[[@YHRK]] [[@Spiritual]]

Kēna Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


సామవేదాంతర్గత

3     కేనోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


కేన = దేనియొక్క / ఎవరియొక్క
ఈషితమ్ = ఇష్టము, ప్రేమ, కోరిక, వేగము, ఉత్సాహముచే ఇదంతా ప్రదర్శనమౌతోందో
ఉపనిషత్ : అద్దాని సామీప్యంగా సుఖాసనము.

ఇక్కడి సృష్టి, స్థితి, లయము, జన్మ, కర్మ, బంధము, మోక్షము, సుఖము, దుఃఖము, లోక సంచారములు, సంసారములు, విముక్తి మొదలగునవి - ఇవన్నీ కూడా ఎవరి ఇష్టం చేత ఏర్పడుచున్నాయి? స్వస్వరూపుడగు ఆత్మభగవానుని ఇష్టము, వినోదము, క్రీడ, లీలానందము, బాలానందము చేతనే।

శాంతి పాఠమ → (నౌ ఉభయః గురు - శిష్యే)
ఓం।।సహనావవతు (నౌ అవతు)।
సహ నౌ భునక్తు।
సహ వీర్యం కరవావహై।
తేజస్వినావధీతమస్తు।
(తేజస్వి నౌ అధీతమ్ అస్తు)
మా విద్విషావహై।

ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।
ఆ పరతత్త్వము… (గురు-శిష్యులుగా) మన ఇద్దరిని రక్షించునుగాక!
మన ఇద్దరిని పరిపోషించునుగాక!
మనిద్దరము వీర్య - ఉద్యమ - సముత్సాహవంతులమై పరిశ్రమించెదముగాక!
మన స్వాధ్యాయము - అధ్యయనము తేజోవంతముగా విరాజిల్లునుగాక!
మనము పరస్పరము (‘‘శిష్యునికి వినటం చేతకాదు’’- అని), ‘‘గురువుకు చెప్పటం చేతకాదు’’- అని - ఇత్యాది భావాలతో) ద్వేషించుకొనకుండెదము గాక। ఒకరిపై ఒకరము ఆత్మభావన కలిగి ఉండెదము గాక।

ఓం। మనయొక్క
(ఆధ్యాత్మిక → శారీరకమైన
అధిదైవిక→ అశరీర-అరూప ప్రకృతికి ప్రజ్ఞలగు దేవతా చర్యల సంబంధమైన
అధిభౌతిక → నామరూపాత్మక ప్రకృతి సంబంధమైన
భావనలన్నీ → భావాతీతమగు ఆత్మయందు శాంతించినవై ఉండునుగాక!

ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుః
శ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి .
సర్వం బ్రహ్మౌపనిషదం
మాఽహం బ్రహ్మ నిరాకుర్యాం మా మా బ్రహ్మ
నిరాకరోదనిరాకరణమస్త్వనిరాకరణం మేఽస్తు .
తదాత్మని నిరతే య
ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు .
ఓం శాంతిః శాంతిః శాంతిః ..
ఓం
అప్యాయన్తు మమాంగాని,
వాక్ - ప్రాణః - చక్షుః - శ్రోతమ్
అథో బలమ్ - ఇంద్రియాణి చ సర్వాణి।
సర్వం బ్రహ్మ ఉపనిషదం।
మ అహం బ్రహ్మ నిరాకుర్యాం।
మా మా బ్రహ్మ నిరాకరోత్ (అస్తు)।
అనిరాకరణమస్తు। అనిరాకరణం మే అస్తు।
తత్ ఆత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః
తే మయి సన్తు। తే మయి సన్తు।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।
ఓంకార రూపమగు బ్రాహ్మీభావనచే ఆప్యాయముగా - నా అంగములు ప్రత్యుత్సాహమగు గాక! ఈ నా మాట-ప్రాణములు - చూపు - వినికిడి శక్తి - సర్వ ఇంద్రియములు బ్రహ్మతత్త్వముయొక్క అధ్యయమునకై సంసిద్ధము అగునుగాక!
అవన్నీ ఉపనిషత్తులచే ప్రబోధించబడుచున్న బ్రహ్మమును గ్రహించుటకు సహకారికమగునుగాక! నేను బ్రహ్మముపట్ల అనిరాకరణుడనై ఉండెదను గాక! బ్రహ్మము నాపట్ల అనిరాకరణమై ఉండును గాక! నా పట్ల బ్రహ్మము అనిరాకరణమే అగును గాక!
ఆత్మశాస్త్రమునందు శ్రద్ధగల నాయందు నా పట్ల ఉపనిషత్తులచే ప్రబోధించబడుచున్న ఆ ఆత్మతత్త్వ ధర్మము ప్రసిద్ధముగా రూపుదిద్దుకొనునుగాక!
ఓం శాంతిః।శాంతిః। శాంతిః।।

ప్రథమ ఖండము


ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః
కేన ప్రాణః ప్రథమః ప్రైతి యుక్తః .
కేనేషితాం వాచమిమాం వదంతి
చక్షుః శ్రోత్రం క ఉ దేవో యునక్తి .. 1..
(శిష్య ప్రశ్న :- )
1.) ఓం। కేన ఈషితం
పతతి, ప్రేషితం మనః?
కేన ప్రాణః ప్రథమః
ప్రైతి యుక్తః?
కేన ఈషితాం
వాచమ్ ఇమాం వదన్తి?
చక్షుః శ్రోతం క ఉ దేవో యునక్తి?
కేన = దేనియొక్క; ఈషితమ్ = ప్రేమ, ఇష్టము, కోరిక, వేగము - ఇచ్ఛ చేత…. ఈ మనస్సు ప్రేరేపింపబడినదై, ఆయా విషయములవైపుగా పంపబడినదై (విషయములలో) పతితమవుతోంది? వ్రాలుచున్నది? పడుచున్నది?

ఎవనిచేత యుక్తమై-(నియోగించబడినదై) ముఖ్యము - ప్రథమము అగు ప్రాణ శక్తి ఈ దేహమునందు, విశ్వమునందు కూడా - సంచారములు సలుపుచున్నది? ఆయా సమస్త వ్యవహారములు నిర్వర్తిస్తోంది?

దేనియొక్క ఇచ్ఛానుసారంగా నోరు వాక్యాలు పలుకుతోంది? ఈ కళ్ళు - చెవులు ఏ దివ్యతత్త్వము సహాయంచేత చూస్తున్నాయి? వింటున్నాయి? శక్తి చెవులదా? కళ్ళదా? ప్రాణములదా? మనస్సుదా? జీవునిదా? దృశ్యజగత్తుదా? మరింకెవరిదన్నానా?

శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్
వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణః .
చక్షుషశ్చక్షురతిముచ్య ధీరాః
ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి .. 2..
2.) (ఆచార్య ప్రవచనము:)
శ్రోతస్య శ్రోత్రం,
మనసో మనో యత్,
వాచో హ వాచమ్,
స ఉ ప్రాణస్య ప్రాణః,
చక్షుషః చక్షుః,
అతిముచ్య ధీరాః -
ప్రేత్య అస్మాత్ లోకాత్
అమృతా భవన్తి।।
యత్-ఏదైతే…. చెవికే చెవి అయి ఉన్నదో…. (వినటమును వినుచున్నట్టిదో),
మనస్సు-ఆలోచనకే ఆలోచన అయి ఉంటోందో…. (ఆలోచన తనదైనది),
వాక్కుకే వాక్‌స్వరూపమై చెన్నొందుతోందో…(మాటలు తనవైనవి)
ప్రాణములకే ప్రాణేశ్వరుడు అయి ఉన్నాడో… (ప్రాణశక్తి తనదైనది)
(చూపులను చూస్తూ) కళ్ళకే కళ్ళు అయి ఉన్నదో…. (చూడటము తనదైనది) -
అది ‘‘ఆత్మ’’యే అయి ఉన్నది.

అట్టి ఆధారతత్త్వమగు ఆత్మనే దర్శిస్తూ ఉన్నట్టి సూక్ష్మబుద్ధి, ధీశక్తిగల ధీరులు - ఈ ఇంద్రియాలకు అనుభవమగుచున్న లోకములన్నీ దాటవేసినవారై, అధిగమించినవారై…., (దేహత్వమునుండి దేహిత్వము సంతరించుకొని)….అమృతస్వరూపము సంతరించుకొంటున్నారు.

న తత్ర చక్షుర్గచ్ఛతి న వాగ్గచ్ఛతి నో మనః .
న విద్మో న విజానీమో యథైతదనుశిష్యాత్ .. 3..
3.) న తత్ర చక్షుః గచ్ఛతి।
న వాక్ గచ్ఛతి।
నో మనః।
న విద్మో - న విజానీయో(మో)
యథా ఏతత్ అనుశిష్యాత్?

(ఎద్దానికైతే మనోవాక్ ప్రాణ తదితర ఇంద్రియములన్నీ ఉపకరణములో, మనస్సుకు మనస్సు - వాక్కుకు వాక్కు మొదలగునవి అయి ఉన్నదో…అట్టి చైతన్యాత్మ గురించి) అక్కడికి ఈ చూపు ప్రసరించలేదు. కళ్లు చూడలేవు. వాక్కు చెప్పలేదు.
ఈ మనస్సు కూడా అందుకోలేదు. పట్టుకోలేదు. బుద్ధి అద్దానిది. అందుచేత బుద్ధి కూడా నిర్ణయం చేయలేదు. అది తెలియబడేదేదీ కాదు. తెలుసుకొనుచున్నదే అది.
సర్వము ఎరుగుచున్నదాని గురించి, అద్దాని (ఎరుక యొక్క) కళావిశేషమైనట్టి ‘ఎరుగుట’ అను ఉపకరణముతో ఎరగటం ఎట్లా? శిష్యునికి చూపటం ఎట్లా?


అన్యదేవ తద్విదితాదథో అవిదితాదధి .
ఇతి శుశ్రుమ పూర్వేషాం యే నస్తద్వ్యాచచక్షిరే .. 4..
4.) అన్యత్ ఏవ తత్ విదితాత్
అథో అవిదితాత్ అధి।
ఇతి శుశ్రుమ పూర్వేషాం
యేనః తత్ వ్యాచచక్షిరే।।
సర్వకారణమైనట్టి ఆత్మ : తెలియబడే సర్వము కంటే ఆవల ఉన్నది. దృశ్యములోని సమస్తమునకు భిన్నమైనది! వేదాన్తమ్। తెలియబడేదానికి ఆవల సంస్థితమై ఉన్నది. అంతేకాదు. తెలియబడకపోవటానికి కూడా ఆవలయే అయ్యది! ‘తెలిసీ - తెలియనిదానికి కూడా తెలుసుకొనుచున్నదాని రూపంగా అతీతస్థానంలో ఉన్నట్టిది’ అని అద్దానిని తెలుసుకొని అనుభూతం చేసుకొన్నట్టి మహనీయులు, (ఆత్మజ్ఞులగు) పూర్వమహాశయులు ఇతఃపూర్వమే చెప్పగా మేము వింటూ వస్తున్నాము!

యద్వాచాఽనభ్యుదితం యేన వాగభ్యుద్యతే .
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదముపాసతే .. 5..
5.) యత్ వాచా అనభ్యుదితం,
యేన వాక్ అభ్యుద్యతే,
తత్ ఏవ ‘బ్రహ్మ’ త్వం విద్ధి।
న ఇదం, యత్ ఇదమ్ ఉపాసతే।।
(నేదం యదిదముపాసతే।)
అది (పరతత్త్వాత్మ) ఎట్టిదంటే…అది వాక్కు చేత (మాటలచే) ప్రకటించబడేది కాదు. ఎందుకంటే, వాక్కు అద్దానిచేతనే ప్రకటించబడుచున్నది. వాక్కు అద్దానియొక్క విన్యాసము.
వాక్కు ఎద్దానిదో - ….అది బ్రహ్మముగా నీచే తెలుసుకొనబడునుగాక! అంతేగాని,….
ఇక్కడ జగత్ దృశ్యములో ఏది వాడుకచే నామరూపాత్మకంగా (శబ్దీకరిస్తూ) ఉపాసిస్తూ ఉన్నామో, అది (ఆత్మతత్త్వము) కాదు. (ఆత్మయొక్క లీలా ప్రదర్శన మాత్రమే తదితరమైనదంతా).

యన్మనసా న మనుతే యేనాహుర్మనో మతం .
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదముపాసతే .. 6..
6.) యత్ మనసా న మనుతే,
యేన ఆహుః మనో మతమ్,
తత్ ఏవ ‘బ్రహ్మ’ త్వం విద్ధి।
న ఇదం యత్ ఇదమ్ ఉపాసతే!
ఏదైతే మనస్సుచే గ్రహించబడునదేదీ కాదో…,
దేని చేత మనస్సు తెలియబడుచున్నదో…
ఏది మనస్సును కూడా సాక్షిగా ఎరుగుచూ ఉన్నదో….
అది బ్రహ్మముగా నీవు తెలుసుకొనెదవుగాక!
అంతేగాని, ఇక్కడ మనస్సుకు తోచేది, మనస్సు ఉపాసిస్తున్నది అది కాదు. మనస్సును కూడా ఎరుగుచున్నట్టిది అది। ఆలోచనకు ఆవిర్భావ - తిరోభావస్థానమే అయ్యది. ఆలోచనలన్నీ తనదైనట్టిదే - బ్రహ్మము.

యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షూఀషి పశ్యతి .
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదముపాసతే .. 7..
7.) యత్ చక్షుసా న పశ్యతి
యేన చక్షూగ్ంషి పశ్యతి,
తదేవ (తత్ ఏవ) బ్రహ్మ త్వం విద్ధి।
న ఇదం యత్ ఇదమ్ ఉపాసతే।।
ఏదైతే కళ్ళకు కనిపించేది కాదో, …దేనిచేత కళ్ళు చూస్తూ ఉన్నాయో, ఏది కళ్ళను ఉపయోగించి చూస్తూ ఉన్నదో - అదియే బ్రహ్మముగా నీవు గమనించెదవు గాక! సందర్శించెదవుగాక! ఎరిగెదవుగాక।
అంతేగాని, కళ్ళకు కనబడేదేదీ పూర్ణబ్రహ్మము కాదు. కళ్ళతో చూస్తూ ఉపాసించుచున్నదేదీ - ఏ ఒక్కటీ అది కాదు. చూడటము ఎద్దాని కళయో అదీ ‘ఆత్మ’.

