[[@YHRK]] [[@Spiritual]]

Yōga Tattva Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


కృష్ణ యజుర్వేదాంతర్గత

22     యోగతత్త్వోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్



యోగైశ్వర్యం చ కైవల్యం జాయతే యత్ప్రసాదతః .
తద్వైష్ణవం యోగతత్త్వం రామచంద్రపదం భజే ..
శ్లో।। యోగైశ్వర్యం చ కైవల్యం
జాయతే యత్ ప్రసాదతః
తత్ ‘వైష్ణవమ్ యోగతత్త్వం’
రామచంద్ర పదం భజే।।
ఎద్దాని ప్రసాదముచే యోగైశ్వర్యము, కైవల్యము కూడా లభించుచున్నాయో, అట్టి ‘వైష్ణవయోగతత్త్వము’ కొరకై శ్రీరామచంద్రమూర్తిని భజించుచున్నాము.

సీతాయాః పతయే నమః।


యోగతత్త్వం ప్రవక్ష్యామి యోగినాం హితకామ్యయా .
యచ్ఛృత్వా చ పఠిత్వా చ సర్వపాపైః ప్రముచ్యతే .. 1..
ఓం
01. యోగతత్త్వం ప్రవక్ష్యామి
యోగినాం హితకామ్యయా,
యత్ శ్రుత్వా చ, పఠిత్వా చ
సర్వ పాపైః ప్రముచ్యతే।।
ఓంకార తత్త్వమును ధ్యానిస్తూ…., మనో వాక్ కాయములచే నమస్కరిస్తున్నాను.
యోగసాధకులందరికీ హితము కలగాలనే ఉద్దేశ్యము కలిగినవారమై ‘యోగతత్త్వము’ ను మనము చెప్పుకుంటున్నాము.
ఎందుకంటే, యోగతత్త్వము పఠించినా వినినా కూడా సర్వపాపదృష్టుల నుండి, పాపక్రియలనుండి, పాప భావములనుండి కూడా - ఆ పఠించువాడు, ఆ వినుచున్నవాడు కూడా విముక్తుడు కాగలడు.

విష్ణుర్నామ మహాయోగీ మహాభూతో మహాతపాః .
తత్త్వమార్గే యథా దీపో దృశ్యతే పురుషోత్తమః .. 2..
02. ‘విష్ణుః’ నామ మహాయోగీ,
మహాభూతో, మహాతపాః।
తత్త్వమార్గే యథా దీపో
దృశ్యతే పురుషోత్తమః।।
యోగయోగీశ్వరుడు, పురుషోత్తముడు అగు విష్ణు భగవానుడు సర్వ జీవులకు, మహత్ తపస్సంపన్నులకు కూడా శరణాగతి అయి ఉన్నారు. అట్టి స్వామి తత్త్వమార్గ అన్వేషకులకు వారి త్రోవలో మార్గదర్శకమగు దీపమువలె ప్రకాశించుచున్నారు. (విష్ణవే సర్వజిష్ణవే)

తమారాధ్య జగన్నాథం ప్రణిపత్య పితామహః .
పప్రచ్ఛ యోగతత్త్వం మే బ్రూహి చాష్టాంగసంయుతం .. 3..
03. తమ్ ఆరాధ్య జగన్నాథం
ప్రణిపత్య పితామహః పప్రచ్ఛ:
యోగతత్త్వం మే బ్రూహి చ
అష్టాంగ సంయుతమ్।
ఒక సందర్భములో సృష్టికర్తయగు బ్రహ్మ దేవుడు (పితామహుడు) విష్ణులోకం వేంచేసిన వారై, ఆరాధ్యుడు, జగన్నాధుడు అగు విష్ణుభగవానుని దర్శించారు. ప్రణిపాతులై విష్ణుస్వామిని ఇట్లు ప్రశ్నించారు.

హే విష్ణు భగవాన్! అష్టాంగ యోగములతో కూడిన యోగతత్త్వమును వివరించి చెప్ప ప్రార్థన.


తమువాచ హృషీకేశో వక్ష్యామి శృణు తత్త్వతః .
సర్వే జీవాః సుఖైర్దుఖైర్మాయాజాలేన వేష్టితాః .. 4..
04. తమ్ ఉవాచ హృషీకేశో:
వక్ష్యామి శృణు తత్త్వతః।
సర్వే జీవాః సుఖైః దుఃఖైః
మాయాజాలేన వేష్టితాః।
విష్ణుభగవానుడు (హృషీకేశుడు) : ఓ బ్రహ్మ దేవా! అష్ట (8) అంగములతో కూడిన యోగతత్త్వమును చెప్పుచున్నాను. వినండి. జీవులంతా కూడా ‘సుఖము-దుఃఖము’ అనే రెండు దారములతో నేసిన మాయ అనే వలలో చిక్కుకొనుచున్నారయ్యా! ‘మాయ’ యొక్క ప్రభావము చేతనే సుఖదుఃఖ పరంపరలలో మునిగి తేలుచూ ఉన్నారు. (స్వతఃగా చూస్తే జీవుడు మాయా నియామకుడగు ఆత్మయే కాబట్టి-బద్ధుడే కాదు).

తేషాం ముక్తికరం మార్గం మాయాజాలనికృంతనం .
జన్మమృత్యుజరావ్యాధినాశనం మృత్యుతారకం .. 5..
05. తేషాం ముక్తికరం మార్గం
మాయా జాల నికృంతనమ్।
జన్మ మృత్యు జరా వ్యాధి
నాశనమ్, మృత్యుతారకమ్।।
అందుచేత, ఈ జీవులను అటువంటి మాయాజాలము (Fisher Nets of Maya) నుండి బయటకు తెచ్చునది, జన్మమృత్యు, వార్థక్య, వ్యాధి దోషములను అధిగమింపజేయునది, మృత్యువు నుండి తరింపజేయునది అగు ముక్తిమార్గము గురించి చెప్పుకుంటున్నాము. వినండి.

నానామార్గైస్తు దుష్ప్రాపం కైవల్యం పరమం పదం .
పతితాః శాస్త్రజాలేషు ప్రజ్ఞయా తేన మోహితాః .. 6..
06. నానామార్గైస్తు దుష్ప్రాపం
కైవల్యం పరమం పదమ్,
పతితా శాస్త్ర జాలేషు
ప్రజ్ఞయా, తేన మోహితాః।।
‘కైవల్యపదము’ అని చెప్పబడు ఈ జీవుని కేవలీ స్వస్వరూపము జేరుటకై మాయను జయించివేయునట్టి మార్గము కష్టసాధ్యమైనది. ప్రయత్నము చేతనే లభించగలదు. కొందరు శాస్త్రములు పఠించి కూడా ‘శాస్త్రములు’ అనే ప్రజ్ఞత్వపు - వలలో పడి మోహమును వదలలేకున్నారు, పైగా మోహమును పెంపొందించుకొనుచున్నారు. (ప్రజ్ఞావాదాంశ్చ భాషసే)

అనిర్వాచ్యం పదం వక్తుం న శక్యం తైః సురైరపి .
స్వాత్మప్రకాశరూపం తత్కిం శాస్త్రేణ ప్రకాశతే .. 7..
07. అనిర్వాచ్యపదం వక్తుం
న శక్యం తైః సురైః అపి।
స్వాత్మ ప్రకాశరూపం
తత్ కిం శాస్త్రేణ ప్రకాశ్యతే?
ఎందుచేతనంటారా? మాటలకు అందని (కేవలీ స్వరూపధారణా రూపమగు) ‘కైవల్య పదము’ గురించి దేవతలకు కూడా నిర్వచించి చెప్పటానికి అలవి కావటం లేదు. అది అంతరాంతమగు స్వాత్మప్రకాశ రూపము (The Form of ones own enlightened self manifestaion). అట్టిది (బాహ్య) శాస్త్రములచే ఎట్లా ప్రకాశింపజేయబడగలదు-చెప్పండి?

నిష్కలం నిర్మలం శాంతం సర్వాతీతం నిరామయం .
తదేవ జీవరూపేణ పుణ్యపాపఫలైర్వృతం .. 8..
08. నిష్కళం నిర్మలం శాంతం
సర్వాతీతమ్ నిరామయమ్,
తదేవ జీవరూపేణ
పుణ్య పాప ఫలైః వృతమ్।
నిష్కళము (కళంకరహితము), అత్యంత నిర్మలము, పరమశాంతము, ఈ సర్వదృశ్య వ్యవహారములకు అతీతమైనది అగు పరమాత్మయే (క్రీడగా, లీలగా) జీవరూపమును అంశగా కలిగినదై ఉంటున్నారు. (అట్టి ఆత్మయొక్క అంశామాత్రమైనట్టి) జీవరూపము పుణ్య-పాపఫలములచే ఆవృతమై ప్రవర్తమానమగుచున్నది. (కేవలమగు ఆత్మకు పుణ్య- పాపములతో సంబంధమై లేదు).

పరమాత్మపదం నిత్యం తత్కథం జీవతాం గతం .
సర్వభావపదాతీతం జ్ఞానరూపం నిరంజనం .. 9..
09. పరమాత్మ పదం నిత్యం
తత్ కథం జీవతామ్ గతమ్,
సర్వభావ పదాతీతం
జ్ఞానరూపం నిరంజనమ్?
వాస్తవానికి ఈ జీవుడు పరమాత్మ స్వరూపుడే! అట్టి పరమాత్మ పదము సర్వభావములకు అతీతమైనది. జీవుడు భావ సంబంధీకుడు. పరమాత్మ భావాతీతుడు. భావ పదాతీతుడు. కేవల జ్ఞానరూపుడు. నిరంజనుడు. నిత్యుడు. (జీవుడో? సందర్భ కల్పితుడు). అట్టి పరమాత్మ జీవాత్మగా ఎట్లా అవుతాడు? (పరమాత్మ సర్వదా యథాతథుడు అయినప్పుడు జీవుడుగా అవటము అనే ప్రసక్తి ఎక్కడిది?).

వారివత్స్ఫురితం తస్మింస్తత్రాహంకృతిరుత్థితా .
పంచాత్మకమభూత్పిండం ధాతుబద్ధం గుణాత్మకం .. 10..
సుఖదుఃఖైః సమాయుక్తం జీవభావనయా కురు .
తేన జీవాభిధా ప్రోక్తా విశుద్ధైః పరమాత్మని .. 11..

10. వారివత్ స్ఫురితం తస్మిన్
తత్ర అహంకృతిః ఉత్థితా,
పంచాత్మకం అభూత్ పిండమ్
ధాతుబద్ధం, గుణాత్మకమ్।।

11. సుఖః దుఃఖైః సమాయుక్తం
జీవ భావనయా కురు
తేన జీవాభిధా ప్రోక్తా
విశుద్ధే పరమాత్మని।।
నిరాకారమగు జలములో ఏ కారణం లేకుండానే తరంగము జనించి సాకారత్వము ప్రదర్శించుచున్నది కదా! అట్లాగే పరమాత్మ అనే సముద్రంలో “అహంకారము” నుండి “వ్యష్ఠి” ప్రదర్శితమగుచున్నది.
పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములచే పంచభూతాత్మకమైనట్టిది, సత్వ-రజో-తమో త్రిగుణాత్మకమైనది, అభూతాత్మకమైన మనో-బుద్ధి-చిత్త-అహంకారములతో కూడినట్టిది, సుఖ-దుఃఖముల అనుభవ పరంపరలతో కూడుకొని ఉన్నట్టిది అగు జీవరూపము (జీవాత్మ) ఏర్పడుచున్నది అగుచున్నది.
“విశుద్ధమగు పరమాత్మనుండియే ఈ జీవుడు బయల్వెడలుచున్నాడు” అని (ఆత్మతత్త్వజ్ఞులుచే సిద్ధాంతీకరించి) చెప్పబడుచున్నది.

కామక్రోధభయం చాపి మోహలోభమదో రజః .
జన్మమృత్యుశ్చ కార్పణ్యం శోకస్తంద్రా క్షుధా తృషా .. 12..
తృష్ణా లజ్జా భయం దుహ్ఖం విషాదో హర్ష ఏవ చ .
ఏభిర్దోషైర్వినిర్ముక్తః స జీవః కేవలో మతః .. 13..
12. కామ క్రోధం భయం చ అపి
మోహ లోభం మదో రజః
జన్మ మృత్యుశ్చ కార్పణ్యం
శోకః తంద్రా క్షుధా తృషా,

13. తృష్ణా లజ్జా భయం దుఃఖం
విషాదో హర్షఏవ చ
ఏభిః దోషైః వినిర్ముక్తః
స జీవః ‘కేవలో’ మతః।।
అందుచేత…..ఓ బ్రహ్మదేవా!
ఎప్పుడైతే ఈజీవుడు
- ‘‘ఇంకా ఏదో పొందాలి కదా!’’ అనే కామము;
- కోపగుణముల తీవ్రమైన అభ్యాసముచే ఏర్పడుచున్న క్రోధము (Revengeful sense of emotions);
- ఏదోపోతుందేమో, ఏది ఏమౌతుందో అనే భయము;
- అసత్యములైన, కల్పితములైన సంగతి సందర్భములపట్ల ‘నిజమేకదా!’ అని భావించు మోహము;
- ‘‘దాచుకోవాలి. పంచుకోను’’ అనే రూపముగల లోభము;
- ‘నేనే ఎక్కువ’ అనే మదము;
- ఇంకా ఏదో చేయాలి, చూడాలి, తిరగాలి’ అను రూపమగు రజోగుణము;
- జన్మించువారి, మరణించువారి పట్ల జాలి బెంగ రూపముగల కార్పణ్యము;
- బాధపడటం, దుఃఖించటం, ఆదుర్దా పడటం రూపముగల శోకము;
- బద్ధకము, అతి నిద్ర రూపమగు తంద్రా;
- ఆకలి - దప్పిక ధాహములపట్ల ధ్యాసరూపమగు క్షుధా;
- తృషా = ఇచ్ఛ, తృష్ణ;
- సిగ్గుపడే స్వభావమగు లజ్జ;
- భయదుఃఖములు; హర్ష విషాదములు…,
వీటన్నిటినీ ఎవడు విడుస్తాడో, అట్టివాడు ‘జీవుడు’ అను స్థితినుండి → ‘‘శివుడు’’ (లేక) కేవలుడు అగుచున్నట్లేనని నిశ్చితాభిప్రాయం.

తస్మాద్దోషవినాశార్థముపాయం కథయామి తే .
యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువం .. 14..
యోగో హి జ్ఞానహీనస్తు న క్షమో మోక్షకర్మణి .
తస్మాజ్జ్ఞానం చ యోగం చ ముముక్షుర్దృఢమభ్యసేత్ .. 15..
14. తస్మాత్ దోష వినాశార్థమ్
ఉపాయమ్ కథయామి తే।
యోగహీనం కథమ్ జ్ఞానమ్
మోక్షదం భవతి ధృవమ్?

15. యోగోఽపి జ్ఞానహీనస్తు
న మోక్షో మోక్ష కర్మణి।

తస్మాత్ జ్ఞానం చ యోగం చ  
ముముక్షుః దృఢమ్ అభ్యసేత్।

పైవన్నీ ఈ జీవుడు జీవితచట్రమునకు పరిమితము చేస్తున్న దోష గుణములు. అందుచేత అటువంటి దోషములు తొలగగల ఉపాయాలు చెప్పుచున్నాను. వినండి. 1. జ్ఞానము 2. యోగాభ్యాసము.

అయితే, ఒకడు ఆత్మ గురించిన జ్ఞానమును వినుట చేతనో, చదువుటచేతనో, వ్రాయుటచేతనో, ఉపన్యశించు ప్రయత్నం చేతనో ఆత్మ గురించిన జ్ఞానము సంపాదించవచ్చు. అట్టి జ్ఞాన సమాచారం యోగాభ్యాసము (Application related practices) లేకుండానే ధృవమగు మోక్షము (Permanent sense of Ever-relieved) ఇవ్వగలదా? లేనేలేదు.

సరే! మరొకడు యోగాభ్యాసమునందు మాత్రమే ప్రయత్నశీలుడైతేనో? అంతమాత్రంచేత అది మోక్షకర్మ అవుతుందా? మోక్షం లభిస్తుందా? ఊహూ! లేనేలేదు. జ్ఞాన విశ్లేషణ లేకుండా మోక్ష కర్మల వలన కూడా మోక్షము లభించదు.

కాబట్టి మోక్షము ఆశయముగాగల ముముక్షువు అటు జ్ఞానము, ఇటు యోగము - ఈ రెండూ కూడా దృఢంగా ఒకేసారి అభ్యసించవలసినదే!

అజ్ఞానాదేవ సంసారో జ్ఞానాదేవ విముచ్యతే .
జ్ఞానస్వరూపమేవాదౌ జ్ఞానం జ్ఞేయైకసాధనం .. 16..
16. అజ్ఞానాత్ ఏవ సంసారో
జ్ఞానాత్ ఏవ విముచ్యతే।
జ్ఞాన స్వరూపమేవ ఆదౌ
జ్ఞానం జ్ఞేయ ఏకసాధనమ్।।
అస్సలు ‘సంసారము’ అనగా ఏమి? స్వస్వరూపాత్మకు సంబంధించిన ‘అజ్ఞానము’ అయి ఉన్నది కదా! అజ్ఞానము జ్ఞానము చేతనే కదా తొలగేది!
మొట్టమొదట జ్ఞానముచేతనే ‘తెలుసుకొనుచున్నవాడు’ (One who is knowing all that being known) జ్ఞానరూపమగు ‘జ్ఞేయము’ గురించి (ఆత్మ గురించి) తెలుసుకొనగలడు. కనుక జ్ఞేయమునకు జ్ఞానమే మొదటి ముఖ్య సాధనము.

జ్ఞాతం యేన నిజం రూపం కైవల్యం పరమం పదం .
నిష్కలం నిర్మలం సాక్షాత్సచ్చిదానందరూపకం .. 17..
ఉత్పత్తిస్థితిసంహారస్ఫూర్తిజ్ఞానవివర్జితం .
ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమథ యోగం బ్రవీమి తే .. 18..
17. జ్ఞాతంయేన నిజం రూపమ్, కైవల్యం పరమం పదమ్!
నిష్కళం నిర్మలం సాక్షాత్,
సత్-చిత్-ఆనంద రూపకమ్।

18. ఉత్పత్తి స్థితి సంహార
స్ఫూర్తిజ్ఞాన వివర్జితమ్
ఏతత్ ‘జ్ఞానమ్’ ఇతిప్రోక్తమ్।
జ్ఞానము అనగా? తనగురించి తాను ఎరుగుటం. ఈ జీవుడు తన సహజ- నిజరూపము యొక్క ఎరుక- అనునిత్యానుభవముగా కలిగి ఉండటమే కైవల్యము. (కేవలోఽహమ్ భావేతి కైవల్యమ్).
నిష్కళము, నిర్మలము, సాక్షాత్ సత్ (ఉనికి) - చిత్ (ఎరుక) - ఆనంద (స్వానుభూతి) రూపకము.

ఈ దేహము యొక్క ఉత్పత్తి - స్థితి - లయములను అధిగమించినది - అయినట్టి ఆత్మ గురించిన సమాచారమే ‘జ్ఞానము’ అను శబ్దముతో చెప్పబడుతోంది.

యోగో హి బహుధా బ్రహ్మన్భిద్యతే వ్యవహారతః .
మంత్రయోగో లయశ్చైవ హఠోఽసౌ రాజయోగతః .. 19..
అథ యోగం బ్రహవీమి తే।

19. యోగో హి బహుథా బ్రహ్మన్! భిద్యతే వ్యవహారతః।
‘మంత్రయోగో’, ‘లయశ్చ’ ఏవ
‘హఠా’ అసౌ ‘రాజయోగకః।।
ఇప్పుడు ‘యోగము’ గురించి చెప్పుకుంటున్నాము.

హేబ్రహ్మన్! యోగము వ్యావహారికంగా అనేక (4) విధములు, రీతులుగా వివరణము చేయబడుచున్నది.
(1) మంత్ర యోగము (2) లయ యోగము (3) హఠ యోగము (4) రాజ యోగము

ఆరంభశ్చ ఘటశ్చైవ తథా పరిచయః స్మృతః .
నిష్పత్తిశ్చేత్యవస్థా చ సర్వత్ర పరికీర్తితా .. 20..
20. ఆరంభశ్చ ఘటశ్చ ఏవ, తథా పరిచయః స్మృతః,
‘నిష్పత్తి’ శ్చ ఇతి అవస్థా చ సర్వత్ర పరికీర్తితా।
అన్ని యోగ విశేషములలోను ‘4’ అవస్థలు పరికీర్తించబడుచున్నాయి.
(1) ఆరంభము (2) ఘటము (3) పరిచయము (4) నిష్పత్తి

ఏతేషాం లక్షణం బ్రహ్మన్వక్ష్యే శృణు సమాసతః .
మాతృకాదియుతం మంత్రం ద్వాదశాబ్దం తు యో జపేత్ .. 21..
క్రమేణ లభతే జ్ఞానమణిమాదిగుణాన్వితం .
అల్పబుద్ధిరిమం యోగం సేవతే సాధకాధమః .. 22..
లయయోగశ్చిత్తలయః కోటిశః పరికీర్తితః .
21. ఏతేషాం లక్షణం, బ్రహ్మన్! వక్ష్యే శృణు సమాహితః।

‘మాతృక’ ఆదియుతం మంత్రం, ద్వాదశాబ్దం ప్రయోజయేత్,
క్రమేణ లభతే ‘జ్ఞానమ్’, ‘అణిమ’ ఆది గుణాన్వితమ్।।
బ్రహ్మన్! వీటియొక్క లక్షణములు సమాధాన చిత్తంతో సావధానంగా వినండి.

‘మాతృక’తో ప్రారంభమై, ఆసాంతము వరకు మంత్రమును 12 సంవత్సరములు జపించువాడు → అణిమ మొదలైన అష్టసిద్ధులతో కూడిన జ్ఞానమును క్రమముగా పొందుచున్నాడు.
22. అల్పబుద్ధిః ఇమం యోగం, సేవతే సాధకాధమః।
లయ యోగః చిత్త లయః, ‘కోటీశః’ పరికీర్తితః।।
సాధకులలో క్రింద దశ యోగి, ఇంకా బుద్ధి పరిపక్వము పొందని దశలో జప యోగము సేవించువారై ఉంటారు. జప యోగము కంటే లయ యోగము ఉత్తమస్థితి అగుచున్నది. ‘లయ యోగము’ అనగా చిత్తము ఉపాస్యవస్తువుతో లయము పొందటము. ఇదియే ‘కోటీశము’ అని కూడా పిలువబడుచున్నది.

గచ్ఛంస్తిష్ఠన్స్వపన్భుంజంధ్యాయేన్నిష్కలమీశ్వరం .. 23..
స ఏవ లయయోగః స్యాద్ధఠయోగమతః శృణు .
యమశ్చ నియమశ్చైవ ఆసనం ప్రాణసంయమః .. 24..
ప్రత్యాహారో ధారణా చ ధ్యానం భ్రూమధ్యమే హరిం .
సమాధిః సమతావస్థా సాష్టాంగో యోగ ఉచ్యతే .. 25..
23. గచ్ఛన్ తిష్ఠం తు
స్వపన్ భుంజన్ ధ్యాయేత్
నిష్కళమ్ ఈశ్వరమ్
సయేవ లయ యోగఃస్యాత్।
ఏ భావన-అనుభూతులచే ఒకానొకడు నడుస్తూ ఉన్నప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు, శ్వాస పీల్చుచున్నప్పుడు, భుజించుచున్నప్పుడు కూడా - నిష్కళుడు, నిర్మలుడు అగు ఈశ్వరుని ధ్యానిస్తూ, సర్వదా ధ్యాస కలిగి ఉంటాడో, అదియే ‘లయ యోగము’ - అని అభివర్ణించబడుచున్నది.
సర్వము ఈశ్వర స్వరూపంగా చూస్తూ ఈశ్వరభావముగా ఉపాసించటమే లయయోగము.
హఠయోగమ్ అతః శృణు।

24. ‘యమ’శ్చ, ‘నియమ’శ్చ ఏవ, ‘ఆసనం’.
25. ‘ప్రాణ సంయమః’, ‘ప్రత్యాహారో’ ‘ధారణా’ చ
‘ధ్యానం’ భ్రూమధ్యమే హరిమ్, సమాధిః సమతావస్థా
స ‘అష్టాంగో యోగ’ ఉచ్యతే।
ఇప్పుడిక ‘హఠయోగము’ గురించి వినండి.

హఠయోగమునకు అంగములు - ‘8‘ (అష్టాంగ యోగములు)
(1) యమము (2) నియమము (3) ఆసనము (4) ప్రాణసంయమము (5) ప్రత్యాహారము (6) ధారణ (7) భ్రూమధ్యాకాశములో హరి ధ్యానము (8) సమాధి. ఇవి సమతావస్థ యోగముయొక్క ‘8’ అంగములు.

మహాముద్రా మహాబంధో మహావేధశ్చ ఖేచరీ .
జాలంధరోడ్డియాణశ్చ మూలబంధైస్తథైవ చ .. 26..
దీర్ఘప్రణవసంధానం సిద్ధాంతశ్రవణం పరం .
వజ్రోలీ చామరోలీ చ సహజోలీ త్రిధా మతా .. 27..
26. మహాముద్రా మహాంబంధో
మహావేధశ్చ ఖేచరీ
జాలంధరో ఉడ్డియాణశ్చ
మూలబంధః తథైవ చ,
27. దీర్ఘప్రణవ సంధానం, సిద్ధాంత శ్రవణం పరమ్।
వజ్రోళీ చ అమరోళీ చ సహజోళీ త్రిథామతా।।
(1) మహాముద్ర (2) మహాబంధము (3) మహావేధ (4) ఖేచరీ (5) జాలంధర బంధము (6) ఉడ్డియాణబంధము (7) మూలబంధము (8) దీర్ఘ ప్రణవ సంధానము (9) ‘పరము’నకు సంబంధించిన సిద్ధాంతశ్రవణము.
ఇవన్నీ యోగ సంధానమునకు సంబంధించిన సాధన సహకారికములు.
అట్లాగే → (1) వజ్రోళి (2) అమరోళి (3) సహజోళి - అను త్రిధామతములు (అంచలంచెలగు 3 యోగ సిద్ధి స్థానములు)

ఏతేషాం లక్షణం బ్రహ్మన్ప్రత్యేకం శృణు తత్త్వతః .
లఘ్వాహారో యమేష్వేకో ముఖ్యా భవతి నేతరః .. 28..
28. ఏతేషాం లక్షణమ్, బ్రహ్మన్!
ప్రత్యేకం శృణు తత్త్వతః।
లఘ్వాహారో యమేషు
ఏకో ముఖ్యో భవతి నేతరః। (న ఇతరః)।
బ్రహ్మాన్! వీటి వీటి తాత్త్విక సంబంధమైన ప్రత్యేక లక్షణములు వినండి.

యమము : ఇంద్రియములు విషయములతో లఘువుగా (తక్కువగా) సంబంధము కలిగి ఉండటము. ‘లఘు ఆహారము. అట్టి లఘు ఆహారము ‘యమము’ యొక్క ముఖ్యార్థము. తదితర అన్ని యమ ఉపాంగములలోకెల్లా ముఖ్యమైన ఉపాంగము.


అహింసా నియమేష్వేకా ముఖ్యా వై చతురానన .
సిద్ధం పద్మం తథా సింహం భద్రం చేతి చతుష్టయం .. 29..
29. అహింసా నియమేషు ఏకా
ముఖ్యావై, చతురాననా!

సిద్ధం పద్మం తథా సింహమ్
భద్రం చ ఇతి చతుష్టయమ్।
నియమము : ఓ బ్రహ్మభగవాన్! ‘నియమము’ అనబడు ద్వితీయ అంగయోగములో ‘అహింస’ (తదితర జీవులకు బాధ కలిగించకుండా ఉండువ్రతము) ముఖ్యమైన ఉపాంగము.

ఆసనము: ముఖ్యమైనవి ‘4’ ఆసనములు. (1) సిద్ధాసనము (2) పద్మాసనము (3) సింహ ఆసనము (4) భద్రాసనము. ఇవి ఆసన చతుష్టయము.

ప్రథమాభ్యాసకాలే తు విఘ్నాః స్యుశ్చతురానన .
ఆలస్యం కత్థనం ధూర్తగోష్ఠీ మంత్రాదిసాధనం .. 30..
ధాతుస్త్రీలౌల్యకాదీని మృగతృష్ణామయాని వై .
జ్ఞాత్వా సుధీస్త్యజేత్సర్వాన్విఘ్నాన్పుణ్యప్రభావతః .. 31..
30. ప్రథమాభ్యాస కాలే తు
విఘ్నాస్స్యుః, చతురాననా!
ఆలస్యం, కత్థనం,
ధూర్తగోష్ఠీ, మంత్రాది సాథనమ్,


31. ధాతు…స్త్రీ లౌల్యక - ఆదీని
మృగతృష్ణామయాని వై,
జ్ఞాత్వా సుధీః త్యజేత్ సర్వాన్
విఘ్నాన్ పుణ్య ప్రభావతః
।।
ఓ చతురాననా! యోగాభ్యాసము యొక్క ప్రారంభ దశలో కొన్ని కొన్ని విఘ్నములు గురించి చెప్పుకుందాము.
(1) బద్ధకము; ఆలస్యము; సోమరితనము (2) ఆత్మస్థుతి; పరనింద;
(3) ధూర్తగోష్ఠి → ఇతరుల చెడు గురించి సంభాషించుకొనే అలవాటు.
(4) మంత్రము జపించటమే సాధనముగా భావించి ‘మనోలయము’ను ఆశయముగా కలిగి ఉండకపోవటము. (5) ధాతు ధ్యాస (ధనము, సంతానము తదితర సంపదలపై ధ్యాస) (6) స్త్రీ - పురుష ఆకర్షణ భావములు.
మొదలైన ఇవన్నీ యోగ సాధకునికి ఎదురుపడే విఘ్నములు.

బుద్ధిమంతుడైనవాడు ‘‘ఇటువంటివన్నీ పైకి సుఖంగా వర్తమానంలో అనిపించటం భ్రమయే!- మృగతృష్ణలో నీరు త్రాగితే దాహం తీరి హాయిగా ఉంటుంది కదా-అని అనుకోవటం’’ అని తెలుసుకొని ఉండాలి.
పుణ్యకార్యములు నిర్వర్తిస్తూ, వాటి ప్రభావం చేత సర్వవిఘ్నములను జయించాలి.
పుణ్యకార్యముల ముఖ్యోద్దేశ్యము-ఆత్మభావనకు కలుగు విఘ్నములు జయించటమే.


ప్రాణాయామం తతః కుర్యాత్పద్మాసనగతః స్వయం .
సుశోభనం మఠం కుర్యాత్సూక్ష్మద్వారం తు నిర్వ్రణం .. 32..
సుష్ఠు లిప్తం గోమయేన సుధయా వా ప్రయత్నతః .
మత్కుణైర్మశకైర్లూతైర్వర్జితం చ ప్రయత్నతః .. 33..
దినే దినే చ సంమృష్టం సంమార్జన్యా విశేషతః .
వాసితం చ సుగంధేన ధూపితం గుగ్గులాదిభిః .. 34..
32. ప్రాణాయామం తతః కుర్యాత్
పద్మాసనగతః స్వయమ్,
సుశోభనం మఠం కుర్యాత్
సూక్ష్మద్వారంతు నిర్వణం,

33. సుష్ఠు లిప్తం గోమయేన
సుధయా వా ప్రయత్నతః
మత్కుణైః మశకైః లూతైః
వర్జితం చ ప్రయత్నతః।।

34. దినే-దినే చ సమ్మృష్టం
సమ్-మార్జన్యా విశేషతః
వాసితం చ సుగంధేన
ధూపితం గుగ్గులాదిభిః।।
(ఇక ప్రాణ - అపానముల సమత్వ అభ్యాసరూపమగు) ‘‘ప్రాణా యామము’’ను (లేక) ‘‘ప్రాణ నియమము’’ అను యోగాభ్యాసమును నిర్వర్తించపూనాలి.
అందుకొరకై…,
ధ్యాన ప్రదేశమును గోమయము (ఆవుపేడ)తోనూ, (లేదా) సున్నముతోను శుభ్రపరచుకోవాలి.
నల్లులు, దోమలు, సాలెపురుగులు ఉండకుండా, చేరకుండా పరిశుభ్రంగా ధ్యానస్థలమును సిద్ధం చేసుకోవాలి.
శోభనమైన మఠము (లేక) నివాసప్రాంగణము, అద్దానికి చిన్ననైన ద్వారం ఉండటము - ఇటువంటివి యోగాభ్యాసమునకు సులభసానుకూల్యాలు.

