అంతర్యామి అయి ప్రకాశించటమే వారికి సాంగ్రహణ యాగము. అదియే వారికి అశ్వమేధము మొదలైన వాటికి మించిపోయినట్టి అంతర్యామి యాగము. అంతర్యామిత్వమే వారు అనుక్షణికమూ సర్వవేళలా నిర్వర్తించు మహాయజ్ఞము, మహాయాగము కూడా!

అవధూత యొక్క కర్తవ్య - అకర్తవ్య వ్యవహారములు లోకరీతిగా చూస్తే బహువిచిత్రంగా ఉంటాయి. ఈ జనులలో అనేకులు ఏఏ సిరి-సంపద- ఆపద-ప్రతిష్ట-స్వజనులు-పొగడ్తలు మొదలైనవి గొప్పగొప్ప విషయాలుగా భావిస్తున్నారో. అట్టి సంబంధ- బాంధవ్యములన్నీ అవధూత దృష్టిలో బాట ప్రక్కన కనపించే జంతుకళేబరములవలె తుచ్ఛమైనవిగా అగుచున్నాయి.

జనులు ఏఏ దృష్టిచే ‘‘సర్వము పరబ్రహ్మమే! స్వస్వరూపమే’’ అను భావనను (మమకార-అహంకార దృష్టులచే) సుదూరము చేసుకొని ఉంటున్నారో అట్టి దేహాత్మదృష్టిని (లేక) సాంసారిక దృష్టిని తిరస్కరించి, ఆత్మదృష్టిపరులై ఉంటున్నారు. అవధూతకు అనునిత్య ఆశ్రయ స్థానము ఆత్మయే అగుచున్నది. అంతర్యాగమ్ యజ్ఞతే। అంతర్యామి యాగములో నిమగ్నమై ఉంటున్నారు. అందుచేత స్వైరం న విగాయ్‌త్ - తత్ మహావ్రతమ్ - బాహ్యాడంబరములు, బాహ్య ప్రదర్శనలు ఆదరించకపోవటమే వారి పట్ల మహావ్రతము.

వారు మూఢులవలె, లోక సంబంధమైన సంఘటనలు - సందర్శనము - సంబంధము - అనుబంధము - బాంధవ్యము మొదలైనవాటిని అంటిపెట్టుకొని ఉండరు.. న సః మూఢవత్ లిప్యతే! ‘‘అవన్నీ కలలో కనిపించే జనుల పరస్పర సంబంధము వంటివి’’ - అను ఎరుకయందు సంశయరహితులై ఉంటారు.

ఆయా లోకసంబంధమైన విషయ - విశేషములచే ఏ మాత్రము దోషము పొందనివారై ఉంటారు. కలలోని దోష విషయాలు కల తనదైనట్టి స్వప్న సాక్షిని దోషపూరితం చేస్తున్నాయా? లేదు. కలలో కనిపించిన సంపదలు, ఆపదలు నిదురలేచి గుర్తుచేసుకొని-ఎవ్వడూ ‘‘నావి - నాకు సంబంధించినవి’’.. అని అనుకోడుగదా! అవధూత వర్తమానంలోనే ఈ దృశ్య వ్యవహారమంతా స్వప్న సదృశంగా దర్శిస్తూ ఉంటాడు. కనుక దృశ్య దోషములు ఆతనిని స్పృశించజాలవు.

సూర్యకిరణములు దృష్టాంతము - యధారవిః సర్వరసాత్ ప్రభుంక్తే। సూర్యుడు తన కిరణజాలములను సర్వ వస్తువులపై ప్రసరింపజేస్తూ, సర్వ రసములను పీల్చుచూ… వాస్తవానికి అవేమీ స్వీకరించకయే ఉంటారు కదా! మురుగుగుంటపై ప్రసరించిన కిరణములు అక్కడి తేమను ఆవిరి చేయవచ్చుగాక! అవన్నీ సూర్యుడు స్వీకరిస్తాడా? త్యజిస్తాడా? రెండూ ఉండదు కదా! అట్లాగే అవధూత నుండి బయల్వెడలే మనో, బుద్ధి, చిత్త, అహంకార కిరణపుంజాలు → విషయములపై, వస్తువులపై వ్రాలటం లోకరీత్యా జరిగినప్పటికీ.. ఆత్మ సూర్యప్రభారూపుడగు ఆ యోగి విషయములను అంతరంగా ఏమాత్రమూ స్వీకరించనివాడై ఉంటాడు.

యథా హుతాశనః సర్వభక్షః - అగ్నిదృష్టాంతము!
అగ్ని కాల్చు వస్తువుల దోషాలు అగ్నిని అంటుతాయా? వస్తువుల ఆకారాలు, రసాలు అగ్నిచే కాల్చబడుచూ వాటి ధర్మాలచే అగ్ని ఏ మాత్రమూ స్పృశించబడదుకదా! అట్లాగే.. తథాయేవ యోగీ విషయాన్ ప్రభుంక్తే, న లిప్యతే పుణ్య పాపైశ్చ శుద్ధే।

యోగి కూడా అగ్ని - సూర్యుని వలె నిత్యశుద్ధుడై ఉంటాడు. ప్రపంచంలో అజ్ఞాన జీవులను ముంచెత్తే పుణ్య-పాప విషయ పరంపరలు అవధూత యోగిని స్పృశించవు. దోషము కలిగించవు. ఆతని ఆత్మ దృష్టి పుణ్య - పాప ద్వంద్వ మోహములను దాటివేసినదై ఉంటుంది.

