[[@YHRK]] [[@Spiritual]]

Brahma Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


కృష్ణ యజుర్వేదాంతర్గత

19     బ్రహ్మోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


ఓం
బ్రహ్మ-కైవల్య-జాబాల-శ్వేతాశ్వో- హంస-ఆరుణిః
గర్భో-నారాయణో-హంసో-బిందు-నాద-శిరః-శిఖా
ఏతాః త్రయోదశ - ఓం।।

ప్రణవార్థమును తెలుపుచున్నట్టి ఉపనిషత్తులు ‘13’. (1) బ్రహ్మోపనిషత్ (2) కైవల్యోపనిషత్ (3) జాబాలోపనిషత్(4) శ్వేతాశ్వతరోప నిషత్ (5) హంసోపనిషత్ (6) అరుణికోపనిషత్ (7) గర్భోపనిషత్ (8) నారాయణో పనిషత్ (9) హంసోపనిషత్ (10) అమృతబిందూపనిషత్ (11) అమృతనాదోప నిషత్ (12) అథర్వ శిరోపనిషత్ (13) అథర్వశిఖోపనిషత్

1. ఓం సహనా వవతు। సహనౌ భునక్తు। సహవీర్యంకరవావహై
తేజస్వి నావధీతమస్తు। మా విద్విషావహై। ఓం శాంతిః శాంతిః శాంతిః।।

ఓం శం నో మిత్ర శ్శం వరుణః। శం నో భవత్వర్యమా! శం న ఇంద్రో బృహస్పతిః। శం నో విష్ణురురుక్రమః।
నమో బ్రహ్మణే। నమస్తే వాయో। త్వమేవ ప్రత్యక్షమ్ బ్రహ్మాసి। త్వామేవ ప్రత్యక్షమ్ బ్రహ్మవదిష్యామి। ఋతమ్ వదిష్యామి।
సత్యమ్ వదిష్యామి। తన్మామవతు। తద్వక్తారమవతు। అవతుమామ్। అవతు వక్తారమ్।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।


ఓం శౌనకో హ వై మహాశాలోఽఙ్గిరసం భగవంతం
పిప్పలాదమపృచ్ఛత్ .
దివ్యే బ్రహ్మపురే సంప్రతిష్టితా భవంతి కథం సృజంతి
కస్యైష మహిమా బభూవ యోహ్మషే మహిమా బభూవ
క ఏషః .
తస్మై స హోవాచ బ్రహ్మవిద్యం వరిష్ఠాం .
ప్రాణో హ్యేష ఆత్మా . ఆత్మనో మహిమా బభువ
దేవానామాయుః స దేవానాం నిధనమనిధనం దివ్యే బ్రహ్మపురే
విరజం నిష్కలం శుభ్రమక్షరం యద్బ్రహ్మ విభాతి
స నియచ్ఛతి మఘుకరరాజానం మాక్షికవదితి .
యథా మాక్షీకైకేన తంతునా జాలం వక్షిపతి తేనాపకర్షతి తథైవైష ప్రాణో
యదా యాతి సంసృష్టమాకృష్య .
ప్రాణదేవతాస్తాః సర్వా నాడ్యః .
సుష్వపే శ్యేనాకాశవద్యథా ఖం శ్యేనమాశ్రిత్య యాతి
స్వమాలయమేవం సుషుప్తో బ్రూతే యథైవైష దేవదత్తో
యష్ట్యాఽపి తాడ్యమానో న యత్యేవమిష్టాపూర్తైః
శుభాశుభైర్న లిప్యతే .
యథా కుమారో నిష్కామ ఆనందముపయాతి
తథైవైష దేవదత్తః స్వప్న ఆనందమభియాతి .
వేద ఏవ పరం జ్యోతిః జ్యోతిష్కామో జ్యోతిరానందయతే .
భూయస్తేనైవ స్వప్నాయ గచ్ఛతి జలౌకావత్ .
యథా జలౌకాఽగ్రమగ్రం నయత్యాత్మానం నయతి పరం సంధయ .
యత్పరం నాపరం త్యజతి స జాగ్రదభిధియతే .
యథైవైష కపాలాష్టకం సంనయతి .
తమేవ స్తన ఇవ లంబతే వేదదేవయోనః .
యత్ర జాగ్రతి శుభాశుభం నిరుక్తమస్య దేవస్య
స సంప్రసారోఽన్థర్యామీ ఖగః కర్కటకః పుష్కరః
పురుషః గ్రాణో హింసా పరాపరం బ్రహ్మ ఆత్మా దేవతా వేదయతి .
య ఏవం వేద స పరం బ్రహ్మ ధం క్షేత్రజ్ఞముపైతి .. 1..


అథాస్య పురుషస్య చత్వారి స్థానాని భవంతి
నాభిర్హృదయం కంఠం భూర్ధేతి .
తత్ర చతుష్పాదం బ్రహ్మ విభాతి .
జాగరితం స్వప్నం సుషుప్తం తురీయమితి .
జాగరితే బ్రహ్మా స్వప్నే విష్ణుః సుషుప్తౌ రుద్రస్తురీయం
పరమాక్షరం
2. అథ
అస్య పురుషస్య చత్వారి
స్థానాని భవంతి।

(అఖండుడు అప్రమేయుడు అగు) పరమపురుషుడు నాలుగు స్థానాలలో మరింత సుస్పష్టంగా ప్రదర్శితుడు, ప్రకాశమానుడు, తత్ స్థానస్వరూపుడు అగుచున్నారు.
నాభిః। హృదయమ్।
కంఠమ్। మూర్ధా చ।

(1) నాభి, (2) హృదయము, (3) కంఠము,
(4) మూర్ధము (Force/Foreface)
తత్ర చతుష్పాదమ్ బ్రహ్మ విభాతి।
నాలుగవ స్థానము స్వస్వరూప బ్రహ్మస్థానము.
ఇవియే పరమపురుషుని యొక్క జాగరిత-స్వప్న-సుషుప్తి-తురీయ చతుష్పాద సంప్రదర్శనములు. (లేక) బ్రహ్మవిభూతుల, విభవములు.
జాగరితే…బ్రహ్మా।
స్వప్నే….విష్ణుః।
సుషుప్తౌ….రుద్రః।
తురీయమ్ → అక్షరమ్।।
జాగరిత పురుషుడు - పురుషకారము - బ్రహ్మా।
స్వప్నపురుషుడు - పురుషకారము - విష్ణువు।
సుషుప్తిపురుషుడు - రుద్రుడు।
తురీయ స్వరూపము - పురుషకారము - అక్షర పరబ్రహ్మము।
ఇవియే సర్వమునకు ప్రదర్శకము - ప్రేరకము అగు పరబ్రహ్మము యొక్క త్రిమూర్తి (స్థాన) ప్రదర్శనములు, నాలుగవది (చతురీయము) తురీయము.

ఆదిత్యశ్చ విష్ణుశ్చేశ్వరశ్చ స పురుషః స ప్రాణః స జీవః
సోఽగ్నిః సేశ్వరశ్చ జాగ్రత్తేషం మధ్యే యత్పరం బ్రహ్మ విభాతి .
స్వయమమనస్కమశ్రోత్రమపాణిపాదం జ్యోతిర్వర్జితం.

న తత్ర లోకా న లోకా వేదా న వేదా దేవా న దేవా
యజ్ఞా న యజ్ఞ మాతా న మాతా పితా న పితా
స్నుష న స్నుష చాండాలో న చాండాలః పైల్కసో న పైల్కసః
శ్రమణో న శ్రమణః పశవో న పశవస్తాపసో న తాపస ఇత్యేకమేవ
పరం బ్రహ్మ విభాతి .

