[[@YHRK]] [[@Spiritual]]

Nārāyana Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


కృష్ణ యజుర్వేదాంతర్గత

16     నారాయణోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। మాయా తత్కార్యమ్ అఖిలమ్
యత్ బోధాత్, యత్ అపహ్నపమ్
త్రిపాద్ నారాయణాఖ్యమ్
తత్ కలయే ‘‘స్వాత్మమాత్రతః।।
ఏ ‘‘నారాయణతత్త్వ విచారణ’’ చేయటంచేత (తత్ ఆఖ్యమ్) - ఈ కనబడేదంతా నారాయణ-త్రిపాదతత్త్వముగా తెలియగలదో, ఇదంతా ఆ నారాయణుని మాయావిలాసంగా అనుభూతమవగలదో, ‘‘నారాయణుడు-అనగా స్వస్వరూపాత్మయే’’నని అనుభవమౌతుందో, అట్టి శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తున్నాము!


ప్రథమః ఖండః
నారాయణాత్ సర్వచేతనాచేతనజన్మ

ఓం అథ పురుషో హ వై నారాయణోఽకామయత ప్రజాః సృజేయేతి .
నారాయణాత్ప్రాణో జాయతే . మనః సర్వేంద్రియాణి చ .
ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ .
నారాయణాద్ బ్రహ్మా జాయతే . నారాయణాద్ రుద్రో జాయతే .
నారాయణాదింద్రో జాయతే . నారాయణాత్ప్రజాపతయః ప్రజాయంతే .
నారాయణాద్ద్వాదశాదిత్యా రుద్రా వసవః సర్వాణి చ ఛందాగ్ంసి .
నారాయణాదేవ సముత్పద్యంతే . నారాయణే ప్రవర్తంతే . నారాయణే ప్రలీయంతే ..

ఏతదృగ్వేదశిరోఽధీతే .
ఓం
01. అథ పురుషో హ వై
నారాయణో అకామయత,
‘ప్రజాః సృజేయ!’ ఇతి।
పరమపురుషుడగు శ్రీమన్నారాయణుడు - ‘ఏకస్వరూపుడు, అనన్యుడు. ‘‘నేను అనేకమంది ప్రాణులను సృష్టించుకొనెదను గాక!’…అనే ఇచ్ఛను పొందుచున్నారు. (ఒకడు కలలో అనేకమందిని కోరి కల్పించుకొని - ఆ స్వప్నమును ఆస్వాదిస్తున్న తీరుగా)।
(ఆ ఇచ్ఛయే-ఊహ, భావన, సంకల్పము, రుచి, లీల, క్రీడ, సరదా- అనికూడా అనవచ్చు)।
నారాయణాత్ ప్రాణో జాయతే,
మనః, సర్వేంద్రియాణి చ।
ఖం, వాయుః, జ్యోతిః, ఆపః,
పృథివీ విశ్వస్య ధారిణీ।

మొట్టమొదట ప్రాణతత్త్వమును, ప్రాణులను, దానినుండి మనస్సును, దాని నుండి పంచేంద్రియతత్త్వములను (శబ్ద-స్పర్శ-రూప-రస గ్రంథ ‘‘సూక్ష్మ’’ తత్త్వాలను), ఆ తత్త్వాలనుండి ఆకాశ - వాయు - జ్యోతి - జల - పృథివీ (స్థూల) పంచభూతతత్వాలను, వాటితో ఈ విశ్వమును ధారణ చేస్తున్నారు. ఆయన కల్పనయే కాబట్టి ఇవన్నీ ఆయనకు అభిన్నం. (కథలోని సంఘటనలు రచయితకు అభిన్నమైనట్లుగా).

నారాయణాత్ బ్రహ్మా జాయతే।
నారాయణాత్ రుద్రో జాయతే।
నారాయణాత్ ఇంద్రో జాయతే।
నారాయణాత్ ప్రజాపతిః ప్రజాయతే।
నారాయణుని సంకల్పము నుండి…, మొట్టమొదట సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు, సంహారకర్తయగు రుద్రుడు, ఇంద్రియతత్త్వరూపుడు, ఇంద్రియాభిమాని, త్రిలోకాధిపతి అగు ఇంద్రుడు, జీవుల రూపభావకుడగు ప్రజాపతి- బయల్వెడలుచున్నారు.
నారాయణాత్ ద్వాదశ ఆదిత్యా,
(ఏకాదశ) రుద్రా, (అష్ట) వసవః।
సర్వాణి ఛందాసి -
నారాయణాత్ ఏవ - సముత్పద్యంతే।
నారాయణాత్ ప్రవర్తంతే।
నారాయణే ప్రలీయంతే।
ఏతత్ ఋగ్వేద శిరో అధీతే।
అట్లాగే, ఆయననుండి ద్వాదశ (12) ఆదిత్యులు, ఏకాదశ (11) రుద్రులు, అష్ట(8) వసువులు, సకల వేదములు ఆవిర్భవించుచున్నాయి. సృష్టిలోని చరాచరములన్నీ ఆ నారాయణునినుండే సముత్పన్నమౌతున్నాయి. నారాయణునియందే ప్రవర్తిస్తున్నాయి. తిరిగి నారాయణునియందే (కథా రచయితయందు కథాక్రమమువలె) విలీనమగుచున్నాయి-జల తరంగాలన్నీ జలంలోనే ఉత్పన్నమయి, జలంలోనే ఉండి, జలంలోనే లయమగుచున్నట్లుగా!

ఇట్టి నారాయణతత్త్వము ఋగ్వేద శిరస్సుచే (ఋగ్వేద-ఉపనిషత్తులచే) బోధింపబడుచున్నది.
ఇతి ఋగ్వేదాంతర్గత
ఉపనిషత్ (10) అధ్యయన ఫలమ్।
ఇతి ఋగ్వేద శిరో - ఋగ్వేదాంతర్గత (10) ఉపనిషత్ అధ్యయన-అంతిమ ఫలము.

ద్వితీయః ఖండః
నారాయణస్య సర్వాత్మత్వం

ఓం . అథ నిత్యో నారాయణః . బ్రహ్మా నారాయణః . శివశ్చ నారాయణః .
శక్రశ్చ నారాయణః . ద్యావాపృథివ్యౌ చ నారాయణః .
కాలశ్చ నారాయణః . దిశశ్చ నారాయణః . ఊర్ధ్వంశ్చ నారాయణః .
అధశ్చ నారాయణః .
అంతర్బహిశ్చ నారాయణః . నారాయణ ఏవేదగ్ం సర్వం .
యద్భూతం యచ్చ భవ్యం . నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః
శుద్ధో దేవ ఏకో నారాయణః . న ద్వితీయోఽస్తి కశ్చిత్ . య ఏవం వేద .
స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి ..

