[[@YHRK]] [[@Spiritual]]

kaTa rudra Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


కృష్ణయజుర్వేదాంతర్గత

8     ‌కఠ రుద్రోపనిషత్

(కఠశృత్యుపనిషత్)

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। శ్రీ ‌కఠ రుద్రోపనిషత్ విద్యా వేద్య అపార సుఖాకృతీ
త్రైపదం బ్రహ్మచైతన్యం రామచంద్రపదం భజే।।

శ్రీ ‌కఠ రుద్రోపనిషత్ విద్యచే ప్రాప్తించగల మహత్తరమగు త్రిపదరూప పరబ్రహ్మతత్త్వము - అను సుఖప్రదమైన స్థానము (సుఖాకృతి) కొరకై శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదపద్మములను భజించుచున్నాను.

1 ఓం దేవా హ వై భగవంతమ్
అబ్రువన్।
అధీహి, భగవన్! బ్రహ్మవిద్యామ్।
‘ఓం’ కారార్థ పరబ్రహ్మమును ఉపాసించుచున్నాము.

ఒక సందర్భములో దేవతలు ప్రజాపతిని దర్శించి హృదయ పూర్వకముగా నమస్కరించారు. స్వభావతః దేవతలు జీవులందరి క్షేమము, శ్రేయస్సు కోరుకొనువారు కదా! లోకముల శ్రేయస్సును ఉద్దేశ్యించినవారై ఇట్లా పలికారు.

‘‘హే భగవాన్! సృష్టికర్తా! సృష్టి ప్రజ్ఞాదురంధరా! ప్రజాపతీ! ప్రణామములు. దయతో జీవులందరినీ ఉద్ధరించగల ‘బ్రహ్మవిద్య’ను బోధించమని వేడుకొనుచున్నాము.’’
స ప్రజాపతిః అబ్రవీత్
స శిఖాన్ కేశాన్ నిష్కృష్య,
విసృజ్య యజ్ఞోపవీతం,
(సర్వం) నిష్కృష్య, పుత్రం దృష్ట్యా
‘‘త్వం బ్రహ్మా। త్వం యజ్ఞః। త్వం వషట్కారః।
త్వం ఓంకారః త్వగ్ం స్వాహా।
త్వగ్ం స్వధా। త్వం ధాతా।
త్వం విధాతా। త్వం త్వష్టా।
త్వం ప్రతిష్ఠా అసి।’’
- ఇతి వదేత్।।
దేవతలు ‘బ్రహ్మవిద్య’ గురించి అడగటము విని, ఎంతో సంతోషించిన ప్రజాపతి ఇట్లు ప్రవచించసాగారు.

ఓ దేవతలారా! నేను కల్పించిన ఈ సృష్టిలో ప్రవేశించుచున్న ఈ జీవుడు, ‘జన్మసాఫల్యత’ను ఏమరచి ‘‘మమకారము, భార్యా-పుత్రుల పట్ల రాగము, - ఏమరపు (“దూరదృష్టిని- ఆత్మదృష్టిని ఏమరచటము”…) ఇటువంటి వాటివల్ల బ్రహ్మవిద్యను అధ్యయనము చేయకున్నాడు. ఇది దృష్టిలో ఉంచుకొని సంబంధ - అనుబంధ-బాంధవ్యముల పరిధులను దాటటము గురించి ముందుగా చెప్పుచున్నాను. వినండి.

సన్న్యాస మార్గము : మొట్టమొదటి నామ-రూపములపై గల అభినివేశమును త్యజించాలి. అందుకు గాను సన్న్యాసి అయి, శిఖను (పిలకను) జుట్టుతో సహా తీసివేయాలి. యజ్ఞోపవీతమును త్రెంచివేయాలి. అప్పుడు తన కుమారుని పిలిచి ఇట్లా పలకాలి.
నీవే బ్రహ్మమువు। యజ్ఞమువు। నీవే వషట్ కారమువు। ఓంకార స్వరూపుడవు। నీవు దేవతలకు సమర్పించు హవిస్సు అగు ‘స్వాహా’వు. పితృదేవతలకు సమర్పించు ‘స్వధా’వు. నీవే ధాతవు! విధాతవు! త్వష్టవు! నీవే ప్రతిష్ఠవు!
2 అథ పుత్రో అవదత్:
అహం బ్రహ్మా। అహం యజ్ఞో। అహం వషట్‌కారో।
అహం ‘ఓం’కారో। అహగ్ం స్వాహా।
అహగ్ం స్వధా! అహం ధాతా।
అహం విధాతా। అహం త్వష్టా।
అహం ప్రతిష్ఠా-స్మి-ఇతి।।
అప్పుడు పుత్రుడు ఇట్లా బదులు పలుకునుగాక!
‘‘అవును! నేను బ్రహ్మమును. నేను యజ్ఞమును। నేను వషట్‌కారమును! నేను ‘ఓం’ కారమును!
నేనే దేవతలకు సమర్పించు హవిస్సుల రూపమగు స్వాహా ను। పిత్రుదేవతలకు సమర్పించబడు స్వధా ను! నేను సృష్టికర్తయగు ధాతను కూడా! విధానము రచించు విధాతను! ఈ దృశ్యమునకు రూపరచయిత అగు ‘త్వష్టా’ అయి ఈ సర్వము నందు ప్రతిష్ఠితుడనై ఉన్నవాడను.
తాన్ ఏతాన్ అనువ్రజన్ న అశ్రుమ ఆపాతయేత్।
యది అశ్రుపాతయేత్ ప్రజాం, విచ్ఛిన్ద్యాత్।
ఈ విధంగా ‘సన్న్యాసయోగము’ను ఆశ్రయించాలి. అట్టి సన్న్యాస (త్యాగ) మార్గము స్వీకరిస్తూ, ‘‘అయ్యో! విడచుచున్నానే’’.. అని కంటతడి పెట్టరాదు.
అప్పుడు కంటతడి పెట్టితే-సంతానమునమును బాధించినట్లే అవుతుంది. మనస్సు వికలమౌతుంది. బుద్ధి విచ్ఛేదనమును పొందుతుంది.
ప్రదక్షిణమ్ ఆవృత్య ఏతశ్చ, ఏతశ్చ అనవేక్షమాణాః
ప్రత్యాయంతి, స స్వర్గ్యో భవతి।
ఇక తన పుత్రులు మొదలైన సంతానము వైపు చూడకుండా (వెనుక చూపు లేకుండా) ప్రదక్షిపూర్వకంగా తిరిగి అక్కడి నుండి వెళ్లిపోవాలి. ఈ విధముగా సన్న్యాసమార్గము స్వీకరించువాడు స్వర్గలోక ప్రవేశమునకు అర్హుడగుచున్నాడు.
బ్రహ్మచారీ వేదమ్ అధీత్య,
వేదోక్త ఆచరిత
బ్రహ్మచర్యో దారాన్ ఆహృత్య,
పుత్రాన్ ఉత్పాద్య, తాన్ అనురూపాధిభిః
వితత్య, ఇష్ట్వాచ శక్తితో యజ్ఞైః సన్న్యసేత్।
గురుభిః అనుజ్ఞాతశ్చ, బాంధవైశ్చ-
సో అరణ్యం పరేత్య,
ద్వాదశ రాత్రం పయసా
అగ్నిహోత్రం జుహుయాత్।
ద్వాదశ రాత్రం పయో భక్షస్స్యాత్।
ద్వాదశ రాత్రస్య అంతే, అగ్నయే వైశ్వానరాయ
ప్రజాపతయే చ ప్రాజాపత్యం చరుం వైష్ణవం
త్రికపాలమ్ అగ్నిగ్ం సగ్ంస్థితాని,
పూర్వాణి దారుపాత్రాణి అగ్నౌ జుహుయాత్,
మృణ్మయాని అప్సు జుహుయాతి
తైజసాని గురవే దద్యాత్।।
ముముక్షువు ఎప్పుడు సన్న్యసించవచ్చో చెప్పుచున్నాను. వినండి.

మొట్టమొదట ‘బ్రహ్మవిద్య’ కొరకై విద్యార్థి అయి ‘బ్రహ్మచారి’ అను వ్రతము స్వీకరించాలి. వేదోక్తంగా జీవిస్తూ వేదపఠనము చేయునుగాక! ఆ విధంగా బ్రహ్మము గురించి సద్గురువు నుండి ఎరుగుచూ బ్రహ్మచర్య వ్రతమును పూర్తి చేయాలి.

అటు తరువాత వివాహం చేసుకోవాలి. గృహస్థ ధర్మంగా పుత్రులను పొందాలి. సంతానమును (పుత్రులను, పుత్రికలను) తగిన వారితో కలపాలి. యథాశక్తిగా యజ్ఞములు నిర్వర్తించాలి. అప్పుడు సన్న్యసించాలి.

సన్న్యసించుటకొరకై గురువుల యొక్క, బంధువుల యొక్క అనుజ్ఞ (Permission) తీసుకోవాలి.