సముద్ర దృష్టాంతము:
ఆ పూర్యమాణమ్ అచలమ్ ప్రతిష్ఠగ్ం, సముద్రం
ఆపః ప్రవిశంతి యద్వత్, తద్వత్ కామా యం
ప్రవిశంతి సర్వే, సశాంతిమ్ ఆప్నోతి, న కామకామీ।।

యోగి జగత్తు పొందుతూ జగత్తు లేనివాడై ఉంటాడు. కోరికలు ఉండి కోరికలే లేనివాడై ఉంటాడు. అనేక నదీ జలాలు సముద్రంలో ప్రవేశించవచ్చుగాక! సముద్రము పొంగదు. సూర్యకిరణాలు సముద్రజలమును ఆవిరిగా మార్చివేస్తూ మేఘములను వర్ధిల్లింపజేస్తూ ఉండవచ్చుగాక, సముద్రము కృంగదు. సముద్రజలము ఎల్లప్పుడు నిండుగా తన సు-విశాలత్వము కొనసాగిస్తూనే ఉంటుంది కదా! అట్లాగే అవధూత అకామకామి అయి ఉంటాడు. అనుకొన్నవి సిద్ధించినంతమాత్రంచేత పొంగడు. సిద్ధంచకపోతే క్రుంగడు. స్వప్నంలో ఒకనికి గుడిసెలో ఉన్నట్లుగా కలవస్తే, లేదా అంతఃపురంలో ఉన్నట్లు కలవస్తే.. ఆతడు నిదురలేచి కృంగుతాడా? పొంగుతాడా? ఇక్కడి ప్రాపంచక విషయాలు అవధూతలో ప్రవేశించి సశాంతిస్తాయి. అంతేగాని కల్లోలం చేయవు. అదే కామకామి (కోరికలు కోరుకొనువాడు) విషయంలోనో? కోరికలు తీరితే పొంగటము, లేదా కృంగటము జరుగుతుంది. యోగికి, జగత్‌దృశ్య భోగికి గల భేదము ఇంతే!

న విరోధః : మనోబుద్ధి చిత్త అహంకారాలను ఆత్మకు ‘అద్వితీయము’గా దర్శిస్తూ ఉంటాడు. అందుచేత వాటి వాటి ధర్మములను నిరోధిస్తేనే ఆత్మభావన సిద్ధిస్తుందనే పట్టుదల, ఆవేశములను వదలి ఉంటాడు. ఏది ఎట్లున్నా కూడా స్వకీయ ఆత్మయే సర్వస్వరూపమై వెలుగొందుచున్నదను ఎరుక - దర్శనము - అనుభూతికి నిరోధకమైనదేదీ ఎక్కడా ఉండజాలదని గ్రహించి ఉంటాడు. మేఘాలు ఆకాశాన్ని మ్రింగగలవా? లేదు కదా! అట్లాగే దృశ్యసంబంధమైన మనస్సు ఆత్మను అణచిపెట్టజాలదు. జలతరంగములు జలమునకు అనన్యమే అయినట్లు, మనోతరంగములు ఆత్మయందే ఆత్మకు అనన్యమై ఉన్నాయి.

న చ ఉత్పత్తి : ఆత్మ స్వరూపుడుగా తనకు ఉత్పత్తి వినాశనములు లేవని గ్రహించి ఉంటాడు. దృశ్య-దేహ -మనో- బుద్ధి-చిత్త-అహంకారముల కలిమి-లేములతో సంబంధము లేని స్వస్వరూపమునందు నిత్యోదయుడై ఉంటాడు.

న బంధో : ‘‘జీవాత్మకు (ఇహస్వరూపమునకు) సంబంధించినవైనవనిపించే బంధమోక్షములతో పరాత్మ సంబంధించినదై ఉండదు. కాబట్టి - సర్వదా ఆత్మ స్వరూపుడనగు నాకు దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారములచే బంధము లేదు. సూర్యకిరణములు సూర్యుడికి బంధము ఎట్లా కల్పిస్తాయి?’’.. అని ప్రశ్నించుకొని సత్ వస్తువును ఎరిగి ఉంటాడు. ఆతనికి అయినవాళ్ళూ ఉండరు. కానివాళ్ళూ ఉండరు. స్వస్వరూపమగు ఆత్మయే సర్వత్రా సమస్తప్రదర్శన చమత్కారములుగా అగుచున్నట్లు ఆస్వాదిస్తూ ఉంటాడు.

న చ సాధకః : ఏదైనా ఇంకా సిద్ధించవలసినది ఉంటే.. అప్పుడు సాధన యొక్క ఆవశ్యకత ఉంటుంది. ఆత్మ - అద్దాని అఖండత్వ-అప్రమేయత్వములతో సహా సర్వదా సిద్ధించియే ఉన్నదని గమనిస్తాడు. కనుక సాధకుడు క్రొత్తగా ఏదో అవవలసిన అగత్యము ఆతనికి కనిపించదు. సాధక స్థితిని దాటివేసి, సర్వదా సిద్ధించినవాడై ఉంటాడు.

న ముముక్షుః : ఆకాశ సూర్యుని జలంలో ప్రతిబింబించే సూర్య ప్రతిబింబముతో సమానమైన కేవలకల్పితమగు ‘జీవాత్మ’కు బంధవిముక్తి యొక్క అగత్యమేమున్నది? నాటకంలోని పాత్రతో నటుడికి బంధమేమున్నది? అద్దానికి మోక్షమెక్కడిది? సహజము, సర్వసందర్భములకు సాక్షి అగు ఆత్మ నిత్యముక్తమై ఉండగా, క్రొత్తగా ముముక్షువు కావలసిన అవసరమేమున్నది? ‘మోక్షము పొందాలి’ అనే ఆశయమును దాటివేసి ఉంటాడు.

