[[@YHRK]] [[@Spiritual]]

kali santaraNa Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


కృష్ణయజుర్వేదాంతర్గత

6     కలిసంతరణోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। యత్ దివ్యనామ స్మరతాం సంసారో గోష్ప దాయతే,
స్వాఽనన్య భక్తిః భవతి, తత్ ‘రామపదమ్’ ఆశ్రయే।।

ఏ ‘దివ్యనామ స్మరణ’చే సంసార సాగరమంతా ఆవుడెక్క యొక్క నేలపై కనపడే ‘ముద్ర’ వంటిది మాత్రమే అగుచున్నదో, స్వస్వరూపౌన్నత్య అనన్యభక్తి (పరాప్రేమ) సిద్ధిస్తుందో-అట్టి శ్రీరామచంద్రమూర్తియొక్క పాదపద్మమును ఆశ్రయిస్తున్నాను.

1. ద్వాపరాంతే నారదో
బ్రహ్మాణం జగామ।
‘‘కథం, భగవన్ గాం పర్యటన్,
కలిం సం-తరేయమ్?’’ ఇతి।।
భూమిపై కాలచక్ర భ్రమణానుసారము ద్వాపరయుగము గడచి, కలియుగము ప్రారంభమగుచుండగా, దేవఋషి నారదులవారు, స్వభావతః లోకకల్యాణ మూర్తులు అయి ఉండటము చేత-ఒకరోజు తన పితృదేవులగు సృష్టికర్త బ్రహ్మదేవులవారిని సమీపించి ఇట్లా అడుగసాగారు.
‘‘హే భగవాన్! సృష్టికర్తా! మీరు నియమించిన కాలక్రమానుసారము ఇప్పుడు భూమిపై కలియుగము ప్రారంభమగుచున్నది. మరి కలియుగంలో భూమిపై సంచారములు చేస్తున్నప్పుడు కవిదోషములు అంటకుండా ఉండేది ఎట్లా? ఏ తీరైన జాగరూకత కలిగి ఉండాలి? దయతో మార్గదర్శకులై వివరించండి’’.
సహో వాచ బ్రహ్మా :
సాధు పృష్టోఽస్మి।
సర్వ శ్రుతి రహస్యం,
గోప్యం తత్ శృణు, -
యేన కలిసంసారం తరిష్యతి।
భగవత, ఆదిపురుషస్య నారాయణస్య,
నామోచ్చారణ మాత్రేణ, నిర్ధూత కలిః భవతి।।
భగవంతుడగు బ్రహ్మదేవులవారు :
ఓ ప్రియమానసపుత్రా! నారద మహర్షీ! చాలా మంచి ప్రశ్న అడుగుచున్నావయ్యా!
సర్వవేదముల రహస్యము అయినటువంటి కలి సంసార దోషముల నుండి విడివడగల ఉపాయము నీకు గుర్తు చేస్తున్నాను. శ్రద్ధగా విను.
భగవంతుడు, ఆదిపురుషుడు అగు శ్రీమన్నారాయణ పరమాత్మ యొక్క నామస్మరణచే అన్ని తరగతి జీవులు కూడా సర్వ కలి-(అరిషట్‌వర్గ) దోషముల నుండి తప్పక విడివడగలరు. హరి నామస్మరణచే దోషములన్నీ తొలగి నిర్మల స్వరూపులు కాగలరు.
2. నారదః పునః పప్రచ్ఛ :
తం నామ కిమ్? - ఇతి।

సహో వాచ హిరణ్యగర్భః :
హరే రామ హరే రామ - రామ రామ హరే హరే।(16)
హరే కృష్ణ హరే కృష్ణ - కృష్ణ కృష్ణ హరే హరే। (16)
ఇతి షోడశకం నామ్నాం - కలి కల్మష నాశనం।
నారద మహర్షి: తండ్రీ! మీరు చెప్పుచున్న శ్రీమన్నారాయణ కలిదోష హరణ ఆదిపురుష నారాయణుని ఏ మంత్రము సహాయముతో మననము చేయాలో దయతో వివరించండి.

