[[@YHRK]] [[@Spiritual]]

Dhyāna Bindu Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


కృష్ణ యజుర్వేదాంతర్గత

15     ధ్యాన బిందూపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్



ధ్యాత్వా యద్బ్రహ్మమాత్రం తే స్వావశేషధియా యయుః .
యోగతత్త్వజ్ఞానఫలం తత్స్వమాత్రం విచింతయే ..
శ్లో।। ధ్యాత్వా యత్ బ్రహ్మమాత్రం తే స్వ-అవశేష ధియా యయుః,
యోగతత్త్వ జ్ఞానఫలం తత్ ‘‘స్వమాత్రం’’ విచింతయే।।
అన్యమైనదంతా బుద్ధితో ‘నేతి (న ఇతి)’ రూప విశ్లేషణగా త్యజించగా, చివ్వరికి శేషించినట్టి ఆత్మ గురించిన యోగాభ్యాస-తత్త్వ విచారణచే ధ్యానించటము యొక్క స్వస్వరూప జ్ఞానఫలము - అని విచింతన చేయబడును గాక!

ప్రథమ అధ్యాయము - యోగసాధనా వివిధ విధానములు


యది శైలసమం పాపం విస్తీర్ణం బహుయోజనం .
భిద్యతే ధ్యానయోగేన నాన్యో భేదః కదాచన .. 1..
ఓం
01. యది శైల సమం పాపం
విస్తీర్ణం బహుయోజనం
భిద్యతే ధ్యానయోగేన
న అన్యో భేదః కదాచన।।

పాపముల గుట్టలు-అనేక యోజనముల వరకు విస్తరించియున్న కొండల సమూహమువలె ఉన్నప్పటికీ కూడా, అవన్నీ ‘ధ్యానయోగము’చే నశించి పోగలవు. లేదా, వాటియొక్క ఉత్తరోత్తర అనుభవము అనివార్యము. మరేవిధంగానూ అవి తొలగవు. అందుచేత ధ్యానయోగము అత్యంత ప్రయోజనకరము.
లేదా, జన్మ-కర్మల ప్రహసనమునకు అంతు-పొంతు ఉండదు.


బీజాక్షరం పరం బిందుం నాదో తస్యోపరి స్థితం .
సశబ్దం చాక్షరే క్షీణే నిఃశబ్దం పరమం పదం .. 2..
02. బీజాక్షరం పరం,
బిందు నాదమ్
తస్య ఉపరిస్థితమ్,
స శబ్దశ్చ అక్షరే క్షీణే,
‘నిశ్శబ్దమ్ పరమంపదమ్’।।
పరమునకు సంజ్ఞ అగు ‘ఓం’… బీజాక్షరము (లేక) ప్రణవము-సర్వ బిందు నాదములను దాటినట్టి స్థానమును (అది భౌతికం కాదు). శబ్దరూపమాత్రం కూడా కాదు. సర్వమునకు ఆవల! కాబట్టి పరము।
శబ్దముయొక్క అక్షరోచ్చారణ క్షీణించగా, ఇక ఆపై ప్రణవము (ఓం) - కేవలాత్మానుభవముగా, ‘నిశ్శబ్ద పరమపద స్థానము’ గా అయిఉంటున్నది. (మామిడి పండు రుచి తింటేనే నిజానికి తెలుస్తుంది. పేరు చెప్పినంత మాత్రం చేతకాదు కదా! కేవలాత్మానుభవము అట్టిది. అది నిశ్శబ్ద పరమపదము. అనుభవైక వేద్యము).

అనాహతం తు యచ్ఛబ్దం తస్య శబ్దస్య యత్పరం .
తత్పరం విందతే యస్తు స యోగీ ఛిన్నసంశయః .. 3..
03. అనాహతంతు యత్ శబ్దమ్,
తస్య శబ్దస్య యత్ పరమ్,
తత్ పరమ్ విందతే యస్తు,
స యోగీ ఛిన్న సంశయః।।
ఏ యోగాభ్యాసి అయితే అభ్యాసముచే అనాహత చక్రము (హృదయ చక్రము - అభౌతిక శక్తి రూపము) నుండి వినబడు ఓంకార శబ్దమును వినుచూ, ఆ శబ్దమునకు ఆవల (పరంగా) గల సాక్షీ స్వస్వరూపమును అనుభూతపరచుకొనుచూ ఉంటున్నాడో,
అట్టి యోగి సర్వ సంశయములను దాటినవాడై ఆత్మానుభవముచే నిత్యముక్తుడు అగుచున్నాడు.

వాలాగ్రశతసాహస్రం తస్య భాగస్య భాగినః .
తస్య భాగస్య భాగార్ధం తత్క్షయే తు నిరంజనం .. 4..
04. వాలాగ్ర శత సాహస్రం
తస్య భాగస్య భాగినః
తస్య భాగస్య భాగార్థమ్
తత్-క్షయేతు నిరంజనమ్।
నిర్మలుడు, అప్రమేయుడు అగు పరమాత్మ సూక్ష్మ రూపముతో సర్వ దేహములలో వేంచేసియే ఉన్నారు.
ఒక జంతువు తోకయొక్క చిట్ట చివరి కొనాగ్ర భాగంలోని సూక్ష్మకణముయొక్క లక్షవవంతు భాగమువలె అతి సూక్ష్మరూపుడై ప్రకాశించుచున్నారు.
యోగముతో మనస్సు లయించగా ఆ యోగి నిరంజనుడై అట్టి పరమాత్మానుభవము పొందుచున్నాడు.

పుష్పమధ్యే యథా గంధః పయోమధ్యే యథా ఘృతం .
తిలమధ్యే యథా తైలం పాషాణాష్వివ కాంచనం .. 5..
05. పుష్పమధ్యే యథా గంధః
పయో మధ్యే యథా ఘృతమ్,
తిలమధ్యే యథా తైలమ్,
పాషాణేష్వివ కాంచనమ్,
ఆత్మభావన అనగా? ఆత్మ ఎట్టిదో గ్రహించి భావించటము.
ఏ విధంగా పుష్పములలో గంధము (సువాసన) ఉంటుందో, పాలలో అంతర్గతంగా ‘నేయి’ (Ghee) దాగి ఉంటుందో, నువ్వు గింజలలో నూనె, రాళ్లలో (బంగారు ఖనిజపు రాళ్లు) బంగారము దాగి ఉంటుందో….(ఆత్మ సర్వత్రా అట్లా వేంచేసి ఉన్నది. ప్రతి జీవుని అంతరమున పరబ్రహ్మము ఆవిధంగా వెలుగొందుచున్నది).

ఏవం సర్వాణి భూతాని మణౌ సూత్ర ఇవాత్మని .
స్థిరబుద్ధిరసంమూఢో బ్రహ్మవిద్బ్రహ్మణిస్థితః .. 6..
06. ఏవం సర్వాణి భూతాని
మణౌ సూత్ర ఇవ ఆత్మని।
స్థిరబుద్ధిః అసమ్మూఢో
బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః।।
పూలదండలోని దారమువలే సర్వజీవులలో అఖండస్వరూపమగు ఆత్మ వేంచేసి, విస్తరించినదై ఉన్నది.
ఆత్మదర్శనమునకై ముందుగా స్థిరమైన బుద్ధితో దృశ్యపరిమితమైన మూఢ - మూర్ఖత్వములను అధిగమించాలి.
బ్రహ్మముగురించి తెలుసుకోవాలి. ఇకప్పుడు బ్రహ్మీస్థితిని అభ్యాస పూర్వకంగా సంతరించుకోవాలి.
బ్రహ్మము తానై ఉండటమే బ్రాహ్మీస్థితి. బ్రహ్మమును ఎరిగినవాడు బ్రహ్మమునందే సంస్థితుడగుచున్నాడు.

తిలానాం తు యథా తైలం పుష్పే గంధ ఇవాశ్రితః .
పురుషస్య శరీరే తు సబాహ్యాభ్యంతరే స్థితః .. 7..
07. తిలానాం తు యథా తైలం,
పుష్పే గంధ ఇవ ఆశ్రితః,
పురుషస్య శరీరేతు
స బాహ్య - అభ్యంతరే స్థితః।।
నువ్వులగింజలలో నూనె వలె, పుష్పములలో సువాసన ఉంటున్న తీరుగా ఈ జీవుని దేహముయొక్క బయట - లోపల కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నారు.
ఆత్మ తత్త్వమే విస్తరించినదై- అంతర్ బహిర్ స్వరూపమైయున్నది. బాహ్య-అభ్యంతరములుగా ఉన్నదంతా పరమాత్మయే. (అంతర్బహిశ్చ యత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః।)

వృక్షం తు సకలం విద్యాచ్ఛాయా తస్యైవ నిష్కలా .
సకలే నిష్కలే భావే సర్వత్రాత్మా వ్యవస్థితః .. 8..
08. వృక్షం తు సకలం విద్యాత్
ఛాయా తస్యైవ నిష్కళా,
సకలే - నిష్కళే భావే
సర్వత్ర ఆత్మా వ్యవస్థితః।।
ఒక పెద్ద ఫలవృక్షము యొక్క ఛాయ (నీడ)లో వృక్షముయొక్క కొమ్మలు, పూలు, ఫలముల నీడలు సాకారంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ, పరిశీలనగా చూస్తే, అంతా ఒక తీరైన ఛాయయే కదా!
ఈ భావనా రూప జగత్తంతా కూడా (వృక్షముయొక్క వివిధ భాగముల ఛాయలలో వృక్షఛాయయే అయి ఉన్నరీతిగా) - సర్వత్రా ఆత్మయే వ్యవస్థితమై యున్నది. ఆత్మయే జగత్తుగా భేద దృష్టికి అగుపిస్తోంది. ఆత్మకు వేరై ఏదీ లేదు. ఆత్మ సర్వదా ఏకము - అఖండముగానే భావ-అభావ రూపంగా సర్వత్రా వ్యవస్థితమై ఉన్నది.
(ఆత్మ వృక్షము వంటిదైతే, జగత్తు ఛాయ వంటిది)

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వముముక్షిభిః .
09. ‘ఓం’ ఇతి ఏక అక్షరమ్ బ్రహ్మ
ధ్యేయం సర్వ ముముక్షుభిః।
అట్టి ఏకము (అనేకముకానిది), అక్షరము (క్షరము లేనిది) అగు బ్రహ్మము ‘ఓం’ అను సంజ్ఞతో చెప్పబడుచున్నది. మోక్షము కోరు ముముక్షువు లందరికీ అట్టి ఏక-అక్షర పరబ్రహ్మమగు ‘ఓం’ ధ్యానబిందువు.
‘ఓం’ అని ఉచ్ఛరించబడుచున్న బ్రహ్మమునకు ‘4’ అంశలు.

పృథివ్యగ్నిశ్చ ఋగ్వేదో భూరిత్యేవ పితామహః .. 9..
అకారే తు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవాంశకే .
పృథివి అగ్నిశ్చ ఋగ్వేదో
‘భూః’ ఇత్యేవ పితామహః
‘అ’కారేతు లయం ప్రాప్తే
ప్రథమే ప్రణవాంశకే। (అ)
మొట్టమొదటి ప్రణవాంశ ‘అ’.
అట్టి ‘అ’కార ప్రణవ ప్రథమాంశతో భూమి, అగ్ని, ఋగ్వేవేదము, ‘భూః’ అనే వ్యాహృతి, బ్రహ్మ (సృష్టికర్త)…వీటిని లయం అగుచున్నారో (వీటన్నిటినీ అ కార పరబ్రహ్మముగా భావించబడుచున్నాయి)

అంతరిక్షం యజుర్వాయుర్భువో విష్ణుర్జనార్దనః .. 10..
ఉకారే తు లయం ప్రాప్తే ద్వితీయే ప్రణవాంశకే .
10. అంతరిక్షం యజుః వాయుః,
‘భువో’ విష్ణుః జనార్దనః,
‘ఉ’కారేతు లయం ప్రాప్తే
ద్వితీయో ప్రణవాంశకే। (ఉ)
ఓం’ శబ్ద సంజ్ఞా ప్రణవము యొక్క రెండవ అంశ ‘ఉ’.
అంతరిక్షము, యజుర్వేదము, వాయువు-ఇవన్నీ ఉకార ప్రణవాంశ. అట్టి ఉకారాంశ లయమైనప్పుడు భువో (అంతరిక్షము), యజుర్వేదము, ‘భువః’ అను వ్యాహృతి, మహావిష్ణువు - ఉకారాంశయందు లీనమై ఉంటున్నాయి. అనగా, అవన్నీ ‘ఉ’కారాంశ స్వరూపమై ఉపాసకునకు అనుభూతనగుచున్నాయి.

ద్యౌః సూర్యః సామవేదశ్చ స్వరిత్యేవ మహేశ్వరః .. 11..
మకారే తు లయం ప్రాప్తే తృతీయే ప్రణవాంశకే .
11. ద్యౌః సూర్యః సామవేదశ్చ
స్వర (స్సువః) ఇత్యేవ మహేశ్వరః
‘మ’ కారేతు లయం పాప్తే
తృతీయే ప్రణవాంశకే। (మ)

ప్రణవము యొక్క ‘3వ’ అంశ ‘మ’కారము.
సువర్ (స్వర్గ) లోకము సూర్యుడు, సామవేదము - ఇవన్నీ మ కారాంశలు.
మహేశ్వరుడు స్సువః వ్యాహృతి రూపము. ప్రణవోపాసమునకు సువర్ (దేవతా) లోకము, సూర్యుడు, సామవేదము - ఇవన్నీ మకారాంశగా అనుభవమై, అప్పుడిక-మకారాంశయందు లీనమైనవిగా అగుచున్నాయి.


అకారః పీతవర్ణః స్యాద్రజోగుణ ఉదీరితః .. 12..
ఉకారః సాత్త్వికః శుక్లో మకారః కృష్ణతామసః .
12. అకారః పీతవర్ణస్యాత్
రజోగుణ ఉదీరితః
‘ఉ’కారః సాత్వికః శుక్లో
‘మ’ కారః కృష్ణ తామసః।
‘అ’కారము పీత (పసుపు) రంగుతో ప్రకృతిలో ‘రజోగుణము’ రూపమై ప్రదర్శితమగుచున్నది.
‘ఉ’ కారము శ్వేత (తెలుపు) వర్ణముగా ప్రకృతిలో సాత్విక గుణము రూపమై ఉన్నది.
‘మ’ కారము కృష్ణ (నీల-నల్లని) వర్ణమై తమోగుణరూపమై ఉన్నది

అష్టాంగం చ చతుష్పాదం త్రిస్థానం పంచదైవతం .. 13..
ఓంకారం యో న జానాతి బ్రహ్మణో న భవేత్తు సః .
13. అష్టాంగం చ చతుష్పాదం
త్రిస్థానమ్, పంచదైవతమ్।
ఓంకారం యో న జానాతి
బ్రాహ్మణో న భవేత్తు సః।

ప్రణవము (అకార - ఉకార - మకార - అర్ధమాత్ర-బిందు - నాద - కళ - కళాతీత - అనబడే) ‘8’ అంగములు కలిగియున్నది.
4 పాదములు, ‘3’ వ్యాహృతులు, ‘5’గురు అధి దేవతలు కలిగియున్నది.

అట్టి ఓంకారమును ఎవ్వరు తెలుసుకుని ఉండరో, అట్టివారు ‘బ్రాహ్మణుడు’ అని అనిపించుకోరు.

ఆత్మ సర్వుల బాహ్య అభ్యంతర స్వరూపమై, భూ-భువర్- సువర్-త్రివ్యాహృతి స్వరూపమై, త్రిగుణాత్మకమై, అష్టాంగయోగముల లక్ష్యమై జాగ్రత్-స్వప్న-సుషుప్తి - తురీయముల చదుష్పాదమై, పైన - మధ్య - క్రింద స్థానములను ఆక్రమించుకొని ఉన్నది. పంచభూతాత్మమగు ఆత్మగా కనిపించే దృశ్యప్రపంచమంతా ఆత్మయే. అట్టి ‘ఓం’కారార్థమగు ఆత్మను తెలుసుకొని పలుకువాడే - బ్రాహ్మణుడు.


ప్రణవో ధనుః శరో హ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే .. 14..
14. ప్రణవో ధనుః। శరో హి ఆత్మా।
బ్రహ్మ తత్ లక్ష్యమ్ ఉచ్యతే।

ప్రణవమును ధనస్సుగాను, మనోరూప జీవాత్మరూపమును బాణముగాను, బ్రహ్మము లక్ష్యముగా నియమించి దృశ్య పరిమితభావనను (జాగ్రత్ దృష్టి-సంకుచిత పరిమిత భావములను) ఛేదించాలి. బ్రహ్మమును చేరిన మనస్సు బ్రహ్మమే అగుచున్నది. (ఈ జీవుడు ప్రణవోపాసనచే శివుడే అగుచున్నాడు).


అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్ .
నివర్తంతే క్రియాః సర్వాస్తస్మిందృష్టే పరావరే .. 15..
15. అప్రమత్తేన వేద్ధవ్యం
శరవత్ తన్మయో భవేత్।
నివర్తంతే క్రియాః సర్వాః
తస్మిన్ దృష్టే పరావరే।।
అప్రమత్తుడై ‘‘మనస్సు’’ అను బాణమును ఆత్మభావనానుసంధానము లక్ష్యముగా సంధించి విడచినవాడు బ్రహ్మమయుడు (తన్మయుడు) అగుచున్నాడు. అట్టి పరమాత్మ దృష్టి-భావనల నిర్దుష్టతత్వముచేత సర్వ సాంసారిక క్రియలు కూడా నివర్తము పొందుచున్నాయి. అన్యముగా అనిపించేదంతా అంతిమంగా ఆత్మయొక్క ‘అనన్యత్వము’లో విలీనమై, అరూపమగుచున్నది.

ఓంకారప్రభవా దేవా ఓంకారప్రభవాః స్వరాః .
ఓంకారప్రభవం సర్వం త్రైలోక్యం సచరాచరం .. 16..
16. ‘ఓం’కార ప్రభవా వేదా।
‘ఓం’కార ప్రభవాః స్వరాః।
‘ఓం’ కార ప్రభవం సర్వమ్
త్రైలోక్యం స చరాచరమ్।।
‘ఓం’కారము నుండియే 4 వేదములు, వేదమంత్ర (16 విధములగు) స్వరములు, ఈ భూ-పాతాళ-స్వర్గ త్రిలోకములు, ఈ కనబడే - వినబడే విశ్వజగత్తు, అట్టి త్రైలోక్యములలోని సర్వ చర - అచరములు ప్రభవిస్తున్నాయి. (ఓంకారము వలననే ప్రవర్తితమగుచున్నాయి).

హ్రస్వో దహతి పాపాని దీర్ఘః సంపత్ప్రదోఽవ్యయః .
అర్ధమాత్రా సమాయుక్తః ప్రణవో మోక్షదాయకః .. 17..
17. ‘హ్రస్వో’ దహతి పాపాని
‘దీర్ఘః’ సంపత్ ప్రదో అవ్యయః
అర్ధమాత్రా సమాయుక్తః
ప్రణవో మోక్షదాయకః।
హ్రస్వమగు ‘ఓం’ కారము జన్మ - జన్మాంతరములలోని పాపములన్నీ భస్మము చేసివేయగలదు. దీర్ఘమగు ప్రణవము సర్వ సంపదలు ప్రసాదిస్తోంది. అర్ధమాత్ర (మ్‌) తో కూడిన ప్రణవము మోక్షమును ప్రసాదించుచున్నది. (అర్ధమాత్ర = The sense of it Essence)

తైలధారామివాచ్ఛిన్నం దీర్ఘఘంటానినాదవత్ .
అవాచ్యం ప్రణవస్యాగ్రం యస్తం వేద స వేదవిత్ .. 18..
18. తైలధారామ్ ఇవ అచ్ఛిన్నం (అవిచ్ఛిన్నం)
దీర్ఘ ఘంటా నినాదవత్,
అవాచ్యం ప్రణవస్య అగ్రమ్
యస్తం (యః తం) వేద, స వేదవిత్।
తెంపులేని తైలధారవలెను, (నూనె ధారవలె), సుదీర్ఘంగా గంట అనేకసార్లు మ్రోగిస్తూ జనించు వస్తున ‘టంగ్‌గ్‌గ్-టంగ్‌గ్‌గ్’ శబ్దతరంగముల నినాదము వలెను వాక్కునకు విషయముగాని ప్రణవమును (లేక - ఇదంతా సర్వదా….బ్రహ్మమే అగుటను) ఎవ్వరు తెంపు లేకుండా (అనుక్షణికంగా) తెలుసుకుంటారో అట్టివాడు వేదవేత్త! వేదహృదయ మును ఎరిగినట్టివాడు.

హృత్పద్మకర్ణికామధ్యే స్థిరదీపనిభాకృతిం .
అంగుష్ఠమాత్రమచలం ధ్యాయేదోంకారమీశ్వరం .. 19..
19. హృత్ పద్మ కర్ణికా మధ్యే
స్థిరదీప నిభాకృతిమ్
అంగుష్ఠమాత్రమ్ అచలమ్
ధ్యాయేత్ ‘ఓం’ కారమ్ ఈశ్వరమ్।।

హృదయపద్మ - కర్ణికల (రెక్కల) మధ్యగా నిశ్చల దీపమువలే ప్రకాశించు వాడు. అంగుష్ఠ బొటనవ్రేలు ప్రమాణముగా (బల్బులోవెలుగు తీగవలె) ‘తత్’ అర్థపూర్వకంగా) స్థానభూతుడు, జన్మ-కర్మల వ్యవహారముచే చలనము పొందనివాడు ‘ఓం’కారస్వరూపుడు-అగు ఈశ్వరుని హృదయములోనే గమనించి, దర్శించి, ధ్యానించాలి. అంతేగాని, బాహ్యమున మరెక్కడో కాదు.


ఇడయా వాయుమాపుర్య పూరయిత్వోదరస్థితం .
ఓంకారం దేహమధ్యస్థం ధ్యాయేజ్జ్వాలవలీవృతం .. 20..
20. ఇడయా వాయుమ్ ఆపూర్య
పూరయిత్వ ఉదర స్థితమ్,
‘ఓం’ కారం దేహ మధ్యస్థం
ధ్యాయేత్ జ్వాలావళీవృతమ్।।
(ఎడమవైపుగాగల) ఇడనాడిని (ఎడమ ముక్కుపుటము ద్వారా) గాలిని పూరకం చేసి, అట్టి గాలిని ఇడనాడి - ఉదర (పొట్ట) భాగములలో నింపి కుంభకం (నిండు నిశ్చలం) చేసి, దేహము మధ్య తేజోమయమై జ్వాలావళి వెలుగొందుచున్న ప్రకృతి - పురుష ఏకరూపమగు ఓంకారార్థ స్వాత్మను ఎల్లప్పుడు ధ్యానిస్తూ ఉండాలి.
‘అహమ్-త్వమ్-జగత్’ - ఏక రూపుడుగా అనుభూతపరచుకోవటమే ధ్యానముయొక్క లక్ష్యసిద్ధి.

బ్రహ్మా పూరక ఇత్యుక్తో విష్ణుః కుంభక ఉచ్యతే .
రేచో రుద్ర ఇతి ప్రోక్తః ప్రాణాయామస్య దేవతాః .. 21..
21. బ్రహ్మా ‘పూరక’ ఇత్యుక్తో,
విష్ణుః ‘కుంభక’ ఉచ్యతే।
‘రేచో’ రుద్ర ఇతి ప్రోక్తః
ప్రాణాయామస్య దేవతాః।।
→ వాయువును పూరించటమును-‘పూరకము’ను-సృష్టికర్త అగు ‘బ్రహ్మ’గాను,
→ వాయువును నిలిపి ఉంచే ప్రక్రియమగు ‘కుంభకము’ను - స్థితికారకుడు, వరిపోషకుడు అగు ‘విష్ణువు’గాను,
→ వాయువును బయటకు వదలు ప్రక్రియయగు ‘రేచకము’ను లయకారకుడగు రుద్రుడు గాను
త్రిమూర్తులను ప్రాణేశ్వర- ఏకరూపంగా భావించి ఉపాసించాలి.

ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం .
ధ్యాననిర్మథనాభ్యాసాదేవ పశ్యేన్నిగూఢవత్ .. 22..
22. ‘ఆత్మానమ్’ అరణిం కృత్వా,
‘ప్రణవమ్’ చ ఉత్తరారణిమ్,
‘ధ్యాన’ నిర్మథనాభ్యాసాత్
‘దేవమ్’ పశ్యేత్ నిగూఢవత్।।


నిప్పు జనింపజేసే ప్రకియలో అరణి (రెండు కొయ్యలను) ఉపయోగించు తీరుగా,
→ ‘జీవాత్మ’ను అట్టి అరణియొక్క ఒరిపిడి పొందే క్రింద కొయ్యగాను,
→ ప్రణవమును, అరణి కొయ్య - యొక్క పైవిభాగముగాను,
→ ‘ధ్యానము’ను ఒరిపిడి చేయు క్రియావిశేషముగాను భావించి స్వహృదయమునందే రహస్యముగా వేంచేసియున్న ఆ ఆత్మ దేవుని ‘సాధన’ అనే ప్రయత్నముతో జ్యోతి (వెలుగు)గా సందర్శించాలి.

ఓంకారధ్వనినాదేన వాయోః సంహరణాంతికం .
యావద్బలం సమాదధ్యాత్సమ్యఙ్నాదలయావధి .. 23..
23. ‘ఓం’ కార ధ్వని నాదేన
వాయోః సంహరణాంతికమ్
యావత్ బలం సమాదధ్యాత్
సమ్యక్ నాద లయావధి।।
హృదయమున సర్వ స్వరూపుడగు పరమాత్మ అనునిత్యానుభవమయ్యే వరకు, రేచక-పూరక-కుంభకములను (మరియు) నాదముల శ్రవణోపాసన చేయాలి. పరమాత్మ తత్త్వముతో భావ-ఐక్యత పొందే వరకు శక్తి - అవకాశములను అనుసరించి పూరక-కుంభక-రేచక-ప్రాణాయామ యోగసాధన విధివిధానంగా నిర్వర్తిస్తూనే ఉండాలి.

గమాగమస్థం గమనాదిశూన్య-
మోంకారమేకం రవికోటిదీప్తిం .
పశ్యంతి యే సర్వజనాంతరస్థం
హంసాత్మకం తే విరజా భవంతి .. 24..
24. గమ - ఆగమస్థం, గమనాది శూన్యమ్,
‘ఓం’ కారమ్ ఏకమ్,
రవికోటి దీప్తమ్,
పశ్యంతి యే సర్వజనాంతరస్థమ్
హంసాత్మకం, తే విరజాభవంతి।
ఈ దృశ్యములోని సర్వజీవులయొక్క-జగత్తులయొక్క-లోకముల యొక్క రాకపోకలన్నీ తనవే అయి ఉన్నట్టిది, కానీ తనకు స్వతఃగా ఎటువంటి రాకపోకలు లేనట్టిది, సర్వధా యథాస్థానములోనే ఉండి ఉన్నట్టిది, కోటి సూర్యుల దీప్తితో వెలుగొందుచున్నట్టిది, సర్వదా ఏకమే అయి ఉన్నట్టిది (అనేకముగా అవనట్టిది)-అగు ఓంకార సంజ్ఞయగు పరబ్రహ్మమును ఎవ్వరైతే సర్వజీవులలో అంతరస్థమై ఉన్నట్లు దర్శిస్తూ ఉంటారో…అట్టి హంసాత్మకుడు (సోఽహమ్‌భావుడు) సర్వదృశ్య భావములనుండి విరామము పొంది మోక్షస్వభావుడగుచున్నాడు. దృశ్యమంతా తానై వెలుగొందుచున్నాడు. ఆ పరబ్రహ్మము తానే అయి విరాజిల్లుచున్నాడు.

యన్మనస్త్రిజగత్సృష్టిస్థితివ్యసనకర్మకృత్ .
తన్మనో విలయం యాతి తద్విష్ణోః పరమం పదం .. 25..
25. యత్ ‘మనః’ త్రిజగత్ సృష్టిః
స్థితిః వ్యసనకర్మ కృత్,
తత్ మనో విలయం యాతి
తద్విష్ణోః పరమం పదమ్।।

ఈ త్రిజగత్తుల సృష్టి అంతా మనోకల్పనయే! ఏ మనస్సైతే కల్పనా రూపమగు పాతాళ-భూ-స్వర్గ, జాగ్రత్-స్వప్న-సుషుప్తులను ఒకవ్యసనము వలే ఆశ్రయించుచూ ఉన్నదో-అట్టి మనస్సు అద్దాని జనన స్థానమునందు (తరంగం జలంలోలాగా) లయించినప్పుడు-ఇక అప్పుడు అనుభవమునకు వచ్చు స్వస్వరూపము- ‘పరమునకే పరమగు విష్ణుతత్త్వము’.


అష్టపత్రం తు హృత్పద్మం ద్వాత్రింశత్కేసరాన్వితం .
తస్య మధ్యే స్థితో భానుర్భానుమధ్యగతః శశీ .. 26..
26. అష్టపత్రం (8) తు, ‘హృత్’ పద్మమ్
ద్వాత్రింశత్ (32) కేసరాన్వితమ్
తస్య మధ్యే స్థితో భానుః
భానుమధ్యే గతః శశీ।।

→ ‘హృదయము’ అనే పద్మము-‘8’ దళములతో (దృశ్య-దేహ-మనోబుద్ధి -చిత్త-అహంకార-కాల-జీవాత్మలతో), 32 కేసరములతో విరాజిల్లుచున్నది.
→ అట్టి హృదయములో ఆదిత్యుడు! సూర్యుడు! (The State prior to all that is making a begining) సూర్యమండలము!
→ సూర్య మండలము మధ్యగా చంద్ర మండలము!


శశిమధ్యగతో వహ్నిర్వహ్నిమధ్యగతా ప్రభా .
ప్రభామధ్యగతం పీఠం నానారత్నప్రవేష్టితం .. 27..
27. శశి మధ్యగతో వహ్నిః,
వహ్ని మధ్యగతా ప్రభా।
ప్రభా మధ్యగతం పీఠమ్
నానారత్న ప్రవేష్టితమ్।।

→ చంద్ర మండలము మధ్యగా వాహ్ని (అగ్నిమండలము)!
→ అగ్నిమండలము మధ్యగా ప్రభ (వెలుగు) (ప్రభామండలము)!
→ అట్టి ప్రభామండలము మధ్యగా నానా రత్నఖచితమైన పీఠము!