న వై ముక్త ఇత్యేషా పరమార్థతా : అవధూత దృష్టికి ‘‘ఈతడు ముక్తుడు - ఆతడేమో బద్ధుడు’’.. అను భేదములు అగుపించవు. ‘‘జగద్దృశ్యమంతా నాటకము, సర్వజీవుల స్వరూపము అఖండాత్మ’’ అయి ఉండగా ఇక బద్ధుడెక్కడ? ముక్తుడెవడు! ఆ భేదము ఆతనికి. కనిపించదు, అనిపించదు. వినిపించదు. చిరునవ్వుతో ఆత్మనే అంతటా, అందరుగా దర్శిస్తూ ఉంటాడు.

సాంకృతి మహర్షి : మహనీయా! ‘సంసారము’ అనగా ఏమి? దేనిని ‘సంసారము’ అని మనము పిలుస్తున్నాము?

దత్తాత్రేయుల వారు : కర్మలతో ఏర్పరచుకొన్న సంబంధమే ‘సంసారబంధము’ అని పిలువబడుతోంది. ‘‘నేను ఐహికం (ఇహలోకం)గా గాని, ఆముష్మికం (పరతత్త్వమునందు)గా ఇంకా సంపూర్ణుడనుకాను. ఏవేవో కొన్ని కొన్ని కర్మలు నిర్వర్తిస్తేగాని, మరికొన్ని కొన్ని కర్మల నుండి విరమిస్తే గాని సిద్ధించవలసినది నాకు సిద్ధించదు. ముక్తి కొరకై కొన్ని ఇతఃపూర్వము నిర్వర్తించాను. ఇప్పుడు ఇంకా కొన్ని నిర్వర్తిస్తేగాని ముక్తిని నేను సమీపించలేను. ముక్తి లభించే వరకు నేను దుఃఖిని, అజ్ఞానిని. కృతకృత్యుడను కానేకాను!’’

జీవుని యొక్క ఇట్టి ఆవేశరూపమగు అభిప్రాయమే సంసారము.

‘‘నా కుమారుడు-పుత్రుడు-తదితర బంధువుల కొరకై ఇంకా కొన్ని కొన్ని సాధించాలి. నిర్వర్తించాలి. అప్పుడుగాని ముక్తి గురించి సంసిద్ధపడలేను’’.. అను క్రియావిశేషముల గురించిన అపేక్షయే సంసార బంధము.

నేను స్వతఃగానే (కర్మలకు సంబంధించకయే) కేవలాత్మస్వరూపుడను. కనుక పరమానంద పూర్ణుడను. జీవాత్మత్వము నాయొక్క ఒకానొక ‘అంశ’ మాత్రమే. నా యొక్క జీవాత్మత్వము నా పరమాత్మత్వము యొక్క స్వీయ కల్పనా చమత్కారము.

సర్వదా ‘కాలః కాలము’ అగు ఆత్మనే అయి ఉండగా, ఇక ఇప్పుడు క్రొత్తగా ఏవేవో కర్మలు నిర్వర్తించి, వాటి ఫలితముగా ఆత్మత్వము సిద్ధించుకోవటమనే ప్రసక్తి ఎక్కడిది? ఆత్మకు వేరుగా ఏ కర్మఫలములు కోరి కర్మలు ఆచరించాలి? నా ఆత్మయే సర్వభూతములకు, సర్వ లోకములకు ఆత్మ అయిఉన్నది కదా! ఉత్తమ కర్మల పరంపరలు, వేద అధ్యయనము మొదలైనవి చేస్తే గాని ఆత్మత్వము సిద్ధించదని ఎందుకనుకోవాలి? ఆత్మగా నన్ను నేను ఎరుగుచుండుటచేత స్వయముగా ఆత్మలక్షణుడను అగుచున్నాను. ఆత్మ నిష్క్రియము, అకళంకము కదా!

ఆత్మ క్రియలకు సంబంధించనిది అవటంచేత నేను కొన్ని కర్మలను వదలటము-మరికొన్ని ఆశ్రయించటము- భిక్ష-స్నానము-శౌచము మొదలైనవన్నీ అనివార్యమనుకోవటం లేదు. అవి లోకరీతికి అవసరమేమోగాని నాకు కాదు.

ఆత్మకు భిన్నముగా (దృక్‌కు భిన్నంగా) ద్రష్ట యొక్క కల్పన పట్ల ఎవరికి సత్యదృష్టి ఉంటుందో.. అట్టివారికి మాత్రమే కర్మలు, సాధనలు అత్యవసరమని అనిపించుచున్నది.

జలములో సూర్యప్రతిబింబము వంటిది, దర్పణములో ప్రతిరూపము వంటిది, నాటకములో పాత్ర వంటిది - అగు జీవాత్మ కల్పితమేనని, పరస్వరూపాత్మ నిత్యముక్తము అని - ఎరిగిన తరువాత, ఇక జగన్నాటకములోని జీవాత్మకు మోక్ష ప్రసంగమెక్కడిది? అందుకొరకు సాధన సంపత్తితో పని మాత్రం యేముంటుంది? ‘‘సాధన అవసరమేలేదు’’ - అనునదే సాధనయొక్క అంతిమ ప్రయోజనము.

న అన్యారోపిత లోక ప్రసిద్ధ సంసార ధర్మములు:

ఈ దృశ్యము, ఈలోకాలు ఆత్మకు ఆరోపితం మాత్రమే! మట్టితో పులి, మేక బొమ్మలు తయారు చేసుకొంటే మట్టి మేక, పులి అవుతోందా? లేదు. ‘‘ఇది క్రూరమైన పులి! అది సాధుజంతువు అగు మేక’’.. అని భయము, సాధుత్వము పొందటము వంటిది ఈ సంసారము. ఆ బొమ్మలలో మట్టియే సత్యము కదా! ఈ దృశ్యములో లోకములు, లోకులు, ఇవన్నీ ఆత్మకు అనన్యము. ఆరోపితం చేత మనస్సుచే అనేకముగా కనిపిస్తున్నాయి. ఆత్మస్వరూప భావన దృష్ట్యా లోకములు లేవు. లోక ధర్మములు లేవు. అనేకంలో అంతర్లీనమై దాగియున్న ఏకత్వము మాత్రమే సత్యము.