అప్పుడు అరణ్యంలో (ఏకాంతంతో) ప్రవేశించాలి. 12 రాత్రులు పాలతో అభిషేకములు, అగ్నిహోత్రమునకు హోమములు సమర్పించి ‘సన్న్యాసవ్రతము’ ప్రారంభించి, పూర్తి చేయాలి.
ఆ 12 రాత్రులు పాలు మాత్రమే ఆహారముగా స్వీకరించాలి.
ఆ ‘12’ రాత్రులు తరువాత అగ్నికి, వైశ్వానరునికి, ప్రజాపతికి నమస్కరిస్తూ యజ్ఞ పాత్రలను సమర్పించాలి. ప్రజాపత్యము, వైష్ణవమును ఉపాసిస్తూ, యజ్ఞములో ఉపయోగించిన త్రిముఖ దారు పాత్రలను, (కొయ్యపాత్రలను) అగ్నికి సమర్పించాలి. మట్టి పాత్రలను మట్టిలో కలపాలి. లోహపాత్రలను గురువులకు సమర్పించి వేయాలి.
3 మా త్వం మామ్ అపహాయ
పరాగాః। న అహం త్వాం అపహాయ పరాగమ్ ఇతి..
గార్హపత్య, దక్షిణాగ్ని ఆహవనీయేషు
‘అరణి’ దేశాత్ భస్మ ముష్టిం పిబేతి
- ఇతి’ ఏకే।…
అప్పుడు గార్హపత్యాగ్ని - దక్షిణాగ్ని- ఆహవనీయాగ్ని లను వ్రేల్చిన ప్రదేశముల నుండి పిడికెడు భస్మమును తీసుకొని ‘‘ఓ యజ్ఞ భస్మమా! మీరు నన్ను విడిచి వెళ్లకండి। నేను మిమ్ములను విడచివెళ్లను’’.. అని పలుకుచూ అరణితో ఆ భస్మమును నీటిలో చేర్చి తాగాలి. → అని కొందరు విధి - విధానమును చెప్పుచున్నారు.
స శిఖాన్ కేశాన్ నిష్కృష్య
విసృజ్య, యజ్ఞోపవీతం
భూస్స్వాహాయేతి, అప్సు జుహుయాత్।।
శిఖ -కేశములను (పిలక-జుట్టును) తీసివేసి, యజ్ఞోపవీతమును త్రెంచి, చేతితో ధరించి ‘భూస్స్వాహా’ అని పలుకుచు నీటిలోనికి హోమము చేయాలి.
అత, ఊర్ధ్వమ్ అనశనమ్
అపాం ప్రవేశమ్ అగ్నిప్రవేశం
వీరాధ్వానం మహా షా ప్రస్థానం,
వృద్ధాశ్రమమ్ వా, గచ్ఛేత్।
ఇక ఆహారము స్వీకరించకుండా…,
- జలప్రవేశము గాని, అగ్ని ప్రవేశముగాని చేయాలి. ‘వీరమార్గము’గా వెళ్లాలి. మహాప్రస్థానము (దేహార్పణ భావమును) చేయాలి. (లేక) వృద్ధాశ్రమము ప్రవేశించాలి. ఏకాంత జీవనముగాని, ఆశ్రమ జీవనముగాని ఎన్నుకొని-‘‘ఆత్మతత్త్వమ్ - ఆత్మాఽహమ్’’ ఉపాసనను స్వీకరించాలి.
పయసాయం ప్రాశ్నీయాత్
సో అస్య సాయగ్ం హోమో।
యత్ ప్రాతః సో అయం ప్రాతః
సాయంకాలము పాలు మాత్రమే త్రాగియుండటమును ‘సాయం హోమము’ అని అంటారు.
ప్రాతః కాలంలో (ఉదయము) పాలు త్రాగి ఉపవాసము ఉంటే అది ‘‘ప్రాతః హోమము’’.
యత్ దర్శే, తత్ దర్శనం।
యత్ పౌర్ణమాస్యే తత్ పౌర్ణమాస్యం।
అమావాస్యనాడు క్షీర పాన-నియమము పాటిస్తే అది ‘దర్శనము’
పౌర్ణమినాడు ఆ నియమము పాటిస్తూ ఉంటే అది ‘‘పౌర్ణమాస్యము’’.
యత్ వసంతే కేశ శ్మశ్రు లోమ నఖాని వాపయేత్।
సో అస్య అగ్నిష్టోమః సన్న్యస్య అగ్నిం
న పునః ఆవర్తయేత్।
వసంతకాలంలో కేశములను, శ్మశ్రు (మీస-గడ్డముల) లోమ (రోమము లను), గోరులను క్షవరం చేయించుకోవాలి. సన్న్యసించిన తరువాత, అగ్నిష్టోమయాగము మొదలైనవి గాని తదితర అగ్నిహోమములను గాని - ఇక నిర్వర్తించరు.
‘‘మృత్యుః జయమావహమ్’’
- ఇతి అధ్యాత్మ మంత్రాత్ పఠేత్।
‘మృత్యుః జయమావహమ్’ (మృత్యు జయమును ఆశ్రయిస్తున్నాను).. అను అధ్యాత్మమంత్రమును పఠిస్తూ సన్న్యసిస్తున్నాడు.
‘‘స్వస్తి సర్వ జీవేభ్య’’
- ఇతి ఉక్త్వా, ఆత్మానమ్ ‘అనన్యం’
ధ్యాయం, తత్ ఊర్ధ్వబాహుః
విముక్తి మార్గో భవేత్।
- ‘‘స్వస్తి సర్వ జీవేభ్య - సర్వ జీవరాసులకు శుభమగు గాక!’’ అని భావన - శబ్దోచ్ఛారణ చేస్తూ,
‘‘నేను ఆత్మకు అనన్యుడను’’ అని ధ్యానము చేయుచూ, చేతులు పైకి ఎత్తి విముక్తి మార్గములో ప్రయత్నశీలుడై ఉంటున్నారు.
అనికేతః చరేత్। భిక్షాశీ యత్ కించిత్
న దద్యాత్। లవా ఏకం న ధావయేత్,
జంతు సగ్ంరక్షనార్థం
వర్ష వర్జమ్ - ఇతి।।
‘‘ఇది నా ఇల్లు-నివాస స్థలము’’ అనునది ఏదీ లేనివాడై, భిక్షచే లభ్యమైనది స్వీకరిస్తూ ఉండాలి. తన కొరకు గాని, ఇతరుల కొరకుగాని ధన-వస్తు సంపదలను స్వీకరించరాదు.
జంతువుల నుండి, వర్షము నుండి దేహమును రక్షించుకోవటానికి కావలసిన పరికరములు తప్పించి, మరింకేమీ తన కొరకై దాచి ఉంచు కోరాదు.
తదపి శ్లోకా భవంతి।।
యతుల గురించి ఈ విధంగా శాస్త్ర శ్లోకములు!
4 కుండికాం చమసం శిక్యం, త్రివిష్టపమ్ ఉపానహౌ
శీతోపఘాతినీం కంథాం, కౌపీన ఆచ్ఛాదనం తథా,
పవిత్రం స్నానశాటీం చ, ఉత్తరాసంగమేవ చ,
యజ్ఞోపవీతం వేదాంశ్చ, సర్వం తత్ వర్జయేత్ యతిః।
స్నానం పానం తథా శౌచం, అద్భిః పూత-అభిరాచరేత్।
నదీ పుళినశాయీ స్యాత్, దేవాగారేషు వా స్వపేత్।
కుండను చమక (కొయ్య) పాత్రను, ఉట్టిని, త్రిపివిష్టపము (3 మూతులు గల కొమ్ము చెంబును), బొంతను, కౌపీనమును, పవిత్రమును, స్నానశాటి (తుండు)ను, ఉత్తరీయమును (పై బట్టను), యజ్ఞోపవీతమును, వేదములను.. ఇవన్నీ కూడా యతి వదలివేసినవాడై ఉంటున్నాడు.
పవిత్రమైన జలముతో స్నానము, పానము (త్రాగటము).. చేయాలి.
ఇసుక దిబ్బ తిన్నెలపైన గాని, దేవాలయ ప్రాంగణములందుగాని నిద్రిస్తూ ఉండాలి.
న-అత్యర్థం సుఖ-దుఃఖాభ్యాం శరీరమ్ ఉపతాపయేత్।
స్తూయమానో న తుష్యేత, నిందితో న శపేత్ పరాన్।
బ్రహ్మచర్యేణ సంతిష్ఠేత్ అప్రమాదేనమస్కరీ।
భౌతిక శరీరమును సుఖ-దుఃఖములైన వాటితో తపింపజేయరాదు
తనను పొగడేవారికి చూచి సంతోషించరాదు. నిందించువారిని శపించరాదు. బ్రహ్మచర్యమునందు - బ్రహ్మ భావనయందు (నేను - నీవు - జగత్తులు అఖండ పరబ్రహ్మస్వరూపమే - అను ఉపాసన యందు) సంతుష్టుడై ఉండును గాక!
దర్శనం, స్పర్శనం, కేళిః, కీర్తనం
గుహ్య భాషణమ్, సంకల్పో,
అధ్యవసాయశ్చ - క్రియానిర్వృత్తిరేవ చ।
- ఏతత్ ‘‘మైథునమ్ అష్టాంగం’’
ప్రవదంతి మనీషిణః।
విపరీతం బ్రహ్మచర్యం అనుష్ఠేయం ముముక్షుభిః।
సన్న్యాసి సర్వదా బ్రహ్మచర్యమునందు జాగరూకుడై ఉండాలి. మైథునమునకు సుదూరుడై ఉండాలి. భౌతికదేహ దర్శనము, స్పర్శనము, కేళి, కీర్తనము, రహస్య సంభాషణము, సంకల్పముతో ప్రయత్నము (సాధనము), క్రియా నిర్వృత్తి.. - ఈ ‘8’ కూడా ‘మైధునము’నకు అష్టాంగములు - అని బుద్ధిమంతులు చెప్పుచున్నారు. మైథునము బ్రహ్మచర్యమునకు వ్యతిరిక్తమైనది. ముముక్షువు తీవ్రమైన బ్రహ్మచర్యమును అనుష్ఠించాలి.
యత్ జగత్ భాసకం, భాసం
నిత్యం భాతి స్వతః స్ఫురత్
స ఏవ జగతః సాక్షీ,
సర్వాత్మా విమలాకృతిః।।
ఈ జగత్తును భాసింపజేయుచున్నది, జగత్తుగా భాసిస్తున్నది, (ఆ విధంగా జగత్తును భాసింపజేయుచు (ప్రకాశింపజేయుచూ)) స్వతఃగా తానే స్వయంగా ప్రకాశమానమై యున్నది ఏదో - అదియే ఆత్మ! అదియే ఈ జగత్తు అంతటికీ కేవల సాక్షి అయి నిర్మలాకృతిగా వెలుగుచున్నది. అట్టి సర్వాత్మకమగు పరమాత్మయే తన ఆత్మగా భావిస్తూ దర్శిస్తూ, ఉపాసిస్తూ ఉండాలి. ముముక్షువు అగు యతి ఆత్మతో సర్వదా మమేకము అయి ఉంటున్నాడు. అద్వితీయుడగుచున్నాడు.
5 ప్రతిష్ఠా సర్వభూతానాం
ప్రజ్ఞానఘన లక్షణః।
న కర్మణా, న ప్రజయా,
న చ అన్యేనాఽపి కేన చిత్।
బ్రహ్మవేదన మాత్రేణ
బ్రహ్మ - ఆప్నోతి ఏవ మానవః।।
‘ఎరుక’ రూపమగు ఘనీభూతమైన ప్రజ్ఞ (ప్రజ్ఞాన ఘనము) అను లక్షణముతో కూడిన ‘‘స్వస్వరూప పరమాత్మ’’ - సర్వ భూతజాలము నందు సుప్రతిష్ఠితమై సర్వదా ఉన్నది.
ఆ విధమైన ‘‘మమాత్మా సర్వభూతాత్మ’’ రూపమగు పరాత్‌పరం- పరబ్రహ్మత్వము కర్మల వలననో (లేక) సంతానము - శిష్యులు-ధనము మొదలైన వాటి చేతనో లభించేది కాదు. ఈ మానవుడు బ్రహ్మమును తెలుసుకొని సర్వాత్మత్వ భావన యొక్క అభ్యాసముచే మాత్రమే బ్రహ్మము పొందబడగలడు.
తత్ విద్యా విషయం బ్రహ్మ, సత్య జ్ఞాన-సుఖ-అద్వయమ్।
సంసారే చ గుహా వాచ్యే, మాయా-అజ్ఞానాది సంజ్ఞికే।
అట్టి ‘బ్రహ్మవిద్య’ → సత్య (యమ్‌సత్-ఉనికి) - జ్ఞాన (ఎరుక) - సుఖ (అనుభూతి) - (దృశ్యమును ద్రష్టను ఏకము చేయు) అద్వయ → స్వరూప - స్వభావయుక్తము.
‘సంసారము’ అనేది ఒక ‘కొండగుహ’ వంటిది అని, ‘మాయ’ ‘అజ్ఞానము’ అనే సంజ్ఞలచేత ఉద్దేశ్యించబడినదని చెప్పబడుతోంది. అట్టి సంసారమునకు బ్రహ్మ విద్య ఒక్కటే తరుణోపాయము.
నిహితం బ్రహ్మ యో వేద, ‘పరమే వ్యోమ్ని’ సంజ్ఞితే,
సో అశ్నుతే సకలాన్ కామాన్, సక్రమేణ ద్విజోత్తమః।

