[[@YHRK]] [[@Spiritual]]

Mahā Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


సామవేదాంతర్గత

7     మహోపనిషత్

(యోగ వాసిష్ఠ మహాగ్రంథ సారము)

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। యత్(యన్)-మహా ఉపనిషత్ (మహోపనిషత్)
వేద్యం చిత్ ఆకాశతయా (చిదాకాశతయా) స్థితమ్,
పరమ అద్వైత సామ్రాజ్యం,
తత్ రామబ్రహ్మ మే గతిః।।

ఏదైతే చిదాకాశస్థానమైయున్నదో, పరమ - అద్వైత సామ్రాజ్యమో, అది ఈ మహోపనిషత్ అధ్యయనముచే తెలియబడగలదు. అట్టి ఆత్మారామ బ్రహ్మమే నేను చేరవలసిన స్వస్థానము. అట్టి స్వాత్మారామబ్రహ్మమును ఉపాసించుచున్నాను.

ప్రథమ (1వ) అధ్యాయము - నారాయణ తత్త్వమ్ - ఏకో నారాయణో।

1. అథ అతో మహోపనిషదం వ్యాఖ్యాస్యామ్యః ।
తదాహుః ఏకో హ వై నారాయణ ఆసీత్ ।।
న బ్రహ్మా। న ఈశానో న ఆపో ।
న అగ్నీ షోమౌ । నే ఇమే ద్యావా, పృథివీ।
న నక్షత్రాణి । న సూర్యో ।
న చంద్రమాః।
స ఏకాకీ రమతే।
ఇక ఇప్పుడు మహత్ (మహో) ఆత్మసామీప్యమును (ఉపనిషదమును) వ్యాఖ్యానించుకొనుచున్నాము.

ఈ దృశ్యమానమగుచున్న సమస్తమునకు మునుముందుగా ‘‘ఏకో నారాయణ’’ తత్త్వమే ఉండి ఉన్నది. అట్టి కేవల నారాయణతత్త్వము (లేక) ఆదినారాయణ పరమపురుషుడు ఏకస్వరూపుడుగా ఉండగా మొట్టమొదట సృష్టికర్తయగు బ్రహ్మలేరు. సృష్టిరూపముగా విస్తరించు ఈశానుడు లేరు. అగ్ని, వాయువు, జలము, పృథివి, ఆకాశము లేవు. నక్షత్ర - సూర్య - చంద్ర మండలములు లేవు. అట్టి ఏకాకి అగు నారాయణుడు మాత్రమే ఉన్నారు. ఆయన - ‘‘నా వైభవములో నేను ఎందుకు రమించరాదు? రమించాలి కదా!’’ - అని భావించారు.
తస్య ధ్యానాంతస్థస్య ‘‘యజ్ఞః-స్తోమమ్’’ (యజ్ఞస్తోమమ్) ఉచ్యతే ।
తస్మిన్ పురుషాః చతుర్దశ జాయంతే।
ఏకా కన్యా। దశ ఇంద్రియాణి ।
మన ఏకాదశం। తేజో ద్వాదశం।
అహంకారః త్రయోదశః। ప్రాణః చతుర్దశ।
ఆత్మా పంచదశీ, బుది
అట్టి నిర్విషయ కేవల నారాయణుడు తనలో తానే ధ్యానముచే ‘‘స్తోమము’ (మనో) యజ్ఞము నిర్వర్తించపూనుకొన్నారు. ఇదియే ‘యజ్ఞస్తోమము’ అని శాస్త్రీయంగా చెప్పబడుతోంది. (యజ్ఞస్తా-ఉమ).
అట్టి కేవలుడు - ఏకాకియగు పరమ పురుషుని నుండి 14 పురుషకారములు, ఒక కన్య బయల్వెడలసాగారు. (కన్య= స్వభావము).
(10) ఇంద్రియములు. (వినికిడి - స్పర్శ - చూపు - రుచి - వాసన - జ్ఞానేంద్రియములు - వాక్కు - పట్టుకొనుట - నడచుట - పాయువు - ఉపస్థ - రూపకర్మేంద్రియములు) (11) తేజోరూపమగు మనస్సు (12) ‘అహం (నేను)’ - కారము (13) ప్రాణశక్తి (14). అనుభవి అగు ఆత్మ (జీవాత్మ). ఆపై (15) తెలివి (లేక) బుద్ధి.
భూతాని, పంచ తన్మాత్రాణి, పంచ మహా భూతాని చ।
స ఏకః పంచ వింశతిః (25) పురుషః।
తత్ పురుషం పురుషో నివేశ్యన ।
అస్య ప్రధానసంవత్సరా జాయంతే ।
సంవత్సరాత్ అధిజాయంతే।।
ఇవికాక శబ్ద స్పర్శరూప రసగంధ (పంచ) భూతతతన్మాత్రలు (భూ-జల-అగ్ని-వాయు-ఆకాశ) పంచ మహాభూతములు –25 తత్త్వములతో కూడిన (విరాట్) పురుషుడు జనించారు. అట్టి సృష్టి కల్పనా విరాట్ పురుషుని నుండి (పై వాటికంటే వేరైన) కాల ప్రధాన పురుషకారము, ‘సంవత్సర’ ఇత్యాది రూపముగల ‘‘కాలము’’ జనించినాయి.
అథ పునరేవ నారాయణః సో
అన్యత్ కామో। మనసా ధ్యాయత ।
తస్య ధ్యానాంతస్థస్య లలాటాత్ త్ర్యక్షః
శూలపాణిః పురుషో జాయతే।।
(ఆది-నిర్మల-ఏకోస్వరూపుడు. ఈ జీవుని సహజ కేవల స్వరూపుడు-అగు) ఆ శ్రీమన్నారాయణుడు - ‘‘ఇంకా ఏదో కల్పించుకోవాలి’’ - అని పునః కోరుకొన్నవారై, మనస్సుతో ధ్యానము కొనసాగించారు.
ధ్యాన నిమగ్నుడైయున్న ఆ నారాయణుని లలాటమునుండి త్రినేత్రుడు శూలపాణి అగు అనేక పురుషకార విశేషములతో కూడిన- ఒక (పురుషాకారవిశేషములతో కూడిన) పురుషుడు జనించారు.
బిభ్రత్ శ్రియం యశః సత్యం,
బ్రహ్మచర్యం తపో వైరాగ్యం,
మన ఐశ్వర్యం స ప్రణవా వ్యాహృతయః,
ఋక్-యజుః-సామ-అథర్వ-అంగీరసః
సర్వాణి ఛందాంసి - తాని అంగే
సమాశ్రితాని। తస్మాత్ ఈశానో
మహాదేవో। మహాదేవః।
మహాతేజముతో ప్రకాశమానమగుచున్న ఆ మహత్ పురుషునియందు - అంగములుగా (వస్త్రములుగా) శ్రియము (లోకరక్షణ, శ్రేయోప్రదము, ప్రేమ), యశస్సు, సత్యము, (బ్రహ్మము గురించిన, ఆచరణ - అనుభూతి రూపమగు) బ్రహ్మచర్యము, (సర్వమును సాక్షిగా చూస్తూ ఆనందించు గుణమగు) వైరాగ్యము, కేవలమగు మనస్సు (మనోఉపకరణము), (‘అహమ్’ రూపమగు) ఐశ్వర్యము, ప్రణవముతో కూడిన వ్యాహృతులు (అకార - ఉకార-మకారములు, జాగ్రత్-స్వప్న-సుషుప్తి కల్పనా వినోద సృజనాత్మకత), భగవత్ తత్త్వ వర్ణనల రూపమగు ఋక్కులతో కూడిన ఋగ్వేదము, యజ్ఞోపాసనలతో కూడిన యజుర్వేదము, స్తుతులతో కూడిన సామవేదము, (ప్రకృతి తత్త్వము విశదీకరించు) అధర్వణ వేదము అంగీరసము, (గాయత్రీ-త్రిష్ఠుప్ ఇత్యాది) ఛందస్సులు - ఇవన్నీ ప్రకాశమానమైనాయి. అందుచేతనే ఆయన ‘ఈశానుడు, మహాదేవుడు’ మొదలైన పేర్లుగా చెప్పబడుచున్నారు.
అథ పునరేవ నారాయణః
సో అన్యత్ కామో మనసా ధ్యాయత…।
తస్య ధ్యాన అంతస్ధస్య లలాటాత్ స్వేదో
అపతత్తా। ఇమాః ప్రతతా ఆపః।
తత్ తేజో హిరణ్మయం అండం।
తత్ర బ్రహ్మా చతుర్ముఖో-అజాయత।
సో అధ్యాయత్ - పూర్వాభిముఖో
భూత్వా ‘‘భూః’’ ఇతి వ్యాహృతిః।
గాయత్రం ఛందః । ఋగ్వేదో । అగ్నిః దేవతా।।
ఆ ఆది నారాయణుడు ‘‘ఇంకా ఏమైనా నాకు ఉండాలి’’ - అని మనస్సులో ధ్యానం చేయసాగారు.

అద్వితీయుడగు ఆయన ద్వితీయ కల్పనయందు ఉత్సాహియై తపనరూపమగు తపస్సుయందు నిమగ్నుడై ఉండగా, ఆయన లలాటస్థానము నుండి ‘‘స్వేదము (చెమట) జనించింది. ఆ స్వేదమే ఇచ్చట సర్వత్రా ఆపః (జలతత్త్వము)’’ రూపుదిద్దుకొన్నది. ఆ ఉదకమునుండి బంగారు కాంతులను వెదజల్లుచూ అండము (బ్రహ్మండము) జనించింది. అద్దానినుండి (సృష్టిరచనకు అభిమానుడు, సృష్టి క్రియాశీలుడు అగు) చతుర్ముఖ బ్రహ్మ జనించారు.
ఆ బ్రహ్మ పూర్వాభిముఖుడై (సృష్టికి ఆది వైపుగా ఉన్ముఖుడై) తపస్సు చేస్తుండగా ‘భూః’ అనే వ్యాహృతి, గాయత్రీ ఛందస్సు, ఋగ్వేదము, అగ్నిదేవత జనించారు.
పశ్చిమాభిముఖో భూత్వా ‘‘భువః’’ ఇతి
వ్యాహృతిః। త్రైష్టుభం ఛందో।, యజుర్వేదో।
వాయుః దేవతా।
ఆ సృష్టికర్త పశ్చిమాభిముఖంగా {సృష్టికల్పన వైపుగా, నిర్విషయ పరమాత్మకు ఎదురు (opposite దిశగా)} - ‘భువః’ వ్యాహృతి, తిష్టుభ్ ఛందస్సు, (యజ్ఞ - యాగ క్రతు విధానములతో కూడిన) యజుర్వేదము, వాయుదేవత ఆయనకు రెండవ ముఖము నుండి జనించాయి.
ఉత్తరాభిముఖో భూత్వా ‘‘స్వః’’ ఇతి వ్యాహృతిః।
జాగృతం ఛందః । సామ వేదః । సూర్యో దేవతా ।
ఉత్తరముగా అభిముఖమైన ముఖముగా - ‘‘స్వః’’ వ్యాహృతి, జగతీ ఛందస్సు, (దివ్యగానములుతో కూడిన) సామవేదము, (సమస్తమును వెలుగుచే ప్రకాశింపజేయు) సూర్య దేవత (3వ ముఖముగా) ప్రదర్శనమైనాయి.
దక్షిణాభిముఖో భూత్వా ‘మహః’ ఇతి వ్యాహృతిః।
ఆనుష్టుభం ఛందో। అథర్వవేదః । సోమో దేవతా ।
దక్షిణాభిముఖముగా ‘‘మహః’’ వ్యాహృతి, అనుష్టుభ్ ఛందస్సు, అథర్వ వేదము, సోమ (చంద్ర) దేవత వ్యక్తీకరణమయ్యాయి.
సహస్ర శీర్‌షం దేవం। సహస్రాక్షం విశ్వశంభువమ్।
విశ్వతః పరమం నిత్యం।
ఆ విధంగా చతుర్ముఖ ప్రదర్శనతో కూడిన సృష్టికర్తృత్వాభిమానియగు బ్రహ్మదేవుడు మరల ధ్యానము చేయసాగారు. ఆయన హృదయాకాశము నందు సమస్తమునకు బాహ్య-అభ్యంతరముగా ఆది స్వరూపుడగు నారాయణ తేజో - ప్రజ్ఞా - ఆనంద కేవల విభవము ప్రదర్శనమైనది.
ఆ నారాయణుడు :- వేలాది శిరస్సులు, భావనలు, ఆలోచనలు తనవే అయిన దివ్యపురుషుడు।
- వేలాది కళ్ళు - దృష్టులతో వెలుగొందువారు।
- విశ్వమంతటికీ సుఖప్రదాత। ఆనంద ప్రదాత। కళ్యాణ ప్రదాత।
- విశ్వమునకు అతీతమై, పరమై ప్రకాశించువారు।
- త్రికాలములకు సాక్షిగా నిత్యుడు.।
విశ్వం నారాయణగ్ం హరిమ్।
విశ్వ మే వేదం, పురుషః
తత్ విశ్వం ఉపజీవతి।।
- ఈ విశ్వమంతా తనయొక్క శరీరముగా కలిగి, తానే అయిఉన్నవారు।
- తన స్వరూపముగా చూస్తున్నవారు. ఈ సమస్తమును తన యొక్క పురుషకారముగా ఎరుగుచున్నట్టి వారు। స్వకీయమైన ఎరుక(knowing)యే విశ్వముయొక్క రూపముగా కలవారు। తన ‘ఎరుక’ నుండే ఎరుక రూపంగా బయల్వెడలుచున్న,
- ఈ విశ్వమునకు ప్రాణస్వరూపులై అణువణువు ఉజ్జీవింపచేయువారు।
పతిం విశ్వేశ్వరం దేవం సముద్ర-ఏకం
విశ్వరూపిణమ్ । పద్మకోశ ప్రతీకాశగ్ం।
లంబత్యా కోశ సన్నిభమ్। హృదయం చ అపి
అథోముఖమ్। సంతత్యై సీత్కరాభిశ్చ।
తస్యమధ్యే మహాన్ అర్చిః।
విశ్వార్చిః। విశ్వతోముఖమ్ ।
- ఈ విశ్వమునకు పతి। ఈ విశ్వముగా విస్తరించి ఉండటంచేత విశ్వేశ్వర దివ్యస్వరూపులు - దేవత। దేవాది దేవుడు।
- ఈ విశ్వమునకు సముద్రమునకు సముద్రజలమువలె-ఏకస్వరూపమై ఉన్నవారు. ఈ సమస్తము ఆయన హృదయమే। ఈ సమస్తమునందు ఆయనయే హృదయస్థుడు.

హృదయము :-
‘‘అధోముఖముగా ళిక్రిందివైపుగా ఉన్న పద్మపు మొగ్గ’’వలెను, పద్మకోశము (Inner Recess of padma Flower) వలెనురి సమస్త జీవులలో అంతరముగా హృదయము (ఆలోచభావన - అనుభూతి జనించుస్థానము) (అధోముఖముగా వ్రేలాడుచూ) ఉన్నది. అద్దానియందు సీత్కరాభిలు (అనేక నరములు) పరస్పరం కలిసిపోయి ఉన్నాయి. ‘‘సీ◖◖◖’’ - ధ్వని (జీవుడు జీవించి ఉన్నంతవరకు) జనిస్తూ ఉన్న స్థానము.
తస్య మధ్యే వహ్నిశిఖా
అణియ ఊర్థ్వా వ్యవస్థితా।
తస్యాః శిఖాయా మధ్యే పురుషః -
పరమాత్మా వ్యవస్థితః । స బ్రహ్మా ।
స ఈశానః । స ఇంద్రః।
సో అక్షరః, పరమః స్వరాట్ ।
అట్టి హృదయముయొక్క మధ్యగల ఆకాశము (space) లో ఊర్ధ్వంగా ‘‘అగ్ని’’ - నలువైపులా తేజోవంతమై ప్రకాశించుచున్నది. అతి సూక్ష్మ దీప శిఖవలె వ్యవస్థితమైయున్నది.
అద్దాని ‘శిఖ’ యొక్క మధ్యభాగములో సమస్తమునకు పరమైయున్న పరమాత్మ ప్రకాశమానుడై తేజోవిభవలతో ప్రదర్శనమగుచున్నారు. ఆయనయే సృష్టికర్తయగు బ్రహ్మ। ఆయనయే ఈ సమస్తముగా విస్తరించియున్న ఈశ్వరుడు.
ఆయనయే ఇంద్రియములకు అధిపతియగు ఇంద్రుడు.
సమస్తమునకు పరాకాష్ఠకాబట్టి ‘పరము’ అనబడుచున్నారు. ‘పరమపురుషుడు’ - అయి ఉన్నవారు.
ఆయనయే సమస్త జీవుల స్వస్వరూపుడై వెలుగొందుచున్నారు కాబట్టి ‘స్వరాట్’. ఆయనకు అన్యము లేదు। మనందరికీ ఆయన అన్యుడు కాదు। అనన్యో నారాయణా।
ఇతి మహోపనిషత్
‘నారాయణతత్త్వమ్’
నామ ప్రథమోధ్యాయః
ఇతి నారాయణతత్త్వమ్ నామ
ప్రథమ అధ్యాయము

ద్వితీయోధ్యాయం (జనక-శుక సంవాదము)

ఓం।।
1. శుకో నామ మహాతేజాః।
స్వరూప-ఆనంద తత్పరః।
జాత మాత్రేణ మునిరాట్ ।
యత్ సత్యం తత్ అవాప్తవాన్।।
తేన అసౌ స్వ-వివేకేన
స్వయమేవ మహా మనాః ప్రవిచార్య,
చిరం సాధుః, స్వ ఆత్మనిశ్చయమ్ ఆప్నుయాత్ ।।
‘శుకుడు’ అనే మహానుభావుడు. మహాతేజో-స్వరూపానంద తత్పరుడు. పరమార్థమగు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు.
జన్మతఃగానే మహామునీశ్వరుడు. ఏది పరమసత్యమో, అద్దానిని పుడుతూనే సముపార్జించుకొన్నట్టివారు.
ఆయన తనయొక్క వివేకము (Intellectual common sense)చే తనకుతానే స్వయముగా తన మనస్సుతో ‘విచారణ’ చేసి ‘‘ఆత్మ అనగా ఇది కదా!’’ - అని సునిశ్చయులు అయ్యారు. ఆత్మతత్త్వము ఏమిటో సిద్ధింపజేసుకున్నారు.
అనాఖ్యత్వాత్, అగమ్యత్వాత్
మనః షష్ఠేంద్రియ స్థితేః,
చిత్ మాత్రం ఏవం ఆత్మాణుః
ఆకాశాత్ అపి సూక్ష్మకః।।
శ్రీ శుక ఏకాంత - అంతర్ విచారణ।।
వాక్కుతో ‘ఇది’ అని పరిధులను నిర్ణయించి చెప్పలేము కాబట్టి ఆత్మ అనాఖ్యము. అది సర్వత్ర వేంచేసినదై ఉండటం చేత, ఒకచోట నుండి బయలుదేరి మరొకచోటికి చేరేది కాదు. అచలము. పంచేంద్రియములకు ఆరవదగు మనస్సుకు లభించే విషయము కాదు కాబట్టి ‘‘అగమ్యము’’. కేవల చిత్ (ఎరుక) మాత్రము. ఆకాశము మొదలైనవాటి కంటే సూక్ష్మాతిసూక్ష్మము కాబట్టి అణుమాత్రము.
2. చిత్ అణోః పరమస్య అంతః
కోటి బ్రహ్మాండ రేణవః। ఉత్పత్తి స్థితిం
అభ్యేత్య, లీయంతే శక్తి పర్యయాత్।
ఆకాశం బాహ్యశూన్యత్వాత్,
అనాకాశం తు చిత్త్వతః।
న కించిత్ యత్ అనిర్దేశ్యం
వస్తు సత్త ఏతి కించన ।।
పరమసూక్ష్మరూపమగు ఆత్మాణువునందు (లేక) ఆ చిద్వస్తువునందు అనంతకోటి బ్రహ్మాండ రేణువులు అద్దానిశక్తిచే అనుక్షణం ఉత్పత్తి - స్థితి - లయములు పొందుచున్నాయి.
బాహ్యమున వస్తురహిత శూన్యము కాబట్టి అద్దానికి ‘చిదాకాశము’ అని పేరు. అది వస్తు రహితము. వస్తువు వలె నిర్దేశించి చెప్పజాలము కాబట్టి అనిర్దేశ్యము. (‘బంగారములో ఆభరణములు ఉన్నాయి’ - అని అనము కదా! అట్లాగే ఆత్మయందు జగత్తులు లేవు).
చేతనో అసౌ ప్రకాశత్వాత్
వేద్య అభావాత్ శిలోపమః ।
స్వాత్మని వ్యోమని స్వచ్ఛే
జగత్ ఉన్మేష చిత్రకృత్ ।
తత్ భాస మాత్రం ఇదం విశ్వం
ఇతి నస్యాత్ తతః పృథక్ ।।
సమస్తమును కదిలించుచూ, ప్రకాశింపజేయునట్టిది. అది ‘తెలుసుకొనుట’ అను ధర్మమునకు వేరైనది. శిలవలె నిశ్చలము. విజ్ఞాన ఘనమై, శిలాసదృశము.
స్వాత్మాకాశము యొక్క మధ్యగా స్వచ్ఛప్రదేశంలో ‘జగత్తులు’ అనే చిత్రపటములను చిత్రీకరించుకొనుచున్నది.
నిర్మలము - శూన్యము - నిర్విషయము అగు ఆత్మ తనయందు తానే చిత్రకారునివలె, కలకంటున్న వానివలె భావనామాత్రంగా జగత్తులను కల్పించుకోవటము, లయింపజేయటము లీలావినోదంగా నిర్వర్తిస్తోంది.
జగత్ భేదో - అపి తత్ భాసమ్-ఇతి-
భేదో - అపి తన్మయః।
సర్వగః, సర్వ సంబంధో గత్య భావాన్, న గచ్ఛతి ।
నాస్తి అసావాశ్రయా భావాత్,
సద్రూపత్వాత్ తథా అస్తి చ।।
జగత్ భేదములన్నీ అద్దాని భావనా భేదములే। అద్దాని చమత్కృతియే ఈ భావనా భేద జగత్ - దృశ్యము. ఈ సమస్త జగత్తు ఆత్మచే తన్మయము.
సర్వసంబంధములు కలిగియున్నదై, సర్వభావముల వెంట వెళ్ళుచూ, సర్వవ్యాపకమై యున్నది. అయినప్పటికీ అద్దానికి ఎట్టి ‘గమనము’ అనునది లేనే లేదు.
అద్దానికి దేశ - జాతి - గుణ - క్రియ భేదములు ఏమాత్రము కూడా లేనేలేవు. త్రికాలములచే అబాధ్యమై, యథాతథమై సర్వదా అస్తిత్వము కలిగినదై ఉన్నది. ఆత్మకు ‘లేమి’ లేదు.
అన్యము అనబడే సమస్త సంబంధములకు ‘ఉనికి’ మొదలే లేదు.
3. విజ్ఞానం, ఆనందం బ్రహ్మ
రాతేర్దాతుః పరాయణమ్।।
సర్వ సంకల్ప సన్యాసః చేతనా యాః పరిగ్రహః।
జాగ్రతః ప్రత్యయా భావం
యస్య ఆహుః ప్రత్యయం బుధాః ।
అది ‘తెలుసుకోవటము’ అను ‘కేవల విజ్ఞానము’. అట్టి కేవల విజ్ఞానమే (కేవలమగు తెలివియే) బ్రహ్మము. త్యాగనిరతులగువారికి అట్టి బ్రహ్మము గురించిన పారాయణమే పరమాగతి - అగుచున్నది.
సర్వసంకల్పములు సన్యసించగా శేషించు అట్టి కేవల చైతన్యమే వారిచే పరిగ్రహించబడుచున్నది.
అది భావాతీతము. అభావ-భావనా ప్రత్యక్‌రూపము. భావములకు ఆవల అభావస్థానమునందు జాగరూకానుభవము. ప్రత్యక్ భావనారూపముగా (ప్రత్యగాత్మగా) బుధులచే చెప్పబడుతోంది. అది వృత్తిరహిత జ్ఞానానందము.
యత్ సంకోచ - వికాసాభ్యాం జగత్
ప్రళయ సృష్టయః, నిష్ఠా వేదాంత
వాక్యానాం అథ వాచామ్ అగోచరః।
ఈ జగత్తు యొక్క ఉత్పత్తి - వినాశనము (లేక ఉత్పత్తి ప్రళయములు) ఆత్మయొక్క ‘వృత్తిజ్ఞానము’నకు సంబంధించిన వికాస - సంకోచములు మాత్రమే. అట్టి నిష్ఠా-మహావాక్యార్థసారము వాక్కు - మనస్సులకు అగోచరము.
‘‘అహం సత్ చిత్ పరానంద
బ్రహ్మైవాస్మి। న చ ఇతరః।’’-
-స్వయైవ సూక్ష్మయా బుద్ధ్యా సర్వం విజ్ఞాతవాన్ శుకః।
‘‘నేను ఎవ్వరు?’’ అను ప్రశ్నకు సమాధానము - సత్-చిత్-ఆనంద బ్రహ్మమే అయి ఉన్నాను. మరింకొకటేదీ కాదు. ఇది వేదాంత వాక్య మహార్థ సారము’’ అని శుకుడు గమనించారు.
శుకుడు ఆత్మగురించిన విషయములన్నీ కూడా స్వయముగా సూక్ష్మబుద్ధితో స్వయముగానే ఎరుగగలిగారు.
స్వయం ప్రాప్తే పరే వస్తుని
అవిశ్రాంత మనాః స్థితః, ‘‘ఇదం
వస్తు’’ - ఇతి విశ్వాసం న అసావత్
ఆత్మని ఉపాయయౌ।
ఈ విధంగా పరమ వస్తువును స్వయముగా సిద్ధించుకొన్నప్పటికీ కూడా ఆయనయొక్క మనస్సు ఆత్మానుభవమునందు శమించనేలేదు. అవిశ్రాంతి యందే స్థితించినదై ఉన్నది.
‘‘ఇదియే పరమ వస్తువు’’ అనే ఉపాయమునందు విశ్వాసము పూర్తిగా పొందనేలేదు. ఎరిగినది అనునిత్యానుభవముగా సిద్ధించలేదు.
కేవలం విరామ అస్య చేతో విషయ చాపలమ్।
భోగేభ్యోః భూరి భంగేభ్యో
ధారాభ్య ఇవ చాతకః
ఏకదా సో, అమల ప్రజ్ఞో
మేరావ ఏకాంత సంస్థితమ్,
పప్రచ్ఛ పితరం భక్త్యా
శ్రీకృష్ణద్వైపాయనం మునిమ్।।
అయితే ఆయనయొక్క బుద్ధి విషయ చాపల్యమునుండి విరామము పొందింది. మేఘధార నుండి చాతక పక్షి బయటకురానివిధంగా ఆయా భోగములనుండి, విషయచపలత్వము నుండి ఆయన విశ్రాంతి పొందారు. కానీ ఆ విశ్రాంతి అవ్యాజము, అనుక్షణికము కాలేదు.
మేరుపర్వతము మీద ఒంటరిగా ఏకాంతములో ధ్యానమునందు రోజులు గడుపుచూ ఉన్న ఆ శుకబ్రహ్మ - ఒకానొకరోజు పితృదేవులగు శ్రీ వ్యాసమహర్షిని భక్తి - ప్రపత్తులతో దర్శించారు. తండ్రితో ఈ విధంగా సంభాషించసాగారు.
శుకౌవాచ :-
4. సంసార ఆడంబరం ఇదం కథం
అభ్యుత్థితం, మునే? కథం, చ ప్రశమం యాతి?
కియత్? కస్య? కదా?- వద।
శుకబ్రహ్మ :- హే పితృదేవా! మునీశ్వరా! ఆత్మసర్వదా కేవలానంద స్వరూపముకదా! అటువంటప్పుడు ఈ సంసారాడంబరమంతా ఎట్లా ఆత్మయందు బయల్వెడలుతోంది? ఈ సంసార దోషము ఏవిధంగా, ఎట్లా ఎటువంటి వారికి శమించగలదో - దయచేసి వివరించండి.
ఏవం పృష్టేన మునినా వ్యాసేన
అఖిలం ఆత్మజే, యధావత్ అఖిలం
ప్రోక్తం వక్తవ్యం విదిత ఆత్మనా।
ఈ విధంగా అడుగగా, శ్రీ వ్యాసమునీంద్రులు ‘‘ఆత్మయందు సంసారము జనించటము’’ అనే విశేషమంతా కూడా యథాతథంగా (ఉన్నది ఉన్నట్లుగా) విశదీకరించి చెప్పారు. ఆత్మగురించి విశ్లేషించి వివరించారు.
అజ్ఞాసిషం పూర్వం ఏవమ్ అహమ్
-ఇతి అథ తత్ పితుః స శుకః
స్వకయా బుద్ధ్యా, న వాక్యం బహు మన్యతే।।
అంతా సవిస్తరంగా విన్నట్టి శుకమహర్షి ‘‘ఈ విశేషమంతా నేను స్వబుద్ధితో గ్రహించినట్టిదే కదా!’’ - అని తలచుచు, ఆ వాక్యలన్నీ కొత్తగా జ్ఞానము లభించేవిగా అనుకోలేదు. ప్రత్యేక విశేషంగా భావించలేదు. తెలిసినవేగా అనిపించాయి.
వ్యాసో అపి భగవాన్ బుద్ధ్వా
పుత్ర అభిప్రాయం ఈదృశమ్,
ప్రత్యు వాచ పునః పుత్రం।
‘‘న అహం జానామి తత్త్వతః।
జనకో నామ భూపాలో విద్యతే మిథిలాపురే।।
యథావత్ వేత్తి అసౌ వేద్యం,
తస్మాత్ సర్వం అవాప్స్యసి।’’
వ్యాసమహర్షులవారు కుమారునియొక్క తూష్ణీభావపూర్వక అభిప్రాయము గమనించి ఇట్లా మరల చెప్పసాగారు.
వ్యాసమహర్షి:- ప్రియకుమారా! నాకు తెలిసినదంతా వివరించి చెప్పాను. నాకు తత్త్వతః ఇంత మాత్రమే తెలుసు.
మిథిలానగర రాజు ‘జనకుడు’ అనే ఆయన ఉన్నారు. ఆయన నాకంటే కూడా తత్త్వమును స్వానుభవం చేసుకొని, అధికముగా ఎరిగి ఉన్నారు. వారు యథాపూర్వకంగా వివరించి చెప్పగలరు. వారివద్దకు వెళ్ళు. శ్రద్ధగా శ్రవణం చేసి ఆత్మజ్ఞానం గురించిన పూర్తి విశేషం తెలుసుకో.
పిత్రేతి ఉక్తః శుకః, ప్రాయాత్
సుమేరోః వసుధాతలమ్ - విదేహ నగరీం
ప్రాప్య జనకేన అభిపాలితామ్।
ఆవేదితోఅసౌ యాష్ణీకైః
జనకాయ మహాత్మనే। -
‘‘ద్వారి వ్యాస సుతో,
రాజన్! శుకో అత్ర స్థితవాన్’’-ఇతి।।
ఈ విధంగా తండ్రిగారు శ్రీ వ్యాసమహర్షి సూచించగా, అప్పటికప్పుడే శుకముని అక్కడి సుమేరుపర్వత ప్రదేశమునుండి బయలుదేరి భూమిపైకి వచ్చారు. జనకమహారాజు పరిపాలిస్తున్న ‘విదేహ’ అనే జనక మహారాజుచే పాలించబడుచున్న నగరమునకు వచ్చారు.
శుకమహర్షితో సంభాషించిన ద్వారపాలకుడు, జనకమహారాజును సమీపించి - ‘మహారాజా! భగవానుడగు వ్యాసమహర్షి కుమారుడు శుకమహర్షి తమ దర్శనమునకై రాజద్వారము వద్ద వేచి ఉన్నారు’ - అని తెలియజేశారు.
5. జిజ్ఞాసార్థం శుకస్య, అసావాః తామేవేతి అవజ్ఞయా ।
ఉక్త్వా బభూవ జనకః తూష్ణీం, సప్తదినాని అథ,
తతః ప్రవేశయామాన జనకః శుకం
అంకణే, తత్రాహాని స సప్తైవ
తథైవ అవత్ ఉన్మనాః, తతః
ప్రవేశయామాస జనకోః అంతఃపురాజిరే।
రాజా న దృశ్యతే తావత్ ఇతి సప్త దినాని తమ్।
‘‘ఈతని జిజ్ఞాస తగినంతగా తీవ్రమైనదా? కాదా?’’ - అని పరీక్ష చేసే ఉద్దేశ్యముతో - ‘‘సరే! అట్లాగే ఉండనీయండి’’ - అని పలికి 7 రోజుల వరకు పట్టించుకోలేదు. తూష్ణీభావము వహించారు. ‘‘అన్యథా వ్యవహారాలలో ఉన్నారు’’ అని మాత్రమే కబురంపారు.
7 రోజుల తరువాత శుకుడు రాజ ప్రాంగణములో ప్రవేశించారు. అయినప్పటికీ ‘మరొక ‘7’ రోజుల వరకు జనకమహారాజు దర్శనము కుదరదు’ అని మాత్రము వ్యాసకుమారునికి తెలియజేయబడింది.
తత్ర ఉన్మదాభిః కాంతాభిః
భోజనైః భోగసంచయైః । జనకో
లాలయామాస శుకం శశి నిభాననమ్।
తే భోగాః తాని భోజ్యాని వ్యాసపుత్రస్య
తత్ మనః, నాజహ్రుః మంద పవనో-
బద్ధపీఠమివ అచలమ్। కేవలం సుసమః
స్వచ్ఛో మౌనీ, ముదిత మానసః ।
సంపూర్ణ ఇవ శీతాంశుః అతిష్ఠత్ అమలః శుకః।।
అయితే అంతఃపురంలో ప్రవేశము పొందిన శుకయోగి- 7 రోజులు ఉన్మత్తునివలె తిరుగాడిన తరువాత ఆయనకు సకల రాచమర్యాదలు అందించబడినాయి. మన్మధమత్తులగు వారకాంతల సేవలు, రుచికరమైన ఆహారపదార్థములు - పూర్ణచంద్రుని సౌందర్యమును పుణికిపుచ్చుకొన్న శుకమహర్షికి అందించబడినాయి.
మలయమారుతము యొక్క పిల్లగాలులు కొండను కదల్చగలవా? అట్లాగే శుకదేవుడు కూడా కేవల -సుమస్కుడై, స్వచ్ఛ స్వభావుడై, సంతోషము వదలని అంతరాంగుడై, ప్రసన్నహృదయుడై ఆయా అందించబడిన భోగములపట్ల మౌనము వహించి ఉన్నారు. పున్నమిరోజు కనిపించే పూర్ణచంద్రునివలె ప్రశాంత - నిర్మల - ఆనందస్వరూపులై ఉండసాగారు.
6. పరిజ్ఞాత స్వభావం, తం శుకం
స జనకో నృపః, ఆనీయ ముదిత
ఆత్మానమ్ అవలోక్య న నామ హ ।
‘‘నిశ్శేషిత జగత్కార్యః । ప్రాప్త
అఖిల మనోరథః । కిం ఈప్సితం తవ?’’
- ఇతి ఆహ, కృత స్వాగతమ్ ఆహ తమ్।।
జనకమహారాజు శుకుని స్వభావము బాగుగా తెలుసుకున్నవారై, సంతోషము పొందారు. స్వయముగా వెళ్ళి అంతఃపురమునకు తీసుకొనివచ్చారు. నమస్కరించారు. స్వాగతము పలికారు.

ఓ శుకదేవా! సుస్వాగతం! మీకు ఈ లోకాలలో చేయవలసిన కార్యములంటూ ఏమీ లేనట్టి ఆత్మానుభవులయ్యారు. కార్య-కారణ-కర్తృత్వాలను అధిగమించారు. ఆత్మాసాక్షాత్కారము పొందిన మీరు సకల మనోరథములు నెరవేరినవారయ్యారు. మరి ఇంక మీరు ఏం కోరుకొని వచ్చారు?’’
‘దయచేసి చెప్పండి’ - అంటూ స్వాగతవచనాలు పలికారు.
శుకః పప్రచ్చుః (శుక ఉవాచ) :
‘‘సంసారాడంబరం ఇదం కథం
అభ్యుత్థితం గురో? కథం ప్రశమమ్
ఆయాతి? యథావత్ కథయాశు మే।’’
యథావత్ అఖిలం ప్రోక్తం జనకేన
మహాత్మనా, తదేవ యత్
పురాప్రోక్తం తస్య పిత్రా మహాధియా।
శుకమహర్షి : గురుదేవా! ఈ సంసారాడంబరము ఎచ్చట నుండి బయల్వెడలుతోంది? ఎట్లా ఉపశమిస్తోంది? ఆ యధాక్రమమంతా దయతో నాకు వివరించి చెప్పండి.

అప్పుడు మహాత్ముడగు శ్రీ జనకమహారాజు యథాక్రమమంతా సమస్తము - ఉన్నది ఉన్నట్లుగా, ఇతః పూర్వమే శాస్త్రములలో చెప్పబడినదంతా వివరించి చెప్పారు. అదంతా కూడా శ్రీ శుకుని దృష్టిలో మహాధీమంతులగు శ్రీ వ్యాసులవారు వివరించినట్లే ఉన్నది.
(శ్రీ శుక ఉవాచ।)
స్వయమేవ మయా
పూర్వం అభిజ్ఞాతం విశేషతః।
ఏతత్ ఏవ హి పృష్టేన పిత్రా మే సముదాహృతమ్ ।
శ్రీ శుకమహర్షి: ఓ గురవర్యా! జనక మహారాజా! మీరు వివరించి చెప్పిన ఆయా విశేషాలన్నీ ఇతఃపూర్వం మేరు శిఖరంపై ఏకాంతంగా తపస్సు చేస్తూ ఉండగానే బాగా తెలుసుకొన్నాను. అభిజ్ఞాతుడనయ్యాను.
అవే విశేషాలు మా నాన్నగారిని అడిగినప్పుడు ఆయన కూడా సవివరణగా చెప్పటం జరిగింది.
భవత అపి ఏష ఏవ అర్థః కథితో। వాగ్విదాం వర !
ఏష ఏవహి వాక్యార్థః శాస్త్రేషు పరిదృశ్యతే ।
మనో వికల్ప సంజాతం, తత్ వికల్ప
పరిక్షయాత్, క్షీయతే దగ్ధ సంసారో
నిస్సార - ఇతి నిశ్చితః ।।
ఓ మహావక్తా! వాగ్విదాం వర! మీచేత కూడా అదే అర్థము ఇప్పుడు శాస్త్ర - దృష్టాంత పూర్వకంగా చెప్పబడింది కూడా. మీరు, మా నాన్నగారు చెప్పిన మహార్థమే శాస్త్రములలో కనిపిస్తూ ఉన్నది.
ఈ ‘సంసారము’ అనునదంతా ‘మనోవికల్పము’ వలన పుట్టుతోంది. అట్టి మనో వికల్పము నశిస్తే (లేక పరి-క్షయిస్తే) సంసారము, అద్దాని వికారములు, అది కల్పిస్తున్నబంధములతో సహా దగ్ధమై నశించగలదు. (లేక) క్షీణించగలదు (లేక) రహితమైపోగలదు.
అందుచేత ‘సంసారము’ అనుబడుదానికి - మనోవికల్పము లేకుంటే - ఉనికియే లేదు. అది స్వతఃగా చూస్తే ‘నిస్సారము’ అని చెప్పబడుతోంది.
7. తత్ కిమ్ ఏతత్, మహాభాగ!
సత్యం బ్రూహి మమ అచలమ్ ।।
త్వత్త్వో విశ్రమం ఆప్నోమి చేతసా భ్రమతా జగత్ ।
శ్రీ జనక ఉవాచ :
శృణు తావత్
ఇదానీం త్వం కధ్యమానం ఇదం మయా
శ్రీ శుక। జ్ఞాన విస్తారం బుద్ధి
సారాంతర అంతరమ్, యత్ విజ్ఞానాత్
పుమాన్ తు సద్యో జీవన్ముక్తత్వం ఆప్నుయాత్।
హే గురు భగవాన్! ఓ మహాభాగా! అదంతా ఏమిటి? ఎట్లా? ఎందువలన? ఏ రీతిగా? మార్పు చేర్పులు లేనట్టి నాయొక్క వాస్తవమగు పరమసత్యము ఏమిటో నాకు చెప్పండి. కేవలమగు ఆత్మస్వరూపమునకు సంసార దోషము ఎట్లా అంటుతోంది?
మీయొక్క ఆత్మబోధచేత నాయొక్క బుద్ధి జగత్ భ్రమను వీడి, ఇక అనునిత్యమగు ఆత్మానుభవమునందు విశ్రాంతపొందెదెట్లా? వివరించండి.

శ్రీ జనకమహారాజు : అదంతా కూడా ఇప్పుడు సవివరణగా, విశ్లేషపూర్వకంగా - సారాంశముగా, అంతరాంతరమున - ‘‘నాకు స్వానుభవమగుచున్నది.’’ చెప్పుచున్నాను. నేను వివరిస్తున్న ఈఈ విశేషాలు విని, అర్థం చేసుకుంటే చాలు, సద్యో జీవన్ముక్తి (ఇప్పటికిప్పుడేముక్తి) లభించగలదు.
‘‘దృశ్యం నాస్తి’’ ఇతి బోధేన
మనసో దృశ్యమార్జనమ్, సంపన్నంచేత్
తదుత్పన్నా పరా నిర్వాణ నిర్వృతిః।
‘‘దృశ్యము కళ్ళకు కనబడుచూ ఉన్నప్పటికీ, ఇది వాస్తవానికి మొదలేలేదు’’ ఇట్టి బోధ (Messege / Learning / Addressing) చేత మనస్సులో దృశ్య జాడ్యము తొలగిందా, ఆ మరుక్షణం నిర్వృతి (Sans distraction) రూపమగు ‘పరాస్థానము’ (లేక) ‘నిర్వాణము’ అనబడు మోక్షము సిద్ధించగలదు.
అశేషేణ పరిత్యాగో
వాసనాయాం య ఉత్తమః, ‘‘మోక్ష’’ ఇతి
ఉచ్యతే సద్భిః । స ఏవ విమల క్రమః ।।
అట్టి పరా - నిర్వాణ - మోక్షస్థానము సిద్ధించేది ఎట్లా? దృశ్యమునకు - సంబంధించిన వాసనలను నిర్దిష్టంగా పరిత్యజించటంచేతనే (లేక) పరిత్యాగముచేతనే. కనుక ‘‘వాసనల మలమును తొలగించి మనస్సును ధ్యానము మొదలైనవాటిచే నిర్మలం చేసుకోండి’’ అని మహనీయులు విమలక్రమమును (The procedure of purifying) చెప్పుచున్నారు.
యే శుద్ధ వాసనా భూయో
న జన్మ-అనర్థ భాగినః। జ్ఞాత జ్ఞేయాస్త
ఉచ్యంతే జీవన్ముక్తా మహాధియః।
పదార్థ భావనా దార్ధ్యం ‘‘బంధ’’ ఇతి
అభిధీయతే । వాసనాతానవం,
బ్రహ్మన్! - ‘‘మోక్ష’’ ఇతి అభిధీయతే ।।
ఈ విధంగా వాసనలు రెండు రకములు (1) శుద్ధ వాసనలు (2) మలిన వాసనలు.
శుద్ధవాసనల అనగా? - అనేకముగా కనిపిస్తూ కూడా ఏకముగా అనిపించగల కర్మ-జ్ఞానాభ్యాసములు. అవి ఎవ్వరు నిర్వర్తిస్తూ ఉంటారో, అట్టివారే ‘‘జీవన్ముక్తులు’’ అని, విదిత వేద్యుల / జ్ఞానజ్ఞేయుల (తెలుసుకోవలసినది తెలుసుకొనియున్న పండితుల) చే చెప్పబడుచూ ఉన్నారు.
🌺 పదార్థముల గురించిన దృఢమైన వస్తుభావనయే ‘బంధము’ అనబడుతోంది.
🌺 దృశ్యపదార్థములపట్ల వాసనా క్షయమే మోక్షము.
(The Decreasing of Tendencies and placing them towards “SELF” is MOKSHAM)
జీవన్ముక్తుడు

8. తపః ప్రభృతినా యస్మై
హేతునైవ వినా పునః, భోగా
ఇహ న రోచంతే స ‘‘జీవనుక్త’’ ఉచ్యతే ।।
జీవన్ముక్తుడు - అనగా ఎవ్వరు?
ఓ శుకమహాశయా! ‘జీవన్ముక్తుడు’ అనగా ఎవ్వరో, జీవన్ముక్తుని లక్షణములు ఏవిధంగా ఉంటాయో - ముముక్షువుల అభ్యాసము కొరకై - చెప్పుచున్నాను.

ఎవ్వరికైతే అప్రయత్నపూర్వకంగానో, స్వాభావికంగానో - (తపస్సు) మొదలైన వాటి అవసరము / అగత్యము లేకుండానే) - ఈ దృశ్యజగత్తులో తారసబడే ఇంద్రియభోగములు ‘‘అనుభవించాలి. కావాలి. రుచి అయినవి’’ - అని అనిపించవో - ఆతడే జీవన్ముక్తుడు.
ఆపతత్‌సు యథాకాలం
సుఖ దుఖేషు అనారతః, న హృష్యతి -
గ్లాయతి యః, స ‘జీవమ్మక్త’ ఉచ్యతే ।।

హర్ష-అమర్ష భయ-క్రోధ, కామ-కార్పణ్య దృష్టిభిః,
న పరామృశ్యతే యో అంతః, సః జీవన్ముక్త ఉచ్యతే।
ఆయా కాలములలో (యథాకాలంగా) వస్తూపోతూ ఉండే ఆపద - సంపదల పట్ల , సుఖ దుఃఖములపట్ల ఎవ్వరైతే సంతోషముగాని, దుఃఖముగాని పొందరో, అతడే ‘‘జీవన్ముక్తుడు’’.

ఎవరి ‘‘అంతఃకరణము’’ (అనే కొండ)ను సంతోషము, దుఃఖము, భయము, క్రోధము, కామము, కార్పణ్యము (బెంగపడటము) మొదలైన దృష్టులు స్పృశించజాలవో, స్పృశించినా కూడా ప్రవేశించజాలవో ఆతడే జీవన్ముక్తుడు.
అహంకారమయీం త్యక్త్వా,
వాసనాం లీలయైవ యః, తిష్ఠతి ధ్యేయ సంత్యాగీ,
స జీవన్ముక్త ఉచ్యతే ।।

ఈప్సిత-అనీప్సిత్యేన స్తో
యస్య అంతర వృత్తి దృష్టిషు,
సుషుప్తి వత్ యత్ చరతి, స జీవన్ముక్త ఉచ్యతే।।
ఎవ్వరైతే అహంకార మమకారములతో కూడిన వాసనలను త్యజించి వేసి, దృశ్య ధ్యేయములను త్యాగము చేసి, లీలా వినోదంగా దృశ్యమునందు విహరిస్తూ ఉంటారో, ఆతడే జీవన్ముక్తుడు.

ఎవ్వరైతే ‘‘అంతర్ముఖ దృష్టి’’చే దృశ్యముపట్ల ఇష్టముల - అయిష్టములకు సంబంధించిన దృష్టులను త్యజించి, జాగ్రత్తులో కూడా సుషుప్తిలో ఉన్నవానివలె - సంచరిస్తూ ఉంటాడో ఆతడే జీవన్ముక్తుడు.
అధ్యాత్మరతిః ఆసీనః,
పూర్ణః పావన మానసః,
ప్రాప్త అనుత్తమ విశ్రాంతిః
న కించిత్ ఇహ వాంఛతి,
యో జీవతి గత స్నేహః,
స జీవన్ముక్త ఉచ్యతే.
ఈ దృశ్యమానమగుచూ ఉన్న (కనబడుచూ - వినబడుచూ ఉన్న) సమస్తము ఆత్మయందు దర్శించటమే - ఆధ్యాత్మధ్యానము (లేక) అధ్యాత్మయోగము (లేక) అధ్యాత్మ సందర్శనము.
ఎవ్వడైతే అట్టి అధ్యాత్మమునందు రతిస్తూ, ఆత్మయందే, పూర్ణభావనతో, పవిత్రమగు ఆత్మభావనా మనస్కుడై, ఆత్మయందే పరమ విశ్రాంతిని పొందుచూ ఉంటాడో,
ఇక్కడ ఏ కించిత్తూ కూడా కోరుకోవటము లేదో,
- దేనిపట్లా ఏమాత్రము స్నేహబంధము (Sense of Dependence) కలిగి ఉండటము లేదో, అట్టి ప్రశాంత - విశ్రాంతి లక్షణసమన్వితుడే - జీవన్ముక్తుడు. సమస్తమును ఆత్మగా, ఆత్మనే చూస్తూ, ఇక అన్యదృష్టి లేనివాడు- జీవన్ముక్తుడు.
9. సంవేద్యేన హృదాకాశే మనాగపి న లిప్యతే,
యస్య అసావ జడా సంవిత్
స జీవన్ముక్త ఉచ్యతే।।

రాగ ద్వేషౌ సుఖం దుఃఖం ధార్మాధర్మౌ ఫలాఫలే,
యః కరోతి అనపేక్ష్య ఏవ, స జీవన్ముక్త ఉచ్యతే ।।
ఆకాశమునకు వస్తువుల దోషములు అంటుతాయా? లేదుకదా. ఆ విధంగానే, ఎవ్వరియొక్క హృదయాకాశము తెలియబడుచూ ఉన్న (సంవేద్యమగుచున్న) ఆయా వస్తు - సంఘటన - సహజీవులు మొదలైనవాటిచే కించిత్ కూడా దోషము పొందదో - వారే జీవన్ముక్తులు.

ఎవ్వరు రాగ-ద్వేష, సుఖ-దుఃఖ, ధర్మ-అధర్మ, ఫల-అలముల వ్యవహారశీలముల పట్ల అపేక్షలేకుండానే (unattracted) నిర్వర్తించువారై ఉంటారో - వారే జీవన్ముక్తులు.
మౌనవాన్ నిరహంభావో, నిర్మానో
ముక్త మత్సరః, యః కరోతి గత
ఉద్వేగః, సః జీవన్ముక్త ఉచ్యతే।।

సర్వత్ర విగత స్నేహో, యః సాక్షివత్ అవస్థితః
నిరిచ్ఛో వర్తతే కార్యే, స జీవన్ముక్త ఉచ్యతే।।
ఎవ్వరైతే సమస్త ప్రాపంచక విశేషముల - సందర్భములపట్ల మౌనము వహించినవారై, ‘‘నేను కర్తను’’ - అను అహంకారము లేనివారై మాన-మద-మాత్సర్యములు మొదలంట్లా జయించివేసినవారై ఉద్వేగ రహితులై ఉంటారో - వారే జీవన్ముక్తులు.

సర్వత్రా స్నేహబంధభావరహితులై, సాక్షీభూతంగా ఉంటూనే ఇచ్ఛారహితంగా ఆయా విధాయకములగు కార్యములను నిర్వర్తిస్తూ ఉంటారో - వారే జీవన్ముక్తులు.
యేన ధర్మం అధర్మం చ, మనో మననమీహితమ్,
సర్వం అంతః పరిత్యక్తం, స జీవన్ముక్త ఉచ్యతే।।

యావతీ దృశ్యకలనా సకలేయం విలోక్యతే,
సా యేన సుష్ఠు సంత్యక్తా, స జీవన్ముక్త ఉచ్యతే।।

కట్వ ఆమ్ల లవణం తిక్తం అమృష్టం
మృష్టం ఏవ చ, సమమేవ చ యో
భుంక్తే, స జీవన్ముక్త ఉచ్యతే।।
ధర్మా ధర్మములను, వ్యావహారికమైన సమస్త మనోసంకల్పములను పరిత్యజించి, హృదయంలో మననరూపముగా కలిగి ఉండనివాడు జీవన్ముక్తుడు.

తనయొక్క ‘సమ్యక్’ (సర్వసమాత్మ) దృష్టిచే దృశ్యమును చూస్తూ సర్వభేదములను పరిత్యజించి ఉంటాడో ఆతడే జీవన్ముక్తుడు.

ఎవ్వడైతే షట్ (6) రుచులు అయినట్టి - కారము, పులుపు, ఉప్పు, చేదు, రుచి - అరుచి వీటినన్నిటిని సమభావముతో భుజించు దృష్టిని పెంపొందించుకొని ఉంటాడో - ఆతడే జీవన్ముక్తుడు.
జరా మరణ ఆపచ్చ, రాజ్యం దారిద్ర్యం
ఏవ చ, ‘రమ్యం’ ఇతి ఏవ (ఇత్యేవ) యో భుంక్తే,
స జీవన్ముక్త ఉచ్యతే।।
బాల్య - యౌవన - వార్ధక్యములు (ముసలితనము), జీవితము - మరణములను, రాజ్యప్రాప్తి - దారిద్ర్య ప్రాప్తులను ‘‘ఇవన్నీ మంచిదే । రమ్యమే।’’ - అను దృష్టితో ఆస్వాదిస్తాడో ఆతడే ‘‘జీవన్ముక్తుడు’’.
10. ధర్మ అధర్మౌ సుఖం దుఃఖం
తథా మరణ జన్మనీ, ధియా యేన
సు సంత్యక్తం, స జీవన్ముక్త ఉచ్యతే।।

ఉద్వేగ ఆనంద రహితః
సమయా స్వచ్ఛయా థియా,
న శోచతి, న చ ఉదేతి, స జీవన్ముక్త ఉచ్యతే।।
ఇక్కడి ధర్మ - అధర్మ వ్యవహారములు, జీవన్ - మరణములు మొదలైనవాటినన్నిటినీ కూడా బుద్ధి కుశలతతో (లేక) బుద్ధి నిశ్చలతతో మొదలంట్లా సంత్యజించినవాడై ఉండువాడే జీవన్ముక్తుడు.

ఉద్వేగ-ఆనందములను దరిజేరనీయనివాడై, స్వచ్ఛము - సమత్వములతో కూడిన బుద్ధితో (with logic and with purity of perception of all pervading unity) - దేని గురించీ కూడా ఆదుర్దా పొందక, క్రుంగక, దేనికీ బద్ధుడు కాకుండువాడు - జీవన్ముక్తుడు.
సర్వైచ్ఛా సకలాః శంకాః
సర్వ ఈహాః సర్వ నిశ్చయాః, ధియా
యేన పరిత్యక్తాః, స జీవన్ముక్త ఉచ్యతే।।
సమస్తమైన కోరికలను, శంకలను (అనుమానములను), సర్వ మమకారములను బుద్ధియొక్క నిశ్చయముతో పరిత్యజించువాడే జీవన్ముక్తుడు.
జన్మ స్థితి వినాశేషు
స ఉదయ - అస్తమయేషు చ, సమమేవ
మనో యస్య, స జీవన్ముక్త ఉచ్యతే।।

న కించన ద్వేష్టి, తథా న కించిత్ అపి కాంక్షతి,
భుంక్తే యః ప్రకృతాన్ భోగాన్,
స జీవన్ముక్త ఉచ్యతే ।।

శాంత సంసార కలనః, కలావాన్ అపి నిష్కళః
యః స చిత్తో-పి నిశ్చిత్తః, స జీవన్ముక్త ఉచ్యతే ।।
ఎవ్వని మననరూపమగు మనస్సు → జన్మ - స్థితి - వినాశన సందర్భములలోను, (తన ఉదయ అస్తమయములందు సూర్యునివలె) - సమత్వము ఏమాత్రము వీడకయే ఉంటుందో - ఆతడు జీవన్ముక్తుడు.

ఎవ్వడైతే దేనినీ కూడా ఏ కించిత్ కూడా ద్వేషించడో, దేనినీ ఏ కించిత్ కూడా కాంక్షించడో (కోరుకోడో), ప్రకృతి సిద్ధంగా (In its natural course) ఏఏ భోగములు స్వాభావికంగా ఎంతవరకు లభిస్తే, వాటినే అత్యాశ-కాంక్ష -ద్వేషములు లేకుండా ఆస్వాదిస్తూ ఉంటాడో, ఆతడే జీవన్ముక్తుడు.

ఎవ్వడైతే అనేక సంసార కలనములు పొందుచున్నప్పటికీ పరమశాంతము స్వాభావికంగా వహించి ఉంటాడో, చిత్తము ఉండి కూడా చిత్తరహిత చిత్ - రూపుడై ఉంటాడో - ఆతడే జీవన్ముక్తుడు.
యః సమస్త అర్ధజాలేషు వ్యవహార్యపి-
నిస్పృహః, పదార్థేషు ఇవ పూర్ణాత్మా
స జీవన్ముక్త ఉచ్యతే।।
ఎవ్వడు ఈ ఎదురుగా ఇంద్రియములను అర్థపూర్వకంగా కనిపించే సమస్త అర్థజాలములందు (Groups of Different Dimensions and Meanings) వ్యవహరిస్తూనే అంతరమున నిస్పృహుడై, విషయ - వ్యవహార రహితుడై సమస్తమునకు సర్వదా అతీతుడై ఉంటాడో, పదార్థముల అనుభవము సందర్భములలో కూడా పూర్ణాత్ముడై ప్రకాశిస్తూ ఉంటాడో ఆతడు - జీవన్ముక్తుడు.
విదేహముక్తి

11. జీవన్ముక్త పదం త్యక్త్వా స్వదేహే
కాలసాత్‌కృతే, విశత్యదేహ - ముక్తత్వం
పవనో అస్పందతాం ఇవ ।।
విదేహముక్తి

గాలి యొక్క తరంగములు గాలితో ఏకమగు విధంగా, ఈ జీవుడు జీవన్ముక్తుడై (జీవించి ఉంటూనే నిత్యముక్తత్వము అభ్యసిస్తూ) - ఆ ‘జీవన్ముక్తపదము’ను అధిగమించి కాలక్రమేణ ‘విదేహముక్తత్వము’ అను కైవల్య స్థానములో ప్రవేశము పొందుచున్నాడు.
విదేహ ముక్తో న ఉదేతి। న అస్తమేతి।
న శామ్యతి । న సత్ । న అసత్ । న దూరస్థో
న చ అహం । న చ నేతరః ।
అట్టి విదేహముక్తుడు ‘‘కేవాలాత్మాఽహమ్’’ అనుభూతిని సిద్ధించుకుంటాడు. ఆతడు ఉదయించడు. అస్తమించడు. శమించడు. ఇక్కడ నుండి బయల్వెడలడు. ఎచ్చటినుండో ఇక్కడికి రాడు.
ఇంకా విదేహముక్తస్థితి ఎట్టిది?
విదేహముక్తునకు అనుభవమగుచున్న ద్రష్ట - దృశ్య సహిత కేవల స్వరూపము ‘సత్’ కాదు. అసత్ కాదు. ఉండీ లేనిది (సదసత్) కాదు. అది ‘నేను’ కాదు. మరొకరు కాదు.
తతః స్తిమిత గంభీరం న తేజో। న తమః తతమ్।
అనాఖ్యమ్। అనభివ్యక్తం। సత్ కించిత్ అవశిష్యతే ।।
న శూన్యం । న అపి చ ఆకారి। న దృశ్యం।
న అపి దర్శనమ్ । న చ భూత పదార్థౌఘః।
సదసంతతయా స్థితమ్ ।
కిమపి అవ్యపదేశ ఆత్మా, పూర్ణాత్-
పూర్ణతర - ఆకృతిః । న సత్। న అసత్। న సదసత్।
న అభావో । భావనం న చ।।
విదేహముక్తుని స్వస్వరూపానుభవము - స్థిమితము, గంభీరము సంతరించుకొన్నట్టిది. నిర్వచించి చెప్పరానిది. (అనాఖ్యము). అది తేజస్సుకాదు. చీకటి కాదు. అభివ్యక్తము అయినది కాదు. అయితే ఈ అభివ్యక్తిమంతా అద్దాని కించిత్ ప్రదర్శనమే. ‘ఉనికి’గా కించిత్ అవశేష్యమై ప్రకటనమగుచూ ఉంటోంది.
అది శూన్యము కాదు. సాకారి కాదు. దృశ్య - దర్శనములు కాదు. భౌతిక పదార్థం కాదు, సర్వదా సత్ స్వరూపము సంతరించుకున్నట్టిది. అనంతరూపములుగా సంస్థితమై ఉన్నట్టిది.
చిన్మాత్రం। చైత్య రహితం।
అనంతం। అజరం శివమ్।
అనాది మధ్య పర్యంతం, యత్ అనాది నిరామయమ్।
ద్రష్టృ దర్శన దృశ్యానాం
మధ్యే యత్ దర్శనం స్మృతమ్। న అత,
పరతరం కించిత్ నిశ్చయో అస్తి అపరో, మునే!
‘‘ఇది!’’ అని చెప్పజాలనిది. పూర్ణమునకే పూర్ణస్వరూపము. సత్-అసత్- సదసత్-భావ-అభావముల రూపము కానట్టిది.
కదలికలే లేనట్టి ‘కేవలచిత్’ స్వరూపము. అనుభవమైనదేదీ తనకు వేరుగా లేనట్టిది. అనంతమైనది. జరామరణములకు సంబంధించినది కాదు. పరమ సుఖ-శుభప్రదమైనది. ఆది, మధ్య, అంతములుగా విస్తరిస్తూనే, ఆదిమధ్యాంతరహితము.
ఓ మునీశ్వరా! శుకదేవా! ద్రష్ట - దర్శన - దృశ్యములనబడే త్రిపుటిల మధ్యగా కించిత్ దర్శనము అగుచున్నట్టిది. అట్టి కేవల చిన్మయవిదేహముక్తి స్వరూపమునకు ఆవల మరింకేమీ కించిత్ కూడా శేషించి లేనట్టిది. ‘అది నాకు అనన్యము’ అను భావన సుస్థిరపరచుకోవయ్యా.
స్వయమేవ త్వయా జ్ఞాతం । గురతశ్చ పునః శ్రుతమ్ ।
స్వ సంకల్ప వశాత్ బద్ధో । నిస్సంకల్పాత్ విముచ్యతే ।।
ఓ శుకదేవా! అట్టి మనందరి అఖండ అప్రమేయత్మ గురించి నీవు స్వయముగా స్వకీయ విచారణచే తెలుసుకొనియే ఉన్నావు. అటు తరువాత మరల గురుదేవులగు మీ తండ్రి శ్రీ వ్యాసమహర్షి చెప్పగా విన్నావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో. స్వకీయ సంకల్పము చేతనే బంధము. నిస్సంకల్పముచే ముక్తి.
12. తేన స్వయం త్వయా జ్ఞాతం
జ్ఞేయం యస్య మహాత్మనః, భోగేభ్యో హి
అరతిః జాతా, దృశ్యాద్వా సకలాత్ ఇహ।।
మహాత్ములగు ఆత్మతత్త్వజ్ఞులు ఏది తెలుసుకోవాలి అని ఎలుగెత్తి చెప్పుచున్నారో, - అట్టి ‘‘స్వస్వరూపాత్మమేవాహమ్’’ గురించి జ్ఞాతవ్యముగా మీకు మీరే తెలుసుకొనే ఉన్నారు. అందుచేతనే సమస్త దృశ్యసంబంధమైన ఆయా ఇహభోగములన్నీ మీకు రతించటానికి ఏమాత్రము అర్హమైనవికావని, ఆత్మయే రమించవలసిన వస్తువని - ప్రవర్తన రూపంగా నిరూపించుకున్నారు.
ప్రాప్తం ప్రాప్తవ్యమ్ అఖిలం
భవతా పూర్ణచేతసా, స్వరూపే
తపసి, బ్రహ్మన్! ముక్తఃత్వమ్।
అహ్రాంతిం ఉత్సృజ ।।
మీయొక్క వివేచన సంతరించుకున్నట్టి బుద్ధితో ప్రాప్తించుకోవలసినది ప్రాప్తించుకొన్నారు. తపస్సుచే స్వస్వరూపము సిద్ధంచుకొనియే ఉన్నారు. హే బ్రహ్మన్! మీరు ముక్తులే. అందుచేత ‘‘బంధము ఉన్నది’’ అనే అహ్రాంతిని నిస్సందేహంగా త్యజించండి.
అతి బాహ్యం, తదా అబాహ్యమ్,
అంతర అభ్యంతరం ధియః, శుక !
పశ్యన్ న పశ్యేత్ త్వం, సాక్షీ సంపూర్ణ కేవలః ।।
హే శుకదేవా! బాహ్యముగా కనబడే సమస్తమును అతిక్రమించివేయండి. బుద్ధితో అంతరాంతరమై ప్రకాశిస్తున్న ఆత్మనే దర్శించండి. దృశ్యవ్యవహారములను చూస్తూనే చూడనివారై, పూర్ణులై, కేవలసాక్షియై విహరించండి.
విశ్రామ శుకః తూష్ణీం స్వస్థే
పరమ వస్తుని, వీత శోక భయ ఆయాసో
నిరీహః చ్ఛిన్న సంశయః ।
ఈ విధంగా జనకమహారాజు నుండి శ్రవణం చేసిన శ్రీ శుకుడు మనోబుద్ధులకు సంబంధించిన సర్వశ్రమలు తూష్ణీకరించినవారైనారు. సమస్త శోకములను (All worries) భయములను (All Fears) ఆయాసములను (Inclinatory emotions) వదలివేశారు. సర్వసందేహములను ఛిన్నం చేసి, ప్రాపంచికమైన భావనలు, అనుమానములు కోరికలు - త్యజించి, ఆత్మానందులైనారు.
శ్రీ జనకమహారాజు నిర్ద్వంద్వంగా స్వస్వరూపాత్మ గురించి ప్రకటించిన స్వాత్మానుభవము శ్రవణము చేసి, శుకమునీంద్రులవారు ‘‘ఆత్మతత్త్వ-ప్రశాంతానుభవి’’ అయ్యారు.
జగామ శిఖరం మేరోః సమాధి అర్థమ్ అఖండితమ్।
తత్ర వర్ష సహస్రాణి నిర్వికల్ప సమాధినా,
దేశే స్థిత్వా శశామాసే హి ఆత్మని అస్నేహ దీపవత్।।
గురుదేవుడగు శ్రీ జనకమహారాజుకు సాష్టాంగదండ ప్రణామములు ఆచరించి, సెలవు తీసుకొని తిరిగి మేరుపర్వత శిఖరం చేరారు. వేయి సంవత్సరములు నిర్వికల్ప సమాధియందు గడిపారు. నూనె అయిపోయిన దీపమువలె ఆత్మయందు ఆయన మనస్సు సశాంతించినదై, విశ్రాంతిని పొందసాగింది.
వ్యపగత కలనా కళంక, శుద్ధః
స్వయం అమల ఆత్మని, పావనే పదే
అసౌ, సలిల కణ ఇవ అంబుధౌ,
మహాత్మా విగళిత వాసనం ఏకతాం జగామ।।
జలకణము సముద్ర జలములో ప్రవేశించి ఆ సముద్రజలముతో ఏకమై పోవు రీతిగా శ్రీ శుకదేవుడు జీవాత్మత్వమును సర్వాత్మత్వముతో ఏకత్వము చేసివేశారు. నిర్వాసనాస్థితి (A state of ‘Nil’ Tendenceies) పొందారు. సర్వ అన్య సంకల్ప దోషములను పరిశుభ్రపరచుకొన్న వారయ్యారు. స్వయముగా నిర్మలమగు ఆత్మపదమును అధిష్ఠించారు. ఏకమగు మహాత్మ స్వరూపులైనారు.
(మహాత్ముడు = ఈ సమస్తము నాలోనే ఉన్నది. ఈ సమస్తములో, ఈ సమస్తముగా ఉన్నది నేనే!’’ - అని భావనాసమన్వితుడు.)
ఇతి శుకవిశ్రాంతి మహోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।
ఇతి శుక విశ్రాంతి - మహోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।

తృతీయోధ్యాయః - ఋభు నిదాఘ సంవాదము

1. నిదాఘో నామ మునిరాట్ । ప్రాప్త విద్యశ్చ బాలకః ।
విహృతః తీర్థయాత్రార్థం పిత్ర అనుజ్ఞాతవాన్ స్వయమ్ ।
ఋభు మహర్షికుమారుడు నిదాఘుడు - అనే మునివరాట్ (మునీశ్వరుడు). ఆయన బాల్యంలోనే విద్యను పూర్తి చేసుకొన్నారు. తండ్రి అనుజ్ఞను తీసుకొని ఇక స్వయముగా తీర్థయాత్రలకు బయలుదేరారు.
స అర్ధ త్రికోటి (3 1/2 కోట్లు) తీర్థేషు స్నాత్వా,
గృహమ్ ఉపాగతః ।
స్వ ఉదంతం కథయామాస
ఋభుం నత్వా మహాయశాః । స అర్ధ త్రికోటి తీర్థేషు
స్నాన పుణ్య ప్రభావతః, ప్రాదురూర్భూతో
మనసి మే విచారః సో అయం ఈదృశః ।
(3 + 1/2) కోట్ల తీర్థములలో స్నానములు చేసి తీర్థయాత్రలు ముగించుకొని తిరిగి ఇంటికి జేరారు. తండ్రిని సమీపించి నమస్కరించాడు, మహాశయుడు (గొప్ప ఆశయము కలవాడై), ఆ నిదాఘుడు తన తీర్థయాత్రానుభవమంతా రంగరించి ఈ విధంగా వివరించి చెప్ప ప్రారంభించారు.
నిదాఘుడు : హే పితృదేవా! గురుతుల్యా! ఋభు మహర్షీ! నమో నమః। నేను ప్రపంచమంతా తిరిగి 3 1/2 కోట్ల తీర్థములలో మునిగి వచ్చాను. అట్టి తీర్థస్నానముల పుణ్య ప్రభావము చేత నా మనస్సునందు ఒకానొక జ్ఞాన విచారణ జనించటం ప్రారంభమయింది.
జాయతే మ్రియతే లోకో, మ్రియతే జననాయ చ ।
అస్థిరాః సర్వ ఏవ ఇమే సచరాచర చేష్ఠితాః।
సర్వ ఆపదాం పదం పాపా భావా విభవ భూమయః।
ఈ జీవుడు దృశ్య జగత్తులో ఎందుకు పుట్టుచున్నట్లు? ఎందుకు మరణిస్తున్నట్లు? ఈతడు మరణించే నిమిత్తమై పుట్టుచున్నాడు. మరల జన్మించే నిమిత్తంగా మరణిస్తూ ఉన్నాడు.
ఇక్కడి చరాచర జీవులందరి చేష్టలు (క్రియలు) అస్థిరములే. ఇక్కడి భావనా వ్యవహార పరంపరలన్నీ పాప - విభవ భూములలోకి దారితీసేవే కదా!
అయః శలాకా సదృశాః
పరస్పర అ సంగినః । శ్లిష్యంతే
కేవలాభావా మనః కల్పనయా అనయా ।
ఇక్కడి జీవుల బంధు సంబంధమైన పరస్పరానుబంధాలన్నీ కూడా - ఇనుపరింగులవంటివే! ఈ జీవులు ఒకరికొకరు సంబంధించినవారే కారు. ఇవన్నీ మనో కల్పనచే బయల్వెడలి, మరల కల్పనారాహిత్యముచే నశించిపోవుచున్నాయి.
భావేషు అరతిః ఆయాతా పథికస్య మరుష్వివ।।
శామ్యతి ఇదం కథం దుఃఖం
ఇతి తప్తోఽస్మి చేతసా.
ఒక బాటసారి మరుభూములలో ఎడారి భూములలో నడచి నడచి, అలసిపోయి కూడా చివరికి ఏమీ లభించనివాడై ఉంటాడు కదా! ఈ మరుభూమి వంటి దృశ్యములో ఏదో పొందాలనే ఉద్దేశ్యముతో ఎంతో శ్రమించి ‘జీవితము’ అనే ఎడారిలో సుదీర్ఘ ప్రయాణములు చేస్తూ ఉన్నప్పటికీ, ఈ జీవుడు అలసి, సొలసి - చివరికి ఏమీ పొందకయే ఉన్నాడు.
‘‘ఈ అశాశ్వత జగత్తులోని సందర్భములతో, సంఘటనలతో, సహా జీవులతో నేను వృద్ధి చేసుకొనియున్న సాంసారిక దుఃఖము నాపట్ల తొలగేది ఎట్లా?’’ అని నా చిత్తము ఎంతగానో పరితాపము పొంద ప్రారంభించింది.
2. చింతా నిచయ చక్రాణి
న ఆనందాయ ధనాని మే।
సంప్రసూత కళత్రాణి
గృహాణి, ఉగ్ర ఆపదామ్ ఇవ ।
ఇయం అస్మిం స్థితో దారాః
సంసారే పరిపేలవా।
అనేక చింతల (Series of worries) చట్రములో చిక్కుకుపోయి ఉన్న నేను,
- ఇక్కడి ధనము మొదలైన సంపదలచే ఏమాత్రము ఆనందము పొందలేనని గమనిస్తున్నాను. అందుచేత, ధనార్జనయే ఆశయముగా తలచి ఈ జీవితమును వృధా చేయ తలచుకోవటం లేదు.
- ఇక్కడి స్త్రీలు, సంపదలు, ఇళ్లు మొదలైన సంబంధములన్నీ కూడా చివరికి ఉగ్రమైన, అతి భయంకరమైన ఆపదలకే దారితీస్తూ ఉన్నట్లు నాకు కనిపిస్తున్నాయి.
- ఇక్కడి భార్యాభర్తల, పిల్ల - జెల్ల సంబంధాలు, తదితర సమస్త సాంసారిక సంబంధాలు - ఇవన్నీ అత్యంత పేలవమైనవి. నిస్సారమైనవి - అని నాకు అనిపిస్తోంది.
శ్రీః, మునే! పరిమోహాయ
స అపి నూనం న శర్మదా ।
ఆయుః పల్లవకోణాగ్ర లంబ అంబుకణ
భంగురమ్।
ఉన్మత్త ఇవ సంత్యజ్య
యాతి అకాండే శరీరకమ్ ।
ఓ మునీశ్వరా! ధనము గొప్ప సుఖమని జనులు మోహము చేతనే భ్రమిస్తున్నారు. కానీ, ధనము ఉన్నవాడు మాత్రం ‘సుఖిని’ అన అనుకోవటంలేదు. అనేక చింతలు వదలటము లేదు.
ఇక ఈ ఆయుష్షు. ఇది వర్షాకాలంలో ఆకు చివ్వర వ్రేలాడే నీటి బిందువువలె అత్యంత క్షణ భంగురము.
ఒక పిచ్చిపట్టినవాడు విలువైన వస్తువును నేలపై విసురుచున్నవిధంగా ఈ శరీరము ఏ క్షణంలోనో నన్ను విడచి ఎటో వెళ్ళిపోగలదు.
విషయాశీ విషాసంగ పరిజర్జర చేతసామ్ ।
అప్రౌఢ ఆత్మ వివేకానాం
ఆయుః ఆయాసకారణమ్ ।
యుజ్యతే వేష్టనం వాయోః।
ఆకాశస్య చ ఖండనమ్।
గ్రంథనం చ తరంగాణాం।
ఆస్థా న ఆయుషి యుజ్యతే।।
నా ఈ చిత్తము పరిపరివిధములైన విషయములతో ఆశలు పెంచుకొని, చివరికి ఆయా విషయములలో చిక్కుకొని మ్రగ్గుతోంది.
ఆత్మగురించిన వివేకము విషయంలో అప్రౌఢము గా ఉన్నంతకాలము ఆయుష్షు శ్రమతో కూడి ఆయాసకారణమే. సుఖము కాదు.
గాలిని గుప్పిటలో బిగించవచ్చునేమో! ఆకాశమును ముక్కలు చేయుట సాధ్యమేమో! జల తరంగములను ప్రోగుచేసి ఒకచోట పెట్టవచ్చునేమో! కానీ ఆయుష్షును నమ్మి ఉండటం, స్థిరముగా ఉంటుందనటం ఎవ్వరివల్లా కాదు.
ప్రాప్యం సంప్రాప్యతే యేన
భూయో యేన న శోచ్యతే,
పరాయా నిర్వృతేః స్థానం
యత్ తత్ ‘జీవితం’ ఉచ్యతే।।
తరవో అపి హి జీవంతి। జీవంతి మృగ పక్షిణః ।
స జీవతి మనో యస్య మననే న ఉపజీవతి ।।
అపరోక్ష జ్ఞానము (లేక) ఆత్మజ్ఞానము ప్రాప్తించాలి. అట్టి ప్రాప్తించవలసినది ప్రాప్తించిందా….ఇక మరల దుఃఖము(worry) అనేదే ఉండదు. అట్టి నిర్వృత (Beyond shakle) పరస్థానము పొందినవానిదే జీవితము.
ఈ మానవుడు దీర్ఘకాలం జీవించటము - అనేది గొప్ప విషయమేమీ కాదు. చెట్లు జీవిస్తున్నాయి. జంతువులు, పక్షులు కూడా జీవిస్తున్నాయి. ఎవ్వని మనస్సైతే అఖండము సమస్తము అయి ఉన్న ఆత్మతో అనుసంధానము (ఉపజీవనము) పొందుచున్నదో, అట్టివాడే జీవించినట్లు. అప్పుడు మాత్రమే మానవుడవటము సద్వినియోగమయినట్లు. లేదా, గొప్ప అవకాశము దుర్వినియోగమే మరి.
3. జాతా స్త ఏవ జగతి జన్తవః సాధు జీవితాః,
యే పునః న ఇహ జాయంతే।
శేషాః జరఠ గర్దభాః।
భారో అవివేకినః శాస్త్రం।
భారో జ్ఞానం చ రాగిణః।
అశాంతస్య మనోభారో ।
భారో అనాత్మవిదో వపుః ।।
ఏ సాధు పుంగవులైతే ఆత్మజ్ఞానమును సంపాదించుకొని తిరిగి జగత్తులో జనించే అగత్యమును అధిగమిస్తారో, పునః జన్మించరో, వారి జన్మయే జన్మ. ఇక మిగిలినవారి జీవితము జరఠ (ముసలి) గాడిద జీవితంతో సమానము.
వివేకికి శాస్త్ర పాండిత్యము భారమేగాని సుఖవంతముకాదు.
- ఆయా దృశ్య విశేషములపట్ల రాగము తొలగనివానికి జ్ఞానము భారమేగాని భ్రమలు తొలగవు.
- అశాంతునికి మనస్సే భారము. ఆత్మ గురించి తెలియనివానికి శరీరమే భారము. శరీరము పొంది, బరువు మొయ్యటమేగాని, ఏ ప్రయోజనమూ ఉండదు.
అహంకారవశాత్ ఆపత్ । అహంకారాత్ దురాధయః ।
అహంకార వశాత్ ఈహా । న అహంకారాత్ పరో రిపుః।।
అహంకారమున్నచోటికి ఆపదలన్నీ వచ్చి చేరుతాయి. అహంకారమే దుష్టచింతలన్నిటికీ నాంది. అహంకారమువల్లనే అనేక కోరికలు. ఈ జీవునికి అహంకారము మించిన శత్రువే లేదు.
అహంకారవశాత్
యద్యత్ మయా భుక్తం చరాచరమ్,
తత్ తత్ సర్వం అవస్తు ఏవ
వస్తు-అహంకార రిక్తతా ।
ఇతః చేతశ్చ సువ్యగ్రం వ్యర్థమేవ అభి ధావతి,
అహంకారము, అట్టి అహంకారముతో కూడి అనుభవించబడే సమస్తము కూడా అవస్తువే! వస్తుతః అహంకారము అంతర్గతంగా ఏమీ లేనిదే! ఖాళీ అయినదే! అహంకార రహితమైనదే వస్తువు. అహంకారపూరితంగా పొందేదంతా అవస్తువే!
ఈ చిత్తము పిచ్చిపట్టినదానివలె ఎల్లప్పుడు వ్యర్థముగా వ్యగ్రత (Deep Worry) యందు చిక్కుకొని ఉంటోంది. ‘మేము బాగున్నాము’ అని పైకి చెప్పుకున్నప్పటికీ, ఈ జీవుని అంతరంగమున ఎన్నో వ్యథలు. చెప్పుకోలేని ఆదుర్దాలు. అనుమానాలు.
మనో దూరతయా యాతి
గ్రామే కౌలేయకో యథా।।
క్రూరేణ జడతాం యాతః తృష్ణా
భార అనుగామినా
వశః కౌలేయ కే-నైవ, బ్రహ్మన్! ముక్తోఽస్మి చేతసా।
(కౌలేయకము = కుక్క)
వీధికుక్క పొందేది ఏదీ లేకపోయినా కూడా, ఆ వీధి - ఈ వీధులలో శ్రమతో నిముష నిముషం తిరుగాడు విధంగా, ఈ మనస్సు పొందేది ఏమీ లేకపోయినప్పటికీ ఎక్కడెక్కడో తిరుగాడుచూ ఉన్నది.
క్రూరమైన మొగ కుక్క వెంటబడగా పరుగులు తీస్తున్న ఆడ కుక్కలాగా, క్రూరమైన, జడప్రాయమైన ‘తృష్ణ’ నా వెంటబడుచూ ఉన్నది. నేను ఎటెటో ఏవేవో స్థితి - గతులకు, జన్మ కర్మలకు పరుగులు తీస్తున్నాను.
హే బ్రహ్మన్! వశమైన కుక్కవలె ఈ మనస్సు నాకు వశం కావాలి. వాస్తవానికి మనస్సుకు దాసుడను నేను కాదు. అదియే నాకు దాసుడు. అటువంటిది అదియే నా వెంటబడుతూ ఉంటే, నేనే పరుగులు తీస్తున్నాను.
అపి అబ్ధి పానాత్ । మహతః,
సుమేరు ఉన్మూలనాత్ అపి,
అపి వహ్ని అశనాత్, బ్రహ్మన్ !
విషమః చిత్త నిగ్రహః ।।
అయినా కూడా ఈ మనస్సును నిగ్రహించటం ఎంత కష్టం! మహాసముద్రంలో ప్రవేశించి జలమంతా త్రాగవచ్చు. సుమేరు పర్వతాన్ని మొదలంట్లా పెరికివేయవచ్చు. అగ్నిని రుచికరమైన పదార్థము వలె భక్షించవచ్చు. కానీ ఈ చిత్తమును నిగ్రహించటము మాత్రం తేలిక కాదు.
4. చిత్తం కారణం అర్థానాం ।
తస్మిం తు సతి జగత్ త్రయమ్ ।
తస్మిన్ క్షీణే జగత్ క్షీణం ।
తత్ చికిత్స్యం ప్రయత్నతః ।।
ఈ చిత్తమే (లేక) ఈ మనస్సే సర్వ అర్థ - అనర్థములకు కూడా కారణము. అద్దానిరూపమే ఈ మర్త్య-భూ - స్వర్గ త్రిజగత్తులుకూడా. చిత్తము క్షీణిస్తే జగత్తు క్షీణిస్తుంది.
అట్టి చిత్తమునకు సర్వ ప్రయత్నములతో చికిత్స - అత్యంత ఆవశ్యకం.
యాం యాం అహం, మునిశ్రేష్ఠ !
సంశ్రయామి గుణశ్రియమ్,
తాం తాం కృతంతి మే తృష్ణా
తంత్రీమ్ ఇవ కుమూషికా।।
హే మునిశ్రేష్ఠా! ఋభు మహర్షీ! నేను ఏఏ శ్రేయోదాయకమైన గుణములను, అభ్యాసములను ఆశ్రయించ ప్రయత్నిస్తున్నానో, వాటన్నిటినీ కూడా - చెడ్డ ఎలుక వీణా తంతువులను కొరికి పాడుచేయు విధంగా - తృష్ణ వచ్చి (నా శ్రేయోప్రయత్నములన్నీ) త్రెంచివేస్తోంది.
పదం కరోతి అలంఘ్యే అపి ।
తృప్తా అపి ఫలం ఈహతే ।
చిరం తిష్ఠతి న ఏక అత్ర
తృష్ణా చపల మర్కటీ।
అంతరంగమున ప్రవేశించిన ‘తృష్ణ’ - అనే అత్యంత చపల స్వభావము గల కోతి :-
- ప్రవేశించకూడని (ఎక్కజాలని) కొండలన్నీ ఎక్కటానికి యోచిస్తోంది.
- ఏవేవో పొంది కూడా, ఇంకా ఏవో ఫలాల కొరకై అర్రులు చాస్తోంది.
- ఎక్కడా ఏ ఒక్కచోట ఎక్కువసేపు నిలకడ కలిగి ఉండదు.
క్షణం ఆయాతి పాతాళం ।
క్షణం యాతి నభఃస్థలం ।
క్షణం భ్రమతి దిక్ కుంజే ।
తృష్ణా హృత్ పద్మ షట్పదీ ।।
హృదయములోనే పుట్టుచున్న - ఈ తృష్ణ (ఇంకా ఏదో పొందాలి - అనే తపన) అనే తుమ్మెద - క్షణంలో పాతాళంలో ప్రవేశిస్తోంది.
- మరుక్షణం ఆకాశంలో విహారములు సలుపుతోంది.
- ఇంకొక క్షణంలో దిక్కులలోని పొదలలో పరిభ్రమిస్తూ పోతోంది.
సర్వ సంసార దుఃఖానాం
తృష్ణా ఏకా దీర్ఘ దుఃఖదా
అంతఃపురస్థమపి యా యో,
జయతు అతి సంకటే ।

సర్వ సాంసారిక దుఃఖములకు అసలైన కారణము ఎవరయ్యా - అని పరిశీలించి, పరికించి చూచాను. ‘‘అది తృష్ణయే’’ - అని తెలిసిపోతోంది. అది అంతరంగములోనే ఉండి అనేక సంకటములు జనింపజేస్తోంది. ఈ తృష్ణ నాలోనే జనించి, నన్ను జయించి వేస్తోందే! అంతఃపురములో హాయిగా ఉన్నవానిని కూడా వీధిపాలు చేస్తోంది.

