[[@YHRK]] [[@Spiritual]]

Ekākshara Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


కృష్ణయజుర్వేదాంతర్గత

5     ఏకాక్షరోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। ఏక-అక్షర పద ఆరూఢం, సర్వాత్మకమ్, అఖండితమ్,
సర్వ వర్జిత చిన్మాత్రమ్, త్రిపాద్-నారాయణమ్ భజే।।

ఏకము - అక్షరము అగు పదము నందు ఆరూఢుడైన వారు, అఖండమైనవారు, సర్వాత్మకుడైన వారు, సర్వజీవుల యందు ఏక స్వరూపుడై వెలుగొందుచున్నట్టివారు, తెలియబడేదంతా ఎద్దాని చేత తెలుసుకొనబడుచున్నదో - అట్టి కేవల చిన్మాత్రులు అయినట్టి త్రిపాద (జాగ్రత్-స్వప్న-సుషుప్తి; దృశ్యము- ద్రష్ట- దృక్) ధారుడగు శ్రీమన్నారాయణుని స్తుతించుచున్నాను.

ఓం
1. ఏక అక్షరం, త్వత్వ అక్షరే
అత్ర అస్తి,
సోమే సుషుమ్నాయాం చ
ఇహ దృఢీ స ఏకః।।
ఇక్కడ కనబడుచున్నదంతా ‘అనేకము’ గాను, ‘నాశన (క్షర) శీలము’’ గాను కనబడుచూ ఉండవచ్చు గాక! దీనికంతటికీ ఆధారమైయున్న పరబ్రహ్మము సర్వదా ఏకము, అక్షరము అయి ఉన్నది. అనగా, ఏ క్షణమందునూ అనేకముగా కానట్టిది, ‘నాశనము’ అనునదే లేనట్టిది. అద్దానికి ‘నీవు - నేను - ఆతడు - ఈతడు’ - మొదలుగా గల ఖండత్వమే లేదు. కనుక తత్ త్వమ్। ‘నీవు’గా ఇక్కడ ఉన్నది పరబ్రహ్మమే! అట్టి పరబ్రహ్మస్వరూపమగు నీవే - సోమ(చంద్ర) రూపుడవై (మనోరూపుడవై), దేహములోని సుషుమ్నానాడి యందు కూడా ఏక-అఖండ స్వరూపుడుగా వెలుగొందుచున్నావు.
త్వం విశ్వభూః।
భూతపతిః। పురాణః పర్జన్యః।
ఏకో భువనస్య గోప్తా।
విశ్వే నిమగ్నః పదవీః
కవీనాం। త్వం జాతవేదో,
ఈ విశ్వమంతా ఉన్నది ఎక్కడ? ఈ విశ్వమంతటికీ స్థానము పరబ్రహ్మస్వరూపుడవగు నీవే!
ఓ పరమాత్మా! నీ సహజ -నిత్యస్వరూపము సర్వదా బ్రహ్మమే కాబట్టి, నీవే పంచభూతముల - సకల దేహముల నియామకుడవు. భూతపతివి!
పురాణ పురుషుడవు. జీవాత్మలన్నీ వాన చినుకులవలె వర్షిస్తున్న మేఘము నీవే. వర్షాధారము కూడా పరమాత్మవగు నీవే! అనేకముగా కనిపిస్తూ సర్వదా ఏక స్వరూపుడవు! సర్వాత్మకుడవై భువనములకు రక్షకుడవు। నీకు సజాతీయములు-విజాతీయములు లేవు. కాబట్టి సర్వదా ఏక స్వరూపుడవు! సర్వమును ఉద్దీపింపజేయు జాతవేదువు. తేజోరూపుడవు.
భువనస్య నాథః
అజాతమ్ అగ్రే
సః హిరణ్యరేతా
యజ్ఞః త్వం ఏవ
ఏక విభుః పురాణః।।
ఈ విశ్వకథారచనా వ్యాసంగమునందు సదా నిమగ్నమై, సృష్టి- స్థితిలయములను నడుపుచున్నది నీవే! ఈ విశ్వమునకు పదవీ బాధ్యత వహిస్తున్నది నీవే। రచయితవు. అన్నియు తెలిసియే ఉన్నవాడివి! కవివి! అజ్ఞాతుడవు। ఈ భువన మంతటికీ నాధుడవు। యజమానివి!
నీకు జన్మలనునవే లేవు! అజాతుడవు! జన్మ-కర్మ వ్యవహారములన్నిటికీ మునుముందే ఉన్నట్టి సృష్టికర్తవు. హిరణ్యరేతసుడవు! ఈ సృష్టికి ఆమూలాగ్రము నిండియున్నవాడవు. ఈ సృష్టి అనునదంతా నీయజ్ఞ స్వరూపమే। యజ్ఞతత్త్వమే। సృష్టి - సృష్టి సంకల్పము(లేక) భావనకు ముందే (సృష్టియే లేనప్పటి నుండి) ఏర్పడియున్న పురాణపురుషుడవు! నీ యొక్క ఏకము నుండే ఈ అనేకమంతా ఏర్పడుచున్నది. కనుక సర్వమునకు నియామకుడవు! యజమానివి! విభుడవు.
2. ప్రాణః ప్రసూతిః।
భువనస్య యోనిః
వ్యాప్తం త్వయా
ఏక పదేన విశ్వమ్।
త్వం విశ్వభూర్యోని
పరాసుగర్భే।
కుమార ఏకో।
ప్రాణమును (శక్తిని) గర్భమున దాల్చినవాడవు! లోకములన్నిటికీ ప్రాణయువువు.
లోకములన్నీటికీ గర్భమువు. విశ్వమంతా గర్భమున దాల్చినవాడవు. విశ్వగర్భుడవు.
నీ యొక్క ఒక్క పాదముచే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడవు! ఏకపదేన విశ్వమ్!
ఈ విశ్వమంతా ఎక్కడైతే ఏర్పడినదై ఉన్నదో.. అది నీవు।
గర్భము నీవే! ఆ గర్భమునందు సర్వజీవుల రూపమున ఏకస్వరూపుడవై ఉన్నదీ నీవే!
