[[@YHRK]] [[@Spiritual]]

KunDika Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


సామవేదాంతర్గత

4     కుండికోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। కుండికోపనిషత్ ఖ్యాత
పరివ్రాజక సంతతిః
యత్ర విశ్రాంతిమ్ అగమత్,
తత్ రామపదమ్ ఆశ్రయే।।

ఈ కుండికోపనిషత్ పలుకుచున్న మహత్ తత్త్వమును ఎరిగియున్నట్టి పరివ్రాజకమన్యులు ఎచ్చట పరమ విశ్రాంతిని ఆస్వాదిస్తున్నారో, - అట్టి శ్రీరామచంద్ర ఆత్మారామ పాదపద్మములను ఆశ్రయించుచున్నాను.

ఓం।
1. బ్రహ్మచర్య - ఆశ్రమే క్షీణే (భిన్నే)
గురుశుశ్రూషణే రతః।
వేదాన్ అధీత్య అనుజ్ఞాత,
ఉచ్యతే ‘‘గురుణాశ్రమీ’’।
బ్రహ్మచర్యాశ్రమము: 5వ సంవత్సరంలో ప్రవేశించిన బాలునికి తల్లిదండ్రులు ‘ఉపనయన’ సంస్కారమును నిర్వర్తింపజేసి ద్విజము (ద్వితీయజన్మ)గా చెప్పబడు బ్రహ్మమును అధ్యయనము చేయు ‘బ్రహ్మచర్యము’నందు ప్రవేశింప జేస్తున్నారు. ఆ బ్రహ్మచారి గురువును ఆశ్రయిస్తున్నాడు. ‘గురుశుశ్రూష’ నిర్వర్తిస్తూ, వేద - వేదాంగ- ఉపనిషత్తులను అధ్యయనము చేస్తున్నాడు. వేదవిద్యను అభ్యసిస్తూ, కొంతకాలమునకు విద్యాపారంగతుడు అగుచున్నాడు. సరి అయిన సమయంలో ఈవిధంగా గురువుచే అనుజ్ఞాతుడు (ఆజ్ఞాపించబడువాడు) అగుచున్నాడు. అట్టివాడు ‘గురుణాశ్రమి’ అగుచున్నాడు.
దారమ్ ఆహృత్య సదృశమ్
అగ్నిమ్ ఆధాయ శక్తితః,
బ్రాహ్మీమ్ ఇష్టిం యజేత్
తాసామ్ అహోరాత్రేణ నిర్వపేత్।
గురువు : నాయనా। ఇప్పటివరకూ గురు - ఆశ్రమివి అయి వేదవిద్యను అభ్యసించావు. ఇప్పుడు ఇక ఈ బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమమును స్వీకరించుటకై అనుజ్ఞ ఇస్తున్నాను. వివాహము చేసుకో. శక్తికొలది అగ్నికార్యము (దైనందికమైన నిత్య - అగ్నికార్యములు, నైమిత్తకములైనటువంటివి మొదలైనవి), యజ్ఞ-యాగములు లోకకళ్యాణము కొరకు, ఆత్మోద్ధరణ కొరకు ఉద్దేశ్యించి నిర్వర్తించు. బ్రహ్మమును అధ్యయనం చేస్తూ జగద్దృశ్యమును బ్రాహ్మీదృష్టితో ఉపాసించు. ‘ఇష్టము’ను (లేక) పరబ్రహ్మోపాసనను అహోరాత్రము అనుక్షణికం చేసుకో. ‘‘ఆత్మాహమ్ - (ఆత్మ)తత్‌త్వమ్’’ - అనుష్ఠానమును అహోరాత్రంగా నిర్వపముచేయి. (నిర్వర్తించు). (మానసిక సదాశివోపాసనను సిద్ధించుకో).
సం విభజ్య సుతాన్ అర్థే
గ్రామ్య కామాన్ - విసృజ్య చ,
సంచరన్ వన మార్గేణ
శుచౌ దేశే పరిభ్రమన్।।
గృహస్థాశ్రమము : గృహస్థుడుగా స్వధర్మ నిరతుడవై, సంపదలను పరిపోషించుకో. గృహములను, ధనమును (అర్ధ - కామ పురుషార్థములను) ధర్మయుతంగా, సంఘసేవాభావ సమన్వితంగా సముపార్జించు. సంతానమును పొంది, వారిని లోక-దైవానుకూలురుగా తీర్చిదిద్దు. అటుపై గృహస్థాశ్రమమునకు ముగింపు పలికి, వానప్రస్థాశ్రమమునకు సంసిద్ధుడవగుము. సంపదలను సంతానమునకు (సుతులకు) పంచి, అప్పజెప్పివేయి. సర్వలోక సంబంధమైన వ్యవహారములను ముగించివేయి. త్యజించివేయి. వానప్రస్థుడవై వనమార్గమును ఆశ్రయించి ‘శుచి’ అయిన ప్రదేశములకు సంచారమును పరిమితము చేసుకొనెదవుగాక।
వాయుభక్షో, అంబుభక్షో వా
విహితాన్నో ఉత్తరైః ఫలైః
(విహితైః) కందమూలకైః
స్వశరీరే సమాపి (సమారోపః)
అథ పృథివ్యాం
న అశ్రుపాతయేత్।।
వానప్రస్థాశ్రమం: వాయుభక్షణం, జలభక్షణం చేస్తూ, శరీరమునకు విహితమైన ఫలములను (Fruits) గాని, కందమూలములనుగాని దేహరక్షణకొరకు మాత్రమే స్వీకరించుచూ ‘అభ్యాసి’ - అయి ఉండెదవుగాక। (Just eat to live and to practise). జీవితమును మోక్షమార్గమునందు మాత్రమే నియమించాలి. ఇక ప్రాపంచకమైన దేనిగురించీ కించిత్ కూడా వేదన పడకూడదు. దేనికీ దుఃఖించకూడదు సుమా। (Leave all worries of the world at its core)
2. సహ తేనైవ పురుషః
కథం ‘సన్న్యస్త’ ఉచ్యతే?
స నామధేయో యస్మింస్తు
కథం సన్న్యస్త ఉచ్యతే?
తస్మాత్ ఫల విశుద్ధాంగీ
సన్న్యాసం సంహితాత్మనామ్।
అగ్నివర్ణం వినిష్క్రమ్య,
‘వానప్రస్థం’ ప్రపద్యతే।
కాషాయ వస్త్రములు ధరించినంత మాత్రం చేతనే ‘సన్న్యస్తుడు’ అవుతాడా? ‘‘నేను సన్న్యాసిని’’ అని పేరు మార్చుకున్నంత మాత్రముచేతనే ‘సన్న్యాసి’ అయిపోతాడా? లేదు. ‘సత్’ను న్యాసము చేయుటచే మాత్రమే, అనగా, బ్రహ్మమును దృష్టియందు సుస్పష్టపరచుకొంటేనే ‘సన్న్యాసి’ అవగలడు. అందుకొరకై వానప్రస్థాశ్రమము ఆశ్రయించబడుతోంది.
సర్వకర్మఫలములను పరమాత్మకు సమర్పించివేసి, విశుద్ధమైన ఇంద్రియ నియామకము కలవాడై, సర్వసమదృష్టిచే సంహితాత్ముడవటముచేతనే ‘‘సత్-న్యాసి’’ (సన్న్యాసి) కాగలడు.
‘గృహస్థాశ్రమము’లోని నియమములగు అగ్నికార్యములనుండి నిష్క్రమించి, లౌకిక-సాంఘిక నియమములను పరిత్యజించువాడు ‘వానప్రస్థుడు’.
లోకవత్ భార్యయాసక్తో వనం గచ్ఛతి సంయతః।
సంత్యాక్త్వా సంసృతి సుఖమ్
అనుతిష్ఠతి కిం ముదా?
కిం వా దుఃఖమ్ అనుస్మృత్య
భోగాం త్యజతి చ ఉచ్ఛ్రితాన్।
‘వానప్రస్థాశ్రమము’ నుండి సన్న్యాసాశ్రమమునకు దారిచేసుకోవాలి.
అట్లాకాకుండా ‘లోకజీవనం’లాగా ‘భార్యా’ సంతానముయొక్క ఆర్ధిక వ్యవహారములు మొదలైన వాటి పట్ల ఆసక్తి వదలకుండా వనప్రవేశం (వానప్రస్థం) చేసి లోక వ్యవహారముల వ్యసనమును విడవకుంటే ఏమిలాభం? బాహ్య సంసృతిని మనస్సుతో వదలకుండా, గృహస్థాశ్రమం లోని, దుఃఖములకు (కష్టములకు) భయపడి భోగములు త్యజించి ప్రయోజనమేమిటి? (అది రాజసిక, తామసిక వైరాగ్యము మాత్రమే).
గర్భవాస భయాత్ భీతః శీతోష్ణాభ్యాం తథైవ చ।
గుహ్యం ప్రవేష్టుమ్ ఇచ్ఛామి
పరంంపదమ్ అనామయమ్ ఇతి।
సన్న్యస్య అగ్నిం అపునరావర్తనం
యన్ మృత్యుః జాయమ్ ఆవహమ్ ఇతి।।
మహదాశయము : ఏ విధమైన ‘మహదాశయము’ కలిగి ఉండాలి?
‘‘జన్మ-మరణ పునర్జన్మ పరంపరల పునరావృత్తి దోషము జయించటానికి, జన్మరాహిత్యము సిద్ధించుకోవటానికి అతిరహస్యమగు కేవల స్వస్వరూపాత్మ యందు ప్రవేశించెదనుగాక! గర్భవాస నరకమునకు, దేహము పొందే శీతోష్ణ బాధలకు భీతిల్లినవాడనై అనామయమగు పరమపదము అనబడు స్వస్థానమును ఆశ్రయిస్తాను’’ అను ఆశయం కలిగి ఉండాలి.
‘‘సన్న్యాసయోగమును ఆశ్రయించువాడనై… అట్టియోగాగ్నిచే పునర్జన్మలు’ అనే మృత్యురూప కట్టెలను భస్మము చేసి వేసి ‘పునరావృత్తిరహితమగు స్వస్థానము చేరెదనుగాక’’ - అను పరమాశయము కలిగి ఉండాలి.
అథ అధ్యాత్మ మంత్రాన్-జపేత్।
దీక్షాం ఉపేయాత్।
కాషాయవాసాః, కక్ష ఉపస్థ లోమాని వర్జయేత్,
ఊర్ధ్వబాహుః విముక్తమార్గో భవతి।।
ఇక ఆత్మతత్త్వోపాసనారూపమగు ‘అధ్యాత్మమంత్రము’ను జపించు దీక్షను స్వీకరించటమే సన్న్యాసయోగము. (అధ్యాత్మ = నా దేహమనందు, ఈ కనబడే సమస్త దేహములలోను సమముగా వేంచేసియుండి, సమస్తమును ఆక్రమించుకొనియున్న ‘కేవలాత్మ’.)
కాషాయ వస్త్రములను ధరించటము, చంకల - ఉపస్థరోమ త్యాజ్యము చేయునుగాక। చేతులు పైకి ఎత్తినవాడై విముక్తమార్గమును ఆశ్రయించునుగాక।
3. అనికేతః చరేత్ భిక్షాశీ,
నిదిధ్యాసనం దధ్యాత్
పవిత్రం ధారయేత్ జంతు
జంతు సంరక్షణార్థమ్।
‘సమస్తము పరమాత్మకు చెందినదేగాని నాకు చెందినదై ఏదీ లేదు. ‘నాది’ అనునది త్యాజ్యము. నాకు ఇల్లు లేదు- వాకిలీ లేదు’’- అనురూపముగల త్యజ్యభావనతో గృహ సంబంధములన్నీ త్యజించి, అనికేతుడై, భిక్షాటనమును ఆశ్రయిస్తూ, ….ఆత్మభావనను ఆశ్రయించి శ్రవణ-మనన ఫలమును సిద్ధించుకొనుచూ, క్రమంగా ‘‘సర్వము అఖండాత్మ సంప్రదర్శనమేనని అనిపించటము’’ అను నిదిధ్యాసను సిద్ధించుకోవాలి.
- జంతువులనుండి రక్షణకొరకు మాత్రమే పవిత్రమును (దర్భ-నార వస్త్రములను) ధారణ చేయుచుండునుగాక।
కుండికా త్యాగి : ‘‘నామరూపాత్మకంగా కనిపిస్తున్న’’ అధిష్ఠానమగు మట్టిని ఆశ్రయించటము’’ కుండికము (కుండ) మొదలైనవి వదలటము. ‘అధిష్టానమగు మట్టిని ఆశ్రయించటము’ గురించి ఈ విధంగా గానము
కుండికాం చమసం శిక్యం, త్రివిష్టపమ్ ఉపానహౌ
శీతా-ఉపఘాతినీం కన్థాం, కౌపీన-ఆచ్ఛాదనం తథా।
పవిత్రం స్నాన శాటీన్చ
ఉత్తరాసంగమేవ చ,
అన్యచ్చ అపేక్ష్యతే కించిత్
సర్వం తత్ వర్జయేత్ యతిః।
కుండికము (కుండ)ను, చమసమును (పాత్రను), శిక్యము (ఉట్టి)ను, త్రివిష్టపమును (త్రిలోకములకు సంజ్ఞయగు మూడుముఖముల పాత్రను), చెప్పులను, చలి బొంతను, కౌపీన (గోచీ) ఆచ్ఛాదనమును, పవిత్రమును, స్నానశాటీ (వస్త్ర పాత్రలు)ను, ఉత్తరీయ వస్త్రమును - వాటికి సంబంధించిన సర్వ నియమ-నిష్ట-అపేక్షలను యతి మానసికంగా త్యజించినవాడై ఉంటాడు. వస్త్రధారణ ఇత్యాది నియమముల పరిధులను అధిగమించినవాడై ఉంటాడు. మహత్తరమగు ఆత్మతత్త్వాన్వేషణయే ఆశయముగా కలిగి ఉండి, అతిశయములను త్యజించి ఉంటాడు.
నదీ పుళినశాయీ స్యాత్ దేవాగారేషు బాహ్యతః,
న-అత్యర్థం సుఖదుఃఖాభ్యాం శరీరమ్ ఉపతాపయేత్।
స్నానం పానం తథా శౌచమ్, అద్భిః పూతాభిః ఆచరేత్।
స్తూయమానో న తుష్యేత। నిందితో న శపేత్ పరాన్।
నదీతీరములలోను, దేవాలయ ప్రాంగణములోను, ఆరు బయట కూడా పరుండుటకు సంసిద్ధుడై ఉంటాడు. అయితే ఈ భౌతిక దేహమును అధిక సుఖ దుఃఖములచే బాధించరాదు. ఉపతాపము కలిగించరాదు.
స్నానము, పానము, శౌచము, ధ్యానము పవిత్ర జలములున్నచోటయే ధ్యానమును నిర్వర్తించాలి.
