[[@YHRK]] [[@Spiritual]]

Nārāyanēyā Yājnaki Khila Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


అనుష్ఠాన పాఠము
నారాయణీయా యాజ్ఞికీ ఖిల ఉపనిషత్

కృష్ణ యజుర్వేదీయ - తైత్తిరీయ - తైత్తిరీయారణ్య - దశమ ప్రపాఠము

ఇది మహర్షిచే - అరణ్యములోని ఆశ్రమమునుండి నాగరిక (సాంఘిక) ప్రపంచమునకు బాల - యౌవన - వృద్ధుల అనుష్ఠానము కొరకై సమీకరణంగా రచించి ప్రసాదించబడిన అరణ్యకము. ముక్తికోపనిషత్‌లో చెప్పబడిన ‘108’ ఉపనిషత్తులలో ఇది ఉదహరించబడలేదు. బహుశః ఇది అనుష్ఠానము కొరకై మహర్షిచే తయారుచేయబడిన ‘సంకలనము’ వంటిది అవటం చేత కాబోలు.

కానీ ఒక్క విషయం! ఈ నారాయణీయ యాజ్ఞక్యుపనిషత్ పిల్లల దగ్గర నుండి పెద్ద వారి వరకు నోటికి వచ్చే వరకు చదవటము - ఉపనిషత్ ఉద్యానవనమునకు చక్కటి ప్రవేశద్వారము వంటిదని నాకు అనిపిస్తుంది. అందుచేత ఈ ‘2’వ సంపుటిలో ‘‘Ⅰ’’ (మొదటి ఉపనిషత్తుగా) గా అందించటం జరుగుతోంది.

మహనీయులగు పాఠకమహాశయులారా! వేదజ్ఞులగు పెద్దలారా! నేను అధ్యయన విద్యార్థిని మాత్రమే. అందుచేత ఈ ‘‘ఉపనిషత్ ఉద్యానవన యజ్ఞము’’ లోని పొరపాట్లను, లోపములను తెలియజేస్తే, సరిదిద్దుకొనుటకు సర్వదా సంసిద్ధుడను. విధేయుడను. యోగ గురువులు, వేద గురువులు ఇందలి వివరణలను విమర్శనాత్మకంగా పఠించవచ్చు. నాకు తెలియచెప్పవచ్చు. అట్టి అభిప్రాయములకు సుస్వాగతము.

వేదమాతా నమో నమః।

ఈ సర్వమును, తత్ఫలములను-సర్వదా వేంచేసియున్న, సర్వము తానైయున్న, కూచిపూడి గ్రామములో కూడా పూజలందుకొంటున్న శ్రీ బాలత్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామి వారికి సర్వదా అంకితము.

- యేలేశ్వరపు హనుమ రామకృష్ణ
అధ్యయన విద్యార్థి


కృష్ణ యజుర్వేదీయ - తైత్తిరీయ - తైత్తిరీయారణ్య - దశమ ప్రపాఠక
నారాయణీయా యాజ్ఞిక్యుపనిషత్‌లోని కొన్ని ముఖ్య విశేషాలు

పరిచయపూర్వకంగా
🙏 పరమాత్మ సర్వదా నిర్మలుడు, మహత్తరుడు, సర్వవిషయాతీతుడు అయి ఉండియే, ఇక్కడి జీవాత్మ-జగత్తులను క్రీడవలె తనయొక్క అంశగా కల్పించుకొని వినోదిస్తున్నారు. ఈ జీవుడుగా కనిపిస్తున్నది. పరమాత్మయే. - అను వర్ణన.
🙏 అనేక ప్రదర్శనా వైచిత్ర్యములతో కూడిన ఈ దృశ్య జగత్తులుగా, వీటియొక్క దృశ్యద్రష్టగా, ఆ ద్రష్టకు సాక్షిగా వెలయుచున్నది - ‘‘ఏకము, అక్షరము’’ అయి ఉన్న పరబ్రహ్మమే. అయ్యది సర్వదా అఖండము, అప్రమేయము, నిత్యమ - అను గానము.
🙏 ‘‘ఇదంతా పరబ్రహ్మమునకు అనన్యము’’ …. అని నిరూపించి బోధించుచున్నవారే ఋషులు (మరియు) వేదములోని ఋక్కులు. ఋతముగా (మనోభావ పూర్వకంగా), సత్యముగా (వాక్ పూర్వకంగా) ‘‘శృణ్వంతి విశ్వే!’’ …. అని శ్రోతమ్। ‘‘తత్ త్వమ్’’ - నీవు సహజముగా పరమాత్మవే’’ అని ఎలుగెత్తి గానం చేస్తున్న - అను వచనము.
🙏 పరబ్రహ్మమునకు అభిన్నమై పరబ్రహ్మమునుండి బయల్వెడలు సృష్టి సంకల్పాభిమానియగు హిరణ్యగర్భుని వర్ణన/విశేషములు.
🙏 ఈ సృష్టి నిర్మాణమును నిర్వర్తించుచున్న, నిర్వహించుచున్న దివ్య ప్రజ్ఞా స్వరూపులగు వివిధ దేవతలను ఉద్దేశ్యించి సమర్పించు ‘‘ప్రచోదయాత్’’ - అభ్యర్థన స్తుతులు (దేవతా గాయత్రీ మంత్రములు).
🙏 సూక్తములు - దుర్వాస సూక్తము. శత్రుంజయ మంత్రము. స్వస్తి సూక్తములు. అఘమర్షణ సూత్రము (మంత్రము). జాతవేదసే-దుర్గా సూక్తము.
🙏 వ్యాహృతి హోమ మంత్రములు. జ్ఞానపాప్త్యర్థ హోమమంత్రము. ప్రణవ స్తుతి. తపోప్రశంస. దహర విద్యా స్తుతి. గుహాశయ స్తుతి.
🙏 పరమాత్మ సాగరంలోని ‘‘జీవాత్మ-జడప్రపంచ’’ - అభిన్న తరంగాలు.
🙏 విషయ భోగముల విరమింపజేయు ప్రత్యాహారములు.
🙏 (సహస్ర శీర్‌షం దేవమ్) … నారాయణ సూక్తము. ఆదిత్య మండల స్తుతి రూప బ్రహ్మోపాసన, (నిధనపతాయే నమః….) శివోపాసనా మంత్రములు.
🙏 నమస్కారార్థ మంత్రములు. భూదేవతా స్తుతి మంత్రము. సర్వదేవతా స్వరూప ఆపః (జల) మంత్రము. సంధ్యావందన పవిత్ర స్వాహా మంత్రము. ఏక-అక్షర పరబ్రహ్మస్తుతి మంత్రము. గాయత్రీ ఆహ్వాన ఉపాసనా స్తుతులు.
🙏 ఆదిత్య దేవతా మంత్రము. త్రిసువర్ణ మంత్రము. బ్రహ్మమేధయా మంత్రము. (మధువాతా ఋతాయతే) - మధుస్తుతి.
🙏 మేధా సూక్తము. మృత్యు నివారణ మంత్రము. రుద్రస్తుతి. ప్రజాపతి ప్రార్థనా మంత్రము. ఇంద్రస్తుతి.
🙏 మృత్యుంజయ మంత్రము. పాప నివారక ప్రార్థనామంత్రము. వసుస్తుతి. కామోకార్షీ - మన్యురాకార్షీ మంత్రములు.
🙏 విరజాహోమ మంత్రము. తిలదేవతాస్తుతి మంత్రము. పంచప్రాణశుద్ధి మంత్రము. సమస్త శుద్ధి మంత్రములు.
🙏 విశ్వేదేవ హోమ మంత్రము, ‘తత్ బ్రహ్మా’ - స్తుతులు, శ్రద్ధాహ్వాన మంత్రము.
🙏 (తినబోయేడప్పుడు) భుక్తాన్న అభిమంత్రణము. (భోజనము ముగించిన తరువాత) ఆత్మానుసంధాన మంత్రము.
🙏 అగ్ని దేవస్తుతి. అభీష్ట సిద్ధి నివేదనా మంత్రము.
🙏 పరతత్త్వ నిరూపణము. జ్ఞాన సాధన కథన స్తుతులు.
🙏 యజ్ఞమహత్మ్యము. మానసికోపాసన. అంతర్యామి స్తుతి. జ్ఞానయజ్ఞము.
అనుష్ఠానము కొరకై ఇవన్నీ ఈ ‘ఉపనిషత్’లో ఋషిచే సంకలన పూర్వకంగా ప్రసాదించబడుచున్నాయి.


కృష్ణ యజుర్వేదాంతర్గత
తైత్తిరీయారణ్యకే - ఖిలాకాండే
నారాయణీయా యాజ్ఞికీ ఖిలోపనిషత్

1వ అనువాకము
ఉపనిషత్ పరిచయ విశేషాలు
1 పరతత్త్వ మంగళ శ్లోకముల
25 స్నానాంగభూత మంత్రములు-దూర్వాసూక్తము
38 మృత్తికా సూక్తము
48 మృత్తికా శుద్ధికై పృథివీ ప్రార్థన
52 జలస్వీకార మంత్రము
58 అఘమర్షణ సూత్రము
65 ‘గంగ’ ఆది ఆవాహన మంత్రము
66 నీటిలో మునిగి ప్రాణాయామం చేస్తూ మనస్సుతో చదువు మంత్రము
69 స్నానము పూర్తి చేసిన తరువాత చదివే ఋక్కులు
75 స్నానము చేసి తుడుచుకొన్న తరువాత చదివే మంత్రము

2వ అనువాకము
78 దుర్గా సూక్తము

3వ, 4వ, 5వ అనువాకము
85,86,87 వ్యాహృతి హోమ మంత్రములు

6వ, 7వ అనువాకము
88 జ్ఞాన ప్రాప్త్యర్థ హోమ మంత్రము

8వ, 9వానువాకము
90 వేదాంత-పరమార్థ సిద్ధికై ప్రార్థనా మంత్రములు

10వ, 11వ అనువాకము
92 తపః ప్రశంసా

12వ అనువాకము
94 దహర విద్యా

13వ అనువాకము
111 నారాయణ సూక్తము

14వ అనువాకము
123 ఆదిత్య మండలే పరబ్రహ్మోపాసనమ్

15వ అనువాకము
124 ఆదిత్య పురుషస్య సర్వాత్మకత్వా ప్రదర్శనము

16వ అనువాకము
125 శివోపాసనా మంత్రము

17–21 అనువాకములు
126–130 సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన పంచముఖ శివస్తుతులు

22–27 అనువాకములు
123 నమస్కారార్థ మంత్రాః

28వ అనువాకము
137 భూదేవతా మంత్రః

29వ అనువాకము
138 సర్వదేవతా ఆపః స్తోత్రః

30వ అనువాకము
139 సంధ్యావందన మంత్రాః

31వ అనువాకము
140 సాయం సంధ్యా జలపానార్థ మంత్రము

32వ అనువాకము
141 ప్రాతః సంధ్యా జలపాన మంత్రము

33–35 అనువాకములు
142,143,144 గాయత్రీ ఏక-అక్షర ఆహ్వాన స్తుతి మంత్రములు

36వ అనువాకము
145 గాయత్రీ స్వస్థాన ప్రదాన మంత్రము

37వ అనువాకము
146 ఆదిత్య దేవతా మంత్రము

38–40వ అనువాకములు
147 పాపనివృత్తి హేతు - త్రిసుపర్ణ మంత్రము

41–44వ అనువాకములు
151–156 మేధా సూక్తము

45–53వ అనువాకములు
157–165 మృత్యు నివారణా మంత్రము

54వ అనువాకము
166 ప్రజాపతి ప్రార్థనా మంత్రము

55వ అనువాకము
167 ఇంద్ర ప్రార్థనా మంత్రము

56–58వ అనువాకములు
168–170 మృత్యుంజయ మంత్రము

59వ అనువాకము
171 పాప నివారక ప్రార్థనా మంత్రము

60వ అనువాకము
172 వసు ప్రార్థనా మంత్రము

61, 62వ అనువాకములు
173,174 నాఽహం కర్తా। నాఽహం కారయితా

63–66వ అనువాకములు
175–199 విరజా హోమ మంత్రము

67–68వ అనువాకములు
200–204 విశ్వేదేవ హోమ మంత్రము

69వ అనువాకము
205,206 ప్రాణాహుతి మంత్రములు
207,208 ప్రాణాహుతి-వికల్ప మంత్రాంతరములు

70వ అనువాకము
209 భుక్తాన్త అధిమంత్రణ మంత్రః

71వ అనువాకము
210 భోజనాంతే - ఆత్మానుసంధాన మంత్రః

72వ అనువాకము
211 భోజాననంతరం - అవయవ స్వాస్థ్య మంత్రము

73వ అనువాకము
212 ఇంద్ర ప్రస్తుతి మంత్రము

74, 75వ అనువాకము
213,214 హృదయాలంబన మంత్రము

76వ అనువాకము
215 అగ్ని స్తుతి మంత్రము

77వ అనువాకము
216 శివసామీప్యమునకై అభీష్ట యాచనా మంత్రము

78వ అనువాకము
217–229 పరతత్త్వ నిరూపణ మంత్రము

79వ అనువాకము
230–252 జ్ఞాన సాధన
249 అంతర్యామి స్తుతి

80వ అనువాకము
252 జ్ఞాన యజ్ఞము


కృష్ణయజుర్వేదాంతర్గత

తైత్తరీయ అరణ్యకే ఖిలకాండే

Ⅰ     నారాయణీయా యాజ్ఞికీ ఖిలోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్

ఉపనిషత్ పరిచయ విశేషాలు

గృహస్థుల, విద్యార్థుల ఉపనిషత్ వాఙ్మయాభ్యాసమును ఉద్దేశ్యించి మహర్షి - ఈ ‘‘నారాయణీయ యాజ్ఞికీ ఖిలోపనిత్ ’’ ను అనుష్ఠానము కొరకై కృష్ణ యజుర్వేద - అరణ్యక అంతర్భాగంగా అందించారు. అనేక మంది గృహస్థులు, గృహిణులు, విద్యార్థులు మొదలైనవారు మొట్టమొదటి పారాయణంగా చదివి, నోటికి వచ్చిన తరువాత, అంతరార్థాన్ని హృదయస్థం చేసుకోవాలని భావించి → ఉపాసనా విశేషాలలో లోకానికి ప్రసాదించారు.

వేదాంత - అధ్యయన సముత్సాహకులకు ఈ ఉపనిషత్ - ‘‘ఉపనిషత్ ఉద్యానవన ప్రవేశ ద్వారము’’ వంటిదని ఉపనిషత్ విద్యాగరిష్ఠుల అభిప్రాయము.

ఈ ఉపనిషత్తులో → పరమ-పురుషస్తుతి; వివిధ దేవతల విద్మహే - ధీమహీ - ప్రచోదయాత్ గాయత్రీస్తవములు; ‘‘దూర్వాసూక్తము’’; ‘‘మృత్తికాసూక్తము’’; స్నానం చేస్తూ చదివే ‘‘అఘమర్షణ సూక్తము’’; ‘‘దుర్గాసూక్తము’’; ‘‘‘వ్యాహృతి హోమమంత్రము’’; ‘‘తపః ప్రశంస’’; ‘‘దహరవిద్య’’; ‘‘నారాయణ సూక్తము (మంత్ర పుష్పము)’’; ‘‘ఆదిత్యమండల పరబ్రహ్మోపాసన’’; ‘‘శివోపాసనా మంత్రము’’; ‘‘నమస్కారార్ధమంత్రము’’; ‘‘భూదేవతా స్తుతి’’; ‘‘సంధ్యావందన మంత్రార్ధము’’; ‘‘ఆదిత్య దేవతా మంత్రము’’; ‘‘త్రిసుపర్ణ మంత్రము’’; ‘‘మేధాసూక్తము’’; ‘‘మృత్యునివారణ మంత్రము’’; ‘‘ఇంద్రస్తుతి’’; ‘‘మృత్యుంజయమంత్రము’’; ‘‘పాపనివారక ప్రార్థన’’; ‘వసు-కామోకార్షీ - మన్యులాకార్షీ విరజాహోమ మంత్రములు’’; ‘‘విశ్వేదేవస్తోత్రము’’; ‘‘భోజన సమయ మంత్రములు’’; ‘‘హృదయ - ఆలంబనా మంత్రము’’; ‘‘అగ్నిస్తుతి’’; ‘‘అభీష్ట యాచనామంత్రము’’; ‘‘పరతత్త్వస్తోత్రము’’; ‘‘జ్ఞానసాధనా మార్గములు’’; ‘‘జ్ఞానయజ్ఞము’’ → మొదలైన విశేషాలు ఉన్నాయి. ఇది పారాయణము కొరకై మహర్షిచే సమీకరించబడింది.

ఈ అనుష్ఠానోపనిషత్ - ‘‘ముక్తికోపనిషత్’’లో చెప్పిన 108 ఉపనిషత్తులలో ఇది ఉదహరించబడలేదు. అనగా మన ఈ జ్ఞానయజ్ఞములో 109వదిగా అనుకోవచ్చును.

ఇది దైనందికాభ్యాసముకొరకై సమీక్షాయుక్తంగా ‘‘సంస్తుతి’’గా అందించబడుతోందని వేదజ్ఞుల అభిప్రాయము.

అవకాశమున్నంతవరకు ఈ ఉపనిషత్ దైనందిక పారాయణంగా చేయటము ఉపనిషత్ మాత-ఉపాసన కాగలదు.

ఇది అనుష్ఠాన కారిక. ఆరణ్యకంగా అరణ్యంలోంచి గ్రామ, పట్టణ పాఠశాలలు ఇత్యాది చోట్ల వేదాభ్యాస సంసిద్ధత కొరకు అందించబడింది.

ఇక్కడ తాత్పర్యము మాత్రమే వ్రాయటం జరుగుతోంది. తదితర ఉపనిషత్తులవలె వచన - అధ్యయనము జోడించటము లేదు. ఇది ప్రారంభ పారాయణంగా చదవటం ఉపనిషత్ అధ్యయనములకు ‘‘తపో సంసిద్ధత’’ కాగలదు.

పిల్లలచే రోజూ చదివించటం, బ్రహ్మచారులు, గృహస్థులు, గృహిణులు నోటికి వచ్చే వరకు చదువుతూ ఉండటం, ఈ ఉపనిషత్తు ఉపాసనగా పారాయణం చేయుటము శుభప్రదము.


Ⅰ     నారాయణీయా యాజ్ఞికీ ఖిలోపనిషత్

శ్లోక - తాత్పర్య పుష్పము (ఉపనిషత్ సంక్షిప్త)

అనుష్ఠాన కారిక


1వ అనువాకము

పరత్తత్వ మంగళ శ్లోకములు

1 అంభస్య పారే భువనస్య మధ్యే
నాకస్య పృష్ఠే
మహతో మహీయాన్,
శుక్రేణ జ్యోతీగ్ంషి
సమను ప్రవిష్ఠః
ప్రజాపతిః చరతి గర్భే అంతః।
పరమాత్మతత్త్వ మంగళాశాసనము
- సప్తసముద్ర మధ్యవర్తి,
- సముద్ర జలమునకు ఆవల (పరతీరమున) ఉన్నట్టి వారు,
- భూ-భువర-సువర్ లోకముల మధ్యగా వెలుగొందుచున్నట్టివారు,
- ఆకాశలోకములకు ఆవల ఉన్నట్టివాడు, ఊర్ధ్వలోకములకు ఆవల వెలుగొందువారు,
- మహత్తరమగు సమస్త వస్తువుల కంటే మహత్తరమైన వారు,
- జ్యోతి యొక్క నిర్మలమగు వెలుగువంటివారు → అగు ‘‘పరమాత్మ’’ సర్వ జీవుల హృదయములలో ప్రవేశించి, సర్వదా ప్రజాపతిగా వెలుగొందుచున్నారు.
2. యస్మిన్ ఇదగ్ం సంచవిచైతి
సర్వం, యస్మిన్ దేవా
అధివిశ్వే నిషేదుః,
తదేవ భూతం,
తదు భవ్యమా ఇదం
తత్ అక్షరే పరమే వ్యోమన్।
- సర్వజగత్తులు ఎందులో సంచార - సంచలన శీలమై వర్తిస్తున్నాయో,
- ఎవ్వరిలో విశ్వము, విశ్వ దేవతలు, వారి వారి లోకములు అమరినవై ఉన్నాయో, అట్టి ఆ పరబ్రహ్మమే అక్షరమై, సర్వమునకు పరమై, ఆత్మాకాశ స్థానభూతమై యున్నది. భూత-భవవిష్యత్-వర్తమాన త్రికాలములయందు సర్వమునకు ప్రదర్శనశీలమై యున్నది. అట్టి పరమాత్మ ఏ మార్పూ పొందటము లేదు. చేర్పూ సర్వత్రా సర్వదా యథాతథము. అక్షరుడు! పరము! ఆయనయే మనందరి వాస్తవ స్వరూపము. మనము సర్వదా సర్వత్రా చూస్తున్నది ఆయననే! ఆయనకు మనమంతా అనన్యము.
3. యేన ఆవృతం ఖం చ
దివం మహీం చ,
యేన (‘అనాదిః’ ఇతియత్)ఆదిత్యః
తపతి తేజసా అహ్రాజసా చ,
యమ్ ‘‘అంతః సముద్రే’’
కవయో వదంతి,
యత్ ‘‘అక్షరే పరమే ప్రజాః’,
దేనిచేత ఆకాశము, స్వర్గాది దివ్యలోకములు ఆవృత్తమై ఆవరించబడినవో,
- ఏది భూమి అంతా వ్యాపించి ఉన్నదో,
- ఏది తన తేజస్సుచే సూర్యగోళమును ఆదిత్యునిగా వెలిగించుచున్నదో, తపింపజేయుచున్నదో,
- ఏది సముద్రమునందు సముద్రమునకు ఆవల అంతటా వ్యాపించి ఉన్నట్లు ప్రాజ్ఞులు వర్ణిస్తున్నారో,
- ఏది సర్వము అయి ఉండియే - సర్వమునకు పరమై, సర్వులకు వేరై అక్షరమైయున్నదో,
4. యతః ప్రసూతా, జగతః ప్రసూతీ,
తోయేన జీవాన్ వ్యచ
సర్జ భూమ్యామ్, యదా ఓషధీభిః,
పురుషాన్ పశూగ్ంశ్చ వివేశ
భూతాని → చరాచరాణి।।
- ఎద్దాని నుండి ఈ జగత్తంతా జనించి ప్రదర్శనమగుచున్నదో,
- ఏది సర్వజీవులలో జీవన స్వరూపజలముగా విస్తరించి ఉన్నదో,
- ఏది ఔషధ రూపంలో పశువులు, మానవులు మొదలుగా అందరిలో ప్రవేశించినదై ఉన్నదో,
- ఏది అంతర్లీనంగా చరాచరములలో వ్యాపించి ఉన్నదో - అదియే పరమాత్మ! సర్వదీపములలోని అగ్నివలె సర్వజీవులలోని జీవన స్రవంతియే పరమాత్మ!
5. అతఃపరం న అన్యత్, అణీయ సగ్ంహి।
పరాత్ పరమ్ యత్
మహతో మహాన్తమ్,
యత్ ఏకం, అవ్యక్తం,
అనన్త రూపమ్,
విశ్వం పురాణం
తమసః పరస్తాత్।
అట్టి పరమాత్మను దాటినదై ఏదీ లేదు. అద్దానికి అన్యమైనదీ అణువంత కూడా లేదు. ఆయన అణువుకే అణువు. ఇహము-పరము అను జీవతత్త్వ ములకు పరమైనట్టివాడు. పరాత్ పరుడు. మహత్తరమైనవాడు. అనంతుడు.
ఆయన ఏకమే అయి ఉన్నారు. అనేకముగా కాదు. సర్వదా అవ్యక్తుడే! సర్వవ్యక్తీకరణములకు ఆవలవాడు. ఆద్యన్తములు లేనివాడు. అనన్తరూపుడు. ఈ విశ్వమునకు మునుముందే ఉన్నవాడు. అందుచేత పురాణపురుషుడు. తమసః పరస్తాత్! అంధకారమునకు ఆవలవాడు (కళ్లుమూసుకున్నప్పుడు కనిపించే అంధకారమునకు ఆవల అద్దాని సాక్షి అయి చూస్తున్నవాడు).
6. తదేవ ఋతం (తదేవర్తం),
తదు ‘సత్యమ్’ ఆహుః।
తదేవ ‘బ్రహ్మ పరమమ్’ కవీనామ్।
ఇష్టాపూర్తం బహుధా జాతం
జాయమానం విశ్వం భిభర్తి
భువనస్య నాభిః।।
(సర్వము తానై కూడా సర్వమునకు వేరై ఉన్నట్టి) ఆ ‘తత్’ అనబడు ప్రతిజీవుని కేవల స్వరూపమే → ఋతము అయినది. ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవటానికి విషయమైనది. (స్వానుభవప్రవచనమ్-ఇతి ఋతమ్)
→ ‘ఉనికి’ రూపముచే సర్వావస్థలలో కేవలమై చెన్నొందచున్నట్టి ‘సత్యము’ (యమ్ సత్) అయి ఉన్నది. అదియే సర్వమునకు ఆవల పరమై, అన్నిటికంటే మహత్తరమై - బ్రహ్మము అయి ఉండటం చేత ‘‘పరబ్రహ్మము’’. అత్యంత శ్రేష్ఠము కాబట్టి ‘కవీమ్’. అట్టి పరబ్రహ్మము యొక్క ఇష్ట- వ్యవహార వివర్తన (పూర్తి)యే ఈజగత్తు. ఏకమగు బ్రహ్మము అనేకముగా తానే ఇష్టాపూర్తిగా అగుచున్నది. ఈ విశ్వమంతా నిండి ఉండి, దీనిని భరించుచు ఇద్దానికి మూల కదలిక రూపమగు ‘‘విశ్వనాభి’’ కూడా!
7. తదేవ అగ్నిః। తత్ వాయుః।
తత్ సూర్యః। తదు చంద్రమాః।
తదేవ శుక్రం। అమృతం।
తత్ బ్రహ్మ। తత్ ఆపః।
స ప్రజాపతిః।।
మూల కదలిక రూపమగు ‘‘విశ్వనాభి’’ కూడా!
అట్టి పరబ్రహ్మమే అగ్నిగా, వాయువుగా, సూర్యుడుగా, చంద్రుడుగా తన యొక్క ఇష్టా-పూర్తి స్వభావముచే అగుచున్నది. తన తేజస్సుచే సర్వ శుభములు ప్రసాదించు శుకరము, నిర్మలము అగు శుక్రము. అది మార్పు చేర్పులకు విషయమేకాదు కాబట్టి అమృతము : అదియే బ్రహ్మము. అదియే జీవనాధారరూపమగు పరా-జలము (జీవులందరూ తరంగాలు). అదియే ఈ అనేక జీవుల సృష్టికర్త, నియామకుడు అగు ప్రజాపతి.
8. సర్వే నిమేషా జజ్ఞిరే విద్యుతః
పురుషాదధి; కలా ముహూర్తాః।
కాష్ఠాశ్చ అహోరాత్రాశ్చ సర్వశః।
ఆ పరబ్రహ్మమే నిమేష కాలరూపము. క్షణికమైనదంతా అదే! సర్వత్రా సంచారము కలిగియున్న జజ్ఞిరము. సర్వమును వెలిగించు విద్యుత్ స్వరూపము. సర్వజీవులలోని పురుషకారము. కాలకల్పనా రూపము. జగత్తులో కాష్టమైయున్న మౌనము. రాత్రింబవళ్లు కూడా అయి ఉన్నట్టిది.
9. అర్ధమాసా మాసా ఋతవః
సంవత్సరశ్చ కల్పన్తామ్।
స ఆపః ప్రదుఘే ఉభే
ఇమే అన్తరిక్షమ్ అథో సువః।।
శుక్ల-కృష్ణములనబడే అర్ధ మాసములు, చైత్ర-వైశాఖ-శ్రావణ మొదలైన మాసముల స్వరూపము, ప్రభవ- విదియ ఇత్యాది సంవత్సరముల, కల్పముల కల్పాంతముల స్వరూపము → ఆత్మయే! జలము తరంగములుగా అగు అంతర్లీన తత్త్వము, అంతరిక్షము, క్రింద భూమి మొదలైన లోకములు, మధ్య గల సువర్లోకము, ఆవల లోకములు → అంతా పరబ్రహ్మమే.
10. నైనమ్ ఊర్థ్వం న తిర్యంచం
న మధ్యే పరిజగ్ర భత్।
న తస్య ఏశే కశ్చన
తస్య నామ మహత్ యశః।।
అట్టి పరబ్రహ్మము పైన ఎక్కడో లేడు. క్రింద మరెక్కడో లేడు. మధ్యలో ఉన్నవాడూ కాదు. ఎవ్వడు కూడా ఆ పరమాత్మను ‘‘ఇట్టిది’’ అని నిర్వచనములో బంధించి ‘ఇంతే’ అని అనలేడు. అన్ని నామరూపములు అద్దానివే. అద్దాని నామ, మహత్, యశములు → అవాక్ మానసగోచరం.
11. న సందృశే తిష్ఠతి రూపమస్య।
న చక్షుషా పశ్యతి కశ్చన ఏనమ్।
హృదా మనీషా మనసా అభికప్తో
య ఏనం విదుః అమృతాః తే భవన్తి।।
(అమృతాస్తే భవన్తి)
ఆ పరమాత్మ ఒక రూపముగానో, నామముగానో కనబడు పరిమితముకాదు. ఎవ్వరూ కళ్లతో చూచి ‘‘ఇది రూపము’’ అని పరబ్రహ్మమును పరిమితి చేసి నిర్ణయించలేడు. (చూచుచూ ఉన్నదే అది కాబట్టి).
అయితే అది స్వానుభవము చేతనే అవగతమౌతుంది. హృదయాకాశములో నిర్మల బుద్ధికి స్వానుభవమైనట్టి ప్రదర్శనము. ఎవ్వరైతే తమ హృదయములో సర్వాత్మకుడగు ఆ పరమాత్మను బాహ్య- అభ్యంతర సర్వస్వరూపుడుగా దర్శిస్తారో, అట్టివారు అమృతత్వమును సిద్ధించుకొనుచున్నారు.
12. అద్భ్యః సంతభూతో
‘హిరణ్య గర్భ’ - ఇతి అష్టౌ।।
(అహమ్ ఏక తరంగ మస్మి పరమాత్మానంద సాగరః) ఆయన జలస్వరూపుడై సంభవించి, సర్వజీవులను తనయందు తరంగములుగా కలిగియున్నవాడు. సర్వము తన గర్భమునందు కలిగియుండి హిరణ్యగర్భుడుగా స్తుతించబడుచున్నారు.
13. ఏష హి దేవః ప్రదిశోను సర్వాః।
పూర్వో హి జాతః స ఉ గర్భే అన్తః
స విజాయ మానః।
స జనిష్యమానః।
ప్రత్యక్ ముఖాః తిష్ఠతి విశ్వతో ముఖః।।
ఆ పరమాత్మ సర్వ దిక్కులలో వేంచేసియున్న దేవాదిదేవుడు. సర్వదిక్కులకు ఆధారుడు. ఈ ‘‘దేహములు, కర్మవ్యవహారములు’’ - అనబడే జన్మకర్మలకు మునుముందే ఉన్నవారు. ‘జన్మించటము’ అనే లీలను ప్రదర్శిస్తూ ఉన్నవారు. జన్మలకు మునుముందు, తరువాత కూడా ఉండువాడు. తెలియబడేదంతా ఆయనయే! జనించినట్లుగా అగుపడేది జననరహితుడగు ఆయనయే! సర్వమునకు వేరై, సర్వమునకు సాక్షి అయి, ఈ విశ్వమంతా తనయొక్క ముఖ-ముఖకవళికలుగా కలవారు.
14. విశ్వతః చక్షుః।
ఉత విశ్వతో ముఖో।
విశ్వతో హస్త, ఉత విశ్వతః పాత్ (విశ్వతస్పాత్)
సం బాహుభ్యాం నమతి సంపత
త్రైః ద్యావా- పృథివీ జనయన్
దేవ ఏకః।।
ఈ విశ్వమంతా తన చూపుయందే కలవాడు. విశ్వమంతా చక్షువులు కలవాడు. విశ్వమంతా ఆయన ముఖమే. ఈ విశ్వమంతా తన హస్తములతో నింపి ఉంచినవాడు. విశ్వస్వరూపుడు (విశ్వమ్ విష్ణుః). విశ్వేశ్వరుడు!
ఆయన సర్వమునకు కర్త (The worker of the universe). ఆయన బాహువుల నుండే (from his workmanship) ఈ అనేకమంతా ఆవిర్భవిస్తోంది. ద్యావా-పృధివి, (మిన్ను-మట్టి), మర్త్య-పాతాళ-స్వర్గ లోకములు, ఈ అనేకములన్నీ ఏకస్వరూపుడగు ఆయన యొక్క క్రియా విశేషమే! నవలలోని సంఘటనలన్నీ రచయితయొక్క చమత్కారమే కదా! ఈ విశ్వమంతా ఆత్మభగవానుని రచనా చమత్కారమే.
15. వేనః తత్ పశ్యన్ విశ్వా భువనాని,
విద్వాన్, అత్ర విశ్వం భవతి ఏక నీడమ్,
యస్మిన్ ఇదగ్ం సంచవిచైతి సర్వగ్ం
స ఓతః ప్రోతశ్చ విభుః ప్రజాసు।।
ఆయన యొక్క ‘చూపు’ చేతనే ఈ విశ్వము, ఈ భువనము సారూప్యత పొందుతోంది. ఆయన ఎరుక నుండే ఎరుగుబడుచున్న వివిధత్వమంతా కల్పితమౌతోంది. ఏకము, అమృతము, నిశ్చలము అగు ఆయననుండియే ఈ సర్వము సంచారత్వము పొంది ఆయనయందే సంచలనముతో ప్రదర్శిస్తూ, ఆయనయందే ముగింపు పొందుతోంది. ఆయన సర్వజనులలో ఓత-ప్రోతమై, విభువు అయి, సర్వజనుల జనన స్థానమై ఉన్నారు.
16. ప్రతత్ వోచే అమృతన్ను విద్వాన్,
గంధర్వో నామ నిహితం గుహాసు,
త్రీణి పదా నిహితా గుహాసు
యః తత్ వేద సవితుః పితా సత్।।
తన యొక్క - సర్వజనుల యొక్క హృదయ గుహలో సర్వదా వేంచేసియున్న అమృతమగు పరమాత్మను ఎరిగినవాడే విద్వాంసుడు. అంతేగాని, వాచా మాత్ర-విద్వాంసుడు వాస్తవ విద్వాంసుడు కాడు.
ఏ గంథర్వుడు జాగ్రత్ స్వప్న సుషుప్త రహస్యతత్త్వముగా దాగి ఉన్నాడో, ఆయనను ఎరిగియున్నవాడే, సత్-విత్ (సంవితుడు)! అట్టి విశేషము చెప్పువాడు పిత. పితకే పిత - అగు పితామహుడు. బ్రహ్మతో సమానుడు. ఆత్మదేవుడే జగత్ పిత. ఆయనయొక్క సత్ విన్యాసమే ఇదంతా!
17. స నో బన్ధుః జనితా।
స విధాతా, ధామాని వేద భువనాని విశ్వా,
యత్ర దేవా అమృత మానశానాః
తృతీయే ధామాని అభ్యైరయన్త।।
అట్టి పరమేశ్వరుడే సర్వజీవులకు జనన స్థానము. ఆయనయే సర్వులకు ఆత్మబంధువు. ఆయనయే ఈ సృష్టికి విధాత (నిర్ణయాధికారి). ఆయనయే ఈ విశ్వమంతా తనయొక్క ఎరుకచే కల్పించువాడు. అట్టి అమృత స్వరూపుడగు పరమాత్మయే దృశ్య-జీవ-పరతత్త్వుడై త్రిధాముడుగా, (సర్వముగా) ప్రదర్శన మగుచున్నారు. ఆయన జీవాత్మగా వెలుగొందువాడు కూడా. జీవాత్మ - ఈశ్వరులు ఆయనయే! ఆయన కానిది ఎక్కడా ఏదీ లేదు. (శివాత్ పరతరం నాస్తి)
18. పరి ద్యావా పృథివీ యన్తి సద్యః
పరి లోకాన్ పరి దిశః పరి సువః।
ఋతస్య తన్తుం వితతం విచృత్య
తత్ అపశ్యత్, తత్ అభవత్ ప్రజాసు।।
ఆకాశము-భూమి అంతటా విస్తరించి సర్వము ప్రకాశింప జేయువాడు. సర్వ భౌతిక లోకములు, సర్వదిక్కులు, సర్వదేవలోకములు ఆక్రమించుకొని అవన్నీ తనయొక్క స్వరూపముగా కలవాడు. ఆయన శ్రోతయొక్క హృదయస్తుడే। వినుచున్నవాడుగా ఉన్నది ఆయనయే. (తత్ త్వమ్।)
అట్టి సర్వదా ఋతము (ఎప్పటికీ ఉన్నట్టిది, సత్యద్రష్టల స్వానుభవము, ఋక్కులసారము), సర్వత్రా సర్వముగా విస్తరించియున్నది-అగు బ్రహ్మముగా ఈ సర్వము దర్శించుటచే అట్టి ద్రష్ట బ్రహ్మమే తానగుచున్నాడు.
19 పరీత్య లోకాన్, పరీత్య భూతాని,
పరీత్య సర్వాః ప్రదిశో దిశశ్చ।
ప్రజాపతిః ప్రథమజా ఋతస్య
ఆత్మన ఆత్మానమ్ అభిసంబభూవ ।।
లోకాలన్ని వ్యాపించి, సర్వ జీవులందు ఏర్పడి ఉండి, సర్వదిక్కులందు ఆక్రమించి, సృష్టికి మొట్టమొదటే ఉండి, సర్వమును సృష్టించువాడై యున్న ఆత్మను ఆత్మతో ఎరిగినవాడు ఆత్మయే తానగుచున్నాడు. (అట్టి ఆత్మయే ఋత్. అది స్వాభావికానుభవముగా కలవాడు ఋషి. అద్దానిని గానము చేయునవి ఋక్కులు. ఋక్కుల ఉనికిస్థానమే ఋగ్వేదము).
20 సత్-అసత్ పతిమ్ అద్భుతం।
ప్రియమ్। ఇన్ద్రస్య కామ్యమ్।
సనిం మేథా మయాసిషమ్।।
సత్‌కు, అసత్‌కు (ఉనికికి లేమికి) కూడా ‘పతి’ (నియామకుడు, ఆధారుడు) అయినవాడు. అద్భుతమగు కేవలానందుడు. సర్వజీవులకు అత్యంత ప్రియమైనవాడు. ఇంద్రభగవానునిచే నిత్యకాముడు, సత్‌చిత్ మేధా స్వరూపుడు అగు పరమాత్మను ఎరిగి దర్శించి మమేకమగుచున్నాను.
21 ఉద్దీప్యస్య జాతవేదో
అపఘ్నం నిరృతిం మమ।
పశూగ్ంశ్చ మహ్యమ్ ఆవహ
జీవనన్చ దిశో దిశ।।
(దిశ త్వయా హతేన పాపేన జీవామి శరదశ్శతమ్।।)
నేను వెలిగించు ఈ దీపము యొక్క అగ్ని, ఉష్ణము, తేజస్సు - నా యొక్క నిరృతి (లేక) అభాగ్యమును తొలగించునుగాక।
హే అగ్నిదేవా! జాతవేదా! నా యొక్క జీవన జ్యోతి వెలుగును దశదిశల వ్యాపిపంజేయుచు, పశు సంపద మొదలైనవి ప్రసాదించండి. దశ దిశల వ్యాపించు మీ తేజస్సు నా పాపములన్నీ తొలగిస్తూ నిర్మలమైన నూరేళ్ల ఆయుష్షును, జీవనమును ప్రసాదించునుగాక!
22 మనోహిగ్ంసీత్, జాతవేదో!
గామ్ అశ్వం పురుషం జగత్
అబిభ్రత్ అగ్న ఆగహి
శ్రియా మా పరిపాతయ।
ఓ జాతవేదా! అగ్ని భగవాన్! మా మనస్సు నందు నీ యొక్క ప్రకాశము ప్రవేశించినదగును గాక! మా యొక్క పశు, అశ్వ సంపదను వృద్ధి చేయునుగాక! జగత్ పురుషకారుడా! ఆత్మ జ్ఞానాగ్ని అవరోధములు లేక మాయందు ప్రకాశించుచుండునుగాక! మాకు శ్రియములు ప్రసాదించండి.
23 పురుషస్య విద్మహే, సహస్రాక్షస్య
మహాదేవస్య ధీమహి।
తన్నో ‘‘రుద్రః’’ పచోదయాత్।
ఆ పరమ పురుషుని తెలుసుకొనుటకై సహస్ర కన్నులు (వేలాది దృష్టి-ద్రష్టత్వములు) కలిగియున్న ఆ మహాదేవ భగవానుని ధ్యానించు చున్నాము. జ్ఞానప్రదాత అయిన ఆ రుద్ర భగవానుడు మా బుద్ధిని వికసింపజేయునుగాక!
24 తత్ పురుషాయ విద్మహే,
మహాదేవాయ ధీమహి।
తన్నో ‘‘రుద్రః’’ ప్రచోదయాత్।।
వికసింపజేయునుగాక!
సాక్షాత్ తత్ పురుషుడగు పరమ పురుషుని గురించి ఎరుగుటకై పరమేశ్వరుడగు మహాదేవుని ధ్యానించుచున్నాము. అట్టి ధ్యానయత్నంలో ఉండగా, ఆ రుద్ర భగవానుడు మా బుద్ధిని ప్రేరేపింపజేస్తూ వికసింపజేయునుగాక!
25. తత్ పురుషాయ విద్మహే,
వక్రతుండాయ ధీమహి।
తన్నో ‘‘దన్తిః’’ ప్రచోదయాత్।।
ఆ తత్ పరమపురుషుని (పరమాత్మను) తెలుసుకోవటానికై ఏనుగు ముఖధారుడగు గణపతిని ధ్యానించుచున్నాము. ఏకదంతుడగు ఆ మహాగణపతి మా బుద్ధిని ప్రేరేపించునుగాక!
26 తత్ పురుషాయ విద్మహే, చక్రతుండాయ ధీమహి।
తన్నో ‘‘నందిః’’ ప్రచోదయాత్।।
ఆ పరమ - తత్ పురుషుని ఎరుగుటకై పరమేశ్వరుని వాహనమైనట్టి - గుండ్రనితోక గల (చక్ర సమానుడగు) - చక్రతుండుని (నందీశ్వరుని) ధ్యానిస్తున్నాము. ఆ నందీశ్వరుడు మా బుద్ధిని ప్రేరేపించునుగాక!
27. తత్ పురుషాయ విద్మహే,
మహాసేనాయ ధీమహి।
తన్నః షన్ముఖః ప్రచోదయాత్।।
విశ్వ విరాట్ స్వరూపుడగు ఆ తత్ పరమ దివ్య పురుషుని స్వానుభవం చేసుకోవటానికై దేవతల సైన్యాధ్యక్షుడగు మహాసేనుని స్తుతిస్తున్నాము. అట్టి ‘6’ ముఖములు గల షణ్ముఖుడు / స్కందుడు మా బుద్ధిని ప్రత్యుత్సాహ పరచునుగాక! (కార్తికేయా! కరుణాసాగరా!)
28. తత్పురుషాయ విద్మహే
సువర్ణ పక్షాయ దీమహి
తన్నో ‘‘గరుడః’’ ప్రచోదయాత్।।
తత్ పరమపురుడగు ‘పరబ్రహ్మము’ను ఎరుగటకై బంగారు రంగు ఛాయలో ప్రకాశించు రెక్కలు గల విష్ణు వాహనమగు గరుడ భగవానుని బుద్ధితో తలచుచున్నాము. అట్టి తలపులచే ఆ గరుడ దేవుడు మా బుద్ధిని ప్రవృద్ధింప జేయునుగాక! (విరాగము ప్రసాదించి పరమాత్మ సన్నిధికి జేర్చును గాక).
29 వేదాత్మనాయ విద్మహే,
హిరణ్య గర్భాయ ధీమహి।
తన్నో ‘‘బ్రహ్మా’’ ప్రచోదయాత్।
వేదాత్మ - వేదహృదయములను తెలుసుకోవటానికై, (బంగారు ఆభరణములన్నిటికీ బంగారము వంటివాడగు) హిరణ్యగర్భ సృష్టికర్త భగవానుని స్తోత్రం చేస్తున్నాను. మా స్తుతులను స్వీకరించి ఆ బ్రహ్మ భగవానుడు మా బుద్ధిని వికసింపజేయునుగాక!
30. నారాయణాయ విద్మహే,
వాసుదేవాయ ధీమహి।
తన్నో ‘‘విష్ణుః’’ ప్రచోదయాత్।।
(తరంగములన్నిటికీ జలమే ఆధారమైన తీరుగా) - సర్వజీవుల ఆధారుడగు శ్రీమన్నారాయణుని తెలుసుకోవటానికై సర్వదేహములలో నివశించే వాసుదేవుని మహిమను పొగడుచున్నాము. అట్టి విష్ణు భగవానుడు మా బుద్ధిని ప్రేరేపించునుగాక! (నార = జలము)
31. వజ్రనఖాయ విద్మహే
తీక్షణా, దగ్ంష్ట్రాయ ధీమహి।
తన్నో ‘‘నారసిగ్ంహః’’ ప్రచోదయాత్।।
వజ్రము వంటి గోళ్ళు కలిగిన శ్రీమన్ నరసింహస్వామి తత్త్వమును ఎరుగుటకై తీక్షణమైన దంతములు గల నరశింహస్వామిని ఉపాసిస్తున్నాము. అట్టి నారసింహస్వామి మా బుద్ధిని ప్రేరేపించునుగాక!
32. భాస్కరాయ విద్మహే,
మహత్ ద్యుతికరాయ ధీమహి।
తన్నో ‘‘ఆదిత్యః’’ ప్రచోదయాత్।।
‘అజ్ఞానము’ అనే అంధకారము తొలగించే (జ్ఞాన) భాస్కరతత్త్వము ఎరుగుటకై మహత్ ద్యుతికరుడగు (మహత్ కాంతి స్వరూపుడగు) సూర్యనారాయణుని ఆశ్రయించుచున్నాము. అట్టి ఆదిత్య పరమ పురుషుడు మా బుద్ధిని సాహసపరచునుగాక!
33. వైశ్వానరాయ విద్మహే,
లాలీలాయ ధీమహి।
తన్నో ‘‘అగ్నిః’’ ప్రచోదయాత్।।
ఈ విశ్వమంతా తన యొక్క ప్రత్యక్ష స్వరూపమైయున్న వైశ్వానరతత్త్వము తెలుసుకోవటానికై పరంజ్యోతి స్వరూపుడగు లాలీయ భగవానుని బుద్ధితో ఆశ్రయిస్తున్నాము. అట్టి అగ్ని భగవానుడు మా ఆత్మబుద్ధిని ప్రచోదనము చేయునుగాక!
34. కాత్యాయనాయ విద్మహే,
కన్యకుమారి ధీమహి।
తన్నో ‘‘దుర్గిః’’ ప్రచోదయాత్।।
సర్వ శక్తి స్వరూపిణి యగు కాత్యాయనీ దేవీతత్త్వమును తెలుసుకోవటానికై ఆ కన్యకుమారీజగన్మాతకు ప్రపత్తి సమర్పిస్తున్నాము. అట్టి దుర్గాదేవి మా బుద్ధిని ప్రత్యుత్సాహపరచునుగాక! సృజనాత్మకముగా తీర్చిదిద్దునుగాక!


