[[@YHRK]] [[@Spiritual]]

Darsana Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


సామవేదాంతర్గత

6     దర్శనోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


అష్టాంగ యోగ దర్శనము

శ్లో।। ‘‘యమ’’ - ఆది అష్టాంగ యోగేద్ధం (యోగా ఇద్ధం)
బ్రహ్మమాత్ర ప్రబోధితః
యోగినో యత్ పదం యాంతి,
తత్ ‘‘కైవల్య పదం’’ భజే।।

‘‘కేవల బ్రహ్మము’’ గురించిన ప్రబోధమును సుసంపన్నము చేసుకొనటానికై ఏ ‘‘యమము-నియమము-ఆసనము- ప్రాణాయామము- ప్రత్యాహారము- ధారణ- ధ్యానము - సమాధి’’ అనబడే అష్ట (8) అంగముల సహాయంతో ప్రబోధితులై, యోగులు దేనిని ఆశ్రయిస్తూ ఉన్నారో, అట్టి వారి యొక్క పరమాశయమగు ‘‘కైవల్యపదమును’’ ఉపాసించుచున్నాము.

ప్రథమ ఖండము - యమము

1. ఓం। దత్తాత్రేయో మహాయోగీ
భగవాన్ భూతభావనః,
చతుర్భుజో మహావిష్ణుః
యోగ సామ్రాజ్య దీక్షితః।।
చతుర్భుజులగు మహావిష్ణు అవతారులు, (ఏ వెలుగులో లోకములన్నీ కనిపిస్తూ ఉన్నాయో - అట్టి) తేజోరూపులగు భగవానుడు, ఈ సమస్త భూత జగత్తును తనయొక్క భావనామాత్రముగా కలిగియున్నవారు, యోగసామ్రాజ్య దీక్షా సంపన్నులు - అగు శ్రీ దత్తాత్రేయ మహాయోగిన్, అవధూతన్ నమో నమః।। శ్రీ గురుదత్తాత్రేయ నమః జై గురుదత్తా।
తస్య శిష్యో మునివరః
సాంకృతిః నామ భక్తివాన్।
ప్రప్రచ్ఛ గురుం ఏకాంతే
ప్రాంజలిః వినయాన్వితః :-
శ్రీ దత్తాత్రేయ మహాయోగి యొక్క శిష్యులు - శ్రీ సాంకృతి మునివరులు. వారు భక్తి సంపన్నులు. యోగాభ్యా నిరతులు. అట్టి సాంకృతి మునివరులు ఒకరోజు ఏకాంతంగా దత్తాత్రేయ జగద్గురు, సద్గురు వరేణ్యుల వారిని సమీపించి, నమస్కరించి వినయ విధేయతలతో ఈ విధంగా ప్రశ్నించారు.
‘‘భగవన్! బ్రూహి మే యోగం సాష్టాంగం,
స ప్రపంచకమ్
యేన విజ్ఞాత మాత్రేణ జీవన్ ముక్తో
భవామి అహమ్।।
‘‘హే భగవన్! జగద్గురూ! అస్మత్ సద్గురుదేవా! దత్తాత్రేయ అవధూత మహాశయా! ఏది తెలుసుకొన్నంత మాత్రం చేత నేను జీవన్ముక్తుడను కాగలనో, అట్టి సువిస్తారమైన సప్రపంచకమైన ‘‘అష్టాంగ యోగములు’’ గురించి, ఈ ప్రపంచము యొక్క వాస్తవ రూపము గురించి బోధించ వలసినదిగా మిమ్ములను ప్రార్థిస్తున్నాను. అర్థిస్తున్నాను. శరణు వేడుచున్నాను.
2. దత్తాత్రేయ అవధూత ఉవాచ :-సాంకృతే!
శృణు, వక్ష్యామి యోగం స-అష్టాంగ దర్శనమ్।
యమశ్చ, నియమశ్చ ఏవ
తథా ఏవ ఆసనం ఏవ చ, ప్రాణాయామః,
తథా, బ్రహ్మన్! ప్రత్యాహారః తతః పరమ్
ధారణా చ తథా ధ్యానం, సమాధిః చ అష్టమం, మునే!
జగద్గురు అవధూత - త్రిమూర్త్యవతార - కరుణామయ శ్రీదత్తాత్రేయుల వారు :
హే బ్రహ్మన్। స్వయం పరబ్రహ్మ-ఆనందస్వరూపా! సాంకృతిమునీ! మీరు కోరినట్లు ‘‘అష్టాంగయోగ దర్శనము’’ను వివరించి చెప్పుచున్నాను. వినండి. యోగాభ్యాసమునకు అంగములు 8. (I) యమము, (II) నియమము, (III) ఆసనము, (IV) ప్రాణాయామము, (V) ప్రత్యాహారము, (VI) ధారణ, (VII) ధ్యానము, (VIII) సమాధి
Ⅰ. యమా దశ
అహింసా, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, దయ, ఆర్జవమ్,
క్షమా, ధృతిః, మితాహారః శౌచం చ
ఇతి ‘‘యమా దశ’’।।
యమా దశ (10): యమాంగ యోగము యొక్క (10) ఉపాంగముల గురించి వినండి.
(1) అహింస, (2) సత్యము, (3) అస్తేయము, (4) బ్రహ్మచర్యము, (5) దయ, (6) ఆర్జవము, (7) క్షమ, (8) ధృతి, (9) మితాహారము, (10) శౌచము
(1) అహింస :-
వేద ఉక్తేన ప్రకారేణ వినా సత్యం,
తపోధన ! కాయేన మనసా వాచా
హింసా(స) ‘‘హింసా’’। న చ। అన్యథా।
(1) అహింస : హే తపోధనా! వేదములచే నియమించబడిన సందర్భములు కాకుండా, సత్యమార్గమును వదలి, మరింకేవిధంగానైనా కాయముచేతగాని, మనస్సుచేతగాని, వాక్కుచేతగాని, సహజీవులకు బాధ కలిగించడమే హింస. ఇది లోకరీతి (లోకదృష్టి)
(వైదాంతికార్థము) →
‘‘ఆత్మా సర్వగతో అచ్ఛేద్యో
న గ్రాహ్య ఇతి యా మతిః,
సా చ ‘‘అహింసా పరా’’ ప్రోక్తా,
మునే। వేదాంత వేధిభిః।।
పారమార్ధికంగా : ‘‘పరమాత్మ నాకు కనబడుచున్న సమస్త దేహములలో సర్వగతుడై ఉన్నారు. ఆయన వేరువేరుగా అవటములేదు. అచ్ఛేద్యుడు, మనోవాక్కులకు అందనివారు (అగ్రాహ్యుడు). సర్వాత్మకుడుగు ఆయన నాకు సర్వరూపములుగా ఆత్మీయుడై ప్రియమై ఉన్నారు’’ అను బుద్ధిని ఎల్లప్పుడు కలిగి యుండి, దర్శించటము పరాకాష్ఠయగు ‘అహింస’ - - అని వేదాంత వేద్యులచే సూత్రీకరించబడుతోందయ్యా!
(2) సత్యం :-
చక్షుః ఆది ఇంద్రియైః దృష్టం, శ్రుతం
ఘ్రాణం, మునీశ్వర! తస్యైవ ఉక్తిః
భవేత్ సత్యం। విప్ర! తత్ న అన్యథా భవేత్।।
‘‘సర్వం సత్యం పరంబ్రహ్మ। న చ అన్యత్’’। ఇతి యా మతిః,
తత్ చ సత్యం పరం ప్రోక్తం, వేదాంత జ్ఞాన పారగైః।।
(2) సత్యము : మునీశ్వరా! విప్రోత్తమా! ఈ కనులు మొదలైన ఇంద్రియములకు ఏదైతే కనిపిస్తోందో, వినిపిస్తోందో, వాసన చూడబడుచున్నదో, అదంతా కూడా లౌకికమైన ఉక్తికి ‘సత్యము’ అని, కళ్లకు కనబడనిదేమో - సత్యము కాదు - అని లోక రీతి. యుక్తితో కూడిన బుద్ధితో ఉన్నది ఉన్నట్లు దర్శించటమే సత్యము.
పరమార్థము: వేదాంత శాస్త్రపారగులచే - ఏ రీతిగా ‘‘పరబ్రహ్మమే సహజ - శాశ్వత సత్యము. తదితరమైనదిగా అన్పించటమనేదంతా సందర్భమాత్ర సత్యము’’ అని సిద్ధాంతీకరించబడుచున్నదో, అట్టి బుద్ధియొక్క విచారణయే సత్యము. ‘‘ఇదంతా పరబ్రహ్మస్వరూపమే’’-అనునది సత్యము. అటువంటి మతి (బుద్ధి) కలిగి ఉండటమే ‘సత్యము’గా చెప్పబడుతోంది.
(3) అస్తేయం :-
అన్యదీయే తృణే రత్నే,
కాంచనే మౌక్తికే - అపి చ,
మనసా వినివృత్తిః యా, తత్ ‘అస్తేయం’ విదుః బుధాః।
ఆత్మని - అనాత్మ భావేన వ్యవహార వివర్జితమ్,
యత్ తత్ అస్తేయం ఇతి ఉక్తం
ఆత్మవిద్భిః, మహామతే!
(3) అస్తేయము (దొంగబుద్ధి లేకుండటం) : తనది కానట్టిదేదైనా కూడా - గడ్డియందు, రత్నమునందు, బంగారమునందు, ముత్యమునందైనా కూడా - అద్దాని పట్ల మనస్సులో కించిత్ కూడా ఆశ లేకుండుటమే ‘అస్తేయము’ అని బుధుల (విజ్ఞుల) నిర్వచనము. ఇది లోకరీతి.
పారమార్థికంగా : ఆత్మయందు ఆత్మభావన లేకుండటము, ఆత్మ విచారణను (తత్త్వవిచారణను) ఏమరచి ఉండటమే ‘స్తేయము’ (దొంగబుద్ది); ‘‘ఆత్మ విద్య, ఆత్మభావన’’ అభ్యాసముగా కలిగి ఉండటమే ‘అస్తేయము’ అని మహామతులగు ఆత్మతత్త్వజ్ఞులు చెప్పుచున్నారు. సమస్తము పరమాత్మకు చెందినదిగా భావించటమే ‘అస్తేయము’. ‘సమస్తము ఆత్మయే’ అను భావనను ఆశ్రయించి అన్యమగు అనాత్మభావన త్యజించి ఉండటము.
(4) బ్రహ్మచర్యము:-
లోక సంబంధమైన అర్థము
3. కాయేన మనసా వాచా స్త్రీణాం
పరి వివర్జనమ్, ఋతౌ భార్యాం తదా,
తస్య బ్రహ్మచర్యం తత్ ఉచ్యతే।।
బ్రహ్మ భావే మనశ్చ ఆరం (ఆచరం) బ్రహ్మచర్యం,
పరంతప!
(4) బ్రహ్మచర్యము: ఓ పరంతపా! మనసా వాచా కర్మణా స్త్రీ - పురుష శృంగార (బాహ్య) సంబంధములను కలిగి ఉండకపోవటం, ఋతుకూల శాస్త్ర నియమానుసారము జీవిత భాగస్వామితో మాత్రమే శృంగారము - ఇది ‘బ్రహ్మచర్యము’గా (లోకరీతిగా) చెప్పబడుతోంది.
ఆధ్యాత్మికోద్దేశ్యము: బ్రహ్మచర్యము అనగా….
మనస్సును అనునిత్యముగా ‘బ్రహ్మభావన’ యందు నియమించటమే ‘‘బ్రహ్మచర్యము’’. బ్రహ్మమునందు ఆచరణయే (బ్రహ్మభావన యందు మనస్సు ఆచరణ కలిగి ఉండటమే) - బ్రహ్మచర్యము.
(5) దయ :-
స్వ-ఆత్మవత్ సర్వభూతేషు కాయేన మనసా గిరా,
అనుజ్ఞాయా దయా, స ఏవ ప్రోక్తా వేదాంతవేదిభిః।
(5) దయ- ఇతరులపట్ల స్వాభావికమైన ప్రేమ, కరుణ కలిగి ఉండటము. సర్వజీవులను తనయందు తాను వలె, తనకు అయినవారి యందు వలె, ‘‘నావంటివారేకదా’’…అను భావనను త్రికరణ శుద్ధిగా (మనసా, వాచా, కర్మణా) కలిగియుండటమును ‘దయ’ అని వేదాంత విదుల ఆప్తవాక్యము. తన ఆప్తస్వరూపమును తాను వలె తదితరులను కూడా (తన ఆత్మగా) దర్శించటమే దయ. స్వస్వరూపాత్మయే సర్వత్రా విస్తరించి ఉన్న తత్-భావన.
(6) ఆర్జవము :-
పుత్రే మిత్రే కళత్రే చ రిపౌ స్వ-ఆత్మని సంతతమ్,
ఏకరూపం, మునే! యత్ తత్ ‘‘ఆర్జవం’’ ప్రోచ్యతే మయా!
(6) ఆర్జవము - పుత్ర - మిత్ర - కళత్ర - శత్రు మొదలైన సర్వజనులందు ‘‘నావారు - కాని వారు’’ అనే భేదము లేకుండా, సమభావనను కలిగియుండి, స్వాత్మవలె ఆత్మదర్శనము చేయుటము - ఆర్జవము. ‘‘అందరు నావంటివారే నావారే’’ అను భావనయే ఆర్జవము.
(7) క్షమ :-
కాయేన మనసా వాచా శత్రుభిః పరిపీడితే,
బుద్ధి క్షోభ నివృత్తిః యా, ‘క్షమా’ సా, మునిపుంగవ!
(7) క్షమ - ఓ మునిపుంగవా! శత్రువులచేత తన మనో-వాక్- కాయములు పరిపీడించుచున్నప్పుడు కూడా, బుద్ధి నిర్మలముగా ‘ఆత్మభావన’ను వీడకపోవటము ‘‘క్షమ’’! ఓర్పు, క్షమించు గుణము కలిగి ఉండటము
(8) ధృతి :-
‘‘వేదాత్ ఏవ వినిర్మోక్షః
సంసారస్య, న చ అన్యథా’’, - ఇతి విజ్ఞాన
నిష్పత్తిః ‘‘ధృతిః’’ ప్రోక్తా హి వైదికైః।।
(8) ధృతి - సంసార దోషము భయ - దుఃఖ జనకము. అందుకు ఉపాయం దృశ్య ప్రపంచంలో ఏదో లభించటము కానేకాదు. వేద - ఉపనిషత్ సేవ - అధ్యయనములే సంసార జ్వరమునకు ‘‘ఔషధము’’ - అని ఎరిగి వైదికమైన ఉపాయములను ఆశ్రయించటమే ‘‘ధృతి’’. ఈ దృశ్యము యొక్క వాస్తవ స్వరూపమేమిటో - ఎరుగు ప్రయత్నము ‘ధృతి’.
(9) మితాహారము:-
అల్పమృష్ట అశనాభ్యాం చ, ‘‘చతుర్థ అంశ అవశేషకమ్’’
తస్మాత్ యోగ అనుగుణ్యేచ భోజనం
‘‘మితభోజనమ్’’।।
(9) మితాహారము- (1) అల్పాహారి అయి, ‘‘2 వంతులు స్థూలాహారము, నాలుగవ వంతు జలము, శేషించిన నాలుగవవంతు’’-‘‘ఖాళీ’’ అను సూత్రముచే ‘‘చతుర్థాంశ-అవశేషకము’’ పాటించటము. (2) ‘యోగాభ్యాసము’నకు అనుకూలమై, కారము, ఉప్పు, ఆమ్లము తక్కువగాను, సాత్త్వికమగు పాలు మొదలైనవి అధికముగాను స్వీకరించటము - మితాహారము.
(10) శౌచము:-
స్వ దేహ మల నిర్మోక్షో మృత్, జలాభ్యాం, మహామునే!
యత్, తత్ శౌచం భవేత్ బాహ్యం
మానసం మననం విదుః। ‘‘అహం శుద్ధ’’ -
ఇతి జ్ఞానం ‘‘శౌచం’’ ఆహుః మనీషిణః।।
(10) శౌచము - ఓ మహామునీ! ఈ జీవుడు ఏవిధంగా అయితే భౌతికదేహమునకు అంటిన ధూళి - మట్టిని వదిలించుకోవటానికి శుభ్రమగు జలముతో ప్రతిరోజు పరిశుభ్రము చేసుకొంటున్నాడో….
అదే విధంగా- విషయముల గురించిన బాహ్యమననము వలన మనస్సుకు అంటిన మలమును తొలగించుకోవటానికి ‘‘అహం-తత్’’ జ్ఞానము అగు ‘‘శుద్ధాత్మ జ్ఞానము’’ ఆశ్రయించాలి। ఇదియే శౌచము.
అత్యంత మలినో ‘దేహో’। ‘దేహీ’ చ
అత్యంత నిర్మలః। ఉభయోః అంతరం
జ్ఞాత్వా, కస్య శౌచం విధీయతే?
అయితే….
ఈ ‘దేహము’ అత్యంత మలిన భూయిష్టమైనది. ‘దేహి’యో? అత్యంత నిర్మలుడు. మరి దోషము తొలగించేది దేనికి? ‘‘దేహము మాత్రమే నేను’’ - అను మననరూపమగు మనస్సుకే. ఎప్పుడైతే మనస్సు నిర్మలమై, ఈ జీవుని బుద్ధి ‘‘దేహము వేరు - దేహి వేరు’’ అనునది గ్రహిస్తుందో…ఇక ఆపై ‘శుచి’కి సంబంధించిన కార్యక్రమములు ఎవ్వరికి?
జ్ఞాన శౌచం పరిత్యజ్య, బాహ్యే
యో రమతే నరః, స మూఢః
కాంచనం త్యక్త్వా, లోష్టం గృహ్ణాతి - సువ్రత!!
జ్ఞాన - అమృతేన తృప్తస్య కృతకృత్యస్య యోగినః।
జనులు దేహశుభ్రత కొరకై ఎల్లప్పుడు ప్రయత్నశీలురౌతున్నారు. దుఃఖము (worry) తొలగుచున్నదా? లేదు. ఏ నరుడైతే అజ్ఞాన నిర్మూలన రూపమగు ‘జ్ఞానశౌచము’నకు ప్రయత్నించకుండా, కేవలము ‘బాహ్యశుచి’ గురించియే నిమగ్నుడౌతాడో…అట్టివాడు బంగారమును వదలి మట్టిగడ్డను పట్టుకోవటము వంటిది. జ్ఞానశౌచముచే యోగి జ్ఞానామృతమును సిద్ధింపచేసుకొన్నవాడై ‘కృతకృత్యుడు’ అగుచున్నాడు.
న చ అస్తి కించిత్ కర్తవ్యం।
అస్తి చేత్, న స తత్త్వవిత్।
లోకత్రయే అపి కర్తవ్యం కించిత్
నాస్తి ఆత్మ వేదివామ్।
తస్మాత్ - సర్వ ప్రయత్నేన, మునే! అహింస
ఆది సాధనైః, -
ఆత్మానమ్ ‘‘అక్షరం బ్రహ్మ’’
విద్ధి, జ్ఞానాత్ తు వేదనాత్। ఇతి।।
నాటకంలో నటిస్తున్న నటునికి ‘‘దీనికి నేను కర్తను. దీనికి భోక్తను’’ అనునదేమీ ఉండదు కదా! తత్త్వవేత్త స్వకీయ దేహ వ్యవహారములతో సహా ఈ సమస్తమును ‘జగన్నాటకము’గా దర్శిస్తూ ఉంటారు.
తత్త్వవేత్తకు కర్తవ్య భోక్తవ్యాలు ఉండవు. ఒకవేళ ‘నేను కర్తను’, ‘నేను భోక్తను’ అనునదేదైనా ఉండి ఉంటే, అట్టివాడు ‘‘తత్త్వవేత్త’’ అని అనిపించుకోడు.
ఆత్మజ్ఞాని ‘‘త్రిలోకమును నాటకీయ సంప్రదర్శనముగా ఎరిగి ఉండటం చేత - ఆతనికి త్రిలోకములలో కర్తవ్యమంటూ ఏదీ ఉండదు. అందుచేత సర్వ ప్రయత్నములచే అహింస మొదలైన ‘యమాదశ’ను అభ్యసించాలి. తత్ఫలితంగా అకర్తృత్వ - ఆత్మభావన సిద్ధించగలదు.
‘‘స్వస్వరూపమగు ఆత్మ ‘అక్షరము’. అదియే బ్రహ్మము. తదితరంగా తెలియబడేదంతా క్షరము, మృతము. మార్పు చెందునది’’ - అని గమనించుచుండెదరుగాక!

ద్వితీయ ఖండము - నియమము

1. ఓం। తపః, సంతోషం, అస్తిక్యం, దానమ్, ఈశ్వరపూజనమ్,
సిద్ధాంతశ్రవణం, చ ఏవ హ్రీః, మతిః చ (మతిశ్చ)
జపో, వ్రతమ్। ఏతే చ నియమాః (దశ–10)
ప్రోక్తాః। తాని వక్ష్యామి క్రమాత్। శృణు!
నియమము : (1) తపస్సు, (2) సంతోషము, (3) అస్తిక్యము, (4) దానము, (5) ఈశ్వరపూజనము, (6) సిద్ధాంత శ్రవణము, (7) హ్రీ (లజ్జ), (8) మతి, (9) జపము, (10) వ్రతము
ఈ ‘10’ నియమము యొక్క అంగములు. వీటిని వివరించుకుందాము.
(i) తపస్సు : వేద ఉక్తేన ప్రకారేణ కృత్ చ
‘చాంద్రాయణ’ ఆదిభిః, శరీర
శోషణం యత్ తత్ ‘‘తప’’ ఇతి ఇచ్యతే బుథైః।।
‘‘కోవా మోక్షః? కథం తేన సంసారం
ప్రతిపన్నవాన్?’’ - ఇతి ఆలోచనం
అర్థజ్ఞాః ‘‘తపః’’ శంసంతి పండితాః।।
(i) తపస్సు : వేదములు ప్రవచించి నియమించు ‘చాంద్రాయణము’ (తిథి-వార ఉపవాసములు, పవిత్రక్షేత్ర దర్శనములు, తదితర నియమ-నిష్ఠలు మొదలైన విధములుగా శరీరమును శోషింపజేయటమును బుధులు ‘తపస్సు’ అని చెప్పుచున్నారు.
‘‘మోక్షము’’ : అనగా ఏమి? దేనిచేత సంసారము కలుగుచున్నది? ఏ మార్గాన్వేషణ, సాధన, ధారణలచే తొలగుతుంది?’’ ఇటువంటి ఆలోచన, విచారణ, అర్థజ్ఞానము - ఇదియే ‘తపస్సు’ - అని నిత్యానిత్యా వివేకులగు పండితుల అభిప్రాయము.
(ii) సంతోషము : యదృచ్ఛా లాభతో నిత్యం
ప్రీతిః యా జాయతే నృణామ్,
తత్ ‘‘సంతోషం’’ విదుః ప్రాజ్ఞాః
పరిజ్ఞాన ఏక తత్పరాః।।
బ్రహ్మ - ఆది లోక పర్యంతాత్
విరక్త్యా యత్ లభేత్ ప్రియమ్,
సర్వత్ర విగత స్నేహః
‘‘సంతోషం’’ పరమం విదుః।।
(ii) సంతోషము : ఏది ఎంతవరకు యాదృచ్ఛికంగా (అప్రయత్నంగా, ముందుగా కోరుకోకుండానే) లభిస్తే, దానితో అనునిత్యము ప్రీతి పొందుతూ (well satisfied) ఉండటమే సంతోషము - అనబడుచున్నది. ఇది ప్రాజ్ఞులగు పరిజ్ఞాన తత్పరుల ప్రవచనము.
బ్రహ్మలోకమునుండి పాతాళలోకము వరకు సర్వత్రా విరక్తి చేతను, సర్వత్రా విరాగ-విగత స్నేహము చేతను - ఏర్పడే సంతోషమే ‘‘పరమ సంతోషము’’ - అని విజ్ఞుల, ప్రాజ్ఞుల, విదుషుల అభిప్రాయము.
(iii) ఆస్తిక్యము : శ్రౌతే స్మార్తే చ విశ్వాసో యత్
తదా ‘‘అస్తిక్యం’’ ఉచ్యతే।
(iii) ఆస్తిక్యము : శ్రుతులలో (వేదములో) చెప్పబడిన సంధ్యా వందనము మొదలైన శ్రౌతములందు, పితృకార్యములగు స్మార్తము మొదలైన శాస్త్రీయ కర్మల పట్ల విశ్వాసమే ఆస్తిక్యము.
(iv) దానము : న్యాయ ఆర్జిత ధనం శ్రాంతేః
శ్రద్ధయా వైదికే జనే, అన్యద్వా యత్ ప్రదీయంతే
తత్ ‘‘దానం’’ ప్రోచ్యతే మయా।।
(iv) దానము : శ్రమించి సంపాదించినది, న్యాయార్జితము - అయినట్టి ధనమును వైదిక జనులకు, తదితరులకు సమర్పించటమే దానము.
(v) ఈశ్వర పూజనము :
రాగాది అపేతం హృదయమ్
వాక్ దుష్ట, అనృతాదినా,
హింసా ఆది - రహితం కర్మ
యత్, తత్ ‘‘ఈశ్వర పూజనమ్’’।।
(v) ఈశ్వర పూజనము :
- రాగము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మొదలైనవి లేని హృదయము. స్వాభావికమైన ఆప్యాయతతో కూడిన హృదయస్పందనము,
- దుష్టము, దూషణము లేనట్టి వాక్కు (అనుద్వేగకరం వాక్యమ్, సత్యమ్, ప్రియం, హితమ్, స్వాధ్యాయం అభ్యాసనమ్ - చ)
- ఇతరులను బాధించనట్టి, హింసించనట్టి కర్మ నిర్వహణము.
ఇవన్నీ ఈశ్వర పూజనము.
(vi) వేదాంత శ్రవణము :
సత్యం జ్ఞానం అనంతం చ
పరానందం పరం ధ్రువమ్,
ప్రత్యక్ ఇతి అవగంతవ్యం
వేదాంతశ్రవణం బుధైః।
(vi) వేదాంత శ్రవణము / సిద్ధాంత శ్రవణము :
సత్య-జ్ఞాన-అనంత స్వరూపము, పరానందము, పరము, ధృవము అగు ప్రత్యాగాత్మ యొక్క శ్రవణ-మనన-అధ్యయనములు అవగాహనలు- ‘‘వేదాంత శ్రవణము’’.
(vii) హ్రీః! వేద లౌకిక మార్గేషు
కుత్సితం కర్మ యత్ భవేత్,
తస్మిన్ భవతి యా లజ్జా,
‘‘హ్రీః’’ సైవ (సఏవ) ఇతి ప్రకీర్తితా।।
(vii) హ్రీః: వేదము చెప్పు కర్మలకు, లోక శ్రేయమగు కర్మలకు- వ్యతిరేకమగు కర్మల పట్ల, దుష్ట-దుర్మార్గ-కుత్సిత కర్మలపట్ల - ‘‘చేయకూడదు కదా!’’ అను అనుసరణమే ‘లజ్జ’ (లేక) ‘హ్రీ’గా చెప్పబడుచున్నది.
(viii) మతి : వైదికేషు చ సర్వేషు
శ్రద్ధాయా సా ‘‘మతిః’’ భవేత్।।
(ix) జపము : గురుణా చ ఉపదిష్టో అపి
తత్ర సంబంధ వర్జితః
వేద ఉక్తేన ఏవ మార్గేణ
మంత్ర అభ్యాసో ‘‘జపః’’ స్మృతః।।
కల్ప సూత్రే, తథా వేదే,
ధర్మ శాస్త్రే పురాణకే,
ఇతిహాసే చ వృత్తిః యా
స జపః ప్రోచ్యతే మయా।।
(viii) మతి : వైదికములైన ఆచార, వ్యవహారములపట్ల, ఉపాసనా, అభ్యాసముల పట్ల శ్రద్ధ కలిగి ఉండటమే ‘మతి’ అగుచున్నది. ఏది ఎట్లా ఎందుకు , ఎంతవరకు ఎప్పుడు ఏ తీరుగా చేయాలో, గ్రహించాలో, త్యజించాలో అది ఎరిగి ఉండటమే ‘మతి’.
(ix) జపము-వేదోక్తముగా అయి ఉన్నట్టిదిగాని, గురువుచే ఉపదేశించ బడినది గాని-అయిన మార్గములో ‘మంత్రము’ యొక్క అభ్యాసమే జపము. (మనుస్మృతి, పారాశర్య స్మృతి మొదలైన) కల్పసూత్రములపట్ల, పురాణ ప్రవచన విశేషముల గురించి, ఇతిహాసముల గురించి- వేదోక్తంగా ‘‘పఠించాలి, అధ్యయనము చేయాలి’’ అనురూపముగల ముముక్షువు యొక్క వృత్తియే ఆధ్యాత్మికమైన ‘జపము’ - అగుచున్నది.
జపస్తు ద్వి విధః ప్రోక్తో :-
‘‘వాచకో’ ‘‘మానసః’’ తథా।।
వాచికా ఉపాంశుః ఉచ్ఛైః -:
ద్వివిధః పరికీర్తితః। మానసో మనన
ధ్యానభేదాత్ ద్వైవిధ్యం ఆశ్రితః
ఉచ్ఛైః జపాత్ ఉపాంశుశ్చ సహస్ర గుణ ఉచ్యతే।।
(x) వ్రతము, జపము, శ్రద్ధాభక్తులతో చేయు నియమము → ‘‘వ్రతము’’:-జపము రెండు విధములైనవి. (1) వాచకము (2) మానసికము
వాచక జపము (రెండు విధములు) 1. రహస్యముగా చేయు జపము (Closely within), 2. ఉచ్ఛ స్వరముతో ఎలుగెత్తి పలకటము. (Loudly, Spenly)
మానస జపము - రెండు రీతులు. (1) మననము (2) ధ్యానము
పదిమందికి తెలిసేటట్లుగా, గట్టిగా ఎలుగెత్తి చేయు జపము కంటే కూడా ‘రహస్యము’గా చేయు జపము వేయిరెట్లు అధికమైనది.
మానసశ్చ తథా ఉపాంశో
సహస్రగుణ ఉచ్యతే।
ఉచ్ఛైః జపశ్చ సర్వేషాం
యథోక్త ఫలదో భవేత్।
రహస్య జపము కంటే కూడా మానసిక జపము ఇంకా వెయ్యిరెట్లు ఉత్తమము. కొంతమంది కలిసి ఎలుగెత్తి (భజనగా) చేయునది ఉత్తమోత్తమము. (గురువు వద్ద శిష్యులు నేర్చుకొనుచున్నప్పుడు) పెద్దగా పలుకుతూ చెప్పుకున్న మంత్రము యధోక్తమైన (చెప్పబడిన ఉత్తమ) ఫలము ప్రసాదించగలదు.
నీచైః శ్రోత్రేణ చేత్
మంత్రః శ్రుతశ్చేత్
నిష్ఫలం, భవేత్। ఇతి।।
సరిగ్గా వినకుండా, దైనందికము (కాలనియమము - Regularity) పాటించకుండా చేయు మంత్రము నిష్పలము కాగలదు. చిన్నగా విని -చిన్నగా (poorly attentive) నేర్చుకొను మంత్రము నిష్ఫలము కాగలదు. ఉత్తమ ప్రయోజనము లభించదు.

తృతీయ ఖండము - ఆసనము

1. స్వస్తికం గోముఖం పద్మం వీరం సింహాసనం తథా।
భద్రం ముక్తాసనం చ ఏవ, మయూరాసనం
ఏవ చ, సుఖాసన సమాఖ్యం చ నవమం,
ముని పుంగవ।
ఆసనము
ఓ సాంకృతి మునిపుంగవా! ఇప్పటివరకు మనము యమము, నియమమముల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడిక ‘‘ఆసనము’’ గురించి వివరించుకుందాము. ముఖ్యముగా ‘9’ ఆసనములు (1) స్వస్తిక, (2) గోముఖ, (3) పద్మ, (4) వీర, (5) సింహ, (6) భద్ర, (7) ముక్త, (8) మయూర, (9) సుఖ..
1. స్వస్తికాసనము :
జాను ఊర్వోః అంతరే కృత్వా సమ్యక్ పాదతలే ఉభే,
సమగ్రీవ శిరః కాయః ‘‘స్వస్తికం’’ నిత్యం అభ్యసేత్।
(1) స్వస్తికాసనము : రెండు మోకాళ్ళను మడచి పాదముల చివరలను పిక్కలను తొడల మధ్యగా ఆనించి ఉంచి, రెండు పాదముల చివరలను సమస్థితిలో ఉంచి కంఠమును శిరస్సును నిఠారుగా ధారణ చేయటము- ‘‘స్వస్తికము’’.ఈ స్వస్తికాసనమును యోగాభ్యాసి నిత్యము అభ్యసించవచ్చును.
2. గోముఖాసనము :
సవ్యే దక్షిణ గుల్ఫంతు పుష్ఠ పార్శ్వే నియోజయేత్,
దక్షిణే అపి తథా సవ్యం ‘‘గోముఖం’’ తత్ ప్రచక్షతే।
(2) గోముఖాసనము : ఎడమవైపు పుష్ఠ పార్శ్వమునకు కుడి చీలమండలమును, కుడివైపు పుష్ఠ పార్శ్వమును ఎడమ చీలిమండలమును తాకిస్తూ ధారణ చేయటము - ఇది గోముఖాసనము.
3. పద్మాసనము :
అంగుష్ఠ అవధి గృహీణాయాత్ హస్తా భ్యాం వ్యుత్క్రమేణ తు,
ఊర్వోః ఉపరి, విప్రేంద్ర! కృత్వా పాదతలద్వయమ్, ‘‘పద్మాసనం’’
భవేత్, ప్రాజ్ఞ! సర్వరోగ భయాపహమ్।।
(3) పద్మాసనము : ఓ ప్రాజ్ఞా! రెండు తొడలపై రెండు పాదములను ఇటు అటుగా ఉత్క్రమణముగా (పైకి లేపి) ఉంచి రెండు కాళ్ళ బొటనవ్రేళ్ళను రెండు చేతులతో పట్టుకొని ఉండటము. ఇది పద్మాసనము. ఈ పద్మాసనము సర్వ రోగ భయములను తొలగించివేయగలదు.
(4) వీరాసనము :
దక్షిణేతర పాదం తు దక్షిణ ఊరుణి విన్యసేత్,
ఋజుకాయః సమాసీనో ‘‘వీరాసనమ్’’ ఉదాహృతమ్,
(4) వీరాసనము : ఎడమ పాదము (దక్షిణేతర పాదము)ను (చీలి మండలమును) కుడి తొడపై (దక్షిణోరుణి) పై ఉంచి, శరీరమును కొంచెము వంచి ధారణ చేయుటము - వీరాసనము.
(5) సింహాసనము :
పార్శ్వ పాదౌ చ పాణిభ్యాం దృఢం బధ్వా సునిశ్చలమ్, (సింహాసనం?) భవేత్ ఏతత్ విషరోగ వినాశనమ్।।
(5) సింహాసనము : రెండు పాదముల పార్శ్వములను (Both side ends) రెండు చేతులతో దృఢముగా పట్టుకొని నిశ్చలముగా ఉండటము - (సింహాసనము?). ఇది విషరోగములను బాగుగా నశింపజేయగలదు.
(6) భద్రాసనము :
నిపీడ్య సీవనీం సూక్ష్మాం దక్షిణ ఇతర గుల్ఫతః,
వామం యామ్యేన గుల్ఫేన (‘‘భద్రాసనామ్’’?) ఇదం భవేత్।।
(7) ముక్తాసనము :
మేఢ్రాత్ ఉపరి నిక్షిప్య సవ్యం గుల్ఫం తత ఉపరి, గుల్ఫాంతరం చ సంక్షిప్య ‘‘ముక్తాసనం’’ ఇదం, మునే!,
(6) భద్రాసనము : కుడి, చీల మండలముతో ఎడమ సీవనీ ప్రదేశమును, ఎడమ చీలి మండలముతో కుడి సీవనీ ప్రదేశమును తాకించటమే (‘భద్రాసనము’?).
(7) ముక్తాసనము : ఎడమ గుల్ఫము (మడమ)ను మేధ్ర (గుదస్థానము) పై తాకి ఉంచి, రెండవ మడమను ముడిచి ఉంచటము.
(8) మయూరాసనము :
కూర్పరాగ్రే మునిశ్రేష్ఠ! నిక్షిపేత్ నాభి
పార్శ్వయోః, భూమ్యాం పాణితలద్వంద్వం
నిక్షిప్య ఏకాగ్ర మానసః, సమున్నత
శిరః పాదో దండవత్ వ్యోమ్ని సంస్థితః
‘‘మయూర’’ ఆసనం ఏతత్‌స్యాత్ సర్వ పాప ప్రణాశనమ్।
(8) మయూరాసనము : ఓ మునిశ్రేష్ఠా!
- బొడ్డుకు (నాభికి) ప్రక్కలుగా మోచేతి చివర్లను ఆనించి,
- భూమిపై రెండు అరచేతులను ఆనించి,
- పాదములు, శిరస్సు ఎత్తిపట్టి ఉంచి,
- మనస్సు ఏకాగ్రం చేసి, (ఆజ్ఞాచక్రముతో) ధారణ చేయుచుండటము ‘మయూరాసనము’.
ఈ మయూరాసనము సర్వపాపములను ప్రశమింపజేయగలదు.
(9) సుఖాసనము :
యేన కేన ప్రకారేణ
సుఖం ధైర్యం చ జాయతే, తత్ ‘‘సుఖాసనం’’
ఇతి ఉక్తమ శక్తః తత్ సమాశ్రయేత్।
(9) సుఖాసనము : ఏదో ఒక రీతిలో సుఖాసనము. ఏవిధంగా అయితే ధైర్యము - ఉత్సాహము కలుగుతాయో, ఓపిక కొనసాగుతుందో, అట్టి దేహానుకూల మైన ఆసనము (పద్మ - మయూర ఇత్యాది ఆసనము)లను శ్రమము సుఖాసనము. అద్దానిని సమాశ్రయించవచ్చు. శరీరమునకు దీర్ఘకాలము ధారణ చేయటానికి సానుకూల్యమైనదే - ‘సుఖాసనము’.
ఆసనం విజితం యేన,
జితం తేన జగత్రయమ్।।
అనేన విధినా యుక్తః
ప్రాణాయామం సదా కుర్వితి।
’స్వాభావికంగా సుదీర్ఘకాలము ఆసనము ధరించి ధ్యానించటము సుఖప్రదమనిపించటమే ఆసన జయము. ఆసన జయముచే త్రిజగత్తులు జయించినట్లే. సానుకూలమగు ఆసనము ధరించి ప్రాణాయామము నిర్విర్తించాలి. (ఆసన వివరములు ‘త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్’లో కూడా చెప్పబడ్డాయి).