యచ్ఛ్రోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శ్రుతం .
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదముపాసతే .. 8..
8.) యత్ శ్రోత్రేణ న శ్రుణోతి,
యేన శోత్రమ్ ఇదం శ్రుతమ్,
తత్ ఏవ ‘బ్రహ్మ’ త్వం విద్ధి।
న ఇదమ్ యత్ ఇదమ్ ఉపాసతే।।
ఏదైతే చెవులచే వినబడుచున్నదేదీ కాదో…,
ఏది చెవుల ద్వారా వినుచున్నదో, ఏదైతే చెవులను ఉపయోగించు చున్నదో….అది ‘బ్రహ్మము’ అని నీవు గ్రహించు.
అంతేగాని…చెవులకు వినబడేదేదీ కాదు. చెవులతో విని ఉపాసించబడేదేదీ కూడా ….అది కాదు!

యత్ప్రాణేన న ప్రాణితి యేన ప్రాణః ప్రణీయతే .
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదముపాసతే .. 9..
9.) యత్ ప్రాణేన న ప్రాణితి,
యేన ప్రాణః ప్రణీయతే,
తత్ ఏవ ‘బ్రహ్మ’ త్వం విద్ధి।
న ఇదమ్ యత్ ఇదం
ఉపాసతే।।
ఏదైతే ప్రాణములచే (ప్రాణశక్తిచే) జీవింపజేయబడుతోందో, ప్రాణశక్తిచే కదల్చబడుతోందో,…అది బ్రహ్మముకాదు.
దేనిచేత ప్రాణములు ‘‘జీవన శక్తి - చలనశక్తి’’ ప్రదర్శించటం జరుగుతోందో, …. అదియే బ్రహ్మముగా నీచే తెలుసుకొనబడు గాక!
అంతేగాని, ఇక్కడ (ప్రాణములచే కదల్చబడేది) ఏదీ బ్రహ్మముయొక్క సమగ్రార్థము కాదు. ప్రాణముల రూపంగా ఉపాసించబడేదేదీ అది కాదు!

ద్వితీయ ఖండము


యది మన్యసే సువేదేతి దహరమేవాపి (దభ్రమేవాపి)
నూనం త్వం వేత్థ బ్రహ్మణో రూపం .
యదస్య త్వం యదస్య దేవేష్వథ ను
మీమాఀస్యమేవ తే మన్యే విదితం .. 1..
1.) యది మన్యసే ‘సువేద’ ఇతి,
దభ్రమ్ ఏవ అపి
నూనం త్వం వేత్థ
బ్రహ్మణో రూపమ్।
ఒకవేళ ‘‘బ్రహ్మముయొక్క రూపము నాకు బాగా తెలుసునులే!’’… అని అనుకుంటున్నట్లైతే, అప్పుడు నీవు కొంచమే తెలుసుకొన్నట్లు సుమా! నిశ్చయంగా నీవు బ్రహ్మముయొక్క రూపమును కొంతే గమనించినట్లు! ఏది ఈ సమస్తమును తెలుసుకుంటూ ఉన్నదో…అదియే ‘బ్రహ్మము’. సమస్తము తెలుసుకుంటూ ఉన్నది బ్రహ్మము. అంతేగాని అది జగత్తులో తెలియబడుచున్న ఏదో నామ-రూపాత్మకమైనది కాదు. అది తెలియబడేదేదీ కాదు. తెలుసుకుంటూ ఉన్నట్టిదే అది।
యదస్య త్వం, యదస్య చ దేవేషు
అథ ను మీమాంస్యమ్ ఏవ
తే మన్యే విదితమ్।।
- ఒక వేళ మనము ఏదైనా ఒక దేవతా రూపంగా ఆ బ్రహ్మమును భావిస్తామా? అప్పుడు మనము నీవు కొంతయే బ్రహ్మము గురించి ఎరుగుచున్నట్లు!
- మన ఆ ఇష్టదైవముయొక్క వాస్తవ రూపము ఏమిటో స్తుతిస్తూ విచారణ (మీమాంస) చేస్తున్నప్పుడో?…. మనము బ్రహ్మమును ఎరుగుచున్న మార్గములో ఉన్నట్లు!
‘‘ఆ మీమాంస చేయుచున్న నీవే బ్రహ్మము-తత్త్వమసి’’ - అనునదే సమగ్రము.

నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేద చ .
యో నస్తద్వేద తద్వేద నో న వేదేతి వేద చ .. 2..
2.) న అహమ్ మన్యే ‘సువేద’ ఇతి।
నో ‘న వేద’ ఇతి। వేద చ।
యో నః తత్ వేద
తత్ వేద నో,
న వేద ఇతి వేద చ।।
నేను ‘‘బ్రహ్మమును బాగుగా తెలుసుకున్నాను’’ …అని నేను అనుకోవటము లేదు. ‘‘తెలుసుకోవటము’’ ద్వారా తెలుసుకుంటున్న వానిని ఎట్లా తెలుసుకోగలం?
అట్లని ‘‘నాకు తెలియదు’’ అనునది కూడా అనను. నాకు అది తెలియక పోలేదు కూడా। అది మనందరికి తెలిసినదే। తెలియనిది కాదు। నాలోని ‘తెలుసుకుంటూ ఉన్న నేను’ - నాకు తెలియకపోవటమేమిటి? ‘‘నాకు బ్రహ్మము గురించి తెలియదు’’ అని పలికేవానిచే బ్రహ్మము తెలియ బడియే (తెలుసుకొనబడియే) ఉన్నది! తనకు తాను తెలుసు కదా!

యస్యామతం తస్య మతం మతం యస్య న వేద సః .
అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం .. 3..
3.) యస్య అమతం తస్య మతం।
మతం యస్య న వేద సః।
అవిజ్ఞాతం విజానతామ్।
విజ్ఞాతమ్ అవిజానతామ్।
(ఆ బ్రహ్మముయొక్క చమత్కారం వినండి!)
ఎవ్వనికి ‘బ్రహ్మము గురించి నాకు తెలియదు’ అని అనుకుంటున్నాడో, ఆతనికి బ్రహ్మము తెలిసియే(తెలియబడియే) ఉన్నది. ఎవ్వడు ‘బ్రహ్మము గురించి తెలుసును’’ అని అంటాడో, ఆతనికి తెలియబడకయే ఉన్నది.
తెలిసినవారికి అది తెలియనిది. (అది తెలుసుకుంటున్న వానికి అన్యము ఏమాత్రము కాదు కాబట్టి.)
తెలియనివారికి అది తెలిసినదే అయి ఉన్నది. (తానే అది కదా!).

ప్రతిబోధవిదితం మతమమృతత్వం హి విందతే .
ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతేఽమృతం .. 4..
4.) ప్రతిబోధ విదితమ్ మతమ్
అమృతత్వం హి విన్దతే।
ఆత్మనా విన్దతే వీర్యమ్
విద్యయా విన్దతే అమృతమ్।।
ఆత్మజ్ఞుడగు మహనీయునిచే (సద్గురువుచే) బోధించబడుచుండగా బ్రహ్మము తెలియబడగలదనునది నిస్సందేహము.
అట్టి ఆత్మస్వరూపముయొక్క ఎరుకకు సంబంధించిన స్ఫూర్తిచే నిశ్చయముగా అమృతత్వము పొందగలము.
ఆత్మభావనచే వీర్యము, స్థైర్యము పొందగలము! ‘‘దేహముచే పరిమితము కాము’’ - అని నిశ్చయము పొందగలము.
ఆత్మవిద్యచే ‘‘నేను దేహముయొక్క రాకపోకలకు సంబంధించినవాడిని కాను’’…అను అమృతత్వము సంతరించుకోగలము!

ఇహ చేదవేదీదథ సత్యమస్తి
న చేదిహావేదీన్మహతీ వినష్టిః .
భూతేషు భూతేషు విచిత్య ధీరాః
ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి .. 5..
5.) ఇహ చేత్ అవేదీత్ -
అథ ‘సత్యమ్’ అస్తి।
న చేత్ ఇహ అవేదీత్
మహతీ వినష్టిః।
ఇక్కడే ఇప్పుడే (ఈ దేహము ఉన్నప్పుడే) బ్రహ్మము గురించి (ఆత్మతత్త్వముగురించి) ఎరుగుచుండగా. ఆ తదనంతరము సత్యమునందు ప్రతిష్ఠితులము కాగలము.
ఒకవేళ - అశ్రద్ధ , దృశ్యావేశములను ఆశ్రయించి కాలము గడుపుతూ బ్రహ్మతత్త్వము తెలుసుకోకపోతేనో? (అసత్యములో ప్రయాణిస్తూ) గొప్ప నష్టము పొందుతాము.
భూతేషు భూతేషు విచింత్య ధీరాః।
ప్రేత్య అస్మాన్ లోకాత్
అమృతా భవన్తి।।
ధీరులగువారు సమస్త ప్రాణికోట్లలో ఆ బ్రహ్మమునే దర్శిస్తున్నారు.
కనుక (ఉత్తమ - సునిశితమైన - విస్తారమైన - సాత్వికమైన) బుద్ధితో ధీరులమై, ఈ లోక సంబంధమై (లౌకికమైన) ధ్యాసలను దాటివేసి అమృతత్త్వముతో సారూప్యము పొందెదము గాక!
‘‘ఈ సమస్తము సర్వదా సర్వత్రా బ్రహ్మమే అయి ఉన్నది’’ - అను ఎరుకచే మృత్యువుయొక్క పరిధులను దాటివేయుచున్నాము.

తృతీయ ఖండము


బ్రహ్మ హ దేవేభ్యో విజిగ్యే తస్య హ బ్రహ్మణో
విజయే దేవా అమహీయంత .. 1..
త ఐక్షంతాస్మాకమేవాయం విజయోఽస్మాకమేవాయం మహిమేతి .
1.) బ్రహ్మ హ దేవేభ్యో విజిగ్యే,
తస్య హ బ్రహ్మణో విజయే దేవా అమహీయన్త।
త ఐక్షన్త, ‘‘అస్మాకమ్ ఏవ
అయం విజయో।
అస్మాకమ్ ఏవ అయం మహిమ’’। ఇతి।।
పరబ్రహ్మముయొక్క కల్పనాచమత్కారంగా ఒకానొక సందర్భములో దేవతలకు, దానవులకు మధ్య గొప్ప సంగ్రామం (యుద్ధం) జరిగింది. అప్పుడు బ్రహ్మము దేవతల కొరకై జయమును ప్రసాదించటం జరిగింది. (ఒక నవలలో ఒకరు గెలిచి, మరొకరు ఓడిపోవుతీరుగా).
విధివశాత్ (పరమాత్మచే) అనుగ్రహించబడిన విజయమును చూచుకొని దేవతలు ఉప్పొంగిపోయారు!
వారు అనుకున్నారు కదా….,
‘‘ఆహా"! ఇదంతా మా విజయమే కదా! మేమే గెలిచాము। వీర్యవంతులము కాబట్టి గెలిచాము. కనుక ఇదంతా మా మహిమ. మా సామర్థ్యము కాక, మరింకేమిటి?’’ అట్టి భావనతో గర్వించసాగారు.

తద్ధైషాం విజజ్ఞౌ తేభ్యో హ ప్రాదుర్బభూవ తన్న వ్యజానత
కిమిదం యక్షమితి .. 2..
2.) తత్ హ ఏషామ్ విజజ్ఞే
తేభ్యో హ ప్రాదుః బభూవ।
తత్ న వ్యజానంత
‘‘కిమ్ ఇదమ్ యక్షమ్?’’ ఇతి।।
అప్పుడు వారియొక్క (ఆ దేవతలయొక్క) విజయ గర్వమును గమనించినదై పరతత్త్వము ఒకానొక భీకర రూపముతో వారికి అంతదూరంలో ఆవిర్భవించింది.
ఆ దేవతలకు ఆ భీకర రూపి ఎవ్వరో తెలియలేదు?
‘‘ఈ అద్భుతశక్తి అయిన యక్షరూపము ఎవ్వరిదై ఉంటుంది?’’ ఈతడు ఎవ్వరై ఉంటారు?’’…. అని చూడసాగారు. మీమాంస పడసాగారు.

తేఽగ్నిమబ్రువంజాతవేద ఏతద్విజానీహి
కిమిదం యక్షమితి తథేతి .. 3..
3.) తే అగ్నిమ్ అబ్రువన్,
‘‘జాతవేద! ఏతత్ విజానీ హి : -
కిమ్ ఏతత్ యక్షమ్? ఇతి।’’
(అగ్నిః అబ్రువన్) ‘‘తథ’’। ఇతి।।
ఆ దేవతలు అగ్నిదేవునితో :-
‘‘ఓ జాతవేదా! జనించినదంతా ఎరిగియున్న దేవా! ఈ యక్షరూపశక్తి ఏమిటి? తెలుసుకోండి!’’ అని అగ్నిదేవుని అడిగారు.
అగ్నిదేవుడు, ‘‘అలాగే! తప్పనిసరిగా!’’ అని పలికారు.