స్నానాంగభూత మంత్రములు

దూర్వాసూక్తమ్
35. సహస్ర పరమాదేవీ,
శతమూలా శతాంకురా,
సర్వగ్ం హరతు మే పాపం
దూర్వా దుస్స్వప్న నాశినీ।।
స్నానం చేస్తూ శిరస్సుపై మృత్తికతో బాటు గరికను ధరిస్తూ చదివే దూర్వాసూక్తము
వేయి శిరస్సులతో వెలుగొందు ఇహ-పర స్వరూపిణివగు పరాత్‌పర స్వరూపిణీ! వందలాది మూలములను అంకురములను ధరించు తల్లీ!
దూర్వాదేవీ! సంసార దుస్వప్నమును నశింపజేయుతల్లీ! లెక్కకుమించిన చిగుళ్లు కలిగి, కణుపులు కలిగియున్న నాయొక్క-దుష్టతలంపులు తొలగించు పరమాత్మ స్వరూపిణివగు ఓ దూర్వారయగ్మమా! నాలోని దోషములను తొలగించవమ్మా! (దూర్వారమ్ - జగత్ కల్పనతో మిశ్రమము పొందని కేవలీ ఆత్మత్వము).
36. కాండాత్ కాండాత్ ప్రరోహన్తీ
పరుషః పరుషః పరి,
ఏవావో దూర్వే ప్రతను
సహస్రేణ శతేన చ।।
ప్రతి కణుపు నుండి క్రొత్త వ్రేళ్లు, క్రొత్త చిగుళ్లు తొడగుచూ శాఖ - ఉప శాఖలుగా విస్తరించు ఓ దూర్వారయుగ్మమా! గరిక దేవతా! నీవు విస్తరించు విధంగానే నా వంశము కూడా శత-సహస్రాధికంగా పుత్ర-పౌత్రాభివృద్ధిగా విస్తరించునట్లు అనుగ్రహించు. మాయొక్క యోగాభ్యాసము, జ్ఞానాధ్యయనము కాండ-కాండములుగా వృద్ధి చెందును గాక!
37. యా శతేన ప్రతనోషి, సహస్రేణ విరోహసి,
తస్యాస్తే దేవి ఇష్టకే, విధేమ హవిషా వయమ్।।
వందల వేల శాఖలుగా విస్తరించు ఓ దూర్వారయుగ్మమా! భక్తులచే ఇష్టముగా ఆరాధించబడు దేవీ! మేము సమర్పించు హవిస్సులను జగన్మాతగా స్వీకరించవమ్మా! మమ్ములను కృతార్థులముగా, చరితార్థులముగా తీర్చిదిద్దుము.
మృత్తికా సూక్తమ్
38. అశ్వక్రాన్తే రథ క్రాన్తే విష్ణు క్రాన్తే
వసుంధరా।
శిరసా ధారయిష్యామి,
రక్షస్వ మాం పదే పదే।।
సాన్నము చేయబోతూ చదివే మృత్తికా సూక్తం (మట్టిని స్తుతించటం)
అనేక అశ్వములతోను, అసంఖ్యాక రథములతోను, విష్ణుదేవునియొక్క సర్వత్రా ఉనికితోను-నిండియున్న ఓ వసుంధరా! భూదేవీ! సర్వప్రదాతవగు నిన్ను శిరస్సుపై నేను ధారణ చేస్తున్నానమ్మా! నన్ను పదేపదే రక్షించమని వేడుకొనుచున్నాను. స్నానము చేయటానికి తటాకంలో దిగుచున్ననన్ను సర్వదా కాపాడుతూ ఉండు.
39. భూమిః! ధేనుః! ధరణీ! లోకధారిణీ।
ఉద్ధృతాసి వరాహేణ, కృష్ణేన శత బాహునా।
మృత్తికే। హన మే పాపం
యత్ మయా దుష్కృతమ్ కృతమ్।।
ఓ భూదేవీ! ఓ కామధేను దేవీ! ధరణీదేవీ! లోకములన్నీ ధరించు లోకధారణీ! ప్రళయకాలములో జలములో మునుగకుండా పైకి ధరించిన వరాహస్వామిని పతిగా కలదానా! కృష్ణ (నలుపు) ఛాయ శతబాహువులు కలదానా! ఓ మృత్తికాదేవీ! మాయకు బద్ధులమై మేము చేసియున్న పాపకృత్యముల నుండి మమ్ము వరాహస్వామివలె ఉద్ధరించవమ్మా!
40. మృత్తికే। బ్రహ్మదత్తాసి, కాశ్యపేన అభి మన్త్రితా।
మృత్తికే! దేహి మే పుష్టిం, త్వయి సర్వం ప్రతిష్ఠితమ్।।
ఓ మృత్తికాదేవీ! నీవు కశ్యపుడు మొదలైన సప్త ఋషులచే అభిమంత్రించబడి పవిత్రత ప్రసాదించుదానవు. ఓ మృత్తికా! సర్వత్రా దేహమంతా ప్రతిష్ఠితవై నాకు శరీర పుష్టిని ప్రసాదించు.
41. మృత్తికే ప్రతిష్ఠితం(తే) సర్వం,
తన్మే (తత్ మే) నిర్ణుద, మృత్తికే!
ఓ మృత్తికాదేవీ!
ఈ నామరూపాత్మకమైన దాని కంతటికీ నీవే మూలతత్త్వమువు. మూలశక్తివి. మూల పదార్థమువు. మృత్తిక యందే సర్వము ప్రతిష్ఠితమైయున్నది. అట్టి మృత్తిక నన్ను దోషములు తొలగించి నిర్మలము చేయునుగాక!
42. తయా హేతేన పాపేన
గచ్ఛామి పరమాం గతిమ్।
నీ వలననే నేను సర్వ పాపముల నుండి విముక్తుడనై ‘పరము’ అను మార్గమును ఆశ్రయించగలను. కనుక నన్ను దయచూడుము.
శత్రు జయ మంత్రాః
43. యత, ఇన్ద్ర! భయామహే
తతో నో అభయం కృధి।
మఘవన్ చ్ఛ(శ)గ్ధి తవ
తన్న ఊతయే విద్విషో విమృధో జహి।।
శత్రు-జయమంత్రము (శత్రుంజయము)
ఓ ఇన్ద్ర భగవాన్! మేము దేనిదేని గురించి తెలిసి కొంత, తెలియక కొంత భయముపడుచూ ఉన్నామో, అవన్నీ దాటించి - మా పట్ల ‘అభయము’ నిశ్చలమగునట్లు చేసివేయండి. మా పాపములను పాపదృష్టులను తొలగించి మమ్ములను పరిశుద్ధులుగా చేయండి. మా యొక్క అంతరంగ శత్రువులగు కామ క్రోధ లోభ మలములను, బహిఃశత్రువులగు మోహ-మద- మాత్సర్యములను నిరోధించి మమ్ములను కాపాడండి.
44. స్వస్తిదా విశస్పతిః వృత్రహా
విమృథో వశీ।
వృషేంద్రః పుర ఏతు నః
స్వస్తిదా అభయంకరః।।
వృత్రాసురిని సంహరించిన ఇంద్రభగవానుడు - స్నానమునకు సంసిద్ధులగుచున్న - మమ్ములను అన్ని ప్రమాదముల నుండి రక్షించెదరుగాక. భక్తులను పాలించి శుభములు చేకూర్చువాడు, బహిర్-అంతర్ శత్రువుల నుండి మమ్ము రక్షించువాడు, కేవలసాక్షి, పరలోక సుఖ ప్రదాత-అగు ఇంద్రుడు మాపట్ల అభయప్రదాత అగునుగాక!
45. స్వస్తి న ఇన్ద్రో, వృద్ధ శ్రవాః
స్వస్తి నః పుషా, విశ్వవేదాః
స్వస్తినః ‘స్తార్యో’! అరిష్ట నేమిః
స్వస్తి నో బృహస్పతిః దధాతు।।
శ్రవణములో ఉత్తమోత్తములగు (వృద్ధశ్రవులగు)వారు, విశ్వముల యొక్క తత్త్వమును ఎరిగినవారు, పూషయగు ఇంద్రుడు మాకు శుభప్రదాత అగునుగాక!
రాక్షసులను తన రెక్కలతో నశింపజేయగల గరుత్మంతుడు మమ్ములను సర్వ అరిష్టముల నుండి రక్షించి, మేలు చేకూర్చెదరుగాక! దేవ గురువు బృహస్పతి మాకు క్షేమకరుడగునుగాక!
46. అపాన్త మన్యు స్తృపల ప్రభః
మాధునిః శిమీ వాంఛరుమాగ్ం ఋజీషి,
సోమో! విశ్వాని ఆవృత సావనాని (విశ్వాని ఋతసావనాని)
నార్వాగిన్ద్రం (న అర్వాన్ ఇన్ద్రం) ప్రతి మానాని దేభుః।।
తల్లితండ్రుల వలె ఆప్యాయతతో కూడిన చిరుకోపము ప్రదర్శించువాడు, చల్లటి కిరణములతో బహుదీప్తిమంతుడు, వసంతునకు (మన్మథునకు) అత్యంత ఇష్టమైనవాడు, జమ్మిచెట్టుకు ప్రియమైనవాడు, సర్వసుఖప్రదాత అగు చంద్రుడు సర్వ ఓషధులను ప్రసాదిస్తూ వాటిని భూమిపై పరిపోషిస్తున్నారు. అట్టి చంద్రుడు, ఇంద్రియముల యజమాని అగు ఇంద్రుడు మావాక్కును పవిత్ర పరచి మమ్ములను సర్వదా రక్షించునుగాక.
47. బ్రహ్మజ జ్ఞానం ప్రథమం పురస్తాత్
విసీ మతః సురుచో వేన ఆవహ।
సబుధ్నియా ఉపమా అస్య విష్ఠాః
సతశ్చ యోని మనతశ్చ వివః।।
మొట్టమొదట ఈ సృష్టికి మునుముందే బ్రహ్మము యొక్క కేవల జ్ఞాన తేజస్సు మాత్రమే వెల్లివిరిసియున్నది. అద్దాని ఇచ్ఛ, రుచి చేతనే సృష్టి అంతా ఏర్పడినదగుచున్నది. అట్టి సనాతనమగు కేవలాత్మ - ఉత్తమ బుద్ధి చేతను, శాస్త్రముల ఉపమానముల చేతను, వివృత్తమైన మనస్సు చేతను ఈ కనబడే దృశ్య వ్యవహారముగా (బుద్ధికి) ప్రదర్శనమగుచున్నట్లుగా తెలియబడగలదు.
మృత్తికాశుద్ధికై పృధివీ ప్రార్థన
48. స్యోనా పృధివీ! భవాన్
రుక్షరా నివేశినీ
యచ్ఛ ఆనః శర్మ సప్రథాః।।
మృత్తికా శుద్ధి కొరకై భూదేవతా ప్రార్థన
అత్యంత విశాలమైన ఓ పృథివీ దేవతా! భూమాతా! నీవు మా దుఃఖములను (రుక్షములను) తొలగించి ఐహిక-ఆముష్మిక సుఖములను ప్రసాదించు మాతవు. నమస్కారము.
49. గన్ధద్వారాం దురాధర్షాం
నిత్య పుష్టాం కరీషిణీమ్!
ఈశ్వరీగ్ం సర్వభూతానామ్।
తామ్ ఇహ ఉపహ్వయే శ్రియమ్।।
సుగంధము ద్వారముగా కలిగినది, రాక్షసులకు దుస్సవహమైనది, సర్వజీవులకు నిత్యమగు పుష్టి ప్రదాత, సర్వ భూతజాలమునకు ఈశ్వరి అగు భూ- దేవతను మాకు శ్రేయములను ప్రసాదించు నిమిత్తమై తల్లిగా ఇక్కడకు ఆహ్వానించుచున్నాము.
50. శ్రీః మే భజతు। అలక్ష్మీః మే నశ్యతు।
విష్ణుముఖావై దేవాః ఛన్దోభిః ఇమాన్ లోకాన్
అనపజయ్యమ్ అభ్యజయన్।
మహాగ్ం ఇన్ద్రో వజ్ర బాహుః
షోడశీ శర్మ యచ్ఛతు।।
శుభ ఐశ్వర్య రూపిణియగు శ్రీలక్ష్మికి సుస్వాగతము. ఆ తల్లి దయచే మా యొక్క అలక్ష్మి (పీడ మొదలైనవి) తొలగిపోవునుగాక! విష్ణు ముఖముచే ప్రకాశించు దేవతలు → దుష్ట-క్రూరరూపులగు రాక్షసులను జయించి, అదుపులో ఉంచుదురు గాక! మహామహితాత్ముడు, వజ్రము వంటి బాహువులు కలవాడు, షోడశ(16) కళలతో ప్రభాభాసుడు, త్రిలోక పూజ్యుడు అగు ఇంద్రభగవానుడు మాకు సర్వసుఖములు ప్రసాదించెదరుగాక
51. స్వస్తి నో మఘవా కరోతు।
హన్తు పాప్మానం। యో అస్మాన్
ద్వేష్టి, సోమానగ్ం స్వరణం
కృణుహి బ్రహ్మణస్పతే।
కక్షీవన్తం య ఔశిజమ్, శరీరం యజ్ఞ శమలం
కుసీదం, తస్మిం తు సీదతు, యో అస్మాన్ ద్వేష్టి।।
ఇంద్రుడు మా పట్ల శుభప్రదుడగునుగాక! పాపములను సంహరించివేయును గాక! నన్ను ద్వేషించువారిని సరిచేసి, బ్రహ్మ స్పదులగు (బ్రహ్మము నందు పాండితీమణులగు) వారికి సామీప్యతను ప్రసాదించెదరుగాక! ఓశిజుడగు కక్షీవంతమహర్షి - నా ఈ శరీరమును సహించుదానిగా చేసెదరుగాక! నన్ను ద్వేషించువారు నన్ను బాధించకుండెదరుగాక! నన్ను ద్వేషించువారు కూడా, ఆ ద్వేషము తొలగి సుఖించెదరు గాక!
జలస్వీకార మంత్రము
52. చరణం పవిత్రం వితతం పురాణం
యేన పూతః తరతి దుష్కృతాని,
తేన పవిత్రేణ శుద్ధేన
పూతా అతి పాప్మానమరాతిః తరేమ।।
స్నానము చేయుటకై నీటిని స్వీకరించు సందర్భములో పఠించు మంత్రము
పరమ పవిత్రమైనది, సర్వత్రా విస్తరించి జన్మ-కర్మలకు మునుముందే (పురాణమై) ఉన్నట్టిది అగు ఏ పరమాత్మను స్మరించుటచే సర్వ దుష్కృతషులములు నశించి మేము పవిత్రులమౌతామో, అట్టి విష్ణు భాగవానుని పాద పద్మములను పవిత్రాంతఃకరణులమై ఆశ్రయిస్తున్నాము. ఆ చేతులు, పాదపద్మములే (కరచరణములు) మాకు శత్రువు వంటి మా పాపకర్మల నుండి తరింపజేయగలవు. (ఇది నీటిని త్రాగుచున్నప్పుడల్లా చదువుటచే శుభమును ప్రసాదించు మంత్రము).
53. స జోషా ఇన్ద్ర సగణో
మరుద్భిః। సోమం పిబ।
వృత్రహన్! శూర! విద్వాన్!
జహి శత్రూగ్ం అపమృధో
అనుదస్వాథ అభయం
కృణు హి విశ్వతో నః।।
వృత్రాసుర సంహారీ! ఇన్ద్ర దేవా! సర్వత్రా సమప్రీతి, సమప్రేమ కలిగియున్న మీరు- మీ పరివార సమేతంగా వాయుదేవునితో కూడి మా వద్దకు వేంచేయండి. మాతోబాటు ఉండండి. యజ్ఞ ప్రారంభంలో నిర్వర్తించే ‘సోమము’ను స్వీకరించండి! హే శూరా! నిత్యా నిత్యవివేకియగు విద్వాంశా! మమ్ములను సమీపించే అరిషట్‌వర్గము (కామక్రోధ లోభ ఇత్యాదులను) సంహరించండి. అనృతమును, పాపకోపములను తొలగించండి. మాకు అభయము ప్రసాదించండి. విశ్వశ్రేయస్సును అనుగ్రహించండి.
54. సుమిత్రా న ఆప, ఓషధయః
సన్తు। దుర్మిత్రాః తస్మైః
భూయ అసుర్యో అస్మాన్ ద్వేష్టి
యం చ వయం ద్విష్మః।।
ఓషధుల వలన అసురీగుణములు తొలగి దైవీ సంపద ప్రవృద్ధమగును గాక! జలము, ఓషధులు మాకు మిత్రులుగా, శ్రేయోభిలాషులుగా అగునుగాక! మమ్ము ద్వేషించువారివలన, దుష్టబుద్ధి గలవారివలన బాధ లేకుండును గాక! మా యజ్ఞ విధులను నిర్విఘ్నముగా తీర్చిదిద్దండి. (సుమిత్రులగు శ్రద్ధ, ఉత్సాహము, సాహసము, ధైర్యము, సామర్ధ్యము మొదలైనవి మమ్ములను వెంటనంటి ఉండును గాక! దుర్మిత్రులగు అశ్రద్ధ, దైన్యము, నిరుత్సాహము, పిరికితనము, భయము, అసమర్థత తొలగిపోవును గాక!)
55. అపో హిష్ఠా మయో భువః
తాన ఊర్జే దధాతన।
మహేరణాయ చక్షసే।।
ఓ ఉదక(జల)దేవతా! మాకు మీరు అన్నము మరియు సుఖములను, జ్ఞానచక్షువులను ప్రసాదించండి. ఓ ఉదకమా! మాకు ఇంద్రియములను ఉపయోగించటానికి కావలసిన తెలివి ఇవ్వండి. విచక్షణా జ్ఞాన-దర్శనములను మోక్షపర్యంతము దయతో అనుగ్రహించండి.
56. యోవశ్శివ తమోరసః
తస్య భాజయతేహ నః,
ఉశితీః ఇవ మాతరః।।
ఓ జలరూప పరమాత్మా! మీ యొక్క రసతత్త్వము అత్యంత శుభకరము. (శివతమము) అయి ఉన్నది. అట్టి మాతృప్రేమ మాధుర్యమును మాకు సర్వదా - ‘భాజయత’ కలుగజేస్తూ ఉండండి.
57. తస్మా అరంగమామవో
యస్య క్షయాయ జిన్వథ।
ఆపో జనయథా చ నః।।
(యస్యక్ష యాయ) - ఏ మోద స్వరూపమును (జిన్వథ)- కోరుకొను చున్నామో (తమ్ రసమ్) ఆమీ రసస్వరూపమును, బ్రాహ్మీతత్త్వమును (రసోవై బ్రహ్మః) - ఆలస్యము చేయకుండా శ్రమ లేకుండా -(గమామ)- కలుగజేయండి. - జనయధ- మీదివ్య రూపము పొందునట్లు అనుగ్రహించండి.
అఘమర్షణ సూక్తమ్
58. హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే
తీర్థం మే దేహి యాచితః।
యన్మయా (యత్ మయా) భుక్తమ్ అసాధూనామ్
పాపేభ్యశ్చ ప్రతిగ్రహః।।
స్నాన ప్రదేశములో చదువవలసిన అఘమర్షణ మంత్రము
బంగారు కిరీటధారి యగు శ్రీవరుణభగవానుని (సాంగ సపరివార, సపత్నీ, సాయుధ స-అఘమర్షణ ఉపాసక జనసమేతంగా) ఆహ్వానించి, భక్తితో స్తుతిస్తూ ప్రపత్తుడనగుచున్నాను. నాచే యాచించబడుచున్న మీరు మహర్షులు స్నానం చేసిన పుణ్యోదకము - అనే పవిత్ర జలమును ప్రసాదించండి. నాచేత-ఏఏ అసాధుత్వము అయినట్టి (ఇతరులకు సమర్పించక, ఇతరులకు కష్టము కలిగిస్తూ, అన్యాయార్జితమైనట్టి) ఆహారము స్వీకరించబడియున్నదో-అట్టి పాపమంతా మీ స్మరణచే ప్రతిగ్రహమగు గాక. విడిచి వెళ్లునుగాక! (Left off)
59. యన్మే (యత్ మే) మనసా వాచా,
కర్మణా వా దుష్కృతం కృతమ్, తత్ న ఇన్ద్రో వరుణో
బృహస్పతిః సవితా చ పునస్తు పునః పునః।।
నాచేత మనసా వాచా కర్మణా ఏఏ దుష్కర్మలు నిర్వర్తించబడినాయో, అవన్నీ కూడా ఇంద్ర వరుణ బృహస్పతి సవిత్రు (సూర్య) దేవతలు మరల మరల శోధించి తొలగించ ప్రార్థిస్తున్నాను. నన్ను నిర్మలునిగా తీర్చిదిద్దండి.
60. నమో అగ్నయే, అప్సుమతే।
నమ ఇన్ద్రాయ। నమో వరుణాయ।
నమో వారుణ్యైః। నమో అద్భ్యః।।
జలముతో కూడుకొని, జలమునందు వేంచేసి (అట్లాగే) సర్వత్రా వేంచేసియున్న అగ్నిదేవా! మీకు నమస్కారము. త్రిలోకాధిపతియగు ఇంద్రభగవాన్! నమోనమః! ఓవరుణదేవా! ఓ వరుణదేవ పత్నియగు వారుణీ! ఓ జలమా! మీ అందరికి నమో నమో నమో నమః।
స్నాన ప్రదేశ శుద్ధి మంత్రము
61. యత్ అపాం క్రూరం, యత్ అమేధ్యం,
యత్ అశాన్తం, తత్ అపగచ్ఛతాత్।।
స్నాన ప్రదేశ శుద్ధి మంత్రము
మేము స్నాన-ఉపాసనల కొరకు జలములో ప్రవేశిస్తున్నాము. జలములోని (సుడిగుండము, ఊబి, తీవ్రప్రవాహములు మొదలైన) ప్రమాదకర- మరణాంతక విశేషములు, జలములోని నిష్ఠీవనము (ఉమ్మి) మొదలైన ఆరోగ్యమునకు చెడు చేయు అమేధ్యము, జలములోని అశాంతిని కలిగించు విభాగము - ఇవన్నీ మమ్ములను స్పృశించక, తొలగి పోవునుగాక!
62. అత్యాశనాత్ అతీ పానాత్
యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్,
తన్నో వరుణో రాజా
ప్రాణినా హి అవమర్శతు।।
(1) మా యొక్క అతి -అశన (దేవతలకు, పితృదేవతలకు, అతిధులకు సమర్పించకుండా మేము తిన్న) ఆహార దోషము,
(2) అతి పానదోషము (దేవతలకు, పిత్రుదేవతలకు, అతిధులకు తర్పణము చేయకుండా, సమర్పించకుండా త్రాగిన పానీయము)
(3) చెడు కర్మలు (క్రూరకర్మలు, మోసము మొదలైనవి) చేయువారి వద్ద స్వీకరించిన ధనము, ఆహారము ఇత్యాది దోషములు.., ఈ మూడు దోషములను జలస్వామియగు వరుణ భగవానుడు శుభ్రపరచి పోగొట్టునుగాక! మా ప్రాణములు నిర్మలమై జలస్పర్శచే ప్రకాశించునుగాక.
63. సోఽహమ్ అపాపో, విరజో
నిర్ముక్తో ముక్త కిల్బిషః
నాకస్య పృష్ఠమ్ ఆరుహ్య
గచ్ఛేత్ బ్రహ్మ సలోకతామ్।।
వరుణదేవుని అనుగ్రహం చేత నేను పాపరహితుడను, నిర్మలుడను, దుష్ట భావ - ఆవేశకావేశముల నుండి వినిర్ముక్తుడను, పాపకర్మల నుండి విరమించువాడను అయ్యెదనుగాక! స్వర్గమునకు ఆవల గల బ్రహ్మలోకము నందు వరుణ భగవానుని కృపచే ప్రవేశము పొంది బ్రహ్మదేవుని దర్శనము పొందెదము గాక! బ్రహ్మదేవుని బోధకు అర్హుడనయ్యెదముగాక! బ్రహ్మసాలోక్యము సిద్ధించుకొనెదము గాక!
64. యశ్చ అప్సు వరుణః
స పునాతు - అఘమర్షణః।।
ఇతి ‘ఓం’।।
సర్వమును తన స్పర్శచే నిర్మలముగా చేసి, సర్వపాపములను పోగొట్టి పరిశుభ్రత ప్రసాదించు అఘమర్షా! వరుణ దేవాది దేవా! నన్ను మనసా వాచా కర్మణా పునీతునిగా, పవిత్రునిగా తీర్చిదిద్దమని ప్రార్ధిస్తున్నాను. ఇతి అఘమర్షణః।।
గంగ ఆది ఆవాహనమంత్రము
65. ఇమం మే గంగే యమునే
సరస్వతి శుతుద్రిస్తోమగ్ం (శుతుద్రిః సోమగ్ం)
సచతా పరుష్ణియా, అసిక్నియా మరుద్వృధే (మరుత్‌వృధే)
వితస్త యార్జీకీయే శృణు, హి అనుషోమయా।
గంగాది ఆవాహన మంత్రము
ఓ పవిత్ర గంగాదేవీ! ఓ యమునాదేవీ! ఓ సరస్వతీ దేవీ! పవిత్ర ప్రవాహ ప్రదర్శనములారా! ఓ త్రిపవిత్ర నదీమ తల్లులారా! మా ఈ అఘమర్షణ స్తుతి వినండి! విని, నాఎదురుగా గల ఈ జలముగా నాపై దయతో ప్రవేశించండి. తద్వారా నన్ను స్పృశిస్తూ పావనము చేయండి. ఓ మరద్వృధ నదీదేవీ! ఓ ఆర్జికీయ నదీ జననీ! ఈ జలములో మీ జలతేజస్సును ప్రవేశింపజేసి నన్ను పవిత్రునిగా తీర్చిదిద్దండి.
నీటిలో మునిగి ప్రాణాయామం చేస్తూ మనస్సుతో చదువు మంత్రము
66. ఋతం చ సత్యం చ
అభీద్ధాత్, తపసో
అధ్యజాయత,
తతో రాత్రిః అజాయత
తతః సముద్రో ఆర్ణవః।।
నీటిలో మునిగి ప్రాణాయామం చేస్తూ మనస్సుతో చదువు మంత్రము
ఋతము→మనస్సుతో ‘యదార్థము’గా భావించటం / స్వానుభవమైన ప్రవచనము.
సత్యమ్→వాక్కుతో యదార్థ భావన
మానసికమైన (స్వానుభవమైనట్టి) యదార్థ సంకల్ప స్వరూపుడు, వాక్కుచే ఉనికిగా చెప్పబడు స్వీయానుభవ స్వరూపుడు, శాస్త్రములచే ఎలుగెత్తి గానం చేయబడుచూ చూపుడువ్రేలుతో చూపబడువాడు, మహనీయుల తపో అధ్యయనముల ఫలస్వరూపుడు-అగు ఆ పరమాత్మ నుండియే పగలు, రాత్రి, సముద్రములు, మహాసముద్రములు జనిస్తున్నాయి. అట్టి ఆత్మభగవానుని స్తుతిస్తున్నాను.
67. సముద్రాత్ అర్ణవా దధి, సంవత్సరో అజాయత
అహోరాత్రాణి విదధత్, విశ్వస్య మిషతో వశీ।।
జలస్వరూపులై సముద్రములను, మహాసముద్రములను సృష్టించి, కాలస్వరూపుడై, రాత్రింబవళ్లను కల్పిస్తూ , ఈ విశ్వమంతా తన మిషగా (కల్పనా రూపముగా) కలవాడై, దీనికంతటికీ తన వశముగా గల పరంధామా! నమో నమః।
68. సూర్యా చన్ద్రమసౌ ధాతా
యథా పూర్వమ్ అకల్పయత్
దివం చ పృథివీం చ
అంతరిక్షం అదో సువః।।
పరాత్పరుడగు ఆ పరమాత్మయే సూర్యచంద్రులను, సృష్టికర్తయగు బ్రహ్మదేవుని, ఆకాశమును, పృథివిని (భూమిని), అంతరిక్షమును, సువర్- మహర్ ఇత్యాది ఊర్థ్వ లోకములను ఎప్పటికప్పుడు పూర్వంలాగానే - లీలగా క్రీడగా కల్పన చేస్తూ ఉన్న కళా వినోది. అవన్నీ తనే అయి ఉజ్జీవింప జేయుచున్నవారు.
స్నానము పూర్తి చేసిన తరువాత చదివే ఋక్కులు
69. యత్ పృథివ్యాగ్ం రజః స్వమా అన్తరిక్షే విరోదసీ
ఇమాగ్ం తదా ఆపో వరుణః పునాతు అఘమర్షణః।।
స్నానము పూర్తి చేసిన తరువాత చదివే ఋక్కులు
అనేక జన్మలుగా పృథివిపై, అంతరిక్షములో, రోదసిలో నేను ఏఏ దోషములగు మనో-వాక్-కాయ-కర్మలను నిర్వర్తించి ఉన్నానో, అవన్నీ కూడా జలస్వరూపు డగు వరుణ భగవానుడు తన జలతత్వముచే కడిగి వేయునుగాక! నన్ను దోషరహితునిగా, నిర్మలునిగా అఘమర్షణుడగు వరుణ భగవానుడు శుభ్రపరచును గాక! ఆత్మజ్ఞానమునకు సంసిద్ధునిగా తీర్చిదిద్దును గాక!
70. పునన్తు వసవః। పునాతు వరుణః।
పునాతు అఘమర్షణః।
ఏష భూతస్య మధ్యే,
భువనస్య గోప్తా।।
ఓ భూదేవీ! నీ యొక్క మృత్తికారూప మాతృవాత్సల్య స్పర్శచే - మమ్ములను పునీతులు - పవిత్రులుగా తీర్చిదిద్దవమ్మా! స్వామీ! జలదేవా! రసదేవా! వరుణ భగవాన్! సర్వ జీవులలో అంతర్యామీ! భూ-భువర్ -సువర్ లోకములలో అంతరమున ఆధారమై చెన్నొందు స్వామీ! అఘమర్షణ దేవాది దేవా! మీ జల-రస స్వరూపంతో మమ్ములను నిర్మలురుగా తీర్చిదిద్దండి. మిమ్ములను శరణు వేడుచున్నాము.
71. ఏష పుణ్యకృతాన్ లోకాన్।
ఏష మృత్యోః హిరణ్మయమ్।
ద్యావా పృథివ్యో హిరణ్మయగ్ం
సంశ్రితగ్ం సువః సనః సువః సగ్ం శిశాధి।।
ఓ అఘమర్షణదేవా! వరుణ భగవాన్! మీరు మాకు పుణ్యలోకములు ప్రసాదించు దేవత. మా మృత్యువును అమృతానందంగా మార్చివేయు గురుదేవులు. మార్గదర్శులు. ఆకాశము, పృథివి, భువర్-సువర్-మహర్ లోకములను పావనము చేయువారు. మమ్ము ఈ భౌతిక లోకముల నుండి బ్రహ్మలోకము జేర్చి సముద్ధరించప్రార్థన.
72. ఆర్ద్రం జ్వలతి జ్యోతిః అహమస్మి।
జ్యోతిః జ్వలతి బ్రహ్మాహమస్మి।
యో అహమస్మి బ్రహ్మాహమస్మి।
అహమస్మి బ్రహ్మాహమస్మి।
అహమేవ అహం మాం
జుహోమి స్వాహా।
వరుణదేవుడు సద్గురువై మాకు ‘‘సోఽహమ్-తత్‌త్వమ్’ మహావాక్య రససారమును ప్రసాదిస్తూ ఉండగా ‘‘అగ్నిలో ప్రదర్శన శీలమగు ఆర్ద్రత, కేవల- జ్యోతి స్వరూపము వంటి ఆత్మజ్యోతినే నేను! ‘నేను’గా ప్రదర్శనమగుచున్నది నాలోని నేనైన నేనే! జ్యోతికే జ్యోతిగా వెలుగొందు పరంజ్యోతిని! పరబ్రహ్మమే నేను! నేనే బ్రహ్మమును! బ్రహ్మమే నేనై ఉన్నాను. జీవాత్మనైన ‘నేను’-సర్వాత్మకుడగు నాయొక్క పరమాత్మ త్వమునకు సర్వకార్యక్రమములను అగ్నికి ఆజ్యము వలె ఆహూతిగా సమర్పిస్తున్నాను. జీవాత్మనకు నేను పరమాత్మకాని క్షణమే లేదు.
73. అకార్య కార్యః అకీరీణా
స్తేనో భ్రూణహా గురుతల్పగః
వరుణో అపామ్ అఘమర్షణః
తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే।।
చేయకూడని కార్యములు (అకార్యకార్యములు) చేసిఉండటము, బుద్ధి చాంచల్యము, దొంగతనము, భ్రూణ (గర్భములోని బిడ్డ) హత్య, గురుతల్పగమనము మొదలైన అనేక నీచ గతులక కారణమగు పాపకృతుల నుండి కూడా అఘమర్షణ మంత్రము-దోషములను తొలగించి నిర్మలము చేయగలదు. అఘమర్షణుడు (వరుణదేవుడు) మమ్ములను మార్గదర్శి అయి సముద్ధరించగలరు. స్వామీ! అఘమర్షా! మమ్ము తండ్రివలె క్షమిస్తూ మార్గదర్శకులవండి.
74. రజో భూమి స్వమాగ్ం
రోదయస్వ ప్రవదన్తి ధీరాః।
స్వామీ! వరుణ భగవాన్! ధీరలగు పండితులు మిమ్ములను శరణువేడు ఉపాయము చూపుచున్నారు. రజోభూమిలో అనేక జన్మలు ఎత్తి వేసారుచున్న మమ్ములను మీరు దగ్గరకు తీసి సంరక్షించగల సమర్థులు. ఓ అఘమర్షణా! మిమ్ములను శరణు వేడుచున్నాము. రజోగుణస్థితి నుండి గుణాతీత స్థానమునకు జేర్చండి.
స్నానము చేసి తుడుచుకొన్న తరువాత చదివే మంత్రము
75. ఆక్రాన్తః సముద్రః ప్రథమే
విధర్మన్ జనయన్ ప్రజా, భువనస్య రాజా,
వృషా పవిత్రే అధిసానో అవ్యే బృహత్ సోమో వా
వృధే సువాన ఇన్దుః।।
స్నాన-పరిశూహ్రానంతర జపము
ఆ ఉమాసహిత పరమశివుడు చంద్రుని శిరస్సులో ధరించినవారై, సముద్ర జలములో సర్వే సర్వత్రా స్వయముగా ఆక్రమించుకొని ఉన్నవారై, ప్రతి జీవునికి ప్రప్రధములై, సర్వభువనములకు రాజాధిరాజై, వృషభ(ధేను) వాహనులై, పరమ పవిత్రులై నా హృదయ కుహరములో సర్వదా వెలుగొందుచున్నారు. అట్టి బృహత్ స-ఉమ-ఉమామహేశ్వరస్వామికి నమస్కారములు. బృహత్ చంద్రధారులగు శివునికి నమస్కారము.
76. పరస్తాత్ యశో గుహాసు మమ
చక్రతుండాయ ధీమహి।
తీక్షణా దగ్ంష్ట్రాయ ధీమహి।
పరిప్రతిష్ఠితం దేభుః యచ్ఛతు
దధా తనోద్భ్యో అర్ణవః సువో రాజైకన్చ।।
నా హృదయములో - పరయశో స్వరూపులైనట్టి→ చక్రతుండ (నందీశ్వర) వాహనులగు శివ భగవానుని హృదయంలో పతిక్షేపించి స్తుతిస్తున్నాను.
- తీక్షణాదంష్ట్రములు(పలువరుసలు) గల శ్రీమన్నారశింహస్వామిని ప్రస్తుతిస్తున్నాను. స్వామీ! రాజువలె నా హృదయరాజ్యమును పరిపాలించండి.
ఓ వరుణ శివ విష్ణు-దేవాది దేవులారా! నందీశ్వర-గరుడవాహనా సమేతంగా మీరు ఇష్టముగా నా హృదయ గృహంలో ప్రవేశించి సుఖాసీనులై ఉండం&
77. రుద్రో రుద్రశ్చ దన్తిశ్చ
నందిః షన్ముఖ ఏవ చ,
గరుడో బ్రహ్మ విష్ణుశ్చ
నారసిగ్ంహః తథైవ చ -
ఆదిత్యో అగ్నిశ్చ దుర్గిశ్చ
క్రమేణ ద్వాదశ(12) అంభసి,
మమ వచన సువేనావ భావై
కాత్యాయనాయ।।
(1) సహస్రాక్ష పరమ పురుష రుద్రుడు;
(2) మహాదేవ శ్రీమాన్ రుద్రుడు;
(3) వక్రతుండుడగు విఘ్నాధిపతి-దన్తి,
(4) నాలుగు పాదముల ధర్మస్వరూపుడగు నందీశ్వరుడు;
(5) దేవతల సైన్యాధిపతి కార్తికేయుడు, (ఆ కరుణా సాగరుడు అగు షణ్ముఖుడు) (స్కందుడు);
(6) విషయ సర్పముల జాలము నుండి రక్షించు సువర్ణపక్షుడగు గరుడుడు;
(7) జగత్ సృష్టికర్త పితామహుడు (తండ్రికే తండ్రి) అగు బ్రహ్మ భగవానుడు;
(8) సర్వత్రా సమస్వరూపుడై సంప్రదర్శనమగుచున్న నారాయణ - వాసుదేవాత్మకుడగు విష్ణువు;
(9) అంతఃశత్రువులను చీల్చి చండాడు లక్ష్మీనరసింహుడు;
(10) లోకములకు సర్వప్రకాశకుడగు ఆదిత్యుడు (మొట్టమొదటి కేవల చైతన్య స్వరూపుడై ఉన్నవారు);
(11) సర్వమును పవిత్రము చేయు లాలీల బిరుదాంకితుడగు అగ్ని;
(12) వాత్సల్య స్వరూపిణి అగు దుర్గాదేవి.
వీరంతా ఆత్మజలంలో 12 గొప్పతరంగములు.


