[[@YHRK]] [[@Spiritual]]

Brahma Vidya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com

Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


కృష్ణ యజుర్వేదాంతర్గత

20     బ్రహ్మ విద్యోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్



స్వావిద్యాతత్కార్యజాతం యద్విద్యాపహ్నవం గతం .
తద్ధంసవిద్యానిష్పన్నం రామచంద్రపదం భజే ..
శ్లో।। స్వావిద్యా (స్వ-అవిద్యా) తత్ కార్యజాతం
యత్ విద్యా అపహ్నవం గతమ్,
తత్ హంసవిద్యానిష్పన్నం
రామచంద్ర పదం భజే।।

(అపహ్నవ = దాచి ఉంచు, కప్పివేయు, మరుగుపరచు)
ఏ స్వకీయ అవిద్య, అద్దాని కార్యజాలములు ఆత్మ విద్యను కప్పి దాచి ఉంచినాయో, అట్టి మరుగునపడిన ‘హంసవిద్య’ (లేక) సోఽహమ్ జ్ఞానము వికసించుటకై శ్రీ రామచంద్ర ప్రభువు పాద పద్మములను శరణు వేడుచున్నాము.


ప్రసాదాద్బ్రహ్మణస్తస్య విష్ణోరద్భుతకర్మణః .
రహస్యం బ్రహ్మవిద్యాయా ధ్రువాగ్నిం సంప్రచక్షతే .. 1..
01. ఓం। ప్రసాదాత్ బ్రహ్మణః తస్య
విష్ణోః అద్భుత కర్మణః,
రహస్యం బ్రహ్మవిద్యాయా
‘ధృవాగ్నిః’ సంప్రచక్షతే।
‘ఓం’ సంజ్ఞాత్మకుడగు పరమాత్మకు నమస్కరిస్తూ!
‘ధృవాగ్ని’ అనే బ్రహ్మతత్త్వజ్ఞుడు అద్భుతమైన కర్మలను (బ్రహ్మజ్ఞాన సముపార్జన సాధనములు విజయవంతముగా నిర్వర్తించినవారై) విష్ణు అనుగ్రహముచే రహస్యమగు బ్రహ్మవిద్యను ఈ విధంగా ప్రవచించుచున్నారు. చాటి చెప్పుచున్నారు. శ్రీ ధృవాగ్ని గురువరేణ్యులచే ప్రవచించబడిన-రహస్యమగు బ్రహ్మవిద్యా దర్శనము।

ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ యదుక్తం బ్రహ్మవాదిభిః .
శరీరం తస్య వక్ష్యామి స్థానం కాలత్రయం తథా .. 2..
02. ‘ఓం’ ఇతి ఏక - అక్షరం బ్రహ్మ యదుక్తం
బ్రహ్మవాదిభిః,
శరీరం తస్య వక్ష్యామి
స్థానం, కాలత్రయం తథా।।
బ్రహ్మవాదులగు మహనీయులు… దేనిని ‘ఓం’ అను అక్షరముచే ఏకము (Unity) - అక్షరము (Changeless) [క్షరము (లేక) నాశనము లేనిది] అగు ‘బ్రహ్మము’… యొక్క శరీము(Physical Form), స్థానము (Its Placement), (భూత - వర్తమాన - భవిష్యత్ - త్రికాల విశేషము (Its Time) గురించి ఎలుగెత్తి చెప్పుచున్నారో - అట్టి బ్రహ్మము (లేక) ఆత్మ గురించి ఇప్పుడు మనము సత్సంగపూర్వకంగా విచారణ చేస్తున్నాము.

తత్ర దేవాస్త్రయః ప్రోక్తా లోకా వేదాస్త్రయోఽగ్నయః .
తిస్రో మాత్రార్ధమాత్రా చ త్ర్యక్షరస్య శివస్య తు .. 3..
03. తత్ర దేవాః త్రయః ప్రోక్తా
లోకా వేదాః త్రయో అగ్నయః
తిస్రోమాత్ర అర్ధమాత్రా చ
త్ర్యక్షరస్య శివస్య తు।
ఆత్మయందు త్రి-దేవతలు (సృష్టి స్థితి లయ కారకులగు బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులు), భూ-పాతాళ-స్వర్గములనబడు - త్రిలోకములు, ఋక్ యజుర్-సామవేదములనబడే త్రి-వేదములు, త్రి-అగ్నులు, త్రి-మాత్రలు, అంతే కాకుండా-(4వది అగు) అర్ధమాత్ర, ఇంకా త్రి-అక్షరములు వేంచేసినవై శివస్వరూపంగా విరాజిల్లుచున్నాయి.

ఋగ్వేదో గార్హపత్యం చ పృథివీ బ్రహ్మ ఏవ చ .
ఆకారస్య శరీరం తు వ్యాఖ్యాతం బ్రహ్మవాదిభిః .. 4..
04. ఋగ్వేదో గార్హపత్యం చ।
పృథీవీ బ్రహ్మఏవ చ।
‘అ’కారస్య శరీరం తు
వ్యాఖ్యాతం బ్రహ్మవాదిభిః।।
ఇంకా బ్రహ్మవాదులచే ప్రణవము (ఓం) ఈ తీరుగా వ్యాఖ్యానింప బడుచున్నది.
‘అ’కార - ‘ఉ’కార - ‘మ’కారములలో…,
(1) ‘అ’కారము : ఋగ్వేదముగా; గార్హపత్యాగ్నిగా; పృథివిగా; సృష్టికర్తయగు బ్రహ్మ దైవముగా ఉపాసిస్తున్నారు. ఇవన్నీ ‘అ’కారము యొక్క శరీరము. (సృష్టించుచున్న బ్రహ్మదేవ-ప్రజ్ఞయే పరమాత్మ).

యజుర్వేదోఽన్తరిక్షం చ దక్షిణాగ్నిస్తథైవ చ .
విష్ణుశ్చ భగవాందేవ ఉకారః పరికీర్తితః .. 5..
05. యజుర్వేదో అంతరిక్షం చ
‘దక్షిణాగ్నిః’ తథై వ చ
‘విష్ణుశ్చ’ భగవాన్ దేవః
‘ఉ’ కారః పరికీర్తితః।।
(2) ‘ఉ’కారము : యజుర్వేదముగాను; అంతరిక్షముగాను; దక్షిణాగ్ని; స్థితికారుడగు విష్ణుభగవానుడు దైవముగాను పరికీర్తించబడుచున్నది. (ఈ సమస్తమును పరిపోషిస్తూ, స్థితింపజేయుచున్న విష్ణుదేవ ప్రజ్ఞయే ‘పరమాత్మ’).

సామవేదస్తథా ద్యౌశ్చాహవనీయస్తథైవ చ .
ఈశ్వరః పరమో దేవో మకారః పరికీర్తితః .. 6..
06. సామవేదః తథా ద్యౌశ్చ
‘ఆహవనీయః’ తథైవ చ।
‘ఈశ్వరః’ పరమో దేవో
‘మ’కారః పరికీర్తితః।।
(3) ‘మ’కారము : సామవేదముగాను; దివ్య (దేవతా) లోకముగాను, అహవనీయాగ్నిగాను; ఈశ్వరుడు పరమోదైవముగాను - అభివర్ణించబడు చున్నది. ఉపాసించబడుతోంది. (ఈ సమస్తము తనయందు కలిగి యుండి, తానే అయి ఉన్న ఈశ్వరుడే పరమాత్మ).

సూర్యమండలమధ్యేఽథ హ్యకారః శంఖమధ్యగః .
ఉకారశ్చంద్రసంకాశస్తస్య మధ్యే వ్యవస్థితః .. 7..
07. సూర్య మండల మధ్యే అథ హి ‘అ’ కారః శంఖ మధ్యగః।
‘ఉ’ కారః చంద్ర సంకాశః
తస్య మధ్యే వ్యవస్థితః।।
స్థానోపాసన
‘అ’కారమును → సూర్య తేజస్సును, సూర్యమండల మధ్యస్థముగాను, శంఖము మధ్యస్థముగాను దర్శనం చేస్తున్నారు. ఉపాసిస్తున్నారు.
‘ఉ’కారమును → చంద్రప్రకాశరూపముగాను, చంద్రమండల మధ్యస్థముగాను వ్యవస్థితమై ఉన్నట్లు దర్శిస్తూ, ఉపాసిస్తున్నారు.

మకారస్త్వగ్నిసంకాశో విధూమో విద్యుతోపమః .
తిస్రో మాత్రాస్తథా జ్ఞేయా సోమసూర్యాగ్నిరూపిణః .. 8..
08. ‘మ’కారస్తు అగ్ని సంకాశో, విధూమో విద్యుతోపమః।
తిస్రో మాత్రాః తథా జ్ఞేయాః, సోమ-సూర్య-అగ్ని రూపిణః।।
‘మ’కార→పొగలేని అగ్నితేజస్సునందు, మెరుపునందు దర్శనం, ఉపాసన చేస్తున్నారు.ఈవిధంగా ప్రణవమగు ఆత్మనుచంద్రుడు- సూర్యుడు-అగ్ని రూపములతో త్రిసోమాత్రముగా దర్శిస్తూ ఉపాసిస్తున్నారు.

శిఖా తు దీపసంకాశా తస్మిన్నుపరి వర్తతే .
అర్ధమాత్ర తథా జ్ఞేయా ప్రణవస్యోపరి స్థితా .. 9..
09. శిఖాతు దీప సంకాశా, తస్మిన్ను పరివర్తతే।
అర్ధమాత్రా తథా జ్ఞేయా, ప్రణవస్య ఉపరి స్థితా।।
అర్ధమాత్ర : దీపముయొక్క పైన శిఖవంటిది. ప్రణవము అర్ధమాత్ర యొక్క ఉపరిస్థానమున ఉన్నట్టిది అర్ధమాత్ర.

పద్మసూత్రనిభా సూక్ష్మా శిఖా సా దృశ్యతే పరా .
సా నాడీ సూర్యసంకాశా సూర్యం భిత్త్వా తథాపరా .. 10..
10. పద్మ సూత్రనిభా సూక్ష్మా
శిఖా సా దృశ్యతే పరా
సా నాడీ సూర్యసంకాశా
సూర్యం భిత్వా తథా పరా।।
అట్టి అ+ఉ+మ→ ఓం - సంజ్ఞార్థమగు ప్రణవము (ఆత్మ) - తామరకాడలోని తూడులోని తంతువు (దారము) వలె సూక్ష్మమైనది. సూక్ష్మమగు అగ్నిశిఖ యొక్క ఊర్ధ్వభాగము వంటిది. సూర్యతేజస్సు వంటిది. సూర్యమండలమును కూడా అధిగమించినట్టిది. సర్వమునకు పరము (ఆవల) ఉన్నట్టిది. (కేవలమై ప్రకాశించుచున్నట్టిది).

ద్విసప్తతిసహస్రాణి నాడీం భిత్త్వా చ మూర్ధని .
వరదః సర్వభూతానాం సర్వం వ్యాప్యావతిష్ఠతి .. 11..
11. ద్విసప్తతి సహస్రాణి (72000) నాడీం భిత్వాచ మూర్థని,
వరదః సర్వభూతానామ్, సర్వం వ్యాప్య అవతిష్ఠతే।।
ఆత్మ → హృదయము నుండి బయల్వెడలు ‘72000’ నాడులను అధిగమించినట్టి మూర్థ (Fore Face) స్థానము. సర్వ జీవులకు అభయ ప్రదాత అయి, సర్వులయందు సర్వదా అవతిష్ఠితమై (ఆక్రమించు కొనినదై) ఉన్నట్టిది.

కాంస్యఘంటానినాదస్తు యథా లీయతి శాంతయే .
ఓంకారస్తు తథా యోజ్యః శాంతయే సర్వమిచ్ఛతా .. 12..
12. కాంస్య ఘంటా నినాదస్తు
యథా లీయత శాంతయే,
ఓం కారస్తు తథా యోజ్యః
శాంతయే సర్వమ్ ఇచ్ఛతా।।
ఏ విధంగా అయితే కంచుగంట యొక్క ‘టంగ్’ నాదము క్రమంగా శాంతముగా శాంతము (Silence) నందు లీనమగుచున్నదో,…ఆ తీరుగా సర్వ విశేషములు చివరికి ‘ఓం’కార రూపమగు ఆత్మయందే సశాంతిస్తున్నాయి. (ఓం కారమునకు అభిన్నంగా దర్శింపబడుచున్నాయి).

యస్మిన్విలీయతే శబ్దస్తత్పరం బ్రహ్మ గీయతే .
ధియం హి లీయతే బ్రహ్మ సోఽమృతత్వాయ కల్పతే .. 13..
13. యస్మిం(తు) సలీయతే శబ్దః
తత్ ‘పరంబ్రహ్మ’ గీయతే।
ధియం హి లీయతే బ్రహ్మ
సో అమృతత్వాయ కల్పతే।।
‘ఓం’ అను శబ్దమును ఉచ్ఛరించిన తరువాత, ఆ శబ్దము (Sound) ఎందులో లీనమగుచున్నదో, (సర్వము ఎందులో లీనము అగుచు న్నాయో)…అదియే పరబ్రహ్మము. (నటించుచున్నప్పటి పాత్ర వ్యవహారములన్నీ నటుని నటనా చాతుర్యమునందు లీనమగు తీరుగా)! బుద్ధిని బ్రహ్మమునందు తిరిగి లీనము చేయు అభ్యాసి- అమృతత్వమును సంతరించుకొనుచున్నాడు.

వాయుః ప్రాణస్తథాకాశస్త్రివిధో జీవసంజ్ఞకః .
స జీవః ప్రాణ ఇత్యుక్తో వాలాగ్రశతకల్పితః .. 14..
14. ‘వాయుః’ ‘ప్రాణః’ తథా ఆకాశః, త్రివిధో జీవసంజ్ఞికః।
సజీవః ‘ప్రాణ’ ఇత్యుక్తో, వాలాగ్ర శత కల్పితః।।
జీవము = (1) వాయువు (చలనము) (2) ప్రాణము (శక్తి), (3) ఆకాశము, అవకాశము - (Placement) …అను మూడింటి మేళనము. వందల కొలది క్రేశాగ్రములలో (జీవనాడులలో) ప్రవహించు శక్తియొక్క సంప్రదర్శనమే ‘ప్రాణశక్తి’.

నాభిస్థానే స్థితం విశ్వం శుద్ధతత్త్వం సునిర్మలం .
ఆదిత్యమివ దీప్యంతం రశ్మిభిశ్చాఖిలం శివం .. 15..
15. నాభిస్థానే స్థితం విశ్వం,
శుద్ధతత్త్వం సునిర్మలం।
ఆదిత్యమివ దీప్యంతం
రశ్మిభిశ్చ అఖిలం శివమ్।
అట్టి ప్రాణశక్తి…
నాభి→ (బొడ్డు) స్థానమునందు విశ్వరూపంగా కేంద్రీకృతమై, సంస్థితమైయున్నది.
→ విశ్వమంతా నిండియుండి, విశ్వాత్మకమైనది.
→ సునిర్మలమైనది.
→ సూర్యకిరణముల వెలుగు అంతటా విరజిమ్మునవగుచూ, అన్నిటినీ వెలిగించుతీరుగా…ప్రాణశక్తి సర్వము వెలిగించుచూ ఆనంద ప్రదము చేయుచున్నది.

సకారం చ హకారం చ జీవో జపతి సర్వదా .
నాభిరంధ్రాద్వినిష్క్రాంతం విషయవ్యాప్తివర్జితం .. 16..
16. ‘స’ కారంచ ‘హ’ కారంచ
జీవో జపతి సర్వదా
నాభిరంధ్రాత్ వినిష్క్రాంతం
విషయ వ్యాప్తివర్జితమ్।।
‘స’ (సో) - ‘హ’ (హమ్) - ఈ జీవుడు ‘సో’ అను శబ్దముచే ఊపిరిపీల్చుచు, ‘హమ్’ అని వదలుచు ప్రాణశక్తిచే ‘సోఽహమ్’ జపము ఎల్లప్పుడు అసంకల్పితముగా చేయుచూనే ఉన్నాడు. అట్టి ప్రాణచలనము నాభి రంధ్రమునుండి బయల్వెడలుచున్నది. విషయములకు సంబంధము లేనట్టిది. అనగా, విషయములకు మునుముందే ప్రాణశక్తి ఉన్నది.

తేనేదం నిష్కలం విద్యాత్క్షీరాత్సర్పిర్యథా తథా .
కారణేనాత్మనా యుక్తః ప్రాణాయామైశ్చ పంచభిః .. 17..
17. తేన ఇదం నిష్కలం, విద్యాత్ - క్షీరాత్ సర్పిః
యథా, తథా। కారణేన ఆత్మనా యుక్తః
ప్రాణాయామైశ్చ పంచభిః।।
ఏవిధంగా అయితే పాలయందు నెయ్యి (Ghee) అంతటా నిండి ఏర్పడి ఉన్నదో, ఆవిధంగా నిష్కళముగా ఆత్మ చేత ఈ జగత్తంతా నిండినదై యున్నది. పంచ ప్రాణాయామములతో (ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన- సమానములతో)-భౌతిక దేహమునందు ప్రాణశక్తి సంచరిస్తూ సంచాలనము కలిగి ఉంటూనే - తమయొక్క కారణతత్త్వమగు ఆత్మను ఆశ్రయించి ఉంటున్నాయి.

చతుష్కలా సమాయుక్తో భ్రామ్యతే చ హృదిస్థితః .
గోలకస్తు యదా దేహే క్షీరదండేన వా హతః .. 18..
18. చతుష్కళా సమాయుక్తో, అహ్రామ్యతే చ హృది స్థితః,
గోళకస్తు యదా దేహే క్షీరదండేన వా హతమ్।
ప్రాణము తనయొక్క 4 కళలతో (స్థిర-(చంచల)-పూరక-రేచక-కుంభక యుక్తంగా) హృదయమునందు (In the Heart) తిరుగాడుచూ ఉన్నది. గొల్లకవ్వము పెరుగులో తిరుగాడువిధంగా, చేతితో కొట్టబడిన బంతివలె ప్రాణములు నిరంతరము దేహమునందు తిరుగాడుచున్నాయి.

ఏతస్మిన్వసతే శీఘ్రమవిశ్రాంతం మహాఖగః .
యావన్నిశ్వసితో జీవస్తావన్నిష్కలతాం గతః .. 19..
19. ఏతస్మిన్ వసతే శీఘ్రమ్
అవిశ్రామమ్ మహాఖగః
యావత్ నిశ్వసితో జీవః,
తావత్ నిష్కళతాం గతః।।
హంస (సోఽహమ్) అను ప్రాణచైతన్యము (ఊపిరిపీల్చి వదలు ప్రక్రియరూపంగా) దేహములో చేతనరూపమై అవిశ్రాంతంగా తిరుగాడు చున్నది. ఎంతెంత సమయమైతే ఈ జీవుడు నిష్కళితుడయ్యే (అసంకల్పితంగా) గాలిని పీలుస్తూ (నిశ్వసితుడై) ఉంటాడో, అంతవరకు మాత్రమే జీవనము కొనసాగించగలుగుతూ ఉంటాడు.

నభస్థం నిష్కలం ధ్యాత్వా ముచ్యతే భవబంధనాత్
అనాహతధ్వనియుతం హంసం యో వేద హృద్గతం .. 20..

స్వప్రకాశచిదానందం స హంస ఇతి గీయతే .
రేచకం పూరకం ముక్త్వా కుంభకేన స్థితః సుధీః .. 21..
20. నభస్థం నిష్కళం ధ్యాత్వా
ముచ్యతే భవబంధనాత్।
అనాహత ధ్వనియుతం
‘హంసం’ యో వేద
హృత్ తతమ్, (హృద్గతమ్)।

21. స్వప్రకాశ చిదానందమ్
స ‘హంస’ ఇతి గీయతే।
రేచకం పూరకం ముక్త్వా
కుంభకేన స్థితః సుధీః।
హృదయాకాశమునందు నిష్కళత్వమును (అసంకల్పిత ప్రాణ చలనమును) గమనిస్తూ ధ్యానము చేయుటచే ఈ జీవుడు భవబంధములనుండి (ఈ ఇంద్రియ ప్రపంచము నిజంగానే ఉన్నది - అను నమ్మికలచే ఏర్పడుచున్న బంధములనుండి) విడవడుచున్నాడు.
అనాహతము (ప్రాణస్పందనకు ప్రారంభ స్థానమగు హృదయాకాశము) నందు వ్యాపించియుంటున్నదై ‘సోఽహం’ అను ప్రాణశక్తియొక్క స్పందనల శబ్దమును తెలుసుకుంటున్న యోగి ప్రాణేశ్వర స్వరూపమగు- స్వస్వరూప ‘స్వయంప్రకాశ చిదానందము’ను సిద్ధించుకొని (అనుభవమునకు తెచ్చుకొని) - ‘హంస’…అని స్తుతించబడుచున్నాడు.
(సోఽహమ్ సోఽహమ్ సోఽహమ్)
ఏ బుద్ధిమంతుడైతే….
→ రేచకమును (గాలి బయటకు వదలు మార్గమును), పూరకమును (గాలిలోకి ప్రవేశించు మార్గమును) నిరోధించి, కుంభకము (గాలిని దేహమునందు స్థిరముగా ఉంచు విధిని) అభ్యసిస్తూ ఉంటాడో…. అట్టివాడు ‘హంసయోగము’ను ఎరిగినవాడు. హంసయోగి ‘సోఽహమ్’ను స్వాభావికంగా సిద్ధించుకొనుచున్నాడు.

నాభికందే సమౌ కృత్వా ప్రాణాపానౌ సమాహితః .
మస్తకస్థామృతాస్వాదం పీత్వా ధ్యానేన సాదరం .. 22..

దీపాకారం మహాదేవం జ్వలంతం నాభిమధ్యమే .
అభిషిచ్యామృతేనైవ హంస హంసేతి యో జపేత్ .. 23..
22. నాభికందే సమౌ కృత్వా
ప్రాణ-అపానౌ సమాహితః
మస్తకస్యా అమృత ఆస్వాదం
పీత్వా ధ్యానేన సాదరమ్।

23. దీపాకారం మహాదేవం
జ్వలంతం నాభి మధ్యమే।
అభిషిచ్య అమృతేనైవ
‘హంస హంస’ ఇతి యోజపేత్,
→ నాభి (బొడ్డు) ప్రదేశమునందు ప్రాణ - అపానములను సమస్థితి యందు ధారణచేస్తూ,
→ ధ్యాసను మస్తకము(Fore Face) నందు నిలిపి ధ్యానపరుడై సాదరముగా బ్రహ్మరంధ్రమునుండి జాలువాడు అమృతధారను త్రాగుచూ… (ప్రపంచపు మార్పు-చేర్పులకు సంబంధించని కేవల స్వస్వరూపమును ఆస్వాదిస్తూ), స్వానుభవి అగుచూ,
- అట్టి అమృతధారతో నాభి (బొడ్డు) మధ్య ప్రదేశములో దీపాకారుడై ప్రకాశించుచున్న మహాదేవుని - అభిషేకించుచూ ‘హంస - హంస - సోఽహమ్’ -సోఽహమ్’….అని జపిస్తూ ఉంటాడో, అట్టివాని బుద్ధిని జర (వార్ధక్య) - మరణ దోషములు స్పృశించజాలవు.

జరామరణరోగాది న తస్య భువి విద్యతే .
ఏవం దినే దినే కుర్యాదణిమాదివిభూతయే .. 24..

ఈశ్వరత్వమవాప్నోతి సదాభ్యాసరతః పుమాన్ .
బహవో నైకమార్గేణ ప్రాప్తా నిత్యత్వమాగతాః .. 25..
24. జరామరణ రోగాది
న తస్య భువి విద్యతే।
ఏవం దినే దినే కుర్యాత్
అణిమాది విభూతయే,
25. ఈశ్వరత్వమ్ అవాప్నోతి
సదా అభ్యాసరతః పుమాన్।
బహవో అనేక మార్గేణ
ప్రాప్తా నిత్యత్వమ్ ఆగతాః।।
యోగి పై విధంగా ప్రతిరోజు అభ్యసించుటచే ‘అణిమ’ మొదలైన అష్టాంగ యోగములను సిద్ధింపజేసుకొనగలడు. అట్టివాడు ‘ఇతఃపూర్వపు - ఇప్పటి - ఇకముందటి దేహపరంపరలలో ప్రదర్శితమగుచున్న ‘నేనైన నేను’ - అను రూపముగల ‘ఈశ్వరత్వము’ను సిద్ధింపజేసుకుంటున్నాడు.
అనేకమంది అనేకమార్గములలో ‘దేహముల రాక-పోకలకు సంబంధించని నేనైన నేను’ అనే రూపముగల ‘ఈశ్వరత్వము’ అయినట్టి నిత్యత్వము సంపాదించుకోవటం జరుగుతోంది. అయితే అట్టి నిత్యత్వ (ఈశ్వరత్వ) సాధనలలో ‘హంసవిద్య’ను మించిన అమృతత్వ నిత్యత్వసిద్ధి విధానము-సులభము, మధురమైనది మరొకటి లేదు.

హంసవిద్యామృతే లోకే నాస్తి నిత్యత్వసాధనం .
యో దదాతి మహావిద్యాం హంసాఖ్యాం పారమేశ్వరీం .. 26..

తస్య దాస్యం సదా కుర్యాత్ప్రజ్ఞయా పరయా సహ .
శుభం వాఽశుభమన్యద్వా యదుక్తం గురుణా భువి .. 27..

తత్కుర్యాదవిచారేణ శిష్యః సంతోషసంయుతః .
హంసవిద్యామిమాం లబ్ధ్వా గురుశుశ్రూషయా నరః .. 28..

ఆత్మానమాత్మనా సాక్షాద్బ్రహ్మ బుద్ధ్వా సునిశ్చలం .
దేహజాత్యాదిసంబంధాన్వర్ణాశ్రమసమన్వితాన్ .. 29..

వేదశాస్త్రాణి చాన్యాని పదపాంసుమివ త్యజేత్ .
26. హంస విద్య అమృతే లోకే
(అన్యో) నాస్తి నిత్యత్వ సాధనమ్।
యో దదాతి మహావిద్యాం ‘‘హంసాఖ్యాం పరమేశ్వ(రీ)రమ్’’,
27. తస్య దాస్యం సదా కుర్యాత్,
ప్రజ్ఞయా పరయా సహ।।
శుభం వా అశుభమన్యత్ వా
యత్ ఉక్తం గురుణా భువి,
28. తత్ కుర్యాత్ అవిచారేణ
శిష్యః సంతోష సంయుతః।।
‘హంసవిద్యామ్’ ఇమామ్
లబ్ద్వా గురుశుశ్రూష యా నరః,
29. ఆత్మానమ్ ఆత్మనా
‘సాక్షాత్ బ్రహ్మ’ బుధ్వా సునిశ్చలమ్,
దేహ - జాతి ఆది సంబంధాః
సర్వ-వర్ణాశ్రమ సమన్వితాన్
30. వేద శాస్త్రాణి చ అన్యాని
పాదపాంసుమివ త్యజేత్।
ఏ గురువైతే తన శిష్యునకు ‘హంస’ అనబడే పరమేశ్వరసంబంధమైన విద్యను ప్రసాదిస్తాడో, అట్టి ప్రదాతకు ఉత్తమబుద్ధితో పరమేశ్వరభావనలో దాస్యము చేయాలి. హంస యోగ ప్రదాతయగు సద్గురువును ఆశ్రయించాలి. సేవించాలి. పూజించాలి.
గురుముఖతః బోధించబడినది శుభమైనా, అశుభమైనా కూడా, అది చివరికి శిష్యునికి ఉత్తమము, శ్రేయోదాయకము, సిద్ధిప్రదము- అగుచున్నది.
అందుచేత గురువు సూచించిన అభ్యాసమును, చూపించిన మార్గమును ‘‘ఇది ఏమిటి? ఎందుకు అది ఇట్లా?’’…అని వెనుకముందు చూడకుండా శిష్యుడు సంతోషంగా నిర్వర్తించటమే ఆ శిష్యునకు శుభప్రదము.
గురుశుశ్రూషచే …,
→ ప్రాణ-అపాన సమస్థితి రూపమగు ‘హంస’ విద్యను పొంది,
→ అభ్యాసబలంతో క్రమంగా ఆత్మతో ఆత్మను ‘సాక్షాత్‌బ్రహ్మము’గా సునిశ్చలము - నిశ్చితము అయినరీతిగా బుద్ధితో ఎరిగి….,
→ ఇక ఆపై దేహంతో సంబంధమును, దేహములకు చెందిన జాతి మొదలైన సర్వభేదములను, సర్వ వర్ణ - ఆశ్రమ భేదములను, వేద - శాస్త్ర నియమ - మీమాంసములను ….ఇవన్నీ కూడా పాదములకు అంటిన ధూళితో సమానంగా త్యజించినవాడై ఉండాలి. కడిగి వేసుకోవాలి.

గురుభక్తిం సదా కుర్యాచ్ఛ్రేయసే భూయసే నరః .. 30..

గురురేవ హరిః సాక్షాన్నాన్య ఇత్యబ్రవీచ్ఛృతిః .. 31..

శ్రుత్యా యదుక్తం పరమార్థమేవ
తత్సంశయో నాత్ర తతః సమస్తం .
శ్రుత్యా విరోధే న భవేత్ప్రమాణం
భవేదనర్థాయ వినా ప్రమాణం .. 32..
గురుభక్తిం సదాకుర్యాత్
శ్రేయసే భూయసే నరః।
గురుః ఏవ హరిః సాక్షాత్ -
న అన్యః - ఇతి బ్రవీత్ శ్రుతిః।
శ్రుత్యా యత్ ఉక్తం,
పరమార్థమేవ తత్।।
సంశయో న అత్ర। తతః సమస్తమ్
శ్రుత్యా విరోధే
న భవేత్ ప్రమాణమ్,
భవేత్ అనర్థాయ
వినా ప్రమాణమ్।।
ఆత్మ శ్రేయస్సు కలుగజేయు హంసవిద్యచే ఆత్మతో మమేకము కోరుకొనువాడు….గురువుపట్ల ఆత్మదేవునితో సమానంగా ఎల్లప్పుడు ‘గురుభక్తి’ని కలిగి ఉండాలి.
‘గురువు సాక్షాత్ విష్ణువే! వేరుకాదు’ - అని శ్రుతులు నొక్కి వక్కాణిస్తున్నాయి. ఆ విధంగా శ్రుతులు చెప్పునది పరమార్థమే! (It is the Highest meaning). సంశయమే లేదు.
శ్రుతులు చెప్పినదే ప్రమాణము. శ్రుతులకు విరోధమైనది అప్రమాణము. శ్రుతులకు విరోధమైనది అనర్థమునకే అయి ఉన్నది. ‘శ్రుత్యర్థము’నకు, ‘వేదపరమార్థము’నకు సానుకూల్యమై ఉంటేనే - అది స్వీకారయోగ్యము.