తదభ్యద్రవత్తమభ్యవదత్కోఽసీత్యగ్నిర్వా
అహమస్మీత్యబ్రవీజ్జాతవేదా వా అహమస్మీతి .. 4..
4.) తత్ అభ్య ద్రవత్! తమ్ అభ్యవదత్ -
‘‘కో అసి?’’ ఇతి।
‘‘అగ్నిర్వా అహమస్మి’’ ఇతి।
అబ్రవీత్ - :
‘‘జాతవేదా వా అహమ్ అస్మి’’ ఇతి।
అగ్నిదేవుడు ఆ భీకర -అద్భుత యక్షి శక్తి రూపిణి వద్దకు వెనువెంటనే వెళ్ళి ఎదురుగా నిలుచున్నారు.
ఆ యక్ష పురుషుడు, అగ్నిదేవుని చూచి, ‘‘ఎవరివయ్యా నీవు?’’ - అని ప్రశ్నించారు.?
అగ్ని : నేను అగ్నిదేవుడను. నన్ను ‘జాతవేదుడు’ అని కూడా పిలుస్తూ ఉంటారు జనించిన సమస్తము ఎరిగినవాడను.
అప్పుడు యక్షరూపి అడిగారు కదా….,

తస్మింస్త్వయి కిం వీర్యమిత్యపీదగ్ం సర్వం
దహేయం యదిదం పృథివ్యామితి .. 5..
5.) తస్మిన్ ‘‘త్వయి కిం వీర్యమ్?’’ ఇతి।।
(అగ్నిదేవో వాచ)
‘‘అపి ఇదగ్ం సర్వమ్
దహేయమ్ యత్ ఇదమ్ పృథివ్యామ్’’ ఇతి
యక్షశక్తి : అయ్యా! నీ శక్తి ఏమిటి? ఏరీతిగా వీర్యవంతుడవు?
అగ్నిదేవుడు : నేనా? ఈ భూమి మీద ఏదేదైనా సరే, ఎంతటిదైనా సరే,…అదంతా కూడా క్షణంలో నేను దహించి వేయగలను. పుట్టిన దేనినైనా వేదన కలిగించి భస్మము చేయగలను. జాతవేదుడను।

తస్మై తృణం నిదధావేతద్దహేతి .
తదుపప్రేయాయ సర్వజవేన తన్న శశాక దగ్ధుం స తత ఏవ
నివవృతే నైతదశకం విజ్ఞాతుం యదేతద్యక్షమితి .. 6..
6.) తస్మై తృణం నిదధావ - ఏతత్ దహేత।
తత్ ఉపప్రేయాయ సర్వజవేన।
తత్ న శశాక దగ్ధుమ్।
స తత ఏవ నివవృతే న ఏతత్
అశకం విజ్ఞాతుం యత్ ఏతత్
యక్షమ్। ఇతి।।

యక్షశక్తి : అవునా? అట్లాగా? ఏదీ! ఇది కాల్చు! చూద్దాం।
అని ఒక గడ్డిపోచ అగ్ని దేవునికి ఎదురుగా పడవేసింది!
అగ్నిదేవుడు ఆ గడ్డిపోచను సమీపించారు. తన సర్వశక్తిని ప్రయోగించి కూడా ఆ గడ్డిపరికను దగ్ధము చేయలేకపోయారు!
ఆయన అక్కడినుండి వెనుకకు మరలి దేవతలతో…
అగ్నిదేవుడు : ‘‘దేవతలారా! క్షమించండి. ఈ యక్షరూపము ఎవ్వరు, ఎట్టిది అనేది తెలుసుకోవటం నావల్ల కాలేదు’’… అని తెలిపారు.


అథ వాయుమబ్రువన్వాయవేతద్విజానీహి
కిమేతద్యక్షమితి తథేతి .. 7..
7.) అథ వాయుమ్ అబ్రువన్
‘‘వాయవ! ఏతత్
విజానీ హి కిమ్ ఏతత్
యక్షమ్?’’ ఇతి। ‘‘తథ’’। ఇతి।।
అప్పుడు వాయువుతో (దేవతలు) :-
‘‘ఓ వాయుదేవా! ఈ యక్షశక్తి ఏదై ఉన్నదో, ఎవ్వరి శక్తియో, పోనీ - మీరు తెలుసుకొనిరండి’’….అని పలుకగా…
వాయుదేవుడు ‘‘సరే! అట్లాగే తెలుసుకొనివస్తాను!’’ అన్నారు.

తదభ్యద్రవత్తమభ్యవదత్కోఽసీతి వాయుర్వా
అహమస్మీత్యబ్రవీన్మాతరిశ్వా వా అహమస్మీతి .. 8..
(వాయో)
8.) తత్ అభ్యద్రవత్।
(శక్తిః….)
తమ్ అభ్యవదత్ ‘‘కో అసి?’’ ఇతి।
‘‘వాయుర్వా అహమ్ అస్మి’’। ఇతి అబ్రవీత్ ః
మాతరిశ్వా వా అహమస్మి।’’ - ఇతి
వాయుదేవుడు ఆ యక్షశక్తి వద్దకు వెనువెంటనే పరుగు తీస్తూ వెళ్ళారు.
ఆ భీకర యక్షశక్తి ఇట్లా అడిగింది, ‘‘నీవెవ్వరివయ్యా బాబూ?’’
వాయుదేవుడు: ‘‘నేనా? (కనబడటంలేదా?)
వాయుదేవుడిని కదా! ఆకాశమంతా అన్నిచోట్లా సంచరించే వాడగుటచే ‘‘మాతరిశ్వుడు’’ అను బిరుదు కలవాడను.

తస్మిఀస్త్వయి కిం వీర్యమిత్యపీదఀ
సర్వమాదదీయ యదిదం పృథివ్యామితి .. 9..
9.) (యక్షిణి శక్తిః ఉవాచ)
‘‘తస్మిం త్వయి కిమ్ వీర్యమ్?’’ ఇతి।
(వాయుర్వాచ)
‘‘పీదం సర్వమ్ ఆదదీయ
యత్ ఇదమ్ పృథివ్యామ్’’ …ఇతి।।
యక్షశక్తి : అట్లాగా! ఏదీ నీ వీర్యశక్తి ఎటువంటిదో చెప్పు!
వాయుదేవుడు : నేను ఈ భూమిమీద ఏదేది ఉన్నదో, అదంతా కూడా పీల్చి వేయగలను. ఆకాశంలోకి విసిరివేయగలను. పర్వతములను కూడా పెకలించి, కావాలంటే, సముద్ర మధ్యలోకి విసరగలను.

తస్మై తృణం నిదధావేతదాదత్స్వేతి
తదుపప్రేయాయ సర్వజవేన తన్న శశాకాదాతుం స తత ఏవ
నివవృతే నైతదశకం విజ్ఞాతుం యదేతద్యక్షమితి .. 10..
10.) తస్మై తృణం నిదధావ
ఏతత్, ‘‘ఆదత్స్వ।’’ ఇతి।
తత్ ఉప ప్రేమాయ సర్వజవేన।
తత్ న శశాక ఆదాతుం।
స తత ఏవ నివవృతే
‘‘న ఏతత్ అశక్తం
విజ్ఞాతుం యత్ ఏతత్ యక్షమ్’’ ఇతి.
అప్పుడు ఆ అద్భుత యక్షశక్తి, ‘‘ఊ"హూ!’’ అంటూ ఒక గడ్డిపోచను ముందుంచి, ‘‘ఏదీ! దీనిని గాలిలోకి లేపు’’ అన్నది.
వాయుదేవుడు → ఆ గడ్డి పరకను సమీపించారు. తనయొక్క సర్వశక్తిని ఉపయోగించి కూడా కదల్చటానికి, గాలిలో లేపటానికి శక్తుడు కాలేకపోయాడు. వల్ల కానే లేదు.
ఆయన కూడా సిగ్గుపడుతూ మరలిపోయి దేవతలతో,….
‘‘ఆ యక్షశక్తి ఎవ్వరో - ఏమిటో నేను కూడా తెలుసుకోలేకపోయాను’’…. అని దేవతలకు చెప్పారు.

అథేంద్రమబ్రువన్మఘవన్నేతద్విజానీహి కిమేతద్యక్షమితి తథేతి
తదభ్యద్రవత్తస్మాత్తిరోదధే .. 11..
11.) అథ ఇంద్రమ్ (దేవతానామ్)
అబ్రువన్ :
‘‘మఘవన్! ఏతత్ విజానీహి
కిమ్ ఏతత్ యక్షమ్?’’ ఇతి। ‘‘తథ’’ - ఇతి।
తత్ అభ్యద్రవత్। తస్మాత్ తిరోదధే।।
అప్పుడు దేవతలు ఇంద్రుని ఈ విధంగా ప్రార్థించారు.
‘‘ఓ మఘవన్! మేఘ నియామకా! సర్వసంపదాధిపతీ! త్రిలోకపూజ్యుడవు, త్రిలోక సంపదాధిపతివికదా!
ఈ యక్షశక్తి ఏమై ఉన్నదో….మీరు తెలుసుకోండి’’ - అని
ఇంద్రుడు ‘‘అట్లాగే!’’ అంటూ వెంటనే బయలుదేరి ఆ యక్షశక్తి ఎదురుగా నిలిచారు. ‘‘ఎవ్వరై ఉంటారు?’’ అని కించిత్ ఆశ్చర్యంగా ఇంద్రుడు చూస్తూ ఉండగా, ఆ యక్షశక్తి అదృశ్యమైపోయింది.

స తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామ బహుశోభమానాముమాఀ
హైమవతీం తాఀహోవాచ కిమేతద్యక్షమితి .. 12..
12.) స తస్మిన్ ఏవ ఆకాశే స్త్రియమ్
ఆజగామ।
బహు శోభమానామ్,
ఉమామ్। హైమవతీమ్।
తాం హోవాచ :
‘‘కిమ్ ఏతత్ యక్షమ్?’’ ఇతి।।
ఇంద్రులవారు ‘‘ఏమిటిది?’’ అని అనుకుంటూ ఉండగా ఆకాశంలో ఒక స్త్రీ రూపం ప్రత్యక్షమై కనిపించింది.
ఆ తల్లి బహు శోభాయమానంగా - తేజోమయంగా - ధగధగ కాంతులతో మహత్-ప్రకాశంగా కనిపించారు।
ఆమె జగన్మాత ఉమాదేవిగా, హైమావతిగా, పార్వతిగా దర్శించిన ఇంద్రుడు - ‘‘హే ఉమాదేవీ! హైమవతీ! జగన్మాతా! నమో నమః ఇప్పటిదాకా ఇక్కడ భీకరంగా ఏదో యక్షశక్తి కనిపించిందమ్మా! ఎవ్వరై ఉంటారు?’’ - అని అడిగారు.

చతుర్థ ఖండము


సా బ్రహ్మేతి హోవాచ బ్రహ్మణో వా ఏతద్విజయే మహీయధ్వమితి
తతో హైవ విదాంచకార బ్రహ్మేతి .. 1..
1.) సా ‘బ్రహ్మ’’-ఇతి హ ఉవాచ,
‘‘బ్రహ్మణో వా ఏతత్ విజయే।
మహీయధ్వమ్’’ ఇతి;
తతో హ ఏవ
విదాంచకార ‘బ్రహ్మ’ ఇతి।
అమ్మవారు : ‘‘బిడ్డా। నీకు కనిపించిన ఆ యక్షస్వరూపము బ్రహ్మమే నాయనా!
పరబ్రహ్మమే సర్వ కారణ - కారణము అని మరిచావా? మీరు రాక్షసులపై విజయం పొందటం బ్రహ్మము యొక్క లీలా విశేషమే. ఆ పరబ్రహ్మమే జగత్ కథా రచయిత కదా। ‘‘మేము గెలిచాం’’ అని గర్విస్తున్నారేం? అంతా మీ గొప్పతనమేనని అనుకున్నారా ఏమి? బ్రహ్మమే ఈ జగత్ నాటకమునకు సూత్రదారి, పాత్రధారి, దర్శకుడు, వినోదియగు ప్రేక్షకుడు కూడా।
అప్పుడు ఇంద్రుడు:
‘‘ఆహా! ఇదంతా బ్రహ్మమే! సర్వము బ్రహ్మమే’’। - అని, తెలుసుకున్న వారయ్యారు!

తస్మాద్వా ఏతే దేవా అతితరామివాన్యాందేవాన్యదగ్నిర్వాయురింద్రస్తే
హ్యేనన్నేదిష్ఠం పస్పర్శుస్తే హ్యేనత్ప్రథమో విదాంచకార బ్రహ్మేతి .. 2..
2.) తస్మాత్ వా ఏతే దేవా అతితరామ ఇవ -
అన్యాన్ దేవాన్, యత్ అగ్నిః - వాయుః
ఇంద్రః - తేహి ఏనత్ నేదిష్ఠమ్
పస్పర్శుః తే హి ఏనత్ ప్రథమో
విదాంచకార ‘బ్రహ్మ’ - ఇతి।।
అందుచేత ఆ అగ్ని - వాయు - ఇంద్ర దేవతలు అన్యదేవతలకంటే - (బ్రహ్మము యొక్క సామీప్య దర్శనముచే) - అధికాధికులైనారు.
అత్యంత సన్నిహితమైన పరతత్త్వమును ప్రప్రథమముగా స్పర్శించిన వారు కదా।

తస్మాద్వా ఇంద్రోఽతితరామివాన్యాందేవాన్స
హ్యేనన్నేదిష్ఠం పస్పర్శ స హ్యేనత్ప్రథమో విదాంచకార బ్రహ్మేతి .. 3..
3.) తస్మాత్ వా ఇంద్రో అతితరామ ఇవ
అన్యాన్ దేవాన్;
స హి ఏనత్ నేదిష్ఠమ్
పస్పర్శ, స హి ఏనత్
ప్రథమో విదాం చకార ‘బ్రహ్మ’-ఇతి।।
ఇంద్రదేవుడు అన్య దేవతలను అధిగమించినవారైనారు.
బ్రహ్మమును ఆయన అతి సమీపంగా దర్శించి పరతత్త్వ స్పర్శానుభవులైనారు. ‘సర్వము బ్రహ్మమే’ అని గమనించినవారైనారు.
(నాటకములోని ఒక పాత్రకు సంబంధించిన సంఘటనలు ఆ పాత్రధారునిపై ఆపాదిస్తామా? రచయితవి కదా!) ఈ జగత్ సంఘటనలన్నీ పరమాత్మ విరచితం. స్వస్వరూప పరబ్రహ్మముయొక్క వినోదము.