హృద్యాకాశే తద్విజ్ఞానమాకాశం తత్సుషిరమాకాశం
తద్వేద్యం హృద్యాకాశం యస్మిన్నిదం సంచరతి వచరతి
యస్మిన్నిదం సర్వమోతం ప్రోతం . సం విభోః ప్రజా జ్ఞాయేరన్ .
3. స ఆదిత్యో,
- విష్ణుశ్చ, ఈశ్వరశ్చ।
- స్వయమ్ అమనస్కమ్! అశ్రోత్రమ్।
అపాణి - పాదమ్!
జ్యోతిర్విదితమ్!
అట్టి పరబ్రహ్మమే సర్వమునకు ‘ఆది’ (మొట్టమొదటే ఉన్నవాడు) అగు ఆదిత్యుడు. సర్వము తానై వెలయు విష్ణువు. ఆయనయే ఈశ్వరుడు (అంతటిలో అంతగా విస్తరించి ఉన్నవాడు) కూడా.
అట్టి పరమాత్మ →
అమనస్కుడు. మనోరహితుడు. చెవులు - చేతులు - పాదము లేనివాడు. అవన్నీ ఆయన నుండి బయల్వెడలుచున్నాయి. ఆయన కేవల జ్యోతి స్వరూపుడు. ఆదిపురుషుడు. సర్వమునకు మునుముందేగల కేవలాత్మస్వరూపుడు.
లోకాలకు ముందే ఉన్నట్టివాడు. కనుక అలౌకికుడు.
యత్ర - లోకా న లోకా…,
దేవా న దేవా….,
వేదా న వేదా, యజ్ఞా న యజ్ఞా।
మాతా న మాతా, పితా న పితా।
స్నుషా న స్నుషా, చండాలో న చండాలః।
పౌల్కసో న పౌల్కసః।
శ్రమణో న శ్రమణః।
తాపసో న తాపసః -

ఏకమేవ
తత్పరమ్ బ్రహ్మ
విభాతి నిర్వాణమ్।।

అట్టి కేవలీ స్వరూపుని సమక్షంలో
- లోకములన్నీ అలోకములే.
- వేదములన్నీ అవేదములే.
- యజ్ఞాలు - అయజ్ఞాలు.
- మాతాపితలు - అమాతాపితలు.
- కోడలూ - కోడలు కాదు.
- చండాలుడు - చండాలుడు కాదు.
- పౌల్కసుడు (భార్యకానట్టి స్త్రీకి జనించినవాడు) - పౌల్కసుడు కాదు.
ఆత్మసమక్షంలో…. పై భేదములే లేవు. ఇంకా,
శ్రమణుడు - అశ్రమణుడు (సన్న్యాసి సన్న్యాసి కాదు).
తపస్యుడు….తాపసుడు కాదు.

ఆ ఆదిపురుషుడు భేదరహితుడు. అనేకము కాదు.
ఆతడే అఖండ - ఏకస్వరూపుడు! ఆయనయే పరంబ్రహ్మ! తత్ బ్రహ్మమ్।
ఆయనే అంతటా అన్నీ అగుచూకూడా, ఏమీ అవనట్టి నిర్వాణ స్వరూపుడు! అఖండుడు!

న తత్ర దేవా ఋషయః పితర రిశతే
ప్రతిబుద్ధః సర్వవిదితి .. 2..

హృదిస్థా దేవతాః సర్వా హృది ప్రాణాః ప్రతిష్ఠితాః .
హృది ప్రాణశ్చ జ్యోతిశ్చ త్రివృత్సూత్రం చ యన్మహత్ ..

హృది చైతన్యే తిష్ఠతి యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ .
ఆయుష్యమగ్రపం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ..
4. న తత్ర దేవా - ఋషయః
పితర ఈశతే
ప్రతిబుద్ధ్యః
సర్వ విద్యేతి (విదేతి)।

హృదిస్థా దేవతాః సర్వా।
హృది ప్రాణాః ప్రతిష్ఠితాః।
హృది ప్రాణాశ్చ జ్యోతిశ్చ
త్రివృత్ సూత్రం చ
తత్ విదుః ఇతి।
హృది చైతన్యే తిష్ఠతి।।
ఆయన ‘ఇది’ అని దివ్య దేహులగు దేవతలు, పిత్రుదేవతలు (Workers of Physical Bodies), ఋత్‌ను ప్రవచించు ఋషులు కూడా ‘‘ఇంతే’’ అని నిర్వచించజాలరు.
అవాక్ - మానసగోచరుడు. అయితే నిర్మలము - ఉత్తమముగల బుద్ధిగలవారు ఆయనను స్వ-హృదస్థునిగా ఎరుగుచూ దర్శిస్తున్నారు.
సర్వదేవతలు హృదయములోనే నివాసము కలిగిఉన్నారు.
బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు, తదితర లోకాధిపతులు (సమస్త దేవతలు) హృదయములోనే నివాసము కలిగి ఉన్నారు. హృదయములోనే పంచప్రాణములు, జ్యోతిస్వరూపుడగు ఆత్మ (జీవాత్మ) పతిష్ఠితులై ఉన్నారు.
త్రిసూత్రములైనటువంటి ఇంద్రియ - ప్రాణ - తేజస్సులు, జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు హృదయమునందే స్థానము కలిగి ఉన్నాయి. (యజ్ఞోపవీతమే హృదయ సంజ్ఞ).
ఇక హృదయమో… చైతన్యస్వరూపమగు ఆత్మయందు స్థానము కలిగి ఉన్నది.
అందుచేత దేవతలు, దేవతాధిపతులు, జీవాత్మ, ఇంద్రియ - ప్రాణ - తేజస్సులు, జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు మొదలైనవన్నీ ఆత్మజ్యోతి / ఆత్మచైతన్య స్వరూప తేజో విశేషణములే - అని తత్త్వవేత్తలు ఎరిగియే ఉంటున్నారు!
5. యజ్ఞోపవీతమ్ పరమమ్ పవిత్రమ్,
ప్రజాపతేః యత్ సహజమ్ పురస్తాత్।
ఆయుష్యమ్ అగ్ర్యమ్!
ప్రతిముంచ శుభ్రగ్ం।
యజ్ఞోపవీతమ్
బలమ్ అస్తు తేజః।
‘‘ఇంద్రియ - ప్రాణ - తేజో త్రిసూత్రరూపమగు తత్త్వములు యజ్ఞోపవీతముగా నాచే ధరించబడినవి కదా!’’….అనే భావనారూపధారణ పరమపవిత్రమైనది. (అనగా నేను ఆత్మరూపుడను - అను భావన).
సృష్టికి పూర్వమే ప్రజాపతి (సృష్టికర్త)తో పాటే యజ్ఞోపవీతము సంజ్ఞగా జనించింది. ఆయుష్షును వృద్ధి చేయునది. ఈ దృశ్యజగత్తును (త్రిగుణ) దారములచే ధరింపబడునదిగాను, తానే (బ్రహ్మముగా) ధారణ చేయువాడుగాను భావించటము →
- పరమ శ్రేష్ఠమైనది!
- ఆయుష్షును వృద్ధి చెందించునది!
- పరమ పవిత్రమునకు సంజ్ఞ!
అట్టి ఆత్మజ్ఞాన సంజ్ఞారూపమగు, ఆత్మధారణారూపమగు విశ్వరూప యజ్ఞోపవీతము యజ్ఞపురుషునిచే ధరింపబడునది. యజ్ఞపురుషత్వ - ఉపాసనచే మాకు ఆయుష్షు, బలము, తేజము ప్రాప్తించును గాక.

సశిఖం వపనం కృత్వా బహిఃసూత్రం త్యజేద్బుధః .
యదక్షరం పరం బ్రహ్మ తత్సూత్రమితి ధారయేత్ ..

సూచనాత్సూత్రమిత్యాహుః సూత్రం నామ పరం పదం .
తత్సూత్రం విదితం యేన స విప్రో వేదపారగః ..
6. సశిఖం వపనం కృత్వా,
బహిస్సూత్రం త్యజేత్ బుధః।
యత్ అక్షరమ్ పరమ్ బ్రహ్మ
తత్ సూత్రమ్ ఇతి ధారయేత్।।

సూచనాత్ సూత్రమ్ ఇతి ఆహుః
సూత్రమ్ నామ పరమ్ పదమ్।
తత్ సూత్రమ్ విదితమ్
యేన స విప్రో
వేదపారగః।
‘ఆత్మాహమ్’ భావనయే ఆశయముగా గల బుధుడు (ఉత్తమబుద్ధి సమన్వితుడు) - శిఖతోసహా బహిస్సూత్రమును (బయటకు ధరించే త్రి సూత్రదంధ్యమును, యజ్ఞోపవీతమును) మనస్సుతో త్యజించి, బాహ్యాచారమునకు ఆవలగల అంతర్గత ఉద్దేశ్యమును (మనస్సుతో) ఆశ్రయించుచున్నారు.
‘‘అక్షరము - పరము’’ అగు ‘అంతా బ్రహ్మమే’ అను బ్రహ్మసూత్రమును బుద్ధితో ధారణ చేయుచున్నారు.

‘సూచన’యే సూత్రము అయి ఉన్నది. బ్రహ్మమును సూచించునదే యజ్ఞ-సూత్రము! ఇది గమనించి విజ్ఞుడు ‘పరమపదము’ అనుపేరుగల యజ్ఞసూత్రమును ఎరుగుచున్నాడు! ‘‘బ్రహ్మమే జాగ్రత్ స్వప్న సుషుప్తులను ధారణ చేస్తున్నది! అట్టి బ్రహ్మమే నేను కదా!’’…అను అర్థమును, పరమార్థమును ఆశ్రయిస్తున్నాడు. ఎవ్వరు యజ్ఞసూత్రము సూచించే సూచనను గ్రహిస్తాడో, ఆతడే వేదార్థమును తెలుసుకొన్న విప్రుడు! (దూది సూత్రమును ధరించినంత మాత్రము చేత విప్రుడు కాదు, వేదార్థము తెలిసినవాడుకాదు). ‘‘ఈ జగత్తు నాయొక్క యజ్ఞ సూత్రధారణా విశేషమే’’ - అనునదే (యజ్ఞ) మాత్రము.