2వ అనువాకము
దుర్గాసూక్తము
(అరిష్ట పరిహార మంత్రము)

78. జాత వేదసే సునవామ
సోమ మరాతీయతో
నిదహాతి వేదః।
స నః పర్షదతి దుర్గాణి
విశ్వా నావేవ సింధుం
దురిత-అత్యగ్నిః।।
ఓ జాతవేదా! అగ్నిదేవా! స్వామీ! మేము సోమలత నుండి రసమును తీసి ఆ రసమును మీకు భక్తి-ప్రపత్తులతో సమర్పిస్తున్నాము. మాకు పరమాత్మను ఎరుగటలో తారసబడే అడ్డంకులను కరుణామూర్తులై తొలగించండి.
ఏ విధంగా నావ దొరికితే సముద్రంలో మునుగువాడు ఆ నావ ఎక్కి ఒడ్డుకు చేరగలడో, ఆ విధంగా మమ్ములను సమస్తమైన సంసార దోషముల నుండి (eT]యు) అన్ని పొరపాట్లు - తప్పిదముల నుండి, క్లేశముల నుండి కాపాడదెరుగాక! సర్వ దురితములను తమ తేజో తత్త్వముతో భస్మము చేసివేయ ప్రార్థన.
79. తామ్ అగ్నివర్ణాం తపసా జ్వలన్తీం
వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్।
దురాం దేవీగ్ం శరణం
అహమ్ ప్రపద్యే।
సుతరసి తరసే నమః।
ఓ దుర్గాదేవీ! జగన్మాతా! సర్వత్రా తేజోరూపిణివై, అగ్నివై, అగ్నివర్ణముతో ప్రకాశించుదానా! తపోశక్తి రూపిణివై ప్రకాశించు దేవీ! పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణీ! సర్వజీవులకు కర్మఫలములను ప్రసాదించు లోకేశ్వరీ! నమోనమః। దుర్గమములను సుగమంగా చేసే దుర్గాదేవీ! - పాంచభౌతిక పరిమిత భావములచే నిర్మితమైన ‘‘సంసారము’’ (లేక) ప్రాపంచక దుఃఖముల నుండి ఆశ్రితులను తరింపజేసే తల్లివి కదా! నిన్ను శరణు వేడుచున్నాను. సంసార దుఃఖముల నుండి చక్కగా తరింపజేసే నీకు నమస్కరిస్తున్నాను.
80. అగ్నే। త్వం పారయా నవ్యో
అస్మాన్ స్వస్తిభి రతి
దుర్గాణి విశ్వా।
పూశ్చ పృథ్వీ బహులాన ఉర్వీ
భవా తోకాయ తనయాయ
శంయోః।।
ఓ అగ్నిదేవా! నీవు మమ్ములను శ్రీదుర్గాదేవి పాదపద్మములకు జేర్చే సమర్థుడవు. అందుచేత శ్లాఘనీయుడవు. స్వామీ! మమ్ములను సమస్త కష్టముల నుండి, దుఃఖముల నుండి బహిర్గతము చేయండి. ‘కష్టములు’ అనే దుర్గమారణ్యంలో చిక్కుకున్న మాకు త్రోవచూపండి. మాయొక్క- మేమున్న ఈ స్థలము, ఈ మాతృభూమి, ఈ సమస్త ప్రపంచము-మీకృపచే సుభిక్షమగుగాక! మా యొక్క పుత్రులకు, పౌత్రులకు శుభములు కలుగజేస్తూ, కష్టములు మాకు దూరమగునట్లు అనుగ్రహించండి. సుఖ ప్రదాత అవండి.
81. విశ్వాని నో దుర్గహా జాతవేదః
సింధుం న నావా దురితా-తిపర్షి।
అగ్నే అత్రివన్ (త్) మనసా గృణానో
అస్మాకం బోధ్యవితా తనూనామ్।
ఓ జాతవేదా! అగ్నిదేవా!
మా ఈ భౌతిక శరీరములలో వేంచేసి అణువణువూ పవిత్రము చేయుచూ సర్వదా కాపాడుచున్నారు కదా! అదేవిధంగా, సముద్ర మధ్యలో చిక్కుకొని కొట్టుమిట్టాడుచున్న వానిని ‘నావ’ కాపాడువిధంగా సంసార సాగరంలో చిక్కుకొని అనేక దుఃఖములకు (Many worries) లోను అగుచున్న మమ్ములను పవిత్రత అనే నావపై (As a Boat) ఎక్కించి కాపాడండి. ఓ అగ్ని భగవాన్! లోకకల్యాణమూర్తి అయి సమస్త జనుల సుఖ-శాంతి-ఐశ్వర్య-ఆనందముల కొరకై తన తపస్సంతా సమర్పించిన అత్రి మహర్షి వలె ఎల్లప్పుడు మా శ్రేయస్సును దయతో మీ దృష్టియందు కలిగినవారై ఉండం&
82. పృతనాజితగ్ం సహమానమ్
ఉగ్రమ్ అగ్నిగ్ం। హువేమ
పరమాత్ సధస్థాత్।।
స నః పర్షదతి దుర్గాణి
విశ్వాక్షామత్ దేవో
అతి దురితాతి అగ్నిః!
హే అగ్నిదేవా! మమ్ములను కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే శతృవులు చుట్టు ముట్టి ఉన్నారయ్యా!
మీరు ఉగ్రరూపులై శత్రు సైన్యమును ముట్టడించి భస్మము చేయగల మహత్ సామర్థ్యము కలవారు. అట్టి మిమ్ములను జగత్ సభ యొక్క అత్యున్నత స్థానము నుండి మేము ఉన్న చోటికి వేంచేయమని ఆహ్వానిస్తున్నాము. మా యొక్క సమస్త క్లేశముల నుండి మమ్ములను కాపాడండి. మా యొక్క గొప్ప దురితములను తొలగించండి. దేవా! మా అపరాధములను క్షమించి మమ్ములను రక్షించండి.
83. ప్రత్యోషికమ్ ఈడ్యో అధ్వరేషు
సనాచ్చ హోతా, నవ్యశ్చ సత్సి।
స్వాంచ అగ్నే తనువం
విప్రయ స్వాస్మభ్యన్చ
సౌభగమాయ జస్వ।।
ఓ అగ్నిదేవా! యజ్ఞయాగాదులలో మీరు ప్రప్రధమ- ఆహ్వానితులుగా కీర్తించబడుచున్నారు. ప్రాచీన కాలము నుండి కూడా ఇప్పటివరకు ఇక ఎప్పటికీ కూడా- నిర్వహించబడు యజ్ఞ-యాగ-క్రతు-పూజా-పితృకార్య విధులలో హవ్య వాహనులై మేము స్వర్గ-దేవతలకు, పిత్రుదేవతలకు సమర్పించు హవ్యములను వారికి జేర్చుచున్నారు. మేమంతా మీ స్వరూపము చేతనే నిర్మితులము. మీకు చెందినవారమే అయి ఉన్న మాకు ఆనందము కలుగజేయండి. మాకు సర్వతోముఖమైన సౌభాగ్యములను, శ్రేయస్సులను ప్రసాదించండి.
84. గోభిః జుష్టమ్ అయుజో
నిషిక్తం తవ ఇన్ద్ర విష్ణోః
అనుసన్చరేమ।
నాకస్య పృష్ఠమ్ అభిసంవసానో
వైష్ణవీం లోక ఇహమ్
ఆదయనన్తామ్।।
(కాత్యానాయ విద్మహే।
కన్యకుమారి ధీమహి।
తన్నో దుర్గిః ప్రచోదయాత్।।)
హే భగవతీ! వైష్ణవీ! దుర్గాదేవీ!
నీవు సమస్త పాపములకు, దుఃఖములకు సంబంధించక మాయందు కేవల స్వరూపిణివై వేంచేసియున్నావు. ఇంద్ర స్వరూపిణివై సమస్త ఇంద్రియములను పాలించు రాజ్ఞివి. విష్ణు స్వరూపిణివై సర్వత్రా వ్యాపించి ఉన్నావు. ఆకాశమునకు ఆవలగా విస్తరించి ఉన్నావు. సర్వ యజ్ఞ యాగ క్రతువులందు అభిసంవసువై అంతర్లీన గానంగా వేంచేసి ఉన్నావు. పశు ధన ధాన్య సంపదకై, యోగ-మోక్ష సాధనా సంపత్తికై నీ యొక్క సర్వత్రా వెల్లివిరిసియున్న వైష్ణవీ తత్త్వమును శరణు వేడుచున్నాము. వైష్ణవీ జ్యోతివై ఈ సర్వ లోకములుగా, ‘నేను’గా వెలుగొందుచున్నది నీవే కదా!
శక్తి స్వరూపిణియైన కాత్యాయనీ దేవిని ఎరుగుటకై ఆ కన్యకుమారీదేవిని స్తుతించుచున్నాము. ఈ మా కొంచము స్తుతిని స్వీకరించి ఆ దుర్గాదేవి మా బుద్ధిని వికసింపజేయునుగాక!


3వ అనువాకము
ఎలుగెత్తి గానముచేయబడు (వ్యాహృతి) హోమ మంత్రములు
(అన్నసమృద్ధి కొరకై హోమమునకు సంబంధించిన మహా వ్యాహృతి మంత్రములు)

85. వ్యాహృతి హోమ మంత్రములు
‘‘భూః’’ అన్నమ్ అగ్నయే
పృథివ్యై స్వాహా।
‘‘భువో’’ అన్నం వాయవే
అంతరిక్షాయ స్వాహా।
‘‘సువః’’ అన్నమ్ ఆదిత్యాయ
దివే స్వాహా।
‘‘భూః భువః సువః
అన్నం చంద్రమసే
దిగ్భ్యః స్వాహా।
నమో దేవేభ్యః।
స్వధా పితృభ్యో।
భూర్భువస్సువః అన్నమ్ ‘ఓం’।।
అన్నము- (1) ఆహారమునకు ఆహార పదార్థములు. (2) ఇంద్రియములకు ఇంద్రియ విషయములు.
అన్నమ్ ‘ఓం’! ‘భూ’- అను మంత్రోచ్ఛారణచే తత్ ప్రతిపాదితుడు అయినట్టి బ్రహ్మాగ్నివి, మాకు శరీరములను ఇచ్చుచున్న ఓషధ ప్రసాదిని అయినట్టి పృథివీదేవికి మేము సమర్పించి సర్వేంద్రియ కృతమగు అన్నము ఆహుతముగా సమర్పణము చేయుచున్నాము. ఇంద్రియానుభవములు అనే అగ్ని ద్వారా మేము సమర్పించు ఆహుతులను పృథివీదేవిచే స్వీకరించబడునుగాక!
‘భువో’ అను మంత్రముచే మా మనస్సు (ఆలోచనలు) ఆహుతిగా వాయుదేవునికి, అంతరిక్షమునకు సమర్పణమగుగాక!
‘సువః’ అను మంత్రముచే మా బుద్ధి - చిత్త క్రియావిశేషములన్నీ ఆహుతులై ఆదిత్యునికి, దివ్యలోకవాసులగు దేవతలకు సమర్పితము అగునుగాక!
‘‘భూ భువః సువః’’ అను ఉచ్ఛారణచే మేము సమర్పించు ఇంద్రియ - మనో- చిత్త విశేషాలన్నీ ఓషధ - వనస్పత ప్రదాతయగు చంద్రదేవునికి, దిక్-దేవతలకు ఆహుతులై చేరునుగాక. జగత్తును నిర్మించి ప్రసాదించు దివ్య ప్రజ్ఞలగు దేవతలకు నమస్కారము. వారికి ‘స్వాహా’ అని పలుకుచూ ఆహూతులు సమర్పిస్తున్నాము. ఈ భౌతిక దేహనిర్మాణ ప్రజ్ఞలగు పిత్రుదేవతలకు ‘స్వధా’ నమః అని సమర్పించు ఆహూతులను స్వీకరించుదురుగాక. పిత్రు దేవతలకు నమస్కరించుచున్నాము.
ఈ ‘‘భూః-భువర్-సువర్’’ త్రిలోకములు ‘అన్నము’ అను ఓంకార పరబ్రహ్మ స్వరూపమే.


4వ అనువాకము
అగ్న ‘ఓం’!

86. ‘భూః’ - అగ్నయే పృథివ్యై స్వాహా।
‘భువో’ - వాయవే అన్తరిక్షాయ స్వాహా।
‘సువః’ - ఆదిత్యాయ దివే స్వాహా।
‘భుర్భువస్సువః’ చంద్రమసే
దిగ్భ్యః స్వాహా।
నమో దేవేభ్యః।
స్వధా పితృభ్యో।
భూర్భువస్సువః ‘అగ్న’ ఓం।।
అగ్న ‘ఓం’! (అగ్నికి నేయిని స్రువముతో సమర్పిస్తూ)
‘‘భూః’’ అని అగ్నికి, పృథివికి ఆహుతులు సమర్పిస్తున్నాము.
‘‘భూవో’’- అని వాయువుకు, అన్తరిక్షమునకు ఆహూతులు సమర్పిస్తున్నాము.
‘‘సువర్’’- అని పలుకుచూ ఆదిత్యునికి (సూర్యభగవానునికి) దేవతా లోకమునకు, దేవతలకు ఆహూతులు సమర్పిస్తున్నాము.
దేవతలకు ‘స్వాహా’ అని ఆహూతులు సమర్పిస్తూ నమస్కరిస్తున్నాము.
పితృ దేవతలకు ‘స్వధా’ అని ఆహూతులు సమర్పిస్తూ నమస్కరిస్తున్నాము.
‘భూర్భువస్సువః’ అని ఆహూతులు హవ్య వాహనుడగు అగ్నికి ఓంకార స్వరూపోపాసనగా సమర్పిస్తున్నాము.


5వ అనువాకము
మహత్ - అగ్నిహోమము (మహః ఓం)

87. ‘‘భూః’’ అగ్నయే చ పృథివ్యై చ మహతే చ స్వాహా।
‘‘భువో’’ వాయవే చ, అంతరిక్షాయ చ
మహతే చ స్వాహా।
‘‘సువః’’ ఆదిత్యాయ చ దివే చ
మహాతే చ స్వాహా।
‘‘భూర్భువస్సువః’’ చంద్రమసే చ
నక్షత్రేభ్యశ్చ దిగ్భ్యశ్చ
మహతే చ స్వాహా।
నమో దేవేభ్యః। స్వధా పితృభ్యో।
భూర్భువస్సువః మహః ‘ఓం’।।
‘‘భూః’’ - అగ్ని - పృథివీ మహత్ తత్త్వములు మా ఈ ఆహూతులను స్వీకరించునుగాక।
‘భువో’ వాయు - అంతరిక్ష మహత్ తత్త్వములు మా ఈ ఆహూతులను అందుకొనెదరు గాక!
‘సువర్’ - ఆదిత్యా దివీ మహత్ తత్త్వములు మా ఈ ఆహూతులను ఆస్వాదించెదరుగాక!
‘భూర్భవస్సువః’ - చంద్రమస-నక్షత్ర - దిక్ దేవతా మహత్ తత్త్వములు మా ఈ సమర్పితమగు ఆహూతులను పొంది ఆనందించెదరుగాక!
దేవలోక దేవతలకు నమస్కారము! పిత్రు దేవతలకు నమస్కారము!
ఓంకార స్వరూప భూర్భవస్సువః।।
మహత్ తత్త్వములను ఉపాసిస్తూ ఆహూతులను సమర్పిస్తున్నాము.


6వ అనువాకము
జ్ఞాన ప్రాప్త్యర్థ హోమమంత్రము

88. పాహి నో అగ్న ఏనసే స్వాహా।
పాహి నో విశ్వవేదసే స్వాహా।
యజ్ఞం పాహి విభావసో స్వాహా।
సర్వం పాహి శతక్రతో స్వాహా।
(బద్ధకము, అశ్రద్ధ, పరిమిత దృష్టులు మొదలైన) జ్ఞాన ప్రతిబంధకములు విచ్ఛేదనమవటానికై, కష్టములు తొలగటానికై అగ్నిదేవునికి ఈ ఆహూతి. స్వామీ! స్వీకరించి రక్షించండి. ఓ విశ్వరచయితా! విశ్వ ప్రదర్శకుడా! విశ్వ స్వరూపా! పాహి! రక్షించండి. యజ్ఞమును (వాక్‌యజ్ఞం, తపోయజ్ఞం, స్వాధ్యాయజ్ఞం, ద్రవ్యయజ్ఞం, యోగయజ్ఞం, జ్ఞానయజ్ఞం మొదలైనవి) కాపాడుటకై - ఈ జగత్తంతా ఎవ్వరి విభవమో అట్టి (పరబ్రహ్మము అనే) విభావసునకు ఆహూతులు సమర్పిస్తున్నాము. సర్వమును రక్షించుటకై శతక్రతు (100 క్రతువులకు) ఆహూతులు సమర్పిస్తున్నాము.


7వ అనువాకము

89. పాహినో ‘అగ్న’ ఏకయా।
పాహి ‘ఉత’ ద్వితీయయా।
పాహి ‘ఊర్జం’ తృతీయయా।
పాహి గీర్భిః, శతసృభిః వసో స్వాహా।। (గీర్భిశ్చతసృభిర్వసో స్వాహా।)
ఓ అగ్నిదేవా! మమ్ములను ఋగ్వేద ఋక్కుల రూపులై రక్షించండి. ఓ హుత దేవతా! యజుర్వేద యజ్ఞ-యాగ- క్రతు రూపులై రక్షించండి. ఓ వరుణ దేవా! మమ్ములను సామవేదములోని సామగాన స్వరూపులై రక్షించండి. ఓ గీర్మాతా! వేదమాతా! వేదములచే గానము చేయబడు వేద పురుషా! రక్షించండి. శతాధిక స్తుతిని వసువుకు సమర్పిస్తున్నాము. ।। స్వాహా!।


8వ అనువాకము
వేదాంతపరమార్థ సిద్ధి కొరకై ప్రార్థనా మంత్రము
ఓంకార సంజ్ఞా బ్రహ్మవిద్య

90. యః ఛందసామ్ ఋషభో విశ్వరూపః,
ఛందోభ్యః ఛందాగ్ంస్య అవివేశ।
సచాగ్ం శిక్యః పురో వాచ
ఉపనిషత్ ఇంద్రో జ్యేష్ఠ।
ఇంద్రియాయ ఋషిభ్యో।
నమో దేవేభ్యః।
స్వధా పితృభ్యో।
భూర్భువస్సువః ఛంద ‘ఓం’-।।
ఏ ‘‘ఓంకార’’ ప్రణవము వేదములకు వృషభము (అతి ముఖ్యము! ధేనువు) వంటిదో, విశ్వరూపమో, సర్వజగదాత్మకమో, అట్టి వేదములలోనించి పుట్టిన వేదాంత సారమగు ఆత్మజ్ఞానము నన్ను సమీపించునుగాక!
అట్టి వేదముల నుండి జనించిన ‘ఓం’ ప్రణవము వేదములకు శిఖవంటిది. వేదములకు మొదలే, మునుముందే ఉన్నట్టిది. ముందే ఉన్న పరబ్రహ్మతత్త్వమగు ‘ఓం’కారమును వేదములు అభివర్ణించు ధర్మమును నిర్వర్తిస్తున్నాయి. ఓం-అనునది ఆత్మ యొక్క అత్యంత సామీప్యత పొందినవారు పలికిన ఆత్మ గురించిన సంజ్ఞ. అందుచేత ఉపనిషత్ సంజ్ఞ. ఇంద్రియముల కంటే, వాటి సంచాలకుడగు ఇంద్రుని కంటే, అద్దానిని పరమసత్యముగా ప్రకటించు ఋషులకంటే ముందే ఉన్నట్టిది. అట్టి ఓంకారము నుండి బయల్వెడలు దేవతలకు నమస్కారము; పిత్రు దేవతలకు ‘స్వధా’ శబ్ద వందనములు. భూ-భువర్-సువర్లోకములంతా నిండియున్నట్టి వా{న్నిటికీ జనన స్థానమగు వేదజనిత ‘ఓం’కారమునకు ఉపాసనా పూర్వక నమస్కారములు.


9వ అనువాకము

91. నమో బ్రహ్మణే। ధారణం
మే అస్తు అనిరాకరణమ్।
ధారయితా భూయాసం।
కర్ణయోః శ్రుతమ్।
మాచ్యోఢ్వం।
మమ ఆముష్య ‘ఓం’।।
ఓంకార ప్రణవము నుండి మొట్టమొదటగా బయల్వెడలిన సృష్టికర్త, సృష్ట్యభిమాని అగు బ్రహ్మదేవునికి నమస్కరిస్తున్నాము. ఆయన అనుగ్రహముచే మా యొక్క బ్రహ్మము గురించిన ధారణ అనిరాకరణ మగును గాక!
మరల మరల మేము బ్రహ్మము గురించి మా ఈ చెవులతో వినుచుండెదము గాక! వినినది వదలక ధారణ కలిగియుండెదముగాక!
మేము బ్రహ్మముచే తిరస్కరించబడకుండెదముగాక! మేము ఓంకార అముష్య (పర) స్వరూపములమై స్వయముగా ప్రకాశించెదముగాక!


10వ అనువాకము
తపో ప్రశంస

92. తపః ప్రశంసా:-
ఋతం తపః। సత్యం తపః। శ్రుతం తపః। శాన్తం తపో।
దమః తపః। శమః తపో। దానం తపో। యజ్ఞః తపో।
భూర్భువస్సువః బ్రహ్మైతత్, ఉపాస్య ఏతత్ తపః।
వేదములు, వేదవేత్తలు ఎలుగెత్తి చెప్పు ఆత్మయే (ఋతము) మా తపోలక్ష్యము. అట్టి పరమ సత్యమును స్వానుభావముగా దర్శిస్తూ ఉండటము (సత్యము) ‘‘తపస్సు’’. బ్రహ్మము గురించి వినుచుండటము తపస్సు. దృశ్యమును ఆత్మగా దర్శిస్తూ ఆత్మయందు సశాంతింపజేయుట తపస్సు. యజ్ఞము తపో రూపమే! భూర్భువస్సువ త్రిలోకములను బ్రహ్మముగా భావన చేసి బ్రహ్మమును ఉపాశించటమే తపస్సు.


11వ అనువాకము
శాస్త్ర-లోక అనుకూల్య సత్-కర్మలు - అశాస్త్రీయ - లోకప్రతికూల దుష్కర్మలు - వాటి ప్రభావము

93. యథా వృక్షస్య సంపుష్పితస్య
దూరా దంధో వా ఇత్యేవం
పుణ్యస్య కర్మణో దూరాత్
గంధో వాతి,
యథ అసిధారాం కర్తే అవహితామ్
అవక్రామేత్
యద్యువేయువే హవా
విహ్వయిష్యామి।
గర్తం పతిష్యామి।
ఇత్యేవమ్ అమృతాత్
ఆత్మానం జుగుప్సేత్।।
విహిత సుకర్మల అనుష్ఠానం: ఒక పుష్పవనంలో (సంపెంగ వంటి) వృక్షమునకు పూచిన పువ్వు వెదజల్లు మధురమగు సువాసన (లేక) పరిమళమును గాలి సుదూరమునకు తీసుకువెళ్లటం, అనేకులను ఆహ్లాదపరచటము జరుగుతుందికదా! అట్లాగే మనము చేయు పుణ్యకర్మలు సయత్నములు అనేక లోకములకు, ఉత్తరోత్తర జన్మలకు విస్తరించి, అనేక మందిని ఆహ్లాదపరచగలవు. కర్తకు జన్మ-జన్మాంతరాలుగా శుభములు ప్రసాదించగలవు.
అవిహిత-దుష్టకర్మలు నిర్వహించుట : రాజును, మంత్రులను సంతోషింప జేయటానికి ఒకడు ఎత్తుగా-బారుగా నిలబెట్టిన పదునైన కత్తులపై అడుగులు వేస్తూ ఉండటము వంటిది. ‘‘గట్టిగా అడుగువేశానా, కాలితో గ్రుచ్చుకుంటుందేమో! గట్టిగా అడుగులు వేయకపోతేనో,.. క్రింద మురికిగుంటలో పడి దుర్వాసనలు, బురద అంటించుకుంటానేమో!’’ - అని ఉభయత్రా జీవునకు భయమే కలిగిస్తుంది. ఉభయత్రా నష్టమే! అందుచేత ఈ జీవుడు దుష్టకర్మల జుగుప్స నుండి తనను తాను రక్షించుకోవాలి. మృతత్వము నుండి అమృతత్వమునకు సాధుకర్మల ద్వారా త్రోవ సుగమం చేసుకోవాలి.