తస్యైష ఆదేశో యదేతద్విద్యుతో వ్యద్యుతదా3 (Extra `A’kAr is used in the sense of comparison)
ఇతీన్ న్యమీమిషదా3 ఇత్యధిదైవతం .. 4..
4.) తస్య ఏష ఆదేశో
యదేతత్ (యత్ ఏతత్) విద్యుతో
అవ్యద్యుతదాత్ ఆ ఉ 3
ఇతీతి న్యమీమిషదా 3(అ-ఉ) ఇతి అధిదైవతమ్।।
ఆ బ్రహ్మముయొక్క ఆదేశము చేతనే, అహో! మెఱుపు మెరుస్తోంది!
జీవులు కనురెప్పల కదలికలు కూడా అద్దాని రచనా క్రియా విశేషమే। ఈ ప్రకృతి, ప్రకృతి దేవతలు- ఇదంతా ఆ పరమాత్మయొక్క అధిదైవత్వముయొక్క ప్రదర్శనా విన్యాసమే। ఆత్మజ్యోతి యొక్క వెలుగే। ఆత్మశక్తి ప్రదర్శనమే।

అథాధ్యాత్మం యద్దేతద్గచ్ఛతీవ చ మనోఽనేన
చైతదుపస్మరత్యభీక్ష్ణఀ సంకల్పః .. 5..
5.) అథ అధ్యాత్మమ్
యత్ ఏతత్ గచ్ఛతి ఇవ చ
మనో అనేన చ
ఏతత్ ఉపస్మరతి
అభీక్షణాం సంకల్పః।।
ఇక, ఆత్మయందు ఇదంతా బ్రహ్మముయొక్క - అధ్యాత్మ్య- అభివ్యక్తీకరణము దృష్ట్యా మనము చూచినప్పుడు….
పరబ్రహ్మము వలననే మనస్సు ఇద్దానిని (ఈ ప్రపంచమును) తెలుసుకొంటోంది. నడిపిస్తోంది. జ్ఞాపకరూపంగా కలిగి ఉంటోంది. ఆత్మయొక్క (బ్రహ్మముయొక్క) ‘మనస్సు’ అనే ఉపకరణమే ప్రపంచమును ఊహిస్తోంది. సంకల్పిస్తోంది. సంకల్పములను విరమిస్తోంది.

తద్ధ తద్వనం నామ తద్వనమిత్యుపాసితవ్యం స య ఏతదేవం వేదాభి
హైనమ్ సర్వాణి భూతాని సంవాంఛంతి .. 6..
6.) తద్ధ (తత్ హ) తద్వనం నామ
తత్ వనమ్ ఇతి ఉపాసితవ్యమ్,
స య ఏతత్ ఏవమ్ వేదా అభి హి ఏనమ్
సర్వాని భూతాని సంవాంఛంతి।।
ఈ జగత్తు, జీవులు - ఇదంతా బ్రహ్మముయొక్క స్వకీయ ఉద్యాన వన సంచారము. ఇదంతా బ్రహ్మముయొక్క వనము (This is all the Garden of Divinity - బ్రహ్మము)….అని ఉపాసించవలసినది. ఇది దేవతలు మరచారు.
ఆ పరబ్రహ్మమును ఈ సమస్త - దృశ్య స్వరూప విన్యాసుడుగా ఎవ్వరు తెలుసుకుంటారో, సర్వ సహజీవులను బ్రహ్మము యొక్క సంప్రదర్శనంగా వీక్షిస్తూ ఉంటారో…
తదితర జీవులు అట్టి వానిని ఆప్యాయతగా చూస్తారు. సామీప్యత కోరుకుంటూ ఉంటారు. ఆతడు అందరికీ ప్రియుడౌతాడు.

ఉపనిషదం భో బ్రూహీత్యుక్తా త ఉపనిషద్బ్రాహ్మీం వావ త
ఉపనిషదమబ్రూమేతి .. 7..
(శిష్యుడు)
7.) ఉపనిషదమ్ భో భ్రూహి। ఇతి।।
(గురువు)
ఉక్తా త ఉపనిషద్
బ్రాహ్మీం వావ
త ఉపనిషత్ అబ్రూమ్।। ఇతి।।
శిష్యుడు : స్వామీ! నాకిప్పుడు ఇక ఉపనిషత్ చెప్పండి. ఉపనిషత్ వాణి వినిపించండి.
గురువు : నాయనా! నీకు ఉపనిషత్ వాణియే చెప్పబడిందయ్యా! మనం చెప్పుకున్నదంతా బ్రహ్మమునకు సంబంధించినదే కదా! నీకు నాచే బోధించబడింది ఉపనిషత్తే!

తస్యై తపో దమః కర్మేతి ప్రతిష్ఠా వేదాః సర్వాంగాని
సత్యమాయతనం .. 8..
8.) తస్యై తపో - దమః కర్మ ఇతి ప్రతిష్ఠా
వేదాః సర్వాంగాని
సత్యమ్ ఆయతనమ్।।
తపస్సు - దమము - కర్మ బ్రహ్మమునందే ప్రతిష్ఠితము. అవన్నీ బ్రాహ్మీదృష్టియొక్క సిద్ధికై సాధనలు కూడా.
వేదమునకు, వేదమహావాక్యములకు నివాస స్థానము పరమ సత్యమగు బ్రహ్మమే। సమస్తమునకు కారణ కారణము, ఆధారము, ఆధేయము బ్రహ్మమే।

యో వా ఏతామేవం వేదాపహత్య పాప్మానమనంతే స్వర్గే
లోకే జ్యేయే ప్రతితిష్ఠతి ప్రతితిష్ఠతి .. 9..
9.) యో వా ఏతామ్ ఏవమ్ వేద
అపహత్య పాప్మానమ్
అనన్తే స్వర్గే లోకే జ్యేయే ప్రతితిష్ఠతి। ప్రతితిష్ఠతి।।
(యో వై) ఎవ్వరైతే (ఉపనిషత్ పాఠ్యాంశమగు) పరబ్రహ్మము గురించి ‘‘సర్వము బ్రహ్మమే కర్తృత్వమంతా బ్రహ్మ సంబంధమే’’ అనురూపంగా తెలుసుకుంటారో, అట్టి వారు సర్వ పాపభావముల నుండి, నిరుత్సాహముల నుండి విమక్తులగుచున్నారు.
అనంతమైన, అత్యున్నతమైన స్వర్గలోకమును కూడా దాటివేసి, బ్రహ్మలోకమునందు ప్రతితిష్ఠతులగుచున్నారు. బ్రహ్మమునందు స్థానము పొందుచున్నారు.
బ్రహ్మప్రతిష్ఠులై ప్రకాశిస్తున్నారు। బ్రహ్మమే అగుచున్నారు।

ఓం సహ నావవతు। సహ నౌ భునక్తు।
సహ వీర్యం కరవావహై। తేజస్వినావధీతమస్తు।
మా విద్విషావహై।

ఇతి కేనోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



సామవేదాంతర్గత

3     కేన ఉపనిషత్

అధ్యయన పుష్పము

శాంతి పాఠము - 1

మన ఇరువురికి అనన్యము, అమృతము అగు ఆ పరబ్రహ్మము (లేక) - పరతత్త్వము…గురు శిష్యులమగు → మన ఇరువురిని సదా పరిరక్షించునుగాక! సదా పరిపోషించునుగాక!

మన ఇద్దరము కూడా వీర్యవంతులము, సముత్సాహవంతులము ఉద్యమవంతులము అయి మన సహజరూపమగు పరబ్రహ్మతత్త్వముయొక్క అనుగ్రహము - అనుభవము కొరకై శ్రద్ధగా పరిశ్రమించెదముగాక!

మన ఈ అధ్యయనము - స్వాధ్యాయము మన ఇరువురి పట్ల, (మరియు) తదితర అధ్యయనులపట్ల తేజోవంతమై విరాజిల్లునుగాక!

‘‘నేను బాగా చెప్పుచున్నాను. శిష్యుడికి అర్థం కావటం లేదు! నేను బాగా వింటున్నాను. మా గురువుకు చెప్పటం కుదరటం లేదు!’’ - ఇటువంటి పరస్పరమైన దురవగాహన - ద్వేషములు మనమధ్య ఏర్పడక, బలహీనభావములు మటుమాయమగును గాక!

ఓం శాంతిః శాంతిః శాంతిః।।

మనయొక్క -
ఆధ్యాత్మిక = భౌతిక సంబంధమైన ….,
ఆథి దైవిక = అశరీర - అరూప ప్రజ్ఞలకు సంబంధించిన…. దేవతాయత్తములైన,
ఆధి భౌతిక = నామరూపాత్మక ప్రకృతి సంబంధములైన పరిమిత భావనలు
ఆత్మభావనయందు సశాంతించినవై ఉండును గాక!

శాంతి పాఠము - 2

‘ఓం’కార సంజ్ఞారూపమగు బ్రహ్మమును ధ్యానిస్తూ, అన్వయించుకొని - స్ఫూర్తిపొందుచూ - అనుభూత పరచుకొనుచున్న మార్గములో….
→ నా ఈ దేహాంగములు ఆప్యాయత (Lovelyness) సంతరించుకొనునుగాక!
→ ఈ నా వాక్కు, ప్రాణములు, దృష్టి, వినికిడి, శక్తి, ఈ సర్వ ఇంద్రియములు - ఇవన్నీ కూడా ఆత్మభావన - అనుభూతులకై సహకరించుటకు సంసిద్ధమగును గాక!
→ అవన్నీ కూడా ఉపనిషత్ వాఙ్మయముచే వివరించబడుచున్న బ్రహ్మతత్త్వమును గ్రహించటానికి, వివేచన సామర్థ్యము (Logical ability) కొరకు సహకరించునుగాక।
→ ఆత్మజ్ఞుల సుస్పష్టానుభవమగు బ్రహ్మము పట్ల ‘అనిరాకరణము’ కలిగి ఉండెదను గాక! నిరాకరణము నాయందు లేకుండును గాక.
→ ఆ పరబ్రహ్మము కూడా నా పట్ల ‘అనిరాకరణము’నే కలిగి ఉండును గాక! అనుగ్రహించును గాక।
→ నా పట్ల బ్రహ్మము యొక్క అనిరాకరణమే ప్రకటనమగుచు ప్రకాశించును గాక!

ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।

ప్రథమ ఖండము

శిష్య ఉవాచ: శిష్య ప్రశ్న: స్వామీ! మహాత్మా! బ్రహ్మజ్ఞా! సద్గురూ!

వ్యష్టిగా → ఈ దేహములో జ్ఞానేంద్రియములు - కర్మేంద్రియములు, మనస్సు, ప్రాణశక్తి (అట్లాగే)
సమష్టిగా → విశ్వములో వాటి వాటియొక్క సమిష్టితత్త్వములు కనిపిస్తున్నాయి కదా!
ఇవన్నీ వాటి వాటికవే ఏర్పడి ప్రవర్తిస్తున్నాయని నాకు అనిపించటం లేదు. వాటన్నిటికీ మరింకేదో ఆధారమై, ప్రేరణమై, వాటి ఉత్పత్తికి ప్రజ్ఞారూపమై ఏదో ఉండి ఉండాలని తోచుచున్నది. అట్టి మూలాధారము, ఆదికారణము అగునది ఏది? దయచేసి బోధించవలసినదిగా శరణువేడుకొనుచున్నాను!

→ ఈ మనస్సు ఎల్లప్పుడు ఏవేవో విషయాలపై ప్రసరిస్తోంది కదా! అట్టి ఈ మనస్సును కదల్చుచున్నది, ప్రేరేపించునది ఏది? (లేక) ఈ మనస్సు తనకు తానే కదలుచున్నదా?
→ ఏ తత్త్వముచే నియోగించబడినదై (యుక్తమై) దేహమునకు ప్రథమము - అతిముఖ్యము అయినట్టి ‘ప్రాణశక్తి’ ఈ భౌతిక దేహమునందు, (అదేరీతిగా) ఈ విశ్వమంతా - సంచారములు (ప్రయతి) సలుపుతోంది? (లేక) ప్రాణశక్తి తనకు తానే దేహములో ప్రవేశించి ఈ రక్తమాంసమయ రూపమును జీవింపజేస్తోందా?

ఏ దివ్యతత్త్వముయొక్క సహాయంచేత - అద్దాని…. ఇచ్ఛానుసారంగా (ఇష్టమును అనుసరించి) :
👄 ఈ నోరు వాక్యాలు పలుకుతోంది? పలుకగలుగుతోంది?
👂 చెవులు శబ్దములను వింటోంది? వినగలుగుతోంది?
👁 ఈ కళ్ళు దృశ్య విషయములను చూస్తోంది? చూడగలుగుతోంది?
(లేక) - ఈ నోరు, చెవులు, కళ్లు - తమకు తామే పలకటము, వినటము, చూడటము నిర్వర్తించగలుగుచున్నాయా?

దయయుంచి వివరించండి!

ఆచార్యౌవాచ : ఆచార్యవర్యులు చెప్పుచున్నారు :

నాయనా! ఇప్పుడు సరి అయిన విశ్లేషణమే అడుగుచున్నావయ్యా!

ఏదైతే…,
- ఈ చెవులకు - వింటున్న రూపంగా - చెవికే చెవి అయి ఉన్నదో…., (చెవితో వింటోందో),
- ఆలోచనలు చేస్తున్న మనస్సుకే మనోరూపమై ఉన్నదో…., (ఆలోచనలు చేస్తూ ఉన్నదో),
- వాక్కుకు ప్రేరణ రూపమై, వాక్కుకే వాక్‌రూపమై చెన్నొందుతోందో…, (మాటలను నోటితో పలికిస్తోందో),
- ప్రాణములను దేహములోను - విశ్వమంతా కూడా నియమిస్తూ, శక్తి స్వరూపమగు ప్రాణములకే ‘‘ఈశ్వరుడు - ప్రాణేశ్వరుడు, అయి, ప్రాణశక్తి తనదై, ప్రాణములకు సొంతదారు’’ అయి ఉన్నదో… (తనదైన ప్రాణశక్తిని ప్రదర్శిస్తోందో),
- చూపులను నియమిస్తూ, చూస్తూ, కళ్ళకే కళ్ళు అయి ఉన్నదో….(దృష్టికి దృక్‌రూపమై ఉన్నదో),
అట్టి స్వస్వరూప - సర్వస్వరూప ఆత్మయే నీవు అడిగినట్టి అన్నిటికీ ప్రేరణరూపం!

ఆత్మయొక్క ప్రత్యుత్సాహము చేతనే ఈ దేహములో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు చేతనమగుచున్నాయి.
అవి స్వతఃగా చేతనములు కావు.