విశిఖః సుధన్వా।
వితత్య బాణం, తరుణార్క వర్ణం,
వ్యోమ అంతరే భాసి
హిరణ్యగర్భః। భాసా
త్వయా వ్యోమ్ని కృతః సుతార్యః।।
ఈ సృష్టి అంతా బాణము విడచుటవంటిదైతే, గొప్ప ధనస్సు, బాణము, ఎక్కుపెట్టి వదలుచున్న సైనికుడవు కూడా నీవే!
లేత సూర్యుని సప్తరంగుల కిరణములను వ్యాపింపజేస్తూ ఆకాశమును భూమిని తేజస్సుతో నింపివేయుచున్న హిరణ్యగర్భుడవు! సర్వమును భాసింపజేయుచున్నది నీవే!
ఆకాశమంతా విహారములు చేస్తున్న గరుత్మంతుడవు!
త్వం వై కుమారః। త్వం అరిష్టనేమిః।
త్వం వజ్రభృత్ భూతపతిః।
త్వం ఏవ కామః।
ప్రజానాం నిహితో-అసి సోమే।
నీవే షణ్ముఖుడవు! కుమార స్వామివై, దేవతల సేనానాయకుడవు! అరిష్టములన్నీ తొలగించుచున్నట్టివాడవు.
వజ్రము చేతితో ఎత్తి ధరించియున్న ఇంద్రభగవానుడవు నీవే! సర్వజీవ జాలమునకు పంచభూతములకు అధినేతవు! భూతపతివి! శివ తత్ త్వమ్। తత్ త్వమేవ!
సర్వజీవుల కామముగా ప్రకాశించుచున్న కామేశ్వరుడవు.
సర్వజీవుల హృదయాలలో సోముడవై (చంద్రుడవై) దాగి ఉన్నట్టి వాడవు! మహా మనోరూపుడవు!
స్వాహా, స్వధా
యత్ చ వషట్కారోతి,
రుద్రః, పశూనాం
గుహయా నిమగ్నః।
దేవతలకు సమర్పించబడు హోమద్రవ్యములగు ‘స్వాహా’, పితృదేవతలకు సమర్పించు ‘స్వధా’లతో కూడి వషట్ కారుడవగుటచే నీవే రుద్రుడవు। సర్వజీవుల హృదయములలో నిమగ్నుడవై ఉన్నట్టి రుద్రభగవానుడవు!
ఉత్సాహ-సాహస-ధైర్య-బుద్ధి-శక్తి-పరాక్రమములతో కూడిన సర్వ హృదయములలోని రుద్రశక్తివి నీవే!
ధాతా, విధాతా, పవనః,
సుపర్ణో, విష్ణో, వరాహో।
రజనీః, అహః చ।
భూతం, భవిష్యత్
ప్రభవః క్రియాశ్చ కాలః। క్రతుః।
త్వమ్ పరమ అక్షరం చ।
ధాతా-సృష్టికర్తవు! విధాతా-సృష్టి నియామకుడవు! వాయువై అంతటా వ్యవహరించుచున్నది నీవే! ఊర్ధ్వ - అధోలోకములు - అనే రెక్కలు గల పక్షివి! అంతటా (స్వప్నంలో - స్వప్నద్రష్ట వలె) ఉండి ఉండుటచే విష్ణువువు నీవే? సర్వజీవులలోని ‘అహమ్’ స్వరూపుడవు కాబట్టి వరాహుడవు! రాత్రింబవళ్ళ రూపుడవు!
జరిగిపోయిన భూతకాలము - జరుగబోవు భవిష్యత్ కాలము, ఇప్పుడు కనబడుచున్న వర్తమానకాలము, త్రికాలములలో ఉత్పత్తి అయి కనబడు ఈ సర్వము, ఇందలి క్రియావిశేషాలు-ఇవన్నీ ఏర్పడియున్న కాలస్వరూపుడవు.
సృష్టి - స్థితి - లయ చమత్కారములతో కూడిన పరము- అక్షరము - శాశ్వతము అగు క్రతుస్వరూపుడవు నీవే!
ఋచో యజూగ్ంషి
ప్రసవంతి, వక్త్రాత్ సామాని,
సమ్రాట్ వసుః అంతరిక్షమ్।
త్వం యజ్ఞ నేతా
హుతభుక్ విభుఃశ్చ।
ఋగ్వేదములోని ఋక్కులు, యజర్వేదములోని యజస్సులు, సామవేదములోని సామగానములు నీ ముఖము నుండే వర్షిస్తున్నాయి!
సామ్రాట్టువు. చక్రవర్తివి! వసువువు! అంతటా వసించువాడవు! అంతరిక్షమువు!
యజ్ఞమునకు యజమానివి! యజ్ఞనేతవు! హుతమును స్వీకరించుచున్న అగ్నివి! హుతభుక్। సర్వమునకు విభుడవు। ప్రభువువు!
రుద్రాః తథో దైత్యగణాః వసుశ్చ।
స ఏష దేవో అంబరగశ్చ, చక్రే,
అన్యేభ్య తిష్ఠేత తపో నిరుంధ్యః।
ఏకాదశ రుద్రులు, దైత్యగణములు, వస్తువులు, దేవతలు నీవే!
ఆది దేవాది దేవుడవు! ఆకాశగతుడవై, అనేక పరిభ్రమలకు ఆధారభూతుడవై ఉన్నావు! అనేకముగా అంతటా సంచరించుచున్నవాడవై ఉన్నావు. తపస్సు చేత గాని, మరింక దేనిచేతగాని నిరోధింపబడువాడవు కాదు!
హిరణ్మయం యస్య విభాతి సర్వం
వ్యోమ-అంతరే రశ్మిః ఇమాగ్ంశ్చ నాభిః। (ఇమాగ్ంశునాభిః)
నీ యొక్క హిరణ్మయ సృష్టి-అనే క్రీడా వినోదముయొక్క తేజోకిరణ సమూహములు ఆకాశమున అంతటా వ్యాపించినవాడివై ఉన్నావు. ‘జీవరాసులు’ అను కిరణములకు నాభిస్థానమై ప్రకాశించుచున్నావు!
3. స సర్వవేత్తా। భువనస్య గోప్తా।
నాభిః ప్రజానాం,
