[[@YHRK]] [[@Spiritual]]

Yōga KunDalinī Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


కృష్ణ యజుర్వేదాంతర్గత

21     యోగకుండలినీ ఉపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। యోగకుండలిన్యుపనిషత్ యోగసిద్ధి హృదాసనమ్
నిర్విశేష బ్రహ్మతత్త్వం ‘స్వమాత్రం’ ఇతి చింతయే!

‘యోగసిద్ధి’చే స్వహృదయమే ఆసనముగా కలిగియున్నట్టిది, నిర్విశేష బ్రహ్మతత్త్వము అయినట్టిది అగు ఆత్మతత్త్వమును స్వస్వరూప మాత్రంగానే చింతన చేయాలి. ఈ పరమరహస్యమును యోగకుండలినీ ఉపనిషత్ → నిరూపించుచూ గానము చేయుచున్నది.

ప్రథమాధ్యాయః - కుండలినీ శక్తి ప్రేరణ

01. ఓం హేతుద్వయం హి చిత్తస్య,
(1) వాసనా చ (2) సమీరణః।
తయోః వినష్ట ఏకస్మిన్ తత్ ద్వా అపి వినశ్యతః।
తయోః అదౌ సమీరస్య జయం కుర్యాత్ నరః సదా।
మితాహారశ్చ ఆసనన్చ
శక్తిచాలః తృతీయకః
ఏతేషాం లక్షణం వక్ష్యే,-
శృణు, గౌతమ! సాదరమ్।
ఈ చిత్తము రెండు హేతువులు (Root - causations) కలిగియున్నది. (1) వాసనలు (2) వాయువు (ప్రాణతత్త్వము).
ఈ (1) వాసనలు (2) ప్రాణ వాయువు (ప్రియము)లలో ఒక్కటి నశిస్తే రెండవది నశించగలదు.
ఆ రెండిటిలో మునుముందుగా ‘వాయు జయము’ను జీవుడు నిర్వర్తించటము ఉచితము. అది వాసనా జ్వరమునకు ఔషధము.
వాయుజయము (ప్రాణజయము) కొరకై మూడు నియమములు
(1) మితాహారము (2) ఆసనము (3) శక్తి చాలనము
ఓ గౌతమా! ఈ మూడిటి లక్షణములు చెప్పుకుంటున్నాము. శ్రద్ధగా ఇష్టముగా వినండి.
సుస్నిగ్ధ మధురాహారః
చతుర్థాంశ వివర్జితః,
భుజ్యతే శివసంప్రీత్యై
‘మితాహారః’ స ఉచ్యతే।
మితాహారము :
(1) సాత్వికము, మధురమైన (తక్కువ కారము, ఉప్పుగల) ఆహారము
(2) చతుర్థాంశ (1/4th) వివర్జితము
(పొట్టలో సగభాగము అన్నముతోను (ద్వేభాగం పూరయేత్ అన్నమ్ - భగవద్గీత);
- 1/4వ వంతు → జలముతోను,
- శేషించిన 1/4వ భాగము ఖాళీగా ఉంచటము).
(3) శివార్పితాహారమ్
ఈ మూడూ ‘మితాహార లక్షణములు’గా చెప్పబడుచున్నది.
‘ఆసనం’ ద్వివిధం పోక్తమ్,
‘పద్మం’, ‘వజ్రాసనం’ తథా।
ఊర్వోః ఉపరిచేత్ ధత్తే
ఉభే పాదతలే యథా
‘పద్మాసనం’ భవేత్ ఏతాత్, సర్వపాప ప్రణాశనమ్।
వామాంఘ్రి మూలకందా అధో, హి
అన్యం తదుపరి క్షిపేత్, సమ గ్రీవ శిరః కాయో
‘వజ్రాసనమ్’ ఇతి ఈరితమ్।।
ఆసనము :
ఆసనములు రెండు ముఖ్యమైన విధములుగా చెప్పబడు చున్నాయి (1) పద్మాసనము (2) వజ్రాసనము
పద్మాసనము = రెండు తొడల ఉపరిభాగముపై రెండు పాదములను (ఈ కాలు అటుగా, ఆ కాలు ఇటుగా - అమర్చి ఆసీనుడై ఉండటము పద్మాసనము. పద్మాసనము సర్వ పాపములను శమింపజేస్తుంది.
ఎడమ మడమ (లేక) చీలమండలమును మూల కందము (మూలాధారము)పై ధరించి (నొక్కి ఉంచి), దానిపై కుడి మడమును ధరించి మెడ, శిరస్సు, శరీరములను సమముగా ధారణ చేయుటము ‘వజ్రాసనము’.
కుండల్యేన భవేత్ శక్తిః, తాంతు సంచారయేత్ బుధః
స్వస్థానాత్ ఆ భృవోః మధ్యం, ‘శక్తి చాలనమ్’ ఉచ్యతే।
శక్తి చాలనము :
మౌనంగా ఉన్నట్టి ‘కుండలినీ శక్తి’ని సంచారయుక్తముగా చేయుచూ దేహమును యోగమార్గంగా ఉపయోగించు విద్యను ఎరిగిన బుధులు → అందుకై యోగాభ్యాసం సూచిస్తున్నారు. మూలాధారమున నిదురిస్తు కుండలినీ శక్తిని భ్రూమధ్య ప్రదేశము వరకు సంచరింపజేయు విధానము. - ‘శక్తి చాలనము’ అని అనబడుచున్నది. (ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి ఆత్మను ఏమరచి దృశ్యమునకు ‘పరిమితము’ అయి ఉండటమే- ‘‘నిదురించుచున్న కుండలిని’’)
02. తత్ సాధనే ద్వయం ముఖ్యమ్।
‘‘సరస్వత్యాస్తు చాలనమ్’’।
‘‘పాణరోధమథ’’ - అభ్యాసమ్।।
‘రుజ్వీ’ కుండలినీ భవేత్।
అట్టి ‘శక్తి చాలనము’ అను సాధనను నిర్వర్తించటానికి ‘2’ ముఖ్య విధులు చెప్పబడుచున్నాయి.
(1) సరస్వతీ చాలనము (2) ప్రాణరోధమథ యోగాభ్యాసము
ఈ రెండింటిచే నిదురిస్తు కుండలినీ శక్తి ఋజు మార్గంగా చాలనము (movement) పొందగలదు.
తయోః ఆదౌ ‘సరస్వత్యాః-
చాలనమ్’ - కథయామితే।
‘అరుంధత్యైవ’ కథితా, పురావిత్‌భిః సరస్వతీ
యస్యాః సంచాలనే నైవ, స్వయం చలతి కుండలీ।।
మొదట ‘సరస్వతీ చాలనము’ గురించి చెప్పుకొనెదముగాక.
‘సరస్వతి చాలనము’ నే ‘అరుంధతీ చాలన యోగాభ్యాసము’ అని కూడా అంటారు. అట్టి ‘సంచాలన యోగప్రక్రియ’చే మూలాధారంలో కునుకులు తీస్తూ ఉన్న కుండలిని స్వయముగా కదలికనుపొంది, ఊర్ధ్వగమనము ప్రారంభించగలదు.
ఇడాయాం వహతి ప్రాణే బధ్వా పద్మాసనం
దృఢం, ద్వాదశాంగుల దైర్ఘ్యం చ, అంబరః
చతురంగులమ్, విస్తీర్యతేన తత్ నాడీం
వేష్టయిత్వా తతః సుధీః।
అంగుష్ఠ -తర్జనీభ్యాం తు
హస్తాభ్యాం ధారయేత్ దృఢమ్,
స్వ శక్త్యా చాలయేత్ వామే
దక్షిణేన పునః పునః,
ముహూర్త-ద్వయ పర్యంతం
నిర్భయాత్ చాలయేత్ సుధీః।
సరస్వతీ చాలనము / అరుంధతీ చాలనము
1. పద్మాసనమును దృఢంగా ధరించి
2. ఎడమవైపుగా గల -‘ఇడ’ నాడియందు ప్రాణ-అపానముల స్థిరత్వముచే (ఏకత్వముచే) ప్రాణశక్తిని నిలిపి ఉంచి,
3. 12 అంగుళముల పొడవు, 4 అంగుళముల వెడల్పుగా ఈ ‘ఇడ’ నాడిని విస్తరింపజేసి
4. అంగుష్ఠ (బొటనవ్రేలు) - తర్జనీ (చూపుడువ్రేలు)లను బంధించి (చిన్ముద్రను గట్టిగా ధరించి)
5. స్వీయబుద్ధితో ఎడమ కుడి వైపుల నుండి - ఇడ - పింగళనాడుల మధ్య గల సుషుమ్న నాడిని ‘కదలిక’ భావనతో స్పృశిస్తూ
- రెండు ముహూర్తముల కాలము (12 + 12 క్షణముల = 24 క్షణముల కాలము) నిర్భయముగా కుండలినీ శక్తికి కదలికలు కలిగించటము. (క్రమంగా 68 + 68 = క్షణముల కాలము దానిని నిర్వర్తించాలి). ఇది సరస్వతీ చాలనము.
ఊర్ధ్వమ్ ఆకర్షయేత్ కించిత్
సుషుమ్నాం కుండలీ గతామ్,
తేన కుండలినీ తస్య
సుషుమ్నాయా ముఖం వ్రజేత్।
జహాతి తస్మాత్ ప్రాణో - అయం
సుషుమ్నాం వ్రజతి స్వతః।
తుందేతు తాణం కుర్యాత్ చ
కంఠ సంకోచనే కృతే,
సరస్వత్యాః చాలనేన
వక్షసశ్చ ఊర్ధ్వగో మరుత్।
- సుషుమ్ననాడి ద్వారా కుండలినీ శక్తిని ఊర్ధ్వముగా (ఆజ్ఞాచక్రము వైపుగా) ఆకర్షిస్తూ ఉండాలి.
- దీనితో కుండలినీ శక్తి సుషుమ్ననాడి యొక్క ఊర్ధ్వ - ముఖద్వారము అగు బ్రహ్మరంధ్రమును చేరుచున్నది.
- ఇట్టి సరస్వతీ చాలనయోగ ప్రక్రియచే అనగా, కుండలిని ప్రాణ-అపాన పరిధులను వదలి, సుషుమ్నను చేరినదగుచున్నదై, ఊర్ధ్వయానము ప్రారంభించి, బ్రహ్మరంధ్రమువైపుగా ఎక్కుబెట్టినదగుచున్నది.
- పైకి చేరుకున్న కుండలినిని ఆహ్వానిస్తూ తుందము (పొట్ట విభాగపు ఆకాశము నందు) తాణము (ప్రత్యుత్సాహపరచటము) నిర్వర్తించాలి. కంఠమును సంకోచింపచేస్తూ ఉండాలి. ఈ విధమైన సరస్వతీ చాలనముచే వాయువు ‘వక్షస్థలము’ యొక్క ఉపరి భాగమునకు చేరగలదు.
సూర్యేన రేచయేత్ వాయుమ్ సరస్వత్యాస్తు చాలనే।
కంఠ సంకోచనం కృత్వా, వక్షసశ్చ ఊర్ధ్వగో మరుత్।
తస్మాత్ సంచాలయేత్ నిత్యమ్ శబ్దగర్భాం సరస్వతీమ్।
తస్యాః సంచాలనేనైవ, యోగీ రోగైః ప్రముచ్యతే।
గుల్మం జలోదరః ప్లీహో
యేచ అన్యే తుంద మధ్యగాః, సర్వే తే శక్తి చాలేన
రోగా నశ్యంతి, అసంశయమ్।।
అటువంటి సరస్వతీ చాలన-అభ్యాస సందర్భములో సూర్యనాడి (పింగళ నాడి) యందు వాయురేచకము చేయాలి. కంఠమును సంకోచింప జేస్తూ ఉండగా వాయువు వక్షస్థలముయొక్క ఉపరిభాగమును చేరుచున్నది.
ఈ విధంగా నిత్యము ‘శబ్దగర్భ’అగు ‘సరస్వతి’ని సంచరింప జేయాలి. అట్టి సంచాలనము అభ్యసించు యోగి సర్వరోగములనుండి విముక్తికాగలడు. ప్లీహములోని దోషములు, ఉదరమునకు సంబంధించిన వ్యాధులు ఉదరములో ప్రాణ సంచాలనమగు ‘సరస్వతీ చాలనము’చే తొలగిపోగలవు. సందేహం లేదు.
03. ప్రాణరోధ మథేదానీం, ప్రవక్ష్యామి సమాసతః।
ప్రాణశ్చ దేహగో వాయుః
ఆయామః ‘కుమ్భకః’ స్మృతః।
స ఏవ ద్వివిధః ప్రోక్తః, ‘సహితః’, ‘కేవలః’ తథా।
యావత్ ‘కేవల’ సిద్ధిస్యాత్
తావత్ ‘సహితమ్’, అభ్యసేత్।
(i) ‘సూర్యా’, (ii) ‘ఉజ్జాయీ’ (iii) ‘శీతళీ’ చ,
(iv) ‘భస్త్రీ’ చ ఏవ చతుర్థికా।
భేదైరేవ సమం కుంభో యస్యాత్ ‘సహిత కుంభకః’
ప్రాణరోధ మధనము
ఇప్పుడు ‘ప్రాణరోధ మధనము’ లేక ‘ప్రాణయామము’ మొదలైనవాటి గురించి సంక్షిప్తంగా చెప్పుకుంటన్నాము. దేహములో వాయువుయొక్క ఉనికియే ‘ప్రాణము’. అద్దాని ఆయామము (సుస్థిరీకరణము) ‘కుంభకము’ అని చెప్పబడుతోంది. దేహములో వాయు కుంభకమే ప్రాణాయామము.
అట్టి కుంభకము రెండు తీరులు (1) సహితము (2) కేవలము

(1) సహితము: వాయు ధారణతో కూడుకొన్నట్టిది. 2. కేవలము మనస్సుతో చేసేది. కేవల కుంభకము సిద్ధించేవరకు సహితకుంభకమును అభ్యసించాలి.
సహిత కుంభకము 4 భేదములు కలిగియున్నది.
(1) సూర్య (2) ఉజ్జాయి (3) శీతళీ (4) భస్త్రీ


ఈ 4 కూడా సమాన కుంభక సంబంధమైనవి. ఇవి కేవలీ కుంభకమునకు మార్గములు.
(i) సూర్యభేదము
పవిత్రే నిర్జనే దేశే శర్కరాది వివర్జితే,
ధనుః ప్రమాణపర్యంతే
శీత-అగ్ని-జల వర్జితే,
పవిత్రే న అతి ఉచ్చ నీచే హి,
ఆసనే సుఖదే సుఖే,
‘బద్ధపద్మాసనం’ కృత్వా
సరస్వత్యాస్తు చాలనమ్।

[1] సూర్యకుంభకము / సూర్యభేదము
సూర్య (సహిత) కుంభకము యొక్క అభ్యాసమును…..
- పవిత్రమైన, నిర్జన (జనులు లేని) ప్రదేశంలో
- ధనస్సు ప్రమాణము గల, ధూళి లేని పవిత్ర ప్రదేశం ఎన్నుకోవాలి. శీతలము (మంచు) - అగ్ని - జలము (తడి) ఉండనట్టిది, దుమ్ము - ధూళీ ఉండనట్టి పవిత్రమైనట్టిది, మరీ ఎత్తు - మరీ పల్లము కానట్టిది అగు అట్టి ప్రదేశంలో ‘బద్ధ పద్మాసనము’ అవధరించి, సుఖముగా కూర్చుని నిర్వర్తించాలి!
సరస్వతీ చాలనము అను విధానముగా అభ్యసించాలి.

దక్షనాడ్యా సమాకృష్య
బహిష్ఠం పవనగ్ం శనైః, యథేష్టం పూరయేత్
వాయుగ్ం, రేచయేత్ ఇడయా తతః।
కపాల శోధనేన అపి రేచయేత్ పవనగ్ం శనైః।
చతుష్కం వాత దోషం తు
క్రిమి దోషం నిహంతి చ।
పునః పునః ఇదం కార్యగ్ం
‘సూర్య భేదమ్’ ఉదాహృతమ్
బయట ఉన్న గాలిని కుడి (పింగళ) నాడిలోనికి నెమ్మదిగా చేతనయినంత సేపు పూరించాలి. ఆ తరువాత ఎడమ (ఇడ) నాడిచే రేచకము (గాలి విడువటం) చేయాలి.
- తరువాత కపాలమును శోధిస్తూ (కపాలములో వాయువు నింపి వదలుచూ) నెమ్మదిగా రేచకప్రాణాయామము నిర్వర్తించాలి.
ఇట్టి పూరక - రేచకములను గుండె, పొట్ట, కపాలములలో నిర్వర్తించుచూ అభ్యాసించుచుండగా దేహములో క్రిమిదోషములు తొలగిపోగలవు.
ఇటువంటి పూరక - రేచకములను మరల మరల అభ్యసించటమును ‘సూర్యభేదము’ అని పిలుస్తున్నారు.
(ii) ఉజ్జాయ కుంభకము
ముఖగ్ం సంయమ్య నాడీభ్యామ్
ఆకృష్య పవనగ్ం శనైః
యథా లగతి కంఠాత్తు
హృదయావధి సస్వనమ్,
పూర్వవత్ కుంభయేత్
ప్రాణగ్ం, రేచయేత్ ఇడయా తతః।।
[2] ఉజ్జాయ కుంభకము
నోరును మూసి ఉంచి కుడి నాడులయందు నెమ్మది నెమ్మదిగా వాయువును పూరించి (పింగళయందు గాలి పూరించి), కంఠమునుండి హృదయస్థానము వరకు సస్వనము (గాలిని నియాకము చేసి) - (పూర్వం చెప్పినట్లుగా) ప్రాణమును కుంభకము (కదలకుండనివిధంగా) నిలిపి ఉంచి, కొంతసేపైన తరువాత ఇడనాడినుండి రేచకము(Out pushing of Air)ను నెమ్మదిగా నిర్వర్తించాలి. (Air to be slowly released through ‘Ida’ Naadi)
04. శీర్షా-ఉదిత అనల హరం,
గళ శ్లేష్మ హరం, పరమ్,
సర్వరోగ హరం పుణ్యం
దేహ - అనల వివర్థనమ్, నాడీ జల ఉదరం
ధాతు గత దోష వినాశమ్,
గచ్ఛతః తిష్ఠతః కార్యమ్-
‘ఉజ్జాయ’ ఆఖ్యంతు కుమ్భకమ్।
ఇట్టి కుంభకముతో కూడిన పూరక -రేచక ‘ప్రాణ రోధన మధనము’ (ప్రాణాయామము) - శిరస్సులో అనలము (వాతము)ను హరింపజేస్తుంది. శ్లేష్మమును తొలగించగలదు. దేహములోని అనేక రోగములను పారద్రోలగలదు. దేహములో జఠరాగ్ని తేజోమయము, ఉత్సాహవంతము అవుతుంది. నాడీజలమును తొలగించి ఉదర సంబంధమైన ధాతు దోషములు తొలగిస్తుంది
ఇది ఉజ్జాయ కుంభకము : కొంత అభ్యాసము తరువాత, ఇది నడుచుచూ నిలబడి, ఆయా పనులు నిర్వర్తిస్తూ కూడా అభ్యాసము చేయవచ్చును.
(iii) శీతళీ కుంభకము
జిహ్వయా వాయుమ్ ఆకృష్య
పూర్వవత్ కుమ్భకాత్ అను,
శనైస్తు ఘ్రాణ రంధ్రాభ్యాగ్ం
రేచయేత్ అనిలగ్ం సుధీః।
గుల్మ ప్లీహ - ఆదికాన్ దోషాన్
క్షయం పిత్తం జ్వరం తృషామ్।
విషాణి శీతహృత్ నామ
కుంభకో-యం నిహంతి చ।
[3] శీతళీ (లేక) శీతాహృత్ కుంభకము (లేక) శీత హరకుంభకము
నాలుకతో గాలిని ఆకర్షించి, నోరుమూసి, నోటిలోను- కంఠములోను కుంభకము (Holding Air constantly) నిర్వర్తించి, అటు తరువాత నెమ్మదిగా ముక్కుపుటములతో వదలటము.
ఇట్టి అభ్యాసము - గుల్మ (పొత్తి కడుపు) - ప్లీహము మొదలైనచోట్ల గల దోషములను, పిత్తదోషములను, జ్వరమును నివర్తింపజేయగలదు.
ఇది శీతళీ (లేక) శీతహృత్ కుంభకము. ‘శీతహర కుంభకము’ అని కూడా అంటారు.
‘శీత హృత్’ కుంభకము వలన సర్వ విషదోషములు తొలగగలవు.
(iv) భస్త్రీ కుంభకము
తతః పద్మాసనం బధ్వా
సమ గ్రీవ-ఉదరః సుధీః,
ముఖగ్ం సంయమ్య
యత్నేన ప్రాణం
ఘ్రాణేన రేచయేత్।
యథా లగతి కంఠాత్తు
కపా లే సస్వనం తతః
వేగేన పూరయేత్, కించిత్
హృత్ పద్మావధి మారుతమ్।
పునః విరేచయేత్,
తద్వత్ పూరయేచ్చ పునః పునః।
[4] భస్త్రీ కుంభకము-వేగవంతంగా రేచక పూరకములు
(1) రేచకము - గాలి వదలటము
- పద్మాసనమును అవధరించి,
- గ్రీవమును (కంఠమును) ఉదరమును (పొట్టను) సమముగా (నిట్టనిలువుగా) ధరించి,
- నోటిని మూసి ఉంచి,
- ప్రయత్న పూర్వకంగా ఘ్రాణము (ముక్కు)తో వాయువును రేచకము చేయాలి.
(2) పూరకం - గాలిని లోనికి పీల్చటం
కంఠమునుండి కఫాలము వరకు సస్వనముగా(In a Rythmic manner) వేగముగా గాలిని పూరించటము. అనగా, హృదయ పద్మమున ఉన్న గాలిని కంఠము ద్వారా కఫాలము స్పృశించువరకు వేగముగా పూరించటము.

ఈ విధంగా, ముందుగా రేచకము, ఆ తరువాత పూరకము నిర్వర్తించాలి. ఇట్లు మరల మరల రేచక-పూరకములను నిర్వర్తించాలి. (రేచకం= ముఖంలో గాలి సంయమిస్తూ, ముక్కు నుండి గాలి వదలటం, పూరకం= కంఠకపాలములలో గాలిని నింపటము. కంఠమును కించిత్ సంకోచింప జేస్తూ హృదయము నుండి కపాలమును స్పృశిస్తూ కపాలాకాశంలో మౌనానందమును ఆస్వాదిస్తూ, ఉండటము. అటు తరువాత రేచకం ముక్కు ద్వారా గాలిని వదలటము/రేచకించటము)
యథైవ లోహకారాణాం ‘భస్త్రా’ - వేగేన చాల్యతే,
తథైవ స్వ-శరీరస్థం, చాలయేత్ పవనగ్ం శనైః।
యథా శ్రమో భవేత్ దేహే, తథా సూర్యేణ పూరయేత్।
యథా ఉదరం భవేత్ పూర్ణమ్, పవనేన తథా లఘు,
ధారయత్ నాసికా మధ్యం, తర్జనీభ్యాం వినా దృఢమ్,
కుంభకమ్ పూర్వవత్ కృత్వా
రేచయేత్ ఇడయా అనిలమ్।
కమ్మరి ఏ విధంగా కొలిమితిత్తి నుండి కొలిమిలోనికి గాలిని వేగముగా వదలుతారో, అదే విధంగా స్వశరీరంలో సంచరించుచున్న వాయువును నెమ్మదిగా ప్రారంభించి వేగంగా చలింపజేయాలి. (చాలనం చేయాలి)
ఎంతవరకైతే దేహము శ్రమ అవధరించగలదో, (భరించగలదో) అంతవరకు సూర్యనాడి (పింగళి)ని పూరించి ఉంచాలి.
ఉదరమును గాలితో నింపి, తేలికగా ధారణ చేయగలిగినంతసేపు నాసిక మధ్యమున గాలిని నిలిపి, తర్జనుల రెండిటినీ (చూపుడు వ్రేళ్ళను) వదలుగా ఉంచి పూర్వమువలె కుంభకము చేసి ఇడచే గాలిని వదలాలి.
కంఠోత్థితా అనలహరగ్ం, శరీరాగ్ని వివర్ధనమ్।
కుండలీబోధకం, పుణ్యం।
పాపఘ్నగ్ం శుభదమ్ సుఖమ్।
బ్రహ్మనాడీ ముఖాంతస్థ
కఫాది యత్ గళనాశనమ్,।
గుణత్రయ సముద్భూత
గ్రంధిత్రయ విభేదకమ్, విశేషేణైవ కర్తవ్యం
భస్త్రాఖ్యం కుంభకం తు ఇదమ్।

భస్త్రీ కుంభక ప్రయోజనములు: కంఠములో చెడు గాలిని బయల్వెడ లించునది; శరీరములో వాతమును తొలగిస్తూ అగ్నిని వృద్ధిని చేయగలదు. కుండలినిని బోధకముగా (సముత్సాహముగా) చేయగలదు. పాప భావములను తొలగించునది; పుణ్యభావములు కలిగించునది; శుభప్రదమైనది; సుఖదాయకమైనది; బ్రహ్మనాడి, ముఖము మొదలైన ప్రదేశములలో కఫము తొలగించి నిర్మలము చేయునది; సత్వ-రజో-తమో త్రిగుణముల వలన కలుగు విష్ణు-బ్రహ్మ-రుద్ర గ్రంథులను ఛేదించునది- అగు భస్త్రీ కుంభకమును విశేషంగా అభ్యసించటము - యోగికి సదభ్యాసము, అత్యంత శ్రేయోదాయకము కూడా!

05. చతుర్ణామపి భేదానాం
‘కుమ్భకే’ సముపస్థితే,
బంధత్రయం ఇదం కార్యం
యోగిభిః వీతకల్మషైః।
ప్రథమో → ‘మూలబంధస్తు’,
ద్వితీయో → ‘ఉడ్డీయణాభిధః’।
‘జాలంధరః’ తృతీయస్తు। తేషాం లక్షణమ్ ఉచ్యతే।
అధోగతిం అపానంవై, ఊర్ధ్వగ్ం కురుతే బలాత్
ఆకున్చనేన తం
ప్రాహుః ‘‘మూలబంధో’’ అయమ్ ఉచ్యతే।
అపానే చ ఊర్ధ్వగే యాతే, సంప్రాప్తే వహ్నిమండలే,
తతో అనలశిఖా దీర్ఘా, వర్ధతే వాయునా హతా।।

పైన చెప్పిన (1) సూర్యా (2) ఉజ్జయీ (3) శీతళీ (4) భస్త్రీ - ఈ నాలుగు రకములైన కుంభకములను నిర్వర్తిస్తూ ఉండగా, ఆయోగి కల్మషములను తొలగించుకొనుచూ, క్రమంగా త్రిబంధములకు సంసిద్ధమగుచున్నాడు.
బంధత్రయము
(1) మూలబంధము (2) ఉడ్డీయాణము (3) జాలంధరము. ఈ ‘3’ బంధముల లక్షణములు ఈవిధంగా చెప్పబడుచున్నాయి.
మూలబంధము : అధోగతి (క్రిందకు వెళ్ళు ధర్మముగల) అపాన వాయువును బలవంతముగా ఊర్ధ్వముగా (పైకి) అకుంచనము (ఈడ్చుకు రావటము) మూలబంధము.

అపానము ఊర్ధ్వంగా వచ్చుచుండగా, వాయువుతో కూడిన ‘అగ్నిశిఖ’ (తేజోతత్త్వము)ను స్పృశిస్తోంది. అట్టి తేజోమండలము దేహములో (అపాన) వాయు స్పర్శచే ప్రవృద్ధమగుచున్నది.
తతో యాతౌ వహ్న్యపానౌ
ప్రాణమ్ → ఉష్ణస్వరూపకమ్,
తేన అత్యంత ప్రదీప్తేన
జ్వలనో దేహజః తథా।
తేన కుండలినీ సుప్తా
సంతప్తా సమ్ప్రబుధ్యతే।
దండాహత భుజంగీ వ
నిశ్శ్వస్య ఋజుతాం వ్రజేత్।

క్రమంగా అగ్ని - అపానములు ఉష్ణస్వభావము కలిగియున్న ప్రాణమును కలియనారంభిస్తాయి. అట్టి ప్రాణ - అపానముల పరస్పర సంయోగస్పర్శచే దేహములో అంతటా అగ్ని ప్రజ్వలితమై, దేహము ప్రకాశవంతము కాగలదు.
అట్టి ప్రజ్వలనము యొక్క ప్రభావంచేత నిద్రాముద్రతో సుప్తమైయున్న కుండలినీ శక్తి సంతప్తమై మేలుకొనుచున్నది.
కర్రదెబ్బ తిన్న ఆడ త్రాచువలె తీవ్ర శ్వాసలతో బుసలు కొడుతూ మెలికెలు తిరిగియున్న కుండలినీ శక్తి → ఋజుత్వము (Stright Forwardness) పొందసాగుతుంది.
బిలప్రవేశతో యత్ర బ్రహ్మనాడి అంతరం వ్రజేత్।
తస్మాత్ నిత్యం ‘మూలబంధః’
కర్తవ్యో యోగిభిః సదా।
కుంభకాన్తే - రేచక ఆదౌ
కర్తవ్యస్తు ‘ఉడ్డీయాణకః’।
బంధో యేన సుషుమ్నాయాః
ప్రాణస్తు ఉడ్డీయతే యతః, తస్మాత్ ఉడ్డీయాణాఖ్యో
అయం యోగిభిః సముదాహృతః।।
బిల ప్రవేశం చేసే పామువలె బ్రహ్మ బిలప్రవేశమునకై శీర్షమునగల బ్రహ్మనాడివైపుగా అంతరయానము పొందుచున్నది.
అందుచేత యోగి అయినవాడు ఎల్లవేళలా మూలబంధము తప్పక నిర్వర్తించతగినది.