తేన సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ .
తత్సూత్రం ధారయేద్యోగీ యోగవిత్తత్త్వదర్శివాన్ ..

బహిఃసూత్రం త్యజేద్విద్వాన్యోగముత్తమమాస్థితః .
బ్రహ్మభావమయం సూత్రం ధారయేద్యః స చేతనః ..
7. యేన సర్వమ్ ఇదమ్ ప్రోతగ్ం
సూత్రే మణిగణా ఇవ,
తత్ సూత్రమ్ ధారయేత్ యోగీ
యోగవిత్ తత్త్వదర్శివాన్।।
బహిస్సూత్రమ్ (బహిః సూత్రమ్) త్యజేత్ విద్వాన్
యోగమ్ ఉత్తమమ్ ఆస్థితః।
‘బ్రహ్మభావమ్’ ఇదమ్ సూత్రమ్
ధారయేత్
యత్ స చేతనః।
యోగసాధనచే ఒకడు ‘‘యోగవేత్త, తత్త్వదర్శి’’ అగుచున్నాడు. ‘‘దేనిచేత ఈ నీవు - అతడు - ఇది - అది మొదలైన వాటితో కూడిన దృశ్యమంతా (పూలదండలో పూలు దారముచే ధరింపబడుచున్నవిధంగా) ధరింప బడుతోందో అట్టి సూత్రమును (దారమును) ధరించు బ్రహ్మమే నేను’’ - అను భావన, అవగాహనలను ధరించినవాడై యోగవేత్తగా జగత్తును సందర్శిస్తున్నాడు. అట్టి దార్శనికుడే యోగి. తత్త్వదర్శి కూడా.
యోగి ఉత్తమ యోగ స్థితిని సముపార్జించుకొని ఇక ఆపై బహిః సూత్రమును (నాకు బాహ్యమైనది ఈ జగత్తు - అను ధారణను) త్యజించుచున్నాడు!
‘‘ఇదంతా బ్రహ్మమే! నేను బ్రహ్మమునే! నేనే ఇదంతగా అయి, నాకు నేనే అనుభూతమగు చున్నాను’’….అను సచేతన సూత్రమును ధారణ చేస్తున్నాడు!
యజ్ఞః = యత్ + జ్ఞః → జగత్తును ఎరుగుచున్న ‘ఎరుక’.

ధారణాత్తస్య సూత్రస్య నోచ్ఛిష్ఠో నాశుచిర్భవేత్ .
సూత్రమంతర్గతం యేషాం జ్ఞానయజ్ఞోపవీతినాం ..

తే చై సూత్రవిదో లోకే తే చ యజ్ఞోపవీతినః .
జ్ఞానశిఖినో జ్ఞాననిష్ఠా జ్ఞానయజ్ఞోపవీతిహః ..

జ్ఞానమేవ పరం తేషాం పవిత్రం జ్ఞానముత్తమం .
అగ్నేరివ శిఖా నాన్యా యస్య జ్ఞానమయీ శిఖా ..
8. ధారణాత్ తస్య సూత్రస్య
న ఉచ్చిష్టో! న అశుచిః భవేత్।
సూత్రమ్ అంతర్గతమ్ యేషామ్
జ్ఞాన యజ్ఞోపవీతినామ్,
తే వై సూత్రవిదో లోకే।
తే చ యజ్ఞోపవీతినః।
జ్ఞాన శిఖినో, జ్ఞాన నిష్ఠాః,
జ్ఞాన యజ్ఞోపవీతినః।
జ్ఞానమ్ ఏవ పరమ్ తేషామ్
పవిత్రమ్ జ్ఞానమ్ ఉచ్యతే।
అగ్నేః ఇవ శిఖా, నాన్యా
యస్య జ్ఞానమయీ శిఖా।।
అట్టి బ్రహ్మసూత్రధారణ చేయువానికి-జగత్తు బ్రహ్మ స్వరూపమే అగుచున్నది. కనుక, వదలవలసినదేదీ ఉండదు! జగత్తును జగత్తుగా పట్టుకోడు! బ్రహ్మము తానై ‘జాగత్ దృశ్యము’ అనే సూత్రధారణ చేసినవాడై ఉంటాడు. ఇక ఆతనికి అశుచి, అనునదేమీ ఉండదు!

అంతరంగములో అంతర్గతముగా (In the Inner Recess) ‘ఆత్మజ్ఞానము’మే - ఆతడు ధరించే యజ్ఞోపవీతసూత్రము! అట్టి వాడే యజ్ఞసూత్రమును ఎరిగినట్టినవాడు. ‘‘అంతా బ్రహ్మముచే ధరింపబడే సూత్ర చమత్కారమే’’…అని ఎరిగియుండి, ఈ జగత్తును దర్శించువాడే యజ్ఞోపవీతుడు! తానే బ్రహ్మమై, జగత్తునంతా యజ్ఞోపవీతరూపంగా ధారణ చేస్తూ ఉంటాడు.

‘‘అంతా నేనే! బ్రహ్మమే’’ అను జ్ఞానమే ఆయనయొక్క శిఖ (పిలక)! ఆత్మజ్ఞానమే ఆయన నిష్ఠ! ఆత్మగా (బ్రహ్మముగా) ఈ కనబడేదంతా దర్శించటమే ఆయనకు యజ్ఞోపవీతము! జ్ఞానమే ఆయనకు శ్రేష్ఠమగు పరరూపము. అట్టి జ్ఞానమే పరమ పవిత్రమైనది! ఎవ్వరైతే ‘‘అంతా జ్ఞానాగ్నిచే భస్మముగా చేసే అగ్ని’’ వలె జ్ఞానశిఖను ధరిస్తాడో…ఆతడే విద్వాంసుడు. అంతేగాని, నూలుప్రోగుల సూత్రము, జుట్టు (కేశ) పిలక ధరించినంత మాత్రం చేత కాదు!

స శిఖీత్యుచ్యతే విద్వానితరే కేశధారిణః .. 3..

కర్మణ్యధికృతా యే తు వైదికే బ్రాహ్మణాదయః .
తైః సంధార్యమిద సూత్రం క్రియాంగం తద్ధి వై స్మృతం ..
9. స ‘శిఖీ’ ఇతి ఉచ్యతే విద్వాన్,
నేతరే (న ఇతరే) కేశ ధారిణః।
కర్మణి అధికృతా యేతు
వైదికే బ్రాహ్మణాదయః।
ఎవ్వడు ‘ఆత్మయే ఇదంతా! ‘‘ఈ విశ్వమంతా బ్రహ్మముయొక్క శిఖాధారణమే’’ అను అవగాహనతో, జాగ్రత్-స్వప్న-సుషుప్తులను తాను ధరించే శిఖ యొక్క మూడు ప్రోగులుగా దర్శించుచున్నాడో - ఆతడే ‘శిఖి’ అని విద్వాంసులు భావిస్తున్నారు. తదితర శిఖులు కేశధారులు మాత్రమే! అందుచేత వైదిక బ్రాహ్మణులు మొదలైనవారు విశ్వమంతా ఆత్మకు శిఖగా భావించుచున్నారు.
తేభిః ధార్యమ్ ఇదమ్
సూత్రగ్ం
క్రియాంగం తత్ ధివై స్మృతమ్।
వైదిక కర్మాధికారము కలిగినట్టి వైదిక బ్రాహ్మణులు ‘బ్రహ్మము’ అనే సూత్రమును ధారణ చేస్తూ క్రియాశీలురై ఆత్మబుద్ధిశీలురై నియమితకర్మలు నిర్వర్తిస్తున్నారు. ఇదియే కర్మయోగోద్దేశ్యము. శాస్త్రోద్దేశ్యము.

శిఖా జ్ఞానమయీ యస్య ఉపవీతం చ తన్మయం .
బ్రాహ్మణ్యం సకలం తస్య ఇతి బ్రహ్మవిదో విదుః ..

ఇదం యజ్ఞోపవీతం తు పవిత్రం యత్పరాయణం .
స విద్వాన్యజ్ఞోపవీతీ స్యాత్స యజ్ఞః స చ యజ్ఞవిత్ ..
శిఖా జ్ఞానమయీ యస్య
ఉపవీతం చ తన్మయమ్।
శిఖ → ఆత్మజ్ఞాన సంపన్నులై ఉండటము.
ఉపవీతము→ ఆత్మతత్త్వముతో సామీప్యత. ఆత్మతన్మయులై ఉండటము
శిఖ + ఉపవీతము = జ్ఞానము + విజ్ఞానము (Theory (+) Practising )

జ్ఞాన-విజ్ఞాన శిఖ ఉపవీతధారులంతా - యజ్ఞోపవీతధారులే.
10. బ్రాహ్మణ్యగ్ం సకలం తస్య
ఇతి బ్రహ్మవిదో విదుః।
ఇదం యజ్ఞోపవీతం తు
పరమమ్, యత్ పరాయణమ్,
స విద్వాన్ యజ్ఞోపవీతీస్యాత్।
స యజ్ఞస్తం యజ్వానం విదుః।
‘‘బ్రహ్మమే ఇదంతా నేను బ్రహ్మమునే!’’ అనునదే బ్రహ్మజ్ఞానము. ‘‘సకలము బ్రహ్మణ్యమే! బ్రహ్మస్వరూపమే! బ్రహ్మమే’’…అని ఎరిగినవారే బ్రహ్మవిదులు. బ్రాహ్మణులు.