(ఏతద్యజుర్వేదశిరోఽధీతే .)
02. అథ నిత్యో నారాయణః।
బ్రహ్మా నారాయణః।
శివశ్చ నారాయణః।
అట్టి నారాయణుడు నిత్యుడు. ఎల్లప్పుడు ఉండి ఉండువాడు. ఆయన సంకల్పమే సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు. కనుక బ్రహ్మగా ఉన్నది నారాయణుడే! తన స్వరూపమే యగు సృష్టిలోని జీవులకు శుభము - ఆనందము-సుఖము ప్రసాదించు శివునిగా ఉన్నదీ నారాయణుడే!
శక్రశ్చ నారాయణః।
ద్యావా పృథివ్యౌ చ నారాయణః।
కాలశ్చ నారాయణః।
దిశశ్చ నారాయణః।
ఊర్థ్వం చ నారాయణః।
అధశ్చ నారాయణః।
త్రిలోకాధిపతి-ఇంద్రియాధిపతియగు ఇంద్రునిగా ప్రదర్శనమగుచున్నదీ నారాయణుడే! ఆకాశము-భూమిలుగా కనబడుచున్నది కూడా నారాయణుడే!
నారాయణుడే కాలస్వరూపుడు! తూర్పు-పడమర-ఉత్తరము-దక్షిణ- ఈశాన్య-వాయువ్య-నైరుతి-ఆగ్నేయ-అష్టదిక్కులుగా ఉన్నది నారాయణుడే! పైన(ఊర్థ్వము)గాను, క్రింద(అధోదిశగాను) ఉన్నదీ నారాయణుడే!
అంతర్బహిశ్చ నారాయణః।
నారాయణ ఏవ ఇదగ్ం సర్వమ్,
యత్ భూతమ్-
యచ్చ భవ్యమ్।।
నిష్కళంకో, నిరంజనో, నిర్వికల్పో,
నిరాఖ్యాతః, శుద్ధో,
దేవ ఏకో నారాయణః।
న ద్వితీయో అస్తి కశ్చిత్।
య ఏవమ్ వేద
స విష్ణురేవ భవతి।
ఏతత్ యజుర్వేద శిరో అధీతే।।
బాహ్య-అభ్యంతరాలలో సంస్థితుడై ఉన్నదీ నారాయణుడే! (నవలా రచయిత నవలంతా నిండి ఉన్న తీరుగా, కలకనేవాడే కలంతా నిండి ఉన్న విధంగా!)
ఇప్పుడు ఇక్కడున్నట్లు ఉన్నదంతా నారాయణుడే! ఇతః పూర్వము, ఇక ముందు కూడా ‘‘ఉన్నది’’ - అగుచున్నదంతా సర్వము నారాయణుడే! ఆయన తప్పించి ఎక్కడా ఏమీలేదు! ఏదీ లేదు!
అట్టి పరమాత్మయగు శ్రీమన్నారాయణుడు ఈ సర్వము అగుచూ కూడా,
సర్వదా ఏకము - అఖండము కూడా,
నిష్కళంకుడు। కళంక రహితుడు। దోషరహితుడు।
నిరంజనుడు। సర్వదా జ్ఞాన సహితుడు।
నిర్వికల్పుడు। కల్పన లేనివాడు।
నిరాఖ్యాతుడు । వర్ణింపనలవికానివాడు।
శుద్ధో = పరమనిర్మలుడు।
ఏకో = అనేకంగా కనిపిస్తూ కూడా ఏకమే అయి ఉన్నవాడు।
జగత్ కల్పనచే, అట్టి కల్పనకు కర్తయగు ఆత్మానారాయణునకు ఏలోటూ లేదు! ఆ నారాయణుని ఇచ్ఛా చైతన్యము నుండి ఈ సృష్టి, సృష్టికర్త, సృష్టిశక్తులు బయల్వెడలుచున్నప్పటికీ, ఆయనకు వేరై ఎక్కడా ఏదీ ఏ కించిత్ కూడా లేనేలేదు.
ఎవరు-ఈ కనబడే సర్వమును ఆత్మానారాయణునకు అభిన్నంగా ఎరుగు చున్నారో, సందర్శిస్తున్నారో-వారు విష్ణురూపులే అగుచున్నారు. ఇదియే యజుర్వేద-ఉషనిషత్తులు ఎలుగెత్తి గానం చేస్తూ వినిపిస్తున్నాయి. బోధిస్తున్నాయి!
ఇతి యజుర్వేదాంతర్గత
ఉపనిషత్ (51)అధ్యయన ఫలమ్।
యజుర్వేదాంతర్గత (51) ఉపనిషత్ అధ్యయన ప్రయోజనము

(తృతీయః ఖండః
నారాయణాష్టాక్షరమంత్రః)

ఓమిత్యగ్రే వ్యాహరేత్ . నమ ఇతి పశ్చాత్ . నారాయణాయేత్యుపరిష్టాత్ .
ఓమిత్యేకాక్షరం . నమ ఇతి ద్వే అక్షరే . నారాయణాయేతి పంచాక్షరాణి .
ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం .
యో హ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి . అనపబ్రువస్సర్వమాయురేతి .
విందతే ప్రాజాపత్యగ్ం రాయస్పోషం గౌపత్యం .
తతోఽమృతత్వమశ్నుతే తతోఽమృతత్వమశ్నుత ఇతి . య ఏవం వేద ..

(ఏతత్సామవేదశిరోఽధీతే . ఓం నమో నారాయణాయ)
03. ‘ఓం’ ఇతి అగ్రే వ్యాహరేత్।
‘నమ’ ఇతి పశ్చాత్।
‘నారాయణాయ’ ఇతి ఉపరిష్టాత్।
‘ఓం’ ఇతి ఏకాక్షరమ్।
‘నమ’ ఇతి ద్వే అక్షరే।
‘నారాయణాయ’ ఇతి పంచాక్షరాణి।
ఏతత్ వై నారాయణస్య (ఓం నమో నారాయణాయ)
అట్టి ‘‘నారాయణ సోఽహమ్’’ కొరకై శ్రీ మన్నారాయణోపాసనమంత్రము మనకు ప్రసాదించబడుచున్నది.
ఓం : మొట్టమొదట ‘‘ఓమ్..మ్…’’ శబ్ద-నాదముల గానంగా ఉచ్ఛరించ బడునుగాక!
నమో : తరువాత పర - ఇహ రూపములగు పరమాత్మ - జీవాత్మల ఏకత్వ సూచకమగు నమో - అని ఉచ్ఛరించాలి. (న=కేవలము, మ = సందర్భము)
నారాయణాయ : ఆ తరువాత నారాయణాయ అని పలకాలి! (ఒకే జలము అనేక తరంగములగు తీరుగా, ఒకేతత్త్వము అనేక జీవులుగా).
‘ఓం’ అనునది ఏకము - అక్షరము అగు పరబ్రహ్మ సూచకము.
అష్టాక్షరమ్ పదమ్। యో హ వై
నారాయణస్య అష్టాక్షరమ్
పదమధ్యేతి।
అనప బ్రువన్ సర్వమ్ ఆయురేతి।
విందతే ప్రాజాపత్యమ్।
రాయస్పోషమ్ గౌపత్యమ్।
తతో అమృతత్వమ్ అశ్నుతే।
తతో అమృతత్వమశ్నుత ఇతి।
ఏతత్ సామవేదశిరో అధీతే।।
‘నమ’ చేత అఖండమగు పరబ్రహ్మము నుండి ‘పరము - ఇహము’ అనే రెండు చమత్కారములగు పరమాత్మ-జీవాత్మ కల్పనల ద్వే-‘2’ అక్షర తత్త్వము ఉపాసించబడుతోంది. (భావించువాడు-భావించబడువాడు)
‘నారాయణాయ’ - ఇతి పంచాక్షరి. పంచప్రాణములు. పంచభూతములు. పంచకర్మేంద్రియములు. పంచజ్ఞానేంద్రియములు. ఇదంతా ఉపాసనా నారాయణతత్త్వమగుచున్నాయి.
మొత్తముగా నారాయణతత్త్వమును ఉపాసించటమే - ‘‘ఓం నమో నారాయణాయ’’ అష్టాక్షరీ మహామంత్ర రూపము దాల్చుచున్నది.

ఈ అష్టాక్షరీ మహామంత్రమును ఎవరు అర్థ - పరమార్థ సహితంగా, శ్రద్ధాభక్తులతో, ప్రీతిగా జపిస్తారో, అట్టివారు పూర్ణాయుర్ధాయష్కులు (ఆయుర్దాయమును సద్వినియోగపరచుకొన్నవారు)-అగుచున్నారు. ప్రజాపత్య (ప్రజాపతి) స్థానమును పొంది ఆనందిస్తున్నారు. బ్రహ్మ అయి, సృష్టి కల్పనా సామర్థ్య - ఆనందమును పొందుచున్నారు.
ఇంద్ర పదవిని అధిష్టించి త్రిలోకాధిపత్యానందము పొందుచున్నారు. ధన - ధాన్య-పశు-ఇత్యాది సంపదలు స్వయముగా ఆతనిని ఆశ్రయిస్తున్నాయి. నారాయణ తత్త్వమును తెలుసుకొని మృత్యుశృంఖలములను తెగత్రెంచుకొని, అమృతస్వరూపులగుచున్నారు. ఈ రీతిగా సామవేదము - సామ వేదోపనిషత్తులు పాడుతూ తెలియజేస్తున్నాయి.
ఇతి సామవేదాంతర్గత
(16) ఉపనిషత్ అధ్యయన ఫలమ్।
ఇది సామవేదాంతర్గత (16) ఉపనిషత్ అధ్యయన ప్రయోజనము.