చతుర్థ ఖండము - నాడీ సముదాయము

1. శరీరం తావత్ ఏవస్యాత్ షణ్ణవత్ (96)
అంగులాత్మకమ్। దేహ మధ్యే
శిఖి స్థానం తప్త జంబూనద ప్రభమ్।
త్రికోణం మనుజానాం తు సత్యం ఉక్తం హి, సాంకృతే!
గుదాత్తు ద్వ(య) (2) అంగులాత్ ఊర్థ్వం -
మేఢ్రాత్తు ద్వి (య) (2) అంగులాత్ అథః,
దేహమధ్యం విజానీ హి మనుష్యాణాం హి, సాంకృతే!
ఓ సాంకృతి మహాశయా!
ఈ భౌతిక శరీరము ‘96’ అంగుళముల ప్రమాణము. అట్టి ఈ దేహము మధ్యగా సర్వదేహములలో ‘శిఖిస్థానము’ (central zone). ఇది జంబూఫలము (నేరేడుపండు) రంగులో ప్రకాశమానమై ఉంటుంది. మానవులలో అది త్రికోణ ఆకారంలో ఉంటుంది. (అంగులము = బొటనవ్రేలు కణుపు నుండి పైవరకు-అనికూడా అర్థము).
గుదస్థానమునకు 2 అంగుళములు పై వైపుగాను, మేఢ్రమునకు (పొత్తికడుపుకు) 2 అంగుళముల క్రిందుగాను దేహమధ్యగా మానవులలో ఈ శిఖిస్థానము ఉంటుంది.
కంద స్థానం, మునిశ్రేష్ఠ! మూలాధారం
నవ (9) అంగులమ్, చతుః (4) అంగులం, ఆయామ
విస్తారం, మునిపుంగవ!, కుక్కుట
అండవత్ ఆకారం భూషితం తు
త్వక్ ఆదిభిః। తత్ మధ్యే ‘నాభిః’
ఇతి ఉక్తం యోగజ్ఞైః, మునిపుంగవ!
కంద మధ్య స్థితా నాడీ ‘‘సుషుమ్న’’
ఇతి ప్రకీర్తితా, - తిష్ఠంతి పరితః తస్య
నాడయో, మునిపుంగవ!
కంద స్థానం, మునిశ్రేష్ఠ! మూలాధారం
నవ (9) అంగులమ్, చతుః (4) అంగులం, ఆయామ
విస్తారం, మునిపుంగవ!, కుక్కుట
అండవత్ ఆకారం భూషితం తు
త్వక్ ఆదిభిః। తత్ మధ్యే ‘నాభిః’
ఇతి ఉక్తం యోగజ్ఞైః, మునిపుంగవ!
కంద మధ్య స్థితా నాడీ ‘‘సుషుమ్న’’
ఇతి ప్రకీర్తితా, - తిష్ఠంతి పరితః తస్య
నాడయో, మునిపుంగవ!
ద్విసప్తతి సహస్రాణి 72000। - తాసాం ముఖ్యాః చతుర్దశ (14)
సుషుమ్నా పింగళా తద్వత్
ఇడా చైవ సరస్వతీ, పూషాచ వరుణా చ ఏవ,
హస్తిజిహ్వా, యశస్వినీ, ఆలంబుసా
కుహూః చ ఏవ విశ్వోదరీ తపస్వినీ,
శంఖినీ చ ఏవ గాన్థారా ఇతి ముఖ్యాః చతుర్దశ (14) ।।
కందము నుండి బయల్వెడలుచున్న 72000 నాడులలో 14 నాడులు అతి ముఖ్యమైనవి.
1. సుషుమ్న, 2. పింగళ, 3. ఇడ, 4. సరస్వతి, 5. పూష, 6. వరుణ, 7. హస్తిజిహ్వ, 8. యశస్విని, 9. అలంబుస, 10. కుహు, 11. విశ్వోదరి, 12. తపస్విని, 13. శంఖిని, 14. గాంధార (గాంధారి).
అసాం ముఖ్యతమాః తిస్రః(3)।
తిసృషు ఏకః (1) ఉత్తమోత్తమా। ‘‘బ్రహ్మవాడి’’
ఇతి సా ప్రోక్తా మునే! వేదాంతవేదిభిః।।
ఈ 14 నాడులలో అతి ముఖ్యమైనవి మూడు.
(1) సుషుమ్న, (2) ఇడ, (3) పింగళ. ఈ మూడింటిలో అత్యంత ప్రాముఖ్యమైనది - సుషుమ్ననాడి. ఇది శిరస్సుపైగల బ్రహ్మరంధ్రమువరకు విస్తరించి ఉండటంచేత ‘‘బ్రహ్మనాడి’’ అని వేదాంతవేత్తలచే పిలువబడుతోంది.
పృష్ఠ మధ్య స్థితేన ఆస్థా
వీణా దండేన, సువ్రత!
సహ మస్తక పర్యంతం - సుషుమ్నా సంప్రతిష్ఠితా।
ఓ సువ్రతా!
ఈ సుషుమ్ననాడి - పృష్ఠ మధ్యగా (వీపు మధ్యగా) వెన్నెముక వెంట వీణా దండము వలె ఉంటోంది.
మస్తకము (Foreface) వరకు సుషుమ్ననాడి ఆక్రమించుకొనినదై ఉన్నది.
నాభికందాత్ అధః స్థానం
కుండల్యాత్ ద్వి (ద్వయ) (2) అంగులం మునే!
‘‘అష్టప్రకృతి’’ రూపా సా కుండలీ మునిసత్తమ!
ఓ మునిసత్తమా!
నాభికందమునకు క్రింద స్థానములో చెవికుండలీఆకారంగా 2 అంగుళముల విస్తీర్ణముగా అష్టవిధప్రకృతి (సూక్ష్మపంచ భూత-మనో-బుద్ధి-చిత్తముల) రూపంగా ఒక మహత్తర శక్తి స్థానము కలిగి యున్నది. అదియే ‘కుండలినీ శక్తి’.
2. యథావత్ వాయు చేష్టాం చ
జల-అన్నాదీని నిత్యశః
పరితః కంద పార్శ్వేషు నిరుధ్య ఏవ సదా స్థితా।।
స్వముఖేన సమావేష్ట్య బ్రహ్మరంధ్ర ముఖం, మునే!
సుషుమ్నాయా ఇడా సవ్యే।
దక్షిణే పింగళా స్థితా।।
కందమునకు ప్రక్కగా (పార్శ్వంగా) వాయుచేష్టలు, జల-అన్నములు మొదలైనవి ఏర్పడి ఉండి, కందముయొక్క అన్నివైపులా నిరోధించి (కప్పుకొని) ఉంటున్నాయి.
ఓ మునీ! సుషుమ్ననాడి తనయొక్క ముఖముతో శిరస్సుయొక్క ఊర్థ్వ ప్రదేశంలో గల బ్రహ్మరంధ్ర ముఖమును చుట్టి కప్పి ఉంటోంది.
సుషుమ్నకు ఎడమవైపుగా ఇడనాడి, కుడివైపుగా పింగళనాడి ఉండి ఉంటున్నాయి.
సరస్వతీ కుహూశ్చ ఏవ సుషుమ్నా
పార్శ్వయోః స్థితే। గాంధారే హస్తిజిహ్వా చ
ఇడాయాః పృష్ఠ పూర్వయోః।
సరస్వతీ నాడి, కహూనాడి సుషుమ్ననాడికి ఇరుప్రక్కలగా ఉంటున్నాయి.
గాంధారి, హస్తిజిహ్వ - అని పిలువబడుచున్ననాడులు ఇడానాడికి ముందు, వెనుకగా ఏర్పడినవై ఉన్నాయి.
పూషా యశస్వినీచైవ పింగళా పృష్ఠ పూర్వయోః।
కుహోశ్చ హస్తిజిహ్వాయా
మధ్యే విశ్వోదరీ స్థితా। యశస్విన్యాః
కుహోః మధ్యే వరుణా సుప్రతిష్ఠితా।।
పూషాయాశ్చ - సరస్వత్యా మధ్యే
ప్రోక్తా యశస్వినీ। గాంధారాయాః సరస్వత్యా
మధ్యే ప్రోక్తా చ శంఖినీ। అలంబుసా స్థితా
పాయు పర్యంతం కంద మధ్యగా।।
పూష, యశశ్వినీ నాడులు పింగళకు ముందు - వెనుకలుగా ఉంటున్నాయి. కుహూనాడి, హస్తిజిహ్వ నాడులకుమధ్యగా విశ్వోదరీ నాడి ఉన్నది. యశశ్విని - కుహు నాడులకుమధ్యగా వరుణనాడి ప్రతిష్ఠితము అయి ఉన్నది.
పూష - సరస్వతి నాడుల మధ్య యశస్వినీ నాడి. గాంధారి - సరస్వతీ నాడుల మధ్య శంఖినీ నాడి. అలంబుసనాడి కందమునకు మధ్యగతమై పాయువు (మలమూత్రవిసర్జన స్థానము) వరకు విస్తరించి ఉన్నది.
(కంద) పూర్వభాగే సుషుమ్నాయా రాకాయాః
సంస్థితా కుహూః। అధశ్చ-ఊర్థ్వం
స్థితా నాడీ యామ్య నాసాంతం ఇష్యతే
ఇడా తు సవ్య నాసాంతం సంస్థితా, ముని పుంగవ! యశస్వినీ చ వామస్య పాదాంగుష్ఠాంతమ్ ఇష్యతే।
కందభాగములో సుషుమ్న తాకుచూ కుహునాడి ఉన్నది. ఈ కుహునాడి పైపైన కుడి ముక్కుపుటం చిట్టచివరి వరకు విస్తారితమై యున్నది.
ఇడనాడి ముక్కు చివరి ఎడమ ముక్కు పుట చివరి వరకు విస్తరించినదై ఉన్నది. యశస్వినీనాడి ఎడమకాలు బొటనవేలు (వామస్య పాదాంగుష్ఠాంతమ్) విస్తరించి ఉన్నది.
పూషా వామాక్షి పర్యంతా, పింగళాయాస్తు పృష్ఠతః।
పయస్వినీ చ యామ్యస్య కర్ణాంతం
ప్రోచ్యతే బుథైః। సరస్వతీ తథా చ
ఊర్థ్వగా జిహ్వాంతం (సం) స్థితా, మునే!
పూషానాడి - పింగళకువెనుకగా - ఎడమకంటి చిట్ట చివరి వరకు ఏర్పడి ఉన్నది. పయస్వినీనాడి (ఎడమ) చెవియొక్క చివరివరకు వ్యాపించి ఉన్నదని యోగవేత్తల గమనిక.
సరస్వతీనాడి ఊర్థ్వంగా నాలుక చివ్వరి వరకు విస్తరించి ఉన్నది.
హస్తిజిహ్వా తథా సవ్య పాదాంగుష్ఠాంతమ్ ఇష్యతే।
శంఖినీ నామ యా నాడీ సవ్య కర్ణాంతమ్ ఇష్యతే।
గాంధారా సవ్య నేత్రాంతా ప్రోక్తా, వేదాంత
వేదిభిః। విశ్వోదరాభిదా నాడీ
కందమధ్యే వ్యవస్థితా।।
హస్తజిహ్వ సవ్య (కుడి) పాదపు బొటన వ్రేలు వరకు విస్తరించి ఉన్నది. శంఖినీ నాడి కుడి చెవి చివ్వరివరకు స్థానము కలిగి యున్నది.
గాంధారీనాడి ఎడమ కన్ను కొలకుల వరకు ఉన్నదని వేదజ్ఞుల సందర్శనానుభవము. విశ్వోధరనాడి కందప్రదేశము మధ్యగా వ్యవస్థితమై ఉన్నది.
3. ప్రాణో-అపానః తథా వ్యానః సమాన ఉదాన ఏవ చ,
నాగః కూర్మ కృకరో దేవదత్తో ధనంజయః, -
ఏతే నాడీషు సర్వాసు చరంతి దశ వాయవః।
తేషు ‘‘ప్రాణ’’ ఆదయః పంచ ముఖ్యాః పంచసు, సువ్రత!
ఓ సువ్రతా! మునీశ్వరా!
పంచప్రాణములు = ప్రాణ-అపాన వ్యాన - సమాన - ఉదానములు.
పంచ ఉపప్రాణములు = నాగ - కూర్మ - కృకర - దేవదత్త - ధనంజయ
ఈ పది వాయుచలనములు నాడులన్నిటిలో చరిస్తూ ఉంటున్నాయి. వీటిలో ముఖ్యమైనవి (పైన చెప్పిన) మొదటి పంచప్రాణములు
ప్రాణ సంజ్ఞః, తథా ఆపానః పూజ్యః,
‘‘ప్రాణః’’ తయోః మునే! ఆస్య నాసికయోః
మధ్యే నాభి మధ్యే తథా హృది -
ప్రాణసంజ్ఞో అనిలో నిత్యం వర్తతే, మునిసత్తమ!
అపానో వర్తతే నిత్యం -
గుద మేఢ్ర ఊరు జానుషు।
ఉదరే సకలే కట్యాం
నాభౌ జంఘే చ, సువ్రత! వ్యానః
శ్రోత్ర - అక్షి మధ్యే చ కుకుద్భ్యాం గుల్ఫయోః అపి।।
అట్టి పంచ ప్రాణములలో
(1) ప్రాణ, (2) అపానములు అత్యంత పూజ్యములు. యోగాభ్యాసమునకు ముఖ్య పరికరములు.
‘ప్రాణము’ మరికొంత ఆత్యంతికంగా పూజ్యము. అట్టి ప్రాణవాయువు నాశికామధ్య (ముక్కుకు మధ్య)గాను, హృదయమధ్యగాను ఎల్లప్పుడు సంచరించుచూ ఉన్నది.
అపానవాయువు → గుదము, మేఢ్రము (పొత్తికడుపు), తొడలు, జానువులు (మోకాళ్ళు) యందు సంచారము కలిగి ఉంటోంది.
వ్యానము : దేహమంతా సంచారము చేస్తోంది. పొట్టయందు, కటి ప్రదేశమునందు, నాభి (బొడ్డు)యందు, జంఘముల (పిక్కల)యందు, చెవులలోను కళ్ళలోను, మూపులయందు చీలమండలమునందు అంతటా సంచారము కలిగియున్నది.
ప్రాణస్థానే గళే చ ఏవ వర్తతే, మునిపుంగవ!
ఉదాన సంజ్ఞో విజ్ఞేయః పాదయోః హస్తయోః అపి।।
సమానః సర్వ దేహేషు వ్యాప్య తిష్ఠతి అసంశయః।
నాగాది వాయవః పంచ త్వక్ అస్థి-ఆదిషు సంస్థితాః।।
నిశ్వాస ఉచ్ఛ్వాసక ఆసాశ్చ ప్రాణకర్మ హి, సాంకృతే।
‘‘అపాన’’ ఆఖ్యస్య వాయోస్తు విణ్మూత్రాది విసర్జనమ్।।
ఉదానప్రాణము - కంఠము నందు, పాదములయందు, చేతులయందు ముఖ్య సంచారస్థానములు కలిగియున్నది.
సమానపానము - దేహమంతటా వ్యాపించి సంస్థితమైయున్నది.
నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము - అను పంచ ఉపప్రాణవాయువులు చర్మము, బొమికలు మొదలైనచోట్ల సంచార ప్రదేశముగా కలిగి ఉంటున్నాయి.
ఓ సాంకృతి మునీంద్రా! వాటి వాటి ధర్మముల గురించి వినండి.
ప్రాణవాయు ధర్మములు : ఉచ్ఛ్వాస - నిశ్వాస (ఊరి పీల్చుట - వదలుట)
అపానవాయువు నిర్వర్తించు ధర్మములు : మలమూత్ర విసర్జన కర్మలు.
‘సమానః’ సర్వ సామీప్యం కరోతి ముని పుంగవ!
ఉదాన ఊర్థ్వ గమనం కరోతి ఏవ। న సంశయః।।
వ్యానో వివాదకృత్ ప్రోక్తో మునే! - వేదాంత వేదిభిః।
ఉద్గారాది గుణః ప్రోక్తో, నాగాఖ్యస్య మహామునే!
ధనంజయస్య శోభాది కర్మ ప్రోక్తం హి,
సాంకృతే! ‘నిమీలన’ ఆది కూర్మస్య
క్షుథా తు కృకరస్య చ।।
దేవదత్తస్య, విప్రేంద్ర! తంద్రీ కర్మ ప్రకీర్తితమ్।।
ఓ మునిపుంగవా!
సమానవాయువు : శరీరములోని వివిధ భాగములను వాటివాటి ధర్మములను ఒకదానికి మరొకటి సమీప్యము, పరస్పర సంబంధితము చేస్తున్నది.
ఉదానము : ప్రాణవాయువుల ఊర్థ్వగమనములను నిర్వర్తించుచున్నది.
వ్యానవాయువు : శరీరభాగములను, వాటి వాటి ధర్మములను విడివిడిగా ఉంచుచున్నది. ఒకదానికి మరొకటి అవిరోధముగా సమవర్తింపజేస్తోంది.
నాగము : అవసరములు లేని / అవసరము తీరిన వాయువులను, పదార్థములను బయటకు త్రోయుచున్నది.
ధనంజయ ఉపప్రాణము : శరీరమును ఉత్తేతిజముగాను, శోభాయమానముగాను ఉంచుచున్నది.
కూర్మము : కనులు మూయుటకు, తెరచుటకు కారణమగుచున్నది.
కృకరము : ఆకలి - దప్పికల వ్యవహారము నిర్వర్తిస్తోంది.
ఓ విప్రేంద్రా!
దేవదత్తము : తంద్రీ (అలసట, కునికిపాట్లు) ధర్మమును ఇంద్రియముల విశ్రాంతిని పర్యవేక్షిస్తోంది.
సుషుమ్నాయాః శివో దేవ। ఇడాయా దేవతా
హరిః। పింగళాయా విరించిః స్యాత్। సరస్వత్యా
విరాట్, మునే। పూషా ‘‘ధీః’’ దేవతా ప్రోక్తా।
వరుణా వాయుదేవతా। హస్తిజిహ్వ అభిదాయాస్తు
వరుణో దేవతా భవేత్।।
యశస్విన్యా మునిశ్రేష్ఠ! భగవాన్ భాస్కరః తథా
అలంబుసా యా అంబాత్మా వరుణః పరికీర్తితః।।
కుహోః క్షుత్ దేవతా ప్రోక్తా। గాంధారీ చంద్ర
దేవతా। శంఖిన్యాః చంద్రమాః తత్‌వత్
పయస్విన్యాః ప్రజాపతిః।।
విశ్వోదర అభిధాయ అస్తు భగవాన్
పావకః పతిః। ఇడాయాం చంద్రమా
నిత్యం చరతి ఏవ, మహామునే!
నాడి - అధి దేవత
సుషుమ్ననాడికికి - శివుడు
ఇడనాడికి - హరి
పింగళనాడికి - బ్రహ్మదేవుడు
సరస్వతినాడికి - విరాట్టు
పూషనాడికి - బుద్ధిదేవత (బృహస్పతి)
వరుణనాడికి - వాయుదేవుడు
యశస్వినీనాడికి - భగవానుడగు భాస్కరుడు
ఆలంబుసకి-జగజ్జనని అగు ‘అంబ’ అంబాత్మయగు వరుణుడు.
కుహూనాడికి - క్షుత్‌దేవత (వైశ్వానరుడు)
గాంధారీనాడికి - చంద్రుడు
ప్రయస్వినీనాడికి - ప్రజాపతి
ఇంకా కూడా….
విశ్వోదరికి - పావకుడు - (అగ్నిదేవుడు)
ఇడనాడికి - చంద్రుడు / చంద్రమసదేవత
ఈ విధంగా ఆయానాడులలో వ్యక్తీకరణమగుచున్న దివ్యప్రజ్ఞులగు దేవతామూర్తులుగా యోగాభ్యాస సందర్భంగా ఉపాసించబడుచున్నారు. ఆయా దివ్యతత్త్వములకు ఈ విధంగా యోగవేత్తలు గుర్తించి ఉపాసనను సూచిస్తున్నారు.
పింగళాయాం రవిః తద్వత్, మునే!
వేదవిదాంవర! పింగళాయా ఇడాయాం తు
వాయోః సంక్రమణం తు యత్,
తత్ ‘‘ఉత్తరాయణం’’ ప్రోక్తం, మునే!
వేదాంత వేదిభిః।
మునీ! వేదవిదాంవర!
పింగళయందు రవి (సూర్యుడు) ఎల్లప్పుడు సంచారము చేస్తూ ఉంటారు. (సూర్యుడు = ప్రజ్ఞ / చైతన్యస్ఫూర్తి)
ఉత్తరాయణము : ‘పింగళ’ నుండి ‘ఇడ’కు వాయు సంక్రమణము - ‘ఉత్తరాయణము’ అని అనబడుతోంది.
ఇడాయాః పింగళా
యాంతు ప్రాణ సంక్రమణం, మునే!
‘‘దక్షిణాయనం’’ ఇతి ఉక్తం పింగళాయాం ఇతి శ్రుతిః।।
దక్షిణాయనము : ఇడ నుండి పింగళకు ప్రాణ సంక్రమణము ‘‘దక్షిణాయనము’’ అని వేదజ్ఞుల చేతను, శ్రుతుల చేతను చెప్పబడుతోంది.
(సంక్రమణము = వాయువు ఒకచోట ‘‘రేచకము’’ అయి, రెండవచోట ‘‘పూరకము’’ అవటము)
4. ఇడా పింగళయోః సంధిం యదా
ప్రాణః సమాగతః, ‘‘అమావాస్యా’’ తదా
ప్రోక్తా దేహే। దేహభృతాంవర!
అమావాస్య : దేహభృత పండితులలో శ్రేష్ఠుడా!
ప్రాణశక్తి ఇడ-పింగళల మధ్యగల ‘సంధి’ ప్రదేశములలో సమాగత మైనప్పుడు-అది ‘‘అమావాస్య’’ అనబడుచున్నది. అట్టి సందర్భములలో ఇడ - పింగళములలో వాయువు శోచనము (vacation) జరుగుతోంది.
మూలాధారం యదా ప్రాణః ప్రవిష్టః,
పండితోత్తమ! తత్ ‘‘ఆద్యం విషువమ్’’
ప్రోక్తం తాపసైః! తాపసోత్తమ!
ఆదివిషువము : ఓ తాపసోత్తమా!
ప్రాణశక్తి మూలాధారములో ప్రవేశించినప్పుడు అది ‘‘ఆదివిషువము’’ అని పండితోత్తములచే పిలువబడుతోంది. (విషువము=సంధ్యా సమయము. చీకటి-వెలుతురు రహితమగు స్థానము)
ప్రాణ సంజ్ఞో, మునిశ్రేష్ఠ! మూర్థానం
ప్రావిశత్ యదా, తత్ ‘‘అంత్యం విషువం’’
ప్రోక్తం తాపసైః, తత్త్వ చింతకైః।।
అంత్యవిషువము : ప్రాణశక్తి మూర్థము (foreface)లో ప్రవేశించినప్పుడు అది ‘‘అంత్యవిషువము’’ అని యోగశాస్త్రకోవిదులు అంటున్నారు.
(ఇడ, పింగళనాడులు రేచకము (Airlessness) పొందగా, మూర్థములో కుంభకము (Airful) జరుగు సందర్భము).
నిశ్వాస ఉచ్ఛ్వాసనం సర్వం మాసానాం
సంక్రమో (సంక్రమణో) భవేత్। ఇడాయా కుండలీస్థానం
యదా ప్రాణః సమాగతః,
‘‘సోమగ్రహణం’’ ఇతి ఉక్తం తదా, తత్త్వవిదాం వర!
ఉచ్ఛ్వాస - నిచ్ఛ్వాసులు ఈ దేహములోని మాస సంక్రమణములు.
ఓ తత్త్వావిదాంవరా!
ఇడ నుండి ప్రాణశక్తి కుండలినీ శక్తిని సమీపించటము, చేరటము ‘‘చంద్రగ్రహణము’’ అని తత్త్వవిదులచే అనబడుచున్నది.
యదా పింగళయా ప్రాణః కుండలి స్థానమ్
ఆగతః, తదా తదా భవేత్ ‘‘సూర్యగ్రహణం’’
మునిపుంగవ!
‘శ్రీ’ పర్వతం శిరఃస్థానే। కేదారంతు లలాటకే।
ప్రాణము పింగళనాడి నుండి కుండలినిని చేరటము ‘‘సూర్యగ్రహణము’’.
శిరస్సు - శ్రీ పర్వతస్థానము. (హిమాలయము)
లలాటస్థానము - ‘కేదారము’
అనబడు పుణ్యతీర్థము.
వారణాసీ, మహాప్రాజ్ఞ! భ్రువోః-ఘ్రాణస్య మధ్యమే।
కురుక్షేత్రం కుచస్థానే।
ప్రయాగం హృత్ సరోరుహే।।
చిదంబరం తు హృత్ మధ్యే। ఆధారే కమలాలయమ్!
ఆత్మతీర్థం సముత్సృజ్య
బహిః తీర్థానియో వ్రజేత్, -
‘‘కరస్థం, స మహారత్నం త్యక్త్వా కాచం’’
విమార్గ తే।।
హే మహాప్రాజ్ఞా! మహనీయులగు యోగవేత్తలు ఈ శరీరములోనే పుణ్య తీర్థములు సందర్శించి ఉపాసిస్తూ ఉంటున్నారు.
రెండుకనుబొమ్మల మధ్యగల భ్రూమధ్యస్థానమే వారణాసి.
కుచ స్థానము - కురుక్షేత్రము
హృదయపద్మము - ప్రయాగ
హృదయమధ్యయ్ - చిదంబరము.
ఆధారచక్రస్థానము - కమలాలయము
ఈ విధంగా ఈ దేహమే పుణ్యక్షేత్రములు ప్రత్యక్షమైయున్న స్థానము.
ఎవ్వడైతే ‘ఈ శరీర’ క్షేత్రము అను ఆత్మతీర్థమును వదలి బాహ్యమున దూరదూరంగా ఉన్న తీర్థ స్థలములను మాత్రమే ఆశ్రయిస్తాడో, అట్టివాడు చేతిలోని ఒకమహారత్నమును వదలి గాజుపూసలకై వెతకటంతో సమానము.
‘‘భావతీర్థం పరం తీర్థం
ప్రమాణం సర్వ కర్మసు।।
అన్యథా ఆలింగ్యతే కాంతా,
అన్యథా ఆలింగ్యతే సుతౌ।
సమస్తము ‘భావము’ యొక్క ఔన్నత్యమే. భావనా చమత్కారమే అగు భావతీర్థమే పరమ (గొప్పదగు) తీర్థము. అదియే సర్వకర్మలపట్ల ప్రమాణము.
ఇదంతా భావనాజగత్తే గాని భౌతికమాత్ర వస్తు జగత్తు కాదు. దృష్టాంతానికి - ఆలింగనము ఒకేతీరైనప్పటికీ, భార్యతో ఆలింగనము, కూతురుతో ఆలింగనము భావముచే వేరు వేరైనవికదా! ‘భావించటము’ అనునదే జగదనుభవము. మరింకొకటేదీ కాదు.
తీర్థాని తోయ పూర్ణాని।
దేవాన్ కాష్ఠాది నిర్మితాన్।
యోగినో న ప్రపద్యంతే
స్వ-ఆత్మ ప్రత్యయ కారణాత్।।
ఆత్మతత్త్వము స్వానుభావమగుచుండగా అట్టి యోగికి - తీర్థములన్నీ ఒకే జలముతో నిండియున్నవిగా అనిపిస్తాయి.
-దేవతా విగ్రహములన్నీ కొయ్య విగ్రహమాత్రములుగాను, స్వాత్మయే (స్వశరీరమ్) సమస్త పుణ్యక్షేత్రములకు తీర్థములకు నిలయముగాను భావిస్తాడు. ఆత్మయే పరమాత్మ కదా! ప్రత్యగాత్మతో తృప్తి కలిగి ఉంటాడు. స్వాత్మయే జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల సాక్షి అగు ప్రత్యగాత్మ।
5. బహిః తీర్థాత్ పరం తీర్థం అంతః
తీర్థం, మహామునే! ఆత్మతీర్థం మహా
తీర్థం। అన్యతీర్థం నిరర్థకమ్।।
ఓ మహామునీ! బాహ్యతీర్థములకన్నా (ఈ దేహముయొక్క) అంతర్ తీర్థములు పరము, మహత్తరము కూడా. బాహ్యతీర్థములన్నీ అంతర్-తీర్థప్రతీకలు। అంతరతీర్థములను పట్టించుకోకుండా బాహ్య తీర్థములకొరకై మాత్రమే పరుగులు తీయటము నిరర్థకము.
చిత్తం అంతర్గతం దుష్టం తీర్థస్నానైః
న శుద్ధ్యతి। శతశో అపి జలైః, ధౌతం,
సురాభాండం ఇవ అశుచిః।
ఆత్మ తీర్థము అనగా - (స్వశరీరములో ఆత్మస్థాన సందర్శనమే) సుమా!
సురాభాండమును (కల్లు / సారా గల కుండను) బయట వందసార్లు కడిగితే మాత్రం అది శుచి అవుతుందా? (లోపని అశుచి పోతుందా?) లేదు. అట్లాగే శరీరముతో తీర్థ స్నానములు చేసినంతమాత్రం చేత కూడా చిత్తము అంతర్గతంగా శుద్ధికాదు. శరీరములోని తీర్థములలో యోగాభ్యాసపూర్వకంగా బుద్ధితో మనస్సును ఆత్మసందర్శన-ఆనంద జలధిలో స్నానం చేయించాలి.
విషువాయన కాలేషు
గ్రహణే చ అంతరే సదా,
వారాణాసి - ఆదికే స్థానే స్నాత్వా శుద్ధో భవేత్ నరః। (కిం?)।
(పైన చెప్పినట్లుగా ఈ స్వశరీరములో వేంచేసియున్న కాల-తీర్థములైనట్టి)
- విషువాయన కాలములలోను (ఉదయ-సాయంకాల సంధ్యా సమయములలో), గ్రహణ సమయంలోను, ఆయన (ఉత్తరాయణ, దక్షిణాయన) పుణ్యకాలములలో - స్నానము చేయటంచేత ఈ మానవుడు ఆత్మశుద్ధుడు కాగలడు.
జ్ఞానయోగ పరాణాం తు
పాదప్రక్షాళితం జలమ్,
భావశుద్ధ్యర్థం అజ్ఞానాం
తత్ తీర్థం। మునిపుంగవ!
అయితే, వాస్తవానికి స్నానము చేయవలసిన అసలైన తీర్థము - ఆత్మయోగా పారాయణులున్న చోటే. వారి భావనా జలమే స్నానము చేయవలసిన జలము.
ఓ మునిపుంగవా! అజ్ఞానులకు ఆత్మజ్ఞానుల ఆత్మతత్త్వ ఉపదేశవాక్యములే కాళ్ళు కడిగే నీళ్ళు. భావశుద్ధియే పరిశుద్ధత. అందుచేత ఆత్మ జ్ఞానులే తీర్ధస్థానములు. వారిజ్ఞానవైభవ - వాక్యములే బుద్ధిని పరిశుభ్రపరచు జలముగా గ్రహించండి।
తీర్థే, దానే, జపే, యజ్ఞే, కాష్ఠే, పాషాణకే సదా,
శివం పశ్యతి మూఢాత్మా!
శివే దేహే ప్రతిష్ఠితే।।
ఓ మునిశ్రేష్ఠా! సర్వాత్మకుడగు శివుడు సర్వదా ఈ దేహమునందే సుప్రతిష్ఠితుడై ఉండగా, అది గమనించకుండా బాహ్యమున తీర్థ - దాన- జప - యజ్ఞ - కాష్ఠ-పాషాణ-దైవప్రతిమలను మాత్రమే ఆశ్రయించువాడు తెలివి తక్కువవాడే! అట్టివాడు మూఢాత్ముడే అగుచున్నాడు.
అంతస్థం మాం పరిత్యజ్య బహిష్ఠం యస్తు సేవతే,
హస్త స్థం పిండం ఉత్సృజ్య లిహేత్ కూర్పరం ఆత్మనః।।
(కూర్పరము = మోచేయి, మోకాలు
లిహేత్ = నాకటము)
సర్వదా హృదయాంతస్థుడై ‘కేవలాత్మాహమ్’ (Absolute-I) రూపమున ఉన్న శివ భగవానుని గుర్తించక, బాహ్యమున తీర్థములు మొదలైనవి సేవించువాడు - చేతిలోని మధురమగు రసాన్నమును వదలి, చెమటపట్టిన తన మోచేతి వెంట కొంచెముగా కారే చుక్కలను నాకటంతో సమానం.
శివం ఆత్మని పశ్యంతి
ప్రతిమాసు న యోగినః।
అజ్ఞానాం భావన అర్థాయ (భావనార్థాయ)
ప్రతిమాః పరికల్పితాః ।।
ఓ సాంకృతి మునీంద్రా!
యోగపుంగవులు తనయందు, సమస్త జీవులయందు వేంచేసియున్న (సర్వాత్మకుడగు) శివుని తమయందే దర్శిస్తూ ఉంటారు. అంతేగాని ప్రతిమయందో, మరెక్కడో కాదు.
మరి ప్రతిమలు ఎందుకు కల్పించబడ్డాయి? ఎందుకంటే, అజ్ఞానుల భావ పరిశుద్ధికొరకై మార్గదర్శకంగా సర్వజనులకు ఆత్మీయులగు (దివ్యతత్త్వజ్ఞులగు) మహనీయులచే మార్గదర్శకంగా పరికల్పించబడ్డాయి.
ప్రతిమలు అజ్ఞాన చీకటి దశలో అందించబడిన చేతికర్రవంటిది మాత్రమే।
అపూర్వం అపరం బ్రహ్మ
స్వ- ఆత్మానం సత్యం అద్వయమ్,
ప్రజ్ఞాన ఘనం ఆనందం
యః పశ్యతి - స పశ్యతి।।
✤ అపూర్వము (ఇప్పటికిప్పుడే ఉన్నది. అంతేగాని పూర్వమెప్పుడో మాత్రమే ఉన్నది కాదు).
✤ అపరము (తనకు వేరుకానట్టిది)
✤ బ్రహ్మము (మహత్తరము)
✤ స్వస్వరూపాత్మ రూపము, సత్యము, అద్వితీయము
✤ ఘనీభూతము. కేవల ప్రజ్ఞాస్వరూపము
అగు పరతత్త్వమును స్వశరీరమునందు దర్శించువాడే సరియగు దర్శనము కలవాడు.
నాడీపుంజం సదా సారం
నర భావం, మహామునే!
సమ్ ఉత్సృజ్య- ‘‘ఆత్మన ఆత్మానం అహమ్’’
ఇతి అవధారయ।।
ఓ మహామునీ! నాడీ సముదాయము ఎల్లప్పుడు అసారమే। అది ‘నేను శరీరమును’ అను భావనచే ‘‘నరములే నేను’’ అను నరభావము వదలదు. (ప్రాణాయామము మొదలైన వాటిచే నరభావము కొంత శేషించియే ఉంటుంది).
అట్టి భౌతిక భావనను మొదలంట్లా విడచివేసి ఆత్మతో ఆత్మను దర్శిస్తూ ‘‘ఆత్మాహమ్’’ భావనను అవధారణ చేయాలిసుమా।
అశరీరం శరీరేషు, మహాంతం, విభుం, ఈశ్వరమ్,
ఆనందం, అక్షరం, సాక్షాత్ మత్వా ధీరో న శోచతి।।
విభేద జనకే జ్ఞానే నష్టే జ్ఞాన
బలాత్, మునే! ఆత్మనో-బ్రహ్మణో భేదం
అనంతం కిం కరిష్యతి?
సమస్తము ‘తానే’ అయి ఉన్న పరమాత్మ సకలజీవుల స్వస్వరూపమై వెలుగొందుచున్నారు. స్వస్వరూపమగు ఆత్మ ఈ భౌతికశరీరములో ప్రత్యక్షముగా కనిపిస్తూ ఉన్నప్పటికీ, శరీరముగా అగుటలేదు. ఆత్మ ఈ భౌతికశరీరముకంటే కూడా మహత్తరమైనది. అట్టి పరబ్రహ్మమే సమస్తమునకు విభువు. (నియమించునట్టిది). ఈ సమస్తము సర్వత్రా విస్తరించి ఉండుటచే ఈశ్వర వైభవము. అలౌకిక ఆనందస్వరూపము. మార్పుచేర్పులు లేనట్టిది కాబట్టి అక్షరము. అట్టి ఆత్మను సాక్షాత్‌స్వరూపముగా ఎరిగిన ధీరుడు ఇక దేనికీ శోకించడు. జ్ఞాననేత్రమునకు ఈ సమస్తము ఆత్మగా అనిపిస్తూనే ఉంటుంది.
ఓ మునీశ్వరా! ఆత్మజ్ఞానబలముతో విభేదజనకమైన అజ్ఞానరూప భేద-జ్ఞానమును తొలగించుకో. నీవు అనంత ఆత్మజ్ఞానస్వరూపుడవై ఉండనే ఉన్నావు. ఈ మనస్సుకు కనిపించే భేదములు నీ అఖండాత్మ స్వరూపమును ఏమి చేయగలవు? ఎందుకంటే, ఆత్మకు సంబంధించినవే కావు. అనంతమగు ఆత్మకు పరిమితమగు మనో-దేహములు హాని కలిగించ జాలవు.