దేహస్థః సకలో జ్ఞేయో నిష్కలో దేహవర్జితః .
ఆప్తోపదేశగమ్యోఽసౌ సర్వతః సమవస్థితః .. 33..
సకళ నిష్కళములు
31. దేహస్థః సకళో జ్ఞేయో,
నిష్కళో దేహవర్జితః।
ఆప్త ఉపదేశ గమ్యో అసౌ
సర్వతః సమవత్ స్థితః।
‘హంస హంస’ అను మంత్రముచే దేహపరిధులను దాటి ‘దేహి’ తత్త్వములో ప్రవేశించాలి. దేహతత్త్వము ‘సకళము’. దేహాతీతమగు దేహిత్వమో - నిష్కళము.
- దేహముతో ఏర్పడే జాతి - ఆశ్రమ - బంధుపరిమితత్వమునకు సంకుచిత్వమునకు పరిమితమై ఉండటము - సకళము (దోషసమేతము)
- దేహమున దాటివేయటము. నిష్కళుడవై, దేహితుడవై ఉండుము. ‘దేహి’ తత్త్వమును ఆప్త ఉపదేశముచే ఎరిగినవాడు ‘దేహి’గా అంతటా ఉన్నవాడుగా అగుచున్నాడు. సకళ-నిష్కళములను ఏకము చేయుచున్నాడు.

హంసహంసేతి యో బ్రూయాద్ధంసో బ్రహ్మా హరిః శివః .
గురువక్త్రాత్తు లభ్యేత ప్రత్యక్షం సర్వతోముఖం .. 34..

తిలేషు చ యథా తైలం పుష్పే గంధ ఇవాశ్రితః .
పురుషస్య శరీరేఽస్మిన్స బాహ్యాభ్యంతరే తథా .. 35..

ఉల్కాహస్తో యథాలోకే ద్రవ్యమాలోక్య తాం త్యజేత్ .
జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్జ్ఞానం పరిత్యజేత్ .. 36..
32. ‘హంస హంస’ ఇతి యో బ్రూయాత్,
హంసో నామ హరిః, శివః।
గురు వక్త్రాత్తు లభ్యేత
ప్రత్యక్షం సర్వతోముఖమ్।।
33. తిలేషు చ యథా తైలం,
పుష్పే గంధ ఇవ ఆశ్రితః,
పురుషస్య శరీరే అస్మిం తు
స బాహ్య - అభ్యంతరే తథా।।
ఉల్కా హస్తో యథా లోకే
ద్రవ్యం ఆలోక్యతాం త్యజేత్,
జ్ఞానేన జ్ఞేయం ఆలోక్య
పశ్చాత్ జ్ఞానం పరిత్యజేత్।।
‘హంస - హంస సోఽహమ్’’ అని దేనిని అంటున్నారో, అట్టి ‘హంస అనగా సాక్షాత్ హరియే. సాక్షాత్ శివభగవానుడే! అట్టి ‘హంస’ యే ప్రత్యక్షమైయున్న ఈ జగత్ దృశ్యమంతా కూడా! ఇది గురుముఖతః సుస్పష్టమవగలదు.

‘‘నేను ఎవరు?’’ అను శిష్య ప్రశ్నకు - సద్గురు సమాధానము ‘‘ఈ దృశ్య జగత్తు ఎందులో ఉన్నదో అది నీవే। నీవే విశ్వముగా ప్రత్యక్షమై, సర్వతోముఖుడవై ఉన్నావు!’’ అని.



ఆత్మ ఏరూపంగా ఎక్కడ వేంచేసియున్నది?
→ అనేక అసంఖ్యాక నువ్వు గింజలన్నిటిలో తైలము ఉండి ఉన్నట్లుగా….
→ అనేక పుష్పములలో పుష్పసుగంధము ఆశ్రయించి ఉన్నట్లు
ఆత్మ ఈ జీవునికి అనుభూతమగుచున్న బాహ్య అభ్యంతరములలో సర్వాత్మకంగా సంప్రదర్శనమైయున్నది.

ఒకాయన చీకటిగదిలో విలువైన ద్రవ్యమును (ఉదా: రత్నముగాని ధనముగాని దాచినచోటు) గుర్తించి తేవటానికై దీపము వెలిగించాడు. చీకటి గదిలో ఆ విలువైన వస్తువును జేబులో పెట్టుకొని బయట వెలుతురు లోకి వచ్చాడు. అటు తరువాత ఆ దీపమును వదలి, ద్రవ్యమును వెంట ఉంచుకుంటాడేగాని, సూర్యుని వెలుగులో దీపము అట్టెబెట్టుకోడు కదా!
అట్లాగే జ్ఞానముచే జ్ఞేయము (ఆత్మ)యొక్క అవలోకనము అయిన తరువాత, అట్టి జ్ఞానిచే జ్ఞానవిశేషణా సమాచారమంతా పరిత్యజించివేయ బడుచున్నది.

పుష్పవత్సకలం విద్యాద్గంధస్తస్య తు నిష్కలః .
వృక్షస్తు సకలం విద్యాచ్ఛాయా తస్య తు నిష్కలా .. 37..

నిష్కలః సకలో భావః సర్వత్రైవ వ్యవస్థితః .
ఉపాయః సకలస్తద్వదుపేయశ్చైవ నిష్కలః .. 38..

సకలే సకలో భావో నిష్కలే నిష్కలస్తథా .
34. పుష్పవత్ సకలమ్ విద్యాత్, గంధః తస్యతు నిష్కళః।
వృక్షస్తు సకలం విద్యాత్ ఛాయా తస్యతు నిష్కళా।।
నిష్కళః సకళో భావః సర్వత్రైవ వ్యవస్థితః।
ఉపాయః సకలః తద్వత్, ఉపేయశ్చైవ నిష్కళః।
సకళే సకళో భావో నిష్కళే నిష్కళః తథా।
ఈ దృశ్య ప్రపంచరూప సకలము పుష్పమువంటిది అయితే, ఆత్మ (నిష్కళము) వాసన వంటిది. కలము (ఈ దృశ్య ప్రపంచము) వృక్షము వంటిది అగుచుండగా, నిష్కళము (ఆత్మ) ఆ వృక్ష ఛాయ వంటిది.
నిష్కళము, సకళము (పరము, ఇహము) భావరూపముగా సర్వత్రా వ్యవస్థితమైయున్నది. పురుష-ప్రకృతులు కలిసియే ఉంటాయి.
ఉపాదానము (ఇవ్వబడినది) సకళము (అన్యము దృశ్య విభాగము) అయి ఉండగా, ఉపాదేయము (ఇచ్చుచున్నది) - నిష్కళము - బ్రహ్మమే.
‘సకళము’ అగు జగత్ భావన జగత్ భావనయందే ఉండగా, నిష్కళమగు ఆత్మ ఆత్మయందే ఏర్పడినదై ఉన్నది.

ఏకమాత్రో ద్విమాత్రశ్చ త్రిమాత్రశ్చైవ భేదతః .. 39..

అర్ధమాత్ర పరా జ్ఞేయా తత ఊర్ధ్వం పరాత్పరం .
పంచధా పంచదైవత్యం సకలం పరిపఠ్యతే .. 40..
35. ఏకమాత్రో ద్విమాత్రశ్చ
త్రిమాత్రశ్చైవ భేదతః
అర్ధమాత్రా పరా జ్ఞేయా।
తత ఊర్ధ్వమ్
పరాత్ పరమ్।
పంచధా పంచదైవత్యం (పంచదైవత్వం)
సకళం పరిపఠ్యతే।।
(1) అ = ఏకమాత్ర (2) ఉ = ద్విమాత్ర (3) మ = త్రిమాత్ర….అని ‘ఓం’ నందు వేరు వేరు మాత్రలు.
ఈ కనబడేదంతా అకార(పురుషుడు, Experiencer)తో నిండి ఉన్నది.
ఉమ (ప్రకృతి, That being Experienced) పురుషునికి పరమైనది.
(4) అ-ఉ-మలకు ఆవల (దాటిపోయి) అర్ధమాత్ర 4వది. ఆ మూడింటియందు అంతరమై, అంతర్లీనమై ఉన్నది. ‘జ్ఞేయము’, ‘దృక్’ అను పేర్లతో చెప్పబడినది.
(5) పరాత్ పరమ్ - 5వది
అర్ధమాత్రకు ఇంకనూ, ఆవల పరాత్ పరము. కేవల స్వరూపము → సకలము (‘అన్య’ అనుభవము) పొందుచున్నదై ఉన్నది.

బ్రహ్మణో హృదయస్థానం కంఠే విష్ణుః సమాశ్రితః .
తాలుమధ్యే స్థితో రుద్రో లలాటస్థో మహేశ్వరః .. 41..

నాసాగ్రే అచ్యుతం విద్యాత్తస్యాంతే తు పరం పదం .
పరత్వాత్తు పరం నాస్తీత్యేవం శాస్త్రస్య నిర్ణయః .. 42..
36. బ్రహ్మణో హృదయం స్థానం
కంఠే విష్ణుః సమాశ్రితః।
తాలుమధ్యే స్థితో రుద్రో
లలాటస్థో మహేశ్వరః।
నాసా2గ్రే అచ్యుతం విద్యాత్
తస్య అంతేతు పరం పదమ్।।
పరత్వాత్తు పదం నాస్తి।
ఇత్యేవం శాస్త్రస్య నిర్ణయః।
1) హృదయస్థానమును→ సృష్టికర్త యగు చతుర్ముఖ బ్రహ్మ ఆశ్రయించి ఉన్నారు.
2) కంఠస్థానమును → స్థితికారుడగు విష్ణువు సమాశ్రయించి ఉన్నారు.
3) తాలువు (దవడ) మధ్య స్థానమును → లయ కారుడగు రుద్రుడు స్థితి కలిగి ఉన్నాడు.
4) లలాటము (నుదురు, నొసలు, Fore Face) మధ్యగా → మహేశ్వరుడు వేంచేసియున్నారు.
5) ముక్కుకు ఎగువ స్థానములో → అచ్యుతుడు వెలయుచున్నారు.
చిట్టచివరగా → పరంపదము. ఆ ‘పరమపదము’నకు ఆవల మరింకేమీ లేదు. ఇదియే శాస్త్రములు అనేకవిధాలుగా అభివర్ణించి చెప్పుచున్నాయి.

దేహాతీతం తు తం విద్యాన్నాసాగ్రే ద్వాదశాంగులం .
తదంతం తం విజానీయాత్తత్రస్థో వ్యాపయేత్ప్రభుః .. 43..

మనోఽప్యన్యత్ర నిక్షిప్తం చక్షురన్యత్ర పాతితం .
తథాపి యోగినాం యోగో హ్యవిచ్ఛిన్నః ప్రవర్తతే .. 44..

ఏతత్తు పరమం గుహ్యమేతత్తు పరమం శుభం .
నాతః పరతరం కించిన్నాతః పరతరం శుభం .. 45..

శుద్ధజ్ఞానామృతం ప్రాప్య పరమాక్షరనిర్ణయం .
గుహ్యాద్గుహ్యతమం గోప్యం గ్రహణీయం ప్రయత్నతః .. 46..

37. దేహాతీతం తు తం విద్యాత్
నాసాగ్రే ద్వాదశాంగుళమ్।
తత్ అంతమ్ తం విజానీయాత్
తత్రస్థం వ్యాపయేత్ ప్రభుః।
మనోఽపి అన్యత్ర విక్షిప్తం
చక్షుః అన్యత్ర పాతితమ్,
తథాఽపి యోగినాం యోగో హి
అవిచ్ఛిన్నః ప్రవర్తతే।
38. ఏతత్తు పరమమ్ గుహ్యమ్।
ఏతత్తు పరమమ్ శుభమ్।।
న అతః పరతరం కించిత్।
న అతః పరతరం శుభమ్।
శుద్ధ జ్ఞానామృతం ప్రాప్య,
పరమాక్షర నిర్ణయమ్,
గుహ్యాత్ గుహ్యతమం గోప్యం
గ్రహణీయం ప్రయత్నతః।
ముక్కుకు ఉపరిభాగమునకు 12 అంగుళములకు చివరిగా ఆ పరాత్‌పరుడు సంస్థితుడై ఉన్నారు. ఆయనయే విశ్వమంతా విస్తరించియున్న ప్రభువు సర్వవ్యాపకుడు. ‘నాసాంతే ద్వాదశాంగుళమ్’ - చివరగా విశ్వవ్యాకుడై ఉన్నారు. ద్వాదశాంతము - (అనబడే సహస్రారము)నందు ఈ జీవుడు సర్వాత్మకుడై, సర్వతత్త్వ స్వరూపుడై వెలయుచున్నాడు.

యోగదృష్టి - మనస్సు ఆయా అనేక విషయములపై వ్రాలుచూ నిక్షిప్తము అగుచున్నప్పుడు కూడా,
- కనులు ఆయా దృశ్య విషయములు చూస్తూ ఉన్నప్పుడు కూడా, యోగయోగీశ్వరుడు ఎద్దానియందు అవిచ్ఛిన్నంగా ప్రవర్తితమై ఉంటున్నారో అట్టి సర్వాత్మాఽహమ్ భావనను ఆయన వదలరు. (పుంఖానుపుంఖ విషయ అనుక్షణ తత్పరోఽపి, బ్రహ్మావలోకధిషణం న జహాతి యోగి) అట్టి ఆత్మాఽహమ్ స్థానము పరమరహస్యమైనది.

అట్టి పరాత్ పరస్థానమునకు మించిన స్థానము మరింకేదీ లేదు. అంతకు మించిన శుభప్రదస్థానం మరేదీ ఉండజాలదు. ‘పరము’, ‘అక్షరము’ అని నిర్ణయింపబడినట్టిది, రహస్యములలోకెల్ల అత్యంత రహస్యమైనట్టిది, గోప్యాతిగోప్యమైనట్టిది అగు - అట్టి శుద్ధ (కేవల) జ్ఞానామృతస్థానమును ప్రయత్నపూర్వకంగా - గ్రహించుటయందు సర్వదా యత్నశీలుడవై ఉండాలి. అద్దాని అనునిత్య స్వాభావికానుభవమే కైవల్యము.

నాపుత్రాయ ప్రదాతవ్యం నాశిష్యాయ కదాచన .
గురుదేవాయ భక్తాయ నిత్యం భక్తిపరాయ చ .. 47..

ప్రదాతవ్యమిదం శాస్త్రం నేతరేభ్యః ప్రదాపయేత్ .
దాతాస్య నరకం యాతి సిద్ధ్యతే న కదాచన .. 48..

39. న అపుత్రాయ ప్రదాతవ్యం
న అశిష్యాయ కదాచన।
గురుదేవాయ భక్తాయ,
నిత్యం భక్తి పరాయ చ..,
ప్రదాతవ్యం ఇదం శాస్త్రం।
నేతరేభ్యః (న ఇతరేభ్యః) ప్రదాపయేత్।
దాతస్య నరకం యాతి, సిద్ధ్యతే న కదా చన।।
గౌతమా! పుత్రుడు కానివానికి (పితృభక్తి లేనివానికి), శిష్యుడు కానివానికి ఈ పరాత్ పరస్థానమును గురించి బోధించరాదు.
గురుదేవునిపట్ల భక్తి - ప్రపత్తులు కలవానికి, నిత్యము ‘పరాభక్తి’ సమన్వితునికి మాత్రమే ‘పరాత్‌పరస్థానము’ గురించి బోధించాలి. తదితరులకు ప్రదాతవ్యము (Eligible to be given) కాదు.
గురుభక్తి, దైవభక్తి లేనివానికి ఉపదేశించువాడు నరకమును పొందగలడు. (విశ్వప్రేమ నుండియే విశ్వరూపత్వము సిద్ధించగలద

గృహస్థో బ్రహ్మచారీ చ వానప్రస్థశ్చ భిక్షుకః .
యత్ర తత్ర స్థితో జ్ఞానీ పరమాక్షరవిత్సదా .. 49..

విషయీ విషయాసక్తో యాతి దేహాంతరే శుభం .
జ్ఞానాదేవాస్య శాస్త్రస్య సర్వావస్థోఽపి మానవః .. 50..

బ్రహ్మహత్యాశ్వమేధాద్యైః పుణ్యపాపైర్న లిప్యతే .

40. గృహస్థో బ్రహ్మచారీ చ
వాన ప్రస్థశ్చ బిక్షుకః,
యత్ర యత్ర స్థితో జ్ఞానీ
పరమాక్షర విత్ సదా,
విషయీ విషయాసక్తో
యాతి దేహాన్తరే శుభమ్।।
జ్ఞానాదేవ అస్య శాస్త్రస్య
సర్వ - అవస్థోఽపి మానవః,
బ్రహ్మహత్యా అశ్వమేధాద్యైః
పాప - పుణ్యైః న లిప్యతే।
ఒకడు గృహస్థుడు కావచ్చు. బ్రహ్మచారి కావచ్చు. వానప్రస్థుడు కావచ్చు లేదా భిక్షకుడు కావచ్చు. పరమాక్షరవేత్త అయిన జ్ఞాని ఎక్కడ ఉన్నప్పటికీ, సర్వ విషయములకూ కూడా విషయమైయున్న కేవల స్వరూపమునందు ఆసక్తుడై ఉంటాడు. అక్షరబ్రహ్మమునకు వేరైన దేనియందూ ఆతనికి ఆసక్తి ఉండదు. అట్టి వాడు దేహానంతరము కూడా శుభములను పొందగలడు. వర్తమానములోనే దేహాతీత్వమును సిద్ధింపజేసుకోగలడు.

అటువంటి అక్షర పరబ్రహ్మజ్ఞానమునకు చెందిన శాస్త్రమును ఎరిగిన
మానవుడు (జీవుడు) → ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా, అటు ‘బ్రహ్మహత్య’ వంటి పాపముగాని, ఇటు అశ్వమేధయాగము మొదలైన కార్యములవలన కలిగే పుణ్యముగాని ఆతనికి అంటవు. ఆతడు పాప పుణ్యముల ద్వంద్వ - పరిధులను దాటి వేసినవాడై ఉంటాడు.

చోదకో బోధకశ్చైవ మోక్షదశ్చ పరః స్మృతః .. 51..

ఇత్యేషం త్రివిధో జ్ఞేయ ఆచార్యస్తు మహీతలే .
చోదకో దర్శయేన్మార్గం బోధకః స్థానమాచరేత్ .. 52..

మోక్షదస్తు పరం తత్త్వం యజ్జ్ఞాత్వా పరమశ్నుతే .

41. చోదకో బోధకశ్చ ఏవ
మోక్ష దశ్చ పరస్మృతః
ఇతి ఏషామ్ త్రివిధో జ్ఞేయః
ఆచార్యస్తు మహీతలే।।
చోదకో దర్శయేత్ మార్గం।
బోధకః స్థానమ్ ఆచరేత్।
మోక్షదస్తు పరం తత్త్వం
యత్ జ్ఞాత్వాః ‘పరమ్’ అశ్నుతే।।
జ్ఞేయులగు ఆచార్యులు ఈ భూమిపై ‘3’ విధములుగా బోధనము చేస్తూ ఉంటారు.
(1) చోదకుడు : ఈయన ‘ఇటు వెళ్ళండి!’ - అని మార్గమును చూపుచూ సాధనలు తెలియజేస్తూ ఉంటారు.
(2) బోధకుడు : శాస్త్ర విశ్లేషణములను బోధిస్తూ, క్రమంగా శాస్త్రావగాహనని పెంపొందింపజేస్తూ ఉంటారు.
(3) మోక్షదస్తుడు: ‘‘సోఽహమ్, తత్త్వమ్’’ల స్వానుభవమునకు దారి చూపుతూ ఉంటారు. పరతత్త్వమును తెలియజేయుచూ ఉండగా ఆ విధంగా తెలుసుకున్న మాత్రంచేత పరతత్త్వజ్ఞానముచే మోక్షమును సిద్ధించు కొనుటకై సహకరించుచూ ఉంటారు. ‘‘నీకు బంధమే ఉండ జాలదు’’ అనునది సుస్పష్టపరచుచూ ఉంటారు. ఇది సద్యోముక్తి ఉపాయము.

ప్రత్యక్షయజనం దేహే సంక్షేపాచ్ఛృణు గౌతమ .. 53..

తేనేష్ట్వా స నరో యాతి శాశ్వతం పదమవ్యయం .
స్వయమేవ తు సంపశ్యేద్దేహే బిందుం చ నిష్కలం .. 54..

అయనే ద్వే చ విషువే సదా పశ్యతి మార్గవిత్ .

42. ప్రత్యక్ష యజనం దేహే
సంక్షేపాత్ శృణు, గౌతమ!
తేన ఇష్ట్వా స నరో యాతి
శాశ్వతమ్ పదమ్ అవ్యయమ్।
స్వయమేవ తు సంపశ్యేత్
దేహే బిందుం చ, నిష్కళమ్।
అయనే ‘ద్వే’ చ విషువే
సదా పశ్యతి మార్గవిత్।।
ఓ గౌతమా! ఈ దేహమునందే నిర్వర్తించు ‘ప్రత్యక్షయజనము’ గురించి సంక్షిప్తంగా చెప్పుచున్నాను. ఇట్టి ‘దేహ - అంతర యాగము’చే (ఇష్టముచే) ఈ జీవుడు శాశ్వతము, అవ్యయము అగు పదమును పొందగలడు.
ఎవడికివాడే స్వయముగా తనయందు ‘మార్గాన్వేషి’, ‘మార్గవేత్త’ (Knower of Right Path) అయి తన దేహములో (1) బిందువు (2) నిష్కళము అను రెండు విషయములను సందర్శించుచున్నాడు.

కృత్వాయామం పురా వత్స రేచపూరకకుంభకాన్ .. 55..

పూర్వం చోభయముచ్చార్య అర్చయేత్తు యథాక్రమం .
నమస్కారేణ యోగేన ముద్రయారభ్య చార్చయేత్ .. 56..

సూర్యస్య గ్రహణం వత్స ప్రత్యక్షయజనం స్మృతం .

43. కృత్వా యామం, పురా, వత్స!
రేచక పూరక కుంభకాన్।
పూర్వం చ ఉభయమ్ ఉచ్చార్య
హి అర్చయేత్తు యథాక్రమమ్।
నమస్కారేణ యోగేన ముద్రయా
ఆరభ్యచ అర్చయేత్।
‘‘సూర్యస్య గ్రహణం’’, వత్స!
ప్రత్యక్షయజనం స్మృతమ్।
వత్సా! బిడ్డా! మునుముందుగా రేచక - పూరక - కుంభకములతో కూడిన ప్రాణాయామవిధిని ఆచరిస్తూ ‘హంసోఽహమ్’ అని యధాక్రమంగా ఉచ్ఛారణ చేయాలి.
(త్రి ప్రాణాయామ ఆచరణ) తరువాత రెండు అరచేతులతో నమస్కారములచే, మనస్సు నిశ్చలము చేసియుంచు యోగాభ్యాసములచే, (చిన్ముద్ర మొదలైన) జ్ఞానముద్ర చేతనే సర్వాంతర్యామి అగు ఆత్మభగవానుని అర్చించాలి. ప్రియవత్సా! సూర్యునియొక్క గ్రహణము (సూర్య - ఉపాసన) ‘ప్రత్యక్షయజనము’ అని పిలుస్తున్నారు. జ్ఞూన సూర్యుని ఆవరించుయున్న ప్రత్యక్ష జగత్-భావనము ఆత్మతో ఏకము చేయటమే ‘‘ప్రత్యక్ష యజనము’’.

జ్ఞానాత్సాయుజ్యమేవోక్తం తోయే తోయం యథా తథా .. 57..

ఏతే గుణాః ప్రవర్తంతే యోగాభ్యాసకృతశ్రమైః .
తస్మాద్యోగం సమాదాయ సర్వదుఃఖబహిష్కృతః .. 58..

యోగధ్యానం సదా కృత్వా జ్ఞానం తన్మయతాం వ్రజేత్ .

44. జ్ఞానాత్ సాయుజ్య మేవ ఉక్తం
తోయే తోయం యథా తథా।
ఏతే గుణాః ప్రవర్తంతే
యోగాభ్యాస కృత శ్రమైః।
తస్మాత్ యోగం సమాధాయ
సర్వదుఃఖ బహిష్కృతః।
యోగ ధ్యానం సదా కృత్వా
జ్ఞానం తన్మయతాం వ్రజేత్।।
సూర్యునికి గ్రహణం పట్టు తీరుగా జీవాత్మయొక్క ఆత్మసూర్యుని ‘అజ్ఞానము’ అనే గ్రహణం పట్టుచున్నది. జ్ఞానముచే అజ్ఞానము తొలగినప్పుడు (జ్ఞానముచే) లభించు స్థితియే ‘సాయుజ్యము’ అని చెప్పబడుతోంది. నీరు నీటితో కలిసినప్పుడు ఆత్మయందు ప్రవేశించి అఖండమగు ఆత్మయే తానగుచున్నాడు. ‘యోగాభ్యాసము’ అనే పరిశ్రమయందు (త్రి)గుణములు ప్రవర్తించునవై ఉంటాయి. అయితే యోగాభ్యాసముచే ఆ అభ్యాసి సర్వ దుఃఖములనుండి బహిష్కృతుడు అగుచున్నాడు. గుణముల ద్వారా గుణాతీతత్వము సంతరించుకోగలడు.
అందుచేత యోగాభ్యాసమును ఎల్లప్పుడూ నిర్వర్తిస్తూ, మరొకవైపుగా జ్ఞానముచే కేవలాత్మ (లేక) అఖండాత్మతో తన్మయుడై ఉండునుగాక

జ్ఞానాత్స్వరూపం పరమం హంసమంత్రం సముచ్చరేత్ .. 59..

ప్రాణినాం దేహమధ్యే తు స్థితో హంసః సదాచ్యుతః .
హంస ఏవ పరం సత్యం హంస ఏవ తు శక్తికం .. 60..

హంస ఏవ పరం వాక్యం హంస ఏవ తు వాదికం .
హంస ఏవ పరో రుద్రో హంస ఏవ పరాత్పరం .. 61..

సర్వదేవస్య మధ్యస్థో హంస ఏవ మహేశ్వరః .
పృథివ్యాదిశివాంతం తు అకారాద్యాశ్చ వర్ణకాః .. 62..

కూటాంతా హంస ఏవ స్యాన్మాతృకేతి వ్యవస్థితాః .
మాతృకారహితం మంత్రమాదిశంతే న కుత్రచిత్ .. 63..

45. జ్ఞానాత్ స్వరూపం పరమం
‘హంసమంత్రం’ సముచ్చరేత్।
ప్రాణినాం దేహమధ్యే తు
స్థితో ‘హంసః’ సదా అచ్యుతః।
హంస ఏవ పరం సత్యం,
హంస ఏవ తు శక్తికమ్।
హంస ఏవ పరం వాక్యం
హంస ఏవతు వైదికమ్।।
46. హంస ఏవ పరో రుద్రో
హంస ఏవ పరాత్ పరః।
సర్వదేహస్య మథ్యస్థో
హంస ఏవ మహేశ్వరః।
పృథివి ఆది శివాంతంతు
‘అ’కారాది యాశ్చ వర్ణకాః
కూటాంతా హంసఏవ స్యాత్
మాతృకేతి వ్యవస్థితాః।।
మాతృకా రహితా మంత్రా
ఆదిశంతే న కుత్ర చిత్।
ఆత్మజ్ఞానము యొక్క ‘స్వరూపము’ అయినటువంటి ‘పరమ హంస’ - ‘సోఽహమ్ పరమమ్’ - ళీఅవలగల పరమగు ‘సః’ (లేక) తత్‌యేరి నేను…అను మంత్రార్థభావనతో సోఽహమ్ పరమమ్ మంత్రమును ఎల్లప్పుడు ఎలుగెత్తి - మనసా-వాచా,కర్మణా, బుద్ధ్యా-సముచ్ఛరిస్తూ ఉండటమే యోగము.
‘హంస’ లేక ‘సోఽహమ్’ అను దాని స్థానము ఎక్కడ? ఎక్కడోకాదు. ప్రతి ప్రాణియొక్క దేహమధ్యస్థానంలో ‘నేను ఇది కాదు! అది! జీవాత్మ పరిమితుడనుకాను! పరమాత్మనే’ అను హంస మననము చ్యుతి లేకయే (With no Distraction) ఏర్పడియున్నది. అట్టి హంస (I am actually that) అనునదే పరమవాక్యము. పరమసత్యము. వేదముల సారమగు వైదికము అదియే. ప్రతి జీవుని హృదయములో వెలుగొందుచున్న హంస (పరమహంస - సోఽహమ్ పరమమ్) యే సర్వమునకు పరుడగు రుద్రుడు. అట్టి హంసయే పరాత్పరుడు. (పరమునకే పరమైన ఈ జీవుని నిత్యసత్య సహజస్వరూప - స్వభావము)
సర్వ దేహుల మధ్యస్తుడైయున్న ఆత్మయగు హంసయే మహేశ్వరుడు.
పృథివి (మట్టిగడ్డ) మొదలుకొని చిట్టచివ్వర శివుని వరకు గల ఏఏ ఆకారములతో ప్రారంభమైయున్న సర్వవర్ణకములు (All Discriptions), …… అట్లాగే కూటస్థునివరకు (Till its extreme base) వ్యవస్థితమై యున్నదంతా మాతృకయే! ‘‘ఉపాసకుడు ఉపాస్య దైవము…. ఉభయము కేవలమగు ఆత్మయే’’ - అనునదే మాతృక.
అట్టి ‘మాతృక’ లేనట్టి (మాతృకారహితమైన) మంత్రము ఎక్కడా ఏదీ ఆదేశించబడుటలేదు. ఉపదేశించబడు ప్రతి మంత్రము - (ఓం నమః శివాయ - ఓం నమో నారాయణాయ మొదలైనవన్నీ - సర్వము) హంస (ఆత్మ) స్వరూపమే!మాతృకయే! ‘‘శివుడు’’ అనగా ఆత్మయే! విష్ణువు అనగా ఆత్మయే - అనునదే మాతృక. శివతత్త్వమ్-శివోఽహమ్-విష్ణు తత్త్వమ్ మొదలైన ఇవన్నీ మాతృకా బీజములే.