తస్య మధ్యగతం దేవం వాసుదేవం నిరంజనం .
శ్రీవత్సకౌస్తుభోరస్కం ముక్తామణివిభూషితం .. 28..
28. తస్య మధ్యగతం దేవమ్
వాసుదేవమ్ నిరంజనమ్।
శ్రీవత్స కౌస్తుభోరస్కం
ముక్తామణి విభూషితమ్।
అట్టి నవరత్న ఖచిత సింహాసనముపై నిత్యనిరంజనుడగు (నిత్యనిర్మలుడు సర్వ హృదయవాసి, కేవలుడు అగు) వాసుదేవుడు ఆసీనులై ఉన్నారు. (వాసుదేవ స్సర్వమితి).
ఆయన శ్రీవత్స చిహ్నము ధరించిన వారు, అసతీ పుష్పమువలె నీలిరంగు ఛాయచే ప్రకాశించువారు, ముక్తామణిచే విభూషితులు.

శుద్ధస్ఫటికసంకాశం చంద్రకోటిసమప్రభం .
ఏవం ధ్యాయేన్మహావిష్ణుమేవం వా వినయాన్వితః .. 29..
29. శుద్ధ స్ఫటిక సంకాశం
చంద్రకోటి సమప్రభమ్,
ఏవం ధ్యాయేత్ మహావిష్ణుః
ఏవం వా వినయాన్వితః।
శుద్ధ స్ఫటికము వంటి స్వరూపులు, కోటిచంద్రుల ప్రశాంతమగు చల్లని కాంతులు విరజిమ్మువారు, అగు మహావిష్ణు భగవానుని వినయ - భక్తి జ్ఞాన - యోగ విధేయతలతో ధ్యానించాలి. ‘‘ఈ విశ్వమంతా ఆత్మస్వరూపుడగు విష్ణుభగవానుని సంప్రదర్శనమే’’- అని భావించటమే- ధ్యానించటము. ధ్యాసయే ధ్యానము.

అతసీపుష్పసంకాశం నాభిస్థానే ప్రతిష్ఠితం .
చతుర్భుజం మహావిష్ణుం పూరకేణ విచింతయేత్ .. 30..
30. అతసీ పుష్ప సంకాశం
నాభిస్థానే ప్రతిష్ఠితమ్
చతుర్భుజమ్ మహావిష్ణుమ్
పూరకేణ విచింతయేత్।।
త్రిరావృత్తి ప్రాణాయామము
నాభి స్థానములో అతసీ (అగిసె) పుష్పమువలే ప్రకాశిస్తూ చతుర్భుజములతో ప్రతిష్ఠితులై విరాజిల్లుచున్న మహావిష్ణుభగవానుని పూరక ప్రాణాయామ విధానముగా ధ్యానించాలి.

కుంభకేన హృదిస్థానే చింతయేత్కమలాసనం .
బ్రహ్మాణం రక్తగౌరాభం చతుర్వక్త్రం పితామహం .. 31..
31. కుంభకేన హృదిస్థానే, చింతయేత్ కమలాసనమ్।
బ్రహ్మాణం రత్నగౌరాభం, చతుర్వక్త్రం పితామహమ్।
హృదయ స్థానములో కమలాసనుడు, పచ్చటి రత్నమువలే ప్రకాశించువారు, నాలుగు ముఖములు కలవారు, పితామహుడు అగు బ్రహ్మదేవుని కుంభక ప్రాణాయామ పూర్వకంగా ధ్యానించాలి.

రేచకేన తు విద్యాత్మా లలాటస్థం త్రిలోచనం .
శుద్ధస్ఫటికసంకాశం నిష్కలం పాపనాశనం .. 32..
32. రేచకేన తు విద్యాత్మా
లలాటస్థం త్రిలోచనమ్।
శుద్ధ స్ఫటిక సంకాశం
నిష్కళం పాపనాశనమ్।।
లలాట స్థానములో ఆత్మతత్త్వజ్ఞాన విద్యాసంపన్నులు, త్రినేత్రుడు, శుద్ధ స్ఫటికమువలె తెల్లని దేహముతో ప్రకాశించువారు, నిష్కళంక - నిర్మల స్వరూపులు, సర్వపాపములను, సర్వ కర్మలను నశింపజేయువారు- అగు శంకరభగవానుని రేచకప్రాణాయామ విధానంగా ధ్యానించాలి.

అంజపత్రమధఃపుష్పమూర్ధ్వనాలమధోముఖం .
కదలీపుష్పసంకాశం సర్వవేదమయం శివం .. 33..
33. అబ్జపత్రమ్ అధః పుష్పమ్
ఊర్ధ్వ నాళమ్ అధోముఖమ్
కదళీపుష్ప సంకాశం
సర్వవేదమయమ్ శివమ్।।
హృదయ కమలము
యోగవిద్యా సుసంపన్నులగు యోగులు →
→ క్రింద వైపుగా పుష్పమును → ఊర్ధ్వ (పై) వైపుగా నాళమును
కదలీ (అరటి) పుష్పము ఆకారముగా క్రిందకు వేలాడుచున్న రీతిగా సర్వవేదమయుడు, వేదపురుషుడగు శివభగవానుని హృదయకమల యందు ధ్యానించెదరు గాక. తెలియబడేదంతా శివానంద స్వరూపమే కాబట్టి - ఆయన వేదమయుడు.

శతారం శతపత్రాఢ్యం వికీర్ణాంబుజకర్ణికం .
తత్రార్కచంద్రవహ్నీనాముపర్యుపరి చింతయేత్ .. 34..
34. శతారం శత పత్రాఢ్యమ్
విప్రకీర్ణాబ్జ కర్ణికమ్
తత్ర చంద్ర - అర్క - వహ్నీనామ్
ఉపర్యుపరి చిన్తయేత్।।
ఈ విధంగా నూరు రేకులతోను, నూరు అంచులతో కూడిన హృదయ కమలమును హృదయమునందు భావించి అరటిమొగ్గ (అరటిపువ్వు) ఆకారంగా భావించి, అద్దాని యందు చంద్ర - సూర్య - అగ్ని తేజస్సును ధ్యానించాలి, ‘‘తేజోమయమ్, విశ్వమనంతమాద్యం’’గా ఉపాసించాలి.

పద్మస్యోద్ఘాటనం కృత్వా బోధచంద్రాగ్నిసూర్యకం .
తస్య హృద్బీజమాహృత్య ఆత్మానం చరతే ధ్రువం .. 35..
35. పద్మస్య ఉద్ఘాటనం కృత్వా
సూర్య-చంద్ర-అగ్ని వర్చసః
తస్య ‘హ్రీం’ బీజమ్ ఆహృత్య
ఆత్మానం చరతే ధ్రువమ్।
అట్టి సూర్య-చంద్ర-అగ్ని తేజస్సు గల హృదయకమలనమును (రేచక ప్రాణాయామముతో) వికశింపజేసి, అద్దానియందు ‘హ్రీం’ బీజాక్షరము ఆశ్రయించి తిరుగాడు (ఆత్మయొక్క సందర్భ సత్యరూపమగు) ‘జీవాత్మ’ను గమనించాలి. ‘‘నేను పరమాత్మను. జీవాత్మ నాయొక్క ఒక అంశ’’ - అను రీతిగా దర్శించాలి.

త్రిస్థానం చ త్రిమాత్రం చ త్రిబ్రహ్మ చ త్రయాక్షరం .
త్రిమాత్రమర్ధమాత్రం వా యస్తం వేద స వేదవిత్ .. 36..
36. త్రి-స్థానం చ, త్రి-మాత్రం చ,
త్రి బ్రహ్మాచ, త్రియక్షరమ్,
త్రి మాత్రమ్ - అర్ధమాత్రం వా
యస్తం వేద స వేదవిత్।
అట్టి జీవాత్మను
→ ‘అ ఉ మ’ అను త్రిమాత్రలు కలిగి ఉన్నదిగాను,
→ ‘ఓం’కార త్రి-అక్షరస్వరూపంగాను 3 మాత్రలు + అర్ధమాత్ర సమన్వితముగాను, (జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు, వాటిలో నాలుగవదగు సంచారిగాను) ఎవ్వరు తెలుసుకుంటారో - అట్టివారు తెలుసుకొనవలసినది తెలుసుకొన్నవాడగుచున్నట్టివారు. (విదత వేద్యులు, వేద వేద్యులు).

తైలధారమివాచ్ఛిన్నదీర్ఘఘంటానినాదవత్ .
బిందునాదకలాతీతం యస్తం వేద స వేదవిత్ .. 37..
37. తైలధారామ్ ఇవ అ(వి)చ్ఛిన్నం, దీర్ఘఘంటా నినాదవత్
అవాచ్యం ప్రాణవస్య అగ్రం, బిందు నాద కళాతీతం
యస్తం వేద సవేదవిత్।।
తెంపులేని తైలధారవలె, దీర్ఘంగా మ్రోగిస్తున్న గంట యొక్క శబ్దమువలె, ఇహాత్మ (జీవాత్మ) చమత్కారమునకు అతీతమై, జీవాత్మను తన అంశగా కలిగియున్నట్టిదై, నాద - బిందు - కళాతీతమగు పరాత్మను ఎరిగినవాడే విదిత వేద్యుడు. అట్టి పరమాత్మతో మమేకమవటమే ధ్యానము.

యథైవత్పలనాలేన తోయమాకర్షయేన్నరః .
తథైవఓత్కర్షయేద్వాయుం యోగీ యోగపథే స్థితః .. 38..
38. యథైవ ఉత్పల నాళేన, తోయమ్ ఆకర్షయేత్ నరః
తథైవ ఉత్కర్షయేత్ వాయుం, యోగీ యోగపదే స్థితః।।
కలువపువ్వు - కాడతో జలమును పీల్చు విధంగా ఎవ్వడైతే దేహమంతా నిండియున్న వాయువును (పూరక - ప్రాణాయామ విధి విధానంగా) ఆకర్షిస్తాడో, అట్టి యోగి క్రమంగా ‘యోగపదము’ నందు స్థితిని పొందుచున్నాడు.

అర్ధమాత్రాత్మకం కృత్వా కోశీభూతం తు పంకజం .
కర్షయేన్నలమాత్రేణ భ్రువోర్మధ్యే లయం నయేత్ .. 39..
39. అర్ధమాత్రాత్మకం కృత్వా
కోశభూతం తు పంకజమ్।
కర్షయేత్ నాళమార్గేణ
భృవోః మధ్యే లయం నయేత్।
‘ఓం’కారములోని ‘మ్‌మ్’… (Sense) అను అర్ధమాత్రాత్మకంగా భావించి, అట్టి అర్ధమాత్రతో భ్రూమధ్యమునగల రెండు దళముల పద్మమునందు మనస్సును ప్రకాశింపజేయాలి. అర్ధమాత్రోపాసనతో నాళమార్గంగా (సుషమ్న ద్వారా) భ్రూమధ్యలో - (అనగా అక్కడగల చైతన్యస్ఫూర్తితో) మనస్సును లయింపజేయాలి.

భ్రువోర్మధ్యే లలాటే తు నాసికాయాస్తు మూలతః .
జానీయాదమృతం స్థానం తద్బ్రహ్మాయతనం మహత్ .. 40..
40. భృవోః మధ్యే లలాటే తు
నాసికాయాస్తు మూలతః
జానీయాత్ అమృతస్థానమ్
తత్ బ్రహ్మాయతనం మహత్।।
ముక్కుకు పైభాగ స్థానంలోగల (నాసిక యొక్క ఊర్ధ్వ మూలంగా) భ్రూమధ్యలో గల ‘లలాటస్థానము’నందు (బొట్టుపెట్టు కొనే కనుబొమ్మల మధ్య స్థానంలో) మహత్తరమగు ‘బ్రహ్మానందము’ను ప్రసాదించు ‘అమృత స్థానము’ ఉన్నది. (అది మార్పు-చేర్పుల సంబంధితమైన ఇంద్రియ విషయములను దాటివేసిన స్థానము). అది కేవల-స్వస్వరూప సంబంధమైనది.

ఆసనం ప్రాణసంరోధః ప్రత్యాహారశ్చ ధారణా .
ధ్యానం సమాధిరేతాని యోగాంగాని భవంతి షట్ .. 41..
41. ‘‘ఆసనం ప్రాణ సంరోధః,
ప్రత్యాహారశ్చ ధారణా
ధ్యానం సమాధిః’’
ఏతాని యోగాంగాని
భవంతి ‘షట్’ (6)

అట్టి స్థానములో యోగాభ్యాస పూర్వకంగా మనస్సును ప్రవేశింపజేయు చుండగా, అట్టి అమృతస్థానములో ప్రకాశించుచున్న యోగికి సర్వాత్మకమగు పరబ్రహ్మము స్వానుభవముగా సిద్ధించగలదు. యోగసాధనకు షట్ (6) అంగములు.
(1) సుఖాసనము (2) పూరక - రేచక - కుంభకముల ద్వారా ప్రాణ నిరోధము (3) ఇంద్రియములను ఆత్మోపాసనయందు (ఆత్మభావన యందు) నియమించే ప్రత్యాహారము (4) జ్ఞప్తి (జ్ఞాపకము) రూపమైన ధారణ (5) ధ్యాసరూపమగు ధ్యానము (6) నిశ్చల భావనారూపమగు సమాధి. (అదియే తానై ఉన్న సంస్థితి)


ఆసనాని చ తావంతి యావంత్యో జీవజాతయః .
ఏతేషానతులాన్భేదాన్విజానాతి మహేశ్వరః .. 42..
42. ఆసనాని చ తావంతి, యావంత్యో జీవజాతయః,
ఏతేషామ్ అతులాన్ భేదాన్, విజానాతి మహేశ్వరః।
ఆసనము : ప్రతి జీవజాతికి, ప్రతి జీవునికి సానుకూల్యమైన, ఏకాగ్రతను ప్రసాదించులకు సానుకూల్యమగు ఒక్కొక్క తీరైన ‘ఆసనము’ ఉన్నది. అంతటి వివిధ విస్తారరూపములగు ఆసనముల భేదముల గురించి ఈశ్వరునికే ఎరుక!

ఛిద్రం భద్రం తథా సింహం పద్మం చేతి చతుష్టయం .
ఆధారం ప్రథమం చక్రం స్వాధిష్ఠానం ద్వితీయకం .. 43..
43. సిద్ధం భద్రం తథా సింహం
పద్మం చ ఇతి చతుష్టయమ్।
ఆధారం ప్రథమమ్ చక్రమ్,
స్వాధిష్ఠానం ద్వితీయకమ్।।
వాటిలో ముఖ్యమైన ఆసనములను మాత్రమే మనము ఇక్కడ ఉదహరించుకొనుచున్నాము. (1) సిద్ధాసనము (2) భద్రాసనము (3) సింహాసనము (4) పద్మాసనము - ఇవి ముఖ్యమైన 4 ఆసనములు.

యోనిస్థానం తయోర్మధ్యే కామరూపం నిగద్యతే .
ఆధారాఖ్యే గుదస్థానే పంకజం యచ్చతుర్దలం .. 44..
తన్మధ్యే ప్రోచ్యతే యోనిః కామాఖ్యా సిద్ధవందితా .
యోనిమధ్యే స్థితం లింగం పశ్చిమాభిముఖం తథా .. 45..
44. యోనిస్థానం తయోః మధ్యే
కామరూపం నిగద్యతే।
ఆధారాఖ్యే గుదస్థానే
పంకజం యః చతుర్దళమ్।
45. తన్మధ్యే ప్రోచ్యతే యోనిః
కామాఖ్యా సిద్ధ వందితా।
యోని మధ్యే స్థితం లింగం
పశ్చిమాభిముఖం తథా।
ఆధార - స్వాధిష్ఠాన - మణిపూరక చక్రములు
(1) ఆధార చక్రము (మూలాధార చక్రం)
గుదస్థానమునకు కొంచము పైగాను లింగస్థానమునకు కొంచము క్రిందగాను యోనిస్థానం మధ్యన కామ రూపంగా మూలశక్తిరూపమగు మూలాధార చక్రము ఉన్నది. ఈ మూలాధార చక్రమునందు 4 దళముల పద్మమున్నది. (4 దళములు బీజాక్షరములు - వ, శ, ష, స)
(2) స్వాధిష్ఠాన చక్రము
‘కామము’ యొక్క యోని స్థానమున సంస్థితమైన ఈ స్వాధిష్టానచక్రము సిద్ధులచే నమస్కరించబడుతూ ఉంటోంది. యోని మధ్య చక్ర స్థానమునకు పశ్చిమ అభిముఖంగా లింగము ఉండి ఉంటుంది.

మస్తకే మణివద్భిన్నం యో జానాతి స యోగవిత్ .
46. మస్తకే మణివత్ భిన్నమ్
యో జానాతి స యోగవిత్।
లింగ ప్రదేశమునకు పై స్థానంలో మణివలె ఆకారము కలిగియున్న ఈ చక్ర - స్థానము (పూరక ప్రాణాయామ క్రియ ద్వారా) ఎరుగుచూ, క్రమంగా ఆ స్థానమును బుద్ధితో గ్రహించినవాడు యోగవేత్తయే!

తప్తచామీకరాకారం తడిల్లేఖేవ విస్ఫురత్ .. 46..
చతురస్రముపర్యగ్నేరధో మేఢ్రాత్ప్రతిష్ఠితం .
స్వశబ్దేన భవేత్ప్రాణః స్వాధిష్ఠానం తదాశ్రయం .. 47..
స్వాధిష్ఠానం తతశ్చక్రం మేఢ్రమేవ నిగద్యతే .
47. తప్త చామీకరాకారం, తటిల్లేఖేవ విస్ఫురత్
చతురశ్రమ్ ఉపరి ‘అగ్నేః’ అథో మేఢ్రాత్ ప్రతిష్ఠితమ్।।
48. ‘స్వ’ శబ్దేన భవేత్ ప్రాణః, ‘స్వాధిష్ఠానమ్’ తత్ ఆశ్రయమ్।
స్వాధిష్ఠానమ్ తతః చక్రమ్, ‘మేఢ్రమ్’ ఏవ నిగద్యతే।
స్వాధిష్ఠాన చక్రం → మెరుస్తున్న బంగారురంగు కలది, విద్యుత్ తీగ వలె ప్రకాశించుచున్నది. 4 కోణములు కలిగియున్నట్టిది. మేఢ్రమునకు (పొత్తి కడుపునకు) పై భాగమున ఇది సంస్థితమైయున్నది. ‘స్వయముగా శబ్దము చేయునది, ‘స్వశబ్దము’ అని పిలువబడే ప్రాణశక్తికి ఆధారస్థానం కాబట్టి దీనిని ‘స్వాధిష్ఠానము’ అని పిలుస్తున్నారు. ఈ స్వాధిష్ఠాన చక్రమునకు ‘మేఢ్రము’ అనే మరో పేరు కూడా ఉన్నది.

మణివత్తంతునా యత్ర వాయునా పూరితం వపుః .. 48..
తన్నాభిమండలం చక్రం ప్రోచ్యతే మణిపూరకం .
49. మణి వత్తంతునా యత్ర, వాయునా పూరితం వపుః।
తత్ నాభిమండలం చక్రం, ప్రోచ్యతే ‘మణిపూరకమ్’।
(3) మణిపూరక చక్రము - దారముతో కూర్చబడిన మణివలే ఉంటుంది. కాబట్టి ‘మణిపూరకము’ వాయువుచే ప్రేరణ పొందుతూ మేఢ్రమునకు (పొత్తి కడుపునకు) పై భాగంగా (బొడ్డు స్థానమునందు) ఉనికి పొంది ఉంటుంది.

ద్వాదశారమహాచక్రే పుణ్యపాపనియంత్రితః .. 49..
తావజ్జీవో భ్రమత్యేవం యావత్తత్త్వం న విందతి .
ఊర్ధ్వం మేఢ్రాదథో నాభేః కందో యోఽస్తి ఖగాండవత్ .. 50..
తత్ర నాడ్యః సముత్పన్నాః సహస్రాణి ద్విసప్తతిః .
50. ద్వాదశార మహాచక్రే, పుణ్యపాప నియంత్రితః
తావత్ జీవో భ్రమతి యేవం, యావత్ తత్త్వం న విందతి।
ఊర్ధ్వం మేఢ్రాత్ అథో నాభేః, కందో యో అస్తి ఖగాండవత్।
తత్ర నాడ్యః సముత్పన్నాః, సహస్రాణి ద్విసప్తతిః। (72000)
‘12’ ఆకులు గల ఈ మణిపూరక చక్రమునందు - ఈ జీవుడు బ్రహ్మతత్త్వము తెలుసుకోనంతవరకు భ్రమయుతుడై ఉంటున్నాడు. పుణ్య - పాపకర్మలచే నియంత్రితుడై సంచారములు చేస్తూ ఉంటున్నాడు.
మేఢ్రమునకు పైభాగంగాను, నాభికి క్రింద భాగంగాను ‘పక్షియొక్క గ్రుడ్డు’ వలే ఒక ఘనీభూతమైన మాంసపుగడ్డ ఉన్నది.
అట్టి ఘనీభూతగడ్డ నుండి ‘72000’ నాడులు బయల్వెడలుచున్నాయి.

తేషు నాడీసహస్రేషు ద్విసప్తతిరుదాహృతాః .. 51..
ప్రధానాః ప్రాణవాహిన్యో భూయస్తత్ర దశ స్మృతాః .
ఇడా చ పింగలా చైవ సుషుమ్నా చ తృతీయకా .. 52..
గాంధారీ హస్తిజిహ్వా చ పూషా చైవ యశస్విని .
అలంబుసా కుహూరత్ర శంఖినీ దశమీ స్మృతా .. 53..
51. తేషు నాడీ సహస్రేషు
ద్విసప్తతిః ఉదాహృతాః। (72)
52. ప్రధానాః ప్రాణవాహిన్యో
భూయః తత్ర ‘దశ’ స్మృతాః।
‘ఇడా’ చ, ‘పింగళా’ చ ఏవ
‘సుషుమ్నా’ చ తృతీయకా
53. ‘గాంధారీ’ ‘హస్తిజిహ్వా’ చ
‘పూషా’ చ ఏవ ‘యశస్వినీ’
‘అలంబుసా’, ‘కుహూః’ అత్ర
శంఖినీ, దశమీ స్పృతా।
అట్టి 72000 నాడులలో ముఖ్యమైనవి ‘72’ నాడులుగా చెప్పబడు చున్నాయి. ఇవి తమయందు ప్రాణశక్తిని ప్రవహింపజేస్తూ, శరీరమంతా ప్రాణశక్తి ప్రవహించటానికి వాహకములు (Vehicles) అగుచున్నాయి. ఆ ‘72’ ముఖ్యనాడులలో 10 అతి ముఖ్యమైనవిగా వర్ణించబడుచున్నాయి.

10 అతి ముఖ్య నాడులు
(1) ఇడ, (2) పింగళ, (3) సుషుమ్న, (4) గాంధారి, (5) హస్తజిహ్వ, (6) పూషా, (7) యశస్వినీ, (8) అలంబుసా, (9) కుహూ, (10) శంఖినీ.

ఏవం నాడీమయం చక్రం విజ్ఞేయం యోగినా సదా .
సతతం ప్రాణవాహిన్యః సోమ సూర్యాగ్నిదేవతాః .. 54..
54. ఏవం నాడీమయం చక్రం
విజ్ఞేయం యోగినా సదా।
సతతం ప్రాణవాహిన్యః
సోమ - సూర్య - అగ్ని దేవతాః
‘యోగి’ ఈ నాడీమయ చక్రమును ఎల్లప్పుడు తెలుసుకొన్నవాడై ఉంటున్నాడు. అందులో ‘3’ అత్యంత ముఖ్యమైన నాడులు నిరంతరము ప్రాణచలన స్పందన శక్తిని ధారణ చేస్తూ ఉన్నాయి. (1) ఇడ, (2) పింగళ, (3) సుషుమ్న ఈ మూడింటికి అధి దేవతలు → (1) చంద్రుడు (ఇడకు), (2) సూర్యుడు (పింగళకు), (3) అగ్ని (సుషుమ్నకు).

ఇడాపింగలాసుషుమ్నాస్తిస్రో నాడ్యః ప్రకీర్తితాః .
ఇడా వామే స్థితా భాగే పింగలా దక్షిణే స్థితా .. 55..
55. ఇడా పింగళా సుషుమ్నాః
తిస్రో నాడ్యః ప్రకీర్తితాః।
ఇడా వామే (ఎడమ)స్థితా భాగే
పింగళా దక్షిణే (కుడి) స్థితా।।
‘ఇడ’నాడి ఈ దేహమునకు ఎడమవైపుగాను, ‘పింగళ’ నాడి దేహమునకు కుడివైపుగాను, సుషుమ్న దేహమునకు మధ్యగాను…ఈ విధంగా ప్రాణశక్తి ప్రసరణ మార్గములుగా ఉన్నాయి. ఈ ‘3’ అతి ముఖ్య ప్రాణ ప్రసరణ - తేజోపూరిత శక్తి మార్గములుగా గమనించబడుచున్నాయి.

సుషుమ్నా మధ్యదేశే తు ప్రాణమార్గాస్త్రయః స్మృతాః .
ప్రాణోఽపానః సమానశ్చోదానో వ్యానస్తథైవ చ .. 56..
56. సుషుమ్నా మధ్య దేశస్థా
‘‘ప్రాణమార్గాః త్రయః’’ స్మృతాః
ప్రాణో అపానః సమానశ్చ,
ఉదానో వ్యానః తథైవ చ।
ఇక ప్రాణశక్తి గురించి, అద్దానియొక్క దేహములోని సంచలనములను ఉద్దేశ్యిస్తూ పంచప్రాణములుగా పంచ ఉపప్రాణములుగా (అవి నిర్వర్తించు ధర్మములను దృష్టిలో పెట్టుకొని) యోగ శాస్త్రముచే విశదీకరించ బడుతోంది.

నాగః కూర్మః కృకరకో దేవదత్తో ధనంజయః .
ప్రాణాద్యాః పంచ విఖ్యాతా నాగాద్యాః పంచ వాయవః .. 57..
57. నాగః కూర్మశ్చ కృకరో
దేవదత్తో ధనంజయః
ప్రాణాఖ్యాః పంచవిఖ్యాతా।
నాగాద్యాః పంచవాయవః।।
పంచ ప్రాణవాయువులు : (1) ప్రాణము, (2) అపానము, (3) సమానము, (4) ఉదానము, (5) వ్యానము
పంచ ఉప ప్రాణవాయువులు : (1) నాగ, (2) కూర్మ, (3) కృకర, (4) దేవదత్త, (5) ధనంజయ - ఇవి ‘‘నాగాది పంచవాయువులు’’ అని ప్రసిద్ధి.

ఏతే నాడీసహస్రేషు వర్తంతే జీవరూపిణః .
ప్రాణాపానవశో జీవో హ్యధశ్చోర్ధ్వం ప్రధావతి .. 58..
58. ఏతే నాడీ సహస్రేషు
వర్తంతే జీవరూపిణః,
ప్రాణ అపాన వశో జీవో హి
అధశ్చ ఊర్ధ్వం ప్రధావతి।
పంచప్రాణములు(+)పంచ ఉపప్రాణములు→ ఈ 10 ప్రాణ వాయువుల ఉత్తేజము ‘72,000’ నాడులలో జీవరూపములుగా సంచరిస్తూ ఉన్నది. ఇక పరమాత్మయొక్క స్వకీయ-అంశ అగు జీవాత్మ ప్రాణ - అపానములకు వశుడై (దేహములో) పైకి - క్రిందికి కదలికలు నిర్వర్తిస్తూ ఉన్నాడు.

వామదక్షిణమార్గేణ చంచలత్వాన్న దృశ్యతే .
ఆక్షిప్తో భుజదండేన యథోచ్చలతి కందుకః .. 59..
ప్రాణాపానసమాక్షిప్తస్తద్వజ్జీవో న విశ్రమేత్ .
అపానాత్కర్షతి ప్రాణోఽపానః ప్రాణాచ్చ కర్షతి .. 60..
ఖగరజ్జువదిత్యేతద్యో జానాతి స యోగవిత్ .
59. వామ దక్షిణ మార్గేణ
సంచలత్వాత్ న దృశ్యతే।
ఆక్షిప్తో భుజదండేన
యథా ఉచ్చలతి కందుకః।।
60. ప్రాణ - అపాన సమాక్షిప్తః
తద్వత్ జీవో న విశ్రమేత్।
అపానాత్ కర్షతి ప్రాణో
అపానః ప్రాణాచ్చ కర్షతి-
61. ఖగ రజ్జువత్, ఇత్యేతత్
యో జానాతి స యోగవిత్।।
ఈ విధంగా ప్రాణ ప్రసరణ వెంట కుడి (పింగళ ప్రాణ ప్రసరణ) - ఎడమ (ఇడ ప్రాణ ప్రసరణ) మార్గాలలో ఈ జీవుడు నిరంతరం తిరుగాడుతూ ఉండటం చేత ఒక్కచోట ఎక్కడా కనిపించటం లేదు. నిలబడటం లేదు. నిలకడ లేదు.
భుజదండములచే కొట్టబడుచూ ఉన్న బంతివలె (Like Foot Ball) ఈ జీవుడు ప్రాణ - అపానముల వెంట తిరుగాడుచూ (క్షిప్తుడై), పైకి క్రిందికి విశ్రాంతి అనేది లేకుండా అవిశ్రాంతంగా తిరుగాడుచున్నాడు.
అపానము ప్రాణము చేతను, ప్రాణము అపానము చేతను మ్రింగబడుచుండగా, ఈ జీవుడు ప్రాణ - అపానముల వెంట నిరంతరం పరుగులు తీస్తూ…ఒకచోట ఆగి ఉండటమే లేదు.
కాలుకు త్రాడుచే కట్టబడిన పక్షివలే అటూ-ఇటూ పరుగులు తీసే జీవాత్మను ఎవ్వడు గమనించి, తెలుసుకుంటూ ఉంటాడో, అట్టివాడు యోగవేత్త.


హకారేణ బహిర్యాతి సకారేణ విశేత్పునః .. 61..
‘హ’కారేణ బహిః యాతి,
‘స’ కారేణ విశేత్ పునః
ఈ జీవుని పరుగులు అవిశ్రాంతమై ఏ తీరుగా ఉన్నాయంటే… ‘హం’ కారముతో బయల్వెడలుచున్నాడు. ‘సం’ కారముతో లోనికి వస్తున్నాడు.

హంసహంసేత్యమం మంత్రం జీవో జపతి సర్వదా .
శతాని షట్దివారాత్రం సహస్రాణేకవింశతిః .. 62..
62. ‘హంస హంస’ ఇతి అముం, మంత్రం జీవో జపతి సర్వదా।
శతాని షట్ దివారాత్రగ్ం, సహస్రాణి ఏకవిగ్ం శతిః (21600)
‘హం’ ‘సం’ - ‘హం’ ‘సం’ అనబడు శ్వాస - ప్రశాసలతో ఈ జీవుడు అనుక్షణం ‘సోఽహమ్’ మంత్ర - క్రియా జపం నిర్వర్తిస్తూ ఉన్నాడు. (అదంతా అసంకల్పిత విభాగమునుండి జీవునిచే నిర్వర్తించబడుతోంది) రోజుకు 21600సార్లు హంస జపం చేస్తూ ఉన్నాడు.