ప్రత్యగాత్మనమ్ - అజ్ఞాన మాయా శక్తేశ్చ సాక్షిణమ్,
-జ్ఞాత్వా ‘బ్రహ్మాహమస్మి’
ఇతి, బ్రహ్మైవ భవతి స్వయమ్।
ఈ దృశ్యమంతటికీ ఆవల సర్వదా వేంచేసియున్న ‘పరమాకాశము’ అనబడు సర్వాత్మత్వ ‘‘సంజ్ఞ’’ను ఎవ్వరు ఎరుగుచున్నారో.. అట్టివారు ‘‘సర్వకామములు’’ సిద్ధించుకున్నవారు అగుచున్నారు. క్రమంగా ఆ ద్విజోత్తముడు ‘పరమాత్మ రూపము’ను సంతరించుకొనుచున్నాడు.
అజ్ఞాన మాయాశక్తికి కేవల సాక్షియై, సర్వాతీతమై వెలుగొందుచున్న ‘ప్రత్యగాత్మ’ను ఎరుగుచున్న యోగి.. ‘‘నేనే బ్రహ్మమును కదా!’’ అని గమనిస్తూ, సర్వత్రా ‘బ్రహ్మదర్శనము’ను అభ్యసిస్తూ, తానే స్వయముగా ‘బ్రహ్మము’ అగుచున్నాడు. సకల భూతములు తానై, సర్వసాక్షిగా వేరై ఉంటున్నాడు. ఇహ-పర - పరాత్పర అఖండత్వము తనకు తానే అయి, పునికి పుచ్చుకొనుచున్నాడు.
బ్రహ్మభూతాత్మనః తస్మామ్
ఏతస్మాత్ శక్తి మిశ్రితాత్
‘అపంచీకృత-ఆకాశ’
సంభూతో - రజ్జుసర్పవత్।
ఆకాశాత్ ‘వాయు’ సంజ్ఞస్తు
స్పర్శో పంచీకృతః పునః।
బ్రహ్మభూతాత్మ తన యందు ‘శక్తి’ని స్వభావ సిద్ధంగా కలిగియున్నదై ఉంటోంది. అట్టి ‘శక్తి’ (Energy)తో కూడిన ‘బ్రహ్మభూతాత్మ నుండియే.. ‘అపంచీకృత ఆకాశము’ సంభవించుచున్నది. అట్టి బ్రహ్మము నుండి → అపంచీకృత ఆకాశము, బయల్వెడలటము అనునది → త్రాడు పాముగా కనిపించటము - రజ్జు సర్పాహ్రాంతి → వంటిది మాత్రమే!
బ్రహ్మము నుండి సర్పరజ్జువు వలె (త్రాడు యందు పాము వలె) సంభవించిన అపంచీకృతాకాశము నుండి పంచీకృతమగు ఆకాశము,
వాయోః అగ్నిః। తథా చ,
అగ్నే ఆపః।
అద్భ్యో వసుంధరా!
అద్దాని నుండి → ‘స్పర్శ’ (Touch) మొదలైనవి జనిస్తున్నాయి.
ఆ పంచీకృత, ఆకాశము నుండి → వాయువు, వాయువు నుండి → ‘అగ్ని’, అగ్ని నుండి → ద్రవము (జలము), జలము నుండి → స్థూలము (భూమి) జనించటం (రజ్జు సర్పము వలె) జరుగుతోంది.
తాని భూతాని సూక్ష్మాణి
పంచీకృత్య ఈశ్వరః తదా,
తేభ్య ఏవ విసృష్టం
తత్ బ్రహ్మాండాది శివేన హ।
ఈశ్వరునిచే → (బ్రహ్మము + శక్తి స్వరూపముచే) సూక్ష్మభూతములు (శబ్దము- స్పర్శ - రూపము - రసము - గంథముల కేవలీ రూపములు) జనించి, అవి పంచీకరణము అగుచున్నాయి. ఈ విధంగా ఆత్మ స్వరూపుడగు శివభగవానునిచే (ఈశ్వరునిచే) బ్రహ్మాండమంతా సృష్టించబడుతోంది.
బ్రహ్మాండస్య ఉదరే
దేవా, దానవా, యక్ష కిన్నరాః,
మనుష్యాః, పశు-పక్ష్య ఆది
యత్ తత్ కర్మానుసారతః।।
అట్టి బ్రహ్మాండము యొక్క ఉదరము (గర్భము) నందు కర్మానుసారంగా (As a Programme of Acts and Evertualities) దేవతలు, దానవులు, యక్షులు, పశుపక్ష్యాదులు జగన్నాటకము కొరకై సృష్టించబడుచున్నారు.
6 అస్థి స్నాయుః ఆది రూపో
అయం శరీరం భాతి దేహినామ్।
యో అయమ్ అన్నమయో హి
ఆత్మా భాతి సర్వ శరీరిణః।
ఆ ఆత్మచైతన్య శివతత్త్వము→ (1) బొమికలు - మాంసము - చర్మముల రూపములతో సర్వశరీరములుగా, (2) శరీరులుగా భాసించుచున్నది.
ఈ విధంగా సర్వ శరీరుల పట్ల ఆ ఈశ్వరుడు (శివుడు) అన్నమయ ఆత్మగా ప్రకాశించుచున్నారు.
తతః ప్రాణమయో హి ఆత్మా
విభిన్నశ్చ అంతరస్థితః।
తతో మనోమయో హి ఆత్మా
విభిన్నశ్చ అంతర స్థితః।
తతో విజ్ఞాన ఆత్మాతు తతో
అన్యశ్చ అంతర స్థితః।
అట్టి అన్నమయ స్వయమాత్మాకల్పిత భౌతిక శరీరముల అంతరముగా అన్నమయమునకు విభిన్నమైన ‘ప్రాణమయ ఆత్మ’ స్థితించినదై ప్రభాసిస్తోంది.
అద్దాని లోపల అద్దానికి భిన్నమైనటువంటి ‘మనోమయాత్మ’ ఉండి ఉంటోంది.
ఆ మనోమయాత్మ యందు అద్దానికి భిన్నమైన ‘‘విజ్ఞానమయాత్మ’’ వెలయుచున్నదై ఉన్నది.
ఆనందమయ ఆత్మాతు
తతో అన్యశ్చ అంతర స్థితః।
యో అయమ్ అన్నమయః
సో అయం పూర్ణః ప్రాణమయేన తు,
మనోమయేన ప్రాణోఽపి
తథా పూర్ణః స్వభావతః।
ఆ విజ్ఞానమయాత్మకు అంతరముగా అద్దానికి భిన్నమైన ‘ఆనందమయాత్మ’ ఉండి ఉంటోంది.
ఏది అన్నమయమై ఉన్నదో, అది ప్రాణమయముతో నిండినదై ఉన్నది.
అట్టి ప్రాణమయమైనదంతా మనోమయముతో స్వభావంగా పూర్ణమైయున్నది.
తథా మనోమయో హి ఆత్మా
పూర్ణో జ్ఞానమయేన తు।
ఆనందేన సదా పూర్ణః
సదా జ్ఞానమయః సుఖమ్।
అట్లాగే మనోమయమైనదంతా (మనోమయాత్మ) జ్ఞానముతో పూర్ణమైయున్నది.
జ్ఞానమయ కోశము ఎల్లప్పుడు అజ్ఞాన -సుఖమయమగు ఆనందమయ కోశముతో పూర్ణమై యున్నది.
తథా ఆనందమయశ్చ అపి
బ్రహ్మణో అన్యేన సాక్షిణా।
సర్వాంతరేణ పూర్ణశ్చ
బ్రహ్మ న అన్యేన కేన చిత్।।
అట్టి ఆనందమయకోశము బ్రహ్మమునకు అన్యమైన ‘సాక్షి’ (Absolute witness) చేత పూర్ణము. సాక్షితో సహా అన్నమయ-ప్రాణమయ- మనోమయ- విజ్ఞానమయ - ఆనందమయములన్నీ బ్రహ్మముతో పూర్ణమైయున్నాయి. అట్టి బ్రహ్మము మరింక దేని చేతనూ పూర్ణమై లేదు.
7 యత్ ఇదమ్ ‘బ్రహ్మపుచ్ఛ’
ఆఖ్యం → సత్య-జ్ఞాన - అద్వయాత్మకమ్
సారమేవ రసం లబ్ధ్వా, సాక్షాత్ దేహీ సనాతనమ్।
సుఖీ భవతి సర్వత్ర, అన్యథా సుఖితా కుతః?
సత్యాత్మకము, జ్ఞానాత్మము అయినట్టి ‘బ్రహ్మపుచ్చము’.. అని పిలువ బడునది- అద్వితీయమైయున్నది. అద్దానికి ద్వితీయమనునది ఏదీ లేదు. అట్టి-ఈ జీవుని సనాతన రూపమగు, సర్వసారమగు బ్రహ్మమును ఎరిగినప్పుడు మాత్రమే ఈ జీవుడు ‘సుఖి’ అగుచున్నాడు. తదితరము దేనివల్ల-కూడా ఈ జీవునకు వాస్తవమైన సుఖము ఎక్కడిది? లేనే లేదు.
అసత్ యస్మిన్ పరానందే
స్వాత్మభూతే అఖిలాత్మనామ్,
కో జీవతి నరో జంతుః?
కోవా నిత్యం విచేష్టతే?
దేనివల్ల కూడా ఈ జీవునకు వాస్తవమైన సుఖము ఎక్కడిది? లేనే లేదు.
ఏ పరానందము-అఖిలాత్మకము-స్వాత్మ భూతము అగు పరబ్రహ్మము సర్వదేహములలో వేంచేసియున్నదో, అట్టి బ్రహ్మచైతన్యమే ఉండి ఉండకపోతే, ఈ జీవుడు ఎట్లా జీవించ ఉండగలడు? అఖిలాత్మకమగు బ్రహ్మచైతన్యమే ఈ దేహము నందు ప్రకాశించకపోతే జీవుడు చేష్టలు ఎట్లా నిర్వర్తించగలడు? కదిలించేది ఉండటం చేతనే దేహాలు కదలు చున్నాయి. ఆ విధంగా కదలించుచున్నట్టిదే - ‘జీవ చైతన్యము’ - అనబడుతోంది.
తస్మాత్ సర్వాత్మనా చిత్తే
భాసమానో హి అసౌ నరః।
ఆనందయతి దుఃఖాఢ్యం
జీవాత్మానగ్ం సదా జనః।
కాబట్టి ఈ నరుడు చిత్తము యొక్క అంతరాంతరమున సర్వాత్మత్వకముగా ఎల్లప్పుడూ భాసించుచున్నవాడే అయిఉన్నాడు.
ఈ జనులు ఎల్లప్పుడు (ఏడ్చే పిల్లవాడిని సముదాయిస్తున్నట్లుగా) దుఃఖపూరితుడగు జీవాత్మను ఆనందింపజేయుటకై యత్నిస్తున్నారు. ఆత్మను ఎరిగి ఉంటేనో?, స్వస్వరూప పరమాత్మకు ‘‘జీవాత్మ’’ - అనునది ఒక అంశ వంటిదిగా తెలియబడగలదు.
యదా హి ఏవ ఏష ఏతస్మిన్
న దృశ్యత్వాది లక్షణే
నిర్భేదం పరమాద్వైతం
విందతే చ మహాయతిః।
తదేవ అభయం ఇత్యంతం
కల్యాణం పరమామృతం
సద్రూపం పరమం బ్రహ్మ
త్రిపరిచ్ఛేద వర్జితమ్।
దృశ్య విషయము కానట్టి (అదృశ్య లక్షణము కలిగియున్న) ఆత్మయందు (తదితర సత్-చిత్-ఆనంద లక్షణ సమన్వితమగు ఆత్మయందు) యోగి ప్రవేసిస్తున్నాడు. భేద రహితము-పరమాద్వైతము అయినట్టి (ద్వితీయ మైనది లేనట్టి)-స్వస్వరూపాత్మయందు ఆ మహామతి (ఆత్మయోగి) - రమిస్తూ ఉన్నాడు. జీవాత్మను సముదాయించి దుఃఖము తొలగించాలనే తాపత్రయమును ఆపి,.. ఆపై ‘‘భేదరహిత ఆత్మ’’ యందు రమించుటమే అభయము. అదియే దృశ్యమునకు ఆవలి స్థానము. అది కల్యాణ ప్రదము. అది పరమామృత రూపము.
అట్టి ‘సత్’ రూపమగు పరబ్రహ్మము త్రికాలములు - త్రిగుణములు - జన్మ జీవన మృత్యువులు అను పరిచ్ఛేదము లేనట్టి స్థానము.
యదా హి ఏవ యేష ఏతస్మిన్
అల్పమపి అంతరం నరః
విజానాతి తదా తస్య భయంస్యాత్।
న అత్ర సంశయః।
ఎంతెంత కాలమైతే ఈ జీవుడు (ఈ జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, ఆత్మవేరు - అనురూపమైన) భేదమును మాత్రమే చూస్తూ ఉంటాడో, అట్టి భేదదృష్టి కించిత్ ఉన్నాకూడా ఆతనికి ‘భయము’ ఉండియే తీరుతుంది. స్వస్వరూపము గురించిన (అఖండ- సమ-అద్వైత-భేదరహిత భావనచేత మాత్రమే భయము తొలగుతుంది). ఇందులో సందేహం లేదు.
అస్యైవ ఆనందకోశేన
స్తంభాంతా విష్ణుపూర్వకాః,
భవంతి సుఖినో నిత్యం
తారతమ్య క్రమేణ తు।।
లౌకిక సంబంధమైన ఆనందకోశము నందు ఈ జీవుడు ‘విష్ణుమాయ’లో పడి (సుఖ విషయములు - దుఃఖ విషయములు, తక్కువ-ఎక్కువ; గొప్పవారు - కానివారు; జీవాత్మ.. పరమాత్మ; జీవుడు - దేవుడు.. మొదలుగా గల) తారతమ్యముల క్రమమును ఆశ్రయించినవాడై దేహములలో నివసిస్తున్నాడు.
8 తత్ తత్ పద విరక్తస్య
శ్రోత్రియస్య ప్రసాదినః
స్వరూపభూత ఆనందః
స్వయం భాతి పరే యథా।
ఆయా సర్వ తార-తమ్యముల పట్ల విరక్తి పొందినదై, ఆత్మతత్త్వము వినుచూ, దృశ్య విషయముల పట్ల అనురాగము త్యజించు పవిత్ర బుద్ధి మాత్రమే స్వయముగా ఆత్మత్వమునందు భాసిస్తోంది. ఆ యోగి (లేక) ముముక్షువు ఆత్మానంద స్వరూపభూతుడు అగుచున్నాడు.
నిమిత్తం కించిత్ ఆశ్రిత్య
ఖలు శబ్దః ప్రవర్తతే।
యతో వాచో నివర్తంతే
నిమిత్తా-నామ భావతః।
నిర్విశేషే పరానందే
కథం శబ్దః ప్రవర్తతే?
కించిత్ శబ్దము అయినా కూడా - అది నిమిత్తమును ఆశ్రయించి మాత్రమే ప్రవర్తిస్తుంది. అనగా ఒక వస్తువును సూచించటానికి ఒక శబ్దము కల్పించబడుతోంది. ఆ శబ్దము చెప్పగానే అది ఆ వస్తువు స్ఫురించటానికి కారణమౌతోంది. (మామిడి పండు అనగానే ఆ పండు స్ఫురించునట్లుగా), ఇట్లాగే దృశ్యవస్తువులన్నీ కూడా।
దృశ్య విషయములన్నిటికీ - వస్తువులన్నీటికీ శబ్దములు నిమిత్తముగాను, అర్థములు ఉపాదానములుగా ఉంటున్నాయి. కానీ, ఏదైతే చెప్పటానికి వాక్కుతో కుదరదో, వాక్కు కూడా వెనుకకు మరలుచూ చెప్పలేక పోతామో,… అట్టి ‘‘నిర్విశేష - విషయరహిత పరానందము’’ గురించి ఏ మాటలు నిర్వచించి చెప్పగలుగుతాయి? అది నిమిత్త కారణరహితము. కార్య - కారణాతీతము.
తస్మాత్ ఏతత్ మనః సూక్ష్మం
వ్యావృత్తం సర్వగోచరమ్,
యస్మాత్ శ్రోత్ర-త్వక్-అక్ష్యాది
ఖ-ఆది కర్మేంద్రియాణి చ।
వ్యావృత్తాని పరం ప్రాప్తుం, న సమర్థాని తాని తు,
అట్టి నిర్విషయ పరానందము నుండి సూక్ష్మమగు మనస్సు బహిర్గతమై, వ్యావృత్తము (Extended) పొందినదై ఈ సర్వత్రా కనిపిస్తున్న జగత్ రూపముగా అగుచున్నది. ఎద్దాని నుండి శ్రోత్రమ్ (వినికిడి), త్వక్ (స్పర్శ), కళ్లు (చూపు), రుచి, గంథములు, భూత-చిత్త-చిదాకాశములు, కాళ్లు- చేతులు, మనస్సు- ఇవన్నీ బయల్వెడలుచున్నాయో, అవన్నీ అట్టి ఎద్దానిని పొందజాలకున్నాయో.. అదియే ‘‘నిర్విషయ పరమానందము’’. అదియే పరమాత్మ, కేవలాత్మ, పరబ్రహ్మము - అని కూడా అనబడుచున్నది.
తత్ బ్రహ్మానందమ్, అద్వంద్వం
నిర్గుణమ్ సత్య చిద్ఘనమ్।
విదిత్వా స్వాత్మరూపేణ న బిభేతి కుతశ్చన।
ఏవం యస్తు విజానాతి స్వగురోః ఉపదేశతః।
స సాధు-అసాధు కర్మభ్యాం
పదా న పతతి ప్రభుః
బ్రహ్మానందము ఇంద్రియ సంస్పర్శజమైన ఆనందము కాదు. విషయరహితమైనది. గుణరహితమైనది. సత్‌స్వరూపము (సత్యము). కేవల చిత్ ఘనము (ఎరుక). అట్టి ‘‘నిర్విషయ పరానందమే స్వాత్మ’’ అని ఎరిగిన తరువాత, ఇక దేనికీ భయము ఉండదు.

గురు-ఉపదేశములచే ఎవ్వడు స్వస్వరూపము గురించి ఎరుగుచున్నాడో, అట్టివాడు పాప-పుణ్యకర్మల మార్గములను దాటివేసినవాడై, సర్వమునకు తానే నియామకుడు (ప్రభువు) అగుచున్నాడు. ఆతనికిక కర్మచట్రము లోనికి పతనము ఉండదు. (సమస్తమునకు ప్రభువై ఆనందిస్తాడు).
తప్య - తాపక రూపేణ
విభాతమ్ అఖిలం జగత్।।
ఈ జగత్తంతా తప్య-తాపక రూపంగా ప్రకాశిస్తోంది. తపిపంజేయువాడు. తపించినది, ప్రకాశింపజేయువాడు - ప్రకాశించునది → రూపమున ఈ సర్వజగత్తుగా ఆత్మచే విభాతమానమగుచున్నది. (Being enlightened and manifested)
9 ప్రత్యగాత్మ తయా భాతి
జ్ఞానాత్ వేదాంత వాక్యజాత్।
ఇక, ముముక్షువు ‘‘మమాత్మాబ్రహ్మ। శాంతమ్-పరమ్-సుఖమ్- అద్వైతం బ్రహ్మ। అహమ్ బ్రహ్మాస్మి। తత్ త్వమ్। ఏకోహి దృక్-ద్రష్ట -దృశ్యః।’’.. ఇత్యాది వేదాంత వాక్యముల జ్ఞానముచే, విచారణచే ప్రత్యగాత్మ (కేవల ఆత్మస్వరూపుడు)గా భాసించుచున్నాడు. అట్టిది - ఈ జీవుని సహజ రూపమే సర్వదా - అయి ఉన్నది.
శుద్ధమ్ - ఈశ్వర చైతన్యం -
జీవచైతన్యమేవ చ- ప్రమాతా చ ప్రమాణం చ-
ప్రమేయం చ ఫలం తథా,
ఇతి సప్తవిధం ప్రోక్తం భిద్యతే వ్యవహారతః।
అనిర్వచనీయమగు ఆత్మయొక్క తత్త్వము ఏమిటో విశదీకరించటానికై ఈ వ్యావహారికంగా కనిపించే అంతటినీ..,
(1) శుద్ధ చైతన్యము (2) ఈశ్వరచైతన్యము (3) జీవచైతన్యము. (4) ప్రమాత (5) ప్రమాణము (6) ప్రమేయము (7) ఫలము.. అని ‘‘7’’ విధములుగా విడమర్చి .. విభాగించి శాస్త్రములచే చెప్పబడుచున్నది.
‘మాయోపాధి వినిర్ముక్తం
‘శుద్ధమ్’.. ఇతి అభిదీయతే।
మాయాసంబంధశ్చ → ‘ఈశో’।
‘జీవో’ అవిద్యావశః తథా,
అంతఃకరణ సంబంధాత్ ‘ప్రమాత’
- ఇతి అభిదీయతే।
కేవలాత్మ ఉపాధి రహితము. ‘మాయ’ అనే ఉపాధి దేహము లేనట్టిది. ఈ జీవుని యొక్క-కేవల బ్రహ్మస్వరూపమే ‘శుద్ధము’ - అని పిలువబడుతోంది. అట్టి - జీవుని యొక్క శుద్ధపరబ్రహ్మస్వరూపము ‘‘కల్పన-ఊహ-భావన’’.. రూపమగు మాయతో సంబంధము కలిగి ఉన్నప్పుడు - (మాయ అనే ఉపాధి కలిగి ఉన్నప్పుడు) → ఈశ్వరుడు - అనబడుచున్నాడు. ‘‘మాయ నాదియే కదా!’’ అన్నప్పుడు ఆతడు ఈశ్వరుడు.
అట్టి ఊహ-కల్పన- భావముల రూపమగు ‘అవిద్య’కు వశుడై ఉన్నప్పుడు పరబ్రహ్మమే ‘జీవుడు’ అను శబ్దముతో చెప్పబడుచున్నారు.
ఆ జీవుడు అంతఃకరణ విభాగములైనట్టి మనో-బుద్ధి-చిత్త-అహంకార విభాగ పరిమితుడై, సంబంధితుడై ఉన్నప్పుడు ‘ప్రమాత’ అనబడు చున్నాడు.
తథా తత్ వృత్తి సంబంధాత్
‘ప్రమాణమ్’ - ఇతి కథ్యతే।
అజ్ఞాతమపి చైతన్యం
‘ప్రమేయమ్’ - ఇతి కథ్యతే।
ఆతడు ఆ విధంగా వృత్తి (Avocation)- (కనబడే-వినబడే- స్పర్శించబడే- ఆఘ్రాణించబడే-రుచి చూడబడే-విషయాల పట్ల ధ్యాసలు) కలిగి ఉన్నప్పుడు ‘ప్రమాణము’ అని అనిపించుకుంటున్నాడు.
చైతన్యము తనను తాను ఏమరచి ‘దృశ్యమే సత్యము’ అని భావిస్తున్నప్పుడు, (చైతన్యము తెలియనిదగు చుండగా).. ‘ప్రమేయము’ అని చెప్పుకోబడుచున్నాడు.
తథా జ్ఞాతం చ చైతన్యం
‘ఫలమ్’ ఇతి అభిధీయతే।
సర్వోపాధి వినిర్ముక్తం
స్వాత్మానం భావయేత్ సుధీః।
ఏవం యో వేదతత్త్వేన…
‘బ్రహ్మభూయాయ కల్పతే।।
సర్వము ఎరుగుచూ ఉన్న చైతన్యము గురించి తెలుసుకోవటమే ‘ఫలము’ అని అభివర్ణించబడుతోంది.
అల్పబుద్ధులను అధిగమించివేసి, - ఉత్తమ బుద్ధిమంతుడైనవాడు→ సర్వ ఉపాధుల నుండి విడివడిన వాడై - ‘‘ఉపాధి రహితమై ప్రకాశించుచున్న స్వాత్మ’’.. నే భావన చేయాలి.
ఎవ్వడు సర్వోపాధి వినిర్ముక్తమగు స్వస్వరూపాత్మ యొక్క సహజ - సత్య - నిత్య- ఆనంద - అప్రయమేయ తత్త్వమును ఎరుగుచున్నాడో, ఆతడు బ్రహ్మభూయాత్మ (లేక) బ్రహ్మమే అగుచున్నాడు.
సర్వ వేదాదంత సిద్ధాంత
సారం వచ్మి యథార్థతః।।
స్వయం మృత్వా,
స్వయం భూత్వా
స్వయమేవ అవశిష్యతే।।
సర్వ వేదాంత - సిద్ధాంత సారము, యథార్థము - చెప్పుచున్నాను.
సమస్తము ఆత్మయొక్క విన్యాస ప్రదర్శనమే.
- తానే (ఆత్మయే) జన్మ మృత్యువులు.
- తానే జనిస్తున్నాడు.
- తానే మరణిస్తున్నాడు.
- తానే ఈ సర్వము।
- తానే జగత్తు। అంతర్గతము-బహిర్గతము కూడా తానే!
- ‘‘ఇదంతా ఆత్మయే!’’ అని గ్రహించి ఆత్మజ్ఞుడు సర్వము తానై ఉంటున్నాడు.