పంచమ ఖండము - నాడీశుద్ధి

సాంకృతౌ వాచ
1. సమ్యక్ కథయ మే, బ్రహ్మన్! నాడీశుద్ధిం
సమాసతః, యయా శుద్ధ్యా సదా
ధ్యాయన్ జీవన్ముక్తో భవామి అహమ్।
అవధూతౌ వాచ
సాంకృతే! శృణు, వక్ష్యామి, నాడీ శుద్ధిం సమాసతః ।
విధ్యుక్త (విధి యుక్త), కర్మసంయుక్తః-కామసంకల్ప వర్జితః,
‘యమా’ ఆది అష్టాంగ సంయుక్తః, శాంతః,
సత్యపరాయణః, స్వ-ఆత్మని అవస్థితః
సమ్యక్ జ్ఞానిభిశ్చ సుశిక్షితః।।
పర్వత - అగ్రే, నదీతీరే, బిల్వమూలే, వనే అథవా,
మనోరమే శుచౌదేశే
మఠంకృత్వా సమాహితః,
ఆరభ్య చ ఆసనం। పశ్చాత్
ప్రాక్ ముఖో ఉఙ్మఖోపి-వా,
సమగ్రీవ శిరః కాయః సంవృత అస్య సునిశ్చలః,
సాంకృతముని : హే బ్రహ్మాన్! శ్రీదత్తాత్రేయ భగవన్! నేను నాడీ శుద్ధిని ఎట్లా పొందగలనో, అట్టి శుద్ధిచే కలుగు ధ్యానముచే జీవన్ముక్తుడను ఎట్లా కాగలనో-అట్టి సమ్యక్ (యోగ) మార్గము గురించి చెప్పమని ప్రార్థన.
శ్రీదత్తాత్రేయ అవధూత : ఓ సాంకృతి మునీశ్వరా? ‘నాడీశుద్ధి’ గురించి సంగ్రహముగా (In Brief) చెప్పుచున్నాను. వినండి.
- విద్యుక్తమైన (తనకు నియమితమైన) కర్మలను చక్కగా నిర్వర్తించుచూ,
- ఈ దృశ్యములో ఏదో కావాలి. పొందాలి. అనే కామ సంకల్పములను త్యజించి,
- ‘‘యమము, నియమము, ఆసనము, ప్రాణాయణము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి’’ - అనబడు అష్టాంగయోగములను అభ్యసిస్తూ
- శాంత మనస్కుడై, సత్యపరాయణుడై (అసత్తును అసత్తుగా దర్శించు మననము - దృష్టి - భావన - అవగాహనకలవాడై)
- సమ్యక్ జ్ఞానులగు సద్గురువుచే సుశిక్షితుడై ఈ జీవుడు సమ్యక్జ్ఞానము బోధింపబడునుగాక. పర్వతముయొక్క పై ప్రదేశంలో గాని, నదీ తీరంలోగాని, బిల్వ వృక్ష (రావిచెట్టు) మూలంలోగాని, వనములోగాని - ఒక శుచి అయిన ప్రదేశంలో మఠం నిర్మించుకోవాలి.
(లేదా) ఎక్కడైనా సరే, మనస్సుకు రమింపజేసేది అగుగాక! మనస్సులోనే కూడా అగుగాక.
మనస్సుకు సానుకూల్యంగా ఉండాలి.
తరువాత - తూర్పుదిక్కగా గాని, ఉత్తర దిక్కుగాన గాని ముఖములో ఆసనము వేసుకొని కూర్చోవాలి. కంఠమును, శిరస్సు సమముగా ఉండేవిధంగా ధారణ చేయాలి. నిశ్చలముగా నిలపాలి. యోగాభ్యాసమునకు ఉపక్రమించాలి.
బిందునాద సమాయుక్తం అగ్నిబీజం విచింతయేత్।
పశ్చాత్ విరేచయేత్ సమ్యక్
ప్రాణం పింగళయా బుధః।।
పునః పింగళయా ఆపూర్యం, వహ్నిబీజం
అనుస్మరేత్। పునః విరేచయేత్ ధీమాన్
ఇడయైవ శనైః శనైః।।
బిందు (point of Athma) - నాద సమాయుక్తమైనట్టి అగ్నిబీజమును చింతన చేస్తూ ఉండాలి.
ఆ తరువాత కుడివైపుగా గల ‘‘పింగళనాడి’’ నుండి రేచకంగా గాలిని వదలాలి. కుంభకము చేయబడిన వాయువును సమ్యక్ భావనతో రేచకము చేయాలి. ఈ విధంగా బుద్ధిని, మనస్సును సాధన వస్తువులుగా చేసుకొని వాయువును వదలటము - స్వీకరించటము - కుంభకము - రేచకము చేయాలి. అటు తరువాత పింగళనాడి ద్వారాపీల్చి వాయుపూర కము, ఇడలో కుంభకము చేయాలి. కుంభక సమయంలో అగ్ని బీజము (తేజోకణమును) స్మరించుచూ ఇడతో మెల్లమెల్లగా రేచకము చేయాలి.
త్రి చతుః వాసరం వా, అథ త్రిచతుః
వారం ఏవ చ, షట్ కృత్వా విచరేత్
నిత్యం - రహస్యేవం త్రిసంధిషు।।
నాడీశుద్ధిం అవాప్నోతి పృథక్ చిహ్న
ఉపలక్షితః, శరీర లఘుతా దీప్తిః వహ్నేః జాఠరవర్తినః,
ఈ విధంగా 3–4 రోజులు రోజుకు 3–4 సార్లు ద్వి-పూరక కుంబక రేచకములను (3x2=6) త్రిసంధ్యలలోను - రహస్యముగా - నిర్వర్తించాలి.
పూరక - రేచక - కుంభకముల మధ్యగల ‘త్రిసంధిస్థానము’ ‘లయస్థానము’ గమనించి, మనస్సును ఏకాగ్రం చేసి ఉపాసించాలి.
- ఇట్టి త్రిసంధ్యా-షట్ విశేష ప్రాణాయామము యొక్క కొన్ని చిహ్నములు
-నాడీ చక్రములోని దోషములు పోయి, పరిశుభ్రమగుచున్నది.
- శరీరము తేలికగాను దీప్తివంతముగాను అగుచున్నది.
- జఠరాగ్ని ప్రదీప్తమై ప్రవర్తించగలదు.
‘నాద’ అభివ్యక్తిః- ఇతి ఏతత్ చిహ్నం
తత్ సిద్ధిసూచకమ్। యావత్ ఏతాని
సంపశ్యేత్ తావత్ ఏవం సమాచరేత్।।
నాదము అభివ్యక్తము అగుచున్నట్టి ‘‘నాదజనస్థానము’’బుద్ధికి అనుభవమే- ‘అభ్యాససిద్ధి’కి సూచన. మరింతగా సుస్పష్టము, స్వాభావికము అగునంతవరకు పైవిధంగా (1) ఇడా కుంభక- (2) పింగళా కుంభక ప్రాణాయామమును పైన చెప్పిన విధంగా సమాచరించాలి.
అథవా-ఏతత్ పరత్యజ్య, స్వ-ఆత్మశుద్ధిం సమాచరేత్।
ఆత్మా శుద్ధః సదా నిత్యః
సుఖరూపః స్వయం ప్రభః।।
అజ్ఞానాత్ మలినో భాతి।
జ్ఞానాత్ శుద్ధో విభాతి అయమ్।।
అజ్ఞాన మల పంకం యః
క్షాళయేత్ జ్ఞానతో యతః,
స ఏవ సర్వదా శుద్ధో।
న అన్య కర్మరతో హి స। ఇతి।।
అదేవిధంగా ప్రాణాయామము నిర్వర్తిస్తూనే ఆత్మయొక్క నిత్యశుద్ధత్వమును గమనికగా మననం చేయాలి.
ఆత్మ సర్వదా శుద్ధమైనది. నిత్యసుఖరూపమైనది. స్వయంప్రకాశకము.
అజ్ఞానము చేత నిత్యశుద్ధమగు ఆత్మ మలినములచే కప్పబడినట్లు అగుపిస్తోంది. ప్రాణాయామయోగధారణచే అజ్ఞాన మలినమును తొలగించుకొన్నవాడు. - ఆత్మానుభవుడగుచున్నాడు. ఆత్మయే తానై ప్రకాశిస్తున్నాడు. ఎవ్వడైతే (కర్మల సందర్భముగా మనస్సుకు తాకుచున్న) ‘అజ్ఞానము’ అనే ‘బురద’ను ‘జ్ఞానము’ అనే జలముతో ప్రక్షాళనము చేయు ప్రయత్నమును (సత్కర్మల ద్వారా) చేయుచున్నాడో, అట్టివాడు సర్వదా శుద్ధుడే.
కర్మల ద్వారా దోషములను ప్రక్షాళనము చేయు ఉద్దేశ్యము (objective) లేకుండా కర్మరతుడైనవాడు, శుద్ధుడు కాలేడు. {(అనగా) కర్మఫల త్యాగి అయి, ఆత్మ శుద్ధి కొరకై కర్మలు నిర్వర్తించునుగాకఊ.

షష్ఠమ ఖండము - ప్రాణాయామము

1. ప్రాణాయామ క్రమం వక్ష్యే, సాంకృతే! శృణు సాదరమ్।
ప్రాణాయామ ఇతి ప్రోక్తో।
‘‘రేచ - పూరక - కుంభకైః’’।
వర్ణత్రయాత్మకాః ప్రోక్తా, రేచ పూరక కుంభకాః।
స ఏష ‘‘ప్రణవః’’ ప్రోక్తః
ప్రాణాయామస్తు తన్మయః।।
ఇడయా వాయుం ఆకృష్య
పూరయిత్వా ఉదరస్థితమ్
దత్తాత్రేయ అవధూత : ప్రియసాంకృతి మునీశ్వరా! ప్రాణాయామక్రమము గురించి చెప్పుకుంటున్నాము. ఇంకా మరికొంత వివరిస్తాను. సాదరంగా వినండి.
(1) రేచకము (2) పూరకము (3) కుంభకము - ఈ మూడు కలిపి ప్రాణాయామము. ఈ మూడిటిని ‘వర్ణత్రయము’ అని కూడా అంటారు.
అట్టి వర్ణత్రయ సమన్విత ప్రాణాయామమునందు తన్మయమైయున్నట్టి అంతర్లీనతత్త్వమే ‘ప్రణవము’ - అనబడుచున్నది.
ప్రాణాయామము - ప్రణవము
(1) పూరకము: ఎడమ ముక్కు రంధ్రము (పుటము) ద్వారా గాలిని ‘ఇడ’ నాడిలో నెమ్మదిగా పీల్చటము.
16 మాత్రల కాలము గాలి పీల్చాలి. ‘అ’కారమును స్మరిస్తూ నిర్వర్తించాలి.
శనైః షోడశభిః(16) మాత్రైః ‘అ’ కారం తత్ర
సంస్మరేత్। పూరితం ధారయేత్ పశ్చాత్
చతుః షష్ట్యాతు (64) మాత్రయా।।
‘ఉ’ కార మూర్తిం అత్ర అపి, సంస్మరన్ ప్రణవం జపేత్।
యావత్ వా శక్యతే, తావత్ ధారయేత్ జపతత్పరః।
పూరితం రేచయేత్ పశ్చాత్ ‘మ’ కారేణ
అనిలం బుధః, శనైః పింగళయా తత్ర
ద్వాత్రింశత్ (32) మాత్రయా పునః।।
(2) కుంభకము: పీల్చిన వాయువున ‘ధారణ’
‘64’ మాత్రల కాలము
‘ఉ’కారమూర్తియగు ప్రణవమును సంస్మరించాలి.
ఎంతసేపు వాయువును కుంభకముగా నిలుపగలమో అంతకాలము ‘ఉ’ కార జప తత్పరుడై ఉంటూ, కుంభక ధారణ చేయాలి. క్రమంగా 64 మాత్రలకాలము కనీసముగా కుంభకమును సిద్ధించుకోవాలి. కుంభక సమయంలో - ప్రాణకదలికలకు అంతర్లీనము, ఆధారము అయి ఉన్న - ‘ప్రణవము’ అని పిలువబడే ‘ప్రాణశక్తి’ని గమనిస్తూ ఉపాసించాలి.
(3) రేచకము: పూరితం చేసిన వాయువును రేచకము చేయాలి. అనగా పింగళనాడిద్వారా 32 మాత్రల కాలము ‘మ’ కారమును స్మరిస్తూ వాయువును వదలాలి.
ప్రాణయామో భవేత్ ఏషః।
తతః చ ఏవం సమభ్యసేత్।।
పునః పింగళయా పూర్య మాత్రైః షోడశభిః (16)
తథా, ‘అ’ కార మూర్తిం అత్ర అపి స్మరేత్
ఏకాగ్ర మానసః।।
ఇది ఒక ప్రాణాయామము. ఈ విధంగా ‘అ-ఉ-మ’ ప్రణవ స్మరణతో కూడి పూరక - కుంభక - రేచక త్రివర్ణ ప్రాణాయామమును చక్కగా, శ్రద్ధగా నిర్వర్తించాలి. ప్రాణేశ్వరీ (లేక) ప్రాణశక్తి రూపమగు ప్రణవమును (కదలికల వెనుకగల కదలని శక్తిని) ఉపాసించాలి.
ఇడా కుంభకం అయిన తరువాత ఇక ‘పింగళాకుంభకము’ కుడి ముక్కుపుటము ద్వారా వాయువును 16మాత్రల కాలము పూరించి ‘అ’కారమూర్తిని ఏకాగ్రముగా స్మరించాలి.
ధారయేత్ పూరితం విద్వాన్ ప్రణవం
సం జపత్ వశీ। ‘ఉ’ కార మూర్తిం సంధ్యాయన్
చతుః షష్ట్యాతు (64) మాత్రయా।
‘మ’ కారం తు స్మరన్ పశ్చాత్,
రేచయేత్ ఇడయా అనిలమ్।
ఏవం ఏవ పునః కుర్యాత్ ఇడయ అపూర్య
బుద్ధిమాన్। ఏవం సమభ్యసేత్
నిత్యం ప్రాణాయామం, మునీశ్వర!
ఆ తరువాత ఉకారమూర్తిని ధ్యానిస్తూ 64 మాత్రలకాలము ప్రాణ - అపానముల మధ్యగా సంధ్య స్థానమునందు ప్రాణాపాన సమస్వరూపధారణ చేయాలి. అప్పుడు ‘మ’కారమూర్తిని స్మరిస్తూ ఇడనాడి ద్వారా వాయువును ‘32’ మాత్రల కాలము రేచకము చేయాలి.
ఓ మునీశ్వరా! బుద్ధిమాన్!
ఈ విధంగా
(1) ఇడయా పూరక - పింగళలలో కుంభక - పింగళా నుండి రేచకము
(2) పింగళయా పూరక - ఇడలో కుంభక - ఇడ నుండి రేచకము
అను ప్రాణాయామమును అభ్యాసముగా చేయాలి.
ఏవం అభ్యాసతో నిత్యం
షట్ (6) మాసాత్ జ్ఞానవాన్ భవేత్।
వత్సరాత్ బ్రహ్మ విద్వాన్‌స్యాత్।
తస్మాత్ నిత్యం సమభ్యసేత్।।
ఈ విధంగా నిత్యము ప్రాణాయామము ‘6’ మాసములు నిర్వర్తిస్తూ ఉండగా, ఆ యోగాభ్యాసి జ్ఞానవంతుడు అగుచున్నాడు.
సంవత్సరకాలమునకు అట్టి యోగాభ్యాసి బ్రహ్మవేత్త అగుచున్నాడు. అందుచేత ఇట్టి ప్రాణాయామమును నిత్యము శ్రద్ధగా అభ్యాసము చేయాలి
2. యోగాభ్యాస రతో నిత్యం, స్వధర్మ
నిరతశ్చ యః, ప్రాణసంయమనేన
ఏవ జ్ఞానాత్ ముక్తో భవిష్యతి।।
బాహ్యాత్ ఆపూరణం వాయోః, ఉదరే
పూరకో-పి సః,
సంపూర్ణ కుంభవత్ వాయోః
ధారణం కుంభకో భవేత్।।
బహిః విరేచనం వాయోః
ఉదరాత్ రేచకః స్మృతః।।
ఎవ్వరైతే (1) యోగాభ్యాసపరుడు (2) స్వధర్మనిరతుడు అయి ఉంటాడో, అట్టివాడు ఆత్మజ్ఞాని అయి ‘ముక్తుడు’ అగుచున్నాడు. ‘‘నాకు ‘బంధము’ మొదలే లేదు’’ - అను బుద్ధియొక్క గ్రహింపు స్వాభావికం అవగలదు.
పూరకము: బయటనుండి గాలిని లోనికి పూల్చటమును ‘పూరకము’ అంటారు. (పూరకము = నింపటము)
కుంభకము: ఆ పీల్చిన గాలిని నిండు కుండవలె ఉదరమునందు ధారణ చేయటమును ‘కుంభకము’ అంటున్నారు. (కుంభకము = నిండు కుండలో నీరువలె నిలిపి ఉంచటము)
రేచకము: ఉదరము నుండి వాయువును బయటకు విరేచనము చేయటమును ‘రేచకము’ అని పిలుస్తున్నారు. (రేచకము = వదలటము - విరేచనము)
ప్రస్వేద జనకో యస్తు
ప్రాణాయామేషు సో అధమః।
కంపనం మధ్యమం విద్యాత్।
ఉత్థానం చ ఉత్తమం విదుః।
పూర్వ పూర్వం ప్రకుర్వీత యావత్ ఉత్థాన సంభవః।।
సంభవతి ఉత్తమే ప్రాజ్ఞః ప్రాణాయామే సుఖీ భవేత్।।
ప్రాణాయామ - అభ్యాసము చేస్తూ ఉండగా :-
ప్రారంభస్థితిలో (Initial Stage) (అధమము) → అధికాధికంగా చెమట కలుగుచూ ఉండటము
ద్వితీయస్థితిలో (మధ్యమ) (Second Stage) → కంపనము కలుగుచూ ఉండటము.
ఉత్తమస్థితిలో (At Third Stage) → ఉత్థానము (శరీరముపైకి లేవటం) జరుగగలదు. అనగా శరీరము అతి తేలికైన వస్తువుగా అనుభూతమవ గలదు.
ప్రాణాయామేన చిత్తం తు శుద్ధం భవతి, సువ్రత!
చిత్తే శుద్ధే శుచిః సాక్షాత్
ప్రత్యక్ జ్యోతిః వ్యవస్థితః।।
ప్రాణ చిత్తేన సంయుక్తః పరమాత్మని తిష్ఠతి।
ఒక్కొక్క స్థితిని పొందుచూ అట్టి ఉత్తమమగు ఉత్థానస్థితి సిద్ధించేవరకు ప్రాణాయామమును అభ్యసించువాడు సుఖవంతుడు కాగలడు.
ఓ సువ్రతా! సాంకృతి మునీంద్రా! ప్రాణాయామాభ్యాసము చేత ముందుగా చిత్తములోని కామ - క్రోథ - లోభ - మోహ - మద - మాత్సర్య ఇత్యాది దోషములు తొలగి చిత్తశుద్ధి లభిస్తుంది. చిత్తము శుద్ధము అగుచుండగా ఆ యోగి ‘‘ప్రత్యక్ జ్యోతి (లేక) కేవల తేజస్సు (లేక) చిత్తరహిత చిత్’’ యందు వ్యవస్థితుడు అగుచున్నాడు.
ప్రాణాయామపరస్య అస్య పురుషస్య మహాత్మనః,
దేహశ్చ ఉత్తిష్ఠతే। తేన కించిత్
జ్ఞానాత్ విముక్తతా।।
రేచకం పూరకం ముక్త్వా కుంభకం
నిత్యం అభ్యసేత్।।
ప్రాణము (శక్తి) చిత్తము (ఇష్టము)తో కూడి (కేవలము - సమస్తము అయి ఉన్న, సమస్తమునకు ఆవలగల) పరమాత్మయందు స్థానము పొందుచున్నది. (Getting placed in one’s own Absolute All perveding SELF)
ప్రాణాయామ పరుడైన యోగికి క్రమముగా ‘‘జాగ్రత్ స్వప్న సుషుప్తులు, జన్మ జన్మాంతరములు, ఇవన్నీ నాయొక్క పురుషకార చమత్కారమే’’ అను అవగాహనతో కూడిన మహత్‌పురుషత్వము (లేక) పరమ పురుషత్వము సిద్ధించగలదు. యోగాభ్యాసము చేస్తూ ఉన్నప్పుడు, కించిత్ ఆత్మజ్ఞానముచే దేహముతో ఏర్పడియున్న మనోబంధము తొలగుచున్నది. కించిత్‌గా జ్ఞానము - శ్రవణం చేసినంత మాత్రంచేత కూడా ‘విముక్తుడు’ అగుచున్నాడు.
క్రమంగా రేచక పూరకముల అవసరము లేకుండానే కుంభక ప్రాణాయామమును అభ్యాసము చేయాలి. (స్వాభావిక కుంభకము)
సర్వపాప వినిర్ముక్తః
‘‘సమ్యక్ జ్ఞానం’’ అవాప్నుయాత్।।
మనోజవత్వం ఆప్నోతి పలితాది చ నశ్యతి।
ప్రాణాయామ ఏక నిష్ఠస్య
న కించిదపి దుర్లభమ్।।
అట్టి యోగాభ్యాసి సర్వపాప దృష్టుల నుండి, అల్పసాంసారిక భావములనుండి విముక్తుడు అగుచున్నాడు. సర్వత్రా సమమగు ఆత్మయొక్క సందర్శనము చేస్తూ ‘సమ్యక్జ్ఞాని’ అగుచున్నాడు.
మనస్సును దాటివేసినట్టి ‘‘మనోసాక్షిత్వము’’ (The witnessing to the Experiencing) సిద్ధించగలదు. పలిత (వృద్ధ స్త్రీ) లక్షణములైనట్టి
తలనెరవటము, చర్మపు ముడతలు మొదలైన వార్థక్య లక్షణములు ప్రవర్తించవు. ప్రాణాయామాభ్యాసమునందు నిష్ఠకలవానికి అసాధ్యమనుననది ఏదీ ఉండదు.
3. తస్మాత్ సర్వ ప్రయత్నేన
ప్రాణాయామాన్ సమభ్యసేత్।।
(అథ) వినియోగాన్ ప్రవక్ష్యామి
ప్రాణాయామస్య, సువ్రత!
సంధ్యయోః బ్రహ్మకాలేపి, మధ్యాహ్నేవా।
అందుచేత సాంకృతి సువ్రతా! యతివర్యా! సర్వ ప్రయత్నములతో ప్రాణాయామము అభ్యసించటము శ్రేయస్కరము.
ఈ ప్రాణాయామము యొక్క - ‘‘ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ చెయ్యాలి’’ - ఇటువంటి వినియోగముల గురించి (Regarding practices) చెప్పుచున్నాను, వినండి.
(ఉదయ - సాయంత్ర) ఉభయ సంధ్యా సమయములందు, బ్రాహ్మీ ముహూర్తసమయము(4 AM, 6 PM) లందు, మధ్యాహ్న సమయములంద నిర్వర్తించబడునుగాక।
అథవా సదా - బాహ్యం ప్రాణం
సమాకృష్య పూరయిత్వ ఉదరేణ చ।
నాసాగ్రే నాభి మధ్యే చ,
పాద అంగుష్ఠే చ ధారయేత్,
సర్వరోగ వినిర్ముక్తో
జీవేత్ వర్ష శతం నరః।।
ఉదా : సహజ ప్రాణాయామ రూపంగా (పూరక-రేచకములు లేకుండానే) అన్ని సమయములందు
- ప్రాణమును బాహ్యమునుండి సమాకర్షించి,
- ఉదరము (పొట్ట)యందు వాయువును పూరించి (పూరకము చేసి), (ఉదర కుంభకము),
- ముక్కుకు అగ్రభాగంలోను (రెండు కనుబొమ్మల మధ్యగాను), (నాసాగ్ర కుంభకము)
- నాభి (బొడ్డు) మధ్యప్రదేశములోను, (నాభిప్రదేశకుంభకము)
- పాద అంగుష్ఠములలోను ధారణ (కుంభకము) నిర్వర్తిస్తూ ఉంటే, (పాద-అంగుష్ఠ కుంభకము)
ఇది సర్వరోగముల నుండి విముక్తి కలిగించగలదు. ఆయోగి శత సంవత్సర దీర్ఘాయుష్కుడు కాగలడు.
నాసాగ్ర ధారణాత్ వా అపి జితో
భవతి, సువ్రత! సర్వరోగ నివృత్తిస్స్యాత్
నాభి మధ్యే తు ధారణాత్।
శరీర లఘుతా, విప్ర!
పాద అంగుష్ఠ నిరోధనాత్।
-నాసాగ్ర (ఆజ్ఞాచక్రాకాశ)ము నందు (కుంభక) ప్రాణధారణచే సమస్తమును జయించి వేయు సామర్థ్యము పొందగలడు.
- నాభి మధ్య ప్రదేశములో కుంభక- ప్రాణధారణచే సర్వరోగములు నివృత్తి పొందగలవు.
ఓ విప్రుడా!
- పాదములవద్ద బొటనవ్రేలుల వద్ద కుంభక -ధారణచే శరీరము తేలిక అగుచున్నది.
జిహ్వయా వాయుం ఆకృష్య
యః పిబేత్ సతతం నరః,
శ్రమదాహ వినిర్ముక్తో
యోగీ నీరోగతామి యాత్।
జిహ్వ-వాయు ఆకర్షణ యోగాభ్యాసము
జిహ్వతో వాయువును, ఆకర్షించి నోటితో త్రాగి వాయు కుంభక ధారణ చేస్తూ ఉండే యోగాభ్యాసముచే - అట్టి యోగి అలసట, దాహములనుండి వినిర్ముక్తుడై ఆరోగ్యవంతుడగుచున్నాడు.
జిహ్వయా వాయుం ఆకృష్య,
జిహ్వా మూలే నిరోధయేత్, పిబేత్ అమృతం
అవ్యగ్రం, - సకలం సుఖం ఆప్నుయాత్।
ఇడయా వాయుం ఆకృష్య
భృవోః మధ్యే నిరోధయేత్ యః పిబేత్
అమృతం శుద్ధం, వ్యాధిభిః ముచ్యతే హి సః।।
జిహ్వ బంధన - అమృతపాన యోగము
నాలుకతో వాయువును సమాకర్షించి, నాలుకయొక్క మూలస్థానము నందు, నిరోధనము చేయాలి. (వాయువును కుంభించి ఉంచి, సర్వ చింతనలను త్యజించి (కొండనాలుక స్థానము నుండి స్రవించు) అమృతమును గ్రోలాలి. అవ్యగ్రమైన అమృతమును (The change less sense of self) గ్రోలు యోగాభ్యాసముచే అట్టిజీవుడు సకల వ్యాధులనుండి విముక్తుడు కాగలడు. సుఖవంతుడగుచున్నాడు.
భ్రూమధ్యాకాశ కుంభకము : ఇడా నాడిద్వారా భ్రూమధ్యాకాశమునకు వాయువును (Space between two Eye Brow) ఆకర్షించి, అమృతపానము (Experiencing Changeless Self) చేయువాడు సర్వవ్యాధివిముక్తుడు అగుచున్నాడు.
ఇడయా, వేద తత్త్వజ్ఞ! తథా
పింగళయైవ చ, నాభౌ
నిరోధయేత్। తేన వ్యాధిభిః ముచ్యతే నరః।।
నాభీ ప్రదేశ కుంభకము : (1) ఇడలోనికి (ఎడమవైపు ముక్కుపుటము ద్వారా) వాయువును పూరించి నాభి వద్ద నిరోధించి ధారణ చేయటము. (2) కుడి ముక్కుపుటము ద్వారా రేచకము. (3) ఆ తరువాత పింగళ లోనికి (కుడిపుటముద్వారా) వాయువును పూరించి నాభి ప్రదేశంలో నిరోధించటము. (4) ఎడమ ముక్కుపుటము ద్వారా రేచకము.
ఇట్టి నాభీ కుంభకము చేత కూడా దేహములోని సర్వవ్యాధులు తొలుగ గలవు.
మాస మాత్రం త్రి సంధ్యాయాం
జిహ్వాయ ఆరోప్య మారుతమ్,
అమృతం చ పిబేత్ నాభౌ
మందం మందం నిరోధయేత్।
వాతజా పిత్తజా దోషా నశ్యంతి ఏవ
న సంశయః।।
ఒక నెలరోజులు ఉదయ మధ్యాహ్న - సాయంత్ర సంధ్యలందు నాలుకతో గాలిని ఆరోపించి అమృతపానము చేస్తూ (లాలాజలము మ్రింగుచూ), (రసపానము - మార్పుచేర్పులు లేని ఆత్మాభావనమును జోడించటము), మెల్లమెల్లగా నాభివద్ద వాయు నిరోధము (వాయు కుంభకము / సహజ కుంభకము) అభ్యాసము చేస్తూ ఉండటం చేత వాత దోషములు (వాయువు యొక్క శరీరములోని ప్రసరణము సమయములో ఏర్పడు అపక్రమ దోషములు), పైత్య రస సంబంధమైన దోషములు నశించగలవు. ఇందులో సందేహము లేదు.
నాసాభ్యాం వాయుం ఆకృష్య, నేత్ర ద్వంద్వే
విరోధయేత్। నేత్రరోగా వినశ్యంతి।
తథా శ్రోత్ర నిరోధనాత్ శ్రోత్ర రోగా వినశ్యతి।।
తథా వాయుం సమారోప్య ధారయేత్
శిరసి స్థితమ్, శిరో రోగా వినశ్యంతి।
సత్యం ఉక్తం హి। సాంకృతే!
నేత్ర - శ్రోత్ర - శిరో వాయునిరోధ - కుంభకము
(ప్రాణాయామము అభ్యాసము చేస్తూ ఆయా ప్రదేశములలో స్వాభావిక కుంభకము)
ముక్కుపుటములతో గాలిని సమాకర్షించి
- రెండు కళ్ళలోను వాయు నిరోధనము (సహజ కుంభకము) చేయటము.
- అట్లాగే చెవులలోను నిరోధనము చేయటము.
ఈ తీరైన నేత్ర శ్రోత్ర స్వాభావిక కుంభకముచే నేత్రములలోని, దోషములు, చెవులలోని దోషములు సమసిపోగలవు.
అదే విధంగా ముక్కుతో గాలిని ఆకర్షించి శిరస్సులో వాయుధారణ చేయటంచేత శిరోప్రదేశంలో ఏర్పడే వాయు ప్రసరణముల అధిక అల్పసంబంధమైన దోషములు తప్పక తొలగగలవు. ఇది సత్యము.
4. ‘‘స్వస్తిక’’ ఆసనమ్ ఆస్థాయ
సమాహిత మానాః తథా,
అపానం ఊర్థ్వం ఉత్థాప్య ప్రణవేన శనైః శనైః
హస్తాభ్యాం ధారయేత్ సమ్యక్
కర్మాది కరణాని చ।। అంగుష్ఠాభ్యాం, మునే!
శ్రోత్రే, తర్జనీభ్యాం తు చక్షుషీ।
నాసాపు{ అవధానాభ్యాం
ప్రచ్ఛాద్య కరణాని వై! ఆనంద ఆవిర్భవో యావత్
తావత్ మూర్థని ధారణాత్।।
అల్పసంబంధమైన దోషములు తప్పక తొలగగలవు. ఇది సత్యము.
శిరో అంతర్గత కుంభకము - సంసార విచ్ఛిత్తి
- మనస్సును సమాహితము (ప్రశాంతము, నిర్విషయము) చేసి,
- ‘స్వస్తికాసనము’ ధరించి,
- ‘ప్రణవము’ పలుకుచు (ఓం),
బాహ్య ప్రసరణ స్వభావముగల అపానమును గుదస్థానము నుండి మెల్లమెల్లగా ఊర్థ్వమునకు ఉత్థాపనము చేస్తూ (లాగుచూ),
బొటనవేళ్ళతో రెండు చెవులను, చూపుడు వేలులతో కళ్ళను, ముక్కుపుటములను మధ్యవేళ్ళతోను నొక్కి ఉంచి, సంతోషంగా ఉన్నంతసేపు (ఇబ్బంది కలుగనంత సమయము) మూర్థము (Foreface) యందు వాయుధారణ (స్వాభావిక కుంభకము) చేయటమును ‘‘మూర్ధస్థానకుంభకము’’ - అంటారు.
ప్రాణః ప్రయాత్యనైవ ఏవ బ్రహ్మరంధ్రం,
మహామునే! బ్రహ్మరంధ్రం గతే వాయౌ
నాదశ్చ (‘నాదః’ చ) ఉత్పద్యతే, అనఘ!
ఓ మహామునీ! అనఘా!
(బొటనవ్రేళ్ళతో చెవులను చూపుడు వ్రేలులతో రెండు కళ్ళను, మధ్య వ్రేలులతో రెండు ముక్కుపుటములను మూసి ఉంచి) - ఆ విధంగా మూర్ధము (Fore face) నందు వాయుధారణ చేతనయినంతసేపు చేయట చేత) - ప్రాణవాయువు బ్రహ్మరంధ్రమును క్రమంగా చేరగలదు. శిరస్సుయొక్క ఉపరిభాగమగు బ్రహ్మరంధ్రము (బ్రహ్మమార్గము) చేరగానే (ఉకార) ‘నాదము’ జనిస్తూ ఉంటుంది. (ఉమ్… నాదము)
శంఖ ధ్వని నిభశ్చ ఆదౌ।
మధ్యే మేఘధ్వనిః యథా। శిరోమధ్యగతే
వాయౌ, గిరిప్రస్రవణం యథా।
మొదట ‘శంఖము’ ఊదుచున్నప్పటి శంఖ ధ్వని, ఆ తరువాత మేఘముల ఘర్షణచే ఏర్పడే (పిడుగు సమయములో ఏర్పడే) మేఘగర్జన ధ్వని వినబడుచూ ఉంటుంది. ప్రాణవాయువు శిరస్సుకు మధ్యగతంగా అగుచున్నప్పుడు గాలి కొండను వేగంగా తాకుచున్నట్టి ధ్వని వినబడసాగుతుంది.
పశ్చాత్ ప్రీతో, మహాప్రాజ్ఞ! సాక్షాత్
ఆత్మ ఉన్ముఖో భవేత్। పునః తత్
జ్ఞాన నిష్పత్తిః యోగాత్ సంసార నిహ్నుతిః।
ఆ తరువాత యోగి ప్రీతిగా, సుఖముగా, ఆనందభావనా సమన్వితంగా, దృశ్యమునుండి వెనుకకు మరలి ‘ఆత్మోన్ముఖుడు’ అగుచున్నాడు. అప్పుడు ఇక ఆత్మజ్ఞానము స్వాభావికమగుచుండగా, అట్టి యోగాభ్యాసముచే సంసారము నిహ్నుతము (విముక్తి, ప్రాయశ్చిత్తము, విచ్ఛిత్తి) అగుచున్నది.
దక్షిణేతర గుల్ఫేన సీవనీం పీడయేత్ స్థిరామ్।
సవ్య ఇతరేణ గుల్ఫేన పీడయేత్ బుద్ధిమాన్ నరః।।
జాన్వో రధస్థితాం సంధిం స్మృత్వాత్ ఏవం
త్రియంబకమ్, వినాయకం చ సంస్మృత్య,
తథా వాక్ ఈశ్వరీం, పునః, లింగనాళాత్
సమాకృష్య వాయుం అప్యగ్రతో, మునే!
లింగనాళ కుంభకము: (1) ఎడమకాలి చీలమండలముతో సీవని (గుద స్థానమునకు కించిత్ పైనగా) నొక్కి స్థిరముగా ఉంచటము, (2) కుడికాలి మడమతో పిక్కలకు క్రిందగా సంధి యందు నొక్కి ఉంచటము, (3) త్రయంబకుడగు శివ భగవానుని స్మరించటము. (4) జానువులను (మోకాళ్ళను) నిలువుగా దగ్గరగా - సూటిగా ధారణ చేస్తూ మూలాధార - అధిదేవతయగు వినాయకుని స్మరించటము. (5) వాగీశ్వరుడగు బ్రహ్మదేవుని (లేక, వాగీశ్వరియగు సరస్వతీదేవిని) స్మరిస్తూ లింగనాళమునందు వాయువును సమాకృష్యము (ప్రోగుచేయటము) చేసి పైకి ఆకర్షించటము.
ప్రణవేన నియుక్తేన బిందుయుక్తేన, బుద్ధిమాన్!
మూలాధారస్య విప్రేంద్ర! మధ్యే తంతు నిరోధయేత్।
నిరుధ్య వాయునా దీప్తో
వహ్ని రూహతి కుండలీమ్।
పునః సుషుమ్నయా వాయుః వహ్నినా సహ గచ్ఛతి।
ఏవం అభ్యసతః, తస్య జితో వాయుః భవేత్ భృశమ్।
అట్టి బుద్ధిమంతుడగు యోగి ఇంకా బుద్ధిని నియుక్తము (ఏకాగ్రము) చేస్తూ ప్రణవముతో బిందుయుక్తంగా మూలాధార మధ్య ప్రదేశమునందు వాయు నిరోధము నిర్వర్తించునుగాక. ఓ విపేంద్రా।
అప్పుడు జనించే యోగాగ్నితో కుండలిని నిదురలేచుచున్నది.
వాయు - అగ్నిలతో కూడి కుండలిని సుషుమ్నయందు ప్రవేశించుచున్నది. అప్పుడిక అట్టి అభ్యాసము కొనసాగుచుండగా వాయువు జయించబడి బుద్ధికి వశమగుచున్నది.
ప్రస్వేదః ప్రథమః పశ్చాత్, కంపనం, మునిపుంగవ।
ఉత్థానం చ శరీరస్య చిహ్నం ఏతత్ జితే అనిలే।
ఏవమ్ అభ్యసతః తస్య మూలరోగో వినస్యతి।
భగందరం చ నష్టంస్యాత్ సర్వరోగాశ్చ। సాంకృతే!
(1) మొదట అత్యధికమైన చెమట, (2) తరువాత కంపనము, (3) ఆ తరువాత శరీరము తేలిక అయి పైకి లేవటము - ఇవన్నీ ‘‘వాయువు జయించబడుచున్నది’’ అను దానికి చిహ్నములు. ఉత్తరోత్తర స్థితులు (Stage after stage towards achieving the ultimate)
ఇట్టి అభ్యాసము చేత మూలరోగము తొలగిపోతుంది. భగంధరము (కడుపులో మంట మొదలైనవి) సమసిపోతాయి. ఇట్టి అభ్యాసము సర్వరోగములకు నివారణము.
పాతకాని చ నశ్యంతి క్షుద్రాణి చ, మహాంతి చ।
నష్టే పాపే విశుద్ధం స్యాత్ చిత్తదర్పణం అద్భుతమ్।
పునః బ్రహ్మాది భోగేభ్యో వైరాగ్యం జాయతే హృది।।
విరక్తస్య తు సంసారాత్ జ్ఞానం కైవల్య
సాధనమ్। తేన పాపాపహానిః స్యాత్
జ్ఞాత్వా దేవం సదాశివమ్।।
ప్రాణయోగాభ్యాసముచే :
సమస్త క్షుద్రమైన మహాపాతములు నశించగలవు. పాప సంస్కారములు, అభ్యాసములు, వాసనలు రహితము అగుచుండగా, ‘‘చిత్తము’’ - అనే దర్పణము నిర్మలమై అత్యద్భుతముగా ప్రకాశమానమవగలదు.
అప్పుడిక బ్రహ్మలోకము నుండి పాతాళము వరకు గల సర్వభోగముల పట్ల హృదయములో వైరాగ్యము (Non attachment) స్వాభావికము కాగలదు.
‘సంసారము’ అనే అనురక్తిరూపమైన మనోజాడ్యము తొలగి కైవల్యము సిద్ధించటానికి ఆత్మజ్ఞానమే సాధనము.
హృదయము నిర్మలమవటానికి యోగము జ్ఞానసాధనము.
తద్వారా సమస్త దోషములు తొలగి ‘సదాశివోఽహమ్’ అనునది అనుభవమవగలదు.
5. జ్ఞానామృతరసో యేన సకృత్ ఆస్వాదితో భవేత్,
స సర్వకార్యం ఉత్సృజ్య తత్రఏవ పరిధావతి।
జ్ఞానస్వరూపమ్ ఏవ ఆహుః జగత్ ఏతత్
విచక్షణాః, అర్థ స్వరూపం అజ్ఞానాత్
పశ్యంతి అన్యే కుదృష్టయః।।
ఎవ్వడైతే ఆత్మజ్ఞానామృతరసమును చక్కగా ఆస్వాదించటం ప్రారంభిస్తాడో , అట్టివాడు సమస్త కార్యక్రమములను (రజోభావములను) విడచి ‘‘ఆత్మయేవాఽహమ్’’ - స్థానమును సిద్ధించుకుంటున్నాడు. తత్ స్థానమునందు అతిత్వరగా నిశ్చలుడగుచున్నాడు.
విచక్షుణులగు బ్రహ్మజ్ఞానుల ఉద్దేశ్యముప్రకారము - ఈ సమస్త జగత్తు, - ఈ జగద్దృశ్యము జ్ఞానస్వరూపమే. స్వకీయ జ్ఞానానందమయమే. పరమార్థస్వరూపమే.
ఇక తక్కినవారు (ఆత్మజ్ఞానదృష్టి లేనట్టివారు) తమయొక్క అజ్ఞానభావనచేత ఈ దృశ్య జగత్తు ఇహార్థరూపంగా (కుదృష్టిచే) మాత్రమే చూస్తున్నారు. అనేక భేదములతో, బంధ-దుఃఖ వృత్తులతో, - జనన మనన వ్యావహారికమై వారికి ప్రాప్తిస్తోంది.
ఆత్మస్వరూప విజ్ఞానాత్ అజ్ఞానస్య పరిక్షయః।
క్షీణే అజ్ఞానే, మహాప్రాజ్ఞ!
రాగాదీనాం పరిక్షయః।
రాగాది అసంభవే, ప్రాజ్ఞ! పుణ్యపాప
విమర్దనమ్। తయోః నాశే శరీరేణ
న పునః సంప్రయుజ్యత। ఇతి।।
‘‘రాగము(attachment)’’ అను జన్మజన్మార్జిత సంస్కారములు (లేక) వాసనలవలననే అజ్ఞానము పరిఢవిల్లి ప్రవర్తమానమౌతోంది. అట్టి అనేక బంధములకు, దుఃఖములకు కారణమగుచున్న అజ్ఞానము - ఆత్మస్వరూప విజ్ఞానము చేతనే తొలగిపోగలదు. ఓ మహాప్రాజ్ఞా! అజ్ఞానము క్షీణించగా, ఇక ‘‘రాగ ద్వేష మోహ మాత్సర్య’’ మొదలైన దోషములు వాటికవే తొలగుతాయి.
హే ప్రాజ్ఞా! రాగద్వేషములు తొలగితే పుణ్యపాప ద్వంద్వములు కూడా విమర్ధనమౌతాయి. (మసి అయిపోతాయి). అట్టి జీవుడు ఈ భౌతిక దేహముతో ఇక తాదాత్మ్యము చెందడు. ఆతనికి ఈ వర్తమాన జన్మ కూడా ‘‘మొదలే లేనిది’’ అగుచున్నది. తనను తాను అమృతమగు ఆత్మస్వరూపుడుగా గమనిస్తున్నాడు.
ఇక పునర్జన్మ గురించి ప్రసక్తి ఎక్కడిది?