ఏతన్సంఖ్యాన్వితం మంత్రం జీవో జపతి సర్వదా .
అజపా నామ గాయత్రీ యోగినాం మోక్షదా సదా .. 63..
63. ఏతత్ సంఖ్యాన్వితం మంత్రం
జీవో జపతి సర్వదా,
‘అజపా’ నామ గాయత్రీ
యోగినాం మోక్షదా సదా।
యోగి తన శ్వాస - నిశ్వాసలను ‘సోఽహమ్’ మంత్ర జపంగా, గమనిస్తూ బుద్ధితో ‘సోఽహమ్’ అనుభూతిని ‘గమనిక’ను సిద్ధించుకోవటమును ‘అజపాగాయత్రి’ అంటారు. ఇది పరస్వరూపములో, అద్దానికి అనన్యంగా ఇహస్వరూపం గమనించటము. అట్టి అజపాగాయత్రి యోగులకు సర్వదా మోక్షప్రదాత.

అస్యాః సంకల్పమాత్రేణ నరః పాపైః ప్రముచ్యతే .
అనయా సదృశీ విద్యా అనయా సదృశో జపః .. 64..
అనయా సదృశం పుణ్యం న భూతం న భవిష్యతి .
యేన మార్గేణ గంతవ్యం బ్రహ్మస్థానం నిరామయం .. 65..
64. అస్యాః సంకల్ప మాత్రేణ
నరః పాపైః ప్రముచ్యతే।
అనయా సదృశీ విద్యా,
అనయా సదృశో జపః,
65. అనయా సదృశం పుణ్యం
న భూతం, న భవిష్యతి,
యేన మార్గేణ గంతవ్యం
బ్రహ్మస్థానం నిరామయమ్।।
‘‘సోఽహమ్’’ - జీవాత్మగా ప్రాణ అపానములవెంట పరుగులు తీస్తూ, ‘‘జీవాత్మ-ప్రాణప్రసరణములకు నేను ఆది - ఆధారమగు పర స్వరూపుడను’’- అని ఎరుగుచుండటము, జీవాత్మత్వమును అధిగమించి పరమాత్మగా భావనచేస్తూ, ‘‘సర్వ సంకల్పములకు ఆవల స్థానము అవధరించి ఉండటం’’ అనే యోగాభ్యాసంతో సర్వదోషాలు విడివడతాయి.
అట్టి ‘‘అజపా గాయత్రి’’ … అనబడే ‘సోఽహమ్’ మంత్రోపాసనకు సమానమైన విద్యగాని, జపముగాని, పుణ్యముగాని - న భూతో, న భవిష్యతి. - మరొకటేదీ ఇదివరకు లేదు. ఇక ఉండబోదు. ‘సోఽహమ్’ అజపాగాయత్రీ బుద్ధి సంబంధమైన మంత్రము. నిరామయమగు బ్రహ్మస్థానమును ఆ యోగికి అజపాగాయత్రి ప్రసాదించగలదు.

ముఖేనాచ్ఛాద్య తద్ద్వారం ప్రసుప్తా పరమేశ్వరీ .
ప్రబుద్ధా వహ్నియోగేన మనసా మరుతా సహ .. 66..
66. ముఖేన ఆచ్ఛాద్య తత్ ద్వారం
ప్రసుప్తా పరమేశ్వరీ।
ప్రబుద్ధా వహ్ని యోగేన
మనసా మరుతా సహ।
‘కుండలినీ’ అనే శక్తి (లేక) పరమేశ్వరి ఆచ్ఛాదన ధరించిన ముఖముతో దేహములో (మూలాధార స్థానములో) కునుకులు తీస్తూ ఉన్నది.
మనస్సు, ప్రాణశక్తి, అగ్నిలను ఉపకరణములుగా చేసుకొని నిదురిస్తున్న ఆ కుండలినీ మహాశక్తి స్వరూపిణిని (విశ్వశక్తీదేవిని) దేహము అనే క్షేత్రంలో -నిదురలేపాలి. (కుండలినీ=ఇచ్ఛ-జ్ఞాన-క్రియాశక్తుల దృశ్య సంబంధత్వమే ఆ నిదుర).

సూచివద్గుణమాదాయ వ్రజత్యూర్ధ్వం సుషుమ్నయా .
ఉద్ఘాటయేత్కపాటం తు యథా కుంచికయా హఠాత్ .. 67..
కుండలిన్యా తయా యోగీ మోక్షద్వారం విభేదయేత్ .. 68..
67. సూచీవత్ గుణమ్ ఆదాయ, వ్రజతి ఊర్ధ్వం సుషుమ్నయా।
ఉద్ఘాటయేత్ కవాటం తు, యథా కుంచికయా హఠాత్।
68. కుండలిన్యా తథాయోగీ
మోక్షద్వారం విభేదయేత్।
దారము గ్రుచ్చబడిన సూదిని పైకి లాగు తీరుగా యోగి స్వకీయ శక్తి స్వరూపమగు ‘కుండలినీ శక్తి’ని నిదురలేపి ప్రేరేపించి…
కుంచికతో తలుపుతీయురీతిగా కుండలినీ శక్తితో మోక్షద్వారమును (శిరస్సుపై గల-మూసుకుపోయి ఉన్న బ్రహ్మ రంధ్రమును) బలాత్కారంగా భేదించాలి. మోక్షద్వారములను తెరచివేయాలి. [సహస్రారము - (Open Al-pervading Self)లో ప్రవేశించాలి].

కృత్వా సంపుటితౌ కరౌ దృఢతరం బధ్వాథ పద్మాసనం .
గాఢం వక్షసి సన్నిధాయ చుబుకం ధ్యానం చ తచ్చేతసి ..
వారంవారమమపాతమూర్ధ్వమనిలం ప్రోచ్చారయన్పూరితం .
ముంచన్ప్రాణముపైతి బోధమతులం శక్తిప్రభావాన్నరః .. 69..
69. కృత్వా సంపుటితౌ కరౌ
దృఢతరం, బధ్వా అథ
పద్మాసనమ్,
గాఢం వక్షసి సన్నిధాయ
చుబుకం, ధ్యానం చ తత్
చేతసి,
వారం వారం అపానమ్
ఊర్ధ్వమ్ అనిలం
ప్రోచ్ఛారయన్ పూరితమ్,
ముంచన్ ప్రాణమ్ ఉపైతి
బోధమ్ అతులం
శక్తి ప్రభావాత్ నరః।

యోగసాధనా విధానం: కుండలినీయోగం
→ రెండు చేతులను ముకుళించి,
→ దృఢంగా పద్మాసనమును వైచుకొని (అవధరించి), సుఖాశీనుడై,
→ గడ్డమును వక్షస్థలమును తాకించుచు,
→ చిత్తమును సర్వాత్మకుడు, స్వస్వరూపుడు, సర్వస్వరూపుడు, సర్వసాక్షి, కేవలుడు అగు పరమాత్మను ధ్యానించాలి. ధ్యాసను నిలపాలి. బుద్ధిని నిలపాలి.
→ మరల మరల క్రిందవైపుగా ప్రసరించు స్వభావముగల ‘అపానవాయువు’ను ఊర్ధ్వంగా (upwarding) లాగుచూ
→ పూరక ప్రాణవాయు అభ్యాసము (పూరక ప్రాణాయామము) నిర్వర్తిస్తూ…
→ ప్రాణవాయువును బ్రహ్మరంధ్రమార్గముగా ప్రయాణింపజేస్తూ (నడిపిస్తూ) శిరస్సుయొక్క ఉపరిభాగమునగల బ్రహ్మరంధ్రమును స్పృశిస్తూ ఉండాలి.
ఈ సాధనచే యోగి బ్రహ్మజ్ఞానము (బోధ)ను త్వరగా పొందగలడు. స్వాభావికంగా సిద్ధంపజేసుకోగలడు.


పద్మాసనస్థితో యోగీ నాడీద్వారేషు పూరయన్ .
మారుతం కుంభయన్యస్తు స ముక్తో నాత్ర సంశయః .. 70..
70. పద్మాసన స్థితో యోగీ
నాడీ ద్వారేషు పూరయన్,
మారుతం కుంభయన్ యస్తు
స ముక్తో। న అత్ర సంశయః।
నాడీ అంతర్గత కుంభకము:
పద్మాసమును ధరించి నవ నాడీ ద్వారములలో వాయువును పూరించి (నింపి) కుంభకయోగము అభ్యసించుయోగి క్రమంగా స్వభావంగా, అప్రయత్నంగా (నాడులలో కుంభకము సిద్ధించుకొను క్రమంగా) ముక్తిని పొందగలడు! ఇందులో సందేహమేలేదు.

అంగానాం మర్దనం కృత్వా శ్రమజాతేన వారిణా .
కట్వమ్లలవణత్యాగీ క్షీరపానరతః సుఖీ .. 71..
71. అంగానాం మర్దనం కృత్వా
శ్రమజాతేన వారిణా।
కట్వ ఆమ్ల లవణ త్యాగీ
క్షీరపానరతః సుఖీ।
యోగాభ్యాసము చేస్తూ ఉండగా జనించు స్వేదనమును (చెమటను) ఇంకునట్లుగా అంగములను మర్దనము చేయును గాక.
యోగసాధన సమయంలో సాత్వికమైన ఆహారము తీసుకుంటూ ఉండాలి. కారము - పులుపు - ఉప్పు…వదలి, పాలు అధికంగా తీసుకొనుయోగి యొక్క కుండలినీ యోగసాధన సుఖవంతమగుచున్నది.

బ్రహ్మచారీ మితాహారీ యోగీ యోగపరాయణః .
అబ్దాదూర్ధ్వం భవేత్సిద్ధో నాత్ర కార్యాం విచారణా .. 72..
72. బ్రహ్మచారీ మితాహారీ
యోగీ యోగ పరాయణః
అబ్దాత్ ఊర్ధ్వం భవేత్ సిద్ధో।
న అత్ర కార్యా విచారణా।

బ్రహ్మమునే ఉపాసిస్తూ బ్రహ్మచారి అయి, ఆహారము మితంగా స్వీకరిస్తూ, ఇంద్రియములను విషయములవైపు పోనివ్వకుండా, యోగపరాయణుడై యున్న యోగి - ఒక సంవత్సరకాలములో ‘బ్రాహ్మీదృష్టి’ అనే సిద్ధిని పొందగలడు. ఇందులో విచారణ చేయవలసింది లేదు. అనగా అనుమానం ఉండనక్కర్లేదు.


కందోర్ధ్వకుండలీ శక్తిః స యోగీ సిద్ధిభాజనం .
అపానప్రాణయోరైక్యం క్షయన్మూత్రపురీషయోః .. 73..
73. కంఠా ఊర్ధ్వ కుండలీ శక్తిః
స యోగీ సిద్ధి భాజనమ్।
అపాన - ప్రాణయోః ఐక్యమ్
క్షయాత్ మూత్ర పురీషయోః।
మూలబంధన యోగము : మూలాధారంలో మౌనంగా నిద్రాముద్రను ధరించియున్న కుండలినీశక్తిని ఏ యోగి అయితే కంఠము పై భాగమునకు చేర్చుచున్నాడో,…. ఆ యోగి యోగసిద్ధికి ‘పాత్రుడు’ అగుచున్నాడు.
లోనికి ప్రసరించే ప్రాణవాయువును, బయటకు ప్రసరించు అపాన వాయువును ఆ యోగి ప్రాణాయామ సాధనలో ఐక్యం చేయటం జరుగుతోంది. అట్టి అపాన-ప్రాణ ఐక్యమువలన అకుండలినీయోగ సాధకుని శరీరంలో మల-మూత్రముల అధికత్వము తొలగగలదు. క్షీణిస్తాయి. అనగా విసర్జకాయవములు స్వాధీనమై జీవుని సుఖవంతుని చేస్తున్నాయి..

యువా భవతి వృద్ధోఽపి సతతం మూలబంధనాత్ .
పార్ష్ణిభాగేన సంపీడ్య యోనిమాకుంచయేద్గుదం .. 74..
అపానమూర్ధ్వముత్కృష్య మూలబంధోఽయముచ్యతే .
ఉడ్యాణం కురుతే యస్మాదవిశ్రాంతమహాఖగః .. 75..
74. యువా భవతి వృద్ధోఽపి
సతతమ్ మూలబంధనాత్
పార్‌ష్ణిభాగేన సంపీడ్య
యోనిమ్ అకుంచయేత్ గుదమ్।
75. అపానమ్ ఊర్ధ్వమ్ ఉత్కృష్య ‘మూలబంధో’ అయమ్ ఉచ్యతే।
ఉడ్యాణం కురుతే యస్మాత్
అవిశ్రాంత మహాఖగః।

అట్టి ‘మూలబంధనము’ అనబడే కుండలినీ యోగం (మూలాధారంలో అపానమును మార్గము నుండి వెనుకకు లాగి ప్రాణముతో ఏకము చేయు విధానము) అభ్యాసము చేయు యోగి వృద్ధుడైన కూడా యువకునివలే ఉత్సాహము - సాహసము - బుద్ధి - శక్తి - కార్యదక్షత కలిగి ఉంటాడు.
కాలి మడమతో గుదస్థానము (మలవిసర్జన స్థానమును) నొక్కి పట్టిపీడించుచు, అపానమును ఊర్ధ్వ మునకు ఆకర్షిస్తూ యోని స్థానమును లోపలివైపుగా ముడుస్తూ ఉండటము, ప్రాణముతో సంయోగము- మూలబంధనము అగుచున్నది.


ఉడ్డియాణం తదేవ స్యాత్తత్ర బంధో విధీయతే .
ఉదరే పశ్చిమం తాణం నాభేరూర్ధ్వం తు కారయేత్ .. 76..
ఉడ్డియాణోఽప్యయం బంధో మృత్యుమాతంగకేసరీ .
బధ్నాతి హి శిరోజాతమధోగామినభోజలం .. 77..
తతో జాలంధరో బంధః కర్మదుఃఖౌఘనాశనః .
76. ‘ఉడ్డియాణం’ తదేవస్యాత్। తత్ర బంధో విధీయతే।
77. ఉదరే పశ్చిమం తాణం, నాభేత్ ఊర్ధ్వం తు కారయేత్,
ఉడ్డియాణో అపి అయం
బంధో…మృత్యుమాతంగ కేసరీ।
బధ్నాతి హి శిరోజాతమ్
అధోగామీ నభో జలమ్, తతో ‘జాలంధరో బంధః’
కంఠ దుఃఖౌఘ నాశనః।।
ఉడ్డ్యాణ బంధము : హంస స్వరూపుడగు ఈ జీవుడు - నాశికా (ముక్కు) - మూల స్థానమునకు కొంచము క్రింద (అధోభాగము)గా ఉండు ‘ఆజ్ఞా చక్రము’ నకు ఎడతెగకుండా → చిత్త - ప్రాణశక్తులతో ప్రయాణము చేయుటమును ‘ఉడ్డీయాణబంధము’ అని అంటారు.
మరొక తీరైన ఉడ్డీయాణ బంధము :
నాభికి ఊర్ధ్వంగా ఉదరము (పొట్ట)లో ఎడమవైపుగా (పశ్చిమంగా) ఉన్న ప్రదేశమును గుదించి ప్రాణ-యోగసాధనచే అనుభవముగా తెలుసుకొని ఉండటము కూడా ఉడ్డీయాణబంధమే! ఇది మృత్యువను ఏనుగు సింహమునకు వలె - వశముగా అగుచూ, అంతా తెలియబడినదై ఉంటుంది. ‘దృశ్యమంతా మమాత్మయే’ అను భావన స్వాభావికము అగుచున్నది.

జాలంధరే కృతే బంధే కర్ణసంకోచలక్షణే .. 78..
న పీయూషం పతత్యగ్నౌ న చ వాయుః ప్రధావతి .
కపాలకుహరే జిహ్వా ప్రవిష్టా విపరీతగా .. 79..
భ్రువోరంతర్గతా దృష్టిర్ముద్రా భవతి ఖేచరీ .
న రోగో మరణం తస్య న నిద్రా న క్షుధా తృషా .. 80..
78. జాలంధరే కృతే బంధే
(కర్ణ సంకోచ లక్షణే, కంఠ సంకోచ లక్షణ)
కంఠ దుఃఖౌఘ భక్షణే।।
79. న పీయూషం పతతి అగ్నౌ
న చ వాయుః ప్రధావతి।।
కపాల కుహరే జిహ్వా
ప్రతిష్టా విపరీతగా,
80. భ్రువోః అంతర్గతా దృష్టిః
ముద్రా భవతి ‘ఖేచరీ’।
న రోగో మరణం తస్య,
న నిద్రా, న క్షుధా తృషా।
జాలంధర బంధము : కంఠములోను, చెవుల వద్ద కుంభక అభ్యాసముతో కూడినది. కంఠ దోషములను తొలగించగలదు. శిరస్సునందు యోగసాధన సమయంలో ప్రశాంతమగు రసము (ఉపరిభాగంలో) స్రవిస్తూ ఉంటుంది. అది ‘ఆకాశగంగ’ అని వర్ణించబడుతోంది. అట్టి ‘ఆకాశగంగ’ను యోగి → కంఠస్థానంలోను, చెవుల ద్వారములలోను బంధించటమును ‘జాలంధరబంధము’ అని అంటారు.
శిరో ఉపరి భాగమునుండి కంఠము వరకు యోగసాధనలో ‘మాధుర్యము’ను నింపి ఉంచే ఈ జలంధర యోగముచే సర్వదుఃఖములు, ఆదుర్దాలు స్వయంగా శమిస్తాయి. కంఠము వరకు ప్రసరించు ఆకాశగంగ సర్వ చెడు రసములను కడిగివేస్తుంది.
అప్పుడు అగ్నియందు అమృతబిందువు పడదు. (అమృతభావం నశించదు). ప్రాణవాయు చలనములు స్థిరత్వం పొందుతాయి.
ఖేచరీ ముద్ర : (1) నాలుకను వెనుకకు త్రిప్పి, కపాల కుహరం (బ్రహ్మరంధ్రము నుండి బయల్వెడలు → దవడలోగల క్రింద రంధ్రము, కొండనాలుక అంచుస్థానము)ను స్పృశిస్తూ, (2) దృష్టిని భ్రూమధ్యలో చేర్చి ఉంచటమును ‘ఖేచరీముద్ర’ అని అంటారు.
అట్టి ఖేచరీ ముద్ర అభ్యసించు యోగి - మరణము, నిద్ర, ఆకలి, దప్పికము - జయించివేయుచున్నాడు. చొక్కా మార్చినట్లు ‘‘ఈ దేహం వదిలాను. ఆ దేహం స్వీకరించాను’’ అనే దేహాతీత బుద్ధిశక్తితో కూడిన అమృతస్థితి పొందుచున్నాడు.

న చ మూర్చ్ఛా భవేత్తస్య యో ముద్రాం వేత్తి ఖేచరీం .
పీడ్యతే న చ రోగేణ లిప్యతే న చ కర్మణా .. 81..
81. న చ మూర్ఛా భవేత్ తస్య, యో ముద్రాం వేత్తి ఖేచరీమ్
పీడ్యతే న చ రోగేణ, లిప్యతే న చ కర్మణా।।
అట్టి ఖేచరీ-యోగాభ్యాసిని మూర్ఛ, రోగము మొదలైనవి పీడించవు. ఖేచరీముద్రను అభ్యసిస్తున్న యోగిని కర్మదోషములు అంటవు. ఆగామి-సంచిత-ప్రారబ్ధకర్మలచే ఖేచరీముద్రను అభ్యసించు యోగి బద్ధుడు కాడు.

బధ్యతే న చ కాలేన యస్య ముద్రస్తి ఖేచరీ .
చిత్తం చరతి ఖే యస్మాజ్జిహ్వా భవతి ఖేగతా .. 82..
తేనైషా ఖేచరీ నామ ముద్రా సిద్ధనమస్కృతా .
ఖేచర్యా ముద్రయా యస్య వివరం లంబికోర్ధ్వతః .. 83..
82. బధ్యతే న చ కాలేన
యస్య ముద్రా అస్తి ‘ఖేచరీ’।
చిత్తం చరతి ఖే యస్మాత్
జిహ్వా భవతి ఖే గతా,
83. తేన ఏషా ఖేచరీ నామ
ముద్రా సిద్ధ నమస్కృతా।
ఖేచర్యాముద్రయా యస్య
వివరం లంబిక ఊర్ధ్వతః।

భూత-వర్తమాన-భవిష్యత్ కాలములను దాటి కాలః-కాల స్వరూపుడౌతాడు. కాలములోని సర్వవిశేషములకు సాక్షిగా ఉండ గలడు. అనగా, కాలబద్ధుడు కాడు. ఆతని చిత్తము దహరాకాశము (ఆత్మాకాశము)లో సంచరించగలదు. నాలుక కపాల ఆది రంధ్రస్థానమును తాకి ఉండే ఖేచరీ ముద్రచే- చిత్తము ‘‘చిత్ రూపము’’గా సంతరించుకుంటుంది. ఖేచరీ-యోగసిద్ధి పొందినవాడు సిద్ధులచే నమస్కరించబడుటకు అర్హుడగుచున్నాడు.
యోని ముద్ర : ‘ఖేచరీముద్ర’ను నిర్వర్తించుటచే సిద్ధించు ఊర్ధ్వ కపాలయోగము (లేక) ‘లంబికాయోగము’చే యోగి స్థిరచిత్తుడు, స్థిర శరీరుడు అగుచున్నాడు.


బిందుః క్షరతి నో యస్య కామిన్యాలింగితస్య చ .
యావద్బిందుః స్థితో దేహే తావన్మృత్యుభయం కుతః .. 84..
84. బిందుః క్షరతి నో యస్య, కామినీ ఆలింగతస్య చ,
యావత్ బిందుః స్థితో దేహే, తావత్ మృత్యు భయం కుతః?
అట్టి యోగికి ప్రియకామినితో ఆలింగనము కలిగినప్పటికీ శక్లబిందు పతనము కాదు. (అనగా) దృశ్య విషయములు కోరుకోవలసివస్తూ ఉన్నప్పటికీ విషయములకు బద్ధుడు కాడు. (అకామకామీ-అనాకర్షితుడై ఉండగలడు) ఆ విధంగా శుక్ల బిందు పతనమును జయించి, జితేంద్రియుడగు యోగికి, ఇక మృత్యుభయము ఉండదు. ఆతని బుద్ధి ఇంద్రియ విషయ పంజరములో ప్రవేశించదు.

యావద్బద్ధా నభోముద్రా తావద్బిందుర్న గచ్ఛతి .
గలితోఽపి యదా బిందుః సంప్రాప్తో యోనిమండలే .. 85..
వ్రజత్యూర్ధ్వం హఠాచ్ఛక్త్యా నిబద్ధో యోనిముద్రయా .
85. యావత్ బద్ధా నభో ముద్రా
తావత్ ‘బిందుః’ న గచ్ఛతి।
గళితోఽపి యదా బిందుః
సంప్రాప్తో యోని మండలే,
86. వ్రజతి ఊర్ధ్వం హఠాత్ శక్త్యా
నిబద్ధో యోనిముద్రయా।
ఖేచరీముద్ర ధరించి ‘లంబయోగము’ సిద్ధించుకున్న యోగి, ఖేచరీముద్ర ధరించనంతసేపు బిందు స్రవము (శుక్లస్రవము) ఉండదు. రేతస్సు స్కలనము కాదు. (అనగా) బిందువులో బ్రహ్మాండమంతా దర్శించు, బిందు ధ్యానయోగము నుండి చ్యుతి పొందడు. ఒకప్పుడు స్కలనము అయినప్పటికీ కూడా… (విషయ సహితుడైనప్పటికీ) తేజస్సు విభాగం ఊర్ధ్వముగా ఎగసి శిరస్సును చేరుచున్నది. అందుకే దీనిని ‘యోనిముద్ర’ అని పిలుస్తున్నారు. యోనియందు స్రవించు రజోబిందు తేజస్సును సమాకర్షించి ‘లంబిక’ (కొండ నాలుక) యందు స్థిరముగా చేర్చినప్పుడు - అట్టి యోగి త్రికాలజ్ఞాన సంపన్నుడగుచున్నాడు. (‘జఠయోగ దీపిక’…అను శాస్త్రమునందు ‘స్కలన తేజస్సు’ను కపాలకుహరమునకు చేర్చటమును ‘వజ్రోళిముద్ర’ అని కూడా చెప్పబడుతోంది).

స ఏవ ద్వివిధో బిందుః పాండరో లోహితస్తథా .. 86..
పాండరం శుక్రమిత్యాహుర్లోహితాఖ్యం మహారజః .
విద్రుమద్రుమసంకాశం యోనిస్థానే స్థితం రజః .. 87..
87. స ఏవ ద్వివిధో బిందుః।
పాండరో, లోహితః తథా।
పాండురం శుక్లమ్ ఇతి ఆహుః
లోహితాఖ్యం ‘మహారజః’।
విద్రుమ ద్రుమ సంకాశం
యోని స్థానే స్థితం రజః।।
‘బిందువు’ → రెండు విధములు
(1) పాండరబిందువు : శుక్లము, పురుషసంబంధమైనవి. తెల్లటి రంగు, శివస్వరూపము. (పురుషునికి సంజ్ఞ)
(2) లోహితబిందువు : శోణితము, రక్తవర్ణము, రజోబిందువు. పగడమువలే ఎరుపు యోని స్థానమునందుండునది. (రక్త బిందువు అని కూడా అంటారు). (ప్రకృతికి సంజ్ఞ).

శశిస్థానే వసేద్బిందుఃస్తయోరైక్యం సుదుర్లభం .
బిందుః శివో రజః శక్తిర్బిందురిందూ రజో రవిః .. 88..
88. శిశ్నస్థానే వసేత్ బిందుః
తయోః ఐక్యం సుదుర్లభమ్।
బిందుః శివో, రజః శక్తిః।
బిందుః ఇందూ, రజో రవిః।

శిశ్నము (పురుషాంగము) నందలి శుక్ల బిందువునకు - యోని స్థానమునందలి ‘రక్తబిందువు’నకు ఐక్యము అత్యంత దుర్లభము.

శుక్ల బిందువు → శివస్వరూపము. - పురుషుడు

శోణితము → శక్తి స్వరూపము - ప్రకృతి

బిందువు శుక్లము → చంద్రరూపము

శోణితము (రజము) → సూర్యరూపము (రవి)
ఐక్యము
అభేదత్వం
అనన్యత్వం


ఉభయఓః సంగమాదేవ ప్రాప్యతే పరమం వపుః .
వాయునా శక్తిచాలేన ప్రేరితం ఖే యథా రజః .. 89..
రవిణైకత్వమాయాతి భవేద్దివ్యం వపుస్తదా .
శుక్లం చంద్రేణ సంయుక్తం రజః సూర్యసమన్వితం .. 90..
ద్వయోః సమరసీభావం యో జానాతి స యోగవిత్ .
89. ఉభయోః సంగమాత్ ఏవ, ప్రాప్యతే పరమం వపుః
వాయునా శక్తి చాలేన, ప్రేరితం ఖే యదా రజః
90. రవిణి ఏకత్వమ్ ఆయాతి, భవేత్ దివ్య వపుః తథా।
శుక్లం చంద్రేణ సంయుక్తం, రజః సూర్య సమన్వితమ్।
91. ద్వయోః సమరసీభావమ్
యో జానాతి, స ‘‘యోగవిత్’’।।
శుక్ల - శోణితములు కలియుటచేతనే ‘పరము’ అనునది ఏర్పడుచున్నది. శ్రేష్ఠమగు దివ్య - పర శరీరము రూపుదిద్దుకుంటోంది.
వాయువుచే ప్రేరితమైన రజస్సు ఆకాశంలో సూర్యునితో (పాండర బిందువు, శుక్లము)తో ఏకత్వము పొందినప్పుడు దివ్య శరీరము ఏర్పడుచున్నది.
చంద్ర - సూర్యుల తేజోరూపమగు శుక్ల -శోణితముల సంయోగంలో గల ‘సమరసీభావన’ను ఎవ్వరు తెలుసుకొని ఉంటారో - ఆతడు యోగవేత్తయే! (ఇది ద్రష్ట-దృశ్యముల అభేద తత్త్వము)

శోధనం మలజాలానాం ఘటనం చంద్రసూర్యయోః .. 91..
రసానాం శోషణం సమ్యఙ్మహాముద్రాభిధీయతే .. 92..
92. శోధనం మలజాలానాం
ఘటనం చంద్ర - సూర్యయోః
రసానాం శోషణం ‘సమ్యక్
‘మహాముద్రా’ అభిధీయతే।
మహాముద్ర - రజస్సులో మలజాలము తొలగినప్పుడు చంద్రతేజో రూపమగు శుక్లము - సూర్యతేజో రూపము అగు శోణితముల ఘటనము (కలయిక) అయి, పురుష ప్రకృతుల ఉభయముల రశాంశములు ఒకదానితో మరొకటి అభేదము, ఏకత్వము పొందుటమే సమ్యక్ రూపమగు మహాముద్ర.

వక్షోన్యస్తహనుర్నిపీడ్య సుషిరం యోనేశ్చ వామాంఘ్రిణా
హస్తాభ్యామనుధారయన్ప్రవితతం పాదం తథా దక్షిణం ..
ఆపూర్య శ్వసనేన కుక్షియుగలం బధ్వా శనైరేచయే-
దేషా పాతకనాశినీ నను మహాముద్రా నృణాం ప్రోచ్యతే .. 93..
93. వక్షోన్యస్త హనుః నిపీడ్య, సుంషిరం యో నేశ్చ
వామాంఘ్రిణా,
హస్తాభ్యాం అనుధారయన్ ప్రతితతం పాదం
తథా దక్షిణమ్,
అపూర్య శ్వసనేన కుక్షియుగళం
బధ్వా, శనైః రేచయేత్।
ఏషా పాతక నాశినీ నను
‘‘మహాముద్రా’’ నృణాం ప్రోచ్యతే।।
మహాముద్రా యోగాభ్యాసము :
వక్ష స్థలమునకు గడ్డమును ఉపరితలమును తాకించుచూ,
(1) సుషిరమును (బ్రహ్మరంధ్ర స్థానమును) బిగించి,
(2) యోనిని (మూలాధార స్థానమును) ఎడమ పాదముచేత బిగియబట్టి కుడి పాదమును రెండు చేతులతో పట్టుకొని,
(3) వాయువుతో కుక్షిని (పొట్టను) నింపి కుంభకము చేసి,
(4) నెమ్మది నెమ్మదిగా రేచక ప్రక్రియతో ఆ వాయువును ఖాళీ చేస్తూ (రేచకం చేస్తూ) నిర్వర్తించు ప్రాణాయామ ప్రక్రియ ‘మహాముద్ర’ అనబడుతోంది.
అది మానవుని సర్వపాతకములు వశింపజేయగలదు-అని యోగ వేత్తలచే సూచించ బడుచున్నది.