నిందా-స్తుతులకు కుంగరాదు, పొంగరాదు ఎవ్వరినీ నిందించనూ కూడదు. శపించనూ రాదు.
భిక్షాది వైదలమ్ పాత్రం స్నానద్రవ్యం అవారితమ్।
ఏతాం వృత్తిం ఉపాసీత, యత-ఇంద్రియో జపేత్ సదా।
‘‘విశ్వాయమ్ అనుసంయోగమ్’’
మనసా భావయేత్ సుధీః।
భిక్షపాత్ర, స్నానవస్త్రములు, తదితర ‘చెంబు’ మొదలైన దైనందిక ఉపకరణములు కలిగి ఉండటము కూడా దేహయాత్రకొరకు మాత్రమే. అయితే వాటిని కూడా ఉపకరణములుగా కలిగి ఉండి, ఇంద్రియములను పరమాత్మోపాసనయందు మాత్రమే నియమిస్తూ జపము నిర్వర్తిస్తూ ఉండాలి.
‘‘ఈ విశ్వము విశ్వేశ్వరరూపమే’’ అను అనుసంధానముతో సర్వమును బుద్ధితోను మనసా వాచా ఆత్మభావన కలిగి ఉండాలి. మనో-బుద్ధులను ఆత్మోపాసనయందు నియమించాలి.
ఆకాశాత్ వాయుః। వాయోః జ్యోతిః।
జ్యోతిష ఆపో। అద్భ్యః పృథివీ।
ఏషామ్ భూతానాం బ్రహ్మ ప్రపద్యే
‘‘అజరమ్। అమరమ్। అక్షరమ్। అవ్యయమ్’’-ప్రపద్యే।।
‘ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి జ్యోతి (అగ్ని), జ్యోతి నుండి జలము, జలము నుండి పృథివి జనిస్తున్నాయి. అయితే ఆకాశమో? అజరము, అక్షరము, అవ్యయము అగు ఆత్మనుండి జనిస్తోంది కదా।’’ - అనే ఉపాసన, భావన, ప్రార్థన కలిగి ఉండాలి. ‘‘అట్టి అవ్యయమగు ఆత్మయే నా సహజ స్వరూపము। అదియే ఈ సమస్తము కదా!’’ - అను మంత్రభావననే మననం చేయాలి. ‘‘నానుంచే ఈ సమస్తము। ఈ సమస్తమునందు నేను।’’ అను మార్గంగా బ్రహ్మమును ఉపాసించాలి.
4. మయి అఖణ్ణ సుఖ- అంభోధౌ
బహుధా విశ్వవీచయః,
ఉత్పద్యంతే, విలీయన్తే
మాయా మారుత విభ్రమాత్।
నాలోమాయ
(ఏవిధంగా అయితే ప్రతిరోజు స్వప్నములు కల్పనగా స్వప్నద్రష్టయందు బయల్వెడలి, ప్రదర్శనమయి, లయిస్తూ ఉన్నాయో, అట్లాగే) నాయొక్క అఖండ - పరమానంద ఆత్మ సముద్రంలో ‘విశ్వములు’ అనే తరంగములు ఉత్పత్తి అయి, ప్రదర్శనమయి, లయిస్తూ ఉంటున్నాయి. అయితే, అవన్నీ మాయలో (In a magic play) వాయు విభ్రమములు వంటివి మాత్రమే! అనగా ఆత్మస్వరూపుడనగు నాయందు విశ్వముల ఉత్పత్తి - లయములు కథారచయితలో వచ్చి పోయే కథా సంబంధమైన ఊహలు వంటివి - అను గమనికను నిశ్చలం చేసుకోవాలి. కథకు కథారచయిత ‘‘వేరు’’ అయినట్లు, నేను సమస్తమునకు (ఆత్మగా) ‘‘వేరు’’ అయి ఉంటున్నాను.
న మే దేహే। న సంబంధో।
మేఘేనేవ విహాయనః।
అతః కుతో మే తత్ ధర్మా -
జాగ్రత్ స్వప్న సుషుప్తిషు?
ఆకాశంలో మేఘముల వీచికలు కనబడవచ్చుగాక! కానీ ఆకాశమునకు మేఘములతో సంబంధమేముంటుంది? అట్లాగా ఆత్మాకాశస్వరూపుడ నగు నాకు ఈ దేహములు వాస్తవరూపము కాదు. నాయందు దేహములు లేవు. దేహసంబంధములు లేవు.
‘‘జాగ్రత్, స్వప్న, సుషుప్తులు’’ - (కథారచయితలోని కథా రచన విశేషాలవలె, ఆకాశంలో మేఘముల ఆకారములవలె) కల్పనామాత్రములు మాత్రమే. వాటికి నేను వేరైనవాడను. వాటికి ఆధారుడను. కాబట్టి జాగ్రత్ - స్వప్న - సుషుప్త అంతర్గత విశేషాలు అఖండాత్మాకాశ స్వరూపుడనగు నాయొక్క ధర్మములు (Functions) ఎట్లా అవుతాయి? అవజాలవు. (ఆభరణంగా అవటము బంగారముయొక్క సహజ ధర్మము కాదు కదా)। వాటి వలన నాకు బంధమెక్కడిది?
ఆత్మగా నేను…
ఆకాశవత్ కల్ప విదూరగో అహమ్।
ఆదిత్యవత్ భాస్య (బాహ్య) విలక్షణోఽహమ్।
ఆహార్యవత్ నిత్య వినిశ్చలోఽహమ్।
అంభోధివత్ పార వివర్జితోఽహమ్।
ఆత్మస్వరూపుడుగా నేను ఎట్టివాడను? ఆకాశమువలె సర్వ నామ - రూపాత్మకమైన కల్పనలకు విదూరుడను. వేరైనవాడను.
→ సూర్యకాంతి ప్రసరిస్తూ ఉన్న ఆయా వస్తువులకు సూర్యుడు వేరైన రీతిగా నేను ఆత్మప్రకాశ స్వరూపుడను. ఈ జగత్తులు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు అట్టి ప్రకాశములో కనిపించే వస్తువుల వంటివి. నేనో? విలక్షణుడను. (నాటకరంగమును వెలిగించే నాటక దీపము వంటివాడను)
→ ఆభరణమునందలి బంగారమువలె వినిశ్చలుడను.
→ పర్వతముపైగల చెట్లు గాలికి కదులుతాయి. గాలి వీచికలకు పర్వతము కదలదు కదా! పర్వతమువలె నిత్య - నిశ్చల స్వరూపుడను.
→ సముద్రమువలె అంతము (అడ్డు) లేనివాడను.
అహమ్ నారాయణో
నారాయణోఽహమ్। నరకాన్తకోఽహమ్।
పురాంతకోఽహమ్, పురుషోఽహమ్ ఈశః।
అఖండ భోధోఽహమ్ అశేష సాక్షీ।
నిరీశ్వరోఽహమ్ నిరహన్చ నిర్మమః।
→ తరంగములవలన జలము ఉత్పత్తి, వినాశనము పొందదుగదా! ఆ తీరుగా నేను నారాయణుడను (నారము = జలము). నరాకాన్తకుడను. తరంగములకు ఆవలివాడను. ‘నేను నరుడును’ అను భావనకు ఆవల - భావములన్నీ జనిస్తున్న ఆత్మస్వరూపుడను. నరాకాన్తకుడగు కృష్ణచైతన్యానంద స్వరూపుడను.
→ దేహపురములకు ఆవలగల, దేహములకు పరిమితుడనుకానట్టి ‘దేహి’ స్వరూపుడను. పురాన్తకుడను.
- నాచే పొందబడేదంతటికీ నేనే పురుషకారుడను. పురాణపురుషుడను. స్వప్నమంతా అనుభవముగా పొందబడుచున్న సమస్తమునకు నేనే ఈశ్వరుడను. నేనే నిర్మాతను. నేనే ప్రేక్షకుడను.
- ‘ఎరుక’ (knowledge) అనునది నానుండి బయల్వెడలుచుండగా, అది ఎరుగ బడువాటిచే ముగియదుకదా! కనుక అఖండబోధ స్వరూపుడను! అనిరీశ్వరుడను. నిరహంకారుడను. మమకారరహితుడను.
- దృశ్యము కంతటికీ నిర్విశేషసాక్షిని. వికల్పనలేవీ లేనట్టి నిర్వికల్పుడను.
ఈ విధంగా మమాత్మతత్త్వము గురించి (శాస్త్రములచే, ఆత్మజ్ఞులచే) గానము చేయబడుతోంది. విశదీకరించబడుతోంది.
తత్ అభ్యాసేన, ప్రాణ-అపానౌ సంయమ్య,
తత్ర శ్లోకాభవంతి।
వృషణ అపానయోః మధ్యే
పాణీ ఆస్థాయ సంశ్రయేత్।
సన్దశ్య శనకైః జిహ్వాం
యవమాత్రే వినిర్గతామ్,
అట్టి అఖండాత్మాహమ్ భావన సిద్ధించుటకై యోగాభ్యాసములు చెప్పబడుచున్నాయి.
- ప్రాణ, అపాన సంయమ అభ్యాసముచేస్తూ, ప్రాణాయామము అభ్యాసము చేయాలి. ఇంకా ఇట్లా చెప్పబడుతోంది.
వృషణ - అపానముల మధ్య చేతులను తాకించిఉంచటము.
- నాలిక చాచి, చాచిన నాలికను కొంచెము మెల్లగా నొక్కిపట్టి ఉంచటము (ఖేచరీముద్ర). మొదలైనవన్నీ ఆత్మనిశ్చలతకొరకై యోగాభ్యాసములు.
మాషమాత్రాం తథా దృష్టిం,
శ్రోత్రే స్థాప్య తథా భువి,
శ్రవణే నాసికే గన్ధా
యతః స్వం న చ సంశ్రయేత్।
- దృష్టిలో కొంతభాగము - మినపగింజంతగా - చెవులలోను, భూమిపైన నిలిపి ఉంచి, మిగతా దృష్టిని-చెవులతో వినబడుచున్నవాటిని, నాసికకు వాసనగా పొందబడువాటిని కళ్ళకు కనబడుచున్నవాటిని - ఆత్మదృష్టిగా నియమించాలి. (Must be appointed). అనగా వాటిని ఆత్మకు అన్యమైన దృష్టితో స్పృశించకూడదు. ఆత్మప్రదర్శనముగా భావించాలి.
అథ ‘‘శైవం పదం’’ యత్ర -
తత్‌బ్రహ్మ, బ్రహ్మతత్ పరమ్।
తత్ అభ్యాసేన లభ్యేత
పూర్వ జన్మార్జితాత్మనామ్,
సంభూతైః వాయు సంశ్రావైః (వ్యైః)
హృదయం-‘తప’ ఉచ్యతే।।
ఇప్పుడిక, సర్వము శివమయముగా, శివతత్త్వముగా, శివా-అనన్యముగా దర్శించాలి. అదియే ‘‘శైవం పదము’’ (లేక) ‘‘శివతత్త్వ దర్శనము’’.
‘శివుడు’ అనగా బ్రహ్మమే! శివపదము ఏదియో, అదియే ‘‘తత్‌పరమ్‌బ్రహ్మ’’ దర్శనము. అట్టి సర్వము శివతత్త్వముగా (లేక) బ్రహ్మముగా అనునిత్యస్వాభావిక సందర్శనము అనేక జన్మలలో ఆర్జించిన జ్ఞాన, యోగాభ్యాసముల ఫలముచేతనే సిద్ధించుచున్నది. హృదయములో అట్టి ‘ఓం’కార నినాదమును వినటము, వాయునిరోధము, ఆత్మగా సర్వము సందర్శనము - ఇదియే ‘తపస్సు’ - అనబడుతోంది. (హృదయతపస్సు)
5. ఊర్ధ్వం ప్రపద్యతే దేహాత్
భిత్త్వా మూర్థానమ్ అవ్యయమ్।
స్వదేహస్య తు మూర్థానం
యే పాప్య పరమాం గతిమ్,
భూయః తే న నివర్తంతే
పరావరవిదో జనాః।
న సాక్షిణం సాక్ష్యధర్మాః
సంస్పృశంతి విలక్షణమ్।।
- ప్రాణ - అపానముల సంయోగాభ్యాసముచే జనించిన ఉష్ణముతో ఇచ్ఛాజ్ఞానక్రియారూపమై ‘మట్టిముద్దవలె నిద్రాణమైయున్న కుండలినీశక్తి’ని నిద్రలేపి, ప్రత్యుత్సాహపరచి - సుషుమ్న నాడియందు ప్రవేశింపజేసి, ఊర్ధ్వత్వము పొందింపజేసి,
- యోగాభ్యాసులు క్రమంగా మూర్ధస్థానమునకు జేర్చి (Placing in Fore face),
యోగాభ్యాసులు క్రమంగా - మూర్థస్థానము నుండి బ్రహ్మరంధ్రమును ఛేదించి శిరో ఊర్ధ్వ-సహస్రారమునకు జేర్చుచున్నారు.
ఇదియే ‘పరమాంగతి’. అట్టివారు తిరిగి భౌతిక స్థితిగతులకు దిగిరారు. ఆత్మభావననుండి క్రిందికి దిగరు. వారు పరావరవిదులు. పరతత్త్వమును ఎరిగినవారు.
అట్టి కేవలుడగు ఆత్మస్వరూప విలక్షణుని సాక్షి - సాక్షి ధర్మములు (జీవుడు - జగత్ అనుభవము అనునవి) స్పృశించజాలవు.
అవికారమ్ ఉదాసీనం
గృహధర్మాః - ప్రదీపవత్।
జలేవాపి స్థలేవాపి
లుఠత్వ ఏష జడాత్మకః।।
గదిలో దీపము వెలుగుచుండగా, ఆ వెలుతురులో కనిపించే వస్తువుల / గృహోపకరణ ధర్మములు దీపపు వెలుగును స్పృశిస్తాయా? లేదు కదా!
‘ఈ భౌతిక దేహము జలంలో ఉన్నా, స్థలంలో ఉన్నా కూడా ఈ దేహముయొక్క, జీవాత్మయొక్క జడధర్మములు నిత్యచైతన్యాత్మ స్వరూపుడనగు నన్ను స్పృశించజాలవు’’ అని ఆత్మజ్ఞుడు ఎరిగినవాడై, సర్వదా తనయొక్క కేవలీస్వరూపమును ఆస్వాదించువాడై ఉంటున్నాడు.
దృష్టిని దృశ్యమునుండి → నిశ్చలము, అప్రమేయము, సమస్తము అయి ఉన్న ఆత్మవైపుగా త్రోసుకుపోవుచున్నాడు. జడమునుండి చైతన్యము వైపుగా జరుపుకుపోవుచున్నాడు (లుఠము).
న అహమ్ విలిప్యే తత్ ధర్మైః,
ఘటధర్మైః నభో యథా।
నిష్క్రియోఽస్మి। అవికారోఽస్మి।
నిష్కళోఽస్మి, నిరాకృతిః।
నిర్వికల్పోఽస్మి। నిత్యోఽస్మి।
నిరాలంబోఽస్మి నిర్ద్వయః।