బ్రహ్మస్వరూప సందర్శమే బ్రహ్మసూత్రధారణ! అట్టి ‘బ్రహ్మభావన’ అనబడే యజ్ఞోపవీతము పరము, మహత్తరము! బ్రహ్మ యజ్ఞముగా జగద్దృశ్య దర్శనము చేయువాడే ‘యజ్ఞస్తుడు’.

‘సర్వము బ్రహ్మమే’ అనునదియే పారాయణ చేయవలసిన మననరూప మంత్రము!
ఈ రీతిగా యజ్ఞోపవీతమును తెలుసుకొనుచున్నవాడే విద్వాంసుడు. అట్టివానిని యజ్ఞస్తుడుగా (యజ్ఞము నిర్వర్తించినవానిగా) బ్రహ్మవేత్తలు ఎరుగుచున్నారు. అంగీకరించుచున్నారు. ఆత్మ యజ్ఞము చేయుచున్న వాడుగా అనుకోబడుచున్నాడు.

ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా .
కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ ..
11. ఏకో దేవః సర్వభూతేషు గూఢః।
సర్వవ్యాపీ, సర్వభూతాంతరాత్మా।
కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః।
సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ।
పరమాత్మ ఏకస్వరూపుడు(ఏకమ్)। పరమాత్మ ఒక్కడే! ఆయన అనేకముగా అగుటలేదు. ఏకముగా ఉండి, సర్వజీవులలో రహస్యముగా దాగి ఉన్నారు. సర్వములోను, సర్వముగాను సర్వవ్యాపిగాను ఉన్నారు. సర్వుల అంతరాత్మ ఆయనయే! సర్వకార్యక్రమములకు అధ్యక్షుడు సర్వభూతాది / సర్వులలోని మనో - బుద్ధి - చిత్త - అహంకారాలకు సాక్షి। సర్వము ఆయన వలననే చేతనమగుచున్నది. సర్వుల సహజ స్వరూపుడు। కేవలుడు। గుణములకు ఆవల ఉన్నవాడు। నిర్గుణుడు।

ఏకో మనీషీ నిష్కియాణాం బహూనామేకం సంతం బహుధా యః కరోతి .
తమాత్మానం యేఽనుపష్యంతి ధీరాస్తేషం శాంతిః శాశ్వతీ నేతరేషాం ..
ఏకో వశీ సర్వభూతాంతరాత్మా
ఏకగ్ం రూపం బహుథా యః కరోతి,
తమ్ ‘ఆత్మస్థం’ యే
అనుపశ్యంతి ధీరాః,
తేషాగ్ం సుఖమ్ శాశ్వతమ్।
నేతరేషామ్।
ఏకస్వరూపుడై సర్వజీవుల అంతరాత్మగా విరాజిల్లుచున్నారు! ఆయన ఏకమే అయి ఉండి అనేక రూపములుగా తనను తాను ప్రదర్శించు కుంటున్నారు.
ఏ ఏకస్వరూపుడు అద్వయుడు, అఖండుడు - అనేకముగా విద్యమాన మగుచున్నారో….అట్టి పరమాత్మను ఏ ధీరుడైతే తన ఆత్మస్థునిగా సందర్శిస్తున్నాడో, గమనించి ‘తమేవాఽహమ్’ అగుచున్నాడో, ఆతని సుఖము మాత్రమే శాశ్వతము। అనునిత్యము। ఇక తదితరుల సుఖమో- అశాశ్వతము। కాలబద్ధము। సందర్భపరిమితము. దుఃఖభూయిష్టము.

ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం .
ధ్యాననోర్మథనాభ్యాసాద్దేవం పశ్యేన్నిగూఢవత్ ..
12. ఆత్మానమ్ అరణిం కృత్వా,
ప్రణవమ్ చ ఉత్తరారణిమ్,
‘ధ్యాన’ నిర్మథన - అభ్యాసాత్
దేవమ్ పశ్యేత్
నిగూఢవత్।।
అట్టి మనయందే నిగూఢుడై ఉన్న సర్వాత్మకుని తెలుసుకోవటం, దర్శించటము, ప్రవేశించటము, అనన్యమైన ఆత్మానందము ఆస్వాదించటము ఎట్లా?
👉 జగత్ భావనాయుక్తమైన జీవాత్మ- భావయుక్తమైన మనస్సు ను → క్రింద కొయ్యగాను,
👉 ‘ఓం’ అను జాగ్రత్ స్వప్న సుషుప్త సాక్షీ భావనారూపమనస్సు (ప్రణవమును) → పై కొయ్యగాను
👉 ‘ధ్యాస’ రూపమైన ధ్యానాభ్యాసమును → మథనము (ఒక దానితో మరొకదాని ఘర్షణ చేతను)
అంతరంగ - అంతర హృదయాంతరంగుడగు ఆత్మదేవుని ఈ సమస్త స్వరూపుడుగా సందర్శించాలి!

తిలేషు తైలం దధినీవ సర్పిరాపః స్త్రోతఃస్వరణీషు చాన్నిః .
ఏవమాత్మాఽఽత్మని గృహ్మతేఽసౌ సత్యేనైనం తపసా యోఽనుపశ్యతి ..

ఊర్ణనాభిర్యథా తంతూన్సృజతే సంహరత్యపి .
జాగ్రత్స్వప్నే తథా జీవో గచ్ఛత్యాగచ్ఛతే పునః ..
13. తిలేషు తైలమ్,
దధినీవ సర్పిః
ఆపః స్రోతః
స్వరణీషు చ అగ్నిః
ఏవమ్ ఆత్మాత్మని జాయతే అసౌ,
సత్యేన - తపసా యో అనుపశ్యతి।
ఊర్ణనాభిః యథా
తంతూన్ సృజతే
సగ్ంహరత్యపి,
జాగ్రత్ - స్వప్నే
తథా జీవో
గచ్ఛతి - ఆగచ్ఛతే పునః।
నువ్వులలో నూనె, పెరుగులో నేయి, ప్రవాహములో జలము, కొయ్యయందు అగ్ని దాగి ఉన్నట్లుగా మనందరిలో సర్వాంతర్యామియగు పరమాత్మ సర్వదా దాగి ఉన్నారు. ఎల్లప్పుడు వేంచేసియే ఉన్నారు. అంతర్-హృదయాంతరంగుడై ఉన్నారు.
ఎవ్వరైతే ఎదురుగా ఇంద్రియములకు తారసబడుచున్న సందర్భములను అధిగమించి, సత్‌స్వరూపమును (యత్-సత్)ను ఉపాసిస్తూ, ‘‘సత్యుడగు పరమాత్మయే ఇన్ని రూపములుగా అగుపిస్తున్నారు కదా! అనేకముగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఒక్కటిగా అనుపించుగాక’’ - అను విజ్ఞతతో దర్శిస్తూ, తపన రూపమైన తపస్సుచే అంతటా ‘ఆత్మ’నే దర్శిస్తారో….
వారు తమయందలి పరమాత్మను స్వాభావికంగాను, సమస్త సందర్భములకు అతీతంగాను సందర్శించగలరు.
సాలె పురుగు తననుండి తంతువులను (దారమును) ఉపయోగించి సాలెగూడు కట్టుకొని త్రెంచుకొంటూ (బయటకు-లోపలకు) వెళ్ళి వస్తుంది కదా! అట్లాగే పరమాత్మ జాగ్రత్ - స్వప్న - సుషుప్తులను నిర్మించుకొని ప్రవేశము-నిష్క్రమణములను క్రీడా వినోదముగా మరల మరల నిర్వర్తిస్తున్నారు!

పద్మకోశప్రతీకాశం సుషిరం చాప్యధోముఖం .
హృదయం తద్విజానీయాద్విశ్వస్యాఽఽయతనం మహత్ ..

నేత్రస్థం జాగ్రతం విద్యాత్కంఠే స్వప్నం వినిర్దిషేత్ .
సుషుప్తం హృదయస్థం తు తురీయం మూర్ధ్ని సంస్థితం ..
14. నేత్రస్థం జాగరితమ్ విద్యాత్।
కంఠే స్వప్నగ్ం సమావిశేత్।
సుషుప్తగ్ం హృదయస్థమ్ తు
తురీయమ్ మూర్ధ్ని సంస్థితమ్।
ఆత్మయొక్క విన్యాసరూపుడు, అంశ అయినట్టి జీవాత్మ
- జాగ్రత్ అవస్థలో నేత్రస్థానమును కేంద్ర స్థానముగా కలిగి ఉంటున్నాడు.
- స్వప్నావస్థలో కంఠమునందు,
- సుషుప్తిదశలో హృదయస్థానమునందు
- తురీయదశలో మూర్ధ్ని (శిరస్సు, నుదురు) స్థానమునందు సంచారములు కలిగి ఉంటున్నాడు.