ద్వితీయ అధ్యాయము - ఆత్మ నిర్ణయము


అథాత్మనిర్ణయం వ్యాఖ్యాస్యే ..

హృదిస్థానే అష్టదలపద్మం వర్తతే తన్మధ్యే రేఖావలయం
కృత్వా జీవాత్మరూపం జ్యోతీరూపమణుమాత్రం వర్తతే
తస్మిన్సర్వం ప్రతిష్ఠితం భవతి
01. అథ ఆత్మ నిర్ణయం వ్యాఖ్యాస్యే।

హృదిస్థాణే ‘అష్టదళపద్మమ్’ వర్తతే।
తన్మధ్యే రేఖావలయం కృత్వా
జీవాత్మరూపమ్, జ్యోతీరూపమ్
అణుమాత్రమ్ వర్తతే।
తస్మిం తు సర్వం ప్రతిష్ఠితం భవతి।।
ఇప్పుడు మనము ‘ఆత్మ’ గురించిన నిర్ణయము (లేక) నిర్వచనమును వ్యాఖ్యానించు కుంటున్నాము.

హృదయస్థానంలో ‘8’ దళములు గల పద్మము వర్తించుచూ ఉన్నది. ఆ పద్మమున మధ్యగా రేఖావలయం ఉన్నది. అట్టి హృదపద్మములోని రేఖావలయంలో జ్యోతిస్వరూపమై, అణుస్వరూపమై-జీవాత్మరూపము (తేజస్సు) వర్తించుచూ ఉన్నది. అట్టి జీవాత్మయందే ఈ జగత్తులన్నీ (భావనా కల్పన రూపంగా) ప్రతిష్ఠితమై ఉన్నాయి.

సర్వం జానాతి సర్వం కరోతి సర్వమేతచ్చరితమహం
కర్తాఽహం భోక్తా సుఖీ దుఃఖీ కాణః ఖంజో బధిరో మూకః కృశః
స్థూలోఽనేన ప్రకారేణ స్వతంత్రవాదేన వర్తతే ..
పూర్వదలే విశ్రమతే పూర్వం దలం శ్వేతవర్ణం తదా భక్తిపురఃసరం
ధర్మే మతిర్భవతి ..
యదాఽగ్నేయదలే విశ్రమతే తదాగ్నేయదలం రక్తవర్ణం తదా నిద్రాలస్య
మతిర్భవతి ..
యదా దక్షిణదలే విశ్రమతే తద్దక్షిణదలం కృష్ణవర్ణం తదా
ద్వేషకోపమతిర్భవతి ..
యదా నైరృతదలే విశ్రమతే తన్నైరృతదలం నీలవర్ణం తదా
పాపకర్మహింసామతిర్భవతి ..
సర్వం జానాతి। సర్వం కరోతి।
సర్వమ్ ఏతత్ చరితమ్।

‘‘అహమ్ కర్తా। అహమ్ భోక్తా।
సుఖీ। దుఃఖీ। కాణః। ఖంజో।
బధిరో। మూకః। కృశః। స్థూలో’’-
అనేన ప్రకారేణ స్వతంత్రవాదేన వర్తతే।

పూర్వ దళే విశ్రమతే (తదా),
పూర్వ దళం శ్వేతవర్ణమ్।
తదా భక్తి పురస్సరం, ధర్మ మతిః భవతి।
యదా ఆగ్నేయదళే విశ్రమతే, (తదా)
ఆగ్నేయ దళమ్ రక్తవర్ణమ్।
తదా నిద్రా - ఆలస్యమతిః భవతి।
యదా దక్షిణదళే విశ్రమతే, (తదా)
తత్ దక్షిణదళం కృష్ణవర్ణం।
తదా ద్వేష-కోపమతిః భవతి।
యదా నైరృతిదళే విశ్రమతే, (తదా)
నైరృతి దళం నీలవర్ణమ్।
తదా పాపకర్మ, హింసామతిః భవతి।।
జీవాత్మ దేహములో ఉండి ఏమి చేస్తున్నాడు? ‘ఇది నా దేహము - ఇది దృశ్యము-ఇది నా గుణము-ఇది నేను-ఇది తదితరము’ మొదలైనదంతా తెలుసుకొనుచూ ఉంటున్నాడు. సర్వమును నిర్వర్తించువాడు. ఈ జగత్ దృశ్యమంతా ఆ జీవుడు స్వయముగా చరించు స్థానము. ఆతడు చరించువాడు.

‘‘నేను కర్తను! నేను భోక్తను! నేను ఇప్పుడు సుఖిని! ఇప్పుడు దుఃఖిని! గ్రుడ్డివాడను! గూనివాడను! బధిరుడను (చెవిటివాడిని)! మూగవాడను! కృశించినవాడను! స్థూలుడను (లావుపాటి శరీరము వాడిని)’’ - ఈ విధంగా జీవుడు అనేక ప్రకారములైన వ్యక్తిగతమైన స్వతంత్రవాద - ఉప వాదములతో వర్తించుచున్నాడు. స్త్రీ, పురుష రూపములన్నీ తనపై ఆపాదించుకుంటున్నాడు.

ఈ జీవుడు హృదయకమల అష్టదళములలో పూర్వదళము (తూర్పుదళము) నందు విశ్రమించుచుండటం నిర్వర్తిస్తున్నప్పుడు తెల్లటి ఆ దళమునందు సంచరించుచుండగా భక్తి - ధర్మ పూర్వకమైన బుద్ధి కలవాడగుచున్నాడు. స్వాత్విక భావములు పొందుచున్నాడు.
అగ్నేయ దళమునందు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు అక్కడి ఎర్రటి దళ - అంతర్గత సంచారముచే ఈ జీవుడు తమోగుణములగు నిద్ర, బద్ధకము, అలసత్వముగల బుద్ధికలవాడుగా ఉంటున్నాడు.
దక్షిణమువైపునగల నల్లటి రంగుతో కూడిన దళములో విశ్రాంతుడై సంచరించుచున్నప్పుడు - అట్టి వాని బుద్ధి-ద్వేషము, కోపములను అధికముగా ప్రదర్శించునదై ఉంటోంది.
నీలవర్ణము అగు ‘నైరృతి - వైపుగల దళములో సంచరించుచున్నప్పుడు ఆ జీవుని బుద్ధి పాపకర్మలు చేయునదిగాను, హింసించు స్వభావముతో కూడినది గాను అయి ఉంటోంది.

యదా పశ్చిమదలే విశ్రమతే తత్పశ్చిమదలం స్ఫటికవర్ణం తదా
క్రీడావినోదే మతిర్భవతి ..
యదా వాయవ్యదలే విశ్రమతే వాయవ్యదలం మాణిక్యవర్ణం తదా
గమనచలనవైరాగ్యమతిర్భవతి ..
యదోత్తరదలే విశ్రమతే తదుత్తరదలం
పీతవర్ణం తదా సుఖశృంగారమతిర్భవతి ..
02. యదా పశ్చిమదళే విశ్రమతే, (తదా)
తత్ పశ్చిమ దళమ్ స్ఫటిక వర్ణమ్।
తదా క్రీడా వినోదే మతిః భవతి।
యదా వాయవ్యదళే విశ్రమతే, (తదా)
వాయవ్యదళం మాణిక్యవర్ణమ్।
తదా గమన చంచల వైరాగ్యే మతిః భవతి।
యదా ఉత్తరదళే విశ్రమతే, (తదా)
తత్ ఉత్తరదళం పీతవర్ణమ్।
తదా సుఖ శృంగారమతిః భవతి।
హృదయపద్మములయొక్క - స్ఫటికవర్ణము అగు - పశ్చిమ దళమునందు జీవుడు సంచరించుచున్నప్పుడు, ఆ జీవుడు క్రీడా వినోదములతో కూడిన బుద్ధి కలవాడగుచున్నాడు.
జీవుడు మాణిక్యవర్ణమును వెదజల్లు వాయువ్య దిశలోగల హృదయపద్మదళములో సంచారములు చేయుచున్నప్పుడు - బుద్ధి ఒకచోట నిలువక, గమనములుకలది, చంచలము, వైరాగ్యముతో కూడినది అగుచున్నది.
పీత (పసుపురంగు) హృదయపద్మదళము - ఉత్తరదిక్కునగల దళము - నందు సంచారములు చేయుచూ ఉన్న జీవునిబుద్ధి సుఖాశా - శృంగార భావములు అధికముగా కలిగినదై యుంటోంది.

యదేశానదలే విశ్రమతే తదీశానదలం వైడూర్యవర్ణం తదా
దానాదికృపామతిర్భవతి ..
యదా సంధిసంధిషు మతిర్భవతి తదా వాతపిత్తశ్లేష్మమహావ్యాధి-
ప్రకోపో భవతి ..
యదా మధ్యే తిష్ఠతి తదా సర్వం జానాతి గాయతి నృత్యతి పఠత్యానందం
కరోతి ..
యదా ఈశాన దళే విశ్రమతే (తదా)
తత్ ఈశానదళం వైడూర్య వర్ణమ్।
తదా దానాది కృపామతిః భవతి।
యదా సంధి సంధిషు మతిః భవతి, తదా
వాత పిత్త శ్లేష్మ మహావ్యాధి ప్రకోపో భవతి।
యదా మధ్యే తిష్ఠతి
తదా సర్వం జానాతి। గాయతి। నృత్యతి।
పఠతి। ఆనందం కరోతి।
వైడూర్యమణి రంగుతో ప్రకాశించే ఈశాన్య దళములో జీవుడు సంచరిస్తూ ఉన్నప్పుడు - దానము చేయుబుద్ధి, ఇతరుల పట్ల కృపచూపించు స్వభావ సంపన్నుడు అయిఉంటున్నాడు.
దళముల సంధి ప్రదేశములలో సంచరించు జీవుడు, వాత - పిత్త - శ్లేష్మనాడులలో కలుగు వ్యత్యాసము చేత ఆయా సంబంధితమైన వ్యాధులు ప్రకోపించటము జరుగుతోంది.
ఎప్పుడు ఈ జీవుని బుద్ధి హృదయపద్మముయొక్క మధ్య భాగమునందు తిష్ఠించినది అగుచున్నదో, అట్టివాడు సర్వము తెలుసుకొనగల తెలివిగలవాడు, గానము - నృత్యము చేయువాడు, పఠించగలుగువాడు, ఆనందముగా ఉండువాడు అగుచున్నాడు.

యదా నేత్రశ్రమో భవతి శ్రమనిర్భరణార్థం ప్రథమరేఖావలయం
కృత్వా మధ్యే నిమజ్జనం కురుతే ప్రథమరేఖాబంధూకపుష్పవర్ణం
తదా నిద్రావస్థా భవతి ..
నిద్రావస్థామధ్యే స్వప్నావస్థా భవతి ..
స్వప్నావస్థామధ్యే దృష్టం శ్రుతమనుమానసంభవవార్తా
ఇత్యాదికల్పనాం కరోతి తదాదిశ్రమో భవతి ..
03. యదా నేత్రశ్రమో భవతి,
శ్రమ నిర్హరణార్ధం
ప్రథమ రేఖావలయం కృత్వా
మధ్యే నిమజ్జనం కురుతే।
ప్రథమరేఖా, బన్ధూకపుష్ప వర్ణా,
తదా నిద్రావస్థా భవతి।
నిద్రావస్థా మధ్యే స్వప్నావస్థా భవతి।
స్వప్నావస్థా మధ్యే
దృష్టం, శ్రుతమ్, అనుమాన సంభవ
వార్తా…ఇత్యాది కల్పనాం
కరోతి। తదా అధిక శ్రమో భవతి।

జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయములు
ఎప్పుడైతే ఈ జీవునికి సర్వ - ఇంద్రియ వ్యాపారముల వలన కలిగిన శ్రమ (Tiresomness) కనులలో ప్రవేశిస్తుందో, అప్పుడు ఆ శ్రమను తీర్చుకోవటానికి బంధూక పుష్పము (మంకిన చెట్టుపువ్వు) ఎరుపు రంగుగా ఉండే ప్రథమ రేఖావలయమునందు నిమజ్జనము స్వీకరించుచున్నాడు. ఆ ఎర్రటి రంగుగా ప్రకాశిస్తున్న మొదటి వలయములో బాహ్య ప్రపంచమైన బుద్ధి అణగినప్పుడు, బాహ్య ఇంద్రియ వ్యాపారములన్నీ నిలచిపోవుచున్నాయి. నేత్రములకు కలిగిన శ్రమ నివారణము కొరకై జీవుడు నిదురపోవుచున్నాడు.
ఆ ‘నిద్రావస్థ’ యొక్క మధ్యలో స్వప్నావస్థ కలుగుచున్నది.
అట్టి ‘నిద్రావస్థ’కు మధ్యలో చూడబడేవి, వినబడేవి, అనుమానించబడేవి - అవన్నీ మనస్సుతో యోచించబడేవే. కలలోని వ్యవహారములన్నీ మనస్సుచే కల్పించ బడినవగుచూ, జీవునిచే పొందబడుచున్నాయి. వాటిచే ఆ జీవుని శ్రమ అధికముగా అగుచున్నది.


శ్రమనిర్హరణార్థం ద్వితీయరేఖావలయం కృత్వా మధ్యే
నిమజ్జనం కురుతే ద్వితీయరేఖా ఇంద్రకోపవర్ణం తదా
సుషుప్త్యవస్థా భవతి సుషుప్తౌ కేవలపరమేశ్వరసంబంధినీ
బుద్దిర్భవతి నిత్యబోధస్వరూపా భవతి పశ్చాత్పరమేశ్వర-
స్వరూపేణ ప్రాప్తిర్భవతి ..
శ్రమ నిర్హరణార్థం ద్వితీయ
రేఖా వలయమ్ కృత్వా,
మధ్యే నిమజ్జనం కురుతే।
ద్వితీయరేఖా ఇంద్రగోపవర్ణా।
తదా సుషుప్త్యవస్థా భవతి।
సుషుప్తౌ కేవల పరమేశ్వర
సంబంధినీ బుద్ధిః భవతి।
నిత్య బోధ స్వరూపా భవతి।
పశ్చాత్ పరమేశ్వర స్వరూపేణ ప్రాప్తిః భవతి।
ఆ స్వప్న దశ యందు కలుగు శ్రమని తొలగించుకోవటానికై ఇంద్రగోప పురుగు (మెఱుగుడు పురుగు) రంగు గల రెండవ రేఖావలయ ములో ప్రవేశించి అద్దాని మధ్యయందు నిమజ్జనమును పొందుచున్నాడు.
అప్పుడు ఆ జీవునికి ‘సుషుప్తి - అవస్థ’ సిద్ధిస్తోంది.
అట్టి సుషుప్త్యవస్థలో ఈ జీవునికి విషయ సంబంధమగు ఇహబుద్ధి - భావములన్నీ అప్రదర్శితములై, ఆవలగల కేవలుడగు పరమేశ్వరునితో సంబంధముగల బుద్ధి మాత్రమే ప్రదర్శితమై ఉంటోంది.
బుద్ధి → కేవల - నిత్య - ఏకబోధా స్వరూపముగా అగుచున్నది.
అట్టి సుషుప్త్యవస్థ తరువాత ఈ జీవుడు పరమేశ్వర స్వరూపమును సంతరించుకొని ఉంటున్నాడు.

తృతీయరేఖావలయం కృత్వా మధ్యే నిమజ్జనం కురుతే తృతీయరేఖా
పద్మరాగవర్ణం తదా తురీయావస్థా భవతి
తృతీయ రేఖావలయంకృత్వా
మధ్యే నిమజ్జనం కురుతే।
తృతీయ రేఖా, పద్మరాగవర్ణా
తదా తురీయ అవస్థా భవతి।
‘పద్మరాగమణివర్ణము’తో కూడిన ‘3’వ రేఖా వలయంలో నిమజ్జనము పొంది ఈ జీవుడు ‘తురీయావస్థ’ పొందుచున్నాడు. (తురీయమ్ = చతురీయం=నాలుగవది). జాగ్రత్-స్వప్న-సుషుప్తులలో ప్రవేశ నిష్క్రమణ ములను నిర్వర్తించు క్రియాత్మకమగు స్వస్వరూపాంశ. (The one who owns and operates the said ‘Three’) అయి ఉంటున్నాడు.

తురీయే కేవలపరమాత్మ-
సంబంధినీ భవతి నిత్యబోధస్వరూపా భవతి తదా శనైః
శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయాత్మసంస్థం మనః
కృత్వా న కించిదపి చింతయేత్తదా ప్రాణాపానయోరైక్యం కృత్వా
సర్వం విశ్వమాత్మస్వరూపేణ లక్ష్యం ధారయతి .
04. తురీయే కేవల పరమాత్మ
సంబంధినీ భవతి।
నిత్య బోధస్వరూపా భవతి।
తదా శనైః శనైః ఉపరమేత్
బుద్ధ్యా ధృతి గృహీతయా,
ఆత్మసంస్థం మనః కృత్వా
న కించదపి చింతయేత్।
తదా ప్రాణ అపానయోః ఐక్యం కృత్వా,
సర్వం విశ్వమ్ ఆత్మ స్వరూపేణ,
లక్ష్యం ధారయతి।
‘తురీయమ్’ అనునది కేవల పరమాత్మ (The Absolute)కు సంబంధించి నది అగుచున్నట్టిది. కేవల బుద్ధి స్వరూపము. నిత్యబోధ స్వరూపం!
అప్పుడు, అట్టి ‘తురీయాఽహమ్’ స్థితి నుండి నిర్మల బుద్ధి - ధృతిలను ఉపకరణములుగా తీసుకోవాలి. దృశ్య సంబంధములైన జాగ్రత్ - స్వప్న - సుషుప్తులనుండి మనస్సును ఉపసంహరిస్తూ, ఆత్మస్థానమునకు (సర్వము స్వస్వరూపాత్మగా దర్శించు బుద్ధితో కూడిన స్థానమునకు) ఆ మనస్సును చేర్చాలి. ఇక ఆత్మకు అన్యమైనదేదీ చింతన చేయకుండునుగాక! సర్వ చింతనలు వీడి బ్రహ్మము గురించే చింతన దర్శనమనే అభ్యాసమును ఆశ్రయించాలి. ప్రాణ - అపానము లను ఐక్యము చేసిన యోగి, (యోగాభ్యాసముచేత జాగ్రత్‌లోనే తురీయుడై) ఈ సర్వ విశ్వమును ఆత్మస్వరూపంగా (ఇదంతా నేనే - అను) లక్ష్యమును ధారణ చేయుచున్నాడు.

యదా తురీయాతీతావస్థా తదా సర్వేషామానందస్వరూపో భవతి
ద్వంద్వాతీతో భవతి యావద్దేహధారణా వర్తతే తావత్తిష్ఠతి
పశ్చాత్పరమాత్మస్వరూపేణ ప్రాప్తిర్భవతి ఇత్యనేన ప్రకారేణ
మోక్షో భవతీదమేవాత్మదర్శనోపాయం భవంతి ..

చతుష్పథసమాయుక్తమహాద్వారగవాయునా .
సహ స్థితత్రికోణార్ధగమనే దృశ్యతేఽచ్యుతః .. 94..

పూర్వోక్తత్రికోణస్థానాదుపరి పృథివ్యాదిపంచవర్ణకం ధ్యేయం .
ప్రాణాదిపంచవాయుశ్చ బీజం వర్ణం చ స్థానకం .
యకారం ప్రాణబీజం చ నీలజీమూతసన్నిభం .
రకారమగ్నిబీజం చ అపానాదిత్యసంనిభం .. 95..

లకారం పృథివీరూపం వ్యానం బంధూకసంనిభం .
వకారం జీవబీజం చ ఉదానం శంఖవర్ణకం .. 96..

హకారం వియత్స్వరూపం చ సమానం స్ఫటికప్రభం .
హృన్నాభినాసాకర్ణం చ పాదాంగుష్ఠాదిసంస్థితం .. 97..
తదా తురీయాతీతావస్థా।
తదా సర్వేషామ్ ఆనన్దస్వరూపో భవతి।
ద్వంద్వాతీతో భవతి।
యావత్ దేహధారణావర్తతే, తావత్ తిష్ఠతి।
పశ్చాత్ పరమాత్మ స్వరూపేణ ప్రాప్తిః భవతి।
ఇతి అనేన ప్రకారేణ మోక్షో భవతి।
ఇదమేవ ఆత్మదర్శనోపాయమ్ భవతి।

చతుష్పథ సమాయుక్త, మహాద్వార గవాయునా
సమాస్థిత త్రికోణార్థా, గమనే దృశ్యతే ‘అచ్యుతః’।

పూర్వోక్త త్రికోణస్థానాత్
ఉపరి ‘పృథివి’ ఆది
పంచవర్ణకమ్ ధ్యేయమ్।
ప్రాణాది పంచవాయుశ్చ ‘బీజమ్’।
వర్ణంచ స్థానకమ్।
‘య’ కారం ప్రాణబీజం చ।
నీలజీమూత సన్నిభమ్।
‘ర’ కారం అగ్నిబీజం చ,
అపాన ఆదిత్య సన్నిభమ్।

‘ల’ కారం పృథివీ రూపం,
వ్యానం బంధూక సన్నిభమ్।
‘వ’ కారం జీవబీజం చ,
ఉదానం శంఖవర్ణకమ్।।

‘హ’ కారం విశ్వరూపం చ,
సమానం స్ఫటిక ప్రభమ్
హృత్ - నాభి - నాసా - కర్ణం చ
పాద - అంగుష్ఠాది సంస్థితః।।
క్రమంగా ‘తురీయాతీత-అవస్థ’ను అవధరించుచున్నాడు.
అప్పుడాతడు సర్వజీవులకు ‘ఆనందస్వరూపుడు’ గా తనకుతాను అనుభవమగు చున్నాడు. ఆతడు ద్వంద్వా తీతుడై ‘ఈ తదితరులు - ఈ జగత్ దృశ్యము నాకువేరు కాదు! నాకు అనన్యము’ అను అనినిత్యానుభవ- కారణాతీత స్థితిని చేరుచున్నాడు.
ఇక ఆతడు ఈ భౌతిక దేహము నిలచి ఉన్నంత వరకు కూడా ద్వంద్వ రహితుడై, ఆనందరూపుడై ఉంటూ దేహానంతరము పరమాత్మ స్వరూపము ప్రాప్తించుకున్నవాడై విరాజిల్లుచున్నాడు. ఇదియే అనేక ప్రాకారములుగా (జీవన్ముక్తి, విదేహముక్తి, జీవబ్రహ్మైక్యము మొదలైన శబ్దములతో) కూడా చెప్పబడు మోక్షము. ఇదియే ఆత్మదర్శనోపాయము!
(ఇడ-పింగళ-సుషుమ్నా-పురీత అనబడు) 4 త్రోవలు (నాడీ మార్గములు) - కూటస్థం అయినట్టి కంఠ ప్రదేశంలోకి చేరుచున్నాయి.
ప్రాణ వియోగసమయంలోను, సమాధి నిష్ఠి వహించినప్పుడు కూడా దేహంలోని సర్వవాయువులు - సభలోకి ప్రవేశించే పౌరజనుల వలే వచ్చి చేరుచున్నాయి. అట్టి సుషుమ్ననాడికి ‘మహాద్వారము’ అని పేరు. అప్పుడీ జీవుడు ‘4’ త్రోవలుగల సహస్రార చక్రంలో అచ్యుతుడుగా (చ్యుతిలేనివాడై) స్వానుభూతుడగుచున్నాడు. ద్రష్ట-దర్శన-దృశ్యముల సమస్థితియే త్రికోణార్ధము.
ఇంతకు ముందుగా చెప్పబడిన త్రికోణమగు మూలాధారమునకు పైన పృథివి మొదలైన పంచభూతములు ఆయా స్థానములలో ఆయా వర్ణములు కలిగి ఉంటున్నాయి. అవి ధ్యేయమగుచున్నాయి. అందుకు మార్గముగా ఆయా రంగులతో కూడిన పంచభూతములను ఏకాంశ సంభూతుడగు పరమాత్మగా ధ్యానించాలి.
ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన-సమానములు’ అనబడే పంచప్రాణముల బీజము, వర్ణము, స్థానము చెప్పుకుంటున్నాము.
‘య’ నీలమేఘపు రంగు స్థానముగా ‘య’-అను బీజాక్షరంతో ధ్యానించాలి.
‘ర’ ‘అపానము’ ఉత్పత్తి అగు స్థానము అగు అగ్నిబీజమును ‘ర’కారాక్షర ముతో, సూర్యమండల సన్నిభంగా ఉపాసించాలి,
‘ల’కారము పృథివీ రూపమును బంధూక (మంకెన) పుష్ప రంగుగాను ‘వ్యాన వాయువు’గాను, (శరీరమంతా వ్యాపించు ప్రాణశక్తివలే) భావించి ‘ల’కార బీజాక్షరంతో ఉపాసించాలి.
‘వ’ కారము ఈ జీవుల ఉత్పత్తి స్థానముగాను - (జీవబీజంగాను), ‘ఉదాన’ ప్రాణముగాను శంఖవర్ణముతో ఉపాసించాలి.
‘హ’ కారము ఈ విశ్వరూపమును ‘హ’కారము, బీజాక్షరముతో, స్ఫటికప్రభ భావనతో ఉపాసించబడునుగాక!
ఈ విధంగా హృదయము, నాభి (బొడ్డు), ముక్కు, చెవులు, పాదములు, వ్రేళ్ళ వద్ద ఆత్మను ఆయాస్థానములలో సంచారిగా ఉపాసించాలి.

ద్విసప్తతిసహస్రాణి నాడీమార్గేషు వర్తతే .
అష్టావింశతికోటీషు రోమకూపేషు సంస్థితాః .. 98..

సమానప్రాణ ఏకస్తు జీవః స ఏక ఏవ హి .
రేచకాది త్రయం కుర్యాద్దృఢచిత్తః సమాహితః .. 99..

శనైః సమస్తమాకృష్య హృత్సరోరుహకోటరే .
ప్రాణాపానౌ చ బధ్వా తు ప్రణవేన సముచ్చరేత్ .. 100..

కర్ణసంకోచనం కృత్వా లింగసంకోచనం తథా .
మూలాధారాత్సుషుమ్నా చ పద్మతంతునిభా శుభా .. 101..

అమూర్తో వర్తతే నాదో వీణాదండసముత్థితః .
శంఖనాదిభిశ్చైవ మధ్యమేవ ధ్వనిర్యథా .. 102..

వ్యోమరంధ్రగతో నాదో మాయూరం నాదమేవ చ .
కపాలకుహరే మధ్యే చతుర్ద్వారస్య మధ్యమే .. 103..

తదాత్మా రాజతే తత్ర యథా వ్యోమ్ని దివాకరః .
కోదండద్వయమధ్యే తు బ్రహ్మరంధ్రేషు శక్తితః .. 104..

స్వాత్మానం పురుషం పశ్యేన్మనస్తత్ర లయం గతం .
రత్నాని జ్యోత్స్నినాదం తు బిందుమాహేశ్వరం పదం .
య ఏవం వేద పురుషః స కైవల్యం సమశ్నుత .. 105..

ఇత్యుపనిషత్.
05. ద్విసప్తతి సహస్రాణి (72000)
నాడీమార్గేషు వర్తతే।
అష్టావింశతి కోటిషు (28 కోట్ల)
రోమ కూపేషు సంస్థితః।

సమాన ప్రాణ ఏకస్తు
జీవః సో అపి ఏకఏవ హి।
రేచకాది త్రయం కుర్యాత్
దృఢచిత్తః సమాహితః

శనైః సమస్తమ్ ఆకృష్య
హృత్ సరోరుహ కోటరే
ప్రాణ అపానౌచ బధ్వాతు
ప్రణవేన సముచ్చరేత్।

కంఠ సంకోచనం కృత్వా
లింగ సంకోచనం తథా,
మూలాధారాత్ సుషుమ్నాచ
పద్మతంతు నిభా శుభా

అమూర్తో వర్తతే నాదో
వీణాదండ సముత్థితః,
శంఖ నాదాదిభిశ్చైవ
మధ్యమేవ ధ్వనిః యథా।

వ్యోమరంధ్ర గతో నాదో
మాయూరం ‘నాదమ్’ ఏవ చ।
కపాల కుహరే మధ్యే
చతుః ద్వారస్య మధ్యమే

తత్ ఆత్మా రాజతే తత్ర,
యథా వ్యోమ్ని దివాకరః।
కోదండ ద్వయ మధ్యే తు
బ్రహ్మరంధ్రేషు శక్తితః

స్వాత్మానం పురుషమ్ పశ్యేత్
మనః తత్ర లయం గతమ్।।
రత్నాని జ్యోత్స్నికా నాదం
‘బిందుం మాహేశ్వరమ్ పదమ్’।
య ఏవం వేద పురుషః
స కైవల్యం సమశ్నుత ఇతి।

ఈ జీవుడు ‘72000’ నాడీ మార్గములలోవర్తించుచున్నాడు. 28 కోట్ల రోమ కూపములలో సంస్థితుడై ఉన్నాడు. నాభి వద్ద సమానవాయవుతో ఏకస్వరూపుడై ఈ శరీరమంతా ధరించవాడై యున్నాడు.
ఆయా అనేక విశేషములతో కూడిన ఈ భౌతిక దేహమునందు జీవాత్మ దృఢ (పట్టుదలగల) చిత్తముతో సమాహితుడై రేచక - పూరక - కుంభక ప్రాణాయామములను అసంకల్పితంగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. (ఇప్పుడు స-సంకల్పితం చేయాలి).
మెల్లగా సమస్తమును ఆత్మభావనలోనికి ఆకర్షిసూ, హృదయ పద్మముయొక్క కోటరంలో ప్రాణ-అపానములను ఒకదానితో ఒకటి బంధిస్తూ…, నిత్యము ప్రణవస్వరూపుడై ప్రకాశించుటకై, కంఠమును, లింగమును సంకోచింపజేస్తూ యోగాభ్యాసము చేయును గాక!
సుషుమ్న ‘మూలాధారమునుండి మొదలై, పద్మము యొక్క కాడలోని తంతువు వలె విస్తరించునది. శుభప్రదమైనది. నాదమువలె అమూర్తము అయినది, వీణాదండమువలె ఉన్నట్టిది-సుషుమ్ననాడి. అట్టి సుషుమ్న స్వరూపరహితమైయున్నది. (శక్తి రూపము). అద్దాని నుండి ఒకానొక ‘నాదము’ జనిస్తోంది.
ఆ నాదము శంఖానాదము యొక్క మధ్యమ ధ్వని వలె ఉన్నట్టిది. మధ్యమ ధ్వని అయినట్టి సుషుమ్న నుండి పుట్టిన శంఖానాదము - వ్యోమరంధ్ర మగు సహస్రారమును చేరుచున్నది. అట్లు చేరుచున్నప్పుడు షడ్జమ స్వరము వంటి మయూరకూజిత ధ్వనిచే ధారణయందు నిలచి ఉంటోంది.
ఈ జీవుడు ‘కుండలినీయోగము’గా కుండలినియందు ప్రవేశించి, బుద్ధిని క్రమంగా ఊర్ధ్వముగా నడపుచూ, కపాల కుహరము యొక్క ‘4’ వ ద్వారము మధ్యయందు ప్రవేశించి జగత్తును స్వీయ కల్పనా మాత్రమైన దానిగా తిరస్కరించివేస్తున్నాడు. పరమాత్మ సాక్షాత్కారముచే ఆత్మానందభరితుడై, సహస్రారంలో ఉనికిని పొంది - అంతరిక్షంలో సూర్యునివలే సర్వలోకములను ప్రకాశింపజేయుచున్నాడు.