ఒకచోట ఒక ఘటము (లేక) కుండికము (కుండి - Pot made up of Mud) ఉన్నది. ఆ కుండి యొక్క ‘‘గుండ్రటి -శంఖు - నలుచదరపు’’ ఆకారధర్మములు ఆ కుండి ఉన్న చోటు (లేక) ఆకాశమును స్పృశిస్తాయా? లేదు కదా! అట్లాగే దేహ - మనో - బుద్ధి ఇత్యాది ధర్మములచే నేను స్పృశించబడను. దోషము పొందను.
→ సదాశివుడను, అఖండాత్మ స్వభావుడను,
→ క్రియలకు సంబంధితుడను, బద్ధుడను కాను. నిష్క్రియుడను.
→ శరీరము మొదలైన పాంచభౌతిక వస్తువుల వలె సాకారుడను కాను. నిరాకారుడను. నిరాకృతుడను.
→ ఎట్టి గుణ దోషములు నాకు ఆపాదించబడజాలవు. అవికారుడను.
→ సర్వ సంకల్ప (Ideation) వికల్పము ( withdrawal of Idia)లకు మునుముందే వాటికన్నిటికీ ఆధారుడను. నిర్వికల్పుడను.
→ కాలఃకాలుడను. కాలనియామకుడును. త్రికాలములలో ఏకస్వరూపుడనై ఉన్నవాడను. కనుక నిత్యుడను.
→ నాకు అన్యమైన దేనిపైనా ఆధారపడిలేను. నాకు నేనే ఆధారుడను. నిరాధారుడను. నిరాలంబుడను. ఆలంబనా రహితుడను. దేని ఆవశ్యకత లేనివాడను.
→ నాకు ద్వితీయమైనదేదీ ఎక్కడా లేదు. నిర్ద్వంద్వుడను.

సర్వాత్మకోఽహమ్। సర్వోఽహమ్।
సర్వాతీతోఽహమ్ అద్వయః।
కేవలాఖండ బోథోఽహమ్।
స్వానందోఽహం నిరంతరః।
స్వమేవ సర్వతః పశ్యన్
మన్యమానః స్వమద్వయమ్
స్వానందమ్ అనుభుంజానో
నిర్వికల్పో భవామి అహమ్।
- నా ఆత్మ ఒక శరీరమునకు పరిమితమైనది కాదు. సర్వుల ఆత్మగా వెలుగొందుచున్నట్టిది. అందుచేత నేను సర్వాత్మకుడను.
- ఈ సర్వముగా కనిపిస్తున్నది నేనే! సర్వుడను.
- ఈ సర్వమునకు అతీతుడను. సర్వత్రా సమస్వరూపుడను. అద్వయుడను.
- సర్వము ఎరుగుచున్నట్టి కేవలబోధ స్వరూపుడను. అనేకము ఎరుగుటచే అనేకముగా అగుటలేదు. కేవల - అఖండ ఏక బోధస్వరూపుడను. ఇదంతా నా యొక్క ఆత్మానందప్రదర్శనమే. సర్వదా స్వానంద స్వరూపుడను.
స్వయముగా సర్వత్రా దృష్టులు కలిగియుండి సర్వత్రా సర్వమును దర్శించుచూ, స్వయముగా సర్వదృష్టులకు అద్వయుడుగా, అనన్యుడుగా ఏర్పడి ఉన్నవాడను.
ఈ జన్మలు, కర్మలు మొదలై సమస్త వ్యవహారము కూడా స్వానందముగా ఆస్వాదిస్తూ సర్వదా నిర్వికల్పుడైన, సర్వత్రా సంప్రకాశకుడనై ఉన్నవాడను.
గచ్ఛం తిష్ఠన్, ఉపవిశన్,
శయానో వా, అన్యథాపి వా,
యథేచ్ఛయా వసేత్ విద్వాన్
ఆత్మారామః
సదా మునిః।।
ఆత్మారాముడగు అట్టి ఎరుకగల ముని ఎక్కడకు వెళ్లుచున్నప్పటికీ, ఎక్కడ కూర్చుని ఉన్నప్పటికీ, విశ్రాంతి పొందుచున్నప్పటికీ శయనిస్తున్నప్పటికీ, మరింక ఏవిధంగా ఉన్నప్పటికీ, యధేచ్ఛగా ఉంటూనే ఆత్మయందు రమిస్తూ ఉంటాడు. సందర్భములవశంగా ‘తదితరము’గా ఉన్నదంతా ఆత్మయందే ఆత్మగా దర్శిస్తూనే, ‘అన్యము’ అనునదే లేనివాడై ఉంటాడు. ‘మౌనము’ను కలిగి ఉండి ఆత్మానందమును సదా ఆస్వాదిస్తున్నాడు.