ఉడ్డియాణము : ఇది కుంభకము ముగియుచూ - రేచకము ప్రారంభమగు స్థానమున నిర్వర్తించు యోగాభ్యాసము. ఇట్టి ఉడ్డియాణ అభ్యాసముచే సుషుమ్ననాడి నుండి ప్రాణశక్తి పైకి లేచుచుండటంచేత ఈ పేరు వచ్చింది. యోగులచే స్వానుభవమై ఈ ఉడ్డీయాణము ఈ క్రిందివిధంగా వర్ణితమై చెప్పబడుచున్నది.
06. సతి వజ్రాసనే పాదౌ, కరాభ్యాం ధారయేత్ దృఢమ్।
గుల్ఫదేశ సమీపే చ కందం తత్ర ప్రపీడయేత్।
పశ్చిమం తాణమ్ ఉదరే
ధారయేత్ హృదయే గళే।
శనైః శనైః యదా ప్రాణః
తుంద సంధిం నిగచ్ఛతి।
తుంద దోషం వినిర్ధూయ
కర్తవ్యగ్ం సతతం శనైః।
జాలంధర బంధము
పూరకాంతేతు కర్తవ్యో
బంధో జాలంధరాభిదః।
‘వజ్రాసనము’ ధరించి - పాదములను చేతులతో దృఢంగా పట్టుకొని ధారణ చేయాలి.
చీల మండలముతో కందస్థానమును (ఆసనస్థానమును) నొక్కిపట్టి ఉంచాలి.
పశ్చిమ తాణము (పొత్తికడుపు)ను ఉదరమువైపుగా నిలుపుకొని, హృదయమును ధారణగా నిలిపి ఉంచాలి.
ఎప్పుడైతే నెమ్మది నెమ్మదిగా ప్రాణశక్తి పొట్టయొక్క సంధి ప్రదేశము నుండి ఊర్ధ్వముగా బయల్వెడలుచున్నదో, పొట్టలోని దోషములు వాయు ప్రసరణముచే తొలగిపోతాయి. అందుచేత అట్టి ప్రాణసంచాలనమును నెమ్మదిగా సుదీర్ఘకాలం నిర్వర్తిస్తూ ఉండాలి.

జాలంధరము : పూరకముయొక్క అంతమునందు (ముగిసిన తరువాత), ఇంకనూ రేచక- ప్రారంభము కానట్టి స్థానములో ‘జాలంధరము’ అనబడు యోగమును యోగులు ధారణగా ఆశ్రయిస్తు న్నారు. పూరక-రేచకముల లయస్థానంలో ధ్యాసను నిలుపుచున్నారు.
కంఠ సంకోచ రూపో-సౌ
వాయుమార్గ నిరోధకః
అధస్తాత్ కుంచనేనాశు
కంఠ సంకోచనే కృతే।
మధ్యే పశ్చిమ తాణేన స్యాత్
ప్రాణో బ్రహ్మనాడిగః।
పూర్వోక్తేన క్రమేణైవ
సమ్యక్ ఆసనం ఆస్థితః,
చాలనం తు సరస్వత్యాః
కృత్వా,….ప్రాణం నిరోధయేత్।
అట్టి జాలంధరము కంఠమునందు వాయుసంకోచ రూపమునకు సంబంధించినది. వాయువుయొక్క మార్గమును నిరోధించు యోగాభ్యాసము. కొంచము క్రింద వైపుగా కంఠమును కుంచింప జేయుటచే, మధ్యే మార్గముగా ప్రాణశక్తి బ్రహ్మనాడిని నిరాఘాతముగా చేరటము జరుగగలదు.

ఇతఃపూర్వం చెప్పిన తీరుగా (క్రమముగా)
→ శిరస్సు, మెడ, ముఖము నిశ్చలముగా, నిలువుగా నిలిపి,
→ సరస్వతీ చాలనము చేస్తూ
→ ప్రాణ ప్రసరణమును నిరోధనము (Control and wel conditioning) చేయాలి. ప్రాణశక్తిని సూటిగా బ్రహ్మరంధ్రమువైపుగా ప్రసరించునట్లుగా బుద్ధితో అభ్యసించాలి.
ప్రథమే దివసే కార్యం,
కుమ్భకానాం చతుష్టయమ్।
ప్రత్యేకం దశసంఖ్యాకం, ద్వితీయో పంచభిః తథా।
వింశతి అలం తృతీయే-హ్ని
పంచ వృద్ధ్యా దినే దినే,
కర్తవ్యః కుమ్భకో నిత్యం
బంధత్రయ సమన్వితః,

యోగాభ్యాసము ప్రారంభించువాడు మొదటిరోజు - 4 కుంభకములు, రెండవరోజు - 5 కుంభకములు 2 సార్లు = 10 కుంభకములు, మూడవరోజు - 20 సార్లు అభ్యసించాలి. అంతకుమించి కుంభకములు చేయనక్కర్లేదు.
పై విధానంగా రోజు రోజుకు ‘5’ కుంభకములను పెంచుకుంటూ పోవచ్చు.
ఈ విధంగా కుంభక ప్రాణాయామమును ‘3’ బంధకములను (పైన చెప్పిన త్రిబంధములను) నిత్యము చేస్తూ ఉండాలి.

విఘ్నములు
దివాసుప్తిః నిశాయాంతు
జాగరాత్ అతిమైథునాత్,
బహుసంక్రమణం నిత్యగ్ం
రోధాత్ మూత్ర పురీషయోః,
విషమా - అశన దోషాచ్చ
ప్రయాస ప్రాణ చింతనాత్,
శీఘ్రం ఉత్పద్యతే రోగః
స్తంభయేత్ యది సంయమీ
‘‘యోగాభ్యాసేన మే రోగ ఉత్పన్న’’-
ఇతి కథ్యతే।
తతో అభ్యాసం త్యజేత్
ఏవం ‘‘ప్రథమం విఘ్నమ్’’ ఉచ్యతే।।
విఘ్నములు
కొందరు యోగాభ్యాసకులు ప్రారంభదశలో విఘ్నములు ఎదుర్కొనుచున్నారు.

మొదటి విఘ్నము
→ పగటి నిద్ర
→ రాత్రి జాగరణము.
→ అనేక పిచ్చి ఆలోచనలు. మనస్సు క్షణ క్షణ చాంచల్యము
→ మూత్ర పురీషములు అధిక/అల్పత్వములు
→ సరిగ్గా ఆహారం రుచించకపోవటం
→ అలసట
→ కొన్ని రోగాలు మొదటికొస్తున్నాయని అనిపించటము
→ ఒంటి నొప్పులు
ఇవన్నీ మానసిక రుగ్మతలు. యోగాభ్యాసి ఓర్పు, పట్టుదల కలిగి ఉండాలి. అల్పభావములు దరిజేయనీయకుండా ఎదుర్కోవాలి. తితిక్ష అభ్యసించాలి.
….ఈ విధంగా చెప్పుకొని యోగాభ్యాసం నుండి కొందరు విరమిస్తూ ఉంటారు. అందుచేత ఇవన్నీ మొట్టమొదట వచ్చిపడే విఘ్నములుగా చెప్పబడుచున్నాయి.
07. ద్వితీయగ్ం సగ్ంశయాఖ్యం చ।
తృతీయంచ ప్రమత్తతా।
ఆలస్యాఖ్యన్ చతుర్థం చ,
నిద్రారూపం తు పంచమమ్।
షష్ఠం తు విరతి।
అహ్రాంతిః సప్తమమ్ పరికీర్తితమ్।
విషమం చ అష్టమం చైవ
అనాఖ్యం నవమగ్ం స్మృతమ్।
అలబ్ధిః యోగతత్త్వస్య
దశమం ప్రోచ్యతే బుధైః।।
ఇతి ఏతత్ విఘ్న దశకం।
విచారేణ త్యజేత్ బుధః।।
‘2’వ విఘ్నము → సంశయించటం (Getting Doubts) (ఇట్లా అవుతోందేం? అట్లా అవదేం? వేలాదిమందిలో ఒక్కొక్కడికేగా సిద్ధించేది? నాకు, ఇటువంటి వాడికి సిద్ధిస్తుందా? అబ్బే! - అనే అనుమానాలు).
‘3’వ విఘ్నము → ప్రమత్తత (Dullness, Gloomyness)
‘4’వ విఘ్నము → ఆలస్యము (బద్ధకము Lazyness)
‘5’వ విఘ్నము → నిద్ర
‘6’వ విఘ్నము → ప్రయత్నము మానివేసి తదితర విషయములవైపు, లౌకిక సందర్భములవైపు మరలటము.
‘7’వ విఘ్నము → అహ్రాంతి, భ్రమలు చెందటం.
‘8’వ విఘ్నము → విషమము. సమత్వం కోల్పోవటం
‘9’వ విఘ్నము → తెలివి తక్కువగా ఉండటం. అర్థం చేసుకోలేకపోవటం.
‘10’వ విఘ్నము → యోగసిద్ధి లభించకపోవటము. ఎన్నాళ్ళురా? అని వేసటపడటం.
ఈ 10 విఘ్నములను విచారణ (పరిశీలన Analysing) ద్వారా త్యజించివేయాలి - అని బుధులు గుర్తు చేస్తున్నారు. పట్టుదల గలవాడు వీటన్నిటినీ జయిస్తున్నాడు.
ప్రాణాభ్యాసః తతః కార్యో
నిత్యగ్ం సత్యాస్థయా ధియా।
సుషుమ్నా లీయతే చిత్తం
న చ వాయుః ప్రధావతి।
శుష్కే మలే తు చ
యోగీస్యాత్ గతిః చాలితా తతః।
అధోగతిం అపానం వై
ఊర్ధ్వగం కురుతే బలాత్।
ఆకున్చనేన తం ప్రాహుః
‘మూలబంధో’ అయం ఉచ్యతే।
నిత్యము ప్రాణాభ్యాసమును ‘సత్యమైన ప్రయోజనకారి’ అనుభావనతో నిర్వర్తించాలి. బుద్ధిపూర్వకంగా అభ్యాసము చేయాలి.
అప్పుడు చిత్తము క్రమంగా జగత్ విషయముల నుండి వెనుకకు మరలి, ‘సుషుమ్న’యందు లీనము కాగలదు. ఇక ప్రాణవాయువులు తమ స్వభావమగు చంచలత్వము వదలి, నిశ్చలత్వమును సంతరించుకోగలవు.
ప్రాణాయోగాభ్యాసముచే-దేహములోని మలిన పదార్థములన్నీ శుష్కిస్తాయి. వాయుగతి అడ్డంకులు తొలగుచుండగా చాలితము (Actively) అగుచున్నది. బుద్ధి సునిశితము కాసాగుచున్నది.
క్రిందకు ప్రసరణము పొందుచున్న అపానవాయువు బలవంతముగా ఊర్ధ్వత్వమును ఇచ్ఛాపూర్వకంగా పొందింపజేయటమే మూలబంధము.
అపానశ్చ ఊర్ధ్వగో భుత్వా
వహ్నినా సహ గచ్ఛతి।
ప్రాణస్థానం తతో వహ్నిః,
ప్రాణ-అపానౌ చ సత్వరమ్।
మిళిత్వా ‘కుండలీం’ యాతి।
ప్రసుప్తా కుండలాకృతిః।
తేన అగ్నినా చ సంతప్తా
పవనేనైవ చాలితా, ప్రసారస్య స్వశరీరస్య
సుషుమ్నా వదనాంతరే।
ఆ విధమైన ‘మూలబంధనము’ చే అపానవాయువు ఊర్ధ్వత్వం పొంది క్రమంగా దేహములో ఉన్న అగ్నితో ఏకమగుచున్నది.
అపాన - అగ్ని తత్త్వములు కలిసి ప్రాణముతో సంయోగము చెందుచున్నాయి.
ప్రాణ - అపానములు మిళితము అయి కుండలినీ శక్తిని సమీపిస్తున్నాయి.
నిద్రాముద్ర వహించిన కుండలినీశక్తి కుండలి (చెవికుండలి) ఆకృతి వహించి ఉంటుంది. అట్టి కుండలిని ప్రాణ - అపానముల వెంటనంటి సమీపించిన అగ్నిచే సంతప్తమై వాయువుచే చాలితమై (కదల్చబడి) యోగియొక్క స్వశరీరములో ఊర్ధ్వంగా ప్రసారముపొంది సుషుమ్ననాడి యొక్క ముఖద్వారంలో ప్రవేశించుచున్నది.
బ్రహ్మగ్రన్ధిం-తతోభిత్వా రజోగుణ సముద్భవమ్।
సుషుమ్నా వదనే శీఘ్రం,
విద్యుల్లేఖేవ సగ్ంస్ఫురేత్।
విష్ణగ్రంధిం ప్రయాతి ఉచ్చైః
సత్వరగ్ం హృదిసగ్ంస్థితా!
అప్పుడు సుషుమ్నద్వారా ముందుకు వెళ్ళి రజోగుణముచే ఉద్భవమైన (నాభిస్థాములోని/నాభికమలములోని) బ్రహ్మగ్రంథిని ఛేదిస్తూ ఉంటుంది. సుషుమ్నయొక్క ముఖప్రదేశము శీఘ్రంగా ‘విద్యుల్లత’ వలె ప్రకాశమానమై ఉండసాగుచున్నది.
అప్పుడు హృదయంలో సంస్థితమైయున్న (బిగుసుకుపోయి ఉన్న) సత్వగుణముచే జనించే విష్ణుగ్రంథిని కుండలినీ శక్తి ఛేదించి మరికొంత ఊర్ధ్వమునకు ప్రయాణించసాగుతోంది.
08. ఊర్ధ్వం గచ్ఛతి యత్ చ అస్తే,
రుద్రగ్రంథిం తత్ ఉద్భవమ్,
భృవోర్మధ్యంతు సంభిద్య
యాతి శీతాంశు మండలమ్।
అనాహతాఖ్యం యత్ చక్రం
దళైః షోడశభిర్యుతమ్।
తత్ర శీతాంశు సంజాతం
ద్రవగ్ం శోషయతి స్వయమ్।
ఇకప్పుడు కుండలినీశక్తి విష్ణుగ్రంథిని అధిగమించి రుద్రగ్రంధి ఉన్నచోట ప్రవేశము పొందుచున్నది.
(తమో గుణాధికృత్వా) రుద్రగ్రంధిని కూడా అధిగమించి భ్రూమధ్య స్థానములో ప్రవేశిస్తోంది. భ్రూమధ్య - ఆకాశమును కూడా ఛేదించి శీతాంశుమండలము (చంద్రమండలము) చేరుచున్నది.
షోడశదళములు (16 దళములు)గల కపాలముచుట్టూ వ్యాపించి ఉన్న ‘అనాహత’ అనబడే చక్రములో ప్రవేశిస్తోంది. అక్కడ చంద్రమండలము నుండి ద్రవిస్తున్న చంద్ర ద్రవమును స్వయముగా శోషింపజేస్తున్నది.
చలితే ప్రాణ వేగేన, రక్తం పిత్తం రవేః గ్రహాత్।
యాత ఇందు చక్రం యత్రాస్తే
శద్ధ శ్లేష్మ స్రవాత్మకమ్।
తత్ర సిక్తం గ్రసతి ఉష్ణం
కథగ్ం శీతస్వభావకమ్।
తథైవ రభసా శుక్లం
చంద్ర రూపగ్ం హి తస్యతే।
ప్రాణవేగముచే చలించుచూ రవి మండలములోని వేడిని గ్రహిస్తూ రక్తమును పిత్తముగా మార్చుచూ ఉంటుంది.
ఎక్కడ చంద్ర చక్రము (ఇందు మండలము) ఉన్నదో, అద్దాని అట్టి శుద్ధ శ్లేష్మముచే సిక్తమైన (నిండిఉన్న) దానిని ఉష్ణ స్వరూపముతో పొడిగా చేయుచున్నది.
అప్పుడు తెల్లటి రంగుతో ఉండే చంద్రమండల (బింబ) రూపము ఎర్రగా మార్పు పొందసాగుచున్నది.
ఊర్ధ్వం ప్రవహతి క్షుబ్ధం
తథైవం భ్రమతేతరామ్।
తస్యాః స్యాత్ అవశాత్ చిత్తం
బహిష్ఠం విషమేషు యత్।
తదేవ, పరమం భుక్త్వా
స్వస్థస్య ఆత్మరతోయువా।
ప్రకృత్యష్టక (ప్రకృతి-అష్టక) రూపన్చ
స్థానం గచ్ఛతి కుండలీ।
ఆ శుక్లవర్ణ చంద్రాకాశము క్షుబ్దమై (క్షోభింపబడినదై) భ్రమతము (సుడివలె తిరగటం) ప్రారంభిస్తోంది. విషమత్త్వముల నుండి బహిర్గతమైన చిత్తము అట్టి సుడులకు చిక్కక బహిర్గతమైనదై ఉంటోంది.
అట్టి నిర్మల రసమును సునిర్మల చిత్తముతో ఆస్వాదించి, ఆ యోగి స్వస్థుడై ఆత్మయందు వాటినన్నిటినీ రమించువాడై ఉంటున్నాడు.
ఈ కుండలిని అష్ట విధ ప్రకృతి (భూమి - ఆపః - అనలః - వాయుః - ఆకాశో - మనో - బుద్ధి - అహంకార రూపి) అయి, తత్-తత్ స్థానము పొందుచున్నది. తనయందు వాటినన్నిటినీ ఏకము చేసివేసుకొనుచున్నది.
క్రోడీకృత్య శివం యాతి
క్రోడీకృత్య విలీయతే।
ఇతి అధ-ఊర్ధ్వ రజః శుక్లగ్ం
శివే తదను మారుతః।।
ప్రాణ అపానౌ సమౌ యాతి
సదా జాతౌ తథైవ చ।।
కుండలినీ శక్తి తనయొక్క అష్టవిధ ప్రకృతిని క్రోడీకరించుకొని శివస్తానమును చేరుచున్నది. తనకు తాను క్రోడీకరించుకొని శివస్థానమునందు విలీనమగుచున్నది. అనగా, తానే జీవస్వరూపమును అధిగమించివేసి శివస్వరూపమును సంతరించుకుంటోంది. ఇంకాకూడా, క్రిందికి - పైకి రజస్సు కారణంగా శుక్లమైయున్న ప్రాణశక్తి (గాలి) శివస్థానం నందు చేరుచున్నది. ప్రాణ - అపానములు సమత్వము పొంది కుండలినిని అనుసరించినవై ఉంటున్నాయి. కుండలినీతోబాటే ‘‘విశ్వప్రాణత్వము’’ను సంతరించుకుంటున్నాయి.
భూతే అల్పే చ, అపి అనల్పే వా
వాచకే త్వతి వర్ధతే।
ధావయతి అఖిలా వాతా
అగ్ని మూషా హిరణ్యవత్।
ఆధి భౌతిక దేహస్తు
ఆధి దైవిక విగ్రహే।
దేహో అతి విమలం యాతి చ
ఆతివాహికతామి యాత్।।
అట్టి వారి వాచకము అల్పము అయినా, అనల్పము అయినా కూడా (కొంచము అయినా మిక్కిలి అయినా కూడా) భౌతికరూపంగా వర్థిల్లసాగుతుంది. వాక్శుద్ధి వారికి కలుగుతుంది.
‘అగ్నిమూష’లో బంగారు లోహము విషయములో జరుగువిధంగా వాయువు అంతటా బయల్వెడలుచున్నది.
ఆధి భౌతిక దేహము (The sense Partaining to physical body) - కాస్తా ఆధి దైవిక విగ్రహము’నందు కరిగిపోవుచున్నది. ఆధిభౌతిక దేహము అత్యంత నిర్మలమై,….అతివాహికత్వమును సంతరించు కొనుచున్నది.
09. జాడ్య భావ వినిర్ముక్తమ్
అమలం చిన్మయాత్మకమ్।
తస్య ‘ఆతివాహికం’ ముఖ్యగ్ం
సర్వేషాం తు మదాత్మకమ్।
జాయా భవ వినిర్ముక్తిః
కాలరూపస్య విభ్రమః।
ఇతి తగ్ం స్వస్వరూపా హి
మతీ రజ్జు - భుజంగవత్।
మృషైవ ఉదేతి సకలం, మృషైవ ప్రవిలీయతే।
రౌప్య బుద్ధిః శుక్తకాయాగ్ం
స్త్రీ పుగ్ంసోః భ్రమతో యథా।
జాడ్యభావన మొదలంట్లా తొలగిపోయినట్టిది, మల (దోష) రహితమైనట్టిది, కేవల ఎరుక - చిన్మయాత్మకమైనది - అగు ఆతివాహికదేహమే సర్వజీవులకు ముఖ్యదేహము. అంతేగాని ఆది భౌతిక దేహము ముఖ్యదేహము కాదు.
‘‘జీవుల పరస్పర జాయా (భార్య) ఇత్యాది భవరోగము, తొలగాలి కదా?’’ -అను సంసార భావనాక్రమమంతా కాల స్వరూప మార్పు చేర్పుల విభ్రమము. ఇటువంటివన్నీ కూడా రజ్జువుపై సర్పము ఆపాదించబడిన తీరుగా - స్వస్వరూపాత్మపై ఆపాదించబడుచున్న అల్ప భావపరంపరలు.
ఈ దృశ్య జగత్ వ్యవహారమంతా మృషము (అహ్రాంతి) వలననే - పుట్టటము - లయించటము జరుగుచున్నది. ముత్యపుచిప్పలో ‘వెండి ఉన్నది’ అను భ్రమవంటిదే స్త్రీ-పురుష భేదముతో కూడిన ఈ జగత్ భ్రమ. అజ్ఞాన దృష్టిచే ఉన్నది. విజ్ఞాన దృష్టిచే లేనిది అగుచున్నాయి.
పిణ్డ బ్రహ్మాండయోః ఐక్యం
లిఙ్గత్ సూత్రాత్ మనోః అపి,
స్వాభావ వ్యాకృతయోః (ఆకృతయోః) ఐక్యగ్ం
స్వప్రకాశ చిదాత్మనోః।

పిండాండము - బ్రహ్మాండము-లింగ శరీరము - సూత్రాత్మ….ఇటువంటి సర్వభేదములు కూడా స్వభావము - వ్యాకృతము - అనుభేదశబ్దముల వంటివే.
యోగాభ్యాసి పట్ల - ఇవన్నీ కూడా ‘స్వప్రకాశ చిదాత్మ’తో ఐక్యము పొందుచున్నాయి. అవన్నీ ‘అనన్యము’ను సంతరించుకుంటున్నాయి.

శక్తిః కుండలినీ నామ, బిసతంతు నిభా శుభా।
మూలకందం ఫణాగ్రేణ
దష్ట్వా కమల కందవత్।
ముఖేన పుచ్ఛగ్ం సంగృహ్య
బ్రహ్మరంధ్ర సమన్వితా
ఒక తామరతూడులో తంతువు (సన్నటి దారము) ఉన్న రీతిగా ఈ దేహములో కుండలినీశక్తి ప్రదర్శితమై ఉన్నది. శుభప్రదమైనది.
ఒక కమలము తనయందు కందమును ధరించినదై ఉన్న తీరుగా కుండలినీశక్తి పడగవలె మూలాధారములో ఉన్నది. ముఖము మూలాధారంలోను, తోక బ్రహ్మరంధ్రముతోను కూడినదై ఉన్నది.
పద్మాసనగతః స్వస్థో
గుదమ్ ఆకుంచ్య సాధకః,
వాయుమ్ ఊర్ధ్వగతం కుర్వన్
కుంభక ఆవిష్ట మానసః।

యోగాభ్యాసి (యోగసాధకుడు) పద్మాసనమును వైచుకొని, మనస్సును స్వస్థతగా ఉంచి, గుదస్థానమును (మూలాధారస్థానమును) కుంచింపజేసి, ప్రాణవాయువును ఊర్ధ్వగతం చేస్తూ కుంభకయోగాభ్యాసము చేస్తున్న మనస్సు కలవాడై సాధన చేయును గాక.

వాయుః ఆఘాతవశాత్ అగ్నిః
స్వాథిష్ఠానగతో జ్వలన్
జ్వలన ఆఘాత పవనా
ఆఘాతో రున్నిద్రితో -హిరాట్।
బ్రహ్మగ్రంథిం తతో భిత్వా, (భి సత్త్యతః)
విష్ణుగ్రంథిం భినత్తి అతః,
రుద్రగ్రంథిం చ భిత్వైవ -
కమలాని భినత్తి షట్।
సహస్ర కమలే శక్తిః
శివేన సహమోదతే।
సైవ అవస్థా పరా జ్ఞేయా
సైవ నిర్వృతికారణి। ఇతి।।
యోగాభ్యాసియొక్క స్వకీయయానము: వాయువు యొక్క ఆఘాతము (వేగము, సంఘాతము)చే స్వాధిష్టానములోగల జ్వలిస్తున్న అగ్నిస్థానమును కుండలినీ యోగాభ్యాసి చేరుచున్నాడు.
ఆ సాధకుడు క్రమక్రమంగా (1) అగ్ని ఆఘాతము (2) వాయు- ఆఘాతము - ఈ రెండిటిచే సర్పరాజు (కుండలినీశక్తి)ని మేలు కొలుపుచున్నాడు.
మరికొంత క్రమంగా కుండలినీశక్తిని అనుసరిస్తూ ‘బ్రహ్మగ్రంథి’ని సమీపించి, సముత్సాహపూర్వకమైన కుండలినీశక్తితో ఆ బ్రహ్మగ్రంథిని ఛేదించుచున్నాడు. ఆతరువాత విష్ణుగ్రంథిని, క్రమంగా రుద్రగ్రంథిని ఛేదించి వేయుచున్నాడు. అటు తరువాత షట్కమలమును కూడా భేదనము చేయుచున్నాడు.
అప్పుడిక ఆ యోగాభ్యాసి సహస్రకమల శక్తిమంతుడై (సహస్ర శీర్‌షా పురుషః, సహస్రాక్షః సహస్రపాద్, సభూమిమ్ విశ్వతో వృత్త్వా) - శివభగవానునితో కూడి ఆనందించుచున్నాడు. సమస్తమునందు తానై, తనయందే సమస్తమై సమస్తము తానే అయి వెలుగొందుచున్నాడు.
- అట్టి స్థితి పరాజ్ఞేయమైనది. నిర్వృతి (సర్వము జయించినట్టి) స్థితి.

ద్వితీయో (2వ) అధ్యాయః - ఖేచరీ విద్య



01. అథ అహం సంప్రవక్ష్యామి
విద్యాం ఖేచరి సంజ్ఞికామ్।
యథా విజ్ఞాతవాన్ అస్య,
లోకే-స్మిన్ న జరా మరః,
మృత్యు వ్యాధి జరా గ్రస్తో
దృష్ట్వా విద్యామ్ ఇమాం, మునే!
ఖేచరీ విద్య - ఆత్మాకాశ విహారము
ఓ గౌతమా! ఇప్పుడు నేను ‘ఖేచరీవిద్య’ అనే సంజ్ఞచే చెప్పబడుచున్న దానిని వివరిస్తున్నాను. శ్రద్ధగా వినిదెరుగాక!

ఈ ఖేచరీ విద్యను ఎరిగినప్పుడు అట్టివాడు అజరామరుడు (వార్ధక్యము - మృత్యువులచే పరిమితత్వము పొందనివాడు) అగుచున్నాడు. మృత్యువును సమీపించునప్పుడు, వ్యాధిగ్రస్తుడైనప్పుడు, వార్ధక్యము వచ్చినప్పుడు కూడా వాటి బాధలనుండి అతీతత్వ స్వరూపమైన విముక్తికి ఈ ఖేచరీ దృష్టి ఉపశమనమై ఉన్నది.