(చతుర్థః ఖండః
నారాయణప్రణవః)

ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం . అకార ఉకార మకార ఇతి .
తానేకధా సమభరత్తదేతదోమితి .
యముక్త్వా ముచ్యతే యోగీ జన్మసంసారబంధనాత్ .
ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః . వైకుంఠభువనలోకం గమిష్యతి .
తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం . తస్మాత్తటిదాభమాత్రం .
( bhAshya తస్మాత్ తటిదివ ప్రకాశమాత్రం) .
బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనః .
(var బ్రహ్మణ్యో మధుసూదనఓం) .
బ్రహ్మణ్యః పుండరీకాక్షో బ్రహ్మణ్యో విష్ణురచ్యత ఇతి .
సర్వభూతస్థమేకం నారాయణం . కారణరూపమకార పరం బ్రహ్మ ఓం .
ఏతదథర్వశిరోయోఽధీతే ..
04. ప్రత్యక్ ఆనందమ్।
బ్రహ్మ పురుషమ్।
ప్రణవస్వరూపమ్।
‘అ’కార ‘ఉ’కార ‘మ’కార ఇతి।।
తాని ఏకథా సమభవత్,
తత్ ఏతత్ ‘ఓం’ - ఇతి। -
→ ఓం ‘అ’కార + ‘ఉ’కార + ‘మ’కారమ్ ఇతి - ‘ప్రణవ’ స్వరూపము.
→ సత్ + చిత్ + ఆనందమ్
→ పరమాత్మ + జీవాత్మ + దృశ్యము
ఓం → ప్రత్యక్ ఆనందస్వరూపమగు పరబ్రహ్మ పురుషుడు - అట్టి ‘ఓం’కారమును అర్థయుక్తంగాను, జాగ్రత్ - స్వప్న - సుషుప్త సాక్షిగాను భావిస్తూ, స్మరణ చేస్తూ ఉండగా, ఏ ఈ అనేకములోని ఏకమగు సత్ వస్తువు అనుభవమునకు వస్తుందో - అదియే ప్రణవము - ‘‘ఓం’’.
యమ్ ఉక్త్వా ముచ్యతే యోగీ
జన్మ సంసార బంధనాత్।।
ఓం నమో నారాయణాయ
ఇతి మంత్ర - ఉపాసకః
వైకుంఠభవనమ్ గమిష్యతి।।
తత్ ఇదమ్! పరమ్! పుండరీకమ్!
విజ్ఞానఘనమ్!
తస్మాత్ తటిదాభమాత్రమ్।।
బ్రహ్మణ్యో దేవకీ పుత్రో।
బ్రహ్మణ్యో మధుసూదనః।
బ్రహ్మణ్యః పుండరీకాక్షో।
బ్రహ్మణ్యో విష్ణుః, అచ్యుతః। ఇతి।।

ఓంకార ప్రణవముయొక్క స్మరణచే, అట్టి యోగి (లేక అభ్యాసి) జన్మ సంసార బంధములనుండి విముక్తుడగుచున్నాడు.
‘‘ఓం నమో నారాయణాయ’’ అను మంత్రమును ఉపాసించువాడు దేహపురము (Individual self) నుండి, వైకుంఠపురమునకు (Al- Pervading Self) చేరుచున్నాడు.

‘‘సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూపుడు’’ అగు నారాయణతత్త్వమును సముపార్జించుకొనుచున్నాడు.
సర్వ వ్యాపకమగు ఆ పరమాత్మయే ఇహ-పరస్వరూపుడై
- స్వ-సర్వ హృదయ, పుండరీకము (హృదయపుష్పము) నందు…
- కేవలచిత్ (కేవల తెలివి) స్వరూపమగు విజ్ఞానఘనమై,
- విద్యుల్లత (మెఱుపు)గా ప్రకాశమానుడు అయి,
- అంతర్యామియై,
- అంతరాత్మగా ప్రకాశించుచున్నారు.
అంతరాత్మయే నారాయణునిఉనికి ప్రత్యక్షస్థానము. అపరోక్ష స్వానుభవం.

సర్వభూతస్థమ్ ఏకమ్ వై నారాయణమ్।
కారణ పురుషమ్।
అకారణమ్।
పరబ్రహ్మ ‘ఓం’।
ఏతత్ అథర్వ శిరో అధీతే।।
పరబ్రహ్మస్వరూపుడగు నారాయణుడు…,
- దేవకీ పుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడు. (కృష్ణస్తు భగవన్ స్వయమ్)
- నిర్మల పరబ్రహ్మస్వరూపుడు.
- మధుకైటభ సంహారియగు మధుసూదనుడు.
- సమస్త జీవుల యందు ఏకస్వరూపుడై సర్వదా - సర్వత్రా వెలుగొందు చున్నది శ్రీమన్నారాయణుడే!
- ఆయనయే ఈ సమస్త ప్రపంచమునకు, బ్రహ్మాండములకు కారణభూతుడైనవాడు.
- ‘నాకు అనుభూతమగుచున్న సర్వదృశ్యములకు నేనే కారణుడను కదా!’…అను జ్ఞానప్రదాత!
- సర్వమునకు కారణమగుచు, అకారణుడై ఉన్నవారు. ‘‘నేను కారణపరిమితుడను కాను. అకారణుడను’’ అను ప్రజ్ఞను ప్రసాదించువారు. తనకు వేరు కారణము లేనట్టివాడు. ఆతడే పరబ్రహ్మము. జగత్ రూపంగా మూర్తీభవించుచున్న పరబ్రహ్మమూర్తి! శాస్త్రములచే ఎలుగెత్తి ప్రకటించబడుచున్న - శాస్త్రి. (కిమపి శాస్త్రేణ ప్రవచతీతి)
ఇది ఈ రీతిగా ఆ నారాయణ భగవానుని అధర్వవేదముయొక్క అంతర్గత గానమైన, (31)అధర్వణోపనిషత్తులు ఎలుగెత్తి అభివందనము చేస్తున్నాయి.

విద్యాఽధ్యయనఫలం .

ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి .
సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి .
తత్సాయంప్రాతరధీయానోఽపాపో భవతి .
మాధ్యందినమాదిత్యాభిముఖోఽధీయానః (మధ్యందిన)
పంచమహాపాతకోపపాతకాత్ ప్రముచ్యతే .
సర్వ వేద పారాయణ పుణ్యం లభతే .
నారాయణసాయుజ్యమవాప్నోతి నారాయణ సాయుజ్యమవాప్నోతి .
య ఏవం వేద .