(మౌనము = ఏది ఎట్లా ఉన్నప్పటికీ నాయొక్క ఆత్మతత్త్వమునకు లోటు లేదు - అను స్వాభావిక సునిశ్చయత్వము = తత్‌భావనా మౌనమేవ ముని ధర్మమ్।।)

ఇతి కుండికోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



సామవేదాంతర్గత

4     కుండిక ఉపనిషత్

అధ్యయన పుష్పము

ఈ ‘మానవజన్మ’ మహత్తరమైన ‘సదవకాశము’గా విజ్ఞులచే ఎలుగెత్తి గానము చేయబడుచూ గుర్తు చెప్పబడుతోంది. 5వ సంవత్సరములో ప్రవేశించిన బిడ్డ - ఇక ‘‘ద్విజుడు - ద్వితీయజన్మ’’-అనబడు (బ్రహ్మతత్త్వ అధ్యయన జిజ్ఞాసకొరకై) ‘బ్రహ్మచర్య - ఆశ్రమము’ స్వీకరించును గాక. సద్గురువును ఆశ్రయించి ‘లోకసేవ’ కొరకై లోకసంబంధవిద్యను, (మరియు) ఆత్మతత్త్వజ్ఞానము కొరకై ఆధ్యాత్మ శాస్త్రమును అధ్యయనము చేయాలి. ఈ విధంగా ‘విద్యార్థి దశ’ పూర్తయ్యేవరకు గురుశుశ్రూష చేస్తూ ‘గురు-ఆశ్రమీ’ అయి ఉండునుగాక। వేద హృదయమును, సద్గురు ప్రవచన పరమార్థమును అభ్యసించును గాక!

విద్యాభ్యాసము ముగిసిన తరువాత, ఆపై సరియగు సమయములో సద్గురువు శిష్యుని పిలిచి, ఈ విధంగా సంబోధిస్తున్నారు.

సద్గురు అభిభాషణము

గురువు (శిష్యునితో) : బిడ్డా! శిష్యా! వేద-వేదాంతములను అధ్యయనము చేసావు. ఇప్పటికి నావద్ద నీ విద్యా-అధ్యయనము పూర్తి అయినది. ఇక నీవు నీ ఇంటికి వెల్లవచ్చు. నీకు గృహస్థాశ్రమము స్వీకరించటానికి అనుజ్ఞ ఇస్తున్నాను. అప్పుడు కూడా మన ఆశ్రమములో నేర్చిన ‘‘అగ్ని కార్యము’’ మొదలైన దైనందిక ఉపాసనలు కొనసాగించు. మాతృ-పితృ దేవతలపట్ల, తదితర కుటుంబసభ్యుల పట్ల, సహజనులపట్ల నీవు విద్యుక్త ధర్మములను సమర్పణభావంతో నిర్వర్తించు. సముత్సాహవంతుడవై ఉత్తరోత్తర ఆశ్రమ ధర్మములను తగిన సమయములో స్వీకరించు. ఇహ - ఆముత్ర ఉత్తమ పవిత్ర ప్రయోజనములను సిద్ధించుకొనెదవు గాక.

గృహస్థాశ్రమము

ఆ విధంగా ‘‘గురుణాశ్రమీ’’ అనబడు బ్రహ్మతత్త్వ అధ్యయనముతో కూడిన ‘‘బ్రహ్మచర్యాశ్రమము’’ను ముగించుకొని ఆ విద్యార్థి తిరిగి ఇంటికి చేరుకున్నాక, తాను గురువుచే బోధించబడిన ‘అగ్నికార్యము, సంధ్యావందనము’ దైనందిక అనుష్ఠానము నైమిత్తికమగు కర్మలు (పరవడిరోజులలో పూజలు మొదలైనవి) యధాశక్తిగా నిర్వర్తిస్తూ జీవనోపాధిని ఆశ్రయిస్తూ ఉండును గాక.

పెద్దల నిర్ణయానుసారము వివాహము చేసుకొనును గాక. ‘‘ఆత్మోద్ధరణ’’యే పరమలక్ష్యముగా కలిగియుండి గృహస్థాశ్రమధర్మములగు ధర్మ-అర్ధ-కామములు, దానము, పెద్దలసేవ, తత్త్వాధ్యయనము, బ్రహ్మజ్ఞానము వినటము, బోధించటము, భక్తి, యోగాభ్యాసము…ఇత్యాదులు శ్రద్ధగా చేయుచుండునుగాక. ‘‘జగత్-దృశ్యమును ఆత్మభావనతో ఉపాసించటము’’…ను అనునిత్యము చేసుకొనుచుండునుగాక. ‘ఇష్టము’ అనబడు అగ్నియజ్ఞము, ఆత్మయజ్ఞము (అహమ్ బ్రహ్మాఽస్మి, తత్‌త్వమ్, అయమాత్మా బ్రహ్మ మొదలైన మహావాక్యార్థములను లోకకళ్యాణభావనతో) అనుష్ఠించుచుండును గాక!

‘‘నూతులు త్రవ్వించటము’’ మొదలైన ‘పూర్తములు’ అనబడు సాంఘిక సేవా కార్యక్రమములు నిర్వర్తించునుగాక. వంశపారంపర్య సంపదలును, న్యాయార్జిత-దైవార్చిత-భూతార్పిత సమన్వితమగు సంపదలు వృద్ధి చేయును గాక.

సంతానమును పొంది ఈశ్వర భావనతో లోకానుకూల్యంగా వారిని తీర్చిదిద్దును గాక. ‘దైవభక్తి, యోగాభ్యాసము, విద్యార్జనము’ నేర్పించుచూ సంతానమును యజ్ఞభావముగా పెంచునుగాక! జీవితమంతా కూడా బ్రహ్మము గురించిన అధ్యయనము నిర్వర్తిస్తూ బ్రాహ్మీభావనను - స్వాభావికము, అనునిత్యము చేసుకొనును గాక.

వానప్రస్థాశ్రమము

ఈ విధంగా ఇష్టా (యాగ, యజ్ఞములను)-పూర్త (లోకోపకరణములు) నిర్వర్తిస్తూ గృహస్థాశ్రమమును నిర్వహిస్తూ, సరి అయిన సమయ - సందర్భములలో లోకసంబంధమైన బాధ్యతలను సంతానమునకు అప్పజెప్పి ‘వానప్రస్థాశ్రమము’నకు ఉపక్రమించును గాక.

💐 తనకు సంబంధించిన సంపదలను సంతానమునకు పంచి వేసి,
💐 సర్వ లోక సంబంధమైన ఆశయములను విడచివేసి,
💐 శేషించిన జీవితమును పూర్తిగా ఆధ్యాత్మిక మార్గమునందు వెచ్చించుటకై సంసిద్ధుడగును గాక.
💐 అందుకొరకై వనములలో (సాంఘిక వాతావరణమునకు సుదూరంగా) ఏదైనా ఏకాంత (సాధనమునకు సానుకూల్య) ప్రదేశమును ఎన్నుకొనును గాక. ఈ విధంగా వానప్రస్థాశ్రమము స్వీకరించును గాక.
💐 శరీర రక్షణ కొరకు మాత్రమే ఉద్దేశ్యిస్తూ సులభంగా పరిసరములలో లభించేది, సాత్వికము అగు ఆహారము స్వీకరించుచుండునుగాక! కందమూల ఫలములను, వాయు-జలభక్షణ ఇటువంటి నియమములు, నిష్ఠలు ఆచరించును గాక!
💐 ఇక లోక సంబంధమైన సర్వచింతనలను (ఆత్మజ్ఞానముపట్ల ఏర్పడు) ఇష్టముతో త్యజించి, తనశరీరమును పృథివీభావనతో దర్శిస్తూ (మట్టి-రాయి వలె భావిస్తూ) మోక్షమార్గములగు యోగాభ్యాసము, జ్ఞానాధ్యయనము మొదలైన వాటికి పరిమితుడై ఉండును గాక.
💐 ఇంద్రియానందములన్నిటికీ మొదలంట్లా ముగింపు పలికి, దేహేంద్రియములను ఉపకరణభావంతో నియమించును గాక.

సన్న్యాస యోగము

ఇప్పుడిక సన్న్యాసయోగము గురించి చెప్పుకుందాము. సహ తేనైవ పురుషః కథం సన్న్యస్త ఉచ్యతే? ‘సన్న్యస్తుడు’ అని ఎవరిని అంటాము? కేవలము ఇంద్రియములను కందమూలఫలముల ఆహారముతోను, వనప్రదేశ విహార నివాసములతోను నియమించినంత మాత్రముచేత సన్న్యాసయోగము సిద్ధిస్తుందా? స నామధేయో యుస్మింస్తు కథం? ‘సన్న్యాసి’ అనే పేరుచేత పిలువబడిన మాత్రం చేత సన్న్యాసయోగము లభిస్తుందా? లేదు. మరి?

తస్మాత్ ఫల విశుద్ధాంగీ సన్న్యాసమ్ సంహితాత్మనామ్। సర్వలోకసంబంధమైన భేదములను త్యజించి సర్వత్రా సమస్వరూపమైయున్న అచంచలమగు ‘ఆత్మదృష్టి’ (లేక, భౌమా దృష్టి) చే సత్ + న్యాస = సన్న్యాసి - అవాలి.

ఈ విధంగా (1) గృహస్థాశ్రమములోని నియముల వ్యాజము. (2) ఏకాంత వనప్రదేశ ప్రవేశము (3) యోగసాధనలచే వానప్రస్థము సిద్ధిస్తోంది. సర్వత్రా ‘‘సత్-దర్శన స్వాభావికము’’చే సన్న్యాసము పరిపూర్ణమగుచున్నది.

మహదాశయుడు / మహాశయుడు

గృహస్థాశ్రమములో భార్య - పిల్లలు, సంపదలు…ఇవన్నీ సుఖరూపమువలె సామాన్యముగా జనులచే చూడబడుచున్నాయి. అయితే మహదాశయుడు వాటిని స్వల్పాశయములు (లేక) సందర్భమాత్రములుగా గమనిస్తున్నాడు.

అని నిర్ణయించుకొని ‘‘అనామయము-అతిరహస్యము’ అగు ఆత్మస్థానమును చేరెదరుగాక! గుహ్యం ప్రవేష్టుమ్ ఇచ్ఛామి పరంపదమ్ అనామయమ్ - ఇతి।’’-అని నిర్ణయించుకొనుచున్నాడు. సన్న్యాసయోగము (లేక) సన్న్యాస ఆశ్రమము స్వీకరించుచున్నాడు.

‘‘సన్న్యాసము (సత్‌ను ఉపాసించటము)’’ - అనే అగ్నిచే పునరావృత్తి దోషరూపమగు మృత్యువుయొక్క పరిధిని అధిగమించుటయందు ప్రయత్నశీలుడగుచున్నాడు. సన్న్యాసాగ్నిమ్ అపునరావర్తనం యన్మృత్యుర్జాయమ్ ఆవహమితి।।

అందుకు మార్గము → సన్న్యాస ఆశ్రమ నియమనిష్ఠ. ‘‘ఇదంతా నాదికాదు. నేను దీనికి సంబంధించిన వాడిని కాదు’’ అనూవగాహన.