హంసజ్యోతిరనూపమ్యం మధ్యే దేవం వ్యవస్థితం .
దక్షిణాముఖమాశ్రిత్య జ్ఞానముద్రాం ప్రకల్పయేత్ .. 64..

సదా సమాధిం కుర్వీత హంసమంత్రమనుస్మరన్ .
నిర్మలస్ఫటికాకారం దివ్యరూపమనుత్తమం .. 65..

47. హంస జ్యోతిః అనౌపమ్యం (ప్రదేశము),
మధ్యే దేవం వ్యవస్థితమ్।
దక్షిణాముఖమ్ ఆశ్రిత్య
జ్ఞానముద్రాం ప్రకల్పయేత్।
సదా సమాధిం కుర్వీత
హంసమత్రం అనుస్మరన్,
నిర్మల స్ఫటికాకారం
దివ్యరూపమ్ అనుపమమ్
(అనుత్తమమ్)
‘ఇది ఇట్టిది’ అని నిర్వచించి, దేనితోనూ పోల్చి చెప్పబడజాలని జ్యోతిస్వరూపమగు ‘హంస’ ఈ దేహమునందు వ్యవస్థితమైయున్నది. (That is the Electrifying force in every body. It is the absolute Enlightner).
దక్షిణాభిముఖము (Towards the sensory world) గా ఆశ్రయించి ‘‘ఇదంతా హంస స్వరూపమే! ఆత్మస్వరూపమే’’…అనే జ్ఞానముద్రను (తత్‌త్వమ్ అను చిన్ముద్రను) ధారణచేస్తూ ఉండాలి.
నిర్మల స్ఫటిక ఆకారము కలది, దివ్యమైనది (Divine by itself) అనూపము (Placement) - అయినట్టి ‘హంస’ (సోఽహమ్) మంత్రమును క్షణక్షణము అనుస్మరిస్తూ ‘సమాధి’ యోగమును ఎల్లప్పుడు అభ్యసిస్తూ ఉండాలి. (సమాధి = అదియే తానై ఉండటము).

మధ్యదేశే పరం హంసం జ్ఞానముద్రాత్మరూపకం .
ప్రాణోఽపానః సమానశ్చోదానవ్యానౌ చ వాయవః .. 66..

పంచకర్మేంద్రియైరుక్తాః క్రియాశక్తిబలోద్యతాః .

48. మధ్య దేశే పరం హంసం
జ్ఞానముద్రాత్మ రూపకమ్।
ప్రాణో అపానః సమానశ్చ
ఉదాన వ్యానౌ చ వాయవః
పంచకర్మేంద్రియైః ఉక్తాః
క్రియాశక్తి బలోద్యతాః।।
ఆత్మయే జ్ఞానముద్రాత్మకమైన (చిన్ముద్ర - తత్ త్వమ్) ‘హంస’ దేహమధ్యలో సర్వదా సంస్థితమైయున్నది. అట్టి పరమహంస → ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన-సమానములనబడే పంచప్రాణముల సమేతంగా ఉన్నది. వాటి వాటి మధ్య ప్రదేశమే (అనూపమే) ఆత్మక్షేత్రము.
ఆత్మయే (వాక్కు, పాణి (చేతులు), పాదములు, పాయువు, ఉపస్థ అనబడే)-పంచకర్మేంద్రియములతో క్రియాశక్తి ప్రదర్శనా ఉద్యుక్తమై యున్నది.

నాగః కూర్మశ్చ కృకరో దేవదత్తో ధనంజయః .. 67..

నాగః కూర్మశ్చ కృకరో
దేవదత్తో దనంజయః।
అట్టి ‘హంస’ లేక ఆత్మయే ‘నాగము, కూర్మము, కుకరము, దేవదత్తము, ధనంజయము’ అని పిలువబడు పంచ ఉపప్రాణవిధులను నిర్వర్తిస్తూ చేతనరూపంగా దేహమును చేతనపరచుచున్నది. [Inspiring]

పంచజ్ఞానేంద్రియైర్యుక్తా జ్ఞానశక్తిబలోద్యతాః .
పావకః శక్తిమధ్యే తు నాభిచక్రే రవిః స్థితః .. 68..

బంధముద్రా కృతా యేన నాసాగ్రే తు స్వలోచనే .

49. పంచ జ్ఞానేంద్రియైః యుక్తా
జ్ఞాన శక్తి బలోద్యతాః।
పావకః శక్తి మధ్యేతు
నాభిచక్రే వ్యవస్థితః।
బంధ ముద్రా కృతాయేన
నాసాగ్రేతు స్వలోచనే।।
(చర్మము-కళ్ళు-చెవులు - జిహ్వ - ముక్కు అనబడే) పంచజ్ఞానేంద్రియములలో ‘జ్ఞానశక్తి’ అనే బలప్రదర్శన ఆత్మయే నిర్వర్తిస్తోంది.

శరీరములో మధ్యగాగల నాభి చక్రమునందు తేజో (అగ్ని) రూపముగా ఆత్మశక్తి ప్రవర్తితమై వెలుగొందుచున్నది.

ఎవ్వరైతే నాసాగ్రమున (ముక్కు యొక్క ఊర్ధ్వం - చివరగా) - రెండు కనుల మధ్య (భ్రూమధ్యమున) బంధముద్ర ధారణచేస్తాడో, అట్టివానికి ఆత్మ సులభముగా అనుభవ సిద్ధమగుచున్నది.

అకారేవహ్నిరిత్యాహురుకారే హృది సంస్థితః .. 69..

మకారే చ భ్రువోర్మధ్యే ప్రాణశక్త్యా ప్రబోధయేత్ .
బ్రహ్మగ్రంథిరకారే చ విష్ణుగ్రంథిర్హృది స్థితః .. 70..

రుద్రగ్రంథిర్భ్రువోర్మధ్యే భిద్యతేఽక్షరవాయునా .
అకారే సంస్థితో బ్రహ్మా ఉకారే విష్ణురాస్థితః .. 71..

మకారే సంస్థితో రుద్రస్తతోఽస్యాంతః పరాత్పరః .
కంఠం సంకుచ్య నాడ్యాదౌ స్తంభితే యేన శక్తితః .. 72..

రసనా పీడ్యమానేయం షోడశీ వోర్ధ్వగామిని .

50. ‘అ’ కారే వహ్నిః ఇతి ఆహుః,
‘ఉ’ కారే హృది సంస్థితః।
‘మ’ కారేచ భృవోర్మధ్యే ప్రాణశక్త్యా ప్రబోధయేత్।।
‘బ్రహ్మ’గ్రంథిః ‘అ’కారే చ, విష్ణుగ్రంథిః హృదిస్థితః।
రుద్ర గ్రంథిః భృవోర్మధ్యే భిద్యతే అక్షరవాయునా।
‘అ’కారే సంస్థితో బ్రహ్మా। ‘ఉ’కారే విష్ణుః ఆస్థితః।
51. ‘మ’కారే సంస్థితో రుద్రః। తతో అస్యాం తత్ పరాత్‌పరః।।
కంఠం సంకుంచ్య నాడ్యాదౌ
స్తంభితే యేన శక్తితః,
రసనా పీడ్యమానేయం
షోడశీ(16) ఊర్ధ్వగామినీ।।
‘అ’కారము అగ్నియందు, ‘ఉ’కారము అనే హృదయములోను సంస్థితమై ఉన్నాయి. ‘మ’కారముతో భ్రూమధ్యంలో ప్రాణశక్తితో ‘అ’కారాగ్నిని ప్రజ్వలింపజేయాలి.
అకారమునందు బ్రహ్మగ్రంథి, హృదయమునందుగల విష్ణుగ్రంథి, భ్రూమధ్యగల రుద్రగ్రంథి - అక్షర వాయువుచే భేదింపబడుచున్నాయి.
‘అ’కారరూపమగు బ్రహ్మ-‘ఉ’కారమునందు విష్ణువు, ‘మ’కారమునందు రుద్రుడు సంస్థితులై ఉన్నారు. ఆ మూడిటికి పరమై పరాత్పరుడు తత్ స్వరూపుడై ఉన్నారు. సర్వత్రా పరాత్పరుడే సమస్తముగా వేంచేసిఉన్నారు.
నాడీ ప్రారంభ స్థానమగు కంఠమును సంకోచింపజేసి, తద్వారా కంఠములోని ‘స్థంభన’చే జిహ్వ (నాలుక) → పీడింపబడినదై ఊర్ధ్వ గామియై (దవడను స్పృశిస్తూ)…షోడశ (16) కళాసమన్వితం అగుచున్నది.

త్రికూటం త్రివిధా చైవ గోలాఖం నిఖరం తథా .. 73..

త్రిశంఖవజ్రమోంకారమూర్ధ్వనాలం భ్రువోర్ముఖం .
కుండలీం చాలయన్ప్రాణాన్భేదయన్శశిమండలం .. 74..

సాధయన్వజ్రకుంభాని నవద్వారాణి బంధయేత్ .

త్రికూటం త్రివిధం చ ఏ వ, గోలాకం నిఖరం తథా।
52. త్రిశంఖం వజ్రం ‘ఓం’ కారం,
ఊర్ధ్వ నాళం భ్రువోః ముఖమ్।
కుండలీం చాలయన్ ప్రాణాత్,
భేదయం శశి మండలం।
సాధయన్ వజ్ర కుంభాని
నవద్వారాణి బంధయేత్।।
ఈ విధంగా నాలుకను దవడకు బిగుతుగా తాకించు అభ్యాసముచే→ త్రికూటము (Association of three Energies), త్రివిధము, గోలాకము నిఖరము, త్రిశంఖము, వజ్రతుల్యము, ఓంకార సంజ్ఞ, ఊర్ధ్వనాశనము, భ్రూమధ్య ఆకాశంలో ముఖము కలిగినది అగు- ‘కుండలినీశక్తి’ ఉత్తేజితమగుచున్నది.
ఇక అక్కడి నుండి ప్రాణములను చాలనము చేయుచు చంద్ర మండలమును ఛేదించు క్రమంగా వజ్రకుంభకముతో నవద్వారములను యోగి బంధించుచున్నాడు.

సుమనఃపవనారూఢః సరాగో నిర్గుణస్తథా .. 75..

బ్రహ్మస్థానే తు నాదః స్యాచ్ఛాకిన్యామృతవర్షిణీ .
షట్చక్రమండలోద్ధారం జ్ఞానదీపం ప్రకాశయేత్ .. 76..

సర్వభూతస్థితం దేవం సర్వేశం నిత్యమర్చయేత్ .

సుమనః పవనారూఢః
స రాగో నిర్గుణః తథా।
53. బ్రహ్మస్థానేతు నాదస్యాః
శంఖినీ అమృతవర్షిణీ।
షట్ చక్ర మండల ఉద్ధారం
జ్ఞానదీపం ప్రకాశయేత్।
సర్వభూత స్థితం దేవం
సర్వేశం నిత్యం అర్చయేత్।
సుమనము (కేవల మనస్సు)తో కూడిన వాయువును అధిరోహించినది, సరాగమైనట్టిది అగు ఆత్మ సగుణ-నిర్గుణతత్త్వము కూడా అయి ఉన్నది.
యోగాభ్యాసముచే - శంఖిణీ, అమృతవర్షిణీ అగు నాదము బ్రహ్మస్థానమునందు (బ్రహ్మరంధ్రమునందు) వినబడసాగుతుంది.
షట్ చక్రమండలమును (మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞా అనబడే ‘6’ చక్రములలో సంస్థితమైయున్న ఆకాశమును) అధిగమించి, ఆత్మజ్ఞాని జ్ఞాన-దీపమును దేహమునందు వెలిగించుచున్నాడు.
అట్టి జ్ఞానదీపమును ప్రజ్వలింపజేసి - సర్వజీవులయందు సంస్థితుడైన వాడు దేవదేవుడు, సర్వమునకు ఈశ్వరుడు అగు అఖండ స్వరూప- పరమాత్మను నిత్యము యోగి హృదయాకాశమునందు అర్చించున్నాడు.

ఆత్మరూపం తమాలోక్య జ్ఞానరూపం నిరామయం .. 77..

దృశ్యంతం దివ్యరూపేణ సర్వవ్యాపీ నిరంజనః .
హంస హంస వదేద్వాక్యం ప్రాణినాం దేహమాశ్రితః .

54. ఆత్మరూపం తమ్ ఆలోక్యం, జ్ఞానరూపం నిరామయమ్।
దృశ్యం తం దివ్యరూపేణ, సర్వవ్యాపీ నిరంజనః
‘హంస హంస’ వదేత్ వాక్యం, ప్రాణినాం దేహమ్ ఆశ్రితః।।
అట్టి పరాత్పరుడగు పరమాత్మను స్వస్వరూపాత్మరూపుడుగాను, కేవల జ్ఞానరూపుడుగాను, నిష్ప్రపంచ నిరామయుడుగాను, ఈ దృశ్యమంతా తన దివ్యస్వరూపముగా కలవాడు గాను, సర్వవ్యాపి - నిత్య నిర్మలుడుగాను సర్వ ప్రాణుల దేహములను ఆశ్రయించియున్నట్టి వాడుగాను - ఉపాసించుచున్నాము.

సప్రాణాపానయోర్గ్రంథిరజపేత్యభిధీయతే .. 78..

సహస్రమేకం ద్వయుతం షట్శతం చైవ సర్వదా .
ఉచ్చరన్పఠితో హంసః సోఽహమిత్యభిధీయతే .. 79..

పూర్వభాగే హ్యధోలింగం శిఖిన్యాం చైవ పశ్చిమం .
జ్యోతిర్లింగం భ్రువోర్మధ్యే నిత్యం ధ్యాయేత్సదా యతిః .. 80..

55. సప్రాణ - అపానయోః గ్రంథిః, ‘అజప’ ఇతి అభిధీయతే।
సహస్రం ఏకం, ద్వ్యయుతం, షట్ శతం చ ఏవ సర్వదా।
ఉచ్చరత్ పఠితో ‘హంసః’, ‘సోఽహమ్’ ఇత్యభిధీయతే।
పూర్వభాగే హి అధో లింగం, శిఖిన్యాం చ ఏవ పశ్చిమమ్।
జ్యోతిర్లింగమ్ భ్రువోః మధ్యే, నిత్యం ధ్యాయేత్ సదా యతిః।।
ప్రాణ-అపానముల గ్రంథిని (ఒకదానితో మరొకటి తాకుచూ లయించుస్థాన ఉపాసనను) ‘అజప’ అని అంటారు.
1000, 20000,600 శ్వాసలను గమనిస్తూ సర్వదా ఉచ్ఛరిస్తూ పఠిస్తున్నప్పుడు హంస → ‘సోఽహమ్’గా చెప్పబడుచున్నది.
పూర్వభాగం (కుడివైపు) అధోలింగమున, ఎడమవైపు శిఖస్థాన లింగమును, భ్రూమధ్యగా జ్యోతిర్లింగమును యతి నిత్యము ధ్యానిస్తూ ఉంటున్నాడు.

అచ్యుతోఽహమచింత్యోఽహమతర్క్యోఽహమజోఽస్మ్యహం .
అప్రాణోఽహమకాయోఽహమనంగోఽస్మ్యభయోఽస్మ్యహం .. 81..

కోఽహమ్? సోఽహమ్। (అజపం)
56. అచ్యుతోఽహమ్।
అచింత్యోఽహమ్।
అతర్క్యోఽహమ్।
అజోఽస్మ్యహమ్।
అవ్రణోఽహమ్।
అకాయోఽహమ్
అసంగోఽస్మి।
అభయోఽస్మ్యహమ్।
సోఽహమ్ (I am ever that) - భావన అనగా? - నేను ఆత్మను కాని క్షణమే లేదు కాబట్టి అచ్యుతుడను.
- చింతన (thinking) నానుండి బయల్వెడలుతోంది. చింతనకు మునుముందే ఉన్నవాడను. కనుక అచింత్యుడను.
- వాదోపవాదములకు ఆత్మగా అవిషయుడను (సిద్ధించుకొనబడువాడను కాను. బుద్ధికి ముందే ఉన్నవాడను. అందుచేత అతర్క్యుడను.
- దేహముతో జనించను. దేహముతో నశించువాడను కాను. అందుచేత అజుడను.
- దేహమునకు సంబంధించిన ఆధి - వ్యాధులు ఆత్మను స్పృశించవవు. అందుచేత అవ్రణుడను.
- దేహము లేనప్పుడు కూడా స్వప్న - సుషుప్తుల యందువలె నేను ఉన్నాను. అకాయుడను.
- నేను దేనికీ సంబంధించినవాడను కాను. అసంగుడను.
- వస్తు దేహ సంబంధములకు అతీతుడను. అభయస్వరూపుడను.

అశబ్దోఽహమరూపోఽహమస్పర్శోఽస్మ్యహమద్వయః .
అరసోఽహమగంధోఽహమనాదిరమృతోఽస్మ్యహం .. 82..

అక్షయోఽహమలింగోఽహమజరోఽస్మ్యకలోఽస్మ్యహం .
అప్రాణోఽహమమూకోఽహమచింత్యోఽస్మ్యకృతోఽస్మ్యహం .. 83..

57. అశబ్దోఽహమ్। అరూపోఽహమ్।
అస్పర్శోఽస్మ్యహమ్, అద్వయః।
అరసోఽహమ్। అగంధోఽహమ్।
అనాదిః। అమృతోస్మ్యఽహమ్।
అక్షయోఽహమ్। అలింగోఽహమ్।
అజరోఽస్మి। అకళోఽస్మ్యహమ్।
అప్రాణోఽహమ్। అమూకోఽహమ్।
అచింత్యోఽస్మి। అకృతోఽస్మ్యహమ్।
శబ్దము - రూప - స్పర్శలకు విషయుడను కాను. నాకు ద్వితీయమైనది ఎక్కడా ఏదీ లేదు. కనుక అద్వితీయుడను.
రస-గంధములచే తెలియబడువాడను కాను. ఆది అనుదే లేనివాడను. జన్మ - మృత్యువులు లేనివాడను. అమృతస్వరూపుడను.
క్షయము (తరుగుదల) లేనివాడను. అక్షయుడను. నామరూపములు దేహమునకు సంబంధించినవి. అసంగుడను. ప్రాణములు నాయొక్క శక్తి ప్రదర్శనము. ప్రాణశక్తికి మునుముందే ఉన్నవాడను. అప్రాణుడను.
శబ్దములన్నీ ఆత్మనగు నానుండే బయల్వెడలుచున్నాయి. అందుచేత అమూకుడను. (మూగవాడను కాను).
చింతనలకు దొరకనివాడను. అచింత్యుడను. కర్మలు దేనికీ నేను కారణము కాదు. నిష్క్రియుడను. అకృతుడను. కర్మలన్నిటికీ అతీతుడను.

అంతర్యామ్యహమగ్రాహ్యోఽనిర్దేశ్యోఽహమలక్షణః .
అగోత్రోఽహమగాత్రోఽహమచక్షుష్కోఽస్మ్యవాగహం .. 84..

58. అంతర్యామ్యమహమ్ - అగ్రాహ్యో,
అనిర్దేశ్యోఽహమ్ అలక్షణః।
అగోత్రోఽహమ్। అగాత్రోఽహమ్।
అచక్షుష్కోఽస్మి। అవాక్ అహమ్।
- (నాయొక్క కలతో ప్రవర్తించేవారందరి అంతర్ - హృదయుడను నేనే అయి ఉన్న తీరుగా) ఈ కనబడే విశ్వమునకు నేనే అంతర్యామిని.
- ఆత్మగా నేను ప్రపంచంలోని ఒక విషయమువలె, ఒక దృశ్యమువలె, ఒక వ్యక్తివలె తెలియబడువాడను కాను. అగ్రాహ్యుడను.

అదృశ్యోఽహమవర్ణోఽహమఖండోఽస్మ్యహమద్భుతః .
అశ్రుతోఽహమదృష్టోఽహమన్వేష్టవ్యోఽమరోఽస్మ్యహం .. 85..

అదృశ్యోఽహమ్। అవర్ణోఽహమ్।
అఖండోఽస్మి అహమ్ అద్భుతః।
అశ్రుతోఽహమ్।
అదృష్టోఽహమ్।
అన్వేష్టవ్యో,
అమరోస్మ్యఽహమ్।
‘‘ఆత్మ ఇది! ఇదే! ఇంతే!’’ అని నిర్దేశించబడునది కాదు. ఆత్మగా నేను అనిర్దేశ్యుడను.
- లక్షణములు ‘నావి’ కావచ్చునేమోగానీ, ‘నేను లక్షణములు కాదు. నేను సర్వదా లక్షణములకంటే ముందే ఉన్నవాడను. విలక్షణుడను. అలక్షణుడను.
- గోత్రనామాలు దేహ సంబంధమైనవి. ఆత్మనగు నాకు గోత్రనామాలు లేవు. అగోత్రుడను.
- ఈ శరీరము - నేను ధరించిన వస్త్రము వంటిది. శరీరిగా నేను శరీరమునకు వేరై (పరమై) ఉన్నాను. అందుచేత అగాత్రుడను.
- ఈ కళ్ళు కనబడేవి, వాక్కు - చెప్పబడేవి, దృశ్యము - దర్శించబడేది, వర్ణము - వర్ణించబడేది ‘నేను’ కాదు. పరుడను.
- అఖండుడను. అద్భుతుడను. వినబడే వాడను కాదు. అశ్రుతుడను. అదృష్టుడను. వెదికితే దొరికేవాడను కాను. అన్వేష్టుడను. అమరణుడను (మరణ రహితుడను).

అవాయురప్యనాకాశోఽతేజస్కోఽవ్యభిచార్యహం .
అమతోఽహమజాతోఽహమతిసూక్ష్మోఽవికార్యహం .. 86..

అరజస్కోఽతమస్కోఽహమసత్త్వోస్మ్యగుణోఽస్మ్యహం .
అమాయోఽనుభవాత్మాహమనన్యోఽవిషయోఽస్మ్యహం .. 87..

59. అవాయుః అపి అనాకాశో।
అతైజసో అవ్యభిచార్యఽహమ్।
అమృతోఽహమ్। అజాతోఽహమ్।
అతి సూక్ష్మో। అవికార్యఽహమ్।
అరజస్కో, అతమస్కోఽహమ్।
అసత్త్వోఽస్మి, అగుణోఽస్మ్యహమ్
అమాయో అనుభవాత్మాఽహమ్।
అనన్యో (అ)విషయోఽస్మ్యహమ్
నేను వాయువును (ప్రాణమును) కాను. ఆ వాయువు ఎందులో చలిస్తోందో అట్టి ఆకాశరూపుడను కూడా కాను. స్వప్న పురుషుడగు తేజసుడను (స్వప్నంలో చరించువాడను) కాను. నా స్వరూపమునుండి నేను వేరై చరించువాడనుకాను! అవ్యభిచారుడను.
ఆత్మగా నాకు చావు లేదు. పుట్టుక లేదు. స్థూలరూపుడను కాను. అత్యంత సూక్ష్మాతి సూక్ష్మరూపుడను. ఎట్టి జన్మ - వృద్ధి - క్షయ వికారములు లేనివాడను. అవికార్యుడను. రజో - తమో - సత్వ గుణరూపుడను కాను! గుణరహితుడను. గుణాతీతుడను!
మాయా అనుభవరూపుడను కాను. కథలోని అనుభవములు ఆ రచయితయొక్క అనుభవములా? కాదు కదా! అయితే ఆ అనుభవములన్నీ రచయితయొక్క కల్పనలోంచే వస్తున్నాయి కదా! అట్లాగే విషయములు నారూపము కాదు. నాకు వేరుగా విషయములు లేవు. అందుచేత అనుభవాతీతుడను.

అద్వైతోఽహమపూర్ణోఽహమబాహ్యోఽహమనంతరః .
అశ్రోతోఽహమదీర్ఘోఽహమవ్యక్తోఽహమనామయః .. 88..

అద్వయానందవిజ్ఞానఘనోఽస్మ్యహమవిక్రియః .
అనిచ్ఛోఽహమలేపోఽహమకర్తాస్మ్యహమద్వయః .. 89..

60. అద్వైతోఽహమ్, అపూర్ణోఽహమ్।
అబాహ్యోఽహమ్, అనంతరః।
అశ్రోత్రఽహమ్। అదీర్ఘోఽహమ్। (అహ్రస్వోఽహమ్)
అవ్యక్తోఽహమ్ అనామయః
అద్వయానంద విజ్ఞాన
ఘనోఽస్మ్యహమ్, అవిక్రియః।।
అనిచ్ఛోఽహమ్। అలేపోఽహమ్।
అకర్తాస్మ్యఽహమ్ అద్వయః।
నాకు ద్వితీయమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. ఇదంతా నేనే! కనుక, అద్వైతుడను, అద్వితీయుడను. ద్వితీయమైన దేనిచేతనూ నేను పూరింపబడువాడను కాను. అందుచేత అపూర్ణుడను. అంతా నేనే! అయి ఉండటంచేత బయటవాడిని కాదు. లోపలివాడను కాను! బాహ్య- అభ్యంతర రహితుడను.
చెవులకు వినబడువాడను కాను. అశ్రోత్రుడను. పొడుగైనవాడినీ కాదు. పొట్టి అయినవాడినీ కాదు. నామరూపాత్మకంగా వ్యక్తమగు వాడిని కాదు. అనామయుడను. అవ్యక్తుడను. క్రియా వ్యవహారములకు సంబంధించని అద్వయ (ద్వితీయమనునదే లేనట్టి) - ఘనీభూతమైన విజ్ఞాన ఆనందస్వరూపుడను.
జీవాత్మగానో, మరొకటిగానో అగువాడను కాను. అవిచ్ఛిన్నుడను. విచ్ఛిన్నమనునదే లేనివాడను. నిత్యనిర్మలుడను. లేపము (దోషము) లేనివాడను. కథలోని ఒక పాత్రయొక్క చర్యలు ‘‘రచయిత చేస్తున్నాడు’’ - అని ఆపాదించలేము కదా! అట్లాగే నేను అకర్తను. కానీ అన్నీ కల్పనయే కనుక - అద్వయుడను. అవేవీ నాకు ద్వితీయం కాదు. రచయితకు వేరుగా కథకు ఉనికి ఎక్కడ?

అవిద్యాకార్యహీనోఽహమవాగ్రసనగోచరః .
అనల్పోఽహమశోకోఽహమవికల్పోఽస్మ్యవిజ్వలన్ .. 90..

ఆదిమధ్యాంతహీనోఽహమాకాశసదృశోఽస్మ్యహం .
ఆత్మచైతన్యరూపోఽహమహమానందచిద్ఘనః .. 91..

ఆనందామృతరూపోఽహమాత్మసంస్థోహమంతరః .

61. అవిద్యాకార్యహీనోఽహమ్, అవాక్-మానస గోచరః।
అనల్పోఽహమ్। అశోకోఽహమ్।
అవికల్పోఽస్మి అవిజ్వలన్।
ఆది - మధ్య - అంత హీనోఽహమ్।
ఆకాశ సదృశోస్మ్యఽహమ్।
ఆత్మ చైతన్య రపోఽహమ్।
అహమ్ ఆనంద చిద్ఘనః।
ఆనందామృత రూపోఽహమ్।
ఆత్మసంస్థోఽహమ్ అంతరః।
కల్పనకు మునుముందే ఆ కల్పించువాడు ఉన్నరీతిగా, నాకు ‘మాయ- జగత్తు అవిద్య’ - ఇవన్నీ లేవు. సమస్తమునకు ముందే ఉన్నాను. అవాక్ మానస గోచరుడను!
అల్పుడనుకాను. శోకరహితుడను. వికల్పరహితుడను. ఎక్కడికీ ప్రవహించుటలేదు. అవిజ్వలుడను. ఉన్నచోటనే సర్వదా ఉండువాడను.
నాకు మొదలు-మధ్య-చివరలనునవేవీ లేవు. ఆకాశమువలె అనంతుడను. ఆత్మచైతన్యమే నా రూపము. సర్వదా మహత్ - ఆనంద విగ్రహుడను!
అంతరాంతరమగు ఆత్మగా సర్వమునందు ఆనంద - అమృత రూపుడుగా సంస్థితుడనై ఉన్నవాడను.

ఆత్మకామోహమాకాశాత్పరమాత్మేశ్వరోస్మ్యహం .. 92..

ఈశానోస్మ్యహమీడ్యోఽహమహముత్తమపూరుషః .
ఉత్కృష్టోఽహముపద్రష్టా అహముత్తరతోఽస్మ్యహం .. 93..

కేవలోఽహం కవిః కర్మాధ్యక్షోఽహం కరణాధిపః .
గుహాశయోఽహం గోప్తాహం చక్షుషశ్చక్షురస్మ్యహం .. 94..