నిహితా జనానామ్।
ప్రోతా త్వమ్ ఓతా
విచితిః క్రమాణాం।
ప్రజాపతిః ఛందమయో విగర్భః।
పరబ్రహ్మస్వరూపుడవే అయి ఉన్నట్టి నీవు…,
- ఈ దేహమునకు ఈవల-ఆవల- కూడా గల జన్మ-కర్మలకు మునుముందటి స్వరూపమును ఎరిగిన వాడవు! సర్వ స్వరూపుడవు! అనంత రూపుడవు!
భువనములన్నిటికీ (లోకములన్నిటికీ) రక్షకుడు. జీవులందరికీ నాభిస్థానము అయినవాడివి. జనులందరి రహస్య స్వరూపుడవు!
సర్వ జగత్తుకు వస్త్రములో దారమువలె ఓత-ప్రోతమై ఉన్నావు. జ్ఞానస్వరూపుడవు! ప్రజాపతివి! ఛందోమయుడవు.
‘‘సామైః’’
చిదంతో విరజశ్చ
బాహుగ్ం హిరణ్మయం
వేదవిదాం వరిష్ఠమ్।
యం అధ్వరే బ్రహ్మవిదః స్తువంతి,
సామైః యజుర్భిః
క్రతుభిః।। త్వమేవ।
అంతరాంతరముగా (గర్భాంతరంగా) సర్వత్రా ఉన్నట్టివాడివి! సామవేదము నీ గురించే చిదంతుడు (చిత్‌కు ఆవల ఉన్నవాడివి) - అని స్తోత్రం చేస్తోంది. రజోగుణ రహితుడవు. నిష్క్రియుడవు. కానీ, సర్వ క్రియల రచయితవు.
శ్రేష్ఠుడవు! హిరణ్మయుడవు! సమస్తమును నీ కాంతితో నింపుచున్నావు. తెలుసుకొనుచున్న దాని గురించి తెలుసుకొనియే ఉన్నావు. అత్యంత ప్రాముఖ్యుడవు! పెద్దవు! వేదవిదుడవు।
యజ్ఞ మంత్రములు ఎరిగి యజ్ఞములు చేయు ఆధ్వర్యులు యజ్ఞము నందు సామవేదగానముల చేతను, యజుర్‌వేద మంత్రములచేతను, క్రతువులలోని ఉపాసనల చేతను స్తుతించుచున్న మహాపురుషుడవు నీవే!
త్వమేవ తత్। తత్ త్వమేవ। తత్ త్వమ్।
త్వగ్ం స్త్రీ, పుమాగ్ంః! త్వం చ
కుమారః। ఏకః। త్వం వై కుమారీ హి।
అథ భూః త్వమేవ।
త్వమేవ ధాతా।
వరుణశ్చ। రాజా త్వం।
వత్సరో అగ్నిః అర్యమః ఏవ సర్వమ్ ।।
స్త్రీ అయి ఉన్నది నీవే! పురుషుడుగా ఉన్నది నీవే! కుమారుడవు నీవే! కుమారివి నీవే! ఇన్నీ అగుచూ సర్వదా ఏకస్వరూపుడవు!
ఈ భూమిగా కనిపిస్తున్నది, అయిఉన్నది కూడా నీవే। దీని కంతటికీ సృష్టికర్తవు! ధాతవు! ఈ సృష్టిలోని జల స్వరూపుడవు! రాజువు! సంవత్సర స్వరూపుడవు! అగ్నివి! పితృదేవతా స్వరూపుడగు అర్యముడవు! ఈ సర్వము నీవే! అంతా నీవే! నీతోనే ఇదంతా! నీలోనే ఇదంతా!
మిత్రః సుపర్ణః చంద్రః
ఇంద్రో, వరుణో, రుద్రః
త్వష్టా విష్ణుః సవితా గోపతిః-త్వమ్।
త్వం విష్ణుః
భూతాని తు త్రాసి। దైత్యాః త్వయా ఆవృతం।
జగత్ ఉద్భవ గర్భః
సూర్యుడవు! గరుత్మంతుడవు! చంద్రుడవు!
ఇంద్రుడవు! వరుణుడవు! రుద్రుడవు।
త్వష్టుడవు। విష్ణువువు! గోవువు! గోపతివి!
నీవే విష్ణువు అయి ఈ జీవజాతులన్నిటినీ రక్షించుచున్నావు! దైత్యులు నీచేతనే ఆక్రమించబడుచున్నారు.
త్వం భూః భువః స్సువః, త్వగ్ం హి
స్వయం భూ, అథ విశ్వతో ముఖః।।
య ఏవం నిత్యం వేదయతే గుహ ఆశయం,
ప్రభుం, పురాణగ్ం, సర్వభూతగ్ం,
ఈ జగత్తు నీ గర్భమునందే జనిస్తోంది. ఉనికిని కలిగి ఉంటోంది. విశ్వ గర్భుడవు.
భూలోకానివి, భువర్లోకానివి, సువర్లోకానివి కూడా నీవే!
నీ జన్మకు నీవే కారణము. అందుచేత స్వయంభువువు! జన్మలకు మునుముందే ఉండి, జన్మలకు ఆది కారణుడవు.
ఈ విశ్వమంతా నీ ముఖము! విశ్వతో ముఖః।
సర్వజీవుల హృదయగుహను ఆశ్రయించి, సర్వము ఎరుగుచూ ఉన్న వాడివి। ప్రభువువు. పురాణ పురుషుడవు! ఇతఃపూర్వమే ఉండి ఇప్పటికీ అట్లే ఉన్నట్టి వాడవు.
హిరణ్మయమ్,
బుద్ధిమతాం పరాం గతిగ్ం,
స బుద్ధిమాన్। బుద్ధిమత్ సు-తిష్ఠతి।।
సర్వ భూతజాలమునకు దృష్టి ప్రదాతవు! సృష్టి కర్తవు! బుద్ధిమతులలోని బుద్ధివి! బుద్ధిమంతులకు పరమగతి (Final Target) అయి ఉన్నవాడివి।
ఎవరు నిన్ను పరమగతి స్థానముగా (పైవిధంగా ఆత్మభావన కలగటమును), తమ యొక్క గతి - ఆశయముగా కలిగి ఉంటారో అట్టివారు బుద్ధిమంతులై ఉండగలరు.
ఇదియే ‘త్వం’ గురించిన తత్త్వదర్శియొక్క ‘తత్’ దర్శనము.