ధీశక్తి, సూక్ష్మబుద్ధిగల ధీరుడు - ఇక్కడ ఇంద్రియములను, మనస్సును, ఆ మనస్సు చూస్తూ ఉన్న లోకములను, లోక దృశ్యములను అధిగమించినవాడై, దేహత్వము నుండి దేహిత్వము సంతరించుకుంటున్నాడు. ఇంద్రియ - మనో - బుద్ధులను ఆత్మవిన్యాసంగా దర్శిస్తూ…., అమృత స్వరూపుడగుచున్నాడు. మార్పు చేర్పులు లేని కేవలాత్మత్వము సంతరించుకొనియే లీలావినోదంగా దృశ్యమునందు పాల్గొనుచున్నాడు.

ఈ మనో- వాక్- ప్రాణముల ప్రదర్శన → ఏ ఆత్మ చైతన్యము యొక్క స్వకీయ ప్రదర్శనా చమత్కారమో -
అట్టి బ్రహ్మమును :-
🙏 ఈ భౌతికమైన కళ్లు చూడజాలవు. చూపు ప్రసరించలేదు. చూపును తన దర్శనశక్తిగా వెలిగించునది అయ్యది కదా! కళ్లు వస్తువులను చూడగలవుగాని, చూస్తూ ఉన్నవానిని అవి చూడలేవు.
🙏 ఈ వాక్కు బ్రహ్మమును వర్ణించలేదు. వాక్కును బ్రహ్మమే ప్రదర్శించుచున్నది. వాక్కుకే వాక్కు! వాక్కు ఆత్మయొక్క కళాత్మక ప్రదర్శనమే। అంతేగాని, వాక్కుకే ఆధారమైన చైతన్యమును పలుకలేదు. నోరు బాహ్య విషయములు మాట్లాడగలదుగాని, ఆ మాట్లాడేవానిని తన మాటలచే ప్రకటించలేదు.
🙏 మనస్సు అద్దానిని అందుకోలేదు. ఈ మనస్సు ఆ పరతత్త్వము యొక్క భావనారూపము. బ్రహ్మము మనస్సుకే మనస్సు! ఆలోచనలకు ఆవల - ఆలోచించువాని (The Thinker) రూపమును ఆలోచనలు ఆలోచించలేవు. అన్యములైన వాటి గురించి మాత్రమే మనస్సు ఆలోచనలు చేయగలదు.
🙏 ఆత్మను బుద్ధి కూడా గ్రహించలేదు. బుద్ధి అద్దానిది కదా! అందుచేత బుద్ధితో ‘‘ఆత్మ ఇట్టిదే!’’….అని నిర్ణయించలేము. బుద్ధి ఎవ్వరిదై యున్నదో అద్దానిని బుద్ధి గ్రహించలేదు.‘‘బుద్ధియే తనదైన వాని గురించి’’-ఈ బుద్ధి నిర్వచించి, నిర్ణయించి ‘ఇంతే’ అని ఎట్లా ప్రకటించగలడు?

సర్వము ఎరుగుచున్న అద్దానిని, అద్దానియొక్క ఉపకరణమగు ‘ఎరుక’ను ఉపయోగించి (పరబ్రహ్మమును) ఎరుగుట ఎట్లా?

సర్వకారణములకు మూలకారణమైన ఆత్మ: -
→ ఈ తెలియబడుచున్న సర్వమునకు ఆవల - పరమై, పరమాత్మ స్వరూపమై ఉన్నది. తెలియబడేదానికి భిన్నమై ఉన్నది.
అయితే, తెలియబడేదంతా ఆ బ్రహ్మముయొక్క విన్యాసమే। స్వకీయ సంప్రదర్శనమే।
→ ‘మాకు తెలియదు’ అనురూపంగా తెలియబడకపోవటానికి కూడా ఆవల, ‘‘తెలియటానికి-తెలియకపోవటానికి’’ కూడా ఆధారమై ఉన్నది ఆ పరతత్త్వమే! పరమేష్ఠియే!
→ తెలిసీ - తెలియని దానిని ఆ రూపంగా తెలుసుకొనుచున్నది కూడా - ఆ బ్రహ్మమే! పరబ్రహ్మమే!
అందుచేత తెలుస్తున్న దానికి భిన్నము। తెలియనిదానికి అతీతము। సాక్షి। అయితే, ఆత్మకు తెలియబడేదంతా ఆత్మకు అనన్యమే।
→ తెలిసినవారు - తెలియనివారు కూడా సందర్భరూపంగా వేరువేరు భావ - అభిప్రాయ - గుణసమన్వితులు అయి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ …. సహజముగా బ్రహ్మమే స్వరూపముగా కలిగి ఉన్నారు. అనగా, తెలిసినవారు - తెలియనివారు కూడా బ్రహ్మముయొక్క వ్యక్తీకరణమే!

ఓ స్నేహితుడా! అద్దానిని తెలుసుకున్నట్టి, - అనుభూతము చేసుకున్నట్టి పూర్వ మహాశయులు, తత్త్వజ్ఞులు - ఈ విధంగా బ్రహ్మము గురించి చెప్పుచుండగా మేము విన్నాము.

మనస్సుయొక్క తార్కికశక్తి ఆత్మను ఏమరచి → దృశ్యతాదాత్మ్యము, ఇంద్రియ విషయ సమ్మిళితము, అయి ఉంటున్నప్పుడు… (బ్రహ్మమును ఏమరచిన సందర్భములలో) - శాస్త్ర ప్రవచనములు, సద్గురు అనుభవవాక్యములు ఆత్మగురించిన జ్ఞానమునకు ప్రమాణములుగా అగుచున్నాయి. ఈ జీవునికి తత్త్వజ్ఞానము అత్యవసరమౌతోంది.

వేద = తెలియబడేది. అంతము తెలియబడేదానికి ఆవలగల ‘‘తెలుసుకొనుచున్నట్టివాడు’’ తెలియబడేదంతటికీ ఆవల - తెలుసుకొనుచున్నట్టిదే (వేదాంత స్వరూపమే) అది।

గురువాక్యములు మననం చేసుకుంటూ మరొక్కసారి వేదాంత శాస్త్ర ప్రవచనములు చెప్పుచున్నాను! విను!

మనందరి కేవలీరూపమగు బ్రహ్మము లేక పరస్వరూపము (పరతత్త్వ స్వరూపము; ఆత్మస్వరూపము; (బ్రహ్మము) ; -
- వాక్కుచే ప్రకటించబడేది కాదు. వాక్కుయే అద్దానిచే ప్రకటించబడుతోంది.
- కానీ అద్దాని గురించి చెప్పుకోవాలంటే వాక్కునే మనము ఉపయోగించక తప్పదు కదా! అందుచేత తత్త్వ శాస్త్రములు, తత్త్వజ్ఞులగు గురువులు - వాక్కు, వాక్యములను ఉపయోగించియే ‘ఆత్మ’ గురించి బోధిస్తున్నారు.
- ఏది వాక్కును ప్రదర్శిస్తోందో…అదీ బ్రహ్మము! - అని గ్రహించబడుగాక! అంతేగాని…వాక్కుకు విషయమైనది, వాక్కుతో ఉపాసించేది బ్రహ్మము కాదు సుమా!
(వాక్కుతో ఉపాసించబడేది బ్రహ్మముయొక్క అవగాహన - అనుభూతులకు సాధన - ఉపకరణము మాత్రమే।)
- ఇష్టదైవోపాసన ఆర్తుడై - జిజ్ఞాసువు అయిమాత్రమే నిర్వర్తిస్తూ ఉంటే అది బ్రహ్మోపాసన కాదు.

అయితే, ఇష్ట దైవమే ‘‘సర్వరూపములు తానై-సర్వసాక్షిగా వేరై’’ అనురూపంగా ఉపాసించబడుచూ… స్వకీయత్వము కూడా ఇష్టదైవమునకు చెందినదిగా ఉపాసించబడుచుండగా, ఇక ఆపై అది క్రమంగా పరబ్రహ్మోపాసన అయి ‘శివోఽహమ్’గా రూపుదిద్దుకొంటోంది.

దేనికి తనయొక్క శబ్ధశక్తిచే ఇక్కడి ప్రదర్శనరూపమగు వాక్కు ఒక ఉపకరణమో, అదీ బ్రహ్మము. (That for which sound is an usage instrument)

మనస్సు - ఆలోచనలు - ఆలోచించబడుచున్నవి :
💐 ఈ మనస్సు దేనిచే గ్రహించబడుతోందో, ఎద్దానికి చెందినదై ఉన్నదో…అదీ ‘బ్రహ్మము’…అని తెలుసుకొనబడు గాక! అంతేగాని… ఈ మనస్సు - దేనినైతే గ్రహిస్తోందో…అది బ్రహ్మము కాదు.
💐 అనేక అభిప్రాయములు - అభిరుచులతో మనస్సుచే ఏది ఆశ్రయిస్తోందో అది బ్రహ్మముయొక్క పూర్ణార్థము కాదని తెలుసుకొనబడు గాక!

ఈ దృశ్య ప్రపంచాన్ని మనస్సు గ్రహిస్తోంది కదా! విషయముల - వస్తువుల ప్రతిబింబ మాత్ర బాహ్యరూపములను (The Reflection of Incidents and matters) మనస్సు ఇంద్రియములద్వారా గ్రహించి ఆత్మయొక్క సమక్షములో నిలుపుతోంది. ఆత్మ యొక్క అంశ జీవలోకములో ప్రకాశించినదై జీవాత్మగా… తన బుద్ధియొక్క ఒక విభాగము సహాయంతో ఆ సమాచారమునకు అర్థమును, చిత్తము సహాయంతో అనుభూతిని ఆపాదిస్తోంది. అప్పుడు అది జగదనుభవంగా ఆత్మయొక్క అంశచే స్వీకరించబడి, జగత్ దృశ్యముగా ప్రసిద్ధి పొందినదౌతోంది.

దేనికి ఈ మనస్సు ఒక ఉపకరణముగా అగుచున్నదో…అదీ బ్రహ్మము (That to which the thought is an instrument)

చక్షువులు - చూపు - చూడబడుచున్నవి (దృష్టి) :
💐 ఈ కళ్ళు దేనిని చూస్తున్నాయో….(దృశ్యములో ఒక విశేషము), అది బ్రహ్మము (లేక) ఆత్మ కాదు.
💐 ఈ కళ్ళతో ఏది చూస్తూ ఉన్నదో…అదీ ఆత్మ।

కళ్ళకు కనిపించేది, అట్టి కనిపించేదేదో - అద్దానిపట్ల నిర్వర్తించే ఉపాసన - బ్రహ్మోపాసన కాదు. అనగా…,దృష్టిచే దృశ్యముగా కనిపిస్తూ ఏదైతే ఉపాసించబడుచున్నదో…. అది బ్రహ్మము కాదు.

…ఆ దృష్టి - ద్రష్ట ఎద్దానిదో…అదీ బ్రహ్మము। (That for which perception and perceiver are instruments)

చెవులు - వినికిడి - వినబడుచూ ఉన్నవి :
💐 ఏదైతే చెవులకు విషయములై వినబడుచూ, ఉపాసించబడుచూ ఉన్నదో, అది బ్రహ్మము కాదు.
💐 ఏది చెవులను ఉపయోగించుకుంటూ, వినుచూ ఉన్నదో…అది బ్రహ్మము. వినికిడిని వినియోగించు తత్త్వము బ్రహ్మత్వము - అని గమనించబడుగాక!
💐 అంతేగాని, చెవులతో వింటూ ఉపాసించబడుచున్నది ఏదో, అది (బ్రహ్మము) కాదయ్యా!

ఏది తనయొక్క వినికిడిశక్తిచే చెవులను ఉపకరణంగా ఉపయోగించుకుంటోందో…అదీ ‘బ్రహ్మము’ (That for which listening and the Ears are mere instruments)

ప్రాణములు - ప్రాణశక్తి :: చలనము - చలనశక్తి :
💐 మనము ఏ ప్రాణశక్తిచే ఊపిరి పీలుస్తున్నామో, దేహాంతర్గతంగాను, దేహబాహ్యమున ఏ శక్తిచే కదల్చుచున్నామో…అది బ్రహ్మము కాదు.
💐 అట్టి ప్రాణశక్తి ఎవ్వరిదో, ఎద్దాని ఉపకరణమో, ఎవ్వరిచే నియమించబడుచున్నదో, వినియోగించబడుచున్నదో - అట్టి ప్రాణేశ్వర నియామకుడే బ్రహ్మము (లేక) ఆత్మ.

అంతేగాని….,
- జనులు పూజిస్తున్న ప్రాణశక్తియొక్క బాహ్యరూపముగాని, ప్రాణశక్తిచే ఉపాసించబడేవి (బింబము - నాదము - వెలుగు మొదలగునవి గాని) బ్రహ్మము కాదు. అవన్నీ ఉపాసనా సాధనములు! ప్రాణోపాసనయొక్క ఉత్తరోత్తర సాధన స్థితులు ప్రాణశక్తిని ఉపయోగిస్తూ - ‘‘ఆ ఉపాసిస్తున్నవాడే బ్రహ్మము’’….అని తెలుసుకో! [That by whome the Prana Energy is being adored is “Brahmam”]

ఈ మన ఇంద్రియములు ఆయా కార్యములు…నిర్వర్తించటానికి అవసరమగుచున్న ప్రజ్ఞ ఎవరిదో, ఎవ్వరివలన సామర్థ్యము పొందుచూ ఉన్నాయో, అట్టి మూలచైతన్యమగు స్వస్వరూపాత్మసత్తయే బ్రహ్మముగా గ్రహించబడుగాక! అర్థము చేసుకోబడుగాక! గమనించబడు గాక!

ఆత్మయే → జగత్ ద్రష్టకు - ఆ ద్రష్ట యొక్క దృశ్యానుభవములకు కేవల సాక్షి - నియామకుడు - ప్రేరకుడు కూడా!

