[[@YHRK]] [[@Spiritual]]

Taittirīya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


కృష్ణ యజుర్వేదాంతర్గత

13     ‌తైత్తిరీయోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


విషయసూచిక:

1.) శీక్షా వల్లీ

1.) అధ్యయనము। (The Training Phase)

2.) ఆనంద వల్లీ (బ్రహ్మానంద వల్లీ)

2.) బ్రహ్మానందము।(The Experiencing Phase)

3.) భృగు వల్లీ

3.) కిం తత్ బ్రహ్మ? - అహమేవ తత్।(The Clarity)


1వ అధ్యాయము - శీక్షా వల్లీ

1వ అధ్యాయము - శీక్షా వల్లీ - 1వ అనువాకము - మిత్రాది దేవతలకు విన్నపము


ప్రథమా శీక్షావల్లీ
ఓం శం నో మిత్రః శం వరుణః . శం నో భవత్వర్యమా .
శం న ఇంద్రో బృహస్పతిః . శం నో విష్ణురురుక్రమః .
నమో బ్రహ్మణే . నమస్తే వాయో .
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి .
త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి . ఋతం వదిష్యామి .
సత్యం వదిష్యామి . తన్మామవతు . తద్వక్తారమవతు .
అవతు మాం . అవతు వక్తారం .
ఓం శాంతిః శాంతిః శాంతిః .. 1.. ఇతి ప్రథమోఽనువాకః ..

ఓం శం నో మిత్రః। శం వరుణః। శం నో భవతి అర్యమా।
శం న ఇంద్రో, బృహస్పతిః। శం నో విష్ణుః ఉరుక్రమః।
నమో బ్రహ్మణే। నమస్తే వాయో। త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి।
త్వా(త్వ)మేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి।
ఋతం వదిష్యామి। సత్యం వదిష్యామి।
తన్మామ్ (తత్ మామ్) అవతు। తత్ వక్తారమ్ అవతు।
అవతు మామ్। అవతు వక్తారమ్।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।

ఓం సహ నావవతు। సహనౌ భునక్తు।
సహ వీర్యం కరవావహై।
తేజస్వినావధీతమస్తు।
మా విద్విషావ హై।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।

1వ అధ్యాయము - శీక్షా వల్లీ - 2వ అనువాకము - గురు-శిష్య ఉభయ శ్రేయోస్తుతి

శీక్ష (The Training)
The Training

శిక్షాశాస్త్రార్థసంగ్రహః -
ఓం శీక్షాం వ్యాఖ్యాస్యామః . వర్ణః స్వరః . మాత్రా బలం .
సామ సంతానః . ఇత్యుక్తః శీక్షాధ్యాయః .. 1..
ఇతి ద్వితీయోఽనువాకః ..
ఓం
1. శీక్షాం వ్యాఖ్యాస్యామః।
వర్ణః। స్వరః। మాత్రా। బలమ్। సామ। సంతానః।
ఇతి ఉక్తః శీక్ష అధ్యాయః ।। (శీక్షాం పంచ।)
ఓంకార పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ,
మొట్టమొదటగా ‘శీక్ష’ అను (పైకి అనవలసిన లక్షణములు) వైదికపరమైన స్వర-శాస్త్రము గురించి చెప్పుకుంటున్నాము.

‘శీక్ష’ - ‘6’ విధములుగా చెప్పబడుచున్నది.
(1) వర్ణములు = ‘అ’ నుండి ‘క్ష’ వరకు - అకారాది క్షకారాంతము వరకు అక్షరములు - మౌఖిక శబ్దములు.
(2) స్వరములు = ఉదాత్తము-అనుదాత్త-స్వరితపము-స్వరముయొక్క స్థాయి.
(3) మాత్రలు = హ్రస్వమాత్ర - దీర్ఘమాత్ర - ప్లుతము - స్వరముయొక్క పరిమాణము.
(4) బలము = అక్షరములు ఉచ్ఛరించునప్పుడు బలము (ఉచ్చరణ శక్తి) ఉపయోగించు తీరు.
(5) సామము = అక్షరము పలుకునప్పటి వేగ (speed) నియమములు
(6) సంతానము = [ విలంబనము (pause) ] ఎంత ఉండాలి…అని ఎరిగి ఉండటము ఇవన్నీ వేద - ఉపనిషత్తు పఠించునప్పుడు ఎరుగుట శుభప్రదము.


1వ అధ్యాయము - శీక్షా వల్లీ - 3వ అనువాకము


సంహితోపాసనం -
సహ నౌ యశః . సహ నౌ బ్రహ్మవర్చసం .
అథాతః సగ్ంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః .
పంచస్వధికరణేషు .
అధిలోకమధిజ్యౌతిషమధివిద్యమధిప్రజమధ్యాత్మం .
తా మహాసగ్ంహితా ఇత్యాచక్షతే .
1. సహ నౌ యశః।
సహ నౌ బ్రహ్మవర్చసమ్।।
అథ అతః సగ్ంహితాయా
ఉపనిషదం వ్యాఖ్యాస్యామః।। పంచసు అధీకరణేషు।।
- అధిలోకమ్।
- అధిజ్యౌతిషమ్।
- అధి విద్యమ్।
- అధి ప్రజమ్।
- అధ్యాత్మమ్।।
తం ‘‘మహాసగ్ంహితా’’ ఇతి ఆచక్షతే।।
ఉపనిషత్ ఉద్యానవనములోని ఈ ‘తైత్తిరీయోపనిషత్’ అధ్యయనము చేస్తున్న గురుశిష్యులిరువురమగు మనకు ఆత్మభావనా సామ్రాజ్యములో స్థానము, కీర్తి, యశస్సు, బ్రహ్మవర్చస్సు, బ్రహ్మతత్త్వము స్వభావ సిద్ధిమవటము… ఇవన్నీ సిద్ధించునుగాక.

స్వర-వర్ణ-మాత్ర-బల-సామ-సంతానములనబడే ఉదాత్త అనుదాత్తములతో కూడిన, హ్రస్వ - దీర్ఘమాత్రలతో కూడిన, శబ్దబల ఉచ్ఛారణతో కూడిన, సమవేగముతో కూడిన, విలంబనములతో కూడిన అక్షరా భ్యాసము తరువాత,
ఇక ఇప్పుడు ఐదు అధికరణములు (లేక) ఆశ్రయము లతో కూడిన ‘ఆత్మసామీప్యత’ రూపమగు ఉపనిషదమును (లేక) బ్రహ్మతత్త్వ సామీప్య - ఉపాసన గురించి వ్యాఖ్యానించుకొనుచున్నాము.
(1) అధి లోకమ్ - లోకములయందు ఉపాసన। - విశ్వోపాసన
(2) అధి జ్యౌతిషమ్ - జ్యోతి-తేజస్సు నందు ఉపాసన। -కాంతి- తేజోపాసన
(3) అధి విద్యమ్ - విద్యలయందు ఉపాసన। -విద్య-విద్యోపాసన
(4) అధి ప్రజమ్ - జనుల యందు ఉపాసన। - సంతానము-సహజనోపాసన
(5) అధి ఆత్మమ్ - తనయందు దేహమునందు ఉపాసన- శరీరము-దేహాంతరోపాసన

ఈ ‘5’ కూడా ‘పంచ-మహాసంహితలు’ (ఉపాసనా మార్గములు) అని తత్త్వజ్ఞులు (వేదజ్ఞులు) ప్రవచించుచున్నారు. (విశ్వ-కాంతి-విద్య-సంతాన- శరీరో పంచమహా సంహితోపాసనలన గురించి చెప్పుకుంటున్నాము).

అథాధిలోకం .
పృథివీ పూర్వరూపం . ద్యౌరుత్తరరూపం .
ఆకాశః సంధిః .. 1..
వాయుః సంధానం . ఇత్యధిలోకం .
అథ అధిలోకమ్।
పృథివీ - పూర్వ రూపమ్।
ద్యౌః - ఉత్తర రూపమ్।
ఆకాశః - సంధిః।
వాయుః - సంధానమ్ః
ఇతి ‘అధిలోకమ్’।।
(1) అధి లోకోపాసన (లోక సంహిత) - యొక్క విశ్వరూపోపాసన
విశ్వముయొక్క -
పూర్వరూపము - పూర్వాక్షరము = పృథివి / భూమి.
ఉత్తరరూపము - ఉత్తరాక్షరము = ద్యౌః / అంతరిక్షము
పూర్వ - ఉత్తర రూపముల (కలయిక) సంధి = ఆకాశము
భూమి - ఆకాశముల అనుసంధానము = వాయువు,
ఈ విధముగా పరస్పర సంబంధము గమనిస్తూ ఈ విశ్వమును ఆత్మరూపముగా ఉపాసించటము.

అథాధిజ్యౌతిషం .
అగ్నిః పూర్వరూపం . ఆదిత్య ఉత్తరరూపం . ఆపః సంధిః .
వైద్యుతః సంధానం . ఇత్యధిజ్యౌతిషం .
2. అథ అధిజ్యౌతిషమ్।
‘అగ్నిః’ - పూర్వరూపమ్।
‘ఆదిత్యః’ - ఉత్తర రూపమ్
‘ఆపః’ - సంధిః।।
‘వైద్యుతః’ - సంధానమ్।
ఇతి అధి జ్యౌతిషమ్।

(2) అధిజ్యౌతిష - ఉపాసన - తేజస్సును ఉపాసించటమెట్లా?(అధి జ్యోతిష సంహిత) - కాంతి (లేక) తేజస్సుయొక్క ఉపాసన
పూర్వరూపము - పూర్వాక్షరము = అగ్ని
ఉత్తరరూపము - ఉత్తరాక్షరము = ఆదిత్యుడు (సూర్యుడు)
పూర్వ-ఉత్తర రూపముల-(అక్షరముల) సంధి (కలయిక)= జలము (ఆపః)
పూర్వ - ఉత్తర రూపముల (అక్షరముల) అనుసంధానము = విద్యుత్తు (తేజస్సు)
ఇట్టి ఆశ్రయము (సంహితము)తో జ్యోతి (లేక) తేజస్సును బ్రహ్మముగా ఉపాసించటము. (లేక) తేజస్సును ఇట్లా ధ్యానించటము.


అథాధివిద్యం .
ఆచార్యః పూర్వరూపం .. 2..
అంతేవాస్యుత్తరరూపం . విద్యా సంధిః .
ప్రవచనగ్ంసంధానం .
ఇత్యధివిద్యం .
అథ అధి విద్యమ్
‘ఆచార్యః’ - పూర్వరూపమ్।
‘అన్తేవాసి’ - ఉత్తరరూపమ్।
‘విద్యా’ - సంధిః।
ప్రవచనగ్ం - సంధానగ్ం।
ఇతి అధి విద్యమ్।।

(3) ‘విద్య’ను ఉపాసించునప్పుడు… (అధివిద్యా సంహిత)-విద్యోపాసన
పూర్వరూపము - పూర్వాక్షరము = గురువు - ఆచార్యులవారు.
ఉత్తరరూపము - ఉత్తరాక్షరము = శిష్యుడు.
సంహితయొక్క పూర్వ - ఉత్తర రూపముల (అక్షరముల) సంధి = విద్య (వేదవిద్య / బ్రహ్మవిద్య)
పూర్వ - ఉత్తరరూపముల అక్షరముల అనుసంధానము = ప్రవచనము
ఈ విధంగా విద్యను పరబ్రహ్మతత్త్వము కొరకై ధ్యానించటము. ఇది ‘విద్య’ను ఆశ్రయించి చెప్పబడు ఉపాసన (లేక) సంహిత.


అథాధిప్రజం . మాతా పూర్వరూపం .
పితోత్తరరూపం . ప్రజా సంధిః . ప్రజననగ్ంసంధానం .
ఇత్యధిప్రజం .. 3..
అథ అధి ప్రజమ్
‘మాతా’ - పూర్వరూపమ్।
‘పితా’ - ఉత్తరరూపమ్।
‘ప్రజా’ - సంధిః।
ప్రజననమ్ (గ్ం) - సంధానమ్।
ఇతి అధి ప్రజమ్।

(4) ప్రజోపాసన (లేక) ప్రజాసంహిత - సంతాన విద్య - ఉపాసన
పూర్వరూపము - పూర్వాక్షరము = మాతృదేవత తల్లి - అమ్మ (దేహమునకు ఆవల)
ఉత్తరరూపము - ఉత్తరాక్షరము = పితృదేవులవారు తండ్రి - నాన్న (దేహమునకు ఈవల)
పూర్వ ఉత్తర రూపముల (లేక) అక్షరముల సంధి= (సంతానము) ప్రజలు, సర్వజీవులు
పూర్వ ఉత్తరరూపముల అనుసంధానము = ప్రజనము ప్రజోవృత్తి - ప్రజాపోషకులగు దేవతలు.
ఇది ‘ప్రజ’ను ఆశ్రయించి నిర్వర్తించవలసిన ప్రజనోపాసన - సంహిత।


అథాధ్యాత్మం . అధరాహనుః పూర్వరూపం .
ఉత్తరాహనూత్తరరూపం . వాక్సంధిః . జిహ్వాసంధానం .
ఇత్యధ్యాత్మం .
ఇతీమామహాసగ్ంహితాః .
అథ అధ్యాత్మమ్।
అధరా - హనుః - పూర్వరూపమ్।
ఉత్తరా హనుః - ఉత్తర రూపమ్।
వాక్ - సంధిః।
జిహ్వా - సంధానమ్।
ఇతి అధ్యాత్మమ్।।

(5) అధ్యాత్మోపాసన - అధ్యాత్మసంహిత - దేహౌపకరణోపాసన
పూర్వరూపము - పూర్వాక్షరము = క్రింద పెదవి
ఉత్తర రూపము - ఉత్తరాక్షరము = పై పెదవి
పూర్వ ఉత్తరాక్షరముల సంధి = వాక్కు పలకటం
పూర్వ - ఉత్తర రూపముల (అక్షరముల) అనుసంధానము = నాలుక
ఈ విధముగా సాధకుడు తనయొక్క ఈ భౌతిక దేహమును ఆశ్రయించి నిర్వర్తించవలసిన ఉపాసన (లేక) సంహిత (లేక) అధ్యాత్మ సంహిత.

ఇతీమా మహా సగ్ంహితాః।

ఇవి పంచ మహత్ సంహిత-పంచ మహా ఉపాసనలుగా చెప్పబడుచున్నది.


య ఏవమేతా మహాసగ్ంహితా వ్యాఖ్యాతా వే`ద .
సంధీయతే ప్రజయా పశుభిః .
బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సువర్గ్యేణ లోకేన .. 4..

ఇతి తృతీయోఽనువాకః ..
య ఏవమ్ ఏతా
మహా సగ్ంహితా వ్యాఖ్యాతా వేద,
సంధీయతే, ప్రజయా
పశుభిః। బ్రహ్మవర్చసేన
అన్నాద్యేన సువర్గ్యేణ లోకేన।।
(సంధిః ఆచార్యః పూర్వరూపమ్
ఇతి అధిప్రజం లోకేన।)
ఎవ్వరైతే ఈ విధంగా వ్యాఖ్యానింపబడుచున్న మహా సంహిత (మహాసంయోగము-మహదోపాస)ను తెలుసుకొని పంచోపాసనలను నిర్వర్తించు చున్నారో,… అట్టివారు ఉత్తమ ప్రజలతోను, సంతానముతోను, తత్త్వజ్ఞులగువారి సహవాసముతోను, పశుసంపదతోను, బ్రహ్మవర్చస్సు తోను ప్రకాశించుచున్నారు. అన్నాద్యములతోను (భోగ్యవస్తువులను పొందుట చేతను), సువర్గ (స్వర్గ) లోక ప్రవేశము చేతను - సుసంపన్ను లగుచూ, ఆత్మతత్త్వముతో అనుసంధానము పొందుచున్నారు. ‘ప్రజనాశ్రయము’ అని ఆచార్యులవారిచే ఈ విధంగా ఉపాసనగా, ‘పంచసంయోగ మహాసంహిత’గా నిత్యోపాసనకొరకై శిష్యులకు బోధించబడుచున్నది! ప్రసాదించబడుచున్నది!


1వ అధ్యాయము - శీక్షా వల్లీ - 4వ అనువాకము


మేధాదిసిద్ధ్యర్థా ఆవహంతీహోమమంత్రాః

యశ్ఛందసామృషభో విశ్వరూపః .
ఛందోభ్యోఽధ్యమృతాత్సంబభూవ .
స మేంద్రో మేధయా స్పృణోతు .
అమృతస్య దేవ ధారణో భూయాసం .
శరీరం మే విచర్షణం . జిహ్వా మే మధుమత్తమా .
కర్ణాభ్యాం భూరివిశ్రువం .
బ్రహ్మణః కోశోఽసి మేధయా పిహితః .
శ్రుతం మే గోపాయ . ఆవహంతీ వితన్వానా .. 1..
1. యః ఛన్దసామ్ ఋషభో విశ్వరూపః।
ఛన్దోభ్యో అధి అమృతాత్ సంబభూవ।
సమేంద్రో మేధయా స్పృణోతు।।
అమృతస్య దేవధారణో భూయాసమ్।
శరీరం మే విచర్షణమ్।
జిహ్వా మే మధుమత్తమా।
కర్ణాభ్యాం భూరి విశ్రువమ్।
బ్రహ్మణః కోశోఽసి
మేధయా పిహితః,
శ్రుతం మే గోపాయ।
ఆవహన్తీ వితన్వానా।।
ఏది వేదములలో ప్రాధాన్యముగా పురుషోత్తమ-విశ్వరూపము (ప్రణవము) గా స్తుతించబడుచూ ఉన్నదో, వేదముల సారమై అమృత రూపమై పలుకబడుచున్నదో, సంప్రకాశమానమై ఉన్నదో, అట్టి ఇంద్ర తత్త్వము (పరబ్రహ్మతత్త్వము) అగు ‘ఓం’ సంజ్ఞార్థము నా మేధస్సును (ప్రజ్ఞను) చేరునుగాక! స్పృశించునుగాక! నా మేధను ఉత్తేజపరచును గాక.
ఓ దేవా! అమృతరూపమగు బ్రహ్మతత్త్వమును మేము ధారణగా పొందెదముగాక! అందుకుగాను మా ఈ శరీరము విచక్షణమై (లేక) యోగ్యమై ఉండునుగాక! మా యొక్క ఈ నాలుక ‘మధురభాషణము’ అనే భూషణము పొందినదై ఉండుగాక! మా ఈ చెవులు బ్రహ్మము గురించి విస్తారముగా వినుటకు శక్తియుతమై ఉండునుగాక!
ఓ పరబ్రహ్మ తత్త్వమా! నీవు మాయందు ఉండియే ఉన్నావు. అయితే పంచకోశములచేతను, మా లౌకిక ప్రజ్ఞచేతను కప్పబడినదానవై ఉన్నావు. మా యొక్క ఆత్మజ్ఞానము యొక్క వినికిడిని దయతో రక్షించి, మమ్ములను కప్పియున్నట్టి అడ్డుల నుండి రక్షించుము.
ఈ విధంగా ఆత్మమేధస్సు కోరువాడు చేయవలసిన ప్రార్థనగా చెప్పబడింది!

కుర్వాణాఽచీరమాత్మనః . వాసాగ్ంసి మమ గావశ్చ .
అన్నపానే చ సర్వదా . తతో మే శ్రియమావహ .
లోమశాం పశుభిః సహ స్వాహా .
ఆమాయంతు బ్రహ్మచారిణః స్వాహా .
విమాఽఽయంతు బ్రహ్మచారిణః స్వాహా .
ప్రమాఽఽయంతు బ్రహ్మచారిణః స్వాహా .
దమాయంతు బ్రహ్మచారిణః స్వాహా .
శమాయంతు బ్రహ్మచారిణః స్వాహా .. 2..
యశో జనేఽసాని స్వాహా . శ్రేయాన్ వస్యసోఽసాని స్వాహా .
తం త్వా భగ ప్రవిశాని స్వాహా .
స మా భగ ప్రవిశ స్వాహా .
2. (ఆవహన్తీ వితర్వానా)
కుర్వాణ ఆచీరమాత్మనః।
వాసాగ్ంసి మమ గావశ్చ।
అన్న పానే చ సర్వదా।
తతో మే శ్రియమావహ।
లోమశాం పశుభిః సహ స్వాహా।।
ప్రమాయన్తు బ్రహ్మచారిణః స్వాహా।
ఆమాయన్తు బ్రహ్మచారిణః స్వాహా।
ని(వి)మాయన్తు బ్రహ్మచారిణః స్వాహా।
దమాయన్తు బ్రహ్మచారిణః స్వాహా।
శమాయాన్తు బ్రహ్మచారిణః స్వాహా।
యశోజనే అసాని స్వాహా।
శ్రేయాన్ అస్యసో అసాని స్వాహా।
తం త్వా భగ, ప్రవిశాని స్వాహా।
స మా భగ ప్రవిశ స్వాహా।
ఓ పరమాత్మా! ఉత్తమ శరీరము, మేధాశక్తులతోబాటుగా చిరకాలము సర్వదా…
మాకు వస్త్రములను, గోవులను, అన్న - పానములను కూడా ప్రసాదిస్తూ విస్తరింపజేయండి! రోమములు గల గొర్రెలను కూడా ప్రసాదించి మా స్వాహా (దేవయజ్ఞ) విధులను దిగ్విజయముగా నిర్వర్తింపజేయండి!
బ్రహ్మ విద్యను ఆశ్రయించినవారై, ఉత్తమమగు ఆశయము కలవారు సమస్త దిక్కులనుండి చక్కగా - ఆయాన్తు - ఇక్కడికి వచ్చెదరుగాక. నియమ - నిష్ఠలతో, శ్రద్ధతో వారిని (విద్యార్థులను) ఈ ఆశ్రమమునకు ఆహ్వానిస్తున్నాము. ఇంద్రియ నిగ్రహముగల, శమముగల, బ్రహ్మచారులు (బ్రహ్మమును అభ్యసించు ఆశయముగల విద్యార్థులు) నన్ను సమీపించెదరుగాక! ఈ హోమద్రవ్యమును స్వీకరించి, మీ దివ్యమగు ఆశీస్సులు ప్రసాదించండి. ఇక్కడి గురుశిష్యులమంతా కూడా జనులయందు యసస్సు పొందెదముగాక! మా ఈ గురు- శిష్య సాంప్రదాయము, తాత్త్విక విషయముల అభ్యాసములు జనులలో ప్రసిద్ధిపొందునుగాక! మేము శ్రేయస్సు పొందెదముగాక!

హే భగవాన్! ఆధ్యాత్మిక పాఠ్యాంశములు గురువుగా నేను చెప్పుచున్నప్పుడు, శిష్యుడుగా ఈతడు ఎరుగుచున్నప్పుడు మా ఇరివురి బుద్ధి నీయందు ప్రవేశించి ప్రకాశించునుగాక…
మాయందు భగ (తేజోరూపమై) తత్త్వజ్ఞానము ప్రవేశించి ప్రకాశించును గాక! దేవతల సమర్పణగా ఈ ఉపనిషత్ వ్యాసంగము దిగ్విజయమగును గాక! భక్తితో హోమద్రవ్యములను సమర్పిస్తున్నాము.

తస్మిన్ సహస్రశాఖే . నిభగాఽహం త్వయి మృజే స్వాహా .
యథాఽఽపః ప్రవతాఽఽయంతి . యథా మాసా అహర్జరం .
ఏవం మాం బ్రహ్మచారిణః . ధాతరాయంతు సర్వతః స్వాహా .
3. తస్మిన్ తు సహస్ర శాఖే।
నిభగా అహం త్వయిమ్ ఋజే స్వాహా।
యథా ఆపః ప్రవతాఽఽయన్తి (ప్రవతా ఆయన్తి)
యథా మాసా అహః జరమ్, (అహర్జరమ్)।
ఏవం మాం బ్రహ్మచారిణః।
ధాతరాయంతు సర్వతః స్వాహా।।
సహస్ర (వేలాది) విధానములుగా చెప్పబడుచూ అభివర్ణించబడుచున్న ఓ ప్రణవమా! ఆత్మ భగవాన్! నీయందు నేను సత్యదృష్టితో ప్రవేశించి పరిశుద్ధుడనగుదునుగాక! ‘‘స్వాహా’’ అని దేవతలను ఆహ్వానిస్తున్నాను.

ఓ సర్వాత్మకుడవగు పరమాత్మా! ప్రణవస్వరూపా!
→ ఏ విధంగా నీరు పల్లము ఎరిగి ప్రవహిస్తూ ఉంటుందో…
→ ఏ విధంగా కాలమును మాసములు, సంవత్సరములు వెంటనంటినవై నడుస్తూ ఉంటాయో,
ఆ విధంగా ఆధ్యాత్మ విద్యయందు శ్రద్ధ-ఆసక్తి- అభిలాషలు గల బ్రహ్మచారులు (అధ్యయన విద్యార్థులు) సర్వదిక్కులనుండి నన్ను సమీపించుటకై వచ్చెదరుగాక! ఈ ఆశ్రమములో బ్రహ్మవిద్య - అధ్యయనము లోకములకు శుభము చేకూర్చునుగాక!

ప్రతివేశోఽసి ప్రమాభాహి ప్రమాపద్యస్వ .. 3..
4. ప్రతివే అశోఽసి (ప్రతివేశోఽసి)
ప్రమా భాహి।
ప్రమాపద్యస్వ।)

- (వితన్వానా ప్రవిశ స్వాహా సప్తచ। - ద్రవిడ పాఠః)
- (వితన్వానా శమాయన్తు బ్రహ్మచారిణః స్వాహా
ధాత రాయన్తు సర్వతః స్వాహా। హి ఏకం చ।।- (ఇతరపాఠః।)
హే భగవాన్! పరబ్రహ్మమా! ఎవరు మిమ్ములను శ్రద్ధతో ఉపాసిస్తారో, వారి గృహములలో స్వయముగా ప్రవేశించటము మీ స్వభావము కదా!
మా గృహమునకు వేంచేయండి.
మా గృహమును పొంది మమ్ము ప్రకాశింపజేయుము. ఆత్మతత్త్వము మాయందు ప్రవేశించి మమ్ములను ప్రకాశింపజేయునుగాక! (ఆత్మ శ్రేయస్సు కోరి ఉపనిషత్ ఉపదేశము పొందకోరువాడు ముందుగా జపము మంత్రము-హోమమంత్రము-ప్రణవప్రార్థన నిర్వహించాలి).


1వ అధ్యాయము - శీక్షా వల్లీ - 5వ అనువాకము


వ్యాహృత్యుపాసనం -

భూర్భువః సువరితి వా ఏతాస్తిస్రో వ్యాహృతయః .
తాసాముహస్మై తాం చతుర్థీం . మాహాచమస్యః ప్రవేదయతే .
మహ ఇతి . తద్బ్రహ్మ . స ఆత్మా . అంగాన్యన్యా దేవతాః .
భూరితి వా అయం లోకః . భువ ఇత్యంతరిక్షం .
సువరిత్యసౌ లోకః .. 1..
మహ ఇత్యాదిత్యః . ఆదిత్యేన వావ సర్వేలోక మహీయంతే .
1. ‘భూః భువః స్సువః’ ఇతి వా
ఏతాః తిస్రో వ్యాహృతయః।
తాసామ్ ఉహ అస్మైతాం - చతుర్థీమ్
మహాచమస్యః ప్రవేదయతే।
‘మహ’ ఇతి। తత్ బ్రహ్మ।
స ఆత్మా। అంగాని (అంగాస్య) అన్యా దేవతాః।
‘భూః’ ఇతి వా అయం లోకః।
‘భువః’ ఇతి అంతరిక్షమ్।
‘సువః’ ఇతి అసౌ లోకః।

2. ‘మహ’ - ఇతి ఆదిత్యః।
ఆదిత్యేన వావ సర్వే లోకా
మహీయన్తే।
3వ అనువాకమునందు లోక - జ్యోతి - విద్య - ప్రజ - ఆత్మ (స్వదేహ) సంహితము (ఉపాసనల) గురించి పంచమహాసంహితముగా చెప్పబడింది.
4వ అనువాకంలో మేధ - శ్రీ (సిరి - సద్గుణములు) కోరుకొనువానికి - అందుకొరకై సాధనభూతములగు మంత్రములు చెప్పబడ్డాయి).
ఇక ఈ 5వ అనువాకములో ‘వ్యాహృతి స్వరూప బ్రహ్మమును హృదయంలో ధ్యానించండి’… అంటూ బ్రహ్మకు అంగభూతములైన వ్యాహృతులు ఉపాసనగా చెప్పబడుతోంది.

దృశ్యలోకమును ఉద్దేశ్యించి ఉపాసన
-‘భూ’- భువర్- సువర్ లోక వ్యాహృతులకు…ఈ ‘3’ తన అంగముగా గల ‘మహర్‌లోకము’ అనే 4వ వ్యాహృతిని ‘మహాచమన్వుడు’ అనే మహర్షి తన తపస్సుతో దర్శించి చెప్పారు. అట్టి 4వ వ్యాహృతి గురించి చెప్పుకుంటున్నాం.
భూః - ఈ భౌతికంగా కనిపించే లోకము.
భువః - అను ‘వ్యాహృతి’ని అంతరిక్షములోని (ఆకాశములోని-భూలోక- దేవలోకములకు మధ్య గల లోకములను ఉద్దేశ్యించి చెప్పబడుతోంది.
సువః - అను ‘వ్యాహృతిని’ సువర్లోక (లేక) దేవ(స్వర్గ) లోకమును భావిస్తూ ఉపాసించాలి. లోక నిర్మాణకర్తలు,అశరీరులు అగు దివ్యతత్త్వాభిమానులగు దేవతలు ఉపాసించబడుచున్నారు.

మహః=భూ-భువర్-సువర్-లోకములుగా సంప్రదర్శితమగుచూ ఆ మూడిటిని తన అంగములుగా కలిగి ఉన్నది. ‘ఆదిత్యలోకము’! మహర్లోకము. అట్టి ‘మహత్’యే ‘3’ లోకములు. సృష్టికర్తయగు బ్రహ్మ పురుషుడే ఆత్మ-ఆదిత్యుడు. దేవతలు ఆదిత్యుని అంగములయి, ఆదిత్యమే సర్వ తదితర లోకములు అయి, ఆదిత్యునిచే వృద్ధి చేయబడుచున్నది. ‘‘మహీయన్తే!’’ - అని ఉపాసించబడుచున్నది.

భూరితి వా అగ్నిః . భువ ఇతి వాయుః . సువరిత్యాదిత్యః .
మహ ఇతి చంద్రమాః . చంద్రమసా వావ
సర్వాణి జ్యోతీగ్ంషి మహీయంతే . భూరితి వా ఋచః .
భువ ఇతి సామాని .
సువరితి యజూగ్ంషి .. 2..
మహ ఇతి బ్రహ్మ . బ్రహ్మణా వావ సర్వేవేదా మహీయంతే .
‘భూః’ ఇతి వా అగ్నిః।
‘భువ’ ఇతి వాయుః।
‘సువః’ ఇతి ఆదిత్యః।
‘మహ’ ఇతి చంద్రమాః।
చన్ద్రమసా వావ సర్వాణి
జ్యోతీగ్ం షి మహీయన్తే।
‘భూః’ ఇతి వా ఋచః।
‘భువః’ ఇతి సామాని।
‘సువః’ ఇతి యజుగ్ంషి।
‘మహ’ అతి బ్రహ్మ।
బ్రహ్మణా వావ సర్వే వేదా మహీయన్తే।
దివ్యప్రజ్ఞలగు దేవతలను ఉద్దేశ్యించి ఉపాసన
ఇంకా చతుర్ - హ్యహృతీ ఉపాసన గురించి చెప్పబడుచున్నది.
‘భూః’ వ్యాహృతి → ‘అగ్ని’గాను,
‘భువర్’ వ్యాహృతి → ‘వాయువు’గాను,
‘సువర్’ వ్యాహృతి → ఆదిత్యుడుగాను, (సూర్యుడు)
మహర్ వ్యాహృతి → చంద్రతత్త్వము గాను (మనస్సు)
చంద్రునిచేతనే సర్వ అగ్ని - వాయు - ఆదిత్యులు వృద్ధి చేయబడు చున్నట్లుగాను, చంద్రుని జ్యోతి స్వరూపముగాను, అద్దాని వెలుగుయే తదితరమంతా అని… ఉపాసించుచున్నాము!

వేదములను ఉద్దేశ్యించి ఉపాసన
ఋగ్వేదమును → భూవ్యాహృతిగాను,
సామవదేమును → ‘భువర్’ వ్యాహృతిగాను
యజుర్వేదమును → ‘సువర్’ వ్యాహృతిగాను
‘ఓం’కారమగు బ్రహ్మమును → మహర్ వ్యాహృతిగాను
ఉపాసించుచున్నాము.
వేదములన్నీ కూడా ‘ఓం’కార సంజ్ఞ అగు ‘పరబ్రహ్మము’ యొక్క త్రి అంగములు. అవి మహర్వ్యాహృతి చేతనే ఋక్ యజుర్ సామవేదములుగా వృద్ధిచెందుచున్నాయి. ‘మహ’ యే త్రివేదములుగా విస్తరించుచున్నది.

భూరితి వై ప్రాణః . భువ ఇత్యపానః . సువరితి వ్యానః .
మహ ఇత్యన్నం . అన్నేన వావ సర్వే ప్రాణ మహీయంతే .
తా వా ఏతాశ్చతస్రశ్చతుర్ధా . చతస్రశ్చతస్రో వ్యాహృతయః .
తా యో వేద .
స వేద బ్రహ్మ . సర్వేఽస్మైదేవా బలిమావహంతి .. 3..

ఇతి పంచమోఽనువాకః ..
3. ‘భూః’ ఇతి వై ప్రాణః
‘భువః’ ఇతి అపానః।
‘సువః’ ఇతి వ్యానః।
‘మహ’ ఇతి అన్నమ్।।
ప్రాణశక్తిని ఉద్దేశ్యించి ఉపాసన
ప్రాణము (పీల్చువాయువు)ను → ‘భూ’ వ్యాహృతిగాను,
అపానము (వదలువాయువు)ను → ‘భువర్’ వ్యాహృతిగాను,
వ్యాన (వ్యాప్తి కలిగియున్న) వాయువును → సువర్ వ్యాహృతిగాను,
అన్నము (ఆహారము) - మహర్‌వ్యాహృతిగాను ఉపాసించుచున్నాము.
అన్నేన వావ సర్వే ప్రాణా మహీయన్తే।
తావా ఏతాః చతస్రః
చతుర్థా।
చతస్రః చతస్రో (4 x 4 = 16)
వ్యాహృతయః।
తా యో వేద, స వేద బ్రహ్మ।
సర్వే అస్మై దేవా
బలిమ్ ఆవహన్తి।।
అసౌ లోకో యజూగ్ంషి
వేద ద్వే చ।
అన్నము చేతనే సర్వప్రాణులు వృద్ధిచెందుచున్నారు. అందుచేత సర్వజీవుల ప్రాణప్రదర్శనములకు కారణమగు ‘అన్నము’ను పరబ్రహ్మ స్వరూపముగా ఉపాసించెదము గాక.
పైన చెప్పుకున్నట్లు బ్రహ్మమును భూ - భువర్ - సువర్ - మహర్ వ్యాహృతులను → లోక - దేవ - వేద - ప్రాణ దృష్టులతో దృక్ రూపమగు ఆత్మను ఉపాసించాలి.
(1) భూవ్యాహృతిని → పృథివి - అగ్ని - ఋగ్వేదము, ప్రాణవాయువుగాను….
(2) భువర్ వ్యాహృతిని → అంతరిక్షము, వాయువు, సామవేదము, అపానవాయువుగాను,
(3) సువర్ వ్యాహృతిని → స్వర్గము, ఆదిత్యుడు, యజుర్వేదము, వ్యానవాయువుగాను
(4) మహర్ వ్యాహృతిని → ఆదిత్య లోకము, చంద్రుడు, ఓంకారము, అన్నముగాను ఉపాసించుచున్నాము.
ఈ 4 x 4 = 16…ఆత్మయొక్క అంగభూతములుగాను, ఆత్మయొక్క వ్యాహృతులుగాను ఎవ్వడు ఎరిగి - ఉపాసిస్తున్నాడో, ఆతడు బ్రహ్మమును ఎరిగి ఉపాసించుచున్న వాడగుచున్నాడు. దేవతలందరిని పూజించిన ఫలము పొందుచున్నాడు.
అట్టివాడు (1) ఇహము, (2) ఇద్దానికి ఆధారమగు పరము…ఈ రెండిటిని ఉపాసన చేయుచున్నవాడగుచున్నాడు.


1వ అధ్యాయము - శీక్షా వల్లీ - 6వ అనువాకము


మనోమయత్వాదిగుణకబ్రహ్మోపాసనయా స్వారాజ్యసిద్ధిః

స య ఏషోఽన్తహృదయ ఆకాశః .
తస్మిన్నయం పురుషో మనోమయః . అమృతో హిరణ్మయః .
అంతరేణ తాలుకే . య ఏషస్తన ఇవావలంబతే . సేంద్రయోనిః .
యత్రాసౌ కేశాంతో వివర్తతే . వ్యపోహ్య శీర్షకపాలే .
1. స య ఏషో అన్తర్హృదయ
ఆకాశః।
తస్మిన్ అయం పురుషో
మనోమయః।
అమృతో హిరణ్మయః।
అన్తరేణ తాలుకే।
య ఏషస్తన ఇవ అవలమ్బతే।।
స ఇన్ద్ర యోనిః, (సేన్ద్రయోనిః)
యత్ర అసౌ కేశాన్తో
వివర్తతే। వ్యాపోహ్య శీర్ష కపాలే।
ఇప్పటి వరకు భూ-భువర్-సువర్-మహర్ వ్యాహృతులచే బ్రహ్మయొక్క ‘అంగపూజ’ చెప్పబడినది.
ఇప్పుడు హృదయాకాశములో బ్రహ్మమును ధ్యానించటము, దర్శించటము - ఉపాసించటము గురించి చెప్పుకోబోవుచున్నాము.

అంతర్-హృదయ పుండరీకమునందు మధ్యగా చిత్-ఆకాశమునందు మనోమయుడు, హిరణ్మయుడు, జ్యోతిర్మయుడు, మరణముగాని- మార్పు- చేర్పులు గాని లేనట్టి అమృతస్వరూపుడు, ఈ సమస్తమును తనయొక్క పురుషకారముగా కలవాడు అగు పరమాత్మ వేంచేసి ఉన్నారు. సర్వనాడులకు ఊర్థ్వభాగమునందు, ప్రాణములకు స్థానమై యున్నారు. ఆయనను పొందడమే పరమపదస్థానము.

- హృదయమునకు ఊర్థ్వభాగంలో సుషుమ్ననాడి!
- ఆ సుషుమ్ననాడి దవడల మధ్య భాగంలో స్తనమువలె వ్రేలాడుచూ ఉన్నది.
ఆ నాడి తల వెంట్రుక వంటి రూపంగా శిరస్సు యొక్క ఊర్ధ్వభాగము వరకు (బ్రహ్మరంధ్రము వరకు) విస్తరించి ఉన్నది. అంతే కాదు. శిరస్సు చీల్చుకొని బయటకు కూడా (సహస్రారమునకు) విస్తరించినదైయున్నది. అనగా కపాలమును దాటినదై, విశ్వ- విశ్వాంతరాళమందు ప్రసరించునదై యున్నది. అది బ్రహ్మమును ప్రాప్తించుకొనటమును ఎరిగిన యోగి యొక్క కపాల ఊర్థ్వమునుండి బయటకు స్వానుభవమై వెడలుచున్నది.

భూరిత్యగ్నౌ ప్రతితిష్ఠతి . భువ ఇతి వాయౌ .. 1..

సువరిత్యాదిత్యే . మహ ఇతి బ్రహ్మణి . ఆప్నోతి స్వారాజ్యం .
ఆప్నోతి మనసస్పతిం . వాక్పతిశ్చక్షుష్పతిః .
శ్రోత్రపతిర్విజ్ఞానపతిః . ఏతత్తతో భవతి .
ఆకాశశరీరం బ్రహ్మ .
సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం .
శాంతిసమృద్ధమమృతం .
ఇతి ప్రాచీన యోగ్యోపాస్వ .. 2..

ఇతి షష్ఠోఽనువాకః ..
2. ‘భూః’ ఇతి అగ్నౌ
ప్రతితిష్ఠతి।
‘భువః’ ఇతి వాయౌ।
‘సువః’ ఇతి ఆదిత్యే।
‘మహః’ ఇతి బ్రహ్మణి।
ఆప్నోతి స్వా రాజ్యమ్।
ఆప్నోతి మనసస్పతిమ్।
వాక్పతిః। చక్షుష్పతిః।
శ్రోత్ర పతిః। విజ్ఞాన పతిః।
ఏతత్ తతో(త్) భవతి।
ఆకాశ శరీరం బ్రహ్మ।
సత్యాత్మ ప్రాణ ఆరామం
మన ఆనన్దమ్।
శాన్తి సమృద్ధమ్
అమృతమ్।
ఇతి, ప్రాచీన యోగ్య ఉపాస్స్వ। (యోగ్యోపాస్య)
(వాయా వ అమృతమ్ ఏకం చ।।)
‘భూ’ అను వ్యాహృతాత్మకమైన అగ్నియందు సుషమ్న నాడ్యభ్యాసి ప్రతితిష్టితుడగుచున్నాడు. వ్యాహృతుడై భూమి - అగ్ని స్వరూపుడగుచున్నారు. అంతరిక్షమునందు ప్రవేశించి
‘భువర్’ అను వ్యాహృతాత్మకమగు వాయువునందు ప్రవేశించి వాయువునందు ప్రతితిష్టితుడు అగుచున్నారు. వాయు స్వరూపుడై సర్వ కదలికలు తనవిగా దర్శిస్తున్నారు.
‘సువః’ అను ఆదిత్యునియందు (సూర్యునియందు) ప్రతితిష్టితుడై ఉంటున్నారు. తన వెలుగులో అన్నీ ఉజ్జీవింపజేయువాడగుచున్నారు.
‘మహర్’ అను 4వ వ్యాహృతాత్మకమగు బ్రహ్మమునందు ప్రతితిష్టితుడై ఉంటున్నారు. మనస్సుకు అధిపతీయి, స్వస్వరూపమగు స్వారాజ్యము (ఆత్మ సామ్రాజ్యము) పొందుచున్నారు. ఏలుచున్నారు.
→ వాక్‌కు అధిపతిగాను, చూపుకు - చెవులకు (వినికిడికి) అధిపతిస్థానము పొందుచున్నారు. విజ్ఞానము (ఎరుక) నకు అధిపతి అయి ప్రకాశిస్తున్నారు.

ఓ ప్రాచీనయోగ్యా! (అట్లు సంషుమ్ననుండి కేశమువంటి మార్గములో ‘కేశాంతము’ చేరి, కపాలభాగమును దాటిన యోగి) ఈ సర్వము తనయందు దర్శించువాడై, తానే ఈ సమస్తమై ప్రకాశించుచున్నారు.
→ ఆకాశమంతా తన శరీరముగా దర్శిస్తూ, ఆకాశమంతా తన శరీరముగా కలిగి ఉంటున్నారు. మూర్త - అమూర్తము కూడా తానైన సత్యాత్మ స్వరూపుడు అగుచున్నారు.
→ ప్రాణ శక్తి యందు క్రీడించువాడు, ఆనందమయమగు మనస్సును సంతరించుకున్న వాడు, సర్వము తనయందు శాన్తించగా కూడా శేషించియుండువాడు, అమృతుడు… అగు పరమాత్మ శరీరుడు అగుచున్నాడు.

ఓ ప్రాచీన యోగ్య శిష్యా! నీవు అట్టి సుషుమ్ననుండి వెంట్రుక వంటి మార్గములో కఫాలమును దాటి ఆత్మవై పంచభూతములు నీ సూక్ష్మశరీరముగా, ఈ లోక-లోకాంతరములతో కూడిన సమస్త దృశ్యము స్వశరీరముగా కలవాడవై ప్రకాశించుము!


1వ అధ్యాయము - శిక్షా వల్లీ - 7వ అనువాకము


పృథివ్యాద్యుపాధికపంచబ్రహ్మోపాసనం

పృథివ్యంతరిక్షం ద్యౌర్దిశోఽవాంతరదిశాః .
అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి .
ఆప ఓషధయో వనస్పతయ ఆకాశ ఆత్మా . ఇత్యధిభూతం .
అథాధ్యాత్మం . ప్రాణో వ్యానోఽపాన ఉదానః సమానః .
చక్షుః శ్రోత్రం మనో వాక్ త్వక్ .
చర్మమాగ్ంస స్నావాస్థి మజ్జా .
ఏతదధివిధాయ ఋషిరవోచత్ .
పాంక్తం వా ఇదగ్ం సర్వం .
పాంక్తేనైవ పాంక్తగ్ స్పృణోతీతి .. 1..

ఇతి సప్తమోఽనువాకః ..
1. పృథివీ, అన్తరిక్షం, ద్యౌః,
దిశో అవాన్తర దిశాః।
అగ్నిః వాయుః ఆదిత్యః
చన్ద్రమా నక్షత్రాణి।
ఆప ఓషధయో వనస్పతయ
ఆకాశ ఆత్మా।
ఇతి అధిభూతమ్।
ఆత్మను పంచ విభాగములుగా గమనిస్తూ ఉపాసించువిధానము అగు ‘పాంక్త పంచక ఉపాసన’ గురించి ఇప్పుడు చెప్పుకుందాము.

బాహ్య - పాంక్త త్రయము - అధిభూత పాంక్తత్రయము
ఆత్మను పంచముఖములుగా ( పంచముఖ శివత్తత్వముగా) ఉపాసించు రీతి.
(1) లోకపాంక్తము : పృథివి, అంతరిక్షము, ద్యులోకము, దిశలు, అవాంతర దిశలు - ఇవి ఐదు. ఆత్మభగవానుని ‘పంచలోకపాంక్తములు’గా ఉపాసించుచున్నాము.
(2) దేవతా పాంక్తము : అగ్ని, వాయువు, ఆదిత్యుడు, చంద్రుడు, నక్షత్రములు…ఇవి ఆత్మయొక్క దేవతా పంచప్రత్యక్షములుగా (లేక) దేవతా పాంక్తములుగా భావించి ఉపాశించుచున్నాము.
(3) భూతపాంక్తము : జలము, ఔషధులు (ఆహార ధాన్యములు - వరి, గోధుమ మొదలైనవి). వనస్పతులు (పెసలు, మినుగులు మొదలైన పప్పు ధాన్యములు, ధనియాలు మిరియాలు…మొదలైన దినసులు), ఆకాశము, ఆత్మ…ఈ భూత పాంక్తము - పరమాత్మయొక్క రస విభవములుగా భావించి ఉపాసించుచున్నాము.
అథ అధ్యాత్మమ్
ప్రాణో వ్యానో అపాన ఉదానః
సమానః।
చక్షుః శ్రోత్రం మనో
వాక్ త్వక్
చర్మ మాగ్ంసగ్ం
స్నావా అస్థి మజ్జా।
ఏతత్ అధివిధాయ
అధ్యాత్మ పాంక్తత్రయము
(1) వాయుపాంక్తము : ప్రాణము, వ్యానము, అపానము, ఉదానము, సమానము…ఈ ఐదూ ప్రాణేశ్వరుని పంచప్రాణముఖములుగా, ఆత్మయొక్క పంచ ప్రదర్శనములుగా భావించి ఉపాసించుచున్నాము.
(2) ఇంద్రియ పాంక్తము : చక్షువులు, శ్రోత్రము, మనస్సు, వాక్కు (నోరు), త్వక్కు (స్పర్శ)…ఈ ఐదింటిని పరమాత్మయొక్క ఇంద్రియ పంచప్రదర్శనముగా చూస్తూ ఆత్మను ధ్యానించుచున్నాము.
(3) ధాతు పాంక్తము : చర్మము, మాంసము, వస (స్నాయవు), అస్థి (బొమికలు), మజ్జ → ఈ ఐదు పరమాత్మయొక్క పంచధాతు ప్రత్యక్షములుగా దర్శించి ఉపాసిస్తున్నాము.
ఋషిః అవోచత్-
పాఙ్క్తం వా(పాక్తంవా) ఇదగ్ం
సర్వమ్।
పాంక్తేనైవ పాంక్తగ్ం
స్పృణోతి ఇతి।
(సర్వం ఏకం చ।।)
ఋత్ (సత్యము)ను ఎరిగిన ఋషులు జనుల ఆత్మోపాసనకొరకై ‘పాంక్త షట్క (3+3) కోష్ఠముల-పంచవిభాగముల ‘6’ కోష్ఠములను ‘ఆత్మచైతన్యసంప్రదర్శనములు’గా ఉపాసించుమార్గమును చూపుచున్నారు.
పరమాత్మ పంచాత్మకుడు (దృశ్యము+దేహము+జీవాత్మ+ఈశ్వరాత్మ +పరమాత్మ). అందుచేత పాంక్త-పంచముఖుడు అని చెప్పబడుచున్నాడు.
ప్రపంచము కూడా పంచభూత నిర్మితము కాబట్టి ‘పాంక్త’ శబ్దవాచ్యమే। కాబట్టి నాయొక్క ప్రపంచముయొక్క స్వరూపం ఒక్కటే. వేరు కాదు.
ఉపాసనచే… ఇదంతా అనేకంగా కనిపిస్తూనే, ఏకమే అయి ఉన్నది.
ఏకము - సర్వము అయినట్టి అఖండ బ్రహ్మముయొక్క వ్యాహృతాత్మక వైభవమే-ఇదంతా-అను అవగాహనతో ఆత్మ ఉపాసించబడుగాక!
బ్రహ్మమే సర్వస్వరూపమైయున్నది! నేను జగత్తు కూడా (ఏక-అఖండ) బ్రహ్మ స్వరూపులం! త్వమ్-తత్ కూడా అఖండ బ్రహ్మమే!