ఇత్యుపనిషత్ ..
05. ప్రాతః అధీయానో
రాత్రి కృతమ్ పాపమ్ నాశయతి।
సాయమ్ అధీయానో
దివస కృతమ్ పాపమ్ నాశయతి।
తత్ సాయమ్ ప్రాతః
అధీయానః అపాపో భవతి।
మాధ్యం దినమ్ ఆదిత్య
అభిముఖో అధీయానః
పంచమహాపాతక-ఉపాతకాత్ ప్రముచ్యతే।
సర్వ వేద పారాయణ పుణ్యమ్ లభతే।
నారాయణ సాయుజ్యమ్ అవాప్నోతిః।
శ్రీమన్నారాయణ సాయుజ్యమ్ అవాప్నోతి,
య ఏవమ్ వేద।।
ఇది సర్వోపనిషత్ సారము. ‘ఓం నమో నారాయణాయ’ మంత్ర మహత్మ్యమును తెలుపుచున్న ఈ ‘నారాయణోపనిషత్’ను ఎవ్వరు, తెల్లవారుజామున పాతఃకాలంలో పఠిస్తారో, వారు అజ్ఞానము చేత (రాత్రి) తెలిసీ-తెలియక చేసిన పాపదోషములను నశింపజేసుకొనుచున్న వారగుచున్నారు.
ఎవరు ఉదయము - సాయంత్రము కూడా ఈ నారాయణోపనిషత్‌ను పారాయణ చేస్తారో, వారు హృదయములోని సమస్త పాపవృత్తులను తొలగించుకొనుచున్నారు.
ఎవ్వరైతే మధ్యాహ్నకాలములో సూర్యభగవానునికి ఎదురుగా నిలబడి ఈ నారాయణోపనిషత్ పారాయణము చేయుచున్నారో, వారు పంచమహా పాతకములనుండి, ఉప-పాతకములనుండి విముక్తులై పుణ్యకర్మలపట్ల ప్రేరితులగుచున్నారు. పుణ్యసంస్కారములు పొందుచున్నారు.

ఈ ఉపనిషత్ పారాయణము రోజూ చేయువారు →
- సర్వవేద పారాయణ పుణ్యమునను సముపార్జించుకొనుచున్నారు.
- ప్రారబ్ద కర్మణానంతరము నారాయణ సాయుజ్యమును పొందుచున్నారు.
నారాయణతత్త్వమును ఎరిగినవారు నారాయణ స్వరూపులే అగుచున్నారు.

ఇతి శ్రీమత్ నారాయణ తత్ త్వమ్।

ఇతి నారాయణోపనిషత్।।

ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



కృష్ణ యజుర్వేదాంతర్గత

16     నారాయణ ఉపనిషత్

అధ్యయన పుష్పము

నారాయణ
మహాజ్ఞేయమ్

సోఽహమ్
నారాయణోఽస్మి।

శ్లో।। మాయా తత్కార్యమ్ అఖిలం
యత్ బోధాత్ యాతి అపహ్నపమ్,
త్రిపాద్ నారాయణాఖ్యం తత్
కలయే స్వాత్మమాత్రతః।।

ఎద్దాని తత్త్వబోధచే మాయ - మాయా కార్యములు కూడా మొదలంట్లా ‘లేనివే’ అవుతాయో, అట్టి త్రిపాద నారాయణ భగవానుడు అనగా - ‘‘స్వాత్మయే’’ - అను ప్రవచనమును శ్రవణము, అధ్యయనము చేయుటకై శ్రీమన్నారాయణ స్వామిని శరణు వేడుచున్నాము.

‘‘ఏతత్ ఋగ్వేదశిరో అధీతే’’

ఈ సృష్టికి పూర్వము అఖండ స్వరూపుడు, అద్వితీయుడు, అయినట్టి ‘శ్రీమన్నారాయణుడు’ ఒక్కరే ఉన్నారు. (ఏకోనారాయణః।). అట్టి కేవల సత్‌స్వరూపునకు అనేకము - అనునదే లేదు. ఏకస్వరూపుడై ఉన్నారు. (అది మనందరియొక్క కేవల స్వస్వరూపమే).

ఆయనకు ‘‘నేను అనేకమును కల్పించుకొనెదనుగాక। అనేక రూపనామములతో కూడిన సృష్టిని భావించుకొని ఆనందించెదనుగాక।’’… అనే ఇచ్ఛ, అభిలాష, వినోదము, సరదా కలుగుచున్నది.

ఒకడు ఒకచోట నిదురిస్తూ,

‘జాగ్రత్’కు వచ్చిన తరువాతనో? ‘‘కలలోని నేను వేరు. కలలో కనిపించిన జనులు వేరు. జాగ్రత్‌లోని ఇప్పటి నేను వేరు’’…. అని తలచుచున్నాడు. వాస్తవానికి సమస్తము స్వయం కల్పితమే కదా!

అదేవిధంగా…,

కేవల - శుద్ధ పరతత్త్వ స్వరూపుడగు నారాయణుడు కూడా సృష్టి సంకల్పుడగుచున్నారు. అట్టి సృష్టి సంకల్పము యొక్క ‘సిద్ధి’ (Execution) కొరకై మొట్టమొదట ఆ నారాయణుని నుండి ‘‘ప్రాణశక్తి (Energy)’’ బయల్వెడలుచున్నది. ఆయన నుండి బయల్వెడలినదేదైనా ఆయనకు వాస్తవానికి అభిన్నమే అయి ఉన్నది కదా! శక్తి - శక్తిమంతుడు ఏకరూపులే!

ఆ తరువాత

వాటన్నిటి యొక్క సమన్వయముచే ఈ విశ్వము రూపుదిద్దుకొనుచున్నది.

ఈ సర్వము తత్ ఆత్మానారాయణునుండియే శ్రీమన్నారాయణునిచేతనే, ఆయనకు అభిన్నము అయి ప్రదర్శితమగుచున్నది.

నారాయణాత్ బ్రహ్మా జాయతే : సృష్టిని ‘ధారణ’ చేయు ప్రజ్ఞాతత్త్వము నారాయణుని నుండే బయల్వెడలింది. ఆ ప్రజ్ఞాతత్త్వము (ఇచ్ఛా-క్రియా స్వభావము) ‘బ్రహ్మ’ అనబడుచున్నది. ఈ విధంగా నారాయణునికి అభిన్నమే అయినట్టి బ్రహ్మదేవుడు ఆత్మానారాయణుని నుండే సృష్టి సంకల్పసిద్ధికొరకై జనించుచున్నారు. (బ్రహ్మణోఽపి ఆదికర్త్రే!)

నారాయణాత్ రుద్రో జాయతే! నారాయణుని నుండే ‘సృష్టికల్పన’ను లయింపజేయుతత్త్వము కూడా ఆయనకు అభిన్నమై బయలుదేరుతోంది. అదియే రుద్రతత్త్వము (లేక) రుద్రుడు.

(కల కనేవాడు తన యొక్క బ్రహ్మదేవాంశతో స్వప్నదృశ్యమును సృష్టించుకొనుచున్నాడు. విష్ణు అంశతో స్వప్నభావనను పొడిగించుకుంటూ, పరిపోషించుకుంటూ కొనసాగిస్తున్నాడు. రుద్రాంశతో ఆ కలను ముగించి తనయందు లయింప జేసుకుంటున్నాడు - అనునది పరమార్థము. ఈ జీవుడు స్వతఃగా నారాయణ, స్వరూపుడే।)

కనుక నారాయణుడే రుద్రుడై ‘లయము’ అను క్రియ నిర్వర్తిస్తున్నారు.

నారాయణాత్ ఇంద్రో జాయతే : ఇంద్రియములన్నిటికీ అభిమాని, అధిపతి, పర్యవేక్షకుడు, త్రిలోకాధిపతి కూడా - అయినట్టి ఇంద్రుడు నారాయణుని నుండియే బయల్వెడలుచున్నారు. అనగా, నారాయణుడే ఇంద్రుడుగా అయి త్రిలోకాలు పాలిస్తున్నారు. దిక్పాలకుల - తదితర దేహనిర్మాణ దేవతల కార్యక్రమములను పరిపాలిస్తూ ఉన్నారు. (హృషీకేశుడు). అట్టి దిక్పాలకాది దేవతలంతా నారాయణాంశయే!

నారాయణాత్ ప్రజాపతిః ప్రజాయతే : ఆ నారాయణుడే ప్రజాపతి అయి సర్వజీవులుగా కూడా ప్రదర్శనమగుచున్నారు. జీవుల భౌతికదేహ నిర్మాణములు, వస్తుధర్మములు-ఇవన్నీ పర్యవేక్షించు ప్రజాపతి నారాయణచైతన్యమే. (ప్రజాపతిస్త్వమ్, ప్రపితామహశ్చ).