ఇతి ఏకాక్షరోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



కృష్ణ యజుర్వేదాంతర్గత

5     ఏకాక్షర ఉపనిషత్

అధ్యయన పుష్పము

తపో-ధ్యాన ఉపాసనాదులను చక్కగ నిర్వర్తిస్తూ, ఒకానొక శిష్యుడు- ‘బ్రహ్మతత్త్వము’ గురించిన పరిజ్ఞానము కొరకై, భక్తి-ప్రపత్తులతో కూడిన హృదయుడై, - నమస్కరించుచున్న ముకుళిత హస్తములతో - సద్గురువగు మహర్షిని సమీపించి, పాదాభివందనములు సమర్పించారు.

┄ ┄ ┄

మహర్షి : బిడ్డా! సహజ-ఆత్మానందస్వరూపా! నీకు శుభమగుగాక! చెప్పవయ్యా! ఏమిటి విశేషము?

శిష్యుడు : మహాత్మా! కోఽహమ్? నేనెవ్వరు? ఈ విషయము తెలుసుకోవటానికై సద్గురువరేణ్యులగు మిమ్ములను శరణువేడుచున్నాను.

తత్ త్వమ్ - తత్త్వ దర్శనమ్

మహర్షి :

శ్లో।। ఏకాక్షర సమారూఢం సర్వాత్మకమ్ అఖండితమ్
సర్వవర్జిత చిన్మాత్రం త్రిపాత్ నారాయణం భజే!

ఏకము - అక్షరము అగు ఏ పరమాత్మ పరాకాష్ఠ పదమునందు ఆరూఢులై ఉన్నారో… ఎవ్వరు అఖండము - సర్వాత్మకము అయి ఉన్నారో, ఎవ్వరు తెలియబడునంతటినీ దాటినట్టి ‘కేవల చిన్మాత్ర స్వరూపులు’ అయి ఉన్నారో…, అట్టి శ్రీరామచంద్రమూర్తిని భజించుచున్నాను. నాయనా! ‘నేనెవ్వరు?’ అని అడుగుచున్నావు. మంచిదే! నీకు సంబంధించిన ఏ వివరములను నీవు తెలుసుకోతలచావు?

శిష్యుడు : స్వామీ! నా యొక్క సహజము - సత్యము - నిత్యములగు స్వరూప-స్వభావములు ఎట్టివి? నేను జీవాత్మవా? పరబ్రహ్మమునా? మరింకేదైనానా? దయచేసి సత్యదృష్టితో నిర్వచించి చెప్పండి!

మహర్షి : నాయనా! నీవు అడిగిన ప్రశ్నకు మహర్షుల స్వానుభవ ప్రవచనమగు భారతీయ (జ్ఞానమునందు రతింపజేయు) తత్త్వశాస్త్రము సుస్పష్టముగా, నిర్దుష్టముగా సమాధానము చెప్పుచున్నది కదా! తత్ త్వమ్ ఏవ - ఇతి సశాస్త్రీయ సవివరణమితి తత్త్వశాస్త్రమ్।

నీకు ‘జీవాత్మ’గా అనుభవమగుచున్నదంతా సందర్భ సత్యము మాత్రమే! అనేక నాటకములలో నటించు ఒక మహానటునికి సంబంధించిన (తాను ఇప్పుడు నటించే) ఒక పాత్ర విశేషములు ఎటువంటివో, నీకు సంబంధించి ఈ వర్తమాన జగత్తులో కనిపించే జీవాత్మత్వమంతా అటువంటిది మాత్రమే!
- నీ సహజ రూపము సర్వదా పరబ్రహ్మమే!
- పరబ్రహ్మము సర్వదా ఏకము - అక్షరము అయి ఉన్నది. అట్టి ఏకాక్షరస్వరూపమునకు నీవు వేరుగా ఎట్లా ఉంటావు? ఒకవేళ వేరుగా ఉంటే అది ఏకము ఎట్లా అవుతుంది? కనుక నీవు - నేను - వారు - వీరు… మనమంతా ఏక-అక్షర స్వరూపులమే.

అనగా…,
ఏ క్షణమందూ కూడా అనేకము కానట్టిది (సర్వదా ఏకమే అయినట్టిది), ‘నాశనము’ అను ధర్మమే లేనట్టిది (అక్షరము).. అగు పరబ్రహ్మమే నీవు! పరబ్రహ్మమునకు నీవు-నేను మొదలైన ఖండత్వమే లేదు! కనుక తత్ త్వమ్! నీవు సర్వదా పరబ్రహ్మమువే!

శిష్యుడు : ‘తత్త్వమ్’, ‘సోఽహమ్’ శబ్దములచే నాకు వేద-ఉపనిషత్తులు ఎలుగెత్తి గుర్తుచేస్తున్న - నాయొక్క సహజమగు, నిత్యమగు ‘స్వస్వరూపమే’ అని చెప్పబడుచున్న పరబ్రహ్మము ఎట్టిది? ఏమై ఉన్నది?.. నాకు బోధించవలసినదిగా మిమ్ములను శరణువేడుతూ అర్థిస్తున్నాను.