ఇతి కఠ రుద్రోపనిషత్ సమాప్తా
(కఠశృతి ఉపనిషత్)
ఓం శాంతిః| శాంతిః| శాంతిః||



కృష్ణ యజుర్వేదాంతర్గత

8     కఠ రుద్ర ఉపనిషత్‌

(కఠశృతి ఉపనిషత్)

అధ్యయన పుష్పము

త్రిపదస్థానము - బ్రహ్మచైతన్య రూపము అగు ఏ అపార సుఖాకృతి గురించి ఈ శ్రీ కఠ రుద్రోపనిషత్ విద్య చెప్పుచున్నదో….,
అట్టి మహావిద్య సిద్ధించటానికి శ్రీరామచంద్రమూర్తి పాదపద్మములను శరణువేడుచున్నాను.

‘‘ఓం’’కారతత్త్వ పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ ఉపాసించుచున్నాను.

┄┄┄

ఒకానొక సందర్భములో దివ్యతేజోరూపులు, అశరీరులై సృష్టిక్రమమంతా సేవించువారు - అగు దేవతలు సృష్టికర్తయగు ప్రజాపతిని (బ్రహ్మదేవుని) దర్శించటానికై బ్రహ్మలోకము ప్రవేశించారు. వారంతా స్వభావతః సర్వలోకక్షేమమును, లోకకల్యాణమును కోరుకొనువారు కాబట్టి, సర్వజీవుల శ్రేయస్సును ఉద్దేశ్యిస్తూ ప్రజాపతిని ఇట్లు అభ్యర్థించారు.

హే భగవన్! సృష్టికర్తా! మహాప్రజ్ఞా దురంధరా! ప్రజాపతీ! మీకు సాష్టాంగ దండ ప్రణామములను భక్తి పూర్వకంగా, హృదయపూర్వకంగా సమర్పించుచున్నాము. హే మహాత్మా! సర్వజీవులను సంసార బంధముల నుండి సముద్ధరించగల ‘బ్రహ్మవిద్య’ను విశదీకరించమని మిమ్ములను వేడుకొనుచున్నాము. మా అందరి ఆనందము కొరకై మీరు మహత్తర ప్రజ్ఞతో కల్పించిన దృశ్య జగత్ దృశ్యములో దేవతలము, మానవులము, - తదితర సర్వజీవులము సంసార బద్ధులమై మ్రగ్గుచున్నాము. అందుచేతనే మిమ్ములను ‘బ్రహ్మవిద్య’ను ప్రవచించమని అభ్యర్థన చేస్తున్నాం. మా అందరిపై, సకల జీవులపై ప్రేమ-దయార్ద్ర హృదయులగు మీరు మాకు జ్ఞానామృతం ప్రసాదించండి. బ్రహ్మతత్త్వమునకు ఉపాయము, బ్రహ్మతత్త్వ సారూప్య స్వభావములు వివరించ ప్రార్థన.

ప్రజాపతి : స్వభావతః సర్వజీవులకు ఆనందము కలుగజేయు ఉద్దేశ్యమును కలిగియుండు ఓ దేవతలారా! మీరు సమస్త జీవుల క్షేమమును కోరుకొంటూ ‘ఆత్మవిద్య’ గురించి ప్రశ్నించటము - నాకు ఎంతో సంతోషము కలుగజేస్తోంది. తప్పక వివరిస్తాను. వినండి.

⌘⌘⌘

నేను కల్పించుచున్న సృష్టిలో ప్రవేశించి భౌతిక దేహము స్వీకరిస్తున్న ఈ జీవులలో అత్యధికులు ఈ దృశ్యములో కనిపిస్తున్న దేహముల పట్ల, సందర్భముల పట్ల, సంబంధ-అనుబంధ-బాంధవ్యముల పట్ల రాగము-కామము కలిగియుండి మమేకమగుచున్నారు. ఇదియే సర్వ అనర్ధములకు, దుఃఖములకు కారణము. దేహమును స్వీకరించుచున్నప్పటికంటే మునుముందే ఉన్న ముఖ్యాశయమును (The objective at the Point of Birth) ఏమరచుటచేతనే, ఆత్మ దృష్టి మరుగున పడుచున్నది. మమకార-అహంకార సంబంధమైన, అనేక బాహ్య భావావేశములు ఆత్మస్వరూపుడగు ఈ జీవుని నిబద్ధుని చేయుచున్నాయి.

దేవతలు : మహాత్మా! ప్రజాపతి భగవాన్! అవును! దేహాత్ములము, జీవాత్ములము అగు మేము జీవ-దేహభావ బద్ధులమై అనేక దుఃఖపరంపరలకు లోను అగుచున్నాము. అజ్ఞానము చేత జనించిన ఆశా-నిరాశా- మమకారాహ్రాంతి పాశములలో నిబద్ధులమగుచున్నాము. ఆత్మదృష్టికై విద్యార్థిత్వమును ఏమరచుచున్నాము. జీవులు ఆత్మదృష్టి - భావనలను ఆశ్రయించు విధి విధానముల గురించి, పరబ్రహ్మతత్త్వము గురించి, దయతో సవివరించ ప్రార్థన!

ప్రజాపతి : చెప్పుచున్నాను వినండి.

ఈ జీవుడు తాను ఇంద్రియములను ప్రవర్తింపజేయుచున్నప్పుడు క్రమంగా ‘‘నావి - నా పేరు ప్రతిష్ఠలు - నా వ్యవహారములు - నా పుత్రులు - నా గృహాది సంపదలు - తదితరుల కంటే నా యొక్క ప్రత్యేకతలు - నాకు సంబంధించిన ఆయా ప్రాపంచక విషయాలు.. ఇవన్నీ నాకు సొంతమై ఉన్నవి’’.. అనే మమకారము రూపుదిద్దుకుంటోంది. ‘‘బంధుమిత్ర పరివార సమేతంగా వీటన్నింటికీ నేను సంబంధించినవాడిని. ఇవన్నీ నాకు చెందినవి’’ - అనే అహంకారము స్థూలమగుచున్నది. ఇవన్నీ అనేక జన్మల అభ్యాసముచే ఘనీభూతమై, ఎప్పటికప్పుడు క్రొత్త క్రొత్తగా చిగురిస్తూ ఈ జీవుని పట్టిపీడిస్తున్నాయి. అట్టి మమకార-అహంకారములకు సంబంధించిన విషత్వము తొలగటానికి, ‘అమృతత్వము’ వైపు త్రోవచేసుకోవటానికి ఆత్మవేత్తలగు మునులు ‘సన్న్యాస మార్గము’ అను ఒకానొక సంప్రదాయమును సూచించుచున్నారు.

అద్దాని గురించి ముందుగా, కొన్ని విశేషాలు చెప్పుచున్నాను. వినండి.

సన్న్యాస విధి

‘సన్న్యాస ఆశ్రమము’ స్వీకరించుచున్నవాడు మొట్టమొదట శిఖను (పిలకను), శిరస్సుపై కేశములను (వెంట్రుకలను) త్యజించాలి. ఆ తరువాత ఉపనయన సంస్కార సంజ్ఞ అయినట్టి ‘యజ్ఞోపవీతము’ను కూడా త్రెంచునుగాక! (సన్న్యాసవిథులలో భాగముగా) తన కుమారుని పిలిచి ఇట్లు పలకాలి! (ఇది పరమాత్మ స్థానమునుండి - జగన్నాటక అంతర్గతమైన (స్వకీయ స్వీకృత) ‘జీవాత్మ’-అను పాత్రధారుని సంబోధించు విధానమని కూడా విజ్ఞుల అన్వయము).

సన్న్యసించబోవువాడు → కుమారుని సంబోధనము:

కుమారా!
→ ఈ సర్వము బ్రహ్మమే! కనుక త్వం బ్రహ్మ! నీవు బ్రహ్మమువే! (అంతేగాని నాకు కుమారుడమాత్రుడవు, కావు).
→ నీవు సృష్టికర్తవు. ఒకడు స్వప్నమును కల్పించుకొని, కొనసాగించి, ఉపసంహరించుకొంటున్న తీరుగానే, స్వయం పరబ్రహ్మస్వరూపుడవగు నీవు బ్రహ్మాండముల సృష్టి -స్థితి-లయ కల్పనా సామర్థ్య సంపన్నుడవు.
→ యజ్ఞ స్వరూపుడవు : ఈ సృష్టి అనే మహాయజ్ఞ కార్యక్రమమంతా ఆత్మవగు నీ ప్రదర్శనా చమత్కారమే!
→ త్వం వషట్‌కారః : నీవే → వాత్సల్యము - భవ శోషణము - ఉదారత్వము - అభయ ప్రదానము - ఆపత్కాల సంరక్షణము - అక్షయపదము.. అను ‘6’ గుణములు గల ‘విష్ణువు’వు.

దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారములకు కర్తవు (ఆత్మవు) కాబట్టి కూడా వషట్‌కారుడవు.

త్వం ‘ఓం’కారః → ‘అ’ కార + ‘ఉ’ కార - ‘మ’ కార స్వరూపుడవు. జాగ్రత్-స్వప్న-సుషుప్తి ప్రదర్శనశీలుడవు.
అ+ఉమ= పురుష + ప్రకృతి స్వరూపడవు. కర్త + కర్మ + క్రియా స్వరూపుడవు.
ఇహ + పర + పరాత్పర స్వరూపుడవు. అందుచేత నీవు ‘ఓం’కార స్వరూపుడవు.

త్వగ్ం స్వాహా : దేవతలకు యజ్ఞములో సమర్పించు హవిస్సుల స్వరూపుడవు. ఈ సర్వము సమర్పణము చేయుచున్న స్వాహా రూపుడవు. మనోరూపుడవు. (దేవతలకు ‘స్వాహా’ శబ్దము చెప్పుచూ సమర్పిస్తాము)

త్వగ్ం స్వధా: పితృ దేవతలకు సమర్పించు తర్పణముల స్వరూపుడు. భౌతిక రూపుడవు. (పితృదేవతలకు ‘స్వధా’ శబ్దము చెప్పుచూ సమర్పిస్తాము). ‘‘అహమ్ బ్రహ్మ-అన్నం బ్రహ్మ-భోక్తాచ బ్రహ్మ’’.. అను మంత్రములో బ్రహ్మమువు.

త్వం ధాతా : ఈ సృష్టిని ధరించు - సంరక్షించువాడవు. సృష్టికి కర్తవు. బ్రహ్మవు!

త్వం విధాతా : ఈ సృష్టిని నియమించువాడవు. సర్వ నియామకుడవు. విశ్వస్వరూపుడవు. ఇద్దాని అనుభూతి-అనుభవము - అంతా నీ నిర్వచన చమత్కారమే!

త్యష్టా త్వమ్ : ఈ విశ్వమునకు నిర్మాణకర్తవు. (Engineer), విశ్వకర్మవు. విశ్వస్వరూప రచన చేయు రచయితవు (The worker of the Universe).

ప్రతిష్ఠా అసి : విశ్వరూపుడవు. ఈ విశ్వముగా ప్రతిష్ఠితుడవై ఉన్నట్టి వాడవు.

ఓ కుమారా! మమాత్మవు - సర్వాత్మకుడవు అయి ఉన్న నీవు ఆత్మగా ఈ ఈ విలక్షణ లక్షణ సమన్వితుడవు! ఔను కదా!
ఇప్పటివరకు గృహస్థుడై.. ఇక ఇప్పుడు సన్న్యసించుచున్న సన్న్యాసాశ్రమాభిలాషి చెప్పు పై వాక్యములను ఆతని కుమారుడు ‘సన్న్యాసాశ్రమ విధి’ని అనుసరించి, ‘‘ఆత్మావై పుత్రః’’ అను వాక్యార్థము విని, ఎరిగి ఇట్లు బదులు పలుకుచున్నాడు.

సన్న్యసించబోవువానియొక్క కుమారుని ‘‘ప్రతి స్పందనము’’ :

‘‘అవును! నేను బ్రహ్మమును! నేను ఈ సృష్టియజ్ఞ స్వరూపుడను! నేను వషట్‌కారుడగు విష్ణువును! ‘ఓం’కారస్వరూపుడను! అగ్ని యొక్క పత్ని (ధర్మము) అగు ‘స్వాహా’ స్వరూపుడను! దేవతా సమర్పితుడను! పితృదేవతల ధర్మమగు ‘స్వథా’ స్వరూపుడను! సృష్టికి కర్తృత్వము వహించుచున్న ‘ధాత’ను. సృష్టి నియామకుడనగు విధాతను (బ్రహ్మను) కూడా! ఇంకా, సృష్టికి భౌతికరూపము రచించుచున్న త్వష్ట (విశ్మకర్మ)ను! సృష్టి రూపముగా, సృష్టిధర్మముతో కూడి ప్రతిష్టితుడనై ఉన్నవాడను.
(ఆత్మయే సహజ స్వరూపముగా కలవాడను కనుక పై విశేషణములు కలవాడను! ఆ విశేషణములు నా స్వస్వరూపమునకు యుక్తి-యుక్త వర్ణనయే!’)’

ఈ విధంగా సన్న్యాస విధి ముముక్షువులచే వ్రతముగా స్వీకరించబడుచున్నది. ఈ రీతిగా సన్న్యసించువాడు పై విధముగా పలుకుచూ కంటతడి పెట్టరాదు. బాధపడుచూ (నైరాశ్యము - తామసికమైన విరక్తిలతో) సన్న్యసించరాదు. ‘‘నేను మహత్తరమైన ఆశయముతో సన్న్యాసాశ్రమమును ఆశ్రయిస్తున్నాను’’.. అను రూపంగా ధృతి-ఉత్సాహము కలిగి ఉండాలి.