నారాయణాత్ ద్వాదశాదిత్యాః : ఆత్మానారాయణుడే విష్ణువు, సూర్యుడు మొదలైన ‘12’ ఆదిత్యుల రూపులై తమ తేజస్సుతో సృష్టిని, లోకాలను హృదయాంతరాలములను తేజోమయం చేస్తూ ఉన్నారు. సర్వదేహాలకు, దేహతత్త్వాలకు, సర్వవస్తువులకు ఉనికి - జీవనము - ఉత్సాహము-క్రియాసామర్థ్యము - దేవతా దివ్య శక్తులు - ఇవన్నీ ఇచ్చి నారాయణుడే పరిపోషిస్తున్నారు.

నారాయణాత్ రుద్రః : ఆ నారాయణుడే శంకరుడు మొదలైన ఏకాదశ రుద్రస్వరూపులుగా అయి ఈ సృష్టికి సుఖము, శుభముగా చెన్నొందుచూ ఇక్కడిమాయా కల్పనలను తగిన సమయంలో ఉపసంహారక్రియ నిర్వర్తిస్తున్నారు.

నారాయణాత్ వసుః : నారాయణుడే అష్టవసువుల రూపములు దాల్చి దేహముల రూపకల్పన, అనేక దేహ విభాగముల పరిరక్షణ, తదితర విధి - విధానాలను పర్యవేక్షించు ‘శక్తి’గా ఉన్నారు. అంతేకాదు. ఈ దేహగృహాలన్నీ ఆయనవే! సర్వజీవుల ఉనికి - సంస్కారములు ఆయనవే. [వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయమ్, సర్వభూత నివాసోఽసి!] (అష్ట విధములైన తత్త్వములుగా భౌతికదేహమునందు క్రియా వ్యవహారులై ఉన్నారు).

నారాయణాత్ సర్వాని ఛందసాని : నాలుగు వేదములలో ఛందోబద్ధంగా స్తోత్రం చేయబడు స్తోత్రగానము, స్తోత్రార్థములు.. ఇవన్నీ కూడా నారాయణ స్వరూపములే! వివరణ, ప్రవచన, విశ్లేషణములన్నీ నారాయణ తత్త్వము గురించియే!
- పరసత్యముగా నారాయణుని ఉపాసించువారు,
- ఆ ఉపాసనా మార్గములైనట్టి వేదములు,
- ఉపాసనా ఆశయమగు తత్త్వమును నిర్వచించుచూ, విశ్లేషిస్తూ అభివర్ణిస్తున్న… తత్త్వశాస్త్ర వాఙ్మయమగు ఉపనిషత్తులు,
- ఆ ఉపనిషత్ ప్రవక్తకులగు మహర్షులు….,
అంతా నారాయణ స్వరూపమే! … మనమంతా కూడా సర్వదా నారాయణస్వరూపులమే!

నారాయణాత్ ఏవ సముత్పద్యంతే : ఎక్కడెక్కడ ఏదేది సముత్పన్నము అగుచున్నదో.. అదంతా నారాయణుడే అట్లు సముత్పన్నమగు చున్నారు. కథలోని పాత్రలుగా సముత్పన్నమగుచున్నది కథారచయిత యొక్క రచనా చమత్కృతియే కదా! రచనా చమత్కృతి రచయిత యొక్క కళా విశేషమేకదా! కళ కళాకారుని ప్రదర్శనారూపమే కదా! (Whatever we come across in a Novel is nothing but the “Art of Story Visualization” of the Novelist only)

ఈ విధంగా జగత్తుగా - జీవుడుగా - మరేదైనాగా కూడా నారాయణుడే ఆయా సర్వ ప్రదర్శనములుగా సముత్పన్నమగుచున్నారు. జీవుడుగాను (As Experiencer) - జగత్తుగాను (As that being experienced) సముత్పన్నమగుచున్నది నారాయణుడే!
నారాయణో ప్రవర్తంతే : జీవుడుగా - జగత్తుగా, నేనుగా-నీవుగా, సర్వదేవతలుగా, సర్వసృష్టిశక్తులుగా ప్రవర్తిస్తున్నది ఆత్మానారాయణుడే!

నారాయణో ప్రలీయంతే : (1) ‘‘లయము పొందుచున్నట్టిది’’, (2) ‘‘ఎందులో లయము పొందుచున్నదో, అది’’ - ఈ ఉభయము కూడా నారాయణుడే।

ఈ విధంగా సృష్టి-స్థితి-లయకారుడు, సృష్టి-స్థితి-లయములు పొందుచున్నట్టిది - ఉభయము నారాయణుడే।
- ఆలోచించువాడు, ఆలోచన, ఆలోచించుబడు వస్తువు / విషయము / వ్యక్తి మొదలైనవి
- నేను - నీవు - జగత్తు,
- ఇతః పూర్వము ఉన్నది, ఇప్పుడున్నది ఇక ముందు ఉండబోవునది,
- బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులు,
- జగత్ నిర్మాతలు, పరిపాలకులు, పరిరక్షకులు, వినాశకులు,
… అంతా నారాయణుడే।

ఇతి ఋగ్వేదశిరో అధీతే!

ఈ విధముగా, ఋగ్వేదము- ఋగ్వేదాంతర్గమగు (10) ఉపనిషత్తులు నారాయణుని గురించి మంత్ర రూపములుగా అభివర్ణిస్తున్నాయి. ఇట్టి ఋగ్వేద ‘ఋక్’ రూప నారాయణ తత్త్వమును ఎరిగినవాడు ‘విష్ణు’ స్వరూపుడగుచున్నాడు! ఆతడే సోఽహమ్ విష్ణుః।।

‘‘ఏతత్ యజుర్వేద శిరో అధీతే।’’

నిత్యో నారాయణః। అట్టి ఇహ-పరస్వరూపుడగు అద్వితీయ నారాయణుడు నిత్యుడు. నారాయణునికి ద్వితీయమైనదంతా దృష్టిచే ఏర్పడేది మాత్రమే! - అనిత్యం కూడా! అనిత్యమైన సర్వవస్తు - విషయ - విశేషాలన్నీ నిత్యుడగు నారాయణునియందే సందర్భానుచిత భూతములై ఉంటున్నాయి. వచ్చి-పోతున్నాయి.
నిత్యో అనిత్యానామ్ ఏతత్ నారాయణః! అనిత్యమైన వస్తువులలో నిత్యమై ఉన్నది నారాయణుడు.

ఒకాయన వినోదంగా, సరదాగా కథ వ్రాయాలనుకొన్నాడు.
- వినోదీ ఆయనే! కధారచన ఊహించువాడూ ఆయనే!
- ఊహలోని పాత్రలు - సంఘటనలు - సందర్భాలు ఆయనయే! ఆయనవే!
- ఆ కథ యొక్క ఉపసంహారము ఆయనయే కదా!
- పాఠకులు కూడా కథాశ్రవణ వ్యాసంగులై - కధాసంబంధితులే।

అట్లాగే…,

బ్రహ్మా నారాయణః। బ్రహ్మగా ఉన్నది నారాయణుడే . ఈ సృష్టికి కల్పన చేయువాడై సంసిద్ధుడగుచున్నది (అగు) ‘బ్రహ్మ’ పాత్రను దాల్చుచున్నది, దీనిని నడిపించు విష్ణుపాత్రను కల్పించి దాల్చుచున్నది కూడా నారాయణుడే! బ్రహ్మగా విష్ణువుగా ఉన్నది నారాయణుడే! సృష్టిగా - సృష్టి రూపంగా - సృష్టి అనుభవిగా ఉన్నదంతా ఆత్మానారాయణుడే!

శివశ్చ నారాయణః : ఈ సృష్టికి, ఇందలి సర్వ జీవులకు సుఖ-శుభ-ఆనంద ప్రదాతయగు శివభగవానుడుగా ఉన్నది నారాయణుడే! నాలుకలో రుచి సుఖము, కళ్ళలో రూపసుఖము, చెవులలో శబ్దసుఖము, (అట్లాగే) స్నేహసుఖము, వాత్సల్యసుఖము… ఇత్యాది సర్వసుఖప్రదాతయగు శివ భగవానుడుగా - శివ స్వరూపుడుగా ఉన్నది ఆత్మానారాయణుడే!