యదాత్మా ప్రజ్ఞయాఽఽత్మానం సంధత్తే పరమాత్మని .
తేన సంధ్యా ధ్యానమేవ తస్మాత్సంధ్యాభివందనం ..

నిరోదకాధ్యానసంధ్యా వాక్కాయక్లేశవర్జితా .
సంధినీ సర్వభూతానాం సా సంధ్యా హ్యేకదండినాం ..

యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ .
ఆన్నందమేతజ్జీవస్య యం జ్ఞాత్వా ముచ్యతే బుధః ..
యతోవాచో నివర్తంతే
అప్రాప్య మనసా సహ।
ఆనందమ్ ఏతత్ జీవస్య
యత్ జ్ఞాత్వా ముచ్యతే బుధః।
‘‘ఏకరూపమే’’ అయి ఉన్న జీవాత్మ-పరమాత్మలే సమస్తమునకు ఆధారము, పరమము, నిత్యసత్యము కూడా. అట్టి పరమ పురుషుని గురించి నిర్వచించటానికి వాక్కు - మనస్సు తమకు సాధ్యము కాక, వెనుతిరుగు చున్నాయి.
అయితే విజ్ఞతతోకూడినట్టి బుధులు - ఆత్మను స్వస్వరూప-సహజ ఆనంద విభవముగా గ్రహించి సంసారబంధ విముక్తులగుచున్నారు!

సర్వవ్యాపినమాత్మానం క్షీరే సర్ప్రివార్పితం .
ఆత్మాతపోమూలం తద్బ్రహ్మోపనిషత్పరం .
సర్వాత్మైకత్వరీపేణ తద్బ్రహ్మోపనిషత్పరమితి .. 4..

ఇత్యథర్వవేదే బ్రహ్మోపనిషత్సమాప్తా ..
సర్వవ్యాపినమ్ ఆత్మానమ్
క్షీరే సర్పిః ఇవ అర్పితమ్।
ఆత్మవిద్యా తపోమూలం
తత్ బ్రహ్మోపనిషత్ పదమ్।।
తత్ బ్రహ్మోపనిషత్ పదమ్ ఇతి।।
పాలలో నేయి అంతటా ఉండి ఉన్నట్లు ఆత్మ సర్వవ్యాపకమై సర్వముగా వెలుగొందుచున్నది.
తపస్సుచే ఆత్మను గురించి తెలుసుకొన్నవారు - ఇక్కడే, ఇప్పుడే బ్రహ్మపదమును సముపార్జించుకొనుచున్నారు.

ఇతి బ్రహ్మోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



కృష్ణ యజుర్వేదాంతర్గత

19     బ్రహ్మ ఉపనిషత్

అధ్యయన పుష్పము


స్వప్నానుభవమునకు మునుముందుగానే - స్వప్న ద్రష్ట ఉండి ఉన్నాడు కదా! అట్లాగే, జన్మలకన్నా మునుముందే ‘జన్మలు’ అను పురుషకారమును ప్రదర్శించబోవుచున్న ‘పురుషుడు’ ఉండియే ఉన్నాడు. ఆయన ‘కేవలుడు’ అని, ‘నిత్య-అనునిత్యుడు’ అని, ‘సత్ పురుషుడు’ అని, ‘సహజ పురుషుడు’ అని అభివర్ణించబడుచున్నాడు.

ఆతడే పరమపురుషుడు। ఆది పురుషుడు। ఆత్మ। దృక్। పరమాత్మ। పరతత్త్వము। ఓం। బ్రహ్మము। స్వసహజ స్వరూపము। ఇటువంటి అనేక శబ్దములచే కూడా ఉద్దేశ్యించబడుచున్నారు.

అట్టి పురుషుని గురించి ఈ బ్రహ్మోపనిషత్ విశదపరచుచున్నది.

⌘ ⌘ ⌘

అట్టి పరమపురుషుడు నాలుగు అభౌతిక - భౌతిక స్థానములుగా ప్రకాశమానమగుచున్నారు. (లేక) విద్యమానమగుచున్నారు.

అట్టి ఆదిపురుషుడు ఈ భౌతిక దేహము పరంగా ప్రభవగుచున్న (లేక) ప్రదర్శనమగుచున్న స్థానములు

బ్రహ్మ-ఉపనిషత్-అవస్థలు-స్థానములు

ఈ నాలుగు ముఖ్య స్థానములలో జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయ రూపుడుగా యోగులకు స్వానుభవమై వెలుగొందుచున్నాడు.

జాగ్రత్ అవస్థయందు… సృష్టికి కర్త, చతుర్ముఖుడు అగు బ్రహ్మ గాను,
స్వప్నావస్థయందు… స్థితికారుడగు విష్ణువు గాను,
సుషుప్తి యందు… లయకారుడగు రుద్రుడు గాను,
తురీయమునందు… సర్వమునకు ఆవల (పరమునందు) ప్రకాశించే పరబ్రహ్మము గాను అభివర్ణించబడుచున్నారు!

తురీయమే, పరమ ప్రశాంతమగు నిర్వాణ స్థానము!

మొట్టమొదటే ఉండి ఉండటంచేత ఆ ఆదిస్వరూపమే (The inspiring self prior to every thing) ‘ఆదిత్యుడు’ అనబడుచున్నాడు. యతయో ఆదిః - సర్వమునకు ప్రారంభముననే ఉన్నట్టి స్వస్వరూపుడు ఆదిత్యుడు. (ఆద్యేవయత్ స్థితః, ఉదితః - తత్ ఆదిత్యః).

అట్టి ఆదిత్యుడే విష్ణువుగాను, ఈశ్వరుడుగాను కూడా పిలువబడుచు ఉపాసించబడుచున్నారు! అనగా…, ఆ ఆదిత్యుడే విష్ణువు, ఈశ్వరుడు కూడా! ఆయనయే సమస్త దేహములలోను, సమస్త దేహములుగాను సంప్రదర్శితులు.

ఈ దేహి పట్ల మనస్సు, చెవులు, కళ్లు ఇత్యాదులు కనబడుచున్నాయికదా! అయితే ఆదిపురుషునియొక్క దేహత్వ భావన తరువాతయే అవన్నీ అంతర్గతమై ప్రదర్శనమగుచున్నాయి.

‘దేహత్వము’ అనే పురుషకారమును ప్రదర్శించే (దేహత్వమునకు మునుముందే ఉండే) చైతన్య స్వరూపుడైనట్టి ‘ఆదిత్యుడు’ లేక ఆదిపురుషుడు…ఎట్టివాడు?

అమనస్కుడు : స్వయముగా మనోరహితుడు. మనస్సు ఆయన యొక్క పురుషకారములోని ఒకానొక అంతర్గత విశేషము. ఆలోచనలకు మునుముందే ఆలోచించువాడుగా ఉండటం చేత అమనస్కుడు. ఆలోచనలకు ముందే ఆలోచనలకు ఆవల ఆలోచనలు లేనప్పుడు కూడా ఉండి ఉన్న స్వస్వరూప చైతన్య స్వరూపుడే ఆతడు! ఆలోచనలు ఆతని చేతన ప్రదర్శనము.

అశ్రోత్రమ్ - అపాణి-పాదమ్ : అట్టి ఆదిపురుషునికి కర్మేంద్రియములు గాని, జ్ఞానేంద్రియములు గాని లేవు. అవన్నీ ఆయన సంకల్పశక్తియొక్క ప్రదర్శనములు. నవలలోని పాత్రల రూపురేఖలు ‘రచయితకు ఉన్నాయి’ అని అనము కదా।

జ్యోతిర్విదితము : అయితే అవన్నీ వెలిగించే కేవల జ్యోతిస్వరూపుడుగా బ్రహ్మజ్ఞుల అనుభవ విషయమగుచున్నాడు. జ్యోతి స్వరూపముగా (That which enlightens, exhibits and operates all else)గా విదితమగుచున్నారు. దీపపు వెలుగులో గదిలోని వస్తువుల ఆకారములన్నీ కనిపిస్తున్న విధంగా, - ‘ఆత్మజ్యోతి’ వెలుగులో అన్యరూపమగు ఈ జగద్వ్యవహారమంతా అనుభవమవటం జరుగుతోంది.