రోజూ ఊడ్చి, చిమ్మి, సుగంధ ద్రవ్యములతోను, (అగరుబత్తి వంటి) సువాసన వస్తువులు, గుగ్గిలం పొగలతో పరిశుభ్రం చేసి అలంకారం చేసుకొని ఉంచాలి. ఆహ్లాదవంతము, పరిమళవంతము చేసుకోవాలి.

నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరం .
తత్రోపవిశ్య మేధావీ పద్మాసనసమన్వితః .. 35..
ఋజుకాయః ప్రాంజలిశ్చ ప్రణమేదిష్టదేవతాం .
తతో దక్షిణహస్తస్య అంగుష్ఠేనైవ పింగలాం .. 36..
నిరుధ్య పూరయేద్వాయుమిడయా తు శనైః శనైః .
యథాశక్త్యవిరోధేన తతః కుర్యాచ్చ కుంభకం .. 37..
35. న అతి ఉచ్ఛ్రితం,
న అతి నీచం,
చేలాజిన కుశోత్తరమ్,
తత్ర ఉపవిశ్వ మేథావీ,
పద్మాసన సమన్వితః,
36. ఋజుకాయః ప్రాంజలిశ్చ
ప్రణమేత్ ఇష్టదేవతామ్,
తతో దక్షిణ హస్తస్య
అంగుష్ఠేనైవ పింగళామ్,
37. నిరుధ్య, పూరయేత్ వాయుమ్,
ఇడయా తు శనైః శనైః
యథాశక్తి అవిరోధేన
తతః కుర్యాత్ చ ‘‘కుంభకమ్’’।।
ధ్యానపీఠస్థానము మరీ ఎత్తుగాగాని, మరీ పల్లముగాగానీ ఉండరాదు. అద్దానిమీద దర్భలు, కృష్ణాజినము (జింకచర్మము) పరచి, పద్మాసనముతో ఆచోట ఆసీనుడై నిర్మలమైన, సుతీక్షణమైన బద్ధితో (మేధావి) ఇక యోగసాధనకు ఉపక్రమించాలి.

ప్రాణాయామము - ‘‘ఇడా పూర్వక’’
- పద్మాసనాసీనుడై శరీరమును నిలువుగా, నిఠారుగా ఉంచి
- ముందుగా ఇష్ట దేవతను తలచుకొని ముకుళించిన హస్తములతో కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ప్రార్థనపూర్వక నమస్కారములు సమర్పించాలి.
Ⅰ. ఇడాపూర్వకము: ఇప్పుడు కుడిచేతి బొటనవ్రేలితో కుడిముక్కుపుటము, తద్వారా ‘పింగళ’ నాడిని అణచి ఉంచుకొని, ఎడమ ముక్కుపుటతో (12 అంగుళముల బహిర్‌స్థానము నుండి)… గాలిని నెమ్మది నెమ్మదిగా ఎడమ ‘వైపుగల ఇడ’ నాడిలో గాలిని పూర్ణముగా పూరించాలి.
అప్పుడు వాయువును లోన కుంభించి (నిలిపి) ఉంచాలి. అది ‘కుంభకము’ అవుతుంది. శక్తి కలిగినంతవరకు, అవిరోధపూర్వకంగా (సుఖముగా ఉన్నంతసేపు) ‘కుంభకము’ (Holding Air unmoved) నిర్వర్తించాలి.

పునస్త్యజేత్పింగలయా శనైరేవ న వేగతః .
పునః పింగలయాపూర్య పూరయేదుదరం శనైః .. 38..
ధారయిత్వా యథాశక్తి రేచయేదిడయా శనైః .
యయా త్యజేత్తయాపూర్య ధారయేదవిరోధతః .. 39..
38. పునః త్యజేత్ పింగళయా
శనైరేవ, న వేగతః।
పునైః పింగళయా ఆపూర్య
పూరయేత్ ఉదరం శనైః।

39. ధారయిత్వా యథాశక్తిః
రేచయేత్ ఇడయా శనైః
యయా త్యజేత్, తయా ఆపూర్య
ధారయేత్ అవిరోధతః।।
ఆ విధంగా వాయువును ఇడలో (Left side) పీల్చి-కుంభక థారణ (Constantly/unmovingly Holding) సుసాధ్యమైనంతవరకు నిర్వర్తించిన తరువాత, పింగళనాడి ద్వారా (On the Right side - through nostril) కుంభించినట్టి వాయువును నెమ్మదిగా బయటకు విడవాలి. వేగంగా కాదు! నెమ్మదిగా సుమా!

Ⅱ. పింగళా పూర్వకము: ఇప్పుడిక పింగళాపూరక (ఎడమ ముక్కుపుటను కుడిచేతి చూపుడు వ్రేలుతోగాని, ఎడమచేతి బొటనవ్రేలుతోగాని మూసి ఉంచి, వాయువును 12 అం।।ములు బయటనుండి, గాలిని పీల్చుచు) → ‘పింగళనాడి’ని నెమ్మదిగా పూరించాలి. ఆ వాయువును నెమ్మదిగా ఇడలోను, ఉదరంలోను నింపి ఉంచాలి. (ఉదర పూరకము).
(అనగా), ఇడలోను ఉదరములోను యథాశక్తిగా వాయువును ధారణ (ఇడా కుంభకము) చేసి ఉంచాలి. మనస్సుకు, దేహమునకు ఇబ్బంది, బాధ లేనంతవరకు ధారణ (కుంభకము) చేయాలి.
- అప్పుడిక ఇడనాడి ద్వారా (ఎడమముక్కు పుటద్వారా) నెమ్మదిగా వాయువును రేచకించాలి. (వదలాలి)

జాను ప్రదక్షిణీకృత్య న ద్రుతం న విలంబితం .
అంగులిస్ఫోటనం కుర్యాత్సా మాత్రా పరిగీయతే .. 40..
40. జానూ ప్రదక్షిణీ కృత్య
న ద్రుతం, న విలంబితమ్
అంగుళీ స్ఫోటనం కుర్యాత్
సా మాత్రా పరిగీయతే।।
- ఎలా వాయువును త్యజించాడో, అట్లానే మరల వాయువును ఉదరముతో పూరించాలి.

‘‘మాత్ర’’ - నిర్వచనము
- ఆ విధంగా పూరించిన వాయువుతో మోకాళ్ళచుట్టూ ప్రదక్షిణం చేయాలి. అట్టి ప్రాణవాయు ప్రదక్షిణమును మరీ పట్టుదలగా కాదు. మరీ పట్టుదల లేకుండా కాదు. మరీ వేగంగా కాదు. మరీ, నెమ్మదిగా కాదు. స్వాభావికంగా ఉండుగాక! బొటనవ్రేలును స్ఫోటకం చేసి (ముక్కుపుట నుండి తొలగించి) వదలాలి. ‘‘పూరకం+జానునీ ప్రదక్షిణం+రేచకం = 1 మాత్ర’’ అంటారు.

ఇడయా వాయుమారోప్య శనైః షోడశమాత్రయా .
కుంభయేత్పూరితం పశ్చాచ్చతుఃషష్ట్యా తు మాత్రయా .. 41..
రేచయేత్పింగలానాడ్యా ద్వాత్రింశన్మాత్రయా పునః .
పునః పింగలయాపూర్య పూర్వవత్సుసమాహితః .. 42..
41. ఇడయా వాయుమ్ ఆరోప్య, శనైః షోడశమాత్రయా
కుంభయేత్ పూరితం పశ్చాత్, చతుషష్ట్యాతు (64) మాత్రయా।
42. రేచయేత్ పింగళా, నాడ్యా ద్వాత్రింశత్ (32)
మాత్రయా పునః, పునః పింగళయా ఆపూర్య
పూర్వవత్ సుసమాహితః।।
‘ఇడ’లో వాయువును నెమ్మదిగా పూరించు సమయము = 16 మాత్రలు.
(పింగళలో) వాయువును కుంభించి ఉంచు సమయము = 64 మాత్రలు.
పింగళనాడి నుండి వాయువును వదలుచూ ఉండవలసిన సమయము = 32 మాత్రలు.
అటు తరువాత ‘పింగళ’ నాడిలో పూర్వమువలె సమాహితంగా పూరించవలసిన సమయము పైవిధంగానే.

ప్రాతర్మధ్యందినే సాయమర్ధరాత్రే చ కుంభకాన్ .
శనైరశీతిపర్యంతం చతుర్వారం సమభ్యసేత్ .. 43..
ఏవం మాసత్రయాభ్యాసాన్నాడీశుద్ధిస్తతో భవేత్ .
యదా తు నాడీశుద్ధిః స్యాత్తదా చిహ్నాని బాహ్యతః .. 44..
జాయంతే యోగినో దేహే తాని వక్ష్యామ్యశేషతః .
43. ప్రాతః మధ్యందినే సాయమ్
అర్ధరాత్రే చ కుంభకాన్
శనైః అశి (80) ఇతి
పర్యంతం చతుర్వారం
సమభ్యసేత్।।
44. ఏవం మాసత్రయ అభ్యాసాత్
నాడీ శుద్ధిః తతో భవేత్।
45. యదా తు నాడీ శుద్ధిస్స్యాత్
తదా చిహ్నాని బాహ్యతః
జాయంతే యోగినో దేహే
తాని వక్ష్యామి అశేషతః।
పై విధమైన ప్రాణాయామమును
(1) ప్రాతఃకాలము (4 AM to 8 AM)
(2) మధ్యందినే (12 Noon to 2 PM)
(3) సాయంకాలము (4 PM to 6 PM)
(4) అర్ధరాత్రి (8 PM to 12 AM in the Mid Night)

ప్రతి ఒక్కసారి - 20 మార్లు
20 x 4 = 80 ప్రాణాయామములను నెలలో గల 4 వారములు చక్కగా (తొందరలేకుండా నెమ్మదిగా) అభ్యాసము చేయాలి. ఈ విధంగా ‘3’ నెలలు అభ్యసిస్తే దేహములో నాడులన్నిటిలో శుద్ధి జరుగగలదు.

(ఎప్పుడైతే (1) ఇడాపూరక - కుంభక - పింగళారేచక (2) పింగళాపూరక - కుంభక - ఇడా రేచక ద్వయముతో కూడిన ప్రాణాయామము 20 సార్లు ద్వయముతో కూడిన ప్రాణాయామము 20 సార్లు చొప్పున ప్రాతః - మధ్యాహ్న - సాయం - అర్ధరాత్రిలుగా రోజుకు 20 x 4 = 80 ప్రాణాయామములు ‘3’ నెలలు నిర్వర్తించగా, నాడుల శుద్ధి జరుగగా) అప్పుడు అట్టి యోగి యొక్క దేహములో జరుగు నాడీశుద్ధి యొక్క శరీరపు బాహ్యచిహ్నములన్నీ వివరిస్తున్నాను.
హే బ్రహ్మ భగవాన్! వినండి.

శరీరలఘుతా దీప్తిర్జాఠరాగ్నివివర్ధనం .. 45..
కృశత్వం చ శరీరస్య తదా జాయేత నిశ్చితం .
యోగావిఘ్నకరాహారం వర్జయేద్యోగవిత్తమః .. 46..
46. శరీర లఘుతా, దీప్తిః,
జాఠరాగ్ని వివర్థనమ్।
కృశత్వం చ శరీరస్య
తదా జాయేత నిశ్చితమ్।।
యోగవిఘ్నకర ఆహారం
వర్జయేత్ యోగ విత్తమః।।
- ఇతః పూర్వము బరువుగా అనిపించే ఈ దేహము ఇక తేలికైన వస్తువువలె అనిపించసాగుతుంది.
- దేహమంతా తేజోవంతమై అనుభవమౌతుంది.
- పొట్టలోని జఠరాగ్ని బాగా జ్వలితమౌతుంది. (బాగుగా వెలుగ సాగుతుంది).
- శరీరము సన్నపడుతుంది
ఇవన్నీ క్రమక్రమంగా స్వానుభవము అగుచున్నాయి.

అయితే, ఒక చిన్న హెచ్చరిక!
యోగవేత్త (యోగాభ్యాసి) యోగసాధనకు విఘ్నకరములగు ఆహార పదార్థములను గమనించి, వాటిని వదలి ఉండాలి సుమా!


లవణం సర్షపం చామ్లముష్ణం రూక్షం చ తీక్ష్ణకం .
శాకజాతం రామఠాది వహ్నిస్త్రీపథసేవనం .. 47..
ప్రాతఃస్నానోపవాసాదికాయక్లేశాంశ్చ వర్జయేత్ .
అభ్యాసకాలే ప్రథమం శస్తం క్షీరాజ్యభోజనం .. 48..
47. లవణం, సర్ష, పంచామ్లమ్
ఉష్ణం రూక్షణాం చ తీక్ష ణాకమ్
శాకజాతం రామఠాది
వహ్నీ స్త్రీ పథసేవనమ్,
48. ప్రాతః స్నాన ఉపవాసాది
కాయ క్లేశాంశ్చ వర్జయేత్।
అభ్యాసకాలే ప్రథమం
శస్తం క్షీర - ఆజ్య భోజనమ్।।
ఉప్పు, ఆవాలు, చింతపండు, బాగా వేడిగా ఉండే పదార్థాలు, కారము, కాక చేయు కారపు పదార్థాలు, (గోంగూర వంటి) కొన్ని తీవ్రక్షారగుణ ఆకు కూరలు, ఇంగువ, తెల్ల ఉల్లి….ఇటువంటివి అధికంగా తీసుకొంటూ ఉంటే అవి యోగాభ్యాసునికి విఘ్నములు కలుగజేసే అవకాశాలు అధికం. అట్లాగే పర స్త్రీలతో అధిక సరస-విరస సంభాషణలు, సంచారములు కూడా. (స్త్రీలకైతే పరపురుషులతో సరస-విరసాలు).
చలిలో తెల్లవారుజామున స్నానములు, అధికంగా ఉపవాసములు, తదితర దేహమునకు అధిక కేశములు కలిగించు క్రియావిశేషాల ఆధిక్యత - ఇవన్నీ యోగసాధనకు, సంబంధిత ఏకాగ్రతలకు ప్రాతికూల్యం అవవచ్చు. శరీర సానుకూల్యత దృష్ట్యా వదలి ఉండటం ఉచితం. యోగసాధనయొక్క ప్రారంభపు దశలో పాలు, నేయిలతో భోజనము శ్రేయస్కరము.

గోధూమముద్గశాల్యన్నం యోగవృద్ధికరం విదుః .
తతః పరం యథేష్టం తు శక్తః స్యాద్వాయుధారణే .. 49..
49. గోధూమ ముద్గ శాల్యన్నం
యోగవృద్ధికరం విదుః।
తతః పరం యథేష్టంతు
శక్తస్యాత్ వాయు ధారణే।।
గోధుమలు, ముద్గ (పెసలు) శాల్యన్నము (శ్రేష్ఠమైన వరి అన్నము) - ఇవి భుజించుటము యోగవృద్ధికరము.
యోగాభ్యాసము సుసాధ్యమైనంతవరకు కొనసాగుచుండగా క్రమంగా ఇష్టానుసారంగా వాయుధారణ చేయు సమయము వృద్ధి దానంతట అదే పొందుతూ ఉంటుంది.

యథేష్టవాయుధారణాద్వాయోః సిద్ధ్యేత్కేవలకుంభకః .
కేవలే కుంభక సిద్ధే రేచపూరవివర్జితే .. 50..
50. యథేష్ట ధారణాత్ వాయోః
సిద్ధ్యేత్ ‘కేవల కుంభకః’
కేవలే కుంభకే సిద్ధే
రేచ పూర వివర్జితే
।।
ఆ విధంగా వాయు ధారణ ఇష్టముతో కూడి అధిక కాలయుతము, అధిక శక్తి సు-సంపన్నము అగుచుండగా ‘కేవల కుంభకము’ అనే ‘‘రేచక - పూరక రహిత ప్రాణయామము’’ స్వభావసిద్ధి కాసాగగలదు.
కేవల కుంభకము సిద్ధిస్తూ ఉండగా రేచక - పూరకముల ఆవస్యకత ఉండదు.

న తస్య దుర్లభం కించిత్త్రిషు లోకేషు విద్యతే .
ప్రస్వేదో జాయతే పూర్వం మర్దనం తేన కారయేత్ .. 51..
తతోఽపి ధారణాద్వాయోః క్రమేణైవ శనైః శనైః .
కంపో భవతి దేహస్య ఆసనస్థస్య దేహినః .. 52..
51. న తస్య దుర్లభం కించిత్
త్రిషులోకేషు విద్యతే
52. ప్రస్వేదో జాయతే పూర్వం
మర్దనం తేన కారయేత్।
తతోఽపి ధారణాత్ వాయోః
క్రమేణైవ శనైః శనైః
కఫో భవతి దేహస్య
ఆసనస్థస్య దేహినః।।
ఏ యోగికి పూరక - రేచకములు అవసరము లేకుండానే ‘కేవలకుంభకము’ సిద్ధిస్తూ ఉంటుందో, అట్టి వానికి (కేవల కుంభక సిద్ధియోగికి) ఈ మూడు లోకములలో అసాధ్యము, దుర్లభము అనునది ఏదీ ఉండదు.

యోగ సాధన సమయంలో ప్రారంభ దశలో స్వేదనము (చెమట) ఎక్కువగా జనిస్తూ ఉంటుంది. అట్టి స్వేదనలో ‘యోగ తేసజస్సు’ దాగి ఉంటుంది కనుక, అద్దానిని ఎప్పటికప్పుడు అచ్చోటనే (చర్మముపై) మర్దనము చేయబడునుగాక!

ఆ విధంగా మరికొంత వాయుధారణ (కుంభక ప్రాణాయామ సాధన) కొనసాగుచుండగా, దేహమునుండి ఆసన ప్రదేశంలో కఫము (Oily and Juicy) ఆ దేహికి అనుభూతమగుచూ ఉండగలదు.

తతోఽధికతరాభ్యాసాద్దార్దురీ స్వేన జాయతే .
యథా చ దర్దురో భావ ఉత్ప్లున్యోత్ప్లుత్య గచ్ఛతి .. 53..

53. తతో అధికతర అభ్యాసాత్
దారుణాత్ స్వేద ఉద్భవేత్,
యదా చ దార్దురో భావ
ఉత్ప్లుత్య గచ్ఛతి।

మరికొంత ప్రాణనిరోధాభ్యాసము జరుగుచుండగా అధికంగాను, వెచ్చగాను స్వేదము ఉద్భవము కాగలదు.
అటు తరువాత ఆ యోగికి ‘కప్ప’వలె కుప్పిగంతులు వేయు దేహదార్డ్యభావము కలుగుచున్నది. ఆనందముతో కూడిన ఉత్సాహము పొంగి పొరల సాగుతుంది.


పద్మాసనస్థితో యోగీ తథా గచ్ఛతి భూతలే .
తతోఽధికతరభ్యాసాద్భూమిత్యాగశ్చ జాయతే .. 54..
54. పద్మాసనస్థితో యోగీ
తథా గచ్ఛతి భూతలే।
తతో అధికతర అభ్యాసాత్
భూమిత్య ఆగశ్చ జాయతే।।
‘పద్మాసనము’ ధరించి యోగాభ్యాసము చేయుచూ ఉన్న యోగికి, భూమిపై ఎగురుచూ అడుగులు వేయు ఉత్సాహము (నైరాస్యరాహిత్యము) రూపుదిద్దుకోసాగుతుంది. వినోదముతో కూడిన ఉత్సాహము పొంగిపొరల సాగుతుంది.

పద్మాసనముతో ప్రాణాయోగాభ్యాసము ఇంకా ఇంకా కొనసాగుచుండగా, అట్టి అభ్యాసికి భూమి నుండి పైకి ఎగయు శక్తి కూడా రూపుదిద్దుకోగలదు.

పద్మాసనస్థ ఏవాసౌ భూమిముత్సృజ్య వర్తతే .
అతిమానుషచేష్టాది తథా సామర్థ్యముద్భవేత్ .. 55..
న దర్శయేచ్చ సామర్థ్యం దర్శనం వీర్యవత్తరం .
స్వల్పం వా బహుధా దుఃఖం యోగీ న వ్యథతే తదా .. 56..
55. పద్మాసనస్థ ఏవ అసౌ
భూమిమ్ ఉత్‌సృజ్య వర్తతే।
అతి మానుష చేష్టాది
తథా సామర్థ్యమ్ ఉద్భవేత్।
56. న దర్శయేచ్చ సామర్థ్యం
దర్శనమ్ వీర్యవత్తరమ్।
స్వల్పం వా బహుధా దుఃఖం
యోగీ న వ్యథతే తదా।
భూమి నుండి ఆకాశంలో పైకి ఎగయు శక్తి కూడా పద్మాసనస్థితుడగు ప్రాణాభ్యాసి సిద్ధించుకోగలుగుతాడు. మానవాతీతమగు కార్యముల సామర్థ్యములు ఆతని యందు ఉద్భవిస్తున్నాయి.

అయితే, యోగాభ్యాసులకు ఒక ముఖ్యమైన జాగరూకత (లేక) హెచ్చరిక! అటువంటి యోగసిద్ధి - వీర్యవర్తన సామర్థ్యములను మహిమలతో కూడిన వ్యక్తిత్వమును ఇతరులకు చూపరాదు. ఇతరులు తెలుసుకోవాలని అనుకోకూడదు. మానవాతీత సామర్థ్యములు తదితర జనులను ఆశ్చర్య పరచుటకు ఉద్దేశ్యించరాదు.

అట్టి యోగి యోగసిద్ధియొక్క ప్రభావంచేత - స్వల్పమైన (లేదా) అధికమైన సుఖదుఃఖములకు లోనుకాడు. చెక్కుచెదరడు. వ్యధ చెందడు.

అల్పమూత్రపురీషశ్చ స్వల్పనిద్రశ్చ జాయతే .
కీలవో దృషికా లాలా స్వేదదుర్గంధతాననే .. 57..
ఏతాని సర్వథా తస్య న జాయంతే తతః పరం .
57. అల్ప మూత్ర పురీషశ్చ, స్వల్ప నిద్రశ్చ జాయతే
కీలవో దూషికా లాలా, స్వేద దుర్గంధతాననే
ఏతాని సర్వథా తస్య, న జాయంతే తతః పరమ్।
ఆ యోగి విషయములో మలమూత్రముల విసర్జనావశ్యకత అల్పము అగుచున్నది. నిద్రయొక్క ఆవస్యకత కూడా స్వల్పముగా అగుచున్నది. కీలలు, ధూష్ఠిక, (చెవులో గులుబు, కంటిలో పుసులు) లాలాజల, చమట దుర్వాసనలు కనిపించవు. ఆతడు వాటి నుండి నిర్మలత్వము సంతరించుకుంటున్నాడు. ఆతనిని దుర్వాసనలు స్పృశించవు. దరిజేరవు.

తతోఽధికతరాభ్యాసాద్బలముత్పద్యతే బహు .. 58..
యేన భూచర సిద్ధిః స్యాద్భూచరాణాం జయే క్షమః .
వ్యాఘ్రో వా శరభో వ్యాపి గజో గవయ ఏవ వా .. 59..
సింహో వా యోగినా తేన మ్రియంతే హస్తతాడితాః .
58,59. తతో అధికతర-అభ్యాసాత్, బలమ్ ఉత్పద్యతే బహు
యేన భూచర సిద్ధిస్స్యాత్, భూచరాణాం జయే(త్) క్షమః।
వ్యాఘ్రోవా శరభోవాఽపి, గజో గవయ ఏవవా
సింహోవా యోగినా తేన, మ్రియంతే హస్త తాడితాః।।
ఆతనియొక్క ఇంకా అధికమైన అభ్యాసము చేత ఆతని దేహములో గొప్పదేహబలము ఉత్పన్నము కాగలదు. తద్వారా ఆతనికి ‘భూచరసిద్ధి’ ఏర్పడుచున్నది. భూమిపై చరించే ఏ జంతువునైనా శాసించే, జయించే సామర్థ్యము ఆయాచితంగా కలుగుచున్నది.
‘పులినైనా, శరభము (ఒంటె)నైనా, ఏనుగునైనా గవయమృగము (ఎద్దు)నైనా, సింహమునైనా కూడా ఒక చేతి స్పర్శతో శాసించగలదు. చేతితో కొట్టి చంపివేయగలడు.

కందర్పస్య యథా రూపం తథా స్యాదపి యోగినః .. 60..
తద్రూపవశగా నార్యః కాంక్షంతే తస్య సంగమం .
యది సంగం కరోత్యేష తస్య బిందుక్షయో భవేత్ .. 61..
60. కందర్పస్య యథా రూపం,
తథాస్యాత్ అపి యోగినః।।
61. తత్ రూపవశగా నార్యః, కాంక్షంతే తస్య సంగమమ్।
యది సంగం కరోతి, ఏష తస్య బిందుక్షయో భవేత్।
ఆతడు మన్మథుని వంటి తేజోసౌందర్యమును (ఆతని యోగా సాధనయొక్క ఉత్కృష్టతచేత) పునికిపుచ్చుకొనుచున్నాడు. స్త్రీలు ఆతని సంగమము కోరుకొనునంతటి స్ఫురద్రూపి అగుచున్నాడు.
ఒక వేళ ఆతడు స్త్రీ వశుడై ‘సంగము’ పొందాడా, ఆతడు ‘బిందుక్షయము (శుక్లక్షయము) పొందుచున్నాడు. యోగసాధనాబలము క్షీణించగలదు.

వర్జయిత్వా స్త్రియాః సంగం కుర్యాదభ్యాసమాదరాత్ .
యోగినోఽఙ్గే సుగంధశ్చ జాయతే బిందుధారణాత్ .. 62..
62. వర్జయిత్వా స్త్రియాః సంగం
కుర్యాత్ అభ్యాసమ్ ఆదరాత్।
యోగినో అంగే సుగంధశ్చ
జాయతే బిందు ధారణాత్।।
అందుచేత యోగాభ్యాసి స్త్రీ సాంగత్యమునకు (పరస్త్రీతో స్పర్శాది సంబంధమునకు) దూరంగా ఉండి, ఏకాగ్రతతో యోగసాధనను కొనసాగించాలి. (సతి-ఈయమ్ - స్త్రీయమ్. దృశతాదాత్మ్యము. Its meaning is not mere ‘Female’).

ఈ విధంగా ఇంద్రియ విషయములపట్ల ధ్యాసను ఉపసంహరించుచూ యోగాభ్యాసమునందే ఇష్టముగా సాధన కొనసాగించు యోగి దేహమునందు ఆతడు ఉన్న పరిసరములను మాధుర్యముగా చేసివేయు ‘సుగంధము’ వ్యక్తమై, (పారిజాతమువలె) సహజీవులకు ఆతని ఉనికి ఆహ్లాదము కలుగజేయగలదు.

తతో రహస్యుపావిష్టః ప్రణవం ప్లుతమాత్రయా .
జపేత్పూర్వార్జితానాం తు పాపానాం నాశహేతవే .. 63..
సర్వవిఘ్నహరో మంత్రః ప్రణవః సర్వదోషహా .
ఏవమభ్యాసయోగేన సిద్ధిరారంభసంభవా .. 64..
63. తతో రహస్య ఉపావిష్టః
ప్రణవం ప్లుతమాత్రయా
జపేత్ పూర్వార్జితానాం తు
పాపానాం నాశ హేతవే।।
64. సర్వవిఘ్నహరో మంత్రః
ప్రణవః సర్వదోష హా।
ఏవమ్ అభ్యాసయోగేన
సిద్ధిః ఆరంభ సంభవా।।
యోగ అంతర్ముఖత్వము
యోగాభ్యాసి సమయము దొరికినప్పుడల్లా ఏకాంతము(Loneliness)గా ఒకచోట పద్మాసనాశీనుడై కూర్చుని ‘ఓం’ కారమంత్రమును జపించును గాక.
‘‘నేను పూర్వార్జితంగా స్వకీయ దేహ-మనో-బుద్ధి- చిత్త- అహంకారముల ద్వారా నిర్వర్తించుటచే జనించినట్టి దుష్ట - దోష - పాప స్వభావ సంస్కారములు ఏమేమి ఉన్నాయి?’’ → అని గమనించి, ఓంకార మంత్ర జపం సహాయంతో నాశ హేతువులగు పాపదృష్టులను తొలగించు కుంటాడు. ప్రణవోచ్చారణచే అట్టి దోషములు తొలగిపోతున్నాయి.
‘ఓం’ అను (అకార ఉకార మకార అర్ధమాత్ర లయ రూప) ప్రణవము యొక్క జప - భావ - ఉచ్ఛారణలు సర్వ విఘ్నములను హరించగలవు. సర్వ దోష దుష్ట అల్పదృష్టి సంస్కారములను, వాసనలను తొలగించగలదు. అందుచేత అభ్యాసయోగమును ప్రణవమంత్రోపాసనతో ప్రారంభిస్తే ‘సిద్ధి’యొక్క స్థితి ఆరంభమయినట్లే.


తతో భవేద్ధఠావస్థా పవనాభ్యాసతత్పరా .
ప్రాణోఽపానో మనో బుద్ధిర్జీవాత్మపరమాత్మనోః .. 65..
అన్యోన్యస్యావిరోధేన ఏకతా ఘటతే యదా .
ఘటావస్థేతి సా ప్రోక్తా తచ్చిహ్నాని బ్రవీమ్యహం .. 66..
పూర్వం యః కథితోఽభ్యాసశ్చతుర్థాంశం పరిగ్రహేత్ .
దివా వా యది వా సాయం యామమాత్రం సమభ్యసేత్ .. 67..
65. తతో భవేత్ ‘ఘటావస్థా’
పవన అభ్యాస తత్పరా।
66. ప్రాణ - అపానో మనోబుద్ధిః
జీవాత్మ పరమాత్మనోః
అన్యోన్యస్య అవిరోధేన
ఏకతా ఘటతే యదా
‘ఘటావస్థా’ ఇతి సా ప్రోక్తా।
ఘటావస్థ
అట్టి ‘ప్రణవము’ యొక్క అధికమైన అభ్యాసముచే ‘ఘటావస్థ’ ఏర్పడుచున్నది.

ఘటావస్థ అనగా?
(1) ప్రాణము (2) అపానము (3) మనస్సు (4) బుద్ధి (5) జీవాత్మ (6) పరమాత్మ - ఎప్పుడైతే ఈ ‘6’ కూడా అన్యోన్యమై, పరస్పరము ఏమాత్రము విరోధము Opposition to each others కించిత్ కూడా లేకుండాపోయి, ఏకత్వము పొందినవై ఉంటాయో అద్దానిని ‘‘ఘటావస్థ’’ అని పిలుస్తున్నారు.