శక్రశ్చ నారాయణః : జీవులకు ఇంద్రియ ప్రదాత, ఇంద్రియ రక్షకుడు, ఇంద్రియ పరిపోషకుడు అగు ఇంద్రభగవానుడుగా ఉన్నది. ఆ శ్రీమన్నారాయణుడే! త్రిలోకపాలకుడై, లోకపాలక నియామకుడై త్రిలోక జీవులను ఒక రాజువలె రక్షణ కల్పిస్తున్న ఇంద్రుడుగా ఉండి అన్నీ నిర్వర్తించుచున్నది ఆత్మానారాయణుడే!

ఆత్మానారాయణుని కల్పనాశక్తి యొక్క అంతర్విభాగములుగా ఉన్న లోకములు - లోకపాలకులు కూడా నారాయణుడే! ఇంద్ర పరిపాలనలో వివిధ కార్యక్రమములు నిర్వర్తించు అష్టదిక్‌పాలకులు, నవగ్రహములు, సప్తఋషులు, ఏకాదశ రుద్రులు… ఇవన్నీ నారాయణుడే!

ద్యావా పృథివ్యౌ చ నారాయణః: ఆకాశము - భూమి… ఈ రెండు ఈ కనబడే భూ విశేషాలన్నిటికీ ఈవల-ఆవల ఉన్న తొడుగులవలె వ్యవహరిస్తున్నాయి. అనేక వస్తు ధర్మములు-తత్త్వములు అంతర్లీనంగాను ఉన్నాయి, మధ్యగాను కలిగి ఉన్నాయి. ఆకాశము - భూమి రెండూ కూడా సర్వతత్త్వరూపుడగు నారాయణుడే! [ద్యావా పృథివ్యౌరిదమంతరర్హి వ్యాప్తం త్వ ఏకేన దిశశ్చసర్వాః (భగవద్గీత)]

కాలశ్చ నారాయణః : అనిర్వచనీయము, అరూపము అగు కాలము ఆత్మానారాయణుడే! (కాలోఽస్మి లోకక్షయకృత్-ప్రవృద్ధో). ఈ జగత్తుల అంతరమున కాలస్వరూపమై సర్వవిశేషాల ప్రారంభము - క్షయముల మధ్యగాను, వాటిని ఆవల - ఈవలగాను ఉన్న కాల స్వరూపము నారాయణ స్వరూపమే! ఆత్మానారాయణుడే!

దిశశ్చ-ఊర్ధ్వం చ - అధశ్చ- అంతర్బహిశ్చ నారాయణః : ఈ విశ్వము యొక్క 8 దిక్కులలోను, పైన-క్రింద, బయట-లోపల అంతా ఆత్మానారాయణుడే!

స్వప్నమంతా అన్నివైపులా, అన్ని దిక్కులుగాను ఉన్నది స్వప్న ద్రష్టయే కదా! ఆయన చైతన్యాకృతియే కదా! ఒక ‘భావన’కు ఈవల-ఆవల లోన-బయట అన్నివైపులా ఉన్నది భావికుడే కదా!
- ఒక కళాఖండములోని రంగుల దృశ్యము, కళాత్మక విశేషాలు.. అన్నీ ఆ కళాకారుని కళాచైతన్యమేగా!
- ఒక ఊహయొక్క ఈవల-ఆవల-, ఇటు - అటు, లోన-బయట ఉన్నది ఆ ఊహించువాడే కదా!
ఇదీ అంతే! ఈ విశ్వమంతా విశ్వేశ్వర ప్రదర్శనమే! నారాయణుడే! శ్రీమన్ ఆత్మానారాయణుడే!

ఇదగ్ం, యశ్చభూతం, యశ్చభవ్యం… సర్వమ్ నారాయణయేవ।
ఇప్పుడున్నది, ఇది వరకు ఉండి ఉన్నది, ఇక ముందు ఉండబోవునది… ఈ సర్వము నారాయణుడే!
దేహాత్మకుడు - విశ్వాత్మకుడు,
దేహేంద్రియములు- విశ్వేంద్రియములు,
దేహాంతఃకరణములు - విశ్వాంతఃకరణములు
ఇవన్నీ సర్వదా సర్వత్రా నారాయణుడే! ఆత్మానారాయణుడే!

అట్టి నారాయణుడు;….,

నిష్కళంకో : ఒక కథలోని పాత్రల గుణములు, స్వభావములు, సంఘటనా సంబంధమైన సుఖ-దుఃఖములు… ఆ కథారచయితచే కల్పించబడినవే అవవచ్చుగాక! కానీ వాటిని ఆ కథా రచయితకు ఆపాదించగలమా? లేదు. సర్వాంతర్యామి - సర్వ స్వరూపుడు అయి కూడా, నారాయణుడు సర్వదా కళంక (దోష) రహితుడు. నిష్కళంకుడు. అస్పృశ్యుడు. దేనిచేతా తాకబడనివాడు.

నిరంజనో : ఆయన ఎట్టి రంజనములచే, ఇంద్రియ విషయ దోషములచే, జన్మ-కర్మ వ్యవహారములచే స్పృశించబడనివాడు. మట్టితో చేసిన ఒక గుర్రపుబొమ్మ బాగున్నది, బాగోలేదు - అను దానితో ఆ మట్టికి ఏమి సంబంధము?

నిర్వికల్పో : కల్ప-వికల్పములు ఆయన క్రీడ అయినప్పటికీ, ఆయన ఎట్టి కల్పనలు లేనట్టివాడు. ఈ జగత్తంతా సవికల్పము. ఆత్మా నారాయణుడో… సదా నిర్వికల్పుడు. జాగ్రత్-స్వప్న-సుషుప్త కల్పనలకు అతీతుడు! సర్వకల్పనలు తనవై, సర్వదా వేరై ఉన్నవారు!

నిరాఖ్యాతః : ‘నారాయణుడు ఇట్టివాడు’ అని వ్యాఖ్యానించలేము. వర్ణింపనలవికానివాడు. లీలగా జగత్ రూపధారి అయి కూడా, అరూపుడు. గుణముల కన్నా ముందే ఉన్నవాడు. సత్-చిత్-ఆనందములు కూడా ఆయన విలాసములే! ‘ఇది’ అని ‘తీపి’ అనుభవించవలసినదే కాని - వర్ణించి ఇతరులకు అనుభూతము చేయలేము కదా! వేదములే ఆయన గురించి ‘‘యతో వాచో నివర్తంతే, అప్రాప్య మనసా సహ’’.. అని అనుచుండగా, ఆ నారాయణుని గురించి ఏమి చెప్పగలం? కళ్ళకు - నాలుకకు.. వాటి వాటి ఉనికికి ‘‘చైతన్యస్ఫూర్తి’’ అయి ఉండగా, అవి ఆత్మానారాయణుని నిర్వరించటమెట్లా? మనము ఉపయోగించే ఇంద్రియాలతో ఆ ఇంద్రియములకే త్రాణ-ప్రేరణ-ఆధారము అయి ఉన్న నారాయణుని చెప్పగలగటము ఎట్లా? కళ్ళు చూచువానిని చూడలేవు కదా! చెవులు వినుచున్న వానిని వినలేవు కదా!

శుద్ధో: ప్రతి ఒక్కరి సహజస్వరూపుడగు నారాయణుడు ఈ జగత్ సందర్భములచే స్పృశించబడక, నిత్య శుద్ధుడై సర్వదా వెలుగొందుచున్నారు. అన్నీ ఆయనయే అయి కూడా, ఆయన దేనికీ సంబంధించి లేరు. దేనికీ పరిమితుడు కాదు. ఏ దోషమూ ఏ మాత్రము అంటనివారు.

