[[@YHRK]] [[@Spiritual]]

Garbha Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting) - CAUTION: Incompatible with the slokas in the book.


కృష్ణ యజుర్వేదాంతర్గత

11     గర్భోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్



యద్గర్భోపనిషద్వేద్యం గర్భస్య స్వాత్మబోధకం ।
శరీరాపహ్నవాత్సిద్ధం స్వమాత్రం కలయే హరిం ॥
శ్లో।। యత్ గర్భోపనిషత్ వేద్యమ్ గర్భస్య స్వాత్మ బోధకమ్
శరీరాపహ్నవాత్ సిద్ధమ్ స్వమాత్రమ్ కలయే హరిమ్।।
గర్భస్థ శిశువు యొక్క యోచనారీతిని, శరీరము పొందినందుకు ఉపయోగించుకొనువలసిన విధిని, జీవిత యజ్ఞతత్త్వమును బోధించే ‘‘గర్భోపనిషత్’’ను అధ్యయనము చేయువాడు ఆ శ్రీహరిని స్వ ఆత్మరూపముగా దర్శించగలడు.


ఓం పంచాత్మకం పంచసు వర్తమానం షడాశ్రయం
షడ్గుణయోగయుక్తం ।
తత్సప్తధాతు త్రిమలం ద్వియోని
చతుర్విధాహారమయం శరీరం భవతి ॥
ఓం
1 పంచాత్మకమ్। పంచ సువర్తమానమ్।
‘షట్’-ఆశ్రయమ్, ‘షట్’-గుణ యోగయుక్తమ్।
తమ్ సప్త-ధాతుమ్। త్రి-మలమ్। త్రి-యోనిమ్।
చతుర్విధ(4) ఆహారమయమ్ శరీరమ్ ।।
ఓంకారరూప పరమాత్మా! నమస్కరించుచున్నాము.
ఈ భౌతిక దేహము→ ఐదు వస్తువులతో తయారైనది. పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు కలిగినదై వర్తిస్తోంది. ఆరింటిని ఆశ్రయించి ఉంటోంది. ఆరు గుణములతో కూడి ఉంటోంది. సప్తధాతువులు ఇందులో ఉన్నాయి. మూడు మలములు, మూడు యోనులు కలిగి ఉన్నది. (భక్ష్య-భోజ్య - చోహ్య-లేహ్యములనబడే) నాలుగు రకాల ఆహారాలు ఇది స్వీకరిస్తూ ఈ దేహము జీవనము కొనసాగిస్తోంది.

పంచాత్మకమితి కస్మాత్ పృథివ్యాపస్తేజోవాయురాకాశమితి ।
అస్మిన్పంచాత్మకే
శరీరే కా పృథివీ కా ఆపః కిం తేజః కో వాయుః కిమాకాశం ।
తత్ర యత్కఠినం సా పృథివీ యద్ద్రవం తా ఆపో యదుష్ణం
తత్తేజో యత్సంచరతి స వాయుః యత్సుషిరం తదాకాశమిత్యుచ్యతే ॥
2 భవతి పంచాత్మకమ్ ఇతి కస్మాత్?
3 పృథివి ఆపః తేజో వాయుః ఆకాశాత్
ఇతి అస్మిన్ పంచాత్మకే శరీరే।।
పంచాత్మకము అనగా?
(1) పృథివి (భూమి) (2) ఆపః(జలము) (3) తేజస్సు (4) వాయువు (5) ఆకాశము - వీటినే ‘పంచాత్మకము’ అనే పేరుతో చెప్పుచున్నారు. ఈ 5 కూడా ఈ శరీర నిర్మాణమునకు మూలపదార్థములు.
4 కా పృథివీ? కా ఆపః?
కిం తేజః? కో వాయుః? కిమ్ ఆకాశమ్?
.. ఇతి అస్మిన్ పంచాత్మకే శరీరే।
పృథివి - జలము - తేజస్సు - వాయువు - ఆకాశము.. అనగా ఏమి? ఈ పంచాంశక (సమన్విత) శరీరములో అవి ఏఏ రూపములుగా ఉన్నాయి?
5 యత్ కఠినమ్.. సా పృథివీ।
యత్ ద్రవమ్ తత్ ఆపో।
యత్ ఉష్ణమ్ తత్ తేజో।
యః సంచరతి స వాయుః।
యత్ సుషిరమ్ తత్ ఆకాశమ్।
ఇతి ఉచ్యతే।
పృథివి - కఠినంగా ఉండేది - Solid.
ఆపో - ద్రవముగా ఉండేది - Liquid.
తేజస్సు - ఉష్ణముగా ఉండేది - Heat / Light.
వాయుః - చలనము - స్పందము - Vibration / Movement.
ఆకాశము - స్థానము - (Placement and way out), ద్వారముగా ఉన్నది, సుషిరమ్ - వృద్ధిచేయునది (That from which all else develops)

తత్ర పృథివీ ధారణే ఆపః పిండీకరణే తేజః ప్రకాశనే
వాయుర్గమనే ఆకాశమవకాశప్రదానే ।
పృథక్ శ్రోత్రే శబ్దోపలబ్ధౌ త్వక్ స్పర్శే చక్షుషీ రూపే జిహ్వా రసనే
నాసికాఽఽఘ్రాణే ఉపస్థశ్చానందనేఽపానముత్సర్గే బుద్ధ్యా
బుద్ధ్యతి మనసా సంకల్పయతి వాచా వదతి ।
6 తత్ర పృథివీ (నామ)ధారణే,
ఆపః పిండీకరణే,
తేజో రూపదర్శనే,
వాయుః గమనే,
ఆకాశమ్ అవకాశ ప్రదానే,
శ్రోత్రమ్ శబ్దే,
త్యక్ స్పర్శే,
చక్షూ రూపే,
జిహ్వా రసే,
ఘ్రాణం గంధే,
వాక్ వచనే,
పాణిః ఆదానే,
పాదో గమనే,
పాయుః విసర్గే,
ఉపస్థ ఆనందే -
వర్తతే।।
పృథివి → ఆకారము కలిగి ఉంటోంది. నామధారిణి. పొడి రూపం. (Dry Powder)
ద్రవము → పొడిని పిండీకరణం చేస్తూ ఉన్నది. పొడిని సపిండీకృతం చేస్తోంది.
తేజస్సు → రూపములను దర్శింపజేస్తోంది.
వాయువు → గమనమును - చలనమును నిర్వర్తిస్తోంది.
ఆకాశము → అవకాశమును (space) ప్రసాదిస్తోంది.
చెవులు → వినటానికి, శబ్దము కొరకై,
చర్మము → స్పర్శానుభవము కొరకు,
చక్షువులు → చూడటానికి, (కళ్లు),
నాలుక → రుచిని ఆస్వాదించటమును,
ముక్కు → వాసన చూచుటయందును,
నోరు → మాటలు పలుకుట యందును,
చేతులు → వస్తువులను ఎత్తుట - పట్టుట యందును,
పాదములు → నడుచుటయందు,
పాయువు - విసర్జించుట యందు,
వర్తిస్తూ ఉన్నాయి.
7 బుద్ధ్యా బుద్ధ్యతి నిశ్చినోతి;
మనసా సంకల్పయతి - వికల్పయతి చ;
చిత్తేన సంజానాతి;
అహంకారేణ ‘అహం’ కరోతి;
తాని తాని తత్‌తత్ విషయేషు వర్తం
బుద్ధితో గ్రహించటం - నిర్ణయించటం (Understanding & Decision making) జరుగుచున్నది. మనస్సు సంకల్ప- వికల్పములు నిర్వర్తించుచున్నది.
చిత్తము-ఇష్టంగాను, సుతీక్షణామైన భావాల ఆవేశముతో అన్యమైనదంతా తెలుసుకొనుచున్నది. ఇష్ట-అయిష్టములు ప్రదర్శించుచున్నది.
అహంకారము - నేను -నేను ఇటువంటివాడిని. ఇవన్నీ కూడా నా మనోబుద్ధి చిత్తములు నాకు చెందినవి → అని భావన చేయుచున్నది.
అవన్నీ వాటివాటి విషయాలలో ప్రవర్తిస్తూ, స్పందిస్తూ, పాల్గొనుచూ ఉన్నాయి.

షడాశ్రయమితి కస్మాత్
మధురామ్లలవణతిక్తకటుకషాయరసాన్విందతే .
8 కుతః ‘షట్’(6) ఆశ్రయమ్ ఇతి?
‘షట్’ వై రసా : →
‘‘మధుః ఆమ్ల లవణ కటు కషాయ తిక్తాః।’’
తాన్ ఆశ్రయతే తైరపి ఆశ్రితమ్।।
ఈ దేహము ఆరింటిని ఆశ్రయించి ఉంటోందని అనుకున్నాం కదా? ఏమి ఆ ‘6’?
ఆ ‘6’ కూడా షట్ రసములు - రుచులు - ‘‘తీపి’’, ‘‘పులుపు’’, ‘‘ఉప్పు’’, ‘‘కారము’’, ‘‘వగరు’’, ‘‘చేదు’’, రుచులు…. ఈ దేహమును ఆశ్రయించి ఉన్న రసానుభూతి తత్త్వములు.
ఈ శరీరము ఈ ఆరు రసములను ఆశ్రయించి ఉంటోంది. అవి ఈ శరీరమును ఆశ్రయించి ఉంటున్నాయి కూడా!
9 షడ్వై(6) భావ వికారా
అస్తి; జాయతే;
వర్ధతే; పరిణమతే;
అపక్షీయతే; వినశ్యతి
ఇతి భవతి విక్రియతే చ।।
షట్ భావ వికారాలు ఏమై ఉన్నాయి?
(1) ఉండటం (2) కలగటం/ప్రత్యక్షమవటం/పుట్టటం (3) వృద్ధి పొందటం (4) పరిణతి - పరిపక్వమవటం (5) అపక్షయం పొందటం - కృశించటం (6) నశించటం..
ఈ షట్ వికారములు ఈ దేహము పొందుచుండటం జరుగుతోంది.
(ఉనికి, జననము, వృద్ధి, పరిణతి, అపక్షీయము, వినాశనము) - ‘6’
10 షడ్వై చక్రాణి
మూలాధార; స్వాధిష్ఠాన;
మణిపూరక; ఆగ్నేయ (ఆజ్ఞా);
అనాహత; విశుద్ధాని;
తత్థమ్ అన్య ఆశ్రితమ్।।

ఈ దేహములో ‘షట్’ చక్రములు ఉన్నాయి.
(సహస్రారస్థానము), (6) అజ్ఞా(గా) చక్రము, (5) విశుద్ధచక్రము, (4) అనాహత చక్రము, (3) మణిపూరకము, (2) స్వాథిష్ఠానము, (1) మూలాధారచక్రము
ఈ ఆరు చక్రములు శక్తి స్థానములై ఆయా ఆరు నాడులను ఆశ్రయించినవై ఉన్నాయి.
గర్భ-ఉపనిషత్-దేహములో-ఆరు-చక్ర-స్థానములు

11 షట్ (6) అవగుణాః -
కామాదయః।
శమాదయః చ (శమాదయశ్చ) గుణాః।
తత్ యోగసన్నిష్ఠా, తయా చ యుక్తమ్।।
ఆరు అవగుణములు - ఈ దేహమును వెంటనంటి ‘ఆరు’ అవగుణాలు ప్రదర్శనమగుచున్నాయి.
కామము - క్రోధము - లోభము - మోహము- మదము - మాత్సర్యము (6).

ఆరు సద్గుణాలు - శమము; దమము; తితీక్ష; ఉపరతి; శ్రద్ధ; సమాధానము(6)
ఈ ఆరు షడంగములు, యోగసాధన యొక్క ‘ఆరు’ అంగములు. ఇవన్నీ వాటి వాటి నిష్ఠతో దేహములో చేరి, ఏర్పడినవై ఉన్నాయి. అనగా, పరమాత్మతో సంనిష్ఠను ఈ ఆరు ప్రసాదిస్తూ యోగిని యుక్తునిగా తీర్చిదిద్ద గలవు.

షడ్జర్షభగాంధారమధ్యమపంచమధైవతనిషాదాశ్చేతి .
ఇష్టానిష్టశబ్దసంజ్ఞాః ప్రతివిధాః సప్తవిధా భవంతి .. 1..

var ప్రణిధానాద్దశవిధా భవంతి.
శుక్లో రక్తః కృష్ణో ధూమ్రః పీతః కపిలః పాండుర ఇతి .
సప్తధాతుమితి కస్మాత్ యదా దేవదత్తస్య ద్రవ్యాదివిషయా
జాయంతే ..

పరస్పరం సౌమ్యగుణత్వాత్ షడ్విధో రసో
రసాచ్ఛోణితం శోణితాన్మాంసం మాంసాన్మేదో మేదసః
స్నావా స్నావ్నోఽస్థీన్యస్థిభ్యో మజ్జా మజ్జ్ఞః శుక్రం
శుక్రశోణితసంయోగాదావర్తతే గర్భో హృది వ్యవస్థాం
నయతి .

హృదయేఽన్తరాగ్నిః అగ్నిస్థానే పిత్తం పిత్తస్థానే
వాయుః వాయుస్థానే హృదయం ప్రాజాపత్యాత్క్రమాత్ .. 2..
12 అథ చ, షడ్జ; ఋషభ;
గాంథార; మధ్యమ;
పంచమ; దైవత;
నిషాదా చ (నిషాదాశ్చ)
ఇతి ఇష్టా - అనిష్ట
శబ్ద సంజ్ఞాః
ప్రతివిధా భవంతి సప్త।।

శుక్లో; రక్తః కృష్ణో;
ధూమ్రః, పీతః, కపిలః
పాండర..,
ఇతి సప్త ధాతవత్ తత్ వర్ణాః।।
ఈ దేహము యొక్క గొంతు విభాగము నుండి బయల్వెడలు నాదము ‘6’ విధములుగా విభజించి చెప్పబడుచున్నాయి.
షడ్జము - ఋషభము - గాంధారము - పంచమ- (మధ్యమ) - దైవత - నిషాదము శబ్దములు - ‘7’ సంగీతనాదములను - సప్తస్వరములు (స-రి-గ-మ-ప-ద-ని) జనింపజేస్తున్నాయి. ఇవి ఆ దేహికి ఇష్టములైన - అయిష్టములైన శబ్దముల సంజ్ఞలుగా అగుచున్నాయి.

శబ్ద-అర్థ-అవగాహణ-శ్రుతి-అభిరుచులను అనుసరించి వీటిలో కొన్ని పరస్పర మధుర రూపంగాను, మిగిలినవి పరస్పర బాధిత రూపములుగా ఉంటున్నాయి.

ఏడు (7) ధాతువులు ఈ దేహములో అంతరమున ఏర్పడినవై ఉన్నాయి. (శుక్లము, బొమికలు, రక్తము, మాంసము, చర్మము, క్రొవ్వు- మజ్జ, నాడులు)
శుక్లము (తెలుపు); రక్తము (ఎరుపు); కృష్ణము (నలుపు), ధూమ్రము(బూడిద రంగు), పీతము (పసుపు రంగు); కపిలము (గోధుమ రంగు); పాండరము (ఎరుపు-నలుపుతో కలసిన తెలుపు) ఏడు రంగులతో ఆయా ధాతువులు ఉండి ఉంటున్నాయి.
13 కస్మాత్ యదా కస్యచిత్
ద్రవ్యవిషయా జాయంత, ఉపచీయంతే
పరస్పర రసగుణత్వాత్ వా
యోనిః - సా రసః।।
దేహంలో బాహ్యద్రవ్యములు (ఆహార పదార్ధములు మొదలైనవి) ప్రవేశించగానే రసతత్త్వ స్పందన జరుగుచున్నది. ద్రవ్యము - యోచనలనుండి దేహంలో ఒక్కొక్క రసగుణము ప్రకోపనమై ‘రసతత్వము’ అని చెప్పబడుతోంది. దేహములోని రసము కారణంగా రసాయనిక మార్పులు పొందుచుండగా అనేక ధాతుక్రమ భూత పదార్థాలు ఏర్పడి - వృద్ధి పొందుచున్నాయి.
14 షట్(6) విధో (షడ్విదో) రసోః
రసాత్ → శోణితమ్
శోణితాత్ → మాంసమ్।
మాంసాత్ → మేదో।
దేహములో ‘6’ విధములగు రసములు జనిస్తున్నాయి.
దేహములోని రసము నుండి → రక్తము,
రక్తము నుండి → మాంసము,
మాంసము నుండి → క్రొవ్వు,
మేదసో అస్థీని।
అస్థిభ్యో మజ్జా।
మజ్జాయా శుక్లం।
శుక్ల-శోణిత సంయోగాత్
ఆవర్తతే గర్భో
హృదివ్యవస్థామ్ నయతి।।
క్రొవ్వు నుండి → ఎముకలు,
ఎముకల నుండి → మజ్జ,
మజ్జ నుండి → శుక్లము ఏర్పడుచున్నాయి.
శుక్ల-శోణిత సంయోగముచే (పురుషాంశ-స్త్రీ అంశలచే) గర్భము (Pragnancy) కలుగుచున్నది.
గర్భమున జనించు శిశువులో నూతన ‘హృదయవ్యవస్థ’ - అంతా జనిస్తోంది.
15 హృదయేభ్యో అంతరాగ్నిః।
అగ్నిస్థానే పిత్తమ్।
పిత్తస్థానే వాయుః।
వాయుస్థానే హృదయమ్।

ఆ నూతన గర్భస్థ శిశువు హృదయస్థానములో.. అంతరాగ్ని
- ఆ అంతరాగ్ని స్థానములో ‘పిత్తము’.
- ఆ పిత్తము స్థానములో ప్రాణవాయువులు/శక్తి -
- ఆ ప్రాణవాయుశక్తి స్థానములో హృదయము ఏర్పడుచున్నాయి.


ఋతుకాలే సంప్రయోగాదేకరాత్రోషితం కలిలం భవతి .
ప్రాజాపతి ఋతుకాలే సంప్రయోగత,
ఏకరాత్రోషితం కలలమ్ భవతి।।
ప్రజాపతియగు బ్రహ్మదేవుని సృష్టి నియమానుసారంగా ‘ఋతు’కాలంలో స్త్రీ-పురుషుల సంయోగము చేత ఇదంతా జరుగుతోంది. పురుషుని నుండి శుక్లము, స్త్రీ నుండి శోణితము-ఈ రెండు స్త్రీ గర్భంలో ఏకము పొందినప్పుడు ఒక్కరాత్రి గడవగానే అది మీగడ వంటి ముద్ద - అగుచున్నది.

సప్తరాత్రోషితం బుద్బుదం భవతి .
అర్ధమాసాభ్యంతరేణ పిండో భవతి .
16 సప్త రాత్రోషితమ్ బుద్బుదమ్ భవతి।
అర్థమాస అభ్యంతరేణ పిండో భవతి।

ఆ పురుషాంశ శుక్లము-స్త్రీ అంశ శోణితముల మిశ్రమమగు మీగడ వంటి ముద్ధ:
- ఏడు రాత్రులు గడచేసరికి ఒక బుడగగా ఏర్పడుచున్నది
- అర్థమాసము - (15 రోజులు) గడిచే సమయానికి ఆ బుడగ ఒక పిండము (ద్రవపు ముద్ద) ఆకారముగా అగుచున్నది.


మాసాభ్యంతరేణ కఠినో భవతి .
మాసద్వయేన శిరః
సంపద్యతే మాసత్రయేణ పాదప్రవేశో భవతి .

అథ చతుర్థే మాసే జఠరకటిప్రదేశో భవతి .
పంచమే మాసే పృష్ఠవంశో భవతి .
షష్ఠే మాసే ముఖనాసికాక్షిశ్రోత్రాణి భవంతి .
సప్తమే మాసే జీవేన సంయుక్తో భవతి .
అష్టమే మాసే సర్వసంపూర్ణో భవతి .
17 మాసాభ్యంతరేణ కఠిణో భవతి।
మాసద్వయేన శిరః కురుతే।
మాసత్రయేణ పాదప్రదేశో భవతి।
అథ చతుర్థే మాసే గుల్భ జఠర కటి ప్రదేశో భవతి।

పంచమే మాసే పృష్ఠవంశో భవతి।
షష్ఠే మాసే ముఖ - నాస-అక్షి-శ్రోత్రాణి భవంతి।
సప్తమే మాసే జీవసంయుక్తో భవతి।
అష్టమే మాసే సర్వసంపూర్ణో భవతి।
నవమే అపీవతే।।
ఒక నెల(1) గడిచేసరికి పల్చగా ఉన్న ఆ పిండము గట్టిపడుతోంది.
రెండు(2) నెలలకాలం గడుస్తున్న సమయానికి ఆ పిండపు ముద్దకు శిరోభాగం ఏర్పడుతోంది.
మూడు(3) నెలల కాలం గడుస్తూ ఉండగా శిరోభాగముతో కూడిన ఆ పిండమునకు కాళ్లు - చేతుల ఆకారాలు తయారగుచున్నాయి.
నాలుగు(4) నెలలు అయ్యేసరికి ఆ శిరోభాగము - కాళ్లు- చేతుల ఆకారం గల పిండమునకు కటి ప్రదేశము (మొలత్రాడు భాగము) ఏర్పడుతోంది. కడుపు -నడుము- తొడలు ఏర్పడుచున్నాయి.
ఐదు (5) నెలలకు ఆ శిరస్సు - కాళ్లు-చేతులు-తొడలు- కడుపు-నడుము గల పిండమునకు ‘వెన్నెముక’ ఏర్పడుచున్నది.
ఆరు (6) నెలలకు ఆ పిండమునకు ముక్కు (ప్రాణశక్తి-కదలికలు) - కళ్లు (చూపు) - చెవులు (వినికిడిశక్తి) ఏర్పడినవగుచున్నాయి.
ఏడు (7) నెలలు గడుస్తూ ఉండగా ఆ గర్భస్థ పిండమునకు అనుభవ రూపమగు జీవశక్తి - జీవాత్మ (Experienear) యొక్క సంయుక్తత (Association) జరుగుతోంది. జీవాత్మ సంబంధించిన ‘అహమ్’ ప్రవర్తితమౌతోంది,
ఎనిమిది (8) నెలలు పూర్తియగుచుండగా ఆ జీవపిండము యొక్క అవయవములు సంపూర్ణంగా ఏర్పడిన వగుచున్నాయి.
తొమ్మిది (9) నెలలు అయ్యేసరికి ఆ పిండము కదలటం ప్రారంభించి ‘గర్భస్థశిశువు’ గా పిలువబడుచున్నది.
18 శుక్లం పుంభాగః।
శోణితమ్ స్త్రీ భాగః।
ఉభయమ్ క్లీబమ్।
ఈ విధంగా రెండుచోట్ల నుండి - ఒక చోటికి వచ్చిన పిండభాగాలు తల్లి గర్భంలో పిండము - శిశువుగా అగుచున్నాయి. పురుషభాగము ‘శుక్లము’ అని పిలువబడుతోంది. స్త్రీభాగము ‘శోణితము’ అనే పేరు. ఆ రెండింటినీ కలిపి ‘క్లీబము’ అంటారు. ఈ విధంగా శుక్ల - శోణితములు :: క్లీబము :: పిండము: శిశువుల - సృష్టికర్తయగు ప్రజాపతి సంకల్పానుసారము ఏర్పడినవగుచున్నాయి.