12వ అనువాకము
దహర విద్యా

94. అణోః అణీయాత్,
మహతో మహీయాత్,
ఆత్మా గుహాయాం నిహితో
అస్య జంతోః।
తమ్ అక్రతుం పశ్యతి వీతశోకో,
ధాతుః ప్రసాదాత్
మహిమానమ్ ఈశమ్।।
దహర విద్య : ఈ దృశ్యమంతా ఎద్దానిచే ప్రసాదించబడుచూ ఎందులో చివ్వరికి లయము కానున్నదో - అట్టి అధ్యయనమే ఆత్మ విద్య. జాగ్రత్ - స్వప్న దృశ్య జగత్తులకు, సుషుప్తికి, జన్మజన్మాంతరములకు ‘కేవల సాక్షి’ అగు ఆత్మ→ అణువుకే అణువు వంటిది. అత్యంత సూక్ష్మము.
→ మేరువు, ఆకాశము లోకములు మొదలైన బృహత్తర వస్తువుల కంటే కూడా బృహత్తరమైనది.
అత్యంత ఘనీభూతము : అట్టి ఆత్మ ప్రతి ఒక్కని హృదయగుహలో సర్వదా సంప్రకాశమానమై ఉన్నది. ఎవ్వడైతే సర్వకార్య వ్యవహారముల నుండి బహిర్గతుడై , సర్వదృశ్య వేదనలను త్యజించినవాడై, ధాతువులను (ఇంద్రియములను) నిర్మలము చేసుకొన్నవాడై, బుద్ధిని సునిశితము, విస్తారము చేసుకొంటాడో అట్టివాడు సర్వము విస్తరించియున్న ఆత్మను తన హృదయాకాశమునందే సుస్పష్టముగా, నిర్ధుష్టముగా దర్శించుచున్నాడు. అంతేకాని, ఆత్మదర్శనమనునది మరెప్పుడో కాదు. మరెక్కడో కాదు.
95. సప్త ప్రాణాః ప్రభవన్తి।
తస్మాత్ సప్తార్చిషః సమిధః।
సప్త జిహ్వాః। సప్త ఇమే లోకా
యేషు చరంతి
ప్రాణా గుహాశయాత్
నిహితాః సప్త సప్త।।
ఆత్మనుండి..,
సప్త ప్రాణములు (ప్రాణ-అపాన - వ్యాన-ఉదాన - సమాన - సప్రాణ - మూలప్రాణతత్త్వములు)బీ సప్త ఉపప్రాణములుబీ
→ శబ్ద - స్పర్శ - రూప-రస -గంథ - మనో - జీవాత్మలుబీ
→వాటిచే గ్రహించబడు సప్త విషయములు (సప్త సమిధలు)బీ
→ సప్త జిహ్వలు, సప్త ఊర్ధ్వలోకములు (భూ భువర్ సువర్ మహర్ జనో తపో సత్య లోకములు)
- సప్త అధోలోకములు- (అతల-వితల-సుతల- తలాతల- రసాతల- మహాతల-పాతాళములు).
ఈ విధంగా ప్రాణులు చరించే ప్రాణగుహలగు సప్త సప్త లోకములన్నీ ఆత్మనుండే బయల్వెడలుచున్నాయి.
96. అతః సముద్రా గిరయశ్చ సర్వే
అస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః।
అతశ్చ విశ్వా ఓషధయో రసాశ్చ
యేన ఏష భూతః తిష్ఠతి అంతరాత్మా।।
ఆ పరమాత్మయగు పరమేశ్వరుని నుండియే సముద్రములు, గిరులు, నదులు, ఓషధులు, రసములు, సర్వరూపములు, విశ్వములు, సర్వజీవులు - ఇవన్నీ బయలుదేరుచున్నాయి. ఇవన్నీ అంతరాత్మ యందే తిష్ఠితమై ఉన్నాయి. (స్వప్నమంతా సప్నద్రష్టయే చైతన్యస్వరూపుడై ప్రదర్శన మగుచున్నట్లు) ఈ జగత్ వ్యవహారమంతా పరమాత్మకు అనన్యము.
97. బ్రహ్మా దేవానాం పదవీః కవీనామ్,
ఋషిః విప్రాణాం మహిషో మృగాణామ్।
శ్యేనో గృధ్రాణాగ్ం, స్వధితిః
వనానాగ్ం, సోమః పవిత్రమ్ అత్యేతి రేభన్।
ఆ పరమేశ్వరుడు సర్వ సృష్టి స్వరూపుడు. సర్వశ్రేష్ఠుడుగా ప్రకాశమానుడగు చున్నారు. దేవతలలో బ్రహ్మ, కవులలో (వ్యాస వాల్మీక వసిష్ఠాది శ్రేష్ఠ ఆత్మతత్త్వ ప్రవచితులలో) ఋషి, మృగములలో మహిషము (దున్న), పక్షులలో డేగ, వనములలో పదునుగల కట్టె, లతలలో సోమలత.. ఈ విధంగా ఈ సమస్థములో శ్రేష్ఠరూపుడై ప్రదర్శనమగుచున్నారు.
98. అజామ్ ఏకాం లోహిత శుక్ల కృష్ణాం।
బహ్వీం ప్రజాం జనయన్తీగ్ం
సరూపామ్।
అజో హి ఏకో జుషమాణో అనుశేతే
జహాతి ఏనాం భుక్త భోగామ్
అజో అన్యః।।
ఆ పరమాత్మకు జన్మలు లేవు. అజుడు. సర్వదా ఏకమేగాని అనేకముగా అవటమే లేదు. ఎరుపు-తెలుపు-నలుపు (రజో-సత్వ-తమో గుణములు) ఆయనయొక్క ఏకస్వరూపము నుండి బయల్వెడలుచున్నాయి. ఏకమునుండి అనేకత్వమంతా జనితమౌతోంది. నిర్గుణము నుండి సగుణము, అరూపము నుండి సరూపము బయల్వెడలుచున్నాయి. ఆయనలోంచి జన్మ రహితత్వము, జన్మసహితత్వము - ఈ రెండూ బయల్వెడలుచున్నాయి. జన్మరహితుడుగా కేవలసాక్షిగా ఉంటున్నాడు. జన్మసహితుడుగా మాయలో ప్రవేశించి ఇంద్రియ విషయ పరంపరలన్నీ అనుభవిగా బద్ధుడై పొందుచున్నాడు.
99. హగ్ంసః శుచిషత్।
వసుః అన్తరిక్షసత్।
హోతా వేదిషత్।
అతిథిః దురోణషత్।
నృషత్ వరసత్। ఋత సత్।
వ్యోమ సత్। అబ్జా గోజా
ఋతజా అద్రిజా
ఋతం బృహత్।।
ఆ ఆత్మ భగవానుడే జ్యోతిర్మండలము నందు ఆదిత్యుడై, సహస్ర కిరణ సూర్యభగవానుడై వెలయుచున్నారు.
అంతరిక్షములో ‘వాయువు’ రూపుడై సర్వ చలనములకు కారకుడగు చున్నారు.
- వేది (ఎరుక) యందు అగ్ని స్వరూపుడై ప్రకాశించుచున్నారు.
- నామరూపములలో అతిధి (Guest Artist) అయి చెన్నొందుచున్నారు.
- కర్మలలో కర్మల కర్త, కర్మఫల భోక్తగా (The Doer and the under goer) అగుచున్నారు.
- వేద వచనములలో ‘ఋతము’ (స్వానుభవైకవేద్యము) అగుచున్నాడు.
- (స్వప్నమునందు స్వప్న ద్రష్టవలె) నీటి యందు గోవులందు, ఋక్కులందు (కీర్తనములందు), కొండలపై కూడా మహత్తరసత్యమై, ఆత్మాకాశ స్వరూపుడై వెలుగొందుచున్నారు.
100. ఘృతం మిమిక్షిరే।
ఘృతం అస్య యోనిః।
ఘృతే శ్రితో, ఘృతమ్ ఉవస్య (ఉపస్య) ధామ।
అనుష్వధమ్ ఆవహమాదయస్వ
స్వాహా కృతం వృషభవక్షి హవ్యమ్।।
యజ్ఞ కర్త అగ్నిలో నేయిని ఆహుతి చేస్తున్నారు. ఘృతము అగ్నికి స్థానము అయి ఉన్నది. ఘృతమునందు సర్వము శ్రితమై ఉపాస్యవస్తువై, ఉపాసించు వాడు లక్ష్యముగా కలిగి యుండు తేజోరూప ధామము అయిఉన్నది. ఓ అగ్నిదేవా! మీకు ఘృతమును (నేయిని) సమర్పిస్తున్నాము. ఈ ఘృతమును హవిస్సుగా స్వీకరిస్తూ దేవతలను మా వద్దకు ఆహ్వానించండి. వారు మీ మధ్యవర్తిత్వముచే ఆహూతులు స్వీకరించి తృప్తి పొందెదరుగాక! ఓ శ్రేష్ఠుడా! అగ్నిదేవా! ‘స్వాహా’ అని పలుకుచూ మేము సమర్పించు ఆహూతులను (ఆవు నేయిని) దేవతలు స్వీకరించునట్లుగా మమ్ము అనుగ్రహించండి.
101. సముద్రాత్ ఊర్మిః మధుమాగ్ం
ఉదార దూపాగ్ంశునా
సమ మృతత్వమానట్।
ఘృతస్య నామ గుహ్యం యదస్తి
జిహ్వా దేవానామ్
అమృతస్య నాభిః।।
మధుర స్వరూపుడగు ‘పరమాత్మ’ అనే క్షీరసముద్రము నుండి క్షీర కెరటముల వలె ఈ భోగ్య ప్రపంచమంతా మధురంగా ప్రకటితమగు చున్నది. ఇదంతా సమమగు మాధుర్యములో నిండియున్నది. పాలలో నేయి దాగి ఉన్న విధంగా స్వయం ప్రకాశ ప్రణవతత్త్వమగు పరమాత్మ మాధుర్యము సర్వవేదములందు గోప్యమై (దాగి) ఉన్నది. ధ్యాన కాలమున ప్రణవనాదము నుండి బ్రహ్మతత్త్వ మాధుర్యము బయల్వెడలుచున్నది. ప్రణవమే దేవతలకు జిహ్వ (నాలుక). దేవతల ముఖములలో ప్రణవ మాధుర్యము ద్యోతకము. అట్టి ప్రణవము మోక్షమునకు నాభి వంటిది.
102. వయం నామ ప్రబ్రవామా ఘృతేన
అస్మిన్ యజ్ఞే ధారయామానమోభిః।
ఉపబ్రహ్మా శృణవత్
యస్య మానం, చతుఃశృంగో వమీత్
గౌర ఏతత్।।
ఆత్మజ్ఞానార్థులమై జ్ఞాన యజ్ఞమును నిర్వర్తించుచూ, స్వయం ప్రకాశ పరబ్రహ్మ స్వరూపమగు ప్రణవమును మధురముగా ఉచ్ఛరించుచున్నాము. మా చిత్తముతో బ్రహ్మతత్త్వము గురించి ధారణ చేయుచున్నాము. మాచే ప్రణవము స్తూయమానమగుచున్నది. అట్టి ప్రణవము (1) ‘అ’కారము (2) ‘ఉ’కారము (3) ‘మ’కారము (4) అర్ధమాత్ర (లేక) నాదము - అను నాలుగు వాచకములు (గుణములు) గల తెల్లటి ఎద్దు వంటిది.
103 చత్వారిశృంగా త్రయో అస్య
పాదా। ద్వే శీర్షే,
సప్త హస్తాసో అస్య,
త్రిధా బద్ధో వృషభో రోరవీతి
మహాదేవో మర్త్యాగ్ం ఆవివేశ।।
ప్రణవమునకు (పరబ్రహ్మమునకు)
→ ‘అ’ కార, ‘ఉ’కార, ‘మ’కార, నాదములు అనే నాలుగు శృంగములు (4 కొమ్ములు).
→ 3 పాదములు - జాగ్రత్ స్వప్న సుషుప్తులు.
→ 3 పురుషకారములు - విశ్వ - తేజసః - ప్రాజ్ఞ పురుషకారములు
→ అధిదైవిక - ఆధ్యాత్మిక - ఆధి భౌతిక త్రిప్రదర్శనములు.
→ విరాట్ - హిరణ్యగర్భ - అవ్యాకృత త్రివ్యాహృతులు.
→ 2 శీర్షములు: జీవాత్మ -పరమాత్మలు
చిత్ - అచిత్
సత్ - అసత్
- ‘7’ హస్తములు - భూ-భువర్ -సువర్ - మహర్- జనో-తపో - సత్య లోకములు. త్రిధా బద్ధమగు వృషభరోరవము. ఆ పరమేశ్వరుడు వీటన్నిటితో సర్వ దేహములలో ప్రవేశించి ఉన్నారు
104 త్రిధా హితం పణిభిః గుహ్యమానం
గవి దేవాసో ఘృత మన్వ విందన్।
ఇంద్ర ఏకగ్ం సూర్య ఏకం
జజాన వేనాత్ ఏకగ్ం స్వధయా నిష్ణతక్షుః।।
- విశ్వ తేజస ప్రాజ్ఞ ; బ్రహ్మాండ - విరాట్- హిరణ్యగర్భ- విరాట్ పురుషుడు జాగ్రత్‌ను, హిరణ్యగర్భుని పుట్టించారు.
అంతర్ దృష్టిచే ఇంద్ర సూర్యాది దేవతలు చూస్తున్న విధంగా ఏకమగు ఆత్మను ఈ జీవుడు దర్శించగలడు.
105. యో దేవానాం ప్రథమం
పురస్తాత్ విశ్వా ధియో రుద్రో మహర్షిః
హిరణ్యగర్భం పశ్యత జాయమానం
స నో దేవః శుభయా స్మృత్యా సంయునక్తు।।
ఏ దేవాదిదేవుడు విశ్వమునకు వేరై వేదములచే ప్రతిపాదించబడుచు, సర్వమును ప్రప్రధముడై (మొదటే ఉన్నవాడై), మహత్ ఋతమై, సృష్ట్యభిమాని అగు హిరణ్యగర్భుని సృష్టించుకొన్నవారై ఉన్నారో, అట్టి పరమేశ్వరుడు మమ్ములను సర్వ సంసార బంధముల నుండి విముక్తిని ప్రసాదించునుగాక! సర్వశోభాయ మానమగు, శుభప్రదమగు మోక్షస్థానమునకు దారిచూపుదురుగాక.
106. యస్మాత్ పరం న అపరమస్తి కించిత్,
యస్మాత్ న అణీయో, న జ్యాయో-స్తి కశ్చిత్,
వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్ఠతి ఏకః
తేన ఇదం పూర్ణం పురుషేణ సర్వం।।
ఏ స్వస్వరూప ఆత్మతత్త్వమునకు వేరైనదిగాని, వేరుకానిదిగాని (పరముగాని, అపరముగాని) కించిత్ కూడా లేనేలేదో,
ఎద్దానికి తక్కువైనదిగాని, అధికమైనదిగా ఎవ్వరూ అయిఉండలేదో,
- ఏదైతే దివ్యలోకములలో కూడా వృక్షమువలె స్తబ్దముగా సంతిష్ఠితమై యున్నదో అట్టి పూర్ణ పురుషుడగు పరమాత్మచేతనే ఇదంతా నిండియున్నది.
107 న కర్మణా, న ప్రజయా ధనేన,
త్యాగేన ఏకే అమృతత్వ మానశుః।
పరేణ నాకం నిహితం గుహాయాం
వీహ్రాజతే తత్ యతయో విశంతి।।
అట్టి స్వాత్మానుభవమగు అమృతత్వము…,
→ కర్మలచేతగాని, సంతానము మొదలైన జన సంపద చేతగాని, ధనము మొదలైన ఆయా భౌతిక సంపదల చేతగాని పొందబడజాలదు.
బాహ్య విషయముల ‘త్యాగము’చే హృదయ గుహలోనే పరతత్త్వము’ అనుభవమవగలదు. తనయందు ప్రకాశమానమైయున్న ఆత్మను తనయందే గమనించి దర్శించి ఆత్మజ్ఞుడు ప్రవేశించుచున్నాడు. ఆత్మతో మమేకమగుచున్నాడు.
108. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః
సన్న్యాస యోగాత్ యతయః
శుద్ధ సత్త్వాః,
తే బ్రహ్మలోకే తు పరాంతకాలే
పరామృతాత్ పరిముచ్యంతి సర్వే।
ఆత్మను స్వానుభవముగా పొందటము ఎట్లా?
- ఉపనిషత్తులు ప్రతిపాదించు ఆత్మతత్త్వార్థము యొక్క విచారణ, సునిశ్చిత చేతను,
- శుద్ధ సాత్త్విక భావనలచేతను,
-యోగాభ్యాసము చేతను,
-సున్న్యాస యోగము చేతను,
పరాంతకాలములో బ్రహ్మలోకములో ప్రవేశితులై ‘‘పరామృత స్వస్వరూపము’’ అగు కేవలీతత్త్వమును ఇక్కడే ఎవ్వరైనా పొందగలరు.
109. దహ్రం విపాపం పరమే
అశ్మభూతం, యత్ పుండరీకం
పురమధ్య సగ్ంస్థమ్,
తత్రాపి దహ్రం గగనం విశోకః
తస్మిం యదం తత్ తత్
ఉపాసితవ్యమ్।।
హృదయాకాశంలో ….,
- అష్టదళములతో కూడినది,
- అంగుష్ఠ మాత్రమైనది,
- దోషరహితమైనది, పరమ నిర్మలమైనది → అగు ఆత్మ సర్వదా జ్వాజ్వల్యమానంగా వెలుగుచున్నది. సర్వ దృశ్యవ్యధలు యోగాభ్యాసముచే త్యజించిన ధీరుడు తన హృదయమునందే దర్శించి అద్దానిని ఉపాశితవ్యముగా సమీపించి ఆరాధించగలడు. ఆత్మయే సర్వదా ఉపాసితవ్యము.
110. యో వేదాదౌ స్వరః ప్రోక్తో,
వేదాంతే చ ప్రతిష్ఠితః
తస్య ప్రకృతి లీనస్య
యః పరః, స మహేశ్వరః।।
ఏ ప్రణవార్థమగు ఆత్మ….,
→ వేదములకు మొదలై ఉన్నదో,
→ తెలియబడేదానికంతటికీ తెలుసుకొనుచున్న వాని రూపంగా మునుముందే వేంచేసియున్నదో, వేదాంతమునందు (తెలియబడుదానిని తెలుసుకొనుచున్న రూపముగా) ప్రతిష్ఠితమో,
→ వేదాంతములగు ఉపనిషత్తులలో బోధ రూపంగా పతిష్ఠితమైయున్నదో,
అట్టి ఆత్మ తన యొక్క ప్రకృతిని సర్వదా లీనము చేసుకొని సర్వశేష్యమై, సర్వమునకు పరమై, మహేశ్వరస్వరూపమై వెలుగొందుచున్నది.


13వ అనువాకము
నారాయణ సూక్తము

111. సహస్రశీర్‌షం దేవం
విశ్వాక్షం। విశ్వశంభువమ్।।
విశ్వం నారాయణం దేవమ్
అక్షరం పరమం పదమ్।।
వేలాది (అనంత) శిరస్సులు (భావనా-ఆలోచనా-సందర్శనా విశ్లేషములు) కలవాడు, స్వయం ప్రకాశకుడగుటచే ‘దైవము’ అయిన వాడు, విశ్వమంతా కనులు (అనేక దృష్టులు) కలాడు, సమస్తమును వీక్షిస్తున్నవాడు, సర్వులకు శుభ- ఆనంద- శ్రేయో ప్రదాత, ఈ విశ్వమంతా (సముద్రంలో జలమువలె) నిండియున్నవాడు, అక్షరుడు, దేవదేవుడు అగు శ్రీమన్నారాయణుని అక్షరమగు పరమపదము కొరకై స్తుతిస్తున్నాము. ధ్యానించుచున్నాము. ఉపాసించుచున్నాము.
112. విశ్వతః పరమాన్ నిత్యం।
విశ్వం నారాయణగ్ం హరిమ్।
విశ్వమే వేదమ్ పురుషః
తత్ విశ్వమ్ ఉపజీవతి।।
(దేహమునకు దేహి వలె) - విశ్వమునకు పరముగా (ఆవలగా) ఉన్నవాడు, త్రికాలములోలోను నిత్యుడు, ఈ విశ్వమంతా తన స్వరూపముగా కలవాడు - అగు ఆ హరినారాయణుడే….
→ తన యొక్క పురుషకారముచే స్వీయమగు ‘ఎరుక’ నుండి ఈ విశ్వమంతా కల్పించుకొని, దీనినంతా పరివేష్టిస్తూ పరిపోషించుచున్నారు. ఉజ్జీవింప జేయుచున్నారు.
113. పతిం విశ్వస్య ఆత్మేశ్వరగ్ం
శాశ్వతగ్ం శివమ్ అచ్యుతమ్।
నారాయణం మహాజ్ఞేయం
విశ్వాత్మానం పరాయణమ్
ఈ విశ్వమునకు పతి (యజమాని), సర్వజీవులకు ఆత్మేశ్వరుడు, శాశ్వతుడు, సర్వులకు శుభప్రదాత, ఆత్మత్వము నుండి ఏ మాత్రము చ్యుతి పొందనట్టి అచ్యుతుడు, (దేహమునకు దేహి ఆత్మాగు తీరుగా) ఈ విశ్వమునకు ‘ఆత్మ’ అయిననవాడు-అగు ఆ నారాయణుడే అన్నిటికంటే తెలుసుకొన వలసినవాడు. పఠించవలసిన పరాయణుడు. సర్వమునకు పరమై విహరించువాడు.
114. నారాయణ పరోజ్యోతిః
ఆత్మా నారాయణః పరః।
నారాయణ పరం బ్రహ్మ,
తత్త్వం నారాయణః పరః।
నారాయణ పరో ధ్యాతా
ధ్యానం నారాయణః పరః।।
స్వస్వరూప-ఆత్మేశ్వరుడగు నారాయణుడు జ్యోతిలకే (సర్వజీవులకు) జ్యోతి. పరంజ్యోతి. ఆయనయే ఇహమునకు ఆవల గల (నటుని వ్యక్తిగత రూపమువలె) పరమాత్మ! ‘త్వమ్’గా కనిపించే (నీవుగా కనిపించేది) అంతా కూడా ఆ తత్త్వనారాయణుడే!
ఈ దృశ్యమంతా ధ్యాన వస్తువు అయి ఉండగా, దీనికంతటికీ పరమై ధ్యాతగా, (ధ్యానము చేయువాడుగా), ధ్యానముగా (form of Avocation)గా ఉన్నది నారాయణుడే! ధ్యానించబడు సమస్తము ఆయనయే.
115. యచ్చ కించిత్ జగత్ సర్వం
దృశ్యతే శ్రూయతేఽపి వా
అంతర్బహిశ్చ తత్ సర్వం
‘‘వ్యాప్య నారాయణః’’ స్థితః।।
ఈ సర్వజగత్తు కూడా కించిత్ నుండి ఏదేది కళ్లకు కనబడుచున్నదో, వినబడుచున్నదో,.. ఇందలి బాహ్య (కనబడేది, వినబడేది) - అభ్యంతర (చూచేవాడు, వినేవాడు, మనోబుద్ధి చిత్త అహంకారములతో సహా) - ఇదంతా కూడా నారాయణుని పరివ్యాప్త - చమత్కారమే! నారాయణునికి అన్యముగా అంతరమునగాని, బాహ్యమునగాని ఏకించిత్ కూడా ఎక్కడా ఏదీ లేదు.
116. అనన్తమ్ అవ్యయమ్ కవిగ్ం
సముద్రే-న్తం విశ్వ శంభువమ్।
పద్మకోశ ప్రతీకాశగ్ం
హృదయం చ అపి అధో ముఖమ్।।
దేహములచేతగాని, జగత్తు ప్రదర్శనలచేతగాని- ప్రారంభ - ముగింపులను నవే లేనట్టివాడు అనన్తుడు;
మార్పు చేర్పులనునవే లేవు కాబట్టి అవ్యయుడు.
సర్వజ్ఞుడగుటచే కవి.
(ఈ జగత్తులు, జీవులు తరంగముల వంటివి అగుచుండగా) - సముద్రమునకు ఆవలివాడు (పరుడు).
విశ్వమునకు మంగళప్రదాత, అట్టి ఆ శ్రీమన్నారాయణుని - నా హృదయములో అధోముఖముగా ఉన్న ‘‘తామరపూమొగ్గ’’గా ధ్యానము చేయుచున్నాను.
117. అథో నిష్ట్యా - వితస్త్య అంతే
నాభ్యామ్ ఉపరి తిష్ఠతి।
జ్వాలమాలాకులం భాతి
విశ్వస్య ఆయతనం మహత్।
ఆలోచనలు భావములు, అనుభూతులు మొదలైనవి బయల్వెడలుచున్న పారమార్థిక (ఆధ్యాత్మిక) హృదయం గురించి:
-కంఠ పల్లమునకు (కంఠముడికి) క్రిందవైపుగా,
-బొడ్డుకు పైవైపుగా (4 బెత్తెల/12 అంగుళాలపైగా) పారమార్థిక (లేక) ఆధ్యాత్మిక ‘హృదయకోశము’ ఉన్నది. ఆ హృదయములో ‘‘జ్వాలమాల’’ వలె ఈ విశ్వమంతటికీ ఆధారభూతుడగు పరబ్రహ్మము/మహత్ బ్రహ్మము ప్రకాశించుచున్నది. ఇది దీపశిఖల వరుసతో ఆవృత్తమైనట్లు దేదీప్యమానంగా సంప్రకాశమానమై ఉన్నది.
118. సంతతగ్ం శిలాభిస్తు
లంబత్యా కోశ సన్నిభమ్।
తస్య అంతే సుషిరగ్ం సూక్ష్మం
తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్।।
అట్టి హృదయ కోశములో తామరపూమొగ్గ వలె వ్రేలాడు హృదయకమలము నలువైపులా నాడులతో వ్రేలాడుచున్నది. ఆ హృదయకోశమునకు చివరగా సూక్ష్మమైన ‘రంధ్రము’ (అను ఆకాశము) ఉన్నది. అట్టి సుషిరగము (లేక) సూక్ష్మ రంధ్రములో ఈ జగత్ సర్వము ప్రతిష్ఠితమైయున్నది. (బ్రహ్మప్రకాశమే సుషిరిగము). హృదయములోని శూన్యరూపమగు సూక్ష్మ రంధ్రములో లోకములన్నీ ఏర్పడినవై ఉన్నాయి.
119. తస్య మధ్యే మహాన్ అగ్నిః
విశ్వార్చిః విశ్వతోముఖః।
సో అగ్రభుక్ విభజన్ తిష్టన్
నాహారమ్ అజరః కవిః।
అట్టి హృదయాకాశము మధ్యగా మహాన్- అగ్ని. అదియే ప్రాణాగ్ని. అట్టి జఠరాగ్ని (లేక) ప్రాణాగ్ని విశ్వమంతా నిండిఉండి విశ్వమంతా వెలగించు చున్నది. ఆ అగ్ని మొట్టమొదట ఆహారమును స్వీకరించి, ఆహార సారమును వివిధ అవయవములకు పంచిపెడుతున్నది. అట్టి అగ్ని ‘జర’ లేనిది. నిత్యనూతనమైనది. అత్యంత శ్రేష్ఠమైనది. తాను దేనికీ ఆహారము కానట్టిది.
120. తిర్యక్ -ఊర్ధ్వమ్-అధః శాయీ రశ్మయః తస్య సంతతా।
సంతాపయతి స్వం దేహమ్, ఆపాద తల మస్తగః।।
అట్టి ప్రాణాగ్ని యొక్క కిరణములు శరీరంలో అడ్డంగాను, పైకి, క్రిందికి శరీరములో సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి. పాదముము నుండి మస్తకము (Foreface) వరకు వ్యాపించి శరీరమంతా వెచ్చగా ఉంచుచున్నది.
121. తస్య మధ్యే వహ్ని శిఖా, అణీయ ఊర్థ్వా వ్యవస్థితా।
నీలతో యద మధ్యస్థా, విద్యుల్లేఖేవ భాస్వరా।।
ఆ అగ్ని యొక్క అంతరమున అణుప్రమాణమైనట్టి ఒక అగ్నిశిఖ (అగ్నికణము) ఊర్థ్వముఖమైన జ్వాల కలిగి ఉంటోంది. ఆ అగ్నిజ్వాల నీలిమేఘముల మధ్యగా గల మెరుపు తీగ వలె ప్రకాశిస్తోంది. (సుషుమ్ననాడి).
122. నీవార శూకవత్ తన్వీ
పీతా భాస్వతి అణూపమా।
తస్యాః శిఖాయా మధ్యే
పరమాత్మా వ్యవస్థితః।।
స బ్రహ్మా। స శివః। స హరిః।
స ఇంద్రః। సో అక్షరః।
పరమః। స్వరాట్।।
ఆ మెరుపుతో కూడిన అగ్నిశిఖ (అగ్నికణం) ధాన్యపు గింజ యొక్క సూక్ష్మమైన ముల్లువలెఉండి, బంగారపు రంగుతో ప్రకాశమానమై యున్నది. (సుషమ్న అనబడు) అట్టి అత్యంత సూక్ష్మమగు మెరుపుతీగ - అగ్నిశిఖ చివర గల బంగారపు రంగులో మెరయు ముల్లువంటి స్థానములో (బ్రహ్మ రంధ్రములో) పరమాత్మ విశేషముగా సుప్రతిష్టితుడై, వ్యవస్థితుడై ఉన్నారు. (సుషిరగమ్ అంతరమ్ పరమాత్మా వ్యవస్థితః)
ఆ పరమాత్మయే సృష్టికర్తయగు బ్రహ్మ। సర్వ శుభములు, ఆనందములు, శ్రేయస్సులు కలుగజేయు శివుడు। సర్వమునకు సంరక్షకుడగు హరి। సర్వేంద్రియములకు అధి దేవత, నియామకుడు అగు ఇంద్రుడు। ఆయనయే అక్షరుడగు ఆత్మ। ఆయనయే సర్వమునకు ‘పరము’ అయినట్టి స్వయం ప్రకాశ-మానుడు। ఆయన కంటే అధికమైనది జగత్తులో ఎక్కడా ఏదీ లేదు.


14వ అనువాకము
ఆదిత్య మండలే పరబ్రహ్మోపాసనమ్
ఆదిత్య మండల రూపంగా పరబ్రహ్మమును ఉపాసించటము

123. ఆదిత్యో వా ఏష ఏతత్ మండలమ్ తపతి।
తత్రతా ఋచః। తత్ ఋచా మండలగ్ం స ఋచాం లోకో।
అథ య ఏష ఏతస్మిన్ మండలే ‘అర్చిః’ దీప్యతే,
తాని సామాని।
అట్టి ఆత్మానారాయణుడు స-ఉపాధికుడై,ఆదిత్యుడై ఆదిత్యమండలమంతా తన తేజస్సుచే నింపిఉంచుచున్నారు. ఆ ఆదిత్య మండల తేజస్సే ‘‘అగ్నిమీళే పురోహితే’’ - ఇత్యాది ఋక్కులచే వర్ణించబడుచున్నది.
ఆ ఆదిత్య మండల తేజోరూపమే ఈ జగత్తులను వెలిగించు తేజో విశేషము. లోకములన్నీ ఆ ఋచ-తేజస్సుచే నిండిఉన్నాయి.
అ ఆదిత్యమండల దీప్తిని ఈ జగత్తులన్నీ - ‘‘అథయ’’ అని సామవేదము గానము చేయుచున్నది.
స సామ్నాం లోకో, అథ య ఏష ఏతస్మిన్
మండలే అర్చిషి పురుషః। తాని యజూగ్ంషి।
స యజుషా మండలగ్ం।
స యజుషాం లోకః,
స ఏషా ‘‘త్ర య్యేవ విద్యా’’ - తపతి।
య ఏషో అంతరాదిత్యే హిరణ్మయః పురుషః।।
ఆత్మ భగవానుడగు సామ్నలోక మండల పురుషుని, యజోష-సాయుజ మండల పురుషుని అర్చించెదముగాక! ఈ విధంగా ఋగ్వేద మండల పురుషుని, యజుర్వేద (లోక) మండల పురుషుని, సామవేద మండల పురుషుని (భూ భూవర్ సువర్ లోక త్రయ మండల పురుషుల) త్రయీ ప్రదర్శనమే జగత్ ప్రదర్శనము.
సవితృ మండల - మధ్యవర్తినే (లేక) అంతరాదిత్య మండల పురుషునే సృష్టి కర్తయగు హిరణ్మయ పురుషునిగా వేదములు వర్ణిస్తున్నాయి.


15వ అనువాకము
ఆదిత్యమండల పురుష (లేక) ‘‘ఆత్మ’’ యొక్క సర్వాత్మకత్వము

15వ అనువాకము
ఆదిత్య పురుషస్య సర్వాత్మకత్వ ప్రదర్శనము
124. ఆదిత్యో వై→తేజ ఓజో;
బలం యశః చక్షుః శ్రోత్రమ్;
ఆత్మా మనో మన్యుర్మనుః;
మృత్యుః సత్యో మిత్రో;
వాయుః ఆకాశః;
ప్రాణో లోక పాలః;
కః కిం కం తత్ సత్యమ్;
అన్నమ్ అమృతో జీవో విశ్వః;
కతమః స్వయంభుః
బ్రహ్మైతత్ అమృత ఏష పురుష।।
ఏష భూతానామ్ అధిపతిః।
బ్రహ్మణః। సాయుజ్యగ్ం।
స లోకతామ్ ఆప్నోతి
ఏతా సామేవ
దేవతానాగ్ం సాయుజ్యగ్ం
సార్‌ష్టితాగ్ం
సమాన లోకతామ్
ఆప్నోతి
య ఏవం వేద।।
ఇతి ఉపనిషత్।
ఆదిత్యుడే సర్వాత్మకుడు. సర్వజగత్తుకు ఆత్మస్వరూపుడు. ఆయనయే సూర్యునిలో కనిపించే తేజస్సు. భూమిలో ప్రవేశించే ఓజోశక్తి. దేహముల లోని బలము. శరీరములలో ప్రకాశరూపమగు యశోశక్తి. కళ్లలోని చూపుశక్తి. చెవులలోని వినికిడి శక్తి. జీవాత్మశక్తి (శరీరిగా శరీరమును జీవింపజేయు జీవనశక్తి) కూడా. ఆయనయే మనోశక్తి। ఆయనయే మనోన్మనస్సు (మనస్సుకు ఆధారమైన మనస్సు), మృత్యువు (మార్పు), సత్యము, మిత్రత్వము (సూర్యుడు), వాయువు, ఆకాశము కూడా. ఆయనయే జీవులలోని ప్రాణశక్తి, లోక పాలకులు కూడా. అంతా ఆ ఆత్మపురుషుని ప్రత్యక్ష రూపములే. ‘ఎవ్వరూ? ఎందుకూ? ఎప్పుడూ? - వీటి పరాకాష్ట సమాధానము ఆ పరమపురుషుడగు ఆత్మయే!
అనిర్దేశ్యమగు ఏదేది ఎక్కడెక్కడెక్కడ ఎట్లా ఏమేమిగా ఉన్నదో, అదంతా ఆత్మయే! ఇంద్రియములకు ఆహారముగా (అన్నమ్) అగుచున్నదంతా ఆత్మయే! మృతమునకు ఆధారమగు అమృతము, జీవుడు (experienear), ఆ జీవునికి అనుభవమగుచున్న ఈ విశ్వముగా ఏదేది అగుపిస్తోందో - అదంతా ఆత్మయే! ఏది తనకు తానే జనన కారణమగుటచే ‘‘స్వయంభువు’’ వో-అదీఆత్మయే! అంతా ఆ పరమపురుషుడగు బ్రహ్మమే! ఆయనయే సర్వభూత జలమునకు అధిపతి. ఆ ‘సాయుజ్యము’ అనుబడు దానికి అర్థము ఆ పరబ్రహ్మమే! కేవలాత్మయే! ఆత్మాఽహమ్ స్వానుభవమే!
అట్టి అదిత్యో పాసన రెండు విధములు.
సాలోకతము : దేవతా నిర్మితమగు ఈ లోకములలో ఏవేవో స్థితి-గతుల సంబంధమైన ఆశయము.
సాయుజ్యము : ‘‘వీటిన్నిటికీ ఆధారమగు కేవలాత్మయే నేను’’ - అను మార్గమునకు దారితీయు ఉపాసన.
అట్టి ఆదిత్యుని పరబ్రహ్మతత్త్వము ఎరిగి, ఉపాశించువాడు లోక వ్యవహారములను దాటి ఆదిత్యస్వరూపము సంతరించుకోగలవాడు.


16వ అనువాకము
శివోపాసనా మంత్రములు

125. నిధన పతయే నమః।
నిధన పతాంతికాయ నమః।
ఊర్ధ్వాయ నమః
ఊర్ధ్వ లింగాయ నమః।।
హిరణ్యాయ నమః।
హిరణ్య లింగాయ నమః।।
విశ్వలయమునకు కారకుడగు ప్రభువుకు నమస్కారము. బహుధనపతికి నమస్కారము.
విశ్వమునకు ఆవల (ఆంతికము)గా గల స్వామికి నమస్కారము. మరణాధిపతియగు యముని శాసించు శివునికి నమస్కారము.
ఇంద్రియములకు, జగత్తులకు ఊర్ధ్వమున ఉన్నవానికి, ఊర్ధ్వమైనదంతా తానే అయి ఉన్న స్వామికి, (ఆభరణములన్నిటిలో అంతః బహి స్వరూపమైయున్న హిరణ్యము వలే) ఏకస్వరూపుడై కేవలీస్వరూపుడైనవానికి నమస్కారము.
జీవులకు శ్రేయస్సు, ఆనందము, సంపద ప్రసాదించు శివునికి నమస్కారము. ఆనంద కేవలీ లింగస్వరూపునికి నమస్కారము.
సువర్ణాయ నమః
సువర్ణ లింగాయ నమః।।
దివ్యాయ నమః।
దివ్య లింగాయ నమః।।
భవాయ నమః।
భవలింగాయ నమః।।
శర్వాయ నమః।
శర్వలింగాయ నమః।
సువర్ణ స్వరూపుడు, సువర్ణమునకు ఆధారము అయి, మూల ప్రకృతి స్వరూపుడు అగు పరమాత్మకు నమస్కారము.
దివ్యుడు అయినవాడు, దివ్యత్వమునకు ఆధారమైనవాడు అగు శివభగవానునికి నమస్కారము.
భవము అయినట్టి (ఉనికి గల) సమస్తము (ఉన్నదంతా) తానై, ఆ ఉన్న దానికంతటికీ ఆధారమైయున్న స్వామికి నమస్కారము.
శర్వము (రాత్రి-ప్రకృతి) తానై, అద్దాని లయకారునికి, మూలతత్త్వ స్వరూపునికి నమస్కారము.
శివాయ నమః।।
శివలింగాయ నమః।।
జ్వలాయ నమః।
జ్వల లింగాయ నమః।।
ఆత్మాయ నమః।
ఆత్మలింగాయ నమః।।
పరమాయ నమః।
పరమ లింగాయ నమః।।
ఏతత్ సోమస్య సూర్యస్య
సర్వలింగగ్ం స్థాపయతి
పాణి మంత్రం పవిత్రమ్।।
శివునికి, శివలింగ (మూల, కేవల) స్వరూపునికి నమస్కారము.
అగ్నికాంతులతో వెలుగొందుస్వామికి, జ్వలనమునకు (వెలుగుటకు) ఆధారమైన స్వామికి నమస్కారము.
సర్వజీవుల అంతర్యామియగు ఆత్మస్వరూపునకు, ఆత్మాధారుడైన ఆత్మదేవునికి నమస్కారము.
సర్వమునకు ‘‘పరము’’(Beyond) అయినవానికి, సర్వమునకు ఆధారమై యున్న స్వామికి నమస్కారము.
సోమ-సూర్య-అగ్ని లింగ స్వరూపుని స్వస్వరూపమగు హృదయమున స్థాపించి, పాణిమంత్రముగా అభిషేకిస్తూ పవిత్రత పొందుచున్నాము.
(ఇతి పాణి మంత్రేణ జలము-పాలు-పంచరసములు (ఇంకా) మనో బుద్ధి చిత్త అహంకారములు మొదలైనవాటితో) అభిషేకము సమర్పించుచున్నాను.


17వ అనువాకము
శివపంచముఖోపాసన మంత్రం
పశ్చిమ అభిముఖము అగు సద్యోజాత శివముఖమునకు నమస్కారము.

126. సద్యోజాతం ప్రపద్యామి।
సద్యోజాతాయవై నమో నమః।
భవే భవేన అతి-భవే భవస్వమామ్।
భవోద్భవాయ నమః।।
సద్యోజాతమ్ : కేవల సత్‌స్వరూపుడవై సర్వదేహులలో ‘‘నేను ఉన్నాను’’ అను సత్-ఆనందరూపంగా ప్రభవిస్తున్న ఓ సద్యోజాతముఖా! మీకు నమస్కరిస్తున్నాము. ‘భవము’ అను మీ స్వభావము నుండి ఈ జగత్తులను ఉనికిని ప్రసాదిస్తూ భవముచే భావరూపంగా అతిభవులై (ఉనికికే ఉనికి రూపుడు) అయి ఉన్నారు. నాయందు భావస్వరూపులై, భవమునకు ఉద్భవకరమగు మీ సద్యోజాతముఖమును ఆరాధిస్తున్నాము. భావనారాయణా! నమస్కారము. మీరు నాకు సద్యోముక్తి ప్రసాదించగలరు.


18వ అనువాకము
ఉత్తరాదిశాభిముఖులగు వామదేవ శివముఖమునకు నమస్కరిస్తున్నాము!
శివస్వామి ఉత్తర ముఖోపాసన

127.వామదేవాయ నమో।
జ్యేష్ఠాయ నమః।
శ్రేష్ఠాయ నమో
రుద్రాయ నమః।
కాలాయ నమః।
కల వికరణాయ నమో।
బల వికరణాయ నమో।
బలాయ నమో।
బలప్రమాథనాయ నమః।।
సర్వభూత దమనాయ నమో।
మనోన్మనాయ నమః।।
- వామదేవా - నమో నమః।
- సర్వలోకములలో, సర్వదేహములలో అన్నిటికంటే మునుముందే జ్యేష్ఠుడవై ఉన్న మీకు నమో వాక్కములు।
- మీ సర్వశ్రేష్ఠత్వమునకు నమస్కారము।
- జ్ఞానాగ్నిచే అన్యమైనదంతా భస్మము చేసి అలంకరాముగా ధరించు మీ ‘రుద్రత్వము’ను ఉపాసిస్తున్నాము।
- కాల స్వరూపులై సర్వమునకు సృష్టిస్థితి లయకారకులగు మిమ్ము ఆరాధిస్తున్నాము।
- కల - కల్పనలను తొలగించి సత్యమును ద్యోతకము చేయు కలవికరణ సద్గురు స్వరూపమును ఆరాధిస్తున్నాము.
- అసురీ స్వభావ బలమును హీనపరచి మమ్ము రక్షించు మహాబల స్వరూపమునకు ప్రణమిల్లుచున్నాము.
- మమ్ములను బలవంతులనుగా తీర్చిదిద్దు బల, ప్రమధన విన్యాసమునకు ప్రణామము.
- పంచభూతములను నియమించు స్వామీ! నమః।
-మనస్సుకు జనన స్థానమగు (ఆలోచనలకు ఉత్పత్తి స్థానమగు) మనో - ఉన్మనీస్వరూప శివస్వామికి భక్తి-ప్రపత్తులు. కేవలీ స్వరూపా! నమో నమః!


19వ అనువాకము
శివభగవానుని దక్షిణముఖ స్తుతి
దక్షిణాభిముఖుడగు అఘోర శివముఖ - స్థుతి - రుద్రరూప స్థుతి

128. అఘోరేభ్యో- అథ ఘోరేభ్యో।
ఘోర ఘోర తరేభ్యః
సర్వేభ్యః సర్వ శర్వేభ్యో
నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః।।
స్వామీ! మీ యొక్క మనో బుద్ధి చిత్త అహంకార - సూక్ష్మ రూపమునకు పాంచ భౌతిక స్థూల తత్త్వమునకు నమస్కారము. స్థూల-సూక్ష్మములకు ఆవల గల మీ యొక్క కేవలాంశ ముఖమునకు నమస్కారము.
- సర్వము నీవే అయి ఉన్న నీ యొక్క సర్వత్వమునకు, సర్వత్రా వేంచేసి సర్వమును ప్రకాశింపజేయు రుద్ర రూప మహత్ తేజ ఘోరాఘోరములకు వందనములు. ప్రకృతి స్వరూపా! నమో నమః।


20వ అనువాకము
స్వామి యొక్క తూర్పుముఖ స్తుతి
పాక్ వక్త్ర (తూర్పు అభిముఖ) స్తుతి

129.తత్పురుషాయ విద్మహే।
మహా దేవాయ ధీమహిః।
తన్నో రుద్రః ప్రచోదయాత్।।
ఈ జీవుని ఇహస్వరూపము నాటకంలో నటుని నటనా సందర్భమైన సంబంధముల వంటివి. పరస్వరూపమో - ఆ నటుని వ్యక్తిగత నటనా చాతుర్య స్వరూపము వంటిది. అట్టి ఇహపురుషత్వమునకు ఆధారమైన మా యొక్క ‘‘తత్ పురుషత్వము’’ ను ఎరుగుటకై మీ యొక్క తూర్పు ముఖ విభవమును ఉపాసిస్తున్నాము. ఓ మహాదేవా! మిమ్ములను బుద్ధితో ఆరాధిస్తున్నాము. మా బుద్ధులను వికశింపజేయ ప్రార్ధిస్తున్నాము. తత్ త్వమ్ స్వరూపా! నమో నమః।


21వ అనువాకము
ఊర్ధ్వ ఈశానముఖ - ఈశ్వరు సర్వేశ్వరోపాసన
స్వామి యొక్క ఊర్ధ్వ ముఖ స్తుతి

130. ఈశానః సర్వ విద్యానామ్।
ఈశ్వరః సర్వభూతానామ్।
బ్రహ్మాధిపతిః। బ్రహ్మణో అధిపతిః।
బ్రహ్మా శివో మే అస్తు ‘‘సదాశివోమ్’’।।
(సదా శివ ‘ఓం’)
స్వామీ! ఈశ్వర సర్వతోముఖ స్వరూపా! మీ ఈశానముఖము సర్వవిద్యాప్రదాత. సర్వేశ్వరులై సృష్టికర్త అగు బ్రహ్మదేవుని నియమించినవారు. బ్రహ్మకు, బ్రహ్మము యొక్క ఉపాసనకు, వేదములలోని ఉపాసనా క్రమములగు బ్రాహ్మణములకు పరిలక్ష్యమైనట్టి స్వామీ! మా పట్ల బ్రహ్మ-శివతత్త్వము సిద్ధించినవగుగాక!, మేము సదాశివ స్వరూపులమై ప్రణవ స్వరూపములమై బ్రహ్మానందమొందెదముగాక! సదా శివేశ్వరా! నమో నమః।


22వ అనువాకము
నమస్కార పరమార్థ మంత్రము

131. నమో హిరణ్య బాహవే।
హిరణ్య వర్ణాయ, హిరణ్య రూపాయ,
హిరణ్య పతయే,
అంబికా పతయ
ఉమాపతయే
పశుపతయే నమో నమః।।
బంగారు బాహువులు గల, బంగారు రంగులో మెరుస్తూ, బంగారు రంగుతో బంగారమునకు పతి అగు రుద్రునికి నమస్కారము. సృష్టిని బాహువులుగా గలవారు. సమస్త సృష్టి మీ వర్ణనమే (Your own discription). సృష్టి రూపులై - సృష్టికి పతి, అంబికాపతి, ఉమాపతి, పశుపతి అగు రుద్రభగవాన్ ! నమో నమో నమో నమః।।
పశుపతయే! నమో నమః।


23వ అనువాకము

132. ఋతగ్ం సత్యం పరంబ్రహ్మ
పురుషం కృష్ణ పింగళమ్।
ఊర్ధ్వ రేతం విరూపాక్షం
విశ్వరూపాయ వై
నమో నమః।।
ఋగ్వేద ఋక్కులచే గానము చేయబడుచున్నట్టి వారు, బుద్ధికి కేవల స్వరూపమై అనుభవమగు వారు, సత్‌స్వరూపులు, సర్వ ఇహములకు ఆవల ఆధారమైయున్న పరబ్రహ్మస్వరూపులు, ఈ జగత్తంతా తమ పురుషకారముగా కలిగియున్న మూల పురుషులు, నలుపు-గోరజము రంగులను ప్రదర్శించువారు, సర్వమునకు ఊర్థ్వముగా ప్రకాశించువారు, నామరూపాత్మకమైన దానికంతటికీ ఆవల ‘‘ప్రతిష్ఠిత’’ కలవారు, ఈవిశ్వమంతా తమ రూపముగా కలవారు అగు రుద్రమహాదేవునికి నమస్కరిస్తున్నాము. విశ్వరూపా! నమో నమః।


24వ అనువాకము

133. సర్వో వై రుద్రః। తస్మై రుద్రాయ నమో అస్తు।
పురుషో వై రుద్రః। సత్ సన్మయో(సన్మహో) నమో నమః।
విశ్వం భూతం భువనం చిత్రం
బహుధా జాతం జాయమానం చ యత్,
సర్వోహి ఏష రుద్రః।
తస్మై రుద్రాయ నమో అస్తు।।
చూచువానిని చూస్తూ ఉన్నవాడు కాబట్టి రుద్రుడు. చూచువాడు- చూడ బడునది తానే అయి ఉండటం చేత ఈ సమస్తము రుద్రుడే! అట్టి సర్వముతానే అయి ఉన్న రుద్రనికి నమస్కారము. ఉత్తమ-మధ్యమ-ప్రధమ పురుషుల లోని సత్ - మహో - మహత్ రూపుడగు పరమపురుషునికి నమో నమః।
-ఈ విశ్వము యొక్క భూత(భౌతిక, జడ)విభాగము, భువర్ (ప్రాణ,చైతన్య) విభాగము, సువర్ (చేతనాచేతన - విచిత్రములగు) మనోబుద్ధి చిత్తవిభాగములు, అనేకమైన జన్మల వ్యవహారములు, అనేక జీవుల పరస్పర వ్యవహారములు - సమస్తము, సర్వము రుద్రతత్త్వమే. అట్టి సర్వము తానైయున్న రుద్రభగవానునికి నమస్కారము. రుద్రాయ నమః।


25వ అనువాకము

134. కద్రుద్రాయ, ప్రచేతసే మీఢుష్టమాయ తప్యసే,
వోచేమ శంతమగ్ం హృదే సర్వో హి ఏష రుద్రః।
తస్మై రుద్రాయ నమో అస్తు।।
సర్వేసర్వత్రా సర్వ రూపములుగా ప్రసిద్ధుడు, పకృష్ట జ్ఞానానంద స్వరూపుడు, సర్వదా స్తుతింప తగినవాడు, సర్వ హృదయవర్తి- అగు రుద్రుని స్తుతించుచున్నాము. సర్వత్రా సమస్వరూపుడై ప్రకాశించుచున్న రుద్ర భగవానునికి నమస్కరించుచున్నాము. రుద్రాయ నమోస్తు।


26వ అనువాకము

135. యస్య వైకంకతి
అగ్నిహోత్ర హవణీ భవతి,
ప్రత్యేవా అస్య ఆహుతయః
తిష్ఠంతి। అథో ప్రతిష్ఠిత్యై।।
ఎక్కడ ‘వికంకతి’ (పుల్లవెలగ కొయ్య గరిట / స్రుక్కు) ఉంటుందో, అక్కడ ఆహవనీయ-అగ్నిహోత్రము, అగ్నియజ్ఞములు కూడా ఉండటం జరుగగలదు. సుక్కు స్రువముతో చేయు అగ్న్యోపాసనలు త్వరితంగా ఫలప్రదము గలవు. అనుష్ఠాతకు (ఆహుతి ఇచ్చువానికి) ప్రత్యేకమైనవన్నీ సిద్ధించగలవు. అందుచేత వికంకత వృక్షము (పుల్ల వెలగ వృక్షము) ఉన్న చోటు అతి శ్రేష్ఠమైనది.