హిరణ్యగర్భుడు (బ్రహ్మదేవుడు) : [ 16 దివ్యాక్షరములతో కూడిన ద్వివర్ణరూపము (16x2=32 అక్షరాలు) ] అయినట్టి సకల కలిదోషములను నశింపజేయు మంత్రము చెప్పుచున్నాను విను.

హరే రామ హరే రామ (8) రామ రామ హరే హరే (8) = 16
హరే కృష్ణ హరే కృష్ణ (8) కృష్ణ కృష్ణ హరే హరే (8) = 16

ఈ షోడశక నామముచే కలిదోషములు తొలగిపోతాయి.
న అతః పరతర ఉపాయః -
సర్వ వేదేషు దృశ్యత। ఇతి।।
షోడశ కలా ఆవృతస్య
జీవస్య ఆవరణ వినాశనమ్।
తతః ప్రకాశతే ‘పరంబ్రహ్మ’,
మేఘాపాయే రవి రశ్మి మండలీవ - ఇతి ।
ఓ నారదా! సర్వజనులు కూడా తమ కలిదోషముల నుండి నిర్దోషులు, విముక్తులు అవటానికి ఇంతకుమించిన సులభమైన ఉపాయము వేరే లేదు. ఈ విషయము సర్వ వేదములచే కూడా సుస్పష్టము చేయబడుచున్నది.
(నా-మోస్తు యావతీ శక్తిః) 16 అక్షరములతో కూడిన ఈ కలి సంతారణ ఉపాయమగు మంత్రము - 16 కలనములచే (దోషములచే) కప్పబడినట్టి ఈ జీవుని పట్ల ఆ ఆవరణములన్నీ నశింపజేయుచున్నది.
ఆకాశములో మేఘములు దట్టంగా కమ్ముకొని ఉన్నప్పుడు ఆకాశంలో సూర్యుడు ఉండి కూడా సూర్య తేజోవిభవము కనిపించదు. మబ్బులు తొలగగానే సూర్యరశ్మి కనిపిస్తుంది. అట్లాగే 16 ఆవరణలు నామస్మరణ మహిమ వలన తొలగిపోగా అప్పుడు ఈ జీవుని పట్ల పరబ్రహ్మము స్వయముగా ప్రకాశించగలదు.
పునః నారదః పప్రచ్ఛ:
భగవన్! కోఅస్య విధి? - ఇతి।
నారదమహర్షి : భగవాన్! అట్టి కలి సంతారణోపాయమగు ‘‘హరే రామ..’’ నామోచ్ఛారణకు విధి-విధానములు ఎట్టివి? ఏఏ నియమములు పాటించాలి.
తం హో వాచ:
న అస్య (నాన్య) విధిః - ఇతి।
సర్వదా శుచిః - అశుచిర్వా పఠన్, బ్రహ్మణః సలోకతాం,
సమీపతాం, సరూపతాం, సాయుజ్యతాం ఏతి,
యదా అస్య షోడశీకస్య సార్ధః త్రికోటిః జపతి।।
బ్రహ్మదేవుడు : పవిత్రమగు ‘‘హరేరామ…’ నామోచ్ఛారణకు విధులు లేవు. నియమములు లేవు. సమయాసమయములు లేవు. ఎవ్వరైనా తాను శుచి అయినా (లేక) అశుచి అయినా కూడా → పఠిస్తే చాలు. వారు బ్రహ్మతత్త్వము యొక్క సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయజ్యముక్తి తప్పకపొందగలరు. 16 నామములు గల ఈ మంత్రమును మూడున్నర కోట్లు జపిస్తే సర్వ దోషముల నుండి విముక్తి పొందగలరు.
3. తదా బ్రహ్మహత్యాం తరతి।
తరతి వీర హత్యాం।
స్వర్ణస్తేయాత్ పూతో భవతి।
వృషలీ గమనాత్ పూతో భవతి।
పితృ-దేవ-మనుష్యాణాం
అపకారాత్ పూతో భవతి।
సర్వధర్మ పరిత్యాగ
పాపాత్ సద్యః
శుచితామ్ ఆప్నుయాత్।
ఈ ‘‘హరేరామ..’’ 16 నామముల మంత్రమును ప్రతిరోజూ ఉపాసించువారు ‘‘బ్రహ్మ హత్య- వీరహత్య’’… మొదలైన మహాపాతక దోషముల నుండి కూడా విముక్తులు కాగలరు.
బంగారము దొంగిలించటము, పరస్త్రీ గమనము మొదలైన నరక ప్రదమగు పాతకముల దోషములు కూడా తొలగగలదు.
తల్లిదండ్రులకు, దేవతలకు అపకారము చేసిన-కష్టపెట్టిన పాపఫలములు, సహజనులను బాధించిన పాపఫలములు కూడా తొలగుచుండగా, ‘‘హరే రామ హరే రామ రామ రామ హరే హరే’’.. ‘‘హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే!’’ - స్మరణచే ఆ జీవుడు బ్రహ్మజ్ఞానమునకు అర్హుడు కాగలడు.
స్వధర్మమును వదలిన మహాదోషఫలముల నుండి కూడా ‘హరేరామ హరే రామ’ నామస్మరణము చేయుచున్నవాడు ముక్తుడు-శుచిమంతుడు కాగలడు.
సద్యో ముచ్యతే।
సద్యో ముచ్యత- ఇతి।।
ఇప్పటికిప్పుడు ఇక్కడే సద్యోముక్తిని కైవశం చేసుకోగలడుకూడా!