పితూ రేతోఽతిరిక్తాత్ పురుషో భవతి .
మాతుః రేతోఽతిరిక్తాత్స్త్రియో
భవంత్యుభయోర్బీజతుల్యత్వాన్నపుంసకో భవతి .
19 పితృరేతో అతిరేకాత్ పురుషో భవతి।
మాతృరేతో అతిరేకాత్ స్త్రియో భవంతి।
స్త్రి యోహి కామిన్యత్ తాసామ్
సుఖాధిక్యాత్ తా ఏవ
బహుళా జాయంత।
ఉభయోః బీజతౌల్యే నపుంసకో భవతి।।
పితృ రేతస్సు - శుక్లము - యొక్క అధికత్వము చేత ‘పురుషశిశువు’గా ఆ పిండము అగుచున్నది. మాతృరేతస్సు - శోణితము - యొక్క అధికత్వము చేత ‘స్త్రీ శిశువు’గా అగుచున్నది. ప్రకృతి విధిని అనుసరించి స్త్రీలకు కామాధిక్యత, కామసుఖాధిక్యత.. కారణంగా.. పురుష శిశువుల కంటే స్త్రీ శిశువుల సంఖ్యాపరంగా అధికంగా ఉంటారు.
స్త్రీ-పురుషుల (శోణితము - శుక్లముల) ఆధిక్యత - ప్రభావములు సరిసమానముగా ఉన్నప్పుడు ఆ శిశువు ‘‘స్త్రీ + పురుష’’ లక్షణములతో కూడిన ‘నపుంసక శిశువు’ జనిస్తోంది.


వ్యాకులితమనసోఽన్ధాః ఖంజాః కుబ్జా వామనా భవంతి .
అన్యోన్యవాయుపరిపీడితశుక్రద్వైధ్యాద్ద్విధా
తనుః స్యాత్తతో యుగ్మాః ప్రజాయంతే ..
20 వృత్తి-అనుగుణా హి ప్రవృత్తిః।
తతోహి పిత్రనుగుణా ప్రజా వ్యాకులిత మనోభ్యామ్
అంధాః, ఖంజాః
కుబ్జా వామనా వ్యంగా జాయంతే।।
కారణమును అనుసరించే కార్యము ఉంటుంది. మానసిక వృత్తిని (Avocation) అనుసరించి ప్రవృత్తి (Tendency of Avocations) ఉంటాయి. తల్లితండ్రుల ప్రవృత్తులను అనుసరించియే శిశువుల రూపురేఖలు - గుణములు కూడా ఉంటూ ఉంటాయి. స్త్రీ-పురుషులు ప్రవృత్తుల రీత్యా చిత్త, చాంచల్యము, వికృతగుణ స్వభావములు, వ్యాకులతమై తీవ్ర మనోభావాలు కలిగియున్నవారై ఉంటే, సంభోగ సమయంలో అవి అధికంగా మనోగతమై ఉండటం జరిగినప్పుడు - పుట్టబోయే శిశువులు గ్రుడ్డి (Blind), గూని, పొట్టి, వంకర ఇటువంటి శారీరక-మానసిక దోషములు కలిగినవారై ఉంటారు. ఇదంతా ప్రకృతి చిద్విలాసము.
21 పుష్పవతోః ఉపరక్తయోః
అంగవైకల్య భాజః।
కాల-దేశ-క్రియా-ద్రవ్య భోగ ఉపాధిభిః
ఉపచిత - అపచిత,
అనురూపా-అననురూప
మూర్తయో భవంతి।।
స్త్రీ యొక్క పుష్పవతి (3 రోజుల బహిష్ఠు) సమయంలో ఉపరక్తులు (సంభోగతులు) అవటంచేత శిశువులు అంగవైకల్యము కలవారు, బలహీనులు, అనారోగ్యవంతులు అయి ఉండటం జరుగుతుంది. స్త్రీ పురుషుల.. సంభోగము సంబంధించి కాలము - దేశము - క్రియ-ద్రవ్యము - భోగము.. ఇటువంటి సంగతి - సందర్భాలను అనుసరించి - ఆ శిశువు.. భారీ దేహము, అతి సన్నదేహము, సమానదేహము, అసమాన దేహము.. ఇటువంటి ఆకార భౌతికరూప దేహములు పొందటం జరుగుతోంది
22 సమ్యక్ యోగే సారూప్యమ్ అవాప్య
సమాన గుణా భవంతి।
బింబమివ ఉపాధౌ ప్రతిబింబమ్।
యోగభావనతో, రాగ-ద్వేష మోహావేశ రహితమగు సమ్యక్ భావనతో, భక్తి- జ్ఞాన- సాత్వికవృత్తులు, ఆప్యాయత - అనురాగముతో కూడియున్న దంపతులకు సారూప్యము (తమ రూపమేగల) - సమాన గుణ(అట్టి గుణము)- స్వభావములు గల శిశువులు జన్మిస్తూ ఉన్నారు. బింబము వలెనే జలములో ప్రతిబింబము ఉండటము సహజమే కదా! అయితే జలము చంచలమగుచున్నప్పుడు ప్రతిబింబమూ చంచలంగా అగుచున్నది.
23 అన్యోన్య వాయు పరిపీడితానాం
శుక్ల ద్వైవిధ్యే యమళౌ భవతః।
పిత్రోః తథా తు ఏన రేతో విభాగే
మిశ్ర ప్రజామ్రేడితా భవతి।।
పరస్పరము - పరస్పరవాయు పీడితులగుచున్న సందర్భాలతో శుక్లము రెండు విభాగములుగా అవటం జరిగిందా - ఆ దంపతులకు కవల పిల్లలు పుడుతూ ఉంటారు. శుక్లము - శోణితము → ఈ రెండూ కూడా విడిపోయి, (తల్లితండ్రుల ఇరువురి రేతస్సు విడిపోయి సంయోగ మొందినప్పుడు) - మిశ్ర ప్రజామ్రేడితా - అంటు కవల పిల్లలు పుట్టటం జరుగుతూ ఉంటుంది.
24 పంచ మానుషీ పేశ్య।
ఏకా సాధారణీ।
ద్వౌ కాసాంచిత్।
బహ్వ్యః సహస్రతమీషు।
ముహుః నిషేకే అధికాంగస్స్యుః।
సకృత్ నిషేకే శుష్క అసకృత్।
ఆధానే స్త్రీయో అన్యాం యుగ్మాః ప్రజాయంతే।।
మానవులలో ‘5’(ఐదు) అండముల వరకు ఉండవచ్చును.
సామాన్యంగా ఒకరిలో ఒక అండము మాత్రమే ఉండటం సహజము. కొందరికి రెండు అండములు ఉంటాయి.
అంతకంటే ఎక్కువ అండములు (2 కంటే ఎక్కువ) వేయి మందిలో ఒక్కరికి ఉండవచ్చును.
అనేకసార్లు రేతస్సు సేవించటం చేత ఆ శిశువు అధికమైన అంగములు కలిగి ఉంటున్నది. రేతస్సును అల్పంగా సేవించటం చేత శిశువు శుష్కమైన - బలహీనమైన అంగములు కలిగి ఉంటోంది. ఎప్పుడో సుదీర్ఘ కాలపు నిడివితో సంభోగము జరిగితే ఆ స్త్రీకి యుగ్మలు (చర్మపు ముడతలు) అధికంగా కలిగియున్న శిశువులు జన్మిస్తున్నారు. (ఇదంతా ప్రకృతి చమత్కార వైపరీత్యములు).


పంచాత్మకః సమర్థః పంచాత్మకతేజసేద్ధరసశ్చ
సమ్యగ్జ్ఞానాత్ ధ్యానాత్ అక్షరమోంకారం చింతయతి .

తదేతదేకాక్షరం జ్ఞాత్వాఽష్టౌ ప్రకృతయః షోడశ వికారాః
శరీరే తస్యైవే దేహినాం .
అథ మాత్రాఽశితపీతనాడీసూత్రగతేన ప్రాణ ఆప్యాయతే .
అథ నవమే మాసి సర్వలక్షణసంపూర్ణో భవతి

పూర్వజాతీః స్మరతి కృతాకృతం చ కర్మ విభాతి
శుభాశుభం చ కర్మ విందతి .. 3..
25 పంచాంత్మకః సమర్థః।
పంచాత్మక తేజస - అధిగంధ రసశ్చ।
సమ్యక్ జ్ఞానాత్ - ధ్యానాత్
అక్షరమ్ - ఓంకారమ్ చింతయతి।
తదేవ చ ఏకాక్షరమ్ జ్ఞాత్వా,
అష్టౌ ప్రకృతయః - షోడశ వికారాః శరీరే।
తస్యైవ దేహినో అథ నవమేమాసే
సర్వ లక్షణ సంపూర్ణో భవతి।

పూర్వజాతిమ్ స్మరతి।
కృతాకృతమ్ కర్మ విభాతి।
శుభాశుభమ్ కర్మ విందతి।
ఈ విధంగా తల్లి తండ్రుల మానసిక వృత్తులు పాల్గొనుటచేతను, పంచభూత దేవతల సహకార సంపత్తి చేతను ఆ జీవుడు సమర్థమైన దేహమును చేకూర్చు కొనుచున్నాడు. ఆ దేహములో పంచకర్మేంద్రియ ములు, పంచ జ్ఞానేంద్రియములు రూపుదిద్దుకుంటున్నాయి. శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములు, తెలుసుకొనే ‘తెలివి’ ప్రవర్తించ ప్రారంభిస్తున్నాయి. ఆ శిశువులో సమ్యక్ జ్ఞానము, ధ్యాసరూపమైన ధ్యానము, అక్షరమగు ఓంకారము.. ఈ మూడింటి యొక్క సమన్వయ రూప-చింతన బయల్వెడలుతోంది. ఏకము-అక్షరము అగు ఆత్మ యొక్క అనుభూతి ఏమిటో తెలుసుకుంటు న్నాడు (ఆతనికి ప్రాపంచిక విషయముల పొర అప్పటికి ఉండదు కాబట్టి).
శరీరములో పంచభూతములు - మనస్సు - బుద్ధి - అహంకారము.. అనే అష్టవిధ ప్రకృతి 9వ నెలలో క్రియాశీలంగా రూపుదిద్దుకుంటున్నాయి. 16 వికారములు బయల్వెడలుచున్నాయి. 9 నెలలు పూర్తయ్యే సరికి సర్వ - లక్షణ సంపన్నుడగుచున్నాడు.

ఇక అప్పుడు తన యొక్క ఇతః పూర్వపు దేహముల జాతి-జన్మ-కర్మలను స్మరించటం ప్రారంభిస్తున్నాడు. చేసినవి - చేయాలనుకొన్నవి - చేయలేక పోయినవి-వద్దనుకుంటూనే చేసియున్నవి… అగు కర్మలను, వాటికి సంబంధించిన శుభ-అశుభ విశేషాలను గుర్తు చేసుకోవటం, విచారణ చేయటం, బాగు-ఓగులకు సంతోష-దుఃఖములు పొందటం - ప్రారంభిస్తున్నాడు.

నానాయోనిసహస్రాణి దృష్ట్వా చైవ తతో మయా .
ఆహారా వివిధా భుక్తాః పీతాశ్చ వివిధాః స్తనాః ..
26 ‘‘నానా యోని సహస్రాణి దృష్ట్వా చ ఏవ
తతో మయా।
ఆహారా వివిధా భుక్తాః।
పీతాశ్చ వివిధాః స్తనాః।’’

అంతర్ యోచనలు:
గతించిన సంఘటనలు ఇక గుర్తు చేసుకోవటము, యోచించటము, విచారణ (Analysis) చేయటము, బాధపడుచూ ఉండటము - ప్రారంభిస్తున్నాడు.
‘‘ఆహా"! నేను ఇప్పటికే వేలాది జీవజాతులలో - అసంఖ్యాకమగు తల్లుల యోనులను దర్శించాను. ప్రవేశించాను. నాచే ఎన్ని మాతృ యోనులు పొందబడినయో.. అంతు లేదు. లెక్కలేదు!
అనేక - అనేక రకములైన ఆహారాలను రుచిచూచాను. భుజించాను. అనేక మంది తల్లుల స్థనములలో పాలుగ్రోలాను’’.

27 ‘‘జన్మభూమిః హి సర్వా భూః
శ్మశానమ్ అపి మే పురా।
చతురాశీతి లక్షేషు
యోని భేదేషు చ అభవమ్।
‘‘అనేక చోట్ల జన్మించియున్న నాకు ఈ సమస్త భూమండలము జన్మభూమియే! అనేక చోట్ల మరణించి ఉండటం చేత ఈ సమస్త భూమండలము నాకు శ్మశాన భూమియే కూడా!
ఆహా! 84 లక్షల జీవజాతుల గర్భములలో జన్మించి, ఆయా దేహ ధర్మములు నాపై ఆపాదించుకొని ఆహార-విహారములు నిర్వర్తించాను.

జాతస్యైవ మృతస్యైవ జన్మ చైవ పునః పునః .
28 జాతశ్చాఽస్మి మృతశ్చాఽస్మి
సంసార్యస్మి పునః పునః।
జన్మ-మృత్యుః। పునర్జన్మః।
పునః మృత్యుః। పునర్జనిః।।
‘‘ఎన్నోసార్లు పుట్టాను - చచ్చాను. మరల మరల ‘ఈ దృశ్యమే సత్యము’ అని తలచుచూ కళ్లకు - చెవులకు ప్రాప్తించే ఇంద్రియ విషయాలకు బద్ధుడనై పరిమితము - ఇరుకు అయిన ఆలోచనలతో జీవించాను. వాటితోనే మరణించాను. పుట్టడం! చావటం! మరల పుట్టటం! మరల చావటం! ఎన్ని మార్లో , ఎంతెంతగానో!
29 గర్భవాసే మహత్ దుఃఖమ్,
మోహో దుఃఖం చ జన్మసు।
బాల్యే దుఃఖమ్, తథా శోకః
పారవశ్యంచ మూఢతా।।

30 హితా కరణమ్ ఆలస్యమ్,
అహిత ఆచరణం తథా।
యౌవనే విషయాసక్తిః
తాపత్రయ నిపీడితః।।
గర్భవాసం - జన్మ దుఃఖమ్: తల్లి గర్భంలో పిండముగా ఉండి ఎన్నో దుఃఖాలు పొందాను! పుట్టుచు ఎన్ని దుఃఖాలు - ఎంత బాధ అనుభవించాను! ఎంతటి మోహము అవి!
బాల్యే : ఆకలి - దప్పిక, ఆట-పాట, ఆశ-నిరాశలతో మూఢుడనై పరవశిస్తూ అనేకసార్లు బాల్య దుఃఖాలు, వేదనలు అనుభవించానే! బాల్యంలోని మూఢత్వము (Ignorance)తో కూడిన పారవశ్యము - ఎంతటి బాధాకరం?
యౌవనే : మంచి పనులు చేయబుద్ధి కాకపోవటం! చెడుపనులే చేయాలనే ఉద్విగ్నత! అశుభము - అహితము అగు ఆచరణము. అనేక విషయములందు - విశేషములందు ఆసక్తి (Inquisitiveness)! ఎల్లప్పుడు తాపత్రయములచే పీడించబడటం! - ఇదీ యౌవన దశ. అదీ గడచిపోవటం అనేకసార్లు జరిగింది.
31 చింతా-రోగశ్చ వార్థక్యే మరణే తు మహత్ భయమ్।
ఆశయా చ అభిమానేన కామ-క్రోధాది సంకటే,
అత్యుత్కటే (అతి - ఉత్కటే) మహద్దుఃఖమ్,
అస్వతంత్రశ్చ దుఃఖితః।।
ఇక వార్థక్యం : అనేక చింతలు! దేహము రోగాలతో డొల్ల! ‘‘మరణము వచ్చి మీద పడదు కదా!’’.. అనే భయం. ‘‘తరువాత గతి ఏమిటి?’’ అనే తికమక.
ఎన్నో తీరని ఆశలు! అభిమానానికి దెబ్బమీద దెబ్బలు! కామము వదలదు! క్రోధము, లోభము, మోహము, మదము తొలగవు! అనేక ఉత్కంఠతలు మనస్సును తొలుస్తూ ఉంటాయి. మహత్‌దుఃఖములు వెంటనంటి ఉంటాయి. అస్వతంత్రమైన బ్రతుకు. ఎవరన్నా సాయపడితేగాని రోజులు వెళ్ళవు.
32 దుఃఖ బీజమ్ ఇదమ్ జన్మ
దుఃఖ రూపం చ దుస్సహమ్।
నివృత్తి ధర్మో న ఉపాత్తో (నో పాత్తో)
న యోగ - జ్ఞాన సాధనమ్।
జన్మంతా దుఃఖమే! జన్మ అనేదే దుఃఖానికి బీజము. ఈ సంబంధాలు, సంపదలు.. ఇవన్నీ దుఃఖప్రదాతలే! భరించరాని అనేక ఆదుర్ధాలతో కూడిన దుఃఖపరంపరలు బ్రతుకును నింపి ఉంటున్నాయి.
ఈ విధంగా ఉపాధులు వస్తున్నాయి, పోతున్నాయి. జన్మ-దుఃఖనివృత్తి ధర్మములు, మార్గములు అయినట్టి యోగ-జ్ఞాన సాధనలు ఆశ్రయించుకుండానే బ్రతుకులు బుగ్గిపాలు అయిపోయినాయే!

అహో దుఃఖోదధౌ మగ్నః న పశ్యామి ప్రతిక్రియాం ..
యది యోన్యాం ప్రముంచామి సాంఖ్యం యోగం సమాశ్రయే .
అశుభక్షయకర్తారం ఫలముక్తిప్రదాయకం ..
యది యోన్యాం ప్రముంచామి తం ప్రపద్యే మహేశ్వరం .
అశుభక్షయకర్తారం ఫలముక్తిప్రదాయకం ..
యది యోన్యాం ప్రముంచామి తం ప్రపద్యే
భగవంతం నారాయణం దేవం .
అశుభక్షయకర్తారం ఫలముక్తిప్రదాయకం .
యది యోన్యాం ప్రముంచామి ధ్యాయే బ్రహ్మ సనాతనం ..
33 అహో। దుఃఖోదధౌ మగ్నో,
న పశ్యామి ప్రతిక్రియామ్।
ధిక్ అజ్ఞానమ్। ధిక్ అజ్ఞానమ్।
ధిక్ కామ-క్రోధ సంకటమ్।

ఆహా! అనేక దుఃఖపరంపరా తరంగములతో కూడిన దుఃఖ సాగరంలో మునిగియే ఉంటున్నాను. మరి దీనికి ప్రతిక్రియ ఏదీ నాకు కనిపించటం లేదు. ఒకవేళ కనిపించినా, నేను ప్రయత్నించటం లేదు. ధిక్ అజ్ఞానం! నా అజ్ఞానమునకు ధిక్కారమగుగాక! నా యొక్క కామ-క్రోధ-లోభ సంకటములకు ధిక్కారమగు గాక! ఓ కామ-క్రోధములారా! ఇక నన్ను వదలండి! పొండి!
34 సంసార శృంఖలమ్ ధిక్ ధిక్।
ఆచార్యాత్ జ్ఞానమ్ ఆప్నుయామ్,
యది యో అన్యామ్ ప్రముంచామి,
సాంఖ్యమ్ యోగమ్ సమాశ్రయే।
నాకు నేనే మనస్సుతో కల్పించుకొన్న సంసార బంధములకు ధిక్కారమగు గాక! నాచే ధిక్కరించబడు గాక!
ఈ సంసార వ్యవహారములను తిరస్కరించి, దీనికి వేరైన సాంఖ్య-యోగ (Differentiation) మార్గములను ఆశ్రయించెదనుగాక! మహనీయులు - ఆత్మజ్ఞులు అగు ఆచార్యులను ఆశ్రయించి ఆత్మజ్ఞాన సముపార్జనకై యత్నిస్తూ జీవితావకాశమును సద్వినియోగపరచుకొనెదను గాక!
35 అశుభక్షయ కర్తారమ్,
ఫలముక్తి ప్రదాయకమ్,
యో అన్యాం యది ప్రముంచామి
తం ప్రపద్యే మహేశ్వరమ్।।
ఈ యోని నుండి ఎట్లాగో అట్లా బయటపడితే చాలు. బయల్వెడలితే చాలు. అశుభమును క్షయింపజేయువాడు, ముక్తి ఫలప్రదాత అగు మహేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాను. శరణు వేడుతాను. (దృశ్యలంపటము నుంచి నా బుద్ధిని ఉద్ధరించుకుంటాను)
36 అశుభక్షయ కర్తారమ్
పురుషార్థ ప్రదాయినమ్,
యది యో అన్యా ప్రముంచామి
తం ప్రపద్యే జగదీశ్వరమ్।
అశుభమైన సంసార ధ్యాసలు క్షయించుటకొరకై, పురుషార్థమగు మోక్ష స్థానమును నా బుద్ధి సముపార్జించుకోవటానికై ఈ సంసార మార్గమునకువేరైన బంధ-విముక్తి మార్గము చూపవలసినదిగా, ప్రసాదించ వలసినదిగా-నేను ప్రవేశించబోయేజగత్తుకు ఈశ్వరుడగు ఆ జగదీశ్వరుని ప్రార్ధించెదను గాక! అంతే. అశాశ్వత విషయములలో తల దూర్చను.
37 సర్వ శక్తిమ్, చిదాత్మానమ్
సర్వ కారణ కారణమ్
యది యో-న్యాః ప్రముచ్యేయం-
ప్రపద్యే పరమేశ్వరమ్,
భర్గమ్, పశుపతిమ్,
రుద్రమ్, మహాదేవమ్, జగద్గురుమ్।
ఈ యోని ప్రదేశములో చిక్కుకొని ఉన్నానే! ఈ యోని ద్వారమునుండి ఎట్లాగో బయటపడ్డానా, ఇక - ఆ సర్వశక్తిమంతుడు, చిదాత్మ స్వరూపుడు, అగు పరమాత్మను శరణువేడుతాను. సర్వకారణ కారకుడు, పరమేశ్వరుడు, సర్వమును ఉత్తేజపరుస్తూ వెలిగించుచున్న భర్గుడు, పశుపతి, రుద్రుడు, మహాదేవుడు అగు పరమాత్మను గానము చేస్తాను. జగద్గురువగు పరమ శివ భగవానుని ఉపాసించి, సేవించి, ఇటువంటి గర్భనరకానుభవముల నుండి తరిస్తాను.
38 యోని బంధాత్ ప్రముచ్యేయమ్,
యది, తప్స్యే మహత్తపః।
గర్భవాసాత్ ప్రముచ్యేయమ్
యది, విష్ణుమ్ భజే హృది,
అమృత ప్రదమ్, ఆనందమ్,
నారాయణమ్, అనామయమ్।
ఈ ‘తల్లి గర్భము’ అనే యోని బంధము నుండి ఎట్లాగో ఒక్కసారి బయటపడ్డానా.. ఇక గొప్ప-మహత్తరమైన తపస్సు చేయటం ప్రారంభిస్తాను.
ఈ గర్భవాసము నుండి బయటపడి, ఇక్కడి నుండి విముక్తుడనైన తరువాత, ఇక అమృతప్రదుడు, ఆనంద స్వరూపుడు, నిర్విషయ- నిరామయుడు, సర్వత్రా ఉనికి కలిగి ఉన్న విష్ణువు - అగు ఆ నారాయణునినే సర్వదా నా హృదయమునందు నిలుపుకొని ధ్యానిస్తాను. భజిస్తాను. ఇక మనస్సును ఎటూ వెళ్లనివ్వను.
39 మాతృకుక్షౌ నిబద్ధోఽస్మి
ముచ్యే యత్ యద్య బంధనైః
వాసుదేవమ్ ప్రతోష్యామి
భగవంతమ్ అనన్యధీః।।
అయ్య బాబోయ్! ఇప్పుడు ఈ తల్లి గర్భములో నేను బంధించబడి ఉన్నానే! ఎట్లా ఈ బంధము నాకు తొలగేది? ఈ బంధము తొలగిబయటపడ్డానా.. ఇక అనన్యమైనట్టి బుద్ధితో భగవంతుడగు వాసుదేవుని ఆరాధించి, భజించి సంతోషింపజేసి ఆయన కరుణకు పాత్రుడను అయ్యెదను గాక! దృశ్య విషయములను పరిమితుడను అవను గాక, అవను.