67. (ఘటావస్థా) తత్ చిహ్నాని
బ్రవీమి అహమ్।
పూర్వం యః కథితో అభ్యాసః
చతుర్థాంశం (1/4) పరిగ్రహేత్।
దివా వా యదివా సాయం
యామ మాత్రం సమభ్యసేత్।

బ్రహ్మాత్మదేవా! ఘటావస్థయొక్క తదితర ముఖ్య చిహ్నములు (గుర్తులు) చెపుతాను. వినండి.
మనం ఇతఃపూర్వం చెప్పుకున్న ఇడ - పింగళలలో ఒకదాని తరువాత మరొకటిగా (1) ఇడా పూరక - కుంభక - పింగళా రేచక , (2) పింగళా పూరక - కుంభక - ఇడా రేచక,
‘‘16 మాత్రలు — 64 మాత్రలు — 32 మాత్రలు’’
(మాత్ర = ఉదరములో పూరించిన వాయువును మోకాళ్ళు చుట్టూ ఒకసారి త్రిప్పుకొనివచ్చిన సమయము)

ఈ అభ్యాసము 80 సార్లులో - నాలుగవవంతు (అనగా రోజుకు ఒక్కసారి - 20 ప్రాణాయామములు) - (తెల్లవారుఝామునగానీ, మధ్యాహ్నంగానీ, సాయంకాలంగాని, రాత్రిగాని ఒకసారి) - సమభ్యసించుటచే సిద్ధించునది → ఘటావస్థ. ఇది మొత్తం యామ మాత్రము (3 గంటల కాలము) క్రమంగా అభ్యసించబడును గాక!

ఏకవారం ప్రతిదినం కుర్యాత్కేవలకుంభకం .
ఇంద్రియాణీంద్రియార్థేభ్యో యత్ప్రత్యాహరణం స్ఫుటం .. 68..
యోగీ కుంభకమాస్థాయ ప్రత్యాహారః స ఉచ్యతే .
యద్యత్పశ్యతి చక్షుర్భ్యాం తత్తదాత్మేతి భావయేత్ .. 69..
యద్యచ్ఛృణోతి కర్ణాభ్యాం తత్తదాత్మేతి భావయేత్ .
లభతే నాసయా యద్యత్తత్తదాత్మేతి భావయేత్ .. 70..
జిహ్వయా యద్రసం హ్యత్తి తత్తదాత్మేతి భావయేత్ .
త్వచా యద్యత్స్పృశేద్యోగీ తత్తదాత్మేతి భావయేత్ .. 71..
ఏవం జ్ఞానేంద్రియాణాం తు తత్తత్సౌఖ్యం సుసాధయేత్ .
68. ఏకవారం ప్రతిదినం కుర్యాత్
‘కేవల కుంభకమ్’। ఇంద్రియాణి
ఇంద్రియార్థేభ్యో యత్
ప్రత్యాహరణమ్ స్ఫుటమ్।

69. యోగీ కుంభకమ్ ఆస్థాయ
‘ప్రత్యాహారః’ స ఉచ్యతే।।
యత్ యత్ పశ్యతి చక్షుర్భ్యాం
తత్ తత్ ఆత్మేతి భావయేత్।

యత్ యత్ శృణోతి కర్ణాభ్యాం
తత్ తత్ ఆత్మేతి భావయేత్।।

70. లభతే నాసయా యత్‌యత్
తత్ తత్ ఆత్మేతి భావయేత్।।
జిహ్వయా యత్ రసం హి యత్ యత్
తత్ తత్ ఆత్మేతి భావయేత్।।

71. త్వక్ చా యత్ యత్ స్పృశేత్
యోగీ, తత్ తత్ ఆత్మేతి
భావయేత్।
ఏవం జ్ఞానేంద్రియాణాం తు
తత్ తత్ సౌఖ్యం తు సాధయేత్।
ఈ విధంగా ప్రతిరోజు ఒక్కసారి కొంతసేపు ‘కేవలకుంభకము’ను అభ్యసిస్తూ ఇంద్రియములను, ఇంద్రియార్థములను (ఇంద్రియవిషయము లను) వెనుకకు మరల్చి ఆత్మస్వరూపమునందు మౌనము చేసి ఉంచు ప్రత్యాహరణ క్రియయే ప్రత్యాహారము. అదియే కేవలకుంభక ప్రత్యాహార ధారణము.


ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి ఉపసంహరించి కేవల కుంభకము నిర్వర్తిస్తూ ప్రత్యాహారం సిద్ధించుకోవటం అనగా ఏమి? ఎట్లా?

ఓ బ్రహ్మదేవా? అది సులభమే! ఎట్లా అనగా….
కనులకు ఏదేది కనిపిస్తోందో అదంతా కూడా ‘‘ఆత్మయే’’ అని భావించుచూ చూడటము.
✤ ఏదేది చెవులకు వినబడుచూ ఉన్నదో… అదంతా ‘ఆత్మయే’ కదా’’ అను భావనతో వినటము,
✤ ఏదేది ముక్కుతో గంధములుగా అగుచున్నదో అదంతా ‘‘ఆత్మస్వరూపమే’’ అని అనుకుంటూ ఆ వాసనానుభవం పొందటము.
✤ ఏదేది జిహ్వ (నాలుక)తో ఆయా అనేక రుచులుగా పొందబడు చున్నదో అదంతా ‘‘ఆత్మరసమే, ఆత్మయే’’…అను అభిరుచితో ఆస్వాదించటము.
✤ ఏదేది ఈ చర్మమునకు అనేక స్పర్శానుభవములుగా అనుభూతమగుచున్నవో, అవన్నీ ‘ఆత్మయే’ అని తలచుచూ వాటిని పొందటము,
ఈ విధంగా జ్ఞానేంద్రియముల అనుభవములన్నీ, వాటివలన ఏర్పడు సుఖదుఃఖములు, సమస్త అనుభవములు ‘ఆత్మయే’ అను భావనచే పొందాలి. ఇదియే ప్రత్యాహారము! అదియే కేవల మరియు సహజ కుంభకము కూడా అట్టి ఆత్మసౌఖ్యము క్రమంగా స్వాభావికం అగుచున్నది.

యామమాత్రం ప్రతిదినం యోగీ యత్నాదతంద్రితః .. 72..
యథా వా చిత్తసామర్థ్యం జాయతే యోగినో ధ్రువం .
72. యామ మాత్రం ప్రతిదినమ్
యోగీ యత్నాత్ అతంద్రితః
యథా వా చిత్త సామర్థ్యం
జాయతే యోగినో ధృవమ్।।
యోగి ప్రతిరోజూ ఒక జాముకాలము (Say, 45 minutes) (1) సోమరి తనమును (2) విషయములవైపు మనస్సుయొక్క చ్యుతిని- త్యజించి ఇంద్రియ పరిధులను బుద్ధితో దాటివేసి (అంచలంచల కుంభక- కేవల కుంభకము లను) - యోగసాధన చేస్తూ ఉండగా, క్రమంగా ఆతని చిత్తము ధృవమగు సామర్థ్యము పొందగలదు. ఆతనిని సర్వసామర్థ్యములు ఆశ్రయిస్తాయి.

దూరశ్రుతిర్దూరదృష్టిః క్షణాద్దూరగమస్తథా .. 73..
వాక్సిద్ధిః కామరూపత్వమదృశ్యకరణీ తథా .
73. దూర శ్రుతిః దూరదృష్టిః
క్షణాత్ దూరాగమః తథా
వాక్సిద్ధిః కామరూపత్వమ్
అదృశ్య కరణీ తథా।
దూరశ్రవణము (దూరముగా ఉండి కూడా వినగలగటము); దూరంగా మరెక్కడో ఉన్నది ఇక్కడ ఉండిచూడగలగటము - దూరదృష్టి; క్షణంలో దూరప్రదేశంలో ప్రత్యక్షమవటము - క్షణాత్ దూర ఆగమనము; ఎట్లా పలికింది → అట్లాగే అగుచుండటము - వాక్‌సిద్ధి; కోరుకొన్న రూపము పొంది ఇతరులకు కనిపించగలగటము - కామరూపత్వము ; ఎదుటి వారు చూస్తూ ఉండగానే వారికి కనిపించకుండా ఉండటము - అదృశ్యకరణి → ఈ ఈ సామర్థ్యములన్నీ యోగి యోగాభ్యాసముచే పొందగలుగుచున్నాడు.

మలమూత్రప్రలేపేన లోహాదేః స్వర్ణతా భవేత్ .. 74..
ఖే గతిస్తస్య జాయేత సంతతాభ్యాసయోగతః .
74. మలమూత్ర ప్రలేపేన
లోహాదేః స్వర్ణతా భవేత్
ఖే గతిః తస్య జాయేత
సంతత-అభ్యాస యోగతః।
యోగసిద్ధునియొక్క మల-మూత్రముల (మరియు చేతుల) స్పర్శ మాత్రం చేత ఇనుము మొదలైన లోహములు స్వర్ణము (బంగారము)గా మారగలవు.
యోగాభ్యాసము యొక్క సంతతమైన (ఎల్లప్పుడూ) అభ్యాసముచే ఆకాశమునందు విహరించు ‘ఆకాశగమన సామర్థ్యము’ పొందగలడు.

సదా బుద్ధిమతా భావ్యం యోగినా యోగసిద్ధయే .. 75..
ఏతే విఘ్నా మహాసిద్ధేర్న రమేత్తేషు బుద్ధిమాన్ .
75. సదా బుద్ధిమతా భావ్యం
యోగినా యోగసిద్ధయే,
‘‘ఏతే విఘ్నా మహాసిద్ధే,
న రమేత్ తేషు బుద్ధిమాన్!’’
ఎవడు ఏ ఆశయముతో యోగాభ్యాసమును చేస్తూ ఉంటాడో, ఆతడు పైన చెప్పిన అష్టాంగ యోగములలో ఆయా సామర్థ్యములను పొందగలడు. అయితే అటువంటి సామర్థ్యములన్నీ యోగసిద్ధి కాదు. అవన్నీ అల్పాశయములు మాత్రమే. బుద్ధిమంతుడు (తెలివిగల యోగాభ్యాసి) - ‘‘నాయొక్క మహదాశయ యోగ సిద్ధి మార్గములో ఆయా (పైన చెప్పిన) సామర్థ్యములన్నీ కూడా విఘ్నములు. మహాసిద్ధికి అడ్డంకులే కదా’’ అని గమనిస్తున్నాడు. బుద్ధిమంతుడు వాటియందు రమించే ధ్యాసను దరిచేరనీయడు. ఆత్మసాక్షాత్కారమే ఆతని మహదాశయము.

న దర్శయేత్స్వసామర్థ్యం యస్యకస్యాపి యోగిరాట్ .. 76..
యథా మూఢో యథా మూర్ఖో యథా బధిర ఏవ వా .
తథా వర్తేత లోకస్య స్వసామర్థ్యస్య గుప్తయే .. 77..
76. న దర్శయేత్ స్వ-సామర్థ్యం
యస్య కస్యాఽపి యోగిరాట్।
యథా మూఢో, యథా మూర్ఖో,
యథా బధిర ఏవ వా,
77. తథా వర్తేత లోకస్య
స్వ-సామర్థ్యస్య గుప్తయే।।
యోగిరాట్ (లేక) బుద్ధిమంతుడగు యోగసిద్ధుడు తనయొక్క సామర్థ్యము లను ఇతరులకు తెలిపి ప్రచారము చేసుకోడు. (ఒకడు నిదురపోయే ముందు ‘‘కలలో కనబడే కొందరికి నా సామర్థ్యములగురించి చెప్పుకొని గొప్ప వాడినౌతాను’’ - అని అనుకొని నిద్రకు ఉపక్రమించడు కదా!) యోగ సామర్థ్యము , ఆత్మతో సంయమనము సిద్ధించుకొన్న యోగి తదితర సంసార జనులతో పాల్గొనుచున్నప్పుడు - ఏమీ తెలియని మూఢుని వలె, మూర్ఖునివలె, చెవిటివానివలె, - లోక వ్యవహార సందర్భములలో ఉంటాడు. యోగముచే సిద్ధించిన ఆయా సామర్థ్యము లను బహిరంగపరచుకోడు. రహస్యముగా దాచుకొని ఉంటాడు. వాటిని కలలోని విషయములుగా చూస్తాడు.

శిష్యాశ్చ స్వస్వకార్యేషు ప్రార్థయంతి న సంశయః .
తత్తత్కర్మకరవ్యగ్రః స్వాభ్యాసేఽవిస్మృతో భవేత్ .. 78..
అవిస్మృత్య గురోర్వాక్యమభ్యసేత్తదహర్నిశం .
78. శిష్యాశ్చ స్వస్వకార్యేషు
ప్రార్థయంతి న సంశయః।
తత్ తత్ కర్మకర వ్యగ్రః స్వాభ్యాసే
విస్మృతో భవేత్।
అవిస్మృత్య గురోః వాక్యమ్-
అభ్యసేత్ తత్ అహర్నిశమ్।
కొంతకొంతమంది శిష్యులు ప్రాణ సంయమ యోగసిద్ధిని పొందినట్లు తెలుసుకొన్న యోగిని సమీపించి, ‘‘అయ్యా! మాకు ఈ సంపదలు వచ్చేటట్లు చూడండి! మా కష్టాలు పోగొట్టండి’’ అంటూ ప్రార్థనలు చేయసాగుతారు. అనుమానం లేదు. అప్పుడు ఆయా వారి వారి కార్యక్రమములలో ‘అది చేస్తాను, ఇది చేస్తాను. రండి’ అని ఆహ్వానిసూ ఉంటే….అప్పుడు ఆ యోగి తనయొక్క యోగాభ్యాసము కొనసాగించటములో విస్మృతి పొందే అవకాశాలు అధికం
అందుచేత యోగాభ్యాస గురువాక్యములగు ‘‘తత్ త్వమ్ - సోఽహమ్ -ఆత్మమేవ హి సత్యమ్! తదితరమంతా కల్పితమే’’- అను మహావాక్యముల ఆశయమును గుర్తు చేసుకుంటూ రాత్రింబవళ్ళు తన యోగాభ్యాసము కొనసాగించుకోవాలి. పరమాశయముగా తదితరులకు గుర్తు చేయాలి.

ఏవం భవేద్ధఠావస్థా సంతతాభ్యాసయోగతః .. 79..
అనభ్యాసవతశ్చైవ వృథాగోష్ఠ్యా న సిద్ధ్యతి .
తస్మాత్సర్వప్రయత్నేన యోగమేవ సదాభ్యసేత్ .. 80..
తతః పరిచయావస్థా జాయతేఽభ్యాసయోగతః .
79. ఏవం భవేత్ ‘ఘటావస్థా’
సంతత - అభ్యాసయోగతః।
అనభ్యాసవతశ్చ ఏవ
వృథా గోష్ఠ్యా న సిద్ధ్యతి।

80. తస్మాత్ సర్వ ప్రయత్నేన
యోగమేవ సదా అభ్యసేత్।
తతః ‘పరిచయావస్థా’
జాయతే అభ్యాస యోగతః।।
ప్రాణ-అపాన-మనో (ఆలోచన)-బుద్ధి (తెలివి)-జీవాత్మ (Individual Self) - పరమాత్మ (Universal as well as Al-Beyond Absolute Self) ల యొక్క అన్యోన్య - అవిరోధ - ఏకతాభావన, అనుభూతి, అనిపించటము → అనబడు (ఈ ఉపనిషత్తులో మనము చెప్పుకొని యున్న) ఘటావస్థ యోగాభ్యాసికి ఎట్లా సిద్ధిస్తుంది? క్రమమైన సాధన చేతనే.

సంతత అభ్యాస యోగము - సిద్ధికి మార్గము. అభ్యాసము లేకుండా (ఊరికే కేవలం చదవటం, వినటం, చెప్పటం, వ్రాయటం మొదలైనవి చేత (లేక)) తదితర వృథాగోష్ఠుల వలన ఎట్లా సిద్ధిస్తుంది? (Practice is necessary. Mere theory does not serve ultimate purpose). అందుచేత సర్వ ప్రయత్నములచే ఎల్లప్పుడు యోగము అభ్యసిస్తూనే ఉండాలి.

వాయుః పరిచితో యత్నాదగ్నినా సహ కుండలీం .. 81..
భావయిత్వా సుషుమ్నాయాం ప్రవిశేదనిరోధతః .
వాయునా సహ చిత్తం చ ప్రవిశేచ్చ మహాపథం .. 82..
81. (తతః పరిచయావస్థా జాయతే అభ్యాస యోగతః)
వాయుః పరిచితో యత్నాత్
అగ్నినా సహ కుండలీమ్
భావయిత్వా సుషుమ్నాయాం
ప్రవిశేత్ అనిరోధతః।

82. వాయునా సహ చిత్రం చ
ప్రవిశేత్ చ ‘మహాపథమ్’।
ఈ విధంగా సర్వప్రయత్నములతో ఎల్లప్పుడు యోగము అభ్యసించు యోగిపట్ల క్రమంగా పరిచయావస్థ సిద్ధించుచున్నది.

ప్రాణ - అపానములు ఏకరూపము పొందినవై అగ్నితో కూడుకొని, సుషుమ్నలో ప్రవేశము పొందుచున్నాయి. కుండలినీ శక్తిని ఉష్ణము ద్వారా నిదురలేపి, ఆశక్తిని సుషుమ్న యందు ప్రవేశింపజేస్తున్నాయి. భావనయొక్క బలముచే కుండలిని (సుషుమ్న ద్వారా) ఊర్థ్వగమనము పొందుటలో అడ్డంకులన్నీ తొలగిపోతూ ఉంటాయి. పరిచయావస్థ సంసిద్ధమగుచున్నది.

‘పరిచయావస్థ’ సిద్ధించుకుంటున్న యోగియొక్క ప్రాణ - అపాన ఏకరూపము అతిచిత్రంగా ‘‘మహామార్గము’’ అయి ఉన్న ‘‘సుషుమ్న నాడి’’యందు స్వభావసిద్ధంగా ప్రవేశం పొందుచున్నది.

యస్య చిత్తం స్వపవనం సుషుమ్నాం ప్రవిశేదిహ .
భూమిరాపోఽనలో వాయురాకాశశ్చేతి పంచకః .. 83..
యేషు పంచసు దేవానాం ధారణా పంచధోద్యతే .
83. యస్య చిత్తమ్ స్వపవనః
సుషుమ్నాం ప్రవిశేత్ ఇహ,
భూమి ఆపో అనలో వాయుః
ఆకాశశ్చ - ఇతి పంచకమ్
ఏషు పంచసు దేహానాం
ధారణా ‘పంచథా’ - ఉచ్యతే।


చిత్తముయొక్క శక్తిరూపమే కుండలిని. ఏ యోగి యొక్క చిత్తము ప్రాణవాయువుతో కూడి (స్వపవనముతో) ఇక్కడ సుషుమ్న నాడియందు ప్రవేశించుచున్నదో, అట్టి యోగికి భూమి - జలము - అగ్ని - వాయువు - ఆకాశము - ఈ ఐదు కూడా సమస్తంగా ఆతనికి ‘ఐదు’ దేహములుగా అగుచున్నాయి.
‘‘పంచ భూతములు నాకు పంచ శరీరములు’’ - అను స్వభావసిద్ధమగు నిత్యానుభవములో ఆ యోగి ప్రవేశితుడగుచున్నాడు. అట్టి ధారణ ‘పంచథ’’ అని పిలువబడుచున్నది.

పాదాదిజానుపర్యంతం పృథివీస్థానముచ్యతే .. 84..
పృథివీ చతురస్రం చ పీతవర్ణం లవర్ణకం .
పార్థివే వాయుమారోప్య లకారేణ సమన్వితం .. 85..
ధ్యాయంశ్చతుర్భుజాకారం చతుర్వక్త్రం హిరణ్మయం .
ధారయేత్పంచఘటికాః పృథివీజయమాప్నుయాత్ .. 86..
పృథివీయోగతో మృత్యుర్న భవేదస్య యోగినః .
పృథివీ స్థాన విజయము
84. పాద ఆది → జాను పర్యంతం
‘‘పృథివీ స్థానమ్’’ ఉచ్యతే।
పృథివీ చతురశ్రం చ
పీతవర్ణం ‘ల’ వర్ణకమ్।।
85. పార్థివే వాయుమ్ ఆరోప్యా
‘లం’ కారేణ సమన్వితమ్,
ధ్యాయం చ చతుర్ముఖాకారమ్
చతుర్వక్త్రమ్ హిరణ్మయమ్।
86. ధారయేత్ ‘పంచఘటికా’ః
పృథివీ జయమ్ ఆప్నుయాత్।
పృథివీ యోగతో….
మృత్యుః న భవేత్
అస్య యోగినః।।
పరిచయావస్థ సిద్ధికి పంచోపాసనలు
(1) పృథివీ జయము: ‘‘పృథివీ అహమ్’’ - ధారణ, ధ్యాన విధానము
ఆ పరిచయావస్థ యోగి ‘‘పాదముల నుండి మోకాలు వరకు విశ్వరూపుడనగు నాయొక్క పృథివీ స్థానము’’ అను ధారణ స్వీకరించుచూ యోగసిద్ధి పొందుచున్నాడు.
ఓం పృథివీ తత్త్వాయ నమః।।
❋ పాదముల నుండి మోకాళ్ళ వరకు పృథివీ స్థానము
❋ ఆకారము చతురశ్రంగా భావించాలి     🔲
❋ రంగు పసుపురంగును భావించాలి
❋ బీజము వర్ణము ‘లం’
‘ల కారసమన్వితంగా భూమిని వాయువునకు (ప్రాణశక్తికి జేర్చాలి)
దేవత : నాలుగు ముఖములుగల ఆకారుడు, చతుర్ - భుజుడు, సృష్టికర్త అగు బ్రహ్మదేవుని హిరణ్మయుడుగా ఉపాసించాలి. ఈ విధమైన 5 గడియల ధ్యాన ధారణలచే అట్టి యోగికి పృథివీ జయము సిద్ధించుచున్నది. అనగా, సమస్త పృథివిని ఆత్మయొక్క ఒక అంశగా ధారణ చేయుచున్నాడు.
పృథివీయోగము సిద్ధించుటచే, ఇక అట్టియోగికి మృత్యుభయము మొదలంట్లా తొలగిపోతుంది.

ఆజానోః పాయుపర్యంతమపాం స్థానం ప్రకీర్తితం .. 87..
ఆపోఽర్ధచంద్రం శుక్లం చ వంబీజం పరికీర్తితం .
వారుణే వాయుమారోప్య వకారేణ సమన్వితం .. 88..
స్మరన్నారాయణం దేవం చతుర్బాహుం కిరీటినం .
శుద్ధస్ఫటికసంకాశం పీతవాససమచ్యుతం .. 89..
ధారయేత్పంచఘటికాః సర్వపాపైః ప్రముచ్యతే .
తతో జలాద్భయం నాస్తి జలే మృత్యుర్న విద్యతే .. 90..
అపాం (జల) స్థాన విజయము
87. ఆజానోః → పాయు పర్యంతమ్
‘అపాం స్థానమ్’ ప్రకీర్తితమ్।
ఆపో అర్ధచంద్ర శుక్లం చ
‘వం’ బీజం పరికీర్తితమ్।
88. వారుణే వాయుమ్ ఆరోప్య
‘వ’ కారేణ సమన్వితమ్
స్మరన్ నారాయణమ్ దేవం
చతుర్బాహుమ్ కిరీటినమ్।
89. శుద్ధస్ఫటిక సంకాశం
పీతవాససమ్ అచ్యుతమ్
ధారయేత్ పంచఘటికాః
సర్వపాపైః ప్రముచ్యతే।
90. తతో జలాత్ భయం నాస్తి।
జలే మృత్యుః న విద్యతే।
(2) ఆపో జయము: ‘‘అపోఽహమ్’’ - దారణ, ధ్యానవిధానము
❋ మోకాలు నుండి-గుదము వరకు ‘జలస్థానము’గా ప్రకీర్తించుచూ ధారణచేసి యోగసిద్ధి పొందుచున్నాడు.
ఓం అపో తత్త్వాయ నమః।।
❋ ఆకారము → అర్ధశుక్లచంద్రాకారము.     🌗
❋ రంగు → తెలుపు (శుక్లము).
❋ బీజాక్షరం → ‘వం’.
❋ ‘వ’కారముతో కూడా వాయువును జలస్థానమునకు ఆరోపించాలి.
దేవతాస్మరణ : ‘‘చతుర్ (4) బాహుడు, కిరీటధారుడు, శుద్ధ స్ఫటికముతో సమానమైన రూపము కలవాడు పీత (ఎర్రటి) వస్త్రధారుడు, ‘అహమ్ సర్వస్యప్రభవో’ అను ఆత్మభావననుండి చ్యుతియే లేనట్టి అచ్యుతుడు’’. ఈ విధంగా ధ్యానిస్తూ 5 గడియల కాలము ధారణ చేయుటచే ఆ యోగి జలమును జయించినవాడగుచున్నాడు. శ్రీమన్నారాయణుడుగా జలస్వరూపుడనై (వరుణ నామథేయుడనై) సృష్టియందు విస్తరించి ఉన్నాను’’ - అను అనునిత్య పరికీర్తనచే తత్ - స్వాభావికానుభూతుడు అగుచున్నాడు. సమస్త జలతత్త్వము ఆత్మతత్త్వము యొక్క అంశని ధరించుచున్నాడు.
అట్టివానికి ఇక ‘జలభయము’ఉండదు. జలమువలన మృత్యువు పొందడు.

ఆపాయోర్హృదయాంతం చ వహ్నిస్థానం ప్రకీర్తితం .
వహ్నిస్త్రికోణం రక్తం చ రేఫాక్షరసముద్భవం .. 91..
వహ్నౌ చానిలమారోప్య రేఫాక్షరసముజ్జ్వలం .
త్రియక్షం వరదం రుద్రం తరుణాదిత్యసంనిభం .. 92..
భస్మోద్ధూలితసర్వాంగం సుప్రసన్నమనుస్మరన్ .
ధారయేత్పంచఘటికా వహ్నినాసౌ న దాహ్యతే .. 93..
న దహ్యతే శరీరం చ ప్రవిష్టస్యాగ్నిమండలే .
వహ్ని స్థాన విజయము
91. ఆ పాయోః → హృదయాంతం చ
‘వహ్నిస్థానమ్’ ప్రకీర్తితమ్, వహ్నిః త్రికోణ, రక్తం చ
(‘రం’)-రేఫాక్షర సముద్భవమ్।
వహ్నౌ చ అనిలమ్ ఆరోప్య
రేఫాక్షర సముజ్జ్వలమ్।
92. త్రియక్షం వరదం రుద్రం తరుణాదిత్య సన్నిభమ్।
భస్మోద్ధూలిత సర్వాంగమ్ సుప్రసన్నమ్ అనుస్మరన్।
93. ధారయేత్ పంచఘటికా
వహ్నినా అసౌ న దహ్యతే।
న దహ్యతే శరీరం చ
ప్రవిష్టస్య చ అగ్ని కుండకే।।
(3). అగ్ని జయము : ‘‘అగ్న్యహమ్’’ - ధారణ, ధ్యానవిధానము
- పాయువు(గుదము) నుండి హృదయస్థానము వరకు→ అగ్నిస్థానముగా ప్రకీర్తించుచూ ధారణచేసి యోగ సిద్ధి పొందుచున్నాడు.
ఓం అగ్ని తత్త్వాయ నమః।।
ఆకారము → త్రికోణము         ▵  
రంగు → ఎరుపు - రక్త వర్ణము
రేఫాక్షరము నుండి జనించినట్టిది ‘రం’ బీజము = ‘రం’
- ‘రం’ బీజాక్షరముతో వాయువును అగ్నితో జేర్చాలి. ఆరోపించాలి.
దేవతాస్మరణము - త్రినేత్రుడు, వరప్రదాత, సర్వమును వెలిగించువాడు, దహించుటచే రుద్రుడు. బాలసూర్యకాంతులతో వెలుగొందువాడు, దేహమంతా భస్మము ధరించినవాడు, సుప్రసన్నుడు అగు రుద్ర భగవానుని స్మరించాలి.
అగ్ని తత్త్వమంతా ఆత్మయొక్క అంశగా భావిస్తూ ధ్యానము చేయుచున్నాడు. యోగి ఈ విధంగా ‘5’ గడియలు ధ్యానం చేస్తూ ధారణ చేసినంత మాత్రం చేతనే అట్టి యోగసాధకుడు ఇక అగ్నిచే దహించబడడు. ఆ యోగసిద్ధుడు అగ్ని కుండములో ప్రవేశించినా కూడా ఆతని శరీరమును అగ్ని కాల్చదు.

ఆహృదయాద్భ్రువోర్మధ్యం వాయుస్థానం ప్రకీర్తితం .. 94..
వాయుః షట్కోణకం కృష్ణం యకారాక్షరభాసురం .
మారుతం మరుతాం స్థానే యకారాక్షరభాసురం .. 95..
ధారయేత్తత్ర సర్వజ్ఞమీశ్వరం విశ్వతోముఖం .
ధారయేత్పంచఘటికా వాయువద్వ్యోమగో భవేత్ .. 96..
మరణం న తు వాయోశ్చ భయం భవతి యోగినః .
వాయుస్థాన విజయము
94. ఆ హృదయాత్ → భృవోః మధ్యం
‘వాయుస్థానమ్’ ప్రకీర్తితమ్।
వాయుః షట్ (6) కోణకమ్, కృష్ణమ్,
‘య’ కార అక్షర భాసురమ్।
95. మారుతమ్। మారుతమ్ స్థానే
ప్రాణీ ప్రాణం సమాహితః।
ధారయేత్ తత్ర సర్వజ్ఞం
ఈశ్వరం విశ్వతో ముఖమ్।।
96. ధారయేత్ పంచఘటికా
వాయువత్ వ్యోమగో భవేత్।
మరణం న తు వాయో2స్తు
న భయం భవతి యోగినః।।
(4). వాయు జయము - వాయ్వుహమ్ - ధారణ, ధ్యానవిధానము
హృదయస్థానము నుండి భృకుటి స్థానము వరకు వాయుస్థానముగా
ప్రకీర్తించుచూ ధారణ చేసి యోగసిద్ధి పొందుచున్నాడు.
ఓం వాయు తత్త్వాయ నమః।।
❋ ఆకారము - షట్‌కోణాకారము.     ⬡
❋ రంగు - కృష్ణము, నలుపు.
❋ బీజము - ‘య’కారముగా భాసించునది.
❋ స్థానము : వాయుస్థానం.
ఇక్కడ ‘యం’ బీజాక్షరంతో ప్రాణమును ప్రాణముతో సమాహితము చేయాలి.
ధారణా దైవము : సర్వజ్ఞుడు, ఈ సర్వము తానే అయి విస్తరించిన వాడు, ఈ విశ్వము తన ముఖముగా కలవాడు అగు -ఈశ్వరుని ధ్యానం చేస్తూ ధారణ చేయాలి. ఈశ్వరుడే వాయురూపునిగా సర్వత్రా వెలయుచున్నట్లు ఉపాసన చేయాలి. వాయుతత్త్వమును ఆత్మయొక్క అంశగా భావించాలి. ఈ విధంగా 5 గడియలు ధ్యానము చేసినంత మాత్రం చేతనే అట్టి యోగి ఆకాశమునందు వాయువు (గాలి) వలె సంచరించగలడు. అట్టి వానికి వాయువు వలన మరణభయము ఉండదు.