తృష్ణా విషూచికా మంత్రః
చింతా త్యాగో హి స, ద్విజ !
స్తోకేన ఆనందం ఆయాతి ।
స్తోకేన ఆయాతి ఖేదతామ్ ।।
ఓ ద్విజోత్తమా! ఇంతలోనే ఎంతో సంతోషమును, ఇంతలోనే భయంకర దుఃఖములను, ఖేదములను కలుగజేస్తూపోతున్న ఈ ‘‘తృష్ణ’’ అనే విషూచివ్యాధి (విషజ్వరము)ని శమింపజేయగలిగినది - ఒకే ఒక్క ఔషధము/ మంత్రము. అది - చింతనను త్యజించి ‘చింతనా త్యాగి’ అయి ఉండటమే.
5. నాస్తి దేహసమః శోచ్యో
నీచో, గుణవివర్జితః।
కళేబరం అహంకార గృహస్థస్య మహాగృహమ్।।
ఈ భౌతికదేహము ఉన్నది చూచారూ? ఇంతటి అతి శోచనీయమైన, నీచమైన, గుణరహితమైన దుఃఖప్రదాత సృష్టి మొత్తంమీద మరొకటి లేదు.
ఈ కళేబరము (శరీరము) అనే ఇంటిలో ‘అహంకారము’ అనే ఇంటాయన ఎప్పటినుంచో నివాసము కలిగి ఉంటున్నాడు.
లుఠత్వభ్యేతు వా స్థైర్యం
కిం అనేన, గురో, మమ?
పంక్తి బద్ధ ఇంద్రియ పశుం
వల్గతి తృష్ణా గృహ - అంగనామ్।
చిత్త భృత్య, జన అకీర్ణం ।
న ఇష్టం దేహగృహం మమ ।।
హే అస్మత్ గురువర్యా! ‘‘అహంకారము’’ అనే దుర్మార్గుడు మనస్సును ఆక్రమించి పెత్తనము చెలాయిస్తూ ఉంటే నాకు భయము వేస్తోంది. ఇంక నాకు స్థైర్యము ఎక్కడిది?
హే భగవాన్! పితృదేవా! ఋభు మహర్షీ! ఈ దేహ గృహము (The house of physical Body)లో -
- పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు - అనే పశువులు మేపబడుచూ ఉన్నాయి. అవన్నీ కట్టి వేయబడి, ‘‘విషయములు’’- అనే గడ్డి పరకలను తింటూ, నెమరు వేస్తున్నాయి.
- తృష్ణ (ఏదో కావాలి। పొందాలి।) అనే ఆవేశము ఈ దేహ గృహములో సంచరించే గడుసరి ఇల్లాలు.
-‘చిత్తవృత్తులు’ అనే పనివాళ్ళు అత్యంత ఉద్వేగంగా ఏవేవో పనులు చేస్తూ పరుగులు తీస్తున్నారు.
అటువంటి ఈ దేహగృహము కలిగియున్న నాకు దేహమువలన అన్నీ బాధలేకాని, నాకేమీ లాభం కనిపించటంలేదు. ఇది ఏమాత్రం కూడా నాకు ఇష్టం కలిగించే వస్తువే కాదు.
జిహ్వా మర్కటికా ఆక్రాంత
వదనద్వార భీషణమ్।
దృష్ట దంత - అస్థి శకలం
నేష్టం దేహగృహం మమ ।
- ఈ దేహమునకు ముఖమే ద్వారము. భయంకరమగు ఆకారముగల ‘నోరు’ అనే కోతి ఈ ముఖద్వారమును ఆక్రమించుకొని అటూ - ఇటూ సంచారాలు చేస్తోంది. (నోటికొచ్చినట్లు మాట్లాడే స్వభావమే ఆ భీషణమగు కోతి).
- పళ్ళు (Teeth) బొమికల ఇత్యాది సమూహములతో నిర్మించబడిన , బొమికల గూడుగా అయి ఈ దేహము కనిపిస్తోంది. నాకు ఇష్టమైనదేదీ ఈ దేహగృహంలో కనిపించటంలేదు. ఇందులోనివన్నీ త్వరలో కృశించి, నశించబోయేవే మరి!
రక్తమాంస మయస్య అస్య స్వ బాహ్య -
అభ్యంతరే, మునే !
నాశ ఏక ధర్మిణో । బ్రూహి!
కా ఏవ (కైవ) కాయస్య రమ్యతా?
మహాత్మా! ఈ దేహము లోపల - వెలుపల రక్త - మాంస - చర్మమయము. ఏ క్షణంలోనో నశించటమే ధర్మముగా కలిగియున్నది. తండ్రీ! అటువంటి ఈ రక్తమాంసమయ - దేహంలో రమ్యమైనది ఏమున్నది? మరి, ఈ దేహధారులు పరస్పర దేహములలో చూస్తున్న ‘రమ్యత’ ఏమిటో చెప్పండి?
తటిత్సు, శరదభ్రేషు, గంధర్వ నగరేషు చ,
స్థైర్యం యేన వినిరీణాతం స విశ్వసతు విగ్రహే।
ఎవ్వడైనా - శరత్కాల మేఘములు చూచి, మేఘములలో మెఱుపులు చూచి, మాయచే కల్పితమైన గంధర్వనగరము చూచి ‘‘ఇవి శాశ్వతంగా ఉంటాయి’’ - అని అనుకుంటాడా? ‘‘ఈ శరీరము శాశ్వతము’’ అని స్థైర్యము కలిగి ఉండటము అటువంటిది. నేను ఈ శరీరమును విశ్వసించి ఉండటానికి సిద్ధంగా లేను.
శైశవే గురుతో భీతిః।
మాతృతః పితృతః తథా,
జనతో జ్యేష్ఠ బాలాత్ చ।
శైశవం భయమందిరమ్।।
బాల్యము : బాల్యంలో గురువులంటే భయం. తల్లిదండ్రులంటే భయం. అన్యజనులంటే భయం. పెద్ద పిల్లలంటే భయం. ‘బాల్యము’ అనేది - అనేక భయములతో నిండి ఉన్న ‘గృహము’ వంటిది.
6. స్వచిత్త బిల సంస్థేన,
నానా విభ్రమకారిణా,
బలాత్ కామ పిశాచేన
వివశః పరిభూయతే।।
ఇక యౌవనము : జీవుని చిత్తములో అనేక విభ్రమములు (Illusions, Misconceptions, Mis-interpretations etc.,) దాగి ఉండగా, ఈతడు బలవంతముగా ‘కామము’ అనే పిశాచమునకు వశుడై ఎటెటో తిరుగాడుచూ ఉన్నాడు. ఇంద్రియార్థములకు అమ్ముడవుచూ, మోసపోవుచున్నాడు. తన చిత్తముయొక్క ప్రవృత్తులకు, చాంచల్యములకు తానే వశుడైపోతున్నాడు.
దాసాః పుత్రాః స్త్రియశ్చ ఏవ,
బాంధవాః సుహృదః తథా,
హసంతి ఉన్మత్తకం ఇవ
నరం వార్థక కంపితమ్।।
దైన్య దోషమయీ దీర్ఘా
వర్థతే వార్ధకే స్పృహా ।
వార్ధక్యము : అయిందా? ఆ తరువాత వార్ధక్యము. ముసలి శరీరమును చూచి సేవకులు, సంతానము, స్త్రీలు, బంధువులు, స్నేహితులు (అంతకాలం గౌరవించినవారు అయి ఉండి) - ఇప్పుడు పిచ్చివాడిని చూచినట్లు చూచి నవ్వుకొంటున్నారు. వణికే శరీరం చూచి అందరికి ఎగతాళియే. దిగ తుడుపే.
వార్ధక్యమంతా దైన్యము (దిగులు, పిరికతనముల)తో నిండి ఉన్నదై అనుభవమగుచున్నది. సర్వ ఆపదలకు ముసలితనము సఖివంటిది. హృదయమునకు అనేక దాహములను ప్రసాదించునది.
సర్వ ఆపదాం ఏక సఖీ,
హృదిదాహ ప్రదాయినీ ।।
ఎక్కడి నుండి వచ్చి పడిందోగాని ‘ఆశ’ అనే దుష్ట సఖితో స్నేహం ఏర్పడి, ‘‘దృశ్యము నుండి ఏదో కావాలి, పొందాలి’’ అను రూపముగల అట్టి ఆశచే హృదయములో పేరాశల రూపంగా అనేక దాహములు, తాపములు వచ్చి హృదయగృహమును ప్రవేశించి, ఇక ఆక్రమించుకొని ఉంటున్నాయి.
క్వచిత్ వా విద్యతే యైషా సంసారే
సుఖ భావనా, ఆయుస్తంబమ్ ఇవ
ఆసాద్య కాలస్తామ్ అపి కృంతతి।।
ఈ సంసారములో ఎక్కడైనా ‘ఇది సుఖము కదా!’- అనిపించినా కూడా, ఎప్పుడో, ఏ క్షణంలోనో యముడు అనే ఆయన వచ్చి గడ్డి పరకలను కోసినట్లు ఆయుర్దాయమును త్రుంచి బుట్టలో వేసుకనిపోతున్నాడు.
తృణం పాంసుం మహేంద్రం చ
సువర్ణం మేరుసర్షపమ్, ఆత్మం
భరితయా సర్వం, ఆత్మసాత్ కర్తుం ఉద్యతః।
కాలఽయం సర్వ సంహారీ।
తేన ఆక్రాంతం జగత్త్రయమ్।
గడ్డిపరక, ఆవగింజ, బంగార ఆభరణాలు, మహేంద్ర మేరు ఇత్యాది పర్వతాలు, పర్వత శిఖరాలు, ఇంకా ఈ జీవునికి ప్రియంగా కనిపిస్తున్న ఆయా వస్తు జాలములు, ఎంతో ప్రియ - ఉత్సాహములతో ప్రారంభించబడి గృహములు మొదలైనవి, గొప్ప ఉద్యమ స్ఫూర్తి విశేషములు - వీటినన్నిటినీ- విశ్వమంతా పొట్టగా కలిగియున్న కాలుడు ఉద్యుక్తుడై వచ్చి సర్వమును సంహరించివేస్తున్నాడు.
ఈ మూడు లోకములలో కనిపించే సమస్త వస్తువులను కాలస్వరూపుడు ఆక్రమించుకొని ఉన్నాడు. ఎప్పుడు దేనిని ఏమి చేస్తాడో - ఏమాత్రం ఎవ్వరికీ ఏమీ తెలియదు.
మాంస పాంచాలికాయాస్తు
యంత్రలోలే అంగపంజరే । (యంత్రలోలేం-గ పంజరే)
స్నాయు అస్థి గ్రఃథి శాలిన్యాః,
స్త్రీయః కిం ఇవ శోభనమ్?
దేహ రమ్యత్వము : ఈ మూడు లోకములలో కనిపిస్తున్న దేహములన్నీ మాంసము, బొమికలు, నాడులు, కీళ్ళతో నిండిన అస్తిపంజర గూడులవంటివే కదా! బొమికలు, గ్రంథులు మొదలైన వాటిలో కూడిన ఈ స్త్రీ - పురుష శరీరములలో ఈ జీవులు ఏమి రమ్యత దర్శిస్తున్నారో - అది నాకు అర్థమే అవటము లేదు.
7. త్వక్, మాంస, రక్త, భాష్ప అంబు,
పృథక్ కృత్వా విలోచనే,
సమాలోకయ రమ్యం చేత్
కిం ముథా పరిముహ్యసి?
ఈ జీవులు పరస్పర భౌతిక దేహములను చూచి మురిసిపోతున్నారు. పరవశం పొందుచున్నారు. చర్మము, మాంసము, రక్తము, కంటి భాష్పములు (కళ్ళనీరు) మొదలైన వాటిని వేరువేరుగా చేసి పరిశీలించి చూస్తే ఒక్కొక్క దానిలోగల రమ్యత (Beauty, Attraction) ఏమున్నది? మరి ఈ స్త్రీ - పురుషులు పరస్పర భౌతిక దేహములను చూచి ఎందుకు ఎంతగానో మోహము చెందుచున్నారు? ఓయీ! జీవుడా! అనుక్షణం మార్పుచెందుతూ, క్రమంగా నశించబోయే స్వభావముగల ఈ భౌతిక శరీరభాగములు చూచి ఎందుకు మురిసిపోతున్నావు?
మేరుశృంగ తట ఉల్లాసి
గంగాజల రయోపమా,
దృష్టా యస్మిన్, మునే!
ముక్తాహారస్య ఉల్లాస శాలితా,
శ్మశానేషు, దిగంతేషు స ఏవ
లలానా స్తనః, శ్వభిః ఆస్వాద్యతే కాలే
లఘు పిండ ఇవ అంధసః।।
(సత్-త్రిగుణోరతాఇతి‘స్త్రీ’। సత్‌స్వరూపము త్రిగుణములందు రతిస్తున్నపుడు ‘స్త్రీ’ శబ్దముతో చెప్పబడుతోంది.)
హే మునీశ్వరా! ఈ స్త్రీల మెడలు - మేరుపర్వతమునుండి క్రిందకు జారువారే గంగా జలపాతములవంటి ముక్తాహారములు స్తనముల క్రింద వరకు జాలువ్రాలుచూ చూపరులకు ఉల్లాసము కలిగించవచ్చు గాక! అట్టి అందంగా ఆకర్షిస్తున్న ఈ స్త్రీ పురుషుల శరీరములు ముందు ముందు ఏమి కాబోవుచున్నాయి? శృంగార పురుషులచే ప్రియముగా లాలించబడే స్తనములు, శరీర విభాగములు- కాలక్రమేణా ఒక సమయంలో శ్మశానములో చేరి, కుక్కలచే, అన్నపు ముద్దలవలె భక్షించబడుచూ కనిపిస్తున్నాయి.
కేశ కజ్జల ధారిణ్యో దుస్పర్శా
లోచన ప్రియాః, దుష్కృత అగ్నిశిఖా
నార్యో దహంతి తృణవత్ నరమ్ ।।
పొడవైన తలవెంట్రుకల ‘జాలువారు’ను, చర్మభాగములను, కనుకొనలను శృంగార భావములతో స్పృశించి మురియటము - ఇదంతా కూడా కామము అనే అగ్ని శిఖలుగా పరిణమిస్తోంది. యౌవనులగు స్త్రీ -పురుషులను-గడ్డిపరకలను కాల్చినట్లు కాల్చటమే అగుచున్నది.
జ్వలతామ్ అతిదూరే అపి।
సరసా అపి నీరసాః।
స్త్రీయో హి నరక అగ్నీనాం
ఇంధనం చ అతి దారుణమ్।।
ఈ స్త్రీ- పురుషుల పరస్పర దేహములపట్ల కామ భావనలు ఎటువంటివంటే…
- అగ్ని దగ్గరగా ఉంటేనే కాల్చగలదు. కాని కామాగ్నియో! శరీరములు దూరదూరంగా ఉండియే (ఆ ఆశ్రయించిన వారిని) కాల్చుచున్నది.
- సరసముల రూపముగా ప్రారంభమై, నీరసములుగా పరిణమిస్తున్నాయి.
- ఈ (త్రిగుణ సంబంధరూపములగు) స్త్రీ పురుషుల పరస్పర కామరూప దేహాకర్షణలు ‘నరకము’ అనే అతిదారుణమైన అగ్నికి ఇంధనములు అగుచున్నాయి.
కామ నామ్నా కిరాతేన
వికీర్ణా ముగ్ధ చేతసః,
నార్యో నర విహంగానాం
అంగబంధనవాగురాః।
‘కామము’ అనే కిరాతకుడు ఈ జీవులను బంధించి, బుట్టలో వేసుకోవటానికై ‘‘బాహ్య సౌందర్యములు’’ అనే వలలను పన్నుచున్నాడు. ఈ జీవులు ‘‘నేను జన్మించినది ఎందుకు?’’ - అనే విషయమే మరచిపోయి, ఈ దేహాకర్షణల కామరూప వలలో చిక్కుకొనుచున్నారు.
8. జన్మ పల్వల మత్స్యానాం,
చిత్త కర్దమచారిణాం,
పుంసాం దుర్వాసనా రజ్జుః
నారీ బడిశ పిండికా।
మన్మథుడు అనే మత్స్యకారుడు ‘‘జన్మ’’ అనే కాలువలోగల ‘చిత్తము’ అనే బురద ప్రాంతంలో దుర్వాసనారూపమగు ‘కామము’ అనే వలను పన్నుచున్నాడు. ‘దేహసౌందర్యములు’ అనే ఎరలను అమర్చి బహుదూరపు బాటసారులవంటి ఈ ‘జీవులు’ అనే చేపలను పట్టుకొని ‘జన్మ-జన్మాంతరములు’ అనే బుట్టలోకి త్రోయుచున్నాడు.
సర్వేషాం దోషరత్నానాం
సు సముద్గికయా అనయా,
దుఃఖ శృంఖలయా నిత్యం
అలం అస్తు మమ స్త్రియా।
‘‘ఈ భౌతికాకర్షణ’’ అను కామమే, సర్వదోష రత్నములు ఏర్పడినవైయున్న దుష్టరత్నముల పెట్టె. ‘‘స్త్రీ-వ్యామోహ-దుఃఖబంధము-నన్ను దోషపూరితునిగా చేయగలుగునదే’’ - అని నాకు అనిపిస్తోంది. అవన్నీ ఇక చాలు. నాయొక్క శ్రేయస్సు కొరకై కామశృంఖలములను త్రెంచివేసుకోదలుస్తున్నాను.
యస్య స్త్రీ, తస్య భోగేచ్ఛా।
నిః స్త్రీ కస్య క్వ భోగభూః?
స్త్రియం త్యక్త్వా జగత్ త్యక్తం ।
జగత్ త్యక్త్వా సుఖీ భవేత్ ।।
ఎవరు స్త్రీ సహవాసము కలిగి ఉంటారో, వారికి భోగేచ్ఛ కూడా దట్టమై ఉంటుంది. స్త్రీ సంబంధము లేనివానికి ఇక భోగేచ్ఛతో పనేముంటుంది? స్త్రీని త్యజించటము (లేక, స్త్రీ -పురుష భౌతికాకర్షణ త్యజించినవాడు) జగత్తునే త్యజించినట్లు. జగత్తును త్యజించినవాడు సుఖవంతుడు.
దిశో అపి నహి దృశ్యన్తే,
దేశో అపి అన్య ఉపదేశకృత్ । (అన్యోపదేశకృత్)
శైలా అపి విశీర్యంతే ।
శీర్యంతే తారకా అపి ।
శుష్యంతి అపి సముద్రాశ్చ ।
ధ్రువోఽపి అధ్రువ జీవనః ।
సిద్ధా అపి వినశ్యంతి ।
జీర్యంతే దానవ ఆదయః ।
పరమేష్టి అపి నిష్ఠావాన్ ।
హీయతే హరిః, అపి అజః ।
భవో అపి అభావమ్ ఆయాతి ।
జీర్యంతే వై దిక్-ఈశ్వరాః ।। (దిగీశ్వరాః)।
ఈ దృశ్య జగత్తులో ‘శాశ్వతము’ అని చెప్పగలిగేది ఏదైనా ఉన్నదా?
సమస్తము కాలము చేత జనిస్తున్నది. కాలము చేతనే నశిస్తున్నది. దేనిని ఏ రీతిగా నిత్యము - సత్యము అని నమ్మాలి?
- దిక్కులే ఒకానొకప్పుడు దిక్కులేకుండా పోతున్నాయి. అదృశ్యమై కనబడకుండాపోతున్నాయి.
- దేశ దేశములే (సింధు నాగరికతవంటివి) గుర్తుపట్టలేకుండా రూపుమాసిపోతున్నాయి.
- ఉత్తుంగ పర్వతములు మరొకప్పటికి చూర్ణమై పోతున్నాయి.
- ఆకాశంలో ప్రకాశించే నక్షత్రములే శుష్కించి కనుమరుగవుచున్నాయి.
- నిండు జలముగల సముద్రములే కాలమహిమచే మరొకప్పుడు ఇంకిపోతున్నాయి.
- ‘ధృవము’ (Wel-fixed) అనుకున్న గొప్పగొప్ప వస్తువులు అధృవమై, వినాశనమగుచున్నాయి.
- సిద్ధులంతటివారు వినాశనము పొందుచున్నారు.
- దానవులంతటి వారు కొంతకాలానికి దమించిపోతున్నారు.
- పరమేష్టి కూడా నిష్ఠాబద్ధుడౌతున్నారు.
- హరి అంతటివారు ఒకనాటికి హరించుకుపోతున్నారు.
- విష్ణువు నిష్ఠను వీడుచున్నారు.
- భవుడంతటివాడు అభవుడు, అభావుడు అగుచున్నారు.
- దిక్పాలకులు, దిక్-దేవతలు జీర్ణులై అదృశ్యులైపోతున్నారు.
9. బ్రహ్మా, విష్ణుశ్చ రుద్రశ్చ సర్వావా భూత జాతయః,
నాశమ్ ఏవ అనుధావంతి సలిలాని ఇవ బాడబమ్ ।।
ఆపదః క్షణం ఆయాంతి । క్షణం ఆయాంతి సంపదః ।
క్షణం జన్మ, అథ మరణం। సర్వం నశ్వరం ఏవ తత్।।
అశూరేణ హతాః శూరా ।
ఏకేన అపి శతం హతమ్ ।।
బ్రహ్మవిష్ణు మహేశ్వరులంతటివారు కూడా - కాలముచే అరూపులు అగుచున్నారు. సముద్రంలో నుండే బడబాగ్ని జనించి సముద్రజలమునంతా మ్రింగివేస్తోంది. భూతజాలమంతా నాశనమువైపు పరుగులు తీస్తోంది.
ఈ విశ్వములో దృశ్యమైనమై కనిపించేదంతా - క్షణభంగురమే. క్షణంలో ఆపదలు. క్షణంలో సంపదలు. క్షణంలో జన్మ. క్షణంలో మరణము. ఇదంతా కూడా నశ్వరము. ‘శాశ్వతము’ అని చెప్పగలిగేది ఏదీ లేదు.
ఇంకా ఎన్నో చిత్ర - విచిత్రములు. బలహీనుడు (అశూరుడు) బలవంతుని సంహరిస్తున్నాడు. ఒక్కడు వందమందిని చంపుచున్నాడు.
విషం విషయ వైషమ్యం
న విషం విషం ఉచ్యతే।।
జన్మాంతరఘ్నా విషయా,
ఏతత్ జన్మ హరం విషమ్ ।
ఇతి మే దోష దావాగ్ని దగ్ధే సంప్రతి చేతసి ।
స్ఫురంతి హీన భోగాశా మృగతృష్ణా సరస్స్వపి ।
విషం వాస్తవానికి విషం కాదు. విషయములే విషము. ఎందుకంటే, విషము వల్ల ఒక్క దేహము మాత్రమే నశిస్తుంది. విషయముల వల్లనో - జన్మజన్మాంతర పరంపరలు నాశనము కాగలవు.
ఓ పితృదేవా! ఋభుమహర్షీ। అస్మత్ గురుదేవా! అనేక దోషములు అంతరముగా కలిగియున్న నా చిత్తము నందు పుణ్యతీర్థయాత్రల సత్-ఫలితంగా ఇటువంటి భావనాపరంపరలు బయల్వెడలుచూ ఉన్నాయి.
మృగతృష్ణా సరస్సులో నీళ్ళు త్రాగి దాహం తీర్చుకోవాలని ఎవ్వరూ అనుకోరు కదా! అట్లాగే నాకు ఇక్కడి భోగములు పొందాలని, ఆస్వాదించాలని ఏమాత్రమూ కూడా అనిపించటము లేదు.
అతో మాం బోధయాశు త్వం
తత్త్వ జ్ఞానైన, వై గురో। నో చేత్,
మౌనం సమాస్థాయ, నిర్మానో,
గత మత్సరః। భావయన్
మనసా విష్ణుం లిపికర్మా అర్పితా ఉపమః।।
(అర్పితోపమః)।
అందుచేత, హే సద్గురూ! మీరు ఇప్పుడు నాపై దయతో తత్త్వబోధ చేయండి.
మీరు ఒకవేళ తత్త్వబోధను ప్రసాదించకపోతేనో? ఇక నేను మాన - అవమానములను త్యజించి, మత్సరమును వదలి పరమాత్మయగు విష్ణుభగవానుని మనసా భావన చేస్తూ చిత్రములో లిఖించబడిన చిత్రలేఖనంలాగా నిశ్చలుడనై ఉండిపోదలచుచున్నాను.

చతుర్థోఽధ్యాయః - సాధన చతుష్టయం - సమాధినిష్ఠ

1. నిదాఘ। తవ నాస్తి అన్యత్ జ్ఞేయం,
జ్ఞానవతాం వర !
ప్రజ్ఞయా త్వం విజానాసి
ఈశ్వర అనుగృహీతయా ।।
చిత్త మాలిన్య సంజాతం
మార్జయామి భ్రమం, మునే!
మోక్ష ద్వారే ద్వార పాలాః చత్వారః
పరికీర్తితాః। శమో విచారః
సంతోషః చతుర్ధః సాధుసంగమః।।
బుభు మహర్షి: ఓ నిదాఘా। జ్ఞానులలో ఉత్తముడా। బిడ్డా। నీవు తెలుసుకోవలసినది తెలుసుకొన్నట్లేనయ్యా। క్రొత్తగా తెలుసుకోవలసినది ఏమీ లేదు. ఈశ్వరానుగ్రహంచేత, స్వకీయప్రజ్ఞచేత అంతా చక్కగా గమనించియే ఉన్నావు.
మునీ! నీవు జ్ఞానివే. అయినప్పటికీ కూడా మనస్సుకు అంటిన కించిత్ మాలిన్యమును తొలగించుకోవటానికై కొన్ని విశేషాలు బోధిస్తాను. విను.
మోక్షద్వారపాలకులు
ఈ జీవుడు మానవజన్మ ఎత్తినందుకు ప్రయోజనంగా ‘‘ఆత్మస్వరూపుడను అవటంచేత నాకు బంధమే ఉండజాలదు’’ అనే రూపముగల మోక్షము ను సిద్ధించుకోవాలి. అట్టి మోక్ష ద్వారమునకు ద్వారపాలకులు నలుగురు. (1) శమము (2) విచారణ (3) సంతోషము (4) సాధుసంగము.
ఏకం వా సర్వ యత్నేన
సర్వం ఉత్సృజ్య సంశ్రయేత్ ।।
ఏకస్మిన్ వశగే యాంతి
చత్వారో అపి వశంగతాః ।
శాస్త్రైః సజ్జన సంపర్క పూర్వకైశ్చ తపో దమైః,
ఆదౌ సంసార ముక్త్యర్థం ప్రజ్ఞామేవ అభివర్ధయేత్ ।।
ఈ జీవుడు ఉద్యమించి సర్వప్రయత్నములతో ఒక్క ద్వారపాలకుడినైనా ఆశ్రయించాలయ్యా। ఒక ద్వారపాలకుడు వశమైతే తక్కిన ముగ్గురు తమంతట తామే (మార్గదర్శకులై) వశం కాగలదు.
మునుముందుగా శాస్త్ర పరిశీలన, సజ్జనులతో (ఆత్మజ్ఞులతో, తత్త్వజ్ఞులతో) సంపర్కము, తపస్సు, ఇంద్రియ నిగ్రహములను ఆశ్రయించాలి. తద్వారా సంసారమునుండి విముక్తి పొందటానికి అవసరమైన ‘ప్రజ్ఞ’ (wisdom) అభివర్ధనము కాగలదు.
స్వానుభూతేశ్చ (స్వ-అనుభూతేశ్చ) శాస్త్రస్య,
గురోః చైవ, ఏకవాక్యతా
యస్య అభ్యాసేన, తేన
ఆత్మా సతతం చ అవలోక్యతే।।
ఎవ్వరైతే -
(1) స్వానుభవము (2) శాస్త్ర వచనములు (3) గురుబోధ - (4) వేదమహావాక్యముల విచారణ - వీటివీటిని సమీకరించుకుంటూ, సమన్వయించుకొంటూ సర్వత్రా సమస్తము ఆత్మగా దర్శించు అభ్యాసులై ఉంటారో:-
- వారికి ఆత్మ దర్శనమగుచున్నది. అనగా సమస్తము ‘ఆత్మ’గా సందర్శనమవగలదు.
స్వస్వరూపమే ఆత్మగా దర్శనమవగలదు.

2. సంకల్ప ఆశా అనుసంధాన
వర్జనం చేత్ ప్రతిక్షణమ్,
కరోషి తత్ అచిత్తత్వం
ప్రాప్తఏవాసి పావనమ్ ।।
ఓ నిదాఘ మహాశయా! నీవు కనుక (1) సంకల్పము (Assumption and presumption) (2) ఆశ (Expectation) - ఈ రెండిటి యొక్క అనుసంధానము (Application)ను త్యజించియే ఈ ప్రపంచములో యథావిధిగా కర్మలను నిర్వర్తిస్తూ ఉంటే, అప్పుడిక పవిత్రమగు (లేక) పావనమగు ‘అచిత్తత్వము’ లేక ‘అమనస్కము’ తనకు తానై సిద్ధించగలదు.
చేతసో యత్ అకర్తృత్వం
తత్ ‘‘సమాధానమ్’’ ఈరితమ్,
తత్ ఏవ ‘‘కేవలీ భావం’’ ।
సా శుభా ‘‘నిర్వృతిః’’ పరా ।।
(ఒకడు నాటకములో నటిస్తూ, తాను పాత్ర నిర్వర్తించే ప్రవర్తనలకు ‘‘నేను కర్తను’’ అను దృష్టి / అభిప్రాయము / భావన కలిగి ఉంటాడా? లేదు కదా! అట్లాగే) ఎవ్వరి బుద్ధి ఇక్కడి సమస్త ప్రవర్తన నిర్వర్తనములకు ‘‘అకర్తృత్వము’’ వహించి ఉంటుందో అదియే ‘సమాధాన’ లేక ‘సమాధి’ స్థితి. - అదియే ‘కేవలీభావము’ (లేక) కైవల్యము. అదియే శుభప్రదమగు ‘నిర్వృతి’ లేక ‘నిర్వాణము’. అదియే పరాస్థితి కూడా.
చేతసా సంపరిత్యజ్య
సర్వ భూతాత్మ భావనామ్,
యథా తిష్ఠసి తిష్ఠత్వం,
మూక - అన్ధ - బధిరా ఉపమః।। (బధిరోపమః)।
చిత్తము (లేక) బుద్ధితో (‘‘ఈ భౌతికంగా కనిపించే దేహమే ఆత్మ’’ అను) భూతాత్మభావనను మొదలంట్లా పరిత్యజించి, అప్పుడు శేషించే ‘కేవలాత్మభావన’ (లేక) ‘సర్వాత్మభావన’యందు సుతిష్ఠితుడనై ఉండవయ్యా. ఇక ఈ ప్రపంచక సమస్త భేద విశేషములపట్ల మూగవాని (Dumb) వలె, గ్రుడ్డివాని (Blind) వలె, చెవిటివాని (Deaf) వలె ఉండుము.
సర్వం ప్రశాంతమ్ అజమ్ ఏకమ్
అనాది మధ్యమా, భాస్వరం స్వదనమాత్రం
అచైత్య చిహ్నమ్ ।
‘సర్వం ప్రశాంతం’ ఇతి శబ్దమయీ చ దృష్టిః
బోధ అర్ధం ఏవ హి ముధైవ తత్ ‘‘ఓం’’ ఇతి ఇదమ్।।
(తదోమితీదమ్)
‘‘సర్వం కించిత్ ఇదం దృశ్యం
దృశ్యతే చిత్ జగత్ గతమ్,
‘‘చిత్ నిష్పదాంశమాత్రత్వం।
న అన్యత్ అస్తి।’’ ఇతి భావయ ।।
ఓ నిదాఘమునీ! సర్వభేదభావనలను వదలివేసి ‘ఆత్మభావన’ను ఆశ్రయించుము. ‘‘తత్ - ఓం - ఇతి - ఇదమ్’’ అను శబ్దార్ధము - పరమ శాంతమగు ఆత్మయే।
- ‘‘ఇదంతా పరమ ప్రశాంతము. జనన - మరణ రహితము, స్వకల్పితము, కదలికలు - మార్పు చేర్పులు లేనిది అగు ఆత్మయే!’’ అనే భావనను అనుసంధానము చేస్తూ ఉండు.
అటు తరువాత ‘‘ఇదంతా పరమ ప్రశాంతము’’ అని ప్రయత్నపూర్వకంగా భావనచేయుటమును కూడా, - వాటి శబ్దమయదృష్టికి సంబంధించిన క్రియాత్మత్త్వమును కూడా వదలివేయి. అనగా, అట్టి బోధ స్వరూపము స్వాభావికంగా అయిఉండుము. ‘అనుకోవటము’ను కూడా దాటివేసి ‘అనిపించటము’లో ప్రవేశించుము. ‘తదేవాఽహమ్’ స్వానుభవుడవగుము.
‘‘ఈ కనిపిస్తున్న సమస్త జగత్తు అంతా - కించిత్ నుండి బృహత్ వరకు - ఇద్దాని ఉత్పత్తి - గతించటముతో సహా - చిత్ నిష్పదాంశమాత్రము. యథాతథముగా ఆత్మయొక్క అంశయే. ఆత్మకు వేరు లేదు - అని భావన చేయి.
3. నిత్య ప్రబుద్ధ చిత్తః త్వం (చిత్తస్త్వం)
కుర్వన్ వా అపి జగత్ క్రియామ్।
ఆత్మ ఏకత్వం విదిత్వా త్వం
తిష్ఠ అక్షుబ్ధ మహా అబ్ధివత్ ।।
ఈ విధంగా ‘‘ఈ సమస్తము మమాత్మయే’’ - అను భావన సమన్వయములతో నిత్య ప్రబుద్ధుడవై (Ever awakened sense of experiencing everything as All Equal & All Present SELF) నిశ్చల చిత్తుడవై ఉండుము. ‘‘ఆత్మ నీకు-నాకు- ఈ జగదృశ్యమునకు అద్వితీయము’’ - అని భావించి ఉండు. ఇక కర్మలు నిర్వర్తిస్తూనే (జగత్తులో) ఏమీ చేయనివాడవై ఉండుము. ఆత్మయొక్క ఏకత్వము ఎరిగినవాడవై - సముద్ర తరంగాలు కదులుచున్నా కూడా, సముద్రము కదలనిదే అయినట్లు - నిండు సముద్ర స్వరూపుడవై అఖండాత్మగా ఉండుము.
తత్త్వావబోధ ఏవ అసౌ
వాసనా తృణ పావకః -
ప్రోక్తః ‘‘సమాధి’’ శబ్దేన।
న తు తూష్ణీం అవస్థితిః ।।
‘‘సమాధిస్థితి’’ని అవధరించుము. సమాధి స్థితి అనగా? ఏదీ ఆలోచించకుండా, అన్నిటినీ తృష్ణీకరించి ఎక్కడో ఒంటరిగా ఉండటము - కానే కాదు. మరి? ‘‘నీవుగా (త్వంగా) కనిపించేదంతా (తత్) అఖండ పరమాత్మ స్వరూపమే’’ - అను ‘‘తత్త్వబోధ’’చే జనించే ‘జ్ఞానాగ్ని’చే ‘సమస్త భేద వాసనలు’ అనే గడ్డి పరకలను కాల్చివేయటమే ‘సమాధి’.
నిరిచ్ఛే సంస్థితే రత్నే యథా లోకః
ప్రవర్తతే, సత్తా మాత్రే పరే తత్త్వే
తథైవ అయం జగద్గణః ।।
ఒక జాతిరత్నము ఎటువంటి స్వకీయమైన ఇచ్ఛ (కోరిక) లేకుండానే ప్రకాశమును అన్నివైపులా వెదజల్లుతూ ఉంటుంది కదా! ఆ విధంగానే ఆత్మ కూడా తనయొక్క ఉనికి మాత్రం చేతనే ఈ జగత్ పరంపరలను స్వకీయ ఇచ్ఛ లేకుండానే ప్రదర్శించుచూ ఉన్నది. ఈ జగత్తు బ్రహ్మముయొక్క భావనా రూపమే.
ఆతశ్చ ఆత్మని కర్తృత్వం
అకర్తృత్వం చ వై, మునే !
నిరిచ్ఛత్వాత్ అకర్తా, అసౌ,
కర్తా సన్నిధిమాత్రతః ।।
అందుచేత ఓ మునీంద్రా! ఈ సమస్తమునకు కర్త ఆత్మయే. అయినప్పటికీ ఆత్మకు ఏ కర్తృత్వమూ లేదు. ఈ రెండూ నిజమే. ఆత్మకు జగత్తు యొక్క ఇచ్ఛ లేదు. కాబట్టి - ‘అకర్త’. ఆత్మయొక్క సన్నిధానము చేతనే జగత్తు ఉనికి పొందుతోంది కనుక - కర్త కూడా.
తే ద్వే బ్రహ్మణి విందేతే
కర్తృతా, అకర్తృతే, మునే !
యత్రైవ ఏష చమత్కారః,
తం ఆశ్రితస్య స్థిరో భవ ।।
ఓ మునీ! ఈవిధంగా ఆత్మయొక్క పరస్పర వ్యతిరేకమైన అకర్తృత్వ - సకర్తృత్వ ధర్మములను గమనిస్తూ, అట్టి ఆత్మ (లేక) బ్రహ్మమును సర్వాతీత చమత్కారంగా దర్శిస్తూ, అట్టి బ్రహ్మమునే ఆశ్రయించినవాడవై ఉండుము. ఆత్మవే నీవై ఉండుము. నీవు సర్వదా అఖండమగు ఆత్మయే అయి ఉన్నావు కూడా।
తస్మాత్ నిత్యం ‘‘అకర్తా అహం’’ - ఇతి భావన
యేద్ధయా, పరమ-అమృత నామ్నీసా
‘‘సమత’’ ఏవ అవశిష్యతే ।।
ఆత్మజ్ఞానిపట్ల ‘‘నేను నిత్యము కర్తను, అకర్తను కూడా। (అకర్తృ-కర్తృత్వములు తనవే అయిన) ఆత్మనే ।’’ - అనుభావన స్వాభావికమై శోభించిచున్నది. ‘‘సర్వత్రా సమరసానుభవము’’ - అను పరమామృత రూపమగు ‘సమత’యే శేషించుచున్నది. అట్టి సమదర్శనమే ‘సమాధి’.
నిదాఘ! శృణు సత్వస్థా జాతా
భువి మహా గుణాః ।
తే నిత్యమ్ ఏవ అభ్యుదితా,
ముదితాః, ఖ ఇవ ఇందవః।।
ఓ నిదాఘా। ఇంకా విను. ఎవ్వరైతే ఈ సమస్త జగత్తును స్వస్వరూప - ఆత్మసత్తామాత్రం గా (లేక) స్వస్వరూపాత్మ గా దర్శిస్తూ, ఆస్వాదిస్తూ ఉంటారో, అట్టివారు ఆకాశంలో ప్రకాశించే పున్నమినాటి చంద్రునివలె ప్రసన్నత - శాంతి - సుఖము సర్వదా సంతరించుకొన్నవారై ఉంటారు.
4. న ఆపది గ్లానిమాయాంతి, నిశి - హేమ అంబుజం యథా।
నేహంతే ప్రకృతాత్ అన్యత్, రమంతే శిష్ట వర్త్మని ।।
ఆకృత్యైవ విరాజంతే, మైత్ర్యాది
గుణ వృత్తిభిః। సమాః సమరసాః
సౌమ్యాః, సతతం సాధు వృత్తయః ।।
అబ్ధివత్ ధృత మర్యాదా భవంతి విశదాశయాః ।
నియతిం న విముంచంతి, మహాంతో భాస్కరా ఇవ।।
అట్టి సమరస ఆత్మభావన (లేక) సర్వాత్మక దృష్టిని ఆశ్రయించిన మహానుభావుని విషయంలో, వారు ఎట్లా ఉంటారు? రాత్రి కూడా వికసించియే ఉండే బంగారు కమలము వలె - ఆపదలందు కూడా శిష్టాచారులై, సత్ప్రవర్తనతో, సంతోషముగా ఈ జగత్తునందు విహారములు చేస్తూ, రమిస్తూ ఉంటారు.
వారు అకృత్యులై (కర్మలకు అతీతులై) విరాజిల్లుచూనే, ఎల్లప్పుడు మైత్రి - ఇటువంటి సాధు ప్రవర్తనలు కలిగి ఉంటారు. సమత్వము, సమరసభావన, సౌమ్యము మొదలైన సాధు వృత్తులను ఎల్లప్పుడు కలిగియే ఉంటారు.
నిర్మలాత్ములు అగు మహనీయులు మహదాశయులై ఉంటారు. సముద్రమువలెనే ధృతి - మర్యాదలను అతిక్రమించరు. ఆకాశములో సూర్య భగవానునివలె అంతా తెలిసియే, మర్యాదను అగౌరవించనివారై ఉంటారు.
కో అహం? కథం ఇదం చ ఇతి
సంసార మలమ్ ఆతతమ్? - ప్రవిచార్య
ప్రయత్నేన, ప్రాజ్ఞేన సహసా అధునా ।।
ఓ నిదాఘా! ‘‘నేను ఎవ్వరు? ఈ సంసార కథన దోషమంతా నాకు ఎట్లా ప్రాప్తిస్తోంది’’ - అనే విశేషములన్నీ ప్రాజ్ఞులగు సాధువులను సమీపించి వారి సన్నిధిలో చక్కగా విచారణ చేయాలి.
న అకర్మసు నియోక్తవ్యం ।
న అనార్యేణ సహా వసేత్ ।
ద్రష్టవ్యః సర్వ సంహర్తా, న మృత్యుః అవ హేళయా ।।
శాస్త్రముల చేత, సాంఘిక శ్రేయోభిలాషులగు పెద్దలచేత ‘‘ఇవి చేయకూడనివి’’ - అని నియమించబడే ‘నిషిద్ధకర్మలు’ నిర్వర్తించవద్దు. ప్రాపంచక విషయములే మహత్తరమనుకొనే అనార్యులతో స్నేహ-సంభాషణలతో కాలం వెళ్లబుచ్చరాదు. సర్వసంహర్తయగు ‘మృత్యువు’ గురించి విచారణతో తెలుసుకొని అమృతతుల్యులుకావాలి. అంతేగాని, మృత్యువుగురించి అవహేళన పనికిరాదు.
శరీరం అస్థి-మాంసం చ
త్యక్త్వా రక్తాది అశోభనమ్,
భూతముక్తావలీ తంతు,
‘‘చిత్’’ మాత్రం అవలోకయేత్।।
‘బొమికల-మాంస-చర్మ రక్తములచేత నిర్మితమైన ఈ పంచభూత నిర్మిత భౌతిక శరీరముచేత నేను పరిమితుడను’’ - అను పరిమిత దృష్టి వీడుము. రక్తము మొదలైన అశోభ వస్తువులతో కూడిన - ఈ శరీరముయొక్క బాహ్య శోభను చూచి మురిసిపోతూ ఉండవద్దు. దానికి ఆధారమై, ‘‘శరీరము కదల్చుటకు కారణమగు (కదలించుచున్న)’’ చైతన్యతత్త్వమునే అవలోకనము, అధ్యయనము చేయి.
5. ఉపాదేయ అనుపతనం
హేయ ఏకాంత విసర్జనమ్।
యత్ ఏతత్-మనసో రూపం
తత్ బాహ్యం విద్ధి। నేతరత్ ।।
(న-ఇతరత్) ।।
మనస్సుయొక్క రూపము ఏమిటి?
(1) ‘‘ఇది నాకు కావాలి’’ అని కామించటము. (ఉపాదేయము)
(2) ఇది నాకు వద్దు. తొలగాలి (హేయము) అని అంతరమున ఏకాంత విసర్జనము.
ఇవియే మనస్సు యొక్క బాహ్యరూపము. హేయ - ఉపాదేయము (వద్దు-కావాలి)లకు వేరుగా మనస్సు మరింకేదీ కాదు.
గురు శాస్త్ర - ఉక్త (శాస్త్రోక్త) మార్గేణ
స్వ-అనుభూత్యా చ ‘‘చిత్‌ఘనే,
-బ్రహ్మ ఏవ అహం’’ (బ్రహ్మైవాహమ్) ఇతి జ్ఞాత్వా
వీత శోకో భవేత్ మునీ!
ఓ మునీ! నిదాఘ మహాశయా!
(1) గురుబోధ (2) శాస్త్ర ప్రవచనము / పాఠ్యాంశము (3) స్వవిచారణ ఈ మూడూ ఏమి వివరించి చెప్పుచున్నాయో, - శ్రద్ధగా విని, విచారించి ‘‘చిద్ఘనము, ఆనందరూపము అగు బ్రహ్మమే నేను సర్వదా అయి ఉన్నాను’’. - అని తెలుసుకొన్నవాడు రాగ-భయ-క్రోధములనుండి విడివడి ఆత్మసామ్రాజ్యములో ప్రవేశము పొందుచున్నాడు. ఈ విధంగా స్వానుభవము స్వాభావికం చేసుకొన్నవాడే ముని.
యత్ర నిశిత అసి - శత పాతనం
ఉత్పల తాడన వత్ సోఢవ్యమ్।
అగ్నినా దాహో హిమసేచనం ఇవ।
ఓ నిదాఘా! జీవన్ముక్తుడు ఈ దృశ్య సంబంధమైన సమస్తమునకు అతీతుడై, బ్రహ్మానందమును బ్రాహ్మీదృష్టిని ఏ పరిస్థితులలోను వీడనివాడై ఉంటున్నాడు.
⌘ పదునైన ఖడ్గముతో ఈ శరీరము ఖండింపబడుచున్నప్పుడు కూడా తనపై కలువపూలు చల్లబడునట్లు భావిస్తూ ఉండగలడు.
⌘ అగ్నిచే దహించబడుచున్నప్పుడు తనపై మంచు బిందువులు జాలువారుచున్నట్లు అనుభూతుడవగలడు.
అంగార ఆవర్తనం చందన చర్చేవ।
నిరవధి నారా చ
వికిరపాతో। నిదాఘ ! వినోదన -
ధారా గృహ శీకర వర్షణం ఇవ।
స్వ శిరః ఛేదః సుఖ-నిద్రా ఇవ ।
మూకీకరణ మానన ముద్రేవ।
బధిర్యం మహాన్ ఉపచయ ఇవ।-
ఇదమ్ న అవహేళనయా భవితవ్యం।
ఏవం దృఢవైరాగ్యాత్ బోధో భవతి।।
⌘ నిప్పులలో త్రిప్పబడుచూ ఉండగా చందన శీతలమును అనుభవిస్తూ ప్రశాంతతను ఆశ్రయించి ఉండగలడు.
⌘ బాణవర్షము కురుస్తూ ఉన్నప్పుడు నీటి జల్లులవలె దర్శించగలడు. యంత్రమునుండి మీదపడుచున్న పన్నీటిజల్లువలె భావించగలడు.
⌘ తల తెగుచున్నప్పుడు కూడా సుఖనిద్రకు ఉపక్రమిస్తున్నట్లు ఆస్వాదించగలడు.
⌘ ఎవ్వరైనా వాగ్బంధనము చేస్తూ ఉంటే, అంతరమున మౌనముద్రవలె వహించగలడు.
⌘ ఎవ్వరైనా తన చెవులను మూసివేసి ఉంచటం జరిగినప్పుడు మహామౌనోపాసకుడై ఉండగలడు.

అటువంటి మహోన్నతమగు జీవన్ముక్తుని ఔన్నత్యము తక్కువగా చూడగలిగేది కాదు. అవహేళన చేయరానిది. ఆతడు స్వాభావికంగానే దృఢవైరాగ్యముతో కూడిన బోధస్వరూపుడై ఉంటున్నట్టివాడు. అంతేగాని అందుకొరకై కృత్రిమంగా ప్రయత్నించటంచేత కాదు.
గురువాక్య సముద్భూత,
స్వానుభూత్య అతి శుద్ధయా
యస్య అభ్యాసేన తేన ‘ఆత్మా’ -
సతతం చ అవలోక్యతే ।।
తత్త్వదర్శులగు గురువాక్యములు అయినట్టి ‘తత్‌త్వమ్’ వాక్యార్థముయొక్క శ్రవణముచేత జనించే స్వానుభూతిని, ‘సోఽహమ్’ అనుభూతిని -అభ్యసిస్తూ ఉండగా బుద్ధి శుద్ధము (నిర్మలము), సునిశితము, విస్తారము అగుచున్నది. అట్టి శుద్ధబుద్ధి కలవాడు సర్వత్రా సర్వదా సమస్తమును ఆత్మగాను, స్వస్వరూపమునకు అనన్యముగాను అవలోకనము చేయుచున్నాడు.
6. వినష్ట దిక్ భ్రమస్య అపి (దిగ్భ్రమస్యాఽపి)
యథా పూర్వం విభాతి దిక్ ।
తథా విజ్ఞాన విధ్వస్తం
‘‘జగత్ నాస్తి’’ ఇతి భావయ ।।
న ధనాని ఉపకకుర్వంతి । న మిత్రాణి।
న బాంధవాః । న కాయ క్లేశ వైధుర్యం ।
న తీర్థ ఆయతన ఆశ్రయః ।।
దిక్కులన్నీ ఏ కారణంచేతైనా వినష్టము అయినప్పటికీ (Even though all Dimensions Vanished) కూడా, ‘8’ దిక్కులు ఆతని బుద్ధికి తెలియబడుచూనే ఉంటాయి. ఓ నిదాఘా! బ్రహ్మజ్ఞానముచే జగత్తు లేనిదై, బ్రహ్మమే జగత్తుగా ఉన్నదై-ఉన్నట్లు భావనచేయి.
ఆ ‘‘బ్రహ్మమే నేను - నీవు - ఈ సమస్తము కూడా’’ - అనబడే ‘‘తత్‌పదము’’ లభించేది ఎట్లా? - అది ధనసంపద - చేతగాని, గొప్ప, గొప్ప స్నేహితులు - బంధువులు కలిగి ఉండటంచేతగాని, శారీరక కష్టములు, తీర్థయాత్రల సేవనము….ఇటువంటి వాటి వలనగాని లభించేదికాదు.

కేవలం తత్ మనో మాత్ర
జయేన ఆసాద్యతే పదమ్ ।।

యాని దుఃఖాని, యా తృష్ణా,
దుస్సహా యే, దురాధయః,
శ్రాంత చేతస్సు తత్ సర్వం
‘తమో ఆర్కేషు’ ఇవ నశ్యతి ।।
ప్రశాంతమైన మనస్సు
కేవల స్వరూపుడగు పరమాత్మతో మనస్సుచే ‘తన్మయము’ పొందువాడు మనస్సును జయించి తత్ పదమును పొందగలడు.
శాంతము - శమము
సూర్యకిరణములు ప్రసరించినచోట అంధకారము తనకు తానుగా వినాశనము పొందువిధంగా, ‘‘శాంతము’’ ‘‘శమము’’ ( withdrawal from worldly scenario) అభ్యాసముగా కలవాడు - సర్వదుఃఖములను, తృష్ణలను, దుష్టచింతనలను (సూర్యుని తీక్షణ కిరణములవలె) ఎండింపజేయగలడు. అవన్నీ-ఎండవలన మురికి గుంటలోని నీరు వలె ఆతనిపట్ల హరించివేయబడతాయి.
మాతరి ఇవ పరం యాంతి, విషమాణి
మృదూని చ , విశ్వాసం ఇహ భూతాని
సర్వాణి శమశాలిని ।।
విషపూరితమైన జంతువులు, సాధు జంతువులు కూడా శాంత మనస్కుని (శమము సిద్ధించుకొని స్వభావి)ని - తల్లివలె విశ్వసిస్తాయి. తల్లి వలె వాత్సల్యము ప్రదర్శిస్తాయి.
న రసాయన పానేన, న లక్ష్మ్య
ఆలింగితేన చ, స తథా సుఖం
ఆప్నోతి - శమేన అంతర్యథా జనః।।
శమము (మనోలయము / బుద్ధి చాంచల్య ఉపశమనము) వలన లభించే అంతఃసుఖము → రసాయన అమృత పానము చేతగాని, లక్ష్మీ ఆలింగనము చేతగాని లభించునది కాదు. ఆత్మ భావనచే శమము స్వాభావికమవగలదు.
శ్రుత్వా, స్పృష్ఠ్యా చ, భుక్త్వా చ,
దృష్ట్వా, జ్ఞాత్వా శుభ - అశుభమ్,
న హృష్యతి, గ్లాయతి యః,
స ‘‘శాంత’’ ఇతి కథ్యతే ।।
‘‘శాంతము’’ అనగా?
శుభ-అశుభ సంబంధమైన విషయములు వినినా, స్పృశించినా, భుజించినా (అనుభవించవలసి వస్తున్నా), చూస్తూ ఉన్నా, తెలుసుకొంటూ ఉన్నా కూడా, ….ఎవ్వరి హృదయమందైతే కించిత్ కూడా ‘‘గ్లాని’’ (ఆదుర్దా ఆవేదన, భయము మొదలైనవి) స్థానము పొందవో, అట్టి స్థితియే ‘‘శాంతము’’.
7. తుషార కర బింబాచ్ఛం
మనో యస్య నిరాకులమ్,
మరణ, ఉత్సవ, యుద్ధేషు
స ‘‘శాన్త’’ ఇతి కథ్యతే ।।
తపస్విషు, బహుజ్ఞేషు, యాజకేషు నృపేషు చ,
బలవత్సు గుణాఢ్యేషు ‘‘శమవాన్’’ ఏవ రాజతే।।
ఎవ్వరి హృదయమైతే - మరణ, ఉత్సవ, యుద్ధ సమయములలో కూడా మేఘములు లేని నిర్మలాకాశంలో పున్నమినాటి చంద్రునివలె ప్రశాంతంగా ప్రకాశమానమై ఉంటుందో అట్టి హృదయమే ‘‘శాంతము’’ - అనబడుతోంది.
సమస్త దృశ్య విషయములను ఉద్వేగరహితంగా, బ్రాహ్మీభావనతో చూడగలుగు శమవంతుడు సర్వులలో శ్రేష్ఠుడు. గొప్ప తాపసులలో, అనేక విషయములు తెలిసియున్న జ్ఞానులలో, యజ్ఞయాగములు నిర్వర్తించిన యాజకులలో, రాజ్యాలు ఏలే రాజులలో - వారందరికంటే కూడా ‘శమము’ సిద్ధించుకొన్నవాడే అత్యంత ప్రకాశమానుడై విరాజిల్లగలడు.

సంతోష అమృతపానేన యే శాంతాః
తృప్తిమ్ ఆగతాః, ఆత్మారామా మహాత్మానః
తే ‘మహాపదామ్’ ఆగతాః।
సంతోషము
ఓ నిదాఘ మునీ! ఎవ్వడైతే ‘‘సంతోషము’’ అనే అమృతమును త్రాగి ‘తృప్తి’ కలిగి ఉంటాడో అట్టి మహాత్ముడు ఆత్మారాముడై మహాపదము (లేక) ఆత్మపదము సిద్ధించుకోగలడు.
అప్రాత్తం హి పరిత్యజ్య, సంప్రాప్తే
సమతాం గతః, అదృష్ట ఖేద-అఖేదో
(ఖేదాఖేదో) యః, ‘సంతుష్ట’ ఇతి కథ్యతే।।
(భేదాభేదో యః, ‘సంతుష్ట’ ఇతి కథ్యతే.)
సంతుష్టి - అనగా ఎవ్వడు?
ఎవ్వరైతే,
- ప్రాప్తించనట్టి వాటిని మనస్సుతో పరిత్యజించినవాడై,
- ప్రాప్తించియున్న వాటిని ఈశ్వర ప్రసాదితంగా ఆస్వాదిస్తూ,
- దృష్టికి ఖేద-అఖేదములు మొదలే ఆతనికి ఉండవో, అట్టివాడే సంతుష్టుడు.
న అభినందతి అసంప్రాప్తం,
ప్రాప్తం భుంక్తే యథా ఈప్సితమ్,
యః స సౌమ్య సమాచారః
‘‘సంతుష్ట’’ ఇతి కథ్యతే ।।
ప్రాప్తముకాని వాటిగురించి వాంఛలు కలిగి ఉండక, ప్రాప్తమైన వాటిని ఇష్టముగా పొందుచూ, సౌమ్యమైన- సాత్వికమైన భావన-ప్రవర్తన కలిగి ఉండటమే ‘సంతుష్టి’.
రమతే ధీః యథా ప్రాప్తే
సాధ్వీ ఇవ అంతఃపురాజిరే,
సా జీవన్ముక్తతా ఉదేతి
స్వరూపానంద దాయినీ ।।
అంతఃపురంలో ఉండే కులస్త్రీ (సాధ్వి) ఏవిధంగా సంతోషముగా మహారాజ్ఞిగా అంతఃపురంలోను, రాజ ఉద్యానవనములోను విహరిస్తూ ఉంటుందో, ఆ విధంగా ఉత్తమబుద్ధి గల ధీమంతుడు జీవన్ముక్తత్వము పుణికిపుచ్చుకొని ఈ జగత్తునందు స్వస్వరూపానందదాయకముగా విహారము చేస్తూ ఉంటాడు.

8. యథా క్షణం, యథా శాస్త్రం,
యథా దేశం, యథా సుఖమ్,
యథా సంభవ ‘సత్ సంగం’
ఇమం మోక్షపథక్రమమ్, -
తావత్ విచారయేత్ ప్రాజ్ఞో
యావత్ విశ్రాంతిం ఆత్మని ।
మోక్షపథము - సత్సంగము
ప్రాజ్ఞుడైనవాడు - దేశ-కాల-శాస్త్రములకు సానుకూల్యమై లభిస్తున్న ప్రాజ్ఞులతో సంగము వదలక ఉంటాడు.
శాస్త్రములు చెప్పే విశేషములను, విధివిధానములను గౌరవిస్తూ ఉంటాడు. అసత్‌ను అధిగమించి ‘సత్’ను ఆశ్రయిస్తూ ఉంటాడు.
‘‘జీవాత్మగా కనిపిస్తున్న నేను పరమాత్మగా (సహజంగానే) బంధ రహితుడను’’-అనే రూపమగు మోక్షమార్గమునకు సంశయ నివృత్తికై తత్త్వజ్ఞులతో సంభాషణమును ఆశ్రయిస్తాడు.
త్రికాలములలో పరమసత్యమైయున్న ఆత్మతత్త్వము గురించిన విచారణ కొరకై-‘‘సత్-సంగము’’ సహాయముతో ఆత్మయందు విశ్రాంతిపొందుతాడు.
తుర్య విశ్రాంతి యుక్తస్య
నివృత్తస్య భవార్ణవాత్ ।
తుర్యక్ విశ్రాంతి
అట్టి జాగ్రత్ -స్వప్న-సుషుప్తి సాక్షీరూపమగు తుర్యక్ విశ్రాంతియే ‘భవము’ అను సాగరము నుండి నివృత్తి (లేక) విడుదల.
జీవతో, అజీవతశ్చైవ,
గృహస్థస్య, అధవా యతేః,
న అకృతేన, కృతేన అర్థో।
న శ్రుతి స్మృతి విభ్రమైః।।

ఒకడు జీవించుచూ ఉన్నవాడైనా, జీవితాంతము (ఆ తరువాత) అయినా, (లేక) గృహస్థుడు అయినా, యతి అయినా, కృతార్థుడు అయినా - కాకపోయినా కూడా శ్రుతి (వేద) - స్మృతులు (పురాణములు) తెలియకపోయినా కూడా - తుర్యక్ స్వరూప విశ్రాంతుడు కృతకృత్యుడే!
అట్టివాడు కర్మలు చేయుటచే అర్ధమునుగాని, చేయకుండుటచే అనర్థముగాని పొందడు. శ్రుతి, స్మృతి విభ్రమములతో కూడా పని ఉండదు.

నిర్మంధన ఇవ అంభోధిః
స తిష్ఠతి యథా స్థితః
సర్వాత్మ వేదనం శుద్ధం
యదా ఉదేతి తత్ ఆత్మకమ్।।

తరంగరహిత సముద్రజలమువలె అట్టి తురీయ భావ విశ్రాంతుడు పరమ ప్రశాంత స్థితిని ఆస్వాదిస్తూ ఉంటాడు.
(1) తెలుసుకొనుచున్నవాడు (2) తెలియబడుచున్నది కూడా, (జలంలో నుండి జలమునకు వేరు కానట్టి తరంగము బయల్వెడలుచున్నట్లు)- ఆత్మనుండియే, ఆత్మకు ‘వేరు’ కాకయే బయల్వెడలుచున్నాయి.ఆత్మ సర్వదా శుద్ధము. అట్లాగే సమస్తము తత్ - ఆత్మకమే కాబట్టి సర్వదా శుద్ధమే.

భాతి ప్రసృతి దిక్-కాల
బాహ్యం చిత్‌రూప దేహకమ్,
ఏవం ఆత్మా యథా యత్ర
సముల్లాసం ఉపాగతః,
తిష్ఠతి-ఆశు (తిష్ఠత్యాశు), తథా తత్ర
తత్ రూపశ్చ విరాజతే।।
ఆత్మ సర్వదా నిశ్చలమే. అయితే ఆత్మ తనయొక్క భావనచే - స్వప్న దృశ్యకల్పనవలె - భావనారూపముగా భావనాత్మకమై దిక్ - కాలములతో కూడి కనబడుతోంది. ఆత్మయొక్క భావనా ఉల్లాసమే జగత్ దృశ్యము. ఆత్మ దేనిని ఎట్లా భావన చేస్తూ ఉంటే, అది అట్లాగే (దృశ్యము, బంధము, మోక్షము, జీవాత్మ, ఈశ్వరుడు మొదలైన) ఆయా సమస్తముగా భాసిస్తోంది.
యత్ ఇదం దృశ్యతే సర్వం
జగత్ స్థావర జంగమమ్,
తత్ ‘సుషుప్తా’ ఇవ స్వప్నః
కల్పాంతే ప్రవినశ్యతి।।
నిద్రపోతున్నవానికి వచ్చిన ఆయా అనేక భేదములతో కూడిన స్వప్నములోని దృశ్యమంతా ఏమౌతోంది? ఎటుపోతోంది? కల తనదైనవాడిలో (మెలుకువ రాగానే) లయించిపోతోంది కదా! అట్లాగే ఇక్కడి స్థావర-జంగమాత్మక మగు జగత్తంతా కూడా ఆత్మయొక్క ‘కల్పన’చే రూపము పొంది, కల్పనచే కొనసాగుతూ, కల్పన ముగియగానే ప్రవినాశనము ‘ప్రళయము’ పొందుతోంది.
‘‘ఋతం, ఆత్మా పరంబ్రహ్మ సత్యం’’
ఇతి ఆదికా బుధైః
కల్పితా వ్యవహారార్థం
యస్య, సంజ్ఞా ‘‘మహాత్మనః’’।
ఈ జగత్తుయొక్క - నీయొక్క - నాయొక్క కేవల స్వరూపము (The Absolute one’s own self) గురించి గుర్తు చేయుటకొరకై, ‘‘ఋతము, ఆత్మ, పరబ్రహ్మము, సత్యము’’….మొదలైన పదజాలమంతా మహాత్ములు సంజ్ఞాపూర్వకంగా (ఆత్మగురించి బోధించుటకై) కల్పిస్తున్నారు. వాస్తవానికి ఆత్మ స్వానుభవమేగాని భాషాయుతంగా అందించగలిగేది కాదు.
9. యథా కటక శబ్దార్థః పృథక్
భావో న కాంచనాత్, న హేమ కటకాత్,
తద్వత్ జగత్ శబ్ద - అర్థతా పరా ।।
తేనేయం (తేన ఇయం) ఇంద్రజాల
శ్రీః జగతి ప్రవితన్యతే। (ప్రవితస్యతే)।
‘బంగారు కంకణము’’ అని చెప్పునప్పుడు ‘‘ఇది బంగారము - ఇది కంకణము’’ అని విడదీసి చూపగలమా? కంకణము బంగారమునకు వేరై ఉన్నదా? లేదు. వాస్తవానికి బంగారమే ఉన్నదిగాని కంకణము బంగారమునకు వేరై లేదు. (Ornament is not seperable from Gold). అట్లాగే ఆత్మయే (కంకణమువలె) జగత్‌రూప శబ్ద - అర్థములుగా ఉన్నది. ఆత్మకు వేరుగా జగత్తు లేదు. అయినా కూడా ఆత్మయందు ఆత్మచే ఈ ఇంద్రజాల (ఇంద్రియ విషయకల్పిత) జగత్తు విస్తారమై ప్రదర్శనమౌతోంది.
ద్రష్టుః దృశ్యస్య సత్తా ‘అంతర్బంధ’ -
ఇతి అభిధీయతే ।।
దృష్టా దృశ్య వశాత్ బద్ధో ।
దృశ్య అభావే విముచ్యతే।।
‘ఆత్మస్వరూపుడే’ అయి ఉన్న ద్రష్ట తన భావనయందు దృశ్యము కలిగి ఉండుటచే….అదియే ‘అంతర్-బంధము’ - అని బంధము గురించి చెప్పబడుచున్నది.
- ‘దృశ్యము’ యొక్క దృష్టి, భావనలచేత ద్రష్ట బద్ధుడగుచున్నాడు.
- ద్రష్ట దృశ్యమును అభావించినప్పుడో? ద్రష్ట బంధవిముక్తుడు అగుచున్నాడు. కాబట్టి బంధ-విముక్తులు భావనామాత్రమే।
‘జగత్ - త్వం - అహం’
ఇత్యాది సర్గాత్మా దృశ్యం ఉచ్యతే।।
- ఆత్మకు అన్యముగా జగత్తు - త్వమ్ - అహమ్ - ఇవేవీ లేవు. సమస్తము ఆత్మ స్వరూపమే. ఆత్మ సర్వదా అనన్యము. తనను గురించి తానే కల్పించుకొంటూ, ఇంతలోనే కల్పనను విరమిస్తూ వినోదిస్తోంది.
- ఆత్మ - ‘‘జగత్తు-త్వమ్-అహమ్’ లను కల్పన చేసుకొని - తనకు అన్యముగా భావించి అనుభవముగా పొందుచున్నట్టిదే ‘దృశ్యము’.
మనసైవ ఇంద్రజాల శ్రీః, జగతీ ప్రవితన్యతే ।
యావత్ ఏతత్ సంభవతి, తావత్ మోక్షో న విద్యతే।
బ్రహ్మణాత్ అన్యతే విశ్వం మనసైవ స్వయంభువా।
మనోమయం అతో విశ్వం యత్ నామ పరిదృశ్యతే ।।
ఆత్మయొక్క భావనారూపమగు మనస్సే ఈ ‘దృశ్యజగత్తు’ - అను ఇంద్రజాల సంపదగా విస్తరించుచున్నది. ఇంద్రజాలములో కనబడే సంపద ఎటువంటిదో, మనస్సు పొందుచున్నవన్నీ అటువంటివి.
మనస్సుయొక్క కల్పన ఎన్నాళ్ళు ఆత్మకు అన్యముగా భావించబడి, అట్టి అన్య కల్పన ఉండి ఉంటుందో, అంత కాలము ‘మోక్షము’ అనునది సిద్ధించదు. అనగా దృశ్యము బంధముగా అనుభవమగుచూనే ఉంటుంది.
‘‘స్వయంభువు’’ యొక్క కల్పనయే (లేక) సంకల్పమే మనస్సు. సంకల్పమే విశ్వరూపమై అగుపిస్తోంది. ఈ కనబడేదంతా మనోకల్పనయే.
న బాహ్యే, న అపి హృదయే సత్‌రూపం
విద్యతే మనః।, యత్ అర్థ ప్రతిభానం
తత్ ‘మన’ - ఇతి అభిధీయతే।
సంకల్పనం మనో విద్ధి ।
సంకల్పః తత్ర విద్యతే।।
మనస్సుయొక్క రూపమేమిటి? బయట - లోపల ఏ విశ్వము అనుభూతమగుచున్నదో అదియే ‘మనస్సు’. అంతేగాని మనస్సు విశ్వమునకు లోపలలేదు, విశ్వమునకు బయటలేదు. భావనకు వేరైన స్వకీయమైన ‘ఉనికి’ ఏదీ మనస్సుకు లేదు.
విషయ సంకల్పమే మనస్సుయొక్క రూపము. దేనికి ఏ అర్థము ప్రతిపాదించబడి అనుభూతమగుచున్నదో, అట్టి అర్థప్రతిపాదనయే మనస్సుయొక్క రూపము. ‘సంకల్పనమే మనస్సు’ అని గమనించు. సంకల్పమునకు వేరుగా మనస్సు లేదు. సంకల్పించటమే మనస్సుగా చెప్పబడుతోంది.
‘‘యత్ర సఙ్కల్పనం, తత్ర మనో అస్తి’’
ఇతి అవగమ్యతామ్ ।
సంకల్ప మనసీ భిన్నే న కదాచన కేనచిత్।
సంకల్పజాతే గళితే
‘‘సరూపం’’ అవశిష్యతే।।

✤ ఎక్కడ సంకల్పము ఉంటే అక్కడ మనస్సు ఉంటుంది. అంతేగాని సంకల్పము ఒకచోట ఉండగా, మనస్సు మరింకెక్కడో లేదు. సంకల్పము లేనిచోట ‘మనస్సు’ ఉండదు. మనస్సు లేనిచోట ‘సంకల్పము’ - ఉండజాలదు.
✤ మనస్సుకు వేరుగా సంకల్పము లేదు.
✤ సంకల్పమునకు వేరుగా మనస్సు లేదు. అవి రెండూ భిన్నము కానేకాదు. పరస్పరము అభిన్నము.
‘సంకల్పము’ నశించినప్పుడు, అప్పుడిక స్వస్వరూపమగు ఆత్మయే శేషించినదగుచున్నది.
‘‘సంకల్పించువాడు’’ ఆత్మస్వరూపుడై సంకల్పము లేనప్పుడు కూడా శేషించువాడై ఉంటాడు. కనబడే సమస్తము ఆత్మగా దర్శిస్తూ ఉన్నప్పుడు అది మనోనాశనమే।

10. అహం త్వం జగత్ - ఇతి ఆదౌ (ఇత్యాదౌ)
ప్రశాంతే దృశ్య సంభ్రమే -
సత్తా దృశీ కేవలతా దృశ్యే సత్తాం ఉపాగతే ।।
మహా ప్రళయ సంపత్తౌ। హి
అసత్తాం సముపాగతే । అశేష దృశ్యే సర్గాదౌ
‘శాంతమ్’ ఏవ అవశిష్యతే।।

‘అహమ్ (నేను) - త్వమ్ (నీవు) - జగత్తు’ - ఈ మూడు నీ దృష్టిలో ఆత్మయందు, శమించిందా - దృశ్యమంతా శమిస్తుంది. దృశ్యము శమించగా శేషించేదే ‘‘కేవలము’’ (The Absolute). అట్టి ‘‘కేవలమే నేను’’ అను స్థితియే కైవల్యము.
‘‘మహాప్రళయము’’తో సహా దృశ్యమంతా కూడా ‘అసత్త’ స్వరూపముగా అగుచున్నది. కేవలాత్మ స్థానముయొక్క స్వానుభవముచే ఆత్మకు అన్యమైనదంతా ‘‘మొదలేలేనిది’’….అను అసత్-తత్వము సంతరించు కుంటోంది. సత్తా సామాన్యము మాత్రమే శేషించినదగుచున్నది. సర్గము (కల్పన)చే ఏర్పడి అనుభవమగుచున్న దృశ్యమంతా నిశ్శేషంగా ఆత్మకు అనన్యమై, ఇకప్పుడు ‘పరమశాంతము’ సర్వత్రా స్వానుభవమగుచున్నది. అట్టి సశాంత స్వరూపమే ఈ జీవుని నిత్యసహజత్వము. (అదియే సోఽహమ్-తత్త్వమ్ పరమార్థము) - నిజము.

అస్తి - అనస్తిం ఇతో భాస్వాన్
అజో దేవో నిరామయః।
సర్వదా సర్వకృత్ సర్వః
‘‘పరమాత్మ’’ ఇతి ఉదాహృతః।।
అట్టి స్వస్వరూప ఆత్మ భగవానుడు జన్మరహితుడు. దివ్యస్వరూపుడు నిరామయుడు (నిరామయుడు). ఆయనయే (అద్దములో దృశ్యము ఉండీ లేనట్టి తీరుగా) ‘అస్తి-నాస్తి’ రూపుడై భాసిస్తున్నారు. అట్టి ఏ తత్త్వమైతే సర్వదా సర్వము నిర్వర్తిస్తూ, సమస్తము అయి ఉన్నదో - ఆయనయే ‘పరమాత్మ’. (పరమ్ = ఆవల దేనికి ఆవల? ఈ జగన్నాటకము, ఇందలి నాయొక్క ‘పాత్ర’ (Role)కు ఆవలగల స్వస్వరూపము కాబట్టి ‘‘పరమ్’’ అనబడుతోంది).
యతో వాచో వివర్తంతే, యో
ముక్తైః అవగమ్యతే, యస్య చ
ఆత్మాదికాః సంజ్ఞాః
కల్పితా । న స్వభావతః ।।
→ (జలం నుండి తరంగం లాగా)
ఎక్కడి నుండి వాక్కు జనించి తిరిగి ఉపశమిస్తోందో (That into which the speaking in getting withdrawn)
→ దేనిని సమస్త దృశ్యము నుండి ముక్తి పొందిన ముక్త పురుషులు సందర్శిస్తూ ఆస్వాదిస్తునారో..
అద్దానికి ‘‘ఆత్మ’’ అనే పేరు ‘సంజ్ఞ’గా కల్పించబడింది. అంతేగాని ‘ఆత్మ’ అనగా ఒక పదార్థమో, ప్రదేశమో, స్థానమో కాదు. జగత్ విషయాలవలె స్వభావమువంటిది కాదు.
చిత్త ఆకాశం, చిత్ ఆకాశం,
మహాకాశం చ తృతీయకమ్ ।
ద్వాభ్యాం శూన్యతరం విద్ధి
చిత్ ఆకాశం। మహామునే!
అట్టి సంజ్ఞావివరణలలోని మరికొన్ని విశేషాలు చెప్పుకుందాము. ఈ భౌతికాకాశమును ప్రక్కగా పెడితే
(1) చిత్తాకాశము, (2) చిదాకాశము, (3) మహాకాశము (ఆత్మాకాశము)

ఓ మహామునీ! భూతాకాశము కంటే చిత్తాకాశము వస్తురహితమైనది. చిత్తాకాశము కంటే (విషయ రాహిత్యం దృష్ట్యా) చిదాకాశము శూన్యతరము (శూన్యము=విషయరహితము) (Superlatively Blank). చిదాకాశము కంటే మహాకాశము శూన్యతమము.
దేశాత్ దేశాంతర ప్రాప్తౌ
సంవిదో మధ్యమేవ యత్,
నిమేషేణ చిత్ ఆకాశం -
తత్ విద్ధి, మునిపుంగవ!
ఓ మునిపుంగవా! నిదాఘ మహాశయా! చిదాకాశము (చిత్-ఆకాశము) అనగా? దానిని ఎక్కడ గమనించాలి? విను. అది భూత-చిత్తాకాశములకంటే అత్యంత సూక్ష్మతరమైనది.
ఒకడు ఒక విషయమును వదలి మరొక విషయమును యోచన చేస్తూ ఉండగా,

ఇతఃపూర్వపు విషయము → నిర్విషయస్థానము → తదనంతర విషయము

విషయము - విషయము మధ్యగా ఏ ‘‘అవిషయ కేవల సత్తారూపము’’ (one’s own presence of Absolute self) స్వస్వరూపముగా ప్రదర్శనమై, ప్రకాశమానమై ఉన్నదో….అదియే ‘‘చిదాకాశము’’. (అదియే మనందరి ‘సహజరూపము’ ఇక, తదితరమైనదంతా సందర్భమాత్రము).
11. తస్మిన్ నిరస్త నిశ్శేష
సంకల్ప స్థితమ్ ఏషి చేత్,
సర్వాత్మకం పదం శాంతం
తదా ప్రాప్నోషి అసంశయః ।।
అటువంటి విషయ-విషయముల మధ్యగాగల వస్తురహిత-నిశ్శేష స్థానమును ‘సంకల్పము’ అనే ఉపకరణము సహాయముతో ఆశ్రయించి, అద్దానియందు బుద్ధిపూర్వకంగా స్థితి పొందుచుండగా, పరమశాంతమగు ‘‘సర్వాత్మక పదము’’ తప్పక ప్రాప్తించగలదు. నాస్తి అత్ర సంశయః।
నేను ఒక వ్యక్తిని = జీవాత్మభావన, ‘‘అందరిలోని నేనైన నేనే - నేను’’ = సర్వాత్మక పదము

ఉదిత ఔదార్య సౌందర్య వైరాగ్య
రసగర్భిణీ, ఆనంద స్యందినీ యైషా (యఏషా)
‘‘సమాధిః’’ అభిధీయతే ।
‘‘దృశ్య - అసంభవ’’ భోధేన,
రాగద్వేషాదితానవే,
రతిః బలోవిదితాయా అసౌ, ‘సమాధిః’ అభిధీయతే ।
సమాధి
‘‘ఔదార్యము-సౌందర్యము-వైరాగ్యము’’-ఈ మూడు రసములు అనుక్షణము గర్భము నందు కలిగి ఉన్నట్టిది, - అవ్యాజము,-స్వాభావికము అగు ‘‘పరమానంద రూప యోగస్థితి’’యే ‘సమాధి’.
‘‘దృశ్యము స్వతఃగా అసంభవము అని భావించటముచే ప్రాప్తించునది’’ - అగు అవగాహన చే (By virtue of logic based common sense of understanding) రాగద్వేష రహితంగా దృశ్యమునందు బుద్ధిబలంతో లీలగా, క్రీడగా, వినోదముగా సంచారము కలిగియుండినప్పటి బలోపేత స్థితియే సమాధి.
దృశ్య అసంభవ బోధేన
జ్ఞానం జ్ఞేయం ‘‘చిత్-ఆత్మకమ్’’
తత్ ఏవ కేవలీభావం, తతో
అన్యత్ సకలం మృషా ।।
‘‘దృశ్యము మొదలే (ఎండమావులలో జలములాగా, కుందేటి కొమ్ములాగా) అసంభవము’’ - అను జ్ఞానము (knowledge) జ్ఞేయము(practice)తో కూడిన చిదాత్మతో మమేకత్వము, చిదాత్మతో కేవలీభావము, అన్యమైనదంతా భ్రమాత్మకము - అనుధారణయే సమాధి. అదియే ‘‘కేవలీభావము’ లేక ‘కైవల్య స్థితి’.
‘‘మత్త ఐరావతో బద్ధః సర్ష పీకోణ కోటరే’’
‘‘మశకేన కృతం యుద్ధం సింహౌఘైః అణుకోటరే।’’
‘‘పద్మాక్షే స్థాపితో మేరుః నిగీర్ణో భృంగ సానునా।’’
నిదాఘ! విద్ధి తాదృక్త్వం జగత్
ఏతత్ భ్రమాత్మకమ్।
⌘ ఒక మదపుటేనుగు ఆవగింజయొక్క పొట్టభాగంలో బంధించబడింది. ఇరుక్కున్నది!
⌘ ఒక చిన్న వృక్షపు తొర్రలో ప్రవేశించిన సింహముతో ఒక దోమ యుద్ధం చేసి గెలిచింది! చెట్టు తొర్రలోని చిన్నచోటులో కూర్చుని దోమ - అటుగా వచ్చిన సింహమును మ్రింగింది కూడా।
⌘ ఒక తామర పూస (పద్మాక్షము)లో మేరుపర్వతము ఇరుక్కొని ఉండగా, ఒక తుమ్మెద ఎటునుంచో వచ్చి ఆ తామరపూసను కాస్తా ఆకలికి ఆహారంగా మ్రింగివేసింది కూడా!