బుద్ధిం దృఢతరం కృత్వా
ఖేచరీం తు సమభ్యసేత్।
జరామృత్యుగదఘ్నోఽయం
ఖేచరీం వేత్తి భూతలే!
గ్రంథతశ్చ అర్థతశ్చైవ
తత్ - అభ్యాస ప్రయోగతః
తం, మునే! సర్వభావేన
గురుం మత్వా సమాశ్రయేత్।
సర్వ స్థితిగతులందు బుద్ధిని దృఢతరం చేసుకొని ఖేచరీ విద్యను అభ్యసించాలి.
భూతలమునందు జరా మృత్యువు దోషములను తొలగించివేయునదిగా ‘ఖేచరీ విద్య’ను యోగవేత్తలు వర్ణిస్తున్నారు.

ఇట్టి ఖేచరీ విద్యను ప్రయోగముగా అభ్యాసించునప్పుడు (1) గ్రంథము (Theory) (2) తాత్త్వికార్థము(Practice) గ్రహించి, అప్పుడు అభ్యాసము(Practising)నకు సిద్ధపడాలి.

అంతేకాదు. ఓ మునీ! అర్థము చేసికొని సాధనకు ఉపక్రమించటానికై సర్వభావములతో గురువును శ్రద్ధా భక్తులతో సమాశ్రయించాలి.
దుర్లభా ఖేచరీ విద్యా। తత్ అభ్యాసోఽపి దుర్లభః।
అభ్యాసం మేళనం చ ఏవ
యుగపత్ న ఏవ సిద్ధ్యతి।
అభ్యాసమాత్ర నిరతా
న విందంతేహ (విందంతి ఇహ) మేళనమ్।
అభ్యాసం లభతే, బ్రహ్మన్।
జన్మ జన్మాంతరే క్వచిత్।
ఖేచరీ విద్య ఎరుగుట దుర్లభమైనదని, అద్దాని అభ్యాసము ఇంకా దుర్లభమని చెప్పబడుతోంది.
(1) అభ్యాసము (2) అవగాహన (Practice and understanding) మేళము(Application)…..ల చేత మాత్రమే అది సిద్ధించగలదు.
కేవలము అభ్యాసంచేస్తూ (అభ్యాసనిరతుడై ఉంటూ) అద్దానిని అవగాహనతో మేళవించుకోకపోతే (Its tallying in live situations) ఖేచరీ విద్య సిద్ధించినది అవదు. జన్మ - జన్మాంతరముల (అనేక జన్మల) అభ్యాసము, అధ్యయనపూర్వకమైన అవగాహనల చేతనే అది సిద్ధిస్తోంది.
మేళనం జన్మనాం తత్తు
శతాంతే అపి న లభ్యతే।
అభ్యాసం బహుజన్మాంతే
కృత్వా తత్ భావ సాధితమ్।
మేళనం లభతే కశ్చిత్
యోగీ జన్మాంతరే క్వచిత్।
యదా తు మేళనం యోగీ
లభతే గురు వక్త్రతః।
తదా తత్ సిద్ధిం ఆప్నోతి
యత్ ఉక్తా శాస్త్ర సంతతౌ।।

కేవలము మేళనము (Merely learning as subject and understanding) చేస్తూ ఉంటూ, యోగాభ్యాసము లేకపోతేకూడా వంద జన్మలెత్తినా - అది లభించేది కాదు.
ఓ మునీశ్వరా! అనేక జన్మల అభ్యాస-మేళనములచే ఏతత్ ‘‘ఖేచరీ భావనాస్థితి’’ ఈ జీవునిచే సిద్ధిస్తోంది.
అభ్యాస, - మేళనముల చేత జన్మ - జన్మాంతరములలో అది సిద్ధిస్తోంది. (అనేక జన్మ సంసిద్ధిం తతో యాతి పరాం గతిం).
ఎప్పుడైతే యోగి గురుముఖతః మేళనము (Its Interpretative understanding) పొందునో, అప్పుడు శాస్త్రములచే నిర్వచించి వివరించ బడుచున్న ఖేచరీ యోగసిద్ధి తప్పక పొందుచున్నాడయ్యా! అదియే ‘ఆత్మాఽహమ్’ స్థితి కూడా.

02. గ్రంధతశ్చ అర్థతశ్చైవ, మేళనం లభతే యదా,
తదా శివత్వమ్ ఆప్నోతి, నిర్ముక్తః సర్వ సంసృతేః।
శాస్త్రం వినాపి సంబోద్ధుం
గురవో అపి న శక్నుయుః।
తస్మాత్ సు దుర్లభతరం
లభ్యం శాస్త్రం - ఇదం, మునే!
యావత్ న లభ్యతే శాస్త్రం,
తావత్ గామ్ పర్యటేత్ యతిః।
యదా సం-లభ్యతే శాస్త్రం
తదా సిద్ధిః కరే స్థితా।
న శాస్త్రేణ వినా సిద్ధిః, దృష్టాచైవ జగత్ త్రయే।
ఎప్పుడైతే గ్రంథములలో (శాస్త్రములలో) చెప్పిన పరమార్థనమును మేళనము (Its Practical Application here and now) లభిస్తుందో, ఇకప్పుడు సర్వ సంసృతులనుండి (సంసారబంధములనుండి) విముక్తుడై సదాశివత్వమును ఆ యోగి పొందుచున్నాడు.
శాస్త్రములు చదివినంత మాత్రముచేత సరిపోదు. గురువు చెప్పితేనే అది అనుభవమౌతుంది. నిజమే! అయితే, గురువు కూడా శాస్త్రముల సహాయం లేకుండా (Without making references to sastram) అది చెప్పలేడు. అందుచేత, ఓ మునీంద్రా, ఈ ఖేచరీ శాస్త్రము అతి దుర్లభమైనది.
శాస్త్రము లభించే వరకు యతి పర్యటన (Constant search for it) చేస్తూనే ఉండాలి. శాస్త్రము లభించిందా….ఇక సిద్ధి చేతికి లభించినట్లే.
‘శాస్త్రము’ను ఆశ్రయించకుండా ఈ మూడు లోకములు వెతికినా కూడా సిద్ధి లభించదు.
తస్మాత్ మేళన దాతారగ్ం, శాస్త్రదాతారమ్ అచ్యుతమ్,
తత్-అభ్యాస ప్రదారతారగ్ం, ‘శివం’ మత్వా సమాశ్రయేత్।
లబ్ధ్వా శాస్త్రం ఇదం మహ్యమ్
అన్యేషాం న ప్రకాశయేత్।
తస్మాత్ సర్వ ప్రయత్నేన, గోపనీయం విజానతా।
అందుచేత, మేళము (Practical Application) ప్రసాదించినవారిని, శాస్త్రము ప్రసాదించినవారిని అచ్యుతుడగు విష్ణుభగవానునితో సమానముగాను, అభ్యాసప్రదాతను సాక్షాత్ పరమశివునిగాను భావించి సమాశ్రయించాలి.
మనం చెప్పుకుంటున్న ఈ ‘ఖేచరీవిద్య’ను పొందిన తరువాత ఇద్దానిని ఎవ్వరిబడితే వారికి (అర్హత చూడకుండా) బోధించరాదు. ఈ ఖేచరీ విద్య అత్యంత-రహస్యమైనదిగా (గుహ్యతమమ్)గా ప్రయత్నపూర్వకంగా భావించాలి. శ్రద్ధ, పట్టుదల, గురువుపై గురి, భక్తి మొదలైనవి పరిశీలించి మాత్రమే బోధించాలి.
యత్ర అస్తే చ గురుః బ్రహ్మన్
దివ్యయోగ ప్రదాయకః, తత్ర గత్వా చ తేన ఉక్తం
విద్యాం సంగృహ్య ‘ఖేచరీమ్’
తేనోక్తః ‘సమ్యక్’ అభ్యాసం, కుర్యాత్ ఆదావతంద్రితః।।
అనయా విద్యయా యోగీ, ‘ఖేచరీ సిద్ధిభాక్’ భవేత్।
‘‘ఖేచర్యా ఖేచరీ యుంజన్
ఖేచరీ బీజపూరయా।
ఖేచరాధిపతిః భూత్వా
ఖేచరేషు సదా వసేత్।’’
బ్రహ్మన్! ఎక్కడ ఖేచరీ దివ్యయోగవిద్య ప్రసాదించగల గురువు ఉంటారో, అక్కడికి వెళ్ళి ఈ విద్యను గురువును ఆశ్రయించి పొందాలి.
గురువు చెప్పురీతిగా ఓర్పుతో నేర్చుకోవాలేగానీ, తొందరబడి, త్వరత్వరగా నేర్చుకోవాలనే ఆవేశంతోకాదు. క్రమంగా, ఖేచరీ విద్యచే ఖేచరీ సిద్ధిభాక్ అగుచున్నాడు.
ఖే = ఆకాశము = ఆత్మాకాశము
ఖేచర్యముతో ఖేచరీ యోగాభ్యాసముచే ఖేచరీ బీజపూరకము చేయుచు, ఖేచరీ ఆధిపత్యత్వము ధారణ చేసి ఖేచరమునందు వసించాలి.
(ఆత్మచే ఆత్మయోగాభ్యాసి అయి ఆత్మ భీజముతో సర్వము పూరించుచూ, ఆత్మాధిపత్యత్వమును ధారణచేస్తూ ఆత్మగా ఆత్మయందు వసించాలి).
ఖేచర అవసథం వహ్నిమ్
అంబుమండల భూషితమ్।
ఆఖ్యాత ఖేచరీ బీజం, తేన యోగః ప్రసిద్ధ్యతి।
జలమండల భూషితమై, ఖేచర అవసథమైన యోగాగ్ని-జ్ఞానాగ్నిలచే ఏర్పడు ఎరుకయే ఖేచరీ బీజము. అట్టి ప్రయత్నముచే యోగము సిద్ధించుచున్నది. ఖేచరీ విద్యచే పునర్జన్మ పరంపరాప్రదమగు సంసార బీజము పునః చిగురించదు.
సోమాగ్ంశ నవకం వర్ణం
ప్రతిలోమేన చ ఉద్ధరేత్।
తస్మాత్ త్ర్యగ్ంశకమ్ అఖ్యాతమ్
అక్షరం చంద్ర రూపకమ్।
తస్మాత్ అపి అష్టమం వర్ణం
విలోమేన పరం, మునే
తదా తత్ పరమం విద్ధి, తదాదిః అపి పంచమీ।
ఇందోశ్చ బహుభిన్నం చ
‘కూటో’ అయం పరికీర్తితః।।
ప్రతిలోమము (Indirect way of Approach)చే సోమాంశయొక్క నవకమైన వర్ణమును ఉద్ధరించాలి.
దానినుండి (జీవుడు - ఈశ్వరుడు - పరమాత్మ అనబడు) త్ర్యగ్ంశకము యొక్క యోగము, చంద్రరూపకమగు అక్షరములను ఎరగాలి.
అంతేకాకుండా మునీశ్వరా! అద్దానికి విలోమముగా (Directly) పరమై → ‘8’వ వర్ణము. అట్టి పరమైనది తెలుసుకోవాలి. అద్దానినుండి ‘5’ వది (తురీయాతీతము) కూడా పరమము అయి ఉన్నది.
చంద్రునికి సంబంధించిన అట్టి బహుభిన్నమే ‘కూటము’ అని కూడా పరికీర్తించబడుచున్నది. ఈ జీవుడు కూటస్థుడే.
03. గురూపదేశ లభ్యం చ, సర్వయోగ ప్రసిద్ధిదమ్।
యత్ తస్య దేహజా మాయా, నిరుద్ధ కరణాశ్రయా।
స్వప్నేఽపి న లభేత్ తస్య, నిత్యం ద్వాదశ జప్యతః।
య ఇమాం పంచ లక్షాణి, జపేత్ అపి సుయంత్రితః,
తస్య శ్రీ ఖేచరీ సిద్ధిః
స్వయమేవ ప్రవర్తతే।
నశ్యంతి సర్వ విఘ్నాని।
ప్రసీదంతి చ దేవతాః।
గురూపదేశముచే లభించు ఆత్మతత్త్వయోగము సర్వయోగములలో ప్రసిద్ధమైనది.
ఇంద్రియములతో కూడిన దేహముతోగల సంబంధరూపమైయున్న మాయ దురత్యయము (దాటుటకు కష్టమైనది). గురు ఆశ్రయము లేకుండా, ‘‘మాయ తొలగదు. ఆత్మాకాశ విహారము’’ అను ఖేచరీ సిద్ధికై నిత్యము ద్వాదశము (12) జపించాలి. ఎవ్వడు ఖేచరీ ధారణచే మంత్రమును సువ్రతుడై 5 లక్షలసార్లు జపిస్తాడో (అభ్యసిస్తాడో), అట్టి వాని పట్ల ఖేచరీ సిద్ధి స్వయముగా ప్రవర్తితమగుచున్నది.
అప్పుడు సర్వవిఘ్నములు స్వయముగా శమించుచున్నాయి. దేవతలు అట్టి యోగి పట్ల సంతోషము ప్రకటించువారై ఉంటున్నారు.
వలీ పలిత నాశశ్చ భవిష్యతి। న సగ్ంశయః।
ఏవం లబ్ధ్వా మహావిద్యామ్, అభ్యాసం కారయేత్ తతః।
అన్యథా క్లిశ్యతే, బ్రహ్మన్। న సిద్ధిః ఖేచరీ పథే।
యత్ అభ్యాసవిధౌ విద్యాం
న లభేత్ యతః సుధామయీమ్।।
తతః సంమేళక అదౌ చ
లబ్ధ్వా విద్యాగ్ం సదా జపేత్।
న అన్యథా రహితో, బ్రహ్మన్!
న కించిత్ సిద్ధిభాగ్ భవేత్।
యత్ ఇదం లభ్యతే శాస్త్రం
తదా విద్యాగ్ం సమాశ్రయేత్।
తతః తతో ఉదితాగ్ం
సిద్ధిమ్ ఆశుతాం, లభతే మునిః।
ఖేచరీ యోగాభ్యాసమువలన వార్ధక్య లక్షణములైనటువంటి శరీరము ముడుతలు పడటము, తలనెరియటము మొదలైనవి జయించబడగలవు. సంశయం లేదు. ఈ విధంగా ఖేచరీ మహావిద్యను అభ్యసించి, అద్దానిని అవగాహనతో కూడి నిర్వర్తించాలి. ఖేచరీ పదము కాకుండా తదితర మార్గములలో సిద్ధి, మోక్షము ప్రాప్తించటము కష్టతరము.

బుద్ధిచే ఖేచరీముద్ర
తదితర అభ్యాసపూర్వకమైన విధి - విధానములలో ఆత్మవిద్య అనునిత్య-స్వానుభవమై లభించునప్పుడు ఆ బుద్ధిమంతుడు, ‘ఆత్మచే జగత్తును ఆత్మగా దర్శించి ఆత్మగా స్వభావసిద్ధము చేసుకోవటము’ అనే సమ్మేళకముతో జపించాలి. ఖేచరీ = ఆత్మగా అనుకోవటము + అనిపించటము.
హే బ్రహ్మన్ తదితర విద్యలచే కొంచము ఆత్మబుద్ధిని పెంపొందించుకొని, అప్పుడిక ‘ఆత్మచే ఆత్మగా ఆత్మతో ఆత్మదర్శనం’ అనే ఖేచరీ విద్యను సమాశ్రయించాలి. అట్టి ఖేచరీ విద్యచే త్వరితంగా సిద్ధిపొందగలవయ్యా, మునీ! సందేహంలేదు.
తాలు మూలగ్ం సముత్కృష్య
సప్తవాసరమాత్రవిత్।
స్వగురు ఉక్తప్రకారేణ
మలం సర్వం విశోధయేత్।।
యోగశాస్త్రీయమైన ఖేచరీ యోగాభ్యాస విధానము గురించి ఇక విచారిద్దాము.
తాలు (దవడ) మూల ప్రదేశములో కొండనాలుక వరకు బుద్ధిని చిత్తమును 7 రోజులు గురువు బోధించువిధంగా నిలిపి (ఏకాగ్రంచేసి) మనో- బుద్ధులలో గల దోషములను వెతికివెతికి శోధించాలి.
స్నుహిపత్రనిభం శస్త్రం, సుతీక్షణాం స్నిగ్ధనిర్మలమ్,
సమాదాయ తతః తేన, రోమమాత్రం సముచ్ఛినేత్।
హిత్వా సైంధవ పథ్యాభ్యాం, చూర్ణితాభ్యాం ప్రకర్షయేత్।
పునః సప్తదినే ప్రాప్తే, రోమమాత్రం సముచ్ఛినేత్।
బొమ్మజముడాకువలె అతి పదునైన నునుపైన, చిక్కనైన శస్త్రమును తీసుకోవాలి. అద్దానియొక్క సహాయంతో (నాలుకపై పాచి) రోమములను తొలగించివేయాలి. తాలుమూలమును సైంధవ లవణముచే, చూర్ణించిన పథ్యములతో ప్రకర్షణమును కలిగించాలి. మరల 7 రోజులు అయిన తరువాత రోమమాత్రములను తొలగించాలి.
04. ఏవం క్రమేణ షాణ్మాసం
నిత్య ఉద్యుక్తః సమాచరేత్।
షణ్మాసాత్ రసనామూలం, సిరాబంధం ప్రణశ్యతి।
అథ వాగీశ్వరీ ధామ, శిరో వస్త్రేణ వేష్టయేత్।
శనైః ఉత్కర్షయేత్ యోగీ, కాలవేళా విధాన విత్।
పునః షణ్మాసమాత్రేణ, నిత్యగ్ం సంఘర్షణాత్,మునే।
భ్రూమధ్యా అవధి చ ఆప్యేతి, తిర్యక్ కర్ణబిలావధి।
అధశ్చ చుబుకం మూలం, ప్రయాతి క్రమచారితా।।
ఈ విధంగా 6 నెలల కాలము నిత్యము ఉద్యుక్తుడై ఆచరించాలి.
6 నెలలకు రసన - మూలమున సిరాబంధము తొలగగలదు.
అప్పుడు-‘వాగీస్వరీ (సరస్వతి) ధామము’గా చెప్పబడు శిరస్సును వస్త్రముతో చుట్టవలె భావనచేస్తూ నాలుకను లోపలి వైపుగా మడచటం అభ్యసించాలి. ‘కాలవేళావిధానము’ను ఎరిగినవాడై క్రమంగా ఉత్కర్షచేయాలి.
ఓ మునీ! ‘6’ నెలల కాలము నిత్యసంఘర్షణచే క్రిందగల కర్ణ (చెవి) బిలమును (మనస్సుతో) ఆక్రమించిన యోగధ్యాసముచే- ధ్యాస నిశ్చలమై భ్రూమధ్య స్థానము చేరుచున్నది.
క్రమంగా చుబుకము (గడ్డము) మూలము వరకు యోగబలముతో కూడిన ధ్యాసచే ఆక్రమించబడుచున్నది.
పునః సంవత్సరాణాం తు, తృతీయా దేవలీలయా।
కేశాంతమ్ ఊర్ధ్వం క్రమతి, తిర్యక్ శాఖావధిః, మునే!
అధస్తాత్ కంఠ కూపాంతం, పునః వర్షత్రయేణ తు,
బ్రహ్మరంధ్రం సమావృత్య, తిష్ఠే దేవ, న సంశయః।
‘దేవలీలయా!’…అనువిధంగా 3 సంవత్సరముల అభ్యాసముచే పైకి కేశముల అంతము వరకు (యోగసమన్వితమైన ధ్యాస) క్రమముగా వెళ్ళుచున్నది. క్రిందవైపుగా కంఠబిలాంతము వరకు - 3 సంవత్సరముల అభ్యాసముచే - యోగధారణశక్తి విస్తరించినదై, ఆక్రమించుకొనుచున్నది.
ఆ తరువాత ఆ యోగి బ్రహ్మరంధ్రమును ఆక్రమించి, దేవతలతో ఆసీనుడగుచున్నాడు. సంశయము లేదు.
తిర్యక్ చూళితలం యాతి, అధః కంఠబిలావధిః,
శనైః శనైః మస్తకాచ్చ, మహావజ్ర కవాటభిత్।
పూర్వం బీజయుతా విద్యా హి, ఆఖ్యాతా యాతి దుర్లభా।
తస్యాః షడంగం కుర్వీత, తయా షట్ స్వరభిన్నయా।
కుర్యాత్ ఏవం కరన్యాసగ్ం, సర్వసిద్ధ్యాదిం హేతవే,
శనైః ఏవం ప్రకర్తవ్యం, అభ్యాసం యుగపత్ నహి।।
క్రింద కంఠబిలము వరకు, ప్రక్కలందు చూళి తలము వరకు వ్యాపించుచున్నాడు. నెమ్మది నెమ్మదిగా మస్తకములోని మహావజ్ర కవాటము (తలచుట్టూ కిరీటము ధరించి చుట్టు స్థానము) ఛేదింపబడుచున్నది.
బీజయుతమైన ఖేచరీ విద్య వివరించి చెప్పటం దుర్లభమైనది.
అద్దానిని షట్ (6) సర్వభిన్నములతో (వేరువేరైన స్వరములతో) షడంగములుగా (6 అంగములుగా, విభాగములుగా) చేయాలి.
సర్వసిద్ధులు ప్రసాదించు ఖేచరీ విద్యను (6) కరన్యాసములుగా కూడా చేయాలి. గురుముఖతః అభ్యాసము ప్రారంభించాలి. నెమ్మది నెమ్మదిగా అభ్యాసము చేయుటము ముఖ్య కర్తవ్యం. అంతేగాని మొత్తం (6) విభాగములను ఒకేసారి కాదు.
05. యుగపత్ వర్తతే యస్య, శరీరం విలయం వ్రజేత్
తస్మాత్ శనైః శనైః కార్యం అభ్యాసం, మునిపుంగవ
యదా చ బాహ్య మార్గేణ
జిహ్వా బ్రహ్మబిలం వ్రజేత్,
తదా ‘బ్రహ్మార్గళం’ బ్రహ్మన్!
దుర్భేద్యం త్రిదశైదపి।।
అంగుల్య - అగ్రేణ సంఘృష్య
జిహ్వామాత్రం నివేశయేత్।
ఏవం వర్షత్రయం కృత్వా, బ్రహ్మద్వారం ప్రవిశ్యతి।।
ఓ ముని పుంగవా! ఒక్కసారిగా 6 విభాగములు చేయనారంభిస్తే శరీరము విలయము పొందవచ్చుకూడా! అందుచేత నెమ్మది నెమ్మదిగా నిర్వర్తిస్తూ అభ్యాసం కొనసాగించాలి. (గురుముఖతః అభ్యాసం చేయాలి).
హే బ్రహ్మన్! ఎప్పుడైతే బాహ్యమార్గంగా జిహ్వ (నాలుక) బ్రహ్మబిలము (కొండనాలుక యొక్క చిట్టచివరను) చేరుతుందో అప్పుడిక ఆతని బ్రహ్మార్గళము త్రిదశులగు దేవతలకు కూడా దుర్భేద్యమవగలదు.
తాలుమూలాభ్యాసం చేస్తున్నప్పుడు నాలుక చివరను, చేతి వ్రేళ్ళ ఉపరి భాగంతో కొంచము కొంచము లోనికి నొక్కుతూ ఉండాలి. ఈ విధంగా ‘3’ సంవత్సరములు అభ్యసిస్తూ ఉంటే నాలుక అంగటిలోని బ్రహ్మ ద్వారము వైపు (కొండనాలుక చివర రంధ్రము వైపు) ప్రవేశించు సామర్థ్యము పొందగలదు.
బ్రహ్మద్వారే ప్రవిష్టే తు, సమ్యక్ మథనమ్ ఆచరేత్।
మథనేన వినా కేచిత్, సాధయంతి విపశ్చితః।
ఖేచరీ మంత్ర సిద్ధస్య, సిద్ధ్యతే మథనం వినా।
జపన్చ మథనం చ ఏవ, కృత్వా శీఘ్రం ఫలం లభేత్।
నాలుక చివర బ్రహ్మద్వారమును ప్రవేశించటం ప్రారంభమవగానే, ఇక ‘మథనము’ (Round shaped movement) ప్రారంభం కావాలి.
కొందరు మథనము లేకుండానే మననరూపమగు మంత్రమును కొనసాగిస్తూ ఉంటారు. వారు బుద్ధి బలంతో ఖేచరీ పరాకాష్ఠ స్థితిని సిద్ధింపజేసుకొనుచున్నారు.
ఖేచరీ మంత్ర సిద్ధి → మథనము లేకుండా కూడా → సిద్ధించగలదు.
ఈవిధంగా ఖేచరీ విద్యా పూర్వకంగా యోగాభ్యాసము అగు జపము + మథనము ఒక్కసారే నిర్వర్తిస్తూ ఉండగా ఖేచరీ ముద్రసిద్ధి త్వరగా లభించగలదు.
స్వర్ణజాం రౌప్యజాంవాపి, లోహజాం వా శలాకినామ్
నియోజ్య నాశికా రంధ్రం, దుగ్ధ సిక్తేన తంతునా।
ప్రాణాః నిరుధ్య హృదయే, సుఖమాసనమ్ ఆత్మనః,
శనైః స మథనం కుర్యాత్, భ్రూ మధ్యే న్యస్త చక్షుపీ।
షాణ్మాసం మథన అవస్థా, భావేనైవ ప్రజాయతే।
యథా సుషుప్తిః బాలానాం
యథా భావః తథా భావేత్।
న సదా మథనగ్ం శస్తం
మాసే మాసే సమాచరేత్।।
ఖేచరీయోగ సంబంధిత బ్రహ్మాండ మహామార్గము - బంగారం (లేక) వెండి (లేక) ఇనుప శలాకము (సన్నటి తీగ)ను పాలతో తడిపి ధారగా ముక్కు రంధ్రములో ప్రవేశపెట్టుచూ,
- ప్రాణమును హృదయస్థానము నందు నిరోధించి (నిలిపి),
- దేహమునకు సుఖమైన ఆసనమును ధారణ చేసి,
- భ్రూమధ్యగా దృష్టిని నిలిపి ఉంచి,
- నెమ్మదిగా మథనము (చిలకరించటము) చేయుచుండటము. ఇది ‘ఖేచరీ యోగ బ్రహ్మాండ మహామార్గము’.
- ‘6’ నెలలు మథనావస్థను అభ్యసించుటచే (ఆత్మ) భావన సిద్ధించగలదు.
- చిన్నపిల్లవాడు కునికిపాట్లు పడురీతిగా అట్టి భావన రూపము కలిగి ఉంటుంది.
- అట్టి మథనము అన్నివేళలా చేయతగదు. కొన్నికొన్నిసార్లుగా అప్పుడప్పుడు సమాచరిస్తూ (నిర్వర్తిస్తూ) ఉండాలి. (గురుముఖతః మాత్రమే అభ్యసించాలి). నెలకొకసారి చేయుచుండవచ్చు.
సదా రసనయా యోగీ
మార్గం న పరిసంక్రమేత్।
ఏవం ద్వాదశ వర్షాంతే
సగ్ంసిద్ధిః భవతి ధ్రువా।
శరీరే సకలం విశ్వం
పశ్యతి ఆత్మా విభేదతః।
బ్రహ్మాండో-యం మహామార్గో
‘రాజదంత, ఊర్ధ్వకుండలీ ఇతి।।
యోగి అట్టి యోగాభ్యాసంలో జిహ్వ (నాలుకతో) మార్గమును ఆక్రమించరాదు. సమార్గమును నిరోధించకుండానే బ్రహ్మరంధ్ర స్పర్శని (నాలుక చివరలో స్పృశించు ‘ఖేచరి’ని) అభ్యసించాలి.
ఈ విధమైన అభ్యాసము కొనసాగుచుండగా 12 సంవత్సరాల కాలంలో ధృవమగు సంసిద్ధి లభించగలదు. స్వయంగా విశ్వరూపుడై, విశ్వమంతటికీ ఆత్మ అయి - విరాజిల్లుచున్నాడు. సమస్త విశ్వమును ఆత్మకు అద్వితీయంగా స్వశరీరమునందే సందర్శించుచున్నాడు.
ఇది ‘బ్రహ్మాండ మహామార్గము’ అని, ‘రాజదంతా - ఊర్ధ్వకుండలి’ అని పిలువబడుచున్నది.