అయితే….
స్వప్న ద్రష్టయే…. స్వప్నాంతర్గత ద్రష్టగా, స్వప్న దృశ్యముగా ప్రదర్శితుడగుచున్నతీరుగా, మనో - ఇంద్రియ - బుద్ధి - చిత్తాదుల ద్రష్టయే,
….ఆ అన్ని రూపములుగా చెన్నొందుచూ,
….వాటి వాటి విషయపరంపరలుగా ప్రకాశించటం జరుగుతోంది.

అందుచేత,…..సమస్తము ఎద్దాని సంప్రదర్శనమో (That the Expression of which all this) - అదియే ఆత్మ।

అన్యముగా కనిపిస్తూ, అనిపిస్తూ ఉన్నటువంటి ఈ సమస్తము కూడా ఆత్మ చేతనే! ఆత్మ స్వరూపమే! ఆత్మయే జాగ్రత్ ద్రష్ట అయి జాగ్రత్ దృశ్యానుభవమంతా తనకొరకై తానే కల్పన చేసుకొని ఆస్వాదించటం జరుగుతోంది.

ఆత్మయే - జాగ్రత్‌కు, స్వప్నమునకు, సుషుప్తికి, జన్మ - జన్మాంతరములకు - ద్రష్ట, దర్శనము, దృశ్యములకు కూడా కారణ-కారణము.

ద్వితీయ ఖండము - బ్రహ్మము యొక్క ఎరుక
(అవిజ్ఞాతం - విజ్ఞాతం)

ఆచార్యులవారు: ప్రియవత్సా! ఏది స్వకీయ-ఇంద్రియ-మనో-బుద్ధి-చిత్త-అహంకారములనబడే ఉపకరణముల ద్వారా స్వీయ భావనా పరంపరల విన్యాసముగా ‘జాగ్రత్ దృశ్యము’ను ఎరుగుచున్నదో, ఆ ఎరుకను కల్పించుకొనుచున్న స్వస్వరూపాత్మయే బ్రహ్మము.

తెలియబడేదంతా - తెలుసుకొనుచూ ఉన్న ఆత్మకు ఏ స్థితియందు అన్యము కాదు.

అట్టి స్వకీయమగూద్వితీయ బ్రహ్మమును ఎరుగునది ఎట్లా? ఒకవేళ ‘‘బ్రహ్మము (ఈ దృశ్యములో) ఇట్టిదైయున్నదని నాకు తెలిసింది’’…అని నీవు (ఏవైనా రూప నామాల దృష్ట్యా) అనుకుంటున్నట్లైతే,…అప్పుడు బ్రహ్మము గురించి తెలియనట్లే.

ఒకవేళ నీవు ‘‘(బ్రహ్మ - విష్ణు - రుద్ర - ఇత్యాది) ఏదైనా ఒక్క దేవతా రూపము మాత్రమే బ్రహ్మము’’ అని భావన చేస్తున్నావనుకో…. అప్పుడు నీవు బ్రహ్మము గురించి స్వల్పంగా మాత్రమే గమనిస్తున్నట్లు!

అట్లా కాకుండా…..
నీ ఇష్టదేవతయే ఈ సర్వ జగత్ రూపములుగా కనిపిస్తూ, ఇదంతా ఒక్కటిగా అనిపించటం ప్రారంభము అయిందా,….అప్పుడిక నీవు బ్రహ్మమును దర్శించు మార్గములో అడుగులు వేస్తున్నట్లే! శివతత్ త్వమ్। నీవే శివుడవు। విష్ణుతత్త్వమ్। నీవే విష్ణువు।

Step 1 : (1) నేను భక్తుడను, ఆ పరమాత్మ ఎక్కడో (వైకుంఠంలోనో, కైలాసంలోనో మణిద్వీపములోనో) ఉన్నారు.
Step 2 : (2) ఆ మహావిష్ణువు(లేక) శివుడు (లేక) దేవి నాకు కనబడే అందరిలో ఉన్నారు.
Step 3 : (3) పరమాత్మ అందరుగాను, సమస్తము అయి ఉన్నారు.
Step 4 : (4) నేనుగా అనిపించేది - అగుపించేది ఆ పరమాత్మయే! నాదంతా ఆయనదే। ఆయనయే।
Step 5 : (5) నేనే ఇదంతా! (బ్రహ్మానుభవం) (అహం బ్రహ్మాస్మి। త్వం బ్రహ్మ। ఇదం బ్రహ్మ। ఇదమ్ అహమేవ। - ఇదియే అనన్యోపాసన. అనన్యచింతన.
‘‘నేను బ్రహ్మమును బాగుగా తెలుసుకున్నాను’’ …అని నేను అనుకోవటము లేదయ్యా! అది తెలియబడేది కాదు।
అంతేకాదు….
‘‘బ్రహ్మము నాకు తెలియదు’’….అని కూడా నేను అనటము లేదు. ఎందుకంటావా…బ్రహ్మము నాకు తెలియకపోవటమనేది లేదు.

నాలో ‘‘తెలుసుకొనుచున్నవాడు’’ - నాకు తెలియకుండా ఎట్లా ఉంటాడు? అది నీకు - నాకు మనందరికీ తెలిసినదే! మనందరిలో అది తెలియనివారెవ్వరూ లేరు! మనమంతా స్వస్వరూపము - సహజరూపము దృష్ట్యా చూస్తే ‘బ్రహ్మమే’ - అయి ఉన్నాము కదా! మనమంతా మన అపరిమితత్వము - అప్రమేయత్వము తెలియనిదేమీ కాదు! బ్రహ్మము గురించి అందరికీ తెలిసినదే। ఆబాల గోప విదిత।

‘‘నాకు బ్రహ్మము గురించి ఏమీ తెలియదు’’ అని మనలో ఎవ్వరైనా అంటారేమో! వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పుచున్నాను. ఆ తెలియదనుకునేవారందరిచే బ్రహ్మము తెలియబడియే ఉన్నది.

ఎందుకంటే…

చమత్కారంగా చెప్పుకోవాలంటే…

ఈ విధంగా…

బ్రహ్మము….
అవిజ్ఞాతం విజానతామ్ → తెలిసినవారికి అది తెలియనిదే అగుచున్నది!
విజ్ఞాతం అవిజానతామ్ → తెలియనివారికి అది తెలిసినదే అయి ఉన్నది!

శిష్యుడు: గురువర్యా! అట్టి బ్రహ్మము నాకు అనుభవమై సిద్ధించగలదా? ఏవిధంగా అనుభవమవగలదు?

ఆచార్యులవారు:
నాయనా! ఆత్మజ్ఞులు, బ్రహ్మజ్ఞులు అగు మహనీయులచే బోధించబడుచుండగా…స్వవిచారణచే అది తప్పక తెలియబడగలదని కూడా గ్రహించు. వారి బోధలు శ్రద్ధగా వినటంచేత రూపుదిద్దుకోగల ‘స్ఫూర్తి’ (Sense of Enlightenment) చే నిశ్చయముగా అమృతత్త్వమును పొందగలవయ్యా! స్వానుభవము చేతనే ఈ వాక్యము చెప్పబడుచున్నది సుమా! ఇందులో ఈషన్మాత్రము అనుమానమే లేదు.

ఆత్మవేత్తల ప్రవచనముల ప్రభావముచే నీకు నీవుగా, నీ బుద్ధి సునిశితము, విస్తారము అగుచుండగా, - ‘అహమ్ ఆత్మ’ భావన రూపుదిద్దుకోగలదు. అట్టి ఆత్మభావనచే ‘‘నేను దేహబద్ధుడను’’ అను అల్పత్వమును పాము కుబుసమువలె త్యజించినవాడవై, వీర్యము, - స్థైర్యము పొందగలవు.

ఆత్మవిద్యచే
- ‘‘నేను దేహబద్ధుడను కాను. సందర్భబద్ధుడనుకాను. దృశ్యబద్ధుడను కాను. జన్మ-కర్మలచే బద్ధుడను కాను’’
- ‘‘ఈ దేహము యొక్క బాల్య - యౌవన - వార్థక్య - జరామరణ జగన్నాటక సంఘటనలకు సంబంధితుడను కాదు.
- అవన్నీ నాకు సంబంధించినవి కావు.
- దేహ ధర్మములైన రాక - పోకల (పుట్టుక - చావుల)చే నేను పరిమితుడను కాదు.
నేను సర్వదా అపరిమితమగు ఆత్మస్వరూపుడను’’-అను అవగాహన పెంపొందగలడు. తత్ఫలితముగా అమృతత్వము సంతరించుకొంటావు!

ఓ ప్రియమహదాశయా! బిడ్డా! ప్రియశిష్యా।

శ్రద్ధావాన్ తత్ ప్రతిష్ఠిమ్ ప్రాప్యసి। ఇప్పుడే - ఇక్కడే - ఈ దేహమున్నప్పుడే నీవు ఆత్మతత్త్వమగు బ్రహ్మమును గురించి ఎరుగుట జరిగిందా….సత్యమునందు ఇప్పుడు ప్రతిష్ఠితుడవవు కాగలవు.

ఆత్మజ్ఞానముచే జన్మకర్మములకు ఆవలి ఒడ్డు జేరినవాడవై బంధ విముక్తుడవగుచున్నావు. ‘లోకములలో నేను’ను అధిగమించి, సర్వమునకు కేవల సాక్షివై ‘‘నాయందే స్వప్నమువలె ఈ లోకములన్నీ భావనా మాత్రమై ఉన్నాయి’’…అను స్థానమును అలంకరించగలవు.

అశ్రద్ధ దానాః - అప్రాప్యవాన్। ఒకవేళ, అశ్రద్ధచే-బ్రహ్మతత్త్వమును ఇప్పుడే తెలుసుకోకపోతేనో?…అసత్యమునందు అనేక ప్రయాసలతో కూడిన ప్రయాణములు కొనసాగించవలసి వస్తుందయ్యా! మహతీ వినష్టి। గొప్ప నష్టము పొందగలవు-అని ఆప్తులమై గుర్తు చేస్తున్నాము.

ధీరుడు, ఉత్తమ బుద్ధిగలవాడు, ఈ సమస్త ప్రాణికోట్లయందు బ్రహ్మమును, సమస్త ప్రాణికోట్లను - బ్రహ్మమునందు దర్శిస్తున్నాడు.

సునిశితము, ఉత్తమము, విస్తారము అగు బుద్ధిని ఇప్పుడే సముపార్జించుకో! అట్టి పరమ సాత్వికమైన బుద్ధితో లోక సంబంధమైన ధ్యాసలను, భావాలను, అభిప్రాయములను, అనుబంధములను జయించివేసినవాడవై ఉండు.

అట్టివాడు అమృతత్వ స్వరూపము పొందుచున్నాడయ్యా! జన్మ - మృత్యువులకు కేవల సాక్షియై జన్మ - జీవన్ - మృత్యువులను, ఈ ఇక్కడి మొత్తము తతంగమును, సమస్త దృశ్యమును తనయొక్క స్వస్వరూప - చిద్విలాసంగా క్రీడావినోది అయి ఆస్వాదిస్తున్నాడు.

ఆత్మానంద స్వరూపుడై, ఈ అన్యముగా కనిపించే సమస్తమును హాయిగా, ప్రశాంతముగా, లీలగా, ఆనందముగా, మౌనంగా చూస్తూ ఉంటున్నాడు.

తృతీయ ఖండము - బ్రహ్మమే కారణకారణము

ఆచార్యులు: ఆత్మతత్త్వమే అన్నిటికీ కారణము (మరియు) కార్యము (Cause as well as effect) కూడా. తదితరమైనదంతా ఆత్మయొక్క సమక్షంలో ఆత్మచే కల్పించబడి, ఆత్మచేతనే ఆస్వాదించబడే లీలా వినోదమే! మరి సుఖదుఃఖాలు ఎందుకున్నాయంటావా?

ఆత్మయొక్క ‘‘మహాకర్తృత్వము - మహాభోక్తృత్వము’’ను గమనించక, జగత్‌స్వప్నములో తారసబడే ఆత్మజ్ఞానవిషయమై పరిశీలనలేని సందర్భములలో ఈ జీవుడు ‘‘నేను ఈ ఈ సంఘటనలచే దుఃఖిని. సుఖిని. దేహమునకు, బంధువులు మొదలైనవాటికి చెందినవాడిని’’…అను రూపముగల భావనలను ఆశ్రయించి, క్రమంగా అట్టి భావనలచే తనపై పరిమితత్వమును ఆపాదించుకుంటున్నాడు. ‘‘కల’’ తనదైనవాడు - కలలో కనిపించిన బంధువులకు ‘‘చెందినవాడు’’ అవుతాడా? అవడు కదా! ఈ జాగ్రత్ తనదైనవాడి - జాగ్రత్‌లోని ‘‘బంధ-సంబంధములు’’ అట్టివే।

బ్రహ్మము యొక్క (లేక) ఆత్మ యొక్క ఔన్నత్యమేమిటో గ్రహించాడా, ఈ జగత్ సంఘటనల నాటకీయత్వము గమనిస్తూనే, ఆత్మౌన్నత్యము యొక్క గమనిక, ఆస్వాదనల నుండి చ్యుతి పొందడు. (Will not get distracted from “Sense of Self”)

ఆత్మయొక్క సర్వప్రదర్శనారూపమగు మహత్ శక్తిని, బ్రహ్మముయొక్క తత్త్వమును తెలుసుకొని - ఏమరువని విజ్ఞుడు ‘‘నేను గెలిచాను! ఓడాను! పాపిని! పుణ్యుడిని! స్వర్గలోకవాసిని! మర్త్యలోకవాసిని! పాతాళలోకవాసిని! కర్మబద్ధుడను! సుఖిని! దుఃఖిని’’….ఇటువంటి న్యూనభావాలు స్వభావసిద్ధంగా పరిత్యజిస్తున్నాడు.

ప్రియశిష్యులారా! ఈ విషయమును గుర్తు చేస్తూ ఇతఃపూర్వము జరిగియున్న ఇతిహాసవర్ణితమైన ఒక సంఘటనను ఇప్పుడు చెప్పుచున్నాను. వినండి.