ఇతి కలి సంతరణోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



కృష్ణ యజుర్వేదాంతర్గత

6     కలిసంతరణ ఉపనిషత్

అధ్యయన పుష్పము

{ఏ దివ్యనామము స్మరించినంత మాత్రంచేత భయానక సంసార సాగరమంతా గోష్పదముగా (గోపాదముద్రను దాటివేయు తీరుగా) అవగలదో, స్వయముగా ‘అనన్యభక్తి’ సిద్ధించగలదో, అట్టి ‘శ్రీరామపదము’ను ఆశ్రయించుచున్నాను}.

అనంత కాల చక్రములో ఒకప్పుడు ద్వాపరయుగం అంతమై కలియుగము ప్రారంభమగుచున్న సమయము. కృష్ణావతార పరిసమాప్తిచే కొన్ని కొన్ని కళ్యాణ విశేషములు భూమిని విడచి దివ్యలోకములు చేరనారంభించు సందర్భము. భూలోకములో కలి ప్రభావములగు లోభము, మోహము, కలహము, దురభ్యాసములు, దుర్వ్యసనములు, అధర్మప్రవృత్తులు, అధర్ములు శ్రేష్ఠులుగా చెల్లుబాటు అవటము, ధర్మనిరతులను బలహీనులుగా భావించటము, మోసము, దగా - మొదలైనవన్నీ ప్రబలటం ఆరంభించాయి. ఇవన్నీకూడా జీవులను అనేక దుఃఖముల వైపు మరలించసాగాయి. తల్లి-తండ్రులను అగౌరవించటము, పెద్దలను అవమానించటము, వేదజ్ఞులను ఎగతాళి చేయటము, విజ్ఞులను కించపరచటము, సదాచారముల పట్ల బద్ధకించటము, దురాచారముల పట్ల తీవ్ర ప్రవృత్తి కలిగి ఉండటము.. ఇవన్నీ జీవులకు అలవడసాగాయి. (ఈఈ ప్రవర్తనలు కలి కల్మష దోషములుగా విజ్ఞుల జాగరూక సూచనలు).

లోకకల్యాణమూర్తులగు ఋషులు, మునులు ఇదంతా గమనిస్తూ ‘‘అయ్యో! ప్రారంభంలో మధురంగాను, పరిణామం విషప్రాయంగాను ఉండు విశేషములకు ఈ జీవులు బద్ధులగుచున్నారే! ఇదంతా కలిదోషము కాబోలు. జనులలో భక్తి, సదాచారములు, జ్ఞానాభ్యాసములు సన్నగిల్లుచున్నాయే! జీవులకు దుఃఖభాజకము కదా! వీరికి కలికాల దోషముల సందర్భములో ఉత్తమము - సులభము అగు ఏమైనా మార్గము చూపాలి’’… అని సంభాషించుకోసాగారు. సర్వజీవరాసులపై (తండ్రికి బిడ్డలపై వలె) అవ్యాజమైన వాత్సల్యము, కరుణ, ప్రేమ మహనీయులకు స్వభావసిద్ధము కదా!