1వ అధ్యాయము - శీక్షా వల్లీ - 8వ అనువాకము


ప్రణవోపాసనం

ఓమితి బ్రహ్మ . ఓమితీదꣳసర్వం .
ఓమిత్యేతదనుకృతిర్హస్మ వా అప్యోశ్రావయేత్యాశ్రావయంతి .
ఓమితి సామాని గాయంతి . ఓంꣳశోమితి శస్త్రాణి శꣳసంతి .
ఓమిత్యధ్వర్యుః ప్రతిగరం ప్రతిగృణాతి .
ఓమితి బ్రహ్మా ప్రసౌతి . ఓమిత్యగ్నిహోత్రమనుజానాతి .
ఓమితి బ్రాహ్మణః ప్రవక్ష్యన్నాహ బ్రహ్మోపాప్నవానీతి .
బ్రహ్మైవోపాప్నోతి .. 1..

ఇత్యష్టమోఽనువాకః ..
1. ‘ఓం’ ఇతి బ్రహ్మ।
‘ఓం’ ఇతి ఇదగ్ం సర్వం।
‘ఓం’ ఇతి ఏతత్
అనుకృతి హస్మ వా
అప్యోశ్రావ
యేత్యా శ్రావయన్తి।
‘ఓం’ ఇతి సామాని గాయన్తి।।
‘ఓగ్ం శోమ్’ (సోమ్) ఇతి శస్త్రాణి
శగ్ం సన్తి।
‘ఓం’ ఇతి అధ్వర్యుః
ప్రతిగరం ప్రతిగృణాతి।
‘ఓం’ ఇతి బ్రహ్మా ప్రసౌతి।
‘ఓం’ ఇతి అగ్నిహోత్రమ్ అనుజానాతి।
ఓం ఇతి బ్రాహ్మణః
ప్రవక్ష్యన్ న ఆహ।
‘బ్రహ్మో అవాప్నువాన్’ ఇతి
బ్రహ్మ ఏవ అవాప్నోతి।।
(ఓం దశ)
సమస్త ఉపాసనలకు అంగభూతమైనట్టి ‘ఓం’కారోపాసన
ఓ శ్రోతలారా! ‘ఓం’ను ఏ రీతిగా ఉపాసించాలో చెప్పుకుందాము!
‘ఓం’ అను శబ్దముయొక్క రూపము పరబ్రహ్మమే. ఇదంతా కూడా ఓంకార స్వరూపమే! ‘ఓం’ అనునది ఈ జగత్తుయొక్క ‘‘కర్తృరూపము - అను కృతము’’ అని ప్రసిద్ధి. ‘ఓం’ కారమును శబ్ద బ్రహ్మముగా ధ్యానించాలి.
జగత్తు ఓంకారము నుండి శ్రవిస్తోంది. కాబట్టి ‘శ్రావయతి’ అంటారు.
ఇదంతా ‘ఓంకారమే’ అని సామవేద మంత్రములు గానం చేస్తున్నాయి.
ఓగ్ం-శోం - ఓంకారమనగా పరమాత్మయే - అని శాస్త్ర-మంత్రద్రష్టలు చెప్పుచున్నారు. శబ్దరూపంగా ఉన్న సమస్తము ‘ఓం’ నకు అధీనము. శబ్దములన్నీ ‘ఓం’ను అనుకరిస్తున్నాయి.
అందుచేతనే యజ్ఞ - యాగములు చేయించు ఆధ్వర్యుడు ‘ఓం-అధ-ఓం-ఇదమ్’ అని బదులు పలుకుచున్నారు. ప్రతిగరంగా (Resoundingly) స్వస్తి చెప్పుచున్నారు - చెప్పిస్తున్నారు.
‘ఓం’తోనే బ్రహ్మ (యజ్ఞ మంత్రద్రష్ట) యజ్ఞము ప్రారంభిస్తున్నారు. సమస్త కర్మలు చేయిస్తున్నారు. బ్రహ్మ ఆధ్వర్యులకు ‘ఓం’తో యాగ ప్రారంభమునకు అంగీకారము ఇచ్చుచున్నారు.
‘ఓం’కారముతో ప్రారంభించి బ్రాహ్మణుడు వేద మంత్రములను పలుకుచున్నారు. ‘ఓం’తో సర్వ ప్రవచనములు ప్రారంభిస్తున్నారు. ‘ఓం’ అని బ్రహ్మోపాసన ప్రారంభించి బ్రహ్మమును ఉద్దేశ్యించిన వారై, బ్రహ్మమునే పొందుచున్నారు. అందుచేత ‘ఓం’కారమును బ్రహ్మముగా, పరబ్రహ్మ స్వరూపముగా భావించాలి!
‘సర్వాత్మకము - సర్వ స్వరూపము - సర్వ బాహ్య - అభ్యంతరము - సర్వసాక్షి, సర్వకారణ కారణము అగు పరబ్రహ్మమునే ‘ఓం’ అను సంజ్ఞతో పిలుస్తున్నాము’. అని ఎరిగి ‘ఓం’ను ప్రారంభములో ఎలుగెత్తి పలకాలి!


1వ అధ్యాయము - శీక్షా వల్లీ - 9వ అనువాకము


స్వాధ్యాయప్రశంసా

ఋతం చ స్వాధ్యాయప్రవచనే చ .
సత్యం చ స్వాధ్యాయప్రవచనే చ .
తపశ్చ స్వాధ్యాయప్రవచనే చ .
దమశ్చ స్వాధ్యాయప్రవచనే చ .
శమశ్చ స్వాధ్యాయప్రవచనే చ .
అగ్నయశ్చ స్వాధ్యాయప్రవచనే చ .
అగ్నిహోత్రం చ స్వాధ్యాయప్రవచనే చ .
అతిథయశ్చ స్వాధ్యాయప్రవచనే చ .
మానుషం చ స్వాధ్యాయప్రవచనే చ .
ప్రజా చ స్వాధ్యాయప్రవచనే చ .
ప్రజనశ్చ స్వాధ్యాయప్రవచనే చ .
ప్రజాతిశ్చ స్వాధ్యాయప్రవచనే చ .
సత్యమితి సత్యవచా రాథీ తరః .
తప ఇతి తపోనిత్యః పౌరుశిష్టిః .
స్వాధ్యాయప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్యః .
తద్ధి తపస్తద్ధి తపః .. 1..

ఇతి నవమోఽనువాకః ..
1. ఋతం చ స్వాధ్యాయ ప్రవచనే చ।
సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ।
తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ।
దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ।
శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ।
అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ।
అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ।
అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ।
మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ।
ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ।
తపోధనులగు మహనీయుల స్వానుభవ ఆత్మతత్త్వ ప్రవచనములే ఋక్కులు. ఋషి వాక్కులలోని సత్యమును పారాయణం చేయాలి! ప్రవచించాలి! నిర్వర్తించాలి. వేద ప్రవచనములను, విధులను పాటించాలి. కలసి పఠించాలి. సాధ్యాయనంగా అధ్యయనం చేయాలి.
సత్యమగు బ్రహ్మమునే స్వాధ్యాయనంచేయాలి. ప్రవచించాలి. పాటించాలి.
కలిసి తపస్సు చేయాలి. స్తుతి-జ్ఞాన వాఙ్మయములను స్వాధ్యయనం చేయాలి. నిర్వర్తించాలి.

బాహ్య ఇంద్రియ నిగ్రహమును తప్పక కలిగి ఉండాలి. అద్దాని విధులను సంభాషించుకోవాలి. అంతరింద్రియ నిగ్రహమును స్వాధ్యాయనం చేయాలి. అనుష్ఠించాలి. అనుసరించాలి.

అగ్ని కార్యములను స్వాధ్యాయ - ప్రవచనములను నిర్వర్తిస్తూ ఉండాలి. శ్రుతులు చెప్పే శ్రోతములు నిర్వర్తించబడుగాక!
అగ్నిహోత్రమును ఉపాసించాలి. స్వాధ్యాయ ప్రవచనములు నిర్వర్తించబడుగాక! అనుష్ఠించబడునుగాక!

అతిథులను సేవించాలి. సేవింపజేయాలి. స్వాధ్యాయ - ప్రవచనములను నిర్వర్తించాలి! చెప్పాలి! చేయాలి!
మానుషత్వమును సేవించాలి. సంతోషింపజేయాలి. ‘దైవం మానుషరూపేణ’ అని ఉపాసించాలి. స్వాధ్యాయ - ప్రవచనములతో ఆరాధించాలి.
ప్రజలను, సంతానమును భగవత్ భావనతో పరిపోషించాలి. కలిసి ఉండి సేవా భావంతో, ప్రవచనములతో సేవించాలి. శ్రద్ధ కలిగి ఉండాలి. (వివాహములు చేయాలి). ఉత్తమ బోధలతో తీర్చిదిద్దాలి.
ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ।
ప్రజాపతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ।
‘సత్యమితి’ సత్య వచాః -
రాథీ తరః।


‘తప’ ఇతి తపో నిత్యః -
పౌరుశిష్టిః।


స్వాధ్యాయ ప్రవచనే
ఏవేతి నాకో
మౌద్గల్యః।
తద్ధి తపః। తద్ధి తపః।
(ప్రజా చ స్వాధ్యాయ
ప్రవచనే చ షట్చ।।)
సంఘము వృద్ధికై, సంఘము క్షేమం కోరి శుభకార్యములు నిర్వర్తించాలి. కలసి పనిచేయాలి. సేవాభావం కలిగి ఉండాలి.
సృష్టికర్తను → జీవుల అవసరాలకు సర్వము సృష్టిస్తున్న ప్రజాపతిని (బ్రహ్మదేవుని) స్తుతించాలి. కృతజ్ఞతలు తెలుపాలి.
ఏది సత్యమో…అట్టి సత్యమే పలకాలి. సత్యమును వినాలి. సత్యమునే ఆశ్రయించాలి. సత్యమే తెలుసుకోవాలి.
ఇది రాధీతరగోత్రోద్భవుడగు సత్యవచమహర్షి సిద్ధాంత సూచన.

తపనయే తపస్సు. పరమాత్మ గురించిన, దైవకార్యముల గురించిన, ఆత్మ గురించిన తపనతో తపస్సు చేయాలి. తపించాలి! - అని పురిశిష్ఠిమహర్షి కుమారుడగు పౌరుశిష్ఠ మునీంద్రుల పాఠ్యబోధ. ఇది అనుష్ఠానం చేయాలి.


స్వాధ్యాయ - ప్రవచనముల గురించి
సత్యవచః → సత్యమునే పలుకువాడై ఉండాలి.
తపోనిత్యః → తపసి నిత్యం వర్తత ఇతి। నిత్యము తపస్సు నిర్వర్తిస్తూ ఉండాలి.
(పేరుశిష్ఠః → తల్లి - తండ్రి - గురువులచే చక్కగా శిక్ష పొందుటయందు శ్రద్ధగలవాడు - ఇది మౌద్గల్య మహర్షి ప్రవచనము).
(మౌద్గల్యః → ముదం శాస్త్రార్ధ నిరూపనామ్, గలతి - స్రవతీతి. సంతోషంగా శాస్త్రార్థములను చెప్పుకొనువాడు).
తపో నిష్ఠుడై తపస్సు నిర్వర్తించాలి. ప్రజాసేవ, స్వాధ్యాయనము - ప్రవచనము. ఇవన్నీ తపోరూపములే.


1వ అధ్యాయము - శీక్షా వల్లీ - 10వ అనువాకము


బ్రహ్మజ్ఞ్యానప్రకాశకమంత్రః

అహం వృక్షస్య రేరివా . కీర్తిః పృష్ఠం గిరేరివ .
ఊర్ధ్వపవిత్రో వాజినీవ స్వమృతమస్మి .
ద్రవిణగ్ంసవర్చసం . సుమేధ అమృతోక్షితః .
ఇతి త్రిశంకోర్వేదానువచనం .. 1..

ఇతి దశమోఽనువాకః ..
1. అహం వృక్షస్య రేరివా।
కీర్తిః పృష్ఠం గిరేరివా।
ఊర్థ్వపవిత్రో వాజినీవ
స్వమ్ అమృతమస్మి।
ద్రవిణగ్ం సవర్చసమ్।
సుమేధా అమృతోక్షితః।
ఇతి, త్రిశంకోః
వేదానువచనమ్।।
(అహగ్ం షట్।।)
నేను → దేహపరిమిత రూపుడను కాను. మరి? ఈ జన్మ - జరా - మరణ రూపమగు ‘దేహము’ అను వృక్షమునకు రేః → అంతర్యామి యగు ప్రేరకుడను.
అహమ్ స్వరూపుడగు నాకీర్తి - ఖ్యాతి పర్వతము యొక్క పృష్ఠ ఆధార - బాహ్య భాగమువలె వేదములలో, ఉపనిషత్తులలో ప్రదర్శనమగుచున్నది. ఈ బాహ్యమునకు వెనుకభాగమగు ఆధారము నేనే! ఊర్థ్వంగా పవిత్రమగు ఆత్మనై ప్రకాశించువాడను.
స్వయముగా అమృత స్వరూపుడను. ఆత్మ తేజస్సు చే ‘దీప్తి’ అను ద్రవ్యముచే ప్రకాశించువాడను. బుద్ధికి సాక్షినై, కేవల బుద్ధి స్వరూపుడనై అమృతమునందు స్థితి కలిగి ఉన్నవాడను.
ఇవి త్రిశంకు మహర్షి యొక్క ఆత్మా-హమ్ పూర్వకమైన పలుకులు - వేద అనువచనము. - (ఇది ‘6’వ సూత్రము).


1వ అధ్యాయము - శిక్షా వల్లీ - 11వ అనువాకము


శిష్యానుశాసనం

వేదమనూచ్యాచార్యోంతేవాసినమనుశాస్తి .
సత్యం వద . ధర్మం చర . స్వాధ్యాయాన్మా ప్రమదః .
ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీః .
సత్యాన్న ప్రమదితవ్యం . ధర్మాన్న ప్రమదితవ్యం .
కుశలాన్న ప్రమదితవ్యం . భూత్యై న ప్రమదితవ్యం .
స్వాధ్యాయప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం .. 1..
1. వేదమ్ అనూచ్య -
ఆచార్యో అన్తేవాసినమ్ అనుశాస్తి।
‘సత్యం వద। ధర్మం చర।
స్వాధ్యాయాత్ మా ప్రమదః।’
ఆచార్యాయ ప్రియం ధనమ్।
ఆహృత్య, ప్రజాతంతుం
మా వ్యవచ్ఛేత్సీః।। (వ్యతచ్ఛేథ్సీః)
సత్యాన్ న ప్రమదితవ్యమ్।
ధర్మాన్ న ప్రమదితవ్యమ్।
కుశలాన్ న ప్రమదితవ్యమ్।
భూత్యై న ప్రమదితవ్యమ్।
స్వాధ్యాయ ప్రవచనాభ్యాం
న ప్రమదితవ్యమ్।
ఆచార్యులవారు శిష్యునికి వేదార్థములను బోధిస్తూ, వేదాధ్యయనముకొరకై శిష్యుని నియమించుచున్నారు. అనుశాశించుచున్నారు! ఈ విధంగా శిష్యునికి బోధించుచున్నారు.

- అధ్యయనమునకు సంసిద్ధుడవు అగుచున్న ఓ శిష్యా! బిడ్డా! ప్రియ ఆనందాత్మస్వరూపా! సత్ వస్తువు అగు ఆత్మ గురించియే వినుము. మాట్లాడుము. విద్యుక్త ధర్మములను, నియమిత ధర్మములను, బ్రహ్మచారి- గృహస్థ ఇత్యాది ఆశ్రమ ధర్మములను శ్రద్ధతో నిర్వర్తించుము. ఆత్మతత్త్వము గురించిన అధ్యయనము, అభ్యాసము ఎట్టి పరిస్థితులలోనూ వదల వద్దు. ఆచార్యులను సేవ-సమర్పణలతో సంతోషింపజేయుము. వారి కుటుంబమునకు, కుటుంబ సభ్యులకు ఎటువంటి బాధ-ఇబ్బంది కలిగించ వద్దు.
- సత్యము నుండి (ఆత్మతత్త్వ జ్ఞానము-యమ్ సత్… లేక సత్య స్వరూపమునుండి) విడిపోవద్దు. ప్రమాదము-(బద్ధకము-అశ్రద్ధ) కూడదు.
- నీకు నియమించబడిన స్వధర్మమును వదలనే వద్దు! తప్పక నిర్వర్తించుము. తదితర-సహజీవులకు శ్రేయస్సు కలిగించు కుశల కర్మలను వదలనే వద్దు. భూత దయ విషయంలో బద్ధగించకూడదు. స్వాధ్యాయనము (శాస్త్ర అధ్యయనము), ప్రవచనములను వినటము-చెప్పటముల నుండి విరమించరాదు.

దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం . మాతృదేవో భవ .
పితృదేవో భవ . ఆచార్యదేవో భవ . అతిథిదేవో భవ .
యాన్యనవద్యాని కర్మాణి . తాని సేవితవ్యాని . నో ఇతరాణి .
యాన్యస్మాకగ్ంసుచరితాని . తాని త్వయోపాస్యాని .. 2..
నో ఇతరాణి .
2. దేవ పితృ కార్యాభ్యాం
న ప్రమదితవ్యమ్।
మాతృదేవో భవ। పితృదేవో భవ।
ఆచార్య దేవో భవ। అతిథి దేవో భవ।
యాని అనవద్యాని కర్మాణి,
తాని సేవితవ్యాని। నో ఇతరాణి। (న ఇతరాని)।
యాని అస్మాకగ్ం సుచరితాని,
తాని త్వయా ఉపాస్యాని। నోఇతరాని। (న ఇతరాని)।
స్విద్య ముగించుకొన్న తరువాత
దేవతా కార్యములను, పిత్రు కార్యములను తప్పక నిర్వర్తించాలి. అశ్రద్ధ కూడదు. తల్లిని, తండ్రిని, ఆచార్యులవారిని (గురువును), అతిథిని దైవ సమానులుగా భావించి, పూజ్యభావముతో సేవించాలి.
పెద్దల దృష్టిలో, తదితరుల దృష్టిలో నింద్యము కానట్టి, (తప్పు కానట్టి, ఇతరులకు, మంచిది…అనిపించునట్టి), ఇతరులకు ఇబ్బంది - బాధ కలిగించనట్టి కర్మలు-అనింద్య కర్మలు) మాత్రమే నిర్వర్తించాలి. నింద్యమగు కర్మలు నిర్వర్తించకూడదు!
బిడ్డా! శిష్యా! నీవు ఇతరులకు బాధ - హింస - ఇబ్బంది కలిగించు కర్మలు చేస్తూ ఉంటే, ‘ఈతడు ఆయన శిష్యుడు కదా!’…అని గురువునకు నన్ను దూషిస్తారు. గురువుకు మంచి పేరు తేగల కర్మలే నీవు నిర్వర్తించాలి. తదితరములైనవి చేయరాదు సుమా! (ఆస్మాకం సుచరితాని। నో ఇతరాని।)

యే కే చాస్మచ్ఛ్రేయాగ్ంసో బ్రాహ్మణాః .
తేషాం త్వయాఽఽసనేన ప్రశ్వసితవ్యం . శ్రద్ధయా దేయం .
అశ్రద్ధయాఽదేయం . శ్రియా దేయం . హ్రియా దేయం .
భియా దేయం . సంవిదా దేయం .
3. యే కే చ అస్మత్ శ్రేయాగ్ం సో
బ్రాహ్మణాః, తేషాం
త్వయా ఆసనేన ప్రశ్వసితవ్యమ్।।
శ్రద్ధయా దేయమ్। అశ్రద్ధయా అ(q)దేయమ్।
శ్రియా దేయమ్।
హ్రియా దేయమ్। భియా దేయమ్।
సంవిదా దేయమ్।

మనకంటే అధికులు, విద్వత్తు కలవారు, శ్రేష్ఠులు ఉంటారు. బ్రహ్మజ్ఞులను, పెద్దలు, వచ్చినప్పుడు లేచి నిలుచుని, ఆసనము ఇచ్చి, వారి శ్రమ పోగొట్టాలి. వినమ్రతతో సంభాషించాలి. పెద్దల పట్ల, అమర్యాదకూడదు. భక్తి - ప్రపత్తి - శరణాగతి ప్రదర్శించాలి.
✤ శ్రద్ధతో గౌరవించాలి. అశ్రద్ధగా ఉండరాదు.
✤ ఆశ్రయించినవారికి - ఉపయోగపడు ధనమును, వస్తువులను శ్రద్ధ - భక్తులతో ఇవ్వాలి.
✤ అణకువతో ఇవ్వాలి. గర్వముతో కాదు. సిగ్గుచూపిస్తూ…దానము చేయాలి. ‘‘నేను ఇంతవరకు మాత్రమే ఇవ్వగలుగుచున్నానే’’- అని అనుకొంటూ ఇవ్వాలి.
✤ భయ-భక్తులు ప్రదర్శిస్తూ దానం చేయాలి. పరమాత్మకు సమర్పిస్తున్నాను. కృతజ్ఞతతో ఇస్తున్నాను - అని భావిస్తూ ఇవ్వాలి. ‘ఈతడు పరమాత్మ స్వరూపుడు కదా!’ అను సత్‌విత్ భావనతో సమర్పించాలి.


అథ యది తే కర్మవిచికిత్సా వా వృత్తవిచికిత్సా వా స్యాత్ .. 3..
యే తత్ర బ్రాహ్మణాః సంమర్శినః . యుక్తా ఆయుక్తాః .
అలూక్షా ధర్మకామాః స్యుః . యథా తే తత్ర వర్తేరన్ .
తథా తత్ర వర్తేథాః . అథాభ్యాఖ్యాతేషు .
యే తత్ర బ్రాహ్మణాః సంమర్శినః . యుక్తా ఆయుక్తాః .
అలూక్షా ధర్మకామాః స్యుః . యథా తే తేషు వర్తేరన్ .
తథా తేషు వర్తేథాః . ఏష ఆదేశః . ఏష ఉపదేశః .
ఏషా వేదోపనిషత్ . ఏతదనుశాసనం . ఏవముపాసితవ్యం .
ఏవము చైతదుపాస్యం .. 4..

ఇత్యేకాదశఽనువాకః ..
4. అథ యది తే కర్మవిచిత్సా వా
వృత్త విచికాత్సా వా స్యాత్,
యే తత్ర బ్రహ్మణాః సమదర్శినః, (సమ్మర్శినః)
యుక్తా - అయుక్తాః, అలూక్షా
ధర్మ కామాస్స్యుః। యథా
తే తత్ర వర్తేరన్,
తథా తత్ర వర్తేథాః।।
అధ అభ్యాఖ్యా తేషు।
యే తత్ర బ్రాహ్మణా స్సంమ్మర్శినః (సమదర్శినః)
యుక్తా అయుక్తాః అలూక్షా
ధర్మ కామాస్స్యుః,
యథా తే తేషు వర్తేరన్
తథా తేషు వర్తేథాః।
ఏష ఆదేశః। ఏష ఉపదేశః।
ఏషా వేదోపనిషత్।
ఏతత్ అనుశాసనమ్।
ఏవమ్ ఉపాసితవ్యమ్।
ఏవమ్ చ ఏతత్ ఉపాస్యమ్।
స్వాధ్యాయ ప్రవచనాభ్యాం
న ప్రమదితవ్యమ్।
తాని త్వయా ఉపాస్యాని
విచికిత్సావ్యాస్యాత్ (విచికిత్సావ అస్యాత్)
తేషు వర్తేరన్ - సప్త చ।।
ఒకవేళ “ఏ కర్మలు ఏ తీరుగా చేయాలి? ఏది నిష్ఠ? ఏవి నియమములు?” అనే సందేహము (కర్మవిచికిత్స మరియు ఆచారముల గురించిన విచికిత్స - సందేహము) వస్తే…అప్పుడు వేదజ్ఞులగు బ్రాహ్మణులను, (లేదా) యుక్తాయుక్తములు తెలిసిన సాత్వికులు (అలూక్ష) అగు పెద్దలను ధర్మ నిర్వహణ గురించి సంప్రదించాలి. ధర్మాభిలాషులగు పెద్దలు ఆచరణమును ప్రాతిపతికగా తీసుకొని వర్తించాలి. వారి అభిభాషణము లను, వారు మెచ్చుకొనే విధానములను పాటించాలి. లోక కళ్యాణ ధ్యేయముగల పెద్దలు చెప్పినది తప్పక అనుసరించాలి.

‘దోషులు’ అని నీకు ఎవ్వరి విషయమైనా సంశయములు వస్తూఉంటే, పెద్దల అభిప్రాయముననుసరించి త్యజించి ఉండాలి.

దేశకాలమానములను అనుసరించి, బ్రహ్మజ్ఞులు, యుక్తాయుక్తములు తెలిసిన ధార్మికబుద్ది గల సాత్వికులు - సకల జన క్షేమము అరయు వారు అగు పెద్దలను విధి-నిషేధముల గురించి సంప్రదించాలి. వారు బోధించు తీరుగా, నియమించు విధంగా వర్తించాలి! (ఆర్య వ్యవహారంబు దృష్టంబు గ్రాహ్యంబు।)

పెద్దలు చెప్పునది, నియమించునది, అనుసరించాలి. మీరు నిర్వర్తించబోయేది పెద్దలకు కూడా ముందుగా నచ్చాలి.
పెద్దలు చెప్పునది, నియమించునది, అనుసరించాలి. మీరు నిర్వర్తించబోయేది పెద్దలకు కూడా ముందుగా నచ్చాలి.
పెద్దల అనుభవ ప్రవచనములను ఆదేశముగాను, ఉపదేశముగాను స్వీకరించాలి! ఇది తప్పక నిర్వర్తించ వలసిన అనుశాసనము!
ఇట్లు పెద్దల చూపుమార్గమును ఆశ్రయించి ఉపాసించాలి. శాస్త్రాను సారంగా, దేశకాలానుసారంగా చెప్పబడు ఆచారములు, ఆచార్యుల ఆజ్ఞలు తప్పక గౌరవించాలి।

స్వాధ్యాయమును (శాస్త్ర పరిశీలనను, శాస్త్ర నిర్వచనములను, బోధనములను), విడచి ఉండరాదు. సాత్వికులు - శుభ ఆశయులు అగు బ్రహ్మవేత్తల - పెద్దల ప్రవచనములను వినాలి. విని ఆకలింపు చేసుకోవాలి. ఏమరువరాదు. బద్ధగించరాదు. పెద్దలను తిరస్కరించరాదు. వారి ఉపదేశములను యుక్తాయుక్త విచారణ వాక్యములను స్వీకరించి, ఉపాసనను అవిరామంగా కొనసాగించాలి. (ఇది ‘7’వ సూత్రము).


1వ అధ్యాయము - శీక్షా వల్లీ - 12వ అనువాకము


ఉత్తరశాంతిపాఠః

శం నో మిత్రః శం వరుణః . శం నో భవత్వర్యమా .
శం న ఇంద్రో బృహస్పతిః . శం నో విష్ణురురుక్రమః .
నమో బ్రహ్మణే . నమస్తే వాయో . త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి .
త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిషం . ఋతమవాదిషం .
సత్యమవాదిషం . తన్మామావీత్ . తద్వక్తారమావీత్ .
ఆవీన్మాం . ఆవీద్వక్తారం .
ఓం శాంతిః శాంతిః శాంతిః .. 1..

ఇతి ద్వాదశోఽనువాకః ..
1. శం నో మిత్రః। శం వరుణః।
శం నో భవతి అర్యమా।
శం న ఇన్ద్రో బృహస్పతిః।
శం నో విష్ణుః ఉరుక్రమః।
నమో బ్రహ్మణే। నమస్తే వాయో।
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ అసి।
త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ అవాదిషమ్।
ఋతమ్ అవాదిషమ్। సత్యమ్ అవాదిషమ్।
తత్ మామ్ ఆవీత్। తత్ వక్తారమ్ ఆవీత్।
ఆవీత్ మామ్। ఆవీత్ వక్తారమ్।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।
(సత్యం అవాదిషం పంచ చ)।।
శం న శ్శీక్షగ్ం సహ నౌ
యః ఛన్దసాం భూః సయః
పృథివీ ‘ఓం’ ఇతి ఋతం చ
అహమ్ వేదమ్ అనూచ్య
శం నో ద్వాదశ।
శం నో మహ ఇతి ఆదిత్యో
నో ఇతరాణి త్రయోవిగ్ంశతిః।।
(ప్రాణవృత్యభిమాన పగలు దేవత అగు) మిత్రభగవానుడు, (అపాన వృత్యభిమాన - రాత్రి దేవత-జలదేవత అగు) వరుణ భగవానుడు, (సూర్యమండలమునకు, కనులకు అభిమానదేవత అగు) అర్యమ భగవానుడు, (సర్వేంద్రియాభిమాన దేవత అగు) ఇంద్రభగవానుడు, (వాక్ - బుద్ధి అభిమానదేవత అగు) బృహస్పతి భగవానుడు, (త్రివిక్రమావతారమునందు మూడు పాదములతో ఈ సర్వమును నింపుచున్న) ఉరుక్రముడగు విష్ణుభగవానుడు మాకు సర్వ సుఖములు, శుభములు ప్రసాదించెదరుగాక!

పరబ్రహ్మమునకు నమస్కారము. ఓ వాయుదేవా! నమస్తే। నమో నమః। (సమస్తమును చేతనముగా చేయుచున్నారు కాబట్టి మిమ్ములను ‘ప్రత్యక్షబ్రహ్మము’గా ఉపాసిస్తున్నాము. ప్రత్యక్షముగా ‘బ్రహ్మము’ అని - అవాదిషమ్ - ఎలుగెత్తి పలుకుచున్నాను.
నిజము - నిజముగా, ఋత-ఋతంగా, సత్యము-సత్యంగా ప్రాణేశ్వరులగు మిమ్ములను ‘ప్రత్యక్ష బ్రహ్మము’ అని చెప్పుకొనుచున్నాను.

ఓ పరమాత్మా! మీరే నాకు రక్షకులు. నాకు, బ్రహ్మము బోధిస్తున్న సత్‌గురువు (వక్తారమ్)కు కూడా రక్షకులు. నన్ను రక్షించండి! వక్తయగు ఆచార్యులకు సదా (ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ) సంరక్షకులై ఉండండి!
(బ్రహ్మవిద్యను) శీక్షకులు (ఆచార్యులవారు) చెప్పుచుండగా, మేము వినుచుండగా, అడ్డులు తొలగుగాక! (ఆధ్యాత్మిక, ఆధి భౌతిక, ఆధి దైవిక) తాపత్రయములు… సశాంతించుగాక! వేదభూమియగు పృథివి ప్రణవోపాసనలచే, ఋక్కులు గానములలచే శుభప్రదమగు గాక.

ఇతి - శీక్షా వల్లీ - 1వ అధ్యాయము


2వ అధ్యాయము - ఆనంద వల్లీ

2వ అధ్యాయము - ఆనంద వల్లీ - 1వ అనువాకము


ఓం సహ నావవతు . సహ నౌ భునక్తు . సహ వీర్యం కరవావహై .
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై .
ఓం శాంతిః శాంతిః శాంతిః ..
1. హరిః ఓం। సహ నావవతు
సహ నౌ భునక్తు।
సహ వీర్యం కరవావహై।
తేజస్వి నావధీతమస్తు
మా విద్విషావహై।
ఓం శాన్తిః। శాన్తిః। శాన్తిః।
ఓంకార స్వరూపుడగు హరిని స్మరిస్తున్నాము. శిష్య - ఆచార్యులమగు మా ఇరువురిని అవతు → పరమాత్మ రక్షకులై ఉండెదరు గాక!
మా ఇరువురిని పరబ్రహ్మము పరిపాలించునుగాక! ఉత్తముడగు రాజు ప్రజలను సంరక్షించు రీతిగా, మమ్ములను కాపాడును గాక!
‘బ్రహ్మవిద్య’ మా ఇరువురి బుద్ధిని తేజోవంతము చేయును గాక! మేము వీర్యవంతులమై, ఈ బోధ కార్యక్రమమును నిర్వర్తించెదముగాక!
తేజవంతమగు ఆత్మ విద్య - అధీతమస్తు - మాచే అధ్యయనము చేయబడును గాక!
గురు - శిష్యులమగు మేము ఒకరికొకరము ప్రేమించుకొనెదముగాక! ద్వేషించుకొనకుండెదము గాక! శాన్తి సర్వత్రా పరిఢవిల్లునుగాక!

ఉపనిషత్సారసంగ్రహః

ఓం బ్రహ్మవిదాప్నోతి పరం . తదేషాఽభ్యుక్తా .
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ .
యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ .
2. బ్రహ్మవిత్ ఆప్నోతి పరమ్।
తత్ ఏషా అభ్యుక్తా।
సత్యం జ్ఞానమ్ అనన్తమ్ బ్రహ్మ।
యో వేద నిహితం
గుహాయాం పరమే వ్యోమన్।
బ్రహ్మమును తెలుసుకొన్న బ్రహ్మవేత్త పరబ్రహ్మమును పొందగలడు. పరబ్రహ్మతత్త్వమే తానై ప్రకాశించగలడు. అట్టి ‘బ్రహ్మము’ గురించి ఇప్పుడు మనము చెప్పుకొనుచున్నాము.

బ్రహ్మము అనగా? కింతత్ బ్రహ్మ?
సత్యం : సత్యస్వరూపము. యమ్ సత్! ఏదైతే స్వతఃగానే ఉనికి (presence) కలిగియున్నదో, అది సత్తు. (బ్రహ్మమునకు వేరైనదంతా అసత్తు)
జ్ఞానమ్ : ‘ఎరుక - ఎరుగబడుచున్నది - ఎరుగువాడు….కూడా తానే అయినట్టి కేవల జ్ఞాన స్వరూపము. (Absolute awareness)
అనన్తమ్ : అది ఎరుగబడే దేని చేతనూ (ఈ విశ్వము - అంతరంగము - అహమ్ మొదలైన వాటి చేత) పరిమితమైనది కాదు. అపరిమితము. ఆది అంత రహితము. (No begining - No end). వేదజ్ఞుల హృదయ గృహలలో సుస్పష్టంగా ప్రకాశిస్తున్న పరమాకాశము

సోఽశ్నుతే సర్వాన్ కామాన్సహ . బ్రహ్మణా విపశ్చితేతి ..
తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సంభూతః . ఆకాశాద్వాయుః .
వాయోరగ్నిః . అగ్నేరాపః . అద్భ్యః పృథివీ .
పృథివ్యా ఓషధయః . ఓషధీభ్యోన్నం . అన్నాత్పురుషః .
సో అశ్నుతే సర్వాన్ కామాన్
(తు) సహ।
3. బ్రహ్మణా విపశ్చితే ఇతి।
తస్మాద్వా ఏతస్మాత్
ఆత్మన ఆకాశః సంభూతః।
ఆకాశాత్ వాయుః।
వాయోః అగ్నిః।
అగ్నేః ఆపః।
అద్భ్యః పృథివీ।
పృథివ్యా ఓషధయః।
ఓషధీభ్యో అన్నమ్।
అన్నాత్ పురుషః।
అట్టి బ్రహ్మమును - ఎవ్వరైతే బుద్ధిగుహయందు అవ్యాకృతము (Non extended outward / placed in ones own self), పరము (శ్రేష్ఠము) అయినట్టి హృదయాకాశమునందే ఏర్పడి ఉన్నది - అని దర్శిస్తాడో, అట్టి విపశ్చిత్తు (విశేషేణ-పశ్చిత్, సత్య-జ్ఞాన-అనంత బ్రహ్మ దార్శనికుడు)… తాను కోరుకొను సర్వము తనయందే పొందుచున్నాడు. తానే బ్రహ్మమై బ్రహ్మమగు సర్వము పొందుచున్నాడు. ఎందుకంటే?
అటువంటి బ్రహ్మమే అయి ఉన్న అఖండమగు ఆత్మ నుండియే ఈ ఆకాశాది సమస్తము బయల్వెడలుచున్నాయి కాబట్టి!
→ సత్యజ్ఞానానంత స్వరూపమగు ‘ఆత్మ’ నుండి (‘శబ్దము’ గుణముగా కలిగి సర్వమునకు ‘అవకాశము’ ప్రసాదిస్తున్న) ‘ఆకాశము’,…పుట్టుచున్నది.
→ అట్టి శబ్ద గుణ సమాన్వితమగు ‘ఆకాశము’ నుండి → (‘శబ్ద-స్పర్శ’ అను రెండు గుణములు కలిగియున్న) ‘వాయువు’ జనిస్తోంది. (స్పర్శ=స్పందన)
→ అట్టి వాయువు వలన {‘శబ్ద - స్పర్శ - రూపములు’ అనే మూడు ధర్మములు (లేక) గుణములు కలిగియున్నఊ ‘అగ్ని’…పుట్టుచున్నది. (అగ్ని = Form, Light and Heat)
→ అట్టి శబ్ద - స్పర్శ - రూప సమన్వితమగు ‘అగ్ని’ నుండి {శబ్ద - స్పర్శ - రూప- రసములు….అనే ‘4’ ధర్మములు (గుణములు)గలఊ ‘జలము’ పుట్టుకొస్తోంది. (జలము = Flow)
→ అట్టి ‘4’ గుణముల సమన్వితమైన ‘జలము’ (లేక) ఉదకము నుండి - {శబ్ద - స్పర్శ - రూప - రస గంధ గుణములతో కూడిన పృథివిఊ జనిస్తోంది. (పృథివి = Solid)
→ అట్టి భూమి నుండి ఆహార ధాన్యములు, అపరములు, పూలు - పళ్ళు రూపమగు ఓషధులు, వనస్పతులు పుట్టుచున్నాయి. వృక్ష సంపద వస్తోంది. (Basic Material for Physical Formations)
→ ఓషధుల నుండి అన్నము (ఆహారము) జనిస్తోంది. అన్నము నుండి పురుషుడు (జీవుడు) భౌతికంగా రూపుదిద్దుకొనుచున్నాడు. (అన్నము = All that being experienced)

స వా ఏష పురుషోఽన్నరసమయః . తస్యేదమేవ శిరః .
అయం దక్షిణః పక్షః . అయముత్తరః పక్షః .
అయమాత్మా . ఇదం పుచ్ఛం ప్రతిష్ఠా .
తదప్యేష శ్లోకో భవతి .. 1.. ఇతి ప్రథమోఽనువాకః ..
4. స వా ఏష పురుషో అన్న రసమయః।
తస్య ఇదమేవ శిరః।
అయమ్ దక్షిణః పక్షః।
అయమ్ ఉత్తరః పక్షః।
అయమ్ ఆత్మా ఇదం పుచ్ఛం ప్రతిష్ఠా।
తత్ అపి ఏష శ్లోకో భవతి।।
అట్టి ఈ పురుషుడు అన్నము నుండి జనించు రేతస్సురూపుడై ఉన్నాడు. రసమయుడగు ఆతనికి ‘ఇది శిరస్సు - ఇది కుడి చేయి, విభాగము - ఇది ఎడమ చెయ్యి, విభాగము - మొదలైనవి ఏర్పడినవగుచున్నాయి. అట్టి ఈ పురుషునిగా, దేహముగా ఆత్మయే ప్రతిష్ఠితమై యున్నది. ఆత్మచేతనే చేతనమగుచున్నది.

ఇంకా కూడా ఇట్లా గానం చేయబడుతోంది.


2వ అధ్యాయము - ఆనంద వల్లీ - 2వ అనువాకము


పంచకోశోవివరణం

అన్నాద్వై ప్రజాః ప్రజాయంతే . యాః కాశ్చ పృథివీగ్ంశ్రితాః .
అథో అన్నేనైవ జీవంతి . అథైనదపి యంత్యంతతః .
అన్నగ్ంహి భూతానాం జ్యేష్ఠం . తస్మాత్ సర్వౌషధముచ్యతే .
సర్వం వై తేఽన్నమాప్నువంతి . యేఽన్నం బ్రహ్మోపాసతే .
అన్నగ్ంహి భూతానాం జ్యేష్ఠం . తస్మాత్ సర్వౌషధముచ్యతే .
అన్నాద్ భూతాని జాయంతే . జాతాన్యన్నేన వర్ధంతే .
అద్యతేఽత్తి చ భూతాని . తస్మాదన్నం తదుచ్యత ఇతి .
తస్మాద్వా ఏతస్మాదన్నరసమయాత్ . అన్యోఽన్తర ఆత్మా ప్రాణమయః .
తేనైష పూర్ణః . స వా ఏష పురుషవిధ ఏవ .
తస్య పురుషవిధతాం . అన్వయం పురుషవిధః .
తస్య ప్రాణ ఏవ శిరః . వ్యానో దక్షిణః పక్షః .
అపాన ఉత్తరః పక్షః . ఆకాశ ఆత్మా .
పృథివీ పుచ్ఛం ప్రతిష్ఠా .
తదప్యేష శ్లోకో భవతి .. 1..

ఇతి ద్వితీయోఽనువాకః ..
1. అన్నాత్ వై ప్రజాః ప్రజాయన్తే।
యాః కాశ్చ పృథివీగ్ం శ్రితాః।
అథో అన్నే నైవ జీవంతి।
అథ ఏనత్ అపి యంతి అంతతః।
అన్నగ్ంహి భూతానాం జ్యేష్ఠమ్।
తస్మాత్ సర్వ ఔషధమ్ ఉచ్యతే।
సర్వం వై తే అన్నమ్ ఆప్నువంతి,
యే అన్నం బ్రహ్మోపాసతే।
అన్నగ్ం హి భూతానాం జ్యేష్ఠమ్।
తస్మాత్ ‘సర్వ ఔషధమ్’ ఉచ్యతే।
(1) అన్నమయమ్
యాః కాః చ - ఏ ఏవైతే ఈ భూమిని ఆశ్రయించి ఉన్నాయో…అట్టి స్థావర జంగమాత్మకమైనవి - అన్నీ కూడా (సమస్త దేహములు కూడా)→ అన్నరసమునుండే పుట్టుచున్నాయి. అన్నమును ఆశ్రయించియే రూపము పొందుచున్నాయి.
అంతేకాకుండా ‘అన్నము’ చేతనే జీవిస్తున్నాయి. ప్రాణములు ధరించి వృద్ధి పొందుచున్నాయి. చివరికి అన్నరసమునందే లయమును పొందటం జరుగుతోంది.
అందుచేత, అన్నమే సర్వజీవులకు అత్యంత ప్రాముఖ్యము, జ్యేష్ఠము.
సర్వులకు అన్నము ‘ఔషధము’ అని చెప్పబడుతోంది.
‘అన్నం బ్రహ్మ’….అని ఆహారమును పరబ్రహ్మ స్వరూపముగా ఉపాసిస్తారో, వారు అన్నము వలన సర్వము పొందుచున్నారు. అన్నమే సర్వజీవులకు జ్యేష్ఠము అయి ఉండటం చేత అన్నము సర్వులకు ‘ఔషధము’ గా స్తోత్రము చేయబడుచున్నది. ‘ఆకలి’ అనే వ్యాధికి ఔషధము అన్నమే.
2. అన్నాత్ భూతాని జాయన్తే।
జాతాని అన్నేన వర్థన్తే।
అద్యతే అత్తి చ భూతాని।
తస్మాత్ అన్నం తత్ ఉచ్యత
ఇతి।
తస్మాత్ వా ఏతస్మాత్
అన్నరసమయాత్।
అన్యో (అన్యే) అంతర ఆత్మా
ప్రాణమయః (హో)।
తేనైష (తేనైవ) పూర్ణః (హో)।
స వా ఏష పురుషవిధ ఏవ।
తస్య పురుష విధతామ్।
అన్వయం పురుష విధః (హో)।
‘అన్నము’ చేతనే భూతజాతమంతా జనిస్తోంది, వృద్ధి చెందుతోంది కూడా! అన్నమే సర్వభూతజాలముచే భక్షించబడి, పరిషోపకముగా అగుచున్నది.
అందుచేత ‘ఈ భౌతిక దేహములన్నీ అన్నమయమే! అన్నరూపమే! అన్న రస ప్రదర్శనమే! - అని స్తుతిచేయబడుతోంది.
(2). ప్రాణమయమ్
ఆత్మకు అంతరమున ‘అన్నము’ అన్నమునకు వేరుగా ప్రాణమయమగు ఆత్మ ఉన్నది. అది అన్నమయాత్మను తనయందు పూర్ణముగా ధరించినదై ఉన్నది.
తైత్తరీయ-ఉపనిషత్-అన్నమయం-ప్రాణమయం
ప్రాణమయాత్మ చేత అన్నమయాత్మ పూర్ణమైయున్నది కూడా!
ప్రాణమయాత్మ యొక్క పురుషకారమే (Functional feature) అన్నమయముగా అన్వయము అగుచున్నది. అందుచేత ప్రాణమయాత్మను ‘పురుష విధుడు’ అని కూడా అంటారు.
3. తస్య ప్రాణ ఏవ శిరః।
వ్యానో దక్షిణః పక్షః।
అపాన ఉత్తరః పక్షః।
ఆకాశ ఆత్మా।
పృథివీ పుచ్ఛం ప్రతిష్ఠా।
తదపి ఏష శ్లోకో భవతి।
అట్టి ప్రాణమయాత్మకు
→ ప్రాణము శిరస్సు (ముఖమునుండి, ముక్కునుండి లోనికి వెళ్ళుచుండు వాయు రూప ప్రాణము - శిరస్సు)
→ వ్యానవాయువు → దక్షిణ (కుడి) బాహువు
→ అపానవాయువు → ఎడమ బాహువు (లేక ఎడమ Left చేయి)
→ ఆకాశమంతా నిండియున్న సమాన వాయువు ఆత్మ! మధ్యభాగము.
→ పృథివి (భూమి) - ఆధార విభాగము! (స్వచ్ఛము)గా ప్రతిష్ఠితమగుచున్నది.
అది శ్లోకంగా గానము చేయబడుచున్నది! ఉపాసించబడుతోంది.


2వ అధ్యాయము - ఆనంద వల్లీ - 3వ అనువాకము


ప్రాణం దేవా అను ప్రాణంతి . మనుష్యాః పశవశ్చ యే .
ప్రాణో హి భూతానామాయుః . తస్మాత్ సర్వాయుషముచ్యతే .
సర్వమేవ త ఆయుర్యంతి . యే ప్రాణం బ్రహ్మోపాసతే .
ప్రాణో హి భూతానామాయుః . తస్మాత్ సర్వాయుషముచ్యత ఇతి .
తస్యైష ఏవ శారీర ఆత్మా . యః పూర్వస్య .
తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్ . అన్యోఽన్తర ఆత్మా మనోమయః .
తేనైష పూర్ణః . స వా ఏష పురుషవిధ ఏవ .
తస్య పురుషవిధతాం . అన్వయం పురుషవిధః .
తస్య యజురేవ శిరః . ఋగ్దక్షిణః పక్షః . సామోత్తరః పక్షః .
ఆదేశ ఆత్మా . అథర్వాంగిరసః పుచ్ఛం ప్రతిష్ఠా .
తదప్యేష శ్లోకో భవతి .. 1..

ఇతి తృతీయోఽనువాకః ..
1. ప్రాణం దేవా అను ప్రాణన్తి।
మనుష్యాః పశవశ్చ యే,
ప్రాణోహి భూతానామ్ ఆయుః।
తస్మాత్ ‘సర్వాయుషమ్’ ఉచ్యతే।
సర్వమేవ త ఆయుర్యంతి
యే ప్రాణం బ్రహ్మోపాసతే।
ప్రాణో హి భూతానామ్ ఆయుః (హో)।
తస్మాత్ ‘సర్వాయుషమ్’
ఉచ్యత ఇతి।।
తస్య ఏష ఏవ శరీర ఆత్మా
యః పూర్వస్య।
అగ్ని మొదలైన దేవతలంతా ప్రాణచైతన్య ప్రదర్శనమగు వాయు చలనమును అనుసరిస్తూ వారివారి కర్మలు నిర్వర్తిస్తున్నారు. అనగా, ఇంద్రియములు ప్రాణశక్తిచే చలిస్తూ వర్తిస్తున్నారు.
మనుష్యులు, పశువులు, తదితర జీవజాలమంతా ప్రాణశక్తి చేతనే జీవితముయొక్క ‘ఆయుష్షు’ను పొందుచున్నాయి. అందుచేత ప్రాణమయ కోశమును ‘సర్వాయుషము’ అని పిలుస్తూఉంటారు.
జీవుల ‘ఆయుష్షు’ (లేక జీవనము)ను ఆయుష్మంతము చేయుచున్నది- ప్రాణశక్తియే.
ఏ ప్రాణ తత్త్వము సర్వజీవుల ఆయురూపమై ఉన్నదో, సర్వజీవులు ప్రాణతత్త్వ స్వరూపమేనని, ప్రియరూపమని దర్శించబడుచున్నదో, ఆ ప్రాణశక్తి యొక్క పూర్వ స్వరూపమే ఆత్మ. ‘ఆత్మ నుండియే, ఆత్మకు అభిన్నమై ప్రాణశక్తి ప్రవర్తమానము-క్రియమానము అగుచున్నది. దేహములో (అన్నమయ శరీరములో) ప్రదర్శనమగుచున్న ప్రాణమయుడు ఆత్మయే!
2. తస్మాత్ వా ఏతస్మాత్
ప్రాణమయాత్ - అన్యో అంతర్ ఆత్మా
‘‘మనోమయః’’। తే న ఏష పూర్ణః।
స వా ఏష పురుష విధ
ఏవ। తస్య పురుష విధతామ్।
అన్వయం పురుష విధః(ధి)।
తస్య ‘యజురేవ’ (యజురివ) శిరః।
‘ఋక్’ దక్షిణః పక్షః।
‘సామా’ ఉత్తరః పక్షః।
ఆదేశ ఆత్మా।
‘అధర్వా’ అంగిరసః।
పుచ్ఛం ప్రతిష్ఠా।
తదపి ఏష శ్లోకో భవతి।।
(3) మనోమయము:
అట్టి ప్రాణమయాత్మకము కంటే వేరై, (‘ఆత్మ’యందు) మనోమయాత్మ స్వరూపుడు తనయందు ప్రాణ మయాత్మచే పూర్ణుడై ఉన్నారు. ప్రాణమయాత్మకు అంతరమున ఉండి మనో మయాత్మ ప్రాణమయముచే పూర్ణమైయున్నది. ప్రాణమయ పురుషుని అంతరమున గల మనో మయ పురుషుడే ప్రాణమయ పురుషత్వమును తన ఆకారముగా కలిగి ఉన్నారు. మనోమయుడు అనబడుచున్నాడు.
అట్టి మనోమయ పురుషునికి
→ యజుర్వేద-యజస్సులు → శిరస్సు,
→ ఋగ్వేద-ఋక్కులు → దక్షిణ భాగము
→ సామవేద స్తుతులు, గానములు → ఉత్తరభాగము
→ బ్రహ్మము గురించి వివరించు బ్రాహ్మణములు - పుచ్ఛము.
అనగా, ఆత్మ గురించి చెప్పు మహావాక్యములు (ఆదేశములు)→ అథర్వణ వేదము. అంగిరసులగు ఋషుల ప్రవచనములు → పృచ్ఛికాకృతి (నిలపటానికి ఆధారము).
పై విధముగా గానము చేయబడుచున్నది. ప్రస్తుతించబడుచున్నది.


