[[@YHRK]] [[@Spiritual]]

Jābāli Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


సామవేదాంతర్గత

5     జాబాల్యుపనిషత్

జాబాలి - పైప్పలాద సంవాదరూప జాబాలోపనిషత్ (పశువులు - పశుపతి)

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। జాబాల్యుపనిషత్ వేద్య పరతత్త్వ స్వరూపకమ్
పారమ్ ఐశ్వర్య విభవమ్ రామచంద్ర పదం భజే।।

ఈ జాబాల్యుపనిషత్‌చే తెలియబడు పారమైశ్వర్య విభవమగు - అగు స్వస్వరూప పరతత్త్వము స్వానుభవమగుటకై ‘‘శ్రీరామ బ్రహ్మము, ఆత్మారాముడు, రామానంద సాగరుడు’’గా వర్ణించబడుచున్న శ్రీరామచంద్రమూర్తి పాదపద్మములను భజించుచున్నాను.

ఓం।
1. అథ హి ఏనం భగవంతం
జాబాలిం పైప్పలాదిః
ప్రపచ్ఛ :
‘‘భగవన్! మే బ్రూహి
పరమ తత్త్వ రహస్యమ్।
కిం తత్త్వం?
కో జీవః?
కః పశుః?
క ఈశానః?
కో మోక్షోపాయ? ఇతి।।
పైప్పలాద మహర్షి : హే భగవాన్। జాబాలి సద్గురూ। నమో నమః। దయతో నాకు పరకాష్ఠ అగు ‘‘తత్త్వ రహస్యము’’ - గురించి బోధించ ప్రార్థన

‘తత్త్వమ్’ అనగా ఏమి?
ఈ జీవుడు ఎవ్వడు? ఎక్కడివాడు?
‘పశువు’ అని ఎవరిని అంటాము? ‘పశుపతి’ అనగా?
‘ఈశానుడు’ అనగా ఎవ్వరు?
‘మోక్షము’ సిద్ధించటానికి ‘ఉపాయము’ ఏది?

ఈ ఈ విషయాలు దయచేసి విశదీకరించండి.
2. స తం హో వాచ (జాబాలౌ వాచ)
‘‘సాధుపృష్టం। సర్వం నివేదయామి
యథా జ్ఞాతమ్’’ - ఇతి।
పునః సః తమ్ ఉవాచ। (పైప్పలాదౌ వాచ)
‘‘కుతః త్వయా జ్ఞాతమ్?’’ ఇతి।
పునః సః తమూవాచ। (జాబాలౌ వాచ)
‘‘షడాననాత్।’’ ఇతి।।
జాబిలి మహర్షి : బిడ్డా। పిప్పలాద మహర్షి ప్రియకుమారా। పైప్పలాదా। మంచి ప్రశ్నలే వేశావయ్యా। నేను ఏ విధంగా ఆయా నీవు అడిగిన విశేషాలు శ్రవణం చేసి (విని) తెలుసుకొనియున్నానో, అవన్నీ నీకు వివరిస్తాను. శ్రద్ధగా వినిదెవు గాక.
పైప్పలాదుడు : స్వామీ! జాబాలి మహానుభావా! మీరు ఎవ్వరినుండి ఎట్లా తెలుసుకొనియున్నారో….అది కూడా ముందుగా చెప్పండి.
జాబాలి భగవానుడు : నేను తాత్త్విక రహస్యములను నా గురువరేణ్యులు, షడాననుడు, శివపుత్రుడు-అగు శ్రీమన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నుండి, (కార్తికేయుని నుండి) తెలుసుకున్నాను. (భక్త జనప్రియ పంకజ లోచన బాలసుబ్రహ్మణ్యం।)
పునః సః తమువాచ। (పైప్పలాదౌ వాచ)
‘‘తేన అథ కుతో జ్ఞాతమ్?’’ ఇతి।
పునః సః తమువాచ (జాబాలౌ వాచ)
‘‘తేన ఈశానాత్।’’ ఇతి।।
పైప్పలాదుడు : ఓహో। అట్లాగా? అయితే ఆ షణ్ముఖులవారు ఎవరి నుండి తెలుసుకోవటం జరిగింది?
జాబాలి : మత్ ప్రియ గురువులవారు శ్రీ షణ్ముఖుడు వారి పితృదేవులగు ఈశ్వరుడగు - శివభగవానుని నుండి - విని ఉండటము జరిగింది.
పునః సః తమువాచ। (ప్పైప్పలాదౌ వాచ)
‘‘కథం తస్మాత్ తేన జ్ఞాతమ్?’’ ఇతి।।
పునః సః తమువాచ। (జాబాలౌ వాచ)
‘‘తత్ ఉపాసనాత్’’ - ఇతి।।
పైప్పలాదుడు : ఆ ఈశానులవారి నుండి ఆయా విశేషాలు ఎట్లా షణ్ముఖస్వామి తెలుసుకోవటం జరిగింది?
జాబాలి మహర్షి : అస్మత్ గురుదేవులగు షణ్ముఖ భగవానుడు ‘ఈశ్వరోపాసన’చే ఈశ్వరుని మెప్పించి ఆయా మనం చెప్పుకోబోయే విశేషాలు విని, తెలుసుకోవటం జరిగింది. (ఉపాసన నుండి గురు అనుగ్రహం. తద్వారా జ్ఞానము)
పునః సః తమువాచ। (ప్పైప్పలాదౌ వాచ)
భగవన్! కృపయా మే రహస్యం
సర్వం నివేదయ। ఇతి।।
స తేన పృష్టః సర్వం
నివేదయామాస తత్త్వమ్।
పశుపతిః అహంకారావిష్టః
సంసారీ జీవః - స ఏవ ‘పశుః’।
సర్వజ్ఞః పంచకృత్య సంపన్న
సర్వేశ్వర ఈశః ‘పశుపతిః’।
పైప్పలాదుడు : స్వామీ! భగవాన్! జాబాలి మహర్షీ। ఆయా తాత్త్విక రహస్య విశేషములు నాకు కూడా బోధించమని అభ్యర్థన.
జాబాలి : ‘‘మీరు కోరిన, నేను వినియున్న ‘తత్త్వము’ గురించి చెప్పుచున్నాను. ఇక వినండి’’- అని వినిపించసాగారు.

ఈ జీవుడు వాస్తవానికి అహంకారమునకు మునుముందే సత్‌స్వరూపుడు. అహంకారమునకు కూడా నియామకుడు. ఇంద్రియములు అనే పశువుల పాలకుడు. పశుపతి. అట్టి పశుపతి - ‘‘నేను - నాది-అది-ఇది’’….అను భావనతో కూడిన (వ్యష్టి) అహంకారపూరితుడైనప్పుడు ‘సంసారజీవుడు’ అయి కనిపిస్తున్నాడు. ఈ విధంగా ఈ జీవుడే ‘పశువు’.