యన్మయా పరిజనస్యార్థే కృతం కర్మ శుభాశుభం .
ఏకాకీ తేన దహ్యామి గతాస్తే ఫలభోగినః ..
40 పురా పరజనస్య అర్థే
కృతమ్ కర్మ శుభ-అశుభమ్।
… ఏకాకీ తేన దహ్యామి,
గతాః తే ఫలభాగినః।।
ఇతః పూర్వము నేను - ‘‘నా వారేలే’’ అని అనుకొన్న మిత్ర - కళత్ర-పుత్ర - తదితర బంధు జనములను సంతోషంగా ఉంచటానికి అనేకములైన శుభ-అశుభకర్మలు - కార్యక్రమములు నిర్వర్తించాను. వారేరీ? నేను చేసిన కర్మల లాభములను అనుభవించినవారు ఒక్కరు కూడా నా వెంట రాలేదు. అందరూ గతించారు. అప్పటి కర్మల చేత ఏకాకినై నేను ఆయా కర్మ ఫలములన్నీ అనుభవిస్తున్నాను.
41 నాస్తిక్యేన భయమ్ త్యక్త్వా
పాపాని అకరవమ్ పురా।
భుంజామి తత్ఫలమ్ హి అద్య
భవిష్యామి ఆస్తికస్థ్వితః (ఆస్తికస్తు స్థితః)।
‘‘నేను నిర్వహిస్తున్న సర్వ కర్మవ్యవహారములకు సర్వసాక్షి అయి, అన్నీ చూస్తున్న పరమాత్మ ఒకరు ఉన్నారు కదా!’’ అని భయం లేకుండా అనేక పాపపు పనులు చేశాను. ఇతరులను బాధించాను. ఆ కర్మల పాప - ఫలములను ఇప్పుడు అనుభవిస్తున్నాను! ఇకనుంచన్నా, ‘‘నా కర్మలకు సాక్షియై, నా తప్పులకు శిక్షించవారై, నన్ను సర్వదా రక్షించువారై, నాకు సర్వము ప్రసాదించే భగవంతుడు ఒకాయన ఉన్నారు! చూస్తున్నారు’.. అని గుర్తుంచుకుంటాను. గురి కలిగి ఉంటాను.
42 ఏవమ్ నానా విధ అనర్థాన్
పరిచింత్య ముహుర్ముహుః।
శశ్వత్ సాంసారికం దుఃఖమ్
స్మృత్వా నిర్వేదమ్ ఆప్యచ।
అవిద్యా కామ కర్మాద్యైః
ముహ్యతే జంతురాంతరః।।
ఈ విధంగా ఆ గర్భస్థ జీవాత్మ తాను క్రితం ఉపాధితోను, అంతకు ఉపాధులతోను నిర్వర్తించియున్న అనేక దృశ్య సంబంధమైన, అనర్ధములైన కర్మలను, భావావేశములను మరల మరల గుర్తు తెచ్చుకుంటూ పరిచింతన చేస్తున్నాడు. సంసార దుఃఖముల గురించి జ్ఞాపకం తెచ్చుకొంటూ, వైరాగ్యము పొందుతూ ఉంటున్నాడు. తన యొక్క అవిద్యాపూర్వకమైన కోరికలను, నిర్వర్తించిన కర్మలను స్మరిస్తూ అంతరాంతరాలలో ఇంకా మోహము పొందుచున్నాడు.

అథ జంతుః స్త్రీయోనిశతం యోనిద్వారి
సంప్రాప్తో యంత్రేణాపీడ్యమానో మహతా దుఃఖేన జాతమాత్రస్తు
వైష్ణవేన వాయునా సంస్పృశ్యతే తదా న స్మరతి జన్మమరణం
న చ కర్మ శుభాశుభం .. 4..
43 సవై జంతుః స్త్రీ యోనిశతం
గత్వా, యోని ద్వారమ్ ఉపేత్య
ముముక్షుః యతతే, తత్ర అశక్తో
యంత్రేణ పీడ్యతే।
మహతా దుఃఖేన క్లిశ్యతి,
పిష్యతే చ ప్రసూతివాతేన,
జాత మాత్రస్తు వైష్ణవేన వాయునా
సంస్పృశ్యతే, తదా న స్మరతి।
నైవ కించన పారత్రికమ్
న అపరోక్ష దృక్ భవతి।
ఈ జీవుడు వందల స్త్రీ యోనులను పొందాడు - ప్రవేశించాడు. జన్మ మృత్యురూపమగు పెద్ద యంత్రములో ప్రవేశించి పైకి - క్రిందికి దేహ-దేహాంతరములలో ప్రవేశ -నిష్క్రమణములను నిర్వర్తిస్తూ, ‘‘ఎట్లాగురా, జన్మ-మృత్యు చట్రము నుండి బయల్వెడలేది?’’.. అని తలుచుచున్నాడు. ప్రయత్నించి కూడా, జన్మ-కర్మల బాధ నుండి విముక్తుడు కాలేకపోతున్నాడు. అశక్తుడై ఉంటున్నాడు. సుదీర్ఘము - మహత్తరము అగు దుఃఖ పరంపరల చేత బాధింపబడుచున్నాడు. నలిగిపోతున్నాడు. ప్రసూత వాయువులచే పీడింపబడుచున్నాడు.

పుట్టీ - పుట్టగానే వైష్ణవ మాయావాయువుచే స్వీకరించబడి మరల మోహము - చెందుచున్నాడు.
మరల జన్మపొందిన తరువాత - ఏ పరమార్థమును గర్భములో ఉన్నప్పుడు యోచించాడో - ఆ పారమార్థికమును కించిత్‌గా కూడా స్మరించటమే లేదు. అపరోక్ష జ్ఞానము కొరకై దృష్టి - ధ్యాస కలిగి ఉండటం లేదు.
44 భూమి సంస్పర్శనాత్ జంతుః
ఉగ్రదృక్ పామరో భవేత్।
జల సంస్పర్శనాత్
ఊర్థ్వమ్ దృక్ దోషః, తస్య నశ్యతి।।
నేల మీద పడిన, నేలను తాకిన మరుక్షణం నుండి ఈ జీవుడు క్రూర దృష్టిని ఆశ్రయించుచున్నాడు. ‘‘నాది-నేను-నాకు-నాదే’’ ఇత్యాది క్రూర భావాలు, ఆశ్రయించి ‘పామరుడు’ అగుచున్నాడు. జలస్పర్శ చేత (నీళ్లలో మునిగినప్పుడు) ఒకని ఊర్ధ్వ దృష్టి (బయొ కనిపించిన దృశ్యదృష్టి) నశించిపోయిన తీరుగా…, గర్భములో ఉన్నప్పటి దృష్టులు, ఇతఃపూర్వపు దోషములు, యోచనలు, ప్రణాళికలు.. భూమిపై పడగానే పటాపంచలగుచున్నాయి.
45 న హవై జాతస్య
జన్మ-మరణ-కర్మ-శుభాశుభ
సాధన స్ఫూర్తిః
వాసనాశ్చ నిగూహితా భవంతి;
కథమ్ అథో జానాతి?
వాతః పిత్తం శ్లేష్మా చ
త్రయో ధాతవః
సమానా ఆరోగ్యదా భవంతి।
ఈ జీవుడు నూతన శరీరమును ఆశ్రయించినవాడై భూమిపై పడిన తరువాత ఏమరపు పొందుచున్నాడు. ఇతః పూర్వపు జన్మ-మృత్యువు - కర్మ - శుభాశుభ సాధనా స్ఫూర్తులు.. ఏవీ ఈ జగత్ - జీవిత సందర్భములో, గుర్తుకే రావటం లేదు. అయితే అవన్నీ కూడా వాసనల రూపంలో అంతరాంతరాలలో నిగూఢంగా దాగియే ఉంటున్నాయి కూడా.
ఇక ఈ జన్మించిన జీవుడు వర్తమానమును ఏ తీరుగా తెలుసుకొంటూ ఉండటం జరుగుతోంది?
ప్రకృతిచే నిర్మితమగు ఈ భౌతిక దేహములో వాతము - పిత్తము - శ్లేష్మము.. అనే మూడు ధాతువులు సరియైన పాళ్లులో ఉన్నప్పుడు, ఈ జీవుడు ఆలోచనా విధానం సక్రమంగా ఉండి, ఇంద్రియముల ద్వారా జగత్ విషయాలు తెలుసుకొంటూ ఉంటున్నాడు.
46 విషమాస్తే రోగదా। నైవ రోగీ విందతే వేద్యం చ
తేన తర్హి పిత్తే.. న అనురూపేణ జానాతి
న్యూనేన అల్పమ్ - అధికేన అధికం
ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ ‘3’ ధాతువులు సక్రమంగా లేకపోతే ఆ దేహము వ్యాధిగ్రస్తమౌతోంది. కాబట్టి పిత్తధాతువు సమరూపంగా ఉంటేనే విషయములు సక్రమంగా ఎరుగగలుగుచున్నాడు. పిత్త-వాత- శ్లేష్మములు అల్పంగా ఉంటే అల్పముగాను, అధికంగా ఉంటే అధికంగాను జగద్విషయాలు (ఇంద్రియముల ద్వారా) ఎరుగుచున్నాడు. ఈ ధాతువుల ఉనికిని అనుసరించి దేహము- ఇంద్రియములు బలంగానో, బలహీనంగానో ఉంటున్నాయి.
వికృతేన వికృతో
ఉన్మత్తాయతే! తద్వై పిత్తమగ్నిః
కర్మాశయగతో,
ధర్మ- అధర్మ మూలేన వాయునా ప్రజ్వాల్యతే
యద్వత్ ఇంధనమ్ భోగ్యమ్
అంతరమ్ - బాహ్యం చ।
కొన్ని దేహములలో ఈ ఈ ధాతువులు వికృతంగా ఉండటం చేత ఆ జీవుడు ఉన్మత్తమైన ప్రవర్తన కలిగినవాడగుచున్నాడు.
ధాతువులు ధర్మ- అధర్మములు (Functioning, Disfunctioning) మూలముగా కలిగి యుండి, దేహాగ్నిచే స్పృశించబడుచూ ఉంటున్నాయి.
- ఇంధనము రూపంగా దేహములో ఉంటూ,
- వాయువుచేత ప్రజ్వరిల్లుచూ,
- బాహ్య - అభ్యాంతర భోగ్యముగా ఈ దేహమును తీర్చిదిద్దుతోంది. పరిరక్షిస్తోంది. పరిపోషిస్తోంది.
47 స హి అగ్నిః కతి విధో భవతి?
త్రిణి వై। శరీరాణి త్రీణివావ
రేతాగ్ంసి, త్రైపురః
త్రిధా తు, త్రయీమయః,
త్రివిధో అగ్నిః త్రైతానామ శారీరకో
వైశ్వానరః।।
దేహములోని అగ్ని ఎన్ని విధములుగా ఉంటోంది?
- త్రి శరీరములుగాను (స్థూల-సూక్ష్మ-కారణ),
- త్రి ధాతువులుగా (వాత, పిత్త, శ్లేష్మ),
- త్రిపుర రూపములుగాను (జాగ్రత్ -స్వప్న - సుషుప్తులు) ఉంటోంది.
ఈ విధంగా ఈ త్రిధాతువులు, త్రి శరీరములు, త్రీఅగ్నులు.. ఇవన్నీ కలిపి ‘వైశ్వానరాగ్ని’ అయి ఉన్నది.

శరీరమితి కస్మాత్
సాక్షాదగ్నయో హ్యత్ర శ్రియంతే జ్ఞానాగ్నిర్దర్శనాగ్నిః కోష్ఠాగ్నిరితి .
తత్ర కోష్ఠాగ్నిర్నామాశితపీతలేహ్యచోష్యం పచతీతి .
48 స ఏవ ‘‘జ్ఞానాగ్నిః’’ ‘‘దర్శనాగ్నిః’’,
‘‘కోష్ఠాగ్నిః’’ ఇతి చ భవతి।
తత్ర..,
జ్ఞానాగ్నిః మానసో।
దర్శనాగ్నిః ఐంద్రియకః (ఇంద్రియకః)।
కోష్ఠాగ్నిః దాహరఃసతు,
నిత్యమ్ అశిత → పీత- లేహ్య
చోహ్య ఆదికం పాచయతి సమమ్
ప్రాణ-అపానాభ్యామ్।
వైశ్వానరాగ్నియే
-జ్ఞానాగ్ని-దర్శనాగ్ని-కోష్ఠాగ్నిగా త్రివిధ రూపములుగా రూపుదాల్చుచున్నది.


అందులో..,
మనస్సు → జ్ఞానాగ్ని రూపము.
ఇంద్రియములు → దర్శనాగ్ని రూపము.
ప్రాణదహరము → కోష్ఠాగ్ని రూపము

ఈ కోష్ఠాగ్ని (లేక) దహరాకాశము (లేక) ప్రాణాగ్ని -
- ప్రాణ - అపాన వాయువులతో కలయుచూ
- ప్రతిరోజు ఈ జీవుడు భుజించుచున్నట్టి భక్ష్య - భోజ్య - లేహ్య - చోహ్య మొదలైన షడ్రసోపేతము (‘6’ రుచులతో కూడిన) అన్న-పానములను జీర్ణము చేస్తోంది. దేహములో ఆహార రసమును సిద్ధింపజేస్తోంది.

దర్శనాగ్నీ రూపాదీనాం దర్శనం కరోతి .
జ్ఞానాగ్నిః శుభాశుభం చ కర్మ విందతి .
తత్ర త్రీణి స్థానాని భవంతి .
49 ‘దృక్’ ఏవ → దర్శనాగ్నిః
విజ్ఞాన వికృతిః దృశ్య దర్శనమ్ కరోతి।
తస్య త్రీణి స్థానాని భవంతి,
ఇంద్రియ గోళకాని, ఉపస్థానాని,
చక్షురేవ అవసథః।।
కంటి చూపుకు ఆవల గల (జగత్ ద్రష్టకు సాక్షియగు) ‘దృక్’యే దర్శనాగ్ని. ఈ ‘దృక్‌యే → దేహములో ఉన్నదై, విషయ విజ్ఞానము (Knowing things) అను వికారము ద్వారా దృశ్యమును దర్శించటమును నిర్వర్తిస్తోంది.
ఈ దృక్ → ‘‘ద్రష్ట- దర్శనము - దృశ్యము’’ అని మూడు రూపాలుగా ప్రకాశిస్తోంది. ఇంద్రియగోళములు, ఉపస్థానముగా - (నేత్రములు స్థానముగా) కలిగి ఉన్నది.

హృదయే దక్షిణాగ్నిరుదరే గార్హపత్యం
ముఖమాహవనీయమాత్మా యజమానో బుద్ధిం పత్నీం నిధాయ
మనో బ్రహ్మా లోభాదయః పశవో ధృతిర్దీక్షా సంతోషశ్చ
బుద్ధీంద్రియాణి యజ్ఞపాత్రాణి కర్మేంద్రియాణి హవీంషి శిరః
కపాలం కేశా దర్భా ముఖమంతర్వేదిః చతుష్కపాలం
శిరః షోడశ పార్శ్వదంతోష్ఠపటలాని సప్తోత్తరం
మర్మశతం సాశీతికం సంధిశతం సనవకం స్నాయుశతం
సప్త శిరాసతాని పంచ మజ్జాశతాని అస్థీని చ హ
వై త్రీణి శతాని షష్టిశ్చార్ధచతస్రో రోమాణి కోట్యో
హృదయం పలాన్యష్టౌ ద్వాదశ పలాని జిహ్వా పిత్తప్రస్థం
కఫస్యాఢకం శుక్లం కుడవం మేదః ప్రస్థౌ ద్వావనియతం
మూత్రపురీషమాహారపరిమాణాత్ .
50 హృదయే దక్షిణాగ్నిః। ఉదరే
గార్హపత్యమ్।
ముఖేచ ఆహవనీయమ్।
యజతే పురుషో యజమానః।
ఈ దేహధారణ యజ్ఞ రూపము అయి ఉన్నది! అట్టి దేహయజ్ఞము నందు:
హృదయము → దక్షిణాగ్ని స్థానము.
ఉదరము (పొట్ట) → గార్హపత్యాగ్ని స్థానము.
ముఖము → ఆహవనీయాగ్ని స్థానము.
పురుషుడు (జీవుడు) ఈ ‘జీవితము’ అనే యజ్ఞమునకు - యాగకర్త, యజమాని.
బుద్ధిమ్ పత్నీం పరిగృహ్య,
దీక్షాం సంతోషమ్।
ధీ - ఇంద్రియాణి యజ్ఞ పాత్రాణి।
కర్మేంద్రియాణి ఉపకరణాని।
సత్రే శారీరకే।
తత్ తత్ దేవతాఏవ
ఋత్విజః। తటస్థా ఏవ
యథా దేశమ్ యజమానమ్ అనుయజంతే,
తత్ర కాలా శరీరమ్।
కుండంతు శిరః। కపాలమ్ కేశా దర్భాః।
ముఖమ్ అంతర్వేదిః।
‘‘బుద్ధి’’యే - యాగకర్త యొక్క ధర్మపత్ని (భార్య).
సంతోషముగా ఉండటమే → దీక్ష.

కళ్లు-చెవులు-ముక్కు-నోరు-చర్మము→ జ్ఞానేంద్రియములు - యజ్ఞపాత్ర.
ఈ జీవన యజ్ఞమునకు కర్మేంద్రియములు - ‘‘యజ్ఞోపకరణములు’’.
ఈ దేహమే యజ్ఞశాల. శరీరమునందు ఆయా జీవింపజేయు ధర్మములు నిర్వర్తించు ఇంద్రియదేవతలే తటస్థ - ఋత్విజులుగా ఆయా దేహస్థానములలో ఉండి, ‘జీవుడు’ అనే యజమానితో గూడి ‘జీవితము’ అనే గొప్ప యజ్ఞమును నిర్వర్తించుచున్నారు.
- దేహయజ్ఞమునకు ఈ భౌతిక శరరీమే ‘యాగశాల’.
- శిరోకపాలము - యజ్ఞకుండము.
- కేశములు… దర్భలు.
ఈ దేహము యొక్క ముఖము- అంతర్వేది.
కామమ్ ఆజ్యమ్।
జీవితకాలః సత్రకాలో
దాహరో నాదః - సామః।
వైఖరీ యజుః।
పరా-పశ్యంతీ - మధ్యమా ఋచః।
పరుషాని అధర్వ ఖిలాని।
సూనృతాని వ్యాహృతయః।
ఆయుః బలమ్।
పిత్తమ్ పశవో। మరణమ్ అవబృథః।।
దేహి యొక్క కామము.. ఆజ్యము (అగ్నికి సమర్పించే నేయి).
పుట్టుక నుండి - చావు వరకు జీవిత కాలమంతా.. యజ్ఞకాలము.
‘‘ఉమ్‌మ్’’ - అను దహర (ఆకాశ) శబ్దతత్త్వమే - సామగానము.
‘వైఖరీ’ శబ్దము - యజుర్వేదము.
పరా-పశ్యంతీ - మధ్యమములు-ఋగ్వేదము -
పరుషముగా (గట్టిగా) చెప్పు శబ్ధములే - అధర్వణవేద ‘ఖిల’ విభాగములు.
సత్యవాక్యములు - వ్యాహృతులు.
ఆయుష్షు - బలము.
పిత్తము - యజ్ఞపశువు.
మరణము - అవబృథస్నానము.
51 తస్మిన్ యజ్ఞే ప్రజ్వలంతి అగ్నయః।
తత్ర దేవాః సాంసారికమ్ అనురూపమ్ ఉపయచ్చంతి।
యే కేచిత్ చేతయేయుః సర్వే యజ్ఞకృతో।
న అయజ్ఞకృత్ జీవతి।
యజ్ఞాయ ఇదమ్ శరీరమ్
యజ్ఞాత్ భవతి।
యజ్ఞానురూపమ్ వివర్తతే
పరిణామినీ శరీర ధారా
దుఃఖాబ్ధిమ్ గచ్ఛతి।।
అటువంటి ‘‘జీవితము - భౌతిక దేహము - అనుభూతులు’’ అనే యజ్ఞాగ్నులు ప్రజ్వరిల్లుచున్నాయి. ఇక్కడి ‘దేహము’ అనే యజ్ఞశాలలో దేవతలు సంసారసౌఖ్యమును (దృశ్యానుభూతిని) అనుభవించుచున్నారు.

ఈ దేహ రాక - పోకలతో కూడిన జీవితమే ఒక యజ్ఞము.
ఈ ‘‘దేహ-జీవిత-జీవ’’యజ్ఞమును ఎవరు తెలుసుకొంటారో, వారందరు యజ్ఞమును చేస్తున్న వారే అగుచున్నారు.

అట్టి యజ్ఞ భావమును బుద్ధితో స్వీకరించనివాడు జీవించియున్నవాడే కాదు, (న అయజ్ఞకృత్ జీవతి).

ఈ భౌతిక దేహము యజ్ఞము నుండియే, యజ్ఞము కొరకే ఏర్పడినదగుచున్నది.
యజ్ఞ కార్యక్రమమును అనుసరించియే ఈ దేహము వివర్తమగుచున్నది. వికారములు కలిగి ఉంటోంది. పరిణామములు పొందుతోంది. ‘‘దుఃఖ సాగరంలో తేలటము’’.. అనునది కూడా ఒకానొక యజ్ఞాంతర్గత విశేషమే!