ఇవన్నీ అసంభవము, భ్రమ కల్పిత వాక్యములు కదా! అట్లాగే ఓ నిదాఘ మహాశయా! పంచేంద్రియములకు ఘనీభూతమై అనుభవమగుచున్న ఈ ‘దృశ్య జగత్తు నిజంగానే ఉన్నది’ - అనటము అటువంటిది.
చిత్తమేవ హి సంసారో రాగాది క్లేశ దూషితమ్,
తత్ ఏవ తైః వినిర్ముక్తం ‘‘భవాంత’’ ఇతికథ్యతే।।
రాగము, ద్వేషములతో కూడియున్న స్వకీయచిత్తమే - సంసారము. రాగద్వేషములు తొలగినాయా, - అప్పుడు ఆ స్థితియే ‘సంసారమునుండి విముక్తి. మోక్షము’ అనబడుతోంది. ‘‘నా దృష్టిలో - ఈ దృశ్యము కలలో వలె కల్పన మాత్రమే। నిజమే కాదు।’’ అను స్థితి సిద్ధించటమే ‘‘భవాంతము’’ (లేక) ‘‘భ(భా)వ బంధరాహిత్యము’’ (లేక) ‘భవరోగ నివారణము’’.
12. మనసా భావ్యమానో హి
దేహతాం యాతి దేహకః ।
దేహ వాసనయా ముక్తో
దేహ ధర్మైః న లిప్యతే।
కల్పం క్షణీ కరోతి అంతః
క్షణం నయతి కల్పతామ్।
‘‘మనోవిలాసః సంసార’’
ఇతి మే నిశ్చితా మతిః।
మననరూపమగు మనస్సుచే నిర్వర్తించుచున్న ‘‘భావనాపరంపరలు’’ - వలననే ఈ దేహి (లేక జీవుడు) దేహవాసనలు పొందుచూ, వాటిచే, ‘‘నేను దేహమాత్రుడను’’ అని అనుకుంటూ, అనుకుంటూ ‘‘నిబద్ధుడు’’ - అగుచున్నాడు.
దేహమునకు సంబంధించిన వాసనలను జయించి, వాటినుండి ‘‘విముక్తుడు (Relieved) అగుచుండగా. ఇక ఈ జీవుడు దేహధర్మముల దోషము ఏమాత్రము పొందడు.
ఓ నిదాఘా! ఈ మనస్సుయొక్క విలాసము ఎంతటి అమోఘమైనదంటే, - ఇది తలచుకొంటే ‘కల్పము’ కాలమును ‘క్షణ’మాత్రంగాను, ‘క్షణ’కాలమును ‘కల్పము’ అంతటిదిగాను చేసి వేయగలదు.
ఈ ‘సంసారము’ అనబడునది మనస్సుయొక్క విలాసము మాత్రమే - అని నా నిశ్చితాభిప్రాయము.
న అవిరతో దుశ్చరితాన్,
న అశాంతో, న అసమాహితః,
న అశాంత మనసోవాఽపి
(ప్రజ్ఞానేనైవ ఏనం) న ఆప్నుయాత్।।
అట్టి సంసారదోషము (దృశ్యముతో ఏర్పడుచున్న కల్పితసంబంధము) - తొలిగేది ఎట్లా? మనస్సుకు (లేక) ఆలోచనకు జననస్థానమైన ఆత్మయొక్క జ్ఞానముచే తనే తొలగిపోగలదు. అయితే ఆత్మగురించిన నిశ్చితమైన అవగాహన లభించేది ఎట్లా? ప్రజ్ఞ (Intellectual) చేతనే. కానీ
- ఎవ్వడు దుష్ట అభ్యాసముల నుండి వెనుకకు మరలడో,
- అశాంతితో కూడిన మనస్సు కలిగి ఉంటాడో,
- సర్వసమత్వభావనను ఆశ్రయించడో,
అట్టివాడు, - ప్రజ్ఞావంతుడై ఉండి కూడా,-ఆత్మతత్త్వ భావన సిద్ధించుకోలేడు.
తత్ బ్రహ్మానందం, అద్వంద్వం, నిర్గుణం, సత్య -
చిత్ ఘనమ్ విదిత్వా - స్వ ఆత్మనో రూపం -
న బిభేతి కదాచన
।।
ఎవ్వడైతే స్వస్వరూపాత్మ (తన ఆత్మ)యే బ్రహ్మానందరూపమని, అద్దానికి ద్వితీయమై ‘నీవు -జగత్తు’ వేరుగా లేవని (ఆత్మ సర్వదా అనన్యమని, కేవల ఎరుకయగు చిద్ఘన రూపమని) తెలుసుకుంటాడో, అట్టివాడు ఇక దేనికీ భయము పొందడు.
పరాత్ పరం యత్ -
మహతో మహాంతం, స్వరూప తేజోమయ-
శాశ్వతం శివమ్।
కవిం । పురాణం । పురుషం ।
సనాతనం । సర్వేశ్వరం ।
సర్వదేవైః ఉపాస్యమ్ । ‘‘అహం బ్రహ్మ’’ ఇతి
నియతం మోక్ష హేతుః మహాత్మనామ్।।
బంధ-మోక్షములు
‘‘నేనే బ్రహ్మమును’’ అను ఎరుకచే ఈ జీవుడు ‘‘మహాత్ముడు’’ అగుచున్నాడు.
ఏదైతే పరమునకే పరమో, పరాత్‌పరమో, (నాటకములోని పాత్రలన్నిటికీ కారణము రచయిత అయి ఉన్నతీరుగా) మహత్ స్వరూపమో, తేజోమయ స్వరూపమో, త్రికాలములచే మార్పు చెందక - శాశ్వతమో, సమస్తము కంటే మహనీయమో, కవి (శ్రేష్ఠము) అయిఉన్నదో, సమస్తమునకు మునుముందే ఉండిన పురుషకారమో (పురాణపురుషమో), స్వతేజస్సుచే స్వయముగా ప్రకాశమానమో, జన్మకర్మలకు మును ముందుగా ఉండి ఉండటంచేత సనాతనమో, సర్వదేవతలకు ఉపాస్యమో, అట్టి ఆత్మయే నేను. నా వాస్తవ రూపము ఆత్మయే’’ - అను విజ్ఞానము మోక్షమునకు కారణము కాగలదు.
13. ద్వే పదే బంధమోక్షాయ -
నిర్మమేతి; మమేతి చ।
మమేతి బధ్యతే జంతుః।
నిర్మమేతి విముచ్యతే।।
‘‘బంధము-మోక్షము’’ అనునవి రెండు వేరువేరైన త్రోవలు.
(1) ‘‘మమ’’ కారము (నాది) (2) ‘‘నిర్మమ’’కారము. (నాది అనునది ఏదీ లేదు) ‘‘మమకారము (నాది)’’చే బంధము కలుగుతోంది. ‘నాది కాదు’ - అనుకొనుటచే మోక్షము లభిస్తోంది. బంధ-మోక్షములు ఇంతమాత్రమే।
‘‘జీవ-ఈశ్వర’’ ఆది రూపేణ చేతన, అచేతనాత్మకమ్।
ఈక్షణ ఆది - ప్రవేశాంతా సృష్టిః ఈశేన కల్పితా।।
జాగ్రత్-ఆది→విమోక్ష అంతః సంసారో జీవకల్పితః।
‘‘త్రిణాచిక - ఆది - యోగాంతా ఈశ్వర అహ్రాంతిమ్
ఆశ్రితాః। లోకాయత → ఆది సాంఖ్యాంతా
జీవ వీహ్రాంతిం ఆశ్రితాః।।
తస్మాత్ ముముక్షుభిః న ఏవ మతిః
జీవ-ఈశ వాదయోః కార్యా।
కింతు, బ్రహ్మతత్త్వం
నిశ్చలేన విచార్యతామ్ ।।
‘‘జీవుడు’’, ‘‘ఈశ్వరుడు’’ (Individual - Collective) మొదలైన రూపములతో కల్పితమై కనిపిస్తున్న ఈ దృశ్య జగత్తు చేతన-అచేతనాత్మకము. ‘‘ద్రష్ట యొక్క దర్శనము’ ద్రష్ట - దృశ్యములతో కూడిన ఈ జగత్తు ఈశ్వరునిచే ‘‘వీక్షణము’’ (Perception) నుండి ప్రవేశము (Entering into) వరకు నిర్మితమగుచున్నది. ఈశ్వరుని దృష్టి అంతమయ్యే వరకు ఈ సృష్టి ఈశ్వరునిచే పరికల్పించబడుచూనే ఉంటుంది. ఈశ్వర దృష్టియే సృష్టి.
-జాగ్రత్ మొదలుకొని విమోక్షము (Relief) వరకు కొనసాగుచూ ఉన్న ఇక్కడి సంసారము జీవునిచే కల్పించబడుచున్నది.
త్రిణాచక యజ్ఞము మొదలైన (స్వర్గలోకప్రాప్తి) కార్యక్రమముల నుండి - సాంఖ్యయోగ పరాకాష్ఠానుభవము వరకు జీవుని స్వయం కృతంగా అహ్రాంతి రూప నిర్మితమే. 14 లోకములు మొదలైనవన్నీ జీవాహ్రాంతిలోని అంతర్గత విశేషాలే। యజ్ఞయాగాలు మొదలుకొని ‘‘నేను జీవుడను. నేను ఈశ్వరుడను’’ - అనబడు అంతా కూడా అహ్రాంతియే. అందుచేత ఈ జీవుడు జీవ-ఈశ్వర భావములను రెండిటినీ దాటివేసి - నిశ్చలమైన బుద్ధితో బ్రహ్మతత్త్వమును విచారణ చేయాలి.
అవిశేషేణ సర్వం తు యః పశ్యతి చిత్ అన్వయాత్,
స ఏవ ‘‘సాక్షాత్ విజ్ఞానీ’’ । స శివః। స హరిః। విధిః ।
ఇక్కడి సమస్తమును నిశ్శేషంగా చితానందరూపంగా, కేవలచిత్ స్వరూపంగా ఎవ్వరు దర్శిస్తారో, ఆతడే సాక్షాత్ విజ్ఞాని. ఆతడే బ్రహ్మ। ఆతడే హరి। ఆతడే శివుడు।
దుర్లభో విషయ త్యాగో।
దుర్లభం తత్త్వ దర్శనమ్,
దుర్లభా సహజ - అవస్థా,
సద్గురోః కరుణాం వినా।
సద్గురు కరుణ
ఓ నిదాఘా! ఆత్మసాక్షాత్కారము కొరకై, సాక్షాత్ ఆత్మదర్శనమునకై సద్గురువును ఆశ్రయించాల్సిందేనయ్యా. సద్గురు కరుణ లేనిదే విషయత్యాగము, తత్త్వదర్శనము, సహజావస్థ - ఈ మూడు దుర్లభము.
14. ఉత్పన్న శక్తి బోధస్య,
త్యక్త నిశ్శేష కర్మణః,
యోగినః ‘‘సహజ అవస్థా’’
స్వయం ఏవ ఉపజాయతే ।
ఎరుగుచూ ఉన్న వానిని ఎరుగుట - (The knowing about the knower) అనురూపముగల బోధజ్ఞానశక్తి ఉత్పన్నముకావాలి. కర్మలను మొదలంట్లా త్యజించివేయాలి. (నేను కర్తను, భోక్తను అనే భ్రమ తొలగాలి). అప్పుడు ఆ యోగి సందర్భావస్థలను దాటివేసి స్వయముగా ‘‘సహజావస్థ’’ (The Natural self which is mere witness to Incidental self) - అను స్థానమును స్వయముగా సిద్ధించుకొనుచున్నాడు.
యదా హి ఏవ ఏష ఏతస్మిన్
అల్పమపి అన్తరం నరః, విజానాతి
తదా తస్య భయంస్యాత్ ।
న అత్ర సంశయః।।

ఎంతెంత కాలము ఈ జీవుడు ఈ దృశ్యమానమగుచున్న జగత్తులో (సర్వ సమత్వము దర్శించకుండా) కించిత్ భేదము దర్శిస్తూ ఉంటాడో, అంతంతవరకు అట్టివానికి ‘భయము’ కొనసాగుచూనే తీరుతుంది. ఇందులో అనుమానం లేదు.

సర్వగం సచ్చిదానందం
జ్ఞానచక్షుః నిరీక్షతే। అజ్ఞానచక్షుః న ఏక్షేత, -
భాస్వంతం భానుం అంధవత్।।
జ్ఞాన చక్షువులకు ఈ కనబడేదంతా కూడా సర్వత్రా సర్వదా సర్వ సందర్భములలోను సత్-చిత్-ఆనందరూపమగు బ్రహ్మమే. బ్రాహ్మీభావన నిస్సందేహమై, స్వాభావికమగుచున్నది.
ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ - గ్రుడ్డివానికి సూర్యుని వెలుగు అగుపించదు కదా! అట్లాగే అజ్ఞాన చక్షువులకు ఆత్మతత్త్వము అగుపించదు.
ప్రజ్ఞానం ఏవ తత్ బ్రహ్మ,
సత్య ప్రజ్ఞాన లక్షణం।
ఏవం బ్రహ్మ పరిజ్ఞానాత్ ఏవ,
మర్త్యో అమృతో భవేత్।।
‘కేవలమగు తెలివి’ రూపమగు ప్రజ్ఞానమే (the property of absolute knowing) బ్రహ్మము. అట్టి ప్రజ్ఞానము ‘‘నేను ఉన్నాను’’ - అను అహం సత్ (‘ఉనికి’)కి సంబంధించినది. ప్రజ్ఞానముయొక్క స్వాభావిక లక్షణము - ‘సత్’. ఈవిధంగా ‘‘నాయందలి ఉనికి -భావనలతో కూడిన ప్రజ్ఞయే బ్రహ్మము’’ - అను పరిజ్ఞానముచే ఈ జీవుడు ‘అమృతుడు’ అగుచున్నాడు. మార్పు-చేర్పులకు తాను విషయమేకానని ఎరుగుచున్నాడు.
భిద్యతే హృదయ గ్రంధిః, ఛిద్యంతే సర్వ సంశయాః
క్షీయంతే చ అస్య కర్మాణి, తస్మిన్ దృష్టే పరావరే।।
అట్టి ఆత్మయొక్క పరావర (Ones own ‘Self’ which is beyon all that is being seen here) దృష్టిచే హృదయ గ్రంథులు ముడివీడుతాయి. సర్వ అనుమానాలు ఛేదించ బడతాయి. కర్మబంధములన్నీ తెగిపోతాయి.
అనాత్మతాం పరిత్యజ్య నిర్వికారో జగత్ స్థితౌ,
ఏక నిష్ఠతయ అంతస్థః సంవిత్ మాత్రపరోభవ।
ఓ నిదాఘ ముని సత్తమా! భేదరూపమగు అనాత్మమైనదంతా వదలివేయి. పరిత్యజించు. ఈ జగత్తులో సంచరిస్తూ కూడా నిర్వికారుడవై ఉండుము. బాహ్యమున కనిపించే నామరూపములు, గుణములు ప్రక్కకు పెట్టి, సర్వదా ఏకనిష్ఠతో-అహం-త్వమ్-జగత్తుల అంతరమగు ఆత్మనే సర్వత్రా సందర్శిస్తూ, అంతర్ముఖుడవై ఉండుము. సంవిత్‌మాత్ర పరుడవై ఉండు.
మరుభూమౌ జలం సర్వం
మరుభూ మాత్ర ఏవ తత్ ।
జగత్రయం ఇదం సర్వం
చిన్మాత్రం - స్వవిచారతః।।
మరుభూమి (ఎడారి)లో ఎండమావులందు కనిపించే నీరు వాస్తవానికి ఎడారి భూమియే కాని, ‘జలము’ కాదు కదా!
అట్లాగే ‘‘స్వస్వరూపవిచారణ’’చే - (జాగ్రత్ స్వప్న సుషుప్తులలో స్వర్గ-మర్త్య పాతాళ లోకములలో) కనిపించేదంతా - స్వకీయ ఎరుక యొక్క విస్తరణ రూపమే, చిన్మాత్రమే అయి ఉన్నది.
15. లక్ష్య - అలక్ష్య మతిం త్యక్త్వా, యః తిష్ఠేత్
కేవల ఆత్మనా, శివ ఏవ స్వయం సాక్షాత్।
అయం బ్రహ్మవిత్ ఉత్తమః।।
ఎవ్వడైతే బ్రహ్మమును తెలుసుకుంటాడో, ఆతడు బ్రహ్మమే - అగుచున్నాడు. ఎవ్వడైతే లక్ష్యము-అలక్ష్యములను (All Targetting and objectivation) వదలి, కేవలమగు ఆత్మయందే సంతిష్ఠితుడు అయి ఉంటాడో, ఆతడు సాక్షాత్ శివుడే। సాక్షాత్ ‘బ్రహ్మమే’।. ఆతడే ఉత్తమమగు బ్రహ్మవేత్త.
అధిష్ఠానం, అనౌపమ్యం, అవాక్ మానస గోచరమ్,
నిత్యం, విభుం, సర్వగతం, సు-సూక్ష్మం చ, తత్ అవ్యయం।
అట్టి పరబ్రహ్మము ఎట్టిది?
సమస్తమును ఆక్రమించుచూ, తన ఏలుబడియందు కలిగియుండటంచేత అధిష్ఠానము. ఉపమానములతో నిర్ణయించి చెప్పలేము కాబట్టి అనౌపమ్యము, వాక్కుకు, మనస్సుకు విషయము కాదు కాబట్టి అవాక్-మానసగోచరము. ఇంకా, నిత్యమైనది. సమస్తమూ తన ప్రదర్శనమే కాబట్టి విభువు. సర్వత్రా విస్తరిస్తూ సర్వగతము. అత్యంత సూక్ష్మము. మార్పు-చేర్పులకు ఆ అవిషయము కనుక అవ్యయము.
సర్వశక్తేః మహేశస్య విలాసో హి మనోజగత్ ।
సంయమ - అసంయమాభ్యాం చ,
సంసారం శాంతిమ్ అన్వగాత్।।
ఈ జగత్తు అనబడునది - అటువంటి సర్వశక్తిమంతుడగు మహేశ్వరుని మనో విలాసమే.
సంయమ - అసంయమములతో కూడిన ఈ జగత్తు - పరబ్రహ్మమునందే జనించి, పరబ్రహ్మమునందే సశాంతిస్తోంది.
మనోవ్యాధేః చికిత్సార్థం
ఉపాయం కథయామి తే।
యత్ యత్ స్వాభిమతం వస్తు
తత్ తత్ త్యజన్ ‘‘మోక్షమ్’’ అశ్నుతే।।
ఓ నిదాఘ! ఆత్మానందస్వరూపా! ఈ జీవుని స్వస్వరూపము పరబ్రహ్మమే! అట్టి పరబ్రహ్మము ఎట్లా స్వానుభవమౌతుందంటావా? కాకపోటానికి మనస్సే వ్యతిరిక్త కారణం. మనస్సు భేదదృష్టితో కూడిన ‘‘జగత్‌దర్శనము’’ అనే జాడ్యము అభ్యాసవశంగా వీడలేకపోతోంది.
అటువంటి ‘‘మనోవ్యాధి’’ యొక్క చికిత్స కొరకై ఒక ఉపాయము చెప్పుచున్నాను. విను.
ఏదేది ‘‘ఇది నాకు ప్రియము’’ - అని అనిపిస్తూ వస్తుందో - అట్టిదానినంతా మానసికంగా త్యజించి ఉండటమే - ‘మోక్షము’ సిద్ధించు ఉపాయము.

స్వ-ఆయత్తం, ఏకాంత హితం,
స్వ-ఈప్సిత-త్యాగ వేదనమ్,
యస్య దుష్కరతాం యాతం,
ధిక్తం పురుష కీటకమ్।।
ఎవ్వడైతే - తనయొక్క స్వాధీనములోనే ఉన్నట్టి, ఏకాంతముగా అంతరమున అభ్యాసం చేస్తే హితము కలిగించునట్టి, - స్వకీయమైన మనో ఈప్సిత అభ్యాసమును (ఏదో కావాలి. వదలరాదు అనే రూపముగలది)ను జయించునట్టి - ప్రయత్నము ‘‘అది మాకు కష్టము కష్టము. కుదరదు’’ - అని అనుకుంటాడో, అట్టివాడు పురుషకీటకము. (‘మానవుడు’ రూపములో ఉన్న ‘పురుగు’ వంటివాడు). అట్టి అప్రయత్నశీలత్వమునకు ధిక్కారమగు గాక.
స్వపౌరుషా-ఏక సాధ్యేన
‘‘స్వ-ఈప్సిత త్యాగ రూపిణా’’, -
మనః ప్రశమ మాత్రేణ
వినా నాస్తి శుభా గతిః।।
ఓ నిదాఘా! తనయొక్క ఇష్ట-అయిష్టములనుండే ఈ జీవునికి దృశ్యముతో ‘సంసారము’ అనే బంధము వచ్చిపడుతోంది. అటువంటి ‘ఈప్సిత త్యాగము’ అనే పురుషకారమగు స్వకీయ ప్రయత్నము లేకపోతే మనస్సు శమించదు. ‘మనస్సు’ విషయములపై వ్రాలటము అనే జాడ్యము తొలగదు. మనస్సును జయించకుంటే శుభగతి లేనే లేదు.

16. అసంకల్పన శస్త్రేణ
ఛిన్నం చిత్తం ఇదం యదా
సర్వం సర్వగతం శాంతం
బ్రహ్మ సంపద్యతే తదా।।
అమనస్క యోగము
చిత్తము అనగా ఏమి? ‘నేను-నాది అని సంకల్పించటము’ యొక్క అభ్యాసమేకదా! ఇప్పుడు ఇక చిదాత్మానుభవమునకు అడ్డుగా నిలుస్తున్న ‘చిత్తము’ను జయించవలసిందే. ఎట్లా? అందుకు ఉపాయం సాధనము కూడా అసంకల్పమే. (లేక) నిస్సంకల్పమే. ‘‘సంకల్పము చేయక పోవటము’’ అని పిలువబడే ‘అసంకల్పము’ అనే ప్రయత్నము - ‘‘అనేక విషయములపై వ్రాలి, వాటిలో చిక్కుకోవటం’’ - అనే రూపముగల ‘చిత్తము’ను నశింపజేయగలదు. అప్పుడు ఇక ‘సర్వము, సర్వగతము, శాంతము’- అగు బ్రహ్మము యొక్క భావన (చిత్) సిద్ధించగలదు.
‘భవ’ భావనయా ముక్తో
యుక్తః పరమయాధియా,
ధారయ ఆత్మానం అవ్యగ్రా
ఉగ్రస్త చిత్తం చితః పదమ్।।
(అవ్యగ్రో-గ్రస్త చిత్తం-చితః పరమ్)
‘ఈ జగదృశ్యము నిజంగా ఉండియే ఉన్నది’ అనునదే భవరోగముగా చెప్పబడినది. అది భావనచేతనే ఏర్పడుతోంది. అందుచేత ఓ నిదాఘా! భవ-భావన (What ever beeing seen is permanent) నుండి ముక్తుడవు అవవయ్యా (Please get relieved). (భవము = ఉన్నది)
ఉత్తమమైన బుద్ధి-యుక్తులతో అవ్యగ్రముగా (unemotionally) చిత్తము చిత్‌పదమును ఆశ్రయించగలదు.
పరం పౌరుషం ఆశ్రిత్య
నీత్వా చిత్తం అచిత్తతామ్।
ధ్యానతో హృదయ ఆకాశే
చితి చిత్ చక్రధారయా।
‘పరము’ కొరకై ఇహపురుషకారమును ఆశ్రయించి చిత్తమును అచిత్తముగా చేసివేయి. ధ్యాసరూపమగు ధ్యానముతో నీయొక్క (స్వకీయ) హృదయాకాశములో - చిత్తమును చిత్ చక్రముతో ఖండించి వేసి, కేవలచిత్ స్వరూపుడవు అగుము.
మనో మారయ నిశ్శంకం, త్వాం ప్ర బధ్నంతి నారయః।
‘‘అయం, సోఽహం’, ఇదం, తత్ మే,’’
ఏతావత్ మాత్రకం మనః।
తత్ అభావన మాత్రేణ దాత్రేణ ఏవ విలీయతే।
కామరూపమున {(అనేక కోరికలు) (expectations) రూపంగాఊ ఉన్న మనస్సు అనే మారుడు - ఈ జీవుని బంధించుచున్నాడు. పురుషకారముతో సర్వాత్మకమగు అఖండ పరబ్రహ్మమును ఆశ్రయిస్తూ, హృదయములోనే ‘సోఽహమ్’ (-‘అదియే నేను’ భావనతో) ఆత్మోపాసన నిర్వర్తిస్తూ ఉండగా, ఇక మనోబంధములు నిన్నేమీ చేయలేవు.
‘భావన’చే మనస్సు రూపుదిద్దుకొంటోంది. అభావన మాత్రం చేత మనస్సు - తరంగం సముద్రజలంలోలాగా - ఆత్మయందు విలీనము కాగలదు.
ఛిన్నాభ్ర మండలం వ్యోమ్ని
యథా శరది ధూయతే,
వాతేన అకల్పకేన ఏవ
తథా అంతర్ధూయతే మనః।।
శరత్ కాలంలోఆకాశంలోని మేఘములు వాయువుయొక్క ప్రసరణచే ఛిన్నాభిన్నమై జలరూపంగా వర్షిస్తున్నట్లు, మనస్సు ‘ఆత్మధ్యానము’ అనే వాయుతరంగములచే ఛిన్నాభిన్నమై, హృదయస్థమగు ఆత్మయందు లయించిపోగలదు.
17. కల్పాన్త పవనావాంతు,
యాంతు చ ఏకత్వం అర్ణవాః,
తపం తు ద్వాదశ ఆదిత్యా,
నాస్తి నిర్మనసః క్షతిః।।
మనోజయ ధ్యాని / ఆత్మధ్యాని
- ప్రళయాంతమును సూచించు ప్రళయ వాయువులు వీచునుగాక!
- సప్త సముద్రములలోని జలము పొంగి ఏకమగుగాక!
-ద్వాదశాదిత్యులు తమయొక్క ఉష్ణకిరణములచే జగత్తులోని పదార్థజాలమునంతా తపించేసి మాడ్చివేయుదురు గాక!
మనస్సును జయించిన అమనస్కుడు కించిత్ కూడా క్షోభ పొందడు
అసంకల్పన మాత్రైక సాధ్యే సకల సిద్ధిదే।
‘అసంకల్ప’ ఆది సామ్రాజ్యే తిష్ఠ అవష్టబ్ధ
తత్ పదః। న హి చంచలతా హీనం
మనః క్వచన దృశ్యతే ।।
సంకల్పము నిరోధించి, ‘అసంకల్పము’ను ఆశ్రయించిన మాత్రంచేత అష్ట సంపదలతో సహా సమస్తము సిద్ధించగలదు. అందుచేత ఆది-స్వరూపము (The Origin Form of Self) అగు ‘అసంకల్పత్వము’ అను, ఆత్మసామ్రాజ్య సింహాసనమును అధిష్ఠించి ఉండుము. అఖండ - ఆత్మత్వమును సంతరించుకొని ఉండెదవుగాక।
చంచలత్వం మనో ధర్మో,
వహ్నేః ధర్మో యథా ఉష్ణతా।
ఏషాహి చంచల అస్పంద
శక్తిః చిత్‌తత్త్వ సంస్థితా।
తాం విద్ధి మాససీం శక్తిం,
జగత్ ఆడంబరాత్మికామ్।
మనోచాంచల్యము
ఈ మనస్సు ఎప్పుడూ కూడా తనయొక్క చంచల స్వభావమును విడచి ఉండదు. అగ్నికి ఉష్ణము ఏవిధంగా ధర్మమో, మనస్సుకు చంచలత్వము అనేది ధర్మమైయున్నది.
అయితే మనస్సును కదల్చుచున్న చిత్‌శక్తి - తాను కదలక, మనస్సుయొక్క కదలికలకు కారణము అగుచున్నది - అని గమనించెదవు గాక. చిత్తుయొక్క ‘కదల్చటము’ అను చంచలశక్తియే (తాను కదలకయే) స్పందశక్తిగా ప్రదర్శనమగుచూ, మనోశక్తిగా ఈ జగదాడంబరమునకు కారణమగుచున్నది. కదలేదానిని దాటి, కదిలిస్తూ తాను కదలక ఉన్న దానిని ఆశ్రయించు.
యత్తు చంచలతా హీనం, తత్ మనో అమృతం ఉచ్యతే।।
తత్ ఏవచ తపః, శాస్త్ర సిద్ధాంతే, ‘‘మోక్ష’’ ఉచ్యతే।।
తస్య చంచలతా యైషాతు అవిద్యా వాసనాత్మికా,
వాసనా ‘పర’నామ్నీం, తాం విచారేణ వినాశయ।।
జగత్తు యొక్క ఆడంబరమంతా కూడా మనోశక్తి ప్రదర్శనమే. ఏ మనస్సు యొక్క అంతరవిభాగము చంచల రహితమై ఉన్నదో….అదియే అమృత రూపము. అదియే ఆత్మ. అదియే తపోధనులచే ‘‘మోక్షము’’ అని సిద్ధాంతీ కరించబడుచున్నది. కదలికలకూఅధారమై, తాను కదలక ఉన్నట్టిదే - ఆత్మ.
మనస్సుయొక్క అనిరోధరూపమగు చాంచల్యమే ‘అవిద్యావాసన’. అట్టి అవిద్యచే జనించే వాసనలను (Tendencies) ఇప్పుడు నీవు ‘‘ఆత్మతత్త్వవిచారణ’’ - సహాయముతో మొదలంట్లా నశింపజేయాలి. లేదా అనేక చిత్తభ్రమలు కొనసాగుచూనే ఉంటాయి
పౌరుషేణ ప్రయత్నేన యస్మిన్ ఏవ పదే మనః,
యోజ్యతే తత్ పదం ప్రాప్య నిర్వికల్పో భవ।
అనఘ!
పాపదృష్టి రహితుడవగు ఓ నిదాఘమహాయా! అనఘా! నీయొక్క పురుషప్రయత్నము, వివేక దృష్టిచే మనస్సును ఆత్మయందు విలీనము చేసి, సర్వత్రా ‘ఆత్మదృష్టి’ని పెంపొందించుకో. ‘నిర్వికల్పము’ను అభ్యసించు. అప్పుడు ఏ ఆత్మ (తత్) పదము ప్రాప్తిస్తుందో - అట్టి అఖండాత్మయే నీవు అగుము. (అట్టి నిశ్చలాత్మయే నీ స్వభావము, స్వరూపము కూడా).
18. అతః పౌరుషమ్ ఆశ్రిత్య, చిత్తం ఆక్రమ్య
చేతసా, విశోకం పదం ఆలంబ్య
నిరాతంకః స్థిరో భవ।।
ఇప్పటికిప్పుడే పురుషకారమును ఆశ్రయించి, చిత్‌బుద్ధితో చిత్తమును ఆక్రమించు. విశోకమగు (No Worry) అతీత ఆత్మపదమును అవలంభించు. అన్ని ఆటంకములను (All Hurdles) జయించి, సర్వాత్మకమగు ‘‘ఆత్మభావన’’ యందు సుస్థిరుడవు, నిశ్చలుడవు అగుము.
మన ఏవ సమర్థం హి మనసః దృఢ నిగ్రహే।
అరాజా కః సమర్థః స్యాత్ రాజ్ఞో నిగ్రహ కర్మణి?
తృష్ణా గ్రాహ గృహీతానాం సంసార అర్ణవ
పాతినామ్, ఆవర్తై రుహ్యమానానాం
(ఆవర్తైః ఉహ్యమానానాం) దూరం
స్వ మన ఏవ ‘నౌః’।।
(రహ్యము = గఱిక)
మనస్సు చేతనే ఈ జీవునికి దృశ్యబంధము కలుగుచున్నమాటనిజమే. అయితే దృశ్యతన్మయమగుచున్నట్టి మనో విభాగమును దృఢముగా నిగ్రహించు సామర్థ్యము తిరిగి (నిశ్చలవిభాగమగు) మనస్సుకే ఉన్నది. ఏ విధంగా రాజును రాజే జయించగలడో, నిగ్రహించగలడో -మనస్సును మనస్సే నిగ్రహించగలదు. రాజు కానివాడు రాజును ఎట్లా జయించటం?
‘సంసారము’ అనే సముద్రములో తృష్ణ (ఆశ)’ అనే సుడిలో ప్రవేశించి ఉన్న తరంగములలో చిక్కుకొని గఱికలవలె ఊగిపోతున్న ఈ జీవునికి ఆతని (శుద్ధ) మనస్సే ఆతనిని కాపాడగల ‘నౌక’.
మనసః ఏవ మనః ఛిత్వా పాశం పరమబంధనమ్,
భవాత్ ఉత్ తారయ (ఉత్తారయ) ఆత్మానం
న అసావత్ అన్యేన తార్యతే।।
యా యా ఉదేతి మనో నామ్నీ వాసనా వాసిత-
అంతరా, తాం తాం పరిహరేత్ ప్రాజ్ఞః
తతో అవిద్యా క్షయో భవేత్।।
వివేకములతో కూడిన మనస్సుతో అనేక దుష్టపాశములలో చిక్కుకొనియున్న అజ్ఞానమనోచంచల్యమును నీకు నీవే - ఉద్ధరించాలి. నీ మనస్సును నీవే పైకి తెచ్చి తరింపజేయాలి. నీ మనస్సు కాకుండా, వేరొక రెవరో వచ్చి ఉద్ధరిస్తారని అనుకోవద్దు. ఈ జీవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి. ఎవ్వరైనా మనస్సును నిగ్రహించే మార్గం చెప్పగలరు. అంతవరకే కానీ మనస్సును నిగ్రహించుకోవలసినది ఎవరికి వారే।
ఈ మనస్సులో ఏఏ ఇష్టాఇష్టముల చేత అంతరంగా ఏఏ వాసనలు జనిస్తూ ఉన్నాయో, ఆయా అవిద్యా వాసనలన్నీ ప్రాజ్ఞుడైనవాడు తనకు తానే నశింపజేసుకోవాలి. అప్పుడు మాత్రమే అవిద్య క్షయించగలదు.
‘భోగా’ ఏక వాసనాం త్యక్త్వా, త్యజ త్వం భేదవాసనాం।
భావ-అభావౌ తతః త్యక్త్వా నిర్వికల్పః సుఖీభవ।।
ఏష ఏవ మనోనాశస్తు అవిద్యానాశ ఏవ చ।
యత్ తత్ సంవేద్యతే కించిత్
తత్రాస్థా పరిమార్జనమ్।।
ఓ నిదాఘా! నీ మనస్సునందు మనస్సుయొక్క అభ్యాసవశంగా పుట్టుకొస్తూ ఉన్నట్టి :-
(1) ‘భోగించాలి’ అనే రూపముగల,
(2) భేదములను దర్శించుచున్నట్టి,
(3) భావ - అభావములకు సంబంధించినట్టి
సమస్త వాసలను జయించి, త్యజించి, ‘నిర్వికల్పస్థితి’ని సిద్ధించుకొని సుఖముగా ఉండెదవుగాక!
మనోనాశనమే అవిద్యానాశనము కూడా. ఏదేది దృశ్య సంబంధితమై వాసనల రూపముగా నీ హృదయమునందు ప్రవేశిస్తూ ఉన్నాయో - అవన్నీ కూడా గుర్తెరగాలి. (ఇల్లాలు వంటిల్లును శుభ్రము చేయు విధంగా) పరిమార్జనము(washing off) చేసివేసుకొంటూ ఉండాలి.
19. అనాస్థా ఏవహి నిర్వాణం।
దుఃఖం ఆస్థా పరిగ్రహః।
అవిద్యా విద్యమానైవ,
నష్ట ప్రజ్ఞేషు దృశ్యతే।
నామ్నా ఏవ అంగీకృత ఆకారా
సమ్యక్ ప్రజ్ఞస్య సా కుతః?
తావత్ సంసార భృగుషు
స్వాత్మనా సహ దేహినమ్।
దృశ్య విషయములచే ఇష్టము, విశ్వాసము కలిగి ఉండకపోవటమే నిర్వాణము. దృశ్యవిషయములపట్ల ఇష్టము కలిగి పరిగ్రహిస్తూ (స్వీకరిస్తూ) ఉండటమే దుఃఖముయొక్క రూపము.
వాస్తవానికి ‘అవిద్య’ అనునది మొదలేలేదు. అయితే ఏం? అల్పప్రాజ్ఞులపట్ల అది కనబడుచూ, ప్రవర్తమానమౌతోంది.
‘‘వాస్తవానికి లేనట్టిది, పేరుకు మాత్రమే ఉన్నట్టిది’’ - అగు అవిద్య అప్రాజ్ఞులకు (తెలివితక్కువవారికి) ఉన్నట్లే అగుపిస్తోంది. సమ్యక్ సిద్ధి పొందిన ప్రాజ్ఞులకు అది ఎట్లా ఉండగలదు? ఉండదు. ‘‘సంసారమును గుర్తించి జయించాలి’’ - అను యత్నశీలుర సమక్షంలో అవిద్య - మీమాంసకు (logical verification) నిలువదు. మోక్షేక్ష కలుగగానే అవిద్య తనకు తానే తోకముడుస్తుంది.
ఆందోళయతి నీరంధ్రం, దుఃఖకంటకశాలిషు,
అవిద్యాయావత్ అస్య అస్తు
న ఉత్పన్నా, క్షయకారిణీ।
అవిద్య ‘‘దుఃఖము’’ అనే ముళ్ల పొదలతో నిండి, ఈ జీవునికి అనేక ఆందోళనలు కలుగచేస్తోంది. ఏది అవిద్యచే మాత్రమే ఉనికి కలిగి యుంటుందో, అట్టి శరీరతదాత్మ్యము ఈ జీవుని అనేక దుఃఖములలోకి త్రోస్తూనే ఉంటుంది. వాస్తవానికి అవిద్యకు ఉత్పత్తి లేదు. క్షయము లేదు.
స్వయం ఆత్మా అవలోకేచ్ఛా మోహ సంక్షయకారిణీ,
అస్యాః పరం ప్రపశ్యంత్యాః స్వ-ఆత్మనాశః ప్రజాయతే।।
దృష్టే సర్వగతే బోధే స్వయం హి ఏషా విలీయతే।

ఆత్మయొక్క అవలోకమునకు ఇచ్ఛ కలుగునంతవరకు మోహము కొనసాగుతుంది. ఆత్మయొక్క అవలోకేచ్ఛ మోహమును సంక్షయింపజేయు కారణము అగుచున్నది. సర్వగతమగు ఆత్మ దర్శనము మాత్రమే మోహమును నశింపజేయగలదు.

ఇచ్ఛామాత్రం అవిద్యేయం ।
తత్ నాశో - మోక్ష ఉచ్యతే।
స చ అసంకల్పమాత్రేణ
సిద్ధో భవతి వై, మునే !

అవిద్యయొక్క రూపమేమి? దృశ్య విషయములపట్ల ఏర్పడుచున్న అవినాభావ సంబంధమగు ఇచ్ఛయే. ‘ఇచ్ఛ’ నశిస్తే అవిద్య కూడా నశిస్తుంది. ‘ఇచ్ఛ’ సంకల్పముచేతనే రూపుదిద్దుకుంటోంది. కనుక ఓ మునీశ్వరా! అసంకల్పమాత్రముచేత ఈ జీవుడు ‘సిద్ధి’ పొందగలడు. ఇచ్ఛారాహిత్యము, సంకల్పరాహిత్యము, ఈ రెండూ అంతరమున పెంపొందించుకోవటమే ‘‘మోక్షము’’ - నకు మార్గము.

20. మనాగపి మనోవ్యోమ్ని వాసనా రజనీ క్షయే,
కాళికా తనుతామ్ ఏతి చిత్ ఆదిత్య ప్రకాశనాత్ ।।
చైత్య అనుపాతరహితం, సామాన్యేన చ సర్వగమ్।
యత్ ‘‘చిత్ తత్త్వం’’ అనాఖ్యేయం, స ఆత్మా పరమేశ్వరః।।
సంకల్పముయొక్క పరంపరచేతనే వాసన (Tendency) రూపుదిద్దు కుంటోంది. మనో ఆకాశములో వాసనాచంద్రుడు క్షయిస్తే (తెల్లవారగానే) అట్టి హృదయములో చిత్ -ఆదిత్య సూర్యుడు ప్రకాశమానుడవగలడు.
చిత్-తత్త్వము : అనుభవమగుచున్న దృశ్యము (చైత్యము)తో ఏమాత్రము సంబంధము లేనట్టిది, సర్వసామాన్యరూపంగా సర్వవ్యాపకమైనట్టిది. అనిర్వచనీయమైనది, అగు చిత్ ఆత్మయే పరమేశ్వరుడు.
సర్వం చ ఖలు ఇదం బ్రహ్మ ।
నిత్య చిత్-ఘనం, అక్షతమ్।
కల్పనా అన్యా మనోనామ్నీ విద్యతే నహి కాచన।
న జాయతే, న మ్రియతే కించిత్-అత్ర జగత్ త్రయే।
న చ భావ వికారాణాం సత్తా క్వచన విద్యతే।
ఈ సమస్తము కూడా - నిత్యము ఘనీభూతము అగు చిత్‌స్వరూపమే। క్షయము లేనిది అగు బ్రహ్మమే! సమస్తము బ్రహ్మమే అయి ఉండగా ఇక కల్పనా రూపమగు ‘మనస్సు’ అనబడునది ఎక్కడ ఉన్నది? లేనే లేదు.
ఈ మూడు లోకములలో కూడా ఏదీ జనించటమూ లేదు. నశించటమూ లేదు. అందుచేత షట్ భావ వికారములు (జన్మ - ఎదుగుదల - జీవనము - తరుగుదల - వార్ధక్యము - వినాశనము అనునవి) - కించిత్ కూడా సత్యమగు ఆత్మదృష్ట్యా లేనే లేవు.
కేవలం కేవలాభాసం సర్వసామాన్యం అక్షతమ్,
చైత్య-అనుపాతరహితం
‘చిత్‌మాత్రమ్’ ఇహ విద్యతే।
తస్మిన్ నిత్యే తతే శుద్ధే చిత్ మాత్రే
నిరుపద్రవే, శాంతే సమ సమాభోగే
నిర్వికారే చిత్ఆత్మ
అందుచేత - కేవలమగు ఆత్మయొక్క ఆభాస (Reflective) యే ఇదంతా. సర్వత్ర సమస్వరూపము, క్షయము లేనిది, తెలియబడేదంతా తానే అయినట్టిది, దృశ్యముగా దిగజారనట్టిది - అగు ‘కేవల చిత్ మాత్రము’ - మాత్రమే ఇక్కడ సర్వదా ఉన్నది.
అట్టి నిత్యమైనట్టి, సర్వత్రా ‘తతము’ (వ్యాపకము) అయినట్టి, శుద్ధము అయినట్టి చిత్ స్వరూపమే - నిరుపద్రవమైన, శాంతమగు, నిర్వకారమగు స్వస్వరూప చిత్ నందు ‘‘ద్రష్ట - దృశ్యము’’ల రూపంగా భోగించుచున్నది. అట్టి విహరణయే మనస్సుయొక్క రూపము.
యైషా (య ఏషా) స్వభావ అభిమతం స్వయం
సంకల్ప్య ధావతి, చిత్ చైత్యం స్వయం
అమ్లానం మననాత్ ‘మన’ ఉచ్యతే ।
అతః సంకల్ప సిద్ధేయం సంకల్పేన ఏవ నశ్యతి।।
ఈ మనస్సు తన స్వభావమునకు సానుకూలమైనట్టి దానిని, అభిమతము అయినట్టి దానిని స్వయముగా కల్పించుకొంటోంది. చిత్ చైతన్యముయొక్క స్వయంకృతమైన తెంపులేని మననమే ‘మనస్సు’. సంకల్పముచేత సిద్ధిస్తున్నట్టిదే మనస్సు. మరల సంకల్పము చేతనే సంకల్పించువానియందు (ఆత్మయందు) లయించుచున్నది.
21. ‘‘నాహం బ్రహ్మ’’ ఇతి సంకల్పాత్ సుదృఢాత్
బధ్యతే మనః। ‘‘సర్వం బ్రహ్మ’’ ఇతి సంకల్పాత్
సుదృఢాత్ ముచ్యతే మనః ।।
‘‘నేను బ్రహ్మమును కాదు. బ్రహ్మము - అనునది నాకు వేరుగా మరెక్కడో ఉన్నది’’ - అను సుదృఢమైన మననము చేతనే మనస్సు కల్పితము అగుచున్నది. అట్టి మనస్సు దృశ్య వ్యవహారములకు సంబంధితమై, సుదృఢముగా ‘బంధము’ పొందుచున్నది.
‘నాతో సహా ఈ సమస్తము బ్రహ్మమే’ - అను సుదృఢ సంకల్పముచే మనస్సు బంధ విముక్తి పొందుచున్నది.
‘‘కృశోఽహమ్’’ ‘‘దుఃఖ బద్ధోఽహమ్’’
‘‘హస్తపాద ఆది మాన్ అహమ్’’ -
ఇతి భావ అనురూపేణ వ్యవహారేణ బద్ధ్యతే ।।
‘‘నేను కృశించి పోయినట్టివాడను’’।
- దుఃఖములచే బద్ధుడను। అల్పుడను। స్వల్పుడను।
- ఈ కాళ్ళు - చేతులతో కూడిన దేహమునకు పరిమితుడను’’ - అను భావనా-అనురూపముచేతనే ఈ జీవుడు దృశ్యవ్యవహారమునకు ‘నిబద్ధుడు’ అగుచున్నా
‘‘నాహమ్ దుఃఖీ । న మే దేహో బంధః।’’
కో అస్య ఆత్మని స్థితః,’’ - ఇతిభావ అనురూపేణ
వ్యవహారేణ ముచ్యతే।।
‘నేను దుఃఖిని కాదు. ఆత్మానందస్వరూపుడను. నేను దేహముచే బంధము పొందువాడను కాను’ - అను రూపముగల వ్యావహారిత్వమును ఎవ్వడు ఆశ్రయిస్తాడో, ఆతడు ముచ్యుడే। సర్వదా విముక్తుడే।
‘‘నాఽహమ్ మాంసం । న చ అస్థీని। దేహాత్
అన్యః పరోఽస్మి అహమ్।’’ - ఇతి నిశ్చితవానంతః
క్షీణ అవిద్యో, విముచ్యతే।।
‘‘ఈ మాంస బొమికల అమరికగల దేహము నేను కాదు. దీనిని ఉపయోగిస్తూ, దీనికి పరమై, దీనిని కదల్చుచూ ఉన్న చైతన్య స్వరూపుడను’’ - అను అంతరంగములోని సునిశ్చితమైన సునిశ్చయముచేత విముక్తుడు అగుచున్నాడు. అవిద్య క్షీణిస్తోంది. నేను దేహమును కాను. దేహిని - అని అనుకున్నంతమాత్రం చేత అవిద్య ‘లేనిదే’ అవుతోంది.
కల్పితే అయం అవిద్యేయం, అనాత్మని
అత్మభావనాత్। పరం పౌరుషం ఆశ్రిత్య
యత్నాత్ పరమయా ధియా, భోగేచ్ఛాం
దూరతః త్యక్త్వా నిర్వికల్పః సుఖీ భవ।।
అవిద్యచే జనించే అనాత్మభావన కేవలము కల్పితము మాత్రమే. పురుషకారమును ఆశ్రయించి సమస్తమునకు ‘పరము’ (Beyond) అయి ఉన్నట్టి ‘ఆత్మభావన’చే అనాత్మభావనను జయిస్తూ, ఉత్తమమైన ప్రయత్నశీలుడవగుము. సునిశితము - విస్తారము అగు బుద్ధితో ‘భోగేచ్ఛ’ను దూరంగా త్యజించివేయి. నిర్వికల్ప సమాధిని (సర్వకల్పనలను దాటిపోయి సర్వే సర్వత్రా సమస్వరూపమైయున్న ఆత్మత్వమును)ను ఆశ్రయించి సుఖించు.
‘‘మమ పుత్రో । మమ ధనం । అహం సోఽయమ్ ।
ఇదం మమ’’ । ఇతీయం ఇంద్ర జాలేన
వాసనా ఏవ వివల్గతి ।।

వాసనలు
‘‘నా కుమారులు । నా వారు । నా ధనము । నేను ఇంతటి వాడిని । ఇది నాది । అది నేను ।’’ ఇటువంటి ఇంద్రజాల సమాశ్రయమువల్లనే వాసనలు (Tendencies) ఈ జీవునిపట్ల విజృంభిస్తున్నాయి.

22. మా భవ అజ్ఞో । భవ జ్ఞః త్వం ।
జహి సంసారభావనామ్ ।
అనాత్మని ఆత్మభావేన
కిం అజ్ఞ ఇవ రోదిషి?
ఓ నిదాఘ మహాశయా! ఓ తదితర ప్రియశ్రోతలారా!
మీరంతా అజ్ఞులు కాకండి. విజ్ఞులు అవండి. ‘‘నాది - నేను - నాకు సంబంధించినది - నేను దీనికి సంబంధించినవాడను’’ - అనురూపముగల సంసారభావములను (పాము కుబుసమువలె) వదలి ఉండటమును అభ్యాసపూర్వకంగా నిర్వర్తించువారై ఉండండి. అనాత్మకమగు (కల్పిత-అపాదిత-సందర్భమాత్ర-ఊహాపరిమిత) విశేషములపట్ల ‘‘వీటికి నేను బద్ధుడను’’ అను భావనతో ఆత్మభావనచేస్తూ అజ్ఞునివలె మీరు ఎందుకు దుఃఖిస్తున్నారు?
కః తవ అయం జడో మూకో
దేహో మాంసమయో అశుచిః,
యత్ అర్థం సుఖ దుఃఖాభ్యాం అవశః
పరిభూయసే?
‘‘దేనివలన నేను అవశుడవై సుఖ-దుఃఖములన్నీ అనుభవిస్తూ ఉన్నాను? - జడము, మూగది, మాంసమయము, అశుచికరము అగు ఈ దేహము నాకు ఎందుకు లభించింది? దేహిగా నేను ఎవ్వరు?’’ - ఇవన్నీ యోచన చేయి. అది చేయకుండా, దేహమును చూచి భ్రమలు చెంది దుఃఖము పొందుచున్నావేమి? అనర్హమైన విషయాలగురించి దుఃఖించి ఏమి ప్రయోజనము?
అహో! అను చిత్రం! (సు చిత్రం)!
యత్ సత్యం బ్రహ్మ తత్
విస్మృతం నృణామ్ । తిష్ఠతః తవ కార్యేషు
మా అస్తు రాగ - అనురంజనమ్।।
ఆహా! ఎంత విచిత్రం! ఈ జనులు సత్యమగు బ్రహ్మమును ఏమరచి కల్పితమాత్రమగు ఇంద్రియ దృశ్య వ్యవహారములే నిజమనుకొంటున్నరే! ఇక్కడ దేహములు, దేహసంబంధములు శాశ్వతమనుకొని మురిసిపోతున్నారే! ఇది నీ గురించి నీవే గమనించు. లౌకిక (ప్రాపంచక) కార్యములు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు రాగ-ద్వేషములను ఏమాత్రము దరిచేరనీయవద్దు. మనోబుద్ధులకు కర్మల దోషములను అంటనీయకుండా జాగరూకుడవై ఉండు.
ఆహో। (అ)ను చిత్రం । పద్మోత్థె
బద్ధా తంతుభిః అద్రయః, అవిద్యామానా,
యా అవిద్యా తయా విశ్వం ఖిలీకృతమ్।
ఇదం తత్ వజ్రతాం యాతం తృణమాత్రం
జగత్ త్రయం ।।

ఇత్యుపనిషత్
ఆహా◖! ‘‘ఒక తామరకాడలోని తంతువులతో ఎవ్వరో అద్రిని (మేరు పర్వతమును) కట్టి ఈడ్చుకుంటూ ఇంటికి తెచ్చారు’’ - అన్న తీరుగా యదార్థమే కానట్టి అవిద్యచేత విశ్వమంతా బంధనముతో కూడినదిగా అగుచున్నది! ఇది ఎంత ఆశ్చర్యం!
గడ్డి పరకతో సమానమైన ఈ త్రిజగత్‌కల్పనా వ్యవహారమంతా వజ్రతుల్యంగా జీవులకు అనుభూతమౌతోందే! ఏమి చమత్కారం!

ఇతి ఉపనిషత్

పంచమోఽధ్యాయః ➤ జ్ఞాన - అజ్ఞాన భూమికలు

ఋభు ఉవాచ :-
1. అథ అపరం ప్రవక్ష్యామి
శృణు తాత। యథా తథమ్।
‘అజ్ఞాన’ భూః సప్త (7) పదా,
‘జ్ఞ’ భూః సప్తపద (7) ఏవ హి।।
పదాంతరాణి అసంఖ్యాని ప్రభవన్తి అన్యథై తయోః।
స్వరూపాన్ అవస్థితిః ముక్తిః।
తత్ భ్రంశో అహంత్వ వేదనమ్ ।।
ఋభు మహర్షి :-
బిడ్డా! నిదాఘా! ఇప్పుడు మనము ‘‘అపరము’’ - గురించి (ఆత్మకు అన్యమగు కల్పనావిశేషము గురించి) యథాతథంగా చెప్పుకుంటున్నాము. శ్రద్ధగా విను.
(1) అజ్ఞాన భూమికలు - 7
(2) జ్ఞాన భూమికలు - 7
పై రెండు విధములైన సప్త-సప్త భూమికల నుండి అన్యములైనట్టి అసంఖ్యాక భూమికలుగా కూడా శాస్త్రములు చెప్పుచున్నాయి. (గురువులచే అనేక ఉపవిభాగములుగా విశదీకరించబడుచున్నాయి).

స్వస్వరూపస్థితిలో ఉండి ఉండటమే మోక్షము.
అట్టి స్వస్వరూప స్థితి నుండి భ్రంశము (లేక) చ్యుతి పొంది అహమ్-త్వమ్ స్థూలానుభవము కలిగి ఉండటమే బంధము.
శుద్ధ సత్ మాత్ర సంవిత్తేః
స్వరూపాత్ న చలంతి యే,
రాగద్వేషాదయో భావాః
తేషాం న అజ్ఞత్వ సంభవాః ।।
ఎవ్వరైతే శుద్ధ - సత్ (కేవలమగు ఉనికి) మాత్ర - సంవిత్ (సత్‌విత్, ఉనికి+ఎరుక) - స్వరూపము నుండి చలనము పొందరో, విచలితులు కారో, రాగ-ద్వేషములకు కించిత్‌గా కూడా చోటు ఇవ్వరో, వారిపట్ల అజ్ఞానము సంభవించే ప్రసక్తియే ఉండదు. కేవల సంవిత్ ధారణ చేయు ధన్యులకు రాగద్వేష సంకల్పములు ఉండజాలవు.
యత్ స్వరూప పరిభ్రంశశ్చ - యత్ అర్థే
చితి మజ్జనమ్, ఏతస్మాత్ అపరో మోహో
న భూతో, న భవిష్యతి।।
అర్థాత్ అర్థాంతరం చిత్తే, యాతి మధ్యే తు
యా స్థితిః, సా ధ్వస్త-మనన ఆకారా
‘‘స్వరూపస్థితిః’’ ఉచ్యతే।।
తన దృక్ స్వరూపము (The one who is seeing) నుండి పరిభ్రంశము పొంది, దృశ్యమునందు నిమజ్జనము పొందటమే మోహము. అట్టి అపర రూపమగు మోహముతో సమానమైన దుఃఖకారణము మూడు (త్రి)కాలములలో మరొకటి ఏదీ లేదు. ఇక ఉండబోదు కూడా.
కనుక దుఃఖమునకు కారణము మోహమే. కేవలమగు స్వస్వరూపము పట్ల స్వకీయమైన ఏమరుపే.

స్వరూపస్థితి : ఆలోచనకు - ఆలోచనకు (లేక) ఒక సంకల్పము - ఆ తరువాత సంకల్పమునకు మధ్యగా గల మనన రహితమైనప్పటి మనో స్థితి (లేక) మనో రహిత స్వస్వరూప స్థితియే ‘స్వరూపస్థితి’ అనబడుతోంది.
సంశాన్త సర్వ సంకల్పా యా శిలావత్
అవస్థితిః, జాగ్రత్ నిద్రా వినిర్ముక్తా,
‘‘స్వరూప స్థితిః పరా’’ ।।
సమస్త సంకల్పములు మొదలంట్లా సశాంతించగా, ఏ స్థానము శిలవలె నిశ్చలంగా అవస్థితమై యున్నదో-జాగ్రత్-నిద్రారహితము అయినట్టి అదియే ‘‘పరాస్వరూప స్థితి’’.
2. అహంతా అంశే క్షతే, శాన్తే
భేద నిష్పన్ద చిత్తతా,
అజడా యా ప్రచలతి,
తత్ ‘స్వరూపమ్’ ఇతి ఈరితమ్।।
‘‘అహమ్’’నకు వివిధాంశాలు ఉన్నాయి. వాటిలో పెద్దగా చెప్పుకొనవలసినవి
(1) దేహమే నేను (2) ఈ విశ్వమే నేను (3) ఈ విశ్వమంతా దేహము అగుచుండగా, అట్టి విశ్వమునకు వేరైన ‘విశ్వదేహి’వి.

ఇదియే (1) వ్యష్టి (2) సమిష్టి (3) కేవలము.

అన్నిటికన్నా అధమమైనది ‘‘ఈ దేహమే (లేక) వ్యష్టిత్వమే - నేను’’ అనేదే! అట్టి ‘‘దేహమునకు దేహి మాత్రమే నేను’’ - అను అహం ప్రవృత్తి నశించగా, ‘‘జీవుడు వేరు - పరమాత్మ వేరు-జగత్తు వేరు’’-అను భేదము తొలగినట్టి (నిష్పందము- స్పందరహితము అయినట్టి) చిత్తము శేషిస్తుంది. అట్టి భేద నిష్పందమైనట్టి, అజడమైనట్టి చిత్‌యే ‘‘స్వరూపము’’ - అను శబ్దముచే చెప్పబడుతోంది.

బీజ జాగ్రత్, తథా జాగ్రత్, మహాజాగ్రత్,
తథా ఏవ చ, జాగ్రత్ స్వప్నః, తథా స్వప్నః,
స్వప్నజాగ్రత్, సుషుప్తికమ్
ఇతి సప్తవిధో మోహః, పునః ఏష పరస్పరమ్ ।।
సప్త అజ్ఞాన భూమికలు
సప్త అజ్ఞానభూమికలు - అజ్ఞానరూపమగు మోక్షము ‘7’ అవస్థలు కలిగినదై ఉంటుంది.
(1) బీజజాగ్రత్
(2) జాగ్రత్
(3) మహాజాగ్రత్
(4) జాగ్రత్‌స్వప్న
(5) స్వప్న
(6) స్వప్నజాగ్రత్
(7) సుషుప్తి.
ఈ ఏడు అవస్థలే కాకుండా వీటివీటి కొంతకొంత మిశ్రమములచే అనేక రూపములుగా అవస్థలు ఏర్పడి ఉంటున్నాయి. ప్రతి భూమికలో అనేక చిలవలు, పలవలు ఉన్నాయి.
శ్లిష్టో భవతి అనేకాగ్ర్యం,
శృణు లక్షణం అన్య తు।
అనేక రూపములై ప్రకటనమౌతూ ఉన్న వీటియొక్క ఆయా విశేషమైన లక్షణములు ఏ తీరైనవో చెప్పుతాను వినండి.
(1) బీజజాగ్రత్: ప్రథమం చేతనం, యత్ స్యాత్
అనాఖ్యం నిర్మలం చితః।
భవిష్యత్ చిత్త జీవాది
నామ శబ్ద-అర్థ భాజనమ్।
బీజరూప స్థితం జాగ్రత్,
‘‘బీజ జాగ్రత్’’ తత్ ఉచ్యతే।
(1) బీజ జాగ్రత్ అవస్థ :-
ఈ ‘సృష్టి’ అనే చేతనము (కదలిక) ప్రారంభము అవటానికి మునుముందుగా కేవలమగు చైతన్యము మాత్రమే ఉన్నది. అది వాక్కుకు అందనిది. మాటలతో చెప్పబడలేనిది కాబట్టి ‘అనాఖ్యము’. విషయరహితము. కాబట్టి ‘అత్యంతనిర్మలము’.