మహర్షి : అట్లాగా? అయితే నీకు, నాకు ప్రతి ఒక్క శ్రోతకు, ప్రతి ఒక్క జీవునికి కూడా సంబంధించిన పరమ సత్యము, సహజ సత్యము (తత్) అగు పరబ్రహ్మము గురించి ‘త్వమ్’ వివరణపూర్వకంగా కొన్ని విశేషాలు చెప్పుచున్నాను. శ్రద్ధగా వినెదవుగాక!

నీవు (త్వమ్) సర్వదా పరబ్రహ్మ స్వరూపుడవే అయి ఉన్నావు (తత్ త్వమ్ అసి).

సోమ (చంద్ర-మనో) రూపుడవై దేహములోని సుషుమ్నానాడి యందు ఏక-అఖండ స్వరూపుడుగా వెలుగొందుచున్నావు.

ఈ కళ్లకు కనబడుచున్న విశ్వమంతా ఏ స్థానములో ఏర్పడినదై ఉన్నదో, అది నీ ఆత్మస్వరూపమే! ‘కేవలాత్మ’వై యున్న నీవు - నీయందు నీవే - నీకు అన్యము కానట్టి ‘జగత్ కల్పనా చమత్కారము’ను ఆస్వాదిస్తున్నావు.

నీ సహజ స్వరూపము సర్వదా బ్రహ్మమే! అందచేత పంచభూతముల - సకల భూతముల నియామకుడవు! ‘బ్రహ్మము’ అయి ఉన్నట్టి నీవే జగత్తురూపుడవు కూడా! జగత్తు- జగత్తులో కనిపించే నీ జీవాత్మత్వము కేవలము నీపట్ల సందర్భ సత్యము మాత్రమే!

జన్మకర్మలకు కూడా మునుముందే ఉన్న సత్-స్వరూపుడవు కాబట్టి కేవల పురుషకారమువు! ఆది పురుషుడవు! ఆది నారాయణుడవు! ఇతః పూర్వము - ఇప్పుడు కూడా యథాతథమై, సర్వమునకు పురుషకార స్వరూపుడవై ఉన్నావు. కనుక పురాణ పురుషుడవు! మేఘము నుండి వర్షధారలు కురియుచున్న తీరుగా, ఈ కనబడే జీవులంతా వర్షిస్తున్నది నీ ఆత్మస్వరూపము నుండే! అందుచేత కూడా పురాణపురుషుడవుగా చెప్పబడుచున్నావు!

అనేకముగా కనిపిస్తూ కూడా, సర్వదా ఏకస్వరూపుడవే అయి ఉన్నావు! సర్వజీవులలో వేంచేసియున్న ఆత్మస్వరూపుడవు కాబట్టి సర్వాత్మకుడవు! సర్వ భువనములకు భావనారూప పరిపోషకుడవు, సంరక్షకుడవు! సజాతీయ-విజాతీయ భేదమనునది ఏమీ లేనట్టివాడవు. కనుక ఏకస్వరూపుడవు!

‘విశ్వము’ అను రచనా వ్యాసంగమునందు (లేక) కల్పనా వ్యవహారమునందు నిమగ్నమై యుండి కూడా నీవు సర్వదా విశ్వమునకు వేరైనవాడవు. అయితే విశ్వము నీస్వరూపమే! ఇక్కడి సృష్టి-స్థితి-లయలు నీ క్రియా విశేషాలే! ‘సృష్టించుట’ అను పురుషకార - క్రియావిశేషమునకు ‘సృష్టికర్త’ అను కర్తృత్వ - పదవిని అలంకరించియున్నది ఆత్మస్వరూపుడవైన నీవే! సృష్టి రచయితవు. నీ కల్పన అగు సృష్టి యొక్క రాకపోకలన్నీ ఎరిగి ఉన్నవాడవు. దీనికంతటికీ కవివి। శ్రేష్ఠుడవు. అంతేకాదు. ఈ భువనములంతటికీ నాథుడవు, యజమానివి కూడా!

ఈ సృష్టి అంతా నీకు లీల! క్రీడ! సృష్టికి ప్రారంభము - కొనసాగింపు - ముగింపు- పునఃప్రారంభము… ఇవన్నీ క్రీడా వ్యాసంగమువలె నీయందే జనిస్తున్నాయి. నీవు జన్మిస్తూ కూడా జన్మరహితుడవు. ఆత్మానంద విన్యాసముగా దీనికంతటికీ ఆవల ఉన్న నీకు జన్మలు లేవు. నీవు అజాతుడవు! సృష్టించటము - స్థితింపజేయుటము-లయింపజేయుటము ఎరిగియున్నవాడవు! ఈ సృష్టి నీ కల్పనయే కాబట్టి జనించినట్టి ఈ సర్వము యొక్క తత్త్వమునకు మునుముందే ఉన్నావు. అందుచేత అగ్రసత్ - చిత్ స్వరూపుడవు. ఈ సృష్టికి ముందే ఉండి, ఈ సృష్టిని ఆమూలాగ్రమూ నీ స్వరూపముచే స్వయముగా నింపి ఉంచుచున్నవాడవు. అందుచేత హిరణ్య రేతస్సు రూపుడవు. బంగారు ఆభరణమంతా బంగారముతో నిండిఉన్న రీతిగా ఇదంతా నీ హిరణ్య తేజోవిలాసముతో నిర్మితమై, నిండి ఉన్నది.

ఈ ‘సృష్టి’ అనే మహాయజ్ఞమునకు యజ్ఞ స్వరూపుడవు! యజ్ఞ పురుషుడవు నీవే! ఈ సృష్టి అంతటికీ నియామకులను నియమించువాడవు. ఆ ఏకైక నియామకడవు, ఏక విభుడవే నీవు! సృష్టి ప్రారంభం కాకముందు నీవు ఉన్నావు! ఇదంతా నీ సృష్టియే కనుక, … సృష్టికి మునుముందుగానే ఉన్నావు! తరువాత కూడా ఉన్నావు. ఇప్పటికీ ఉన్నావు. ఎప్పటికీ ఉంటావు. ఇద్దాని పురుష కారమంతా నీదే! అందుచేత పురాణ పురుషుడవు! నీ యొక్క ఏకత్వము నుండే నీ యొక్క నీ మాయచే ఇక్కడి అనేకత్వమంతా కల్పనగా నియామకమగుచున్నది. అందుచేత కూడా నీవు ఏక - విభు - కేవలపురుషుడవు! దీనికంతటికీ అధికారివి! అధిపతివి! అధినాయకుడవు! అధిప్రదర్శన రూపుడవు! అధికారణుడవు! ‘మాయి’వీ నీవే! ‘మాయ’వూ నీవే! (మాయి = మాయ తనదైనవాడు).