సాంకృతి మహర్షి : మరి ఇక్కడ లోకులు - లోకములు, ఆకారములు, గుణముల దృష్ట్యా - వేరువేరుగా అగుపిస్తున్నారు కదా! ధర్మశాస్త్రము ఆశ్రమ ధర్మములను, వర్ణ ధర్మములను వివరించి చెప్పుచున్నది. అట్లాగే ఇక్కడ జ్ఞానులు, మూర్ఖులు, ధర్మపరులు, అధర్మపరులు వేరువేరుగా అగుపిస్తున్నారు కూడా కదా?

దత్తాత్రేయుల వారు : అవును! మనస్సుకు ఇక్కడ అనేకమంతా ఈ జీవునికి అనుభవమౌతోంది. అయితే,
- అజ్ఞానికి ఇక్కడ అనేకంగా కనిపిస్తూ అనేకంగా కూడా అనిపిస్తోంది.
- యోగికో? (లేక) అవధూతకో? అనేకంగా కనిపిస్తూ ఏకంగా అనిపిస్తోంది.

ఇప్పుడొక దృష్టాంతము వినండి!

ఒక ప్రదేశంలో కొన్ని కోతులు గుంపు ఉన్నది. అది శరత్‌కాలము. వాతావరణమంతా ఎంతో చలి కలుగజేస్తూ ఉన్నది. వాటిలో కొన్ని తెలివైన కోతులు ఒకచోట గుమిగూడి ‘‘చలి నుండి మనలను మనము రక్షించుకోవటము ఎట్లా?’’ అని సమాలోచన చేయసాగాయి. వాటికి ఒక గొప్ప ఉపాయం తట్టింది. ఆ ఉపాయం ప్రకారము కోతులన్నీ బయలుదేరి గురివింద గింజలను (క్రింద నలుపుగా పైకి ఎర్రగా ఉండే గింజలను) సంపాదించి ఒక చోట గుట్టగా పోశాయి. ‘‘అగ్ని ఎర్రగా ఉంటుంది కదా! ఇదిగో ఈ గుట్ట ఎర్రగా ఉన్నది. అనగా ఇవి చలిమంటలు. ఈ మంటల వలన మనకిక చలి ఉండదు కదా!’’.. అని తలచి చలికాచుకొంటున్నట్లుగా అనుభవము పొందసాగాయి. భ్రమించసాగాయి.

ఇక్కడి సాంసారిక ధర్మాలు, వాటి వలన సుఖములు పొందామనుకోవటము ఆ కోతులు గురివిందగింజల గుట్టను చలిమంట అని అనుకొని చలి పోగొట్టుకున్నట్లు భ్రమించటము వంటిది.

⌘⌘⌘

ఆత్మను ఎరిగి ఆత్మతత్త్వమును నిశ్చలంగా ఆశ్రయించిన వానికి ఇక శాస్త్ర నిష్ఠలు, కథావిశేషములు మొదలైనవాటితో పని ఏమి? విని క్రొత్తగా తెలుసుకొనవలసినది ఏమున్నది? సందేహాలు కొనసాగునంతకాలము మాత్రమే శాస్త్రజ్ఞానము యొక్క అవశ్యకత! ‘‘నేను ఆత్మను! అఖండ - అప్రమేయ-నిత్య-సర్వస్వరూప సత్యమును’’…. అని ఎరిగిన అవధూతకు శాస్త్రజ్ఞానములో ఇక పని ఏముంటుంది?

జ్ఞాన స్సంచ్ఛిన్న సంశయః। సంశయములు తొలగిన యోగికి తర్జన-భర్జనలతో అవసరముండదు.

ఓ సాంకృతి మహర్షీ! సర్వాంతర్యామియగు ఆత్మనే నేనై ఉండగా, అట్టి భావనయే నాకు నిదిధ్యాస అగుచున్నది. ఇక మరో శాస్త్రీయమైన నిదిధ్యాసతో పనేమున్నది? ‘అదంతా ఆత్మభావనకు విపర్యము’ అని అవధూత గమనిస్తున్నారు. భావిస్తున్నారు.
విపర్యమే లేనప్పుడు ధ్యానముతో పనేమున్నది? ‘‘ఈ ఇంద్రియములకు తారసబడే సర్వము ఆత్మకు అభిన్నము’’ - అను దృష్టి (లేక) ధ్యాసయే అవధూతకు ధ్యానము అగుచున్నది.

అందుచేత ఓ మహర్షీ। ‘‘ఈ దేహము నాకు సంబంధించినది కాదు. నేను ఈ దేహమునకు సంబంధించినవాడిని కాదు. బంగారపు ఆభరణమునకు ఆకారమున్నంత మాత్రముచేత బంగారమునకు ఆ ఆభరణ ఆకారము ఉన్నట్లు అవదు కదా!’’ అను అనుక్షణికమైన భావనా బలము చేత నేను ‘దేహాత్మభావన’ అనే విపర్యము పొందటము లేదు. దేహభావనను దరిజేరనీయటము లేదు. భౌతికదేహత్వము ఆశ్రయించటము లేదు.

సాంకృతి మహర్షి : మరి ఈ వేరు వేరు మానవ - జంతు - దేవతా ఉపాధుల మాట ఏమిటి?