అధ్యాత్మ మంత్రాన్ జపేత్। ఇక అతడు ఆత్మయొక్క కేవలత్వమును, ఆవిష్కరత్వమును, అఖండత్వమును, అప్రమేయత్వమును, నిత్యత్వమును, సత్యత్వమును జపించునుగాక! (ఆధ్యాత్మమ్ = ఈ దేహమును, సమస్త దృశ్యమును ధారణచేయుచున్న స్వస్వరూపాత్మయొక్కభావన)

(సన్న్యాస) దీక్షామ్ ఉపేయాత్ : అనేక భేదములతో కూడిన జగత్తును - జగత్తుగా కాకుండా - ఆత్మగా ఈ మస్తమును దర్శించు దీక్షకు ఉపక్రమించునుగాక। ‘‘సర్వము స్వస్వరూపమునకు అభిన్నము కదా’’ - అను కైవల్యానుభవమువైపు దృష్టి సారించునుగాక।
సన్న్యాస విధులు :

కాషాయ వాసాః : బాహ్య - అభ్యంతరముల పరిశుద్ధతను ఉద్దేశ్యించి కాషాయ వస్త్రధారణను స్వీకరించుచున్నాడు.

కక్షా-ఉపస్థ లోమాని వర్జయేత్ : చంకల - ఉపస్థరోమములు త్యజించుచున్నాడు.

ఊర్ధ్వబాహుః విముక్త మార్గోభవతి : పైకెత్తి ఉంచిన చేతులతో - మోక్షమార్గమును అభ్యసించువాడై ఉంటున్నాడు.

అనికేతః చరేత్ నిదిధ్యాసనమ్ దద్యాత్ : గృహసంబంధమైన సర్వ విషయములను మొదలంట్లా మానసికంగా త్యజించివేయుచున్నాడు. ధ్యాసను సమస్తమునకు మూలాధారమగు ఆత్మగా ఈ సమస్తమును దర్శించుటయందు ఉద్యుక్తుడగుచున్నాడు.

శ్రవణము - బ్రహ్మతత్త్వము గురించి గురు / శాస్త్రముల ఆశ్రయముచే అధ్యయనము చేయటమును తీవ్రము చేసుకొంటున్నాడు. సత్సంగమును ఆశ్రయిస్తున్నాడు. ఆత్మజ్ఞులగు వారిని సమీపించి శ్రవణము చేస్తున్నాడు.

మననము - సర్వము ‘‘బ్రహ్మముగా అనుకోవటము’’ను ఆశ్రయిస్తూ, క్రమంగా ‘‘బ్రహ్మముగా అనిపించటము’’ అనే రూపముగల ‘‘నిదిధ్యాస’’ను సిద్ధింపజేసుకొనుచున్నాడు.

ఈ స్థితిలో జంతు (లేక) దేహపరిమిత భావములను అధిగమించుటకొరకై మహనీయుల చరిత్రలను, అవతారమూర్తుల దివ్యగుణములను పారాయణం చేస్తూ పవిత్ర భావములను కలిగి ఉంటున్నాడు. దీనిని గురించి ఇంకా ఈ విధంగా ‘శ్లోకములు’’ చెప్పబడుచున్నాయి.

అట్టి సన్న్యాసాభ్యాసి - కుండికము (కుండీ), చమకము (చెంబు), త్రివిష్టపము (త్రిలోకసంజ్ఞయగు మూడు ముఖములపాత్ర- పిలక), కాలిచెప్పులు, బొంత వస్త్రము, శాటినీ వస్త్రము (పైపంచ), గోచి మొదలైన సర్వధారణములపై మోజును (గ్రాహ్య త్యాజ్య పట్టుదలలను) త్యజించినవాడై ఉంటున్నాడు. పవిత్రము (దర్భాసనము), స్నానవస్త్రములు, ఉత్తరీయము మొదలైన సర్వధారణలందు కించిత్ అపేక్షకూడా లేనివాడై సర్వము త్యజించి ‘యతి’ అయి ఉంటున్నాడు. ఇల్లు వదలుచున్నాడు.

నదీతీరములో, దేవతాప్రాంగణములో - శయనించే (నిద్రపోయే) చోటులుగా కలిగి ఉంటున్నాడు. భౌతిక శరీరమును సుఖ- దుఃఖ స్పర్శధ్యాసలను లేనట్టిదిగా మలచుకొనుచున్నాడు. స్నానము, పానము, శుచిత్వము - ఇవన్నీ పవిత్రజలము (ఉదాహరణ → నదీజలము)… లభించే చోట మాత్రమే నిర్వర్తిస్తున్నాడు.

దృశ్యపరిధులను దాటి ఆత్మభావనను మననము చేస్తూ ‘యతి’ అగుచున్నాడు. అట్టి యతి జనుల స్థుతిచే పొంగడు. నిందలకు క్రుంగడు. ఇతరుల తప్పులను మాట్లాడడు. ఎవ్వరినీ దూషించడు. శపించడు. స్తూయమానో న తుష్యేత। నిందితో న శపేత్ పరాన్।

భిక్షకొరకు, స్నాన - పానములకొరకు పాత్రను, దేహరక్షణకొరకు వస్త్రమును మాత్రము - (అనివార్యమగు వస్తువులను మాత్రమే) ఉంచుకొని, తదితరమైనవన్నీ త్యజించివేసి ఉంటాడు.

‘‘సర్వము సర్వదా బ్రహ్మమే! ఆత్మనగు నాకు సర్వము అనన్యము’’ అను రూపముగల భావనలను ఆశ్రయిస్తూ, ఇంద్రియములవలన కలుగుచున్న విషయ-భేద దృష్టులన్నీ సన్న్యాసాగ్నిచే దగ్ధము చేస్తూ ఉంటాడు.

శరీముతోను, మనస్సుతోను అభ్యాసయోగమును ఆశ్రయిస్తూ, పరమాత్మతత్త్వమును జపిస్తూ,-విశ్వ అయమ్ అనుసంయోగాత్ మనసా భావయేత్ సుధీః।

ఈ విశ్వమును విశ్వేశ్వరుని ప్రత్యక్షరూపంగా భావించుటయందు మనోభావనను నియమిస్తూ బుద్ధితో సర్వము పరమాత్మ స్వరూపంగా దర్శిస్తూ - ఆరాధించుటయందు వృత్తిని, అవగాహనలను, పెంపొందించుకొంటూ ఉంటున్నాడు. విశ్వమును భేదదృష్టితో చూడక, భేదములందు మునగక, విశ్వమును విశ్వేశ్వరోపాసనతో ‘సమదర్శి’ అయి దర్శిస్తూ ఉంటాడు.

యతియొక్క జగత్ సందర్శనము

ఆత్మనుండి → ఆకాశము
ఆకాశము నుండి → వాయువు
వాయువు నుండి → జ్యోతి / అగ్ని
జ్యోతి నుండి → జలము
జలము నుండి → భూమి

సర్వభౌతిక దేహములు ఆకాశ - వాయు - జ్యోతి - జలము - పృథివి అనబడే పంచభూతముల - సంమిశ్రమముయొక్క - ఆవిష్కరణము (The Formation of Mix - up) మాత్రమే. అనగా అనేక జీవరాసుల చమత్కారములతో కూడిన ఈ సమస్త దృశ్య జగత్తు ఆత్మయొక్క సంప్రదర్శనా - విశేషమే. జీవులంతా సహజముగా బ్రహ్మమే స్వ-స్వరూపముగా కలిగి ఉన్నారు. ఇక దృశ్యజగత్తులో సందర్భమగుచున్నదంతా కేవలము కల్పనామాత్రమే.

అట్టి ప్రతి ఒక్క జీవుని యొక్క, నాయొక్క అనునిత్య-సహజస్వరూపమగు - ఆత్మ యొక్క లక్షణములు ఎట్టివి?

అజరమ్, అమరమ్ - జనన మరణములు లేనట్టిది.

అక్షరమ్ - అవ్యయమ్ - ఆత్మకు క్షీణించటము అనే క్షరధర్మము లేదు. సర్వదా అవ్యయము. తరుగదు. పెరుగదు.

అట్టి ఆత్మయే నా స్వరూపము। అదియే నీవు కూడా।

మమాత్మానంద స్వరూప నిర్ణయము

మం।। శ్లో।। మయి అఖండ సుఖాంభోధౌ బహుధా విశ్వవీచయః
ఉత్పద్యతే, విలీయంతే - మాయామారుత విభ్రమాత్।।

‘‘సముద్రము - తరంగాలు - దృష్టాంతము’’ :

సముద్రంలో తరంగాలు బయల్వెడలి, సముద్ర జలంలో సంచారములు చేసి తిరిగి సముద్రజలంలో లయము అవుతూ ఉంటాయి కదా!

‘‘వాయువు-వాయుతరంగాలు’’-దృష్టాంతము: వాయువునందు వాయుతరంగాలు బయల్వెడలి వాయువునందు విలీనమగుతూ ఉంటాయి కదా!

నాయొక్క అఖండ - సుఖస్వరూప - కేవల ఆత్మసాగరంలో - ‘విశ్వములు’ అనే మాయా (కల్పనా) వీచికలు బయల్వెడలి, ఆత్మయందే ఉనికి కలిగిఉండి…తిరిగి ఆత్మయందే లయమగుచున్నాయి.

ఒక కథారచయిత యొక్క కల్పనా చైతన్యము నుండి కథాగమనమంతా బయలుదేరి, చివరికి ఆ కథావిన్యాసమంతా కథా రచయితయందు విలీనమగు తీరుగా,…. నానుండి స్వకీయమాయచే దేహ - దేహాంతర చమత్కృతులతో కూడిన విశ్వకథాగమనములు బయల్వెడలి, తిరిగి మమాత్మయందే విలీనము అగుచున్నాయి.

విశ్వము ఆత్మకు అభిన్నము : వాయు వీచికలు వాయువే అయినట్లు, సముద్ర తరంగములన్నీ సముద్రజలమునకు అభిన్నమే అయినట్లు, కథా విశేషములన్నీ ఆ రచయితయొక్క ఊహలకు అభిన్నమే అయిఉండువిధంగా,
నా ఆత్మనుండి సంప్రదర్శనమగుచున్న ఈ విశ్వ విశ్వాంతరళములు మమాత్మకు కించిత్ కూడా భిన్నము కాదు. సర్వదా అభిన్నము.

ఆత్మ సర్వదా ఏకమేగాని అనేకము కాదు। అఖండమే గాని ఖండము కాదు.

ఆకాశము : మేఘములు :: ఆత్మ : జగత్తులు

న మే దేహే, న సంబంధో - మేఘేనేవ విహాయనః : ఆకాశంలో మేఘములు సంచరిస్తూ ఉన్నప్పటికీ ఆకాశమునకు మేఘములతో సంబంధమే లేదు కదా!

‘ఆకాశము మేఘములను ధరించినది’ అని కూడా అనలేము. మేఘములు ఉన్నా (లేక) లేకున్నా ఆకాశము సర్వదా యథాతథము కదా। అట్లాగే ఆత్మాకాశస్వరూపుడనగు నాకు ఈ దేహములతోగాని, ఈ దేహముల ద్వారా దర్శించబడే ఇంద్రియ విషయ జగత్ - దృశ్యములతోగాని కించిత్ కూడా సంబంధము లేనేలేదు. మొదలేలేదు. ఇప్పటికీ లేదు. ఎప్పటికీ లేదు.