62. ఆప్తకామోఽహమ్
ఆకాశాత్
పరమాత్మేశ్వరోఽస్మ్యహమ్।
ఈశానోఽస్మ్యహమ్। ఈడ్యోఽహమ్।
అహమ్ ఉత్తమ పూరుషః।
ఉత్కృష్టోఽహమ్ ఉపద్రష్టాఽహమ్।
ఉత్తరతోఽస్మ్యహమ్।
కేవలోఽహమ్ కవిః
కర్మాధ్యక్షోహం కరణాధిపః।
గుహాశయోఽహమ్। గోప్తాఽహమ్।
చక్షుషః చక్షురస్మ్యహమ్।
‘ఆకాశము’ వలె అంతయూ నాయందే ఉండి ఉండటంచేత సర్వము సిద్ధించుకొన్నవాడనే!
ఆప్తకాముడను. కొత్తగా పొందవలసినదేదీ నాకు లేదు. సర్వమునకు వేరై, పరమై ఉన్నవాడను. కానీ సర్వముగా విస్తరించి ఉన్నవాడను. కనుక ఈశ్వరుడను! సర్వము నాయందే ఉండి ఉన్నది. అందుచేత ఈశానుడను! సర్వస్తోత్రములకు ఆత్మగా అర్హుడనే అగుటచే ఈడ్యుడను. ‘నేను’ అనబడు జగత్తుయొక్క ఉత్తమపురుష (First Person) అయి ఉన్నవాడను. ఉత్కృష్టుడను. నాటక దీపమువలె కేవల సాక్షినగుటచే ఉపద్రష్టను (చూచువానిని చూచువాడను. I am a witness to one who is seeing from within me.)
కేవలుడను. (I am always the absolute) శ్రేష్ఠుడను. కవిని. దేహ మనోబుద్ధి సంబంధితమైన సర్వ కర్మలు నాయొక్క అధ్యక్షతన జరుగుచు న్నాయి. కనుక కర్మాధ్యక్షుడను. కరణములకంటె (ఇంద్రియములకంటే) అధికాధికుడను. హృదయగుహయందు ఆశీనుడై, రహస్యముగా దాగినవాడనై ఉన్నాను. కంటికి చూపు స్వరూపుడును.

చిదానందోఽస్మ్యహం చేతా చిద్ఘనశ్చిన్మయోఽస్మ్యహం .
జ్యోతిర్మయోఽస్మ్యహం జ్యాయాంజ్యోతిషాం జ్యోతిరస్మ్యహం .. 95..

తమసః సాక్ష్యహం తుర్యతుర్యోఽహం తమసః పరః .
దివ్యో దేవోఽస్మి దుర్దర్శో దృష్టాధ్యాయో ధ్రువోఽస్మ్యహం .. 96..

63. చిదానందోఽస్మ్యహమ్ చేతా, చిద్ఘనః
చిన్మయోఽస్మి అహమ్।
జ్యోతిర్మయోస్మ్యహమ్ జ్యాయాన్
జ్యోతిషాం జ్యోతిరస్మ్యహమ్।
తమసః సాక్ష్యహమ్, తుర్యః
తుర్యోఽహమ్ తమసః పరః। దివ్యోదేవోఽస్మి దుర్దర్శో
ద్రష్టా ధ్యేయో ధ్రువోఽస్మ్యహమ్।
చిదానంద స్వరూపుడను. ఘనీభవించిన చిత్‌స్వరూపుడను. చిన్మయ స్వరూపుడను. మృణ్మయస్వరూపుడను కాను!
సర్వమునకు ఉత్కృష్టము అధికము అగు స్వస్వరూపుడను! జ్యోతిర్మయ స్వరూపుడను! జ్యోతికే జ్యోతి స్వరూపుడను. అంధకారమునకు ఆవల పరమై కేవల సాక్షినై ఉన్నాను. దివ్యమగు దేవదేవుడను. కళ్ళకు కనిపించువాడను కాను. దుర్దర్శుడును. ద్రష్టను. ధ్యేయుడను. ధృవమైన రూప సమన్వితుడను! (సర్వదా యథాతథుడను)

నిత్యోఽహం నిరవద్యోఽహం నిష్క్రియోఽస్మి నిరంజనః .
నిర్మలో నిర్వికల్పోఽహం నిరాఖ్యాతోఽస్మి నిశ్చలః .. 97..

నిర్వికారో నిత్యపూతో నిర్గుణో నిఃస్పృహోఽస్మ్యహం .
నిరింద్రియో నియంతాహం నిరపేక్షోఽస్మి నిష్కలః .. 98..

పురుషః పరమాత్మాహం పురాణః పరమోఽస్మ్యహం .

64. నిత్యోఽహమ్। నిరవద్యోఽహమ్।
నిష్క్రియోఽస్మి, నిరంజనః।
నిర్మలో, నిర్వికల్పోఽహమ్
నిరాఖ్యాతోఽస్మి నిశ్చలః।।
నిర్వికారో నిత్యపూతో నిర్గుణో నిస్పృహోఽస్మ్యహమ్।
నిరింద్రియో నియంతాఽహమ్।
నిరపేక్షోఽస్మి నిష్కళః
పురుషః పరమాత్మాఽహమ్, పురాణ పరమోఽస్మ్యహమ్।
పురాణ పురుషోఽస్మ్యహమ్।
నిత్యుడను। దేనిచేతను జయింపబడను। నిరవద్యుడను. నిష్క్రియుడను। నిర్మలుడను। నిరంజనుడను। సర్వ వికల్పములకు వేరైనవాడను. నిర్వికల్పుడను. చెప్పబడజాలనివాడను! నిశ్చలుడను!
వికారములు లేనివాడను. నిర్వికారుడను. నిత్యనిర్మలుడను. నిర్గుణుడను. ఎట్టి స్పృహ - భావన - యోచనలకు నిబద్ధుడనుకాను. నిస్పృహుడను. ఇంద్రియరహితుడను. కానీ ఇంద్రియములను పరిపాలించువాడను. నియంతను. దేనిపట్లా అపేక్షలేనివాడను. కళంకము లేనివాడను నిష్కళంకుడను.
పరమపురుషుడను - పరమాత్మను - పురాణపురుషుడను - పరమ పురుషుడను!

పరావరోఽస్మ్యహం ప్రాజ్ఞః ప్రపంచోపశమోఽస్మ్యహం .. 99..

పరామృతోఽస్మ్యహం పూర్ణః ప్రభురస్మి పురాతనః .
పూర్ణానందైకబోధోఽహం ప్రత్యగేకరసోఽస్మ్యహం .. 100..

ప్రజ్ఞాతోఽహం ప్రశాంతోఽహం ప్రకాశః పరమేశ్వరః .

65. పరావరోఽస్మ్యహం। ప్రాజ్ఞః।
ప్రపంచ ఉపశమోస్మ్యఽహమ్।
పరామృతోఽస్మ్యహమ్, పూర్ణః।
ప్రభురస్మి పురాతనః।
పూర్ణానందైక బోధోఽహమ్।
ప్రత్యక్ ఏక రసోఽస్మ్యహమ్।
ప్రాజ్ఞాతోఽహమ్। ప్రశాంతోఽహమ్।
ప్రకాశః పరమేశ్వరః।
పరతత్త్వముచే ఆవరించబడువాడను. కేవల ప్రజ్ఞాస్వరూపుడను. పరాత్‌పరుడను. ప్రాజ్ఞుడను. నా పట్ల ప్రపంచము సర్వదా ఉపశమించినదై యున్నది. దృష్టాంతంగా ఒక కథా రచయిత తాను ఎప్పుడో వ్రాసిన కథను ఇప్పుడొకసారి చదువుకొంటున్న తీరైనదిగా చూస్తూ ఉండటమే - ఈ దృశ్యము.
సర్వదా పూర్ణుడను। అందుచేత నాకు మార్పు-కూర్పు - చేర్పులు లేవు. మృత్యువుకు ఆవలగా ఉన్నవాడను. పురాతనుడను. సర్వమునకు ప్రభువును. ఎందుకంటే, ఇదంతా నా ప్రభవము కాబట్టి (Its all my own appearence). ఈ జన్మ - కర్మలు, జ్ఞాన - అజ్ఞానములు….ఇవన్నీ నా ఆనందమునుండియే బయల్వెడలుచున్నాయి.
పురా (సర్వమునకు ఇతః పూర్వమ్) - ఆనంద ఏకబోధ స్వరూపుడను. ప్రత్యక్ (కేవల) ఏకరస స్వరూపుడను!
కేవల ప్రజ్ఞాస్వరూపుడను! ప్రజ్ఞా ప్రదర్శకుడను. ఆత్మస్వరూపుడనగు నేను పరమ ప్రశాంతుడను! సర్వత్రా ప్రకాశించువాడను! సర్వమునందు పరస్వరూపుడనై విస్తరించి ఉన్నవాడను! కాబట్టి పరమేశ్వరుడను!

ఏకదా చింత్యమానోఽహం ద్వైతాద్వైతవిలక్షణః .. 101..

బుద్ధోఽహం భూతపాలోఽహం భారూపో భగవానహం .
మహాజ్ఞేయో మహానస్మి మహాజ్ఞేయో మహేశ్వరః .. 102..

విముక్తోఽహం విభురహం వరేణ్యో వ్యాపకోఽస్మ్యహం .

66. ఏకధా (అ)చింత్యమానోఽహమ్,
ద్వైత - అద్వైత విలక్షణః।
బుద్ధోఽహమ్। భూతపాలోఽహమ్।
‘భా’రూపో భగవాన్ అహమ్।
మహాదేవో మహాన్ అస్మి
మహాజ్ఞేయో మహేశ్వరః।
విముక్తోఽహమ్। విభుః అహమ్।
వరేణ్యో వ్యాపకోఽస్మ్యహమ్।
ద్వైత - అద్వైతములకంటె విలక్షుణుడను. ఏకస్వరూపుడనై విచారణచే తెలియవచ్చువాడను!
కేవలబుద్ధి స్వరూపుడను. పంచభూతములచే నియమించబడువాడను కాను. పంచభూతములకు నియామకుడను. సర్వమును వెలిగించు (one who enlightens) భగవంతుడను.
మహత్తరమగు అద్భుత స్వరూపుడను. దేవతలకే ఆత్మగా దేవదేవుడను. మహాదేవుడను. మహత్ స్వరూపుడను. మహాజ్ఞేయుడను. మహేశ్వరుడను. సర్వమునుండి సర్వదా విముక్తుడను. విభుడను. సర్వులకు వరేణ్యుడను. సర్వవ్యాపకుడను!

వైశ్వానరో వాసుదేవో విశ్వతశ్చక్షురస్మ్యహం .. 103..

విశ్వాధికోఽహం విశదో విష్ణుర్విశ్వకృదస్మ్యహం .
శుద్ధోఽస్మి శుక్రః శాంతోఽస్మి శాశ్వతోఽస్మి శివోఽస్మ్యహం .. 104..

67. వైశ్వానరో, వాసుదేవో।
విశ్వతః చక్షురస్మ్యహమ్।
విశ్వాధికోఽహమ్, విశదో।
విష్ణుః విశ్వకృదస్మ్యహమ్।
శుద్ధోఽస్మి। శుక్రః శాంతోఽస్మి।
శాశ్వతోఽస్మి। శివోఽస్మ్యహమ్।
వ్యష్టిని నేనే! సమిష్ఠినీ నేనే! అందుచేత వైశ్వానరుడను, వాసుదేవుడను కూడా! విశ్వమునకు దర్శనుడను. విశ్వమంతా చక్షువులు కలవాడను!
నాయొక్క విశదీకరణ రూపమే (The explanatory form of what I am) ఈ జగత్తు, ఈ విశ్వము. ఈ విధంగా ఈ విశ్వమునకు ఆవల అధిగమించినవాడనై ఉన్నాను. విశ్వ నిర్మాతను (విశ్వకృత్). విశ్వముగా వ్యాపించినవాడను - ‘విష్ణుః’!
శుద్ధుడను. శాంతుడను! శుద్ధ - నిర్మలత్వములకు కూడా ఆవల (అంతః) ఉన్నవాడను! శాశ్వతుడను. శుభ - సుఖస్వరూపుడను. (శివోఽస్మి)!

సర్వభూతాంతరాత్మహమహమస్మి సనాతనః .
అహం సకృద్విభాతోఽస్మి స్వే మహిమ్ని సదా స్థితః .. 105..

68. సర్వభూతాంతరాత్మాఽహమ్,
అహమస్మి సనాతనః।
అహం సకృత్ విభాతోఽస్మి
స్వే మహిమ్ని సదా స్థితః।
(నాటక రచయితయే నాటక పాత్రలకు ముందే ఉత్పత్తి స్థానమై, సర్వపాత్రల - స్వభావముల - సంఘటనలకు అంతరాత్మగా అగుచున్నట్లుగా) - నేనే సర్వజీవుల అంతరాత్మను. సనాతనుడను. జగత్ కార్యకర్తను. సకృత్! విశ్వముగా కనిపిస్తూ జగత్తుగా ప్రకాశించుచున్నది నేనే! ఇదంతా సదా నాయొక్క మహిమగా నాయందే సంస్థితమై యున్నది.

సర్వాంతరః స్వయంజ్యోతిః సర్వాధిపతిరస్మ్యహం .
సర్వభూతాధివాసోఽహం సర్వవ్యాపీ స్వరాడహం .. 106..

సమస్తసాక్షీ సర్వాత్మా సర్వభూతగుహాశయః .

69. సర్వాంతరః స్వయంజ్యోతిః। సర్వాధిపతిరస్మ్యహమ్।
సర్వభూతాధివాసోఽహమ్, సర్వవ్యాపీ స్వరాడహమ్।
సమస్త సాక్షీ సర్వాత్మా, సర్వభూత గుహాశయః।।

సర్వమునకు అంతరుడు. స్వయం జ్యోతి స్వరూపుడను! సర్వమునకు అధిపతిని! సర్వజీవులయందు అధివాసుడను! సర్వవ్యాపిని! విశ్వవిరాట్‌ను! విశ్వమంతా నా విస్తార సంప్రదర్శన రూపమే! సమస్తమునకు సాక్షిని! సర్వమునకు ఆత్మను! సర్వజీవుల హృదయగుహలలో ఆశయ స్వరూపుడనై ఉన్నది నేనే! సర్వభూత ఆశయ స్థితః!


సర్వేంద్రియగుణాభాసః సర్వేంద్రియవివర్జితః .. 107..

స్థానత్రయవ్యతీతోఽహం సర్వానుగ్రాహకోఽస్మ్యహం .
సచ్చిదానంద పూర్ణాత్మా సర్వప్రేమాస్పదోఽస్మ్యహం .. 108..

సచ్చిదానందమాత్రోఽహం స్వప్రకాశోఽస్మి చిద్ఘనః .

70. సర్వేంద్రియం గుణాభాసః।
సర్వేంద్రియ వివర్జితః।
స్థానత్రయ వ్యతీతోఽహమ్
సర్వానుగ్రాహకోస్మ్యఽహమ్।
సచ్చిదానంద పూర్ణాత్మా
సర్వ ప్రేమాస్పదోస్మ్యహమ్।
సత్ చిత్ ఆనంద మాత్రోఽహమ్,
స్వ ప్రకాశోఽస్మి చిద్ఘనః।।
సర్వైంద్రియములందు, వాటి వాటి గుణ - స్వభావ - అనుభవరూపము లందు భాసించుచున్నట్టిది (That being reflected) నేనే! ఇంద్రియములలో ప్రకాశిస్తూ కూడా ఇంద్రియ రహితుడనే అయి ఉన్నాను! సర్వేంద్రియ వివర్జితుడను!
ఇహ-పర-పరాత్పరములకు, భూ-స్వర్గ-పాతాళ లోకములకు వేరైనవాడను! త్రిస్థానములు నాయొక్క అనుగ్రహము చేతనే ఉనికి - ప్రదర్శనము కలిగి ఉన్నాయి!
సత్-చిత్-ఆనందములతో కూడుకొని ఉన్న నేను సర్వదా పూర్ణుడను! సర్వమునకు ఆత్మనై ఉండటం చేత సర్వ ప్రేమాస్పదుడను! కేవల సత్ - చిత్ - ఆనందమాత్రుడను కూడా! నన్ను మరొకటేదీ ప్రకాశింపజేయటం లేదు. స్వయం ప్రకాశమాత్రుడను. చిద్ఘనుడను.

సత్త్వస్వరూపసన్మాత్రసిద్ధసర్వాత్మకోఽస్మ్యహం .. 109..

సర్వాధిష్ఠానసన్మాత్రః స్వాత్మబంధహరోఽస్మ్యహం .
సర్వగ్రాసోఽస్మ్యహం సర్వద్రష్టా సర్వానుభూరహం .. 110..

ఏవం యో వేద తత్త్వేన స వై పురుష ఉచ్యత ఇత్యుపనిషత్ ..

71. సత్త్వ స్వరూపః చిన్మాత్ర
సిద్ధః సర్వాత్మకోఽస్మ్యహమ్।
సర్వాధిష్ఠాన చిన్మాత్రః
స్వాత్మబంధ హరోస్మ్యఽహమ్।
సర్వగ్రాసోస్మ్యఽహమ్ సర్వద్రష్టా
సర్వానుభూః అహమ్।।

యే చ బ్రహ్మవిదః సిద్ధాః
సర్వ ఏవం పదంతి హి।।
ఏవం యో వేద తత్త్వేన
స వై ‘పురుష’ ఉచ్యతే।।
సత్త్వ (కేవల సత్) స్వరూపుడను। చిన్మాత్రుడను। సర్వము నాపట్ల సిద్ధించియే ఉన్నట్టివాడను. సర్వాత్మకుడను. (ఆభరణములన్నిటికీ బంగారమే అధిష్టానము అయి ఉన్న తీరుగా)
- సర్వమునకు అధిష్ఠాన చిన్మాత్రస్వరూపుడను! నా బంధమును హరించువాడను నేనే!
సర్వమునకు అనుభవరూపకముగా గ్రాసము (అన్నము → అనుభవించ బడుచున్నది) నేనే! సర్వమునకు కేవల ద్రష్టను! అనుభవముగా పొందబడుచున్న ఈ సర్వము నేనే!


బ్రహ్మమును సిద్ధించుకున్న బ్రహ్మవేత్తల పలుకులే ఇవి! వారు ఎలుగెత్తి చెప్పుచున్న మనయొక్క స్వస్వరూప నిర్వచన వివరములే ఇవన్నీ!

ఎవరు ఈ బ్రహ్మవిద్యను - తత్త్వార్థంగా తెలుసుకొనుచున్నారో వారే ‘పురుషుడు’ అను శబ్దార్థము పుణికిపుచ్చుకొన్నవారగుచున్నారు.

ఇతి బ్రహ్మవిద్యోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



కృష్ణ యజుర్వేదాంతర్గత

20     బ్రహ్మవిద్య ఉపనిషత్

అధ్యయన పుష్పము

మహనీయుడగు సద్గురువు ధృవాగ్ని ‘గౌతముడు’ అను శిష్యునికి చేయుచున్న బోధ :

విష్ణుతత్త్వము కొరకై పరిశ్రమించి సిద్ధించుకొనియున్న బ్రహ్మవేత్తల యొక్క అద్భుత ప్రవచనముల చేత ప్రసాదాత్ - పవిత్రులమై చెప్పుకొనుచున్న ఈ బ్రహ్మవిద్య (ధృవాగ్ని అయి) సర్వదిశలలో సర్వదా వెలుగులు నింపుచుండునుగాక! బ్రహ్మజ్ఞుల బాటలో బ్రహ్మవిద్యను ఇప్పుడు మనము ఉత్తమము - సువిశాలము - సుతీక్షణాము అగు దృష్టి - విజ్ఞతలతో - సంప్రచక్షతే - పరిశీలిస్తున్నాము.

సద్గురుః వాచ।
ప్రియశిష్యా। గౌతమా। బ్రహ్మతత్త్వజ్ఞులు (బ్రహ్మవాదులు) దేనిని ‘ఓం’ అను సంజ్ఞచే ‘పరబ్రహ్మము’ గురించి సిద్ధాంతీకరించు చాటుచున్నారో,… అట్టి ఏకము, అక్షరము అగు పరబ్రహ్మము యొక్క రూప స్థాన-కాలత్రయ… ఇత్యాదుల గురించి కొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాము.

ఓ గౌతమా! తదితర సమాశ్రితులగు శ్రోతలారా! ఇక వినండి.

⌘ ⌘ ⌘

‘‘ఓంకార పరబ్రహ్మతత్త్వము’’ అనబడు మనందరియొక్క ఆత్మకు అనన్యమై, అంతర్గతమై… ఈ సమస్తము ఏర్పడి ఉంటోంది.

త్రయీ దేవాః → సృష్టి - స్థితి.. లయములు, వాటి వాటి అధిదేవతలగు బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు.
త్రయీలోకాః → భౌతిక - మనో - బుద్ధి ప్రధాన లోకములగు పాతాళ - భూ-దివ్య (దేవతా-స్వర్గ) త్రిలోకములు..,
త్రయీ వేదా → ఋక్ మంత్ర - యజ్ఞోపాసనా - స్థుతి ప్రధానములగు ‘‘ఋక్ - యజుర్ - సామవేదములు’’..,
త్రయీ అగ్నిః → దేవతాహ్వాన - ఆసన సమర్పణ - వర్ణనా రూపములగు గార్హపత్య - దక్షిణ - ఆహహనీయ → త్రీగ్నులు..,
త్రిస్రో మాత్రా → శబ్ద ఉచ్ఛారణ - అర్థ - తత్ భావలయ రూపములగు ‘‘శబ్దార్థ భావ తన్మయ’’.. మాత్రలు,
అర్ధమాత్రా చ → కేవల శబ్ద ‘‘మ్‌మ్..’ కేవలీ భావనా రూపమగు, భావాతీత ఆత్మచైతన్యము
త్ర్యక్షరస్య → ‘అ’కార (సత్) - ‘ఉ’కార (చిత్) - మకార (ఆనంద) త్ర్యక్షరములు;

ఇవన్నీ బ్రహ్మము నందు.. జలమునందు తరంగాలవలె, బంగారమునందు ఆభరణములవలె అంతర్గతములు, అనన్యములు. అంతర్విశేషములు.

ఉపాసనకొరకై బ్రహ్మవాదుల వ్యాఖ్యానము-‘మాత్రలు’ (ఓం=అ-ఉ-మ-అర్ధమాత్ర)

(1). ‘అ’కారము యొక్క శరీరము : (1) పృథ్వి (2) ఋగ్వేదము (ఋక్కులు) (3) గార్హపత్యాగ్ని (4) సృష్టికర్తయగు బ్రహ్మ - అని వ్యాఖ్యానించబడుచున్నది. స్థానము = సూర్య మండల మధ్య సూర్య తేజస్సు - శంఖ నినాదము (మధ్యగా).

(2). ‘ఉ’కారము యొక్క శరీరము : (1) యజుర్వేదములోని యజ్ఞమంత్రముల సంబంధమైన ‘యజస్సులు’ (2) అంతరిక్షము (3) దక్షిణాగ్ని (4) దేవత = విష్ణు భగవానుడు - ఇవి ‘ఉ’కార శరీరముగా పరికీర్తించబడుచున్నాయి. స్థానము : చంద్రమండలము మధ్య వ్యవస్థితమైయున్నది. చంద్రతేజో కాంతి రూపము.

(3). ‘మ’కారము యొక్క శరీరము : (1) వేదగానములతో కూడినట్టి సామవేదము; (2) ద్యౌ-ద్యులోకము, (దేవతా లోకము); (3) ఆహవనీయాగ్ని; (4) దేవత = ఈశ్వరుడు - ఇవి మకార శరీరముగా అభివర్ణించబడూన్నది.

స్థానము = అగ్ని తేజస్సు. అగ్ని రూపము. విద్యుత్ (మెరుపు) కాంతి రూపము. ధూమము లేని అగ్ని రూపము.

త్రిస్రోమాత్రాః తథా జ్ఞేయః సోమసూర్య అగ్ని రూపిణః।
సూర్య - చంద్ర - అగ్నిల మూడిటిలో గల తేజోరూపమే - ‘అ - ఉ - మ’ త్రిమాత్రలలోని జ్ఞేయవస్తువు.

(4). అర్ధమాత్ర : ‘అ’కార ‘ఉ’కార ‘మ’కారముల అంత్యరూపము. దీపంజ్యోతి స్వరూపము. అర్ధమాత్ర = దీపము యొక్క శిఖా (చివరి) సంకాశము (ప్రకాశము), జ్వాలారూపము. అది ప్రణవమునకు ఉపరిస్థానము నందు (మ్‌మ్…మ్ రూపముగా) ఉన్నట్టిది.

→ తామరకాడలోని దారము వలె ఆ ప్రణవ-శిఖ (అర్ధమాత్ర) అతి సూక్ష్మమైనది
→ అది సూర్యతేజో సమమే కాకుండా సూర్యమండలమును భేదించి, అధిగమించినదై ఉన్నట్టిది. సూర్య- చంద్ర - అగ్ని మండల జ్యోతిని దాటివేసిన తత్త్వము.

అ-ఉ-మ-అర్ధమాత్రలను దేహములోని నాడీ స్థానపరంగా చెప్పుకొంటున్నప్పుడు:

⌘ దేహములో కంద (పొట్టవిభాగము క్రింద నుండి) మూర్ధ్నీ (శిరస్సు) ప్రదేశము (ముఖముయొక్క శిఖర ప్రదేశము వరకు) 72000 నాడుల విస్తారము - ఇవన్నీ మొదటి మూడు మాత్రలగు ‘అ-ఉ-మ’ తేజోస్థానము.
⌘ ఇక 4వదగు అర్ధమాత్ర మూర్ధ్నీ (శిరస్సు) ప్రదేశము నుండి శిరో ఉపరిభాగము వరకు విస్తరించి ఉండునట్టి ఇంద్రియ దేవతలను (ఇంద్రియ తత్త్వములను) అధిగమించినట్టి అర్ధమాత్ర స్థానము.

‘‘ఓం’’ ‘‘అర్ధమాత్ర’’ అగు ఆత్మ వరద సర్వభూతానామ్ : సర్వభూతజాలమునకు వరదప్రదాత! ఇంద్రియములకు శక్తి ప్రసాదించుచున్నట్టిది.

సర్వవ్యాపి : అర్ధమాత్ర తేజోవిశేషమే అంతటా, అన్నీగా వ్యాపించిఉన్న తత్త్వము.

(5). మాత్రా లయస్థానము (5వది): బిందుస్థానమునందు ‘‘అ-ఉ-మ-అర్ధమాత్ర’’లగు ‘‘ఓం’’.. నందలి ‘మ్’ లయించినప్పటి స్థానము, ఎచ్చట శబ్దము నిశ్శబ్దమై అశబ్దమగుచున్నదో…, అదియే జగత్ లయస్థానమగు పరబ్రహ్మము’’. అట్టి పరబ్రహ్మమునందు సృష్టి సంబంధమైన సర్వ భావనలను (బ్రహ్మను) లీనము చేసినవాడు→ ‘‘అమృతత్వము’’ (మార్పు-చేర్పులకు అతీతమైన స్థానము)ను చేరుచున్నవాడు, సిద్ధించుకొనువాడు - అగుచున్నాడు.

జీవుడు - జీవము

‘‘జీవము (The living Factor)’’ అనునది ‘3’ సంజ్ఞికలు (Indications) కలిగియున్నది. (1) వాయువు (Movement) (2) ప్రాణము (Energy) (3) ఆకాశము (Space)

స (జీవః ప్రాణ ఇత్యుక్తో వాతాగ్రశత కల్పితః వాయు- కేశాగ్రము (Extreme edges) యొక్క ‘100’ కలయికలచే కల్పించబడిన ప్రాణ స్వరూపుడే ఈ జీవుడు (లేక) ప్రాణి. (వాయుదేవుడు దేహములో శత - నాడులుగా అంతటా విస్తరించియున్నారు.)

ఆ విధంగా వాయు-ప్రాణ-ఆకాశముల శతాంశలచే కల్పించబడిన ఈ భౌతికదేహము యొక్క నాభి (బొడ్డు) స్థానము నందు దివ్యమగు జీవచైతన్యము వెలయుచున్నది. అట్టి జీవచైతన్యము విశ్వాత్మకమైనది. శుద్ధసత్త్వము. నిత్య నిర్మలము. సమస్తమునకు ఉనికి స్థానము. ఆదిత్య తేజస్సువలె సర్వదా స్వయం ప్రకాశమై, తనకిరణములు అన్ని వైపులా ప్రసరించుచుండగా, సర్వమును తేజోవంతము చేయునది. సర్వదా సంప్రదర్శనము అయిఉన్నది.

ఆ తీరుగానే - నాభి మండలాకాశము ఆత్మ తేజస్సుతో స్వయంప్రకాశమానమై యున్నది. అట్టి జీవచైతన్యమే స్ఫూర్తి (Inclination) రూపంగా శరీరములోని అణువణువునూ ఉత్తేజితము, కార్యసమర్థము చేయుచున్నది. జీవచైతన్యమే సర్వమును మంగళప్రదము చేయుచూ సృష్టియందు అంతటా ప్రవర్థిల్లుచున్నది. ప్రవర్తిల్లుచున్నది.

అజపా జపము

‘స’కారం చ ‘హ’కారంచ జీవో జపతి సర్వదా! → ఈ జీవుడు ఎల్లవేళల (1) ‘‘స’’ (‘సో’-గాలి పీల్చటం) (2) ‘‘హ’’ (‘హమ్’ గాలి వదలటం).. అనురెండు ప్రక్రియలు - అసంకల్పితంగా నిర్వర్తిస్తున్నాడు. ఈ రెండూ కూడా నాభిరంధ్రము నుండే బయలుదేరుచున్నాయి. ఇంద్రియములను అవి ఉత్తేజపరచి ఉజ్జీవింపజేస్తున్నాయి. అవి ఇంద్రియ-విషయ సంబంధమైనవికావు. విషయవ్యాప్తి వర్జితం! మనస్సుకు విషయ సామర్థ్యమును ప్రసాదించు శక్తిరూపములు.

అట్టి ‘‘సోఽహమ్’’ రూపమగు ‘స-హ’ స్ఫూర్తికి ‘కారణము’ ఏది? అందుకు సమాధానము ‘‘పంచప్రాణాయామములతో కూడిన ఆత్మయే!’’

అట్టి ‘‘స-హ’’ (సోఽహమ్) → ఈ శరీరము నందు పక్షి (హంస)గా జీవాత్మ అవిశ్రాంతంగా తిరుగాడుచూనే ఉంటోంది.

అట్టి ‘స-హమ్’ను గమనిస్తూ, వాటికి ‘సాక్షిత్వ’ అభ్యాసముచే - ఈ జీవుడు నిష్కళుడు(విషయాతీతుడు) అయి ఉండగలడు.