కించిజ్ఞుడు: ఈ జీవుడు వర్తమాన ఉపాధికి సంబంధించిన పరిమిత - సంకుచిత ‘దృష్టి’ కలిగియుండి, ‘‘ఆవల-ఈవల’’ గురించి పరిశీలనా త్మకుడై ఉండటములేదు. అందుచేత ‘కించిజ్ఞుడు’గా అగుపిస్తున్నాడు.
సర్వజ్ఞుడు: ‘‘ఈ దేహముల పరంపరలన్నీ నాయొక్క ఉపకరణములు. దేహము యొక్క పుట్టుక, వృద్ధి, హాని, దేహముల వ్యవహారము నుండి తిరోభావము - మరొక - తిరిగి దేహమును స్వీకరించటము - ఇదంతా నాయొక్క స్వకీయ లీలా క్రీడాకల్పన. నేను సర్వమునకు ఈశ్వరుడను, సర్వముగా విస్తరించి ఉన్నవాడను. ఒక కవి రచించునవలలకు, వాటిలోని పాత్రలకు - ఆ కవికి గల సంబంధమే, నాకు తదితర దేహములకు ఉన్న సంబంధము’’ - అని గమనించువాడు పశుపతి.
3. పైప్పలాదౌ వాచ
‘‘కే పశవ?’’ - ఇతి
పునః సః తమువాచ। (జాబాలౌ వాచ) :
జీవాః ‘పశవ’ ఉక్తాః।
తత్ పతిత్వాత్ పశుపతిః।
పైప్పలాదుడు : లోకంలో ‘‘పశుపతి - పశువులు’’ అనేవి చూస్తూ ఉంటాము. ఆధ్యాత్మ వాఙ్మయంలో కూడా। ‘పశువులు - పశుపతి’ అనే శబ్దాలు ఉపయోగిస్తున్నాము. ఇక్కడ పశువు ఎవరు? పశుపతి ఎవరు? మరికొంతగా వివరించండి.
జాబాల మహర్షి : మరల చెప్పుచున్నాను. జీవులే - పశువులు. ఈ జీవాత్మలకు యజమానియే పశుపతి.
అనగా, ఈ జీవుడు -
దేహాత్మగా → పశువు.
దేహముల వ్యవహారమంతా పాలించువాడుగా → పశుపతి.
సః పునః తమ్ హ ఉవాచ : (ప్పైప్పలాదౌ వాచ)
కథం జీవాః పశవ? ఇతి।
కథం తత్ పతి? ఇతి।
సః తము వాచ (ప్పైప్పలాదౌ వాచ)
యథా తృణ అశినో వివేక హీనాః
పర ప్రేష్యాః
‘కృషి’ ఆది కర్మసు
నియుక్తాః సకల దుఃఖసహాః
స్వ-స్వామి బధ్యమానా గవ-ఆదయః పశవః।
పైప్పలాదుడు : జీవుడు → పశువుగా ఎట్లా అగుచున్నారు?
ఆ పశువులకు పతిగా - ఈశ్వరుడు ఎట్లా అగుచున్నారు? దీని యొక్క ‘‘అధ్యాత్మశాస్త్ర హృదయము’’ ఏమిటి?

జాబాల మహర్షి : పశువులు గడ్డిని మేస్తూ, వివేకము లేనివై, ఇతరులచే ప్రేరేపించబడుచూ బండిని లాగటము, పొలము దున్నటము మొదలైన కృషి కర్మలయందు (ఇతరులచే) నియుక్తము అగుచూ ఉంటాయి. యజమాని చెప్పుచేతలలో ఉంటూ, బంధము అనుభవిస్తూ నానా దుఃఖములు అనుభవిస్తూ ఉంటాయి కదా!
అట్లాగే, ఈ జీవులు కూడా ఇంద్రియ విషయములను అనుభవిస్తూ, ఆత్మానాత్మ-నిత్యానిత్య వివేకము లేనివారై, కర్మదేవతల ప్రేరణచే కర్మబద్ధులై, జగత్ పురుషుని యాజమాన్యంలో శరీర పరంపరబద్ధులై ఉంటున్నారు. ఆయా అనేక దుఃఖములు అనుభవిస్తూ ఉంటున్న సందర్భము దృష్ట్యా - ‘‘ఈ జీవుడు పశువు’’ అని అనబడుచున్నాడు. ఆత్మజ్ఞానరాహిత్యమే అందుకు కారణం.
యథా తత్ స్వామిన ఇవ
సర్వజ్ఞ ఈశః పశుపతిః।।
(పైప్పలాదౌ వాచ)
- తత్ జ్ఞానం కేనౌపాయేన జాయతే?
పునః సః తమువాచ (జాబాలౌ వాచ)
విభూతి ధారణాత్ ఏవ।
ఈశ్వరుడు → ‘‘ఈ జీవాత్మత్వమునకు యజమానినేగాని జీవాత్మత్వము నా స్వరూపము కాదు, స్వభావము కాదు’-అని గమనించినవాడై, దేహ - దేహాంతరముల పట్ల, అంతరంగ చతుష్టయముపట్ల స్వామిత్వము వహించినవాడు సర్వజ్ఞుడు, ఈశుడు, పశుపతి. ఈ జీవుడు తనయొక్క పశుపతిత్వ సంబంధమైన జ్ఞానము, నిశ్చలానుభవము సంపాదించుకోవాలి మరి।
పైప్పలాదుడు: అట్టి పశుపతి జ్ఞానము (లేక) ఆత్మజ్ఞానము లభించేది ఎట్లా?
జాబాలమహర్షి : విభూతిధారణయోగము అందుకు మార్గదర్శకముగా చెప్పబడుతోంది.
పైప్పలాదౌ వాచ
- తత్ ప్రకారః కథమ్? - ఇతి।
- కుత్ర కుత్ర ధార్యమ్?
పైప్పలాదుడు : అట్టి విభూతి ధారణకు విధానమేమిటి? ఏవిధంగా విభూతి (భస్మము)ను ధరించాలి. (చితాభస్మధారణగా ఈ సమస్త జాగ్రత్ - స్వప్న - సుషుప్తులను అలంకరించుకొనేవిధానమెట్టిది?)
పునః సః తమువాచ (జాబాలౌ వాచ)
‘‘సద్యోజాతాది’’ పంచ బ్రహ్మ మంత్రైః
భస్మ - సంగృహ్య
‘‘అగ్నిః - ఇతి భస్మ’’
ఇతి అనేన అభిమంత్ర్య,
జాబాలమహర్షి :
- సద్యోజాతం…
- వామదేవం…
- తత్ పురుషం…
- అఘోరం…
- ఈశానం…
‘‘అగ్నిరితిభస్మ। వాయురితిభస్మ। వ్యోమేతి భస్మ’’… ఈ మంత్రముతో అభిమంత్రించాలి.
‘‘మాన స్తోక’’
ఇతి - సముధృత్య,
జలేన - సంసృజ్య,
‘‘త్ర్యాయుషమ్’’ - ఇతి
శిరో లలాట వక్షః స్కంధేషు ఇతి తిసృభిః
త్ర్యాయుషైః త్రయంబకైః, తిస్రో రేఖాః ప్రకుర్వీత।
వ్రతమ్ ఏతత్ శాంభవం,
సర్వేషు వేదేషు వేదవాదిభిః ఉక్తం భవతి।
తత్ సమాచరేత్ ముముక్షుః న పునర్భవాయ।।
‘మానస్తోకే తనయే’….అను మంత్రములో నీటితో భస్మమును తడుపాలి.
‘‘త్ర్యాయుషమ్ జమదగ్నే’’ ‘‘త్ర్యంబకం యజామహే సుగంధం పుష్టివర్థనమ్’’ - మంత్రము చదువుచూ శిరో - లలాటముపై, వక్ష స్థలముపై, భుజములపై త్రివిభూది రేఖలు ధారణ చేయాలి. ఇది ‘‘శాంభవ వ్రతము’’ - అని ప్రసిద్ధమైయున్నది.
వేదవాదులు ఈ రీతిగా వేదవాఙ్మయమును అధ్యయనము చేస్తున్నప్పుడు, అనుష్ఠించుచున్నప్పుడు ఈ శాంభవ వ్రతము ఆచరించు నియమమును పాటించుచున్నారు. ముముక్షువులు జన్మరాహిత్యముకొరకై ఆచరణగా విభూతిధారణా-శాంభవీ వ్రతమును ఆచరించుచుండెదరు గాక.
4. అథ సనత్కుమారః ప్రమాణం పృచ్ఛతి।
త్రిపుండ్ర ధారణస్య,
త్రిధా రేఖా, ఆ లలాటాత్ - ఆ చక్షుషో, ఆ భ్రువోః మధ్యశ్చ।
ఈ విభూతి ధారణ గురించి బ్రహ్మ మానసపుత్రులగు సనత్కుమారుల వారు చెప్పియున్న విభూతి ధారణ యొక్క పరమార్థము గురించి శాస్త్రములచే ఈ విధంగా చెప్పబడుచున్నది.