అతః కుతో మే తత్ ధర్మా - జాగ్రత్ స్వప్న సుషుప్తిషు? ‘‘ఆకాశంలో మేఘములు సంచరిస్తూ ఉంటే, ఆకాశము మేఘముల ఆకారము పొందుచున్నది’’ అని ఎవ్వరైనా అనగలరా? లేదు. ఆకాశము (Space) నకు ఆకారమే లేదు. మేఘములు ఆకార - ధర్మములు ఆకాశమునకు ఆరోపించవీలు కాదు.

అట్లాగే…., జాగ్రత్ - స్వప్న - సుషుప్తులలోని ఆయా విశేషములు, అనుభూతులు, అనుభవములు, సందర్భములు, సంబంధములు, అనుబంధములు, బాంధవ్యములు - మొదలైనవన్నీ ఆత్మాకాశానంద స్వరూపుడనగు నన్ను స్పృశించవు.
ఆత్మనగు నేను ఆయా సందర్భములలోనికి జారిపడువాడను కాను. (I don’t quit from what I am and I do not happen to slip into situations, relationships, contexts etc) .

వాస్తవానికి అవన్నీ కూడా నాయొక్క ఆత్మ తేజస్సుచేతనే సాకారంగా ప్రదర్శనమగుచున్నాయి.

ఆత్మ సర్వదా యథాతథము

జాగ్రత్ స్వప్న సుషుప్తులలోని విశేషములన్నీ నాకు - కధా రచయితయొక్క కథారచనా అంతర్గత సంఘటనల వంటివి మాత్రమే.

సూర్యకాంతిలో ఒక వస్తువు కనిపిస్తూ ఉంటే, సూర్యకాంతి ఆ వస్తువుయొక్క ఆకారము సంతరించుకున్నట్లుగా అవుతుందా? అవనే అవదు. అట్లాగే ఆకాశమువలె, సూర్యకాంతివలె ఈ దృశ్యజగత్తుకు సర్వదా విలక్షణుడను.

కొండపైగల చెట్లు గాలికి అటూ ఇటూ ఊగుచుండవచ్చుగాక! కొండ కదలుతుందా? కదలదుకదా! అట్లాగే, ఈ మనస్సు, అద్దాని ఆశ్రయములు అగు విషయములు కదలుచున్నప్పటికీ, కొండవంటి మమాత్మకు ఎటువంటి చలనస్వభావము లేదు.

కలలో ఒకడు ఒక ప్రదేశమునుండి మరొక సుదూరప్రదేశము వెళ్ళి వచ్చినప్పటికీ జాగ్రత్ దృష్ట్యా వెళ్ళనివాడే అగుచున్నాడు కదా! అట్లాగే సర్వదా కేవలాత్మాకాశ స్వరూపుడనగు నేను జాగ్రత్ - స్వప్న - సుషుప్తులలోనికి గాని, దేహముల లోనికి గాని, లోకములలోనికి గాని, వెళ్ళువాడనుగాను. తిరిగివచ్చువాడను కాను. సర్వదా యథాతథుడనై యథాతథంగా ఆత్మప్రకాశ ప్రదర్శనుడనై ఉన్నాను. (I am always as ’Blossoming SELF - unaffected by events and eventualities of this scinario including Birth and Death)

ఆత్మయే అయి ఉన్న ‘నేను’

ఆకాశము వలె - సమస్త సాకార - పాంచభౌతిక కల్పనలు లేనట్టివాడను.

ఆదిత్యునివలె (సూర్యునివలె) - వెలిగించబడు (వెలుగులో కనబడు) సర్వ వస్తువుల కంటే (దృశ్యముకంటె) విలక్షణమైనవాడను.
కొండవలె సర్వదా నిశ్చలుడను. కొండపైగల చెట్లు గాలికి కదులుతాయిగాని, కొండ గాలికి కదలదు కదా! కించిత్ కూడా చ్యుతిలేనివాడను. అచ్యుతుడను.

సముద్రజలమువలె - ‘అంతు’ అనునదే లేనివాడను. (తరంగములచే సముద్రము ఆది - అంతము పొందదుకదా) (I am Infinite and endless). పంచభూతములచేగాని, కాలము, ఆకాశము, అంతరంగ చతుష్టయము మొదలైన వాటిచేతగాని పరిమితుడనుకాను.

నేను ‘జీవుడు’ అనబడుదానిచే పరిమితుడను కాను. నారాయణోఽహమ్। నరకాన్తకోఽహమ్।

తరంగములచే జలము పరిమితము కాని విధంగా నేను నారాయణుడను. ‘నరుడు’ (జీవుడు) అనబడు జగన్నాటక ‘పాత్ర’కు ఆవల ఉన్నట్టివాడను. నరకాసుర సంహారియగు శ్రీకృష్ణ చైతన్య - నిత్యానందస్వరూపుడను.

‘నరుడు, జీవజాతి మొదలైన సమస్త ‘‘ఆవరణ-విభాగ-ఆపాదనలకు’’ ఆవలివాడను (I am beyond all Zoological & Biological Discriptions / Bifunctions / Attributions). ఈ దేహమునకు ‘దేహి’గా ఆవలివాడను. దేహ-పురములచే సంకుచితుడను అవను. పురాంతకుడను. ఈశ్వర స్వరూపుడనై సర్వత్రా విస్తరించి ఉన్నట్టి పురుషుడను. (I am the worker / Functioner beyond all works / Functions)

అఖండబోధోఽహమ్। నాయొక్క ‘ఎరుక’ అను ‘బోధ’ (They Feature / Quality of ‘knowing’) :-

(1) ఎరుగుచుండు వస్తువుకు పరిమితమైనది కాదు.
(2) ఎరుగబడేదంతా ‘ఎరుక’ యొక్క స్వకీయ విస్తార ప్రదర్శనారూపమే.

నాకు వేరైనదంటూ ఏదీ లేనట్టి ఈ సమస్తమునకు సాక్షిని (A mere witness by being beyond) కూడా! అశేష సాక్షీ। నిరీశ్వరోఽహమ్। నన్ను సాక్షిగా నియమించునది నేనే! నన్ను నియమించు మరొకటేదీ ఎక్కడా లేదు. నాయందు నేనే నాకు అభిన్న జగత్తుగా విస్తరించి ఉన్నాను.

‘నేను’ అను నాయొక్క భావనకు మునుముందే నేను ఉన్నాను.

‘అహం’ భావనకు ముందుగానే, ఆ భావనకు పురుషకారుడనై ఉన్నవాడిని. ‘నిరహమ్’ స్వరూపుడను.

నాకు అన్యమైనదేదీ లేదు. కనుక ‘నాది’ అనునది నాకు వేరై ఎక్కడా లేదు. కనుక నిర్మమ స్వరూపుడను.

అభ్యాస యోగము

ఇంకా కూడా ఈవిధంగా గానం చేయబడుతోంది.

‘‘అహమ్ అఖండ - అప్రమేయ - నిత్య - సత్య ఆత్మస్వరూపమస్మి’’ అను సత్ - భావనాసిద్ధి కొరకై, పరిమితమైన వ్యష్టిభావనను జయించుటకై ‘‘ప్రాణ-అపానసంయమము’’ ‘అభ్యాసము’గా చెప్పబడుతోంది. లోనికి ప్రవేశించు ప్రాణవాయువును, బహిర్గతమగుచుండు అపానవాయువును సమస్థానము నకు జేర్చి ధారణచేయు కుంభకరూప - అభ్యాసమగు ‘ప్రాణాయామము’చే మనస్సు చంచలత్వము వీడగలదు. బుద్ధి నిర్మలత్వము, ఏకాగ్రత సంచరించుకోగలవు.

వ్యష్టిగతమగు ‘జీవుడు’ అను పరిమితధ్యాసను దాటివేసి సమష్టి - సర్వగతమగు ‘శివతత్త్వజ్ఞానము’నందు ప్రవేశించు సాధనలయందు నిమగ్నుడై ఉంటాడు.

‘‘అహమ్ త్వమ్ తత్ ‘‘శివేతి’’ : - ఈ దృశ్యము - ద్రష్ట - దర్శనము , సర్వ సహజీవులు కూడా శివమయమే కదా!’’ - అనునదే శివతత్త్వోపాసన. ‘‘శివభగవానుడే సర్వరూపులుగా ఉన్నారు’’ అను దర్శనమే శివతత్త్వదర్శనము. అథ శైవం పదం యత్ర తత్ బ్రహ్మ। బ్రహ్మ తత్ పరమ్। దేనిని ‘శివము’ అంటున్నామో, అద్దాని తత్త్వార్థము బ్రహ్మమే। తత్ పరబ్రహ్మమే। అట్టి శివతత్త్వము, జ్ఞానముచే ఎరుగబడినదిగాను, ‘‘ప్రాణయోగాభ్యాసము’’, ‘‘మననము’’ ఇత్యాదులచే అనుక్షణిక స్వానుభవముగా తీర్చిదిద్దబడిదిగాను అగుచున్నది.

ప్రాణయోగాభ్యాసము

అటు తరువాత…

ఊర్ధ్వం ప్రపద్యతే దేహాత్ భిత్వా మూర్ధానమ్ అవ్యయమ్। - ఆజ్ఞా చక్రమునుండి యోగాభ్యాసి కుండలినీశక్తి సమేతుడై మూర్థము ( Foreface) నుండి శిరస్సు (బ్రహ్మరంధ్రమును) స్పృశించి, భేదించి, సర్వాత్మకుడగు పరమాత్మయొక్క విశేష సంప్రదర్శనస్థానమగు శిరో - ఊర్ధ్వస్థానము (సహస్రారము) నందు సంస్థితుడు అగుచున్నాడు.

పరావరవిదులు - పరమాంగతి

నేను ‘‘ఈ దేహములో ‘దేహాత్మ’గాను, (అదే సమయములో All at the same time - నాలో దేహము ఉండటంచేత) ‘పరాత్మ’గా కూడా ఉండి ఉన్నాను. లోకములలో నేను ఉన్నాను. లోకములన్నీ నాలోను (స్వకీయ భావనామాత్రంగా) ఉన్నాయి.

⌘ లోకములలో ‘నేను’ = జీవాత్మను। (స్వప్నములోని ‘నేను’ వంటిది)।
⌘ నాలో లోకములు = పరాత్మను। (నాలో స్వప్నము ఉన్నతీరుగా)।
⌘ జీవాత్మగా - సందర్భ మాత్ర సత్యము కాబట్టి ‘వ్యయుడను’. మార్పుచెందు విభాగుడను. (పాదో అస్య విశ్వాభూతాని)
⌘ పరాత్మగా - కేవలాత్మ స్వరూపుడను కాబట్టి అవ్యయుడను. మార్పు చెందనిది (త్రిపాదస్య అమృతం దివి)
⌘ జీవాత్మగా - పరాత్మోపాసకుడను.
⌘ పరాత్మగా - జీవాత్మ నియామకుడను.

స్వస్వరూపముయొక్క - ‘‘మార్పు చెందు ‘4’వ వంతు - ‘మార్పుచెందని మిగతా ‘3’ వంతుల విభాగము’’లు సమన్వయమే ‘‘విభాగయోగము’’

అట్టి, స్వాభావిక అనునిత్య అవగాహనతో కూడి ‘‘స్వస్వరూపాత్మాజ్ఞాన సమన్విత ఆస్వాదన’’ యే ‘‘పరమాగతి’’।

స్వదేహస్య తు మూర్థానం యే ప్రాప్య పరమాంగతిమ్ భూయః తే న నివర్తంతే పరావరవిదో జనాః। ఆ విధంగా మూర్థస్థానమును దాటి ‘‘జగత్తులో నేను - నాలో జగత్తుల సమన్వయస్థానము’’…అనబడు సహస్రారము (శిరో ఊర్ధ్వస్థానము) సిద్ధించుకొన్నయోగి పరమాగతిని సిద్ధించుకొనుచున్నాడు. అట్టివాని పరమాంగతి ఇక పునరావర్త దోషము లేనట్టిది అగుచున్నది.