సప్తమ ఖండము - ప్రత్యాహారము

1. అథ అతః సంప్రవక్ష్యామి ‘‘ప్రత్యాహారం’’,
మహామునే!
ఇంద్రియాణాం విచరతాం
విషయేషు స్వభావతః।
బలాత్ ఆహరణం తేషాం ‘‘ప్రత్యాహారః’’
స ఉచ్యతే।
ఓ మహామునీ! సాంకృతిమహాశయా!
కాబట్టి ఇక ఇప్పుడు ‘‘ప్రత్యాహారము’’ గురించి కొన్ని విశేషాలు చెప్పుచున్నాను, వినండి.
ఈ ఇంద్రియములు - విషయములవైపుగా ప్రసరించటము, వాటి నుండి సుఖ - దుఃఖ భూయిష్టమైన సమాచారము అవి జీవునికి అందించటము - స్వభావముగా కలిగి ఉన్నాయి.
అట్టి ఇంద్రియములను దృశ్య విషయములనుండి వెనుకకు మరల్చటము - అనునదే ‘‘ప్రత్యాహారము’’.
యత్ పశ్యతి తు తత్ సర్వం
బ్రహ్మ పశ్యః సమాహితః
ప్రత్యాహరో భవేత్ ఏష బ్రహ్మవిద్భిః
పురోదితః। యద్యత్ శుద్ధం - అశుద్ధం వా
కరోతి ఆమరణాంతికమ్,
తత్ సర్వం బ్రహ్మణే కుర్యాత్, ‘‘ప్రత్యాహారః’’ స
ఉచ్యతే। అధవా, నిత్య కర్మాణి బ్రహ్మ - ఆరాధన బుద్ధితః
కామ్యాని చ తథా కుర్యాత్ ప్రత్యాహారః స ఉచ్యతే।
‘‘ఏదేది కనబడుచూ ఉన్నదో, అట్టి ఇదంతా ఈ జగత్తుకు మునుముందే ఉండి ఉన్నట్టి బ్రహ్మమే. బ్రహ్మమునకు అన్యము కాదు. - అని బ్రహ్మవేత్తల ప్రవచనము. ఇట్టి సమన్వయమే ప్రత్యాహారము.
ఒక పని శుద్ధమైనా (లేక) అశుద్ధమైనా కూడా, అది బ్రహ్మమును ఉద్దేశ్యించి ‘బ్రహ్మోపాసన’గా ఆమరణాంతము (Including birth and Death) నిర్వర్తిస్తూ ఉంటే, అది ‘‘ప్రత్యాహారము’’ అనియే అనబడుచున్నది.
(లేక) బ్రహ్మమును ఆరాధించాలనే బుద్ధితో నిత్యకర్మలుగాని, కామ్య కర్మలుగాని నిర్వర్తిస్తూ ఉంటే, అది ప్రత్యాహారమే!
అథవా, వాయుం ఆకృష్య స్థానాత్
స్థానం నిరోధయేత్।
దంతమూలాత్ తథా కంఠే,
కంఠాత్ ఉరసి మారుతమ్।
ఉరో దేశాత్ సమాకృష్య
నాభీదేశే నిరోధయేత్।।
ప్రత్యాహార పండితుల మరొక నిర్ణయము
- వాయువును ముక్కుపుటముల ద్వారా (లేక) నోరు ద్వారా ఆకర్షించి ఆ శరీరములో ఒక్కొక్క స్థానములో నిరోధించటము (కుంభకము చేయటము)
- దంత మూలము నుండి కంఠమునకు, కంఠము నుండి ఉరసి (ఱొమ్ములు)లో, భుజములలో, భుజముల నుండి నాభి ప్రదేశము వరకు వాయువును సమాకర్షించి నిరోధించటము. - ‘‘ప్రత్యాహారము’’. అనగా బుద్ధి - మనస్సులను రెండు చేతులుగా చేసుకొని దేహములోని ఆయా ప్రదేశములలో ‘స్వాభావిక కుంభకము’ నిర్వర్తిస్తూ ఉండటము - ప్రత్యాహారము।
2. నాభి దేశాత్ సమాకృష్య కుండల్యాం తు
నిరోధయేత్। కుండలీ దేశతో విద్వాన్
మూలాధారే నిరోధయేత్। అథ అపానాత్ కటి ద్వంద్వే
తథా ఉరౌ చ సు మధ్యమే, తస్మాత్ జానుద్వయే
జంఘే, పాద అంగుష్ఠే-నిరోధయేత్।
దేహములోని వివిధ విభాగములలో కుంభక ప్రాణాయామాభ్యాసము నాభి ప్రదేశములో వాయువును సమాకృష్యము (సమాకర్షణ) చేసి కుండలిని యందు నిరోధించటము.
కుండలినీ ప్రదేశమునుండి మూలాధారమునందు వాయునిరోధనము చేయటము.
అపానము నిర్వర్తిస్తూ , అపానము నుండి కటి (మొలత్రాడు ప్రదేశము) అక్కడినుండి తొడలయందు, తరువాత మోకాళ్ళయందు, అక్కడ నుండి కాలిపిక్కలయందు, ఆ తరువాత పాదములయందు, అటు తరువాత కాలి బొటనవ్రేళ్ళయందు వాయు నిరోధనము, (లేక) స్వభావకుంభక ప్రాణాయామాభ్యాసము - ‘‘ప్రత్యాహారము’’.
‘‘ప్రత్యాహారో’’ అయం ఉక్తస్తు,
ప్రత్యాహార పరైః పరా। ఏవం అభ్యాసయుక్తస్య
పురుషస్య మహాత్మనః,
సర్వపాపాని నశ్యంతి భవరోగశ్చ సువ్రత!
- ఇది పరము (ఉత్కృష్టము, విశేషము) అయినట్టి ప్రత్యాహారము. ఎందుకంటే మనో బుద్ధుల నియామకమునకు సంబంధించినది.
ఓ సువ్రతా! ఇట్టి విశేష ప్రత్యాహారముచే భవరోగమునకు సంబంధించిన సర్వ పాపములు నశిస్తాయి. ఆతడు ‘మహాత్ముడు’ అగుచున్నాడు.
నాసాభ్యాం వాయుం ఆకృష్య నిశ్చలః స్వస్తిక ఆసనః,
పూరయేత్ అనిలం విద్వాన్ ఆపాద తలమస్తకమ్।।
స్వస్తి కాసనము ధరించి ముక్కుతో వాయువున ఆకృష్యము చేసి (ఆకర్షించి), యోగవిద్య నేర్చిన విద్వాంసుడు అభ్యాసపూర్వకంగా గోరు నుండి తలపై గల వెంట్రుకల వరకు ఆపాదతలమస్తకము వాయువును పూరించటము సిద్ధించుకోగలడు.
పశ్చాత్ పాదద్వయే తద్వత్, మూలాధారే
తథాఏవ చ, నాభికందే చ హృత్ మధ్యే
కంఠమూలే చ తాలుకే।
అట్టి వాయువును
- ఉభయపాదములలోను
- ములాధార ప్రదేశములోను,
- నాభి కింద ప్రదేశములోను
- హృదయాకాశమునందు,
- కంఠమూలమునందు (బొడ్డుకు క్రిందగల మాంసఖండము నందు),
భ్రువోః మధ్యే, లలాటే చ, తథా
మూర్థని ధారయేత్।
దేహేతు ఆత్మ మతిం విద్వాన్
సమాకృష్య సమాహితః,
ఆత్మన్ ఆత్మని నిర్ద్వంద్వే నిర్వికల్పే
నిరోధయేత్।
(ఇతి) ప్రత్యాహారః సమాఖ్యాతః సాక్షాత్
వేదాంత వేధిభిః। (సాక్షాత్‌ప్రత్యాహారము)।
ఏవం అభ్యసతః తస్య,
న కించిత్ అపి దుర్లభం। ఇతి।।
- భ్రూ - మధ్య ప్రదేశములోను,
- లలాటమునందు,
- ముఖో - ఉపరి మూర్థ ప్రదేశమునందు,
ఒకచోటు తరువాత మరోచోటు యోగాభ్యాసపూర్వకమైన ధారణచేస్తూ (ప్రాణాయామ విధాన కుంభకము (లేదా) స్వాభావిక కుంభకము) ఉండటము కూడా - ప్రత్యాహారము.
యోగ విద్వాంసుడైనవాడు ఒకవైపు తన-తదితరుల దేహములను కళ్ళతో చూస్తూనే,…సమాహితుడై వాయువును సమాకర్షించి - జీవాత్మను నిర్ద్వంద్వము, నిర్వికల్పము అగు పరమాత్మయందు నిరోధనము (అనన్యభావనచే ఏకము) చేయు చున్నాడు. దేహముపట్ల ఆత్మబుద్ధిని త్యజించి వేస్తున్నాడు. ఇతరులకు మార్గదర్శి అగుచున్నాడు.
ఇదియే ఉత్తమోత్తమగు ‘ప్రత్యాహారము’ అని వేదాంతవేద్యులచే ప్రకటించబడుచున్నది. ఈ విధంగా అభ్యసించటము దుర్లభమేమీ కాదు. తప్పక సాధ్యమే. న తు దుర్లభం। న కించిదపి దుర్లభమ్।

అష్టమ ఖండము - ధారణ

1. అథ అతః సంప్రవక్ష్యామి
‘‘ధారణాః పంచ’’, సువ్రత!
దేహమధ్యగతే వ్యోమ్ని
బాహ్య ఆకాశస్తు ధారయేత్।
ఓ సువ్రతా! సాంకృతీ! ఇప్పుడు ఇక ‘‘ధారణాపంచకము’’ గురించి వివరించుకుంటున్నాము. వినండి.
ఆకాశాత్మధారణ : బాహ్యమునగల ఆకాశము (space) దేహమునందు మధ్యగతమైయున్న ఆకాశమును ఏకరూపంగా భావన చేస్తూ ఉండటము. అనగా, దేహగతాకాశమే విశ్వగత - ఆకాశమని, విశ్వ గతాకాశమే దేహగతమై యున్నదని భావన కలిగి ఉండటము. ఇదియే అఖండాకాశధారణము.
ప్రాణే బాహ్య అనిలం తద్వత్
జ్వలనే చ అగ్నిం ఔదరే।
తోయం తోయాంశకే భూమిం
భూమిభాగే, మహామునే!
అగ్న్యాత్మధారణ : బాహ్యమున జ్వలిస్తూ ఉండే అగ్నియే ఉదరములో (పొట్టలో) జఠరాగ్ని రూపముగా ఉన్నదను భావన, ఉపాసన. అఖండ అగ్నిధారణ.
వాయోపాసన : వ్యష్టిగతమైన నా ప్రాణము విశ్వగతమైన ‘విశ్వప్రాణము’ లేక సప్రాణముయొక్క అఖండ ప్రదర్శనా చమత్కారమే - అని ఉపాసించటము. - అఖండవాయుధారణ.
తోయ ఉపాసన : ‘విశ్వజలతత్త్వమే ఈ నా దేహములోని ద్రవపదార్థముల ప్రదర్శనము - అని భావించటం. అఖండతోయధారణ.
భూమిఉపాసన : జగత్తులోని భౌతిక ధర్మమే నా దేహమునందు భౌతిక వస్తురూపమై (As matter)గా యున్నదను ఉపాసన. అఖండభూధారణ
‘హ-య-ర-వ-ల’ క ఆరాఖ్యాం మంత్రం
ఉచ్చారయేత్ క్రమాత్। ‘ధారణ’ ఏషా
పరా ప్రోక్తా, సర్వపాప విశోధినీ।।
‘జాను’-అంతం (జాన్వంతం) పృథివీ హి అంశో హి।
‘అపాం’ పాయు - అంశం ఉచ్యతే।
‘హృదయాంశః’ తథా అగ్ని - అంశో।
‘భ్రూమధ్యాంశో’ అనిల అంశకః।
ఆకాశ-అంశః తథా, ప్రాజ్ఞ!
‘మూర్థాంశః’ పరికీర్తితః ।
అట్టి విశ్వతత్త్వమును
హ = ఆకాశ య = వాయు ర = అగ్ని
వ = ద్రవ ల = స్థూల
అను బీజాక్షరములను ‘‘హ-య-ర-వ-ల….’’ఉచ్ఛారణచే ధారణ చేస్తూ వ్యష్టిగతమైనదంతా విశ్వగతమైన తత్త్వముతో ఏకము చేయుటయే ‘పరా ఉపాసన’. ఇది సర్వపాపములను శోధించి శుభ్రము చేయగలదు.
భ్రూమధ్య నుండి - మూర్థము వరకు ఆకాశ అంశ ।
హృదయము నుండి - భ్రూమధ్య వరకు అనిల (వాయు) అంశ।
పాయువు నుండి - హృదయము వరకు అగ్ని - అంశ
జానువుల నుండి-పాయువు (విసర్జకావయము) వరకు అపాంశ (జలాంశ)
పాదముల నుండి - జానువులు (మోకాళ్ళ) వరకు పృథివీ అంశ
అని ప్రాజ్ఞులచే పరికీర్తించబడుచూ, ఉపాసించబడుచున్నది.
బ్రహ్మాణం పృథివీ భాగే।
విష్ణు తోయాంశకే తథా।
అగ్ని అంశే చ మహేశానం,
ఈశ్వరం చ అనిల అంశకే । ఆకాశ అంశే, -
మహాప్రజ్ఞ! ధారేయేత్తు సదాశివమ్।।
హే మహాప్రాజ్ఞా! ‘ధారణపంచకము’లో అంతర విధానంగా ‘‘పంచ అధి - దేవతా ధారణ’’ ఎట్లా చేయాలో వినండి.
బ్రహ్మదేవుని - పృథివీ భాగమునందు,
విష్ణుదేవుని - జలాంశయందు,
మహేశ్వరుని - అగ్ని అంశయందు
ఈశ్వరుని - వాయు అంశయందు
సదాశివుని - ఆకాశ అంశయందు
ఆయా అంశలుగా భావిస్తూ ధారణ చేయబడుగాక। ఆయా దేవతల అంశలుగా ఉపాసించబడుగాక।
అథవా, తవ వక్ష్యామి, ధారణాం,
మునిపుంగవ!
పురుషే సర్వశాస్తారం
బోధ ఆనందమయం శివమ్,
ధారయేత్ బుద్ధిమాన్ నిత్యం సర్వపాప విశుద్ధయే।।
నియామకః తత్
మరొకటైన ధారణా విధానము చెప్పుచున్నాను ‘మునిపుంగవా! వినండి. ‘‘సర్వమ్ శాసయతేది ఇతి శాస్తారమ్’’ - అనబడు సర్వశాస్త (నియమకుడు), బోధానందమయుడు (సమస్తమును తనయొక్క ఎరుకయందు ఎరుకచే కల్పించుకొని ఆనందించువాడు) - అగు శివభగవానుని (శివతత్త్వమును) ధారణ చేయుదురుగాక! అట్టి బుద్ధిమంతుడు సర్వపాప దోషములనుండి విశుద్ధుడు కాగలడు.
అథవా, తవ వక్ష్యామి, ధారణాం,
మునిపుంగవ!
పురుషే సర్వశాస్తారం
బోధ ఆనందమయం శివమ్,
ధారయేత్ బుద్ధిమాన్ నిత్యం సర్వపాప విశుద్ధయే।।
నియామకః తత్
మరొకటైన ధారణా విధానము చెప్పుచున్నాను ‘మునిపుంగవా! వినండి. ‘‘సర్వమ్ శాసయతేది ఇతి శాస్తారమ్’’ - అనబడు సర్వశాస్త (నియమకుడు), బోధానందమయుడు (సమస్తమును తనయొక్క ఎరుకయందు ఎరుకచే కల్పించుకొని ఆనందించువాడు) - అగు శివభగవానుని (శివతత్త్వమును) ధారణ చేయుదురుగాక! అట్టి బుద్ధిమంతుడు సర్వపాప దోషములనుండి విశుద్ధుడు కాగలడు.
బ్రహ్మా ఆది-కార్యరూపాణి
స్వే స్వేసంహృత్య కారణే,
సర్వకారణం, అవ్యక్తం, అనిరూప్యం
అచేతనమ్,
సాక్షాత్ ఆత్మని సంపూర్ణే ధారయేత్
ప్రణవే నరః।
ఇంద్రియాణి సమాహృత్య
మనసః ఆత్మని యోజయేత్। ఇతి।।
ఇంకొకతీరైన ‘ధారణ’ :: కారణ కారణః నియామతఃతత్
సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు (eT]యు) సమస్త సృష్టి…మొదలైనవన్నీ కూడా ‘‘కార్య’’ (Workmanship) రూపంగా భావించుచూ,
అట్టి సమస్తమునకు కారణ రూపుడు అయి ఉన్నవారు అవ్యక్తుడు. కేవలుడు, ఆయన రూపరహితుడు. నిరూపణకు దొరకనివాడు. సమస్తరూపములు తానే అయినవాడు. కదలికలు - రాకపోకలు లేనివాడుగుటచే అచేతనుడు. అట్టి ఆత్మ భగవానునియందు (లేక-ఆత్మయందు) ‘ప్రణవము’ యొక్క శబ్దార్థభావనను చేర్చుటము ‘ధారణ’। స్వస్వరూపముతో సహా ఈ సమస్తము అనన్యుడగు ఆత్మభగవానుని లీలాప్రదర్శనముగా దర్శించటము - ‘ధారణ’।
‘‘ఈ జగత్తంతా కార్యము - ఆ పరమాత్మయే కారణకారణము’’ - అని భావించి ఉపాసించటము - ధారణ।
ఇంద్రియులన్నీ విషయములతో సహా మనస్సు ద్వారా ఆత్మయందు నియమించటము. ఆత్మగా మనస్సుచే సర్వదా సర్వత్రా అవిచ్ఛిన్నంగా ఈ సమస్తమును సందర్శించటము (నవలు చదువుచూ అందులోని పాత్రలను నవలారచయితయొక్క కవితా కల్పనగా ఎరిగి ఉండురీతిగా) సమస్తము ఆత్మయందు దర్శించటము - ఇది ధారణ।

నవమ ఖండము - (ధ్యానము) సోఽహమ్ పరమమ్।

1. సోఽహమ్:
అథ అతః సంప్రవక్ష్యామి ‘‘ధ్యానం’’ సంసార నాశనమ్।
ఋతం సత్యం పరం బ్రహ్మ సర్వ సంసార భేషజమ్,
ఊర్థ్వరేతం విరూపాక్షం విశ్వరూపం మహేశ్వరమ్ -
సోఽహమ్ - ఇతి ఆదరేణ ఏవ
ధ్యాయేత్ యోగీశ్వరేశ్వరమ్।।
ఓ సాంకృతి యోగీశ్వరా!
‘సంసారము’ అనబడే పాంచభౌతిక దృశ్యముతో శబ్దస్పర్శ రూపరసగంధ పాశముల రూపంగా ఏర్పడియున్న సంబంధరూప ‘బంధము’ తొలగేది ఎట్లా? ఇందుకు ఏ ‘ధ్యానము’ ఉపకరించగలదో, అట్టి ‘ధ్యాసరూప ధ్యానము’ గురించి (దేనిని ధ్యాన విషయముగా కలిగి ఉండటం చేత సంసార దోషము తొలగగలదో) - అది చెప్పుచున్నాను.
ఋక్కులచే గానము చేయబడుచు, ఋషులకు స్వానుభవమగుచున్న ఋతము - అగు ఆత్మయే ధ్యానవస్తువు।
- ఏది పరమ సత్యమై ఉన్నదో,
- సమస్తమునకు ఆవల ‘పరము’గా ప్రకాశమానమైయున్నదో,
- ‘పరంబ్రహ్మము’గా సన్నుతించబడుతోందో,
- సంసార రోగమునకు ఔషధమో,
- ఆవల ప్రకాశమానుడై ఉండటంచేత ఊర్ధ్వరేతసుడో,
- సర్వము తన రూపము అయినట్టి వాడో, సర్వము యొక్క వాస్తవ రూపము చూడగలుగు కన్నులు దృష్టి గల విరూపాక్షుడో, నామ రూపములకు ఆవలివాడో,
- యోగ యోగీశ్వరేశ్వరుడో - అట్టి పరతత్త్వమే నేనై ఉన్నాను.
‘‘సోఽహమ్’’….అని ధ్యానించాలి. ‘తత్ త్వ మేవ’ అని ‘నీవు’ను దర్శించుచుండుము.
అహమస్మి తత్:
అథవా సత్యం ఈశానం జ్ఞానం ఆనందం
అద్వయమ్, అత్యర్ధం, అచలం, నిత్యం,
ఆది మధ్యాంత వర్జితమ్,
తథా స్థూలమ్, అనాకాశమ్,
అసంస్పృశ్యం, అచాక్షుషమ్
న రసం, న చ గంధ ఆఖ్యమ్, అప్రమేయమ్,
అనూపమమ్, ఆత్మానం సచ్చిదానందం
అనంతం బ్రహ్మ, సువ్రత! :-
అహస్మి - ఇతి అభిధ్యాయేత్,
ధ్యేయ-అతీతం విముక్తయే।।
ఏవం అభ్యాస యుక్తస్య పురుషస్య
మహాత్మనః, క్రమాత్ వేదాంత విజ్ఞానం
విజాయేత। న సంశయః। ఇతి।।
సచ్చిదానంద పరబ్రహ్మమ్ అహమేవ
లేక (ఇంకా కూడా): సత్యస్వరూపుడు, సర్వముగా విస్తరించి ఉన్నట్టి ‘ఈశానుడు’, ఈ సమస్తము స్వస్వరూపముగా కల్పించుకొని, దర్శించుచూ ఆనందించు జ్ఞానానందమయుడు, భూత-చిత్తాకాశములకు వేరైన చిదాకాశస్వరూపుడు, స్పర్శ-చూపు రూప - రస - గంధములకు విషయమేకానట్టి నిర్విషయ స్వరూపుడు, నిశ్చలుడు, అగు ‘సచ్చిదానంద పరబ్రహ్మము’’ ధ్యాన విషయముకావాలి.
‘‘అట్టి పరబ్రహ్మము నేనే।’’ ‘‘నేను’’గా ఉన్నది పరబ్రహ్మమే। అహమస్మిబ్రహ్మమ్।’’ - అని ధ్యానము చేస్తూ ఉండగా అట్టివాడు ధ్యాని ధ్యేయాతీతమగు విముక్తి పొందుచున్నాడు.
‘‘ఇటువంటి సోఽహమ్ - తత్త్వమ్ - త్వమేవాఽహమ్’’ అధ్యాసయుక్తుడగువాడు మహాన్‌పురుషుడు (సమస్తము నాయొక్క పురుషకారమే అను అవగాహన అనుభవపరుడు) అగుచున్నాడు.
జీవుడు ఈవిధమైన అధ్యాసచే క్రమంగా సోఽహమ్ వేదాంత విజ్ఞాన స్థానము సిద్ధించుకోవాలయ్యా! ఇదియే జీవిత మహాదాశయము.
అత్రన సందేహః! ఇందులో అనుమానము లేదు.

దశమ ఖండము - సమాధి-స్వానుభవము

1. అథ అతః సంప్రవక్ష్యామి
‘‘సమాధిం’’, భవ నాశనమ్। సమాధిః
సం విత్ ఉత్పత్తిః పరజీవ ఏకతాం ప్రతి।
నిత్యః సర్వగతో హి ఆత్మా, కూటస్థో
దోషవర్జితః, ఏకః సన్ భిద్యతే
అహ్రాంత్యా మాయయా న స్వరూపతః।
ఓ సాంకృతీ! ఇప్పుడు భవరోగమునకు దివ్యౌషధమగు ‘‘సమాధి’’ యొక్క వివరణను చెప్పుకుంటున్నాము. వినండి.
ఈ జీవుని జగత్ వ్యవహారమంతా (జగత్) - నాటకములోని పాత్రవంటిది. ఇక్కడి-పర-ఇహముల ఉత్పత్తి స్థానము ఆత్మయే। అట్టి పరమాత్మ కూటస్థుడై, ఆత్మయందు నిత్యగతుడై, సర్వగతుడై విషయవర్జితుడైఉన్నాడు. అట్టి సత్- విత్ పరమసత్యమునందు అభ్యాసమే ‘‘సమాధి’’. ‘మాయ’కు సంబంధించిన అహ్రాంతి తొలగినదై, స్వరూపతః జగత్తు అనబడే అన్యత్వమే లేదని గ్రహించటమే ‘సమాధి’. సర్వవేదనలకు అట్టి సమాధి స్థానమే ఉపాయము.
తస్మాత్ అద్వైతమ్ ఏవ అస్తి। న ప్రపంచో,
న సంసృతిః। యథా ఆకాశో ఘటాకాశో
మఠాకాశ - ఇతి ఈరితః,
తథా భ్రాంతైః ద్విధా ప్రోక్తా హి ఆత్మా :-
జీవ, ఈశ్వర ఆత్మనా।।
ఆకాశము (space) ఏకమే అయినప్పటికీ - ఇది ఇల్లు ఉన్న స్థలము. ఇది కుండ ఉన్న స్థలము - అనే భేదమును కల్పించుకొని చూస్తూ ఉంటాము కదా! అట్లాగే ‘పరమాత్మ - జీవాత్మ - దృశ్యజగత్తు’ అనునవి వేరువేరుగా లేవు. ప్రపంచము లేదు. దానితో ఏర్పడు సంసృతి అనబడునది లేదు. జీవ-ఈశ్వర ఏక స్వరూపమగు అద్వైతమే సత్‌స్వరూపమై యున్నది.
‘‘మహాకాశము - మఠాకాశము - ఘటాకాశము’’ల వలె అహ్రాంతి చేతనే జీవాత్మ - దృశ్య జగత్తు - పరమాత్మలు వేరువేరు విధములుగా అగుబడటం (లేక) అనిపించటం జరుగుతోంది.
న అహం దేహో। న చ ప్రాణో।
న ఇంద్రియాణి। మనో నహి।
సదా సాక్షి స్వరూపత్వాత్
శివ ఏవ అస్మి కేవలః।
ఇతి ధీర్యా మునిశ్రేష్ఠ!
సా ‘‘సామాధిః’’ ఇహ ఉచ్యతే।।
నేను సర్వదా కేవలమగు ఆత్మస్వరూపుడనే. అంతేగాని నేను ఈ భౌతిక దేహముగా గాని, ప్రాణములుగా గాని, పంచేంద్రియములుగా గాని, మనస్సుగా గాని అగుటయే లేదు.
నేను ఈ బాహ్య దృశ్యమునకు, భౌతిక దేహమునకు, మనోబుద్ధి చిత్త అహంకారాలకు సర్వదా కేవల సాక్షి స్వరూపుడను. అందుచేత కేవల శివానంద స్వరూపుడనే!
ఓ మునిశ్రేష్ఠా! ఇట్టి బుద్ధి యొక్క నిశ్చలమగు స్థితియే సమాధి. (A state of Non-distracting decesion of ones own all - present self)
సోఽహమ్ బ్రహ్మ।
న సంసారీ।
న మత్తో అన్యః కదాచన। యథా ఫేన
తరంగ - ఆది సముద్రాత్ ఉత్థితం పునః,
సముద్రే లీయతే, తద్వత్ జగత్
మయి అనులీయతే। తస్మాత్ మనః
పృథక్ వాస్తి। జగన్మాయా చ నాస్తి హి।।
సమాధి సంస్థితుని అవగాహన
‘‘నేను ‘సంసారి’ని ఏమాత్రమూ ఏ క్షణము కూడా అయి ఉండనేలేదు. పరబ్రహ్మమే సర్వదా నేనై ఉన్నాను. బ్రహ్మమునకు అన్యము ఏ క్షణమందును కాను.’’ - అను సునిశ్చయమే సమాధి.
ఫేనము (నురుగు), తరంగములు…ఇవన్నీ సముద్ర జలము నుండి జనించి, జలములోనే ఉండి, తిరిగి సముద్రజలములోనే లీనము అవటం లేదా? అట్లాగే అఖండ-అప్రమేయ-అక్షర ఆత్మ స్వరూపుడనగు నానుండే జగత్తు అనబడునది ప్రదర్శనమౌతోంది, నాయందే విలీనమౌతోంది. అందుచేత మనస్సుగాని, మాయగాని, జగత్తుగాని నాకు వేరైన ఉనికి కలిగిలేవు.
యస్య ఏవం పరమాత్మా అయం
ప్రత్యక్ భూతః ప్రకాశితః,
స తు యాతి స పుం భావం
స్వయం సాక్షాత్ పరామృతమ్।।
ఎవ్వరికైతే పరమాత్మ ఈ విధంగా ప్రత్యక్ భూతుడై (విషయ రహిత కేవల స్వరూపమై) ప్రకాశమానమౌతారో, అట్టి వానిచే - సాక్షాత్ పదము - అమృతము అగు పరమ పురుషకారము పొందబడుచున్నది. ఈ సమస్తము నా చేతనే। నాయందే। నావలననే। నేనే’’ అను అనుక్షణికాను - భూతము సిద్ధపురుషత్వము. ‘‘అహమేవ కారణకారణ పరమాత్మన్’’ - అనునది అనుక్షణికంగా, అవ్యాజముగా సునిశ్చితమౌతుంది. ఆతడు స్వయం సాక్షాత్ పరామృతుడు - అగుచున్నాడు.
యదా మనసి చైతన్యం
భాతి సర్వత్ర గం సదా,
యోగినో అవ్యవధానేన,
తదా సంపద్యతే స్వయమ్।।
యదా సర్వాణి భూతాని
స్వాత్మన్యేవ హి పస్యతి,
సర్వ భూతేషు చ ఆత్మానం
బ్రహ్మ సంపద్యతే తదా।।
ఎవ్వని మనస్సుకైతే సర్వే సర్వత్రా ఆత్మచైతన్యమే ఈ సమస్తముగా భాసించుచూ అనుభూతమగుచున్నదో, అట్టివానికి అవ్యవధానంగా, అవ్యాజంగా సమస్తము స్వయముగా స్వస్వరూపమై, ప్రాప్తించినదగుచూ ఉంటుంది. అట్టి యోగి సమస్తము తానే అయి ఆస్వాదిస్తున్నాడు.
ఎవ్వడైతే సర్వభూతజాలమునందు స్వస్వరూపాత్మను, స్వస్వరూపాత్మ యందే సర్వభూతజాలమును స్వాభావికంగా దర్శించుచూ ఉంటాడో - అప్పుడు అట్టివాడు అప్పటికప్పుడే బ్రహ్మ సంపద్యమును (లేక) బ్రహ్మ సాక్షాత్కారము పొందుచున్నాడు.
యదా సర్వాణి భూతాని
సమాధిస్థో న పశ్యతి,
ఏకీ భూతః పరేణ అసౌ
తదా భవతి కేవలః।।
ఎవ్వడైతే సమాధిస్థితుడై సర్వత్రా సమదర్శన బలముచేత అన్యముగాని, భూతజాలముగాని ఏమాత్రము - భేదదృష్టితో (స్వాభావికంగానే) చూడనివాడై ఉంటాడో, ఏకీభూతపరుడై సమస్తము స్వస్వరూపా నందముగా దర్శిస్తూ ఉంటాడో….అట్టివాడు కేవలత్వము సిద్ధించుకొని ‘‘కైవల్యము’’ పొందుచున్నాడు.
2. యదా పశ్యతి చ ఆత్మానం
కేవలం పరమార్థతః,
మాయా మాత్రం జగత్ కృత్స్నం,
తదా భవతి నిర్వృతిః।।
ఎవ్వడైతే
- తనను తాను కేవలునిగా పరమార్థముగా చూచుచున్నాడో
- ‘త్వమ్’ అనబడు ‘నీవు’ను కూడా కేవల - పరమార్థమగు బ్రహ్మముగా దర్శించుచున్నాడో, అట్టివాడు అవ్యాజమగు, నిర్వృతమగు (కల్పనారహితమగు) ఆత్మానందము పొందుచున్నాడు.
ఏవం ఉక్త్వా స భగవాన్ దత్తాత్రేయో
మహామునిః,
సాంకృతిః స్వస్వరూపేణ
సుఖం ఆస్తేతి నిర్భయ। ఇతి।।
భగవానుడగు శ్రీదత్తాత్రేయ అవధూత ఈ రీతిగా పలికిన ఆత్మజ్ఞాన - బోధవాక్యములను సాంకృతి ముని భక్తి - శ్రద్ధ - బుద్ధి - ప్రపత్తులతో విన్నారు.
స్వస్వరూపమునందు నిశ్చలురై నిర్భయులైనారు.