అట్టి నిష్కళమగు ‘స-హమ్’ (హంసోహమ్) (Inward Air pull and outward push) ను ధ్యానపూర్వకంగా సేవించుచూ ఉండగా, అట్టి యోగి సర్వ-సంసార భావముల నుండి విముక్తి పొందగలడు.

హంస

స్వప్రకాశమగు చిదానందరూప ‘ఆత్మ’నే ‘హంస’ అను శబ్దముతో కూడా చెప్పుచున్నారు.

ఉత్తమ బుద్ధి కలవాడు - (సుధీః)…,
⌘ రేచకము, పూరకములను దాటివేసి,
⌘ ‘కుంభకము’ నందు సంస్థితుడై, స్వాభావిక కుంభకమును (మనో-బుద్ధి కుంభకమును) ఆశ్రయించువాడై,
⌘ నాభి ప్రదేశములో గల ‘కందము’ నందు ప్రాణ-అపానములను సమస్థితింపజేసి, సమాహితం చేసి…,
⌘ ధ్యాసను సాదరముగా మస్తకము వరకు నడిపించి, ధ్యానము ద్వారా నిలిపి ఉంచి,
⌘ మస్తక (fore face) ఆకాశము నందు మార్పు-చేర్పులచే స్పృశించబడజాలని అమృత-ఆనంద ఆత్మ రూపమును (స్వకీయ అక్షర పరబ్రహ్మస్వరూపానందమును) బుద్ధితో స్వీకరించుచున్నవాడై, ఉపాసనాపూర్వకంగాను, ఉత్సాహంగాను చూచుచున్నవాడై,
⌘ నాభి (బొడ్డు) మధ్య గల ఆకాశము నందు పొగలేని దీపము (Light)గా జ్వలించుచున్న ప్రకాశించుచున్న మహాదేవుని ‘హంసహంసేతి’ మహా జపము స్మరిస్తూ అమృతముతో అభిషేకించు యోగాభ్యాసి అయి,
జరామరణ రోగముల నుండి మొదలంట్ల విముక్తుడు అగుచున్నాడు.

ఈ విధంగా రేచక పూర్వక ముక్తుడై (అవి రెండూ అవసరం లేకుండానే) - కుంభక స్థితిని అనుసంధానం చేస్తూ మస్తకము నందు జనించుచున్న అమృతమును గ్రోలుచు, నాభి మధ్యలో సంప్రకాశకుడగు మహాదేవుని అమృతాభిషిక్తునిగా ‘‘హంస హంస’’ మంత్రస్మరణ పూర్వకంగా ప్రతిరోజు నిర్వర్తించు యోగాభ్యాసముచే - అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య, ఇచ్ఛాది అష్టసిద్ధులు సిద్ధించగలవు. వాటిని కూడా దాటివేస్తూ సదా-అభ్యాస రతుడైన వాడు ‘ఈశ్వరత్వము’ పొందుచున్నాడు. క్రమంగా పరమేశ్వరత్వమును పుణికిపుచ్చుకుంటున్నాడు. (అమృతము = మార్పుకు విషయమేకానట్టి కేవలమగు స్వస్వరూపము).

అనేక మంది అనేక మార్గములలో ‘నిత్యత్వము’ అను స్థానమును పొందటం జరుగుతూ ఉన్నది. అయితే, అట్టి నిత్యత్వసిద్ధికి (పైన చెప్పుకున్న) ‘‘హంస విద్యామృతము’’ వలె ఉత్తమమైనది మరింకొక్కటేదీ లేదు - అని యోగవేత్తల అభిప్రాయము.
గురుశుశ్రూష - తస్య దాస్యం సదా కుర్యాత్ - ప్రజ్ఞయా పరయా సహ।

ఏ గురువైతే శిష్యునకు మనము వివరించుకొనుచున్న ‘‘పరమేశ్వర సంబంధమైన ప్రాణచిత్త నియామకమైన యోగ మహావిద్య’’ను యోగాభ్యాస పూర్వకంగా ప్రసాదిస్తారో, అట్టి గురువు సేవాపూర్వకంగా, బుద్ధి పూర్వకంగా సర్వదా సేవించుటకు అర్హులు. ఆరాధ్య దైవసమానులు. ‘తత్ త్వమ్’ అని స్వస్వరూప-అఖండ-కేవలాత్మత్వమును గుర్తుచేయు సద్గురువుకు నమస్కారము.
శుభం వా - శుభమన్యత్‌ వా యత్ ఉక్తుం గురుణా భువి।।

గురువు ఏది ఎట్లు చేయమని చెప్పితే అది (మనకు వర్తమానంలో మంచిదని అనిపించినా (లేక) అనిపించకపోయినా కూడా) - శుభప్రదమే! అది తప్పక మంచిదే అవుతుంది. గురువు చెప్పినది ఏదైతే, ఆ మార్గమును - ఇక వెనుక మందులు ఆలోచించకుండా - తత్ కుర్యాత్ అవిచారేణ శిష్యః సంతోష సంయుతః - శిష్యుడు సంతోష - ఉత్సాహములతో ఆచరించటం సముచితము, శుభప్రదము. శ్రేయోదాయకము. శోభప్రదము.

గురు శుశ్రూషతో ఈ → కుంభక సమేత ‘‘మస్తకామృత- నాభి ప్రదేశ మహాదేవ’’ తేజోపూర్వక - ‘హంస-హంస’ మంత్రము సమేతంగా పరబ్రహ్మము అమృత భావనతో మహాభిషేకించు విద్య ను గురువు నుండి తెలుసుకోవాలి. నిత్యము అభ్యసించాలి. అనుష్ఠించాలి.

క్రమంగా…,
అట్టివాడు, ఆత్మానమ్ ఆత్మనా సాక్షాత్ ‘బ్రహ్మ’ బుద్ధ్వా సునిశ్చలమ్। ఆత్మచేతనే ఆత్మను (About the ‘SELF’ with the help of one’s own SELF) ‘సాక్షాత్ బ్రహ్మమే’ అని సునిశ్చతముగా (sans any Distraction) తెలుసుకొనుచున్నాడు.

→ ఇక ఆపై

దేహ జాత్యాది సంబంధా వర్ణ ఆశ్రమ సమన్వితాన్,
వేద శాస్త్రాని చ అన్యాని పాదపాంసుమివ త్యజేత్।।

అట్టి సాధన యొక్క క్రమక్రమ సిద్ధి చేత దేహ భేదములు (The Genders), దేహ సంబంధ-బాంధవ్య భేదములు (Differences by virtue of relationships), వర్ణ భేదములు, బ్రహ్మచారి - గృహస్థ- వానప్రస్థ - సన్న్యాస ఆశ్రమ భేదములు, ఇంకా తెలియబడుచున్న దానిలో ఆయా అనేక భేద విశేషములు, వేద - శాస్త్ర పాండిత్యాది విశేషాలు, సకల భేదదృష్టులు కూడా - ఇంటిలోకి వస్తున్నప్పుడు కాళ్లకు అంటిన బురదను నీళ్ళతో కడిగి వేసుకొనుతీరుగా - …. బాహ్యముననే వదలివేయుచున్నాడు! అంతర్-దృష్టిచే సర్వత్రా సర్వదా ఏకము, అఖండము అగు ఆత్మనే దర్శిస్తున్నాడు.

ప్రియగౌతమా! కాలికి అంటిన బురదను పొట్లం కట్టి ఇంట్లోకి తీసుకు వెళ్తామా? లేదు కదా! కాళ్ళు కడుగుకొని పాదధూళిని వదలివేసి ఇంటిలోకి వెళ్లుచున్నావు కదా! ఆ విధంగా -‘తత్‌త్వమ్’ను సిద్ధాంతీకరించి చెప్పుచున్న సద్గురువును (బాహ్యవిషయాలు బాహ్యముననే త్యజించి) అప్పుడు సమీపించాలి.

‘తత్ త్వమ్’ అని నిరూపించి చెప్పు గురుదేవులవద్ద ప్రాపంచిక-లౌకిక భేద వాదోపవాదములు ప్రతిపాదించకూడదు.

పరమేశ్వర సంబంధమైన యోగవిద్య అగు ‘హంస హంస’ (సోఽహమ్ విద్య) కొరకై గురువును శరణు వేడవలసిందే!

గురుభక్తిం సదా కుర్యాత్ శ్రేయసే భూయసే నరః।
స్వీయ శ్రేయస్సు కొరకై యోగసాధకుడగు ముముక్షువు గురుభక్తిని ఎల్లప్పుడు కలిగి ఉండాలి.

గురురేవ హరిః సాక్షాత్, న అన్యత్ ఇతి బ్రవీత్ శ్రుతిః।
‘గురువు సాక్షాత్ హరియే’ అవి శ్రుతులు ఎలుగెత్తి చెప్పుచూ గుర్తు చేస్తున్నాయి. శ్రుతి ఏది చెప్పుచున్నదో, అది పరమార్థమే! ఇందులో అనుమానమే (సంశయమే) లేదు. శ్రుతులు దేనిని ‘కాదు’ అని నిషిద్ధముగా చెప్పుచున్నాయో, అది ప్రమాణమే కాదు (Whatever sruthis declare as “Don’t” accordingly follow as ‘Don’t’) - ప్రమాణము కానిది అనర్థమే మరి!

ఈ జీవునిపట్ల రెండు ప్రమాణములు

👉 దేహము కలవాడు సకళుడు (కళాసమన్వితుడు) - దేహభావముతో కూడిన ‘‘దేహి’’.
👉 దేహమే లేనివాడు నిష్కళుడు - దేహభావతీత-కేవలచేతనుడగు ‘‘దేహి’’.

ఆత్మయొక్క తత్త్వోపదేశమును వదలి, సద్గురువు యొక్క ‘‘తత్త్వమ్ - సోఽహమ్-ఇదమ్ తత్ అనన్యమ్’’ - ల పరమార్థమును తనకు అనన్యమైనదిగా - గురువు బోధించే పరమార్థమును ఆశ్రయించకుండా మరెక్కడో ‘‘అన్యము’’ నందు వెతికి ఏమి ప్రయోజనం? ‘‘హంస’’ యోగాధారణ తనగురించే అయి ఉండి కూడా, - సోఽహమ్‌ను వదలి మరెక్కడికి వెళ్లి ఏమి పొందాలి? ‘పరమాత్మ నాకు అన్యుడు’ అనే జాడ్యమును వదలకుండా పరమాత్మ గురించి ఎంత వెతికినా కూడా పరమాత్మ లభించడు. ఆయన సర్వదా శ్రోతకు హృదయేశ్వరుడే.

‘హంస హంస’ జపముగా స్వీకరించి, నాభి మధ్యలో దేనిని మస్తకామృతముతో యోగాభ్యాసి అభిషేకిస్తున్నాడో,.. ‘హంస’ను సిద్ధింపచేసుకుంటున్నాడో…, అట్టి హంస అనగా ఏది? ఎట్టిది?

ఆప్త ఉపదేశ గమ్యౌ, అసౌ సర్వతః సమవత్ స్థితః,
హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ ‘‘హరిః శివః’’।

బ్రహ్మజ్ఞులగు సద్గురువుల ఆప్త-ఉపదేశములన్నీ కూడా-సర్వత్ర - సమస్వరూపమైన ‘హంస’ను సూచిస్తున్నాయి? హంస అనగా - హరియే! హంస అనగా శివుడే! సర్వత్ర ముఖములు గల సర్వతోముఖుడే! ఆత్మయే ‘హంస’ స్వరూపము. గురుముఖతః తెలియవచ్చునదే ఆత్మ (లేక) ‘హంస’ స్వరూపము.

అట్టి హంస.. (లేక ఆత్మ) →
తిలేషు చ యథా తైలం। → తిలలలో తైలం ఉన్నట్లు,
పుష్పే గంథా ఇవ ఆశ్రితః। → పుష్పములలో గంధం (సువాసన) ఉన్నట్లు.

ఈ జీవుని బాహ్య - అంతరములలో సంప్రకాశమానమై ఉన్నది. నిత్యోదితమై ఉన్నది. ఈ జీవునికి అనుభవమగుచున్న అన్యమైనదంతా,…. ఈతని అనన్యాత్మ చేతనే పూర్ణముగా నిండినదై ఉన్నది.

ఆత్మానుభవము - సాధనలు

అట్టి ఆత్మ ‘హంస’ ఇత్యాది యోగ సాధనల వలన, జ్ఞాన సముపార్జనకు సంబంధించిన సమచారముల వలన ఈ జీవునికి ‘తన యందేగల ఆత్మ ఇక్కడే, ఇప్పుడే సిద్ధించగలదు. ఎందుకంటే, ‘ఆత్మ-పరమాత్మ, హంస-హంస’ మొదలైన శబ్దములచే ఉద్దేశ్యముగా శాస్త్రములచే, ఆత్మజ్ఞులచే, యోగ గురువులచే, సద్గురువులచే వివరించి చెప్పబడేది దేనిగురించి?
కేవలము, సమస్తము అగు స్వస్వరూపము గురించియే!

ఆత్మ సర్వకాల-సర్వావస్థల యందు ఆ శ్రోత యొక్క స్వస్వరూప-అభిన్నంగా సిద్ధించియే ఉన్నట్టిది, మరి పరమాత్మ ‘‘అన్యమైనది’’ ఎట్లా అవుతుంది? అవదు. అవటానికే వీలు లేదు.

యోగ సాధనలతో బుద్ధి ఏకాగ్రము అగుచున్నది. ఏకాగ్రమగు బుద్ధిచే ఆత్మజ్ఞానము ప్రవృద్ధమగుచున్నది.

తనను గురించిన (స్వస్వరూపము గురించిన) గురుబోధయే ఆత్మజ్ఞాన సమాచారము. ఆత్మజ్ఞాన సమాచారముచే ఈ ముముక్షువు బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త అగుచున్నాడు. మంచిది అయితే, అంతటితో సరి పోయిందా? లేదు. ‘‘అనన్యమగు బ్రహ్మమే నేను కదా’’ - అను అకృత్రిమ, అకారణ అనునిత్య స్వకీయానుభవమునకు చేరాలి. (లేక) జ్ఞేయమును సిద్ధించుకోవాలి. అటుతరువాత, జ్ఞానము (జ్ఞాన విశ్లేషణలు, జ్ఞానసాధనలు, యోగ ప్రక్రియలు మొదలైనవి) స్వభావ సిద్ధంగానే త్యజించబడతాయి.

ఉల్కా హస్తో యథా లోకే ద్రవ్యమ్ ఆలోక్యతామ్ త్యజేత్।
చీకటి గదిలో దీపము సహాయంతో కావలసిన వస్తువు కనిపించి, అద్దానిని స్వీకరించి వెలుతురులోకి వచ్చిన తరువాత. ఇక అంతటా సూర్యకాంతి లభించుచుండగా చేతిలో దీపము ధరించవలసిన పనేముంటుంది? సాధనలు, జ్ఞాన విశ్లేషణలు అటువంటివే! జ్ఞానేన జ్ఞేయమ్ ఆలోక్య, పశ్చాత్ జ్ఞానమ్ పరిత్యజేత్। జ్ఞానముతో జ్ఞేయమును సిద్ధించుకొని ఇక జ్ఞానము దివిటీవలె వదలివేయాలి.

సకల యోగ సాధనాక్రమములు, జ్ఞాన విశ్లేషణా సమాచారములు ‘పుష్పము వంటిది’ అని అనుకుంటే,…. ఆత్మజ్ఞానముచే సిద్ధించు జ్ఞేయమగు స్వయమ్ హంసానుభవము (స్వయమాత్మానుభవము) → (నిష్కళుడగు, ఆత్మస్వరూపుడగు) ఈ జీవునికి సాధన పుష్పముల ‘‘గంథము’’ వంటిది. ఒకడు పుష్పగంధమును పీల్చుతాడుగాని, పుష్పమును కాదు కదా!

జగత్తు-జీవాత్మ-జగదనుభవం

ఈ జీవునికి ఎదురుగా ఘనీభూతమైనట్లుగా ఏర్పడినవై తారసబడుచున్న ఈ జగత్తు, ఈ జగదనుభవములు - వీటిని ఏ రీతిగా సమన్వయించుకొని ఉండాలి? చెప్పుకుందాము.

వృక్షస్య సకలం విద్యాత్ → ఈ దృశ్యమాన జగత్తు (All that being experienced) భావన - వృక్షము వంటిది.

ఛాయా తస్యతు నిష్కళా → కేవలాత్ముడగు (నిష్కళుడగు) జీవునికి (As an Experiencer) ఈ జగత్తు యొక్క భావన ఛాయ (Shadow) వంటిది.

వృక్షము యొక్క ఛాయ నుండి ఫలములు లభిస్తాయా? లేదు.

ద్రష్టయొక్క కల్పనయే అయి ఉన్న ఈ జగత్తు - కేవలస్వరూపుడగు / దృక్ స్వరూపుడగు ద్రష్టకు - ‘వినోదము’ వంటిది మాత్రమే!

నిష్కళః సకళోభావః - భావములకు ముందే ఉన్నట్టి ఈ జీవుడు (Perceiver prior to perceptions) - భావములను కల్పించుకొని ఆస్వాదించువాడు. అనగా భావములకు మునుముందే భావనారాయణ స్వరూపుడై వెలుగొందుచున్నాడు. అట్టి నిష్కళుని (భావనలకు ముందే ఉన్న భావికుని) కళా ప్రదార్శనములే భావములు. భావములు కలిగి ఉన్నప్పుడు ‘సకళుడు’ అగుచున్నాడు. భావనలు ఇంకనూ ఆశ్రయించనప్పుడు ‘నిష్కళుడు’గా ఉంటున్నాడు. నిష్కళుడు=కేవలుడు; సకళుడు= భావములతో కూడి ఉన్నట్టి కేవలుడు.

సర్వత్రైవ అవస్థితః : భావములకు మునుముందే ఉన్నట్టి నిష్కళుడు (లేక) కేవలుడు తన భావనా సామ్రాజ్యమునందు అంతటా విస్తరించి ఉన్నట్లు , భావకుని (ఈ జీవుని) భావనా కళయే ఆతని స్వానుభావమగు దృశ్యమంతా అవస్థితమై యున్నది. నిండి ఉన్నది.

ఏకమాత్ర=‘అ’ కారము     జాగ్రత్ అనుభవం
ద్వి మాత్ర= ‘ఉ’ కారము     స్వప్నానుభవం
త్రి మాత్ర= ‘మ’ కారము     సుషుప్త్యానుభవం

వీటిలో జీవుడు-నీవు-నేను-నీది-నాది-జ్ఞాని-అజ్ఞాని ఇత్యాది భేదములు అగుపిస్తున్నాయి.

అట్టి ‘అ’ కార ‘ఉ’ కార ‘మ’ కారములకు ఆవల ‘మ్’ రూపమగు అర్ధమాత్ర ‘‘మ్‌మ్’’ నాద రూపంగా పలుకబడుచున్నది. అది జాగ్రత్- స్వప్న - సుషుప్తులకు వేరై ఉన్నది. కనుక ‘‘పరము- (That which is beyond the sensory world with its three phases)".. అని చెప్పబడుచున్నది. (‘‘(చ)తురీయము’’ - అని కూడా అనబడుచున్నది).

‘‘నిష్కళము’’ - అనునది → అది నాటకములో ఒకడు నటించు పాత్రకు వేరై ఉన్న ఆతని వ్యక్తిగతమగు నటనా చాతుర్యము (His Art of Acting) వంటిది. పాత్రకు సంబంధించిన హావ భావములు, నవరసములు, పాత్రకు చెందిన తదితర పాత్రలతో ఆ నాటకములో కనిపించే సంబంధ, అనుబంధ, బాంధవ్యములు, పరస్పరంగా ఆ నాటకంలో కనిపించే కష్టసుఖములు - ఇవన్నీ ఆ నటుని యొక్క ‘‘నటనాకళ’’ను లేకుండా చేస్తాయా? లేదు కదా.

అట్లాగే ఇక్కడి జాగ్రత్ స్వప్న సుషుప్త విశేషములు, ఇక్కడి పరస్పర సంబంధములు, అనుబంధములు మొదలైనవన్నీ ఈ జీవుని పరస్వరూపములో ఉన్న విశేషములు కావు. ఈ జీవుని పరస్వరూపమును అవి స్పృశించవు. పరము అనగా (ఆవల ఉన్న) స్వస్వరూపాత్మ సర్వదా యథాతథము. జీవించి ఉన్నప్పటి పరస్పర సంబంధ - అనుబంధములు- దేహానంతరము- ఏమగుచున్నాయి? ‘‘గడచిపోయిన స్వప్నములోని విశేషములు’’ వంటివి మాత్రమే అగుచున్నాయి.

పరాత్ పరము

‘పరము’నకు ఆవల పరాత్-పరము.

నటనాకళకు ఆవల, తత్ కళా స్వరూపుడు (కళ తనదైనవాడు) అగు కేవలాత్మ స్వరూపము ఉన్నది. అట్టి రూపము పరమునకే పరము. తురీయమునకు కూడా సాక్షి. సర్వ నియామకము। విషయములచే అస్పృశ్యము కూడా! కనుక - తురీయాతీతము.

అట్టి కేవల ‘సోఽహమ్’ (లేక) హంస విషయ రహితమైనప్పుడు → నిష్కళుడు.

విషయ సహితమై ఉన్నప్పుడో → సకళుడు.

అట్టి పరాత్పరుడే…., బహురూపుడై ప్రదర్శితుడగుచున్నాడు. (యోగులు ఉపాసించు విధము)

బ్రహ్మణో హృదయం స్థానం → హృదయములో సృష్టికర్తృత్వాభిమాని అగు ‘‘బ్రహ్మ’’గా ఉన్నారు. (One who is inclined to create)

కంఠే విష్ణుః సమాశ్రితః → కంఠములో స్థిత్యభిమానియగు విష్ణువుగా సమాశ్రితులై ఉన్నారు. (One who is inclined to maintain)

తాలు మధ్యే స్థితో రుద్రో → దవడ మధ్యగల ఆకాశంలో రుద్రరూపుడుగా సంసిద్ధిడై ఉన్నారు. (One who is inclined to withdraw)

లలాటస్థో మహేశ్వరః → లలాట (ఫాల) భాగంలో (In the space of Foreface) మహేశ్వరులై (జగత్ అనుభవికే నియామకులై) ఉంటున్నారు. (One who is appointing the experiencer).

నాసాగ్రే అచ్యుతం విద్యాత్ → ముక్కుకు అగ్రభాగ - ఆకాశంలో స్వస్వరూపమునుండి చ్యుతియే లేనట్టి ‘అచ్యుతుడు’ (ఆత్మాఽహమ్ అభిమాని)గా వేంచేసి ఉన్నారు. (One who is as one’s own obsolute self undistractedly).

తస్యాంతే తు పరంపదమ్ - నాసికాగ్ర భాగమునకు ఆవల బ్రహ్మరంధ్రమును స్పృశిస్తూ, ఫాల భాగమును అధిగమించి (‘12’ అంగళముల వరకు విస్తరించి యున్న ద్వాదశాంగుళాంతము వరకు) పరాత్పరుడు, పరమపద స్థానముగా వేంచేసియున్నాడు. (One who is enjoying himself as all else)

పరత్వాత్తు పరం నాస్తి। పరాత్పరుని యందే దేహముల రాక పోకలు దృశ్యములు, బ్రహ్మాండములు, జాగ్రత్- స్వప్న- సుషుప్తులు, దేహిలు మొదలైనవన్నీ జలంలో తరంగాలవలె ఉత్పత్తి- స్థితి- లయములు పొందుచున్నాయి. అట్టి ‘పరాత్పరము’ నకు ఆవల మరింకొకటేదీ లేదు. మరింకేమిలేదు. అట్టి పరాత్పరత్వము ఈ జీవుని సహజ-అనునిత్య స్వరూపము అయి ఉన్నది.

ఇత్యేవం శాస్త్రేషు నిర్ణయః। ఇది ఆత్మజ్ఞుల స్వానుభవ ప్రవచితములగు శాస్త్రములచే సునిర్ణయమైయున్నది.

అట్టి స్వస్వరూపుడు, సర్వస్వరూపుడు అగు పరమాత్మ (లేక) పరాత్పరుడు వేంచేసియున్న స్థానము ఏది?

అట్టి స్వస్వరూప పరాత్ పరుడు దేహమును అధిగమించిన వాడై ఉన్నారు. దేహము, దృశ్యము కూడా అట్టి మనయొక్క స్వాభావికమగు ‘‘పరాత్పర స్వరూపం’’లో ఉన్నది. అంతేగాని ఆ మనయొక్క తత్ పరాత్పరము - దేహముచేత గాని , దృశ్యముచేత గాని పరిమితమై లేవు.

దేహాతీతం తు తమ్ విద్యాత్ నాసాగ్రే ద్వాదశాంగుళమ్। నాసికకు ఉపరితలస్థానము నుండి 12 అంగుళములు ఊర్ధ్వంగా (బ్రహ్మరంధ్రమును దాటి) - సహస్రారస్థానము వరకు) విస్తరించి ఉన్న ‘‘దహరాకాశము’’ నందు ఆ పరాత్పరుని ఉనికిని గమనించాలి.

తత్రస్థం వ్యాపయేత్ ప్రభుః। అట్టి ద్వాదశాంగుళ స్థానము నుండి ఆ ప్రభువు సర్వే సర్వత్రా (విశ్వమంతా), విశ్వముగాను వ్యాపించి ఉన్నారు. విశ్వేశ్వరుడై, విశ్వరూపుడై ప్రకాశించుచున్నారు.

ఈ మనస్సు ఒక (బాహ్యమైన) చోటికి ప్రసరించి ఉండవచ్చుగాక. దృష్టి ఇంకొక (బాహ్య) స్థానము నందు చేరుచుండవచ్చుగాక! అయినప్పటికీ ఆత్మయోగము సిద్ధించుకొనుచున్న యోగి యొక్క ‘‘పరాత్పర్వతము’’తో యోగము విచ్ఛిన్నం కాదు. ఆత్మ భావన, ఆత్మాఽహమ్ అనుభవముతో అవిచ్ఛిన్నంగా కొనసాగగలదు. (పుంఖానుపుంఖ విషయ అనుక్షణ తత్పరోఽపి, బ్రహ్మఽవలోక ధిషణమ్ న జహాతి యోగీ) ఆత్మయొక్క సంస్థితికి, మనో- బుద్ధి- దృష్టుల చర్యలకు - సంబంధమేలేదు. ఆత్మ సర్వదా నిశ్చలము. బంధరహితము. తదితరములన్నీ సందర్భ పరిమితము. సందర్భమునకు బద్ధము. చంచలము.

ఇది పరమ శుభప్రదమగు ‘‘పరమ రహస్యము’’. (గుహ్యతమము)

‘హంస’, ‘ఓం’, ‘సోఽహమ్’, ‘త్వమేవాహమ్’ ‘తత్ త్వమ్’ శబ్దముల, వాక్యముల పరమార్థమగు పరాత్పరునికి మించినదేదీ లేదు. అట్టిది శుద్ధజ్ఞానానంద స్వరూపము, ‘పరమాక్షరము’ → అని నిర్ణయించబడి, చెప్పబడుతోంది.

గుహ్యాత్ గుహ్యతమమ్ గోప్యమ్ - రహస్యములలో కెల్ల గొప్ప రహస్యము అగు సహజానంద స్వస్వరూపమే అయ్యది.

గ్రహణీయం ప్రయత్నతః! ఎంతటి, ఎటువంటి ప్రయత్నము చేసి అయినాసరే, ఈ జీవుడు అట్టి అఖండ - అద్వితీయ ఆత్మత్వమే- తనకు తానై పొందవలసినది. ఎందుకంటే అదియే పరాకాష్ఠసత్యము, పరమ శుభప్రదము కాబట్టి. అట్టి మనయొక్క ఆత్మస్వరూపము పట్ల నమ్మకమును పునరుద్ధరించటానికే ఉపనిషత్ వాఙ్మయము ప్రవచనమగుచున్నది.

⌘ ⌘ ⌘

ఇటువంటి ‘హంస హంస యోగము’నకు సంబంధించిన పరాకాష్ఠ బోధను - ‘కుమారుడే కదా?: అనియో, ‘‘శిష్యుడే కదా’’.. అని తలచియో అర్హత పరిశీలించకుండా ఇచ్చివేయరాదు.

పితృదేవుని గురువుగా భావించి తత్త్వజ్ఞానముకై శరణు వేడినప్పుడు మాత్రమే పుత్రునికి, గురుభక్తితో ప్రణిపాతుడైన శిష్యునికి - మాత్రమే ఈ ‘‘పరాత్పరోఽహమ్’’ పాఠ్యాంశమగు పరాకాష్ఠ - పరతత్త్వ శాస్త్ర విషయం బోధించాలి. ఇతరులకు ఇవ్వతగదు.

నేతరేభ్యః ప్రదాపయేత్। అర్హత పరిశీలించకుండా బోధిస్తే అది బూడిదలో పన్నీరు పోసినట్లే అవుతుంది.

దాతస్య నరకం యాతి, సిద్ధ్యతే న కదాచన! భక్తి, వైరాగ్యము, సాత్విక భావములు, గురుశుశ్రూష మొదలైనవి పరిశీలించకుండా ‘‘ఏమి బాగుంటుందిలే?’’ … అని తలచి పరస్పర మర్యాద కొరకై హంస యోగ విద్యను బోధించుటచే, ఆ బోధించువాడు నరకమును ఆహ్వానించువాడు అగుచున్నాడు.

శిష్యుడు గాని, రక్త సంబంధీకులగు పుత్రులు మొదలైనవారుగాని, - తనను ‘హంస విద్య’ కై అభ్యర్ధించుచూ, తగిన అర్హత కలిగి ఉంటే ఆ అభ్యర్థించినవానికి తప్పక బోధించాలి.

ఒకడు గృహస్థుడు కావచ్చు. బ్రహ్మచారి కావచ్చు. వానప్రస్థుడు కావచ్చు. భిక్షకుడు కావచ్చు. ఆతడు పరమాక్షరమగు ఆత్మ (లేక) బ్రహ్మము నందు ఆసక్తుడైతే, అట్టివాడు దేహపతనానంతరము కూడా ఆత్మానందము కొనసాగిస్తూ, సర్వశుభములు పొందుచున్నాడు.