పరబ్రహ్మస్థానము

ఎక్కడైతే… (లేక) ఏదైతే…,

→ లోకాలన్నీ ఆలోకములుగాను (లోకాలు ఏర్పడకముందే ఉన్న దివ్య స్వస్వరూప చైతన్యుడు కనుక),

→ దేవాన్ అదేవాన్ - దేవతలు అదేవతలుగాను, ళిదేవతల కంటే (ఆదిర్హి దేవానామ్) మునుముందే ఉన్న పరతత్త్వము కాబట్టిరి,

→ వేదములు అవేదములుగాను, - (వేదములు ఆపరమ పురుషుని గురించి గానం చేస్తున్నాయి. ఆయన వేద పురుషుడు, తెలుసుకొనబడే సమస్తమునకు తెలుసుకునేవాడుగా మునుముందే ఉన్నవాడు కాబట్టి),
వేదము (శబ్దార్ధము) = తెలియబడునది
వేదపురుషుడు = తెలుసుకొనుచున్నవాడు (లేక) తెలుసుకొనబడుచున్నదానిని + తెలుసుకొనుచున్న వానిని → తెలుసుకొంటున్న ‘‘ప్రజ్ఞాచైతన్య పురుషుడు.’’

→ సంబంధ - అనుబంధ - బాంధవ్యములైనట్టి సర్వ విశేషములకు ఆవల ఉన్నట్టి అలౌకికస్వరూపుడుగాను,

తల్లి….. తల్లిగా కానట్టి,
తండ్రి…. తండ్రి కానట్టి,
కోడలు… కోడలు కానట్టి,
చండాలుడు… చండాలుడు కానట్టి
అన్య స్త్రీ సంజాతుడు - పౌల్కసుడు కానట్టి,
మూర్ఖుడు… మూర్ఖుడు కానట్టి
శ్రమణుడు (సన్న్యాసి) - శ్రమణుడు కానట్టి,
సర్వ సంబంధములు లేనట్టి తత్త్వముగాను…,
ఆశ్రమ రూపకర్మలు లేనట్టిదిగాను,
తపస్సు అతపోరూపమైనట్టిదిగాను అగుచున్నదో….,

ఏది సర్వచేతనమో, ఏది అనేకము కాకుండా, ఏకమైయుండి ప్రకాసిస్తోందో…, అదియే, ఆ స్థానమే పరంబ్రహ్మము!

ఆ ఆత్మ స్థానము నందు ‘‘వీరు అల్పజీవులు - వారు మానవులు - వారేమో దేవతలు - ఇకవారు పితృదేవతలు’’ మొదలైన భేదము లేవీ లేవు!

అది అధికాధిక బుద్ధి సమన్వితులగు దేవతలచేత, పిత్రుదేవతల చేత కూడా నిర్వచన రూపంగా సవిదితమయ్యేదికాదు.

దేవత - పితృదేవతలకు కూడా మునుముందే ఉన్నట్టిది ఆ పరబ్రహ్మ చైతన్యము! (అహమ్ హి సర్వ దేవానాం, మహర్షీణాం చ సర్వశః) అయితే, నిర్మల హృదయులు బుద్ధితో సర్వే సర్వత్రా ఇదంతా అద్దాని మహిమగా గాంచుచున్నారు!

సర్వదేవతల - దేవతాలోకముల ఉనికి (నివాస) స్థానము ఆ పరమ పురుషుని హృదయమే!

హృదయము - హృదయేశ్వరుడు:

⌘ దేవతలు హృదయమునందే నివాసులు.
⌘ ప్రాణశక్తి ప్రతిష్టితమై ఉన్నది కూడా హృదయములోనే!
⌘ పంచ ప్రాణములు, జ్యోతిర్మండలము, … ఇవన్నీ హృదయములోనే ఉన్నాయి!
⌘ త్రివృత్ (3 Phases) (అనబడు
→ ఇంద్రియ - ప్రాణ - తేజస్సులుబీ జాగ్రత్-స్వప్న-సుషుప్తులుబీ
→ వాటికి సంజ్ఞయగు ‘3’ ప్రోగుల యజ్ఞోపవీతము -
… ఉన్నది కూడా హృదయమునందే! ఇవన్నీ హృదయములోనే ఉన్నాయని తత్త్వవిదులు సిద్ధాంతీకరించుచున్నారు.

ఆ హృదయమో.. ఆదిచైతన్య పురుషునియందు ప్రతితిష్ఠితమై ఉన్నది!

అందుచేత దేవతలు దేవతాలోకాధిపతులు, పిత్రుదేవతలు జ్యోతిర్మండలములు, జీవాత్మ, ఇంద్రియ - ప్రాణ- తేజస్సులు… ఇవన్నీ (ఒకే అగ్ని యొక్క అనేక శిఖల వలె) ఆత్మ యొక్క తేజోవిలాసములే! ఆత్మకు అభిన్నము! = అట్టి బ్రహ్మజ్ఞానము - స్వీయానుభవమితి! స్వకీయానుభవ విషయము మాత్రమే!

⌘ ⌘ ⌘

శ్లో।। యజ్ఞోపవీతం పరమమ్ పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పురస్తాత్
ఆయుష్యమగ్ర్యం పతిముంచశుభ్రం। యజ్ఞోపవీతమ్ బలమస్తు తేజః।।

అట్టి ఆదిపురుషుడు అలంకారంగా ధరించే త్రిసూత్రములతో (3 దారములతో) - జాగ్రత్, స్వప్న సుషుప్తుల రూపములతో కూడిన పరమ - పవిత్రమగు యజ్ఞోపవీతమే ఈ ఈ జగత్తులు! ఈ త్రి-లోకాలు! ఈ సర్వలోక సంబంధమైన సంఘటనలు, సందర్భములు, సంబంధములు జన్మ-మృత్యువులు, ఇవన్నీ కూడా యజ్ఞ-ఉపవీతముయొక్క (ఆత్మయొక్క) త్రిసూత్ర అంతర్గతమే!

‘‘ఆత్మాహమ్! నా యొక్క సహజ-అనునిత్య స్వరూపము పరబ్రహ్మమే’’ అనే అవగాహన ఆశయముగా గల బుధుడు (The wise) ఉత్తమ బుద్ధి సమన్వితుడగుచున్నాడు. ఆత్మతత్త్వము గురించిన సమాచారము - అవగాహన - సామీప్యము ప్రవృద్ధ పరచుకొనుచున్నాడు.

క్రమక్రమంగా కేశ-శిఖ (పిలక రూపమైన జుట్టు)ను, దారముతో తయారు చేసి ధరించిన సంజ్ఞారూపమగు త్రిసూత్ర (దారపు) యజ్ఞోపవీతమును అధిగమించి, (వాటిని మానసికంగా త్యజించి…,) ‘పరబ్రహ్మము’ అనే బుద్ధితో కూడిన (బుద్ధిరూప) త్రిసూత్ర ధారణకు ఉపక్రమించుచున్నాడు.

సూచనాత్ సూత్రమ్… ఇతి అహుః। ‘సూత్రము’ అనగా ‘సూచన’ అని ఉద్దేశ్యమై యున్నది.

‘‘భౌతిక త్రిసూత్ర (దారముచే తయారు చేసుకొనిన) యజ్ఞోపవీతము అక్షరపరబ్రహ్మమునకు సూచన’’… అను అవగాహన సిద్ధించుకోవటమే అంతరార్థము.

సూత్రమ్ నామ పరమ్ పదమ్!

‘‘ఏ బ్రహ్మము జాగ్రత్ - స్వప్న - సుషుప్తులను లీలా వినోదముగా ధారణ చేస్తున్నదో.. అదియే నాయొక్క వాస్తవ స్వరూపము కదా!’’ అను అర్థ - పరమార్థములను అలవరచుకొనువాడు పరమ పద స్థానమును చేరుచున్నాడు. ఆ పరమ పదభావనయే ‘సూత్రము’ అని సూత్రధారులు ఎరిగి ఉండెదరు గాక!

ఎవ్వడు యజ్ఞసూత్రము (యజ్ఞోపవీతము) యొక్క సూచన అగు పరమార్థమును మననం చేస్తూ ఉంటాడో, తెలుసుకొంటూ ఉంటాడో, ఆత్మజ్ఞుడగుచూ ఉంటాడో, ఆతడే ‘విప్రుడు’!

అంతేగాని, ఎవడు - కేవలము ప్రత్తితో చేసిన త్రిసూత్రమును ధరించి, అది సూచించే పరమార్థమును బుద్ధిలో నిలుపుటకు ప్రయత్నించడో… ఆతడు విప్రుడుకాడు! వేదార్థము తెలిసిన ‘వాడు’ కాదు!

బ్రహ్మము యొక్క మననముచే ఒకడు యోగి అగుచున్నాడు. క్రమంగా యోగవేత్త అగుచున్నాడు. క్రమంగా తత్త్వవేత్త అగుచున్నాడు. అటువంటి తత్త్వదర్శి ‘‘దేనిచే ఇదంతా కూడా ఓత-ప్రోతమై (Every thing is made up of) ఉన్నదో అట్టి బ్రహ్మమునే సూత్రముగా ధరించుచున్నాను’’ అను భావనతో ధారణ చేయుచున్నాడు! (ఓత-ప్రోతము = వస్త్రములో దారము వలె నిలువుగాను, అడ్డంగాను).

ఆత్మయేవ ఇదమ్ సర్వమ్।

‘‘అనుకోవటము - క్రమంగా అనిపించటము’’ - అను అనుక్షణికమగు భావనయే ముఖ్యము. అంతేగాని బహిః సూత్రము మాత్రమే కాదు.