52 తస్య ఏతత్ శరీరస్య
షోడశ(16) పాత్ర దంతపటలాని,
దశపంచ(15) సుషయః।
షణ్ణవత్(96) అంగుళోత్ మానమ్।
చతుర్దశ (14) నాడీ స్థాన,
అన్య అష్టోత్తరమ్(108) మర్మాణి।
భౌతిక దేహ విశేషాలు
అటువంటి ఈ శరీరంలో 16 x 2 = (32) దంతాలు.
(15) సుషిరములు (రంధ్రస్థానాలు).
ఈ దేహము పొడవు (96) అంగుళములు. (96 ఉంగరపు వ్రేలుల ప్రమాణము).
ఇందులో నాడీ స్థానములు - (14).
మర్మావయవ స్థానాలు (108).
తత్ర ద్విసప్తతి (72) ధమస్య (ధమనస్య)
తాసామ్ మధ్యేః ద్విసప్తతి।
తాసు ముఖ్యాః త్రిస్ర(3) → ఇడా పిగళా సుషుమ్నా చ ఇతి।
తురీయా(4) పురీతతిః।
పంచమీ(5) జీవితమ్।
జీవితాత్ అధి పిత్తమ్।
పిత్తాత్ అర్వాక్ పురీతతిః।
నాభేత్ ఊర్ధ్వమ్ ద్వయ అంగుళే వామభాగే
పిత్త మూలమ్ ప్రతిష్ఠితమ్।
అన్నమ్ అశితమ్ త్రేధా విధీయతే।
మూత్రమ్; పురీషమ్; సార ఇతి।।
మూత్రమ్ ద్విధా భూత్వా నాభేః అధో వామే ప్రస్రవతి।
పురీషమ్ సప్తధా। తత్ర దక్షిణే వర్తతే।
సారః పంచవిధః శరీరమ్ వ్యాప్నోతి।
తేనవై రేతః శోణితమ్ చ అన్న పానాభ్యామ్।
ముఖ్య ధమన నాడులు - (72).
ఇతర నాడులు (సిరలు) (72).
ఈ నాడులలో అతిముఖ్యమైన పాత్ర వహిస్తున్నవి - ‘3’ నాడులు → ఇడ, పింగళ, సుషుమ్న.
నాలుగవది శక్తి నాడి - ‘పురీతతి’.
ఐదవ నాడి - ‘జీవుడు’.
ఆ తరువాత ‘పిత్తము’.
పిత్తమునకు ముందు ‘పురీతతి’.
నాభి (బొడ్డు) స్థానమునకు రెండు అంగుళముల దూరంలో ఎడమ వైపుగా ఉపరితలంగా పిత్తము యొక్క మూలము ప్రతిష్ఠితమై ఉన్నది.
జీవుడు తినుచున్న ఆహారము పిత్తములో ‘‘(1) మూత్రము (2) మలము (3) సారము’’.. అను మూడు విధములుగా మారటం జరగుతోంది.
మూత్రము - రెండు భాగములుగా అయి, నాభి స్థానమునకు ఎడమ వైపుగా పిత్తమూలస్థానమునకు క్రిందుగా ప్రవహించుచున్నది.
మలము ఏడు మార్గములుగా దేహము యొక్క కుడివైపుగా కదలుచూ వెళ్లుచున్నది.
ఇక అన్నసారము ఐదు విధములుగా అయి శరీరమంతా వ్యాపించుచున్నది.
అన్నము - పానములు నుండి దేహములో రేతస్సు (వీర్యరసం), రక్తము ఏర్పడుచున్నాయి.
53 తత్ర దేహే చాలకో వాయుః సప్రాణః।
సూత్రాత్మా, తేనో ఉచ్ఛ్వసతి, నిశ్వసతి, చేష్టతే చ।
సహి అంగమ్, శారీరకమ్।
తేన వినా న జీవతి।
వాయునావై రుధిర స్రోతాంసు
ఉ (యు)రశ్చక్రా (హృదయచక్రా)- నాడీషు చాల్యంతే।
తత స్త్వాచమ్ సర్వదర్శనమ్।
ఈ దేహమంతా కదలిక - స్పందము కలిగియుండేటట్లు చేసే వాయువు ‘ప్రాణము’.
ఆ ప్రాణము నూలుపోగు ఆకారంగా దేహంలో ప్రవర్తిస్తోంది. అట్టి ప్రాణ శక్తి యొక్క ప్రభావము చేతనే ఈ శరీరములో శ్వాసపీల్చటం, వదలటం, సంచరించటం - మొదలైన కార్యక్రమములన్నీ జరుగుచున్నాయి. అంగములు కదలుచూ ప్రవర్తిస్తున్నది. ప్రాణశక్తి చేతనే దేహము జీవిస్తోంది. ఈ ప్రాణశక్తి లేకుంటే ఈ దేహము జీవించదు. వాయువుల ప్రసరణ శక్తి చేత రక్తము హృదయచక్రము నుండి సర్వనాడుల మూల-మూలలకు ప్రసరిస్తోంది. వాయువే రక్తమును సర్వేంద్రియములు చేరటానికై స్పందన నిర్వర్తిస్తోంది.
54 రసః పక్వః సవిత్రీ కుక్షౌ
స్రంసిన్యా జరాయుమ్ గత్వా
శిశు శిరః కపాలమ్ ప్రవిశ్య
సుషుమ్నా ద్వారా
గర్భశాబక ప్రాణమ్ తర్పయతి।।
పక్వమైనటువంటి అన్నము (ఆహారము) యొక్క రసము తల్లిగర్భంలో ‘‘నాడీద్వారము’’ ద్వారా ‘‘గర్భాశయము’’ చేరుతోంది. ఆ గర్భాశయము నుండి శిశువు యొక్క (జీవపిండము యొక్క) కపాల మూలముగా ప్రవేశిస్తోంది. ‘‘సుషుమ్న నాడీ మార్గము’’గా జీవి (పిండము) యొక్క ప్రాణశక్తిని ఆ అన్నరసము చేరుచున్నది. ఆ శిశువు యొక్క పిండ దేహములోని ప్రాణశక్తిని చేరి, అద్దానిని సంతృప్తి పరచుచున్నది.
55 సుషుమ్నా బ్రహ్మనాడీ భవతి।
తత్ర వ్యజ్యతే ప్రాణాదిః గర్భస్య
జన్మ అభిముఖే
అథోధః ప్రస్కందతే
జాతస్యతు హృదయే ప్రతిష్ఠితః।
గర్భములో ఉన్న శిశువుకు నివాస స్థానము ‘సుషుమ్న’ - బ్రహ్మనాడి అయి ఉన్నది. బ్రహ్మరంధ్రమువరకు విస్తరించి ఉండటంచేత ‘బ్రహ్మనాడి’.
గర్భములో ఉన్నప్పుడు ఆ శిశువు యొక్క ‘‘మూల ప్రాణశక్తి’’ మొదలైన శక్తితత్వాలన్నీ బ్రహ్మనాడి యందే ఉండి, ఆ శిశువు తల్లి గర్భము నుండి బయల్వెడలుచున్నప్పుడు, శిరస్సు అధో ముఖము అగుచుండగా - ఆ మూలప్రాణశక్తులు హృదయస్థానములో ప్రవేశించి, అక్కడ ప్రతిష్ఠితమగుచున్నాయి
తంతు యోగేన ఆయమ్య ‘‘భ్రూమధ్యాత్ -
సుషుమ్నాంతమ్’’ ప్రాపయేత్,
‘‘యథాగర్భగః తథా అపరోక్ష దర్శీ’’ భవతి।।
ఇక.., ఒకానొకరోజున - ఆ శిశువు జన్మించి, దేహముతో తాదాత్మ్యము చెందుచూ - ఇంద్రియ విషయములే తన యొక్క సర్వస్వముగా భావించుచున్నది. సంసార పంజరములో ఈ జీవుడు మరల చిక్కుకొనుచున్నాడు.

యోగాభ్యాసులు :
ఇప్పుడు యోగి హృదయస్థానము నందున్న మూల ప్రాణశక్తిని యోగాభ్యాసం చేత భ్రూమధ్య స్థానము నందు గల సుషుమ్నానాడి యొక్క తుది ప్రదేశము వరకు తీసుకొనిపోయి నిలిపినప్పుడు.. ఆ యోగి - గర్భస్థ శిశు క్షణికానుభవం వలె- అనుక్షణికంగా అపరోక్షమగు ఆత్మను దర్శించగలడు.
56 తాదృగ్ విధే దేహే,
అంతర్యామిః ఆత్మా, అమృతః
సాక్షీ, పురుషః
సహి ఆవృతో
జీవత అభిమాన అవిద్యయా చేతతే ప్రాణీ।
తస్య ఆవరకమ్ అజ్ఞానమ్ బీజమ్।
తత్ అంకురమ్ అంతః కరణమ్।
తత్ వృక్షః శరీరమ్।
అట్టి ఈ దేహములో → పురుషుడు (ఈ సృష్టులను స్వప్నములను కల్పించుకోవటం - త్యజించటం నిర్వర్తించగల పురుషకారము గల తత్త్వము) - అంతర్యామియై, అమృత స్వరూపుడై, కేవల సాక్షిస్వరూపుడై ఉన్నాడు.

ఆ పురుషుడు ‘‘ఇంద్రియ విషయములే నాకు సంబంధించిన పూర్తి సత్యము’’.. అను రూపమగు అవిద్యచే కప్పబడి ఉన్నాడు. దేహాభిమానియై, దేహము నందు - చరిస్తూ ‘‘నేను పరిమితమగు జీవుడను’’ అను స్థితిని అనుభవిస్తున్నాడు.

ఈవిధంగా జీవుడు యొక్క ‘‘జీవ బద్ధత్వము’’ పొందుచున్నాడు (లేక) సంసారమునకు నిబద్ధడగుచున్నాడు. ‘‘ఆత్మగురించి ఏమరచి, - ఇంద్రియ దృశ్య విషయములే నా సర్వస్వము’’ అనురూపము గల పరిమిత భావనను ఆశ్రయిస్తున్నాడు. అదియే అజ్ఞానమునకు బీజము.
- ఆ బీజము యొక్క అంకురము - మనో - బుద్ధి చిత్త అహంకారావరణమగు అంతఃకరణము అగుచున్నది.
- ఆ అంకురము యొక్క వృక్షరూపమే - ఈ శరీరము.
57 తస్మిన్ లోమ్నామ్
అష్టౌ కోటయః (8 కోట్లు) అస్తు।
అశీతి (80) సంధిశతమ్,
నవ స్నాయు శతాని (900)।
హృదయ పలాని అష్టౌ (8)।
ద్వాదశ (12) పలా జిహ్వా।
పిత్తమ్ ప్రస్థమ్।
కఫశ్చ ఆఢకమ్।
శుక్లమ్ కుడుపం
మేదః ప్రస్థౌ ద్వౌ।
సర్వమ్ నశ్వరమ్ విజ్ఞాయ।
యథా గర్భగః సుషుమ్నా
ప్రతిష్ఠితో భూయాత్
జంతుః వివేకీ ముచ్యతే।
న పునః శరీరమ్ ప్రాప్నోతి।
అటువంటి ఈ దేహములో..,
- 8 కోట్ల రోమ స్థానములున్నాయి.
- ‘80’ వందల సంధులు
- 9 వందల నరములు
హృదయము (గుండె) → 8 ఫలములు.
జిహ్వ(నాలుక భాగం) → 12 ఫలములు.
పిత్తము → ఒక ప్రస్థము (పడి)
కఫము → ఒక తూమెడు
శుక్లము → రెండు తూములు (కడుపము)
మేదము (క్రొవ్వు) - రెండు ప్రస్థములు (రెండు పడులు)
‘‘ఇదంతా నశించబోయేదే! చచ్చిన వాటితో సమానమే’’
అని ఈ జీవుడు తెలుసుకొని ఉండాలి.
-గర్భములో ఉన్న శిశువు వలె
- ‘సుషుమ్నానాడి యందు’ స్థిరస్థానము కలిగి ఉండు గాక।
విజ్ఞానియై సుషుమ్నా నాడి స్థానము పొంది ఉండును గాక।

గురువును శరణు వేడి, యోగాభ్యాసి అయి శరీరము యొక్క సర్వ విషయాలు దాటిపోయి సుషుమ్నలో ఉండి, తన యొక్క కేవల-పురుషరూపదర్శనముచే సర్వదేహ విషయ-విశేషాల నుండి విముక్తుడగుచున్నాడు. ఇక శరీరత్వమును ప్రాప్తించుకోక, సర్వదా పరమై పరస్వరూపుడై పరమాత్మ అయి విరాజిల్లుచున్నాడు.
58అన్యథా తు అజ్ఞస్య
సంసారిణ అహరహః
క్రిమివత్ తత్ మూత్ర - పురీషయోః పానమ్,
యథా నరకే తద్వత్ ఇహైవ శరీరే।
తదేతత్ పరిమాణమ్ పరిజ్ఞాయ నిర్విద్యాత్।
అట్లా కాకుండా-
- ఈ దేహమును - ఇందలి ఇంద్రియాది సర్వ సంబంధిత విషయాలను నశించునవిగాను, ‘దేహి’ అనబడు పురుషుడు శాశ్వతుడుగాను - దర్శించనివాడు నిబద్ధుడు.
‘‘నేను ఇంద్రియ సంబంధితుడను’’ అను భావించువాని గతి ఏమిటి? అట్టివాడు అజ్ఞుడై, సంసారి అయి, రాత్రింబవళ్లు గడుపుచున్నాడు. ఒక క్రిమి కీటకము వలె ఈ శరీరములో గర్భస్థుడై మూత్ర-పురీషముల స్పర్శలను పొందుచూ, అనేక నరకయాతనలు అనుభవించవలసి వస్తోంది. ఈ శరీర బంధనములలో చిక్కుకుని నానా బాధలు అనుభవించుచున్నాడు.

ఈ దేహమునకు వేరై, దేహమునకు ఏమాత్రము సంబంధించని తన యొక్క పరమ పరుషస్థానమును తెలుసుకొనుటకై వైరాగ్యమును పొంది, ఈ దేహమును ఉపకరణముగా చేసుకొని, మోక్షలాభము సంపాదించుకుంటున్నాడు.

పైప్పలాదం మోక్షశాస్త్రం
పరిసమాప్తం పైప్పలాదం మోక్షశాస్త్రం పరిసమాప్తమితి ..
ఇతి పైప్పలాదమ్ మోక్షశాస్త్రమ్ పరిసమాప్తమ్।।
ఇత్యుపనిషత్।
గర్భోపనిషత్ సమాప్తా।
శ్రీ పిప్పలాద మహర్షిచే ప్రబోధించబడిన దేహతత్త్వము - మోక్ష - మార్గముల గురించి చెప్పుచున్న ఈ గర్భోపనిషత్ మోక్షశాస్త్రము
సమాప్తము.
ఇతి గర్భోపనిషత్

ఇతి గర్భోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



కృష్ణ యజుర్వేదాంతర్గత

11     గర్భ ఉపనిషత్

అధ్యయన పుష్పము


శాంతి పాఠము

ఓం
మం।।శ్లో।।
సహనావవతు। సహనౌ భునక్తు।
సహవీర్యం కరవావహై।
తేజస్వి నావధీతమస్తు।
మా విద్విషావహై ।।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।

గురు - శిష్యులమగు మేమిరువురము →
→ (‘‘ఆత్మమేవాహమ్’’ అను స్వాభావికానుభవము కొరకై) కలసి ప్రయత్నశీలురము అగుచున్నాము.
→ ఉభయులము ఆత్మానుభవ ఫల రసమును పొంది ఆనందించెదము గాక!
→ తేజోరూపమగు ఆత్మ మాకు అవగతము, అనుభవము అగునుగాక!
→ పరస్పరము ద్విషము (ద్వేషము, ద్వైతము) దరిజేరనీయక ఆత్మ భావనతో దర్శించుకొనెదము గాక! సర్వతాపములు ఆత్మయందు సశాంతించును గాక।

ఓం
మం।। శ్లో।।
శం నో మిత్రః। శం వరుణః।
శం నో భవతు అర్యమా।
శం న ఇంద్రో బృహస్పతిః।
శం నో విష్ణురురుక్రమః।
నమో బ్రహ్మణే। నమస్తే వాయో।
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి।
త్వామేవ ప్రత్యక్షమ్ బ్రహ్మ వదిష్యామి।
ఋతమ్ వదిష్యామి! సత్యమ్ వదిష్యామి।
తన్మామవతు। తద్వక్తారమవతు।
అవతుమామ్। అవతువక్తారమ్।
ఓం శాంతిః శాంతిః। శాంతిః।

తేజోరూపుడు, తేజోప్రదాతయగు సూర్యభగవానుడు, జీవనప్రాణప్రదాత అగు వరుణ భగవానుడు. త్రిలోకాధిపతియగు ఇంద్రభగవానుడు. దేవతల గురువగు బృహస్పతులవారు, సర్వమును ఆక్రమించినవారైయున్న విష్ణుభగవానుల వారు - మాకు సుఖశాంతి ఐశ్వర్య ఆనంద ప్రదాతలయ్యెదరుగాక! ఓ సృష్టికర్త యగు బ్రహ్మదేవా! బ్రహ్మమును నిర్వచించు వేదములలోని బ్రాహ్మణములారా! మీకు నమస్కరిస్తున్నాము. ఓ వాయుదేవా! ప్రాణేశ్వరా! (చేతన-ప్రేరణ స్వరూపులగుటచే) మీరే (ప్రాణశక్తియే) ప్రత్యక్ష బ్రహ్మముగా ఉపాసిస్తున్నాము.
ఋక్కులు చెప్పుచున్న సర్వదా సత్ స్వరూపమైయున్న బ్రహ్మము గురించియే సంభాషించుకోవటానికి మేము సంసిద్ధులమగుచున్నాము.

‘ఓం’ శబ్దార్థ - పూర్ణాత్మానంద స్వరూపుడు, విశ్వేశ్వరుడు - అగు పరమాత్మకు నమస్కరిస్తున్నాము!

ఆ తత్-బ్రహ్మము మమ్ము (మరియు) మాకు బ్రహ్మమును గురించి బోధిస్తున్న వక్తారులను (గురువులను) సర్వదా రక్షించునుగాక!

ఓం శాంతిః। శాంతిః। శాంతిః।

⌘ ⌘ ⌘

భౌతికంగా, సాకారముగా కనిపిస్తూ ఉన్న శరీరము -

ఐదు (5) వస్తువులతో పంచాత్మకమై నిర్మితమౌతోంది → (భూమి - జలము - అగ్ని - వాయువు ఆకాశము)

ఐదు (5) వస్తువులు తనయందు కలిగి ఉండి వర్తించుచున్నది. → (శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములు)

ఆరింటిని (6) ఆశ్రయించి ఉన్నది. → (తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదుల అనుభవములు)

ఆరు (6) గుణములతో కూడినదై ఉన్నది. → (ఉనికి, పుట్టుక, ఎదుగుదల, మార్పు, కృంగటం, నాశనము)

ఏడు (7) ధాతువులను కలిగి ఉంటోంది. → (చర్మము, రక్తము, మాంసము, క్రొవ్వు, బొమికలు, నరములు, నాడులు)

మూడు (3) మలములచే కప్పబడి ఉంటోంది. → (వాత పిత్త కఫములు)

మూడు (3) యోనులను-కారణములను కలిగి ఉన్నది. → (స్థూల, సూక్ష్మ, కారణ దేహములు. తండ్రి-తల్లి - పంచభూతములు)

చతుర్విధములైన (4) ఆహారములను స్వీకరించి రూపుదిద్దుకుంటోంది. → (భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు)

అటువంటి ఈ శరీరము యొక్క స్వభావము గురించి, ఇందులో దాగియున్న పురుషతత్త్వము [One who is using or operating - The Functioner] గురించి, ‘మోక్షము’ యొక్క మార్గము స్థానముల గురించి ఇప్పుడు మనము వివరించుకుంటున్నాము.

⌘ ⌘ ⌘

పంచభూతాత్మకమ్

ఎందుచేత, దేనిని ఉద్దేశ్యించి ఈ దేహము ‘పంచభూతాత్మకము’ అని చెప్పుకుంటున్నాం?

ఒక ‘ఐదు’ మూలతత్వాలచే ఈ భౌతిక దేహము నిర్మితమై సమ్మేళనముగా వ్యవహరిస్తోంది.

అస్మిన్ పంచాత్మకీ శరీరే కా పృధివీ ఇత్యాదిః?
పంచాత్మక జనశరీరాలలో పృథివి మొదలైనవి ఏమై ఉన్నాయి?

1.) కా పృథివి? యత్ కఠినం, సా పృథివి! ఏదైతే ఘనరూపంగా కనిపిస్తోందో - అదీ పృథివి. చర్మము, మాంసము, బొమికలు, నరములు, ప్రేగులు.. వీటిలోని ఘనీభూత (Solid) తత్వము - పంచభూతములలో మొదటిదగు ‘పృథివి’గా చెప్పబడుచున్నది.
పృథివీ → నామధారిణే। రూపాత్మకమై, ఘనీభూతంగా, పార్థివరూపంగా, పాదార్థికంగా, వస్తు రూపంగా కనిపించేదంతా పంచభూతములలో భూ(లేక) పృథివీ తత్వము అయి ఉన్నది.

2.) కా ఆపః? యత్ ద్రవమ్, తత్ ఆపో! ఏదైతే ద్రవరూపంగా దేహములోను- బాహ్యముగాను కనిపిస్తోందో… (రక్తము మొదలైనవి). అదంతా ‘ఆపః’ అను పంచభూతములలోని రెండవదగు జలతత్త్వము. ఆపః పిండీకరణే। ఈ ద్రవతత్త్వము - స్థూలమైన దానిని పిండీకరణరూపంగా తయారు చేయుటకు కారణమగుచున్నది.

3.) కిం తేజః? యత్ ‘ఉష్ణమ్’ తత్ తేజో: దృశ్యములోను; దేహములోను, విశ్వములోను కనిపించే వేడి-ఉష్ణము-వెలుతురు (కాంతి) రూపంగా ఏది కనిపిస్తోందో.. అదియే పంచభూతములలో మూడవది అగు తేజస్సు. తేజో రూపదర్శనే! - ఘన-ద్రవరూపములను ఏకాంతిచే చూడగలుగుతున్నామో.. అదియే తేజము (లేక అగ్ని). గు కారమ్ కాంతిత్వాం తేజోమయమ్ యత్ సరూపమ్ - కాంతిమ్-ప్రకాశమ్ కురుతే, తత్ అగ్నిః । చీకటిని తొలగించి ఆకారములను చూపగలుగుచున్నదే… న-గ్ని = - అగ్నిః (చీకటిని లేకుండా చేసేది) ఈ దేహములో ఉష్ణము రూపముగా ఉండి తేజోరూపముగా విరాజిల్లుచున్నట్టిది.

4.) కో వాయుః? యత్ సంచరతి-తత్ వాయుః: సర్వ కదలికలకు-చలనములకు-స్పందనలకు ఏది కారణభూతమై ఉంటుందో… అదియే ‘వాయువు’. వాయుర్గమనే! సర్వత్రా సంచారము కలిగియున్నది కాబట్టి వాయువు సర్వజీవరాసులకు ఆయువు వాయువే!