27వ అనువాకము

136. కృణుష్వపాజ ఇతి పంచ।।
(‘‘సంహిత’’ యొక్క ‘ప్రధమ కాండ’లో గల) ‘కృణుష్వపాజ’ మొదలైన పంచఋక్కులు శ్రద్ధగా పఠించవలసినవి.


28వ అనువాకము
భూదేవతా నమస్కారము

137. అదితిః దేవా గంధర్వా మనుష్యాః
పితరో సురాః తేషాగ్ం
సర్వ భూతానాం మాతా।
మేదినీ। మహతా। మహీ। సావిత్రీ।
జగత్ ఉర్వీ। పృథివీ। బహులా!
- దేవతలకు, గంధర్వులకు, మనుష్యులకు, పితరులకు (పితృదేవతలకు), సురులకు, ఆశ్రయమై ఉన్నావు కాబట్టి సర్వజీవులకు తల్లీ! సర్వదేహములకు రక్త-మాంస-శక్తి ప్రదాత కాబట్టి మేదినీ! మహత్ వస్తువులన్నీ ప్రసాదించు మహతా! సత్-విత్ జ్ఞానప్రదాత, ఆహార ఓషధ ప్రదాత అగు సావిత్రీ! మహిమాన్వితురాలవగుటచే మహీ! జగత్‌కు ఆధారము కాబట్టి ఉర్వీ! విస్తారమైనది కాబట్టి పృథివీ!
విశ్వాభూతా కతమ్ ఆకాయా,
సా సత్యేతి। అమృతేతి।
వసిష్ఠః।।
సకలురకు ఆశ్రయభూతవు, ఆధారమువు, అత్యంత శ్రేష్ఠము కాబట్టి సకలాధారీ! విశ్వమునకు సమాశ్రయము కాబట్టి విశ్వభూతా! అనేక సస్యములచే విస్తారమైన భూదేవీ (కతమ)।
సర్వజీవుల సుఖస్వరూపము, సర్వప్రాణుల పరిణతము అగు భూమి బ్రహ్మమే! కనుక సత్యస్వరూపం! అమృత స్వరూపము. సర్వులయందు ఉనికి కలిగినది. అట్టి భూదేవతకు నమస్కరించుచున్నాము. (అని నేలను కళ్ళకు అద్దుకోవలెను).


29వ అనువాకము

138. సర్వదేవతా ఆపః స్తోత్రం
ఆపో వా ఇదగ్ం సర్వం।
విశ్వా భూతాని ఆపః। ప్రాణా వా ఆపః।
పశవన్ ఆపో। అన్నమ్ అపో।
అమృతమ్ ఆపః। సమ్రాట్ (సమ్రాడ్) ఆపో।
విరాట్ (విరాడ్) ఆపః। స్వరాట్ ఆపః।
ఛందాగ్ంసి ఆపో। జ్యోతీగ్ంషి ఆపో।
యజూగ్ంషి ఆపః। సత్యమ్ ఆపః।
సర్వా దేవతా ఆపో। భూర్భువస్సువః। ఆప ‘ఓం’।
అపః (జల) స్తుతి (జీవులందరూ తరంగాలవంటి వారు అయితే, పరమాత్మ జలము వంటివారు)
ఈ సర్వము ఆపః (జల) స్వరూపమే! ఈ విశ్వములోని దేహములన్నీ ఆపః స్వరూపమే! ప్రాణములు జలస్వరూపమే!
పశువులు (జంతుజాలమంతా) జలమయమే! అన్నము, అమృతము, విరాట్ విశ్వము, స్వరాట్ (Matter and sense of - I) జలమయమే.
వేదములు, జ్యోతిర్మండలము, యజ్ఞ యాగ క్రతువులు, సత్యము, సర్వదేవతలు, భూ-భువర్-సువర్ లోకములు కూడా ఆపః స్వరూపమే! అందుచేత, జలము ఓంకార స్వరూపముగా ఉపాసించుచున్నాము. (అని స్తుతిస్తూ అవపోసన జలము స్వీకరించాలి).


30వ అనువాకము
సంధ్యావందనము - మధ్యాహ్న జలాభిమంత్రము

139. ఆపః పునస్తు పృథివీం
పృథివీ పూతా పునాతు మామ్।
పునస్తు బ్రహ్మణస్పతిః।
బ్రహ్మపూతా పునాతుమామ్।
యత్ ఉచ్ఛిష్టమ్, అభోజ్యం,
యద్వా దుశ్చరితం మమ,
సర్వం పునస్తు మామ్
ఆపో అసతాం చ
ప్రతిగ్రహగ్ం స్వాహా।
ఈ జలము నన్ను పునీతుని చేయునుగాక! శుద్ధమగు పృథివీ, జలము నన్ను పవిత్రునిగా తీర్చిదిద్దునుగాక! అందుకై జలదేవతకు, (వరుణునికి) నమస్కరించుచున్నాను.
పవిత్రాత్ములగు బృహస్పతి, బ్రహ్మభగవానుడు నన్ను పునీతునిగా, పవిత్రునిగా సరిదిద్దునుగాక!
ఇతరులకు చెందినది, అభోజ్యమైనది స్వీకరించిన నా దోషములు, నా యొక్క దుశ్చరితములు, దుష్ప్రవర్తనలు - ఇవన్నీ దేవతల కరుణచే తొలగునుగాక! నేను స్వీకరిస్తున్న ఈ జలము అసత్తు నుండి, సర్వ శారీరక-మనో దోషముల నుండి నన్ను పవిత్రుని, పునీతునిగా చేయుగాక! అందుకొరకై ఆజ్యము (హితము)ను అగ్నికి ‘స్వాహా’ అని పలుకుచూ సమర్పిస్తున్నాను.


31వ అనువాకము
సాయం సంధ్యా జలపానార్థమంత్రము

140. అగ్నిశ్చ మామన్యుశ్చ
మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతామ్।
యత్ అహ్నా(త్) పాపమ్ అకార్షమ్,
మనసా వాచా హస్తాభ్యాం
ద్భ్యామ్ ఉదరేణ శిశ్నా
అహః తదవలుంపతు,
యత్ కించి(త్) దురితం మయి,
ఇదమ్ అహమ్ మామ్
అమృత యోనౌ ‘సత్యే’ జ్యోతిషి, జుహోమి స్వాహా।
సాయం సంధ్యను అనుష్ఠిస్తూ చేసే జలపానార్థ మంత్రము
అగ్నిదేవుడు, మన్యుదేవత, మన్యుపతి- వీరంతా నాచే నిర్వర్తించబడిన పాపకార్యముల నుండి దోషనివృత్తి చేస్తూ నన్ను రక్షించ వేడుకొనుచున్నాను.
నేను మనస్సుతో, వాక్కుతో, ఈ చేతులతో, కాళ్లతో, పొట్టచే, అన్యాయార్జిత ఆహారముతో తెలిసీ - తెలియక ఏఏ పాపములు పంగలంతా చేసియున్నానో అట్టి చిన్న పెద్ద దురితములన్నీ తొలగును గాక! అహః అభిమానదేవత - నాయీ ఆహుతులను స్వీకరించి - (దురితఫలములను తొలగించి) నన్ను రక్షించి, పవిత్రుని చేయునుగాక! నేను సమర్పించు ఆహూతులు దేవతలను చేరుచూ - పరమసత్యమగు అమృత యోని ప్రకాశమునకై తోడగునుగాక! ఓ దేవతలారా! నా ఈ ఆహూతులను స్వీకరించండి.


32వ అనువాకము
ప్రాతః సంధ్యా జలపాన అనువాక మంత్రము

141. సూర్యశ్చ మామన్యుశ్చ
మన్యుపతయశ్చ మన్యు కృతేభ్యః, పాపేభ్యో రక్షంతామ్।
యత్ రాత్రియా పాపమ్ అకార్షమ్
మనసా వాచా హస్తాభ్యామ్
పద్భ్యామ్ ఉదరేణ శిశ్నా, రాత్రిః తత్ అవలుంపతు।
యత్కించ దురితం మయి, ఇదమ్ అహమ్ మామ్
అమృత యోనౌ సూర్యే, జ్యోతిషి జుహోమి స్వాహా।
సూర్యభగవానుడు, మనువు, మన్యుపతి (పరమాత్మ) - నాచే చేయబడిన మనోవాక్ కాయ దోషముల నుండి నన్ను రక్షించెదరుగాక!
మనసా, వాచా, చేతులతో, కాళ్లతో, పొట్టతో శిశ్నముతో చేసియున్న దోషభూయిష్ట కర్మల ఫలములు రాత్రి (చీకటి) తెల్లవారుసరికి తొలగిపోవు గాక! సూర్యుడు, మన్యుడు, మన్యుపతి నా దోషములు తొలగించెదరుగాక!
జ్యోతి స్వరూపుడగు సూర్యుడు నా యొక్క చిన్న-పెద్ద సమస్త దురితములను కూడా పోగొట్టి అమృతమగు ఆత్మ భావనయందు ప్రవేశింపజేయుటకై ఆయనకు ఈ ఆహూతులను సమర్పిస్తున్నాను.


33వ అనువాకము

142. ‘ఓం’ ఇతి ఏకాక్షరమ్ (ఏకమ్ అక్షరమ్) బ్రహ్మ।
‘అగ్నిః’ దేవతా! ప్రణవస్య ఋష్యాది।
‘బ్రహ్మ’ ఇతి ఆర్షమ్।
గాయత్రం ఛందం
పరమాత్మం స(స్వ)రూపమ్
సాయుజ్యం వినియోగమ్।।
‘ఓం’ అను అక్షరమును → అఖండ, సర్వగత ఆత్మకు సంజ్ఞ.
- అనేకముగా కనిపిస్తూ ‘ఏకమే’ అయి ఉన్నట్టి తత్త్వముయొక్క సూచన.
ఓంకారము-మార్పు - చేర్పులకు ఆవల ఆరెండింటికీ అతీతమై, అక్షరమైయున్న
ఆత్మతత్త్వమును-రూపముగాను, ఆశయముగాను కలిగియున్నది. అట్టి ‘ఓం’ అక్షర ఆత్మోపాసనకు…,
దేవత→ అగ్ని! సృష్టికర్తయగు, వేదపురుషుడగు బ్రహ్మయే-ఆదిపురుషుడు. స్వరూపసిద్ధి-పరమాత్మయే. మంత్ర సిద్ధికై ఛందస్సు- ‘గాయత్రీ’।


34వ అనువాకము
త్రిసంధ్యా గాయత్రీ ఆవాహన మంత్రము

143. ఆయాతు, వరదాదేవీ!
అక్షరమ్ బ్రహ్మ సమ్మితమ్।
గాయత్రీం ఛందసాం
మాతే! ఇదం బ్రహ్మ జుషస్వ మే।
యత్ అహ్నాత్ కురుతే పాపం,
తత్ అహ్నాత్ ప్రతిముచ్యతే।
యత్ రాత్రియాత్ కురుతే పాపం,
తత్ రాత్రియాత్ ప్రతిముచ్యతే।
సర్వవర్ణే। మహాదేవి। సంధ్యా విద్యే। సరస్వతీ!
‘ఓం’ అను అక్షర - పరబ్రహ్మ స్వరూపిణివగు శ్రీగాయత్రీ దేవీ! సర్వసిద్ధి ప్రదాత అయినదానవు. నీకు సుస్వాగతము. ‘‘బ్రహ్మము అనగా ఇది’’ - అనే నిశ్చల - నిశ్చిత జ్ఞానమును ప్రసాదించుదానవు.
నిన్ను ఛందోబద్ధమగు గాయత్రీ మంత్రము ద్వారా ఉపాసించుచున్నాము. సద్గురువువై బ్రాహ్మీతత్త్వము యొక్క సువిదితము కొరకు నిన్ను అనుష్ఠించుచున్నాను.
నీవు తల్లివి. తల్లికి తప్పే కనిపించదు. బ్రహ్మతత్త్వము ఎరుగుటకు నా యొక్కదోషములు అడ్డు వస్తూ ఉండవచ్చుగాక. అయితే, జననివగు నిన్ను ఆశ్రయించి ఉపాసించటము ఒక ఔషధము. ఏ రాత్రిపగలు దోషములు ఆ రాత్రియే నీ అనుష్ఠానముచే తొలగిపోవును గాక.
అమ్మా! నిన్ను నేను ఉపాసిస్తూ ఉన్నప్పుడు సర్వదేవతా వర్ణనలు అంతర్లీనమై ఉన్నాయి. ఆలోచ-ఆలోచనల మధ్య ఆలోచనారహిత స్వరూప విద్యవు కాబట్టి సంధ్యా విద్యవు. సత్-విత్ ఆత్మతత్త్వము నందు రమించుదానవు కాబట్టి ‘‘సరస్వతివి’’.


35వ అనువాకము

144. ఓజోఽసి। సహోఽసి। బలమసి। అహ్రాజోఽసి।
దేవానాం ధామ నామాఽసి!
విశ్వమసి! విశ్వాయుః!
సర్వమసి! సర్వాయుహుః!
అభిభూరోం!
అమ్మా!గాయత్రీ మాతా! నీవు భూమిలో ఓజస్వరూపిణిగా, ఓషధ స్వరూపిణిగా ఓజో శక్తివి! సర్వజీవరాశులను భరించు సహనశీలివి. సర్వదేహములలో వైశ్వానరశక్తిగా బలస్వరూపిణివి! సర్వత్రా అగ్నిశక్తివై ప్రకాశించు వీహ్రాజమాన దీప్తివి! దేవతలకు ధామమగు దేవలోకేశ్వరివి. ఈ విశ్వమంతా నీ రూపముగా కలదానవు. సర్వజగత్ రూపిణివి. విశ్వరూపిణివి. ఈ విశ్వమును ఉజ్జీవింపజేయు ఆయుః స్వరూపిణివి! కాలస్వరూపిణివి.
గాయత్రీమ్ ఆవాహయామి।
సావిత్రీమ్ ఆవాహయామి।
సరస్వతీమ్ ఆవాహయామి!
ఛన్దర్షీమ్ ఆవాహయామి।
శ్రియమ్ ఆవాహయామి।
బలం ఆవాహయామి గాయత్ర్యా।
గాయత్రీ ఛందో। విశ్వామిత్ర ఋషిః
సవితా దేవతా।
అగ్నిః ముఖమ్। బ్రహ్మా శిరో।
విష్ణుః హృదయగ్ం।
రుద్రః శిఖా
పృథివీ యోనిః।
ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన
సమాన-సప్రాణాః
శ్వేతవర్ణా।
సాఖ్యాయనసగోత్రా! గాయత్రీ।
చతుర్విగ్ంశత్(24) అక్షరా।
త్రి (3) పదా! షట్ (6) కుక్షిః।
పంచ (5) శీర్ష - ఉపనయనే
వినియోగః।
విశ్వాయువువు. సర్వము నీ ప్రత్యక్ష సంప్రదర్శనమే! సర్వము నీవే అయి ఉన్నావు. సర్వము యొక్క రాకపోకల ప్రేరేపకురాలివిగా సర్వాయువు! మా అందలి దోషములను పోగొట్టు నిర్మలము చేయు అభిభూరివి! సర్వమునకు ఆత్మవు.
అట్టి - గాతయత్ త్రాయతే యస్మాత్- గానము చేసినంత మాత్రం చేత మమ్ములను రక్షించే - గాయత్రీ దేవిని ఆహ్వానిస్తున్నాము. సత్ - విత్ - రతివగు సావిత్రీవి, సత్ - రస స్వరూపిణివగుటచే సరస్వతివి అగు నిన్ను ఆహ్వానిస్తున్నామమ్మా! ఇంకా ఛందస్సు ప్రవచించు ఋషిని ఆరాధిస్తూ ఆహ్వానిస్తున్నాం. శ్రేయోదాయని బలప్రదాతవగు గాయత్ర్యా - గాయత్రీ! సుస్వాగతం!
ఋషి→ విశ్వామిత్రుడు! దేవత → సత్+విత్ → సవిత్రు (సూర్యుడు)। ముఖము→అగ్ని। శిరస్సు→బ్రహ్మ। హృదయం-విష్ణువు। శిఖ → రుద్రుడు।
యోని → ఈ పృథివి;
దేహములోని ప్రాణేశ్వరివి।
ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన; సమాన స్వరూపిణి। విశ్వములోని సప్రాణస్వరూపిణీ! శుద్ధ సాత్విక శ్వేతస్వరూపిణీ। సాంఖ్య శాస్త్ర (దేహ-దేహితత్త్వ విభజన శాస్త్ర) స్వరూపిణివి। సాంఖ్యాయనస
గోత్రి। గాన స్వరూపిణి-గాయత్రీ। 24 అక్షరముల మంత్ర స్వరూపిణి।
(1) జాగ్రత్-స్వప్న-సుషుప్తులు (2) జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములు (3) కార్యకారణ కర్తృత్వములు (4) ద్రష్ట దర్శన దృశ్యములు (5) పూరక రేచక కుంభకములు- అనే త్రిపదములు (3 పాదములు) గలది। షట్ వేదాంగములు (శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్తము; జ్యోతిషము, కల్పము) కలది। (మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా) - 6 చక్రములు కుక్షియందు కలది; 5 ముఖములు (పంచభూతములు) గలది - అగు గాయత్రీ దేవిని సాయుజ్యము కొరకై ఆత్మసాన్నిధ్యము కొరకై వినియోగించుచున్నాము.
ఓం భూః। ఓం భువః।
ఓగ్ం సువః। ఓం మహః।
ఓం జనః। ఓం తపః। ఓగ్ం సత్యం।
ఓం తత్ సవితుః వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి।
థియోయోనః ప్రచోదయాత్।
ఓం ఆపో జ్యోతీ రసో, అమృతం బ్రహ్మ
భూః భువః సువః ‘ఓం’।। (భూర్భువస్సువః ‘ఓం’)
గాయత్రీ మంత్రము : సప్త ఊర్థ్వ లోకములగు భూ, భువర్, సువర్, మహర్, జనో, తపో, సత్యలోకములను ఏ ‘ఓం’కారార్థ - తత్ స్వరూప స్థుత్యర్హుడు (వరేణ్యుడు) అగు సర్వమును వెలిగించు చైతన్యమూర్తి-తన ధీశక్తిచే వెలిగించుచుచున్నారో, అట్టి భర్గోదేవుడు (సూర్యుడు, తేజో మూర్తి) శక్తిని, మహిమను స్తుతించుచున్నాము. మా యొక్క బుద్ధిశక్తిని (ఆత్మతత్త్వాను భవము దిశగా) ప్రేరేపించుదురు గాక! అట్టి ప్రణవస్వరూపుడగు ఆపోరూపుని, జ్యోతి స్వరూపుని, రసస్వరూపుని, అమృతస్వరూపుని, భూభువర్ సువర్ త్రైలోక్యకర్తను ఓంకారోపాసనగా స్తుతించుచున్నాము.


36వ అనువాకము
గాయత్రీ స్వస్థాన ప్రదాన మంత్రము
(పునః బ్రహ్మలోక ప్రవేశ)విసర్జన మంత్రము

145. ఉత్తమే శిఖరే జాతే
భూమ్యాం పర్వతమూర్థని।
బ్రాహ్మణేభ్యో అభ్యనుజ్ఞాతా।
గచ్ఛ దేవి యథా సుఖమ్।
గాయత్రీ స్వస్థాన - పునః బ్రహ్మలోక ప్రవేశ మంత్రము
అమ్మా! గాయత్రీ దేవీ! ఉత్తమమగు హిమాలయ, మేరు.. ఇత్యాది పర్వత శిఖరములపై, భూమిపై గల పవిత్ర స్థానములను ఆసనముగా గలిగిన ఓ బ్రహ్మీ దేవీ! మాకు బ్రహ్మతత్త్వము ప్రసాదించి, బ్రహ్మతత్త్వోపాసకులగు బ్రాహ్మణుల అనుజ్ఞాతవై(అనుజ్ఞచే) తిరిగి నీ స్వస్థానమగు బ్రహ్మ లోకమునకు సుఖముగా చేరెదవుగాక!
స్తుతో మయా వరదా! వేదమాతా!
ప్రచోదయంతీ పవనే ద్విజాతా!
ఆయుః పృథివ్యాం
ద్రవిణం బ్రహ్మవర్చసం
మహ్యం దత్వా
ప్రజాతుం బ్రహ్మలోకమ్।।
(సర్వప్రదాతవగుటచే) వరద, (వేదములను స్వరూపముగా కలిగియున్న) వేదమాత, అంతర్యామి, (సర్వజీవుల ఇహ-పరములను) ప్రేరేపించునది, ఇహ-పరముల రెండింటినీ జనింపచేయునది - అగు గాయత్రీ జగన్మాత నా చేత స్తుతించబడుచున్నది.
మాకు తన విభవముచే కరుణతో ఆయుష్షు, పృథివి, ధన సంపద, బ్రహ్మవర్చస్సు ప్రసాదించునదగు గాక! నన్ను బ్రహ్మతత్త్వమును ఎరిగిన బ్రహ్మలోకవాసుల దరికి జేర్చునుగాక!


37వ అనువాకము
ఆదిత్య దేవతా మంత్రము

146. ఘృణిః సూర్య ఆదిత్యో
స ప్రభావాత్ అక్షరమ్। (ప్రభావాత్యక్షరమ్)
మధు క్షరంతి తత్ రసం।
సత్యం వై తత్ రసమ్
ఆపో జ్యోతి రసో
అమృతం బ్రహ్మ
భూర్భువస్సువః
‘‘ఓం’’। (భూర్భువస్సువరోమ్)
జగత్ యొక్క ఉనికికి హేతువు. (జగత్ కారకుడు), సర్వమును తన తేజోస్ఫూర్తిచే వెలగించుచున్న దీప్తిమంతుడు, తన కిరణ జాలములచే సర్వమును వెలిగించు సూర్యుడు, సర్వమునకు మొదలే ప్రకాశమానుడై ఉన్నవాడు అగు ఆదిత్యుడు - తన ప్రభావములతో కూడుకొని ఆకాశమంతా వెలుగుతో నింపుచున్నారు. అక్షర స్వరూపుడు అగు ఆ భాస్కరుని ఉనికి చేతనే నదీ జలములు రస స్వరూపమగుచూ భూమిని రసమయం చేస్తున్నాయి. ఆ ఆదిత్యుడే దేహములను కూడా రసమయం చేస్తూ రస స్వరూపుడై పరమ సత్యమైయున్నారు. ఆయన అపః (జల), జ్యోతి (వెలుగ), రస (ఓషధ-ఆహార)- పరంబ్రహ్మస్వరూపుడు. ఆయనయే భూర్భువస్సువ లోకములలో దేహులుగా, లోకములుగా వ్యాపించి వెలుగొందుచున్నారు. అట్టి ఆత్మభగవానునికి నమస్కారములు.


38వ అనువాకము
పాపనివృత్తిహేతు - త్రిసుపర్ణ మంత్రము

147. బ్రహ్మ మేతు మామ్।
మధు మేతు మామ్।
బ్రహ్మమేవ మధుమేతుమామ్।
యా అస్తే సోమ ప్రజావత్
సోభి సో-అహమ్।
దుస్స్వప్నహం దురుష్షహా
యా అస్తే సోమ ప్రాణాగ్ం,
(స్తాం) తామ్ జుహోమి।।
త్రిసుపర్ణమ్ అయాచితం
బ్రాహ్మణాయ దద్యాత్।।
జ్ఞాన ప్రతిబంధక పాప నివృత్తి హేతు మంత్రము
సర్వ మనోబుద్ధి చిత్త అహంకారమైన ప్రతిబంధకములు, అడ్డంకులు, పాప-దోష దృష్టులు తొలగి - (1)నేను బ్రహ్మమును పొందెదముగాక (2) బ్రహ్మము నన్ను పొందునుగాక! (3) నేను బ్రహ్మమునకు ప్రియము అయ్యెదనుగాక! (4) బ్రహ్మమే నాకు అత్యంత ప్రియమై ఉండునుగాక!
ఏ విధంగా చంద్రుడు, సర్వజీవులు నీచే కల్పించబడి, నీచే ప్రవర్తమానులై, నీయందే లయించుచున్నారో.., అదే తీరుగా నేను నీ నుండి బయలుదేరిన భాసమాన కిరణమై, నీయందే లయించుచున్నాను. నన్ను శుభ్రము చేయండి. ఓ పరమేశ్వరా! నా యొక్క సంసార దుస్స్వప్నము నుండి, దుర్భరమగు ఆవేశముల నుండి నన్ను మీ ప్రియ వస్తువు వలె సంరక్షించండి.
హే భగవాన్! నా ఈ దేహ-మనోప్రాణములు మీకు చెందినవే! మీకు చెందిన ఈ సర్వమును మీకే సమర్పించుచున్నాను.
బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి।
యే బ్రాహ్మణాః ‘‘త్రిసుపర్ణం’’
పఠంతి, తే ‘‘సోమం’’ ప్రాప్నువన్తి।
ఆ సహస్రాత్ పక్తిం పునంతి
‘‘ఓమ్’’।।
ఈ విధంగా (1) బ్రహ్మమునకు మేము, బ్రహ్మము మాకు ప్రియమగు చుండటం (2) దుస్స్వప్న-దుష్కృతములతో కూడిన సంసారమును అధిగమించగలగటము. నాది- అనునదంతా ‘‘పరమాత్మది’’గా దర్శించటం (3) దేహ-మనో-ప్రాణములను పరమాత్మ సమర్పణగా నిర్వర్తించటము - అనబడు త్రిపర్ణ సూత్రములను అడగకపోయినా శిష్యజనులకు, ఆశ్రితులకు గురువు గుర్తు చేయునుగాక. ఈ ఉపదేశములను మూడింటిని ఎవ్వరు నిత్యము దృష్టి యందు కలిగి జపిస్తూ (గుర్తు చేసుకుంటూ) ఉంటారో, - అట్టివారు బ్రహ్మహత్య మొదలైన మహాపాతకముల నుండి కూడా నివృత్తులు కాగలరు.
ఏ బ్రహ్మ విద్యోపాసకులగు బ్రాహ్మణులు ఈ ‘త్రిసుపర్ణము’ను పఠిస్తారో వారు అమృతత్వము (సోమము) ప్రాప్తించుకోగలరు. వారి పంక్తిలోని వేయి మంది పునీతులు కాగలరు. ఇది ఓంకారార్థ సారము.


39వ అనువాకము

148. బ్రహ్మ మేధయా। మధు మేధయా।
బ్రహ్మమేవ మధు మేధయా।
ఆద్యానో దేవ సవితః
ప్రజావత్ సావీ సౌభగమ్।
పరా దుష్వప్నియగ్ం సువ।
విశ్వాని దేవసవితః
దురితాని పరాసువ।
యత్ భద్రం, తత్
మ ఆసువ।। (తన్మ ఆసువ)।।
ఉపనిషత్తులు (వేదములు), బ్రహ్మజ్ఞులు బోధించి మహావాక్య సారములు నాకు ధారణగా లభించునుగాక! నా మేధ (బుద్ధి)కి బ్రహ్మతత్త్వమే ప్రియాతిప్రియమగుగాక। బ్రహ్మమునకు నేను ప్రియమగుదును గాక! బ్రహ్మమునకు నా బుద్ధి, నా బుద్ధికి బ్రహ్మము పరస్పరము ప్రియాతి ప్రియమగుగాక!
సర్వ ప్రేరకుడగు ఓ దేవాదిదేవా! సవిత్రు మండలవర్తీ! ఇప్పుడే మాకు దివ్యజ్ఞాన సంపన్నులగు ప్రజలను (గురువును, శ్రద్ధ-పట్టుదల గల తోటి విద్యార్థులను, శిష్య ప్రశిష్యులను) వారితో సాంగత్యమును ప్రసాదించండి.
ద్వైత (పరాపరభేద) సంబంధమగు దుస్స్వప్నములను తొలగిపోవు మార్గము చూపండి. దేవతా సహితులై విశ్వేదేవులవారు, సవిత్రుడగు సూర్యభగవానుడు మా ‘దురితములు’ అనే మసక చీకట్లను ప్రాలత్రోలుదురుగాక! ఏది భద్రమో, క్షేమకరమో, అట్టి ఆత్మ తత్త్వపాఠ్యాంశములు మా బుద్ధిని సమీపించునుగాక!
149. మధువాతా, ఋతాయతే।
మధు క్షరంతి సిన్ధవః। మాధ్వీర్నః సన్తు ఓషధీః।
మధు నక్తమ్ ఉతోషసి।
మధుమత్ పార్థివగ్ం రజః।
మధుద్వౌః అస్తు నః పితా।
మధుమాన్ నో వనస్పతిః।
మధుమాగ్ం అస్తు సూర్యః।
మాధ్వీః గావో భవన్తు నః।।
మధురమగు (ఆత్మతత్త్వ సంబంధమైన విశేషాలు అనే) వాయు వీచికలు వీచునుగాక!
నదులు (పవిత్రత అనే) - మధురమైన, ఆరోగ్య ప్రదమైన తరంగములు ‘ప్రవహింపచేయునవి అగును గాక!
అన్నము ఓషధులు మాధుర్యము సన్తరించుకొనునుగాక! ఈ మట్టి, ధూళి మా పట్ల మధురమై ఉండునుగాక! మధుర సువాసనలు వెదజల్లునుగాక!
జగత్పతి అగు పరమాత్మ మా పట్ల మాధుర్య సమన్వితులగుదురుగాక! వనస్పతులు, సూర్యుడు, సూర్య కిరణములు, ఆవు మొదలైన చతుష్పాద జంతువులు - ఇవన్నీ మా పట్ల మాధుర్యము కలిగినవై ఉండునుగాక
య ఇమం త్రిసుపర్ణమ్
అయాచితమ్ బ్రాహ్మణాయ దద్యాత్,
-భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి।
యే బ్రాహ్మణాః ‘‘త్రిసుపర్ణం’’
పఠంతి, తే సోమం, ప్రాప్నువంతి
ఆ సహస్రాత్ పంక్తిం, పునంతి ఓమ్
ఎవ్వరైతే ఈ ‘‘త్రిసుపర్ణము’’ను బ్రహ్మమును ఎరుగుటకై వచ్చు బ్రహ్మచారులకు ప్రియముగా, అయాచితంగా కూడా బోధిస్తారో - అట్టి వారి గర్భస్త శిశు హత్యాదోషములు కూడా తొలుగగలవు.
ఏ బ్రహ్మవిద్యా అధ్యయనులు, బ్రాహ్మణులు ఈ ‘‘త్రిసుపర్ణము’’ను అధ్యయనము చేస్తారో, అట్టివారు చంద్రలోకమును సిద్ధించుకోగలరు. వారున్న పంక్తిలో వేయి మంది పునీతులు కాగలరు.


40వ అనువాకము
త్రిసుపర్ణ- అనంతర వర్ణన

150. బ్రహ్మ మేధవా। మధు మేధవా।
బ్రహ్మమేవ మధు మేధవా।
బ్రహ్మా దేవానాం, పదవీః కవీనామ్
ఋషిః విప్రాణాం, మహిషో మృగాణామ్,
శ్యేనో గృధ్రాణాగ్ం, స్వధితిః వనానాగ్ం,
సోమః పవిత్రమ్ అత్యేతి రేభన్।।
హగ్ం సః శుచిషత్। వసుః అంతరిక్షసత్।
హోతా వేదిషత్। అతిధిః దు(ఉ)రోణసత్।
నృషత్ వరసత్। ఋత సత్। వ్యోమ సత్।
అబ్జా గోజా ఋతజా, అద్రిజా ఋతం బృహత్।।
(1) బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులు; (2) విశ్వ-తేజస-ప్రాజ్ఞులు, (3) విరాట్- హిరణ్యగర్భ- ఈశ్వరులు - ఇవి బ్రహ్మము నుండి బయల్వెడలుచున్న ‘‘త్రిసుపర్ణములు’’ (3 ఆకులు).
అట్టి బ్రహ్మమును, మధురాతిమధురమగు తత్త్వమును నా బుద్ధి ఆశ్రయించునుగాక! బ్రహ్మమునకు నా బుద్ధి మధురమై ఉండునుగాక!
అట్టి బ్రహ్మము విశేషంగా దేవతలలో సృష్టికర్తయగు బ్రహ్మదేవుడై, శ్రేష్ఠులలో విష్ణుభగవానుడై, విప్రులలో బ్రహ్మర్షి - మృగములలో మహిషము (దున్న) అయి, పక్షులలో శ్యేనము (డేగ), అయి ఉన్నది. పవిత్రమైన వస్తువులలో (యజ్ఞపరికరములలో) సోమరసముగా ఉన్నది కూడా ఆ పరమాత్మ యొక్క విశేషకళా చమత్కారమే!
శుచి అయిన వాటిలో హంస (పరమహంస)గా, అంతరిక్షములో అష్ట వసువులుగా, ఆకాశంలో సూర్యుడుగా, ఆకాశములో వాయువుగా, వేదికలో
ఋచే త్వా ఋచే త్వా సమిత్
స్రవంతి సరితో నధేనాః।
అంతర్-హృదా మనసా పూయమానాః।
ఘృతస్య ధారా అభిచాకశీమి।
హిరణ్మయో వేతసో మధ్య ఆసామ్।
తస్మిం తు సుపర్ణో, మధుకృత్
కులాయీ భజన్నాస్తే మథు దేవతాభ్యః।
తస్యా సతే హరయః సప్త తీరే
స్వధాం దుహానా అమృతస్య ధారామ్।
య ఇదం‘‘త్రిసుపర్ణమ్’’ అయాచితం
బ్రాహ్మణాయ దద్యాత్, వీరహత్యాంవా ఏతే ఘ్నంతి
యే బ్రాహ్మణాః ‘‘త్రిసుపర్ణం’’ పఠంతి,
తే సోమం ప్రాప్నువన్తి।
ఆ సహస్రాత్ పంక్తిం పునంతి
‘‘ఓం’’।।
హోత (అగ్ని)గా, గృహమునకు వేంచేయు అతిధి వలె, మనుష్యులలో కర్తృత్వాభిమానిగాను, కార్యక్రమ దక్షత రూపంగాను, ఋగ్వేదములలో ఋక్కులగాను, ఋతము (పరమసత్యము) వలెను, ఆకాశములో ఆత్మాకాశముగాను, జలములో, గోవులలో, పుజనీయుడగు ఋతజుడుగాను ఉన్నారు. సత్యమునకే సత్యమై ప్రకాశమానులు. సరస్సులలో, నదులలో స్రవంతిగా ఉన్నారు. ఆ పరమాత్మ అంతర్ హృదయములో ఉండి మనస్సుచే సర్వమును పూరించుచున్నారు.
ఆయన యజ్ఞములో హుతాశన స్వరూపులై ధారవంటి నేయిని (హవ్య ద్రవ్య పరంపరలను) దేవతలకు అందించువారై ఉన్నారు. యజ్ఞవేదికలో మధ్య హిరణ్మయుడగు పరమాత్మ - జ్యోతిర్మయుడు, బహుద్రవ్యవంతుడు, స్వర్గాది సుఖములు ఇచ్చువాడు, సర్వదేహముల దేహాశ్రయుడు అగు త్రి-సుపర్ణ భగవానుడుగా ఉన్నారు. ఆ పరమాత్మకు చుట్టూ సప్తర్షులు అగ్ని ‘స్వధా’ శబ్దముచే దేవతలకు ఆహూతులను అందించి అమృతమును ప్రసాదింపజేయుచున్నారు. ఈ త్రి-సుపర్ణమును అయాచితంగా కూడా ఎవ్వరూ బ్రహ్మజిజ్ఞాసువులకు అందిస్తారో, వారు వీరహత్య ఇత్యాది దోషముల నుండి విముక్తులగుచున్నారు. ఏ బ్రహ్మజ్ఞులు, బ్రహ్మజిజ్ఞాసువులు ‘త్రిసుపర్ణము’ను పఠిస్తారో వారు చంద్రలోకము పొందగలరు. వారున్న పంక్తిలో వేయిమంది పునీతులగుచున్నారు.