బహిః సూత్రమ్ త్యజేత్ విద్వాన్, యోగమ్ ఉత్తమమ్ ఆశ్రితః।
ఉత్తమమైన (సంయోగ - వియోగ అతీత) బ్రహ్మ యోగ స్థానము- స్థితి సంపాదించుకుంటున్న యోగి బాహ్యమున ధరించిన సూత్రమును మానసికంగా త్యజించి, ‘బ్రహ్మతత్త్వ సూత్రధారణ’ చేయువాడై ఉంటున్నాడు.

కనుక, అచేతనమగు దారపు సూత్రమును మనస్సుతో త్యజించి సచేతనమగు ‘బ్రహ్మభావము’ అనే సూత్రమును క్రమంగా మనో-బుద్ధి-చిత్తములతో ధరించాలి!

అటువంటి ‘బ్రహ్మసూత్రధారణ’ చేయుచున్న యోగికి - ఎక్కడా దృశ్యములో వదలవలసినది (న ఉచ్ఛిష్టమ్) ఉండదు.

అతను దేనినీ పట్టుకోడు, వదలడు.

అతనికి ‘అశుచి’ అనునదే ఉండదు! అంతరంగములో ‘సర్వము బ్రహ్మమే’ అను భావన రూపుదిద్దుకొనుచుండగా ఇక ఆపై శుచి - అశుచులు ఏమి ఉంటాయి? ‘‘సర్వమూ తానే’’ అయి, దృశ్యమును తన ధారణాసూత్రముగా ఎరుక కలిగి ఉంటున్నాడు.

అట్టి బ్రహ్మసూత్రమును ఎరిగినవారే సూత్ర విదులు, వారే వాస్తవమగు యజ్ఞోపవీత ధారులు!

‘‘అంతా బ్రహ్మమే! నేను బ్రహ్మమునే! అహమ్- బ్రహ్మా-స్మి’’ అనునదే జ్ఞానశిఖ! ‘‘బ్రహ్మ సత్యమ్- జగత్ మిధ్యా’’ అనునదే ఆతని నిష్ఠ. (తడి బట్టలు - ఎవ్వరు తాకని బట్టలు - పట్టుబట్టలు - ధావళీ.. మొదలైనవి అసలైన నిష్ఠ అని అనిపించుకోవు).
(నిష్ఠ = ఎడతెగని శ్రద్ధ).

ఆత్మ భావనయే పరమాశయము! ఆత్మ జ్ఞానమే పరమ పవిత్రము! అందుచేత బ్రహ్మజ్ఞానమే అసలైన యజ్ఞోపవీతము. సర్వము భస్మము చేసే అగ్నివలె - సర్వప్రాపంచక విషయాలను జ్ఞానాగ్నిచే భస్మముచేయు సంజ్ఞయే జ్ఞానశిఖ! అదియే త్రి-విభూతి రేఖలు.

విద్వాంసులు దృశ్యమునకు ఆధారమైన ఆత్మ యొక్క జ్ఞానాగ్నినే శిఖగా దర్శిస్తారు. ఇతరమైన కేశధారణను వాస్తవ శిఖగా భావించరు. అట్టి జ్ఞాన శిఖ- జాతి భేదము లేకుండా ఎవ్వరైనా, ఎక్కడైనా ధరించగలిగేదే, ధరించవలసినదే.

ఇక, ‘‘వైదిక బ్రాహ్మణులు భౌతికమైన ‘కేశశిఖ’ ధరించే నియమము శాస్త్రప్రోక్తమై ఉన్నది కదా! అది శాస్త్ర నియమం కదా! దాని సంగతేమిటో’’ - అని అంటారా? వారు కూడా భౌతికమైన కేశశిఖధారణతో తృప్తిపడక.. కర్మ సంబంధమైన కేశశిఖతో బాటు ‘‘బ్రహ్మభావనయే విద్వాంసులు మెచ్చే శిఖ కదా!’’… అను దృష్టిని ప్రవృద్ధ పరచుకొనటం ఉచితం! అత్యావశ్యకం!

శాస్త్ర విధి - నియమాల కొరకై ధరించే క్రియాసూత్రమును (దూది సూత్రమును) బుద్ధితో బ్రహ్మభావనా క్రియా సూత్రముగా మలచుకొనెదరు గాక!

ఎవరి యొక్క క్రియలన్నీ జ్ఞానమయమై, తత్త్వదర్శన సమన్వితమై ఉంటాయో, అట్టివారి ధారణయే ‘ఉపవీతము’ (బ్రహ్మము యొక్క సామీప్యత-అనే ధారణ)! అదియే శబ్దార్ధము! బ్రహ్మముతో తన్మయమే ఉపవీతము!

‘‘బ్రహ్మమే నేను - నీవు ఇత్యాదులతో కూడిన ఇదంతా కూడా!’’ అని బ్రహ్మవిదులు ఎరిగినవారై ‘‘శృణ్వంతి విశ్వే’’ అని ఎలుగెత్తి గానము చేస్తున్నారు.

మనము ఇప్పుడు చెప్పుకొనే సూత్రాత్మరూపమైన యజ్ఞోపవీత ధారణయే ఉత్తమోత్తమము! పరమధర్మము! నిత్యపారాయణము!

‘‘సర్వము పరబ్రహ్మముగా నేను దర్శించుచుండెదనుగాక!’’ - అను మననమును, మహదాశయమును - సర్వకాల, సర్వావస్థల యందు ఆశ్రయిస్తూనే ఉండటమే ‘త్రిసూత్రధారణ’.

ఆత్మభావనచే ఆత్మతత్త్వము సిద్ధించగలదు. అనుకుంటూ - అనుకుంటూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది!

ఏ విద్వాంసుడైతే శాస్త్ర జ్ఞానము సంపాదించుకుంటూ ‘‘జ్ఞేయము (Practical Implementation)’’ రూపమగు యజ్ఞోపవీత ధారియై ఉంటాడో…, ఆతడే యజ్ఞస్తుడు! యజ్ఞస్తమ్ సః! - అని యజ్ఞవిదులు ఎరిగినవారై ఉంటున్నారు.

⌘ ⌘ ⌘

ఏకోదేవః సర్వభూతేషు గూఢః। సర్వవ్యాపీ। సర్వభూతాంతరాత్మా।।
పరమాత్మ సదా, సర్వదా ఒక్కడే! ఏకస్వరూపుడే! అనేకముగా అగుచుండటమే లేదు! ఆయన ఏకస్వరూపుడై, సర్వజీవులకు అంతరాత్మయై వెలుగొందుచున్నారు. స్వయం ప్రకాశమానమగుచున్నారు! అనేకంగా (మనస్సుకు) కనిపిస్తున్నప్పటికీ ఏకముగానే అయి ఉన్నారు. ఆత్మజ్ఞుల దృష్టిలో ఇదంతా ఏకమేగాని, అనేకము కాదు.

పరబ్రహ్మమే సర్వవ్యాపి అయి సర్వజీవుల అంతరాత్మ స్వరూపముగా విరాజిల్లుచున్నది.

కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః, సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ।
పరమాత్మయే సర్వకర్మలకు అధ్యక్షుడు. ఆయన సంకల్పవిన్యాసమే ఇదంతా! సర్వభూత-అధివాసుడు, కేవలుడు, నిర్గుణుడు, సాక్షి అయి ఉన్నారు.

అటువంటి సర్వాత్మకుడు - పరబ్రహ్మము- సర్వలోకాధ్యక్షుడు - సర్వాధారుడు అగు పరమాత్మను -

-   ఎక్కడికి వెళ్లి దర్శించాలి?  
-   ఏలోకములో ప్రవేశించి ఆయనను ఆశ్రయించాలి?

ఆయన కొరకై బాహ్యమున మరెక్కడికో వెళ్లవలసిన పని లేదు.

తమ్ ఆత్మస్థమ్! ఆయన ప్రతి ఒక్కని హృదయమునందు సర్వదా వేంచేసియే ఉన్నారు.

యే పశ్యంతి ధీరాః, తేషామ్ సుఖమ్ శాశ్వతమ్। నేతరేషామ్!
ఏ తెలివి- ఉత్తమ వివేకము - నిర్మల బుద్ధి కలవాడైతే ఆ పరమ పురుషుని తన హృదయమునందే.., ‘‘ఓహో! ఆయన ఇక్కడే నా హృదయమునందే సర్వతత్త్వ స్వరూపుడై వేంచేసి ఉన్నారు కదా!’’ అని సందర్శనము చేస్తారో, వారి సుఖమే నిజమైనది; శాశ్వతమైనది!

తదితరుల సుఖములు శాశ్వతముకాదు. ఇంద్రియ సుఖములు దుఃఖ మిశ్రితము - అయి ఉన్నాయి. అవి కాలమునకు, సందర్భ - సంఘటన - సంబంధములకు మనో కల్పితమైన అనుబంధము. అందుచేత అశాశ్వతము!