తృతీయ అధ్యాయః - - బ్రహ్మదేవ-పరమశివ సంవాదము

01. మేళనమనుః ‘హ్రీం భం సం షం ఫం సం క్షమ్’’।
పద్మజ ఉవాచ :-
అమావాస్యాచ ప్రతిపత్, పౌర్ణమాసీ చ, శంకర।
అస్యాః కా వర్ణ్యతే సంజ్ఞా? ఏతత్ ఆఖ్యాహి తత్త్వతః।
శంకర భగవానుడు:
ప్రతిపత్ దినతో కాలే
అమావాస్యా తథైవ చ
పౌర్ణమాస్యాగ్ం స్థిరీకుర్యాత్
స చ పంథాహి, న అన్యథా।।
సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు ఖేచరీ విద్య సంబంధమైన మేళనమును ‘హ్రీం భం సం షం ఫం సం క్షమ్’ అను అక్షరములను ఉచ్చరిస్తూ ఒకానొకరోజు శంకరభగవానుని ఈ విధంగా ప్రశ్నించటం జరిగింది.
పద్మజుడు (సృష్టికర్త) : హే శంకర భగవాన్! ఈ దేహాకాశములో (1) అమావాస్య (2) పౌర్ణమి (3) పాడ్యమి వాటియొక్క సంజ్ఞలు ఏమేమి అయి ఉన్నదో, అట్టి తాత్త్వికార్థములను దయతో వివరించండి.
శంకర భగవానుడు : పగలు యొక్క (తెలివియొక్క) ప్రవేశమగు పాడ్యమిని అమావాస్య - పౌర్ణమిలయందు సుస్థిరీకరణము చేయాలి. ఇక వేరే త్రోవయే లేదు. సర్వకాలములయందు సమరసభావనను సుదృఢీకరించుకోవాలి. మనస్సు యొక్క సర్వ సమత్వస్థితియే స్థిరీకరణ యోగ స్థితి.
కామేన విషయ - ఆకాంక్షీ
విషయాత్ కామమోహితః।
ద్వావేవ సం - త్యజేత్ నిత్యం
నిరంజనమ్ ఉపాశ్రయేత్।
అపరగ్ం సంత్యజేత్ సర్వం
యదిచ్ఛేత్ ఆత్మనో హితమ్।
శక్తి మధ్యే మనః కృత్వా
మనః శక్తేశ్చ మధ్యగమ్,
మనసా మన ఆలోక్య
తత్ త్యజేత్ పరమం పదమ్।
మన ఏవ హి బిందుశ్చ
ఉత్పత్తి స్థికారణమ్।
మానసో ఉత్పద్యతే బిందుః
యథా క్షీరం ఘృతాత్మకమ్।
న చ బంధన మధ్యస్థం
తద్వై కరణ మానసమ్।
చంద్ర - అర్క మధ్యమా శక్తిః
యత్రస్థా తత్ర బంధనమ్।
జ్ఞాత్వా సుషుమ్నా తత్ భేదం
కృత్వా వాయుంచ మధ్యగమ్।
స్థిత్వాసౌ బైందవస్థానే
ఘ్రాణరంధ్రే నిరోధయేత్।।

కోరికవలన ఈ జీవుడు ‘విషయాకాంక్షి’ (కోరికలను కోరువాడు), కోరుచున్న విషయములచే కామమోహితుడు అగుచున్నాడు. హృదయములో కామ - క్రోధములను రెండిటినీ సంత్యజించివేయాలి. నిత్యము, నిరంజనము అగు ఆత్మను ఉపాశ్రయించాలి. ఉపాసించాలి. సమవర్తించాలి. సమస్తమును ఆత్మకు అనన్యముగా దర్శించాలి.
తనకు తనవలన (వర్తమాన జన్మవలన) హితము జరగాలని ఈ జీవుడు నిజంగా కోరుకొంటే, అపరము (కాలబద్ధము, సందర్భమాత్రము) అగు అన్యమైనదంతా (తదితరమైనదంతా) సంత్యజించివేయాలి. ఈ సమస్తమునకు అనన్యమగు ఆత్మనే భావనచేయువాడై ఉండాలి.

మనస్సును శక్తికి మధ్యగాను, శక్తిని మనస్సుకు మధ్యగాను సంకల్పించి, నిలిపి ఉంచి, మనస్సుతో మనస్సును ఆలోకనము చేస్తూ ‘పరమపదము’ వరకు సమస్త లౌకికాశయములను త్యజించి వేయాలి. మనస్సే బిందువుకు ఉత్పత్తి, స్థితులకు కారణము. పాల నుండి నేయి జనించుచున్నవిధంగా మనస్సు నుండి బిందువు ఉత్పన్నమగుచున్నది. విశ్వమంతా బిందు స్వరూపమే.

ఒకానొక కరణము (లేక) ఉపకరణము వంటి మనస్సు బంధనమునందు చిక్కుకున్నట్టిది కాదు. అద్దములో ప్రతిబింబించే వస్తువులచే అద్దమునకు బంధమెక్కడిది? మనో దర్పణమునకు కూడా బంధము లేదు.
చంద్ర - సూర్య (ఇడ - పింగళ నాడుల) మధ్యగా ఉన్న శక్తియే (కుండలినీ శక్తియే) బంధనము. (ఇడ-పింగళ నాడుల మధ్య మాత్రమే కుండలిని గుర్తించబడి ఉన్నంతవరకు జీవునకు బంధము కొనసాగుచున్నది).
- ఇడ - పింగళనాడుల మధ్య వేరై ఉన్న సుషుమ్ననాడిని వేరుగా ఎరిగి, అట్టి సుషుమ్ననాడిలో మధ్యగా వాయువును కుంభక ప్రాణాయామప్రక్రియతో నిలపి ఉంచి, బైందవ స్థానము బ్రహ్మరంధ్రము యొక్క క్రింద → కొండ నాలుక ప్రదేశమునగల → బ్రహ్మరంధ్ర అధోబిందుస్థానమును ఆక్రమించుకొనియుండి, ముక్కు రంధ్రమును, నిరోధించి (కుంభించి) ఉంచాలి.

02. వాయుం బిందుగ్ం సమాఖ్యాతగ్ం
సత్వం ప్రకృతిమేవ చ
షట్ (6) చక్రాణి పరిజ్ఞాత్వా
ప్రవిశేత్ సుఖమండలమ్।।
మూలాధారగ్ం స్వాధిష్ఠానం
మణిపూరమ్ తృతీయకమ్।
అనాహతం విశుద్ధిం చ
ఆజ్ఞాచక్రంచ షష్ఠకమ్।
→ ‘ఆధారం’ గుదమ్ ఇత్యుక్తం
→ స్వాధిష్ఠానంతు లైంగికమ్।
→ మణిపూరం నాభిదేశం।
→ హృదయస్థమ్ అనాహతమ్।
→ విశుద్ధిః కంఠమూలే చ,
→ ఆజ్ఞాచక్రం చ మస్తకమ్।
షట్ చక్రాణి పరిజ్ఞాత్వా
ప్రవిశేత్ సుఖమండలే।।
బిందువు = వాయువు (ప్రాణశక్తి) ‘బిందువు’గా చెప్పబడుతోంది.

ప్రకృతి = దృశ్యముగా ప్రదర్శనమై అనుభవమగుచున్నదంతా, సర్వేంద్రియ విషయ విశేషములతో సహా - ‘ప్రకృతి’ అని పిలువబడుచున్నది. బిందు ప్రకృతులను, షట్ (6) చక్రములను తెలుసుకొని…సుఖమయ కుండలమగు బ్రహ్మరంధ్రము (సహస్రార ప్రారంభస్థానము) చేరాలి. (ప్ర = ప్రదర్శనము, కృ = కృతము, తి = తిరోధానము, బ్రహ్మ-విష్ణు-మహేశ్వర తత్త్వము).
- గుదస్థానంలో ఆధార (మూలాధార) చక్రము
- లింగస్థానంలో స్వాధిష్ఠాన చక్రము
- నాభి ప్రదేశంలో - మణిపూరక చక్రము
- హృదయ స్థానములో - అనాహత చక్రము
- కంఠ మూలస్థానములో - విశుద్ధి చక్రము
- మస్తక స్థానములో - ఆజ్ఞా చక్రము

‘భౌతిక దేహములో అభౌతికము’ అనతగినట్టి ఈ ‘6’ చక్రములను బుద్ధితో (గురుముఖతః) గమనించి, వాటిని ‘కుంభకము’ ద్వారా అధిగమించుచూ సుఖమండలమగు (శిరస్సుయొక్క ఉపరిభాగంలో సంస్థితమైయున్న) ‘బ్రహ్మరంధ్రము’ను చేరాలి. ప్రవేశించాలి.
ప్రవిశేత్ వాయుమ్ ఆకృష్య
తయైవ ఊర్ధ్వం నియోజయేత్।
ఏవం సమభ్యసేత్ వాయుం
స బ్రహ్మాండమయో భవేత్।
వాయుం బిందుం తథా చక్రం
చిత్తం చ ఏవ సమభ్యసేత్।
సమాధిమ్ ఏకేన సమమ్ అమృతం
యాంతి యోగినః।
యథా అగ్నిః దారు మధ్యస్థో
న ఉత్తిష్ఠేత్ మథనం వినా,
వినా చ అభ్యాసయోగేన
జ్ఞాన దీపః తథా నహి।
ఘట మధ్యగతో దీపో
బాహ్యే నైవ ప్రకాశతే,
భిన్నే తస్మిన్ ఘటేచైవ
దీపజ్వాలా చ భాసతే।
స్వకాయం ఘటమ్ ఇత్యుక్తం
యథా దీపో హి తత్పరమ్।
గురువాక్య సమాభిన్నే
బ్రహ్మజ్ఞానం స్ఫుటీ భవేత్।
కర్ణధారం గురుం ప్రాప్య
కృత్వా సూక్ష్మం తరంతి చ।
అభ్యాస వాసనా శక్త్యా
తరంతి భవసాగరమ్।
ఆ విధంగా వాయువును సమాకర్షించి, ప్రాణధారుడై (ప్రియత్వధారణచే) ప్రాణశక్తిని ఆజ్ఞాచక్రమునకు ఊర్ధ్వంగా → బ్రహ్మరంధ్రము - సహస్రారములయందు నియమించాలి. (సహస్రారము = ఈ విశ్వమంతా నాలో ఉన్నట్టి నేను).

ఈ విధమైన అభ్యాసముచే అట్టి యోగాభ్యాసి బ్రహ్మాండమయుడగు చున్నాడు. బ్రహ్మాండమంతా తన శరీరమై ఆతడు విరాజిల్లుచున్నాడు.

ఈ విధంగా (1) వాయువు (2) బిందువు (3) చక్రము (4) చిత్తమును ఏకం చేసి అభ్యసించుయోగి సర్వే సర్వత్రా సమస్వరూపుడై, సర్వభూతములు తానె అయి, సర్వసాక్షిగా వేరై ‘‘సమ + అధి’’ = సమాధి సంస్థితుడై, మార్పు చేర్పులకు విషయమే కానట్టి అమృతత్వమును సిద్ధించుకొనుచున్నాడు.

కర్రలో అగ్ని ఉన్నది. కానీ, అద్దానిని చేతిలో ధరిస్తే అగ్ని అనుభవమౌతుందా? లేదు. కర్రలను ఒకదానితో మరొకటి ఒరిపిడి చేస్తే అగ్ని పుడుతుంది. అట్లాగే అభ్యాసయోగమును ఆశ్రయించకపోతే జ్ఞానదీపము వెలుగదు.

కుండలో వెలుగుచున్న దీపము బాహ్యమున ప్రకాశము ప్రదర్శిస్తూ ఉంటుందా? ఉండదు.
ఆ కుండను ఛేదిస్తేనో? దీపపు కాంతి సర్వే సర్వత్రా కిరణ (జ్వాలా) రూపమై, పరిసరములను తేజోపుంజములతో భాసమానము చేస్తుంది.
ఈ భౌతిక దేహము (దేహాఽహమ్ భావన) ఘటము వంటిది. ఘటము (కుండ) లో (దేహములో) వెలుగొందు స్ఫూర్తియే ఆ పరమాత్మ!

‘దేహభావన జయించబడగా, ‘‘తత్ త్వమ్, జీవోబ్రహ్మేతి నా -పరః, సోఽహమస్మి’’ ఇత్యాది మహావాక్యముల గురుదేవ ప్రవచన - వివరణ-బోధనలచే (అహంబ్రహ్మా-స్మి’ సంబంధమైన) బ్రహ్మజ్ఞానము ప్రస్ఫుటము కాగలదు. అట్టి యోగి ‘‘త్వమేవాఽహమ్’’ భావనతో ఏకంచేసి ఈ జగత్తును చూస్తున్నాడు. అహమ్-త్వమ్ జగత్‌లపట్ల అఖండాత్మా నందుడగుచున్నాడు.

తత్త్వజ్ఞానము బోధించు సద్గురువు సంసార సాగరంలో చిక్కుకున్న పడవకు కర్ణధారుడు (చుక్కానిని నడుపువాడు). సద్గురుబోధను భక్తిశ్రద్ధలతో విని, మననము ద్వారా అంతర్ - హృదయ విచారణ చేసి, బుద్ధి నిశ్చలత కొరకై యోగాభ్యాసమును నిర్వర్తిస్తూ ఉండగా, అట్టి అభ్యాసవాసనాశక్తిచే ఆ అభ్యాసి, భవసాగరమునుండి తరించుచున్నాడు.
03. పరాయామ్ అంకురీ భూయ
పశ్యంత్యాం ద్విదళీకృతా।
మధ్యమాయాం ముకుళితా
వైఖర్యాం వికసీకృతా।
పూర్వం యథ ఉదితా యా
వాక్ విలోమేన అస్తగా భవేత్।
తస్యా వాచః పరో దేవః।
కూటస్థో వాక్ ప్రబోధకః।
‘సోఽహమ్ అస్మి’ ఇతి నిశ్చత్య
యః సదా వర్తతే పుమాన్,
శబ్దైః ఉచ్చావచైః నీచైః
భాషితోఽపి న లిప్యతే।
‘‘సోఽహమ్ - దేవః - ఆత్మైవాహమ్’’ - ధ్యానము
- ‘పరా’ (ఆవల)….యందు అంకురముగలదై,
- ‘పశ్యంతి’…అను (జీవుడు - ఈశ్వరుడు అనబడు రెండు ఆకులు మొలువగా,
- ‘మధ్యమా’ అనే ముకిళితము (మొగ్గతొడగటం) ఆరంభమై,
- ‘వైఖరీ’….అనబడే పుష్పవికాసము కలిగినదై….(వికసించినదై)
- వాక్కు మాట్లాడువానియందు అస్తమించుచున్నది (Speaking gets desloved in speaker).
వాక్యములకు ఆవల, ఆవాక్యముల ఉత్పత్తికి స్థానమై కూటస్థుడగు పరమాత్మ సర్వమునకు ‘ప్రబోధకుడు’. ‘‘సోఽహమస్మి, తత్త్వమ్’’ - స్వానుభవముల అనునిత్య స్వరూపమే ‘‘ప్రబోధము’’.
అట్టి పరమాత్మ భావనచే (శబ్దములకు జనన స్థానమై, మెదలే సిద్ధించినదైయున్న) పరమాత్మను తనయందు అనుక్షణికానుభూతము చేసుకొన్నవానికి, ఇక ఉచ్ఛ - నీచములనుబడుదేనిచేతనూ దోషము పొందడు.
విశ్వశ్చ తైజసశ్చైవ
ప్రాజ్ఞశ్చేతి చ తే త్రయః।
విరాట్ హిరణ్యగర్భశ్చ ఈశ్వరశ్చ ఇతి తే త్రయః।
బ్రహ్మాండంచైవ పిండాండం
లోకా ‘భూః’ ఆదయః క్రమాత్।

వ్యష్ఠి పురుషకారములు
(1) విశ్వుడు (జాగ్రత్ పురుషకారము)
(2) తేజసుడు (స్వప్నపురుషకారము)
(3) ప్రాజ్ఞుడు (సుషుప్తి పురుషకారము)

విశ్వ పురుషకారములు
(Ⅰ) విరాట్ (పురుషకారము)
(Ⅱ) హిరణ్యగర్భుడు (పురుషకారము)
(Ⅲ) ఈశ్వరుడు (పురుషకారము)

దృశ్య పురుషకారములు
(i) బ్రహ్మాండము
(ii) పిండాండము
(iii) భూలోకము


స్వస్వ - ఉపాధి లయాత్ ఏవ
లీయంతే ప్రత్యగాత్మని।।
అండం జ్ఞానాగ్నినా తప్తం
లీయతే కారణైః సహ
పరమాత్మని లీనం
తత్‌పరమ్ బ్రహ్మైవ జాయతే।
మొదలైన క్రమక్రమ విశేషాలన్నీ….వాటి వాటి ఉపాధులతో సహా లయము చేసి సర్వము పరబ్రహ్మమునందు లీనమై పరబ్రహ్మత్వము సంతరించుకుంటున్నాయి. అట్టి యోగ-జ్ఞానాభ్యాస బలముచే కేవల పరమపురుషత్వము సిద్ధిస్తోంది.
అండాండము (All Physical universe) జ్ఞానాగ్నిచే దగ్ధమై వాటి వాటి కారణములతో సహా పరమాత్మయందు లీనము పొంది పరబ్రహ్మ రూపముగా స్వానుభవము అగుచున్నది.
తతః స్తిమిత గమ్భీరం
న తేజో। న తమః తతమ్।
అనాఖ్యమ్, అనభివ్యక్తగ్ం
సత్ కించిత్ అవశిష్యతే।
ధ్యాత్వా మధ్యస్థమ్ ఆత్మానం
కలశాంతరదీపవత్।
అంగుష్ఠమాత్రమ్ ఆత్మానమ్
అధూమ జ్యోతి రూపకమ్
ప్రకాశయంతం అంతస్థం
ధ్యాయేత్ కూటస్థమ్ అవ్యయం।।
ఆత్మ అప్పుడిక గంభీరమై, స్థిమితమై యున్నట్టిది. అది తేజస్సు కాదు. చీకటి కాదు. వాక్కుతో చెప్పబడజాలనిది. వ్యక్తము కానట్టిది. అటువంటి ‘కేవల సత్ మాత్రమే’ శేషించి ఉంటోంది. అట్టి ఆత్మను కలశములో దీపమువలె స్వస్వరూపమునందే (లేక) స్వహృదయమునందే వెలుగుచున్నట్లుగా ధ్యానించాలి.
అట్టి కేవలాత్మ ప్రకాశము
- అంగుష్ఠ (బొటనవ్రేలు) ప్రమాణముగా,
- పొగ లేని జ్యోతి రూపంగా,
- అంతరమునకే అంతరమై (అంతరాంతమై), కూటస్థమై, అవ్యయమై, మార్పు చేర్పులు పొందనిదై,
- తదితరమైనదంతా ప్రకాశింపజేయుచున్నదై స్వస్వరూపమై, సమస్తమై విద్యమానమగుచున్నది.
అట్టి కూటస్థ పరబ్రహ్మమును ధ్యానము చేయాలి. అట్టి యోగి సర్వ దేవతాత్మకుడగుచున్నాడు. సర్వాత్మకుడుగా శేషిస్తున్నాడు.
04. విజ్ఞానాత్మా తథా దేహే
జాగ్రత్ స్వప్న సుషుప్తితః
మాయయా మోహితః పశ్చాత్
బహుజన్మాంతరే పునః,
సత్కర్మ పరిపాకాత్తు
స్వవిచారం చికీర్షతి।।
‘‘కోఽహమ్? కథమ్ అయం దోషః?
సగ్ంసారాఖ్య ఉపాగతః?
జాగ్రత్ స్వప్నే వ్యవహరన్
సుషుప్తౌ క్వ గతిః మమ?
ఇతి చింతాపరో భూత్వా,
స్వభాసా చ విశేషతః,
అజ్ఞానాత్తు చిదాభాసో
స్వతఃగా పరమాత్మస్వరూపుడగు ఈ విజ్ఞానాత్మ (జీవుడు, One who is knowing, The knowing self) → జాగ్రత్ స్వప్న సుషుప్తులలో మాయామోహితుడై ఉంటున్నాడు. ఈ విధంగా అనేక జన్మలలోని పుణ్యకర్మల పరిపక్వత చేత ఒకానొకప్పుడు స్వవిచారణకు ఉపక్రమించు చున్నాడు.
  • నేనెవడను? ఈ కనబడే సంబంధ - అనుబంధ దోషములు ఏమై ఉన్నాయి? ఈ ‘సంసార దోషము’ ఎక్కడి నుండి దాపరించింది?
  • జాగ్రత్‌లోను, స్వప్నములోను సంచరించుచున్న నాకు సుషుప్తిలో ఏ గతిని పొందుచుండటం జరుగుతోంది?
…..ఇటువంటి చింతనలో పడి విచారణ చేయుచున్నాడు .

‘‘నాయొక్క వెలిగించుట (భాససా) విశేషముచేత, అంతరమున స్వకీయ అజ్ఞానముచే సమస్తము అనుభవమౌతోంది. సమస్తమునకు చిత్‌స్వరూపుడను (Absolute knower with Faculty of knowing) అగు నేనే - బాహ్య తాపములచే (Out word worries) తపించు చిదాభాసుడను (Reflective knower) అగుచున్నాను కదా!
బహిః తాపేన తాపితః।
దగ్ధం భవత్యేవ తదా
తూలపిండమివ అగ్నినా।
దహరస్థః ప్రత్యగాత్మా
నష్టే జ్ఞానే తతః పరమ్।
వితతో వ్యాప్య విజ్ఞానం
దహత్యేవ క్షణేన తు।
మనోమయ జ్ఞానమయాగ్ం
సమ్యక్ దగ్ధ్వా క్రమేణతు,
ఘటస్థ దీపవత్ శశ్వత్
అంతరేవ ప్రకాశతే।

‘‘ఆహా! అగ్నిచే దూదివలె నేను అజ్ఞానజనిత చిదాభాసత్వముచే దగ్ధం అగుచున్నానే?’’ - అని గమనిస్తున్నాడు.
దహర (హృదయ) ఆకాశమున ఉన్న ప్రత్యగాత్మ (జీవాత్మ) ఆత్మతత్త్వమును (లేక) ఆత్మధర్మమును ఏమరచి దృశ్య విభాగి అగుచున్నాడు. ఆత్మ జ్ఞానము వికసించుటచే క్షణములో అన్యత్వమును దహించివేయుచున్నాడు.
అన్యభావనా రూపమగు మనోమయ భావములను, అన్యవస్తుజ్ఞాన రూపమగు దృశ్యజ్ఞాన సమాచారములను క్రమంగా సమ్యక్ భావ - జ్ఞానములచే (Sense of perceiving equality every where) జయిస్తున్నాడు. కుండలో వెలుగుచున్న దీపమువలె అంతర్ - హృదయములలోనే ఆత్మజ్యోతి, జగత్‌జ్యోతి ప్రకాశమానం కాగలదు.

థ్యాయన్ అస్తే మునిశ్చైవ
మా సుప్తేః మృతేస్తు యః
జీవన్ముక్తః స విజ్ఞేయః।
స ధన్యః। కృతకృత్యవాన్।।
ఏ ముని (సర్వ ప్రాపంచక - బాహ్య విషయములపట్ల మౌనము (Let them be the way they are, Let me do what I have to do leaving aside all worries) వహించిన వాడు అయి ఉంటాడో, గాఢనిద్రాస్థితి వరకును - మరణమువరకును కూడా తన హృదయా కాశములో ప్రకాశమానమైయున్న సర్వాంతర్యామిని ఉపాసిస్తూనే ఉంటాడో, - అట్టివాడు జీవన్ముక్తుడు. స విజ్ఞేయుడు, తెలుసుకోవలసినది తెలుసుకున్నట్టివాడు. ఆతడు ధన్యుడు. కృతకృత్యుడు.
జీవన్ముక్త పదం త్యక్త్వా
స్వదేహే కాలసాత్ కృతే,
విశతి అ(వి)దేహముక్తత్వం
పవనో అస్పన్దతాం ఇవ।।
ఈ పాంచభౌతిక దేహము కాలకృతంగా కాలాధీనము అగుచుండవచ్చు గాక! ఇక హృదయాంతర్గత సర్వస్వరూప-పరమాత్మ ధ్యానము చేయు యోగి….వాయువుయొక్క అస్పందత్వమువలె స-దేహముక్తమును దాటి ‘విదేహముక్తి’ యందు ప్రవేశించుచున్నాడు.
సర్వము ఆత్మకు అభిన్నమై, ‘‘సర్వాత్మకమగు కేవల -పరతత్త్వము, అద్దాని అంతము (ఆవల)’’ కూడా తానే అయి శేషించుచున్నాడు.
అశబ్దమ్। అస్పర్శమ్। అరూపమ్।
అవ్యయం। తథా అరసం।
నిత్యం। అగంధవచ్చయత్।
అనాది - అనంతం।
మహతః పరమ్।
ధృవమ్।
తత్ ఏవ అవశిష్యతి
అమలం।
నిరామయం।
అట్టి కేవలీ పరబ్రహ్మతత్త్వము….
→ శబ్దములతో చెప్పబడేది కాదు. కాబట్టి అశబ్దము!
→ స్పర్శకు విషయం కాదు. అస్పర్శమ్!
→ కనులకు కనబడే రూపము కాదు. అరూపమ్!
→ హెచ్చుతగ్గులు లేనట్టిది. అవ్యయమ్।
→ రుచికి విషయం కాదు. నవరసాలలో ఏదీ కాదు. అరసమ్!
→ కాలబద్ధము కాదు. నిత్యమ్!
→ వాసనకు విషయం కాదు. అగంధమ్!
→ ఆద్యంతములు లేనిది. అనాదిమ్! అనంతమ్!
- జీవ, ఈశ్వరులు (Role player in world Drama and Actor who acts in manya Drama) - రెండిటికి ఆవల ఉన్నట్టిది కాబట్టి మహత్ పరమమ్! - సర్వదా, సర్వే సర్వత్రా ఏక - అఖండ స్వరూపము - ధృవమ్!
- నిర్మలము - అమలమ్!
- నిర్విషయము. నిరామయమ్! అదియే నీవు! అదియే నేను! తత్త్వమ్! సోఽహమ్।

ఇతి యోగకుండలినీ ఉపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



కృష్ణ యజుర్వేదాంతర్గత

21     యోగకుండలినీ ఉపనిషత్

అధ్యయన పుష్పము

యోగకుండలిన్యుయుపనిషత్ - గురుముఖతః నేరువవలసిన యోగస్థానమునకు యోగమార్గముగా, బ్రహ్మానందానుభవమగు పరబ్రహ్మ తత్త్వముగా, స్వస్వరూపముగా స్వానుభవమగుటకు - ‘‘మార్గదర్శకము’’గా - తోడై ఉండగలదు.

⌘ ⌘ ⌘

ప్రథమాధ్యాయము - కుండలినీ శక్తి ప్రేరణ

ఒకప్పుడు గౌతముడు (శిష్యుడు) తన గురుదేవులను సమీపించి, ఇట్లా అర్థించారు.

గురుదేవా! అవ్యాజ కరుణామూర్తీ! నాపై కరుణతో ఈ ఈ విశేషాలు బోధించండి.

(1) చిత్తము - అద్దాని హేతువులు.
(2) వాయువును జయించు విధానము.
(3) శక్తి చాలనము - సరస్వతీ చాలనము.
(4) ప్రాణ నిరోధము - ప్రాణ కుంభకము - వివిధ కుంభక విధానములు.
(5) బంధత్రయము, వాటి యొక్క అభ్యాస విధానములు.
(6) యోగాభ్యాస ప్రారంభ దశలో ఏర్పడు ప్రతిబంధకములు, వివిధ విఘ్నములు, వాటిని ఎదుర్కొనే ఉపాయములు.
(7) ఆధిభౌతిక - ఆతివాహికత్వములు.
(8) జగత్ అహ్రాంతి - ఉపశమనము.
(9) కుండలినీ శక్తి - అద్దానిని నిదురలేపి ఊర్ధ్వగమనమును నిర్వర్తించు విధానము.
(10) ఖేచరీ విద్య.
(12) ఆత్మదర్శనము - పరమాత్మతో అనన్యత్వము.
(13) వాయువును ఆకర్షించి చక్రగమనము ద్వారా బ్రహ్మరంధ్ర - సహస్రారములు చేరి, ఆత్మదర్శనము చేయు యోగ విధానము
(14) ‘ఆత్మమేవాహమ్’ భావనా సిద్ధి - వైచిత్ర్యము. ఈ ఈ విశేషాలు వివరించమని, ప్రవచించమని వేడుకొంటున్నాను.

⌘ ⌘ ⌘

గురుదేవులు : ఓ గౌతమా! మీరు తెలుసువాలనుకొన్న విశేషాలు సంక్షిప్తంగా వివరించి చెప్పుచున్నాను, వినండి.


చిత్తహేతువులు

అసంఖ్యాక దృశ్య సంబంధమైన-విషయ పరంపరల వైపుగా సమాకర్షణమగుచున్న అభిరుచితో కూడిన మనన స్వభావమే ‘చిత్తము’గా పిలువబడుతోంది.
అట్టి కార్యరూపమగు చిత్తమునకు కారణహేతువులుగా ‘2’ విశేషాలు చెప్పబడుచున్నాయి.