ఈ విశ్వమంతటికీ సంప్రదర్శన కారణమగు ప్రాణశక్తి నీనుండియే బహిర్గతమౌతోంది. అందుచేత ప్రాణ ప్రసూతివి! ఈ లోకములన్నిటికీ జనన స్థానమగు యోనివి! నీ యొక్క 4వ వంతు విభాగముతో ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న విష్ణువు. ఇదంతా నీ యొక్క ఏకపదముచే విస్తరించి ఉన్నట్టిది. వ్యాప్తం త్వయా ఏకపదేన విశ్వమ్! ఇల్లుకు ఆధారము భూమి అయి ఉన్న తీరుగా…, ఈ విశ్వమంతటికీ నిర్మితమైయున్న ఆధార స్థానమువు! విశ్వగర్భమూ నీవే! ఆ గర్భములోని జీవరాసులను - కోడి తన పిల్లలవలె - కలిగియున్నదీకూడా నీవే!

ఈ సృష్టి మొత్తము ఒక బాణము వంటిదైతే, అద్దానికి ధనస్సు నీవే! ఆ ధనస్సును ఉపయోగిస్తూ సృష్టి బాణమును ఎక్కుపెట్టి విడచుచున్న విలుకాడివి కూడా నీవే!

అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబము యొక్క లేత సప్తరంగుల కిరణ సమూహములు వ్యాపించి ఆకాశమును భూమిని తేజస్సుతో నింపి వేయుచున్నాయి కదా! అట్లాగే హిరణ్యగర్భుడవుగా సర్వజీవులు యొక్క మనో-బుద్ధి-చిత్త-అహంకారములుగా వ్యాపించుచున్నావు.

గరుత్మంతుడు ఆకాశమంతా విహరిస్తున్న తీరుగా నీవే భూత-చిత్త-చిదాకాశములలో విహారము చేస్తూ ఉన్నట్టివాడవు. నీవే దేవతల నాయకుడగు కుమారస్వామివి! భక్తి-యోగ-జ్ఞానసాధకుల అరిష్టములను తొలగించు అరిష్టనేమివి! విష్ణు భగవానుడవు!
వజ్రాయుధమును ఎడమచేతితో ధరించి మూడు లోకములను కుడిచేతితో శాసించుచూ పరిపాలించుచున్న పురాణ పురుషుడగు ఇంద్రభగవానుడుగా ఉన్నది నీవే!

సర్వజీవజాలమునకు (భూతజాలమునకు), పంచభూతములకు అధినేతవు! అందుచేత ‘భూతపతి’ అయి ఉన్నావు. త్వమేవ కామః। నీ ఇచ్ఛయే ఇదంతా! త్వమేవ శివః। సర్వ హృదయాలలో సంచారము చేస్తున్న మనోరూపుడగు సోమదేవతవు! సర్వజీవులకు హితుడవు!

దేవతలకు సమర్పించబడుచున్న ‘హోమద్రవ్యములు’ అయినట్టి ‘స్వాహా’, పితృదేవతలకు సమర్పించబడు పితృహోమద్రవ్యములైనట్టి ‘స్వథా’… వీటన్నింటితో కూడిన వషట్‌కారుడవు! సమస్తమునకు లయస్తానమగు రుద్రభూమిని ఏలుచున్న రుద్రుడవు! సర్వ దేహుల హృదయాలలో సాక్షివై వెలుగొందుచున్న రుద్రభగవానుడవు!

ఈ సృష్టి కంతటికీ కర్తవు! ధాతవు! సృష్టిని నియమమునందు ఉంచువాడు! విధి-విధానముల కల్పించే విధాతవు! విశ్వమంతా భావ-తరంగములతో నింపుచున్న వాయు భగవానుడవు! ఊర్ధ్వ సప్త - అధో సప్త - సప్త సప్త లోకములు నీ యొక్క రెండు రెక్కలవంటివి!

స్వప్నములో స్వప్నద్రష్ట యొక్క స్వకీయ స్వప్నచైతన్యమే నిండి ఉన్న విధంగా, ఈ జగత్తునంతా స్వస్వరూప జాగృత్-చైతన్యముతో నింపిఉంచుచున్నావు. అందుచేత విష్ణు తేజో విలాసుడవు.

సర్వజీవులలో ‘నేను-నేను’ అను రూపముతో ప్రత్యక్షమై ఉండటము చేత నీవే వరాహరూపుడవు! కదలని చెదరని కొండవు. కొండపై చెట్లు గాలికి కదలుచూ, కొండ కదలని రీతిగా - నీయొక్క ప్రాణ - మనోశక్తులచే సర్వము కదల్చుచూ, నీవు మాత్రమూ కదలిక లేనివాడవై ఉంటున్నావు.

కాలము యొక్క రాత్రింబవళ్లు నీ యొక్క రూపవైశిష్ఠ్యమే! జరిగిపోయిన భూతకాలము-జరుగబోవు భవిష్యత్ కాలము - ఉభయములోని అనేక సంఘటన-సందర్భ-పరస్పర సంబంధ విశేషాలతో సహా-జనిస్తున్నది, లయిస్తున్నది నీనుండే, నీయందే! సర్వము ఎందులో వర్తమానములో ఏర్పడినదై కనబడుచున్నదో… అది కూడా నీ స్వరూపమే! అందుచేత నీవు అనిర్వచనీయమగు కాల స్వరూపుడవు.