అట్టి కేవల చైతన్యమునందు : -
బీజములో భవిష్యత్ వృక్షమునకు సంబంధించిన (ఆకులు-పూలు- కాయలు - పునరుత్పత్తి మొదలైన విశేషములన్నీ అప్రదర్శనశీలమై దాగి ఉన్నరీతిగా) భవిష్యత్‌లోని చిత్తము, జీవుడు, జగత్తు మొదలైన శబ్దార్ధములన్నీ (బీజములోవలె) దాగి ఉన్నాయి. ఈ విధంగా నిశ్చలజలంలో భవిష్యత్ తరంగముల ఆకారాదులు దాగి ఉన్న రీతిగా - కేవల చైతన్యమునందు ఏఏ భవిష్యత్ జీవ-చిత్త-జగత్ రూపములు బీజరూపముగా దాగి ఉన్నాయో అదియే మొట్టమొదటిదగు ‘బీజజాగ్రత్’ అని పిలువబడుతోంది. ఈ బీజజాగ్రత్‌యే జ్ఞప్తికి, అహంభావనకు, దృశ్యానుభవత్వమునకు, త్వం జాగ్రత్ (‘నీవు’ అను భావనారూపమునకు)కు స్వస్థానము. అవన్నీ అరూపంగా దాగి ఉండి, తరువాత తరువాత ప్రదర్శనమవగల స్థానము - బీజజాగ్రత్।
ఏషా, జ్ఞప్తేః నవావస్థా
త్వం జాగ్రత్ సంస్థితమ్ శృణు।
నిర్మల కేవల చైతన్యముయొక్క తదనంతర - నూతనమగు అవస్థ అగు ‘జాగ్రత్’ గురించి ఇక విను.
(2) జాగ్రత్ : నవ ప్రసూతస్య పరాత్ అయం చ
‘‘అహం - ఇదం - మమ’’
ఇతి యః ప్రత్యయః స్వచ్ఛః
‘‘జాగ్రత్’’ ప్రాగభావనాత్ ।।
(2) జాగ్రత్ అవస్థ :-
కేవల చైతన్యమునుండి - ‘‘చేతనము’’- రూపంగా బీజజాగ్రత్ ప్రదర్శనమౌతోంది కదా! అట్టి బీజ-జాగ్రత్ నుండి అద్దానికి పరమై (వేరైన లక్షణముతో) ‘‘నేను - ఇది - నాది - అది / అతడు / ఆమె’’ - అను ఒకానొక వృత్తిజ్ఞానము (Avocative consciousness) ప్రదర్శితమగుచున్నది. అట్టి అహం-ఇదమ్-మమ ప్రారంభమే ‘‘జాగ్రత్-అవస్థ’’.
(3) మహాజాగ్రత్ : అయం సోఽహమ్ ఇదం తన్మ ఇతి
జన్మాన్తరోదితః, పీవరః ప్రత్యయః
ప్రోక్తో, ‘‘మహాజాగ్రత్’’ ఇతి స్ఫుటమ్।।
(3) మహా జాగ్రత్ అవస్థ :-
అట్టి నేను - ‘ఇది, నాది’ రూప జాగ్రత్‌తో చైతన్యముయొక్క అనన్య (లేక) తన్మయ భావన ‘జన్మ’, ఆ తరువాత ‘‘మరొక జన్మ’’ - అను జన్మ-జన్మాంతరములుగా కొనసాగుచున్నది. అట్టి జన్మ-జన్మాంతర సంబంధముచేత - ‘‘నేను - నీవు - ఇది’’ - అను భావన ఆత్మకు వేరైనట్లుగా ప్రదర్శమవటమే ‘మహాజాగ్రత్ అవస్థ’.
(4) జాగ్రత్ స్వప్నము : అరూఢం, అథవా ఆరూఢం
సర్వథా తన్మయాత్మకమ్
యత్ జాగ్రతో మనో-రాజ్యం,
తత్ ‘‘జాగ్రత్ స్వప్న’’ ఉచ్యతే.
(4) జాగ్రత్ స్వప్నము (ఊహాలోకం) : -
జాగ్రత్‌లో ఉంటూనే ఆరూఢము అయినవి (Believed / Determined) (లేక) అరూఢముకానివి (Non-Believed / Non-determined) (లేక) జాగ్రత్‌లో తన్మయమైన -ఆలోచనల సంబంధమైనవి - అగు ఆయా జాగ్రత్ దృశ్య సంబంధ విశేషాలతో మనస్సు నిర్మించుకొనే మనోలోకము - జాగ్రత్ స్వప్నము.
(5) స్వప్నము :
ద్విచంద్ర, శుక్తిక ఆరూప్య, మృగతృష్ణ - ఆది
భేదతః, అభ్యాసం ప్రాప్య జాగ్రత్ తత్ ‘‘స్వప్నః’’
నానావిధో భవేత్ ।।
(5) స్వప్నము :-
ఆకాశంలో కంటిదోషం చేత ఒక్క చంద్రుడు రెండు చంద్రబింబములుగా అగుపించటము, ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లు అనిపించటము, ఎడారిలో కనిపించే ఎండమావులలో (మృగతృష్ణలో) నీరు ఉన్నట్లు అగుపించటము ఎటువంటిదో, అట్లాగే మనస్సు యొక్క అభ్యాసం ప్రభావం చేత స్వప్నములో నిదురించినప్పుడు ఏవేవో మనోకల్పిత నానావిధ భేద విశేషాలన్నీ అటువంటివి. జాగ్రత్ నుండి నిదురిస్తూ ఉండగా, ఊహాత్మకంగా అనుభవమయ్యేవి - ‘‘స్వప్నము’’.
అల్పకాలం మయా దృష్టం ఏతత్ న ఉదేతి
యత్ర హి, పరామర్శః ప్రబుద్ధస్య, స ‘‘స్వప్న’’
ఇతి కథ్యతే‘
-ఏదైతే స్వప్న సమయంలో ‘నిజమే’ అను రీతిగా అనుభవించబడుతోందో,
- ‘‘ఏ దృశ్యము నాకు కొద్ది సేపు కలలో కనిపించటం జరిగిందో అందులో నిజమనేది ఏదీ లేదు’’ - అని మెలకువ వచ్చిన తరువాత పరామర్శ చేయబడుచున్నదో - అది స్వప్నము.
ఆత్మయందు దృశ్యజగత్ - సంకల్పమే స్వప్నరూపముగా అనుభూత మౌతోంది.
(6) స్వప్నజాగ్రత్ :
చిరం సందర్శనాభావాత్, అప్రఫుల్లం బృహత్ వచః,
చిరకాల అనువృత్తిస్తు ‘స్వప్నోజాగ్రత్’ ఇవ
ఉదితః, ‘‘స్వప్న జాగ్రత్’’ ఇతి ప్రోక్తం ।
జాగ్రతి అపి పరిస్ఫురత్ ।।
(6) స్వప్నజాగ్రత్ (జాగ్రత్‌ను స్వప్నభావంతో సందర్శించడం) :-
ఈ దృశ్య వ్యవహారమంతా చికరాలము దర్శించుచూ, ఇక తత్త్వర్ధజ్ఞానమనకు ఈ జీవుడు సంసిద్ధుడై సాధన ప్రారంభిస్తున్నాడు. ఆ విధంగా ప్రయత్నశీలుడై ఉండి కూడా, ‘‘సోఽహమ్, తత్త్వమ్’’ వంటి మహావాక్యముల పరమార్థము అనుభూతికి స్వానుభవమునకు రాకుండా, కానీ ప్రయత్నశీలుడై ఉండే స్థితి ‘స్వప్నజాగ్రత్’. జాగ్రత్‌ను అధ్యయంగా పరిశీలించు దృష్టి స్వప్నజాగ్రత్. ఈ స్థితిలో ‘‘జాగ్రత్ కూడా స్వప్నము వంటిదే’’ అని అనిపించసాగుతుంది.
(7) సుషుప్తి :
4. షట్ అవస్థా పరిత్యాగే జడా జీవస్య యా స్థితిః,
భవిష్యత్ దుఃఖ బోధాఢ్యా
‘‘సౌషుప్తిః’ స ఉచ్యతే గతిః।
జగత్ తస్యాం అవస్థాయాం అన్తః తమసి లీయతే।।
(7) సుషుప్తి :-
గాఢ నిద్రాస్థితి. ‘‘జన్మకుముందు-జన్మించటము- ఎదగటము-మధ్య వయస్సు వార్ధక్యము-దేహత్యాగము’ - అనబడు ‘షట్ (6) అవస్థలను పరిత్యజించినట్టి- ఈ జీవునియొక్క స్థితియే సుషుప్త స్థితి. భవిష్యత్‌కు సంబంధించిన ‘దుఃఖావబోధ’ అంతరంగమున శేషించియే ఉంటుంది కాబట్టి అది అవ్యాజము - కేవలము అగు ఆనందస్థితి కానేకాదు. అట్టి తమో అవస్థలో ‘‘సమస్తజగత్తు లీనమై, మరల మరొకప్పటికి ప్రదర్శనమునకు సంసిద్ధమై’’ ఉంటుంది. అనగా అది జగత్ - రాహిత్య స్థితి కాదు. ‘‘జగత్ అప్రదర్శిత జడ స్థితి’’ మాత్రమే।
‘‘సప్త అవస్థా’’ ఇమాః ప్రోక్తా మయా అజ్ఞానస్య వై, ద్విజ।
ఏకైకా శతసంఖ్య అత్ర నానా విభవ రూపిణీ।।
ఓ ద్విజోత్తమా! ఈ విధంగా మనము సప్త (7) అజ్ఞాన భూమికల (లేక అవస్థల) గురించి చెప్పుకున్నాము. ‘7’ అవస్థలలో ప్రతి ఒక్క అవస్థతో కొంతగా కలిసి- వందలాది భూమికలు (లేక) అవస్థలు ఏర్పడినవై ఉంటు న్నాయి. అవన్నీ నానావిధములైన విభవముల రూపంగా ప్రదర్శనమగుచూ, ఆత్మయొక్క సమక్షంలో ‘కల్పనాక్రీడ’ వలె ప్రదర్శనమగుచున్నాయి
సప్తజ్ఞాన భూమికలు
ఇమాం సప్తపదాం జ్ఞానభూమిం ఆకర్ణయ, అనఘ!
న అనయా అజ్ఞాతయా భూయో, మోహపంకే నిమజ్జతి ।
వదన్తి బహు భేదేన వాదినో యోగ భూమికాః ।।
మమ తు అభిమతా నూనం ఇమా ఏవ శుభప్రదాః ।
అవబోధం విదుర్ జ్ఞానం తత్ ఇదం సాప్త భూమికమ్।
ముక్తిస్తు ‘జ్ఞేయం’ ఇత్యుక్తా భూమికా సప్తకాత్ పరమ్ ।
సప్త (7) జ్ఞాన భూమికలు
ఓ పాప దోష రహితుడా! నిదాఘా! ఇప్పుడిక సప్త (7) జ్ఞానభూమికల గురించి చెప్పుకుందాము. ఇవి ఎరుగకపోతే మరల మరల మోహ పంక్తులలో ఈ జీవుడు మునగగలడు. ఈ జ్ఞానభూమికల గురించి వేరువేరు ప్రవక్తలు వేరువేరు విధాలుగా చెబుతూ ఉంటారు. ఏ రీతి అయిన ‘ఆరూఢి’గా ఎరగటము నీకు శుభప్రదమో, ఉత్తేజము కాగలదో ఆ రీతిగా విశ్లేషించి, నాకు చెప్పాలనిపించినట్లుగా సప్త భూమికా విశేషాలను చెప్పుచున్నాను. సప్తభూమికాజ్ఞానమే ఆత్మజ్ఞాన విశ్లేషణము. సప్త భూమికలకు పరము (Beyond)అగు జ్ఞేయ వస్తువే ‘ముక్తి’-అయి ఉన్నది. వాటికి ఆవల ఉండి సమస్తము తెలుసుకొనుచున్నదే జ్ఞేయమగు ఆత్మ।
5. జ్ఞానభూమిః ‘శుభేచ్ఛా’ ఆఖ్యా ప్రథమా
సము దాహృతా। ‘‘విచారణా’’ ద్వితీయా తు ।
తృతీయా ‘‘తనుమానసీ’’ ।
‘‘సత్వాపత్తిః’’ చతుర్థీస్యాత్ । తతో ‘‘అసంసక్తి’’ నామికా ।
‘‘పదార్థ భావనా’’ షష్ఠీ, సప్తమీ ‘‘తుర్యగా’’ స్మృతా ।।
ఆసామ్ అన్తస్థితా ముక్తిః, యస్యాం భూయో న శోచతి ।
ఏతాసాం భూమికానాం, త్వం ఇదం నిర్వచనం శృణు ।।
సప్తజ్ఞాన భూమికలు -
(1) శుభేచ్ఛ
(2) విచారణా
(3) తనుమానసి
(4) సత్వాపత్తి,
(5) అసంసక్తి
(6) పదార్థభావన
(7) తుర్యగము
వీటికి ఆవల ‘ముక్తి’ స్థానము. సప్తభూమికలను అభ్యాసపూర్వకంగా తెలుసుకొని, ముక్తిని క్రమంగా సిద్ధించుకుంటున్న అభ్యాసి - ఇక మరల దేనికీ శోకించడు. (All worries vanish). అందుచేత అట్టి సప్త జ్ఞాన భూమికలు - నిర్వచనము చెప్పుకుంటున్నాము.
‘‘స్థితః కిం మూఢ ఏవ అస్మి? ప్రేక్షే అహం
శాస్త్ర సజ్జనైః’’, వైరాగ్య పూర్వం ఇచ్ఛా
ఇతి - ‘‘శుభేచ్ఛా’’ ఇతి ఉచ్యతే బుథైః।।
(1) శుభేచ్ఛా భూమిక :
‘‘ఇదేమిటి? అశాశ్వతము, కాలబద్ధము, సందర్భ పరిమితము అగు విషయములను పట్టుకొని, అవి ఇస్తూ ఉన్న సుఖ-దుఃఖ సంకెళ్లలో చిక్కుకొని అనేక యాతనలు పడుచున్నానే! మూఢుడను అగుచున్నానే! కనుక అల్పాశయములను జయించి మహదాశయుడను కావాలి’’ - అని తలచి శాస్త్ర - సజ్జన సాంగత్య - వైరాగ్య పూర్వక ఇచ్ఛ పొందటమును ‘శుభేచ్ఛ’ అని విజ్ఞులు పిలుస్తున్నారు.
శాస్త్ర సజ్జన సంపర్క వైరాగ్య - అభ్యాస
పూర్వకమ్, సదాచార ప్రవృత్తిః యా,
ప్రోచ్యతే సా ‘‘విచారణా’’ ।।
(2). విచారణ భూమిక :
ఇంద్రియ విషయములపట్ల వైరాగ్యము అభ్యసిస్తూ, సదాచారము (Positive and flaw less conduct) ఆశ్రయిస్తూ శాస్త్రములను పరిశీలించటము; సజ్జనులతో తాత్త్వికచింతన చేయటము - ఇది రెండవ జ్ఞానభూమికయగు ‘విచారణ’
విచారణా శుభేచ్ఛాభ్యాం
ఇంద్రియ అర్థేషు రక్తతా,
యత్ర సా తనుతామేతి
ప్రోచ్యతే ‘‘తను మానసీ’’ ।।
(3) తనుమానసా భూమిక :
శుభేచ్ఛ, విచారణ భూమికల దీర్ఘమైన అభ్యాసముయొక్క ఫలితంగా (ఇంద్రియార్థముల పట్ల శబ్ద స్పర్శ రూప రస గంధములపట్ల) అనురక్తత తరగుచూ, శుష్కించుచూ ఉండటమును –3వ భూమికయగు ‘తనుమానస’ అనబడుచున్నది.
(తను=తరగుచున్న, మానసా = ఇంద్రియ విషయ ప్రియమనో అభ్యాసము.)
6. భూమికా త్రితయాభ్యాసాత్, చిత్తే తు
విరతేః వశాత్, సత్త్వ - ఆత్మని స్థితేశుద్ధే
‘‘సత్వాపత్తిః’’ ఉదాహృతా ।।
(4) సత్వాపత్తి భూమిక :
పైవిధంగా ‘శుభేచ్ఛ-విచారణ-తనుమానస’ - అనే మూడు భూమికలను అభ్యాసముచేస్తూ ఉండగా, అట్టి అభ్యాసియొక్క చిత్తము అశాశ్వతము, కల్పనామయము, అనేక దోష ధ్యాసల, దృష్టుల అంతిమ ప్రయోజనముగా కలిగినవి - అగు దృశ్య విషయ సాంగత్యము నుండి చిత్తము-విరతి (Non Participation, withdrawal) పొందసాగుతుంది. చిత్తము (లేక మనస్సు) ఆతని వశంలో ఉండటం ప్రారంభిస్తోంది. క్రమంగా అసత్యమగు దృశ్య విషయాలను వదలి సత్యము, శుద్ధము అగు ఆత్మయందు స్థితి (నిలకడ) పొందటం ప్రారంభిస్తుంది. ఈ భూమికను ‘సత్వాపత్తి’ (సత్-గుణమునందు సుస్థిరత) - అని అంటారు.
దశా చతుష్టయ అభ్యాసాత్ అసంసర్గ
ఫలా తు యా, రూఢ సత్వచమత్కారా
ప్రోక్తా ‘‘అసంసక్తి’’ నామికా ।।
(5) అసంసక్తి భూమిక :
ఆ విధంగా దశాచతుష్టయము (4 దశలను) అభ్యసిస్తూ ఉంటే - విషయములలతో అసంసక్తి (Non Participation. withdrawal) దృఢం అవనారంభిస్తోంది. ‘సక్తత’ తగ్గుతూ వస్తున్న చమత్కారమును (అసతోమా సద్గమయ) - ‘అసంసక్తి’ అని పిలుస్తున్నారు.
భూమికా పంచకాభ్యాసాత్ స్యాత్మారామ
తయా దృఢమ్, అభ్యంతరాణాం బాహ్యానాం
పదార్థానాం అభావనాత్ ।।
పర ప్రయుక్తేన చిరం ప్రయత్నేన అవబోధనమ్,
‘‘పదార్థ (అ)భావనా’’ నామ షష్ఠీ భవతి భూమికా ।।
(6) పదార్ధభావనాభూమిక (పదార్థా భావనాభూమిక) :
పంచ (5) భూమికలు అయినట్టి ‘‘శుభేచ్చ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంసక్తి లను దీర్ఘకాలము అభ్యాసము చేస్తూ ఉండగా అట్టివాడు జగత్తునందు రమించుటను తగ్గించుకుంటూ ‘‘కేవలాత్మ’’ అనబడు - ‘స్వ-ఆత్మారామము’నందు రమించటము ప్రారంభించుచున్నాడు. ఆత్మారాముడై, బాహ్యమున వస్తు-విషయ-నామ-రూపధ్యాసలను జయిస్తూ జగత్తులో వస్తు దృష్టిని వదలసాగుతాడు. ‘‘ఆత్మయే ఈ సమస్తము’’ అను ఆత్మ వస్తు-దృష్టిని ధారణ చేయసాగుతాడు. పరతత్త్వము గురించే వినుచూ, మాట్లాడుతూ పరతత్త్వమునందు ‘నియమితుడు’ అవుతాడు. అట్టి ‘పరప్రయుక్తము’నకు సంబంధించిన చిరకాల ప్రయత్నముచే పరబ్రహ్మము గురించిన బోధ (Message/cognition/cogitation) ప్రవృద్ధము అవుతూ ఉండగా, - ‘‘పదార్థ భావన’’ (పదార్థాభావన) అను ఆరవ భూమికలో ప్రవేశము పొందుచున్నాడు. (ఇక్కడ పదార్థము అనగా మూలపదార్థమగు కేవలాత్మ. జగత్ పదార్థ అభావన, ఆత్మ పదార్థ భావన - ఇద్దాని విశేషము.
భూమి షట్ (6) చిరాభ్యాసాత్ భేదస్య
అనుపలంభనాత్,
యత్ స్వభావైక నిష్ఠత్వం సా జ్ఞేయా
‘‘తుర్యగా’’ గతిః।।
ఏషా హి జీవన్-ముక్తేషు తుర్య అవస్థేతి విద్యతే
(7) తుర్యగ భూమిక :
ఈ విధంగా షట్ (6) భూమికల చిరకాల అభ్యాసముచేత ఆతడు జీవాత్మ - పరమాత్మల, జగత్తు - జగదీశ్వరుల, త్వమ్-తత్‌ల, అహమ్-తత్‌ల భేదభావనల వెంటబడక, వాటిని దాటివేయగలుగుతూ ఉంటాడు. అభేదము, అనన్యత్వము ఆశ్రయిస్తూ ఉంటాడు. సూక్ష్మభావనను సిద్ధింపజేసుకుంటూ తుర్యగ భూమికలో ప్రవేశిస్తున్నాడు. ఈవిధంగా ‘తుర్యగము’ అనబడు ‘7’వ భూమికలో ప్రవేశించిన వానిని జీవన్ముక్తుడు అని కూడా అంటారు.
7. విదేహ ముక్తి విషయం ‘‘తుర్యాతీతమ్’’
అతః పరమ్। యే, నిదాఘ !
మహాభాగాః సప్తమీం భూమిం ఆశ్రితాః ।।
తురీయాతీతము :
ఆ విధంగా ‘7’ భూమికలను అభ్యాసము చేస్తూ ఉండగా ఆ ముముక్షువు తుర్యగ భూమికను కూడా దాటిపోయి ‘తుర్యాతీతము’ను చేరుచున్నాడు.
అది భూమిక కాదు. స్థానము.
- అట్టి తురీయాతీత స్థితి (లేక) స్థానమునకు ‘విదేహముక్తి’యే విషయము. ఓ నిదాఘా! మహాభాగా! మహాశయా! భూమికాభ్యాసమయి, సప్తభూమికలను అభ్యసించుచూ, సప్తభూమికలను అధిగమించి, స్వాభావికంగా ‘తుర్యగాతీతుడు’ (లేక) ‘విదేహముక్తుడు’ అగుచున్నాడ
‘‘ఆత్మా ఆరామా, మహాత్మానః’’
తే మహాపదం ఆగతాః
జీవన్ముక్తా న మజ్జన్తి
సుఖ దుఃఖ రసస్థితే, ప్రకృతేన అథ కార్యేణ
కించిత్ కుర్వన్తి వా, న వా ।।
అట్టిది ‘మహాపదము’. అట్టివాడు ఆత్మయందే రమించుచు, ‘మహాత్ముడు’ అనబడుచున్నాడు. ‘7’వ భూమికయగు తుర్యగములో ప్రవేశించి, అభ్యాసము కొనసాగిస్తూ క్రమంగా ‘ఆత్మారాముడు’అగుచున్నాడు. మహాత్ముడై మహాపదమునకు చేరిన మహనీయుడు జీవన్ముక్తుడగు చున్నాడు. ఇక ఆతడు అట్టి సుఖదుఃఖస్థితులలో ఏమాత్రము కూడా చిక్కడు. అనగా ఈ జగత్తులో కనిపించే సుఖదుఃఖవ్యవహారములు నిజమనుకోడు. ‘‘సర్వకార్యములు ప్రకృతియే నిర్వర్తిస్తోంది. నాకేమీ సంబంధము లేదు, బంధము లేదు’’- అను ఆత్మసంబంధమైన ఎరుక అనుభవములను పుణికిపుచ్చుకొని ఉంటున్నాడు. తాను చేసినా, చేయకున్నా కూడా దేనికీ కర్తకాడు. అకర్త కూడా కాడు. సమస్తమునకు కేవలసాక్షి అయి వెలుగొందుచున్నాడు.
పార్శ్వస్థ బోధితాః, సన్తః
పూర్వ ఆచార క్రమ ఆగతమ్,
ఆచారం ఆచరంత్యేవ,
సుప్త బుద్ధవత్ ఉత్థితాః ।।
ఇక ఆతడు ప్రపంచంలో ఆయా కార్యములు చేస్తాడా? చేయడా? సమాధానం విను. జగత్తును స్వస్వరూపముగా దర్శించుచుండటంచేత , స్వాభావికంగానే ప్రేమాస్పదుడై ఉంటాడు. ప్రక్కవారిచేత, ఆయా సందర్భములచేత-బోధితుడై (గుర్తుచేయబడుచూ), తాను ఉన్నచోట శాస్త్ర, -శిష్ట-ఆచారములను అనుసరించి, ఆ క్రమంగా చేస్తూ ఉంటాడు. నిద్రపోతున్నవాడు నిద్రను కొనసాగిస్తూనే ఏదైనా వస్తువు తనను తాకినప్పుడు అసంకల్పితంగా స్పందించుతీరుగా ఈ ప్రపంచంలో అసంకల్పితంగా (Thought Less / Plan less Responses) - ప్రాపంచిక సందర్భ స్పందనములు దర్శిస్తూ, స్పందిస్తూ, నిర్వర్తిస్తూ ఉంటాడు.
భూమికా సప్తకం చ ఏతత్ ధీమతాం ఏవ గోచరమ్।
ప్రాప్య జ్ఞానదశాం ఏతాం పశు మ్లేచ్ఛ ఆదయో అపి యే।।
సదేహావ అపి అదేహావ
తే ముక్తా। న అత్ర సంశయః।
ఓ నిదాఘా! బుద్ధిచేతనే 7 భూమికలు తెలియవస్తాయి. అంతేగాని అవి భౌతికమైన వేషధారణవంటివి కాదు. ఉపాధులకు సంబంధించినవి కాదు. సాంఘిక (కుల) విభజనలవంటిది కాదు. పశువులు, మ్లేచ్చులు మొదలైన వారిలో కూడా సప్తజ్ఞాన భూమికలను సిద్ధించుకొన్నవారు ఉంటారు. అంతేగాని అది ఒక జాతికో, కులమునకో సంబంధించి పరిమితమైనది కాదు.
8. స-దేహా వా, అస్య అ-దేహే వా, తే అత్ర ముక్తా।
తే ముక్తా న అత్ర సంశయః ।
జ్ఞప్తిః హి (జ్ఞప్తిర్హి) గ్రన్థి విచ్ఛేదః
తస్మిన్ సతి విముక్తతా ।।
మనము చెప్పుకున్న జ్ఞానభూమికలలో విహరించు వారు - దేహము కలిగి ఉన్నప్పుడు , దేహము లేనప్పుడు కూడా - ముక్తులే. ఇందులో అనుమానము లేదు. (బ్రహ్మగ్రంథి - విష్ణుగ్రంథి - రుద్రగ్రంథి ఇత్యాది) జ్ఞప్తికి (జగత్తు గురించిన జ్ఞాపకమునకు) సంబంధించిన గ్రంథుల విచ్ఛేదమే- సంసారబంధ - విముక్తి.
‘‘మృగతృష్ణ అంబు’’-బుద్ధి ఆది,
శాన్తి మాత్ర ఆత్మకస్తు అసౌ,
యే తు మోహార్ణవాత్ తీర్ణాః
తైః ప్రాప్తం పరమం పదమ్ ।।
సప్తభూమికలను అభ్యాసము చేయుచూ, తురీయతీతమును అనునిత్య స్వాభావికంగా చేసుకోవటం ఎటువంటిదంటే - మృగతృష్ణలో జలము యొక్క అహ్రాంతి వంటిదగు ‘మహత్’ (సమిష్టి, ‘నేను’) నుండి -స్థూలమగు ‘అహమ్’ వరకు గల ‘‘దేహాహ్రాంతులు’’ సశాంతించిన స్థితి. ఎవ్వరు దృశ్యముపట్ల ఏర్పడిన మోహ-అజ్ఞానసాగరమునుండి ఆవలివడ్డుకు చేరుతారో - వారే ‘పరమపదము’ను పొందినట్టివారు.
తే స్థితా భూమికాసు ఆసు స్వాత్మ లాభ పరాయణాః ।
మనః ప్రశమన ఉపాయోః
‘‘యోగ’’- ఇతి అభిధీయతే।।
సప్తభూమికలను అభ్యాసము చేయువారు ఇక దృశ్యలాభముల వైపుగా పరుగులు తీయరు. ‘‘స్వాత్మారామపరాయణులు’’ అగుచున్నారు.
మనస్సు ఆత్మయందు సశాంతించు ఉపాయమే ‘యోగము’ అను శబ్దముయొక్క అర్థము. మనస్సును జయించు మార్గమే యోగము.
సప్తభూమిః సవిజ్ఞేయః,
కథితాః తాశ్చ భూమికాః
ఏతసాం భూమికానాం తు
గమ్యం ‘‘బ్రహ్మ అభిదం పదమ్’’ ।।
‘‘అట్టి ‘యోగము’ యొక్క అభ్యాసమే సప్త (7) భూమికలు’’ అని కూడా గ్రహించెదవుగాక.
సప్తభూమికల గమ్యము ‘‘పరబ్రహ్మపదమే’’.
త్వత్‌తా, అహన్తా ఆత్మతా యత్ర పరతా
న అస్తి కాచన, న క్వచిత్ భావ కలనా,
న భావ - అభావ గోచరా।
అట్టి పరబ్రహ్మపదము ఎటువంటిదంటే :….
- ‘‘నీవు, ఆతడు, నేను’’ అను చిత్తవృత్తులు ఏమాత్రము పొడచూపనట్టిది.
- భావ-అభావములకు మునుముందే ఉండినట్టిది। భావాభావములజాడ కనబడనట్టిది ।
సర్వం శాన్తం నిరాలమ్బం వ్యోమస్థం శాశ్వతం
శివమ్, అనామయమ్, అనాభాసం,
అనామకమ్, అకారణమ్ ।।
- సమస్తము అయినట్టిది । పరమశాంతరూపము ।
- ఏదీ కూడా అద్దానికి ఆధారము కాదు । సమస్తమునకు ఆధారము అట్టి బ్రహ్మీతత్త్వమే.
- ఆకాశము వలె నిర్విషయము । - త్రికాలములచే స్పృశించబడనిది । శాశ్వతమైనది।
- సమస్త శుభ-శాంతి-సుఖ-ఆనందప్రదాత।
- ఆభాసము కానట్టిది. (It is not reflective. It is original by itself). నామరూపరహితము । అకారణము ।
అట్టి స్వస్వరూప - సర్వస్వరూప పరబ్రహ్మము :-
9. న సత్ । న అసత్। న మధ్య - అంతమ్ ।
న సర్వం । సర్వం ఏవ చ । మనో వచోభిః
అగ్రాహ్యం।
పూర్ణాత్ పూర్ణం। సుఖాత్ సుఖమ్।
❋ సత్తు (ఎదురుగా ఉన్నది) కాదు.
❋ అసత్తు (ఇక్కడ లేనిది) కాదు.
❋ ఉండీ - లేనిది కాదు. మధ్యలోనో చివరిలోనో ఉన్నది కాదు. ఈ కనబడే సమస్తము కాదు.
❋ ఈ సమస్తము అయి ఉండకపోనూలేదు. ఈ సమస్తము అదియే.
❋ వాక్కుచేత, మనస్సుచేత గ్రహించబడేది కాదు. అగ్రాహ్యము.
❋ అది పూర్ణమునకే పూర్ణము
❋ సర్వసుఖ ప్రదాత. సుఖమునకే సుఖస్వరూపము.
అసంవేదనం । అశాన్తం । ఆత్మవేదనం ఆతతమ్ ।
సత్తా సర్వ పదార్థానాం। న అన్యో సంవేదనా దృతే ।
సంబన్ధే ద్రష్టృ దృశ్యానాం
మధ్యే దృష్టిః హి యత్ వపుః
ద్రష్టృ - దర్శన - దృశ్యాది - వర్జితం
తత్ ఇదం పరమ్।।
❋ తెలియబడుచున్నదేదీ కాదు. తెలుసుకొంటున్నదే అది. తెలియబడేదంతా అద్దాని సంప్రదర్శనమే.
❋ శాంత స్వరూపము (మౌనస్వరూపము) కూడా కాదు.
❋ ఆత్మచేతనే ఆత్మగా తెలియవచ్చునది.
❋ సర్వ పదార్థములకు సత్తా (ఉనికి) ను ప్రసాదించునది. సమస్తము యొక్క సత్తాస్వరూపము.
❋ అద్దానికి వేరుగా ‘‘ఏదీ తెలియబడటము’’ అనునది లేదు. తెలియబడుచున్నట్టిది కాదు.
❋ ద్రష్ట - దృశ్యముల మధ్యగా దృష్టి రూపముగా సంప్రదర్శనమగుచూ ఉన్నట్టిది. ‘దృక్’ రూపముగా వేంచేసియున్నది.
- ద్రష్ట - దృశ్య - దర్శన త్రిపుటీరహితము. త్రిపుటీ అతీతము. మధ్యగా ఉన్నదంతా కూడా అదియే। అదియే ఇదంతా ! అది సర్వదా ఈ సమస్తమునకు పరము । అదియే నీవు । అదియే నేను। సమస్తము ‘తానే’ అయి, సమస్తమునకు వేరై కూడా ఉన్నట్టిది।
దేశాత్ దేశం గతే చిత్తే - మధ్యే యత్
చేతసో వపుః, ‘‘అజాడ్య సంవిత్ మననం’’,
తన్మయో భవ సర్వదా ।
అజాగ్రత్ స్వప్న నిద్రస్య యత్తే రూపం సనాతనమ్,
అచేతనం చ, అజడం చ తన్మయో భవ సర్వదా ।।
ఓ నిదాఘా। నీకొక ‘సాధన’ లేక ‘ఉపాయము’-ఆత్మస్వరూపసిద్ధికొరకై - సూచిస్తున్నాను. విను.
ఒక స్థానము (లేక, ఆలోచననుండి మరొకస్థానము (లేక ఆలోచనకు) వెళ్ళుచున్న చిత్తము మధ్యలో ఏ చేతనము (ఎరుక)గా సంస్థితమైయున్నదో, అట్టి అజాడ్యమగు (నిద్రా భావములేనట్టి) సంవిత్ (సత్+విత్)ను మననము చేస్తూ సర్వదా తన్మయుడవై ఉండుము.
జాగ్రత్ స్వప్న సుషుప్తులకు మునుముందే ఏర్పడినదై ఉన్న నీయొక్క అచేతనము (కదలిక లేనిది), అజడము అగు కేవల స్వరూపమును గమనించు. అదియే నీవై ఉండుము.
జడతాం వర్జయిత్వ, ఏకం శిలాయా
హృదయం హి తత్, అమనస్క స్వరూపం
యత్, తన్మయో భవ సర్వదా।
చిత్తం దూరే పరిత్యజ్య
యోఽసి సోఽసి స్థిరోభవ।
జడత్వము(Passive, Drowsy, Lazy) ను త్యజించివేయుము. హృదయమును ఏకశిలాస్వరూపముగా రూపు చేసికొనుచుండుము. ఆలోచనలకు కూడా సాక్షివై, ఆలోచనలకు జనన స్థానమై, అమనస్కుడవగుచూ, మనస్సుకు ఆవలగల స్వస్వరూపము నందు తన్మయుడవై ఉండుము.
వస్తువులపై, విషయములపై సంబంధ - అనుబంధములపై ‘‘ఇష్టము/ధ్యాస’’ - రూపమగు చిత్తమును మొదలంట్లా పరిత్యజించి, అప్పటికీ ఏది శేషిస్తుందో, అద్దానియందు సుస్థిరుడవై ఉండుము.
10. పూర్వం మనః సముదితం
పరమాత్మ తత్త్వాత్ తేన ఆతతం,
జగదిదం సవికల్పజాలమ్,
శూన్యేన శూన్యం అపి, విప్ర!
యథా అంబరేణ నీలత్వం ఉల్లసతి
చారుతరం అభిధానమ్।।
ఓ విప్రా। నిదాఘమహాశయా! ఆకాశము వాస్తవానికి శూన్యాతి శూన్యము (ఏ పదార్థము లేనట్టిది). కానీ నీలంగా కంటికి కనబడుచూ, ఏదో నీలపు పదార్థముతో నిండి ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది.
అట్లాగే సమస్తమునకు మునుముందే ఉన్నట్టి కేవలాత్మతత్త్వము శూన్యము, నిర్వికల్పము అయిఉండి, అద్దానియందు సవికల్పజాలముతో కూడిన ఈ దృశ్యజగత్తు అనుభూతమై, ఉల్లసితమై అగుపించటము, అనిపించటము జరుగుతోంది. అయినా కూడా, సర్వాత్మకమగు స్వస్వరూపాత్మ సర్వదా యథాతథము.
సంకల్ప సంక్షయవశాత్ గళితే తు చిత్తే
సంసార మోహ మిహికా గళితా భవన్తి।।
స్వచ్ఛం విభాతి శరదీవ ఖమ్ ఆగతాయాం,
‘చిత్’ మాత్రమ్-ఏకం, అజం, ఆద్యం, అనన్తం, అన్తః।।
సంకల్పము (Assumption & Pressumption) చేతనే చిత్తము రూపుదిద్దుకుంటోంది. సంకల్పము క్షయిస్తూ ఉన్న మరుక్షణం సంసారమోహరూపము దాల్చియున్న చిత్తము తనకు తానే రహితమగుచున్నది. నాశనము అగుచున్నది.
శరత్కాలంలో ఆకాశము నిర్మలమై (మేఘరహితమై) ప్రకాశించుచున్నట్లుగా చిదాకాశము → ఏకమై, కేవలచిత్ - మాత్రమై, సమస్తమునకు ఆదిస్వరూపమై, అజమై (జన్మరహితమై), అనన్తమై, సమస్తమునకు ఆవల-ప్రకాశించుచున్నది. అయ్యది అంతరముననే అనుభవమగుచున్నది. (బాహ్యమున కాదు) (It has to be seen and enjoyed within, but not else where)
అకర్తృకం అరంగం చ, గగనే చిత్రం ఉత్థితమ్,
అద్రష్టృకం, స్వానుభవం,
అనిద్ర స్వప్న దర్శనమ్।
సాక్షి భూతే సమే స్వచ్ఛే నిర్వికల్పే చిత్ ఆత్మని,
నిరిచ్ఛం ప్రతిబింబంతి జగన్తి ముకురే యథా।।
ఆకాశంలో ఏ చిత్రకారుని ఇచ్ఛ. చిత్రలేఖనము లేకుండానే ఆయా అనేక రంగులు, రూపములు అగుపిస్తూ ఉన్నట్లు, ఈ కనబడేదంతా ‘‘-ద్రష్టలేకుండానే దృశ్యము వచ్చిందా?…..,
- నిద్రలేకుండానే స్వప్నగా దర్శనము జరుగుతోందా?’’
అనినట్లు కనిపిస్తూ ఉన్నది.
వస్తువు యొక్కగాని, - అద్దము యొక్క గాని, ఇష్టము, ఉద్దేశ్యము లేకుండానే ఆ అద్దములో ఆ వస్తువు ప్రతిబింబిస్తూ (స్వాభావికంగానే) కనిపిస్తూ ఉంటుంది కదా ।
అట్లాగే
‘‘కేవలము సాక్షిభూతము, సర్వత్రా సమరూపము, స్వచ్ఛము, నిర్వికల్పము’’ అగు చిదాత్మయందు ఎట్టి ఇచ్ఛ లేకుండానే జగద్దృశ్యమంతా ప్రతిబింబించటము స్వాభావికంగా జరుగుతూ పోతోంది.
11. ఏకం బ్రహ్మ చిత్ - ఆకాశం,
సర్వాత్మకమ్ అఖండితమ్, ఇతి భావయ యత్నేన
చేతః చాంచల్య శాంతయే।।
రేఖా ఉపరేఖావళితా
యథా ఏకా పీవరీ శిలా,
తథా త్రైలోక్య వళితం
బ్రహ్మైకం ఇహ దృశ్యతామ్ :
ద్వితీయ కారణ అభావాత్ అనుత్పన్నం ఇదం జగత్।।
ఓ నిదాఘా! అనేక భేదములను దర్శించు వ్యసనము ప్రదర్శించుచున్న నీ చిత్తముయొక్క చాంచల్యము శమించాలి. ‘‘ఏకము, చిత్ ఆకాశస్వరూపము, సర్వాత్మకము, అఖండము’’ - అగు బ్రహ్మమే-ఇదంతా అను భావనను ఆశ్రయించు, నిత్యాభ్యాసివి అగుము. ‘‘అదియే నేను’’ అని-అనిపించేవరకు అనుకుంటూ ఉండు. భావనను యత్నపూర్వకంగా చేయి.
ఒకపెద్ద శిల అనేక చిన్న - పెద్ద రేఖలతో కనిపిస్తూ ఉన్నట్లుగా -ఏకమగు బ్రహ్మమునందు మర్త్య-పాతాళ-స్వర్గ త్రిలోకములు అగుపిస్తూ ఉన్నాయి.
ఆత్మ సర్వదా అద్వితీయము. ఆత్మకు ద్వితీయమై ఏదైనా ఉండటానికి కారణమే లేదు. కాబట్టి ఈ జగత్తు ఆత్మయందు ఉత్పన్నమే అయి ఉండలేదు. ఈ జగత్తునకు జన్మించటమనునదే లేదు. నశించటము లేదు.
జ్ఞాతం జ్ఞాతవ్యం అధునా। దృష్టం ద్రష్టవ్యం అద్భుతమ్।
విశ్రాంతో-స్మి చిరం శ్రాంతః।
చిత్ మాత్రాత్ నాస్తి కించన ।। -
- పశ్య విశ్రాన్త సందేహం, విగత అశేష కౌతుకమ్ ।
నిరస్తకల్పనాజాలమ్, అచిత్తత్వం పరంపదమ్।।
ఆహా! అద్వితీయమగు, ఈ జగత్తుయొక్క వాస్తవ స్వరూపమగు, అహం-త్వమ్‌ల శాశ్వతానందరూపమగు ‘‘ఆత్మ’’ గురించి తెలుసుకొనుచూ ఉండగా
- తెలుసుకోవలసింది తెలుసుకొన్నవాడను అగుచున్నాను.
- చూడవలసిన ‘ఉన్నసత్యము’ను చూచుచున్నవాడనగుచున్నాను.
‘‘కేవలచిత్ (ఎరుక/ప్రజ్ఞ) యొక్క విన్యాసమే ఇదంతా!’’
అని తెలుసుకొని ఇంతకాలపు శ్రమ తొలగినది’’. - అని ఎలుగెత్తి పలుకు. విశ్రాంతిని ఆస్వాదించు.
ఓ నిదాఘా! అన్ని సందేహములనుండి విగతుడవై (Having come out), కౌతుకము (Inquisitiveness) లతో కూడిన సర్వకల్పనాజాలమును రహితం చేసి - ‘‘అచిత్తస్వరూపమగు పరమపదము’’ను ఆశ్రయించు.
త ఏవ భూమతాం ప్రాప్తాః, సంశాన్త
అశేష కిల్బిషాః।, మహా ధియః శాన్త థియో
యే యాతా విమనస్కతామ్।।
కల్పనారూప మనస్సు ఆత్మయందు సశాంతించుచుండగా, బుద్ధియొక్క దోషములన్నీ తొలగిపోవుచుండగా, అమనస్కస్థితి (మనస్సుకే నియామకమగు స్వస్వరూపస్థితి) పొందుచుండగా -అట్టివారు భూమతమును (సప్తభూమికాసిద్ధిని) పొందుచున్నారు.
జన్తోః కృత విచారస్య, విగళత్ వృత్తి చేతసః
మననం త్యజతో నిత్యం
కించిత్ పరిణతం మనః ।।
అనునిత్యమగు ఆత్మవిచారణచే చిత్తవృత్తులన్నీ విగళితము (రహితము) అగుచుండగా, ఉత్తమబుద్ధితో దృశ్య మననము త్యజించుచుండగా, ఆపై కించిత్ మనన-ధారణలచే బ్రహ్మభావము సిద్ధించగలదు.
12. దృశ్యం సంత్యజతో హేయమ్, ఉపాదేయమ్
ఉపేయుషః, ద్రష్టారం పశ్యతో
నిత్యం, అద్రష్టారం అపశ్యతః ।।
విజ్ఞాతవ్యే పరే తత్త్వే జాగరూకస్య జీవితః,
సుప్తస్య ఘన సమ్మోహమయే సంసార వర్త్మని ।।
హేయ (వదలటము) - ఉపాదేయ (స్వీకరించటము) - అను ద్వంద్వ ములతో కూడిన దృశ్యమును పరిత్యజించి (By leaving aside) కేవల ద్రష్టను దర్శించువాడే సత్యదర్శి. దృక్ స్వరూపమును చూస్తూ, ఈ సమస్తమును దృక్ స్వరూపమునకు అనన్యముగా చూచువాడే ఆత్మదర్శి.
తెలుసుకోవలసినట్టి పరతత్త్వమునందు సర్వదా జాగరూకుడైనవాడు, ఘనీభూత మోహ(Illusion) రూపమగు సంసార మార్గముల పట్ల నిద్రించువాడు (త్యజించి ఉండువాడు) - స్వస్వభావమగు ఆత్మస్థానమును సమీపిస్తున్నాడు. అజాగరూకుడై ఆత్మజ్ఞానముపట్ల నిదురించివాడు దట్టమగు ‘సంసారాంధకారం’లో చిక్కుకుంటున్నాడు.
అత్యన్త పక్వ వైరాగ్యాత్,
అరశేషు, రసేషు అపి।
సంసార వాసనా జాలే, ఖగజాలం ఇవ అథునా,
తోదితే హృదయగ్రంథౌ
జ్ఞానవైరాగ్యరంహసా।।
రస-అరసములైన సమస్త పదార్థములపట్ల, విషయములపట్ల అత్యంత పరిపక్వమైన వైరాగ్యము పెంపొందించుకున్నవాడు, వలను త్రెంచి బయటకు వచ్చిన పక్షివలె - ఇక్కడి సంసార వాసనా జాలమునుండి విడివడినవాడు, హృదయ గ్రంథులను జ్ఞాన-వైరాగ్యముల సహాయముతో త్రెంచివేసుకొన్నవాడు - ఆత్మభావమును సమీపించగలడు.
కాతకం ఫలం ఆసాద్య
యథా వారి ప్రసీదతి,
తథా విజ్ఞాన వశతః
స్వభావః సంప్రసీదతి।।
చిల్లగింజలు జలములో వేయగా ఆ జలములోని ధూళికణములు క్రిందకుజారి జలము నిర్మలమగు విధంగా, ‘విజ్ఞానము’ అనే చిల్లగింజచే ‘అజ్ఞానము’ అనే మాలిన్యమును హృదయమునుండి తొలగించుకొన్నవాడు ‘‘స్వస్వభావత్మ’’యందు ప్రసీదతుడు (Manifested) అవగలడు.
నీరాగం నిరుపాసంగం
నిర్ద్వంద్వం నిరుప ఆశ్రయమ్,
వినిర్యాతి మనో మోహాత్
విహంగః పంజరాత్ ఇవ।।
పంజరమును త్రెంచుకొని బయటపడిన చిలుక లాగా-మనస్సు రాగరాహిత్యము (Non fondness) పొందుచూ, సంగరహితము ఆసక్తిరహితము అగుచూ, ద్వంద్వాతీతము అగుచూ, దృశ్యమును ఆశ్రయించనిదై, దృశ్యమునందు చిక్కుకొననిదై ఉంటుందో, అప్పుడా మనస్సు మోహమును త్యజించి సర్వాబంధములనుండి విడివడగలదు.
శాంత సందేహ దౌరాత్మ్యం
గత కౌతుక విభ్రమమ్,
పరిపూర్ణాంతరం చేతః పూర్ణ-ఇందురివ రాజతే।
ఎప్పుడైతే బుద్ధి స్వస్వరూపాత్మ గురించిన సర్వ సందేహములను నివృత్తి చేసుకొని, కౌతుకములనుండి విభ్రమములనుండి విడివడుతుందో, అప్పుడు ఆ బుద్ధి అంతరమున పరిపూర్ణత్వము సంతరించుకొని పూర్ణచంద్రునివలె విరాజిల్లగలదు.
న అహం, న చ అన్యత్ అస్తి ఇహ
బ్రహ్మైవ అస్మి నిరామయమ్।
ఇత్ధం సత్ అసతోః మధ్యే
యః పశ్యతి, స పశ్యతి।।
ఇక్కడ ‘‘అహమ్ (నేను)’’ లేదు. ‘‘నాహమ్’’ లేదు. నిరామయమగు బ్రహ్మమే సర్వే సర్వత్రా అఖండమై ఏర్పడి ఉన్నది. అట్టి బ్రహ్మమును సత్-అసత్‌ల మధ్యగా ఎవ్వరు దర్శిస్తారో, అదియే సత్యదర్శనము.
13. అయత్న ఉపనతేషు అక్షి దృక్ ద్రవ్యేషు
యథా మనః, నీరాగం ఏవ పతతి,
తద్వత్ కార్యేషు ధీర ధీః ।।
పరిజ్ఞాయ ఉపభుక్తో హి భోగో భవతి తుష్ట యే,
విజ్ఞాయ సేవితః చోరో మైత్రీం ఏతి న చోరతామ్।
(అద్దమునందు దృశ్యమువలె) ఏ విధంగా అయితే ఈ కళ్ళు మొదలైన ఇంద్రియములు తమకు తారసబడే వస్తువులపై - తమకుగా ఏ స్వకీయ ఇష్ట - ఐష్టములు లేకుండానే వ్రాలుచూ క్రియలు నిర్వర్తిస్తున్నాయో, ఆ విధంగా –
ధీరునిబుద్ధి- తాను చేయుచున్నట్టి, చేయుచుండనట్టి - కార్యములలో రాగరహితంగానే ప్రవృత్తి కలిగి ఉంటుంది.
ఆత్మతత్త్వము గురించి చక్కగా ఎరిగిన యక్తుడు (యోగి) భోగములను అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా, ఆ జ్ఞాన విజ్ఞానయోగి పట్ల - దొంగలు తమ స్నేహితునితో స్నేహభావము కలిగి యుండు విధంగా - (ఆ దొంగలు స్నేహితుని ఇంట్లో దొంగతనము చేయని విధంగా) ఇంద్రియములు, ఇంద్రియ విషయములు స్నేహితులవలె ఉంటాయి.
ఆశంకిత అపి సంప్రాప్తా, గ్రామయాత్రా యథా అధ్వగైః,
ప్రేక్షతే తద్వత్ ఏవ, జ్ఞైః భోగశ్రీః అవలోక్యతే ।।
బ్రహ్మనిష్టులగు జ్ఞానులు తమకు సంప్రాప్తిస్తున్న భోగములను, సంపదలను, సంబంధములను - వేరే మరొక గ్రామము వచ్చిన బాటసారివలె, తనకు సంబంధించనివిగా అవలోకనము చేస్తూ ఉంటాడు.
మనసో నిగృహీతస్య లీలా భోగో అల్పకో అపియః
తమేవ లబ్ధ, విస్తారం
క్లిష్టత్వాత్ బహు మన్యతే ।।
మనస్సు భోగములను తనలోకి స్వీకరించనంతకాలము - అల్పమైన భోగములను కూడా - ఆత్మజ్ఞాని - విస్తారముగాను బహు గాను భావన చేస్తూ తృప్తిని వదలక ఉంటాడు. అనాయాసంగా లభించిన స్వల్పమునకే అల్ప సంతోషి అయి ఉంటాడు. (Even simple things are enjoyable to him)
బంధముక్తో మహీపాలో
గ్రాసమాత్రేణ తుష్యతి।
పరైః అబద్ధో న అక్రాంతో,
న రాష్ట్రం బహుమన్యతే।।
ఒక మహారాజు శత్రు సైనికులచే బద్ధుడై, ఎట్లాగో తప్పించుకొని తిరిగి వస్తూ ఉండగా ఆతనికి అత్యంత ఆకలిగా ఉన్నది. అప్పుడు ఆతడు సామాన్యులు తినే ఆహారము కొంచెము లభించినా కూడా, అది రాజభోగములకంటే గొప్పదిగా ఆస్వాదిస్తాడు. అట్లాగే దృశ్యబంధములనుండి (సంసార శృంఖలముల నుండి) విడివడిన యోగి ఏ కొంచెము ఎక్కడ లభించినా తృప్తిగా, హాయిగా ఉంటాడే గాని, ‘‘ఇంకా ఏదో లభించాలి కదా?’’ అని వేదనలు పొందడు.
హస్తం హస్తేన సంపీడ్య, దంతైః దంతాన్
విచూర్ణ్య చ, అంగాని అంగైః ఇవ
ఆక్రమ్య జయేత్ ఆదౌ స్వకం మనః ।
మనసో విజయాత్ -
న అన్యా గతిః అస్తి భవార్ణవే ।।
ఓ నిదాఘా! ఈ మనస్సు పెద్ద దొంగ. ఇది అనేక దుష్ట అభ్యాసములవైపుగా, దుష్పరిణామమునకు దారి తీయు వ్యవహారములవైపుగా చెప్పాపెట్టకుండానే పరుగులు తీస్తూ ఉంటోంది. అటువంటి మనస్సును,
- చేయి చేయి గట్టిగా కలిపి అయినా సరే,
- పళ్ళతో పళ్ళు నొక్కిపడుతూ అయినా సరే,
- అంగములతో అంగములను ఆక్రమించి అయినా సరే - మనస్సును జయించవలసిందే. సంసారసాగరము దాటటానికి వేరే త్రోవలేదు.
14. మహానరక సామ్రాజ్యే మత్త దుష్కృత
వారణాః, ఆశా శర శలాకాఢ్యా దుర్జయా హి
ఇంద్రియా రయః ।।
అనుక్షణము మార్పుచెందు స్వభావముగల ‘‘దృశ్యము’’ తో సుదీర్ఘముగా ఆత్మకు ఏర్పడిన సంబంధ రూపమగు ‘సంసారము’ అనే మహాసామ్రాజ్యములో ‘‘చెడుపనులు (దుష్కృతములు), చెడు ఆలోచనలు’’ అనే మదించిన ఏనుగులు భయమును గొలుపుతూ సంచారములు చేస్తున్నాయి. ‘‘ఆశలు’’ అనే బలహీనమైన బాణములను చేతబట్టుకొని ఇంద్రియములు అనే మదపుటేనుగులను వశం చేసుకోవటము కుదిరే విషయం కాదు. ఆశల వలన భోగవాసనలు వృద్ధి చెందుతాయేగాని, తీరవు.
ప్రక్షీణ చిత్త దర్పస్య
నిగృహీత ఇంద్రియ ద్విషః,
పద్మిన్య ఇవ హేమంతే
క్షీయంతే భోగవాసనాః।।
హేమంత ఋతువులో పద్మములు క్షీణించువిధంగా - మనస్సు అనే ఏనుగుయొక్క గర్వమును అణగద్రొక్కి, ఇంద్రియ విషయములను హృదయములోనికి స్వీకరించకుండా ఉంటే, వాటి భోగవాసనలు తమకుతామే క్షీణించగలవు.
తావత్ నిశీవ బేతాళా
వల్గంతి హృది వాసనాః
ఏకతత్త్వ దృఢ అభ్యాసాత్
యావత్ న విజితం మనః ।।
మనస్సును జయించకపోతేనో? కటిక చీకటి ప్రదేశములో దయ్యములు సంచారములు చేయుచుండు తీరుగా, హృదయములో భేదదృష్టితో కూడిన దుష్ట వాసనల సంచారమును ఆపలేము. (‘ఏకత్వము’) రూపమగు దృఢమగు సమత్వభావనయొక్క అభ్యాసము లేనంతవరకు మనస్సు జయించబడదు. కోతిలాగా, దయ్యంలాగా దృశ్య సంగతులతో గంతులు వేస్తూనే ఉంటుంది.
భృత్యో అభిమత కర్తృత్వాత్, మంత్రీ సర్వార్థ
కారణాత్, సామంతశ్చ ఇంద్రియ ఆక్రాంతే -
మనో మన్యే వివేకినః ।
లాలనాత్ స్నిగ్ధ లలనా, పాలనాత్ పాలకః పితా।
సుహృత్ ఉత్తమ విన్యాసాత్ మనో మన్యే మనీషిణః ।।
స్వ-ఆలోకతః శాస్త్ర దృశా స్వ బుద్ధ్యా స్వ అనుభావితః,
ప్రయచ్ఛతి పరాం సిద్ధిం, త్యక్త్వా ఆత్మానం మనః పితా।।
వివేకి యొక్క మనస్సు…
- ఇష్టకార్యములు నెరవేర్చటానికి భృత్యునివలె, విశ్వాసముగల సేవకునివలె ప్రవర్తిస్తుంది.
- రాజభక్తిగల మంత్రివలే సర్వ అర్థములను (Al-services) చేకూర్చగలదు.
- సామంతునివలె ఇంద్రియములను అదుపులో ఉంచటములో సహకారికములుగా ఉంటుంది.
ఆత్మవిచారణ - ఆత్మతత్త్వ నిశ్చయములతో కూడిన ఉత్తమబుద్ధిగల మనిషికి ఈ మనస్సు :
- లాలించటంలో ప్రియురాలివలె మెలగుతుంది.
- పాలించటములో తండ్రివలె వాత్సల్యము కలిగి ఉంటుంది.
- ఉత్తమ విన్యాసములలో (కార్యక్రమములలో) సహృదయుడగు మిత్రునివలె అగుచున్నది.

ఏవిధంగా అయితే తండ్రి తన సుఖములను విడిచిపెట్టైనా సరే, కుమారుని విద్య, వృద్ధి, సంపదలను కాపాడుతాడో, అట్లాగే, సాధనచే ఈ మనస్సు శాస్త్ర దృష్టితో అవలోకించటమునకు, స్వానుభవమునకు సహకరించగలదు. శుద్ధమనస్సు తండ్రి అయి రక్షించగలదు. అందుచేత వివేకివి అయి ఉండాలి సుమా!
15. సుహృష్టః, సుదృఢః, స్వచ్ఛః, సుక్రాంతః,
సుప్రబోధితః, స్వగుణేన ఊర్జితో భాతి
హృది హృద్యో మనో మణిః ।।
ఏనం మనోమణిం, బ్రహ్మన్! బహుపంక కళంకితమ్,
వివేకవారిణా సిద్ధ్యై ప్రక్షాళ్య అలోకవాన్ భవ।।
వివేకం పరమ్ ఆశ్రిత్య, బుద్ధ్యా సత్యం అవేక్ష్య చ,
ఇంద్రియ-అరీ నలం ఛిత్వా తీర్ణో భవ భవార్ణవాత్।।
మనస్సును సంతోషముతోను, సుహృత్ భావములతోను, సుదృఢముగాను, స్వచ్ఛముగాను, ఆత్మభావముతో సర్వత్రా ఆక్రమించినదిగాను, చక్కటి ప్రబోధయుక్తముగాను- తీర్చిదిద్దుకోవాలి. అప్పుడు స్వాత్మగుణ సమన్వితమె,→ హృదయమునందు ఉత్తమజాతి మణివలె ప్రకాశిస్తూ ఉండగలదు.

మణికారుడు (రత్నములను సానబెట్టువాడు)
ఓ బ్రహ్మన్ ! మణికారుడు మణిని దోషములు తొలగునట్లుగా కడిగి (cleaning to remove dust particles) ప్రకాశింపజేయునట్లుగా, ఈ మనస్సును వివేక రసముతో ప్రక్షాళన చేసి లోకాతీతుడవై ఉండుము.

పరమగు వివేకమును ఆశ్రయించి, బుద్ధితో పరమసత్యమగు ఆత్మగా జగత్తును దర్శిస్తూ ఇంద్రియములలోని దోషములను తొలగించుకొని సాంసారికమగు దృష్టులను తొలగించి, భవసాగరము నుండి తరించెదవుగాక। ఒడ్డుకు చేరెదవు గాక। ఇంద్రియములు - అనే శత్రువులను జయించి, పవిత్రుడవు అగుము.
ఆశా(స్థా)మాత్రం అనంతానాం దుఃఖానామ్ ఆకరం విదుః।
అనాశా(స్థా) మాత్రం అభితః సుఖనాం ఆలయం విదుః ।।
వాసనా తంతు బద్ధో అయం లోకో విపరివర్తతే,
సా ప్రసిద్ధా అతి దుఃఖాయ। సుఖాయ ఉచ్ఛేదమ్ ఆగతా ।
ధీరో, అపి, అతి బహుజ్ఞో అపి, కులజో అపి, మహాన్
అపి, తృష్ణయా బధ్యతే జంతుః
సింహః శృంఖలయాయథా ।।
‘‘కోరికలు కోరుకోవటము’’ అనే అభ్యాసముచే అట్టి కోరుకోవటానికి అంతూ - పొంతూ ఉండదని విజ్ఞులు గమనిస్తున్నారు.
కోరికలు (Expectations) కలిగి ఉండని స్వస్థానము సుఖాలయము - అని కూడా విదితవేత్తల సూచన. ఆశ ఉంటే అది అనేక దుఃఖములకు నాంది. ఆశను త్యజిస్తే, అదియే పరమసుఖము.

ఓ నిదాఘా! ఈ జనులలో అనేకులు వాసనలు అనే తంతువులచే (పురికోస త్రాళ్ళచే) బంధితులై జనన-మరణ చక్రములో పరిభ్రమిస్తున్నారు. అదియే దుఃఖకారకములు. వాసనా తంతువులు త్రెగితే సుఖము.
ఒకడు ధీశక్తి కలవాడైనా (తెలివితేటలు కలవాడైన), అనేక విషయాలు తెలిసినవాడైనప్పటికీ, గొప్ప వంశములో జన్మించినవాడు అయినప్పటికీ, మహనీయుడుగా ప్రసిద్ధుడు అయినప్పటికీ, - ఆతడు ‘ఆశ’ అనే అభ్యాసమును కొనసాగిస్తూ ఉంటే అట్టి ఆశాపాశములచే - సింహము గొలుసులచే బంధిపబడుచున్నట్లు - బంధింపబడుచున్నాడు.
పరమం పౌరుషం యత్నం ఆస్థాయ ఆదాయ సూద్యమమ్।
యథా శాస్త్రం అనుద్వేగం, ఆచరన్ కో న సిద్ధిభాక్?
ఓ నిదాఘ మహాశయా! ఉత్తమ ప్రయత్నముకలవాడై, దీక్ష-పట్టుదల కలవాడై, ఉద్యమించే ఉత్సాహంతో అనుద్వేగకరంగా (unemotionally) శాస్త్రానుసారం ప్రయత్నశీలుడై ఉంటే - ఎవ్వడు మాత్రం సిద్ధి పొందడు. తప్పక పొందుతాడు.
1. ఈ సమస్తము నేనే
16. ‘‘అహం సర్వం ఇదం విశ్వం పరమాత్మా ।
అహం అచ్యుతః । న అన్యత్ అస్తి’’ - ఇతి సంవిత్త్యా
పరమా సా హి అహంకృతిః।।
(1) అహం సర్వం ఇదమ్ విశ్వమ్ - అహంకారము
పరమోత్తమపురుష-అహంకారము : ‘‘నేను-ఈ విశ్వము, ఈ సమస్తము పరమాత్మ స్వరూపమే. నేను అఖండము, సమస్తము అగు ఆత్మస్థానమునుండి ఏ క్షణమందు చ్యుతి పొందుటయే లేదు. అచ్యుతుడను. ఇంతకు వేరై తెలుసుకోవలసినది, తెలియబడవలసినదీ ఏదీ లేదు’’ - ఈ పరమోత్తమహంకారము ప్రధమమైనది.
2. ‘‘ఇదేదీ నేను కాదు’’
‘‘సర్వస్మాత్ వ్యతిరిక్తో అహం, వాలాగ్రాత్
అపి అహం తనుః।’’ ఇతి యా సంవిదో,
బ్రహ్మన్! ద్వితీయ-అహంకృతిః శుభా।।
మోక్షాయ ఏషా । న బంధాయ ।
‘జీవన్ముక్తః’ అస్య విద్యతే।।
(2) సర్వస్మాత్ పరమ్ = వ్యతిరిక్తోఽహమ్-అహంకారము
‘‘ఈ సమస్త దృశ్యముకంటే నేను వేరైనవాడను. వెంట్రుక చిట్టచివర విభాగముయొక్క సూక్ష్మభాగములో వెయ్యవవంతువలె సూక్ష్మాతిసూక్ష్మ స్వరూపుడను’’- ఇది పరమ్-అహంకారము. ద్వితీయమైన అహంకారము.
పై రెండూ జీవన్ముక్తుడు కలిగి ఉండే మోక్షరూప - బంధరహిత అహంకారములు (లేక) నిశ్చయములు. ఇరువురు జీవన్ముక్తులే.
3. ఈ శరీరమే నేను
‘‘పాణి పాద ఆది మాత్రో అహం।’’ -
ఇతి యస్య ఏష నిశ్చయః,
అహంకారః తృతీయో అసౌ।
లౌకికః తుచ్ఛ ఏవ సః। వర్జ్య ఏవ
దురాత్మా సౌ, కందః సంసార దుస్తరో ।।
(3) ఇదమ్ దేహమేవాఽహమ్ - అహంకారము
‘‘ఈ కాళ్ళు చేతులు మొదలైన విభాగములతో భౌతికంగా కనిపిస్తున్న దేహమే నేను. దీనిచే నేను పరిమితుడనై ఉన్నాను’’- ఇటువంటి నిశ్చయము (లేక) అహంకారము మూడవది. ఇది లోక-లౌకిక సంబంధమైనది. తుచ్ఛమైన (Mean) అహంకారము. ఇది సంసార మహావృక్షమునకు బీజము వంటిది. ఈ దురాత్మకమైన, దుష్టమైన అహంకారమును ఈ జీవుడు - ఎట్లాగైనా సరే - త్యజించాలి. జయించాలి.
అనేన అభిహతో జంతుః అధో అధః పరి
ధావతి, అనయా దురహంకృత్యా
భవాత్ సంత్యక్తయా చిరమ్।,
శిష్ట అహంకారవాన్ జంతుః
శమవాన్ యాతి ముక్తతామ్ ।
మూడవదగు ‘‘దేహమేవాఽహమ్’’ అహంకారము, అనేక అథో-అధః (నిమ్న) గతులకు ఈ జీవుని త్రోసుకొనిపోతూ ఉంటోంది. అందుచేత, బహుకాలము ఆయా బహువిధములైన ప్రయత్నములచేత దేహమునకు సంబంధించిన, (మరియు) దృశ్యమునకు సంబంధించిన ‘దురహంకారము’’ను శమింపజేసుకొని, ఈ జీవుడు శరీరాహంకారము నుండి ‘ముక్తుడు’ (Relieved) కావాలి. దుఃఖము తొలగటానికి వేరే ఉపాయము లేదు.
17. ప్రథమౌ ద్వ అహంకార అంగీకృత్యత్వ
లౌకికౌ, తృతీయ అహంకృతిః త్యాజ్యా
లౌకికీ దుఃఖదాయినీ ।।
అథ తే అపి సంత్యజ్య సర్వ అహంకృతి వర్జితః,
స తిష్ఠతి తధ అతి ఉచ్చైః (అత్యుచ్చైః)
పరమేవ అధిరోహతి ।।
(1) నేను - ఈ విశ్వము కూడా సర్వదా అఖండ పరబ్రహ్మస్వరూపమే.
(2) ఈ సమస్త దృశ్యమునకు పరము (Beyond) - అగు ఆత్మ (లేక) బ్రహ్మమే నేను.
అనురూపముగల ఒకటవ-రెండవ అహంకారములను అంగీకరించి, ఎంత ప్రయత్నంగానైనా సరే నిస్సందేహంగా స్వానుభూతం చేసుకోవాలి.
ఇక మూడవదగు లోకసంబంధమైన లౌకికాహంకారము త్యజించవలసియే ఉన్నది. ఎందుకంటే ఈ లౌకికమగు తృతీయాహంకారము సర్వ దుఃఖములకు ఆలవాలము. సర్వదుఃఖ ప్రదాత.
అటు తరువాత మొదట రెండు అహంకారములను కూడా వదలుచూ, సర్వాహంకార వర్జితుడు (one who left aside all kinds of Egos) అవ్వాలి. అట్టివాడు పరస్వరూపుడై, అత్యంత ఉత్కృష్టమైన పరమస్థానమును అధిరోహిస్తున్నాడు.
భోగేచ్ఛ మాత్రకో బంధః ।
తత్ త్యాగో మోక్ష ఉచ్యతే।।
మనసో అభ్యుదయో నాశో। మనోనాశో మహోదయః ।।
జ్ఞ-మనో నాశం అభ్యేతి । మనో అజ్ఞస్య హి
శృంఖలా।
ఓ నిదాఘా! భోగేచ్ఛ ఉండటమే ‘బంధము’. అట్టి భోగేచ్ఛను త్యజించి ఉండటమే ‘మోక్షము’. ఈ జీవునికి ఇంతకుమించి బంధము లేదు. మోక్షము లేదు. మనస్సుయొక్క అభ్యుదయమే (బయల్వెడలుటయే) ఈ జీవుని పట్ల నాశము - బంధము. మనోనాశమే ఈ జీవునిపట్ల మహోదయము. ఈ జీవుడు మనస్సు జయించి మహోదయుడు కావాలి. ఇదియే మోక్షమార్గము.
ఆత్మజ్ఞానికి స్వాభావికంగానే మనస్సు నశించినదై, ఆత్మతో అనన్యత్వము సంతరించుకొని ఉంటుంది. అజ్ఞానికో? మనస్సే బంధపుత్రాళ్ళు అయి కూర్చుంటుంది.
న ఆనందం, న నిరానందం,
న చలం, న అచలం స్థిరమ్,
న సత్। న అసత్। న చ, ఏతేషాం మధ్యం,
జ్ఞాని మనో విదుః।।
జ్ఞానియొక్క మనస్సు ఆనందరూపముకాదు. నిరానందరూపముకాదు. చలము కాదు. అచలము కాదు. స్థిరము కాదు. అది ఉన్నది (సత్) కాదు. లేనిది (అసత్) కాదు. మధ్య ఉండి, తరువాత లేనిది కాదు. జ్ఞాని దృష్టిలో మనస్సుకు ఉనికియే లేదు. భావన చేయటమే మనస్సుయొక్క రూపము. అంతకుమించి, మనస్సు అనబడేదేదీ లేదు.
యథా సౌక్ష్మ్యాత్ చిదాభాస్య ఆకాశో
న ఉపలక్ష్యతే, తథా నిరంశః చిత్ భావః
సర్వగో అపి న లక్ష్యతే।।
ఆకాశము అంతటా ఆక్రమించి ఉన్నప్పటికీ సూక్ష్మము కాబట్టి కంటికి కనబడదు, ఇంద్రియములకు విషయము కాదు కదా! అట్లాగే నిరంశము అగు చిత్ భావనారూపము సర్వత్రా ఆక్రమించి ఉన్నప్పటికీ - అత్యంత సూక్ష్మము కాబట్టి విషయములవలె గోచరించటము లేదు.
సర్వ సంకల్ప రహితా, సర్వసంజ్ఞా వివర్జితా,
స ఏషా చిత్ అవినాశ ఆత్మా -
‘స్వాత్మ’ - ఇత్యాది కృతా-భిదా।।
ఆకాశ శత భాగాత్‌చ, జ్ఞే షు నిష్కళ రూపిణీ,
సకల అమల సంసార-స్వరూప ఏక ఆత్మ దర్శినీ।।
సమస్త సంకల్పములచే బద్ధము కానట్టిది, సర్వ సంకల్పములు లేనట్టిది, ఎట్టి సంజ్ఞతోను చెప్పరానట్టిది, అవినాసి, సమస్త జీవుల కేవల స్వస్వరూపము - అగు తత్త్వమునకే ‘‘ఆత్మ, చైతన్యము’’ మొదలైన పేర్లతో చెప్పుకొంటున్నాము.
ఆత్మతత్త్వము ఎరిగినట్టి బ్రహ్మజ్ఞుల దృష్టిలో ‘‘ఆత్మ భౌతికాకాశము కంటే వందల వేల రెట్లు సూక్ష్మము. సర్వదా దోషరహితము (నిష్కళంకము). జీవుని నిజరూపము. ఏకము (అనేకముగా అవనిది) సంసారదోషముచే స్పృశించబడనిది’’.
18. న అస్తమేతి। న చ ఉదేతి। న ఉత్తిష్ఠతి। న తిష్ఠతి।
న చ యాతి। న చ ఆయాతి ।
న చ నేహ । న చేహ చిత్ ।
అట్టి సర్వాత్మకమగు ప్రతి జీవుని కేవల స్వస్వరూపము (లేక) చిత్ (ఎరుకరూపమగు) చైతన్యము ఉదయించదు. అస్తమించదు. లేచునది కాదు. లేచి ఎటో వెళ్లుచున్నట్టిదికాదు. ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చునది కాదు. ఇక్కడ మాత్రమే ఉన్నది కాదు. ఇక్కడ లేనిది కాదు.
స ఏషా ‘‘చిత్’’ - అమల ఆకారా, నిర్వికల్పా, నిరాస్పదా,
ఆదౌ శమ దమ ప్రాయైః గుణైః శిష్యం విశోధయేత్ ।
పశ్చాత్ సర్వం ‘ఇదం’ బ్రహ్మ శుద్ధః-,
‘‘త్వం’’ ఇతి బోధయేత్ ।।
అట్టి చిత్ చైతన్యము - సదా నిర్మలాకారము. కల్పనారహితము. నిర్వికల్పము. అది స్వానుభవమయ్యేది ఎట్లా? ఆత్మానుభావుడగు గురువును ఆశ్రయించుట చేతనే.

గురువు - మొట్టమొదట శిష్యుని శమము, దమము, తితిక్ష, ప్రాణాయామము, ప్రత్యాహారము మొదలైన గుణములను అభ్యసింపజేసి (By conditioning)- పవిత్రునిగా, ఆత్మానుభవమునకు అర్హునిగా తీర్చిదిద్దాలి. అటుతరువాత ‘‘ఈ సమస్తము బ్రహ్మమే’’ అను పరాకాష్ఠ పాఠ్యాంశమును బోధించాలి. ‘‘అట్టి బ్రహ్మము అనగా - నీవే’’ - (De-conditioning) అని సుస్పష్టపరచాలి.
అజ్ఞస్య, అర్థ ప్రబుద్ధస్య -
‘‘సర్వంబ్రహ్మ’’ - ఇతి యో వదేత్,
మహానరక జాలేషు, స తేన వినియోజితః ।।
అజ్ఞానికి, అర్ధప్రబుద్ధము (Half Enlightened) అయినట్టి శిష్యునికి మొట్టమొదటే ‘‘సర్వము బ్రహ్మమే’’ అను పరాకాష్ఠ పాఠమునందు నియోగించరాదు. అట్టి పరాకాష్ఠ బోధ అజ్ఞునికి చెప్పి నియమించటము ‘మహానరకము’ అనే చేపల వలలో త్రోయటము వంటిది అవగలదు.
ప్రబుద్ధ బుద్ధేః, ప్రక్షీణ భేగేచ్ఛస్య
నిరాశిషః, ‘‘నాస్తి అవిద్య అమలమ్’’ -
ఇతి ప్రాజ్ఞస్తు ఉపదిశేత్ గురుః।।
ఎవ్వనికి బుద్ధి ప్రబుద్ధము (Wel Awakined and highly alert) అయి ఉన్నదో, ఎవనికి దృశ్య సంబంధమైన భోగేచ్ఛ నశించినదై ఉన్నదో - అట్టివానికి ఇక ‘‘అవిద్య, మాయ అనునవి మొదలే లేవు’’ అను రూపముగల వేదాంతసార విద్యను గురువు శిష్యునికి బోధించాలి.
సతి దీప ఇవ ఆలోకః।
సతి అర్క ఇవ వాసరః ।
సతి పుష్ప ఇవ ఆమోదః ।
చితి సత్యాం (సత్త్వాం) జగత్ తథా ।
దీపము ఉంటేనే కాంతి ఉంటుంది. సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ క్రమంగా ఉంటేనే చీకటి తొలగి, జగత్ వస్తువుల ఉనికి, ఆకారములు కనిపిస్తాయి. పుష్పము ఉంటేనే సువాసన. అట్లాగే చిత్ చైతన్యము ఉంటేనే - జగత్తు, జీవుడు మొదలైన వాటికి ఉనికి.
ప్రతిభాసత ఏవ ఇదం, న జగత్ పరమార్థతః ।
జ్ఞానదృష్టౌ ప్రసన్నాయాం
ప్రబోధ వితత-ఉదయే,యథావత్ జ్ఞాస్యసి
స్వస్థో మత్ వాక్ వృష్టి బలాబలమ్।।
పరమార్థంగా చిత్ చైతన్యమే జగత్‌రూపముగా భాసిస్తోంది. అంతేగాని జగత్ అనబడుదానికి స్వకీయమైన ఉనికి లేదు.
నా ఈ వాక్యములయొక్క బలాబలములు ఏమిటో ఎటువంటివో - నీవు జ్ఞాన దృష్టిచే ప్రసన్నత సంపాదించుకొని, ప్రబోధితుడవు (Wel taught) అగుచూ ఉన్నప్పుడు - యథాతథముగా తప్పక గ్రహించగలుగుతావు.
అవిద్యయైవ ఉత్తమయా, స్వార్ధ నాశ
ఉద్యమ అర్థయా,
విద్యా సంప్రాప్యతే, బ్రహ్మన్ !
సర్వదోష అపహారిణీ ।।
శాస్త్ర విశేషాలు, గురుబోధ - ఇవన్నీ అవిద్యలోని భాగమే. ఆత్మానుభవము ఒక్కటే విద్య. అయితే శాస్త్ర - గురు ప్రతిపాదితమగు అవిద్యబోధవలననే సర్వదోష నివారణియగు ఆత్మవిద్య వికాసము పొందగలదు. స్వార్థము నశించి పరార్థము ప్రభవించగలదు. ఉత్తమ పురుషార్థము శుద్ధాంతః కరణములో ఆత్మాకార వృత్తిగా జనించగలదు.
19. శామ్యతి హి అస్త్రం అస్త్రేణ ।
మలేన క్షాళ్యతే మలమ్।
శమం విషం విషేణైతి।
రిపుణా హన్యతే రిపుః।
ఈదృశీ భూతమాయేయం
యా స్వనాశేన హర్షదా ।।
అస్త్రము అస్త్రముతోనే శమించగలదు కదా!
పాత్రకు పట్టిన ధూళి (మలము) మలముతోనే (ధూళితోనే) శుభ్రము చేస్తాము. విషము విషయతోనే శమిస్తుంది. శత్రువును శత్రుత్వముతోనే జయించగలము.
అట్లాగే మాయను మాయారూపమగు గురు-శాస్త్ర బోధలతోనే తొలగించగలము. శాస్త్ర-జ్ఞాన-గురువాక్య ప్రసాదమగు మాయా విషయములు ఈ జీవుని ఆశ్రయించిన మాయను తొలగించి, ఆ తరువాత తాము కూడా తొలగగలవు. (కాలిలో గ్రుచ్చు కొన్న ముల్లును ముల్లుతోనే తీసి, ఆ తరువాత ఆ రెండుముల్లులను విడచి వేస్తాం కాదు।)

న లక్ష్యతే స్వభావో అస్య। వీక్ష్యమాణైవ
నశ్యతి। నాస్తి ఏషా పరమార్థేన
ఇతి ఏవం భావన యేద్ధయా ।।
‘‘సర్వం బ్రహ్మ’’ ఇతి యస్య అంతః భావనాం
సా హి ముక్తిదా। భేద దృష్టిః అవిద్యేయం ।
సర్వథా తాం విసర్జయేత్ ।
యా మా సా మాయా।
విచారణచేసి చూస్తే ‘మాయ’ అనునది ఎక్కడ ఉన్నది? యా మా - మొదలే లేదు. దాని స్వరూప-స్వభావములు అధ్యయనము చేయ ప్రారంభించగానే, పరమార్థ దృష్టికి మాయ మొదలే లేనిదై నశిస్తోంది. ‘మాయ యదార్థానికి లేదు’ అని భావించినంత మాత్రంచేత ‘లేనిదే’ - అగుచున్నది.
‘‘సర్వము సర్వదా బ్రహ్మమే’’ - అను భావనను అంతరమున (In the Heart of Heart) జనించగానే, అది ముక్తిప్రదాత అగుచున్నది.
ఏకము-అఖండము అగు ఆత్మదర్శనమే ‘విద్య’. భేద దృష్టియే ‘అవిద్య’! అందుచేత అవిద్యను సర్వదా విసర్జిస్తూనే ఉండాలి.
మునే! న అసాధ్యతే తద్ధి పదం ‘‘అక్షయమ్’’ ఉచ్యతే ।
‘‘కుతో జాతేయమ్?’’ ఇతి తే, ద్విజ।
మ అస్తు విచారణా।।
‘‘ఓ మునీశ్వరా! నిదాఘా! మాయకు ఆవలగల అక్షయపదము అసాధ్యము కాదు. ప్రయత్నశీలునకు సులభసాధ్యమే’’ అని అద్దానిని సిద్ధించుకొన్నవారిచే ప్రవచించబడుతోంది.
ఓ ద్విజోత్తమా! ‘‘మాయ ఎట్లా వచ్చింది?’’ అనే విచారణను ప్రక్కకు పెట్టు. ‘‘మాయ ఎట్లా తొలగుతుంది?’’ అనే విచారణ చేయి. మొదలే లేనిది ‘‘ఎట్లావచ్చింది?’’ అనే చర్చ దేనికి?
20. ‘‘ఇమాం కథం అహం హన్మి?’’
ఇతి ఏషా తే అస్తు విచారణా
అస్తం గతాయాం క్షీణాయాం
అస్యాం జ్ఞాస్యసి తత్ పదమ్।।
ఓ ప్రియ నిదాఘా! ‘‘నేను ఈ మాయను ఎట్లా నశింపజేయగలను?’’ అనునదే ముఖ్యము. అదియే నీవు చేయవలసిన విచారణ. అంతేగాని ‘‘మాయ ఏ చోటినుండి వచ్చింది? ఎక్కడికి పోతోంది?’’ - అని కాదు. ఆ విచారణ అనవసరం. మాయను క్షీణింపజేస్తూ ఉండగా అట్టి విచారణ - అభ్యాసముల ప్రభావము చేత మాయ తనకుతానే తోకముడుస్తుంది. అక్షయమగు తత్ పదము స్వాభావసిద్ధము కాగలదు. వెలుగు వస్తే, ఇక చీకటి ఉండదు కదా। ఏదైతే స్వతఃగా లేదో, ఇక అది ఎందుకు ‘‘ఎందుకు ఎట్లా వచ్చింది?’’ - అనే ప్రశ్న ఎక్కడిది?
‘‘యత ఏషా?, యథా చ ఏషా? యథా
నష్టా?’’ - ఇతి అఖండితమ్, తత్ అస్య అరోగ
శాలాయా, యత్నం కురు చికిత్సనే।।
యథా ఏషా జన్మ దుఃఖేషు, న భూయః
త్వాం నియోక్ష్యతి ।
స్వ ఆత్మని స్వ పరిస్పందైః స్ఫురతి
యచ్ఛైః చిత్ అర్ణవః ।।
ఒక రోగము వచ్చినప్పుడు ‘‘అది ఎట్లా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏ విధంగా నశిస్తుంది?’’ - ఈ విషయాలన్నీ చికిత్స చేస్తూ ఉండగా తెలిసిపోతూ ఉంటాయి కదా! అరోగ్యశాల(Hospital)కు వెళ్ళి ‘‘ఎందుకు వచ్చిందో ముందు చెప్పండి?’’ - అంటామా? మరి చికిత్సను ఆశ్రయించకుండా కేవలం చర్చిస్తూ కాలయాపన ఎందుకు?

అట్లాగే మాయను దాటివేసి ఆత్మజ్ఞానము - ఆత్మభావనవైపుగా అభ్యాసము కొనసాగుచుండగా ‘‘జన్మ, దుఃఖము, దృశ్యబంధము’’ ఇవన్నీ వాటి వాటి ఉత్పత్తి వినాశనములతో సహా (అజ్ఞానము వలననే - అని) తెలిసిపోతుంది. ఆత్మజ్ఞాన ఔషధముచే అవన్నీ మరల ఉత్పత్తి పొందవు. ఈ జగత్తు అనబడునది ఆత్మయొక్క స్వకీయస్పందనగా, ఆత్మయందే బయల్వెడలి, ఆత్మయందే ప్రవర్తించి ఆత్మయందే (సముద్రజల తరంగమువలె) లయిస్తోందని సుస్పష్టమౌతుంది.
‘‘ఏక ఆత్మకం, అఖండం - తత్’’ - ఇతి
అంతర్భావ్యతాం దృఢమ్ ।। కించిత్ క్షుభిత
రూపా, సా చిత్ శక్తిః చిత్ మహార్ణవే ।।
తన్మయ ఏవ స్ఫురతి యచ్ఛా, తత్ర ఏవ
ఊర్మిః ఇహ ఆర్ణవే, ఆత్మని ఏవ
ఆత్మనా వ్యోమ్ని యథా సరతి మారుతః ।।
ఓ నిదాఘా! తత్ ఆత్మ సర్వదా అఖండమని, సమస్తము ఆత్మాత్మకమేనని అంతరమున దృఢభావనను ఆశ్రయించు. సముద్రంలో కించిత్ స్పందనచే తరంగములు బయల్వెడలునట్లు, ఆత్మయందు కించిత్ స్పందనా రూపములే ఈ జగత్ నామ పరంపరలన్నీ కూడా।
సముద్ర జలంలో జలమే తరంగములుగా స్ఫురిస్తున్న తీరుగా ఛిద్రూపమునందు ఛిద్రూపమే స్ఫురిస్తూ ఉంటుంది. సముద్రజలంలో జలమే, జలతరంగాలుగా, వాయువునందు వాయువే వాయుతరంగములుగా స్ఫురించు విధంగా ఆత్మాకాశమునందు ఆత్మాకాశమే జగత్ - జీవాత్మలుగా స్ఫురిస్తోంది.
21. తథైవ ఆత్మా ఆత్మ శక్త్యైవ
స్వ ఆత్మని ఏవ ఏతి లోలతామ్ ।
క్షణం స్ఫురతి సా దేవీ, సర్వశక్తి తయా తథా।
దేశ కాల క్రియా శక్తిః న యస్యాః సంప్రకర్షణే।
నీయొక్క చిత్ చైతన్యమే (లేక, ఆత్మయే) శక్తిదేవీ రూపము దాల్చి జగత్తుగా ప్రదర్శనమగుచున్నది. అట్టి దేవి సర్వశక్తిస్వరూపమైయున్నది. అనుక్షణము మహోన్నతమగు ఆ దేవీ తత్త్వములో ‘‘దేశ,కాల,క్రియలు’’-అద్దములో ప్రతిబింబమువలె -స్ఫురిస్తున్నాయి. వాస్తవానికి అవి ఏవీ ఉండనట్టి ఆదిస్వరూపమే చిచ్ఛక్తి.
స్వస్వభావం విదిత్వా ఉచ్ఛైః, అపి అనంత పదే స్థితా,
రూపం పరిమితే న అసౌ భావయతి అవిభావితా। (తథా)।
నీ స్వస్వభావముయొక్క ఔన్నత్యమును (లేక - పరస్వరూపమును) - సమస్తమునకు ఆవల (ఉచ్ఛస్థానము అగు) అనందపదమునందు సంస్థితమైనదిగా దర్శించుము. ఇక ఈ పరిమితమగు నామరూపములను ‘‘భావన సహాయంతోనే అభావించి వేయుము. రూపనామముల పట్ల అభావితుడవై ‘‘ఆత్మభావన’’ చేయుచూ ఉండుము. ఆత్మత్త్వమును సర్వదా వీడనివాడవై ఉండుము.
యదైవం భావితం రూపం తయా
పరమకాంతయా, తదా ఏవ ఏనాం
అనుగతా నామ సంఖ్యాది కా దృశః।।
చిచ్ఛక్తి ఏది ఏ రూపమున ఏ విధంగా భావిస్తే ఆ భావనయే దేశ - కాల- క్రియాదుల రూపముగా, ఆయా నామ సంఖ్యాదులుగా ఆయా రూపములను పొందుతూ, (చిచ్ఛయే) ధరిస్తున్నది. చిచ్ఛక్తియే దృశ్యముగా ద్రష్టగా ఆస్వాదన చేయుచున్నది-అగుచున్నది కూడా!
అనగా, నీ స్వరూపాత్మయొక్క భావనాశక్తి ప్రదర్శనమే ‘జగత్తు’గా అనుభవైకవేద్యము అగుచున్నది.
వికల్ప కలిత ఆకారం, దేశ కాల క్రియాస్పదమ్।
చితో రూపం ఇదం, బ్రహ్మన్!
‘‘క్షేత్రజ్ఞ’’ ఇతి కథ్యతే।।
వాసనాః కల్పయన్నోఽపి
యాతి ‘అహం’ కారతాం పునః।
అహంకారో వినిర్ణేతా
కళంకీ ‘‘బుద్ధిః’’। ఉచ్యతే।
బుద్ధిః సంకల్పత ఆకారా
ప్రయాతి మననాస్పదమ్।।
క్షేత్రజ్ఞుడు : హే బ్రహ్మన్! విచ్ఛక్తి యొక్క వికల్పన (విశేషమైన కల్పన / స్వరూపభావననుండి ఏమరుచునప్పటి సందర్భము) నుండియే దేశ-కాల-క్రియలు స్పందిస్తున్నాయి. కనుక ఈ సమస్తము చిత్ రూపమే! స్వకీయమగు ఎరుక యొక్క విన్యాసమే ఈ (అన్యముగా అనిపిస్తూ ఉన్న) ఎరుగబడేదంతా కూడా! ఎరుగుచున్నవాడే ‘‘క్షేత్రజ్ఞుడు’’.

అహంకారము : ఆ విధంగా ఆత్మనుండి వికల్పనా విశేషములగు దేశ-కాల-క్రియాస్పందనల అభిమాని అగు క్షేత్రజ్ఞుడు - వాసనలు (Tendencies) కారణంగా ‘అహంకార సహితుడు’ అగుచున్నాడు.

బుద్ధి : బాహ్యమునకు సంబంధించిన ఇష్ట-అయిష్ట, సామాన్య, విశేష…ఇత్యాది నిర్ణయాత్మక భావనలు వాసనలు (Tendencies) గా అగుచున్నాయి. ఆ వాసనల గురించి ‘అహంకారము’ యొక్క నిర్ణయాత్మకతయే - బుద్ధి.

మనస్సు : బుద్ధి సంకల్పముల ఆకారము పొందుటచే (మనన స్పందనముచే) ‘మనస్సు’ నిర్మితము అగుచున్నది.
22. మనో ఘన వికల్పం తు
గచ్ఛతి ఇంద్రియతాం శనైః।
పాణి పాదమయం
దేహం ఇంద్రియాణి విదుః బుధాః।
ఏవం జీవో హి సంకల్ప-వాసనా రజ్జు వేష్టితః।
దుఃఖజాల పరీతాత్మా క్రమాత్ ఆయాతి నీచతాం।।
ఇతి శక్తిమయం చేతో ఘన-అహంకారతాం
‘కోశకార క్రిమిః’ ఇవ స్వేచ్ఛయా
యాతి బంధనమ్।।
మనస్సుయొక్క ఘనీభూత వికల్పమే నెమ్మదిగా ‘ఇంద్రియరూపములు’గా అగుచున్నది.
ఇక కళ్ళు, కాళ్లు, చేతులు మొదలైన కర్మేంద్రియ జ్ఞానేంద్రియ విశేషములు ప్రదర్శనమగు స్థానమే (లేక) పురమే ఈ దేహము. ఇదియే దేహపురము (లేక) పుర్యష్టకము అని బుధులు ఎరిగి ఉంటున్నారు. ఈ విధంగా చిచ్ఛక్తి సంకల్పవాసనామయములగు త్రాళ్ళతో సంబంధరూపబంధము కలిగియుండగా ‘జీవుడు’ అని పిలువబడుచున్నది.

అట్టి జీవుడు అంతులేని దుఃఖముల వలలో చిక్కుకొని పర్యవసానంగా స్వస్వరూప దురవహనవా రూపములగు నీచస్థానములు పొందుచున్నాడు.

ఈ విధంగా అనంతశక్తిమయుడు, చేతనరూపుడు, కేవలాత్మస్వరూపుడు - అగు పరమాత్మ- ఘనమైన ‘నేను-నేను వేరు’ అను అహంకారమును ఆశ్రయించి, పాత్రలోపల (కోశము నందు) చిక్కుకొన్న చీమ వంటి క్రిమికీటకమువలె తనకు తానే ఇంద్రియ విషయముల బంధనములలో చిక్కుకొనుచున్నాడు.
స్వసంకల్పిత తన్మాత్ర జాల అభ్యంతర
వర్తి చ, పరాం వివశతాం ఏతి
శృంఖలాబద్ధ సింహవత్।।
క్వచిత్ ‘‘మనః’’, క్వచిత్ ‘‘బుద్ధిః’’, క్వచిత్ ‘‘జ్ఞానం’’,
క్వచిత్ ‘‘క్రియా’’, క్వచిత్ ఏతత్ ‘‘అహంకారః’’
క్వచిత్ ‘‘చిత్తమ్’’ - ఇతి స్మృతమ్। క్వచిత్ ‘‘ప్రకృతిః’’
ఇతి ఉక్తం। క్వచిత్ ‘‘మాయ’’ ఇతి కల్పితమ్।।
పరస్వరూపమగు ఆత్మపురుషుడే స్వయముగా భావనామాత్రంగా కల్పించుకొన్న తన్మాత్రల (శబ్ద-స్పర్శ-రూప-రస-గంధముల) వల లోపలగా చిక్కుకొని, వివశమై - బోనులో చిక్కుకొన్న సింహము వలె - తన్మాత్రల మధ్యగా అటూ - ఇటూ తిరుగుచున్నాడు. జీవుడుగా అయి, పరాధీనుడై ఉంటున్నాడు. నిత్యముక్తుడగు పరమాత్మ - నిత్యబద్ధునివలె అగుచున్నాడు.

ఈ విధంగా అనంతశక్తిరూపమగు చిచ్ఛిక్తియే-కొంత మనస్సుగా, కొంత బుద్ధిగా, కొంచెము జ్ఞానము రూపంగా, కొంత అహంకారము రూపంగా, కొంత చిత్తము రూపముగా ప్రదర్శనమౌతోందని గమనించు. ఆ చిచ్ఛక్తియే కొంత ‘ప్రకృతి’గాను, కొంత మాయగాను - కల్పితము అగుచున్నది.
క్వచిత్ ‘‘మలం’’ ఇతి ప్రోక్తం । క్వచిత్ ‘‘కర్మ’’
ఇతి సంస్మృతమ్।। క్వచిత్ ‘‘బంధ’’ ఇతి
ఖ్యాతం। క్వచిత్ ‘‘పురి-అష్టకం’’ స్మృతమ్।
(‘‘పుర్యష్టకమ్’’ స్మృతమ్)।
ప్రోక్తం క్వచిత్ ‘‘అవిద్య’’ ఇతి,
క్వచిత్ ‘‘ఇచ్ఛా’’ ఇతి సంమతమ్।।
ఇంకా కూడా ఒకప్పుడు మల దోషము (అరిషట్ వర్గ రూపం)గాను, మరికొంత ‘కర్మ’ రూపంగాను ఆత్మయే ప్రదర్శనమౌతోంది.
కొంతసేపు ‘బంధము’ అనబడుతోంది. ఒకప్పుడు పుర్యష్టకముగా పంచభూతములు, మనో-బుద్ధి చిత్తముల కలయికారూపముగా ప్రదర్శనమగుచున్నది. అదియే ఒకప్పుడు అవిద్యగాను, ఇంకొకప్పుడు ‘ఇచ్ఛ’గాను, రూపము దాల్చుచున్నది. ఈ విధంగా మనస్సు, బుద్ధి, జ్ఞానము, క్రియ, అహంకారము, చిత్తము, ప్రకృతి, మాయ, మలము, కర్మ, బంధము, పుర్యష్టకము, అవిద్య, ఇచ్ఛారూపములుగా చిచ్ఛక్తియే తనయొక్క చేతన ప్రదర్శనచే సంప్రకటితమౌతోంది.
23. ఇమం సంసారం అఖిలమ్
ఆశాపాశ విధాయకమ్,
దధ దంతః ఫలైః హీనం
వట ధానావటం యథా ।।
‘చింతా’ అనల శిఖా దగ్ధం ।
‘కోప’ అజగర చర్వితమ్ ।
‘కామ’ అబ్ధి కల్లోల రతం,
విస్మృత ‘‘ఆత్మ పితామహమ్’’ ।।
సముద్ధర మనో, బ్రహ్మన్। మాతంగం ఇవ
కర్దమాత్। ఏవం జీవాః చితో భావా
భవ భావనయా హి తాః ।।
చిన్నదిగా కనిపించే ఒక చిన్న మఱ్ఱి విత్తనము మొలకెత్తిన కాలక్రమేణా ఒక పెద్ద మఱ్ఱి వృక్షముగా విస్తరిస్తూ ఉన్నది కదా! అట్లాగే, చిచ్ఛక్తితో బయల్వెడలిన ‘ఆశ’- అనే ఒక చిన్న స్వయంకల్పిత స్ఫురణ - ఈ జన్మ జన్మాంతరములతో కూడిన సువిశాల మహా సంసార రూపముగా విస్తరణమౌతోంది.
హే బ్రహ్మమే స్వస్వరూపము కలిగియున్నట్టి బ్రహ్మన్! ఈ భావనా - ఆలోచనా రూపమగు మనస్సు
→ అసంఖ్యాక ‘చింతలు’ అనే అగ్ని శిఖలచే దగ్ధం అవుతోంది.
→ ‘కోపము’ అనే కొండచిలువచే మ్రింగబడుచూ ఉన్నది.
→ ‘కోరికలు’ అనే కల్లోలమైన సముద్రతరంగములలో చిక్కుకుని తిరుగాడుచున్నది.
ఈ విధంగా తన జనన స్థానమగు ‘‘ఆత్మపితామహస్థానము’’ను పూర్తిగా ఏమరచి ఉంటున్నది.
బురదలో చిక్కుకున్న ఏనుగువలె - ‘విషయములు’ అనే లంపటములో మనస్సు చిక్కుకొన్నది. మరి ఆత్మచైతన్యస్వరూపుడవగు నీవు చూస్తూ ఊరుకోవటమేమిటి? ఈ మనస్సును విషయములనుండి సముద్ధరించాలి.
బ్రహ్మణా కల్పిత ఆకారా, లక్షశో అపి,
అధ కోటిశః, సంఖ్య-అతీతాః పురా జాతా
జాయంతే అద్యాఽపి చ అభితః।।
ఉత్పత్స్యన్తే అపి చ ఏవ
అన్యే కణౌఘా ఇవ నిర్ఘరాత్, కేచిత్ ప్రథమ
జన్మానః। కేచిత్ జన్మ శతాధికాః ।
కేచిత్ చ అసంఖ్య జన్మానః ।
కేచిత్ ద్వి-త్రి భవాంతరాః ।
జీవుడు ఇంద్రియములను ఉపయోగిస్తూ, దృశ్యమును స్వయముగా కల్పించుకొన్నదై ఉండగా - ‘ఇదంతా నిజమై ఉన్నది’ అను భవబంధము ఏర్పడుచున్నది. భావనలే అసంఖ్యాక తరంగరూపమల రూపము దాల్చి ‘భవసాగరము’ అగుచున్నది. ఆత్మస్వరూపుడే అయి ఉండి కూడా ఈ జీవుడు భవబంధములలో చిక్కుకొని ఉంటున్నాడు.
‘‘ఇదంతా నిజమే’’ అను భావనలు బంధములై, భావసాగరంగా అవుతోంది.
ఈ భవభావములన్నీ ‘‘సమిష్టిసూక్ష్మ దేహాభిమాని’’ - అగు హిరణ్యగర్భునిచే అనేక ఆకారములుగా గుణ-మిశ్రమములు కల్పించబడి - లక్షల -కోట్లు అసంఖ్యాకముగా ప్రకటనమగుచున్నాయి.

ఈ అనేక రూప-నామ-గుణములతో కూడిన వివిధత్వము గల జీవరాసులు సృష్టి ప్రారంభంలోనే ఏర్పడి, సృష్టి యొక్క అంతమువరకు ఉండియే ఉంటున్నాయి. కొన్ని కణములుగా జనించి, కణములుగానే ఉంటున్నాయి. వీటిలో కొన్ని జీవదేహములుగా ఇప్పుడే పుట్టుచున్నాయి. మరికొన్ని ఈ దృశ్యజగత్తులో వందలాది జన్మలు, మరికొన్ని అసంఖ్యాక జన్మలు, కొన్నికొన్ని కొద్ది జన్మలే (రెండు, మూడు జన్మలు) కలిగి ఉంటున్నాయి.
కేచిత్ కిన్నర గంధర్వ విద్యాధర మహోరగాః ।
కేచిత్ అర్క ఇందు వరుణాః
త్ర్యక్షాః అధోక్షజ పద్మజాః ।।
కేచిత్ బ్రాహ్మణ - భూపాల - వైశ్య-శూద్రగణాః స్థితాః।
కేచిత్ తృణ ఔషధీ వృక్ష ఫలమూల పతంగకాః ।
కేచిత్ కదంబ జంబీర
సాల తాల తమాలకాః ।
కేవలాత్మ భగవానుని నుండి బయల్వెడలిన సృష్ట్యభిమానియగు హిరణ్యగర్భునియొక్క సృష్టి సంకల్పరూపములు - కొన్ని కిన్నెరులుగా, కొన్ని గంధర్వులుగా, విద్యాధరులుగా, మహాసర్పములుగా, మరికొన్ని సూర్య-చంద్ర-వరుణ మొదలైన అష్టదిక్పాలకులుగా, ఇంకా కొన్ని బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులుగా అగుచున్నాయి.
అట్టి సృష్టి కల్పనాభావములలో కొని బ్రాహ్మణ-భూపాల (క్షత్రియ) -వైశ్య (గోపాలక) శూద్ర (సేవాస్వభావ) గణములుగా స్థితి పొందుచున్నాయి. ఇంకా కొన్ని సంకల్పములు (లేక) భవాభావములు, తృణములు (గడ్డి)గాను, ఓషధులు (ఆహార ధాన్యములు ఇత్యాది)గాను, వృక్ష-ఫలములుగాను,
కొన్ని కంద-జంబీర-సాల-తాల-తమాల వృక్షములుగా అగుచున్నాయి.
24. కేచిత్ మహేంద్ర మలయ సహ్య మందర మేరవః
కేచిత్ క్షారో దధి, క్షీర ఘృత ఇక్షు జలాశయః ।
ఇంకొన్ని మహేంద్ర-మలయ-సహ్య-మందర, పర్వతములుగా,
కొన్ని భావనా తరంగములు క్షార (ఉప్పు) సముద్రముగా, మరికొన్ని పాలు-నేయి-తీయటి -చెఱకు రస జలాశయములుగా అగుచున్నాయి.
కేచిత్ విశాలాః కకుభః। కేచిత్ నద్యో
మహారయాః, విహరన్తి ఉచ్చకైః కేచిత్।
నిపతన్తి, ఉత్ పతన్తి చ।।
కన్దుకా ఇవ హస్తేన మృత్యునా అవిరతం హతాః,
భుక్త్వా జన్మ సహస్రాణి, భూయః సంసార సంకటే।
పతన్తి కేచిత్ అబుధాః సంప్రాప్య అపి వివేకతామ్।।
ఆత్మ పురుషుని నుండి మూల భావనగా జనించిన సృష్టికర్త యొక్క కేవలాత్మానంద స్వరూపమునుండి భావనారూపంగా జనించిన కొన్ని భావనాతరంగాలు: -
🦜 విశాల అష్టదిక్ దృశ్యములుగాను, కొన్ని తీవ్ర తరంగములు ప్రదర్శించే నదులుగాను, (కకుభము = దిక్కు)
🦜 కొన్ని భావనాతరంగాలు ఆకాశములలో విహరించే విహంగాలు (పక్షులు)గాను.
🦜 కొన్ని ఎగురుచూ, వ్రాలుచూ, నడుచుచూ ఉండే పక్షులుగాను అగుచున్నాయి.
సృష్టి కల్పనాభావనా తరంగములే అసంఖ్యాక రూపములుదాల్చి సృష్టిరూపదృశ్యముగా ప్రదర్శనమగుచున్నాయి.

ఈ విధంగా అనంతప్రకారములైన భావములై, అసంఖ్యాక రూపములుగా ధరించుచూ ఉన్నాయి. చేతులు ఇటు నుండి అటు, అటునుండి ఇటు కదలు విధంగా, ఈ వివిధ రకములుగా జనించిన జీవులు మరణము పొందుచున్నారు. మరణించి కూడా విరామము పొందక, తిరిగి జన్మించటం - (పునఃపునః జన్మించటం - మరణించటం - ‘పునర్జన్మ’) ఇవన్నీ పొందుచూ వేలాది జన్మలుగా మరల మరల సంసార సంకటములలో కూలుచున్నారు. కొందరు జీవులు వేలాది లక్షలాది జన్మపరంపరలు పొందుచూ, వివేకులు అయి ఉండి కూడా, అజ్ఞానులై జన్మ పరంపరలతో తిరుగాడుచున్నారు.
దిక్ కాలాది అనవచ్ఛిన్నం ఆత్మతత్త్వం స్వశక్తితః
లీలయైవ యదా దత్తే దిక్-కాల కలితం వపుః।
తదేవ జీవ పర్యాయ వాసన- ఆవేశతః పరమ్।
మనః సంపద్యతే లోలం కలన - అకలన ఉన్ముఖమ్। కలయన్తీ మనః శక్తిః ఆదౌ భావయతి క్షణాత్।।
కొందరు, వివేకులు అయి ఉండి కూడా, ఆత్మతత్త్వమును ఎరుగుచూ కూడా అనుభవమును సుస్థిరీకరించుకోకుండా,…..తెలిసి తెలిసి దిక్-కాలములతో కూడిన దృశ్య జగత్తులో భౌతిక దేహములను ఆశ్రయిస్తూ మరలమరల భవసాగరములో పడుచున్నారు.

ఆహా◖! చిచ్ఛక్తి యొక్క ‘‘లీలా వినోదమా ఏమి?’’ - అని అనిపించే తీరుగా సృష్టియొక్క (లేక) సృష్టికర్త యొక్క భావనా రూపులగు జీవులు అనేక దేశ - కాల - పరిధులలో ప్రవేశ - నిష్క్రమణములు నిర్వర్తిస్తున్నారు.