5.) అస్మిన్ పంచాత్మకేశరీరేని - కిమ్ ఆకాశమ్? యత్ సుషిరమ్, తత్ ఆకాశమ్ ఉచ్యతే। ఏది మిగతా ‘4’ పంచభూతాత్మక విశేషాలకు ‘‘చోటు- Place’’…. రూపముగా ఉన్నదో, అది ఆకాశము. ఆకాశమ్ - అవకాశ ప్రదానే। తదితరములకు అవకాశము ప్రసాదించుచూ ఉన్నట్టిదే ఆకాశము. సుషిరమితి ఆకాశమ్। ఏది ఘన-ద్రవ-ఉష్ణ-వాయువులకు ద్వారప్రవేశమైయున్నదో, వృద్ధి చేస్తోందో… అది ‘ఆకాశము’ అయి ఉన్నది.

జ్ఞానేంద్రియములు - కర్మేంద్రియములు - విషయములు

ఇక ఈ దేహములో ఆ పంచభూతముల సంబంధమైన మరికొన్ని విశేషాలు ఉన్నాయి. ఆయా వివిధ శక్తులు ఇంద్రియములయందు ప్రవర్తిస్తూ. వివిధ విధులు నిర్వర్తిస్తున్నాయి. చెవులు, చర్మము, కళ్లు, మొదలైనవి ఇంద్రియ శక్తులకు ద్వారములు, ఉపకరణములు కూడా!

ఈ విధంగా ఈ శరీరంలో వివిధ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు వాటివాటి క్రియా విశేష ధర్మాలలో ప్రవర్తిస్తూ ఉన్నాయి.

ఇవన్నీ ఇలా ఉండగా.. ఇంకాకూడా మరికొన్ని విశేషాలు ఈ దేహంలో అంతరంగ చతుష్టయ విభాగాలై ప్రవర్తిస్తున్నాయి.

దేహాంతర్గత అంతరంగ చతుష్టయం (4)

బుద్ధ్యా బుద్ధ్యతి నిశ్చినోతి! అంతరంగములోని ‘బుద్ధి’ అని చెప్పబడే విభాగము.
- అనేక విషయములను గ్రహించటము. అర్థం చేసుకోవటము (understanding and interpreting).
- ఏది ఎట్లా నిర్వర్తించాలో, (లేక) నిర్వర్తించవద్దో.. నిర్ణయములు తీసుకోవటము (Decision making) - ఇవన్నీ బుద్ధి విభాగము.. నిర్వర్తిస్తోంది.

మనసా సంకల్పతే - వికల్పతే : ‘మనస్సు’ అని పిలువబడే మరొక విభాగము సంకల్పములు నిర్వర్తించటము - విరమించటము (Taking up thought provoked assumptions and pressumptions as well as withdrawing the same) - నిర్వర్తిస్తోంది.

చిత్తేన సంజానాత్ : ‘చిత్తము’ అను విభాగము కొన్నిటిని ఇష్టముగాను, మరికొన్ని అయిష్టమైనవిగాను గుర్తిస్తూ, తెలుసుకొంటూ ఉన్నది. భావము + ఆవేశము.. కలిసి చిత్తము రూపముగా అగుచున్నది.

అహంకారేన అహమ్ ‘కరోతి’ : ‘అహంకారము’ అనబడు విభాగమేమో, ‘‘ఇది నేను. ఇది నాకు సంబంధించిన నేను. నేను ఇట్టివాడను. అటువంటి వాడను కాను. ఇవన్నీ నావి. అవి కావు. వీరు నా వారు, వారు కాదు’’.. ఇత్యాది అహంకార సంబంధమైన భావనా-క్రియా-సంకల్పనా కార్యవిశేషాలన్నీ నిర్వర్తిస్తోంది.

ఈ ‘‘అంతరంగ చతుష్టయము’’ అను మనో, బుద్ధి, చిత్త, అహంకారములు - ఆయా సంబంధితమైన విశేషాలలో, విషయాలలో వర్తిస్తూ ఉన్నాయి.

రసా షట్(6) ఆశ్రయమ్

ఇంకా ఈ దేహము - ‘6’ రసాస్వాదనలు తన యందు ప్రవర్తించుచున్నదై-ఉన్నది. కుతః తత్ ఆశ్రయమ్ ఇతి? ఏమిటా ఆరు ఆశ్రయాలు? - అవి ఈ ‘6’ రసాలు - రుచులు!

        తీపి (మధుః) :: పులుపు (ఆమ్ల) :: ఉప్పు (లవణ) :  
        కారము (కటు) :: వగరు (కషాయ) :: చేదు (తిక్తా) ;

ఈ ఆరు రసాలు దేహాన్ని ఆశ్రయించి ఉంటున్నాయి. (లేక) ఈ దేహము - ఆ ‘6’ రసాలను ఆశ్రయించి ఉంటోంది!

ఆరు భావవికారాలు - షడ్వై భావ వికారాః

ఈ దేహము స్థితి-గతులకు సంబంధించిన భావనా సంబంధమైన వికారాలు తనయందు అనునిత్యము చేసుకొని ఉంటోంది.

(1) అస్తి (ఉండి ఉండటము - ఉనికి)
(2) జాయతే (పుట్టటము)
(3) వర్ధతే (ఎదగటము)
(4) పరిణామము (Change) పొందుచూ ఉండటము
(5) ఉపక్షయము (కృంగుతూపోవటము)
(6) వినశ్యతి - నాశనము పొందటం.

ఇవన్నీ విక్రియముగా (స్వయత్నము లేకుండానే) దేహమునకు సంప్రాప్తిస్తున్నాయి.

ఆరు చక్రములు - షడ్వై చక్రాని - షట్ చక్రములు

గర్భ-ఉపనిషత్-దేహములో-ఆరు-చక్ర-స్థానములు

(ఆయా వేరు వేరు ఉపనిషత్తులలో ప్రవచించబడిన కొన్ని వివరణలు కూడా పైన ఉదహరించుకుంటున్నాము).

ఈ ఆరు - శక్తియొక్క వివిధ కేంద్ర బిందుస్థానములుగా ఉన్నవై, దేహము యొక్క పృథివీ-ద్రవ-ఉష్ణ-వాయు-ఆకాశ-జీవాత్మత్వములను పర్యవేక్షిస్తూ యోగులను జీవపరిమితత్వము నుండి ‘‘పరమ పురుషత్వము, బ్రహ్మీభావము, పరమాత్మత్త్వమును సర్వాత్మత్వమును’’ - పునికిపుచ్చుకొనే ఉపాసనా స్థానములై ఈ దేహములో చెన్నొందుచున్నాయి. అనగా పరము (వేరుగా - అన్యముగా) ఉన్న స్వస్వరూప ఆశ్రయమునకు మార్గములగుచున్నాయి.

షట్ (6) అవగుణాః - అరిషట్‌వర్గము

అంతర్గతంగా ఈ దేహమును ‘అహం-మమ (నేను-నాది)’’ అని పరిపాలిస్తున్న దేహిని వెంటనంటి ‘6’ అవగుణాలు ఉంటున్నాయి. అవి ఆరు విభాగములుగా (వర్ణములుగా) చెప్పబడుచున్నాయి.

(1) కామము : ‘‘ఏదో ఇంకా ఇంకా పొందాలి. అప్పటిదాకా శాంతి లేదు - సుఖము లేదు’’.. అనే మనో నిశ్చయముతో ప్రవర్తించటము. సహజ స్వభావమగు సంతోషమును పోగొట్టుకొని ఉండటము.
- ఇంకా ఈ ఈ సంపదలు, ఆ సంబంధాలు, సానుకూల్యతలు కావాలి. అప్పటికిగానీ ‘సుఖము’ లేదు.
- ఇంద్రియముల వలన ఇంకా సుఖమయ వస్తు-విషయ సంబంధాలు లభించే వరకు ఇదంతా దుఃఖమే.
… ఇటువంటి రజోగుణ స్వభావము చేత తీవ్రంగా ఆకాంక్షలు కలిగి ఉండే స్థితిని ‘కామము’ అంటారు. దృశ్య విషయముల పట్ల అభినివేశ రూపమే ‘కామము’గా ప్రవర్తిస్తోంది.

(2) క్రోధము : కొన్నిటిపై, కొందరిపై అయిష్టత. కోపము. ఆ కోపము ఆవేశము రూపంగా ప్రదర్శితమగుచున్నది. ఫలితం? అంతరంగమంతా అంశాతితోను, అయిష్టతతోను, ఇతరులకు బాధ, కష్టము కలిగించే రీతిగాను భావోద్వేగాలు బయల్వెడలుచుండటము జరుగుతోంది.

(3) లోభము : కొన్నిటిపై రాగము - ‘‘ఇవి నావే! నాకు చెందినవే! ఇవి కోల్పోయానా, నాగతి నిర్గతే!’’.. అనే మమకారము. దోచుకొని - దాచుకొని ఉండాలనే స్వభావము,
తత్ఫలితంగా తెలివి-ధ్యాస కొన్ని వస్తువులకు పరిమితమై, బుద్ధి వికసించక, … పరము - నిత్యము అగు సత్యమును జీవుడు గమనించటానికి సంసిద్ధుడు కాలేకపోవుచున్నాడు. ‘దేహమునకు నేను పరిమితుడను’ అను పరిమిత-న్యూనతాభావాలు లోభగుణానికి సంబంధించినవి.

ఇది జీవునికి అశాంతియే కల్పిస్తోంది కాబట్టి - ఆరుగురు శత్రువులలో (అరిషట్ వర్గము)లో ఒకటి అయి కూర్చుంటోంది.

(4) మోహము : పరిమిత దృష్టితో కూడిన భావాలు - అభిప్రాయాలు - భ్రమ క్రోధ స్వభావాలు కలిగి ఉండటం. వాటిచే ప్రభావితులై వస్తు-విషయ దర్శనము చేయు స్వభావము.
సమగ్రంగా సమాచారము కలిగి ఉండక, అందుకు ప్రయత్నించక… సత్యమును ఏ మరచటము. అసత్యమును, కల్పితమును సత్యము వలె దర్శించటము. సందర్భంగా కనిపించే దానినే సత్యమని భావిస్తూ, సహజము-నిత్యము అగు సత్యమును ఏమరచటము.

ఉదాహరణకు -

  1. ఈ దేహముల మునుముందు, దేహానంతర స్థితి స్థానములు, సర్వాతీత స్వస్వరూపము మొదలైన విషయముల అధ్యయనము చేయకుండా ఎటువంటివో పరిశీలించుకోకుండా, వర్తమానంలో కనిపించే రూపమును ఊహ-అపోహలను జోడించి… అప్పుడు జనిస్తున్న అభిప్రాయములతో కూడి ప్రవర్తించటము. పరిమితమవటము.
  2. అల్పమైన ఆశయములను స్వీకరించి, మహదాశయములను తిరస్కరించటం.
  3. లేనిది-ఉన్నట్లుగాను, ఉన్నది లేనట్లుగాను అనిపించే అభ్యాసము.

ఇవన్నీ ఆనందమయమగు సర్వాత్మావగాహనకు అడ్డుగోడగా ఉండటం జరుగుతోంది.

అందుచేత ఈ మోహము - అరిషట్‌వర్గములలో (అంతఃశత్రువులలో) ఒకటిగా చెప్పబడుతోంది.

(5) మదము :‘‘ఇతరుల కన్నా నేను ప్రత్యేకత గల వాడను. అధికుడను. తదితరులు నాకన్నా అల్పులు, స్వల్పులు’’ - అను రూపముగల - జాతి, విద్యా, ధన, జన…ఇత్యాదుల వలన కలిగేవి - మదగర్వము. ‘నేను గొప్ప వాడినని అందరూ అనుకోవాలి’ అనే తీవ్రాశయం కలిగి ఉండటం. ఇతరులను తక్కువ చేసి చూచుచూ మాట్లాడే స్వభావమే ఇందుకు బీజము. కనుక, భగవత్ ప్రసాదితమైన శక్తి-యుక్తులు పరమశాంతమగు ఆత్మసత్యమువైపుగా కాకుండా, గర్వము-దర్పములవైపుగా ఈ జీవుని నడిపిస్తున్నాయి. అందుచేత ఇది జీవునికి శత్రువుగా పరిణమించుచున్నదని గుర్తు చేయబడుతోంది.

(6) మాత్సర్యము : అధికార-ధన -జన సంపదను చూచుకొని, ఇతరులపై ఆధిపత్యము, క్రూరత్వము, బాధించటము, అవమానించటము, ఎగతాళి చేయటం - ఇటువంటివన్నీ ఆనంద విషయములుగా అనుకోవటము… ఇవన్నీ మాత్సర్య స్వభావములు. ఇవన్నీ ఆత్మ దృష్టికి సుదూరంగా తీసుకొని పోవుచుండటం చేత.. ఇది జీవునికి శత్రువుగా చెప్పబడుతోంది.

ఈ విధంగా ఈ (‘6’) అరిషట్‌వర్గ అవగుణములు ఈ దేహములో అంతరంగమునందు మనో-బుద్ధి కల్పితములుగా అభ్యాసవశం చేత ఏర్పడినవై ఉంటున్నాయి.

శరీర ఉపకరణము - శమాదిషట్కసంపత్తి

యోగాభ్యాసకుల కొరకై యోగ శాస్త్రముచే మార్గము చూపబడుచున్న ‘6’ యోగాభ్యాస సంబంధమైన నిష్ఠలు కూడా ఈ దేహము చేత ఆశ్రయించబడుచున్నాయి. (లేక) ఈ దేహము ఈ ‘6’ అభ్యాస సంబంధమైన గుణవైశిష్ఠ్యాలు కూడా ఏర్పడి ఉన్నాయి.

(1) శమము : కామము - క్రోధము మొదలుగా గల అరిషట్‌వర్గములను శమింపజేస్తూ ఉండగా ప్రవృద్ధి పొందుచుండు శాంతస్థితి. బాహ్య విషయ నిగ్రహము. సందర్భములకు, సంగతులకు, సంపద-ఆపదలకు వేదన చెందకుండా, శాంతమును కోల్పోకపోవటము. శాంత రస స్థాయీ భావః। మనస్సు శాంతిని ఆశ్రయింపజేయటం

(2) దమము : ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియనిగ్రహాది క్లేశ సహనమ్! ఇంద్రియములను నియమించటం. కష్ట సుఖ సందర్భములపట్ల సహనశీలుడై ఉండటము. ఇంద్రియములు విషయములపై వ్రాలే అభ్యాసమును నిగ్రహించటము.

(3) తితిక్ష : ఓర్పు. క్షమాగుణం. సహించగలగటము. బాధలను, వ్యతిరిక్తతలను భరించటగలగటము. కష్టాలను జగద్గురు భగవానుని పాఠ్యాంశ శిక్షణగా దర్శించటము. సంగతులను, సందర్భములను, సంబంధములకు ఆవేశకావేశములు.

ప్రాణాయామము : రేచక - పూరక-కుంభకాది వాయు బంధనము. ప్రాణశక్త్యోపాసన. ప్రాణ చలన-మౌనగమనిక. ప్రాణోపాసన ద్వారా ప్రాణేశ్వరుని ఆశ్రయించటం. ‘శక్తి’ని ఉపాసిస్తూ శివదర్శనం. ఇది తితిక్షను వృద్ధి చేయగలదు.

(4) ఉపరతి / ప్రత్యాహారము : బాహ్య దృష్టిమ్ పరిత్యజ్యామ్-అంతర్ముఖత్వమ్! ఇంద్రియములను అదుపులో ఉంచుకొని, ఉపాసనల వైపుగా, భగవదారాధన మార్గముగా నియమించటము. అందరిలో అంతర్గతమైయున్న ఆత్మనే దర్శించు అభ్యాసము.

(5) శ్రద్ధ / ధారణ : ఆత్మభావనా పరిపోషణ. ఏకాగ్రత్వం. దృష్టిని నిలుపి ఉంచటము. బుద్ధి యొక్క చంచలత్వమును త్యజించే ప్రయత్నము.

(6) సమాధానము / సమాధి : సర్వత్రా స్వాభావికమైన సమదర్శనం. ఆత్మగా అంతా దర్శించటము. విషయములు విషయములుగా కాకుండా… ‘‘ఆత్మౌపమ్యేవ దృష్టి’’ - కలిగి ఉండటము.

ఈ యోగనిష్ఠాగుణ సంపత్తికి ఈ దేహము సాహకారికమగు ఉపకరణము.

ఇష్టా - అనిష్ట శబ్ద సంజ్ఞా - ప్రతివిధాభవంతి సప్త।

ఈ దేహములో గల కంఠములోని కండరములలోను-నరములలోను-ఉపనరములలోను వాయు ప్రసరణముచే ఈ జీవుడు… తన ఇచ్ఛాశక్తి ప్రభావం చేత శరీరము నుండి శబ్దములు పలికించుచున్నాడు.

అట్టి నాదములు చిత్తముచేత ఇష్టము తెలియజేయటానికి కొన్ని, అయిష్టము తెలిపుటకు మరికొన్ని ప్రకటితమగుచున్నాయి. కొన్ని సంకల్పితంగాను, మరికొన్ని అసంకల్పితంగాను శబ్దీకరించబడుచున్నాయి.

ఈ విధంగా చిత్తము-బుద్ధి-మనస్సు-ప్రాణవాయు శక్తి ఒకచోటకి వచ్చి నిర్వర్తించే క్రియావిశేషాల చేత ఈ మానవ శరీరము నుండి ప్రదర్శనమగుచున్న శబ్దజాలము (స్వరయుక్తంగా) ‘7’ విధములుగా విభజించబడి చెప్పబడుచున్నాయి.

సామవేద సప్తస్వర బీజములు :

(1) షడ్జము (2) ఋషభము (3) గాంధారము (4) పంచమ (5) మధ్యమ (6) దైవతము (7) నిషాదాత్తము -
ఇవన్నీ… ఇష్ట (Interesting) అయిష్ట (Non interest) రూపాలుగా అనిపించుచూ, కంఠము నుండి, తదితర శరీర భాగములలోను ఉత్పత్తి అయి బహిస్పందనము-బహిర్గతము అగుచున్నాయి.

భౌతిక శరీరము - సప్త ధాతువులు

ఈ దేహములో సప్తధాతువుల సప్త రంగులలో

శుక్లము (తెలుపు) → బొమికలు - తెల్లకణములు
రక్తము (ఎరుపు) → క్రొవ్వు మొదలైనవి ఎర్రకణములు, మాంస విభాగములు మొదలైనవి
కృష్ణము (నలుపు) → ప్లీహము, (కొన్ని) ప్రేగులు, (కొన్ని) మెదడు విభాగములు మొదలైనవి
ధూమ్రము (బూడిద రంగు) → కొన్ని కండరములు మొదలైనవి
పీతము (పసుపురంగు) → బొమికలు - ప్రేగుల అంతర్విభాగములు మొదలైనవి
కపిలము (గోధుమరంగు) → చర్మాంతర్విభాగములు మొదలైనవి
పాండరము → కనుగుడ్లు మొదలైనవి

… ఈ విధమైన రంగురంగుల మేళవింపు కలిగినవై ఈ దేహములోని అంతర్-బహిర్ విభాగములు ఏర్పడి ఉంటున్నాయి.

సప్తధాతువులు - సప్తవర్ణముల మేళవించి - ఒక గొప్ప కళాకారుని కళాఖండముల వలె అవన్నీ అలంకారమగుచున్నాయి.

శరీరము - రస గుణతత్వము (రసము = Chemicals, Eg: పైత్య-జఠర రసములు)

ఈ దేహములో ఆయా ద్రవ్య విషయములు ప్రవేశించుచుండగా, అవన్నీ ఒక్కొక్క రసగుణమునకు కారణముగా అగుచున్నది.
దేహములోని-ఆహార పదార్థములోని రసగుణత్వము-పరస్పర ఏకత్వము పొంది ప్రదర్శితమగుచున్నది.
ఇదియే → ‘‘దేహములోని రసము - రసతత్వము - రసగుణస్వభావము’’.. అని చెప్పబడుతోంది.
అట్టి దేహములోని ఆహార పదార్థముతో రసపరస్పరత్వము - ‘6’ విధములుగా ప్రవర్తన కలిగి ఉంటోంది.

తిన్న ఆహారము నుండి → రసము.
రసము నుండి → శోణితము.
శోణితము నుండి → మాంసము.
మాంసము నుండి → మేదస్సు (క్రొవ్వు)
మేదస్సు నుండి → బొమికలు.
బొమికల నుండి → మజ్జ (బొమికలలోని పుప్పొడి)
మజ్జ నుండి → శుక్లము

(These are all the chemical events between “పైత్య రస - జఠర రస” of the Body with the Association of Food stuffs that continue through out the Lifetime )
… ఇవన్నీ కూడా శిశువు దేహములో రూపుదిద్దుకుంటూ,.. ఆ తర్వాత - తరువాత కూడా వృద్ధి చెందుతూ వస్తున్నాయి.

జీవ బీజ - అంకుర - పిండ - శిశువులు

శుక్ల - శోణిత సంయోగము చేత శిశువు యొక్క గర్భము (పొట్ట విభాగములు), హృదయ వ్యవస్థ మొదలైనవన్నీ రూపుదిద్దుకొని ఏర్పడినవగుచున్నాయి.

ఆ నూతన శిశువు యొక్క…

హృదయ స్థానములో … అంతరాగ్ని,
అంతరాగ్ని స్థానములో … పిత్తము,
పిత్త స్థానములో …. వాయువు,
వాయు స్థానములో … హృదయము (గుండె) హృదయపు లోపలి - బయటి సర్వ విభాగములు. ఎడమ-కుడి కవాటములు. రక్తనాళములు. రక్తజనిత స్థానము.

→ ఇవన్నీ… రూపము దిద్దుకొని, క్రమంగా క్రియాశీలకమగుచున్నాయి.

దేహ నిర్మాణ చమత్కారం

సృష్టికర్త - ప్రజాపతియగు బ్రహ్మదేవుని సంకల్పానుసారంగాను, సృష్టి నియమానుసారంగాను…,

స్త్రీ యొక్క ఋతుకాలములో స్త్రీ-పురుషుల సంయోగం చేత జరిగే కలియక - సంప్రయోగముచే (శుక్ర-శోణిత సంయోగముచే) ‘‘జీవ బీజ భౌతిక తత్త్వము’’ ఉద్భవము అగుచున్నది.

ఏకరాత్రోషితమ్ ‘‘కలలమ్’’ భవతి : పురుషుని నుండి శుక్లము- స్త్రీ నుండి శోణితము… ఈ రెండు స్త్రీ గర్భము నందు ‘ఏకము’ అయినప్పుడు - ఒక్క రాత్రి గడవగానే - … అది మీగడవలె అగుచున్నది.

సప్త రాత్రోషితం బుద్బుదమ్ భవతి : వారం రోజులకు (ఏడు రాత్రులకు) ఆ మిశ్రమము బుద్బుదము (బుడగ)వలె అగుచున్నది.

అర్ధమాస అభ్యంతరేణ పిండో భవతి : రెండు వారాలకు ద్రవపు ముద్ద ఆకారముగా - పిండము (ముద్ద)వలె ఆకారము పొందుచున్నది.