(1) వాసనలు : అనేక జన్మలలోని భౌతిక-మానసిక అభ్యాసముల కారణంగా దృశ్య విషయముల పట్ల ప్రత్యాకర్షణలచే రూపుదిద్దుకొనియున్న వాసనలు, సంస్కారములు.

(2) ప్రాణచలనము : విషయముల పట్ల (సంగతి, సంఘటన, సందర్శ పరస్పర సంబంధముల పట్ల) ఏర్పడినదైయున్న ప్రియత్వ రూపమగు సమీరణము. అనగా ‘‘ఇదంటే నాకు ప్రాణము’’… అను వాక్యార్ధమగు - ప్రాణచంచలత్వము. ఆకర్షణము. అవినాభావత్వము.

అట్టి (1) వాసనలు, (2) ప్రియత్వరూపమగు ప్రాణచంచలత్వములలో - ఒకటి వినష్టమైతే రెండవది కూడా తొలగిపోగలదు.

వాసనలు అనేక జన్మలుగా ఆర్జించబడినవై మనో-బుద్ధి-చిత్తములందు దట్టముగా పేరుకొని ఉంటున్నాయి. అందుచేత ప్రాణ నియమము ద్వారా వాయు జయమును సిద్ధించుకోవటమే వర్తమానంలో ముఖ్య ఉపాయము. ‘జీవితము’ అనే సదవకాశమును సద్వినియోగపరచుకోవటానికి ఈ జీవుడు యోగసాధనకు ఉపక్రమించి ‘వాయు జయము’నకు సంసిద్ధుడగుగాక!


వాయు జయము - ప్రాణ నిరోధము - ప్రాణోపాసన

ఓ గౌతమా!

వాయుజయము (లేక) ప్రాణోపాసన కొరకై మునుముందుగా నిర్వర్తించవలసిన ‘3’ ఉపాయములు ఆత్మజ్ఞులగు గురువులచే సూచించబడుచున్నాయి.

(1) మితాహారము (2) ఆసనము (3) శక్తిచాలనము.

ఈ మూడింటి లక్షణముల గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాము. సాదరముగా, శ్రద్ధగా, ప్రియముగా వినుచుండెదరుగాక!

సమీరము గురించిన (లేక) వాయు జయము కొరకై ‘3’ నియమములు

[1] మితాహారము :

(1) సుస్నిగ్ధ మధురాహారః: ఆహారము తేలికగా జీర్ణమయ్యేది అయి ఉండాలి. ఆవేశకావేశములు పెంచేవి కాకుండా, మధురమైన స్వభావము పెంపొందించేది కావాలి. (ఖట్వము, ఆమ్లము, లవణము అధికంగా ఉండేది కాకూడదు). సాత్వికమైన ఆహారము అగునుగాక. ప్రశాంతత పెంపొందించేదిగా ఉండాలి - ఇది మితాహారపు ఒక లక్షణం

(2) చతుర్ధాంశ వివర్జితము : పొట్టలో 1/2వ వంతు ఆహారము (Soft food) తోను, 1/4వ వంతు జలము (Liquid) తోను పూరించాలి. చతుర్భాగం వివర్జితః। శేషించిన 1/4వ వంతు ఖాళీగా ఉంచటము మితాహారపు మరొక ముఖ్యలక్షణము.

(3) శివార్పితము : ఆహారము దైవార్పితాహారము అయి ఉండాలి. దైవమునకు (అనగా) తోటి జీవులకు ‘నివేదన’ చేసినప్పుడు, అది ‘ప్రసాదము’ (పవిత్రము) అగుచున్నది. ‘‘దైవము నాకు ఆహారమును ప్రసాదిస్తున్నారు’’ అను కృతజ్ఞతాభావముతో అతిథులకో, పక్షి-జంతు జీవులకో కొంతభాగము విభాగించి, అప్పుడు స్వీకరించు ఆహారము ‘శివార్పితాహారము’ అగుచున్నది.

అట్లాగే ఆహారము న్యాయముగా పొందినది అయి ఉండాలి. ఇతరులను బాధించియో, మోసగించియో పొందినది అయి ఉండకూడదు.

ఈ రెండు విశేషములచే ఆహారము శివార్పితమైనదగుచున్నది.

ఈ విధంగా సాత్వికము, చతుర్ధాంశ (1/4) వివర్జితము, శివ సంప్రీత్యము అగు ఆహారము ‘మితాహారము’ అనబడుచున్నది
వాయుజయము కొరకై మొట్టమొదటి - ‘మితాహారము’గా తీర్చిదిద్దుకోవాలి.

[2] ఆసనము :

మనస్సు చాంచల్యమును వీడటానికి, బుద్ధి-నిశ్చలతను సంతరించుకోవటానికి ఒకచోట కొంత వ్యవధి ఆసీనుడై ‘ధ్యాననిష్ఠ’ను స్వీకరించాలి. ఇక్కడ మనము రెండు ముఖ్యమైన ఆసనముల గురించి చెప్పుకుంటున్నాము.

(1) పద్మాసనము : ఎడమ పాదము కుడి తొడపైన, కుడి పాదము ఎడమ తొడపైన ఉపరితలంగా ధరించి, ‘పద్మాసనము’ ధారణ చేసి నిశ్చలంగా ఆసీనులవటం. పద్మాసనం భవేత్ ఏతత్ సర్వపాప ప్రణాశనమ్! పద్మాసనము సర్వపాప-దుష్ట-అల్పభావములను దరిజేరనీయకుండా సహకరించగలదు.

(2) వజ్రాసనము : వామాంఘ్రి మూలకంద-అధో, హి అన్యం తదుపరి క్షిపేత్। సమగ్రీవ శిరః కాయో ‘వజ్రాసనమ్’ ఇతి ఈరితమ్।। ఎడమ చీలమండలమును మూలాధారమును తాకించుచు, కుడి కాలు చీలమండలమును ఎడమ మోకాలిపై ఆనించి, కంఠము శిరస్సు కాయములను సమముగా ధరించి ఉండటము ‘వజ్రాసనము’ అగుచున్నది.

[3] శక్తిచాలనము :

కుండల్యేవ భావేత్ శక్తిః। ‘కుండలిని’యే (ఇచ్ఛాజ్ఞానక్రియా) - శక్తిగా ప్రదర్శనమైయున్నది.

అట్టి కుండలినీ మహత్ శక్తి దేహములో వేంచేసి, (మూలాధారస్థానములో) - గాఢ నిద్ర అనుభవిస్తున్న ఆడుత్రాచువలె నిద్రాణమైయున్నది. తాంతు (తత్‌కుండలినీ శక్తిస్తు) సంచారయేత్ బుధః స్వస్థానాత్ భృవోర్మధ్యం-‘‘శక్తిచాలనమ్’’ ఉచ్యతే।

అట్టి మూలాధారమునందు నిద్రాముద్ర వహించి యున్న మహత్తరమగు కుండలినీ శక్తిని బుద్ధిపూర్వకమైన కదలికలచే నిదురలేపి, అద్దానిని ఊర్ధ్వముగా కదలించుచు (నడిపించుచు) భ్రూమధ్యస్థానము వరకు చేర్చు యోగాభ్యాసము ‘శక్తిచాలనము’ అని పిలువబడుచున్నది.

(కుండలినీ నిద్రాముద్ర = ఇచ్ఛ- జ్ఞానక్రియా శక్తి - ఇంద్రియ విషయములలో మాత్రమే నిమగ్నమై, పరిమితమై, ఆత్మ-ఆత్మ సమాచారముల విషయంలో ఏమరచి ఉండటము).

అందుకు సాధనములు ముఖ్యంగా రెండు (1) సరస్వతీ చాలనము (2) ప్రాణ రోధమథాభ్యాసము.

అభ్యాసము చేతనే కుండలినీ శక్తి ఋజుత్వము (Straight forward move) పొందటము జరుగగలదు. ఈ రెండిటి గురించి ఇక ఇప్పుడు చెప్పుకుందాము.

(1.) ‘‘సరస్వతీ చాలనము’’ / ‘‘అరుంధతి’’

ఈ సరస్వతీ చాలనము పూర్వీకులచే - తత్త్వ యోగ పరిభాష వాఙ్మయములో ‘అరుంధతీవిద్య’ అని కూడా వ్యవహరించబడి - వర్ణించబడింది.

అట్టి సరస్వతీ చాలనముచే నిద్రాముద్ర వహించియున్న ఊర్ధ్వ కుండలినీశక్తి స్వయముగా ఊర్ధ్వ చలనము (Move towards upward Direction) స్వీకరించగలదు.

సరస్వతీ చాలన (లేక) అరుంధతీ యోగాభ్యాస విధానము :

(1) ముందుగా పద్మాసనమును దృఢముగా ధరించాలి. మెడ, శిరస్సు, భుజములను నిఠారుగా నిలిపిఉంచి కొద్దిక్షణములు.. ధారణ చేయాలి.

(2) ఇడాయాం వహతి ప్రాణే బధ్వాః పద్మాసనమ్ దృఢమ్

యోగకుండలినీ-ఉపనిషత్-ముఖ్య-నాడులు

ద్వాదశాంగుళ (12“) దైర్ఘ్యం చ, అంబరమ్, చతుర్ (4”) అంగుళమ్ విస్తీర్యతేన తత్ నాడీం వేష్టయిత్వా, తతః సుధీ!

ఈ విధంగా శబ్దగర్భయగు సరస్వతిని నిత్యము సంచలింపజేయాలి. అట్టి సంచాలనముచే యోగి సర్వరోగముల నుండి ప్రముచ్యుడు (Wel-Relieved) అగుచున్నాడు. అట్టి శక్తి చాలనముచే గుల్మము (హృదయ ఎడమభాగములో గల పచ్చని మాంసఖండము), ప్లీహము (గుండెలోని భాగము) యొక్క దోషములు, ఇంకా ఉదరములో జనించే వ్యాధులు - అవన్నీ నశించగలవు! అసంశయః। (ఇది గురుముఖతః నేర్చుకొని అభ్యసించటము శ్రేయోదాయకము).

(2.) ప్రాణ రోధ మథాభ్యాసము

ఓ గౌతమా! ఇప్పుడు మనము ‘‘ప్రాణరోథ మథ’’ - అను యోగాభ్యాసము గురించి కొన్ని వివరములను చెప్పుకుంటున్నాము. ఈ భౌతికంగా కనిపిస్తున్న దేహములో జరుగుచున్న వాయువు యొక్క ఉనికి+సంచలనములే ప్రాణము. అట్టి ప్రాణము యొక్క ఆయామము (సుస్థిరీకరణము) - ‘కుంభకము’ అని పిలుస్తున్నారు.

అట్టి కుంభకము రెండు విధములు (1) సహిత కుంభకము - వాయుచలన సంబంధమైన కుంభకము (2) కేవల కుంభకము వాయు చలనములకు ఆధారమైఉన్న మనస్సుయొక్క - నిరోధము, బుద్ధియొక్క ఏకాగ్రతచే నిర్వర్తించు కుంభకము.

యావత్ కేవల సిద్ధిస్స్యాత్, తావత్ ‘సహితమ్’ అభ్యసేత్।
కేవల కుంభకస్థితి (లేక) మనో-బుధ్యుక్త కుంభకము సిద్ధించేవరకు సహితకుంభకమును అభ్యసించాలి. కేవల కుంభకాభ్యాసము సిద్ధిస్తే ఇక ప్రాణాయామ పూర్వక కుంభక - సాధన ప్రక్రియలతోను, ప్రయత్నములతోను అగత్యము తరుగసాగుతుంది. ఆత్మయొక్క విశేష లక్షణములు నిస్సందేహంగా స్వ-స్వాభావికమే అయిన తరువాత, ఇక ఆత్మ గురించిన సాధనపూర్వక ప్రయత్నములతో పని ఏముంటుంది?

సహిత కుంభకము

సమస్వరూప సంబంధమైన కుంభకమునకు సాధన రూపమగు సహిత కుంభకము - 4 భేదములైనవిగా వర్ణించి చెప్పబడుచున్నది.
(1) సూర్య కుంభకము (2) ఉజ్జాయీ కుంభకము (3) శీతళీ కుంభకము (4) భస్త్రీ కుంభకము.

(1). సూర్య కుంభకము

ఈ సూర్యకుంభకమును నిర్వర్తించటానికై (అభ్యసించటానికై)

✤ పవిత్రమైన నిర్జన (జనసంచారము లేనట్టి) రాళ్లు -రప్పలు ఉండనట్టి, చలి- వేడి-తడి (నీరు) ఏ మాత్రము లేనట్టి - చక్కటి ప్రదేశమును ఎన్నుకోవాలి.
✤ ఆచోట ధనస్సు ప్రమాణము గల చోటును చక్కగా తీర్చిదిద్ది సంసిద్ధం చేసుకోవాలి.
✤ ఆ చోటు మరీ ఎత్తుగా గానీ, మరీ పల్లముగాగాని కాకుండా ఉండాలి. పవిత్ర భావాలు జనింపజేసేదై ఉండాలి.
✤ అట్టిచోట ‘బద్ధపద్మాసనము’ ధరించి సరస్వతీ చాలనయోగమును అభ్యాసము చేయాలి.
✤ (తరువాత) దక్షణాడ్యా సమాకృష్య బహిష్ఠం పవనగ్ం శనైః యధేష్టం పూరయేత్, వాయుగ్ం। బయట ఉన్న గాలిని కుడి (పింగాళ) నాడిలోనికి ఇష్టముగా అనిపించినంతసేపు ‘పూరణము’ (Air inviting and filling into ‘PINGALA’) అభ్యసించాలి.
✤ ఆపై - రేచయేత్ ఇడయాతతః। ‘ఇడనాడి’(ఎడమనాడి) ద్వారా రేచకము (Releasing out) చేయాలి.
✤ కపాలము (Higher part of the Head, forehead)ను శోధనము చేస్తూ (బుద్ధితో వాయువును బయటకు పంపు భావనను నిర్వర్తిస్తూ) నెమ్మదిగా వాయురేచకము - బుద్ధిపూర్వకంగా చేయాలి.

ఈ విధంగా (1) సరస్వతీ చాలనము (2) పింగళపూరకము (3) ఇడారేచకము (4) కపాల రేచకముల అను 4 విధములను అభ్యసించుట వలన దేహములో వాతదోషము (Air - disfunctioning in certain parts of the physical Body), దేహములో రోగక్రిములు ప్రోగుపడి రోగములను కలిగించు దోషము తొలగిపోగలవు. ఇట్టి నాలుగు ప్రక్రియలను మరల మరల నిర్వర్తించటమును ‘‘సూర్యభేదము’’ అను యోగవిధిగా చెప్పుచున్నారు.

(2) ఉజ్జాయ కుంభకము

❋ ముఖగ్ం సంయమ్య - నోరును మూసి ఉంచి,
❋ నాడీభ్యాం ఆకృష్య పవనగ్ం శనైః - ఇండ-పింగళ రెండు నాడుల చేతను మెల్లగా గాలిని లోనికి పీల్చి
❋ కంఠప్రదేశము నుండి హృదయ స్థానము వరకు ‘సస్వనము’ (Systematicaly rhythmic) అను వాయునియామకము (లేక) వాయు కుంభకము నిర్వర్తించి,
❋ పూర్వం చెప్పినట్లు పింగళపూరకము, ఇడారేచకముచేస్తూ ‘కుంభకము’ చేయటము

ఇట్టి ప్రాణ సంయమనప్రక్రియను ‘ఉజ్జాయ కుంభకము’ అని పిలుస్తున్నారు.

ఇట్టి ‘ఉజ్జాయీ’ - శీర్ష (తల)భాగములో జనించే అనలము (వేడి)ని హరించివేయగలదు. గొంతులో శ్లేష్మదోషమును తొలగించగలదు. సర్వరోగములను హరించి, మనస్సుకు పుణ్య (Positive) భావములను కలిగిస్తుంది. దేహములో జలతత్వమును పరిపుష్టిగాను, సర్వత్రా సమముగాను చేస్తుంది. నాడులలోని జలదోషమును, ఉదరములో ధాతుదోషములను నశింపజేయగలదు.

‘ఉజ్జాయకుంభకము’ గురించి మరొక విశేషం కూడా!
గచ్ఛతః తిష్ఠతః కార్యమ్ ఉజ్జాయ్యాఖ్యంతు కుంభకమ్। యోగి కూర్చున్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, ఆయా కార్యములు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు కూడా ఉజ్జాయకుంభక ప్రాణాయామము నిర్వర్తిస్తూ ఉండవచ్చు కూడా! (ఉత్+జాయీ → లేస్తూ, కదలుచూ, నడుచుచూ ఉన్నప్పుడు కూడా గాలి-పీల్చి, కుంభించి, గుండెలో నింపి, నెమ్మదిగా వదలు వాయుచలన విధానము).

(3) శీతళీ (లేక) శీతహృత్ (నామ) కుంభకము

ఓ బుద్ధిమంతుడా! ఇక శీతళీ కుంభకము గురించి వినండి.

♠︎ జిహ్వాయా వాయుం ఆకృష్య.. నాలుకతో బయట గాలిని ఆకర్షించి, స్వీకరించి,
♠︎ నెమ్మదిగా ముక్కు రంధ్రముల ద్వారా రేచకము చేసి, (మరల) గుండె నిండుగా నోటితో గాలిపీల్చడం.
♠︎ నోరు మూయటము. గుండె, భుజములలో కుంభకము, ఆతదనంతరము ముక్కుపుటముల ద్వారా నెమ్మదిగా గాలి వదలటము.

ఇట్టి ప్రక్రియన ‘శీతహృత్ కుంభకము’ అని అంటున్నారు.

ఇది కూడా గుండెలో మాంసపు విభాగములో ఏర్పడే దుష్టవాయువుల దోషము (గుల్మము)ను హరిస్తుంది. ప్లీహ (పొత్తి కడుపు) దోషములను, వాత-పిత్తముల దోషములను, తొలగిస్తుంది. ముఖ్యముగా దేహములో ఉష్ణాధికత్వముచే ఏర్పడే జ్వరము (High Temperature)ను తగ్గించి దేహములో శీతలత్వము పెంపొందిస్తుంది కాబట్టి ‘శీతహృత్‌నామ కుంభకము’ అనే పేరుచే చెప్పుకోబడుతోంది.

(4). భస్త్రీ (భస్త్ర) కుంభకము

(1) రేచక భస్త్రి తతః పద్మాసనం బధ్వా → పద్మాసనమును వైచుకొని,
సమగ్రీవ ఉదరః సుధీ → మెడను పొట్టను నిలువుగా ధరించుచూ, బుద్ధితో ధారణచేయువాడై,
ముఖగ్ం సంయమ్య → నోటితో గాలి పీల్చి, నోటిని మూసిఉంచి,
యత్నేన ప్రాణం ఘ్రాణేన రేచయేత్→ ప్రయత్నపూర్వకంగా రెండు ముక్కు పుటముల నుండి గాలిని వేగంగా రేచకముచేయుటము (గాలిని వేగంగా వదలటం) - రేచక భస్త్రీ అనబడుచున్నది.

(2) పూరక భస్త్రి : యథాలగతి కంఠాత్తు కపాలే సస్వనం తతః వేగేన పూరయేత్-నోటితో గాలిని పీల్చి, కంఠప్రదేశము నుండి-కఫాల ప్రదేశము వరకు అత్యంత వేగంగా గాలిని పూరించటము. కఫాలం యొక్క గుండ్రని ఉపరి భాగమును వేగముగా వాయువు స్పృశించు వరకు పూరించటము. క్రమముగాను, నెమ్మదిగాను ముక్కు పుటములనుండి వదలటము.

(3) హృదయపద్మమున గాలిని నింపి ఆ గాలిని కంఠము ద్వారా కఫాలమును వేగంగా స్పృశింపజేస్తూ పూరించటము.

ఈ విధంగా రేచక పూర్వకములను ఒకదాని తరువాత మరొకటి నిర్వర్తిస్తూ ఉండాలి.

రేచకము - నోటితో గాలి తీసుకొని, ముఖంలో గాలిని సంయమనం చేసి, రెండు ముక్కుపుటముల ద్వారా గాలిని వేగంగా వదలటము.

పూరకము - కంఠమును సంకోచింపజేస్తూ హృదయమునందు గాలిని నింపి, హృదయం నుండి కంఠము ద్వారా గాలిని వేగంగా కఫాల స్థానము స్పృశింపజేయటం (Speed Touch) - హృదయపూరక - కఫాల సంవేగ సంస్పర్శ. ఈ విధంగా పునః పునః నిర్వర్తించాలి.

ఏ విధంగా అయితే గొడ్డలి, పలుగు, పార మొదలైన ఇనుప వస్తువులను తయారు చేసే కమ్మరి కొలిమితిత్తితో వేగంగా గాలిని వదలి కొలిమిలోకి ఊదుతూ పంపుచున్నాడో.. ఆ విధంగా స్వశరీరంలో సంచారములు చేస్తున్న వాయువును నెమ్మదిగా ఆకర్షించి వేగంగా పూరక-రేచకములు నిర్వర్తించాలి.

⌘ ⌘ ⌘

ఎంతెంతవరకై శరీరము ఇబ్బంది-శ్రమ లేకుండా (నొప్పి మొదలైనవి రాకుండా) భరించగలదో గమనించి, అంతంత వరకు సూర్యనాడిని వాయువుతో పూరించిఉంచాలి.

భస్త్రి కుంభకము వలన ప్రయోజనములు
➤ కంఠములో పేరుకొన్న దుర్వాసనలను బయటకు త్రోసివేయగలదు.
➤ శరీరములో వాతమును (State of icy solidness in certain bodily inner spaces) తొలగించి అగ్నిని వృద్ధి చేయగలదు.
➤ కుండలినీ శక్తిని సముత్సాహపరచి, బ్రహ్మరంథ్రమువైపు సంసిద్ధమగునట్లుగా ప్రయాణింపజేయగలదు.
➤ పాప-బలహీన-నిరుత్సాహ-ద్వేష-మోహ భావావేశములను తొలగించి, మనస్సును సంరక్షించి పవిత్రముగా చేయగలదు.
➤ పుణ్య భావములను (Positive thoughts and feelings) సముత్సాహపరచగలదు
➤ శుభ్రప్రదమైనది. శాంతి, సుఖదాయకమైనది. అట్టి యోగిని చూచినప్పుడు ఇతరులకు ప్రశాంతపూర్వకమై ఆహ్లాదము కలుగుచూ ఉంటుంది.
➤ కంఠము, కఫాలము, ముఖము, హృదయము మొదలైన ప్రదేశములలో ఘనీభవించు కఫమును మొదలంట్లా తొలగించి వేయునది. శరీరమును నిర్మలము, సుఖవంతముగా తీర్చిదిద్దునది.
➤ సత్వ రజో తమోగుణముల సకేంద్రీకృతత్వముచే ఏర్పడుచున్న ‘విష్ణుగ్రంథి’, ‘బ్రహ్మగ్రంథి’, ‘రుద్రగ్రంధు’లను విభేదించివేయగలిగినట్టిది,

ఇట్టి ఉత్తమ ప్రయోజనములను ప్రసాదించునది కాబట్టి భస్త్రీకుంభకము (లేక) ‘భస్త్రాఖ్య కుంభకము’ దినదినము శ్రద్ధగా’ అభ్యసించవలసినదై యున్నదిగా యోగవేత్తలచే సూచించబడుచున్నది.

⌘ ⌘ ⌘

పైన మనం చెప్పుకున్న సూర్యా, ఉజ్జాయీ, శీతళీ, భస్త్రీ కుంభకములను ప్రియముగా నిర్వర్తిస్తూ ఉండగా, అట్టి యోగి దేహ మనో వీధులలోని సర్వకల్మషములను కడిగివేస్తున్నాడు. నిష్కల్ముషుడు - నిర్మలుడు అగుచున్నాడు. అట్టి యోగశక్తిచేత త్రి(3) బంధములను ఆశ్రయించి - సంసారబంధనముల నుండి సులభముగా విడివడుచున్నాడు. అట్టి ‘బంధయోగత్రయము’ గురించి ఇప్పుడు వివరించుకుందాము.

బంధత్రయము → మూల - ఉడ్డీయాణ - జాలంధర।

యోగవేత్తలు అభ్యసించు యోగ బంధలక్షణములను ‘3’ విధములుగా విభాగించి యోగవేత్తలు వివరిస్తున్నారు.

(1) మూలబంధము (2) ఉడ్డీయాణ బంధము (3) జాలంధర బంధము.

(1) మూలబంధము :

అధోగతిం అపానం వై ఊర్ధ్వగ్ం కురుతే బలాత్,
అకుంచనేన తం ప్రాహుః ‘మూలబంధో’ అయం ఉచ్యతే’।
అపాన వాయువు స్వభావతః అధోగతి (Downward Move/Travel) కలిగి ఉంటోంది. ఈ శరీరము, ఇందులో క్రిందకు ప్రవహించు అపాన వాయువు యోగసాధకులకు యోగసిద్ధికై ఉపకరణములుగా అగుచున్నాయి. ఎట్లా? క్రిందకు ప్రయాణ ప్రసరణము అన్నివేళలా కలిగి ఉంటున్న అపాన వాయువును బుద్ధిబలముతో ఊర్ధ్వముగా చేయు యోగాభ్యాసమును ‘‘మూలబంధయోగము’’ అని అంటున్నారు.

ఈ బంధము మూలాధార ప్రదేశము నుండి ఆరంభమౌతుంది కాబట్టి మూలబంధము.

ఆ విధంగా అపానవాయువు అధోగమనము నుండి యోగాభ్యాసపూర్వకంగా వెనుకకు మరల్చబడినదై వాయువుతో కూడి (ప్రాణశక్తితో కూడి) దేహములోని అగ్ని (వహ్ని) మండలమును పొందుచున్నది. - సంప్రాప్తే వహ్నిమండలే, తతో అనిలశిఖా దీర్ఘా వర్థతే వాయునా హతా। అట్టి అగ్నిమండలము వాయువుచే (అపానముచే) స్పృశించబడుచూ ఉండగా, అద్దాని తేజస్సు ప్రవృద్ధమౌతూ వస్తుంది.

క్రమంగా అగ్ని - అపాన వాయువులు రెండూ ఏకమై ఉష్ణస్వభావము కలిగియున్నట్టి ప్రాణశక్తితో కలియనారంభిస్తాయి. తత్ఫలితంగా దేహములో కాంతి-వేడిమి-వేగములు జనించి, దేహములోని మూలాధారకోశములో నిద్రాముద్ర వహించియున్న కుండలినీశక్తికి సంతప్తము (ఉష్ణము - Warming) కలిగిస్తాయి.

అప్పుడు తోకపై కర్రదెబ్బ తిన్న ఆడత్రాచువలె తీవ్రమైన శ్వాసలు (బుసలు) చేస్తూ కుండలినీ శక్తి (The will power) తన వంకర స్థితిని వీడి, దేహములో ఋజుత్వము (Stright forwardness) పొందనారంభిస్తుంది. పాము వేగముగా బిలప్రవేశము చేయురీతిగా కుండలినీ శక్తి శిరస్సుకు ఉపరితలముగా ఉన్న ‘బ్రహ్మనాడి’ నందు ప్రవేశించుటకు ప్రయత్నశీలమగుచున్నది.

కుండలినిని అనుసరించిన బుద్ధి క్రమంగా - బ్రహ్మజ్ఞానానందము, సర్వతత్త్వ స్వరూపము అగు పరబ్రహ్మత్వము సంతరించుకోనారంభిస్తుంది. అటువంటి ఉత్తమోత్తమ ప్రయోజనము ప్రసాదించగలదు కాబట్టే యోగ పుంగవులు ‘మూలబంధము’ను తప్పక చేయవలసి సాధన కర్తవ్యముగా యోగసాధకులకు ప్రబోధిస్తున్నారు.

(2) ఉడ్డీయాణ బంధము:

కుంభకాంతే రేచకాదౌ కర్తవ్యస్తు ఉడ్డియాణకః।
(1) రేచకము (2) పూరకము (3) కుంభకము (4) పునఃరేచకము - అను నాలుగు విశేషములు గల ‘కుంభకాంత-రేచకాదౌ’-యోగాభ్యాసమును ‘ఉడ్డీ యాణబంధము’ అని అంటూ ఉంటారు.

కుంభకముచే ముగుస్తూ, రేచకముయొక్క ప్రారంభములో ధ్యాసను నిలుపు ఈ యోగాభ్యాసముచే ప్రాణశక్తి
(1) సుషుమ్న నుండి ఊర్ధ్వముగా పయనించి,
(2) బ్రహ్మరంధ్రమును స్పృశిస్తూ,
(3) ఇంకా శిరో ఊర్ధ్వభాగము చేరుప్రయోజనము కలిగి యుండటంచేత,
ఈ బంధమునకు ‘ఉడ్డీయాణము’ అనే పేరు వచ్చింది.