ఎవ్వరైతే కంటతడిపెట్టుచూ (శ్మశాన వైరాగ్యముతో గాని, ‘ఏదో పోగొట్టుకొనుచున్నామే! వదలుచున్నామే!’’ అనే వ్యథతో గాని) - సన్న్యసిస్తారో,… అట్టి వారు తమ సంతానమును (భార్య-పుత్రులు మొదలైనవారిని) బాధించినవారు అగుచున్నారు. ఇతః పూర్వపు ఆశ్రమఫలములను విచ్ఛిన్నము చేసుకొన్నవారే అగుచున్నారు గానీ, త్యజించినవారు అవరు. త్యాగఫలము సిద్ధించదు. అందుచేత సాత్త్విక వైరాగ్యశీలురై, వివేకులై సన్న్యసించెదరుగాక!

ఈ విధంగా ‘సన్న్యాసవ్రత సమాప్తి’ అయిన తరువాత కుటుంబ సభ్యులకు ఆత్మభావనతో ప్రదక్షిణము ఆచరించి, ఇక వెనుకకు చూడకుండా ఆ స్థలమును సన్న్యాసిగా త్యజించి అక్కడి నుండి కదలివెళ్లిపోవాలి. ఎవ్వరైతే ఈఈ శాస్త్ర విధులను అనుసరిస్తూ సన్న్యాసాశ్రమము స్వీకరిస్తారో, అట్టివారు ఉత్తమ (స్వర్గాది) లోకమును పొందగలరు. ఊర్ధ్వ లోకములకు అర్హులగుచున్నారు.

⌘⌘⌘

దేవతలు : అట్టి ‘‘మమకార-అహంకార-రాగ-ద్వేష-సంసారబంధ-త్యాగరూపమగు సన్న్యాసమార్గమునకు అర్హమగు సమయము ఎట్టిదో- (what is proper and appropriate time?) - దయచేసి వివరించండి. ఏఏ స్థితుల తరువాత (After what phases and practices) మానవుడు సన్న్యసించవచ్చును?

బ్రహ్మచారి దీక్ష

ప్రజాపతి :
మొట్టమొదట ఈ జీవుడు - ‘‘నేను సంసారబంధము నుండి విముక్తుడను అగుటకై ఈ ‘మానవ జన్మ’ అను సుదుర్లభమైన మహత్తర అవకాశమును సద్వినియోగపరచుకొనెదను గాక’’.. అను మహదాశయమును హృదయంలో సారూప్య పరచుకొనునుగాక! అప్పుడిక వేదములు చెప్పు పద్ధతి (వేదోక్తము)ని అనుసరించుచూ, ‘బ్రహ్మచారీ ఆశ్రమము’ను స్వీకరించాలి. అనగా, ‘‘బ్రహ్మవిద్యను నేర్చెదనుగాక!’’ అని నిర్ణయించుకొని అధ్యయన విద్యార్థి అగునుగాక! అటుపై ఆచార్యుల వారిని (గురువును) ఆశ్రయించునుగాక! వేదోక్తంగా జీవిస్తూ వేదపఠనము, వేదముల అధ్యయనము నిర్వర్తించునుగాక! ఆ విధంగా గురుబోధలచే, శాస్త్ర పరిశీలనచే స్వవిచారణ పూర్వకంగా బ్రహ్మవిద్యను నేర్చుకోవాలి. బ్రహ్మము అనగా ఏమో, ఈ జగత్తు యొక్క స్వరూపమేమిటో, జాగ్రత్-స్వప్న-సుషుప్తుల సంచాలకుడు సంచారుడు అగు తానెవ్వరో, బ్రహ్మముతో గల జగత్-జీవాత్మల అభిన్నత్వము ఎట్టిదో.. ఇవన్నీ గురుముఖతః అభ్యసించి బ్రహ్మజ్ఞానమును సముపార్జించుకోవాలి.

గృహస్థాశ్రమము

ఆ విధంగా బ్రహ్మచారి వ్రతమును సంపూర్తి చేసుకొని, వేద-వేదాంగముల మహత్ అర్థమును హృదయస్థము చేసుకొన్న తరువాత ‘గురు అనుజ్ఞ’తో గృహమునకు వచ్చి, తల్లి- తండ్రుల అంగీకారముతో వివాహము చేసుకోవాలి. గృహస్థాశ్రమము స్వీకరించాలి. వేద విధులను అనుసరిస్తూ ధర్మ-అర్థ-కామమోక్షములను సేవిస్తూ.. సంతానమును పొందాలి. ఆ సంతానమును (కుమార్తె-కుమారులను) వివాహ విధితో కలపాలి. పెళ్ళిళ్లు చేయాలి. అప్పుడిక తగిన సమయంలో గృహస్థాశ్రమమును త్యజించి సన్న్యాసాశ్రమమునకు సంసిద్ధుడు కావచ్చును.

సన్న్యాసాశ్రమము

సన్న్యాసాశ్రమం స్వీకరించు ముముక్షువు గృహస్థమగు ధర్మములను సమీక్షించుకొని, ముగింపుచేసుకొని, బాధ్యతలను సంతానమునకు చేతికివ్వాలి. ముందుగా యథాశక్తి గృహస్థ ధర్మములుగా చెప్పబడిన యజ్ఞములను లోకకల్యాణార్ధమై నిర్వర్తించాలి. అటు తరువాత సన్న్యసించటానికై గురువుల యొక్క, ముఖ్యబంధువుల యొక్క (భార్య-పుత్రులు - తన తరువాత కుటుంబ పరిరక్షకులు మొదలైనవారి యొక్క) అనుజ్ఞను తీసుకొని.. అప్పుడు సన్న్యసించాలి. (గురుభిః అనుజ్ఞాతశ్చ, బాంధవైశ్చ।)

సో అరణ్యం పరేత్య ద్వాదశరాత్రం పయసా అగ్నిహోత్రం జుహుయాత్। అప్పుడు ఇక అరణ్యంలోగాని, ఏకాంత ప్రదేశంలోగాని ప్రవేశించాలి. 12 రాత్రులు పాలతో అభిషేకము చేస్తూ, అగ్నిహోత్రమునకు హోమములు సమర్పిస్తూ సన్న్యాసవ్రత దీక్ష స్వీకరించాలి. ముముక్షువు ఆ 12 రాత్రులు ‘పాలు’ మాత్రమే స్వీకరించు నియమమును పాటించుచున్నారు.

12 రాత్రుల తరువాత…,

అగ్నిని, వైశ్వానరుని, ప్రజాపతిని వేదమంత్రములతో ఉపాసిస్తూ… యజ్ఞపరికరములను అగ్నిదేవునికి సమర్పించాలి. అగ్నిని, ప్రాజాపత్యమును, వైష్ణవమును ఉపాసిస్తూ… యజ్ఞములో ఉపయోగించిన త్రిముఖదారు (కొయ్య) పాత్ర, వస్త్రములు మొదలైనవాటిని అగ్నిగుండములో వేయాలి. మట్టిపాత్రలను తడిపి మట్టిలో కలిపివేయాలి. లోహపాత్రలను గురువులకు, యాజ్ఞీకులకు సమర్పించాలి.

అప్పుడు ‘‘గార్హపత్యాగ్ని-అహవనీయాగ్ని-దక్షిణాగ్ని’’ అని పిలువబడు త్రి-అగ్నులను వ్రేల్చిన 3 ప్రదేశముల నుండి గుప్పెటతో (ముష్టితో) భస్మమును చేతికి తీసుకొని..,

‘‘ఓ యజ్ఞ భస్మమా! మా త్వం మామ్ అపహాయ పరాగాః। న అహం త్వాం అపహాయ పరాగామ్ ఇతి। మీరు నన్ను విడచి ఎప్పుడూ ఎటూ వెళ్లకండి. నేను మిమ్ములను విడచి ఎటూ వెళ్లను’’

అని పలుకుచూ స్తుతించాలి.

‘‘అరణిలో ఆ భస్మమును ఉంచి నీటితో చేర్చి మంత్రమును ఉచ్ఛరిస్తూ త్రాగాలి’’… అని కొందరు యజ్ఞవేత్తలు విధి-విధానముగా చెప్పుచున్నారు.

⌘⌘⌘

→ అప్పుడు ఇక శిఖ కేశములను (పిలక-జుట్టులను) తీసివేయించాలి.
→ ఉపనయన క్షణముల నుండి ధరిస్తూ వస్తున్న ఉపవీతమును (ప్రత్తిధారముతో నిర్మితమైన బ్రహ్మముడితో కూడిన ఉపనయన ధారపు పంక్తిని) త్రెంచివేయాలి.
‘భూస్వాహాయేతి’ అని పలుకుచూ ఆ యజ్ఞోపవీతమును నీటితో భూమిలోనికి హోమముగా సమర్పించాలి.

అత ఊర్ధ్వమ్, అనశనమ్, అపాంప్రవేశమ్, అగ్ని ప్రవేశమ్, వీరాధ్వానం మహాప్రస్థానం, వృద్ధాశ్రమమ్ వా గచ్ఛాత్!
అప్పుడు నీటిలో ప్రవేశించాలి. (స్నానాదులు చేయాలి). అగ్నిలో ప్రవేశించాలి. (అగ్నిని చేతులతో స్పృశించాలి) వీరా ధ్యానముతో మహాప్రస్థానము చేయాలి. (సన్న్యాస దండముతో అక్కడి ప్రదేశమును త్యజించి బయల్వెడలాలి). వృద్ధాశ్రమమును చేరుకోవాలి. ఇక ఆపై ఆహారమునకు సంబంధించిన నియమ-నిష్ఠలు పాటిస్తూ ఉండాలి.

4 ఆశ్రమవాసులు సర్వదా నిర్వర్తించవలసిన మహాప్రస్థాన దీక్ష :

అంతేకాదు.

సన్న్యాసి → ఈ దేహమును ఒక ‘యజ్ఞవాటిక’గా భావిస్తూ ఆహార పదార్థములను ‘హోమద్రవ్యములు’గా భావిస్తూ ఉండును గాక.

ఆయా నియమములు ‘4’ ఆశ్రమములవారికి (‘మనుధర్మము’ చేతను, ‘ఋగ్వేదము’ చేతనూ) నియమించబడినవి. సన్న్యాసాశ్రమం స్వీకరించువారు చేయు హోమముల గురించి వినండి.

సాయగ్ం పయసా హోమము: సాయంత్రము ‘పాలు’ మాత్రమే స్వీకరించు నియమమును ‘సాయగ్ం పయసహోమము’ అని అంటున్నారు.

ప్రాతః పయసా హోమము : ప్రాతః కాలములో మాత్రమే ‘పాలు’ స్వీకరించు నియమమును ‘ప్రాతః పయస హోమము’ అని పిలుస్తున్నారు.

దర్శన హోమము : అమావాస్యనాడు ‘క్షీరము (పాలు)’ మాత్రమే స్వీకరించు నియమమును ‘దర్శనము’ అని చెప్పుతారు.

పౌర్ణ మాస్యము : పౌర్ణమిరోజు క్షీరము మాత్రమే త్రాగు నియమమును ‘పౌర్ణమాస్య హోమము’ అని అంటారు.

తదితరములైన నియమ - నిష్ఠలు

→ వసంతకాలంలో మాత్రమే జుట్టును - గడ్డమును - గోరులను - మీసమును క్షవరము చేయించుకొనువిధిని పాటించాలి.

→ సన్న్యసించిన తరువాత మరల అగ్నిని గ్రహించరు. సన్న్యాసికి అగ్నికార్యనియమములు ఉండవు. అగ్నికి సంబంధించిన అగ్నిష్టోమ హోమము మొదలైనవి సన్న్యసించిన వానికి ఉండవు.

→ యన్ముత్యుంజయమావహమ్ : ‘మృత్యుంజయము’ అనే ఆత్మబుద్ధిరూప ఆవహనీయాగ్నికి నేను చేయు సర్వకార్యములను, సర్వప్రాణ-మనో-బుద్ధి-చిత్త-దేహ-దృశ్య వ్యాపారములను అనుక్షణమూ సమర్పించుచూ ఉన్నాను → అని మంత్ర - మంత్రార్థములను అనువర్తిస్తూ ఉండాలి.

→ అనన్యత్వము : ‘‘స్వస్తి సర్వ జీవేభ్య’’.. సర్వ జీవరాశులకు నావలన స్వస్తి (శుభ-శాంతి-ఐశ్వర్య-ఆనందములు) కలుగునుగాక… అని పలుకుతూ, సర్వ సహజీవులను స్వస్వరూపాత్మరూపులుగా, స్వా-త్మకు అనన్యముగా భావిస్తూ ఉండాలి. చేతులెత్తి ‘‘స్వస్తి సర్వ జీవేభ్య’’.. అని పలుకుచూ ఈ దృశ్య జగత్తులో సంచరించునుగాక!

→ ‘అని కేతః చరేత్’ - ఇల్లుయో, గుహయో, వీధియో, గుడియో… ఏదైనా సరే ‘‘ఇది నా నివాస స్థలము.. నాది’’.. అనునది ఏదీ కించిత్ కూడా ఆతని పట్ల ఏ మాత్రమూ ఉండకుండునుగాక!

→ ‘‘నేను వీరికి ఇది ఇస్తున్నాను’’ అనునదేమీ కొంచము కూడా భావించకుండునుగాక! లవలేశము కూడా ‘‘నేను ఇతరులకు ఇస్తున్నాను’’ - అను భావన కలిగి ఉండకూడదు. ‘‘సర్వము ఆత్మయే అయి ఉండగా, ఇచ్చువాడు - ఇవ్వబడునది - ఇవ్వబడుచున్న వాడు (స్వీకరించువాడు) - సర్వమూ అఖండాత్మ స్వరూపమై ఉన్నది! ఎవ్వడు ఎవ్వడికి ఏదీ ఇచ్చుట లేదు. ఎవ్వడు ఎవ్వడి నుండి ఏదీ స్వీకరించటమూ లేదు’’.. అను సర్వాత్మ-అఖండాత్మ భావనను పరిపోషించుకొనుచుండునుగాక!

→ జంతువుల నుండి, కీటకముల నుండి, వర్షము నుండి రక్షణకు ఎంత అవసరమో, అంత వరకే పరికరములు, వస్తువులు కలిగి యుండునుగాక! అంతకుమించి దాచుకొనకుండునుగాక!

యతి గురించి శ్లోకార్థ గానము ఈ విధంగా ఉన్నది

→ ఒక కుండపైగాని, చమక పాత్రపైగాని, ఉట్టిపైగాని, త్రిపివిష్టపము (3-మూతలు కొమ్ము చెంబు) పైగాని, బొంతపైగాని, కౌపీనముమీదగాని, పవిత్రము (దర్భముడి)పైగాని, స్నానశాటి (స్నానము చేయటానికి ఉపయోగించు రంగు ఉత్తరీయము)పై గానీ, పైబట్టమీదగాని, యజ్ఞోపవీతముపైగాని, వేదములపైగాని.. యతికి మమకారము, ఇష్ట-అయిష్ట భావన, అవినాభావన.. ఉండదు. యతి అవన్నీ త్యజించియే, ఆయా సందర్భములలో - సందర్భోచితంగా కలిగి ఉంటాడు, త్యజించి వేసి ఉంటాడు కూడా! ‘‘నాది - నాకుండాలి- లేకుంటే ఎట్లా?’’.. అనునది వాటి వేటిపట్లా కూడా యతికి ఉండదు.