మాసాభ్యంతరేణ కఠినో భవతి : ఒక నెల రోజులు గడుస్తూ ఉండగా పలచగా ఉన్న ఆ పిండము గట్టి పడుతూ వస్తోంది.

మాసద్వయేన శిరః కురుతే : రెండు నెలల కాలం గడుస్తూ ఉండగా ఆ పిండమునకు శిరోభాగముగా ఏర్పడుతోంది.

మాసత్రయేణ పాదప్రదేశో భవతి : మూడు నెలలకు శిరోభాగముతో కూడిన ఆ పిండమునకు కాళ్లు తదితర ప్రదేశముల ఆకారాలు ఏర్పడుచున్నాయి.

చతుర్థే మాసే గుల్భ - జఠర కటి ప్రదేశో : 4 నెలలు అయ్యే సరికి ఆ పిండమునకు - చీలమండలములు, పొట్టభాగము, మొలత్రాడు చుట్టూ భాగము, నడుము ఏర్పడుచున్నాయి.

పంచమమాసే పృష్ఠవంశో భవతి : ‘5’ నెలలు అయ్యేసరికి వెన్నెముక నిట్టునిలువుగాను, గట్టితనముతోను ఏర్పడినదగుచున్నది.

షష్ఠే మాసే ముఖ - నాస - అక్షి - శ్రోత్రాణి భవతి : ‘6’ నెలలకు ముఖము-ముక్కు - కాళ్లు-చెవులు రూపుదిద్దుకుంటున్నాయి.

సప్తమే మాసే జీవసంయుక్తో భవతి : 7వ మాసము గడుస్తూ ఉండగా జీవశక్తి సంయుక్తము అగుచూ, జీవుడు అనుభవిగా ప్రదర్శితమగుచున్నాడు.

అష్టమమాసే సర్వసంపూర్ణో భవతి : ‘8’వ నెల జరుగుచుండగా ఆ జీవపిండమునకు - ఆమూలగ్రము అవయవములన్నీ సంపూర్ణంగా ఏర్పడినవగుచున్నాయి. ఆ పిండ శిశుదేహము కొంచెము కదులుచూ ఉంటుంది. ‘సంకల్పము’ పనిచేయనారంభిస్తుంది.

నవమే అపీవతే : తొమ్మిది నెలలు అయ్యేసరికి ఆ పిండము కదలటం పూర్తిగా ప్రారంభిస్తుంది. ఇక ‘‘గర్భస్థ శిశువు’’ అని పిలువబడుచున్నది. భావ-అభావములు, జాగ్రత్-స్వప్న స్వభావములు ప్రవర్తించనారంభిస్తున్నాయి.

ఈ విధంగా → స్త్రీ - పురుష… రెండు దేహముల నుండి ఒక్కచోటికి (స్త్రీ గర్భాశయములోనికి) వచ్చి చేరిన శోణితము - శుక్లము… అను పేర్లతో పిలువబడే రెండు శరీరక (మూలక - మూలసృష్టి) విభాగములు… ‘శిశువు’గా రూపముదాల్చుచున్నాయి.

ఈ రెండింటినీ కలిపి (ఆ రెండు కలిసి ఉన్నప్పుడు) ‘క్లీబము’ అని అంటారు.

ఈ విధంగా శుక్ల-శోణితములు - క్లీబము - పిండము- శిశువు-శైశవము-బాల్యము - కౌమారము.. యౌవనము- వార్థక్యము - మరణము… ఈ దశలన్నీ సృష్టికర్తయగు ప్రజాపతి సంకల్పానుసారముగా ఈ దేహము పట్ల దేహధర్మములుగా ఈ భూతాకాశమునందు అవస్థితమై ప్రవర్తిస్తున్నాయి.

వీటన్నిటిలో పరమాత్మయొక్క అంశయే ప్రవర్తితమగుచుండగా, ‘పరమాత్మ’యే ‘జీవుడు’గా ప్రదర్శితమగుచున్నారు.

శిశువు - లింగధారణ

గర్భస్థ పిండము…,

స్త్రీ యోహి కామిన్యః తాసామ్ సుఖాధిఖ్యాత్ తాఏవ బహుళా జాయంత! ప్రకృతి విధిని అనుసరించి స్త్రీలకు ‘‘కామాధిక్యత’’- కారణంగా పురుష శిశువుల కంటేకూడా స్త్రీ శిశువులు సంఖ్యాపరముగా అధికంగా ఉంటారు.

ఒక్కొక్కసారి శుక్ల-శోణితముల (పురుషుల - స్త్రీల రేతస్సుల) ఆధిక్యత - ప్రభావములు సరిసమానంగా ఉంటూ ఉండే అవకాశం ఉంటుంది. ఉభయోః బీజతౌల్యే నపుసంకో భవతి। - ఆ శిశువు స్త్రీ+పురుష - ఉభయలక్షణములు కలిగి ఉండి, నపుంసక శిశువుగా అగుచున్నది.

⌘⌘⌘

‘‘వృత్తిః’’ అనుగుణాహి ప్రవృతిః ।
వృత్తి (Avocations) అనుసరించియే ప్రవృత్తి (Tendency) ఉంటూ ఉంటుంది. కారణమును అనుసరించి కార్యము ఉండటము సామాన్యంగా (usually) లోకరీతి కదా! అట్లాగే తల్లితండ్రుల రూపురేఖలను, గుణములను అనుసరించి… కొంతవరకు శిశువుల రూపురేఖలు, స్వభావాలు ఉంటూ ఉంటాయి.

ఒకవేళ తల్లి-తండ్రులు - వారి ప్రవృత్తుల రీత్యా సంభోగసమయానికి ముందుగాని, సంభోగ సమయానికిగాని వికృతగుణవంతులు, చంచలస్వభావులు, చిత్త-చాంచల్యవంతులు, క్రూరస్వభావులు, తీవ్రమైన వ్యాకులత కలవారు, పగ-ద్వేష-హింస స్వభావులు, అకారణ క్షణ-క్షణ కోపోద్రిక్తత కలవారు, ఒకరినొకరిపట్ల తిరస్కార-ద్వేషభావములు పెంపొందించుకున్నవారు అయి ఉండటం జరుగుతుంటే… అప్పుడు పుట్టబోయే శిశువులు పుట్టుగ్రుడ్డులు, పుట్టు చెమిటివారు, పొట్టివారు, వంకర-టింకర దేహాకారములు గలవారు, శారీరక మానసిక దోషములు కలవారు అగు సందర్భములు ఏర్పడుచున్నాయి.

అట్లా కాకుండా… స్త్రీ-పురుషులు పరస్పర ప్రేమాస్పదులు, పరస్పరము ఆప్యాయత కలిగి ఉన్నవారు, స్నేహ-మృదుభావులు, స్త్రీ పురుషుల కలయికను ఉపాసనగా భావించువారు… అయినప్పుడో? ఆ శిశువులు తదనుగుణంగా సాత్విక-దైవీ గుణ సంపన్నులు, ఆరోగ్య-ప్రకాశములు గల దేహములు కలవారు అగుచున్నారు.

పుష్పవతోః ఉపరక్తయోః అంగవైకల్యభాజః :
స్త్రీల పుష్పవతిత్వ (బహిష్ఠు) సమయాలలో దంపతులు ఉపరక్తులు అయితే (సంభోగించటం జరిగితే)…, శిశువులు బలహీనులు, అంగవైకల్యము కలవారు, శారీరక-మానసిక అనారోగ్యవంతులు అగుచూ ఉంటున్నారు.

కాల దేశ క్రియా ద్రవ్యభోగ ఉపాధిభిః ఉపచిత-అపచిత, అనూరూప-అననురూపమూర్తయో భవంతి।।
స్త్రీ-పురుషుల కలయికకు సంబంధించిన కాలము-దేశము క్రియ-ద్రవ్యము - భోగములను అనుసరించి ఆ శిశువు-భారీదేహము, అతిసన్నని దేహము, సమాన-అసమాన దేహములు… ఇటువంటి ఉత్తమ-అల్ప ఆకార దేహములు- పొందుచుండటం జరుగుతోంది.

(ఉదాహరణకు..సాయం ప్రదోషకాలము సంయోగమునకు నిషిద్ధమని, పగలు సంయోగముచే శిశువులు రాక్షస-పిశాచ ప్రవృత్తులు కలిగి ఉంటారని పురాణములలోని కొన్ని దృష్టాంతాలు తెలుపుచున్నాయి).

సమ్యక్ యోగే సారూప్యమ్ అవాప్య సమానగుణా భవంతి -బింబమివ ఉపాధౌ ప్రతిబింబమ్:
→ యోగ భావనతో, సంయోగ వియోగాతీత భావులై,
→ రాగ ద్వేష మోహ ఆవేశ రహితమగు సమ్యక్ భావనతో,
→ భక్తి - జ్ఞాన-ధర్మానుసరణానుకూల - లోక కల్యాణ సంకల్పములతో,
→ సాత్వికవృత్తులు, ఆప్యాయత, అనురాగము ఇత్యాది దైవీసంపత్తి ఆశ్రయించుచున్నవారై…,
దంపతులు ఉంటున్నప్పుడు, ఆ దంపతులకు సారూప్యము (తమ రూపమే గల), సమాన గుణములు (అట్టి సాత్విక - దైవీగుణములుగల) శిశువులు కలుగుచూ ఉంటారు.

బింబము వలెనే జలములోని ప్రతిబింబము ఉండటము సహజమే కదా! జలము చంచలముగా ఉన్నప్పుడో? ప్రతిబింబము చంచలంగా అగుచున్నదికదా! మనస్సు చంచలముగాను, అల్పభావ - ఉద్రేక సమన్వితంగాను ఉంటే, ఆ దోషము పుట్టిన పిల్లలకు అంటగలదు. అందుచేత దంపతులు మానవ జన్మను ఉత్తమ అవకాశముగా భావిస్తూ, సంతానమును పొందటము యోగముగా, ఉత్తమ గుణ-స్వభావము గల లోకకల్యాణ భావములుగల శిశు సంతానము - తమ యొక్క విద్యుక్త ధర్మమైన సేవగా భావించెదరుగాక!

యమళ (కవల)పిల్లలు: అన్యోన్యవాయు పరిపీడితానామ్ శుక్ల ద్వైవిధ్యే యమళౌ భవతః।। కొన్ని కొన్ని సందర్భాలలో దంపతుల దేహములోని తీవ్ర వాయు (పరస్పర భావావేశ సందోహములచే పరస్పరము వాయు పీడితులగుచున్నప్పుడు) శుక్ల-శోణితములు రెండు -రెండు విభాగాలుగా విడిపోయి,… ఆ దంపతులకు కవలపిల్లలు (జంట పిల్లలు) కలగటం జరుగుతోంది.

మిశ్రప్రజా - ఆమ్రేడితా శిశువులు : (అంటు శిశువులు) : ఎక్కడో కొద్ది సందర్భాలలో శుక్ల-శోణితములు ఏకమగుచున్న క్షణములలో తీవ్రముగా విడిపోయి, మరల వేగముగా ‘జంటలు’గా పరస్పర తాకిడిచే ప్రకృతి వైపరీత్యంగా అంటు శిశువులు రూపదిద్దుకుంటున్నారు. అట్టి ఆమ్రేడితా శిశువుల యొక్క శరీర విభాగములు పరస్పరము చొచ్చుకొనిపోయి ఏక-మిశ్రమ దేహము కలవారై ఉండటం జరుగుతోంది.

⌘⌘⌘

అత్యధికంగా (Maximum) మానవులలో ఐదు (5) అండముల వరకు ఉండవచ్చును. సామాన్యముగా ఒకరిలో ఒక అండమే ఉండటము సహజము. కొంతమందిలో రెండు అండములు ఉండి ఉంటున్నాయి. రెండుకు మించిన సంఖ్య గల అండములు వేలాది మందిలో ఒక్కొక్కరిలో ఉండటం జరుగుతోంది.

పిండధారణ సమయంలో పిండము అనేకసార్లు రేతస్సు సేవించటం చేత ఒక్కొక్క శిశువులో అంగములు మామూలుగా కాకుండా,… అధికంగా ఉండటం జరుగుతోంది. మరికొన్ని సందర్భాలలో రేతుస్సును అల్పముగా సేవించటం చేత, ఆ పిండ శిశువు శుష్కమైన, అల్పమైన, తక్కువ అంగములు కలిగి ఉంటున్నది. ఎప్పుడో సుదీర్ఘకాల విరామముగానో, అన్యాపదేశముగానో (Very drowry / Absent minded / sleepy state) సంభోగము జరుపినప్పుడు కొన్నిసార్లు యుగ్మములు (చర్మపు ముడతలు) అధికంగా ఉండే శరీరము నిర్మితమౌతోంది. ఇదంతా అనిర్వచనీయమగు, అప్రతిహతమగు ప్రకృతి వైపరీత్య చమత్కారములు.

⌘⌘⌘

శ్లో।। పంచాత్మకః సమర్థః, పంచాత్మక తేజస అధిగంధ రసశ్చ,
సమ్యక్ జ్ఞానాత్ ధ్యానాత్ అక్షరము ఓం కారమ్ చింతయతి।।

ఈ విధంగా తల్లితండ్రుల శారీరక-మానసిక ప్రవృత్తులను, యోగ-అయోగభావ-ఉద్విగ్నతలును, స్వీకరించే ఆహార పదార్థాలను, పంచభూత దేవతల సహకార-సంపత్తులను-అనుసరించి, శుక్ర-శోణితమిశ్రమముగా ఆరంభమగుచున్నది. దేహబిందువుగా పరిణమించుచూ జీవతత్త్వముగా పరిణమించుచూ సమర్థము, పంచేంద్రియ పరిపుష్ఠము అగు-దేహముగా రూపము పొందటం జరుగుతోంది. దేహములో పంచ-జ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు రూపుదిద్దుకుంటున్నాయి. క్రమంగా దేహములో శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములను తెలుసుకొనే ‘తెలివి’ రూపము (చిత్ విలాసకిరణము) స్థానభూతమగుచున్నది.

ఈ మూడింటియొక్క చింతన రూపముగా ‘చిత్తము’ ఉత్పన్నమగుచున్నది. (The experiencer is begining his function of Experiencing).

⌘⌘⌘

‘‘ఇక ఆ శిశువు క్రమంగా ఏకము-అక్షరము-ఓంకార సంజ్ఞార్థము - అగు అనుభూతి ఎట్టిదో అనుభూతం చేసుకొంటున్నాడు. (అప్పటికి ఇంద్రియ ప్రపంచము భౌతికంగా ఎదురుగా లేదు కనుక!).

శరీరములో పంచభూతములు, మనస్సు (ఆలోచన), బుద్ధి (విచక్షణ), చిత్తము (ఇష్టాఇష్టములు) అనబడే అష్టవిధ ప్రకృతి - ‘9’వ నెలలో సంపూర్ణముగా రూపుదిద్దుకుంటున్నాయి.

అష్టవిధ ప్రకృతి + షోడశవికారాలు పూర్తిగా తయ్యారవగా, జీవుడు+దేహము… (User and usager)… ఉభయము సర్వలక్షణ సంపూర్ణమైనవగుచున్నాయి. పరస్పరము సమాశ్రయించినవగుచున్నాయి.

ఇకప్పుడు ఆ శిశువులో తన యొక్క ఇతః పూర్వపు అనుభవములకు సంబంధించి జ్ఞాపకములు గుర్తుకురావటం, విమర్శన - విచారణలకు విషయములవటం ప్రారంభమగుచున్నాయి. ఇంతకుముందు జరిగిపోయిన దేహముల-జీవజాతి, జన్మ-కర్మలు, సంబంధ-అనుబంధ-బాంధవ్యములు, వాటి-వాటికి సంబంధించిన శుభ-అశుభ విశేషాలు, సుఖ-దుఃఖాలు, తప్పు- ఒప్పులు మనోదర్పణంలో స్ఫురించనారంభిస్తున్నాయి. పూర్వజాతిమ్ స్మరతి! కృత-అకృతమ్ కర్మవిభాతి! శుభ-అశుభకర్మ విందతి!

… ఈ రీతిగా బాగు-ఓగుల గురించి తలచుచూ, సుఖ-దుఃఖములు పొందటము ప్రారంభిస్తున్నాడు.

ఆ శిశువు యొక్క విచారణ - విశ్లేషణ - యోచన- భావన - అనుభూతి - బాధ-కోపము… ఇటువంటి ఆలోచనా తరంగాలు ఈ రీతిగా అనుభూతి రూపమై ఆతనిని స్పృశించనారంభిస్తున్నాయి.

నవమాస గర్భస్థ శిశువు - ఆలోచనా పరంపరలు

నానా యోగి సహస్రాణి దృష్ట్వా చ ఏవ తతో మయా!
ఆహా! నేను ఇప్పటికి రకరకాల-వేలాది జీవజాతులలో జనించాను. మరణించాను. అసంఖ్యాకంగా తల్లుల గర్భములను దర్శించాను. వాటియందు జీవించాను. శయనించాను. ఇప్పుడు ఈ మాతృయోనిలో ప్రవేశించాను. ఇప్పటికి ఎన్ని మాతృయోనులలో ప్రవేశించి, ఆ దేహముల నుండి నిష్క్రమించియున్నానో… అసంఖ్యాకం! అంతూ-పొంతూ లేదుకదా!

ఆహారా వివిధా భుక్తాః। పీతాశ్చ వివిధాః స్తనాః।।
అనేక విధములైన ఆహారాలు స్వీకరించాను. రకరకములైన తల్లుల స్థనములలో పాలు గ్రోలాను. అనేకచోట్ల పుట్టాను. ఇంకెన్నో చోట్ల చచ్చాను. భూమండలమంతా నేను అనేక చోట్ల జన్మభూములుగా కలిగి ఉండటం జరిగింది. అనేక ప్రదేశాలు నాకు శ్మశానాలు కూడా అవటం జరిగింది. ఈ విధంగా నాకు ఏకానేక భూప్రదేశాలన్నీ కూడా జన్మస్థలములు, మరణించిన స్థానములు కూడా అయి ఉన్నాయి కదా!

శ్లో।। జాతశ్చాఽస్మి మృతశ్చాఽస్మి। సంసార్యస్మి పునః పునః।
జన్మమృత్యూ, పునర్జన్మః। పునః మృత్యుః పునర్జనిః।

ఏన్నోసార్లు పుట్టాను, చచ్చాను.. మరల మరల ‘‘ఈ దేహములోని ఇంద్రియ ద్వారముల ద్వారా ధ్యాస ప్రవహించుచున్నప్పుడు ఏ దృశ్యము- దృశ్య విషయాలు నాకు అనుభవమగుచున్నాయో… ఇదియే కదా, నాకు సంబంధించిన సమస్తము - సమగ్రము అగు సత్యము’’ అని తలచి సంసార చట్రములో ఇరుక్కొని దేహ పరంపరలలో గడుపుతూ వచ్చాను.

గర్భవాసే → మహత్ ‘దుఃఖమ్’, మోహో దుఃఖం చ జన్మసు!

ఆహాహా! తల్లి గర్భములోని పిండమును ఆశ్రయించి, పిండ-శిశు స్వరూపుడనై ఎన్నిసార్లు ఎంతెంతగా దుఃఖాలు పొందాను! తల్లి గర్భము నుండి బయల్వెడలుచు ఎన్ని బాధలు-దుఃఖాలు అనుభవించాను! అదంతా ఎంతటి మోహము! (What an illusion that was many many times serially undergone by me).

బాల్యే → దుఃఖమ్ తథా శోకః పారవశ్యం చ మూఢతః।

సరే! ఎట్లాగో అట్లా తల్లిగర్భంలోంచి బయల్వెడలి పాంచభౌతిక దృశ్య ప్రపంచములలోనికి అనేకసార్లు ప్రవేశించాను. అటు తరువాత, ఆకలి-దప్పిక-నిస్సహాయత-బెంగ-ఆటపాటలు- ఆశ-నిరాశలు-పేరాశలు… ఇటువంటి అనేక దోషములచే విమూఢుడనై, పరవశము పొందుచూ అనేకసార్లు బాల్యదుఃఖాలు, బాలదశ వేదనలు అనుభవించానుకదా! బాల్యములోని మూఢత్వము (Sheer Ignorance) తో కూడిన పారవశ్యము ఎంతటి బాధాకరము!

యౌవనౌ: క్రమంగా యౌవనమును పొందుచుండటం జరుగుతూ ఉండేది కదా!

హితాకరణమ్; ఆలస్యమ్; అహిత ఆచరణమ్ తథా, యౌవనే విషయాసక్తిః - తాపత్రయ నిపీడితః।

ఆ విధంగా, యౌవనములో ప్రవేశించిన తరువాత…,
→ మంచి పనులు చేయబుద్ధి కాదు. వాటి పట్ల బద్ధకము, తిరస్కారము పెంపొందినవై ఉండేవి.
→ అహితమైన-దుర్మార్గపు చెడు పనులు ప్రారంభించటానికి మాత్రము ఎక్కడలేని ఉత్సాహము-ఉత్తేజము వచ్చిపడుతూ ఉండేది.
→ అనేక లౌకిక విషయముల పట్ల కట్టలు త్రెంచుకొని వస్తున్న ఆసక్తి!
అధిభౌతికము - అధిదైవికము-ఆధ్యాత్మికము రూపములలో ఉండి-‘3’ తాపాలు; తాపత్రయాలు… వీటిచే నిత్యము పీడించబడటము.

ఈ విధంగా ధ్యాస, ఇంద్రియ విషయములకు ఆవల ఉన్న నిత్యము - సత్యము అగు ఆత్మజ్ఞానము పట్ల, శ్రద్ధగాని, ఏకాగ్రతగాని ఏమాత్రమూ కుదరటమే లేదు. దేహంలో ప్రవేశించటం! ఇంద్రియ విషయాలలో పడటం! దేహనిష్క్రమణం! ఇంకో దేహం… ఇదే పని అయిపోతూ వస్తోంది!

ఇక వార్ధక్యము
- నిర్వర్తించిన నిర్వర్తించని కర్మల గురించి, వ్యవహారముల గురించి అనేక చింతనలు.
- దేహములో అనేక బాధలు, రోగములు.
- ‘‘ఎప్పుడు చావు వచ్చి పడుతుందో, ఏమో’’ అనే మరణ భయము.
- అనేక ఆశ-నిరాశ-దురాశ-పేరాశ భావాలు. తీరని కోరికలు.
- అభిమానములు. లోభములు.
- కామ-క్రోధముల సంకటములు.
- అనేక ఉత్కంఠలు (ఏది ఏవిధంగా ఏమౌతుందోననే ఉద్వేగములు).
- స్వతంత్రంగా ఏమీ చేయలేనట్టి నిస్సహాయత.
… ఇటువంటి అనేక దుఃఖములతో అనేక వార్ధక్యములు గడిచిపోయినాయి.

అసలీ ‘జన్మ’ అనునదే అనేక ‘‘మహాదుఃఖములు’’ అనే మహావృక్షమునకు బీజము.
దుఃఖబీజమ్ ఇదమ్ జన్మ, దుఃఖరూపంచ దుస్సహమ్!
జన్మంతా కూడా సహింపరాని దుఃఖరూపము.