ఒకానొకప్పుడు ఒక సందర్భములో దేవతలకు, దానవులకు మధ్య గొప్ప సంగ్రామం జరిగింది. దేవతలు, విష్ణుభగవానుని భక్తి ప్రపత్తులతో శరణువేడసాగారు. ఎట్టకేలకు (చివరికి) ఆ యుద్ధములో పరమాత్మయొక్క సంకల్పానుసారంగా (దైవేచ్ఛచే) విజయము దేవతలను వరించింది. (It is one scene at one point in the “Story of the World”).

విజయదుందుభులు మ్రోగిస్తూ దేవతలంతా ఒకచోట సమావేశమైనారు. లోకసృష్టి కథా కల్పనా రూపంగా పరమాత్మ (పరబ్రహ్మము) ప్రసాదించిన విజయమును చూచుకొని ఆ దేవతలంతా ఎంతగానో ఆనందము పొందారు. వారిలో వారు ఒకరి నొకరు అభినందించుకున్నారు. ఆ సభయొక్క కార్యకర్తలు అనేక బహుమతులు ప్రకటిస్తూ, ఇవ్వసాగారు. ఉప్పొంగిపోతూ ఇక, క్రమంగా ఆ దేవతలంతా ‘‘ఆహా"! మనము ఎంతో సమర్థులము కాకపోతే ఈనాడు అసురులపై ఈ దిగ్విజయము ప్రాప్తించేది కాదు కదా!’’ అని అనుకుంటూ మురిసిపోసాగారు. ఇక ఆపై వారు దానవులపై గెలిచినందుకు ఎవరికి వారే కొంచం కొంచంగా గర్వించసాగారు. వారంతా అసలు విషయం ఏదో మరచిపోయారు.

అస్మాకం ఏవ అయమ్ విజయో! అస్మాకం ఏవ అయమ్ మహిమ। - ఇతి।

మేము కదా, గెలిచింది! మరి ఇదంతా మా సామర్థ్యము, మా మహిమయే కదా! ఎవ్వరైనా కాదనగలరా?’’ అని మరింత మరింత గర్వించసాగారు. కొంచము సేపైన తరువాత ‘‘మావలన’’ - అంటే ‘‘మావలన’’ అని అంటూ వారిలో వారు వాదించుకోసాగారు. పరబ్రహ్మము అది చూచి పిల్లలగోలవలె చూచి చిరునవ్వు చిందించారు!

అప్పుడు ఆ పరమాత్మ ‘‘ఈ దేవతలకు బ్రహ్మతత్త్వము యొక్క మహిమను గుర్తు చేయాలి’’ - అని సంకల్పించారు. గర్వము క్షేమము కాదు కదా మరి!

ఆ దేవతలు విజయోత్సాహాలతో ఉప్పొంగిపోతున్న తరుణంలో, వారు సమావేశమైయున్న స్థానానికి సమీపంగా ఒక భీకరమైన మహాపర్వతమంత యక్షిణీశక్తిరూపము ప్రత్యక్షమై,……ఆ పరిసరాలలో బిగ్గరగా నవ్వుతూ సంచారాలు చేయసాగింది.

దేవతలంతా ఆ యక్షిణీరూపముయొక్క సంచారాలు చూచారు. ఆ బీభత్సమైన రూపి (శక్తి) ఎవ్వరో వారెవ్వరికీ ఏమాత్రము తెలియనే రాలేదు. ‘‘భీకరంగా నవ్వుతూ, కేకలు వేస్తూ సంచరిస్తున్న ఈ అద్భుతశక్తి ఎవ్వరా?’’….అని చూడసాగారు. ‘‘ఇది రాక్షసుల మాయ కాదు కదా?’’ అని సందేహించసాగారు. ఎంతసేపటికీ ఏమీ అర్థమే కావటము లేదు.

అప్పుడు దేవతలంతా కలసి అగ్నిదేవుని సమీపించి, ‘‘ఓ జాతవేదా! ఈ దృశ్యముయొక్క ఉత్పత్తి రహస్యమును ఎరిగినవారు మీరు, జనించినదంతా దహించగలిగిన స్వామీ! అగ్నిదేవా! మీరు దయచేసి వెళ్ళి మీ సామర్థ్యమును ఉపయోగించి ఆ అద్భుతమైన శక్తి ఎవ్వరో, ఎవ్వరికి చెందినదో….తెలుసుకుని రండి!’’….అని కోరారు.

అగ్నిదేవుడు, ‘‘ఓ! అట్లాగే! ఇప్పుడే వెళ్ళి ఆ శక్తి ఏమిటో - ఎవరిదో తెలుసుకొని అవసరమైతే వశం చేసుకొని, - మరీ, వచ్చి మీకు తెలియజేస్తాను’’…అని పలికి వెంటనే ఆ మహాద్భుతశక్తి ఉన్న ప్రదేశము చేరారు.

యక్ష మహాశక్తి : (పకపకాబిగ్గరగా నవ్వుతూనే) ఓహో! ఎవరయ్యా నీవు! ఇటువచ్చావేం?

అగ్నిదేవుడు : నేను అగ్నిని, జాతవేదుడు అని నన్ను పిలుస్తారు.

యక్షిణి : అయితే ఏమిటంట?

అగ్నిదేవుడు :
→ నేను జనించిన దానిని దేనినైనా సరే దహిస్తూ ఉంటాను. భస్మము చేయగలను.
→ నన్ను సర్వజ్ఞుడనిగా భావించి జాతవేద నామధేయం నాకు ఇవ్వబడింది.
→ వేదతత్త్వము (తెలియబడే దానియొక్క తాత్త్విక రహస్యము) తెలిసియున్నవాడను. అందుచేత కూడా, జాతవేదుడను.
→ అన్ని దేహాలలో అందరి మనోబుద్ధి చర్యలను అతిసామీప్యముగా ఉండి అంతయు ఎరుగుచూ ఉంటున్నవాడను.
→ దేహరక్షణా విధానము నానుండే పుట్టినది. దేహాలన్నీ నశించకుండా ఉండటము నాకారణంగానే,
→ యజ్ఞ - యాగములకు ప్రారంభకుడనై హవిస్సులను దేవతలకు జారవేసే హవ్యవాహనుడను.

యక్ష శక్తి : అది సరేనయ్యా! నీ వీర్య ప్రతాపాలు ఏమిటో అది చెప్పు.

అగ్నిదేవుడు : అదా"? చెప్పాను కదా! అయినా వినండి. నేను తలిస్తే భూమిపై ఉనికిగల దేనినైనా కూడా దహించవేయగల సామర్థ్యము కలవాడను. నన్నెదిరించి ఈ భూమిపై ఏ ఒక్క వస్తువు నిలువలేదు. వస్తువులన్నీ ఒకానొకప్పుడు నాయందు ప్రవేశించి భస్మమగుచూనే ఉంటాయి. అంతా తెలిసినవాడిని కనుక జాతవేద బిరుదాంకితుడను గదా!
- ఆగ్నేయాస్త్ర రూపుడనై లక్ష్యమును క్షణాలలో దహించగలను.

మహాయక్షశక్తి : ఓహో! బాగుబాగు. అది సరే. ఇదిగో! ఈ గడ్డిపోచను ఇక్కడ పెడుచున్నాను. దీనిని భస్మము చేయి, చూద్దాం।

అప్పుడు అగ్నిదేవుడు, …‘‘ఓస్! ఇంతేకదా’’ అని పలికి ఆ గడ్డిపోచను స్పృశించారు. అది చెక్కుచెదరలేదు. క్రమక్రమంగా తనయొక్క తేజస్సుతో కూడిన ఉష్ణశక్తినంతా ఒకచోటికి తెచ్చి ఆ గడ్డిపోచపై ప్రయోగించారు. అయినా లాభం లేకపోయింది. ఆ గడ్డిపోచకు ఇసుమంత కూడా హాని కలుగలేదు. ఇంక ఏమి - చేయాలో తోచలేదు.

వెంటనే అగ్ని దేవుడు వెనుతిరిగారు. దేవతలు ఉన్న స్థానమును చేరి, ‘‘ఓ దేవతలారా! ఆ అద్భుత - అపురూప యక్షశక్తి ఎటువంటిదో, ఎవరిదో, ఆయన ఎవ్వరో నేను కనిపెట్టలేకపోయాను. నా శక్తి అంతా కూడా యక్షుడు నాకు చూపించిన ఒక గడ్డి పోచను కూడా దహించనే లేకపోయింది’’. ఆ శక్తి ముందు నా శక్తి సూర్యునిముందు దివిటివలె అయింది’’ - అని తెలియజేశారు.

ఆ దేవతలు ‘‘ఏమి చేయాలి?’’ అని ప్రశ్నించుకొన్నారు. అప్పుడు వాయుదేవుని సమీపించి, ‘‘ఓ మహత్తర శక్తి సమన్వితుడా! వాయుదేవా! మీరు ఆకాశమంతా సంచరిస్తూ ఉంటారు కదా! మీరు దయచేసి వెళ్ళండి. భీకర హర్షధ్వానాలు చేస్తున్న ఆ అద్భుత యక్షశక్తి ఎవ్వరో, ఎవ్వరిదో తెలుసుకొని మాకు తెలియజేయండి’’…అని అడిగారు.

వాయుదేవుడు, ‘‘ఓ"! తప్పకుండా. మీరు అడిగినట్లు వెళ్ళి ఆ అద్భుత మహాశక్తి ఏమిటో, ఎవ్వరో ఎందుకు పెద్దగా నవ్వుతూ సంచరిస్తోందో కనుక్కుని వస్తాను’’ అని అన్నారు. అంటూనే వెంటనే వాయుతరంగ స్వరూపంగా ఉరకలు వేస్తూ బయల్వెడలారు. ఆ మహాశక్తికి ఎదురుగా నిలుచున్నారు.

మహాద్భుతయక్షరూపి : నీవెవ్వరివయ్యా బాబూ?

వాయుదేవుడు : నేనా? నేను వాయుదేవుడను! ఆకాశములో, అంతటా ఒక్కసారిగా ఆక్రమించి సంచారములు చేస్తూ ఉంటాను. అందుచేత నన్ను ‘మాతరిశ్వుడు’ - అని పిలుస్తూ ఉంటారు.

యక్షరూపి : అవన్నీ సరేనయ్యా! నీయొక్క శక్తి సామర్థ్యముల గురించి మాట్లాడు! అవి ఎట్టివో వివరించు! వింటాను!

వాయుదేవుడు : నా సామర్థ్యము గురించా? చెప్పుతూనే ఉన్నాను కదా!

నేను భూమిపై ఏ వస్తువునైనా - ఎంతటి వస్తువునైనా నా వాయుశక్తిచే పెకలించి భూమిమీద నుండి ఆకాశములోనికి ఎగురునట్లు చేయగలను. విసరివేయగలను. నా చేతులతో సముద్రపు అలలను, కొండలను, 14 లోకములను, మహాపర్వతములను కూడా ఊపివేయగలను. లేపివేయగలను.

వాయువ్యాస్త్ర స్వరూపుడనై ఏదైనా సరే బంతిలాగా ఆకాశములోనికి ఎగురవేయు శక్తి సమన్వితుడను.

యక్షరూపమహాశక్తి : ఓహో! అంత గొప్పవాడివా? చాలా సంతోషము. అయితే, ఒక్క పని నిర్వర్తించు. ఇదిగో, ఈ గడ్డి పోచను చూస్తున్నావు కదా! దీనిని పైకి లేపు. తదితర విషయాలు ఆ తరువాత!

వాయుదేవుడు ‘అట్లాగే’ అని పలికారు. ఆ గడ్డి పరకను సమీపించారు. అది గాలి వాటుకు లేవనే లేదు. క్రమక్రమంగా ఉధృత శక్తినంతా ఉపయోగించినా కూడా, ఆ గడ్డిపరక కించిత్ కూడా కదలలేదు. ఇక చేసేది లేక, వెనుకకు మరలి దేవతలున్న చోటికి వచ్చి, ‘‘ఓ దేవతలారా! క్షమోస్మి. ఆ మహత్తర దివ్యశక్తి గురించి ఏ వివరమూ కూడా తెలుసుకోలేకపోయాను! అశక్తుడనై వెనుకకు రాక తప్పింది కాదు!’’ అని పలికారు.

అప్పుడు దేవతలంతా త్రిలోక నాయకుడు త్రిలోక పూజ్యుడు అగు ఇంద్ర దేవుని సమీపించారు.

‘‘హే ఇంద్ర దేవా! మఘవన్! మీరు త్రిలోకాలకు ఆరాధ్యులు. మహా సంపదవంతులు. త్రిలోకాధిపతులు, ఈ పని మీవలననే కావాలి! ఆ భీకర - అద్భుత మహాశక్తి ఏమి అయి ఉన్నదో మీరు దయచేసి తెలుసుకోవలసినదిగా మా విన్నపము’’.

‘‘అట్లాగే’’ అంటూ ఇంద్రదేవుడు జగన్మాతయగు పరమేశ్వరికి నమస్కరించుకుంటూ, త్వరత్వరగా వెనువెంటనే బయల్వెడలి ఆ యక్షశక్తిని సమీపించారు. వినమ్రతతో కనులు మూసుకొని జగన్మాతయగు ఆదిశక్తికి నమస్కరించారు. కనులు తెరచి ‘‘ఏమిటి ఇది!’’ అని భక్తిశ్రద్ధ సమన్వితులై కించిత్ పరిశీలనగా చూడబోతూ ఉండగానే…. ఆ అద్భుత యక్షశక్తి కాస్తా అంతర్థానమై పోయింది!

ఇంద్ర దేవుడు ఆశ్చర్యంగా ఆకాశంలో ఎనిమిది దిక్కులలోను, పైకి, క్రిందికి పరిశీలనగా చూస్తూ ఉండగా… - ఆకాశంలో - ఇతఃపూర్వము యక్షశక్తి ఉండటం జరిగిన ప్రదేశంలో….వేనవేలకాంతులతో విరాజిల్లుతూ ఒక స్త్రీ మూర్తి ప్రత్యక్షమై కనిపించారు.
ఆ తల్లి యొక్క కాంతిపుంజము బహుశోభాయమానంగా ఆకాశంలోని చీకట్లన్నీ పటాపంచలు చేసివేస్తున్నాయి.