2వ అధ్యాయము - ఆనంద వల్లీ - 4వ అనువాకము


యతో వాచో నివర్తంతే . అప్రాప్య మనసా సహ .
ఆనందం బ్రహ్మణో విద్వాన్ . న బిభేతి కదాచనేతి .
తస్యైష ఏవ శారీర ఆత్మా . యః పూర్వస్య .
తస్మాద్వా ఏతస్మాన్మనోమయాత్ . అన్యోఽన్తర ఆత్మా విజ్ఞానమయః .
తేనైష పూర్ణః . స వా ఏష పురుషవిధ ఏవ .
తస్య పురుషవిధతాం .
అన్వయం పురుషవిధః . తస్య శ్రద్ధైవ శిరః .
ఋతం దక్షిణః పక్షః .
సత్యముత్తరః పక్షః . యోగ ఆత్మా . మహః పుచ్ఛం ప్రతిష్ఠా .
తదప్యేష శ్లోకో భవతి .. 1..

ఇతి చతుర్థోఽనువాకః ..
1. యతో వాచో నివర్తంతే
అప్రాప్య మనసా సహ।
ఆనందమ్ బ్రహ్మణో విద్వాన్
న బిభేతి కదాచన ఇతి।
తస్య ఏష ఏవ శరీర ఆత్మా।
యః పూర్వస్య।
తస్మాద్వా ఏతస్మాత్ మనోమయాత్।
అన్యో అంతర ఆత్మా ‘విజ్ఞానమయః’।
తేన ఏష పూర్ణః। స వా ఏష పురుష విధ ఏవ।।
ఏ కేవలీ స్వస్వరూపమునుండి వాక్కులు మనస్సుతో సహా-చెప్పుటకు చేతకాక - వెనుకకు మరలుచున్నాయో, అట్టి కేవలానందానుభూతియగు బ్రహ్మము గురించి ఎరిగిన ఆత్మతత్త్వజ్ఞుడగు విద్వాంసుడు-తానే తత్ ఆత్మ, తత్ సత్యము, తత్ సర్వము-అగుటచే, ఇక దేనికీ భయమును పొందడు.
ప్రాణాత్మ శరీరమునకు మునుముందుగానే ఉన్నట్టిది ‘మనోమయాత్మ’.

(4) విజ్ఞానమయాత్మ:
అట్టి మనోమయాత్మకు అంతరముగా, మనోమయ పురుషునకు వేరై-విజ్ఞానమయాత్మ (విజ్ఞానమయ పురుషుడు) ఉన్నది. అట్టి విజ్ఞానమయాత్మ చేతనే మనోమయాత్మ పూర్ణమైయున్నది. విజ్ఞానమయాత్మ పురుషుని పురుషకారమే మనస్సు.
2. తస్య పురుష విధతామ్।
అన్వయం పురుష విధః।
తస్య శ్రద్ధైవ శిరః।
ఋతమ్-దక్షిణః పక్షః।
సత్యమ్ - ఉత్తరః పక్షః।
యోగ ఆత్మా।
మహః పుచ్ఛం ప్రతిష్ఠా।
తదపి ఏష శ్లోకో భవతి।
మనస్సు యొక్క పురుషవిధత్వము యొక్క అన్వయముచే విజ్ఞానమయ పురషవిధము గుర్తించబడుతోంది. ఆలోచనకు మునుముందే ‘ఏది ఆలోచించాలి’? అను ధీశక్తి ఉండాలి కదా! అట్టి వివేచన, నిర్ణయములు నిర్వహించు పురుషకారము - ‘విజ్ఞానమయాత్మ’.
అట్టి విజ్ఞానమయాత్మ పురుషునకు
శ్రద్ధ (Attention / Concentration)→ శిరస్సు.
ఋతము (ఋక్కులు) → దక్షిణ పక్షము.
సత్యము → ఉత్తర విభాగము.
యోగము → ఆత్మ.
మహత్-తత్త్వము ‘నేను…’ అను స్వభావము → ప్రతిష్ఠితమగు పుచ్ఛము (Baggage where it is placed).
ఈ విధంగా సత్యదర్శులచే గానముచేయబడుతోంది


2వ అధ్యాయము - ఆనంద వల్లీ - 5వ అనువాకము


విజ్ఞానం యజ్ఞం తనుతే . కర్మాణి తనుతేఽపి చ .
విజ్ఞానం దేవాః సర్వే .
బ్రహ్మ జ్యేష్ఠముపాసతే . విజ్ఞానం బ్రహ్మ చేద్వేద .
తస్మాచ్చేన్న ప్రమాద్యతి . శరీరే పాప్మనో హిత్వా .
సర్వాన్కామాన్ సమశ్నుత ఇతి . తస్యైష ఏవ శారీర ఆత్మా .
యః పూర్వస్య . తస్మాద్వా ఏతస్మాద్విజ్ఞానమయాత్ .
అన్యోఽన్తర ఆత్మాఽఽనందమయః . తేనైష పూర్ణః .
స వా ఏష పురుషవిధ ఏవ . తస్య పురుషవిధతాం .
అన్వయం పురుషవిధః . తస్య ప్రియమేవ శిరః .
మోదో దక్షిణః పక్షః .
ప్రమోద ఉత్తరః పక్షః . ఆనంద ఆత్మా . బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్ఠా .
తదప్యేష శ్లోకో భవతి .. 1..

ఇతి పంచమోఽనువాకః ..
1. విజ్ఞానం యజ్ఞం తనుతే।
కర్మాణి తను తేఽపి చ।
విజ్ఞానం దేవాః సర్వే। (దేహః సర్వే)।
బ్రహ్మ జ్యేష్ఠమ్ ఉపాసతే।
విజ్ఞానం బ్రహ్మచేత్ వేద,
తస్మాత్ చేత్ న ప్రమాద్యతి।
శరీరే పాప్మనో హిత్వా,
సర్వాన్ కామాన్ సమశ్నుత ఇతి।
తస్య ఏష ఏవ శారీర ఆత్మా
యః పూర్వస్య।
విజ్ఞానమే లోకంలో సర్వయజ్ఞముల రూపము దాల్చినదై ఉన్నది. సర్వ కర్మలకు తనువు విజ్ఞానమే (బుద్ధియే). సమస్తమునకు మొదటిది విజ్ఞానమే అని ‘విజ్ఞానమే - బ్రహ్మము’ అని, (ఇంద్రుడు మొదలైన) దేవతలందరు ఉపాసిస్తున్నారు. (ప్రజ్ఞానం బ్రహ్మ)! అన్నిటికన్నా శ్రేష్ఠమైన బ్రహ్మతత్త్వముగా ‘విజ్ఞానము’ → ఉపాసించ బడుచున్నది.
సృష్టికి ప్రప్రధమ అభిమాని అగు బ్రహ్మ దేవతలలో శ్రేష్ఠుడుగా ఉపాసించ బడుచున్నారు. ఆయనయొక్క విజ్ఞానమయ స్వరూపమే ఈ సృష్టి.
ఎవ్వరైత్ ‘సర్వజీవులలోని ప్రజ్ఞయే బ్రహ్మము’…అని ఎరిగి ఉపాసిస్తూ ప్రజ్ఞానము (కేవల ప్రజ్ఞ)ను బ్రహ్మముగా దర్శించటమునందు ప్రమాదము పొందరో, వారు ‘దేహభావము’ సంబంధితమైన సర్వదోషములనుండి విడివడినవారగుచున్నారు. అట్టివారు సర్వ కోరికలను సిద్ధింపజేసుకోగలరు.
విజ్ఞానమయ పురుషుడు = మనోమయ పురుషుని ఉనికి స్థానము. మనోపురుషునిలోని ఆత్మ!
2. తస్మాత్ వా ఏతస్మాత్ విజ్ఞానమయాత్-
అన్యో అన్తర - ఆత్మా ‘‘ఆనందమయః’’।
తేనైష పూర్ణః। (తేన ఏష పూర్ణః)।
స వా ఏష పురుషవిధ ఏవ।
తస్య పురుష విధతామ్।
అన్వయం పురుష విధః।
తస్య ప్రియమేవ శిరః।
మోదో దక్షిణః పక్షః।
ప్రమోద ఉత్తరః పక్షః।
ఆనంద ఆత్మా।
బ్రహ్మ పుచ్ఛం ప్రతిష్ఠా।।
తదపి ఏష శ్లోకో భవతి।।
(5) ఆనందమయాత్మ
అట్టి విజ్ఞానమయ పురుషుని నుండి, అద్దానికి వేరైనట్టి ఆనందమయ పురుషుడు విజ్ఞానమయ శరీరుని పూర్ణముగా చేయుచున్నట్టివాడు.
విజ్ఞానమయాత్మ యొక్క మూల వస్తువు, జననస్థానము- ఆనందమయ పురుషుడు.
విజ్ఞానమయ పురుషత్వమునకు ఆనందము పురుషకారమైయున్నది. ఆనందమయ ఆత్మపురుషుడే విజ్ఞానమునకు యజమాని.
అట్టి ఆనందమయ పురుషకారము ఈ విధంగా అన్వయించుకో బడుచున్నది.
ప్రేమ - ప్రియము…ఆ ఆనందమయాత్మ యొక్క → శిరస్సు
సంతోషము - మోదము → దక్షిణపక్షము
ప్రమోదము - ఆనందము → ఉత్తరపక్షము
ఆత్మానందము - బ్రహ్మానందము → ఆత్మ!
బ్రహ్మమే → ఆధారము
ఈ విధంగా ఆనందమయాత్మ గురించి గానము చేయబడుచున్నది. స్తుతించబడుతోంది.


2వ అధ్యాయము - ఆనంద వల్లీ - 6వ అనువాకము


అసన్నేవ స భవతి . అసద్బ్రహ్మేతి వేద చేత్ .
అస్తి బ్రహ్మేతి చేద్వేద . సంతమేనం తతో విదురితి .
తస్యైష ఏవ శారీర ఆత్మా . యః పూర్వస్య .
అథాతోఽనుప్రశ్నాః . ఉతావిద్వానముం లోకం ప్రేత్య .
కశ్చన గచ్ఛతీ3 3 for prolonging the vowel in the form . అఽఽ .
ఆహో విద్వానముం లోకం ప్రేత్య . కశ్చిత్సమశ్నుతా3 ఉ .
సోఽకామయత . బహుస్యాం ప్రజాయేయేతి .
స తపోఽతప్యత .
స తపస్తప్త్వా . ఇదꣳసర్వమసృజత . యదిదం కించ .
తత్సృష్ట్వా . తదేవానుప్రావిశత్ . తదను ప్రవిశ్య .
సచ్చ త్యచ్చాభవత్ .
నిరుక్తం చానిరుక్తం చ . నిలయనం చానిలయనం చ .
విజ్ఞానం చావిజ్ఞానం చ . సత్యం చానృతం చ సత్యమభవత్ .
యదిదం కించ . తత్సత్యమిత్యాచక్షతే .
తదప్యేష శ్లోకో భవతి .. 1..

ఇతి షష్ఠోఽనువాకః ..
1. అసత్ ఏవ (అపన్నేవ) స భవతి,
అసత్ బ్రహ్మ ఇతి వేదచేత్।
అస్తి బ్రహ్మేతి చేత్ వేద
సంతమేనం తతో విదురితి।
తస్య ఏష ఏవ శారీర ఆత్మా
యః పూర్వస్య, అథాతో
అనుప్రశ్నాః।
ఉత అవిద్వాన్ అముం లోకం ప్రేత్య,
కశ్చన గచ్ఛతీ?
ఉ(3) అహో విద్వాన్
అముం లోకం ప్రేత్య।
కొందరు ఇట్లా అనవచ్చు - ‘‘సర్వాంతర్యామి అయిన పరమాత్మగాని, సర్వమునకు వేరై-సర్వము స్వస్వరూపత్మగాని - లేవు’’. వారు ఆత్మ తిరస్కారులు. అనగా, ‘బ్రహ్మము లేదు’ అను దృష్టిచే, భావనచే…అట్టివాడు ‘అసత్’ గా (లేనివాడుగానే) తనను తాను దర్శిస్తున్నాడు. ‘నేను లేను’…అను అభిప్రాయము ఆశ్రయించువాడగుచున్నాడు. అసత్ వాదులు - ‘‘నేనే లేను’’ - అనుచున్నవారగుచున్నారు.

‘బ్రహ్మము ఉన్నది’ అను భావనచే అట్టివాడు తనను తాను ‘సత్ స్వరూప బ్రహ్మము’గానే ఎరుగుచున్నాడు. ప్రజ్ఞానమునకు పూర్వమే గల ఆనందమయ సత్ స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు.

‘‘శరీరమే ఆత్మ (నేను)’’ అనుకొనువాడు శరీరానంతరము ఉంటాడా? ఇక ఇప్పుడుకొన్ని ప్రశ్నలు, వాటి సమాధానములు చెప్పుకుందాము.
ఆత్మ గురించి (లేక బ్రహ్మము గురించి) తెలుసుకొననట్టి అవిద్వాంసుడు (ప్రేత్య) మరణానంతరము-అముత్రలోకమును (పరమాత్మమ్- పరబ్రహ్మమునును) - బ్రహ్మజ్ఞాని అగు విద్వాంశునివలే - పొందుతాడా? పొందడా? బ్రహ్మమును ఎరిగిన విద్వాంసుడు మాత్రమే పరబ్రహ్మమును పొందుచున్నాడా?
2. కశ్చిత్ సమశ్నుతా 3(ఉ) (ఆహా। ఓహో)
సో అకామయత।
‘‘బహుస్యాం ప్రజాయే యేతి’’।
స తపో అతప్యత।
స తపః తప్త్వా,
ఇదగ్ం సర్వమ్ అసృజత।
యత్ ఇదం కిం చ, తత్ సృష్ట్వా,
→ తదేవ అనుప్రావిశత్।
పై ప్రశ్నలకు సమాధానము :
బ్రహ్మము → బహుస్యాం ప్రజాయేయే యేతి।
ఆహా! ఓహో! నేను అనేక రూపములుగా అగుదునుగాక’…అని బ్రహ్మము (లేక, ఆత్మ) స్వయంగా తలచినది.
ఆ బ్రహ్మము (లేక - పరమాత్మ) - తాను అనేక రూపములుగా అగుటకై తపన పొందింది. అనగా తపస్సు చేసింది. తన తపస్సు ద్వారా తనయందు అప్పుడు ఈ సమస్తము అయినట్టి జగత్తును (ఒకడు స్వప్నము కల్పించుకొనుతీరుగా) సృష్టించుకొనుచున్నది.
తనయందు ఏ సృష్టిని సృష్టించుకున్నదో, అద్దానియందు (కల తనదైనవాడు తానే ద్రష్టగా ప్రవేశించువిధంగా) తానే - అనుప్రావిశత్ - ఆశ్రయించి, ప్రవేశించి, తను కల్పించుకొనిన దానియందు తానే ‘ద్రష్ట’గా అగుచున్నది. ఆ తదనంతరము బద్ధుడుగా కూడా అగుచున్నది.
3. తత్ అనుప్రవిశ్య, (అనుప్రవిశ్చ)
సత్ చ త్యత్ చ అభవత్। (సచ్చత్యచ్చాభవత్।)
నిరుక్తం చ, అనిరుక్తం చ।
నిలయనం చ, అనిలయనం చ।
విజ్ఞానం చ, అవిజ్ఞానం చ।
సత్యం చ, అనృతం చ।
సత్యమ్ అభవత్।
యత్ ఇదం కిం చ,
‘తత్ సత్యమ్ ఇతి’ ఆచక్షతే।
తదపి ఏష శ్లోకో భవతి।
ఆత్మ (లేక) బ్రహ్మము సర్వదా యథాతథమే. అట్లయికూడా, తన ‘ఊహ - కల్పన - సృష్టి’యందు తాను ప్రవేశించి, అద్దానియందు సత్ - త్యత్ (మూర్త - అమూర్త) రూపములుగా కూడా అయినది. (స్వప్నము ముగియగానే స్వప్నములో ఉన్నవన్నీ లేనివి అవుతాయి. కానీ స్వప్నము తనదైనవాడు లేకుండాపోడు కదా!)
మూర్తములు పంచభూతములు
అమూర్త = మనోబుద్ధి చిత్త అహంకారములు మొదలైనవి.
బ్రహ్మము తన కల్పన - ఊహ - సృష్టిలో
→ నిరుక్తము (దేశకాలబద్ధము) - అనిరుక్తము (దేశ కాలావ్యతిరిక్తము)
→ నిలయము (స్థానము-నిలయముకలది)-అనిలయము (చోటులేనిది)
→ విజ్ఞాతము (సర్వము ఎరుగునది) - అవిజ్ఞాతము (తెలియనట్టిది)
→ సత్యము (ఉనికి కలిగినది) - అసత్యము (కల్పన)
→ చేతనము (కదలునవి) - అచేతనము (జడము)
…ఇవన్నీ సద్వస్తువు అగు బ్రహ్మమే తన కల్పనయందు కల్పించుకొని ఆస్వాదించుచున్నదని సత్యద్రష్టలగు ఆత్మజ్ఞులు ప్రకటించుచున్నారు. ఇంకా కూడా ఇట్లా చెప్పుచున్నారు. స్తుతిస్తున్నారు.


2వ అధ్యాయము - ఆనంద వల్లీ - 7వ అనువాకము


అభయప్రతిష్ఠా

అసద్వా ఇదమగ్ర ఆసీత్ . తతో వై సదజాయత .
తదాత్మాన స్వయమకురుత . తస్మాత్తత్సుకృతముచ్యత ఇతి .
యద్వై తత్ సుకృతం . రసో వై సః .
రసగ్ంహ్యేవాయం లబ్ధ్వాఽఽనందీ భవతి . కో హ్యేవాన్యాత్కః
ప్రాణ్యాత్ . యదేష ఆకాశ ఆనందో న స్యాత్ .
ఏష హ్యేవాఽఽనందయాతి .
యదా హ్యేవైష ఏతస్మిన్నదృశ్యేఽనాత్మ్యేఽనిరుక్తేఽనిలయనేఽభయం
ప్రతిష్ఠాం విందతే . అథ సోఽభయం గతో భవతి .
యదా హ్యేవైష ఏతస్మిన్నుదరమంతరం కురుతే .
అథ తస్య భయం భవతి . తత్త్వేవ భయం విదుషోఽమన్వానస్య .
తదప్యేష శ్లోకో భవతి .. 1..

ఇతి సప్తమోఽనువాకః ..
1. అసత్ వా ఇదమ్ అగ్ర ఆసీత్।
తతో వై సత్ అజాయత।
తత్ ఆత్మానగ్ం స్వయమ్ అకురుత।
తస్మాత్ తత్ సుకృతమ్ ఉచ్యత ఇతి।
యద్వై తత్ సుకృతమ్।
రసో వై సః।
రసగ్ం హి యేవ అయం లబ్ధ్వా
ఆనందీ భవతి।।
కోహి (కరిహి) ఏవా అన్యాత్ (అన్యత్)
కః ప్రాణ్యాత్, యత్ ఏష
ఆకాశ ఆనన్దో న స్యాత్, ఏష హి ఏవ ఆనన్దయాతి।
ఇంద్రియములకు అనుభవమై ప్రాప్తిస్తూ, సత్‌రూపమై కనిపిస్తున్న ఈ దృశ్యము మొట్టమొదట అవ్యాకృతమై (unexhibitive), అవ్యవహారికమై, అప్రదర్శితమైయున్నది. జాగ్రత్ సందర్భంలో స్వప్న చైతన్యమువలె, (ఒక గొప్ప గాయకుడు గాఢనిద్రలో ఉన్నప్పుడు ఆతని గానకళ వలే) - అసత్ రూపమున ఉన్నది. ఒకానొకప్పుడు సత్ ప్రదర్శన రూపము దాల్చినదై సంప్రదర్శితమగుచున్నది. అట్టి అవ్యాకృతపరబ్రహ్మము తనకు తానే స్వయముగా ఈ సత్‌రూప (ఉనికి రూప) ప్రపంచముగా అగుచున్నది. అందుచేత ఇదంతా ‘‘స్వయంకృతము - స్వయంకల్పితము’’ అని చెప్పబడుచున్నది. ప్రతిజీవుడు వాస్తవానికి కేవలుడై సందర్శనములను కల్పించుకొని ఆస్వాదిస్తున్నాడు.

ఈ సర్వము ‘పరబ్రహ్మముయొక్క రసస్వరూపము (The Artistic feature form of Divinity) అగుచున్నది. స్వీయరసరూపమగు ఈ జగత్తును సుకృతముగా రచించుకొని పరబ్రహ్మము (లేక) పరమాత్మ దృశ్యత్వము పొందుచు ప్రియరూపమగు ప్రాణము (స్వశక్తి)తో కూడి ఆనందించుచున్నది.
2. యదా హి ఏవైష
ఏతస్మిన్ అ(న)దృశ్యే అనాత్మ్యే
అనిరుక్తే అనిలయనే,
అభయం ప్రతిష్ఠాం విందతే।
అథ సో అభయం గతో భవతి।
యదా హి ఏవ ఏష ఏతస్మిన్
(ను)ఉదరం అంతరం కురుతే,
అథ తస్య భయం భవతి।
తత్త్వేవ భయం విదుషో
అమన్వానస్య।।
తదపి ఏష
శ్లోకో భవతి।।
పరబ్రహ్మము - తన స్వీయ కల్పన అగు జీవుడు (experiencer)గా అయి, (అట్టి కల్పనయే అగు) జగత్ కల్పనారూప స్వీయసృష్టియందు సంచరిస్తూ అట్టి కల్పనలో కనిపించే తదితరులలో ఒకడై ఉంటున్నది. ’ఇది నా కల్పన’ - అనబడు స్వీయకల్పనా- కర్తృత్వమును, కల్పనకు కర్తయగు పరబ్రహ్మత్వమును ఏమరుస్తున్నది. ఎప్పుడైతే ఈ జీవుడు కంటికి కనబడనట్టి, జీవాత్మత్వ రహితమైనట్టి, వికారరహితమైనట్టి, నిరాధారమైనట్టి → పరబ్రహ్మత్వమునందు ప్రతిష్ఠితుడౌతాడో, అప్పడు అభయ స్థానమగు పరమాత్మగా అగుచున్నాడు. అభయస్వరూపుడగు చున్నాడు. జీవుడు (Individual unit sense) అను స్థితిని ఆత్మ (Al-pervading unit sense) ఆక్రమించివేస్తున్నాడు.

‘పరమాత్మనగు నాయందు జీవాత్మ - ఆ జీవాత్మానుభవమగు జగత్తు నా కల్పనచేతనే ఉన్నాయి’ - అనునది ఏమరచి, ‘ఇదంతా మరొకరి కల్పన! నేను ఇందులో ప్రవేశించాను. ఈ తదితర జీవులు వేరు. నేను వేరు. నావి వేరు - అనే అంతరము (భేదము)ను ఆశ్రయిస్తేనో? తస్యభయం భవతి। భయము వచ్చి పడుతోంది.

ఒకానొకడు తత్త్వశాస్త్రముయొక్క ఆకలింపునందు, బోధించుటయందు గొప్ప విదుషుడు అయి ఉండి కూడా, ‘పరబ్రహ్మస్వరూపుడనగు నాకు ఈ ‘జీవుడు-జగత్తులు-తదితరజీవులు అభిన్నము’ అనునది ఆశ్రయించక పోతేనో? భయము వీడదు! అభయము సిద్ధించదు. ఇది బ్రహ్మజ్ఞుల గానము. ఆత్మగురించి తెలుసుకుంటే చాలదు. ఆత్మయే తానై ఉండాలి.


2వ అధ్యాయము - ఆనంద వల్లీ - 8వ అనువాకము


బ్రహ్మానందమీమాంసా

భీషాఽస్మాద్వాతః పవతే . భీషోదేతి సూర్యః .
భీషాఽస్మాదగ్నిశ్చేంద్రశ్చ . మృత్యుర్ధావతి పంచమ ఇతి .
సైషాఽఽనందస్య మీమాగ్ంసా భవతి .
1. భీషా అస్మాత్ వాతః పవతే।
భీషో ఉదేతి సూర్యః।
బీషా అస్మాత్ అగ్నిశ్చ, ఇన్ద్రశ్చ।
మృత్యుః ధావతి పంచమ ఇతి।
స ఏషా ఆనన్దస్య
మీమాగ్ంసా భవతి।
పరబ్రహ్మము నుండే మనమంతా జనించి, ఉనికిని కలిగి ఉన్నాము. అట్టి పరబ్రహ్మముయొక్క సంకల్పము సిద్ధింపజేస్తున్న శ్రద్ధ - భయములతో వాయువు ఈ విశ్వమంతా వీచుచున్నది.
→ తాను కలిగియున్న భీషా (భయము) చేతనే సూర్యుడు దినదినము తూర్పున ఉదయిస్తున్నారు.
→ అట్టి భయముచేతనే అగ్ని వస్తువులను జ్వలింపజేయటము, ఇంద్రుడు త్రిలోకములను పాలించటము కూడా.
ఐదవదగు మృత్యువు…మార్పు చేర్పులను నిర్వర్తిస్తున్నది - అందుచేతనే,
ఇక ఇప్పుడు ఆత్మానందము (లేక) బ్రహ్మానందము గురించి మీమాంస (విచారణ) చేయుచున్నాము.

యువా స్యాత్సాధుయువాఽధ్యాయకః .
ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠః .
తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ .
స ఏకో మానుష ఆనందః .
ఆనందో బ్రహ్మ

2. యువ అస్యాత్ సాధు, యువ అధ్యాయకః ఆశిష్ఠో ద్రఢిష్ఠో బలిష్ఠః,
తస్య ఇయం పృథివీ సర్వా
విత్తస్య పూర్ణాస్యాత్।
స ఏకో మానుష ఆనన్దః -
శ్రోత్రియస్య చ అకామహతస్య।
బ్రహ్మాహమ్ ఆనందము

మానుష్యానందము: ఒక→ యౌవన దార్ధ్యము కలవాడు, సాధు గుణములు కలవాడు, వేదములను అధ్యయనము చేయుచున్నవాడు, భోగములను అనుభవిస్తూ దృఢమైన-బలమైన శరీరము కలిగి ఉన్నవాడు, భూమిపై గల సర్వభోగములచే-సంపదలచే పరిపూర్ణుడు అయి ఉంటే, అది ఒక మానుషానందముతో సమానము. అట్టి ఆనందమును ఒక శ్రోత్రియుడు, (సర్వ కోరికలను త్యజించి) కోరికలచే హతడు కానివాడు పొందుచున్నాడు.

తే యే శతం మానుషా ఆనందాః .. 1..

స ఏకో మనుష్యగంధర్వాణామానందః .
శ్రోత్రియస్య చాకామహతస్య .
3. తే యే శతం మానుషా ఆనన్దాః
స ఏకో ‘‘మనుష్య గన్ధర్వాణాం ఆనన్దః’’-
శ్రోత్రియస్య చ అకామహతస్య।।
మనుష్యగంథర్వుల ఆనన్దము - అట్టి మానుష్యానందములు నూరు సంఖ్యలు (100 Times) అయితే అట్టిది ఒక మనుష్యగంధర్వానందము. శ్రోత్రియుడు, కామములన్నీ హరించిపోయినట్టివాడు → ఈ ఆనందమును ఇక్కడే పొందుచున్నాడు.

తే యే శతం మనుష్యగంధర్వాణామానందాః .
స ఏకో దేవగంధర్వాణామానందః . శ్రోత్రియస్య చాకామహతస్య .
4. తే యే శతం మనుష్యగన్ధర్వాణాం
ఆనన్దాః → స ఏకో ‘దేవ గన్ధర్వాణామ్’ ఆనన్దః,
శ్రోత్రియస్య చ అకామహతస్య।।
అటువంటి మనుష్యగన్దర్వానందములు నూరు లభిస్తే…అది ఒక దేవ గంధర్వానందముతో సమానము. శ్రోత్రియుడు, కామములు జయించినవాడు అది ఇక్కడే పొందుచున్నాడు.
(అకామహతస్య = సర్వకామములు తనయందు హరింపజేసుకున్నవాడు).

తే యే శతం దేవగంధర్వాణామానందాః .
స ఏకః పితృణాం చిరలోకలోకానామానందః .
శ్రోత్రియస్య చాకామహతస్య .
5. తే యే శతం దేవగన్ధర్వాణాం
ఆనన్దః, → స ఏకః
పితౄణాం ‘‘చిరలోక లోకానాం ఆనన్దః’’
శ్రోత్రియస్య చ అకామహతస్య।
దేవగంధర్వానందములు ఒక నూరు ఒక చోటికి చేరితే,…అది ‘చిరలోకులు’ అగు పిత్రులోకవాసుల ఆనన్దముతో సమానము. వేదములు చెప్పు భక్తి - జ్ఞాన - వైరాగ్య - సర్వసమర్పణ మార్గములో సర్వ కామములు జయించినట్టి- దాటివేసినట్టి శ్రోత్రియుడు అది ఇప్పుడే పొందుచున్నాడు.

తే యే శతం పితృణాం చిరలోకలోకానామానందాః .
స ఏక ఆజానజానాం దేవానామానందః .. 2..

శ్రోత్రియస్య చాకామహతస్య .
6. తే యే శతం పితౄణాం చిరలోక
లోకానామ్ ఆనన్దః, స ఏక ‘‘అజానజానాం
దేవానామ్ ఆనన్దః’’ →
శ్రోత్రియస్య చ, అకామహతస్య।।
అట్టి ‘చిరలోకము’ అనబడే పిత్రులోకానందము (పితరులు పొందు ఆనందము)నకు నూరు రెట్లుగా అజాన జానుడు (స్మార్తకర్మల విశేష ఆచరణముచే దేవలోకము జేరినవాడు) పొందుచున్న ఆనందము.
కామముచే హతుడు కానట్టి శ్రోత్రియుడు అట్టి ఆనందమును ఈ ఇహమందే పొందుచున్నాడు.

తే యే శతం ఆజానజానాం దేవానామానందాః .
స ఏకః కర్మదేవానాం దేవానామానందః .
యే కర్మణా దేవానపియంతి . శ్రోత్రియస్య చాకామహతస్య .
7. తే యే శతమ్ అజానజానాం దేవానామ్ ఆనన్దాః,
స ఏకః ‘‘కర్మదేవానాం దేవానామ్ ఆనన్దః’’
యే కర్మణా దేవానపియన్తి
శ్రోత్రియస్య చ, అకామహతస్య।।
అట్టి స్మార్తకర్మల విశేషానందముచే అజానజానదేవతా ఆనందమునకు నూరు అంతలు → యజ్ఞయాగకర్మలు నిర్వర్తించిన కర్మదేవలోకములోని కర్మ దేవానందము ఒక్కటి అగుచున్నది.
కామములన్నీ త్యజించిన శ్రోత్రియుడు (శ్రుతుల ఉద్దేశ్యము గ్రహించినవాడు) అట్టి ఆనందము పొందుచున్నాడు.

తే యే శతం కర్మదేవానాం దేవానామానందాః .
స ఏకో దేవానామానందః . శ్రోత్రియస్య చాకామహతస్య .
8. తే యే శతం కర్మదేవానాం
దేవానాం ఆనన్దాః స ఏకో
‘‘దేవానాం ఆనన్దః’’ -
శ్రోత్రియస్య చ, అకామహతస్య।।
అట్టి కర్మదేవతానందములు ఒక నూరు ఒక చోటికి జేరినప్పుడు దేవలోకములో జనించిన ‘దేవత’ యొక్క ఒక దివ్య దేవానందముతో సమానము.
అకామకామియగు శ్రోత్రియుడు (శ్యుత్యర్థములు ఎరిగినవాడు) అట్టి ఆనందము పొందుచున్నాడు.

తే యే శతం దేవానామానందాః . స ఏక ఇంద్రస్యాఽఽనందః .. 3..

శ్రోత్రియస్య చాకామహతస్య .
9. తే యే శతం దేవానామ్
ఆనన్దాః
స ఏక ‘‘ఇన్ద్రస్య ఆనన్దః’’ -
శ్రోత్రియస్య చ, అకామహతస్య।।
అట్టి దేవతానందమునకు నూరు అంతలు దేవలోక ప్రభువగు ఒక ఇంద్రుని ఆనందముతో సమానము. శ్రోత్రియుడగు అకామి అద్దానిని పొందుచున్నాడు.


తే యే శతమింద్రస్యాఽఽనందాః .
స ఏకో బృహస్పతేరానందః . శ్రోత్రియస్య చాకామహతస్య .
10. తే యే శతమ్ ఇన్ద్రస్య ఆనన్దాః→
స ఏకో ‘‘బృహస్పతేః ఆనన్దః’’,
శ్రోత్రియస్యచ అకామహతస్య।।
అట్టి ఇంద్రుని ఆనందమునకు నూరు రెట్లు ఒక బృహస్పతి ఆనందము. శ్రుతులు ఎరిగిన శ్రోత్రియుడు సర్వకామములు జయించినప్పుడు అట్టి ఆనందము ఇక్కడే పొందుచున్నారు.

తే యే శతం బృహస్పతేరానందాః . స ఏకః ప్రజాపతేరానందః .
శ్రోత్రియస్య చాకామహతస్య .
11. తే యే శతం బృహస్పతేః ఆనన్దాః
→ స ఏకః ‘‘ప్రజాపతే ఆనన్దః’’
శ్రోత్రియస్య చ అకామహతస్య।
అట్టి బృహస్పతి ఆనందమునకు నూరు అంతలు → జీవసృష్టి కారకుడగు ప్రజాపతి ఆనందము ఒక్కటి అగుచున్నది.
శ్రోత్రియుడగు అకామి అద్దానిని ఇక్కడే పొందుచున్నాడు.

తే యే శతం ప్రజాపతేరానందాః .
స ఏకో బ్రహ్మణ ఆనందః . శ్రోత్రియస్య చాకామహతస్య .. 4..
12. తే యే శతం ప్రజాపతేః
ఆనన్దాః → స ఏకో
‘‘బ్రహ్మణ ఆనందః’’
శ్రోతియస్య చ అకామహతస్య।।
అట్టి విరాట్ పురుషుడు (సర్వ జీవులు నాదేహములోని వారే) అని ఎరిగి ఆస్వాదించు ప్రజాపతి ఆనందమునకు నూరు అంతలు బ్రహ్మదేవుని ఆనందము. సర్వకామములను దాటివేసిన శ్రోత్రియుడు అది పొందుచున్నాడు.

స యశ్చాయం పురుషే . యశ్చాసావాదిత్యే . స ఏకః .
13. స యశ్చ అయం పురుషే
యశ్చ ఆసావాదిత్యే, స ఏకః।
ఈ జీవునియందు వేంచేసియున్న పరమాత్మ - సూర్యునియందు వేంచేసియున్న పరమాత్మ ఏకస్వరూపులే! ఏకపరమాత్మయే!

స య ఏవంవిత్ . అస్మాల్లోకాత్ప్రేత్య .
ఏతమన్నమయమాత్మానముపసంక్రామతి .
ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రామతి .
ఏతం మనోమయమాత్మానముపసంక్రామతి .
ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రామతి .
ఏతమానందమయమాత్మానముపసంక్రామతి .
తదప్యేష శ్లోకో భవతి .. 5..

ఇత్యష్టమోఽనువాకః ..
14. స య ఏవం విత్→
అస్మాన్ లోకాత్ ప్రేత్య,
ఏతమ్ అన్న మయమ్
ఆత్మానమ్ ఉపసంక్రామతి।
ఏతం ప్రాణమయమ్ ఆత్మానమ్
ఉపసంక్రామతి।
ఏతం మనోమయమ్ ఆత్మానమ్
ఉపసంక్రామతి।
ఏతం విజ్ఞానమయ్ ఆత్మానమ్
ఉపసంక్రామతి।
ఏతం ఆనందమయమ్ ఆత్మానమ్
ఉపసంక్రామతి।
తత్ అపి ఏష శ్లోకో భవతి।
ఎవ్వడైతే ఈ విధముగా పరమాత్మ గురించి (సమం సర్వేషు భూతేషు అని) తెలుసుకుంటాడో, ఆతడు ఈ లోక పరిమిత దృష్టుల నుండి విడివడి ‘అన్నమయాత్మ స్వరూపధారుడు’ అగుచున్నాడు. అన్నమయాత్మను పొందుచున్నాడు. సర్వభౌతిక ఆకారములు తనవిగా స్వాత్మానుభావనను పొంది ఆనందిస్తున్నాడు.
→ ఆతడు ఇంకా ప్రాణమయ ఆత్మానందమును పొంది సర్వజీవుల ప్రాణస్వరూపుడగుచున్నాడు.
→ మనోమయ ఆత్మానంద స్వరూపుడై సర్వజీవులలోని మనోరూపాత్మగా ప్రకాశించుచున్నాడు.
→ విజ్ఞానమయాత్మ స్వరూపుడై సర్వదేహములలోని విజ్ఞాన మయత్వమును సంతరించుకొనుచున్నాడు.
ఆతడు ఇంకా కూడా ఆనందమయ ఆత్మత్వము సంతరించు కొనుచున్నాడు. సర్వకామములు జయించి, శ్రుతులు చెప్పు ఆత్మ తత్త్వమును పునికిపుచ్చుకొనుచున్నాడు.
ఆత్మయే తానైయున్నవాని ఆనందమునకు హద్దులు లేవు. ఈ విషయం ఇంకా ఇట్లా ప్రకటించబడుతోంది.


2వ అధ్యాయము - ఆనంద వల్లీ - 9వ అనువాకము


యతో వాచో నివర్తంతే . అప్రాప్య మనసా సహ .
ఆనందం బ్రహ్మణో విద్వాన్ .
న బిభేతి కుతశ్చనేతి .
ఏతగ్ంహ వావ న తపతి .
కిమహగ్ంసాధు నాకరవం . కిమహం పాపమకరవమితి .
స య ఏవం విద్వానేతే ఆత్మాన స్పృణుతే .
ఉభే హ్యేవైష ఏతే ఆత్మాన స్పృణుతే . య ఏవం వేద .
ఇత్యుపనిషత్ .. 1..

ఇతి నవమోఽనువాకః ..

.. ఇతి బ్రహ్మానందవల్లీ సమాప్తా ..
1. యతో వాచో నివర్తంతే, అప్రాప్య మనసా సహ।
ఆనన్దం బ్రహ్మణో విద్వాన్, న బిభేతి కుతశ్చనేతి।
ఏతగ్ం హవావ న తపతి-కిమ్ అహగ్ం సాధు న అకరవమ్।
కి మహం పాపమ్ అకరవమితి।
స య ఏవం విద్వాన్ ఏతే, ఆత్మానగ్ం స్పృణుతే।
ఉభే హి ఏవైష ఏతే
ఆత్మానగ్ం స్పృణుతే, య ఏవం వేద।

ఇత్యుపనిషత్
ఇతి ఆనందవల్లీ (బ్రహ్మానందవల్లీ)
ద్వితీయోధ్యాయః సమాప్తః।।
ఏ ‘పరబ్రహ్మము’ను వాక్కు - మనస్సు వర్ణించలేక ప్రకటించలేక అలసి - సొలసి వెనుకకు మరలుచున్నాయో, అట్టి ఆనందబ్రహ్మమును బుద్ధితో తెలుసుకొన్నవాడు ఇక దేనివలన కూడా భయమును పొందడు.
అట్టివాడు ఆత్మను ఎరిగినవాడై, ఆత్మత్వము సంతరించుకుంటూ…
→ అయ్యో! ఈ సాధుకర్మలు చేయలేకపోయానే? ఆ అసాధు (పాప) కర్మలు చేశానే? ఎట్లా?’…అను తపనను మొదలంట్లా త్యజించివేస్తాడు. సర్వ సందేహాలు పటాపంచలైపోతాయి.
ఎవడు ఆత్మత్వమును పుణికిపుచ్చుకోవటమును ప్రవృద్ధపరచు కుంటాడో….ఆతడే విద్వాంశుడు.
ఆత్మను ఎరిగినవాడు ఇటు ఇహత్వమును, అటు పరత్వమును ఏకం చేసి, ఆత్మబలము సమృద్ధపరచుకొనుచున్నాడు. ఆత్మానందమును, బ్రహ్మానందమును పునికిపుచ్చుకొనుచున్నాడు.

ఇతి ఉపనిషత్
ఆనందవల్లీ(బ్రహ్మానందవల్లీ) రెండవ అధ్యాయము సమాప్తము.

ఉత్తర శాంతి పాఠః
ఓం సహనావవతు। సహనౌ భునక్తు।
సహవీర్యం కరవాహై।
తేజస్వినావధీతమస్తు।
మా విద్విషావహై।
ఓం శాంతిః శాంతిః శాంతిః।।


బ్రహ్మానందవల్లీ ముఖ్య వ్యాఖ్యః

బ్రహ్మవిత్ ఇదమయమ్
ఇదమ్ ఏకవిగ్ంశతిః (21);
అన్నాత్ అన్న రసమయాత్।
అన్నాత్ ప్రాణో వ్యానో
అపాన ఆకాశః పృథివీ
పుచ్ఛం షడ్విగ్ంశతిః (26);
ప్రాణం యజుర్ ఋక్
సామ ఆదేశో అథర్వ
అంగిరసః పుచ్ఛం
ద్వావింశతిః (22);
యతః శ్రద్ధర్తగ్ం సత్యం
యోగో మహో అష్టాదశ (18);
విజ్ఞానం ప్రియం మోదః
ప్రమోద ఆనందో బ్రహ్మ
పుచ్ఛం - ద్వావింగ్ంశతిః (22);
రసత్ షోడశ (16);
అసత్ ఏవ అథ అష్టావింశతి (28);
అసత్ షోడశ (16);
భీషా అస్మాత్ మానుషో
మనుష్యగంధర్వాణాం, దేవగంధర్వాణాం,
పితౄణాం, చిరలోకానామ్, అజానజానాం, కర్మదేవానాం,
యే కర్మణా దేవానామ్
ఇంద్రస్య, బృహస్పతేః, ప్రజాపతేః, బ్రహ్మణః,
స యశ్చ సంక్రామ ఇతి।।
ఏకమ్ పంచాశత్; (51);
యతః కుతశ్చన
ఏక ఏకాదశ నవ।। (119)
(బ్రహ్మవిత్ నవ)
ఆనందవల్లీ సమాప్తమ్।।
ఓం సహనావవతు।। …. (శాంతిపాఠము)
బ్రహ్మవేత్త ఇక్కడి 21 తత్త్వములను తన ఆత్మ స్వరూపములో నింపివేసి ఉంచుచున్నారు.

భౌతికంగా కనిపించేదంతా అన్నమయమైయున్నది.
అట్టి అన్నమయాత్మ - ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, సప్రాణములు పీఠముగా ఉన్నది. షడ్వింశతిః [(26) తత్త్వములు తనయందు కలిగి ఉన్నది.]

అట్టి ప్రాణము - యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము - ఆదేశము - అంగిరసము….. పీఠముగా కలిగి ఉన్నది. [ద్వావింశతిః (22)].
ఆ ప్రాణాత్మ → మనస్సునందు ఆశీనమైయున్నది. శ్రద్ధ - సత్యము - యోగము - ఇవి మనస్సు యొక్క మహత్‌లక్షణములు [అష్టాదశ (18) మహత్ లక్షణములు]

అట్టి మనోమయ పురుషాత్మ విజ్ఞాన పురుషుని పీఠముగా కలిగి ఉన్నది. విజ్ఞానాత్మ→మోదము, ప్రమోదము ఆనందములను ఆశీనముగా కలిగి యున్నది. ఆనందమునకు బ్రహ్మమే ఆశీనస్థానం. [ద్వావింశతాః (22);]

అసత్ (నిర్విషయమగు) ఆత్మనుండి సత్ రూప దృశ్యము ప్రదర్శితమగుచున్నది.
అష్టా వింశతి (28); → తత్త్వములు ఆత్మయే.
షోడశ (16) రసతత్త్వములు ఆత్మయే.
అసత్తులో గల సత్తే ఇదంతా. సత్తు సర్వదా సత్తే। ఉనికియే। ఇక అసత్తో? ‘లేనిది’ అనియే కదా!

ఆత్మభగవానునిపట్ల భయముతో ఆత్మ సంకల్పమునకు లోనై సర్వము ప్రవర్తిస్తోంది. ‘ఆత్మ’ అనబడు సంకల్పించువాని సంకల్ప చమత్కారమే ఇదంతా!

మానుష - మనుష్య గంధర్వ - దేవగంధర్వ - చిరలోకపితృ - అజానజాన - కర్మదేవతా- దేవతా - ఇంద్ర - బృహస్పతి ప్రజాపతి - బ్రహ్మదేవాది ఆనందములన్నీ - ఆత్మానందము యొక్క కించిత్ తేజో కిరణములు.
ఏక పంచాశత్ (51) - తత్త్వములు ఆత్మయే.
అవన్నీ ఏకమగు అఖండానంద స్వరూప విభవములే!
ఏకాదశ నవ (119) - తత్త్వములు - ఆత్మయే. ఆత్మ మేవాహమ్। ఆత్మత్వమేవ। ఇదమ్ ఆత్మయేవ।

ఇతి బ్రహ్మానందవల్లీ - పునశ్చరణమ్.


3వ అధ్యాయము - భృగు వల్లీ

3వ అధ్యాయము - భృగు వల్లీ - 1వ అనువాకము

ఓం
సహ నావవతు।
సహ నౌ భునక్తు।
సహవీర్యం కరవావహై।
తేజస్వినా వధీతమస్తు
మా విద్విషావ హై।
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః।।
(ఓం సంజ్ఞార్థస్వరూపుడు - సర్వతత్త్వ స్వరూపుడు - సర్వాంతర్యామి అగు) పరమాత్మ సహనా వవతు। → గురుశిష్యులమగు, వక్త - శ్రోతలగు, ఆచార్యులు. అధ్యయని అగు మన ఇరువురికి రక్షకుడై ఉండెదరు గాక!
మన ఇరువురిని ఉత్తమగుణములుగల రాజువలే పరిపాలించును గాక! ఇరువురము వీర్యవంతులమై ‘బ్రహ్మవిద్య’కు సంసిద్ధులమగుదుము గాక!
తేజోరూపమగు ఆత్మ విద్య మన ఇరువురిచే అవధారణ చేయబడును గాక! ఒకరినొకరు అయిష్టపడకుండెదముగాక! కాలత్రయము - దేహత్రయము -దృక్‌త్రయము-లోక త్రయము ఆత్మయందు సశాంతించినవగును గాక!

భృగుర్వై వారుణిః . వరుణం పితరముపససార .
అధీహి భగవో బ్రహ్మేతి . తస్మా ఏతత్ప్రోవాచ .
అన్నం ప్రాణం చక్షుః శ్రోత్రం మనో వాచమితి .
తꣳహోవాచ . యతో వా ఇమాని భూతాని జాయంతే .
యేన జాతాని జీవంతి .
యత్ప్రయంత్యభిసంవిశంతి . తద్విజిజ్ఞాసస్వ . తద్బ్రహ్మేతి .
స తపోఽతప్యత . స తపస్తప్త్వా .. 1..

ఇతి ప్రథమోఽనువాకః ..
భృగుర్వై వారుణిః
వరుణం పితరమ్ ఉపససార:


అధీహి భగవో బ్రహ్మేతి।

తస్మాత్ ఏతత్ ప్రోవాచ:
అన్నం ప్రాణం చక్షుః శ్రోత్రం
మనో వాచమ్ ఇతి।

తగ్ం హో వాచ:
యతో వా ఇమాని భూతాని
జాయన్తే, యేన జాతాని
జీవన్తి, యత్ ప్రయన్తి
అభిసంవిశన్తి….?
తత్ విజిజ్ఞాసస్వ।
తత్ బ్రహ్మేతి।
స తపో అతప్యత।
స తపః తప్త్వా…।।

వరుణభగవానుని కుమారుడగు భృగువు ‘బ్రహ్మవిద్య’ యందు తీవ్రమైన అభిలాషతో పితృదేవులను సమీపించి త్రిప్రదక్షిణ నమస్కారము, సాష్టాంగ నమస్కారము సమర్పించారు.

భృగువు: పూజ్యులగు భగవాన్! పిత్రుదేవా! శరణు వేడుచున్నాను. ‘బ్రహ్మము’ గురించి దయతో ఉపదేశించండి.

అప్పుడు వరుణ దేవుడు ఇట్లు చెప్పసాగారు.
బిడ్డా! బ్రహ్మతత్త్వ సిద్ధిని పుణికిపుచ్చుకోవటానికి కొన్ని ద్వారాలు (Entrance Gates) చెప్పబడుచున్నాయి. అవి ముందుగా గమనించు.
అన్నము; ప్రాణము; చక్షువులు; శ్రోత్రము (చెవులు); మనస్సు; వాక్కు…మొదలైన ఇవన్నీ!