త్రిపుండ్ర ధారణమును మూడు రేఖలుగా లలాటముపై రెండు కనుల, కొలకుల వరకు, భ్రూమధ్యగా ధారణ చేయబడును గాక. ఆ ‘3’ రేఖలను ఈ విధంగా మహనీయులగు సనత్కుమారులవారు విశ్లేషించి చెప్పుచున్నారు.
యా అస్య ప్రథమా రేఖా → సా
- గార్హపత్యశ్చ।
- ‘అ’ కారో।
- రజో।
- భూర్లోకః।
- స్వాత్మా।
- క్రియాశక్తి।
- ఋగ్వేదః।
- ప్రాతః సవనం।
- ప్రజాపతిః దేవో దేవతా। ఇతి।।
త్రిపుండ్రములోని ప్రథమ రేఖ : → యజ్ఞములోని గార్హపత్యాగ్నికి, ‘ఓం’ కార త్రీక్షరముల లోని ‘అ’కార వ్యాహృతికి, త్రిగుణములలోని సృష్టి సంకల్ప జననరూపమగు ‘రజో’ గుణమునకు, త్రిలోకములలోని భూలోకమునకు, (Matterకు) కేవలమగు స్వాత్మకు, క్రియాశక్తి రూపమునకు, ప్రాతఃసవనము (ప్రాతః ఉపాసనకు), విశ్వకల్పనా పర్యవేక్షకుడగు ప్రజాపతి దేవతకు (బ్రహ్మకు) ప్రతీక। సంజ్ఞ। ‘‘పరమాత్మగా ఇవన్నీ నాకు ‘ధారణ’ అయి ఉన్నాయి.’’ - అనునది అంతరార్థము. మననము కలిగి ఉండవలసిన మహదార్థము.
యా అస్య ద్వితీయా రేఖా → సా
- దక్షిణాగ్నిః।
- ‘ఉ’ కారః।
- సత్వమ్।
- అంతరిక్షమ్।
- అంతరాత్మా చ।
- ఇచ్ఛా శక్తిః।
- యజుర్వేదో।
మాధ్యం దినం సవనం
- విష్ణుర్దేవో దేవతా। ఇతి
త్రిపుండ్రములోని ద్వితీయ రేఖ: → యజ్ఞాగ్నులలో ద్వితీయమైనదగు ‘దక్షిణాగ్ని’కి, ‘ఓం’కార వ్యాహృతులో ద్వితీయమైనదగు ‘ఉ’ కారమునకు, త్రిగుణములలో సత్వగుణమునకు, అంతరిక్షమునకు, అంతరాత్మకు ఇచ్ఛాశక్తికి, యజుర్వేదమునకు మధ్యాహ్నదైనందిక సవనమునకు, (ఉపాసనకు) విష్ణుదేవునకు - ప్రతీక. విభూతి ధారణ చేస్తూ పై విశేషములను ఆత్మపరంగా భావనచేస్తూ మననము చేసెదరు గాక।
యా అస్య తృతీయా రేఖా → సా
- ఆహవనీయో।
- ‘మ’ కారః।
- తమో।
- ‘ద్యౌః’ లోకః।
- పరమాత్మా।
- జ్ఞానశక్తిః।
- సామవేదః।
- తృతీయ సవనం।
- మహాదేవో దేవతా। ఇతి।।
త్రిపుండ్రములోని తృతీయ రేఖ: → యజ్ఞములోని అహవనీయాగ్నికి, ‘ఓం’కారములో తృతీయ వ్యాహృతి అగు ‘మ’కారమునకు, త్రిగుణములలోని తమోగుణమునకు, తేజోమయ ద్యులోకమునకు (దేవతా లోకమునకు),
{(స్వాత్మ-జీవుడు), అంతరాత్మ - (ఈశ్వరుడు), పరమాత్మ (కేవల సాక్షి)లలోఊ పరమాత్మకు, (ఇచ్ఛా-క్రియా-జ్ఞానశక్తులలో) జ్ఞానశక్తికి, (ఋక్-యజుర్- సామవేదములలో) సామవేదమునకు, తృతీయ సవనమునకు, (ఉపాసనకు) మహాదేవ దేవతకు ప్రతీక (లేక) సంజ్ఞ.

స్వస్వరూపమగు పరమాత్మకు ఇవన్నీ అలంకారమాత్రములు

త్రిపుండ్రం భస్మనా కరోతి యో
విద్వాన్, బ్రహ్మచారీ,గృహీ
వానప్రస్థో, యతిర్వా
స మహాపాతక ఉపపాతకేభ్యః
పూతో భవతి।
స సర్వాన్ వేదాన్ అధీతో భవతి।
స సర్వాన్ దేవాన్ ధ్యాతో భవతి।
స సర్వేషు తీర్థేషు స్నాతో భవతి।
సకల రుద్రమంత్ర జాపీ భవతి।।
న స పునరావర్తతే।
న స పునరావర్తత। ఇతి
= ఓం సత్యమి త్యుపనిషత్ =
విద్వాంసుడు అయినా, కాకపోయినా, - (eT]యు) బ్రహ్మచారిగాని, గృహస్థుడుగాని వానప్రస్థుడుగాని, యతిగాని, అయతిగాని, ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా - పైన చెప్పిన పరమార్థములను మననం చేస్తూ విభూతిధారణను ఆత్మా-హమ్ భావనాశ్రయుడై నిర్వర్తిస్తూ ఉంటాడో…
- అట్టివాడు మహాపాతక - ఉపపాతకముల నుండి పునీతుడు కాగలడు.
- వేదములన్నీ అధ్యయనము చేసిన వానితో సమానుడగుచున్నాడు.
- సర్వ దేవతల తత్త్వమును ధ్యానించిన వానితో సమానము.
- సర్వ పుణ్యతీర్థములలో స్నానము చేసిన వానితో సమానము.
- రుద్ర మంత్రములను ఆమూలాగ్రం అసంఖ్యాకంగా జపించిన ప్రయోజనము పొందుచున్నాడు.
అట్టివానిచే ఇక ఆపై ‘‘ఈ దేహము నుండి ఆ దేహము, ఈ లోకములోనుండి ఆలోకము లోనికి’’….అనే అనివార్య పునరావర్తనము….(అనే దోషము) - జయించబడగలదు. ‘‘నేను పుట్టువాడను - చచ్చువాడను. ఇదంతా నాపట్ల అనివార్యము’’ - అనే మానసిక జాడ్యము తొలగిపోతుంది. ఓం సత్యమ్ ఇతి ఉపనిషత్।

ఓం ఇతి జాబాలోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



సామవేదాంతర్గత

5     జాబాల్యుపనిషత్

జాబాలి - పైప్పలాద సంవాదరూప జాబాలోపనిషత్ (పశువులు - పశుపతి)

అధ్యయన పుష్పము


బ్రహ్మజ్ఞుడు, తత్త్వజ్ఞుడు అగు పిప్పలాదమహర్షియొక్క కుమారుడు పైప్పలాదముని ఒక సందర్భములో ‘‘తత్త్వజ్ఞానాభిలాషి’’ అయి గురుదేవులగు జాబాలి మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. భక్తి - ప్రపత్తులతో సాష్టాంగదండ ప్రణామములు సమర్పించారు.