ఈ విధంగా లోక శ్రేయోభిలాషులగు మునులు, మహర్షులు, దైవీ సంపత్తి సమన్వితులగు మహనీయులు అంతా కూడా-‘‘జనులందరు దుష్టకర్మల ప్రభావము నుండి విడివడి, స్వస్వరూప పరబ్రహ్మముకు చేరుకొను సులభమార్గము ఏది?’’… అని తర్జన-భర్జనలు చేసుకోసాగారు.

అదంతా గమనిస్తున్నట్టి - బ్రహ్మ మానసపుత్రుడు, భక్తాగ్రేసరుడు, నారాయణ మంత్ర నిత్యధారుడు, భక్తి సూత్రగ్రంథ ప్రణీత, లోక కళ్యాణ మహాశయుడు, నాదబ్రహ్మగా కీర్తికెక్కినవారు - అగు దేవర్షి నారదులవారు అప్పటికప్పుడే తన తండ్రియగు బ్రహ్మదేవుని సందర్శించుటకై బ్రహ్మలోకము బయల్వెడలారు. సృష్టికర్త, సర్వజీవులకు పితామహుడు, సృష్టి విశేష మహాప్రజ్ఞా సంకల్పుడు అగు శ్రీసరస్వతీ సమేత శ్రీబ్రహ్మదేవులవారిని సమీపించి త్రిప్రదక్షణ పూర్వక సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించారు.

┄ ┄ ┄

బ్రహ్మదేవుడు : ప్రియపుత్రా! దేవర్షీ! నారదా! సుస్వాగతము, బిడ్డా! లోకములన్నీ సంచరిస్తూ జనులకు శుభ-శాంతి-ఐశ్వర్య-ఆనందములు కలుగజేస్తూ ఉంటావు కదా! చాలా సంతోషము! నీ రాకకు ఏమి విశేషం? నేను ఏమిచ్చి నిన్ను సంతోషపెట్టాలో… అడగవయ్యా!

నారద మహర్షి: మాతా పితృదేవా! నమోనమః! తండ్రీ! భగవన్! సృష్టికర్తా! ఓ బ్రహ్మదేవా!

భూలోకములో కలి ప్రవేశము కారణంగా అనేక మంది జనులు అల్పదృష్టి-అల్పాశయములు కలవారై, లోభ-మోహ-మాత్సర్యములకు దాసులై, ముందుచూపు లేనివారై, పరస్పర కలహములతో, రాగద్వేషములతో ‘మానవ జన్మ’ అను మీరు ప్రసాదించుచున్న మహత్తరమగు మోక్షార్హమగు అవకాశమును సద్వినియోగపరచుకోవటము లేదు. దుర్వినియోగపరచుకొనుచున్నారు.

తెలివి తక్కువగా వర్తమానమును వృధా చేసుకొంటూ, రాగ-ద్వేష-మద-మాత్సర్యములను ఆశ్రయిస్తూ.. అనేక దుఃఖసంకటములు కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. ‘‘ఇప్పుడు నేను ఈ తీరుగా ప్రవర్తిస్తూ ఉంటే,.. ఈ ఈ కర్మల పర్యవసానము ఏమిటి?’’.. అనే యోచన లేకుండా అవివేకులై ప్రవర్తిస్తూ ఉన్నారు.

స్వల్పము-అల్పము-చంచలము అగు విషయముల పట్ల అనువర్తులై, తత్ఫలితంగా అనేక ‘‘భయ-దుఃఖ-రోదన’’ స్థానములలో ప్రవేశించుటకు సంసిద్ధులగుచున్నారు. ఉభయ భ్రష్టులగుచున్నారు.