ఈ విధంగా కేవలము, నిత్య నిర్మలము, సమస్తమునకు పరము-అగు చిచ్ఛక్తి ‘జీవులు’ అనే పర్యాయము (Transformation)ను వాసనావేశముచే పొందటము జరుగుతోంది. చిచ్ఛక్తియే ‘జీవుడు’ అని మరొక పేరును సంతరించుకోవటం జరుగుతోంది. చిచ్ఛక్తియొక్క సమక్షంలోనే స్వకీయప్రేరణాశక్తి చేత సంకల్ప-వికల్పములకు, కల్పన-అకల్పనలకు ఉన్ముఖమై ‘మనస్సు’ ఆవిర్భవిస్తోంది. అప్పుడు ఆ మనోశక్తి సమస్తమును భావనాత్మకంగా పొందటము జరుగుతోంది.
25. ఆకాశ భావనా మచ్ఛాం శబ్ద బీజ రస-ఉన్ముఖీమ్।
తతః తత్ ఘనతాం యాతం ఘనస్పన్ద క్రమాత్ మనః।।
భావయతి అనిల స్పన్దం, స్పర్శ బీజ రస ఉన్ముఖమ్ ।
తాభ్యాం ఆకాశ వాతాభ్యాం
దృఢ అభ్యాస వశాత్ తతః ।।
మనస్సే → ఆకాశముయొక్క భావనచే (ఆకాశకల్పనచే) ఆకాశమును పొందుచూ ఆకాశమునందు శబ్ద బీజముగా ఉన్ముఖము (directed) అగుచున్నది. అట్టి ఆకాశబీజ ఉన్ముఖత్వము (Diversion as a seed to space) నుండి మనస్సే ఘనీభూతమై, స్పందము అను రసము (Responsiveness) రూపుదాల్చుచున్నది.
ఆ తరువాత మనస్సే ‘స్పర్శ’ (Sense of touch)ను బీజరసస్వరూపముగా కలిగియున్న వాయువుగా ఉన్ముఖము అగుచున్నది.
శబ్ద స్పర్శ స్వరూపాభ్యాం సంఘర్షాత్ జన్యతే అనలః ।
రూప తన్మాత్ర సహితం త్రిభిః తైః సహ సమ్మితమ్
మనస్తా దృక్ గుణగతం రస తన్మాత్ర వేదనమ్।
క్షణాత్ చ ఏతత్ అపాం శైత్యం
జలం సంవిత్ తతో భవేత్ ।।
అట్టి మనస్సుయొక్క ఆకాశ-వాయుస్వరూపముల (స్వకీయమైన) దృఢాభ్యాస వశంగా….అద్దాని శబ్ద-స్పర్శ-రూప అభ్యాసముల సంఘర్షణ నుండి జలము (Liquid) జనించుచున్నది.
శబ్దస్పర్శరూపముల మూడిటి సాన్నిహిత్యముచే వాటి సమ్మేళన ఫలితంగా మనస్సుయొక్క‘దృక్’ గుణ విస్తరణచే మనస్సుకు అనన్యమైనట్టి ‘రసతన్మాత్ర’ రూపము దిద్దుకుంటోంది.
క్షణకాలంలో ఆ ద్రవతత్వమగు జలము సంవిత్ (మనస్సు)యొక్క స్పర్శచే శైత్యము (శీతలత్వము) పొందుచున్నది.
తతః తాదృక్ గుణగతం మనో భావయతి క్షణాత్ ।
గంధ తన్మాత్రం ఏతస్మాత్ భూమి సంవిత్ తతో భవేత్।।
అథ ఇత్థం భూత తన్మాత్ర వేష్టితః తనుతాం జహత్ ।
వపుః వహ్ని కణ - ఆకారం స్ఫురితం వ్యోమ్ని పశ్యతి ।।
మనస్సు శబ్ద-స్పర్శ-రూప-రసములను సమీకరించుకొన్న సుదీర్ఘ భావనచే ‘గంధతన్మాత్ర’ను ప్రదర్శనము చేయు ‘భూసంవిత్’ (solid) రూపము దాల్చుచున్నది. అప్పుడు మనస్సు (మనో అనన్యమైనట్టి) భూతన్మాత్రయొక్క రూపమగు ఈ జగత్తును పొందుతోంది.
ఈ విధంగా మనస్సు శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములనబడే పంచతన్మాత్రలతో మమేకము పొందినదై, ఆకాశముతో అగ్నికణాకారముగా కనిపించు రూపము యొక్క అనుభవమువలె పుణికి పుచ్చుకుంటోంది.
26. అహంకార కలాయుక్తం, బుద్ధి బీజ సమన్వితమ్,
తత్ ‘‘పుర్యష్టకం’’ - ఇతి ఉక్తం-
భూత హృత్‌పద్మ షట్‌పదమ్।
ఈ మనస్సు - పంచతతన్మాత్రలుగా ప్రదర్శనమగుచూ తనకు ‘అన్యము’ వలె వాటిని ఆస్వాదించుచూ ఉంటోంది. అట్టి మనస్సు ‘‘అహంకారము’’తో కూడి తనయందు ‘బుద్ధి’ అనే బీజము కలిగియున్నప్పుడు ఇష్ట-అయిష్టరూపములతో సహా (పంచతన్మాత్రలు +బుద్ధి+చిత్తము+ అహంకారము కలిసి) మనస్సు ‘పుర్యష్టకము’గా చెప్పబడుచూ-పద్మములో తుమ్మెదవలె- హృదయములో సంచారము కలిగి ఉంటోంది.
తస్మింస్తు తీవ్ర సంవేగాత్ భావయత్ భాసురం వపుః,
స్థూలతాం ఏతి పాకేన మనో బిల్వఫలం యదా ।
మూషాస్థ ద్రుత హేమాభం స్ఫురితం విమల అంబరే,
సన్నివేశం అథా దత్తే తత్ తేజః స్వ స్వభావతః।
అప్పుడు - పద్మములోని తుమ్మెద చేయు ‘ఝం’కార నాదమువలె -పుర్యష్టకము హృదయములో (మననము-కారణంగా) స్థూలదేహరూపము దాల్చుచున్నది. బిల్వఫలములాగా (పుష్పము లేకుండానే కాయ ప్రదర్శనమగుచున్నట్లు) మనోసంకల్పమే స్థూలాకారమువహిస్తోంది. మూసలో కరిగించిన బంగారములాగా పరిశుద్ధ-ఆకాశములో సౌందర్య శోభతో మనస్సుయొక్క స్వస్వభావంగా ఒక ‘‘తేజస్సు’’ ఏర్పడుతోంది.
ర్ధ్వం శిరః పిండమయం। అధః పాద మయః తథా।
పార్శ్వయోః హస్త సంస్థానం ।
మధ్యే చ ఉదర ధర్మిణమ్।
కాలేన స్ఫుటతాం ఏతి అభవతి అమల విగ్రహమ్।
బుద్ధి సత్వ బల-ఉత్సాహ-విజ్ఞాన-ఐశ్వర్య సంస్థితః।।
స ఏవ భగవాన్ బ్రహ్మా, సర్వలోక పితామహః।
అవలోక్య వపుః బ్రహ్మా కాన్తం ఆత్మీయమ్ ఉత్తమమ్।।
ఆ మనోభావితమగు తేజస్సు తనకు తానే ఒక ఆకారమును ధరిస్తోంది. అదే మనస్సుయొక్క మూర్తీవిభవము. ఆ మూర్తీవిభవమునకు
- ఊర్ధ్వంగా (upper part) శిరస్సుయొక్క రూపము.
- క్రిందివైపుగా పాదముల రూపము
- ప్రక్కగా రెండు చేతులు
- మధ్యగా పొట్ట విభాగము. ఆయా పొట్టలోని ‘జీర్ణము’ మొదలైన ధర్మము.
కాలక్రమంగా అట్టి ‘‘శిరస్సు-పాదములు-చేతులు-పొట్ట’’ - ఇవన్నీ కలిగియున్న రూపము ప్రస్ఫుటమై నిర్మలవిగ్రహము రూపుదిద్దుకుంటోంది. ఈ విధంగా మూర్తీభవించిన ఈ దేహమునందు బుద్ధిబలము, సత్త్వ (సాత్త్విక/సత్‌స్వరూప) ఉత్సాహ విజ్ఞాన ఐశ్వర్యము (మనోప్రదర్శనంగా) సంస్థితమై ఉన్నాయి.

ఆ విధంగా పుర్యష్టకములోను, తేజోరూపుడుగాను ప్రదర్శనమగు ఆతడే సర్వలోక పితామహుడగు ‘బ్రహ్మ’.
అట్టి సృష్టికి కర్త కాబోవుచున్న బ్రహ్మ ఉత్తమ-ప్రాకృతరూపమగు స్వశరీరమును అవలోకనము చేసుకొనుచున్నారు.
ఆ చతుర్ముఖ బ్రహ్మ భగవానుడు -
త్రికాలములను ఎరిగినవాడు (భూత వర్తమాన భవిషత్ రూప త్రికాలజ్ఞుడు), నిర్మలదర్శనుడు.
27. చిన్తాం అభ్యేత్య భగవాం(స) త్రికాల అమల దర్శనః,
ఏతస్మిన్ పరమ ఆకాశే, చిన్మాత్ర ఏకాత్మ రూపిణీ।
అదృష్ట పార పర్యన్తే ప్రథమం ‘‘కిం భవేత్ ఇతి?’’।
ఇతి చిన్తితవాన్ బ్రహ్మా, సద్యోజాతా, అమలాత్మదృక్।।
చిన్మాత్రము (కేవలమగు ఎరుక తెలివి స్వరూపము), ఏకాత్మ రూపిణి, అద్వితీయము అగు ఆత్మయే-ప్రప్రథమ శరీరము ధరించింది. స్వకీయ రూపము అయినట్టిది, అది - అంతము తెలియరానిది అగు ప్రప్రథమ శరీరమును చూచుకొని ‘‘ఇది ఏమైయున్నట్టిది? - అని ఆ బ్రహ్మ విచిన్తన, ధ్యానము చేయసాగారు. ఆ విధంగా నిర్మలాత్మదృష్టికలవాడు అయ్యారు. నిర్మలదృష్టితో జరిగిపోయిన సృష్టులయొక్క సృష్టి విధానములను గమనించ సాగారు.
అపశ్యత్ సర్గ బృందాని సమతీతాని
అనేకశః, స్మరతి అథో స సకలాన్
సర్వ ధర్మ గుణ క్రమాత్।।
లీలయా కల్పయా మాస చిత్రాః సంకల్పతః ప్రజాః ।
ఇతఃపూర్వము జరిగిపోయిన సృష్టులయొక్క స్వర్గ భూ, పాతాళములను, అందులోని అనేక విశేషాలను దర్శించారు. ఆ విధంగా దర్శించి గమనించిన రీతిగా సర్వధర్మ - గుణవిశేషముల ప్రకారము లీలగా చిత్రవిచిత్ర విశేషములతో సంకల్పమాత్రంగా మూడు లోకములను, వాటి అంతర్గత విశేషాలన్నీ కల్పించారు.
నానా ఆచార సమారంభా ‘గంధర్వ
నగరం’ యథా, తాసాం స్వర్గ అపవర్గార్థం
‘ధర్మ-కామ-అర్థ’ సిద్ధయే।
అనంతాని విచిత్రాణి శాస్త్రాణి సమకల్పయత్।
విరించి రూపాత్ మనసః
కల్పితత్వాత్ జగత్ స్థితేః, తావత్
‘స్థితిః’ ఇయం ప్రోక్తా। తత్ నాశే, ‘నాశం’ ఆప్నుయాత్ ।।
అనేక కార్యక్రమ విశేషములతో గంధర్వ (ఊహానిర్మిత) నగరము స్వర్గ-అపవర్గములు ఫలప్రాప్తములు, ఆ సృష్టిలో సంకల్పానుగుణంగా బయల్వెడలినాయి. వాటి వాటి సిద్ధి కొరకై అసంఖ్యాక చిత్ర విచిత్రములయిన శాస్త్రములు కల్పించబడ్డాయి.

ఓ నిదాఘా! ఆ రూపముగా ఉన్నది సమష్టి మనస్సే. అట్టి సమష్టి మనస్సులో వ్యష్టి(Individual)లో ఉన్నట్టి మనస్సు కూడా అంతరచమత్కార విభాగమే. ఈ జగద్దృశ్యములు అట్టి సమష్టి మనస్సు కొనసాగినంతకాలము ఈ జగద్దృశ్యమంతా ‘ఉనికి’ని కొనసాగిస్తూ ఉంటుంది. అట్టి సమష్టి మనస్సు నశిస్తే జగత్తు కూడా వినాశనము పొందినదే అగుచున్నది.
28. న జాయతే న మ్రియతే క్వచిత్
కించిత్ కదాచన । పరమార్థేన, విప్రేంద్ర!
మిథ్యా సర్వస్తు దృశ్యతే ।।
కోశం ఆశా భుజంగానాం సంసార ఆడంబరం త్యజ ।
అసత్ ఏతత్-ఇతి జ్ఞాత్వా, మాతృ(మూల) భావం నివేశయ ।।
ఓ విప్రవర్యా! నిజానికి ఇక్కడ జగత్‌దృశ్యము అనబడుదానిలో - పరమార్థంగా ఏదీ జనించటమూ లేదు. నశించటమూ లేదు. ఇదంతా ఇంద్రజాలమువలె మిధ్యగానే (As an illusion) కనిపిస్తూ ఉన్నది.
అందుచేత పాము కుబుసమును విడచిపెట్టువిధంగా, ఇక్కడి సంసార- ఆడంబరమంతా మనస్సులో పరిత్యజించినవాడవై ఉండు. ఇదంతా కథలోని విశేషాలవలె, స్వప్నములో కనబడిన మేడయొక్క పొడవువలె అసత్తే - అని ఎరిగినవాడవై దీని జననస్థానమైనట్టి ‘‘ఆత్మభావము’’ను ఆశ్రయించి ఉండుము.
గంధర్వ నగరస్య అర్థే భూషితే, అభూషితే తథా,
అవిద్యాంశే, సుత ఆదౌ వా
కః క్రమః సుఖదుఃఖ యోః,
ధన దారేషు వృద్ధేషు దుఃఖ యుక్తం
న తుష్టతా। వృద్ధాయాం మోహ మాయాయాం
కః సమాశ్వాసవాన్ ఇహ?
గంధర్వ నగరంలో (ఊహాకల్పితమైన స్వప్నముతో సమానమైన చోట) కనబడేవన్నీ గొప్పవి అయినా, కాకున్నా, అందులో ఏమి శేషం? అట్లాగే ఇక్కడ కనిపించే కుమారుడు మొదలైన సమస్త సంబంధాలు, ధనసంపదలు, హాని వృద్ధులు - ఇవన్నీ దుఃఖభూయిష్టములే అయి ఉన్నాయి. ఇవన్నీ జీవునికి తృప్తిని కలిగించేవి కావు. వీటినన్నింటినీ చూచి మురియటమో, దుఃఖించటమో తెలివైన పనికాదు. మోహము యొక్క వృద్ధి వలన ప్రాప్తిస్తున్న విషయములవలన ఇక్కడ ఎవరికి శాంతి కలుగుతుంది? కలుగనే కలుగదు.
యైరేవ జాయతే రాగో మూర్ఖస్య అధికతాం గతైః,
తైరేవ భోగైః ప్రాజ్ఞస్య విరాగ ఉపజాయతే ।।
అతో నిదాఘ ! తత్వజ్ఞ ! వ్యవహారేషు
సంసృతేః, నష్టం నష్టం ఉపేక్షస్వ,
ప్రాప్తం, ప్రాప్తం ఉపాహర ।
ఏ భోగములు వృద్ధి చెందుతూ ఉంటే ముగ్ధునకు ఏదో అధికత్వముగా అనిపిస్తుందో, అట్టి అవే భోగముల ప్రవృద్ధిని చూచినప్పుడు ప్రాజ్ఞుడైనవాడు ‘విరాగి’గానే ఉంటాడు. సరాగిగా అవడు. వాటి యందలి సార-అసారములు ఎరిగియే ఉంటాడు. సంపదల పట్ల ‘‘మమకార వ్యాధి వృద్ధి చెందుతుందేమో?’’ అను శంకతో విరాగి అయి ఉంటాడు.

అందుచేత! ఓ నిదాఘా! తత్త్వజ్ఞా! ఇక్కడి సంసార వ్యవహారములలో (సంసృతియందు) ఎటువంటి లాభనష్టములు వచ్చినప్పటికీ, అటువంటి సర్వసంఘటనలపట్ల - సందర్భములపట్ల ఉపేక్ష కలిగియుండుము. అపేక్ష కలిగి ఉండవద్దు. ప్రాప్తించే సుఖములతో సంతోషపడుతూ ఉండవద్దు. లభించని సంతోషములపట్ల కించిత్ కూడా ‘అపేక్ష’ వద్దు.
29. అనాగతానాం భోగానాం అవాంఛనం అకృత్రిమమ్,
ఆగతానాం చ సంభోగ ఇతి పండిత లక్షణం ।
నిత్యానిత్యావివేకియగు పండితుని లక్షణము
(1) లభించని భోగములపట్ల స్వాభావికంగా ఏమాత్రము వాంఛ కలిగి ఉండకపోవటము. (2) లభించిన భోగములను సమదృష్టిని, ఆత్మదృష్టిని వీడక భోగించటము - ఇవి పండితునియొక్క (నిత్యానిత్యవివేకి యొక్క) స్వాభావిక లక్షణములు.
శుద్ధం, సత్ - అసతోః మధ్యం
పదం బుద్ధ్వా చ,
స బాహ్యాభ్యంతరం దృశ్యం మా, గృహాణ।
విముంచ మా।
యస్య న ఇచ్ఛా
తథా, అనిచ్ఛా జ్ఞస్య కర్మణి తిష్ఠతః,
న తస్య లిప్యతే ప్రజ్ఞా పద్మ - పత్రం ఇవ అంబుభిః ।।
సత్-అసత్‌ల మధ్యగా గల పరిశుద్ధమగు కేవలమగు పదమ (లేక) స్థానమును బుద్ధితో గమనించి అవలంబించుచూ,
ఇక అటుపై…బాహ్య దృశ్యమును స్వీకరించనూవద్దు. వదలనూ వద్దు.
ఎవ్వడైతే ఇచ్ఛగాని, అనిచ్ఛ గాని (Neither interest nor disinterest) లేకుండా ఆయా నిర్వర్తించవలసి వస్తున్న కర్మలను నిర్వర్తిస్తూ ఉంటాడో, పద్మమునకు జలస్పర్శ దోషము కలిగించలేని విధంగా, - అట్టి వాని ప్రజ్ఞ దోషరహితమై, నిత్యనిర్మలమై ఉంటుంది.
‘‘యది తేన ఇంద్రియార్థ శ్రీః స్పందతే హృది వై, ద్విజ!
తదా విజ్ఞాత విజ్ఞేయః సముత్తీర్ణో భవార్ణవాత్ ।।
ఉచ్చైః పదాయ పరయా ప్రజ్ఞయా
వాసనా గణాత్, పుష్పాత్ గంధం
అపోహి ఆరం చేతో వృత్తిం పృథక్ కురు ।।
ఓ ద్విజోత్వమా! ఎప్పుడైతే ఇక్కడి శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ సమస్త విశేషాలు కూడా హృదయమునందు ఇష్టము, కోపము మొదలైన స్పందనలు ఏమాత్రము కలిగించజాలవో, ఇక అప్పుడు నీవు తెలుసుకొనవలసినది తెలుసుకొని భవసాగరమును దాటి వేయగలుగుతావు.

ఓ నిదాఘా! పుష్పమునుండి గంధమును వేరుచేసి స్వీకరిస్తున్న విధంగా చిత్తవృత్తులనుండి వాసనలను ప్రజ్ఞతో వేరు చేసి, అప్పుడు అట్టి నిర్మల (కేవల) నీవు చిత్తముతో దృశ్య జగత్తును నీవు ఆస్వాదించెదవు గాక!
సంసార అంబునిధౌ అస్మిన్, వాసనా-అంబు పరిఫ్లుతే,
యే ప్రజ్ఞా నావం ఆరూఢాః, తే తీర్ణాః పండితాః పరే।।
న త్యజన్తి, న వాంఛన్తి, వ్యవహారం జగత్ గతమ్,
సర్వం ఏవ అనువర్తన్తే పారావార విదో జనాః।।
ఈ జీవుడు ఎప్పటినుంచోగాని, సంసార సాగరం లో చిక్కుకొని ఉన్నాడు.
‘‘సంసారము’’ అనే సాగరములో వాసనలు అనే జలము అనేక కల్లోలములు కలిగి ఉంటోంది. {The ocean of worldliness with water of Tendencies, Relationships, Emotions, Ignorant Ideologies, etc.,}.

ఎవ్వడైతే ఆత్మతత్త్వజ్ఞానమునకు సంబంధించిన ‘ప్రజ్ఞ’ అనే నావను అధిరోహిస్తాడో అట్టి మహాత్ముడు మాత్రమే సులభముగా ఒడ్డుకు చేరగలుగుచున్నాడు.

అట్టి సంసార సాగరముయొక్క ఆనుపానులను, ఆత్మసంబంధమైన తత్త్వమును తెలిసియున్న మహనీయులు - ఇక్కడి ఆయా సమస్త వ్యవహారములను ‘వదలరు’. పట్టుకోరు. కోరుకోరు. వద్దని అనరు. ఆత్మతత్త్వమును ఎరిగియుండి ఆత్మదృష్టిని ఏమాత్రము వదలకయే ఉంటారు. ‘అపార సంసారముయొక్క - స్వకీయ కల్పనా - చమత్కార రహస్యము’ను ఎరిగియే దీని పారము (End) గమనిస్తూ ఎప్పటికప్పుడు ఏది ప్రస్తుతమో ఆ తీరుగా - ఏదీ అంటక అనువర్తిస్తూ ఉంటారు.
30. అనంతస్య ఆత్మతత్త్వస్య
‘‘సత్తా సామాన్య’’ రూపిణః,
చితః చేతో ఉన్ముఖిత్వం యత్,
తత్ ‘‘సంకల్ప అంకురం’’ విదుః।।
లేశతః ప్రాప్త సత్తాకః
స ఏవ ఘనతాం శనైః
యాతి చిత్తత్వమ్ ఆపూర్య,
దృఢం చ ఆకాశ మేఘవత్।
ఆత్మ సర్వదా అనంతమై, జాగ్రత్-స్వప్న-సుషుప్తులచే పరిమితము కానిదై, దేహ-దేహాంతరములచే బంధింపబడనిదై ఉన్నది. అట్టి అనంతమగు ఆత్మతత్త్వము ‘సర్వత్రా ఉనికి’ అనబడు సత్తా సామాన్యరూపమైయున్నది. సమస్తముగా ఉన్నది ఆత్మయే.
‘‘అట్టి అనంత - సత్తా సామాన్య ఆత్మతత్త్వమగు కేవల చిత్ యొక్క స్ఫూర్తి ‘‘అన్యము’’ అనే కల్పనవైపుగా కించిత్ ఉన్ముఖమైనప్పుడు అట్టి సంకల్పముయొక్క అంకురమే ఈ సమస్త జగత్ ఆకార అనుభవము’’ - అని విజ్ఞులు ఎరిగినవారై ఈ జగత్తులో లీలగా పాల్గొనుచున్నారు.

అట్టి ఆత్మయొక్క సత్తాసామాన్యసంబంధమైన కించిత్ అంకురమే చిత్తము. (అనగా, సహజమగు స్వస్వరూపము యొక్క కించిత్ సత్తా రూప ఘనీభూతమే చిత్తముగా ప్రదర్శనమౌతోంది. (దృఢచిత్తముగా పరిణమిస్తోంది).

అట్టి చిత్తమే సమస్తమైన జగదనుభవముగా అయి, ఈ సమస్త జగత్-దృశ్యముగా ప్రదర్శనమౌతోంది.

ఆకాశంలో మేఘము ఆకాశమంతా నింపివేయుతీరుగా ‘చిత్తము’ అనబడే ‘చిత్’ యొక్క కించిత్ స్ఫూర్తి…సమస్త జగత్తుగా ప్రదర్శనమగుచున్నది. (ఒక చిత్రకారుని ఊహయే చిత్రలేఖనము (The Art of Painting) అగునట్లు, ఆత్మకు ఈ జగత్తు కళాప్రదర్శనమే)!
భావయన్తి చితిః చైత్యం వ్యతిరిక్తం ఇవ ఆత్మనః,
సంకల్పతాం ఇవ ఆయాతి బీజం అంకురతాం ఇవ।।
సంకల్పనం హి సంకల్పః స్వయం ఏవ ప్రజాయతే ।
వర్ధతే స్వయం ఏవ ఆశు,
దుఃఖాయ, న సుఖాయ యత్।।
బీజము నుండి అంకురము (Seedling) వలె-‘‘చిత్’’ (తెలుసుకునేవాని) నుండి ‘‘చైత్యము’’ (అనుభూతమయ్యేదంతా) బయల్వెడలుతోంది.

‘చిత్’ యొక్క సంకల్పము (Assumption) నుండి బయలుదేరుతూ, ‘‘అనుభవి (The Experiencer)కి అనుభవములు (The Experiences)గా అగుచున్నదంతా వేరు’’ అన్నట్లుగా (వ్యతిరిక్తంగా) అనుభూతమౌతోంది.

ఆత్మయొక్క ‘‘సంకల్పశక్తి’’ నుండియే - అసంఖ్యాక కల్పనా రూపములుగా - స్వయముగా కల్పనలు బయల్వెడలుచున్నాయి. ఆ విధంగా చైతన్యము నుండి బయల్వెడలిన సంకల్పములు అనేక కల్పనా పరంపరలుగా రూపుదిద్దుకోవటము - ఇదంతా సుఖము కొరకు కాకుండా, (ఆత్మకు బంధము ఆరోపించబడుచూ ఉండటంచేత) ‘దుఃఖమునకే’ - అవుతోంది.
మా సంకల్పయ సంకల్పం। మా భావం (అ)భావయ స్థితౌ।
సంకల్ప నాశనే యత్తో, న భూయో అననుగచ్ఛతి ।
‘‘భావనా-అభావ’’ మాత్రేణ, సంకల్పః క్షీయతే స్వయమ్।।
అందుచేత ఓ నిదాఘా! సంకల్పమును సంకల్పించనే వద్దు. అభావనను భావించనూ వద్దు. ‘భావాతీతము’నందు సంస్థితుడవై ఉండెదవుగాక. ఆత్మభావనయే ఆశ్రయించి ఉండెదవుగాక. అప్పుడు సంకల్పములు నిన్ను ఆక్రమించలేవు. కప్పి ఉంచజాలవు. ‘భావన’ను భావించనంతమాత్రం చేతనే ‘సంకల్పన’ అను వ్యసనము తనకు తానే క్షీణించగలదు.
సంకల్పేన ఏవ సంకల్పం, మనసైవ మనో,
మునే! ఛిత్వా, స్వ-ఆత్మని తిష్ఠత్వం-
కిం ఏతావతి దుష్కరమ్?
యథైవ ఇదం నభః శూన్యం,
జగత్ శూన్యం తథా ఏవ హి।।
ఓ మునీశ్వరా! ‘‘దృశ్యము గురించి సంకల్పించుచూ తన్మయమవటము’’ - అనే వ్యసనరూపమగు అలవాటును - ‘సంకల్పించకపోవటము’ అనే అభ్యాసముతోనే జయించాలి. మనస్సును మనస్సుతోనే ఛేదిస్తూ, ఆత్మ భావన-ఆత్మస్వభావమునందు సుతిష్ఠితుడవై ఉండు.

సంకల్పించటములోనే శ్రమ ఉన్నది కాని - సంకల్పించు శ్రమను విరమించటములో ఏమి కష్టము ఉన్నది? మరి ‘‘ఆత్మయేవాఽహమ్ - నేను ఆత్మను - అను నిశ్చిత భావన దుష్కరము (సాధ్యముకాదు)’’ అని ఎట్లా అంటావు? సాధ్యమే. ‘సంకల్పించటం’ నిర్వర్తిస్తూ ఉన్న నీవు ‘‘సంకల్పించకపోవటము’’- ను కూడా తప్పక నిర్వర్తించగలవు.

ఆకాశము సర్వదా శూన్యమే! అందులో ఏ పదార్థము లేదు. అట్లాగే ఆత్మయందు జగత్తు శూన్యమే అయి ఉన్నది. ఆత్మయందు ఆత్మయే ఉన్నది.
తండులస్య యథా చర్మ, యథా తామ్రస్య కాళిమా,
నశ్యతి క్రియయా, విప్ర!
పురుషస్య తథా మలమ్।।
జీవస్య తండులస్య ఇవ మలం సహజం
అపి అలమ్, నశ్యతి ఏవ న సందేహః।
తస్మాత్ ఉద్యోగవాన్ భవేత్ ।।
ధాన్యమును దంచినప్పుడు ధాన్యపు గింజపైగల పొట్టు తొలుగుతోంది. రాగి పాత్రను (చింతపండుతో) శుభ్రం చేస్తే మకిలి తొలగి, తళతళా మెరుస్తోంది. ఓ విప్రవర్యా! అదేవిధంగా ఉత్తమ ప్రయత్నము చేత చిత్తములో (ప్రాపంచక సంబంధమైన అరిషట్ వర్గము అనే) మలము తప్పక తొలుగుతుంది!

బియ్యపు గింజలలో కొద్దిగా రాళ్ళు ధాన్యపుగింజలు వచ్చి చేరటం సహజమేకదా. అట్లాగే ఈ జీవుని మనస్సుకు ‘కర్మవ్యవహారములకు సంబంధించిన దోషము అంటటము’ - అనునది సహజమే.
రాళ్ళను ఏరి పొట్టును తొలగించి ఆవల పారవేసి బియ్యమును వండుకుంటాము కదా! ‘‘అయ్యో! వడ్లపై ఊక ఉందికదా। ఊక తీయటమెట్లా’’ (Paddy itself) - అని వడ్లనే వండుకుంటున్నామా? లేదు. పొట్టు తొలగిస్తున్నాము.

అట్లాగే, మలమును తొలగించి చిత్తమును (మనస్సును) ఎప్పటికప్పుడు నిర్మలముగా ఉంచుకొనే ఉత్-యోగ కార్యక్రమము నిర్వర్తిస్తూ ఉండాలి.
మానవ జీవితము - అటువంటి ఉద్యోగ సందర్భము. కనుక సద్వినియోగ పరచుకొనెదవుగాక। మనస్సు నుండి దృశ్య మలమును తొలగించుకొనటంలో ప్రయత్నశీలుడవై ఉండెదవు గాక।
ఇతి మహోపనిషత్।।
‘‘ఇతి ఉపనిషత్’’

షష్ఠోఽధ్యాయః - యోఽసి, సోఽసి (అదియ్ ఇది)

1. ఓం। అన్తరాస్థాం పరిత్యజ్య భావశ్రీం a
భావనామయీమ్,
యో అసి, సో అసి (యోఽసి, సోఽసి)
జగత్ యస్మిన్, లీలయా విహర। అనఘ!
ఓం।
ఓ అనఘా (పాపదృష్టులు లేనట్టివాడా)! నిదాఘముని సత్తమా! అంతరమున ఏఏ విషయములపట్ల ‘‘భావించటము’’ - అనునది ఏర్పడుచూ ఉంటోందో…. అట్టి ‘‘భావనా వ్యవహారమును- భావించబడు వస్తువులతో సహా’’ త్యజిస్తూ ఉండు. ‘‘శ్రీం’’ - శ్రియమగు ఆత్మభావనచే భావనారాహిత్యము అభ్యసించు. ఆలోచనలన్నీ ఆపివేయగా అప్పటికీ ఏది ఇంకా శేషించి ఉంటోందో అదియే నీవై ఉండుము. ఇక ఆపై ఈ జగత్తులో లీలగా, క్రీడగా, సరదాగా విహరిస్తూ ఉండు. అట్టి ‘ఆది’ శేష్యమే ‘శ్రీం’ అక్షరార్థము.
‘సర్వత్ర అహం అకర్తా’
ఇతి దృఢ భావనయా అనయా
,
పరమ అమృత నామ్నీ సా
‘సమతా’ ఏవ అవశిష్యతే।।
‘‘నేను సర్వత్రా సర్వదా దేనికీ కర్తను కాదు. అకర్తను’’ (అట్లాగే ఎవ్వరూ దేనికీ కర్త కాదు) - అను దృఢ తర భావనచే - పరమ అమృత స్వరూపమగు సర్వసమత్వ ‘సమత’యే శేషించినది అవుతోంది. (‘సమతా భావనాయేవ‘శ్రీం’).
ఖేద ఉల్లాస విలాసేషు
స్వ-ఆత్మ కర్తృయా ఏకయా,
స్వ సంకల్పే క్షయం యాతే,
‘‘సమత’’ ఏవ అవశిష్యతే।।
‘‘సమస్త ఖేద-ఉల్లాసములకు అకర్తృత్వమే స్వభావమైయుండు గాక। ‘‘సర్వాత్మకమగు స్వస్వరూపాత్మయే సమస్తమునకు కర్త- భోక్త కూడా’’ అను ధారణచే (దృశ్య సంబంధమైన) సంకల్పములు తమకు తామే క్షయిస్తాయి. సర్వత్రా సమ స్వరూపమైయున్న ‘‘సమత’’యే శేషించగలదు.
2. సమతా సర్వ భావేషు
యా అసౌ (యాఽసౌ) సత్య పరాస్థితిః,
తస్యామ్ అవస్థితం చిత్తం
న భూయో జన్మ భాగ్ భవేత్।।
ఓ నిదాఘా!
సర్వత్రా సర్వభావనలయందు (భావనలకు ఆవల భావించువాని రూపంగా) ‘‘సమస్థితి’’ అనబడు సత్య - పరాస్థితిని ఆశ్రయించి, అద్దానియందు చిత్తమును నిశ్చలము చేసి ఉంచుము. ఆ విధంగా అఖండము, అప్రమేయము, నిత్యము అగు ఆత్మయందు అవస్థితమైన చిత్తము మరల జన్మ-కర్మల ప్రవాహములో చిక్కుకోదు.
అథవా సర్వ కర్తృత్వం అకర్తృత్వం చ వై,
మునే! సర్వం త్యక్త్వా మనః పీత్వా
యోఽసి సోఽసి స్థిరో భవ।।
ఓ మునీ! (పై విధంగా కాదనుకుంటే) - పోనీ (లేదా, క్రమక్రమంగా)
(1) నేను కర్తను! (2) నేను అకర్తను - ఈ రెండిటికీ సంబంధించిన ఉభయ భావములను వదలివేసి, ఆత్మభావనతో ‘మనస్సు’ అనబడు ఆలోచనా విభాగమును మింగివేసి - అప్పటికీ నీవు ఏదై ఉన్నావో, అదియే అయి ఉండుము.
శేష స్థిర సమాధానో యేన త్యజసి, - తత్ త్యజ
చిత్ మనః కలన ఆకారం ప్రకాశ తిమిర ఆదికమ్।
వాసనాం వాసితారం చ ప్రాణ స్పందన పూర్వకమ్,
సమూలం అఖిలం త్యక్త్వా వ్యోమ
సామ్యః ప్రశాన్త ధీః, హృదయాత్
సం పరిత్యజ్య సర్వా వాసన పంక్తయః,
యః తిష్ఠతి గత వ్యగ్రః
స ముక్తః పరమేశ్వరః।।
స్థిర సమాధానము (Stabilized and wel answered) పొందిన వాడివై, దేనిని త్యజిస్తున్నావో అది కూడా దాటిపోయి…..ఇక ‘త్యజించటము’ను కూడా వదలి వేసి ఉండెదవుగాక! ‘‘నేను త్యజిస్తున్నాను’’ అనే ‘‘అహంకర్తృత్వము’’ను కూడా త్యజించివేయి. చిత్‌మనస్కుడవై జ్ఞాన-అజ్ఞాన ప్రకాశ-తిమిరము లను కూడా వదలివేయి.

ఎవ్వడైతే, ప్రాణ (ప్రియత్వ) స్పందన పూర్వకమై ఏర్పడు సమస్త వాసనలను సమూలంగా మొదలంట్లా త్యజించివేసి ఆకాశమువలె సశాంతముతో కూడిన బుద్ధితో ప్రశాంతముగా ఉంటాడో, హృదయములోని సర్వ దృశ్య సంబంధ భావావేశములను పరిత్యజించి, ఆత్మనే మననము చేస్తూ, నిర్విషయమును ఆశ్రయిస్తూ సర్వవ్యగ్రములను {దిగుళ్ళను (All Avocative disturbances)} వదలి ఉంటాడో - ఆతడు పరమేశ్వరుడే! ఆతడు సర్వదా ముక్తుడే!
దృష్టం ద్రష్టవ్యం అఖిలం
అహ్రాన్తం అహ్రాన్త్యా దిశో దశ,
యుక్త్యావై చరతో జ్ఞస్య
సంసారో గోష్పశీ - ఆకృతిః।।
ఓ నిదాఘా!
‘‘ఈ సంసారసాగరము దాటటమనేది అత్యంత దుర్లభము’’ అని కొందరు అనుచుండగా వింటున్నాము కదా! విని ‘‘సంసారము అనగా ఏమి’’ అని పరిశీలించటము, అధ్యయనము చేయటము ప్రారంభించాను.
చూడవలసినదంతా పరిశీలించుచూ అహ్రాంతితో పది దిక్కులు సుదీర్ఘ సంచారములు చేశాను.
ఒక కొత్త విషయము నాకు తెలియవచ్చింది.
యుక్తితో ఆత్మజ్ఞానమును ఆశ్రయించి, స్వస్వరూపాత్మను నిత్యమైనదిగా, సమస్తము అయినట్టిదిగా గ్రహించువారికి ‘‘సంసార సముద్రము’’ అని చెప్పబడేది - ఆవు డెక్క యొక్క నేలపై పడిన ముద్రను దాటగలగడమంత సులభము - అని గమనించాను.
3. స బాహ్య - అభ్యన్తరే దేహే హి
అథ-ఊర్ధ్వం చ దిక్షు చ,
ఇత ఆత్మా। తతో - అపి ఆత్మా।
నాస్తి అనాత్మ మయం జగత్।।
ఇక్కడ (దేహమునకు) బయట - లోపల కూడా, (అట్లాగే ఈ కనబడే విస్తార జగత్తుకు బయట,లోపల), పైన, క్రింద, సమస్త దిక్కులలోను, సర్వత్రా ఆత్మయే సమస్తమును ఆక్రమించి, సమస్తముగా కూడా ఉన్నది. ఆత్మకు వేరుగా ‘జగత్తు’ అనబడునది ఏ క్షణంలోనూ లేనే లేదు. నవల అంతా రచయితయొక్క కల్పనా చమత్కారమేగా।
న తత్ అస్తి న యత్ర అహం।
న తత్ అస్తి, న తత్ మయం (న తన్మయం)।
కిం అన్యత్ అభి వాంఛామి?
సర్వం సచ్చిన్మయం (సత్ చిత్ మయం) తతమ్।।
ఆత్మ లేనిచోటే లేదు. నేను ఆత్మస్వరూపుడనే అయిన ఉన్నాను. కాబట్టి నేను లేనట్టి ప్రదేశమే ఎక్కడా లేదు. నాది కానిది, నేను లేనిది లేనప్పుడు ఇక నేను దేనిని కోరుకోవాలి? లేదని దేనిగురించి దుఃఖం పొందాలి? సమస్తము సత్-చిత్-ఆనందమయమే।
అంతటా ఉన్న దానిని ఎక్కడ వెతకాలి? (తరంగము జలము కోసము ఎక్కడని వెతుకుతుంది - తానే జలమైనప్పుడు!) నేను ఆత్మను కానిది ఎప్పుడు?
సమస్తం ఖల్విదం బ్రహ్మ।
సర్వం ఆత్మా ఇదం ఆతతమ్।
అహం అన్యం ఇదం చ అన్యత్
ఇతి అహ్రాంతిః త్యజ, అనఘ!
ఇక్కడి సమస్తము బ్రహ్మమే అయి ఉన్నది. ఆత్మచేతనే ఈ సమస్తము విస్తరించినదై ఉన్నది.
అందుచేత ఓ అనఘా! నిదాఘా!
‘ఆత్మకు నేను వేరు. నీవు వేరు. ఇది అన్యము. అది కాదు’ ఇటువంటి అహ్రాంతిని మొదలంట్లా త్యజించివేయి.
తతో బ్రహ్మ ఘనే నిత్యే సంభవన్తి,
న కల్పితాః। న శోకో అస్తి। న మోహో అస్తి।
న జరా అస్తి। న జన్మ వా।
యత్ అస్తి ఇహ, తత్ ఏవ అస్తి।
విజ్వరో భవ సర్వదా।।
అట్టి బ్రహ్మము సర్వత్రా ఘనీభూతమై, సంభవము (ఉనికి) కలిగియున్నది. ఆత్మకు అన్యమైనదంతా కల్పితమాత్రము. కథలో సంఘటనలవలె కల్పితమైన దానికి ఉనికి ఎక్కడిది?
ఓ మహాశయా! శోకము లేదు. మోహము లేదు. జన్మ లేదు. వార్ధక్యము లేదు. మృత్యువు లేదు. ఏది ఉన్నదో, అట్టి ఆత్మ మాత్రమే ఉన్నది. ఏది లేదో (కల్పితమో), అది మొదలే లేదు. కనుక ఎల్లప్పుడు ఎట్టి జ్వరము (వేదన) లేనివాడనై ఉండెదవు గాక!
యథా ప్రాప్త అనుభవతః సర్వత్ర
అనభివాంఛనాత్,
త్యాగా దాన పరిత్యాగీ,
విజ్వరో భవ, సర్వదా।।
యస్య ఇదం జన్మ పాశ్చాత్యం
తమ్ ఆశ్వేవ, మహామతే!
ఎప్పుడు ఏది ‘అనుభవము’గా ప్రాప్తిస్తూ ఉంటే, అది ఇచ్ఛారహితంగా స్వీకరించు. దేనినీ వాంఛించవద్దు. ద్వేషించనూ వద్దు. ఎల్లప్పుడు సంతాపరహితుడవై ఉండు. దేనినీ విడిచిపెట్టనూవద్దు. పట్టుకోనూవద్దు. ‘ఏదోవదలాలి’ అనేది కూడా వదలి విజ్వరుడవై (ఆదుర్దా లేనివాడవై) ఉండు. ఇప్పుడు ఏమున్నదో, ఆ తరువాత కూడా అదే ఉన్నది.
ఓ మహామతీ! ఈ జన్మయే చివరి జన్మగా మలచుకొనుము. మొదలే జన్మలు లేనివాడవై, ఆత్మయే నీవై ఉండుము. జన్మలే లేని నీకు ఈ జన్మమాత్రం ఎక్కడున్నది?
4. విశన్తి విద్యా విమలా
ముక్తా వేణుం ఇవ ఉత్తమమ్,
విరక్త మనసాం సమ్యక్
స్వ-ప్రసంగాత్ ఉదాహృతమ్।
‘‘ఆత్మ విద్య’’ను ఎరుగుటచే ఈ జీవుడు - ఉత్తమమైన ముత్యములచే గ్రుచ్ఛబడి అలంకరించబడిన వేణువువలె ఆత్మతత్త్వానుభవ సౌందర్యమును సిద్ధించుకోగలడు.
ఇంద్రియ విషయములపట్ల అనురక్తిత్యాజ్యమే (విరక్తి) ఆత్మ యొక్క (అభేదత్వము యొక్క) అనుసంధానమునకు మార్గము. ‘‘ఆత్మ గురించిన విచారణ అనగా-స్వస్వరూపము యొక్క ప్రసంగమే’’ - అని చెప్పబడుచున్నది.
‘ద్రష్టుః దృశ్య’ సమాయోగాత్
ప్రత్యయ - ఆనంద నిశ్చయః
యస్తం స్వం-ఆత్మ తత్త్వ ఉత్థం (తత్త్వోత్థం)
నిష్పన్దం సం ఉపాస్మహే।।
ఈ లోకరీతిని అనుసరించి ‘ఆనందము’ అనునది ద్రష్ట యొక్క దృశ్య వస్తువుతో సంయోగముచే ఏర్పడుచున్నదని - జనులచే భావించబడుతోంది. అయితే ద్రష్టకు దృశ్య వస్తువు యొక్క సందర్శనముచే బుద్ధియందు స్ఫురిస్తున్న ఆనందము స్వరూపతః ఆత్మనుండే జననము పొందుతోంది. స్పందరహితమగు అట్టి కేవలాత్మ స్వరూపమునకు నమస్కరిస్తున్నాము. ఉపాసిస్తున్నాము. సర్వాత్మభగవానునికి నమో నమః ।
ద్రష్టృ దర్శన దృశ్యాని త్యక్త్వా వాసనయా సహ,
దర్శన ప్రథమా భాసం ఆత్మానం సం ఉపాస్మహే।।
ద్వయోః మధ్యగతం నిత్యం
‘‘అస్తి-నాస్తి ఇతి పక్షయోః’’, ప్రకాశనమ్
ప్రకాశానామ్ ఆత్మానం, సం ఉపాస్మహే।।
ద్రష్ట-దర్శన-దృశ్యములను వాటియొక్క వాసనలతో సహా (Including Tendencies) ప్రక్కకు పెట్టి దర్శనమునకు మునుముందుగానే (Even prior to perception) ఏది నిత్యోదిత-స్వయంప్రకాశరూపమైయున్నదో, సర్వదా అఖండజ్యోతివలె భాసిస్తోందో’’ అట్టి ‘ఆత్మ’ను ఆత్మాఽహమ్ భావనతో ఉపాసిస్తున్నాము.
ఉన్నది - లేదు (సత్-అసత్) అను ఉభయపక్షముల (వాదముల/భావముల) మధ్య ఉండి, ఏది ‘అస్తి-నాస్తి’ భావములను ప్రకాశింపజేయుచున్నదో - అట్టి ఆత్మను ఉపాసిస్తున్నాము.
సంత్యజ్య హృత్ గుహేశానం
దేవం అన్యం ప్రయాన్తియే,
తే ‘‘రత్నం అభి వాంఛన్తి,
త్యక్త హస్తస్థ కౌస్తుభాః।’’
ఏ అఖండాత్మ జ్యోతి, ఆత్మానందము సర్వదా స్వకీయ హృదయగుహలో ప్రకాశమానమై ఉన్నదో అట్టి దేవాది దేవుని వదలి, ‘అన్యదేవత’ను ఆశ్రయించటమంటే (పరమాత్మ నాకు అన్యము’ అని భావించటం) అరచేతిలోని ‘కౌస్తుభమణి’ని వదలి, బయట ఎక్కడో ఉన్న రత్నము (బాహ్యరత్నము) కావాలి - అని కోరుకోవటం వంటిది.
5. ఉత్థితా-అనుత్థితాన్ ఏతాన్
ఇంద్రియాదీన్ పునః పునః
హన్యాత్ ‘‘వివేక’’ దండేన,
వజ్రేణ ఇవ హరిః గిరీన్।
ఒకానొకప్పుడు పర్వతములు రెక్కలు కలిగియుండి…తమ గొప్పతనము గురించి గర్వము పొందసాగాయి. ‘‘సృష్టిలో మేము ఎంతో బలవంతులము. మేము దేనినైనా అణచగలము, ఆక్రమించగలము’’ - అని భావించి, గర్వించసాగాయి. ఆ గర్వము అంతటితో ఆగక ‘‘మా గొప్పతనం చూపిస్తాము’’అను మాత్సర్యముతో గాలిలో ఎగిరి, జనావాసాలమీదపడి, ఊళ్ళు - ఊళ్ళనే సర్వనాశనం చేయసాగాయి. అప్పుడు త్రిలోకపాలకుడగు ఇంద్రుడు లోకరక్షణార్థం ఒకానొకరోజు వ్రజాయుధము చేతిలో ధరించి, ఆ పర్వతముల రెక్కలను ఖండించి, ఇక అవి ఎగురలేనివిగా చేయసాగారు.

ఆ విధంగా ఓ నిదాఘా! ఈ బలవత్తరమగు ఇంద్రియములు విషయములపై వ్రాలటమును ‘‘వివేకము’’ - అనే వజ్రాయుధముతో మరల మరల రెక్కలు త్రెంచి, వాటియొక్క ‘‘విషయములవైపు చాంద్రాయణము’’ను అరికట్టాలి.
సంసార రాత్రి దుస్వప్నే
శూన్యే దేహమయే భ్రమే,
సర్వం ఏవ అపవిత్రం తత్
దృష్టం సంసృతి విభ్రమమ్।।
దుఃఖస్వప్నము (చెడుకల) - వాస్తవానికి వస్తుతః శూన్యమే అయి ఉండి కూడా, ఆ పీడకల ప్రశాంతముగా నిద్రపోవుచున్న ఆ జీవునికి అనేక అపవిత్ర-భయానక దృశ్యములను చూపి, అహ్రాంతిని కొలుపుతూ ఉలికిపాటు కలిగిస్తోంది. అంతమాత్రంచేత ఆ స్వప్నద్రష్ట బద్ధుడా? కాదు.

అట్లాగే ‘‘సంసారము’’ అనే రాత్రి సమయంలో ‘‘నేను దేహమునకు సంబంధించినవాడను. ఈ దేహమునకు నేను పరిమితుడనై చావు - పుట్టుకలను అనివార్యంగా పొందుచున్నాను’’ - అనే చెడు కలను పొందుచూ, ఈ జీవులు వర్తిస్తున్నారు. ‘దేహమే నేను’ అనునదంతా అపవిత్రభావన. ఆవిధంగా చూడబడేదంతా సంసృతి (లేక) సంసార విభ్రమమే! (అయినా కూడా ఈ జీవుడు వాస్తవానికి ఆత్మగా బద్ధుడు కాదు).
అజ్ఞాన ఉప హతో బాల్యే।
యౌవనే వనితా హతః।
శేషే కళత్ర చిన్తా ఆర్తః।
కిం కరోతి నరాధమః?
ఆత్మ అప్రతిహతమైనది. అయితే కూడా ఈ జీవుని పరిస్థితి ఈ జీవుని పట్ల బాల్యమంతా అజ్ఞానముచే ఉపహతమై (కొట్టుబడుచున్నదై) ఉండిపోతోంది. యౌవనకాలమంతా శృంగార భావములు వచ్చి ఆక్రమించివేస్తున్నాయి. ఇక శేషించిన జీవితము భార్య-పిల్లల పోషణ గురించి కొట్టుకుపోతోంది. అజ్ఞానముతో ఆవరించబడిన ఈ జీవుడు ఇంక దుఃఖనాశనమునకై చేయుచున్నది ఏమున్నది?
సతో సత్తా స్థితా మూర్ధ్ని
రమ్యాణాం మూర్ధ్ని అరమ్యతా।
సుఖానాం మూర్ధ్ని దుఃఖాని।
కిం ఏకం సంశ్రయామి అహమ్?
ఈ దృశ్యములో కనిపిస్తూ ఉన్న సమస్త వస్తువుల నెత్తిమీద ‘‘ఉన్నాయి కాని లేవు’’ - అనే సత్తాసత్త దోషము తాండవిస్తోంది.
రమ్యమైన (బాగుబాగు అనుకుంటున్న) సమస్త విశేషములపైన అరమ్యత (రోత) - నెత్తిన ఎక్కి కూర్చుని ఉన్నది.
-‘‘ఇది సుఖము కదా’’ - అని అనుకుంటున్న ప్రతి విశేషముయొక్క ముఖమునందు దుఃఖము తాండవిస్తూనే ఉన్నది. మరి ఇక్కడ దేనిని ఆశ్రయించి ఉండాలి?
యేషాం నిమేషణ ఉన్మేషౌ
జగతః ప్రళయోదయౌ,
తాదృశాః పురుషా యాన్తి ।
మాదృశాం గణనైవకా?
ఏ సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు కనులు తెరచినప్పుడు ఈ అతి విశాల సృష్టి అంతా ఏర్పడినదై, ఆయన కనులు మూయగానే ఇదంతా (ప్రళయ సమయము దాపురించగా) - వినాశనము పొందుచున్నదో,….అంతటి ఆ చతుర్ముఖ బ్రహ్మ మొదలైన దేవతా ప్రముఖులు కూడా కాలము చేత క్షణంలో మటుమాయమగుచున్నారు. ఇక మా వంటి దేహబద్ధులగు అల్పజీవుల గురించి వేరే ఏమి చెప్పాలి? మా ఈ దేహములు ఒక్క లెక్కయా?
సంసార ఏవ దుఃఖానాం
సీమాన్త - ఇతి కథ్యతే,
తత్ మధ్యే పతితే దేహే
సుఖమ్ ఆసాద్యతే కథమ్?
‘‘దుఃఖములన్నిటికంటే పరాకాష్ట అయిన దుఃఖము ఏది రా?’’ అని పరిశీలిస్తూ రాగా, ‘‘అనిత్యము, నిత్యనాశనము ధర్మములుగా కలిగియున్న ఇక్కడి దృశ్యముతో అవినాభవ సంబంధము తెచ్చిపెట్టుకొని ఒంటికి పూసుకోవటము. (కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యములనే ఆరు) త్రాళ్ళతో పేనుకున్న చాంతాడుతో స్వయముగా కాళ్ళు-చేతులు కట్టించుకొని ఉండటము’’- ఈ ఈ రూపముగల సంసారబంధము అన్ని దుఃఖములకంటే ‘పరాకాష్ఠ’-అని చెప్పబడుతోంది. అటువంటి సంసారారణ్యము మధ్యగా పడి వున్న ఈ దేహమువలన కలుగగల సుఖము ఏమున్నది?
6. ప్రబుద్ధో అస్మి। ప్రబుద్ధో అస్మి।
దుష్టః చోరో అయమ్ ఆత్మనః।
‘‘మవో’’ నామ నిహంతి ఏనం,
మనసాస్మి చిరం హతః।।
నేను (అజ్ఞానము అనే) గాఢనిద్ర పోవుచూ ఉండగా - ఇంటిలోకి (‘జ్ఞానము’ అనే నాదైన రత్నమును దొంగిలించటానికి) దొంగ ప్రవేశించాడు. సుదీర్ఘ కాలంగా ఆతడు ఎక్కడ ఇంటిలో నక్కినాడో చీకటికారణంగా తెలియనే లేదు. ‘‘గురువాక్యమననము - శాస్త్ర శ్రవణము - సాధనలు’’ సహాయంతో బాగా మెలకువ వచ్చింది. ‘జ్ఞానము’ అనే వెలుగులో చూడగా అప్పుడు ఏమైంది? ఆహా! ప్రబుద్ధుడను అయ్యాను. బుద్ధి వికాసము పొందింది. ఆ దొంగ ఎవ్వరో కాదు. నా మనస్సే. మనస్సు అనే దొంగ చిరకాలంగా నన్ను భయపెట్టుచూ బాధిస్తున్నాడు.
మా ఖేదం భజ హేయేషు।
న ఉపాదేయ పరో భవ।
హేయా-దేయ దృశౌ త్యక్త్వా,
శేషస్థః సుస్థిరో భవ।।
అందుచేత ఓ నిదాఘా! అనివార్యంగా వదిలిపెట్టవలసిన వాటిగురించి, పట్టుకోవలసి వస్తున్న వాటి గురించి ఖేదము (Worry / Lamenting) పొందనే వద్దు. దృశ్యమునకు సంబంధించినట్టి అట్టి హేయ-ఉపాదేయములను అంతరంగా త్యజించినవాడవై, అప్పటికీ శేషించియున్న ‘ఆత్మ-ఆత్మభావన’ యందు సుస్థిరుడవై ఉండు.
నిరాశతా, నిర్భయతా, నిత్యతా, సమాతా జ్ఞతా,
నిరీహతా, నిష్క్రియతా, సౌమ్యతా, నిర్వికల్పతా,
ధృతిః మైత్రీః మనః తుష్టిః మృదుతా,
మృదు- భాషితా, హేయ ఉపాదేయ నిర్ముక్తే
‘జ్ఞే’ తిష్టన్తి అపవాసనమ్।।
త్యాజ్య-గ్రాహ్యములకు అతీతులు, దృశ్యవాసనలను మొదలంట్లా జయించి వేసినవారు - అగు మహనీయులలో ఈఈ ఉత్తమ గుణములు స్వాభావికమై ఉంటాయి.

🌺 నిరాశత : ‘‘ఈ ప్రపంచములో ఇంకా ఏదో పొందాలి! ఇది ఇట్లా ఉండాలి. అట్లా ఉండరాదు’’ - అనే ఆశించటము(Expectation) ను త్యజించి ఉంటారు (నిరాశితులు).
🌺 నిర్భయత్వము : ఎప్పుడైనా ఏదో జరుగకూడనిది జరుగుతుందేమోననే భయావేశము లేకుండటము.
🌺 నిత్యాతా : ఆత్మయొక్క నిత్యత్వమును ఏమరువకపోవటము
🌺 సమతా : ‘‘సమస్తజీవులు ఆత్మస్వరూపులే. ఆత్మస్వభావులే’’ అను సమతాభావము.
🌺 ‘జ్ఞ’తా : వివేకముతో కూడిన ఆత్మతత్త్వజ్ఞానము.
🌺 నిరీహత్వము (లేక) నిష్కామత్వము
🌺 ‘నేను దేనికీ కర్తను కాదు. భోక్తను కాదు’ - అనే నిష్క్రియత్వము.
🌺 సౌమ్యతా : ఇతరులకు ప్రీతి - సుఖము కలిగించే ఆచారములు
🌺 సర్వకల్పనలకు ఆవల సంస్థితుడై ఉండు నిర్వికల్పత్వము.
🌺 ధైర్యము, తెలివి. స్నేహపూర్వక మనస్సు సంతృప్తి. మృదువుగా సంభాషించటము.

ఇవన్నీ ఆత్మజ్ఞునిని స్వాభావికంగానే ఆశ్రయించి ఉంటాయి. స్వాభావికంగానే వారు వాసనారహితులై ఉంటారు.
గృహీత తృష్ణా శబరీ వాసనా జాలం ఆతతం।
సంసార వారి ప్రసృతం చిన్తా తంతుభిః ఆతతం।
‘‘తృష్ణ’’ అనే ఆటవిక స్త్రీ వాసనలు (Tendencies) అనే త్రాళ్ళతో అల్లిన ‘వల’ (Fishernet)ను తీసుకొనివచ్చి, ‘‘సంసారము’’ అనే తటాకంలో ఆ వలను విసరి, ఈ ‘జీవులు’ అనే చేపలను వలలోకి ఆకర్షించి బలవంతముగా పట్టుకొంటోంది.
అనయా తీక్షణాయా, తాత।
ఛిన్ది బుద్ధి శలాకయా।
వాత్యయైవ అంబుదం జాలం
ఛిత్వా తిష్ఠత తే పదే (తిష్ఠ తతే పదే)।।
వాయువు వేగముగా వీచి దట్టమైన మేఘములను ఛిన్నాభిన్నం చేస్తాయి చూచావా! ఆ విధంగా ‘జ్ఞానము’ అనే చురకత్తిని చేబూని బుద్ధియొక్క సునిశితత్వముతో (పదునుతో) వాసనా సమూహములను నిర్మోహమాటంగా ఛేదించివేసి, సర్వత్రా వ్యాపించి ఉన్న తత్-ఆత్మ పదమునందు సుస్థిరుడవు, నిశ్చలుడవు అయి ఉండెదవుగాక!
మనసైవ మనః ఛిత్వా
కుఠారేణేవ పాదపం,
పదం పావనం అసాద్య
సద్య ఏవ స్థిరో భవ।।
గొడ్డలితో భీకరంగా గోడలపై పెరిగియున్న మఱ్ఱివృక్షమును ఖండిస్తాము చూచావా? ఆ విధంగా పరిశుద్ధము - నిశ్చలము అగు ‘మనస్సు’ - అనే గొడ్డలితో మనస్సు యొక్క వాసనా విభాగములను ఖండించివేసి, ఇక అప్పటికీ శేషించియుండే సద్యము (ఆత్మ)యందు సుస్థిరుడవగుము.
(సద్యము = అయమ్ సత్ = సత్ వస్తువు)
7. తిష్టన్, గచ్ఛన్ స్వపన్ జాగ్రన్
నివసన్ ఉత్పతన్ పతన్,
‘‘అసత్ ఏవ ఇదమ్’’ ఇతి అంతః
నిశ్చిత్య ఆస్థాం పరిత్యజ।।
ఓ నిదాఘ మహానుభావన్! ఈ దృశ్య జగత్తు ఎల్లప్పుడు చంచలము, గతించుతూ ఉండేదే కూడా. నీవు కూర్చుని ఉన్నప్పుడు , లేచి నడుస్తూ ఉన్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, కునుకులు పడుచూ ఉన్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు, నిలబడి ఉన్నప్పుడు, పడుచూ ఉన్నప్పుడు, పడిపోయి ఉన్నప్పుడు కూడా ‘‘ఈ దృశ్య జగత్తు సర్వదా కథలోని సంఘటనలవలె అసత్యము’’ - అని అంతరంగములో నిశ్చయము కలిగి ఉండు. ఈ సమస్త దృశ్యమును మొదలే పరిత్యజించివేసి ఉండు.
దృశ్యం ఆశ్రయసీదం చేత్,
తత్ - సత్ చిత్తో అసి బంధవాన్।।
దృశ్యం సంత్యజసీదం చేత్
తత్ అచిత్తో అసి ‘‘మోక్షవాన్’’ ।।
‘‘ఈ దృశ్య జగత్తు సత్యమే’’ అని చిత్తముతో ఇష్టముగా నమ్మి ఆశ్రయించినవాడవై ఉన్నావా? - ఇక అప్పుడు నీ చిత్తమే నీకు బంధము కాగలదు. చిత్తము ఉంటే ఇక బంధమే।
దృశ్యమును మొదలంట్లా త్యజించి (ఒక కథను చదువుచున్నట్లో, ఒక నాటకమును చూస్తున్నట్లో) జగద్దృశ్యమును మిధ్యగా దర్శిస్తూ ఉన్నావా…, ఆ చిత్తమే నిన్ను మోక్షస్వరూపునిగా చేసివేయగలదు. చిత్తము ఉన్నా లేకున్నా కూడా మోక్షమే.
‘‘న అహం। న ఇదం’’ ఇతి ధ్యాయం
తిష్ఠ త్వం అచలాచలః।।
ఆత్మనో జగతశ్చ అంతః,
ద్రష్టృ దృశ్య దశ అన్తరే,
దర్శనాఖ్యం స్వం ఆత్మానం
సర్వదా భావయన్ భవ।।
ఓ నిదాఘా! నాటకములో ఒక పాత్రగా నటిస్తున్నప్పుడు ‘‘ఈ ‘పాత్ర’ - అనబడే ఒకాయన ఉన్నాడు’’ - అని అనుకొని నటిస్తామా? లేదు కదా! అట్లాగే ‘‘ఈ జగత్తులో ప్రతిబింబిస్తున్న ‘నేను’ అనునది గాని, నాటకీయమగు ఈ జగత్ దృశ్యము గాని మొదలే లేదు’’ - అను ధ్యాసను వీడక, ఎక్కడ ఉంటే అక్కడ సుతిష్ఠితుడవై ఉండు. అచంచలుడవై జగత్ + స్థ (జనిస్తూ - గతిస్తూ ఉండే) ఇద్దానిని మౌనంగా అతీతత్వముతో చూస్తూ ఉండు.
నీకు - ఈ జగత్తుకు (లేక) ద్రష్టకు - దృశ్యమునకు మధ్యగా గల కేవల దర్శన స్వరూపము యొక్క అంతరమున స్వాత్మరూపముతో భావనాపూర్వకంగా ఏర్పడినవాడవై ఉండు.
స్వాద్య - స్వాదక సన్త్యక్తం,
స్వాద్య - స్వాదక మధ్యగమ్,
{స్వా(స్వ)} స్వదనం కేవలమ్ ధ్యాయన్
పరమాత్మమయో భవ।।
అవలంబ్య నిరాలంబం మధ్యే మధ్యే స్థిరోభవ।।
‘‘ఆస్వాదించుచున్నది ఆస్వాదించబడునది’’ - అగు రెండిటినీ మొదలంట్లా త్యజించి, ఆ రెండిటి మధ్యగా ఏర్పడి ఉన్న ‘‘ఆస్వాదనము’’ అను కేవల తత్త్వమును ధ్యానము చేస్తూ ఉండు. అనగా, కేవల స్వరూప ఆస్వాదనము నందు మాత్రమే ధ్యాసను నిలుపుచూ - పరమాత్మమయుడవు అగుము.
‘‘నిరాలంబనము (Independence) ‘ఆలంబనము (Dependence)ల మధ్యగా సమస్తమునకు అతీతుడవై, సుస్థిరుడవై ఉండవయ్యా।
8. రజ్జు బద్ధా విముచ్యంతే।
తృష్ణా బద్ధా న కేనచిత్।
తస్మాత్, నిదాఘ! తృష్ణాం త్వం
త్యజ సంకల్ప వర్జనాత్।।
ఒకడు త్రాడుతో కట్టబడితే ఎట్లాగో - అట్లా ఆ త్రాళ్ళను త్రెంచి విముక్తి కలిగించగలం. కానీ తృష్ణ (The habit / Tendency / The culture of craving for some thing) చే బంధించిబడినవాడిని బంధము నుండి విడిపించలేము. ఆ బంధము తేలికగా తెగదు.
అందుచేత ఓ నిదాఘా! నీవు తృష్ణను జయించే ప్రయత్నము చేయాలి. అందుకు ఉపాయం? సంకల్పములను త్యజిస్తే తృష్ణ జయించబడగలదు.
ఏతాం అహంభావ మయీం అపుణ్యాం
ఛిత్వా ‘‘అనహంభావ’’ శలాకయైవ,
స్వభావజాం భవ్య భావాన్త భూమౌ
భవ, ప్రశాన్త అఖిల భూత భీతిః।।
(పొయ్యిలోనుంచి మండుచున్న కట్టెలను లాగివేస్తే ఉష్ణము తొలగుతుంది కదా!) అహంభావముతో నిండి ఉన్నది, పాప కార్యక్రమములలోకి త్రోసివేయునది - అగు తృష్ణ (లేక) ఆశ (ఆశించటము)ను ‘‘అనహంభావము’’ - అనే ఆయుధముతో త్యజించివేయుము. భవబంధమును త్రెంచివేయుము. ఆవల స్వాభావికమైయున్న ‘‘భౌమాస్థానము’’ను ఆశ్రయించి ఉండుము. ప్రశాంత మనస్కుడవై అఖిల భూతజాలముల పట్ల భయమును రహితము చేసుకొని ఉండుము. ఆత్మ దృష్టిని కలిగి ఉండుము.
‘‘అహం ఏషాం పదార్థనాం।
ఏతే చ మమ జీవితమ్।
నా అహమ్ ఏభిః వినా కశ్చిత్। న మయా ఏతే వినా కిల।’’
- ఇతి అంర్నిశ్చయం త్యక్త్వా, విచార్య, మనసా సహ।।
‘‘న అహం పదార్థస్య, న మే పదార్థ’’ - ఇతి భావితే।।
‘‘నేను ఇక్కడి పదార్థ విశేషములకు చెందినవాడను. ఈ ఇంద్రియ విషయములు, ఇక్కడ పదార్థజాలము నాకు చెందినవి. ఇవన్నీ లేకుండా నేను ఉండలేను. నేను లేకుంటే ఇవన్నీ ఉండజాలవు’’ - అనే అంతర నిశ్చయము ఎప్పటినుంచో హృదయములో రూపుదిద్దుకొని ఎందుకో గూడు కట్టుకుని, పేరుకొని ఉన్నది.
ఇప్పుడు అటువంటి అంతర నిశ్చయమును విడచివేయి. విచారణ చేయి. ‘‘ఈ ఈ పదార్థములు, మనస్సు నేను కాదు. నేను ఈ పదార్థములకు చెందినవాడను కాదు’’- అని గమనించెదవు గాక!
అంతః శీతళయా బుద్ధ్యా
కుర్వతో లీలయా క్రియామ్,
యో నూనం వాసనా - త్యాగో
ధ్యేయో ‘‘బ్రహ్మన్’’ ప్రకీర్తితః।।
‘‘ఈ దృశ్యములోని వస్తుజాలము, సందర్భములు, సంఘటనలు - ఇవన్నీ వీటిని స్వీకరిస్తూ ఉన్న మనస్సుతోసహా - నేను కాదు. అవి నాకు చెందినవి కూడా కాదు’ అను అంతరశీతలమైన (Internally Calm) బుద్ధితో లీలగా, క్రీడగా ఆయా సందర్భానుచితమైన క్రియలు, ‘‘వాసనాత్యాగి’’ వయి నిర్వర్తించువాడు ‘ధ్యేయత్యాగి’ అని శాస్త్రములచే కీర్తించబడుచున్నాడు. ధ్యేయవాసనాత్యాగి ‘‘బ్రహ్మమే నేను’’ అని ఎరుగగలడు.
సర్వం సమతయా బుధ్యా యః కృత్వా
వాసనా క్షయమ్,
జహాతి నిర్మమో దేహం, నేయో
అసౌ వాసనా క్షయః।।
సర్వము పట్ల ‘సమత’ (The sense that Everything and every body is the presentation of Alpervading Divinity)తో కూడిన బుద్ధితో నిర్వర్తిస్తూ ఉంటే - ‘వాసనలు తమకు తామే క్షీణించగలవు. నిర్మమకారములో చరిస్తూ ఉండగా, వాసనలు స్వయముగా క్షయించి -నేయోముక్తుడు (ఆతని దృష్టిలో దేహము కల్పితమేగాని- స్వయముగా ఉన్నది కానట్టివాడు) అగుచున్నాడు.
9. అహంకారమయీం త్యక్త్వా వాసనాం
‘‘లీలయైవ యః,
తిష్ఠతి ధ్యేయ సంత్యాగీ, స ‘‘జీవన్ముక్త’’ ఉచ్యతే।।
‘నేను దేహము ఏమాత్రము కాదు - అనునదే నిర్మమో ముక్తి’.
ఎవ్వడైతే 1) వాసనలు త్యజిస్తూ 2) అట్టి వాసనలను ఏ అహంకారముతో త్యజిస్తున్నాడో అట్టి అహంకారమును కూడా త్యజిస్తూ, 3) ధ్యానము చేయుచున్న ధ్యేయమును కూడా త్యజించి ఉంటాడో, అట్టివాడు ‘జీవన్ముక్తుడు’. (3 steps)
నిర్మూలం కలనాం త్యక్త్వా, వాసనాం యః శమం గతః
‘‘నేయ త్యాగం’’ ఇమం విద్ధి, ముక్తం తం బ్రాహ్మణోత్తమమ్।।
ద్వావేతౌ బ్రహ్మతాం యాతౌ, ద్వావేతౌ విగత జ్వరౌ,
ఆపతత్సు యథాకాలం సుఖదుఃఖేషు అనారతౌ,
సన్న్యాసయోగినౌ దాంతౌ విద్ధి శాంతౌ, మునీశ్వర!
‘కల్పన’ అనబడు నిర్మాల్యము రూపమగు వాసనలను త్యజించి అంతరమున పరమశాంతుడై ఉండటమే నేయత్యాగము (నేతి-నేతి) అనబడుచున్నది. అట్టి బ్రహ్మజ్ఞానియగు బ్రాహ్మణోత్తముడు ముక్తుడే (Relieved of all shackless and Bondages). ఓ మునీశ్వరా ! ఆతడే బ్రాహ్మణోత్తముడు. ఆతడే జీవన్ముక్తుడు కూడా.


సంపద - ఆపదల సందర్భములలో ఎవ్వడు వేదనారహితుడై ఉంటాడో, సుఖదుఃఖ సందర్భములలో వాటిలో రమించని వాడై ఉంటాడో, సన్న్యాస యోగి అయి, ఇంద్రియ నిగ్రహము కలవాడై ఉంటాడో - ఆతడే దాంతుడు, శాంతుడు. ఆతడే సన్యాసియోగి కూడా.
ఈప్సిత-అనీప్సితేనస్తో
యస్య అంతర్ వృత్తి దృష్టిషు,
సుషుప్తివత్ యః చరతి, స ‘‘జీవన్ముక్త’’ ఉచ్యతే।।
హర్ష అమర్ష భయక్రోధ కామ కార్పణ్య దృష్టిభిః
న హృష్యతి గ్లాయతి యః, పరామర్శ వివర్జితః।।
ఈప్సితములు నెరవేరుచున్నప్పుడు నెరవేరనప్పుడు, అనుకున్నవి జరిగినప్పుడు-జరుగనప్పుడు కూడా ఎవ్వడు ‘అంతర్‌దృష్టి’చే గాఢనిద్రలో ఉన్న వాడివలె ఏమాత్రం సంబంధించనివాడై ఈ జగత్తులో విహారము చేస్తూ ఉంటాడో, ఆతడే జీవన్ముక్తుడు.


ఎవ్వడైతే - హర్ష - శోక - భయ - క్రోధ - కామ - కార్పణ్య (జాలి) దృష్టులు కలుగుచూ ఉన్నప్పటికీ ఏమాత్రము సంతోష - దుఃఖము పొందక, గ్లాని పొందక ఉంటాడో - ఆతడే ‘జీవన్ముక్తుడు’.
10. బాహ్య అర్ధ వాసనా ఉత్ భూతా
‘‘తృష్ణా బద్ధ’’ - ఇతి కథ్యతే।।
సర్వార్థ వాసనో విముక్తా ‘‘తృష్ణా ముక్తా’’
ఇతి భణ్యతే।।
బాహ్యమున ‘‘ఇది పొందాను. ఇది ఇంకా పొందలేదు’’ అను వేదనల రూపంగా ఉద్భూతమగుచున్న వాసనా క్రమములను కలిగియున్నవాడు ‘తృష్ణా బద్ధుడు’ అని చెప్పబడుచున్నాడు.
సర్వ ఇంద్రియార్థ వాసనల పట్ల (విడివడినవాడు - Wel Relieved) అయినవాడు ‘‘ముక్తుడు’’ - అని స్తుతించబడుచున్నాడు. (ఆత్మతో సోఽహమ్ భావము కలిగి ఉండటమే ‘ముక్తి’).
‘‘ఇదం అస్తు మమ’’ ఇత్యంతం-ఇచ్ఛాం
ప్రార్థనయాన్వితామ్,
తాం తీక్షాణాం శృంఖలాం విద్ధి
దుఃఖ జన్మ భయ ప్రదామ్।।
తామ్ ఏతాం సర్వ భావేషు
సత్ సు, అసత్ సు చ సర్వదా,
‘‘ఇది నాకు కావాలి’’ అను వాంఛ (ఇచ్ఛ) హృదయమునందు ఉద్వేగంగా రూపము కలిగి యుండి, ఇచ్ఛల గురించిన యాచనను (Begging) అభ్యాసపూర్వకంగా ప్రకటనమవటమే తీక్షణమగు బంధము. ‘‘ఇది నాది’’ అను ‘‘అస్తు మమ భావన’’యే దుఃఖ-జన్మ ఫలప్రదమై యున్నది.

సత్ -అసత్‌గా (ఉండి-ఉన్నట్లు) కనబడుచూ ఉన్న సమస్త వస్తు-విషయ-దృశ్య వ్యవహారములను సర్వదా వదలియున్న వాడివై, పరమ ఉదారమగు ‘‘మహామనో పదము’’ సిద్ధించుకొనుము.
సంత్యజ్య పరమోదారం పదమేతి ‘‘మహామనాః’’।।
బంధాస్థాం అథ మోక్షాస్థాం సుఖదుఃఖ
దశాం అపి, త్యక్త్వా సత్-అసత్ ఆస్థాం
త్వం తిష్ఠ, అక్షుబ్ధ-మహాబ్ధివత్।।
ఏ నిదాఘా! బంధము-మోక్షము, సుఖము-దుఃఖము, సత్-అసత్-ఈ విధములైనవన్నీ వదలిపెట్టి, తరంగములు లేనట్టి మహా సముద్రము ఎట్లా ఉంటుందో - ఆ విధంగా నిశ్చలంగా, ప్రశాంతంగా సుతిష్ఠుడవై ఉండు. ఇక ఈ తదితరమైన జీవాత్మ, దేహము, దృశ్యములు మొదలైనవి ఏది ఎట్లా ఉండాలో, అట్లే ఉండుగాక।
జాయతే నిశ్చయః, సాధో! పురుషస్య
చతుర్విధః (4)।
ఓ సాధూ! ఈ మానవులు (పురుషులు, జీవులు) నాలుగు (4) విధములైన నిశ్చయములు (way of understanding) కలిగి ఉంటున్నారు.
(1) అహమ్ శరీరమ్ : ‘‘ఆపాదమస్తకం అహం’’,
మాతా పితృ వినిర్మితః
ఇతి ఏకో నిశ్చయో బ్రహ్మన్!
బంధాయాస విలోకనాత్।।
(1) ‘‘ఇదమ్ దేహమహమ్’’ నిశ్చయము : ‘‘తల్లిదండ్రుల శరీరములనుండి నిర్మితమై పాదమునుండి మస్తకము (Foreface) వరకు కనిపిస్తున్న ఈ భౌతికదేహమే నేను’’ - అను నిశ్చయము (Determination). హే బ్రహ్మాన్! అట్టి విలోకనము (perception) బంధముకొరకే అవుతోంది. అనేక శ్రమలకు, దుఃఖములకు త్రోవతీస్తోంది.
(2) అహమ్ అతీతో: అతీతః సర్వ భావేభ్యో వాలాగ్రాత్
అపి ‘‘అహం’ తనుః
ఇతి ద్వితీయో, మోక్షాయ నిశ్చయో
జాయతే సతామ్।।
(2) ‘‘ప్రత్యక్ - పర స్వరూపోఽహమ్’’-నిశ్చయము : ‘‘నా భావములలో ఈ దేహము దృశ్యములతో సహా ఈ జగదనుభవమంతా ఏర్పడినదై ఉండగా, ఇక దీనికంతటికీ - వెంట్రుకయొక్క చిట్టచివరి సూక్ష్మవిభాగము వలె - నేను ప్రత్యేక-కేవల-(సర్వమునకు) అతీత స్వరూపుడను. అంతేగాని ఈ భౌతిక శరీరముతో సహా నేను ఈ దేహములోని ఒక వస్తువు అయి ఉండనే లేదు’. - ఇట్టి రెండవ నిశ్చయము మోక్షమునకు మార్గము అయి ఉన్నది.
11. (3) అహమ్ సమస్తమ్ : ‘‘జగత్ జాల పదార్థ - ఆత్మా,
‘‘సర్వ ఏవ అహమ్ అక్షయః’’
తృతీయో నిశ్చయశ్చ ఉక్తో
‘‘మోక్షాయ’’ ఏవ, ద్విజోత్తమ!
(3) ‘‘అనన్యోహమ్। ఇదం సమస్తమ్ అహమేవ’’ - నిశ్చయము : ‘‘సమస్తము భావన చేతనే అనుభవమగుచున్నది. నేను భావమునకు ఆదికర్తను. కనుక ఈ జగత్ - జాల పదార్థమంతా కూడా అక్షయస్వరూపుడనగు నేనే! నాకు అన్యమై ఏదీ లేదు’’ - ఇది మూడవ నిశ్చయము. ఓ ద్విజోత్తమా! ఈ మూడవ నిశ్చయము యుక్తి యుక్తమే. ఎందుకంటే రెండవ నిశ్చయమువలె ఇది కూడా మోక్షదాయకమే అయి ఉన్నది.
(4) సర్వమ్ శూన్యమ్ : ‘‘అహం జగద్వా సకలం శూన్యం
వ్యోమ సమం సదా’’,
ఏవం ఏష చతుర్థో అపి నిశ్చయో, మోక్ష సిద్ధిదః।।
(4) ‘‘సమస్తమ్ శూన్యమేవ’’ - నిశ్చయము : ‘ఆకాశము యొక్క స్వరూపము సర్వదా శూన్యమే కదా! అదే విధంగా, ‘‘నేను’’, ఆ ‘‘నేను’ చే అనుభవముగా పొందబడుచూ ఉన్న ఈ జగత్తు - రెండూ కూడా నిర్విషయమగు శూన్యస్వరూపములే’’. ఈ విధమైన నాలుగవ నిశ్చయము కూడా మోక్ష సిద్ధిని ప్రసాదించునదే అయి ఉన్నది.
ఏతేషాం ప్రథమః ప్రోక్తః తృష్ణయా
బన్ధ యోగ్యయా।
శుద్ధ తృష్ణాః త్రయః స్వచ్ఛా
జీవన్‌ముక్త విలాసినః।।
ఈ నాలుగు నిశ్చయములలో మొదటిది అగు ‘‘ఈ భౌతిక దేహమే నేను’’ - అనునది ‘తృష్ణ’కు దారితీయుచూ, ఈ జీవునికి బంధమే అగుచున్నది. ‘‘ఆశించటము’’ అను ఆశారూపము ప్రసాదిస్తోంది. దానికిక అంతు ఉండదు.
తదితర రెండవ, మూడవ, నాలుగవ నిశ్చయము మనస్సును క్రమంగా తృష్ణారహితము చేయుచు, పరిశుభ్రపరచుచూ, జీవన్ముక్తత్వమునందు విహారము ప్రసాదించగలదు.
‘‘సర్వంచ అపి అహమేవ’’ - ఇతి నిశ్చయో
యో, మహామతే!
తమ్ ఆదాయ విషాదాయ న భూయో జాయతే మతిః।।
ఓ మహామతే! ‘‘ఈ సమస్తము నేనే’’ - అను నిశ్చయముచే ఈ జీవుడు జ్ఞానపూర్ణుడగుచున్నాడు. అప్పుడు బుద్ధియందు ‘విషాదము’ - మొదలంట్లా తొలగిపోతుంది. ఇక మరల విషాదముగాని, దుఃఖముగాని జనించదు. సమస్తము వినోదమయమై చెన్నొందగలదు.
శూన్యం తత్ ప్రకృతిః మాయా
బ్రహ్మ విజ్ఞానం ఇతి అపి,
శివః పురుష ఈశానో
నిత్యం ‘‘ఆత్మ’’ ఇతి కథ్యతే।।
పరస్వరూపమగు కేవల స్వరూపమును : -
♠︎ కొందరు ‘శూన్యము’ అంటున్నారు. మరికొందరు
♠︎ ‘‘ప్రకృతి’’ అని, ‘‘మాయ’’ అని,
♠︎ ‘‘పరబ్రహ్మము’’ అని, ‘‘విజ్ఞానము’’ అని,
♠︎ ‘‘శివము’’ అని, ‘‘పురుషుడు’’ అని,
♠︎ ‘‘ఈశానుడు’’ అని, ‘‘నిత్యమగు ఆత్మ’’
….అని ఈఈ అనేక పేర్లతో ఆయా లక్షణ విలక్షణపూర్వకంగా అభివర్ణిస్తున్నారు.
12. ద్వైత-అద్వైత సముత్ భూతైః
జగత్ నిర్మాణ లీలయా,
పరమాత్మ మయీ శక్తిః
అద్వైత ఏవ విజృంభతే।।
పరమాత్మ స్వరూపము, అద్వితీయము - అగు చిత్ యొక్క నిర్మలమగు ఎరుక (consciousness/Awareness)। అయి ఉన్న చైతన్య శక్తియే ద్వైత, అద్వైత సంకల్పములతో ఈ జగత్ నిర్మాణమును లీలగా, క్రీడగా, వినోదముగా స్వకీయ కల్పనారూపముగా తయారు చేసుకొనుచున్నది. పరమాత్మయే జగత్‌రూపంగా అద్వితీయుడై విజృంభించుచున్నారు.
సర్వాతీత పదాలంబీ,
పరిపూర్ణ ఏక చిన్మయః,
న ఉద్వేగీ, న చ తుష్టాత్మా
సంసారే న అవసీదతి।।
బ్రహ్మము గురించి శాస్త్ర-అభ్యాసపూర్వకంగా సాధన చేసి ఎరిగిన జ్ఞాని ఈ సమస్త ప్రపంచమునకు అతీతమగు బ్రహ్మమును ఆలంబనముగా తీసుకొనుచున్నాడు. ఏకమేగాని, చతుష్టయము (4గా) కానట్టి ఆత్మను ఆశ్రయిస్తున్నాడు. పరిపూర్ణ చిదానందమయుడై ఉంటున్నాడు. ఏమాత్రము ఉద్వేగములేనివాడై ఉంటాడు। దేనికీ సంతోషించడు. విషాదము పొందడు. ఒకవైపు - ఇదంతా శూన్యముగా కాకుండా పూర్ణముగా చూస్తూనే, మరొకవైపు సంసారమును స్వీకరించనివాడై - అప్రమేయుడై ఉంటాడు.
ప్రాప్తకర్మకరో నిత్యం శత్రు మిత్ర
సమాన దృక్, ఈహితాని అనీహితైః ముక్తో,
న శోచతి। న కాంక్షతి
ప్రాప్తించిన కర్మలను శాస్త్రీయ లోకానుకూల - ఆచారానుకూల విధానం నిర్వర్తిస్తూ, శత్రు - మిత్రులయందు సమదృష్టి కలిగియుండి, సర్వకోర్కెలను అకోర్కెలుగా (కోరుకోవలసిన అవసరము లేనివిగా) చేయుచున్నవాడై, ఇక దేనికీ శోకించడు. దేనినీ కాంక్షించడు. బ్రహ్మజ్ఞాని అయి, సుఖవంతుడుగా ఉంటాడు.
సర్వస్య అభిమతం వక్తా చ,
ఉదితః పేశల ఉక్తిమాన్,
ఆశయ జ్ఞశ్చ భూతానం,
సంసారే న అవసీదతి।


పూర్వాం దృష్టిం అవష్టభ్య
ధ్యేయ త్యాగ విలాసినీమ్,
జీవన్ ముక్తతయా స్వస్థోః
లోకే విహర, విజ్వరః।।
అందరికీ సానుకూల్యమగునట్లుగా సంభాషిస్తూ ఉంటాడు. ప్రేరణ చేయుచూ ఉంటాడు. యుక్తుడై సర్వజీవుల అభిప్రాయము (Expectation) అనుసరించి ఉంటాడు. ఇతరుల పట్ల ‘‘సర్వము సృష్టియజ్ఞములో అంతర్విభాగమే కదా!’’ - అని గమనిస్తూ ఎరిగియున్నవాడు మరల సంసారములో కృంగడు. మహదాశయుడై ఉంటాడు. సర్వసాక్షి అయి చిద్విలాసంగా సందర్శిస్తూ ఉంటాడు.
లోకే విహర విజ్వరః
ఓ నిదాఘా! ధ్యేయమగుచున్న (ఇంద్రియములకు విషయమగుచున్న) సమస్తమును అధిగమించివేసి, ఇంద్రియములకు మునుముందే ఉన్న కేవలాత్మయొక్క దృష్టిని అవలంబించి - స్వస్థుడవై, జీవన్ముక్తుడవై ఈ మనోకల్పిత దృశ్య ప్రపంచములో క్రీడగా, లీలగా విహరించెదవుగాక।
13.
అన్తః సంత్యక్త సర్వ ఆశో, వీతరాగో,
వివాసనః, బహిః సర్వ సమాచారో
లోకే విహర విజ్వరః।।
ఓ నిదాఘా! (పడవ నీళ్ళల్లో ఉంటుంది. కానీ పడవలోకి నీళ్ళను ప్రవేశించనీయము కదా! అట్లాగే) - అంతర హృదయంలో సమస్త ఆశలను (All Expectations and desires) త్యజించివేసిన వాడవై, రాగ-ద్వేషములను రహితముచేసుకొని, వాసనలను పరిత్యజించి ఉండు. ఇక బాహ్యమున మాత్రం సర్వసమాచారములు కలిగియే ఉండి, - ఎట్టి జాడ్యము దరిచేరనీయకుండా విహరించెదవు గాక.