భగవానుడగు జాబాలి పైప్పలాదుని సాదరంగా ఆహ్వానించి చిరునవ్వుతో కుశల ప్రశ్నలు వేయసాగారు.

జాబాలి మహర్షి : బిడ్డా। పైప్పలాదా। మహనీయులగు మీ పితృదేవులు పిప్పలాద మహర్షివారికి నా హృదయపూర్వక నమస్కారము. నీవు కుశలమే కదా? మీ తండ్రిగారు నీకు నియమించిన ఆధ్యాత్మికమార్గమగు భక్తి-జ్ఞాన-యోగ-ధ్యానాత్మకమైన అభ్యాసములు శ్రద్ధగా కొనసాగుచున్నాయి కదా? ఇంకా ఏమి విశేషాలు? నీ ఈ రాకకు కారణం?

పైప్పలాదుడు : హే భగవన్। అస్మత్ గురువర్యా। జాబాలమహర్షీ! మీయొక్క ఆశీర్వాదబలంచేత సమస్తము సకుశలమే. నేనిప్పుడు తత్త్వజ్ఞానార్థినై మీవద్ద పరమతత్త్వరహస్యముల గురించి శ్రవణం చేయాలని వచ్చి, మిమ్ములను శరణువేడుచున్నాను. తత్త్వశాస్త్రరహస్యమును నాకు ఉపదేశించ ప్రార్థన. బ్రూహి పరమ తత్త్వ రహస్యమ్।

❓ ‘తత్త్వమ్’ - అను శాస్త్రము ముఖ్యంగా చెప్పే సారాంశమేమిటి? ఆ శబ్దార్థమేమిటి? కిం తత్త్వమ్?
❓ ఈ ‘జీవుడు’ అనబడువాడు ఎచ్చటివాడు? ఎక్కడినుండి బయల్వెడలి, ఈ దృశ్యములో ప్రత్యక్షమై కనిపిస్తున్నాడు. కో జీవః?
❓ పరమాత్మయగు పరమశివ భగవానునికి ‘‘పాశుపత్యుపాసన’’ నిర్వర్తిస్తూ ఉంటాముకదా! ఆ పాశుపత్యుపాసనా విధానము గురించిన విశేషమును మీవద్ద అభ్యసించటానికి సముత్సాహితుడను అగుచున్నాను.
❓‘పశువు’ ఎవరు? పశుపతి ఎవరు?
❓‘ఈశానుడు’ అనగా ఎవరు?
❓‘‘ఈ మానవజన్మ ఉత్కృష్టమైనదని, ‘మోక్షము’ను సిద్ధించుకోవటానికి మహత్తరమైన అవకాశము’’ - అని తత్త్వజ్ఞుల యొక్క, తత్త్వశాస్త్రము యొక్క మహత్-వాక్యము కదా! అట్టి ‘మోక్షము’ను మేము సిద్ధింపజేసుకొనేది ఎట్లా? అందుకు మేము అనుసరించవలసిన ఉపాయమేమిటి?

ఈ ఈ విశేషాలన్నీ దయతో వివరించవలసినదిగా నా అభ్యర్థన.

జాబాలి మహర్షి : సంతోషమయ్యా! తత్త్వజ్ఞానవిశేషాలు వినటానికి వచ్చినందుకు నీకు అభినందనలు. నేను ఏ విధంగా శ్రవణం చేసి (విని), తెలుసుకోవటం జరిగిందో….ఆయా విశేషాలన్నీ నీకు చెప్పుతాను. సర్వం నివేదయామి, యథా జ్ఞాతమ్ ఇతి?

పైప్పలాదుడు : ఓహో। మీరే స్వయముగా మహాతపోసంపన్నులుగా మునిలోకంలో సుప్రసిద్ధులు. మహర్షులుగా కీర్తింపబడువారు. అట్టి మీరు - ‘‘విని ఉన్నట్టి, నేర్చుకొని ఉన్నట్టి విశేషాలు చెప్పుతాను’’ - అని అంటున్నారే! మీరు ఎవరిచే బోధింపబడి, విని, తెలుసుకొన్న విశేషాలు చెప్పబోవుచున్నారు? కుతః త్వయా జ్ఞాతమ్?

జాబాలి మహర్షి : నాయనా! నేను లోక గురువులగు శివపుత్రుడు షడాననులవారు తత్త్వజ్ఞానము బోధించగా విని తెలుసుకోవటం జరిగింది. షడాననా ఇతి। (కార్తికేయా! కరుణాసాగర! శ్రీ స్వామినాధా వడివేలా! దానశరణ్య వడివేలా! నమో నమః।।)

పైప్పలాదుడు : అట్లాగా మహనీయా? అయితే ఆ షణ్ముఖులగు సుబ్రహ్మణ్యస్వామి (లేక) స్వామి కార్తికేయులవారు ఎవరి నుండి తత్త్వజ్ఞానము తెలుసుకోవటం జరిగింది?

జాబాలి మహర్షి : ఆ షణ్ముఖస్వామి - తత్త్వజ్ఞానమును తమ పితృదేవులు, జగత్ పిత అగు పరమేశ్వరుని నుండి తాను శ్రవణం చేసినట్లుగా చెప్పటం జరిగింది. ఈశానాత్ ఇతి।

పైప్పలాదుడు : ఆ షణ్ముఖుడు ఈశానుని నుండి ఎట్లా తత్త్వరహస్యములు వినటము, తెలుసుకోవటం సాధ్యపడింది? కథం తస్మాత్ తేన జ్ఞాతం?