→ పవిత్రమైన స్థలములలో మాత్రమే స్నానము, పానము, ఆహార స్వీకరణ.. ఇటువంటివి నిర్వర్తించాలి. స్నానం పానం తథా శౌచం అద్భిః పూత అభిరాచరేత్! అపవిత్రమైన స్థలములలో నిలువరాదు. అపవిత్రజలములో స్నానము చేయరాదు.

→ నది ఒడ్డున గాని, ఇసుక ప్రదేశములోగాని, దేవాలయ ప్రాంగణములలోగాని నిదురించాలి.

→ యతులు ఈ భౌతిక దేహమును సుఖ-దుఃఖ విషయములచేతగాని, వస్తుజాలముచేతగాని ఏ మాత్రము తపింపజేయరు.

→ వారు తమను స్తుతించేవారిని (పొగిడేవారిని) చూచి సంతోషపడరు. - తిరిగి పొగడరు. దూషించేవారిని చూచి శపించరు. ‘‘అంతయూ ఆత్మవిన్యాసమే’’ అను ఎరుకచే సుదృఢులై ఉంటారు.

→ ఏ మాత్రము బద్ధకించనివారై, సర్వదా - సర్వ సందర్భములలోను బ్రహ్మచర్యమును (బ్రహ్మము నందే చరించుచున్న భావమును) పాటిస్తూ ఉంటారు.

మైథున అష్టాంగములు :
(1) దర్శనము (కామదృష్టితో -కామసంకల్పముతో చూడటము)
(2) స్పర్శనము (తాకటము)
(3) కేళీ (సరసములు) -
(4) కీర్తనము (భౌతిక దేహవిభాగములను స్తుతించటము)
(5) గుహ్య రహస్యభాషణము (శృంగారపు మాటలు మాటలాడటము) -
(6) సంకల్పములతో కూడి సరసయత్నములు
(7) అధ్యవసాయము (ధ్యాస)
(8) క్రియానిర్వర్తనము..

ఈ ‘8’ కూడా ‘మైధున అష్టాంగము’ అని చెప్పబడుతోంది. ఇవి భౌతిక - లౌకిక- దృశ్యమాన దృష్టులను ప్రవృద్ధము చేసి,… ఆధ్యాత్మిక దృష్టిని (అఖండాత్మ దృష్టిని) కప్పి ఉంచుచున్నాయి.

అందుచేత మోక్షము (ఆత్మజ్ఞానము-సర్వాత్మత్వము) ఆశయముగా కలిగి ఉన్నట్టి ముముక్షువు వీటిని త్యజించి సుదూరముగా ఉంచుచున్నాడు. అట్టి అతీత (విపరీత) సంప్రయత్నము - ‘బ్రహ్మచర్యము’గా - చెప్పబడుచున్నది. సర్వాత్మభావనయందు అనునిత్యుడై ఉంటాడు.

దేవతలు : పితృదేవా! జగద్గురూ! జగత్ కల్యాణమూర్తీ! ప్రజాపతిదేవా! ‘సర్వాత్మత్వము’ అనగా ఏదై ఉన్నదో వివరించవలసినదిగా మా విన్నపము.

సర్వాత్మత్వముతో మమేకము

→ ఏదైతే ఈ జగత్తు నంతటినీ భాసింపజేయుచున్నదో, జగత్ భావమును ప్రదర్శించుచూ వెలిగించుచున్నదో, (That which is enlightening all this being seen with pancha - indrias), - యత్ జగత్ భాసకమ్..,
→ ఏదైతే పంచేంద్రియ జగత్తుగా భాసిస్తోందో (That which is being experience as pancha - Indria scenary) భాసమ్..,
→ ఏదైతే స్వయముగా స్ఫురణ రూపముగా నిర్మలాకృతి అయి వెలుగొందుచున్నదో, భాసించుచున్నదో (That which is enlighting by itself whithout dependence on anything outside else).. నిత్యమ్ భాతి స్వతః స్ఫురత్..,
స ఏవ జగతః సాక్షీ సర్వాత్మా విమలాకృతిః। అదియే.. జగత్ కేవల సాక్షి! (That is a mere witness to all being experienced). అదియే విమలాకృతియగు ఆత్మ! అద్దాని పరమ-ఔన్నత్య స్థానమే ‘‘సర్వాత్మత్వము’’.

‘‘నేను జీవాత్మ-దృశ్య పరిమితుడను కాదు. సర్వ దేహములలో వెలుగుచు, సర్వ దేహములుగా ప్రకాశించుచున్న సర్వాత్మస్వరూపుడను’’ - అనునదే సర్వాత్మత్వము.

అట్టి ఆత్మ….,
సర్వదేహములలో, సర్వజీవులలో ‘‘ఘనీభూతము-కేవలము’’ అగు ‘ప్రజ్ఞ’గా ప్రతిష్టితమైయున్నది.

దేవతలు : హే సద్గురూ! ప్రజాపతీ! సర్వాత్మకము-కేవలము అగు ఆత్మయే స్వస్వరూపముగా కలిగియున్న ఈ జీవునికి అట్టి సహజానంద స్వస్వరూపము తెలియుటకు మార్గమేది? ఈ జీవుడు ఏఏ కర్మలు నిర్వర్తించుటచే అట్టి బ్రహ్మతత్త్వమును సముపార్జించుకోగలుగుతాడు?

ప్రజాపతి : అట్టి ‘‘సర్వదేహములలో సర్వదా అనునిత్యముగా వెలుగొందుచున్న ఆత్మస్వరూపుడను నేను’’ అను ‘‘బ్రహ్మభూతత్వము’’ను లేక ‘‘పరబ్రహ్మము’’ను ఎవ్వడూ కూడా…,

మరింకేదో తపస్సు - ప్రాణామాయము మొదలైన ఆయా తదితరముల చేత కూడా పొందలేడు.
మరి? బ్రహ్మవేదన మాత్రేణ బ్రహ్మ ఆప్నోతి ఏవ మానవః। బ్రహ్మము గురించి ఎరుగట చేత మాత్రమే బ్రహ్మము పొందబడుచున్నదగుచున్నది.

బ్రహ్మమును ఏమని తెలుసుకోవాలి?

సత్యమ్। జ్ఞానమ్। సుఖము। → ఉనికి-ఎరుక-అనుభూతి… అద్దాని లక్షణములై ఉన్నాయి.

అద్వయమ్ : అద్దానికి ద్వితీయమైనదంటూ ఏదీ లేదు. ఈ జీవాత్మ - జగత్తులు, ద్రష్ట-దృశ్యములు, భావించువాడు- భావించబడునవి.. ఇవన్నీ ఆత్మస్వరూపములే! ఆత్మకు ద్వితీయమైనవి కావు. ఈ కనబడేదంతా స్వ-అనన్య అఖండాత్మయే!

సంసారము : సంసారేచ గుహావాచ్యే, మాయ-అజ్ఞాది సంజ్ఞికేః।
‘సంసారము’ అనునది ఒక కొండగుహలోని చీకటిలో ప్రవేశించటమువలె అనేక భయానక-భీభత్సక-విశేష-విషయ పరంపరలన్నీ అంతర్గతంగా కలిగియున్నట్టిది. అది ‘మాయ’, ‘అజ్ఞానము’ మొదలైన అనేక ఆయా సంజ్ఞలతో వర్ణించబడుతోంది. నిర్వచించబడుతోంది. ఆత్మత్వమును పట్టించుకోకుండా, జీవత్వ-దేహత్వ-సందర్భత్వ.. మొదలైనవాటిని పట్టించుకొనుచుండటమే ‘మాయ’.

పరమాకాశము : భూతాకాశమును, చిత్తాకాశమును ఆక్రమించుకొని, ఆరెండింటికి ఆవల భూత-చిత్తాకాశముల ప్రభవస్థానమై సర్వకారణ-కారణమైయున్నదే ‘పరమాకాశము’ అను ‘సంజ్ఞ’తో చెప్పబడుతోంది. అట్టి పరమాకాశ సంజ్ఞార్థమగు బ్రహ్మమును ఎవ్వరు తెలుసుకుంటారో,… అట్టి క్రమమును ఎరిగిన ద్విజోత్తముడు (one who becomes aware of the other side of all this) … సకల కామములు సిద్ధించుకొన్నవాడగుచున్నాడు. అట్టివానికి మరింకొకటేదో కోరుకోవటానికి శేషించి ఉండదు.

ప్రత్యగాత్మ: అజ్ఞానమునకు, మాయాశక్తికి కూడా కేవలసాక్షి అయి, సర్వమునకు అతీతమై ఉన్నదానికి ‘‘ప్రత్యగాత్మ’’… అని కూడా పిలుస్తున్నారు. ‘‘నేను మాయాశక్తికి, అజ్ఞానమునకు సాక్షి అగు ప్రత్యగాత్మను’’ అను ఎరుగటయే ‘‘బ్రహ్మైవాఽహమస్మి’’ అని తెలుసుకొన్నవాడవటము.

‘‘బ్రహ్మము అనగా ఇది’’ అని ఎరుగుటచే అట్టివాడు బ్రహ్మమే తానై ప్రకాశించుచున్నాడు. (బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి).

దేవతలు : అట్టి నిర్మల - సర్వాతీత-సర్వసాక్షి అగు ‘బ్రహ్మము’నందు ఈ ‘‘జీవుడు - జగత్ దృశ్యము’’ అనబడునవి, ‘మాయ-అజ్ఞానము’ మొదలైనవి ఎందుకు ఏర్పడుచున్నాయో, ఆ ఏర్పడుచున్న వరుసక్రమము ఏమిటో వివరించండి, ప్రభూ!

సర్వదా బ్రహ్మభూతాత్మనః

ప్రజాపతి : మట్టి బొమ్మలన్నిటికీ, వాటి వాటి వేరు -వేరు ఆకారములకు,… ఆ ఆకారముల నామరూపములకూ → మునుముందుగా మట్టియే ఉన్న తీరుగా (మృత్తికేవ సత్యమ్- అనురీతిగా),..
మొట్టమొదట, అటు తరువాత, ఇప్పుడు ఇంకెప్పటికీ ‘బ్రహ్మభూతాత్మ’యే ఉన్నది.

అట్టి ‘బ్రహ్మము’ (లేక) ఆత్మ సర్వశక్తియుతము. ఒక హస్తములో వస్తువును మోయగల శక్తి దాగి ఉన్నట్లుగా,… అట్టి బ్రహ్మము కేవలమై, అంతర్గత జగత్ కల్పనా శక్తియుక్తమై యున్నది. ఈ అనంతకోటి బ్రహ్మాండములను, అట్టి ప్రతిఒక్క బ్రహ్మాండములలో అనంతకోటి జీవులను స్వశక్తితో ధరించి ఉన్నట్టిదే బ్రహ్మము.

అట్టి ‘‘బ్రహ్మభూతాత్మ’’ నుండి శక్తితో మిశ్రితమై ‘‘అపంచీకృతాకాశము’ (Basic form) - రాయిలో శిల్పము వలె, బంగారములో ఆభరణము వలె.. ప్రదర్శితమగుచున్నది.

దేవతలు : ఆత్మ నుండి మొట్టమొదట బయల్వెడలిన అపంచీకృత ఆకాశము అనునది - ఆత్మకు (లేక) బ్రహ్మమునకు భిన్నమైనదా? అభిన్నమైదనా?

ప్రజాపతి : అభిన్నమైనదే! ఒక దృష్టాంతము చెప్పుతాను. వినండి.

ఒక అవిచారణ శీలుడు, ఆవేశపరుడు, పిరికివాడు అగు బాటసారి ఉన్నాడు. ఆతడు బాటలో ప్రయాణిస్తూ, ఒకచోట బాటలో ఒక చాంత్రాడు (నూతి నుండి పెద్దబొక్కెనతో నీరు తోడుటకు ఉపయోగించు త్రాడు)పై కాలు వేశాడు. అంతే"! ‘‘అయ్యబాబోయ్। పెద్ద త్రాచుపామును తొక్కాను। చచ్చాన్రోయ్।’’.. అని ఒక్కసారి పైకి ఎగిరి నేలపై కూలబడ్డాడు. భయముతో గజగజా వణకసాగాడు. నోటి నుండి పాము కరచినప్పుడు నురుగు రావటం అతనికి గుర్తుకు రాసాగింది. ఆ బాటసారికి త్రాడుయందు పాము కనిపించటము ఎటువంటిదో, కేవలస్వరూపమగు పరబ్రహ్మము (లేక) ఆత్మ యందు అపంచీకృత-ఆకాశము అట్టిదే!
→ అక్కడ ఉన్నది త్రాడే!
→ అట్లాగే అపంచీకృతాకాశముగా చెప్పబడుచున్నది, కనబడుచున్నది కూడా బ్రహ్మమే! ఆత్మయే!

ఈ విధంగా రజ్జుసర్పవత్ తస్మాత్ బ్రహ్మభూతః శక్తిమిశ్రితాత్ అపంచీకృత ఆకాశః సంభూతో। త్రాడులో కనిపించిన పామువలె ఆత్మయందు ‘శక్తి’తో కూడిన అపంచీకృత ఆకాశము (Matter concept with no bifurcated form accompanying the energy) సంభూతమగుచున్నది. అద్దాని గుణము శబ్దము.

➤ అట్టి ఆకాశము నుండి వాయువు. అద్దాని గుణము ‘స్పర్శ’,
➤ ఆ వాయువు నుండి అగ్ని! అగ్ని నుండి జలము (ద్రవము)! జలము నుండి భూమి (స్థూలము),
➤ ఈశ్వరశక్తిచే అపంచీకృతమైన సూక్ష్మభూతములు (ఆకాశ-వాయు-అగ్ని-ద్రవ-స్థూల-సూక్ష్మ తత్త్వములు),
➤ వాటి విషయముల సూక్ష్మతత్త్వములు (శబ్ద-స్పర్శ-రూప-రస-గంథ సూక్ష్మ తత్త్వము)గా - పంచీకృతము - ఇవన్నీ బయల్వెడలుచున్నాయి.
అట్టి ఈశ్వరుడగు శివుని చేతనే ఈ భౌతికంగా ఎదురుగా కనిపిస్తున్న బ్రహ్మాండమంతా సృష్టించబడుతోంది.

అట్టి ఈశ్వర నిర్మిత అపంచీకృతము నుండి పంచీకృతము చేయబడినట్టి బ్రహ్మాండము యొక్క గర్భములో ఆత్మసంకల్పముచే- మీరు(దేవతలు), దానవులు, యక్షులు, కిన్నెరులు, మనుష్యులు - పశుపక్ష్యాదుల దేహాలు నేను, ఇవన్నీ కర్మానుసారంగా నిర్మితము అగుచున్నాము.

భౌతిక శరీరము

ఆత్మ యొక్క శివసంకల్ప విశేష సంబంధమైన సూక్ష్మ భూతశక్తుల పంచీకృత విశేషం చేతనే జీవులందరి స్థూలదేహములు కూడా నిర్మితములు అగుచున్నాయి. అట్టి శివశక్తి సహిత పంచీకృత విశేషములే.. ఈ దేహములోని అస్థి (బొమికలు), స్థాయువు (మాంసము) - చర్మము - రక్తము మొదలైన ఆయా విశేషములన్నీ కూడా! ఈ విధంగా శివ సూక్ష్మపంచభూతతత్త్వమే (ఈశ్వరుడే). సర్వ శరీరములలో అనేక పదార్థములుగా ఏర్పడుచుండగా, అట్టి సర్వదేహములలో దేహి (The experiencer) గా అఖండ - దివ్య శివచైతన్యమే ప్రత్యక్షమై యున్నది.