ఓ భృగూ! ఇంకా విను!
ఈ జీవులంతా దేనివలన జీవిస్తున్నారు? అదియే ‘బ్రహ్మము’.
దేనివలన….

→ ఈ సర్వభూత జాలము పుట్టుచున్నదో…
→ ఇదంతా ఎవరిచే పరిపోషించబడుచున్నదో, ఉజ్జీవించబడుచున్నదో…
→ ఈ జీవులందరు దేనియందు (జలతరంగము → జలములోవలే) తిరిగి లయము పొందుచున్నారో….
→ ఈ జీవులంతా దేనిని సర్వదా పొందియే ఉన్నారో, దేనిచే ఎల్లప్పుడు తదాత్మ్యము చెంది ఉంటున్నారో…,
→ ఈ జీవులంతా స్వతఃగా, స్వయముగా ఏ స్వరూపము అయి ఉన్నారో…
అదియే పరబ్రహ్మము. నీవు తెలుసుకోవలసినట్టిది అదేనయ్యా! పోయి ప్రయత్నించు.

తండ్రి చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్న భృగువు పరబ్రహ్మముయొక్క సంసిద్ధికొరకై అప్పటికప్పుడే తపస్సు ప్రారంభించారు. తపస్సు చే ఈ విధంగా తెలుసుకోసాగారు.


3వ అధ్యాయము - భృగు వల్లీ - 2వ అనువాకము


పంచకోశాంతఃస్థితబ్రహ్మనిరూపణం

అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ . అన్నాద్ధ్యేవ ఖల్విమాని
భుతాని జాయంతే . అన్నేన జాతాని జీవంతి .
అన్నం ప్రయంత్యభిసంవిశంతీతి . తద్విజ్ఞాయ .
పునరేవ వరుణం పితరముపససార .
అధీహి భగవో బ్రహ్మేతి . తగ్ంహోవాచ .
తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ . తపో బ్రహ్మేతి .
స తపోఽతప్యత . స తపస్తప్త్వా .. 1..

ఇతి ద్వితీయోఽనువాకః ..
అన్నం బ్రహ్మేతి?
అన్నం బ్రహ్మే-తి వ్యజానాత్।
అన్నాత్ ఏవ ఖలు ఇమాని భూతాని జాయన్తే।
అన్నేన జాతాని జీవన్తి।
అన్నం ప్రయన్తి అభిసంవిశంతీతి।
తత్ విజ్ఞాయ।
అన్నమే బ్రహ్మమా?
‘‘ఈ జీవులంతా దేనిచేత పుట్టుచున్నారో దేనిచే జీవిస్తున్నారో, చివరికి దేనిలో ప్రవేశిస్తున్నారో, ఏది తాము విడచియే ఉండటము లేదో అదీ పరబ్రహ్మము అని పితృదేవులు సూచన చేశారు కదా! అది ఏది?’’- అని యోచించి, విచారణ చేస్తూ…ఆ భృగువు ఇట్లు….మననము చేయసాగారు.
‘‘ఈ జీవులంతా కూడా…అన్నము చేతనే జనిస్తూ, అన్నము చేతనే జీవిస్తూ, తిరిగి అన్నమునందే ప్రవేశించువారు కదా! కాబట్టి అన్నమే పరబ్రహ్మము।
→ అవును అన్నమయ దేహమే బ్రహ్మము’’ అని తలచారు.
పునరేవ వరుణమ్
పితరమ్ ఉపససార:


అధీహి భగవో బ్రహ్మేతి।

తగ్ం హో వాచ :
తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ।।
తపో బ్రహ్మేతి।
స తపో అతప్యత।
స తపః తప్త్వా….।।
‘‘అయితే…. నా నిర్ణయము యుక్తి యుక్తమా కాదా? అయినా తండ్రి గారి వద్ద బ్రహ్మము గురించి శ్రవణం చేద్దాం’’ అని తలచారు.
మరల తండ్రియగు వరుణదేవుని సమీపించి, ‘‘తండ్రీ! నేను మీ ఆజ్ఞానసారం తపస్సు చేసి బ్రహ్మమును తెలుసుకున్నాను. ( ‘అన్నమయ దేహమేవ పరబ్రహ్మమ్’ అని అనుకుంటున్నాను’’ - అని పలికారు.

వరుణదేవుడు: బిడ్డా! తపస్సు చేయవయ్యా! తపస్సుచేతనే బ్రహ్మమును ఎరుగగలవు.
అప్పుడు భృగువు మరల తపస్సుకు ఉపక్రమించి ఆ తరువాత…ఇట్లా అనుకోసాగారు.


3వ అధ్యాయము - భృగు వల్లీ - 3వ అనువాకము


ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్ . ప్రాణాద్ధ్యేవ ఖల్విమాని
భూతాని జాయంతే . ప్రాణేన జాతాని జీవంతి .
ప్రాణం ప్రయంత్యభిసంవిశంతీతి . తద్విజ్ఞాయ .
పునరేవ వరుణం పితరముపససార .
అధీహి భగవో బ్రహ్మేతి . తగ్ంహోవాచ .
తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ . తపో బ్రహ్మేతి .
స తపోఽతప్యత . స తపస్తప్త్వా .. 1..

ఇతి తృతీయోఽనువాకః ..
ప్రాణో బ్రహ్మేతి।
ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్।
ప్రాణాత్ ఏవ ఖలు ఇమాని
భూతాని జాయన్తే।
ప్రాణేన జాతాని జీవన్తి।
ప్రాణం ప్రయన్తి, అభిసంవిశన్తి ఇతి।
తద్విజ్ఞాయ।
పునరేవ వరుణం పితరం ఉపససార।
అధీహి భగవో బ్రహ్మేతి।
తగ్ం హో వాచ।
తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ।
తపో బ్రహ్మేతి। స తపో అతప్యత।
స తపః తప్త్వా…।।
ప్రాణమే బ్రహ్మమా?
"ఈ జీవులంతా ఎట్లా జీవించగలుగుచున్నారు? కేవలము అన్నము చేతకాదు. ఎందుకంటే ముందుగా జీవించి ఉంటేనే అన్నము వ్యవహారము కదా! అందుకు ప్రాణములు ముఖ్యము కదా! అందుచేత - ప్రాణముల నుండి (ప్రాణశక్తి నుండి)యే ఈ జీవులు జనిస్తున్నారు. ప్రాణములు కారణంగానే జీవిస్తున్నారు. ప్రాణమునందే ప్రళయము పొందుచున్నారు (ప్రయాన్తి). ప్రాణములలోనే ఏకత్వము పొందుచున్నారు. జీవుడు ప్రాణములచేతనే జీవిస్తున్నాడు కాబట్టి ప్రాణమే బ్రహ్మము’’ - అని అనుకున్నారు.
మరల తండ్రిని సమీపించారు.

భృగువు : తండ్రీ! తెలిసింది. ప్రాణము ఉంటేనే ఈ జీవుడు జీవిస్తున్నాడు. కనుక ప్రాణమే బ్రహ్మము అని నాకనిపిస్తోంది.

వరుణదేవుడు : కుమారా! నీవు చెప్పింది విన్నాను. అయితే తపస్సు చేయి. తపస్సు చేతనే కదా ఎవ్వరైనా బ్రహ్మమును ఎరుగగలిగేది.

అప్పుడు భృగువు ‘ఆహా! ఇంకనూ ఎరుగాలి కాబోలు’ అని తలచి తండ్రి ఆజ్ఞానుసారం మరల తపస్సు చేశారు. అప్పుడు ఇట్లా తెలుసుకోసాగారు.


3వ అధ్యాయము - భృగు వల్లీ - 4వ అనువాకము


మనో బ్రహ్మేతి వ్యజానాత్ . మనసో హ్యేవ ఖల్విమాని
భూతాని జాయంతే . మనసా జాతాని జీవంతి .
మనః ప్రయంత్యభిసంవిశంతీతి . తద్విజ్ఞాయ .
పునరేవ వరుణం పితరముపససార .
అధీహి భగవో బ్రహ్మేతి . తꣳహోవాచ .
తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ . తపో బ్రహ్మేతి .
స తపోఽతప్యత . స తపస్తప్త్వా .. 1..

ఇతి చతుర్థోఽనువాకః ..
మనో బ్రహ్మేతి?
మనో బ్రహ్మేతి వ్యజానాత్।
మనసో హి ఏవ ఖలు ఇమాని
భూతాని జాయన్తే।
మనసా జాతాని జీవన్తి।
మనః ప్రయన్తి అభిసంవిశన్తి ఇతి।
తత్ విజ్ఞాయ, పునరేవ వరుణం
పితరం ఉపససార।
అధీహి భగవో బ్రహ్మేతి।
తగ్ం హో వాచ:
తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ। తపో బ్రహ్మేతి।
స తపో అపతప్యత। స తపః తప్త్వా…।।
మనస్సే బ్రహ్మమా?
‘‘మనస్సే బ్రహ్మమని తెలియవస్తోంది. మనస్సుంటేనే జీవుడు కదా! ఈ జీవులంతా మనస్సునుండే బయలుదేరుచున్నారు. మనస్సు చేతనే జీవిస్తున్నారు. మనస్సునందే సర్వము లయిస్తోంది. ఈ జీవుడు మనోరూపుడే అయి ఉన్నాడు. కనుక మనస్సే బ్రహ్మము!’’ - అని భృగువు భావించి, మరల తండ్రిని సమీపించారు.

భృగువు : నాన్నగారూ! ‘మనస్సే బ్రహ్మము’ అని మరల తపస్సు చేసిన తరువాత తెలుసుకుంటున్నాను.

వరుణభగవానుడు: ఓహో! అట్లాగా! సరే! అయితే, తపస్సు చేత బ్రహ్మమును తెలుసుకో మరి! బ్రహ్మమును ఎరుగుటకు తపస్సే ఉపాయము.

భృగువు : ‘తండ్రి గారి దృష్టిలో నేను ఇంకా బ్రహ్మమును ఎరుగటకు తగనన్నమాట! సరే ఆయన ఆజ్ఞ ప్రకారం మరల తపస్సు చేస్తాను’.
ఆయన మరల తపస్సు చేసి ఈ విధంగా తెలుసుకున్నారు.


3వ అధ్యాయము - భృగు వల్లీ - 5వ అనువాకము


విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ . విజ్ఞానాద్ధ్యేవ ఖల్విమాని
భూతాని జాయంతే . విజ్ఞానేన జాతాని జీవంతి .
విజ్ఞానం ప్రయంత్యభిసంవిశంతీతి . తద్విజ్ఞాయ .
పునరేవ వరుణం పితరముపససార .
అధీహి భగవో బ్రహ్మేతి . తꣳహోవాచ .
తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ . తపో బ్రహ్మేతి .
స తపోఽతప్యత . స తపస్తప్త్వా .. 1..

ఇతి పంచమోఽనువాకః ..
విజ్ఞానమ్ బ్రహ్మేతి?
విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్।
విజ్ఞానాత్ ఏవ ఖలు ఇమాని
భూతాని జాయన్తే। విజ్ఞానేన జాతాని జీవన్తి।
విజ్ఞానం ప్రయన్తి, అభిసంవిశన్తి
ఇతి। తత్ విజ్ఞాయ।
పునరేవ వరుణం పితరం ఉపసససార:
అథీహి భగవో బ్రహ్మేతి।
తగ్ం హోవాచ:
తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ।
తపో బ్రహ్మేతి। స తపో అతప్యత।
స తపః తప్త్వా….।।
విజ్జానమే బ్రహ్మమా?
‘మనస్సు స్వతఃగా తెలుసుకోలేదు. మనస్సు అనగా ఆలోచనయే కదా! ‘ఇది నా మనస్సు’ అని ఎరుగుచున్నవాడు ఉండాలి. కాబట్టి ఎరుగుచుండునట్టి ఎరుకయే (లేక) విజ్ఞానమే బ్రహ్మము! ప్రజ్ఞారూపమగు విజ్ఞానమే బ్రహ్మము! ఎరుకరూపమగు విజ్ఞానమునుండి (లేక) తెలియబడేదానికి ఆవలగల తెలివి నుండే ఈ భూతజాలము జనించి - జీవించి - ఫలము (లయము) పొందుచున్నది. కనుక విజ్ఞానమే బ్రహ్మము’ - అని తలచారు. తండ్రిని సమీపించారు.

భృగువు : హే భగవాన్! పిత్రుదేవా! నేను ‘విజ్ఞానమే బ్రహ్మము’ అని తపస్సు తరువాత విచారించి అట్టి ఈ నిర్ణయమునకు వచ్చాను. అంతే కదా?

వరుణభగవానుడు : నాయనా! భృగూ ఇంకా తపస్సు చేయి. తపస్సు చేతనే బ్రహ్మము తెలియబడగలదు. నేను నిర్ణయించి చెప్పితే కాదు.

అప్పుడు భృగువు, మరల తపస్సు కొనసాగించారు. ఈ విధంగా తెలుసుకున్నారు.


3వ అధ్యాయము - భృగు వల్లీ - 6వ అనువాకము


ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ . ఆనందాధ్యేవ ఖల్విమాని
భూతాని జాయంతే . ఆనందేన జాతాని జీవంతి .
ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి .
సైషా భార్గవీ వారుణీ విద్యా . పరమే వ్యోమన్ప్రతిష్ఠితా .
స య ఏవం వేద ప్రతితిష్ఠతి . అన్నవానన్నాదో భవతి .
మహాన్భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన .
మహాన్ కీర్త్యా .. 1..

ఇతి షష్ఠోఽనువాకః ..
ఆనన్దో బ్రహ్మేతి।
ఆనన్దో బ్రహ్మేతి వ్యజానాత్।
ఆనన్దాత్ ఏవ ఖలు ఇమాని
భూతాని జాయన్తే।
ఆనన్దేన జాతాని జీవన్తి।
ఆనన్దం ప్రయన్తి - అభిసంవిశన్తి। ।।ఇతి।।
స ఏషా ‘భార్గవీ - వారుణీ విద్యా
పరమే వ్యోమన్ ప్రతిష్ఠితా।
స య ఏవం వేద ప్రతితిష్ఠతి।
అన్నవాన్ అన్నాదో భవతి।
మహాన్ భవతి।
ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేన।
మహాన్ కీర్త్యా।।
ఆనన్దమే బ్రహ్మము
ఇష్టమునుబట్టి తెలివి, తెలివిని బట్టి మనస్సు, మనస్సును అనుసరించి భౌతికానుభవం ఉంటాయి. ఒకడికి చదువు కన్నా సంగీతము ఇష్టమైతే సంగీతమే వస్తుంది. చదువు రాదు కదా! కనుక ఇష్టము రూపమగు ఆనందమే బ్రహ్మము. ఆనందము (లేక) అనుభూతియే బ్రహ్మము. అనుభూతినుండే (ఆనందము నుండే) తెలివి (ప్రజ్ఞ), ఆలోచన, శక్తి, భౌతికత్వము వస్తున్నాయి. ఆనందమునుండే జీవులు జనిస్తున్నారు, జీవిస్తున్నారు, లయిస్తున్నారు. ఇష్టమైన దానితో (ఆనందముతో) మమేకమగుచున్నారు. ఆనందమే బ్రహ్మము అని గ్రహించి, తండ్రితో చెప్పారు.

ఇది సుప్రసిద్ధమగు ఆత్మ విద్య - వారుణి (వరుణదేవుని) భార్గవీ (భృగువుని) విద్య అని ఎరుగుచున్నారు. ‘పరమాకాశమునందు ఆనంద, విజ్ఞాన, మనో, ప్రాణ - అన్న బ్రహ్మములు ప్రతిష్ఠితమై ఉన్నాయి - అని ఎవడు ఈ విద్యను వరుస క్రమంగా సేవిస్తాడో, అట్టివాడు అన్నవంతుడు - అన్నాదుడు అగుచున్నాడు. అట్టివాడు సంతానవంతుడు, గోసంపద కలవాడు, కీర్తిమంతుడు, మహాన్ కూడా అగుచున్నాడు. (అన్నమ్ = అనుభవమగు, అన్నాదుడు = అనుభవమును జనింపజేయువాడు).


3వ అధ్యాయము - భృగు వల్లీ - 7వ అనువాకము


అన్నబ్రహ్మోపాసనం

అన్నం న నింద్యాత్ . తద్వ్రతం . ప్రాణో వా అన్నం .
శరీరమన్నాదం . ప్రాణే శరీరం ప్రతిష్ఠితం .
శరీరే ప్రాణః ప్రతిష్ఠితః . తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం .
స య ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతితిష్ఠతి .
అన్నవానన్నాదో భవతి . మహాన్భవతి ప్రజయా
పశుభిర్బ్రహ్మవర్చసేన . మహాన్ కీర్త్యా .. 1..

ఇతి సప్తమోఽనువాకః ..
అన్నం న నిన్ద్యాత్। తత్ వ్రతమ్।
ప్రాణో వా అన్నమ్।
శరీరమ్ అన్నాదమ్।
ప్రాణే శరీరం ప్రతిష్ఠితమ్।
శరీరే ప్రాణః ప్రతిష్ఠితః।।
తదేతత్ అన్నమ్ అన్నే ప్రతిష్ఠితమ్।
స య ఏతత్ అన్నమ్ అన్నే ప్రతిష్ఠితం
వేద ప్రతితిష్ఠతి।
‘అన్నము’ను నిందించరాదు. ఇది వ్రతము. ప్రాణమే అన్నము రూపముగా ఉన్నది. (లేక) శక్తియే పదార్థ రూపముగా ప్రదర్శితమవుతోంది.
(సూత్రము - ఒకటి ఎద్దాని లోపల ఉన్నదో, అది అన్నాదమ్, ఏది అద్దానిలో ఉన్నదో అది ‘‘అన్నమ్’’).
ఎద్దాని లోపల అన్నమ్ ఉన్నదో అది అన్నాదమ్!
ప్రాణము శరీరములోపల ఉన్నది. కనుక - ప్రాణము అన్నము. శరీరము అన్నాదము.
అట్లాగే - శరీరము అన్నాదము. ప్రాణము అన్నము కూడా. (శరీరములో ప్రాణము ఉన్నది).
అన్నవాన్ అన్నాదో భవతి।
మహాన్ భవతి।
ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేన।
మహాన్ కీర్త్యా।।
ఈ శరీరము ప్రాణమునందు ప్రతిష్ఠితమై ఉన్నది కూడా! కనుక శరీరము అన్నము, ప్రాణము అన్నాదము కూడా. ఈ విధంగా పరస్పర ప్రతిష్ఠితమైయున్న శరీరము - ప్రాణము - ఈ రెండూ పరస్పరము అన్న-అన్నాదములు అగుచున్నాయి.
ఈ విధంగా - శక్తి పదార్థములో ఉన్నది కాబట్టి - పదార్థము అన్నము, శక్తి అన్నాదము. శక్తిలో పదార్థము ఉన్నది కాబట్టి శక్తి అన్నము. పదార్థము అన్నాదము. ఎవడు ఈ విషయము ఎరిగి ఉపాసిస్తాడో…అట్టి వాడు అన్నవంతుడు (ఈ సర్వము తనయందు), అన్నాదవంతుడు (ఈ సర్వమునందు తాను)…అగుచున్నాడు. ‘మహాత్ముడు’ అగుచున్నాడు.
‘ఈ సర్వమునందు నేనున్నాను. నాయందు ఈ సర్వము ఉన్నది’ అని ఎరిగినవాడు-అన్న-అన్నాదుడు. పుత్ర - పౌత్ర ప్రజ, సంపదలతో,శమ, దమములతో కూడిన బ్రహ్మవర్చస్సు, కీర్తి పొందుచున్నాడు.


3వ అధ్యాయము - భృగు వల్లీ - 8వ అనువాకము


అన్నం న పరిచక్షీత . తద్వ్రతం . ఆపో వా అన్నం .
జ్యోతిరన్నాదం . అప్సు జ్యోతిః ప్రతిష్ఠితం .
జ్యోతిష్యాపః ప్రతిష్ఠితాః . తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం .
స య ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతితిష్ఠతి .
అన్నవానన్నాదో భవతి . మహాన్భవతి ప్రజయా
పశుభిర్బ్రహ్మవర్చసేన . మహాన్ కీర్త్యా .. 1..

ఇత్యష్టమోఽనువాకః ..
అన్నం న పరిచక్షీత।
తత్ వ్రతమ్।
ఆపోవా అన్నమ్। జ్యోతిః అన్నాదమ్।
అప్సు జ్యోతిః ప్రతిష్ఠితమ్।
జ్యోతిషి ఆపః ప్రతిష్ఠితాః।
తదేతత్ అన్నమ్ అన్నే
ప్రతిష్ఠితమ్।
స య ఏతత్ అన్నమ్ అన్నే
ప్రతిష్ఠితం వేద ప్రతితిష్ఠతి,
అన్నవాన్ అన్నాదో భవతి।
మహాన్ భవతి।
ప్రజయా పశుభిః
బ్రహ్మవర్చసేన। మహాన్ కీర్త్యా।
అన్నబ్రహ్మోపాసన - వ్రత నియమములు
అన్నమును వృద్ధి చేయాలి. పాడుచేయరాదు. పరిహాసము చేయరాదు. బ్రహ్మవేత్తకు ఇది వ్రతము అగుగాక!
→ జలమునందు అగ్ని ఉన్నది. కనుక జలము అన్నము. అగ్ని అన్నాదము.
→ అగ్నియందు జలము ప్రతిష్ఠితమైయున్నది. కనుక అగ్ని అన్నము. జలము అన్నాదము.
→ జలమునందు అగ్ని, అగ్నియందు జలము ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈ విధంగా జలము - అగ్ని. పరస్పరము అన్న - అన్నాదములై ప్రతిష్ఠితములు అయి ఉన్నాయని గ్రహించువాడు, ఉపాసించువాడు- ఆ రెండింటికీ ‘అన్న - అన్నాదుడు’ అగుచున్నాడు.
రెండిటియందు ఆత్మగా ప్రతిష్ఠితుడు అయి, ‘మహాన్’ అగుచున్నాడు.
అట్టివాడు (1) తనయందు భౌతికములగు భూ-జల-అగ్నిలు, (2) తాను వాటియందు ఉనికిగా ఉన్నట్లు - ప్రతితిష్ఠుతుడు అగువాడు - జనసంపద, పశుసంపద, బ్రహ్మవర్చస్సును పొంది, ‘మహానుభావుడు’ అని కీర్తించబడుచున్నాడు.


3వ అధ్యాయము - భృగు వల్లీ - 9వ అనువాకము


అన్నం బహు కుర్వీత . తద్వ్రతం . పృథివీ వా అన్నం .
ఆకాశోఽన్నాదః . పృథివ్యామాకాశః ప్రతిష్ఠితః .
ఆకాశే పృథివీ ప్రతిష్ఠితా .
తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం .
స య ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతితిష్ఠతి .
అన్నవానన్నాదో భవతి . మహాన్భవతి ప్రజయా
పశుభిర్బ్రహ్మవర్చసేన . మహాన్ కీర్త్యా .. 1..

ఇతి నవమోఽనువాకః ..
అన్నం బహు కుర్వీత। తత్ వ్రతమ్।।
పృథివీ వా అన్నమ్।
ఆకాశో అన్నాదః। పృథివ్యాం
ఆకాశః ప్రతిష్ఠితః। ఆకాశే పృథివీ ప్రతిష్ఠితా।
తదేతత్ అన్నమ్ అన్నే ప్రతిష్ఠితమ్।
స య ఏతత్ అన్నమ్ అన్నే
పతిష్ఠితం వేద, ప్రతితిష్ఠతి।
అన్నవాన్ అన్నాదో భవతి।
మహాన్ భవతి। ప్రజయా పశుభిః।
బ్రహ్మ వర్చసేన। మహాన్ కీర్త్యా।।
అన్నమును సర్వదా వృద్ధి చేయాలి. అది వత్రముగా స్వీకరించాలి. పృథివిలో ఆకాశము ఉన్నది. అందుచేత పృథివి అన్నము. ఆకాశము, అన్నాదము.
ఆకాశమునందు పృథివి ప్రతిష్ఠితమైయున్నది. అందుచేత ఆకాశము అన్నము. పృథివి అన్నాదము. ఈ విధంగా పృథివి - ఆకాశములు పరస్పరము అన్నము - అన్నాదములుగా ప్రతిష్ఠితములై ఉన్నాయి. అట్టి అన్న - అన్నాదముల ప్రతిష్ఠితములు ఎరుగువాడు ఆత్మయందు సంప్రతిష్ఠితుడు అగుచున్నాడు.
అట్టివాడు - అన్నవాన్ అగుచున్నాడు. అనగా పృథివి - ఆకాశములు తనయందు ఉన్నవిగా అగుచున్నాడు.
అన్నాదవాన్ → పృథివి - ఆకాశముల యందు ఉన్నది తానగుచున్నాడు. మహానుభావుడు అగుచున్నాడు. ప్రజాసంపద, పశుసంపద, బ్రహ్మవర్చస్సులతో బాటు మహాకీర్తిమంతుడగుచున్నాడు.


3వ అధ్యాయము - భృగు వల్లీ - 10వ అనువాకము


సదాచారప్రదర్శనం . బ్రహ్మానందానుభవః
న కంచన వసతౌ ప్రత్యాచక్షీత . తద్వ్రతం .
తస్మాద్యయా కయా చ విధయా బహ్వన్నం ప్రాప్నుయాత్ .
అరాధ్యస్మా అన్నమిత్యాచక్షతే .
ఏతద్వై ముఖతోఽన్నగ్ంరాద్ధం .
ముఖతోఽస్మా అన్నగ్ంరాధ్యతే .
ఏతద్వై మధ్యతోఽన్నగ్ంరాద్ధం .
మధ్యతోఽస్మా అన్నగ్ంరాధ్యతే .
ఏదద్వా అంతతోఽన్నగ్ంరాద్ధం .
అంతతోఽస్మా అన్న రాధ్యతే .. 1..
1. న కంచన వసతౌ
ప్రత్యాచక్షీత। తత్ వ్రతమ్।
తస్మాత్ యయాకయా చ
విధయా బహు అన్నం ప్రాప్నుయాత్।
ఆరాధ్యస్మా అన్నమ్ ఇతి ఆచక్షతే।
ఏతద్వై ముఖతో అన్నగ్ం రాద్ధమ్।।
ముఖతో అస్మా అన్నగ్ం రాద్ధ్యతే।
ఏతద్వై మధ్యతో అన్నగ్ం రాద్ధమ్।
మధ్యతో అస్మా ‘అన్నగ్ం రాద్ధ్యతే।
ఏతద్వా అంతతో అన్నగ్ం రాద్ధమ్।
అంతతో అస్మా అన్నగ్ం రాధ్యతే।।
‘వసతి’ కొరకు తనను సమీపించిన వానిని ఎవ్వరినీ (అతిథి - అభ్యాగతులను) నిరాదరించరాదు. (అభ్యాగతిః స్వయం విష్ణుః। అతిథి దేవోభవ). ఇది ఒక వ్రతముగా ఆచరించబడుగాక! ఇది పృథివీ ఆకాశోపాసకుడు (లేక) పృథివీ ‘‘ఆకాశ అన్న = అన్నాదోపాసకుని’’ నియమము అగుగాక! అతిథి - అభ్యాగతి సమర్పణ కొరకై అన్నమును నివాస స్థానమును వృత్తిచే సమృద్ధిగా సముపార్జించబడునుగాక!
అతిథిలకు(వసతికై ఆశ్రయించువారికి)- ‘‘అయ్యా! అన్నము సంసిద్ధముగా ఉన్నది. దయచేయండి!’’… అని సంసిద్ధత కనబరచబడుగాక!
అన్నార్థియై సమీపించువానికి ముఖతః → ఎదురువెళ్ళి ఎల్లప్పుడూ సమర్పించువానికి,…అన్నము ఎదురొచ్చి ప్రాప్తిస్తుంది.
మధ్యతః {మధ్యరకంగా (అనగా) అడిగినప్పుడు మాత్రమే కొంతవరకు మాత్రమే} అతిథులకు సమర్పించువానికి మధ్య రకంగానే లభిస్తుంది. చివ్వరికిగాని సమర్పించనివానికి, చివ్వరికి మాత్రమే లభించగలదు. దానము - దాచిపెట్టుకోవటమే! అన్నము, నివాస-అవకాశము దానము చేయువాడు సమృద్ధిని పొందగలడు.

య ఏవం వేద . క్షేమ ఇతి వాచి . యోగక్షేమ ఇతి ప్రాణాపానయోః .
కర్మేతి హస్తయోః . గతిరితి పాదయోః . విముక్తిరితి పాయౌ .
ఇతి మానుషీః సమాజ్ఞాః . అథ దైవీః .
2. య ఏవం వేద, క్షేమ ఇతి వాచి।
యోగ - క్షేమ ఇతి ప్రాణ - అపానయోః।
కర్మేతి హస్తయోః। ‘గతిః’ ఇతి పాదయోః।
విముక్తిః ఇతి పాయౌ।
ఇతి మానుషీః సమాజ్ఞాః।
అథ దైవీః।
ఆధ్యాత్మికోపాసనలు - క్షేమము
బ్రహ్మము సర్వత్రా ఉన్నదని ఆరాధించబడుగాక!
→ వాక్కునందు ‘క్షేమ’ రూపంలో ఉన్నదని ఎరిగి క్షేమము - ప్రేమ - వాత్సల్య పూర్వక వాక్కులతో బ్రహ్మమును ఉపాసించాలి.
→ ప్రాణ - అపానములు ఈ దేహమును సర్వదా రక్షిస్తున్నాయి కదా! అందుచేత ‘ప్రాణ - అపానములయందు పరమాత్మయే - క్షేమము రూపమున ఉన్నారు’…అని గమనిస్తూ బ్రహ్మమును ఆరాధించాలి.
→ పని చేయాలంటే చేతులు బాగుండాలి కదా! అందుచేత పరబ్రహ్మమును హస్తముల రూపముగా ఉన్నారు - అని భావిస్తూ (అయమ్ మే హస్తో భగవానః అని అనుకుంటూ) భగవానునికి కర్మలు సమర్పించాలి. చేతులలో పరమాత్మచే ప్రసాదించబడిన ‘క్షేమమును’ గమనిస్తూ, హస్తములు ఆత్మస్వరూపంగా ఉపాసించబడు గాక!
→ ‘పాదములయందు గతి రూపమున భగవంతుడు వేంచేసి ఉన్నారు’ అని భావిస్తూ, (‘సంచారః పదయోః ప్రదక్షిణ విధిః’ - భావనతో) నడకలను ప్రదక్షణ భావన చేయాలి. ‘క్షేమము’ను దర్శించాలి.
‘విసర్జనావయములో విముక్తిరూపులై పరమాత్మ ఉన్నారు’ అని భావించాలి.
ఈ విధంగా ఆత్మభగవానుని గురించి ఆధ్యాత్మిక జ్ఞానశీలత కలిగి ఉండాలి.

తృప్తిరితి వృష్టౌ .
బలమితి విద్యుతి .. 2..

యశ ఇతి పశుషు . జ్యోతిరితి నక్షత్రేషు .
ప్రజాతిరమృతమానంద ఇత్యుపస్థే . సర్వమిత్యాకాశే .
తత్ప్రతిష్ఠేత్యుపాసీత . ప్రతిష్ఠావాన్ భవతి .
తన్మహ ఇత్యుపాసీత . మహాన్భవతి . తన్మన ఇత్యుపాసీత .
మానవాన్భవతి .. 3..
‘తృప్తిః ఇతి వృష్టౌ।
బలమ్ ఇతి విద్యుతి।।
3. యశ ఇతి పశుషు। జ్యోతిః ఇతి నక్షత్రేషు।
ప్రజాతిః ‘అమృతమ్ ఆనంద’ ఇతి ఉపస్థే।
సర్వమ్ ఇతి ఆకాశే।
తత్ ప్రతిష్ఠేతి ఉపాసీత, ప్రతిష్ఠావాన్ భవతి।
తత్ ‘మహ’ - ఇతి ఉపాసీత మహాన్ భవతి।
తత్ ‘మన’ - ఇతి ఉపాసీత మానవాన్ భవతి।।
ఆధి దైవికోపసనలు
బ్రహ్మము వర్షమునందు అన్నములను ప్రసాదించుట ద్వారా తృప్తిరూపమున ప్రదర్శనమగుచున్నది - అని ఉపాశించాలి.
మెఱుపు - విద్యుత్ (జ్యోతి) యందు (లేక కాంతియందు) ‘బలము’ రూపముగా ఉన్నట్లు బ్రహ్మమును ఉపాసించాలి. పశువులయందు యశస్సు (క్షేమము) కలిగించు రూపముగాను, నక్షత్రములలో జ్యోతి రూపముగాను, ఉపస్థయందు సంతాన ప్రదాతగాను బ్రహ్మమును దర్శిస్తూ ఉపాసించాలి.
ఆకాశమునందు సర్వదృశ్యరూపముగా బ్రహ్మము ప్రదర్శనమగు చున్నట్లుగా ‘సర్వము బ్రహ్మమే’ అను భావనారూప మననముతో బ్రహ్మమును పూజించాలి.

‘ఈ సర్వము బ్రహ్మమునందే సర్వదా ప్రతిష్ఠితమైయున్నది’ అను మననము - ధ్యానములను ఆశ్రయించువాడు. బ్రహ్మమునందే తాను ప్రతిష్ఠితుడగుచున్నాడు.
‘ఈ పాంచభౌతిక జగత్తు - ఇందలి జీవులు …ఈ సర్వము పరమాత్మ యొక్క మహత్ స్వరూపవైవభవమే’…అను మహానుభావనచే…ఈ జీవుడు సంకుచిత స్థితి నుండి → మహానుభావుడు అగుచున్నాడు.

‘పరబ్రహ్మమే → మనన స్వరూపమై, మహామనోరూపమై అనేక విధములైన హావభావాలతో అనేక దేహములలో ప్రదర్శనమగుచు, జగత్ కల్పనా వినోదమునకు కారణమగుచున్నది’ అను మననముతో పరబ్రహ్మమును ఉపాసించువాడు జగద్విషయములపట్ల మౌనవంతుడు…అగుచున్నాడు. మానవంతుడు (సగౌరవించబడువాడు) అగుచున్నాడు.

తన్నమ ఇత్యుపాసీత . నమ్యంతేఽస్మై కామాః .
తద్బ్రహ్మేత్యుపాసీత . బ్రహ్మవాన్భవతి .
తద్బ్రహ్మణః పరిమర ఇత్యుపాసీత .
పర్యేణం మ్రియంతే ద్విషంతః సపత్నాః .
పరి యేఽప్రియా భ్రాతృవ్యాః .
స యశ్చాయం పురుషే . యశ్చాసావాదిత్యే . స ఏకః .. 4..
4. తత్ ‘నమ’ ఇతి ఉపాసీత,
నమ్యన్తే అస్మై కామాః।
తత్ బ్రహ్మేతి ఉపాసీత,
బ్రహ్మవాన్ భవతి।
తత్ బ్రహ్మణః ‘‘పరిమర’’ ఇతి ఉపాసీత,
పర్యేణం మ్రియన్తే ద్విషన్తః సపత్నాః।
పరియే అప్రియా అహ్రాతృవ్యాః
స యశ్చ అయం పురుషే,
యశ్చ ఆసావాదిత్యే స ఏకః।
స్వస్వరూపము - సర్వస్వరూపము అయినట్టి, జగత్ - సాక్షి - జగత్ రూపము కూడా అయినట్టి → పరబ్రహ్మమునకు మనస్సుతోను, భావనతోను రెండు చేతులతో నమస్కరిస్తూ ఉపాసించాలి. అట్టి వానిపట్ల సర్వకామములు వినమ్రత ప్రదర్శించుచున్నాయి. లోబడుచున్నాయి.
ఈ సర్వము ‘పరబ్రహ్మమే’ అని ఉపాసించువాడు స్వయముగా బ్రహ్మమే అగుచున్నాడు. బ్రహ్మముయొక్క ఉపాసన సర్వ పరిమిత సంకుచిత భావములను సపరివారంగా నశింపచేయగలదు.

‘నేను బ్రహ్మమునే! సర్వసహజీవులు సర్వదా బ్రహ్మమే. ఈ జగత్తు బ్రహ్మమే! ఆవల-ఈవల…అంతా బ్రహ్మమే’ అని ఉపాశించువానిపట్ల…
→ ద్వేషభావములు, అరిషట్ వర్గములు రూపుమాసిపోతాయి.
→ అప్రియత్వమంతా తొలగి, సర్వాహ్రాతృత్వము వెల్లివిరిస్తుంది.
→ (1) అట్టి వాని ఆత్మ, (2) ఆదిత్యుని ఆత్మ, (3) సర్వజీవుల ఆత్మ - ఈ మూడూ ఏకస్వరూపమై ప్రకాశించుచున్నది. ఆతడు అఖండాత్మ స్వరూపుడై ఆత్మానంద సంభరితుడు అగుచున్నాడు.

స య ఏవంవిత్ . అస్మాల్లోకాత్ప్రేత్య .
ఏతమన్నమయమాత్మానముపసంక్రమ్య .
ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రమ్య .
ఏతం మనోమయమాత్మానముపసంక్రమ్య .
ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య .
ఏతమానందమయమాత్మానముపసంక్రమ్య .
ఇమాఀల్లోకన్కామాన్నీ కామరూప్యనుసంచరన్ .
ఏతత్ సామ గాయన్నాస్తే . హా 3 వు హా 3 వు హా 3 వు .. 5..
5. స య ఏవం విత్, అస్మాత్
లోకాత్ ప్రేత్య, ఏతమ్
అన్నమయమ్ ఆత్మానమ్ ఉపసంక్రమ్య।
ఏతం ప్రాణమయమ్ ఆత్మానమ్ ఉపసంక్రమ్య।
ఏతం మనోమయం
ఆత్మానమ్ ఉపసంక్రమ్య।
ఏతం విజ్ఞానమయమ్
ఆత్మానమ్ ఉపసంక్రమ్య।
ఏతం ఆనన్దమయమ్
ఆత్మానమ్ ఉపసంక్రమ్య।
ఇమాన్ లోకాన్ కామాన్నీ కామరూప్య అనుసంచరన్।
ఏతత్ సామగాయన్నాస్తే।
హా 3। వుహా3। వుహా 3 వు।।
‘‘సర్వము నాయందే ఉన్నది (అన్నమ్)। సర్వము నందు నేనున్నాను (అన్నాదమ్)’’ → అను ఉపాసనను సిద్ధించుకొన్నవాడు ‘బ్రహ్మవేత్త’ అగుచున్నాడు. ఆదిత్యునియందు, తనయందు, సర్వజీవులయందు, సర్వజగత్తులనందు ప్రకాశించు అఖండ బ్రహ్మమునకు నమస్కరిస్తూ భక్తి - జ్ఞాన - వైరాగ్యములతో ఉపాసించువాడు….
→ ఈ భౌతికలోకముల పరిధులను దాటివేయుచున్నాడు.
→ అన్నమయాత్మను, ప్రాణమయాత్మను మనోమయాత్మను, విజ్ఞానమయాత్మను, ఆనందమయాత్మను క్రమముగా ఆక్రమిస్తూ, పొందుచూ,…తనకు ఇష్టము అయినట్టి రూపములను నూతన వస్త్రములవలె ధరిస్తూ, ఆశ్చర్యకరమైన మధుర స్వరముకలిగియున్న గాయకునివలే సామగానం చేస్తూ…హాయి-ఆనందరూపుడై, విహరిస్తున్నాడు. తాను ఏక - అఖండ స్వరూపుడై తన కల్పనయందు తానే (స్వప్నంలోవలే) ఆనందముగా విహారములు చేయుచున్నాడు! ఆశ్చర్యం! అమోఘం!
ఆహా! ఓహో! ఊహూ! (సర్వ భూతస్ధమ్ ఆత్మానమ్, సర్వభూతాని చ ఆత్మని).

అహమన్నమహమన్నమహమన్నం .
అహమన్నాదోఽ3హమన్నాదోఽ3అహమన్నాదః .
అహగ్ంశ్లోకకృదహగ్ంశ్లోకకృదహగ్ంశ్లోకకృత్ .
అహమస్మి ప్రథమజా ఋతా3స్య .
పూర్వం దేవేభ్యోఽమృతస్య నా3భాఇ .
యో మా దదాతి స ఇదేవ మా3అఽవాః .
అహమన్నమన్నమదంతమా3ద్మి .
అహం విశ్వం భువనమభ్యభవా3మ్ .
సువర్న జ్యోతీః . య ఏవం వేద . ఇత్యుపనిషత్ .. 6..

ఇతి దశమోఽనువాకః ..

.. ఇతి భృగువల్లీ సమాప్తా ..
6. అహమ్ అన్నమ్। అహమ్ అన్నమ్।
అహమన్నమ్।
అహమ్అన్నాదో। అహమ్ అన్నాదో।
అహమ్ అన్నాదః।
అవాగ్గ్ శ్లోక కృత్।
అహగ్గ్ శ్లోక కృత్।
అహగ్గ్ శ్లోక కృత్।
అహమస్మి ప్రథమజా
ఋతా 3 స్య।
పూర్వం దేవేభ్యో అమృతస్య
నా3 భా3యి।
యో మా దదాతి
స ఇదేవ మా3–వాః।
(ఆ ఆవాః।)
అహమ్ అన్నమ్
అన్నమ్ అదన్తమా 3 ద్మి।
అహం విశ్వం భువనమ్।
అభ్య భవా3మ్। భవామ్।
సువర్ణ జ్యోతీః।
య ఏవం వేద।
అన్యపాఠక మూలము
(రాధ్యతే విద్యుతి, మానవాన్ భవ,
ఏకో, హా3వు
య ఏవం వేద ‘ఏకం’ చ।।)
అహమ్ అన్నమ్। అహమ్ అన్నాదమ్। అహమ్ బ్రహ్మ।।
బ్రహ్మమును, పరమాత్మను అగు నాయందే, సర్వలోకములు - స్వకీయ కల్పనచే ఉన్నాయి. కనుక నేనే అన్నమును. అహమన్నమ్! అహమన్నమ్!
సర్వలోక దృశ్యములు నాయందే ఉన్న తీరుగానే…ఈ సర్వమునందు నేను ఉన్నాను. కనుక నేను అన్నాదుడను! అహమన్నాదమ్! అహమన్నాదమ్।

వేద - వేదాంత - పురాణ - ఇతిహాసములు, ప్రవచనములచే పరమాత్మగా నేనే శ్లోకములచే (విశ్వమ్ విష్ణుః…మొదలై మాటలచే)…స్తుతించ బడుచున్నాను. (సర్వ దేవతా సహస్రనామ స్తోత్రములు అస్మత్ ఆత్మ స్వరూప వర్ణనములే!)

సృష్టి - అనబడేది నా యొక్క భావనయే! భావన నా కల్పనయే! ఈ సర్వమునకు నేను కల్పించువాడనై ఉన్నాను. అందుచేత సర్వకల్పనలకు మూలము - మొదలు నేనే! సర్వ సందర్భ సత్యములకు మొట్టమొదటి ప్రప్రథముడుగు ‘సృష్టికర్తను’! హిరణ్యగర్భుడను! నాకు వేరైనదంతా కల్పనయే! పరమ సత్య స్వరూపుడను. నాయొక్క అమృత స్వరూపమే సత్యము. దేవతలకు మునుముందువాడును! మూర్తామూర్త స్వరూపుడను! కేవలాత్మను!

సమస్త దేవతా స్వరూపుడగు ఏ అఖండాత్మదేవుడు నన్ను అన్నార్థుల కొరకై ప్రసాదించుచున్నాడో, ఆతడే సర్వ జగత్ రక్షకుడు! ఆతడే నీకు రక్షకుడు. ఆతడు నీకు నాకు అభిన్నమగు పరమాత్మయే! పరబ్రహ్మమే! ఆతడు నీకూ అభిన్నుడే! నాకూ అభిన్నుడే!
నేనే ఈ సర్వమునకు తినుచున్నవాడను! (I am the consumar of all). నేనే సర్వులచే అనుభవరూపంగా భక్షించబడుచున్నవాడను కూడా! (I am also at the same time, the subject for consumption). ఈ విశ్వమంతా నేనే! ఈ విశ్వభావనమంతా నేనే అయి, ఈ సర్వమును తిరస్కరించువాడనై ఆవల ఉన్నాను! ఇద్దానిని పురస్కరించువాడనై కూడా ఈ సమస్తమునందు నిండి ఉన్నాను. తిరస్కరించువాడుగా ఈ సమస్తమునకు అతీతుడను కూడా.

నాయొక్క రూపము సువర్ణమగు స్వయంజ్యోతి స్వరూపము! ఈ విశ్వమంతా నా వెలుగు రూపము!’ అని ఎరుగుచున్నాను.
జ్యోతి - జ్యోతి (భౌతిక) రూపము ఒక్కటే! జీవాత్మ - జగత్తు - పరమాత్మ ఏకమే. ఇదంతా కూడా ఏకము అఖండము అగు ఆత్మగా తెలియబడు చున్నది. మమాత్మయే ఇదంతా!

ఇతి తైత్తిరీయోపనిషత్ సమాప్తా।
ఓం శాంతిః| శాంతిః| శాంతిః||



కృష్ణ యజుర్వేదాంతర్గత

13     ‌తైత్తిరీయ ఉపనిషత్

అధ్యయన పుష్పము

శిక్షావల్లీ

1వ అనువాకము - శాంతి పాఠము - 1
2వ అనువాకము - శాంతి పాఠము - 2
3వ అనువాకము - ఆచార్యులవారి ‘‘శిక్షా’’ 4వ అనువాకము - శిష్యునికి ఆహ్వానము-గురుశిష్య సమాగమం
5వ అనువాకము - చాతుర్వ్యాహృతులు - షోడశకళ - ఆత్మ భగవానుడు
6వ అనువాకము - ఆత్మయోగము
7వ అనువాకము - పాంక్త - ఉప పాంక్తములు
8వ అనువాకము - ‘ఓం’ కారోపాసన
9వ అనువాకము - పురుషార్థ సాధనములు
10వ అనువాకము - ‘అహమ్’ సహజ పరస్వరూపము
11వ అనువాకము - శిష్య అనుశాసన నియమావళి
12వ అనువాకము - సూర్యాది దేవతాస్తుతి - శాంతి

ఆనందవల్లీ / బ్రహ్మానందవల్లీ

1వ అనువాకము - బ్రహ్మతత్త్వము
2వ అనువాకము - అన్నమయ, ప్రాణమయ
3వ అనువాకము - మనోమయ
4వ అనువాకము - విజ్ఞానమయ
5వ అనువాకము - ఆనందమయ
6వ అనువాకము - సత్ - అసత్
7వ అనువాకము - రసోవై అయం పురుషః
8వ అనువాకము - అభయానందము

భృగువల్లీ

1వ అనువాకము - సహనావవతు…. (శాంతి పాఠము)
2వ అనువాకము - అన్నం బ్రహ్మేతి వ్యజానాత్
3వ అనువాకము - ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్
4వ అనువాకము - మనో బ్రహ్మేతి వ్యజానాత్
5వ అనువాకము - “విజ్ఞానం” బ్రహ్మేతి వ్యజానాత్
6వ అనువాకము - ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్
7వ అనువాకము - అన్నమ్ ప్రాణస్వరూపం
8వ అనువాకము - ఆపః - జ్యోతిః - అన్నమన్నాదమ్ (జలము - అగ్ని - పరస్పరం అన్నమ్ అన్నాదమ్)
9వ అనువాకము - సర్వము నాయందు
10వ అనువాకము - త్యాగ మహిమ



1వ అధ్యాయము - శీక్షావల్లీ

ఈ ప్రథమాధ్యాయములో ‘అ’కారాది వర్ణములు, ‘ఉదాత్త’ఆది స్వరములు, హ్రస్వదీర్ఘాది మాత్రలు, వర్ణముల మధ్యమ వృత్తి ఉచ్ఛారణ, వర్ణముల సంధి - ఇవన్నీ ప్రస్తావించబడటం చేత ‘‘శీక్షావల్లీ’’.

1వ అనువాకము - శంనో మిత్రః! శం వరుణః! శం నో భవత్వర్యమా!…..

ప్రాణ వృత్యభిమాన దేవతయగు మిత్రుడు,
అపాన వృత్యభిమాన (మరియు) జలతత్త్వాభిమాన దేవత అగు వరుణుడు,
చూపు-అభిమాన దేవత, పితృదేవతల అధినాయకుడు, దేహనిర్మాణముల అభిమాని యగు.. అర్యముడు,
(త్రిజగముల సర్వేంద్రియాభిమాన దేవతయగు) ఇంద్రుడు,
(బుద్ధి-వాక్-విజ్ఞానాభిమాన దేవతయగు) బృహస్పతి,
(త్రిలోకములకు ఆధార-పరిరక్షక దేవతయగు) విష్ణువు-ఉరుక్రముడు
మాకు కరుణతో సుఖశాంతి-ఐశ్వర్య-ఆనందములు ప్రసాదించెదరుగాక!

ఓ సర్వదేవతల అఖండ స్వరూపుడవగు పరబ్రహ్మమా! మీకు నమస్కరిస్తున్నామయ్యా!

సర్వజీవుల ప్రాణేశ్వరుడవగు ఓ వాయుదేవా! మీకు హృదయపూర్వకముగా నమో వాక్కములు సమర్పిస్తున్నాము. మీరే మాకు పరబ్రహ్మస్వరూపులై బ్రహ్మోపాసనకు ఉపాస్య దైవమగుచున్నారు. మీరే సమస్తమును చేతనపరచుచున్న చైతన్య - స్వయమాత్మానందస్వరూపులు కదా।

‘త్వమ్’ రూపమగు ఈ ప్రత్యక్షమైనదంతా తత్ రూపమగు పరబ్రహ్మమే అయి ఉన్నది. తత్ త్వమ్। నేను అదే। సోఽహమ్।
మేము ఋతముగా బ్రహ్మము గురించియు చెప్పుకొంటున్నాము. యమ్-సత్…. సత్యమును సంభాషించుకొనుచున్నాము.