కందము (పొట్ట భాగములో) ఉడ్డీయాణము

అట్టి పొట్ట ప్రదేశములో రేచకి-పూరక-కుంభక-పునఃరేచక ఉడ్డీయాణము యొక్క ప్రయోజనములు:

3. జాలంధర బంధము

పూరకాంతే తు కార్తవ్యో బంధో జాలంధరాభిదః।
‘పూరకాంత-కుంభకము’ ప్రారంభస్థాన బంధము → జాలంధర బంధముగా పిలువబడుచున్నది.

పూరకము తరువాత-కుంభకము ప్రారంభముకాకముందు గల స్థానమునందు ఈ జాలంధర బంధము అభ్యసించబడుతోంది.

ఈ జాలంధర బంధములో కూడా,
🌺 సుఖాసనము అవధరించటము.
🌺 సరస్వతీ చాలనము.
🌺 ప్రాణ నిరోధము.
ఇవన్నీ నిర్వర్తించబడుచున్నవై ఉంటాయి.

- ప్రథమే దివసే కార్యం కుమ్భకానాం చతుష్టయం - మొదటి దశలో కుంభక చతుష్టయమును (రేచక - పూరక- కుంభక-పునఃరేచకములను) రోజుకు ఒక్కసారి నిర్వర్తించాలి.

- ప్రత్యేకం దశ సంఖ్యాకం ద్వితేయే పంచభిః తథా।। - రెండవ దశలో పదిసార్లు దేహములోని ‘5’ ప్రదేశములో కుంభక చతుష్టయమును అభ్యాసం చేయాలి. (5 x 2)

- వింశతి అలం తృతీయే : ‘3’వ దశలో 20 సార్లు మాత్రమే చేయాలి.

- ఏహ్ని పంచవృద్ధ్యాదినే దినే! ఆ తరువాత 4వ దశలో రోజుకు ‘5’ ‘5’ చొప్పున కుంభక చతుష్టయమును పెంచుకుంటూ పోవచ్చు. ఆ తరువాత ఉడ్డీయాణ - జాలంధర ఉభయము ఒకటి తరువాత రెండవదిగా ‘ఒకటి-రెండు-మూడుసార్లు, రోజూ అభ్యాసము చేయబడు గాక!

ఏదిఏమైనా దినదినాభ్యాసం ఉండాలి. బంధత్రయ సమన్వితంగా నిత్యము (Regularly, Every Day) → కుంభకాభ్యాసమును ఒక అలవాటుగా నిర్వర్తించటం ఆవస్యకం. (ఎన్నిసార్లు చేసినా కూడా ప్రతిరోజు చేయటము అలవాటుగా అయిఉండాలి).


ప్రాణ సంయమ యోగాభ్యాసములో ప్రారంభ ప్రతిబంధకములు

ప్రియ గౌతమ మునీశ్వరా!

వాయుజయము, ప్రాణరోధనము (లేక) నిరోధము, కుంభక చతుష్టయము, ఇత్యాది యోగాభ్యాస విషయాల గురించి; కుండలినీశక్తిని ఇడ-పింగళనాడులలో వాయురేచక - పూరక - కుంభకముల సహాయంతో కుండలినీ శక్తి యొక్క సుషుమ్న ముఖప్రాప్తి, సరస్వతీ చాలనము.. ఇట్టి విశేషాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా!

అయితే, ఇట్టి యోగసాధనలకు సంసిద్ధుడగుచున్న యోగికి, పూర్వ-సంస్కారవశంచేత కొన్ని కొన్ని ప్రారంభదశలో విఘ్నములు ఏర్పడుచూ ఉంటాయి. అట్టి విఘ్నములు కలుగగానే యోగాభ్యాసి, అమాత్రానికి బద్ధకించరాదు. వెనుతిరుగరాదు. ‘‘అవన్నీ యోగాభ్యాసములు కొనసాగుచుండగా, అభ్యాసబలం చేత తప్పక తొలగగలవు’’.. అను నమ్మికతో ఆత్మ విశ్వాసంతో, పట్టుదలతో యోగాభ్యాసము నందు, ముందుకు సాగాలి.

అట్టి విఘ్నములు పది రకములుగా విభజించి యోగతత్త్వజ్ఞులు శాస్త్రీయంగా విశదీకరిస్తున్నారు.

అట్టి దశవిఘ్నముల గురించి కొంత వివరించుకొని, ఆ తరువాత యోగాభ్యాస విశేషములు మరికొన్ని సంభాషించుకుందాము.

దశ విధ యోగాభ్యాసమార్గ- విఘ్నములు

(1) మొదటి విఘ్నము: ‘‘అయ్యా! మేము యోగాభ్యాసమునకు సంసిద్ధమై, ఇక ప్రారంభించగానే మాకు కొన్ని ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. అందుకే, దినదినాభ్యాసం చేయలేకపోతున్నాం! మరి ఏమి చేద్దాంలెండి!’’ అని కొందరు యోగాభ్యాస ప్రారంభకులు ప్రారంభదశలో పట్టుదలను సడలిస్తున్నారు.

దివా సుప్తిః → పగటి నిద్ర; యోగాభ్యాసం ప్రారంభించిన కొద్దిసేపటికే కునుకువచ్చి, తూలటము.

నిశాయాం తు జాగరాత్ → రాత్రిపూట చాలాసేపు నిద్రపట్టకపోవటము, ఏదో తోచకపోవటము.

అతిమైథునామ్ → మైథునము (Sexual Intercourse) నకు సంబంధించిన ఊహలు ముసరటము.

బహు సంక్రమణం → ఏవేవో ఆలోచనలు, భావాలు ముసురుకోవటము. అనేక వ్యావహారిక సంబంధమైన ఆవేశపూరిత - అనుబంధములు గుర్తుకు రావటము.

నిత్యగ్ం రోథాః మూత్ర ‘పురీషయోః → మూత్ర పురీషములు సరిగ్గా జరుగుట లేదని అనిపించటము. ఏవేవో ఏదో మార్పుగా అనిపించటము.

విషయ అశనదోషాశ్చ → విషయములకు సంబంధించిన దిగుళ్ళు. ఆకలి తగ్గినట్లు అనిపించటం - ఆహారం రుచించకపోవటం.

ప్రయాసమ్ → అలసటగా అనిపించటం.

శీఘ్రం ఉత్పద్యతే రోగ స్తంభయేత్, యది సంయమీ, యోగాభ్యాసేన మే రోగం ఉత్పన్న - ఇతి కధ్యతే। శరీరంలో ఏవో దోషాలు బయటపడుచున్నాయని, రోగాలేవో ఉత్పన్నమగుచున్నాయని - అనుకోసాగటము.

తతో అభ్యాసం త్యజేత్ ఏవం ప్రథమమ్ విఘ్నమ్ ఉచ్యతే। ఇటువంటివన్నీ ప్రథమ విఘ్నములు అగుచున్నాయి. కొందరి విషయంలో ఇవి కారణమై, ప్రాణయోగ సాధన నుండి విరమించటం జరుగుతోంది.

అవన్నీ యోగాభ్యాస ప్రారంభదశలో అనిపించినప్పటికీ, అవి దేహంలో తిష్ట వేసుకొన్న దోషాలు బయటపడటంవంటివి. యోగసాధన కొనసాగుచుండగా సరి అయిపోతాయి. అందుచేత - నిరుత్సాహపడకూడదు. ఉత్సాహము, సాహసము, ధైర్యములతోను, ప్రియభావముతోను యోగాభ్యాసము కొనసాగించెదరు గాక. గురువుతో సంభాషిస్తూ ప్రత్యుత్సాహవంతులు కావాలి.

(2) ద్వితీయ విఘ్న-సగ్ంశయాఖ్యం చ : ‘‘మోక్షము-యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి’’-అని అన్నారు కదా! మరి, వేలాది మందిలో ఎక్కడో ఒక్కరికి సిద్ధిస్తుందని అంటున్నారే? మరి నాకు సిద్ధిస్తుందా? నాకైతే నమ్మకం కలగటం లేదు. ఇంతా ప్రయత్నించి ఏమి సాధిస్తున్నట్లు?’’ ఇటువంటి అనుమానములు పొడచూపనారంభిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క జీవుడు యోగ పరాకాష్ఠకు అర్హుడే సుమా!

(3) తృతీయం చ ప్రమత్తాత : మూడవ విఘ్నము ప్రమత్తత. అశ్రద్ధ. బద్ధకము. అప్రమత్తుడు (Enthusicartic, attentive) కాకపోవటము. ఉత్సాహము, సాహసము,పట్టుదలను ఆశ్రయిస్తూ ఉంటే - ప్రమత్తత తొలగిపోగలదు. ఎట్లాగైనాసరే, నిద్ర, బద్ధకములను జయించవలసిందే.

(4) ఆలస్యాఖ్యన్ చతుర్ధంచ : యోగసాధనకు ఆశీనులవ్వాలని సిద్ధపడుచూనే, మనస్సు ఏవేవో వ్యవహారముల వైపుగా ప్రసరించుచుండటం చేత బద్ధకము అశ్రద్ధలతో కూడిన ‘చ్యుతి’ (Distraction) వచ్చిపడుతూ ఉంటుంది. ‘‘కాసేపు ఆగుదాం. అప్పుడు యోగసాధనకు కూర్చుందాంలే!’’ → అని అనిపించటం జరుగుతుంది. క్రమంగా యోగసాధనను మానివేయాలనే బుద్ధి బలము పుంజుకోసాగుతుంది. యోగాభ్యాసి ఎల్లప్పుడు ‘కాలనియమము’ను నిర్దేశించుకొని అనుసరించటమే ఉపాయము.

(5) నిద్ర : యోగాభ్యాసము ప్రారంభించగానే ఆవలింతలు, నిద్ర ముంచుకురావటము.

(6) విరతి : ఏవేవో జ్ఞాపకమునకు వస్తూ ఉండటం చేత మనస్సు యోగక్రియావిశేషము నందు, యోగ భావన యందు రమించక, ఎటెటో సంచారములు చేస్తూ ఉండటము. ధ్యాస → ధ్యానము వైపుగా కాకుండా.. అల్పమగు లౌకిక విషయాల వైపు మరలటము. ‘‘వాళ్లు అటువంటివారు. ఇటువంటి వారు’’ - అనుమాటలలో అభిరుచి.

(7) అహ్రాంతి : ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చిపడటము. ఏవేవో రూపములు, నీడలు, ఆకారములు కనిపించసాగటం. ధ్యాస ఏకాగ్రం కాకపోవటము.

(8) విషమం : ఎవ్వరిపైనో కోపము, ఆవేశము, అవమానము, రోషము, పగ, లోభము → మొదలైన విష సమానమైనవి గుర్తుకు వస్తూ, మనస్సునకు చెప్పరాని ఆవేశము, ఆక్రోశము కలగటము. ‘‘ఇంతకింతకు వాళ్ల-వీళ్ళ సంగతి చూస్తాను చూడు!’’ అనే దూషణ భావములు ప్రబలటం.

(9) అనాఖ్యం : తెలివి తక్కువదనం; ఆలోచనలు మొద్దుబారిపోవటం. ఏమీ అనుభవముచే గ్రహించలేకపోవటము. పైకి యోగిగా, లోన భోగిగాను, లోభిగాను ఉండిపోవటము.

(10) అలబ్ధి యోగతత్త్వస్య : ‘‘నాకింకా యోగసిద్ధి లభించదేం? ఆరు నెలలో కలగాలంటారుకదా? నాకు ఇదేం గతి? ఇంకా ఎన్నాళ్లు చేయాలి?’’.. అనే అలబ్ధిత్వము..

ఇవన్నీ యోగభ్యాసి - తన యొక్కయోగాభ్యాసము వలననే - కలుగుచున్నాయని అనుకోవచ్చుగాక!

వాస్తవానికి ఇవన్నీ మనోఫలకము (Box of Inwardness) నందు దాగి ఉన్న జన్మజన్మలుగా అభ్యాసవంతంగా ఆర్జించిన దోషపరంపరలు అభ్యంతర సంస్కారములు మాత్రమే!

అందుచేత…, యుద్ధవీరునివలె యోగాభ్యాసి విఘ్నములపై యుద్ధము ప్రకటించవలసిందే. వేరే త్రోవ లేదు.

ఇత్యేతత్ విఘ్నదశకం విచారేణ త్యజేత్ బుధః। ఈ దశ విఘ్నములను బుధులు విచారణ చేసి, చక్కటి ఉపాయములను ఆశ్రయించి వాటిని త్యజించాలి. తెలివి, పట్టుదల గురుప్రపత్తి, ఇష్టదైవము పై భక్తి, ఆత్మనమ్మకము - ఇటువంటివన్నీ విఘ్నములు జయించటానికి ప్రోత్సాహక కారణములు.

ఆ విధంగా స్వవిచారణచే, సద్గురువుల పోత్సాహముచే, తోటి యోగాభ్యాసుల సోదాహరణములచే దశ విఘ్నములను జయించివేయాలి. ప్రాణాభ్యాసముపై పట్టుదల మనోగత విఘ్నములను తొలగించగలదు. ‘‘ఇది నా బంధనములను తొలగించి, ఆత్మౌన్నత్యమును సిద్ధింపజేయగలదు’’.. అను శాస్త్రము మీద, తన మీద, సాధన మీద, గురుసూచనపైన నమ్మికతో యోగసాధనలో ముందుకు సాగాలి. దైనందికంగా యోగాభ్యాసమును శ్రద్ధతో పట్టుదలతో నిర్వర్తించాలి.

యోగాభ్యాసము ఎల్లప్పుడు తనకు, తదితరులకు కూడా ఆహ్లాదంగానే ఉండాలి. తననుగాని, తదితరులను గాని బాధించే రీతిగా ఉండరాదు. ప్రేమాస్పదంగాను, సర్వాత్మత్వము ఆశయముగాను ఉండాలి.


కుండలినీ ఊర్ధ్వ సంచాలనము

క్రమంగా.. సుషుమ్నాతీయతే చిత్తం, న చ వాయుః ప్రధావతి। చిత్తము ఇడ-పింగళ నాడులలో సంచారము జయించి సుషుమ్నయందు లీనమై నిర్మలత్వము సంతరించుకొనగలదు. వాయువు క్రమంగా తన చంచలత్వమును త్యజించి యోగసాధకునికి వశమగుచున్నది. దేహ సంబంధమైన, మనోసంబంధమైన దోషములన్నీ తొలగిపోనారంభిస్తాయి.

అధోగతిం అపానంవై ఊర్ధ్వగం కురుతే బలాత్। అధోగతి (Downward flow/trend) గల అపాన వాయువు స్వభావంగాను, బుద్ధిబలము చేతను ఊర్ధ్వముగా ఆకుంచనము అవగలదు. ఇదియే మూలబంధము.

అపానశ్చ ఊర్ధ్వగో భూత్వా వహ్నినా సహ గచ్ఛతి। ఊర్ధ్వగతిని పొందిన అపానవాయువు అగ్నితో ఏకమై ప్రవర్తించసాగుతుంది.

ప్రాణ స్థానమ్ తతో వహ్నిః। అపానము, అగ్ని - ఉభయము ప్రాణస్థానమును చేరుచున్నాయి.

ప్రాణ - అపానౌచ సత్వరమ్ మిళిత్యా కుండలీం యాతి। ప్రాణ-అపానములు కలిసి అగ్ని-వాయువులతో కూడి కుండలిని తాకుచున్నాయి. ప్రసుప్తా కుండలాకృతిః। నిదురించుచున్న కుండలీ శక్తిని వాయు-ఉష్ణములు వేగముగా స్పృశించి నిద్రలేపుచున్నాయి.

తేన అగ్నినా చ సంతప్తా పవనేనైవ చాలితా! అప్పుడు వాయువుచే స్పృశించబడుచూ అగ్నిచేత కుండలినీ శక్తి సంతప్తము పొందుచున్నది.

→ ఇకప్పుడు కుండలినీ శక్తి ఊర్ధ్వగమనము పొంది సుషుమ్నముఖ ద్వారము ద్వారా విద్యులేఖవలె ప్రకాశించసాగుచూ ‘ఆజ్ఞాచక్రము’ వరకు విద్యుల్లత వలె సంప్రకాశమానమవసాగుచున్నది.

→ అట్టి కుండలినీ శక్తి రజోగుణ సముద్భవమైన బ్రహ్మగ్రంధిని భేదించి, పైపైకి ప్రయాణించసాగుచున్నది.

→ క్రమంగా సత్వగుణ రూపమగు హృదయమున స్థానము కలిగియున్న ‘విష్ణుగ్రంథి’లో ప్రవేశించుచున్నది. ఆ విష్ణుగ్రంథిని కూడా ఛేదించి ఇంకనూ ఊర్ధ్వముగా ప్రయాణించసాగుతోంది.

→ అక్కడి నుండి భృవోర్మధ్యగా గల రుద్రగ్రంధిలో కుండలినీశక్తి ప్రవేశించుచున్నది.

కుండలినీ - భ్రూమధ్యము నుండి ఊర్ధ్వ గమనము

రుద్ర గ్రంధియందు ప్రవేశించిన కుండలినీ శక్తి భ్రూమధ్యమును కూడా ఛేదించి (అధిగమించినదై) - యాతి శీతాంశు మండలమ్! శీతల స్వభావమగు చంద్రమండలమును (కేవల మనో మండలమును) స్పృశించుచున్నది.

అప్పుడు కుండలిని- 16 దళములతో శిరోఉపరిభాగమున గల అనాహత చక్రము (సూర్య స్థానము) నందు స్థానము పొందినదై, చంద్ర మండలము నుండి ప్రభవించుచున్న ద్రవమును స్వయముగా శోషింపజేయుచున్నది.

షోడశ దళ మండలమున ప్రవేశించిన కుండలినీ శక్తి - శివైక్యమవటము

ప్రాణచలన వేగముచే చలించుచున్న కుండలినీశక్తి దేహములో గల రవిమండలము (Heat Generating zone) నుండి ఉష్ణమును గ్రహించుచున్నది. రక్తమును ధాతుశేషమగు ‘పిత్తము’గా మార్చివేయుచున్నది.

అట్టి కుండలినీ చలనము - శుద్ధశ్లేష్మముచే సిక్తమై (నిండినదై) యున్న చంద్ర మండలములోని శ్లేష్మమును తన యొక్క ఉష్ణత్వముచే పొడిగా (Dry Cleaning) చేసి వేయుచున్నది.

అప్పటివరకు తెల్లటి రంగులో ప్రకాశించుచున్న చంద్రమండలము కుండలినీ ఉష్ణత్వ ప్రభావముచే ఎర్రబారిపోవుచున్నది.

ఇకప్పుడు శుక్లవర్ణ చంద్రాకాశము కుండలినిచే క్షోభింపబడినదై సుడివలె తిరుగుచు భ్రమతము (Round moving) పొందుచున్నది.

అద్దాని విషమత్వముల నుండి బహిర్గతమైన చిత్తము చంద్రాకాశ-సుడులకు చిక్కక, ఈవల ఉంటోంది. (చంద్రుడు = మనస్సు)

అప్పుడు ఆ యోగి యొక్క చిత్తము చంద్రమండలము నుండి ద్రవించు నిర్మల రసమును ఆస్వాదించి, స్వస్థత పొంది, తదేవ పరమం భుక్త్వా, స్వస్థః స్వాత్మరతోయువా। ఆతడు స్వస్థుడై కేవలమగు స్వాత్మయందు సర్వదా రమించువాడై ఉండగలడు.

ఓ గౌతమా!

షోడశ (16) దళములతో కూడిన ‘అనాహతము’ అనే చక్రములో ప్రవేశించిన కుండలినీశక్తి ఆ తదనంతరము నిర్వర్తించు విశేషముల గురించి మరికొన్ని విశేషములు వినండి.

అష్టవిధ ప్రకృతి రూపధారిణీ, కుండలినీ

అనాహత చక్రమును కూడా దాటి వేసిన కుండలిని ‘‘భూమి - జలము - అగ్ని - వాయువు - ఆకాశము - బుద్ధి-అహంకారము’’.. అనబడే అష్టవిధ ప్రకృతి స్థానము నందు ప్రవేశించుచున్నది. అవన్నీ స్వశరీర విశేషాలుగా, స్వకీయ చైతన్యమునకు అనన్యంగా ధారణ చేస్తోంది.

క్రోడీకృత్య శివం యాతి! తాను తనయందు కలుపుకొంటూ పోతున్న బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంధి, రుద్రగ్రంధి, చంద్రమండలము, అనాహతచక్రము మొదలై సర్వమును (షట్‌చక్రములతో సహా), ఇంకాకూడా, పంచభూత - మనోబుద్ధిచిత్త ధర్మములతో సహా సర్వము తనయందు క్రోడీకరించుకొనుచున్నది. (It is encompassing and encovering all else into itself and starting to look at as “I am all this”).

క్రోడీకృత్య విలీయతే। తనను తానే క్రోడీకరించుకొని ‘‘చిదానంద రూపమ్ - శివోఽహమ్’’ నందు విలీనము పొందుచున్నది.

అట్టి యోగసిద్ధుడు శివతత్త్వము నందు ప్రవేశించినవాడై, సర్వము శివానందము నందు ఏకము చేయుచున్నాడు.

‘‘శివతత్త్వమునకు అభిన్నము’’ అను భావనయందు లయం చేసి, తానే శివానంద లహరీ స్వరూపుడగుచున్నాడు.

ఈ విధంగా ఊర్ధ్వ-అధోగమనములు గలిగియున్న వాయుతత్త్వమగు ప్రాణశక్తికే ప్రాణేశ్వరుడు, శుక్ల (వెండివలె తెలుపు) వర్ణుడు - అగు సర్వాత్మక శివభగవానుని యందు ప్రవేశించి శివత్వము పొందుచున్నది.

కుండలినీశక్తి సదాశివ సర్వాత్మకునియందు లయము పొందినట్టి యోగపుంగవుని విశేష లక్షణములు :

★ ప్రాణ-అపానములు సమత్వము పొందినవై కుండలినీ యానమును అనుసరించినవై ఉంటాయి. ఆతడు విశ్వప్రాణుడై, ఆ బ్రహ్మ-స్తంభ పర్యంతము స్వకీయప్రాణ (ఇష్ట-చిత్త-ప్రేమ) స్వరూపంగా ఆస్వాదిస్తాడు.. సమరస సప్రాణుడు అగుచున్నాడు. ఈ సమస్త విశ్వమునందు, ‘‘త్వమ్-తత్’’ అనబడే వాటియందు తనయొక్క ‘‘అప్రతిహతమైన ఉనికి’’ని గమనించి ‘‘బ్రహ్మానంద భరితుడు’’ అగుచున్నాడు.

★ ఇక ఈ భూతప్రకృతి అధికముగా అయినా (లేక) అల్పముగా అయినప్పటికీ కూడా, సర్వవాచక స్వరూపుడై ‘‘త్వమేవాహమ్ - నీవుగా ఉన్నది నేనే’’.. అను తత్‌త్వమ్ భావనా వాచ్యుడు అగుచున్నాడు.

★ అగ్నిమూష (అగ్నిపై ఉంచి బంగారమును కరగించు ఉక్కుపాత్ర)లో కరగి ఆవిరగుచున్న బంగారము ఆ పాత్ర నిండా ఆక్రమించి ఉంటున్నతీరుగా - ఈ ‘విశ్వము’ అనే పాత్ర యందు ఆత్మరస స్వరూపుడై అంతటా నిండి ఉంటాడు. ఈ 14 లోకములతో కూడిన ఈ సమస్తమునందు నేను లేనిచోటెక్కడ? - అని చిరునవ్వు నవ్వుకొనుచున్నాడు.

★ ఆతని ఆధిభౌతిక దేహము (Material Body of five elements) , ఆధిదైవికత్వము (దివ్యత్వము - Absolute Purity with Beyondness to worldly impressions) సంతరించుకొనుచున్నది. అత్యంత నిమలమై, అనిర్వచనీయమగు ఆతివాహికత్వము (ఈవిశ్వము, ఈ విశ్వజనులు, ఈ 14 లోకములు నాకు దేహము వంటివి అనబడు) విశ్వేశ్వర - విశ్వంభరాస్థితి పొందినదగుచున్నది.


ఆతివాహిక దేహ విశేషము

ఓ గౌతమా!

ఈ జీవుడు భౌతికంగా కాళ్లు చేతులు, ముక్కు, నోరు, కళ్లు, తలకాయి మొదలైన పాంచభౌతిక సమ్మిళిత రూపుడై అగుపించవచ్చుగాక! వాస్తవానికి ఈ భౌతిక దేహము సందర్భమాత్ర ప్రకృతి కల్పిత రూపమేగాని ఈ జీవుని వాస్తవ స్వరూపము కానే కాదు. మరి? భావనలు ఎక్కడి నుండి జనించుచున్నాయో - అట్టి ఆతివాహిక శరీరమే సహజ శరీరము.

❀ ఎట్టి మనోబుద్ధి - చిత్త-అహంకార జాడ్యములు, దోష-పరిమిత ఇష్టాఇష్ట భావములు స్పృశించజాలనట్టిది;
❀ సర్వ బంధముల నుండి సర్వదా వినిర్ముక్తమైనట్టిది;
❀ మలదోష రహితమైనది. నిత్య నిర్మలము అయినట్టిది;
❀ ఎరుగబడు సర్వమునకు మునుముందే ఉన్నట్టి ఎరుక స్వరూపమైన్నట్టిది; చిన్మయాత్మకము;
❀ ‘నేను’కు మునుముందే ఉండి జాగ్రత్-స్వప్న-సుషుప్తులలో వేరువేరైన ‘నేను’ లను సంప్రదర్శించుచుండటచే మత్-ఆత్మకమైనట్టిది
→ అట్టి ‘ఆతివాహిక దేహమే నేను’ అని ఎరుగుట చేతనే ఈ జీవుడు తనను తాను వాస్తవముగా తెలుసుకొన్నవాడై శివస్వరూపుడు, అఖండ-అవ్యాజానందస్వాత్ముడు కాగలడు.

‘‘ఆతివాహిక దేహోఽహమ్’’ భావన సిద్ధించుకొన్న కుండలినీ-శివసంయోగ సిద్ధుడు..,

ఇతి తగ్ం స్వస్వరూపాహి : శివతత్త్వమునందు ‘‘కుండలినీ ప్రవేశ-తదేవరూప-యోగసిద్ధి’’ పొందిన యోగేశ్వరుడు→ఇదంతా స్వస్వరూప-అభిన్నమైనదిగా ఎరిగి వినోదిస్తున్నాడు.

గౌతముడు : గురువర్యా! సర్వము శివమయమేనని అంటారు కదా?

గురువర్యులు : అవును. నిస్సందేహముగా అది పరమసత్యము.

గౌతముడు : అంతా శివతత్త్వమే అయిఉండగా, ఈ జగత్తు ఎందుకు ఎప్పుడు ఎట్లా జనిస్తోంది? ఎట్లా, ఎప్పటికి నశిస్తోంది?

గురువర్యులు : అదా? చెప్పుతాను విను. మతీ రజ్జు భుజంగవత్। ఒకడు బాటలో త్రాడును చూచి, ‘పాము’ అని తలచి సర్వభయములు పొందాడు. దీపము తెచ్చి కాస్తంత వెలుతురులో పరిశీలనగా చూచినప్పుడు - ‘‘అబ్బే। ఇది పాము కానే కాదు. త్రాడు మాత్రమే!’’ - అని తెలియవచ్చింది. ఈ సందర్భములో తాడులో పాము ఎప్పుడు, ఎందుకు పుట్టింది? ఎప్పుడు నశించింది? గౌతమా! చెప్పండి!

గౌతముడు : గురువర్యా! త్రాడు ఉన్నచోట పాము పుట్టనూ లేదు. నశించనూ లేదు. త్రాడే పాముగా ఒకప్పుడు భ్రమించబడింది. పరిశీలన తర్వాత త్రాడు త్రాడుగా గమనించబడి, ‘‘పాముకాదు’’ అని తెలియుటచే, పాముకు సంబంధించిన భ్రమ తొలగిపోయింది.

గురువర్యులు : బిడ్డా! గౌతమా! ఈ ‘జగత్తు’గా దర్శించబడుచున్న విశేషము కూడా - అట్టి త్రాడుయందు పాము వంటిదే! వాస్తవానికి ఈ కనబడేదంతా కూడా సర్వదా శివతత్త్వమే!