ఈ ఉపనిషత్తులోని ఆత్మ విద్య(లేక) ‘హంసోఽహం’ విద్య ఎరిగినవాడు సర్వావస్థలందు శుభ-శాంతి- ఐశ్వర్య- ఆనందములు పొందగలడు. అట్టి వాడు బ్రహ్మహత్య- అశ్వమేధ యాగ నిర్వహణ మొదలైన ఆయా కార్యక్రమములలోగల ద్వంద్వములగు పాప-పుణ్యములచే స్పృశించబడని వాడై ఉంటాడు.

త్రివిధ-ఆచార్యులు

మనము చెప్పుకున్న ‘‘హంస - సోఽహమ్’’ ఆత్మ విద్యను శిష్యులకు బోధ చేయు ఆచార్యులు ‘3’ తీరులుగా ఉంటారు.

(1) చోదకుడు : వీరు అంతర్హృదయమైయున్న ఆత్మస్థానమునకు ‘దారి ఇది’ అని చూపుచూ ఉంటారు. మార్గాణ్వేషకులకు మార్గదర్శకులు. హంససాధనల ప్రాముఖ్యం గుర్తు చేస్తూ ఉంటారు. విధి-నిషేధములు అనుగ్రహిస్తూ ఉంటారు.

(2) బోధకుడు : ఆత్మ స్థానము వద్దకు ప్రోత్సాహపరుస్తూ, జగత్ స్వప్నత్వమును సుస్పష్టపరచుచూ ఉంటారు. ‘హంస’ విద్యకు ఈయన బోధకుడు.
- ఓం కారము యొక్క 4 మాత్రలు. శరీరములో అ కార-ఉ కార- మ కార- అర్ధమాత్రల సందర్శనము,
- ఓం కార శబ్ద లయ స్థానమగు పరాత్ పరము;
- ‘స-హ’ స్వభావసిద్ధ ప్రాణాయామము, సంప్రయత్నపూర్వక రేచక- పూరక-కుంభక- పునః రేచకములు;
- నాభి(బొడ్డు) కందకములో కుంభకంగా ప్రాణ అపానములను సమస్థితము చేయుట,
- మస్తకము నందు ధ్యాస వలన జనించిన అమృతానందరసముతో నాభియంది పొగలేని జ్యోతివలె వెలుగుచున్న మహాదేవుని అభిషేకించటము→
ఇవన్నీ శిష్యునికి సుస్పష్ట పరచుచూ, అభ్యసింపజేయుచుచూ ఉంటారు. వీరు యోగ-ఇత్యాది సాధన గురువులు.

(3). మోక్షదస్తుడు: వీరు - ‘‘నీకు బంధము మొదలే లేదు. ఎందుకంటే అఖండమగు ఆత్మయే సర్వదా స్వస్వరూపము. ఈ జగత్ - జీవాత్మనుభవములు - నీలోని కవి యొక్క కథా కల్పనా విశేషములే! కాబట్టి నీవు - జగత్తు కూడా స్వస్వరూపాత్మకు అభిన్నము, నీవు సర్వదా ఆత్మగా అద్వితీయుడవు. ద్వితీయమనునది మొదలే లేదు!’’- అని శిష్యునికి సద్గురువై ‘ఆత్మాఽహమ్’ ను సుబోధిస్తున్నారు.

మోక్షదస్తు పరంతత్త్వం, యత్ జ్ఞాత్వా పరమశ్నుతే। ఏది తెలుసుకొనుటచే పరతత్త్వము ఎరుగబడినదై ఆ శిష్యుడు పరాత్పరత్వము సంతరించుకో గలడో, … అట్టి పరమ సత్యము అగు కైవల్యమును - సద్గురువు శిష్యునకు కరతలామలకము చేయుచున్నారు. ఆ శిష్యుడు ఇక ఆపై అమృతత్వమును అనుక్షణికానుభూతముగా పొందుచున్నాడు.

ప్రత్యక్ష యజనము

ఓ ప్రియ ఆత్మానంద స్వరూపుడగు గౌతమా! తదితర ప్రియశ్రోతలారా!

ప్రత్యక్ష యజనం దేహే సంక్షేపాత్ శృణు, గౌతమా!
ఈ దేహమే యాగశాల. అట్టి ఈ దేహయాగశాల యందు ఏ ‘ప్రత్యక్ష యజనము’ అనే ఆత్మయజ్ఞమును మహనీయులగు తత్త్వవేత్తలు నిర్వర్తిస్తున్నారో, …అట్టి విశేషమును సంక్షిప్తంగా చెప్పుచున్నాను. వినండి!

తేన ఇష్ట్వా, స నరో యాతి శాశ్వతం పదమవ్యయమ్।
మనం చెప్పుకొనబోవు ‘శరీరాంతర్గత ఆత్మయజ్ఞము’ను తెలుసుకొనినంత మాత్రం చేతనే ఈ జీవుడు శాశ్వతము- అవ్యయము అగు పదమును (A state beyond any change factor) అధిరోహించగలడు. అనునిత్యము చేసుకొనగలడు.

ఈ భౌతిక దేహము ఒక పాంచభౌతికమైన ఉపకరణము. ఇది యోగ -ధ్యానముల కొరకై ‘‘పంచపాత్ర’’ (పాంచభౌతిక నిర్మితమైన పాత్రోపకరణము) అని అభివర్ణించబడుచున్నది. మరి ధ్యానము-యోగములో? ‘ఉద్ధరిణ’! (ఉద్ధరించగల సహకారి వస్తుజాలము) వంటివి.

ఆయనే ద్వే చ విషువే సదా పశ్యతి - ఎల్లప్పుడు రెండు విశేషముల పరస్పరాశ్రయములుగా - యోగవేత్తయగు మార్గాణ్వేషి(మార్గవిత్) గమనించుచున్నాడు.

(1) స్వీకరించుచున్నట్టిది (The Receiver) - సంజ్ఞగా → సూర్యుడు - కేవలాత్మ- (Experiencer Receiver)

(2) స్వీకరించబడుచున్నట్టిది (That being received) - గ్రహణము- ప్రకృతి- (All that being known; being experienced; being received; being felt)

ఈ రెండు విభాగములే (1) పరమాత్మ (2) జీవాత్మ + ఇంద్రియానుభవములు

    పరమాత్మ → సహజము.      జీవాత్మ → సందర్భము.

జీవాత్మ-జగత్తులు పరమాత్మ యొక్క స్వకీయ వినోద నిర్మితమగు అంశలే! ఈ రెండిటి ఏక-అఖండత్వములే (1) స (సో) (2) హమ్ (అహమ్)

ఇది - ‘‘హంస’’ మంత్రము యొక్క తాత్త్వికార్థము. అట్టి హంసయోగ -ధ్యానములను ఉపాసించాలి. అందుకు విధానము.

(1) కృత్వా‘యామం’- రేచక పూరక కుంభకానామ్ పూర్వం చ।

మునుముందుగా రేచక- పూరక-కుంభక-పునః రేచక (4) ప్రక్రియా విధులతో మనస్సును నిర్మలము - విస్తారముగాను, బుద్ధిని సునిశితముగాను చేసుకోవాలి.

(2) ఉభయమ్ ఉచ్ఛార్య హి అర్చయత్ యథాక్రమమ్।

యథాక్రమంగా సో - (గాలిపీల్చటం) - ‘హమ్’ (గాలిని వదలటం) అనే ప్రక్రియలు పాల్గొనుచున్న స (Uplifting) - హమ్ (Releasing) శబ్ద సమన్వితంగా కొంతసేపు, శబ్ద రహితంగా మరికొంతసేపు ఉచ్చారణాభ్యాసమును బుద్ధిపూర్వకంగా నిర్వర్తించాలి.

‘‘స : హ’’ - హం సో పాసన - హమ్ (నేను) సో (పర) స్వరూపుడను

వత్సా! గౌతమా!

[1] నమస్కార యోగము :

(1) న = పరస్వరూపుడనగు ‘నేను’ (2) మ = ఇహస్వరూపముగా జగత్-నాటకములో కనిపిస్తున్న పాత్రవంటి ‘‘నేను’’.

నమస్కారము = ఈ (1) & (2) నేనే అయిన ‘‘నేను’’। ఈ రెండూ నీవే అయిన ‘‘నీవు’’!
నమస్కారయోగము = ఆవల గల ‘‘నేను’’ + ఈవల (జగన్నాటకములో గల) నేను + నాదైన జగదనుభవము.

ఈ త్రిపుటిల ఏకత్వమే యోగము

(1) జగత్ దృశ్యములోని ‘‘నేను’’ మరియు ‘‘నీవు’’ - జాగ్రత్ జగత్ దృశ్యము - దర్శనము.
(2) స్వప్నములోని ‘‘నేను’’ - స్వప్నములోని ‘‘నీవు’’ - జగత్‌లోని నీవు - నీవు చూస్తున్న స్వప్న-జగత్ దృశ్యము - నీ స్వప్నములో కనబడు నేను - దర్శనము
(3) సుషుప్తిలోని ‘‘నేను’’ - సుషుప్తి అనుభవము - సుషుప్తిలోని మౌనము.

ఈ ఈ మూడిటిని ఏకత్వము చేసిచూడటమే నమస్కార యోగము.

[2] ముద్రాయోగము : చిన్ముద్ర :

చూపుడువ్రేలు రేఖగా చాచి = ఎదురుగా కంటికి కనిపిస్తున్న ‘నీవు’ + ‘నేను’
బొటనవేలు పైకి ధరించి = సర్వాత్మకుడైనట్టి ‘నీవు’ + నేను
ముద్ర = కలపటము (ఏకత్వ దర్శనం).

నాలోని నేనైన నీవే నేను - నీలోని నైనైన నేనే నీవు. నేను - నీవు కూడా అఖండాత్మ సంప్రదర్శనా చమత్కారమే!

ఈ రెండు గమన పూర్వక భావన (ధారణము) చేసి ఏకస్వరూపమగు అఖండమగు ఆత్మను ఉపాసించాలి. భావించాలి. ‘తన్మయము, తదేవాహమ్’నకై ప్రయత్నించి సిద్ధించుకోవాలి.

[3] సూర్యగ్రహణం :

సూర్య = ఆత్మ; గ్రహణం = ఆత్మను ఏమరిపిస్తున్న జగత్ భావన

గ్రహణం తొలగితే సూర్యుని స్వయం ప్రకాశము స్వయంగా సందర్శనగురీతిగా జీవాత్మ - జగత్ పరిమితభావనలను అధిగమించిన మరుక్షణము అఖండము - సర్వము - నిత్యము అగు ఆత్మ-స్వభావసిద్ధమై అనుభవమవగలదు. ఇది అభ్యసించటం - ‘ప్రత్యక్ష యజనము’గా చెప్పబడుచున్నది.

క్రమముక్తి : జీవాత్మగా యోగ జ్ఞానములను ఆశ్రయించి క్రమంగా ఆత్మస్వరూప సూర్యుడై వెలుగొందుచూ, ఈ సర్వము తనకు అభిన్నంగా, స్వభావసిద్ధదర్శనం సిద్ధించుకోవటము. (By practising step by step).

‘‘యోగజ్ఞాన - సమాయుక్తం’’

సాయుజ్యము : జ్ఞానాత్ సాయుజ్యమేవ ఉక్తం తోయే తోయం యథా తథా। నిర్మలమైన నీరు నిర్మలమైన నీరుతో కలిసిపోయినప్పుడు ఇక ఇతః పూర్వపు ‘‘వేరైన పాత్రలోని నీరు’’ అనే గుర్తింపు ఇంక శేషించదు కదా! అట్లాగే ఆత్మజ్ఞాని తన వ్యష్టిత్వమును పాము కుబుసము వలె త్యజించివేస్తున్నాడు. ఆ విధంగా… ఏతే గుణాః ప్రవర్తంతే యోగాభ్యాసకృత శ్రమైః।.. యోగాభ్యాసముచే ఆతని త్రిగుణములు విశ్వత్రిగుణములతో ఏకత్వము పొందినవగుచున్నాయి. సమష్టిత్వముతో మమేకమగుచున్నాయి.

ఈ జీవునికి దుఃఖములకు (For all worries) కారణము వ్యష్టిగతమైన త్రిగుణముల ఆశ్రయమే! ‘హంసయోగాభ్యాసము’చే ఆ యోగాభ్యాసి సర్వ దుఃఖముల నుండి బహిష్కృతుడై, గుణాతీతత్వము సంతరించుకోగలడు. ‘‘హంస (ఆత్మ)’’తో ధ్యానము (ఆత్మకు సంబంధించిన సందర్శన ధ్యాస) ను స్థితించుకోగలడు.

యోగ ధ్యానం సదా కృత్వా జ్ఞానం తన్మయితాం వ్రజేత్! యోగ అభ్యాసము - ధ్యానములను ఉపకరణములుగా వాడుకొనుచూ, జ్ఞానముచే ఆత్మతో అభిన్న రూపమగు ‘తన్మయిత్వము’ వైపు అడుగులు వేయుచున్నాడు. జ్ఞాన స్వరూపమగు ‘పరమహంస’ - (సోఽహమ్, తత్త్వమ్)- సదా మనసా, వాచా ఎలుగెత్తి గానం చేస్తూ అనుక్షణిక స్వానుభవముగా పుణికిపుచ్చుకొనునుచున్నాడు.

హంస-సంస్థానము

సర్వప్రాణుల దేహమధ్యగా (హృదయస్థానములో) ‘హంస’ సదా సంస్థితమైయున్నది.

ఆ హంస భగవానుడు అచ్యుతుడై వెలయుచున్నారు. ఆయనయే సర్వ జీవులలో పరమసత్యము.

ఆయన సర్వశక్తిమంతుడై వెలయుచున్నారు. ఆ హంసయే మహావాక్యముల సారభూతుడు. ఆయనయే వేదములచే ‘ఉత్తమ పురుషుడు’ (The first person - ఉత్తమ పురుష) అని వర్ణించబడుచున్నారు.

అట్టి హంస రూప ఆత్మభగవానుడే వేదనారాయణుడు! సర్వదేహములలో వేంచేసి, సంస్థితుడై, సర్వమును ఎరుగుచున్న ఎరుక (Knowing) స్వరూపుడు. (The knower of all else).

ఆ హంసయే (అఖండాత్మయే) పరోరుద్రుడు! పరాత్పరుడు! సర్వదేహములలో ప్రకాశమాడగు మహేశ్వరుడు!
→ పృథివి (భూమి/మట్టిగడ్డ) మొదలుకొని శివుని వరకు గల సర్వతత్త్వములు,
→ ‘అ’కారము నుండి ‘క్ష’ కారము వరకు గల సర్వవర్ణములు, సర్వశబ్దార్థములు..,
→ సర్వ దేహములలో ‘కూటస్థుడు’ అని చెప్పబడునది…,
కూటాంతమైనట్టి సప్తమాతృకలు - సర్వము.. హంసయే! ఆత్మతత్త్వమును ఉద్దేశ్యించనట్టి (మాతృకారహిత) మంత్రములు ఎక్కడా ఏవీ లేవు. అంతా ‘హంస’ లేక ‘ఆత్మ’ గురించియే! దేనితోనూ పొల్చజాలని హంసజ్యోతి - ఈ దేహి యొక్క దేహము మధ్యగా వెలుగుచూ ఉండుటచేతనే ఇది చైతన్యవంతమై ప్రవర్తమానమైనదగుచున్నది.

హంసజ్యోతి - జ్ఞానముద్రోపాసన

అట్టి దేహములో వేంచేసియున్న హంసజ్యోతిని ఈ జీవుడు ‘దక్షిణము’ (Towards the sensory scene)నకు అభి ముఖుడై బుద్ధిని నిలిపి ఉపాసిస్తూఉండటము-జ్ఞానముద్ర. అనగా, సాక్షిస్వరూపంగా జ్ఞానరూపమగు ‘చిన్ముద్ర’తో (యోగముచే) దృశ్యమును దర్శిస్తున్నాడు.

‘‘కనబడేదంతా ఆత్మకు అభిన్నము. ఆత్మయే’’ అను బుద్ధితో జగత్ దర్శనం చేయుచుండటము - ఇది దక్షిణాభిముఖము.

‘సర్వము బ్రహ్మమే’ అను ధ్యాన-సమాధిని అవధరించి ఉండటము - మొదలైనవన్నీ ‘హంసముద్ర’యొక్క ఉపాసనా క్రమములు.
‘సర్వము బ్రహ్మమే’ అను ధ్యాన-సమాధిని అవధిరించునుగాక!

అట్టి బుద్ధికి అనుభవమగు ‘హంసజ్యోతి’ →
- నిర్మల స్ఫటిక ఆకారము కలిగి ఉన్నట్టిది. దివ్యమగు (Devine) రూపము.
- హృదయ మధ్య ప్రదేశంలో జ్ఞానముద్రాత్మకమైనది.
- తన యొక్క విశ్వచైతన్య శక్తిచే సమస్తమును ఉత్తేజితము చేయుచున్నది. దేహములో (ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన) పంచప్రాణములను, (నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ) పంచ ఉప ప్రాణములను స్వకీయ క్రియా శక్తియుక్త సంప్రదర్శనముచే కార్యోన్ముఖము చేయుచున్నట్టిది.
- పంచజ్ఞానేంద్రియములలో (కళ్లు - చెవులు - ముక్కు - నాలుక - చర్మములతో) జ్ఞానశక్తి బలప్రదర్శనము కలిగి నిత్య- ఉద్యుక్తమై (Always Exhibitive) ఉంటోంది. పంచ కర్మేంద్రియములను కదల్చుచున్నట్టిది.
- అట్టి ‘హంస’ శక్తి - నాభిచక్రమునందు అగ్ని (పావకుడు)గా తేజోపూరితంగా వ్యవస్థితమై యున్నది.

సమస్త ధర్మములు నెరవేరుస్తున్న హంస జ్యోతిని నాభి-హృదయ-భ్రూమద్య ప్రదేశములలో కుంభకంగా సంకల్పించి ఉపాసించటము - హంసజ్యోతి యోగోపాసన.

యోగముద్ర - బంధముద్ర

నిర్వర్తించాలి.

ఇట్టి నాభి-హృదయ-భ్రూమధ్య స్థానములలో ‘‘సహజ కుంభకాభ్యాసము’’ నిర్వర్తించు యోగి క్రమముగా పరమాత్మస్వరూపుడై, సమస్తమును స్వకీయ-వినోద ప్రదర్శనముగా సందర్శిస్తూ ఆత్మ జ్ఞానానంద భరితుడై, ఆత్మస్వరూపుడై విరాజిల్లగలడు.

ఊర్ధ్వముఖ - కుండలినీ యోగము

నాడీ ప్రారంభ స్థానమగు కంఠమును సంకోచింపజేయాలి. ఏ శక్తిచే నాడుల పారంభమున కంఠము సంకోచింపజేయగలమో, ఆ శక్తిచేతనే జిహ్వ దవడను స్పృశింపజేయబడునదిగా ఊర్ధ్వముగా పీడింపబడినదిగా చేయాలి.

దీనిచే కుండలినీ శక్తి ఊర్ధ్వగామినిగా (One that gets pushed upward)..అగుచున్నది.

త్రికూటము     → త్రివిధము → గోలాకము  
‘నిఖరము’ అను  → త్రిశంఖము → వజ్రము  
ఓంకారము   → ఊర్ధ్వనాళము   →     భ్రూముఖము

ఈ త్రిపుటిలతో కూడిన కుండలినీశక్తి చాలనము పొందుచున్నది.

ఇట్టి ‘‘ఊర్ధ్వముఖ-కుండలినీ యోగ సాధన’’-చే కుండలినీశక్తి పంచ ప్రాణముల పరిమితత్వమును అధిగమించి శిరోఆకాశమున గల చంద్రమండలమును జేరుచున్నది.

సాధకుడు ‘వజ్ర కుంభోపాసన’తో నవ ద్వారములను (The ‘9’ External Gates of the Body) [2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు పుటములు, నోరు, గుదము, శిశ్నము] కుంభకముతో బంధించాలి. బుద్ధి-ప్రాణశక్తుల నిశ్చలత్వమును అభ్యసించాలి. విషయముల నుండి వాటిని వెనుకకు మరల్చాలి. నిరోధించాలి. ఈ విధమైన యోగసాధనచే మనస్సు - నిర్మలము, నిర్గుణము - అను పవనములను అధిష్టించగలదు.

అప్పుడు క్రమంగా బ్రహ్మ రంధ్రము నందు శంఖినీనాదము జనించుచూ, అమృతవర్షిణి అగుచున్నది. షట్‌చక్రమండలములు (మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞా చక్రస్థానములు) కుండలినీ ఊర్ధ్వగ్గమనముచే ఉత్తేజితములౌతాయి. వాటి యందు ఆత్మజ్ఞాన దీపం వెలుగొందగలవు.

సర్వభూత స్థితం దేవం సర్వేశం నిత్యమ్ అర్చయేత్।

సర్వేశ్వరుడు, స్వస్వరూపుడు అగు ఆత్మభగవానుడే సర్వజీవుల యందును, సర్వ జీవులుగాను, సర్వమునకు నియామకుడుగాను, సర్వమునకు లీలావినోద కల్పనా రచయితగాను - ఉన్నారు.. → అని అనునిత్యముగా అర్చించుచుండటమే - ఆత్మదేవో పాసన, ఆత్మజ్ఞాన దీపమును వెలిగించటము కూడా! అట్టి భావనయొక్క అనుక్షణికత్వమే సమాధి స్థితి కూడా!

అట్టి పరాత్పరుడగు ఆత్మదేవుని ఇంకా కూడా….,

ఎరుగుచూ ‘హంసహంస’ వాక్యముతో పూజించాలి. అవలోకనం చేయాలి. ఈ విశ్వమును విశ్వాత్మకుని రూపంగా భావించాలి. ఆరాధించాలి.

ప్రాణ-అపానములు దేహములో ఎక్కడ (ఏచోట) అయితే కలియుచూ, పరస్పరము లయస్థితి పొందుచున్నాయో, అట్టి స్థానము యొక్క గమనికను ‘అజపాగాయత్రి’ అని పిలుస్తున్నారు. 21,600 సార్లుగా జరుగు ‘హంస’ - ను గమనిస్తూ, అట్టి స్థితిలో ‘హంస’ ‘సోఽహమ్’ యొక్క లయస్థానమే ‘లింగస్థానము’గా ఎరుగబడాలి. గమనించాలి.

యతిధ్యానం :- ఈ దేహము లింగ స్వరూపమే! ఇందులోని ‘దేహి’యే లింగేశ్వరుడు!

పూర్వ భాగేహి అధో లింగమ్ = పూర్వ భాగంలో (కుడివైపు భాగము → అధో లింగమును (లింగము యొక్క అధో భాగముగాను),
శిఖిన్యాం చ ఏవ పశ్చిమమ్ = పశ్చిమభాగము (ఎడమవైపు) → లింగము యొక్క శిఖి భాగమును (ఊర్ధ్వభాగముగాను),
భ్రువోర్మధ్యే జ్యోతిర్లింగమ్ = భ్రూమధ్యాకాశంలో జ్యోతిర్లింగమును,
యోగులు సర్వవేళలా దేహమును శివావలోకనంగా ధ్యానము చేయుచున్నారు. ఆత్మయే లింగముగా వారిచే ఉపాసించబడుచున్నది. (ఆత్మయేవహి ఇదం లింగమ్)।

ఆత్మోపాసనచే బ్రహ్మహ్మవిద్యను ఎరుగుచూ, అట్టి యోగి ఆత్మదృష్టిని సముపార్జించి, ‘సోఽహమ్’ ‘అహమ్ ఆత్మా’ భావనను పొంది - జగత్తును ఆత్మగా సాక్షాత్కారము పొందుచున్నాడు.

అట్టి ఆత్మసిద్ధుడగు యోగి యొక్క ఆత్మతత్త్వ-ఆత్మసోఽహమ్ గానము వినండి. ఇద్దాని అధ్యయనము స్వస్వరూపాత్మోపాసనయే।

‘నేను’ ఎట్టివాడను? ఎంతటివాడను? (What I am? What extent I am?)

అచ్యుతోఽహమ్ : నేను ఆత్మను కానిక్షణమే లేదు. ఆత్మస్థానము నుండి ఏ సమయమందునూ చ్యుతియే పొందియుండటం లేదు. అచ్యుతుడను.

అచింత్యోఽహమ్: నా సహజ - నిత్య-వాస్తవ స్వరూపము ఆలోచనలకు విషయమేకాదు. ఆలోచనలకు మునుముందే ఉన్నట్టివాడను. ఈ జగత్తు ఆలోచనా కల్పిత- నిర్మితము. అందుచేత నా ఆత్మస్వరూపము అచింత్యము.

అతర్క్యోఽహమ్ : ఆత్మ ఇద్దరో ముగ్గురో - కొందరియో వాదోపవాదములచే, తర్క - వితర్కములచే అనుభవమగునది కాదు. ఎవరికి వారికే స్వ-అనుభవైక వేద్యము. అందుచేత అతర్క్యము.

అహమ్ అజో : జన్మలకంటే ముందే ఉన్న ఆత్మ చైతన్యస్వరూపుడను. జన్మరహితుడను. అజుడను! దేహముయొక్క ‘రాక’తో జనించను. దేహము యొక్క ‘పోక’తో మరణించను.

అహమ్ అవ్రణో : దేహమునకు వ్యాధి వ్రణదోషములు ఉండవచ్చుగాక! ఆత్మగా - నాకు దేహవ్యాధులు, దేహదోషముల సంబంధించినవి కావు. అందుచేత అవ్రణుడను.

అకాయోఽహమ్ : నాకు దేహాదులు లేవు. వాటి రాకపోకలు నా స్వరూపమునకు సంబంధించినవి కావు. నేను సదా యథాతథుడను. స్వప్నంలో నాకు భౌతికదేహమెక్కడున్నది? అయినా అనుభూతులు, అనుభవాలు ఉంటున్నాయి కదా! కాబట్టి, నేను సర్వదా అకాయుడను.

అసంగోఽహమ్ : నేను దృశ్యములో దేనికీ సంబంధించినవాడను కాను. ఏదీ నాకు సంబంధించినది కాదు. సర్వదా అసంగుడను.

అహమ్ అభయోఽస్మి : ఆత్మ స్వరూపుడనుగా దేని చేతా బంధితుడనుగాను. దేనిచేతా బాధింపవాడనూ కాను. సర్వదా అభయస్వరూపుడను! కలలోని నాకు భయముండవచ్చునేమో! కానీ, కల నాదైన నాకు కలంటే భయమేముంటుంది?

అశబ్దోఽహమ్ : శబ్దములు నా గురించి ఉద్దేశ్యించినవై చెప్పుకోబడవచ్చుగాక! కానీ…,ఆత్మగా శబ్దస్వరూపుడను కాదు. శబ్ద పరిమితుడను కూడా కాను. అందుచేత అశబ్దుడను!

అరూపోఽహమ్ : ఆత్మకు ‘ఇట్టిది’ అను రూపము లేదు. మట్టి బొమ్మలకు రూపముండవచ్చునేమోగాని, మట్టికి రూపమేమున్నది? ఆభరణానికి ఒక రూపముండవచ్చుగాక! బంగారానికి ‘ఇది’ అన్నరూపమేమున్నది? ‘‘అన్ని రూపములు ఆత్మవే’’ అని అనవచ్చుగాని, ‘‘ఆత్మకు ఇది రూపము’’ అనునది ఏమీ లేదు : కనుక అరూపుడను! హంస (ఆత్మ) రూపుడను!

అహమ్ అస్పర్శో : ‘అహమ్’ (నేను) స్వరూపమగు ఆత్మ స్పర్శకు విషయం కాదు. ఒకానొక స్పర్శచే ఇప్పుడు పొందవలసినది కాదు. కాబట్టి అస్పర్శుడను! అంతే కాదు. ఏదీ నన్ను స్పృర్శించలేదు. అస్పర్శుడను.

అద్వయమ్ : కల కనేవానికి వేరై, ఆ కలలో ఏదీ ఉండదు కదా! అట్లాగే, నేను అద్వితీయుడను. నాకు అనుభవమయ్యేదంతా నేను భావనా స్వరూపుడైనప్పుడు మాత్రమే రూపం పొందుచున్నది. కనుక అద్వితీయుడను. నాకు వేరై త్రిమూర్తులుగాని, త్రిలోకములుగాని, త్రికాలములుగాని లేవు. అవన్నీ నా ఆత్మ స్వరూపము యొక్క స్వకీయ సృష్టి భావనయొక్క కల్పనాంతర్గత విశేషములే!

అరసోఽహమ్ : రుచి నా అనుభూతియే గాని, నేను రుచి స్వరూపుడను కాను. నవరస నాటకంలో రచయిత వాటిలో ఏ రసము కాని విధంగా, నేను అరస స్వరూపుడను. రసములు, రసానుభవములు - మొదలైనవన్నీ ఆత్మగా నాయొక్క రసాస్వాదనా విశేషములై ఉండగా, నేను అరసస్వరూపుడను.

అగంధోఽహమ్ : నేను గంధస్వరూపుడను కాను. వాసనను ఆస్వాదించువాడనవవచ్చుగాక! గంథము నేను కాను. అగంథస్వరూపుడను! గంథముచే లభించువాడనుకాను.

అనాదిమ్ : దేహాదులకు మొదలు, చివర ఉన్నది. ‘నేను’కు ఇది మొదలు అనునది లేదు. ఏదైనా ‘కాలము’ యొక్క పరిధిలో ఉంటేనే ‘ఆది’ అనేది కలిగినదై ఉంటుంది. కాలకల్పనకు కారణ కారణుడనగు నాకు ‘ఆది’ ఏమి ఉంటుంది? కనుక అనాది స్వరూపుడను.

అమృతోఽస్మి అహమ్ : ‘జాగ్రత్ - స్వప్న-సుషుప్తులు నావై యున్న నేను దేహము యొక్క రాక-పోకలకు పరిమితుడనుకాను. ‘మృత్యువు’ అను సందర్భమునకు కూడా వేరై, సాక్షినై ఉన్నట్టివాడను. మార్పు-చేర్పులకు విషయుడను కాను. ఉపాధుల రాకపోకలు నా సమక్షంలో నా యొక్క నా వినోదంగా జరుగుచున్న స్వయం కల్పితాలు.