ఓ పరబ్రహ్మమా! మీరే మాకు సర్వదా సంరక్షకులు. మాకు బ్రహ్మమును చెప్పుచున్న సద్గురుభగవానుడు పరబ్రహ్మస్వరూపులే అయి ఉన్నారు.

ఓ పరబ్రహ్మమా! మీరు మమ్ములను అజ్ఞానమునుండి రక్షించువారు, మాకు బ్రహ్మమును బోధించువారు కూడా మీతో సమానమే. మమ్ములను, మాకు బ్రహ్మము బోధించు వక్త అగు ఆచార్యులవారిని సర్వదా రక్షించెదరు గాక! ఓం శాన్తిః। శాన్తిః శాన్తిః।।

మా యొక్క దృశ్యత్వము, దేహిత్వము, దేహత్వము స్వస్వరూపాత్మతత్త్వము నందు సశాంతించినవై ఉండునవగును గాక!

2వ అనువాకము - సహనావవతు…సహనౌభునక్తు…।

గురుశిష్యులమగు మనము…, పరబ్రహ్మము గురించి సత్సంగ పూర్వకంగా సంభాషించుకొనుచున్నాము.
- గురుశిష్యులమగు మన ఇరువురిని సర్వాత్మకుడగు పరామాత్మ సర్వదా రక్షించునుగాక! జీవనయాత్రకు అవసరమగునవి ప్రసాదించెదరుగాక!
- ఇరువురము బుద్ధి కుశలతచే వీర్యవంతులమై బ్రహ్మతత్త్వమును అధ్యయనము చేసెదముగాక!
- తేజో (Enlightenment) రూపమగు ఆత్మ విద్యను మనము బుద్ధితో ఎరుగుచుండెదముగాక!
- పరస్పరము ప్రేమతో ఈ అధ్యయనము కొనసాగించెదముగాక! అయిష్టత - ద్వేషములు మన ఇరువురి మధ్య దరిచేరకుండును గాక!

ఓం శాన్తిః। శాన్తిః। శాన్తిః।

3వ అనువాకము - ‘‘ఆచార్యుల వారి ‘‘శిక్షా’’ (Training Techniques)

సహ నౌ యశః। సహనౌ బ్రహ్మవర్చసమ్।। గురుశిష్యులమగు మేము ఇరువరము యశస్సు, బ్రహ్మవర్చస్సు పొందుచుండెదము గాక। అధా అతః సగ్ంహితయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః। - కాబట్టి ఇప్పుడు ఉపాసనా సమన్వితమైన (తైత్తిరీయ) - సంహితా ఉపనిషత్ వ్యాఖ్యానము చేస్తున్నాము. శిక్షా - ఆనంద - భృగు తైత్తిరీయములను (Three Facets) అధ్యయనము చేయుచున్నాము.

ఉచ్ఛరించటము ఆరు విధములుగా చెప్పబడుచున్నది

(1) వర్ణములు : ‘అ’ కారాది - ‘క్ష’ కారారాన్తము - అక్షరముల ధ్వని. అక్షరమును నిండు ధ్వనితో పలుకటము. మౌఖిక శబ్దోపాసన. ప్రతి అక్షరమును నిర్దుష్టముగా, సుస్పష్టముగా, సుమధురంగా, భావయుక్తంగా శబ్దీకరించటము.

(2) స్వరములు : అక్షరములను శబ్దార్థము - భావన సిద్ధించుటకై అవసరమగు ప్రకంపన, కంపన పరిమితులు. స్థాయి. ఉదాత్త - అనుదాత్తము - స్వరితము - స్వరములయొక్క స్థాయి.

(3) మాత్రా : హ్రస్వము-ఎట్లా కుచించాలి? అనుదాత్త స్వరములు, దీర్ఘములు - ఎట్లా విస్తరించి ఎంతవరకు పలకాలి? → ఈ వివరణలు. (హ్రస్వ - దీర్ఘ మాత్రలుబీ రెండింతల దీర్ఘము = ప్లుతము) - స్వరముయొక్క పరిమాణము.

(4) బలము : కంఠనాళము పైపైన - లో నుండి అక్షరమును పలుకు రీతులు. ఉదా : (1) ‘ఓం’ శబ్దము పెదమిల వద్ద ప్రారంభించటం, (2) స్వరనాళము నుండి ప్రకంపింపజేస్తూ గొంతు-గుండెల ఆధారంగా పలుకటము. (3) శబ్దము పలుకు ప్రయత్నము యొక్క అల్ప-అధిక-అత్యధిక బలములు నొక్కి ఉచ్ఛరించటం. - ఉచ్ఛారణశక్తి.

(5) సామము : త్వరితంగాగాని, నిదానంగాగాని, మధ్యరకంగాగాని అక్షరమును పలకటము., సమవేగము - విలంబనముల- సన్నగొంతు-పెద్దగొంతుల ఉదాత్త-అనుదాత్తములు. (Modulation of voice towards deeper pick up etc) - అను స్వరభేదములు.

(6) సన్తానః : ప్రతి అక్షరమును ఉచ్చార సమయమును పాటిస్తూ, దాటివేయకుండా పలకటము. భావనను ఉద్దేశ్యిస్తూ, ప్రేరేపించుచూ పలకటము. శబ్దములో ఉత్సాహము, సంప్రేరేపణను, ప్రశాంత-ఆనందములను జోడించటము.

ఈ ఉచ్ఛారణా భేదములను, వాటికి సంబంధించిన భావ పరిపుష్టిని మొట్టమొదట ఆచార్యుల వారు శిష్యునికి నేర్పుచున్నారు. (ఉదా : ‘‘ఓం-న-మః-శి-వ-యః-సి-ద్ధం-న-మః’’.. అను ప్రారంభ మంత్రముతో ఈ ఈ విశేషాలు చెప్పుచున్నారు)

ఈ విధముగా వేదమంత్రముల ఉచ్ఛారణను ఎరుగుచూ ఉండగా,… ఇక అప్పుడు ఆత్మహితము కొరకై ఉపనిషత్ అధ్యయనమును, శిష్య-ఆచార్యుల సంబోధన-సంవాదన విధానంగా చెప్పుకొనుచున్నారు.

శిష్య-ఆచార్యులు లేచి నిలబడి ఆత్మభగవానుని ఇట్లు ప్రార్ధిస్తున్నారు.

సహ నౌ యశః। సహనౌ బ్రహ్మవర్చసః। → మన మిరువురము పరబ్రహ్మము గురించిన విచారణచే పరమాత్మ కరుణచే యశస్సు-బ్రహ్మవర్చస్సు పొందెదముగాక। బుద్ధి - సునిశిత్వమును, నిర్మలత్వమును, విస్తారత్వమును, ప్రశాంతత్వమును, అధ్యయనత్వమును - వర్చస్సుగా కలిగియుండునుగాక।

ఆచార్యులవారు : ప్రియ శిష్యులారా! ముందుగా మనము ‘సంహితలు’ గురించి చెప్పుకుదాము.

పంచమహాసగ్ం హితా। పంచమహా సంయోగములు। సంయోగ సిద్ధాంతము

సంహితలు = వేటివేటిని ఉపాసనా వస్తువులుగా స్వీకరించి ఉపాస్య వస్తువగు పరమాత్మతత్త్వమును సిద్ధింపజేసుకోవచ్చునో.. అవి ‘సంహితలు’ అనబడుచున్నాయి. ‘అధికరణములు లేక ఉపకరణములు’ అని కూడా చెప్పబడుచున్నాయి.

అట్టి ఉపాసనను - ఇటు (పూర్వస్థానము) అటు ఉత్తరస్థానము, ఆ రెండింటిలయ స్థానము (నంధి) ; ఇటు అటు కలుపునది (అనుసంధానము)-గా (4 విభజనలతో)-నిర్వర్తించాలి.

‘5’ సంహితలు (లేక) ఉపకరణముల (లేక) అధికరణములు : (1) అధి లోకమ్ (ప్రపంచము) (2) అధిజ్యోతిషం (తేజస్సు) (3) అధి విద్య (జ్ఞానము) (4) అధి ప్రజమ్ (సంతతి / సహజీవులు), (5) ఆధ్యాత్మం = శరీరముతో ప్రపంచోపాసనం [విశ్వము-కాంతి (తేజస్సు) - విద్య - సంతానము - శరీరము…అను ఐదు సంహితలను ఆత్మోపాసనకై వినియోగించుచున్నాము.]

⌘⌘⌘

1.) అధిలోకమ్ - అధిలోకోపాసన - అధిలోక సంహిత (దృశ్య ప్రపంచము ఉపాసనకు ఉపకరణగా)

ఈ ఎదురుగా కంటికి, తదితర ఇంద్రియములకు భౌతికంగా సిద్ధించినదై కనిపించేదంతా (లేక) ఈ పృధివీంతా (ఈ ప్రపంచమంతా) ఉపాసనా వస్తువు (లేక) సంహితగా భావించబడి, ఆత్మతత్త్వ సిద్ధికొరకై ఉపాసించటము ‘అధిలోకము’ అనబడుచున్నది.

పృథివి (భూమి) (భౌతిక విభాగము) - అధిలోకము యొక్క పూర్వరూపము

ద్యు(దేవతా) ద్యే-లోకము (దివ్యత్వము) - అధి లోకము యొక్క ఉత్తరరూపము

ఆకాశము (స్థానము) - విశ్వముయొక్క పూర్వరూపమగు భూమి-ఉత్తరరూపమగు దేవలోకముల → సంధిస్థానము.

వాయువు (స్పందము) - అనుసంధానము (లేక) సంధాన కర్త.

మనస్సు ఏ ప్రపంచము గురించి అనుక్షణం ఆలోచించటలో నిమగ్నమై అలసిపోతూ ఉన్నదో.. అట్టి ఆయా వస్తు-విషయ- సంబంధ- సంపద-ఆపద ఇత్యాది విషయవలయము నుండి ఈవలికి తేవాలి.

‘‘ఈ కనబడే ఈ దృశ్యజగత్తు ఆత్మధ్యానము కొరకై ఉపాసన వస్తువు’’.. అని భావించాలి.

భూమి-ఆకాశము, (దేహ-పృథివితదితర-ఈ సర్వ నిర్మాణములలో పాల్గొనుచున్న అశరీరులగు దేవతల దేవతా లోకము; ఈ మూడు అనుసంధానము చేస్తున్న వాయువు (ప్రాణతత్త్వము)లను గమనించటము - ‘‘అధిలోక సంహిత’’.. అనబడుతోంది.

ఈ రీతిగా గమనిస్తూ క్రమంగా ఈ సర్వమునకు ఆధారమైన ఆత్మ యొక్క ఉనికిని గురించి, భావించి, మమేకము కావాలి. (భూ-ద్యౌ(దేవతాలోకముల) - ఆకాశముల పరస్పర వాయు (ప్రాణశక్తి) సంబంధములను దృష్టిలో ఉంచుకొని - విశ్వముయొక్క రూపమును ధ్యానించాలి).

2.) అథిజ్యౌతిష ఉపాసన సంహిత (లేక) తేజసో ఉపాసన - తేజోభావన

దృశ్యజగత్తు కళ్ళకు కనబడాలంటే, తేజస్సు (లేక) వెలుగు కావాలి కదా! అట్టి తేజస్సును ఉపాసించునిది - ‘‘ఆధి జ్యోతిష సంహిత’’

పూర్వరూపము - అగ్ని। ఉత్తరరూపము - ఆదిత్యుడు (సూర్యుడు)।

సంధి = ఆపః / జలము సంధానకర్త = విద్యుత్ / మేఘపు మెరుపులు।।

అగ్ని - ఆదిత్య - జల - విద్యుత్తులలో ‘‘కాంతి విభాగము’’ను సంహితగా (ఉపాసనా వస్తువుగా) భావించి ఉపాసించుటము - తేజోపాసన (లేక) అధిజ్యోతిషోపాసన.

సర్వే సర్వత్రా కనిపించే ‘వెలుగు’, ఆ వెలుగు ప్రసరిస్తూ ఉండగా కనిపించే సమస్త దృశ్యము ఉపాసనా వస్తువుగా అగుచున్నాయి.

అధిలోకోపాసన (భౌతికమైన నామరూపాత్మాక జగదోపాసన) కంటే కూడా తేజో భావన ఉన్నతమైనది. ఉత్కృష్టమైనది, కష్టము. ఉత్తమ ప్రయోజనకరము.

యోగులు కళ్లు మూసుకుని, కళ్లు తెరచి కూడా - అంతరంగ చతుష్టయమును అంతరజ్యోతిగాను, ఈ జగత్తుగా కనిపించేదంతా బహిర్-జ్యోతిగాను దర్శిస్తూ, అట్టి అధిజ్యౌతిష సంహితను ఆత్మత్వమునకు ‘‘సాధన ద్రవ్యము’గా వినియోగించుచున్నారు. శిష్యులారా! ఈ విధంగా అధితేజసో(జ్యోతిషో)పాసనను నిర్వర్తించండి.

3.) అధివిద్యాసంహిత - విద్యాఉపాసన - విద్యాభావన (గురు శిష్య విద్యాభ్యాస విధానమే ఉపాసనకు ఉపకరణంగా)

విత్+యత్= ఏది తెలుసుకోవాలో అట్టి ఆత్మ గురించిన అధ్యయమే అధివిద్య.

ఈ అధివిద్యా ఉపాసనకు
- పూర్వ రూపము → ఆచార్యుల వారు. గురుదేవులు.
- ఉత్తర రూపము → అన్తేవాసి (శిష్యుడు, విద్యార్థి)
- ఇద్దరి కలయిక → సంధి - విద్య (ఆత్మవిద్య)
- అనుసంధానము → ప్రవచము. శాస్త్ర అధ్యయనము. తత్ భావన. తత్ - అనుభవము.

⌘ శిష్యుడు ఆత్మ విద్యకై ఆచార్యుల వారిని ఆశ్రయించటము
⌘ ఆచార్యులు - ‘‘తత్-త్వమ్.. నీ సహజ రూపము అఖండమగు ఆత్మయే’’ - అని నిరూపించు ప్రవచనములను అనేక దృష్టాంతముల ద్వారా ప్రసాదించటము.
⌘ శిష్యులు ఆచార్యులవారిని పరబ్రహ్మముగా ఉపాసించటము.
⌘ గురువు శిష్యుని అఖండాత్మ స్వరూపమును తన ప్రవచనముల అంతరార్థరూపముగా ఉపాసించటము (తత్‌త్వమ్ అని భావించి చెప్పుట) ….
⌘ ‘ఆత్మభావన’తో అనుసంధానము.

ఇట్టి కార్యక్రమము గురుశిష్యులకు ‘అధి విద్యాసంహిత’ అయి-ఆత్మోపాసనకు, ఆత్మ ధ్యానమునకు, ఆత్మావలోకమునకు ఆత్మాఽహమ్ భావనకు-సుమార్గమగుచున్నది. బిడ్డలారా! ఈ విధంగా అధివిద్యోపాసనను ఎల్లప్పుడు మనో-బుద్ధులతో నిర్వర్తించెదరు గాక।

4.) అధి ప్రజోపాసన-ప్రజాసంహితము-ప్రాణుల ఉత్పత్తి ఉపాసన (దేహమే ఉపాసనకు ఉపకరణముగా)

ఇక ‘ప్రజ’ను అశ్రయించి సంహితరూపముగా (ఉపాసనా వస్తువుగా) ఉపయోగించి ఆత్మౌపాసన చేయుటము ఎట్లాగో చెప్పుకుంటున్నాము.

ఈ ప్రజోపాసనకు -

(‘‘సంతానము’’నకు) (ఉత్కృషార్థము)
పూర్వరూపము మాత (తల్లి)! (ప్రకృతి) (దేహముకంటే మునుముందు రూపము)
ఉత్తర రూపము పిత (తండ్రి)! (పురుషుడు) (దేహము పొందిన తరువాత రూపము)
పూర్వ ఉత్తర సంధి (కలయిక) సంతానము-ప్రజ (దేహమునకు ఆవలి-ఈవలి సంధి)
(పరమ పురుషుని అనేక రూప ప్రదర్శనము)
అనుసంధానము ప్రజల ఉత్పత్తి విధి; సంతతి (అఖండము, అప్రమేయము అగు పరమాత్మయొక్క జీవాత్మతో అనుసంధానము)

ఈ విధంగా ప్రజా ఉపాసన నిర్వర్తించుదురుగాక!

ప్రాణుల ఉత్పత్తికి సంబంధించిన భావన-ఉపాసనారూపమై ఈ విధంగా సిద్ధిస్తోంది. ‘‘ప్రకృతి-పురుషుడు - ఉత్పత్తి-పరిపోషణ’’… అను నాలుగు ఉపాసనా వస్తువులుగా అగుచున్నాయి. తల్లి పూర్వరూపము; తండ్రి ఉత్తరరూపము; వీరిద్దరి సంధిస్థానము సంతానోత్పత్తి క్రియ వీరిద్దరిని సంధానపరుస్తుంది. ఈ విధంగా ‘సంతానము’ గురించి ధ్యానించాలి. ‘ప్రజోపాసన’కు కనిపించే సమస్త దేహములు ఉపాసనా వస్తువుగా భావించబడుచున్నాయి.

5.) అధ్యాత్మోపాసన - శరీరోపాసన - శరీరము నుండి వెలువడు వాక్ ఉపాసన- వాక్ సంహిత - స్తుతి

అధ్యాత్మోపాసనకు శరీరములో ‘నోరు’ ముఖ్యమైన అంగము. నోటితో శబ్ద ఉపాసన చెప్పబడుచున్నది.

అధరహనుః - అధరములు  (పెదిమలు), క్రింద దవడ →    వాక్ రూప అధ్యాత్మోపాసనకు పూర్వరూపము.  
ఉత్తర హనుః - పై దవడ (ఉత్తర హనువు)       → శరీర (అధ్యాత్మ భావన) యొక్క ఉత్తర రూపము  
వాక్ సంధిః - శబ్దములు - వాక్కు        → సంధి (అక్షర స్థానము)  
జిహ్వ సుధానమ్ - జిహ్వ (నాలుక)       → అనుసంధానము..పూర్వ-ఉత్తర రూపములను సంధానపరుస్తుంది. 

ఈ తీరైన శరీరము గురించిన ధ్యానము అధ్యాత్మోపాసనగా చెప్పబడుతోంది. ఈ విధంగా భౌతికదేహమును, ఈ దేహము నుండి జనించే అక్షరములను ఉపాసించు విధానము అధ్యాత్మోపోసాసన అగుచున్నది. వాక్కును ఆధ్యాత్మిక మార్గములో సద్వినియోగించటము ‘అధ్యాత్మోపాసన’గా సూచించబడుతోంది. (భగవత్‌స్తుతి, నామసంకీర్తన, పురాణపఠణము, దివ్యమగు భగవత్, అవతారముల - భక్తుల చరిత్రల పారాయణము - ఇవన్నీ అధ్యాత్మోపాసనారూప విధానమునకు ఉపకరణములు)

ఈ విధమైన ‘5’ సంహితలు (‘5’ ఉపాసనలు) ‘పంచ మహాసంహితలు’ వాఖ్యానించబడుచున్నాయి. ‘‘ఈ పంచసంహితా ఆఖ్యాతములను (Explanations) ఎరిగి, అనుసంధానము చేయువాడు ఉత్తమ ప్రజలను (సంతానము-స్నేహితులు మొదలైనవాటిని), తత్త్వజ్ఞులతో సామీప్యమును, పశుసంపదను, బ్రహ్మవర్చస్సును, భోగ్యవస్తువులగు అన్నాద్యములను, సువర్ణజ్యోతిస్థానమును పొందుచున్నాడు. పంచసంహితభావనల వలన ఈ మనస్సు ‘‘నేను-నాది’’.. అను రూపములుగల సంకుచితమైన శృంఖలములను (బంధముల) త్రెంచి వేసుకొనుచున్నది. ‘‘విశ్వమంతా నేనైన నేను’’గా పరిణమించుచున్నది.

4వ అనువాకము శిష్యునికి ఆహ్వానము - గురుశిష్య సమాగమం

యః ఛందసాం ఋషభో విశ్వరూపః…. - శాంతి ప్రవచనము :
→ ఏదైతే వేదములచే శ్రేష్ఠముగా, అత్యంత ప్రాధాన్యముగా- ఓంకారనాదముచే ఉద్దేశ్యించబడుచున్నదో…,
→ ఏది విశ్వము యొక్క వాస్తవ రూపము అయి ఉన్నదో…,
→ వేదసారమై ‘అమృతరూపము’గా చెప్పబడుచున్నదో…, వేదములచే ఎలుగెత్తి గానము చేయబడుచున్నదో…,
అట్టి ‘‘పరబ్రహ్మరూపము’’ నా మేధస్సును (బుద్ధిను) స్పృశించి, హృదయములో ప్రవేశించి నిండుకుండలోని నీరువలె నిలిచి ఉండును గాక!

ప్రణస్వరూపుడవగు ఓ దేవాదిదేవా! ఆత్మదేవా! మా బుద్ధి మీ యొక్క (బ్రహ్మతత్త్వము యొక్క)ధారణను పొందిఉండునుగాక!

అట్టి బుద్ధిని కలిగియుండి, బ్రహ్మము యొక్క అనునిత్యధారణకై ఈ మా భౌతిక దేహము ఆరోగ్యవంతమై, అర్హత పొందియుండునుగాక! ఈ మా జిహ్వ (నాలుక) బ్రహ్మతత్త్వము గురించిన మధుర భాషణమునకై సదా సంసిద్ధమై ఉండునుగాక! మా ఈ చెవులు బ్రహ్మతత్త్వము గురించి శ్రద్ధగా వినుట కొరకై సర్వవేళలా సముత్సాహవంతమగునుగాక!

ఓ పరబ్రహ్మమా! మీరు ఎక్కడ ఉనికి కలిగి ఉన్నారు?
మరింకెక్కడనో కాదు! మాలోని పంచకోశములకు అంతరాంతరముగా , ఆవల - ఈవల కూడా వెలుగొందుచూ, మేము కల్పించుకొనుచున్న ‘లౌకిక ప్రజ్ఞ’చే కప్పబడి ఉన్నారు. మేము లోకసంబంధమైన బుద్ధిని అధిగమించి, బుద్ధియొక్క ఉత్తర విభాగముతో మిమ్ములను దర్శించెదముగాక!

ఓ ఆత్మ భగవాన్ ! శ్రుతం మే గోపాయ। నేను వినుచున్న ఆత్మజ్ఞాన వాక్యములను సమాచారమును… మీరు సంరక్షిస్తూ… మా బుద్ధి పరిపక్వమై, ఆత్మశుద్ధి పొందుటకొరకై తోడు అవండి.

ఈ విధంగా ఆత్మభావన యొక్క సిద్ధి కొరకై ‘ప్రార్థన’ ను గురు-శిష్యులు ముందుగా ఎలుగెత్తి గానము చేసెదరు గాక!

ఓ పరమాత్మా! ఆవహన్తీ వితన్వానా। కుర్యాణాచీరమాత్మనః। వాసాగ్ంసి మమ గావశ్చ।

మీరు మాకు ఎల్లప్పుడు అన్న-పానములను, వస్త్రములను, గోసంపదను, రోమములు గల గొర్రెలను ప్రసాదించండి! అవి విస్తారమగుచుండునుగాక! మేము ఎప్పుడూ ‘దేవయజ్ఞము’ నందు నిమగ్నులమై, మీచే మాకు ప్రసాదించబడు సర్వసంపదలను తిరిగి యజ్ఞవిధుల ద్వారా మీకే సమర్పించుచుండెదము గాక! మా ‘స్వాహా’ పూర్వక యజ్ఞ-యాగ-కర్మ విధులను విజయవంతము చేసి తత్-ఫలములను మీరు స్వీకరించ వేడుకొనుచున్నాము. ‘తత్ భావన’ను మాకు ప్రసాదించండి!

గురువు శిష్యులను ఆహ్వానించటం : ఓ దేవతలారా! బ్రహ్మవిద్యను మనసా, వాచా కోరుకొను అధ్యయనులు, బ్రహ్మవిద్య కొరకై నన్ను సమీపించెదరు గాక! శ్రద్ధ-నియమనిష్ఠలు గల అట్టి విద్యార్థులను నేను మనఃపూర్వకముగా ఆహ్వానించుచున్నాను. ఆత్మ వస్తువుయొక్క పరిసేవనము కొరకై ముముక్షువులను నాకు దగ్గర అగుటకు పిలుచుచున్నాను.

ఇక్కడ ఈ చోట సమావేశమగుచున్న గురిశిష్యులము అగు మేము జనులందు ‘యశస్సు’ పొందెదముగాక! గురు-శిష్య సాంప్రదాయములు, తాత్త్విక విశేషాలు, ఆధ్యాత్మిక అభ్యాసములు జనులలో ప్రసిద్ధిపొందునుగాక। జనులలో ఆధ్యాత్మిక ఆశయములు, భావములు ప్రవృద్ధమై, పరిపుష్టి పొందును గాక।

గురుశిష్యులమగు మేము ఆధ్యాత్మిక విశేషాలు సంభాషించుకొనుచుండగా, అట్టి సంభాషణములు గూడార్థములు, అంతరార్థములు మా హృదయములలో ప్రకాశమానమగుచుండునుగాక! మేము ఇరువురము ‘భగ’-జ్ఞానతేజోవంతులమగుదుముగాక! దేవతల సమర్పణముగా మా ఉపనిషత్ వ్యాసంగములు దిగ్విజయముగా అగునుగాక! సహస్ర (వేలాది) రీతులుగా చెప్పబడుచున్న ఓ ప్రణవమా! ఆత్మదేవా! మేము నీయందు సత్యదృష్టితో ప్రవేశించి పునీతులము (పవిత్రులము) అయ్యెదముగాక! ‘స్వాహా’ అను దేవతాసమర్పణ-వేదోచ్ఛారణలతో ఈ మా గురు-శిష్య ఆధ్యాత్మిక సమాగమునకు దేవతలను ప్రేమగా ఆహ్వానము పలుకుచున్నాము. ప్రేరేపకులు అగుటకై అర్థించుచున్నాము.

సద్యాత్మకుడవగు ఓ పరమాత్మా! ఓంకార ప్రణవస్వరూపా! ఈ ఆశ్రమానికి దేశము యొక్క, - ప్రపంచము యొక్క నలుమూలల నుండి అధ్యాత్మ విద్య-బ్రహ్మవిద్యయందు శ్రద్ధ, ఆసక్తి, అభిలాష గల బ్రహ్మచారుల ఆగమనాభిలాషినై యున్నాను. ఈ ఆశ్రమంలో తత్త్వజ్ఞాన ప్రవచనములు వెల్లివిరియాలని మిమ్ములను మనసా వాచా ప్రార్ధిస్తున్నాను. అట్టి బ్రహ్మవిద్యా అధ్యయనము లోకకల్యాణ కారకము అగునుగాక! ఎవ్వరు ఆత్మవిద్యను శ్రద్ధగా ఉపాసిస్తూ అభ్యర్ధిస్తారో, వారి గృహములలో ప్రవేశించటము మీ స్వభావము కదా! కనుక మా ఈ గృహాశ్రమమునకు సుస్వాగతము! ఆత్మతత్త్వము మా యందు ప్రవేశించి, ఉదయించుచున్న సూర్యునివలె, సహస్ర కిరణ అఖండ జ్యోతిగా ప్రకాశమానము అగును గాక!

⌘⌘⌘

మేధోకాముడు మరియు శ్రీకాముడు (తెలివి, సంపద కోరువాడు), ఆత్మశ్రేయస్సు కోరువాడు - ముందుగా జపము, తపము, భగవత్ గుణగానము, గురుస్తోత్రము, కర్మయోగము మొదలైనవాటిని ఆశ్రయించాలి. బుద్ధిని కుశలము, నిర్మలము, విస్తారము, సునిశితము చేయాలి. {‘3వ అనువాకము’లో చెప్పిన రీతిగా} ‘‘లోక-జ్యోతి-విద్యా-ప్రజా-ఆత్మ (స్వదేహ) పంచ సంహితులను (ఉపాసనలను)’’ ఆచరించాలి. మేధ-సద్గుణములను, అందుకు కారణభూతములగు అభ్యాసములను ఆశ్రయించాలి.

అటుపై వ్యాహృతులను-భూ-భువర్-సువర్… ఆ మూడింటికి ఆధారభూతమగు మహర్ వ్యాహృత్‌ను ఆశ్రయించాలి. (Let the generating origin of the matter, the thought and the logic be adored)

5వ అనువాకము - చతుర్వ్యాహృతులు - షోడశకళ ఆత్మభగవానుడు

మహా చమస్వః ప్రవేదయతే: చతుర్-వ్యాహృతి స్వరూపబ్రహ్మమును హృదయములో ధ్యానించుచున్నాము. అట్టి వ్యాహృతి ఉపాసన బ్రహ్మదేవుని అంగములయినట్టి భూ భువర్-సువర్… ఆ మూడింటికి ఆధారమగు మహర్ వ్యాహృతిని ‘మహాచమన్యుడు’ అను మహర్షి తన దివ్యదృష్టితో స్వానుభవముగా దర్శించి ప్రవచనము చేస్తున్నారు. (వ్యాహృతులు = నిగూఢమైన మహదత్వమును నిదురలేపు మంత్రాక్షరములు).

అట్టి చతుర్ (4) వ్యాహృతి ఉపాసనలు
(1) లోక చతుర్ వ్యాహృతి ఉపాసన
(2) దేవ చతుర్ వ్యాహృతి ఉపాసన
(3) వేద చతుర్ వ్యాహృతి ఉపాసన
(4) ప్రాణ చతుర్ వ్యాహృతి ఉపాసన
4 x 4 = 16 వ్యాహృతులు

వ్యాహృతి = (i) ఉచ్ఛారణ, (ii) కర్మల పరమాశ్రయము; (iii) ఉపాసన; (iv) ప్రదర్శన (expression), (v) సమర్పణ. ఈ ఐదింటి సమన్వయము
భూ-భువర్ ఇత్యాది - లోక వ్యాహృతి
భూః - భూలోకము, భౌతిక రూపములు → వ్యాహృతులుగా, (ఉపాసన సామాగ్రిగా) అగుచున్నది.

భువః-అంతరిక్షము (లేక) ఆకాశములోని లోకములు (వరుణ లోకము, అగ్నిలోకము, వాయు లోకము మొదలైనవి)-ఉపాసనా విషయములు.

సువః - సువర్గ (లేక) స్వర్గలోకము. దివ్యతత్త్వములగు దేవతా లోకములు.

మహర్- భూ-అంతరిక్ష-సువర్ లోకములను తన అంగములుగా కలిగి ఉన్నట్టి నాలుగవది.

అంగి (అంగములుగా కలిగి ఉన్నట్టిది) అగు హిరణ్యగర్భుని ఉపాసించుచున్నాము. అనగా ఈ భూ-భువర్-సువర్ త్రిలోకములు సృష్టి యొక్క అంగములు (అవయవములు)- అని, అట్టి ఈ అంగములు ఎవరివో అట్టి ‘అంగి’ → బ్రహ్మదేవుడు అని ఎరిగి, ఆయనను ఉపాసించుచున్నాము. (We are chanting the worker of the creation, the thought and the Presentation of this creation)

ఈ విధంగా 4వ దగు మహర్ వ్యాహృతి బ్రహ్మదేవుని హృదయ మధ్య భాగమగు ఆత్మగా ఆత్మదర్శులగువారిచే గమనించబడుతోంది.

నామరూపాత్మకంగా ఉపాసించుటకై….

హిరణ్యగర్భుని (సృష్టికర్త) ఉపాసనకొరకై బ్రహ్మదేవునికి-

భూ - (matter) వ్యాహృతి - ‘హిరణ్యగుర్భుని పాదములు’ అని
భువర్ - (Thought) వ్యాహృతి - హిరణ్యగర్భుని బాహువులు’ అని
సువర్ (బుద్ధి) వ్యాహృతి-హిరణ్యగర్భుని శిరస్సు గాను….. ఈ విధంగా శరీర భాగములుగా ఉపాసించుచున్నాము.

ఇక 4వ వ్యాహృతి (మహర్)తత్త్వమును ‘శరీరి’ లేక ‘అంగి’ అగు బ్రహ్మదేవుని ఆత్మగా ఉపాసించుచున్నాము. అట్లాగే..,
ప్రతిజీవుని చూస్తూ ఉన్నప్పుడు
= భౌతికము - భూతత్త్వము
= మానసికము - భువర్‌తత్త్వము
= బుద్ధి - సువర్‌తత్త్వము.

ఈ మూడు బుద్ధి ఆత్మ వ్యాపిత, స్వరూపములు (That manifested)
4వది = శరీరి - మహత్ - తత్త్వము. కేవలాత్మ - బ్రహ్మము.

మొదటి మూడింటిని ధరించుచున్నట్టి, మూడుగా అగుచున్నట్టి మహర్‌తత్త్వము. ‘‘అన్నిటినీ వ్యాపింపజేయు వ్యాపక స్వరూపము - సర్వవ్యాపకము’’ అని ఉపాసించి, ఆత్మోపాసనను సిద్ధింపజేసుకొనుచున్నాము. (The manifistation and The manifester be adored).

నాలుగవది అగు - మహత్ లేక మహావ్యాహృతియే బ్రహ్మస్వరూపము. అది సర్వ వ్యాపక (శరీరి) స్వరూపమని, మొదటి ‘3’ - వ్యాపించిన (శరీర) రూపములని ఉపాసించుచున్నాము. ఈ విధంగా వ్యాపిత (3 వ్యాహృతులు) - వ్యాపక (4వ వ్యాహృతి)గా భావిస్తూ చేయు ఉపాసనమే ‘వ్యాహృతోపాసన’ అగుచున్నది. ఇదియే ‘బ్రహ్మోపాసన’ కూడా.

ఆత్మకు తదితరములైన చతుర్(4) వ్యాహృతులు - అంగ విశ్లేషణ

(1) లోక వ్యాహృతులు = (1) భూ-భూలోకము; (2) భువర్-అంతరిక్షము; (3) సువర్ - మనుష్యులు, జీవులతో కూడిన ప్రపంచము;.. (4) మహః = సూర్యుడు (ఆదిత్యుడు)
సూర్యుని చేతనే సమస్తలోకములు వృద్ధి చెందుచున్నాయి. ఆయన జగత్‌శరీరమునకు ‘దేహి’.

(2) దేవతా వ్యాహృతులు = (1) భూ=అగ్ని; (2) భువః = వాయువు; (3) సువః = సూర్యుడు; (4) మహః = చంద్రుడు.
చంద్రుని యొక్క (ఓషధీతత్వము యొక్క)ఉనికి చేతనే సమస్త తేజస్సులు వృద్ధి చెందుచున్నాయి.

(3) వేదవ్యాహృతులు = (1) భూ= ఋగ్వేదము, ఋక్కులు; (2) భువర్ = సామవేదము, సామగానములు
(3) సువః = యజుర్వేదము, యజస్సులు, (4) మహః = బ్రహ్మస్వరూపమగు ‘ఓం’కారము
‘ఓం’కారము చేతనే సమస్త వేదములు వృద్ధి చెందుచున్నాయి.

(4) ప్రాణ వ్యాహృతులు = (1) భూ=ప్రాణము; (2) భువః =అపానము; (3) సువః= వ్యానము; (4) మహః = అన్నము
అన్నము చేతనే సమస్త ప్రాణులు వృద్ధి చెందుచున్నాయి.

ఈ విధంగా లోక-దేవతా-వేద-ప్రాణ (4) x (4) విభాగములు.. 16… షోడశకళలు ఆత్మపురుషునివిగా భావించి ‘‘షోడశాత్మక ఆత్మ పురుషుని’’ ఉపాసించటమే ‘వ్యాహృతి ఉపాసన’.

ఎవ్వడు ఈ షోడశ(16) కళలను తెలుసుకొని పరబ్రహ్మమును షోడశకళాత్మకముగా ఉపాసిస్తాడో, అట్టివాడు దేవతలందరినీ పూజించినవాడు అగుచున్నాడు. దేవలోకంలో కూడా పూజనీయుడగుచున్నాడు.

6వ అనువాకము - ఆత్మయోగము

ఇప్పటివరకు భూ-భువర్-సువర్-మహర్ వ్యాహృతులతో కూడిన లోక-దేవతా-వేద-ప్రాణ.. షోడశ (4x4=16) అంగ పూజ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడిక షోడశకళల పురుషుడగు ఆ హిరణ్యగర్భ పురుషుని (లేక) పరమపురుషుని - హృదయాకాశములో గమనించటము, దర్శించటము, ఉపాశించటము మమేకము-ఏకత్వము సిద్ధించుకోవటము గురించి చెప్పుకొంటున్నాము.

ఈ జగత్తు స్వతఃగా బ్రహ్మమే! అట్టి బ్రహ్మమునకు స్థానము హృదయాకాశము! స్వప్నంలో కనిపించే ఆయా వ్యక్తుల ఆత్మ - ఆ స్వప్నద్రష్ట యొక్క భావనా - స్వస్వరూపమే కదా! అట్లాగే స్వాత్మను సర్వాత్మకముగా భావన చేయుట చేతనే ఈ జీవుని సత్యమగు స్థానము జేర్చుచున్నది.

ఈ విశ్వమును బ్రహ్మముగా, సర్వజీవుల అఖండాత్మస్వరూపముగా సందర్శించు అభ్యాససిద్ధియే ‘‘ఆత్మసాక్షాత్కారము’’. ‘‘అట్టి అఖండమగు విశ్వాత్మ - మమాత్మయే’’ - అను లక్ష్యమే ‘ఆత్మవిద్య’. ‘‘సర్వభూతములందు నేనే ఆత్మగా స్థితించి ఉన్నాను. సర్వభూతములు నా ఆత్మయందే స్థితి కలిగి ఉన్నాయి’’ - అను స్థితియే ‘సోఽహమ్’ భావము.

⌘⌘⌘

ఓ శిష్యుడా! ఈ దేహోపకరణమును ఉపయోగించి యోగమార్గములో ఆత్మస్థానమును చేరు ఒకానొక యోగసాధన గురించి ఇప్పుడు మనము చెప్పుకుందాము.

(1) హృదయ మధ్య ప్రదేశంలో ఆకాశము ఉన్నది. అది బాహ్యాకాశమువలెనే విస్తారమైనది. బాహ్యాకాశము కంటే కూడా అత్యంత సూక్ష్మమైనది.

(2) అట్టి ఆకాశములో ఆత్మవిరాజిల్లుచున్నది.

(3) అట్టి ఆత్మ భగవానుడు (లేక) పరమ పురుషుడు - మనోమయుడై, చైతన్యస్ఫూర్తితో అమృతమయుడై, హిరణ్మయుడై (జ్యోతిర్మయిడై) నిత్యప్రకాశమానుడై ఉన్నారు. ఆయన ఈ విశ్వమంతా ఆక్రమించుకొని ఉన్నారు. అంతేకాదు. ఈ విశ్వమంతా ఆయనకు అనన్యము.

(4) ఆయనది ఆధ్యాత్మిక స్వరూపమే కాని భౌతిక రూపం కాదు (దేహంతో స్వప్నసీమవలె) స్థూల రూపం కాదు. సూక్ష్మరూపము.

(5) అట్టి హృదయాకాశము గురించి, అద్దానిలో ప్రకాశిస్తున్న సర్వగతమగు ఆత్మభగవానుని గురించి → బుద్ధి యొక్క ఏకాగ్రతతో, యోగసాధన సహాయంతో గమనిస్తూ, ‘ఉపాసన’ను వృద్ధి చేసుకొంటున్నాము.

సర్వపరిపూర్ణుడగు ‘ఆత్మ’… దేవుడు →
- సర్వ నాడులకు (శక్తి తరంగాలకు) ఊర్ధ్వంగాను,
- ‘ప్రాణశక్తి’కి జనన స్థానముగాను,
- క్రింద వైపుగా (అధోముఖంగా) చైతన్యస్ఫూర్తి రూపంగా వ్రేలాడుచూ..,
- మాంసమయమగు హృత్ పద్మ ఆకాశమునందు…,
- మనోమయమై, అమృతరూపమై, తేజోరూపమై ప్రదర్శనమగుచున్నారు.

స్వీయ హృదయమే పరమాత్మస్థానము. అట్టి పరమాత్మను చేరు విధానము యోగసాధనా విధి.

✤ దేహముతో కొన్ని సూక్ష్మశక్తి ప్రవాహములు నిరంతరము అనువర్తిస్తూ ఉన్నాయి.
✤ వాటిలో ‘వెన్నముకాకాశము’ నందు ఇడ-పింగళ, వాటి మధ్యగా సుషుమ్ననాడులు.. ముఖ్యమగు శక్తిగత నాడులు
✤ హృదయమునకు ఊర్థ్వంగా సుషుమ్ననాడి ముఖ్య ప్రదర్శనము కలిగినదై, గుండె, కంఠము, ముఖముల వైపుగా విస్తరించి, శిరోకపాలమును స్పృశిస్తూ ఉన్నది. అంతేకాదు. కేశముల (వెంట్రుకల) మూల విభాగము నుండి - శిరోకపాలమును చీల్చుకొని శిరస్సు యొక్క ఊర్థ్వకాశము వరకు విస్తరించినదైయున్నది. ఇది ‘బహ్మప్రాప్తి’ సంబంధమైన ‘‘యోగ-శక్తి-తేజోమార్గము’’. సుషుమ్ననాడి ద్వారా బ్రహ్మరంధ్రమును ఛేదించి సహస్రారములో ప్రవేశించి సర్వాత్మత్వము సంతరించుకోవటమే - యోగాభ్యాసము.

అట్టి సుషుమ్ననాడి దవడల మధ్య భాగమునందు ‘‘తాలు ఆకాశము’’ నందు మాంసపిండము రూపమువలె వ్రేలాడుచూ యోగాభ్యాసికి అనుభవమగుచున్నది.

ఆత్మను ‘‘అద్వితీయము - సర్వవ్యాపకము - సర్వాధారము’’ అని తెలుసుకొనుచున్న యోగి.
(1) యోగాభ్యాసముచే సుషుమ్నా-శక్తినాడి యందు ధ్యాసను ఏకాగ్రం చేయుచున్నాడు.
(2) హృదయాకాశము నుండి ప్రస్ఫుటమై బయల్వెడలుచు, సుషుమ్నయందు ఆయా స్థానములలో ప్రాణ - మనోబుద్ధి కుంభకములచే ఉపాసిస్తూ బ్రహ్మరంధ్రమును చేరుచున్నాడు.

అటు తరువాత…

👉 ‘‘నేను భూస్వరూపుడను! భౌతిక రూపములన్నీ నాదైనవాడను!’’ - భూమి-అగ్ని-ఋగ్వేద - ప్రాణ స్వరూపుడను.
👉 భువర్ - స్వరూపుడను! అంతరిక్ష-వాయు. సామవేద-అపాన స్వరూపుడను!
👉 సువర్-స్వరూపుడను! దేవతా (దివ్య) లోక-సూర్య-యజుర్వేద-వ్యాన స్వరూపుడను!
👉 ఈ మూడింటికీ కారణభూతుడగు సూర్యస్వరూపుడను! చంద్ర - ఓంకార - అన్నస్వరూపడను.

ఈ విధంగా ప్రాణ - మనో-బుద్ధి కుంభక విధిగా ఏకాగ్రతతో ఉపాసన చేస్తూ ఉండగా, క్రమంగా అగ్ని-వాయు-ఆదిత్య బ్రహ్మముల యందు ఆత్మస్వరూపుడై (తన యొక్క రూపము దర్శించువాడై) స్వర్భావము పొందుచున్నాము. ఒక్కొక్కటిగా స్వాత్మ స్వరూపముతో ఏకము చేయుచు, క్రమంగా సర్వాత్మకుడై, అఖండాత్ముడై కేవల స్వరూపముగా వెలుగొందుచున్నాము. (ఇదియే కైలాసవాసము (లేక) కైవల్యము కూడా। సందర్భములన్నిటినీ కేవలస్వరూపమునందు అంతర్గతము చేయటమే కైవల్యము.

మరికొంత విశేష వివరణ
👉 హృదయము నుండి 101 ముఖ్యనాడులు బయల్వెడలుచున్నాయి.
👉 అట్టి నాడులలో ‘100’నాడులు కంఠము - ఇంద్రియముల ద్వారములలో విస్తరించి ఉండగా, ఒక్కనాడి మాత్రము నడినెత్తి స్థానము వరకు విస్తరించి విశ్వంతర్గత - విశ్వబహిర్గతశక్తి యుతమై ఉన్నది.
👉 తాలువు అంతమయ్యే చోట నాసాగ్ర ఆకాశమునకు అంతరమున కొండనాలుకను స్పృశిస్తూ ఆ 101వ (సుషుమ్న) నాడి ఊర్థ్వముగా ప్రయాణించుచున్నదై ఉన్నది.
👉 ఈ తాలువు (కొండనాలుక)-ఆకాశము ద్వారా ప్రయాణించు శక్తి (నాడీ) మార్గము ఈ జీవుని అమరత్వమునకు చేర్చునదై ఉన్నది. తక్కిన నాడులు మృతస్వభావము గల (మార్పులకు అంతర్గతమైన) స్థానములకు (ఇంద్రియముల వైపుగా) విస్తరించి ఉన్నాయి.
👉 హృదయమునుండి - శిరః కపాలస్థానము ద్వారా విశ్వాంతరాళము ప్రవేశించు యోగాభ్యాసముచే ఆ యోగి అమృతస్థానము చేరుచున్నాడు. ఇంద్రియనాడుల వైపు ఆకర్షితుడైనవాడు అధోలోకములు పొందుచున్నాడు.

[ హృదయం = ప్రాణస్థానము. భావనారాయణ స్థానము. భావములు, అనుభూతులు జనించు స్థానము.
→ ఉద్వేగాలు, ఆలోచనలు మొదలైనవన్నీ నియంత్రించబడుస్థానము.
→ హృదయంతో నిండుగా చెప్పటం, గుండె ముక్కలు అవటం-గుండెమీద చేయి వేసుకొని చెప్పుచున్నాననటం…
ఇవన్నీ హృదయస్థాన-దైనందికానుభవ సంబంధములు ]

మనో - అధిపతిత్వ ఆత్మత్వము

ఈ విధంగా సుషుమ్నానాడి మార్గంగా హృదయమునుండి శిరో ఊర్థ్వభాగమును అధిరోహించి, బహిర్-విశ్వములో ప్రవేశించు యోగి →
👉 సర్వ స్వరూపుడై అఖండత్వము అప్రమేయత్వము పుణికిపుచ్చుకొనుచున్నాడు.
👉 మహామనో స్వరూపుడై సర్వదేహాలలోని కేవల మనోరూపుడై ‘మనో అధిపతిత్వము’ పొంది ఆస్వాదిస్తున్నాడు.
👉 సర్వవాక్కులకు ప్రభువు, సర్వ చక్షువులకు-దృష్టులకు ఆది స్వరూపుడు, సర్వశ్రోతములకు (వినికిడిలకు) అధినేత, సర్వవిజ్ఞానములకు విజ్ఞానఖని, సర్వజీవులు ఆదిస్వరూపుడుగా - తనను తాను సందర్శించుచున్నాడు. సర్వులను తన సహజాత్మస్వరూపులుగా దర్శిస్తూ ఆత్మానందభరితుడు అయి ఉంటున్నాడు.
👉 సర్వముకంటే కూడా (లోకసంబంధమైన సర్వవిశేషములకంటే కూడా) వేరై, సాక్షీస్వరూపుడై - అధికాధికుడు అగుచున్నాడు.
👉 ఆకాశము వలె సూక్ష్మాతి సూక్ష్మస్వరూపుడై మూర్త-అమూర్తములు (All that is with form and without form) తానే అగుచున్నాడు.
👉 సర్వప్రాణములు తన క్రీడాస్థానముకా కలిగి ఉన్నట్టిది, మహామనో ఆనంద స్వరూపము, పరమ శాంతస్థానము, అమృతరూపము అగు పరబ్రహ్మమే తానై ‘‘అహమ్ బ్రహ్మాఽస్మి’’ అను వేదమహావాక్యతాత్పర్యమును అనుభవముగా సిద్ధింపజేసుకొనుచున్నాడు.

ప్రాచీన (The self that is prior to all else) స్వరూప యోగ్యుడవగు ఓ శిష్యదేవా! ప్రాచీన యోగ్యనామధేయా! నీవు పై సుషుమ్ననాడీ మార్గముచే పృధివీ-అగ్ని-వాయు-ప్రాణరూపుడవై-అవన్నీ అతిక్రమించి పరబ్రహ్మ రూపమును ధ్యానిస్తూ.., పరబ్రహ్మ స్వరూపడవై ప్రకాశించు అభ్యాసమును ఆశ్రయించుము.

7వ అనువాకము - పాంక్త - ఉపపాంక్తములు

బిడ్డా! శిష్యా! ఇప్పటివరకు ఆత్మ ఏ విధంగా వ్యాహృతి (ఇహ) స్వరూపమై, అదే సమయంలో (at the same time) సర్వదా పరమై ఉన్నదో, ఏ స్వస్వరూప-అఖండ సర్వస్వరూప పరబ్రహ్మము అయి ఉన్నదో, అద్దాని ఉపాసన-ఉపవాసముల గురించి చెప్పుకుంటున్నాం.

ఇప్పుడు ‘పాంక్తములు’గా (ఉపాసన వస్తువులుగా) పృధివి మొదలైనవి తీసుకొని ఉపాసించు విధి గురించి కొన్ని విశేషాలు వివరించుకుంటున్నాము.