పరమాత్మలో ఐక్యము పొందుటకై…
- భ్రూ మధ్య స్థానమున నిలచి,
- స్వ దృష్టి - శక్తులచే బ్రహ్మ రంథ్రస్థానమును లక్ష్యముగా కలవాడై
- బ్రహ్మ రంథ్రస్థానము చేరి..,
తన సహజ స్వస్వరూపము - అగు పరమాత్మను ఎరుగుచున్నాడు.
జీవాత్మ - పరమాత్మల ఏకరూపమును బుద్ధితో ప్రస్ఫుటపరచుకొనుచున్నాడు.
- ‘అహమ్ బ్రహ్మాస్మి’ అను జ్ఞానము నందు ‘మనోలయము’ను సిద్ధింప జేసుకుంటున్నాడు.
అనేక రత్నముల ఏకరూపకాంతివలె, జ్యోతి స్వరూపమై, నాద - బిందు - కళాతీతమైనట్టి మహేశ్వర పదమును అధిరోహించుచున్నాడు.
జీవ - బ్రహ్మైక్యమును చేర్చగల భ్రూమధ్య స్థానము నుండి - బ్రహ్మరంధ్రము వద్ద స్వశక్తితో లక్ష్యమును నిలిపి, ‘‘అహంబ్రహ్మాఽస్మి। అహమేవ ఇదమ్ సర్వము’’ అను సుస్థిర - అనునిత్యబుద్ధిని సిద్ధింపజేసుకొన్నవాడు. ఈ ఉపనిషత్ దారిచూపు ‘సోహమ్’ మహత్తర స్థానమును పుణికి పుచ్చుకొనుచున్నాడు.
కేవలీ స్వరూపుడై ప్రకాశించుచూ - పునరావృత్తి దోషము లేనట్టి కైవల్యపదమును పొందుచున్నాడు.

ఇతి ధ్యానబిందూపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



కృష్ణ యజుర్వేదాంతర్గత

15     ధ్యాన బిందు ఉపనిషత్

అధ్యయన పుష్పము

ప్రమాధ్యాయము - యోగసాధనా వివిధ విధానములు

ఇప్పుడు ‘ధ్యానయోగము’ గురించి అద్దానికొరకై శరీర - ఉపకరణ సంబంధమైన విశేష విషయాల గురించి చెప్పుకొనుచున్నాము.

ధ్యాన యోగాగ్నిచే - అనేక జన్మల సువిస్తీర్ణ పాపకర్మల గుట్టలగుట్టలు కూడా దహించి వేయబడగలవు. బుద్ధియొక్క అనేక జన్మల దృశ్యపరిమిత సంస్కారములను రహితము చేసుకోవటానికి ‘ధ్యానయోగము’ను మించిన ఉపాయము మరింకేదీ లేదు. భిద్యతే ధ్యానయోగేన, న అన్యః భేదః కదాచన.

‘బీజాక్షరము’ అగు ఓంకారము → నాద - బిందువులకు ఆవల అభౌతికమై, అశబ్దతత్త్వమై యున్నది.

‘ఓం’కార అర్థ ము: సర్వమునకు ఆవల ప్రకాశమానమైయుండునది ఆత్మ. అద్దాని సంజ్ఞ - ‘ప్రణవము’. ‘పరస్వరూప సంజ్ఞ’….అని కూడా అనబడుతోంది. ఓంకారము మొట్టమొదట శబ్దరూపముగానే ఆశ్రయించబడుతోంది. క్రమంగా శబ్దము - అక్షరములను దాటివేసినదై నిశ్శబ్ద - పరమస్థానమగు ‘కేవలాత్మానుభము’గా, ‘స్వానుభవమాత్రము’గా ‘మౌన ఆత్మానందమిదమ్ సర్వమ్’గా రూపుదిద్దుకో వలసినదైయున్నది. పరమ ప్రశాంతమగు బుద్ధి విభాగముతో అవ్యాజ-అనిర్వచనీయ స్వాత్మానందముగా ఆస్వాదించవలసినట్టిది.

మామిడిపండు రుచి ఎట్లా వర్ణనాతీతమో, అట్లాగే బిందు అతీత, బీజాక్షరాతీత, కేవల ‘ఓం’ తత్త్వానుభవము అవాక్ గోచరము! అరూపస్వానుభవము! సర్వజగత్‌స్వరూప సర్వసాక్షీస్వరూప ఏకరస రూపము! అజపాగాయత్రీస్వానందము!

హృదయస్థానములోని అనాహతములో నిశ్శబ్దమైన బుద్ధికి వినబడు ప్రణవనాదమగు ‘ఓ….మ్….మ్’ శబ్దమును వినుచున్న యోగాభ్యాసి క్రమంగా ఆ శబ్దమును అధిగమించి అద్దానికి ఆవల - అద్దానికీ ఆధారమైనట్టి ‘కేవల చైతన్యాత్మ’ అగు ‘తత్ పదము’ను దర్శించుచున్నాడు. అట్టి అశబ్ద ఓంకారాత్మ తత్త్వార్థ జ్ఞానదర్శనముచే (అనుభవముచే)….ఆ యోగి యొక్క సర్వ సందేహములు తొలగిపోయి, ఆతడు ఆత్మానందమును ఆస్వాదించగలడు. తత్ చైతన్యాత్మయే తానగుచున్నాడు.

పరమాత్మను ఎట్లా, ఎక్కడ దర్శించాలి?

పరమాత్మ అత్యంత సూక్ష్మస్వరూపుడు! ఒక జంతువు తోక యొక్క చిట్టచివరి కొనభాగంలోని సూక్ష్మకణములోని లక్షవ వంతు భాగమువలె సూక్ష్మాతిసూక్ష్ముడు. అత్యంత నిర్మలుడు. అప్రమేయుడు. అన్ని మట్టి బొమ్మలలో మట్టివలె - అసంగుడు. సర్వజీవులలో అంతర్ - హృదయుడై సర్వజీవులలోను సమముగా సాక్షిగా ప్రకాశమానుడై ఉన్నారు.

ఆత్మతత్త్వోపాసకుడగు యోగి - తన జగత్ భావసంబంధమైన మనస్సు లయించగా - నిర్మల హృదయుడై, తనయందే సర్వతత్త్వస్వరూపుడగు పరమాత్మను అనునిత్యంగా, అనుభూతపరచుకొనుచున్నాడు. అనుక్షణికము కేవలానంద స్వరూపంగా దర్శించుచున్నాడు.

అట్టి ఆత్మ బాహ్య జగత్తులోని ఒక వస్తువు వంటిదా? కాదు! అది సర్వ జగత్ భావ - అనుభవములకు జననస్థానము.

ఆత్మ ఉన్నది ఎక్కడ?

పుష్పములలో సుగంధమువలె, పాలలో నేయివలె, నువ్వులలో నూనెవలె, ఖనిజములో బంగారమువలె, ఆభరణములలో బంగారమువలె, తరంగములలో జలమువలె, మట్టి బొమ్మల కొలువులో మట్టివలె, కథలోని పాత్రలకు కథారచయిత వలె, స్వప్నమునకు స్వప్నసాక్షివలె సర్వజీవులలో సర్వదా అఖండస్వరూపుడై సర్వత్రా విస్తరించినదై (ఆత్మ)యున్నది.

అట్టి ఆత్మయొక్క దర్శన - స్వానుభవములకై….

అట్టివాడు క్రమంగా బ్రహ్మవేత్త అయి, బ్రాహ్మీస్థితికి సంసిద్ధుడు అగుచూ, బ్రహ్మమే తానై ప్రకాశించుచున్నాడు. తన నిత్య - సహజ స్వరూపము ‘బ్రహ్మమే’ అని సునిశ్చలుడు, సునిశ్చితుడు (Well decided and undistracted) అగుచున్నాడు.

ఈ జీవునికి ఆత్మకు గల సంబంధము

నువ్వుగింజలలో అంతటా నూనె ఉన్నట్లు, పుష్పములో సువాసన అంతటా ఉన్నట్లు….ఈ జీవుని బాహ్య - అభ్యంతరములలో అంతటా స్వస్వరూపము - సర్వస్వరూపము కూడా అయి ఉన్న ఆత్మయే వెలుగొందుచూ సంస్థితమైయున్నది. అట్టి ఆత్మ జీవాత్మ - జీవాత్మానుభవములకు కూడా స్థానము. ఎందుకంటే, ఈ జీవాత్మ పరమాత్మ కానట్టి క్షణమే లేదు.

ఈ జగత్తు ఆత్మస్వరూపమే!

ఒక మహావృక్షము యొక్క ‘నీడ’లో కొమ్మలు, ఆకులు, పుష్పములు, ఫలముల నీడలు కనిపిస్తూ ఉన్నప్పటికీ….అంతా ‘ఏకఛాయ’ యే కదా! ఆత్మభావనచే - ఈ జగత్తు అనేకముగా కనిపిస్తూ ఉన్నప్పటికీ….నిష్కళంక భావనచే ‘సర్వత్రా ఆత్మయే వ్యవస్థితమై యున్నది’ - అని అనుభూతమవగలదు. నిర్మల హృదయానికి ఇదంతా అఖండ - నిత్య నిర్మల - సత్య పరమ ఆత్మానంద స్వరూపంగానే అనుభవమగుచున్నది. అనేకంగా కనిపిస్తున్న ఇదంతా ఏకమగు ఆత్మగానే ఆత్మసంయమయోగి కి అనిపిస్తూ ఉన్నది.

ఆత్మగా అనిపించేది ఎట్లా? ఆత్మభావనగా ఇదంతా సిద్ధించేది ఎట్లా?

ఈ దృశ్యమంతా కూడా భేద దృష్టిచే అనేకమైన పరస్పర సానుకూల - వ్యాతిరిక్తములతో కూడుకొని ఉన్నట్లు అనిపిస్తోంది. ఆత్మదృష్టిచే సర్వమూ ఆత్మగా అనిపించుటకు మార్గమేమిటి? అందుకు ‘ధ్యాస’యే మార్గము. ధ్యాస కొరకై ‘ధ్యానము’ను అభ్యసించాలి. ధ్యానమే అందుకు ఏకైక మార్గము.

దేనిని ధ్యానించాలి?

జన్మ-కర్మ పరంపరల నుండి, దృశ్యభ్రమ బంధములనుండి, వాటివాటిచే ఏర్పడుచున్న అసంఖ్యాక సంబంధ - అనుబంధ రూప శృంఖములనుండి విడివడదలచిన ‘మోక్షార్ధి’యగు మముక్షువు - ‘ఓం’ అను అక్షరసంజ్ఞతో - అక్షర పరబ్రహ్మమును ధ్యేయముగా కలిగి ఉపాసించాలి. ధ్యానించాలి. అప్పుడు ఈతడు ‘క్షరము’ (మార్పుచెందుదాని) నుండి విడివడి, అక్షరస్వరూపుడై విరాజిల్లగలడు.

సకల ముముక్షువులకు రాచబాట అగు ‘ఓం’ అనబడు ప్రణవోపాసన గురించి ఇప్పుడు మనము చెప్పుకొనుచున్నాము.

‘ఓం’కార ప్రణవాంశలు

‘ఓం’ అను ఉచ్ఛారణ రూప పరబ్రహ్మమును - ‘3’ అంశలుగా ఉపాసించుచున్నారు. - అ + ఉ + మ

ప్రమ (మొదటి) ప్రణవాంశ - ఉపాసన - ‘అ’కారోపాసన

‘అ’ కారము ‘ఓం’కారములోని ప్రథమ ప్రణవాంశ. ఇట్టి ‘అ’ శబ్దమును ఉపాసిస్తూ ఉన్నప్పుడు →
- భూతతత్వము (Physical appearence in toto) ఉపాసనా వస్తువు (భూః వ్యాహృతి - ప్రథమ వ్యాహృతి) అగుచున్నది.
- పితామహుడగు బ్రహ్మదేవుడు….ఉపాసనా దైవము.
- పృధివి (భూమి), అగ్ని, ఋక్కులతో కూడిన ఋగ్వేదము….అకారమునకు ప్రత్యక్ష రూపములు అగుచున్నాయి.

ఈ విధంగా ఈ భౌతికంగా కనిపించే భూమిని, జ్యోతిస్వరూపము (అగ్ని)ను, ఋగ్వేదములోని ఋక్కుల గానములను, ఈ సృష్టికి కర్తయగు బ్రహ్మదేవుని ‘అ’కారమునందు లయింపజేయాలి.

అనగా, అవన్నీ ఓంకారములోని ప్రథమాంశయగు ‘అ’కార స్వరూపంగా భావించుచూ ‘అ’కారపూర్వక ఓంకారోపాసన చేయాలి. ‘అ’కారము = రజోగుణస్వరూపము. రంగు = పీతము (ఎరుపు)

ద్వితీయ (2వ) ప్రణవాంశోపాసన - ‘ఉ’కారోపాసన

‘ఓం’ కారములోని ద్వితీయ ప్రణవాంశయగు ‘ఉ’కారమును
- యజుర్వేదము - యజస్సులుగాను,
- వాయు రూపంగాను, ప్రాణరూపంగాను,
- భువర్ - ఆకాశ స్వరూపంగాను (ద్వితీయ హ్యహృతిగాను),
- జనార్దనుడగు విష్ణుభగవానుని తత్త్వముగాను….ఉపాసించాలి.
‘ఉ’కారమునందు వాటినన్నిటినీ లయింపజేయాలి. ‘ఉ’కార స్వరూపములుగా భావించాలి. గుణము = సాత్వికము. రంగు = తెలుపు.

తృతీయ (3వ) ప్రణవాంశోపాసన - ‘మ’కారోపాసన

‘ఓం’ కారములోని ‘3’వ అంశ అగు ‘మ’కారమును….
- సూర్యభగవానుని గాను,
- సామవేదముగాను, సామగానములుగాను, స్తోత్రగానములు గాను,
- సువర్ (స్వర్గ)….అంతరిక్ష రూపము గాను,
- మహేశ్వర భగవానునిగాను,
ఉపాసించాలి. అవన్నీ ‘మ’ కారమునందు లయం చేయాలి. అనగా, అవి ‘మ’కార స్వరూపంగా భావించాలి.
గుణము = తామసము, రంగు = కృష్ణ (నలుపు) వర్ణము.

ఇంకనూ ‘ఓం’ ప్రణవమును ఈఈ రీతులుగా భావించుచూ ఉపాసించాలి.

అష్టాంగము (8 అంగములు కలది) = (అకార - ఉకార - మకార - అర్ధమాత్ర - బిందు - నాద - కళ - కళావీత స్వరూపము)

చతుష్పాదము (4 పాదములతో కూడినది) = జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయములు తన పాదములుగా కలిగియున్నట్టిది. (మాండూక్యోపనిషత్ దృష్టాంత వివరణ);

త్రిస్థానము (3) (3) స్థానములలో ప్రకాశించునది) = సత్య - జ్ఞాన - అనంత స్థానసహితము. ఇహ - పర - పరాత్ పరరూపము;
Here - Beyond - Alpervading Form without Boundaries); భూత - వర్తమాన - భవిష్యత్ కాలనియామకము; దృశ్య - జీవ - ఈశ్వరరూపము; బ్రహ్మ - విష్ణు - రుద్రః - సత్య - జ్ఞాన - ఆనంద దేవతా (దివ్య) రూపములు.

పంచ దైవతము (5గురు అధిదేవతలు కలిగి ఉన్నట్టిది) =
తత్సవితుః → బ్రహ్మాత్మనే!
వరేణ్యం → విష్ణవాత్మనే!
భర్గోదేవస్య → రుద్రాత్మనే!
ధీమహీ → సత్యాత్మనే!
ధియోయోనః → జ్ఞానాత్మనే!

—————————–
ప్రచోదయాత్ → సర్వాత్మనే।
—————————–

⌘⌘⌘

‘ఓం’కార ప్రణవమును ఇప్పుడు మనము చెప్పుకొన్న అంతరార్థంగా ఎవ్వరు తెలుసుకొని దర్శిస్తూ ఉపాసించరో, అట్టివారు బ్రాహ్మణులు (లేక) బ్రహ్మతత్త్వజ్ఞులు అని అనిపించుకోజాలరు.

అనగా, ‘ఓం’ అని ఉచ్ఛరిస్తూ….పరమాత్మను

తెలుసుకొని ‘ఓం’ కారమును పలుకువాడే ఓంకారమును ఎరిగిన (ప్రణవమును తెలుసుకొన్న) బ్రాహ్మణ శబ్దార్హుడు.

బ్రాహ్మీస్థితి - లక్ష్యము

అట్టి ప్రణవము (ఓంకారము) → ధనస్సుకాగా,
స్వకీయ- జీవాత్మత్వము → బాణముగాను,
సర్వతత్త్వస్వరూపమగు ‘బ్రహ్మమే తానగుట’ - అనునది → లక్ష్యముగాను… సంసిద్ధుడవాలి.

‘‘ఓం’’ → ధనస్సును బాణముతో సంధించి, ముముక్షువు అప్రమత్తుడై (With all Awakened Enthusiasm and Attention) - జీవాత్మత్వ బాణము లక్ష్యమును తాకు విధంగా పరబ్రహ్మముతో తన్మయుడు కావాలి. బ్రాహ్మమే తానుగా అవాలి. అట్టి పరాత్‌పరము (దేహమునకు సాక్షియగు జీవాత్మకే సర్వాంతర్యామిరూప మహత్ సాక్షిత్వము) సంపాదించుకొనును గాక.

ఇక ఆపై సర్వమునకు ఆది అగు మమాత్మకు క్రియలు లేవు! జన్మలు లేవు! కర్మలు లేవు! చావుపుట్టుకలు లేవు! దేహముల రాకపోకలు లేవు!
‘‘వాటి అన్నిటికీ లీలగా ఆధారమై, సర్వ కల్పనలకు ఆవల - మౌనంగా, ఆనందంగా చూస్తూ ఉన్నట్టి కేవలసాక్షియే నేను’’….అని ఎరుగాలి!
అట్టివాడు సర్వ దృశ్యవ్యవహారములలో ఉండి కూడా,….వాటన్నిటినుండీ నివర్తితుడు.(One who has withdrawn every thing into himself) …..అగుచున్నాడు.
ఓంకారార్థమే తానై ఉంటున్నాడు.
జన్మలు, కర్మలు మొదలైనవన్నీ ఉండి కూడా, ఆతనిపట్ల అవన్నీ మెదలే ఏ క్షణమందూ ‘లేనివే’ అగుచున్నాయి.
ఆతడు అన్నీ ఉండి, ఏమీ లేనివాడై ఉంటున్నాడు.

‘ఓం’ = దృశ్యజగత్తు + ద్రష్ట + దృక్ + ఈశ్వర + పరమాత్మల అఖండైకతత్త్వం.

‘ఆత్మ’కు సంజ్ఞయే ‘ఓం’కారము. ‘ఓం’ కారం చ ప్రభవమ్ ఇదమ్ సర్వమ్!

ఓంకారమునుండియే → ఋక్ - యజుర్ - సామ - అధర్వణ చతుర్వేదములు జనిస్తున్నాయి.
ఓంకారము నుండియే → 16 విధములగు స్వరములు పుట్టుకొస్తున్నాయి.
ఓంకారమునుండియే → భూ - భువర్ - సువర్ మొదలైన లోకములు, లోకస్థులు, లోకేశులు సంప్రదర్శితమగుచున్నారు.
ఓంకారమునుండియే → ఈ చరాచర జగత్తు ఉద్భవించి, ఓంకారము నందే ప్రదర్శితమగుచున్నది! అంతా కూడా తదభిన్నం.

ఓంకారమే…..‘నేను’ రూపంగా జాగృత్ స్వప్న సుషుప్తులలో వేరు - వేరు రూపములవలె ప్రదర్శితమగుచున్నది. ఆ ‘నేను’ కు అక్కడ - ఇక్కడ అనుభవమగుచున్నదంతా పరమాత్మార్థమగు ఓంకారమే!

‘అ - ఉ - మ’ (ఓం అని చిన్నగా పలకటము)….అని హ్రస్వరూపంగా (వేరువేరుగా) ఓంకారమును ఉపాసించువాని పాపములన్నీ హ్రస్వ ప్రణవాగ్నిచే సర్వపాప దృష్టులు, మనోవికలములు దహించివేయబడుచున్నాయి. (అ = పరాత్మ; ఉ = ఊహ, భావన, ప్రకృతి మ = ఊహించువాడు, భావించువాడు, అనుభవి).

ఓ……మ్…. (సుదీర్ఘంగా ఓంకారము - ఏకంచేసి) - దీర్ఘ ప్రణకోచ్చారణ - అవ్యయమగు సర్వసంపదలు ప్రసాదించగలదు.

అర్ధమాత్ర (మ్…..): అర్ధమాత్రతో కూడిన ప్రణవోపాసన → మోక్షమును ప్రసాదించునదై ఉన్నది. ‘నేను ఈ దృశ్య - దేహ - జీవాత్మలచే బంధితుడను కాను. సంబంధితుడనుకాను’ అను అనుశ్రుతమగు ఉత్తేజముతోకూడిన అనుభవమును శాశ్వతము చేసివేయగలదు. (ఓంకార పరమార్థ భావనయే అర్ధమాత్ర).

విదిత వేద్యుడు (లేక) వేదవేద్యుడు

ఎవ్వరైతే….
- ఇదంతా అవాక్ - మానస గోచరమగు బ్రహ్మముయొక్క (ఆత్మయొక్క) ప్రత్యక్ష రూపమేనని,
- ఓంకారార్థ ప్రణవ స్వరూపమేనని…..
- అట్టి ప్రణవము తైలధారవలె తెంపులేనిదని,
- ‘ఈ దేహ - దృశ్య - జీవాత్మత్వములవలె కొలబద్ధము (measerable) కాదు’ అని,
- గంటయొక్క ట్రంగ్ - ట్రంగ్ మ్రోతవలె అవిచ్ఛిన్న నాదపరంపర వంటిదని….
గ్రహిస్తారో… వారే వేదహృదయమును ఎరిగినట్టి వేదవేద్యులు.

ఓంకార (ప్రణవ) ధ్యాన విధానములు

హృదయాంతర్గత ఆత్మజ్యోతిరూపంగా….

(18) హృత్‌పద్మ కర్ణికామధ్యే స్థిరదీప నిభాకృతమ్
అంగుష్ఠమాత్రమ్ అచలమ్ ధ్యాయేత్ ‘ఓం’కారమ్ ఈశ్వరమ్!

హృదయము = ఎక్కడ ఆలోచన, భావన, కోపము, ప్రేమ, ఇష్టము, అయిష్టము మొదలైన ఆయా సమస్త భావములు, ఉద్వేగములు గుణములు జనిస్తున్నాయో….అట్టి భావనాజనిత స్థానము. ఈ లోకములన్నీ జీవుని భావనా రూపములే కాబట్టి - లోకములన్నీ స్థానముగా కలిగియున్నట్టిది హృదయమే.

అట్టి ‘హృదయము’ అను పద్మము యొక్క కర్ణికల (పూరెక్కల) మధ్యగా అంగుష్ఠ మాత్ర (బొటనవ్రేలు నిలువుగా పెట్టి ఉంచినప్పటి) ఆకారము గల పొగలేని జ్యోతి రూపంగా ఆత్మజ్యోతి వెలుగొందుచున్నది…అట్టి అచలమగు ఆత్మజ్యోతి రూపమును ఓంకార - ఈశ్వర స్థానముగా ధ్యానము చేయాలి.

పూరక ప్రాణాయామ - ఆత్మో (ప్రణవో) పాసన

ఈ దేహములో ఎడమవైపుగా మూలాధారమునుండి → కంఠస్థానము వరకు ప్రసరించి ఉన్న సూక్ష్మ నాడిని ‘ఇడా నాడి’ అని పిలుస్తున్నారు. కుడివైపున→ మూలాధారమునుండి కంఠస్థానము వరకు ప్రసరించి ఉన్న సూక్ష్మనాడిని ‘పింగళా నాడి’ అని అంటారు.

అనగా, మూలాధారచక్రమునుండీ
- కుడివైపు పింగళానాడి
- ఎడమవైపు → ఇడనాడి
- వెన్నెముకను వెంటనంటి ఊర్థ్వంగా శక్తి ప్రదర్శనముగా విస్తరించి ఉన్నాయి.

  1. ఎడమవైపుగల ముక్కుపుటము ద్వారా గాలిని పీల్చి,
  2. ఆ గాలిని ఎడమవైపుగాల ఇడాశక్తి నాడియందు నింపి (పూరించి),
  3. పొట్టభాగంలో ఆ గాలిని కుంభకము చేసి (కుంచితముగా, స్థిరముగా నిలిపి ఉంచి),

అప్పుడిక ధ్యాసతో దేహమధ్యభాగములో జ్వాలావళి (నిశ్చల దీపజ్వాల) వలె వెలుగొందుచున్న ఓంకార సంజ్ఞార్థమగు ‘ఆత్మజ్యోతి’ని ధ్యానము చేస్తూ ఉండాలి.

ప్రాణాయామ దేవతోపాసన

ప్రాణాయామప్రక్రియ ‘3’ క్రియలు కలిగి యున్నది.

(1) పూరకము = గాలిని (12 అంగుళముల దూరమునుండి) ఎడమముక్కు రంధ్రము ద్వారా (ఇడనాడి గుండా) లోనికి నెమ్మదిగాను, దీర్ఘంగాను పీల్చటము. అట్టి ప్రక్రియ నిర్వర్తిస్తూ….సృష్టికర్తయగు బ్రహ్మదేవుని అధిదేవతగా మనస్సుతో ఉపాసిస్తూ ఉండాలి.

(2) కుంభకము = పీల్చిన గాలిని ఉదర (పొట్ట) భాగము వరకు నింపి - కదలకుండా ధారణ చేయాలి. అట్టి స్థితిలో స్థితికారకుడగు విష్ణుమూర్తిని మనో బుద్ధులతో ఉపాసనాభావన చేస్తూ ఉండాలి.

(3) రేచకము = ‘కుంభకము’ చేసిన గాలిని కొంతసేపు కదలకుండా ధారణ చేసి, ఆ తరువాత కుడి ముక్కుపుటము ద్వారా (పింగళ సూక్ష్మనాడి ద్వారా) నెమ్మదిగా వదలాలి. అట్టి విడుచుచున్న సమయమంలో మనస్సుతో లయకారుడగు రుద్రభగవానుని భావన చేస్తూ ఉండాలి.

అటు తరువాత కుడి ముక్కు పుటముతో అదే తీరైన యామము.

ఈ విధంగా బ్రహ్మ - విష్ణు - రుద్రో పాసన పూర్వకంగా ప్రాణాయామయజ్ఞ విధి - ‘‘ఓంకార-ప్రాణాయోగోపాసన (ఆత్మోపాసన)’’గా చెప్పబడుచున్నది. ‘దేవతోపాసన పూర్వక ప్రాణాయామయోగము’గా కూడా అభివర్ణించబడుతోంది.

ధ్యానరూప ప్రణవ (ఆత్మ) ఉపాసన

నిప్పును జనింపజేసే ఒకానొక ప్రక్రియలో రెండు చెక్కలు (1) క్రింద చెక్క పూర్వారణి (2) పై చెక్క - ఉత్తరారణి….ఉపయోగిస్తూ ఉంటారు. (ఇది యజ్ఞ - యాగములలో నిప్పును పుట్టించే ప్రక్రియగా ప్రసిద్ధము).

ఆ విధంగా
→ ఈ ‘జీవాత్మత్వము’ను ఒక ఉపకరణగా క్రింది ‘అరణి’గాను,
→ ‘ఓం’కార శబ్ద - అర్థ జ్ఞాన సమన్విత ఉచ్ఛారణను ‘‘పై అరణి’’గాను భావించుచూ….
→ ‘ధ్యానము’ (సర్వాత్మకుడగు పరమాత్మ గురించిన ధ్యాస) అనే నిర్మధనోభ్యాసముతో (ఒకదానితో మరొకటి వేగముగా తాకించు ప్రక్రియ సహాయముతో)
ఆత్మజ్ఞానాన్ని జనింపజేస్తూ, అద్దాని వెలుగులో దేహమంతటా అణువణువు వేంచేసియున్న హృదయాంతర్గతుడగు ఆత్మదేవుని దర్శించాలి. సర్వాత్మకుడగు ఆత్మ భగవానునితో మమేకత్వమును పొందాలి. (ఆయనయే నేను కదా - అను సహజపూర్వకమైన బుద్ధి-భావనలను ఆశ్రయించి ఉండాలి).

పూరక - కుంభక - రేచక - ప్రాణాయోగాభ్యాసము - నాద లయము

ఓంకార - అంతర్ ధ్వని నాదముతో ప్రాణాయామభ్యాసము (పూరక-కుంభక-రేచకములను) శక్తికొలది అభ్యసిస్తూ ఉండాలి. యోగాభ్యాసి వాటి ‘నాదము’ లయించువరకు ప్రాణాయోగాభ్యాసము కొనసాగిస్తూ ఉండునుగాక!

విరజా - హంసాత్మకమ్ - ఆత్మజ్యోతి

ఆత్మ….,
- ఈ జగత్తుల రాక - పోకలన్నీ తనవే అయి ఉండి కూడా, తాను మాత్రమూ గమన - ఆగమనములు (రాక-పోకలు) ఏమాత్రము లేనట్టిది
- సర్వదా ఏకమేగాని అనేకముగా ఏమాత్రము కానట్టిది
- కోటి సూర్యకాంతుల ప్రభతో వెలుగొందుచున్నట్టిది

అట్టి ఆత్మజ్యోతి - అనేక దీపములలో ఒకే అగ్ని వలె - సర్వదా సర్వజీవులలో అఖండ దీపమై వెలుగొందుచున్నది.

అట్టి హంసాత్మకమగు, సోఽహమ్ స్వరూపమగు, ఓంకారార్థమగు ఆత్మను ఎరుగుటచే అట్టివాడు సర్వదోషములనుండి శుభ్రపడినవాడై నిర్మలాత్మగా వెలుగొందుచున్నాడు.

మనో లయాత్మ యోగము

మనస్సే సర్వమును కల్పిస్తోంది, కలిగి ఉంటోంది, త్యజిస్తోంది. మనస్సే బంధ మోక్షములకు కారణము.