మనయందే సర్వదా వేంచేసి, నిగూఢుడై, మనో-బుద్ధి-చిత్త-అహంకారములకు ఆవల దాగి ఉన్న ఆ ‘పరబ్రహ్మాహము’ను పట్టుకోవటానికి మార్గమేమిటి? ఆయనను తెలుసుకోవటం, దర్శించటము, సమీపించటము, అనన్యమవటము ఏవిధంగా?

→ జగత్ దృశ్యభావన-జీవాత్మభావనతో ప్రవర్తిస్తున్న ఈ మనస్సు (లేక) చిత్తమును → క్రింద కొయ్య (ఊర్థ్వ అరిణమ్)గాను,
→ అకార-ఉకార - మకార స్వరూపుడై, ఆవల గల కేవల సాక్షికి నంజ్ఞయగు ఓంకారమును → పైన కొయ్య (ఉత్తరారిణమ్) గాను
→ ఆత్మధ్యాసరూపమైన ధ్యానము (భక్తి-ప్రపత్తి - ప్రాణాయామాదులు) → అను అభ్యాసరూప మధనము (Beating) తోను
ఆ నిగూఢంగా, అంతరమున ఉన్న ఆ దేవదేవుని సమీపించాలి! ఆశ్రయించాలి.

‘సర్వము ఆయనే’ అను అద్వితీయత్వమును అభ్యసించాలి!

అంతరంగ హృదయాంతరంగుడగు ఆ పరమేశ్వరుని సందర్శించాలి!

‘నేను ఆయన యొక్క కిరణమునే’ అను రూపంగా ఉపాసించాలి!

ఆయనతో ‘మమేకము’ సిద్ధించుకోవాలి. సహజీవులను ‘‘ఏకోదేవః కిరణములు’’ అను అంతరంగ-అభ్యాసమును ఆశ్రయించాలి.

ఆయన ఈ సర్వదృశ్య-అదృశ్య జగత్ స్వరూపుడై మనకందరికీ ఎదురుగానే ఉన్నారు! సర్వజీవుల ధారణ ఆయనదే! ఆయనయే ఇదంతా!

తిలేషు తైలమ్ … అనేక నువ్వుగింజలలో నూనెలాగా…,
దధినీవ సర్పిః … పెరుగులో అంతర్లీనమై ఉన్న నేయి (Ghee) వలెను…,
ఆపః స్రోతః … అసంఖ్యాక తరంగాలలోని జలమువలెను,
స్వరణీషు చ అగ్నిః … కొయ్యలో అగ్ని దాగి ఉన్నట్లు

పరమాత్మ ఈ కనిపించే అందరిలోను, అందరుగాను, అంతర్యామిగాను, అంతర్బహి స్వరూపముగాను సర్వదా వేంచేసి ఉన్నారు. మనందరి అంతర్-బహిః స్వరూపానుభమంతా ఆయనయే! ఆయన అద్వితీయుడు కదా!

ఎవ్వరైతే ఈ ఇంద్రియములకు ఎదురుగా కనిపించే సంగతి-సందర్భము మొదలైనవాటిని అధిగమించి అనునిత్య సత్యమగు ఆత్మగానే తపోసంపద యొక్క సహాయముతో సందర్శిస్తారో - యో అనుపశ్యతి ధీరాః…, వారు:

‘‘నాకు నేనే..,; ఆత్మస్వరూపుడనై.., ‘జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు’ అనే ‘3’ సాలెగూళ్లను వేరువేరుగా కట్టుకొని బయటకు వెళ్లటము, లోపలికి రావటము.. ఇవన్నీ నిర్వర్తిస్తున్నాను’’- … అని ఇదంతా గమనిస్తున్నారు. గూళ్ళు కట్టుకొనేది, త్రెంచుకొనేది కూడా ఆత్మయే!

→ జాగ్రత్ నా మనో నిర్మాణమే!
→ అట్లాగే స్వప్న-సుషుప్తులు కూడా నా మనో కల్పనయే! … అని గుర్తించుచున్నారు.
వాటికి వేరైన ఆత్మస్వరూపుడను నేను’’ అని ఆస్వాదిస్తున్నారు!

అనగా,
ఈ జీవుడు ఈ విధంగా సాలెపురుగు - సాలెగూళ్లవలె, పంజరంలో పెరుగుచున్న పక్షి లోనికి - బయటకు వెళ్ళివచ్చు తీరుగా - జాగ్రత్ స్వప్న సుషుప్తులలోకి గచ్ఛితి - ఆగచ్ఛతి - పునః! మరల వస్తు - వెళ్ళుచూ ఉన్నాడు!

అట్టి జాగ్రత్ - స్వప్న - సుషుప్తులలో రాకపోకలు నిర్వర్తిస్తున్న జీవాత్మ యొక్క సహజ - ప్రారంభ- అనునిత్య స్వరూపమే బ్రహ్మము!

ఇప్పుడు తత్త్వదర్శనము కొరకై, పరమాత్మ యొక్క అంశ అగు జీవాత్మ సంబంధమైన వివిధ చైతన్య ప్రదర్శనములను యోగాత్మకంగా సూచించబడుచున్న భౌతిక దేహ సంబంధితమైన - కొన్ని విశేష స్థానములను విశదీకరించుకుంటున్నాము.

దశ దేహమునందు కేంద్రీకృత స్థానము
జాగరితమునకు (జాగ్రత్‌నకు) - నేత్రములు ముఖ్యానుభవ స్థానము!
స్వప్నమునకు - కంఠ ప్రదేశము కేంద్రీకృతస్థానము!
సుషుప్తికి - హృదయము కేంద్రీకృత ప్రదేశము!
తురీయమునకు - ముఖము - (fore face) ముఖ్య సంస్థిత ప్రదేశము!

ఈ నాలుగు స్థానములలో సంచరించు స్వరూపమే పరమాత్మ! ఈ నాలుగు స్థానములు పరమాత్మ యొక్క వివిధ విన్యాసములు! ప్రదర్శనలు! అట్టి పరమాత్మను వాక్కు చేత గాని, మనస్సు చేతగాని ‘ఇది’ అని నిర్వచించలేము! నిర్దేశించలేము. మనోవాక్కులు పరమాత్మను ‘ఇది’ అని వర్ణిస్తూ, చివరికి పొందజాలక వెనుతిరుగుచున్నాయి.

జీవుని పరమానంద స్వరూపమే ఆ పరబ్రహ్మము! సహజానందము! జాగ్రత్ - స్వప్న సుషుప్తులకు వేరైన, కేవల సాక్షి అయినట్టి తురీయ స్వరూపము! తురీయమునకు కూడా సాక్షిస్వరూపము! తురాయాతీతమగు కేవలము. ఈ జీవుడు అట్టి పరబ్రహ్మము కాని క్షణమే లేదు. ఏమరచినప్పుడు మాత్రమే ‘‘జీవుడు’’. జ్ఞప్తిచే కేవలుడగు శివుడే। సదానందుడే।

అట్టి స్వస్వరూప పరమాత్మ తత్త్వమును ఎరిగిన వారై బుద్ధిమంతులు, ధీమంతులు సర్వదృశ్య బంధముల నుండి విముక్తులు అగుచున్నారు.

ఈ జీవుడు బ్రహ్మమే! బ్రహ్మము అఖండము, అద్వితీయము. అందుకు ప్రమాణము? బ్రహ్మతత్త్వజ్ఞులగు వారి అనుభవ వాక్యములే ప్రమాణము. వారు ఈ విధంగా చాటుచున్నారు!

→ ‘‘నేను జాగ్రత్ నందు గాని, స్వప్నము నందు, సుషుప్తియందు బంధితుడనుగాదు! మరి?
→ జాగ్రత్ స్వప్న సుషుప్తులు నాకు నేనుగా సంకల్పించుకొని సంచారము నిర్వర్తించుస్థానములు మాత్రమే!
నేను ఆ మూడిటికి స్థానమై, వేరై, కేవల సాక్షి అయినట్టి పరబ్రహ్మస్వరూపుడను!

పరబ్రహ్మోఽహమ్! అహమ్ బ్రహ్మాస్మి! సోఽహమ్!

ఈవిధంగా వారు నిర్మల- సునిశిత బుద్ధితో ఎరుగిన వారై ఉంటున్నారు. ఆత్మ సర్వత్రా - సర్వమునందు - పాలలో నేయవలె- వ్యాపించి ఉన్నట్టిది! తపస్సుచే ఆత్మ విదితమగుచున్నది! స్వానుభముగా సాక్షాత్కరించుచున్నది.

ఇదియే -
బ్రహ్మజ్ఞ ప్రవచనము! అనుసరణీయము। సిద్ధిస్థానము।
ఆత్మ విద్యాతపో మూలం తద్బ్రహ్మోపనిషత్ పదమ్। తద్బ్రహ్మోపనిషత్ పదమితి।।



🙏 ఇతి బ్రహ్మ ఉపనిషత్ ‌🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।