ఈ సృష్టి - స్థితి-లయములతో కూడిన మహాక్రతువు నీరూపమే. విశ్వములోని అక్షయమగు, అక్షరమగు క్రతు స్వరూపుడవు. ఋగ్వేదములోని ఋక్కులు, యజుర్వేదములోని యజస్సులు, సామవేదములోని గానములు నీ ముఖతః, నీ ముఖము నుండే వర్షించి ప్రదర్శనశీలమగుచున్నాయి.

ఒకానొక చక్రవర్తి సభలో సింహాసమును అధిష్ఠించి సామ్రాట్ అయి-సర్వాధికారముతో ప్రశాంతముగా ఆశీనుడై ఉండగా, మంత్రులు-సైనికాధికారులు - గ్రామాధికారులు మొదలైన వారు ఆ చక్రవర్తి యొక్క ఉద్దేశ్యమును గ్రహించి సభలో జరుగవలసినదంతా జరిపిస్తూ ఉంటారు కదా! అట్లాగే నీవు మహాసామ్రాట్‌వై ‘పరబ్రహ్మము’ అను సింహాసనముపై పరతత్త్వ స్వరూపుడవై అధిష్టించియుండగా.. అష్టదిక్పాలకులు, నవగ్రహ అధినేతలు, త్రిమూర్తులు మొదలైన వారంతా ఈ సృష్టినంతా నడిపించుచూ మౌనస్వరూపమగు నీ ఉద్దేశ్యములను నెరవేర్చుచున్నారు.

సర్వసంకల్పములకు ఆవల సంకల్పములు జనించు స్థానమగు వసువువు! ఆకాశము-ఆకాశములోని అష్టవసువులు (అవుడు, ధ్రువుడు, సోముడు, ఆధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు) నీ నుండి బయల్వెడలిన సంకల్ప విశేషములే కాబట్టి.., ఇదంతా నీకు అభిన్నము.

ఈ సృష్టి మహాయజ్ఞమునకు యజ్ఞకర్తవు! యజ్ఞనేతవు। యజ్ఞ భోక్తవు! యజ్ఞ వాటికలో సమర్పించబడు ‘నేయి’ మొదలైన హుతములను స్వీకరించుచున్న అగ్నిస్వరూపుడవు! హుతమును స్వీకరించు హుతభుక్‌వు! ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, దేవతాగణము, దైత్యగణము కూడా నీవే! దేవాది దేవుడవై ఆకాశగతుడవై ఆకాశములోని సర్వ పరిభ్రమణములకు ఆధారభూతుడవై ఉన్నట్టివాడవు. అనేక రూపములతో సంచరించుచున్నవాడవు!

నీవు అనిరోధివి! సర్వ దేహులలో కేవాలత్మవై సర్వదా వెలుగొందు నీయొక్క ఉనికిని ఎవ్వరూ నిరోధించలేరు. తిరస్కరించలేరు. తపస్సు మొదలైన భౌతికమైన ప్రయత్నములచే నిన్ను ఎవ్వరూ దాటలేరు. నీయొక్క హిరణ్మయ తేజోకిరణములు చైతన్యస్రవంతి రూపముతో ఆకాశమునందు అంతటా వ్యాపించిఉన్నాయి. అట్టి చైతన్యాత్మ తేజోకిరణములన్నిటికీ మహత్తరమగు నాభిస్థానమై ఉన్నట్టివాడవు కూడా!

స సర్వ వేత్తా! నీవు జన్మ-జీవన్-మృత్యు తతంగములకు ఆవల-ఈవల ఏర్పడి ఉన్నవాడవై సర్వమును స్వకీయ-‘చిత్’ చమత్కారముగా ఎరిగియే ఉన్నట్టివాడవు! సర్వమును ఆక్రమించుకొని, అధిగమించి ఉన్నవాడవు.

భువనస్య గోప్తా! నీయొక్క భావనలే సర్వలోకముల మూలరూపము. భావనారాయణ స్వరూపుడవు. పరబ్రహ్మ స్వరూపుడవగు నీవే సర్వలోక రక్షకుడవు! బ్రహ్మాండమునకు నాభిస్థానమువు! సర్వజీవులు నీ యొక్క అంతరహృదయ - రహస్య స్వరూపమే అయి ఉన్నారు. పూదండలో దారమువలె సర్వజీవులను పుష్పములుగా కలిగియున్న మహాపుష్పమాలికా ధారుడవు. జ్ఞానానంద స్వరూపుడవు! సర్వజీవులలో ప్రజ్ఞాస్వరూపుడవై ప్రకాశించుచున్నట్టివాడవు. జీవసృష్టికి కారకుడవైన ప్రజాపతివి! సర్వ సంభాషణా స్వరూపుడవు! ఛందోమయుడవు! భాషకు ఛందస్సు వలె సర్వజీవుల గర్భస్తుడవు!

సామవేదము→ ‘‘చిదంతుడు, చిత్-(ఎరుక)కు ఆవల ప్రకాశించుచున్నవాడు’’ → అని గానము చేస్తున్నది నీ స్వరూపము గురించే! రజోగుణము ప్రదర్శిస్తూనే.. రజోగుణ రహితుడవు! తమోగుణము కలవాడవు, లేనివాడవు కూడా!

త్రిగుణములు నీనుండి బయల్వెడి, నిన్ను ఆశ్రయించుకొని ఉండి, నీలోనే లయిస్తున్నాయి. దృశ్య - దేహ - ఇంద్రియ - ఇంద్రియార్థ - మనో - బుద్ధి - చిత్త - అహంకారాల కంటే కూడా సర్వశ్రేష్ఠుడవు! ప్రాముఖ్యుడవు! తెలుసుకొనవలసినట్టి స్వస్వరూపాత్మను ఎరిగియే ఉన్నట్టివాడవు! అందుచేత వేదవిదశ్రేష్ఠుడవు! యజ్ఞ విధులను ఎరిగిన ఆధ్వర్యులు యజ్ఞమంత్రములచే యజ్ఞమునందు స్తోత్రము చేస్తున్నది నీ స్వరూపము గురించే! యజుర్వేదమంత్రములచేతను, యజుర్వేదముచే ప్రవచితము అగుచున్న యజ్ఞముల చేతను, క్రతువిధానములచేతను స్తోత్రము చేయబడుచున్న, ఉపాసించబడుచున్న వేదాంత స్వరూప మహాపురుషుడవు నీవే!