‘‘బహుప్రకాశమానముగా కనిపిస్తున్న ఈ స్త్రీ మూర్తి ఎవరై ఉంటారు?’’ అని వివేచనాదృష్టితో కనిపిస్తున్న ఆ స్త్రీ మూర్తి జగజ్జనని, లోకమాత, లోకేశ్వరి, ప్రకృతి స్వరూపిణియగు ఉమ, హైమవతీ దేవి గా ఇంద్రదేవుడు గుర్తించారు. ఆ జగన్మాతకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించాడు. పాదపద్మములను నుదురుతో స్పృశిస్తూ… ‘‘జగదేకమాతా! గౌరీ!’’ అని అనేక స్తుతులు సమర్పించి వినమ్రులై నిలుచున్నారు.

ఆ జగజ్జనని హైమవతి వాత్సల్య దిక్కులతో చిరునవ్వులు చిందిస్తూ ఇంద్రునిపై అమృత కిరణములను ప్రసరింపజేసింది. ఇంద్రదేవుడు అమ్మయొక్క చిరునవ్వు చిరువెన్నెలలో ప్రత్యుత్సాహులయ్యారు.

ఇంద్రదేవుడు : అమ్మా! జననీ! హే ఉమా! హైమవతీ! - మా నుతులు స్వీకరించి మమ్ములను సముద్ధరిస్తున్న మాతే!
కొద్ది క్షణముల ముందు ఇక్కడ ఒక భీకరమైన యక్షశక్తి ఏదో కనిపించింది. అది ఎవ్వరు? ఏమిటి? ఎవ్వరిచేత? ఏ కారణంచేత ప్రత్యక్షమైనది? మేము తెలుసుకోవటానికి అశక్తులమయ్యాము. ఆ యక్షశక్తి ఏమిటో, ఎవ్వరో, ఎవ్వరిదో, ఎందుకో మాకు తెలియజేయి! గురువువై మార్గము చూపించమ్మా! ఆది దైత్యుల మాయ శక్తియా? దానవ కులగురువు శ్రీ శుక్రాచార్యులవారి కల్పనా శక్తియా? మరింకేదైనానా? దయతో వివరించమ్మా! రక్షించు! పాహిమాం! రక్షమాం!

చతుర్థ ఖండము - సమస్తము బ్రహ్మమే

శ్రీ ఉమాదేవి : బిడ్డా! ఇంద్రదేవా! మీరు ఇంతకుముందు ఇక్కడ చూచినది పరబ్రహ్మముయొక్క లీల! బ్రహ్మమే మీకు మహత్తర యక్షరూప అద్భుతశక్తిగా కనిపించటం జరిగింది! ఇదంతా పరమాత్మయొక్క మహత్తరమగు మాయావిరచనయే।

అయితే…
నిర్గుణ - నిరాకార - సర్వతత్త్వ స్వరూపమగు బ్రహ్మము ఈ రీతిగా సగుణమై యక్షరూపముగా ఎందుకు కనిపించిందని అనుకుంటున్నావా?

అయితే…విను!

నాయనా! సర్వము బ్రహ్మమే! ఈ త్రికాల సర్వలోక సృష్టికి, ఇందులోని సర్వ సంఘటనలకు కారణకారణము పరబ్రహ్మముయొక్క లీలావినోదరూపమగు సంకల్ప చమత్కారమే! ఆ బ్రహ్మముయొక్క ఊహ, కల్పన, వినోదమే నేను కూడా।

అట్టి బ్రహ్మమే సర్వసామర్థ్యము (చదరంగము ఆటలో పావులకు ఇవ్వబడిన సామర్థ్యమువలె) మీ అందరికి సామర్థ్యము ప్రసాదించి ఈ జగత్ చమత్కార కల్పనను ఆ పరబ్రహ్మమే వినోదిస్తోంది కదా! అదంతా మీరు మరచారా ఏమిటి?

లేకపోతే….

‘‘ఈ దానవులపై ఈరోజు విజయం పొందటము మా మహిమయే! మా సామర్థ్యమే!’’ అని గర్వము పొందసాగారా, ఏమి?
వెంటనే ఇంద్రుడు, జగజ్జనని గురునమస్కారము సమర్పించారు.

ఇంద్రదేవుడు : అవునమ్మా! సర్వము బ్రహ్మమే! సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ! నేహ నానాస్తి కించన!
పరమాత్మయొక్క లీలావినోదమే ఇదంతా! ‘‘మేము దేనికైనా సమర్థులమే’’ - అని ఇప్పుడు కొంచము గర్వించిన మాట నిజమే. అయితే, ఆ సామర్థ్యము సదాశివబ్రహ్మము యొక్క సంకల్ప చమత్కారమే. అట్టి బ్రహ్మముయొక్క ఔన్నత్యమునకు నమస్కరిస్తున్నాము. మా శక్తి మాది కాదు. పరబ్రహ్మముది. సర్వాంతర్యామి అగు శివమహత్‌శక్తిది. అట్టి బ్రహ్మముయొక్క కల్పనాశక్తిని ఏమరచి, ‘‘మాదే ఈ విజయము’’ - అని భ్రమించినందులకు క్షంతవ్యులము, నాటకంలోని ఒక పాత్రధారుడు ‘‘నాటకములో సందర్భమయిన విజయము నాదే।’’ - అని అనటము వంటిదే మా గర్వము.
అట్టి బ్రహ్మము మమ్ములను క్షమించుగాక! రక్షించునుగాక! ఈ విజయము విషయమై కృతజ్ఞతాంజలులు!

సాంబ సదాశివాయ నమో నమో నమో నమః।

ప్రకృతితో కూడుకొన్న పరబ్రహ్మమునకు నమఃసుమాంజలులు.

ఆచార్యులవారు : ఓ ప్రియశిష్యా! పరబ్రహ్మస్వరూపా!

ఆ రీతిగా అగ్ని - వాయు - ఇంద్రదేవతలు ప్రప్రథమముగా బ్రహ్మమును అతి సామీప్యముగా ఉపనిషతులై స్పర్శించి, సందర్శించినవారై పునీతులైనారు. తదితర దేవతలకంటే బ్రహ్మదర్శనము విషయములో అధికాధికులైనారు. ఇంద్ర దేవుడు అత్యంత సామీప్యతగా పరమాత్మను (బ్రహ్మమును) దర్శించుటచేత, ఆరాధించుట చేత అన్య దేవతల కంటే అధికులుగా స్తుతించబడ్డారు.

దేవతలంతా ఆత్మభావనాపూర్వకంగా పరస్పరానుభవముతో పులకితులు, అతి పవిత్రులు, పరమపూజ్యులు అయినారు.
‘‘సర్వము బ్రహ్మమే కదా!’’ అని గమనిస్తూ, త్రిజగత్తులను దర్శిస్తూ అటుపై ఇక త్రిలోకములను పరిపాలించసాగారు!

ఆచార్యులు : తత్త్వస్వరూపుడవగు వత్సా! శ్రద్ధగా విన్నావు కదా! ఆ పరతత్త్వమగు బ్రహ్మముయొక్క ఆ దేశమును అనుసరించియే….
💐 మెరుపుయొక్క మెరుపులు ప్రదర్శితమౌతున్నాయి!
💐 జ్యోతులలో జ్యోతిత్వము ప్రకాశమానమౌతోంది!
💐 పరబ్రహ్మముయొక్క మహిమ చేతనే ఈ భూలోక జీవుల కనురెప్పలు మూసుకుంటున్నాయి. తెరుచుకుంటున్నాయి.
💐 ప్రకృతి శక్తులన్నీ ఆ బ్రహ్మము యొక్క వ్యక్తీకరణ చమత్కారమే!
💐 ఇదంతా (ఈ కనబడే దృశ్యమంతా) ఆత్మయందే ఆత్మచేత అభివ్యక్తరూపమై ప్రకాశిస్తోందయ్యా। నవలలోని కల్పనలన్నీ నవలా రచయితవే అయిన తీరుగా - ఈ సమస్తము ఆత్మయొక్క స్వకీయ కల్పనయే!
💐 ఆత్మ యొక్క చేతనశక్తి చేతనే ఈ మనస్సు ప్రపంచ రూపానుభవమును పొందటం జరుగుతోంది!
💐 మనస్సు జగత్ దృశ్యమును తెలుసుకొంటున్నది ఆత్మయొక్క ప్రత్యుత్సాహ ప్రేరణ (లేక) చైతన్యశక్తి చేతనే।
💐 బ్రహ్మముయొక్క స్వకీయ స్మరణమే (స్వకీయ కల్పనా సందర్శనమే) ఈ ద్రష్ట - దృశ్యములు, దేహి - దేహములు కూడా।
💐 బ్రహ్మమే - మనస్సు ద్వారా దృశ్యము యొక్క కల్పన - జ్ఞాపకము - అనుభూతులకు రూపం ప్రసాదిస్తోంది. సముద్రంలో తరంగాలు లాగా ఆత్మయందే అనుభూతులు స్పందనరూపంగా బయల్వెడలి, లయిస్తున్నాయి.
💐 ఆత్మయే ‘భావన’ అనే వాహనమును అధిరోహించి ఈ అద్వితీయ ప్రపంచమును తన ఊహగా పొందుతోంది. తనయందు ఈ ప్రపంచమును సంకల్పిస్తోంది. పరిపోషిస్తోంది. లయింపజేసుకొంటోంది. పునః పునః సంకల్పిస్తోంది.

నాయనా!
🌺 ఈ జగత్తు - ఈ జీవులు - ఈ అనుభవములు…ఇదంతా కూడా బ్రహ్మముయొక్క స్వకీయ నిర్మిత ఉద్యాన వన సంచారమే! క్రీడా - లీలా చమత్కృతియే!
🌺 ఈ కనబడేదంతా బ్రహ్మవనమే! (This is all the playful Garden of Divinity).

ఆ బ్రహ్మమును ఎవ్వరైతే ఈ దృశ్యరూప విన్యాసుడు గాను, స్వస్వరూపమునకు అనన్యుడుగాను తెలుసుకుంటూ - దర్శిస్తూ, ధారణ చేస్తూ ఉంటారో, ‘‘సర్వజీవులలో బ్రహ్మమును, బ్రహ్మమే సర్వజీవుల స్వరూపముగాను’’ మననపూర్వకంగా వీక్షిస్తూ ఉంటారో….
🌺 అట్టివారికి సర్వజీవులు ప్రేమాస్పదులౌతున్నాయి।
🌺 అట్టి వారు సర్వజీవులకు ప్రేమాస్పదులౌతున్నారు।

శిష్యుడు: స్వామీ! సద్గురూ! ఇప్పుడు మీరు నాకు మహత్తరమై బ్రహ్మసంబంధమైన నిత్యము, పరము, అమృతరూపము అగు సత్యమును ప్రకటిస్తూ బోధించారు. మహదానందము. ఇక ఇప్పుడు ‘ఉపనిషత్’ల యొక్క విశేషములు బోధించ ప్రార్థన.

ఆచార్యులవారు : బిడ్డా! వత్సా! ఇప్పుడు ఇంతవరకు మనము చెప్పుకొన్నది ఉపనిషత్ వాణియే. నీవు వింటూ వస్తున్నదంతా ఉపనిషత్‌యే! మనము చెప్పుకున్న బ్రహ్మము గురించే ఉపనిషత్ ప్రకటిస్తున్నది। (ఈ జీవుని యొక్క బ్రహ్మతత్త్వమే ఇదంతా బ్రహ్మమే - సర్వజీవుల అనుక్షణిక - సహజరూపము. బ్రహ్మము అవాక్ మానసగోచరము కూడా. మనము ఇప్పుడు చెప్పుకొన్నదే ఉపనిషత్ ప్రతిపాదిత ‘బ్రహ్మము’ అని మన ఇరువురము మననము చేసుకొనెదముగాక! అయినా నీవు అడిగినదానికి ప్రత్యుత్తరంగా కొన్ని విషయాలు విను.

ఏ ఉపనిషత్ పరమార్థము మనము చెప్పుకున్నామో….అట్టి బ్రహ్మతత్త్వమునకు మార్గము, స్థానము, పాదములు ఎక్కడయ్యా అంటే…., విను.

వేద మహావాక్యములగు - తత్‌త్వమ్ - సోఽహమ్ - జీవో బ్రహ్మేతి నాపరః - అయమాత్మా బ్రహ్మ - సర్వమ్ ఖల్విదం బ్రహ్మ - ఇత్యాది మహా వాక్యార్థములకు నివాసస్థానము పరమ సత్యమగు బ్రహ్మమే!

యోవై… ఎవ్వరైతే…,
♠︎ ‘‘అకర్తయగు పరబ్రహ్మమే’’ సర్వకర్తృత్వములకు ఆదికారణుడు।
♠︎ కేవలుడగు పరబ్రహ్మమే - సర్వకర్తృత్వములకు, భోక్తృత్వములకు కారణ - కారణము।
♠︎ కర్తృత్వ - భోక్తృత్వమంతా బ్రహ్మముయొక్క భావనా చమత్కృతియే।
♠︎ సర్వరూపములలో - సర్వరూపములుగా, సర్వభావములలో - సర్వభావములుగా బ్రహ్మమే సర్వదా యథాతథముగా సంప్రదర్శన మగుచున్నది,
- అని అనుకుంటూ, క్రమంగా తెలుసుకుంటూ - ఉంటారో,
అట్టివారు ‘‘సమస్తము బ్రహ్మమే। అహమ్ బ్రహ్మాస్మి। తత్త్వమసి’’ మహావాక్యముల పరమార్థమును స్వాభావికము చేసుకొనగలరు.
అట్టివారు - సర్వ పాప భావముల నుండి…,సర్వ దోషములనుండి….., విడివడుచున్నవారగుచున్నారు. సర్వబంధములనుండి విముక్తులగుచున్నారు!

అనంతము, అత్యున్నతమైనది అగు సువర్ణ జనులతో కూడిన బ్రహ్మలోకమునందు వారు సు-ప్రతిష్ఠితులగుచున్నారు।

బ్రహ్మమునందు నివసిస్తూ, బ్రహ్మమునే సర్వత్రా దర్శిస్తూ, బ్రహ్మమే అగుచున్నారు.



🙏 ఇతి కేన ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।