దత్తాత్రేయుల వారు : ఓ! అదా? ‘‘నేను మానవుడను. జంతువును, దేవతను’’.. మొదలైనవన్నీ కూడా మనోవిపర్యములే! - ‘‘అహమ్ మనుష్య’’ ఇత్యాది వ్యవహారో వినాప్యముమ్, విపర్యాసమ్ చిరా అభ్యస్త వాసనాతో అపరికల్పతే।। చిరకాలముగా అభ్యసించుచూ వస్తున్న వాసనలచే (Tends to feel, Tendencies) ఏర్పడుచున్నవి మాత్రమే. భ్రమ తొలగనంత వరకు కూడా భ్రమమాత్రమగు ‘‘నేను, నీవు, వారు, వీరు, ఇది, ఇది, వేరు, వేరు’’ అనునది ఈ జీవుని పట్ల ఉపాధి పరంపరలుగా కొనసాగుచూనే ఉంటుంది. ‘‘దేహముతో నేను అవినాభావ సంబంధము కలిగి ఉన్నాను’’.. అను స్వయం కల్పిత వాసనాపరంపరల చేతనే అదంతా ఏర్పడి వర్తిస్తోంది. ఇదియే సంసార దృష్టి!

సాంకృతి మహర్షి : మరి అట్టి సంసారిక దృష్టి మాపట్ల తొలగేది ఎట్లా?

దత్తాత్రేయులవారు : దృశ్యము - దేహము- భావములకు పరము (Away, Beyond) అయినట్టి ఆత్మ యొక్క తత్త్వము గురించి ఆధ్యాత్మశాస్త్రము (ముఖ్యంగా) ఉపనిషత్తులు, తత్త్వజ్ఞులు, సద్గురువులు ఎలుగెత్తి - శృణ్వంతి విశ్వే అమృతస్యపుత్రః అని గానం చేస్తున్నారు కదా!

శాస్త్ర-సద్గురు ప్రవచనముల సహాయముతో సర్వమునకు సర్వదా పరమైయున్న ఆత్మ గురించిన సమాచారము యొక్క శ్రవణ, మనన, నిదిధ్యాసలచే ‘‘నేను సహజంగానే సర్వదా కేవలాత్మస్వరూపుడను కదా!’’…. అను అభ్యాసఫలమును సునిశ్చితం చేసుకోవాలి. అట్టి సమున్నత సత్యభావనచే దేహాత్మభావనలు తమకు తామే తొలగగలవు.

‘‘నేను సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలకు బద్ధుడను’’.. అనుభ్రమలు కూడా తొలగుతూ రాగలదు. వ్యావహారిక పరిమితత్వ భావావేశము సన్నగిలసాగుతోంది.

ఆత్మజ్ఞానముతో కూడిన (తత్ సమాచారము పొందుతూ చేయు) ధ్యానముచేతనే ‘కర్మలచే బద్ధుడను’ అనునది తొలగగలదు..

ఆత్మజ్ఞానము ఆశ్రయించకుండా.. (లేక) ‘పూర్ణమగు స్వస్వరూపము’ అయిన ఆత్మ గురించిన శ్రవణ-మనన-నిదిధ్యాసలను సేవించకుండా, పరోక్ష భావనతో వేల సంవత్సరములు ధ్యానము చేస్తూ ఉన్నాసరే, కర్మల బంధము తొలగునది కాదు.

‘‘అఖండాత్మకు నేను అనన్యుడను’’ అను భావనాభ్యాసమే (అనుకుంటూ ఉండటమే) - ‘‘ఆత్మ సిద్ధి’’కి ఉత్తమ ఔషధం.

లోక వ్యవహారములతో విహరణము దుర్వ్యసమగుచూ ఉంటే - అప్పుడు, మనస్సును వ్యవహారముల నుండి విరామము పొందటానికి ధ్యానము అవసరమే.

అయితే, ఆత్మయందు రమించటము (అనుకోవటం - అను ప్రక్రియ) చేత నా పట్ల సర్వకర్మ బంధభావనలు తమకు తామే తోకముడుస్తున్నాయి. అనగా, కర్మవ్యవహారములన్నీ నిష్ఫలస్థితిని, నిరర్థకస్థితిని పొందుచున్నాయి. ఆపై కేవలము ఆత్మగా శేషించిన నాకు (అవధూతకు) ఇక ‘ధ్యానము’ అను బాహ్యరూప విపర్యముతో పనేమున్నది. లేదు. ఆత్మ భావనయే ధ్యానముగా నిరంతరము, స్వాభావికము అగుచున్నది. సర్వము మమాత్మగా అనుక్షణికంగా స్వానుభవమవటమే-క్రియాయోగము, ధ్యానము, తపస్సు, భక్తి, కర్మయోగము-అగుచున్నాయి.

అట్లాగే,

విక్షేపో నాస్తి యస్మాత్ మే, న సమాధిః తతో మమ। ఆత్మభావము (ఇక్కడ గల దృక్-ద్రష్ట-దృశ్యములు సర్వదా ఆత్మయే-అను సునిశ్చలత్వము) నుండి ఏమాత్రమూ కూడా విక్షేపము లేనప్పుడు ఇక నాకు (అవధూతకు) శాస్త్రములు సూచిస్తున్న ‘‘సమాధి యొక్క అభ్యాసము’’…. అనే విధి విధానముతో పని ఏమున్నది?

మన ఏవ ఇదమ్ ఆప్తవ్యమ్।

మనస్సే ఇదంతా అనేక రూపములుగా పొందుతోంది. ఇక్కడ నానాత్వమే లేదు. అనగా? ‘విక్షేపము’గాని, ‘సమాధి’ గాని ..(Either sense of Deversity or sense of unity) అవన్నీ మనస్సు యొక్క వికారములు మాత్రమే! విక్షేపోవా సమాధిర్వా మనస్యాత్ వికారిణః। ఆత్మకు సంబంధించినవి కావు. నేను - నీవు కూడా ఆత్మస్వరూపులమే. అందుచేత ‘‘ఆ విక్షేప-సమాధి విశేషములు, సమాచారములు, అభ్యాసములు - మనోసంబంధమైనవి మాత్రమే!’’ అని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను.