వారి వర్తమాన ప్రవర్తనములు, ఉత్తరోత్తరగతులు గమనిస్తూ ఉండగా ఋషులము, మునులము అగు మాకు హృదయము ద్రవిస్తోంది. జాలివేస్తోంది. అందుచేత ప్రియ పితృదేవా! రెండు అభ్యర్థనలను మీ ముందు ఉంచుచున్నాను.

(1) ఈ కలియుగములో భూమిపై సంచరించుచున్నప్పుడు కలిదోషములు నాకు అంటకుండేది ఎట్లా?

(2) కలిదోషములు అంటకుండా సాధక జనులు తమను తాము రక్షించుకొనేది ఎట్లా?

ఏదైనా సులభమైన, ఎవ్వరైనా-ఎక్కడైనా ఉపాసించగల - నిర్వర్తించగల ‘‘కలిసంతారణ ఉపాయము’’ను దయచేసి తెలియజేయండి!

బ్రహ్మదేవుడు : చాలా మంచి-శుభప్రదమగు విషయముగురించి నీవు ప్రస్తావిస్తున్నావయ్యా! సాధు పృష్టోఽస్మి? సర్వ శృతి రహస్యం, గోప్యం, తత్ శృణు, యేన కలి సంసారమ్ తరిష్యసి! ఎద్దాని చేతనైతే ఈ జీవుడు ‘కలి సంసారము’ నుండి తరించగలడో, ఏది వేదములచే అనేక చోట్ల సుస్పష్టముగా ప్రతిపాదించబడినదో,… ప్రవచించబడినదో… అట్టి గొప్ప రహస్యమును నీకు చెప్పుచున్నాను. విను.

పరమాత్మ, భగవంతుడు, మనందరికి ఆది స్వరూపుడు (our original form before everything else begins) ఆది పురుషుడు అగు శ్రీమన్నారాయణుని ‘‘నామస్మరణ’’ యే కలిదోషములచే స్పృశించకుండా జీవులంతా ఆశ్రయించతగినట్టి అతి సులభోపాయము.

అట్టి శ్రీమన్నారాయణుని తత్త్వ మననము మాత్రం చేతనే దోషములన్నీ తొలగి, జీవుడు అనునిత్య-ఆనందమయమగు మోక్షమును సిద్ధించుకోగలడు. ఇందులో సందేహమే లేదు.

నారద మహర్షి : శ్రీమన్నారాయణుని ఏమంత్రముచే కలిదోష నివారణముకై స్మరించాలి? ఉచ్ఛరించవలసిన నమోస్మరణ మంత్రమును ప్రకటించి చెప్పండి.

బ్రహ్మదేవుడు : సర్వాత్మకుడగు నారాయణ భగవానునిచే ప్రసాదించబడిన సర్వజీవోద్ధారణ కరమగు ఒక మంత్రమును - ఇప్పుడు - గుర్తు చేస్తున్నాను. విను.

హరే రామ హరే రామ రామ రామ హరే హరే! (16 అక్షరములు)
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! (16 అక్షరములు)
ఇతి షోడశకం నామ్నాం
కలికల్మష నాశనమ్।

సర్వ వేదములలోను - కలిదోషములు జయించటానికై ఇంతకంటే తేలిక ఉపాయం - మరింకెక్కడా లేనే లేదు. లభించదు.

16 అక్షరములతో కూడిన ఈ కలి సంతారణ మంత్రము-ఈ జీవుని కప్పియున్న 16 ఆవరణల నుండి రక్షించగలదు.

16 ఆవరణలు = పంచ తన్మాత్రలు (లేక) ఇంద్రియార్ధములు (శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములు); (5)
= పంచకోశములు ( భూతమయ కోశము; ప్రాణమయకోశము; మనోమయ కోశము; విజ్ఞానమయకోశము; ఆనందమయ కోశము);(5)
= అరిషట్ వర్గములు (కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యములు). (6)

ఓ నారద మహర్షీ! సూర్యుడు ఆకాశంలో శతసహస్ర కిరణజాలములతో జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ కూడా,… దట్టముగా మేఘములు క్రమ్ముకొని ఉన్నప్పుడు సూర్యతేజస్సు కనిపించకయే ఉంటుంది. గాలివీచికలచే మేఘములు ఎటో వెళ్లిపోయినప్పుడో? సూర్యప్రకాశము స్వయముగా అనుభూతమౌతుంది కదా!