అట్టి మనస్సు త్రిజగత్తులను సృష్టించుకుంటోంది. కలిగినదై ఉంటోంది.

అట్టి మనస్సు లయిస్తే, సర్వము లయిస్తాయి. మనస్సు లయించగా, అప్పుడిక ఈ జీవునిపట్ల ఏది శేషించుచున్నదో అదియే ఓంకార సంజ్ఞార్థమగు కేవలాత్మ!

మనస్సు లయిస్తే అప్పటికీ శేషించునదేదో, అద్దాని ధారణయే ‘విష్ణుపదము’. మనస్సు ఆత్మను భావించుచున్నంత మాత్రంచేతనే విష్ణుపదము లభించగలదు.

వాసుదేవోపాసన (ఇష్టదైవోపాసన)

హృదయము 8 దళములు కలిగి ఉంటోంది. (యోగ శాస్త్రములోని కొన్ని పాఠ్యాంశములలో ‘12 దళములు’ అని చెప్పబడుతోంది. ఇక్కడ ‘8’ ముఖ్యమైనవిగా సూచన చేయబడుచున్నది).

పంచభూతములు మనస్సు, బుద్ధి అనబడు మరియు (32) కేసరములుతో ద్వారములతో అలంకరించబడినదై ఉంటోంది.

పంచభూతములు; పంచ ప్రాణములు; పంచ ఉపప్రాణములు; పంచకర్మేంద్రియములు; పంచజ్ఞానేంద్రియములు, అంతరంగ చతుష్టయం (మనో బుద్ధి చిత్త అహంకారములు త్రిగుణములు) (స్వాత్విక-రాజసిక- తామసిక భావావేశములు) దళములుగా చెప్పబడుచున్నాయి.

ఆ హృదయ పీఠము అనేక రత్నములతో అలంకరించబడి ఉన్నది. అట్టి హృదయపీఠముపై సర్వాంతర్యామి, సర్వత్త్వ స్వరూపుడు, నిరంజనుడు, నిర్మల స్వరూపుడు అగు వాసుదేవుడగు, మహావిష్ణుభగవానునికి వినయముగా ప్రణమిల్లాలి. (సర్వమునకు అంతర్యామి, సమస్తమునకు బాహ్య - అభ్యంతరము అగు స్వస్వరూపమే వాసుదేవుడు.

త్రిరావృత్తి ప్రాణాయామము - (ఇంకొక విధానము)

మహావిష్ణుమ్ - నాభిస్థానమ్ - పూరకేన విచింతయేత్।

నాభి స్థానములో → శ్రీవత్స చిహ్నమును ధరించినవారు; అతసీ పుష్పపు (నీలి) కాంతులు విరజిమ్ము ముక్తామణిని ధరించినవారు; శుద్ధ స్పటికమువలె ప్రకాశమానులై ఉన్నవారు; కోటిచంద్రుల కాంతులతో విరాజిల్లుచున్నవారు; చతుర్భుజుడు - అగు మహావిష్ణువును పూరకము (గుండెనిండా గాలిని నింపు సమయములో విచింతన చేయాలి. (నాభిస్థానోపాసన)

బ్రహ్మణం - హృదిస్థానమ్ - కుంభకేన చింతయేత్।

హృదయస్థానములో → ‘కుంభక ప్రాణాయామము’తో,…. పచ్చటి రత్నమువలె ప్రకాశించువారు, కమలముపై ఆశీనులై ఉన్నవారు, పితామహులు, ‘4’ ముఖములు కలవారు అగు బ్రహ్మదేవుని ఉపాసించాలి. (హృదయస్థానోపాసన).

త్రిలోచనమ్ - లలాటస్థం - రేచకేన విచింతయేత్।

లలాట స్థానములో → ‘రేచక ప్రాణాయామము’తో….. ఆత్మ విద్వత్ పరిపూర్ణుడు, ‘3’ కన్నులు గలవారు. శుద్ధ స్పటికమువలె నిర్మలముగా ప్రకాశించువారు, నిష్కళంకులు, సర్వపాపముల నుండి రక్షించువారు - అగు రుద్ర భగవానుని ఉపాసించాలి. (లలాటస్థానే)

అట్టి విష్ణు- బ్రహ్మ-త్రిలోచన…త్రిమూర్తులను పూరక-కుంభక-రేచకముల సమయములలో ధ్యానించటం ‘త్రిరావృత్తి ప్రాణాయామమ్’ - అని అంటారు.

హృదయ పద శివదర్శనం

నూరు అంచులు కలది, నూరు రేకులతో ఉన్నది-అగు హృదయ కమలము. అందు నాళము - ఊర్ధ్వముగాను, ముఖము క్రిందగానుగల అబ్జ (పద్మ) పత్ర పుష్ప ఆకారము గల హృదయము. అద్దానియందు సర్వవేదమయుడు అగు → శివభగవానుని ధ్యానించాలి.

హృదయ కమలములో జీవచైతన్య తేజో దర్శనము (ఇంకొక యోగాభ్యాసమార్గము)

ఈ యోగాభ్యాసములో….,
- 100 రేకులతోను 100 అంచులతోను ప్రకాశించు హృదయపద్మము.
- అద్దానియందు అరటిమొగ్గ (అరటిపువ్వు) ఆకారము గల అంతర్ హృదయ (మాంసఖండ) విభాగము.
- అట్టి అంతర హృదయ విభాగము అగు విశాలమైన నడిబొడ్డుగల అరటి పువ్వు ఆకారమునందు (1) చంద్రుని (2) సూర్యుని (3) అగ్నిల తేజస్సులు ఒకదానితో మరొకటి ఉన్నట్లు ధ్యానించాలి.
- అట్టి చంద్రునితో, సూర్యుతేజస్సు - సూర్యునితో అగ్ని తేజస్సు గల హృదయ కమలము ముడుచుకుని ఉంటోంది. ‘రేచక ప్రాణాయామము (వాయువును హృదయపద్మమునుండి బయల్వెడలదీయుట)’ యొక్క అభ్యాసముచే ఆ హృదయ కమలము యొక్క రెక్కలు విచ్చుకొనుచున్న అభ్యాసము నిర్వర్తించాలి.
- ఆ వికసించుచున్న హృదయ కమలములో సంచారములు చేస్తున్న ‘హ్రీం’ అను బీజాక్షరమును ఆశ్రయించుచూ ‘జీవాత్మ’ను గమనించాలి.

అట్టి జీవాత్మను…..,

త్రిస్థానం చ → జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు అనబడే ‘3’ స్థానములు తన సంచార ప్రదేశములుగా కలిగియున్నట్టిది గాను,
వ్యాహృతిం చ → భూ- భువర్ - సువర్ వ్యాహృతులు తనయందు సందర్శించుచూ, విహారముగా కలిగి ఉన్నట్టిది గాను,
త్రిమాత్రం చ → ద్రష్ట - దర్శన - దృశ్యముల, ఈశ్వర - జీవ - జీవానుభూతముల ఏకస్వరూపముగాను,
త్ర్యక్షరమ్ చ → అకార (శివ) - ఉకార (ప్రకృతి) - మకార (అనుభవి - వ్యాప్తి) చైతన్యముల త్ర్యక్షరముగాను…..,
త్రి బ్రహ్మ చ → బహిర్ - అంతర - అంతరాంతరములకు తానే సృష్టికర్తగాను,
త్రిమాత్ర - అర్ధమాత్రంచ : అకార - ఉకార - మకార - అర్ధమాత్రలను…ఈశ్వర - ప్రకృతి - ద్రష్ట - దృక్‌లను జీవాత్మ విశేషాలుగాను,

ఎవ్వరు దర్శిస్తారో….ఆతడే వేదవేత్త! అనగా…..ఎవ్వరైతే ‘సాక్షి’ స్వరూపమును ధరించి, తన హృదయ కమలమందు సంచరించు తన జీవాత్మను త్రిస్థాన - త్రిబ్రహ్మ - త్రిమాత్ర - అర్ధమాత్ర విశేషములతో కూడినట్టిదిగా, దర్శిస్తాడో…ఆతడే తెలుసుకోవలసినది తెలుసుకుంటున్నవాడు. విదితవేద్యుడు.

ఓంకార పరమాత్మ ధ్యానం

ఎవ్వరైతే తన సహజ - వాస్తవ - నిత్యసత్యమగు ఓంకార సంజ్ఞారూపక స్వస్వరూపాత్మను…..→
- దేహములచేతను, జాగ్రత్ - స్వప్న - సుషుప్త దశల చేతను ఏమాత్రమూ ఖండితము కానిదై, ‘తైలధార’ వలె అవిచ్ఛిన్నమైనట్టిదిగాను,
- గంట యొక్క సుదీర్ఘ నినాదమువలె నిత్య చేతనము, సర్వకారణము, సర్వత్రా వ్యాపకముగాను,
- వాక్కుచే నిర్వచించి చెప్పరానిదిగాను, అనిర్వచనీయముగాను,
- ప్రాణశక్తికి ఆవల ప్రాణేశ్వర స్వరూపంగాను,
- బిందు - నాద - కళాత్మకమై కూడా, ఆ మూడింటికి అతీతమైనదిగాను-
తెలుసుకొని ఉంటాడో….ఆతడు వేదవేత్త! తెలుసుకొనుచున్నదానిని తెలుసుకొన్నట్టివాడు! తెలుసుకోవలసినది తెలుసుకుంటున్నవాడు.

యోగి యొక్క యోగ పద స్థితత్వము

ఎవ్వరైతే - ఒక కలువ పువ్వు యొక్క కాడతో జలమును పీల్చు విధానంగా - దేహమంతా స్వభావతః నిండియున్న వాయువును ‘రేచక ప్రాణాయామవిధి (The Process of Vacating the Air from whole physical Body) గా వెనుకకు మరల్చి, కేవల ప్రాణశక్తిని తనవైపుగా ఆకర్షిస్తూ ఉండు అభ్యాసమునందు కృతకృత్యుడు అవుతాడో,….అట్టి యోగి ‘యోగపదస్థితుడు’ (యోగస్థానమునందు స్థితిని సంపాదించుకొన్నవాడు) - అగుచున్నాడు.

భ్రూమధ్య - అర్ధమాత్రాత్మక - మనోలయ యోగము
- రెండు కనుబొమ్మల మధ్యగల దహరాకాశ ప్రదేశములో - భ్రూమధ్యస్థానమున అధోభాగంగా ‘అ’ - రెండు దళములుగల కమలమును యోగాభ్యాసకులు దర్శించుచున్నారు.
- అట్టి కమలమును అర్ధమాత్రము (ఉమ్…) యొక్క అంత్యస్థానంగా భావించి, పరిపరి విధములుగా సంచారములు చేస్తున్న మనస్సును ఆహ్వానించి, హృదయ కమలములో నిత్యోదితమైన ఉంటున్న ‘ఆత్మచైతన్య స్ఫురణ’ లోనికి,
- నయముగా (అనగా→ భయముగాకాదు, బలవంతముగా కాదు, స్వభావ-అభ్యాసపూర్వకంగా)….అఖండ చైనన్యభావనయందు మనస్సును లయింపజేయు విధానమును ‘మనోలయయోగము’గా (కొందరు యోగాభ్యాసులు) అభ్యసిస్తున్నారు.

లలాటాంతర్గత బ్రహ్మాకాశోపాసన

ముక్కుకు ఉపరిభాగంలో (నాశికకు ఊర్ధ్వమూలముగా) (భ్రూమధ్యంగా గల స్థానము) లలాట స్థానము. అట్టి (బొట్టు పెట్టుకొనే) కనుబొమ్మల మధ్యగా కించిత్ క్రిందస్థానము బ్రహ్మానందమునకు ఉపాసన - సిద్ధిస్థానము. అది ‘అమృతస్థానము’ అని కూడా అంటారు.

అట్టి అమృతస్థానములో మనస్సును (ఆలోచనను) ఏకాగ్రపూర్వకంగా (అనేకత్వమును త్యజింపజేస్తూ) ప్రవేశింపజేయుచుండగా…..అక్కడ అమృత రూపమగు, సర్వాత్మక స్వభావముతో కూడిన ‘పరబ్రహ్మము’ - స్వానుభవముగా త్వరితగతిని సిద్ధించగలదు. యోగాభ్యాసముచే ఇది సుసాధ్యము. (అమృతస్వస్వరూపము = జాగ్రత్-స్వప్న-సుషుప్తుల సందర్భములలో ఏకము-అక్షరము అయి ఉన్న స్వకీయ ఆత్మ).

యోగాంశములు

(1) ఆసనము (2) ప్రాణసంరోధము (3) ప్రత్యాహారము (4) ధారణ (5) ధ్యానము (6) సమాధి
…..ఈ ‘6’ కూడా ‘యోగము’నకు షష్ఠ (6) అంగములు

ఆసనము : యోగశాస్త్రము అనేక ఆసనముల గురించి ప్రస్తావించుచున్నది. దేహముయొక్క ఎట్టి అంగముల అమరికచే (అంగముల ధారణచే) మనస్సు చంచలత్వమును వీడి, బుద్ధి ఏకాగ్రం అవుతుందో, అదియే ‘సుఖాసనము’. ఒక్కొక్క దేహికి తన దేహముచే ఒక్కొక్క ఆసనము ఏకాగ్రతను ప్రసాదించగలదు. యోగాభ్యాసము సుఖముగాను, నిశ్చలముగాను కొనసాగగలదు. ఆ విధంగా ‘‘జీవజాతులపట్ల ఎన్నెన్ని సుఖాసనములు ఉన్నాయి?’’ - అనేది వర్ణించుటకు అలవి అయ్యేదికాదు. అది సర్వేశ్వరుడగు మహేశ్వరునికే ఎరుక. అట్టి ఆసనములలో ముఖ్యమైనవి నాలుగు. (1) సిద్ధాసనము (2) భద్రాసనము (3) సింహాసనము (4) పద్మాసనము. అట్టి ఒకానొక సుఖాసనమును స్వీకరించి, ఆపై బుద్ధితో మనస్సును తెచ్చి చక్రములందు ప్రతిక్షేపించటమును - యోగాభ్యాసంగా ప్రసిద్ధి. ఇది గురుముఖతః తెలుసుకొని, గమనించి, అభ్యసించాలి.

చక్రముల గురించి….!

మూలాధార చక్రము : గుద స్థానమునకు కించిత్ పైగాను, లింగస్థానమునకు కొంచము క్రిందుగాను ‘మూలాధారాకాశ (శక్తి) చక్రము’ ఉన్నది. ఈ చక్రములో…..4 దళముల కమలము. (ఈ చక్రము ‘వ-శ-ష-స’ బీజాక్షరముల భావనచే ఉత్తేజితము అగుచున్నది - అని అన్య ఉపనిషత్ పాఠము).

స్వాధిష్ఠాన చక్రము : యోనిస్థానము, లింగస్థానము. మూలాధారమునకు పైభాగముగా ఉన్నట్టిది. దీనిని ’కామాఖ్యము’ అని కూడా అంటారు. సిద్ధులచే నమస్కరించబడుచున్నట్టిది. యోనికి మధ్యగా పశ్చిమాభిముఖంగా లింగస్థానమున ఉండి ఉంటోంది. అట్టి లింగమునకు పశ్చిమంగా అగ్రమున మణివలె భిన్నమైయున్నది. అట్టి ‘స్వాధిష్ఠానాకాశము’ను యోగి - ఏకాగ్రతతో కూడిన యోగాభ్యాసముచే స్వానుభవముగా - పొందుచున్నాడు.

స్వాధిష్ఠాన చక్రము….
- కాల్చబడిన (తప్త) బంగారము (చామీకరపు) ఛాయ కలిగినట్టిది.
- విద్యుల్లతవలె ప్రకాశములు వెదజల్లునది.
- నాలుగు కోణములు కలిగినట్టిది
- జఠరాగ్ని స్థానమునకు కించిత్ పైభాగముగాను, మేఢ్రము (పొత్తి కడుపు)నకు కొంచము క్రిందగా ఉన్నట్టిది. అందుచేత ‘మేఢ్రము’ అని కూడా పిలుస్తున్నారు. ఇది పొత్తికడుపు వరకు విస్తరించి ఉన్నది.
- ఇక్కడ ప్రాణవాయువునకు ఆధారమై యుండటంచేత ‘స్వమ్’…అను శబ్దము వినపడుతూ ఉంటుంది.

అట్టి స్వాధిష్ఠానచక్రాకాశస్థానమును అనుభూతముగా ఎరిగినవాడు వేదవేద్యుడే!

మణిపూరక చక్ర - అగ్నిస్థానము :

ఇది దారముతో కూర్చబడిన ‘మణి’వలె వాయువుచే పూరకమై ఉండటంచే ‘మణిపూరక చక్రము’ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇందలి ఆకాశములో ‘12’ ఆకులు గల చక్రములో ఈ జీవుడు పుణ్య-పాపములచే నియంత్రితుడై తిరుగాడుచూ ఉన్నాడు. చక్రములో చిక్కిన మణివలె సంచారములు పొందుచూ ఉండటంచేత కూడా - ‘మణిపూరకము’ అనే పేరు వచ్చింది. ఈ చక్రములో జీవుడు 12 ఆకులలో - బ్రహ్మతత్త్వము తెలియనంత వరకు తిరుగాడుచూనే ఉంటాడు.

ప్రాణశక్తి ప్రవాహక నాడులు

బొడ్డుకు క్రిందగాను, మేఢ్రమునకు (పొత్తి కడుపుకు) పైభాగంగాను పక్షియొక్క గ్రుడ్డువలె ఒక మాంసమయ ఖండము ఉన్నది.

ఆ గడ్డ నుండి 72,000 నాడులు బయల్వెడలి శరీరమంతా విస్తరించినదై ఉంటున్నాయి.

అందులో 72 నాడులు ముఖ్యమైనవి.

శరీరమంతా ‘ప్రాణశక్తివాహకము’లు (Main vehicles that carry prana Energy)గా (నాడులన్నీ) ఉన్నాయి. అనగా, అవి తమయందు ‘ప్రాణశక్తి’ని ప్రవహింపజేస్తున్నాయి.

ముఖ్యమగు 72 నాడులలోనూ మరికొంత ముఖ్యమైనవిగా చెప్పబడేవి - ‘10’. అవి…. (1) ఇడ (2) పింగళ (3) సుషుమ్న (4) గాంధారి (5) హస్తజిహ్వ (6) పూషా (7) యశస్విని (8) అలంబుసా (9) కుహూ (10) శంఖినీ.

సుషుమ్ననాడికి ఎడమవైపు ఇడనాడి, కుడివైపు పింగళనాడి ఉన్నాయి. కుహు, సరస్వతి నాడులు సుషుమ్నకు ప్రక్కగా ఉన్నాయి. గాంధారి, హస్తజిహ్వ ‘ఇడ’కు ముందు వెనుకలుగా ఉన్నాయి. పూషా, శంఖిని, పింగళనాడికి వెనుకగా ఉన్నాయి.

పూషకు, సరస్వతీనాడికి మధ్యగా యశశ్వినీనాడి ఉన్నది. గాంధారికి - సరస్వతికి మధ్యగా శంఖినీ నాడి ఉన్నది.

కంఠమధ్యభాగమునుండి పాయువు వరకు అలంబుసనాడి ఉన్నది. యోగి బుద్ధిని స్వీయ దేహమును ప్రవేశింపజేసి, అట్టి బుద్ధితో ఈ 10 నాడుల ఆయా ధర్మముల నిర్వహణను ఎరుగుచూ గమనిస్తూ ఉంటున్నాడు.

అట్టి ‘10’ నాడులలో కూడా, ‘మూడు’ నాడులు అత్యంత ముఖ్యమైనవై, ఎల్లవేళలా దేహము జీవిస్తున్నంతకాలము - ప్రాణశక్తిని ఏమాత్రము ఒక్క క్షణం కూడా వీడకుండా ధారణ చేస్తూ ఉన్నాయి.
ఈ మూడే ‘‘ప్రాణమార్గములు’’.

(1) ఇడా వామే స్థితా భాగే! వెన్నెముకకు ఎడమవైపుగా బొడ్డు క్రిందనుండి కంఠ ప్రదేశము వరకు విస్తరించి ఉన్న ముఖ్య ప్రాణవాహకనాడి. అధి దేవత - చంద్రుడు. ఓషధతత్త్వముతో దేహమును కాపాడుచుండు నాడి. సుషుమ్నకు, ఎడమవైపుగా ఉన్నది.

(2) పింగళ - పింగళా దక్షిణే స్థితా! ఈ ప్రాణ ప్రవాహ ముఖ్యనాడి దేహమునకు (వెన్నెముకకు) కుడి భాగముగా, బొడ్డు నుండి కంఠము వరకు విస్తరించి ఉన్నది. సుషుమ్నకు కుడివైపుగా ఉన్నది.

(3) సుషుమ్న : దేహమునకు మధ్యగా (వెన్నెముకకు మధ్యగా) మూలాధారము నుండి ఆజ్ఞాచక్రము వరకు, ఆపై ఉపరిభాగముగా గల బ్రహ్మ రంధ్రము వరకు విస్తరించి ఉన్నది. (వీపునకు మధ్యనున్న వెన్నెముక - (వీణాదండము) ద్వారా శిరస్సు పర్యంతము సుషుమ్ననాడి ప్రతిష్ఠితమైయున్నది)

ఈ విధమైన నాడులలో పంచ ప్రాణములు, పంచౌపప్రాణములు → దూర దూరంగా సంచారములు చేస్తూ, ఈ శరీరములో ఆయా నియమిత ధర్మములు నిర్వర్తిస్తున్నాయి. శరీర రక్షణ - ప్రవర్తనములను పర్యవేక్షిస్తున్నాయి.

⌘ ⌘ ⌘

పంచ ప్రాణములు : వాయుస్పందన - ప్రాణ అపాన సమాన ఉదాన వ్యానములు- అను ధర్మములు కలిగి ఉంటోంది. దేహములో అవన్నీ వివిధ సంచలనములు కలిగియుండి, ఆయా దేహరక్షణ - పరిపోషణ - జీవన ధర్మములను నిర్వర్తిస్తున్నట్టివి.

(1) ప్రాణము → ముఖమునకు ముక్కునకు మధ్యగాను, నాభిమధ్య, హృదయమునందు నిత్యము సంచరిస్తూ ఉన్నట్టిది. ఉత్తేజిత - ప్రేరణ - ఉత్సాహరూప సమన్వితము అగు ప్రాణవాయువు. ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రాణకర్మలు నిర్వర్తిస్తున్నట్టిది.

(2) అపాన ప్రాణము → గుదము, పొత్తికడుపు (మేఢ్రము), తొడలు, మోకాళ్లు (జానువుల) మధ్యగా సంచరించు వాయువు. మల-మూత్ర ఇత్యాది విసర్జనలు అపానవాయు కార్యక్రమములు.

(3) సమాన ప్రాణము → దేహమునందు అంతటా ఆపాదమస్తకమూ సంచరిస్తూ ఉన్న వాయువు. సర్వమునకు పరస్పరము సమన్వయమును పర్యవేక్షిస్తూ ఉంటోంది.

(4) ఉదానము → దేహములోని కణతలు, చేతి మణికట్టు, కంఠము మొదలైన ప్రాణస్థానములందు, చేతులయందు, కాళ్లయందు ప్రసరించుచున్న వాయువు. ఊర్థ్వ గమనధర్మము నిర్వర్తించు వాయువు.

(5) వ్యానము → రెండు కళ్లలోను, బొడ్డు (నాభి) యందు, పిక్కలయందు, చెవులయందు, రెండు కళ్ళు మధ్య ప్రదేశమునందు, భుజస్కందములయందు, కాళ్ల చీలిమండలములయందు సంచరించుచున్న వాయువు. ఆయా అంగములను విడివిడిగా ఉంచు ధర్మము నిర్వర్తిస్తూ ఉండటంచేత ‘వివాదకృత్‌ప్రాణము’ అని కూడా అంటారు.

పంచ ఉపప్రాణములు: నాగము; కూర్మము; కృకరము; దేవదత్తము; ధనంజయము, ‘పంచౌపవాయువులు’ అని కూడా అంటారు.

నాగ వాయువు → కక్కుకొనుటము, వ్యర్థ పదార్థములను త్యజించటము కొరకు సహకరిస్తున్న ఉపవాయువు.

కూర్మము → కనులు మూయటయందు, తెరచుటయందు సహకరిస్తున్న ఉపవాయువు.

కృకరము → వాయుచలనము, తుమ్ములను పర్యవేక్షించు ఉపప్రాణము.

దేవదత్తము → నిదుర, కునికిపాట్లు మొదలైన తంద్రీకర్మలు పర్యవేక్షిస్తున్న ఉపప్రాణము.

ధనంజయము → దేహముయొక్క శోభ, ఉత్సాహము, ఆకాశములను పర్యవేక్షిస్తున్న ఉపప్రాణము.

ఈ పంచప్రాణములు, పంచౌపప్రాణములు కూడా 72,000 నాడులలో జీవరూపములుగా నిత్యము సంచరిస్తూ ఉన్నాయి.

ఈ జీవుడో? ప్రాణ - అపానములకు మనస్సుచే వశుడై దేహములో పైకి, క్రిందికి నిరంతరము సంచారములు సలుపుచున్నాడు. ఈ విధంగా నిత్యసంచారి అయి, ఈ జీవాత్మ దేశ ద్రిమ్మరివలె పరమాత్మ కల్పిత ఇంద్రియ దృశ్యలోకములలో పర్యటిస్తున్నాడు.

ప్రాణ -అపానముల వెంట, ఇడ-పింగళనాడుల వెంటా ఎల్లప్పుడు చంచలుడై తిరుగుచూ ఉండటంచేత ఈ జీవుడు ఈ దేహములో ఏ ఒక్కచోట కూడా నిలకడ కలిగి ఉండుటములేదు.

‘ఇదిగో! ఇక్కడ!’….అన్నట్లుగా జీవునికి ఒకచోట ఎక్కడా కుదురు లభించటంలేదు. గాలిలోకి విసరబడి, భుజములచే కొట్టబడుచున్న బంతివలె ప్రాణ-అపానముల వెంట బలవంతముగా పరుగులు తీయుచు పైకి - క్రిందికి అవిశ్రాంతంగా దేహములో తిరుగాడుచున్నాడు.

ప్రాణము అపానముచేత-అపానము ప్రాణముచేత ఆక్రమించబడి, మ్రింగ బడుచూ ఉండగా…ఈ చంచల జీవుడు ప్రాణ-అపానముల మధ్యగల నిశ్చలస్థానమును అనుక్షణికంగా కోల్పోవుచూనే ఉన్నాడు.

గాలిలో హాయిగా ఎగిరే పక్షిని పట్టి తెచ్చి, ఒక గుంజకు సన్నని త్రాడుతో కట్టి వదలితే, ఆ పక్షి త్రాడుయొక్క చుట్టు కొలతలను అధిగమించలేక అక్కడక్కడే ఎగురుతూ గంతులు వేస్తూ ఉంటుందికదా! ఈ జీవాత్మ కూడా దేహభావ పరిధులలో ఆవిధంగా చిక్కుకొని దుఃఖితుడై బంధములను పొంది గంతులు వేస్తూ ఉన్నాడు. జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల మధ్య, దేహదేహాంతరములుగా అవిశ్రాంతంగా కాందిశీకునివలె ప్రయాణములు సాగిస్తున్నాడు.

అట్టి ఈ జీవునియొక్క సహజ రూపము ఎట్టిది? సందర్భ రూపము ఎటువంటిది? ఆత్మగా ఈ జీవుని వాస్తవ స్వరూప-స్వభావములు ఏమై ఉన్నాయి. ఈ విషయాలు ఆత్మతత్త్వజ్ఞానము దృష్ట్యా ఎరిగినప్పుడు అట్టివాడు యోగవేత్త అగుచున్నాడు. అది ఎరుగనంతవరకు, అనుక్షణికంగా స్వానుభవం కానంత వరకు యోగవేత్త కాలేడు. యోగాభ్యాసి మాత్రమే! నిత్యము చంచలుడై, దేనినీ నమ్మక - పొందక - ఆగక తిరుగాడుచూనే ఉంటాడు. అట్టి చంచలత్వమే జీవుని సర్వ దుఃఖమునకు కారణమగుచున్నది. అంతేగాని, దృశ్య వ్యవహారములు దుఃఖమునకు కారణము కాదు.

జీవుని ఉరుకు - పరుగులు

ఈ జీవుడు ప్రాణములవెంటబడుచున్నవాడై ‘హం’ అను ఉచ్ఛారణచే బయటకు వెళ్లుచున్నాడు. ‘సం’…అని పలుకుచూ లోనికి వచ్చుచున్నాడు.

ఈ విధంగా
‘‘ ‘హం’ - సం! హం - సం’’ అనురూపముగల శ్వాస ప్రశాసలచే అసంకల్పితంగా ప్రవర్తిస్తున్నాడు.

పగలు - రాత్రీ, మెళుకువ - నిద్రా సమయములలో కూడా - రోజుకు ‘21,600’ సార్లు ‘సోఽహమ్’ జపము అసంకల్పితముగా నిర్వర్తిస్తూ ఉన్నాడు.

కానీ ఏమి లాభం? మనస్సును ప్రాణ-అపానముల మధ్యగల నిశ్చలస్థానములో జేర్చలేకపోవటంచేత అనేక వ్యసనములు,దిగుళ్లు, దుఃఖములు పొందుచూనే ఉంటున్నాడు.తన దుఃఖములకు స్థితి - గతులకు కారణం మాత్రం దృశ్యములో వెతుకుచున్నాడు. ఎంత వెతికినా దృశ్యములో ఆతనికి శాంతి లభించటమే లేదు.

శ్వాసపై ధ్యాస - అజపా గాయత్రీ।

మనస్సును నియమించి ‘హం - సో - హం’ అనురూపముగా జరుగుచున్న ఉచ్ఛ్వాస - నిశ్వాసలను గమనిస్తూ, దృశ్య సందర్భముల వెంట ఈ మనస్సు పరుగులు తీయకుండా నియంత్రిస్తూ క్రమంగా ప్రాణ - అపానముల మధ్య నిశ్చలచిదాకారమును అనుభూతిగా సంతరింపజేసుకోవటమే ‘అజపాగాయత్రి’. అట్టి అజపాగాయత్రి శ్వాససంఖ్యలను నియంత్రించునదై, క్రమంగా ‘నేను దేహ దృశ్య జీవాత్మలకు నిబద్ధుడను కాను’ అనురూపమగు మోక్షమును ప్రసాదించుచున్నది.