బహిః కృత్రిమ సంరంభో,
హృది సంరంభ వర్జితః,
కర్తా బహిః అకర్తా అంతరః
లోకే విహర శుద్ధధీః।।

త్యక్త అహంకృతిః, (అశాన్తమతిః) ఆకాశ శోభనః,
అగృహీత కళంకాంకో లోకే విహర శుద్ధధీః।।
ఉదారః పేశల ఆచారః,
సర్వ ఆచార అనువృత్తిమాన్,
అన్తరసంగ పరిత్యాగీ,
బహిః సంసారవాన్ ఇవ।
(ఒక నటుడు రంగస్థలముపై నటిస్తూ ఉన్నప్పుడు ‘‘ప్రేమ, కోపము, ఆవేశము’’ మొదలైనవి బయటకు ప్రదర్శిస్తూ లోన అవేవీ లేనివాడై ఉంటాడు కదా। అట్లాగే)
బాహ్యమున కృత్రిమ సంరంభము (Artificially active while functioning) కలిగి ఉండి, (జగన్నాటకీయత ఎరిగియే నటిస్తూ), హృదయములో ఎట్టి సంరంభము లేనివాడవై ఉండు. బయటకు ‘కర్త’గాను, అంతరమున ‘అకర్త’గాను శుద్ధ బుద్ధితో లోకములో విహరించు.
శుద్ధమైన వివేకము (బుద్ధి) గల ఓ నిదాఘా! అహంకారమును, అహంకర్తా భావనను త్యజించి ఉండుము. శాంతబుద్ధితో కళంక రహితుడవై ప్రశాంతమగు నిర్మలాకాశమువలె శోభిస్తూ, దేనినీస్వీకరించక ఈ లోకమునందు విహారము సల్పుచుండెదవుగాక!
ఉదారమైన సర్వ ఆచారములలో అనువర్తిస్తూనే, అంతరమున సంగమును మొదలంట్లా పరిత్యజించి ఉండుము. బయటకు సంసారివై ఉండుము. అంతరములో సమస్తము సన్న్యసించి ఉండు.
అంతర వైరాగ్యం ఆదాయ
బహిః ఆశా ఉన్ముఖే హితః।
‘అయం బంధుః, అయం నేతి’’
గణనా లఘుచేతసామ్।
ఉదార చరితానాన్తు, వసుధైక కుటుంబకమ్।
(వసుధైవ కుటుంబకమ్)।
అంతరమున ఈ దృశ్యసమస్తమునకు అతీతుడవుగా ఉండుము. వైరాగ్యమును ఆశ్రయించి, బయటకు లోకశ్రేయోదృష్టితో శుభాశయ ములను కలిగి ఉండుము. ‘నేను ఇది కాదు’ అని ఎరిగియే సహజీవులకు ఆహ్లాదప్రదుడై ఉండటము ఆత్మజ్ఞానికి స్వభావము అయి ఉన్నది. అంతరంలో ఆశలు లేనివాడవై, బయటకు ఆశలు కలిగినవాడవై ఉండు.
‘‘వీరు నాకు బంధువులు. వారు కాదు’’ - అనునది అల్పబుద్ధివలననే ఏర్పడుతుంది. ఉదారచరితుడగు ఆత్మజ్ఞానికి ఈ భూమిపైగలవారంతా తన కుటుంబ సభ్యులే. ఈ భూమి అంతా తన కుటుంబమే।
భావ-అభావ (భవ-అభావ) వినిర్ముక్తమ్,
జరా మరణ వర్జితమ్,
ప్రశాన్త కలన ఆరంభం,
నీరాగం పదం ఆశ్రయ।
ఓ నిదాఘా! భావ - అభావములను రెండిటినీ త్యజించినవాడవై ఉండు. భావమునకు - అభావమునకు మునుముందే (మరియు) భావ-అభావముల మధ్యగా ఏ కేవల భావాతీత - భావరహిత - భావనలకే జననమగు స్థానము ఉన్నదో - అద్దానిని ధారణ చేస్తూ, ఆశ్రయించి ఉండుము. ఉనికి (భవ) భావనకు ముందే ఉన్నట్టి దానిని ఆరాధించు.
శరీర ధర్మములైనట్టి జన్మ - జరా-మరణములు దేనికి ఏమాత్రము చెందినవి కావో, అట్టి నీయొక్క కేవలస్వరూపమును ఆశ్రయించు.
ప్రశాంత జలములో తరంగములు బయల్వెడలుచూ ఉన్నప్పటికీ జలము తనయొక్క ‘రుచి-నిరాకారము’ మొదలైనవి పోగొట్టుకోదుకదా! అట్లాగే తన ప్రశాంత రూపమునుండి ఈ జగత్తులు మొదలైన ‘కలనము’. ప్రారంభమగుచూ కూడా, ఆత్మ తనయొక్క సత్-చిత్-ఆనందములను వీడదు. అట్టి నీయొక్క ప్రశాంతకలనము - రాగ రహితము అగు పదమునే సర్వదా సందర్శించు.
ఏషా బ్రాహ్మీ స్థితిః స్వచ్ఛా, నిష్కామా విగతామయా
ఆదాయ విహరన్ న ఏవం, సంకటేషు విముహ్యతి।।
(ఆదాయ విహరన్ ఏవం, సంకటేషు న ముహ్యతి)
అట్టి స్వచ్ఛము, నిత్య నిర్మలము, నిష్కామము, మాయారహితము అగుస్థితిని సముపార్జించుకొన్నవాడు - ఇక, ఈ దృశ్య జగత్తులో ఎక్కడ ఉన్నప్పటికీ, అట్టివానికి ఇక్కడి సంకటములు మోహము కలిగించలేవు.
14. వైరాగ్యేణ అథ శాస్త్రేణ
మహత్వాది గుణైః అపి,
యత్ సంకల్ప హరార్థం తత్
స్వయం ఏవ ఉన్నయేత్ మనః।। (ఉన్మయేత్ మనః)।
రాగ-ద్వేషములు లేకుండా చేసుకొను రూపమగు వైరాగ్యము, శాస్త్ర విచారణ, (‘‘ఈ సమస్తము నేనైన నేను’’ అను) మహదత్వము, ప్రేమ-భక్తి-ఇత్యాది సాత్విక గుణములు ఇవన్నీ కూడా….‘‘సంకల్పరాహిత్యము’’ను (సంకల్పములను దాటి, సంకల్పించువాని మునుముందు రూపముయొక్క ధారణ సిద్ధి) కొరకే। అట్టి సంకల్పరాహిత్యమును సంకల్పరూపమగు మనస్సు చేతనే యత్నించి, మనస్సును ‘ఆత్మ’ అను ‘ఉత్’ స్థానమునకు జేర్చాలి.
వైరాగ్యాత్ పూర్ణతాం ఏతి మనో నాశ
దశ అనుగమ్। ఆశయా రక్తతాం ఏతి
శరదీవ సరో అమలమ్।।
శరత్‌కాలములో (చలికాలంలో) నిర్మల సరోవర జలమును మంచు కప్పి, (సరోవర) నిర్మల జలమును కనబడకుండా చేస్తుంది చూచావా? మనస్సు ఆశలచే అనురక్తమగుటచేతనే నిర్మలమగు ఆత్మ అనుభవమవటంలేదు. వైరాగ్యముచే మనస్సు నిలిపినప్పుడు ‘అన్యము’ అనునదంతా మంచు కరిగినట్లు కరిగిపోయి - నిర్మలమగు ఆత్మయే సర్వత్రా అనుభవము కాగలదు.
తమ్ ఏవ భుక్తి విరసం వ్యాపార-ఔఘం
పునః పునః, దివసే దివసే కుర్వన్
ప్రాజ్ఞః కస్మాత్ న లజ్జతే
రసహీనమైనట్టి విషయాలనే రోజురోజు మరల మరల అనుభవిస్తూ, ప్రతిరోజు చేసిందే చేయుచూ, విరసమగు వ్యాపారములో మునిగి తేలుచూ, ఆత్మజ్ఞానమునకు అవకాశమైయున్న ఆయుష్షును గడపటానికి ప్రాజ్ఞుడైనవాడు సిగ్గుపడవద్దా? తెలివిగలవాడు సిగ్గుపడాలి. సరీయిన మార్గము కొరకు ప్రయత్నించాలి.
చిత్ చైత్య కలితో ‘‘బన్థః’’।
తత్ ముక్తౌ ‘‘ముక్తిః’’ ఉచ్యతే।
చిత్ చైత్యాకిలాత్మ ఇతి
సర్వ సిద్ధాన్త సంగ్రహః।
చిత్ చైతన్యము - ఒకానొక సందర్భములో ‘‘దృశ్య విషయముల కలనమే (కల్పనను) సత్యము’’ - అని అనుకోవటమే బంధము. అనుభవముల నుండి అనుభవి యొక్క ఆత్మచైతన్య స్వరూపము విడివడి ఉండటమే ‘‘ముక్తి.’’ ‘చైతన్యము’ (అనుభవమయేదంతా) ఆత్మతో ఏకము-అనన్యము అయి ఉండటమే ముక్తి।

‘‘అనుభవము-అనుదానికి మునుముందే ఉన్న ‘అనుభవి’ యొక్క కేవలస్వరూపమగు ఆత్మచైతన్యమే తానై ఉండటము’’-అనునదే సర్వ సిద్ధాంతముల సారము. సర్వప్రయత్నముల అంతిమ స్థానము - అదియే.
ఏతం నిశ్చయమ్ ఆదాయ, విలోకయ
యథా ఇచ్ఛయా, స్వయమేవ ఆత్మన్
ఆత్మానం ‘‘ఆనన్దం పదం’’ ఆప్స్యసి।।
చిత్ అహం। చిత్ ఇమే లోకాః।
చిత్ ఆశాః। చిత్ ఇమాః ప్రజాః ।
దృశ్య దర్శన (వి)నిర్ముక్తః
కేవల అమల రూపవాన్,
నిత్య ఉదితో, నిరాభాసో
ద్రష్టా సాక్షీ చిత్ ఆత్మకః।।
‘‘అట్టి కేవలమగు ఆత్మయే సర్వదానేనై ఉన్నాను’’ - అను నిశ్చయము సిద్ధింపజేసుకొని, ఇక నీకు ఎట్లా ఇష్టమైతే అట్లా ఈ దృశ్య జగత్తులో విహరించు. అప్పుడిక ఆత్మచే ఆత్మానందపదమును పొంది ఆనందించగలవు.
= నేను చిత్ స్వరూపుడను.
= ఈ లోకము, ఈ సమస్త దృశ్యము చిత్ స్వరూపమే.
= ఆశ, ఆశించబడునది కూడా చిత్ స్వరూపమే.
= సమస్త జీవులు చిత్ స్వరూపులే.
= నేను దృశ్య - దర్శనముల నుండి నిత్యముక్తమగు (Always Relieved) స్వరూపుడను.
= కేవలమగు నిర్మలాత్మ స్వరూపుడను.
= నిత్యోదయ నిరాభాస (ప్రతిబింబరహిత) స్వరూపుడను.
= కేవల ద్రష్టను. సమస్తమునకు సాక్షిని. చిదానందాత్మ స్వరూపుడను.
అను భావనను ప్రవృర్థము, నిశ్చలము చేసుకొనెదవు గాక!
15. చైత్య నిర్ముక్త చిత్ రూపం,
పూర్ణః జ్యోతిః స్వరూపకమ్,
సంశాన్త సర్వసంవేద్యం
సంవిత్ మాత్రం అహం మహత్।।
‘‘సమస్త ఇంద్రియ విషయములచే (చైత్యరూపములచే) బద్ధుడను కానట్టివాడను. చిత్ జ్యోతి స్వరూపుడను. చిత్ తత్త్వముచే పూర్ణుడను. తెలియబడేదంతా సశాంతిస్తూ ఉండగా, మహత్ రూపమగు (సత్+విత్) సంవిత్ మాత్రుడను’’ - అను భావనను ఆశ్రయించు.
సంశాన్త సర్వ సంకల్పః
ప్రశాన్తః సకలేషణః, నిర్వికల్ప పదం గత్వా
‘‘స్వస్థో’’ భవ, మునీశ్వర! ఇతి।।
ఓ మునీశ్వరా! ఈ విధమైన బుద్ధి యొక్క భావనచే సర్వ సంకల్పములను ఆత్మభావనయందు సశాంతింపజేసెదరు గాక. సకల ఈషణములు (Expectations & Desires) ఆత్మభావనచే ఉపశమించునుగాక! నిర్వికల్ప పదమునందు ప్రవేశించి స్వస్థుడవై ఉండుము.
ఫలశ్రుతి
య ఇమాం మహోపనిషదం బ్రాహ్మణో
నిత్యం అధీతే, అశ్రోత్రియః శ్రోత్రియో భవతి।
అనుపనీత ఉపనీతో భవతి।
సో అగ్నిపూతో భవతి।
స వాయుపూతో భవతి।
స సూర్యపూతో భవతి। స సోమపూతో భవతి।
స సత్యపూతో భవతి। స సర్వపూతో భవతి।
స సర్వైః దేవైః జ్ఞాతో భవతి।
స సర్వేషు తీర్థేషు స్నాతో భవతి।
స సర్వైః దేవైః అనుధ్యాతో భవతి।
స సర్వ క్రతుభిః ఇష్టవాన్ భవతి।।
ఫలశ్రుతి
ఎవ్వడైతే ఈ ‘‘మహోపనిషత్’’ బ్రాహ్మణమును నిత్యము అధ్యయనము చేస్తూ ఉంటాడో అట్టివాడు
💐 అశ్రోత్రియుడు కూడా - ఉపనిషత్ హృదయమును ఎరిగినవాడై ‘శ్రోత్రియుడు’ కాగలడు.
💐 ఉపనీతుడు కాకపోయినా కూడా ఈ అధ్యయన ప్రభావముచేత బ్రహ్మతత్త్వజ్ఞుడు (ఉపనీతుడు) అవగలడు.
💐 అట్టివాడు అగ్నివలె, వాయువు వలె సూర్య-చంద్రులవలె పునీతుడు, పవిత్రుడు కాగలడు. సత్యముచేతను, సమస్తము చేతను పవిత్రుడగుచున్నాడు.
💐 సర్వ దేవ తత్త్వములు ఎరిగినవాడు, సర్వతీర్థములందు స్నానము చేసిన పవిత్రుడు కాగలడు.
💐 అట్టివాడు సర్వదేవతలను ధ్యానముచే ఉపాసించినవాడు అగుచున్నాడు.
💐 సర్వక్రతువుల ఇష్టాపూర్తము నిర్వర్తించినవాడు అవగలడు
గాయత్ర్యాః షష్టి సహస్రాణి జప్తాని ఫలాని భవంతి।
ఇతిహాస పురాణానాం రుద్రాణాం,
శతసహస్రాణి జప్తాని ఫలాని భవంతి।
ప్రణవానాం అయుతం, జప్తం భవతి।।
ఆచక్షుషః పంక్తిం పునాతి।
ఆసప్తమాన్ పురుష యుగాన్ పునాతి।।
ఇత్యాహ భగవాన్ హిరణ్య గర్భః….।
జాప్యేవ అమృతత్వం చ గచ్ఛతి।
ఇతి ఉపనిషత్।।
💐 గాయత్రీ మంత్రమును 60,000 సార్లు జిపించిన మనోవికాసము / జపఫలము సిద్ధించగలదు.
💐 ఇతిహాస-పురాణముల అధ్యయన ఫలము లభించగలదు.
💐 లక్షసార్లు రుద్రమును జపించిన ఫలము పొందబడగలదు.
💐 అర్ధయుక్తంగా ప్రణవమును జపించిన స్థితి స్థితించగలదు.
💐 ఆతని చూపు చేత కనుచూపు మేర పరమ పవిత్రత సంతరించుకోగలదు.
💐 అధ్యయనము చేసినవాని అటు ‘7’ ఇటు ‘7’ తరములు పవిత్రము కాగలవు.

ఈ విధంగా భగవానుడగు హిరణ్యగర్భుడు జీవులందరికీ జ్ఞానము ప్రసాదించినవారై ఉన్నారు.
ఇందలి అంతరార్థ జపముచే ఈ జీవుడు అమృతస్థానము చేరగలడు.

ఇతి మహోపనిషత్ ।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।

శ్రీమత్ సరస్వతీ జగన్మాతా సహిత
హిరణ్యగర్భాయ - బ్రహ్మదేవాయ
నమో నమో నమో నమః



సామ వేదాంతర్గత

7     మహా ఉపనిషత్

(యోగవాసిష్ఠ మహాగ్రంథ ముఖ్య విశేషములు)

అధ్యయన పుష్పము

చిదాకాశమునందు సంస్థితమై (ఉనికి కలిగి), ఈ ‘‘మహోపనిషత్’’చే తెలియబడుచూ ఉన్నట్టి పరమ అద్వైత సామ్రాజ్య తత్త్వ స్వరూపుడగు తత్ - రామబ్రహ్మమే మాకు ఉపాస్యము. ఉపాస్య దైవము.

1వ అధ్యాయము

నారాయణీయ → విరాట్-స్వరాట్

పరమాత్మకు అత్యంత సమీప్యమునకు, పరమాత్మతో మమేకత్వమునకు దారి చూపిస్తున్న ‘మహోపనిషత్’ వ్యాఖ్య (A Subtle Analysation)… ఇక ఇప్పుడు చెప్పుకుంటున్నాము. (ఇది ‘‘శ్రీమద్ ‌యోగవాసిష్ఠ సార విశేషములు’’ - అని కూడా ఆర్యవాక్యము.)

ఎదురుగా కనిపిస్తూ పంచేంద్రియములకు విషయము అగుచూ ఉన్న ఈ దృశ్య జగత్తుకు మునుముందుగా - కేవల నారాయణతత్త్వము మాత్రమే ఉనికిని కలిగియున్నది. అట్టి ఏకమగు నారాయణతత్త్వము సమక్షంలో మొట్టమొదటగా సృష్టి లేదు. సృష్టి యొక్క సంకల్పాభిమానియగు బ్రహ్మ లేరు. అనేక రూప-నామములుగా విస్తరించు విశేషణములు గల ఈశ్వరుడు లేరు. జలముగాని, అగ్నిగాని, ఓషధిప్రదాతయగు సోముడుగాని, ఆకాశముగాని, భూమిగాని, నక్షత్రములు గాని, సూర్యుడుగాని, చంద్రుడు (సూర్యచంద్ర బింబములు) గాని లేరు. నారాయణుడు మాత్రమే కేవలుడై, అన్యమునకు సంబంధించిన ఏకల్పనా కూడా లేనివారై రమించుచూ ఉన్నారు.

అప్పుడు ఆ నారాయణుడు ‘‘నాయొక్క వైభమును చూచుకొని నేను ఆనందించాలి కదా!’’.. అను ఉత్సుకత, వినోదాభిలాష పొందారు. ‘‘క్రీడా వినోదము - విలాసము పొందటానికి నేను ఇప్పుడు ఏమి చేయాలి?’’ - అనురూపము గల ‘తపన’ పొందసాగారు. అదియే తపస్సు. తస్య ధ్యాన - అంతస్థస్య ‘‘యజ్ఞస్తోమమ్’’ ఉచ్యతే।। అనన్య స్వరూపుని యొక్క అన్యము కొరకై అంతర - ధ్యానమే ‘‘యజ్ఞస్తోమము’’ - అని పిలువబడుతోంది. ఆ యజ్ఞస్తోమము నుండి క్రీడా ఆనంద ప్రదర్శనంగా ఈ సృష్టి రచనా చమత్కారమంతా (అనన్యములో అన్యముగా) బయల్వెడలుతోంది.

యజ్ఞస్తోమము

అన్యము యొక్క వినోదము సిద్ధించటానికై (అనగా) సృష్టియొక్క ప్రదర్శము మౌఖికము అవటానికై (To materialize the fun of creation from out of creator who has been since beyond creation) - 14 పురుషకారములు (లేక) పురుషులు బయల్వెడలసాగారు. ఒక ‘కన్య’ కూడా (బుద్ధి).. బయల్వెడలటం జరిగింది. (మమ గుణ ధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాసే।)

10 ఇంద్రియములు (భావనా రూపములు)

జ్ఞాన : ఇంద్రియములు ఇంద్రియ గోళములు ఇంద్రియ విషయములు
(1) శోత్ర - ఇంద్రియములు చెవి శబ్దము (వినికిడి) (Sound)
(2) త్వక్ - ఇంద్రియము చర్మము స్పర్శ (Touch)
(3) చక్షు - ఇంద్రియము కన్నులు రూపము (Form)
(4) జిహ్వ - ఇంద్రియము నాలుక రసము (రుచి) (Taste)
(5) ఘ్రాణ - ఇంద్రియము ముక్కు వాసన (గంధము) (Smell)
కర్మ : ఇంద్రియములు ఇంద్రియ గోళములు ఇంద్రియ విషయములు
(6) వాక్- ఇంద్రియము నోరు వచనము (Talk)
(7) పాణి - ఇంద్రియము చేతులు ఆదానము (Working / Carrying)
(8) పాద - ఇంద్రియము కాళ్ళు గమనము (Walking)
(9) పాయు - ఇంద్రియము గుదము విసర్జనము (Releasing)
(10) ఉపస్థ - ఇంద్రియము గుహ్యము ఆనందము (Enjoying)

(ఇంద్రియములు = శక్తి రూపములు)
ఇంద్రియ గోళములు = ఆ శక్తిని (దేహము నుండి) ప్రదర్శించుటకు బహిర్గతమగు స్థానములు (Just like Delivery Pumps)
ఇంద్రియ విషయములు = అనుభవించబడునవిగా అగుచున్నవి దృశ్య వ్యవహారములు (All That being experienced)
ఈ విధంగా నారాయణుని నుండి ఆయనయందే - దశేంద్రియములు భావనాశక్తి రూపములై బయల్వెడలసాగాయి.

అంతేకాకుండా..,
11వది = తేజోరూపంగా ‘ఆలోచనా ప్రవాహం’గా మనస్సు జనించింది.
12వది = అహంకారము రూపము పొందింది. (‘నేను’ అను భావనకు కర్త నారాయణుడే అయి ఉండగా, నారాయణుడు, ‘నేను’కు మునుముందే అమూర్తీభవించి ఉన్నవారు. అందుకే ‘ఆదినారాయణుడు’. ఇవన్నీ ఆయన సంపద కాబట్టే శ్రీమన్నారాయణుడు’).
13వది = ప్రాణశక్తి (అట్టి ప్రాణశక్తికి శ్రీమన్నారాయణుడే ప్రాణేశ్వరుడు. ఆత్మయే శ్రీమన్నారాయణుడు).
14వది = ఆత్మ (The Self) (శరీరము / శరీరి అని కూడా అర్ధం చెప్పబడుతోంది)
15వది = బుద్ధి

ఈ 15 మాత్రమే కాకుండా
‘5’ సూక్ష్మభూతములగు పంచ తన్మాత్రలు ళిశబ్ద - స్పర్శ - రూప - రస - గంథ భావనలు (సూక్ష్మ భావనా చమత్కారములు)రి
‘5’ - పంచ మహాభూతములు (Solid - Liquid - Heat - Vapour - Spacing)

పై ‘25’ తత్త్వములతో సృష్టిగా పరమ పురుషుడగు శ్రీమన్నారాయణుని నుండి సృష్టి పురుషుడు (లేక, విరాట్ పురుషుడు జనించారు. అట్టి సృష్టిలో నారాయణుడే పురుషకారముగా (The Inspirer, The worker of the Universe)గా ప్రవేశించారు. అదియే ‘‘శ్రీమత్ చైతన్యము’’ అని కూడా వర్ణితము. ‘‘అధిష్ఠాన పురుషుడు’’ అని కూడా అంటారు. ఒక రాజు గారి అధికారములు - పరిపాలన రాజ్యమంతా మూలమూలనా వ్యాపించటము ఎట్టిదో, అధిష్ఠాన పురుషుడు - అధిష్ఠాన పురుషకారము అటువంటిది.

ఆ విరాట్ పురుషుని నుండి అప్రమేయము, అభౌతికము, అనిర్వచనీయము, అప్రతిహతము, అతిచమత్కార రూపము - అగు కాలము (Time factor) - ప్రధాన, సంవత్సరముల రూపంగా (with the measuring units of years) పుట్టుకొచ్చింది.

అథ పునరేవ నారాయణః సో అన్యత్ కామో మనసా ధ్యాయతా! పై రీతిగా సంకల్పించిన శ్రీమన్నారాయణుడు ఇంకా కూడా సంకల్పనా వినోదము కొనసాగించసాగారు. సృష్టి యొక్క మరింత నిర్దేశ్యము, మరోహరము కొరకై - ధ్యానము చేయసాగారు. అట్టి ధ్యానము (Avocative thinking) చేత ‘‘లలాటము’’ (fore face) నుండి - (మూడు కనులు గల) ‘‘త్రినేత్రుడు, త్రిశూలప్రాణి’’యగు ఒకానొక పురుషకారముతో కూడిన పురుషుడు జనించారు. ఆయనయే ఈశ్వరుడు. (సమస్తముగా విస్తరించు స్వభావుడు).

అనంత - మహత్తరము అగు అట్టి తేజోమయ పురుషకారము నుండి -
- యశస్సు … సర్వత్రా ప్రకాశమానము, (Manifesting)
- సత్యము… యమ్-సత్-ఘనీ భూతము, అప్రతిహతమగు ‘ఉనికి’-భావన (The sense of one’s own presence)
- బ్రహ్మచర్యము …. ‘బ్రహ్మము’ (Alpervading absolute self) యొక్క చర్యము.
- తపస్సు… చైతన్యము యొక్క సమస్తమును తపింపజేయు - దివ్య భావనారూపము.
- వైరాగ్యము … దేనిచేతనూ పరిమితము కానట్టి రాగరాహిత్యము.
- మనస్సు … మనన రూపమగు యోచనా స్రవంతి.
- ఐశ్వర్యము … సమస్త నామ-రూప -గుణ ఇత్యాది విశేషములతో కూడిన సంపద.
- ప్రణవ సహిత వ్యాహృతులు … ‘అ’కార ‘ఉ’కార ‘మ’ కార పురుష - ప్రకృతి. వ్యాహృతి విస్తరణ, రససౌందర్యములు.
- ‘ఋగ్వేదము’.. ఋక్కులతో (బ్రహ్మమును నిర్వచించు సూత్రములతో) ప్రవరలు.
- యజుర్వేదము .. యజ్ఞ - యాగాది క్రమములతో కూడిన కార్యరూప (మంత్ర-తంత్రరూప) ఉపాసనలు.
- సామవేదము .. పరతత్త్వము గురించిన గాన రూపములైన అభివర్ణనములు
- అధర్వణవేదము … ప్రకృతి సౌందర్యోపాసనలు, ప్రకృతి యొక్క జీవన - పోషణా చమత్కార రహస్య వర్ణనలు.
- సమస్త ఛందస్సులు .. శబ్ద సౌందర్యములు.
ఇవన్నీ ప్రకాశించసాగాయి.

అట్టి త్రిమూర్తి యొక్క తేజోవిభవమే తదితర సమస్తము అవసాగింది. అదంతా ఆ త్రినేత్రుని సమాశ్రయించినదై సంప్రదర్శనమవసాగింది.

అందుచేతనే ఆ త్రినేత్ర పురుషుని - ‘‘ఈశానుడు’’, ‘‘మహాదేవుడు, దేవదేవుడు’’ అని వేదవాక్కులు స్తుతిస్తున్నాయి.

త్రినేత్ర పురుషుని కల్పన తరువాత శ్రీమన్నారాయణుడు - సృష్టికామము కొనసాగిస్తూ మనస్సుచే ధ్యానమును (ధ్యాసతో కూడిన భావనను) పునఃనిర్వర్తించసాగారు. ధ్యానములో మరికొంత సంకల్పమును చేయబూనారు.

అట్టి ధ్యానముచేస్తూ ఉండగా ఆయన యొక్క లలాటము నుండి స్వేదము (చెమట) జనించింది.

బ్రహ్మధ్యానము - చతుర్ముఖము

(1) పూర్వాభిముఖము : ఆ బ్రహ్మ పూర్వాభిముఖుడై (Towards the dimension/point from where he came out) ‘ధ్యానము’ (Thinking) చేయటం ప్రారంభించారు. అట్టి ‘పూర్వాభిముఖ ధ్యానము’’ నుండి :-
- ‘భూః’ అనే వ్యాహృతి (భౌతికతత్త్వముగా - భూః శబ్దముతో కూడినది).
- ‘‘గాయత్రీ’’ ఛందస్సు,
- ఋగ్వేదము (పరమాత్మ యొక్క తాత్త్వికాభివర్ణములతో కూడిన ఋక్కులు),
- అగ్ని దేవత (వెలుగు, ఉష్ణము) - ఆవిర్భవించాయి.

(2) పశ్చిమ-అభిముఖము : పశ్చిమ (West - side) - అభిముఖ దృష్టి (పశ్చిమాభిముఖమైన ముఖము) నుండి :-
- ‘భువః’ ఇతి వ్యాహృతి (మనోవిన్యాసము),
- ‘త్రిష్టుభ్’ ఛందస్సు (జాగ్రత్ స్వప్న సుషుప్తి సంవిధానము),
- యజుర్వేదము (యజ్ఞ యాగ క్రతు విధానములు),
- వాయుదేవత (స్పందనశక్తి, సమస్త కదలికలు) -
ప్రస్ఫుటము కాసాగాయి.

(3) ఉత్తర - అభిముఖము : ఉత్తరము వైపు దృష్టి - (ముఖము) నుండి :-
- ‘సువర్’ వ్యాహృతి (అశరీరులై, దివ్య స్వరూపులై, సృష్టిరచనలో పాల్గొను దేవతలు),
- ‘జగతీ (జాగృతా) ఛందస్సు (మార్పు-చేర్పుల చమత్కారములు),
- సామవేదము (సంగీత/నాదోపాసన),
సూర్య-దేవత (తేజస్సు, జీవత్రాణ) సంప్రదర్శితమైనాయి.

(4) దక్షిణ - అభిముఖము : దక్షిణముగా అభిముఖమైన ముఖము నుండి :-
- ‘‘మహః’’ - వ్యాహృతి (జాగ్రత్ స్వప్న సుషుప్తులు తన మహత్తుగా కలిగియున్న నేను) - అను తత్త్వము (తురీయము),
- అనుష్టుప్ - ఛందస్సు (ప్రియము, ఇష్టము),
- అధర్వణ - వేదము, (ప్రకృతి-పురుషల చమత్కారము),
- సోమ(చంద్ర) దేవత (ఓషధులు, ఆహార తత్త్వము). బహిర్గతమైనాయి.

ఆ తరువాత బ్రహ్మదేవుడు మరల సృష్టి సామర్థ్యము కొరకై ధ్యానము కొనసాగించసాగారు. క్షీరసాగర నివాసి, దేవదేవుడు అగు శ్రీమన్నారాయణుని హృదయాకాశంలో దర్శించారు.

ఆయన యొక్క సందర్శనము ఈ రీతిగా కనబడసాగింది.
💐 వేలాది శిరస్సులు (భావములు, బుద్ధులు కలవారు),
💐 సహస్రాది నేత్రములు (ద్రష్ట-దృష్టులు ప్రదర్శించువారు),
💐 విశ్వమంతటికీ ఆనందమును, శ్రేయస్సును, సుఖమును ప్రసాదించు విశ్వశంభురూపులు,
💐 సమస్త విశ్వమునకు పరము (వేరు/ప్రత్యక్) అయినట్టివారు,
💐 సర్వకాల సర్వావస్థలలో ఏర్పడి ఉండుటచే ‘నిత్యుడు’,
💐 సమస్త విశ్వము తన యొక్క స్వరూపముగా కలవారు,
💐 సముద్రంలో వేలాది తరంగములున్నప్పటికీ తరంగాలన్నీ ఏకస్వరూపమే అయి ఉన్న తీరుగా ఏకో నారాయణుడు,
💐 సర్వమును తన యందే ఇముడ్చుకొని హరించువాడు కాబట్టి హరి,
అగు పరమాత్మను వివేకముతో కూడిన బుద్ధితో బ్రహ్మదేవుడు సందర్శించారు.

ఆ ఆత్మానారాయణుడే ఈ విశ్వమంతటినీ తన యొక్క ‘‘తెలుసుకోవటము’’ - అనే స్వకీయ విలాసమునందు దర్శిస్తూ అద్దానియందు అణువణువు ఉజ్జీవింపజేయుచున్న ‘‘చైతన్యస్వరూపులు’’.

ఈ విశ్వమంతటికీ ఏర్పడటము - ఉనికి - లయములను శాసిస్తూ ‘పతి’. ఈ విశ్వమంతా విస్తరించి విశ్వముగా ఏర్పడి ఉండటం చేత ‘‘విశ్వేశ్వరుడు’’. సమస్తమును ప్రసాదించు దేవతా ‘దివ్య స్వరూపుడు’. సముద్రము వలె ‘‘ఏకస్వరూపుడు’’. ఈ విశ్వమంతా ఆయన రూప విలాసమే కనుక ‘‘విశ్వరూపుడు’’.
ఎ - అధోముఖముగా (క్రింద వైపుగా నిలబెట్టబడి పద్మపు మొగ్గవలె, పద్మము యొక్క అంతరాంతర కోశము (The Inner most Vacant Recess) వలె సర్వుల హృదయాకాశమున క్రిందకు వ్రేలాడుచూ ఆ నారాయణుడే భాసిస్తూ ఉన్నారు.

హృదయము మధ్యగా అనేక నాడులు. అవన్నీ ఒక దానితో మరొకటి కలిసి పెనవేసుకొని ఉన్నాయి. అట్టి పెనవేసుకొని ఉన్న నాడుల అంతర్ - మధ్య విభాగములో మహాన్-అగ్ని-(వైశ్యానరాగ్ని)- నలువైపులా తేజోపుంజములు వెదజల్లుతూ ఉన్నది. అదియే జఠరాగ్ని (లేక ప్రాణాగ్ని) కూడా. ఈ విశ్వమంతా నిండియుండి, విశ్వమంతటినీ తేజోభూతము (Inspiring every bit of / every point of the total creation) చేయుచున్నది. అది శ్రీమన్నారాయణ చైతన్య ప్రదర్శనమే.

అద్దాని అగ్ని శిఖ పైకి, క్రిందకు తేజోరూపముగా ఏర్పడి ఉన్నది. అట్టి ‘వేదాగ్ని- జ్ఞానాగ్ని, వైశ్వానరాగ్ని - శోభాగ్ని’’ యొక్క అంతరమున అణుమాత్రముగా ఒక అగ్నికణము.

అద్దాని యొక్కజ్వాల ఊర్థ్వముఖముగా ఉన్నది. అట్టి బంగారపు రంగుతో మెరుస్తున్న అగ్ని శిఖ యొక్క చిట్టచివర (బ్రహ్మరంథ్ర సూక్ష్మాతిసూక్ష్మ అణుప్రదేశములో) పరమాత్మ విశేషముగా సర్వవిషయ-సహితుడై పరమ పురుషుడు సర్వదా వేంచేసియున్నారు.

అట్టి పరమ పురుషుడే సృష్టి సంకల్పి అగు ‘‘బ్రహ్మ’’.
సర్వానంద ప్రదాత అగు ‘‘శివుడు’’. సమస్తముగా విస్తరించియున్న ‘‘ఈశానుడు’’.
ఆయనయే త్రిలోకములలోని ఇంద్రియములను చేతివ్రేళ్ళవలె ధరించియున్న ‘‘ఇంద్రుడు’’.
ఆయనయే మార్పు-చేర్పులచే స్పృశించబడని ‘‘అక్షరుడు’’.
సకల జీవులలో స్వస్వరూపుడై (సర్వజీవులలో సమస్తాధినేత అయి పాలించుచున్న) స్వస్వరూప - విరాట్! స్వరాట్! (అశరీర దివ్యశక్తి ప్రదర్శకుడు).

ఇతి మహోపనిషత్


2వ అధ్యాయము
శ్రీ జనక - శుక సంవాదము

జీవన్ముక్తులు - విదేహముక్తులు

శ్రీ శుక మహర్షి - శ్రీ వేదవ్యాస మహర్షి కుమారుడు. మహాతేజోసంపన్నుడు. ఎల్లప్పుడు స్వస్వరూపము (లేక) అఖండాత్మ స్వరూపము నందు ఆనందతత్పురుడై ఉండువారు. జన్మతః ఆత్మతత్త్వానుభవి. పుట్టుక నుండియే ఆ మునివరాట్ → ఏది సత్యమో అది ఎరిగియుండి ఎల్లప్పుడు ఆశ్రయించి, అసత్యమగు ఈ కల్పిత ప్రపంచము యొక్క ఆను-పానులు ఎరిగియుండేవారు.

ఒకానొకప్పుడు….,
ఆ శుకమహర్షి ఒక ఏకాంత ప్రదేశములో ప్రవేశించి తనకు తానే స్వ-మనస్సు స్వ-వివేకములతో ఆత్మ గురించిన ‘‘విచారణ’’ చేయసాగారు. పంచేంద్రియములను, ఆరవ ఇంద్రియమగు మనస్సుకు కూడా అగమ్యమై, గుర్తించి చెప్పుటకు వీలు కానట్టిది’’ - అగు స్వాత్మ గురించి సునిశితబుద్ధితో విచారణ చేస్తూ ఈ విధంగా నిశ్చయాజ్ఞానమును పొందసాగారు.

శుక మహర్షి యొక్క ‘‘స్వాత్మ’’ గురించిన నిశ్చయము

శ్రీ శుకమహర్షి : (ఏకాంతముగా) ‘‘ఆహా! పంచేంద్రియముల చేత, ఆరవ ఇంద్రియమగు మనస్సు చేత కూడా నా యొక్క ఆత్మ గురించి వివరించి ఎప్పటానికి సాధ్యము అయ్యేది కాదు. ఎందుకంటే - ‘‘కేవలమగు ఎరుక’’గా చిన్మాత్ర స్వరూపమగు నా యొక్క వాస్తవరూపము అణువు కంటే, ఆకాశము కంటే కూడా అత్యంత సూక్ష్మము. ఊహకు అందదు. ప్రజ్ఞకు మాత్రమే అందుతుంది.

పరమసూక్ష్మమగు నా యొక్క పరతత్త్వమే నా స్వస్వరూప - చిత్ అణువు నందు మాయాశక్తి యొక్క విశేషము చేత అనంతకోటి బ్రహ్మాండములను కల్పిస్తోంది. ఎడారిలో గాలి వీచినప్పటి అసంఖ్యాక ఇసుక రేణువులులాగా - నా యొక్క మాయా శక్తియే ఇక్కడే ఉత్పత్తి, స్థితి, లయములు కల్పించుకుంటూ పోతోంది.

నా యొక్క చిత్‌స్వరూపము బాహ్యమున శూన్యమువలె అగుపించటం చేత ‘‘చిదాకాశము’’ అని పిలువబడుతోంది. వాస్తవానికి నా ఆత్మ భౌతికంగా ఆకాశ రూపము వంటిది కాదు. ఆకాశము కంటే అత్యంత విలక్షణమైనది.

ఆత్మ యందు ఈ భౌతికాకాశము లేదు. నా ఆత్మ - ‘ఇట్టిది’ అని ఒక వస్తువువలె నిర్దేశించ చెప్పబడజాలనిది. అది ఉనికి - ఎరుకలను (సత్-చిత్‌లను) ప్రకాశింపజేయు స్వయం ప్రకాశరూపము. తెలియబడునదంతా తన యొక్క చేతన శక్తిచే తనకు అనన్యముగా ప్రకాశింపజేయుచు, తాను మాత్రము ఎల్లప్పుడు యథాతథంగా ఉంటోంది. విజ్ఞాన ఘన శిలాస్వరూపము.
ఘనీభూతమైన ‘ఎరుక’ స్వరూపము. అత్యంత నిర్మలము. స్వయం ప్రకాశము. అట్టి నా యొక్క ఆత్మ- తనయందు తానే, తనయొక్క షోడశకళాచమత్కారంచేత ‘‘జగత్తు’’ అనే చిత్రమును ‘‘ఎరుక’’ అనే కుంచెతో గీసుకొని వినోదిస్తోంది. మమాత్మయే భావనా మాత్రంగా జగత్తును ఒకప్పుడు కల్పించుకొని, మరొకప్పుడు ‘‘స్వస్వరూపమునకు అభిన్నమే కదా’’ అనే భావనతో తనయందు ఏకము చేసివేసుకుంటోంది.

ఈ విశ్వము సర్వదా మమాత్మ స్వరూపము యొక్క ప్రకాశరూపమే. కాబట్టి - అగ్నికి వెలుగు వేరుకాని విధంగా మమాత్మానంద స్వరూపమునకు ఈ జగద్దృశ్యము ఏక్షణమూ నాకు వేరై ఉండనే లేదు. ఇక ఈ విశ్వమునకు ఉత్పత్తి ఏమున్నది? లయమేమున్నది? అగ్ని వెలుగుచుండగా అనేక అగ్ని శిఖలు ప్రదర్శితమగుచూ ఉంటే అవన్నీ అగ్నికి వేరా? కాదు.

అగ్నిశిఖ సాకారము కాబట్టి అగ్నికి ఆకారమున్నట్లా? కానే కాదు. అట్లాగే ఆత్మ అనే అగ్ని యొక్క శిఖలవంటి ‘‘పంచభూత-పంచతన్మాత్ర - పంచకర్మేంద్రియ - పంచజ్ఞానేంద్రియ - పంచప్రాణ-పంచ ఉపప్రాణ’’ - వంటి పంచ -పంచములతో కూడిన ఈ ప్రపంచము, ఈ భౌతిక దేహి-దేహములు సాకారముగా కనబడుచూ ఉన్నప్పటికీ - అవన్నీ ఆత్మాగ్ని యొక్క అగ్ని శిఖల వంటివి. ఆత్మ సర్వదా నిరాకారము. సాకారంగా కనిపిస్తూ ఉన్నది కూడా ఆత్మయే.

తత్ భావమాత్రమ్, ఇదం జగత్, ఇదం విశ్వం ఇతి। నా ఆత్మయొక్క ‘భావన’ చేతనే ఈ సమస్త విశ్వము రూపుదిద్దుకుంటోంది. ఇక్కడి జగత్తు యొక్క సారూప్యమంతా భావన యొక్క - రూపమునకు సంబంధించిన ‘ఆశ్రయము’ - మాత్రమే. తత్ భాసమాత్రమ్। ఈ జగత్తు ఆత్మయొక్క ప్రకాశరూప చమత్కారమే।

నస్యాత్ తత్తః పృథక్। నా యొక్క స్వకీయభావనా మాత్రంగా అనుభవమగుచూ, సాకారమై సన్నివేశములతో కనబడుచున్న-ఈ జగత్తు - నేను భావనలను విరమించిన మరుక్షణం - నాకు వేరువేరుగా కనిపించేదంతా నశించినదే అగుచున్నది. స్వప్నద్రష్టయందు స్వప్నము ఉపశమించుతీరుగా,….ఇదంతా నాయందే ఉపశమించుచున్నది.

జగత్ భేదో-పి తత్ భానమ్ ఇతి భేదో-పి తన్మయః। ఆత్మనగు నేను ‘భాసించటము’’ అనే క్రీడను లీలగా ప్రారంభించి, అనేక భేదములను భావించటము చేతనే ఇక్కడి జగత్తులో అనేక భేదములు కనిపిస్తున్నాయి. పరము, అప్రమేయము అగు నన్ను నేను కొంచెము సేపు ఏమరచి, నా యొక్క భావనారూప జగద్దృశ్యములో కనబడే భేదములతో లీలగా తన్మయమై ఉండటము చేతనే - ‘జగత్తు’ అనబడేది ఉనికి పొందుతోంది. అందుచేత సమస్త భేదములు ఆత్మమయమే. ‘‘ఆత్మయే ఆత్మయందు అనేక భేదములవలె’’ (భ్రమదృష్టికి) అగుపిస్తోందిగాని, ఆత్మ ఎల్లప్పుడు అఖండమే।

సర్వగః సర్వ సంబంధో గత్య భావాన్, న గచ్ఛతి। ఆత్మ అనేక సంబంధములను భావనా రూపముగా కల్పించుకొనుచూ, ఈ అనేక భేద భావనలను ఒకప్పుడు కలిగిఉంటోంది. ఈ భేద భావనలన్నీ ‘‘రావటము - పోవటము’’ జరుగుచూ ఉండటమే జగత్ (జ= జనించటము, జరుగుతూ - గత్= గతించటము). అయితే, భావముల ‘రాక’తో నేను రావటము లేదు. భావముల ‘పోక’ తో నేను పోవటము లేదు. నేను ఎక్కడి నుండీ రావటము లేదు. ఎక్కడికీ పోవటము లేదు.

భావములను ఆశ్రయించినంత మాత్రం చేత భావాతీతమగు ఆత్మగా నేను దేనినీ ఆశ్రయిస్తున్న వాడినీ కాను. సద్రూపుడనగు నేను - ‘‘జాతి-కుల -జన్మ-కర్మ-దేశ-కాల-ఇహ- పర-జీవాత్మ-పరమాత్మ’’-ఇత్యాది భావములచే పరిమితుడను కాను. బంధము పొందువాడనుగాను. అసలు సంబంధితుడనే కాను.

సముద్ర జలంతో అనేక తరంగాలు బయల్వెడలి ఏమౌచున్నాయి? జలములోనే సంచారములు చేసి చివరికి జలమునందే లయమగుచున్నాయి. ‘‘తరంగములకు ఆకారమున్నది కాబట్టి జలము తరంగములవలె సాకారము’’ - అని అంటామా? అనము. జలము సాకారము కాదు. తరంగము జలమునుండియే ఉత్పన్నమగుచూ సాకారము కలిగి ఉండి, ఒకప్పుడు జలములో సాకారముతో సహా లయమగుచున్నది.

కేవలచిత్ (లేక) కేవల ఆత్మానందసాగర జలస్వరూపుడనగు నాయందు ఇక్కడ అసంఖ్యాక బ్రహ్మాండములు తరంగములవలె బయల్వెడలి, సాకారముగా కనిపిస్తూ, నాయందే చరిస్తూ, చివరికి సాకారత్వముతో సహా నాయందే లయిస్తున్నాయి.

అందుచేత, ఆత్మగా నేను సర్వదా నిరాకారుడను. అస్మత్ కల్పనా రూపములగు బ్రహ్మాండములు, వాటి యొక్క రాకపోకలు - జలంలో తరంగముల ఆకారము వలె - కల్పితము. సాకారమైనదంతా నిరాకారము యొక్క స్వప్నతుల్య కల్పనా చమత్కారమే।

నాస్తి అసావ-ఆశ్రయా భావాత్ సద్రూపస్యాత్ తథాస్తి చ। జలము → ‘తరంగములు’ అనబడే మరొకటేదీగా అవనట్లే, నేను భావనా రూపముగా అవటమే లేదు. భావిస్తూ ఉన్నప్పుడు, భావరహితుడనై ఉన్నప్పుడు కూడా నా యొక్క ‘భావాతీత యథాస్థితి’ ఏదీ కోల్పోవటం లేదు. పొందటం లేదు. సర్వదా సద్రూపమై వెలుగొందుచూ, ‘భావనలు’ అనే వెలుగును నలువైపులా వెదజల్లుచున్నాను. ఆ భావనలచేతనే ఈ జగద్దృశ్యము (లేక) విశ్వము రూపము దిద్దుకోవటము, రూపము కోల్పోవటము కూడా జరుగుతోంది. అంతకుమించి ఈ బాహ్య జగత్తు సంబంధమై మరే విశేషము ఏదీ లేదు.

⌘⌘⌘

భావాతీత భావనారాయణుడనగు నానుండి జగత్ రూప భావనలు ఎందుకు బయల్వెడలుచున్నాయి? అదంతా నా యొక్క క్రీడా - లీలా-బాల్యచాపల్య-భావనా వినోదము మాత్రమే. అనగా, ఈ జగత్తు నాయొక్క ఆనందస్వరూప సంప్రదర్శనము మాత్రమే. నేను సర్వదా విజ్ఞానానంద స్వరూపుడను.

విజ్ఞాన     -     తెలుసుకొను స్వభావముతో  
ఆనంద      -     ఆనందించు  
స్వరూప    -     జగత్ కల్పనా స్వరూప చమత్కారుడను!

ఈ జగత్తును త్యజించి ధ్యానించుచూ, ధ్యానసిద్ధిని పొందిన వారందరికీ అట్టి భావాతీతమగు ఆత్మయే పారాయణము (మనన వస్తువు)గా అగుచున్నది.

అందుచే..,
సర్వ సంకల్పములను బుద్ధితో త్యజించి, అట్టి బుద్ధితోనే ఆత్మత్వమును పరిగ్రహించాలి (లేక) స్వీకరించి ఉండాలి. భావాతీతము, భావరహితము అగు ఆత్మగా ఈ సమస్త జగత్తును దర్శించటమే ఆత్మ పరిగ్రహణము (లేక) ఆత్మ భావన (లేక) ఆత్మతాదాత్మ్యము (లేక) ఆత్మ సాక్షాత్కారము. ఎవ్వరికైతే జగత్తులో ఉన్నప్పుడు కూడా గాఢ నిద్రలో ఉన్నవానివలె - ‘‘జగత్తును అభావించటము. ఆత్మను భావించటము’’ అభ్యాసమౌతుందో - అదియే ‘ప్రత్యక్ భావన’ అని పిలువబడుతోంది. ‘‘వృత్తులన్నీ త్యజించినప్పటి -వృత్తిరహిత కేవలాత్మభావనయే జ్ఞానము’’ అని బుధులు ప్రవచిస్తున్నారు.

జగత్తు యొక్క సృష్టి - ప్రళయములు

పార్థివ (లేక) పాదార్థిక దృష్టి ఆత్మజ్ఞానమును ఆవరించి ఉన్నప్పుడు కనిపించేదే ఈ సృష్టి.

‘‘సృష్టి’’ అనగా పాంచభౌతిక జగత్తు యొక్క ఉత్పత్తి అని, ‘‘ప్రళయము’’ అనగా ఇద్దాని పాదార్థికమైన వినాశనమని భ్రమచే అన్వయించబడితే, అది అల్పబుద్ధి చేత మాత్రమే ఆ విధంగా అనుకోబడుతోంది. వాస్తవానికి ‘జగత్’ అనగా ఆత్మయొక్క ‘జగత్-భావన’యే. అందుచేత జగత్‌వృత్తి (Avocation) యొక్క వికాసమే - జగత్తు యొక్క ఉత్పత్తి. జగత్ వృత్తి యొక్క సంకోచమే - ‘‘జగత్ ప్రళయము’’.

అహమ్ సత్-చిత్-పరానంద బ్రహ్మైవా-స్మి। న చ ఇతరః। నేను సర్వదా సచ్చిదానంద బ్రహ్మమే। అంతేగాని జీవాత్మను కాను. బద్ధుడను కాను. మరొకటేదీ ఏ క్షణమందు అవటమే లేదు.

- సచ్చిదానంద స్వరూపమే - నాయొక్క సహజ స్వరూపము.
- అందుకు అన్యమైనది (వేరైనది) ఏదైనా ఉంటే - అది సందర్భ కల్పితము మాత్రమే

⌘⌘⌘

ఈ విధంగా ఆ శుకదేవుడు తనయొక్క సూక్ష్మబుద్ధితో స్వయముగా ఆత్మ యొక్క కేవలత్వమును, నిత్యత్వమును ఎరిగినవాడు (విజ్ఞాతవాన్) అయ్యారు. స్వయైవ సూక్ష్మయా బుద్ధ్యా సర్వం విజ్ఞాతవాన్ శుకః।

అయితే, ఆ విధంగా పరమవస్తువును బుద్ధితో స్వయముగా ప్రాప్తించుకొన్న తరువాత కూడా ఆతని మనస్సు మాత్రం ఇంకా ఆత్మదర్శనమునందు విశ్రాంతి పొందనే లేదు. ‘‘ఆత్మయే ఈ సమస్తముగా ఉన్నది’’ అనే విశ్వాసమును, సందర్శనమును ఉపాయ పూర్వకంగా ఆయన సిద్ధించుకోలేకపోయారు. ఆతని చిత్తము ప్రాపంచక విషయముల నుండి విరామము పొందటం జరిగిందేగాని, ఆత్మయందు ప్రశాంత -స్వాభావికానందరూపమగు, నిశ్చలత్వము పొందలేదు. చాతకపక్షి తటాక జలము వదలి మేఘముల నుండి జాలువారు వర్షపు చినుకులను విడువలేని విధంగా ఆతడు భోగముల పట్ల చిత్త చాంచల్యము వీడి, ఆత్మ మందిర ద్వారమును ఆశ్రయించినప్పటికీ, - ‘ఆత్మానందము’నందు బుద్ధి, మనస్సు, చిత్తము ఏకత్వము పొందలేదు. ప్రశాంతత సిద్ధించ లేదు.

⌘⌘⌘

ఒకానొక రోజు శుకదేవులు తానున్న తపోవనము నుండి సుమేరు పర్వత శిఖరం వైపు బయల్వెడలారు. నిర్మల ప్రజ్ఞావంతులు, ఉపనిషత్తులతో సహా వేద వాఙ్మయమును సమీకరించి, విభాగించి, అధ్యయనమునకు మహత్తర సౌకర్యము కల్పించినవారు, భారత-భాగవతాది అష్టాదశ పురాణ ప్రదాత, బ్రహ్మసూత్ర ప్రవక్త, లోక కళ్యాణమూర్తి అగు తన పితృదేవులు జగద్గురువులు శ్రీకృష్ణద్వైపాయన వ్యాస మహర్షిని సమీపించారు. శ్రీవ్యాసులవారు ఏకాంత ప్రదేశములో జ్ఞానానందనిష్ఠులై ఉండగా, శుకదేవుడు వారికి సాష్టాంగదండ ప్రణామములు భక్తిపూర్వకంగా సమర్పించి, అటుపై ఈ విధంగా ప్రశ్నించసాగారు.

శ్రీ శుకదేవులు : హే భగవాన్! పితృదేవా! కృష్ణద్వైపాయన వ్యాస జగద్గురూ! మహానుభావన్। పునః పునః నమోనమః। తండ్రీ! తత్త్వానుభవమునకు సంబంధించిన కొన్ని సందేహములు నన్ను, బుద్ధితో సమస్తము విచారణ చేసిన తరువాత కూడా, - ఇంకా వదలటము లేదు. అందుచేత, తమ నుండి ‘ఆత్మతత్త్వము’ గురించిన విశేషములను శ్రవణము చేయటానికి మిమ్ములను శరణువేడుచున్నాను.

శ్రీ వ్యాసభగవానుడు : బిడ్డా! శుకా! ఇంకా కూడా ఏమి సందేహములు నిన్ను ఆశ్రయించి ఉంటున్నాయో, అడుగు నాయనా!

శ్రీ శుకదేవులు : తండ్రీ! ఈ జీవుడు సహజంగానే కేవలమగు ఆత్మయే స్వరూపముగా కలిగి ఉన్నాడు కదా?

శ్రీ వ్యాసభగవానులు : అవును. అందులో కించిత్ కూడా అనుమానమే అవసరం లేదు. ఇది మహనీయులగు ఆత్మతత్త్వజ్ఞులు ఎలుగెత్తి ప్రకటించుచున్న పరమసత్యమే. మరి నీకు సందేహమెందుకు?

శ్రీ శుకదేవులు : నాకు రెండు ప్రశ్నలు కొనసాగుచున్నాయి.

(1) సంసారాడంబరం ఇదం కథం అభ్యుత్థితం, మునే? ఓ మునీశ్వరా! ఆత్మస్వరూపుడే అయినట్టి ఈ జీవుని పట్ల ఈ సంసారాడంబరమంతా ఏ విధంగా రూపుదిద్దుకుని ఘనీభూతము అవుతోంది? ఎట్లా ఉత్పత్తి పొందుతోంది?

(2) కథం చ ప్రశమం యాతి కియత్ కస్య కదా? వద। ఇట్టి ఈ సంసార వ్యసనము (లేక) జాడ్యము ఎటువంటివారికి, ఏఏ విధానములచే, ఎప్పటికి, ఏవిధంగా తొలగగలదు?

దయతో ఈ ఈ విషయాలు నాకు వివరించి చెప్ప ప్రార్థన.

⌘⌘⌘

అప్పుడు వ్యాసమహర్షి ఆ రెండు ప్రశ్నలకు సమాధానమైయున్నదంతా సవివరంగా, దృష్టాంతపూర్వకంగా, అధ్యాత్మశాస్త్ర విశ్లేషణా విధి- విధానంగా విడమర్చి చెప్పారు. అవన్నీ శుకుడు శ్రద్ధగానే విన్నారు. కానీ,… ‘‘అజ్ఞాసిషం పూర్వమేవ అహమ్ ఇతి।’’ ఈ జీవుని సంసారాతీత కేవల స్వరూపము గురించి, కల్పనా మాత్రమగు సంసారము గురించి నేను ఇతః పూర్వమే నా యొక్క ఏకాంత విచారణచే తెలుసుకొన్న విషయమే నాన్న గారు చెప్పుచున్నారు కదా! ఇందులో క్రొత్త విషయము ఏమున్నది?’’.. అని తలచిన శుకదేవుడు తన తండ్రిగారు శ్రీ వ్యాసమహర్షి చెప్పుచున్న విషయముల పట్ల కొంతగా ఉదాసీనులై ఉన్నారు. స శుకః స్వకీయా బుద్ధ్యా న వాక్యం బహు-మన్యతే। ‘‘ఇవన్నీ తెలిసిన విషయాలే కదా!’’ అనే భావన కలిగి ఉండ సాగారు. తాను చెప్పుచున్న ఆత్మతత్త్వ సమాచారము పట్ల ఉదాసీన భావము కలిగియున్నట్లు శ్రీవ్యాసమహర్షి కుమారుని ముఖ కవళికలను బట్టి గమనించారు.

శ్రీ వ్యాసమహర్షి: ప్రియపుత్రా! శుకా! నాహం జానామి తత్త్వతః। ఆత్మ గురించి ఎంతవరకు తెలిసియున్నదో,.. అదంతా కూడా వివరించి చెప్పాను. ఇంతకుమించి నాకు కూడా తెలియదయ్యా! అయితే నాకంటే కూడా జ్ఞాన శ్రేష్ఠులగు ఒక మహానుభావుల గురించి నాకు తెలుసు. భూలోకంలో ‘జనక మహారాజు’ అనే ఆయన మిథిలానగరంలో ఉంటారు. జనకో నామ భూపాలో విద్యతే మిథిలాపురే! ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని అని లోక ప్రసిద్ధి. యథావత్ వేత్తి అసౌ వేద్యం తస్మాత్ సర్వమ్ అవాప్స్యసి। వారు నీవడిగిన ప్రశ్నలకు మరింత సాధికారముగా సమాధానమును ప్రసాదించగలరు. వారిని ఆశ్రయించి, శిష్యుడవై నీవు ఏది నిర్దిష్టముగా తెలుసుకోవాలనుకుంటున్నావో, అదంతా శ్రవణం చేసి సమస్తమును పూర్తిగా ఎరుగుము.

తండ్రి చెప్పిన వాక్యములు విన్న శుకదేవుడు తండ్రికి భక్తిపూర్వకంగా నమస్కరించి, శలవు తీసుకొని, అప్పటికప్పుడే మేరుపర్వత శిఖరాగ్రము నుండి దిగి భూమిపైకి వచ్చారు. సుదీర్ఘమైన ప్రయాణము చేసి, జనకమహారాజు పరిపాలిస్తున్న విదేహ నగరము (మిథిలానగరము)లో ప్రవేశించారు. మహారాజగు జనకుడు ఉండే రాజసౌధమును సమీపించారు. అక్కడి ద్వారపాలకులతో తనను తాను పరిచయం చేసుకొన్నారు.

శ్రీ శుక దేవుడు : ఓ ద్వారపాలకులారా! శ్రీవ్యాస మహర్షి కుమారుడను. ‘శుకుడు’ అను పేరు గలవాడను. మహారాజు జనక మహారాజు దర్శనం కోసం మా పితృదేవుల సూచనానుసారంగా ఆత్మజ్ఞానార్ధినై మేరుపర్వత శిఖరమున గల మా తండ్రి గారి ఆశ్రమము నుండి వచ్చి ఉన్నాను. ఈ విషయము దయచేసి మహారాజుకు విన్నవించండి.

వెంటనే అక్కడి ద్వారపాలకుడు ‘‘స్వామీ! అట్లాగే! ఇక్కడ ఆసీనులై ఉండండి!’’.. అని పలికి రాజుగారి మందిరములోనికి వెళ్లాడు.

ద్వారపాలకుడు : మహారాజన్! జయము జయము! తమ దర్శనానికై రాజముఖద్వారము వద్దకు పూజ్యులగు శ్రీవ్యాసమహర్షి ప్రియపుత్రుడు, మహాతపశ్శాలిగా సుప్రసిద్ధుడు అగు శుకదేవుడు మేరుపర్వతశిఖరాగ్రమున గల వ్యాసాశ్రమము నుండి విచ్చేసిఉన్నారు. తమ దర్శనమునకై అభ్యర్ధన చేస్తున్నారు. ఆజ్ఞ!

జనక మహారాజు : ఓ ద్వారపాలకా! అంతటి మహనీయుడు, తపస్వి అగు శుకుడు ఊరికే వచ్చి ఉండరు. బహుశః తత్త్వజ్ఞానము, ఆత్మానుభవముల గురించి సందేహ నివృత్తికై వేంచేసి ఉంటారు. అయితే, బుద్ధికుశలతను గ్రహించి మాత్రమే పరాకాష్ఠ విశేషాలు చెప్పాలి కదా! అందుచేత జిజ్ఞాసుడై వచ్చియున్న ఆయనను కించిత్ పరీక్ష చేసి చూద్దాము. ‘‘7 రోజుల వరకు రాజదర్శనము కుదరదు’’ అని వారికి చెప్పండి. వారి పట్ల సామాన్యుని పట్ల ఉన్న విధంగానే కించిత్ తూష్ణీభావమే కలిగి ఉండండి!

ద్వారపాలకుడు ఆ విధంగానే ‘‘శుకదేవా! 7 రోజుల వరకు మా జనక మహారాజులవారు అనేక వ్యవహారములలో నిమగ్నమై ఉంటారు. తమకు దర్శనము లభించదు’’.. అని పలికి తూష్ణీభావము వహించి ఉన్నారు. అప్పుడు శుకుడు, చెక్కు చెదరలేదు. ‘‘నాయనా! అట్లే అగుగాక! వారికి సానుకూలమైనప్పుడే దర్శనమును ఇప్పించండి’’.. అని పలికి వేచియుండసాగారు.

7 రోజులు గడిచిపోయాయి. శుకమహర్షికి రాజభవన ప్రవేశము లభించింది. కానీ రాజదర్శనము మాత్రము లభించలేదు. అయితే అక్కడి సర్వవైభవములు గల ఒక విశ్రాంతిమందిరము నివాసముగా ఇవ్వబడింది. సమస్త రాచమర్యాదలు ఆయనకు అందించబడ్డాయి. రాజాజ్ఞను అనుసరించి యౌవ్వనవతులు, మదవతులు అగు సుందరస్త్రీలు వచ్చి పానీయములు, మధుర పదార్థములు మొదలైనవన్నీ అందించసాగారు. వారంతా రాజాజ్ఞానుసారం తమ తళుకు బెళుకులు చూపసాగారు. పిల్లగాలులు పర్వతమును తాకి కూడా అద్దానికి కదల్చలేవుకదా! ఆ విధంగా మధుర పదార్థములు, రుచికరమగు పానీయములు, సుందరస్త్రీల ఆటపాటలు, సరస విరస శృంగార కవ్వింపు సంభాషణలు శుకుని మనస్సును కించిత్ కూడా ఏమీ చేయలేకపోయినాయి. కేవలం సుమనః స్వచ్ఛో మౌనీ ముదిత మానసః, సంపూర్ణ ఇవ శీతాంశుః అతిష్ఠత్ అమలః - శుకః। ఆ శుకదేవుడు కేవలమగు ఆత్మస్వరూపమును ధారణ చేసినవారై, స్వచ్ఛమగు సాత్వికమైన మనస్సుతో వేచి ఉండసాగారు.

ఎదురుగా కనిపిస్తున్న సమస్త విషయముల పట్ల అంతరమున, ‘‘ఇవి ఏ రీతిగా ఉన్నా నాకు ఒక్కటే కదా!’’.. అను ‘మౌనము’ను వహించినవారై ఉన్నారు! స్వచ్ఛతను, సంతోష - సంతృప్తులతో కూడి, పూర్ణత్వమును ఆస్వాదించుచూ, - మలరహితము, ప్రశాంతము, వేదనా రహితము, చల్లతనములతో కూడిన బుద్ధితో సాక్షిగా సర్వము సందర్శించసాగారు. ప్రశాంత-ఆనందైశ్వరముతో కూడినవారై సర్వ సందర్భములను చిరునవ్వు వీడక - చూస్తూ ఉండసాగారు. వారికి అక్కడి సంబరములు, ఆడంబరములు మంత్రగత్తె చూపు వలె మాయా విన్యాసముగా మాత్రమే కనిపించసాగాయి. జనక మహారాజు శుకుని ప్రవర్తన - స్పందనలను, ఆయన యొక్క చిరునవ్వుతో కూడిన మౌన-ఆనంద-అతీతత్వముల గురించి అక్కడి సేవకులను అడిగి తెలుసుకుంటూ ఉండసాగారు.

ఈ విధంగా మరొక ‘7’ రోజులు గడిచిపోయాయి. ఆ తరువాత జనక మహారాజు స్వయముగా శుకదేవుడు ఉన్న శోభామందిరమునకు వచ్చి ఆయనకు హృదయపూర్వకముగా ‘నమస్కారములు’ సమర్పించారు. సాదరంగా రాజసభకు ఆహ్వానించి ఉత్తమాసనము సమర్పించారు. పరిజ్ఞాత స్వభావుడు (తెలుసుకోవలసింది ఎరిగియున్నవారు), ఆనంద స్వరూపులు అగు శుకుని గౌరవాభిమానములతో చూస్తూ ఇట్లా సంభాషించసాగారు.

శ్రీ జనక మహారాజు : హే శుకభగవాన్! నమోనమః। సుస్వాగతము। పడవ నీళ్లలో ఉన్నప్పటికీ పడవలో నీళ్లు ఉండని విధంగా, మీ అంతరంగము జగత్కార్యములేమీ కించిత్‌కూడా లేనిదై, పరమ నిర్మలమై ప్రకాశిస్తోంది. తత్త్వభావనచే - ప్రాప్త మనోరథులకు ఈ జగత్తులో కావలసినదీ, పొందవలసినది ఏమీ ఉండదు - అని మీరు అంతఃపురంలో ఉన్నప్పటి 7 రోజులు ప్రవర్తనచే నిరూపించారు.

నిశ్శేషిత జగత్ కార్యః, ప్రాప్త అఖిల మనోరథః। హే మహనీయా! ఇక మీరు కోరుకొనుటకు అర్హమైనది సమస్త సృష్టిలో ఏదీ కించిత్ కూడా లేదు. సంసారముతో సంగమును మొదలంట్లా జయించివేశారు.

కిమ్ ఈప్సితమ్ తవ ఇతి? ఇంక మీరు కోరునదేముంటుంది? నిరాడంబరులు, జగద్దృశ్యమును జయించినవారు, మహనీయులు అగు మీకు ఇవే మిథిలానగర ప్రజల స్వాగత సుమాంజలులు. మీ దర్శనముచే మేమంతా పావనమైనాము.

ఇక చెప్పండి. మేము మిమ్ములను ఏమి సేవించగలము?

శ్రీ శుకదేవుడు : గురుదేవా! విదేహదేశ ప్రభూ! జనక మహారాజా। తమకు తమ రాజ్య ప్రజలకు శుభ-శాంతి- ఐశ్వర్య-ఆనందములు సిద్ధించునుగాక - అని ముందుగా శుభాకాంక్షలు పలుకుచున్నాను.

హే మహానుభావన్! నేను తత్త్వజ్ఞాన సంబంధమైన సందేహమును నివృత్తింపజేసుకోవటానికై శిష్యుడనై మీ పాదపద్మములను భక్తి ప్రపత్తులతో ఆశ్రయిస్తున్నాను.

స్వామీ! నా సందేహములను వినండి.

(1) సంసారాడంబరం ఇదం కథమ్ అభ్యుత్థితం, గురో? వాస్తవానికి సర్వదా ఆత్మానందస్వరూపుడే అయి ఉన్న జీవుని పట్ల - ఈ సంసార రూప ఆడంబరమంతా ఎట్లా బయల్వెడలుతోంది?

(2) కథం ప్రశమం ఆయాతి? ఆత్మానుభవమును దట్టముగా కప్పి వేసి ఉంటున్న ఈ సంసార రూప ఆడంబరము ప్రశమము జరిగేది ఎట్లా?

అప్పుడు ఆ రెండు ప్రశ్నలకు సమాధానంగా మహా జ్ఞాన సంపన్నుడు, మహాత్ముడు అగు జనక మహారాజు ఉన్నది ఉన్నట్లుగా - సంసారము రూపుదిద్దుకొనుచున్న తీరు గురించి, అది మరి ఎట్లా తొలగగలదో - వివరించి చెప్పారు. ‘‘ఇదంతా మనో విలాసమే! అంతకుమించి మరింకేదీ కాదు. అందుకు వేరై మరేమీ లేదు’’ - అని సమీక్షించారు. అదంతా శ్రద్ధగా విన్న శుకుడు ‘‘ఈ విశేషాలన్నీ పిత్రుదేవులు వివరించినవే కదా!’’ - అని తలచి, ఇక జనక మహారాజుతో ఇట్లా పలుకసాగారు.

శ్రీ శుకదేవుడు : హే మహాత్మన్! గురుదేవా!

మనో వికల్ప సంజాతం। తత్ వికల్ప పరిక్షయాత్, క్షీయతే దగ్ధ సంసారో నిస్సార- ఇతి నిశ్చితః।।
ఈ సంసారమంతా- ఇది ఏర్పడటము, ఈ జీవుని పట్ల బంధముగా రూపుదిద్దుకోవటం, ఘనీభూతమై అనేక జన్మ జన్మాంతరములుగా ఈ జీవుని దుఃఖితునిగా చేయటము, ఇదంతా కూడా - మనస్సు యొక్క వికల్పము చేతనే జరుగుతోంది. మనస్సు యొక్క వికల్పము మొదలంట్లా క్షయింపజేయబడిందా,… ‘సంసారము’ కూడా దగ్ధమై క్షీణించగలదు. మనస్సుచే కల్పించబడి, వాస్తవానికి ‘స్వతఃగా’ లేనిదే కాబట్టి ఇదంతా నిస్సారమైనదే।’’ - అనే నిశ్చయము గురించి నేను ఇతఃపూర్వమే విచారణ చేశాను, అట్లే నిశ్చయించుకున్నాను కూడా!

స్వయమేవ మయా పూర్వం అభిజ్ఞాతం విశేషతః। ఈ విషయము నేను ఏకాంతముగా స్వవివేక విచారణచే గమనించాను. ‘‘అవునా? ఇంతేనా?’’ ‘‘ఆత్మతత్త్వ జ్ఞానము, మోక్షము అనగా - ఇంతమాత్రమేనా?’’ అను సందేహముతో అస్మత్ పితృదేవులగు శ్రీ వ్యాస మహర్షిని సమీపించాను.

ఏతత్ ఏవ హి పృష్టేన పిత్రా మే సముదాహృతమ్। వారు కూడా ఈ విషయములే విస్తరించి చెప్పారు.

భవతాపి ఏషఏవ అర్థః కథితో, వాగ్విదాం వర! ప్రబోధము చేయుటలో విశేష ప్రజ్ఞా సంపన్నులు, వాగ్విదాంవరులు అగు ఓ జనక మహారాజా! మీరు విస్తరించి, వివరించి చెప్పినది కూడా అదే. అదే అర్థమున ఆయా దృష్టాంతముల సహాయముతో నిరూపిస్తూ చెప్పారు. కృతజ్ఞుడను.

ఏష ఏవ హి వాక్యార్థః శాస్త్రేషు పరిదృశ్యతే। నాకు ఏకాంత స్వకీయ విచారణచే తెలియవచ్చినది, మా నాన్నగారు బోధించినది, మీరు వివరించి చెప్పినది అదే. ఈ విషయమే - (మనస్సే అంతా కల్పిస్తోంది. మనస్సు ఉపశమిస్తే, సంసారాడంబరముఉపశమించగలదు. - అను విషయమే) - శాస్త్రములలో కూడా కనిపిస్తూ ఉన్నది. నిశ్చితముగా శాస్త్రములు కూడా అట్లాగే బోధిస్తున్నాయి.

సరే! శాస్త్రములు చెప్పే విషయాలన్నీ అట్లా ఉంచుదాము. తత్కిం ఏతత్, మహాభాగ? తత్త్వం బ్రూహి! మీరు ఈ సంసారమును ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ‘‘ఇదంతా నా మనోకల్పనయే’’ అనే మనో నిశ్చయం ఏవిధంగా ఆరూఢం చేసుకున్నారు?.. ఈ విశేషాలు దయచేసి చెప్పండి. విదేహముక్త సామ్రాజ్య అభిషిక్తులుగా చెప్పబడుచున్న మీ యొక్క స్వానుభవము ఏమిటో, మీరు సంసార బంధ భావముల నుండి విముక్తిని ఎట్లా ఆస్వాదించగలుగుచున్నారో, మీ పట్ల భ్రమ ఎట్లా తొలగుచున్నదో.. అది శ్రవణము చేయతలచాను. దయతో వివరించండి. అది నాపట్ల ‘సోఽహమ్’-ను స్వాభావికముగా తీర్చిదిద్దగలదు.

అప్పుడు శ్రీ జనక మహారాజు పకపకా నవ్వుచున్నవానివలె (ప్రహసన్ ఇవ) ముఖము గలవారై, ఇక ఈ విధంగా చెప్పటము ప్రారంభించారు.

⌘⌘⌘

శ్రీ జనక మహారాజు: ఆత్మజ్ఞానము గురించి మహనీయులగు అనేక మంది ఆత్మజ్ఞులచేత, ఆధ్యాత్మ (వేదాంత) శాస్త్రముల చేత విస్తారముగా చెప్పబడింది. వాటన్నిటి యొక్క సార విశేషము (The Essence of all that) మరల ఇప్పుడు చెప్పుకుందాము. శ్రద్ధగా వినండి. ఈ మనం చెప్పుకోబోతున్న విషయాలు శ్రద్ధాసక్తులతో విని, తెలుసుకున్నంత మాత్రం చేతనే ఈ జీవుడు ఇప్పుడికిప్పుడే సద్యోముక్తుడు కాగలడు. - యత్ విజ్ఞానాత్ పూమాం సద్యో జీవన్ముక్తత్వమ్ ఆప్నుయాత్।। సూటిగా ఉన్న మాట (వాస్తవం) ఏమిటంటే..,

మం।।శ్లో।। ‘‘దృశ్యం నాస్తి’’ - ఇతి బోధేన- మనసో దృశ్య మార్జనమ్,
సంపన్నం చేత్ తత్ ఉత్పన్నా పరా నిర్వాణ నిర్వృతిః।।

ఈ జీవుడు స్వతఃగానే సర్వదా నిర్మలము, కేవలము, అనునిత్యము అగు ‘ఆత్మ’యే సహజమగు స్వరూపముగా కలిగి ఉన్నాడు. అయితే, లీలా వినోదంగా కల్పన-“Creation”-ను స్వయముగా సిద్ధింపజేసుకొన్నాడు. ఎప్పటినుంచో అట్టి కల్పనా మాత్ర దృశ్యమును ‘‘ఇది ఉన్నది. ఉన్నమాట నిజమే! ఇదంతా వాస్తవమే’’.. అను దృఢ భావనను అభ్యాసపూర్వకంగా ఆశ్రయించనారంభించాడు. ఇదియే ‘భవబంధము’గా చెప్పబడుతోంది.

మరి, పర్యవసానం?
కల్పనను నిజమేనని తలచి, ఇద్దానియందు తన్మయమై ‘‘ఇది స్వతఃగా నాయొక్క కల్పనా మాత్రమే కదా? నేను సర్వదా వేరై ఉన్నాను. నేను కేవలమైయున్నాను. వేరుకాని క్షణమే లేదు’’.. అను సత్యమును ఏమరచటం జరుగుతోంది.

‘‘ఈ దృశ్యము నా కల్పనయే. ఇది స్వతఃగా (అస్మత్ కల్పనకు భిన్నమై), స్వతంత్రించి ఉన్నట్టిది కాదు. ఇది స్వయముగా (By itself) లేనే లేదు’’ - అనే బోధచే మనస్సు ‘దృశ్యము’ అనే మురికిని వదిలించుకొని శుభ్రమవగలదు. ‘‘దృశ్యము నాస్తి’’ అనే అవగాహనాసంపదచే (లేక) అవగాహనా దృఢత్వము చేత, అప్పుడు ఉత్పన్నమగు స్థితియే ‘‘పరాస్థితి; నిర్వాణము; నిర్వృతి’’ మొదలైన శబ్దములు ఉపయోగించి పూజ్యులచే చెప్పబడుతోంది.

మోక్షము అంటే ఏమిటి? ‘‘ఈ దృశ్యము ఇందలి సంఘటనలు సందర్భములు, సంబంధములు మొదలైనవన్నీ నాకు బంధము కాజాలవు. అవి ఉన్నా (లేక) లేకున్నా కూడా వాటితో నాకు ఎట్టి బంధము లేదు’’ - అని స్వాభావికంగా అనిపించటమే ‘మోక్షము’గా చెప్పబడుతోంది..

అయితే అసలు బంధము ఎట్లా ఏర్పడుతోంది?
❋ ఈ దృశ్యము పట్ల - ‘‘నిజమే?’’…..అనే నమ్మకముతో కూడిన బుద్ధి.
❋ దృశ్యము పట్ల ప్రియముతో కూడిన ధ్యాస।
❋ అట్టి ధ్యాసను అనేకసార్లు కలిగి ఉండటం చేత అభ్యాసము।
❋ సుదీర్ఘమైన (ఇంద్రియములతో మనస్సుతో విషయముల) అభ్యాసముచే వాసలు (Tendencies)
ఈ విధంగా ధ్యాస (Avocation) → క్రియ (Act) గాను, క్రియ → అలవాటు (Habit)గాను, అలవాటు → సంస్కారము (Character) గాను, సంస్కారము → వాసనలు (Tendency) గాను ఏర్పడటం జరుగుతోంది. అప్పుడు ఏర్పడుచున్న దృష్టి గురించియే ‘‘అనాత్మదృష్టి, భవబంధము, సంసారము’’ మొదలైన శబ్దములు ఉపయోగించబడుచున్నాయి.

అశేషేణ పరిత్యాగో వాసనాయాం య ఉత్తమః, ‘మోక్ష’ ఇతి ఉచ్యతే సద్భిః। స ఏవ విమల క్రమః।
దృశ్య విషయముల పట్ల రాగ-ద్వేషములే వాసనల రూపము, వాసనలు కలిగి ఉండటమే బంధము. అట్టి వాసనలను మొదలంట్లా పరిత్యజించి ఉండటమే మోక్షము. అందుచేత, ‘‘వాసనలను వదిలించుకొంటూ అంతరంగమును శుద్ధి చేసుకోండి. అదియే మోక్షమునకు మార్గము’’ - అని వాసనలను జయించిన సజ్జనులు సుస్పష్టము చేస్తున్నారు.

అయితే వాసనలు {Tendencies (or) Past series of Physical and Mental Acts as a Habit, Character ,and Tendency then on } రెండు రకములు :-

(1) శుద్ధ వాసనలు : యే శుద్ధవాసనా భూయో న జన్మ-అనర్థభాగినః। ఇవి క్రమంగా దృశ్యపరిమిత వాసనలను జయించటానికి ఉపకరణములుగా అగుచూ, వాసనా రాహిత్య సాక్షీ స్థానమునకు దారితీయగలవు. సందర్భాతీతత్వమునకు జేర్చగలవు. ‘పునర్జన్మలు’ అనే అనర్థములను తొలగించగలవు.

(2) మలిన వాసనలు : దృశ్య సంబంధమై, ఆసురీ సంపదారూపమైన - వాసనలను వృద్ధి చేస్తూ ‘‘సందర్భములు’’ అను దాస్య శృంఖలములను (Slavery Bondages) వృద్ధి చేయగలవు. జన్మ పరంపరలకు దారితీస్తున్నాయి.

శుద్ధ వాసనలను ఆశ్రయిస్తూ ఉండగా, మలిన వాసనలు జయించబడుచూ ఉంటాయి. అనగా అంతరంగమున మార్పు చెందే స్వభావముగల దృశ్య విషయముల పట్ల ‘నేను బద్ధుడను’ అను భ్రమను తొలగిస్తూ ఉండసాగుతాయి. ఎవ్వరైతే శుద్ధ వాసనలను పరిపోషణము చేసుకుంటూ ఉంటారో, అట్టివారు జనన-మరణాదులతో కూడిన అనర్ధములలో పునఃగా ప్రవేశించరు. ‘‘నాకు జన్మలు మొదలే లేవు’’ - అను స్థానమును సిద్ధించుకుంటారు. అట్టివారే జ్ఞాతజ్ఞేయులు. జ్ఞేయమగు ఆత్మను ఎరుగుచున్నవారు. మహత్తరమగు ‘ధీ-(బుద్ధి)’’ - గల అట్టివారే ‘జీవన్ముక్తులు’.

జీవన్ముక్తి = ఎవరి దృష్టిలో సమస్త పదార్థములు భావించబడక, నిత్యముక్తమగు ఆత్మయే సర్వే-సర్వత్రా (స్వస్వరూపముతో సహా) భావించబడుచూ ఉంటుందో, - అట్టివాడే ‘జీవన్ముక్తుడు’.

బంధము = పదార్థ భావనాదార్థ్యం ‘బంధ’ - ఇతి అభిధీయతే। ‘‘అహమ్ - త్వమ్’ లుగా కనిపిస్తూ, అఖండమే అయి ఉన్న ఆత్మను ఏమరచి, పదార్థ భావన (A strong perception of matter instead of the one who uses as user)యే బంధము.

మోక్షము = వాసనా తానవం ‘మోక్ష’ ఇతి అభిధీయతే। హే బ్రహ్మన్! వాసనా క్షయమునే ‘మోక్షము’ అని పిలుస్తున్నారు. అంతేగాని, మోక్షమనగా వాసనలకు సంబంధించని వేరైన స్థితికాదు. గతి కాదు. లోకము కాదు.

జీవన్ముక్తుడు - స్వాభావిక లక్షణములు

ఓ శుక మహర్షీ! ఇంకా కూడా జీవన్ముక్తుని స్వాభావికమగు ముఖ్య లక్షణముల గురించి వినండి.