తైత్తరీయ-ఉపనిషత్-పాంక్తములు

అధిభూత-(బాహ్య) పాంక్త త్రయము

‘3’ పాంక్తములు (అధి భూతపాంక్త త్రయము)… ఒక్కొక్కటి 5 ఉపపాంక్తములను (ఉపలక్షణములను) కలిగి ఉంటున్నాయి.
(1) లోకపాంక్తము - పృథివి- అన్తరిక్షము - ద్యులోకము-దిశలు-అవాంతరము (in between)
ఇవి → ఆత్మభగవానుని పంచలోక-ఉపపాంక్తములుగా ఎరిగి ఆరాధించబడుగాక!
(2) దేవతా పాంక్తము - అగ్ని - వాయువు -ఆదిత్యుడు-చంద్రుడు-నక్షత్రములు.. ఇవి → ఆత్మదేవుని
‘‘పంచదేవతా-ఉపపాంక్తములు’’గా గమనిస్తూ పూజించబడుగాక!
(3) భూత పాంక్తము = జలము, ఓషధులు (e]-గోధుమ-జొన్నలు మొదలైన ఆహార ధాన్యములు), వనస్పతులు (నవధాన్యములు)- ఆకాశము, జీవాత్మ → ఇవి ఆత్మభగవానుని పంచభూత ఉపపాంక్తములుగా దర్శించుచూ ఉపాసించబడుగాక!.
ఇవి పరమాత్మ యొక్క బాహ్య సంప్రదర్శితమగు ‘‘అధి భూతపాంక్త త్రయము’’గా భావించబడుచున్నది. సందర్శించబడుచున్నది. ఉపాసించబడుచున్నది.

ఆధ్యాత్మపాంక్త త్రయము (అంతర పాంక్తములు)

(1) వాయు పంచ ఉపపాంక్తము : ప్రాణము (వాయువును దేహములోనికి స్వీకరించు ప్రక్రియ) - అపానము (వాయువును-క్రిందకు కదిలించు ప్రక్రియ) - వ్యానము (వాయువు దేహములో అన్ని మూలలకు వ్యాప్తింపజేయు ప్రక్రియ) - ఉదానము (దేహములో ఉండి అన్ని చోట్ల ఉత్తేజమును నింపి ఉంచు ప్రక్రియ) - సమానము (ఆహారమును జీర్ణింపజేసి రసతత్త్వమును శరీరమునకు నలుమూలలో ప్రతిక్షేపించు ప్రక్రియ).. ఇవి పంచప్రాణములు ప్రాణశక్తి యొక్క పంచ ప్రదర్శనములు.
సప్రాణము = విశ్వమంతా నిండి ఉండే చైతన్య స్ఫూర్తిరూప ప్రాణ ప్రక్రియా - ప్రాణశక్తి ప్రదర్శనము. సప్రాణము యొక్క దేహములోని దశవిధక్రియా నిర్వహణములే పంచప్రాణ - పంచ ఉపప్రాణములు.

పంచ ఉప ప్రాణములు :
నాగ : పొట్టలోని ప్రక్రియలను పర్యవేక్షించు ఉపప్రాణము
కూర్మ : కనురెప్పలు, మఖకవళికలు పర్యవేక్షించు ఉపప్రాణములు
త్రితల : ఆకలి-దప్పికలను పర్యవేక్షించే ఉపప్రాణము
దేవదత్త : ఆవలింత - నిద్ర-స్వప్నము - మొదలైన విశేషములను పర్యవేక్షించు ఉపప్రాణము
ధనంజయ : ప్రాణశక్తిని సమముగా ప్రసరింజేసి ఆరోగ్యము, రోగ నిరోధక విధిని పర్యవేక్షించు ఉపప్రాణము.

ఈ విధంగా పంచప్రాణ-ఉపప్రాణములు ఆత్మయొక్క ఈ దేహములోని సంప్రదర్శనములుగా ఉపాసించుచుండెదము గాక!
ప్రాణేశ్వరుని దశహస్తములుగా గమనించబడుచుండునుగాక!

(2) ఇంద్రియ పంచ ఉప పాంక్తములు : కళ్లు - చూపు; చెవులు - వినికిడి; ముక్కు - గంధము; వాక్కు (నోరు)-మాటలు పలకటము; చర్మము-స్పర్శ
ఈ ఐదు పరమాత్మ యొక్క ఇంద్రియ ప్రదర్శనా విశేషములుగా గమనిస్తూ.. వీటిని తన ప్రత్యక్ష ప్రదర్శనములుగా కలిగి ఉన్నట్టి ‘ఆత్మ’ను పూజాభావంగా దర్శించాలి.

ధాతు పాంక్తము : శరీరములోని ధాతువులు → చర్మము (స్పర్శ); మాంసము; వప (స్నాయు); అస్థి (బొమికలు); మజ్జ.. ఈ ‘5’ - పరమాత్మ యొక్క పంచధాతు ప్రత్యక్షములుగా భావించబడుచూ ఆత్మదృష్టిని ప్రవృద్ధపరచుకొనెదము గాక!

పరమ సత్యమగు పరబ్రహ్మ తత్త్వమును ఋక్కులు గానం చేస్తున్నాయి. అట్టి పరమసత్యమును తమకు తాముగా ఎరుగుచు, లోకములకు మార్గదర్శకులగుచున్నవారు - ‘ఋషులు’. అట్టి ఋషులు ఆత్మతత్త్వమును ఉపాసించు ఉపాయములను, ఉపకరణములను సూచిస్తున్నారు.
వారు -
బాహ్య పాంక్తత్రయము లోక-దేహ-భూత పాంక్తత్రయము
అధ్యాత్మ పాంక్త త్రయము (వాయు(ప్రాణ)-ఇంద్రియ-ధాతు పాంక్తములు)
3+3=6.. ఈ విధంగా పాంక్తన షట్కమును - ‘‘ఆత్మయొక్క ప్రదర్శిత రూపములుగా ఉపాసిస్తూ ఆత్మత్వము సంతరించుకొనటమును చెప్పుచున్నారు. ఆత్మ విభవములుగా, ఆత్మ సంప్రదర్శనములగు విశేషములుగా భావిస్తూ, ఆత్మత్వమును పునికి పుచ్చుకోవటమును దారిగా చూపుచున్నారు.

ఓ బిడ్డలారా! శిష్యదేవులారా! ‘వేదము’ అను శబ్దార్థము (గూడార్థము) = తెలియబడు ఈ సమస్తము ఈ ఎదురుగా కనిపిస్తున్న పంచభూతాత్మకమైనదంతా (ఆకాశ-వాయు-అగ్ని, జల-భూవిశేషాలన్నీ)… ప్రాణాది పాంక్తపంచకము నుండే ఉదయిస్తున్నది. కనుక సర్వము ఆత్మయొక్క పాంక్తమే (ప్రదర్శనమే).

‘‘ఆత్మ’’ అను పాంక్తము (source) చేతనే ఈ సర్వము వ్యాహృతమై యున్నది’’.. అని సిద్ధాంతీకరించబడుచున్నది. ఈ సర్వము వ్యాహృత హిరణ్యగర్భపరబ్రహ్మమే! అయితే బ్రహ్మము సర్వదా అవ్యాహృతము (It does not extend as any thing else). ఇదంతా అనేకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ, వస్తుతః ఏకము-అఖండము అగు పరబ్రహ్మమే! ఈ జీవుడు స్వతఃగా ఏక-అఖండ పరబ్రహ్మ ప్రదర్శనా రూపుడే!

[దృష్టాంతానికి - నీవు వినుచున్నప్పుడు, చూచుచున్నప్పుడు, మాట్లాడుచున్నప్పుడు, పోట్లాడుచున్నప్పుడు - ఏకరూపుడవే అయి ఉంటావుగాని,…..ఆయా ధర్మములనుబట్టి వేరు వేరు జీవులుగా అగుటలేదు కదా।]

పంచముఖుడు

పరమాత్మ ‘‘దృశ్యము-దేహము-జీవాత్మ-ఈశ్వరాత్మ-సర్వాత్మ’’.. అనబడే ‘5’ ముఖముల ప్రదర్శన సమన్వితుడు అయి ఉండటం చేత పంచపాంక్తుడు, పంచముఖుడు-అను శబ్దముచే స్తుతించబడుచున్నారు. ఈ జీవుడు అట్టివాడే, ఈతడు ఆత్మ స్వరూపుడే!
జీవో శివః। శివో జీవః। ప్రపంచము (ప్ర+పంచము) కూడా పంచభూతాత్మికమే కాబట్టి పంచపాంక్త శబ్దవాచ్యమే! పరమాత్మయే ప్రపంచరూపుడు! ప్రపంచము-పరమాత్మ-జీవాత్మ ఏక-అఖండ రూపులేగాని, వేరు-వేరు కాదు.

8వ అనువాకము - ‘ఓం’కారోపాసన

‘‘ఈ సమస్తము పరబ్రహ్మమే’’ అని చెప్పటానికి ‘ఓం’ శబ్దము వేదములచే ఉచ్చరించబడుతోంది!

అట్టి పరబ్రహ్మము ‘ఓం’ కారశబ్ద-నాద-ప్రదర్శనా రూపముగా ఆత్మను దర్శించిన బ్రహ్మజ్ఞులు-వాటిని అపౌరుషేయములగు వేదములుగా ప్రకటిస్తున్నారు.

స్వస్వరూపము-సర్వానుభవముల అఖండాత్మయే ఓం - కారము!

అట్టి ‘ఓం’ను ఎట్లా ఉపాసించాలో చెప్పుకుంటున్నాము.

⌘ ఓంకార శబ్దము యొక్క రూపము, అర్థము పరబ్రహ్మమే!
⌘ ఓంకారమే భగవంతుడు! పరమాత్మ! ఇష్టదైవము!
⌘ ఈ కనబడేదంతా కూడా ఓంకారమే! ఈ జగత్తు ‘ఓం’కార పరమార్థ స్వరూపమే!
⌘ ఈ జగత్తును అనుభవముగా పొందుచున్న జీవాత్మ (The Experiencer) కూడా ఓంకారమే!
⌘ జగత్తు ఓంకారము చేతనే అనుకృతము. (It is made up of). ఇదంతా స్వతఃగా సర్వదా ఓంకారమే కాబట్టి అకృతము కూడా! (It is as it is).
⌘ జగత్తు - జీవులు ఓంకారము నుండే శ్రవిస్తున్నాయి (out flowing). కాబట్టి ‘శ్రావయతి ఇతి ఓం’ అనబడుచున్నది. శ్రవింపజేయునది శ్రావ్యమగు ఆత్మ!
⌘ ‘అవును’ అని సూచించటానికి, ‘‘చెప్పు’’ అని అనటానికి, ‘‘విను’’ అని చెప్పటానికి ‘ఓం’యే పలుకబడుచున్నది. (‘ఓ రామా! విను’’ అను ‘ఓం’తో ప్రారంభమౌతోంది).

పరమాత్మ యొక్క విభూతులు వర్ణించు సామగానము.. ‘ఓం ఇతి ఓం’ అని పలుకుచు ‘ఓం’ను ఆది-అంత శబ్దములుగా పలుకుచున్నది.

‘ఓం శోం’ (ఓంకారమ్ సర్వత్రా ఏర్పడినదై ఉన్నది) అను శబ్దముతో ఋగ్వేదమంత్రములు పలుకుబడుచున్నాయి. శాస్త్రమంత్రద్రష్టలు

‘ఓం’తో ప్రారంభిస్తున్నారు. శబ్దరూపముగా ఉన్న సమస్తము ఓంకారమే! ఓంకార అధీనమే! శబ్దములన్నీ ‘ఓం’ను అనుకరిస్తున్నాయి. ఆశ్రయించినవై ఉంటున్నాయి.

యజ్ఞములు చేయించు ఆధ్వర్యులు ‘ఓం-అధ’, ‘ఓం-ఇవ’ అని పలికి, యజమాని చేత అట్లే బదులు పలికిస్తున్నారు. ‘బింబము-ప్రతిబింబము’వలె.. ఈ జగత్తు ఓంకారరూపమేనని వారు సూచిస్తున్నారు. అగ్నిహోత్రమును ‘ఓం’ స్వరూపముగా ఆహ్వానిస్తూ, ప్రజ్వలింపజేస్తున్నారు. బ్రహ్మ (యజ్ఞములు చేయించు ప్రారంభ -శ్రేష్ఠ, ఆధ్వర్యుడు) - తదితర ఆధ్వర్యుల చేత (యజ్ఞమును చేయించు మంత్రోపాసకులచేత) ‘ఓం’ అని అనుజ్ఞ ఇస్తున్నారు. తదితర ఆధ్వర్యులు ‘ఓం’ అని అంగీకరించి తదితర తతంగమంతా నిర్వర్తిస్తున్నారు, నడిపిస్తున్నారు.

‘ఓం’తో ప్రారంభించి బ్రాహ్మణుడు వేదమంత్రములను ప్రారంభిస్తున్నారు. ఓంతో ‘ప్రవచనములు’ అన్నీ ప్రారంభమగుచూ, ‘ఇతి ఓం’ అని ముగించబడుచున్నాయి. ‘ఓం’ అని బ్రహ్మోపాసన’ ప్రారంభమై ‘‘ఓం ఇతి సిద్ధిః’ అని సిద్ధించుఫలము ‘ఓం’కారరూపంగా దర్శించబడుతోంది.

‘‘లోకం సృష్టించబడినప్పుడు ‘ఓం’ శబ్దమే ధ్వనిస్తున్నది! ‘ఓం’ సృష్టిగా కొనసాగుచున్నది. ఓం యందే ఇదంతా లయించుచున్నది!’’.. అని సృష్టితత్త్వజ్ఞులు ఆత్మపరంగా సిద్ధాంతీకరించి చెప్పుచున్నారు. యోగులు సృష్టికి మునుముందు నుండి ఇప్పటి దాకా ‘ఓం’ శబ్దమునే వినుచూ పలుకుచున్నారు. ‘ఓం’ శబ్దము ఎవ్వరో ఒక్కరిచేత పుట్టించబడినది కాదు. అందుచేత ‘‘అనాహతము! అపౌరుషేయము’’… అని అనబడుతోంది. ‘ఓం’ ఆత్మ యొక్క అమృతమగు స్వాభావిక సూచనము.

అందుచేత ‘ఓం’ కారమును పరబ్రహ్మరూపంగా భావించాలి! ‘ఓం’ అనునప్పుడు నేను పరబ్రహ్మమునే ఉపాసిస్తున్నాను’’… అని గుర్తు పెట్టుకొని ఉండాలి.

తైత్తరీయ-ఉపనిషత్-ఓం

అని ఎరిగి ‘ఓం’ను ఎలుగెత్తి పలుకుచూ గానం చేసి, ఆ తదుపరి ఈ ‘జగత్తు’ అనుబడు సందర్భరూపవిశేషాలను స్వీకరించాలి!

ఓం కారముతో (ఈసర్వము పరబ్రహ్మమే - అనుభావనతో ) ప్రారంభమగుచున్న సమస్తక్రియలు అత్యంత ఫలప్రదములగుచున్నాయి.

ఓంకార (పరమాత్మభావనా) రహితమైన సమస్త క్రియలు నిష్ఫలములగుచున్నాయి. ఓంకారమును పరమాత్మస్తుతిగా ఉపాసించాలి! దర్శించాలి। ఆస్వాదించాలి।।

ఓంకారోఽహమ్ - ఓంకార త్వమ్ - ఓం కారమిదమ్।

9వ అనువాకము - పురుషార్థ సాధనములు

ఓ ప్రియశిష్యా!

కర్మలను పురుషార్థ సాధనములుగా ఎట్లా మరల్చుకోవచ్చో,… కొన్ని ముఖ్య సూచనలను సిద్ధాంతీకరిస్తూ…. ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము. వినండి! ఆత్మ దృష్టికి, ఆత్మావగాహనకు, ఆత్మాతాదాత్మ్యమునకు, ఆత్మమేవాహమ్ భావనకు ఇది త్రోవ అయి ఉన్నది.

ఋతం చ స్వాధ్యాయ ప్రవచనే చ। సత్యమును స్వానుభవంగా దర్శించి (శృణ్వంతి విశ్వే - అమృతస్య పుత్రః! వేదాఽహమ్ ఏతమ్ పురుషమ్। ఆదిత్యవర్ణమ్! తమసః పరస్తాత్) - ఓ బిడ్డలారా! సత్యమును మీకు వినిపిస్తున్నాం. కల్పనను ప్రక్కనపెట్టి మీ స్వరూపము గురించిన ఈ సత్యవాక్కులు వినండి!’’ అని ఎలుగెత్తి చెప్పబడు సమాచారమే ‘ఋతము’ అనబడుచున్నది. అట్టి ఋషివాక్కులను, ఋక్కుల గానములను, మహనీయుల సూచనలను, అభిప్రాయములను, అనుభూతములను, అనుభవములను శ్రద్ధగా వినాలి! పారాయణం చేయాలి! పఠించాలి! అంతర్ముఖంగా యోచించాలి! కలిసి కూర్చుని సంభాషించుకోవాలి! స్వాధ్యాయనము (Group study) - అధ్యయనము (one’s own study) నిర్వర్తించాలి!

సత్యం చ స్వాధ్యాయ ప్రవచనేచ। : చీకటిలో గదిలోని వస్తువులు సరిగ్గా అగుపించవు! వెలుతురు వస్తేనో? అన్నీ సుస్పష్టమౌతాయి. ‘యమ్-సత్’ ఏది ఎల్లప్పుడు ఉండి ఉంటోందో- అట్టి ఆత్మజ్ఞాన సమాచారము యొక్క తేజస్సులో ఈ జగత్తును, ఈ సమస్తమును దర్శించాలి! అందుకుగాను పరబ్రహ్మము యొక్క అద్వితీయత్వము గురించిన వివరణలు, నిర్వచనములు స్వాధ్యాయనం - ప్రవచనములు జరుగుతూ ఉండునుగాక! సత్యము వినాలి! సంభాషించాలి! సత్ సంగమ - సత్యముయొక్క అనుభవమునకు రాచబాట.

తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ! : పరిమితమగు జీవాత్మత్వము నుండి అపరిమితము - సర్వము అగు పరమాత్మతత్త్వము గురించిన స్వానుభవముకొరకై తపన యే తపస్సు. మనలో ప్రతి ఒక్కరి ఆత్మ సర్వాత్మకమైనదేకాని, కేవలము ఒక భౌతికదేహపరిమితము కాదు. ఈ విషయము గురించిన ప్రవచనములు వినాలి. స్వాధ్యాయము (Study) చేయాలి! లోకాతీత-గుణాతీత-విషయాతీత స్వస్వరూపము వైపుగా దృష్టిని సారించాలి! భేదముల నుండి దృష్టిని వెనుకకు మరల్చాలి! ఇదియే తపస్సు.

దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ ! : ఈ కళ్లు-చెవులు మొదలైన ఇంద్రియములను దృశ్యము నుండి విరమింపజేస్తూ, ఆత్మను దర్శించు మార్గములో సశాస్త్రీయంగా నియమించాలి!

శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ। : మనోబుద్ధి చిత్త అహంకారాలను ఆత్మతో మమేకము చేస్తూ సర్వాత్మకుడగు ఆత్మ భగవానుని కళావిశేషాలుగా గమనించు ప్రక్రియలందు నియమించాలి.

అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ : వేదములు - శాస్త్రములు సూచిస్తున్న అగ్నికార్యములను (దీపములను వెలిగించటము, యజ్ఞ-యాగములు.. ఇటువంటివి) అగ్న్యుపాసనలను వదలరాదు. నిర్వర్తిస్తూ ఉండాలి! దైనందిక పూజ మొదలైననవి, దైవకార్యములు, పితృకార్యములు ఆగ్నోపాసనతో ప్రారంభించాలి! (యజ్ఞోపాసనగా వెలిగించబడుచున్నప్పుడు అగ్ని - అగ్నిహోత్రమగుచున్నది.)

అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ। : సహస్ర దీపములలో ఏక స్వరూపుడగు అగ్నిహోత్రమును ఆత్మలక్షణ సమన్వితముగా ఆరాధించాలి। ‘‘నాకు కనబడుచున్న ఈ సర్వజీవులు పరంజ్యోతి స్వరూపుడగు పరమాత్మ యొక్క జ్యోతిస్వరూపములే’’.. అను అవగాహనతో అగ్నిహోత్రమును ఉపాసించాలి!

అతిధయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ। : తనను సంపద కొరకు, జ్ఞానము కొరకు, శాస్త్ర వివరణల కొరకు ఆశ్రయించవచ్చువారిని ఆదరించాలి. అతిధులను పరమాత్మ భావనతో ఆరాధిస్తూ సేవించాలి! (అభ్యాగతిః స్వయం విష్ణుః అనుభావనతో) ఉపాసించాలి!

మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ। : తోటి మానవులను పరమాత్మ రూపంగా దర్శించాలి! భావించాలి! ఉపాసించాలి!

ప్రజా చ స్వాధ్యా ప్రవచనే చ : తన కుటుంబ సభ్యులను, సంతానమును, బంధువులను పరమాత్మ రూపంగా భావించి సేవించాలి! పూజాభావం కలిగిఉండాలి.

ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ : దేశక్షేమము కోరి, ఆయా విధులు నిర్వర్తించాలి. కలిసి పనిచేస్తూ సేవాభావము కలిగి ఉండాలి! స్వాధ్యాయ- ప్రవచనములు ఆచరించాలి. గ్రామ - మండల - రాష్ట్ర - దేశ - ప్రపంచజనుల శుభ - శాన్తి - ఐశ్వర్య - ఆనందములకొరకు (ఉద్దేశ్యించి) దైవ - యోగ - జ్ఞానోపాసనలు నిర్వర్తించాలి.

ప్రజాపతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ : సృష్టిని-సృష్టికర్తను ప్రస్తుతిస్తూ స్వాధ్యాయ-ప్రవచనములు నిర్వర్తించాలి. దేహములను, ఆహారములను, పరస్పర సంబంధములను ప్రసాదించుచున్న సృష్టికర్త యొక్క పాత్రను ఏమరువరాదు. ఉపాసించాలి. ప్రకటించుచూ సంభాషించుకోవాలి. ‘‘ఓ ప్రజాపతీ! ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ చర్మము, ఈ గుండె శరీరముయొక్క జనన వృద్ధులు ఎంతటి ప్రజ్ఞతో రచించారు! ఆహా! అమోఘం!’’ - అని గుర్తిస్తూ స్తుతించాలి.

‘సత్యమితి’ సత్యవచాః రాథీతరః : ఏది సత్యమో, నిత్యమో.. అద్దానినే గుర్తుపెట్టుకుని సంభాషించాలి. ఆచార్యులు చెప్పుపరమసత్య వచనములను ఆశ్రయించాలి. సోదాహరణంగా సంభాషించుకోవాలి. - అని రాధృతర గోత్రోద్భవుడగు సత్యవచస మహర్షులగువారు ప్రవచిస్తున్నారు. గుర్తు చేస్తున్నారు. వారు సూచించు మార్గమును అనుష్ఠించాలి.
(రాధా = ఆరాధన)

‘తప’ ఇతి తపోనిత్యః పౌరుశిష్టిః : : పరమాత్మ గురించిన తపనయే ధ్యానాదులకు, శ్రుతములకు (వినుటకు) అధ్యయనమునకు దారితీస్తోంది. - అని పురుశిష్టముని కుమారుడగు పౌరుశిష్టులవారు, సిద్ధాంతీకరిస్తూ సూచించుచున్నారు. సత్యము కొరకు ‘తపన’ కలిగి ఉండాలి… అని వారి ఉద్దేశ్యము.

స్వాధ్యాయ ప్రవచన ఏవ ఇతి నాకో మౌద్గల్యః : స్వాధ్యాయము : అభ్యసించటము; అధ్యయనం చేయుటము, ప్రవచనము = బోధించటము → ఇవి బ్రహ్మతత్త్వమును సిద్ధింపజేయు ఉత్తమ సహకారి కారణములు - అని ముద్గల మహర్షి పుత్రుడగు నాకాచార్యులవారి సూచన. స్వాధ్యాయ ప్రవచనములను ప్రయత్నపూర్వకముగా నిర్వర్తించాలి. అనుష్ఠించాలి. అర్థ-జ్ఞానములు స్వాధ్యాయ-ప్రవచనముల ఆధీనము అయి ఉన్నాయి. అర్థజ్ఞానము వలననే పరమ శ్రేయస్సు సిద్ధిస్తోంది. అట్టి ఆత్మ శ్రేయస్సు కొరకై స్వాధ్యాయ-ప్రవచనములను విడవనే కూడదు. ధర్మమే స్వాధ్యాయ-ప్రవచనముల రూపమని కూడా ఏమరువరాదు. అధ్యయనము అనుష్ఠానరూపము సంతరించుకొనునుగాక! అనుష్ఠానము చే ఈ జీవుడు ముక్తుడై బ్రహ్మస్వరూపుడై ప్రకాశించుచున్నాడు.

10వ అనువాకము - ‘అహమ్’ - సహజ పరస్వరూపము - శాంతి పాఠము

అహం వృక్షస్య రేరివా। కీర్తిః పుష్టం గిరీః ఇవ।। …, జనన - వృద్ధి - నాశన స్వరూప సంసారవృక్షమునకు ప్రేరణ అయి, బలమును చేకూర్చు చైతన్యరూపుడను నేనే। జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవల నా యొక్క ‘అహమ్’ స్వరూపము యొక్క కీర్తి (ఖ్యాతి) కొండ శిఖరము వలె సమున్నతమై వెలుగొందుచున్నది. సూర్యుని వలె సర్వమునకు ఆవల ఊర్థ్వముగా పరమ పవిత్రమై నా యొక్క ఘనతకు చెందిన సహజ స్వస్వరూపము మార్పుచేర్పులచే స్పృశించబడనిదై ఉన్నది. సర్వదా అమృతస్వరూపుడనై, అవినాశినై, అప్రమేయుడనై వెలుగొందుచున్నాను. ఈ దృశ్యమునకు ద్రవ్యాధికార స్వరూపుడను! ఇదంతా నా సంపదయే! నా వర్చస్సు యొక్క ప్రదర్శనమే ఇదంతా! జగత్తును నా బుద్ధి ప్రదర్శనముగా కలవాడనై సుమేధస్సు (ఉత్తమ బుద్ధి) స్వరూపుడను! జాగ్రత్‌కే జాగృత్ స్వరూపుడను! వృద్ధి క్షీణములు లేనట్టి అమృతస్వరూపుడను!

ఇతి త్రిశంకు మహర్షి యొక్క ఆత్మ-తత్త్వోపదేశ మహావాక్యము।

ఈ దేహ-దేహి-మనో-బుద్ధి-చిత్త-అహంకారములుగా కనిపించేదంతా నా ఆత్మతేజోవిలాసము యొక్క షట్ విన్యాసమే! దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకార విన్యాసమే!

జీవాత్మ-అవ్యక్త-త్రిగుణ(3) - గుణాతీత-స్వకీయ వినోద విన్యాసమే!

11వ అనువాకము శిష్య - అనుశాసన నియమావళి

వేదమ్ అనూచ్య ఆచార్యో అన్తేవాసినమ్ అనుశాస్తి। వేదములను నేర్పుచున్న ఆచార్యులవారు (ఈ తెలియబడేదంతా తెలుసుకొంటున్న ఆత్మతత్త్వమును విశదీకరించుచున్న సద్గురువు) → వేదాధ్యయనము (మరియు) ఆత్మతత్త్వమును అధ్యయనము చేయుచున్న శిష్యులకు (అన్తేవాసికి) ఈ విధంగా అనుశాసిస్తూ ‘‘తప్పక అనుసరించండి’’.. అని బోధిస్తున్నారు. సంబోధిస్తున్నారు.

ఓ ప్రియ ముముక్షూ! శిష్యా! తత్త్వజ్ఞానాన్వేషీ! నీవు ఈ ప్రకారముగా వర్తించుము - (అనుష్ఠాన ఉపనిషత్ వాక్యములు).

సత్యమ్ వద! సత్యమునే పలుకాలి. యమ్ సత్-ఏది సత్యమో, నిత్యమో అట్టి ఆత్మతత్త్వమును దృష్టిలో పెట్టుకొని జీవించాలి! పరమాత్మత్వము సిద్ధించుటకై ఉత్తమ ఆశయములతో జీవితము గడపాలి! అంతేకాని అసత్తును పట్టుకొని వ్రేలాడి ఉండకుము!

ధర్మమ్ చర! : ‘‘ఇది నీ యొక్క స్వధర్మము’’ అని శాస్త్రములచే, సర్వ శ్రేయోభిలాషులగు పెద్దలచే, సంఘముచే నీకు ఏది నియమించబడియున్నదో, అద్దానిని తప్పక శ్రద్ధగా ఆచరించాలి. అంతేకాదు. అధర్మప్రవృత్తి కలిగి ఉండకూడదు. స్వధర్మమును విశాలదృష్టితో తప్పక నిర్వర్తించాలి. అశ్రద్ధ, ఆలస్యము, బద్ధకము ఉండరాదు.
మానవ ధర్మము, ఉపాసనా ధర్మము ఇత్యాదులు ఏమరువవద్దు. ఉపేక్షించవద్దు!

స్వాధ్యాయాత్ మా ప్రమదః : వేదాధ్యయనము, ఆత్మతత్త్వ అధ్యయనము, మహనీయుల ప్రవచనములు. అవతారపురుషుల విశేషములు, బోధలు మొదలైనవాటి పట్ల స్వాధ్యాయుడవై గానం చేస్తూ పఠించువాడవై, వింటూ - వినిపిస్తూ - ఉండుము. స్వాధ్యాయము పట్ల ప్రమత్తత (బద్ధకము) పనికిరాదు. విడచి ఉండకూడదు.

ఆచార్యాయాయ ప్రియం ధనం ఆహృత్య : విద్యనేర్పిన ఆచార్యుల వారికి గురుదక్షిణ సమర్పించి, విద్య నేర్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషింపజేయండి. వారిని సేవించాలి. వారికి ఆజ్ఞానువర్తుడవై ఉండాలి. వారి ఆశయములు నెరవేర్చు ప్రయత్నములు వీడరాదు.

ప్రజాతన్తుం మా వ్యవచ్ఛేత్సీః। : వంశావళికి, వివాహవ్యవస్థకు, సంతానమునకు, కుటుంబమునకు సేవకుడవు-సంరక్షకుడవు అయి ఉండుము. వంశ వ్యవస్థకు విచ్ఛిత్తి కలిగించకూడదు. ‘‘బిడ్డలను కని వారిని శ్రేయోమార్గానువర్తనులుగా తీర్చిదిద్దాలి!’’ అను ఆశయము కలిగి ఉండండి!

సత్యాత్ న ప్రమదితవ్యమ్ : సత్యమార్గమును విడిచిఉండవద్దు. అసత్యము - అపవాదము.. మొదలైన దుష్టమార్గములకు దూరంగా ఉండండి!

ధర్మాత్ న ప్రమదితహ్యమ్ : నీవు నిర్వర్తించవలసిన ధర్మము- ధర్మకార్యముల పట్ల ఏ మాత్రము వైదొలగకూడదు. బద్ధగించరాదు. ఎవరిపైనో కోపముతోనో, చిరాకుపడియో ధర్మమార్గమునుండి చ్యతిపొందకూడదు.

కుశలాత్ న ప్రమదితవ్యమ్ : ఏది నీకు- నీ కుటుంబీకులను- బంధువులకు - సంఘమునకు శ్రేయోదాయకమో, అట్టి విధి-విధానముల పట్ల అశ్రద్ధ కూడదు! నిర్వర్తించాలి! శ్రేయోధర్మముల పట్ల శ్రద్ధను వీడవద్దు. దేశముయొక్క సహజనులయొక్క కుశలము కొరకై - కర్మలు ఉద్దేశ్యించాలి. బద్ధగించకూడదు. నీకు దేనియందు కుశలత్వము (Efficiency) ఉన్నదో, ఆది పరోపకారముకొరకై నిర్వర్తిస్తూనే ఉండుము.

భూత్యై న ప్రమదితవ్యమ్ : సహజనులకు ఏది శ్రేయోదాయకమో, అట్టి కార్యక్రమములను తప్పక నిర్వర్తించాలి. సహజీవుల పట్ల ప్రేమ-ఆప్యాయత-క్షమ కలిగి ఉండాలి. ఇది మరువరాదు. జీవకారుణ్యమును తపస్సులా భావించి నిర్వర్తించాలి. పక్షులపట్ల, జంతువుల పట్ల కారుణ్యము కలిగి ఉండాలి. పేదలపట్ల, నిస్సహాయులపట్ల ‘‘భూతదయ’’ కలిగి ఉండాలి. దయా-దాక్షిణ్యములను ఏ కారణం చేతకూడా విడిచి ఉండరాదు.

స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యమ్ : అధ్యయనము చేయుటము, నేర్చినది ఇతరులకు నేర్పటము.. ఈ రెండూ వదలనే కూడదు. నేర్చుకుంటూనే ఉండాలి. నేర్పుతూనే ఉండాలి.

దేవ పితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యమ్ : ఈ భౌతిక దేహమును ప్రసాదించిన దేవతలకు కృతజ్ఞతతో దైవ కార్యములు నిర్వహిస్తూ ఉండాలి. ఈ దేహ రక్షణకు కారణమగుచున్న పితృదేవతలకు ఉపాసనలు తప్పక నిర్వర్తించాలి. అది దేహ రక్షకులగు దేవతలకు కృతజ్ఞలు తెలుపటము - దేహానంతరము సాధనలకు సానుకూల్యమగు ఉపాధులకు అర్హత పొందటము కూడా అగుచున్నది. పితృకార్యములను ఏమరువరాదు.

మాతృదేవో భవ : తల్లికి ఎటువంటి వాత్సల్యము, అకృత్రిమమైన-ప్రతిఫలాపేక్ష రహితమగు ప్రేమ కలిగి ఉంటుందో అట్టి ప్రేమ-వాత్సల్యములను స్వభావముగా కలిగి ఉండండి! జన్మనిచ్చిన తల్లికి కృతజ్ఞుడవై ఉండండి!

పితృ దేవో భవ : తండ్రి వలె సహజనులపై ప్రేమ - రక్షణ - అనురాగము - ఆప్యాయత కురిపించుము. నీ పితృదేవులను పూజ్యభావముతో సేవించుము.
తల్లితండ్రులకు బాధకలిగిస్తూ కృతఘ్నులు కావద్దు.

ఆచార్యదేవో భవ : ఆచార్యులను దైవ సమానముగా భావించి గౌరవించుము. ఆచార్యుడవై నీవు నేర్చిన వేదవిద్యను, ఆత్మవిద్యను ప్రియముగా బోధించుము. ‘తత్త్వమ్’ భావన కలిగి ఉండి తత్త్వ శాస్త్ర విశేషాలు నేర్పుము. తెలియజేయుము. ఆచార్యులను దైవసమానులుగా భావించి సేవించండి. వారి ఆశయములను గుర్తుంచుకోండి.

అతిధి దేవో భవ : ‘‘ఈ జగత్తుకు నేను అతిధి వంటివాడిని’’ అని గ్రహించి మమకార-అహంకారములను త్యజించినవాడవై ఉండుము. నీ ఇంటికి విచ్చేసిన అతిధులను పూజ్యభావముతో సేవించుము. ‘అభ్యాగతిః స్వయం విష్ణుః’ అను ఉద్దేశ్యము, ఉపాసన కలిగి ఉండుము. ఆశ్రయించినవారికి ఆప్యాయత, సేవ, సహకారములను అందించుము. అది ఉపాసన వలె, వ్రతముగా నిర్వర్తించుము.

యాని అనవద్యాని కర్మాణి, తాని సేవితవ్యాని నో ఇతరాని। నిందితములు, ఇతరులకు ఆమోదము కానివి, ఇతరులను బాధించునవి అగుకర్మలు చేయవద్దు. అనిందితములగు కార్యములనే సేవించుము. తదితర జనుల సానుకూల్యత, శ్రేయస్సులను దృష్టిలో పెట్టుకొని కర్మలు నిర్వర్తించండి.

యే కేచ అస్మత్ శ్రేయాగ్ం సో బ్రాహ్మణాః, తేషాం త్వయా ఆసనేన ప్రశ్వసితవ్యమ్ : మీకంటే అధికులైన వేద విద్య- బ్రహ్మవిద్య తెలిసినవారు ఎదురుగా కనబడితే, ఆసనము నుండి లేచి, వారిని సుఖాశీనులను చేసి గౌరవించాలి. వారికి ఉపచర్యలు చేసి వారి శ్రమను తొలగించాలి. వారికి ఉత్తమ ఆసనమును సమర్పించాలి. భక్తి ప్రపత్తులను చూపండి.

శ్రద్ధయాదేయమ్। అశ్రద్ధయా న దేయమ్! ఇతరుల కొరకై దాన-ధర్మములు తప్పక నిర్వర్తించాలి. ఆ విధంగా దానము చేయుచున్నప్పుడు..,
- ‘‘వీరు భగవత్ స్వరూపులై స్వీకరించుచున్నారు. ఇది నా భాగ్యము’’ అని శ్రద్ధగా దానం చేయాలి! దానము స్వీకరించువారిని చులకన చేసియో, తక్కువచేసియో, నిందించుచూనో.. ఇవ్వటంకూడదు.
- ‘‘వీరికి ఇవ్వవలసివచ్చిందే"!’’ అని బాధపడుతూ దానం చేయరాదు.
- శ్రియా దేయమ్ : ‘‘ఈ స్వీకరించువారికి శుభము - శ్రేయస్సు కలగాలి!’’.. అని భావించి దానం చేయాలి. స్వీకరిస్తున్నవారికి కష్టపెడుతూనో, నిందిస్తూనో, అశుభము కోరుతూనో దానం చేయకూడదు. వారికి నిరుపయోగమైనదానిని దానముగా ఇవ్వకూడదు.‘‘మంచి అగుగాక!’’ - అని ఉద్దేశ్యిస్తూ ఇవ్వాలి (దానం చేయాలి).
- హ్రియాదేయమ్ : ‘‘నేను ఇంతటివాడిని కాబట్టి ఈ దానం చేస్తున్నాను’’.. అని గర్వపడుతూ ఇవ్వరాదు. ‘‘అయ్యో! ఇంతమాత్రమే సమర్పిస్తున్నానే!’’.. అని సిగ్గుపడుతూ ఇవ్వాలి.
- భియా దేయమ్ : వినమ్రత కలిగి ఇవ్వాలి. గౌరవిస్తూ సమర్పణ భావంతో ఇవ్వాలి. భగవంతుని పట్ల భయ-భక్తులతో దానము సమర్పణగా చేయాలి! ‘‘భగవంతుడు ప్రసాదిస్తూ ఉన్నదానికి ఈ రూపంగా కృతజ్ఞతలు’’ - అని భావిస్తూ ఇవ్వాలి.
- సంవిదా దేయమ్ : స్నేహ-సౌహార్ద్ర-ప్రేమభావాలతో ఇవ్వాలి. ‘పరమాత్మస్వరూపుడు’ అని భావించి దానం చేయాలి.

ఉదాశీనత లేకుండా, శక్తి మేరకు - అవసరముల మేరకు, భగవంతుడు సంతోషిస్తారనే ఉద్దేశ్యంతో, ‘‘నన్ను ఈ దాన కార్యము ఉద్ధరించగలదు కదా!’’.. అని భావిస్తూ నిర్వర్తించాలి. పవిత్రత - పరిపూర్ణతలకు అవకాశంగా అనుకొని దానం చేయాలి. ‘‘ఈ స్వీకరించువాడు నాపై ఆధారపడి లేడు. నేను కూడా దైవంపై ఆధారపడినవాడినే! ఏ ప్రాణీ నాపై ఆధారపడి లేదు. నేను తృప్తి పొందటానికి ఇది దైవము ప్రసాదించిన అవకాశము. ఇది వీరికి ఉపయోగపడితే అదియే నాకు సంతోషము’’.. అని మననము చేసుకుంటూ ఇవ్వాలి.

┄ ┄ ┄

ఎప్పుడైనా, - ‘‘ఏ కర్మలు చేయాలి? అవి ఎట్లా చేయాలి? ఎందుకు చేయాలి?’’ అనే మీమాంస వచ్చినప్పుడు ఏమి చేయాలి? బిడ్డలారా! ఇది కూడా వినండి!

అప్పుడు సమదర్శులగు బ్రహ్మతత్త్వము తెలిసిన బ్రహ్మజ్ఞులగు పెద్దలను సమీపించండి. యుక్తాయుక్త విచక్షణ తెలిసినవారు, అలూక్షులు (ఇతరుల పట్ల క్రూర భావములు లేనివారు, ఇతరుల పట్ల ప్రేమ-దయ కలవారు), ధర్మవర్తనులు, ధర్మమును అభిలషించువారు అగు పెద్దలతో, మహాత్ములతో సంభాషించండి. సంప్రదించండి. వారిని గమనించండి. వారు ఆయా విద్యుక్త ధర్మములు ఎట్లా నిర్వర్తిస్తున్నారో… అది గమనిస్తూ మీమీ నిర్వర్తించవలసిన కర్మలను విచక్షణతో నిర్ణయించుకోండి.

దోష బుద్ధి, మూర్ఖ బుద్ధి, అల్ప బుద్ధి, ద్వేష బుద్ధి, రాగ బుద్ధి కలవారు చెప్పు ‘ధర్మచ్యుతి’ మార్గములను, దుష్ట కర్మవిధులను గ్రుడ్డిగా స్వీకరించకండి. వివేచన, విచక్షణలతో శుభాశుభములను పరిశీలించి మాత్రమే స్వీకరించాలి. దోషులుగా సమాజముచే పరిగణించేవారి మాటలు వినుచున్నప్పుడు జాగరూకులై ఉండండి. ఉద్రేకము - బద్ధకము - దురభిప్రాయములు కలిగియుండి చెప్పుమాటలను విచారించకుండా, విచక్షించకుండా పాటించరాదు.

‘‘(1) ఇది ఆదేశము! ఇట్లా చేయవలసిందే!
(2) ఇది ఉపదేశము! మీ క్షేమము కోరి మీకు చెప్పుచున్న మాటలు.
(3) ఇది వేద-ఉపనిషత్ హృదయము. దైవాజ్ఞ.
(4) ఇది అనుశాసనము! ఉల్లంఘించకూడదు.
(5) ఇది ఇట్లాగే ఉపాసించాలి.
(6) ఇది ఇట్లా చేయక తప్పదు.
(7) ఇందుకు వేరుగా చేసే స్వతంత్రము నాకు లేదు’’.
→ ఈ విధంగా ఏడు విభాగములుగా గుర్తెరిగి సాధు కర్మలు, లోకహిత కర్మలు, విద్యుక్త ధర్మములు నిర్వర్తించాలి.

12వ అనువాకము - సూర్యాది దేవతాస్తుతి - శాంతి।।

దేవతలకు కృతజ్ఞతలు చెప్పుచున్నాము.

శం నో మిత్రః। శం వరుణః। శంనో భవతు అర్యమా.. ఈ సృష్టిని తన తేజో కిరణములచే ఉత్తేజపరుస్తున్న మిత్రభగవానుడు, (సూర్యదేవుడు), జలదేవత అగు వరుణ భగవానుడు, పితృదేవతాధినేత అగు అర్యమ భగవానుడు, ఇంద్రియములను ప్రసాదిస్తూ పరిరక్షిస్తున్న ఇంద్రభగవానుడు, త్రివిక్రమావతారముతో సర్వమును నింపివేస్తున్న విష్ణు భగవానుడు మాకు సుఖ-శాంతి- ఐశ్వర్య-ఆనందములు ప్రసాదించెదరుగాక!

ఓ పరబ్రహ్మమా! మీకు భక్తితో మనసా, వాచా కర్మణా నమస్కరిస్తున్నాము. ఓ వాయుదేవా! ప్రాణేశ్వరా! మీకు నమో వాక్కములు.

మీరు ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపులుగా నమస్కరిస్తున్నాము. ఓ ప్రాణదేవా! మిమ్ములను ప్రత్యక్ష బ్రహ్మముగా స్తుతిస్తున్నాము.

వేదములు ఋక్కుల ద్వారా చెప్పు పరబ్రహ్మ తత్త్వమును, ఋతమును పలుకుచుండెదముగాక! సత్యము అగు పరమాత్మ గురించే సంభాషించుకొనెదముగాక! పరబ్రహ్మము గురుశిష్యులమగు మన ఇరువురిని కాపాడునుగాక! అట్టి పరబ్రహ్మము ఆచార్యుల వక్తృత్వ సామర్థ్యము రూపంగాను, శిష్యునిలో అవగాహనా సామర్థ్యముగాను ప్రకాశించి వర్ధిల్లునుగాక! శ్రోతనగు నన్ను వక్తారుడగు గురువును పరబ్రహ్మము సదా రక్షించుచుండునుగాక! నన్ను-నా బోధకుని పరమాత్మ సర్వదా కాపాడునుగాక!

ఓం శాంతిః। శాంతిః। శాంతిః।



2 ఆనందవల్లీ (లేక) బ్రహ్మానందవల్లీ

1వ అనువాకము - బ్రహ్మతత్త్వము

ఆచార్య - శిష్యులిరువురము కలిసి - అధ్యాత్మవిద్యా-అధ్యయనము సందర్భములో - అవరోధములు, ఆటంకములు, అలసటలు, అలసత్వములు ఎదురు రాకుండా పరమాత్మ అనుగ్రహించుటకై - సమర్పిస్తున్న విన్నపము! ప్రార్థన!

సహ నావవతు : (బ్రహ్మతత్త్వమును తెలుసుకొనుటకు, ఉపాసించుటకు, బ్రహ్మముతో అజ్ఞానమువలన మనము. కల్పించుకొన్న భేదమంతా తొలగి ‘అహమ్‌బ్రహ్మాస్మి’ భావన → దైనందికము - అనుక్షణికము అగుటకు - సంసిద్ధపడుచున్న) → మన ఇరువురిని సర్వాత్మ భగవానుడు రక్షించునుగాక!

సహనౌ భునక్తు : (రక్షించటమే కాకుండా మనకు బ్రహ్మవిద్యా-అధ్యయనమునకు అవసరమైనవి, సానుకూలమైనవి) మన ఇరువురికి ప్రసాదించి పరిపోషించునుగాక!

సహ వీర్యం కరవావహై : ఆచార్య-శిష్యులము అగు ఇరువురము కలిసి వీర్యవంతులము (Enthusiastic, energitic and wel-established) అయి శ్రద్ధ-పట్టుదలతో పరిశ్రమించెదము గాక!

తేజస్వి నావధీతమ్ అస్తు : మన ఇరువురి స్వాధ్యాయన పూర్వక ప్రయత్నమంతా ఇరువురి పట్ల జ్ఞానతేజోరూపంగా ఫలప్రదమగుగాక.

మా విద్విషావహై : శిష్య-ఆచార్యులమగు మనమిరువురము సంకుచిత భావములకు లోను కాకుండెదముగాక! పరస్పరము ద్వేషించుకొనకుండెదము గాక! పరస్పరము గుర్తింపు-గౌరములతో ఈ అధ్యయనము కొనసాగించెదముగాక!

‘‘తత్‌త్వమ్! ఓ శిష్య దేవా నీవు తత్ స్వరూప పరమాత్మవే!’’ అను ఎరుకను ఏమరువక ఆచార్యులు ప్రవచించెదరు, వ్యాఖ్యానించెదరు, మార్గదర్శకత్వము వహించెదరు గాక!

‘‘గురుః సాక్షాత్ పరబ్రహ్మ’’.. అను సత్-భావనను మనో-బుద్ధులందు నిండుగా నింపుకొను శిష్యుడు శ్రవణము, అటు తరువాత మననము, ఆపై నిదిధ్యాసలకు ఉపక్రమించుచుండునుగాక!

బ్రహ్మజ్ఞానము

ప్రతి జీవునిలోను, ప్రతి జీవునిగాను ‘బ్రహ్మము’ అను ఒకానొక మహత్తర వస్తువు ఉన్నది! అది - ఈ దృశ్యము-దేహము- ఆలోచనలు-బుద్ధి-జాగ్రత్ స్వప్న సుషుప్త అంతర్గత అహంకారమునకు ఆవల-వాటన్నిటికంటే మహత్తరమై - వాటిన్నిటిని నియమించుచున్నది. వాటన్నిటినీ తన తేజోరూపములుగా కలిగి ఉన్నది! అందుచేతనే ‘‘బ్రహ్మము’’, ‘‘కేవలానందము’’ అనబడుచున్నది.

అట్టి మన యొక్క కేవల స్వరూపము ఈ దృశ్యములోని సర్వము కంటే శ్రేష్ఠము. (అంతేకాకుండా) ఈ సర్వము తన యందు ప్రకాశింపజేయునదై ఉన్నది. (కేవలస్వరూపమగు ఆత్మతో అనుక్షణికమగు మమేకత్వమే ‘కైవల్య’ము)-
అట్టి బ్రహ్మము గురించి తెలుసుకోవాలి.

ఎందుకు?

బ్రహ్మవిత్ ఆప్నోతి పరమ్-తత్ఏషా అభ్యుక్తా! బ్రహ్మమును ఎవ్వరు తెలుసుకొంటారో అట్టివాడు సర్వము కంటే పరమై, శ్రేష్ఠమై మహత్తరమై విరాజిల్లగలడు. ఇది వేదోపనిషత్తులచే, బ్రహ్మమును ఎరిగిన తత్త్వజ్ఞులచే చెప్పబడుచున్నది. వేదములలోని ఋక్కులచే (సత్యమును ఎరిగిన ద్రష్టలచే) గానం చేయబడుతోంది. మాకు స్వానుభవం కూడా! అట్టి బ్రహ్మము ముఖ్యంగా మూడు లక్షణములు కలిగినదై ప్రకటితమగుచున్నది.

‘‘సత్యమ్ జ్ఞానమ్ అనన్తమ్ బ్రహ్మ’’

(1) సత్యమ్ - సత్‌లక్షణము : ‘‘నేను ఉన్నాను’’ - అను బుద్ధి యొక్క అనుభూతియే ‘సత్’। ‘ఉనికి’ (PRESENCE) అనునది ఈ జీవుని సహజ స్వభావమే. ‘బ్రహ్మము’ యొక్క లక్షణమగు ‘ఉనికి’ని సమాశ్రయించి, ఇక తదితరమైనదంతా ‘ఉనికి’ని పొందుచున్నది. వాస్తవానికి బ్రహ్మమునకు మాత్రమే స్వకీయమైన ఉనికి. తదితరము బ్రహ్మము యొక్క భావనా చమత్కారమునకు కించిత్‌కూడా అన్యము కాదు.