అటువంటి పరిస్థితులలో అనేక దేహపరంపరలు వస్తున్నాయి. పోతున్నాయి.

ఇప్పుడు ఈ వర్తమాన గర్భస్థశిశు స్థితి అనుభవిస్తున్నాను.
దుఃఖ నివృత్తికి ఉపాయాలు ఏమిటి? యోగము, జ్ఞానము, ప్రవృత్తికి వేరైన నివృత్తి ధర్మములు - ఇవి మార్గములుగా విజ్ఞులు చెప్పుతూ వస్తున్నారు. ఇవి నేను విని కూడా సరీయిన రీతిలో ఆచరించకుండానే, వారి మాటలు పెడచెవిని పెట్టాను. ఫలితంగా గొప్ప అవకాశములు గల అనేక ఉపాధులు నిష్ప్రయోజనంగా బుగ్గిపాలు అయిపోయాయి!

ఇప్పుడు మరల ఈ తల్లి గర్భములో శిశుదేహంలో చిక్కుకుని ఉన్నాను. అయ్యబాబోయ్! ఇది ఏమి స్థితి! ఎంత కష్టం! దుఃఖసాగరంలో మునిగిఉన్నాను!

అహో దుఃఖ దధౌ మగ్నో! న పస్యామి ప్రతిక్రియామ్!
ఈ దుఃఖస్థితి-బంధస్థితి తొలగేందుకు ఏమీ ప్రతిక్రియ చేయలేని పరిస్థితి! దుస్థితి! థిక్ అజ్ఞానము! థిక్ అజ్ఞానము! ధిక్ కామక్రోధ సంకటము! ఓ నా అజ్ఞానమా! నీకు ధిక్కారము! నీకు ధిక్కారమగుగాక! నేను అనేక ఉపాధులతో ఆశ్రయించిన కామ-క్రోధములు ధిక్కారమగుగాక! అవియే నన్ను ఇప్పటి ఈ స్థితికి ఈడ్చుకుంటూ తీసుకువచ్చాయి!

‘‘ఈ ఇంద్రియ విషయములే, ఈ దేహమే నా సర్వస్వము. ఇదియే సమగ్రము’’- అని అనుకొంటూ అనేక దేహాలలో బద్ధుడనై జీవిస్తూ, మరణిస్తూ వస్తున్నాను. అట్టి నా అజ్ఞాన శృంఖలములకు (బేడీలకు) ధిక్కారమగుగాక!

ఇక ఇంద్రియ విషయములకు - ఇంద్రియములకు కూడా ఆవల ఉన్న ఆత్మతత్త్వ జ్ఞానమును సముపార్జించకోవటానికై ఆచార్యులను సమీపించి, వారి బోధల ద్వారా ఆత్మవిచారణారూపమగు విచక్షణను పెంపొందించుకొనెదనుగాక! సాంఖ్యయోగమును సమాశ్రయించెదనుగాక!

సరే! అయినదేమో అయినది! ఇప్పటి మాట ఏమిటి? ఇప్పుడు మాతృగర్భంలో చిక్కుకొని ఈ గర్భనరక దుఃఖాలన్నీ అనుభవిస్తున్నాను కదా! ఈ మాతృయోని నుండి ఎట్లాగో అట్లా విడుదల అయ్యానా,… ఇక అశుభమునకు క్షయకర్త, పురుషార్థప్రదాత - అయినట్టి జగదీశ్వరుడగు పరమాత్మను శరణువేడి తద్వారా సంసార శృంఖలములను త్రెంచివేసుకొనెదనుగాక!

⌘ సర్వశక్తిమంతుడు….,
⌘ సత్-చిత్-ఆనందాత్మ స్వరూపుడు,
⌘ సర్వకారణ కారణుడు,…
⌘ సర్వమునకు పరమైయున్నట్టి పరమేశ్వరుడు, సర్వమూ ‘తానే’ అయినవాడు,
⌘ సర్వమును ఉత్తేజపరచుచు, ప్రకాశవంతము చేయుచున్నట్టి భర్గుడు,…,
⌘ సర్వదేహాలలోని సర్వేంద్రియములకు అధిపతియగు - పశుపతి…,
⌘ కాలః కాలస్వరూపుడగు రుద్రుడు,
⌘ దేవతలకే దేవుడైనట్టి దేవదేవుడు, మహాదేవుడు…,
⌘ శరణన్న వారికి ఆత్మానందమునకు, ఆత్మసాక్షాత్కారమునకు త్రోవచూపించి నడిపించు జగద్గురువు…
అగు పరమేశ్వరుని స్తోత్రం చేస్తాను.. పూజిస్తాను. ఆరాధిస్తాను. శరణువేడుతాను. అంతేగాని ఇంద్రియ విషయబద్ధుడను అవనే అవను! ‘‘ఇంద్రియ విషయములు’’ - అనే సర్పములు సంచరించే నూతిలో పడిన ‘కప్ప’వలె అటూ ఇటూ గెంతులు వేయను.

ఈ యోని బంధము నుండి ఈ ఒక్కసారి విముక్తుడనై బయల్వెడలానా…,
ఆ భగవంతుని కరుణా కటాక్ష వీక్షణను సముపార్జించుకోవటానికై - గొప్ప తపస్సు, ధ్యానము, యోగము ప్రారంభిస్తాను. అదొక్కటే నా పని.

ఈ గర్భవాసము నుండి బయటపడగానే…,
- అమృత-ఆనంద ప్రదాత,
- అపరిమితుడు, అనామయుడు,
- నారాయణ నామధేయుడు
అగు ఆ విష్ణు భగవానుని హృదయమునందు నిలుపుకొని సర్వదా ఆయననే భజిస్తాను. ఉపాసిస్తాను. అంతేకాని, దృశ్య విషయముల జోలికే వెళ్ళను.

ఈ మాతృకుక్షిలో (తల్లి గర్భములో) చిక్కుకున్న నేను- ఇప్పుడు అనుభవిస్తున్న బంధనముల నుండి విముక్తుడనయ్యానా…;

⌘⌘⌘

ఓ గతించిన బంధువులారా!

‘‘ఆ"! ఎవరు చూస్తారులే!’’ … అని అనుకుంటూ నేను అనేక పాపకార్యాలు చేసి ఉన్నాను. ‘‘పరమాత్మ అనే ఆయన సర్వసాక్షి అయి ఒకరు ఉన్నారు. ఆయన తప్పు చేస్తే తప్పక శిక్షిస్తారు కదా!’’. అనే విషయమే నేను పట్టించుకోలేదు. (ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా?) నాస్తికుడనై (సృష్టికర్త లేడు - ఎవ్వరూ లేరు - అని పలుకుచు) భయం లేకుండా తప్పుడు పనులు చేశాను. భుంజామి తత్ఫలమ్ హి అద్య। వాటి ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాను కాబోలు. అప్పటి కోపము - ఆవేశము - కసి-దూషణ-అపశబ్దాలకు తదనంతర ప్రయోజనములు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇతరులకు బాధ కలిగించినదంతా ఇప్పుడు కట్టి కుడుపుతోంది.

ఇక ఆ తప్పులు చేయను. పరమాత్మకు భయపడి, ధర్మానికి కట్టుబడి జీవిస్తాను.

ఆస్తికుడనై పరమాత్మ యొక్క ఆగ్రహమునకు లోనుకాకుండా, అనుగ్రహము కొరకై కర్మ-భక్తి-జ్ఞాన-సర్వసమర్పణ-దైవీగుణ సంపత్తులను నిర్వర్తిస్తూ ఆత్మభావన వృద్ధిపరచుకుంటాను. పెద్దలు చెప్పిన మార్గంలో నాయొక్క ‘కేవలస్వరూపము’ వైపు దృష్టి సారించి కైవల్యము సిద్ధించుకుంటాను.

⌘⌘⌘

ఈ విధంగా మాతృగర్భస్థమగు శిశుదేహము ఆశ్రయించిన ఆ జీవాత్మ,

తాను ఇతః పూర్వపు దేహములతో పొందిన

బుద్ధిని నిలిపి, సంసారపు బంధములను తొలగు ప్రయత్నములు చేయనందుకు పశ్చాత్తాప్పడుచున్నాడు. సంసార దుఃఖములు ఎటువంటివో మరల మరల గుర్తు చేసుకుంటూ ఉన్నాడు.

శశ్వత్ సాంసారికమ్ దుఃఖమ్. స్మృత్వా-నిర్వేదమ్ ఆప్యచ…।
తన యొక్క అవిద్యాపూర్వకమైన కర్మలను స్మరిస్తున్నాడు. గుర్తు చేసుకొని, అంతరాంతరాలలో నిర్వేదన చెందుచున్నాడు. అనేక విషయాలు గుర్తు చేసుకొని మోహమునకు లోను అగుచున్నాడు. అవిద్య - కామ్య కర్మలు మొదలైనవి తలచుకొని మోహపరవశుడగుచుండటం జరుగుతూ ఉంటోంది.

ఈ జీవుడు ఒకటి తరువాత మరొకటిగా వందల-వేల, రకరకాల జంతుజాతుల మాతృయోనులలో ప్రవేశించాడు. నిష్క్రమించాడు.

యంత్ర మహాచక్రములో ప్రవేశించినవాడు ఆ యంత్ర చక్ర గమనముతోబాటే పైకి-క్రిందికి తిరుగాడుతూ ఉంటాడు కదా! ఆ విధంగా ‘‘కల్పన - భావన - ఊహ’’ అను స్వకీయ మాయలో ప్రవేశించి ‘జీవుడు’ అనే అంశకు బద్ధుడు అగుచూ ఉండి, తల్లుల గర్భములలో ప్రవేశిస్తూ-బయటపడుతూ, పుట్టుచు-మరణిస్తూ… దేహ-దేహాంతరములలో తిరుగాడుచున్నాడు.

‘‘ఎట్లాగురా, ఈ జన్మ-మృత్యుచక్రభ్రమణముల నుండి బయల్వెడలేది?’’… అని తలచుచున్నాడు. కొన్నిసార్లు, ముముక్షువై ప్రయత్నించి కూడా జన్మ-కర్మల వేగ గమన పరిధుల నుండి బయటకు రాలేకపోతున్నాడు. ముముక్షుః యతతే। తత్రా, అశక్తో యంత్రేణ పీడ్యతే। జన్మ-కర్మలను పీడగా అనుభవిస్తున్నాడు.

ప్రసూతి వాయుస్పర్శ

ఇప్పుడు గర్భవాసములో ఉండి, ప్రసూతి వాతముచే (వాయువులచే) స్పృశించబడినప్పుడల్లా నలిగిపోతూ మహత్ దుఃఖమును ఆ శిశువు పొందటం జరుగుతోంది.

ఒకానొక రోజు ప్రసూతివాయువుల పీడనముచే ఆ శిశుదేహము క్లేశములు పడుచూ యోని నుండి బయటపడుతోంది.

మరొక అద్భుతం!

ఆ శిశువు నేల మీద పడగానే వైష్ణవ వాయు సంస్పర్శచే ఆతని గర్భనరక బాధలు తొలగుచున్నాయి. పుట్టినబిడ్డ పుట్టగానే ఉగ్రదృక్ (క్రూరదృష్టి) కలవాడై, స్నానము చేయించేసరికి సర్వాంతర్యామి, విశ్వదృశ్యరూపుడగు వైష్ణవస్పర్శచే స్వాంతనము చెందుచున్నాడు.

గొప్ప విశేషం ఏమిటంటే…,

పుట్టిన ఆ శిశువు తన యొక్క జనన-మరణములను, తాను గర్భములో స్మరించిన పూర్వజన్మ స్మృతులను, తాను దేహోపకరణముతో నిర్వర్తించాలనుకొన్న ప్రణాళికలను, శుభ - అశుభకర్మల స్ఫూర్తిని, - ఇవన్నీ యాథాలాభంగా ఏమరచుచున్నాడు. ఆతనికి ఆ విశేషాలన్నీ స్ఫురించటమే లేదు. అయితే, నిగూఢంగా పూర్వజన్మల వాసనలు మాత్రము సూక్ష్మ సంస్కార రూపములుగా ఆతనితోబాటే ఆతనియందు దాగి ఉంటున్నాయి.

ఇక జన్మించిన ఆ శిశువు దేహియై దేహము గురించి, ఇంద్రియముల గురించి, ఇంద్రియ విషయముల గురించి, (కనబడేవి - వినబడేవి - స్పర్శ - రుచి-వాసనలు మొదలైనవి) ఏ విధంగా తెలుసుకుంటూ ఉండటం జరుగుతోంది? కథమ్ అథో జానాతి?… ఈ విషయమై వివరించుకొనెదము గాక!

దేహములో వాతము-పిత్తము- శ్లేష్మము అను మూడు ధాతువులు ఉంటున్నాయి. అవి సమపాళ్ళలో (అవసరమైనంతగా) ఉండి, సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ ఉంటే, అప్పుడు ఆ జన్మించిన శిశువు ఆరోగ్యవంతుడై ఉంటున్నాడు.
(వాతము - వాయు సంబంధమైనది. పిత్తము - స్థూల సంబంధమైనది. కఫము - జలసంబంధమైనది)

ఒకవేళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి స్వీకరించిన విపరీత-ఆహారములు కారణంగానో, (లేక) జన్మించిన తరువాత పొందిన దోషపూరిత ఆహారముల వల్లనో… వాత పిత్త కఫములు-అవసరానుసారము సమపాళ్లలో ఉండకపోతేనో? ఆ శిశువు దేహము రోగగ్రస్తమౌతోంది. ముఖ్యంగా పిత్తధాతువులు సమరూపంగా (ఎక్కువ-తక్కువ కాకుండా తగినంతగా) ఏర్పడుచూ ఉంటేనే, ఆ దేహధారుడు ఇంద్రియములను - ఇంద్రియ విషయములను సక్రమంగాను, సరీయిన రీతిగాను ఎరుగగలుగుచున్నాడు.

పిత్తధాతువు అల్పంగా ఉంటే అల్పముగా మాత్రమే ఇంద్రియశక్తితత్వాలు ఉపయోగించగలుగుచున్నాడు. అధికంగా ఉంటే… అధికాధికంగా విషయాలు తెలుసుకోగలుగుచున్నాడు. పిత్తధాతువు వికృతరూపంగా ఉంటే, ఆ జీవుని మనస్తత్వము కూడా వికృతంగా ఉంటోంది. విపరీతమైన భావాలు ఆతడు కలిగి ఉంటున్నాడు. పిత్తధాతు తీవ్ర వికృతత్వము వలన ఉన్మత్తుడై (పిచ్చివాడై) చరిస్తున్నాడు.

అట్టి పిత్తధాతువు…,
✤ శరీరమునందలి అగ్నిచే సమ్మిళితమగుచూ…,
✤ దేహములో ఇంధనము రూపముగా ఉంటూ…,
✤ వాయువు యొక్క స్పర్శలచే ప్రజ్వరిలుచూ…,
✤ లోపల - బయట కూడా విషయభోగము కొరకై సహకరిస్తూ…,
ఈ దేహము క్షయించకుండా కాపాడుతోంది.

పిత్తధాతువు బలహీనమైతే క్రమంగా దేహములోని స్థూల విభాగము కూడా శిధిలము కాగలదు.

అగ్ని : సహి అగ్ని కతి విధోభవతి? ఈ దేహములో అగ్ని ఉండి, దేహమును, దేహవిభాగములను, దేహోపకరణములగు శబ్ద - స్పర్శ - రూప రస గంధములను ప్రజ్వలింపజేస్తూ దేహమును ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటోంది. అగ్ని యొక్క తేజోప్రభావమే అంతా కూడా!

♠︎ త్రీణివై శరీరాణి (ఈ దేహమునకు సంబంధించిన స్థూల-సూక్ష్మ-కారణ శరీరములు).
♠︎ త్రిణివావ రేతాగంసి- త్రివిధములైన రేతస్సులు (రసతత్త్వములు).
♠︎ త్రిధాతుః - వాత, పిత్త, కఫ ధాతువులు.
♠︎ త్రయీమయ-ద్రష్ట, దర్శన, దృశ్యములు.
♠︎ త్రివిధో అగ్నిః దేహములోని మూడు విధములైన అగ్నులు.
♠︎ త్రైతానామ శరీరకో - స్థూల సూక్ష్మకారణ శరీరములు.
… ఇవన్నీ అగ్ని యొక్క తేజోవిభాగము చేతనే ఉత్తేజితమై ప్రవర్తించటం జరుగుతోంది.

త్రి అగ్నులు - జీవన్ యజ్ఞము

తత్త్వజ్ఞులగు మహనీయులు ‘జీవితము’ అనుదానిని పవిత్ర-మహత్తర యజ్ఞముగా దర్శిస్తున్నారు.
జీవన్ యజ్ఞములోని త్రి అగ్నులు - జ్ఞానాగ్ని, దర్శనాగ్ని, కోష్టాగ్ని.
ఈ మూడు రీతులుగా, జీవన్ యజ్ఞాగ్ని ఈ దేహమును తేజోమయముగా, ఉత్తేజితముగా, అర్థవంతముగా చేయుచున్నది.

జ్ఞానాగ్ని యొక్క చర్య (క్రియ) → మనస్సు
దర్శనాగ్ని యొక్క చర్య (క్రియ) → ఇంద్రియములు
కోష్ఠాగ్ని యొక్క చర్య (క్రియ) → దహరాకాశము (ప్రాణశక్తి)

ఏతా నామ శారీరకో వైశ్వానరః ।
ఈ మూడు వైశ్వానరుని శారీరక దర్శనములు.

కోష్ఠాగ్ని ప్రాణ-అపానముల రూపమును దాల్చి, ఈ జీవుడు నోటితో ప్రతిరోజు భుజిస్తున్న భక్ష్య-భోజ్య-లేహ్య-చోష్యరూపములైన షడ్రుచులు (6 రుచులు) గల పదార్థములను రస శక్తి రూపముగా మార్చి.. ఆ రసశక్తి దేహములోని నర-నరములు అందుకునేటట్లు శరీర తీరును నడుపుచున్నది.

(అట్టి మహత్తర ప్రభావ సమన్వితమగు తాను తినిన ఆహారమును పచనము చేసి జీర్ణము చేస్తున్న అగ్నిని ‘‘వైశ్వానరుడు’’గా కొన్ని పురాణ ఇతిహాసములచే చెప్పబడుచున్నది.)

ఈ జీవన మహాయజ్ఞ కార్యక్రమానికి - ద్రష్ట, దర్శన, - దృశ్యములకు ఆవల గల - ‘దృక్’ స్వరూపమే త్రీగ్నులలోని ‘దర్శనాగ్ని’ - అయి ఉన్నది. అట్టి దృక్ స్వరూపము ళికేవల దృక్ (లేక) ఆత్మచైతన్యమురి - జీవన్ మహాయజ్ఞమునకు ప్రారంభపు వాక్యమగుచున్నది.

‘విజ్ఞానము’ → అనే వికాసము - వికృతిని స్వీకరించి ‘‘దృశ్యమును దర్శించటము’’.. అను నాందీ ప్రస్థావన జరుగుచున్నది. అనగా దృక్ స్వరూపము → ‘తెలుసుకొనవాడు’ రూపి అయి దృశ్యమును ‘‘తెలుసుకోవటం’’ - అనే ఒక యజ్ఞ కార్యక్రమము వినోదియై ప్రారంభిస్తున్నారు.

అట్టి దర్శనాగ్ని స్వరూపమగు దృక్ - ఇంద్రియ గోళములందు, ఉప(హృదయ) స్థానమునందు, చక్షువులందు వెలుగొందుచూ - అచ్చటచ్చట ముఖ్య స్థానములుగా కలిగినదగుచున్నది.

జీవన్ యజ్ఞము , శారీరక యజ్ఞము - యజ్ఞ విశేషాలు

ఈ ‘జీవితము’ అనే సందర్భమును జీవన్ మహాయజ్ఞమును నిర్వర్తిస్తున్నట్లుగా శారీరక యజ్ఞకోవిదులు భావన చేస్తున్నారు.
అనగా, ‘నా ఈ జీవన్ యజ్ఞము జననముతో ప్రారంభమై మరణముతో ముగుస్తూ ఉంటుంది!’…. అనే అవగాహనతో జీవిత సందర్భమును వారు దర్శిస్తున్నారు.

ఈ జీవన్ యజ్ఞములో

హృదయము      →     దక్షిణాగ్ని స్థానము అని,  
ఉదరము (పొట్ట)       →     గార్హ పత్యాగ్ని అని,  
ముఖము     → ఆహవనీయాగ్ని అని.  
పురుషుడు (జీవుడు)   →     ఈ జీవన్ యజ్ఞమునకు యజమాని, యాగకర్త అని  
విచక్షణా రూపమగు బుద్ధి →  యాగకర్త యొక్క ధర్మపత్ని అని

‘జీవనయజ్ఞము’ నందు అనుక్షణము పాల్గొనుచున్నవారై ఉంటున్నారు.

సత్-చిత్ దాంపత్యం

(1) పురుషుడు (2) ఆయన యొక్క ‘బుద్ధి’ → దంపతులై ఈ జీవన్ యజ్ఞమును నిర్వర్తిస్తున్నారు ఎందుకు?
వినోదము, ఆనందము కొరకే!

            సత్       -   పురుషుడు  
            చిత్        -   బుద్ధి  
            ఆనందము  -   వినోదము

కనుక..,
సంతోషము, వినోదము… ఇవియే ఇక్కడ యజ్ఞదీక్ష.

ఈ దేహములోని జ్ఞానేంద్రియములు → కళ్ళు- చెవులు, ముక్కు, చర్మము, నోరు : … ఇవియే యజ్ఞపాత్రలు.

ఇందలి కర్మేంద్రియములు → కాళ్లు-చేతులు-గుదము-ఉపస్థ : యజ్ఞకార్యమునకు ఉపకరణాలు, పనిముట్లు (Instruments).

సత్రే శారీరకే - శరీరమే యాగశాల. తత్ తత్ దేవతాయేవ ఋత్విజః తటస్థా యథా దేశం యజమానమనుజయంతే! - ఈ శరీరములో నాటక దీపమవలె, తటస్థులై ప్రకాశిస్తున్న దేవతా శక్తులే - దేవతలే యజ్ఞమును చేయించే మంత్ర ద్రష్టలగు ఋత్విజులు. వారంతా కూడా యజమానితో కూడి ఈ దేహయజ్ఞమును నిర్వర్తిస్తున్నారు. (దేవతలు = సృష్టిరచనలో పాల్గొనే అశరీర దివ్య ప్రజ్ఞలు).

ఈ శరీరము… యజ్ఞశాల.

శిరః కపాలము… యజ్ఞ కుండము.

ఈ దేహముయొక్క కేశములు (వెంట్రుకలు)… దేహయజ్ఞవిధికి సంబంధించిన ‘దర్భలు’.

ఈ శరీరము యొక్క ముఖమే… యజ్ఞము యొక్క అంతర్వేది. మంత్ర-శాస్త్ర సంబంధమైన ప్రజ్ఞా విశేషాల రూపము.

దేహమును, ఇంద్రియములను ఉపయోగించి ఏవేవైనా చేయాలి - కావాలి- పొందాలి అను కామమే - ఈ శారీరకయజ్ఞములో అగ్నికి సమర్పించే ‘ఆజ్యము’ (నేయి).