పంచకోశములు

అన్నమయ ఆత్మ : యో ఆయమ్ అన్నమయోహి ఆత్మాభాతి సర్వ శరీరిణః। ఏకము - అక్షరము అగు ఈశ్వరుడు తన యొక్క చైతన్యస్ఫూర్తితో సర్వదేహములలో చర్మము-రక్తము-మాంసము- ఇంద్రియముల రూపంగా సర్వదా ప్రకాశించుచున్నారు. పరబ్రహ్మమే ఈ విశ్వములోను, ఈ భౌతిక దేహములోను కనిపించే సర్వభౌతిక విశేషాలను కల్పించటము, పరిపోషించటము, తానే అవన్నీ అగుచూ ఉండటము నిర్వర్తించుచున్నది. ‘‘స్వస్వరూప పరబ్రహ్మమే అన్నమయమై వెలయుచున్నది’’ … అను అవగాహనచే - భౌతికమైనదంతా (లేక) అన్నమయమైనదంతా - ఆత్మయొక్క అనన్యమగు ఒకానొక అంశ అగుచున్నది. ఒకే అన్నమయాత్మ అనేక భౌతిక దేహములుగా అగుపిస్తోంది.

ప్రాణమయాత్మ: తతః ప్రాణమయో హి ఆత్మా విభిన్నశ్చ అంతర స్థితః। ఒకే బంగారు లోహము అనేక నామరూపములు గల ఆభరణములుగా అగుచున్నది. ఒకే విద్యుత్తు అనేక విద్యుత్ దీపములలో ప్రవేశించి అనేక రకములైన వస్తు జాతములపై వెలుగు రూపంగా ప్రసరిస్తోంది. ఒకే వాయువు అనేక ఆకారములు గల బూరలలో ప్రకాశించి అనేక ఆకారములకు కారణమగుచున్నది. అట్లాగే పరబ్రహ్మము యొక్క ఏకైక ప్రాణశక్తి అనేక అసంఖ్యాక దేహములలో ప్రాణముల-ప్రాణుల రూపముగా సంప్రదర్శితమౌతోంది. ప్రాణులు అసంఖ్యాకము కావచ్చు. అన్ని దేహములలో అఖండాత్మ యొక్క ప్రాణశక్తి సర్వదా ఏకమే! అనేకము కాదు. అదియే ప్రాణమయాత్మ. అన్నమయ ఆత్మలో ప్రాణమయాత్మ అంతరమున వెలుగొందుతోంది.

మనోమయాత్మ : తతో మనోమయో హి ఆత్మా విభిన్నశ్చ అంతర స్థితః। {అన్నమయాత్మకు వేరై అన్నమయాత్మయందు (Altogether different in the matter) ప్రాణమయాత్మ స్థితి కలిగి ఉన్నతీరుగానేఊ, ప్రాణమయాత్మకు అంతరమున వేరైన ప్రాణమయ విభాగంగా మనోమయాత్మ స్థితి కలిగి ఉన్నది. పరబ్రహ్మము యొక్క అఖండ మనోమయాత్మయే సర్వదేహుల మహామనోరూపమై, మనోమయాత్మకంగా ప్రవర్తమానమగుచున్నది. ఒకనాటకములోని అన్ని పాత్రల యొక్క మనస్తత్త్వములు ఆ నాటక రచయిత యొక్క కథాకల్పనా మనోరూపమే అయి ఉంటున్న తీరుగా,… సర్వదేహుల మనోమయ విశేషములన్నీ పరబ్రహ్మము యొక్క ‘‘మహామనోమయాత్మ’’గా ఆత్మజ్ఞులు దర్శించుచున్నారు.

విజ్ఞానాత్మ : తతో విజ్ఞానాత్మాతు తతో అన్యశ్చ అంతర స్థితాః।। అట్టి మనోమయాత్మకు అంతరమున, - మనోతత్వమునకు వేరైన ‘‘విజ్ఞానమయాత్మ’’ - స్థితి కలిగి ఉన్నది. ‘తెలివి’ రూపమున సర్వ అన్నమయదేహములలో ప్రాణమనో→అంతర్గతంగా విజ్ఞానమయాత్మ ప్రకాశించుచున్నది. ‘ఎరుగుట’ అనునది నిర్వర్తిస్తోంది.

ఆనందమయాత్మ : ఆనందమయాత్మాతు తతో అన్యశ్చ అంతర స్థితిః। అట్టి విజ్ఞానమయాత్మ యొక్క అంతరముగా విజ్ఞానమునకు వేరైనదిగా ఆనందమయాత్మ ఏర్పడినదై ఉన్నది. ఇది పంచభూతాత్మికమైన - దృశ్యసంబంధమైన-వస్తు సంబంధమైన అజ్ఞాన నిర్మితమైన ఆనందము.

కఠరుద్ర-ఉపనిషత్-పంచకోశాత్మక-బ్రహము

బ్రహ్మము : అట్టి (లోకసంబంధమైన) ఆనందమయాత్మకు ‘‘కేవల సాక్షి’’ అయి వేరుగా ప్రకాశించుచున్నదే పరబ్రహ్మము. బ్రహ్మ చైతన్యమే ఈ జీవుని వాస్తవ-సహజరూపము.

‘‘సాక్షి-ఆనందమయ-విజ్ఞానమయ-మనోమయ-ప్రాణమయ-అన్నమయ - జీవాత్మలన్నీ కూడా → అఖండం బ్రహ్మముతో (మట్టి బొమ్మలతో మట్టివలె) పూర్ణమై ఉన్నాయి. బ్రహ్మము వాటన్నిటికీ వేరై, వాటన్నిటి యందు నిండిఉన్నది. సర్వమునకు మూలపదార్థము (Raw-Material) అయి ఉన్నది. కనుక ఇదంతా ఆత్మానందమే!

⌘⌘⌘

ఓ దేవతలారా! ఎవ్వరైతే సత్య-జ్ఞానస్వరూపము, అఖండ-అద్వయాత్మకము అగు ‘‘బ్రహ్మపుచ్ఛము (బ్రహ్మతత్త్వమును)’’ ఎరుగుచున్నారో, అట్టివారు మాత్రమే వాస్తవమగు సుఖమును ఆస్వాదించగలరు. అన్యథా సుఖమెక్కడిది? లేనే లేదు. స్వస్వరూపాత్మను ఏమరచి, నేను కల్పించిన జగత్తులో సుఖముకై వెతకి ఏమిలాభం? ఆ తీరుగా వెతకటం - ఒకడు ఒక వస్తువును ఎక్కడో పోగొట్టుకొని, మారెక్కడో వెతకటము వంటిది - అగుచున్నది.

ఓ ముముక్షువులారా! మీరంతా ఒక్క ముఖ్య విషయము గమనించెదరుగాక! అసత్తగు ఈ దేహములందు ‘‘పరానందస్వరూపము - స్వస్వరూపాత్మభూతము- అఖిలాత్మకము’’.. అగు బ్రహ్మచైతన్యమే ఉండి ఉండకపోతే, జడమగు ఈ భౌతికదేహములు ఎట్లా జీవించగలవు? ఎట్లా తమకు తామే కదలగలవు? ఆత్మయొక్క ఉనికి చేతనే ఈ భౌతికదేహాలు స్వయంప్రతిపత్తితో జీవిస్తున్నాయి, కదలగలుగుచున్నాయి కూడా సుమా!

ఈ జీవుడు తన యొక్క అంతరాంతరమున సర్వాత్మకమగు పరబ్రహ్మముగా సర్వదా, సర్వే సర్వత్రా భాసించుచునే ఉన్నాడు! అయితే, ఈ జీవుడు ఎల్లవేళలా - ఏడ్చే పసిబాలుడిని తండ్రి సముదాయించుచుండుతీరుగా - జడము-దుఃఖసంకేతము అగు ‘జీవాత్మత్వము’ను సంతోషింపజేయాలనే ప్రయత్నములో నిమగ్నుడై దేహ-దేహాంతరములు పొందుచున్నాడు. అజ్ఞానుల దృష్టి ఈ రీతిగా ఉన్నది మరి!

ప్రాపంచక సుఖములు : పసిపిల్లవాడు మారాము చేస్తూ ఉంటే, ఏడుపు మానిపించటానికి మధుర పదార్థములేవో కొని తెచ్చి, చేతిలో పెట్టి, ఏడుపు ఆపించటము వంటివి మాత్రమే ఈ ప్రాపంచక సుఖములు. ఆ తండ్రి గారి గదమాయింపు వంటివి - ప్రాపంచక దుఃఖములు.

ఆత్మయోగి

మహామతి అగు ఆత్మయోగియో,…
→ దృశ్యములో ఒకానొక దృశ్య విషయము కానట్టిది, (అదృశ్యత్వము స్వలక్షణముగా కలిగి ఉన్నట్టిది),
→ సత్-చిత్-ఆనందలక్షణ సమన్వితమైనట్టిది,
→ భేదరహితమైనదైనట్టిది,
→ పరమాద్వైతమైనట్టిది,
అగు ‘‘స్వస్వరూపము’’ నందే సర్వదా రమిస్తున్నాడు. అంతేగాని దృశ్యమునందుకాదు. (న తేషు రమతే బుధః)

అట్టి ఆత్మదర్శనమే అభయస్థానము.

ఆత్మయొక్క ప్రతిబింబము వంటి జగదంతర్గతమగు జీవాత్మ స్వరూపమును సముదాయిస్తూ, ఇద్దాని - సుఖ-దుఃఖములు తొలగించాలనో, పాప-పుణ్యముల నుండి సముద్ధరించాలనో, అనుకోవటం వృథాప్రయాసయే - అని గమనించుచున్నాడు.

సమస్త భేదరహితమగు ఆత్మయందు రమించటమే అభయ-ఆనంద రూపమగు మార్గము. కల్యాణప్రదము. పరమ-అమృతరూపము.

అట్టి పరబ్రహ్మమునకు త్రిపదభేదము… లేనే లేదు. అనగా,
- భూత - భవిష్యత్-వర్తమాన → కాలభేదం,
- జీవ - ఈశ్వర - పరాత్మ → త్రిపుటి భేదము,
- సత్వ-రజో-తమో → త్రిగుణముల భేదము,
- జన్మ - జీవన్ - మృత్యు → త్రిదశల భేదము,
- ఇహము - పరము - పరాత్పరము → త్రిగతుల భేదము,
మొదలైన పరిచ్ఛేదమే → బ్రహ్మమునందు (లేక బ్రహ్మమునకు సంబంధితమై) ఉండజాలవు.

ఎంతెంత వరకైతే ఈ మానవుడు (లేక ఈ జీవుడు) - కొంచెము ‘భేదము’ అయినా చూస్తాడో,… అట్టివాడు భయమును అధిగమించలేదు. ‘‘ఆత్మకు రెండవది ఉన్నది’’.. అని తలచినంతకాలము అభయము సిద్ధించదు. (ఏకో అభయమ్ - ద్వితీయమ్ భయమ్ భవతి)

ఓ దేవతలారా! విష్ణు మాయావిలాసము యొక్క చమత్కారము అయినట్టి ఎక్కువ-తక్కువలు, అల్ప - అధికులు, సుఖ - దుఃఖములు, పుణ్య-పాపములు, బంధ-మోక్షములు మొదలైన ద్వంద్వములను తార-తమ్య భేద పూర్వకంగా ఆశ్రయించి, ఈ జీవుడు వాటియందు సుఖ-దుఃఖ రూప అశాంతిని పొందుచున్నాడు. నటుడి అభిరుచిని బట్టి నాటక సంఘటనలు రచించబడతాయా? లేదుకదా! ఈ జగత్ నాటకము జీవాత్మకు (నటునివలె) అంతే! నాటకంలో నటించే నటుడు, ‘‘నేను నటించువాడను’’ - అనునది ఏమరచి, ‘‘నాటకంలో సంఘటనలు ఇట్లాగే ఉండాలి కదా. అది అట్లా ఉండకూడదు కదా’’ - అని నాటక సందర్భములతో సుఖ-దుఃఖములు పొందటము వంటిదే ఈ జీవుని జగత్ సంబంధ సుఖ-దుఃఖములు.

ఆత్మానురక్తి

ఎవ్వని బుద్ధి అయితే - ఆయా దృశ్యములోని విషయముల పట్ల అనురక్తి (fondness) త్యజించుచూ, తనయొక్క తదితరులయొక్క ఆత్మతత్త్వము పట్ల అభిరుచి పెంపొందించుకొంటూ శ్రవణ-మననముల ద్వారా ఆత్మజ్ఞాన సమాచారము - ఆత్మభావనలను ఆశ్రయిస్తూ ఉంటుందో, అట్టి బుద్ధికలవాడు సుఖ-దుఃఖ ద్వంద్వ మోహములను క్రమముగా అధిగమించుచున్నాడు. బుద్ధి పవిత్రమగుచుండగా, అది స్వయముగా స్వస్వరూపభూత అఖండాత్మయందు భాసించుచున్నది.

అనగా, ఆతని బుద్ధి పరిమితము, సంకుచితము, కల్పనామయము, భ్రమ దాయకము అగు ‘ఇహము’ను అధిగమించి సర్వాత్మకమగు పరమునందు ప్రభాసిస్తోంది.

స్వరూపభూత ఆనందము - పరతత్త్వము

నిమిత్తం కించిత్ ఆశ్రిత్య ఖలు శబ్దః ప్రవర్తతే।

ఈ ప్రపంచములోని పదార్థములన్నిటినీ ‘శబ్దము’తో చెప్పవచ్చు. వినినవాడు ఆ శబ్దమును బట్టి - ‘‘ఇది వస్తువు! ఇది విషయము’’.. అని తెలుసుకొననూవచ్చు. మాటలతో చెప్పుకొని అర్థం చేసుకోగలవాటన్నిటికీ కించిత్ నిమిత్తకారణము ఉంటుంది. ఉదాహరణకు ‘మామిడిపండు’ అనగానే అద్దాని రంగు - రుచి-ఆకారము మొదలైనవి వెంటనే శ్రోతలో స్ఫురించి ‘‘మామిడిపండు అనగా ఇది’’… అని తెలుసుకొని, ఆ శ్రోత తిరిగి ప్రతిస్పందిస్తాడు.

‘ఆత్మ’ ‘బ్రహ్మము’ అను పేర్లతో పిలువబడే ఈ జీవుని యొక్క పరతత్త్వ స్వస్వరూపము శబ్దముతో చెప్పగానే చెప్పేవాడు చెప్పివేసినట్లూ కాదు. వినువాడు ‘తెలిసిపోయినది’ అని అనటానికి కుదిరేదీ కాదు.

నిమిత్తమైన భావాలు మనస్సుకు చెందినవి. ఆ మనస్సు ఎద్దానికి విషయమో, ఏది మనస్సుకు - వాక్కుకు ఉత్పత్తిస్థానమో,.. అద్దానికి (ప్రాపంచక వస్తువులవలె, విషయములవలె) నిమిత్తకారణమే లేదు. యతో వాచో నివర్తంతే నిమిత్తా నామ భావతః, నిర్విశేషే పరానందే కధం శబ్దః ప్రవర్తతే? ఎద్దానిని నిర్వచించి - ‘‘ఇది! ఇట్టిది! ఇంతటిది! ఇట్టి పరిమితములు కలిగినట్టిది! ఈ పరిధికి సంబంధించినది!’’ - అని వాక్కు పలుకజాలక, వెనుకకు మరలుచున్నదో, నిర్విశేష (విషయములకు సంబంధించని) పరతత్వమగు (ఇహమును అతిక్రమించినట్టి) ఆనంద స్వరూపమో, అట్టి ఆత్మతత్త్వము పట్ల ఏ శబ్దములు ఎంత వరకు ప్రవర్తిస్తాయి? ప్రవర్తించజాలవు. అయితే, అద్దాని గురించి బోధించుకోవాలంటే శబ్దములు అనివార్యము.