ఆభ్రూమధ్యాత్తు మూర్ధాంతమాకాశస్థానముచ్యతే .. 97..
వ్యోమ వృత్తం చ ధూమ్రం చ హకారాక్షరభాసురం .
ఆకాశే వాయుమారోప్య హకారోపరి శంకరం .. 98..
బిందురూపం మహాదేవం వ్యోమాకారం సదాశివం .
శుద్ధస్ఫటికసంకాశం ధృతబాలేందుమౌలినం .. 99..
పంచవక్త్రయుతం సౌమ్యం దశబాహుం త్రిలోచనం .
సర్వాయుధైర్ధృతాకారం సర్వభూషణభూషితం .. 100..
ఉమార్ధదేహం వరదం సర్వకారణకారణం .
ఆకాశ స్థాన విజయము
97. ఆ భ్రూమధ్యాత్తు → మూర్థాన్తమ్
‘ఆకాశస్థానమ్’ ఉచ్యతే।
వ్యోమ వృత్తం చ, ధూమ్రం చ
‘హ’ కార అక్షర భాసురమ్।
98. ఆకాశే వాయుమ్ ఆరోప్య
‘హ’కార ఉపరి శంకరమ్।
బిందురూపం, మహాదేవమ్
వ్యోమాకారం ‘సదాశివమ్’।।
99. శుద్ధ స్ఫటిక సంకాశమ్,
ధృత బాల - ఇందుశేఖరమ్,
పంచవక్త్రయుతం సౌమ్యం,
దశబాహుం త్రిలోచనమ్।
100. సర్వ - ఆయుధైః ధృతాకారమ్
సర్వభూషణ భూషితమ్
ఉమార్థదేహమ్ వరదమ్
సర్వకారణ కారణమ్।।
(5) ఆకాశ జయం -‘‘ఆకాశమహమేవ’’ - ధారణ, ధ్యానవిధానము
భ్రూమధ్య స్థానము నుండి మూర్థస్థానము వరకు ఆకాశస్థానముగా ప్రకీర్తించుచూ ధారణచేసి యోగసిద్ధి పొందుచున్నాడు.
ఓం ఆకాశ తత్త్వాయ నమః।।
❋ ఆకారం → వర్తులాకారం     ⬭
❋ రంగు → ధ్రూమం.
❋ బీజాక్షరం → ‘‘హం’’గా భాసురము.
❋ ఆకాశమునందు వాయువును జేర్చి ‘హమ్’ కారముతో ప్రకాశించు బిందురూపము. సమస్త ఆకాశమును ఆత్మయొక్క అంశగా ధ్యానము చేయుచున్నాడు.
ధారణాదైవం - హకార బిందురూపుడు, సర్వశుభప్రదాత, సుఖప్రదాత అగుటచే శంకరుడు, బిందురూపుడు, దేవతలకే దేవుడగు మహాదేవుడు, ఆకాశాకారుడు- అగు సదా శివుడు! శంకరుడు!
- పరిశుద్ధమగు స్ఫటికమువలె ప్రకాశమానులు.
- బాలచంద్రుని శిరస్సునందు భూషణముగా ధరించువారు.
- పంచముఖులు.
- 10 బాహువులతో విరాజిల్లువారు.
- త్రిలోచనులు.
- పరమసౌమ్యులు.
- సర్వ ఆయుధములు ధరించినవారు.
- సమస్త ఆభరణములుచే భూషితులు.
- ఉమాదేవికి తన దేహముయొక్క (ఎడమవైపు) అర్ధభాగము సమర్పించుకొనియున్నవారు.
- వరదులు; సర్వము ప్రసాదించువారు.
- సర్వకారణకారణులు.

ఆకాశధారణాత్తస్య ఖేచరత్వం భవేద్ధ్రువం .. 101..
యత్రకుత్ర స్థితో వాపి సుఖమత్యంతమశ్నుతే .
101. ఆకాశ ధారణాత్ తస్య
ఖేచరత్వం భవేత్ ధృవమ్।
యత్రకుత్ర స్థితోవాఽపి
సుఖమ్ అత్యంతమ్ అశ్నుతే।
అటువంటి సాంబశివభగవానుని ఉపాశించాలి. ఆ పరమశివులవారే సర్వత్రా ఆకాశరూపముగా వెలయుచున్నట్లు ఉపాసించాలి.
ఈ విధంగా ఆకాశ ధ్యాన ధారణలచే ఆకాశ సంచార సామర్థ్యము కలుగుచున్నది. అట్టి యోగి ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉన్నప్పటికీ, ఏ స్థితిలో అయినా అభ్యంతరమగు ఆత్మ-సుఖము నుండి ఏమాత్రము చెదరనివాడై సర్వదా ఆస్వాదించువాడై ఉంటాడు.

ఏవం చ ధారణాః పంచ కుర్యాద్యోగీ విచక్షణః .. 102..
తతో దృఢశరీరః స్యాన్మృత్యుస్తస్య న విద్యతే .
102. ఏవం చ ధారణాః పంచ కుర్యాత్ యోగీ విచక్షణః,
తతో దృఢ శరీరస్స్యాత్, మృత్యుః తస్య న విద్యతే।
ఈ విధంగా యోగాభ్యాసి విచక్షణాశీలుడై పంచధ్యాన-ధారణుడై నిత్యము పంచభూతతత్త్వోపాసనచే యోగాభ్యాసము నిర్వర్తించుటచే అట్టి వాని దేహము దృఢత్వము పొందుచున్నది. ఆతనిని మృత్యువు సమీపించదు. సర్వదా అమృతరూపుడై విరాజిల్లుతాడు

బ్రహ్మణః ప్రలయేనాపి న సీదతి మహామతిః .. 103..
సమభ్యసేత్తథా ధ్యానం ఘటికాషష్టిమేవ చ .
వాయుం నిరుధ్య చాకాశే దేవతామిష్టదామితి .. 104..
సగుణం ధ్యానమేతత్స్యాదణిమాదిగుణప్రదం .
103. బ్రహ్మణః ప్రళయేనాపి, న సీదతి మహామతిః।
సమభ్యసేత్ తథా ధ్యానం, ఘటికా షష్టిమేవ చ।

104. వాయుం నిరుధ్య చ ఆకాశే, దేవతామ్ ఇష్టదామ్ ఇతి।
సగుణం ధ్యానమ్ ఏతత్స్యాత్, అణిమ-ఆది గుణప్రదమ్।
బ్రహ్మ ప్రళయము వచ్చి పడినప్పుడు కూడా అట్టి మహామతి అగు యోగి కించిత్ కూడా పీడనము చెందడు. చ్యుతిపొందడు. అందుచేత యోగాభ్యాసి - పై చెప్పిన రీతిగా షష్టి ఘటికాధ్యాన - ధారణలను (రోజుకు 6సార్లు) అభ్యసించునుగాక!

సగుణము: హృదయాకాశమునందు వాయువును నిరోధించి ఇష్టదేవతారాధనను నిర్వర్తించుచూ ఉండటమును ‘సగుణోపాసన’గా చెప్పుచున్నారు. సగుణధ్యానము (లేక) సగుణోపాసనవలన అణిమ - గరిమ - లఘిమ - మహిమ-ఈశిత్వ-వశిత్వ-ప్రాకామ్య-ఇచ్ఛా…. అష్టసిద్ధులు లభించగలవు.


నిర్గుణధ్యానయుక్తస్య సమాధిశ్చ తతో భవేత్ .. 105..
దినద్వాదశకేనైవ సమాధిం సమవాప్నుయాత్ .
105. నిర్గుణ ధ్యానయుక్తస్య
సమాధిశ్చ తతో భవేత్।
దిన ద్వాదశకేనైవ (12 రోజులకు)
సమాధిం సమవాప్నుయాత్।
నిర్గుణము: క్రమంగా అట్టివాడు నిర్గుణధ్యాన అభ్యాసి (యుక్తుడు) అగుచున్నాడు. పంచతంత్రములు తనకు అనన్యంగా అభ్యసించు చున్నాడు. ఎప్పుడైతే నిర్గుణధ్యాన యోగము ప్రారంభమౌతుందో, అట్టివాడు 12 రోజులలో అత్యుత్తమమగు ‘సమాధిస్థితి’ని సముపార్జించు కొనుచున్నాడు. వాయు నిరోధముచే ఆ అభ్యాసి ఉత్తమ బుద్ధితో కూడిన మేధావి అయి క్రమంగా ‘జీవన్ముక్తుడు’ అగుచున్నాడు.

వాయుం నిరుధ్య మేధావీ జీవన్ముక్తో భవత్యయం .. 106..
సమాధిః సమతావస్థా జీవాత్మపరమాత్మనోః .
106. వాయుం నిరుధ్య మేధావీ
జీవన్‌ముక్తో భవత్యయమ్,
సమాధిః సమతావస్థా
జీవాత్మ పరమాత్మనోః।।
సమాధి : (నాటకంలో పాత్రగా కనిపించుచున్నవాడు నటనా చాతుర్యము గల నటుడే అయి ఉన్నతీరుగా) → ‘‘జీవాత్మ - పరమాత్మల సమతావస్థ’’ యే ‘సమాధి’ అను పేరుతో చెప్పబడుచున్నది. సర్వము తానై వెలుగొందటమే ‘సమాధి’. (ద్రష్ట-దృశ్య దర్శనముల ఏకత్వమే సమాధి).

యది స్వదేహముత్స్రష్టుమిచ్ఛా చేదుత్సృజేత్స్వయం .. 107..
పరబ్రహ్మణి లీయేత న తస్యోత్క్రాంతిరిష్యతే .
అథ నో చేత్సముత్స్రష్టుం స్వశరీరం ప్రియం యది .. 108..
సర్వలోకేషు విహరన్నణిమాదిగుణాన్వితః .
కదాచిత్స్వేచ్ఛయా దేవో భూత్వా స్వర్గే మహీయతే .. 109..
మనుష్యో వాపి యక్షో వా స్వేచ్ఛయాపీక్షణద్భవేత్ .
సింహో వ్యాఘ్రో గజో వాశ్వః స్వేచ్ఛయా బహుతామియాత్ .. 110..
యథేష్టమేవ వర్తేత యద్వా యోగీ మహేశ్వరః .
107. యది స్వదేహమ్, ఉత్-స్రష్టుమ్ ఇచ్ఛాచేత్
ఉత్-సృజేత్ (ఉత్సృజేత్) స్వయమ్, పరబ్రహ్మణి లీయేత
న తస్య ఉత్క్రాంతిః ఇష్యతే।

108. అథ నోచేత్ సముత్ స్రష్టుమ్
స్వశరీరం ప్రియం యది,
సర్వలోకేషు విహరన్
అణిమాది గుణాన్వితః।
109. కదాచిత్ స్వేచ్ఛయా దేవో
భూత్వా స్వర్గే మహీయతే,
మనుష్యోవాఽపి యక్షో వా
స్వేచ్ఛయాపి క్షణాత్ భవేత్।।

110. సింహో వ్యాఘ్రో గజో వా
అశ్వః స్వేచ్ఛయా (స్వ-ఇచ్ఛయా)
బహుతా మియాత్, యథేష్టమేవ వర్తేత
యద్వా యోగీ మహేశ్వరః।।
సమాధి స్థితి సిద్ధించుటకై ‘‘నేను ఈ భౌతిక దేహ రూపమాత్రుడను’’ - అనే దేహాహ్రాంతిని విడవటానికి ఇష్టుడైనప్పుడు, అట్టి యోగి దేహభావ పరిమితులను విడచి పరబ్రహ్మము నందు స్వయముగా లీనమగు చున్నాడు. అనగా దేహ-లోక అహ్రాంతులను త్యజించి, బ్రహ్మమే తానగుచున్నాడు. అట్టి ఇష్టము పొందనంతవరకు పరబ్రహ్మతో లీనత్వము కలిగియున్నప్పటికీ, ఆ యోగికి ఉత్క్రాంతి కలుగదు. 14 లోకములలో ఆతని సంచారము వినోదముగా, ఇష్టముగా, స్వేచ్ఛానుసారం, అణిమాది అష్టసిద్ధులతో కూడినదై కొనసాగుచూనే ఉంటుంది.

యోగి తన శరీరమును (సృష్టిలో తన చేష్టా రూపమును) వదలుటకు ఇష్టపడక, స్వశరీర ప్రియుడై ఉంటే, అట్టి జీవాత్మ పరమాత్మల ఏకత్వానుభావుడగు) యోగేశ్వరుడు ‘‘అణిమ’’ మొదలైన అష్టసిద్ధులతో కూడుకొన్నవాడై స్వేచ్ఛగా అన్ని లోకములలో సంచారములు చేస్తూ ఉంటాడు. స్వర్గలోకవాసులచే కూడా పూజితుడై ఉంటాడు. అట్టివాడు మనుష్యుడు (మానవదేహముతో కూడుకొని ఉన్నవాడు) అయి ఉండి కూడా క్షణంలో స్వేచ్ఛగా ‘యక్షుడు’ అవగలడు.

యోగి యోగాభ్యాసముచే యోగీశ్వరుడై - సింహములాగా, ఏనుగులాగా, గుర్రములాగా స్వేచ్ఛా విహారి అయి, యధేష్టావర్తనుడుగా ఈ కల్పిత లోకములలో క్రీడా లీలా - వినోదంగా సంచారములు సలుపుచూ ఉంటున్నాడు. తనకు ఇష్టమనిపించిన ఏరకమైన దేహమైనా స్వీకరిస్తూ, త్యజిస్తూ ఉండగలడు.

అభ్యాసభేదతో భేదః ఫలం తు సమమేవ హి .. 111..
పార్ష్ణిం వామస్య పాదస్య యోనిస్థానే నియోజయేత్ .
ప్రసార్య దక్షిణం పాదం హస్తాభ్యాం ధారయేద్దృఢం .. 112..
చుబుకం హృది విన్యస్య పూరయేద్వాయునా పునః .
కుంభకేన యథాశక్తి ధారయిత్వా తు రేచయేత్ .. 113..
వామాంగేన సమభ్యస్య దక్షాంగేన తతోఽభ్యసేత్ .
ప్రసారితస్తు యః పాదస్తమూరూపరి నామయేత్ .. 114..
అయమేవ మహాబంధ ఉభయత్రైవమభ్యసేత్ .
111. అభ్యాస భేదతో భేదః,
ఫలంతు సమమేవ హి।।
పార్షిణాం వామస్య పాదస్య
యోని స్థానే నియోజయేత్।
112. ప్రసార్య దక్షిణం పాదం
హస్తాభ్యాం ధారయేత్ దృఢమ్
చుబుకం హృది విన్యస్య
పూరయేత్ వాయునా పునః।।
113. కుంభకేన యథా శక్త్యా
ధారయిత్వా తు రేచయేత్।
వామాంగేన సమభ్యస్య
దక్షాంగేన తతో అభ్యసేత్।
114. ప్రసారితస్తు యత్ పాదస్తమ్,
ఊరూ ఉపరి యోజయేత్।
అయమేవ ‘మహాబంధ’।
ఉభయత్రా ఏవమ్ అభ్యసేత్।।
యోగాభ్యాసముల విషయంలో అభ్యాసముల దృష్ట్యా కొన్ని కొన్ని భేదములు కనబడితే కనబడవచ్చుగాక! ఏది ఏమైనా అన్ని రీతులైన యోగాభ్యాసముల అంతిమఫలము మాత్రము ఒక్కటే (జీవ-బ్రహ్మ ఏకస్వరూప → సమాధిస్థితియే)!

పునశ్చరణగా కొన్ని బంధముల గురించి చెప్పుకుంటున్నాము.

మహాబంధము
- ఎడమకాలి మడమను యోని స్థానము (లింగస్థానము)ను తాకించాలి.
- కుడి కాలిని చాచి ఉంచాలి.
- రెండు చేతులుతో కుడిపాదమును గట్టిగా పట్టుకొని ఉండాలి.
- గడ్డము (చుబుకము)ను వక్షస్థలము తాకించి ఉంచాలి.
- వాయువును పూరకం చేసి (పీల్చి), శక్త్యానుసారం కుంభకమును (Holding) నిర్వర్తించి, ఆ తరువాత రేచకము (Releasing) చేయాలి.
ఈ విధంగా ఎడమవైపు, అటు తరువాత కుడివైపు పూరక - కుంభక - రేచకములను (గురుముఖతః) అభ్యాసం చేయాలి.
చాపపడిన (wel extended) పాదమును ఉరువుపై (తొడపై The other side), తాకించి ఉంచాలి. కుడి ఎడమల రెండువైపులా ఉభయత్రముగా అభ్యసించాలి.

ఇదియే ‘‘మహాబంధము’’ - అగుచున్నది. ఇది ఈవిధంగా రెండు రీతులుగా అభ్యాసించవచ్చు.

మహాబంధస్థితో యోగీ కృత్వా పూరకమేకధీః .. 115..
వాయునా గతిమావృత్య నిభృతం కర్ణముద్రయా .
పుటద్వయం సమాక్రమ్య వాయుః స్ఫురతి సత్వరం .. 116..
అయమేవ మహావేధః సిద్ధైరభ్యస్యతేఽనిశం .

115. మహాబంధ స్థితో యోగీ
కృత్వా పూరకమ్ ఏకధీః
వాయునా గతిం ఆవృత్య
నిభృతం కంఠముద్రయా।
116. పుటద్వయం సమాక్రమ్య
వాయుః స్ఫురతి సత్వరమ్,
అయమేవ ‘మహావేధః’
సిద్ధైః అభ్యస్యతే అనిశమ్।।
మహావేదబంధము
‘‘మహాబంధము ధరించినట్టి యోగి స్థిరమైనబుద్ధితో→
→ పూరకమును నిర్వర్తించి
→ వాయువును కదలకుండా ఉంచి,
→ కంఠమును నిలువుగా, నిశ్చలముగా ఉంచుతూ -
- కంఠ ముద్రను ధారణచేసి
- రెండు ముక్కు పుటములనుండి వాయువును సత్వరముగా (Speedily) గ్రహించటము, వదలటము’’ . ఇది ‘మహావేధముద్ర’ అనబడుచున్నది. ఇది సిద్ధపురుషులు అన్నివేళలా అభ్యసిస్తూ ఉంటున్నారు.

అంతః కపాలకుహరే జిహ్వాం వ్యావృత్య ధారయేత్ .. 117..
భ్రూమధ్యదృష్టిరప్యేషా ముద్రా భవతి ఖేచరీ .
117. అంతః కపాలకుహరే
జిహ్వాం వ్యావృత్య ధారయేత్,
భ్రూమధ్య దృష్టిః
అపి ఏషా ముద్రాభవతి ‘ఖేచరీ’।।
ఖేచరీముద్ర
- నాలుకను పైదవడకు తాకించుచు క్రమ-క్రమంగా పైలోపలికి మడచుచూ, కపాలముయొక్క అంతః కుహరము (రంధ్రము) - [అంగిలి- పై దవడ మొదలు ప్రాంత (కొండనాలుక చివర) బెజ్జము]తో నాలుకయొక్క చిట్టచివర భాగమును తాకించటము (మరియు)
- అట్టి అభ్యాసముయొక్క ప్రారంభక్షణమునుండి కూడా దృష్టిని భ్రూమధ్య ప్రదేశమునందు నిలిపి ఉంచటము - ఖేచరీముద్ర అగుచున్నది.

కంఠమాకుంచ్య హృదయే స్థాపయేద్దృఢయా ధియా .. 118..
బంధో జాలంధరాఖ్యోఽయం మృత్యుమాతంగకేసరీ .
118. కంఠమ్ ఆకుంచ్య హృదయే
స్థాపయేత్ దృఢయా ధియా,
బంధో ‘జాలంధర’ ఆఖ్యో।
అయం మృత్యు మాతంగ కేసరీ।
జాలంధర బంధము
కంఠభాగ ఆకాశమును సంకోచింపజేసి, అద్దానిని హృదయాకాశమునందు దృఢముగా స్థాపించి ఉండటము జాలంధరముద్ర అనబడుచున్నది. ఇది ‘మృత్యువు’ అను ఏనుగుకు సింహము (సింహనాదము వినబడటం) వంటిది.

బంధో యేన సుషుమ్నాయాం ప్రాణస్తూడ్డీయతే యతః .. 119..
ఉడ్యానాఖ్యో హి బంధోఽయం యోగిభిః సముదాహృతః .
119. బంధో యేన సుషుమ్నాయాం
ప్రాణస్తు ఉడ్డీయతే యతః
‘ఉడ్యాణ’ ఆఖ్యో హి బంధోఽయం
యోగిభిః సముదాహృతః।।
ఉడ్యాణ (లేక) ఉడ్డీయాణ బంధము
ఇడ - పింగళనాడుల మధ్యగా గల ‘సుషుమ్న’ యందు ఏ ప్రాణశక్తి కుంభకముగా బంధితమైయున్నదో, అదియే ‘‘ఉడ్డీయాణ బంధము’’ - అని యోగి బృందముచే విశదీకరించబడుచున్నది.

పార్ష్ణిభాగేన సంపీడ్య యోనిమాకుంచయేద్దృఢం .. 120..
అపానమూర్ధ్వముత్థాప్య యోనిబంధోఽయముచ్యతే .
120. పార్‌ష్ణిభాగేన సంపీడ్య
యోనిమ్ ఆకుంచయేత్ దృఢమ్
అపానమ్ ఊర్థ్వమ్ ఉత్థాప్య
‘యోనిబంధో’ అయం ఉచ్యతే।
యోనిబంధము :
పాదముయొక్క మడమతో యోనిభాగమును బాగుగా అదిమి,
(మూలాధారమునకు క్రిందగా గట్టిగా నొక్కిపెట్టి) బాహ్యగతమౌతున్న అపానవాయువును ఊర్థ్వముఖముగా లాగి తెచ్చు అభ్యాసమును ‘యోనిబంధము’ అని అంటున్నారు.

ప్రాణాపానౌ నాదబిందూ మూలబంధేన చైకతాం .. 121..
గత్వా యోగస్య సంసిద్ధిం యచ్ఛతో నాత్ర సంశయః .
121. ప్రాణ-అపానౌ, నాద-బిందూ
మూలబంధేన చ ఏకతామ్
గత్వా, ‘యోగస్య సంసిద్ధిమ్’ యచ్ఛతో।
న అత్ర సంశయః।।
మూలబంధము :
ప్రాణ - అపానములు, నాద - బిందువులు ఒక్కచోటికి తెచ్చి ఏకము చేయటము ‘మూలబంధము’ అగుచున్నది. అట్టి మూలబంధ యోగాభ్యాసముచే యోగులకు అతి త్వరగా యోగసిద్ధి లభిస్తోంది. సిద్ధించగలదు. ఇందులో సందేహమే లేదు.

కరణీ విపరీతాఖ్యా సర్వవ్యాధివినాశినీ .. 122..
నిత్యమభ్యాసయుక్తస్య జాఠరాగ్నివివర్ధనీ .
ఆహారో బహులస్తస్య సంపాద్యః సాధకస్య చ .. 123..
అల్పాహారో యది భవేదగ్నిర్దేహం హరేత్క్షణాత్ .
అధఃశిరశ్చోర్ధ్వపాదః క్షణం స్యాత్ప్రథమే దినే .. 124..
క్షణాచ్చ కించిదధికమభ్యసేత్తు దినేదినే .
వలీ చ పలితం చైవ షణ్మాసార్ధాన్న దృశ్యతే .. 125..
యామమాత్రం తు యో నిత్యమభ్యసేత్స తు కాలజిత్ .
‘‘కరణీ విపరీత’’
122. కరణీ విపరీతాభ్యా, సర్వవ్యాధి వినాశినీ।
నిత్యమ్ అభ్యాస యుక్తస్య, జఠరాగ్ని వివర్థనీ।
123. ఆహారో బహుళః తస్య
సంపాద్యః సాధకస్య చ,
అల్పాహారో యది భవేత్
అగ్నిః దేహమ్ హరేత్ క్షణాత్।।
124. ‘అధః శిరశ్చ ఊర్థ్వపాదః’
క్షణం స్యాత్ ప్రథమే దినే,
క్షణాచ్చ కించిత్ అధికమ్
అభ్యసేత్తు దినే దినే।
125. వలీ చ పలితం చ ఏవ
షణ్మాసార్థాత్ న దృశ్యతే।
యామమాత్రంతు యో నిత్యమ్
అభ్యసేత్,….సతు కాలజిత్।।
‘కరణీ విపరీత అభ్యాసము’’ (దేహముయొక్క తలక్రిందుల ధారణ)
కరణములను విస్తరించి ఉంచు అభ్యాసము-నిత్యము అభ్యసిస్తూ ఉంటే అట్టి కరణీవిపరీత అభ్యాసము సర్వ వ్యాధులను ఉపశమింపజేయగలదు. పొట్టలో జీర్ణప్రక్రియ కొరకై జనించే ‘జఠరాగ్ని’ని ప్రవృద్ధము చేయగలదు.
యోగసాధకునికి ఆహారము యొక్క ఆవశ్యకత పెరుగుతూ ఉంటుంది.

అటువంటప్పుడు అల్పముగా, (చాలా తక్కువగా) ఆహారము తీసుకోవటం జరుగుతూ ఉంటే, అప్పుడు దేహములో జనించే జఠరాగ్ని దేహమును క్షణములలో (కొద్ది కాలములో) దహించివేయగలదు. అందుచేత పుష్ఠి అయిన ఆహారము యోగాభ్యాసంలో తగినంత స్వీకరించాలి. ఈ ‘‘కరణీ విపరీత అభ్యాసము’’ శిరస్సు క్రిందకు - పాదములు పైకి ధారణ చేయు అభ్యాసము. ఈ అభ్యాసమును ప్రారంభంలో మొదటిరోజు ఒక్క క్షణకాలం చేయాలి. ఇక ఆ తరువాత రోజుకొక క్షణమును పెంచుతూ రోజురోజులుగా అభ్యాసము చేయాలి.

అట్టి కరణీ విపరీత అభ్యాసికి షణ్మాసార్థకాలంలో (3 నెలల కాలంలో) అతనిలో కనిపించే వార్థక్యఛాయలు తొలగిపోగలవు. ప్రతిరోజు ఒక యామము (జాముకాలము) అభ్యాసం చేస్తూ ఉన్న యోగాభ్యాసి కాలమును జయించగలడు.

వజ్రోలీమభ్యసేద్యస్తు స యోగీ సిద్ధిభాజనం .. 126..
లభ్యతే యది తస్యైవ యోగసిద్ధిః కరే స్థితా .
అతీతానాగతం వేత్తి ఖేచరీ చ భవేద్ధ్రువం .. 127..
అమరీం యః పిబేన్నిత్యం నస్యం కుర్వందినే దినే .
వజ్రోలీమభ్యసేన్నిత్యమమరోలీతి కథ్యతే .. 128..
తతో భవేద్రాజయోగో నాంతరా భవతి ధ్రువం .
యదా తు రాజయోగేన నిష్పన్నా యోగిభిః క్రియా .. 129..
తదా వివేకవైరాగ్యం జాయతే యోగినో ధ్రువం .
126. ‘వజ్రోళీమ్’ అభ్యసేత్ యస్తు, స యోగీ సిద్ధి భాజనమ్,
లభ్యతే యది, తస్యైవ యోగసిద్ధిః కరే స్థితా।
127. అతీతాన్ ఆగతం వేత్తి, ఖేచరీ చ భవేత్ ధృవమ్।
అమరీం యః పిబేత్ నిత్యం, నస్యం కుర్వన్ దినే దినే।।
128. వజ్రోళీమ్ అభ్యసేత్ నిత్యమ్, ‘అమరోళీ’ ఇతి కథ్యతే।
తతో భవేత్ ‘రాజయోగో’। నాంతరా భవతి ధృవమ్।।
129. యదా తు రాజయోగేన నిష్పన్నా యోగిభిః క్రియా,
తదా వివేక వైరాగ్యం, జాయతే యోగినో ధ్రువమ్।।
కేవల కుంభక భావనా మాత్ర సిద్ధిరూపమగు ‘వజ్రోళి’ని అభ్యసించు యోగి సకల సిద్ధులు పొందుచున్నాడు. వజ్రోళీ యోగ సిద్ధిని సిద్ధించుకొని సంస్థితుడైన యోగి ముందు ముందు జరగబోయేవి మునుముందుగానే ఎరుగగలడు. ఆకాశ సంచారములు చేయగలడు. ఎవ్వరైతే నిత్యము నస్యము (దృశ్యరాహిత్యము) సిద్ధించుకొని చేసుకొని వజ్రోళిని అభ్యసిస్తూ ప్రతిరోజు అమృతమును త్రాగుచూ ఉంటారో అట్టివారు (అమృతపానులగుటచే) ‘అమరోళి’ అని చెప్పబడుచున్నారు.
అమరోళీయోగామృతముచే క్రమంగా ‘రాజయోగము’ సిద్ధిస్తోంది. వేరువిధంగా సిద్ధించదు మరి!
రాజయోగముచే సిద్ధించుకున్నయోగి లోకరీతి అయిన ప్రయోజనములను అధిగమించి, యోగక్రియా పరిపక్వము పొందినప్పుడు, ఆ యోగి యందు ధృవమైన వివేక - వైరాగ్యములు పరిపక్వమై ఉంటాయి.

విష్ణుర్నామ మహాయోగీ మహాభూతో మహాతపాః .. 130..
తత్త్వమార్గే యథా దీపో దృశ్యతే పురుషోత్తమః .
యః స్తనః పూర్వపీతస్తం నిష్పీడ్య ముదమశ్నుతే .. 131..
యస్మాజ్జాతో భగాత్పూర్వం తస్మిన్నేవ భగే రమన్ .
యా మాతా సా పునర్భార్యా యా భార్యా మాతరేవ హి .. 132..
యః పితా స పునః పుత్రో యః పుత్రః స పునః పితా .
ఏవం సంసారచక్రం కూపచక్రేణ ఘటా ఇవ .. 133..
భ్రమంతో యోనిజన్మాని శ్రుత్వా లోకాన్సమశ్నుతే .
130. ‘విష్ణుః’ నామ మహాయోగీ,
మహాభూతో, మహాతపాః
తత్త్వమార్గే యథాదీపో
దృశ్యతే పురుషోత్తమః।।
131. యః స్తనః పూర్వపీతః
తం నిష్పీడ్య ముదమ్ అశ్నుతే।
యస్మాత్ జాతో భగాత్ పూర్వం,
తస్మిన్ ఏవ భగే రమన్।
132. యా మాతా, స పునః భార్యా।
యా భార్యా మాతృకైవ హి।
యః పితా స పునః పుత్రో
యః పుత్రః స పునః పితా।
133. ఏవం సంసార చక్రేణ కూపచక్రే ఘటా ఇవ
భ్రమంతో యోని జన్మాని
కృత్వా లోకాంతు సమశ్నుతే।।
యోగ యోగీశ్వరుడగు విష్ణుభగవానుడు, సర్వభూత స్వరూపుడు! మహాతపః స్వరూపుడై, పురుషోత్తముడై ‘‘నీవు బ్రహ్మమే’’ - అని గుర్తుచేయు తత్త్వమార్గమునందు దారిచూపు దీపమువంటివారు.

ఈ సంసారము బహు చమత్కారరమైనది కదా!
ఈ జీవుడు తాను ఇతఃపూర్వము పాలుత్రాగిన స్తనమునే పీడించి నిష్పీడ్యము (మర్దనము) చేసి సంతోషపడుచున్నాడు.
ఏ యోనియందు తాను ఇతఃపూర్వము జనించినాడో, అద్దానియందే రమించుచున్నాడు.

ఈ వర్తమానంలో కనిపిస్తున్న సంసారములోని సంబంధ - అనుబంధ - బాంధవ్యములు ఎంతటి చిత్రవిచిత్రములైనవి! ఎంతటి మార్పులు!
- ఎవ్వరు ఇప్పుడు తల్లియో, ఆమె మరొక జన్మలో భార్య. ఎవరు భార్యయో, ఆమె మరొక జన్మలో తల్లి అగుచున్నది!
- ఎవరు ఇప్పుడు తండ్రియో, ఆతడు (మరొక జన్మలో) కుమారుడు అగుచున్నాడు. ఎవడు ఇప్పుడు కుమారుడో, ఆతడే మరొకప్పుడు తండ్రి అగుచున్నాడు.