నటుడు ఉన్నాడు కాబట్టి - నటించటము, పాత్ర యొక్క నవరసభావాలు మొదలైనవి ఉంటాయి కదా! కనుక బ్రహ్మము గురించి చెప్పుచున్నప్పుడు ‘తత్ సత్యమ్! తదితరమ్ కల్పనా’ అనబడుచున్నది. జాగ్రత్ స్వప్న సుషుప్త సంబంధమైన సర్వకల్పనలకు మునుముందే ఉన్నట్టిది ‘బ్రహ్మము’ అని అనబడుచున్నది.

(2) జ్ఞానమ్ - చిత్ లక్షణము : బ్రహ్మము ‘ఎరుగుట’ అను స్వకీయ కేవల (Absolute) లక్షణము కలిగి ఉన్నది. విలక్షణ లక్షణముచే తనకుతానే ‘‘ఎరుగుబడుచున్నది’’గా అగుచున్నదంతా కల్పించుకొని ఆస్వాదించుచున్నది. జ్ఞానము చేతనే స్వరూప-స్వభావములకు ఆవల-ఈవల వెలుగొందుచూ సర్వము తానే అయి ఉండి కూడా, ఒక్కొక్కసారి తన కల్పనలోని ఒక విభాగమున నందు - ‘‘నేను వేరు - తెలియబడేది వేరు’’ - అనే పరిమితభావము పొందుచున్నది. ఎరుగుచున్నట్టిది (ద్రష్ట) - ఎరుగబడుచున్నట్టిది (దృశ్యము) - ఈ ఉభయము అఖండ-జ్ఞాన స్వరూపమే!

అనంతమ్ : స్వస్వరూపమగు పరబ్రహ్మము దేహముల రాకపోకలకు గాని, దేశ-కాలములకుగాని, మరింకెట్టిదాని చేతగాని పరిమితము కాదు. కనుక ‘అనంతమ్’ - ‘అపరిమితమ్’ - అని చెప్పబడుతోంది. కల కనుచున్నవాడు కలతో ముగియడు కదా! అట్లాగే బ్రహ్మము దేనిచేతనూ ముగింపబడునది కాదు. దేహములు, కర్మలు, సంబంధములు, జ్ఞాన - అజ్ఞానములు మొదలైనవేవీ అద్దానిని పరిమితము చేయలేవు. కనుక అది అనన్తము.

అట్టి బ్రహ్మము ఉన్నదెక్కడ? నిహితం గుహాయాం ! ఎక్కడ ఆలోచనలు జనిస్తున్నాయో, భావముల ఉత్పత్తి అగుచున్నాయో.., అట్టి స్థానమే హృదయం. అది అవ్యాకృతము (It is not extended towards any side; It is in itself)" అని కూడా చెప్పబడుతోంది. అట్టి స్వీయ హృదయ గుహయే యోగులు బ్రహ్మమును సందర్శించున్నస్థానము. స్వస్వరూప భావాతీత రూపము!

ఎవ్వడు- సర్వమునకు పరమగు బ్రహ్మమును (జగత్తులకు, ద్రష్టత్వమునకు ఆదిస్వరూపము అగు) హృదయాకాశములో సందర్శించుచున్నాడో..
అట్టి వాడు - సో అశ్నుతే సర్వాన్ కామాన్ సహ! పొందవలసినదంతా పొందినవాడై ఉంటున్నాడు. బ్రహ్మణా విపశ్చితేతి! సర్వజ్ఞుడై నిగూఢమగు బ్రహ్మమును సర్వవేళలా ఉన్నట్లుగా దర్శిస్తూ, బ్రహ్మమే తానై → నిత్య-ప్రకాశమానుడై ఉంటున్నాడు.

- సర్వవస్తువులకు వస్తుత్వము ప్రసాదించువాడై..,
- ‘నియతి’ యొక్క నియామకుడై…,
కేవల చైతన్యస్వరూపుడై, సర్వమును చైతన్యపరచువానిగా తనను తాను దర్శించుచున్నాడు. సర్వము తానే అయి ఉండగా క్రొత్తగా కోరుకోవలసినదేముంటుంది?

ఆత్మాత్ ఆకాశాత్ - ఇత్యాది

తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మని ‘ఆకాశః’ సంభూతః! : ‘ఆత్మ’ అను శబ్దమునకు పరమార్థము - సత్యజ్ఞానానందలక్షణ సమన్వితము అయి ఉన్నది. ఈ జీవుని వాస్తవ- నిజ-సహజరూపము అగు.. ఆత్మ (లేక) ‘పరబ్రహ్మము’ నుండి → ‘‘జలం నుండి తరంగములు’’ వలె, ‘‘బంగారము నుండి ఆభరణములు’’ వలె, ‘‘శిల నుండి శిల్పములు’’వలె - (ఈ ‘తదితరము’ వలె కనిపించేదంతా) ప్రదర్శితమై, అనుభూతరూపము సంతరించుకుంటోంది.

ఆత్మాత్ ఆకాశమ్! : నిర్గుణము-నిత్యసత్యము అగు ఆత్మ నుండి శబ్దము అను గుణము కలిగి ఉండి, ఈ దేహములకు, భూ-జల-అగ్ని-వాయువులకు ‘అవకాశము (space)’ కల్పించుచున్న ‘ఆకాశము’ జనిస్తోంది.

ఆకాశాత్ వాయుః! : ‘శబ్దము’ తన గుణ విశేషముగా గల ఆకాశము వలన.. ‘శబ్ద-స్పర్శలు’ అనే ద్వి(2) లక్షణములు గల ‘వాయువు’ ప్రదర్శితమౌతోంది. వాయువు ఆకాశము నుండి జనించి, ఆకాశమునందే సంచారములు కలిగి ఉంటోంది.

వాయో అగ్నిః : వాయువు వలన శబ్ద-స్పర్శ-రూపములనే ‘3’ గుణములు గల ‘అగ్ని’ జనిస్తోంది.

అగ్నే ఆపః! : అగ్ని వలను శబ్ద-స్పర్శ-రూప-రసములనే ‘4’ గుణములు గల ‘జలము-ఆపః’ పుట్టుతోంది.

అద్భ్యః పృథివీ! జలము వలన శబ్ద-స్పర్శ-రూప-రస-గంథములనే ‘5’ గుణములు గల ‘పృథివి’ బయల్వెడలుతోంది.
పృథివి నుండి ఆహారధాన్యములు ప్రసాదించు మొక్కలు-లతలు-వృక్షములు-ఓషధులు జనిస్తున్నాయి.

ఓషధుల వలన అన్నము (ఆహార రసము),
అట్టి అన్నము నుండి → ఆహార రసము ‘రేతస్సు’ రూపమును దాల్చి- తల, కాళ్ళు, చేతులు మొదలై- అన్నిటితో కూడిన పురుషుడు (జీవుడు) దేహధారుడుగా అగుచున్నాడు.

స వా ఏష పురుషో అన్న రసమయః। ‘కుండ’ అంతా ‘మట్టి’యే అయిన తీరుగా, ఈ పురుషుడు అన్నరసమయ స్వరూపుడు. శబ్ద-స్పర్శ-రూప-రస-గంధముల భావన వలనే తేజోసంభూతుడై పురుషుడు జీవిస్తున్నాడు.

అట్టి అన్నరస రూపమగు రేతస్సు రూపుడగు ఈ పురుషుని సమస్త అవయవములలో శిరస్సు ప్రధానమైనది. దేహము యొక్క కుడి-ఎడమ విభాగములకు శిరస్సే ఆత్మ (ముఖ్యవిభాగము). ఇదంతా గోవు యొక్క పుచ్ఛ (ఊర్ధ్వ) భాగమువలె ఈ మానవ శిరస్సు ఆకారము కలిగి ఉంటోంది. అట్టి ఈ శరీర వృక్షమును (అన్నమయ శరీరమును) ఆశ్రయించి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు ప్రవర్తిల్లుచున్నాయి.

2వ అనువాకము - అన్నమయ, ప్రాణమయ

అన్నమయ పురుష శరీరము :

అన్నాత్ వై ప్రజాః ప్రజాయన్తే! యాః కాశ్చ పృథివీగ్ం శ్రితాః జీవన్తి। అన్నము నుండే ఈ భూమిని ఆశ్రయించియున్న సమస్త దేహులు (జనులు) పుట్టుచున్నారు. జీవులందరూ అన్నముచేతనే జీవిస్తున్నారు, వృద్ధి చెందుచున్నారు. దేహానంతరము ఈ అన్నమయదేహము అన్నము రూపమునే పొందుచున్నది.

అన్నగ్ం హి భూతానాం జ్యేష్ఠమ్! ‘అన్నము’యే భూతజాలమంతటికీ శ్రేష్ఠమైన వస్తువు. అన్నమును ‘సర్వౌషధము’… అని అందుకే పిలుస్తున్నారు. అన్నముచేతనే సర్వజీవులు నిర్మితమగుచున్నారు. అన్నాత్ భూతాని జాయంతే। జాతాని అన్నేన వర్థంతే। అద్యతే అత్తి చ భూతాని।
- ఆహారమును ప్రాణులను భక్షిస్తున్నారు.
- చివరికి ప్రాణులను అన్నమే భక్షిస్తోంది.
- అన్నము = అద్.. అను ధాతువు నుండి చెప్పబడుచున్నది. అది తినబడునది, తినునది కూడా!
తస్మాత్ అన్నమ్ తత్ - ఉచ్యత। అన్నమును బ్రహ్మముగా ఉపాసించాలి. అన్నమ్ బ్రహ్మ! అన్నము జీవులచే హరింపజేయుబడుచూ, ఆ అన్నమ్ జీవులను హరిస్తోంది కూడా. కనుక, ‘ఆహారము’ అని కూడా అంటున్నారు.

ప్రాణమయ పురుష శరీరము :

ఈ విధంగా అన్నము-ఆహారము చేత నిర్మితమైయున్న ఈ భౌతికదేహమునకు వేరైన మరొక దేహతత్త్వము-ఇద్దానియందు వేంచేసి, ఇద్దానిని ఆశ్రయించి ఉన్నది. అట్టి ప్రాణము శక్తిరూపము. ఈ దేహము యొక్క కాళ్లు-చేతులు మొదలైన సర్వవిభాగములలో ప్రాణశక్తి నిండి ఉన్నది. ఈ దేహము చలనవంతమవటానికి ప్రాణమే శక్తిరూపంగా కారణమగుచున్నది. అట్టి ప్రాణమయమనే రెండవ పురుషకార దేహము - అన్నమయ దేహమువలెనే శిరస్సు, పార్శ్వములు కలిగి ఉన్నవి.

శిరస్సు → ప్రాణము - బాహ్యము నుండి వాయువును ముఖ - ముక్కుల ద్వారా దేహములోనికి స్వీకరించుశక్తి.  
దక్షిణ / కుడి భాగము → వ్యానము శరీరమంతా వాయువును నింపి ఉంచు శక్తి.  
ఉత్తర / ఎడమ భాగము → అపానము శరీరము నుండి వాయువు బయటకు ప్రసరింజేయు శక్తి.  
సమానము → ఆకాశము నందు వాయువును అంతటా వ్యక్తీకరణముగా విస్తరింపజేయుచున్న శక్తి.

ఈ విధంగా అన్నమయ దేహమునకు శిరస్సు, కాళ్లు, చేతులు ఉన్నట్లే, ప్రాణమయ దేహమునకు కూడా ఉన్నాయి. అట్టి ఆకాశము నందు వాయువును కదల్చు ఆధారశక్తియగు సమానవాయు అన్నరస వికారముగా (Formulate as physical form) అగుచున్నది. సర్వ జీవులకు ఆయువు రూపముగా ప్రదర్శనమగుచున్నది. ఈ భౌతికమైనదంతా ప్రాణశక్తియందు స్థానము కలిగి ఉన్నది.

అట్లాగే ఆ ప్రాణశక్తి ఈ భౌతికరూపమునందు నిక్షిప్తమైయున్నది కూడా. ప్రాణశక్తి ఆత్మకు అభిన్నమై ప్రవర్తన శీలము. క్రియాశీలకము అయి ఉంటోంది. ప్రాణమయుడగు ఆత్మయే దేహముల భౌతిక రూపముగా కూడా కనబడుచున్నది. ఈ స్థూలదేహము నిలవటానికి ప్రాణమే ఆధారము. స్థూల దేహములో అణువణువు శక్తి రూపంగా ఉన్నదే ప్రాణము. ప్రాణము ఉత్క్రమణము పొందిన మరుక్షణం ఈ శరీరములోని విశేషములన్నీ క్రుళ్లిన పండువలె నశిస్తున్నాయి.

ప్రాణం దేవాః (ఇంద్రియములు) అను ప్రాణన్తి। ప్రాణశక్తిని అనుసరించే ఇంద్రియ దేవతలు (ఇంద్రియములు. దేహములో నివసించే ఇంద్రియ ప్రజ్ఞా దేవతలు) - సర్వదా దేహము నందు ప్రవర్తిల్లుచున్నారు. ప్రాణము బలహీనమైతే ఇంద్రియములు కూడా బలహీనమౌతాయి. అనగా ఇంద్రియ దేవతలు దేహమునుండి నిష్క్రమిస్తున్నారు.

యే ప్రాణ ‘బ్రహ్మ’ ఉపాసతే, ప్రాణోహి భూతానాం ఆయుః తే సర్వం ఆయుః యాన్తి! ‘ప్రాణము బ్రహ్మమే’ అని ఉపాసించువారు ఉత్తమ ఆయుష్షును పొందుచున్నారు. ప్రాణశక్తి ఆహారము నుండి లభించే రస-శక్తిని ఉపాహారముగా చేసుకొని, ఈ జీవుని దేహములో క్రియలు చేస్తూ ఉన్నది. క్రియాకారకమగుచున్నది. అందుచేత, ‘‘ప్రాణో హి బ్రహ్మమ్’’। ప్రాణము బ్రహ్మమే అయి ఉన్నది!

3వ అనువాకము - మనోమయ

శ్లో।। తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్ అన్యో - అంతరాత్మా మనోమయః - తేన ఏష పూర్ణః।
అట్టి ప్రాణమయ స్వరూపమునకు వేరైన మనోమయ పురుషుడు ఉన్నాడు. ఆయన తన యందు ప్రాణశక్తిని తన పురుషకారముగా కలిగి ఉన్నారు. అనగా, ప్రాణము మనోమయుని పురుషకారమే! (Energy is workmanship of the thought).

అట్టి తన యందు ప్రాణతత్త్వమును అంతర్గతముగా కలిగియున్న మనోమయపురుషునికి…
శిరస్సు → యజుర్వేదములోని పురుషుని గురించిన (ఆత్మ గురించిన) అభివర్ణనములు.
దక్షిణ (కుడి) విభాగము → ఋగ్వేదము. ఋక్కులు. మంత్రములు వర్ణించి ఋక్‌గానము। ఆత్మతత్త్వస్తుతి.
ఉత్తర (ఎడమ) విభాగము → సామవేదము. సామములు. స్తోత్రములు.
ఆత్మ → బ్రహ్మము గురించి సిద్ధాకరిస్తూ వివరిస్తున్న బ్రాహ్మణములు. ఆత్మ గురించి చెప్పు (సోఽహమ్ - తత్త్వమ్ మొదలైన) తత్త్వ మహావాక్యములు

మనస్సు ప్రాణముచే పూర్ణమైయున్నది. మనస్సు కూడా స్థూల దేహము - ప్రాణదేహములవలె ఈ జీవునికి దేహమే. అనగా ఈ జీవుడు భౌతికదేహుడే (అన్నమయ దేహుడే) కాకుండా, ప్రాణమయ దేహుడు, మనోమయ దేహుడు కూడా!

అంగిరసుడు మొదలైన ఋషువుల ప్రవచనములు, అధర్వణవేదము - ఈ మనోమయ పురుషుని నిర్వచిస్తూ ఇంకా ఇట్లా వర్ణిస్తున్నాయి కూడా!

అయితే యతో వాచో నివర్తంతే అప్రాప్యమనసా సహ। ‘‘ఎద్దానిని వాక్కు- మనస్సు నిర్వచించలేక, అభివర్ణించలేక వెనుకకు మరలుచున్నాయో.. అదియే ఆనందమయమగు ఆత్మ! ఆనందో బ్రహ్మణో విద్వాన్, న బిభేతి కదాచనా - ఇతి।।
అట్టి ఆత్మను మనస్సుతో ఎరిగినప్పుడు ఇక ఈ జీవుడు దేనికీ భయము పొందడు.

మనస్సు ఆత్మకు శరీరము. మనస్సుకు పూర్వమే ఉన్న ఆత్మచే మనస్సు నింపబడినదై ఉన్నది. యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాత్ మనోమయాత్।।

4వ అనువాకము - విజ్ఞానమయ

ఇప్పటివరకు అన్నమయ పురుషుడు - ప్రాణమయ పురుషుని యందు (ప్రాణమయ పురుషుని పురుషకారంగా) ప్రాణమయ పురుషుడు మనోమయ పురుషునియందును (మనోమయ పురుషుని పురుషకారముగా) - పూర్ణమై నిండియున్నారనుకొన్నాము కదా! ‘‘అట్టి మనోమయ పురుషుడు ఎద్దానియందు ఏర్పడినవాడై ఉన్నాడు?’’.. అనునది ఇప్పుడు గమనిద్దాము.

‘ఎరుక-ఎరుగుట’యే స్వరూపముగా గల విజ్ఞానమయ పురుషుని యందు పురుషకారముగా.. మనోమయ పురుషుడు పూర్ణుడై నిండి ఉన్నాడు.

అట్టి విజ్ఞానమయ పురుషునికి -
శిరస్సు (head) - శ్రద్ధ (concentration and attention)
దక్షిణ విభాగము - ఋతువు. ఋక్కులు ఈ జీవాత్మ యొక్క ‘‘సహజ-సత్య-నిత్య ఆత్మ’’ స్వరూపము గురించి చెప్పే పరాకాష్ఠ- పాఠ్యాంశసారము.
ఉత్తర భాగము - సత్యము; అసత్తుకు ఆవల అమృత - కేవల - యథా స్వరూపమగు ఆత్మ; - యోగము; జీవ-బ్రహ్మముల ఏకత్వము; కలయిక

విజ్ఞానాత్మ ప్రతిష్టతమగు పుచ్ఛము/స్థానము. మహత్ తత్త్వము. సర్వాత్మకత్వము. జగదాత్మకత్వము. ఈ ఒక దేహము మాత్రమే కాకుండా ‘‘సర్వదేహములలోని నేనైన నేను’’ రూపము.

ఈ విధంగా సత్యదర్శులచే గానము చేయబడుచున్నది.

విజ్ఞానం యజ్ఞం తనుతే! విజ్ఞానము = ఎరుక। తెలివి। విజ్ఞానమే ఈ లోకాలలో జరుగుచున్న సర్వుల యొక్క కార్యక్రమముల రూపములను దాల్చుచున్నది. విజ్ఞానము, యజ్ఞములను తన శరీరములుగా కలిగియున్నది. సమస్తమునకు మొట్టమొదటిది విజ్ఞానమే. ఇదియే ‘బుద్ధి’ అని కూడా అనబడుచున్నది. విజ్ఞానం దేవాః సర్వే। సర్వదేవతల స్వరూపము ఈ విజ్ఞానమే!

- బ్రహ్మజ్యేష్ఠమ్ ఉపాసతే; విజ్ఞానం బ్రహ్మచయత్ వేద!

ఓ శిష్యా! విజ్ఞానము మహత్ స్వరూపమే! బ్రహ్మమే! అనుమానం లేదు. విజ్ఞానము చేతనే ఈ జీవుడు సంసారములో ప్రవేశిస్తున్నాడు. అయితే, బ్రహ్మమును ఏమరుస్తున్నాడు. అట్టి ఈ జీవుని యొక్క మహత్ బ్రహ్మము, ‘ఉపాసన’ చేతనే పునః అనుభవమగుచున్నది.

ఒకానొక జీవుడు ఆత్మజ్ఞానైశ్వర్యము సంపాదించి త్రిమూర్తుల పదములను స్వీకరించగలుగుచున్నాడు. బ్రహ్మము యొక్క ఉపాసనచే ఇంద్రుడు వరుణుడు మొదలైనవారు జ్ఞానైశ్వర్యులు అగుచున్నారు. ఈ విధంగా విజ్ఞానము చేతనే ‘జీవుడు’ అను స్థితి, త్రిమూర్తుల స్థానములు కూడా సిద్ధింపబడుచున్నాయి.

అన్నమయంలో ప్రాణమయం। ప్రాణమయంలో మనోమయం। మనోమయంలో విజ్ఞానమయం।

అన్నమయము ప్రాణమయంలో। ప్రాణమయము మనోమయంలో। మనోమయము విజ్ఞానమయములో। ఈ విధంగా దేహములు జీవునకు ఏర్పడినవై ఉన్నాయి. విజ్ఞానమయ దేహమును ఆత్మగా తెలుసుకొని, బ్రహ్మముగా దర్శించుచూ, అనుభూతపరచుకొనువాడు ఈ అన్నమయ-ప్రాణమయ - మనోమయ దేహసంబంధములైన సర్వదోషములను అధిగమించి విజ్ఞానమయ-స్వయమాత్మ స్వరూపుడగుచున్నాడు. అట్టివాడు ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అనబడు విజ్ఞానమయ దేహముతో అన్నమయ-ప్రాణమయ- మనోమయదేహములచే ‘పొందవలసినవి’గా అనిపించుచున్నవన్నీ పొందినవాడగుచున్నాడు. అట్టి విజ్ఞానమయాత్మ → మనోమయాత్మకు అంతరమున కేవలాత్మగా సర్వదా ప్రకాశించుచున్నదై ఉన్నది.

5వ అనువాకము - ఆనందమయ

ఆనందమయాత్మ: ఇంకా కూడా -
తస్మాత్ ఏ తస్మాత్ విజ్ఞానమయాత్ అన్యో- అన్తర ఆత్మా-ఆనన్దమయః, తేన ఏష పూర్ణః।
విజ్ఞానమయాత్మకు వేరై, విజ్ఞానమయాత్మకు అన్తరముగా ‘ఆనన్దమయాత్మ’ వెలుగొందుచూ ఉన్నది. విజ్ఞానమయాత్మ ఆనన్దముచే పూర్ణమైయున్నది. ఆనన్దమయాత్మ - ‘పురుషుడు’గాను, విజ్ఞానమయాత్మ ‘పురుషకారము’గాను ఏర్పడినవై ఉన్నాయి.

ఆనందమయాత్మ పురుషునికి..,
శిరస్సు - ప్రియము ప్రేమభావన, ఇష్టము - ప్రియమేవ శిరః।
దక్షిణ పక్షము- మోదము, సంతోషము - మోదోదక్షిణః పక్షః।
ఉత్తరపక్షము - ప్రమోదము;- ప్రమోద ఉత్తరః।
ఆత్మ- ఆనందము; ఆత్మానందము - ఆనంద- ఆత్మా।
ఆధారము / పుచ్ఛము - బ్రహ్మము - బ్రహ్మపుచ్ఛ ప్రతిష్ఠా।

6వ అనువాకము - సత్ - అసత్

అన్నమయ దేహము నందు ప్రాణమయ దేహము; ప్రాణమయ దేహమునందు మనోమయ దేహము; మనోమయ దేహమునందు విజ్ఞానమయ దేహము; విజ్ఞానమయ దేహమునందు ఆనందమయదేహము.. అనబడు పంచ దేహ-దేహాంతరములకు ‘‘దేహి’’.. వేరని, అట్టి దేహమే తానని ఎవ్వడు ఎరుగుచున్నాడో… అట్టివాడు ఆత్మను ఎరిగినవాడగుచున్నాడు. బ్రహ్మజ్ఞుడై బ్రహ్మమును ఎరిగి, బ్రహ్మమే తానై ప్రకాశించుచున్నాడు.‘నేను బ్రహ్మమునే’ అను దానికి వేరైనదంతా అసత్తే.

బ్రహ్మము సత్తా? అసత్తా? ఉన్నట్టిదా? లేనట్టిదా?

‘‘ఈ ఇంద్రియ విషయ ప్రపంచమునకు వేరుగా - ‘బ్రహ్మము’అనబడునదేదీ లేదు’’ - అని ఎవడు భావన చేస్తాడో ఆతడు ‘‘అన్నమయ దేహమే నేను!’’ మొదలైన పరిమితులకు లోను అయి, ఉంటున్నాడు. అట్టివానికి కేవలాత్మానుభవము - ‘‘దృష్టికి రానిదే’’ అగుచున్నది. అట్టివాడు ‘‘నేను లేనే లేను! కానీ ఈ దేహము, దృశ్యము, ప్రాణములు, మనస్సు, విజ్ఞానము చిత్తము, ఆనందము మాత్రము సత్యమే’’.. అని అన్నట్లు అవుతుంది. ఆతడు తన బ్రహ్మతత్త్వమును, తన అనునిత్యమగు ఉనికిని తానే. తిరస్కరించువాడగుచున్నాడు.

‘‘అసత్తే ఉన్నది. బ్రహ్మము లేదు’’ అను భావనను ఆశ్రయించువానికి బ్రహ్మమే లేనట్లే - అనిపించుచున్నది. అసత్ ఏవ స భవతి -‘అసత్‌బ్రహ్మ ఇతి వేదచేత్।

‘అస్తి బ్రహ్మ’ ఇతి చేత్ వేద, సంత్ మేనం తతో విదురితి! ‘బ్రహ్మము ఉన్నది అన్నమయ-ప్రాణమయ మనోమయ-విజ్ఞానమయ- ఆనందమయ దేహములకు దేహిగా నేను బ్రహ్మమునే అయి ఉన్నాను’’ అనునదే తత్త్వవాక్యార్థము. తత్-త్వ’మ్ మహావాక్యమును, మహనీయుల అభిప్రాయమును గౌరవిస్తూ, విశ్వసిస్తూ అందుకుగాను ప్రయత్నశీలుడై అనునిత్య స్వాభావికత్వమును ఎవడు అభ్యాసము చేస్తూ ఉంటాడో…, అట్టివాడు -తస్య ఏష శరీర ఆత్మా! - అట్టివాడు ఆత్మయే తన శరీరముగా కలవాడగుచున్నాడు.

-   ‘‘బ్రహ్మము ఉన్నది! బ్రహ్మమే ఉన్నది!  
-   ఇదంతా బ్రహ్మము యొక్క ప్రత్యక్షరూపమే!  
-   నేను అట్టి సదా శివబ్రహ్మమునే! జీవుడు, ఈ జీవునికి అనుభవమగు జగత్తు - మొదలైనవన్నీ సదాశివ స్వరూపుడనగు నా స్వకీయ లీలావినోదకల్పనయే!’’  

అని అనుభవపూర్వకముగా అనుభూతపరచుకొనుచున్నాడు. తనను తాను ‘‘సర్వదా-సదా ప్రత్యేకమై ఉన్నాను’’ అని గమనించుచున్నాడు. ఆచార్యుల ప్రశ్నలను విని సమాధానము విని యోచించి ‘‘విజ్ఞానమయకోశమునకు ఆత్మయగు ఆనందాత్మయే నేను’’ అని ఎరుగుచున్నాడు. ఆస్వాదిస్తున్నాడు. సర్వత్రా ఆత్మయే కాబట్టి తనను తాను సమస్తమునకు సర్వాంతర్యామిగా దర్శించుచున్నాడు.

శిష్య ప్రశ్న

గురువర్యా! ‘‘పంచకోశములకు అంతరమున ‘దేహి’ అయి - ఆత్మ (లేక) బ్రహ్మము ఈ జీవుని వాస్తవ-సహజ స్వరూపముగా వెలుగొందుచున్నది’’ - అని తమరు సిద్ధాంతీకరించుచున్నట్లుగా నేను గమనిస్తున్నాను.

అయితే గురుదేవా! మీరు చెప్పుచున్న ‘‘నేను బ్రహ్మమును! పంచకోశములు నా కల్పనా విభాగములోనివి!’’.. అని అనేక మంది జీవులు గమనించటములేదు. ‘‘నేను అన్నమయ దేహమును! ఈ దృశ్యములో ఒక వస్తువు వంటివాడిని!’’.. అనియే అనుకుంటూ ఉన్నారు. ఎందుచేత?
(పంచకోశములు = అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ)

నా మరొక ప్రశ్న ఏమిటంటే,…, ఎవ్వడు బ్రహ్మమును, తన యొక్క బ్రాహ్మీస్థితి - స్వరూపములను ఎరుగడో, అట్టి జీవుడు దేహపతనానంతరము తిరిగి ఈ త్రిలోకములలో జీవుడై పుట్టుచున్నాడా? ఈ లోకములను పొందలేకపోవుచున్నాడా? బ్రహ్మజ్ఞాని తిరిగి ఈ లోకములను పొందుచున్నాడా? పొందుటలేదా? (లేక) బ్రహ్మమును ఎరిగిన విద్వాంసుడు బ్రహ్మమును పొంది, ఇక ఈ లోకములకు తిరిగి రాకుండా ఉంటున్నాడా? బ్రహ్మజ్ఞాని - అజ్ఞానుల విషయంలో తదనంతర జన్మల విషయమై భేదమేమన్నా ఉంటుందా? ఉండదా?

గురుదేవుని సమాధానము

శిష్యా! నీ ప్రశ్నకు సమాధానంగా - ఆత్మయొక్క స్వకీయ వినోదరూప ‘అన్యత్వ కల్పన’ గురించి విను. ఆత్మ సర్వదా ఏకము, అఖండమే! అంతేగాని, ‘జీవాత్మ’గా గాని, ‘దేహములు’గా గాని ఎప్పుడూ అగుచుండటమేలేదు.

అయితే, సో అకామయత ‘‘బహుస్యాం ప్రజాయేయా!’’.. ఇతి। ఆత్మ ఒకానొకప్పుడు అనిర్వచనీయ కారణంగా - ‘ఏకము-అఖండము అగు నేను అనేకమును కల్పించుకొనెదును గాక! అనేకముగా అయ్యెదనుగాక! అనేక రూపములుగా అయి ఆస్వాదిస్తానుగాక!’’.. అను ఊహ (భావన)ను పొందుచున్నది. స తపో అతప్యత। తపస్సు (తపన) నిర్వర్తించుచున్నది. దృశ్యకల్పన రూపంగా ఈ సర్వమును తనకుతానే స్వప్నమువలె సృజించుకొనుచున్నది. ఇక్కడ కనబడుచున్నదంతా సృష్టించుకొని ఇద్దానియందు చైతన్యరూపమున - అనుప్రావిశత్ । ప్రవేశించుచున్నది.

సత్ చ → మూర్తివంతమైన కనిపించే → పృధివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనదంతాగానూ,
అసత్ చ → అమూర్తివంతమైన అనుభవమగు → మనో బుద్ధి చిత్త అహంకార రూపంగానూ…
→ దేశ-కాలములుగాను - తానే అగుచు, తానే ప్రవేశించి, తనకు తానే అద్దానికి ‘పరిమితము’ను (Limitedness / Boundedness) కల్పించుకొంటోంది.
→ నిరుక్త - అనిరుక్తములు = (సామాన్య-విశేషములు),
→ నిలయంచ-అనిలయంచ.. = (ఆశ్రయసహితమైనది- ఆశ్రయరహితమైనది),
→ విజ్ఞానంచ-అవిజ్ఞానంచ… = (తనకు తెలిసినవి- తెలియనవి),
→ ‘సత్యము’గా తెలియబడునది = అనృతము (అసత్యము)గా తెలియబడుచున్నది,
ఇవన్నీ ఆత్మ కల్పించుకొనుచున్నది. అవన్నీ తానే అగుచున్నది కూడా! అద్వితీయమై వెలుగొందుచున్నది.

అట్టి ఆత్మ ఏది ఏ తీరుగా (సత్యమనో-అసత్యమనో, నిత్యమనో - అనిత్యమనో, సుఖమనో - దుఃఖమనో) సంకల్పించుకొనుచున్నదో.. అది అట్లే సిద్ధించినదై అనుభూతమగుచున్నది. ఇక్కడ ఏకించిత్ ఏతీరుగా ఆత్మ సత్యమని అనుకుంటే అది అతీరుగా సత్యముగా అగుచున్నది. (యత్ భావమ్, తత్ భవతి).

అందుచేత, ఆత్మను ‘‘సత్యసంకల్పి-తాను ఏది సత్యమనుకొంటే.. అది అట్లే అగుచున్నది’’… అని ఆత్మ-జగత్తుల పరంగా నిర్వచించబడుతోంది. వాస్తవానికి ఆత్మ సర్వదా కేవలమైయున్నది. అద్దానిపట్ల జీవుడు లోకములు మొదలైనవి లేవు. లేని వాటి గురించి ‘‘ఎప్పుడు ఏమగుచున్నది?’’ - అను మీమాంస వదలిపెట్టండి. ఒకడు ఏవిధంగా భావించినా కూడా ఆతడు ‘తనను తాను’ అనబడు ఆత్మత్వము వదలుటయే లేదు. ఆత్మకు అన్యమైన దేనికీ స్వతఃగా ‘ఉనికి’ లేదు.

7వ అనువాకము - రసో వై అయం పురుషః

అసద్వా ఇదమ్ అగ్ర ఆసీత్। ఈ ఇంద్రియములకు వర్తమానమున ఈ జీవునికి అనుభవమగుచున్న నామరూపాత్మకమైనదంతా మొట్టమొదటగా లేదు. మొదట ఇది అసత్తు (That which is not existent) అయి అవ్యాకృతమై (unexhibited) అవ్యవహారికమై, అప్రదర్శితమైయున్నది. ఇదంతా ఆత్మయందు ఆత్మగానే ఉన్నది. ఇప్పుడు కూడా ఆత్మకు వేరై ఎక్కడా ఏదీ అన్యముగా లేదు. వేరుగా ఉంటే ఆత్మ అనన్యము ఎట్లా అవుతుంది?

‘‘ఆత్మయందు ఈ జగత్తు ఉన్నదా?’’ - అను దానికి సమాధానం విను.

→ జాగ్రత్‌లో ఈరోజు రాత్రి నిద్రించటం జరిగినప్పుడు కనిపించబోవు స్వప్నములోని దృశ్యజాలమువలె,
→ ఒక గాయకుడు గాఢనిద్ర పోవుచున్నప్పటి ఆతని జాగ్రత్ అనుభవములు, సంగీత కళానైపుణ్యము మొదలైనవాటివలె.
→ గొప్ప కథ రచించబోవు గొప్ప రచయిత యొక్క కథాకల్పనకు మునుముందుగా - రచన (ప్రారంభమైన తరువాత) రూపుదిద్దుకోబోవు కథలోని పాత్రల యొక్క పరస్పర సంబంధములవలె,
→ నిశ్చల జలములో - ఆ తరువాత ఏర్పడు చంచలము వలన కనిపించు తరంగముల ఆకారములవలె
అసత్ రూపము (అప్రదర్శిత -నాస్తిరూపము) దాల్చి ఉన్నది.

ఎప్పుడో ఒక సమయ - సందర్భములలో → ఆత్మయొక్క వ్యవహారికత్వము కారణంగా సంప్రదర్శనమై సత్తుగా (ఉన్నదిగా) రూపము పొందుచున్నది. అవ్యాకృత పరబ్రహ్మమే స్వయముగా ‘జగత్ సత్త’ రూప దృశ్యప్రపంచత్వము సంచరించుకొనుచున్నది. అంతేగాని బ్రహ్మమునకు (లేక) ఆత్మకు వేరుగా ఏ కారణం చేతనూ ఇదంతా ఆత్మయందు కనిపించటం లేదు.

అందుచేత ‘‘జగత్తు ఆత్మకు స్వయంకృతము - స్వయంభావన - స్వయం రచన’’ అని చెప్పబడుతోంది. ఆత్మ ‘‘దృక్ చైతన్యము - ద్రష్ట - దృశ్యము - అను త్రిమూర్తిస్వరూపము అనబడుచున్నది.

ఈ కనబడే నామ రూపాత్మకమైనదంతా బ్రహ్మము యొక్క స్వీయానుభవ రచనా విజృంభణమే! ఏ కారణం చేత ఈ జగత్తు ఆత్మ తన యొక్క భావనా కల్పనగా రచించుకొనుచున్నదో,.. ఆ కారణం చేతనే ‘స్వయంకృత’ అని (ఆత్మ) పిలువబడుతోంది.

రసోవై సః

ఇదంతా ఆత్మ యొక్క ఆనందరస ప్రదర్శనమే।

ఆత్మయందు ఆత్మచే ఆత్మకు అభిన్నమై కల్పించబడి, ఆత్మచేతనే అనుభవించబడు ఈ జగత్తు ఎట్లా రూపుదిద్దుకుంటోంది? లీలా వినోదంగా స్వయంకృత రసానుభూతిగా। తన ఈ రసప్రదర్శనచే జీవుడు దీనినంతటినీ తన సుఖమయరూపముగా తలచుచున్నాడు. సుఖ స్వరూపమగు పరబ్రహ్మము తన హృదయాకాశమున తన సుఖస్వరూపమును ప్రదర్శించుటచేతనే ఈ ప్రాణాది వ్యాపారములు ఏర్పడినవగుచున్నాయి. ప్రాణములు బ్రహ్మముయొక్క ప్రియరూపమే!

సుఖ భావనయే ప్రాణ స్వరూపమై, ప్రాణశక్తి సుఖ రూపముగా అనుభవమగుచున్నది.

బ్రహ్మము యొక్క సుఖ భావనయే -
(1) జీవుడు (సుఖముగా దర్శించుచూ అనుభవము పొందువాడు-Experiencer)
(2) ప్రాణశక్తి (సుఖమయ భావన- Energy - కలయిక ఏర్పడుచున్నది.

‘జగత్ దృష్టి’ని స్వీయసుఖమయ కల్పనగా నిర్మించుకొని, జగత్-దృష్టి నుండి జగత్-సృష్టిని పొందుచున్నది. అనగా దృష్టియే సృష్టి. తన దృశ్యరూపమగు - అట్టి సృష్టిలో ప్రవేశించి, స్వీయ చమత్కారము చేత స్వకీయ సృష్టియందే సంచరిస్తూ, ‘‘నేను ఏదో -ఎవరిదో సృష్టిలో ప్రవేశించాను! ఇదంతా నాకు అన్యము, బంధము’’! - అని భావించి ఉపాధి పరంపరలు కొనసాగించనారంభిస్తోంది. అనాత్మమైనది, బంధప్రదమైనదంతా పొందటం జరుగుతోంది.

ఆత్మచేత ఆత్మకు అన్యమైనది భావించబడేదంతా ‘అసత్’ అని పిలువబడుతోంది.

బ్రహ్మమే స్వీయభావనాక్రమముచే జీవుడుగా కనబడుచున్నది. జీవుడు సర్వదా బ్రహ్మమే అయి ఉన్నాడు.

‘అభయమ్’

ఏది సర్వదా సత్‌స్వరూపమై ఉండియున్నదో, అదియే ఉద్భవిస్తోంది. ఆ పరమాత్మ స్వతఃగానే ఆనందమయుడు। రసస్వరూపుడు। రసగ్ం హి ఏవ అయం లబ్ద్వా ఆనందీ భవతి। రసస్వరూపుడగు భగవానుని నుండి ఆనందము పొందటం చేతనే - ఈ జీవుడు ఆనందము కలిగినవాడై ఉంటున్నాడు.

హృదయాకాశంలో ఆనందము లేకుంటే ఎవ్వడు మాత్రం ఎట్లా జీవించగలడు! ఈ జీవించటము - అనునదంతా - పరమాత్మయొక్క ఆనందస్ఫురణా విశేషమేగాని మరింకొకటేదీ కాదు.

అఖండుడు, అద్వితీయుడు, అనన్యుడు అగు ఆత్మదేవుడు మన హృదయాకాశంలో ఆనందమయస్వరూపుడై సర్వదా వేంచేసియే ఉన్నారు.

ఈ జీవుని సహజమగు ఆత్మరూపము →
→ అదృశ్యే …… కంటికి కనబడనట్టి,
→ అనాత్మ్యే …… అభౌతికము (Non material) అయినట్టి,
→ అనిరుక్తే …… అనిర్వచనీయుడయినట్టి,
→ అనిలయ …… ఆధారరహితుడైనట్టి,
→ అభయం …… అభయ స్వరూపుడైనట్టి
ఏ జీవుడు భగవంతుని తన హృదయస్థానమునందే పైవిధంగా గుర్తించి, దర్శిస్తాడో.. అథ సో అభయం గతో భవతి।
ఆతడు అభయ స్వరూపుడై ఇప్పుడే ఇక్కడే ప్రకాశించగలడు. అభయం హి ఆత్మా!

యదా హి ఏవ ఏష ఏతస్మిన్ ఉదరమ్ ‘‘అన్తరమ్’’ కురుతే, అధ తస్య భయం భవతి।

ఎప్పుడు ఈ జీవుడు అట్టి పరమాత్మస్థానమునుండి తనపట్ల తాను తన ఉదరమునందు వేరైన భావము పొందటము జరుగుచున్నదో, అదియే సంసారము. స్వస్వరూప భావనతో (అనగా) ఈతడు దృశ్యముతో సందర్భములతో, సంఘటనలతో, సంబంధ-అనుబంధ-బాంధవ్యములతో.. ‘‘నేను వీటిచే పరిమితుడను’’.. అను జీవాత్మ ధర్మమునకు పరిమితుడగుచూ ఆశ్రయించుచున్నాడో, ఆ మరుక్షణమే ‘భయము’ బయల్వెడలుచున్నది.

ఎవ్వడు పరమాత్మతత్త్వమును స్వస్వరూపభావనతో చింతన చేయడో, ఆతడు విదుషుడు (పండితుడు) అయినప్పటికీ ‘భయము’ కొనసాగుచూనే ఉండగలదు. (ద్వితీయో భయమ్ భవతి। అద్వితీయో అభయమ్।)

8వ అనువాకము - అభయానందము

ఆత్మ సర్వదా అభయస్వరూపము. అందుకు భిన్నమైనదంతా ‘భయము’తో కూడినదే.

అట్టి పరమాత్మ పట్ల భయము చేతనే…., ‘అన్యము’గా కనిపించేదంతా ఆత్మకు అధీనమై ప్రవర్తిస్తోంది.
⌘ భీషా అస్మాత్ వాతః పవతే - వాయువు ఆత్మ పట్ల భయముచేతనే ఆకాశమంతటా వీచుచున్నది
⌘ భీషా ఉదేతి సూర్యః - సూర్యుడు ఆకాశంలో భయముచేతనే ఉదయిస్తున్నారు.
⌘ అగ్ని-ప్రకాశించటము, ఇంద్రుడు ఇంద్రియములను-లోకములను పరిపాలించటము - ఇదంతా ఆత్మపట్ల భయముచేతనే జరుగుతోంది.
⌘ ఈ దృశ్య ప్రపంచములో కనిపిస్తున్న మార్పుచేర్పుల చమత్కారమంతా పరమాత్మ పట్ల భయముచేతనే (మృత్యువు= మార్పు) ఏర్పడుచున్నదగుచున్నది. ఆత్మకు భయపడియే మృత్యువు - తన పనిని తాను నిర్వర్తిస్తోంది.

ఆనంద మీమాంస

ఇప్పుడు ‘ఆనందము’ యొక్క అవధుల గురించి ఒకానొక మీమాంసగా చెప్పుకుంటున్నాము.

మానుష్యానన్దము : యౌవనదార్ధ్యము, ఉత్సాహము, సాహసము, ధైర్యము, శక్తి గల - వేదాధ్యయనము చేసినట్టి ఒక యువకుడు తన శక్తి-సామర్థ్యములతో అనేక మందిని శాసించగలుగుచూ, తస్య అయం పృథివి సర్వా విత్తస్య పూర్ణస్యాత్। - భూమిపై గల సంపదలన్నీ ఆతని సొంతమై, ఆతని కనుసన్నలలో మెలగుచున్నాయని అనుకుందాం. అట్టి వానికి కలుగుచున్న ఆనందము - ‘ఒక మనుష్యానందము’తో సమానము.

శోత్రియస్యచ, అకామహతస్య చ। అటువంటి ఒక మానుష్యానందమును - ఒక శ్రోత్రియుడు (వేదముల హృదయమగు ఆత్మతత్త్వము తెలిసినవాడు), అకామహతుడు (కామములచే జయింపబడనివాడు) అగు మానవుడు ఇప్పుడే, ఇక్కడే వస్తు - విషయాదులు లేకుండానే పొందుచూ ఉన్నాడు.

మనుష్య గన్థర్వానందము : అటువంటి మానషానందమునకు వంద ఇంతల ఆనన్దము (x 100) ఒక మనుష్య-గంధర్వానందముతో (సంగీతము ఇత్యాది, కళలతో పరాకాష్ఠ ఆనందముతో) సమానము. అయితే అది ఒక శ్రోత్రియుడైన ఆత్మతత్త్వవేత్త (మరియు) అకామహతుడు, తాను ఉన్నచోటనే పొందుచూ ఉన్నాడు.

దేవగంధర్వానందము : మనుష్య గన్ధర్యానందమునకు 100 రెట్లు దేవగంధర్వానందము. అది కూడా కామరహితుడగు బ్రహ్మజ్ఞానికి ఇక్కడే లభిస్తోంది.

పితృదేవతా చిరలోకానన్దము : ఇది దేవగంధర్వానందమునకు నూరింతలు. అయితే, ఇది కూడా వేదరహస్యము తెలిసిన అకామహతుడు పొందుచున్నాడు.

అజానజానానందము : అట్టి పితృలోకానికి నూరురెట్లు దేవలోకములో జనించిన అజానజానానందము అగుచున్నది. అక్కడ మానవునివలె మృత్యువు ఉండదు.

నూరు అజానజానానందములు ఒక కర్మదేవతానందము. యజ్ఞయాగాది కర్మలు చేసినవారు అట్టి కర్మదేవతానందము పొందుచున్నారు.

అట్టి కర్మదేవతానందమునకు నూరురెట్లయినది. → ఒక దేవానందము (దేవతా లోకాలలో దేవత పొందుచున్నది)

అట్టి ‘దేవానామ్ ఆనందములు’ నూరు అంతలు - ఒక ఇంద్రదేవానందము.

ఇంద్ర దేవానందమునకు నూరురెట్లు - ఒక బృహస్పతి ఆనందము.

అట్టి ‘బృహస్పతి ఆనందము’…. నూరు ఇంతలు లభిస్తే అది లోకముల నిర్మాణ సామర్ధ్యమును ప్రదర్శించుచున్నట్టి ప్రజాపతి ఆనందముతో సమానము.

అట్టి ప్రజాపతి ఆనందమును కూడా బ్రహ్మజ్ఞానము గల శ్రోత్రియడగు అకామకామి తాను ఎక్కడ ఉంటే అక్కడ పొందుచూనే ఉన్నాడు.

అట్టి ప్రజాపతి ఆనందమునకు నూరురెట్లు - స ఏకో బ్రహ్మణ ఆనందః। - అది బ్రహ్మానందము.

కోరికలు జయించిన బ్రహ్మవేత్త అది ఇక్కడే ఇప్పుడే పొందుచూనే ఉన్నాడు.
అందుచేత ఇంద్రియ దృశ్య సంబంధమైన కోర్కెలను (All wordly expectations and desires) త్యజిస్తూ ఆత్మజ్ఞానము వైపు అడుగులు వేస్తూ ఉండటమే ఆత్యంతికానందముకొరకై ఏకైక ఉపాయము.

ఆత్మానందము

ఆత్మానందము ఎక్కడ లభిస్తుంది?

ఆత్మ ఈ జీవుని హృదయంలోనే సర్వదా వేంచేసియే ఉన్నది. ఈ మనుజునియందు ఏ ఆత్మానందము ప్రకాశమానమై ఉన్నదో,.. అదియే - సయశ్చ అయం పురుషే, యశ్చ ఆసావాదిత్యే। - స ఏకః। ఆదిత్యునియందు కూడా ఆ ఆత్మానందమే ఉన్నది.

బ్రహ్మదేవుని నుండి - ఒక జీవుని వరకు అంతర్-హృదయంగా ఏ ఆత్మానందము సమముగా సర్వదా ప్రకాశమానమై ఉన్నదో,… అద్దానిని తెలుసుకొనుచుండటమే ఆత్మజ్ఞానము. అట్టి ఆత్మానందమును గుర్తిస్తున్న వాడే వేదవేత్త! విదితవేద్యుడు। అది ఎరిగిన వాడు బ్రహ్మానంద స్వరూపుడై విహరిస్తున్నాడు.

సర్వదేహములలో ప్రకాశించు అఖండాత్మానందమును దర్శించువాడు - తం అన్నమయమ్, ప్రాణమయమ్, మనోమయమ్, విజ్ఞానమయమ్, ఆనందమయమ్ ఆత్మానమ్ ఉపసంక్రామతి! ఆతడు పంచకోశములను తనయందు లయంచేస్తూ ఆక్రమించివేస్తూ… కేవలాత్మానంద స్థానమును చేరుచున్నాడు. ‘‘పంచకోశములు నాలోని చమత్కారములు. వాటికి నేను వేరై ఉన్నాను!’’ అని గమనిస్తున్నాడు.

ఆనందవల్లీ - 9వ అనువాకము -ఆత్మజ్ఞః

అట్టి ఆత్మానందము ‘ఇట్టిది’ అని మాటలలో ఎట్లా చెప్పటం? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ! వాక్కు మనస్సు కూడా వాటి గురించి అభివర్ణించ ప్రయత్నించి, వల్లకాక… వెనుకకు మరలుచున్నాయి.

అట్టి ఆనందము బుద్ధికి మాత్రమే విదితమగుచున్నది. (one’s own common sense only shall be able to observe that).

తత్ ఆనన్దమ్ బ్రాహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి! అట్టి సర్వాత్మకమగు అఖండ పరబ్రహ్మమును తెలుసుకొని, అనుభూతపరచుకున్నవాడికి భయము పొందుటకు విషయమే ఉండదు.