ఇతి దర్శనోపనిషత్ సమాప్తా।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



సామవేదాంతర్గత

6     దర్శనోపనిషత్

అధ్యయన పుష్పము

అష్టాంగ యోగ దర్శనము

శ్లో।। యమాది అష్టాంగయోగేద్ధం బ్రహ్మమాత్ర ప్రబోధితః
యోగినో యత్ పదం యాంతి, తత్ ‘కైవల్యపదం’ భజే।।

శ్రీ దత్తాత్రేయ అవధూత జగద్గురవే నమో నమః।
శ్రీ సాంకృతి మునీశ్వరాయ నమః।।

యోగపుంగవులు యోగాభ్యాసపరాకాష్ఠచే, (యమ-నియమ-ఆసన-ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన-ధారణ-సమాధి) అష్టాంగయోగ అభ్యాసముచే - మహత్తరమగు అంతిమ సత్ఫలితము పొందుచున్నారో, ఏ పదమును స్వాభావికరూపంగా సిద్ధించుకొనుచున్నారో…, అట్టి కైవల్యపదము కొరకై ఆత్మతత్త్వజ్ఞులగు శ్రీ దత్తాత్రేయ అవధూతను శరణువేడుచున్నాము.

⌘⌘⌘

‘‘ఓం’’
శ్రీ అవధూత దత్తాత్రేయులవారికి నమస్కరిస్తున్నాము. వారు యోగయోగీశ్వర - మహాయోగి. సమస్తమును చైతన్యపరచు కేవలతత్త్వ భగవానుడు. ఈ భౌతిక ప్రపంచమంతా భావనారూపముగా గుర్తెరిగినవారగుటచే భూతభావనులు. జాగ్రత్ - స్వప్న - సుషుప్తి తురీయములను స్వయంకల్పిత క్రియావిశేషములుగా దర్శించువారు కాబట్టి చతుర్భుజులగు మహావిష్ణుస్వరూపులు. యోగసామ్రాజ్యమునకు చక్రవర్తి. భక్తిగా నమస్కరించినంత మాత్రముచేతనే ఎట్టివారికైనా ఆత్మజ్ఞానబోధను ప్రసాదించువారు కాబట్టి జగద్గురువులు.

అట్టి పరానంద స్వరూపులగు శ్రీ దత్తాత్రేయ స్వామిని జ్ఞానభిక్షకై శరణు వేడుచున్నాము.

వారిని శిష్యులై సేవించువారిలో ఒకరు శ్రీ సాంకృతి ముని. ఆయన గురుసేవతో భక్తిసంపదను సిద్ధించుకుని, దత్తాత్రేయులవారికి ప్రియశిష్యులైనారు.

ఒకరోజు…
శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రశాంతముగా ఆత్మానందానుభవులై ఒక ఏకాంత ప్రదేశములో ఆసీనులై ఉన్నారు. అప్పుడు సాంకృతిముని రెండు చేతులు జోడించి, ప్రాంజలి ఘటిస్తూ, హృదయపూర్వకంగా నమస్కరిస్తూ భక్తి-ప్రపత్తి-వినయములతో జగద్గురువును సమీపించారు. త్రిప్రదక్షిణమలు చేసి సాష్టాంగదండ ప్రణామములు సమర్పించారు. ఎంతో సంతోషించిన శ్రీదత్తాత్రేయులవారు ప్రియశిష్యునికి స్వాగతం పలికి ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు.

శ్రీదత్తాత్రేయస్వామి : ప్రియ సాంకృతి మునీంద్రా! రావయ్యా! ఏమిటి విశేషం? ఏమి శ్రవణం చేయాలని అభిలషిస్తున్నావో అడుగవయ్యా।

సాంకృతిముని : స్వామీ! అస్మత్ సద్గురూ! నమో నమః! హే భగవన్! సంప్రపంచకమైన (ఈ ప్రపంచము సాధనవస్తువుగా అవగల) అష్టాంగయోగముల గురించి అంతరార్ధపూర్వకంగా తమ ముఖతః వినాలని మిమ్ములను వేడుకొంటున్నాను. ఎట్టి విశేషము తెలుసుకున్నంతమాత్రంచేత నేను జీవన్ముక్తుడను కాగలనో, అట్టి (అష్టాంగ) యోగవిశేషాలు నాకు దయతో బోధించండి - యేన విజ్ఞానమాత్రేణ జీవన్ముక్తో భవామి అహమ్!!

శ్రీదత్తాత్రేయ జగద్గురువు : ప్రియపరబ్రహ్మస్వరూపా! సాంకృతి మహాశయా! అట్లాగే, నీవు కోరుచున్నట్లు ‘అష్టాంగ యోగ దర్శనము’ గురించి చెప్పుకొందాము. వినండి.

యోగము యొక్క అష్ఠ (8) అంగములు : (1) యమము (ఇంద్రియములను విషయములనుండి వెనుకకు మరల్చటము) (2) నియమము (ఇంద్రియములను నియమించటము) (3) ఆసనము (4) ప్రాణాయామము (5) (తత్‌పరమైన) ప్రత్యాహారము (6) (పరమునకు సంబంధించిన) ధారణ (7) (ఆత్మ సందర్శన ధ్యాసరూపమగు) ధ్యానము (8) సమాధి.
ఇవి యోగాభ్యాసము యొక్క ‘8’ అంగములుగా శాస్త్రీయమై ఉన్నాయి.

ఆత్మతత్త్వజ్ఞులు, తత్త్వదర్శులు, తత్త్వప్రాజ్ఞులు అగు మహనీయులచే శాస్త్రముల రూపముగా అనేకవిధములుగా ఎలుగెత్తి గానము చేయబడుచున్నాయి.


ప్రథమ ఖండము - యమము (అష్టాంగయోగములలో మొదటిది)

యమా-దశః (10) యమయోగాంగముయొక్క దశ (10) ఉపాంగములు
(1) అహింస (2) సత్యము (3) అస్తేయము (4) బ్రహ్మచర్యము (5) దయ
(6) ఆర్జవము (7) క్షమ (8) ధృతి (9) మితాహారము (10) శౌచము
ఇతి యమా దశ।।

(యమము = ఇంద్రియ-విషయ తాదాత్మ్యము నుండి బుద్ధిని ఉపసంహరించు ప్రయత్నములు.
ఓ తపోధనా! అట్టి ‘యమము’ అనే అంగము యొక్క దశ (10) ఉపాంగముల గురించి ఇప్పుడు వివరించుకుందాము.

⌘⌘⌘

(1) అహింస :

వేదము చెప్పియున్న సందర్భములను తప్పించి, (అట్లానే) సత్యమును ఆశ్రయించు ప్రయత్నములో తప్పించి - తదితర సర్వసందర్భములలో - కాయము (శరీరము) తోగాని, మనస్సు (ఆలోచనల)తోగాని, వాక్కుతోగాని ఇతరులను హింసించటము (లేక) బాధించటమును ‘హింస’ అని అంటారు. అద్దానికి అన్యథా (The opposite) అయినది ‘అహింస’! అని లోకరీతి. ‘అహింస’ను ఓర్పుగా అభ్యసించటము - మొదటి ఉపాంగము.

అయితే ఓ మునీ! వేదవేదాంత వేద్యులగు మహనీయుల స్వానుభవపూర్వకమగు అభిప్రాయము ప్రకారము ‘అహింస’ అనగా ఏమిటో వినండి.

శ్లో।। ‘‘ఆత్మా సర్వగతో, అచ్ఛేద్యో, న గ్రాహ్య’’-ఇతి యా మతిః,
సా చ ‘అహింసా పరా’ ప్రోక్తా మునే! వేదాంత వేదిభిః।।

‘‘ఆత్మ సర్వదా సర్వగతము (All present and All extended). అది ‘‘జీవాత్మ-పరమాత్మ’’గా గాని, ‘నేను-నీవు’ల రూపమగు అనేక జీవులుగా గాని ఛేద్యము (Bifurcated) అగుట లేదు. ఆత్మ ఆఛేద్యము అని, ‘అఖండము’’ - అని ఎవ్వని బుద్ధి - తత్త్వభావనగా కలిగి ఉంటుందో, అదియే ‘అహింస’. అందుకు అనన్యమైనది హింస.

(2) సత్యము :

చక్షురాది ఇంద్రియైః దృష్టం, శ్రుతం, ఘ్రాణం - మునీశ్వర! తస్యైవ ఉక్తిః భవేత్ సత్యం, విప్ర! తత్ న అన్యథా భవేత్।

లోకరీతి ప్రకారము ‘‘ఈ కళ్లు, చెవులు, ముక్కు, చర్మము మొదలైన ఇంద్రియములకు ఏది కనబడుతోందో, వినబడుతోందో, వాసన చూడబడుతోందో అది మాత్రమే ఉక్తికి (Logically speaking) సత్యము. ఇందుకు వేరైన సత్యమేదీ లేదు’’ - అని (పరిమితదృష్టిచే) అనుకోబడుతోంది. అయితే వేదాంత (తెలుసుకొనుచున్నవానిగురించిన విజ్ఞానము సంపాదించుకొన్న) పారగుల (experts) యొక్క అభిప్రాయమో?

శ్లో।। సర్వం సత్యం పరబ్రహ్మ। న చ అన్యత్ - ఇతి యా మతిః తత్ చ సత్యం పరం ప్రోక్తం - వేదాంత జ్ఞాన పారగైః।।

‘‘ఈ ఇంద్రియములకు కనిపిస్తున్న దృశ్యము, ఇద్దానిని దర్శించుచున్న ద్రష్ట, అట్టి ద్రష్టకు సాక్షి అగు దృక్…ఈ సమస్తము పరబ్రహ్మస్వరూమే! బ్రహ్మమునకు కించిత్ కూడా అన్యము కాదు. కనుక ఈ జీవుడు స్వతఃగా పరబ్రహ్మమే। సందర్భంగా కనిపించేది అపాదితము (Attributively visualized) మాత్రమే’’ - అను పరమసత్యమును (వేదాంత పారగులు) ఎలుగెత్తి గానం చేస్తున్నారు. బుద్ధికి ఆరీతిగా అనుభవమగుచున్నదే సత్యము. ఎక్కడైనా ఏదైనా ‘‘పరబ్రహ్మమునకు ఇది వేరైనది కదా!’’ - అని అనిపిస్తూ ఉంటే….అది అసత్యము. (లేక) కల్పనామాత్రము.

(3) అస్తేయము :

శ్లో।। అన్యదీ యే తృణే రత్నే కాంచనే మౌక్తికేపి చ,
మనసా వినివృత్తిర్యా, తత్ ‘అస్తేయం’ విదుః బుధాః।।

బుధుల దృష్టిలో → ఇతరులకు చెందిన ఒక గడ్డి పరకగాని, రత్నమునుగాని, బంగారమునుగాని - మౌక్తికము (ముత్యము)గాని - వీటన్నిటిపట్ల ఎవ్వరైతే ‘‘తీసివేసుకుందాము’’ - అనే వృత్తిని దగ్గరకు రానీయరో…..అట్టి వారియొక్క స్వాభావిక వినివృత్తియే ‘‘అస్తేయము’’. అయితే ఇది లౌకమైన అర్థము. (స్తేయము = దొంగతనము). అనగా, దొంగతనము చేయకుండటమే అస్తేయము అని వ్యావహారిక నిర్వచనము. అయితే ఓ మహామతీ! తత్త్వశాస్త్రము చెప్పు పరమార్థము వినండి.

ఆత్మవేత్తల ప్రవచనము : ఆత్మని ఆనాత్మభావేన వ్యవహార వివర్జితమ్ యత్, తత్ - ‘అస్తేయమ్’ ఇత్యుక్తమ్ ఆత్మవిద్భిః, మహామతే!

ఒక నాటకము యొక్క కథాగమనము బాగుండటము , బాగుండకపోవటము - అనేవి నాటక దీపము(Light focussed on the stage) పై ఆపాదించము కదా! అట్లాగే అనాత్మకమగు భేద వ్యవహారములపట్ల ‘‘ఇది ఆత్మధర్మము’’ అని ఆత్మపై ఆపాదించకపోవటమే ‘‘అస్తేయము’’. ఆత్మకు గుణములను, సందర్భములను, సంగతులను, మార్పు - చేర్పులను, స్థితి - గతులను, జీవాత్మ - పరమాత్మ భేదములను….మొదలైనవి ఆపాదించి సాంసారిక దృష్టితో నమ్మిక కలిగి ఉండటమే ‘స్తేయము’ లేక ‘దొంగతనము’ - అని శాస్త్రీయమైన పరమార్థము.

(4) బ్రహ్మచర్యము :

శ్లో।। కాయేన మనసా వాచా స్త్రీణాం పరివర్జితమ్
ఋతౌ భార్యాం తదా తస్య ‘బ్రహ్మచర్యం’ తత్ ఉచ్యతే।।

ఋతుమతి అయిన జీవితభాగస్వామితో తప్ప, మరింకెప్పుడైనా మనసా వాచా కర్మణా (పర) స్త్రీ సంగమము వర్జించి ఉండటము బ్రహ్మచర్యము - ఇది వ్యావహారికమైన అర్థము.

ఓ పరంతపా! (పరతత్త్వము కొరకై తపన - తపస్సు కలవాడా।)! ఇంద్రియజయము సిద్ధించుకొన్న సాంకృతి మునీంద్రా! బ్రహ్మభావే మనశ్చ అరం ‘‘బ్రహ్మచర్యం’’, పరంతప! బ్రహ్మభావన యందు మనస్సు నిలకడ కలిగియుండే ప్రయత్నమే బ్రహ్మచర్యము.

(5) దయ :

శ్లో।। స్వ-ఆత్మవత్ సర్వభూతేషు కాయేన మనసా గిరా
అనుజ్ఞాయా దయా, స ఏవ ప్రోక్తా వేదాంత వేదిభిః।।

సర్వసహజీవులను - తనను తానువలె - దర్శించటమే దయ. ‘‘నాకు నేను ఎంత ప్రియమో, సర్వజీవులు నాకు అంతే ప్రియమగుగాక!’’ - అను భావనయే దయ. సర్వత్రా ఆత్మభావనతో అంగీకారబుద్ధి కలిగి ఉండటమే ‘‘దయ’’ - అని వేదాంత శాస్త్ర బోధ.‘‘యోగాభ్యాసికి అందరూ నా వాళ్ళే। ప్రియమగు ఆత్మస్వరూపులే - అని అనిపించటమే యోగసాధన।

(6) ఆర్జవము :

పుత్రే, మిత్రే, కళత్రే చ, రిపౌ-స్వాత్మని సంతతమ్, ఏక రూపమ్. యత్, తత్ ‘‘ఆర్జవమ్’’ పోచ్యతే మయా।
‘నావారు’ అనుకున్న వారిపట్ల, ‘‘వేరైనవారు’’ అని తలచిన చోట కూడా - ఒకే భావన కలిగి ఉండటమే ఆర్జవము. ‘‘నాయొక్క పుత్ర మిత్ర కళాత్రాదులపట్ల ఎంతగా ప్రేమ, ఓర్పు కలిగి ఉంటామో, (శత్రువులు, మొదలైన) తదితరుల పట్ల కూడా అంతే ప్రేమ ఓర్పు కలిగి ఉండటము’’ - అను ప్రయత్నశీలత్వమే ‘ఆర్జవము’’!

(7) క్షమ :

కాయేన మనసా వాచా శత్రుభిః పరిపీడితే
బుద్ధి క్షోభ నివృత్తిః యా ‘క్షమా’, సా, మునిపుంగవ!

ఓ మునిశ్రేష్ఠా! సుఖ-దుఃఖ, సంపద - ఆపద, మాన - అవమాన, శత్రు - మిత్ర సంఘటన సందర్భములు వచ్చి పోతూ ఉన్నప్పుడు కూడా ఎవరి బుద్ధి క్షోభ చెందక, సమభావన వదలకయే ఉంటుందో, అట్టి బుద్ధి సముపార్జనయే ‘క్షమ’. భేదదృష్టిని త్యజిస్తూ, ‘ఆత్మదృష్టి’ వైపుగా దృష్టి సారించటమే - క్షమ.

(8) ధృతి :

‘‘వేదాత్ - ఏవ వినిర్మోక్షః సంసారస్య,
న చ అన్యథా’’ - ఇతి విజ్ఞాన నిష్పత్తిః ‘ధృతిః’ ప్రోక్తా హి వైదికైః।।

‘‘ఆత్మ గురించిన జ్ఞానము (ఎరుక) చేతనే సంసార దోషము నుండి విముక్తి పొందగలము. వేరేత్రోవలేదు’’ అను విజ్ఞానరూప నిష్పత్తి (నిర్ణయము) ‘ధృతి’ అని వేదతత్త్వజ్ఞులగు వైదికుల పాఠ్యాంశము. తెలుసుకుంటేనే బంధము వీడుతుంది. (ఆత్మగురించి) తెలుసుకోనంతవరకు ఈ జీవునికి బంధము అనివార్యము. ‘‘అహమాత్మా। న చ అన్యోస్మి’’ - ఇత్యేవం అప్రచ్యుతా మతిః। - ‘‘నేను ఆత్మను. అన్యము కాదు’’ - అను చ్యుతి (Distraction) లేనట్టి మతి (Mindful) యే - ధృతి.

(9) మితాహారము :

(1) పొట్టలో నాలుగవవంతు ఖాళీగా ఉండు విధంగా ఆహారమును తగినంతగా మాత్రమే తీసుకోవటము,
(2) యోగాభ్యాసమునకు అనుకూలంగా సాత్వికమైన పదార్థములైనట్టి పాలు మొదలైనవి అధికంగా తీసుకోవటము
(3) యోగ సేవనమునకు సాధనయుక్తంగా న్యాయార్జితము, దైవార్పితము అయిన ఆహారము భుజించటము
- ఇది ‘మితాహారము’ అనబడుతోంది.

ఆహారము స్వీకరిస్తున్నప్పుడు - ‘‘పొట్టలో రెండు వంతులు ఘనాహారము (ద్వే భాగే పూరయేత్ అన్నం), నాలుగవ వంతు జలము, శేషించినది ఖాళీగా ఉంచాలి’’ అనునది మితాహారసూత్రము.

(10) శౌచము :

ఓ మహామునీ! ఈ భౌతిక దేహము శుభ్రముగా ఉండటానికై దీనిని మృత్తికజలముతో (మట్టి, సబ్బు నీరు మొదలైనవాటితో) స్నానము చేయిస్తున్నాము. మంచిదే. అయితే, అటువంటి శౌచము మనస్సుకు కూడా నిర్వర్తిస్తూ ఉండాలి కదా! (1) అవతార పురుషుల, భక్తి యోగ జ్ఞాన సిద్ధ పురుషుల కథలు, (2) వారి దృష్టాంతంగా గుణాభ్యాసములు (3) యోగాభ్యాసము - మొదలైనవి మనస్సుకు స్నానము. ‘‘నాయొక్క ఆత్మస్వరూపము నిత్య శుద్ధము - నిత్య ముక్తము కదా!’’ అనునది బుద్ధికి స్నానము వంటిది.

ఇక్కడ ఒక చమత్కారము.

ప్రతి వ్యక్తి దేహి + దేహము ల సమావేశ స్వరూపుడే.

అత్యంత మలినో దేహో - ఈ దేహము అత్యంత మలినభూయిష్టమైనది. దీనికి శౌచము (శుచి) అనేది ఎక్కడిది?

దేహీ చ అత్యంత నిర్మలః । ఈ దేహమును ఉపయోగిస్తూ ఉన్న దేహి యో? ‘‘నిత్య నిర్మలుడు’’।

ఈ దేహి-దేహముల భేదములు తెలుసుకొన్న తరువాత ఇక శౌచము యొక్క విధి దేనికి? దేహమునకా? దేహికా?

ఓ సువ్రతా! సాంకృతి ఆత్మానందా! మరొక్క విషయము కూడా శౌచము సంబంధితమై ఇక్కడ గుర్తుచేసుకుందాము.

ఇంద్రియ మనోబుద్ధులతో అనేక జన్మల సందర్భములలో ప్రోగుచేసుకున్న దృశ్యసంబంధమైన దురవగాహనాపూర్వక ఆవేశములు, సంస్కారములు, వాసనలు గండ శిలలవలె రూపుదిద్దుకుని ఉంటున్నాయి. అవి ఆత్మజ్ఞానానుభవమునకు అడ్డుగోడలగుచున్నాయి.

శ్లో।। జ్ఞాన శౌచం పరిత్యజ్య, బాహ్యే యో రమతే నరః,
స మూఢం కాంచనం త్యక్త్వా లోష్టం గృహ్ణాతి, సువ్రత!

ఓ సువ్రతా! ఆత్మాజ్ఞానమును ఆవరించి ఉన్న అజ్ఞానమును తొలగించు జ్ఞాన-శౌచమును వదలి, కేవలము బాహ్యశౌచము పాటించే ప్రయత్నములచే ఏమి లాభం? అట్టివాడు బంగారమును ప్రక్కకునెట్టి, మట్టిగడ్డలను ఏరుకు తెచ్చుకొనే మూఢునితో సమానము. కర్తవ్యాకర్తములు ఎరిగి, ఆత్మజ్ఞానామృతమును సంపాదించుకొని సంతృప్తుడగుచున్న యోగి కృతకృత్యుడు. అట్టి తత్త్వవేత్తకు ‘‘ఇంకా ఇది నిర్వర్తించాలి’’ అను కర్తవ్యాకర్తవ్యములు ఏవీ ఉండవు. లోకత్రయేఽపి కర్తవ్యం కించిత్ నాస్తి ఆత్మవేదినామ్। ఆత్మతత్త్వము ఎరిగిన మహనీయునికి ఈ మర్త్య - పాతాళ - స్వర్గ త్రిలోకములలో ‘చేయవలసినదే’ అనుబడు కర్తవ్యము కించిత్ కూడా ఏదీ ఉండదు. (ప్రకృత్యైవ చ కర్మాణి - అను భావనను కలిగి ఉంటాడు).

అందుచేత ఓ మునీ! ‘‘అహింస’’ మొదలైన యమ-సాధనలు సర్వప్రయత్నములతో ఆశ్రయించాలయ్యా! జ్ఞాన-యోగాది ప్రయత్నముల చేతనే ‘‘ఏకము - అక్షరము’’ అగు బ్రహ్మమును తెలుసుకొనగలవు. అట్టి పరబ్రహ్మము స్వాభావికము, అనుక్షణికము అగుచుండగా, ఇక ఆపై విధి - నిషేధములు, కర్తవ్య అకర్తవ్యములు తమకు తామే మొదలంట్లా శమించగలవు.


ద్వితీయ ఖండము - నియమము (అష్టాంగయోగములలో రెండవది)

నియమము = నియమించుకొని నిర్వర్తించవలసినవి.

‘‘నియమము’’ అను యోగాంగము యొక్క ఉపాంగములు :
(1) తపస్సు (2) సంతోషము (3) ఆస్తిక్యము (4) దానము (5) ఈశ్వరపూజనము (6) సిద్ధాంతశ్రవణము (7) హ్రీ-మహనీయుల సద్గుణములు గమనిస్తూ, స్వకీయ లోపములను గుర్తించటము) (8) మతి, (9) జపము, (10) వ్రతము

(1) తపస్సు :

శ్లో।। వేదోక్తేన ప్రకారేణ కృత్ చ చాంద్రాయణాదిభిః
శరీర శోషణం యత్, తత్ ‘తప’ ఇతి ఉచ్యతే బుధైః।।

‘‘వేదోక్తంగా చాంద్రాయణ వ్రతము మొదలైనవి నిర్వర్తిస్తూ శరీరమును శోషింపజేయటము’’ను తపస్సు అని బుధుల వచనము. (చాంద్రాయణము = ఈఈ రోజులలో ఉపవాసము, ఈఈ రోజులలో / సమయములలో గుడికి వెళ్ళాలి. ఈఈ నెలలో తీర్థస్థానము… మొదలైన తిథుల నియమములు పాటించటం).

శ్లో।। ‘‘కోవా మోక్షః? కథం తేన సంసారం ప్రతిపన్నవాన్?’’
ఇతి ఆలోచనమ్ అర్థజ్ఞాః ‘‘తపః’’ శంసంతి పండితాః।।

‘‘ఈ మానవజన్మయొక్క మహదాశయము మోక్షము సంపాదించటము’’ అని పెద్దలచే సిద్ధాంతీకరించబడుచున్నది. ‘‘నాకు బంధము ఉండజాలదు’’ - అను అవగాహనారూపమగు మోక్షము గురించిన పరిశీలన, తద్వారా సంసార బంధముల ఛేదనము-ఇదియే తపస్సు - అని నిత్యానిత్యవివేకులగు పండితుల ప్రబోధము.

(2) సంతోషము :

శ్లో।। యదృచ్ఛాలాభతో నిత్యం ప్రీతిః యా జాయతే నృణామ్,
తత్ ‘‘సంతోషమ్’’ విదుః ప్రాజ్ఞాః, పరిజ్ఞానైక తత్పరాః।।

పరిజ్ఞానమే - మహదాశయముగల (తత్పరులగు) పాజ్ఞుల దృష్టిలో - యాదృచ్ఛికంగా లభిస్తున్న దానితో అనునిత్యము ప్రీతి - సంతృప్తి కలిగి ఉండటమే - ‘సంతోషము’ అనబడు నియమాంగము యొక్క - ఉపాంగము.

పరమ సంతోషము : బ్రహ్మలోకమునుండి భూలోకము వరకు ఏదేది ప్రియంగా కనిపిస్తూ, లభిస్తూ ఉంటుందో అట్టి సమస్త విశేషాలపట్ల స్నేహ-సంతోషములకు అతీతులై దర్శించగలటము పరమ సంతోష స్వభావము.

(3) ఆస్తిక్యం :

శ్రౌతే స్మార్తే చ విశ్వాసో యత్, తదా ‘‘ఆస్తిక్యమ్’’ ఉచ్యతే।

శ్రుతులు చెప్పిన ప్రాతః సంధ్యావందనము మొదలై ‘నిత్యకర్మలు’, కొన్ని పరవడి దినములలో నిర్వర్తించవలసినదిగా చెప్పబడే నిమిత్త సంబంధమైనట్టి ‘‘నైమిత్తిక కర్మలు’’, పితృ దేవతా సంబంధమైన (మరియు) వంశపారంపర్య సంబంధమైన వైదికకర్మలు -ఇవి నన్ను సంసారబంధములనుండి ఉద్ధరించగలవు. మోక్షమార్గమునకు దారి చూపగలవు’’ - అను విశ్వాసము కలిగియుండటమును ‘ఆస్తిక్యము’.

(4) దానము :

శ్లో।। న్యాయార్జిత ధనం శ్రాంతేః శ్రద్ధయా వైదికే జనే,
అన్యద్వా యత్ ప్రదీయంతే, తత్ ‘దానం’ ప్రోచ్యతే మయా।।

శ్రమించి న్యాయార్జితంగా సంపాదించిన ధనమును వైదికోపాసనగలవారికి, అర్హులగు సాత్వికజనులకు, అవసరార్థం అర్థించినవారికి సమర్పణ భావముతో శ్రద్ధగా ఇవ్వటము - దానము .

(5) ఈశ్వర పూజనమ్ :

శ్లో।। రాగాది యత్ అపేతం హృదయం, వాక్-దుష్టా, అనృతాదినా,
హింస-ఆది రహితం కర్మయత్, తత్ ‘‘ఈశ్వర పూజనమ్’’।।

రాగము (attachment) మొదలైనవి లేకుండా, నిర్మల హృదయముతో హృదయపూర్వకంగా, ‘‘దుష్ట భావములు, దుష్టవాక్కులు, అనృతము (అబద్ధములు), ఇతరులను హింసించటం మొదలైనవి లేకుండా - ‘కర్మలు’ నిర్వర్తించటమే ‘ఈశ్వరపూజనము’. చేస్తున్న సమస్త కర్మలు (ఈశ్వరార్పితమ్ - న ఇచ్ఛ యాకృతమ్ - చిత్త శోధకమ్ - ముక్తి సాధకమ్ అను) పవిత్ర భావములతో పరమాత్మకు సమర్పిస్తామో…అవన్నీ ఈశ్వరపూజనము అగుచున్నాయి.

(6) సిద్ధాంత శ్రవణము / వేదాంత శ్రవణము :

శ్లో।। సత్యం జ్ఞానం అనంతం చ, పరానందం పరం ధృవమ్
‘ప్రత్యక్’ - ఇతి అవగంతవ్యం వేదాంతం శ్రవణం బుధైః।।

సత్యము, జ్ఞానస్వరూపము, అనంతము, పరానందము, సమస్తమునకు పరము, ధృవము అగు ప్రత్యక్ (కేవల) వస్తువగు ఆత్మగురించి తెలుసుకోవాలనే శ్రవణమే ‘‘వేదాంతశ్రవణము’’.

(7) లజ్జ :

శ్లో।। వేద లౌకిక మార్గేషు కుత్సితం కర్మ యత్ భవేత్,
తస్మిన్ భవతి యా లజ్జా ‘హ్రీః’ సైవేతి ప్రకీర్తితా।।

వేదములకు, లోకశ్రేయస్సుకు సానుకూల్యమగు మార్గములనే అనుసరించాలి. మరియు, లోకధర్మ మార్గములకు ప్రతికూల్యమైన కర్మలయందు, ఇతరులను బాధించు - మోసగించు కుత్సిత (చెడు, దుష్టభావసమన్విత) కర్మలపట్ల వ్యతిరిక్తత కలిగి ఉండాలి. ఆ తీరుగా నిర్వృత్తి (Non-Avocative) ఏర్పడి ఉండటమే ‘హ్రీ’ (లేక) సిగ్గుపడటము. స్వకీయమగు గుణదోషములను గమనించి ,జయించు యత్నము - ‘హ్రీ’ - అనబడుతోంది.

(8) మతి :

వైదికేషు చ సర్వేషు శ్రద్ధా యా, సా ‘మతిః’ భవేత్।।

వైదికమైన (శాస్త్రప్రవచితమైన), లోకకళ్యాణపూర్వకమై కర్మలయందు శ్రద్ధకలిగి ఉండటమే ‘మతి’.

(9) జపము :

శ్లో।। గురుణా చ ఉపదిష్టోఽపి తత్ర సంబంధ వర్జితః
వేదోక్తేనైవ మార్గేణ మంత్ర - అభ్యాసో ‘జపః’ స్మృతః।।

గురూపదేశమైనట్టి (లేదా) వేదములలో చెప్పిన విధంగా (వేదోక్తమైన మార్గంగా) … మంత్రమును అభ్యాసము చేస్తూ ఉంటే…అది ‘జపము’ అని చెప్పబడుతోంది.

కల్పసూత్ర విధానములందు, వేదాధ్యయనమునందు ధర్మశాస్త్రమునందు, పురాణములందు, ఇతిహాసములందు ‘‘శ్రవణ- పారాయణ-అధ్యయన’’ వృత్తి కలిగిఉండటమే జపము.

దర్శన-ఉపనిషత్-జపము

❋ ఉచ్చైః జపాత్ ఉపాంశుశ్చ సహస్ర గుణ ఉచ్యతే।। బిగ్గరైన గొంతుకతో జపము చేయటము కన్నా కూడా రహస్యముగా చేయు జపము వేయి రెట్లు అధికమైనది.
❋ మానసశ్చ తథా ఉపాంశ సహస్రగుణ ఉచ్యతే।। మనస్సుతో చేసే జపము వాక్-జపము కంటేకూడా వేయి రెట్లు ప్రభావితము/ ప్రయోజనకరము.
❋ ఉచ్చైః జపశ్చ సర్వేషాం యథోక్త ఫలదో భవేత్। కొందరు కలసి బిగ్గరగా జపము చేయటము ఇంకా కూడా ఉత్తమ ఫలము ప్రసాదించగలదు.
❋ శ్రోత్రేణ చేత్ మంత్రః శ్రుతశ్చేత్ నిష్ఫలా భవేత్। ఇతరులు వినాలనే ఉద్దేశ్యముతో జపము చేస్తే, అట్లా వినిపించటము నిష్ఫలము అవగలదు.

(10) వ్రతము:

శాస్త్రములచే ఉపాసనగా చెప్పబడుచున్న ఆయా నియమములతో కూడిన వ్రతము. {(వ-రతము = వషట్ కారుడగు పరమాత్మయందు మాత్రమే రతించటము. (ఉదా : గోపికా స్త్రీలు)}.

ఈ 10 ‘నియమదశ’ అనబడుచున్నాయి.


తృతీయ ఖండము - ఆసనము (అష్టాంగయోగములలో మూడవది)

ఓం
శ్రీ దత్తాత్రేయస్వామి :
ఓ మునిపుంగవా! సాంకృతి మునీంద్రా! ముఖ్యముగా ‘9’ ఆసనములు (ప్రసిద్ధముగా) చెప్పబడుచున్నాయి.

(1) స్వస్తికాసనము (2) గోముఖాసనము (3) పద్మాసనము (4) వీరాసనము (5) సింహాసనము (6) భద్రాసనము (7) ముక్తాసనము (8) మయూరాసనము (9) సుఖాసనము

(1) స్వస్తికాసనము :

జాను ఊర్వోః అంతరే కృత్వా సమ్యక్ పాదతలే ఉభే, సమగ్రీవ శిరః కాయః - ఇతి ‘‘స్వస్తికాసనమ్’’।।
✤ రెండు రెండు పాదముల తలములను (మడమలను) పిక్కలను తొడల మధ్యగా ఆనించి ఉంచటము
✤ మెడను, శిరస్సును, శరీరమును నిఠారుగా ధారణ చేయటము. ఈ రెండు ప్రక్రియలు కలిపి ‘స్వస్తికాసనము’ అనబడుతోంది. ఇది నిత్యము అభ్యసించతగినది.

(2) గోముఖాసనము:

సవ్యే దక్షిణ గుల్ఫంతు పృష్ఠ పార్శ్వే నియోజయేత్ - దక్షిణేఽపి, తథా సవ్యం - ‘‘గోముఖం’’ తత్ ప్రచక్షతే।।
✤ ఎడమ పృష్ఠ పార్శ్వమునందు కుడి చీలమండలమును, కుడి పృష్ఠ పార్శ్వము నందు ఎడమ చీలమండలమును ప్రవేశింపజేసి ఉంచటము - గోముఖాసనము.

(3) పద్మాసనము:

అంగుష్ఠాః అధి గృహీణాయాత్ హస్తాభ్యాం వ్యుత్క్రమేణ తు, ఊర్వో ఉపరి కృత్వా పాదతల ద్వయమ్ - ‘‘పద్మాసనం’’ భవేత్ - (ఇదమ్) సర్వరోగ భయాపహమ్।।
✤ రెండు తొడలపైనా రెండు పాదములను - (ఎడమ పాదము కుడిగా, కుడిపాదము ఎడమగా) - బొటనవ్రేళ్ళను ఉత్క్రమణముగా (పైకి లేచురీతిగా) ఉంచి, రెండు కాళ్ళ బొటనవ్రేళ్ళను చేతులతో పట్టుకోవటము - పద్మాసనము.
✤ ఓ విప్రేంద్రా! ప్రాజ్ఞా! ఈ ఆసనము సర్వరోగముల భయములనుండి విముక్తికరము.

(4) వీరాసనము :

దక్షిణా ఇతర పాదం తు దక్షిణా ఊరుణి విన్యసేత్, - ఋజు కాయః సమ-ఆసీనో - ‘‘వీరాసనమ్’’ ఉదాహృతమ్।।
✤ ఎడమ పాదమును కుడి తొడపై వేసి, శరీరమును నిఠారుగా ధారణ చేసి, దేహమును సమస్థితికి తెచ్చి సమముగా ఆసీనుడై ఉండటము వీరాసనము.

(5) సింహాసనము :

✤ మోకాళ్ళ వరకు మడచి తొడలు తాకించి ఉంచి, ముఖమును ఊర్థ్వధారణ చేసి మోచేతులు చాపి ఉంచటము.

(6) భద్రాసనము :

పార్శ్వ పాదౌ చ పాణిభ్యాం దృఢం బధ్వా సునిశ్చలమ్ ‘భద్రాసనమ్’ భవేత్।। - ఏతత్ విషరోగ వినాశనమ్।
✤ సుఖాసీనుడై, పాదముల పార్శ్వ (ప్రక్క) భాగమును చేతులతో దృఢముగా పట్టుకొని కదలికలు లేక ఉండటము భద్రాసనము. ఇది విషరోగములన్నిటినీ నశింపజేయగలదు.