నిత్యానుభవ రూపస్య, కో మే అనుభవః పృథక్? సర్వకాల సర్వావస్థలయందు అనన్యుడనై (అన్యమనునదే లేనివాడనై) ఉండగా, నాయందు నేనే ఈ సర్వరూపుడవై సర్వదా వెలుగొందుచుండగా, ఇక నాకు (యోగికి) వేరుగా ‘‘అనుభవించువాడు - అనుభవము - అనుభవించబడునవి’’.. అనునవి ఎట్లా ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? ఉండజాలవు.

సర్వము, సర్వదా సర్వత్రా స్వయముగా ‘తానే’ అయి ఉన్న ఆత్మనే నేను. ఇది సత్యము. ఆత్మభావనచే, నేను సర్వదా కృతకృత్యుడను. చేయవలసినదంతా చేసినవాడను, ప్రాప్తించుకోవలసినది - ప్రాప్తించుకొన్నవాడిని (ప్రాప్తం ప్రాప్త) అయి ఉన్నాను. అకర్తను. శాస్త్రీయంగాగాని, లౌకికంగాగాని మరింకే రీతిగా గాని ఏదైనా నిర్వర్తించి ఆపై మరేదో పొందవలసినదంటూ ఎప్పుడూ ఏదీ నాకు లేదు. సర్వదా ఆత్మగా దోషరహితుడను, అలేపుడను. ప్రతి ఒక్క జీవుని విషయములోను ఇదియే నిత్యసత్యము.

సాంకృతి మహర్షి : హే సద్గురూ! ఆత్మజ్ఞానానంతరము కూడా ప్రారబ్దము అనివార్యమని కొందరు అంటూ ఉంటారు. ప్రారబ్దము అనుభవించక తప్పదా?

దత్తాత్రేయులవారు : ఆత్మదృష్టిచే సత్యమగు ఆత్మయే ఇదంతాగా అనుభవమగు చుండగా, ఇక కర్మలు-కర్మఫలముల వలన కలుగు సుఖ-దుఃఖ ద్వంద్వమునకు తావెక్కడిది? ఒకవేళ క్రితం జన్మల కర్మఫలాలు ప్రారబ్దము రూపంగా ప్రవర్తించినా కూడా, అదంతా లోకవ్యవహారార్థ జగన్నాటక వినోద చమత్కారంగా ప్రవర్తించునుగాక!

మమ అకర్తుః అలేప్యస్య। నా అకర్త్వత్వానికి, నిర్మలత్వానికి లోటు ఏమీ ఉండదు. కనుక, ప్రారబ్దము అని పిలువబడే వర్తమాన కర్మలు లోకానుకూలము, శాస్త్రానుకూలముగా వర్తించునుగాక!

అథవా కృతకృత్యోఽపి లోకానుగ్రహ కామ్యయా శాస్త్రీయేణ ఏవమార్గేణ వర్తే అహమ్। నేను సర్వదా కృతకృత్యుడను అయి ఉండియే ఆత్మకు అభిన్నమగు లోకముల అనుకూలత కొరకు, శాస్త్రముల సానుకూల్యత కొరకు కర్మలు నిర్వర్తిస్తే నిర్వర్తిస్తాను. లోకకల్యాణముకొరకై అనువర్తించటం అవధూత యొక్క స్వభావమే అయి ఉన్నది. మమ కా క్షతిః? లోకానుకూల శాస్త్రానుకూల వర్తనములను అంగీకరించి వర్తించినంత మాత్రముచేత ఆత్మతత్త్వమునకు కలుగు లోటు ఏముంటుంది? దానివలన నాకేమి బాధ? ఏమీ లేదు!

అవధూత - సర్వజీవస్వరూపములు, లోక విశేష-విన్యాసములు తానే అయి, సర్వమునకూ సాక్షిగా వేరుగా కూడా అయి ఉండియే, దేవార్చన-స్నాన శౌచ భిక్ష ఆదౌ వర్తతాం వపుః। ఈ భౌతికదేహమును దేవతార్చనల యందు, స్నానము మొదలైన శుచి క్రియలందు, ఆహార -విహార క్రియలందు, భిక్షాటనయందు ప్రవర్తింపజేస్తూనే ఆత్మత్వము యొక్క ఆస్వాదనను చిరునవ్వుతో అనునిత్యముగా సర్వదా కొనసాగించుచున్నాడు.

తారం జపతు వాక్ వపుః। నోటితో తారకమంత్రము (హరేరామ హరే రామ.. ఓం నమః శివాయ, శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే.. మొదలైనవి) పలుకుచూ ఉండవచ్చు గాక! పఠతాం ఆమ్నాయ మస్తకమ్। అట్లాగే ఆత్మతత్త్వమును నిర్వచించు ఉపనిషత్తులను మనస్సుతో పఠిస్తూ ఉండవచ్చు. విష్ణుంధ్యాయంతు। చిత్తము విష్ణునామ సంకీర్తనతో పారవశ్యము పొందుతూ ఉండునుగాక! ‘‘శివాయ। పరమేశ్వరాయ। చంద్రశేఖరాయ।’’ - అంటూ శివతత్త్వము గానము చేస్తూ ఉండవచ్చుగాక!

బుద్ధి జగత్తును చూస్తూనే ధీరత్వముతో బ్రహ్మానంద వైభవమునందు సద్విచారణ చేస్తూ ఉండవచ్చు.

ఇవన్నీ ఒక వైపు జరిగితే జరుగుచూ ఉండవచ్చు గాక. మరొకవైపు అన్ని సందర్భములకు, సంగతులకు సర్వదా ‘‘సాక్షీఽహమ్ - కేవల సాక్షిని’’ అని ఎరిగియే ఉంటున్నాను.