అట్లాగే…,
ఎప్పుడైతే ఈ జీవుడు ‘‘హరే రామ హరే రామ రామ రామ హరే హరే,.. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’’… అనే నామస్మరణను ఆశ్రయిస్తాడో,.. వెనువెంటనే పై ఉదహరించుకొన్న 16 ఆవరణలు తొలగిపోయి ఈ జీవుని యొక్క పరబ్రహ్మ స్వరూపము స్వయముగా ప్రకాశమానమవగలదు. దివ్యతేజస్సుతో పరిపూర్ణానందయుక్తముగా స్వస్వరూపాత్మ ద్యోతకమవుతోంది. షోడశాక్షర ‘‘హరే రామ..’’ మహామంత్రము యొక్క ఔన్నత్యము అట్టిది!

నారద మహర్షి : స్వామీ! కలిదోహములను తొలగించి మహత్తర ప్రాశస్త్యము గల కలి సంతారణోపాయము అగు ‘‘హరే రామ హరే రామ’’ మంత్రోపాసనకు విధి - విధానము లేమిటో, సమయ-అసమయములు ఏవేవో, అవి కలియుగ జీవులుగాని, నేను గాని ఎట్లా అనుసరించి ఉచ్చరిస్తూ ఉండాలో.. అదికూడా దయచేసి తెలియజేయండి!

బ్రహ్మదేవుడు : పరమ పవిత్రము, జీవులను దోషముల నుండి నిర్మలముగా తీర్చిదిద్దు కలి సంతారణ మంత్రము అగు ‘‘హరే రామ-హరేకృష్ణ’’… మంత్ర అనునిత్య మననమునకు ఎట్టి విధి-విధాన సంబంధమైన నియమ-నిష్ఠలు లేవు. ఒకడు శుచిగా ఉన్నా, (లేక) అశుచిగా ఉన్నా కూడా పారాయణము చేయవచ్చు. పఠించవచ్చు. సర్వేషు కాలేషు నామజపము చేయవచ్చును. ఈ మంత్రమును పఠిస్తూ ఉండగా ఈ జీవుడు రామ బ్రహ్మతత్త్వముతో సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము పొందగలడు.

ఎవ్వరైతే ఈ ‘‘హరే రామ హరే రామ రామ రామ హరే హరే! హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’’.. కలిసంతరణోపాయమంత్రమును 3½ కోట్లసార్లు జపిస్తారో, అట్టివారి జన్మ-జన్మల దోషములన్నీ తొలగిపోగలవు. అట్టివారు సర్వబంధముల నుండి విముక్తి పొందగలరు. అతిత్వరగా సాయుజ్యమును సిద్ధించుకోగలరు.

ఈ ‘‘హరేరామ..’’ 16 నామముల మంత్రమును దైనందికముగా జపించువారు..,
- బ్రహ్మహత్య, వీరహత్య, బంగారము దొంగిలించిన పాపము, పరస్త్రీ వ్యామోహ-సంగమముల దోషములు, తల్లిదండ్రులను బాధించటము, సేవించకపోవటము, స్వధర్మమును ఏమరచి చరించటము - అను పాపములు మొదలైన పంచమహాపాతక- ఘోరపాపముల దోషములు కలిగియున్నా కూడా అవన్నీ ప్రక్షాళనము కాగలవు. అట్టి జపముచే ఈ జీవుడు నిర్మలుడుగా రూపుదిద్దుకోగలడు. బ్రహ్మజ్ఞానమునకు అర్హుడు అయి, ‘‘ముక్తుడు’’ కాగలడు.

పరమ శుచిమంతుడై ప్రకాశించగలడు.

ఇప్పుడే ఇక్కడే సద్యోముక్తిని పొందుచున్నాడు.

అనేక జన్మల సంసిద్ధతతో ఆవస్యకమగు ‘క్రమముక్తి’ యొక్క అగత్యము ఆతనికి ఉండదు.



🙏 ఇతి కలిసంతరణ ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।