ఈ విధంగా ‘సంసారము’ అనే నూతియందు తిరుగాడుచున్న కూపచక్రము (గిలక) వెంట తిరుగాడుచూ ఉన్న ఘటము (బొక్కెన) వలె - ఒక యోని తరువాత మరొక యోనిలో ప్రవేశములు, దేహనిష్క్రమణములు పొందుచున్న ఈ జీవుడు ఉపనిషత్తు వినుటచే ఉత్తమ లోకములు (స్థితి గతులు) పొందుచున్నాడు.

త్రయో లోకాస్త్రయో వేదాస్తిస్రః సంధ్యాస్త్రయః స్వరాః .. 134..
త్రయోఽగ్నయశ్చ త్రిగుణాః స్థితాః సర్వే త్రయాక్షరే .
త్రయాణామక్షరాణాం చ యోఽధీతేఽప్యర్ధమక్షరం .. 135..
తేన సర్వమిదం ప్రోతం తత్సత్యం తత్పరం పదం .
134. త్రయోలోకాః। త్రయోవేదాః
తి-స్రసంధ్యాః। త్రయః స్వరాః।
త్రయో అగ్నయశ్చ। త్రిగుణాః
స్థితాః సర్వే త్రయాక్షరే।
135. త్రయాణామ్ అక్షరాణాం చ
యో అధీతేఽపి అర్థమ్ అక్షరమ్,
తేన సర్వమ్ ఇదమ్ ప్రోతమ్।
తత్ సత్యం। తత్ పరం-పదమ్।।
ఇక్కడ
- పాతాళ - భూ - స్వర్గములనే ‘3’ లోకములు.
- ఋక్ - యజుర్ - సామములనే ‘3’ వేదములు.
- ప్రాతః - మధ్యాహ్న - సాయం - ‘3’ సంధ్యలు.
- ఉదాత్త - అనుదాత్త - స్వరితములనే - ‘3’ స్వరములు.
- గార్హపత్య - దక్షిణ - ఆహవనీయములనే - 3 అగ్నులు.
- సత్వ - రజో - తమో - (త్రి) 3 గుణములు.
సమస్తము కూడా అకార - ఉకార - మకారములనే త్ర్యక్షరీ ఓంకారము నందు అమరినవై ఉన్నాయి. ఓంకార సంజ్ఞయగు ఆత్మయే ఇదం హి! ఇదంతా కూడా!
ఏ యోగి అయితే త్రయీ అక్షరమగు ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కారములయొక్క అక్షరార్థమును అధ్యయనము చేస్తాడో, అట్టివాడు ఇదంతా ఓత - ప్రోతమైయున్న ‘‘తత్ పరమ్ - తత్ సత్యమ్’’ అగు ఆత్మయందు చూస్తూ, ఆత్మపదమును చేరుచున్నాడు.

పుష్పమధ్యే యథా గంధః పయోమధ్యే యథా ఘృతం .. 136..
తిలమధ్యే యథా తైలం పాషాణేష్వివ కాంచనం .
హృది స్థానే స్థితం పద్మం తస్య వక్త్రమధోముఖం .. 137..
ఊర్ధ్వనాలమధోబిందుస్తస్య మధ్యే స్థితం మనః .
136. పుష్ప మధ్యే యథా గంధః,
పయో మధ్యే యథా ఘృతమ్,
తిల మధ్యే యథా తైలమ్
పాషాణేషు ఇవ కాంచనమ్,
137. హృదిస్థానే స్థితం పద్మమ్!
తస్య వక్త్రమ్ అథోముఖమ్।
ఊర్థ్వనాళమ్, అధోబిందుం
తస్య మధ్యే స్థితం మనః।।
→ పుష్పము యొక్క మధ్యగా సువాసన ఉన్నట్లు,
→ పాలకు అంతరమున నేయి ఉన్నట్లు,
→ నువ్వులలో మధ్యగా నూనె ఉన్నట్లు,
→ పాషాణము (బంగారు ఖనిజము) మధ్యగా బంగారము ఉన్నట్లు,
హృదయస్థానములో మధ్యగా పద్మము ఉన్నది.
ఆ పద్మము క్రిందవైపుగా ముఖము కలిగి అధోముఖముగా ఉన్నది.
అద్దాని, నాళము ఊర్థ్వముగాను, క్రిందకు బిందువుగా ఉన్నది.
అట్టి పద్మమునకు మధ్యగా ‘మనస్సు’ ఉన్నది.

అకారే రేచితం పద్మముకారేణైవ భిద్యతే .. 138..
మకారే లభతే నాదమర్ధమాత్రా తు నిశ్చలా .
138. ‘అ’ కారే రేచితం పద్మమ్।
‘ఉ’ కారేణైవ భిద్యతే।
‘మ’ కారే లభతే నాదమ్
అర్ధమాత్రాతు నిశ్చలా।
అట్టి హృదయపద్మము
➤ ‘అ’ కారముతో రేకులు విప్పుకొనుచున్నది.
➤ ‘ఉ’ కారముతో ఆ పద్మము వికసించుచున్నది.
➤ ‘మ’ కారముతో నాదరూపము పొందుచున్నది.
➤ ‘అర్ధమాత్ర’చే సునిశ్చలము అగుచున్నది.

శుద్ధస్ఫటికసంకాశం నిష్కలం పాపనాశనం .. 139..
లభతే యోగయుక్తాత్మా పురుషస్తత్పరం పదం .
139. శుద్ధ స్ఫటిక సంకాశమ్,
నిష్కళం, పాపనాశనమ్,
లభతే ‘యోగయుక్తాత్మా’
పురుషః తత్ పరంపదమ్।।
అట్టి ‘‘హృదయ సందర్శన - యోగోభ్యాసము’’చే, యోగి యోగ యుక్తాత్ముడై….
- శుద్ధ స్ఫటికమువంటిది,
- నిష్కళము,
- సర్వపాప భావములను మొదలంట్లా కడిగివేయునది,
అగు తత్ ‘‘పరమ పురుష పదము’’ను సిద్ధించుకొనుచున్నాడు.

కూర్మః స్వపాణిపాదాదిశిరశ్చాత్మని ధారయేత్ .. 140..
ఏవం ద్వారేషు సర్వేషు వాయుపూరితరేచితః .
140. కూర్మః స్వపాణి పాదాది
శిరశ్చ ఆత్మని ధారయేత్,
ఏవం ద్వారేషు సర్వేషు
వాయుపూరిత రేచితః।
తాబేలు తనయొక్క పాణి - పాదములను, శిరస్సును తనయందుతానే ఉపసంహరించుకుంటూ తనయందే ధారణ చేస్తున్నది కదా!
అదే విధంగా అన్ని ద్వారములలో (నవద్వారములలో) వాయువును పూరించుచూ, రేచించుచూ శ్వాసలతో ప్రాణాయామము నిర్వర్తించాలి.

నిషిద్ధం తు నవద్వారే ఊర్ధ్వం ప్రాఙ్నిశ్వసంస్తథా .. 141..
ఘటమధ్యే యథా దీపో నివాతం కుంభకం విదుః .
నిషిద్ధైర్నవభిర్ద్వారైర్నిర్జనే నిరుపద్రవే .. 142..

నిశ్చితం త్వాత్మమాత్రేణావశిష్టం యోగసేవయేత్యుపనిషత్ ..
141. నిషిద్ధంతు నవద్వారే
ఊర్థ్వం - ప్రాక్ నిశ్వసం తథా।
ఘటమధ్యే యథా దీపో
నివాతః కుంభకం విదుః।
142. నిషిద్ధైః నవభి ద్వారైః
నిర్జనే నిరుపద్రవే,
నిశ్చితంతు ఆత్మమాత్రేణ
అవశిష్టం యోగసేవయా।।
నవద్వారములను నిషేధించాలి. పైకి - క్రిందికి నిశ్వసనము (బాహ్యకుంభకము) ద్వారా నవద్వారములను మూసివేయాలి.
‘‘ఘటము (కుండ) మధ్యలో గాలిలేని చోట దీపము’’ ఎట్లా ఉంటుందో, ఆత్మజ్యోతి సమస్త దేహములలో అట్టిదని తెలుసుకొనబడునుగాక!
యోగి → ‘యోగసేవ’ లేక ‘యోగాభ్యాసము’చే….
- మనస్సును నవద్వారముల ప్రవేశమునుండి నిషేధించినవాడై
- నిర్జనమునందు అవశిష్టుడై, నిర్ - ఉపద్రవము, నిశ్చింతము అగు ‘ఆత్మ’గా సర్వము తానై, సర్వమునకు వేరై, సర్వసాక్షి అయి, ఆత్మజ్యోతి స్వరూపముగా వెలుగొందుచున్నాడు.

ఇతి యోగతత్త్వోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



కృష్ణ యజుర్వేదాంతర్గత

22     యోగతత్త్వ ఉపనిషత్

శ్రీ మహావిష్ణు - బ్రహ్మభగవన్ సంవాదము

అధ్యయన పుష్పము

ఎద్దానివలన యోగైశ్వర్య కైవల్యస్థానము సిద్ధించుచున్నదో, అట్టి ‘వైష్ణవయోగతత్త్వార్థి’నై శ్రీరామచంద్ర భగవానునికి భజించుచున్నాను. తత్త్వాణ్వేషకులమగు మనకు తత్త్వసిద్ధికి ‘శ్రీరామరక్ష’ వెంటనుండునుగాక!

⌘⌘⌘

శ్రీ గురుదేవులవారు: ప్రియ ఆత్మానంద స్వరూపులగు శిష్యదేవులారా! ఏది వినుటచే, పఠించుటచే సర్వజనులకు సర్వదోషములు, సర్వ పాపములు, సర్వపాపదృష్టులు తొలగి, మనస్సు ‘నిర్మలము’ కాగలదో, ఏది యోగులకు యోగసాధనయందు హితము- సానుకూల్యత ప్రసాదించగలదో - అటువంటి యోగతత్త్వము గురించిన విశేషములను చెప్పుకొనుచున్నాము. మీరంతా సావధానచిత్తులై శ్రద్ధాసక్తులతో ‘‘సోఽహమ్-తత్త్వమ్’’ జ్ఞాన మహదాశయులై వినండి.

సర్వాంతర్యామి, సర్వతత్త్వ స్వరూపుడు, కరుణామయుడు, యోగయోగీశ్వరుడు, భక్తవత్సలుడు, యోగజనుల విశ్రాంతి మార్గప్రదాత, జగత్ పాలకుడు - అగు విష్ణు భగవానునికి రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాము. మన ఈ తత్త్వవిచారణకు - బిడ్డకు తండ్రి వలె మార్గదర్శకులై తోడు నీడ అయి ఉండవలసినదిగా ప్రేమ - భక్తి పూర్వకంగా సుస్వాగతము పలుకుచున్నాము.

పరమ ప్రేమాస్పదుడు, జగత్ పితామహుడు, జగత్ రచయిత, సరస్వతీదేవీ సమేతుడై జీవులను తరింపజేయు మహదాశయుడు, (జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయములనబడే నాలుగు ముఖములతో ప్రకాశించు) చతుర్ముఖుడు - అగు ఓ బ్రహ్మ భగవాన్! నమో నమో నమో నమః।

⌘⌘⌘

మహావిష్ణు-బ్రహ్మదేవ సంవాదము

ఒకానొక సందర్భములో - సృష్టికర్త, జగత్ పితామహుడు, సర్వజీవులపై అవ్యాజప్రేమాస్పదుడు, సర్వజీవ శ్రేయోభిలాషి, సర్వజీవులకు జీవనప్రదాత….అగు బ్రహ్మదేవుడు విష్ణులోకం ప్రవేశించారు. విష్ణుభగవానుని దర్శించి సాష్టాంగదండ ప్రణామములు సమర్పించారు. విష్ణుభగవానుడు పుత్రవాత్సల్యంగా బ్రహ్మదేవునికి ‘సుస్వాగతము’ పలికారు. తన ప్రక్కనే సుఖాశీనులుగా చేశారు.

బ్రహ్మదేవుడు :

స్వామీ! విష్ణుభగవాన్! పితృదేవా! నమో నమః।

శ్లో।। ‘విష్ణుః’ నామ। మహాయోగీ। మహాభూతో। మహాతపాః।
తత్త్వ మార్గే యథాదీపో దృశ్యతే పురుషోత్తమః।

ఈ జీవులు తత్త్వాణ్వేషకులై యుండగా, వారి తత్త్వానేషణా మార్గములలో ‘చీకటిలో దీపము’ (భోదీపః బ్రహ్మ రూపేన సర్వేషాం హృది సంస్థితః) వలె కనిపించు పురుషోత్తములు మీరు! సర్వులకు స్వస్వరూపులై వెలయుచుండుటచే ‘‘విష్ణు’’ నామధేయులు! మహాయోగ యోగీశ్వరులు! సర్వజగత్తులు, సర్వజీవులు, వారి వారి భౌతిక రూపములు తమ భౌతిక ప్రదర్శనమే కాబట్టి మహాభూతస్వరూపులు! తపస్సు - ధ్యానముల పరాకాష్ఠ మీ పాదపద్మములను చేరుటయే కాబట్టి మహాతపోరూపులు! అట్టి అరాధ్యదైవము, జగన్నాధుడు అగు మీకు ప్రణిపాతుడనగుచూ, సేవించుచూ పరిప్రశ్నించుటకై ‘అనుజ్ఞ’ ప్రసాదించ వేడుకొనుచున్నాను.

స్వామీ! ఈ జీవులు సంసార దుఖములనుండి బయటపడేది ఎట్లా?
‘యోగము’ అనగా ఏమి? ‘యోగతత్త్వము’ ఏదైయున్నది? దేనితో యోగము సంతరించుకోవాలి?

అష్టాంగయోగ వివరణ పూర్వకంగా సర్వయోగాభ్యాసులకు సులభమమయ్యేరీతిగా దయచేసి వివరణ చేయండి.

హృషీకములకు (ఇంద్రియములన్నిటికీ) ఈశుడగు హృషీకేశుడు:

హే సృష్టి కళా విశారదా! బ్రహ్మలోకాధిపతీ! బ్రహ్మ భగవాన్! మీరు కోరినట్లు తత్త్వార్థపూర్వకంగా యోగతత్త్వము గురించి వివరించి చెప్పుకొందామయ్యా. సర్వజనుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చెప్పుచున్నాను. వినండి.

సర్వే జీవాః సుఖైః దుఃఖైః మాయాజాలేన వేష్టితః।
తేషాం ముక్తికరం మార్గం, మాయాజాల నికృంతనమ్।।

పంచేంద్రియములకు విషయముల రూపమైనట్టి ఈ దృశ్యముపట్ల ఈ జీవుడు అభ్యాసవశంగా కల్పించుకొన్న ఆశ-దురాశ-పేరాశ-నిరాశ-నిస్పృహా రూపమే ‘‘సంసారము’’. అట్టి ఈ సంసార బద్ధులగు జీవులంతా కూడా ‘సుఖములు - దుఃఖములు’ అను రెండు వరుసలు గల త్రాళ్లతో పేనబడిన మాయాజాలము (Fishernet of Illusionary perceptions and cravings) లో చిక్కుకున్నవారై జీవితయానములను గడపుచూ ఉండటము జరుగుతోంది.

అందుకు ముక్తి మార్గము ఏమిటి? స్వయం కల్పితమగు అట్టి ఆ మాయాజాలమును త్రెంచివేయుటయే (నికృంతనమ్).

అప్పుడు ఈ జీవునకు సిద్ధించగల కేవలీ స్వస్వరూపమగు ‘కైవల్యపదము’ అను పరమస్థానము ప్రయత్నశీలునికే సిద్ధిస్తోంది. అందుకే ‘అప్రయత్నశీలునికి అది దుష్ప్రాప్యము’ అని శాస్త్రములచే గుర్తుచేయబడుచున్నది.

అయితే కేవలము శాస్త్ర విజ్ఞానము (Merely knowing and then Talking various details) మాత్రం చేత కైవల్యము లభించేది కూడా కాదు. ‘‘కేవలం జ్ఞానమును ఆశ్రయిస్తాం. యోగసాధనతో పనేమున్నది?’’ - అనునది కుదురునది కాదు. తెలుసుకొన్న తరువాత (జ్ఞానము తరువాత After knowing) ‘అనుకోవటము, అనిపించటము’ (అనబడు మనన-నిదిధ్యాసలు) అవసరం కదా!

అందుచేత,

పతితా శాస్త్ర జాలేషు ప్రజ్ఞయా తేన మోహితాః।
కొందరు తెలివిగలవారై ఉండి కూడా జ్ఞానసమాచారము వింటూ, తెలుసుకొని కూడా, వెళ్ళి వెళ్లి శాస్త్ర సమాచారముల వలలో పడి మోహితులై ‘తత్ అఖండాత్మ అహమేవ’ అను
స్వానుభవమునకు చెందిన తగినంత ‘బుద్ధి సంసిద్ధత’ పెంపొందించుకోవటం లేదు. ‘‘ఆ"! తెలిసిపోయిందిలే!’’ - అని విని, (లేక) చదివి ఊరుకుంటున్నారు. యోగాభ్యాసమునకు ఉపక్రమించటంలేదు. ‘‘ఈ సమస్తము మమస్వరూపమగు అఖండాత్మయే’’ - అను అనునిత్య , నిస్సందేహ స్వానుభవమును అనుక్షణికము చేసుకోలేకపోతే జ్ఞానముండి ఏమి ప్రయోజనం? అనగా, ‘‘తెలుసుకోవటము-తెలియజెప్పటము’’ ఈ రెండూ కూడా స్వానుభవమును సంతరించుకున్నప్పుడే ప్రయోజనము సుమా!

కైవల్యము :
దేవతలకు కూడా చెప్పుటకు అలవికానిది. అనిర్వాచ్యపదం వక్తుం న శక్యం తై సురైః అపి!
ఎందుకంటే అయ్యది ఎవరికి వారికే స్వాత్మప్రకాశరూపమై యున్నది.
సర్వసందర్భములకు ఆవల కేవల సహజ స్వస్వరూపముగా సర్వదా ప్రకాశమానమైయున్న ఆత్మపదస్థితి.
అది శాస్త్రములు పఠించినంత మాత్రం చేత ప్రకాశమానమవుతుందా? అనుభూతికి సరిపోతుందా? లేదు.
అట్టి శ్రోత లక్ష్యశుద్ధితో అభ్యాసి కావాలి. బుద్ధి దోషములు తొలగాలి. అదే తాను కావాలి. (He has to uninterruptedly experience himself as Al-present and ever present self)

స్వాత్మ ప్రకాశరూపం తత్ కిం శాస్త్రేణ ప్రకాశ్యతే?
తానే అదై ఉన్నట్టిది. సర్వదా తానే అయి ఉన్న ‘ఆత్మతేజస్సు’ను శాస్త్రములు వచ్చి వెలిగించటమేముంటుంది?
కనుక తాను అదియే అని - అనునిత్యమైన అనుభవంగా సంతరించుకోవాలి.

నిష్కళంకము (కళంక రహితము), నిత్యనిర్మలము, పరమశాంతము, ఈ దృశ్య - దేహ - దేహదేహాంతరములు - ఇత్యాది సర్వ వ్యవహారములకు అతీతమైనది, నిర్గుణ నిర్విషయ - నిరామయమైనది - అగు కేవలాత్మతత్త్వమే ( The Absolute Ever existent, ever blossoming and ever beyond self itself) ఈ జీవుని వాస్తవ రూపము. అట్టి పరతత్త్వమే ‘జీవరూపాంశ’ను, తనకుతానై ప్రదర్శించుచున్నది.

తదేవ జీవరూపేణ పుణ్యపాపై ఫలైర్వృతమ్।
అట్టి ఆత్మాంశరూపుడగు జీవుడు (జీవాత్మ) స్వాత్మకల్పిత దృశ్యములో ప్రవేశించి, పుణ్య పాప ఫలములచే ఆవృతుడు అగుచున్నాడు. ఉపాధి పరంపరలు ధారణ చేస్తూ, దృశ్య గ్రాహ్య - దృశ్య త్యాజ్యములందు ఒకదాని తరువాత ఒకటిగా సమాహితుడగుచున్నాడు. అనేక దుఃఖ పరంపరలచే ఆవృతుడు(encompassed), ఆకృతుడు (en-formed) అగుచున్నాడు.

త్వమ్ తత్ ఏవ।
‘జీవుడు’ అనునది ఆత్మకు సందర్భ సత్యమేగాని, సహజసత్యము కాదు. ఈ జీవుడు పరమాత్మ పదమును పోగొట్టుకొని ఉండలేదు. కించిత్ ఏమరుపుయే - ఈ అపార సంసారము.

అటువంటి పరమాత్మ స్వరూపము అనునిత్యమైనది. సర్వ భావపదములకు అతీతమైనది. కేవల జ్ఞానస్వరూపము (Form of Absolute knowing). అయ్యది జీవాత్మగా మారిపోతుందా? లేనేలేదు.

ఒకడు ఉద్యోగిగా, తండ్రి - మేనమామ - భర్త - మిత్రుడు - పుణ్యుడు - పాపుడు - ఇత్యాదులుగా వేరువేరు సందర్భములలో వేరువేరు జనులతో సంబంధ, సందర్భ, అనుభూతులు కలిగి ఉన్నప్పటికీ ఆతడు సర్వదా ‘పరము’ (వేరుగా As Beyond all such related contexts)గానే ఉన్నాడు గాని, వాటిలో ఒకటి అయిపోయి ఉండటంలేదే! అట్లాగే పరమాత్మ యథాతథమై ఉన్నారు. ఈ జీవుడు స్వతఃగా సర్వదా పరమాత్మస్వరూపుడే! ఇందులో సందేహించవలసినదే లేదు.

అహంకారమ్ ప్రతిబింబిమివ స్ఫురితమ్।

జలములో సూర్యబింబము ప్రతిబింబిస్తూ కనిపిస్తున్న విధంగా ఆత్మయందు ‘‘జగత్ దృశ్యము’’, ‘‘అహంకారము’’ అనునవి భావనా - స్ఫురణరూపంగా బయల్వెడలుచున్నాయి. జలంలో తరంగమువలె ప్రదర్శితమౌతోంది. జీవితము అను సందర్భంనకు సంబంధించినది జీవాహంకారము (Individualistic sense of I). అది పంచభూతాత్మకముగా, అభూతపిండముగా (Non-materialistic i.e., మనోబుద్ధి చిత్త అహంకార రూపములుగా), ధాతుబద్ధరూపంగా, సత్వ రజో తమో త్రిగుణాత్మకంగా, సుఖ దుఃఖ పరంపరలతో సమాయక్తమై (Deeply involved) ప్రకటితమగుచున్నది (Getting manifested). తత్ఫలితంగా విశుద్ధుడగు పరమాత్మయే-ఆ సందర్భములో ‘జీవుడు’ అని చెప్పుకోబడుచున్నారు. దీనికావల (పరమై) ప్రతి జీవునియందు ‘పరమాత్మాఽహమ్’ - అను సర్వాతీత, కేవలీ స్వకీయతత్త్వము అప్రతిహతంగా వేంచేసియే ఉన్నది.

‘కేవలాత్మాఽహమ్’ భావసిద్ధి :

ఈ జీవునిపట్ల ఆయా స్వకీయ అభ్యాసములు, స్వభావములు మొదలైనవి ఆత్మతత్త్వ అనుభవమునకు అడ్డులు (Barriers) అగుచున్నాయి.

✤ ‘ఏదో ఇంకా పొందాలికదా!’ అనురూపముతో వెంటనంటి వర్తించు కామము (Desires);
✤ తదితర జీవులను ఉద్దేశ్యించి సుదీర్ఘ తీవ్ర వ్యతిరిక్త రూపమగు క్రోధము (Deep and long continued Anger and opposition) {ఒకే సందర్భములో వచ్చిన కోపము 3 సార్లు మించి గుర్తు చేసుకొని కోపముతో చెప్పటము / ప్రదర్శించటము జరిగితే - అది క్రోధ లక్షణము};
✤ ‘‘ఉన్నదేదో పోగొట్టుకుంటామేమో! ఎప్పుడు ఏమవుతుందో!’’ అనే రూపముగల భయము (Fear psychosis);
✤ సత్యాసత్యములు, నిత్యానిత్యములు తగినంత పరిశీలించకుండా ఊహ-అపోహలు సుదీర్ఘముగా కొనసాగించు మోహము (Illusionery perceptions);
✤ ‘ఇది నాది. నాకే ఉండాలి. ఇతరుల నుండి దాచుకోవాలి’ అను దాచి దాచి ఉంచుకొను / అత్యాగరూపమగు లోభము (Sense of privately and secretary possessing while refusing others share);
✤ తనయొక్క ధన - జన - దేహ సంపదలను చూచుకొని ‘నా అంతటివాడు ఎవ్వడు?’ అను రూపముగల మదగర్వము (Exhibiting pride and dominating);
✤ ‘ఏదో ఇంకా చేయాలి! చేయాలి’ అనే రూపముగల తీవ్ర రజోగుణ స్వభావము (Restlessly Work-holic);
✤ ఇతరులతో గల సన్నిహితమైన ‘నావారు’ అను తీవ్ర భావనచే ఏర్పడే మమకారము (బెంగ, కార్పణ్యము ‘నావాళ్లకి ఏమౌతుందో’ అనే దిగులు) (Pseudo pessimism on account of attachment viz. ‘my people’, My belongings, My beloved, etc.)
✤ ఇంకా ఇంకా పొందాలని, ఊళ్ళు ఊళ్లే సొంతం చేసుకొని కులకాలనే తీవ్ర వాంఛారూపమగు, - సంతృప్తియొక్క ఛాయ కూడా లేని తృష్ణ (Urge to possess still something more);
✤ ‘నేను తక్కువ - వాళ్లు ఎక్కువ’ అని తలచుచూ సిగ్గుపడటము, లజ్జ (sense of shy / feeling shy and low);
✤ ఎప్పటికప్పుడు ఏది ఏమౌతుందోనన్న ఆవేదన. ఉద్వేగపూరితమైన, అసందర్భమైన భయము (Feeling of Fear without a reason or context);
✤ అకారణంగా దిగులు, వేదన చెందటము, దుఃఖపడటము (worry as a Habit);
✤ ఎప్పుడూ బాధితునివలె దుఃఖితునివలె, నష్టపోయినవానివలె మాట్లాడుటము, విషాదము (Meloncholy);
✤ కష్టాలొస్తే క్రుంగిపోవటం….సుఖాలొస్తే పొంగిపోవటం. హర్ష (over flowing with happy events) - శోకములు (lamentings);

ఈ ఈ మనోదోషములన్నీ ఈ జీవుని మనోబుద్ధి ఫలకములలో చేరి ఈతనిని జన్మ జన్మాంతరములుగా పట్టి పీడిస్తున్నాయి. ఈ దోషములను జీవుడు మొదలంట్లా తొలగించుకున్నాడా…ఇక, ఏభి దోషైః వినిర్ముక్తః, సజీవః కేవలోమతః। అట్టి జీవుడు కేవలుడే! కేవలమగు ఆత్మానందమును స్వభావసిద్ధము చేసుకోగలడు. కేవల స్వరూపమునకు సంబంధించిన నిత్యోదిత స్వానుభవమే ‘‘కైవల్యము’’.

అందుచేత ఓ బ్రహ్మదేవా! తస్మాత్ దోష వినాశార్థమ్ ఉపాయం కధయామితే। ఈ దోషములు తొలగిపోవటానికి ఉపాయములు చెప్పుచున్నాను. వినండి.

జ్ఞానమ్ - యోగమ్

Ⅰ. జ్ఞానమే గొప్పది :

ముముక్షువులలో కొందరు ‘‘కర్మలు, యోగసాధనా ప్రక్రియలు వీటన్నిటికన్నా జ్ఞానమే గొప్పది. ఆత్మజ్ఞాన సమాచారమే ఉద్ధరిస్తుంది. కర్మలు, యోగసాధనములు ఎందుకులే! అని తలచుచున్నారు. ‘‘జ్ఞానము చేతనే కైవల్యము’’ అని సిద్ధాంతీకరిస్తున్నారు.

Ⅱ. యోగమే గొప్పది :

మరికొందరేమో ‘‘ప్రాణాయామము, కుండలినీ ఊర్థ్వ సంచలనము, షట్ చక్రోపాసనానంతర బ్రహ్మరంధ్ర - సహస్రార స్థానాంతర్గత ధ్యానము’’ మొదలైన సాధనల వలననే మోక్షము సాధ్యము. అది వదలివేసి, కేవలము ఆత్మజ్ఞాన సమాచారము వినుటచేత, చదువుటచేత ‘‘ఏమి ప్రయోజనం?’’… అను అభిప్రాయం కలిగి ఉంటున్నారు.

ఈ ఈ అభిప్రాయముల గురించి ఇప్పుడు విశ్లేషణం చేసుకుంటున్నాము.

⌘⌘⌘

యోగాభ్యాసము అత్యవసరమే! ఎందుకంటే, ఆత్మగురించి జ్ఞానము సంపాదించుకోవటమనేది తెలుసుకోవటం వరకే అగుచున్నది.

యోగహీనం కథమ్ జ్ఞానమ్ మోక్షదం భవతి ధృవమ్?

(1) తెలుసుకోవాలి (శ్రవణం)
(2) తెలుసుకొన్నది అనుకోవాలి (మననము)
(3) అనుకున్నది అనిపించాలి (నిదిధ్యాస)
(4) అనిపించే దానితో మమేకం కావాలి.

‘‘ఈ కనబడే సమస్తము మమాత్మచమత్కార విన్యాసమే’’ అనే అనుభూతి సహజము, అనుక్షణికము కావాలి (సమాధి). అందుకుగాను ఈ మనస్సు - దేనిని ఎంతవరకు ఏరూపంగా విడవాలో, అది అంతవరకు విడవబడాలి. దేనిని ఎంతవరకు ఏ రీతిగా పట్టుకోవాలో, అది ఆ రీతిగా పట్టుకోవాలి. తదితరమైనదంతా ఆత్మకు అనన్యమని అశంసయంగా అనిపించటం స్వభావసిద్ధంకావాలి.

అందుకు శాస్త్రములు సూచించు అష్టాంగ యోగాభ్యాసములు, భక్తిసాధన మొదలైనవి అత్యావస్యకము. కనుక జ్ఞానమాత్రం చేత (తెలుసుకోవటం, సంభాషించటం, వినటం….ఇంతమాత్రం చేత) ‘నాకు బంధమే కించిత్ కూడా లేదు’ అను రూపముగల మోక్షము ఎట్లా లభిస్తుంది?లేదు. స్వానుభవమై అది అనుక్షణికమవటము సులభం కాదు. అందుకు అభ్యాసము అత్యావస్యకము.

జ్ఞానాభ్యాసము : జ్ఞానము అనగా ‘‘అవగాహన’’యే కదా! ‘‘మేము యోగాభ్యాసులమై మాత్రమే ఉంటాము. జ్ఞానసమాచారము వినము. అనవసరం!’’ అనునది సరిపోతుందా? లేదు.

యోగోఽపి జ్ఞానహీనస్తు న మోక్షో మోక్ష కర్మణి!
‘‘మోక్ష సాధనలో మేము యోగమునకు పరిమితమౌతాము’’ - అంటే కూడా మోక్షము లభించదు. జ్ఞానము లేకుండా యోగాభ్యాసములను నిర్వర్తించుచూపోతామంటే కూడా మోక్షము అనుభవమవదు. చిట్టచివరికి ఆత్మను ఎరుగుటయే మోక్షము. (జ్ఞానేనైవతు కైవల్యమ్).