ఆత్మసాక్షిగా.. కించిదపి అత్ర న కుర్వేణ। నేను ఏమీ చేయని వాడినే! న అపికారయే! నేను దేనికీ కారణముగా అగుచుండటయూ లేదు. ఏమీ చేయించటము లేదు. సర్వదా కృతకృత్యుడనై అత్యంత తృప్తిని ఆస్వాదిస్తూనే ఉన్నాను. నేను దేనికీ కారణుడును కాదు! కారకుడను కాదు! సర్వమునకు ఆవల ఉండి, సర్వమును సాక్షిగా, అంతర్యామిగా, (బంగారు లోహమే సర్వ ఆభరణముల రూపముల వలె) అనన్యముగా ఎల్లప్పుడు వెలుగొందుచున్నాను. ఈవల అన్నీ చేస్తూ ఉన్నాను. ఆవల ఏమీ చేయనివాడనై ఉన్నాను.

ధన్యోఽహం। ధన్యోఽహం। ధన్యోఽస్మి। ధన్యోఽస్మి।

నన్ను నేను ధన్యుడనుగా సర్వదా దర్శిస్తూ ఉన్నాను. అత్యంత తృప్తితో కూడిన మనస్సుతో ఈవిధంగా గమనించువాడనై ఉంటున్నాను.

నిత్యగ్ం స్వాత్మానమ్ అంజసా వేద్మి! నిత్యము -సత్యము అగు స్వాత్మయొక్క అంజసము (సామీప్యము)ను నేను ఎరిగిన వాడినేగాని, ఎరుగని వాడను కాను. శాస్త్రములు, సాధనలు, గురువులు.. ఆత్మ గురించి నేను ఎరిగియే ఉన్నానని నాకు గుర్తు చేస్తున్నారు. అది విని, నేను ‘‘ఔను కదా!’’ అని శాస్త్రములకు, గురువులకు వంతపలుకుచున్నాను.

బ్రహ్మానందో విభాతిమే స్పష్టమ్! బ్రహ్మానందము నా పట్ల సుస్పష్టముగా భాసించుచున్నవి.

దుఃఖం సాంసారికం న వీక్ష్య అద్య! అట్లు భాసించుచున్న ఆత్మను నేను దర్శించుచుండగా ఇతః పూర్వము ఉన్నట్లుగా అగుపించిన సంసార దుఃఖముల క్రీనీడకూడా ఇప్పుడు కనిపించటము లేదు.

స్వస్య అజ్ఞానమ్ పలాయితం క్వాపి! దీపం వెలిగించిన మరుక్షణం చీకటి ఏమైనది? ఎటు పోయింది? ఏమో! మొత్తంమీద చీకటి పటాపంచలు అగుచున్నది కదా! ఆత్మ గురించిన గుర్తు ఎరుగుచుండగా నా యొక్క అజ్ఞానము ఎటువైపు పలాయనము చిత్తగిస్తోందో కూడా చెప్పలేకపోతున్నాను. ఆత్మానందముతో కూడిన ‘‘పరమపవిత్ర దృష్టి’’ సర్వత్రా వెలయుచున్నది.

కర్తవ్యం మే న విద్యతే కించిత్! ‘‘ఇది ఇంకా చేయాలి. అప్పుడు అది పొందుతాను’’ అనునదేమీ నాకు లేదు. కించిత్ కూడా కర్తవ్యమనునదేదీ లేదు. కనుక కర్తృత్వమూ లేదు. భోక్తృత్వమూ లేదు. ‘‘కలలో ఇది నేను చేసి అది పొందాలి’’.. అనునదేమీ కలకు ముందుగానీ, కలలోగానీ ఉండవుకదా! ‘‘ కలలో ఇది పొందాలి. అది పొందకూడదు’’.. అని తలచి ఒకడు కలకు ఉపక్రమించడు కదా! అట్లాగే జాగ్రత్‌లో - ఇది పొందాలి. అదికాదు. ఇది చేయాలి!.. అది కాదు - అనునదేమీ నాకు (అవధూతకు) ఉండదు.

ప్రాప్తవ్యమ్ సర్వమ్ అద్య సంపన్నమ్! నేను ఇంకనూ పొందవలసినదంటూ.. 14లోకాలలో ఎక్కడా ఏదీ లేదు. ఆత్మస్వరూప భావనచే ప్రాప్తించవలసినది ప్రాప్తించినదైనది. సుసంపన్నుడనై ఉన్నాను. లోకాలన్నీ నాలోనే ఉండగా, నేను లోకముల నుండి ఏదో పొందటము ఎక్కడిది? జీవాత్మగా లోక సంచారినై ఉంటూనే, పరమాత్మగా లోకములన్నీ నాయందే కలిగి ఉన్నాను.

తృప్తేః మే, కో ఉపమా భవేత్ లోకే? ఆత్మ జ్ఞానముచే, ఆత్మాఽహమ్ భావనచే ఆత్మతృప్తి పొంది ఉంటున్నాను. ఇట్టి తృప్తి దృశ్య వస్తువులు లభించినప్పటి తృప్తి కాదు. ఆత్మ తృప్తితో పోల్చగలిగిన లోకగతమైన ఉపమానము ఏదీ లేదు.

పునః పునః ‘ఆత్మాఽహం’ అనుభూతిచే ధన్యుడను. ధన్యుడను.

అహోపుణ్యమ్। అహోపుణ్య ఫలితమ్। ఫలితం దృఢం! అస్య పుణ్యస్య సంపత్తే అహో వయమ్। అహో వయమ్। ‘ఆత్మజ్ఞానము’ యొక్క పుణ్యఫలమును చూచి నాకు నేనే నన్ను చూచుకొని ఆశ్చర్యపడుచున్నాను. ఆనందపడుచున్నాను.