కుండలినీ శక్తి ప్రాణరోధ యోగముచే జనించిన ఉష్ణ-వాయువుల వలన నిదురలేచి; సుషుమ్నచే ఆకర్షించబడి;
ప్రత్యుత్సాహి అయి, సుషుమ్ననాడిద్వారా ఊర్ధ్వగామి అయి ;
➤ బ్రహ్మ-విష్ణు-రుద్ర గ్రంధులను చేధించి;
➤ ఇంకనూ ఊర్ధ్వపధమును వేగంగా ప్రయాణిస్తూ ‘భ్రూమధ్య’ను ఛేదించి;
➤ చంద్రమండలమున ప్రకాశించి, షోడశదళ చక్రము నుండి చంద్రమండల ద్రవమంతా ఆవిరిచేసివేసి;
➤ అష్టవిధ ప్రకృతిని క్రోడీకరించి ఏ శివస్థానము పొందుచున్నదో →
అట్టి శివతత్త్వమునకు భిన్నమై ఎక్కడా ఏదీ లేదు. శివోఽహమ్! శివ తత్ త్వమ్!

మార్పు-చేర్పులతో కూడిన జ(జనించునది) - గత్ (గతించునది).. అను క్రియా పరంపరలతో కూడిన ‘‘జగత్తు’’ సర్వదా సర్వత్రా ఘనీభూతమై ఉన్నట్లు భ్రమచే అనిపిస్తోంది.

‘కుండలినీ శివైక్య సిద్ధి’ని సిద్ధించుకొన్న యోగికి జగత్తు జగత్తుగా కాక, … ‘‘శివాత్ పరతరమ్ నాస్తి’’ అను సూత్రార్థమగు అఖండ శివతత్త్వముగా తెలియవచ్చి, అనునిత్యానుభూతమగుచున్నది.

మృషైవ ఉదేతి సకలం! ఈ ఇంద్రియములకు విషయమగుచున్న దృశ్యవ్యవహారమంతా భ్రమయందు అసత్యముగా పుట్టి,
మృషైవ ప్రవిలీయతే! భ్రమయందే, అసత్యమునందే నశించుచున్నది. (అనగా) లేనిదై పోవుచున్నది.

రౌప్య బుద్ధిః శుక్తికాయాగ్ం స్త్రీ-పుగ్ంసో భ్రమతోయథాః। కొందరు అమాయకులు, అపరిశీలకులు అగు స్త్రీ పురుషులు ముత్యపు చిప్పలను చూచి, ‘‘ఆహా"! ఈ ముత్యపుచిప్పలలో మనకు విలువైన వెండి లభిస్తోంది కదా!’’.. అని సంతోషపడి, వాటిని ఇంటికి మోసుకొని తెచ్చుకున్న రీతిగా.., ‘‘ఈ దృశ్య జగత్తు వాస్తవమే’’ అని అజ్ఞానముచే భావించబడినదై ఉంటున్నది.

మట్టితో తయారు చేసిన స్త్రీ - పురుషుల బొమ్మలలో, మట్టి దృష్ట్యా - భేదమేమిటి చెప్పండి? ఇదంతా మట్టి బొమ్మల కొలువు వంటిదే మరి!

★ పిండాండము (Individual Physical form) - బ్రహ్మాండము (Universal physical form) ఏకమేగాని వేరైనవి కావు.
లింగము (జీవాత్మ) - సూత్రాత్మ (Universal soul).. ఏకమేగాని, అనేకము కాదు. రెండూ మనోరూపమే!
★ స్వప్రకాశ-చిదాత్మల ఐక్యము అయినట్టి ఇవన్నీకూడా అఖండ- ఏక శివపరబ్రహ్మము యొక్క ఐక్యరూపములే! ఇదే జీవశివైక్యము!

కుండలినీ శక్తి యొక్క సుషుమ్నా ముఖద్వార ఊర్ధ్వప్రయాణ ‘‘శివ-శివా యోగోపాసన’’చే పరబ్రహ్మము స్వానుభవము, స్వా-అభిన్నము అగుచున్నది.


మరొక్కసారి వివరిస్తున్నాను.

అట్టి కుండలినీ శక్తి…,
♠︎ బిసంతంతునిభా → తామరతూడు నందలి దారము వలె సూక్ష్మమైన శక్తిరూపము.
♠︎ శుభా → ఉపాసనచే సర్వశుభములు కలుగజేయునట్టిది.
♠︎ మూలకందం ఫణాగ్రేణ దృష్ట్వా కమల కందవత్→ మూలకందమున (మూలాధారములో) కమల ఫలమును (పండు)ను నోట కరచిన పాము పడగవలె ఉంటోంది.
♠︎ ముఖేన పుచ్ఛగ్ం సంగృహ్య, బ్రహ్మరంధ్ర సమన్వితా → ముఖము మూలాధారమున, తోక చివర బ్రహ్మరంధ్ర సమన్వితమై (బ్రహ్మరంధ్రము వరకు ఉనికి కలిగి) యున్నది.

కుండలినీ యోగాభ్యాసము
🧘🏿‍♂️ పద్మాసనాగతుడై, స్వస్థుడై,
🧘🏿‍♂️ గుదస్థానమును (మూలాధారకాశ ప్రదేశమువద్ద) ఆకుంచ్యము చేసి (పట్టుబిగించి),
🧘🏿‍♂️ కుంభకముతో కూడిన యోగసాధనా మానసుడై,
🧘🏿‍♂️ వాయుమ్ ఊర్ధ్వగతమ్ కుర్యన్ → అపానవాయువును ఊర్ధ్వగతంగా చేస్తూ,
🧘🏿‍♂️ వాయువు యొక్క ఆఘాతముచే మణిపూరకము ద్వారా అగ్నిస్థానమగు మణిపూరకము ద్వారా స్వాధిష్ఠానము చేరి - వాయ్వా ఘాత వశాత్ అగ్నిః స్వాథిష్ఠానగతో జ్వలన్ - జ్వలించుచు,
🧘🏿‍♂️ అగ్ని - వాయువులచే స్వాధిష్ఠానము నుండి → మూలాధారములో నిదురిస్తున్న ‘బిసతంతు తనీయశీ’ అని వర్ణించబడు పద్మపుష్పకాడలోని దారము వంటి ‘కుండలినీ శక్తి’ అను సర్పరాజును నిదురలేపి,
🧘🏿‍♂️ ఉష్ణవాయువులచే జనించు ప్రత్యుత్సాహముచే కుండలినీ శక్తిచే బ్రహ్మ-విష్ణు-రుద్ర గ్రంధులను-తతో భిత్వా - భేదింపజేసి,
🧘🏿‍♂️ కమలాని భినత్తి షట్ → షట్కములము (ఆరు దళము కమలము గల శిరో ఉపరిభాగము - Upper circle part of skullను కూడా ఛేదించి,
🧘🏿‍♂️ సహస్ర కమలే శక్తిః శివేన సహ మోదతే - సహస్ర కమలయుక్తుడగు (సహస్రారము - అనబడు) శక్తిశివైక్య అఖండ సర్వతత్వాత్మకమును (- స+అంబ-సకల తత్త్వవిదూరక - సర్వతత్త్వ స్వరూప ఏకాత్మానంద స్వరూపుడగు శివభగవానుని) చేరి ఆనందిస్తున్నాడు. ‘శిహోఽహమ్’ స్థానము చేరుచున్నాడు.

అట్టి సర్వము స్వస్వరూపముగా దర్శించు అవ్యాజ - అకారణ - అవాక్యవర్ణిత ఆనందాస్వాదనయే ‘మోక్షము’ అని, ‘పరాజ్ఞేయము’ అని, ‘నిర్వృతికారిణి’ అని వర్ణించబడుచున్నది.

స ఏవ అవస్థా పరాజ్ఞేయా, స ఏవ నిర్వృతి కారిణీ - ఇతి.
అచ్చట ‘‘జగత్తులలో ‘నేను’ - నాలో జగత్తులు’’ అను ఉభయము ఏకస్వరూపానుభవమగుచున్నాయి.


2వ అధ్యాయము - ఖేచరీ విద్య

గౌతముడు : మహాత్మా! గురుదేవా! ఇప్పుడిక ‘‘ఖేచరీవిద్య’’ యొక్క ఔన్నత్యము, వివరణల గురించి మీనుండి తెలుసుకోగోరుచున్నాను.

గురువర్యులు : మిత్రమా! గౌతమా! మునీశ్వరా!

అథ అహం సంప్రవక్ష్యామి విద్యాం ‘ఖేచరి’ సంజ్ఞికామ్।
ఇప్పుడు మనము ‘ఖేచరీ’ అనే సంజ్ఞచే చెప్పబడుచున్న యోగ విద్య గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాము. ఇద్దానిని ఎరిగినవాడు జరామరణ పరిధులను అధిగమించివేయుచున్నాడు. లోక పరిమితిని దాటివేయుచున్నాడు. అట్లాగే మృత్యువు, వ్యాధి - ఇవన్నీ సమీపించినప్పుడు కూడా, ఖేచరీ దృష్టిచే సర్వదా ఉపశమనము పొందినవాడై, కేవల సాక్షీభూతుడై ఉండగలుగుచున్నాడు. అందుచేత బుద్ధిని దృఢతరము చేసుకొనుటకై ‘ఖేచరీ’ని యోగాభ్యాసులు సమభ్యసించెదరు గాక!

ఓ యోగాభ్యాసులారా, జరామృత్యుభయములకు, అనేక మానసిక రుగ్మతలకు ‘ఖేచరీవిద్య’ - ఔషధము.

ఖేచరీ విద్యను గ్రంథ పూర్వకంగాను (Textually and Technically), అర్థపూర్వకంగాను (In its practical and Application dimention) - ఎరిగి యోగతః ‘ఖేచరీ’ని అభ్యసించాలి సుమా!

ఓ మునీ! తం, మునే! సర్వభావేన గురుం మత్వా సమాచరేత్। అట్టి ఖేచరీ అభ్యాసము యొక్క గురి, విధి విధానము, ఆశయ నిర్వచనము, సిద్ధించు విధానములను తెలుసుకొనటానికై - యోగవిధానమును ఎరిగిన గురువును సమాశ్రయించాలి.

ఎందుకంటే, ఖేచరీ విద్యను ఎరుగట, ఖేచరీ యోగాభ్యాసము - ఈ రెండూ కూడా దుర్లభమైనవే! అనగా, శ్రద్ధగా విని, మార్గమును ఎరిగి అభ్యాసం చేస్తేనే ఉత్తమ ఫలము.

(1) అభ్యాసము (Practice) (2) మేళనము (Interpretatively wel understanding)

ఈ రెండు ఒక్కసారే గురువు లేకుండా సిద్ధించాలంటే అది కష్టమైన విషయమే! కేవలము ‘అభ్యాసము!’ మాత్రమే అనుసరిస్తే, మేళనము (Catching mentally and achieving its sense) సిద్ధించదు. అభ్యాసమాత్రనిరతా న విందతి ఇహ మేళనమ్!

హే బ్రహ్మన్! ‘అభ్యాసము’ అనునది కూడా జన్మ-జన్మాంతర ధ్యాస-ప్రయత్నములచేతనే లభిస్తోంది. అభ్యాసము లేకుండా, ‘‘కేవలం వినటము, చదవటము మొదలైన వాటి వలన మేము సిద్ధింపజేసుకుంటాము’’ - అని చెప్పితే, అప్పుడు కూడా ఖేచరీ పరాకాష్ఠచే ఆత్మసంయోగస్థితి వందల జన్మలకు కూడా సిద్ధించేది కాదు.

మేళనం జన్మనాం తత్తు శతాంతేఽపి న లభ్యతే!
అభ్యాసం బహుజన్మాంతే కృత్వా తద్భావ సాధితమ్, మేళనం లభతే కశ్చిత్ యోగీ జన్మాంతరే క్వచిత్!
బహుజన్మల అభ్యాసము చేసిన యోగి, తత్ భావనచే సాధించబడిన ‘మేళనము’చే ఈ జన్మలోనో, మరుజన్మలోనే ఖేచరీ యోగ పరాకాష్ఠ స్థితి సిద్ధింపజేసుకుంటున్నాడు. అయితే ఎవ్వడైతే గురుముఖతః ఖేచరీ విధిని, మేళనమును ఆశ్రయించి, అభ్యసించుచున్నాడో, అట్టివాడు శాస్త్రములలో చెప్పబడిన సిద్ధిని అతి శీఘ్రముగా పొందుచున్నాడు. (ఖే = ఆత్మాకాశమునందు, చరీ = ప్రవేశము, విద్య = ఎరగటము)

యోగకుండలినీ-ఉపనిషత్-ఖేచరీ-విద్య

యోగాభ్యాసి.. ఈ మూడింటిని ఎరిగినవాడై, ఇప్పుడే ఇక్కడే శాస్త్ర ప్రవచిత ఖేచరీ విద్యాఫలమును ఫలదీకరించుకొనవచ్చును కూడా!

గ్రంథము = పాఠ్యపుస్తకము ; (Literature, theoritical part)
అర్థము = పరమార్థము అనుభవ సంబంధమైన అనుభూతి (Practical implementation by which a certain state of wel-understood and wel sensing mind gets equipped).

ఎప్పుడైతే ఈ రెండిటి మేళనము (Matching wel - combined state) లభిస్తుందో - తదా శివత్వమ్ ఆప్నోతి, నిర్ముక్తః సర్వ సంసృతే! - అట్టివాడు సర్వ సంసృతుల నుండి (దృశ్య సంబంధిత బంధముల నుండి సంసార బంధనముల నుండి నిర్ముక్తుడై (Having been relieved) శివత్వమును సముపార్జించుకొనుచున్నాడు.

గౌతముడు (శిష్యుడు) : మహాత్మా! ఖేచరీ విద్య (లేక) ఆత్మవిద్యకు శాస్త్రము ముఖ్యమా? గురువు ముఖ్యమా!

గురుదేవుడు : నాయనా! గౌతమ మునీ! గురువు చేయు సూచనలు, బోధనల ఆకళింపు అనుసరణముల చేతనే విద్య సిద్ధించగలదు. అంతేగాని, శాస్త్రములు చదివినంతమాత్రంచేత కాదు. ఇందులో సందేహమే లేదు.

అయితే, శాస్త్రం వినాఽపి సంబోద్ధుం గురువోఽపి న శక్నుయుః। శాస్త్రము ఉంటేనే గురువు బోధించగలుగుతారు. ‘శాస్త్రం’ సూచన చేయకుండా గురువు శిష్యునికి బోధించటము దుర్లభతరం. అందుచేత శాస్త్రము, గురువు - రెండూ అత్యావశ్యకమే! యతి (ప్రయత్నశీలుడు) శాస్త్రము, గురువు లభించేవరకూ పర్యటన (search) కొనసాగిస్తూనే ఉండాలి. ‘శాస్త్రము’ లభిస్తే ఇక ఆ యతి సిద్ధికొరకై సుసంపన్నుడు అగుచున్నట్లే. అయితే శాస్త్రార్థముకొరకై గురువు!

న శాస్త్ర వినా సిద్ధిం దృష్టాచైవ జగత్ త్రయే!
శాస్త్రమును ఆశ్రయించకుండా ‘3’ లోకములలో ఎన్నిచూచినా, ఎంత వెతికినా సిద్ధి లభించదు. శాస్త్రము = ఇతః పూర్వీకుల అనుభవములు + మార్గ సూచనలు

అందుచేతనే.. (1) శాస్త్ర ప్రదాతను (2) జ్ఞానాంశను ప్రసాదించువారిని ఇరువురిని అచ్యుతునితో (విష్ణు భగవానునితో) సమానంగాను, తత్ అభ్యాసమును నేర్పువానిని సాక్షాత్తూ పరమశివునిగాను సమాశ్రయించాలి.

మనము చెప్పుకొనుచున్న ఖేచరీ విద్య అత్యంత రహస్యమైనది. రహస్యంగానే ఉంచుకోవాలి. అర్హత పరిశీలించకుండా ఇతరులకు బోధించరాదు.

ఎక్కడ ఖేచరీ విద్య ఎరిగిన గురువు ఉంటారో, దివ్యమగు అట్టి ఆత్మయోగము కొరకై (ఖేచరీ ఆత్మ సంయోగము కొరకై) ఎంత దూరమైనా ప్రయాణించి అట్టి గురువును ఆశ్రయించాలి. అట్టి గురువుచే బోధించబడు ఖేచరీ విద్యను శ్రద్ధగా విని, నెమ్మదిగా అభ్యాసము చేస్తూ, త్వరలో ఖేచరీ విద్యాసిద్ధుడు అవ్వాలి. అభౌతికమగు ‘‘ఆత్మాఽహమ్ ఖేచరీ’’ తత్త్వమునందు సంప్రవేశితుడు కావాలి.

ఖేచర్యా ఖేచరీం యుంజన్ ఖేచరీ బీజ పూరయా, ఖేచరాధిపతిః భూత్వా ఖేచరేషు సదా వసేత్। ఖేచరీ విద్యచే ఆత్మాకాశమును యోగాభ్యాసము చేసి, ఖేచరీ బీజమును మొలకెత్తించి, ఖేచరాధిపతి అయి, ఖేచరీ యోగమునందు నిత్య నివాసి కావాలి.

‘‘అంబు (జల) మండల భూషితము’’ అయినట్టి ఖేచరి యొక్క అభ్యాసముచే జనించే వెచ్చతనముచే ఖేచరీ బీజము (ఖేచరీ జలస్పర్శచే) మొలకలెత్తినదై, ఖేచరీ యోగము సుప్రసిద్ధము అగుచున్నది.
- సోమాంశ (మనస్సు) యొక్క నవకమగు (9వదగు) వర్ణము ప్రతి లోమముచే ఉద్ధరించబడుచున్నది.
- దాని నుండి జనించు త్ర్యంశకమైన (3 అంశాలు గల) అక్షరము - (అ-ఉ-మ= ఓం) - ‘చంద్రరూపము’ అని చెప్పబడుతోంది.
- దానికి విలోమముగా ‘8’వ వర్ణము ఉత్తమమైనది.
- అద్దానికన్నా ‘5’వది పరమోత్తమం.

యోగకుండలినీ-ఉపనిషత్-సోమాంశ-మనస్సు

బహుభిన్నమైన చంద్రుని కళలు గల ఈ అంతరమును ‘‘కూటము’’ - అంటారు. పరమాత్మ = కూటస్థుడు.
‘‘పరమాత్మ స్థానమే ముఖ్యాశయము’’-అని యోగాభ్యాసి ఎల్లప్పుడూ ‘గుర్తు’ ఉంచుకొనియే ఉండాలి సుమా!

గురూపదేశముచే లభించు ఖేచరీ యోగము సర్వ యోగములకెల్ల ప్రసిద్ధమైనది. ఈ ‘దేహమే నేను’ అను దేహముతో వచ్చిపడిన మాయ గురుబోధాశ్రయమునకు (ఆత్మాశ్రయమునకు) విరుద్ధమైనది. అట్టి దేహబంధము 12 విధజపములచే కూడా తొలగుటలేదు.

గురూపదేశపూర్వకంగా ఖేచరీ యోగభ్యాసము (ఖేచరీ ఆత్మయేవాహమ్। నాన్యః జపమును) 5 లక్షల మార్లు జపించువారికి ఖేచరీ సిద్ధి కలుగగలదు.
- సర్వ విఘ్నములు తొలగుతాయి.
- దేవతలు ప్రసన్నులు అవగలరు.
- ఖేచరీ విద్యాభ్యాసిచే వార్ధక్య లక్షణములగు తలనెరియటం, శరీరపు ముడతలు మొదలైనవి జయించబడగలవు.

మనో-దేహ ఆరోగ్య ప్రదమగు ‘ఖేచరీ మహావిద్య’ను గురువు నుండి తెలుసుకొని అభ్యాసవశము చేసుకొనుటచే మోక్షసిద్ధి సులభతరము అగుచున్నది. కొద్దికాలంలో కరతలామలకమవగలదు. అట్టి యోగసిద్ధునికి దేహ సంబంధమైన రాక - పోకలు, జరా - వార్ధక్య - మరణాదులు క్రీడావినోదమేగాని, ‘పీడ’ కాదు. బంధము కాదు.

కేవలము ఖేచరీవిద్యా - యోగాభ్యాసముచే సుధామయమగు కేవలీసిద్ధి లభించుటలేదనిపిస్తే అప్పుడు ‘ఆత్మచే ఆత్మగా జగత్ దర్శనము’ అను సమ్మేళనముతో కూర్చి ఖేచరీ జపము కొనసాగించాలి.

హే బ్రహ్మన్! ఆత్మగురించి శాస్త్రముల ద్వారా తెలుసుకొని, అట్టి ఆత్మభావన అనునిత్యము అవటమును ఖేచరీ - మేళన విద్యచే సిద్ధింపజేసుకొనెదరుగాక! ఖేచరీ విద్య యొక్క పరమాశయము - ‘ఆత్మమేవాహమ్’ సందర్శనమే!

ఖేచరీ యోగాభ్యాస విధానము.
(గురుము ఖతః బోధించబడి అభ్యసించవలసినట్టిది.)

తాలు మూలగ్ం సముత్కృష్య సప్తవాసర మాత్రవిత్, స్వగురూక్త ప్రకారేణ మలం సర్వం విశోధయేత్।।
బ్రహ్మరంధ్రము యొక్క సూటిగా క్రిందివైపు ప్రదేశమగు మూలకాశమునందు (కొండ నాలుక స్థానము నందు) నాలుకయొక్క చిట్టచివరి ప్రదేశాకాశమును ఏకము చేయటము - అనునది ఖేచరీ యోగాభ్యాసము. అట్టి 7 వారముల అభ్యాసముచే, గురువు నేర్పుచున్న రీతిగా నిర్వర్తించి బుద్ధి కుంభకముచే సర్వదోషములను పరిశుద్ధ పరచుకోవటము. (బుద్ధిచే బుద్ధికి సాక్షియగు ‘ఆత్మ’యొక్క అవగాహనము).

స్నుహిపత్ర నిభం శాస్త్రం సుతీక్షణాం స్నిగ్ధ నిర్మలమ్, సమాదాయ తతః తేన రోమమాత్రం సముచ్ఛినేత్
బొమ్మజముడు ఆకుతో సమానమైన పదునైన - చిక్కనైన శరముతో రోమమాత్రములను (నాలుకపై) తొలగించి (నాలుకను పరిశుభ్రముగా గీచి),
హిత్వా సైంధవ పథ్యాభ్యాం చూర్ణితాభ్యాం ప్రకర్షయేత్ పునః సప్తదినే ప్రాప్తే రోమమాత్రం సముచ్ఛినేత్।
సైంధవ లవణ చూర్ణముతో ప్రకర్షణము చేసి, మరల 7 రోజులు గడచేవరకు రోమమాత్రమును తొలగిస్తూ ఉండటము.

ఈ విధంగా నిత్యము ఉద్యుక్తుడై 6 నెలల వరకు ఆచరిస్తూ ఉండాలి. 6 నెలలకు ఈ నాలుక మూలమునగల సిరాబంధము తొలగుచున్నది.

- అధవాగీశ్వరీ ధామ శిరో వస్త్రేణ వేష్టయేత్। - అప్పుడు ‘వాగీశ్వరీ ధామము’ (పెదిమలు-నాలుక చివర)ను శిరస్త్రానమువలె చుట్టచుట్టాలి.
- శనైః ఉత్కర్షాయేత్ యోగీ కాలవేళావిధానవత్। - ‘కాలవేళా విధానము’ను ఎరుగుచూ నెమ్మదిగా ఉత్కర్షణము (Inward Folding) చేయాలి. (ఇది కుంభకరూపము + నాలుకచలనము).

ఈ విధమైన దైనందిక అభ్యాసముచే అట్టి (భావసిద్ధి రూపమగు) ఉత్కర్షణము (Pressure) భ్రూమధ్యవరకు వచ్చుచున్నది. అడ్డముగా చెవి రంధ్రముల వరకు కూడా వచ్చుచున్నది.

క్రిందికి గడ్డము వరకు కూడా వెళ్ళుచున్నది. 3 సంవత్సరముల అభ్యాసముచే, పైకి కేశాంతము వరకు (వెంట్రుకల చివరి వరకు) వెళ్ళుచున్నది. అడ్డముగా చేతుల వరకు, కంఠరంధ్రము వరకు వెళ్ళుచున్నది. ఆచోట అణు - ఘనీభూతత్వము సిద్ధించుచున్నది.

మరొక ‘3’ సంవత్సరములకు బ్రహ్మరంధ్రమును ఉత్కర్షణము ఆవరించి ఉండగలదు.

అట్టి ఘనీభూత చిత్ తత్త్వము →
- అడ్డముగా చూళి (చుబుకము) చివరి వరకు.
- క్రిందకు - కంఠ బిలము వరకు వెళ్ళుచున్నది.
- నెమ్మది నెమ్మదిగా మహావజ్రకవాటమును (కపాల ఊర్ధ్వస్థాన కవాటమును) భేదించి వేయుచున్నది. బీజయుత విద్య పొందటము దుర్లభంగా చెప్పబడుచున్నది.
- తస్యాః షడంగం కుర్వీత తయా షట్ సర్వ భిన్నయా। దానిని షట్ (6) స్వరములకు భిన్నమైన దానిగా ‘షడంగము’ చేయాలి. (షడంగన్యాసం = (1) పాదములపై మోకాళ్లవరకు (2) కటి పర్యంతము (3) హృదయము వరకు (4) కంఠము వరకు (5) కనుబొమ్మలవరకు (6) కపాలము వరకు - 6 చోట్ల బుద్ధిని ఏకాగ్రం చేసి పరతత్త్వధ్యానమును చేస్తూ నియమిత సమయము (say 3ని।।) బుద్ధిని నిలిపి ఉంచటము.

⌘⌘⌘

ఈ విధంగా కరన్యాసము చేస్తూ ఉండగా, ఆ యోగికి సర్వసిద్ధులు కలుగగలవు.

పైన చెప్పబడిన అభ్యాసమును మెల్లగా చేయాలేగాని ఒక్కసారే చేయాలని ప్రయత్నించకూడదు. ఒక్కసారే చేయాలని ప్రయత్నిస్తే శరీరము గాయపడి పడిపోవచ్చుకూడా! అందుకే మెల్లమెల్లగా గురుముఖతః అభ్యాసం చేయాలి.

⌘⌘⌘

హే బ్రహ్మన్!

ఎప్పుడైతే బాహ్య మార్గంగా జిహ్వ (నాలుక) బ్రహ్మబిలము (కొండనాలుక స్పర్శతో బ్రహ్మరంధ్రము వరకు గల సరళరేఖను) స్పర్శరూపంగా చేరుచున్నదో, అప్పుడు ఆతని బ్రహ్మమార్గమును నిరోధించటానికి త్రిదశులగు దేవతలు కూడా సమర్థులు కాదు.

అయితే ‘‘జపము + బుద్ధిధారణ + మథనము’’ - ఒక్కసారే నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఖేచరీముద్ర త్వరత్వరగా సిద్ధించగలదు.

మథనము - ఉపకరణ విధానంగా

‘ఖేచరి’ యొక్క మరొక విధానము
- బంగారము (లేదా) వెండి (లేక) ఇనుప శలాక (సన్నని దారము)ను పాలతో తడిపి నాశికారంధ్రములలో ప్రవేశింపజేసి,
- దేహమును సుఖమయ ఆసనమునందు నిలిపి,
- ప్రాణమును హృదయస్థానము నందు నిరోధించి (నిలిపి),
- దృష్టిని భ్రూమధ్యగా నిలిపి, ఉంచి,
- నెమ్మదిగా చిలకరించటమును ‘‘మథనము’’ చేయుచుండటము.

6 నెలలు ‘మథనాయోగము’ను అభ్యసించటము చేత కూడా బుద్ధి సులభముగా ఆత్మభావన యందు ప్రవేశించగలదు - అని యోగవేత్తలచే సూచించబడుచున్నది.

అట్టి భావన చిన్నపిల్లవాడు కునికిపాట్లు పడురీతిగా జగత్తు- ఆత్మలు అనుభూతమౌతాయి.
అయితే, న సదా మథనగ్ం శస్తం, మాసే మాసే సమాచరేత్।

అట్టి మధనము నెలకొక్కసారి మాత్రమే చేయతగినది. అంతేగాని ఎల్లప్పుడు చేయతగినది కాదు. (కాల నియమము గురు నిర్ణయము).

అట్టి యోగాభ్యాస సందర్భములో జిహ్వ మార్గమును అతిక్రమించరాదు.
(ఈ అభ్యాసము కూడా యోగ-గురు ముఖతః విని, వారి పర్యవేక్షణలో మొదట నిర్వర్తించాలి).

ఈ విధమైన అభ్యాసము కొనసాగుచుండగా 12 సంవత్సరాల కాలములో ధృవమగు సిద్ధి లభించగలదని సిద్ధగురువుల పాఠ్యాంశములు.

ఈ విధంగా ఖేచరీ వివిధ రీతులైన ఖేచరీ ముద్రలను అభ్యాసము చేయువాడు అభ్యాససిద్ధిచే -
(1) సమస్త విశ్వము ఆత్మయందు,
(2) సమస్త విశ్వమునందు ఆత్మను,
(3) ఆత్మను స్వశరీరము నందు,
(4) స్వస్వరూపమునకు అభిన్నమైనదిగాను
- 4 రీతులుగా దర్శించుచున్నాడు.