పుణ్య పాపవ్యవహారములతో సహా ఈ సర్వము ఆత్మస్వరూపమై అనుభూతమగుచున్నది. అందుచేత దేహ-దేహాంతరములప్పుడు కూడా పుణ్య-పాప, సుఖ-దుఃఖ, అల్ప-అధిక ఇత్యాది ద్వంద్వములు అట్టి ఆత్మజ్ఞుని బాధించవు. బాధించలేవు! ఆతడు సర్వదా ఆత్మగా ప్రకాశమానుడై ఉంటున్నాడు.



3 భృగువల్లీ

1వ అనువాకము - సహనావవతు….. (శాంతి పాఠము)

సర్వాత్మకుడు, కరుణామయుడు అగు పరమాత్మ - శిష్య, ఆచార్యులమగు మన మిరువురికి రక్షకుడగునుగాక! మనమిరువురము పరిపోషించబడెదముగాక! బ్రహ్మజ్ఞాన - బ్రహ్మతత్త్వానుభవములు సిద్ధించుటకై శిష్య-ఆచార్యులమగు మనమిరువురము వీర్యవంతులమై పరిశ్రమించెదముగాక! మన ఈ స్వాధ్యయనము తేజోవంతమై ఉత్తమ ఫల ప్రదమగునుగాక। శిష్య - ఆచార్యులమగు మనమిరువురము పరస్పరము అయిష్టపడక, ఇష్టముగా ఈ ఆత్మబోధాకార్యక్రమము నిర్వర్తించుకొనెదముగాక!
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః। అధి భూత-అధిదైవ-అధ్యాత్మ తాపములు ఆత్మభావనయందు సశాంతించిన వగునుగాక।

వరుణ భగవానుని కుమారుడు భృగ మహర్షి ఒక సందర్భములో పితృదేవులను సమీపించి ‘‘తండ్రీ! భగవంతుడు (లేక) పరమాత్మ (లేక) బ్రహ్మము గురించి దయచేసి నాకు అధీహి। ఉపదేశించండి!’’ అని ప్రార్థించారు.

వరుణ భగవానుడు : బిడ్డా! భృగూ! అన్నము, ప్రాణము, చక్షువులు, చెవులు మనస్సు వాక్కు…. అంతా పరబ్రహ్మమే! పరమాత్మ ప్రదర్శనమే! సర్వం బ్రహ్మమే!

మరికొంతగా ఇంకొక విశేషంగా చెప్పుచున్నాను విను.

యతోవా ఇమాని భూతాని జాయన్తే, యేన జాతాని జీవన్తి, యత్ ప్రయన్తి అభిసంవిశన్తి → ఈ జీవజాలమంతా ఎక్కడ నుండి పుట్టుచున్నదో.., దేనివలన జీవిస్తూ ఉన్నదో, చివ్వరికి దేనిలో లయిస్తూ ఉన్నదో…. తత్ విజ్ఞానస్వ! అది తెలుసుకో! అదియే బ్రహ్మము. బ్రహ్మము గురించి నేను చెప్పినంత మాత్రంచేత తెలిసేది కాదయ్యా. అందుకు తపస్సు చేసి స్వబుద్ధితో ఎరగాలి సుమా!

┄┄┄

అప్పుడిక భృగువు ఒక ఏకాంతపు దేశమును చేరారు. ‘‘ఈ భూత జాలమంతా ఎక్కడ నుండి జనిస్తూ ఎందులో జీవిస్తూ, దేనిలోలయిస్తోంది? ఇది గమనించమని, కదా గురుదేవులగు పితృదేవుల సూచన! దేనినుండి జీవులు జనించి జీవిస్తున్నారు?’’ - అని యోచన ప్రారంభించారు. తపస్సుకు ఉపక్రమించసాగారు. ‘తపన’ అను ప్రయత్నమే తపస్సు కదా! ఆతడు మనస్సును ఇంద్రియాలను అంతర్ముఖంచేసి ‘‘నేను - సహజీవులు - దృశ్య ప్రపంచము’’ల జనించు - జీవించు - లయించు స్థానము గురించి బుద్ధితో అన్వేషణ చేయసాగారు. కొంతకాలం గడిచింది.

2వ అనువాకము - అన్నం spanred బ్రహ్మేతి వ్యజానత్

భృగువు : ఈ దేహాలన్నీ దేనిచేత జనించి పరిపోషించబడుతూ భౌతికంగా ఇట్లా కనిపిస్తున్నాయి? ఓహో! అన్నము చేతనే ఈ దేహాలన్నీ పుడుచున్నాయి. జీవిస్తున్నాయి. తిరిగి అన్నము చేతనే నశించి అన్నము నందు లీనమగుచున్నాయి. కాబట్టి అన్నమే బ్రహ్మము! అనగా? అన్నమయ దేహముల ప్రత్యక్షరూపమే ‘బ్రహ్మము’ అని నాన్నగారి ఉద్దేశ్యము!’’ అని భావించాదు.

తండ్రి గారి దగ్గర ఈ విషయం ఆరూఢపరచుకోతలచారు. వరుణుల వారిని సమీపించారు.

భృగువు : తండ్రీ! వరుణ భగవాన్! అన్నమ్ బ్రహ్మ। ‘‘ఆహారము - ఆహారముచే నిర్మించబడి-పరిపాలింపబడుచూ - ఆహారముచే లయించబడుటచే అన్నమయ దేహమే బ్రహ్మము’’.. అని నేను గమనిస్తూ ఉన్నాను. ఔను కదా! ఇప్పుడు బ్రహ్మము అనగా ఏదియో, మీ వద్ద కూడా ఎరుగ తలచాను. అన్నమయమైనదే (భౌతికమైనదే) బ్రహ్మము కదా?

వరుణ భగవానుడు అది విని - చిరునవ్వు చిందించారు. ‘ఔను’ అనలేదు. ‘కాదు’ అనలేదు. ‘‘బిడ్డా! తపస్సు చేయి। తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ! తపో బ్రహ్మేతి! తపస్సు వలననే బ్రహ్మము అనగా ఏమో తెలియవస్తోంది. తపస్సు చేసి ‘ఇది బ్రహ్మము’ అని తెలుసుకో!’’ అని పలకాలి.

అప్పుడు భృగువు ‘‘ఓహో! నాన్నగారి ఉద్దేశ్యంలో నేను బ్రహ్మముగురించి ఎరిగినది సమగ్రము కాదన్నమాట. (Not comprehensive). అందుచేత వారి ఆజ్ఞను అనుసరించి మరల తపస్సు చేస్తూ విచారణ కొనసాగిస్తాను’’.. అని తలచారు.

భృగువు మరల తపస్సు ప్రారంభించారు. కొంతకాలము గడిచింది.

3వ అనువాకము - ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్

భృగువు ఇట్లా తలచసాగాడు.

‘‘ప్రాణమే భగవంతుడు. ప్రాణమే-బ్రహ్మము అని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. ఈ జీవులంతా ప్రాణమునందే ఉద్భవిస్తున్నారు. ప్రాణము ఉంటున్నప్పుడే కదా జీవిస్తున్నది! కాబట్టి ఈ జీవులంతా ‘ప్రాణశక్తి’ నుండే బయల్వెడలి, ప్రాణము చేతనే జీవిస్తూ, ప్రాణమునందే లయమగుచున్నారు. మరణానంతరం ప్రాణము ప్రాణములో లయిస్తోంది! అందుచేత ‘ప్రాణమే బ్రహ్మము’ అని నాకు అర్థమగుచున్నది! జీవుడు = ప్రాణరూపుడు!’’

ఇట్లు ఎరిగినవాడై తండ్రి వరుణుని సమీపించి, ‘‘తండ్రీ! ప్రాణమే బ్రహ్మమని ఎరుగుచున్నాను! నేను ‘ప్రాణమే బ్రహ్మము’ అని ఎరిగిన దాని గురించి నాకు మరికొంత ఇంకేమైనాఉంటే విశదీకరించండి’’ - అని బ్రతిమలాడారు.

మహనీయుడగు వరుణుడు చిరునవ్వు నవ్వుచూ ‘‘ప్రియపుత్రా! తపస్సు చేసి బ్రహ్మమును ఎరిగెదవుకాక! తపస్సు వల్లనే ‘బ్రహ్మము’ యొక్క పూర్ణార్థమును ఎరుగగలవు. సుమా!’’… అను పలికి ఊరుకున్నారు.

అప్పుడు భృగువు.. ‘‘అట్లాగా! అనగా, ‘ప్రాణమే బ్రహ్మము’ అనునది సమగ్రము (complete and comprehensive) కాదా? సరే!’’ అని అనుకొని మరల కొంతకాలము తపస్సు చేయసాగారు.

4వ అనువాకము - మనో బ్రహ్మేతి వ్యజనాత్

భృగువు : దేహము ప్రాణముతో జీవిస్తోంది. అయితే ప్రాణము శక్తి రూపము కదా! అట్టి శక్తి ఎవ్వరి ఆధ్వర్యంలో ఉన్నది? ఆహా! మనో పురుషుడి (ఆలోచనలు) హస్తములలో ప్రాణము ఉపకరణము. ఆలోచనాశక్తి చేతనే ఈ భౌతిక దేహములో ప్రాణము నిలచి ఉండి, ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమాన ధర్మములు నెరవేరుస్తోంది.

(‘‘మనయేవ ఇదమ్ ఆప్తవ్యమ్’’ ‘‘మనో యఃకరోతి తత్ కృతం భవతి। మనో య నకరోతి, తత్ న కృతమ్ భవతి!’’.. ‘‘మనయే’వ మనుష్యాణాం కారణమ్ బంధ-మోక్షయ్యో’’ మొదలైన) మనో నిర్వచన ఆప్త వాక్యములను అనుసరించి ‘‘మనస్సు ఈ జీవుని రూపం’’ అనునది విదితమౌతోంది.

కనుక మన సోహి ఏవ ఖలు ఇమాని భూతాని జాయన్తే। మనస్సు నుండే ఈ జీవ జాలమంతా జనిస్తోంది. మనసా జాతాని జీవన్తి। మనస్సు చేతనే జీవిస్తున్నారు. మనస్సు నందే తిరిగి లయిస్తున్నారు. కనుక మనస్సే బ్రహ్మము. మనస్సు నుండియే జీవులంతా బయల్వెడలుచున్నారు.

ఇట్లా గ్రహించి భృగువు మరల తండ్రిని సమీపించారు.

భృగువు: ‘‘మనస్సే సర్వోత్కృష్టమగు బ్రహ్మము’’.. అని నేను తపస్సు తరువాత గ్రహించాను. ఈ దేహము - ప్రాణము మనస్సుకే అంగములు కదా! ఇప్పుడు మీరు దయతో బ్రహ్మము గురించి ఇంకేమైనా ఉంటే చెప్పండి.

వరుణ భగవానుడు : కుమారా! తపస్సు చేతనే బ్రహ్మము గురించి తెలుసుకోగలవు. తపస్సే బ్రహ్మమును తెలుసుకొను ఉపాయము! పెద్దల, బ్రహ్మవేత్తల సూచన మార్గము అదే కదా!

అప్పుడు భృగువు ఇట్లా తలచాడు.

‘‘అయితే మనస్సు బ్రహ్మము.. అనునది కూడా పరాకాష్ఠ - సత్యము కాదన్న మాట! సరే! నాన్న గారి సూచనానుసారంగా మరల తపస్సు కొనసాగిస్తాను!’’ - ఇట్లా పలికి తిరిగి ఏకాంతంగా తపస్సు-వివేకముతో కూడిన ‘స్వకీయ-విచారణ’ కొనసాగించారు.

5వ అనువాకము - ‘‘విజ్ఞానం’’ బ్రహ్మేతి వ్యజనాత్

భృగువు : (తనలో) మనస్సు బుద్ధికి తెలియబడుతోంది కదా! మనస్సుచే తెలియబడేదంతా బుద్ధిని అనుసరించే ఉంటోంది! కనుక విజ్ఞాన-విచక్షణా రూపమగు బుద్ధిని అనుసరించే మనస్సు-ప్రాణము-అన్నమయ దేహము ప్రవర్తిల్లుచున్నాయి. తెలివియే లేనప్పుడు తెలియబడేది, తెలుసుకుంటున్న మనస్సు ఉండజాలవు. కాబట్టి విజ్ఞానమ్ బ్రహ్మేతి! విజ్ఞానమే బ్రహ్మము! విజ్ఞానము (తెలివి) నుండే ఈ జీవులంతా జీవిస్తున్నారు. తెలివిచేతనే జీవులు జీవిస్తున్నారు. తెలియబడేది + మనస్సు చివరికి తెలివియందే లీనము అగుచున్నాయి. కనుక ‘‘విజ్ఞానమే బ్రహ్మము’’.. అని తెలియవస్తోంది. ‘విజ్ఞానము’ నుండే జీవులంతా బయల్వెడలుచున్నారు.

ఇట్లా తలచి, భృగువు మరల తండ్రిగారిని సమీపించారు.

భృగువు : తండ్రీ! వరుణ భగవాన్! ‘కేవల తెలివి’ (The Factorof knowing at its Absolute) రూపమగు విజ్ఞానమే బ్రహ్మము - అని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు బ్రహ్మము గురించి నిర్వచిస్తూ విశదపరచండి.

వరుణ మహర్షి : తపసో బ్రహ్మ విజ్ఞానస్వ! తపో బ్రహ్మేతి। తపస్సుచేత మాత్రమే ‘‘బ్రహ్మము అనగా ఇది’’ అని తెలియవస్తోందయ్యా!

అప్పుడు భృగువు మరల మరొక్కసారి తపస్సు చేయనారంభించారు. కొంతకాలం గడిచింది ఈ విధంగా ఎరుగసాగారు.

‘6’వ అనువాకము - ఆనన్దోబ్రహ్మేతి వ్యజానాత్

భృగువు : తెలివి ఇచ్ఛను అనుసరించి ఉంటుంది కదా! కాబట్టి ఇష్టము (లేక) చిత్తము (లేక) ఆనందమే బ్రహ్మము. ఆనందము (లేక) ఇష్టము నుండే తెలివి, ఆలోచన, ప్రాణశక్తి, అన్నమయ దేహము బయల్వెడలుచున్నాయి. ‘ఇష్టము’ నుండే ఈ జీవులంతా బయల్వెడలుచున్నారు. ఆనందము నందు ఆనందము చేతనే జీవిస్తున్నారు కూడా! ఈ జీవులంతా తిరిగి ఆనందమునందే లయిస్తున్నారు. ‘ఆనన్దో బ్రహ్మ’ అని నిర్ణయించుకుంటున్నాను. అందుచేత ఇచ్ఛా రూపమగు ‘ఆనందము’ నుండియే ఈ జీవుల ఉత్పత్తి జరుగుతోంది.

┄┄┄

ఈ విధంగా భృగువు తండ్రి వరుణ మహర్షి సూచనలను అనుసరించి తపస్సుచే పరిశుద్ధమైన అంతరంగము కలవాడయ్యారు. తపస్సు చేతనే ‘‘ఆనన్దమే బ్రహ్మము’’ అని తెలుసుకొని ‘‘నా బ్రహ్మానంద స్వరూపమే ఈ విజ్ఞానమయ-మనోమయ-ప్రాణమయ-అన్నమయ కల్పనా విశేషాలు’’.. అని గ్రహించారు. అట్టి ఆనందము హృదయాకాశమునందే ఏర్పడి ఉన్నట్లు గ్రహించారు. ‘‘ఆనందోబ్రహ్మ!’’ (This is all my pleasure) అని ఆనందించసాగారు.

ఈ విధంగా వరుణ-భృగువుల సంవాదము ఎరిగినప్పుడు, అట్టి బ్రహ్మవిద్యచే ఆ అధ్యయనుడు-తన హృదయమునందు’ ఆనంద బ్రహ్మమును దర్శించి, బ్రహ్మమే తానై ప్రకాశించుచున్నాడు.

ఆనందమును (బ్రహ్మము యొక్క ఇష్టరూపమే ఇదంతా అని) ఎరిగినవాడు
- అన్నము (సిద్ధించుకోవాలనుకొన్నది) సిద్ధించుకోగలడు
- తేజోవంతుడు, సత్సంతానవంతుడు, (పశు మొదలైన) సంపత్తి గలవాడు, అగుచున్నాడు.
- శమ దమములు మొదలైనవి స్వభావసిద్ధమై, ‘శ్రేష్ఠుడు’ అగుచున్నాడు.

7వ అనువాకము - అన్నమ్ ప్రాణస్వరూపమ్

(అన్న - అన్నాదములు = (దృష్టాంతం). కుండలోని నీరు ఉన్నప్పుడు కుండ ‘అన్నాదము’. నీరు అన్నము).

అన్నము జీవుని జీవనానికి, ఈ దేహము పరిపోషించబడటానికి కారణమై ఉంటోంది. అన్నము బ్రహ్మజ్ఞానమునకు మొట్టమొదటి ఉపాయము. అందుచేత అన్నమును నిందించకూడదు. అన్నమ్ న నింద్యాత్! అన్నము శక్తిని దేహానికి ప్రసాదిస్తోంది. అన్నములో ప్రాణశక్తి నిక్షిప్తమైయున్నది. అందుచేత అన్నమును వృద్ధి చేయటానికి జీవుడు శ్రమించాలి. అన్నమును వృధా చేయరాదు. తినే పదార్థాలను సహజీవులతో పంచుకోవాలేకాని, దుమ్ము-ధూళిలో వేయటమో, చెడేవరకు పాత్రలలో దాచి ఉంచటమో చేయరాదు.

తద్వ్రతమ్! అన్నమును సహజీవులకు సమర్పించటము వ్రతముగా పాటించాలి. అన్నము దైవార్పితము, న్యాయార్జితము అయి ఉండాలి.

(i) అన్నములో ప్రాణశక్తి ఉన్నది.
(ii) ప్రాణశక్తి చేతనే శరీరము నిర్మించబడుతోంది
(iii) శరీరములో అన్నము ప్రాణశక్తి రూపముగా ఉన్నది.

ప్రాణోవా అన్నమ్। - శరీరమ్ అన్నాదమ్। శరీరములో అన్నము ప్రాణరూపంగా ప్రవేశిస్తోంది.

Ⅰ.‘‘శరీరము → అన్నాదము. ప్రాణము → అన్నము’’….అగుచున్నాయి.
Ⅱ. శరీరే ప్రాణ ప్రతిష్ఠితమ్। ఈ శరీరము అన్నము చేతనే నిర్మితము అగుచున్నది. అనగా, ప్రాణములో ఈ భౌతిక శరీరము ప్రతిష్ఠితమై యున్నది. కనుక ‘‘ప్రాణము - అన్నాదము. శరీరము అన్నము’’
Ⅲ. పై Ⅰ & Ⅱ స్థితులను అనుసరించి శరీరము - ప్రాణము పరస్పరము ఒకదానియందు మరొకటి ప్రతిష్ఠితమగుచూ ఉన్నాయి.

ఈ విధంగా ఈ శరీరము - ప్రాణము పరస్పరము ఒకదానియందు మరొకటి ప్రతిష్ఠితమగుచూ ఉన్నాయి. [అనుభవించునది (అన్నాదమ్), అనుభవించబడునది (అన్నమ్) అగుచున్నాయి.]

ఈ విధమైన శరీర-ప్రాణములకు గల పరస్పర-అన్నమన్నాదతత్త్వములను తెలుసుకున్నవాడు అన్నమన్నాద స్వరూపుడై మహాన్ (మహనీయుడు) అగుచున్నాడు. శరీర-ప్రాణములు అవినాభావత్వమును ఎరిగి ఉపాసించువాడు పుత్ర-మిత్ర ఇత్యాది జన సంపద, పశుసంపద పొందుచున్నాడు. శరీర-ప్రాణములను బ్రహ్మముగా ఎరిగినవాడు బ్రహ్మవర్చస్సుచే తేజోవంతుడు అగుచున్నాడు. కీర్తివంతుడై-మహాన్ కీర్త్యా-ప్రకాశించుచున్నాడు.

ఆహారమును భగవంతుని అనుగ్రహంగా భావించాలి. ప్రాణసమానంగా భావిస్తూ స్తుతిస్తూ, పరమాత్మకు కృతజ్ఞతలు సమర్పిస్తూ స్వీకరించాలి. ఇట్లు నిర్వర్తించువాడు అన్నమన్నాదుడు అగుచున్నాడు.

అనగా
→ నాలో అన్నము-దేహము ప్రాణము ప్రతిష్ఠితమై ఉన్నాయి.
→ నేను అన్నము - దేహము - ప్రాణములలో ప్రతిష్ఠితమై యున్నాను - అని అనుభూతుడగుచున్నాడు.

మరికొంత వివరణ.

అన్నాదమ్ = ఎందులో అయితే ఒకానొకటి, ప్రతిష్ఠితమైయున్నదో అది-‘అన్నాదమ్’
అన్నమ్ = ఏది ప్రతిష్టితమై యున్నదో అది - అన్నమ్!

‘‘శరీర-ప్రాణములు ఒకదానిలో ప్రతిష్ఠితమై ఉన్నాయి కాబట్టి పరస్పరము ‘అన్నమన్నాదమ్’ అయి ఉన్నాయి’’.. అని ఆహారమును ‘శరీరము’గాను, శరీరము ప్రాణ రూపంగాను, ప్రాణమును శరీరముగాను ఉపాసించువాడు ‘మహత్‌తత్త్వము’ సిద్ధించుకొనగలడు.

8వ అనువాకము - ఆపః-జ్యోతిః - అన్నమన్నాదమ్ - జలము - అగ్ని - పరస్పరం అన్నమన్నాదమ్

అన్నమును - న పరిచక్షీత। → ఉపేక్షించకూడదు. చెడిపోనీయకూడదు. ఇది జీవునికి వ్రతముగా అగుగాక!

జలములో అన్నరసము (అన్నము) ఉన్నది. అట్లాగే జలము అన్నాదము. అగ్ని అన్నము.

అప్సు జ్యోతిః ప్రతిష్ఠితమ్। - జలమునందు అగ్ని ప్రతిష్టితమై యున్నది. అగ్నియందు జలము ప్రతిష్ఠితము.

జ్యోతిషి ఆపః ప్రతిష్ఠితాః। జలము - అగ్ని →
రెండూ పరస్పరము అన్నము-అన్నాదము అయి ఉన్నాయి. ఇది ఎరిగినవాడు ‘‘అన్నమన్నాదుడు’ అగుచున్నాడు.

అనగా..
→ నేను ఆహారము - దేహము - జలము - అగ్నిలో ప్రతిష్ఠితుడనై ఉన్నాను
→ నాలో ఆహారము - దేహము - జలము - అగ్ని ప్రతిష్టితమై ఉన్నాయి
అను అనుభూతియందు ప్రతిష్ఠితుడగుచున్నాడు.

అట్టివాడు ఆపఃజ్యోతి అన్నమన్నాదుడై మహదత్వము పునికి పుచ్చుకొనుచున్నాడు. సంతానము-పశుసంపద (భౌతిక సంపద) కూడా పొందుచున్నాడు. బ్రహ్మవర్చస్సుతో మహత్తర కీర్తి సంపన్నుడగుచున్నాడు.

9వ అనువాకము - సర్వము నాయందు

అన్నం బహుకుర్వీత! అన్నము విస్తారంగా వృద్ధి చేయుటకై శ్రమించాలి. ‘‘ఆహారమును అభివృద్ధి చేయాలి’’ అనునది వ్రతమువలె ఆచరించాలి.

పృథివీ అన్నం! ఆకాశో అన్నాదః। పృథివి ఆకాశమునందు ప్రతితిష్ఠిత కలిగి ఉన్నది. ఆకాశము పృథివియందు ప్రతితిష్ఠత కలిగి ఉన్నది.

(1) spanredపృథివి అన్నాదము. ఆకాశము అన్నము. (2) ఆకాశము అన్నాదము. పృథివి అన్నము.

పృథివ్యామ్ ఆకాశః ప్రతిష్ఠితః। ఆకాశే పృథివీ ప్రతిష్ఠితా। తత్ ఏతత్ అన్నామన్నే ప్రతిష్ఠితమ్।

పృథివి ఆకాశంలోను, ఆకాశము పృథివియందు ప్రతితిష్ఠత (ఉనికి) కలిగి ఉండడం చేత.. పరస్పరము ‘అన్నమన్నాదమ్’ అయి ఉంటున్నాయి. పరస్పరము ఆహారము అయి ఉంటున్నాయి. ఈ విధంగా ఎవరు ఉపాసిస్తారో, అట్టివారు అన్నమన్నాదులు అగుచున్నారు.

→ నేను అన్నమయ - ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయ ఆనందమయ-భూ-ఆకాశములతో ప్రతితిష్ఠుడనై ఉన్నాను.
→ నాయందు అన్నమయ-మొదలైన (పైన చెప్పబడిన) వన్నీ ప్రతితిష్ఠితమై ఉన్నాయి.

అందుచేత అవన్నీ నాకు - నేను వాటికి అన్నమన్నాదులము - అని గ్రహించబడుగాక.

అట్లాగే, పరమాత్మ - జీవాత్మలు పరస్పరము అన్మమ్- అన్నాదములై ఉన్నారు.

10వ అనువాకము - త్యాగమహిమ

బ్రహ్మ విద్యను కోరి, ‘బ్రహ్మవేత్త అగుటను ఆశయముగా కలిగియున్న యోగికి మరికొన్ని ముఖ్య సూచనలు, ఇప్పుడు ఇవ్వబడుచున్నాయి.

అన్నమునకు శ్రమించాలి. వృద్ధి చేయాలి। సహజీవులకు సమర్పిస్తూ ఉండాలి।

న కంచన వసతౌ ప్రత్యాచక్షీత। తనను ఆహారము కొరకు, నివాసము కొరకు ఎవ్వరైనా వచ్చి ఆశ్రయిస్తే అట్టి అతిధులను ‘‘లేదు! ఇవ్వను! వెళ్లు-’’.. అని తిరస్కరించి పంపరాదు. తత్ వ్రతమ్। ఇది వ్రతముగా ఆచరించాలి. ఎందుకంటే…, ‘‘నాది’’ అనునది బంధము, అత్మానుభవమునకు అడ్డుగోడ, విఘాతము అగుచున్నది. ‘‘ఇదంతా పరమాత్మకు చెందినది’’.. అను వ్రతము ఆత్మజ్ఞానమునకు, ఆత్మాఽహమ్ భావనకు రాచబాట అగుచున్నది.

ఎట్లాగైనాసరే, శ్రమించి అన్నము స్వయంగా సముపార్జించాలి. ‘‘అతిధిదేవా! రండి! మీకు సమర్పించుటకై, ఆహారము ‘ఆరాధి’। సిద్ధముగా ఉన్నది’’ - అని ‘ఆచక్షతే’.. చెప్పాలి! ఏతత్ వై ముఖతో అస్మాత్ అన్నగ్ం రాద్ధమ్! చక్కగా అన్నము అతిథీదేవునికి సమర్పించాలి (అతిథిదేవో భవ).

బాల్య వయస్సులోను, మధ్యవయస్సులోను, చివరి వయస్సులోను కూడా ఎవడు అన్నము తనను ఆశ్రయిస్తున్న సహజీవులకు సమర్పించి, వారితో ఇష్టంగా పంచుకుంటారో, అట్టివారు మరల మరల ఆయా సమయములలో తిరిగి సమృద్ధిగా పొందుచూ ఉంటారు.

ఆహారమును వృద్ధి చేయటము, పంచుకోవటము, సమర్పించటముల ఫలములను ఎరిగి ఇష్టముగా ప్రవర్తించువాడు ఉత్తముడు। అస్మాత్ అన్నగ్ం రాధ్యతే! - ఆతడు తనను తాను సర్వసమృద్ధివంతునిగా తీర్చిదిద్దుకొనుచున్నాడు.
దాన గుణముచే ఈ జీవుడు సంతాన-సౌభాగ్యము, గోసంపత్తి, బ్రహ్మతేజస్సు, మహదత్వము పొందుచున్నాడు.

⌘⌘⌘

పరమాత్మ ఎక్కడెక్కడ సంస్థాపితుడై ఉన్నారు?
సమతతో కూడిన మమత!

పరమాత్మ అంతటా ఏర్పడి ప్రేరణ-ఉత్సాహము-ఆప్యాయతలను సంప్రదర్శనము చేయుచూ ప్రతిష్ఠితులై ఉన్నారు.
➤ వాక్కు నందు - వాచి క్షేమ ఇతి - ‘క్షేమము’ రూపంగాను (వినువారికి ప్రీతి కలిగించు రూపంగాను)..,
➤ ప్రాణ-అపానములందు - యోగ క్షేమ ఇతి-పొందటము, రక్షించటము నిర్వర్తించుచున్నవారుగాను,
హస్తయో కర్మ ఇతి - చేతుల యందు క్రియానిర్వర్తక విశేషుడుగాను,
పాదయో ‘గతిః’ ఇతి - పాదములయందు నడక-నడతల రూపంగాను,
పాయౌ విముక్తి ఇతి - ‘గుదము’నందు విసర్జన క్రియారూపముగాను
ఈ విధంగా జీవుడు ఆత్మ భగవానుని చైతన్యప్రదర్శనమును దర్శిస్తూ ఉపాసించునుగాక!

ఇంకా.., ‘తత్ ప్రతిష్ఠా’ ఇతి ఉపాసీత।.. ఈ ఈ రీతిగా సర్వత్రా ప్రేరణ - చేతన రూపములతో ప్రతిష్ఠితుడై ఉన్నట్లుగా ఉపాసించాలి!

➤ మానవునియందు (జీవులయందు) చింతన రూపమును (మనస్సు రూపంగాను), - వాచి ‘క్షేమః’ - ఇతి,
➤ ‘భగవత్ చింతన’ యందు పరాప్రేమను వర్షించు రూపంగాను, - దైవోపాసనయందు ‘ఉపాసన’ రూపంగాను,
వృష్టి (వర్షము) నందు తృప్తి రూపముగాను - వృష్టీ ‘తృప్తీ’ - ఇతి.
➤ విద్యుత్ యందు బలరూపంగాను, - విద్యుత్ ‘బలమ్’ - ఇతి,
➤ జీవులలో, పశువులలో - యశస్సు రూపంగాను - పశుషు ‘యశః’- ఇతి,
➤ నక్షత్రములలో జ్యోతి (వెలుగు) రూపంగాను, - నక్షత్రేషు ‘జ్యోతిః’ - ఇతి,
➤ ఉపస్థయందు సంతాన పునరుత్పత్తి రూపంగాను, ఆనన్దరూపముగాను, - ఉపస్థే ‘ప్రజాపతిః అమృతం ఆనందం’’ - ఇతి,
➤ ఆకాశంలో ‘సమస్త’ రూపంగాను - ఆకాశే ‘సర్వమ్’ - ఇతి,
భగవంతుడే వేంచేసి ఉన్నారు! తత్ ప్రతిష్ఠేతి ఉపాసతే! సర్వమునకు ఆధారముగా పరమాత్మయే ఉపస్థితులై ఉన్నారని దర్శించాలి. ఆయా రూపములుగా ఉపాసించాలి.

మహత్తు -మహాన్ మనోస్వరూపుడై స్వస్వరూపుడై ఉన్న పరమాత్మను ఉపాసిస్తూ హృదయపూర్వక నమస్కారములు సమర్పించాలి. అస్యైః కామా నమ్యన్తే! అట్టివాడి సర్వకోరికలు తమకు తామే సిద్ధిస్తున్నాయి.

తత్ బ్రహ్మహి ఉపాసీత - బ్రహ్మవాన్ భవతి। ‘ఇదంతా బ్రహ్మమే’ అని ఎరుగుచున్నవాడు బ్రహ్మవాన్ - ‘బ్రాహ్మణుడు’ అని చెప్పబడుచున్నాడు.

★ పరమాత్మను ‘అధినేత’గా ఉపాసించువాడు నేత (leader) అగుచున్నాడు.
★ పరబ్రహ్మమునందే ఈ సమస్తము మార్పు-చేర్పులు చెందునదిగాను, నశించు స్వభావము కలవానిగాను ఉపాసించువాడు మార్పుచేర్పులను, నాశన-ఉత్పత్తులకు సాక్షీ దృష్టిని పొందుచున్నాడు.
★ పరమాత్మను ‘లయకారుడు’గా ఉపాసించువాడు సర్వము తన యందు లయింపజేసుకొని సామర్థ్యమును పొందుచున్నాడు.
★ పరమాత్మ యొక్క ‘నాశన శక్తి’ని ఉపాసించువాడు అరిషట్ వర్గ శతృనాశనము, ద్వేషించుస్వభావ నాశనము పొందుచున్నాడు. పర్యేణం మ్రియన్తే ద్విషంతః సపత్నాః।
★ పరమాత్మ యొక్క ‘మహత్ స్వరూపోపాసన’ చేయువాడు మహత్ స్వరూపుడగుచున్నాడు.
★ పరమాత్మను మనోరూపుడుగా ఉపాసించువాడు- సర్వము స్వస్వరూపంగా దర్శిస్తున్నాడు.

ఈ విధంగా ఈ జీవుడు పరమాత్మ యొక్క మనన రూప-ఉపాసన వలన సర్వ సామర్థ్యములు పొందుచున్నాడు.

⌘⌘⌘

న = పరమాత్మ సంజ్ఞ. మ = జీవాత్మ సంజ్ఞ. సంధి = ఏకత్వము. నమ = జీవాత్మ పరమాత్మ అనుసంధానము.

తత్ నమ ఇతి ఉపాసీత! పరబ్రహ్మమును ‘మనః’ (కేవల మనోరూపం)గాను, సర్వాత్మకముగాను ‘నమః’ నమస్కరిస్తూ ఉపాసించాలి. అట్టివాని కోరికలన్నీ నమ్యంతే - నమ్రత పొందుచున్నాయి. (తల వంచుచున్నాయి).

తత్ బ్రహ్మేతి ఉపాసతః బ్రహ్మవాన్ భవతి! ‘‘ఇదంతా బ్రహ్మమే!’’ అని ఉపాసించువాడు ఇదంతా తానై, తానే బ్రహ్మమై, సత్యమై, నిత్యమై బ్రహ్మానంద భరితుడగుచున్నాడు.

‘‘తత్ పరిమర’’ ఇతి ఉపాసీత,… పర్యేణం మ్రియన్తే।.. ఆ ఆత్మను సర్వసంహారకముగా ఉపాసించువాడు ఈ దృశ్యమంతా ద్రష్టయందు ఉపశమించినదై, దృక్ సాక్షీత్వముచే స్వీయాత్మానందముగా రూపుదిద్దుకొనుచున్నాడు. సమస్తము స్వస్వరూపమునందు లయించబడుచున్నది. (లయము = స్వస్వరూపముతో ఏకత్వము, అనన్యత్వము).

మ్రియన్తే ద్విషన్తః సపత్నాః। సర్వము బ్రహ్మముగా దర్శిస్తూ, ఉపాసిస్తూ స్వయముగా తానే బ్రహ్మమై ‘‘ఇదంతా నా అఖండానందమే’’ అను అనుభవము సిద్ధించిన తరువాత ఇక పరిమితమగు ‘‘రాగము - (వీరే నా వారు,వారు తదితరులు; వీరు శత్రువులు; కనుక నాకు అయిష్టులు; వారు నాకు ద్వేషింపతగిన వారు) మొదలైనదంతా స్వభావ సిద్ధంగా రూపుమాసిపోతుంది. ఆత్మీయమగు దృష్టి ప్రవృద్ధమగుచుండగా - హృదయమంతా ‘‘ఈ జీవులంతా నాకు ప్రియమగు ఆత్మానంద స్వరూపులే!’’ అనే సమతతో కూడిన మమత వెల్లివిరుస్తుంది.

ఏ జీవుడు అట్టి అకారణ-అఫలాపేక్షా - విశాల దృక్పధరూప ఆత్మీదృష్టిని (లేక) బ్రాహ్మీ దృష్టిని సిద్ధించుకొనుచున్నాడో ఆతని ‘మానవ జన్మ’ అను మహత్తర అవకాశము ఉత్తమోత్తమ ప్రయోజనము తెచ్చిపెట్టినట్లే అగుచున్నది. అహ్రాంతులన్నీ నశిస్తాయి. అదియే జన్మించటము - అను సందర్భమునకు మహదాశయసిద్ధి.

ఏక - అఖండాత్మ

ఆత్మ గురించి తెలుసుకొనే మార్గమేది?

స యశ్చ అయం ‘పురుషే’, యశ్చ ఆసావ-‘ఆదిత్యే’ - స ఏకః! ఈ జీవునిలో ఏ ఆత్మ ప్రకాశిస్తోందో,.. ఆదిత్యునిలో ఏ ఆత్మ ప్రకాశమానమౌతోందో.. అట్టి ఆత్మ సర్వదా ఏకమే! ఏమాత్రము ‘అనేకము’ కాదు! ఆదిత్యునియందు, ఒక పురుగునందు, నాయందు ఒకే ఆత్మ అఖండముగా ప్రకాశించుచున్నది. అనగా సర్వ ప్రదేశములలో ఒకే విశ్వాగ్ని ప్రకాశిస్తున్నట్లు, అంతటా ఒకే గాలి వీచుచున్న విధంగా ‘‘ఆదిత్యుని నుండి - ఒక సూక్ష్మ జీవివరకు’’ ఏకాత్మ యొక్క సంప్రదర్శనమే ప్రత్యక్షమై యున్నది. ఎందుచేతనంటే, - ఆత్మ సర్వదా అఖండము కాబట్టి.

స య ఏవం విత్। : ఇది ఎరిగిన వాడు ఆత్మను ఎరిగినవాడు.

సః అస్మాత్ లోకాత్ ప్రేత్య, - అట్టివాడు ఈ లోకస్థితి-గతులన్నీ (సర్వభేదములను) అతిక్రమించివేస్తున్నాడు.

ఏతాం అన్నమయ - ఆత్మానం ఉప సంక్రమ్య, - ‘నేను భౌతిక రూపపరిమితుడను’ అను రూపములో ఏర్పడుచున్న అన్నమయాత్మత్వమును - ‘ఇదే కాకుండా, ఇంతకు మించిన స్వరూపుడనై ఉన్నాను’.. అను భావముతో - దాటివేస్తున్నాడు.

ఏతాం మనోమయ ఆత్మానమ్, ప్రాణమయ ఆత్మానం, విజ్ఞానమయి ఆత్మానమ్, ఆనందమయ ఆత్మానమ్ - ఉపసంక్రమ్య…భౌతిక దేహ-మనో-ప్రాణ-బుద్ధి (విజ్ఞాన)-ఆనందమయ పరిమిత రూపత్వములకు ఆక్రమిస్తూ.. అతిక్రమిస్తూ..
- ఇమాన్ లోకాన్ కామాన్నీ కామ రూప్య - ఒకవైపు లోకములన్నీ తనయందు దర్శిస్తూ →
- మరొకవైపు లోకములలో తనకు ఇష్టమైన రూపమును ఇష్టమును అనుసరించి ధరిస్తూ - అనుసంచరన్- పర్యటిస్తూ ఉంటున్నాడు.

ఏతత్ సామ గాయన్తే అస్తి। ఆనందముగా సామగానం చేస్తూ ‘‘ఆత్మగా ఆవల - జీవుడుగా ఈవల’’.. ఆనందముగా, వినోదముగా, తనయందు తానే తానై ఉంటున్నాడు. తన స్వరూపమగు జగత్తులందు, - తనతోటలో ఈల పాటలు పాడుతూ వినోదంగా సంచరించే చక్రవర్తిలాగా - ఈ సర్వము ఆస్వాదిస్తున్నాడు. ‘ఆహా"! ఓహూ’ అని ఆనందప్రదంగా పాటలు పాడుకుంటూ జాగ్రత్తులో వస్తు సంబంధ - సంచారములు, స్వప్నములో ఊహ-అపోహలు, సుషుప్తిలో విశ్రాంతిగా కూర్చుని ఉండటములు→ నిర్వర్తిస్తున్నాడు.

నేనెవరు?

🙏 నేను జన్మించటం లేదు! మరణించటం లేదు।
🙏 ఒకడు తన స్వప్న కల్పనలలో తానే సంచారములు చేస్తూ వినోదిస్తున్న విధంగా నాకు నేనే సర్వ కల్పనలకు మునుముందే ఉండి, ‘స్వీయ కల్పన’ అను విన్యాసమును కోరుకొన్నవాడనై, ‘కల్పన’ అనే స్వకీయ మాయను కల్పించుకొని, అద్దానియందు నాకు నేనే ఆస్వాదిస్తున్నాను. అనుభవించుచున్నాను. వినోదిస్తున్నాను.

ఆహా"! ఓహో! ఊహూ! ఓహోహో। ఊహా। నా స్వరూపము ఎంత ఆశ్చర్యం!

🙏 పరమాత్మగా కేవల సాక్షిని!
🙏 ‘మాయ’గా నాకు అన్యమైనదంతా జాగ్రత్-స్వప్న-సుషుప్తుల రూపంగా కల్పించుకొనువాడను! ఇదంతా నా కల్పన. స్వకీయ మాయ! దీని రచయితను నేనే!
🙏 జీవాత్మగా జాగ్రత్ - స్వప్న-సుషుప్తులలో నా యొక్క అంశ’లను ప్రవేశింపజేయువాడను.
🙏 దృశ్యమును కల్పనగా కలిగి ఉండి, ఆత్మగా ఏమరచి, జీవాత్మగా బంధము స్వీకరించి, నా కల్పనలో నేనే (స్వప్నములో వలె) తిరుగాడు వాడను। ‘‘నేను బద్ధుడను. మోక్షం కావాలి. కానీ కష్టం’’ - అని అనుకొంటూ వినోదించువాడను.

కల్పన - భౌతికవిశేషములైనట్టి దేహముల రాకపోకలు,
- మనోవిశేషములగు జాగ్రత్ స్వప్న సుషుప్తులు,
- బుద్ధి ధర్మములగు బంధ-మోక్షములు
- చిత్త ధర్మములగు ఆనంద - దుఃఖములు
మొదలైన ఏకానేక విశేషములతో కూడిన ఈ సమస్తము కల్పించుకొనువాడను నేనే! నేనే ఆత్మను! నేనే జీవాత్మను! నేనే పరమాత్మను! నేను దృశ్యముగా విస్తరించియున్న ఈశ్వరుడు.

ఒక చక్రవర్తి తన వనములో వినోదముగా ప్రవేశించి..,
- ఈ తోట అంతా నాదే! ‘పరమాత్మత్వము’
- ఈ తోటలో ఈ మూల ఉండిపోయానే? ‘జీవాత్మత్వము’ - ‘‘రెండూ నా కల్పనలే।’’

అహమన్నమ్ : ఈ కనబడే సర్వము నా యొక్క భావనారూపమే! ఈ జగత్తంతా నా ఆత్మస్వరూపముచే నిండినదైయున్నది. నేను అన్నమును! ఇందులో ఉన్నాను. జగత్తు నాకు అన్నాదమ్! ఈ జగత్తు నేనున్న స్థానము! కనుక జగత్తు అన్నాదమ్!

అహమన్నాదమ్ : ఈ జగత్తులు, లోకములు నాయందే ఉన్నాయి. కనుక జగత్తులు, లోకములు - అన్నమ్! నేనో?.. ‘‘అన్నాదమ్’’

ఈ విధంగా ….,→ ఈ సమస్త జగత్తులలో నేను సర్వదా జీవాత్మనై, త్రిలోక సంచారినై ఉన్నాను.

→ ఈ సమస్త జగత్తులు పరమాత్మయగు నాయందు స్వీయ మనో-నమో కల్పనారూపములై ఉన్నాయి.

అహమన్నమ్! అహమన్నమ్! అహమన్నమ్! (నేనే జగత్తులో ఉన్నాను)! అహమన్నాదో! అహమన్నాదో! అహమన్నాదః। (జగత్తంతా నాలో ఉన్నది)

ఈ దృశ్యము నాకు ఆహారము - నేను ఆహారము స్వీకరించువాడను. అహమన్నాదః। ఈ దృశ్యము (కల్పన)కు నేనే ఆహారము! అహమన్నమ్। భుజించేవాడునేనే! భుజించబడేది నేనే! అహమన్నమన్నాదః।

అహగ్ం శ్లోక కృత్! అహగ్ం శ్లోక కృత్। అహగ్ం శ్లోక కృత్!

ఈ లోకములు, ఈ దృశ్యములు, వీటిలో ఈఈ స్థితిగతులు.. ఇవన్నీ నా గానము!

ఒక చక్రవర్తి తన తోటలో ఈలపాట వినోదంగా పాడుకుంటూ సంచరిస్తూ ఉన్నట్లుగా….,
- ఈ లోకములు నాయందే ఉన్నాయి - అని పాడుకుంటున్నాను.
- ఈ లోకములలో నేను వినోదముగా సంచరిస్తూ పాడుకుంటున్నాను.
- ఇందు దృశ్య-ద్రష్టత్వములు కల్పించుకొని స్వీయగానముగా నేనే పాడుచూ, నా పాటను నేనే వింటూ ఆనందంగా వినోదిస్తున్నాను.

అహమస్మి ప్రమజా ఋతా ఉ అస్య! ఈ లోక కల్పనలన్నిటికీ మునుముందుగానే ‘ఆత్మ’గా ఉనికి కలిగి ఉన్నవాడను! ఈ సర్వమునకు ప్రప్రథమంగా ఉన్నవాడను. నేనుంటేనే కల్పనలు! అంతేగాని నేను కల్పనలలో ఒక విషయమును కాదు. సర్వమునకు ప్రప్రధముడను! నేను మునుముందుగా ఉండి ఉండటం చేతనే ‘‘కల్పన - మాయ; లోక - లోకాంతరములు; జన్మ - జన్మాంతరములు -’’ ఇవన్నీ భావనా చమత్కారంగా వెలయుచున్నాయి.

పూర్వేదేవేభ్యో అమృతస్య నా 3భా। 3యి! ఓహో। ఆహా"। ఊహూ। దేవతలకు కూడా మునుముందే లోకములన్నిటికీ జనన స్థానమై నాభిప్రదేశమై ఉన్నట్టి ఆత్మను! అమృత స్వరూపుడను! సర్వదా యథాతథ స్వరూపుడను! ఆత్మనుండే దేవతలు, ఆ దేవతలచే నిర్మించబడే భౌతిక లోకములు, మనోలోకములు.. ఇవన్నీ జనించి, స్థితించి,.. ఆత్మ యందే లయిస్తున్నాయి. నేను సహజంగా, స్వభావంగా ఆత్మస్వరూపుడను!

యో మా దదాతి, స ఇవేవ మా(ఉ) వాః। - ఈ లోకాలన్నీ ఎవ్వరు ప్రసాదిస్తున్నారో ఆ పరమాత్మ జీవాత్మనగు నాకు సర్వగా రక్షకుడు!
- ఏ పరమాత్మ నుండి ఈ జీవాత్మ జనించి రక్షించబడుచున్నడో,.. అది నా ఆత్మస్వరూపమే!

నేనే పరమాత్మగా రక్షకుడను! జీవాత్మగా పరిపోషించబడి, రక్షించబడువాడను! సమస్త లోకములు నాకు ఆహారము! ఇదమ్ అహమ్! ఇదమ్ అన్నమ్। అహమ్ అన్నాదమ్! ఈ లోకములను కల్పించుకొని ఆస్వాదిస్తున్నవాడిని నేనే!
- అహమన్నమ్। అహమన్నమ్। అనుభవించబడువాడను!
- ఆ పరమాత్మకు నేను ఆస్వాదించబడు వస్తువును! నన్ను కల్పించుకొని ఆస్వాదిస్తూ, వినోదిస్తూ, భక్షిస్తూ ఉన్నారు.

అందుచేత పరమాత్మకు జీవాత్మగా నేను - అహమన్నమ్! అహమన్నమ్! అహమన్నమ్। అహమన్నాదమ్।
హమ్ - అ। అహమ్। నమః। మనః।

అహమ్ అదన్తమాద్మి

పరమాత్మగా… జీవాత్మను - లోకములను భక్షించువాడను.

అహమన్నమ్ - I am one who is being experienced and enjoyed.

అహమన్నాదమ్ - One who is experiencing and enjoying.

జీవాత్మగా - పరమాత్మగా కూడా నేను ‘‘అన్నమన్నాదుడను।’’

అహమ్ విశ్వం భువనమభ్య భవా3మ్।।
ఈ లోకాలన్నీ జయించి ఆత్మనగు నాయందు ఏకరూపముగా లయింపజేయుచున్నవాడను! లోకములను తిరస్కరించి లోక - అలోకేశ్వరుడై ప్రకాశించుచున్నాను.
ఈ లోకములలో సర్వే సర్వత్రా జ్యోతిస్వరూపుడనై వెలుగొందువాడను!

జ్యోతిస్వరూపుడనగు నా వెలుగులో వెలుగు రూపంగా ఈ లోకములన్నీ సర్వదా వెలుగొందుచున్నాయి.
అహమ్ సువర్ణ జ్యోతిః। - నేను అఖండ - చిదాత్మ సువర్ణ జ్యోతిని।

ఈ విధంగా తననున తాను ఎరిగినప్పుడు - ఈ జీవుడు ఆత్మజ్యోతి స్వరూపుడై, ఈ లోకములన్నీ తన యందు ఆనందరూపముగా కలిగి ఉండి ప్రేమ-ఆనంద-కేవల-అఖండ-అప్రమేయ నిత్య-సత్య ఆత్మజ్యోతి స్వరూపుడై వెలుగొందుచున్నాడు. రాధ్యతే విద్యుతి మానవాన్ భవతి।।

తాను ఈ సమస్తమునందు ఆత్మానంద స్వరూపుడై విహరిస్తున్నాడు.

య ఏవం వేద ఏకం చ।। ఆతనికి సమస్తము ఏకస్వరూపమై సిద్ధిస్తోంది.

ఇత్యుపనిషత్

ఓం సహనా వవతు। సహ నౌ భునక్తు
సహ వీర్యంకరవావహై। తేజస్వి నా వధీమస్తు మా విద్విషావహై।



🙏 ఇతి తైత్తిరీయ ఉపనిషత్ ‌🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।