41వ అనువాకము
మేధాసూక్తము

151 మేధా దేవీ జుషమాణా
న ఆగాత్, విశ్వాచీ,
భద్రా, సుమనస్య మానా।
త్వయా జుష్టాన్ ఉదమానాత్
ఉరుక్తాన్,
బృహత్ వదేమ
విదధే సువీరాః।।
(మేధ = గ్రంథమును చదువుచు, అద్దాని అంతరార్థమును సూక్ష్మదృష్టితో తెలుసుకొని, అర్థము చేసుకొని, ‘ధారణ’ చేయుశక్తి)
ఓ మేధాదేవీ! శ్రీ సరస్వతీ దేవీ! విశ్వమంతా వ్యాపించియున్న విశ్వాచీ! భద్రమగు ఆత్మ జ్ఞానమునకు త్రోవచూపు భద్రాదేవీ! సు-మనస్సుకు తోడుగా ఉండు మాతా! అమ్మా! మాతృవాత్సల్యవై నాకు, సామీప్యమును ప్రసాదించు.
అమ్మా! మేధాదేవీ! నీకు దూరంగా ఉండి వ్యర్థ ప్రసంగములచే కాలమంతా వృధా చేసుకొంటూ ఉన్న మేము నీ పట్ల భక్తి-ప్రపత్తులచే సుబుద్ధి గల సంతానమును, శిష్యులను, సహచరులను పొంది మహోన్నత సత్యమగు ఆత్మను గురించిన విచారణా సామర్థ్యము పొందుచూ వీర్యవంతులమగు చుండెదము గాక!
152 త్వయా జుష్ట ‘ఋషిః’ భవతి।
దేవి! త్వయా బ్రహ్మాగతశ్రీ రుత త్వయా।
త్వయా జుష్టః చిత్రం విందతే,
వసు సా నో జుషస్వ
ద్రవిణేన మేధే। (ద్రవిణో న మేధే।
అమ్మా, మేధాదేవీ! నీ యొక్క కృపా కటాక్ష వీక్షణ పొందినవాడు, ఋక్కులు ప్రకటించు సత్యమును హృదయస్థం చేసుకొని ‘‘ఋషి’’అగుచున్నాడు; బ్రహ్మజ్ఞాని అగుచున్నాడు. సర్వ (ఆధ్యాత్మిక) సంపదలు పొందుచున్నాడు. ఉన్నతమగు మహదైశ్వర్యములు అట్టి వానిని స్వభావంగా ఆశ్రయిస్తున్నాయి.
నీ దయచే చిత్రమైనవన్నీ ఆశ్చర్యకరమైనవన్నీ పొందుచున్నాడు. నీకరుణచే ‘మేధ’ అను ద్రవ్యము, భూమి నాకు లభించును గాక!


42వ అనువాకము

153. మేధాం మ ఇంద్రో దదాతు।
మేధాం దేవీ సరస్వతీ।
మేధాం మే అశ్వినా వుభావా
ధత్తాం పుష్కర ప్రజా।।
నీ ఆజ్ఞానుసారము దేవతలు అనువర్తులగుచున్నారు. ఇంద్రుడు నాకు ఇంద్రియ విషయముల పరార్థజ్ఞానము ప్రసాదించెదరుగాక!
మేధాదేవి అగు సరస్వతి మాకు మేధాశక్తిని అనుగ్రహించెదరుగాక! తామరపూలదండలను ధరించిన ఉభయ అశ్వినీ దేవతలు నాకు ఉత్తమ బుద్ధిని, బుద్ధిమంతులతో సత్-సంగమును ప్రసాదించెదరుగాక!
154. అప్సరాసు చ యా మేధా,
గంధర్వేషు చ యన్మనః
దైవీ మేధా సరస్వతీ సా మాం
మేధా సురభిః జుషతాగ్ం ‘‘స్వాహా’’।।
సురుచి మొదలైన అప్సరస స్త్రీలకు (దివ్యులగు దేవతా స్త్రీలకు) ఎటువంటి మేధ (తెలివి విచక్షణా శక్తి) ఉన్నదో, గంధర్వువులకు ఎట్టి సునిశితము - విస్తారమైన మనస్సు ఉన్నదో, అట్టి మేధా-సునిశిత మనోప్రదాత అగు శ్రీ సరస్వతీ దేవి నాకు ఉత్తమమైన ‘‘మేధ’’ (Properly “understanding ” as well as comprehensively “assimilating” intelectual) ఇచ్చునదై నన్ను అనుగ్రహించునుగాక! నా బుద్ధి యొక్క సేవలన్నీ మేధాదేవికి సు-సేవితమగుగాక! సమర్పితమగు గాక!


43వ అనువాకము

155. అమాం మేధా సురభిః విశ్వరూపా,
హిరణ్యవర్ణా జగతీ జగమ్యా,
ఊర్జస్వతీ పయసా పిన్వమానా,
సా మాం మేధా
సుప్రతీకా జుషన్తామ్।।
- సద్భుద్ధితో కూడిన ‘మేధ’ను అనుగ్రహించేది,
- సుగంధ పరిమళము వలె సర్వత్రా వ్యాపించునది,
- ఈ విశ్వమంతా తన రచనా విలాస క్రీడగా, లీలగా కలిగియుండినది, ఈ విశ్వమే తన రూపముగా కలిగి ఉన్నట్టిది అగు విశ్వరూపదేవత మాకు ఈ విశ్వమంతా పరిశోధించు శక్తిని ప్రసాదించును గాక.
- బంగారు ఛాయతో ధగధగ్గా వెలుగొందునది, - ఈ జగత్తంతా తనయందు ఆభరణముగా కలిగియున్నట్టిది, - జగత్తుకు గమ్యము అయినట్టిది, - జగదాత్మిక, - బల ఉత్సాహ సాహసస్వరూపములతో వెలుగొందు ఊర్జస్వతి, - ‘పాలు’ మొదలైనవి ప్రసాదించి తల్లి పాల వలె పోషించునది.
అగు మేధాదేవి వికశిత వదనముతో నాకు సకల శ్రేయస్సులను అనుగ్రహించునుగాక! ప్రసాదించునుగాక!


44వ అనువాకము

156. మయి మేధాం, మయి ప్రజాం -
మయి అగ్నిః తేజో దధాతు।
మయి మేధాం, మయి ప్రజాం -
మయి ఇంద్ర ఇద్రియం దధాతు।
మయి మేధాం, మయి ప్రజాం -
మయి సూర్యో అహ్రాజో దధాతు।।
- జగజ్జనని, లోకమాత, జ్ఞానవిజ్ఞాన ప్రసాదిని అగు మేధాదేవి యొక్క అనుగ్రహముచే దేవతా శ్రేష్ఠులు కూడా సానుకూల్యురు అయ్యెదరుగాక!
- అగ్ని దేవుడు దయతో నాకు మేధాశక్తిని, ఉత్తమ సంతతిని, ఉత్సాహము, సాహసము, ధైర్యములతో కూడిన తేజస్సును ప్రసాదించెదరుగాక!
ఇంద్రభగవానుడు - నాకు ఉత్తమమగు మేధస్సును, సంతతిని, పరతత్త్వ ధ్యానమునకు శక్తియుక్తులతో సంసిద్ధమగు ఇంద్రియములను - కనికరించెదరుగాక!
హే సూర్యభగవాన్! నాకు మేధస్సును, సత్సంతానమును, మహనీయులతో సాంగత్యము దయతో అనుగ్రహించండి.


45వ అనువాకము
మృత్యు నివారణ మంత్రము

157. అపైతు మృత్యుః। అమృతన్ నః
ఆగన్ వైవస్వతో నో అభయం కృణోతు।
పర్ణం వనస్పతేః ఇవాభిః
నః శయితాగ్ం రయిః
సచతా నః శచీపతిః।।
పరమాత్మా! నన్ను మృత్యుపరిధులను దాటించి అమృతత్వ స్థానమునకు జేర్చండి. వైవస్వతుడు (యముడు) మాకు మృత్యు భయము తొలగించునుగాక!
మా ప్రాకృత దోషములు - పండిన ఆకుల వలె, ఎండిన వనస్పతులవలె రాలిపోవునుగాక! శచీపతి (ఇంద్రుడు) మాకు అవసరమగు సంపదలు అనుగ్రహించెదరు గాక.


46వ అనువాకము

158. పరం మృత్యో అను పరేహి
పంథాం యస్తే స్వ ఇతరో
దేవయానాత్।
చక్షుస్మతే శృణ్వతే తే బ్రవీమి।
మానః ప్రజాగ్ం ఈరిషో మోతవీరాన్।।
ఓ మృత్యుదేవతా! మీరు మా సంతానమును బాధించనివారై, వారిని సమీపించకుండా, దేవయాన-పితృయాన మార్గములో వెళ్ళుదరుగాక!
మా భృత్యులను, సంతానమును కృపాదృష్టితో చూడండి.
చక్షువులతో, చెవులతో మేము చెప్పు అభ్యర్థనలు వినండి. ప్రార్థనను ఆలకించండి. మా ఈ ప్రార్థనను విని మా అభ్యర్థనను సఫలం చేయండి.


47వ అనువాకము

159 వాతం ప్రాణం మనసాన్ వారభామహే,
ప్రజాపతిం యో భువనస్య గోపాః,
స నో మృత్యోః త్రాయితాం
పాత్వగ్ం హసో జ్యోః జీవా
జరా మశీమహి।
వాయు రూపంగాను, ప్రాణశక్తి రూపంగాను మనస్సు (ఆలోచనలు) రూపంగాను విశ్వమంతా తన స్వరూపముతో నింపి ఉంచుచున్న ఓ ప్రజాపతీ! నమస్కారము.
అట్టి ప్రజాపతి మమ్ములను మృత్యువు నుండి కాపాడెదరుగాక. పాతకముల నుండి రక్షించుచుండెదరుగాక. మేము పూర్ణ జీవితమును వార్ధక్యాంతము వరకు ఆరోగ్యయుక్తంగా పొందెదముగాక!


48వ అనువాకము

160. అముత్ర భూయా దధ యత్ యమస్య।
బృహస్పతే అభిశస్తేః అముంచః।
ప్రత్యౌ హతామ్ అశ్వినా మృత్యుమ్ అస్మాత్
దేవానామ్ అగ్నే బిషజా శచీభిః।।
ఓ సర్వాంతర్యామి యగు పరమాత్మా! యమదేవా! ఇహములో గల మాకు ఆముత్ర (దేహానంతర) భయము లేకుండా అనుగ్రహించండి.
దేవగురువగు బృహస్పతీ! ఓషధ ప్రసాదులగు అశ్వినీ దేవతలారా! మమ్ములను అపమృత్యువు నుండి మీరూ కాపాడుతూ ఉండండి. ఓ అగ్నిదేవా! దైవ వైద్యుడగు మీరు (భిషజులగు మీరు) మమ్ము శచీదేవిచే (ఇంద్రపత్నిచే) పాలించబడు ఇంద్రలోక ప్రవేశమునకు అర్హులుగా తీర్చిదిద్దండి.


49వ అనువాకము

161. హరిగ్ం హరన్తమ్ అమయన్తి దేవా,
విశ్వస్య ఈశానాం వృషభం మతీనామ్।
బ్రహ్మ సరూప మను మేద
మాగాత్ అయనం,
మా వివధీః విక్రమస్వ।।
ఓ శ్రీహరీ! దేవాదిదేవా! మీరు మా దోషములను హరించివేయండి. ఈ విశ్వమునకు మీరు నియామకులగు ఈశ్వరులు. వృషభమువలె సర్వప్రాణులకు ప్రభువు. సర్వప్రాణుల బుద్ధులకు నియామకులు. మీ అనుగ్రహముచే బ్రాహ్మణములు (4 వేదములు) మమ్ము అనుసరించియుండునుగాక! సరూపమై అంతరార్థము సుస్పష్టమగునుగాక! మా మోక్ష మార్గము సుగమము అగునట్లుగా సంరక్షకులై ఉండ ప్రార్థన.


50వ అనువాకము

162. శల్కైః అగ్నిమ్ ఇంధాన
ఉభౌ లోకౌ సనేమహమ్
ఉభయోః లోకయోః
బధ్వా అతిమృత్యుం తరామి అహమ్।।
ఓ అగ్ని దేవా! మీరు సమిధలతో వెలుగుచూ మేము సమర్పించు ఆహూతులను స్వీకరించి మా యొక్క ఇహ-పరలోకములను సాను కూల్యము, సుఖప్రదము చేయండి. ఉభయ లోకములు మీ ఆధీనములో ఉన్నాయి. మా ఇహపరములను పవిత్రం చేసి అపమృత్యువు నుండి మమ్ములను తరింపజేయండి. ఐహికా ముష్మిక భోగములు ప్రసాదించం&


51వ అనువాకము

163. మాచ్ఛిదో మృత్యో।
మ అవధీః, మా మే బలం
వివృహో మా ప్రమోషీః।
ప్రజాం మా మే ఈరిష
ఆయురుగ్ర నృచక్షసం
త్వాహావిషా విధేమ।।
ఓ మృత్యుదేవా! మా యొక్క జ్ఞానమునకు విచ్ఛిత్తి కలుగకుండా, మా అనుష్ఠానము చెడకుండా, శారీరక బలము క్షీణించకుండా, మా పరలోక సంపద అల్పబుద్ధిచే దొంగిలింపబడకుండా మమ్ములను అనుగ్రహించండి. రక్షకుల వండి. మా సంతానము, మిత్రులు మొదలైనవారికి బాధలు కలుగకుండా చూడండి. మీకు మా దైవభజనలు, స్తుతులు మొదలైన ఉత్తమ కర్మలను హవిస్సులుగా సమర్పించుకుంటున్నాము. ప్రాణుల పుణ్య పాపములను పరీక్షించి ఫలములను ప్రసాదించే మీరు మమ్ములను ఉత్తమ కర్మలకు ప్రేరేపకులు అవండి.


52వ అనువాకము

164. మా నో మహాంతమ్, ఉత
మా నో అర్భకం। మా న ఉక్షంతమ్।
ఉత మా న ఉక్షితమ్।
మా నో అవధీః పితరం మోత।
మాతరం ప్రియా।
మా నః తనువో రుద్రదీరిషః।।
సర్వములను లయింపజేయు లయకారుడగు ఓ రుద్రభగవాన్! దుష్టశిక్షక- శిష్టరక్షకా! మా గురువులను, మా పిల్ల-పాపలను, మా యువకులను, గర్భస్థ శిశువులను, మాతో బ్రహ్మజ్ఞానము సంభాషించు విజ్ఞులను, తదితర బంధుమిత్ర పరివారమును (మానో) బాధించక, సుఖప్రదాతలవండి. మా తల్లి-తండ్రులకు ప్రశాంతత, ఆరోగ్యము, ఆనందము కలుగజేస్తూ ప్రియత్వము ప్రసాదించండి. మాఈ శరీరములు బాధింపబడకుండునట్లు అనుగ్రహించండి.


53వ అనువాకము

165. మా నః స్తోకే తనయే
మా న ఆయుషి।
మా నో గోషు।
మా నో అశ్వేషుః ఈరిషః।
వీరాన్ మానో
రుద్రభామితో అవధీః
హవిష్మంతో నమసా
విధేమ తే।।
ఓ మహారుద్రదేవా! మా యొక్క అర్భకులను, సంతానమును బాధ కలుగకుండా ఆరోగ్యముగా ఉండునట్లు, దీర్ఘాయుష్షు పొందునట్లు అనుగ్రహించండి. మా గోసంపద, అశ్వసంపద, తదితర జంతు సంపద రోగముల బారిపడకుండుగాక! ఆరోగ్యముగా ఉండుగాక! మాలోని వీర్యవంతులను, కార్యసమర్థులను బాధలు లేకుండా ఆయురారోగ్యములతో రక్షించెదరు గాక! రుద్రాణితో కూడి వేంచేసియుండి మేము సమర్పించు నమస్కారములు, యాగ-యజ్ఞములు స్వీకరించి మమ్ములను ఆయురారోగ్య ఐశ్వర్యవంతులుగా అనుగ్రహించండి. బ్రహ్మజ్ఞానమునకు, బ్రహ్మముతో మమైక్యమునకు, మమ అనన్యత్వమునకు మార్గదర్శకులవండి.


54వ అనువాకము
ప్రజాపతి ప్రార్థనా మంత్రము

166. ప్రజాపతే న త్వదేతాని అన్యో
విశ్వాజాతాని పరి తా బభూవ।
యత్ కామాస్తే జుహుమః
తన్నో అస్తు వయగ్ం స్యామ
పతయో రయీణామ్।।
ఓ ప్రజాపతీ! పరంధామా! పరమశివా! అనన్య స్వరూపుడవగు మీవలననే అన్యంగా కనిపిస్తూ (అనన్యమే అయి ఉన్న) దేవతలు, మానవులు, జంతువులు, ఆకాశచరములు, జలచరములు, భూచరములు, వీటన్నిటితో సమన్వితమైన 14 లోకములు విశ్వమంతా జనిస్తోంది. మీ చేతనే పరిపోషించబడి, మీచేతనే ఉపసంహరించబడుతోంది కూడా! ఎవరి ఇచ్ఛ, వినోదము, లీలచే ఇవన్నీ జరుగుచున్నాయో, అట్టి మీకు మా సర్వకర్మలు మీ ఇచ్ఛా - వినోదములకే సమర్పిస్తూ ఉన్నాము. మీ కరుణా కటాక్షముచే మేము విద్యా-వినయములు, ఇహపరములు పొందుచుండెదముగాక!


55వ అనువాకము
ఇంద్ర పార్థనా మంత్రము

167. స్వస్తిదా విశస్పతిః
వృత్రహా విమృధో వశీ।
వృషేంద్రః పుర ఏ తు నః
స్వస్తిదా అభయంకరః।।
ఓ విశస్పతీ! ఇంద్రదేవా! ఎలుగెత్తి మీకు ‘‘స్వస్థి’’ పలుకుచున్నాము. ఓ వృత్రాసుర రాక్షస సంహారీ! ఐహిక-ఆముత్రిక (ఆముష్మిక)సుఖప్రదాతా! త్రిలోకాధిపతీ! వృష్టికి అధినేతా! మా భయములన్నీ పోగొట్టు అభయంకరా! అమరేంద్రా! మాకు సర్వ దిక్కులందు స్వస్థి ప్రదాతలై ఉండుటకై అభ్యర్థన చేస్తున్నాము.


56వ అనువాకము
మృత్యుంజయమంత్రము

168. ఓం।। త్రియంబకం (త్రయంబకం) యజామహే,
సుగంధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారికమ్ ఇవ బంధనాత్
మృత్యోః ముక్షీయ।
మామృతాత్।।
(‘త్ర్యంబకమ్’ - ఇతి ఔత్తరాహ పాఠః)
స్థూల-సూక్ష్మ-కారణ త్రిదేహ పురధారీ! త్రిపుర యజమానీ! స్థూలాకాశ-చిత్తాకాశ-చిదాకాశ స్వరూపా! ఉత్తమ గంధములను (సంస్కారములను) ప్రసాదించు స్వామీ! మా యొక్క దేహ-మనో-బుద్ధిల పరిపుష్టని వర్ధింపజేయు పరమేశ్వరా! పరంధామా! మిమ్ములను రెండు విషయాలు ప్రసాదించటానికై వేడుకొంటున్నాము.
(1) పండిన దోసకాయ దోసపాదును తాకి ఉండి కూడా, ఆ పాదుకు విడివడినదై ఉండుతీరుగా, బంధనములు ఉన్నప్పటికీ వాటి నుండి మేము అనాయాసంగా సర్వదా విడిపడినవారమై ఉండెదముగాక! మృత్యువు నుండి మేము (దోసపండువలె) విడిపోయి ఉండెదముగాక!
(2) అమృతత్వము నుండి విడిపడని వారమై ఉండెదముగాక!


57వ అనువాకము

169 యేతే సహస్రమయుతం
పాశా మృత్యో మర్త్యాయ హంతవే,
తాని యజ్ఞస్య మాయయా
సర్వాన్ అవయజామహే।।
ఓ మృత్యుంజయా! మృత్యుపాశములు వేలాది సంఖ్యలో ఉండవచ్చుగాక! మేము చేయు కర్మానుష్ఠాన యజ్ఞమును స్వీకరించి వాటన్నిటి పట్లా మాకు గల సర్వ బంధనములు తొలగిపోవునట్లు అనుగ్రహించండి. మాకు అమృతత్వము సిద్ధించునట్లు అనుగ్రహించండి.


58వ అనువాకము

170. మృత్యవే స్వాహా।
మృత్యవే స్వాహా।
జీవితాంతం మేము చేయు సమస్త కర్మఫలములను మృత్యుదేవతకు ఆహూతుల రూపముగా సమర్పిస్తున్నాము. (అగ్నితో ఘృతము సమర్పిస్తూ) మృత్యవే స్వాహా! మృత్యవే స్వాహా! ఓ మృత్యుదేవా! మాయొక్క సమస్త కర్మ ఫలములను ఆహూతులుగా స్వీకరించండి. అమృతత్వము ప్రసాదించండి.


59వ అనువాకము
పాప నివారక ప్రార్థనా మంత్రము

171 దేవ కృతస్య ఏనసో అవయజనమసి స్వాహా।
మనుష్య కృతస్య ఏనసో అవయజనమసి స్వాహా।
పితృ కృతస్య ఏనసో అవయజనమసి స్వాహా।
ఆత్మ కృతస్య ఏనసో అవయజనమసి స్వాహా।
అన్య కృతస్య ఏనసో అవయజనమసి స్వాహా।
అస్మత్ కృతస్య ఏనసో అవయజనమసి స్వాహా।
యత్ దివా చ నక్తం చ
ఏనశ్చ కృమతస్య
అవ-యజనమసి స్వాహా।
యత్ స్వపంతశ్చ జాగ్రతశ్చ
ఏనశ్చ కృమతస్య అవయజనమసి స్వాహా।
యత్ సుషుప్తుశ్చ జాగ్రతశ్చ
ఏనశ్చ కృమతస్య అవ-యజనమసి స్వాహా।
యత్ విద్వాగ్ంశ్చ ఏనశ్చ
కృమతస్య అవ-యజనమసి స్వాహా।
ఏనస ఏనసో అవ-యజనమసి స్వాహా
ఓ అగ్నిదేవా! దేవకృతంగా (మా పాత్ర అంటూ లేకుండా) చేసిన దోషములను పరిశుద్ధపరచుటకై ఈ ఆజ్యమును ఆహుతిగా స్వీకరించండి. మనుష్యకృతంగా చేసిన దోషములు తొలగించ వేడుకొనుచు ఈ ఆజ్యమున సమర్పిస్తున్నాను. స్వాహా!
-పితృకృతంగా ఏఏ దోషములు చేసియున్నామో, అవన్నీ పరిశుద్ధ పడుటకై దయతో ఈ ‘నేయి’ని ఆహుతిగా అంగీకరించండి. స్వాహా! -ఆత్మ కృతంగా (ఆత్మకు అన్యంగా దర్శిస్తూ) నేనుగా ఏమేమి దోషకర్మలు చేసియుంటినో, అవన్నీ పరిశుద్ధమగుటకు వేడుకొనుచూ ఈ ఆహుతిని సమర్పిస్తున్నాను.
- ఇతరులను దృష్టిలో పెట్టుకొని నిర్వర్తించియున్న పాపకార్యముల నివృత్తికై ఈ ఆజ్యమును స్వీకరించండి. స్వాహా!
నా కొరకై నేను చేసిన దుష్కృతుల నివారణకై - ‘‘స్వాహా’’ ఈ నేయిని స్వీకరించండి.
- రాత్రి-పగలు చేసియున్న దోషకృతములను పరిశుభ్రపరచుటకై దయతో ఈ ఆహుతిని అంగీకరించెదరుగాక!
స్వప్న జాగ్రత్తులలో నాచే చేయిబడిన దోషవృత్తి - ఆలోచన - కర్మలను నివృత్తింపజేయటానికై ఈ నేయిని సమర్పించుకొంటున్నాను.. సుషుప్తి - జాగ్రత్తులలో ఏఏ దోషకృతములన్నీ ఉన్నాయో వాటివాటి నిర్మాల్య విసర్జనకై ఈ నేయి స్వీకరించండి. ‘‘నాకే తెలుసు - అను పాండిత్య ప్రదర్శనము’’
-మొదలైన దోష క్రియా దోషములు తొలగుటకై స్వాహా“!
దేని వలన ఎప్పుడు ఏ ఏమనోవాక్కాయ కర్మల దోషములున్నప్పటికీ, వాటి దుష్ట ఫలిత నివారణ కొరకై దయతో ఈ ఘృమును (నేయిని) అంగీకరించి స్వీకరించండి. స్వాహా”!


60వ అనువాకము
వసు (పాపనివర్తన) ప్రార్థనా మంత్రము

172. యత్ వో దేవాశ్చ, కృమ జిహ్వయా
గురు మనసో వా ప్రయతీ దేవ హేడనమ్।
అరా వా యో నో అభీత్
ఉచ్ఛునాయ, తే తస్మిం
తత్ ఏనో వసవో నిధేతన స్వాహా।
ఓ దేవతలారా! ఆయా కొన్ని కొన్ని సందర్భములలో ఉద్దేశ్యించియో (లేక) ఉద్దేశ్యించకయో - నోటి దురదగా - ‘ఈ దేవత గొప్ప; ఆ దేవత తక్కువ’’.. ఇటువంటి భేద- అజ్ఞాన వాక్యములు పలికి ఉండవచ్చు. ‘దేవహేళనము’ అనే వాచా దోషము కలిగియున్నవాడను. అవన్నీ క్షమించి, మీలోనే ఉంచుకొని నన్ను సరిచేస్తూ ప్రక్షాళనము చేయండి. అవన్నీ దుష్ట స్వభావము గల కుక్క కూతలు వంటివి. అట్టి ‘వస్తు’ (దోషనివర్తనము) కొరకై శ్రద్ధగా ఈ సమర్పించే ఆజ్యమును స్వీకరించి నన్ను పరిశుభ్రపరచి పునీతుని చేయండి.


61వ అనువాకము
నాహం కర్తా। నాహం కారయతా

173. కామో కార్షీత్ నమో నమః।
కామో కార్షీత్ కామః కరోతి,
నాహమ్ (న అహం) కరోమి।
కామః కర్తా। నాహమ్ కర్తా।
కామః కారయితా। నాహం
కారయితా।
ఏష తే కామ కామాయ స్వాహా।
ఈ జగత్తులు, ఇందలి సర్వ సందర్భములు ఈశ్వర వినోదమే! అందుచేత జగత్తులో సర్వ సంఘటనలు పరమాత్మ యొక్క స్వీయకృతమగు మాయావిశేషములే కనుక ఓ సర్వదేవతలారా! నేను నిర్వర్తించు కర్మలకు సంబంధించి ‘‘అహమ్-కృతమ్’’ అనునదేదీ లేదు. అంతా ఈశ్వరకృతమే.. నవలా రచనలోని విశేషాలన్నీ నవాలా రచయిత ఇచ్ఛా విశేషములే కదా! అదేవిధంగా ఈదృశ్య వ్యవహార సరళి, ఇందలి సర్వ విశేషములు ఏపరమేశ్వరునికి చెందినవో, ఆయనయే కర్త. ఆయన మాయలోని కామోకార్షమే అంతా నిర్వర్తిస్తోంది. అట్టి ఈశ్వరేచ్ఛారూపమగు కామమే కర్త. నేను కర్తను కాను. ఆ ఈశ్వర కామమే కారయితము (చేయించుచున్నది). నేనేమీ చేయించటము లేదు. చేయటమూ లేదు.
అట్టి కామత్వమును కామముగా గల ఈశ్వరా! ఈ ఆహుతి స్వీకరించండి. అట్టి కామః కామ భగవానునికి నమస్కారము.


62వ అనువాకము

174. మన్యుః అకార్షీత్ నమో నమః।
మన్యుః అకార్షీత్ మన్యుః కరోతి।
నాహమ్ కరోమి।
మన్యుః కర్తా। నాహం కర్తా।
మన్యుః కారయితా।
నాహం కారయితా।
ఏష తే మన్యో మన్యవే స్వాహా।।
(మన్యువు = యజ్ఞము; కృప; కోపము)
ఈ జగత్తంతా ఒక మహాయజ్ఞము. ఇక్కడ ఏదేది ఏ విధంగా జరుగుచూ ఉన్నప్పటికీ, ఏది ఎవ్వరి చేత నిర్వర్తించబడుచూ ఉన్నప్పటికీ అదంతా విశ్వయజ్ఞ అంతర్భాగమే. (కథలోనివే సర్వపాత్రలు, సంఘటలన్నీ అయిన తీరుగా!)
ఇదంతా జగద్రచయిత యొక్క మన్యు (జగత్ రచనా యజ్ఞ) చమత్కారమే. కనుక నేను ఏదేది నిర్వర్తిస్తూ ఉన్నానో (పుణ్యపాపములు మొదలైనవి) - నేను కర్తను కాదు. నేను చేయటం లేదు. పరమేశ్వర సృష్టి యజ్ఞ సంకల్పమే నిర్వర్తిస్తోంది. మన్యువే (యజ్ఞము) ఆకర్షించి నిర్వర్తింపజేయుచున్నది. నేను చేయుట లేదు. మన్యువే కర్త. నేను కాదు. మన్యువే చేయిస్తోంది. నేనేదీ చేయించటం లేదు.


63వ అనువాకము
తిలాహోమ మంత్రము (సన్న్యాస విధిలో అంతర్భాగములు)

175. తిలాన్ జుహోమి,
స-రసాగ్ం స-పిష్టాన్
గంధార మమ చిత్తే
రమంతు స్వాహా।
ఓ పరమాత్మా! రస సహితమైనవి, సపిష్టమైనది( పిండిగా, ముద్దగా చేయబడినవి) అగు తిలలను (నువ్వులను) తమ ప్రీతి కొరకై హోమము చేయుచున్నాను. మహత్తరము. పరమ పావనము అగు మీ గుణ విశేషములు నా హృదయము నందు రమించునుగాక! స్వాహా!
176. గావో హిరణ్యం ధనమ్
అన్న-పానగ్ం
సర్వేషాగ్ం శ్రియై స్వాహా
గో సంపద, బంగారము, ధనము, అన్నపానములు మొదలైవి మాకు లాభించుట కొరకై, భోగ్య పదార్థములు పొందుటకై, సర్వజనుల శ్రేయోభిలాషినై ఈ తిలలను హవిస్సు రూపంగా మీకు సమర్పణ చేస్తున్నాను. ఆహుతి ఇస్తున్నాను. స్వాహా!
177. శ్రియన్చ లక్ష్మీన్చ పుష్టిన్చ
కీర్తిం చ అనృణ్యతామ్।
బ్రహ్మణ్యం బహుపుత్రతామ్।
శ్రద్ధా మేధే ప్రజాః సన్దదాతు స్వాహా।।
శ్రియములు (శిరి-సంపదలు), మోక్షలక్ష్మి పుష్టి, కీర్తి, ఋణత్రయా రాహిత్యము (దేవఋణము, పితృణము, ఋషి ఋణము తీరుట)ల కొరకై, బ్రాహ్మణ్యము (బ్రహ్మ జ్ఞానము) లభించటానికై, బహు సంతాన ప్రాప్తి కొరకై, శ్రద్ధ - మేధ (తెలివి) ప్రజా సంపదల కొరకై మీకు ఈ తిలలను ఆహుతిగా ఇస్తున్నాను. స్వాహా!


64వ అనువాకము

178. తిలాః కృష్ణాః,
తిలాః శ్వేతాః
తిలాః సౌమ్య వశానుగాః
తిలాః పునంతు మే పాపం
యత్ కించిత్ దురితమ్ మయి స్వాహా।।
పరమేశ్వరా! నల్లటి నువ్వులు, తెల్లటి నువ్వులు, సౌమ్యమైన నువ్వులు (ఆరోగ్యమును ఏ మాత్రము ఇబ్బంది పెట్టనివి) -అగు నేను సమర్పించు ఈ ఈ నువ్వులు - నా పాపములు తొలగించి నన్ను పునీతునిగా చేయునుగాక. సర్వదురితములను తొలగించునుగాక! అందుకు ఈ తిలలను పరమాత్మకు ‘ఆహుతి’గా సమర్పిస్తున్నాను స్వాహా"!
179. చోరస్య అన్నం నవ శ్రాద్ధం
బ్రహ్మహా గురు తల్పగః
గోస్తేయగ్ం సురాపానం
భ్రూణ హత్యా
తిలాః శాంతిగ్ం
శమయంతు స్వాహా।
ఈ నేను ఆహుతిగా సమర్పించు తిలలను పరమాత్మ ప్రియముగా స్వీకరించునుగాక! దొంగతన దోషంతో తదితరులకు చెందినట్టి ధనము, అన్నము; పితృదేవలకు సమర్పించకుండా వారి నుండి సంక్రమించినది సొంతము చేసుకొన్న ద్రవ్యదోషము; బ్రహ్మ హత్యాదోషము; గురుతల్ప గమన దోషము; గోవును దొంగిలించిన దోషము; సురాపాన దోషము; గర్భస్త శిశు హత్యాదోషము; - ఇట్టి సప్తమహాదోషములు ఈ తిలా ఆహుతి సమర్పణచే శమించినవి, సశాంతించినవి అగునుగాక! స్వాహా!
180. శ్రీశ్చ లక్ష్మీశ్చ పుష్టిశ్చ
కీర్తించ అనృణ్యతామ్।
బ్రహ్మణ్యం బహుపుత్రతామ్।
శ్రద్ధా మేధే ప్రజ్ఞా తు
జాతవేదః సన్దదాతు స్వాహా।।
ఓ పరమేశ్వరా! జాతవేదా! అగ్ని దేవా! మాకు పాడి -పంట - సంపదలతో కూడిన రాజ్యలక్ష్మి కొరకు, మా దేహము యొక్క పరిపుష్టి కొరకు, ఉత్తమమైన కీర్తి కొరకు, ఋణత్రయ విముక్తి కొరకు, బ్రహ్మతత్త్వసిద్ధి కొరకు, బహుసంతానము కొరకు, శ్రద్ధ- మేధ-ప్రజ్ఞల ప్రవృద్ధి కొరకు మీకు ఈ ఆజ్యము సమర్పిస్తున్నాను. స్వాహా!


65వ అనువాకము - శుద్ధి

181. ప్రాణ అపాన వ్యాన ఉదాన
సమానా మే శుధ్యన్తాం
జ్యోతిః - అహమ్ విరజా
విపాప్మా భూయాసగ్ం స్వాహా।
నేను కేవల జ్యోతి స్వరూపుడను. ఎట్టి ధూళి-దోషములచే స్పృశించబడు వాడను కాను. సర్వదా నిర్మలాత్మనగు నన్ను ఎట్టి పాపము అంటజాలదు. అట్టి స్వాభావిక స్వానుభవ సిద్ధి కొరకై, ప్రాణ-అపాన - వ్యాన -ఉదాన - సమాన శుద్ధికొరకై మరల ఈ ఆహుతిని సమర్పిస్తున్నాను. స్వాహా"!
182. వాక్ మనః చక్షుః శ్రోత్ర జిహ్వా
ఘ్రాణః ఏతో బుద్ధ్యా కూతిః
సంకల్పా మే శుద్ధ్యన్తామ్।
‘జ్యోతిః’-అహమ్ విరజా,
విపాప్మా భూయాసగ్ం (గ్గ్) స్వాహా।।
స్వతఃగా నిర్మల-పాపరహిత - దోషరహిత జ్యోతిర్జ్యోతి స్వరూపుడనే అగు నేను నాయొక్క వాక్కు -మనస్సు - దృష్టి /చక్షువులు- వినికిడి/చెవులు, రుచి/నాలుక, వాసన/ముక్కు, దోషబుద్ధి, అల్ప సంకల్పాభ్యాసముల శుద్ధి కొరకై మరల ఈ నేయిని అగ్నికి ఆహుతిగా సమర్పిస్తున్నాను. స్వాహా"!
183. త్వక్ చర్మ మాగ్ంస రుధిర
మేదో మజ్జా స్నాయవో
అస్థీని మే శుద్ధ్యన్తామ్
జ్యోతిః అహమ్-విరజా,
విపాప్మా భూయాసగ్ం స్వాహా।।
నిర్మల జ్యోతిర్జ్యోతి స్వరూపడను. సర్వదా రజోదోష రహితుడను, పారహితుడను. నిత్య నిర్మలుడను. నిత్య శుద్ధడను. ఎందుకంటే నేను సహజముగా సర్వదా కేవలము ఆత్మ స్వరూపుడినే కదా! అట్టి ‘‘ఆత్మాఽహమ్’’ పట్ల సర్వ భ్రమలు తొలగటానికి - త్వక్ (స్పర్శ) - చర్మ- మాంస - రక్త - మేదో (క్రొవ్వు) - మజ్ఞ స్నాయు (సన్నటి నరముల) శుద్ధి కొరకై - ఈ ఘృతము ఆహుతిగా సమర్పిస్తున్నాను. స్వాహా"!
184 శిరః పాణి పాద పార్శ్వ పృష్ఠోః ఉదర జంఘ
శిశ్నో ఉపస్థ పాయవో మే శుద్ధ్యన్తామ్। a
జ్యోతిః - అహమ్
విరజా, విపాప్మా భూయాసగ్ం స్వాహా।
శిరస్సు-చేతులు-పాదములు-భుజములు-పృష్ఠములు-వీపు-పొట్ట- జంఘము (కాలి పిక్క)-శిశ్నము (మగగురి), ఉపస్థ (స్త్రీ పురుషుల రహస్యావయములు) - పాయువు (విసర్జనా వయవము) - ఇవన్నీ శుద్ధి పొంది ఉండానికై విరజుడను - పాపరహితుడను, జ్యోతి స్వరూపుడను అగు నేను ‘‘నేయి ఆహుతి’’ని అగ్ని ద్వారా దేవతలకు సమర్పిస్తున్నాను. స్వాహా"!
185. ఉత్తిష్ఠ। పురుష। (ఉత్తిష పురుష)
హరిత పింగల లోహితాక్ష
దేహి దేహి దదాపయితా మే శుద్ధ్యన్తాం
‘జ్యోతిః’ అహం విరజా
విపాప్మా భూయాసగ్ం స్వాహా।
పరమ పురుషా! మౌనము వీడండి! ఓ పరమాత్మా! ఉదాశీనతను వదలండి. లేవండి. హరిత (ఆకుపచ్చ) - పింగళ (గోరజ రంగు) - లోహిత (ఎర్రటి) కనులు, దేహము గల స్వామీ! నాకు శుద్ధిని ప్రసాదించండి.
ఆత్మ-జ్యోతి స్వరూపుడను, విరజ-విపాపుడను (దోష రహితుడను) అగు నేను ఆజ్యమును అగ్నికి సమర్పిస్తున్నాను. స్వాహా! భూయాసం! అధికంగా సమర్పిస్తున్నాను. స్వాహా!