ఖేచరీ యోగమును ‘బ్రహ్మాండ మహామార్గము’ అని, ‘రాజదంత-ఊర్ధ్వకుండలిని’ అని కూడా పిలుచుచున్నారు.


3వ అధ్యాయము - బ్రహ్మదేవ-పరమశివ సంవాదము

గురువర్యులు: ఓ గౌతమా! ఒక సందర్భంలో బ్రహ్మదేవునికి దేవదేవుడగు పరమశివునికి జరిగిన సంభాషణను-సందర్భోచితం కాబట్టి వినండి.

సృష్టికర్తయ బ్రహ్మదేవుడు ఖేచరీ సంబంధమైన మేళనమును ‘హ్రీం భం సం షం ఫం సం క్షమ్’’ ఉచ్ఛారణ భావనలను రచన చేసి, అభ్యాసపూర్వకంగా ఆశ్రయిస్తూ, ఒక సందర్భములో జగద్గురువగు శంకర భగవానుని సమీపించి ఇట్లు సంభాషించసాగారు.

పద్మజుడు (బ్రహ్మదేవుడు) : హే జగదీశ్వరా! పరమేశ్వరా! శంకర భగవాన్! ఈ దేహములో నిత్యము జరుగుచున్నట్టి సిద్ధయోగులు గమనిస్తున్నట్టి (1) అమావాస్య (2) పౌర్ణమి (3) పాడ్యమిల విశేషమేమిటో, వాటి సంజ్ఞలు ఎట్టివో దయతో తత్త్వార్థసహితంగా వివరించండి.

శంకర భగవానుడు : హే సృష్టికర్తా! బ్రహ్మభగవాన్। లోకకళ్యాణార్థమై మీరు అడిగిన విశేషములను చెప్పుచున్నాను వినండి.

పగలును కాలమునందు (జాగ్రత్తును కాలగతి చమత్కారముగాను), అమావాస్యను పౌర్ణమియందు (ఇహ వ్యవహారమంతా పరాత్మయందు) సుస్థిరీకరించివేయాలి. లేకుంటే సంసారము ఈ జీవుని పట్ల కొనసాగుచూనే ఉంటుంది. వేరే త్రోవలేదు.

‘కామము’ చేత ఈ జీవుడు ‘‘విషయ ఆకాంక్షి’’ (One who is in the deep habit of cluster expectations and cluster desires) పొందుచున్నాడు.

విషయములు (విషయ ఆకాంక్ష) = పరస్పర సంబంధ, అనుబంధ బాంధవ్యముల పట్ల → అభినివేశములు, అభిప్రాయములు, ఆశ నిరాశ దురాశ పేరాశలు; సంగతి, సంఘటనల పట్ల మానసిక వేదనలు; క్షోభలు కలిగి ఉండటము; కోప, తాప, ఆవేశములు; నమ్మకములు, అపనమ్మకములు; ఊహ అపోహలు మొదలైనవి. ఇవన్నీ ‘విషయజాలము’గా గమనించబడుచున్నాయి. ఈ జీవుడు అట్టి ‘విషయములు’ - అనే త్రాళ్ళతో నిర్మితమైన జాలము నందు ‘చేప’ వలె చిక్కుకుని ఉంటున్నాడు.

విషయాత్ కామమోహితః : జగత్ దృశ్యమును భావావేశముతో దర్శించుచూ జగదీశ్వర సంకల్ప-ప్రమేయములను పూర్తిగా మరచి ఉండటం.
దృష్టాంతము : ఒకడు నాటకంలో ఒకపాత్రను స్వీకరించి నటిస్తూ, ఆ పాత్ర యొక్క సుఖ-దుఃఖ-కోప-తాపముల ‘నిజమే’ అన్నట్లుగా తన హృదయ-మనో-బుద్ధులలో పేర్చుకుని ‘‘ప్రవర్తన (బాహ్యమున కూడా) ప్రదర్శన’’-అను అలవాటు పొందటం తన సహజమగు (నటుడిని కదా! - అనే) రూపమును ఏమరవటము. ఈ కనబడే సంగతి - సందర్భములు జగత్ రచయిత చమత్కారమననది గుర్తులేకపోవటం.

ఓ బ్రహ్మదేవా!

ఈ (1) విషయ ఆకాంక్షలు (2) విషయ కామమోహితత్వము - అనబడే రెండు ప్రమాదకరమైన జాడ్యములను, జీవుడు వదలివేస్తూ ఉండాలి.

‘‘ఎట్లా వదలటం?’’ అని అంటారా! ‘‘నిత్య-నిరంజనుడగు పరమాత్మయే ఈ సర్వజీవుల సర్వ ‘‘బహిః-అంతర్’’ ప్రదర్శనము చేయుచున్నారు’’ అని భావిస్తూ, ‘‘పరమాత్మయే ఇన్ని రూపములుగా ఉన్నారు’’…. అను బుద్ధిని, మననమును పెంపొందించుకోవటమే అందుకు ఉపాయం. నిత్యం నిరంజనమ్ ఉపాశ్రయేత్! సర్వకాల సర్వ అవస్థ సర్వ సందర్భములందు ‘‘నిత్యనిర్మలుడగు పరమాత్మయే సర్వరూపధారియై లీలావినోదము ప్రదర్శించుచున్నారు కదా!’’…. అని గుర్తు గట్టిగా పెట్టుకొని, ఉండటము - ఇదియే ఉపాయం.

ఓ ప్రియ మునిః పరాకాష్ఠేశ్వరా! మునులకు శుభప్రదా! సర్వజీవుల సుఖప్రదాతా! బ్రహ్మభగవాన్!

అసలు ఈ జీవుడు తనకు నిజంగా హితము కలిగించుకోదలచాడా? లేక, తనకు తానే అపకారము, ఆత్మద్రోహము కలిగించుకోదలచాడా?

యది ఇచ్ఛేత్ ఆత్మనో హితమ్ - తనకు హితము కలగాలి అనే ఇచ్ఛ కలిగి ఉంటే, అందుకు ఒక్కటే ఉపాయం. అపరగ్ం సంత్యజేత్ సర్వమ్! ‘‘పరమాత్మగా దర్శనము’’నకు వేరైన సర్వ అపర భావనలను మొదలంట్లా వదలివేసి ఉండటమే మార్గము. పర - అపరములను గురు - శాస్త్ర - అభ్యాసముల సహాయముతో విడదీయు ఉత్తమ దృష్టిని అభ్యాసపూర్వకంగా ఆశ్రయించాలి.

బ్రహ్మదేవుడు :

జీవులలో అనేకులు ‘‘నేను ఒక జీవాత్మనై పరమాత్మను వెతుకుచున్నాను’’ అని భావిస్తూ ఉన్నారు.

వీటన్నిటికి యొక్క సారవాక్యములు ప్రవచించండి.

జీవాత్మ స్థితిని వదలి పరమ పదము సముపార్జించుకొనే సులభోపాయం ఏమిటి?

జీవునికి మనోబంధనము తొలగేది ఎట్లా?

పరమశివుడు : ఓ సృష్టి ప్రజ్ఞానందఘనా! బ్రహ్మభగవన్!

ఈ జీవుడు సదా శివానంద స్వరూపుడే! పరమాత్మయే! ఇక, క్రొత్తగా ‘‘పరమపదము ఎప్పటికో పొందాలి?’’ అను సుదీర్ఘ వ్యవహారం మాత్రం ఎక్కడిది? లేదు. అయితే మనన రూపమగు మనస్సే అన్ని భ్రమలకు, అన్ని ప్రతిబంధములకు కారణము! (మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో).

అట్టి మనోవ్యాధులకు చికిత్సగా ఒక ఉపాయం సూచిస్తున్నాను. వినండి.

శక్తి మధ్యే మనః కృత్వా, మనః శక్తేశ్చ మధ్యగమ్, మనసా మన ఆలోక్య తత్, త్యజేత్ పరమం పరమ్।।
మనస్సును విషయముల నుండి కించిత్ మరల్చి, అద్దానిని (కుండలినీ) శక్తి యందు ప్రతిక్షేపించాలి. శక్తిని తెచ్చి మనస్సు యొక్క మధ్యగా నిలపాలి. అప్పుడు (సాక్షీభూత) మనస్సుతో (చంచలస్వరూప) మనస్సును ఆలోకనం చేస్తూ ఉండును గాక. ఇక ఆపై ‘‘తత్ పరమపదము’’ యొక్క ఆశ-ఆశయములను కూడా ఈ జీవుడు త్యజించివేయును గాక!

ఈ జగదనుభవమంతా ఏ బిందువులో ఏర్పడినదై ఉంటోందో, అట్టి బిందువుకు ఉత్పత్తికారణము ఏది? మన ఏవహి బిందుశ్చ ఉత్పత్తి స్థితి కారణమ్! మనస్సే బిందువుకు ఉత్పత్తి-స్థితికారణం కూడా!

ఘృతాత్మకమైన (నేయి కలిగి ఉన్నదై) పాల నుండిఘృతము (నేయి - Ghee) ఉత్పన్నమగుచున్న రీతిగా - మనసో ఉత్పద్యతే బిందుః యధాక్షీరం ఘృతాత్మకమ్ - మనస్సు నుండి బిందువు ఉత్పన్నమగుచున్నది.

బ్రహ్మదేవుడు : ఆత్మ ఈ జీవుని వాస్తవ - సహజ స్వరూపము. ఆత్మకు బంధమనే ప్రసక్తే లేదు. అయితే మనస్సుకు బంధము ఉన్నట్లుగా జీవునికి అనుభవమౌతోంది. అట్టి మనస్సుకు కలిగే బంధము తొలగేదెట్లా?

శివ భగవానుడు :

మనస్సు జీవునికి ఒక ఉపకరణము మాత్రమే! అంతేగాని జీవుడు మనోరూపుడు కాదు.
అప్రమేయము, నిత్యానందము, శివానందము, నిత్యముక్తము - అగు ఆత్మస్వరూపుడే!

ఇక ఉపకరణమగు మనస్సు దగ్గిరకు వచ్చి చూద్దాం.

న చ బంధన మధ్యస్థం తతవై కరణమానసమ్! దర్పణములో (In a mirror) ఏ ప్రతిబింబము కనిపించినా, దర్పణము ప్రతిబింబముచేత బంధితమౌతుందో? ప్రతిబింబమునకు సంబంధితమౌతుందా? లేదుకదా! అట్లాగే, మనస్సు దర్పణమువలె ఒక ఉపకరణము మాత్రమే అయి ఉండగా, అట్టి మనస్సు బంధములో చిక్కుకున్నది - అనే మాట ఎక్కడిది?
చంద్ర-సూర్యుల మధ్యగా (ఇడ-పింగళ నాడుల మధ్యగా) శక్తి (కుండలిని) ఉన్నంతవరకు ఈ జీవుని పట్ల ‘నేను బద్ధుడను’ అనే భ్రమ కొనసాగుచూనే ఉంటోంది.

🌺 ఇడ - పింగళ మధ్యగా ఏర్పడినదైయున్న ‘సుషుమ్ననాడి’ని సంయమనమైన బుద్ధితో ఎరిగి,
🌺 అట్టి సుషుమ్ననాడి యందు కుంభక ప్రాణాయామము సహాయముతో వాయువును నిలిపి ఉంచి,
🌺 ‘‘బైందవ స్థానము’’ (బ్రహ్మరంధ్రము యొక్క క్రింద వైపు మూలస్థానము. కొండ నాలుక ప్రదేశము) - అనబడే బిందుస్థానమును మనస్సుతో ఆక్రమించుకొని ఉండి,
🌺 ముక్కు రంధ్రములను కుంభకముతో నిరోధించాలి.

⌘⌘⌘

వాయుం బిందుగ్ం సమాఖ్యాతగ్ం సత్త్వం ప్రకృతిమేవచ।।
వాయువును ‘బిందువు’ అని సత్త్వమను ‘ప్రకృతి’ అని పిలుస్తున్నారు.

బిందువు = వాయువు (లేక) ప్రాణశక్తి
ప్రకృతి (లేక) సత్త్వము = సర్వేంద్రియ - విషయ ప్రపంచము ‘జగత్’ అనబడే సందర్భము.

బిందు-ప్రకృతుల సంప్రదర్శనా విశేషములగు

  1. మూలాధార (పృధ్వీ ధర్మము-గుదము)
  2. స్వాధిష్ఠాన (జలధర్మము) - లింగస్థానము
  3. మణిపూరక (అగ్నిధర్మము-నాభిస్థానము)
  4. అనాహత (వాయుధర్మము-హృదయ ప్రదేశము)
  5. విశుద్ధ (ఆకాశ ధర్మము-కంఠప్రదేశము)
  6. ఆజ్ఞా (సూక్ష్మ శరీర ధర్మము-మస్తకము)

అనబడే షట్ (6) చక్రముల స్థానములను, శక్తిచే వాటిని దాటివేయటము - అనబడే యోగ ప్రక్రియను గురుముఖతః ఎరిగి, అభ్యాసము చేసి, … క్రమంగా - షట్‌చక్రాని పరిజ్ఞాత్వా ప్రవిశేతు సుఖమండలే। - చివరికి సుఖమండలమగు షోడశదళ మండల బ్రహ్మరంధ్రమును, సహస్ర దళమండలమగు సహస్రారమును చేరి శివస్వరూపుడై ప్రకాశించుచున్నాడు.
త్రయీదేద్యుడై, త్రయీ మండలములను దాటివేసి తురీయుడగు శివాత్మకుడు అగుచున్నాడు.

అనగా ఏమిటో మరికొంత వివరిస్తున్నాన వినండి.

ప్రవిశేత్ వాయుమ్ ఆకృష్య : వాయువును ‘మనస్సు’ అనే ఉపకరణముతో ఆకర్షించి షట్ (6) చక్రములలో ప్రవేశించాలి.

తయైవ ఊర్ధ్వ నియోజయేత్ : ఆ వాయువును పైకి కపాలము వైపుగా (బ్రహ్మరంధ్రమునకు) పంపాలి.

ఏవం సమభ్యసేత్ వాయుం, స బ్రహ్మాండమయో భవేత్ : ఈ విధమైన ప్రాణశక్తి - ఊర్ధ్వగమనము అను అభ్యాసముచే ఆ యోగి ‘బ్రహ్మాండమయుడు’ - అగుచున్నాడు.

అభ్యాసము: (1) వాయువు (2) బిందువు (3) చక్రము (4) చిత్తము ఈ 4 కూడా యోగికి అభ్యాసవస్తువులు (లేక) మార్గములు. ఈ నాలుగు యోగసాధనా - ఉపకరణములు అగుచుండగా, సమాధిమ్ ఏకేన సమమృతం యాంతి యోగినః । - అది సమాధియోగమునకు మార్గమై, ఆ యోగి సమస్వరూపుడు. అమృతుడు (మార్పు-చేర్పులకు విషయమేకాని స్వస్వరూపము సంతరించుకొన్నవాడు) అగుచున్నాడు.

కర్ర మధ్యలో అగ్ని ఉంటుంది. కానీ, ఆ అగ్ని కర్రతో కర్రను ఒరిపిడి చేయకపోతే బయటకు రాదు. కుండలోగల దీపముయొక్క కాంతి కుండ పగిలితేగాని (లేక, రంధ్రము ఉంటే గాని) బయటకు ప్రసరించదు కదా!

స్వకాయం ‘ఘటం’ ఇత్యుక్తం। - ఈ శరీరమే ఆ ఘటము (కుండ). ఇందులో సర్వదా ప్రకాశమానుడైయున్న ‘పరమాత్మ’యే ఘటములోని దీపము. ‘‘తత్‌త్వమ్’’ - అను గురూపదేశముచే స్ఫుటీభవేత్।। - ‘‘అహమ్ బ్రహ్మాఽస్మి’’ - అను బ్రహ్మజ్ఞానము బహిర్గతమై ఈ లోకములన్నీ తనయందు అంతర్గతం చేసివేసుకోగలదు.

‘‘నేను భౌతిక దేహమాత్రుడను కాను. కేవల ఛైతన్య ఆత్మానంద స్వరూపుడను’’ - అను ఒడ్డుకు చేరటమే దేహజయము.

ఈ జీవుడు ‘‘పర’’ యందు అంకురించి, ‘పశ్యంతి’ యందు జీవాత్మ-పరమాత్మల విభాగయోగమనే రెండు ఆకులు చిగురించి, ‘మధ్యమ’యందు మొగ్గతొడిగి, ‘‘వైఖరి’’ యందు వికసించుచున్నాడు.

వాక్కుతో ప్రారంభమై బ్రహ్మతత్త్వాభ్యాసము క్రమంగా అనుభవము పొడచూపుచుండగా ఆ వాక్కు బ్రహ్మానుభవమునందు విలోమముగా అస్తమిస్తోంది.

ఆ వాక్కును కూటస్థుడగు ఆత్మదేవుడే వాక్ ప్రబోధకుడు. ఈ విధంగా ‘సోఽహమ్’ భావమును పునికి పుచ్చుకొన్న వానికి జగత్ దృశ్యముగాని, కర్మవ్యవహారములుగాని అంటజాలవు. సమస్త యోగసాధనలు సోఽహమ్ భావనకు అడ్డగుచున్న విభ్రమములు తొలగటానికోసమే!

స్వకీయాత్మ నియామకములగు -

Ⅰ. (1) జాగ్రత్ అనుభవ పురుషుడగు విశ్వుడు;
(2) స్వప్నానుభవ పురుషుడగా తేజసుడు
(3) సుషుప్తి స్వానుభవపురుషుడగు ప్రాజ్ఞుడు.

Ⅱ. (1) ఈ భౌతిక జగత్ రూపపురుషుడగు విరాట్‌బీ
(2) సృష్టి అభిమాని, సృష్టికల్పనా పురుషుడగు హిరణ్యగర్భుడుబీ
(3) సర్వజీవులలో అంతర్ -బహిర్ స్వరూపుడై విరాజిల్లుచున్న ఈశ్వరుడు.

Ⅲ. (1) బ్రహ్మాండము
(2) పిండాండము (జీవాత్మ)
(3) భూ భువర్ సువర్.. మొదలైన 14 లోకములు

ఈ క్రమ క్రమ విశేషములన్నీ కూడా ‘‘కేవల స్వస్వరూపమగు ఆత్మ’’ ను సమీపించుచుండగా - సర్వము ప్రత్యాగాత్మయొక్క కేవలాత్మ - (One’s own Absolute SELF) యందు లయించిపోగలవు.

ఏకో సత్! ఆది శేషరూపుడై ఈ జీవుడు ‘శివోఽహమ్’ స్థాన-స్వానుభవములకు చేరుచున్నాడు.

⌘⌘⌘

అండం జ్ఞానాగ్నినా తప్తం, లీయతే కారణైః సహ, పరమాత్మని లీనం, తత్ పరబ్రహ్మైవ జాయతే।।
ఈ అండాండము (The sense of matterstic matter-related appearences) - కాస్తా ‘ఆత్మజ్ఞానాగ్ని’చే సంతప్తమైనప్పుడు, ఇద్దానికి సంబంధించిన కార్య-కారణ సమూహములన్నీ కట్టకట్టుకొని పరమాత్మయందు లీనమై ఇక ఇదంతా పరమాత్మకు అభిన్నమై అనుభూతమవగలదు. సర్వభేద భావములు స్థిమితపడిపోవుచున్నాయి.

అప్పుడు ఏది అఖండ పరమాత్మ అయి శేషించుచున్నదో..,
→ అది తేజస్సు కాదు. చీకటి కాదు.
→ ‘ఇది ఇట్టిది’ అని చెప్పబడజాలనిది. అనాఖ్యాతము. [It is a state and an expression which cannot be detailed and explained. It is however being described by the Experienced.]
→ అనభివ్యక్తగ్ం : అభివ్యక్తమైనట్లుగా కనిపించేదానికి మునుముందే ఉండి, ఈ వ్యక్తమైయ్యేదంతా తానే అయి ఉండుటచే - అనభివ్యక్తము. అటువంటి ‘కేవల సత్’ మాత్రమే శేషించనదై ఉంటున్నట్టిది.

అట్టి కేవల సత్ చిత్ స్వరూప ఆత్మను, కలశములో ఉన్న దీపము వలె తన యందు తానే దర్శించి, ఉపాసించి ‘‘తదేవాహమ్ - నేను అదియే! అహమ్ తదేవ- అది నేనే’’ అను ఎరుకుతో ఈ విశ్వమును ఆత్మాంతర్గతంగా ధ్యానోపాసన చేయటమే ఆత్మ-సాక్షాత్కారము.

అట్టి ఆత్మకేవలీ ప్రకాశము
- బొటనవ్రేలు ప్రమాణములో
- పొగలేని జ్యోతి స్వరూపమై
- కూటస్థమై, అవ్యయమై, తదితరమైనంతా తన యొక్క స్వయం ప్రకాశముగా కలిగినదై సర్వము తన తేజోవిలాసమగుచున్నది. అట్టి స్వస్వరూపాత్మను ధ్యానించెదరుగాక!

⌘⌘⌘

గౌతముడు : ఈ జీవుని పట్ల సందర్భమగుచున్న బంధము, మోక్షములు ఎట్లా ఎందుకొరకు ఏర్పడుచున్నవగుచున్నాయి?

గురువర్యులు :

విజ్ఞానాత్మా తథా దేహే జాగ్రత్ స్వప్న సుషుప్తితః, మాయయా మోహితః!

ఈ జీవుడు స్వతఃగా పరమాత్మ స్వరూపుడే! కేవల విజ్ఞానాత్మ స్వరూపుడేనయ్యా!
తెలియబడే సర్వమునకు మునుముందే ఉన్నట్టి కేవల ప్రజ్ఞాస్వరూపుడగు పరాత్మయే దృశ్య కల్పనా వినోద సంబంధము చేత - దేహ సంబంధిత ప్రజ్ఞను ఆశ్రయించి దేహధారి అగుచున్నాడు.
‘‘స్వీయ కల్పనారూపమే’’ - అయి ఉన్న మాయచే మోహితుడై, తన మాయ యందు తానే దేహ-దేహాంతరములు, జాగ్రత్-స్వప్న-సుషుప్తుల పరంపరలను సుదీర్ఘంగా కొనసాగించనారంభించుచున్నాడు.

పశ్చాత్ బహుజన్మాంతరే పునః సత్కర్మ పరిపాకాత్తు స్వవిచారం చికీర్షతి!

ఈ విధంగా మోహమాత్రమగు జన్మ పరంపరావ్యవహారమంతా కొనసాగుచుండగా.. ఒకానొకప్పుడు సత్కర్మల పరిపక్వత చేత ‘‘ఇదంతా ఏమిటి? నేను దృశ్యముచే ఎందుకు బద్ధుడనై ఉన్నాను? ఈ దుఃఖ పరంపరల నుండి బయటపడుటకు త్రోవ ఏమైనా ఉన్నదా?’’ - అనే స్వవిచారణకు పూనుకొనుచున్నాడు.

కోఽహమ్? → నేను అసలు ఎవ్వరు?

కథమ్ అయమ్ దోషః సగ్ంసారాఖ్య ఉపాగతః? → ఈ దోషపూరితమైన సంసారమంతా నాకు ఎందుకు వచ్చిపడింది?

జాగ్రత్ స్వప్నే వ్యవహరన్ సుషుప్తే క్వ గతిః మమ? → జాగ్రత్‌లోను స్వప్నములోను వ్యవహరిస్తున్న నేను సుషుప్తిలో ఏ స్థితిగతులను కలిగి ఉన్నాను?

ఇటువంటి చింతనాపరుడగుచున్నాడు.

అగ్నిచేత దూదిలాగా దహించబడుచున్నాడు.

అజ్ఞానము నశించుచున్నప్పుడు, విజ్ఞానము వ్యాపకము కాసాగుచున్నది. క్రమంగా అజ్ఞానము మొదలంట్లా జ్ఞానాగ్నిచే దహించివేయబడుచున్నది. ‘‘అరె"! నేను అజ్ఞానిని అగుటచేత కదా, ఈ విధంగా బాహ్య తాపములచే దహించబడుచున్నాను?’’.. అనునదే జ్ఞానాంకురము.

ఆత్మతత్త్వమును (లేక) ఆత్మధర్మమును దహరాకాశమున (హృదయాకాశమున) కలిగియుండియే, ఈ జీవుడు సహజమగు తన ఆత్మస్వభావమును ఏమరచి, దృశ్యమాత్ర పరిమితుడు అగుచున్నాడు.

ఆత్మజ్ఞానము వికసించుటచే క్షణంలో అన్యత్వమంతా దహించివేయబడుచుండగా ఆ యోగి ‘‘అనన్యత్వము’’ (All this is neither outside, nor different from what absolutely I am)ను ఆశ్రయించుచున్నాడు.

అన్యభావనా రూపములగు మనోమయ విశేషములను, అన్య వస్తుజ్ఞాన పరిమితమగు దృశ్యాభినివేశ జ్ఞానమును క్రమంగా సమ్యక్‌భావన-ఆత్మజ్ఞాన హస్తములచే నలిపివేయుచున్నాడు.

ఇక ఆపై అతిత్వరగా కుండలో వెలుగుచున్న దీపమువలె హృదయమున ‘ఆత్మతేజోరూపుడు’ అయి జగత్ జ్యోతి-స్వయం ప్రకాశమానుడై వెలుగొందుచున్నాడు.

ఓ గౌతమ మునీ!

ఏ జీవుడైతే….,

✤ గాఢనిద్ర ప్రవేశించుటకు ముందువరకు తన హృదయాకాశములో సర్వదా సర్వకారణకారుణుడై, సర్వకారణముల ‘సాక్షి’ అయి, స్వకారణ -కారణుడై, సర్వకారణ రహితుడై యున్న ఆత్మభగవానుని జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు కేవల సాక్షియగు నిజ-స్వస్వరూపునకు ‘‘అభిన్నమేకదా!’’ అని ఎరిగి ఉపాసనాపూర్వకంగా ఆరాధిస్తున్నాడో, ఈ దేహమున్నంతవరకు అట్టి ఆరాధనను అనుక్షణికంగా కొనసాగిస్తున్నాడో, ఆతడు ధన్యుడు!
✤ నిర్వర్తించవలసినది నిర్వర్తించుచున్నవాడు కాబట్టి కృతకృత్యుడు!
✤ దేహమున్నంతవరకు, అటుతరువాత కూడా ముక్తుడే! ఆతడు జీవన్ముక్తుడే!

ఇక,
కాలానుగతంగా వచ్చిన ఈ జడమగు భౌతిక దేహము కాలమునకు అధీనమై పోవుచుండగా, ఆతడు ‘జీవన్ముక్తత్వము’ను కూడా వదలి - గాలి స్పందముల అభిన్నతత్త్వము వలె- అదేహ (లేక, విదేహ) ముక్తత్వము సంతరించుకొనుచున్నాడు. ఇక ఆ యోగి ఆత్మారాముడగుచున్నాడు.

అట్టి కేవలీ ఆత్మానంద స్థితిని ఏమని వర్ణించగలము?
❋ అది శబ్దములతోను, వాక్యములతోను ‘ఇట్టిది’ అని నిర్వచించలేము. కనుక అశబ్దమ్!
❋ స్పర్శకు, రూపమునకు రుచికి, వాసనకు విషయముకాదు. కనుక అస్పర్శము! అరూపము! అరసము! అగంధము!
❋ అది కాలబద్ధమైనది కాదు. కాలః కాలము. కాలమునకే నియామకము. కాలముచే మార్పు చెందనిది. కనుక అవ్యయము.
❋ సర్వము అనిత్యమైయుండగా, అట్టి స్వస్వరూపాత్మ మాత్రమే నిత్యము। సత్యము। నిత్యసత్యము।
❋ దేహాదులవలె మొదలు - చివరి (ఆది అంతరములు) లేనట్టిది కాబట్టి అనాది! అనంతము!
❋ సర్వదేహములలోని దేహిగా ఉన్నట్టి ‘మహత్తు’కు కూడా పరమై (వేరై) ఉన్నది. మహతః పరమ్।
❋ సర్వదా సదాశివము, యథాతథము కనుక ధ్రువము.

సర్వము లయించగా కూడా, అట్టి కేవల-నిత్య-సత్య-అనన్యమగు ఆత్మయే సర్వదా శేషించినదై ఉండటం చేత సర్వశేష్యము. ఆదిశేష్యము.

సర్వ విషయములకు అధిగమించివేసినది కాబట్టి నిరామయము.

అన్ని యోగ-జ్ఞాన-భక్తి మార్గముల ముఖ్యోద్దేశ్యము ఆట్టి స్వస్వరూపాత్మోపాసన యొక్క అనునిత్యత్వమే!



🙏 ఇతి యోగకుండలినీ ఉపనిషత్। ‌🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।