అందుచేత…
తస్మాత్ జ్ఞానం చ, యోగం చ ముముక్షుః దృఢమభ్యసేత్!
జ్ఞానము, యోగము కూడా ముముక్షవు దృఢముగా అభ్యసించాలి. మోక్షాభిలాషి అయినవాడు - అటు జ్ఞానాభ్యాసి, ఇటు యోగాభ్యాసి కూడా ఒక్కసారే అయిఉండాలి. జ్ఞాని - అభ్యాసమును ఏమరువరాదు. యోగి-జ్ఞానమును తిరస్కరించి ఉండరాదు. రెండూ మోక్షమార్గములో ప్రయాణించే ద్విచక్ర వాహనమునకు రెండు చక్రములు - వంటివి. అంతేగాని, ఒకటి తరువాత మరొకటి కాదు. అవి వేరైన రెండు మార్గములు కానే కావు. ‘‘జ్ఞానులు వేరు, యోగులు వేరు’’ - అనునది చిన్న పిల్లలు పలికే పలుకులు. విజ్ఞులైన పండితులు అట్లా అనరు.

జ్ఞానము యొక్క ప్రాముఖ్యత

ఈ జీవుడు సంసార చక్రమునందు బద్ధుడైఉన్నాడు. సంసారము అనగా? దృశ్యముతో తనకు గల సంబంధ - అసంబంధముల గురించిన సరియగు విజ్ఞానమును పెంపొందించుకోవటమే. తనను తాను ఏమరచి దృశ్యపరంపరలయందు ‘నిజమే’ అని అనుకొంటూ పరిభ్రమించటమే.

అజ్ఞానమనగా? సత్యమును ప్రక్కకు పెట్టి నాటకీయమగు (Dramatic) అసత్యమును ఎదురుగా ఉంచుకొని భ్రమలు కొనసాగించటమే కదా!

అజ్ఞానము జ్ఞానము చేతనే తొలుగగలదు. జ్ఞేయమగు ఆత్మ గురించిన జ్ఞానమే కేవలమగు స్వస్వరూపాత్మ గురించిన స్థానమునకు ఏకైక సాధనము.

జ్ఞాతము = తెలుసుకోవటం. తనను తాను ఎరుగుట. తనయొక్క మాయాతీత సాక్షీమాత్ర నిర్మల నిజరూపము యొక్క స్వాభావికానుభవము. పరమపదమగు కైవల్యము.

‘జ్ఞానము’ యొక్క నిర్వచనం

కళంక రహితము, నిర్మలము, కేవల సత్ (ఉనికి) - చిత్ (ఎరుక) - ఆనంద (అనుభూతి) స్వరూపము, ఈ జగత్ - వృత్తుల ఉత్పత్తి - స్థితి - లయములకు సాక్షీభూతము, ఇంద్రియములకు సంబంధించిన వివరణలకు పట్టుబడనిది - అగు తనను తాను ఎరుగుటయే జ్ఞానము.

కనుక సర్వయోగసాధనల అంతిమాశయము ‘ఆత్మాఽహమ్’, ‘‘అహమ్ బ్రహ్మాస్మి’’, ‘త్వమేవాహమ్’, ‘తత్త్వమ్’ యొక్క స్వానుభవమే!

యోగసాధన విశేషము

జన్మ జన్మలుగా ఈ జీవుడు ఆశ్రయించిన, ‘‘స్వస్వరూపాత్మపట్ల అజ్ఞానము’’ మొదలంట్లా తొలగి, ‘అఖండమగు ఆత్మ’ అనుక్షణికానుభవము అవటానికి సాధన - యోగము.

హే బ్రహ్మన్! ‘యోగము’ అనునది అనేక విధాలుగా సాధన వ్యవహారితమైయున్నది.
(1) మంత్ర యోగము (2) హఠయోగము (3) లయయోగము…ఇవన్నీ విడివిడిగాను, (4) నాలుగవది అగు రాజయోగము వైపుగా - వివిధ మెట్లుగాను చెప్పబడుచున్నది. యోగములన్నిటిలో ‘4’ అవస్థలు పరికీర్తించబడుచున్నాయి.

(1) ఆరంభావస్థ (The Begining Acts / Process)
(2) ఘటావస్థ (The State of Constancy/Solidarity)
(3) పరిచయావస్థ (Differentiation of (Ⅰ) The Self within the world and (Ⅱ) The Self beyond the world)
(4) నిష్పత్తి (Mutually placing with due synchronisation)

హే బ్రహ్మ భగవన్! వీటి వీటి లక్షణముల గురించి వివరించుకొంటున్నాము. సమాహితమైన శ్రద్ధ - ఆసక్తులతో కూడిన చిత్తముతో ముముక్షువులు ఇది గమనించెదరుగాక!

Ⅰ. జపయోగము

మంత్రము : మనన రూపము. అందుకుగాను ఇష్టదైవము యొక్క నామము, బీజాక్షర-సమన్వితము. నిర్మితము, పరమార్థపూరితము. ఋషిప్రసాదితము. మననమునకు సహకారికము అగుచున్నది. (మననాత్ త్రాయతే ఇతి మంత్రమ్). అట్టి మనన రూప శబ్దము (లేక) వాక్యములో గల పరమ ఉద్దేశ్యము పరమాత్మతో మమేకమే। అట్టి సోఽహమ్ భావన ‘మాతృక’ అనబడుచున్నది. అట్టి ‘మాతృక’తో కూడిన మంత్రమును పరమార్థ మనన పూర్వకంగా శ్రద్ధాభక్తులతో 12 సంవత్సరములు మంత్రోపాసన(మంత్రజపము)చే మంత్రసిద్ధి కలుగగలదు. క్రమంగా ‘అణిమ’ మొదలైన అష్టాంగయోగ సమన్విత స్థితి, తత్‌గుణాత్మకమైన జ్ఞానము లభించగలవు.

Ⅱ. లయయోగము! కోటీశమ్!

జపయోగము లయయోగమునకు ప్రారంభదశ మాత్రమే! జపముయొక్క ముఖ్యోద్దేశ్యము, ప్రయోజనము మనోలయమే! జపము పూర్వ - దశగాను, లయయోగము ఉత్తరోత్తర దశగాను చెప్పబడుచున్నది.

శ్లో।। అల్పబుద్ధిః ఇమం యోగం సేవతే సాధకాధమః।
లయయోగః చిత్తలయః కోటీశః పరికీర్తితః।।

కేవలము జపము చేస్తూ ఉండటమనేది ‘సాధన’లో క్రింద (మొదలు) కార్యక్రమము. క్రిందమెట్టు వంటిది. అంతకు మాత్రమే పరిమితమైతే, అది అల్పబుద్ధితో కూడిన ‘సాధకాధమస్థితి’ అగుచున్నది. అనేక భావనారూపమగు మనస్సు క్రమంగా దృశ్య విషయములనుండి జపయోగముచే విరామము (withdraw) పొందసాగుచున్నది. ‘నామజపము’ నుండి ఇష్టదైవ-తత్త్వము’నందు ప్రియము పొందుచూ, ఈశ్వరత్వమును, ఆత్మత్వమును సమీపించసాగుచున్నది. చిత్తము క్రమంగా ఇష్టదైవ పరమార్థ పరతత్త్వమునందు మమేకమగుచుండగా ‘చిత్తలయము’ సిద్ధించుచున్నది. అదియే ‘‘కోటీశము’’ అని కూడా పరికీర్తించబడుచున్నది.

ఒకడు కూర్చుని ఉన్నప్పుడు, నడచుచున్నప్పుడు, భుజించుచున్నప్పుడు, ఊపిరి పీల్చుచున్నప్పుడు, వదలుచున్నప్పుడు కూడా ధ్యాస ‘ఈశ్వర తత్త్వ ధ్యానము’ నందే నియమితమగుచుండగా, ఈ జగత్ దృశ్యమంతా నిష్కళంకమగు ఈశ్వర స్వరూపంగా (పరమాత్మయే ఈ అన్ని రూపాలలో, సమస్త రూపములుగా) - ‘చ్యుతి’ (Distraction) లేకుండా, స్వభావంగా - అనిపించటము జరుగుచూ ఉంటే → సయేవ లయయోగస్యాత్। ‘‘ఇదంతా సర్వదా ఈశ్వర విలాసమే’’ - అని అనిపించటమే లయయోగము.

Ⅲ. హఠయోగము

‘‘ఈ కనబడేదంతా పరమేశ్వర స్వరూపమే’’ - అని అనిపించటం లయయోగము. అది అనుక్షణికము, స్వాభావికము అవటానికి మార్గము హఠయోగము. ఇక ఇప్పుడు హఠయోగము గురించి వివరించుకుందాము.

అష్టాంగ యోగములు : (1) యమము (2) నియమము (3) ఆసనము (4) ప్రాణసంయమము (5) ప్రత్యాహారము (6) ధారణ (7) ధ్యానము (భ్రూమధ్యగా హరిని ధ్యాసతో ధ్యానించటము) (8) సమతావస్థ స్వరూపమగు ‘సమాధి’ ఇవి అష్టాంగ యోగములుగా చెప్పబడుచున్నాయి. ఇవన్నీ ‘‘మమాత్మా సర్వభూతాత్మా’’, ‘‘అహమ్ సర్వస్య ప్రభవో’’ మొదలైన ‘‘కేవలాత్మాఽహమ్’’ స్వాభావికభావనకు - ఉపకరణములు. ఇవన్నీ ‘‘హఠయోగము’’ యొక్క అంగములు. ఈ అష్టాంగములకు ఉపాంగములు శాస్త్రములచే ప్రవచితము అగుచున్నాయి.

ఇవి గాక ‘హఠయోగము’లో మరికొన్ని విశేషమైన విషయములు :

(1) మహాముద్ర (2) మహాబంధము (3) మహావేధ (4) ఖేచరీముద్ర (5) జలంధర ముద్ర (6) ఉడ్డీయాణము (7) ప్రణవమును (అ, ఉ, మ, ఓంలను) సుదీర్ఘంగా అనుసంధానము చేయుటము. (8) మహనీయుల స్వానుభవము, (9) వేదముల - వేదాంత వాఙ్మయముయొక్క మహావాక్య ప్రవచనములగు ‘‘సోఽహమ్, తత్ త్వమ్’, ఏకో విష్ణుః మహత్ భూతమ్’’ మొదలైన సిద్ధాంతముల సవివరణములను శ్రవణము చేయుటము. (10) పరతత్త్వము గురించి శాస్త్రాధ్యయనము (11) త్రి - ధామతములు ‘వజ్రోళీ’, ‘అమరోళీ’, ‘సహజోళీ’ ఇవన్నీ కూడా ‘హఠయోగము’ యొక్క అంతర్విభాగ వివిధ విశేషములు. హఠయోగ వృక్షముయొక్క వివిధ శాఖలు. హే బ్రహ్మ భగవన్! వాటి వాటి వేరువేరు ప్రత్యేక లక్షణముల గురించి, కొన్ని తాత్త్విక - ప్రాముఖ్యార్థములను లోక కళ్యాణార్థమై చెప్పుకొనుచున్నాము. వినండి.

⌘⌘⌘

(1) యమము : ఈ ఇంద్రియములు ఆయా ఇంద్రియ విషయములై వ్రాలుచూ ఉండటము స్వభావముగా కలిగినవైయున్నాయి. కంటికి-చూపు; చెవికి-వినటము; నోటికి-మాట్లాడటము; నాలుకకు-రుచిచూడటము; చర్మమునకు-స్పర్శ; ముక్కుకు-వాసన చూడటము; కాళ్లకు తిరిగిరావటము; చేతులకు పనులుచేయటము-ఇత్యాదులన్నీ ‘ధర్మము’ (Natural Feature) గా కలిగి ఉన్నాయి.
వాటి వాటి విశేషములవైపు ప్రసరణమే వాటికి ‘ఆహారము’. యోగి - వాటన్నిటినీ లఘు ఆహారవర్తనము’ నందు (అవసరమైనంతవరకే) ఉపయోగించుచున్నాడు. ఇదియే ‘యమము’ యొక్క ముఖ్యమైన తత్త్వార్థము. ఇతరములన్నీ ముఖ్యోద్దేశ్య సిద్ధికొరకు మాత్రమే సాధనరూపములుగా చెప్పబడుచున్నాయి.

(2) నియమము : తదితర జీవులకు మనోవాక్ కాయములచే బాధ కలిగించకపోవటము - అహింస. ఓ చతురాననా! అహింసయే ‘నియమము’ యొక్క ముఖ్య విశేషము (పెద్దకొమ్మవంటిది).

(3) ఆసనము : ధ్యానము యొక్క అభ్యాసము కొరకు దేహమునకు సానుకూల్యమైన ఆసనము (sitting posture) ను యోగి ఆశ్రయించుచున్నాడు. అట్టి అనేక ఆసనములలో ‘4’ ఆసనములు ముఖ్యమైనవిగా ఉదహరించుకుంటున్నాము.

(1) సిద్ధాసనము (2) పద్మాసనము (3) సింహాసనము (4) భద్రాసనము. ఈ నాలుగు ‘ఆసన చతుష్టయము’గా సూచించ బడుచున్నాయి.

యోగాభ్యాసములో ఎదురయ్యే విఘ్నములు

ఓ చతురాననా! బ్రహ్మదేవా! మొట్టమొదటగా యోగాభ్యాసము ప్రారంభించుచున్నప్పుడు అట్టి ముముక్షువుకు కొన్ని విఘ్నములు ఎదురు అగుచూ ఉంటాయి. యోగాభ్యాసులందరినీ దృష్టిలో పెట్టుకొని, వారికి శుభము కలుగుటకై…‘‘అట్టి విఘ్నములు ఏఏ తీరులుగా ఉంటాయి? వాటిని ఎదుర్కొని అధిగమించి, యోగాభ్యాసమును దృఢం ఎట్లా చేసుకోవాలి?’’ - ఈ విషయాలు ముందుగా చెప్పుకుందాము.

(1) ఆలస్యము : బద్ధకము. సోమరితనము. ‘యోగసాధనకు సిద్ధపడాలి’ అని అనుకుంటూనే, ఆయా ప్రాపంచకమైన - ఆలోచనలతో, పరస్పర జనసంబంధమైన కబుర్లతో, లౌకికమైన సంభాషణలతో, పరస్పర దూషణలతో కాలమును అవకాశములను వృధా చేసుకోవటం. ఉపాసనా స్థానము, ఆసనస్వీకారము మొదలైనవి ఆలస్యము చేస్తూ కాలము వృధా చేయటం. లేదా, యోగాభ్యాస సమయమును అల్పము చేసుకోవటము.

(2) కత్థనం : తనను తాను స్థుతించుకోవటం (లేక) నిందించుకోవటం. అట్లాగే ఇతరులను నిందించటం (లేక) పొగుడుతూ కాలము వెచ్చించటం. ళీఅత్మస్థుతి. పరనింద (లేదా) పరస్థుతి - ఆత్మనిందరి.
❋ వాళ్లు యోగాభ్యాసం చేయరేం? నేను చేస్తున్నాను చూచారా?
❋ వీళ్లు నాకన్నా బాగా చేస్తున్నారేం? మరి నేను వారిలా ఎట్లా చేయాలి?
❋ నాలాగా ఎందరు చేయగలరు? నాకు తెలిసినంతగా చాలామందికి తెలియటం లేదు.
❋ వాళ్ళు గొప్పవాళ్ళు. మనవలన ఏమౌతుంది? మన గతి ఇంతే. మోక్షము ఇప్పుడప్పుడే కుదిరేది కాదు.

ఈఈ మొదలైన ఆయా ఆలోచనలు చుట్టుముట్టుతూ ఉంటే, మనస్సు నిలవదు. ఏకాగ్రం కాదు. యోగసాధనలో నిలువవలసిన ధ్యాస బలహీనమౌతూ ఉంటుంది.

(3) ధూర్త గోష్ఠి : ఈ జీవుని మనస్సుకు కలుగుచూ ఉంటున్న ఒక ముఖ్యమైన దురభ్యాసమును జాగరూకత కొరకై గుర్తుచేస్తున్నాను.
❋ ఎవరెవరివో తప్పులు గురించి ఒకరికొకరు సంభాషించుకోవటము. ఒకరు చెప్పటం. మరొకరు ‘ఊ - ఊహూ - ఔను’ అంటూ ఉండటం…,
❋ అట్టి సమయములలో ఆ ఇతరుల సద్గుణములు, ఉపకారములు, మంచి పనుల ఊసు గుర్తు రానీయకపోవటం….,
❋ తనయొక్క మంచి గుణములు, మంచి క్రియలు, మంచి స్వభావములు ఉదహరిస్తూ ఉండటము….,
❋ తనయొక్క తప్పులను, దుర్గుణములను జ్ఞాపకమే పెట్టుకోకపోవటము!
గురుదూషణ. జ్ఞాన-యోగములు బోధించు వారి గురించి అల్పాభిప్రాయములు. దూషణ చేయటం.

{(The ‘Evil’ that men do, lives after them. The ‘Good’ is often interred in their Bones - From William Shakespeare’s Julius Ceasar )
(తప్పులెన్నువారు తండోపతండంబుల్ , ఉర్విజనులకెల్లన్ ఉండు తప్పుల్. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ, వినుర వేమ।। - వేమన యోగి)}.

ఈ జీవుని చుట్టూ మంచివారూ ఉంటారు. చెడువారూ ఉంటారు.
❋ మంచి వారి ‘మంచి’ గురించి మాట్లాడాలనిపించకపోవటం.
❋ చెడ్డ వారి ‘చెడు’ గురించే మాట్లాడాలనిపించటం.
ఇది ధూర్త గోష్ఠి అగుచున్నది. ఇట్టి అభ్యాసముచే ఏకాగ్రత కొరవడుతుంది. అటువంటి అలవాట్లు చేత ధ్యాస-జ్ఞాన-యోగ సంజ్ఞలయందు బుద్ధి నిలువదు. అందుచేత యోగాభ్యాసికి ధూర్తగోష్ఠి కూడదు.

సర్వత్రా ఆత్మను, సర్వము ఆత్మగా దర్శించటమే యోగాభ్యాసియొక్క అంతిమ ఆశయము కదా! మరి, ధూర్తగోష్ఠి ఆ అభ్యాసిని వెనుకకు గుంజుతుందని గుర్తించకపోతే ఎట్లా?

(అందుకే శ్రీరామచంద్రమూర్తి సర్వయోగాభ్యాసులకు ఒక సూచన ఇచ్చారు. కుర్యాత్ నరాన్ స్వగుణదోష విచారణాని! మానవజన్మ వచ్చింది తన గుణదోషములను వెతికి వెతికి తెలుసుకొని, తొలగించుకోవటానికేగాని, తదితరుల దోషముల చిట్టా వ్రాయటానికి కాదు - యోగావాసిష్ఠ రామాయణము)

(4) మంత్రాది సాధనము : ‘మంత్రము, తంత్రము, విధానములు, నియమములు, ఆహారనియమములు, కట్టు - బొట్టు’ మొదలైన-ఇవియే అంతిమాశయములుగా భావించి, మంత్రాధిష్ఠాన దేవతయొక్క - (సర్వసహజీవులు తానైనట్టి) దివ్య స్వరూపమునందు మనస్సును లగ్నం చేయకపోవటము, లగ్నం చేసి లయింపజేసే ప్రయత్నము చేయకపోవటము - ఇది మరొక విఘ్నముగా గోడవలె నిలచుచున్నది. మంత్రోపాసన, గుణోపాసన, తదితర ధ్యాన యోగములు - ఇవన్నీ కూడా ‘చిత్తలయము’ అనురూపమగు లయయోగము కొరకేకదా! సర్వము పరమాత్మగా దర్శిస్తూ, తనను తాను పరమాత్మతో మమేకము చేయుటమే ముఖ్యాశయమని సాధకుడు ఏ సమయమందును ఏమరువరాదు.

(5) ధాతుధ్యాస : దేహముల పట్ల, ఇంద్రియ సౌఖ్యముల పట్ల, శృంగారము - ధనము - సంతానము - స్వజనము - ఇత్యాదుల పట్ల తీవ్ర ధ్యాస - యోగధ్యాసమునకు మరొక విఘ్నము.

(6) స్త్రీ లోలుత్వము : స్త్రీ - పురుష పరస్పర అశాస్త్రీయ వ్యామోహములు అనేక దశలలో యోగసాధన విఘ్నములు అవగలవు.

ఈ ఈ మొదలైనవన్నీ ‘సంసారము’ అనే ఎడారిలో మృగతృష్ణా జలాశయములవంటివని గమనించబడునుగాక! ఈ విధంగా తెలుసుకొని, వాటిని త్యజించాలి. దూరంగా ఉంచాలి. వాటితో యుద్ధము చేసి అయినాసరే, జయించక తప్పదు.

ఆలస్యమును …. ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి శ్రద్ధలతోను…
కత్ధనమును (పరనిందను) … దైవస్థుతులతోను, భక్తుల-జ్ఞానుల-అవతారమూర్తుల కధా శ్రవణమువలనను,
ధూర్తగోష్ఠిని …. ఆత్మవిమర్శతోను,
మంత్ర-ఆచార పరిమితత్వమును …. సర్వము ఇష్టదైవమయంగా దర్శించు జ్ఞప్తితోను,
ధాతు స్వభావమును …. త్యాగభావములతోను, దైవ సంకల్పముయొక్క గమనికతోను,
స్త్రీలోలుత్వమును ….. మాతృభావదర్శనములతోను

- ఎదుర్కొనాలి!


ప్రాణాయామ యోగాభ్యాసము

ఓ బ్రహ్మదేవా! ఈ జీవుడు స్వకీయ ప్రయత్నముచేతనే సర్వత్రా దిగ్విజయుడు కాగలడు. విఘ్నములను తొలగించుకోగలడు. పుణ్యకార్యములను నిర్వర్తిస్తూ ఇతఃపూర్వపు దోష - అల్ప ‘‘దృష్టి సంస్కారముల’’ పెత్తనములను నిర్జించగలడు. కనుక జనులు ప్రయత్నశీలురై ఉండెదరు గాక!

మనస్సును నిర్మలము, తేజోవంతము, విషయపరంపరల నుండి విరమించుశక్తివంతము అవటానికి, బుద్ధిని నిర్మలము - ప్రశాంతము - విస్తారము - సునిశతముగా తీర్చిదిద్దుకోవటానికి, దేహమును సముత్సాహవంతము, ఆరోగ్యవంతము, పుష్టివంతము చేసుకోవటాని → ప్రాణాయామ యోగాభ్యాసము అత్యంత ఉపయుక్తమగు యోగసాధనముగా యోగవేత్తలచే ప్రవచించబడుతోంది. అట్టి ప్రాణసంయమము (లేక) ప్రాణనియమము గురించి కొన్ని విశేషాలు వివరించుకుంటున్నాము.

ఆసనము

అట్టి ప్రాణాయామమునకు ‘పద్మాసనధారణ’ సులభము, ఉపయుక్తము కూడా.

అనువైన ప్రదేశము (sanction of place) :

శరీరమును ఋజువుగా (Straight Forward) ‘ధారణ’ చేసి ఒక్కసారి ఇష్టదేవత, గురువుల రూపమును మననం చేస్తూ రెండుచేతులు ముకిళించి ‘నమస్కారములు’ సమర్పించాలి. అప్పుడిక ‘ప్రాణాయామము’ను ప్రారంభించును గాక.

ప్రాణాయామము చేయు విధానము

Ⅰ. ఇడా పూరక కుంభక పింగళా రేచక ప్రాణాయామము

దక్షిణ హస్తస్య అంగుష్ఠేనైవ పింగళామ్ నిరుధ్య కుడిచేతి బొటనవ్రేలుతో కుడిముక్కుపుటమును, పింగళానాడిని అణచి ఉంచి,
పూరయేత్ వాయుమ్ ఇడయాతు శనైః శనైః। ఎడమ ముక్కు పుటము ద్వారా (ముక్కు 12’’ దూరం నుండి) గాలిని లోనికి పీల్చి ‘ఇడానాడి’ యందు నమ్మెది నెమ్మదిగా వాయువును పూరించాలి. (Inward pulling and Filling the air into the left side line)
యధాశక్త్య అవిరోధేన తతః కుర్యాచ్చ ‘కుంభకమ్’ యధాశక్తిగా ఇబ్బంది అని అనిపించనంతవరకు ఎడమవైపుగల ఇడా నాడిలో వాయువును కుంభించి ఉంచాలి. (Holding the Air)
పునః త్యజేత పింగళయా శనైరేవ, న వేగతః।। చేతనైనంతగా వాయువును కుంభించి ధారణచేసిన తరువాత ఇక ఆపై పింగళ నాడి నుండి నెమ్మదిగా (వేగంగా కాకుండా) వాయువును వదలాలి. కుడి ముక్కు పుట ద్వారా క్రమపద్ధతిగా రేచకం (Outword Releasing) చేయాలి. పింగళలోని గాలినంతటినీ బహిష్కృతం చేయాలి.


Ⅱ. పింగళా పూరక కుంభక - ఇడా రేచక ప్రాణాయామము

పునః పింగళయ అపూర్య పూరయేత్ ఉదరం శనైః ఇప్పుడు (ముక్కుకు 12’’ల దూరం నుండి) కుడిముక్కు పుటముగుండా పింగళ (కుడి) నాడిద్వారా వాయువును లోనికిపీల్చి, పూరించి ఆ వాయువును ఉదరము (పొట్ట)లో నెమ్మదిగా పూరించాలి.
ధారయత్వా యథాశక్తిః రేచయేత్ ఇడయా శనైః శక్తి కొలది చేతనైనంత సమయము ధారణ చేసి, నెమ్మదిగా ఇడానాడితో ఎడమ ముక్కుపుటము ద్వారా వాయువును రేచనము చేయాలి (వదలాలి)
యయా త్యజేత్ తయా ఆపూర్య - ధారయేత్ అవిరోధతః।। ఇప్పుడు, ఏ ముక్కు పుటతో వాయువు వదలబడుచున్నదో, ఆ వైపు ముక్కుపుట-నాడితో మరల పూరించి, దేహమునకు ఇబ్బంది లేనంతవరకు ధారణ చేయాలి. రెండవ ముక్కుపటుతో వదలాలి.


పూరక - కుంభక - రేచకముల సమయపాలన - సూచనలు

‘మాత్ర’ - కాల నిర్ణయము
జాను ప్రదక్షిణీ కృత్య నదృతం, న విలంబితమ్
ఒక ముక్కుపుటమును మూసి, రెండవ ముక్కు పుటము ద్వారా వాయువును స్వీకరించి వేగంగా గాని, నెమ్మదిగా గాని కాకుండా (Neither speedily not slowly) మోకాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసి….,
అంగుళీ స్ఫోటకం కుర్యాత్ ‘‘మాత్రా’’-పరిగీయతే।। వెంటనే మొదటి ముక్కుపుటను మూసిన అగుళి (బొటన వ్రేలును) తొలగించి రేచకము చేయుకాలము - ఒక ‘మాత్రకాలము’ అని చెప్పబడుచున్నది.
ఇడయా వాయుమ్ ఆరోప్య శనైః షోడశ మాత్రయా(16)
కుంభయేత్ పూరితం పశ్చాత్-చతుష్షష్ట్యాతు మాత్రయా (64)
రేచయ్‌త్ పింగళా నాడ్యా
ఇడానాడితో నెమ్మదిగా వాయువును పూరించవలసిన సమయము - 16 మాత్రలు
పూరితము తరువాత కుంభించి ఉంచవలసిన కుంభక సమయము - 64 మాత్రలు
పింగళా నాడినుండి రేచకము చేయు (వదలు) సమయము - 32 మాత్రలు
పునః పింగళయ అపూర్య పూర్వవత్సు సమాహితః। ఆ తరువాత పింగళతో పూరించటం - 16 మాత్రలు
కుంభకము - 64 మాత్రలు
ఇడ రేచకము చేయటము - 32 మాత్రలు

ఈ విధంగా….
ఇడాపూరక (16 మాత్రలు) - కుంభక (64 మాత్రలు) - పింగళా రేచక (32 మాత్రలు)
పింగళా పూరక (16 మాత్రలు) - కుంభక (64 మాత్రలు) - ఇడా రేచక (32 మాత్రలు)
పింగళా పూరక ఉదరకుంభక - జానునీ ప్రదక్షిణ ఇడారేచక (ఒక్క మాత్రకాలం)
ఇడాపూరక - ఉదరపూరక - జానునీ ప్రదక్షిణ - పింగళా రేచక (ఒక మాత్రకాలం) - నిర్వర్తించాలి.

ఈ నాలుగు కూడా → ప్రతిరోజూ నాలుగు సమయముల చొప్పున
ప్రాతఃకాలము 4 AM to 6 AM 20 సార్లు
మధ్యాహ్న సమయం 10 AM to 12 PM 20 సార్లు
సాయంకాలం 6 PM to 8 PM 20 సార్లు
అర్థరాత్రి 10 PM to 12 AM Midnight 20 సార్లు
రోజుకు 80 సార్లు నెలలో నాలుగు వారములు సంపూర్ణ ప్రాణాయామము నిర్వర్తించాలి.

ఈ విధంగా ‘3’ నెలల కాలము అభ్యసిస్తే దేహములోని నాడులన్నీ శుద్ధి అవగలవు. నాడులలో వాయు కదలికలవలన, పదార్థముల ప్రవేశ - నిష్క్రమణముల వలన మిగిలిపోయి ఉండే దోషములన్నీ తొలగించబడతాయి. (ఈ ప్రాణాయామ ప్రక్రియ మొదట గురుముఖతః నేర్చుకోవటం - ఉచితము)

(This is an excellent solution to all Gastric Problems)

అట్టి యోగాభ్యాసియొక్క దేహ - విశేష లక్షణములు
⌘ శరీరము తేలికగా అనిపించసాగుతుంది.
⌘ దేహమంతా తేజస్సుతో నిండినట్లు అనుభూతి రోజంతా కొనసాగుచున్నది.
⌘ ఉదరములోని జఠరాగ్ని వివర్ధము (Increase) కాసాగగలదు. (The Digestional Fire becomes wel-poised).
⌘ లావు సన్నగిల్లుచున్నది. (Excessive mustle gets diluted).
ఇవన్నీ యోగాభ్యాసికి, ఎప్పటికప్పుడు స్వానుభవమవుతూ వస్తున్నాయి.

కొన్ని నియమములు
✤ ఉప్పు, ఆవాలు, చింతపండు, వేడి ఎక్కువగా ఉన్న పానీయాలు - పదార్థములు, కారము అధికంగా ఉండేవి, వాతమును అధికము చేయు (గోంగూర మొదలైన) కొన్ని శాకములు, ఇంగువ, వెల్లుల్లి…. ఇటువంటివి అధికంగా ఆహారంగా తీసుకొంటూ ఉంటే…అవి యోగ నిరోధకములు కాగలవు.
✤ యోగ సాధనాకాలంలో ధర్మవిరుద్ధమైన శృంగార వ్యసనములు, పరాయి స్త్రీలతో శృంగార సంభాషణములు…ఇటువంటివి యోగ - విఘ్నకరములుగా యోగి గమనించి ఉండునుగాక.
✤ దేహము సానుకూల్యము కానప్పుడు తెల్లవారుఝాము (చలిలో) స్నానములు, రోజంతా ఉపవాసములు మొదలైన దేహమునకు క్లేశంగా ఉండే వాటిని వర్జించి ఉండటము - యోగాభ్యాస సమయంలో ఉచితము. ఏది ఎంతవరకు సాధ్యమై ఉంటుందో, అంతవరకే సాధన. ‘‘సాధ్యమైనదే సాధన’’ - అనునది మూల సిద్ధాంతము.
✤ యోగాభ్యాస ప్రారంభ కాలములో పాలతోను, నేయితోను కూడిన ఆహారము ఉత్సాహమును పెంపొందించగలదు. అట్లాగే, గోధుమ - పెసలు - బియ్యపు నూకాన్నము ఇటువంటివి భుజించటం చేత యోగవృద్ధి త్వరితము అవగలదు.