గర్భస్థ పిండమును ఆశ్రయించిన క్షణం నుండి - జీవితకాలము → శరీరము త్యజించే వరకు … యజ్ఞకాలమే! సత్రయాగకాలమే!

దహరో నాద స్సామః। ఆకాశతత్వమగు పలికే నాదము (శబ్దోచ్చారణ) - శారీరక యజ్ఞములో అంతర్విభాగంగా పలికే సామవేదగానము!

జీవిత అంతర్ విశేషాలు - బహిర్ విశేషాలే ‘‘మధ్యమ - పరా - పశ్య → శబ్దాలు, శబ్దార్ధాలు, (పరా, పశ్యంతి, మధ్యమములు) (ఋక్‌వేద ఋక్కులు, ఋక్‌వేదమంత్రములు).

పరుషాని అథర్వఖిలాని → గట్టిగా మాట్లాడే మాటలన్నీ అథర్వవేదఖిలములు (ఉపాసనలు).

పలికే సత్యవాక్కులు - సూనృతాని-వ్యాహృతయః। సత్యవాక్కులన్నీ దేవతా స్తోత్రరూపమగు వ్యాహృతులు.

ఆయుష్షు : ఆయుః బలమ్! ఆయుష్షే యజ్ఞకర్త యొక్క ఓపిక రూపమైన బలము.

పిత్తమ్ పశవో - దేహములోని పిత్తధాతువే యజ్ఞపశువు

మరణము - మరణమే (The Death) శారీరక యజ్ఞ పరిసమాప్తి సూచకమగు ‘‘అవబృథ స్నానము’’ (మరణించినవాని భౌతిక దేహమునకు స్థానము చేయించటమనేది అవబృథస్నానము).

అటువంటి ‘శారీరక యజ్ఞము’ అనే జీవనయజ్ఞ - అగ్నికుండములో ‘‘అనుభూతులు- అనుభవములు - అనుబంధములు’’ మొదలైన రూపములు గల యజ్ఞాగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లుచున్నాయి. తస్మిన్ యజ్ఞే ప్రజ్వలంతి అగ్నయః। సర్వము శారీరక యజ్ఞములోని విశేషములే!

ఇక్కడి ‘‘దేహము’’ అనే యజ్ఞశాలలో కళ్ళకు, చెవులకు, నాశికకు, చర్మమునకు, జిహ్వకు.. మొదలైన కర్మేంద్రియ-జ్ఞానేంద్రియములకు సొంతదారులు - దేవతలు. ఆయా దేవతలు వారివారి ఇంద్రియ విషయరూపములగు సంసార (విషయ సంబంధ) సౌఖ్యములను ఈ శరీరములో అనుభవించుచున్నారు. (జీవుడు ‘సాక్షి’ అయి ఉన్నాడు).

ఈ విధంగా ఈ భౌతిక దేహరూప రాకపోకలను, జీవితములోని సర్వ సందర్భాలను, కార్యక్రమాలను ‘‘నేను శారీరక యజ్ఞమును (ఒక సత్యనారాయణ వ్రతము వలె, ఒక యాగము వలె) నిర్వర్తిస్తున్నాను’’ అని ఎవ్వరు సందర్శిస్తూ ఉంటారో,.. వారు దేహాత్మ యజ్ఞ-కృతులు (యజ్ఞమును నిర్వర్తించువారు) అగుచున్నారు.

ఎవరు తమ బుద్ధితో ‘‘జీవితము’’ - అనే సందర్భము గురించి అట్టి యజ్ఞభావమును స్వీకరించరో, వారు వాస్తవానికి జీవిత సందర్భమును ఎరిగినవారే కాదు.

ఎందుకంటే..,

యజ్ఞాయ ఇదమ్ శరీరమ్ యజ్ఞాత్ భవతి। యజ్ఞానురూపం వివర్తతే పరిణామీనీ। ఈ భౌతిక దేహము - ‘యజ్ఞము’ నుండియే, ‘యజ్ఞము’ కొరకే ఏర్పడినదై ఉన్నది కాబట్టి!

విశ్వయజ్ఞమును అనుసరించియే, అంతర్విభాగముగా ఈ దేహము వివర్తమగుచున్నది. పరిణామములు సంతరించుకుంటోంది. అనేక వికారములు పొందటం జరుగుతోంది. దుఃఖసాగరంలో మునకలు కూడా దేహయజ్ఞంలో కనబడే అంతర్గత యజ్ఞవిశేషాలే!
(యజ్ఞాత్ కర్మణో అన్యత్ర లోకో-యం కర్మబంధనః)

⌘⌘⌘

ఈ భౌతిక దేహాన్ని ఒక్కసారి విశ్లేషణరూపంగా మనము మరికొంత పరిశీలిస్తే…, విశ్వ యజ్ఞములో దేహ యజ్ఞము అంతర్విభాగమే అగుచున్నది.

… ఇందులో ‘‘16x2=32’’ దంతాలు ఉన్నాయి. … ‘15’ సుషిరములు (రంధ్రములు) ఉంటున్నాయి.
… ఈ దేహము షణ్ణవత్ (96) అంగుళముల పొడవు కలిగి ఉంటోంది.
… ఇందులో ఇంకా చతుర్దశ (14) నాడీ మండలాలు స్పందిస్తూ ఈ దేహమును క్రియావంతము చేస్తున్నాయి.
… ఇంకా కూడా ఇందులో ‘108’ మర్మస్థానములు ఉంటున్నాయి.
… ‘72’ ధమననాడులు, ‘72’ తదితర (శిర)నాడులు విస్తరించినవై ఉన్నాయి.
… ఈ నాడీ మండలములో అతిముఖ్యమైన ‘3’ నాడులు దేహ-జీవిత విధానాలను శాసిస్తున్నాయి.

అవి → (1) ‘ఇడ’, (2) ‘పింగళ’, (3) ‘సుషుమ్న’.

ఇక తురీయమైన ముఖ్యవాడి (4వది - చతురీయము)… పురీతతి. ఐదవది → జీవనాడి.

‘‘జీవనాడి- జీవితము’’ (Life factor)ల ను దాటి → పిత్తరసమున్నది.
పిత్తరసమునకు మునుముందు - ‘పురీతతి’ అను నాడీమండల అంతర్విభాగము.

పిత్తము : నాభేః ఊర్థ్వమ్ ద్వయ అంగుళే-వామభాగే ‘పిత్తమూలమ్’ ప్రతిష్ఠితమ్।
నాభి (బొడ్డు) స్థానమునకు రెండు అంగుళముల దూరంలో ఊర్ధ్వము (పైవైపు)న- ఎడమవైపుగా పిత్తధాతువు (లేక పిత్తరసము) యొక్క మూలము ప్రతిష్ఠితమైయున్నది.

ఈ జీవుడు ప్రకృతి ప్రసాదితమైన ఆహారము నోటితో స్వీకరిస్తున్నాడు కదా! అట్టి ఆహారము కంఠనాళముల ద్వారా ప్రయాణించి. పొట్టప్రేగులలోకి జేరుతోంది. అన్నమ్-అశనమ్ త్రేథా విధీయతే! ఆ విధంగా ఈ దేహముతో జీవుడు తిన్న ఆహారము పొట్టలో వైశ్వానరాగ్నిచే పచనమౌతోంది. అటు తరువాత ఆ వచనము మూడు తీరులుగా అగుచున్నది.

    (1) మూత్రము (2) పురీషము (మలము) (3) సారము

మూత్రము: రెండు ప్రవాహములుగా అయిన, నాభిస్తానమునకు ఎడమవైపుగా క్రిందకు ప్రసరించుచున్నదగుచున్నది. మూత్రమ్ ద్విధా భూత్వా నాభే-అధో వామే ప్రస్రవతి।

పురీషము : పురీషమ్ సప్తదా తత్ర దక్షిణి వర్తతే! పురీషము (మలము) ఏడు మార్గములుగా దేహము యొక్క కుడివైపుగా కదలుచూ వెళ్లుచున్నది.

సారము : సారః పంచవిధః శరీరమ్ వ్యాప్నోతి। ఇక అన్నసారము ‘5’ మార్గములను అనుసరిస్తూ శరీరమంతా వ్యాపించుచున్నది. అన్న-పానముల నుండి ఈ దేహములో రేతస్సు-రక్తము ఏర్పడుచున్నాయి, వృద్ధి చెందుచున్నాయి. అన్నపానముల నుండియే రేతస్సు, శోణితము ఉత్పత్తి అగుచున్నాయి.

ప్రాణము : తత్ర దేహే చాలకోవాయుః స ప్రాణః। ఈ దేహమంతా స్పందనమును - కదలికను ఏర్పరచు తత్త్వమే ప్రాణశక్తి. అట్టి ప్రాణశక్తి నూలుపోగు వలె ఆకారము కలిగి దేహమంతా విస్తరించినదై ఉంటోంది. అట్టి ప్రాణశక్తి యొక్క విభవము, ప్రభావము చేతనే ఈ దేహములో ఉచ్ఛ్వాస-నిశ్వాసలు (గాలి పీల్చటము-వదలటము), వాటివలన దేహమంతా అణువణువు వరకు వాయు సంచారములు జరుగుచున్నాయి.

ఈ శరీరము, ఇందులోని అంగములు కదలటానికి ఆదిశక్తి రూపమగు ప్రాణమే కారణము.
→ ప్రాణశక్తి సంచలనరూపమై ఉన్నది కాబట్టే ఈ దేహము జీవించగలుగుతోంది.
→ ప్రాణశక్తి యొక్క మహత్తరమగు మహిమచేతనే హృదయ చట్రము నుండి సర్వనాడులలోని మూలమూలల వరకు రక్తము ప్రసరించటం జరుగుతోంది.
→ వాయువు వలననే రక్తము అన్నరసము - ప్రాణవాయువులతో కూడి సర్వేంద్రియములను స్పృశిస్తూ రసము రూపంగా శక్తి ప్రదాత అయి ఉంటుంది. ఆయా ఇంద్రియములు కార్యక్రమములు నిర్వర్తించటానికి త్రాణప్రదాతగా అగుచున్నది - ప్రాణశక్తి యొక్క వాయు సంబంధిత స్పందనమే!

⌘⌘⌘

తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడి నుండే ప్రాణశక్తి ఆ శిశుదేహమునకు జీవన ప్రదాత కూడా! తల్లి స్వీకరించిన ఆహారము కుక్షిలో జఠరాగ్నిచే పక్వమై రసముగా మారుచున్నది. ఆ అన్నరసము నాడీ ద్వారముల ద్వారా, తల్లి గర్భాశయము నుండి - జీవపిండము (గర్భస్థ శిశువు) యొక్క కపాల మూలము నుండి → శిశువు దేహములో ప్రవేశించుచున్నది. ఆ అన్నరసము పిండము (శిశువు) యొక్క పిండ దేహములోనికి - తల్లియొక్క నాడీ మార్గంగా ప్రవేశిస్తోంది. ఆ పిండములోని ప్రాణశక్తికి ఇంధనముగా అగుచున్నది. ఆ ప్రాణశక్తిని సంతృప్తిపరచుచున్నది. ఇకప్పుడు పిండములోని ప్రాణశక్తి పిండము యొక్క వృద్ధికి, అంగములకు ప్రాణప్రదాత అయి వర్తించుచున్నది.

తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పటినుండే ఆ దేహములోని సుషుమ్ననాడి → బ్రహ్మనాడియై వర్తిస్తోంది. (సుషుమ్ననాడి - మూలాధారము నుండి - మూసియున్న కపాల ఉపరి భాగములోని బ్రహ్మరంధ్రము వరకు విస్తరించి ఉండటంచేత - ‘బ్రహ్మనాడి’ అని అంటారు).

ఆ శిశువుయొక్క మూల ప్రాణశక్తి మొదలైన సర్వశక్తులు ఆ బ్రహ్మనాడియందే (సుషుమ్నయందే) ప్రక్షిప్తమై ఉంటున్నాయి. ఆ శిశువు భూమిపై ప్రవేశించటానికై ఒక సమయంలో అభిముఖము కావటం ప్రారంభిస్తోంది. అప్పుడు తేజోరూపమగు రేతస్సు (వీర్యశక్తి Inspiration and Inclination) ప్రత్యుత్సాహమగుచూ ఉంటోంది. అప్పుడు ఆ శిశువు యొక్క మూలప్రాణశక్తి శిశువు యొక్క హృదయస్థానములో ప్రవేశించి, ప్రతిష్ఠితమై… ఇక ఆ శిశువు యొక్క ఉచ్ఛ్వాస-నిశ్వాసలకు, రక్త ప్రసరణ - ఇత్యాదుల కొరకు సర్వమును ఉత్తేజపరుస్తూ సంసిద్ధింపజేస్తోంది.

ప్రశూతి వాయువుల తీవ్రమగు స్పందనల చేత ఆ శిశువు యోని నుండి బహిర్గతమౌతోంది.

ప్రాణశక్తియే బాహ్య ప్రకృతికి సానుకూల్యంగా దేహములోని హృదయమును, కండరములను, నాడులను, ఉపనాడులను, రక్తప్రసరణ మార్గములను ప్రత్యుత్సాహపూర్వకంగా ప్రేరేపణ కలిగిస్తున్నది. ఇదంతా విశ్వయజ్ఞ-అంతర్గత విశేషము.

⌘⌘⌘

ఇక ఇప్పుడు…,

గర్భములో ఉన్నప్పుడు ఇంద్రియాతీత సాక్షియగు జీవుడు-ఆత్మతో దగ్గిర సంబంధము- ఆత్మతోమమేకత్వము కలిగి ఉంటున్నాడు. అట్టి గర్భస్త శిశువు - ఈ పాంచ భౌతిక ప్రపంచములోనికి దేహముతో ప్రవేశించిన కొన్ని క్షణాలతో, ఆత్మను ఏమరచి… ఇంద్రియములలో ప్రవేశించి…, వాటి వాటితో మమేకత్వము చెందుచున్నాడు. ‘‘ఈ ఇంద్రియ విషయములే నా యొక్క సర్వస్వము కదా!’’.. అనే సంసార పంజరములో చిక్కుకొనుచున్నాడు.

ఎప్పుడైతే ఈ జీవుడు యోగాభ్యాసమును ఆశ్రయించినవాడై
- యోగాభ్యాసం చేత ప్రాణశక్తిని బుద్ధి సహాయంతో భ్రూమధ్యస్థానము వరకు నడిపించి,
- భ్రూమధ్యాత్ సుషుమ్నాంతమ్ ప్రాపయేత్ - భ్రూమధ్యలో గల సుషుమ్నానాడియొక్క చిట్టచివ్వరి ప్రదేశమునకు జేర్చి.., అక్కడ నిలిపి,
- ఆ స్థానము నుండి సహస్రారమున గల సుషిరిగము (సన్నటి బ్రహ్మరంధ్రము. బ్రహ్మలోక ప్రవేశద్వారము)పై దృష్టి సారించుచూ..,
యోగాభ్యాసము చేస్తూ ఉంటాడో, అట్టివాడు క్రమంగా ఈ ఇంద్రియ ప్రపంచ పరిమితత్వమును దాటివేయుచున్నాడు.

యథా గర్భగః తథా అపరోక్ష దర్శీ భవతి। గర్భములో ఉన్నప్పటి కించిత్ అనుభవ విషయమైనట్టి అపరోక్షజ్ఞానము-అపరోక్షానందమును…. ఇప్పుడు ఈ దేహము సహాయముతో (దేహమును ఉపకరణముగా చేసుకొని) - అనుక్షణికరూపంగా సముపార్జించుకొంటున్నాడు. అపరోక్షజ్ఞాని అయి ప్రకాశించుచున్నారు. క్రమంగా పరమాత్మ స్వరూపుడై సర్వత్రా విరాజమానుడగుచున్నాడు.

ఈ దేహమును ఉపయోగించి జాగ్రత్-స్వప్న-సుషుప్తులను ఈ జీవుడు (లేక, పురుషుడు) తనకు తానే కల్పన చేసుకొని అనుభవిస్తూ ఉన్నాడుకదా! అట్టి ఈ జీవుడు ‘యోగాభ్యాసము’ను చేపట్టనప్పుడేమో - దేహాభిమానియై, బద్ధుడై ‘జీవాత్మ’ అను శబ్దమునకు అర్థముగా మిగిలిపోవుచున్నాడు. బద్ధుడై దేహముల రాక-పోకలను, గర్భస్థనరకములను పొందటము జరుగుతోంది.

ఆతడే యోగాభ్యాసి అయినప్పుడో…, క్రమంగా →
- నేను సర్వమునకు అంతర్యామిని!
- దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారములకు దృశ్య వ్యవహారములకు నియామకుడను. దేహముల రాక-పోకలకు కేవల సాక్షిని!
- అమృతానంద స్వరూపుడను!
- పరమ పురుషుడను!
అని గ్రహించి, తదేకనిష్ఠాపరుడై పరబ్రహ్మమే తానై, సర్వ సంసార శృంఖలములను ఛేదించి వేస్తున్నాడు.

అసలీ జీవునికి సంసార బంధము ఎక్కడి నుంచి వచ్చిపడింది? ఈతడు సహజ స్వస్వరూపమగు ఆత్మను ఏమరచి, అభ్యాసవశంగా ‘‘దృశ్యవిషయములే నా సర్వస్వము’’ అనే మననమునకు ఉపక్రమించి, జీవ బద్ధత్వము తెచ్చిపెట్టుకుంటున్నందువలనే! అంతేగాని, మరెవ్వరూ ఈతనికి సంసార బంధము కల్పించలేదు.

అనర్థమగు సంసారమునకు బీజము - అజ్ఞానమే!
- అట్టి అజ్ఞాన బీజము యొక్క అంకురమే - అంతఃకరణము.
- మనో-బుద్ధి-చిత్త-అహంకార రూపమగు అంతఃకరణ-అంకురమే… ఈ ‘దేహ’ భావ వృక్షముగా ప్రాప్తించుచున్నట్టిది!
అటువంటి ఈ దేహ వృక్షములో
- 8 కోట్ల రోమస్థానములు.
- 8 వేల సంధులు.
- 9 వందల నరములు.
- ‘8’ పలముల (షుమారు 8x4=32 తులముల) బరువు గల హృదయము.
- ‘12’ పలముల (షుమారు 48 గ్రాముల) నాలుక విభాగము.
- 1 ప్రస్థము … (షుమారు ‘6’ గ్రాముల) పిత్తగ్రంథి.
- 1 తూమెడు….కఫము, శుక్లము 2 మానులు
- 2 కుడుపముల బరువు గల (షుమారు 1/2 కెజి) మేదోవిభాగము. (కొవ్వు)
… ఇటువంటి అనేక రకములైన పదార్థముల సమ్మేళనములతో దేహములోఉండి, అవన్నీ ఈ శరీరము పనిచేయటానికి వీలుగా ఆయా పరస్పర సాహకారిక ధర్మాలు నిర్వర్తిస్తూ ఉండటం జరుగుతోంది.

అయితే ఇక్కడ ఒక ముఖ్యవిషయం గమనించబడుగాక!

ఇప్పుడు మనం చెప్పుకున్న దేహ విభాగ విశేషాలన్నీ కూడా నశ్వరము. నశించబోయేవి. ఇది ఎప్పుడూ జ్ఞాపకము పెట్టుకొనియే ఉండాలి.

గర్భములో శిశువుగా ఉన్నప్పటి సందర్భము వలె ‘‘సుషుమ్ననాడి’’ యందే సుస్థిర స్థానము కలిగి ఉండాలి. ఇంద్రియ విషయముల రూపంలో ఉన్నట్టి సర్వ బాహ్య జగద్విషయాలను యోగసాధనా మార్గంగా అధిగమించాలి. పరమపురుషత్వ దర్శనముచే సర్వేంద్రియ వివర్జితుడవ్వాలి.

వివేకి అయినవాడు జీవితావకాశమును సద్వినియోగపరచుకొని సర్వసంసార బంధాల నుండి విముచ్యుడగుచున్నాడు.

‘‘ఈ శరీరమే నేను - ఈ శరీరము నాకు సంబంధించినది, నేను ఈ శరీరమునకు సంబంధించినవాడను, దేహపరిమితుడను… అనే పరిమిత శృంఖల భావాలను త్యజించివేస్తున్నాడు. అట్టివాడు మరల సంసారమున పడుటలేదు.

ఒకవేళ… ఆ తీరుగా - ఆ మార్గముగా కాకుండా…,
ఈ దేహము-సంబంధాలు మొదలైనవన్నీ నిత్యమేనని, ఇందలి సంబంధ-బాంధవ్య-అనుబంధాలన్నీ శాశ్వతమేనని,
ఇంద్రియ విషయాలే సర్వస్వమని భావిస్తూ జీవిస్తుంటే,
ఆత్మజ్ఞానము కొరకై తగినంతగా ప్రయత్నశీలుడు కాకుండా ఉంటే?
దృశ్యమే సత్యమని నమ్ముకొని ఉన్నందుకు పర్యవసానం?
🙁 అట్టివాడు అజ్ఞుడై, సంసారియై, రాత్రింబవళ్ళు గడిపివేస్తూ, ఆయుష్షును బుగ్గిపాలు చేసుకుంటున్నాడు.
🙁 ఒక క్రిమి-కీటకము వలె జీవిస్తూ - ఉత్తమ ప్రయోజనమేదీ పొందని వాడగుచున్నాడు.
🙁 అనేక సార్లు యోని-పురీష ప్రదేశములలో ప్రవేశించి, అనేక దుర్భర గర్భనరకములను పరంపరగా అనుభవిస్తూనే ఉంటున్నాడు.

⌘⌘⌘

🌺 ఏది ఈ దేహమునకు ‘‘పరమై-వేరై-సంబంధించనిదై అప్రమేయమై’’ యున్నదో…,
🌺 ఎద్దానియందు ఈ జగత్తులన్నీ సర్వదా దర్పణములోని ప్రతిబింబమువలె, మట్టియందు మట్టిబొమ్మలకొలువువలె సర్వదా ప్రతిష్టితమై యున్నాయో…,
అట్టి ‘ఆత్మమేవాహమ్’ తత్త్వమును వివేకి అయినవాడు ఈ దేహమును ఉపకరణముగా ఉపయోగించుకొని - సముపార్జించుకోగలడు.

తత్ ఏతత్ పరిమాణం పరిజ్ఞానాయ నిర్విద్యా।
జీవుడు దేహమును పొందినందుకుగాను, ఇద్దానిని ఉపకరణంగా చేసుకొని, వైరాగ్యముచే అవిద్యను జయించి, ఆత్మతత్త్వమును ఆశ్రయించి → మోక్షస్వరూపుడై ‘‘ఆత్మమేవాహమ్’’ స్థానమును సముపార్జించుకోవాలి. ఇదియే మహదాశయము.

ఇతి పైప్పలాదమ్ మోక్షశాస్త్రమ్ పరిసమాప్తమ్। ఇత్యుపనిషత్.



🙏 ఇతి కృష్ణయజుర్వేదాంతర్గత గర్భ ఉపనిషత్ ‌🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।