అహమ్ అక్షయో : పుట్టినప్పటి నుండి బాల్య - కౌమార - యౌవన - వార్థక్యములలో → ‘నేను’ మారుట లేదు కదా! స్థితి-గతులచే ‘నేను’ తరుగుట లేదు. పెరుగుట లేదు. ఆత్మ క్షయము కానట్టిది. అక్షయమును! అక్షయుడను!

అలింగోఽహమ్: ‘నేను’ అనునది స్త్రీ- పురుష- నపుంసక లింగములకు సంబంధించినదా? కాదు కదా! ఆత్మ అలింగస్వరూపము. కోపము, ఇష్టము, అభిమానము మొదలైనవాటికి లింగభేదమేముంటుంది? ఇక వాటన్నిటికంటే - అత్యంత ప్రత్యేకమైన ‘నేను’కు లింగభేదం అసలే ఉండజాలదు కదా.

అజరోఽస్మి : బాల్య-యౌవన-వార్ధక్యములచే ‘నేను’ అనునది మార్పుచేర్పులు పొందదు. వార్థక్యము మొదలైనవి దేహమునకు సంబంధించినవేగాని, ‘నేను’కు సంబంధించినవి కాదు. అందుచేత జరము (old age) లేనట్టివాడను. జరా మరణములు భౌతిక దేహమునకు సంబంధించినవేకాని, ఆత్మ (హంస) అగు నాకు సంబంధించినవి కావు.

అహమ్ అకళోఽస్మి : కళ నా యొక్క ప్రదర్శనమే కాని నేను కాదు. ఆత్మ కళాతీతమైనది. నేను నాద బిందు కళాతీతుడను. సంసార దోషములచే నేను స్పృశించబడటం లేదు.

అప్రాణోఽహమ్ : ‘శక్తి’ అనునది శక్తిమంతుని విశేషమేగాని, శక్తి ఆతడై ఉండడు. వాహనము నడుపువాడు నడుపుశక్తిగా మారడు కదా! (A Driver drives a vehicle. But he does not become driving art or process). అట్లాగే ప్రాణము నా యొక్క శక్తి ప్రదర్శనా చమత్కారము, నేనో? ప్రాణేశ్వరుడను. ప్రాణమును స్వశక్తిరూప అలంకారముగా కలవాడను. అంతేగాని ప్రాణమాత్రుడనుకాను. అప్రాణుడను.

అమూకోఽహమ్ : సర్వశబ్దములకు జనన స్థానమగు ఆకాశమునకే జననస్థానమగు ఆత్మాకాశము నేనే అయి ఉండగా, నేను మూగవాడిని ఎట్లా అవుతాను? (‘‘మూకం కరోతి వాచాలమ్’’.. అను రీతిగా) మౌనస్వరూపమగు ఆత్మ నుండే సర్వశబ్ద, సర్వ వాక్ ప్రవాహములు బయల్వెడలుచున్నాయి. అందుచేత నేను మూగ కాదు! అమూకుడను!

అచింత్యోఽస్మి : చింతనల కన్నా ముందే ఉన్న నేను ఏ చింతయూ లేనివాడను. నిశ్చింతుడను. అచింత్యుడను! చింతనలచే బంధించబడువాడనూ కాను. సంబంధితుడనూ కాను. పరిమితడను కాను.

అకృతోఽస్మి అహమ్ : ఒక నవలలో ఒక పాత్ర అడవికి వెళ్ళి ‘వేటాడటము’ మొదలైన కొన్ని క్రియలు చేస్తూ ఉంటే, ఆ క్రియలన్నీ ఆ నవలా రచయిత చేస్తున్నట్లా? లేదు కదా! అట్లాగే జీవాత్మగా నాచే నిర్వర్తించబడుచున్నవేవీ పరమాత్మగా నా క్రియలు కావు. ధర్మములు కావు. అందుచేత సహజముగానే పరస్వరూపుడనగుటచేత సర్వదా నేను అకృతుడను. (Non doer). జగత్తు నాచే కల్పించబడుచున్నప్పటికీ, జగత్తులోని విశేషాలకు సంబంధితుడను కాను. కేవల సాక్షిగానే సర్వదా ఏర్పడినవాడనై ఉన్నాను.

అంతర్యామ్యస్మ్యహమ్ : కలలో కనిపించేవన్నిటికీ, అందరికీ అంతర్యామి ‘కల’ తనదైనవాడే కదా! ఒక కథలోని పాత్రల స్వరూప-స్వభావాలన్నిటికీ అంతర్యామి ఆ కథారచయిత యొక్క రచనా చమత్కృతియే కదా! నాచే అనుభూతముగా (As an experience) పొందబడుచున్న జగదనుభవమంతటికీ నేనే అంతర్యామిని. స్వకీయ కల్పన చేతనే అంతా సిద్ధిస్తోంది కనుక కనిపించే అంతటికీ అంతర-హృదయాంతరంగుడను.

అగ్రాహ్యోఽహమ్ : ఈ విశ్వజనులంతా మనస్సుతో ఇంద్రియములను ఉపయోగించి దృశ్య విషయములను తెలుసుకుంటూ ఉన్నారు. అటువంటి బుద్ధికే జనన స్థానమగు ఆత్మస్వరూపుడను. ఆత్మస్వభావుడను. మనస్సు అన్యములైన విషయములనే గ్రహిస్తుంది కాని, అనన్యమగు ఆత్మను ఎట్లా గ్రహించగలదు? అందుచేత మనస్సుకు అగ్రాహ్యుడను!

అనిర్దేశ్యోఽహమ్ : ఆత్మస్వరూపుడుగా నన్ను ‘‘ఇది ఇంతయే! ఇట్టిదే! ఇటువంటిదే!’’ అని చెప్పబడజాలను. అపరిమితుడనవటం చేత నాకు పరిధులు లేవు. అందుచేత ‘నిర్దేశ్యము’నకు పరిమితుడనుకాను. అనిర్దేశ్యుడను!

అలక్షణః : సర్వలక్షణములకు విలక్షుణుడను. సర్వ లక్షణములు నా ప్రదర్శనములే అయినప్పుడు నా గురించి ‘‘ఇవి లక్షణములు’’.. అని ఎట్లా ఆపాదించబడగలవు? లేదు! నవలలోని పాత్రల లక్షణములు రచయిత యొక్క కల్పనే, కానీ, అవి రచయిత లక్షణములు కావు కదా! అట్లే కేవలుడనగు నేను అలక్షణుడను.

అగోత్రోఽహమ్ : ‘ఈ జాతి, గోత్రము చెందినవాడిని’ అని ఆత్మనగునాకు ఆపాదించటము కుదరదు. అటువంటివన్నీ సాంఘిక విశేషములు మాత్రమే! ఆత్మసంబంధితములు గావు. ఆత్మస్వరూపుడనగు నేను అగోత్రుడను!

అగాత్రోఽహమ్ : శరీరమును శరీరిగా ధారణ చేయువాడను, శరీరము అను ఉపకరణమునకు కదలించువాడుగా-మునుముందే ఉన్నవాడను. శరీరము లేనప్పుడు, ఉన్నప్పుడు కూడా ఆత్మగా నేను సర్వదా ఉండియే ఉన్నాను. కాబట్టి అగాత్రుడను!

అచక్షుష్కోఽస్మి : కనులు ఉపయోగించి దృశ్యమును దర్శించువాడను. అంతేగాని చక్షువులు నేను కాదు. చక్షువులు కాలక్రమంగా నశించినా కూడా, నేను నశించను. ఉపకరణము చేజారితే ఉపయోగించువాడు చేజారడుకదా! నేను అచక్షుస్వరూపుడను.

అహమ్ అవాక్ : మాటలు పలుకువాడను నేను గాని, మాటలు నేను కాదు. వాక్కు నా యొక్క ఒకానొక క్రియాప్రదర్శనము. వాక్ పరిమితుడనుగాను. వాక్ స్వరూపుడనుగాను. అవాక్ మానస గోచరుడను. పలుకులు పలుకువాడను. పలుకులు (Expressions) నా స్వరూపం కాదు! అవాక్‌స్వరూపుడను!

అదృశ్యోఽహమ్ : దృశ్యములోని ఒక వస్తువు వంటివాడను కాను. దృశ్యములో భౌతికంగా కనిపిస్తున్న ఈ శరీరము నేను కాదు. శరీరిని. దృశ్యమును దర్శించువాడను. దృశ్యము లేకున్నా నేను ఉన్నాను. దేహము కనిపిస్తుందిగాని, ‘దేహి’ కనిపిస్తాడా? లేదే! ఆత్మనగు నేను అదృశ్యుడను? కదలించే అదృశ్యరూపుడగు దేహిని నేను. కదిలే దేహస్వరూపమాత్రుడను కాను.

అవర్ణోఽహమ్ : నేను వర్ణాశ్రమములకు, వర్ణాశ్రమ ధర్మములకు పరిమితుడనైన వానిని కాను. రంగు రూపు ఆత్మకు లేవు. ఆత్మయే నాయొక్క సహజరూపమగుట చేత నేను అవర్ణుడను. వర్ణభేదములకు అసంబంధీకుడను.

అహమ్ అఖండోఽస్మి : అనేక సందర్భములలో అనేక రూపనామములుగా కనిపిస్తున్నప్పటికీ నేను అఖండుడను. ఉదా : చూచేవాడుగా, వినేవాడుగా, స్పర్శానుభవిగా, ఆలోచించువాడిగా, నిర్ణయించేవాడుగా, ఇష్టభావికుడిగా, జీవుడుగా, అనేక శరీరములు ఒకదాని తరువాత ఒకటి ధరరించువాడుగా ఉండి ఉంటూనే, వేరువేరుగా అవక - ఏక అఖండుడనై ఉన్నాను కదా! కనుక అఖండుడను!

అద్భుతః : భౌతికమైనదాని కంతటికీ అతీతుడను. అద్భుతుడను.

అశ్రుతోఽహమ్ : వినబడువాడనుగాను. వినికిడిని కల్పించుకొని, ‘వినటము’ అను స్వ-కల్పనను ఆస్వాదించువాడను. వినటం నా రూపం కాదు. నాయొక్క అనంత శక్తి ప్రదర్శనములలో ‘వినికిడి’ - ఒకానొకటి.

అదృష్టోఽహమ్ : చూడబడు దృశ్యమును కాను. చూపుచే చూచుచున్నవాడు అగుపించడు కదా! (One who is seeing canot be seen) అదృష్టుడను.

అన్వేష్టిః : వెతికితే లభించువాడను కాను. వెతుకువానికి వేరుకానట్టివాడను. ఆ వెతుకుచున్నవానినే నేను. అన్వేష్టిని! ఆత్మ గురించి అన్వేషిస్తూ ఉన్న సందర్భములో - అట్టి ఆత్మయే నేను కదా!

అహమ్ అమరోఽస్మి : మరణధర్మము దేహమునకు ఉండవచ్చుగాక. దేహినగు నాకు ‘మరణము’ అను ధర్మమే లేదు. అమరణుడను. జాగ్రత్‌లో నుండి స్వప్నములోనికి, స్వప్నమునుండి జాగ్రత్‌లోనికి పోవటము వంటిదే దేహ-దేహాంతరములు కూడా.

అవాయుః : ‘వాయువు’ రూపుడనుకాను. ఆ వాయువు ఎందులో చరిస్తోందో, అట్టి ఆకాశరూపుడను. ఆకాశమునకు కూడా ఆవలగల చిదాకాశరూపుడను. ఆత్మాత్ ఆకాశమ్। ఆత్మనగు నానుండియే ఆకాశాది పంచభూతములు బయల్వెడలుచున్నాయని వేదవాక్యము కదా!

అనాకాశో : ఈ భౌతికాకాశము ఎందులో ఏర్పడినదై ఉన్నదో.. అట్టి ఆత్మాకాశ స్వరూపుడను. భౌతికాకాశ పరిమితుడనుకాను. అనాకాశుడను.

అతేజసో : (జాగ్రత్ పురుషుడు-విశ్వుడు. స్వప్న పురుషుడు = తేజసుడు. స్వప్న పురుషుడు నా యొక్క ఒకానొక అంశ మాత్రమే! నేను స్వప్న పురుషుడను కాను. జాగ్రత్-స్వప్న-సుషుప్తి పరిమితుడను కాను. తేజస్సు నాది కావచ్చు. నేను తేజస్సును కాదు.

అవ్యభిచార్యఽహమ్ : జ్ఞాన-అజ్ఞాన; జన్మ-కర్మ-పునర్జన్మ; బంధ-మోక్ష.. ఇత్యాది సర్వదశలన్నీ మనోధర్మములు కావచ్చుగాక. ఏది ఎప్పుడు ఏ తీరై ఉన్నా కూడా నేను ఆత్మను వదలుట లేదు. అవ్యభిచార్యుడను.

అమృతోఽహమ్ : మృతము (మరణము అనే ధర్మము) లేనివాడను. ఆత్మగా సదా అమృతస్వరూపుడను.

అజాతోఽహమ్ : పుట్టుకయే లేనివాడను. దేహముతో పుట్టువాడను, దేహముతో మరణించువాడను కాను. ఆత్మగా నిత్యుడను. స్వప్న పరంపరలవలె దేహముల రాకపోకలు ఆత్మకు అప్రమేయములు. (దేహే జాతే న జాతోఽసి। దేహే నష్టే న నశ్యసి)

అతిసూక్ష్మో : ఆకాశము కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మమగు ఆత్మను అవటం చేత అతి సూక్ష్ముడను.

అవికార్యోఽహమ్ : వికారములు (నామ-రూప-భావోద్వేగములు) దేహ-మనో-బుద్ధుల యందు ఒకప్పుడు ఉండవచ్చు. మరొకప్పుడు లేకపోవచ్చు. ఆత్మస్వరూపుడనగు నాకు ఎట్టివికారములు లేవు. ఆత్మగా నిర్వికారుడను.

అరజస్కో : నిర్వికారుడను. రజోగుణదోషముచే స్పృశించబడను. రజోగుణము నాది కావచ్చు. కానీ నేను నిర్గుణుడను.

అతమసోఽహమ్ : తమోగుణ స్వరూపుడను గాను.

అసత్త్వోఽహమ్ : సాత్త్వికగుణములు కూడా నారూపం కాదు

అగుణోస్మ్యహమ్ : గుణములకు వేరై, నిర్గుణుడమై యున్నవాడను. గుణాతీతుడై ఉన్నాను. గుణములకు ముందే ఉన్నవాడను. నేను ఉన్నాను కాబట్టి గుణములు ‘ఉనికి’ పొందుచున్నాయి. అంతేగాని, గుణములు నన్ను జనింపజేయవు.

అహమ్ అమాయో : మాయ నా యొక్క వినోద చమత్కారమేగాని, మాయాస్వరూపుడను కాదు. మాయా స్వభావుడనుగాను. ఒక కథ వినుచూ తన్మయమయినంత మాత్రంచేత ఒకడు తనను తాను కోల్పోవటం లేదు కదా! నేను అమాయను!

అహమ్ అనుభవాత్మ : ఆ జగత్తులు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు, దేహదేహాంతరములు నా యొక్క స్వీయానుభవవిశేషములై ప్రదర్శితములగుచున్నాయి. వాటన్నిటికీ వేరుగా అనుభవజ్ఞుడనై, అనుభవాత్ముడనై వెలుగొందువాడను! నాకు తెలియబడుచున్న సమస్తమునకు ఆత్మను నేనే!

అనన్యో (అ)విషయో-స్మ్యహమ్ : అనన్యుడను. కథలోని విశేషాలన్నీ కథా రచయిత యొక్క కల్పనయే కదా! అవన్నీ రచయితకు వేరై ఉనికి కలిగియున్నాయా? లేదు. అట్లాగే నాకు ఇంద్రియములు కూడా అన్యము కావు. అనన్య విషయుడను.

అహమ్ అద్వైతో : ‘‘జీవాత్మ- ఆ జీవాత్మకు అనుభవమగుచున్న జగత్తు’’ నా అంశలే! ఆత్మస్వరూపుడగు నాకు ‘ద్వితీయము’ అనునదేదీ ఎక్కడా లేదు. అనుభవమయ్యేదంతా నేను-నీవుతో సహా, నా నుండి బయల్వెడలిన భావనా చైతన్యవిశేషమే!

అహమ్ అపూర్ణో : ఈ విస్తార విశ్వము, ఈ ఊర్ధ్వ అధో లోకములు - మొదలైన ఇవన్నీ నా అఖండ అనంతాత్మ స్వరూపమును కించిత్ కూడా పూరించలేవు. అందుచేత మమాత్మానందరూపము సర్వదా అపూర్ణము. (I cannot be filled up by all this being experienced)

అహమ్ అబాహ్యమ్, అనంతరః : ఆత్మసర్వత్రా సమస్వరూపమైయున్నది. బాహ్య-అభ్యంతరస్థితుడనై యుండుటచే నాకు బాహ్యము లేదు. అంతరము లేదు. ఆత్మగా బాహ్య-అభ్యంతరములను ఆక్రమించుకొని ఉన్నాను.

అశ్రోత్రోఽహమ్ : వినబడువాడను, చెప్పబడువాడను కాను. వినుటకు ఆధారమైన స్వస్వరూపాత్ముడను. శ్రుతుల చేత కూడా పూర్తిగా నిర్వచించబడువాడను కాను. (యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా)

అదీర్ఘోఽహమ్, అన హ్రస్వోఽహమ్: పొడవైన వాడను కాను. పొట్టీయిన వాడను కాను. అవన్నీ భౌతిక దేహధర్మములు మాత్రమే! ‘దేహి’ ఆత్మస్వరూపుడనగు నాకు సంబంధించినవి కావు. నేను దేహమును కదలిస్తూ ఉన్నవాడను. కదిలే దేహము నేను కాదు.

అవ్యక్తోఽహమ్ : వ్యక్తీకరించబడునదేదీ నేను కాదు. సర్వము వ్యక్తీకరించుచూ, వ్యక్తీకరణమునకు ఆవల ఉన్నవాడను. అవ్యక్తుడను.

అనామయః : నామ రూపాత్మకంగా లభ్యమగువాడను కాను. నాయందు మరొకటేదీ లేదు. అనామయుడను. కథలోని విశేషాలు కథారచయితలో ఉన్నట్టివి కాదు కదా! విషయములు నన్ను ఆశ్రయిస్తూ ఉన్నప్పటికీ కూడా, నేను మాత్రం సదా నిర్విషయుడను.

అద్వయానంద విజ్ఞాన ఘనోఽస్మి : అద్వితీయ కేవల జ్ఞాన ఘనీభూతుడను. (The Facet of knowing at its core is what Iam) నాచే తెలియబడేదంతా నాయొక్క ఘనీభూత జ్ఞాన స్వరూపమే.

అవిక్రియోఽహమ్ : నేనేమీ చేయువాడనుకాను. క్రియల సంబంధింతుడను కాను. క్రియలచే లభించువాడను కాను. క్రియలు నిర్వర్తించువాడు క్రియల కంటే మునుముందే (క్రియలకు అతీతుడై) ఉండాలి కదా!

అనిచ్ఛోఽహమ్ : నేను జన్మించువాడనుగానో, జీవాత్మగానో, దృశ్యాంతర్గతంగానో విచ్ఛిన్నమగుటలేదు. విచ్ఛిన్న ధర్మములేనట్టి ఆత్మను! అఖండాత్మను! ఇచ్ఛ అయిచ్ఛలకు సంబంధించిన చిత్తపరిమితుడను కాను. చిత్ స్వరూపుడను. ఇచ్ఛ ‘నాది’ కాని, ‘నేను’ కాదు.

అలేపోఽహమ్ : ఎట్టి దోషములు ఆత్మకు లేవు. అందుచేత నిత్యనిర్మలుడను. మట్టితో చేసిన బొమ్మ సరిగా కుదరకపోతే, అది మట్టికేమి సంబంధము? మట్టికేమి బంధము?

అహమ్ అద్వయా, అకర్తా : అద్వితీయుడను దేనికీ కర్తను కాను. నాటకంలోని పాత్రలు నిర్వర్తించు కర్మ వ్యవహారములు ఆనాటక రచయి చేస్తున్నాడని అనలేము కదా! కర్తృత్వము ఆపాదించలేము కదా! పాత్రయొక్క సుఖదుఃఖములు, కర్తృత్వ - అకర్తృత్వములు పాత్రధారుడివి ఎట్లా అవుతాయి?

అవిద్యాకార్యహీనోఽహమ్ : అవిద్యకార్యములకు నేను కర్తను కాదు. భోక్తను కాదు. విద్య-అవిద్యల సాక్షిని. విద్య-అవిద్యలు ఆత్మగా నాకు ఆపాదించబడజాలవు. ఆత్మనగు నా స్వరూపముపై అవిద్యాకార్యములు ఆపాదించబడజాలవు.

అవాక్ మానస గోచరోఽస్మి : మనస్సుకుగాని, వాక్కుకుగాని గోచరించువాడనుగాను. ఆలోచనలన్నీ ఆలోచించువాడివై ఉండగా, ఆలోచనలలో ఆలోచించువాడు ఎట్లా లభిస్తాడు? నవలలో (పేజీలలో) నవలా రచయిత కనిపిస్తాడా? నా నుండి బయల్వెడలిన ‘ఆలోచన’ - నన్నెట్లా నిర్వచించి చెప్పగలుగుతుంది?

అహమ్ అనల్పో : ఆత్మగా అనంతుడను. ఆద్యంతములు లేనివాడను. అల్పుడను ఎట్లా అవుతాను? అనల్పుడను. త్రిమూర్తులకు, ఇంద్రాది దేవతలకు కూడా ఆత్మ - ‘మమాత్మ’యే అయి ఉండగా, నాకు అల్పత్వమెక్కడిది?

అహమ్ అశోకో: ఆత్మకు దేని పట్లా వేదన లేదు. పాత్రకు వచ్చు శోకాదులు పాత్రధారునికిగాని, రచయితకుగాని చెందినవి కాదు కదా! మనోసంబంధమైనవేవీ ఆత్మకు చెందవు. మనస్సును ఒక వస్తువువలె వెలిగించు చైతన్యశక్తి - ఆత్మ. నేను ఆత్మ స్వరూపుడను.

అవికల్పోఽస్మి : సంకల్ప-వికల్పములు నా యొక్క కల్పనా విభాగము నుండి బయల్వెడలుచూ ప్రవర్తితమగుచున్నాయి. నేను మాత్రం ఆత్మగా వికల్పరహితుడను. అవికల్పుడను.

అవిజ్వలన్ : ఆత్మ సర్వదా ఉన్నచోటే ఉంటున్నది. ఆత్మ స్వరూపుడనగు నేను జ్వలించుట లేదు. ప్రవహించు ధర్మము నాకు లేదు. (I donot flow from any where to any where). ఆత్మగా ఎచ్చట నుండీ ఎక్కడికీ ప్రవహించటము లేనే లేదు. సర్వదా యథా-తథ స్థానము నందు ఏర్పడి ఉంటున్నాను.

అహమ్ ఆది మధ్యాంత హీనః : కాలములోని విశేషములకు మాత్రమే ‘‘మొదలు-మధ్య-చివర’’ - అనునవి ఉంటాయి. నేను కాలమునకు ఆవల ఆత్మగా వెలుగొందుచున్నట్టి వాడను. ఆదిమధ్యాంత రహితుడను!

అహమ్ ఆకాశ సదృశః : ఆకాశము అంతటా నిండి ఉన్న తీరుగా, నేను జాగ్రత్-స్వప్న-సుషుప్తులలోను, సర్వ లోకములలోను ఆక్రమించుకొని ఉన్నట్టివాడను.

అహమ్ ఆత్మచైతన్య రూపోస్మి : ఆలోచనలను, భావములను, అనుభూతులను, అభిప్రాయములను, ఆనంద అనానందములను నా యొక్క ఆత్మ శక్తిచే చేతనముగా (As moving) నిర్వర్తించున్నట్టివాడను. ఎరుగబడేదంతా ఎరుగబడేడట్లు చేస్తున్న చిత్ చైతన్యుడను.

మహత్-ఆనంద చిద్ఘనోఽహమ్ : ఒకడు తాను వ్రాసిన నవలను చదువుకొంటూ ‘‘ఈ పాత్రలు వైచిత్ర్యములు, పరస్పర సంబంధములు నా నైపుణ్యమేకదా!’’ అని ఆనందించువిధంగా ‘‘ఈ సర్వము నేనైన నేను’’.. యొక్క భావనచే మహదానంద చిద్ఘనుడను.

ఆనందామృత రూపోఽహమ్ : మృతము లేని, దుఃఖకారణములే ఉండజాలనట్టి ఆనందామృతరూపుడను. ఆత్మానందామృతుడను.

అంతరః ఆత్మసంస్థోఽహమ్ : సర్వజీవులయందు అంతరాత్మగా సంస్థితుడైన వాడిని. ఒకడు - తన కలలో కనిపించిన వారందరి యొక్క అంతరాత్మ తానే అయిన తీరుగా, ఈ కనబడే సర్వమునకు అంతరాత్మను అయి ఉన్నాను.

ఆప్తకామోఽహమ్ - ఆకాశాత్ : ఆకాశము సర్వము తనయందే కలిగియుండగా, ఇక జగత్తులోని ఏదైనా ఒక స్థానమునో, వస్తువునో కోరుకొనే ప్రసక్తి ఎక్కడిది? సర్వలోకములు ఆత్మయందే ప్రతిబింబితమై ఉండగా, ఆత్మస్వరూపుడనగు నేను ఏదో లోకంలో ఏదో చోటు కోరుకోవటమేముంటుంది? నేను ఆప్తకాముడను. కోరుకోవలసినదేదీ లేనివాడను.

అహమ్ పరమాత్మేశ్వరోఽస్మి : జాగన్నాటకంలో కనిపించే ‘ఇహాత్మ’ లేక ‘జీవాత్మ’. అనేక నాటకములలో నటించు ఒక నటుని యొక్క ఒక నాటకములోని ఒక పాత్ర వంటిది. నేను ఆవల గల పరమాత్మస్వరూపుడనై స్వకీయరచనా జగత్తునందు విస్తరించి ఉన్నవాడను.

ఈశానోఽస్మ్యహమ్ : సర్వము నందు సర్వముగా విస్తరించి ఉన్నవాడను. ఈశానుడను.

ఈడ్యోఽహమ్ : సర్వత్రా సర్వభావములచే, సర్వదేవతా స్తోత్రములచే స్తుతించబడుచున్న ఆత్మయే నేను. అట్టి ఆత్మతత్త్వమంతా మమాత్మయే! సర్వాత్మకుడనై ఉండుటచే సర్వస్తోత్రములు, ఉపాసనలు నన్నే జేరుచున్నాయి.

అహమ్ ఉత్తమ పూరుషః : ప్రధమ పురుష (He, They - The Third Person); ఉత్తమ పురుష - (I, My - The First Person). అందరిలోని నేనైన నేనే నేను కాబట్టి ఉత్తమ పురుషుడను! ఉత్తమపురుషకారమును. పురుషోత్తముడను.

అహమ్ ఉత్కృష్టో : దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారాదుల కంటే మహత్తరమైన వాడను. ఉత్కృష్టుడను.

అహమ్ ఉపద్రష్టా : నవరసములతో కూడిన నాటకము జగరుచూ ఉండగా ఏ విధంగా అయితే ‘నాటకదీపము’ కేవల సాక్షియో, ఆ విధంగా బ్రహ్మలోకము వరకు జరుగుచున్న సర్వవ్యవహారములకు కేవల సాక్షిని. ఉపద్రష్టను.

ఉత్తరతోఽస్మి అహమ్ : దేవతా గణము, మునిగణము, లోక-లోకపాలకులు లయించగాకూడా శేషించియుండు ఆత్మను. సర్వమునకు ఆవల ఆత్మగా ప్రకాశించువాడను. ఉత్తరోత్తరుడను.

కేవలోఽహమ్ : ఈ జగత్ వ్యవహారములన్నీ నాటకంలోని సంఘటనల వలె సందర్భసత్యములు. ఇక నేనో? సహజసత్యమును. దేనిపైనా ఆధారపడి ఉండనివాడను. కేవలుడను. (I am the Absolute where as all else is merely relative that emanates from Assumptions and presumptions of my visualisation).

కవిః - అహమ్ : ఒక శిల్పమునకు సర్వశ్రేష్ఠుడు శిల్పియే అయిన విధంగా, ఒక నాటకమునకు నాటకరచయితయే సర్వశ్రేష్టుడైన విధంగా ఈ జగత్ దర్శనానుభవమంతా-ఆత్మయొక్క స్వకీయ రచనయే అవటం చేత - ఆత్మయే సర్వశ్రేష్ఠమైనది. నేను ఆత్మస్వరూపుడనే కాబట్టి కవిని! శ్రేష్ఠుడను!

కరణాధిపః, కర్మాధ్యక్షోఽహమ్ : సర్వ ఇంద్రియములకు, వాటి వాటి కార్యక్రమములకు ఆత్మయగునేనే అధిపతిని. కర్మేంద్రియములకు, వాటి కర్మవ్యవహారములకు సర్వాధ్యక్షుడగు ఆత్మను. ఇంద్రియ పశువులకు పశుపతిని. అంతేగాని పశువుల కాపరిని కాదు.

గుహాశయోఽహమ్; గోప్తాఽహమ్: (అహమ్ ఆత్మా సర్వభూత ఆశయస్థితః). సర్వజీవుల ఆశయములందు అంతర్లీనంగా నేనే ఆత్మగా వేంచేసియున్నాను. సర్వజీవుల హృదయగతుడనై ఆత్మగా ఉన్నాను. అందరిలో రహస్యముగా దాగి ఉన్న అంతర్లీన గానమును నేనే!

చక్షుసః - చక్షురస్మ్యహమ్ : కళ్ళలో ‘చూపు’ రూపంగా సంప్రదర్శితుడనై, కనులను ఉపయోగించువాడనై ఉన్నాను. ఆత్మయొక్క అసంఖ్యాక శక్తి ప్రదర్శనములలో ‘చూపు’ ఒకానొకటి. ఈ దేహము మొత్తమును జీవింపజేయటము - మరొకటి. దృశ్యమును స్వానుభవముగా రచించుకోవటము - ఇంకొకటి. చక్షువులలో చూపుగా, చూచువాడుగా ప్రకాశించుచున్నవాడను నేనే.