‘‘నా అంశ అగు జీవాత్మ హం-సోఽహం అజపాగాయత్రీ ప్రణవమును స్వభావసిద్ధంగానే నిర్వర్తిస్తున్నది. నేను జీవాత్మ పరిమితుడనా? కాదు. ప్రాణ-అపానముల వెంట పరుగులు తీస్తున్న జీవాత్మకు - ప్రాణశక్తికి - ప్రాణ ప్రసరణములకు నియామకుడును! పర్యవేక్షకుడను! సాక్షిని కూడా! ప్రాణ - అపానముల జనన-లయస్థానమును ఆక్రమించుకొని ఉన్నవాడను. నిర్హేతు - నిత్యనిర్మలాత్మాకార స్వరూపడనై ప్రకాశించువాడను!’’ →
అను స్థానమును కించిత్ సంకల్పిస్తూ ఉన్నంత మాత్రంచేతనే ఈ జీవుడు సర్వపాపదృష్టుల నుండి విముక్తుడు కాగలడు. నిత్యనిర్మలుడై ప్రకాశించగలడు. అటువంటి ‘ప్రాణ-అపానములను ఏకస్థానమునకు తెస్తూ, గమనించు అతీతస్థానము’ అగు యోగస్థితికి సరితూగగలిగే విద్యగాని, జపముగాని, పుణ్యముగాని భూత-భవిష్యత్తులలో మరొకటేదీ లేదు. అట్టి అజపాగాయత్రీ ధ్యాసపూర్వక ధ్యానము - ఈ జీవుని ‘నిరామయమగు బ్రహ్మీస్థితి’కి చేర్చగలదు.

కుండలినీ యోగము - మోక్ష ద్వార భేదనము

మట్టి బొమ్మలలో మట్టివలె ఈ విశ్వమంతా ఆక్రమించియున్న ‘కుండలినీ’ అని పిలువబడుచున్న పరమేశ్వరీశక్తి ఈ భౌతికదేహములో ఇచ్ఛ - శక్తిరూపముగా ప్రతిష్ఠితమై దాగియున్నది. అట్టి కుండలినీ దేవి - తన ముఖముపై దృశ్య పరిమితరూపమైన ఆచ్ఛాదనము ధరించి, ఈ దేహములో కునుకులు తీయుచున్నది. (Drowsy / Numb). [ధ్యాసను - దృశ్యము వైపుగా ఇచ్ఛాపూర్వకంగా ఉండి, ఆత్మ యొక్క స్వానుభవమును ఏమరచటమే - కుండలినియొక్క కునుకులు].

(1) ఆలోచనలకు ఆవల ఏకాగ్రతరూపమగు మనస్సు (2) పంచ ప్రాణ - ఉపప్రాణ ధర్మములను నిర్వర్తించు ప్రాణశక్తి (3) జ్ఞానాగ్ని (అగ్ని) ఈ మూడిటిని ఉపకరణములుగా తీసుకొని….దేహములో నిదురిస్తున్న దేహాంతర్గత కుండలినీరూప విశ్వశక్తీ దేవత ముఖముపైగల ఆచ్ఛాదనలను తొలగించాలి. ‘‘విశ్వరూపుడు - విశ్వాతీతుడు - విశ్వసాక్షి’’ అగు స్వస్వరూపముయొక్క స్వానుభవము కొరకై విశ్వశక్తీ స్వరూపిణియగు ‘‘కుండలినీ దేవి - బ్రహ్మరంధ్రచ్ఛేదన’’ - అనునది మహత్తరమగు ఉపాయము.

దారముతో గ్రుచ్చబడిన సూదిని (వస్త్రము కుట్టునప్పుడు) పైకి లాగు తీరుగా కుండలినీశక్తిని నిదురలేపుతూ సముత్సాహముతో నింపివేయాలి. యోగి-ఆ నిదురలేచిన కుండలినీ శక్తిని కుంచికతో హఠముగా తలుపులు (Doors) తెరుచుకునేట్లుగా చేయు విధంగా (ప్రాణ - అపాన ఏకీకృత యోగాభ్యాసముచేత, ఇడ -పింగళ హస్తములతో సుషుమ్న ద్వారా) బ్రహ్మరంధ్రమునకు చేర్చాలి.
మోక్షద్వారమును, (శిరస్సుయొక్క ఉపరితలముపైగల బ్రహ్మరంధ్రమును) బలవంతముగా తెరచివేసుకోవాలి.

అట్టి కుండలినీ శక్తియొక్క బ్రహ్మరంధ్ర విభేదనముచే ఆ యోగి ‘జగత్తులలో నేను’ ను అధిగమించి, ‘నాలోని (ఆత్మలోని) కల్పిత జగత్ చమత్కారము’ అను సహస్రారస్థానము చేరుచున్నాడు.

కుండలినీ దేవీ సుప్రభాతము గురించిన యోగ సాధనా విధానములు

కుండలినీ శక్తితో బ్రహ్మరంధ్ర స్పర్శ
⌘ రెండు చేతులను సంపుటీకరించి, ముకుళించి,
⌘ పద్మాసనమును సుదృఢముగా అవధరించి, సుఖాశీనుడై, చుబుకమును (గడ్డము చివరి కొనను) వక్షస్థలముపై (గుండె మధ్యభాగముపై) తాకించుచు,
⌘ బుద్ధితో ‘ధ్యానము’ను అవధరిస్తూ, ‘‘సర్వాత్మకుడు, నిత్యుడు, అప్రమేయుడు’’ అగు పరమాత్మను ధ్యానిస్తూ,
⌘ క్రిందగా ప్రసరించు స్వభావముగల ‘అపానవాయువు’ను మరల మరల బుద్ధిపూర్వకంగా పైకిలాగుచూ,
⌘ పూరక ప్రాణాయామము (గాలిని లోనికి నిండుగా పీల్చు ప్రక్రియ)ను నిర్వర్తిస్తూ….
⌘ క్రమంగా కనుబొమ్మల మధ్యగల ఆజ్ఞాచక్రాకాశము ద్వారా శిరస్సుకు ఉపరితల స్థల ఆకాశమగు బ్రహ్మరంధ్రము లోనికి ప్రాణశక్తిని విస్తరింపజేయాలి. (ప్రాణశక్తితో కుండలినిని ఉత్సాహపరచి బ్రహ్మరంధ్రపు ‘మూత’ను తొలిగించాలి)

అట్టి ‘‘కుండలినీ బ్రహ్మరంధ్ర ప్రవేశోపాసన’’ను అభ్యసించు యోగి ‘నేను - నీవు - జగత్తులతో కూడిన ఇదంతా సర్వదా బ్రహ్మమేకదా’ అను బ్రహ్మజ్ఞానానుభూతిని స్వభావసిద్ధంగా పొందుచున్నాడు. బ్రహ్మమే తానై సర్వత్రా వెలయుచున్నాడు.

నాడీ ద్వారములు-పూరక కుంభక యోగాభ్యాసము
(నోరు, ముక్కుపుటము,కళ్ళు, చెవులు, గుదము శిశ్నము, బ్రహ్మరంధ్రము)

‘పద్మాసనము’ను ధరించి, నాడీద్వారములను బుద్ధితో (ధ్యాసతో) సమీపించాలి. నాడీ ద్వారములను ముక్కుద్వారా పీల్చిన వాయువుతో పూరించి ఉంచి, అట్టి నాడీ ద్వారములవద్ద కుంభకమును (గాలిని నిశ్చలము చేయు విధిని) అభ్యసించు యోగి నిత్యముక్తుడు. అతనిపట్ల ఈ దేహ - మనో బుద్ధి చిత్తాదులు, జన్మకర్మలు….ఏమాత్రమూ కూడా బంధము కలిగించజాలవు.

నాటకంలో నటిస్తున్నప్పుడు ఒక నటునికి సంబంధించిన ‘పాత్ర’ యొక్క కష్ట-సుఖములు, బంధ-సంబంధములు ఆతనికి చెందినవి కావు కదా! అట్లాగే ‘నాడీ ద్వారపూరక-కుంభక-రేచకాభ్యాసియగు యోగి’కి నిత్యముక్తత్వము స్వభావసిద్ధమగుచున్నది.

(నవనాడులు = రెండు కళ్ళు; రెండు చెవులు; రెండు ముక్కుపుటములు; బొడ్డు, శిశ్నము, గుదము). [మొట్టమొదట ఒక్కొక్క నాడీ ద్వారములో పూరక- కుంభక-రేచకములను అభ్యసిస్తూ, క్రమంగా 1 సంవత్సరం కాల అభ్యాసము తరువాత నవరంధ్రములలో ఒకేసారి త్రి-యాసనములను నిర్వర్తించగలడు].

ఈ విధంగా(1) అపానవాయువును ఊర్థ్వమునకు లాగుచూ ప్రాణశక్తిని బ్రహ్మరంధ్రాకాశములో ప్రవేశింపజేయుటము. (2) నాడులలో పూరక - కుంభక అభ్యాసము అను ప్రక్రియల ద్వారా మూలాధారములో నిద్రాణమైయున్న కుండలినీ శక్తిని ఉత్తేజపరచి ఊర్థ్వప్రయాణము నిర్వర్తించుయోగాభ్యాసి → ‘బ్రహ్మానందస్వభావుడు’గా స్వయముగా రూపుదిద్దుకొనుచున్నాడు.

నవ రంధ్రములలో పూరక-కుంభకములచే అంగాంగములలోని అంతర్విభాగములను స్పృశిస్తూ ఉండగా, అట్టి ప్రాణవాయు స్పర్శచే అంగములలో శ్రమంతా కొద్ది క్షణములలో శమించిపోగలదు.

యోగ అభ్యాసము చేస్తున్నప్పుడు శ్రేయో ఆహారము

కట్వ - ఆమ్ల - లవణము (కారము - పులుపు - ఉప్పు) పదార్థములను తగ్గించుచు, పాలు అధికంగా తీసుకొను చుండుటచే…యోగాభ్యాసము సుఖమయము కాగలదు. బ్రహ్మభావనను ఉపాసించు బ్రహ్మచారి అయి, మితాహారము స్వీకరిస్తూ యోగపరాయణుడగు యోగి యోగాభ్యాసము నిర్వర్తిస్తూ ఉండగా, ఒక సంవత్సరకాలములో కుండలినీ శక్తితో (కుండలినీ యోగంతో) బ్రహ్మరంధ్రాకాశమును స్పృశిస్తూ సహస్రారములో ప్రవేశించి బ్రహ్మీస్థితిని సిద్ధించుకోగలడు. ఇందులో అనుమానమే లేదు.

[సహస్రార స్థానసిద్ధి = (1) నాలోని బ్రహ్మాండములతో కూడిన ‘‘నేను’’ (2) బ్రహ్మాండములలోని ‘‘నేను’’ల యొక్క → అభేదత్వము]

మూలబంధయోగము

Ⅰ. మూలాధారములో నిద్రాముద్ర వహించియున్న కుండలినీ విశ్వశక్తిని చైతన్య - ఆనంద స్ఫూర్తితో కంఠముపైభాగము వరకు నడిపించి, అక్కడ (ఇహ-పర) దివ్యశక్తి స్వరూపిణియగు జగన్‌మాతగా ఉపాసించటము. అట్టివాడు యోగసిద్ధికి (బ్రహ్మ తత్త్వానుభవమునకు) సంసిద్ధుడు అయినట్లే, ఇది ఒక మూలబంధ యోగము.

Ⅱ. దేహములో సంచరించు ప్రాణ-అపానములను ఐక్యము చేయుటము, ప్రాణతత్త్వమును దేహమంతా సమస్థితిగా అవధరించి ఉండటము….ఇది కూడా ‘మూలబంధయోగము’ అనియే పిలువబడుచున్నది.

అట్టి యోగాభ్యాసికి మలమూత్రముల విసర్జనము స్వాంతనము పొందినవై, దేహము సుఖమయమై ఉండగలదు. అట్టి ‘మూలబంధనయోగము’ అభ్యసించు యోగికి [మూలాధారములో చలనముగల అపానవాయువును వెనుకకు మరల్చి - ముక్కు నుండి లోకి ప్రవేశించుచున్న వాయువులతో (ప్రాణశక్తితో) ఏకము చేసి ధారణచేయు అభ్యాసము ఆశ్రయించువానికి]….దేహము దృఢముగా ఉండగలదు.

వార్ధక్యములో కూడా ఈ దేహము ఆయా క్రియ వ్యవహారములందు, ఆధ్యాత్మిక సాధనలయందు ఆరోగ్య పూర్వకముగా సులభ - సుఖప్రద ఉపకరణముగా ఉండగలదు. ఆ యోగి యువకునివలె ఉత్సాహసము, ధైర్యము, సాహసము, ఉత్తమ బుద్ధి కలిగి ఉండగలదు.

Ⅲ. యోగసాధనములలో మరొక మూలబంధ సాధన

సుఖాశీనుడై ‘కాలిమడమ’తో గుదస్థానమును (మూలాధార ఆకాశస్థానమును) నొక్కిపట్టిపీడించుచూ, అక్కడ స్వభావసిద్ధంగా వచ్చిచేరుచున్న ‘అపానవాయువు’ యొక్క క్రిందవైపు ప్రసరణను నిరోధించి, అద్దానిని ఊర్ధ్వమునకు కదలించుచు, ప్రాణము (ముక్కు నుండి లోనికి ప్రయాణిస్తున్న వాయువు)తో పరస్పరము ఏకము చేసి ఒక్కచోటకి (కంఠము, హృదయము, ఉదరమునకు గాని) తెచ్చి ఉంచటము ‘మూలబంధనము’లోని క్రియావిభాగము.

ఉడ్డియాన బంధన యోగాభ్యాసము

మహాఖగ (హంస) రూపుడగు (సోఽహం-సో ఉచ్ఛ్వాస - నిశ్వాస అనువర్తుడగు) ఈ జీవుడు…,

1) నాశికయొక్క మూలస్థానమునకు కొంచము క్రిందగా (అధోభాగ ఆకాశముగా) ఉండు ఆజ్ఞాచక్రస్థానమునకు చిత్త - ప్రాణములను చేర్చి, ఎడతెరిపిలేకుండా (రోజంతా మెళుకువ ఉన్నంతవరకు) నిలిపి ఉంచు యోగాభ్యాసము - ఉడ్డియాన బంధము అంటారు.

2) అట్లాగే….నాభికి పైభాగముగా, పొట్ట (ఉదరము)నకు ఎడమవైపుగా (పశ్చిమంగా) ఉన్న ఆకాశ ప్రదేశమునందు బుద్ధిని ఏకాగ్రం చేసి, అక్కడి ఆకాశస్థానమును బుద్ధికి అనుభూతపరచి రోజూ కొంతసేపు ఉంచటము కూడా ఉడ్డియానబంధయోగాభ్యాసమే. ఇట్టి ఉడ్డియాన యోగాభ్యాసము - ‘మృత్యువు’ అనే ఏనుగుకు సింహస్వప్నము వంటిది.

జాలంధర బంధము

బుద్ధిని ప్రాణ - అపాన సంయోగ స్థానము నందు నిలుపుచుండగా…ఒకానొక ప్రశాంతత శిరస్సునందు రూపుదిద్దుకుంటూ ఉంటుంది. అప్పుడు శిరస్సుయొక్క ఊర్థ్వస్థాన ఆకాశంలో ఒకానొక చల్లటి రసజలము జనిస్తుంది. దీనినే యోగవాజ్మయంలో ‘ఆకాశగంగ’ అని అంటారు. శిరస్సులో జనించిన అట్టి ఆకాశగంగను (శిరస్సుపై అనుభవమైన చల్లటి జలతత్త్వమును) క్రిందుగా తెచ్చి కంఠ ప్రదేశములో నిలిపి ఉంచటమును ‘జాలంధరయోగము’ అని పిలుస్తున్నారు.

శిరో ఉపరి భాగమునుండి కంఠ ప్రదేశము వరకు ఈ జలంధరబంధ యోగము ఒకానొక మాధుర్యమును నింపి ఉంచుచుండగా ఆ యోగి అనిర్వచనీయమగు ప్రశాంతతను ఆస్వాదించుచున్నాడు.

ఈ జాలంధరయోగము అభ్యసించు యోగిపట్ల సర్వదుఃఖములు ఆదుర్దాలు స్వయముగా శమిస్తున్నాయి. అప్పుడు ఆతని అమృత భావన చెదరదు. మనస్సు ఈ దృశ్యమునందు చిక్కుకోదు. అగ్నియందు పీయూషము (అమృతబిందువు) పడదు. అనగా, అమృతభావన సర్వకాల సర్వ అవస్థలయందు కొనసాగుచూనే ఉండగలదు. ప్రాణవాయు సంచలనము స్వాధీనమై స్థిరత్వము పొందగలదు.

ఖేచరీముద్ర :

కపాలకుహరే జిహ్వా ప్రవిష్టా విపరీతగా భృవోః అంతర్గతా దృష్టిః ముద్రాభవతి ఖేచరీ!

ఖేచరీ మద్రను అభ్యసించు యోగులు రెండు విశేషములైన ప్రక్రియలు నిర్వర్తించువారై ఉంటున్నారు.

(1) నాలుకను కొంచము కొంచముగా పైవైపుగా మడచటము. ఆ విధంగా మడచి నెమ్మదిగా నాలుక చివరతోను కొండనాలుక అగ్రభాగమును [కపాలకుహరమునకు (శిరస్సు భాగమగు పుర్రెయొక్క బ్రహ్మరంధ్రమునకు) సూటిగా గల పై దడవలోని కొండనాలుక చివరిస్థానమును] నాలుకాగ్ర భాగముతో, స్పృశించు యోగము. దీనిని ‘లంబికాయోగము’ అని కూడా అంటారు. ఇది గురుముఖతః సూచనలు పొంది అభ్యసించాలి.

(2) అదే సమయంలో → దృష్టిని విషయములన్నింటినుండీ వెనుకకు మరల్చి భ్రూమధ్య (రెండు కనుబొమ్మల మధ్యగా కొంచెము క్రిందగా గల ఆకాశము)లో ప్రవేశింపజేసి, అక్కడ నిశ్చలముగా ఉంచటము.

ఈ రెండూ కలసి ‘ఖేచరీముద్ర’ అగుచున్నది.

భ్రూమధ్యగల ఆకాశములో - గురురూపముగాని, శివలింగముగాని, ఇష్టమైన తీర్థస్థలంలోగల ఇష్టదేవతా రూపమును గాని భావించి, మననము ద్వారా అనుభూతపరచుకొంటూ దృష్టిని ఇంద్రియ విషయ, ప్రాపంచక సందర్భ సంఘటనలవైపు పరుగులు తీయకుండా నయంగా (softly and positively) నియమించటము.

పై ఉభయము నిర్వర్తిస్తూ ఉండటమే ఖేచరీ ముద్ర.

ఇట్టి ‘ఖేచరీ ముద్ర’ అభ్యసిస్తూ ఉండగా, అట్టి యోగి మరణదశను పొందడు. అనగా అట్టి వాని బుద్ధి, అవగాహనలకు → మరణము ‘‘ఒక వస్త్రమును వదలి మరొక వస్త్రము ధరించునంతటి స్వల్ప విషయము’’గా అగుచున్నది. అట్టివాడు నిద్ర - ఆకలి - దప్పికలను జయించి, వాటిని తన స్వాధీనమునందు కలిగినవాడగుచున్నాడు.

అంతేకాదు. (మహా భారతంలో విరాట్‌పర్వ ఉత్తరగోగ్రహణం సంఘటనలో భీష్ములవారు అర్జునుడు ప్రయోగించిన సంమోహనాస్త్రమునకు నిద్రావశుడు అవని విధంగా) - ఖేచరీ ముద్రను అభ్యసించు యోగి పరవశ - భయ - ఉద్వేగసంబంధితమైన ‘మూర్ఛదశ’కు గురి కాడు.

ఖేచరీ ముద్రను ఎరిగిన, అభ్యసించుచున్న యోగి రోగబాధలచే పీడించబడని వాడై, శారీరక బాధలకు ‘సాక్షి’గా ఉండగల సామర్థ్యము కలిగి ఉండగలడు. కర్మలు - కర్మ ఫలములు ఆతనిని బంధించజాలవు. వాటికి అతీతమగు స్థానమును చేరిన బుద్ధిని ఆతడు పొందుచున్నాడు.

అంతేకాదు. ఖేచరీ ముద్రాభ్యాసి…..

💐 కాలము కల్పించు మార్పు - చేర్పులకు అతీతత్వము వహించగలిగినవాడై ఉంటాడు. చిరునవ్వు చెదరనివాడై ఉండగలడు.
💐 నాలుక చివరకు కపాల రంధ్రమును తాకిస్తూ చిత్తమును భ్రూమధ్యమున నిలుపుటలో ప్రావీణ్యత పొందిన యోగి యొక్క చిత్తము దృశ్యమును జయించి చిదాకాశములో ఆనందముగా విహరిస్తూ ఉండగలదు.
💐 ఆగామి - సంచిత - ప్రారబ్ధములు ఆతనిని నిబద్ధించలేవు. అవన్నీ ఆ యోగికి అసంబంధించినవి అవుతాయి.
💐 ఖేచరీ ముద్ర వహించిన వానికి ఆకాశంలో సంచరించు సిద్ధులు కూడా నమస్కరిస్తూ, సగౌరవంగా చూచువారై ఉంటారు. ఆతడు సిద్ధనమస్కృతుడై ఉంటాడు.
💐 [ఖేచరీ ముద్రచే సిద్ధించు లంబయోగమును ‘సిద్ధ యోగముద్ర’ అని కూడా పిలుస్తున్నారు]. ఖేచరీ ముద్రచే ప్రాప్తించే లంబికా ఊర్ధ్యయోగస్థితిచే - శుక్లముపై ఆధిపత్యము కలుగుచున్నది. అనగా కామినీ ఆలింగన సంబంధమైన బిందు పతనమును జయించినవాడై ఉంటాడు. [స్వస్థానము నుండి దృశ్య విషయములోకి చ్యుతుడు కాకుండానే సర్వము నిర్వర్తిస్తూ ఉండగలడు]. యోగములో సిద్ధించే బిందుస్థానము నుండి ఏ మాత్రము పతితుడు కాడు.
💐 ‘బిందు పతనమును’ను శాసించగల అట్టి ఖేచరీముద్రా స్థిత - లంబికా యోగి సిద్ధునికి అకాల మృత్యుభయము ఉండదు. దేహమంతా చిత్-చైతన్య బిందుస్థితమై ఉంటున్న అట్టివానికి ఇక మృత్యు భయమేముంటుంది? యావత్ బిందుః స్థితో దేహే, తావత్ మృత్యు భయం కుతః? మార్పు చేర్పులకు సంబంధించిన మృత్యుభయము ఉండదు.
💐 ఈ ఖేచరీ ముద్ర (లేక) యోనిముద్రా సిద్ధుడగు లంబికాయోగి బిందు స్థానమునుండి (బిందు ఏకాగ్రతనుండి) కించిత్ చ్యుతి పొందినప్పటికీ, తిరిగి బ్రహ్మ - తేజస్సును సమాకర్షించి యోని మండలములో అచ్యుతుడై ఉండగలడు.
💐 రేతస్సు స్కలించినప్పటికీ, తేజస్సును ఆకర్షించి తనయందు పదిలము చేసుకొని ఉండగలడు.
💐 యోని యందు స్రవించు రజోబిందు తేజస్సును సమాకర్షించి లంబిక (కొండనాలుక) యందు ఆ తేజస్సును పదిపలచుచున్నప్పుడు ఆ యోగి ‘లంబికాయోగ సంపన్నుడు’ అగుచున్నాడు.

(“హఠయోగ దీపిక” అను యోగ శాస్త్ర పాఠక పుస్తకము నందు - స్కలన తేజస్సును కపాల కుహరమునకు జేర్చుట - అను యోగ విధి - ‘వజ్రోళి ముద్ర’ అను పేరుతో వర్ణించబడుచున్నది).

బిందు యోగము

ఈ జీవజాల సృష్టి అంతా బిందుయోగము చేతనే సిద్ధిస్తోంది. అట్టి ప్రకృతిలో ప్రవర్తమానమై ఉంటున్న బిందువు రెండురీతులైనవి.

(1) పాండర బిందువు → శుక్ల రూపము. పురుష సంబంధమైనది. రంగు - తెలుపు శివస్వరూపము (పురుషుడు)

(2) లోహిత బిందువు → శోణితము. స్త్రీ సంబంధమైనది. రంగు - రక్తవర్ణము - పగడపు రంగు. (ప్రకృతి)

రజోబిందురూపము : స్త్రీ యోని స్థానమున ఉండునది. శిశ్న స్థానములో చోటుచేసుకొనె శుక్ల బిందువుకు యోని స్థానమునందుగల శోణిత బిందువుకు ఐక్యతచే సృష్టి (దేహములు) ఏర్పడుచున్నాయి.
(ఇది జీవ-బ్రహ్మైక్య సంబంధమైనదని గ్రహించబడు గాక!)

ఈ జీవునిలో జీవబ్రహ్మైక్య యోగ రూపమగు శుక్ల - శోణిత బిందు యోగము సుదుర్లభమైన విశేషము.

అది పురుష (Doer)- ప్రకృతుల (Doings) సమ్మేళనము. ‘అ’కారముతో ‘ఉమ’కార ఐక్యరూపమగు ‘ఓం’.

బిందువు - శివుడు రజము - శక్తి ‘అ’ = శివుడు / పురుషుడు
బిందువు - చంద్రుడు రజము - సూర్యుడు ‘ఉమ’ = శివా / స్వభావము / భావన / ఊహ

ఈ ఉభయముల ఐక్యతయే బిందుయోగము.

యోగాభ్యాసముచే ప్రకృతి - పురుషుల (రజ - శుక్లముల) సమాగమము ఏర్పడుచున్నది. అట్టి సమాగమముచే యోగికి ‘పరతత్వము’ సిద్ధిస్తోంది. శ్రేష్ఠమగు విశ్వరూప దివ్య శరీరము ఈ జీవునిపట్ల రూపము దిద్దుకొంటోంది. అది అభౌతికమైన ఆత్మానంద - నిర్మిత మహత్ దేహము.

దివ్యత్వము : రవి చంద్రుల (శోణిత - శుక్లముల); ప్రకృతి - పురుషుల; దృశ్య - ద్రష్టల)….ఏకత్వముచే అట్టి యోగ సాధకునికి ‘దివ్యశరీరము’ లభిస్తోంది. అది దేహ - దృశ్యములకు సాక్షీ శరీరము.

ఎవ్వరైతే….ఈ శరీరములో
- శుక్లము చంద్రతత్త్వ సంయుక్తమని, తేజస్సు సూర్య సమన్వితమని గమనించువారై…..
- ఆ రెండిటియొక్క సమరస విశేషత్వము (ద్రష్ట - దృశ్యముల ఏకత్వము)
తెలుసుకొనుచున్నారో అట్టి యోగులే ‘యోగము’ను ఎరిగిన యోగవేత్తలు.

శుక్ల శోణితముల స-రసత్వము (మహాముద్ర)! : యోగాభ్యాసముచే చంద్ర - సూర్యులలో (దృశ్య - ద్రష్టలలో, ప్రకృతి - పురుషులలో) భేదదృష్టి సంబంధమైన దోషజాలమంతా శోధించబడగా….చంద్రసూర్యుల రసాంశములు పవిత్రమై, ఏకత్వము పొందుచున్నాయి. అట్టి ఏకత్వము ‘మహాముద్ర’ అని పిలువబడుచున్నది.

🌺 చంద్ర - సూర్యుల; ప్రకృతి - పురుషుల
🌺 జీవాత్మ - పరమాత్మల; ద్రష్ట - దృశ్యముల;
🌺 త్వమ్ - తత్‌ల; జగత్ - జీవుల; త్వమ్ - అహమ్‌ల సమరసభావనా, సమరస అనుభవయోగసిద్ధియే మహాముద్ర.

మహాముద్రా యోగాభ్యాసవిధానము

వక్షోన్యస్త హనుః నిపీడ్య, సుషిరం యోనేశ్చ వామంఘ్రిణా,
హస్తాభ్యాం అనుధారయన్ ప్రవితతం పాదం తథా దక్షిణమ్….,
ఆపూర్య శ్వసనేన కుక్షియుగళం బధ్వా, శనైః రేచయేత్।
ఏషా పాతక నాశనీ నను ‘‘మహాముద్రా’’ నృణాంప్రోచ్యతే।।

(1) మొట్టమొదట సుఖ- ఆశీనుడై,
(2) గడ్డముయొక్క చివరి భాగమును (చుబుకమును) వక్షస్థలము (గుండెకు) తాకించుచూ,
(3) యోనియొక్క (మలవిసర్జనా దేహ విభాగము యొక్క) సుషిరమును (బెజ్జమును) ఎడమపాదముచేత బిగియించి కుడిపాదమును రెండు చేతులతో పట్టుకొని,
(4) వాయువును పూరక కుంభక ప్రాణాయామముల ద్వారా కుక్షిలో (పొట్టలో) నింపి
(5) నెమ్మదిగా రేచక ప్రాణాయామ ప్రక్రియ ద్వారా గాలిని బయటకు వదలుచూ….నిర్వర్తించు విధానము (యోగశాస్త్రముచే) ‘మహాముద్ర’ అని నిర్వచించబడుచున్నది.

అట్టి మహాముద్ర వలన యోగసాధకునిపట్ల సర్వ పాపదృష్టులు ప్రక్షాళనము అగుచున్నాయి.

ఈ విధంగా,
శుక్లము → శోణితము,
ఆలోచన → ఆలోచించబడునది,
భావన → భావించబడునది,
అనుభూతి → అనుభూతమై పొందబడుచున్నది, →
మొదలైన విభజనలే ప్రతి జీవునిలోని పురుష-స్త్రీ రూపములగు శుక్ల శోణితములు. ఆ రెండిటియొక్క సమరసత్వధారణ - మహాముద్ర.

ద్వితీయ అధ్యాయము - కిం ఆత్మ? నిర్ణయ వ్యాఖ్యానము

హృదిస్థానే అష్టదళపద్మమ్ వర్తతే! భావనకు, ఆలోచనకు, అనుభూతికి జననస్థానమగు హృదయాకాశస్థానములో ‘8’ దళములుగల పద్మము ప్రవర్తమానమైయున్నది.

ఆ పద్మమునకు రేఖావలయముల రూపముగా ‘3’ వలయములు.

ఆ రేఖా వలయముల మధ్యగా జీవాత్మ → జ్యోతి స్వరూపుడై, అణుస్వరూపుడై, సర్వమును అభిమానించువాడై వెలయుచున్నాడు. వర్తించుచున్నాడు.

ఆ జీవాత్మజ్యోతి - బిందు స్వరూపుడై సర్వ జగత్ అభిమానములకు కర్త, భోక్త కూడా.

ఈ భౌతికంగా కనిపిస్తున్న జగత్ వ్యవహారమంతా కూడా ఆ జీవాత్మ జ్యోతి స్వరూపుని యందే భావనా స్వరూపంగా ప్రతిష్ఠితమై యున్నది. ఆ జీవాత్మ చిత్‌చైతన్య స్ఫురణ స్వరూపుడే।

సర్వమ్ జానాతి → ఇది నేను! ఇది నా అనుభవము. ఇవి నా స్థితి-గతులు - అను సర్వము ఎరుగుచున్నట్టివాడు.