అద్దాని యొక్క సూక్ష్మతరమగు (Most subtle) మనస్సు (Thought process) యొక్క వ్యావృత్తి (Act of extending) వలననే ఈ ‘జగత్తు’ అనబడు దృశ్యవ్యవహారమంతా అద్దానికి స్వయంకల్పిత రచనగా అవస్థితమగుచున్నది. అనుభూతము అవుతోంది.

బ్రహ్మానందమ్ విదిత్వా స్వాత్మరూపేణ!

ఎద్దాని నుండి → చెవులు (శ్రోత్రము) - వినికిడి - వినబడునవి; కళ్లు (చక్షువులు)- చూపు- కనబడునవి; చర్మము- స్పర్శ - స్పృశ్యానుభావములగు విషయములు .. మొదలైన జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు,.. వాటి వాటి వ్యాపారములు .. ఇవన్నీ కూడా ‘వ్యావృత్తి’ (Extention of Avocation) రూపమున వెలువడుచున్నాయో…,
- ఈ ఆకాశము మొదలైన పంచభూతములు ఎద్దాని నుండి బహిప్రదర్శనము అగుచున్నాయో..,
- ఎద్దానిచే అవన్నీ కూడా ప్రవర్తింపజేయబడుచున్నాయో…
… అట్టి నిర్గుణ చిద్ఘన బ్రహ్మాందన స్వరూపమును తన యొక్క స్వస్వరూపమే అని ఎరుగుచుండగా..,
ఇంక ఆ యోగికి దేనిపట్ల భయం?

యస్మాత్ శ్రోత్ర - త్వక్-అక్ష్యాది ఖాది కర్మేంద్రియాణి చ, వ్యావృత్తాని పరం ప్రాప్తుం, నసమర్ధాని తానితు, తత్ బ్రహ్మానందమ్, అద్వంద్వమ్ సత్యచిద్ఘనమ్ - ఏ కర్మేంద్రియ-జ్ఞానేంద్రియ-పంచభూతాదులు, ఇవన్నీ తమ వ్యావృత్తిచే ఎద్దానిని చేరుకోలేవో, అదియే నిర్గుణ- ద్వంద్వాతీత - సత్యచిద్ఘన బ్రహ్మానందము. తత్ విదిత్వా స్వాత్మరూపేణ న బిభేతి కుతశ్చన। అట్టిది స్వస్వరూపము - అది ఎరిగిన తరువాత సర్వభయములకు లయస్థానము. అది అభయస్థానము! అట్టి ఆత్మానందము - ఇంద్రియములు వస్తువులను స్పృశించునప్పుడు ఏర్పడు - ఇంద్రియానందము వంటిది కాదు.

అట్టి నిర్విషయ పరమానందమే తన రూపముగా ఎరుగటయే ఆత్మసాక్షాత్కారము. ఆత్మదర్శనము. ఆత్మతత్త్వజ్ఞానము.
సత్‌గురు ఉపదేశములచే, సత్‌శాస్త్ర ప్రవచనములచే, స్వవిచారణచే అట్టివాడు పాప-పుణ్య కర్మల పరిధులను దాటివేస్తాడు. ఇక ఆపై, తానే ఈ సర్వమును ‘‘తపింపజేయు-తపింపబడు’’ స్వరూపుడై సకల జగత్ స్వరూపముగా ప్రకాశమానుడగుచున్నాడు. సర్వజగత్ సాక్షి-కర్త-భోక్త తానే అయి సారూప్యుడై ఆనందించుచున్నాడు.

ఓ దేవతలారా!

అది ఈ జీవునికి సుసాధ్యమే సుమా! వాస్తవానికి, జన్మ యొక్క మహదాశయమే అది! అటువంటి ఆత్మానందము (లేక) కేవలీస్వరూప (లేక) కైవల్యము ప్రతి జీవునికి జన్మహక్కు.

ఈ ఈ మొదలైన ఉపనిషత్ ప్రవచితమైన పరాకాష్ట మహావాక్యములను పరమార్ధపూర్వకంగా మననము చేయుచుండగా, ఆతడు ప్రత్యగాత్మ (సర్వాత్మ కేవల స్వరూపుడు)గా రూపుదిద్దుకుంటున్నాడు. (అనగా) నిస్సందేహముగా ‘‘ఇదంతా నేనైన నేను’’గా ఎరుగుచున్నాడు.

దేవతలు : స్వామీ! ఈ జీవుడు పరమార్థమగు స్వస్వరూపాత్మతత్త్వమును సులభముగా ఎరిగి, దర్శించి, తదేకమగుటకు ఇంకా కూడా ఉపాయాలు దయతో చెప్పండి. వేదాంత శాస్త్ర విభాగములు ఉపయోగించు శబ్దజాల విశేషములను ముముక్షువు పఠించవలసిన తీరు గురించి కూడా వివరించమని అర్థిస్తున్నాము.

ప్రజాపతి : ఆత్మతత్త్వమును ఎరిగినట్టి కొందరు మహనీయులు అనిర్వచనీయమగు స్వస్వరూపాత్మను విశదీకరించి ప్రబోధించటానికై.. వ్యవహారికంగా సప్త (7) విభాగములుగా విభజనను కల్పించి చెప్పుచున్నారు.

(1) శుద్ధచైతన్యము (2) ఈశ్వరచైతన్యము (3) జీవచైతన్యము (4) ప్రమాత (5) ప్రమాణము (6) ప్రమేయము (7) ఫలము
‘‘స్వస్వరూపాత్మ’’ గురించి చెప్పుకోవటానికై ఈ ఏడిటిని ఇప్పుడు వివరించుకుంటున్నాము. వినండి.

(1) శుద్ధ చైతన్యము : మాయోపాధి వినిర్ముక్తం ‘శుద్ధమ్’ ఇతి అభిధీయతే। కేవలము, మాయా (కల్పన)కు మునుముందే సర్వకల్పనా రహితము అగు స్వస్వరూపమును ‘శుద్ధము’ అని పిలుచుచున్నారు. అద్దానికి ఈవల జీవాత్మ-జగత్తులు అద్దాని కల్పనగా భాసిస్తున్నాయి. శుద్ధచైతన్యమునకు ఆవల మరింకేమీ లేదు. సర్వ కల్పనలకు వేరుగా ఉన్నట్టి స్వస్వరూపమే ఆ శుద్ధ పరబ్రహ్మము. ఇది ఉపాధి రహితము. మాయకు - ఆవల ఉన్నట్టిది. ‘ప్రత్యగాత్మ’ అని కూడా పిలుస్తున్నారు. (నారాయణుడు - వాసుదేవుడు-శివుడు.. అని శుద్ధచైతన్యమే చెప్పబడుచున్నది)

(2) ఈశో-ఈశ్వర చైతన్యము : అట్టి శుద్ధ చైతన్యము కల్పన-ఊహ-భావన-సంకల్పములను తనకొరకై తానే ఆశ్రయించినప్పుడు ‘‘మాయ-అను ఉపాధిని ఆశ్రయించినది’’.. అని అనబడుతోంది. కేవలము+కల్పన = ఈశ్వర చైతన్యము
మాయ యొక్క సంబంధము చేత శుద్ధచైతన్యమే ‘ఈశ్వర చైతన్యము’గా గమనించబడుతోంది. ఈశ్వర చైతన్యమునకు ‘మాయ’ ఉపాధి అగుచున్నది. వస్త్రము వంటిది. (‘‘ఈశ్వరమాయ’’ = ఈశ్వరుని యొక్క మాయ)

(3) జీవచైతన్యము : జీవో అవిద్యావశః తదా! శుద్ధ చైతన్యము (లేక ఈ జీవుని కేవల స్వస్వరూపము) తన యొక్క అప్రమేయత్వ-సాక్షిత్వములను ఏమరచి, ‘‘నేను కల్పనకు సంబంధించినవాడిని. మాయకు బద్ధుడను. మాయచే పరిమితుడను’’.. అని తలచుచూ పరిమితత్వమును పొందుచున్నప్పుడు ‘జీవచైతన్యము’గా అగుచున్నది.
జీవుడు = అవిద్యావశుడు. ‘అవిద్య’ను ఉపాధిగా కలవాడు. శుద్ధ చైతన్య స్వరూపుని స్వకీయ మాయా-అంతర్గత భావనాస్వరూపుడు.

(4) ప్రమాత : అంతఃకరణ సంబంధాత్ ‘ప్రమాతే’ ఇతి అభిధీయతే। శుద్ధ చైతన్య మాయాంతర్గత స్వరూపమగు ఈ జీవుడు ‘అంతఃకరణము’తో సంబంధితుడుగా ఉన్నప్పుడు ‘ప్రమాత’ అని అనబడుచున్నాడు.
అంతఃకరణ చతుష్టయము = మనో-బుద్ధి-చిత్త అహంకారములు.
→ నేను ఆలోచనలకు (మనస్సుకు) సంబంధించిన వాడిని. ఈ ఈ ఆలోచనలు నాకు సంబంధించినవి (మనస్సు);
→ నేను ‘తెలివికి-తెలియబడువాటికి’ సంబంధించినవాడను. ఈఈ తెలియబడేవన్నీ నాకు వేరై, నాకు సంబంధించినవి (బుద్ధి);
→ నేను ‘‘ఇష్టమునకు, ఇష్టమైనవాటికి’’ సంబంధించిన వాడను. ఈ ఇష్టములైనవన్నీ నాకు సంబంధించినవి (చిత్తము).
→ నేను ద్రష్టత్వమునకు సంబంధించినవాడను. ఈ దృశ్యమంతా నాకు సంబంధించినది (అహంకారము), అని భావిస్తూ ఉంటే ‘‘శుద్ధపరబ్రహ్మము ప్రమాతత్వమును స్వీకరించినదై ఉన్నది’’.. అని చెప్పబడుతోంది.

[ప్రమాత = సంబంధీకుడు]
ఆత్మచైతన్యము యధాతథమై ఉండియే ఈ జీవ-ప్రమాతత్వములను లీలావినోదిగా స్వీకరించుచున్నది.

(5) ప్రమాణము : అట్టి శుద్ధ చైతన్య పరాత్పరుడు - తధా తత్ వృత్తి సంబంధాత్ ‘ప్రమాణమ్’ ఇతి కథ్యతే। ‘‘నేను ఈ కనబడుచున్న - వినబడుచున్న - వాసన చూడబడుచున్న - స్పృశించబడుచున్న - రుచిచూడబడుచున్న ధ్యాసలచే నిబద్ధుడను కదా!’’… అని వృత్తి సహితుడు (Accompanying avocations), ధ్యాససమన్వితుడు అగుచున్నప్పుడు - ‘ప్రమాణుడు/ప్రమాణము’ అని అనుకోబడుచున్నాడు.

(6) ప్రమేయము : అజ్ఞాతమపి చైతన్యం ‘ప్రమేయమ్’ ఇతి కథ్యతే। తన చైతన్యత్వమును పూర్తిగా ఏమరచి, జడత్వము నందు తన్మయుడై ఉన్నప్పుడు ‘ప్రమేయుడు/ప్రమేయము’ అని (శుద్ధచైతన్యమే) అనబడుచున్నది. ‘‘నేను జనన-దేహవిషయ- మృత్యువుల మధ్య మరెవ్వరిచేతనో ఇరికించబడుచున్నాను’’ … అను రూపము గల బుద్ధియే ప్రమేయము.

(7) ఫలమ్ : తథా జ్ఞాతం చ చైతన్యం ‘ఫలమ్’ ఇతి అభిధీయతే! ‘‘నేను చైతన్య స్వరూపుడనుకదా! శుద్ధ పరబ్రహ్మమును! ఈ ఈశ్వర-జీవ-ప్రమాతా-ప్రమాణ-ప్రమేయములన్నీ నా లీలలు. వేషములు. నాకు ఆభరణములు. చమత్కారమైన ధారణలు!’’.. అని ఎరుగుచున్నప్పుడు ‘ఫలము! ఫలస్వరూపుడు’ అని శుద్ధచైతన్యము గమనించబడుచున్నది. చైతన్యముచే ఏదేది ‘‘ఎరుగబడుచున్నది’’ అను రూపముగా ఏర్పడుచున్నదో - అదియే ‘ఫలము’ కూడా!

బ్రహ్మభూయాయకల్పతే!

ఓ దేవతలారా!

ఈ జీవుడు ‘‘ఈశ్వర-జీవ-ప్రమాత-ప్రమాణ-ప్రమేయములు’’ అనబడే సర్వ ఉపాధులను దాటివేసినట్టి భావన-దృష్టి-అనుభూతి - అవగాహనలను కలిగి ఉండి, ‘‘నేను సర్వమునకు ఆధారము - కారణము’’ - అను భావనతో ‘‘ఆత్మయేవాహమ్’’ భావనను ఆశ్రయించాలి. సర్వోపాధి వినిర్ముక్తం, స్వాత్మానం భావయేత్ సుధీః।

ఇక్కడి అహమ్-త్వమ్-తత్‌లను అఖండ-బ్రహ్మము యొక్క యథాతథ స్వరూపముగా ఎరిగినవాడై, అట్టి చెదరని పవిత్ర దృష్టిని స్వభావముగా పొందినవాడు ‘‘బ్రహ్మభూయాయతనుడు - స్వయమ్ బ్రహ్మమూర్తి’’ అగుచున్నాడు.

ఇదియే సర్వవేదాంత సిద్ధాంత (వేద = తెలుసుకొనబడుదానికంతటికీ, అంత = ఆవల గల ఎరుక రూపుడగు చిత్‌స్వభావుడు) సారాంశము. ‘‘ఇది యధార్థము’’ అని చేతులెత్తి ప్రకటించుచున్నాను!

శుద్ధ పరబ్రహ్మతత్త్వమే,…
🌺 స్వయముగా సర్వదా బ్రహ్మమే అయి ఉండి…, అమృతస్వరూపము అయి కూడా,
🌺 ఒకానొకప్పుడు ‘మార్పు-చేర్పులు’ అను రూపము గల మృత్యుత్వమును స్వీకరించి…,
🌺 సహజము-స్వభావము అగు స్వకీయ బ్రహ్మతత్త్వమును ఏమరచి, స్వీయకల్పనలో (స్వప్నంలోలాగా) సంచారములు చేస్తూ..,
🌺 మరింకొకప్పుడు సర్వము ఆత్మకు అభిన్నమని ఎరుగుచున్నదై..,
🌺 తనకు తానే అఖండాత్మతత్త్వముగా శేషించుచున్నది.

ఈ ఉపనిషత్ ప్రవచనుడు గాని, శ్రోతగాని, తదితరులుగాని పరబ్రహ్మము కాని క్షణమే లేదు.



🙏 ఇతి కఠ రుద్ర ఉపనిషత్ ‌🙏
(కఠశృతి ఉపనిషత్)
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।