జాబాలి మహర్షి : ఓ అదా! ఈ త్రిజగత్తులలో ఎవ్వరైనా మహత్తరమగు తత్త్వజ్ఞానము తెలుసుకోవాలనుకుంటే, అందుకు ఉపాయం ఒక్కటే. అది ‘‘ఉపాసన’’. షణ్ముఖస్వామి ఈశ్వరుని ఉపాసించి, వారిని ప్రసన్నులుగా చేసుకొన్నారు, పరిప్రశ్నించి ‘‘త్వమ్‌గా కనబడునది తత్‌యే। పరమాత్మయే సకలరూపములలో, సకల దేహములలో దేహిగా ఉన్నారు’’ అనబడు తత్త్వజ్ఞానమునకు ముందుగా అర్హులైనారు. అటు తరువాత శివభగవానుని నుండి తాము శ్రవణం చేయటం జరిగిందని వారు చెప్పి ఉన్నారు. తత్ ‘ఉపాసనాత్’ ఇతి।

పైప్పలాదుడు : హే గురువరేణ్యా। భగవాన్। జాబాలి మహర్షీ। ఇటువంటి ప్రశ్నలు వేసినందుకు నన్ను క్షమించండి. స్వాభావికమై అన్యవిశేష జిజ్ఞాసదోషంచేత ప్రశ్నించానేమో. ఇప్పుడు మిమ్ములను సద్గురురూపంగా ఉపాసిస్తున్నాను. నాపై కృపతో తత్త్వశాస్త్ర రహస్యమును నాకు విశదీకరించండి. భగవన్। కృపయా మే రహస్యం సర్వం నివేదయేతి।

జాబాలి మహర్షి : బిడ్డా। ఇప్పుడిక తత్త్వ రహస్యమును వివరించుకుందాము. ‘పశుపతి’ అను శబ్దార్థమేమిటో చెప్పుకుంటున్నాము. శ్రద్ధగా విను.

‘‘జీవుడు-భౌతికదేహము’’ ఈ రెండూ నీకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా!
ఇక్కడ మూడు విషయాలు బుద్ధితో గమనించు -
(1) ఇంద్రియములు - ఇంద్రియ విషయములు (శబ్ద స్పర్శరూప రసగంధములు)
(2) ఆ ఇంద్రియములకు, ఇంద్రియార్థములకు పరిమితుడు, బద్ధుడు అయి ఉన్నవాడు జీవుడు.
(3) ఆ ఇంద్రియములకు పతి (లేక) నియామకుడు ఈశ్వరుడు.
ఈ మూడు ప్రతి ఒక్క జీవునిపట్ల స్వాభావికమై ఉన్నాయి.

ఇంద్రియములకు ఎవ్వరు పతియో, ఆయనయే పశుపతి.

కథారచనకొరకై ఒకానొకడు తననుండి (1) కథారచయిత (The Writer) (2) కథా విశేషములు (Story details) కల్పించుకొంటున్న తీరుగా పశుపతి తననుండి అహంకారము (Sense of Individual Experience)ను కల్పన చేసుకొంటున్నారు.

జాబాలి-ఉపనిషత్-వ్యష్టిత్వం

ఇవన్నీ ఎవరినుండి (ఏ కేవల స్వరూపమునుండి) ప్రకటనమగుచూ, ప్రదర్శనమగుచున్నాయో… ఆయనయే ‘పశుపతి’.
ఈ జీవుడు → ‘‘దేహము - నేను’’…అను భావనకు ‘‘నేను పరిమితుడను’’…. అను వ్యసనమును అభ్యాసవశంగా ఆశ్రయించినప్పుడు - పశుపతియే ‘‘సంసారి, జీవుడు’’ అనబడుచున్నాడు. పశుపతిః అహంకారావిష్టః సంసారీ; జీవః సయేవ। - ‘పశువు’ అను శబ్దముయొక్క అర్థమునకు సంబంధించిన ఉద్దేశ్యము - ఇంద్రియములు.

ఈ జీవుడే - వ్యష్టి అహంకార పరిమితుడై, దృశ్య వ్యసన రూపపరిమిత దృష్టిచే సంసారి అయి ఉన్నప్పుడు ‘‘పశువు’’గా చెప్పుకోబడుచున్నాడు. సయేవ పశుః।

‘‘ఈ దేహ-ఇంద్రియ జగద్దృశ్యములు నాయొక్క క్రీడా - లీలా వినోదములు. ‘జీవాత్మ’ అనబడు పశువుకు అధికారిని. నియామకుడను’’. (I am the one who created the Experiencer of all else for the sake of my pleasure) - అను భావనచే ఈ జీవుడే శివుడుగా, పశుపతిగా పిలువబడుచున్నాడు.

➤ జీవుడు కించిజ్ఞుడు.
➤ ఇక ఈశ్వరుడో? నటుడు తాను నటించే అనేక పాత్రలకు వేరుగా ఉండు తీరుగా - ఈశ్వరుడు దేహధారణకు మునుముందే ఉన్నట్టివాడు. దేహధారణమునకు ఆవల - ఈవల ఎరిగినవాడు. దేహముయొక్క పుట్టుక - వృద్ధి - హాని - తిరోభావము - అనుగ్రహము (Birth, Growth, Decay, Withdrawal ) and according అను పంచకృత్యములను నిర్వర్తిస్తూఉంటాడు. సర్వమునకు ఈశ్వరత్వము (All pervading) వహించి ఉంటున్నట్టివాడు.
➤ ఈశ్వరుడే సమస్త భావములకు యజమాని. అంతటా విస్తరించి ఉన్నవాడు. ‘‘సర్వేశ్వరుడు’’
➤ ‘జీవుడు’ అనబడు పశువుకు పతి. నియామకుడు.

జీవుడు(పశువు) = సందర్భ పరిమిత పురుషకారము యొక్క సంజ్ఞ.

ఈశ్వరుడు (పశుపతి) = ఆయా వివిధ పురుషకారములు తనవై, తాను వేరై, వాటికి తాను యజమాని - పశుపతి.
(The person whose personality is differently appearing in different contexts while he himself is always “as he is”)

పైప్పలాదుడు : ‘పశువు’ అనగా ఎవ్వరు? మరొక్కసారి వివరించండి. కే పశవః?

జాబాలి మహర్షి : మరల చెప్పుచున్నాను. వినండి. ‘‘నేను దేహమునకు, ఇంద్రియములకు, ఇంద్రియ విషయములకు బద్ధుడను’’ అని తలచినప్పుడు, ఈ ‘‘జీవుడు’’ పశువుగా చెప్పబడుచున్నాడు. ఈ ‘జీవుడు’ ఆత్మయొక్క వ్యక్తిరూప నియామకమే. అట్టి ‘ఆత్మ’యే సమస్తము నియమించుచున్న ‘పశుపతి’.

పైప్పలాదుడు : ఈ జీవుడు, పశువు, పశుపతి కూడానా? ఆశ్చర్యం! జీవుడు ‘పశువు’ ఎట్లా అవుతాడు. అట్టి జీవునికి ఆతడే పతి ఏవిధంగా? ఇంకా కొంత వివరించి చెప్పండి.