(7) ముక్తాసనమ్ :

మేఢ్రాత్ ఉపరి నిక్షిప్య - సవ్యం గుల్ఫం తత్ ఉపరి, గుల్ఫాంతరం చ సంక్షిప్య - ‘‘ముక్తాసనమ్’’।
✤ ఓ మునీశ్వరా! సవ్య (ఎడమకాలి) చీలమండలమును మేఢ్రము (పొత్తికడుపు క్రిందగా) నిక్షిప్యము చేసి (నొక్కిపట్టి ఉంచి), రెండవ మడమను మడిచి ఉంచటము - ముక్తాసనము.

(8) మయూరాసనము :

కూర్పర అగ్రే నిక్షిపేత్ నాభి పార్శ్వయోః, భూమ్యాం పాణితల ద్వంద్వం నిక్షిప్య ఏకాగ్రమానసః - సమున్నత శిరః పాదో దండవత్ వ్యోమ్ని సంస్థితః - మయూరాసనమ్। - ఏతత్ స్యాత్ సర్వ పాప ప్రణాశనమ్।।
✤ నాభిప్రక్కగా మోచేతి చివరి భాగములను తాకించి ఉంచటము.
✤ ఏకాగ్రాచిత్తుడై….భూమిపై రెండు అరచేతులను తాకిండి ఉంచటము.
✤ శిరస్సును పాదములను పైకి గాలిలోకి ఎత్తి ఉంచటము. నెమలి వలే శిరస్సును ముందువైపుగా ధారణ చేయటము.
✤ ఇది మయూరాసనము. ఈ ఆసనము యొక్క ఆభ్యాసముచే ఈ జీవునియొక్క సర్వపాపకర్మఫలములు శమించగలవు.

(9) సుఖాసనము :

✤ పైన చెప్పబడిన 8 యోగాసనములలో ఒకటిగాని, లేదా ఆయా ఇంకా అనేక ఆసనములలోని కొన్ని విశేషములుగాని క్రోడీకరించి (ఎవరికి వారికే) ‘‘ఏకాగ్రతకు, దీర్ఘకాలము కదలక ఉండటానికి సానుకూల్యమైనది’’ అను ఆసనమును యోగాభ్యాసి ఎన్నుకోవచ్చు.
✤ ఆ విధంగా యోగి తన శరీరమునకు, అభిరుచికి, దీర్ఘకాలము యోగాభ్యాసమునకు సానుకూల్యమగు ఆసనముయొక్క ఎంపికా విధిని ‘సుఖాసనము’ అంటారు.

యోగి తనకు సానుకూల్యమైన ఆసనము ఎన్నుకొని, సుఖముగా ఆసీనుడై, ధ్యాన-యోగాభ్యాసములను చేసుకోగలుగుచూ ఉండగలగటమును ‘ఆసన జయము’ అని పిలుస్తారు. (ఆసనముల గురించి ఆయా మరికొన్ని విశేషములు శుక్లవేద-అంతర్గతమైన ‘త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్’లో వివరించబడ్డాయి.

సర్వశక్తులు - యుక్తులు ఉపయోగించి యోగాభ్యాసి ముందుగా సుఖాసనమును సిద్ధించుకోవాలి.

ఆసనం విజితం యేన జితం తేన జగత్రయమ్।।
సానుకూల్యమగు (లేదా) శాస్త్రీయమగు ఆసనమును స్వాభావికంగా సిద్ధించుకోవటమే అతి ముఖ్యమగు ప్రారంభసిద్ధి. ఆసన విజయము సంపాదించుకొన్నాడా, ఇక ఆ పై, ఆ యోగి త్రిలోకములను జయించగలడు.

ఓ సాంకృతి మహాశయా!
ఈ విధంగా ఆయా విధానంగా ఆసన జయము సంపాదించిన యుక్తుడు ఇక ‘ప్రాణాయామము’ అనబడు యోగాభ్యాసమునకు ఉపక్రమించునుగాక! - అనేన విధినా యుక్తః ‘ప్రాణాయామం’ సదా కుర్వితి।।


చతుర్థ ఖండము - శరీర నిర్మాణము - నాడుల అమరికలు

శ్రీ దత్తాత్రేయ అవధూత: ఓ సాంకృతి మునీంద్రా! ఇక ఇప్పుడు పంచభూతముల అమరికచే నిర్మితమై కనిపిస్తున్న ఈ ‘‘భౌతిక శరీరము’’ గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాము. సృష్టికర్త యొక్క సంకల్పానుసారం మహత్ కళాత్మకంగా ప్రకృతిచే ఈ భౌతిక శరీరము నిర్మితమౌతోంది. అట్టి ఈ శరీరము ప్రవర్తమానమవటానికి గాను, ఇందులో విశిష్టమైన అనేక విశేషాలు అత్యంతాశ్చర్యకరంగా ప్రదర్శనమగుచూ ఉన్నాయి.

(చేతియొక్క బొటనవ్రేలు-అడ్డరేఖ నుండి పై విభాగముతో కొలిస్తే) 96 అంగుళములంతగా ఈ భౌతిక దేహము పొడవు. శరీరం తావత్ ఏవ స్యాత్ షట్ నవ (96) అంగులాత్మకమ్!

శిఖిస్థానము (central zone): దేహములన్నిటిలో ‘శిఖి’ అనేది దేహ కేంద్రీకృత స్థానము మధ్యగా ఏర్పడినదై ఉంటోంది.

ఈ మేలిమి బంగారము వంటి ప్రకాశముగల శిఖిస్థానము (శక్తి కేంద్రీకృతస్థానము) మానవులలో ణ త్రికోణాకారముగా సత్యద్రష్టలచే (శారీరకతత్త్వవేత్తలచే) గమనించబడి శాస్త్రముల రూపంగా ప్రకటించబడుతోంది.

దర్శన-ఉపనిషత్-శరీర-నాడీ-నిర్మాణము

గుదస్థానమునకు రెండు అంగుళములకు పైవైపుగా, మేఢ్రము (పొత్తికడుపు)నకు రెండు అంగుళములు క్రిందవైపుగా మనుష్యులలో దేహమధ్యగా ఈ శిఖిస్థానము ఏర్పడి ఉంటోంది. ఇద్దానిలో 9 అంగుళముల పొడవు, 4 అంగుళముల వెడల్పుగల కందస్థానము. ఇది శరీరమునకు మూలాధారము. ఈ కందము త్వక్కు (చర్మము) మొదలైనవాటితో కప్పబడి కోడిగ్రుడ్డు ఆకారము కలిగి ఉంటోంది. అట్టి కందమునకు మధ్యగా కేంద్ర స్థానము, ‘నాభి’ యోగజ్ఞులచే స్వానుభవముగా దర్శించబడుతోంది.

ఓ యోగపుంగవా! అట్టి కందమునకు మధ్యగా ఒక ప్రముఖమైన నాడి - ‘‘సుషుమ్ననాడి’’ అని పరికీర్తించ బడుతోంది. దానిచుట్టూ (కంద స్థానమునుండి) 72000 నాడీ - ఉపనాడులు బయల్వెడలి శరీరములో మారుమూలల వరకు పూతీగలవలె విస్తరించి ఉంటున్నాయి.

అట్టినాడులలో ముఖ్యమైనవి ‘14’.

(1) సుషుమ్న (2) పింగళ (3) ఇడ, (4) సరస్వతి, (5) పూష, (6) వరుణ, (7) హస్తిజిహ్వ (8) యశస్విని, (9) అలంబుస, (10) కుహూ, (11) విశ్వోదరి, (12) తపస్విని, (13) శంఖిని, (14) గాంధారి

ఈ 14 నాడులలో అత్యంత శ్రేష్ఠమైనవి, ముఖ్యమైనవిగా ‘3’ నాడులు - (1) సుషుమ్న, (2) ఇడ, (3) పింగళ.

సుషుమ్న

శ్లో।। ఆసాం ముఖ్యతమాః తిస్రః।
తిసృషు ఏక ఉత్తమోత్తమా। ‘బ్రహ్మనాడీ’ సా ప్రోక్తా।।

ఓ మునీశ్వరా! ఈ త్రినాడులలో కూడా ఇంకా అత్యంత ప్రాముఖ్యమైనది. ‘‘సుషుమ్ననాడి’’. బ్రహ్మరంధ్రమువరకు విస్తరించి ఉండటంచేత, బ్రహ్మవేత్తలచే (లేక వేదాంతవేదులచే) ‘‘బ్రహ్మనాడి’’ అని కూడా పిలువబడుతోంది. ఇది వీణాదండమువలె ఉండి కందముయొక్క కేంద్రీకృత విభాగము నుండి పృష్ఠము (వీపు Back Bone వరకు) విస్తరించి ఉన్నది.

‘‘పృష్ఠమధ్య స్థితేవ అస్థ్నౌ వీణాదండేన, గుహ మస్తక పర్యంతం సుషుమ్నా సుప్రతిష్ఠితా।।’’

కుండలిని : నాభికందమునకు 2 అంగుళములు క్రిందగా ‘కుండలినీ స్థానము’ ఉన్నది. అది అష్టప్రకృతి రూపమై యున్నది.

కందము చుట్టూ నిత్యము వాయువు యొక్క చేష్టలచే జలము, తిన్న పదార్థాములు త్రాగిన జలము నిరోధము పొందుతూ ఉంటాయి. సుషుమ్న కందమునుండి బయల్వెడలుచున్న సుషుమ్ననాడి (లేక) బ్రహ్మనాడి - చిట్టచివర శిరస్సుకు ఉపరిభాగమున గల బ్రహ్మరంధ్రము వరకు విస్తరించి, చిట్టచివర - చుట్టచుట్టుకొనియున్న ఆకారముగా ఏర్పడి ఉంటోంది.

సుషుమ్ననాడికి
ఎడమవైపుగా → ఇడా నాడి।
కుడివైపుగా → పింగళనాడి।
పార్శ్వముగా (ప్రక్కగా) → సరస్వతీ, కుహునాడులు।
ఇడా నాడికి ముందు వెనుకలుగా → గాంధారీ, హస్తిజిహ్వ నాడులు।
పింగళకు వెనుక ముందుగా → పూషా, యశస్వినీ నాడులు।
కుహూ - హస్తిజిహ్వలకు మధ్యలో → విశ్వోదరీ నాడి।
యశస్విని - కుహూలకు మధ్యగా → వరుణ నాడి।
వూష-సరస్వతీలకు మధ్యగా → యశస్విని నాడి।
గాంధారీ - సరస్వతీలకు మధ్యగా → శంఖినీ నాడి।
కందమధ్య నుండి - పాయువు వరకు → అలంబుస నాడి।

సుషుమ్నయొక్క ముందు భాగంలో → కుహునాడి. ఈనాడి క్రిందకు - పైకి క్రమంగా ముక్కుచివరి వరకు విస్తరించి యున్నది.
పైకి క్రిందకూ ఉన్న నాడులన్నీ కూడా శరీరము మూలమూలలా (ఆకులోని ఈనెలవలే) వ్యాపించి ఉన్నాయి. ఈ నాడులన్నీ వాటి వాటి రూపురేఖలననుసరించి పేర్లు పెట్టబడ్డాయి.

ఇడానాడి → ఎడమవైపు ముక్కు చివరి వరకు ప్రసరించి ఉన్నది।
యశస్వినీనాడి → పాదముల బొటనవ్రేలు చివరి వరకు।
పూషా → ‘పిగళ’కు వెనుకగా ఎడమ కంటివరకు విస్తరించి ఉంటోంది।
యశస్వినీ → కుడిచెవి ఆసాంతము వరకు।
సరస్వతీ → ఊర్థ్వముగా నాలుక చిట్టచివరి వరకు।
హస్తిజిహ్వా → కుడి పాద అంగుష్ఠము (బొటనవ్రేలు) చివరి వరకు।
శంఖినీనాడి → కుడిచెవి - శ్రవణ స్థానము చివరి వరకు।
గాంధారీ నాడి → ఎడమకన్ను చిట్టచివరి వరకు। (కంటిపాప మధ్యస్థానము వరకు)
విశ్వోదర → కంద మధ్యప్రదేశములోనికి

ఈఈ విధములుగా విస్తరించి ఉన్నాయి.

సర్వనాడులలో ప్రాణ ప్రసరణము

నాడులన్నిటిలో పంచప్రాణములు, పంచ ఉపప్రాణములు సంచారములు కలిగినవై ఉంటున్నాయి.

Ⅰ. పంచప్రాణములు → ప్రాణ-అపాన-వ్యాన-సమాన-ఉదానములు.
Ⅱ. పంచ ఉపప్రాణములు → నాగ-కూర్మ-కృకర-దేవదత్త-ధనంజయములు.

వాయు ప్రసరణ ముఖ్య స్థానములు

ప్రాణము → ఆస్య నాసికయోర్మధ్యే నాభి మధ్యే తథా హృది-ప్రాణసంజ్ఞో అనిలో నిత్యం వర్తతే। నాసిక (ముక్కు) మధ్యప్రదేశములోను, నాభి మధ్యప్రదేశములోను, హృదయమధ్యగాను ముఖ్య ప్రదర్శనము కలిగి, నిత్యము అగ్నిరూపముగా వర్తనము కలిగి ఉంటున్నది. ఇది దశ ప్రాణములలో పూజ్యాతి పూజ్యము.

అపానవాయు ప్రసరణము : అపానో వర్తతే నిత్యం గుద మేఢ్ర ఊరు జానుషు। ఉదరే సకలే కట్యాం, నాభే జంఘేచ। గుదమునుండి మేఢ్రము (పొత్తికడుపు) ఊరువులు, జానువులయందు (మోకాళ్ళయందు), జంఘములలో (పిక్కలలో), కటి (మొల) ప్రదేశములలోను, బొడ్డు (నాభి) స్థానములోను అపానవాయువు నిత్యము సంచారము కలిగి ఉంటున్నది.

వ్యానవాయు ప్రసరణము : వ్యానః శ్రోత్ర - అక్ష మధ్యే చ, కుకుద్భ్యాం గుల్ఫయోరపి, ప్రాణస్థానే గళే చ ఏవ వర్తతే। రెండు కనుల మధ్య ప్రదేశమునందు, పిరుదులలోను, గుల్ఫములయందు (చీలమండలములయందు), కంఠమునందు సంచలనము కలిగియుంటోంది.

ఉదానవాయు ప్రసరణము : ఉదానసంజ్ఞో విజ్ఞేయః పాదయోః హస్తయోరపి। పాదములయందు చేతులయందు వ్యానవాయువు ముఖ్య ప్రదర్శనము (లేక) సంచలనము కలిగి ఉంటోంది.

సమానప్రాణము : సమానః సర్వ దేహేషు వ్యాప్య తిష్ఠతి। దేహమంతటా సమస్త ప్రదేశములలో వ్యాపించి అణువణువూ స్థానములు పొందుచూ ఉంటోంది.

ఇక నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము అనబడు పంచ ఉపప్రాణములు చర్మమునందు, అస్థిల (బొమికల) యందు, ఇంకా ఆయా ప్రదేశములలో సంచారములు కలిగి ఉన్నాయి.

ఉచ్ఛ్వాస నిశ్వాసలు → పంచప్రాణములలో మొదటిది అగు ‘ప్రాణము’ యొక్క ధర్మము. (Function).

మలమూత్ర - మొదలైన విసర్జనములు → అపానము యొక్క ధర్మములు

శరీరములోని ఆయా వేరు వేరు విభాగములన్నీ పరస్పర సామీప్యత (Inter-Relationship) ఏర్పరచటము → సమాన ప్రాణముయొక్క ధర్మము

ఊర్ధ్వగమనము (రక్తము మొదలైనవాటి ప్రసరణములు) → ఉదాన ప్రాణముయొక్క ధర్మము

ఆయా విభాగములు కలిసిపోకుండా వివాద పరిరక్షణము → వ్యానప్రాణము నిర్వర్తిస్తోంది

ఈ విధంగా వేదాంత వేదులు అధ్యయనము చేసినవారై, వివరిస్తున్నారు.

ఓ మహామునీ! ఇంకా కూడా, పంచ ఉపప్రాణముల ధర్మముల (Functions) గురించి యోగవేత్తలచే ఏ తీరుగా గమనించి చెప్పబడుతోందో - అది వినండి.

నాగ ఉపప్రాణము (ఉద్గారాది గుణఃప్రోక్తో) - దేహములో వాయువుయొక్క సంచలనముల అడ్డులను తొలగించటము అందుకొరకై, కక్కు, త్రేణుపు - ఇత్యాదుల నిర్వహణ.

కూర్మము (నిమీలనాది) → కనులుమూయు, తెరియు ప్రక్రియలను నిర్వర్తించటము.

కృకరము (క్షుధా తు) → ఆకలి దప్పికలను పర్యవేక్షించటము.

దేవదత్తము (తంద్రీ కర్మ) → ప్రేగుల వ్యవహారమును, నాడీ సంచలనమును నిర్వర్తించటము

ధనంజయము (శోభాది కర్మ) → దేహముయొక్క శోభ, ప్రత్యుత్సాహములను పాలన చేస్తూ ఉండటము.

।।నాడులు - దేవతాంశలు।।

ఈ దేహములో దేవతాంశలను సుషుమ్న, ఇడ, పింగళ మొదలైన నాడుల ప్రదర్శనారూపములుగా యోగాధ్యయనులు ఉపాసన చేస్తున్నారు.
సుషుమ్న → శివ దేవాంశ.
ఇడను → దేవతాంశ - ‘హరి’.
పింగళను → విరించి. సరస్వతి నాడి - ‘‘విరాట్టు’’
పూస → బుద్ధి (బృహస్పతి).
వరుణ → వాయువు (వాయుదేవుడు).
హస్తిజహ్వి → వరుణదేవుడు.
యశస్విని → భగవానుడగు భాస్కరుడు.
అలంబుస → అంబాత్మ అయిన వరుణుడు.
కుహు → క్షుత్‌దేవత (అన్నపూర్ణ-వైశ్వానరుడు).
గాంధారి → చంద్ర దేవత.
శంఖిని → చంద్రమస (ఔషధ-తేజో విభావములు)
యశస్విని → ప్రజాపతి.
విశ్వోదర → భగవాన్ అగ్నిదేవుడు.

ఈ విధమైన దివ్యతత్త్వముల దేవతారాధనచే ఆయా నాడులతో సహా నాడీమండలమంతా స్వానుభవముగా అవగలవు. ఆయా నాడులకు ‘పతులు’గా, దివ్య తేజస్సులుగా - ఆయా దేవతలు వర్ణించబడుచున్నారు.

ఓ మహామునీ! ఇంకా వినండి.

ఇడా నాడియందు - చంద్రమా సంచారము
పింగళనాడి యందు - రవి (సూర్య) సంచారము
- తేజోవిభవములై జరుగుచున్నది.

వాయువు ఇడ నుండి సుషుమ్నకు, సుషుమ్ననుండి పింగళకు, పింగళ నుండి సుషుమ్నను, సుషుమ్న నుండి కపాలమునకు - ఒకచోటును విడిచి మరొక చోటికి - ప్రయాణము చేస్తోంది. ఇదంతా వాయు సంక్రమణములు గా అభివర్ణితము.

వాయు సంక్రమణము = ఉత్తరాయణ - దక్షిణాయణములు

ఇడయందు చంద్రుడు (చంద్రాంశ), పింగళయందు సూర్యుడు (సూర్యాంశ) సంచారములు కలిగియున్నాయని అనుకున్నాము కదా!

వాయువు…
ఇడ నుండి (ఖాళీ చేసి) → పింగళకు,
పింగళ నుండి (ఖాళీ చేసి) → ఇడకు
వాయువు ప్రవేశమును ‘ప్రాణసంక్రమణము’ అనబడుతోంది. ఇడ - పింగళలకు మధ్య ప్రాణశక్తి నిలచినప్పుడు - ‘అమావాస్య’ అనబడుతోంది. (సంక్రమణము = వాయువు ఒక చోటును ఖాళీ చేసి మరొకచోటును ఆక్రమించటము.)

(1) ఉత్తరాయణ వాయు సంక్రమణము : పింగళాయా ఇడాయాం తు వాయోః సంక్రమణం తు యత్, తత్ ‘‘ఉత్తరాయణమ్’’ ప్రోక్తమ్, మునే! వేదాంతవేదిభిః।। పింగళనాడిని ఖాళీ చేసి వాయువు ‘ఇడ’ నాడిని నింపి ఉండటము - ‘‘ఉత్తరాయణ వాయు సంక్రమణము’’ అనబడుచున్నది.

అనగా…. (వాయువు పింగళను వదలి ఇడలో ప్రవేశము పొందుచున్నప్పుడు)

{సంక్రమణము ఒకచోటును వదలి మరొక చోటికి ప్రవేశము పొందటము….అది ‘‘ఉత్తరాయణము’’ అనబడుచున్నది.}

(2) దక్షిణాయణము : ఇడాయాః పింగళాయాం తు ప్రాణసంక్రమణం దక్షిణాయనమ్ - పింగళాయామ్।। : ఇడనాడి నుండి పింగళనాడిలోనికి ప్రాణసంక్రమణము జరుగుచున్నప్పుడు అది పింగళనాడికి ‘‘దక్షిణాయనము’’ అగుచున్నది.

(3) అమావాస్య : ఇడా పింగళయో సంధిః యదా ప్రాణః సమాగతః, అమావాస్యా తదా ప్రోక్తా దేహే।।

ప్రాణప్రసరణము (వాయు ప్రసరణము) ఇడ - పింగళనాడుల సంధి (In between space) యందు సమాగతమైనప్పుడు అది - దేహములో ఏర్పడే అమావాస్య - అనబడుతోంది.

అనగా ప్రాణశక్తి →
ఇడనాడి నుండి బయల్వెడలి → ఇంకనూ పింగళయందు ఆ ప్రాణశక్తి ప్రవేశించి ఉండనప్పుడు
పింగళనుండి బయల్వెడలి → ఇడయందు ఇంకను, ప్రవేశించియుడనప్పుడు
మధ్యగత సంస్థతము - → ‘అమావాస్య’ అని యోగ పరిభాషగా అనబడుచున్నది.

ప్రాణ సంక్రమణము - మరికొన్ని విశేషాలు

శ్రీ దత్తాత్రేయ జగద్గురువు : ఓ పండితోత్తమా! సాంకృతి మహాశయా! ‘ప్రాణప్రసరణము’ను అనుసరిస్తూ ప్రాణతత్త్వప్రాజ్ఞులు ఏవిధంగా సూర్య-చంద్రమాసములను ఉత్తరాయణ - దక్షిణాయణములను, ఇండా-పింగళ సంధిరూప అమావాస్య సంఘటనలను గమనిస్తూ ప్రాణోపాసన చేస్తారో, ఆయా కొన్ని విశేషాలు ఇప్పటిదాకా చెప్పుకున్నాము కదా! ఇప్పుడు మరికొన్ని విశేషాలు వివరించుకుంటున్నాము. శ్రద్ధగా వినండి.

విషవత్తు కాలము
(విషవత్తు = రేయి పగలు సమవత్ స్థితిని చేరుకాలము)

ఆద్యం విషువము (లేక) విషవత్తు:
మూలాధారం యదా ప్రాణః ప్రవిష్టః, తత్ ‘‘ఆద్యం విషువమ్’’ ప్రోక్తం తాపసైః।

ఓ పండితోత్తమా! ఎప్పుడైతే ప్రాణము (వాయుప్రసరణము/ప్రాణశక్తి) మూలాధారములో ప్రవేశము పొందుచున్నదో అట్టి క్రియను ‘ఆద్య విషువము’ అని తాపసులు పిలుస్తున్నారు. (ఇది దేహ సంచలన ప్రారంభము కూడా).

అంత్యం విషువము :
ప్రాణసంజ్ఞో మూర్ధానం ప్రావిశత్ యదా, తత్ ‘అంత్యం విషువమ్’ ప్రోక్తం తాపసైః తత్త్వ చింతకైః।।

తత్త్వ చింతనాపరులగు తాపసులు ఇంకా - ఇట్లా చెప్పుచున్నారు. ప్రాణశక్తి (లేక వాయు ప్రసరణము) మూర్ధ్నమునందు (ముఖము యొక్క శిఖరాకాశమునందు ForeFace) ప్రవేశము పొందినప్పుడు అది ‘‘అంత్యవిషువము’’ (ఇది ఊర్ధ్వయోగ మార్గము).

మాస సంక్రమణము :
నిశ్వాస (గాలిని లోపలికి పీల్చటము - ఉచ్ఛ్వాస (ఊపిరిని బయటకు వదలటము) - ఈ సమస్తము కూడా ‘మాస సంక్రమణము’ (ఒక మాసము నుండి మరొకమాసములో ప్రవేశము)

చంద్రగ్రహణము :
ఇడాయా కుండలీ స్థానం యదా ప్రాణః సమాగతః (తదా) ‘సోమ గ్రహణం’ ఇత్యుక్తమ్।।

ఓ తత్త్వవిదాంవరా! ఇడానాడిలో కుంభకము జరుగుచుండగా, అట్టి ప్రాణ (వాయు) ప్రసరణము కుండలినీ శక్తిలో ప్రవేశము పొందటమును (సమాగతము) ‘చంద్రగ్రహణము’ అని తత్త్వవేత్తలచే పిలువబడుతోంది.

సూర్యగ్రహణము:
యదా పింగళయా ప్రాణః కుండలిస్థానం ఆగతః, తదా తదా భవేత్ సూర్యగ్రహణమ్।।

ఓ సాంకృతి మునిపుంగవా! పింగళ నాడిలో నిండియున్న (కుంభకము అయి ఉన్న) వాయువు (ప్రాణము) → కుండలీస్థానముతో సమాగతము (getting Associated) అగుచున్నప్పుడు - అది ‘సూర్యగ్రహణము’.

దేహక్షేత్రము
దేహములో సర్వతీర్థములు

మహాప్రాజ్ఞా! ఓ సాంకృతి మహాశయా! ఈ ‘దేహము’ అనే ‘‘పరమాత్మ వేంచేసియున్న పవిత్రక్షేత్రము’’లోనే పవిత్రమగు తీర్థములన్నీ స్థానము కలిగియే ఉన్నాయి - అని యోగులు అనునిత్యంగా సందర్శనము చేస్తున్నారు. బాహ్యతీర్ధములు - దేహాంతర్గత తీర్థముల సంజ్ఞలు మాత్రమే!

ఆత్మ తీర్థము

ఈ విధంగా ఈ శరీరము ఆత్మభగవానుడు వేంచేసి సర్వత్రా ప్రకాశమానమైయున్నారు. అందుచేతనే యోగశాస్త్రములో ఈ శరీరమును ‘‘క్షేత్రము’’ అని పిలుస్తున్నారు. ప్రాణశక్తి విశేషంగా ప్రవర్తమానమైయుండి దేహములోని ఆయా ప్రదేశములే - యోగులు దృష్టిలో పుణ్యతీర్థములు.

శ్లో।। ఆత్మతీర్థం సముత్స్యజ్య, బహిః తీర్థాని యో వ్రజేత్,
కరస్థం స మహారత్నం త్యక్త్వా, కాచం విమార్గతే।।

ఎవ్వడైతే ‘‘ఆత్మతీర్థము’’ను ఈ దేహమునందు సందర్శించకుండా, బాహ్యమునగల తీర్థములకొరకై మాత్రమే పరుగులు తీస్తూ ఉంటాడో, (లేక) ‘‘నేను తీర్థయాత్రలు చేయలేకపోతున్నానే?’’ అని దిగులుపడుతూ ఉంటాడో….
అట్టివాడు ఎక్కడో గాజుపూస గురించి విని, అద్దానికొరకై పరుగులు తీస్తూ, చేతిలోని మహారత్నమును (ధగధగాయమానమగు రత్నమాలను) చేజార్చుకున్నవాడు - అగుచున్నాడు.

భావన

అన్నిటికీ మూలము భావనయే!

భావనయే బంధము. భావనయే సాధన. భావనయే మోక్షము కూడా.

‘‘ఏ కర్మ చేస్తున్నాము?’’ - అను దానినిబట్టి బంధముగాని, మోక్షముగాని ఉండవు. ‘‘ఏ భావనతో అట్టి కర్మను నిర్వర్తించుచున్నాము’’ - అన్నదానిని అనుసరించి సంసారమో (లేక) మోక్షమో రూపము పొందుచున్నాయి.

భావనచేతనే ఈ దేహములో యోగులు సర్వతీర్థములు దర్శిస్తూ ఉపాసన చేయుచున్నారు. తీర్థోపాసనా ఫలమును సిద్ధించుకొనుచున్నారు.

‘‘సమస్తము భావనాభేద చమత్కారమే’’ అని మనము ఆరూఢ పరచుకోవటానికి ఒక దృష్టాంతము చెప్పుతాను. వినండి.

ఆలింగనము ఒక్కటే అయినప్పటికీ భార్యను ఆలింగనము చేసుకొనుచున్నప్పుడు, కుమార్తెను ఆలింగనము చేసుకొనుచున్నప్పుడు భావనలు వేరు వేరే కదా! అన్యథా ఆలింగ్యతే కాంతా, అన్యథా ఆలింగ్యతే సుతౌ।।

‘‘భావనాసిద్ధి’’ని సముపార్జించుకొన్న యోగవరేణ్యులు తమయందు, సర్వసహజీవులయందు అఖండమగు ఆత్మను దర్శించుచూ, ఉపాసించుచూ ఆత్మభావనను అప్రతిహతంగా సిద్ధించుకుంటున్నారు. తామే సర్వాత్మక స్వరూపులై, స్వయం - దర్శనా భావనా ఔన్నత్యంగా ప్రకాశించుచున్నారు. (ఇది దర్శనోపనిషత్ సారము).

ఇక…,

తీర్థాని తోయపూర్ణాని। దేవాన్ కాష్ఠాని నిర్మితాన్। యోగినో న ప్రపద్యంతే స్యాత్మ ప్రత్యయ కారణాత్।।
తీర్థములన్నీ నదులన్నీ ఒకే జలమయముగాను, దేవతా విగ్రహములన్నీ - కాష్ఠము (కొయ్య) మొదలైనవాటిచే నిర్మితముగాను దర్శిస్తున్నారు. అట్టి అవధూతలు (లేక) పరమహంసలు ‘‘స్వస్వరూపాత్మ సర్వదా అప్రమేయము, నిర్మలము, కేవలము, సమస్తము’’ అని గమనిస్తూ, స్వాత్మానే ప్రత్యాగాత్మగా (అధ్యాత్మగా) ఉపాసన చేయుచున్నారు. వారు - తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానములు, దేవతా విగ్రహములు, దర్శనములు మొదలైనవాటితో ప్రత్యేకమైన ప్రయోజనమేమీ గమనించటము లేదు. ఆత్మ భావన చేతనే సమస్తమును అంతర్గతంగా సంసిద్ధింపజేసుకొంటూ- దర్శనము చేయుచున్నారు.

బహిః తీర్థాత్ ‘‘పరం తీర్థం’’ - అంతస్తీర్థం మహామునే!
అంతరమునగల ఆత్మతీర్థము బాహ్యతీర్థములకంటే పరము (మహత్తరము - Extremely Divine). ఆత్మతీర్థమే మహాతీర్థము. అన్యతీర్థములు నిరర్థకమే (External wandering is futile).

ఎందుకంటారా?

చిత్తమ్ అంతర్గతం దుష్టం తీర్థస్నానైః న శుధ్యతి।
చిత్తములో అంతర్గతమైన ‘‘కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, చాంచల్యము, అసత్‌దర్శనము, దురవగాహనలు’’…మొదలైన చిత్త దోషములు తీర్థస్నానం చేసినంతమాత్రంచేత తొలగుతాయా? చిత్తశుద్ధి లభిస్తుందా? లేదు. కొంచము విరామము లభించగలదు - అని మాత్రమే అనవచ్చు. కల్లు కుండను వందసార్లు నీటిలో ముంచి లేపితే మాత్రం కుండలోని కల్లు వాసన పోతుందా? పోదు. శుచి అవదు. మరి? అంతరముగా పరిశుద్ధం చేయాలి. అట్లాగే, ఈ చిత్తభాండము కూడా. బాహ్యమున కడిగి తుడిచినంతమాత్రం చేత సరిపోదు. చిత్తము యోగాభ్యాసములచే (మరియు) ఆత్మజ్ఞానము/ దర్శనముల చేతనే పరిశుభ్రమవగలదు.

ఓ మునిపుంగవా!
- దేహములోని (అంతరములోని) విషువద్దినము, ఆయన కాలము, అమావాస్య, చంద్రగ్రహణము, సూర్యగ్రహణములను యోగాభ్యాసముచే గమనించుచూ,
- దేహమునందేగల వారణాసి మొదలైన పవిత్ర క్షేత్రముల - తీర్థములలో భావనాపూర్వకంగా దర్శించి, స్నానము చేయటమే సముచితము.

అప్పుడు ఆ అభ్యాసి ఆత్మయందే ఆత్మచే ఆత్మత్వము సంతరించుకోగలడు. అఖండాత్మానంద స్వరూపుడై విరాజిల్లగలడు.

ఓ మునిపుంగవా! ఇంకా కూడా వినండి!

శ్లో।। జ్ఞానయోగపరానాం తు పాదప్రక్షాళితం జలమ్
భావశుద్ధ్యర్థం అజ్ఞానాం, తత్ తీర్థమ్।। మునిపుంగవ!

ఆత్మజ్ఞాన సంపన్నులగు (తత్త్వవేత్తలగు) మహనీయుల పాదములు కడిగినప్పటి భావశుద్ధి రూపమగు పాదప్రక్షాళణా రూప తీర్థము లభించగలదయ్యా। అయ్యది జన్మజన్మలుగా బుద్ధియందు పేరుకొనియున్న అజ్ఞాన మాలిన్యమును తొలగించగలదు.

ఎంతటి చమత్కారము! శివుడు స్వదేహమునందే, కేవల అఖండ ఆనందస్వరూపుడై వేంచేసి ఉండగా, అట్టి స్వస్వరూప - పరతత్త్వమును దర్శించు యత్నము చేయకుండా ఉంటే ఎట్లా? మూఢత్వముచేత మాత్రమే - తీర్థముల, దానము, జపము, యజ్ఞము, కాష్ఠము, పాషాణములయందు శివదర్శనము చేయాలని - అజ్ఞానముచే యత్నించుచున్నారు. స్వస్వరూపాత్మయందు, స్వస్వరూపాత్మగా దర్శనము చేయువాడే ఆత్మదర్శి (మరియు) తత్త్వదర్శి - (లేక) శివతత్త్వదర్శి.

ఓ మునీశ్వరా! నేను సర్వజీవుల హృదయాంతర్గతుడనై సర్వదా ప్రకాశించుచున్నాను. భావనలకు ఆవల భావనారాయణుడనై, శివానంద స్వరూపుడనై వెలయుచున్నాను.

అంతస్స్థం మాం పరిత్యజ్య బహిష్ఠం యస్తు సేవతే, హస్తస్థం పిండమ్ ఉత్సృజ్య లిహేత్ కూర్పరమ్ ఆత్మనః।
ఒకానొకనికి బాగుగా ఆకలి వేస్తోంది. చేతిలో మధురమైన ఆహారపు ముద్ద ఉన్నది. ‘‘ఆ"! ఇది నా చేతిలో ముద్దయే కదా।’’ - అని అనుకుంటూ తనయొక్క మోచేతిని శ్రమతో ఎత్తి, చేతివెంటగా కారుతున్న కించిత్ ద్రవము కోసం శ్రమిస్తూ ఉంటే ఆకలి తీరుతుందా? అట్టివాడు తెలివితక్కువవాడే కదా!

అట్లాగే,

దివ్యస్వరూపుడుగా అంతస్థుడనై, ఈ జీవునికి అనన్యుడనై ఉన్న నన్ను ఏమరచి - బయట ఎక్కడో ఏదో తీర్థంలో దైవదర్శనము చేయాలని పరుగులు తీస్తే ప్రయోజనం ఏముంటుంది? అది మార్గాన్వేషణయేగాని ‘మహదాశయసిద్ధి’ అనిపించుకోదు.

సాంకృతి మునీశ్వరుడు : అయితే యోగపుంగవులు ప్రతిమలో దర్శించరా?

ఆత్మదర్శనము

శ్రీదత్తాత్రేయ భగవాన్ : అవునయ్యా! ‘‘ప్రతిమమాత్రమే శివుడు’’ - అను పరిమిత దృష్టితో దర్శించరు. యోగులు శివాత్మను స్వహృదయమునందు సర్వతత్త్వాత్మకునిగాను, సర్వతత్త్వస్వరూపుడుగాను దర్శిస్తారు. అంతేగాని శివుని ‘‘ప్రతిమ మాత్రమే’’ - అను దృష్టితో చూడరు. ఇందులో సందేహమే లేదు.

సాంకృతి మునీంద్రుడు : మరట్లా అయితే వేద - వేదాంగములు సాధకులకొరకై ప్రతిమా - ఉపాసన (దేవాలయములు మొదలైనవి), షోడశ సేవా పూజలు ఎందుచేత విధిస్తున్నాయి?

శ్రీదత్తాత్రేయ భగవాన్ : ఓ"! అదా? అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాః పరికల్పితాః।।
అజ్ఞానులు ఆత్మభావన సముపార్జించుకోవటానికై ఉద్దేశ్యించి సాధన దశలో శాస్త్రములు, గురువర్యులు సాధకుల కొరకై ‘ప్రతిమ’ను పరికల్పన చేసి త్రోవచూపుచున్నారు. అద్దానియొక్క ముఖ్యాశయము, అంతిమాశయము ఆత్మతత్త్వభావనయే. సందేహమే లేదు.

అందుచేత ఓ మహామునీ!

మనము నాడీ విశేషాలు, యోగాభ్యాసములు, ప్రాణసంచలన గమనికలు మొదలైనవన్నీ చెప్పుకున్నాము కదా! ఒక ముఖ్యమైన విషయము మీ దృష్టిలో నుండి తొలగకుండా చూచుకోండి.