సర్వసాక్షిణమ్ : - అట్టివాడు సర్వమునకు ‘సాక్షి’ అయి, విలక్షణుడై, పరము (ఆవల)గా ప్రకాశించుంచుచుండగలడు. న సాక్షిణమ్ సాక్షి ధర్మమ్ సంస్పృశంతి విలక్షణమ్ - అట్టి ‘‘సాక్షి - సాక్షిధర్మము’’ సిద్ధించుకొన్నయోగి యొక్క ‘‘కేవలసాక్షిత్వము’’ - జగత్‌వ్యవహారమార్పు చేర్పులచే ఏమాత్రము స్పృశించబడదు. ‘ఈ దేహముల రాకపోకలకు, వాటివాటి అంతర్గత విశేషములకు పట్టుబడక, సమస్తమునకు విలక్షణుడై ఉంటాడు.

గృహధర్మాః ప్రదీపవత్ అవికారమ్ - ఉదాసీనమ్। ఒక ఇంటిలో వస్తువులు దీపపుకాంతిలో అస్తవ్యస్తంగా కనబడుతూ ఉన్నాయి. వస్తువులు అస్తవ్యస్తంగా ఉండటానికి, ఆ గదిలో దీపపు వెలుగు కారణమా! కాదు. అయితే, దీపపు వెలుగులో మాత్రమే వస్తువులు చూడగలుగుచున్నాము. అంతవరకే. ఆ వస్తువుల ఆకారములు మొదలైనవాటి కర్తృత్వము దీపపుకాంతికి ఆపాదించలేము.

ఆత్మయొక్క వెలుగులో (జ్యోతిస్వరూపంలో/ కాంతిలో) సాకారయుక్తమైన దృశ్య-దేహ-మనో-చిత్త-అహంకార-త్రిగుణ-దేహి-దేహ వ్యవహారములన్నీ అనేక వికారములతోను, ప్రవర్తనలతోను కనిపించవచ్చుగాక। వాటివాటి ఆకారవికారాదులు ఆత్మను స్పృశించవు. ఆత్మ సర్వదా అవికారము, ఉదాసీనము కూడా.

సర్వదా చైతన్య స్వరూపుడను : ఇదమ్ జడాత్మాకమ్। అహమ్ చైతన్యాత్మకమ్। ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము అహంకారము మొదలైనవన్నీ స్వతంత్రంగా ప్రవర్తించేవి కావు. కనుక ఇవన్నీ జడాత్మకమైనవి (Passive). వీటిని కదిలించే (చేతనము చేస్తు) చైతన్య స్వరూపుడను నేనే (Active)

నిత్యనిర్మలుడను : జలేవాపి, స్థలేవాపి లుఠతు ఏష జడాత్మకః। నాఽహం విలిప్యేతే తత్ ధర్మైః - ఘటధర్మైః నభో యథా। ఈ భౌతికదేహము, ఆలోచన (మనస్సు), చిత్తము (ఇష్టము) మొదలైనవి ఎక్కడైనా (వస్తు - విషయ సంబంధములు కలిగి) దొర్లుతూ ఉండవచ్చును గాక! అవన్నీ చైతన్యస్వరూపుడనగు నాయొక్క చేతన చమత్కారంచేత ప్రవర్తన శీలత్వము సంతరించుకుంటున్నాయి. వాటివాటి ధర్మములు అస్మత్ కేవల చైతన్యతత్త్వమును తాకలేవు. దోషమును కలిగించజాలవు.

సర్వదా అస్పృశ్యుడను. ఒకచోట కొన్ని ‘కుండలు’ ఉన్నాయి. ఆయా కుండల యొక్క బాగున్న ఆకారములు, బాగోలేని ఆకారములు, వాటి క్రొత్తతనము, పాతదనము, వాటియొక్క గట్టితనము, మెత్తటితనము, వాటి పగుళ్ళు, గీతలు మొదలైనవాటితో ‘ఆకాశము’ (Space)నకు సంబంధమేమైనా ఉన్నదా? ఆకాశము సర్వదా అప్రమేయము, అస్పృశ్యము కదా! అట్లాగే ఆత్మయొక్క చైతన్యముచే చేతనమువలె కనిపించే జన్మ-కర్మ-దేహ-దేహాంతర-త్రిగుణ వ్యవహార దోషములేవీ ఆత్మరూపుడనైఉన్న నన్ను తాకజాలవు. ఆత్మయొక్క (మమాత్మ స్వరూపము యొక్క) ‘‘నిర్మలత్వ-అఖండత్వ-అప్రమేయత్వ-నిత్యత్వ-సత్యత్వ’’ మొదలైన ఇత్యాది మహత్ ధర్మములకు వచ్చే లోటు ఏమాత్రం ఉండజాలదు. ఇదియే ఆత్మజ్ఞానము. కుండికోపనిషత్ సారము.

నిష్క్రియోఽస్మి : నాటక దీపము ఏవిధంగా కర్తృత్వ-భోక్తృత్వరహితమో, ఆకాశము ఏ తీరుగా క్రియా వ్యవహారరహితమో, ఆత్మనగు నేను సదా నిష్క్రియుడను. నాటకములో ఒక పాత్ర అనేక క్రియలు నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ, ‘‘అవన్నీ రచయిత చేస్తూ ఉన్న క్రియలు’’ - అని ఆపాదించముకదా। ‘‘జన్మలు, జన్మాంతరములు’’ మొదలైనవి జరుగుచూ ఉన్నప్పుడు కూడా, - ఆత్మగా నేను సర్వదా నిష్క్రియుడను.

అవికారోఽస్మి : పుట్టుక, ఎదుగుదల, వార్ధక్యము, తరుగుదల, వినాశనములు మొదలైనవి శారీరక వికారములు.

‘‘నేను’’కు మార్పు, చేర్పులు ఉండవు. ఆత్మగా నేను వికారములేవీ లేనివాడను.
⌘ జన్మ-పునర్జన్మ-జన్మాంతరములు మొదలైనవి జీవాత్మవికారములు.
⌘ ఆలోచించటం, ఆలోచించకపోవటము మనోవికారములు.
⌘ తెలిసినవి, తెలియనివి మొదలైనవి, బుద్ధియొక్క వికారములు.
⌘ ఇష్ట, అయిష్టములు మొదలైనవి, చిత్తముయొక్కవికారములు.
⌘ మాన-అవమానములు మొదలైనవి అహంకారముయొక్క వికారములు.

ఇవన్నీ కూడా నాకు సంబంధించిన వికారములే కావు ఆత్మగా నేను సర్వదా అవికారుడను.

నిష్కళోఽస్మి: ఆత్మస్వరూపుడనగు నాకు జన్మ - కర్మ - లోక వ్యవహారములకు సంబంధించిన ఏ కళంకము అంటదు. ఆపాదించబడజాలదు. ఎల్లప్పుడూ నిష్కళంకుడను. అట్టి నిష్కళంకాత్మయే నాయొక్క (మరియు) తదితర సమస్త జీవులయొక్క (ఇంకా) ఈ జగదృశ్యముయొక్క వాస్తవరూపము. కేవలమగు నా ‘దేహి’ స్వరూపము జన్మ-కర్మల సంబంధమైన ఏ దోషమూ ఎప్పుడూ పొందదు.

నిరాకృతిః : ఈ భౌతిక దేహమునకు ‘‘ఇది ఆకృతి। ఇది జాతి। ఇది ఆశ్రమము। ఇది కులము। ఇది మతము।’….మొదలైనవి ఉండవచ్చు గాక। మరి ఈ దేహమును ఆభరణమువలె ధరించి, దీనిని కదల్చుచున్న ‘దేహి’కి? ఆత్మగా ఆకారపరిమితుడను కాను. నిరాకృతుడను. నిరాకారుడును. ‘నేను’కు గాని, ‘భావన’కు గాని ‘ఇది’ అనబడే ఆకారమెక్కడిది?

నిర్వికల్పోఽస్మి : సంకల్పములకు (సంకల్పించువాడుగా) మునుముందే ఉన్నట్టివాడను. సర్వదా నా ఆత్మస్వరూపము సంకల్ప (Thinking about some thing) - వికల్ప ( withdrawal of thinking from that something) - ములకు వేరై ఉండగా, నేను నిర్వికల్పుడను.

నిత్యోఽస్మి : కాలము సందర్భములకు సంబంధించినది. మరి నేనో? సందర్భములకు మూలపురుషకారమును. త్రికాలాబాధ్యుడను. (Indivisible and unpartitionable by Time Factor Viz., The Past, The Present and The Future) నిత్యుడను.

‘‘ఇతఃపూర్వము, ఇప్పుడు, ఇకముందు’’ కూడా ‘నేను’ అనేది ‘నేను’గానే ఉంటుందిగాని, మరొకటిగా అవదు.

నిరాలంబోఽస్మి : కేవలాత్మగా నేను స్వయంకృతుడను. స్వయం సంకల్పుడను. మనోబుద్ధి చిత్త అహంకారాలు నానుండి ‘ఉనికి’ని పొందుచున్నాయి. అంతేగాని నేను దేహాదులపై ఆధారపడి ఉండువాడనుకాను. ఆలంబనముయొక్క ఆవశ్యకత లేనివాడను. నిరాలంబుడను. దేహము ఉన్నా, లేకున్నా కూడా నాకు నేనైయున్న స్వావలాత్మాంనంద స్వరూపుడను.

నిర్ద్వయోఽహమ్। : నాయొక్క కల్పనా - ఊహా - భావనా రూప ప్రకృతి నాకు వేరైనదికాదు. ‘‘కోపము తనదైనవానికంటే ‘కోపము’నకు వేరుగా ఉనికి లేని తీరుగా, నాకు ద్వితీయమై ఎక్కడా ఏదీ లేదు. అద్వితీయుడను. అద్వయుడను. కలలో ఏది ఎక్కడ ఎట్లా కనిపించినప్పటికీ, కలలో కనిపించే సమస్తము కల తనదైనవానికి భిన్నము కాదు కదా! నాచే అన్యరూపమగు దృశ్యవ్యవహారముగా చూడబడేవంతా మమాత్మ కంటే అన్యము ఏమాత్రము అయిఉండలేదు.

సర్వాత్మకోఽహమ్। సర్వోఽహమ్। : - ‘‘మమాత్మా సర్వ భూతాత్మ’’- అనునది వేదమహావాక్యము. ‘ఆత్మ’గా నేను ఒక్క శరీరమునకు పరిమితుడనైనవాడను కాను. సాకారములగు అసంఖ్యాక తరంగములన్నిటిలో ఒకే నిరాకార జలముయొక్క ప్రదర్శనమే కదా! అట్లాగే ‘‘అఖండ, అప్రమేయ, నిత్య-నిర్మల’’ ఆత్మయొక్క ప్రదర్శనమే - ఈ అనేక జీవుల సంప్రదర్శనము. ఒక తరంగములోని జలమే సర్వే సర్వత్రా అన్ని తరంగములలోను, తరంగముల మధ్యగాను (నిస్తరంగముగా) వెలయుచున్నట్లుగా, ఆత్మస్వరూపుడనగు నేనే సర్వ సహజీవులయందు కూడా ఆత్మస్వరూపుడనై వెలయుచున్నాను. కథలోని సంఘటనలన్నీ ‘‘కథారచయిత యొక్క ఊహా, కల్పనా చైతన్య చమత్కారమే’’ అయినట్లుగా నాకు అన్యమై కనిపించేదంతా అనన్యతత్త్వస్వరూపుడనగు నాకు అనన్యమే। కనుక ఇదంతా నేనే। నా భావనయే। ఊహయే. మమ చైతన్యస్వరూపమే! నేను సర్వదా సర్వాత్మకుడను। సర్వ బాహ్య - అభ్యంతర స్వరూపుడను కూడా.