జాబాలి మహర్షి :

ఈ జీవుడు :-
★ యథాతృణాసినో → ‘ఇంద్రియ విషయములు’ అనే గడ్డిపరకలను (శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములను) ఆసాదిస్తూ - ‘నేను ఇంతవరకే’ అను భావన కలిగి ఉంటూ ఉన్నాడు.
★ వివేకహీనః → జాగ్రత్-స్వప్న - సుషుప్తులకు కేవలసాక్షి అగు తన ఆత్మయొక్క ఔన్నత్యమును ఎరుగక, ఏమరచి, అవివేకి అయి ఇంద్రియ జగత్తులో సంచారములు చేస్తున్నాడు.
★ జ్ఞాన విహీనః - ఆత్మజ్ఞాన విహీనుడై ఇంద్రియములకు తారసబడేదే ‘సత్యము’ అను భావనలలో మునిగి తేలుచున్నాడు.
★ కృషి ఆది కర్మసు → ‘‘ఏదో చేయాలి। చూడాలి। వినాలి। స్పర్శించాలి। వేచిచూడాలి।’’ అని రంధితో ‘కృషి’ అనే వ్యసనమును వదలలేనివాడై, రజోగుణాత్మకుడై కాలము గడుపుచున్నాడు.
★ సకల దుఃఖ సహాః → ‘‘నేను దుఃఖిని. పాపిని. అల్పుడను. స్వల్పుడను. బద్ధుడను. గుణహీనుడను. బలహీనుడను’’ …ఇటువంటి అనేక దుఃఖ- అల్ప స్వకీయ భావనలతో, అవగాహనలతో కూడుకొన్నవాడై - ఉంటున్నాడు.
★ స్వ-స్వామి బధ్యమానాః → వీరికి నేను యజమానిని. వారు నాకు యజమానులు. వీరు నేననుకున్నట్లుగా ఉండరు. బాధగా ఉంటోంది. వారు నాకు యజమాని. కర్మకొద్దీ నేను వారి యాజమాన్యములో ఉండిపోకతప్పదు… → ఇత్యాది స్వ-స్వామి సంబంధములచే బద్ధుడగుచున్నాడు.

ఇవన్నీ పశు లక్షణములే। సందర్భ సత్యములలో తనను గమనించుకొనుచు, స్వకీయ-స్వాభావికమగు సహజ తత్త్వమును ఏమరచి ఉండుటచే (తాను అప్రమేయమగు ఆత్మగా గమనించకపోవటం చేత) - ఈ జీవుడు ‘పశువు’….అని అభివర్ణించబడుచున్నాడు.

ఈశ్వరుడు :-
ఏవిధంగా అయితే - పశువుయొక్క యజమాని పశువును
→ ఎట్లా కట్టి ఉంచాలి?
→ ఎప్పుడు మేత వేయాలి?
→ ఎప్పుడు పొలములో పనిచేయించాలి?
→ ఏ విధంగా బండి లాగించాలి?
…. మొదలైనవన్నీ ఎరిగి, పశువును ఉపయోగించటము ఎరిగి ఉంటాడో,….

అట్లానే,
- ఈశ్వరుడు సర్వజ్ఞుడై ఇంద్రియములను ఉపకరణముగా ఉపయోగించువాడై, నిత్యనిర్మలుడై - దేహములకు, ఇంద్రియములకు, ఇంద్రియ విషయములకు - పరిమితుడు కానివాడై ఉంటాడు.
- ‘‘ఇంద్రియములు, ఇంద్రియ విషయములు, వాటి ఆస్వాదకుడు - ఈ మూడు నాయొక్క యాజమాన్యములోనివి’’ - అని గ్రహించి ఉంటాడు.

‘‘ఈ దేహము, ఇంద్రియములు, దృశ్య విషయములు నాకొరకై నేను నియమించుకొనుచు, మరొకప్పుడు ఉపశమింపజేయుచున్న - ‘‘యజ్ఞ పరికరములు’’ వంటివి మాత్రమే’’ - అను స్వాభావికమైన ఎరుక, ఆస్వాదనలు ఈశ్వర లక్షణము.

⌘⌘⌘

పైప్పలాదుడు : స్వామీ! మేము పశుత్వమును అధిగమించి పశుపతిత్వము (లేక) శివత్వము సంతరించుకునేది ఏవిధంగా? పరతత్త్వజ్ఞానము సంపాదించటము, అఖండాత్మకు సంబంధించిన కేవలానుభవులమై ఉండుటము ఎట్లా? తత్త్వ జ్ఞానసిద్ధి కొరకై మేము ఏ ఉపాయమును ఆశ్రయించాలి? తత్ జ్ఞానం కేన ఉపాయేన జాయతే? దేహవ్యవహార పరిమితత్వముచే ఆవు మొదలైన జంతువులవలె పశుప్రాయులమై, ఇంద్రియ విషయానుభవబద్ధులమై యున్న మేము పశుపతిని ఆశ్రయించి, ‘శివోఽహమ్’ స్థానము సిద్ధించుకోవటము ఎట్లా? ‘‘అహమ్ పశుపతిః। న (ఇంద్రియ) పశుః। న ఇంద్రియ దాసః’’ - అనునది ఎట్లా సముపార్జించుకోవాలి?

జాబాలి మహర్షి : ‘‘ఈ జీవాత్మత్వ, ఇంద్రియాత్మత్వ, జగదాత్మత్వములు నాయొక్క ఈశ్వరాత్మ లేక శివతత్త్వము (శివోఽహమ్) యొక్క ధారణా - అలంకారము’’ - అనునదే ‘‘త్రిపూండ్రధారణా, భస్మవిభూతిధారణా’’ యోగము. అట్టి ధారణచే ‘‘కేవల ఈశ్వరత్వ భావనాయోగము’’ సిద్ధించగలదు. అట్టి ‘‘భస్మవిభూతి ధారణావ్రతము’’ మహనీయులచే సూచించబడియున్నది. యథాతత్ స్వామిన ఇవ ‘‘సర్వజ్ఞ ఈశః పశుపతిః విభూతి ధారణోపాయేన’’ జాయతే। ఈశ్వరత్వ సంబంధమైన అట్టి విభూతి ధారణవ్రతము ‘శాంభవీ వ్రతము’ అని కూడా శివప్రోక్తమై యున్నది.

పైప్పలాదుడు : అట్టి ‘‘భస్మవిభూతి ధారణావ్రతము’’ (లేక) ‘‘శాంభవీవ్రతము’’, (లేక) త్రిపుండధారణవ్రతము యొక్క విధానము ఎట్టిది? వాటియొక్క మహిమ, అంతరార్థములగురించి కూడా దయతో వివరించండి. అట్టి విభూతిధారణ సందర్భములో పరబ్రహ్మముయొక్క జగత్ ధారణాతత్త్వార్థమును ఉటంకించుచున్న అభిమంత్రణ శ్లోకములు కూడా కరుణతో వివరించండి.

జాబాలి మహర్షి : ‘‘పంచబ్రహ్మ మంత్రములు’’ - అందుకొరకై తత్త్వవేత్తలచే గానముగా అందించబడ్డాయి. అంతరార్థ - అవగాహనపూర్వకంగా బుద్ధి-మనో-వాక్కులు ఏకం చేస్తూ వాటిని పఠించాలి. పఠిస్తూ’’ ‘‘త్రిరేఖా భస్మవిభూతిధారణ’’ను నిర్వర్తించటము ఉత్తమ ప్రయోజన ప్రసాదితంగా పూజ్యులు, తత్త్వదర్శులు అగు సద్గురువులచే సూచించబడుతోంది. అట్టి విభూతిధారణ ప్రకారము ఏమిటో, ఎక్కడెక్కడ విభూతిని ధరించాలో ఆయా విశేషాలు వినండి.

పంచబ్రహ్మ మంత్రములు

‘‘సద్యోజాత।। అగ్నిరితి భస్మ ।। మానస్తోక ।। త్రాయుషమ్।। త్ర్యంబకం।।’’

(1) ఓం।। సద్యోజాతం ప్రపద్యామి। సద్యోజాతాయవై నమో నమః।
భవే భవేన అతిభవే భవస్వమామ్। భవోద్భవాయ నమః (భవ ఉద్భవాయ నమః)

‘‘సద్యోజాతుని స్తుతిస్తున్నాను. నమో నమః। నన్ను జన - మరణ - పునఃజన్మల అవస్థ నుండి దాటించి, ‘అమృతత్వము’నకు జేర్చండి. దేహ-దేహాంతర స్థితులకు మూలకారకుడగు భవోద్భవునికి నమస్కారము’’.