సర్వమ్ కరోతి → ఇదంతా నేను చేయుచున్నట్టివాడను - అను కర్తృత్వము కలవాడు.

సర్వమ్ ఏతత్ చరితమ్ → సర్వము ఆ జీవునిచే చరించు స్థానముగా పొందబడుచున్నది.

అట్టి ఈ జీవుడు ఇంకా కూడా…‘‘నేను కర్తను! భోక్తను! సుఖిని! దుఃఖిని! గ్రుడ్డివాడను! గూనివాడను! చెవిటివాడను! మూగవాడను! ఇప్పుడు కృశించిపోయిన వాడను! ఒకప్పుడు బలముతో ఉండేవాడను! జనించువాడను! మరణించువాడను!’’….ఇటువంటి అనేక శారీరక లక్షణములన్నీ తన స్వస్వరూపముపై ఆపాదించుకొనుచూ, ఈ శరీరరూపము (అనేక ఆయా స్థితిగతులతో సహా) తానే అయినట్లు భావించుచూ, వర్తించుచున్నాడు.

హృదయకమల అష్టదళములందు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క స్వభావము తానే అయినట్లు, తనయొక్క సమస్తము అయినట్లు సంకుచిత భావకుడై వర్తించుచున్నాడు.

హృదయ అంతర్గత - అష్ట దళ పద్మము

హృదయముపద్మములోని తూర్పుదళము ఈ జీవుడు విశ్రమిస్తున్నప్పుడు→ తెలుపు రంగు → భక్తిమంతుడు, పరాప్రేమసమన్వితుడు, ధర్మనిరతి కలవాడు అగుచున్నాడు.
ఆగ్నేయ దళములో తిరుగుచున్నప్పుడు → ఎరుపు వర్ణము → నిద్ర, ఆలస్యములతో కూడినబుద్ధి కలవాడగుచున్నాడు.
దక్షిణ దళములో సంచరిస్తున్నప్పుడు → కృష్ణ (నలుపు) రంగు → ద్వేష - కోపములతో కూడిన మతి.
నైరృతి దళములో కునుకులు తీయునప్పుడు → నీలవర్ణము → పాపమతి, హింసామతి కలవాడై ఉంటున్నాడు.
పశ్చిమ దళములో విశ్రాంతి పొందుచున్నప్పుడు → స్ఫటిక వర్ణము → బాలుర స్వభావి. క్రీడావినోది.
వాయువ్య దళములో విశ్రమిస్తూ ఉంటే → మాణిక్యవర్ణము → అటు ఇటు తిరుగాడు స్వభావి. వైరాగ్యముగల బుద్ధి.
ఉత్తరదళములో నిదురిస్తున్నప్పుడు → పీత (పసుపు) వర్ణము → సుఖాభిలాషి, శృంగారమతి అగుచున్నాడు.
ఈశాన్య దళములో కునుకుచున్నప్పుడు → వైఢూర్య వర్ణము → దానము చేయువాడు, కృపకలిగియుండు బుద్ధి కలిగి ఉంటున్నాడు.
దళముల సంధి ప్రదేశములో సంచారము కలిగి ఉన్నప్పుడు → వాత పిత్త- శ్లేష్మ మహాఖ్యాది ప్రకోపములు పొందుచున్నాడు.
హృదయ పద్మముయొక్క మధ్యభాగములో తిష్ఠితుడై ఉన్నప్పుడు → అన్నీ వివరంగా తెలుసుకొనుచూ, గానం చేస్తూ, పఠనము చేస్తూ సంతోషంగా ఉంటున్నాడు.

⌘ ⌘ ⌘

Ⅰ. జాగ్రత్ అవస్ధ : జాగ్రత్‌లో ఇంద్రియములను ఉపయోగిస్తూ దృశ్య జగత్తును అనుభవముగా పొందుచున్నాడు.

నిద్రావస్థ : ఈ విధంగా హృదయపద్మ దళములలోను, దళముల చివర, మధ్య స్థానములోను తిరుగు ఈ జీవుడు జాగ్రత్‌లో సంచరిస్తూ కొంత సమయానికి నేత్రములో (కళ్లలో) ‘శ్రమ’ (Tiresomeness) పొందుచున్నాడు.

శ్రమ నిర్హరణార్థం ప్రథమ రేఖావలయం కృత్వా, మధ్యే నిమజ్జనం కురుతే! ఎప్పుడైతే ఈ జీవుడు కళ్లలో శ్రమపొందినవాడగుచున్నాడో, అప్పుడు ఆ శ్రమను తొలగించుకోవటానికై ప్రధమ వలయము నిర్మించుకొనుచున్నాడు.

బంధూక (మంకెన పూవు) వంటి హృదయములోని ఎర్రటి రంగుతో ప్రకాశించు ప్రథమ వలయమును… చుట్టుకొని ఆ ప్రథమ రేఖావలయంలో ప్రవేశించి, ‘నిద్రాస్థితి’ పొందుచున్నాడు. నిద్రలో నిమజ్జనము పొందుచున్నాడు.

Ⅱ. స్వప్నావస్థ : అట్టి నిద్రా సమయంలో నిద్రావస్థకు మధ్యగా - నిద్రావస్థా మధ్యే స్వప్నావస్థా భవతి! స్వప్నావస్థ పొందుచున్నాడు. స్వప్నావస్థా మధ్యే దృష్టం, శ్రుతమ్, అనుమానసంభవ, వార్తా ఇత్యాది కల్పనాం కరోతి! నిద్రకు ఉపక్రమించిన తరువాత పొందిన స్వప్నావస్థ మధ్యలో ఇంతకుముందు చూడబడినవి, వినబడినవి, అనుమాన గ్రస్తమైనట్టివి…ఇటువంటి అనేక వ్యవహారములన్నీ స్వకీయ కల్పితముగా అనుభూతములగుచున్నాయి.

జాగ్రత్‌స్వప్నముల పరస్పర అహ్రాంతి-కల్పనా మాత్ర అవగాహనము

ఇక్కడ ఒక చమత్కారము జరుగుతోంది.

జాగ్రత్ దశలో స్వప్న దశలో
జాగ్రత్ అంతా ‘ఇది సత్యమే’ - అనురూపంగా పొందబడి - అనుభవమగుచున్నది. అట్టి జాగ్రత్‌లో ‘‘స్వప్నములో తారస బడిందంతా సత్యమే కాదు కదా!’’…అనే నిశ్చితాభిప్రాయము ప్రవర్తించుచున్నది. అనగా ‘‘రాత్రి స్వప్నంలో చూచిన ప్రదేశములు, సంగతులు, సందర్భములు, వస్తుజాలములు మొదలైనవి సత్యములు కావు. జాగ్రత్‌తో ఉన్నవే సత్యము’! - అను రూపముగల అనుభూతము ఆశ్రయించబడుతోంది.
స్వప్నములోని విశేషాలు, సందర్భాలు, సంఘటనలు, వస్తువులు - అన్నీ కూడా స్వప్నము సమయంలో - ‘‘ఇవన్నీ సత్యమే కదా!’’ అని భావించబడి, అనుభవించ బడుచున్నాయి. అట్టి స్వప్నానుభవ సందర్భములో ‘‘జాగ్రత్ సంబంధించిన విశేషములయినట్టి ప్రదేశములు, సంగతులు, సందర్భములు, వస్తుజాలములు - మొదలైనవన్నీ సత్యము కాదు. ఈ స్వప్నములోని శేషాలే సత్యము’’ - అను అనుభూతము ఆశ్రయించబడుతోంది.

(1) జాగ్రత్ సమయంలో స్వప్నవిశేషాలు, పదార్థాలు మొదలైనవి, (2) స్వప్న సమయంలో జాగ్రత్ విశేషాలు, పదార్థాలు మొదలైనవి పరసర్పము ‘లేనివి - అసత్యము’ అయినట్టుగా అనిపిస్తున్నాయి (లేక) భ్రమయేనను భావన ఏర్పడినదై ఉంటోంది.

అట్లాగే ఒక ఉపాధికి అంతకు ముందటి ఉపాధి విశేషాలు, సంఘటనలు, సందర్భాలు, సంబంధాలు మొదలైనవన్నీ - ‘లేనివి - అసత్యము’….అగుచున్నాయి.

అనగా,
వర్తమాన ఉపాధి విశేషాలు, సంబంధములు, సంఘటనలు, ఇళ్లు - ఊళ్లు మొదలైన పదార్థ జాలమంతా కూడా, తదనంతర ఉపాధి సందర్భములో ‘లేనివి - అసత్యము’ కాబోవుచున్నాయి.

వర్తమానములో ఉన్నట్లే అనిపిస్తూ, మరొక దశలో [స్వప్నదశలో (లేక) తదనంత ఉపాధి దశలో] లేనివి కాబట్టి, - ‘అసత్తు’ అగుచూ వస్తున్నాయి. అయితే ఏం? వర్తమానంలో కలిగి ఉన్న సంగతులు, సంబంధములు, అనుబంధములు, బాంధవ్యములు, ప్రదేశములు, పదార్థములు - ఇవన్నీ కూడా ‘‘నాకు ఉండియే ఉన్నాయి. బంధము అగుచున్నాయి’’ అని మాత్రం అనిపిస్తూ వస్తోంది. అట్లా అనిపించుదానికంతటికీ ఈ జీవుడు బద్ధుడై ఉంటున్నాడు. ‘నాకు బంధము ఉన్నది కదా!’ అను అభినివేశమును (లేక) వ్యసనమును వదలలేకపోవుచున్నాడు.

Ⅲ. సుషుప్తి దశ :

శ్రమ నిర్హరణార్థం ద్వితీయ రేఖావలయం కృత్వా, మధ్యే నిమజ్జనం కురుతే। ద్వితీయ రేఖా, ఇంద్రగోపవర్ణా, తదా ‘సుషుప్త్యవస్థా’ భవతి।।

స్వప్నదశలో కొంత సమయము గడిపిన ఈ జీవుడు, స్వప్నములో పాల్గొనుచు, స్వప్నములోని సంఘటనలను, సంబంధములను, పదార్థజాలమును పొందుచున్నాడు కదా. క్రమంగా, ‘పొందటము’ అనే శ్రమచే అలసి సొలసి పోవుచున్నాడు. అప్పుడు ఆ శ్రమను తొలగించుకోవటానికి రెండవ రేఖావలయమును గీచుకొని, అందులో ప్రవేశించుచున్నాడు.

ఆ రెండవ రేఖ - తదంతర్గతము - ఇంద్రగోప (మెరుగుల) పురుగువర్ణముగా (బూడిద వర్ణముతో) అనుభూతము అగుచున్నది. అట్టి రెండవ రేఖను చుట్టుకొని ఉండి, క్రమంగా ఆ రెండవరేఖా వలయంలో ప్రకాశించి ‘విషయరహితత్వము’ను ధరిస్తున్నాడు. అదియే సుషుప్త్యవస్థ. అట్టి సుషుప్తిలో ‘‘భగవత్ సంబంధమైనబుద్ధి’’ని ఆశ్రయించినవాడై ఉంటున్నాడు.

Ⅳ. తురీయము: జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు ఆవల మరొక రూపమును ఈ జీవుడు కలిగియున్నాడు. తృతీయ రేఖావలయం కృత్వా మధ్యే నిమజ్జనం కురుతే। సుషుప్తికి ఆవల మరొక 3వ రేఖావలయమును కల్పించుకొని ఆ వలయములో ప్రవేశించి నిమజ్జనము పొందుచున్నాడు. తురీయుడు (4వ తురీయుడు–4వ దశ కలవాడు) అయి ఉంటున్నాడు. పశ్చాత్ పరమేశ్వర స్వరూపేన ప్రాప్తిః భవతి.

జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ‘ప్రవేశము - నిష్క్రమణ’ అను కల్పనలను తన విశేషణములుగా కలిగినట్టి ఈ తృతీయ (చతురీయ) రేఖావలయము పద్మరాగమణి రంగు కలిగినట్టిది.

ఆ తురీయావస్థలో మౌనస్వరూపుడై, జాగ్రత్ స్వప్న సుషుప్తులను తనయొక్క వ్యాఖ్యాన విశేషములుగా కలిగి ఉంటున్నాడు.

తురీయావస్థయందు కేవల పరమేశ్వర స్వరూపుడై (సర్వమునకు పరమ్ ఆవల; సర్వముగా విస్తరించి ఉండుటచే ‘ఈశ్వర స్వరూపుడు‘గా) ప్రకాశమానుడగుచున్నాడు. తురీయే కేవల పరమాత్మ సంబంధినీ భవతి! పరమాత్మ తత్త్వ సంబంధితుడై ఉంటున్నాడు. అట్టి తురీయావస్థయందు నిత్యబోధ స్వరూపుడై ఉంటున్నాడు. కేవల నిత్యబోధ ‘స్వరూపా భవతి’.

Ⅴ. తురీయాతీతము : యోగాభ్యాసి ఈ విధంగా తన రేఖావలయ కల్పనలు, వలయ ప్రవేశ - నిష్క్రమణములను గ్రహించి, ఇక ఆపై తురీయాతీత స్థితియొక్క ప్రత్యక్షానుభవమునకు సంసిద్ధుడు అగుచున్నాడు.

జాగ్రత్ - స్వప్న - సుషుప్తులను, అందులో ప్రవేశిస్తూ - నిష్క్రమిస్తూ ఉన్న ‘‘తురీయమును దాటివేయు యోగమునకు యోగాభ్యాసి’’ అయి ఉంటున్నాడు.

బుద్ధిని జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయములనుండి మరల్చి, వాటికి ఆవలగల నిత్య స్వస్వరూపమగు, కేవలసాక్షి అగు ఆత్మయందు (బుద్ధిని) ప్రవేశింపజేయటమును ‘ఆత్మ సంయమ యోగము’ అని పిలుస్తున్నారు.

ఏ విధంగా తురీయాతీతము సిద్ధించగలదు?

తదా శనైః ఉపరమేత్, బుద్ధ్యా ధృతి గృహీతయా, ఆత్మసంస్థం మనః కృత్వా, న కించిదపి చింతయేత్!

ఈ యోగాభ్యాసి నెమ్మది నెమ్మదిగా ‘నిర్మలము - సునిశితము - ఉత్సాహ సాహస సమన్వితము - స్వీయానంద పరబ్రహ్మోత్సాహము’ …..అగు బుద్ధిని పెంపొందించుకొని మనస్సును తురీయస్థితికి కూడా సాక్షి అయి ఉన్న ఆత్మయందు ప్రతిక్షేపించాలి.

సర్వమును స్వస్వరూపమగు కేవాలాత్మకు అభిన్నముగా దర్శించు బుద్ధి స్థానమునకు మననరూపమగు మనస్సు ను చేర్చాలి.

ఇక క్రమంగా సర్వ అన్యచింతనలను విడచివేసి, దాటివేసి ‘ఇదంతా మమాత్మయే! మమాత్మా సర్వభూతాత్మా!’ ….అను ఏకైక లక్ష్యమును, అనుభూతిని, భావనను ధారణచేయాలి.

సర్వము సర్వదా బ్రహ్మమే! అహమ్ బ్రహ్మాస్మి। త్వమ్‌బ్రహ్మాసి। జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయమ్ బ్రహ్మాభిన్నం!….నేను బ్రహ్మమును! బ్రహ్మమునే! నాకు అన్యముగా జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయములుగాని, వాటియందలి అంతర్గత విశేషాలుగాని లేవు!’ అను సర్వాతీత - కేవలస్థితిని అనుక్షణికంగా అవధరించటము క్రమంగా సిద్ధించగలదు.

ఎంతకాలము ఆవిధమైన తురీయాతీత - కేవల ఆత్మా అభిన్నస్థితి ధారణ చేస్తూ ఉండాలి? తురీయాతీతత్వమును సిద్ధించుకొన్న సిద్ధ పురుషుని అనుభూతి, అనుభవము ఏ విధంగా ఉంటుంది?…..ఈ ప్రశ్నలకు మనము ఇప్పుడు సమాధానము చెప్పుకొనుచున్నాము.

తురీయాతీత సిద్ధపురుషానుభవము (లేక) కేవల ఆత్మానుభవి యొక్క స్థితి

ప్రాణ - అపానయో ఐక్యం కృత్వా : ఆతని పట్ల ప్రాణ - అపానములు ఐక్యత పొందినవై, ఆ రెండిటి మధ్య ఏర్పడినదైయున్న నిశ్చలప్రాణస్వరూపుడుగా ఆతడు ప్రకాశించుచున్నాడు.

సర్వమ్ విశ్వమ్ ఆత్మస్వరూపేణ లక్ష్యం ధారయతి : ఇక ఆతడు ఒక దేహమునకు ఆత్మగా మాత్రమే ఉండడు. మరి? ‘ఈ విశ్వమంతా మమాత్మ స్వరూపమే’ అను లక్ష్యమును, అనుభూతిని ధారణ చేయుచున్నవాడై ఉంటాడు. ఈ సమస్త విశ్వమునకు తానే ఆత్మ అయి ప్రకాశించుచున్నాడు.

తదా తురీయాతీతావస్థా : శాస్త్రములచే అది ‘తురీయాతీతావస్థ’ - అని గానము చేయబడుచున్నది.

ఆనన్ద స్వరూపో భావతి : ‘ఆనందము పొందటము’ అనే స్థితిని దాటిపోయి ‘అసంకల్పిత - సర్వసందర్భాతీత - స్వభావాతీత - అవ్యాజ - నిర్హేతుక ఆనందము’ …ఆతని స్వభావము - స్వరూపము అగుచున్నది.

ద్వంద్వాతీతో భవతి : ‘నాకు ద్వితీయమనునది ఎప్పుడూ లేదు. ఎక్కడా లేదు!’….అను స్వానుభూతిసిద్ధమగు ద్వంద్వాతీతుడుగా అగుచున్నాడు.

యావత్ దేహధారణా వర్తతే, తావత్ తిష్ఠతి। పశ్చాత్ పరమాత్మ స్వరూపేణ ప్రాప్తిః భవతి!
‘నాకు ఒకానొక భౌతిక దేహము ఉన్నది’….అని అనిపించుచున్న పర్యంతమూ ఆతడు తుర్యాతీత భావనను ధారణగా కలిగి ఉంటాడు. అద్దానిని కూడా దాటివేసినప్పుడు, ఇక ఆపై అనేక ప్రకారములుగా పరాకాష్ఠగా చెప్పబడుచున్న విదేహముక్తి; మోక్షము ; జీవబ్రహ్మైక్యము; సోఽహమ్‌తత్త్వము; తురీయాతీత కేవల స్వరూపము. అఖండ పరమానందస్థితి….మొదలైన పేర్లతో చెప్పబడే అనునిత్య - కార్యకారణాతీత స్థానము ప్రాప్తించుకొనుచున్నాడు. ఇదియే ఆత్మ దర్శనోపాయము, ఆత్మ దర్శన మార్గము, ఆత్మ సాక్షాత్కారము కూడా!

చతుష్పథ సమాయుక్త : జాగ్రత్ - స్వప్న - సుషుప్త - తురీయములనబడే చతుష్పధములతో కూడి, ఆవల సంస్థితుడై ఉంటున్నాడు. ఈ నాలుగు ఆతనికి నాలుగు కాళ్ళవంటివి అగుచున్నాయి.

’ఇడ-పింగళ-సుషుమ్న-పురీత’ అనబడే 4 నాడీ మార్గములలో ఆతడు బ్రహ్మ రంధ్రమును స్పృశించి, దాటిపోయి… సహస్రారుడగు చున్నాడు. విశ్వాకారుడగుచున్నాడు. ఆతడు చక్రములను దాటి సమవత్‌స్థితమగు బ్రహ్మరంధ్రమహాద్వారములో ప్రవేశము పొంది సర్వాంతర్యామిత్వము సంతరించుకొనుచున్నాడు. ఇదంతా నాయందే! నేనే ఈ సర్వమునందు…అను కైవల్య స్వభావమును సిద్ధించుకొనుచున్నాడు.

సమాధి నిష్ఠకాలములో సభలో ఆసీనుడైయున్న చక్రవర్తిని మంత్రులు సమీంచునట్లుగా పంచ ప్రాణములు ఆతని ‘సమక్షము’ను పొంది ఏకరూపము సంతరించుకొనుచున్నాయి. ఆతడు శిరస్సునకు ఉపరిభాగము బ్రహ్మరంధ్రము ద్వారా సహస్రార చక్రములో ప్రవేశించి అచ్యుతుడై పరమాత్మతో మమేకమగుచున్నాడు. ఆతని యోగమార్గా ప్రయాణపు బాట అగు సుషుమ్న ‘మహాద్వారము’ అను పేరు పొందినదై ఉంటోంది.

ఇతః పూర్వం చెప్పబడిన ద్రష్ట - దర్శన - దృశ్య త్రికోణ స్థానమునకు ఆవల పృధివి మొదలైన పంచభూతములు - వాటివాటి వర్ణముల (colours) పూర్వకంగా ఆతనికి ధ్యేయవస్తువు అగుచున్నది. అనగా, ఈ విశ్వమంతా ఆతనికి విశ్వేశ్వరరూపమే అయి ఆతనికి స్వస్వరూప ధ్యానమునకు ధ్యేయమే అగుచున్నది. ‘త్వమ్’గాను, ‘ఇదమ్’గాను కనిపించేదంతా ఆతనికి భగవత్‌స్వరూపమే! స్వస్వరూప - ఆనంద - సంప్రదర్శనమే।

జనన స్థానముల బీజోపాసన

అట్టి తురీయాతీత యోగసిద్ధికి ధ్యానమార్గము ఈ విధంగా సూచించ బడుచున్నది.

య-ప్రాణబీజధ్యానం : ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమాన పంచవాయువులను (ఇతః పూర్వం చెప్పుకున్న) ఆయా వర్ణముల భావనతో ధ్యానం చేయునుగాక!

‘య’ కారము ప్రాణ బీజంగా నీలమేఘ వర్ణంగా ప్రాణశక్తిని ధ్యానం చేయాలి.

ర-అపానవాయు - అగ్ని బీజ ధ్యానం : ‘ర’కార అక్షరంతో, అపానవాయువును ఆదిత్య (సూర్య) రూపంగా ధ్యానం చేయాలి.

ల-వ్యానవాయు - పృథివీ బీజధ్యానం : ‘ల’ అక్షరంతో పృథివీరూపమును, వ్యానవాయువును బంధూక (మంకెన) పూరంగు (ఎరుపురంగు) గా ధ్యానించాలి.

వ-ఉదానవాయు జీవబీజ ధ్యానం : జీవ బీజమును ‘వ’ అక్షరముతో ఉదానప్రాణరూపంగా శంఖవర్ణమును (శంఖపు వర్ణమును) భావించి ధ్యానించాలి.

హ-సమానప్రాణ విశ్వరూపధ్యానం : ఈ విశ్వ స్వరూపమును ‘హ’ అను అక్షరంతో స్ఫటిక ప్రభగా ధ్యానము చేయాలి.

ఈ విధంగా పంచప్రాణములను ‘వాటియొక్క బీజస్థానము ఆత్మయే’ అను అవగాహనతో బీజస్థానమును ఉపాసించెదరుగాక!

అంగాంగ ఆత్మధ్యానము : హృదయములోను, నాభిస్థానములోను, ముక్కుయందు, చెవులయందు, పాదములయందు, కాలివ్రేళ్లయందు, చేతివ్రేళ్లయందు ‘పరమాత్మ’ యొక్క ఉనికిని బుద్ధితో గమనిస్తూ ఆత్మానుభూతిగా మరల్చుచుచూ కొంతసేపు ఏకాగ్రముగా (with concentration) ధారణ చేస్తూ ఉండటము.

జీవుని ఉనికితత్త్వం - జీవతత్త్వం

ఈ దేహములో 72000 నాడీ మార్గములు ఏర్పడినవై ఉన్నాయి. జీవుడు తనయొక్క జీవచైతన్య స్ఫూర్తి స్వరూపముతో ఈ 72000 నాడీ మార్గములలో సంచారములు కలిగి ఉంటున్నాడు. అట్టి నాడీమార్గములన్నిటిలో ఆత్మచైతన్యమే ప్రదర్శితమై ఉన్నట్లు ఉపాసించెదరుగాక!

అట్లాగే దేహములో ఉనికి కలిగియున్న 28 కోట్ల రోమకూపములలో కూడా జీవచైతన్యరూపుడై ఆత్మభగవానుడే ప్రత్యక్షమై ఉన్నట్లు కూడా ఆత్మతత్త్వోపాసన నిర్వర్తిస్తూ ఉండాలి.

ఆత్మానంద తేజస్సే - ఏకస్తమై, - సమానప్రాణరూపముగా దేహమంతా అణువణువు నిండి ఉన్నట్లు సమాహితమగు దృఢచిత్తముతో (ఆప్యాయతతో) గమనిస్తూ పరబ్రహ్మతత్త్వమును ఉపాసించాలి.

ఈ దేహములో దృఢ చిత్తస్వరూపుడై రేచకము - కుంభకము - పూరకములను స్వభావసిద్ధంగా నిర్వర్తిస్తున్నది సర్వాంతర్యామి - సర్వసాక్షియగు - ఆత్మదేవాది దేవుడే’! అను దృఢసంకల్పముతో గమనిస్తూ ప్రేమాస్పదంగా భక్తి - ప్రపత్తులు సమర్పిస్తూ ఉండాలి.

స్వ-హృదయపద్మము యొక్క ‘కోటరము’లో తేజోరూపుడై ప్రత్యక్షమగుచున్నట్లు భావించాలి. ఒకవైపు సమస్తమును ‘ఎరుక’ రూపములో సమాకర్షిస్తూ, మరొకవైపు ప్రాణ - అపానములను ఒకదానితో మరొకటిని బంధిస్తూ మధ్యగా ఉన్న ఆత్మను దర్శిస్తూ ఉండాలి.

‘ఓం’ అను ప్రణవమును, సముచ్చరించుచూ ఆత్మదేవునికి నివేదనలు సమర్పించాలి. ‘కంఠ సంకోచమును లింగ సంకోచము చేస్తూ యోగోపాసనచే ఆత్మను ఆరాధించాలి. సమస్తమునకు, సమస్త సహజీవులకు బాహ్య - అభ్యంతర స్వరూపుడుగా ఉపాసించాలి.

మూలాధారము మొదలుగాగల ప్రణవరూప మహానాదోపాసన

ఆత్మ మహాదేవియే దేహములో ప్రణవనాద స్వరూపిణియై విరాజిల్లుచున్నది.

సుషుమ్నానాడి : మూలాధారము నుండి బయల్వెడలుచున్నదై యున్నది,
- పద్మముయొక్క కాడలోని తంతువువలె సూక్ష్మమైనది,
- శక్తి స్వరూపమగుటచే అమూర్తమైనట్టిది,
- శరీరమంతటికీ (మరియు) మనో బుద్ధులకు కూడా శుభప్రదాత అయినట్టిది,
- వీణాదండమువలె ఉన్నట్టిది….,
అగు ‘సుషుమ్న’ నాడినుండి ‘ప్రణవరూపము’ అయినట్టి ఓమ్‌…ప్రణవమహత్ నాదము ధ్వనించుచున్నది.

దానినుండి ఏకాగ్రతచే యోగికి ’అంతర్నాదముగాను, శంఖనాదమువలెను, మద్దెలనాదమువలెను, గజ్జలనాదము వలెను, గంటానాదమువలెను వినబడుచున్నది.

అట్టి ప్రణవనాదము ‘మూలాధారము నుండి బయల్వెడలి క్రమక్రమంగా బ్రహ్మరంధ్రమును జేరుచున్నప్పుడు - షడ్జమ స్వరము - అయినట్టి హంస (మయూరము) యొక్క ‘కూ’జితమువలె వినబడుచున్నది.

కపాల కుహరే మధ్యే - చతుర్ద్వారస్య మధ్యమే-తత్ ఆత్మా రాజతే, తత్ర యథా వ్యోమ్ని దివాకరః!
యోగి బ్రహ్మరంధ్రమునుండి సడ్జమ స్వరమును వినటమును అభ్యసిస్తూ…కపాలకుహర ఆకాశములో ప్రవేశిస్తున్నాడు. కపాలకుహరము యొక్క 4వ ద్వారము (తురీయము)లో ప్రవేశించి అక్కడ ఆత్మానందమునుందు నిమగ్నమగుచున్నాడు.

‘సహస్రారము’ అనబడే అత్యుత్తమ యోగస్థానమును చేరి సమాధి యోగమున ప్రవేశించి జగత్తులను స్వస్వరూపాత్మ స్వరూపముగా దర్శించుచూ ఆత్మానందము పొందుచున్నాడు. ‘సర్వలోకములు మమాత్మ ప్రకాశమే కదా!’….అనబడు సర్వలోక సంప్రకాశమానుడై ఉంటున్నాడు.

అంతరిక్షములో సూర్యుడు ఏ ఆధారము లేకుండా సంచరించువిధంగా, ‘కోదండ ద్వయమధ్యము’….అనే భ్రూమధ్యస్థానమునందు నిలచి, బ్రహ్మరంధ్రమును స్వశక్తితో ఆక్రమించి, అధిగమించి స్వస్వరూపమును ఎరిగి నిరాలంబుడై స్వయం ప్రకాశమానుడగుచున్నాడు.

స్వస్వరూపమును సర్వజగత్ రూపముగా తెలుసుకొని….‘జీవాత్మగా కనిపిస్తున్న నేనే పరమాత్మను! పరమాత్మనగు నేనే జీవాత్మగా కూడా ఉండి ఉన్నాను’ అను రూపముగల ‘జీవబ్రహ్మైక్వత్వము’ తో కూడిన బుద్ధితో సర్వే సర్వత్రో వ్యాపించినవాడై ఉంటున్నాడు.

అహమేవ బ్రహ్మమ్! అహమ్ బ్రహ్మాస్మి ! అహమ్ జీవ - బ్రహ్మైక్య ఏకరూపమస్మి! అను ఏకాగ్రతతో కూడిన చిదాకాశస్వస్వరూపమునందు మనస్సును, అద్దాని అనుభవములను లయము చేసివేయుచున్నాడు. ఇహ-పరములను సంపూర్ణముగా ఆత్మానందమునందు అంతర్గతము చేసివేయుచున్నాడు.

ఒకచోట ఉంచబడిన అనేక రత్నముల కాంతియొక్క ఏకస్వరూపమువలె, పౌర్ణమినాటి అసంఖ్యాక అమృత కిరణములను అన్నివైపులా వెదజల్లు పూర్ణచంద్రుని వలె - ‘‘బిందురూప అఖండ పదము’’ను చేరుచున్నాడు.

అట్టియోగి పునరావృత్తి రహితమగు కైవల్య పదమును అలంకరించి ఉంటున్నాడు.



🙏 ఇతి ధ్యాన బిందు ఉపనిషత్ ‌🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।