న ద్వితీయో అస్తి కశ్చిత్ : ఒక సుదీర్ఘ నాటకంలో పాత్రలుగాని, సంఘటనలుగాని, సందర్భాలుగాని, గుణ-గణాలుగానీ- నాటకరచయితకు వేరై ఏదైనా ఉంటుందా? స్వప్నంలో ఏదీ కూడా స్వప్నద్రష్ట యొక్క స్వప్నసంకల్పమునకు వేరై ఉండదుగదా!

నారాయణుడే -

నారాయణునికి వేరైనది ఎక్కడా ఏదీ ఉండజాలదు. ఉండలేదు. ఉండబోదు. ఆయన అద్వితీయుడు. కానీ ఆయన సర్వదా తనకు తానై ఉన్నవాడు. ఆయనకు ద్వితీయము లేదు. ఆయనను నియమించునదేదీ లేదు.

ఎవ్వరైతే నారాయణతత్త్వమును తెలుసుకొంటారో (య ఏవమ్ వేద), వారు విష్ణుస్వరూపులే (Alpresent, Al-perveding presence)… అగుచున్నారు. ఇదియే… యజుర్వేదము - యజుర్వేదాంతర్గతమగు (51) ఉపనిషత్తులు ఆలపిస్తున్న నారాయణ తత్త్వమహయత్మ్యము.

⚫️ ⚫️ ⚫️

ఏతత్ సామవేదశిరో అధీతే!

దివ్యమగు నారాయణతత్త్వముతో మమేకమవటమే ఈ జీవుని సర్వ మానసిక రుగ్మతలకు పరమౌషధము. అట్టి ‘‘అహమ్ నారాయణాస్మి’’ స్థానము కొరకై ‘‘అష్టాక్షర శ్రీమన్నారాయణోపాసన మంత్రము’’ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాము.

‘‘ఓం నమో నారాయణాయ’’

‘‘ఓం’’ : మొట్టమొదట-పొట్టలోపలిగా సంకోచింపజేస్తూబీ శరీరమంతా-సహస్రారం వరకు ప్రేరణోత్సాహమయం చేస్తూబీ శబ్ద తరంగాలను భావనా రూపంగా ఉత్తేజితం చేసుకుంటూబీ రెండు పెదిమల స్థానము నుండి సహస్రారం వరకు బుద్ధితో సత్‌భావనను సంకల్ప పూర్వకంగా స్పృశిస్తూ-‘ఓం’ ఉచ్ఛారణను కించిత్ దీర్ఘంగా, (‘మ్’ను కొనసాగిస్తూ) పలకాలి. (కొంత సాధన తరువాత శబ్దరహితంగా ప్రాణశక్తితో ప్రేరణరూపంగా మౌనోచ్ఛారణారూపంగా కూడా చేయాలి).

‘‘నమో’’ : ఆ తరువాత పర-ఇహ రూపములగు పరమాత్మ-జీవాత్మల ఏకత్వము సూచించే ‘నమో’ శబ్దమును ఉచ్ఛారణ చేయాలి. ఊర్ధ్వమున సహస్రారంలో స్థానం కలిగి ఉంటూనే ‘నమో’ శబ్దమును రసస్థానంలో (నాలుక-పెదమల స్థానంలో) ఉండి ఉచ్ఛరించాలి.

‘‘నారాయణాయ’’ : ఆపై ముఖమంతా శబ్ద బ్రహ్మముతో నింపి ఉంచి ‘నారాయణాయ’ శబ్దమును పలకాలి.

మంత్రము దేహముతోను-మనస్సుతోను ఉచ్ఛరిస్తూ క్రమంగా మనోభావనతో ఎలుగెత్తి మనోచైతన్య రూపంగా ఈ అష్టాక్షరీ మంత్రమును ఉపాసించాలి. స్మరించాలి. ఉచ్ఛరించాలి. భావన చేయాలి. యోచన చేయాలి. దర్శించాలి. స్వీయ మనస్సుతో (పలికే మంత్రోచ్ఛారణ - వినాలి. బుద్ధితో కూడా అష్టాక్షరీ మంత్రార్ధము (అదేసమయంలో) ఉపాసించబడుగాక! (అర్థం చేసుకోవటమే బుద్ధి యొక్క రూపము).

మంత్రార్థ జ్ఞానము

‘ఓం’ ఇతి ఏకాక్షరమ్ : ఏకము - అక్షరము అగు పరబ్రహ్మ సూచకము.. ‘ఓం’

‘నమ’ ఇతి ద్వే అక్షరే : నకార (పరమాత్మ) - మ (జీవాత్మ)ల అభేదసూచకము. అఖండమైన దానిలో రెండు తత్త్వాలు.

‘‘రూపతః రెండు, తత్త్వతః ఒక్కటే’’ అయిన ‘నమ’, ఇహ-పర రూపములు ఏకము చేయుచూ ఉపాసించుబడుచున్నది.

‘నారాయణాయ’ - ఇతి పంచాక్షరాణి : తరంగాలన్నీ జలమే అయినట్లు సర్వము తానై, సర్వమునకు వేరైనదే నారాయణతత్త్వము. ఏకమే అయి, అయిదు (5)గా కనబడుచున్న తత్త్వము. ‘‘స్వామీ! నారాయణా! పంచప్రాణములతో, పంచ ఉప ప్రాణములతో పంచభూతములతో, పంచకర్మేంద్రియములతో, పంచజ్ఞానేంద్రియములతో కనిపించే మిమ్ములను ఉపాసిస్తున్నాను. స్మరిస్తున్నాను’’!- అని ధ్యానించబడుచున్నది.

అష్ట (8) అక్షరీపదము అగు ‘‘ఓం నమో నారాయణాయ’’ అను మంత్రోపాసనచే నారాయణ, సామీప్యము, తత్త్వము లభించగలదు.

ఈ అష్టాక్షరీ మంత్రమును జపించువాడు సంపూర్ణత్వము పొందున్నాడు. జగత్తులను నిర్మించు సామర్థ్యముతో, అప్రమేయుడైన, ప్రజాపతి స్థానమును సంపాదించుచున్నాడు. ‘‘బ్రహ్మ’’ - అయి సృష్టికల్పనా సామర్థ్య సంపన్నుడగుచున్నాడు. సర్వత్రా స్వస్వరూపము దర్శిస్తూ, ఆనందానుభూతుడగుచున్నాడు. త్రిలోకాధిపత్యము పొంది ఇంద్రసమానుడగుచున్నాడు. ధన-ధాన్య సమృద్ధిపొందుచున్నాడు. స్వయమ్ నారాయణతత్త్వమును తెలుసుకున్నవాడై, మృత్యుపరిధులను అధిగమించి అమృతస్వరూపుడగుచున్నాడు. జన్మపరంపరలకు మునుముందే ఉన్నవాడై, సర్వదా ప్రకాశించుచు, అహేతుక (నిర్హేతుక) - ఆనంద స్వరూపమై విరాజిల్లుచున్న అమృతానంద స్వరూపుడై ప్రకాశించుచున్నాడు.

ఇతి సామవేదము - సామవేదాంతర్గత (16) ఉపనిషత్తులు సమర్పిస్తున్న నారాయణమంత్ర తత్త్వార్థ జ్ఞానము. ఎలుగెత్తి నిర్వర్తిస్తున్న గానామృత మధుర రస ధ్వని.

ఏతత్ అథర్వ శిరో అధీతే!

ఆ నారాయణుడు ప్రత్యక్ ఆనంద స్వరూపుడు. జగత్ సాక్షీ ఆనందము ఆయన యొక్క సహజతత్త్వము. ఆయన పరబ్రహ్మస్వరూపుడు. బ్రహ్మపురుషుడు. ఆయనను ‘‘ప్రణవ స్వరూపునిగా’’ వేదములు వల్లిస్తున్నాయి. వర్ణిస్తున్నాయి. స్తుతిస్తున్నాయి.

ప్రణవము = ‘అ’కారము + ‘ఉ’కారము + ‘మ’కారము

ఏకస్వరూపుడై సర్వేసర్వత్రా సమస్వరూపుడై ప్రకాశించుచున్నవాడే ‘ఓం’కార స్వరూపుడు.