కేవల కుంభకము

హే బ్రహ్మ భగవన్! ఈ విధంగా శక్త్యనుసారంగా (శక్తి కలిగినంతగా) యధేష్టానుసారంగా (ఇష్టము అగుచూ ఉన్నంతగా)….వాయుధారణ (కుంభకము) చేస్తూ, ఇడ - పింగళ నాడులను పూరక - రేచకములు ప్రత్యుత్సాహ పరచుచూ ఉండగా యోగసంసిద్ధుడగుచున్న అట్టి యోగి పట్ల ‘కేవలకుంభకము’ యథాకాలంలో సిద్ధించుచున్నది.

పూరక - రేచకముల ఆవస్యకత లేకుండానే ‘కుంభకము’ సిద్ధించటము ‘కేవల కుంభము’ అగుచున్నది. కేవల కుంభకము సిద్ధించు యోగి తన మనస్సును, బుద్ధిని - దేహ-దేహబాహ్య రంగములలో ఎక్కడైనా కూడా కుంభకము చేసి (కేంద్రీకృతం చేసి Concentration wherever he would like to) ఉంచగలడు.

న తస్య దుర్లభం కించిత్ త్రిషులోకేషు విద్యతే । ‘కేవల కుంభకము’ సిద్ధించుకున్న యోగికి ఈ మూడు లోకములలో ‘దుర్లభము, అసాధ్యము’ అనునది ఏదీ ఉండదు.

యోగాభ్యాసం సమయములో - స్థితి - గతి - సిద్ధులు

ప్రస్వేదో జాయతే పూర్వం మర్థనం తేన కారయేత్। యోగాభ్యాసం ప్రారంభించినప్పుడు క్రొత్తలో ప్రస్వేదము (చెమట) ఎక్కువగా (ముఖముపై, భుజములపై, మెడ చుట్టూ) జనిస్తూ ఉంటుంది. అట్టి స్వేదనమును అచ్చోటనే ‘మర్దనము’ చేయబడునుగాక! (To Rub at the same place). అట్టి స్వేదనము (చమట)లో యోగతేజస్సు ఇమిడి ఉంటుంది.
❖ ఆసనము ధరించి దీర్ఘంగా వాయుధారణ (కుంభకము) చేయుచుండగా దేహికి దేహములో అధికంగా కఫము బయటకు రానారంభిస్తుంది. చెమట, చెవులలో వేడి వాయువుల ప్రసరణము, కూర్చున్నచోట తడి-ఏర్పడుచూ ఉంటాయి. అధికాధిక అభ్యాసముచేత పెద్దగా చెమట (స్వేదము) బయల్వెడలగలదు.
❖ క్రమంగా దేహంలో చైతన్యోత్సాహము, దేహముతో ప్రాణ కదలికల కప్పగంతుల వంటివి అనుభవమగుచూ ఉంటాయి. మనస్సు ఉత్సాహము ఉరకలు వేస్తూ ఉంటుంది.
❖ యోగసాధన కొనసాగుచుండగా ఒకానొక స్థితిలో పద్మాసనము కొనసాగిస్తూనే ఆ అభ్యాసి ఒకచోటినుండి మరొక చోటికి స్థానపు కదలిక పొందగలడు. పద్మాసన స్థితో యోగీ తథా గచ్ఛతి భూతలే।
❖ ఇంకా అధికతరమైన - తీవ్రమైన ప్రాణాయామ కుంభక అభ్యాసముచే దేహము తేలిక అయి, భూమి నుండి గాలిలో పైకి (పద్మాసనము కొనసాగిస్తూనే) లేచుచున్నది. భూమిత్యా ఆగశ్చ జాయతే। భూమిన్ ఉత్సృజ్య వర్తతే।
❖ ప్రాణాయోగ అభ్యాసముల వలన ఆ యోగికి మానవాతీతమైన సామర్థ్యములు ఉద్భవించగలవు. అతి మానుష చేష్ఠాది తథా సామర్థ్యమ్ ఉద్భవేత్।

అయితే ‘ఆత్మసాక్షాత్కార మహదాశయము’గల యోగి యోగాభ్యాసఫలములగు తనయొక్క మానవాతీతములగు లౌకిక - వీర్యవత్తర సామర్థ్యములను ఇతరులతో; ‘‘చూడండి! నేను ఇంతటి యోగసిద్ధుడను! సామర్థ్యములు కలవాడను’’ - అను రూపంగా ఏమాత్రమూ ప్రదర్శించడు. ఇతరులకు చూపడు. ఇతరులకు తెలియనీయడు. ‘‘అవి ఆత్యంతిక యోగసిద్ధికి విఘ్నములు కాగలవు’’ - అను జాగరూకత కలిగి ఉంటాడు.

ఇక, ఆతనికి తదితర సంసారిక జనులవలెనే ఆయా సుఖదుఃఖములు సంభవిస్తూ ఉండవచ్చుగాక! స్వల్పం వా బహుథా దుఃఖం యోగీ న వ్యథతే తదా! యోగి స్వల్ప బహు సుఖ దుఃఖములను చూచి వ్యధ చెందడు. తాను చదువుచున్న కథలోని విషయములవలె, తాను వినోదము కొరకు చూస్తున్నవాడువలె ఇక్కడి సుఖదుఃఖ సంఘటనలను, సందర్భములను (యోగబలంచేత) దర్శించుచున్నాడు.

❖ యోగి విషయములో మూత్ర మలములు - శరీర జనిత తేజోశక్తి కారణంగా అల్పత్వము పొందుతాయి.
❖ అతి నిద్ర, బద్ధకము, నైరాస్యము, నిరుత్సాహము ఆతని దరిజేరలేవు. ముక్కుల దూషికము, చెవులలో గులిబి, నోటిలో అధిక లాలాజలము, చమట, దేహదుర్వాసన…..ఇటువంటివన్నీ యోగి దేహమునందు కనిపించనివై అల్పమై ఉంటాయి.
❖ ఆతని దేహము పరిపుష్ఠము, పటిష్ఠము అవసాగుతుంది. అధికతరమైన యోగాభ్యాసముచే దేహము గొప్ప బలవర్ధకమవుతుంది. అట్టి యోగబలంచే జనించిన భౌతికశక్తిచే సింహ - పులి - ఏనుగు - ఎలుగుబంటి వంటి బలముగల జంతువులను కూడా ఒక్క వ్రేటుతో జయించి వశం చేసుకోగలడు. చూపుతో శాసించగలడు.
❖ యోగాభ్యాసము యొక్క ప్రభావముచే ఆతని దేహము తేజో - ఉత్సాహ - ధైర్య - పరాక్రమ సంపన్నమై ఉంటుంది. మన్మధుని వంటి సౌందర్యము కలవాడగుచున్నాడు.

❖ యోగాభ్యాసము కొంచము కొంచము వృద్ధి చెందుచుండగా, అట్టి యోగాభ్యాసి ముఖము నిండుతనము సంతరించుకొని ఉంటుంది. కళ్లు - ముక్కు - నుదురు తేజోమయమవుతాయి. వాక్కు ఆప్యాయత సౌమ్యతము - విజ్ఞత్వము సంతరించుకోసాగుతాయి. ఇవన్నీ స్త్రీలకు ఆకర్షణ విశేషములు అవుతాయి. తద్రూపవశగా నార్యః కాంక్షతే తస్య సంగమమ్। స్త్రీలు అట్టి యోగసౌందర్య రూపితో సాంగత్యము అభిలషించటం కూడా జరుగవచ్చును. వారు నార్యాకర్షితులై ఉంటారు. ఒకవేళ యోగాభ్యాస దశలో పర స్త్రీ సంగమమునకు (దృశ్యములో సంగమమువైపుగా) ఆకర్షితుడు అయ్యాడా, ఆ యోగిపట్ల ఆతడు శ్రమించి సంపాదించుకున్న యోగతేజస్సు బిందుక్షయముచే తరిగిపోతుంది. అందుచేత అన్య స్త్రీ సంగమమును (దృశ్య సంగమును) ప్రసంగములను యోగి వర్జించినవాడై, బలహీన భావములను దరిచేరనీయనివాడై, యోగాభ్యాసముపైనే శ్రద్ధతో దృష్టిపెట్టాలి.

యోగి యొక్క బిందుధారణచే ఆతని దేహమందు సుగంధము జనిస్తూ ఉంటుంది. దృశ్యమునందు అహంకార-మమకారముతో కూడిన మితిమీరిన వర్తనముచే తేజస్సు తరిగిపోగలదు. (స్త్రీ = సత్ ఇహ రతి)

ఘటావస్థ

యోగాభ్యాసము చేస్తూ పూరక - కుంభక - రేచక సమయములలో ‘ప్రణవ’ మంత్రము (ఓం) ను మననము చేయుచుండటంచేత (మనస్సుతో ఉచ్ఛరించుచుండటంచేత), అట్టి ప్రణవమంత్రము సర్వ విఘ్నములను తొలగించగలదు. ఇతఃపూర్వపు పాప కర్మల ప్రభావములను సర్వదోషములను హరించి వేయగలదు. అభ్యాసయోగ సిద్ధి త్వరత్వరగా కలుగగలదు. అట్టి అభ్యాసయోగముచేత ‘యోగసిద్ధి’ ప్రాప్తించటం ఆరంభమవుతుంది. అభ్యాస తత్పరత్వము చేత సిద్ధించు స్థితిని ‘ఘటావస్థ’ అని పిలుస్తున్నారు.

(1) ప్రాణము (2) అపానము (3) మనస్సు (4) బుద్ధి (5) జీవాత్మ (6) పరమాత్మ ఈ ఆరు కూడా - అన్యోన్యస్య అవిరోధేన ఏకతా ఘటతేయథా, ‘ఘటావస్థా’ ఇతి ప్రోక్తా।। ఈ ‘6’ కూడా అన్యోన్యంగా అవిరోధమై (Mutually wet synchronised) ఏకతచే ఘటించడం జరుగుచున్నప్పుడు (When they become united and unified) ఏర్పడు యోగసిద్ధిస్థితి ‘ఘటావస్థ’ అని చెప్పబడుచున్నది.

ఇతఃపూర్వము చెప్పుకున్నట్లుగా ఒకరోజులో ప్రాతఃకాలము - మధ్యాహ్నము - సాయంత్రము - అర్ధరాత్రి - 4 x 20 = 80 ప్రాణాయామములలో నాలుగవవంతు. ళి(అనగా) ఉదయముగాని, సాయం సమయంలోగాని ఒక్కోసారి అభ్యసిస్తే కూడారి ‘ఘటావస్థ’ సిద్ధించగలదు అనగా….

ఇడాపూరక-కుంభక-పింగళారేచక, పింగళాపూరక-కుంభక-ఇడారేచకములు, ఇడా-పింగళములలోని ఒక్కొక్క దానిలో వాయుపూరణం చేసి మోకాళ్ళచుట్టూ ఒక ‘మాత్ర’ కాలము ప్రదక్షిణం చేసి రెండవ దానితో రేచకము - 20 సార్లు రోజుకు ఒక్కోసారి.

ఇట్టి అభ్యాసముచే ‘ఘటావస్థ’ లేక ఘ{యోగం స్వభావసిద్ధమై సరి అయిన కాలములో సిద్ధించుచున్నది.

మనం చెప్పుకున్న ప్రాతః - మధ్యాహ్న సాయం - రాత్రి ప్రాణాయామ అభ్యాస సమయములు కొనసాగిస్తూ, కొంతకాలము గడచిన తరువాత ‘కేవల కుంభకము’ను ఆ యోగాభ్యాసి సిద్ధించుకొనుచున్నాడు.

రోజులోని కొంత కొంత యోగాభ్యాస విభాగంలో (ఉదయంగాని, సాయంకాలము గాని ఒకసారి) రేచక - పూరకము అవసరం లేకుండానే కేవల కుంభకము అభ్యసించబడును గాక!

☞ ప్రాణ-అపానములను మనస్సు అనే చేతులతో క్షణంలో ఏకంచేసి ఉంచటము.
☞ మనోబుద్ధులను ఏకం చేసి ‘ఆలోచించటము’ను కొంతసేపు పూర్తిగా విరమించి - ఏకాగ్రతతో ధారణ చేయటము ‘కేవల కుంభకాభ్యాసము’ అగుచున్నది. (లేక)
☞ మనో బుద్ధులను నిస్పందనము (స్పందనరహితం) చేసి నిర్విషయత్వముగాని, సర్వాత్మకత్వముగాని, గురుపాదారవిందములు మాత్రమే గాని ‘ఏకైక ధారణ’ చేస్తూ కొన్ని క్షణములు స్వావలంబనము చేయటము - ఇవి కేవల కుంభకాభ్యాసములు.

‘‘ప్రత్యాహారము’’

కేవల కుంభకమును అభ్యసిస్తూ, క్రమంగా ఇంద్రియ విషయములను (All Wordly details) ఇంద్రియములలోనికి, ఇంద్రియములను తమ ఉపకరణములుగా కలిగియున్న ఇంద్రియ శక్తులలోనికి, అట్టి ఇంద్రియశక్తులను ఆత్మవైపునకు మరల్చటమే పత్యాహారము.

(1) యోగాభ్యాసముతో - విషయములనుండి మనస్సును వెనుకకు మరల్చి ప్రాణాయామాభ్యాసముల ద్వారా కేవల కుంభకము సిద్ధించుకొనుచూ ప్రణవస్వరూపమగు ఆత్మ గురించిన తత్త్వ మననము - ప్రత్యాహారము.

(2) ఘటావస్థచే - ‘ఈ సర్వముగా పరమాత్మయే సంప్రదర్శితులైనారు’ అని భావిస్తూ, క్రమంగా యోగ విరామ సమయములో సర్వజీవులను పరమాత్మయొక్క ప్రత్యక్ష రూపంగా బుద్ధి సునిశ్చతను ప్రవృద్ధపరచుకోవటము. ‘సర్వేంద్రియ విషయములు ఆత్మయే’ అనునదే కేవల కుంభక ప్రయోజనము.

ఈ రెండిటి అభ్యాసముచే ఇంద్రియములకు కనిపించేదంతా ఆత్మభావనతో నింపటము ప్రత్యాహరము. అనేకంగా కనిపించేదంటకీ ఆధారమైయున్న ఏకమగు ఆత్మను దర్శించుటయందు ఇంద్రియములు నియమించబడము ప్రత్యాహారము.

భావనా ప్రత్యాహారము

యత్ యత్ పశ్యతి చక్షుభ్యాం తత్ తత్ ఆత్మేతి భావయేత్।
కళ్ళకు కనిపించే సమస్తమూ ఆత్మయే! ఏది చూస్తోందో…అదీ ‘ఆత్మయే’ అని భావించబడును గాక। (All that being seen and one who is seeing are nothing but Absolute Self / ‘ఆత్మయే’ ).

యత్ యత్ శృణోతి కర్ణాభ్యాం తత్ తత్ ఆత్మేతి భావయేత్।
చెవులతో వినుచున్నది, చెవులకు వినబడుచున్న సమస్తము ఆత్మయే। (What ever being heard - is nothing but Athma)

లభతే నాసయా యత్ యత్, తత్ తత్ ఆత్మేతి భావయేత్।
వాసన చూచుచూ ఉన్నది, వాసనలుగా పొందబడుచూ ఉన్నది-సమస్తము ఆత్మేతివా। (What ever being smelt is nothing but Athma).

జిహ్వయా యత్ రసం వ్యాత్తి తత్ తత్ ఆత్మేతి భావయేత్।
నాలుకతో రుచి చూచువాడు - రుచిగా పొందబడుచున్న సమస్తము ఆత్మయే। (What ever being tasted is nothing but Athma).

త్వక్‌చా యత్ యత్ స్పృశేత్ యోగీ, తత్ తత్ ఆత్మేతి భావయేత్।
చర్మముతో స్పర్శ స్వీకరిస్తున్నవాడు, స్పర్శగా స్వీకరించబడుచున్న సమస్తము ‘ఆత్మతత్త్వము’గా భావించబడుగాక! (What ever being experienced as touch is nothing but Athma).

ఈ విధంగా - ‘‘జ్ఞానేంద్రియముల అనుభవ విషయములుగా, సుఖప్రదాతలుగా సిద్ధించుచున్నదంతా ఆత్మయే!’’ - అను సాధనయే ‘ప్రత్యాహారము’ అగుచున్నది.

⌘⌘⌘

యోగి ప్రతిరోజు ఒక యామము కాలము - ప్రారంభంలో 3 ని।।, క్రమంగా 6 ని।।, 9 ని।।, 12 ని।।, 15 ని।।…. 45 ని।।

అచంచల బుద్ధి రూపమగు ‘కేవల కుంభకము’ను మౌనము - ప్రశాంతతలతో కూడిన ధ్యాసనియాకముచే అభ్యసిస్తూ ఉంటే క్రమంగా ఆ యోగాభ్యాసి యొక్క చిత్తము మహత్తరమగు సామర్థ్యమును పొందగలడు. అప్పుడు అట్టి దృఢమగు చిత్తమును సర్వ సామర్థ్యములు తమకు తామే ఆశ్రయిస్తాయి.

అంతిమలక్ష్యమగు ఆత్మతత్త్వసిద్ధికి మునుముందుగా కొన్ని కొన్ని సిద్ధులు ఆ యోగాభ్యాసిని ఆశ్రయిస్తూ ఉంటాయి కూడా.

యోగాభ్యాసము కొనసాగుచుండగా యోగిపట్ల సిద్ధించు లౌకికాతీత ప్రాపంచక సిద్ధులు

♦ దూరముగా ఎక్కడో ఎప్పుడో జరుగుచున్న సంభాషణలను వినగలగటము - దూరశ్రుతి, దూరశ్రవణము; ఎప్పుడో జరిగిపోయిన ఒక సందర్భములోని సంభాషణను ఇప్పుడు వినగలగటము-(పూర్వకాలపు-విషయమును వర్తమాన శృతి);
♦ దూరముగా గల దృశ్యమును చూడగలగటము దూరదృష్టి;
♦ క్షణంలో దూరప్రదేశము చేరగలటము - క్షణాత్ దూరాగమః; దూరంగా ఎవ్వరో పిలువగానే, వారి ముందు ప్రత్యక్షమవగలటము.
♦ ‘‘ఇది ఇట్లా జరుగుగాక’’ అని పలికితే, అది అట్లే జరగటం - వాక్‌సిద్ధి, వాక్‌శుద్ధి;
♦ తాను కోరుకొన్న రూపం అప్పటికప్పుడే సంతరించుకోగలగటము - కామరూపము;
♦ ఎదురుగానే ఉండి, ఎదుటివారి కళ్లకు కనబడకుండా ఉండగలగటము - అదృశ్యకరణి; (ఈవిధంగా అష్టసిద్ధులు)
ఈ ఈ సామర్థ్యములు కూడా కేవల కుంభక నిర్విషయ మనోధారణాభ్యాసముచే - ఆయా ఆశయములు కలవారికి సిద్ధించగలవు.

ఇంకా కూడా వస్తుయోగసిద్ధుడు చేతులతో మల మూత్రములు స్పర్శించినంత మాత్రంచేత లోహములు (ఇనుము మొదలైనవి) బంగారముగా మారిపోగలవు. అజ్ఞులు కూడా విజ్ఞులు అవగలరు. ఈ విధంగా సంతత వాయు అభ్యాసయోగులు అనేక విధములైన శ్రేష్ఠత్వములను సంతరించుకొనగలరు. ‘ఆకాశగమనము’ మొదలైనవి కూడా యోగులకు కరతలామలకము అవగలవు.

అయితే,

బుద్ధిమంతుడైన యోగి -

సకామకామీ శిష్యులు

శిష్యాశ్చ స్వస్వకార్యేషు ప్రార్థయంతి, న సంశయః।
కొందరు శిష్యులు యోగసిద్ధియందు నిమగ్నమైయున్న యోగపండితుని సమీపించి ఆత్మజ్ఞానము కొరకు కాకుండా - వారి వారి లోకసంబంధములైన తమయొక్క - తమ బంధువులయొక్క కష్ట సుఖముల గురించి, సంపద - ఆపదల గురించి ‘అది ప్రసాదించండి. ఇట్లా కనికరించండి’ అని ఆయా యోగ సామర్థ్యముల లౌకిక ప్రయోజనములకై అర్ధిస్తూ ఉంటారు.

అటువంటి వ్యగ్రము (worry about wordly incidents) పొంద ప్రారంభించిన యోగపుంగవుడు తన యోగస్వభావమును ఏమరచే (విస్మృతిపొందే) విఘ్నములు కొన్ని కలుగవచ్చును. తాను తన యోగగురువు వద్ద నేర్చిన యోగాభ్యాసములపట్ల తీసుకొని ఉండవలసిన జాగరూకతల పట్ల అశ్రద్ధ కలుగవచ్చు.

అందుచేత,
అవిస్మృత్య గురోః వాక్యమ్, అభ్యసేత్ తత్ అహర్నిశమ్।
గురు వాక్యములు ఏమరువకుండా రాత్రి-పగలు కూడా యోగాభ్యాసరతి విడువకుండా ఉండాలి. కేవలీస్వరూపానుభవ రూపమగు కైవల్యమే ఆశయముగా కలిగి ఉండాలి.

ఏవం భవేత్ ఘటావస్థా సంతత - అభ్యాసయోగతః।।
మనము చెప్పుకున్న సహజ కుంభక, జీవ-బ్రహ్మ అవిరోధ, ఏకత్వ-సమదర్శన రూపమగు ‘ఘటావస్థ’-సంతత (Always) అభ్యాస యోగము చేత మాత్రమే సిద్ధించగలదు. అంతేగానీ, అభ్యాసమునకు సిద్ధపడకుండా వృధా ఘోష్టి (Wasteful conversations) వల్ల సిద్ధిస్తుందా? లేనేలేదు.

తస్మాత్ సర్వ ప్రయత్నేన యోగమేవ సదా అభ్యసేత్।
(It must be regularly practised). ఈ జీవులు ఎట్టి ప్రయత్నమునకు సిద్ధపడి అయినా యోగమును ఎల్లప్పుడూ అభ్యసిస్తూనే ఉండాలి. అటువంటి ఘటావస్థ యొక్క [సహజకుంభ (మరియు) ప్రాణ-అపాన-మనో-బుద్ధి-జీవాత్మ-పరమాత్మల సమదర్శన] అభ్యాసయోగముచే ‘పరిచయావస్థ’కు సంసిద్ధులగుచున్నారు.

నిరంతర యోగాభ్యాసముచే పరిచయావస్థ స్వయముగా సిద్ధించగలదు. (తత్ స్వయం యోగ సంసిద్ధః కాలేన ఆత్మని విందతి - భగవద్గీత). అభ్యాసము లేకుండా కేవలము విమర్శించు స్వభావము మాత్రమే ఆశ్రయించుటచే-అది యోగభ్రష్టత్వమునకు దారితీయగలదు.

పరిచయావస్థ - విశేషములు

(1) ‘ప్రాణాయామయోగము’చే

i. క్రిందకు ప్రయాణించు ’అపానము’
ii. ఊర్థ్వగామి అగు ప్రాణముల - పరస్పర పరిచయము (ఒకటినొకటి తాకు స్థితి)

(2) అగ్ని వాయువుల సమన్వితంగా సుషుమ్ననాడిలో ప్రవేశింపజేసి, భావనాబలముతో మూలాధారంలో నిదురించు కుండలినిని ఉష్ణస్పర్శతో నిదురలేపి సుషుమ్న ద్వారా ఊర్ధ్వగామిని చేయటము

(3) కుండలిని యొక్క భృకుటీస్థానములో ప్రవేశము

(4) తదుపరి బ్రహ్మరంధ్రము ద్వారా బహిర్గతమై సహస్రారస్థానంలోకి ప్రవేశము

(5) అక్కడ ప్రకాశమానమగు సర్వతత్త్వ స్వరూపమగు పరమాత్మ (లేక) శివభగవానునితో ఏకము పొందటము - మహత్-పదప్రవేశము!

ఇది ‘‘పరిచయావస్థ’’ యొక్క పంచ అంగములు.

పరిచయావస్థ పొందుచున్న యోగి యొక్క ప్రాణములు చిత్రంగా సుషుమ్నయందు అడ్డు తొలగించుచూ, కుండలినీశక్తికి మహత్-పదప్రకాశమునకు (బ్రహ్మరంధ్రము వరకు, ఆపై సహస్రారము వరకు) దారి సరిచేయగలవు.

యోగియొక్క పంచభూత ధారణ - పంచధాయోగాభ్యాసము

చిత్తము స్వపనములతో కూడి (ప్రాణ - అపాన ఏకత్వరూపముతో కూడి) యోగాభ్యాసముచే సుషుమ్నయందు ప్రవేశము పొందుచూ ఉండగా, ఆ యోగి దేహములో - ‘‘భూమి - ఆపో - అనలో - వాయు - ఆకాశ’’ పంచకమును ‘పంచథా ధారణాయోగము’గా నిర్వర్తించుచున్నాడు.

అట్టి దేహాంతర్గతమైన ‘పంచథాయోగాభ్యాసము’ గురించి ఇప్పుడు మనము చెప్పుకొనుచున్నాము. వినండి.

ధారణా పంచ / పంచ జయ - ఉపాసనలు

‘5’ ధారణా-జయములు : (1) పృథివీ ధారణ (2) ఆపో ధారణ (3) అగ్ని ధారణ (4) వాయు ధారణ (5) ఆకాశ ధారణ

యోగాభ్యాసపూర్వకంగా ఆయా దేహములోని విభాగములలో పంచభూతములను భావనచేసి, ధ్యాసలను నిలుపుటచే పంచభూత జయమును సముపార్జించబడుచున్నది. ఏషు పంచసు దేహానాం ‘‘ధారణా పంచ’’ అధ ఉచ్యతే।


యోగతత్త్వ-ఉపనిషత్-పంచభూత-జయము


యోగతత్త్వ-ఉపనిషత్-పంచభూత-ఉపాసన-విధి


యోగతత్త్వ-ఉపనిషత్-ఆరోప్యం

ఈ విధంగా పంచ (భూత) ధారణ నిర్వర్తించుటచే అట్టి విచక్షణాశీలుడగు యోగి దృఢమైన శరీరము పొందుచున్నాడు. మృత్యువు ఆతనిని సమీపించదు. అనగా, మార్పు - చేర్పులు లేని అమృతమగు ఆత్మతో ఏకస్వరూపియై ఆనందించగలడు. అట్టి యోగివరేణ్యుడు మహామతి అయి ప్రళయ సమయంలోకూడా ‘అహమ్ బ్రహ్మాస్మి’ అను రూపముగల బ్రాహ్మి స్వరూపమునుండి చ్యుతిపొందడు.

యోగి అందుకొరకై ఆవిధంగా ‘‘ఘటికా షష్ఠి ధ్యానమును’’ (ప్రాణ - అపాన - మనో - బుద్ధి - జీవాత్మ పరమాత్మల ఏకరూప అఖండతత్త్వమును) ఎల్లప్పుడూ ధ్యానము చేయువాడై ఉండుగాక! పంచభూములలో ఒక్కొక్కదానిని ఆత్మయందు ఆరోపించి ‘ఆత్మాకాశ విహారము’ ధ్యానము చేయుట - ‘‘ఘటికా షష్ఠి’’ ధ్యానము.

సగుణ ధ్యానము

ప్రాణాపానములను నిరోధించి స్వీయ హృదయాకాశములో ఇష్ట దైవముయొక్క రూపమును ప్రతిక్షేపించి ధ్యానించటము ‘సగుణ ధ్యానము’ అగుచున్నది.

సగుణం ధ్యానమ్ ఏతత్స్యాత్ అణిమాది గుణప్రదం।
అట్టి సగుణధ్యానము (లేక) ‘సగుణహృదయాంతర్గతోపాసన’ ‘అణిమ’ మొదలైన సిద్ధులను ఆ ఉపాసకునికి ప్రసాదించగలదు.

అయితే ఉత్తరోత్తర స్థితిలో భక్తుడు ఇష్ట దైవమునకు ‘‘సర్వసమర్పణ’’ చేస్తూ ఉంటాడు. ఆత్మానుభవాశయమే ఉత్తమ భక్తుని స్వభావమై ఉంటుంది. అణిమాది సిద్ధులు కాదు.

నిర్గుణ ధ్యానము

అటు తరువాత (సగుణధ్యానము నిర్వర్తించుచూ ఉండగా)….ఆ యోగి క్రమంగా, స్వభావంగానే (In a natural sequence) నిర్గుణధ్యానయుక్తుడు అగుచున్నాడు.

గుణములకు ఆధారమై, ఈ జగత్తులన్నీ తన సంప్రదర్శనమగుచు, దీనికంతటికీ వేరైయున్న ఇష్టదైవము యొక్క ‘‘కేవల చైతన్య స్ఫూర్తి’’ని ఆరాధించనారంభించుచున్నాడు.

‘‘అట్టి సర్వాధారము - సర్వ స్వరూపము, సర్వమునకు వేరైనది, సర్వ వస్తు రహితము, కేవలము అగు మహత్తర తత్త్వమే నా స్వామి తత్త్వము’’…… అని తెలుసుకొనుచూ ప్రార్థించసాగుచున్నాడు.

అయితే….,

నాటక రచయితలో ఈ పాత్రలు, స్వభావములు ఆయనలో ఉన్నాయని అందమా? నాటకము రచయిత యొక్క కళాత్మకమగు నాటక రచనా విశేషమేగాని నాటకములోని నాయకుడు, ప్రతినాయకుడు మొదలైనవి రచయితలో అంతర్గతముగా లేవు.

అట్లాగే నా ఇష్ట దైవమునందు ఈ ఈ జీవులు లేరు! జగత్తులు లేవు. ఆయనలో ఇవేవీ లేవు. కానీ, ఇవన్నీ ఆయననుండే బయల్వెడలుచున్నాయి. ఆయనయందే కనిపిస్తున్నాయి. అందుచేత నా స్వామి పురాణపురుషుడు. కవి! ఆది! సర్వము తానైనవాడు! సర్వమునకు వేరైనవాడు.

ఈ విధంగా సగుణ ధ్యాని తన ఇష్టదైవమును నిర్గుణ గుణాతీత తత్త్వముగా ఆరాధించనారంభిస్తున్నాడు.

‘‘ఇన్ని రూపాలలో, ఇన్ని రూపాలుగా ఉన్నది ఆయనయే!’’ అను దర్శనమును చేయటం మొదలిడుచున్నాడు.

నిర్గుణ ధ్యానయుక్తుడు - సమాధి

ఈ విధంగా సగుణోపాసన నుండి ఆ ధ్యాని క్రమంగా సర్వాత్మకుడగు పరమాత్మ ధ్యానరూపంగా నిర్గుణోపాసనయందు ప్రవేశిస్తున్నాడు. అటుపై సమాధినిష్ఠుడు అగుచున్నాడు.
నిర్గుణధ్యానయుక్తస్య సమాధిశ్చ తతో భవేత్।।

❋ సర్వములోను, సర్వముగాను ఉన్నది ఆ నా ఇష్టదైవమగు పరమాత్మయే!
❋ మరి నేనెవ్వరు? అన్ని రూపములలో, అన్ని రూపములుగా ఆయనయే ఉన్నప్పుడు ‘నేను’గా ఉన్నది కూడా ఆయనయే అయి ఉండాలి కదా! ఆయనకు వేరుగా నేనెక్కడుంటాను? కనుక ‘నేను-నాది’ అనునదంతా కూడా ఆయనయే! ఆయనదే.
❋ నేను ఆయనకు వేరుగా లేను. (సోఽహమ్)
❋ ఆయనయే ‘నేను’గా ‘నీవు’గా, ‘జగత్తు’గా ఉన్నారు.ఆహా"! తెలిసింది! నేనే ఇదంతా! (తత్ త్వమ్।సోఽహమ్। ఇదమ్ అహమేవ।)

ఇట్టి ప్రాణ - అపాన - మనోబుద్ధి - జీవ - బ్రహ్మ మమేకత్వానుభవమే ‘సమాధి’. నిర్గుణోపాసకుడు అటువంటి ‘సమాధి’ యందు భక్తి-యోగ-జ్ఞాన సమన్వితుడై స్వాభావికంగా ఏకము-అక్షరము-సర్వము అగు కేవాలనంద సమగ్ర స్వస్వరూపమునందు ప్రవేసించుచున్నాడు.