✷ భోగా ఇహ న రోచంతే : ఒకానొకనికి సుఖములు, కష్టములు, విషాద సంఘటనలు మొదలైన సానుకూల-వ్యతిరిక్త సందర్భములలో, (‘తపస్సు’, ఆశ్రమ మార్పు యత్నములు మొదలైనవిగా లేకుండానే,…) ఎట్టి యత్నముల ఆవశ్యకత అవసరపడకుండానే స్వాభావికంగా (In its very natural way) ఇక్కడి భోగముల పట్ల ‘‘రుచి, అరుచిబీ కావాలి, వద్దు’’ మొదలైనవి లేకుండానే ఉంటుందో - అట్టివాడు ‘జీవన్ముక్తుడు’. - తపః ప్రభృతినా యస్మై హేతునైవ వినా పునః భోగా ఇవ న రోచంతే।

✷ న హృష్యతి। న గ్లాయతిః : సుఖ-దుఃఖ, సంపద - ఆపద మొదలైన ఆయా సర్వసందర్భములు పొందుచూ కూడా ఎవ్వని అంతరంగము ఆత్మజ్ఞాన విలక్షణముచే హర్షముగాని, శోకముగానీ పొందదో, … అట్టి అంతర్‌హృదయుడు జీవన్ముక్తుడు.

✷ హర్షామర్ష భయక్రోధ కామ కార్పణ్య దృష్టిభిః న పరామృశ్యతే యో అంతః :- కొండలోకి పిల్లగాలులు ప్రవేశించజాలని విధంగా ఎవ్వని యొక్క అంతఃకరణమును హర్షము (World happyness), అమర్షము (worldly unhappyness), భయము (fear for something known or unknown), క్రోధము (Long Anger with attributes turning out to be emotional remembrance), కామము (లేనిదేదో లభిస్తేగానీ నిండుతనము లభించదనే ఆవేదన), కార్పణ్య దృష్టి (ఇతరులపై, బెంగ, మమకార దృష్టి) - ఇవన్నీ - సందర్భానుసారంగా స్పృశించినా కూడా, ఏ మాత్రమూ (హృదయములో, చిత్తములందు) ప్రవేశించలేవో - ఆతడే ‘‘జీవన్ముక్తుడు’’.

✷ అహంకార, వాసనామయీం, యః లీలయైవ త్యక్త్వా-తిష్ఠతి ధ్యేయ సంత్యాగీ। ఎవ్వడైతే ‘‘వ్యష్టిగతమైన నేను-నాది’’ రూపమగు పరిమిత అహంకారముయొక్క వాసనలను త్యజించిన వాడై, తత్ ప్రయోజనముగా ధ్యేయము (Perception annexed to realing of possession)ను సంత్యజించిన వాడై ఉంటాడో (Left at its core), ఈ సమస్తమును లీలగా, క్రీడగా, వినోదముగా (Like a play, game, pleasure etc.,) దర్శిస్తూ ఉంటాడో, - అట్టివాడు జీవన్ముక్తుడు। ధ్యేయరహిత ధ్యానమే (Sans object of the World) ఆత్మోపాసన.

✷ జాగ్రత్‌లో సుషుప్తయోగధారణ :- ఇక్కడి ఈప్సితములు (What ever liked) నెరవేరినా, (లేక) నెరవేరకున్నా అట్టి దృశ్యవ్యవహార సరళి అంతా - అంతర్వృత్తి దృష్టిచే ‘‘మొదలే లేనివి’’గా దర్శిస్తూ, గాఢ నిద్రలో ఉన్నవానివలె ఈ సమస్తమును ఏమాత్రమూ పట్టించుకోకుండా ఇక్కడ విహరిస్తూ ఉంటాడో - అతడు ‘జీవన్ముక్తుడు’ (Either get what you like, or like what you get -while being beyond both. Be content and be playfully witnessing while usually participating).

✷ ఏక - అఖండ పూర్ణభావన : ఎవ్వడైతే ఆధ్యాత్మము యందు ఆశీనుడై (కేవలాత్మయందు సుఖముగా స్థానమును పొంది), జీవాత్మ - జగత్తు - పరమాత్మల ఏకత్వ భావనచే పూర్ణముతో కూడిన మనస్సు కలవాడై (మనస్సు నందు అపూర్ణమునకు చోటు ఇవ్వనివాడై), పవిత్రమగు భావములు (తదితరుల పట్ల ఆత్మభావన) కలవాడై, ప్రాప్తిస్తూ ఉన్నదాని పట్ల విశ్రాంతి పొందుచూ, దేనినీ వాంఛించనివాడై, దేనిపట్లా స్నేహబంధమును కలిగియుండక ఉంటాడో - ఆతడు జీవన్ముక్తుడు.

✷ సంవేద్యేన న లిప్యతే : ఎవ్వరి హృదయాకాశము ఇక్కడి భౌతికాకాశములాగానే తెలియబడుచున్న (సంవేద్యము) దేనిచేతనూ కించిత్ కూడా దోషము పొందదో, జడమగు పదార్థములచే, విషయములచే కొంచెము కూడా సంగము (Attatchment) కలిగి ఉండదో, ఎవని బుద్ధి జడమును త్యజించి నిత్యోదిత ప్రదర్శనము అయి ఉంటుందో - ఆతడే జీవన్ముక్తుడు.

✷ అనపేక్షుడు : కర్మలు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు రాగద్వేషములు గాని, సుఖ-దుఃఖ భావన గాని, ధర్మాధర్మముల ఫలముల పట్ల అపేక్ష గాని లేకుండానే కర్మలు నిర్వర్తిస్తాడో.. - అట్టివాడు జీవన్ముక్తుడు. అంతరమున మౌనము (Unconcerned) వహించినవాడై, ‘‘నేనే ఇది చేస్తూ ఉన్నాను’’ - అనే అహంకారము లేనివాడై, (నిరహంకారుడై), మమకార-మత్సరములు ఏమాత్రము లేకుండా, ఉద్వేగ రహితంగా ‘‘కర్తవ్యమితి మాం’’ భావనతో కర్మలు నిర్వర్తిస్తూ ఉంటే, - ఆతడు జీవన్ముక్తుడు।

✷ సాక్షీవత్ - విగత స్నేహో : దేనిపట్ల స్నేహమబంధము లేనివాడై, నాటక దీపమువలె కేవలము సాక్షిగా ఉంటూ, ఇచ్ఛారహితుడై విద్యుక్త ధర్మములందు వర్తించువాడు జీవన్ముక్తుడు.

✷ ధర్మా ధర్మ మనన ఈహితమ్ సర్వం అంతః పరిత్యక్తం : మనస్సులో ధర్మ అధర్మ ద్వంద్వ భావములను వదలి (నేను అది చేయాలి। ఇది చేయకూడదు। అది ఎందుకు చేయాలి? అనే) ధర్మాధర్మ మీమాంసలకు అతీతుడై, మనస్సు నందు ఎట్టి కోరిక లేనివాడై, సమస్తమును అంతరంగమున మొదలే త్యజించినవాడై ఉంటాడో ఆతడే జీవన్ముక్తుడు.

✷ ఎవ్వడు ధర్మనిరతులను, అధర్మపరులను - ఇరువురను చూస్తూ - ఆత్మభావన నుండి చ్యుతిపొందక, ఆత్మభావనతో మాత్రమే సమన్వయము కలిగి ఉంటాడో - ఆతడు జీవన్ముక్తుడు.

✷ అనన్య భావన : ఎవ్వరైతే ఈ సమస్త దృశ్యమును కల్పనగాను, సర్వత్రా సమస్వరూపుడగు పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపముగాను దర్శించుచూ, అన్యభావమును త్యజించి ఉంటాడో, - ఆతడు జీవన్ముక్తుడు.

✷ సమరుచి భానవ : కారము, పులుపు, ఉప్పు, చేదు, తీపి, వగరు ఇత్యాది షడ్రుచులను - రుచిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా సమభావన - కలిగి ఉంటాడో,.. ఆతడు జీవన్ముక్తుడు.

✷ ఎవ్వడైతే జరా - మరణముల పట్ల, ఆపద - సంపద సందర్భముల పట్ల ధనము - రాజ్యము దారిద్ర్యము పొందినప్పుడు - ‘‘సర్వము కాలచమత్కారమే’’ - అను భావనతో ‘సమభావన’ కలిగి ఉంటాడో, ఆతడే ‘జీవన్ముక్తుడు’. వాటినన్నిటినీ రమ్యమైన భావనతో చూస్తూ ఉన్నవాడు జీవన్ముక్తుడు. (మాయామేయ జగమ్ అనిత్యమ్ ఇతి)।

✷ ఎవ్వడైతే ధర్మ-అధర్మ వ్యవహార సరళిని, మరణ-జన్మములను బుద్ధితో త్యజించినవాడై, వాటికి ఆవల గల కేవలానందమగు ఆత్మసందర్శనమును వీడడో → ఆతడు జీవన్ముక్తుడు.

✷ ఉద్వేగ (Emotion) ఆనంద (Ecstery) రహితుడై, సర్వసందర్భములలోను నిర్మలమైన, ప్రశాంతమైన, సమగ్రమైన అవగాహన గల బుద్ధితో దేనికీ శోకించక, దేనినీ కాంక్షింపక ఉన్నవాడు ‘జీవన్ముక్తుడు’.

✷ నిర్మలము, సునిశితము, విస్తారము అగు బుద్ధితో సర్వ ఇచ్ఛలను, సర్వశంకలను, సర్వ లౌకికమైన ఈషణములను, సర్వ లోక సంబంధమైన నిశ్చయములను పరిత్యజించి ప్రశాంత చిత్తుడై సమస్తము కాలవిన్యాసముగా దర్శిస్తూ ఉంటున్నవాడు జీవన్ముక్తుడు.

✷ ఎవ్వరి మనస్సైతే జన్మ-స్థితి- వినాశనములను సూర్యోదయ - అస్తమయముల వలె సమదృష్టితో చూస్తూ ఉండగలదో - ఆతడే జీవన్ముక్తుడు.

✷ ఎవ్వడైతే కించిత్ ద్వేషముగాని, కించిత్ కాంక్షగానీ లేకుండా ప్రకృతి ప్రసాదితమైన భోగములను ఆస్వాదిస్తూ ఉంటాడో, ‘ఇవి నావి’ అను మమకార- అహంకార రహితంగా అతీతుడై సర్వ అనుభవములను స్వీకరిస్తూ ఉంటాడో - ఆతడు జీవన్ముక్తుడు.

✷ ఎవని పట్ల ఈ సంసార సంభ్రమమంతా శాంతించినదై, సమస్తము యుండి కూడా, ఆతడు ఏమీ లేనివాడై (కలా సమన్వితుడై ఒకప్రక్క ఉంటూనే మరొక ప్రక్క నిష్కళుడై) ఉంటాడో, సర్వ సందర్భములలోను ఎవ్వరిచిత్తము అచిత్తమై నిశ్చితాకారమై ఉంటుందో ఆతడు జీవన్ముక్తుడు.

✷ దృశ్యములోని సమస్త అర్ధజాలములందు (ప్రాపంచ అర్థములందు) నిస్పృహుడు (One who does not accord recognition and doesnot attach Priority) అయి, - పరార్థము ను పుణికిపుచ్చుకొని పూర్ణాత్ముడై ఉంటాడో ఆతడే జీవన్ముక్తుడు.

విదేహ ముక్తుడు

శ్రీ జనక మహారాజు : ఓ వ్యాసప్రియ పుత్రా! మహాతపస్వీ! స్వయంజ్ఞానానంద స్వరూపా! శుకదేవా! ఇప్పటివరకు మనం జీవన్ముక్తుని యొక్క స్వాభావిక లక్షణములు ఏమేమి అయి ఉంటాయో - వివరించి చెప్పుకున్నాము.

ఇక ‘‘విదేహముక్త లక్షణములు’’ గురించి వినండి.

జీవన్ముక్తుడు అట్టి ‘‘జీవన్ముక్త పదము’’ నుండి తన భౌతిక దేహమును కాలస్వరూపునికి ‘సమర్పణ’ చేయబడినదిగా {కాలము యొక్క కలనా (కల్పనా) చమత్కారముగాఊ భావమును సిద్ధించుకొని - వాయువు స్పందమును, జలము తరంగత్వమును వీడు విధంగా ‘‘విదేహముక్తత్వము’’లో ప్రవేశము పొందుచున్నాడు.

విదేహముక్తుడు - స్వస్వరూపానుభవము
➤ ఉదయించడు. అస్తమించడు. శమించడు. ఉద్యమించడు.
➤ ఆతని స్వాత్మానుభావము సత్తు కాదు. అసత్తు కాదు. ఆతడు దేనికీ దూరముగా ఉన్నవాడు కాదు. ‘అహం’ స్వరూపుడు కాదు. మరింకొకటేదో కాదు.
➤ ఈతడు ఏ వికారమునకు విషయుడు కాదు.
➤ ఆతని స్థితి అత్యంత స్థిమితమై, మహా గంభీరమును సంతరించుకొని ఉంటుంది.
➤ ఆతని కేవలానుభవము (లేక) గంభీరానుభవము - ప్రకాశము కాదు. చీకటి కాదు. చీకటి వెలుగుల మధ్య గల ‘సంధ్య’ కాదు. అది అవాచ్యము (మాటలతో చెప్పలేము). అనాఖ్యము (వ్యాఖ్యానించలేము). అభివర్ణించలేము (Indiscribable). అభివ్యక్తమైనదేదీ ఆతని ఆత్మానుభవము కాదు. కనుక అనభివ్యక్తము. ఈ సమస్త జగత్తు ఆతనికి - ‘‘స్వస్వరూపము యొక్క కించిత్ ‘కేవల సత్’ రూపమున ప్రదర్శితము’’ అయి ఉన్నట్టిది.
➤ ఆతని ఆత్మతత్త్వ స్వరూపానుభవము శూన్యము కాదు. సాకారము కాదు. దృశ్యముకాదు. దర్శనము కాదు. భౌతికమైన పదార్ధమేదీ కాదు. సత్‌గాగాని,-అసత్‌గాగాని, సదసత్తుగాగాని స్థితించి ఉన్నది కాదు.
➤ ‘‘విదేహముక్తి స్థితి - ఇట్టిది’’ - అని ఏమి చెప్పగలం? అది ‘‘పూర్వమునకే పూర్వము’’ అని అంటూ ఉంటారు. అది సత్ - అసత్- సదసత్ నిర్వచనములకు పరిమితమైనది కాదు.
➤ ద్రష్ట-దర్శన-దృశ్యములను ఉపమేయముగా తీసుకుని చెప్పుకోవాలంటే అది దర్శన-దృశ్యములకు వేరైనట్టి, ఆ రెంటికీ సంబంధించనట్టి ‘‘ద్రష్ట యొక్క దర్శనరాహిత్య కేవలరూపము’’ - అని మనం చెప్పుకోవచ్చు. అది తెలుసుకొనునది - తెలియబడునది కూడా। కాబట్టి ‘‘చిన్మాత్ర చైత్యరహితము’’. ద్రష్ట- దృశ్యముల మధ్య గల కేవలానంద రూపము.

విదేహముక్తునికి అనుభవ విషయమగుచున్న సర్వాత్మకమగు స్వస్వరూపము.. ఇంకా కూడా,
→ చిన్మాత్ర (Knowing) చైతన్య (That being known) రహితము. ‘తెలుసుకోవటం - తెలియబడేది’లకు మునుముందే, ఆ ఉభయములకు అతీతమై ఉన్నట్టిది. ఆచోటి నుండి చ్యుతి పొందనిది.
→ ఆది - అంతము అనే వస్తు ధర్మము లేనట్టిది కనుక అనంతము.
→ జర (వార్ధక్యము) అను శారీరక ధర్మము లేనట్టిది.
→ శివమ్ (సర్వశుభ-సుఖప్రదము).
→ ఆది-మధ్య-అంతము లేనట్టిది. అద్దానియందు దానికి అన్యముగా ఏదీ లేదు కనుక ‘నిరామయము’.
→ అది ద్రష్ట- దర్శన - దృశ్యముల మధ్యగా స్వానుభవమగుచూ, ఆ మూడు తనకు అన్యము కానట్టిది.

అట్టి విదేహముక్తునికి స్వానుభవమగుచున్న స్వాత్మకు భిన్నముగా నేను-నీవు-జగత్తు మొదలైనవేవీ కించిత్ కూడా లేనేలేవు.

ఓ మునీశ్వరా! ‘‘అది అనన్యము’’ అనునది సునిశ్చయము. బంగారమే అనేక ఆభరణముల నామరూపములుగా అగుపిస్తున్నట్లు, విదేహముక్తుని కేవల - సర్వాతీత తత్త్వమే - ఒక్కొక్క దృష్టికి ఒక్కొక్క తీరై కనిపించే ఈ సమస్తము కూడా!

ఓ ప్రియ శుకదేవా!

నేను ఇప్పటివరకూ చెప్పుతూ వస్తున్న ‘‘జీవన్ముక్త - విదేహముక్తుల స్వాభావిక లక్షణములు’’ - మీకు తెలిసియున్న విషయాలే! తపోధ్యానముల సహాయముతో ఈ విషయాలు స్వవివేకము (your own self - analysis)చే గ్రహించియే ఉన్నారు. మీ పితృదేవులు, లోకపూజ్యులు, మాకు గురుసమానులు అగు వ్యాస మహర్షి మీకు ఈఈ విశేషాలే విశదపరచారు. ఆధ్యాత్మ శాస్త్ర వాఙ్మయము కూడా ఈ మనము చెప్పుకున్న విషయమే పరాకాష్ఠగా ఎలుగెత్తి గానం చేస్తూ చెప్పుచున్నది. వేదజ్ఞులు, తత్త్వజ్ఞులు అగు మహనీయులందరు సూత్రముల రూపంగాను, సంగ్రహముగాను, విస్తారముగాను చెప్పుచూనే ఉన్నారు. ‘అవాక్ మానస గోచరము’గా ఒప్పుకుంటూనే విశదపరచుచున్నారు. మీరు స్వయముగా తెలుసుకొని విజ్ఞాన స్వరూపులు అయ్యారు కూడా.

హే మహాత్మా। మీరు జ్ఞాతజ్ఞేయులే. తెలుసుకోవలసినది తెలుసుకొని ఉన్నవారే। ఇందులో సందేహమే లేదు. ఇట్లా ఎందుచేత చెప్పగలుగుచున్నానంటారా?
భోగేభ్యో హి అరతిః జాతా దృశ్యా ద్వా సకలాత్ ఇహ। ఈ ప్రాపంచక విషయములు చూస్తూ కూడా, వాటి యందు రమించకపోవడం మోక్షము సిద్ధించినవారి స్వాభావిక లక్షణము. ఆ లక్షణము మీరు ప్రదర్శించారు. సమస్త దృశ్య విషయముల పట్ల అనురక్తిని జయించి, మోక్షసామ్రాజ్యము సంపాదించుకొని ‘‘మహావీరులు’’ - అయ్యారు.

ఓ శుక మహాశయా! నిశితమగు బుద్ధితో పూర్ణహృదయులై మీరు ప్రాప్తించుకోవలసినది ప్రాప్తించుకొనియే ఉన్నారు. మీరు స్వస్వరూప సుజ్ఞానము కొరకు తపస్యులై తపన రూపమగు తపస్సుతో స్వరూప-ఔన్నత్యము’ సిద్ధించుకొన్నారు.

హే బ్రహ్మన్! ముక్తస్త్వమ్। మీరు నిత్యముక్తమగు ఆత్మను స్వస్వరూపముగా బుద్ధిచే దర్శించుచూనే ఉన్నారు.

అయితే, అహ్రాంతిమ్ ఉత్సృజ! ‘‘మోక్షము’’ అనగా మరింకేదో। నాకు తెలిసినంత తేలికైనది కాదు’’ - అనే అహ్రాంతిని ఇక ఇప్పటికిప్పుడు విడచిపెట్టండి.

శ్లో।। అతి బాహ్యం తదా అబాహ్యం అంతరాభ్యంతరం ధియః,
శుక! పశ్యన్ న పశ్యేత్ త్వం, సాక్షీ సంపూర్ణ కేవలః ।।

ఓ శుకమునివర్యా! బాహ్యము కానట్టిది, బాహ్య-అంతరములచే విభాగము పొందనట్టిది, స్వయముగా సంపూర్ణము అయినట్టిది, జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు, జీవాత్మ ఈశ్వరాత్మాది సర్వ విభాగములకు కేవలము ‘‘సాక్షి’’ అయినట్టిది- అగు ఆత్మను దర్శించుచునే ఉన్నారయ్యా! ఇంక ‘ఆత్మ’ గురించి మీకు సందేహములతో పనేమున్నది?

💐 స్వస్వరూపాత్మ పట్ల సర్వ సందేహములు త్యజించండి. నిస్సందేహులవండి।
💐 అఖండము, కేవలము అగు ‘‘ఆత్మ’’యే అయి, ఇక ఆపై మీకు ఎట్లా ఇష్టమో అట్లాగే - తన ఉద్యానవనంలో విహరించే చక్రవర్తిలాగా - ఈదృశ్య జగత్తునందు లీలగా, తీరికగా, క్రీడగా, స్వానందభరితంగా, కార్య-కారణాతీతంగా విహరించెదరు గాక!

⌘⌘⌘

శుకదేవుడు జనక మహారాజు చెప్పిన విశేషములన్నీ శ్రద్ధగా విని ఆత్మ సంతృప్తి పొందారు. గురు భావముతో జనక మహారాజు పాదములు స్పృశించి, నమస్కరించి - వారి వద్ద సెలవు తీసుకున్నారు.

‘‘అఖండమగు నిర్వికల్ప సమాధి’ యొక్క ఏకాంత అభ్యాసము నిర్వర్తించదలిచారు.

అక్కడి నుండి మేరుపర్వతముపై గల తనకు ఇష్టమైనట్టి, తనకు సుపరిచయమైనట్టి ఒక ఏకాంత ప్రదేశమునకు చేరారు. అక్కడ వేయి సంవత్సరముల కాలము నిర్వికల్ పసమాధియందు గడిపారు. తైలము లేని దీపమువలె అఖండాత్మయందు - విశ్రామము పొందారు. జలబిందువు సముద్రజలములో పడి అట్టి జలముతో అభేదము పొందిన రీతిగా, స్వల్ప - వాసనలను కూడా జయించి, సంకల్ప దోషములన్నీ త్యజించి పరిశుద్ధుడై, ఆత్మానంద కేవలీస్వరూపుడై వెలుగొందసాగారు.


3వ అధ్యాయము
ఋభు-నిదాఘ సంవాదము (వైరాగ్య పూర్వక విశ్లేషణ)

ఋభు మహర్షి కుమారుడగు నిధాఘుడు గొప్ప జ్ఞాని. మునులలో శ్రేష్ఠుడు. మునిగణముచే ‘మునివరుడు’ అని గౌరవించబడుచుండే బ్రహ్మతత్త్వజ్ఞాని. మహాతపస్వి. లోకకళ్యాణ భావములు గల మహనీయుడు. బ్రహ్మజ్ఞానాభ్యాసకులకు దృష్టాంతరముగా చెప్పబడువారు.

ఆయన తన బాల్యములో 5వ ఏట ఉపనయనము అవగానే, విద్యార్థి అయి గురు ఆశ్రమము ప్రవేశించారు. గురువులను భక్తితో సేవిస్తూ విద్యను అభ్యసించారు. అతి త్వరలో విద్యాపారంగతుడు (Expert) అయినారు. ఒక 7 సంవత్సరముల కాలములో విద్యాభ్యాసము ముగించుకొని, గురు ఆజ్ఞానుసారం 12వ ఏట తల్లిదండ్రులు ఉంటున్న స్వగృహమునకు తిరిగి వచ్చారు. గురువులు ఆజ్ఞాపించిన విధంగా తన వలెనే విద్యను ముగించిన సహపాఠకులతో కూడి, తల్లిదండ్రుల అనుమతితో తీర్థయాత్రలకు బయల్వెడలారు. తాను గురువుల వద్ద నేర్చిన లౌకిక - అలౌకిక విద్యలకు ప్రయోగశాల వంటి దేశదేశాంతరములో ముఖ్యప్రదేశములను, తీర్థస్థలములను, మహనీయుల ఆశ్రమములను సందర్శించసాగారు. లోక ప్రసిద్ధులు, పూజ్యులు ఆశ్రమవాసులు మొదలైన మహనీయుల దర్శనము చేసుకొని, వారితో కొంచెము సేపు తాత్త్వికార్థపూర్వకంగా సంభాషిస్తూ తీర్థయాత్రలు కొనసాగించసాగారు. ఆ విధంగా అనేక పవిత్ర ప్రదేశములను, మహనీయుల సంశ్రయమును, మూడున్నర కోట్ల తీర్థములలో స్నానమును చేసి తిరిగి గృహోన్ముఖుడై ఇంటికి తిరిగివచ్చారు.

తీర్థయాత్రల పుణ్యఫలముగాను, మహనీయుల సందర్శనము చేతను ఆయన యొక్క బుద్ధి వివేక - వైరాగ్యములు సంతరించుకోవటం జరిగింది.

ఆ విధంగా నిదాఘుడు విద్య-తీర్థయాత్రలను నిదాఘుడు పూర్తి చేసి ఇంటిలో ఉండసాగారు. ఒకరోజు ఋభుమహర్షి కుమారుడగు నిదాఘుని దగ్గిరకు పిలిచారు. విద్యా-అధ్యయన విశేషముల గురించి, తీర్థయాత్రలచే జనించిన పవిత్ర భావముల గురించి పరామర్శిస్తూ కుశల ప్రశ్నలు ప్రారంభించారు.

⌘⌘⌘

ఋభు మహర్షి : బిడ్డా! నిదాఘా! నీవు చక్కగా ఏడు సంవత్సరములు విద్యాభ్యాసము నిర్వర్తించి విద్యాపారంగతుడవు అయ్యావు. అంతేకాకుండా, దీర్ఘకాలం తీర్థయాత్రలు కూడా నిర్వర్తించి అనేక విషయాలు ప్రపంచములో గమనిస్తూ తెలుసుకోవలసినది తెలుసుకొని ఉంటావు. ఏదీ! నీవు నేర్చుకొన్నది ఏమిటో, నీకు అనుభవమై, నీవు అర్థము చేసుకొన్నదేమిటో- నాకు వివరించి చెప్పు. నీవు ఏమి నేర్చుకున్నావో, ఏమి తెలుసుకున్నావో - విని మీ గురువులు, నేను కూడా సంతోషించెదముగాక.

నిదాఘుడు : పితృదేవా! పూజనీయా! నాకు విద్యాబుద్ధులకు మార్గము చూపిన మీకు జన్మజన్మాంతరములుగా కృతజ్ఞుడను.

అస్మత్ గురువులకు కూడా నమస్కారములు. నాకు మీరు తండ్రియే కాదు. గురుతుల్యులు కూడా. నా యొక్క మార్గదర్శనము కొరకై నాకు అనుభవమైనది, అనిపిస్తూ ఉన్నది - అంతా మీకు విశదీకరించి ఇప్పుడు చెప్పుతాను. పరమాత్మకు చేరటానికి మార్గణ్వేషకుడనైన నాకు దయతో మరికొంతగా మార్గదర్శకులవండి. మీరు నాకు పరమ సత్యమును బోధించుటకొరకై - ఒక రోగి వైద్యునికి చెప్పుకొను విధంగా - (1) నాకు తెలియ వస్తున్నది, (2) నాకు ఏర్పడి ఉంటున్న సందేహములు మొత్తం వివరిస్తున్నాను. వినండి.

నేను 7 సంవత్సరములు మీరు ఆజ్ఞాపించి, దారిచూపిన విధంగా గురు-ఆశ్రమంలో విద్యార్థినై విద్యను సముపార్జించాను. గురుదేవులచే ఆశ్రమములో అనేక లౌకిక - ఆధ్యాత్మిక విద్యలు నేర్చుకొన్నాను. గురువుల సూచనానుసారంగాను, మీ అనుజ్ఞతోను (3 + 1/2) కోట్ల తీర్థములు దర్శించి పుణ్యనదులలో స్నానము చేశాను. దేవాలయములలో దైవదర్శనము చేసుకొన్నాను. అనేక మంది మహనీయుల పాదపద్మములు స్పృశించి, వారు చెప్పియున్న విశేషాలు శ్రవణం చేశాను. అనేక ఆశ్రమములలో విద్య నేర్పు విధానమును గమనించాను. ఆయా ఆశ్రమములలోని మహనీయులగు గురువులతో, విద్యార్థులతో జ్ఞానాసక్తుడనై సంభాషించాను. వీటన్నిటి యొక్క ప్రయోజనము చేతకాబోలు, నా ఆలోచనా విధానములో అనేక మార్పులు వస్తూ వచ్చాయి. సార్థ త్రికోటి తీర్థేషు స్నాన పుణ్య ప్రభావతః ప్రాదుర్భూతో మనసి మే విచారః సో అయమ్ ఈదృశః।। నా మనస్సులో ఒకానొక విచారణ (Analytical observation) బయల్వెడలింది. మీ పాదపద్మములకు నమస్కరిస్తూ నాకు అనిపిస్తూ ఉన్నదంతా జ్ఞానార్తుడనై మీముందు మనస్సు విప్పి చెప్పుకుంటాను. దయతో విని, నాకు పరమాత్మను చేరు మార్గము చూపెదరు గాక!

ఎందుకు పుడుతున్నాం? ఎందుకు చస్తున్నాం?

అసలు మేము దేహములను ఎందుకు స్వీకరిస్తున్నామో అది ఏమరచి, శరీరముతో అవినాభావ రూపమైన స్నేహబంధముతో తన్మయులమై జీవితమును గడుపుచున్నాము. ‘‘ఇదిగో, ఈ మహదాశయము కొరకై ఈ దేహమును అద్దె వాహనము వలె స్వీకరిస్తున్నాను. దేహమును తిరిగి ఇచ్చివేయవలసిన సమయము రాక ముందే అట్టి మహదాశయమును త్వరగా సిద్ధించుకోవాలి’’ అనే విషయమే పూర్తిగా ఏమరచి, సందర్భ మాత్ర విషయములగు అల్పాశయములకే కాలమంతా సమర్పించి వేస్తున్నాము. ఈ విధంగా దైవకృపచే లభించిన ‘జీవితకాలము’ అనే అవకాశమును సద్వినియోగపరచుకోకపోగా, దుర్వినియోగపరచుకొని మరింత అజ్ఞాన దృష్టులను మూటకట్టుకొంటూ ఉంటున్నామే!

జాయతే మ్రియతే లోకో, మ్రియతే జననాయ చ।। ‘‘ఎందుకు పుట్టుచున్నామురా?’’ అని పరిశీలిస్తే ‘‘చావటానికే!’’ అవుతోంది. ఎందుకు చస్తున్నాము? మరల పుట్టటానికే! ఈ తతంగమునకు అంతూ-పొంతూ ఉండటమే లేదు.

ఈ దృశ్య-ప్రపంచంలో దేహముతో కూడి జీవిస్తూ ఉండగా, అనేక సంబంధములు, అనుబంధములు, బాంధవ్యములు స్నేహ-శత్రుత్వములు మొదలైనవన్నీ మా మనస్సుకు ఏర్పడినవై ఉంటున్నాయి.

‘‘మాకు చెందినవి, మాకు చెందనివి. మాకు సానుకూలమైనవి - ప్రతికూలమైనవి’’ - ఇటువంటి అనేక నిర్వచనములతో జీవితము గడిచిపోతోంది. ఎప్పటికప్పుడు ‘‘ఇదిగో! ఈ సంబంధములు, సంగతులు, వస్తు - విషయములు, ఈ ఈ కార్యక్రమములు సత్యమే! నిత్యమే!’’.. అంటూ రోజులు గడుపుచున్నాము. అసలీ దృశ్య ప్రపంచంలో ‘‘ఇది శాశ్వతము. స్థిరము’’ అని చెప్పుకోగలిగినది ఏమైనా ఉన్నదా? ఏ ఒక్కటీ స్థిరము కాదు.

అస్థిరాః సర్వ ఏవ ఇమే స చరాచర చేష్టితాః।।

ఇక్కడి చరాచర జీవులయొక్క వర్తమాన క్రియా వ్యవహారములు, ఇప్పుడు ఉన్న (జీవుల) నామ రూపములు మొదలైన సమస్తమూ కూడా క్షణమునకు ఒక తీరుగా ఉంటూ ఉంటున్నాయి. ఇక్కడి సర్వజీవుల మనస్తత్వములు, క్రియా విశేషములు మొదలైనవన్నీ కూడా స్థిరముగా ఉండటమే లేదు. ఇక్కడ సమస్తము అస్థిరమే (Every thing and every context is quite Temporary). ఈరోజు ఒకరకంగా ఉంటున్నాయి. కొద్ది కాలము తరువాత మరొక రకం.

ఇక ఇక్కడి లోక సంబంధమైన కార్యక్రమముల గురించి అంటారా? సర్వ ఆపదాం పదం పాపా విభవ భూమయః। ఇక్కడి ధనార్జన, బంధు సంబంధము, ఇంద్రియ సుఖ వ్యవహారములు - మొదలైన కార్యక్రమములన్నీ అంతరమున అనేక ఆపదలతో కూడుకొన్నవై, చివ్వరికి ఈ జీవుని పాపక్రియలతో కూడిన దుఃఖానుభవములు కలిగించే భూములకు జేరుస్తున్నాయి. అనేక తప్పుడు పనులకు, దోష పూరిత భావములకు దారి చూపుచున్నాయి. వాటి పర్యవసానముగా మేము అనేక దుఃఖములు అనుభవిస్తూ ఉపాధి పరంపరలు గడుపుచున్నాము.

ఇక ఇక్కడి భార్య- భర్త - తండ్రి - కొడుకు- స్నేహితుడు - శత్రువు - ఇల్లు - పొలము.., ఇటువంటి సంబంధాలన్నీ కలలో కనిపించే విశేషాలవలె బహుచమత్కారమైనవి. ఇక్కడి జీవులంతా కలిసి జీవిస్తూ ఉన్నప్పటికీ, ఒకరికి మరొకరు ‘‘స్నేహ-శత్రు, ప్రియ- అప్రియ’’ భావములచే అనేక విధాలైన సంబంధములు కలిగి ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నారు. అట్లయి కూడా, ఒకరికి మరొకరు సంబంధించినవారే కాదు. ఎవ్వరి ప్రయాణము వారిది. ఎవ్వరి గొడవ వారిది. అయినప్పటికీ - ఇనపరింగుల వలె - ఒకరికి మరొకరు ముడిపడి ఉన్నట్లు సంభాషించుకొంటున్నారు. కీచులాడుకుంటున్నారు. వాదులాడుకుంటున్నారు. ఎవ్వరి భావములు వారివే అయి ఉండి కూడా, ఒకరిపై మరొకరు అవినాభావ సంబంధములను (ఆధారపడిన భావములను) పరిపోషించుకుంటూ కాలమును వెళ్ళబుచ్చుచున్నారు.

వాస్తవానికి ఇక్కడి జీవులంతా సర్వ భావములకు మునుముందే ఉండి ఉన్న ‘‘కేవల అభావస్వరూపులే’’ కదా! అయితే, ఈ పరస్పర అవినాభావ- భౌతిక సంబంధములన్నీ కూడా - ‘‘మనఃకల్పనయా అనయా’’- మనో కల్పన మాత్రమే.

ఆహా! ఎడారి భూములలో నడిచివెళ్ళుచూ ఉండే పథికునికి (బాటసారికి) నీరు, పళ్ళు, పూలు ఏ మాత్రము లభించని తీరుగా - ఈ ‘దృశ్యము’ అనే ఎడారిలో నడచివెళ్ళుచున్న బాటసారుల వంటి జీవులకు ఇక్కడి పరస్పర సంబంధ బాంధవ్యముల వలన లభించేది గాని, ఒరిగేదిగాని ఏదీ లేదు. ఇది జనులు గమనించటమే లేదు. తండ్రీ! ‘‘శామ్యతి ఇదం కథం దుఃఖమ్ ఇతి?’’ - ఇతి తప్తో-స్మి చేతసా। నా బుద్ధి ఇదంతా గమనించిన తరువాత నాకొక క్రొత్త వేదన పట్టుకొన్నది. ఎడారిలో ఒంటరిగా నడిచివెళ్లే బాటసారివలె జగద్దృశ్యములో చరిస్తూ ఉండగా, నా చిత్తము వలన కలుగుచున్న అనేక సంబంధ - అనుబంధములు నా పట్ల దుఃఖమునకే అగుచున్నాయి. సుఖము కొరకు కానే కాదు. అటువంటి ఈ (సంసార) దుఃఖములు తొలగేది ఎట్లా?’’ - అని నా చిత్తము (ఇవన్నీ చూచిన తరువాత) ఎంతగానో తపించటము ప్రారంభించింది.

ధన-సంపద మొదలైన వ్యవహారములు

స్వామీ! ఈ జగత్తులో ధనము సంపాదించి దాచుకోవటమనేది గొప్ప విశేషంగా అనుకోబడుతోంది. అయితే, ఓ మునీశ్వరా! ‘‘ధనము సంపాదించటము-అనేది అనేక చింతలకు (Multiple worries) పర్యవసానము’’ అని నాకు అనిపిస్తోంది. అట్టి ప్రయత్నములు చివ్వరికి ఆనందము కలుగజేస్తాయనే నమ్మకం నాకు ఏమాత్రమూ కలగటం లేదు.

ఇక్కడి స్త్రీ-పురుష సంబంధములు, మిత్ర - కళత్ర-గృహ-ధన వ్యవహారములు మొదలైన ఇవన్నీ పేలవములనీ (సారరహితమనీ), పైగా తీవ్రమైన ఆపదలకు, మనో వేదనలకు మూలమని నాకు అనిపిస్తోంది. ఇక్కడి భార్య-భర్త -సంతానముల పరస్పర సంబంధ వ్యవహారములన్నీ (ఆత్మజ్ఞానం దృష్ట్యా) సారరహితములు. (Have no inner essece). ఇవన్నీ గొప్ప ‘మోహము’ కలిగించేవే గాని, సుఖ ప్రదాతలు ఏమాత్రము కాదు.

ఏమాత్రము నమ్మి ఉండకూడని ‘‘ఆయుష్షు’’

ఇక, ‘ఆయుష్షు’ విషయానికి వచ్చి చూస్తే ‘‘ఆ"! మేము చాలా కాలము జీవించబోవుచున్నాములే!’’.. అను ఎవరికివారే అనుకుంటూ ఉండటం జరుగుతోంది. ఆయుః పల్లవ కోణాగ్ర లంబాంబు క్షణభంగురమ్। వర్షపు చినుకులు పడినప్పటి పూతీగ యొక్క ఆకు చివ్వర వ్రేలాడుతూ కనిపించే నీటి బిందువు వలె - ఈ ఆయుష్షు క్షణ భంగురము. ఏ క్షణంలో ముగుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు.

ఒక పిచ్చివాడు తన చేతిలో గల వస్తువులను ఏక్షణంలో నేలపై విసరుతాడో తెలియని విధంగా - ఈ శరీరము ఏక్షణంలో అకాలంగా మమ్ములను విడచి వెళ్లగలదో ఏ మాత్రమూ ఊహించలేము.

అట్టి ఈ వినాశన శీలమగు భౌతిక శరీరమును నమ్మి ఎన్నో పాప-అజ్ఞాన కార్యక్రమములలో నిమగ్నమై ఉంటున్నాము. అంతు - పొంతు లేని కార్యక్రమములు, వ్యథలు, ఆశలు, నిరాశలు! మేము ఎందుకొచ్చాము? ఏమి చేస్తున్నాము?

మనో చాంచల్యము - ఆయుష్షు

ఈ భౌతిక శరీరము యొక్క గతి ఈ తీరుగా ఉండగా,.. ఇక ఈ మనస్సు పరస్పరము అనుకూలము- వ్యతిరేకము అయిన అసంఖ్యాక విషయాలపై వ్రాలినదై ఉంటోంది. నిరంతరము అనేక విషయాలలో చిక్కి ఉండి, తన జనన స్థానమగు ఆత్మయొక్క ఔన్నత్యము గురించిన - ఉన్న కొద్ది జ్ఞానము కూడా పోగొట్టుకొంటోందే! అటువంటప్పుడు ఆయుష్షు ఉండి కూడా ఏమి లాభము? అప్రౌఢాత్మ వివేకానామ్ ఆయుః ఆయాస కారణమ్। ఆత్మవివేకమును పొందుటకై పరిపక్వత పొందనప్పుడు, ఆయుష్షు అనేది ఆయాసము కలిగించేదే అవుతోంది.

యుజ్యతే వేష్టనం వాయో। గాలిని పట్టి గుప్పెటలో నిలపవచ్చునేమో!
ఆకాశస్య ఖండనమ్। అఖండాకాశమును కర్రతో ఖండనము చేయవచ్చునేమో!
గ్రంథనం చ తరంగాణాం। జల తరంగములను ప్రోగుచేసి ఒకచోట ఉంచవచ్చునేమో!
అంతేగాని, అయుష్షు ఇట్లాగే నిలకడ కలిగి ఉంటుందనుమాట ఏ మాత్రం కుదిరేదే కాదు.

జీవితము - మహదవకాశము

తరవోపి హి జీవంతి జీవంతి। మృగ పక్షిణః। చెట్లూ జీవిస్తున్నాయి. మృగములు జీవిస్తున్నాయి. మానవుడు జీవిస్తున్నాడు. జీవించినంతమాత్రం చేత ఏమి ప్రయోజనము?

శ్లో।। ప్రాప్యం సంప్రాప్యతే యేన, భూయో యేన న శోచ్యతే,
పరయా నిర్వృతేః స్థానం యత్, తత్ ‘జీవితం’ ఉచ్యతే।।

ఏ మహదాశయముతో జీవుడు ఈ భౌతిక శరీరమును ఆశ్రయిస్తున్నాడో, అద్దానిని ఆశ్రయించాలి.

ఈ జీవుడు ఏడుస్తూ పుట్టాడు. ఏడుస్తూనే మరణించరాదు. మరి? మరల ఇక దుఃఖమే ఉండజాలని స్థితి కోసమే జీవించాలి.

ఏదైతే సమస్తమునకు పరమై, అన్ని దిగుళ్ళను రహితము చేయగలిగినదై ఉన్నదో, అట్టి మహాశయము కొరకు జీవించువాని జీవితమే ‘జీవితము’. తక్కినవారిది గాడిదవలె బరువులు మోయటానికే అగుచున్నది. అంతేగాని జీవితమని అనిపించుకోదు. (బరువు మోయటము మాత్రమే)

స జీవతి మనో యస్య మననేన ఉపజీవతి। ఎవ్వడు అన్యమగు ‘‘దృశ్యరూపమననమును జయించిన మనస్సు’’ను సంపాదించుకుంటాడో (లేక)అఖండము, నిత్యము, సత్యము అగు ‘ఆత్మమననము’ అనే ‘‘అనన్యభావము’’ పొందిన మనస్సును సంపాదించుకొంటాడో - ఆతనిదే జీవితము. ఇక తక్కినవారిది నిత్యమరణ సమానమే!

పునర్జన్మ జాడ్య రాహిత్యము

జాతాః స ఏవ జగతి జన్తవః సాధు జీవితాః, యే పునః న ఇహ జాయంతే। ఎవ్వడైతే పునః జన్మించవలసిన అగత్యమును మొదలంట్లా పెకలించివేసుకుంటాడో, అట్టి సాధుజీవనుని జన్మయే ఈ జగత్తులో సార్ధకము. శేషా జరఠ గర్దభాః। ఇక మా వంటి తక్కిన వారి జీవితము గురించి ఏమి చెప్పమంటారు? ముసలిగాడిదల మూలుగు జీవితములతో సమానం.

అనుభవము లేని శాస్త్రజ్ఞానము - భారమే

భారో అవివేకినః శాస్త్రం। వివేకమును ఆశ్రయించని వానికి శాస్త్రజ్ఞానము భారమే అవుతుంది.
భారో జ్ఞానం చ రాగినః। ‘రాగము’(Attatchment) వదలనివానికి జ్ఞానము భారమే।
అశాంతస్య మనో భారో। శాంతి లేనివానికి మనస్సే భారము.
భారో అనాత్మవిదో వపుః। ఆత్మజ్ఞానము లేనప్పుడు శరీరమే భారము.

అహంకార శత్రువు

నిదాఘుడు : తండ్రీ! ఋభు మహర్షీ!

మాకు సంప్రాప్తిస్తున్న ఆపదలన్నీ ‘అహంకారము’ వలనే వచ్చి పడుచున్నాయి - అని గమనిస్తున్నాను.

అహంకారమే దుష్టప్రవర్తనలకు, అల్పాశయముతో కూడిన ప్రయత్నములకు ‘కారణము’గా అవుతోంది.

అహంకారము నుండే సమస్త దృశ్యము పట్ల ఈహములు (అనేక కోరికలు) వ్యసనముగా రూపుదిద్దుకుంటున్నాయి.

కనుక మాకు మా అహంకారమే శత్రువు. అంతకుమించిన శత్రువు మాకు మరొకడు లేడు.

అహంకారము వలన ఏవేవి నాకు అనుభవమౌతున్నాయో, అవన్నీ అవస్తువులే. పరమ లక్ష్యమునకు అడ్డులే. సార రహితములే. ఎందుకంటే అహంకారమే స్వతఃగా అవస్తువు కాబట్టి.

అహంకారమును ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు మేము సమస్తము కోల్పోయేదేగాని పొందేది ఏ కించిత్తూ లేదు.

‘‘నేను ఇంతటి వాడిని కదా!’’ - అనునదంతా ప్రారంభములో మధురము. పరిణామము మాత్రము పరమ చేదు.

మనస్సు - చిత్తము

ఇతశ్చ ఇతశ్చ సువ్యగ్రం వ్యర్థమేవ అభిధావతి, మనో దూరతరా యాతి గ్రామే కాలేయకో యథా।
హే బ్రహ్మన్! ఒక ఊరకుక్క పొందేది ఏదీ లేకపోయినప్పటికీ.. వీధి వీధులకు, గుమ్మము-గుమ్మములకు వెళ్లి వస్తూ, ఎక్కడా నిలబడకుండా తిరుగుతూ ఉంటుంది - చూచారా? ఆ విధంగా మా మనస్సు కూడా ఏవేవో నమ్ముకొంటూ, పొందేది ఏదీ లేకపోయినా కూడా, - ఎటెటో (వీధి కుక్క వలెనే) అనేక విషయములకు, సందర్భములకు, సంబంధములకు వెళ్లి వస్తూ ఉన్నది.

మొగకుక్కను చూచి ఆడకుక్క భయముతో పరుగులెత్తు తీరుగా ‘తృష్ణ’ను చూచినా ఈ మనస్సు ఎటెటో పరుగులు తీస్తోంది. ఇక నేనో! అట్టి క్రూరమైన తృష్ణ వెంటబడి, జడుని వలె విషయములవైపుగా పరుగులు తీస్తున్నాను.

హే బ్రహ్మన్! ఇప్పుడు నేను ఈ మనస్సును పట్టించుకోవటం మానివేశాను. దాని నుండి ముక్తుడనై ఉన్నాను. అయితే ఏం? ఎప్పుడో అది నన్ను వశం చేసుకుంటోంది. సముద్రములోని మొత్తము జలమును త్రాగివేయటము కంటేను, మేరుపర్వతమును మొదలంట్లా పెల్లగించటము కంటేనూ, అగ్నిశిఖలను మ్రింగటము కంటే కూడా-విషముతో సమానమైన విషయములతో వెంటబడే-చిత్తమును (ఇష్టా ఇష్టములను) నిరోధించటము నాకు కష్టము అనిపిస్తోంది. నేను ఈ చిత్తమును వశము చేసుకోలేకపోతున్నానే! ఇక నాకు గతి ఏది?

చిత్త భ్రమలు

చిత్త కారణమ్ అర్థానామ్। తస్మింసతి జగత్రయమ్।
హే భగవాన్! పితృదేవా! ఋభుమహర్షీ! ‘‘ఈ త్రిజగత్తులలో సర్వ అనర్ధములకు కారణము ‘‘ఇష్టాఇష్టములను రెక్కలుగా గల ఈ చిత్తమే’’- అని నాకు అనిపిస్తోంది. చిత్తము క్షీణిస్తే జగత్తులు క్షీణిస్తాయి. చిత్తము లేచికూర్చుంటే జగత్తులు వచ్చిపడతాయి.

తత్ విచికిత్సం ప్రయత్న తః।
అందుచేత ఈనా చిత్తమునకు చికిత్స అత్యంత ఆవశ్యకం.

తృష్ణ (CRAZY OF THINGS AND WORRYING)

ఓ మునిశ్రేష్ఠా! చిట్టెలుక వీణను సమీపించి ఆ వీణ యొక్క తంతువులను (సన్నటి తీగెలను) త్రెంచివేస్తుంది చూచారా? ఆ విధంగా, నేను ఏవైనా - పెద్దలు సూచించే ఉత్తమ అభ్యాసములకు - ఉపక్రమించగానే, తృష్ణ (Craving for worldly things) వచ్చి నా ప్రయత్నములను త్రెంచివేస్తోంది.

ఈ తృష్ణ ఉన్నది చూచారూ! ఇది నా హృదయ పద్మములో ప్రవేశించి నానా హంగామా, గందరగోళములను నిర్వర్తిస్తోంది. అది క్షణకాలంలో పాతాళమునకు దిగిపోతోంది. (అనేక నిరుత్సాహములను నాకు కల్పిస్తోంది). మరుక్షణం ఆకాశంలోకి ఎగిరిపోతోంది. (‘‘నేను అంతటివాడిని - ఇంతటివాడిని’’- అని ఎగిరిపడుతోంది). ఇంకొక క్షణంలో ఆయా దిక్కులలో గల పొదరిండ్లలోకి దూరి ఉంటోంది.

సర్వ సంసార దుఃఖానాం ‘తృష్ణ’ ఏకా దీర్ఘ దుఃఖదా! ‘సంసారము’లోని సమస్త దుఃఖములు స్వల్పకాలికమే అయినప్పటికీ… తృష్ణచేతనే సుదీర్ఘముగా అనిపించబడుచున్నాయి. సర్వదుఃఖములకు, సర్వబంధములకు మూలకారణము తృష్ణయే.

సంసారములోని ఆయా అన్య దుఃఖములన్నీ ఆయా సంఘటనలు తారసపడినప్పుడే కలుగుతుంది. కానీ ‘తృష్ణ’యో? ఒకానొకడు అంతఃపురములో అనేక సందపల మధ్య, ఉన్నప్పుడు కూడా ఆతని తృష్ణ ఆతనిని బయటకు ఈడ్చుకువచ్చి అనేక సంకటములలోకి బలవంతముగా త్రోసివేయగలదు.

‘‘తృష్ణ’’ అనే ఆధి (మానసిక వ్యాధి) మనస్సును పీడిస్తున్నంత సేపు అట్టి జీవునికి స్వల్ప విషయములకే దుఃఖము, ఆనందము క్షణక్షణికంగా కలుగుతూ, తొలగుతూ ఉంటాయి.

ఓ ద్విజోత్తమా! అట్టి అతి భయానకమైన తృష్ణావిషూచిక (విషజ్వరము)కు ఒక్కటే ఔషధము.
అది ఏమిటంటే….
తృష్ణావిషూచికా మంత్రః, ‘‘చింతా త్యాగో హి.
‘‘ప్రాపంచక విషయములు చింతన చేయకపోవటము’’ ఒక్కటే తృష్ణ తొలగటానికి ఉపాయము. వేరే మార్గమే లేదు.

దేహము

ఓ ఋషీశ్వరా! ఋభు మహాదేవా! ఈ ఘనీభూత భౌతికదేహము గురించి కూడా కొంత విమర్శించుకున్నాను.

నాస్తి దేహ సమశోభో, నీచో గుణ వివర్జితః।
ఈ దేహముకంటే దుఃఖమైనది, శోచనీయమైనది, నీచమైనది. ‘సంసారము’లో మరొక్కటేదీ లేదేమో! అందుకని అన్నిటి కంటే మొట్టమొదటగా మనస్సుతో విసర్జించవలసిన వస్తువు (To be first discarded at inner Zone of thought and feelings) - ఈ దేహమే సుమా!’’

ఈ దేహము- ఒక పెద్ద ఇల్లు. ఇందులో ‘అహంకారము’ అనే ఇంటాయన నివాసము కలిగి ఉన్నాడు.

హే గురుదేవా! ఏదిఏమైతేనేమి? ఈ దేహము ఎప్పుడో నశించు గాక! లేక సుదీర్ఘ కాలము ఉండును గాక! దీనితో నాకేమి పని? నేను సర్వదా ‘దేహి’ స్వరూపుడను. దేహమునకు సంబంధించనివాడను. అంతేగాని దేహములో ఒక అంగమును కాను. దేహము ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నాయొక్క సత్-చిత్‌లకు వచ్చే భంగమే లేదుకదా।

ఈ ‘దేహము’ అనే పశువులశాలలో ‘5’ కర్మేంద్రియములు, ‘5’ జ్ఞానేంద్రియములు పశువులవలె కట్టివేయబడి ఉన్నాయి. ‘తృష్ణ’ అనే గడుసరి భార్య ఇక్కడి ఇంద్రియ పశువులను గదమాయించుచూ ఆయా కార్యములలో వాటిని నియమిస్తూ ఉన్నది. ఆవిడ అజమాయిషీలో చిత్తవృత్తులు (Avocations) అనే పాలేర్లు (సేవకులు, భృత్యులు) అటూ ఇటూ లౌకిక కార్యక్రమావర్తులై పరుగులు తీస్తున్నారు.

నేష్టం దేహ గృహం మమ! అటువంటి ఈ శరీర గృహము పట్ల నాకు ఏ మాత్రము ఇష్టం కలగటమే లేదు.

ఇంకా కూడా…,
ఈ శరీరము యొక్క ముఖద్వారము (Entrance Gate) - ‘జిహ్వ- (నాలుక)’ - అనే కోతిచే ఆక్రమించబడినదై ఉన్నది. దంతములు కలిగి, ఎముకలగూడుగా నిర్మిమైన ఈ శరీరము నాకు ఇష్టమైన వస్తువుగా ఏ మాత్రమూ అనిపించటం లేదు. ఇది లోపల రక్త-మాంసమయమై యుండి, బయటకు పూతలాగా చర్మముచే కప్పబడి కనిపిస్తోంది. ‘‘కాలముచే కృశించి, నశించటము’’ అనే అనివార్యమగు ధర్మము కలిగియున్నది.

ఓ మునివర్యా! బొమికలు, రక్తము, మాంసము, దంతములు, చర్మము మొదలై వేరువేరు పదార్థములతో నిర్మితమైన ఈ శరీరములో ‘అందమైన వస్తువు’ అనునది ఎక్కడున్నది? మరి ఇట్టి రక్త-మాంస- చర్మమయ పరస్పర దేహములు చూచి మేమంతా ఎందుకు మోహము పొందుచున్నాము? ఇది నాకు అర్ధమే కావటం లేదు. పోనీ కొద్ది క్షణములు సుకుమారంగా కనిపించినప్పటికీ, అట్టి సుందర - సుకుమారత్వము శాశ్వతమా? కొద్దికాలములో తలనెరిసి, చర్మము ముడతలు పడి అస్తిపంజరమునకు తొడిగిన తోలువలె అవబోతోంది కదా!

‘‘ఈ శరీరము ఇట్లాగే అందముగా, సుకుమారంగా ఎప్పటికీ ఉండ గలదు’’ - అని అనుకోవటమనేది శరత్కాలంలో మేఘముల మెరుపులు, ఊహాకల్పితమగు గంధర్వ నగరము, నదీ జలములో కనిపించిన తరంగము యొక్క ఆకారము, ఆకాశంలో ఎగురుచున్న పక్షుల గుంపు ఆకారము ‘‘ఎప్పటికీ ఉండేవే!’’ - అని నమ్మి ఉండటము వంటిదేకదా!

ఇటువంటి నశ్వర శరీరములను చూచుకొని మేము ఎందుకు మోహము చెందుచున్నాము చెప్పండి?

బాల్యము

శైశవే గురుతో భీతిః, మాతృతః, పితృతః తథా, జనతో జ్యేష్ఠ బాలాచ్చ।

వర్తమానములోని అనేక మానసిక వేదనలను దృష్టిలో పెట్టుకొని, కొందరు ‘‘బాల్యములో మేము ఆనందంగా ఉండేవారము’’.. అని చెప్పుకుంటూ ఉంటారు. గురుదేవా! ఇది నిజమా? కానేకాదు. నవ్వుకోవలసిన విషయం. బాల్యంలో అంతా భయమే! తోటి బాలురవలన భయము! గురువుల వలన భయము! తల్లిదండ్రులంటే భయం! చీకట్లో ఎదో చూచి భయం! లేని పిశాచమును ఎవ్వరో అన్నారని చీకట్లో ఊహించుకొని భయం!

శైశవం భయ మందిరం। ‘బాల్యము’ అనునది భయమునకు మందిరము వంటిది (Boyhood is a temple of fears).

‘‘బాల్యములో మేము సుఖముగా ఉండేవారము’’.. అను మాట మానసిక భ్రమవాక్యమే. అనేక అనారోగ్యములు, చదువు గురించిన ఆంక్షలు, తోటిబాలురను చూచి భయము, నిప్పు - నీరు చూచి భయము - ఇవన్నీ కలబోసియున్న ‘బాల్యము’ బాగుంటుందని దేహమును ఆశ్రయించటము ఎంతటి తెలివితక్కువతనము!

యౌవనము

బాల్యము ఎట్లాగో గడపి ఈ జీవుడు శారీరకంగా యౌవనము పొందుచున్నాడు. స్వచిత్తబిలసంస్థేన, నానావిభ్రమ కారిణా, బలాత్ కామపిశాచేన వివశః పరిభూయతే। ఇప్పుడిక ఆతని చిత్తమునందే అనేక విభ్రమములు. ‘కామము’ అనే పిశాచి ఎక్కడి నుండో వచ్చి ఈ జీవుని యౌవన దశలో తన వశం చేసుకొని ఈతనిని తోలుబొమ్మ వలె ఆడిస్తోంది.

వార్ధక్యము (ముసలితనము)

యౌవనము గర్వించినంతసేపు పట్టదు. చెప్పా పెట్టకుండా క్రమంగా ఈ దేహమును విడచి వెళ్లుతోంది. ఎక్కడి నుండో ఈ దేహమునకు ‘‘ముసలితనము’’ వచ్చి ఆవరిస్తోంది. చేతులు, కాళ్ళు వణకటం ప్రారంభమౌతోంది.

ఎవ్వరెవ్వరైతే ఇంతవరకు వదిగి ఉన్నారో, అటువంటి వారంతా ముదుసలిని చూచి ఎకసెకియం, అపహాస్యం చేస్తున్నారు.

దాసాః పుత్రాః స్త్రియశ్చ ఏవ బాంధవాః సుహృదః తథా, హసంతి ఉన్మత్తకమివ నరం వార్థక కంపితమ్।
ముసలితనముచే వణుకుచున్న శరీరము చూచి సేవకులు, కొడుకులు, కూతుళ్ళు, భార్య, బంధువులు, స్నేహితులు మొదలైనవారంతా పిచ్చివాడిని చూచినట్లు చూస్తున్నారు. ఎగతాళి చేసి మాట్లాడనారంభిస్తున్నారు.

కోతులను ఆడించువాడు కర్రతో అదిరిస్తున్నట్లు, ప్రతి ఒక్కరూ ముదుసలిని చూచి, ‘‘అట్లా ఉండకూడదా? ఇట్లా ఉంటావేం?’’ - అని అదిరిస్తున్నారు.

ఒకప్రక్క ముసలితనములో దైన్యము (Timidity and then, uncertainity about days to come) వృద్ధి చెందుతూ ఉంటుంది. ‘‘మృత్యువు వచ్చి ఎప్పుడు కాటు వేస్తుందో?’’.. అని మనసంతా భయముతో నిండి ఉంటుంది. ‘‘నేను సంపాదించిందంతా ఏమౌతుందో?’’.. అనే దిగులు వెంటనంటి ఉంటుంది. మరొకవైపు శరీరము శిధిలమగుచూ, అనేక శారీరక బాధలు ప్రారంభమై మనస్సును క్రుంగతీస్తూ ఉంటాయి.

ఓ పితృదేవా! చిత్రం చూస్తున్నారా? ఒకవైపు ఇంత జరుగుచున్నా కూడా, ‘మృత్యువు అనివార్యము’ అని తెలిసియున్నా కూడా - ఈ జీవునిలో వివేకముగాని, వైరాగ్యముగాని వికసించటమే లేదు. ఎందుచేతనంటే ఆశ, లోభము చావవు. ‘‘నా ఇల్లు ఏమౌతుందో? పిల్లల గతి? నాకు తెలిసినంత ఈఈ కుటుంబ వ్యవహారముల గురించి మా వాళ్ళకు తెలియదే? వీళ్ల గతి ఏమిటి?’’.. ఇటువంటి భావములే చుట్టుముట్టి ఉంటున్నాయి.

‘‘మరణము అనివార్యము’’ అని ఎవరికి తెలియదు? అయినా కూడా ఆశ చావదేమి? ‘‘నేనెవరు? ఈ దేహమేమిటి? జన్మ ఏమిటి? మరణమేమిటి? ఇదంతా ఎట్లా ప్రాప్తిస్తోంది? జగదనుభవమంతా ఏమి కానున్నది?’’ - ఇట్టి ఆత్మజ్ఞాన సంబంధమైన ప్రశ్నలే ఉదయించటము లేదు.

ఈ విధమైన సంసారములో ‘సుఖము’ అనునది ఎక్కడ ఉన్నదో చెప్పండి? ఒకవేళ సంపదల వలననో, స్వజనమువలననో కొంచెము సుఖము ఉన్నదనే అనుకుందాము. సమస్తమును భక్షించే స్వభావము గల కాలుడు (కాలయముడు) ఒకానొకరోజు రానే వస్తున్నాడు. అల్లరిపిల్లవాడు సుకుమార పుష్పమును త్రెంచి పూరెక్కలను అటూ ఇటూ చిమ్మివేయు విధంగా, కాలుడు అప్పటివరకు ‘‘నాది - నాది’’ అనుకుంటూ వస్తున్న సమస్తమును, - భౌతిక శరీరముతో సహా - మ్రింగి, చప్పరించివేస్తున్నాడు. ఆ తదుపరి ఇంతవరకు నమ్మి జీవిస్తూ ఉన్న దృశ్య ప్రపంచములో ‘ఇది నాది’ అనునది ఏదైనా మరణానంతరము వెంటనంటి ఉంటోందా? ఏదీలేదు. ఇది గమనించి, జాగరూకత వహించవలసిన అత్యవసరము ఉన్నదా? లేదా?

ఈ సంసారములో జీవునికి సుఖమెక్కడ? నశించబోయేవాటి పట్ల నమ్మిక కలిగి ‘నాది’ అను మమకారము కలిగి ఉండటము ఎంతటి దౌర్భాగ్యము! గడ్డి పరక, ఆవగింజ, బంగారము, మహేంద్ర- మేరుపర్వతములు, చిన్న వస్తువులు, పెద్దవస్తువులు.. ఇవన్నీ కాలుడు మ్రింగి వేస్తూ ఉన్నాడు. అయినా ఆయన పొట్ట నిండటము లేదు. సమస్తము మ్రింగివేయటానికే కాలము - ఎలుకను చూస్తూ ఉన్న పిల్లి వలె - క్షణక్షణము ఉద్యుక్తము అవుతోంది.
- కాలము సర్వ సంహారి.
- కాలము - త్రిలోకములలోని సమస్తమును ఆక్రమించుకొని ఉన్నది. ఈ సమస్తము కాలస్వరూపమే. కాలానుగుతమే!

నశించబోయే స్వభావముగల వస్తువులను పట్టుకొని వ్రేలాడుచూ, మేమంతా శాశ్వత వస్తువు గురించిన ప్రయత్నమును మరచి ఉంటున్నాము. ఎంతటి ప్రమాదము? నశించు ధర్మముగల వస్తువులను, విషయములను పట్టుకొని వేలాడుచున్న కారణంగా మేము ఎక్కడా కూడా ఏమాత్రము నిలకడలేకయే ఉంటున్నాము.

దేహ భ్రమ!

జీవులమగు మేము కొద్దికాలము క్రితము దేహములను స్వీకరించాము. అట్టి ఈ దేహములను చూచి ఎందుకు మోహము పొందుచున్నాము? శాశ్వతమగు ఆత్మ గురించిన అధ్యయనమును, అభ్యాసమును ఎందుకు ఏమరచి ఉంటున్నాము?

నాడులతో, బొమికలతో, కీళ్ళతో, రక్తముతో, చర్మముతో నిండియున్న ఈ మాంసమయ దేహమును చూచుకుని ఎందుకు శృంగార పరవశము పొందుచున్నాము? ఈ స్త్రీ దేహము (అట్లాగే స్త్రీకి పురుష దేహము)లో ఏమి శోభ ఉన్నది? ఒక్కసారి - చర్మము, మాంసము, రక్తము, కన్నీళ్ళు మొదలైనవాటిని విడివిడిగా చేసి చూస్తే - ఇందులో మోహపరవశము పొందతగిన రమ్యత్వము ఏమున్నది? మరి పరస్పర దేహ సంబంధమైన పరవశము ఎందుకు మాపట్ల మా జ్ఞాన-విజ్ఞాన దృష్టులను ఆక్రమించివేస్తోంది? ఇదంతా ఇట్లా నిర్వర్తిస్తూ ఉన్నది ఎవ్వరు? మాకు ఏమాత్రము అర్థముకాని ఏదో మాయాశక్తి మమ్ములను వశము చేసుకొని క్రీడిస్తోందా?.

అరె! - జీవులుగా దృశ్యములో ప్రవేశించియున్న మేము-కొంచముకూడా కాలచమత్కారము, కాలగతుల గురించి గమనించటమే లేదే? ఇప్పుడు - వర్తమానంలో - మేరుపర్వత శిఖరము నుండి క్రింద కొండల వరకు జారువారు గంగా నదీజలపు మెరుపులవంటి గొప్ప హారములు ధరించిన స్త్రీల స్తనములు - కొంతకాలము తరువాత ఏమౌతున్నాయి? శ్మశానములో కుక్కలచే అన్నపు ముద్దలవలె భక్షించబడుచున్నాయి.

స్త్రీ, పురుషులు పరస్పర శరీరములోని కేశములు, భుజములు, కళ్ళు మొదలైనవి శృంగార భావములతో చూడటము, స్పృశించటము - ఇదంతా కూడా నిప్పును ముట్టుకోవటము వంటిదే। నిప్పు కన్నా కూడా ప్రమాదమైనవి. ఎందుకంటే అవన్నీ సమీపంగా లేకపోయినప్పుడు కూడా ఊహించినంత మాత్రంచేతనే మావంటి జీవుల మనస్సులను దహించివేస్తున్నాయి.

‘దేహభావము’ కలిగియున్న కారణంగా - విజ్ఞులైనవారు, లౌకిక ప్రజ్ఞ కలవారు కూడా - గడ్డి పరకలవలె దహించబడుచున్నారే! దూరంగా ఉన్న దేహములు కూడా శృంగారాకర్షణలు గుర్తు చేస్తూ మా మనస్సును దహించగలవు కదా! ఈ తళుకు బెళుకులతో రసమయంగా కనిపించే దేహములన్నీ నిస్సారములే! దేహములను చూచి తాదాత్మ్యము పొందటము నరకాగ్నులకు ఇంధనములు సమకూర్చుకోవటమే!

‘కామము’ అనే కిరాతకుడు ‘జీవులు’ అనే పక్షులను తెలివిగా బంధించి, తన బుట్టలో వేసుకొనుచున్నాడు. ఇదంతా తెలిసి తెలిసి కూడా మేమంతా ఆ కామునకు - ఈ భౌతిక దేహంతో సహా, మా తెలివితేటలతో సహా అమ్ముడుపోతున్నాము.

‘‘జన్మ’’ అనే చెరువు. అందులో ‘‘చిత్తము’’ అనే బురద. అట్టి చిత్తము అనే బురదలో చేపలవలె జీవులమగు మేము సంచరిస్తూ ఉండగా, మన్మథుడు అనే జాలరి దుర్వాసనలు (దుష్ట సంస్కారములు) అనే వలవేసి, ‘కామము’ అనే ఎఱను తగిలించి ఆకర్షించి మరీ పట్టుకొనుచున్నాడు.

తండ్రీ! ఋభు మహర్షీ! కామమును ఆశ్రయించినందుకు మా దుర్గతులు వర్ణనాతీతము. అందుచేత ఇటువంటి స్త్రీ (దేహ) సంబంధములలో నేను చిక్కుకో తలచుట లేదు. ఏదో విధంగా ఈ శారీరక - భౌతిక సంబంధములకు దూరంగా వచ్చివేసి, ‘సత్యము’ కొరకై ‘అణ్వేషణము’ చేస్తూ ఉండ తలుస్తున్నాను.

స్త్రీ ఉంటేనే భోగేచ్ఛ. స్త్రీతో సంబంధమే లేకపోతే (స్త్రీ, పురుషుల పరస్పర శారీరకాకర్షణమే లేకపోతే) భోగేచ్ఛ ఎక్కడిది?

శ్లో।। యస్య స్త్రీ తస్య భోగేచ్ఛా। నిః స్త్రీః, కస్య క్వ భోగభూః?
స్త్రియం త్యక్త్వా జగత్ త్యక్తం। జగత్ త్యక్త్వా సుఖీ భవేత్।

ఈ స్త్రీ-పురుష శరీరముల భౌతికాకర్షణను త్యజిస్తే జగత్తును త్యజించినట్లే. జగత్తునే త్యజిస్తే అది సుఖమే కదా! ఇక దుఃఖమెక్కడ ఉంటుంది?

కాలగతిః యత్ దృశ్యమ్, తత్ నస్యమ్

సర్వము కాలముచే నశించబోవుచుండగా ఇక్కడి వస్తు జాలముచే నేను ‘బద్ధుడను’ ఎందుకు కావాలి చెప్పండి?

➤ సుదూరంగా విస్తరించి కనిపిస్తూ ఉన్న దిక్కులన్నీ కూడా కొంతకాలానికి దిక్కు లేకుండా పోతున్నాయి. దిశోఽపి నహి దృశ్యన్తే।
➤ దేశ దేశములే కాలగర్భములో కలిసిపోయి ‘అన్యోపదేశము’ అగుచున్నాయి. (సింధునాగరికత, గుప్తరాజుల స్వర్ణయుగం ఇటువంటివే కదా). దేశోఽపి అన్యోపదేశకృత్।
➤ కొండలే చూర్ణములైపోతున్నాయి. శైలాఽపి విశీర్యంతే।
➤ ఆకాశములో నక్షత్రాలే ఒకరోజుకి నేలరాలుచున్నాయి. శీర్యంతే తారకా అపి।
➤ సముద్రాలు ఇంకిపోతున్నాయి. శుష్యంత్యపి సముద్రాశ్చ।
➤ ఎంతో ‘ధ్రువము’ అనుకున్నవి కూడా, కాలముచే అధ్రువము అయిపోతున్నాయి. ధృవోపి అధృవ జీవనః।
➤ సిద్ధులంతటివారు అప్రసిద్ధులు అగుచున్నారు. వారు ఎటువైపు వెళ్ళుచున్నారో, వారివారి సిద్ధులు ఏమగుచున్నాయో చెప్పలేకున్నాము! సిద్ధాఽపి వినశ్యంతి।
➤ దానవులు, రాక్షసులు మొదలైనవారే జీర్యము (వినాశనము) పొందుచున్నారు. జీర్యంతే దానవాదయః।
➤ హరుడంతటివాడు నిష్ఠను కోల్పోవుచున్నాడు. హరి అంతటివారు హరించుకుపోతున్నారు. విరించి అంతటివాడు వీగిపోవుచున్నారు. పరమేష్ట్యపి అనిష్ఠావాన్। హీయతే హరిరప్యపి అజః।
➤ భావించబడూ ఉన్నవన్నీ అభావమై కనబడటమే మానివేస్తున్నాయి. భవుడు అభవుడౌచున్నారు. భవోఽపి అభావమాయాతి।
➤ దిక్పాలకులంతటివారు అదృశ్యమైపోతున్నారు. జీర్యంతే వై దిగీశ్వరాః।

ఇక మా బోటి మానవ - దేహధారుల గురించి ఏమి చెప్పాలి? ‘మావి’ అనుకున్నవన్నీ ఎటో వెళ్లిపోతున్నాయి. ఈ దేహమే ఒకప్పుడు మరెటో వెళ్లిపోతోంది. ‘నేను-నాది’ అని గంతులు వేస్తున్న మేము ఇంకెటో వెళ్ళిపోతున్నాము. తదితర విశేషణములగురించి చెప్పేదేమున్నది? ఇటువంటి తుచ్ఛ - నశ్వర దేహములను మనో - దర్పణములో చూచుకొని ‘‘ఆహా! "ఓహో!’’ అని మురిసిపోవుచున్నాము. కాలగతిని మేము గమనించటమే లేదు.

ఆహా! ఏమి ఈ సృష్టికల్పనా చమత్కారము! సముద్రంలో అసంఖ్యాక తరంగాలు బయల్వెడలి, సముద్ర జలములో సంచారములు చేసి చేసి, తిరిగి సముద్ర జలమునందే లయము అవటం జరుగుతోంది కదా!

అట్లాగే..,
శ్లో।। బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ సర్వావా భూతజాతయః, నాశమేవ అనుధావంతి సలిలానీవ బాడబమ్।
సముద్రజలంలో పుట్టిన బడబాగ్ని సముద్రజలమునే హరించివేస్తోంది చూచారా? అట్లాగే,
బ్రహ్మా - విష్ణు - రుద్రులు మొదలుకొని సమస్త జీవులు, ఆ జీవులు నివసిస్తూ ఉన్నట్టి, (అష్ట దిక్పాలకులు - నవగ్రహములు- సప్తఋషులు-సనత్‌కుమార సనస్సుజాతాది బ్రహ్మ మానసపుత్రులు వారువారు) ఏలుతూ ఉన్నట్టి సమస్త మండలములు, ఈ కనబడే 14 లోకములు కూడా కొంతకాలము తరువాత తమ యొక్క స్వరూపమును కోల్పోవుచున్నాయి. సమస్తమునకు సహజరూపమగు అఖండ-కేవలాత్మానంద-చిదానంద సాగరంలో సమస్తము లయమౌతోంది. మరల మరెక్కడో ఇవన్నీ బయల్వెడలుచున్నాయి.

సమస్తము క్షణ భంగురమే కదా!

హే మహర్షీ! ఋభు దేవా! గురువర్యా! ఈ ప్రపంచంలో (ఆత్మకు అన్యముగా ఉనికి ఉన్నట్లుగా) కనిపిస్తూ ఉన్న సమస్తము క్షణికమే కదా!

ఆపదః క్షణమ్ ఆయాంతి। ఈ జీవునికి క్షణంలో ఆపదలు వచ్చిపడుచూ ఉన్నాయి.
క్షణమాయాంతి సంపదః। ఇంతలోనే ఆ ఆపదలు ఎటో పోయి, క్షణంలో సంపదలు వచ్చి చేరుచున్నాయి.
క్షణం జన్మ। అథ (క్షణం) మరణం। క్షణంలో జన్మ। క్షణంలో మరణం।
సర్వం నశ్వరమేవ తత్। ఇక్కడ కనిపించే సమస్తము నశ్వరమే! అతి కొద్దికాలము తరువాత - ఇవేమీ ఉండబోవటమే లేదు.
అసలు ఈ దృశ్యజగత్తులో ‘ఇది శాశ్వతము’ అనతగ్గది ఏదైనా ఒక్కటన్నా ఉన్నదా?

ఇంకా కూడా గమనిస్తూ ఉంటే - ఈ కల్పనా జగత్తులో అనేక చిత్ర-విచిత్రాలు।
✤ బలహీనుని చేతిలో బలవంతుడు మరణిస్తున్నాడు. ఒకని చేతిలో వందమంది చచ్చుచున్నారు.
✤ ఆరోగ్యముగా ఉన్నవాడు అకస్మాత్తుగా మరణిస్తున్నాడు. ‘‘చావబోతున్నాడురా!’’ అనుకున్నవాడు ఇంతలోనే తిరిగి జీవిస్తున్నాడు. అందుచేత పితృదేవా! ఈ జగత్తులోని ‘‘జనించే - కనిపిస్తూనే - గతించే నామ రూపములతో వ్యసనంగా సంబంధమువృద్ధి చేసుకొని, సుఖ-దుఃఖములు ఆశ్రయించటము ఎంతటి తెలివితక్కువతనము!

విషయములే విషము

అయితే, ఇంతగా సమస్తము వైరాగ్య పూర్వకంగా గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా మేము విషయముల బారిన పడుచున్నామే!- ఒకానొకడు పర-దూషణ-తప్పనిఎరిగినప్పటికీ ‘దూషించటము’ అనే దురభ్యాసమును విడువలేనివిధంగా, ఈ విషయములు (జగత్ సంబంధమైన సంగతులు, సమాచారములు, సంబంధములు, సంయోగ - వియోగ భావావేశములు మొదలైనవి) మమ్ములను వదలిపెట్టడము లేదు. వాటిని మేమూ వదలటము లేదు. ఒక్క విషయం - ఇక్కడ విషయముల గురించి - నేను గమనిస్తూ ఉన్నాను.

అది ఏమిటంటే,

శ్లో।। విషం విషయ వైషమ్యం। న విషం విషమ్ ఉచ్యతే।
జన్మాంతరఘ్నా విషయా। ఏతత్ జన్మహరం విషమ్।।
ప్రాపంచకమైన సంఘటన - సందర్భ - సంబంధ - ఇత్యాదుల పట్ల ప్రియ-అప్రియములు, ఆశ-నిరాశలు, మమకార- అహంకారములు మొదలైనవి కలిగియున్నప్పుడు అవి ఈ జీవునిపట్ల ‘విషములు’గా అగుచున్నాయి. అయినా కూడా మేము వాటిని దేహము ఉన్నంత వరకు వదలలేకపోతున్నాము.

హే మహానుభావా! గురువర్యా!
విషము నిజానికి విషము కాదు. విషయములే నిజమైన విషము. ఎందుకంటారా? విషము తీసుకోవటము వలన - అది ఈ వర్తమాన దేహమును మాత్రమే హరించగలదు. కానీ విషయములో? అవి మాపట్ల అనేక అల్ప-నీచ జన్మ పరంపరలకు కారణమగుచున్నాయి. అనేక దేహములను బూడిదపాలు చేస్తున్నాయి. ‘‘అజ్ఞానము’’ - అనే ఉప్పునీటిలో ముంచి ఉంచుచున్నాయి. మా మనోబుద్ధులను ఎందుకూ కొరగానివిగాను, పైగా - పరమ దుఃఖమయముగాను చేసి వేస్తున్నాయి.

ఆహా! ‘విషయాకర్షణము’ అనే దుఃఖపర్యవసానములు మాకు ఎక్కడి నుంచి వచ్చిపడుచున్నాయి? మాపై వెదజల్లుచున్నది ఎవరు? ఏ అజ్ఞాత శక్తి మా ఈ వ్యవహారమంతా వెనకన ఉండి నడిపిస్తోంది?

వైరాగ్య ప్రకటన

హే భగవాన్! పితృదేవా! మహర్షీ! ఋభు మహానుభావన్। సద్గురూ! నేను చెప్పినదంతా గమనిస్తూ ఉన్నారు కదా! సముద్రంలో నుండే బడబాగ్ని జనించి సముద్రమునకే బాధ కలిగిస్తుంది చూచారా! ఆ విధంగా మా హృదయంలో ఎందుకో, ఎప్పటి నుంచో ‘సంసార దోషము’ అనే దావాగ్ని జనిస్తోంది. అనేక జన్మ పరంపరలు. అందులో అనేక అల్పదృష్టులు. అట్టి అగ్ని శిఖలు ప్రవృద్ధమగుచు హృదయములోని ‘శాంతి’ని హరిస్తున్నాయని ఇప్పటికి గమనిస్తున్నాను.

ఈ దృశ్య వ్యవహారము మాకు నిజమైన దాహము తీర్చే జలము గల సరస్సు కాదు. కేవలము ‘‘మృగతృష్ణా సరస్సు మాత్రమే।
- ఇది గమనించిన తరువాత, ఎవ్వడైనా ఆయాసపడుతూ ఈ ‘దృశ్య జగత్తు’ అనే మృగతృష్ణలోని నీరు త్రాగటానికి పరుగులు తీస్తాడా? లేదు కదా.

స్ఫురంతి హీన భోగాశా మృగతృష్ణా సరస్స్వపి। మృగతృష్ణా జలము వంటి ఈ దృశ్యములో కనిపిస్తూ, మేము ఆశించటానికై మమ్ములను ఆకర్షిస్తూ, మమ్ములను ఊరిస్తూ కనబడుచున్న విషయ భోగముల పట్ల ‘భోగాశ’ నాకు క్షీణించింది.

ఏమాత్రము భోగించాలనే ఆశ, నమ్మకము (An expectation to enjoy the worldly matters, relationships, possessions and so on…) నాకు ఏమాత్రము ఏర్పడటమే లేదు. అయితే ఇప్పుడు నా యొక్క ప్రాపంచక భావములు, అర్థములు, సమన్వయములు, అనుభవములు, అనుభూతులు ఆత్మభావన యందు సశాంతించితేగాని నాకు ప్రశాంతత లభించజాలదని గమనిస్తూ ఉన్నాను.

ప్రణిపాతేన

హే మహానుభావన్!
ఇప్పుడు మీ పాదపద్మములను చేతులతో, నుదురుతో స్పృశించి కళ్ళకు అద్దుకుంటూ శరణాగతుడను అగుచున్నాను.

తత్త్వజ్ఞాన బోధ ప్రసాదించండి

అతో మాం బోధయాశు త్వం తత్త్వ జ్ఞానేన వై, గురో!
తండ్రీ! మహర్షీ! నిదాఘ మహాశయా! గురుదేవా! ఇప్పుడు నాకు ‘‘తత్త్వజ్ఞానము’’ను ప్రసాదించవలసినదిగా రెండు చేతులను జోడించి, మరల మరల నమస్కరిస్తూ అభ్యర్థిస్తున్నాను.

(తత్- అదియే
త్వమ్ - నీవు
బోధ - ఏతత్ నిరూపణము)

తమ యొక్క తత్త్వ బోధామృతముచే నా యొక్క జన్మజన్మల సంసార జాడ్యము తొలగునుగాక! నేను కూడా మీవంటి మహర్షుల వలెనే అఖండాత్మానంద స్వరూపుడనై వర్ధిల్లుచూ, సమస్త సంసారదోషములు తొలగి, స్వచ్ఛుడనై ప్రకాశించెదనుగాక! ఈ ఆశయముతో మిమ్ములను శరణువేడుచున్నాను.

తండ్రీ! మరొక విషయం కూడా! ఒకవేళ నేను అర్హుడను కాకపోవటము చేతనో, (లేక) మరింకే కారణముగానో, మీరు ఆత్మతత్త్వ బోధను ప్రసాదించకపోతే? ఇక నా ప్రస్తుత నిర్ణయమేమిటో మీకు వినమ్రుడనై తెలియజేసుకుంటున్నాను. వినండి.

శ్లో।। నోచేత్ ‘మౌనం’ సమాస్థాయ, నిర్మానో, గత మత్సరః
భావయన్ మనసా ‘‘విష్ణుం’’, లిపి కర్మ - అర్పితోపమః।

→ ‘‘నేను ఇటువంటి వాడిని. అటువంటివాడిని’’ అను రూపముతో నన్ను వెంటనంటి ఉంటున్న ‘‘మానము’’ను మొదలంట్లా త్యజించివేస్తాను.
→ ‘‘వారికి అంతే తెలుసు। నాకే ఇంత తెలుసు।’’ అనే రూపము గల ‘‘మత్సరము’’ను వదలివేస్తాను.
→ మనస్సుతో విశ్వస్వరూపుడు, సర్వాంతర్యామియగు విష్ణుభగవానుని తత్త్వమును భావన చేస్తూ..,
చిత్ర పటములో లిఖించబడిన (Painting) చిత్రము వలె సమస్తము త్యజించి చలన రహితుడనై ఉండిపోతలచాను.

అతో నమో నమః

◼️◼️◼️

ఇట్లు పలికి ఆ నిదాఘ మహాశయుడు తండ్రి వద్ద మౌనము వహించి ఉండిపోయారు. చేతకపక్షి వానకొరకు వేచి ఉండుతీరుగా పితృదేవులు, గురుదేవులు అగు ఋభుమహర్షి చెప్పబోవు మాటల శ్రవణము కొరకు సంసిద్ధుడైనారు.