అట్టి ప్రణవాక్షరమగు ‘ఓం’ను ఎవ్వరైతే…,
→ జగదంతర్గత సర్వ స్వరూపుడు, (స్వప్నమంతా తానైన స్వప్నద్రష్ట వలె),
→ జగత్తులను క్రీడగా కల్పించు మహాకవి, (ఒక కథా రచయిత వలె),
→ ప్రతి జీవుని యొక్క కేవల సహజ స్వరూపుడు (మట్టితో తయారయిన అనేక బొమ్మలలోని మట్టి-బొమ్మలుగా ఉన్న మట్టివలె),
→ జాగ్రత్-స్వప్న-సుషుప్తి సాక్షి (మేడపై నుండి క్రింద బాటలలో గల మనుష్యులను, భవనములను, దూరముగా గల విశాల మైదానములను చూచువానివలె)
→ నిర్గుణుడు (నాటకంలోని ఏ పాత్ర యొక్క స్వభావముగాని, గుణము గాని నాటకరచయితవి కాని విధంగా),
→ సర్వగుణుడు (నాటకంలోని సర్వుల గుణ-స్వభావములు నాటక రచయిత యొక్క కల్పనయే అయిఉన్న తీరుగా),
→ సర్వాతీతుడు ( నాటకము చూచువాడు నాటకములోని సర్వ సంఘటనలకు సర్వదా వేరుగా సాక్షి అయి ఉన్నట్లుగా),
→ స్వస్వరూపుడు (జలము తరంగమునకు సర్వదా స్వస్వరూపమే అయినట్లుగా),
ఈ ఈ విధములుగా - భావన చేస్తూ ‘‘ఓం నమో నారాయణాయ’’ అను ఈ అష్టాక్షరీ మంత్రమును ఉపాసన చేస్తూ ఉంటాడో.., అట్టివాడు వైకుంఠభవనమ్ గమిష్యతి। వైకుంఠ ధామమును చేరుచున్నాడు.

అట్టి ‘ఓం నమో నారాయణాయ’కు పరమ లక్ష్యమగు ఆ నారాయణుడు…,
→ మనందరి యొక్క స్వ-హృదయ పుండరీకము (పుష్పము)నందే సర్వదా వేంచేసియున్నారు.
→ కేవల చిత్ (విషయరహితమగు తెలివి) స్వరూపుడైన విజ్ఞానఘనుడు (The said concept of knowing)గా వెలుగొందుచున్నారు.
→ సర్వ-అంతర్యామియై అంతరాత్మగా ప్రకాశించుచున్నారు.

పరబ్రహ్మమగు నారాయణుడే జనుల అజ్ఞానాంధకారము పటాపంచలుచేయు విజ్ఞాన జ్యోతియై ప్రకాశించుచున్నారు. ఆత్మానుభవ మార్గదర్శనము కొరకై దేవకీ పుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడుగా అవతరించారు. బ్రహ్మమే తానైనట్టి మధుసూదనుడు ఆయన! బ్రహ్మణ్యో దేవకీ పుత్రో, బ్రహ్మణ్యో మధుసూదనః।

(- అహమ్ సర్వస్య ప్రభవో.. మత్తః సర్వమ్ ప్రవర్తతే!
- మత్తః పరతరమ్ నా-న్యత్ కించిదస్తి!
- కాలోఽస్మి లోకక్షయకృత్-ప్రవృద్ధో।
- మయా తతమ్ ఇదమ్ సర్వమ్ జగత్ అవ్యక్తమూర్తినా!
- మత్ స్థాని సర్వభూతాని। న చ అహమ్ తేషు అవస్థితః న చ మత్‌స్థాని భూతాని। - ఇతి భగవత్ వాక్యః)

బ్రహ్మణ్యః పుండజరీకాక్షో। బ్రహ్మణ్యో విష్ణుః, అచ్యుతః। - పద్మమువంటి కనులు గలిగిన పుండరీకాక్షుడు! విష్ణుభగవానుడు! స్వస్వరూపమునుండి చ్యుతి పొందనివాడు కాబట్టి అచ్యుతుడు! ఆయనయే పరబ్రహ్మము.

ఇటువంటి స్వస్వరూప నిర్వచన వాక్య ప్రదర్శనముచే శ్రీకృష్ణుడు-‘‘శ్రీకృష్ణ పరబ్రహ్మమూర్తి’’, ‘‘బ్రహ్మైవ-న బ్రహ్మవిత్’’… అయి ఉన్నారు. శ్రీకృష్ణోపాసకుడు, గురోపాసకుడు సాక్షాత్ నారాయణుడే!

ఎవ్వరైతే సర్వజీవులలోను ఏకస్వరూపుడై సర్వదా ఉన్నారో,… ఆయనయే పరమ-పురుషుడు, నిత్యుడు, అఖండుడు అగు శ్రీమన్నారాయణమూర్తి!

ఆయనయే సర్వమునకు కారణుడు. ఆయన కారణ పురుషుడు. ఆయనకు మరొకటేదీ కారణము కాదు. కనుక అకారణుడు.
అట్టి ఓంకార శబ్దార్థ పరబ్రహ్మమూర్తియగు శ్రీమన్నారాయణుని భక్తితో ఆశ్రయించినవారు తదేవ భవతి। పరబ్రహ్మస్వరూపులై వెలుగొందుచున్నారు.

ఇది ఈ విధంగా అథర్వణవేదము - అథర్వ వేద (31) ఉపనిషత్తులు లోకములకు ఎలుగెత్తిగానం చేస్తూ పలుకుచున్నాయి. బోధించుచున్నాయి. గుర్తు చేస్తున్నాయి.

ఫలశ్రుతి

అట్టి పరమ పవిత్రము, ఉత్తమార్థప్రదాత అగు ‘‘శ్రీమన్నారాయణ - అష్టాక్షరీ మంత్రమును’’ ఎవరు భక్తితో, అత్యంతికార్థ పూర్వకంగా ఉపాసిస్తారో, వారు →

ఉదయము నిర్వర్తించిన ‘‘ఓం నమో నారాయణాయ’’ అష్టాక్షరీ మంత్రోపాసనచే రాత్రి చేసియున్న పాపములు - దోషములు [నారాయణునికి అన్యులై సహజీవులు ఉన్నారు - అను సర్వ అల్పదృష్టుల ప్రభావము] తొలగిపోగలదు. పవిత్రమగు నారాయణతత్త్వ దర్శన దృష్టి ప్రవృద్ధమవగలదు.

ప్రాతః-సాయం సమయాలలో అష్టాక్షరీమంత్రోపాసన చేయటం చేత ఆ రోజంతా చేసియున్న అల్పభావనల దుష్ప్రభావములు తొలగగలవు. మనస్సు పవిత్రమగుచూ రాగలదు.

మధ్యాహ్న సమయంలో సూర్యభగవానుని ఎదురుగా నిలబడి అష్టాక్షరీ మంత్రోపాసన - నారాయణ ఉపనిషత్- పారాయణము నిర్వర్తించటం చేత పంచమహాపాతకదోషాల దుష్ప్రభావాలు ఆ ఉపాసకుని పట్ల తొలగిపోతాయి.

నారాయణాత్ పరమ్ నాస్తి - అను ఆత్మభావన ఆరూఢమౌతుంది.

ఎవ్వరైతే ఈ నారాయణోపనిషత్ శ్లోక పఠనమును, అష్టాక్షరీ మంత్రజపమును ప్రతిరోజు నిర్వర్తిస్తుంటారో…
⌘ వారికి సర్వవేదముల పారాయణము చేసిన పుణ్యము లభించగలదు.
⌘ నారాయణ సాయుజ్యము ప్రాప్తించగలదు.

ఇది వేద వచన సార పాఠ్యాంశము!



🙏 ఇతి కృష్ణయజుర్వేదాంతర్గత నారాయణ ఉపనిషత్ ‌🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।