66వ అనువాకము

186. పృథివి ఆపః తేజో వాయు ఆకాశా మే శుద్ధ్యంతాం।
‘జ్యోతిః’ అహం విరజా విపాప్మా భూయాసగ్ం స్వాహా।
నా పట్ల పృథివి, జలము, అగ్ని, వాయు, ఆకాశములు (పంచభూతములు) శుద్ధి పొందినవై ఉండునుగాక! దోష - పాపరహిత జ్యోతి స్వరూపుడనై నేను ఈ నేయిని అగ్నికి ఆహుతి ఇస్తున్నాను. స్వాహా"!
187. శబ్దః స్పర్శ రూప రస గంధా మే శుద్ధ్యన్తామ్।
‘జ్యోతిః’ అహమ్ విరజా విపాప్మా భూయాసగ్ం స్వాహా।
నా యొక్క పంచతన్మాత్రలగు శబ్ద స్పర్శ రూప రస గంధములు శుద్ధిని పొందునుగాక! నిత్యనిర్మల ఆత్మజ్యోతి స్వరూపుడనగు నేను సర్వదోష నివారణార్థమై వాటిని ఆహూతులు అగ్నికి సమర్పిస్తున్నాను. స్వాహా"!
188. మనో వాక్ కాయ కర్మాణి మే శుద్ధ్యన్తామ్
‘జ్యోతిః’ అహం విరజా విపాప్మా భూయా స<span style=“color:red;”గ్ం స్వాహా।
నా యొక్క మనోవాక్ - కాయ కర్మలన్నీ పరిశుద్ధత్వము సంతరించు కోవటానికై విరజా-విపాప్మా జ్యోతి స్వరూపుడనగు నేను అధికాధికంగా వాటిని ఆహూతిగా సమర్పిస్తున్నాను. స్వాహా!
189. అవ్యక్త భావైః అహంకారైః, ‘జ్యోతిః’ అహం విరజా
విపాప్మా భూయాసగ్ం స్వాహా।
అవ్యక్త భావములను, అహంకారమును నిర్మలజ్యోతి స్వరూపుడనై పూర్తిగా ఆహుతిగా వాటిని సమర్పిస్తున్నాను. స్వాహా"!
190. ఆత్మా మే శుద్ధ్యన్తామ్, ‘జ్యోతిః’ అహం
విరజా విపాప్మా, భూయాసగ్ం స్వాహా।
నా జీవాత్మత్వము పరిశుద్ధమగునుగాక! దోషరహిత కేవల జ్యోతి స్వరూపుడనగు నేను పరిశుద్ధి కొరకై ఆహూతులు సమర్పిస్తున్నాను స్వాహా"!
191. అంతరాత్మా మే శుద్ధ్యంతామ్।
‘జ్యోతిః’ అహమ్, విరజా విపాప్మా భూయాసగ్ం స్వాహా।।
నిర్మల - నిర్దోష స్వయం జ్యోతి - ఆత్మ స్వరూపుడనైన నేను ‘అంతరాత్మ శుద్ధి’ని ఉద్దేశ్యించి సమృద్ధిగా ఆజ్యమును అగ్ని భగవానునికి సమర్పిస్తున్నాను. స్వాహా"!
192. పరమాత్మా మే శుద్ధ్యంతామ్।
‘జ్యోతిః’ అహం
విరజా విపాప్మా భూయా సగ్ం స్వాహా।
సకల సంసారిక దోషముల స్పర్శ నుండి శుద్ధి పరచుకొనుచూ, నిర్మల స్వయం ప్రకాశక, జ్యోతి రూపుడగు పరమాత్మకు ఆహుతులు సమృద్ధిగా సమర్పిస్తున్నాను. స్వాహా"!
193. క్షుధే స్వాహా।
194 క్షుత్ పిపాసాయ స్వాహా।
195. వివిట్యై స్వాహా।
196 ఋక్ - విధానాయ స్వాహా।
197 కషోత్కాయ స్వాహా।
‘ఆకలి’ అధిష్ఠాన దేవతకు సు-హుతము. ।।స్వాహా।।
ఆకలి -దప్పికల అధిష్ఠాన దేవతకు సు-హుతము ।స్వాహా।
సర్వత్రా విస్తరించియున్న ఆత్మతత్త్వ ధర్మమునకు సు-హుతము. స్వాహా“!
ఋక్కులు స్తుతించు మార్గము - లక్ష్యము అగు పరబ్రహ్మతత్త్వమునకు స్వాహా”!
సృష్ట్యభిమాని, సృష్ట్యున్ముఖుడు అగు పరమాత్మా! స్వాహా"!
198 క్షుత్ పిపాసా మలాం
జేష్ఠామ్, అలక్ష్మీః
నాశయామి అహమ్।
ఓ పరాత్‌పరా! భగవాన్! నా పట్ల ప్రవర్తించు ఆకలి - దప్పిక - మల దోషముల రూపమగు అలక్ష్మీ జ్యేష్ట దోషవృత్తుల నుండి నేను నిర్మలము పొందుదునుగాక. స్వాహా!
అభూతిమ్ అసమృద్ధిం చ
సర్వాన్ నిర్ణుద మే
పాప్మానగ్ం స్వాహా
‘‘నా పట్ల పరమాత్మ విభూతులను మరుపుకలిగించు అభూతి, ‘‘ఇంకా ఏదో పొందాలి!’’ అనే అసమృద్ధి భావనలు తొలగుటకై, పాపకర్మలు, పాప దృష్టులు సుదూరమగుటకై ఈ నేయి ఆహూతిగా సమర్పిస్తున్నాను. స్వాహా"!
199. అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ
ఆనందమయమ్, ఆత్మా మే శుద్ధ్యన్తాం
‘జ్యోతిః’ అహమ్ విరజా విపాప్మా భూయాసగ్ం స్వాహా।
జీవాత్మత్వ పరిధి అధిగమించుటకై కేవలాత్మానందము ఆస్వాదించుటకై అన్నమయ-ప్రాణమయ-మనోమయ- విజ్ఞానమయ - ఆనందమయ కోశ (పంచకోశ) శుద్ధి కొరకై -ఆహుతులను నిండుగా సమర్పిస్తున్నాను. స్వాహా"!


67వ అనువాకము
విశ్వేదేవ హోమమంత్రములు

200. అగ్నయే స్వాహా।
విశ్వేభ్యో దేవేభ్యః స్వాహా।
ధృవాయ భూమాయ స్వాహా।
ధృవ క్షితయే స్వాహా।
అచ్యుత క్షితయే స్వాహా।
అగ్నయే స్విష్టకృతే స్వాహా।
షడగ్నులగు గార్హపత్య-ఆహవనీయ-దక్షిణ-సభ్య- అవసధ్య - ఔపాసనాగ్నుల రూపుడు; విశ్వాగ్ని - వైశ్వానరాగ్ని రూపుడు అగు అగ్ని భగవానునకు స్వాహా“!
ఈ విశ్వమంతా పర్యవేక్షిస్తూ సర్వజీవులకు దేహ-అన్నపానీయములు ప్రసాదించు విశ్వాభిమాన విశ్వేదేవునికి - స్వాహా”!
ధృవునికి స్వాహా! ధృవక్షితికి స్వాహా! అచ్యుతక్షితికి (స్థానమునకు) స్వాహా! దుష్టకర్మలను నిరోధించి సుకర్మలకు దారిచూపు జగద్గురువగు అగ్నికి ఆహుతము సమర్పిస్తున్నాము. స్వాహా"! కర్మల సప్రియముకొరకై స్వాహా।
201 ధర్మాయ స్వాహా। అధర్మాయ స్వాహా।
అద్భ్యః స్వాహా। ఓషధి వనస్పతిభ్యః స్వాహా।
రక్షో దేవ జనేభ్యః స్వాహా।
గృహ్యాభ్యః స్వాహా। అవసానేభ్యః స్వాహా।
అవసానపతిభ్యః స్వాహా। సర్వభూతేభ్యః స్వాహా।
కామాయ స్వాహా। అంతరిక్షాయ స్వాహా।
యత్ ఏజతి జగతి, యచ్చ చేష్టతి
నామ్నో భాగో యత్ నామ్నే స్వాహా।
పృథివ్యై స్వాహా। అంతరిక్షాయ స్వాహా।
ధర్మమునకు స్వాహా! అధర్మమునకు స్వాహా! జలాధిష్ఠాన దేవతకు స్వాహా! ఓషధ-వనస్పతి రస దేవతలకు స్వాహా“!
లోక రక్షకులగు దేవతామూర్తులకు స్వాహా”! గృహ దేవతలకు స్వాహా! కార్యక్రమముల ముగింపు దేవతకు, అవసాన (ముగింపు) - ఉపసంహార దేవతకు స్వాహా“!
సర్వభూతజాలమునకు స్వాహా”! కామదేవతకు స్వాహా! అంతరిక్ష - అభిమాన దేవతకు స్వాహా“!
సర్వకదలికల అభిమాన దేవతకు, సర్వచేష్టల అభిమాన దేవతకు, సర్వ నామరూప అభిమాన దేవతకు స్వాహా!
పృథివీ - భూదేవతకు స్వాహా”! అంతరిక్ష దేవతకు స్వాహా"! దివ్యలోకముల అధిష్ఠాన దేవతకు స్వాహా! దివా (పగలు) అభిమాన దేవతకు-స్వాహా!
దివే స్వాహా। సూర్యాయ స్వాహా।
చంద్రమసే స్వాహా। నక్షత్రేభ్యః స్వాహా।
ఇంద్రాయ స్వాహా। బృహస్పతయే స్వాహా।
ప్రజాపతయే స్వాహా। బ్రహ్మణే స్వాహా।
స్వధా పితృభ్యః స్వాహా।
నమో రుద్రాయ పశుపతయే స్వాహా।
దేవేభ్యః స్వాహా। పితృభ్యః స్వధాస్తు।
భూతేభ్యో నమః। మనుష్యేభ్యో హన్తా।
ప్రజాపతయే స్వాహా।
పరమేష్ఠినే స్వాహా।
సహస్ర కిరణ తేజో - ఆనంద స్వరూపుడగు సూర్యభగవానునికి - స్వాహా“! ఓషధ - వనస్పత ప్రదాతయగు చంద్రలోకాభిమాన దేవతకు - స్వాహా”! నక్షత్ర మండలాభిమాన దేవతకు - స్వాహా“!
సర్వేంద్రియ గుణభాసుడు, సర్వేంద్రియ వివర్జితుడు, త్రిలోకాభిమాని అగు శ్రీమన్ ఇంద్రభగవానునికి స్వాహా”! మహత్‌బుద్ధి స్వరూపుడు, దేవతల గురువు అగు బృహస్పతుల వారికి - స్వాహా“! పిండ ప్రదాతలు, దేహ నిర్మానాభిమాన దేవతలగు పిత్రు దేవతలకు - స్వధా! ఇంద్రియములనే పశువులకు పతి, లయకారుడు, మహత్తర ఆత్మాహమ్ దృష్టి ప్రదాత అగు - రుద్రభగవానునికి స్వాహా! ముక్కోటి దేవతలకు స్వాహా! పితృ దేవతలకు స్వధా! పంచభూతములకు, పంచభూత నిర్మిత దేహ ప్రపంచాభిమానికి స్వాహా! మనుష్యు జాత్యభిమానియగు మనువుకు స్వాహా! ప్రజాపతియే స్వాహా”! పరమేష్ఠికి స్వాహా"!
202 యథా కూపః శతధారః
సహస్రధారో అక్షితః,
ఏవా మే అస్తు ధాన్యగ్ం
సహస్రధారమ్ అక్షితమ్, ధనధాన్యైః స్వాహా।।
ఏవిధంగా అయితే నుయ్యిలో వందల వేల ధారలతో అక్షయమై తోడుచున్న కొలదీ నీరు తరగకయే ఉంటుందో, … అట్లాగే మాకు ధనధాన్యములు సహస్ర ధారలతో కూడి తరుగకయే ఉండునుగాక.
ధన ధాన్య అక్షయ అభిమాన దేవతకు - స్వాహా"! - ఆహుత సమర్పణ!
203 యే భూతాః ప్రచరన్తి దివా, నక్తం బలిం ఇచ్ఛన్తో
వితుదస్య ప్రేష్యాః, తేభ్యో బలిం పుష్టికామో
హరామి మయి, పుష్టిం పుష్టిపతిః దధాతు స్వాహా।।
ఏ భూతములు ‘‘ఆహారం కావాలి’’ అని బలి కోరుకుంటూ రాత్రిం బవళ్ళు భూతనాధుడగు కాలాగ్ని రుద్రుని భృత్యులై తిరుగుతూ ఉంటారో, ఆ భూతజనులకు - ఆ (పంచ) భూతముల పుష్టి ప్రదానము కొరకు బలిహరణము సమర్పిచుచున్నాను. పుష్టికామపతి (భూతపతి, పరమశివుడు) మాకు ధన - ధాన్య - జన ఇత్యాది పరిపుష్టిని ప్రసాదించెదరుగాక! స్వాహా"!


68వ అనువాకము

204 ఓం తత్ బ్రహ్మ।
ఓం తత్ వాయుః।
ఓం తత్ ఆత్మా।
ఓం తత్ సత్యం।
ఓం తత్ సర్వమ్।
ఓం తత్ పురోః నమః।
అంతః చరతి భూతేషు
గుహాయాం విశ్వమూర్తిషు।
త్వం యజ్ఞః। త్వం వషట్ కారః।
త్వం ఇంద్రః। త్వగ్ం రుద్రః।
త్వం విష్ణుః। త్వం బ్రహ్మా।
త్వం ప్రజాపతిః।
త్వం తత్ ఆప-ఆపో జ్యోతీ
రసో అమృతం బ్రహ్మ
భూర్భువ స్సువః ‘ఓం’।। (భూర్భువస్సువరోమ్)
ఏ ఈ జీవునికి ఏది సహజ నిత్య సత్ రూపమై ఉన్నదో, అట్టి ఆవల రూపమే తత్ బ్రహ్మము. ‘ఓం’ - అనగా అట్టి పరబ్రహ్మమే। ఓంకార తత్‌యే - వాయువు।
అదియే - జీవాత్మ!
ఓంకారమే - సత్యము!
ఓం తత్ ఏవ - ఈ సర్వము కూడా!
సర్వమునకు మునుముందే ఉన్న అట్టి ఓంకారార్థ బ్రహ్మమునకు నమస్కరించుచున్నాము.
ఆ పరబ్రహ్మ-ఆత్మ భగవానుడే విశ్వముగా మూర్తీభవించుచూ ఉన్నారు. సర్వజీవుల హృదయ గుహలలో నిత్య సంప్రదర్శితులై యున్నారు.
అట్టి విశ్వమూర్తీ! పరమాత్మా! భగవాన్!
→ అనేక ప్రజల క్రియా-ఆనంద-ఐశ్వర్య విశేషములతో కూడిన ఈ సృష్టియజ్ఞమంతా మీరే! మీరే ఈ సృష్టి స్వరూపులు.
→ మీరే - ఈ సృష్టి షట్ విభాగములగు →
(1) దృశ్యము (2) ఇంద్రియములు (3) ఇంద్రియార్థములు - (4) దేహము (5) జీవాత్మ (6) ఈశ్వరుడు - అనబడు ఆరింటికి కర్త : వషట్‌కారులు.
→ ఇంద్రియాభిమాని, ఇంద్రియ యజమాని, ఇంద్రియ పర్యవేక్షకుడు, ఇంద్రియాతీతుడు అగు త్రిలోకాధిపతి ఇంద్రుడు - మీరే!
→ లయకారులగు రుద్రుడు మీరే.
→ పరిపోషకులు, సర్వాంతర్యామి, సర్వ స్వరూపులు అగు విష్ణువు కూడా మీరే!
→ సృష్టికర్తృత్వాభిమాని అగు బ్రహ్మా మీరే!
→ సర్వజన కల్పనాభిమాని అగు ప్రజాపతి కూడా మీరే!
→ జల- జ్యోతి - రస - అమృతమగు బ్రహ్మము మీరే!
→ భూ భువర్ సువర్ త్రిలోకములు మీరే!


69వ అనువాకము
ప్రాణాహుతి మంత్రములు

ప్రాణాహుతులు (భోజనానికి ముందు) సంకల్పమంత్రము
205 శ్రద్ధాయాం ‘ప్రాణే’ నివిష్టో
అమృతం జుహోమి।
శ్రద్ధాయామ్ ‘అపానే’ నివిష్టో
అమృతం జుహోమి।
శ్రద్ధాయామ్ ‘వ్యానే’ నివిష్టో
అమృతం జుహోమి।
శ్రద్ధాయామ్ ‘ఉదానే’ నివిష్టో
అమృతం జుహోమి।
శ్రద్ధాయాగ్ం ‘సమానే’ నివిష్టో
అమృతం జుహోమి।
బ్రహ్మణి మ ఆత్మా అమృతత్వాయ।।
ప్రాణాహుతులు (భోజనానికి ముందు) సంకల్పమంత్రము
నివిష్ణుడు = పట్టుదల, ఏకాగ్రత కలవాడు. ప్రవేశించువాడు. కూర్చున్నవాడు. ఓ పరమాత్మా!
- శ్రద్ధగా ‘ప్రాణము’ నందు ప్రవేశించి అమృతమును (ఆహారమును) పరమాత్మకు - జుహోమి। హోమము చేయుచున్నాము.
- శ్రద్ధగా ‘అపానములో ప్రవేశించి (ఈ తినబోవు ఆహారమును) అపానమునకు హోమము చేయుచున్నాను.
- శ్రద్ధగా ‘వ్యానప్రాణము’లో ప్రవేశించి అమృతమును (తినబోవు ఆహారమును) హోమము చేయుచున్నాను.
- శ్రద్ధావంతుడనై ‘ఉదానము’లో ప్రవేశించి అమృత హోమము చేయుచున్నాను.
- శ్రద్ధావంతుడనై ‘సమానప్రాణము’లో ప్రవేశించి అమృతహోమము చేయుచున్నాను.
నా ఆత్మయే అమృత స్వరూపము. బ్రహ్మము - అని ఉపాసిస్తున్నాను
206 అమృత ఉపస్తరణమ్ అసి।।
(అమృతోపస్తరణమసి)
ఓ వరుణ భగవాన్! అఘమర్షణ-అనుగ్రహ స్వరూపమా! జలదేవతా! నీవు అమృత రూపమగు ప్రాణమునకు ఉపస్తరణమువు. ఉపశాంతి స్వరూపమువు. నీకు నమస్కారము.
ప్రాణాహుతుల సందర్భంగా వికల్ప - మంత్రాంతరములు
207. శ్రద్ధాయాం ‘ప్రాణే’ నివిష్టో
అమృతం జుహోమి।
శివో మా విశా ప్రదాహాయ
ప్రాణాయ స్వాహా।
శ్రద్ధాయాం ‘అపానే’ నివిష్టో
అమృతం జుహోమి,
శివో మా విశా ప్రదాహాయ।
అపానాయ స్వాహా।
శ్రద్ధాయాం ‘వ్యానే’-నివిష్టో
అమృతం జుహోమి। శివో
మా విశా ప్రదాహాయ।
వ్యానాయ స్వాహా।
శ్రద్ధాయామ్ ‘ఉదానే’ నివిష్టో అమృతం జుహోమి। శివో మా విశా ప్రదాహాయ। ఉదానాయ స్వాహా।
ప్రాణాహుతుల వికల్పమంత్రాంతరములు
ప్రాణ స్వరూపుడై ‘ప్రాణము’గా సు-తిష్ఠించియున్న అమృతస్వరూప పరమాత్మకు స్వీకరిస్తున్న ఆహారమును హోమముగా వ్రేల్చుచున్నాను.
- నా యందు ప్రాణ స్వరూపశివునికి ఇదే హోమద్రవ్య సమర్పణ! ప్రాణాయిస్వాహా“!
అపాన - స్వరూప శివభగవానునికి శ్రద్ధగా హోమద్రవ్య సమర్పణ!
అపాన దేవత-స్వీకరించునుగాక! అపానాయ స్వాహా”!
వ్యాన స్వరూపుడై ఈ దేహమునందు సుతిష్ఠుతుడుగా ఉన్న వ్యానమా! శివభగవానుడే వ్యానస్వరూపుడై ఉన్నారు. అట్టి వ్యానమునకు హోమద్రవ్య సమర్పణ - స్వాహా"!
ఉదాన స్వరూపుడై పరమశివుడు దేహము నందు వేంచేసియున్నారు. దేహమును ఉజ్జీవింపజేస్తూ ఉన్నారు. అమృత స్వరూపులై ప్రవర్తించుచున్నారు. అట్టి ఉదాన ప్రాణమునకు ఆహారమును హోమద్రవ్యముగా సమర్పించుచున్నాను.
‘సమానము’ అనే శివాంశ దేహంలో ప్రవేశించి దేహమును అమృతవాయువు (మృతిచెందకుండా) చేయుచున్నది. శివస్వరూప ‘‘సమానము’’నకు
శ్రద్ధాయాగ్ం సమానే నివిష్టో అమృతం జుహోమి।
శివో మా విశాప్రదాహాయ, సమానాయ స్వాహా।
బ్రహ్మణి మ ఆత్మా అమృతత్వాయ।

208 అమృతా పిధానమసి। (అమృతా పిధా నమసి)
ఆహారమును ఆహుతిగా సమర్పిస్తున్నాము.
నా ఆత్మ అమృతమగు బ్రహ్మస్వరూపమే.

ఓ జలమా! నాచే త్రాగబడుచున్న మీరు ప్రాణదేవతకు నాశన రహితమగు ఆచ్ఛాదనమగుచున్నారు.


70వ అనువాకము
అన్నము తిన్న తరువాత తిన్న అన్నమునకు మానసిక అభిమంత్రణ మంత్రము
(భుక్తాన్న అభిమంత్రణ మంత్రః)

209 శ్రద్ధాయాం ప్రాణే నివిశ్య అమృతగ్ం హుతమ్।
ప్రాణమ్ అన్నేన ఆప్యాయస్వ।
శ్రద్ధాయాం ‘అపానే’ నివిశ్య అమృతగ్ం హుతమ్।
అపానమ్ అన్నేన ఆప్యాయస్వ।
శ్రద్ధాయాం ‘వ్యానే’ నివిశ్య అమృతగ్ం హుతమ్
వ్యానమ్ అన్నేన ఆప్యాయస్వ।
శ్రద్ధాయాం ‘ఉదానే’ నివిశ్య
అమృతగ్ం హుతమ్। ఉదానమ్
అన్నేన ఆప్యాయస్వ। శ్రద్ధాయాగ్ం
సమానే నివిశ్య అమృతగ్ం హుతమ్
సమానమ్ అన్నేన ఆప్యాయస్వ।
‘ఓ అన్నదేవతా!’ శ్రద్ధావంతులై నాలో ప్రవేశించుయుండి మీరు శరీరమును జీవింపజేయుచున్నారు. నేను హోమము చేసిన అన్నముచే దేహములోని ‘ప్రాణము’ ఆప్యాయమగునుగాక.
దేహములో ప్రవర్త శీలమైయున్న అపానము నేను సమర్పించిన (హోమము చేసిన) అన్నము అను ఆహుతి అపానప్రాణమునకు ఆప్యాయమగుగాక!
వ్యానమునకు సమర్పించిన (హుతము చేసిన) అన్నములను హోమద్రవ్యముచే అమృతత్వము పొంది వ్యానప్రాణము ఆప్యాయమగు గాక!
(నేను స్వీకరించిన) అన్నముచే ఉదానప్రాణముము అమృతముగా ఉత్తేజితమై ఆప్యాయమగుగాక.
నేను సమర్పించిన ‘అన్నము’ అను హోమద్రవ్యముచే సమాన ప్రాణము అమృతము, ఆప్యాయము - అగునుగాక!


71వ అనువాకము
భోజనాంతే ఆత్మానుసంధాన మంత్రః
(భోజనము చేసిన తరువాత చేయవలసిన ఆత్మానుసంధాన మంత్రం)

210 అంగుష్ఠ మాత్రః పురుషో
అంగుష్ఠన్ చ సమాశ్రితః
ఈశః సర్వస్య జగతః
ప్రభుః - ప్రీణాతి “విశ్వభుక్”
చిన్ముద్ర
తత్ - బొటనవ్రేలు (నిలువుగా)
త్వమ్ - చూపుడువ్రేలు సూటిగా
తత్‌త్వమ్-బొటనవ్రేలు-చూపుడువ్రేలుల కలయిక అసి = చిన్ముద్ర
అట్టి అంగుష్ఠము (బొటనవ్రేలు) పరతత్త్వమునకు, పరమాత్మకు సంజ్ఞ. అట్టి హృదయమున వేంచేసియున్న పొగరహిత జ్యోతి ప్రకాశకుడగు పరమ పురుషుడు-ఈ సమస్త జగత్తుకు నియామకుడు, ప్రభువు అయి ఈ విశ్వమంతా అన్నము (అనుభవ విషయము)గా కలిగియుండి ‘విశ్వభుక్’ అయి ఉన్నారు. (తత్ త్వమ్‌గా ఉన్నారు).


72వ అనువాకము
భోజనానంతరం అవయవ స్వాస్థ్య మంత్రము

211 వాఙ్మ అసన్, నసోః ప్రాణః।
అక్ష్యోః చక్షుః। కర్ణయోః శ్రోత్రమ్।।
బాహువోః బలమ్।
ఊరువో రోజః।
అరిష్టా విశ్వాని అంగాని తనూః।
తను వా మే సహ।
నమస్తే అస్తు మా మా హిగ్ సీః।।
ఆ పరమశివా! మీరు ప్రసాదించగా నేను తినియున్న ఆహారముచే ఈ శరీరములోని సర్వ అవయవములకు స్వస్థ్యత చేకూరుచున్నది. కడుపునిండుగా భోజనము స్వీకరించటం చేత →
- వాక్ ఇంద్రియము నోటియందును, - ప్రాణము ముక్కు నందును,
- చూపు నేత్రగోళములందును, - వినికిడి చెవుల యందును,
కుదుటపడుచున్నాయి. బాహువులకు బలము చేకూరుచున్నది. ఊరువులకు కదిలే, నడిచే ఉత్సాహము, శక్తి లభిస్తోంది. నేను పొందుచున్న ఈ విశ్వదృశ్యాంతర్గతమగు అంగములు, తనువు మొదలైనవన్నీ పుష్టి పొందిన ఈ దేహమునకు అరిష్టత (మేలు) చేయునవగుచున్నాయి. నా ఈ శరీరము నాకు ఉపయోగపడ ప్రారంభిస్తోంది. భౌతిక - సూక్ష్మ ఆధ్యాత్మిక శరీరములు స్వస్థత చెందుచున్నాయి. మీ యొక్క అన్నరస రూప మహామహితాత్మ త్వమునకు - నమస్కరించుచున్నాను. నమః తే అస్తు। మీతో మమేకమయ్యెదముగాక!


73వ అనువాకము
ఇంద్ర- ప్రస్తుతి - మంత్రము

212 పయః సుపర్ణా ఉపసేదుః ఇంద్రం
ప్రియ మేధా ఋషయో నాధమానాః।
అపధ్వాన్త మూర్ణు హి పూర్థి చక్షుః
ముముగ్ధ్య అస్మాన్ నిధయేవ బద్ధాన్।
సర్వ పాపక్షయము కొరకు, ఉత్తరోత్తర సంపద ప్రాప్తికై జపించుమంత్రము.
ఓ ఇంద్రభగవాన్! మాకు పాడి - పంటలను, పక్షుల వలె చక్కటి రెక్కలను, ఋషుల యొక్క ప్రియముతో కూడిన మేధస్సును అనుగ్రహించండి. మీరు మాకు నాధులు! అపశ్రుతులను తొలగించుకొను సామర్ధ్యమును, సత్యము - నిత్యము అయినదానినే దర్శించగల శుభ్రతతో కూడిన చక్షువులను, చూపును సంసార బంధ విముక్తి కొరకై ప్రసాదించండి.


74వ అనువాకము
హృదయాలంభన మంత్రము (హృదయముపై కుడిచేయి అడ్డముగా పరచి ఎడమ చేతితో ‘చిన్ముద్ర’ ధరించి చదవాలి)

213 ప్రాణానాం గ్రంథిః అసి।
రుద్రో మా విశాంతకః
తేన అన్నేన ఆప్యాయస్వ।
హృదయమును కుడి అరచేతితో స్పృశిస్తూ ఎడమ ఏతితో చిన్ముద్ర ధరించి పఠించు హృదయాలంబనా మంత్రము
నా హృదయవర్తివి అగు ఓ మహత్ - అహంకారమా! నీవు నాయొక్క - వాయురూప, ఇంద్రియరూప- పంచప్రాణములకు గ్రంథి వంటివారు. నా యందు సుతిష్టితులైయున్న రుద్రభగవానుని అంశ అయి ఉన్నారు. రుద్ర ప్రసాదమగు నేను తినియున్న ఆహారము యొక్క రసము స్వీకరించి ఆప్యాయత పొందండి. ఓ అహంకార దివ్య దేహా! మీరు మాయందు సంకుచితత్వమును తొలగించి విశ్వాహంకారత్వమును సంతరించు కొనునట్లు అనుగ్రహించండి.


75వ అనువాకము

214 నమో రుద్రాయ విష్ణవే।
మృత్యుః మే పాహి।
విష్ణు స్వరూపులగు ఓ రుద్ర భగవాన్! నమో నమః! ‘‘ఆత్మను ఏమరచి, దృశ్య - ఇంద్రియ వ్యవహార అనువర్తినై పరిమితుడవటము’’ - అనే మృత్యువు నుండి (మ-ఋత్→ మ ఋతమ్ = మృతమ్ = సత్యమును గమనించకపోవటం నుండి) నన్ను రక్షించండి. అమృతత్వము ప్రసాదించండి.


76వ అనువాకము
అగ్ని దేవ స్తుతి మంత్రము

215 త్వమ్ అగ్నే ద్యుభిః
త్వమ్ ఆశు శుక్షణిః
త్వమ్ అద్భ్యః।
త్వమ్ అశ్మన స్పరి
త్వమ్ వనేభ్యః
త్వమ్ ఓషధీభ్యః।
త్వమ్ నృణామ్ నృపతే
జాయసే శుచిః।।
ఓ అగ్ని భగవాన్!
- మీరు ఉత్తమ కాంతులతో, తేజస్సుతో సర్వదా వెలుగొందుచున్నట్టివారు.
- మా యొక్క పాపకర్మలను, అల్ప - సంకుచిత దృష్టులను శోషింపజేయు ఉష్ణ స్వరూపులు.
- జలమునందు మీరు అంతర్యామి! జలస్వరూపులు.
- మహామేరు పర్వతము, తదితర సర్వ పర్వతముల పైన కూడా సంచారము, ఉనికి గలవారు
- వనములందు విహరించువారు.
- మీరు సర్వదేహములకు, ఆహారము ప్రసాదించు ఓషధి స్వరూపులు.
- సర్వ జీవులకు అధినాయకులు. సర్వదా శుచి అయినవారు. మమ్ములను పరశుభ్రపరచి రక్షించండి.


77వ అనువాకము
శివ సామీప్యమునకై - అభీష్ట యాచనా మంత్రము

216 శివేన మే సన్తిష్ఠస్వ।
స్యోనేన మే సన్తిష్ఠస్వ।
సుభూతేన మే సన్తిష్ఠస్వ।
బ్రహ్మవర్చసేన మే సన్తిష్ఠస్వ।
యజ్ఞస్య అర్థి మను సన్తిష్ఠస్వ।
ఉపతే యజ్ఞ। ఉపేతే నమ। ఉపతే నమః।
పరమేశ్వరా! పరమశివా! సుస్వాగతము! నా దగ్గర సుఖాసీనులై, నాకు తోడుగా ఉండండి. మీ అనంతమగు కళలతో కళాస్వరూపులై దగ్గిరగా ఆసీనులవండి.
ఐహిక - ఆముష్మిక సుఖ ప్రదాత అగుచూ, భూతనాధుడవై, సుభూతుడవై వేంచేసి సుఖాశీనులవండి. స్వామీ! బ్రహ్మవర్చస్సును అనుగ్రహిస్తూ నాకు దగ్గిరగా సర్వదా తోడై ఉండండి. మీ కొరకై మేము యజ్ఞార్థకర్మలు అధికంగా చేస్తూ ఉండుటకై, తిష్ఠితులు అవండి.
ఓ యజ్ఞ పురుషా! జగత్ యజ్ఞ కర్తా! మీ సామీప్యమునకు నమస్కారము. మీరు వెంటనంటి ఉంటున్నందుకు - నమో నమో నమో నమః।।


78వ అనువాకము
పరతత్త్వ నిరూపణ మంత్రము

217 ‘‘సత్యం’’ పరంపరగ్ం
సత్యగ్ం సత్యేన న
సువర్గాః లోకాః చ్యవన్తే
కదాచన।
సత్యాగ్ం హి (సతాగ్ం హి) సత్యం।
తస్మాత్ సత్యే రమన్తే।।
(11) ఏకాదశ ఆత్మజ్ఞాన సాధనలు - సత్యం, తప, దమ, శమ, దానమ్, ధర్మ, ప్రజన, అగ్నయ, అగ్నిహోత్రమ్, యజ్ఞ, మదనమ్ - ఇతి న్యాసమ్
సత్+యత్ - ఏది త్రికాలములలోను ‘ఉనికి’ (The sense that “I am there”)కలిగియున్నదో, అదియే ‘‘సత్యము’’. ప్రమాణ పూర్వకంగా ఉన్నది ఉన్నట్లు చెప్పునది సత్యము. అది పురుషార్థ సాధనములలో శ్రేష్ఠము. సత్యమే సత్యమంత గొప్పది. సత్యమును ఆశ్రయించువారు సువర్గలోకము నుండి ఎప్పుడూ చ్యుతి పొందరు. సత్ స్వరూపమే సత్యము. సత్యమును (ఆత్మను) ఆశ్రయించువారు సత్యలోకమును పొందుతారు. సత్యమే పరము, మోక్షము కూడా. ‘ఋత్’ తెలిసిన ఋషులు ఋక్- (సత్యము) నందే రమిస్తున్నారు. అందుచేత, ‘‘సత్యమునే ఉపాసించి బ్రహ్మమును సిద్ధించుకోండి’’ - అని చెప్పబడుతోంది.
218 ‘తప’ ఇతి। తపో
నానశనాత్ పరం యద్ధి -
పరం తపః।
తత్ దుద్ధర్షం।
తత్ దురాధర్షం।
తస్మాత్ తపసి రమన్తే।।
తపస్సు: సత్యము గురించిన తపనయే - తపస్సు. సత్యము గురించిన ధ్యానము, పఠణము, అధ్యయనము, శ్రవణము, మననము - ఇవన్నీ తపో వివిధ రూపములు. పరము కొరకై ప్రయత్నశీలత్వమే తపస్సు.
- తపస్సుచే ‘పరము’నకు సంబంధించిన ‘యత్‌తత్ ’ అఖండ స్వానుభవము ఆశయమై ఉన్నది. విషయములందు రమించకపోవటమే తపస్సు.
అట్టి తత్ ఆత్మత్వసిద్ధి దుర్దర్శనమైయున్నది.
ఈ దృశ్యము జీవునికి బంధము, బాధ కలిగించునట్టిది. అందుచేత తపస్సు నందు రమించాలే గాని పాంచభౌతిక ఇంద్రియ జగత్తునందు కాదు. (సంస్పర్శజా భోగాః దుఃఖయోనయయేవ తే।). దృశ్య-ద్రష్టలకు సాక్షి అయి ఉండు సాధనయే తపస్సు. ‘‘తపస్సుచే బ్రహ్మము సిద్ధిస్తుంది’’ - అనబడుచున్నది.
219 ‘‘దమ’’ ఇతి నియతం బ్రహ్మచారిణః।
తస్మాత్ దమే రమన్తే।।
దమము: ఇంద్రియములు అభ్యాసరహితునిపై పెత్తనము చెలాయించి అల్ప స్థితి - గతుల గుంటలలోకి త్రోసివేస్తున్నాయి. అందుచేత, బాహ్యేంద్రియ నిగ్రహము బ్రహ్మజ్ఞాన - బ్రహ్మతత్త్వ అభ్యాసికి అత్యవసరం. కాబట్టి ‘దమము’(Control of External Indrias) ను సర్వదా అభ్యసించాలి.
220 ‘‘శమ’’ ఇతి అరణ్యే మునయః।
తస్మాత్ శమే రమన్తే।
శమము: హృదయారణ్యంలో జన్మజన్మల పరిపోషితములైన కామ-క్రోధ- లోభ-మద-మాత్యర్య ఇత్యాది క్రూరమృగముల సంచారములు తపో అభ్యాసులగు మునులు జాగరూకులై గమనిస్తున్నారు. మనో (ఆలోచన)- బుద్ధి (అవగాహన)-చిత్త (ఇష్ట)-అహంకారము-(నేను-నాది అనుభవనలు)- ఇవి శమించుమార్గములను మహర్షులు సూచిస్తున్నారు. అందుచేత ‘శమము’ నందు రమించాలి. శాంత స్వభావము సంతరించుకొని ఉండటమే శమము. అంతరింద్రియ నిగ్రహము (శమము) గొప్ప ఉపాయమనబడుతోంది.
221 ‘‘దానమ్’’ ఇతి సర్వాణి
భూతాని ప్రశగ్ం సంతి।
దానాత్ నాతి దుశ్చరం।
తస్మాత్ దానే రమన్తే।
దానము: మహనీయులు, మార్గదర్శకులు అందరు కూడా ‘‘సహజీవులకు దానము చేయండి’’ అని బోధిస్తూ దానగుణమును ప్రశంసిస్తున్నారు. దానము దురాభ్యాసములను, దుశ్చర్యల స్వభావములను, దుశ్చరితములను కడిగివేస్తుంది. అందుచేత దానగుణశీలురై ఉండి ఆత్మయందు రమించ సంసిద్ధులు కావాలి. అన్యమైనదంతా స్వస్వరూపాత్మయొక్క ప్రదానమే. ప్రదర్శనమే - అను అనుభూతియే ‘దానము’ - కూడా.
222. ‘ధర్మ’ ఇతి।
ధర్మేణ సర్వమ్ ఇదమ్ పరిగృహీతం।
ధర్మాత్ నాతి దుష్కరం।
తస్మాత్ ధర్మే రమన్తే।
ధర్మము: ‘‘స్వధర్మము’’ అను ప్రవర్తనచే పరమాత్మను ఉపాసించాలి. ధర్మమే జీవునికి ధనము. ‘స్వధర్మ నిర్వహణ’, అను ధనము సంపాదించి ఈ దృశ్యములో ఏదైనా స్వీకరించాలి. దేవతల ధర్మముల ప్రయోజనములను పొందుతూ తాను ‘ధర్మము’ను ఏమరచువాడు రుణపడిపోతాడు. ‘ధర్మము’ మించినదేదీ లేదు. అందుచేత ‘ధర్మము’ను ఆచరణగా కలిగి ఉండాలి. ధర్మమే మార్గముగా బోధించబడుతోంది.
223 ప్రజనన (ప్రజన) ఇతి
భూయాగ్ం సంతః।
తస్మాత్ భూయిష్ఠాః ప్రజాయన్తే
తస్మాత్ భూయిష్టాః ప్రజననే రమన్తే।।
ప్రజననము (సంతానవృద్ధి యజ్ఞము): సంతానమును పొందటము తాను జనించిన జీవజాతి యొక్క ఋణము తీర్చుకోవటము వంటిది. (ఆత్మావై పుత్రః). అధిక సంతానమును ఉపాసనా- పూర్వకంగా పొందాలి. అందుచేత సంతానవంతుడై, బిడ్డలను తీర్చిదిద్దటము వ్రతమువలె ఆచరించాలి.
‘‘సహజీవులందరూ అఖండ-బ్రహ్మముయొక్క ప్రదర్శనా విన్యాసమే’’ - అను అవగాహనయే ‘‘ప్రజనోపాసన’’.
224. ‘‘అగ్నయ’’ ఇతి ఆహ।
తస్మాత్ అగ్నయ ఆధాతవ్యాః।।
అగ్ని: ‘‘అగ్నిదేవుని ఉపాసించాలి’’ అని చెప్పబడుచున్నది. అగ్నిని వ్రేల్చి, దీపారాధన నిర్వర్తించాలి. (భోధీపః బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః, అతస్థాం స్థాపయి ష్యామి భావనతో) సహ జీవులను దీపారాధన భావంతో అగ్నిదేవుని ఉపాశించాలి. అగ్నోపాసన సిద్ధికి మార్గము.
225. ‘‘అగ్నిహోత్రమ్’’ ఇతి ఆహ।
తస్మాత్ అగ్నిహోత్రే రమంతే।।
అగ్నిహోత్రం: అగ్నిహోత్రము (దీపము) వెలిగించి దేవతలకు ఆహుతులను సమర్పించాలి. ఈ విధంగా అగ్నిహోత్రమును ఉపాశించాలి. ‘హోత’ అయి సర్వకర్మలు సర్వాత్మకునికి సమర్పించటమే - అగిహోత్రోపాసన.
226. ‘‘యజ్ఞ’’ ఇతి।
యజ్ఞోహి దేవాః (యజ్ఞేన హి దేవా)
తస్మాత్ యజ్ఞే రమంతే।।
యజ్ఞము: ఈ సృష్టీంతా ఒక యజ్ఞము. ‘‘అట్టి సృష్టియజ్ఞములో నా జన్మ-కర్మలు కూడా అంతర్భాగము’’ - అనుభావనతో యజ్ఞార్థమై స్వకీయకర్మలు, ధర్మములు ఆచరించాలి. సర్వాత్మకుడగు పరమాత్మ నిత్యయజనమునందు (నా పాత్రయందు) అంతర్లీనమై ఉన్నారు. అందుచేత విశ్వయజ్ఞ భావన యందు రమించాలి. వేద విహిత యజ్ఞములు నిర్వర్తించాలి. ‘జీవితము’ అనే సందర్భమును ‘యజ్ఞము’ అనే భావనతో దర్శించాలి. యజ్ఞార్థాత్ కర్మలే పరమునకు మార్గము. (అన్యత్ర కర్మ బంధనః)
227. ‘‘మానసమ్’’ ఇతి విద్వాగ్ంసః
తస్మాత్ విద్వాగ్ంస ఏవ
మానసే రమంతే।
మానసము: పరమాత్మను భావనా పూర్వకంగా విద్వాంసులు మానసోపాసన చేస్తున్నారు. సర్వము మనస్సు చేతనే తెలియబడుతోంది. మనస్సుచే ఏదేది తెలియబడుతోందో, అద్దానినంతా ప్రక్కకు పెట్టి ‘మనస్సు’ యొక్క కేవలీ స్వరూపము ఎరిగి ఉండటమే కైవల్యము. అదియే ‘శుద్ధమనస్సు’. ‘ఉన్మనీ’ ఇత్యాది ప్రత్యయములచే ఉద్దేశ్యించబడుతోంది. కనుక మనస్సులో మనస్సును దర్శించెదముగాక. మనస్సును నియమిస్తే పరమాత్మ సులభ్యము.
228. ‘‘న్యాస’’ ఇతి బ్రహ్మా।
బ్రహ్మా హి పరః।
పరో హి బ్రహ్మా।
తాని వా ఏతాని అవరాణి
పరాగ్ంసి
న్యాస ఏవ అత్యరేచయత్।।
న్యాసము: ‘సత్’ నందు స్థితించటము, అసత్‌ను త్యజించటము.
న్యాసము = ఉండుట/ఉంచుట.
న్యాసము = మననము, మంత్రోచ్ఛారణ; ఉపాసన.
న్యాసమే = బ్రహ్మ యొక్క సృష్టికర్తృత్వము.
న్యాసి = దృశ్యమునకు పరమైనవాడు. దృశ్యమును బ్రహ్మముగా స్వీకరించువాడు.
బ్రహ్మమే → న్యాసి న్యాసియే → బ్రహ్మము
బ్రహ్మమే → (న్యాసిగా) సర్వమునకు పరము.
పరము(Beyond) యే - బ్రహ్మము.
ఇహమునకు అతీతమై, ఆధారమైయున్న ‘పరము’ను ఆశ్రయించటమే న్యాసము. న్యాసమే ఆచరించవలసినది.
సత్-న్యాసమే → సన్న్యాసము. న్యాసి - న్యాసములు ఎరుగబడుగాక! వీటన్నిటి అంతరార్థ - మహార్థపూర్వకంగా ఎరుగాలి.
229. య ఏవం వేద
ఇత్యుపనిషత్
= ఇతి ఉపనిషత్ =