సర్వాతీతోఽహమ్ : నాటక రచయిత - నాటకములోని పాత్రలయొక్క సమస్త పరస్పర సానుకూల్య - ప్రాతికూల్య సంబంధ - అనుబంధ-బాంధవ్యములకు, పాండిత్య విశేషములకు, త్రిగుణవిశేషములకు - సర్వదా అతీతుడైనవాడే కదా! ఏపాత్రయొక్క ఏ ఒక్క గుణము కూడా రచయితకు ఆపాదించలేము. నేను నాచే స్వకీయ రచనగా ఆస్వాదించబడు దృశ్య వ్యవహారమునకు అతీతుడను. చిత్రలేఖనమునకు ఆ చిత్రకళాకారుడు వేరే. అంతేగానీ, చిత్రలేఖనము (Piece of Art) లోని ఆయా లక్షణములు (ముఖము పెద్దది, చిన్నది - మొదలైనవి) - ఆ చిత్రలేఖకుని (Artist) లక్షణములు కాదు కదా! (The contents in a piece of Art are not the qualities of the Artist). (న చ మస్ధాని భూతాని।). నాయందు లోకములు లేవు. మరింకేమీ లేదు.

అద్వయః

(‘‘మృత్తిండమేకమ్ - బహుభాండరూపమ్। సువర్ణమేకమ్ - బహుభూషణాఢ్యమ్।
గోక్షీరమేకమ్ - బహువర్ణ ధేనుమ్। శరీరమేకమ్ - పరమాత్మమేకమ్।’’ - అను శ్లోకము గానము చేయుతీరుగా)

ఆత్మ ఏ జీవునికి వేరైనది కాదు. ఏ జీవుడూ అద్దానికి ద్వితీయము కాదు. ఆత్మ అద్వయము. మరి నేను నీవు మొదలైనవి ఆత్మకానిది ఎప్పుడు? ఎప్పుడూ లేదు.

ఆత్మ కానిది ఏదీ లేదు. ఆత్మ మరొకటేదీగా అవటమూ లేదు. అందుచేత ఆత్మయే అయి ఉన్న నేను అద్వయుడను.

కేవలానందరూపోఽహమ్ : ఒకాయనకు కథ (లేక) నవల (లేక) నాటకము రచించి, ఆ నాటకము జరుగుచూ ఉండగా చూస్తూ ఉంటే…ఆనందము పొందుచూ ఉండటం జరుగుతుంది కదా! తాను రచించిన ఆ నాటకం జరుగుతూ ఉండగా - ఆయా దుఃఖ సంఘటన సందర్భములో నవ్వుచున్నట్లుగా, బాధ కలిగే సంఘటనలప్పుడు బాధను ముఖమును ధారణ చేస్తూ ఉండవచ్చు. ఎందుకు? అదంతా ఆతని నాటక వ్యవహారమును ఆనందించే తీరు.

నేనూ అంతే!

మనో-బుద్ధి-చిత్త-అహంకారములు నేను నా ఆనందముకొరకు కల్పించుకొనుచున్నాను. జాగ్రత్ స్వప్న సుషుప్తులు నాయొక్క భావనాపురుషకారములే.

జాగ్రత్ అనుభవము కొరకు → ‘విశ్వుడు’ అను పురుషకారమును,
స్వప్నానుభవము కొరకు → ‘తేజశుడు’ - అను పురుషకారమును,
సుషుప్తానుభవము కొరకు → ‘ప్రాజ్ఞుడు’ అను పురుషకారమును,

జన్మ - జన్మాంతరముల ప్రహసనము కొరకు - ‘ఈశ్వర’ అను పురుషకారమును
(కథారచయిత కథలను రచించుకొన తీరుగా)….నా పరమపురుషత్వము నుండి కల్పించుకొనుచున్నాను.

స్వప్న-జాగ్రత్-సుషుప్త-జన్మ-జన్మాంతర అనుభవ పరంపరలన్నీ నా వినోదముకొరకు నేనే కల్పన చేసుకొని ఆనందిస్తున్నాను.

ఆత్మనగు నా కల్పనయే ఇదంతా! ఇదంతా నా వినోదము। సరదా। లీల। క్రీడ। స్వకీయ ఆస్వాదన। అందుచేత నేను సర్వదా ఆనందస్వరూపుడనే। కేవలానంద విన్యాసుడనే।

స్వానందోఽహమ్ నిరంతరః - నాకు నేనే నిరంతరము ‘ఊహ’ ‘భావన’ ‘ఆలోచన’ ‘అనుభూతి’ ‘అనుభవాస్వాదన’లను కల్పించుకొని, వాటియందు నేనే ప్రత్యక్షమై ఉంటున్నాను. (అనగా) నాయందు నేనే సంకల్పించుకొని ఆనందిస్తున్నాను. (రమయతేతి రామః)। నాయందు నేనే జగత్ కల్పనా రూపమంతా కల్పించుకొని నాకు అనన్యమగు ఆ ‘కల్పన’ (లేక) ఊహ (లేక) భావన (లేక) ఆలోచన (లేక) అనుభూతి (లేక) అనుభవాస్వాదనల యందు రమించుచున్నాను. (I am a wondering Monk in the Zone of my our thoughts and Feelings).

నాయందు నేను రమించటమే ఈ జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - జన్మ జన్మాంతర భావనా పరంపరలంతా. నిరంతరము నాయందు నేనే ఆయా అనేక రీతులుగా రమిస్తూ ఉండటంచేత - స్వానందుడను. ఒకడు కథను వ్రాయాలనుకొని, ఊహచే కథనము కల్పించుకోసాగించటము వంటిదే ఈ నాయొక్క ఈఈ జగదనుభవ పరంపరలన్నీ కూడా!

‘‘స్వమేవ సర్వతః పశ్యన్, న అన్యమానః। కేవల స్వరూపుడగు నేను (1) జగత్ అనుభవి, (2)జగత్ అనుభవవిధానము (3) అనుభవసిద్ధిరూపమగు దేహముల రాక - పోకలతో కూడిన జగత్ దృశ్యము - ఈ త్రిమూర్తిత్వములను కల్పించుకొనుచున్న త్రిమూర్తుడను। త్రిమూర్తిస్వరూపుడను। ఏకమే అయి ఉండి ‘త్రి’ (3) రూపముల ధారణ చేయు చమత్కారిని.

అందుచేత -
జగత్ రూపముగా మూర్తీభవించుచున్నది నేనే। (Iam talking the form of that being percieved)
నాకు నేనే సర్వము నాయందు దర్శించుకొనువాడను కూడా। నేనే। (I myself am the perceiver of all such perceiptions)

నేను ఈ జగత్తుకు వేరు కాదు. ఈ జగత్తు నాకు వేరుకాదు. జగత్తు - జగదీశ్వరుడు - నేను ఏకస్వరూపులమే! నాకు వేరై అన్యముగా ఏదీ లేదు. న అన్యమానః

స్వయమద్వయమ్ : మరొకరిచేత (లేక) కొన్ని సాధనా కార్యక్రమముల అనంతరము అద్వితీయత్వము పొందవలసినవాడనుకాను.
- స్వయముగానే అద్వితీయుడను

సర్వము అఖండాత్మస్వరూపమే। నేను అఖండాత్మ స్వరూపుడను। అఖండాత్మ నాకు వేరు కాదు. నేను అద్దానికి వేరు కాదు. అహమ్ బ్రహ్మాస్మి। స్వయమద్వితీయమస్మి।

స్వానందమ్ అనుభుంజానో నిర్వికల్పో భవామి అహమ్। నాకు అనుభవముగా సిద్ధించుచున్నదంతా స్వస్వరూపాత్మయే। స్వకీయ కేవలీ స్వరూపమునే జన్మ-కర్మల కల్పనా విశేషరూపమైనట్టి జగత్ దృశ్యముగా కల్పించుకొని అనుభవిస్తున్నాను. ఆస్వాదిస్తున్నాను.

ఈ సమస్తము నేనే అయినప్పటికీ, ఇదంతా నా కల్పనా విశేషమే అయి ఉండి కూడా - కల్పించువాడిగా వేరుగానే ఉన్నాను. కథారచయిత కథకువేరుగానే ఉండి ఉన్నట్లు, శిల్పమునకు శిలత్వము శిల్పి - శిలత్వములు వేరు వేరే అయి ఉన్నట్లు, స్వప్నమునకు స్వప్నద్రష్ట వేరే అయి ఉన్నతీరుగా - భావన - ఆలోచన - అనుభూతి - అనుభవము రూపమగు నాయొక్క ప్రకృతి (ప్రకాశ-కృత్-తిరోగమన) చమత్కారమునకు పురుషుడుగా, కేవలుడుగా వేరై ఉన్నాను. కల్పనలను కల్పించువాడను. అంతేకానీ, కల్పనలోనివాడను కానే కాను. సమస్త కల్పనలకు కారణభూతుడనగువాడను. వాటికన్నిటికీ అతీతుడనగు ‘‘పరమపురుషుడను’’ కల్పనారహిత నిర్వికల్పస్వరూపుడను.

ఈవిధంగా - ఆత్మతత్త్వమును ఎరిగినట్టి, అట్టి తత్త్వమును అనుక్షణికముగా తీర్చిదిద్దుకున్నట్టి - ‘‘ఆత్మతత్త్వజ్ఞుని / తత్త్వవేత్త’’ యొక్క ‘‘స్వాభావికానుభవము’’ గురించి మనము చెప్పుకున్నాము.

గచ్ఛన్ తిష్ఠన్ ఉపవిశన్, శయనో వా, అన్యథాపి వా, యథేచ్ఛయా వసేత్ విద్వాన్, - ‘‘ఆత్మారామః సదా మునిః’’।। - అట్టి బ్రహ్మజ్ఞుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట కూర్చుని ఉన్నా, ఏ ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నా, నిదురిస్తూ ఉన్నా, మరి ఇంకా ఏమేమి చేస్తూ ఉన్నా కూడా, ఏదేది చేయకపోతూ ఉన్నప్పటికీ, (పైన చెప్పుకున్న) (1) ‘అహమాత్మా సంభావన (2) తత్‌త్వమ్ దర్శనమ్, (3) సర్వమ్ ఖలు ఇదమ్ బ్రహ్మ సమాశ్రమము, ఈ మూడిటిని కించిత్ కూడా వదలడు.

→ అన్యము పట్ల మౌనము వహించినవాడై, ముని అయి,
→ ఆత్మారాముడై, స్వయమ్ పరమానంద పరబ్రహ్మమై,

అనునిత్య అచ్యుత కేవలానంద స్వరూపుడై సర్వత్రా వెలయుచున్నాడు.



🙏 ఇతి కుండిక ఉపనిషత్ సమాప్తా 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।