శ్లో।। నాడీ పుజం సదా సారం నర భావం, మహామునే!
సముత్సృజ్య ‘‘ఆత్మన ఆత్మానమ్ అహమ్’’ ఇతి అవధారయ!

హే మహామునీ! నాడీపుంజమంతా (నాడీసముదాయమంతా) నిస్సారము. అందులో నరభావమే (నరములకు సంబంధించినదే) ఇమిడి ఉన్నది. నారాయణ భావము కాదు. అందుచేత సాధన చేస్తూనే, అద్దానిని వదలినవాడవై ఉండు. ఆత్మచేత ‘‘ఆత్మయే నేను’’ అనే సుదృఢమైన, అచంచలమైన, అచ్యుతమైన ఆత్మభావనను అనుక్షణికము చేసుకొనే యత్నములో నాడీయోగాభ్యాసమును ఉపకరణరూపంగా భావించి ఉండండి.

పరమాత్మ ఎట్టివాడు?

అశరీరం శరీరేషు మహాంతమ్। విభుమ్। ఈశ్వరమ్।

ఆయన అశరీరుడై అయినప్పటికీ, సర్వశరీరములతో వ్యవస్థితులై ఉన్నారు. సమస్తమునకు విభువు (నియామకుడు). మహత్-ఆనంద-అప్రమేయ - కేవల-అనన్యస్వరూపుడు. సమస్తముగా విస్తరించి ఉన్నవారు కాబట్టి ‘‘ఈశ్వరుడు’’. ఆనందస్వరూపుడు. మార్పు-చేర్పులు లేవు కాబట్టి ‘‘అక్షరుడు’’.

అట్టి స్వస్వరూప ఆత్మభగవానుని ‘సోఽహమ్’, ‘తత్‌త్వమ్’ రూపముగా బుద్ధిచే సిద్ధించుకున్న ఆత్మజ్ఞుడు ఇక దేనికీ శోకించడు. చింతించడు.

అటువంటి ఏకాక్షరస్వరూపమగు ఆత్మజ్ఞానముచే - భేదములు కల్పన చేసి ప్రదర్శించుచున్న అజ్ఞానము తొలగిపోయిందా, ఇక బ్రహ్మమునందు ఏదైనా భేదము ఒకప్పుడు సందర్భ పరిమితమై కనిపించటము జరిగినా కూడా…అది ఆత్మసాక్షాత్కార సిద్ధుడవగు నిన్ను ఏమీ చేయజాలదు. ‘త్వమ్’ను ‘తత్’ (బ్రహ్మము)గా దర్శించు స్థానము నుండి ఇక నీవు చ్యుతి పొందవు.


పంచమ ఖండము - నాడీ శుద్ధి

సాంకృతి మునీంద్రుడు : హే భగవాన్! దత్తాత్రేయా! లోకగురూ! నేను జీవన్ముక్తుడను అవటానికై ‘నాడీశుద్ధి’ అను విశేషము గురించి సంగ్రహంగానైనా వివరించమని నా అభ్యర్థన.

దత్తాత్రేయ భగవాన్ : ఓ సాంకృతి యతీంద్రా! నాడీశుద్ధి గురించి సంగ్రహంగా మీరు కోరినట్లు చెప్పుచున్నాను. వినండి.

తురీయ సందర్శనం

(1) కర్మఫల త్యాగము : శాస్త్రము చేతగాని, సంఘము చేతగాని, కుటుంబ వ్యవస్థానుసారంగాగాని, పూజ్యులగు పెద్దలచేతగాని, విధివశంగాగాని, ఏవిధంగానైనా సరే - తనకు విధించబడిన ధర్మములను చక్కగా నిర్వర్తించబడు గాక.

అట్టి స్వధర్మమును కామసంకల్పము లేకుండా నిష్కామయోగబుద్ధితో నిర్వర్తించటము కర్మయోగము. ‘‘ఇట్టి కర్మఫలత్యాగము’’ తురీయ సందర్శనమునకు మొదట అతిముఖ్యమైన అడుగు (First important step). కర్మలు వదలటము కర్మ సన్న్యాసము కాదు. కర్మఫలములను సర్వాంతర్యామియగు పరమాత్మకు సమర్పించటమే కర్మయోగము (మరియు) కర్మరాహిత్యము కూడా.

(2) యోగం - సాష్టాంగదర్శనమ్ : - ‘‘యమము, నియమము ఆసనజయము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి’’…అను అష్టాంగయోగములను నిర్వర్తిస్తూ ఉండెదరు గాక. ఇవన్నీ ఒకే సమయములో నిర్వర్తించు వివేకము కలిగి ఉండండి.

(3) శాంతము : కోపము, ఆవేశము, తప్పులెన్నటము, పరనింద, లోకములో తారసబడే సంబంధములగురించి ఆవేదనలు, అనుబంధ బాంధవ్యములు గురించి ఆరాటము - మొదలైనవన్నీ మనోదురభ్యాసముగా గమనిస్తూ ‘‘శాంతముగా ఉండటము’’ను మనస్సుతో అభ్యాసము చేయాలి.

(4) సత్యపరాయణము : ‘‘నాకు సంబంధించినట్టి ఏది సత్తు (సత్యము) ఏది సందర్భమాత్రము (లేక) పరికల్పితము? ఏది నిత్యము? ఏది అనిత్యము? ఏది ‘ఇహము’ ? ఏది ‘పరము’? - అను విభాగము చేసి ‘సత్’ స్వరూప - స్వభావమును అభ్యాసపూర్వకంగా విడదీసి ఆశ్రయించుచూ ఉండాలి.

(5) స్వాత్మని అవస్థితము : ఇక్కడ దేహానుభవములగుచూ ఉన్నట్టి తనయొక్క దృశ్య - దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారములకు ఆవల సాక్షి అయి, సమస్తమునకు ఆధారమైయున్న ‘స్వాత్మ’ను గమనిస్తూ అద్దానియందు సర్వకాల - సర్వావస్థలయందు ‘‘అవస్థితము (placement of the wisdome as well as interest in one’s own absolute self)ను అభ్యాసము చేస్తూ ఉండటము.

(6) సమ్యక్ జ్ఞాన సుశిక్షతత్వము: ‘ఏకము - అక్షరము’ అగు ఆత్మయే అనేక రూపములువలె (అజ్ఞానముచే) అగుపిస్తోంది, అనిపిస్తోంది. భేదదృష్టియే సంసారము. ‘‘అనేకముగా కనిపిస్తూ ఉన్నప్పటికీ, ఏకముగా అనిపించటము’’ అను ఆశయము వైపుగా ఆత్మజ్ఞానము (లేక) సమ్యక్ జ్ఞానము కొరకు సుశిక్షితము (Well Trained) అగుచుండటమే ముఖ్యాశయము. అందుకు శ్రవణము, మననము అధ్యయనము అవసరము. ‘గురు ఆశ్రయము’ ద్వారా అభ్యాసము చేయటము అత్యావశ్యకం.

(7) శుచి అయిన ప్రదేశమును ఎన్నుకోవటము : పర్వతముయొక్క ఒక ఎత్తైన ప్రదేశమునుగాని, ఏదైనా నదీతీరమునుగాని, బిల్వ వృక్షము (మారేడు చెట్టు) వంటి ఏదైనా వృక్షమూలమునగాని, వనములోగాని - ఏకాంత ప్రదేశమును ఎన్నుకోవటము శుభప్రదము. ధ్యానముచేస్తూ ఉన్నప్పుడు ఆటంకములు ఉండని ప్రదేశమును సిద్దము చేసుకోవటము - ఆవశ్యకము.

(8) అథవా మనోరమే శుచే దేశే మఠం కృత్వా। (లేదా) మనస్సుకు ప్రియముగా ఉండే శుచి అయిన ప్రదేశములో ధ్యానమందిరమును సిద్ధము చేసుకోవాలి.

(9) ఆసనము : ఈ విధమై సంసిద్ధత తరువాత ఇక అట్టి శుచి అయిన, మనస్సుకు ప్రియమైన ప్రదేశములో ‘‘ఆసనము’’ను ధారణ చేస్తూ ఉండాలి. తూర్పువైపుగాగాని, ఉత్తరమువైపుగా గాని ధ్యానము కొరకై ఆశీనుడై సుఖాసనము స్వీకరిస్తూ ఉండాలి. ఆరభ్య ఆసనం పశ్చాత్, ప్రాఙ్ముఖో (ఉ)దఙ్ముఖోఽపివా (ఉత్తరముఖోపివా)।।

(10) దేహ నిశ్చల ధారణ : ఇక యోగాభ్యాసమునకై శరీర ధారణ చేయాలి. సమగ్రీవ శిరః కాయః సంవృతాస్యః సునిశ్చలః - పద్మాసనమో, మరేదైనా సుఖాసనమో ధరించి, మెడ - శిరస్సు దేహములను నిఠారుగా నిశ్చలముగా ఉండేటట్లు ధారణ చేయాలి.

(11) ధ్యానము: నాసాగ్రే శశభృత్ బింబే, బింబమధ్యే ‘తురీయకమ్’ - ముక్కుకు ఉపరిభాగమున ఆజ్ఞాచక్రమును స్పృశించు స్థానమునందు చంద్రబింబమును దర్శనము చేయాలి. ఆ చంద్రబింబము మధ్యగా ‘‘జాగ్రత్ - స్వప్న - తురీయములకు ఈశ్వరుడు, సాక్షి, ప్రవేశ నిష్క్రమణశీలుడు, సమస్తమునకు సొంతదారుడు’’ అగు తురీయము (లేక తురీయ పురుషుని) దర్శనము చేయునుగాక।

(12) అమృతాశ్రయము : మార్పు చెందేది మృతము. స్వస్వరూపమో (లేక ఆత్మయో)? మార్పు చెందనిది. ఆత్మదర్శనమే అమృతదర్శనము. స్రవంతమ్ అమృతం పశ్యేత్ నేత్రాభ్యాం సు-సమాహితః।। అమృతము (A factor beyond any kind of, any bit of change) సమాహితుడై నేత్రములతో (అంతర్‌దృష్టిచే) దర్శించుచూ ఉండునుగాక।

(13) ఉదరజ్వాలావళీ అగ్నిధ్యానము:

(i) ఇడయా వాయుమ్ ఆకృష్యము (లాగివశము చేసుకోవటము): ఇడయా ప్రాణమ్ ఆకృష్య పూరయిత్వా ఉదరస్థితమ్, తతో అగ్నిం దేహ మధ్యస్థం ధ్యాయన్ జ్వాలావళీయుతమ్, బిందు నాద సమాయుక్తమ్ అగ్నిబీజమ్ విచింతయేత్।। ఎడమ ముక్కు పుటముద్వారా వాయువును లాగి వశము చేసుకొని, ఇడనాడిలోను, పొట్టయందు వాయువును కుంభకము చేసి, దేహమధ్యలోగల ఉదరము (పొట్ట)లో బిందు-నాద సమన్వితముగా అగ్నిబీజమును (అగ్నికణమును) తేజోయుతంగా భావన చేసి ధ్యానము చేయాలి. ఆ తరువాత పింగళనాడి ద్వారా నెమ్మది నెమ్మదిగా రేచకము (వాయువును వదలటము) చేయాలి.

(ii) పింగళా వాయుమ్ ఆకృష్యము : ఆ తరువాత పింగళనాడి ద్వారా గాలిని సమాకర్షించి పింగళలోను, పొట్టయందు కుంభకం చేసి ‘ఇడ’ ద్వారా రేచకం చేస్తూ పైవిధముగానే నిర్వర్తించాలి. ఈ విధంగా శ్రద్ధగా చేయాలి. ఏకాంత ప్రదేశంలో త్రిసంధ్యలలోను ఇండ పింగళ వాయు ఆకృష్యమును 2x3=6 సార్లు రోజూ చేస్తూ ఉండాలి. అప్పుడు నాడులన్నీ కూడా వాటియొక్క వేరువేరు లక్షణములతో గుర్తించబడతాయి. క్రమంగా ‘నాడీశుద్ధి’ జరుగగలదు.

అట్టి యోగాభ్యాసముచే - శరీరము తేలికగా అనిపించుచూ, దీప్తివంతము కాగలదు. జఠరాగ్ని వృద్ధి పొందగలదు. నాదము అభివ్యక్తము కాగలదు. ఇవన్నీ పైనచెప్పిన యోగాభ్యాసము యొక్క యోగసిద్ధికి సూచకములు. ఈ చిహ్నములు సుస్పష్టము అయ్యేవరకు పైవిధంగా యోగాభ్యాసము కొనసాగించాలి. అటువంటి చిహ్నాలు సంప్రదర్శనము అయిన తరువాత ఇక ‘‘ఆత్మశుద్ధి’’ని చక్కగా ఆచరించాలి.

సాంకృతి ముని: మహాత్మా! ఆత్మ నిత్యశుద్ధము-అని చెప్పబడుచున్నది కదా! ఇక ‘ఆత్మశుద్ధి’ అనుదానితో అగత్యము క్రొత్తగా ఉంటుందా?

శ్రీదత్తాత్రేయ భగవానుడు : నిజమే! ఆత్మ శుద్ధః సదా నిత్యః సుఖరూపః స్వయం ప్రభః। సమస్త జీవులయొక్క స్వస్వరూపాత్మ ఎల్లప్పుడు శుద్ధము. త్రికాలములలో నిత్యము. పరమ సుఖరూపము. స్వయంజ్యోతి స్వరూపము. ఇది నిస్సందేహము. అయితే ‘అజ్ఞానము’ చేత ఆత్మ మలినము పొందినట్లు అనిపించటము జరుగుతోంది. జ్ఞానముచే శుద్ధమై ఎరుకగా ప్రకాశించుచున్నది. ఎవరియొక్క జ్ఞానయత్నములచే అజ్ఞానమలకంపము క్షాళనము (cleaning just like dust - covered mirror) అగుచున్నదో, అట్టివాడు కర్మసహితుడై ఉన్నప్పుడు, కూడా శుద్ధుడే అయి ఉండగలడు. కర్మలకు సంబంధించిన ఏ దోషము ఆతనిని తాకదు. కర్మలు నిర్వర్తిస్తూ కూడా అకర్మిష్టుడై ఉండగలడు.


షష్ఠమ ఖండము - ప్రాణాయామము (అష్టాంగయోగములలో నాలుగవది)

శ్రీదత్తాత్రేయ భగవాన్ : ఓ సాంకృతి మహానుభావా! ఇప్పుడు మనము ‘ప్రాణాయామ క్రమము’’ గురించి మరికొన్ని విశేషాలు చెప్పుకుందాము.

(1) రేచకము (2) పూరకము (3) కుంభకము - ఈ మూడు కలిపి ‘ప్రాణాయామము’ అని ‘వర్ణత్రయాత్మకము’ అని పిలువబడుతోంది. అదియే ‘ప్రణవము’ అని కూడా ప్రాణాయామ తత్పరులచే అనబడుతోంది. (ప్రణవము = ‘ఓం’కారము; పరమాత్మ; కేవలము; మూలము; ఆది - మొదలైన అర్థములు).

(l) ఇడాపూరక - ఉదరకుంభక-పింగళరేచక ప్రాణాయామము : ఇడనాడిలో వాయువును ఆకృష్యము (ధారణ) చేసి, ఉదరములో పూరకము చేయటము. 16 మాత్రలు కాలము ‘అ’ కారమూర్తిగా స్మరిస్తూ ప్రణవమును ధ్యానిస్తూ పూరకము నెమ్మదిగా నిర్వర్తించాలి.

ఆ విధంగా పూరించి ఉదరములో 64 మాత్రల కాలము కుంభకము చేయాలి. ‘ఉ’ కారమూర్తిగా ప్రణవమును భజిస్తూ కుంభకధారణ చేయాలి. కుంభకము చేయుచూ, ఎంతసేపు ధారణ చేయగలడో అంతసేపు చేయాలి.

ఈ విధంగా పూరకము, కుంభకము అయిన తరువాత ‘మ’ కారమును ధ్యానిస్తూ నెమ్మదిగా 32 మాత్రల కాలము - రేచకమును పింగళానాడి ద్వారా నిర్వర్తించాలి.

(ll) పింగళాపూరక - ఉదర కుంభక - ఇడారేచక ప్రాణాయామము : (కుడి ముక్కుపుటము ద్వారా) పింగళనాడిలో 16 మాత్రలకాలము పొట్టలో పూరించి ‘అ’కారమూర్తిని ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానిస్తూ, ఆ తరువాత ‘ఉ’కారమూర్తిని ధ్యానిస్తూ ‘64’ మాత్రల కాలము కుంభకము చేయాలి. అటుపై ‘మ’కార ప్రణవధ్యానము నిర్వర్తిస్తూ ఇడానాడి ద్వారా రేచకము (గాలిని వదలటము) చేయాలి.

పునః పునః పై రెండు రీతులుగా ప్రాణాయాము అభ్యసించబడుగాక.

ఓ మునీశ్వరా! ఈ విధంగా నిత్యము అభ్యాసము చేస్తూ ఉండగా ‘6’ నెలల కాలములో ఆత్మజ్ఞానము జనించగలదు. సంవత్సరకాలము అభ్యాసించుటచే బ్రహ్మతత్త్వజ్ఞుడు, బ్రాహ్మీభూతుడు విద్వాంసుడు అగుచున్నాడు.

ఉత్తమమైన ప్రయోజనమును ప్రసాదించు ఇట్టి ప్రాణాభ్యాసమును యోగాభ్యాసి తప్పక నిత్యము అభ్యసించాలి. ఎవ్వడైతే యోగాభ్యాసరహితుడై ఉంటూ, తనకు నియామకమైనట్టి స్వధర్మమును శ్రద్ధగా నిర్వహిస్తూ ఉంటాడో, క్రమంగా ఆతనియందు ప్రాణసంయమ ప్రభావము చేత జనించు జ్ఞానముచే ‘‘నాకు మొదలే బంధము లేదు. ఉండజాలదు కూడా!’’ - అను ముక్తస్థితిని సిద్ధించుకోగలదు.

బాహ్యమునుండి వాయువును ఆకర్షించి ఉదరమున నింపి ఉంచటము పూరకము. ఉదరము నందు వాయువును నింపి కుండలో గాలి వలె నిశ్చలము చేయటము - కుంభకము. ఉదరము నుండి బయటకు వాయువును విరేచనము (Leaving/ Vacating) చేయటము రేచకము.

ప్రాణాయామాభ్యాసము చేస్తూ ఉండగా -

ప్రథమదశలో → ప్రస్వేదనము (బాగుగా చెమట) బహిర్గతమౌతూ ఉంటుంది. ఇది ‘‘ప్రాణాయామ {ప్రప్రథమ (లేక) అధమ)ఊ దశ’’ అనబడుతోంది.

ద్వితీయ (లేక) మధ్య దశలో → శరీరములో కంపనము (వణుకు) జనిస్తూ ఉంటుంది.

తృతీయ ఉత్తమ దశలో → శరీరము ఉత్థానము (పైకి లేవటము) జరుగుచూ ఉంటుంది. ఉత్తరోత్తరస్థితి లభించేవరకు పూర్వదశ కొనసాగుచూ ఉంటుంది. తృతీయ ఉత్తమ ప్రాణాయామ దశలో ఆ ప్రాణాయామాభ్యాసి శరీరము తేలికగా అగుచూ, ఆతడు అనిర్వచనీయ సుఖమును పొందుచూ ఉండగలడు.

సాంకృతి ముని : స్వామీ! అసలు ప్రాణాయామ యోగాభ్యాసము యొక్క అంతిమాశయము ఏమిటి?

దత్తాత్రేయ అవధూత భగవాన్ : ఓ సువ్రతా! ప్రాణాయామేన చిత్తం తు శుద్ధం భవతి। ప్రాణాయామ - అభ్యాసముచే చిత్తము శుద్ధము అగుచున్నది. ఆ విధంగా చిత్తము నిర్మలమగుచుండగా ఆ అభ్యాసికి ‘‘ప్రత్యక్ జ్యోతి (కేవల తేజస్సు)’’ యొక్క దర్శనము కాగలదు. అప్పుడిక, ప్రాణ చిత్తేన సంయుక్తః పరమాత్మని తిష్ఠతి।। - ప్రాణము చిత్తముతో కూడినదై పరమాత్మ (సర్వసాక్షి, సమస్త స్వరూపము అగు కేవల స్వస్వరూపము) నందు నిశ్చలత్వము పొందటము జరుగుచున్నది.

ప్రాణాయామ యోగము యొక్క మహత్తర ప్రయోజనము

శ్లో।। ప్రాణాయామపరస్య అస్య పురుషస్య మహాత్మనః
దేహశ్చ ఉత్తిష్ఠతే। తేన కించిత్ జ్ఞానాత్ విముక్తతా।।

ప్రాణాయామాభ్యాసము చేయుచున్న పురుషుని దేహము ఉత్తిష్ఠత (Awakened/upward lift) పొందుచున్నది. అట్టివాడు మహాత్ముడు అగుచూ, సమస్తమును తనయొక్క పురుషకారమునందు దర్శించుచున్నాడు. ఇక, కించిత్ జ్ఞానశ్రవణము (లేక) అధ్యయనము చేతనే సర్వ సాంసారిక బంధములనుండి విముక్తుడు అగుచున్నాడు. ప్రాణాయామ యోగాభ్యాసము చేస్తూ ఆ యోగాభ్యాసి ‘ఉత్తర దశ’కు చేరుచున్నాడు.

ప్రాణాయామ యోగాభ్యాస ఉత్తర దశ

రేచకము -కుంభకము - పూరకముల అభ్యాసము చేస్తూ ఉన్న యోగి ఉత్తరోత్తర దశలో - రేచక - పూరకముల ఆవశ్యకత లేకుండానే దేహములో
- ఉదరమునందు, హృదయమునందు,
- శరీరములోని వేరు వేరు ప్రదేశములందు,
- శరీరమునందు అంతటా,
- తదితర సహజీవులయొక్క బాధ కలిగించు శరీరములోని ప్రదేశమునందు / విభాగములందు,
స్వాభావిక (రేచపూరకరహిత) కుంభకము (‘‘క్రమక్రమసాధన’’చే) నిర్వర్తించగలడు. కాలవ్యవధి లేకుండానే క్షణకాలంలో కుంభకా ధారణ చేయగలడు.

రేచకం పూరకం ముక్త్వా, కుంభకమ్ నిత్యమ్ అభ్యసేత్।।
రేచక పూరక కుంభకముల అభ్యాసము కొనసాగుచుండగా అట్టి అభ్యాస ప్రయోజనంగా రేచక్ - పూరకములు నిర్వర్తించవలసిన అగత్యము లేకుండానే ధారణ చేయటము స్వాభావ కుంభకము. అది మహత్తరమైన ప్రయోజనకరము.

అట్టివాడు సర్వ శారీరక - మానసిక - బుద్ధి సంబంధమైన రుగ్మతలనుండి అతిత్వరగా వినిర్ముక్తుడు కాగలడు. మనస్సును జయించివేయగలడు. అట్టివాడు ఇక దృశ్య లంపటములో (సంసారములో) మునగడు. సర్వకాల సర్వావస్థలయందు, సర్వస్థితిగతులయందు ‘‘కేవలాత్మాఽహమ్’ స్థానమును అనుక్షణికంగా, అనునిత్యముగా సిద్ధించుకోగలడు.

అట్టి యోగి సహజీవుల యోగ-జ్ఞాన సాధనములకు కూడా ఎంతగానో సహకరించగలడు.

ప్రాణాయామైక నిష్ఠస్య న కించిదపి దుర్లభమ్।। ఏకాగ్రతతో కూడిన ప్రాణాయామ నిష్ఠ కలవానికి ‘అసాధ్యము’ అనునదే ఉండదు. ఉండజాలదు.

అందుచేత…ఓ సాంకృతి యతీశ్వరా! సర్వప్రయత్నములచే ప్రాణాయామమును చక్కగా, శ్రద్ధగా, దైనందికంగా తప్పక అభ్యసించటము ముముక్షువుకు శుభప్రదము.

ప్రాణాయామ వినియోగము

సాంకృతి ముని : హే భగవాన్! దత్తాత్రేయస్వామి! ప్రాణాయామ అభ్యాసమునకు రోజులో ఏ సమయము అధిక ఫలప్రదమో దయతో సూచించండి.

శ్రీ దత్తాత్రేయ స్వామి : సర్వకాల సర్వావస్థలు ప్రాణాయామమునకు తగిన సమయమే. అయితే ‘నియమము’ అనేది అభ్యాసికి ఏకాగ్రతకై సానుకూల్యము కాబట్టి కొన్ని శాస్త్ర నిర్దేశ్యములను చెప్పుతాను.

ఈ రీతిగా ధారణ చేయబడునుగాక। ఈ విధంగా ఆయా ప్రదేశములలో ప్రాణధారచే అట్టి అభ్యాసి సర్వరోగములనుండి విముక్తుడు కాగలడు. శతవర్ష - ఆయుష్మంతుడు కాగలడు. బుద్ధి నిర్మలము, సునిశితము, విస్తారము, ఏకాగ్రము కాగలదు.

✤ నాసాగ్రము (ముక్కుకు పై ప్రదేశములలో కనుబొమ్మల మధ్యగా - బొట్టు పెట్టుకొనుచోట) ధారణచే సర్వ సందర్భములలో దిగ్విజయుడు కాగలడు.
✤ నాభి మధ్యప్రదేశములో ‘ధారణ’ చేత సర్వరోగములు తొలగిపోగలవు.
✤ పాదముల బొటనవ్రేలులలో ప్రాణ నిరోధము (స్వాభావకుంభకము) చేత శరీరము తేలికగా అయి, ప్రత్యుత్సాహము అనుభవము కాగలదు.
✤ నాలుకతో వాయువును ఆకృష్యము చేసి (లోనికి పీల్చి, వశము చేసుకొని) త్రాగుచూ (గుటకలు వేస్తూ) ఉండు అనునిత్య అభ్యాసముచే అట్టి రోగి అలసట, దాహములనుండి వినిర్ముక్తుడై, ఆరోగ్యవంతుడు కాగలడు.
✤ నాలుకతో వాయువును ఆకృష్యము చేసి, జిహ్వ (నాలుక) యొక్క మూలస్థానము నందు (కంఠమునందు) వాయు నిరోధము చేయు అభ్యాసముచే ‘అమృతము’ (changelessness) గ్రోలుచూ సకల సుఖములు పొందగలడు. సుఖజీవనుడు కాగలడు.
✤ ఇడానాడితో వాయువును సమాకర్షించి (ఆకృష్యము చేసి) భూమధ్యస్థానములో నిరోధము చేయు అభ్యాసము చేస్తూ, అమృతమును (కేవలాత్మానందభావనను) గ్రోలుచూ అభ్యాసము చేయు యోగి శుద్ధుడై సర్వవ్యాధులనుండి విముక్తుడు అగుచున్నాడు.
✤ ఇడ - పింగళలలో వాయువును (ప్రాణమును) ఆకృష్యము చేసి (ఆకర్షించి, పూరకం చేసి), నాభి (బొడ్డు) ప్రదేశములో నిరోధము చేయటముచేత ప్రాణాంతకమైన వ్యాధులుకూడా సమసిపోగలవు. ఆ అభ్యాసి ఆరోగ్యవంతుడు కాగలడు.
✤ ఒక నెలరోజులు ఉదయ - మధ్యాహ్న - సాయం సంధ్యా సమయములలోను - వాయువును నోటితో ఆకృష్యము చేసి (ఆకర్షించి, ప్రియముగా పీల్చి) అమృతపానము (మాధుర్యము, ఆత్మానందానుభావన) చేయువాడు శరీరములో వాత (వాయుసంబంధమైన) - పిత్త (రససంబంధమైన) దోషములను నశింపజేసుకోగలడు. ఇత్యేవ న సంశయః।
✤ ముక్కుతో గాలిని సమాకర్షించి, రెండు కళ్ళలోను వాయునిరోధనము చేయు అభ్యాసము చేత నేత్రరోగములు ఉపశమిస్తాయి. అట్లాగే చెవులలో నిరోధనము చేత చెవులోని దోషాలు తొలగుతాయి. శిరస్సు నందు వాయుధారణ చేస్తూ ఉంటే శిరస్సులోని (తలనొప్పి, పార్శ్వం నొప్పి, మతిమరపు వంటి మొదలైన) అనేక దోషములు, లోపములు ఉపశమిస్తాయి.

యోగాభ్యాసము

శ్రీ దత్తాత్రేయ భగవానుడు : ఓ సాంకృతి మహదాశయా! ఇప్పుడు కొన్ని యోగాభ్యాసముల గురించి నిర్వర్తించు విధి విధానములను - యోగాభ్యాసుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సూచనలుగా చెప్పుచున్నాను. వినండి.

➤ సమాహిత (ప్రశాంత, విషయ భావనా రహిత) మనస్సుతో,
➤ స్వస్తి కాసనమును (రెండు పాద తలములను మోకాళ్ళపైన పిక్కల తొడల మధ్యగా ఆనించి ఉంచి, కంఠమును శిరస్సును శరీరమును ‘‘సమము’’గా, నిఠారుగా ధారణ చేయటము స్వస్తికాసనము. జానుర్వో అంతరే కృత్వా సమ్యక్ పాదతలే ఉభే సమగ్రీవ శిరః కాయః ‘‘స్వస్తికమ్’’) - ధారణ చేసి (లేదా, సుఖాసనము స్వీకరించును గాక)।
➤ ప్రణవమును ఉచ్ఛరిస్తూ నెమ్మది నెమ్మదిగా అపానమును (మూలాధారము వైపుగా పయనిస్తూ ఉన్నట్టి ప్రాణ శక్తిని) ఊర్థ్వముగా ఉత్థాప్యము చేస్తూ (పైకిలాగుచూ),
➤ రెండు చేతులతో కర్మేంద్రియములను ఈ క్రింది విధంగా కప్పి ఉంచి ధారణచేయుదురుగాక!

ఇట్టి కర్మేంద్రియములను చేతివ్రేళ్ళతో మూసి, శిరస్సునందు ప్రాణధారణ (మూర్థమునందు ధారణ)చే ప్రాణశక్తి బ్రహ్మరంధ్రమును పొందుచున్నది.

ప్రాణః ప్రయాత్యనేనైవ బ్రహ్మరంధ్రం! బ్రహ్మరంధ్రం గతే వాయౌ నాదశ్చ ఉత్పద్యతే। ప్రాణశక్తి (వాయువు) శిరస్సునకు ఉపరిగా గల బ్రహ్మరంధ్రమును స్పృశించగానే నాదము పుట్టుచున్నది.

ముందుగా శంఖధ్వని। మధ్యలో మేఘగర్జన ధ్వని। ఆ తరువాత శిరస్సు మధ్యగతంగా వాయువు వలన సెలయేటి ధ్వని। (లేక) కొండను వాయువు స్పృశించినప్పటి ధ్వని (‘‘షీ’’….ఈలధ్వని) వినబడతాయి.

ఓ మహాప్రాజ్ఞా! అప్పుడిక చిత్తము క్రమంగా ఒకానొక మాధుర్యము సంతరించుకొనుచూ సాక్షాత్ ఆత్మోన్ముఖము అగుచున్నది. యోగాభ్యాసము జ్ఞానాభ్యాసరూపముగా స్వయముగా సరియగు సమయంలో సంతరించుకొనుచున్నది. యోగాభ్యాసము, బుద్ధి నిర్మలత ప్రసాదిస్తూ సంసార దోషము నుండి ఈ జీవుని తరింపజేయుచున్నది. అట్టి యోగి జన్మ-కర్మ వినిర్ముక్తుడగుచున్నాడు. ఉత్తరోత్తర జన్మలపట్ల సర్వ స్వాతంత్ర్యుడు అగుచున్నాడు.

💐💐💐

కుండలినీశక్తి - సుషుమ్ననాడీ ప్రవేశము - బ్రహ్మరంధ్ర సంచాలనము

మూలాధారములో వాయు నిరోధము : ఎడమ చీలమండలముతో సీవని (తొడవెనుక ఊర్థ్వభాగమును) నొక్కి ఉంచి, కుడి చీలమండలముతో రెండవ సీవనిని నొక్కి ఉంచి, పిక్కలకు క్రింద గల సంధి భాగమును నొక్కి ఉంచాలి.

దేవదేవుడగా త్ర్యంబకుని (శివుని), వినాయకుని స్మరించి, శ్రీ సరస్వతీ దేవిని ఉపాసిస్తూ లింగనాళమునుండి వాయువును వాయువుతో సమాకర్షించి (లింగము యొక్క క్రింద మాంస భాగమునుండి ముందుకు సమాకృష్యముచేసి, పైకి తెచ్చి) నియుక్తము - బిందుయుక్తము అగు ప్రణవముతో వాయువును మూలాధారములో నిరోధించాలి. ఈ విధంగా వాయు నిరోధములవలన జనించు అగ్ని మూలాధారములోగల కుండలినిని నిదురలేపుతుంది.

ప్రాణయోగాభ్యాసి - ఆ అగ్ని కుండలినిని సుషుమ్ననాడిలో ప్రవేశింపజేసి, వాయు నిరోధక్రమముచే ఊర్ధ్వపధములో నడిపిస్తూ ఆజ్ఞాచక్రము, బ్రహ్మరంధ్రము వరకు కొనిపోవుచున్నాడు. ఈ విధమైన అభ్యాసముచే ఆ యోగికి ప్రాణశక్తి స్వవశము అగుచున్నది. వాయువుపై ఆతనికి నియంత్రణ (Conscious control) కలుగుచున్నది. ప్రాణశక్తి స్వవశమై ఉంటుంది.

మొట్టమొదట ప్రస్వేదనము (చెమట), తరువాత కంపనము, ఆ తరువాత ఉత్థాన శరీరము (అనగా) శరీరము తేలిక అయి పైకి లేవటము - అనునవి యోగాభ్యాస సందర్భములోని పరిణామములు. ‘‘వాయుజయము సిద్ధించినది’’ - అనటానికి గుర్తు (సంజ్ఞ) లేక చిహ్నము శరీరముయొక్క ఉత్థాన (Raising up) సిద్ధియే. (శరీరము దూదిపింజమువలె తేలిక అయి, గాలిలో లేచుచున్న అనుభూతి - ఉత్థానస్థితి).

వాయునిరోధ ప్రయోజనములు

ఇద్దాని అభ్యాసముచే మూలరోగములన్నీ తొలగిపోగలవు. కడుపులో మంట వంటి దోషములు తొలగుతాయి.

ఓ సాంకృతీ! ఈ అభ్యాసము సర్వరోగనివారిణి అయి ఉన్నది. సర్వపాతకములు నశిస్తాయి. చిత్త దర్పణము మహాద్భుతమైన ప్రకాశముతో తేజరిల్లగలదు. మనస్సుకు బ్రహ్మలోకము వరకు తారసపడుచూ ఉండే ఏవేవో భోగములు అనుభవించాలనే దేశ ద్రిమ్మరితనము తొలగుతుంది.

హృదయములో సాత్విక వైరాగ్యము స్వభావసిద్ధమై అంకురించగలదు. క్షుద్రమైన మహాపాతక దోషములు తొలగి హృదయము నిర్మలమై ఆత్మభావనా సౌరభముతో నిండి ఉండగలదు.

కైవల్య సిద్ధి: (1) సంసారముపట్ల విరక్తి (2) అధ్యాత్మ-విచారణలచే ఆత్మజ్ఞాన సముపార్జన - ఈ రెండూ కైవల్యమునకు సాధనములు.

విరక్తస్య తు సంసారాత్ జ్ఞానం కైవల్య సాధనమ్।
సంసారముపట్ల విరక్తిచేతనే జ్ఞానము జనించగలదు.

ఆత్మజ్ఞానముచే సందర్భ పరిమితత్వము వీగిపోయి కేవలమగు స్వస్వరూపము స్వానుభవము అవగలదు.

ఈ విధంగా కైవల్యము సిద్ధించగలదు.

ఆత్మదృష్టి

ఒక్కసారి ఆత్మజ్ఞానామృత రసము ఈ జీవుడు ఆస్వాదించటము జరిగిందా,..ఇక అట్టి ఆత్మతత్త్వామృత రసమును గ్రోలువాడు సర్వ తదితర కార్యవ్యవహారములను అధిగమించివేసి ఆత్మయందే జగత్తును పదర్శిస్తున్నాడు. ఆత్మతత్త్వమునే సర్వదా అమృత మాధుర్యముగా గ్రోలుచున్నాడు. ఈ ఇంద్రియములకు తారసబడే సమస్తమును ఆత్మతత్త్వ స్వరూపముగా చూస్తూ, అట్టి ఆత్మతో మమేకమగుచున్నాడు.

‘జ్ఞానస్వరూపమేవ’ అహుః జగత్ ఏతత్ - విచక్షణః।। ‘‘ఈ జగత్తు ఇంద్రియములకు భౌతికంగా - ఆకాశము మొదలైన పంచభూత సమ్మేళనముగా అగుపిస్తూ ఉన్నప్పటికీ, వాస్తవానికి ఇదంతా కూడా జ్ఞానానంద స్వరూపమే!’’ అని ఆత్మజ్ఞులు ఎలుగెత్తి గానము చేస్తున్నారు.

అల్పదృష్టి

ఇక అల్ప-కుదృష్టులగు అజ్ఞానుల దృష్టిలోనో?….ఇదంతా అనేక విషయ పరంపరలతో కూడిన అర్థస్వరూపము (It is a scenary of multiple meanings) గా అనిపిస్తూ ఉన్నది. అర్థస్వరూపమ్ అజ్ఞానాత్ పశ్యంతి అన్యే కుదృష్టయః।।

‘‘ఆత్మస్వరూప విజ్ఞానము’’ చేత అజ్ఞానము తప్పక నశించిపోగలదు. అజ్ఞానము క్షీణిస్తూ ఉంటే, అద్దానితోబాటే రాగద్వేషములు, ఆశ నిరాశ పేరాశలు, కామక్రోధ లోభములు, మద మాత్సర్యములు - ఇవన్నీ తమకు తామే క్షీణించిపోతాయి.