79వ అనువాకము
జ్ఞాన సాధన

230. ప్రజాపత్యో హి ఆరుణిః సుపర్ణేయః ప్రజాపతిం
సువర్ణ - ప్రజాపతిల పుత్రుడు ఆరుణి.
ఒకరోజు ఆరుణి పిత్రుదేవులగు ప్రజాపతిని సమీపించి భక్తి పూర్వకంగా నమస్కరించారు.
పితరమ్ ఉపససార, కిం భగవంతః!
పరమం వదంతీతి?
తస్మై ప్రోవాచ।।
ఆరుణి : తండ్రీ! ప్రజాపతీ! భగవన్!
ఏది మోక్షము కొరకై ఉత్తమోత్తమ సాధనగా మార్గముగా (బ్రహ్మజ్ఞులచే, తత్త్వశాస్త్రముచే) మార్గాణ్వేషకుల కొరకై సిద్ధాంతీకరించబడుచున్నదో - అద్దాని గురించి దయచేసి వివరించండి.
231. సత్యేన వాయుః ఆవాతి।
సత్యేన ఆదిత్యో రోచతే దివి।
సత్యం వాచః ప్రతిష్ఠా।
సత్యే సర్వం ప్రతిష్ఠితం।
తస్మాత్ సత్యం ‘‘పరమం’’ - వదంతి।
ప్రజాపతి : నీవు అడిగ మోక్షమునకై అత్యుత్తమ సాధన మార్గము గురించి అనేకుల అభిప్రాయములు ముందుగా చెప్పుకుందాము.
(1) సత్-భావన /ఆశ్రయము
- ‘సత్యము’ చేతనే వాయువు వీచుచున్నది
- ‘సత్యము’ చేతనే ఆకాశములో ఆదిత్యుడు ప్రకాశమానుడై వర్తించుచున్నారు.
- అట్టి సత్యము వాక్కు నందు సంప్రతిష్ఠితమై యున్నది.
సత్యమునందే సర్వము ప్రతిష్ఠితమైయున్నది. సత్యమే ఈ సర్వము నందు ప్రతిష్ఠితమైయున్నది.
సత్ = ఉనికి (నేను ఉన్నాను - అను స్వానుభవము)
నేను ఉంటేకదా - జన్మలు, కర్మలు, జాగ్రత్ స్వప్న సుప్తులు!
అట్టి ఉనికి (లేక) సత్ భావనయే పరము (పరాకాష్ఠ - మోక్షము)గా కొందరు మహనీయులచే చెప్పబడుతోంది. (‘సత్’ భావన-ఇతి బ్రహ్మమ్। బ్రహ్మాహమ్।). సత్యమును తప్పక ఉపాసించాలి.
232 తపసా దేవా దేవతామ్
అగ్ర ఆయన్।
తపసర్ష యః సువరన్వవిందః।
తపసా సపత్నాన్
ప్రణుదామారాతీః।
తపసి సర్వం ప్రతిష్ఠితమ్।
తస్మాత్ తపః పరమం వదంతి।।
(2) తపస్సుయే - మోక్షసాధన. తపస్సు చేతనే అత్యుత్తమమగు దేవతా స్థానము పొందబడగలదు. తపో సాధన చేతనే దేవతా లోకములో ఉత్తమ ఆనందము లభిస్తోంది. పూర్వీకులెందరో తపస్సు చేతనే మహర్షి-దేవర్షి స్థానములను సిద్ధించుకోగలిగారు. సత్యము తపస్సుచేతనే సిద్ధించగలరు.
తపస్సులో ‘‘భక్తి-యోగ-జ్ఞాన’’ మొదలైన సర్వము ప్రతిష్ఠితమైయున్నాయి.
అందుచే తపస్సే అన్నిటికీ పరము (Finest path) అని మోక్షశాస్త్రజ్ఞులగు కొందరు ప్రకటిస్తున్నారు. ‘అఖండాత్మయే నేను’ అను భావనకొరకై తపనతో చేసే ప్రయత్నమే ‘తపస్సు’. తపస్సు తప్పక ఆచరించాలి.
233. దమేన దాన్తాః కిల్బిషమ్
అవధూన్వన్తి।
దమేన బ్రహ్మచారిణః
సువరగచ్ఛన్।
దమో భూతానాం దురాధర్షం।
దమే సర్వం ప్రతిష్ఠితమ్।
తస్మాత్ దమం పరమం - వదన్తి।।
(3) బాహ్య ఇంద్రియ నిగ్రహముచే మోక్షము - దమము
బాహ్యేంద్రియములను విషయముల నుండి ఉపసంహరించి, నిర్విషయత్వ మును అభ్యసించటము - అనే ‘దమము’ వలన సర్వ సాంసారిక దోషములు గాలికి ధూళివలె తొలగగలవు. అందుచేత బ్రహ్మతత్త్వాభ్యాసి - బ్రహ్మచారి) దమమును తప్పక ఆశ్రయించాలి. దమము కష్టముతో కూడినదే. కాని ‘దమము’ నందు సర్వసిద్ధి లభించగలదు. సర్వము దమము చేతనే ప్రతిష్ఠితమవగలదు. అందుచేత దమమే అత్యంత ముఖ్యము - అని మరికొందరు ఉత్తమ ఆత్మజ్ఞాన సిద్ధులు అభిప్రాయము. ఇంద్రియ- ఇంద్రియ విషయములు కూడా ఆత్మస్వరూపుడగు జీవునికి ఉపకరణ మాత్రములు - అను భావనా సిద్ధియే - దమము. తప్పక ఆశ్రయించాలి.
234. శమేన శాన్తాః శివమ్ ఆచరన్తి।
శమేన నాకం మునయో అన్వ విన్దం చ।
శమో భూతానాం దురాధర్షం।
శమే సర్వం ప్రతిష్ఠితమ్।
తస్మాత్ శమః పరమం వదన్తి।
(4) అంతరింద్రియ నిగ్రహము - శమము
అంతరింద్రయములగు మనస్సును నిగ్రహించటమే సర్వదా శుభప్రదము. ఆలోచనలను నిగ్రహించి మనోబుద్ధి చిత్తములను నిర్మలపరచు శమముచే దృశ్యము పట్ల మౌనము తప్పక లభించగలదు. అది సిద్ధించుకున్నవాడు ‘‘ముని, మౌని’’ స్థానము పొందుచున్నాడు. శమము జీవులకు దురాధర్ష మైనది. కష్టముతో కూడినది. అయితే శ్రమచే శమము అభ్యసించటమే ఉత్తమ ‘‘ఆత్మా-మమైక్యము’’నకు శ్రేష్ఠము- అని కొందరు చెప్పుచున్నారు. శమమును తప్పక అభ్యసించాలి
235 దానం యజ్ఞానం వరూధం
దక్షిణా లోకే దాతారగ్ం
సర్వ భూతాని ఉపజీవంతి।
దానేన ఆరాతీః అపానుదంత।
దానేన ద్విషంతో
మిత్రా భవంతి।
దానే సర్వం ప్రతిష్ఠితమ్।
తస్మాత్ దానం పరమం వదంతి।
(5) దానము/త్యాగము (సమస్తము పరమాత్మకు దక్షిణగా సమర్పణ)
యజ్ఞములన్నిటిలో కెల్లా దానమే అత్యంత శ్రేష్టమైనది. దానము చేయు మహనీయుని సర్వభూతములు ఆశ్రయించి ఉపజీవనము పొందగలవు. దానముచే అరిషట్‌వర్గము సులభముగా జయించివేయబడగలదు.
దానగుణము కలవానికి శత్రువులు కూడా మిత్రులు అవగలరు.
దానము నందే సర్వమోక్షమార్గస్థులు ప్రతిష్టితులై ఉన్నారు. దానమే యోగము, భక్తి, జ్ఞానము కూడా। కనుక దానమే మోక్షమార్గములో అత్యంత ప్రయోజనకరము - అని కొందరి ప్రవచనము. వ్యష్టిత్వమును ఆమూలాగ్రము సర్వాత్మకుడగు పరమాత్మకు అనుక్షణికంగా సమర్పించి, సర్వాత్మత్వము సంతరించుకోవటమే ప్రదానము. సమస్తము పరమాత్మకు సమర్పించివేసి ఉండాలి.
236. ధర్మో విశ్వస్య జగతః
ప్రతిష్ఠా, లోకే
ధర్మిష్ఠం ప్రజా ఉపసర్పంతి।
ధర్మేణ పాపమ్ అపమదతి।
ధర్మే సర్వం ప్రతిష్ఠితమ్।।
తస్మాత్ ధర్మం పరమం వదన్తి।।
6. ధర్మమే శ్రేష్ట మోక్షమార్గము
ఈ విశ్వమంతా, ఈ జగత్తంతా ‘ధర్మము’ పైనే ఆధారపడి యున్నది. గాలి, నీరు, అగ్ని, నేల, ఆకాశము, దేవతలు - మొదలైనదంతా ‘ధర్మము’ (Respective function) నిర్వర్తించుటచేతనే - జగత్తు, జీవులు జీవించ గలుగుచున్నారు. ధర్మనిష్ఠచే సర్వపాపములు, దోషములు తొలగిపోతాయి. ధర్మము నందే సర్వము ప్రతిష్ఠితము అయి ఉన్నది. అందుచేత మోక్షమునకు స్వధర్మమే పరాకాష్ట మార్గము - అని బోధించబడుచున్నది. (యజ్ఞో దానం తపః కర్మ న త్యాజ్యం। కార్యమేవ। పావనాని మనీషిణః)
237. ప్రజననం వై ప్రతిష్ఠా లోకే సాధు,
ప్రజాయాః తంతుం (సంతుం) తన్వానః।
పితృణామ్ అనృణో భవతి।
తదేవ తస్యా అనృణమ్।
తస్మాత్ ప్రజననం పరమం వదన్తి।।
7. ప్రజనము - సహజన సంబంధము
ప్రజనము = సాధు జనులతో సాంగత్యము, గురుశిష్య సంవాద సంబంధము, సంతాన విశేషములు. పిత్రు-పుత్ర-కళత్ర సంబంధములు.
- ఇవన్నీ ప్రజనత్వము.
అట్టి ప్రజనత్వము చేతనే పితృఋణము తీరగలదు. పితృయజ్ఞము, వంశ ఆచారములు మొదలైన ప్రజనము జీవునికి ఉత్తమ మోక్షమార్గము. (పుత్రుడు పున్నామన రకము నుండి తరింపజేయుగలడు). అందుచేత ప్రజన మార్గమే మోక్ష మార్గములలో ఉత్తమము - అని కొందరి పాఠ్యాంశము. (సర్వ సహజీవులను పరమాత్మ స్వరూపులుగా ఉపాసిస్తూ ఉండటమే ‘‘ప్రజననము’’-అని కొందరి వాఖ్యానము).
238 ‘అగ్న’యో వై త్రయీ విద్యా
దేవయానః పంథా,
గార్హపత్య ఋక్ పృథివీ
రథన్తరమ్ అన్వాహార్య
పచనం।
యజుః అంతరిక్షం,
వామదేవ్యమ్
ఆహవనీయః। సామ సువర్గో లోకో బృహత్
తస్మాత్ అగ్నీన్ పరమమ్ వదన్తి।।
8. అగ్ని - త్రయీ విద్యా
యజ్ఞకోవిదులలో కొందరు - చేదములలో ప్రవచించబడిన త్రయీ అగ్నులే (1) గార్హపత్యాగ్ని, (2) ఆహవనీయాగగ్ని (3) దక్షిణాగ్ని - దేవయానమున నడిపించి మోక్షలక్ష్యమునకు జేర్చగలవు - అని బోధిస్తున్నారు. ఉద్దేశ్యిస్తున్నారు. వేదత్రయముచే ప్రవచించబడు కర్మకాండ వేద విహితములే. కనుక యాగము ద్వారా దేవత్వము తప్పక సిద్ధించగలదు.
గార్హ పత్యాగ్ని → ఋగ్వేదాత్మకము
- పృథివీ లోకరూపము. రథంతరము - అన్యాహార్యపచనం
ఆహవనీయము - యజర్వేద సంజ్ఞ అంతరిత.. వామదేవము
దక్షిణాగ్ని - సామవేద హృదయము. సువర్గమునకు జేర్చునది.
ఉపాసనలన్నిటికీ అగ్నియే మూలము. అందుచేత అగ్నియే అన్నిటికన్నా మోక్షముకొరకై శ్రేష్ఠము అని చెప్పబడుతోంది.
239. ‘‘అగ్నిహోత్రగ్ం’’ సాయం ప్రాతః
గృహాణాం నిష్కృతిః స్విష్టగ్ం
సు హుతం యజ్ఞ క్రతూనాం
ప్రాయణగ్ం సువర్గస్య
లోకస్య జ్యోతిః।
తస్మాత్ అగ్నిహోత్రం పరమం వదన్తి।।
9. అగ్నిహోత్రము-తదోపాసన
సాయం ప్రాతఃకాలములలో అగ్నిహోత్రము గృహమునకు దోషముల నిష్కృతికి, (దోషములు తొలగుటకు)ఉపాయము.
చక్కటి ఆహూతులు సమర్పించబడు యజ్ఞక్రతువు→ సుహృత్ - జ్ఞాన జనుల సామీప్యత ప్రసాదించగలదు.
హోత్రము లోకములో సాంసారికమైన అంధకారము తొలగించు జ్యోతి స్వరూపము. అందుకని అగ్నిహోత్రమే పరాకాష్ట సాధన - అని కొందరు చెప్పుచున్నారు.
240. ‘‘యజ్ఞ’’ ఇతి।
యజ్ఞేన హి దేవా దివం గతా
యజ్ఞే న అసురాన్ అపానుదన్త।
యజ్ఞేన ద్విషన్తో మిత్రా భవన్తి।
యజ్ఞే సర్వం ప్రతిష్ఠితమ్।
తస్మాత్ యజ్ఞం పరమం వదన్తి।।
10 యజ్ఞము (అగ్ని యజ్ఞకార్యము యజ్ఞార్ధాత్ కర్మ నిర్వహణ)
యజ్ఞమే అన్నిటికన్నా ఉత్తమ సాధనమని కొందరి ఉద్దేశ్యం. యజ్ఞనము చేత మానవుడు దివ్యలోకాలలో ప్రవేశించి దేవతా స్థానములను పొందుచున్నారు. యజ్ఞము చేతనే రాక్షసులు నశింపజేయబడుచున్నారు. యజ్ఞము - యజ్ఞార్థము కార్యములు చేయువారికి శత్రువులు కూడా మిత్రులు అగుచున్నారు. యజ్ఞమునందే సర్వము ప్రతిష్ఠితమైయున్నాయి. అందుచేత యజ్ఞమ→ ‘‘పరమము’’ (గొప్ప మార్గము) - అనబడుచున్నది. యజ్ఞభావనతో కర్మలు నిర్వర్తించుటము పరమునకు సులభ మార్గము.
241. ‘‘మానసం’’ వై ప్రజాపత్యం।
పవిత్రం మానసేన
మనసా సాధు పశ్యతి।
మనసా ఋషయః।
ప్రజా ఆసృజన్త। మానసే
సర్వం ప్రతిష్ఠితమ్।
తస్మాత్ మానసం పరమం వదన్తి।।
11. మానస యాగము
మానసయాగము - ప్రజాపతిస్థానమును (బ్రహ్మలోకమును) ప్రాప్తింపజేయగలదు. మనస్సుతో చేసే ఉపాసనచే మనస్సు పవిత్రమౌతుంది. మనస్సును పవిత్రముగా తీర్చిదిద్దటమే అన్నిటికన్నా గొప్పసాధన. పవిత్రమైన మనస్సుకు సాధుకర్మలు, సాధు పుంగవులతో సమాగమము సిద్ధించగలదు. మనస్సుతో చేసే మానసికోపాసనచే ఋషిత్వం లభిస్తోంది. సంకల్ప బలం ప్రవృద్ధమౌతుంది. సంకల్పం చేతనే ఋషులు ప్రజలను సృష్టించగలుగుచున్నారు. మనస్సు నందే సర్వము ప్రతిష్ఠితమైయున్నది. అందుచే - ‘‘మనశ్శుద్ధియే సర్వ సాధనల కంటే ఉత్కృష్టం’’ - అని చెప్పబడుతోంది. మనస్సుతో ఆత్మ మననమే మనో యజ్ఞము.
242. ‘‘న్యాస’’ ఇతి ఆహుః
మనీషిణో బ్రహ్మాణం।
12. న్యాసము (నిష్ఠ, అనుష్ఠానము)
న్యాసము = నిష్ఠాస్వీకారము; మంత్రోపాసన; అనుష్ఠానము.
పట్టుదలతో కూడిన మనో-బుద్ధి- దేహముల నియామకము.
న్యాసము బ్రహ్మదేవుల వారితో సమానమైన బ్రాహ్మీ బుద్ధి సిద్ధంచగలదని చెప్పబడుతోంది. న్యాసము (నిష్ఠ, అనుష్ఠానము)-తప్పక ఆచరించాలి.
243 బ్రహ్మ విశ్వః కతమః
స్వయంభూః ప్రజాపతిః
సంవత్సర ఇతి।।
సృష్టికర్తయగు బ్రహ్మభగవానుడు విశ్వమునకే ఆత్మ. విశ్వాత్మకుడు. ఆయన తనకు తానై జనించుచుండటం చేత స్వయంభువు. ప్రజాపతి. జీవులందరి ధర్మముల ప్రదాత. సర్వజీవులకు పతి. కాలస్వరూపుడు. కాలము ఆయన శరీరమే. ఆయనకు నమస్కారం. సృష్టికర్తను కాలస్వరూపుడుగా ఉపాసించాలి. సంతత్-సరుడు (Time flow) గా పూజించాలి.
244 సంవత్సరో అసావాదిత్యో
య ఏష ఆదిత్యే పురుషః
స పరమేష్ఠీ బ్రహ్మాత్మా।
సంవత్సరము (కాలము) - ఆదిత్య (యః ఆది-సః-మొట్టమొదటే గల కేవలానందాత్ముని) - స్వరూపం. సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు ఆదిత్య పురుషుడే. ఆదిత్య మండల పురుషుని ఉపాసించుటచే బ్రహ్మాత్ముడగు పరమాత్మ సందర్శనము సిద్ధించగలదు. ఆదిత్య మండల పురుషాయ నమః।
245 యాభిః ఆదిత్యః తపతి
రశ్మభిః తాభిః
పర్జన్యో వర్షతి।
ఆదిత్యుని తపింపజేయు కిరణముల ‘‘ధర్మము’’ (Function) చేతనే, సూర్యకిరణములు విస్తరిస్తున్నాయి. వేడిమిచే మేఘములు ఏర్పడి భూమిపై వర్షము కురుస్తోంది.
- మేఘములు వర్షించటం చేతనే భూమిపై ఓషధులు (ఫలవృక్షములు),
పర్జన్యేన ఓషధిః వనస్పతయః ప్రజాయన్త।
ఓషథి వనస్పతిభిః
అన్నం భవతి।
అన్నేన ప్రాణాః।
ప్రాణైః బలమ్।
బలేన తపః।
తపసా శ్రద్ధా।
శ్రద్ధయా మేధా।
మేధయా మనీషా।
వనస్పతులు (పుష్పములు, దినసులు, నవధాన్యపు మొక్కలు) - ఇవన్నీ వృద్ధి పొందుచున్నాయి.
- ఓషధి - వనస్పతుల వలన అన్నము (జీవులకు ఆహారము) రూపుదిద్దుకుంటోంది.
- అన్నము వలన దేహములో ప్రాణములు నిలుస్తున్నాయి.
- ప్రాణముల వలన దేహమునకు త్రాణ, బలము చేకూరుచున్నాయి.
- బలము వలన తపస్సు సాధ్యమవగలదు.
- తపస్సు వలన ‘శ్రద్ధ’ ఆరూఢమౌతుంది.
- శ్రద్ధ వలన మేధ (తెలివి) పరిపుష్టిపొందుచున్నది.
- మేథచే బుద్ధి పవిత్రమవగలదు. (పవిత్ర బుద్ధికి మోక్షము కరతలామలకము)
మనీషయా మనో।
మనసా శాన్తిః।
శాన్త్యా చిత్తం।
చిత్తేన స్మృతిః।
స్మృత్యా స్మారగ్ం।
స్మారేణ విజ్ఞానం।
విజ్ఞానేన ఆత్మానం వేదయతి।
తస్మాత్ అన్నం దదంతిః
సర్వాణి ఏతాని దదాతి।
అన్నాత్ ప్రాణా భవంతి।
భూతానాం ప్రాణైః।
ప్రాణైః మనో।
మనసశ్చ విజ్ఞానం।
విజ్ఞానాత్ ఆనందో బ్రహ్మయోనిః।
బుద్ధి పరిపుష్టి- సునిశితములచే మనస్సు పవిత్రమగుచున్నది. పవిత్రమగు మనస్సు వలన శాంతి లభించగలదు.
శాన్తిచే చిత్తము నిర్మలమగుచున్నది.
చిత్తముచే స్మృతి లభిస్తోంది.
స్మృతిచే స్మారము (విచక్షణ, సందర్భోచితంగా సమన్వయించుకొనగలిగిన సామర్థ్యము) రూపం పొందుతోంది.
స్మారముచే విజ్ఞానము వికసిస్తోంది. విజ్ఞానముచే ఆత్మతత్త్వము తెలియబడగలదు.
అందుచేత ‘అన్నము’ సర్వమును ప్రసాదించునదిగా అగుచున్నది. అన్నం బ్రహ్మ- అనబడుచున్నది. అన్నము నుండి ప్రాణశక్తి ప్రదర్శితమగుచున్నది.
ఈ భూతజాలమంతా ప్రాణ స్వరూపులే!
ప్రాణము నుండి మనస్సు, మనస్సు నుండి విజ్ఞానము, విజ్ఞానము నుండి ఆనందము సిద్ధిస్తున్నాయి.
ఆనందమే బ్రహ్మము యొక్క స్వానుభవ స్థానము. కేవలీ స్థానము.
246 సవా ఏష పురుషః
పంచధా పంచాత్మా
యేన సర్వమ్ ఇదమ్ ప్రోతమ్-
పృథివీ చ, అంతరిక్షం చ,
ద్యౌశ్చ, దిశశ్చ, అవాన్తర దిశశ్చ
సవై సర్వమ్ ఇదమ్ జగత్।
స సభూతం, స భవ్యం
జిజ్ఞాస కప్త ఋతజా
రయిష్ఠా శ్రద్ధా సత్యో
మహస్వాన్ తపసో వరిష్ఠాత్।।
ఎవ్వరిచే ఇదంతా (వస్త్రము నందు దారము వలె) ఓత ప్రోతమై యున్నదో ఆయనయే ఐదు విధాలుగా పంచాత్మకుడై ఉన్నారు.
(1) పృథివి (2) అంతరిక్షము
(3) దేవతల తేజో ద్వే(ఆకాశ) స్థానములు (4) ‘10’ దిక్కులు (5) అవాన్తర దిశలు - ఇవన్నీ పరమాత్మయే. ఆ పరమ పురుషుడే ఈ జగత్తంతా తన స్వరూపముగా ప్రదర్శకుడై ఉన్నారు. ఆయనయే సర్వకాలములందు సర్వదా సర్వత్రా వేంచేసియున్నారు.
(1) శబ్ద పంచక→ శబ్ద స్పర్శ రూప రస గంథములు
(2) భూత పంచకము → పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము
(3) జ్ఞానేంద్రియ పంచకము → చెవులు, త్వక్కు(చర్మము), కళ్ళు, జిహ్వ, ఘ్రాణము
(4) ప్రాణవాయు పంచకము→ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు
(5) ఆత్మపంచకము → భూతాత్మ, ఇంద్రియాత్మ, జీవాత్మ, ఈశ్వరాత్మ (ప్రధానాత్మ) పరమాత్మ (5+5)
ఈ విధంగా పంచవింశతి (25 తత్త్వస్వరూపుడు) ఈ జగత్తంతా
247. జ్ఞాత్వా తమేవం మనసా।।
పూదండలోని దారము వలె విస్తరించి ఉన్నారు. ఋక్కులచే వర్ణితుడు. ఋతజుడు. జీవులంతా ఆయన కిరణములే. రయిష్ఠుడు. శ్రద్ధ స్వరూపుడు. సత్యస్వరూపుడు. తపస్సుచే మహత్‌గా ఎరుగబడువాడు.
అట్టి పరమాత్మ మనస్సు చేతనే తెలియబడగలరు.
248 హృదా చ భూయో
న మృత్యుమ్ ఉపయాహి విద్వాన్।
తస్మాత్ సన్న్యాసమ్ ఏషాం
తపసామ్ అతిరిక్తమ్ ఆహుః।।
హృదయములో అన్యమునంతా వెడలగొట్టి, అనన్యుడగు ఆ పరమాత్మను ప్రతిష్ఠీపించిన మరుక్షణం ఇక ఆ విద్వాంసుడు అగు యోగి మృత్యువుకు విషయుడే కాడు. పరమాత్మను ఎరిగినవాడు అమృతుడగుచున్నాడు. దేహముల రాకపోకలకు తనను అతీతునిగా గాంచువాడు ‘‘అమృతుడు’’.
అందుచేత సర్వము త్యజించి పరమాత్మ కొరకై తపస్సును ఆచరించటమే ‘అత్యుత్తమము’ - అని గుర్తు చేయబడుతోంది. తపో-త్యాగములు అమృతత్వమునకు మార్గము. (త్యాగమేవ సన్న్యాసమ్। త్యాగేనతు కైవల్యమ్)
అంతర్యామి స్తుతి
249 వస్తుః (వసుః) అణ్వో విభూః అసి। ప్రాణే త్వమసి।
సంధాతా బ్రహ్మన్ త్వమసి।
విశ్వధృత్ తేజోదాః త్వమసి। అగ్నిరసి।
వర్చోదా త్వమసి।
సూర్యస్య ద్యుమ్నోదాః త్వమసి।
చంద్రమస ఉపయామ
గృహీతోఽసి। బ్రహ్మణే త్వా మహసే।।
ఓ అంతర్యామీ! నీవు సర్వత్రా వసించువాడవు. సర్వభౌతిక రూపుడవు కూడా. అణువుకే అణువువు. సర్వమును నియమించువాడవు. కాబట్టి విభువువు. ప్రాణేశ్వరుడవు. విశ్వమంతా నీ యొక్క ధారణయే! కాబట్టి సంధాతవు. విశ్వమును ఆభరణముగా ధరించువాడవు, విశ్వమునకు ఉనికిని - తేజస్సును ప్రసాదించువాడవు. అగ్నివి నీవే! సర్వముఖములలోని వర్చస్సుగా ఉన్నది నీ అగ్ని స్వరూపతేజస్సే.
ద్యులోకవాసివై సూర్యునికే తేజస్సును ప్రసాదిస్తూ, సూర్యనారాయణుడవై, సూర్యకిరణ తేజో విభవమై వెలుగించుచున్నది - వెలుగుచున్నది నీవే!
చంద్రకిరణ రూపుడవై చంద్రసాంద్ర కిరణ ఓషధ- వనస్పత వైభవమంతా నీవే! చద్రత్వము నీ స్వీకారమే! మహత్తరమగు బ్రహ్మము నీవే!
250 ‘ఓం’ ఇతి ఆత్మానమ్ యుంజీత।।
‘‘ఆ ఓంకార పరబ్రహ్మము నా స్వస్వరూపమే!’’ అను యోగాభ్యాసము, భావాభ్యాసము స్వీకరించబడుగాక!
251 ఏతద్వై మహోపనిషదం
దేవానాం గుహ్యమ్
అట్టి ‘ఓం’కారార్థ మహోపనిషత్ దేవతలకు కూడా గోప్యము. రహస్యము లక్ష్యశుద్ధిచే అర్హులైనవారికే తెలియవచ్చుచున్నది.
252 య ఏవం వేద బ్రహ్మణో మహిమానమ్ ఆప్నోతి।
తస్మాత్ బ్రహ్మణో మహిమానమ్
ఇతి ఉపనిషత్।।
అట్టి స్వాత్మ-సర్వాత్మ -జగదాత్మ- పరతత్త్వమగు బ్రహ్మమును ఎరిగిన బ్రాహ్మణుడు స్వయముగా బ్రహ్మము అగుచున్నాడు. అందుచే బ్రహ్మమే మహామహిమాన్వితము.
ఇతి ఉపనిషత్.


80వ అనువాకము
జ్ఞానయజ్ఞము - ఆత్మయజ్ఞము (జీవితమే యజ్ఞము)

తస్యైవం విదుషో యజ్ఞస్య ఆత్మా యజమానః।
శ్రద్ధా పత్నీ। శరీరమ్ ఇధ్మమ్। ఉరో వేదిః।
రోమాని బర్హిః। వేదః శిఖా।
హృదయం యూపః। కామ ఆజ్యం।
మన్యుః పశుః। తపో అగ్నిః।
దమః శమయితా దక్షిణా।
వాక్ హోతా। ప్రాణ ఉద్గాతా।
చక్షుః అధ్వర్యుః। మనో బ్రహ్మా।
శ్రోత్రమ్ అగ్నీ। ధ్యావః ధ్రియతే సా దీక్షా।
యత్ అశ్నాతి తత్ హవిః।
యత్ పిబతి తత్ అస్య సోమపానమ్
ఆత్మతత్త్వ పూర్వకమైన ఆత్మయజ్ఞము సర్వోత్కృష్టమైనది.
ఆత్మతత్త్వవిదునకు - దేహ-ఇంద్రియ - ఇంద్రియ విషయ, జాగ్రత్ -స్వప్న - సుషుప్తులకు సాక్షియగు ఆత్మయే ఆత్మయజ్ఞమునకు యజమాని.
→ జీవాత్మయే దేహాత్మ యజ్ఞమునకు ‘కర్త’.
→ ఆత్మయజ్ఞమునకు ‘శ్రద్ధ’యే పత్ని.
→ ఈ శరీరమే ఇధ్మము (సమిధ, కాష్ఠము, కట్టె).
→ వక్షస్థలమే యజ్ఞ వేదిక.
→ రోమములే ఆత్మయజ్ఞమునకు దర్భలు.
శిఖయే→ వేదవిద్య (eT]యు) యజ్ఞములో పశువున కట్టటానికి నాటిన పైష్ట (లేక) కొయ్య.
→ హృదయము → యూపస్తంభము.
→కామము - అగ్నిలో వ్రేల్చే నెయ్యి. మన్యువు, క్రోథము → పశువు.
తపస్సు → అగ్ని. శమ-దమములు → దక్షిణ.
యత్ రమతే తత్ ఉపసదో।
యత్ సంచరతి ఉపవిశత్
ఉత్తిష్ఠతే చ స ప్రవర్గ్యో।
యత్ ముఖమ్ తత్ ఆహవనీయో।
యా వ్యాహృతిః ఆహుతిః
యదస్య విజ్ఞానం తత్ జుహోతి।
యత్ సాయం ప్రాతరత్తి తత్ సమిధం।
యత్ ప్రాతః - మధ్యం దినగ్ం
సాయం చ, తాని సవనాని।
యే అహోరాత్రే, తే
దర్శపూర్ణ మాసౌ।
యే అర్ధమసాశ్చ మాసాశ్చ
తే చాతుర్మాస్యాని।
య ఋతవః తే పశుబంధా।
యే సంవత్సరాశ్చ తే అహర్గణాః।
సర్వ వేదసంవా ఏతత్ సత్రం।
యత్ మరణం తత్ అవబృథ।
ఏతత్ వై జరామర్యమ్
అగ్నిహోత్రగ్ం నత్రం
య ఏవం విద్వాన్ ఉదగయనే
ప్రమీయతే దేవానామ్ ఏవ
మహిమానం గత్వా ఆదిత్యస్య
సాయుజ్యం గచ్ఛతి।
అధ యో దక్షిణే ప్రమీయతే
పితృణామేవ మహిమానం
గత్వా చంద్రమసః సాయుజ్యగ్ం
స లోకతామ్ ఆప్నోతి।
ఏతౌ వై సూర్యా-చంద్రమసోః
మహిమానౌ బ్రాహ్మణో
విద్వాన్ అభిజయతి।
తస్మాత్ బ్రహ్మణో మహిమానమ్ ఆప్నోతి।
తస్మాత్ బ్రహ్మణో మహిమానమ్।।
→ వాక్కు - హోత (హోమము చేయించు ఋత్విక్కు)
→ ప్రాణము - ఉద్గాత (యజ్ఞ తంత్రమును నడుపువాడు)
చక్షువులు - ఆధ్వర్యుడు (యజ్ఞ పర్యవేక్షక - ఆచార్యులు)
మనస్సు - బ్రహ్మ (మంత్రములను బ్రాహ్మణములను విధి పూర్వకంగా జరిపించువాడు)
శ్రోతము (వినటము) - అగ్ని. ధ్యానము - ధారణము అదియే దీక్ష.
ఏదేది తినుచున్నాడో - అదంతా హవిస్సు.
ఏదేది త్రాగుచున్నాడో - అది యజ్ఞ విధానములోని సోమపానము.
ఏదేది రమిస్తున్నాడో అది ఉపసదము (సేవానిరతి).
ఎక్కడెక్కడ సంచారములు చేస్తూ ఉంటాడో, అదంతా ఆతని కూర్చుని ఉండు ఆసనము - పీట.
ఆతడు కూర్చుని లేవటమే ప్రవర్గము (యాగవిధి విధానము)
ఆతని ముఖము-అతని తదితర ముఖముల దర్శనమే - ఆవహవనీయాగ్ని
వ్యాహృతులే-(ఆతని పలుకులే)→ ఆహుతులు. ఆతని ఆత్మజ్ఞాన- అనుభవరూప విజ్ఞానమే - జుహోతి /హోతము.
విజ్ఞానమే ఆత్మాగ్ని యందు హోమము.
సాయంత్రము - ఉదయము చేయు ఆతని భోజనమే - ఆత్మ యజ్ఞ సమిధలు.
ఉదయ - మధ్యాహ్న - సాయంకాలములే త్రి - సవనములు (సోమపానము).
రాత్రింబవళ్ళు-ఆతని దర్శపూర్ణమాసములు (పౌర్ణమి-అమావాస్య విధులు)
కాలము యొక్క కృష్ణపక్షము, శుక్లపక్షము (అర్ధ మాసములు), మాసములు ఆతనికి చాతుర్మాస్యము. ఋతువులే - పశుబంధము.
సంవత్సరకాలము - ఆతని అహర్గణము (నెల/మాసము).
తెలియబడేదంతా (సర్వవేదసము) → ఆతనికి సత్రము.
మరణము - ఆతనికి యజ్ఞములోని అవబృథస్నానము.
ఎవ్వరైతే అట్టి జరామరణములతో కూడిన నత్రమును (జగత్‌యజ్ఞ విశేషమును) తెలుసుకొని ఉంటాడో, అట్టివాడు ఉదగయన (ఉత్తరాయన) మార్గమున పయనించుచూ, ఇంద్రాది దేవతా ఐశ్వర్యములను, మహిమలను పొందుచూ ఆదిత్య భగవానుని స్థానమగు (That which is present before all else) సాయుజ్యమును పొందుచున్నాడు. ఆత్మతాదాప్యమును ఆస్వాదిస్తున్నాడు.
ఈ ఆత్మయజ్ఞ విశేషణములు పఠించి ‘దక్షిణాయనము’ నందు ప్రయాణించువాడు-పిత్రుదేవతల మహిమలను పొంది చంద్రమస సాయుజ్యము, సాలోక్యము (లోకమంతా తానైన స్వరూపము) పొంది ఆనందిస్తున్నాడు.
ఈ విధంగా సూర్యచంద్రుల మహదత్వము, మహిమానత్వము పొంది సగుణబ్రహ్మోపాసనచే హిరణ్యగర్భుని ఉపాసించి ఆయన సాక్షాత్కారము పొందుచున్నాడు.
బ్రహ్మము యొక్క మహిమానత్వము పొంది బ్రహ్మానంద సాగరమున ఆనంద తరంగమై విరాజిల్లుచున్నాడు.


ఇతి కృష్ణయజుర్వేదాయ తైత్తీరీయారణ్యే

🙏 ఇతి నారాయణీయా యాజ్ఞికీ ఖిల ఉపనిషత్ సమాప్తా 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।