అహమ్ - చిదానందోఽస్మి చేతా : ‘ఎరుగుట’ అను విశేషముచే ఆనందించు బుద్ధిగలవాడనై చిత్-ఆనందుడుగా దేహమంతా, అంతరంగమంతా వెలుగొందుచున్నవాడను.

చిద్ఘనః చిన్మయోఽస్మి : ఘనీభూతమైన చిన్మయ స్వరూపుడను. చిత్తు (ఎరుక) నా స్వకీయాత్మలక్షణ విలక్షణము! అంతేగాని మృణ్మయ (భౌతిక) రూపమాత్రుడను కాను. చిద్ఘన-చిన్మయుడను.

అహమ్ జ్యోతిర్మయో జ్యాయాన్ : ఏ జ్యోతిస్వరూపముయొక్క ‘ఎరుక’ అనే వెలుగు ప్రసరిస్తున్న ప్రదేశంలో ఈ దృశ్యవ్యవహారమంతా వ్యవహరిస్తోందో, అట్టి జగత్ జ్యోతికే జ్యోతిని! జీవాత్మజ్యోతికే జ్యోతిని! ఆత్మయొక్క ‘ఎరుక’ అనే జ్యోతి యొక్క కిరణ విశేషములే ఈ ఎరుగబడేదంతా!

జ్యోతిషాం జ్యోతిరస్మి అహమ్ : దృశ్యంతర్గతమైన సర్వ జీవులు జ్యోతి (దీపపు) స్వరూపాలైతే, ఆత్మగా నేను అస్మత్ సర్వాత్మకత్వముచేత దీపముయొక్క అగ్నిస్వరూపుడను. జ్యోతిర్జ్యోతి స్వరూపుడు. స్వయంజ్యోతి ప్రకాశితుడను. సమస్త దీపములలో అగ్నివంటివాడను.

తమసః సాక్ష్యహమ్ : కళ్ళు మూసుకుంటే చీకటి అనుభవమౌతుంది. అట్టి చీకటిని చీకటిగా అనుభవము పొందు సాక్షీస్వరూపుడను. (తమసః పరమ్ ఉచ్యతే!) చీకటికి పరము అయినవాడిని. అజ్ఞానమునకు కూడా సాక్షినే గాని, అదినా స్వభావము కాదు.

తుర్యః తుర్యోఽహమ్ తమసః పరః : అవిద్యాస్వరూపమగు ఈ జగత్ దృశ్యమునకు సర్వదా సాక్షిని. అజ్ఞానాంధకారమునకు ఆవలివాడను. జాగ్రత్-స్వప్న-సుషుప్తి పురుషుల (విశ్వ తేజో ప్రాజ్ఞుల) నియామకుడగు తురీయునికే తురీయుడను. తురీయాతీత స్వరూపుడను.

దివ్యోదేవోఽస్మి దుర్దర్శో: ఈ జగత్తే శరీరముగా కలవాడను. దివ్యుడగు దేవదేవుడను. భౌతికమైన కళ్ళకు (దేహిగా) కనిపించువాడను కాను.

ద్రష్టా : ఒక నాటకమునకు ప్రేక్షకునివలె ఈ జగత్తుకు కేవల ద్రష్టను.

ధ్యేయో : ఒక చక్రవర్తి సమక్షంలో నాటక ప్రదర్శనలాగా నా యొక్క సంభావన (అనుభావన)చేతనే ‘జగత్తు’ అనబడే వస్తు రూపంగా క్రియా విశేషములతో అనుభవమగుచున్నది. నా ధ్యానము యొక్క ధ్యాసరూపమగు ఈ జగత్తు నా యొక్క ధ్యేయ రూపము। జగత్తు నా యొక్క క్రీడాధ్యాసకు ధ్యేయ వస్తువు అయి ఉన్నది.

ధృవోఽస్మి : దేహములు దృశ్యములు నా స్థానమును స్పృశించనైనా లేవు. సర్వము మార్పు చెందుస్వభావము కలిగి ఉండగా, నేను మార్పు - చేర్పులు చెందక, ధృవమైన స్వరూపుడనై ఉన్నాను.

నిత్యోఽహమ్ : ఆత్మగా నేను నిత్యుడను. త్రికాల-అభాజ్యుడును. ఇతఃపూర్వము ఉన్నాను. ఇప్పుడున్నాను. ఇక ఎప్పటికీ ఉండబోవుచున్నాను.

నిరవద్యోఽహమ్ : దేనిచేతనూ కూడా జయింపబడువాడను, నాశనము పొందువాడను, మార్పు చెందువాడను కాను.

నిష్క్రియోఽస్మి : దీపపు వెలుగులో జనులు ఆయా క్రియావిశేషములు నిర్వర్తిస్తున్నప్పటికీ దీపపు వెలుగు తానుగా ఏదీ నిర్వర్తించనిదే అయి ఉంటుంది కదా! ఆత్మగా సర్వదా నిష్క్రియుడనై యుండగా, నాయొక్క చైతన్య స్ఫూర్తియందు జగత్తులు రాక-పోకలు స్వప్న విశేషములవలె జరిగిపోవుచున్నాయి.

నిరంజనః : పాప-పుణ్యములు, గుణదోషములు, మనో-బుద్ధి-చిత్తముల మంచి చెడులు ఆత్మనగు నన్ను అంటవు.

నిర్మలోఽహమ్ : నిత్య నిర్మలుడను. ఒకడు ఒక ఆభరణమును దొంగిలించటం చేత, ఆ దొంగిలించటమనే దోషము ఆభరణమునకు అంటుతుందా? సూర్యకిరణములు వస్తువులపై ప్రసరించినంత మాత్రం చేత, ఆ వస్తు దోషములు కిరణములను దోషరురుచగలవా? లేదు కదా! అట్లాగే, ఆత్మగా ఏ దోషముచేతనూ అంటబడజాలను.

నిరాఖ్యాతోఽస్మి : వర్ణించుటకు, తెలియజెప్పుటకు, అందజేయబడుటకు విషయమైనవాడిని కాను. స్వానుభావముచే మాత్రమే తెలియవచ్చువాడను.

నిశ్చలః : ఆత్మగా ఎప్పుడూ ఎట్టి చంచలము లేదు. సదానిశ్చలుడను. ఒకచోటికి పోవువాడను కాను. మరొకచోటికి వచ్చువాడనుకాను.

నిరింద్రియోఽహమ్ : ఇంద్రియములకు నేను చెందినవాడను కాను. ఇంద్రియములకు విషయమును గాను. ఇంద్రియములతో ప్రారంభమగువాడనుకాను. ఇంద్రియముల కంటే మునుముందే ఉండి, ఇంద్రియములను ఉపకరణములుగా కలిగియున్నవాడను. అందుచేత నిరింద్రియుడను.

నియంతాఽహమ్ : ఇంద్రియములను పాలించువాడను. నియమించువాడను. ఉపయోగించువాడను. అట్లాగే ఈ దృశ్యము నేను ఎట్లా నియమిస్తే, నాకు అట్లా అనుభవమయ్యే వస్తువు. అందుచేత ఈ సర్వమునకు నేను నియంతను. అంతేగాని, ఈ దృశ్యము నన్ను నియమించునది కాదు. ఎందుకంటే - దృశ్యమును అనుభవము రూపముగా తీర్చిదిద్దుకొనుచున్నది నేను కనుక.

నిరపేక్షోఽస్మి : కలలోని వస్తువులన్నీ కలనాదైన నాయొక్క స్వప్న-కల్పనా విశేషములే అయి ఉండగా, నాకలలో కనిపించిన కొన్నిటి పట్ల అపేక్ష, మరికొన్నిటిపట్ల నిరపేక్ష ఉండవలసిన పనేమున్నది? ఈ జాగ్రత్తు స్వీయకల్పనావిశేషమే! అందుచేత. అపేక్షలేనివాడను. అపేక్ష-నిరపేక్షలకు అతీతుడను.

నిష్కళోఽహమ్ : కళంకములు లేనివాడను. కల్పితములగు మనో-బుద్ధి-చిత్తములకు, జీవాత్మకు ఆపాదించగల దోషములు మొదలైనవి ఆత్మకు ఆపాదించబడజాలవు. పదార్థదోషములు, దిక్ దోషములు ఆకాశమునకు అంటవు, ఆపాదించలేము. అట్లాగే ఆత్మాకాశ స్వరూపుడుగా సర్వదోషరహితుడను.

పురుషః పరమాత్మాఽహమ్ : సర్వమునకు ఆవల ఉండి, సర్వము స్వకీయ సంకల్పముచే సిద్ధింపజేయుచుండువాడను. ఆత్మయొక్క పురుషకారమే ఈ జాగ్రత్-స్వప్న-సుషుప్తి అంతర్గత విశేషాలన్నీ. ఆత్మయే అయి ఉన్న నేను సర్వమునకు ఆవల ఉన్నవాడను. పరమాత్మను। పరమ పురుషుడను।

పురాణ పరమో-స్మ్యహమ్ : ఈ జగద్దృశ్యము, జగత్తుల రాకపోకలు, దేహముల రాకపోకలు - వీటన్నిటికీ ఆత్మ మునుముందే ఉన్నది. ఆత్మయే నా సహజ స్వరూప స్వభావములు కూడా! అందుచేత, ఆత్మగా నేను ఆది పురుషుడను! పురాణ పురుషుడను! సర్వమునకు పరమైనట్టి వాడను!

అహమ్ పరావరోఽస్మి : ఈ దేహమునకు దేహిగా పరమై, వేరై ఉన్నాను. ఆ దేహిత్వము కూడా నా యొక్క ఒకానొక ధారణ. అందుచేత పరమునకే పరమైయున్నాను. పరాత్‌పరుడను. పరావరుడను.

ప్రాజ్ఞోఽస్మి : కేవల ప్రజ్ఞా స్వరూపుడను. దేహముల రాకపోకలను, మనోబుద్ధిచిత్త అహంకారముల కార్యకారణ విశేషములను ఎరుగుచున్నట్టివాడను. ప్రాజ్ఞుడను.

అహమ్ ప్రపంచ ఉపశమోఽస్మి : పంచభూతమేళవమగు ఈ ప్రపంచమంతా కూడా ఆత్మయగునాయందే-సముద్ర తరంగము సముద్రజలము నందు వలె - లేనినదై, ఉపశమనము పొందినదగుచున్నది. స్వప్నమంతా స్వప్నము తనదైన వానియందే జనించి, ఉపశమిస్తోందికదా! ఈ ప్రపంచము నానుండే జనిస్తోంది. నాయందే ఉపశమిస్తోంది.

పరామృతోఽస్మి : జనన-మరణములచే స్పృశించబడని అమృతమగు పరాస్వరూపుడను. అంతేగాని ఇహంలో కనిపించే జీవత్మ పరిమిత స్వరూపుడనుకాను. పరామృత స్వరూపుడను.

పూర్ణః : ఎప్పటికో ఏదో పొంది అప్పుడు పూర్ణుడనగువాడనుకాను. ఇప్పటికీ, ఎప్పటికీ పూర్ణుడనే! క్రొత్తగా ఏదీ పొందవలసినదీ లేదు. కోల్పోవుచున్నదీ లేదు. సర్వదా పూర్ణాత్ముడను.

పురాతనః : సర్వమునకు మునుముందే ఆత్మజ్యోతి - ఆత్మానంద స్వరూపుడనై జ్వాజ్వలమానంగా సర్వదా సర్వత్రా వెలుగొందువాడను. పురాతనుడను.

ప్రభురస్మి : సర్వమునకు నియామకుడను. పాలించువాడను. ప్రభువును. మనోబుద్ధి చిత్త, అహంకారములకు, జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయములకు నియామకుడను. పరిపాలించువాడను.

పూర్ణానందైక భోదోఽహమ్ : పూర్ణుడను. కేవల ఆనంద స్వరూపుడను. ‘అనేకము’ అనే స్వభావమే లేనివాడను. ఏకస్వరూపుడను. కేవల బోధ (ఎరుక, తెలివి) విజ్ఞాన స్వరూపుడను.

ప్రత్యక్ ఏకరసోఽస్మి : సర్వమునకు సాక్షినై సర్వమునకు వేరై, సర్వము నేనే అయి, ఏకరస స్వరూపుడుగా వెలుగొందుచున్నవాడను.

ప్రజ్ఞాతోఽహమ్ : తెలియబడుచున్నదంతా నేనే! తెలుసుకొనుచున్నదీ - నేనే! నేనే ఈ జగత్ స్వరూపముగా తెలుసుకొనబడుచున్నాను. అందుచేత ప్రజ్ఞాతను!

అహమ్ ప్రశాంతో : పరమ ప్రశాంతుడను. ఈ జగత్తులు, ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులు, ఈ దేహదేహాంతరములు, లోకలోకాంతరములు - ఇవన్నీ కలిసి కూడా (ఏర్పడి గాని, విడిపోయిగాని) ఆత్మ యొక్క ప్రశాంతతను తొలగించలేవు. నటుడు ఏ పాత్రగా ఏ రసము ప్రదర్శిస్తున్నా కూడా, ఆతని నటనాచాతుర్యసంబంధమైన ప్రశాంతతకు, సామర్థ్యమునకు ముప్పు లేదు కదా! ఇదీ అంతే!

ప్రకాశః : కేవల ప్రకాశస్వరూపుడను. నా ఆత్మ ప్రకాశమునందే దేహాదులు ప్రకాశిస్తున్నాయి.

పరమేశ్వరః : ఆవల ఉండి ఈవలను ప్రదర్శించువాడను. ఈవల-ఆవల నేనైనవాడను.

ఏకధా-చింత్యమానోఽహమ్, ద్వైత అద్వైత విలక్షణః : ఏకస్వరూపుడను. చింతనకు కూడా దొరుకనివాడను. స్వానుభవమునకే విషయమై ఉన్నవాడను. (1) పరమాత్మలోంచి జీవాత్మ బయల్వెడలుచున్నది = ద్వైతము. (2)పరమాత్మయే జీవాత్మగా అగుపిస్తున్నాడు = అద్వైతము. ఇటువంటి ద్వైత- అద్వైత చర్చనీయాంశములకు పట్టుబడనివాడను. విలక్షణుడను.

బుద్ధోఽహమ్ : కేవల బుద్ధి స్వరూపుడను. బుద్ధికి ఆవల ఆత్మగా, ఈవల జీవాత్మ-జగత్తులుగా (As experiencer and experiences) ప్రకాశించువాడను.

భూతపాలోఽహమ్ : పంచభూతనిర్మితములగు ఈ దేహ-జాగ్రత్ జగత్ దృశ్యములచే బంధించబడువాడనుకాను. పంచభూతముల నియామకుడను. భూతజాలమును పాలించువాడను. (I am the Ruler of the matter, Matter does not rule me)

‘భా’ రూపో భగవాన్ అహమ్ : భావనలచే సమస్తము వెలిగించువాడను. దేనిని ఏ విధంగా భావనచేస్తే, అది అట్లే భవించినదగుచున్నది. (యత్ భావమ్, తత్ భవతి). భావనచే భవము (ఉనికి)ను, జగదనుభవములను సిద్ధింపజేయువాడను. భవుడను! భగవానుడను! భావనారాయణుడను!

శ్లో।। మహాదేవో మహాన్ అస్మి మహాజ్ఞేయో మహేశ్వరః।
విముక్తోహం। విభురహమ్। వరేణ్యో వ్యాపకో-స్మ్యహమ్।।

శరీరములో సర్వదేవతలు వేంచేసియుండగా ‘శరీరి’నగు నేను దేవతలకే దేవుడగు మహాదేవుడను. తెలుసుకొంటున్న వానిని తెలుసుకొంటున్నాను కాబట్టి మహాన్‌స్వరూపుడను. నిత్యముక్తుడను. విభుడను, వదేణ్యుడను. వ్యాపకుడను.

వైశ్వానరో- వాసుదేవో : (1) జీవాత్మ (Individual Being) (2) సర్వాత్మ (Al-present being)
ఈ రెండూ నేనే! ఆత్మ అఖండము! నేను ఆత్మను! అఖండుడను! ఖండముగా కనిపిస్తున్నదీ నేనే! బంగారు లోహము - బంగారు ఆభరణములవలె వైశ్వానరుడను (ఒక దేహములో ఉన్న వాడిని), వాసుదేవుడను (సర్వదేహములలో వేంచేసి ఉన్నవాడిని)… ఉభయము నేనే! - ‘‘స్వప్నములో నేనుండి, స్వప్నము నాదై ఉన్న తీరుగా!’’

విశ్వతః చక్షురస్మ్యహమ్ : రచయిత యొక్క రచనా చక్షువులు రచన అంతటా నిండి ఉన్న రీతిగా, … స్వకీయభావనా రూపమగు ఈ విశ్వమంతా చూపు కలిగి ఉన్నాను. దర్శించబడేదంతా ద్రష్టనగు నాయొక్క సందర్శన చక్షువులతోనే నిండినదై ఉన్నది.

విశ్వాధికో; విశదోఽహమ్ : ఒక చిత్రకారుడు- ఆతడు రచించు (చిత్రించు) చిత్రమునకు వేరై, ఆచిత్రపఠమంతా ఆతని కళావిన్యాస ప్రదర్శనమే అయి ఉన్నట్లుగా.. నేను ఈ విశ్వముకంటే అదికాధికుడను. ఈ విశ్వముగా విస్తరించిఉన్నది నేనే! విశ్వమునకు అతీతుడను. సర్వత్రా విశదీకరించబడుచున్నది, సుస్పష్టమగుచున్నది నేనే!

శుద్ధోఽస్మి : పరమశుద్ధుడను. ఎట్టి దోషములు అంటనివాడను. వాయువుకు దుర్వాసనలు సువాసనలు అంటినవై ఉండవుకదా!

శుక్ర-శాంతోఽస్మి : శుక్రమైన (నిర్మలమైన) వాడను. ఆత్మజ్ఞానముచే మనోబుద్ధి-చిత్త-అహంకారములను, దృశ్య వ్యవహారములను నిర్మలముగా చేయువాడను. సర్వము నాయొక్క పరమశాంతమునందు సశాంతిచినవై ఉంటున్నాయి. పరమశాంత స్వరూపుడను.

శాశ్వతోఽస్మి : ఎల్లప్పటికీ ఉండువాడను. ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకుండువాడను కాదు. శాశ్వతుడను.

అహమ్ శివోఽస్మి : శివతత్త్వజ్ఞానముచే సర్వతత్త్వాత్మకుడను! సర్వతత్త్వ విదూరకుడను! సర్వతత్త్వ స్వరూపుడను. కేవల శివానంద స్వరూపుడను. సదాశివుడను. సర్వదా కేవల స్వరూపముచే పరమశివుడనై, ఇహమున ‘జీవుడు’ అనబడు త్రిగుణ సమన్విత స్వరూపమును జగన్నాటకములో ధారణచేస్తున్నాను. పరముగా ‘జీవాత్మ’ - నాయొక్క ఒకానొక అంశ. ఇహపర శివానంద లహరీ స్వరూపుడను.

అహమ్ సర్వభూతాంతరాత్మా : ఒక్క దేహపరిమితుడను కాను. సర్వజీవులలో అంతరాత్మ స్వరూపుడనై వేంచేసి ఉన్నవాడను! సర్వభూత-అంతరాత్మ స్వరూపుడను! (మమత్మా సర్వభూతాత్మా).

సనాతనోఽహమస్మి : జన్మ-కర్మల కంటే మునుముందే ఉండి, సర్వసందర్భములలోను యథాతథుడై ఉన్నవాడను. సనాతనుడను. జన్మ-కర్మల మధ్యగా జనించువాడనుకాను. ఆత్మనగు నేనుంటేనే జన్మ-కర్మలు. అంతేకాని, జన్మ-కర్మలు నన్ను కల్పించవు.

అహమ్ సకృత్ విభాతోఽస్మి : ఈ విశ్వముగా వెలుగొందుచున్నది నేనే! సత్ - కృత్ (ఉనికి - క్రియ) రూపముగా ప్రకాశమానుడై ఉంటున్న వాడనుకూడా.

సదా స్వే మహిమ్ని స్థితః : ఒక చక్రవర్తి యొక్క అధికారము సామ్రాజ్యమంతా విస్తరించియున్నతీరుగా, విశ్వమంతా నా మహిమయే. నా మహిమ యందే నేను - నాకు నేనుగా - సంస్థితుడనై ఉన్నవాడను.

సర్వాంతరః : సర్వుల అంతర స్వరూపుడను. అందరి యందును మమాత్మయే ప్రకాశమానమైయున్నది. మమాత్మయందే సర్వలోకజీవులు అస్మత్ హృదయాంతరంగ స్వరూపులై ఉన్నారు. కలలో కనిపించేవారంతా కల తనదైనవానియొక్క ఆత్మయే కదా।

స్వయం జ్యోతిః : అన్ని దీపములలో ఒకే అగ్ని వెలుగుచున్నతీరుగా అన్ని దేహములలో జ్యోతి స్వరూపుడనై వెలుగొందుచున్నవాడను. నన్ను వెలిగించుటకు మరొక జ్యోతి యొక్క ఆవశ్యకత లేదు. నేనే స్వయంజ్యోతి స్వరూపుడను.

అహమ్ సర్వాధిపతిరస్మి : ఈ ఇంద్రియములకు, దేహములకు, జాగ్రత్-స్వప్న-సుషుప్తి భూములకు అధిపతిని. అధికారిని. విశ్వ-తేజస-ప్రాజ్ఞ పురుషుల నియామకుడను. సర్వాధిపతిని।

అహమ్ సర్వభూత అధివాసో : సర్వజీవుల అంతరాత్మయే నా నివాసగృహము. సర్వాంతరాత్ముడను. సర్వేసర్వత్రా ఆత్మగా ఉనికిని కలిగియున్నవాడను. సర్వత్రా సమస్వరూపుడనై సర్వదా వెలుగొందుచున్నవాడను. నా సమక్షమునందే అన్యమగు సమస్తము యొక్క సృష్టి - స్థితి - లయములు నాయొక్క భావనావినోదముగా జరుగుచూ ఉంటున్నాయి.

సర్వవ్యాపీ : స్వప్నద్రష్టయే స్వప్నమంతా వ్యాపించిఉన్న తీరుగా, సర్వే సర్వత్రా సర్వముగా వ్యాపించి, విస్తరించి ఉన్నవాడను; నాకు అన్యమై ఎక్కడా ఏదీ లేదు. ఇదంతా నా యొక్క సంప్రదర్శనమే.

స్వరాట్ అహమ్ : విశ్వవిరాట్ స్వరూపుడను. విశ్వమంతా నా యొక్క స్వయమానంద ప్రదర్శనమే! ఈ త్రిలోకములు త్రిమూర్తులు, దేవతలు, తదితరులు.. అంతా అస్మత్ ఆత్మ క్రీడా ప్రదర్శన విన్యాసమే! (అహమ్ ఆదిశ్చ మధ్యంచ భూతానామ్ అంతమేవచ).

సమస్త సాక్షీ : సమస్తమునకు వేరుగా సాక్షీమాత్రుడనై యున్నాను. కేవల సాక్షీభూతుడనేగాని, జగత్తులో ప్రవేశించి, బాధింపబడువాడను కాను. బంధించువాడను అసలే కాను.

సర్వాత్మా సర్వభూత గుహాశయః! : సర్వాత్ముడను. సర్వులకు ఆత్మస్వరూపుడనై, సర్వభూతముల (జీవుల) హృదయగుహలలో- వాయువు వలె- ఆశ్రయించి ఉన్నవాడను. (అహమ్ సర్వభూత - ఆశయ స్థితః)

సర్వేంద్రియ గుణాభాసః; సర్వేంద్రియ వివర్జితః : సర్వేంద్రియముల స్వభావములందు, కార్యక్రమములందు అభాసించువాడను. (I reflect in all organs, organ-related functions and concerned experience related things). అయితే సర్వేంద్రియములను అధిగమించి, అతీతుడనై ఉన్నవాడను కూడా! (All this is my own reflection).

అహమ్ స్థానత్రయ వ్యతీతో : భూ-ఆకాశ-అంతరిక్ష స్థానములకు, భూత-వర్తమాన-భవిష్యత్ స్థానములకు అతీతుడైనవాడను.

అహమ్ సర్వానుగ్రహకో : సర్వము నా అనుగ్రహము (Accepting and According) నుండి బయల్వెడలు చున్నట్టివే! సర్వము నా అనుమతి నుండియే ఉనికి-ప్రవర్తనములను పొందుచున్నవగుచున్నాయి.

సత్-చిత్-ఆనంద పూర్ణాత్మా : సత్ (ఉనికి) - చిత్ (ఎరుక)- ఆనందము (అనుభూతి)లచే సర్వమును పూరించివేయుచున్న ఆత్మస్వరూపుడను. ఈ సర్వము సర్వదా నాయొక్క ‘పూర్ణము’లోని అంతర విశేషము.

అహమ్ సర్వప్రేమాస్పదో : సర్వము నా చిత్త (లేక) ఇచ్ఛా స్వరూపమే! నా ఇష్టము నుండే సర్వము బయల్వెడలుచున్నాయి. అందుచేత సర్వప్రేమాస్పదుడను. నా పరాప్రేమ ప్రదర్శనమే జగత్-దృశ్యము.

సత్‌చిత్ ఆనందమాత్రోఽహమ్ : నేను కేవల సత్ (ఉనికి) చిత్ (ఎరుక) ఆనంద (అనుభవ) స్వరూపుడను. వాటి యొక్క విస్తరణయే ఈ విశ్వప్రదర్శనము.

చిద్ఘనః స్వప్రకాశోఽస్మి : ఘనీభూత చిత్-స్వయం ప్రకాశ స్వరూపుడను. అట్టి స్వయం ప్రకాశము యొక్క వెలుగుయే తదితరమైనదంతా!

సత్త్వ స్వరూప : కేవల సాత్విక-సత్త్వ స్వరూపుడనై సర్వదా ప్రభాసమానుడను.

చిన్మాత్రః : కేవల చిన్మాత్రుడను. నా చిత్ వెలుగుయే ఈ జీవాత్మ- జగత్తుల రూపమును సంతరించుకొనుచున్నది.

సిద్ధః : సర్వము నా పట్ల సిద్ధించియే ఉన్నది. క్రొత్తగా సిద్ధించవలసినదేదీ లేనేలేదు. నాకు నేనుగా నా కొరకై మనో-బుద్ధి-చిత్త-అహంకారములను, అనురాగ-విరాగములను సిద్ధించుకొనుచున్నట్టివాడను.

అహమ్ సర్వాత్మకోఽస్మి : సర్వాత్మకుడనై ఉండగా, క్రొత్తగా ఇంకా పొందవలసినదేమున్నది?

అహమ్ సర్వాధిష్ఠాన చిన్మాత్రోఽస్మి : మట్టియే మట్టి బొమ్మలన్నిటికీ అధిష్ఠానమైయున్న తీరుగా నేను చిన్మాత్ర స్వరూపుడనై సర్వమును అధిష్ఠించినవాడనై ఉన్నాను.

అహమ్ స్వా-త్మబంధ హరో : నాయొక్క బంధమును నేనే కల్పించుకొనుచున్నాను. మరల నా ఇచ్ఛానుసారంగా బంధములు త్రెంచి వేసుకుంటున్నాను కూడా! అంతేగాని, నాకు బంధమును మరొకరు కల్పించునదీ కాదు. ఇంకొకరు తొలగించునదీ కాదు. నా బంధములను నేనే హరించుకొనువాడను.

అహమ్ సర్వగ్రాసో : సర్వము ఆస్వాదించువాడను! సర్వము నాకు ఉపాహారము! గ్రాసము! సర్వము నాయందే దాగి ఉండి, ప్రవర్తన శీలమగుచున్నది.

సర్వద్రష్టా : - సర్వమునకు ద్రష్టను.
- దృశ్యము నాకల్పన.
- నాయందు నేనే సర్వము దర్శించువాడనుకూడా! ఈ దృశ్యము - ద్రష్టలను సర్వదా దర్శించువాడను.

సర్వానుభూః అహమ్ : సర్వత్రా భూ-భువర్-సువర్-స్వరూపుడనై నాకు నేనే ఆస్వాదించువాడనై ఉన్నాను! సర్వ అనుభూతులకు రచయితను నేనే. ఆస్వాదించువాడను నేనే.

ఈ విధంగా స్వస్వరూపమగు ఆత్మగురించి చెప్పుకున్న విశేషణములన్నీ కూడా బ్రహ్మతత్త్వమును సిద్ధించుకొనినట్టి బ్రహ్మవేత్తలచే - (ఊర్ధ్వ బాహుః విరౌమ్యేష) - ఎలుగెత్తి, గానము చేయబడుచున్నాయి. రెండు చేతులు ఎత్తి సుస్పష్టపరచుచున్నాయి.
ఈ ఈ ఆత్మభావనలను మరల మరల పఠించాలి. అధ్యయనము చేయాలి. అనుభూతపరచుకోవాలి.

ఇవన్నీ మన యొక్క ఆత్మ సంబంధమైన సహజ స్వరూప-స్వభావములు. మనలో ప్రతి ఒక్కరూ అట్టి ఆత్మానంద స్వరూపులమే. ఇందులో కాదనవలసినది ఏమున్నది?

ఎవ్వరైతే స్వస్వరూప-సర్వస్వరూప ఆత్మ గురించి ఈ ఈ విధముగా ఎరిగినవారై మననము చేయువారై, క్రమంగా నిశ్చల చిత్త-చిత్ స్వరూపులై ఉంటారో… వారు ‘పురుషుడు’ అను శబ్దముచే చెప్పబడుచున్నారు.

‘‘వారే - ‘‘పురుషకారము’’చే ‘‘సిద్ధించుకోవలసినది’’ సిద్ధించుకొన్నట్టి వారు.
స వై ‘‘పురుష’’ - ఉచ్యతే।। ఓం తత్ సత్।।



🙏 ఇతి బ్రహ్మవిద్య ఉపనిషత్ ‌🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।