❋ పరమాత్మయే ‘నేను’గా ఉన్నారు. నాయొక్క సమస్తము ఆయనదే! నేను ఆయన ఏకమే!
❋ కనుక అన్ని రూపాలుగా, జగత్తుగా, ఇదంటికీ వేరుగా ఉన్నది నేనే!
❋ నా సగుణ - నిర్గుణ సంప్రదర్శనమే ఇదంతా! (అహమ్ సర్వభూతాశయస్థితః।।)
అను స్వాభావికమైన అనుక్షణిక ఆకృత్రిమానుభవము అను సమాధి స్వయముగా సిద్ధించినదగుచున్నది.

దినం ద్వాదశకేనైవ సమాధిం సమవాప్నుయాత్!
నిర్గుణ ధ్యానము ప్రారంభమైన 12 రోజులలో సమాధి నిష్ఠుడు విశ్వరూపుడు, విశ్వ సాక్షి, సర్వస్వరూపుడు, నిర్విషయ విషయుడు, విషయ నిర్విషయుడు - అయి ‘కేవలము’తో మమేకమై ఉండగలడు. అట్టి సమాధిస్థితి ఇట్టిది అని చెప్పగలిగేది కాదు, వినగలిగేది కాదు కాబట్టి, ‘అనిర్వచనీయ నిర్హేతుక ఆత్మాహమ్ ఆనందమ్’ అనబడుచున్నది. మహనీయులు అద్దానిని అనిర్వచనీయ మత్ స్థానముగా సూచిస్తున్నారు. (There is nothing to talk. You go and enjoy! That’s all!)

💐 వాయు నిరోధము (ప్రాణాయామము - 4 పూటలు x 20 సార్లు) చే అట్టి మేధావి యగు యోగి ‘జీవన్ముక్తుడు’ అగుచున్నాడు.
💐 జీవాత్మ - పరమాత్మల ఏకరూపానుభవమగు ‘సమతావస్థ’చే అట్టి యోగి (లేక) ముముక్షవు పట్ల ‘సమాధిస్థితి’ సిద్ధిస్తోంది. అట్టి సమాధినిష్ఠుడు ఈ క్రింద విధంగా ఉభయస్వాతంత్ర్యములు కలిగినవాడై ఉంటారు.

(1) సదేహ - సమాధి యోగ సిద్ధుడు : జీవాత్మ - పరమాత్మల ఏకత్వము సిద్ధంచుకుని కూడా ఆయన ‘వర్తమాన శరీరము కలిగి ఉంటూనే, తదితర జీవులలో జీవిస్తూ, సహజీవులను, తానున్న పరిసరములను జీవ బ్రహ్మైక్యానంద భావనా పరిమళములతో నింపివేస్తూ ఉంటాడు. వర్తమాన దేహమో, మరికొన్ని దేహములో ధారణ చేస్తూనే సమాధిస్థితుడై….జగత్తులన్నిటినీ స్వస్వరూపమునకు అనన్యముగా, అవిరోధముగా దర్శిస్తూ ఉంటారు.

(2) విదేహ సమాధియోగ సిద్ధుడు : అంతటిదాకా ఒక దేహముతో యోగ సాధన చేస్తూ ఉన్న ఆ యోగాభ్యాసి ‘సమాధి సిద్ధి’ పొందినవాడై ఆ భౌతిక దేహమును అధిగమించినప్పుడు సూక్ష్మ దేహధారి అయిన (ఆతివాహికదేహిత్వము ధరించినవాడై) - ఒక చక్రవర్తి తన ఉద్యానవనములో క్రీడా వినోదియై విహరించు విధంగా - ముల్లోకములలో విహరిస్తూ ఉంటారు. ‘అణిమా’ మొదలైన అష్టసిద్ధులు ఆతనిని తమకుతామే వెంటనంటినవై ఉండగా, ఆతడు భూ-పాతాళ-స్వర్గలోకములలో, (ఆయా 14 లోకములలో కూడా) ఇష్టానుసారంగా సంచరించువాడై ఉంటున్నాడు. భూ-స్వర్గ-పాతాళ లోకములలో పూజనీయుడై ప్రదర్శనమగుచున్నారు. ఆతడు క్షణంలో మనుష్యుడుగానో, యక్షుడుగానో స్వేచ్ఛగా (స్వైచ్ఛచే) అగుచూ ఉంటున్నారు. యోగీశ్వరుడై తన ఇష్టానుసారంగా సింహముగానో, పులిరూపంగానో, ఏనుగుగానో గుర్రముగానో రూపములు దాల్చుచూ స్వేచ్ఛా విహారి అయి ఉంటున్నాడు. మహేశ్వరుడై విశ్వమంతా తనయందు తానే తన స్వరూపముగా దర్శించుచూ, ఇష్టానుసారం స్వేచ్ఛా (స్వ-ఇచ్ఛా) విహారములను చేస్తూ, యోగ-యోగీశ్వరుడై ఈ సర్వమును ఆస్వాదించుచున్నారు.

నదీనామ్ సాగరో గతిః - యోగ మార్గములన్నిటి అంతిమ ఆశయం ఒక్కటే

అభ్యాసతో భేదః। ఫలంతు సమమేవహి।
‘క్రియాయోగము, భక్తి యోగము, కర్మయోగము, సర్వసమర్పణయోగము, జ్ఞానయోగము, త్రిగుణాతీత కేవల సాక్షియోగము,కేవల కుంభక సమాధియోగము, శ్రీ చక్రోపాసనము, కుండలినీ సహస్రార ప్రవేశ శివోఽహమ్ యోగము’ → ఇవన్నీ కూడా అభ్యాసము దృష్ట్యా వేరు వేరైనట్లు కనిపించినప్పటికీ, అంతిమఫలము జీవ-బ్రహ్మైక్యత్వానుభవమే అయి ఉన్నది.

అట్లాగే, యోగమార్గములలోని అనేక విధానములు మొదలైనవి కూడా. అఖండమగు ఆత్మతో మమేకత్వమే అంతిమ స్థానము.

బ్రహ్మ భగవాన్ : మహాత్మా! జగదీశ్వరా! జగద్గురూ! ఇప్పుడు మరొక్కసారి మహాబంధము; మహావేధ బంధము; ఖేచరీ ముద్ర; జాలంధర బంధము; ఉడ్డీయాణ బంధముల గురించి, యోగ సంసిద్ధతగురించి; కరణీ విపరీత అభ్యాసము (తలక్రింద - కాళ్లు పైన) గురించి ఆత్మతత్త్వము గురించి - యోగసాధకుల సౌకర్యమును దృష్టిలో పెట్టుకొని - సంక్షిప్తంగా మరికొంత వివరించ ప్రార్థన.

విష్ణు భగవానుడు : హే బ్రహ్మదేవా! వినండి.

⌘⌘⌘

బంధము:

♠︎ ఎడమ కాలి మడమను యోనిస్థానమును (లింగస్థానమును) తాకించుచూ (పార్షి ణాం వామస్య పాదస్య యోనిస్థానే నియోజయేత్),
♠︎ కుడి కాలును నిఠారుగా భూమిపై చాచి ఉంచి (ప్రసార్య దక్షిణం పాదం),
♠︎ చేతితో కుడి పాదమును దృఢముగా తాకించి ఉంచి (పాదం హస్తాభ్యాం ధారయేత్ దృఢమ్),
♠︎ చుబుకమును (గడ్డమును) హృదయస్థానమును తాకించి ఉంచి (చుబుకం హృది విన్యస్య), పూరయేత్ వాయునా పునః।

పూరకము, కుంభకము, రేచకము ఇడ పింగళ (ఎడమ కుడిల విభాగాలలో ఒకసారి తరువాత మరొకటిగా) ప్రాణ నిరోధయోగము నిర్వర్తించటము ‘‘బంధము’’గా చెప్పబడుచున్నది.

మహాబంధము :

ప్రసారితస్తు యత్ పాదస్తం ఊరూ ఉపరి యోజయేత్। విస్తరించబడిన పాదమును (కుడిపాదమును) (ఎడమ) తొడయొక్క పై భాగంలో నియోగించి ప్రాణాయామము నిర్వర్తించటము.

కంఠముద్ర :

మహాబంధము ధరించిన యోగి ఒక్కసారిగా పూరకము చేసి వాయుగతిని కంఠము చుట్టూ త్రిప్పి తెచ్చి, కంఠములో నిలువరించి ఉంచటము.

మహావేధముద్ర :

బంధము (లేక) మహాబంధము ధరించి రెండు ముక్క పుటములలో గాలిని వేగవంతముగా పీల్చి సత్వరముగా వదలటమును ‘మహావేధముద్ర’గా సిద్ధులు ఎల్లప్పుడు అభ్యసించుచున్నారు. అభివర్ణిస్తున్నారు.

ఖేచరీముద్ర :

నాలుకను మడతగా లోనికి కపాల కుహరము (కొండనాలుక) వరకు వ్యాపింపజేసి, దృష్టిని భ్రూమధ్యాకాశములో నిలిపి ఉంచటము. క్రమంగా భ్రూమధ్య నుండి బ్రహ్మరంద్రము వరకు గల ఆకాశములో (మనస్సుతో) విహరించటము. బ్రహ్మరంధ్రమునకు అంతర-బాహ్యముల సంచార యోగాభ్యాసము.

జాలంధర బంధము :

కంఠమును కుంచింపజేసి, హృదయమునందు వాయువును నింపి ఉంచటము. ఇది ‘మృత్యువు’ అను ఏనుగుకు సింహము వంటిది.

ఉడ్యాణ (లేక) ఉడ్డీయాణ బంధము :

ఇడ పింగళనాడుల మధ్యగల సుషుమ్ననాడి యందు ప్రాణ - అపానములను నిశ్చలం చేసి, కుంభకమును అభ్యసించటము.

ఇవన్నీ యోగపుంగవులచే విశదీకరించబడుతోంది.

యోని బంధము<>

❖ పాదము యొక్క మడమ భాగములో పార్‌ష్ణీభాగేన …,
❖ యోని భాగమును (విసర్జకావయము స్థానమును) ఎడమకాలి మడమతో గట్టిగా నొక్కి పట్టి ఉంచి - యోనిమ్ ఆకుంచయేత్ దృఢమ్…., అపానమును పైకి ఎత్తటమును ‘యోనిబంధము’ అంటారు.
❖ అపానవాయువుయొక్క క్రిందవైపు గమనమును నిరోధించి ఆ అపాన వాయువును ఊర్ధ్వముగా ఆకర్షించి, వెనుకకు మరలునట్లు చేసి అపానమ్ ఊర్థ్వమ్ ఉత్థాప్య (విసర్జన స్థానమును ప్రయత్న పూర్వకంగా కొంచెము బిగదీసి ఉంచి, వాయువును వెనుక మరల్చి)
❖ మాలాధారము నుండి శిరో-ఫాలభాగము వరకు వాయువును కుంభకము చేసి ధారణ చేయటము ఇది కూడా యోనిబంధమగుచున్నది.

ఇవన్నీ ఆయా అభ్యాస సూచనా విధములైన ముద్రలు.

ముద్ర = (1) దేహములోని ధారణ (Holding) (2) కేవల కుంభకముతో కూడిన వాయు నిశ్చలత్వము (3) మనస్సును బుద్ధితో నిశ్చలరూపంగా నిలిపి ఉంచటము - అను మూడు ప్రక్రియలు కలిసి ఉన్నట్టిది.

యోగ సంసిద్ధి

ఇప్పుడు ‘యోగసంసిద్ధి’ ఎప్పుడు జరుగుచున్నది? ఈ ప్రశ్నకు సమాధానం వినండి.

ఎప్పుడైతే….

Ⅰ. ప్రాణము + అపానము (The Air that is being pulled inward into the Body + The Air that is being pushed outward)
Ⅱ. నాదము + బిందువు (హృదయబిందువు)
The Sound + The Point of Prana where from sound is emerging (ఇష్టదైవ నామోచ్ఛారణ - ఇష్టదైవభావన) (శబ్దము + భావన) - The name and the sense)
- ఇవి ఎప్పుడైతే మూలబంధము చేత (Intentionally catching hold of and maintaining unmoved) ఏకత్వము పొందినవిగా అగుచున్నాయో,
- (ఆలోచన - ఆలోచించబడునది ఆలోచించువానితోనూ, భావన - భావించబడునది-భావించువానితోను) ఏకమైనవిగా అగుచున్నాయో….,
అప్పుడు ఆ యోగాభ్యాసి యోగ సంసిద్ధి పొందినట్లే! న అత్ర సంశయః। ఇందులో అనుమానమే లేదు.

‘విపరీత కరణి’ అభ్యాసము

మానవుని శరీరము పాదములు నేలను తాకుచు, కపాలము ఊర్థ్వముగా నిర్మితమై ఇద్దానియందు పంచప్రాణ - పంచ ఉప ప్రాణములు వాటి వాటి ధర్మములను అనుసరిస్తూ ప్రవర్తిల్లుచున్నాయి కదా!

అధః శిరశ్చ - శిరస్సును నేలకు తాకించుచూ,
పాదః ఊర్థ్వము - పాదములను ఊర్థ్వంగా (పైకి ధారణ చేయుయోగము - వీపరీతకరణి)
మొదటి రోజు - క్షణకాలము (క్షణం స్యాత్ ప్రథమే దినే)
తరువాత నుండి - రోజుకు ఒక్కో క్షణము చొప్పున అధికంచేస్తూ (క్షణాచ్ఛ కించిత్ అధికమ్ దినే దినే)

ఈ కరణీ విపరీత యోగము అభ్యసించాలి.

అట్టి యోగాభ్యాసి పట్ల -

✤ జఠరాగ్ని వివర్థినీ! దేహంలో జఠరాగ్ని వృద్ధి కాగలదు. ఆకలి పెరుగుతుంది. బాగా తినాలనిపిస్తుంది. తిన్నది చక్కగా జీర్ణమవుతుంది. అజీర్ణము, అల్పంగా ఆహారము తీసుకొనే బలహీనత తొలగుచున్నది.
అల్పముగా ఆహారం తీసుకొనే అలవాటు చేత - అల్పాహారో యది భవేత్, అగ్నిః దేహమ్ హరేత్ క్షణాత్। యోగభ్యాసి పట్ల ఆహారముయొక్క ఆవస్యకత పెరుగుతుంది. ఆహారం తగినంత తీసుకోకపోతే, ‘జఠరాగ్ని’ దేహమును ప్రేగులను దహించగలదు.

✤ జఠరాగ్ని పెరుగుటచే ఆహారము తీసుకొనుచుండగా దేహము పుష్టి పొందగలదు. వ్యాధులు తొలగిపోతాయి. సర్వవ్యాధి వినాశనీ!

✤ షణ్మాషార్ధాత్ (షణ్మాసపు అర్థకాలంలో 3 నెలల కాలం) విపరీతకణిని అభ్యసించటం చేత ముసలితనముయొక్క గుర్తులైనట్టి ముడతలు తొలగుతాయి. వార్థక్య ఛాయలుతొలగిపోతాయి. (మొట్టమొదటి 1, 2 ని।।లతో ప్రారంభించి క్రమంగా) ప్రతి రోజు యామము (గడియకాలము–45 ని.లు) ఈ అధశ్శిరశ్చ ఊర్థ్వపాదమ్ ధారణారూపమగు కరణీ విపరీత యోగాభ్యాసము చేయుటచే కాలమును జయించి ‘కాలజిత్’ అగుచున్నాడు. త్రికాలములలో నిత్యసత్యము అయినట్టి ఆత్మతత్త్వభావనయొక్క అనునిత్యత్వము (‘కాలజిత్ లక్షణము’) సిద్ధించుచున్నది.

‘వజ్రోళీ’ అభ్యాస ఫలము : ‘‘కేవల కుంభక-జీవ బ్రహ్మైక్యభావ-మహామౌనానంద-యోగసాధనా విశేషము’’

వజ్రోళీ సిద్ధి లభించిన యోగి యిక సిద్ధయోగియే! సిద్ధపురుషుడే! ఆతడు ఈ శరీరముయొక్క రాకపోకలు, ఆవల-ఈవల అంతా ఎరిగినవాడై, సహజము-నిత్యము అగు అతీతస్థితుడై ఉంటాడు. ఈ ‘జగత్తులు’ అను స్వప్న దృశ్యముల రాకపోకలు ఎరిగినవాడై ఉంటున్నాడు.

అదియే ఆత్మాకాశ విహారరూపమగు ఖేచరీ యోగము యొక్క తత్త్వ పరాకాష్ఠార్థము. ఖేచరుడై స్వీయ వినోద విన్యాసంగా జన్మ వ్యవహారములుగల స్వకీయ ఉద్యానవనములో విహరిస్తున్న ఆత్మసంచార ఆనందమును యోగవిద్యాసిద్ధుడు పొందుచున్నాడు.

అమరోళీ:
యోగ విద్య - యోగాభ్యాస ఫలంగా, ఆ యోగి జన్మ, జన్మాంతర కర్మ కర్మాంతర విషయములకు విషయుడే కానట్టి ‘అమరీ’ స్థానము చేరిన వాడై ఉంటున్నాడు. ‘ఇదంతా లేదు - ఇదంతా నేనే’ అనే ‘ఉభయ సత్ఫలరూపమగు నస్యయోగమును’ ప్రతిరోజు, ప్రతి సంఘటన - సందర్భములలో సుశిక్షితుడగుచూ ‘వజ్రోళియోగము’ అభ్యసించువాడు, అట్టి యోగ-అనునిత్యత్వము ను సిద్ధించుకొన్నప్పుడు, ‘అమరోళీయోగి’ అని పిలువబడుచున్నాడు.

రాజయోగి:
⌘ ఒక చక్రవర్తి సమక్షంలో ఆయన అనుజ్ఞచే మంత్రులు ఒక ‘నాటకము’ను వేయించుచున్నప్పుడు, ఆ చక్రవర్తి ఆ నాటకమును వినోదముగా సందర్శిస్తూ, చిరునవ్వులు చిందిస్తున్న రీతిగా…
⌘ ఒక కథా రచయిత తాను వ్రాసిన కథను చదువుతూ వినోదిస్తున్న విధంగా…
⌘ ఒక స్వప్న ద్రష్ట తెల్లవారి లేచిన తరువాత రాత్రి తాను చూచిన స్వప్న దృశ్యమును మనోఫలకంలో చూచురీతిగా

ఈ జగత్తును తన ముఖ్యమంత్రియగు ‘బుద్ధి’, సాంస్కృత మంత్రియగు మనస్సు అందిస్తున్న వినోదముగా దర్శించుచూ, ‘రాజయోగి’ అగుచున్నాడు.

సర్వలోకాంతర్గతమైన ప్రయోజనములను, సంగతులను, సందర్భములను, సంబంధములను, బాంధవ్యములను వాటి వాటి పరిధులన్నీ బుద్ధిచే అధిగమించినవాడై, నిష్పన్నుడు (uncatchable by worldly events) అయి, యోగ సాధనల ఫలితంగా వివేక వైరాగ్య సంపన్నుడై చివరికి ‘రాజయోగి’గా వెలయుచున్నాడు.

ఈ విధంగా యోగ మార్గంలో

వజ్రోళీ     →   అమరోళీ  → రాజోళీ

అను-వరుసక్రమంగా చివరికి రాజయోగి అయి ప్రకాశించుచున్నాడు.

(వజ్రోళి = ‘అన్యము’ పట్ల అతీతత్వ ధారణ.
అమరోళి = అమృత స్వరూపమగు, కాలాతీతమగు స్వస్వరూప ధారణ.
రాజయోగి = సమస్తము స్వకీయ కల్పనగా ధారణ).

గురువర్యులు : విష్ణుస్వరూపులగు ప్రియ శిష్యజనులారా! ఈ విధంగా బ్రహ్మదేవుడు - విష్ణు - భగవానుల లోకశ్రేయోదాయకమగు ‘సంవాదము’ చెప్పుకున్నాము.

పురుషోత్తముడగు విష్ణు భగవానుడు యోగ యోగీశ్వరుడై, మహాతపోధనుడై, జగద్గురువై యోగ మార్గన్వేషములకు, యోగసాధకులకు వారివారి మార్గములలో మార్గమంతా కాంతి పుంజములతో నింపి చీకటిని పారత్రోలు దీపముగా వెలయుచున్నారు. అట్టి విష్ణుభగవానునికి నమస్కరిస్తూ యోగ-ధ్యాన మార్గములలో ఆ భక్తవత్సలుని శరణువేడుచున్నాము.
ప్రియాతి ప్రియమగు మమాత్మానంద స్వరూప శ్రోతమహాజనులారా!

ఈ సంసార సముద్రము అతి భయంకరమైనది, బహుచమత్కారమైనది కూడా! ఎంత చిత్రవిచిత్రములు ఇందులో సందర్భమగుచున్నాయో, గమనిస్తూ ఉంటే బహు ఆశ్చర్యం!

→ పుట్టిన పసిబాలుడుగా ఏ స్త్రీ (మాతృ) స్థనముల నుండి జాలువారు పాలను త్రాగటానికి వేగిరపడుచూ ఏడ్చుచున్నాడో, తల్లిపాలు త్రాగుచూ ఆకలి తీరి ఆనందిస్తున్నాడో…,అట్టి స్థనములను యవకుడై శృంగార భావములతో పీడించి ఆనందిస్తున్నాడు. యస్తనః పూర్వపీతః, తం నిష్పీడ్య ముదమ్ అశ్నుతే!
→ ఏ యోని నుండి (మాతృగర్భమునుండి) బయల్వెడలి ఈ పాంచభౌతిక ప్రపంచంలో ప్రవేశించి దేహధారి అయి అటూ - ఇటూ తిరుగాడుచున్నాడో, ఆ యోనియందే శృంగార - ఉద్రేకమును పొంది రమించుచున్నాడు. యస్మాత్ జాతో భగాత్ పూర్వమ్, తస్మిన్ యేవ భగే రమన్!
→ ఎవ్వరు (వర్తమానవ జన్మలో) తల్లియో, ఆమె యే (మరొక జన్మలో) భార్యగా అగుచున్నది. ఎవరు భార్యయో, ఆమె (మరొక ఉపాధిచే) తల్లి అగుచున్నది. యా మాతా స పునః భార్యా! యా భార్యా మాతృకైవ హి!
→ ఎవ్వరు ఇప్పుడు తండ్రియో ఆతడు మరొకప్పుడు (మరొక ఉపాధిచే) కుమారుడుగా అగుచున్నాడు. ఎవ్వడు ఇప్పుడు కుమారుడో ఆతడు ఆ జీవునికి తండ్రిగా అగుచున్నాడు. యః పితా స పునః పుత్రో। యః పుత్రః స పునః పితా।

ఈ విధంగా - ఏవం సంసార చక్రేణ ‘కూప చక్రే ఘటా’ ఇవ, భ్రమంతో యోని జన్మాని కృత్వా లోకాం తు సమశ్నుతే। - నూతిలో త్రాడుకు కట్టబడి బొక్కెన (Bucket) నూతిలో పైకి - క్రిందికి తిరుగాడుచున్న విధంగా…, ఈ జీవుడు భ్రమాత్మకమగు సంసార కూపంలో అనేక జన్మ పరంపరల రూపంగా ఒక యోనిలో ప్రవేశించిన, జీవించి, మరణించి మరొక యోనిలో ప్రవేశించుచూ లోక లోకాంతరములలో తిరుగాడుచున్నాడు.

ఈ లోకములు, ఈ దేహ దేహాంతర వ్యవహారములు - ఇవన్నీ ఆత్మయందే కల్పితములై ప్రదర్శనములుగా అగుచున్నాయి! ఇది ఎంత ఆశ్చర్యం!

⌘ మర్త్య - పాతాళ - స్వర్గ త్రయోలోకములు…,
⌘ ఋక్ - యజుర్ - సామ త్రయోవేదములు…,
⌘ ప్రాతః, మధ్యాహ్న, సాయంత్ర = గాయత్రీ - సావిత్రీ - సరస్వతీ త్రిసంధ్యలు…,
⌘ ఉదాత్త (Upper) - అనుదాత్త (Lower) - స్వరిత (in between) త్రిస్వరములు…,
⌘ (యజ్ఞ విధానములోని) గార్హపత్య - దక్షిణ - ఆహవనీయ త్రయో అగ్నులు…
⌘ సత్వ - రజో- తమో త్రిగుణములు…

ఇవన్నీ కూడా త్రయక్షర రూపమగు (అ-ఉ-మ) ‘ఓం’ నందు నిబిళీకృతమై ఉన్నాయి. పై చెప్పిన త్రయీ రూపములన్నీ మట్టిబొమ్మలతో మట్టివలె ఓంకారము చేతనే నిర్మితమై, ఓత ప్రోతమై (ఒకే దారము వస్త్రములో నిలువు-అడ్డముగా నేయబడు తీరుగా) ఉన్నాయి.

అట్టి ఓంకారమే ‘ఆత్మ’కు సంజ్ఞ! అన్ని ప్రయత్నములు, ఆత్మసిద్ధికొరకే. ఎందుకంటే, ఆత్మయే సత్యము! నిత్యము! సర్వము! ఆత్మయొక్క సంప్రదర్శనా చమత్కారమే ఇదంతా! ఎప్పుడూ ఎక్కడా ఏదీ ఆత్మకు అన్యమై లేదు! ఉండబోదు! ఉండి ఉండలేదు.

పుష్పము యొక్క మధ్యభాగంలో సుగంధము ఏ విధంగా ప్రత్యక్షమై ఉంటుందో, ఆ విధంగా లోక - వేద - సంధ్య - స్వర - అగ్ని - గుణ త్రయీ విశేషములలో ఆత్మ ప్రత్యక్షమై ఉన్నది. ఆత్మలోనే ఇవన్నీ ఓత - ప్రోతమై ఉన్నాయి.

పాలలో నేయి అంతటా ఉన్నట్లుగా, సర్వజీవుల అంతర్ - బహిఃస్థానములందు, 14 లోకములందు ఆత్మ అంతర్గతమై ఉన్నది. అంతటా ఆత్మయతే ఓతప్రోతమైయున్నది.

తిలలలో (నువ్వులలో) అంతటా నూనె దాగి ఉన్నతీరుగా, సర్వజీవులయందు ఓంకారరూపమగు ఆత్మ సర్వత్రా అంతరాంతరమై ఉన్నది.

పాషాణములో (బంగారు ఖనిజ ఖండములలో) బంగారము దాగి ఉన్నట్లు, సర్వజీవులలో అజ్ఞానముచే కప్పబడి ఆత్మ ప్రకాశించుచున్నదై ఉన్నది. లోహపరిశుద్ధిచే బంగారము లభించునట్లుగా, మనో బుద్ధులలోని దృశ్యభ్రమలరూపమగు సర్వదోషములు తొలగించుకొనుటచే ఆత్మానుభవము సిద్ధించుచున్నది.

అట్టి ‘ఆత్మాహమ్’ స్వానుభవముచే సమస్తము స్వస్వరూప సత్-చిత్-ఆనంద చమత్కారమై, సమస్తము లీలా-క్రీడా-వినోద ఆనంద భరితమై స్వానుభవమగుచున్నది.

మనో స్థానము

హృది స్థానే స్థితమ్ పద్మమ్: హృదయ స్థానములో ఒక పద్మము సంస్థితమై ఉన్నది.

తస్య వక్త్రమ్ అధోముఖమ్: అద్దాని ముఖము క్రిందవైపుగా (అధోముఖంగా) ఉన్నది.

ఊర్ధ్వనాళమ్ - అధో బిందుమ్ : నాళము ఊర్ధ్వముగాను, బిందువు (A point) క్రిందకు గాను ఉన్నది.

తస్య మధ్యే స్థితః మనః : ఆ బిందువుయొక్క మధ్యలో మనస్సు సంస్థితమై యున్నది. అట్టి మనస్సునందు పరమ పురుషుడు సంస్థితుడై ఉన్నారు.

అట్టి హృదయపద్మము…..

‘అ’కార శబ్దోపాసనతో రెక్క విప్పుకొనుచున్నది.  
‘ఉ’కార శబ్దోపాసనచే వికశించుకొనుచున్నది.  
‘మ’కార శబ్దోపాసనచే నాదము వినబడుచున్నది.  
‘అర్ధమాత్ర’ చే పద్మము మధ్యగా గల చంచలమగు మనస్సు నిశ్చలమగుచున్నది.

అట్టి నిశ్చలమగు మనస్సుచే యోగయుక్తాత్మునకు స్వస్వరూప అఖండాత్ముడు సందర్శితుడగుచున్నాడు.

అట్టి పరమాత్మ దర్శనముచే,

అగు తత్ పరమపదము లభించుచున్నది.

అట్టి పరమ పురుషునితో మమేకమగుట, పరమపదము సిద్ధించుట ఎట్లా?

తాబేలు తనయొక్క చేతులను కాళ్లను, శిరస్సును వెనుకకు మరల్చి తనయందే ధరించినదై యున్నరీతిగా….యోగి కూడా నవద్వారములను వాయుపూరణ రేచకములతో మూసివేయుచున్నాడు. పైన - లోపలి నిశ్వాసనము (రేచకము) ద్వారా నవద్వారములలో సహజకుంభకముచే మనస్సుయొక్క ప్రవేశమును నిరోధించుచున్నాడు. నిషిద్ధముగా చేయుచున్నాడు.

ఘటమధ్యే యధా దీపో నివాతః కుంభకం విదుః। కుండ మధ్యలో ఏ విధంగా అయితే వాయుచలనము లేనట్టిదై నిశ్చలముగా దీపము వెలుగుచున్నదో యోగి కూడా →

నిషిద్ధైః నవభి ద్వారైః : నవద్వారములలోకి ప్రసరించుచున్న ఇష్ట అయిష్ట రూపములతో కూడిన మనస్సును నిరోధించినవాడై

నిర్జనే, నిరుపద్రవే : ‘అఖండ ఆత్మ’రూపుడనగుటచే, సర్వులు, సర్వము అట్టి అఖండాత్మరూపులే కనుక, నిర్జనుడై (ఒంటరి వాడ, చుట్టమొకడు లేడు - వామన చరిత్ర - మహాభాగవతము - పోతనామాత్యులవారు) ఎటువంటి జన్మ - మృత్యు - జరా - వ్యాధి - సుఖ - దుఃఖ - సంబంధ - అనుబంధ సాంసారిక ఉపద్రవములచే ఏమాత్రము స్పృశించబడనివాడై…,

నిశ్చింతైః : లోకముల అంతర్ విశేషముల గురించిన చింతలను కించిత్ కూడా హృదయములో లేనివాడై,

ఈ పాంచభౌతిక జగత్‌దృశ్యమును ఇంద్రియార్థముల మేళన కల్పనుగాను, స్వప్న సదృశంగాను, ఇంద్రజాల కల్పనగాను, స్వకీయ కథాకథన విశేషముగాను, అనేక వాయిద్యములతో కూడిన సంగీత సమ్మేళనము గాను - నిశ్చింతగా దర్శించుచూ…

యోగసేవయా ఆత్మ మాత్రేణ అవశిష్టమ్!

తనయొక్క యోగాభ్యాస బలంచేత కేవల - అఖండ - సర్వస్వరూప సర్వాత్మక ‘ఆత్మ మాత్రుడు’ అయి శేషించినవాడై ఉంటున్నాడు.

యోగులందరికీ మార్గము, లక్ష్యము అదియే అయి ఉన్నది. అట్టి యోగసిద్ధుడే యోగాభ్యాసకులకు మార్గదర్శి.



🙏 ఇతి యోగతత్త్వ ఉపనిషత్। ‌🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।