ఈ విశ్వముయొక్క జనన స్థానము ‘సత్’యే అట్టి ‘‘సత్’’ అను (జ్యోతి) స్వరూపమును స్తుతించుచున్నాను. ‘సత్’ నుండి ఏది దృశ్యజగత్తురూపంగా బయల్వెడలుచూ కూడా. ‘సత్’యే అయి ఉన్నదో, అట్టి జగత్ కల్పనా చమత్కారమునకు కూడా నమస్కారము.

‘‘ఉనికికే ఉనికి’’ అయినట్టి అతిభావమగు కేవలాత్మ నాకు అనునిత్యానుభవమై సిద్ధించునుగాక। నాపట్ల ప్రకటితమై వెల్లివిరుయునుగాక.

భవము (కేవలమగు ఆత్మసత్తాకు) భవ - ఉద్భవ రూపమగు లీలా - క్రీడా వినోదమే ఈ జగత్తు. "ఉద్భవమగు మాయా జగత్తుకు (భవ - ఉద్భవములకు) నమస్కరించుచున్నాను’’ - అని భస్మమునకు నమస్కరించెదరు గాక।

(2) ఓం।। అగ్నిరితి భస్మ। వాయురితి భస్మ। జలమితి భస్మ। వ్యోమేతి భస్మ।
దేవా భస్మ। ఋషయో భస్మ। సర్వగ్ం హవా ఏతత్ ఇదం భస్మీభూతం పావనం నమామి।।

జ్యోతిస్వరూపమగు ‘కేవలాత్మ’ నుండియే పంచభూతములు బయల్వెడలి తిరిగి జ్యోతిస్వరూపసారమందు లయమును పొందుచున్నాయి. ఇదంతా పరమాత్మయొక్క ప్రజ్ఞా ప్రదర్శనమే. తిరిగి సమస్తము ప్రజ్ఞయందు భస్మమై నిర్విషయమగుచున్నది.

అందుచేత - అగ్ని, జలము, ఆకాశము - ఇవన్నీ భస్మమే సహజరూపముగా కలిగి ఉన్నాయి. దేవతలు కూడా ఆత్మ భగవానుని విభూతి అలంకారమే. ఆత్మ చితా భస్మ - విభూతి స్వరూపులే. ఋషులు కూడా ఆత్మ భస్మ (నిర్విషయ) స్వరూపులే।

పరమాత్మయొక్క భస్మ - విభూతులే సమస్తము కూడా! అందుచేత సమస్తము పవిత్రమగు భస్మమే. అట్టి భస్మమునకు అంతర్ - హృదయ పవిత్రత కొరకై నమస్కారము.

ఈ మంత్రములతో విభూతిని భావనాపూర్వకంగా అభిమంత్రిస్తూ అరచేతిలోకి తీసుకోవాలి.

(3) ఓం।। మాన స్తోకే తనయే। మాన ఆయుషి। మానో గోషు। మానో అశ్వేషుః। ఈరిషః
వీరాన్ మానో। రుద్రభూమితో అవధీః హవిష్మంతో నమసా విధేమతే।।

హే రుద్ర భగవాన్। మా సంతానమును రక్షించండి. మాకు పవిత్ర కార్యక్రమములతో కూడిన ఆయుష్షును ప్రసాదించండి. మా గోవులకు గుర్రములకు, మాలోని కార్యక్రమ సమర్థులగు వీరులకు రక్షకులై ఉండండి.

ఓ రుద్రభూమిపై సంచరించు స్వామీ। మమ్ము బుద్ధిమంతులుగా తీర్చిదిద్దండి. మేము సమర్పించు హవిస్సులను, నమస్కారములను, విధేయతలను స్వీకరించండి. మమ్ములను కాపాడండి.

పై రెండు మంత్రములతో భస్మవిభూతిని జలముతో తడపాలి.

(4) ఓం।। త్రి-ఆయుషమ్ జమదగ్నే। కశ్యపస్య త్రి-ఆయుషమ్।

జమదగ్ని మహర్షుల, కశ్యప ప్రజాపతుల కరుణా కటాక్ష వీక్షణచే మా జాగ్రత్-స్వప్న-సుషుప్తుల ఆయుష్షులు పవిత్రమగును గాక.


(5) ఓం।। త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్।
ఉద్వారుకమివ బంధనాత్ మృత్యోః ముక్షీయ మ అమృతాత్।।

(భూతాకాశ - చిత్తాకాశ - చిదాకాశ) త్రి ఆకాశస్వరూపుడు, సుగంధములను వెదజల్లువాడు, పరిపుష్టిని వృద్ధి చేయువాడు అగు రుద్రుని ఆరాధిస్తున్నాము. దోసపండును తొడిమనుండి వేరుచేయనంత సులభంగా, సుకుమారంగా మమ్ములను ‘మృత్యువు’ నుండి వేరుచేయండి. అమృతత్వమును సిద్ధింపజేయండి।

ఈ విధంగా భస్మమును నీటితో సంప్రోక్షించి, ఆ విభూతిని ‘‘ఈ సమస్తము - కేవలాత్మ - అంతరాత్మ - పరమాత్మ స్వరూపుడనగు నాకు విభూతి రూప అలంకారములే’’….. అను మననమును నిర్వర్తిస్తూ చూపుడువ్రేలు - మధ్యవ్రేలు - అనామిక వ్రేలు’’లతో మూడు మూడు రేఖలను →
శిరో - శిరస్సుపై నుదురు ఉపరిగాను (లేక), లలాట - లలాటము (Foreface) పై
స్కంధేషు - భుజముల ఉపరిభాగముపై
‘‘త్రీ ఆయుషైః। త్ర్యంబకైః। త్రిస్రో రేఖా।’’ (త్రికాలములను, త్రి ఆకాశములను, త్రిరేఖలుగా) అని పలుకుచు పరమాత్మను మననం చేస్తూ ధారణ చేయాలి.

ఇట్టి ‘ఆత్మాఽహమ్’- ఇదమ్ మమ భస్మ విభూతిః భావనా పూర్వకంగా తాను అలంకరించుకొన్న త్రిరేఖావిభూతి ధారణ ఒక దైనందికమైన వ్రతముగా ఆచరించబడు గాక। దీనిని ‘శాంభవీ వ్రతము’ అని, ‘శైవ వ్రతము’ అని కూడా అంటారు.

సర్వేవేదేషు : తెలియబడేదంతా భస్మవిభూతిగా మనస్సుతో ధారణ చేయుచూ ఉండుటచే సమస్తము ఆత్మభావానాయుక్తముగా అగుచున్నది.

ఈ విధమైన సమాచరణ కలిగిన ముముక్షువు - న పునః భవాయ। జన్మ - కర్మలకు ఆవలగల శాశ్వతానందరూపమునే అనుక్షణికంగా, స్వాభావికంగా ఆస్వాదిస్తూ ఉంటాడు. అంతేగాని, ‘‘దృశ్యమునందు కనిపించే జీవాత్మత్వము యొక్క పరిధికి బద్ధుడను. జన్మకర్మలచే పరిమితుడను. సంకుచితుడను’’-అనే కల్పనకు ఇక చోటు ఇవ్వడు.