జగత్తులో స్త్రీ-పురుషుడు-కుమారుడు-కుమార్తెల రూపముగా ఉన్నది నీవే! అనేకముగా కనిపిస్తూ సర్వదా అఖండ - ఏకైక స్వరూపుడవు! ఈ భూమిగా కనిపిస్తున్న నీవే! నీయొక్క సృష్టికర్తవు నీవే! ఈ సృష్టిలో పంచభూతముల సమ్మేళనమంతా నీయొక్క సంప్రదర్శనమే!

వర్షించుదానిలో వర్షధారల రూపుడవు! వర్షమునకు రాజువు! వరుణుడవు! రాజాధి రాజువు! సంవత్సర స్వరూపుడవు! అగ్నివి! పితృదేవతలకు అధినాయకుడగు అర్యముడవు! ఏవమ్ సర్వమ్ త్వమేవ! ఈ సర్వము నీవే! సర్వముగా కనిపిస్తున్నదానికి నీవే కేవల సర్వసాక్షివి కూడా!

ఆకాశంలో సహస్ర కిరణ విశేషములలో ప్రకాశించుచున్న సూర్యభగవానుడవు! ఊర్ధ్వ-అధోలోకములను రెక్కలుగా కలిగి ఉండి, చిదాకాశమునందు విహారములు సలుపుచున్న ఆత్మానంద స్వరూప గరుత్మంతుడవు!

సర్వుల మనస్సులు అమర్చబడిన మహామనోస్వరూపుడవు! చంద్రుడవు! ఇంద్రియములన్నిటికీ అంతర్గత శక్తి ప్రదాతవు కాబట్టి ఇంద్రుడవు! సర్వము నీనుండే వర్షించుచుండుటచే వరుణుడవు! సర్వమును శాసించువాడవు కనుక రుద్రుడవు! ఈ భావనా రూపజగత్ సర్వవిశేషములన్నీ లయింపజేయు లయకారుడివి కూడా కాబట్టి, రుద్రుడవు! త్వష్టుడవు! జగత్తు - జగత్ రాహిత్య ఉభయములను నీయందు సర్వదా ఇముడ్చుకొనియున్న మౌన వాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ స్వరూపుడవు.

సర్వమునందు ఉనికి గలవాడవు కాబట్టి, విష్ణువువు! సర్వమునకు పరిపోషకుడవు, పరిరక్షకుడవు కూడా కాబట్టి, జిష్ణువువు! అసంఖ్యాక జీవులకు త్రాణను ఇచ్చు క్షీరప్రదాతవు కాబట్టి, గోవువు! ఇంద్రియములను పాలించువాడవు కనుక, గోపతివి!

విష్ణువువై సర్వ జీవులకు జీవత్వము కొరకై రక్షణ కల్పించుచున్నావు. దైత్యులను ఆక్రమించి శిక్షించుచు, శిష్టులను రక్షించుచున్న విష్ణువు నీవే! ఆత్మ ధర్మమును ఎలుగెత్తి ప్రకటించు ధర్మరక్షకుడవు.

ఈ ‘జగత్తు’ అనబడునది నీ గర్భమునందే జనిస్తోంది! ఈ భూలోకమంతా నీ స్వరూపమే! భువర్లోకము, సువర్లోకము కూడా నీవే! సర్వము నీ కారణంగా నీయందే జనిస్తోంది. నీవు స్వయంభూః। నీ జన్మ-కర్మలకు నీవే కారణము! నీకు మరొక కారణమేమీ లేదు. అకారణుడవు! అందుచేత స్వయంభువువు! ఈ విశ్వమంతా నీకు ముఖముగా అగుచున్నది! విశ్వముఖుడవు!

సర్వహృదయ గుహలలో ఉనికి కలిగియున్న వాడివై సర్వము ఎరుగుచు, ఎవ్వరికీ తెలియబడనివాడవై ప్రవర్తిల్లువాడవై ఉన్నావు! అసంగతుడవు. అమేయుడవు. మనస్సుకు వాక్కుకు అప్రాప్యుడవు.

సర్వమునకు నియామకుడవు! ప్రభువువు! విభువువు! పురుషుడవు! పురుషోత్తముడవు! ఆది పురుషుడవు, పురాణపురుషుడవు!

సర్వభూతజాలముల దృష్టులన్నీ నీ మహత్‌దృష్టి వినోద చమత్కారమే! దృష్టికర్తవు! సృష్టికర్తవు! ద్రష్ట నియామకుడవు!

బుద్ధిమంతులలో ప్రకాశించుచున్న కేవల బుద్ధి స్వరూపము నీయొక్క మహాబుద్ధి ప్రదర్శనా విన్యాసమే!

బుద్ధిమంతుల (యోగుల - జ్ఞానుల - భక్తుల) అంతిమ విశ్రాంతి స్థానము, పరమాగతి నీవే!

అట్టి నీకు హృదయపూర్వకంగా మౌనంగా సర్వదా నమస్కరించుచున్నాను!

┄ ┄ ┄

ఎవ్వరైతే ‘త్వమ్’ అను ‘నీవు’ను ఈ విధంగా పరమతత్త్వముగా, ఆత్మభావనాదృష్టితో ఎరుగుచున్నవారై ఉంటారో..,
‘త్వమ్’గా కనిపించే దానిని ఈ ఉపనిషత్ భావన - అంతరార్థములతో దర్శిస్తూ ఉంటారో….,
- వారే తత్త్వదర్శులు
- అట్టి ఆశయము కలిగి చరించువారు బుద్ధిమంతులు.



🙏 ఇతి ఏకాక్షర ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।