అహో జ్ఞానమ్। అహో జ్ఞానమ్! అహా"! ఆత్మజ్ఞానము సమక్షముతో తదితర ప్రాపంచక, దృశ్యవ్యవహార, ధన-వ్యవహార సంబంధమైన జ్ఞానములు సూర్యకాంతిలో వెలిగించే దివిటీల వంటివికదా!

అహో సుఖమ్ అహో సుఖమ్! ఆత్మానందము ఎంతటి ఆశ్చర్యకరమగు సుఖము!

ఇంద్రియ సుఖములు ఎందుకు పనికివస్తాయి? మంచినీటి సరస్సులో స్నానం చేసినవాడు ఇంటికి తిరిగి వస్తూ బాటలో గల మురికిగుంటలలో స్నానం చేస్తూ కాసేపు క్రీడించి, ఇంటికి చేరాలనుకుంటాడా? లేదు కదా!

అహో శాస్త్రమ్। అహో శాస్త్రమ్! ప్రపంచంలో అనేక శాస్త్రాలు ఉండవచ్చుగాక! కానీ ఆత్మతత్త్వమును నిర్వచిస్తున్న వేదాంత శాస్త్రము (లేక) తత్త్వ శాస్త్రము (లేక) అధ్యాత్మశాస్త్రము ఎంతటి ఆశ్చర్యకరం। ఎంతటి ప్రయోజనకరం। అది అనిర్వచనీయం. అప్రతిహతం!

అమోఘం। శ్రేయః శ్రేయమ్। ‘‘రక్త మాంస నిర్మిత దేహబద్ధుడను నేను’’ అను స్థితి నుండి → ఒక పురుగునుండి-బ్రహ్మ వరకు గల సర్వ దేహములలో ప్రకాశించు సాక్షియే నేను’’ - అనే స్థితికి జేర్చుచున్నది.

అహో గురుః। అహో గురుః : సహజమగు నా స్వస్వరూపమును నిర్వచించి, నిరూపిస్తూ బోధిస్తున్న సద్గురువు యొక్క ఔన్నత్యము ఎంత గొప్పది। వర్ణనాతీతం। అపరోక్షజ్ఞాన సమాచారము అందిస్తున్న గురువు ఎంతటి గొప్పవాడు. ఆత్మబంధువు! మమాత్మానంద-మధురాతి మధుర-మహత్ స్వరూపుడే!

⌘⌘⌘

ఈ అవధూతోపనిషత్ రూపంగా దత్తాత్రేయుల వారిచే ప్రవచించబడిన అవధూతల అనుభవమును ఎవ్వరు శ్రద్ధగా అధ్యయనం చేస్తారో.. అట్టివారు కృతకృత్యులు. వారి జన్మ సార్థకం! అవధూత స్థానము చేరగలరు.

ఇందలి సారమును గ్రహించువాడు సర్వదోషముల నుండి విముక్తుడు అగుచున్నాడు. సురాపానము, బంగారము దొంగిలించటము, బ్రహ్మహత్య మొదలైన మహాపాతక -ఉపపాతకముల నుండి కూడా అట్టి విద్యార్థి (లేక) అధ్యయని పవిత్రుడు అగుచున్నాడు. కృతకృత్యుడు అవగలడు. సర్వదోషముల నుండి పరిశుభ్రుడగుచున్నాడు.

ఏవం విదిత్వా స్వేచ్ఛాచారపరో భూయాత్ యోగమ్। యోగసాధనల యొక్క అంతిమ ప్రయోజనము ఈ ఉపనిషత్‌లో సూచించబడిన ఆత్మసాక్షాత్కారమే!

అవధూత గానము

శ్లో।।
తృప్త్యత్ ఏవం స్వమనసా మన్యతే అసౌ నిరంతరమ్।
ధన్యోఽహం నిత్యగ్ం స్వాత్మాన మంజసా వేద్మి।।
ధన్యోఽహం। ధన్యోఽహం। బ్రహ్మానందో విభాతి మే ‘‘స్పష్టమ్’’।
ధన్యోఽహం। ధన్యోఽహం। దుఃఖం సాంసారికం ‘‘ న వీక్షే-ద్య’’।
ధన్యోఽహం। ధన్యోఽహం। స్వస్య, అజ్ఞానం పలాయితం క్వాపి’’।
ధన్యోఽహం। ధన్యోఽహం। ‘‘కర్తవ్యం మే న విద్యతే కించిత్’’।
ధన్యోఽహం। ధన్యోఽహం। ప్రాప్తవ్యం సర్వమద్య సంపన్నమ్।
ధన్యోఽహం। ధన్యోఽహం। తృప్తేః మే కోపమా భవేత్ లోకే।
ధన్యోఽహం। ధన్యోఽహం। ధన్యో ధన్యః పునః పునః ధన్యః।
అహో పుణ్యం। అహో పుణ్యం ఫలితం, ఫలితం దృఢమ్।
అస్య పుణ్యస్య సంపత్తేః అహో వయమ్। అహో వయమ్।
అహో జ్ఞానమ్। అహో జ్ఞానమ్। అహో సుఖమ్। అహో సుఖమ్।
అహో శాస్త్రమ్। అహో శాస్త్రమ్। అహో గురుః। అహో గురుః।

య ఇదమ్ అధీతే సోఽపి కృతకృత్యో భవతి (అవధూతో భవతి)
సురపానాత్ పూతో భవతి। స్వర్ణ స్తేయాత్ పూతో భవతి। బ్రహ్మహత్యాత్ పూతో భవతి। కృతకృత్యాత్ పూతో భవతి।
ఏవం విదిత్వా స్వేచ్ఛాచారపరో, భూయాత్ ఓగ్ం సత్యమితి।।



🙏 ఇతి అవధూత ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।