రాగాది అసంభవే, ప్రాజ్ఞ। పుణ్య పాప విమర్ధనమ్। రాగాదులు సంభవించటం మానివేస్తే, ఓ ప్రాజ్ఞా! ఇక పుణ్యపాప ద్వంద్వ మోహములు శేషించవు. అప్పుడిక అట్టి యోగి ‘‘శరీరము’’తో తాదాత్మ్యము చెందడు.

తయోః నాశే శరీరేణ న పునః సంప్రయుజ్యత ఇతి।
‘‘శరీరి’’గా ఆత్మానుభవమునందు నిస్సందేహిగా ప్రవేశించి సుప్రతిష్ఠుడు కాగలడు. ‘‘ఈ శరీరములో నేను బద్ధుడను’’ - అను భావనయే జనించదు. అట్టి వానికి ఈ శరీరము ‘సర్వదా నశించినదే’- అగుచున్నది.


సప్తమ ఖండము - ప్రత్యాహారము (అష్టాంగ యోగములలో ఐదవది)

శ్రీ దత్తాత్రేయ స్వామి : ఓ మహామునీ! మహాప్రాజ్ఞా! సాంకృతి మహాశయా! ఇప్పుడిక మనము ‘‘ప్రత్యాహారము’’ యొక్క వివిధ అంగముల గురించి చెప్పుకుందాము.

(1) ఇంద్రియ విషయ ఉపశమే ప్రత్యాహారము

ఈ ఇంద్రియములు స్వాభావికంగా ఆయా విషయాలపై వ్రాలటమును అభ్యాసముగా కలిగి ఉండటము జరుగుతోంది. అటువంటి ఈ ఇంద్రియములు ప్రాపంచక విషయములపై వ్రాలకుండా నిరోధించు ఉపాయమే ‘‘ప్రత్యాహారము’’.

(2) బ్రహ్మమే కర్త। బ్రహ్మమే భోక్త। బ్రహ్మమే ఇదంతా।

‘‘సర్వం ఖలు ఇదం బ్రహ్మ’’ - భావనయే ‘‘ప్రత్యాహారము’’.

‘‘ఏదేది ఇంద్రియములకు ఎదురుగా అనుభవమగుచూ ఉన్నదో,….అట్టి ఈ సమస్తము బ్రహ్మమే’’ అని ఏ సమాహితమైన బుద్ధితో దర్శించబడుచున్నదో….అయ్యదియే ‘‘ప్రత్యాహారము’’ - అని బ్రహ్మవిత్ వరేణ్యుల ప్రవచనము.

‘‘యేదేది ఈ దృశ్యజగత్తులో నాచేతగాని - మరొకరి చేతగాని నిర్వర్తించబడుచున్నదో….అట్టిదంతా కూడా (శుద్ధమైనా, అశుద్ధమైనా కూడా) బ్రహ్మముచేతనే నిర్వర్తించబడుచూ, బ్రహ్మమే అయిఉన్నది’’ - అను అనునిత్యమగు సందర్శనాభ్యాసమే నాహంకర్తాప్రత్యాహారము.

(3) కర్మఫల సమర్పాణా ప్రత్యాహారము

అథవా :
శ్లో।। నిత్యకర్మాణి బ్రహ్మారాధన బుద్ధితః కామ్యాని చ
తథా కుర్యాత్ ‘‘ప్రత్యాహారః’’ స ఉచ్యతే।।

ఈ జీవుడు కర్మలు చేస్తూనే ఉంటున్నాడు. అవి అనేక రీతులు.
(1) విద్యుక్త (ధర్మములు) కర్మలు : తాను చేయుటకై శాస్త్రములచే, సంఘముచే, సహజీవుల శ్రేయస్సుకొరకై విధించబడేవి.
(2) నిత్య కర్మలు : ప్రతిరోజు దైవోపాసనగా, వంశ ఆచారంగా నియమించబడినవి. అవి వ్యవహరికమైనవి కావచ్చు, దైవోపాసనా సంబంధమైనవి కావచ్చు.
(3) నైమిత్తిక కర్మలు : పరవడి, పండుగ మొదలైన ఆయా అనుకున్న, అనుకోని సందర్భములలో నిర్వర్తించవలసినవి. ఇవి కూడా వ్యావహారికం కావచ్చు (లేదా) దైవోపాసన సంబంధము కావచ్చు.
(4) త్రిగుణప్రేరితమైన సాత్త్విక, రాజసిక, తామసిక కర్మలు స్వాభావికములు. సందర్భోచిత - అనుచితములు.
(5) అభ్యాసవశంగాను, లౌకికానందము కొరకు చేయు కర్మలు.
ఆయా మొదలైన ఏదో కారణంచేత ఈ జీవునిపట్ల కర్మలు చేయటము అనివార్యము. అందులో కొన్ని కొందరికి అంగీకారయోగ్యము. మరికొందరికి తిరస్కారయోగ్యములు. కొన్ని వ్యక్తిగతమైనవి. మరికొన్ని సంఘ - సంస్థా గతమైనవి. మరికొన్ని అభ్యాసవశంగా చేయబడునవి. ఇంకొన్ని ఎవ్వరికి ప్రయోజనమో చెప్పజాలనివి.

ఒక నాటకములో నటించే నటుడు తనయొక్క నటనా ప్రదర్శనమంతా
- రచయిత కథాగతంగా - ఏ ఉద్దేశ్యముతో కల్పించాడో, ఆ ఉద్దేశ్యము నెరవేరు తీరుగా,
- ప్రేక్షకులకు అభిరుచి కలిగించే రీతిగా,
- సహనటులకు సానుకూల్యమైనదిగా,
- కళాకారుడుగా సంతృప్తి పొందుటకుగాను - ఉద్దేశ్యిస్తాడు కదా!

అట్లాగే ఎవ్వరైతే సమస్త కర్మలను ‘‘నాహమ్‌కర్తా’’ భావనతో
- పరబ్రహ్మముయొక్క ఉపాసనగా భావించి,
- పరబ్రహ్మము యొక్క ఇచ్ఛానుసారముగా, ‘‘పరబ్రహ్మము చేతనే’’।।
అను అకర్తృత్వ భావనతో, సమస్త కర్మలు సమర్పణగా ‘‘బ్రహ్మమును ఆరాధిస్తున్నాను’’ అను బుద్ధితో నిర్వర్తిస్తూ ఉంటారో,
అది - కర్మఫల సమర్పణా ప్రత్యాహారమే.

(4) స్థానాత్ - స్థానాత్ వాయునిరోధ ప్రాణయోగాభ్యాస ప్రత్యాహారము

శ్లో।। (అథవా) వాయుమ్ ఆకృష్య స్థానాత్ స్థానమ్ నిరోధయేత్।
దంతమూలాత్ తథా కంఠే, కంఠాత్ ఉరసి మారుతమ్।
ఉరో దేశాత్ - సమాకృష్య నాభిదేశ నిరోధయేత్।।

వాయువును ఆకృష్యము చేసి (ఇష్టముగా ఆకర్షించి) దేహమునందు ఒక్కొక్కస్థానములోను, (ఒక స్థానము తరువాత మరొక స్థానమునందు) నిరోధము చేస్తూ, మనస్సును స్వాధీనము - స్వస్వరూపాత్మాధీనము చేయు అభ్యాసము - ప్రాణనిరోధ ప్రత్యాహారము

ప్రాణములను నిరోధించు కుంభకయాన ప్రక్రియ యోగాభ్యాసము (ప్రాణ-అపాన కుంభకంగాగాని, (లేక) స్వాభావ కుంభకంగా గాని)
→ దంతమూలములందు, కొండనాలిక ప్రదేశమునందు నిరోధము చేయటము,
→ అక్కడినుండి సమాకర్షించి → కంఠమునందు ప్రవేశింపజేయటము, అక్కడి నుండి భుజ స్కంధములలో నిలపటము,
→ భుజముల నుండి ఆకర్షించి → వక్షస్థలములో ప్రవేశింపజేయటము,
→ వక్షస్థలము నుండి మరల్చి → నాభి ప్రదేశమునకు జేర్చటము.
→ నాభి నుండి సమాకృష్యము చేసి → కుండలినీస్థానమునకు జేర్చటము.
ఈ రీతిగా సమాకర్షిస్తూ నిరోధించుచూ ఉండాలి.

ఇంకా కూడా,
- నాభి ప్రదేశము నుండి వాయువును ఆకర్షించి ‘కుండలిని’ యందు ప్రవేశింపజేసి, కుండలినియందు నిరోధించటము. కుండలిని నుండి సమాకర్షించి మూలాధార చక్రములో ప్రవేశింపజేసి అచ్చట నిరోధనము చేయటము.

మూలాధారమునందు వాయువు బహిర్గతమయ్యే స్వభావము నుండి సమాకర్షించి, అట్టి అపానమును కటిద్వంద్వము (నడుము-పిరుదులు)యందు, తొడలయందు, పిక్కలలోను మోకాళ్ళలోను, కాలి బొటనవ్రేళ్ళయందు నిరోధనము చేయటము.

ప్రత్యాహారో అయం ఉక్తస్తు ప్రత్యాహారపరైః పరా।। ఇటువంటి యోగాభ్యాస-ప్రత్యాహారము ఉత్కృష్టమైన, పరాకాష్ఠార్థమైన ‘‘ప్రత్యాహారము’’ - అని ప్రత్యాహారయోగపండితుల అభివర్ణనము.

ఇటువంటి ప్రత్యాహార పూర్వక యోగాభ్యాసము నిర్వర్తించు పురుషులు ‘మహాత్ములు’ అని చెప్పబడుచున్నారు.

ఓ సువ్రతా! ఇట్టి దోష అభ్యాసముచే ఆ యోగాభ్యాసియొక్క భవరోగము ఉపశమిస్తుంది. సర్వపాపదోషములు - తొలగుతాయి.

(5) ఆపాదతల మస్తక ప్రాణధారణా ప్రత్యాహారము

శ్లో।। నాసాభ్యాం వాయుం ఆకృష్య నిశ్చలః స్వస్తికాసనః,
పూరయేత్ అనిలం విద్వాన్ ఆపాదతల మస్తకమ్।
పశ్చాత్ పాదద్వయే, తద్వత్ మూలాధారే తథైవ చ
నాభికందే చ హృత్ మధ్యే, కంఠమూలేచ తాలుకే
భృవోన్మధ్యే లలాటే చ, తథా మూర్థని ధారయేత్।।

అటు తరువాత…..
- రెండు పాదములయందు పూరించాలి.
- తరువాత మూలాధారమునందు.
- ఆ తరువాత నాభి కందము (మాంసమయప్రదేశము) నందు.
- హృదయ మధ్యగాను.
- కంఠమూలమునందు.
- తరువాత తాలువు (దవుడ) యందు.
- భ్రూమధ్య ప్రదేశమునందు.
- అటుపై లలాటము (నుదురు, పాపటబొట్టు ప్రదేశము) నందు.
- మూర్థము (శిరోశిఖరము) నందు.
ఈ విధంగా ప్రాణశక్తిని (లేక) ముక్కుద్వారా ఆకృష్యము (Inward Pulling) చేసియున్న వాయువును ధారణ చేయాలి.

ఇది ‘‘ధారణా యోగ ప్రత్యాహారము’’.

ఇందులో బుద్ధిని నిలపటమే ప్రాధాన్యము కాబట్టి - ‘‘ధారణాప్రత్యాహారము’’ అను విశేషముగా చెప్పబడుతోంది.

(6) ఆత్మాన్ ఆత్మనిరోధ ప్రత్యాహారము

శ్లో।। ఆత్మన్ ఆత్మని నిర్ద్వంద్వే నిర్వికల్పే నిరోధయేత్।
‘‘ప్రత్యాహారః’’ సమాఖ్యాతః సాక్షాత్ వేదాంతవేదిభిః।।

‘‘ఈ దేహ స్వభావమునుండి, దృశ్య స్వభావము నుండి ధ్యాసను వెనుకకు మరల్చి → ద్వంద్వాతీతము, సర్వకల్పములకు ఆవలగా ప్రకాశించుచున్న నిర్వికల్పము అగు → అఖండ-అప్రమేయ-నిత్య-కేవల-పరమ సత్యమగు స్వస్వరూపాత్మయందు ధ్యాసను నిలిపి ఉంచటమే ‘‘సాక్షాత్ ప్రత్యాహారము’’. ‘‘తదితరమైన ప్రత్యాహార విశేషాలన్నీ సాక్షాత్‌ప్రత్యాహారస్థానమునకు మార్గదర్శకములు’’ - అని వేదాంతవేద్యులగు బ్రహ్మజ్ఞులు ఆప్యాయముగా సిద్ధాంతీకరించుచున్నారు.

సాంకృతి ముని : హే యోగయోగీశ్వరా! పరమగురూ! వేదాంతవిద్యావరేణ్యా! గురుదత్తాత్రేయ భగవాన్! జీవాత్మను సర్వాత్మత్వమునందు ప్రతిక్షేపించే ‘‘సాక్షాత్ ప్రత్యాహారము’’ అతికొద్దిమందికే సాధ్యము కదా? అది మీవంటి అవధూతలకు మాత్రమే అనుభవైక వేద్యము. మరి మావంటి వారి గతి ఏమిటి?

భగవాన్ దత్తాత్రేయ : నీవు అంటున్నది ఏమాత్రము వాస్తవము కానేకాదు. అభ్యాసముచే ఎవ్వరికైనా సులభ సాధ్యమే. తత్త్వమ్ భావనతో (‘నీవు’గా కనిపిస్తున్నది పరమాత్మగా భావన - మననము చేయుటచేత) కేవలము, సమస్తము అగు స్వస్వరూపాత్మ అనుభవమవగలదు. ఏవమ్ అభ్యాసతః తస్య న కించిత్ అపి దుర్లభమితి।। అనుకుంటూ ఉంటే అనిపించగలదు. అభ్యాసము చేస్తున్న వారికి ‘ఇది అసాధ్యము’ - అనే ప్రసక్తియే లేదు.


అష్టమ ఖండము - ‘‘ధారణ’’ (అష్టాంగయోగములలో ఆరవది)

‘ధారణ’’ = (Integration of unit in the Unity)

శ్రీదత్తాత్రేయ భగవాన్ : ఓ మహామునీ! సాంకృతి మహాశయా! ఇప్పుడు ‘‘ధారణా పంచ’’ (5 ధారణలు) గురించి చెప్పుకుందాము. అట్టి సాధనలో భాగమగు బీజాక్షరోపాసన కూడా విను.

(1) ఆకాశధారణ : దేహమధ్యగతే వ్యోమ్ని బాహ్యాకాశస్తు ధారయేత్। ఈ దేహము యొక్క మధ్యగల ఆకాశమును ‘‘బాహ్యాకాశములో అంతర్విభాగమే - ‘‘కుండలోని ఆకాశము మహాకాశమునకు అభిన్నము అయి ఉన్న తీరుగా’’…..అను ధారణ(బీజాక్షరము ‘‘హ’’) (దివ్యాధిదేవత - సదాశివుడు)

(2) అనిల (వాయు) ధారణ : ప్రాణేబాహ్య అనిలంతద్యత్। దేహములోని వాయు (ప్రాణము) బాహ్యమున కనిపించే వాయువునకు (ప్రాణమునకు)-విశ్వమంతా గల వాయువుతో ఏకరూపముగా భావనచేసి ధారణ చేయటం (బీజాక్షరము ‘‘య’’) (దివ్యాధిదేవత - ఈశ్వరుడు)

(3) అగ్నిధారణ : జ్వలనేచ అగ్నిం ఔదరే। దేహములోని అగ్నిని విశ్వములోని అగ్నితత్త్వముయొక్క ప్రదర్శనగా ధారణ చేయటము (బీజాక్షరము-‘‘ర’’) (దివ్యాధిదేవత = మహేశుడు).

(4) జలధారణ : తోయం తోయాంశకే। దేహములో కనిపిస్తున్న జలము విశ్వములోని ద్రవధర్మము కలిగియున్న విశ్వ జలము యొక్క అంశగా ధారణ (బీజాక్షరము ‘‘వ’’) - (దివ్యాధిదేవత = విష్ణువు)

(5) భూధారణ : భూమిం భూమి భాగే। శరీరములో భౌతికంగా అగుపించేదంతా జగత్తులో స్థూలంగా కనిపించే భౌతికవిభాగముగా ధారణ. (బీజాక్షరము -‘‘ల’’) (దివ్యాధిదేవత - బ్రహ్మ)

ఈ విధంగా ‘‘హ-య-ర-వ-ల’’ అను అక్షరములతో పంచధారణల ఆరాఖ్యము (భావనోచ్ఛారణ)తో క్రమవిధానంగా మననరూప మంత్రోచ్ఛారణ నిర్వర్తించబడటము - ధారణా పంచక యోగాభ్యాసము.

ఈ విధమైన శరీరములోని పంచభూతములను- విశ్వములోని (మహా)పంచభూతములతో ఏకము చేయు ధారణచే అట్టి సాధన సర్వపాప - విశోధని (Cleaner) అగుచున్నది. అట్టి అభ్యాసము ‘విశ్వధారణాయోగము’ అని కూడా అనబడుచున్నది.

దేహముయొక్క విభాగములలలో పంచభూత భావనా ధారణ

(1) జాన్వంతం పృథివీ అంశో : -
పాదముల నుండి మోకాళ్ల వరకు : - పృథివీ అంశ.

(2) అపాం పాయు అంశో :
మోకాళ్ల నుండి వాయువు (విసర్జకావయవము) వరకు : - అపాం(జల) అంశ.

(3) హృదయాంశః అగ్న్యంశో :
పాయువు నుండి హృదయము వరకు : - అగ్న్యంశ.

(4) భ్రూమధ్యాంశో అనిలాంశకః - వాయూంశో:
హృదయము నుండి - భ్రూమధ్యవరకు (కనుబొమ్మల స్థానము వరకు) - వాయు అంశ

(5) ఆకాంశంశః - తథా మూర్థంశో:
భ్రూమధ్య నుండి - శిరస్సు వరకు ఆకాశాంశను.

ఈ విధంగా ధారణ చేయు మార్గమును ప్రాజ్ఞులు ‘యోగాభ్యాసము’గా మార్గదర్శనము చేయుచున్నారు.
ఇది పంచభూత భావనా ధారణ।

పంచ-అధిదేవతా ఉపాసన
పృథివీభాగే బ్రహ్మ.
తోయాంశకే జలాంశకే విష్ణువు.
అగ్న్యంశే మహేశుడు.
అనిలాంశే ఈశ్వరుడు.
ఆకాశాంశే సదాశివుడు……….. అని యోగతత్త్వజ్ఞులు ధారణ చేయుచున్నారు.

సాక్షాత్ ఆత్మతత్త్వ ధారణ

ఓ మునిపుంగవా! మరొక విధానమగు ‘ధారణ’ గురించి చెప్పుచున్నాను. వినండి :-

పరమాత్మ సర్వతత్త్వ స్వరూపుడు. సమస్తమును శాసించువారు. శాస్త. బోధానందమయుడు. (అనగా) ఈ సమస్తము తనయొక్క పురుషకారముగా కలిగియున్నవారు.

అట్టి సర్వాంతర్యామియగు పరమశివ భగవానుని సర్వదోష నివృత్తికొరకై బుద్ధిమంతులై ధారణ చేయుచున్నారు.

బ్రహ్మమొదలుకొని ఈ సందృశ్యమగుచున్న లోకాలోకముల వ్యవహారమంతా కూడా ‘కార్యరూపము’ అగుచుండగా, అట్టికార్యము ‘పరమాత్మ’ అను కారణమునందు (తరంగము జలమునందువలే) ఉపసంహారమగుచున్నది.

సర్వకారణకారణము, అవ్యక్తము, అనిరూప్యము (నిరూపించి చూపుటకు విషయము కానిది), అచేతనము (సర్వము కదలించుచు తానుమాత్రం ఏమాత్రము కదలిక లేనట్టిది) - అగు ‘‘సాక్షాత్ ఆత్మ’’ను ప్రణవపూర్వకంగా ధారణ చేయటము - సాక్షాత్‌ధారణ।

ఇంద్రియములన్నీ మనస్సుచే సమాహరించబడి, అప్పుడు శేషించిన మనస్సును ఆత్మయందు యోజనము (నియమితము) చేస్తూ సమస్తమును స్వస్వరూపాత్మకు అనన్యముగా ధారణ చేయటము ‘‘పరాకాష్ఠధారణ’’.


నవమ ఖండము - ధ్యానము (అష్టాంగయోగములలో ఏడవది)

శ్రీదత్తాత్రేయ భగవానుడు : ఓ మునీశ్వరా! ఇక మనము ‘సంసారము’ అను దోషమును నశింపజేయగల ‘ధ్యానము’ గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాము.

‘‘సోఽహమ్’’ (అదియే నేను)….అనునదే సర్వసాధనలయొక్క అంతిమ ఉద్దేశ్యము (లేక) ప్రయోజనము (లేక) అనునిత్యస్వాభావిక భావనాసిద్ధి.

ఏ పరమాత్మ అయితే
ఋతము (ఆత్మవేత్తల స్వానుభవమైనట్టిదో),
సత్యము (అప్రతిహతమైన ఉనికిచే ప్రకాశిస్తోందో),
పరంబ్రహ్మము (సమస్తమునకు ఆవల బ్రహ్మమై ఏర్పడి ఉన్నదో),
ఊర్ధ్వరేతము (ఊర్థ్వముగా జగత్తుల రూపంగా ప్రకాశమానమైయున్నదో),
విరూపాక్షము (కనబడుచున్న సమస్తమునకు వాస్తవరూపమైయున్నదో, విశేషరూపమై యున్నదో)
విశ్వరూపమ్ (ఈ విశ్వముగా రూపము ప్రదర్శిస్తోందో)
మహేశ్వరమ్ (సమస్తముగా విస్తరించి ఉన్నట్టిదో….)
‘‘అట్టి పరబ్రహ్మమే నేను’’ - అను యోగయోగీశ్వరత్వ ధ్యానమే - ముఖ్యధ్యానము.

సమస్త తదితర ‘అన్య’ ధ్యానములకంటే కూడా ‘అనన్య’ రూపమగు ‘‘అఖండాత్మమేవాఽహమ్’’ అనునది పరాకాష్ఠ - అయిఉన్నది. ముక్తికొరకై…., ‘‘సత్యము; ఈశానము; జ్ఞానానందమయము; అద్వయము; పరమార్థము; అచలము; నిత్యము; ఆదిమధ్యాంతరహితము’’ - అగు పరమాత్మయే ధ్యానవస్తువు.

స్థూలుడు; ఆకాశమునకు ఆవల అనాకాశుడగు ఆత్మాకాశుడు; స్పర్శింపబడజాలనివాడు (స్పర్శకు అవిషయుడు); కళ్ళకు దృశ్య విషయము కానట్టివాడు, రసగంధములకు అవిషయుడు; ఎట్టి విషయాలకు సంబంధించనివాడు కాబట్టి అప్రేయముడు; అనూపము (ఉపమానములచే నిర్దేశింపబడజాలనివాడు); సత్-చిత్-ఆనందస్వరూపుడు; అనంతుడు - అగు ఆత్మయే నేను!

“నేను అది కాని క్షణమే లేదు” అను ధ్యానముతో సమస్త ధ్యేయ వస్తువులకు అతీతత్వము ప్రాప్తించుచుండగా, అట్టి ధ్యానముచే ఈ జీవుడు విముక్తుడు కాగలడు. ‘‘అదియే నీవు కూడా।’’ అను తత్త్వ దృష్టిచే మాత్రమే ‘సోఽహమ్’ స్వానుభవము పూర్ణము కాగలదు.

అట్టి అభ్యాసయుక్తుడగు పురుషుడు ‘మహాత్ముడు’ అనబడుచున్నాడు. అతనియందు ‘‘తెలుసుకొనుచున్నవానిని → తెలుసుకొనుచున్నవాడు’’ (The knower of the knower) అయి ఉన్న వేదాంత విజ్ఞానము స్వయముగా వికసించుచున్నది. అత్ర న సంశయః। ఇతి।।


దశమ ఖండము - సమాధి (అష్టాంగ యోగములలో ఎనిమిదవది)

శ్రీదత్తాత్రేయ అవధూత : ఇప్పుడు భవదోషనాశనకరమగు ‘సమాధి’ గురించి కొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాము.

సంవిత్ (సత్+ఎరుక) స్వరూపుడే అయి ఉన్న ఈ జీవుని గురించి రెండు రూపములు (అధ్యాత్మశాస్త్రముచే) అభివర్ణించబడుచున్నాయి.

(1) ఇహరూపము → జీవాత్మ, సందర్భమాత్రసత్యము. (అనేక నాటకములలలో నటిస్తున్న ఒక మహానటునియొక్క ఒక నాటకములోని ఆతడు నటిస్తున్న పాత్రవలె) ఈ జీవుని ‘‘జగత్ అంతర్గత’’రూపము. స్వప్నము కనువానియొక్క స్వప్నములోని రూపము వంటిది. దేహసంబంధిత, జగత్ సంబంధిత రూపము.

(2) పరరూపము → సమస్తమునకు ఆవలగల సహజరూపము. కేవల సత్యము. నటనా కౌశలము గల నటుని పాత్రకు వేరైన సహజ-కళా స్వరూపము. జగద్దర్శనమంతా తనయందే ఏర్పడి ఉన్నట్టి ఆవల (పర) రూపము. స్వప్నము తనదైన వానిరూపము - వంటిది. సమస్తమునకు ‘సాక్షి’యగు అమృతస్వరూపము. దేహమునకు, జగత్తుకు సంబంధించని - ‘‘దేహి’’ - స్వరూపము.

‘‘సమాధి’’ అనగా అట్టి ఇహ-పరరూపముల అభేదత్వ-ఏకత్వ-అఖండత్వ అనుభవము.

‘‘ఆత్మ’’ సర్వదా నిత్యమైనది (That which is ‘as it is’ beyond Time, i.e. Beyond Past, Present & Future).

ఒక నవలా రచయిత వ్రాసి నవలలోని పాత్రలన్నీ ఆతని ఊహచమత్కారమే అయి ఉండి, ఆతని రచనా నేత్రములకు అన్యము కాదు కదా! ఆత్మకు జగత్తు వేరు కాదు. ఆత్మ సర్వగతము (Extending as all else while remaining constant). అంతేకాదు సమస్తమును తనయందు ‘‘అంతర్గతము’’. సర్వదా ఈ సమస్తమును తనయొక్క ‘‘స్వకీయ విన్యాసము’’గా కలిగి ఉండటముచేత కూటస్థము. (ఉదా: ఒక కథకు, ఆ కథలోని ఆయా సంఘటనలకు రచయితయే కూటస్థుడు. పరేశ్వరుడు. అంతర్గతుడు.

ఆత్మ జాగ్రత్ స్వప్న సుషుప్తులలోని ఆయా విశేషములు, సంఘటనలు - సంగతులు - చేత దోషము పొందడు. సంచిత - ఆగామి - ప్రారబ్ధకర్మలచేతగాని, జన్మజన్మాంతర ప్రహసనములచేతగాని స్పృశించబడదు. అందుచేత సర్వదా అప్రతిహతము. అవ్యాజపూర్వకము. దోషవర్జితము.

ఈ జీవుని సహజస్వరూపమగు ఆత్మ సర్వదా ఏకమే. స్వరూపతః ఎట్టి మార్పు - చేర్పులు పొందనప్పటికీ అహ్రాంతిచే మాయకు వశమైనట్లు (అజ్ఞానదృష్టికి) అగుపిస్తోంది.

వాస్తవానికి ‘‘జీవాత్మ-పరమాత్మ’’ అనబడు రెండు లేవు. ఏకో సత్। అనన్యత్వమే - సర్వదా సర్వత్రా విస్తరించి, వాస్తవమై ఏర్పడినదై ఉన్నది. పరాత్మకు ద్వితీయమే లేదు. బంధము లేదు. మరి బంధము ఎవరికి? జీవాత్మకా? ‘‘నా కలలో ఒకడు కనపించాడు. ఆతనికి బంధము ఉన్నది’’ - అని అనటము ఎటువంటిదో, ‘‘జీవాత్మకు బంధమున్నది’’ - అను మాట అట్టిది.

తస్మాత్ అద్వైతమేవ అస్తి। అందుచేత అద్వైతమే సత్‌స్వరూపమై సర్వదా వెలయుచున్నది. ఇక ఇక్కడ ప్రపంచము అనునది గాని (స్వప్న దృశ్యమువంటిది అగుటచే) , సంసృతి (కల్పనావిన్యాసము) అనునది గాని, స్వతఃగా లేవు. వాస్తవానికి ఉండజాలవు. ఆత్మయే సర్వదా సర్వత్రా సమస్తమై ఉండగా, అనాత్మ దృష్టిచే అన్యమువలె భ్రమింపబడుచున్నది. అనన్యమే సర్వదా సత్యము.

అఖండాత్మాకాశము

ఆకాశము (space) సర్వత్రా ఏర్పడినదై ఉన్నది కదా!

ఆకాశము (స్థలము) సర్వత్రా ‘ఏకమే’ అయినప్పటికీ కూడా, ఇది కుండలోని ఆకాశము (స్థలము). ఇది మఠములోని ఆకాశము - అది మఠము బయట ఆకాశము - అని వ్యవహారీత్యా స్థలము గురించి చెప్పుకోబడుచున్నది. అంతమాత్రంచేత ‘ఈ ఊరు…ఆ ఇల్లు - ఈ మఠము - ఈ దేశము - ఆ రాష్ట్రము’’ మొదలైనవన్నీ ‘స్థలము (ఆకాశము)’’ అను దానికి ఏమైనా భేదము కలిగించగలవా? లేదు. భూ-జల-వాయు-అగ్ని-ఆకాశములకు దేశదేశాంతరభేదమేముంటుంది?

అట్లాగే,
తథా అహ్రానైః ద్విధా పోక్తా హి ఆత్మా, జీవ-ఈశ్వరాత్మనా।।
అఖండమగు స్థలమునకు (ఆకాశమునకు) కుండలోని స్థలము. ఇంటిలోని స్థలము అను భేదము వాస్తవము కానట్లే, (కల్పితము మాత్రమే అయినట్లే) - ఏకమగు ఆత్మయే మూడు పేర్లుగా (లేక) రీతులుగా అనుకోబడుచున్నది. (1) జీవాత్మ (2) ఈశ్వరాత్మ (3) పరాత్మ. ఆత్మ ఎప్పుడూ ఒక్కటే. ‘‘జీవాత్మ- ఈశ్వరాత్మ’’, ‘‘నీవు -నేను’’ ‘‘వారు - వీరు’’ అను ఆయా ద్వంద్వములుగా (రెండుతీరులుగా) దర్శించటము అహ్రాంతిచేత మాత్రమే. అది లౌకిక దృష్టియేకాని, పారమార్థదృష్టికాదు.

ఓ మునిశ్రేష్ఠా!
- ‘‘నేను ఈ భౌతికదేహమును కాను. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రాణము - మొదలైనవేవీ కాను.
- నేను సర్వదా కేవలసాక్షి స్వరూపుడను. కేవల శివస్వరూపుడను।
ఇట్టి ‘‘బుద్ధి’’ సునిశ్చితము, అచ్యుతము, అనుక్షణికము, స్వాభావికము అయి ఉండటమే ‘‘సమాధి’’ అను (అష్టాంగములలోని చివ్వరిదిగా) చెప్పబడుచున్నవి.

కోఽహమ్ - నేను ఎవ్వరు?

నేను బ్రహ్మమునే। అంతేగాని సంసారము (దృశ్యము)చే బంధించబడు ‘‘సంసారి’’ని కాదు. సోఽహం బ్రహ్మ। న సంసారీ।। బ్రహ్మము గురించి ఎరిగినప్పుడు - ఎరగనప్పుడు కూడా దేహము, ఉన్నప్పుడు - లేనప్పుడు కూడా ఏ సమయమందు నేను బ్రహ్మము కాని క్షణమే లేదు. బ్రహ్మము నాకు అన్యము కాదు. బ్రహ్మమునకు నేను అన్యము కాదు.

ఇక ఈ జగత్తు గురించియా? యథా ఫేన తరంగాది సముద్రాత్ ఉత్థితం, పునః సముద్రే లీయతే, తద్వత్ జగత్ మయి అనులీయతే।। సముద్రజలంలో తరంగాలు, బుడగలు, నురుగు మొదలైనవి బయల్వెడలి, జలమునందే ప్రదర్శనమై, తిరిగి సముద్ర జలములోనే లయమగుచున్నాయి కదా! అదే తీరుగా ఈ ‘జగత్తు’ అనబడునది నానుండే, (భావనారూపంగా) బయల్వెడలి, నాయందే ‘స్థితి’ని కలిగియున్నదై, తిరిగి నాయందే (జలంలో తరంగంలాగా) లయము పొందుచున్నది.

జలములో జలమే ఉండిఉండగా, ఇది ‘‘జలతరంగము, ఇది బుడగ’’ - మొదలైనవిధాలుగా అనబడుతోంది. అట్లాగే, ‘మనస్సు’ అనునది నాకు వేరుగా లేదు. జగత్తు స్వతఃగా లేదు. ‘జగత్‌లయము’ - అనునదీ లేదు. తత్ పరబ్రహ్మాఽహమస్మి కేవలమ్।।
సమస్తము సర్వదా ఏదై ఉన్నదో, అదియే ఎల్లప్పుడు నేను ‘అయి ఉన్నాను’.

శ్లో।। యస్య ఏవం పరమాత్మా అయం ప్రత్యక్ భూతః ప్రకాశితః,
స తు యాతి స పుం భావం స్వయం సాక్షాత్ పరామృతమ్।।

ఎవ్వడైతే సర్వత్రా ఏర్పడినదైయున్న ఆత్మచైతన్యమును పై విధముగా భావన చేయుచున్నాడో, అట్టివాడు పరమపురుషరూపమగు పరామృతము (The Beyond; The Deathless; The Changeless)ను పొందుచున్నాడు. ఇహ-పరములు తనయందు అంతర్గత స్వాభావికమగుచూ ఉండగా, ఆతడు పరాత్పరుడుగా ప్రకాశించుచున్నాడు.

ఎప్పుడైతే ఈ మనస్సు కారణంగా మాత్రమే సర్వగతమగు చైతన్యమే ఈ సమస్తముగా భాసిస్తోందని గమనిస్తాడో, అట్టియోగి - పెద్ద వ్యవధి లేకుండానే - బ్రహ్మమును స్వాభావికానుభవంగా తనకు అనన్యంగా సిద్ధించుకోగలడు.

శ్లో।। యదా సర్వాణి భూతాని స్వ-ఆత్మన్యేవ హి పశ్యతి,
సర్వభూతేషు చ ఆత్మానం, బ్రహ్మసంపద్యతే తదా।।

ఎప్పుడైతే ఈ జీవుడు సర్వ తదితర భూతజాలమును తనయొక్క ఆత్మయందే దర్శిస్తాడో, (అట్లాగే) సర్వభూతజాలమునందు తన ఆత్మను దర్శిస్తాడో, అప్పుడిక అట్టి యోగి బ్రహ్మతత్త్వమును స్వాభావికంగా ఇప్పుడే ఇక్కడే అనుభూతపరచుకోగలడు. ‘‘నాయొక్క ‘నేను’ అనునది దేహపరిమితము కాదు. వ్యష్టిపరిమితము కూడా కానే కాదు. ఈ సమస్తము నేనైన నేనే ‘నేను’ అనునదే బ్రహ్మీభావన.

ఎప్పుడైతే అఖండమగు ఆత్మ తప్పించి, ఇక ‘వేరు వేరైన జీవులు’’ అనునది కించిత్ కూడా దర్శించడో, ఏకమగు - అఖండమగు పరతత్త్వమే సర్వత్రా దర్శిస్తాడో, ఆతడు తనయొక్క కేవలీ స్వస్వరూపము దర్శించినవాడై కైవల్యము పొందగలడు.

ఇత్యేవ సారం దర్శనోపనిషత్

ఎవ్వడు
= తనను తాను పరమార్థతః కేవలమగు ఆత్మస్వరూపునిగా చూస్తూ ఉంటాడో
= ఈ జగత్తుని స్వప్న దృశ్యమువలె మాయామాత్రముగా గమనిస్తూ ఉంటాడో….
= ఈ కనబడే సమస్త జీవులను ఆత్మయందు ఆత్మగా దర్శిస్తూ ఉంటాడో,
అట్టివాడు సర్వ అన్యవృత్తుల నుండి నిర్వృతుడై, కేవలమగు పరమానందాత్మగా శేషించినవాడై ఉండగలడు.

లీలా-క్రీడా-వినోద విశేషములుగా, ఈ కల్పిత కథా కథనములాగా ఈ దృశ్యజగత్తును గ్రహించగలడు (భావించగలడు).
ఈ సమస్తము ‘తానే’ అయి పరమానందభరితుడై ఉండగలడు.

ఇదియే బ్రాహ్మీ సందర్శనము.

ఈ విధంగా శ్రీదత్తాత్రేయులవారు spanredతన ప్రియశిష్యుడగు సాంకృతి మునీంద్రునికి పరతత్త్వము గురించి విశదీకరించారు.

సద్గురువగు శ్రీ దత్తాత్రేయులవారి వద్ద శ్రద్ధగా ఆత్మ విద్యా శ్రవణం చేసిన సాంకృతి యతీంద్రుడు : -
- స్వస్వరూపమునందు నిశ్చలుడై,
- అభయ ప్రదమగు ఆత్మానందమునందు పరమసుఖానుభవులయ్యారు.



🙏 ఇతి దర్శన ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।