త్రిపుండ్ర ధారణ, త్రిరేరేఖా ధారణ లలాటమంతా కనుకొలకు చివరివరకు, భ్రూమధ్యస్థానమును కలుపుతూ అలంకరించుకోవాలి.

ఓ పైప్పలాదా! అట్టి త్రిరేఖలకు అంతరార్థము బ్రహ్మ మానసపుత్రులగు అస్మత్ గురుదేవులు శ్రీసనత్కుమారులవారు సవివరంగా చెప్పియున్న వాక్యములను ఇప్పుడు మీకు చెప్పుచున్నాను. వినండి.

భస్మవిభూతిని ‘3’ రేఖలుగా ధారణ చేయటము ‘‘త్రిపుండ్రధారణము’’ అని అంటారు. అట్టి త్రిపుండ్రధారణ నుదుటిపై ఈ చివరనుండి ఆ చివరవరకు కనులచివ్వరగా విస్తరింపజేస్తూ ధారణ చేస్తారని అనుకున్నాం కదా! అట్టి ధారణలోని ‘3’ రేఖల అంతర్లీన ఉద్దేశ్యార్థము ఈ విధంగా చెప్పబడుతోంది.

సంజ్ఞార్థములు

జాబాలి-ఉపనిషత్-త్రిపుండ్ర-ధారణ

ప్రథమరేఖ →
యజ్ఞవిధులలోని గార్హపత్యాగ్ని.
త్ర్యక్షర ‘ఓం’ కారములో ‘అ’కారము (కేవలము). మొదటి వ్యాహృతి.
త్రిగుణములలో రజోగుణము
త్రిలోకములలో భూర్లోలోకము (Zone of Matter)
స్వాత్మ-అంతరాత్మ-పరమాత్మలలో స్వాత్మ (బాహ్య జగత్ సంబంధమైన ‘నేను’)
క్రియ - ఇచ్ఛా - జ్ఞానములలో క్రియాశక్తి.
ఋక్ - యజుర్ - సామవేదములలో ఋగ్వేద ఋక్కులు. ఋత్ (పరమ సత్య ప్రవచనం)
దినములో ప్రాతఃకాల ఉపాసన (ప్రాతఃసవనము) - ఉదయము చేయు ఉపాసన (The Morning Prayer)
దేవత ప్రజాపతి। సృష్టికర్త అగు బ్రహ్మదేవులవారు.

ద్వితీయ రేఖ →
యజ్ఞవిధులలో దక్షిణాగ్ని
‘ఓం’కార త్ర్యక్షరములలో - ‘ఉ’కారము (ప్రకృతి / అనుభవము / స్వభావము)
త్రిగుణములలో - సత్వగుణము
త్రిలోకములలో - అంతరిక్ష లోకము / భువర్లోకము (Zone of thought and feelings)
త్రి ఆత్మలలో - అంతరాత్మ (అంతరంగ సంబంధమైన ‘నేను’)
క్రియ - ఇచ్ఛా - జ్ఞానములలో- ఇచ్ఛాశక్తి
వేదములలో - రెండవదగు యజుర్వేదము
దినములో - మధ్యాహ్న సమయము మధ్యాహ్నోపాసన
దేవత - విష్ణు భగవానుడు.

తృతీయ రేఖ →
యజ్ఞవిధులలో - అహవనీయాగ్ని
ప్రణవము (ఓం)లో- మూడవదగు ‘మ’ కారము. మూడవ వ్యాహృతి. వష్ఠి-అహంకారము.
త్రిగుణములలో - తమోగుణము
త్రిలోకములలో - ద్యు(ద్యౌ)లోకము. అశరీర సృష్ట్యభిమానులగు దేవతలు నివసించులోకము. దివ్యలోకము (Zone of Diversity)
స్వాత్మ - అంతరాత్మ - పరమాత్మలలో- పరమాత్మ
క్రియా-ఇచ్ఛా-జ్ఞానశక్తులలో - జ్ఞానశక్తి
త్రైవిద్య/త్రై వేదములలో - సామవేదము
తృతీయసవనం - సాయంకాలము / రాత్రి - ఉపాసనలు
అధి దేవుడు - మహాదేవుడు

త్రివిభూతిరేఖాధారణ చేస్తూ, ‘నేను అఖండము, నిత్యము, సత్యము, అప్రమేయము అగు ఆత్మను’ అను భావనతో త్రిరేఖలను పైవిధమైన భావనను అనునిత్యంగా పరిపోషించుకుంటూ - ఈ జగత్తునందు చరిస్తూ ఉండటమే - విభూతి యోగము. శాంభవీ విద్య. శాంభవీ వ్రతము. శైవీ వ్రతము. శివ వ్రతము.

అంతరార్థములు

→ భస్మవిభూతిధారణ। భస్మభూషితాంగ శివత్వము।
→ శాంభవీ విద్య।
→ అన్యముగా కనిపించేదంతా అఖండ - అప్రమేయ స్వస్వరూపాలంకారముగా (అనన్యముగా) దర్శించు ఆత్మవిద్య.
→ అనన్యుడై అన్యమును ఆస్వాదించు భౌమా విద్య.

ఈఈ అర్థములను ఉపాసిస్తూ త్రిపుండ్ర భస్మధారణ నిర్వర్తించువాడు ధన్యుడు. అట్టివాడు వేద విద్యా విద్వాంసుడు అయినా, అవకపోయినా - వేద హృదయమును ఎరిగినవాడు అగుచున్నాడు. ఆతడు బ్రహ్మచారి, గృహస్త, వానప్రస్థ, సన్న్యాస - ఇత్యాది ఏ ఆశ్రమములో ఉన్నప్పటికీ కూడా, - తాను కేవలాత్మ స్వరూపుడై ఈ జీవాత్మ - జగదనుభవ - జాగ్రత్ స్వప్న సుషుప్తులను తనకు త్రిపుండ్రాలంకారముగా ధరించువాడగుచున్నాడు. ఈ దృశ్యజగత్తును తన ఆభరణములవలె కలిగి ఉంటున్నాడు.

అట్టి భస్మ విభూతి ధారణాభ్యాసి →
⌘ సమస్త మహాపాతక - ఉప పాతకములనుండి పునీతుడు అగుచున్నాడు.
⌘ చతుర్వేదముల అంతరార్థమును అధ్యయనము చేసినవానితో సమానుడు.
⌘ సర్వదేవతలను ధ్యానించినవాడగుచున్నాడు.
⌘ సర్వ పుణ్యతీర్థములలో స్నానము చేసిన మానసిక పవిత్రత ప్రాప్తించగలదు.
⌘ సకల రుద్రమంత్రములు జపించిన ఫలితము పొందుచున్నాడు.

అట్టివానికి జన్మ - జన్మాంతర - పునర్జన్మ దోషములతో కూడిన పునరావృత్తి దోషము స్పృశించజాలదు. ‘‘నేను దేహముతో పుట్టువాడను. దేహముతో చచ్చువాడను’’ - అనే భ్రమ తొలగుతుంది.

న స పునరావర్తతే।
న స పునరావర్తత - ఇతి। ఓం।

అతడు తనయొక్క కేవలాత్మక స్వయంప్రకాశక స్వభావమునుండి చ్యుతి పొందడు. క్రిందికి దిగడు.



🙏 ఇతి జాబాల పైప్పలాద సంవాద రూపక జాబాలి ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।