4వ అధ్యాయము
‘‘అహం బ్రహ్మాస్మి।’’ సత్సాధన - సంసిద్ధి

ఋభు మహర్షి : బిడ్డా! నిదాఘా! నీవు వివరించి చెప్పిన వివేకముతో కూడిన వైరాగ్య భావములన్నీ విన్నాను. చాలా సంతోషము. ఈ జీవుడు ఏదైతే దృశ్యమునందు సునిశిత బుద్ధితో పరిశీలించి తెలుసుకోవాలో, అదంతా కూడా - తీర్థయాత్రా ఫలితముగాను, మీ గురువుల ప్రసాదముచేతను, ఈశ్వరానుగ్రహం చేతను, స్వ-వివేకము చేతను తెలుసుకొన్నావు. జ్ఞానులలో శ్రేష్ఠుడవు అయ్యావు. ఓ జ్ఞానవతాంవర! తవ నాస్తి అస్తి అన్యత్ జ్ఞేయం! ఇంక వేరే ‘‘తెలుసుకోవలసినది’’ అన్నది ఏదీ నీ పట్ల మిగిలి ఉండలేదు. ఉన్నది ఉన్నట్లే పలికావు.

అయితే శాస్త్రముల నుండి, గురుముఖతః, (మరియు) స్వకీయ వివేక - వైరాగ్యములతో కూడిన ‘‘ప్రజ్ఞ’’(Intelligence duly accompanying common sense)తో తెలుసుకోవలసినది తెలుసుకున్నావు. మంచిది! ఆ తెలుసుకున్న జ్ఞానమును ఇప్పుడు ఇక్కడ నిస్సందేహమగు విజ్ఞానరూప- అనుభవముగా (As an experience here and now beyond doubt) తీర్చిదిద్దుకోవాలి. తెలుసుకొన్నది స్వాభావికంగాను, అనుక్షణికంగాను, అవ్యాజంగాను (Independent of wordly occasions) - అనుభవముగా అయితేనే - సిద్ధించినట్లు సుమా।

అనగా, జ్ఞానము జ్ఞేయముగా స్వానుభవం కావాలి. ఎట్లా? చిత్తమాలిన్యము రూపమున శేషించిన కించిత్ భ్రమ మాత్రమే నీ పట్ల తొలగవలసియున్నది. అట్టి భ్రమ తొలగితే నీవు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె, మా ఋషుల వలె - ‘‘ఆత్మస్వభావి’’ అయి సంప్రాకాశించగలవు.

ఒక పాత్ర సహజంగా నిర్మలమైనది అయినప్పటికీ, వాడుకలో మాలిన్యము తాకినప్పుడు, ధూసరం అవుతుంది. ఇకప్పుడు చక్కగా మార్జయము (తోమటము) నిర్వర్తించి, జలముతో కడిగితే? తిరిగి యథాతథముగా ప్రకాశిస్తూ కనిపించగలదు కదా! నీవంటి తీవ్ర సాత్విక-స్వాభావిక వైరాగ్యము సిద్ధించుకొన్న తరువాత కించిత్ ‘మార్జయము’ (Washing) వలన ‘‘స్వస్వరూపావగాహన- అనుభవముల పట్ల శేషించియున్న ఏకించిత్ సంశయము’’ కూడా తొలగగలదు.

ఇప్పుడు నేను చెప్పబోవు బోధ విశేషములచే అట్టి మార్జయము (Washing) జరుగగలదు. అందుచేత శ్రద్ధగా విను.

మోక్షస్థితి

ఏ మహత్తరమగు ‘‘ఆత్మమేవాఽహమ్। న మనో! న అన్యః’’ అను అవగాహనచే (Clarity),… ‘నాకు బంధము మొదలే లేదు. ఉండజాలదు’’.. అను రూపంగా స్వాభావికానుభమౌతుందో,.. అట్టి అవగాహన - అనుభవస్థితియే (The state of understanding and experiencing) ‘‘మోక్షము’’ అని పిలువబడుతుంది.

‘‘ఈ జీవుని దుఃఖము (Worry) మొదలంట్లా తొలగాలంటే, - అట్టి ‘మోక్షస్థితి’ని సిద్ధించుకోవటము - ఒక్కటే ఉపాయము’’ - అని శాస్త్రములచే, తత్త్వదర్శులచే సుస్పష్టముగా, నిర్దుష్టముగా చేతులెత్తి ప్రకటించబడుతోంది. (ఊర్ధ్వబాహుః విరమ్యౌషమ్।)

సాధన చతుష్టయము

అయితే అట్టి మోక్ష స్థితి సంసార బద్ధుడగు ఈ జీవునికి సిద్ధించటము సాధ్యమా? తప్పకుండా సాధ్యమే. ప్రయత్నించేవానికి సిద్ధించనిదేముంటుంది? అప్రయత్న శీలునికి లభించేదేమున్నది? అందుచేత, ప్రయత్నించి, మోక్షస్థితి (లేక) స్థానము సిద్ధించుకోవటానికి మానవ ఉపాధి ఒక మహత్తరమైన అవకాశము. సాధన శీలునికి అది సులభమే! అందుకని ఓ నిదాఘా! తదితర శిష్యజనులారా! ‘‘తప్పక మోక్షము సాధ్యమే’’ అనే నమ్మికతో సాధనకు ఇక ఉపక్రమించండి.
ఎట్లా సాధ్యము? అందుకుగాను స్వానుభవులగు మహనీయులచే సశాస్త్రీయంగా ‘‘సాధన చతుష్టయము’’ మార్గదర్శకంగా చెప్పబడుతోంది.

(1) శమము (2) విచారణ (3) సంతోషము (4) సాధు సంగము - ఈ నాలుగు మోక్షగృహములో ప్రవేశించటానికి నలుగురు ద్వారపాలకులుగా చెప్పబడుచున్నారు. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటైనా సరే, అన్ని ప్రయత్నములు చేసి ఆశ్రయించాలి. ఈ నలుగురు సాధన సంపత్తి ద్వారపాలకులలో ఒక్కడు వశమైనా కూడా, తక్కిన ముగ్గురు తమకు తామే వశము కాగలరు.

ప్రజ్ఞ (wisdom)ను పదునుపెట్టడానికి మొట్టమొదట శాస్త్ర సజ్జన సంపర్కమును ఆశ్రయించాలి. ఆ తరువాత తపస్సు - దమములను (ఇంద్రియ నిగ్రహమును) ‘‘సంసార బంధ విముక్తి’’ కొరకై ఆశ్రయిస్తే ప్రజ్ఞ తనకు తానే నిర్మలము, సునిశితము, విస్తారము అగుచున్నది. అటుపై - ఏదైతే ఈ జీవునికి సంబంధించిన పరమ సత్యమో, అది తప్పక అవగతమౌతుంది. క్రమంగా శాస్త్ర-గురువాక్యముల పరమార్థమును అట్టి ప్రజ్ఞతో శ్రవణం చేసి మనన - నిదిధ్యాసలతో అభ్యాసము చేయాలి. అట్టి అభ్యాసము సహాయముతో సర్వత్రా ఆత్మనే సందర్శించాలి.

సాధన యొక్క అనుక్షణికత్వం

ఓ నిదాఘా। సాధన అనునది రోజులో కొద్ది సమయమునకు మాత్రమే సంబంధించినది కాదు. కొన్ని క్షణములతో ప్రారంభించినప్పటికీ, అద్దాని యొక్క ‘‘అనుక్షణికత్వము’’ను సిద్ధించుకోవటమే ముఖ్యాశయము.
(1) దృశ్య విషయములను ప్రియ-అప్రియములుగా సంకల్పిస్తూ ఉండటము.
(2) దృశ్యము నుండి ఏదో ఆశించుచూ ఉండటము.
(3) దృశ్యముతో అనుసంధానము కలిగి ఉండటము.
ఈ మూడు కూడా ఎల్లప్పుడు, సర్వసందర్భములలోను వర్జిస్తూ (Leaving aside) ఉండాలి. అప్పుడిక నీవు క్రమంగా పావనమగు ‘‘అమనస్కస్థితి’’ లేక ‘‘చిత్తరాహిత్యము’’ పొందగలవు.

‘‘ఈ జగత్తు నాటకము వంటిది. ఏ విధంగా పాత్రధారుడు నవరసములు నటిస్తున్నప్పటికీ వాటిని తాను ‘కర్త’ కాదో, … అదేవిధంగా ఈ జగత్తులో నేను దేనికీ కర్తను కాదు. భోక్తను కూడా కాదు’’ - అను అకర్తృత్వమును మనస్సుతో కలిగి ఉండటమే - ‘సమాధాన స్థితి’ (లేక) ‘సమాధి స్థితి’. అదియే ‘‘కేవలీ భావము’’ అని ’‘కైవల్యస్థితి’’ అని కూడా పిలువబడుతోంది.

(స్వస్వరూపాత్మ కేవలముగాను, అన్యముగా కనిపించే సమస్తము సందర్భ మాత్రంగాను స్వానుభూతము అవటమే ‘‘కైవల్యము’’.
అద్దానినే అత్యంత శుభప్రదమగు ‘‘పరానిర్వృతి’’ లేక ‘‘ఉత్తమమగు నిర్వాణము’’ - అని కూడా అంటూ ఉంటారు. )

బుద్ధితో సమస్తము త్యజించి ఉండటము

ఓ నిదాఘ ప్రియ పుత్రకా!

చేతసా సంపరిత్యజ్య సర్వభూతాత్మ భావనామ్ యథా తిష్ఠసి తిష్ఠత్వమ్, ‘‘మూక అంధ బధిరా’’ ఉపమా!
మనస్సుతో సమస్త ‘‘వేరువేరు జీవాత్మలు - దేహములు - గుణములు’’ - అను రూపముగా గల భేదరూపమైన భావనలను మొదలంట్లా పరిత్యజించివేయి. అప్పుడు ఏది శేషిస్తోందో అద్దాని యందు సంస్థితుడనై ఉండెదవుగాక. ఇక జగత్ చమత్కారమంటావా? ఈ దృశ్య జగత్తు నందు సర్వ బేధ విషయముల పట్ల మాట్లాడుతూ కూడా మాటలు రాని మూగవానివలె, చూస్తూ కూడా చూడని అంధునివలె, వింటూ విననట్టి చెవిటివానివలె ఉంటూ - సంభావన కలిగి ఉండుము.

నీకు నాకు కూడా - ఇంద్రియములకు విషయమై తారసబడుచున్న ఈ సమస్తము → ప్రశాంతము, జనన ధర్మరహితము, ఏకము, మొదలు - మధ్య - చివర లేనట్టిది. (ఆది మధ్యాంతరహితము), స్వయం ప్రకాశకము, ఇంద్రియములకు విషయమై ఉండనట్టిది, అనుభూతమగుచూ ఉన్న ఏదీ కానట్టిది - అగు ఆత్మయే అయి ఉన్నదయ్యా!

‘సర్వము, ప్రశాంతము’ మొదలైన శబ్దములు ఏమేమి చెప్పుకుంటున్నామో… అవన్నీ కూడా దృష్టి పవిత్రము చేయటానికి చెప్పుకొంటున్న మాటలు మాత్రమే. ‘‘అదంతా కూడా ఆత్మానుభవము సమక్షములో అహ్రాంతివాక్యములే’’ - అని కూడా గ్రహించి ఉండు.

ఇక్కడ ఏదేదైతే ‘‘దృశ్యము’’గా దృశ్యమానమై కనిపిస్తోందో - అదంతా కూడా కేవలమగు చిత్-వస్తువే (చిత్ స్వరూపమే) అయి ఉన్నది. ‘‘చిత్ స్వరూపమునకు వేరై (కేవలమగు తెలివికి వేరై) ఎక్కడా ఏదీ లేదు. ‘తెలివి’యే తెలియబడుచున్న సమస్త జగత్తుగా ప్రకాశమానమగుచున్నది’’ - అనే మననమును సర్వదా ఆశ్రయించి ఉండు.

జగత్ క్రియలన్నీ ఆచరిస్తూ ఉండి కూడా నిత్య ప్రబుద్ధ చిత్తుడవు (One who is mentally awakened in the inspiration of self) అయి ఉండెదవుగాక.

‘‘ఆత్మ సర్వదా ఏకము, అఖండము, అక్షరము, సమస్తము అయ్యే ఉన్నది కదా!’’ అని ఎరిగినవాడవై తరంగ రహిత సముద్రమువలె ప్రశాంతుడవై ఉండుము.

ఆత్మబోధ - ‘‘వాసనలు’’ అనే గడ్డి పరకలను కాల్చివేయు అగ్నివంటిది. అట్టి తత్త్వబోధ చేత సమస్తమును ప్రకాశింపజేయుచు ‘‘ఈ సమస్తముగా ఉన్నది నేనే. నేను ఈ సమస్తమునకు అనన్యము’’ - అను సమాధి స్థితి సిద్ధిస్తోంది.

తత్ = అఖండము అప్రమేయము అగు పరమాత్మయే  
త్వమ్ = ‘నీవు’ రూపముగా అగుపిస్తోంది.  
బోధ = వివేక దృష్టిచే ‘నీవు’ అనురూపంగా కనిపించేదంతా పరమాత్మ యొక్క యథాతథ సంప్రదర్శనమే - అని అనిపించటం.

🙏 ఈ సమస్తము ఆత్మయే!
🙏 దీనిని దర్శించుచున్న నేను ఆత్మస్వరూపుడనే! ‘నీవు’గా కనిపిస్తున్నదంతా మమాత్మ ప్రదర్శనమే.
🙏 కనుక ఈ సమస్తముగా ఆత్మస్వరూపుడనైన నేనే నా వినోదము కొరకు సర్వత్రా ప్రదర్శనమగుచున్నాను.
🙏 జన్మ-జీవన-కర్మలతో సహా, ఇంద్రియముల-ఇంద్రియార్థముల-ఇంద్రియ దృశ్యానుభవములతో సహా నాకు వేరై ఎక్కడా ఏదీ లేదు। ఇదంతా నాకు స్వకీయ కల్పనా రూప వినోద చమత్కారము.

ఇట్టి స్వాభావికమగు అనుభూతియే (అప్రయత్నముగానే అనిపించటమే) ‘‘సమాధి’’. న తు తూష్ణీం అవస్థితిః। అంతేగాని ఈ సమస్త దృశ్యము తూష్ణీకరించి (వదలి) ఎక్కడకో వెళ్లిపోవటము కాదు. సమాధి యొక్క భావనా సిద్ధికొరకు సాధనగా ఒక ఏకాంత ప్రదేశమునకు వెళ్ళవచ్చుగాక! సాధనచే ‘సమాధి’ (సర్వేసర్వత్రా స్వస్వరూప సమదర్శనము) సిద్ధించిన తరువాత - ఇక ఆపై ‘‘అంతా నేనే అయి ఉండగా నేను ఎక్కడికి వెళ్ళాలి?’’…… అను ఎరుకతో ఎక్కడైనా స్వేచ్ఛ పుణికి పుచ్చుకొని ఉంటూ ఉండెదవుగాక.

ఒక జాతిరత్నము ‘ఇచ్ఛ’ అనేదేదీ లేకుండానే ఎక్కడ ఉంటే అక్కడ అన్నివైపులా తన రత్నకాంతులను వెదజల్లుతూ ఉంటుంది కదా! అట్లాగే నీవు ఎక్కడ ఎట్లా ఉన్నప్పటికీ నీయొక్క సత్తా విశేషము (Absolutely existent self)చే పరబ్రహ్మతత్త్వ స్వరూపుడవగుము. ‘‘జగత్తంతా కూడా అస్మత్ ఆత్మజ్యోతి స్వరూపము యొక్క దివ్యకాంతియే’’.. అనే అవగాహనతో స్వాభావికంగానే ఆత్మానుభవి అయి ఉండుము.

ఆత్మ కర్తయా? అకర్తయా?

నిదాఘుడు : ‘‘మహాత్మా! శాస్త్రములలో ఆత్మ గురించిన రెండు వాక్యములు నాకు పరస్పరము నిరుద్ధంగా అనిపిస్తూ వస్తోంది.

(1) ఈ జగద్ధృశ్యము ఆత్మ యొక్క విన్యాసమే. కనుక ఆత్మయే ఈ సమస్తమునకు కర్త.
(2) ఆత్మ దేనికీ కర్తకాదు. సర్వదా అకర్తయే.
ఈ రెండిటి సమన్వయము ఏమై ఉన్నదో దయచేసి వివరించండి. ఆత్మ కర్తయా? అకర్తయా?

ఋభు మహర్షి : ఆత్మశ్చ ఆత్మని కర్తృత్వం, అకర్తృత్వం చ వై మునే! ఓ మునీ! ఆత్మకు ఆత్మ పట్ల (ద్రష్ట-దృశ్యముల పట్ల), కర్తృత్వమూ ఉన్నది. అకర్తృత్వమూ ఉన్నది. (ఆత్మ కర్త కాదు కూడా)।

దృష్టాంతపూర్వకంగా..
→ నవలలోని ఒక పాత్ర యొక్క స్వభావమునకు కర్త ఎవరు? రచయితయే కదా! కాబట్టి ‘కర్త’
→ పాత్ర యొక్క స్వభావము రచయిత కలిగియున్నాడా? లేదు. కనుక అకర్త కూడా!
→ ఆభరణముగా కనిపిస్తున్నది బంగారమే కదా! కాబట్టి ‘‘ఆభరణమవటము’’ అనుదానికి బంగారమే ‘‘కర్త’’. (మరొకటేదో కాదు).
→ ఆభరణముగా ఉన్నది బంగారమే కదా! కనుక బంగారము మరొకటేదీ అవకయే ఉన్నది కాబట్టి ‘‘అకర్త!’’)

నిరిచ్ఛత్వాత్ ‘అకర్తా’ అసౌ। ‘‘కర్తా’’ సన్నిధ మాత్రతః। తే ద్వే (2) బ్రహ్మణి విందేతే ‘‘కర్తృతా-అకర్తృతే’’ - మునే! ఆత్మకు ‘జగత్తు యొక్క కల్పన’ అనే ఇచ్ఛ ఏదీ లేదు. కనుక అకర్తయే! ఆత్మయొక్క సాన్నిధ్యము చేతనే జగత్తు, జీవుడు (That being experienced and one who is experiencing) అనే రెండు ఏర్పడుచున్నాయి. కనుక ఆత్మయొక్క కర్తృత్వమే ఈ సమస్తము.

దృష్టాంతంగా → దీపము / నాటకదీపము
➤ వెలుగు ఉంటేనే వస్తువుల ఆకారము కనిపించటము జరుగుతుంది. చీకటిలో వస్తువుల ఆకారములు చూడనే లేము. కనుక ఆకారముల అనుభవమునకు వెలుగు (light) కర్తయే!
➤ కాని వెలుగుకు ‘ఆకారములు చూపాలి’ అనే ఇచ్ఛ ఏదీ లేదు. వెలుగు యొక్క సాన్నిధ్యం చేతనే వస్తువుల ఆకారాలు కనిపిస్తున్నాయి. అందుచేత వెలుగుకు ఏ కర్తృత్వమూ లేదు.

‘‘అదేవిధంగా ఆత్మయే సమస్తమునకు కర్త। కానీ ఆత్మదేనికీ కర్త కాదు’’ అనునది సమన్వయించుకొని ఉండు. కర్తృతా, అకర్తృతే- మునే! యత్ర ఏవ ఏష ‘‘చమత్కారః’’ - సమాశ్రిత్య స్థిరో భవ।।

నాయనా! నిదాఘా! జలమునకు తరంగములవలె, బంగారమునకు ఆభరణము వలె, వెలుగుకు ఆకారమువలె, రచయితకు కథలోని పాత్రవలె…
→ బ్రహ్మము యొక్క ఈ జగత్తుకు సాన్నిధ్యముచే - ‘బ్రహ్మమే కర్త’।
→ బ్రహ్మము యొక్క ఇచ్ఛా రాహిత్యముచే - ‘‘బ్రహ్మము అకర్త’’।


అను రెండూ ఎరిగియుండి, బ్రహ్మమును ఆశ్రయించి, బ్రహ్మము నందు సంస్థితుడవగుము.

బ్రహ్మమే అయినట్టి నేను సమస్తమునకు నా యొక్క బ్రాహ్మీ సాన్నిధ్యముచే మహాకర్తను. బ్రహ్మముగా సమస్తమునకు అతీతుడనై, కేవలుడనై ఉన్నాను కాబట్టి అకర్తనుకూడా।
- అను ఆశ్రయమును నీగురించి నీవే కలిగియుండును.

సమస్తమునకు అకర్తగా తనను ఎవడు భావన చేస్తూ ఉంటాడో, (‘అకర్తా-హి అహమ్’) భావనను ఎల్లప్పుడు వదలకయే ఉంటాడో. ఇక అట్టివాని పట్ల ‘‘పరమామృతము’’ అనే పేరుతో చెప్పబడే సమత్వమే సర్వత్రా శేషించినదై ఉండగలదు.

ఓ నిదాఘా! ఒక ముఖ్యవిషయం విను. ఎవ్వరైతే సత్తా మాత్ర స్థితి లో ఉంటారో వారే ఈ భూమిపై గల సర్వజీవులలో మహాగుణవంతులు.

(సత్తామాత్ర స్థితి = కేవలసత్తాయే నా స్వరూపము. (I am always what i am, independent of everything else including formation or non-formation of this physical form. I am the form of mere presence)

తే నిత్యం ఏవ అభ్యుదితా ముదితాః ‘ఖ’ ఇవ ఇందవః।। అట్టివారు ఆత్మతత్త్వజ్ఞులలో శ్రేష్ఠులు. - అట్టివారు ఎక్కడున్నా, ఎట్లా ఉన్నా కూడా పౌర్ణమినాడు ఆకాశములో పూర్ణచంద్రునివలె షోడశకళలతో ప్రశాంతముగా ఆత్మప్రకాశమానులై ఉంటారు.

‘‘సర్వదా కేవల సత్ స్వరూపుడను. చిదానంద భరితుడను’’ అను స్వకీయ స్వస్వరూప నిర్వచమును సర్వదా ఆశ్రయించినవారు మాత్రమే ఇక్కడ శాశ్వ సుఖమును పొందగలరు. అట్టి స్వస్వరూపావగాహన సిద్ధించనంతకాలము సంసార దుఃఖము అనివార్యము.

బ్రాహ్మీస్థితి

‘భావన’ అనునది భావించువానికి అభిన్నము కదా! అట్లాగే బ్రహ్మము యొక్క భావనయే ఈ జగద్దృశ్యము. అందుచేత ఈ సమస్తము బ్రహ్మమునకు అభిన్నము. ఇట్టి అవగాహనారూపమగు స్వానుభము సిద్ధించుకొన్నవారు…,
(బ్రాహ్మీస్థితి ప్రాప్య న ముహ్యతి।) - సంసారమోహమును మొదంట్లా జయించివేయగలరు.

బ్రాహ్మీస్థితియందు సంస్థితులైన మహనీయులు :-
✤ సర్వదా ‘సమభావులు’ అయి ఉంటారు.
✤ పద్మము పగలు వికసిస్తుంది. రాత్రిపూట ముకుళించుకుపోయి కృశిస్తుంది. అదే బంగారు పద్మపుష్పమైతే! రాత్రిపూట కూడా కృశించదు కదా! అట్లాగే బ్రాహ్మీ స్థితి సిద్ధించుకున్నవారు ఆపదలందు కృంగరు. సంపదలందు పొంగరు. బ్రాహ్మీ భావనను, బ్రహ్మానందమును వదలరు. సర్వదా బ్రాహ్మీస్థితిని పుణికిపుచ్చుకొని, ఆశ్రయించి ఉంటారు.
- మైత్రి, కరుణ, ప్రేమ ఇత్యాది సద్గుణ (సాధు) వృత్తులతో సర్వదా శోభిల్లుతూ ఉంటారు.

ఓ సౌమ్యా! ఇంకా విను।

బ్రహ్మతత్త్వమును స్వానుభవము చేసుకున్న మహనీయులు ప్రపంచంలో ఉండి ఉంటున్న తీరు :
- సముద్ర జలము తీరము దాటి రాని విధంగా - వారు శాస్త్రమును, సాంఘిక మర్యాదను (The way positive to the world) విడువనివారై ఉంటారు.
- సూర్యునివలె నియతిని (నియమమును) అతిక్రమించనివారై ఉంటారు. దృశ్యము యొక్క బంధనములు కించిత్ కూడా హృదయమున లేనివారై, దృశ్యములో ఆనందంగా విహరిస్తూ అందరినీ ఆహ్లాదపరుస్తూ ఉంటారు.

ఓ నిదాఘా! నీవు ఎల్లప్పుడు - ‘‘నేను ఎవరు? కోఽహమ్? ఈ సంసారమలమంతా ఎందుచే నా పట్ల వ్యాపించినదై ఉన్నది? ‘‘కథమ్ ఇదం చేతి సంసార మలమ్ ఆతతమ్?’’ అనే విషయమును ప్రాజ్ఞులగు మహనీయులతోను స్వకీయముగాను కూడా విచారణ చేస్తూ ఉండాలి.

🌺 కర్మలయందు తన్మయమగుచు జీవితమును వృధా చేసుకోరాదు. అట్లా అని, కర్మలు మానరాదు. న అకర్మసు నియోక్తవ్యం।
🌺 న అనార్యేణ సహా వసేత్। ఆత్మ విచారణను సంసిద్ధులే కానివారితో వ్యావహారికంగా కాలమును వృధా చేసుకోకూడదు. లోకరీతిగా మర్యాద కొరకై లోకభావాలు దట్టముగా కలిగియున్న వారితో ప్రక్కప్రక్కనే కలిసి ఉన్నప్పుడు కూడా, నీవు అలౌకికము- లోకాతీతముగా ఆత్మయొక్క ప్రియత్వము, సమగ్రత్వము విడవనే వద్దు. జాగరూకుడవై పరిరక్షించుకో।
🌺 వర్తమానములో ‘‘ముఖ్యము కదా’’ అను రూపంగా కనిపించే భౌతిక రూప భేద సంబంధములన్నీ మృత్యువుతో (మార్పుచే) ‘‘ముగుస్తాయి కదా!’’.. అనే విషయం ఏమరువరాదు. మృత్యువు యొక్క (మార్పుయొక్క) అనివార్యత, సర్వభౌతిక భేద సంబంధముల మటుమాయము గురించి గ్రహించియే ఉండాలి. అయినా కూడా, వేటినీ అవహేళన చేయరాదు.
🌺 ఇక్కడి రక్త-మాంసమయ దేహముల పట్ల ‘‘నావి-నావారు-నాకు చెందినవారు - నేననుకున్నట్లు లేరేమీ?’’.. ఇటువంటి మనో-అంతర్గత మమకారములను విడచిపెట్టి ఉండాలి.
🌺 విద్యుక్త ధర్మములను సమర్పణ భావంతో నిర్వర్తించు ‘కర్మయోగము’ ఆశ్రయించి ఉండాలి.

ముత్యాల గొలుసుతో ముత్యములను చూచువిధంగా సర్వత్రా సర్వదా ‘‘కేవలచిన్మాత్రము’’-ను దర్శించు నిత్యాభ్యాసమును విడువకుండా ఆశ్రయిస్తూ ఉండాలి.

మనస్సు యొక్క వాస్తవ రూపము

నిదాఘుడు : గురుదేవా! ఈ మనస్సు యొక్క వాస్తవ రూపము ఏమిటని మహనీయులగు మీరు గమనిస్తూ ఉన్నారు?

శ్రీ ఋభు మహర్షి :
- ‘‘ఇది నాకు కావాలి’’ - అని కొన్ని విషయములవైపుగా ఇష్టముగా వెంటబడటము - ఉపాదేయాను పతనమ్।

- ‘‘ఇది వద్దు. తొలగాలి’’ - అని అంతరముగా అయిష్టము, ద్వేషించటము - హేయ ఏకాంత విసర్జనమ్।

యత్ ఏతస్మిన్ మనసో రూపమ్। మనస్సు యొక్క ముఖ్యరూపము ఇదేనయ్యా! అట్టి మనస్సును ఒక బాహ్య వస్తువును చూచినట్లు మేము చూస్తున్నాము. అంతేగా అద్దానిని ఆత్మ యొక్క స్వభావముగా మేము ఏ మాత్రము అనుకోవటము లేదు.

ఓ మునీ।
(1) సద్గురువుయొక్క బోధ నుండి తెలియవస్తున్నది
(2) ఆత్మశాస్త్రములు చెప్పుచూ ఉంటున్నది
(3) యుక్తి (స్వకీయ విశ్లేషణ- విచారణలు)
- ఈ మూడింటి సహాయముతో ఘనీభూతమైయున్న కేవలచిత్ (ఎరుగుచున్నవానిని ఎరుగుచున్న) స్వరూపమును స్వానుభూతిగా చేసుకొని ‘‘బ్రహ్మైవాహమ్’’ అని తెలుసుకొనుచున్నవాడవగుము.

‘‘అహమ్ బ్రహ్మమేవ’’ అను విషయములో సర్వ సందేహములు తొలగగా, సర్వవేదనలు సమసినవాడివి అగుము. సర్వమునకు అతీతుడవై జీవన్ముక్తుడవు అగుము.

జీవన్ముక్త భావనాస్థితి

నిదాఘుడు : జీవన్ముక్తుని ప్రాపంచక స్థితి ఎట్లా ఉంటుంది?

శ్రీ ఋభు మహర్షి : జీవన్ముక్తుని సమస్త ప్రపంచాతీత స్థితి అద్భుతమైనదిగా చెప్పబడుచూ ఉంటుంది.

ఓ నిదాఘా! అటువంటి జీవన్ముక్త స్థితి ‘‘దృఢమైన వైరాగ్యము’’ వలననే లభించగలదు. అంతేగాని అప్రయత్నశీలునకు లభించేది కాదు. ప్రయత్నశీలునికో? లభించకపోయే ప్రసక్తియే లేదు. ఎవ్వరికైనా సుసాధ్యమే కూడా।

శ్లో।। గురువాక్య సముద్భూత స్వానుభూత్య అతి శుద్ధయా
యస్య అభ్యాసేన, తేన ఆత్మా సతతం చ అవలోక్యతే।।

‘తత్-త్వమ్’ అని ప్రవచించి చెప్పుచున్న గురువాక్యములు శ్రవణ - మననములు చేస్తూ అభ్యాసపూర్వకంగా పరమార్థమును ఉపాసిస్తూ ఉండగా, అట్టివారు అతిత్వరగా ‘‘స్వస్వరూపాత్మ యొక్క లీలాప్రదర్శనమే ఈ సమస్తము కూడా’’ - అను అవలోకనమును తప్పకుండా సిద్ధించుకోగలరు. ఎవ్వరైనా సరే, అందుకు అర్హులే।

ఒకానొకడు తనచుట్టూ తాను తిరుగుచూ ఉంటే అప్పుడు పరిసరములన్నీ పరుగులు తీస్తూ ఉన్నట్లుగా దిగ్భ్రమ చెందుతాడు. తిరగటము ఆపివేసి, కాసేపు కళ్ళుమూసుకొని, ఆ తరువాత కళ్ళు తెరిస్తేనో? తిరిగి ‘8’ దిక్కులు అంతకుముందువలె యథాతథంగా కనిపిస్తాయి కదా! అట్లాగే, మనోచాంచల్యత్వముచే రూపము పొందిన జగత్ బంధములన్నీకూడా మనో నిశ్చలతచే ‘విజ్ఞానము’ నందు లయమై ఆత్మభావన సిద్ధించగలదు.

అందుచేత, చిత్తచాంచల్యము తొలగటానికై ‘‘జగత్తు స్వతఃగా లేదు. నిశ్చలము - అఖండము అగు ఆత్మయే సర్వత్రా వెలయుచున్నది’’ అను భావనను సర్వదా ఆశ్రయించి ఉండు. ‘‘మనో చాంచల్యమును జయించటము’’ అనే ప్రయోజనమును ధనము, సంపద, మిత్రులు, బంధువుల, (ఉపవాసముల వంటి) శారీరకశ్రమలు, తీర్థ స్థలములలో సుదీర్ఘ నివాసము - ఇవేమీ సిద్ధింపజేయలేవు. మరి? మనస్సుతోనే మనస్సును జయించాలి. మనోనిశ్చలతతో మనోచాంచల్యమును మ్రింగివేయాలి. వేరే ఉపాయం లేదు.

శమము

మనస్సుతో మనస్సును జయించే సాధనయే శమము.

మనస్సును అభ్యాసవశంగా విషయముల నుండి వెనుకకు మరల్చి ‘‘ప్రశాంతత’’ అను స్థానమునకు అభ్యాసవశంగా చేర్చాలి.

ఎవ్వరైతే ఇంద్రియ చాంచల్యమును ప్రశాంత మనస్సుతో ఉపశమింపజేస్తారో, వారు మహత్తరమగు ప్రభావము కలిగి ఉంటారు. సూర్యుడు ఉదయించగానే చీకటి తనకు తానే మటుమాయమగుచున్న తీరుగా.

ఇంద్రియ నిగ్రహ-ఉపశమన రూపమగు ‘శమము’ను అభ్యసించువాని పట్ల దుఃఖములు (Lamentations), తృష్ణ (Urge for some thing), సహింపరాని చింతలు (Irresistable worries), ఇవన్నీ కూడా ‘‘శాంత స్వభావము’’ సంతరించుకోగలవు.

ప్రశాంతతను అభ్యాసము చేస్తున్న మనో అభ్యాసి సమక్షంలో సర్వ మనోవేదనలు తమకు తామే తోకముడుస్తాయి.

క్రూరజంతువులు, సాధుజంతువులు కూడా శమమును అభ్యాసించు యోగి సమక్షంలో తమ తమ చాంచల్యమును విడచిపెట్టి - ప్రశాంతతను అనుభవించగలవు. విషజంతువులు కూడా క్రూరత్వమును విడచిపెట్టి శమమును సిద్ధించుకొన్న శాంతుని పట్ల విశ్వాసము కలిగియుండి, క్రూరత్వమును త్యజించుతాయి. తమ యందు ప్రేమరసమును ప్రేరేపించుకొను సమర్థత పొందగలవు.

ఈ జీవుడు శమము (లేక) శాంతమును ఆశ్రయించుటచేతనే ‘పరమసుఖము’ యొక్క రుచిని ఆస్వాదింగలడు. మనస్సును శాంతింపజేస్తూ ఉండగా లభించు సుఖము - అమృతపానము చేతగాని, సంపదల ఆలింగనము చేత గాని లభించేది కాదు.

శమము (లేక) శాంతము అనగా ఏమి?

శ్లో।। శ్రుత్వా, స్పృష్ట్వా చ, భుక్త్వా చ, దృష్ట్వా, జ్ఞాత్వా - ‘‘శుభ-అశుభమ్’’ :-
న హృష్యతి, గ్లాయతి యః, స ‘శాంత’ ఇతి కథ్యతే।।

శుభ-అశుభ విషయములను చూస్తున్నప్పుడు, పొందుచున్నప్పుడు, వింటున్నప్పుడు, వస్తుజాలమును-వస్తువులను స్పృశించుచున్నప్పుడు, అనుభవించవలసి వచ్చుచునప్పుడు, చూస్తున్నప్పుడు, తెలియబడుచూ ఉన్నప్పుడు కూడా - ఎవ్వడైతే సంతోషముగాని, దుఃఖముగాని పొందక ఆ ఉభయములకు అతీతుడై ఉంటాడో - ఆతడే శాంతుడు (లేక) ‘శమము’ అను రాజద్వారమును ప్రవేశించినవాడు.

ఎవ్వని మనస్సైతే మరణ సమయములోను, ఉత్సవ సమయములోను, యుద్ధము సందర్భములోను, నిర్మలాకాశములో ప్రకాశిస్తున్న చంద్రబింబమువలె ఏ మాత్రము ‘వ్యాకులత’ చెందదో, అట్టివాడే శాంతుడు.

ఓ నిదాఘా! ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే,
- తాపసులై గొప్ప తపస్సు చేస్తూ ఉన్నవారిలోను, పండితులై అనేక విషయములు తెలుసుకుంటూ ఉన్నవారిలోను, యజ్ఞకోవిదులై బహుయజ్ఞములు చేస్తూ ఉన్న వారిలోను, భౌతికంగా బలవంతులలోను, అనేక సద్గుణములు కలవారిలోను కూడా - ఎవ్వడైతే ‘శాంతము’ అనే మహత్తర గుణమును పుణికిపుచ్చుకుంటాడో, - ఆతడే అందరిలో శ్రేష్ఠుడై విరాజిల్లుచున్నాడయ్యా!

సంతోషము (తృప్తి)

మనస్సు సంతోష - సంతృప్తులను సర్వదా వీడకయే ఉండటము సాధన చతుష్టయములో రెండవది.

‘‘సంతోషము’’ అనబడు అమృతమును పానము చేసి, శాంతి, తృప్తి కలిగినట్టి మహాత్ముడు ‘ఆత్మారామ’ మహాపదము సిద్ధించుకున్నట్లే. ‘‘సంతోషముగా ఉండకపోవటము’’ - అనునది ఒక మానసిక దురభ్యాసముగా, దుర్వ్యసనముగా మహనీయులు గమనిస్తూ ఉన్నారు. మనకు గుర్తు చేస్తున్నారు. అట్లాగే సంతోషముగా ఉండటము ఒక సదభ్యాసము కూడా.

‘‘సంతోషము’’ - అనగా.., అప్రాప్తమైనది మనసః పరిత్యజించినవాడై, సంప్రాప్తించినది సమబుద్ధితో స్వీకరిస్తూ భేద - అభేదములను వేరువేరుగా చూడని వాడే ‘సంతుష్టుడు’

శ్లో।। న-అభినందతి అసంప్రాప్తం, ప్రాప్తం భుంక్తే యథా ఈప్సితమ్,
యః స సౌమ్య సమాచారః ‘‘సంతుష్ట’’ - ఇతి కథ్యతే।।

ప్రాప్తము కానిదాని గురించి ‘‘లభించలేదే?’’ - అను కష్టమును భావించకుండా, లభించినదానితో సంతోషము పొందుచూ, ఎవ్వరైతే సౌమ్యమైన ‘స్వభావము, ప్రవర్తన’ కలిగి ఉంటారో,.. అట్టివారే సంతుష్టులు.

అంతఃపురములో ఉండే సాధ్వీమణి భర్త చేతులు మీదుగా పుష్పము మాత్రమే లభించినా కూడా సంతోషముగా జడలో ధరించు విధంగా, ఎవ్వడైతే ఏది ప్రాప్తిస్తే అంతమాత్రమునకే సంతోషించినవాడై ఉంటాడో, అట్టి అభ్యాసము ‘స్వరూపానందము’నకు దారితీయుచూ జీవన్ముక్తత్వమును ప్రసాదించగలదు.

అందుచేత లభించిన దానితో సంతృప్తిరూపమగు సంతోషము, లభించని దాని గురించి, ‘‘ఇది కూడా శుభము కొరకే’’ - అనే అవగాహన ఎంతగా ప్రయత్నించి అయినాసరే,.. అలవాటుగా చేసుకోవలసిందే.

లభించిన దానిని గుర్తు పెట్టుకొని కృతజ్ఞత - సంతృప్తులను ప్రదర్శించువానికి ‘సంతోషము’ - సులభముగా అభ్యాసం (Ease habit) అవుతోంది.

విచారణ (Analysing the athma concept)

ప్రాజ్ఞుడైనవాడు (One who is wise) ఆత్మయందు మనస్సు శాంతించేవరకు - ఎంతగా వీలుంటే అంతగా, ఎంతవరకు శాస్త్రములు లభ్యపడితే అంతవరకు, ఎంతవరకు సదవకాశమో అంతవరకు, ఎంతగా సాధ్యపడితే అంతవరకు - ఆత్మగురించిన విచారణ యందు నిమగ్నమయ్యే ఉంటాడు. ‘విచారణ’ను విడువనే విడువడు.

నిదాఘుడు : విచారణచే ఎట్టివారికి సులభముగా ఆత్మయందు విశ్రాంతి లభిస్తుంది? (బ్రహ్మచారి-గృహస్థ - వాన ప్రస్త-సన్న్యాస) - చతుర్విధ ఆశ్రమములలో ఎవరు కృతకృత్యులు?

ఋభుమహర్షి: ఓ నిదాఘా! ఎవ్వరికీ కూడా వాస్తవమైన విశ్రాంతి జాగ్రత్ - స్వప్న-సుషుప్తులలో లభించదు. మరి? ‘‘ఆ మూడు నావి కదా’’ అని ఎరిగి, (నాలుగవదగు) తురీయయములో మనస్సును విశ్రాంతింపజేసి, ‘‘జాగ్రత్-స్వప్న-సుషుప్త సాక్షిత్వము’’ అభ్యాసపూర్వకంగా సిద్ధించుకొంటాడో,.. అట్టివాడే ఆత్మయందు విశ్రాంతిని సిద్ధించుకోగలడు. ఎవ్వడైతే తురీయ స్థితిలో సంస్థితిని వివేకముచే సిద్ధించుకొంటాడో - అట్టివాడు గృహస్థుడైనా (లేక) సన్న్యాసి అయినా (లేక) వాన ప్రస్థుడైనా (లేక) బ్రహ్మచారి అయినా, జీవిస్తూ ఉన్నా (లేక) మరణించినా - కృతకృత్యుడే.

నిదాఘుడు : ఒకానొకడు తురీయ స్థితిలో విశ్రాంతిని సిద్ధించుకొని ఉంటే, అట్టివాడు ఏఏ కర్మల యందు ప్రవృత్తుడౌతాడు?

ఋభు మహర్షి : తురీయయము నందు విశ్రాంతిని సిద్ధించుకొన్నవానికి కర్మలు చేయుటము వలన గాని (లేక), చేయకపోవటము వలన గాని వచ్చేది ఉండదు. పోయేది ఉండదు. ఆతనికి ఇక క్రొత్తగా శ్రుతుల, స్మృతుల సేవనయొక్క ఆవశ్యకత ఉండదు. చంచలము ఏమాత్రము లేనప్పటి పాలసముద్రము వలె ఆతడు అంతరమున ఈ ప్రాపంచక కల్లోలములను కించిత్ కూడా లేనివాడై, పరమ ప్రశాంతుడై ఉంటాడు. ఏది సర్వజీవుల అంతరముననే ఉదయించుచూ, సర్వజీవుల బాహ్యానుభవమంతా తానే అయి ఉన్నదో - అట్టి ఆత్మను సర్వత్రా దర్శించుచూ ఉంటాడు. ఎప్పుడైతే అట్టి ఆత్మజ్ఞానానుభవము అనుక్షణికము అవుతుందో, - అట్టి యోగి తద్రూపమే తానై, సర్వత్రా నిత్యోదితమైన (Dawning every minutes) అఖండాత్మగా విరాజిల్లుచున్నాడు.

అనగా బ్రహ్మజ్ఞానము పొంది, ఈ సమస్తమును బ్రహ్మముగా దర్శించుచూ ఉండగా,.. అట్టి అభ్యాసము చేస్తున్న జీవుడు అతిత్వరగా బ్రహ్మమే తానై ప్రకాశించుచున్నాడు. (బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి।)

అందుచే బ్రహ్మతత్త్వాభ్యాసివగుము. ‘‘దేశ - కాల-వస్తు పరిచ్ఛేదము ఏ మాత్రము కించిత్ కూడా లేనట్టి బ్రహ్మమే నేను’’ - అను భావనను ఆశ్రయించి, అద్దానికి అద్వితీయుడవగుము. (లేక) అది నీకు అద్వితీయమగు గాక! ‘‘సమస్తము అయి ఉన్న బ్రహ్మమే నేను’’ - అను అభ్యాసము సులభమే గాని దుర్లభమేమీ కాదు. ‘‘కష్టము కదా’’ - అనే బలహీనతను నీవు దగ్గిరకు రానీయవద్దు.

బ్రహ్మమే తానైనవాని పట్ల ఈ దృశ్యము ఏమౌతోంది?
- మెలకువ వచ్చిన తరువాత స్వప్నములో కనిపించిన స్వప్నదృశ్యము ఏమౌతోంది? స్వప్న ద్రష్ట యొక్క కల్పనయే కాబట్టి, ఆ స్వప్నద్రష్టయందు ‘లయము’ పొందుతోంది.
- నిదురించి కలకంటున్నవాని పట్ల ఈ జాగ్రత్ ఏమౌతోంది? జాగ్రత్‌యొక్క ‘స్వానుభవి’ యందే లయము పొందుతోంది.
- గాఢనిద్రలో ఉన్నవానిపట్ల జాగ్రత్ స్వప్న దృశ్యములు ఏమౌతున్నాయి? ఆ నిద్రించువానియందే లయము అగుచున్నాయి.

‘స్వతఃగా లేనివే’ - అని తెలియవస్తున్నాయి. అట్లాగే బ్రహ్మానుభవి పట్ల ఇక్కడి జాగ్రత్ జగత్తు మొదలైనవి ఉండి కూడా, ‘లయము’ అగుచున్నాయి. ‘జగత్తులు’గా కాకుండా ఆత్మగానే స్వానుభవమై ఉంటున్నాయి. జాగ్రత్ స్వప్న సుషుప్తులు, జన్మ-జన్మాంతరములు స్వతఃగా ఏమాత్రము ‘లేనివే’ - అగుచున్నాయి. ఆత్మప్రకాశము యొక్క ప్రకాశరూపాలు అగుచున్నాయి.

జగత్తుగా ‘‘మొదలే లేనివి’’, ఆత్మగా ‘‘ఎప్పటికీ ఉన్నవి’’ - అగుచున్నాయి. కల్పనగా కనిపించేదంతా ఆత్మగా అనుభవమవటమే కల్పాంతము.

జలము నందు బయల్వెడలిన తరంగముల యొక్క నామరూపములు తిరిగి జలముతో ఏకమైనప్పుడు - ‘‘తరంగమునకు చెందిన జలము (జలవిభాగము) నశిస్తోంది’’ - అనము కదా! ఎందుకంటే జలము పట్ల తరంగము యొక్క నామరూపములు ఆపాదితము (Altributed) మాత్రమే. అట్లాగే ‘‘జీవాత్మ-జగత్తులు ఆత్మకు భిన్నముగా కనిపించటము’’ అనే కల్పన ‘‘ఆత్మగా అనిపించటము’’ అనునదే మనోలయరూప-‘కల్పాంతము’. అట్టి ‘‘బ్రహ్మముగా సమస్తము అనిపించటము’’ - అనే ‘‘కల్పాంతస్థితి’’ -లో అప్పటికీ శేషించే ‘తత్బ్రహ్మానుభవము’ - ‘ఇట్టిది’ అని నిర్వచించలేము. వర్ణించలేము. అయితే అట్టి స్వానుభవమాత్రము (Merely one’s own experience while every thing is being enjoyed as unity, with not even a bit of Diversity still remaining) మాటగా చెప్పలేకపోయినప్పటికీ, బుద్ధికి ‘సత్యము’గా అనుభవ మాత్రము - తత్ సత్ బుద్ధ్యనుభవమాత్రమ్।

‘‘ఋతమ్। ఆత్మా। పరంబ్రహ్మ। సత్యమ్।’’ మొదలైన శబ్దములను ఆత్మానుభవులగు మహనీయులు (అట్టి అనుభవము ఏమరచిన ముముక్షువులమగు) మనకు బోధించటానికై (లేక) సూచించటానికై సశాస్త్రీయయుక్తంగా ‘‘కల్పిస్తున్నారు’’. కనుక, ఆ శబ్దములు ‘‘విజ్ఞులచేత బోధ కొరకై కల్పించబడిన వ్యావహారిక శబ్దములు’’.. అని తెలిసియే, .. ఆత్మశాస్త్రమును శ్రవణ - మననములు చేయి. స్వయమాత్మానుభవమునందు ‘అనుభవము’ యొక్క సమక్షములో వాటికవియే లయించగలవు.

సంజ్ఞార్థమ్ తాన్ బ్రవీమితే

నిదాఘుడు : తండ్రీ! ఋభుమహర్షీ! మీరు చెప్పేది ఆశ్చర్యం గొలుపుతోంది. అయితే - ‘‘ఆత్మ, బ్రహ్మము, పరబ్రహ్మము, ఋతము, సత్యము’’ మొదలైనవన్నీ బోధించటానికై కల్పించబడిన సంజ్ఞలు (Indicative terms / Terminology) మాత్రమేనని మీరు సిద్ధాంతీకరిస్తున్నారా! అది ఎట్లా? మరికొంత వివరించండి.

ఋభు మహర్షి : అవును. ‘‘ఋతమ్, ఆత్మా, పరంబ్రహ్మ, సత్యమ్’’, ఇత్యాదికా బుధైః కల్పితా వ్యవహారార్థం, యస్య సంజ్ఞా మహాత్మనః।। లౌకికంగా కూడా మనము ఉపయోగిస్తున్న శబ్దజాలమంతా సంజ్ఞార్థము కల్పించబడినదేకదా! బ్రహ్మతత్త్వజ్ఞుల అధ్యాత్మ శాస్త్ర ప్రవచ (బోధ) వాఙ్మయము కూడా సంజ్ఞార్థముగా కల్పించబడి చెప్పబడినవే. ఇందులో సందేహము దేనికి? ఈ విషయము గురించి కొంత దృష్టాంత పూర్వకంగా చెప్పుచున్నాను. విను.

‘‘బంగారపు కడియము (కటకము)’’ అనే శబ్దములో బంగారము వేరు - కడియము(గాజు) వేరా? బంగారమునకు వేరుగా ‘కడియము’ అనేది ఎక్కడ ఉన్నది? బంగారము ఒక ఆకారముగా ఉన్నప్పుడు ‘కడియము’ అని, మరివేరైన ఆకారములచే ‘గొలుసు, ఉంగరము, గాజులు, ముక్కుపుడక’’.. మొదలైనవిగా చెప్పుకోబడుతోంది. అవన్నీ బంగారము కాని క్షణమేది? ‘‘బంగారములో ఉంగరము ఉన్నది’’ - అనునది పరమ సత్యము కాదు. ‘‘బంగారమే ఉంగరముగా ఉన్నది. అప్పుడు ‘బంగారపు ఉంగరము’ అని సంజ్ఞగా చెప్పుకుంటున్నాము’’ - అనునది పరమ సత్యము. అట్లాగే, బ్రహ్మమును (బ్రాహ్మీభావనచే) సిద్ధించుకొన్నప్పుడు మనకు ఇక ‘జగత్తు’ అనునది బ్రహ్మముగా వేరై కనిపించదు, అనిపించదు. ఉంగరము, గొలుసు వంటి ఆపాదిత శబ్దజాలమే - ‘‘జగత్తు, అందలి నేను-నీవు- పంచభూతములు - వస్తువులు’’- మొదలైనవి కూడా.

‘‘జగత్తే బ్రహ్మము। బ్రహ్మమే జగత్తు।’’ అను భావనయే ‘జగత్ ప్రళయము’.

చిత్‌బ్రహ్మము యొక్క ‘‘ఎరుగుచుండటము’’ అనే విన్యాసమే (బ్రహ్మము యొక్క ఎరుక విన్యాసమే) జగత్ రూపముగా ‘ఇంద్రజాలములో’ వలె భాసిస్తోంది. ‘ఎరుక’లోంచే ఎరుగబడేదంతా - బయల్వెడలి, తిరిగి ‘ఎరుక’లోనే - లయము పొందుతోంది. (The ‘knowing’ itself is extending as what ever being known)

బంధము - విముక్తి

ఓ నిదాఘా! ఈ సందర్భములో కొన్ని విశేషాలు గమనించమని గుర్తుచేస్తూ ఉన్నాను. విను.

✤ అఖండమగు ‘ఆత్మ’ లేక ‘‘పరబ్రహ్మము’’ కేవలమై ఉంటూనే, లీలగా, క్రీడగా, వినోదముగా (అనిర్వచనీయ కారణంగా) - ‘‘నేను ద్రష్టనౌతాను. అందుకుగాను దృశ్యమును కల్పించుకుంటాను’’.. అను ‘కల్పన’ను స్వయముగా స్వీకరిస్తోంది.
✤ ఆ విధంగా కేవలమగు ఆత్మ నుండి (బ్రాహ్మీ స్వస్వరూపము నుండి) కల్పనా మాత్రముగా - బ్రహ్మము యొక్క (లేక) ఆత్మ యొక్క ‘అంశ’ అనతగిన ‘ద్రష్ట’ (Perceiver/sensory self) బయల్వెడలుచున్నాడు.
✤ అట్టి ‘ద్రష్ట’ అనే అంశ స్వరూపుడు ఆత్మకు అనన్యుడే అయి ఉండి కూడా ఆత్మ కల్పితమగు (లేక స్వయం కల్పితమగు) దృశ్యము యొక్క భావనచే ‘‘బద్ధుడు’’ అగుచున్నాడు.
ద్రష్టా దృశ్యవత్ బద్ధో। ‘‘ద్రష్ట పట్ల దృశ్యము ఉన్నది’’ - అను దృష్టియే బంధము’’ అని చెప్పబడుతోంది. ద్రష్టృః దృశ్యస్య సత్తా ‘బంధ’ - ఇత్యభిధీయతే।। ద్రష్టకు-దృశ్యమును (ద్రష్ట దృశ్యములకు) గల పరస్పరత్వమే ‘బంధము’ అని చెప్పబడుతోంది.
ద్రష్టా దృశ్య - అభావే ముచ్యతే। దృశ్యము ఎప్పుడైతే అభావించబడదో, అప్పుడు ద్రష్టకు దృశ్యము లేకపోవటం చేత- ‘విముక్తుడు’ (Relieved) అనుబడుచున్నాడు. దృశ్యము అభావించబడుటచే ద్రష్టకూడా అభావించబడినట్లే. అప్పటికీ శేషించియుండే ‘దృక్’ యే ‘ఆత్మ’ యొక్క శబ్దార్థము.
✤ దృశ్యము అనగా? ‘‘జగత్తు - నేను - నీవు’’ మొదలైన వాటిలో సర్గము (Avocative relationship) - అనునదే ‘దృశ్యము’ - అని చెప్పబడుతోంది.
✤ జగద్దృశ్యము ఎట్లా ఏర్పడుతోంది? మనసైన ఇంద్రజాల శ్రీఃజగత్ ప్రవితన్యతే।। ‘‘ఆత్మ యొక్క మనన రూప విశేషము’’ అయి ఉన్న మనస్సే - ఈ ‘జగత్తు’ అనే ఇంద్రజాలమును విస్తరింపజేస్తోంది.
✤ మనస్సు జగత్ రూపముగా విస్తరిస్తూ, తనకు ఇదంతా ‘అన్యము’ అయినట్లుగా - జగత్ భావనను కొనసాగిస్తూ ఉన్నంత వరకు - ‘మోక్షము’ అను బంధ రహిత స్థితి అనుభవమవదు.

ఇదంతా మనస్సే

(తన ఉనికికి తానే కారణము) - ‘‘స్వయంభువు’’ - అయినట్టి బ్రహ్మదేవుని మానసిక సృష్టియే - ఈ దృశ్యమానమగుచూ ఉన్నట్టి -విశ్వము (లేక) జగత్తు. మనోమయం అతో విశ్వం యన్నామ పరిదృశ్యతే। ‘విశ్వము’ అను రూపముగా ఏది ఏవిధంగా చూడబడుతోందో.. అదంతా కూడా మనస్సే. మనోమయమే ఇదంతా. మనస్సే లేనప్పుడు - జగత్తు కూడా లేనిదే అగుచున్నది. మనస్సు ఉంటేనో,.. జగత్తు ఉండియే తీరుతుంది.

మనస్సు ఉన్నట్టి స్థానము ఏది?

నిదాఘుడు : స్వామీ! జగత్తే మనస్సు యొక్క రూపమని చెప్పుచున్నారు కదా! మనస్సు అసలు ఉన్నదెక్కడ? బాహ్య ప్రపంచములోనా? హృదయములోనా? మరింకెక్కడన్నానా?

ఋభు మహర్షి : న బాహ్యే, నాపి హృదయే, సద్రూపం విద్యతే మనః। ‘మనస్సు’ అని పిలువబడే వస్తువు బాహ్యమున లేదు. అంతరమున లేదు. హృదయంలోనూ లేదు. అసలు ‘మనస్సు’ అనబడేదానికి వస్తుతః స్వయమైన ఉనికియే లేదు. ఉనికియే లేనిదానికి ‘‘ఇదిగో ఇక్కడ ఉన్నది’’ - అని ఎట్లా అంటావు? మరి ‘మనస్సు’ - అని మనము అంటున్నది దేనిని? విను.

యత్ అర్థప్రతిభానం తత్ ‘మన’ - ఇత్యభిధీయతే। మనము ఒక వస్తువును, రూపమును, సందర్భమును ఏ అర్థమును ప్రతిపాదన (Attribute) చేసి చూస్తామో, (లేక) స్ఫురింపజేసుకుంటామో - అట్టి స్ఫురణయే (The way a meaning is being given to what-ever).. ‘మనస్సు’ - అనే శబ్దములో చెప్పుకుంటున్నాము. {మనస్సు - PERCEPTION}. సంకల్పమే మనోరూపము. సంకల్పించటమే మనస్సు. అంతకుమించి మనస్సుకు వేరైన రూపముగాని, అర్థముగాని లేదు. (1) సంకల్పించటము (2) మనస్సు - ఈ రెండు వేరువేరు కావు. వేరుచోటులలో ఉండవు.

యత్ర సంకల్పనం, తత్ర మనో -అస్తి - ఇతి అవగమ్యతామ్। ‘‘ఎక్కడ సంకల్పము ఉంటుందో - అక్కడ మనస్సు ఉన్నట్లే సుమా! ఇది గమనించెదవుగాక. ‘సంకల్పము, మనస్సు’ - ఈ రెండూ ఎప్పుడూ భిన్నము కావు. భిన్నముగా ఉండవు కూడా. ఈ జీవుని పట్ల ‘సంకల్పములు’ నశించినప్పుడు ఇక పరమాత్మ స్వరూపమే శేషించినదై ఉంటుంది. అనగా, అట్టివాడు మనస్సుకు కూడా సాక్షిగా అయి, స్వస్వరూప సందర్శనం చేస్తూ ఉంటాడు.

కేవలము (లేక) కైవల్యము : ఎప్పుడైతే ‘‘నేను - నీవు-జగద్దృశ్యము’’ మొదలైన వాటితో కూడిన దృశ్య సంభ్రమము శాంతించినదో, అప్పుడు దృశ్యము ఆత్మకు వేరైన ‘సత్తా’ కోల్పోగలదు. అనగా స్వస్వరూపాత్మకు దృశ్యం జగత్తు అనన్యముగా అనుభూతమౌతోంది. అట్టి దృశ్య రహిత సత్తా అనుభవమే ‘కేవలము’ అని, ‘కైవల్యానుభవము’ అని అంటారు.

మహా ప్రళయము : ‘దృశ్యము ఆత్మకు అన్యము కాదు. ఆత్మకు అన్యముగా దృశ్యము లేదు’’ అను ఘనీభూత దృష్టియే, (లేక) ‘‘ జగత్తు నాకు అన్యముగా లేదు’’ అను స్వానుభవ స్థితియే (The Self encompossing all else) ‘‘మహా ప్రళయము’’. దృష్టియే సృష్టి. దృష్టి శమిస్తే సృష్టి శమించినట్లే అవుతుంది. అపుడు ‘దృష్టి-సృష్టి’ అను సంబంధములకు మునుముందే నిశ్చలము - ప్రశాంతముగా ఏ పరమాత్మ సర్వదా శేషించినదై ఉన్నదో,.. అదియే ‘‘నీ యొక్క నాయొక్క ప్రతి జీవుని యొక్క’’ సర్వదా శేషించియున్న. వాస్తవము, కేవలము అగు పరబ్రహ్మ స్వరూపము. జగత్తు (దృష్టి-ద్రష్ట) బయల్వెడలేది పరబ్రహ్మము నుండే! మహాప్రళయము పొందుచున్నది కూడా పరబ్రహ్మము నందే। సర్వదా ఉన్నది పరబ్రహ్మమే! అద్దములో దృశ్య వస్తువులు లేనట్లే (స్వస్వరూపమే అయి ఉన్న) ‘‘పరబ్రహ్మము’’ నందు జగత్తులు మొదలైనవి మొదలే లేవు.

💐 సృష్టికి పూర్వము ఏది ఉన్నదో - ప్రళయము తరువాత అదే శేషించి ఉంటోంది.
💐 సర్వదా స్వయంప్రకాశ స్వరూపునైయున్న సూర్యునికి ఉదయ-అస్తమయములు ఉంటాయా? ఎక్కడుంటాయి? అట్లాగే సృష్టి-ప్రళయములకు ఈవల ఆవల శేషించియున్న ఈ జీవుని యొక్క పరమాత్మ స్వరూపము సృష్టి సమయంలో అస్తమించేది కాదు. ప్రళయానంతరము ఉదయించేది కాదు. అది నిత్యోదితము।

పరమాత్మ యొక్క విలక్షణ - లక్షణములు

పరమాత్మను నిర్వచించలేము. లక్షణములు వర్ణించి చెప్పుకొనూలేము. అయినప్పటికీ శ్రోత యొక్క ఆత్మౌన్నత్యమును గుర్తు చేయటానికి స్వానుభవమును రంగరించి ఆత్మసాక్షాత్కారమును ఆస్వాదిస్తున్న మహనీయులు - పరమాత్మ గురించిన విశేషములను శాస్త్రరూపంగా (మనపై అవ్యాజమైన ప్రేమచే) అభివర్ణిస్తూ మనకు చెప్పుచున్నారు.

ఆత్మ స్వయం ప్రకాశమై ఉండియే ద్రష్ట - దృశ్యములను ‘దృష్టి’ అనే స్వకల్పిత - స్వల్పాంశచే ప్రకాశింపజేస్తోంది.

అస్తి యత్ న అస్తమితో। ఆత్మ దృశ్యము దృష్ట్యా గాని, ద్రష్ట దృష్ట్యా గాని, మరింకే దృష్టి చేతగాని - ఆత్మ ఉదయించటము లేదు. అస్తమించటమూ లేదు. ‘అస్తి’ (ఉనికి - ‘నేను ఉన్నాను’ అను దానికి) - అస్తమయమనునదే లేదు.

భాస్వాన్ - ఈ జీవుని యొక్క కేవల స్వరూపమగు కేవల పరమాత్మ నిత్య ప్రకాశస్వరూపులు.

అజో - దృశ్యము యొక్క ఉదయాస్తమయములచే జనించువాడు కాదు. లయమగువాడు కాదు. ‘‘జన్మ’’ మొదలైన దేహ- జీవధర్మములు ఏ మాత్రము లేనట్టివారు.

దేవో - సమస్తము ప్రసాదిస్తూ ఉన్నట్టివారు. దివ్యస్వరూపులు.

నిరామయః - జగత్తు-నీవు-నేను మొదలైన వేరువేరైన విశేషములేవీ కలిగి ఉండనట్టివారు.

సర్వదా సర్వకృత్ - ఎల్లప్పుడు సమస్తమునకు కర్త అయి ఉన్నవారు.

సర్వః - సర్వదా సర్వము అయి ఉన్నట్టివారు.

పరమాత్మా - నాటకములో నటిస్తున్న ఒక నటుని- నాటకంలో పాత్రగా కనిపిస్తున్న దానికి వేరైన ఆ నటుని సహజ స్వరూపమువలె -(పరమ్-ఆత్మా) - ఆవల గల తేజోమయ ఆత్మ స్వరూపము. ఈ విధంగా ఆత్మ గురించి అభివర్ణించబడుతోంది.

ఇంకా కూడా…,

యతో వాచో నివర్తంతే : దేనిని వాక్కు ప్రయత్నించి కూడా, పలుకజాలక వెనుకకుమరలుచున్నదో..,

యో ముక్తైః అవగమ్యతే। ఈ జగత్ భావనా పరిధుల నుండి విముక్తులైనవారు ఏ స్థానమును చేరి ఈ సమస్తమును సందర్శిస్తున్నారో - అదియే ‘పరమాత్మ’ లేక ‘‘పరబ్రహ్మము’’.

యస్య చ ‘‘ఆత్మ’’-ఆదికాః సంజ్ఞాః కల్పితా। న స్వభావజా। ఎద్దాని గురించి ‘‘ఆత్మ, బ్రహ్మము కేవలము, అధ్యాత్మ, సాక్షి, తురీయాతీతము’’ - మొదలైన శబ్ద జాలమంతా కల్పించబడుచూ ఉన్నదో, ఎద్దానికి అవన్నీ స్వభావతః లేనివే అగుచున్నదో.. అదియే ఆత్మ / బ్రహ్మము.

చిదాకాశము - మహాకాశము

ఓ నిదాఘా! ఇప్పుడు ‘త్రయంబకములు’ (3 ఆకాశముల)గురించి వివరిస్తున్నాను.

(1) చిత్తాకాశము : త్రిగుణ భావములు, స్వభావములు, స్వ-పరభావనలు, అనుభూతములు, అనుబంధములు మొదలైన భావనా విభవములు కలిగియున్న ‘నేను’ యొక్క స్వరూపము ‘చిత్తాకాశము’ అని పిలువబడుతోంది.
వివరణ : (ఆలోచనలు, భావనలు నావైన నేను) (What I am - in my zone of thought!)

(2) చిదాకాశము : నా యొక్క భావనలను, అనుభూతులను ఎరుగుచూ ఉన్న ‘‘నేను’’ (నాచే ఎరుగబడుచున్నప్పటి ‘ఎరుక’ నాదైన నేనైన నేను) (What I am in my zone of Knowing)

(3) మహాకాశము : ఇంద్రియ జగత్తును, సమస్త దృశ్యములోను, సకల జీవులలోను ‘నేను’ అయి ప్రదర్శనమగుచున్న నేను. (ఈ సమస్తము నాలోని నేనైన ‘‘నేను’’) (That ‘I’ in which every thing and every body is placed in)

ఈ (భూత)- చిత్త - చిదా - మహాకాశములలో వరుసగా మొదటిదానికంటే తరువాతది సూక్ష్మమైనది, శ్రేష్ఠమైనది కూడా. చిత్తాకాశము కంటే కూడా చిదాకాశము నిర్విషయమైనది. శూన్యమైనది.

చిదాకాశము : - అభివర్ణనము :

శ్లో।। దేశ దేశాంతర ప్రాప్తౌ సంవిదో మధ్యమేవ యత్,
నిమేషేణ చిదాకాశం తత్ విద్ధి। మునిపుంగవ!

ఓ మునీశ్వరా! ఆలోచన ఎల్లప్పుడు ఒక విషయము నుండి, వేరొక విషయము వైపుగా ప్రయాణించుచూ, ‘నిత్యబాటసారి’ అయి ఉంటోంది.
- ఒక ఆలోచననువదలిన తరువాత,
- తరువాతి ఆలోచనలో ఇంకా ప్రవేశించకముందు మధ్యస్థమై ఏ ‘‘ఆలోచనా రహిత ఎరుకరూప కేవల చైతన్యము’’ ఏర్పడి ఉన్నదో, ‘చిదాకాశము’ సులభముగా అనుభవమవగల స్థానము.
- విషయము & విషయములమధ్యగా గల నిర్విషయ ప్రదేశములో రెప్పపాటు కాలము అనుభూతమగు కేవలీ సత్తా స్వరూపమే ‘‘చిదాకాశము’’.

అట్టి చిదాకాశ స్వస్వరూపస్థితి అనుభవమయ్యేది ఎట్లా?

శ్లో।। తస్మిన్ నిరస్త నిశ్శేష సంకల్పస్థితిమ్ ఏషి చేత్
సర్వాత్మకమ్ పదం శాంతం తదా ప్రాప్నోషి। అశంశయః।।

అది సులభమే। ఎట్లాగంటే -
సర్వ సంకల్పములను - సంకల్పపూర్వకంగా దూరంగానెట్టి, దూరంగా నెట్టుచున్న ఆ ఒక (సాధనశీల) సంకల్పమును కూడా త్యజించి ‘మౌనము’ను ధారణ చేస్తూ ఉండగా, సర్వాత్మకమైనట్టి, పరమ శాంతమైనట్టి అఖండాత్మ పదమును సిద్ధించుకోగలవు. ఇందులో సందేహము లేదు.

అట్టి - సర్వాత్మకము (The ‘self’ that is present in every body else), నిత్యోదితము (Always awakening), సుందరము (The sense of beauty), వైరాగ్య పూర్ణము (Detatched from all differences and be complete as all -present) అనునవన్నీ గర్భము నందు ధరించినట్టిది, సహజానందము (Happy and plenty by itself)- అగు ‘‘అంతరంగ బుద్ధి - మనస్సు’’లయ స్థితియే ‘సమాధి’ అనబడుతోంది.

‘‘ఇంద్రియములకు మనోకల్పన తోడు అగుచుండగా కనిపిస్తున్న ఈ దృశ్యము స్వతఃగా ఉన్నది కాదు. స్వతఃగా అసంభవము కూడా।’’ - అను ‘‘బోధ’’ (Understanding doubtlessly and with clarity)చే ఇక్కడి దృశ్య విషయముల పట్ల రాగము, ద్వేషము - ఉభయము హృదయంతో, ‘రహితము’ అగుచూ వస్తాయి. క్రమంగా కేవలచిదాత్మ యొక్క జ్ఞానము (Conceptual understanding), ధ్యేయము (Its perception here and now) గా అయి, ఇక సమస్తము స్వస్వరూప పరమాత్మగా స్వాభావికానుభవము (ప్రయత్నము లేకుండానే అనిపించటము) అవగలదు. అదియే ‘సమాధి’ అని చెప్పబడుతోంది.

ఆత్మకు అన్యముగా ఎక్కడైనా ఏదైనా దృశ్య భావన రూపంగా కనిపిస్తూ ఉంటే - అది మిథ్యయేసకలం మృషా।

✤ మదించిన ఐరావతము (ఏనుగు)ను ఒకడు ఆవగింజలో బంధించి తీసుకువస్తున్నాడు - మత్త ఐరావతో బద్ధః సర్షపీకోణ కోటరే।
✤ ఒక దోమ సింహముల గుంపుతో బాహాటంగా యుద్ధం చేసి వాటిని చంపి తిరిగివస్తోంది. - మశకేన కృతం యుద్ధం సింహోవై రణకోటరే।
✤ ఒక పద్మము యొక్క మధ్యగా గల పుప్పొడి-రవ్వలో మేరుపర్వతము చిక్కుకొనిపోయింది. ఆ పద్మమును ఒక భృంగము (తుమ్మెద) చెప్పాపెట్టకుండా మ్రింగివేసింది. పద్మాక్షే స్థాపితో మేరుః, నిగీర్ణో భృంగసూనునా।

ఇవన్నీ జరగటము వాస్తవమా? ‘‘ఈ దృశ్యము వాస్తవమే’’ అని అనుకోవటము అటువంటి భ్రమవాక్యమే. పై వాక్యముల ‘అర్థము’ వలెనే ఈ జగద్దృశ్యము మొదలే భ్రమాత్మకము (It is being experienced in an illusionary scenario). అంతేగాని, వాస్తవముగా ఉన్నది కాదు.

మరి లేనిది ఉన్నట్లుగా ఎందుకు అనుభూతమౌతోంది? చిత్తము → ‘రాగము, ద్వేషము’ మొదలైన వాటిచే దూషితమవటం చేతనే. ధూళిచే దట్టముగా ఆవరించబడిన అద్దము (A plain mirror covered with dense dust) లో వంకరటింకరగా ముఖము కనిపించురీతిగా అట్టి చిత్తమునకు ఈ కల్పనతో కూడిన పాంచభౌతిక దృశ్యము - అనేక ప్రియ అప్రియ విశేషములతో కూడి కనిపిస్తోంది.

ఓ నిదాఘా! ఈ దృశ్య జగత్తు ‘‘నిజమే। శాశ్వతమే। వాస్తవమే’’ అని అనిపించటానికి కారణము స్వకీయ చిత్తము యొక్క భ్రమయే - అని గ్రహించు.

✤ రాగ ద్వేషములు మొదలైన వాటితో కూడి ఉన్నప్పటి చిత్తమే ‘సంసారము’ అను శబ్దార్థము.
✤ రాగ ద్వేషముల వినిర్ముక్తము (Completely getting rid off) గురించియే సాధన.
✤ రాగద్వేషములు లేకుండాపోవటమే ‘సంసార నివృత్తి’ (లేక) మోక్షము.

దేహభావన

వాస్తవానికి దేహి (One who is using the Body) వేరు. దేహము (The Body) వేరు. దేహము గురించిన మనస్సు యొక్క భావన చేతనే దేహముతో దేహికి బంధము ఏర్పడుతోంది. ‘‘నేను దేహమునకు వేరై, ‘దేహి’నై ఉన్నాను. దేహమునకు ముందే ఆత్మస్వరూపుడనై ఉండియున్నాను. ఇప్పటికీ, ఎప్పటికీ ఆత్మస్వరూపుడనే!’’ అను భావన యొక్క సుదీర్ఘ - అభ్యాసముచే దేహ వాసనల నుండి (from the Tendencies of getting confiningly related to physical body) ఈ జీవుడు ముక్తుడగుచున్నాడు. ఇక ఆపై దేహధర్మములగు జన్మ-జరా-మరణములచే ఆతడు దోషము పొందడు. పరిమితుడు కాడు. బంధితుడుగాని, సంబంధితుడుగాని అవడు.

మనస్సు యొక్క చమత్కృతి

ఓ నిదాఘా!

‘సంసారము’ అనగా? జీవునికి దృశ్యముతో ఏర్పడుచున్న అప్రతిహతమైన దుఃఖపర్యవసానము గల సంబంధమే సంసారము. వాస్తవంగా ఇదంతా మనస్సు యొక్క విలాసమేగాని, మరింక ఏమీ కాదు. ఇది మా నిశ్చితమైన అభిప్రాయము.

ఎందుకంటావా! ఈ మనస్సు ఎంత మహత్తరమైనదంటే… ఇది ఒక ‘‘కల్పము’’ కాలమును ‘‘క్షణము’’గాను, ఒక ‘క్షణము కాలము’ను ‘‘కల్పము’’గాను చేసివేయగలదు.

అట్టి మనస్సును నిగ్రహించటము - అనేది చిన్న చిన్న ప్రయత్నములతో కుదిరేది కాదు. గొప్ప ప్రయత్నశీలురము కావలసిందే. యోగాభ్యాసము, విచారణ, గురు ఆశ్రయము, సత్సంగము, ఇంద్రియ నిగ్రహోపాయములు - ఇవన్నీ అవసరం.

🙁 ఎవ్వడైతే దుష్టకర్మల నుండి విరమించడో..,న అవిరతో దుశ్చరితాః,
🙁 ‘శాంతము’ను ఆశ్రయించకుండా ఎల్లప్పుడూ అశాంతుడై ఉంటాడో.., న అశాంతో,
🙁 ‘సర్వత్రా సమత్వము’తో కూడిన దృష్టిని విడనాడి భేదదృష్టినే అలవాటుగా కలిగి ఉంటాడో.., న సమాహితః,
🙁 అశాంతమైన మనస్సును కలిగి ఉంటాడో..,
అట్టివాడు ప్రజ్ఞావంతుడు అయి ఉండి కూడా, ఆత్మగురించి విని - చదివి - తెలుసుకొని కూడా (దృశ్యధ్యాసల లయ రూపమగు) ఆత్మ గురించి అనుభవము పొందలేడు. ‘‘ఈ సమస్తము మమాత్మానందస్వరూపమే’’ అనే అనునిత్యానుభవ రూపమగు ‘‘సంసారమునకు ఆవలిఒడ్డు’’ - చేరలేడు.

ఎప్పుడైతే నీవు నీ ఆత్మ స్వరూపము గురించి : → బ్రహ్మానందము, ద్వితీయమే లేనట్టి అద్వితీయము; గుణములకు మునుముందే ఉండటంచేత నిర్గుణము, సత్యము; చిదానంద ఘనము….. అని సుస్పష్టముగా, స్వానుభవముగా ఎరుగుచున్నావో, ఆ తర్వాత ఇక సమస్త భయములు స్వాభావికం, వాటికివే సమసిపోతాయి.

ఏ కేవలమగు స్వస్వరూపాత్మ :-
😊 పరమునకే పరమైన పరాత్‌పరమో, మహత్తుకే మహాంతమో (‘అనేక ఉపాధులలో నేనైన నేను’ - కంటే కూడా మహత్తరమో),
😊 ఏ స్వరూపము తేజోమయమో, శాశ్వతమో, శివమో,
😊 ఎద్దాని రూపము కవియో (సర్వశ్రేష్ఠమో), అనంతకాలము నుండి ఉండటం చేత పురాణమో, సనాతన పురుషకారమో,
😊 ఈ సర్వము తనయొక్క విస్తారమే అయి ఉండటంచేత సర్వేశ్వరమో,
😊 ఇదంతా తనరూపమే కాబట్టి - సర్వస్వరూపమో,
😊 ఈ సమస్తము తన యొక్క ‘‘పురుషకారము’’గా కలిగియుండటంచేత పరమ పురుషుడో,
అట్టి బ్రహ్మమే నేను! అహమ్ బ్రహ్మాస్మి అనునదే మోక్ష హేతువు. అట్టివాడు ‘మహాత్ముడు’ అగుచున్నాడు.

బంధ - మోక్షములు

ద్వే పదే బంధమోక్షాయ। ‘నిర్మమేతి’ ‘మమేతి’ చ।।
బంధము - మోక్షము కలిగించేవి రెండు వేరు - వేరైన మార్గములు ఈ జీవునికి ఎదురుగా ప్రత్యక్షమై ఉన్నాయి.
(1) నిర్మమేతి = ‘నాది - అన్నది దృశ్యములో ఏదీ లేదు’’ - అను భావన. ఇది మోక్ష హేతువు।
(2) మమేతి = ‘‘నాది’’ అను భావన. ఇది బంధ హేతువు.

జీవ-ఈశ్వరతత్త్వములు

చేతన - అచేతనాత్మకమైన ఈ జగత్తు అంతా కూడా ‘‘జీవ-ఈశ్వర’’ (వ్యష్టి - సమిష్టి)రూపముగా ప్రదర్శనమగుతూ ఉన్నది.

Ⅰ. ‘ఈక్షణ’ ఆది → ‘ప్రవేశ’ అంతా సృష్టే ‘‘ఈశేన’’ కల్పితాః।।
అనేక ఉపాధులలో ప్రవేశము - నిష్క్రమణము - ఇదంతా ఈశ్వర మాయ. దర్శనము (seeing) నుండి ఈ జీవుడు జగత్ దృశ్యములో ప్రవేశించే వరకు జరుగుచున్నదంతా ‘‘ఈశ్వర కల్పితము’’ లేక ‘‘ఈశ్వర మాయ’’. స్వర్గలోకములు, అందుకు యాగములు మొదలైనవన్నీ ఈశ్వరాహ్రాంతిని ఆశ్రయించి ఉన్నాయి.

Ⅱ. జాగ్రత్ ఆది → విమోక్ష అంతో సంసారో జీవ కల్పితః।
జాగ్రత్ మొదలుకొని → విమోక్షము వరకు సంసార రూపమున ‘‘జీవ’’ కల్పితము (జీవునిచే తనకు తాను కల్పించుకొనుచున్నది). జీవమాయ లోకముల నుండి → సాంఖ్యము, (జ్ఞాన విచారణ - అందుకు ఆశ్రయించు మనో-బుద్ధి చిత్త- అహంకారాది విభజన మొదలైనవి) వరకు జీవ వీహ్రాంతిని ఆశ్రయించి ఉన్నాయి.

ఓ నిదాఘా! ముముక్షువు అయినవాడు జీవ - ఈశ్వర వాదములలో బుద్ధిని పరిమితము చేయరాదు. ఎందుకంటే - రెండూ మాయలోనివే! రెండూ అహ్రాంతి వెంటనంటియే ఉంటున్నాయి. ఈక్షణాముతో ప్రారంభమై, ప్రవేశాలతో సృష్టి, జాగ్రత్-ఆది-విమోక్షాలతో సహా - జీవానుభవము సమస్తము కల్పితమేవ। మాయయేవ। అనగా, బంధ-మోక్షములు కూడా మాయా కల్పితమే।

బ్రహ్మతత్త్వము

(1) జాగ్రత్ - స్వప్న - సుషుప్తులతో కూడిన ఒక దేహమునకు సంబంధించిన ‘నేనైన నేను’
(2) దేహ-దేహాంతరములకు సంబంధించిన ‘‘నేనైన నేను’’.
అనే ఉభయ జీవ -ఈశ్వరతత్త్వములకు ఆవల ‘బ్రహ్మతత్త్వము’’ ప్రకాశమానమై ఉన్నది.

ఎల్లప్పుడూ కూడా జీవ-ఈశ్వర ద్వంద్వములను బుద్ధితో అధిగమించి ‘బ్రహ్మతత్త్వము’ గురించి సద్బుద్ధితో విచారణ చేయటమే ఉచితము. సమస్త ఉపాధులకు, సమస్త దృశ్యములకు ఆవల స్వస్వరూపమై వేంచేసి ఉన్నదే ఆత్మతత్త్వము.

(లోకాయతనము మొదలైన) ఆయా మతవాదములన్నీ జీవ - ఈశ్వర విశేషములనే అధికంగా ప్రసంగము చేస్తున్నాయి. ఆ ఉభయములు ఆత్మయందే సశాంతిస్తున్నాయి. ‘ఆత్మతత్త్వమే’ - అసలైన ఆశయము, లక్ష్యము అగును గాక! అదే మహదాశయము!

చిత్ తత్త్వ - అన్వయముచే (ఇదంతా ఎరుక యొక్క విస్తారరూపమే అను అన్వయముచే) ఈ సమస్తము ‘చిదాత్మ స్వరూపము’గా (లేక) మమాత్మానంద స్వరూపము గా → తెలియబడగలదు.
→ ఆతడే సాక్షాత్ విజ్ఞాని.
→ ఆతడే శివుడు, హరి.

కనుక ‘‘ఈ దృశ్యము, అట్టి దృశ్యములో అగుపిస్తున్న త్వమ్ -తత్‌లు, వాటిని దర్శిస్తున్న ద్రష్ట, ఆ ద్రష్టను మౌనముగా చూస్తూ ఉన్న దృక్ రూపము - ఇవన్నీ మమాత్మానంద ప్రదర్శనములే’ - అను అభ్యాసమునకు ఈ జీవుడు ఉపక్రమించాలి.

సద్గురువు యొక్క ఆవస్యకత

ఋభు మహర్షి : నాయనా! విషయములను త్యజించాలి. అనగా? = ఆత్మకు అన్యముగా కనిపించటమే ‘‘విషయ ఆశ్రయము’’. అనన్యముగా అనిపించటము - ‘‘విషయ త్యాజ్యము’’

(1) ‘‘నీవు’’గా కనిపిస్తూ ఉన్నదంతా పరమాత్మకు అన్యము కాదు. ఈ సమస్త జగత్తు పరమాత్మ యొక్క సాక్షాత్ స్వరూపమే - - అను తత్త్వ దర్శనము సిద్ధించుకోవాలి.

(2) అప్పుడిక ‘‘ఆ పరమాత్మను నేనే’’, ఆత్మమేవాఽహమ్’’ - అను సహజావస్థ సిద్ధించగలదు.

ఇది జీవితము యొక్క మహదాశయము, సహజాశయము.

ఇక తక్కిన ఆశయములంటావా? అవన్నీ సందర్భమాత్ర ఆశయములుగా ఉద్దేశ్యించబడుగాక। గమనించబడుగాక।
అందుకొరకై తత్త్వజ్ఞుడు, తత్త్వదర్శి అగు గురువును ఆశ్రయించాలి.

త్యాజ్యము - జ్ఞానము - అనుభవము

నిదాఘుడు : తండ్రీ! సద్గురుదేవా! మీరు మహత్తరముగా సూచిస్తూ ఉన్న (1) విషయ త్యాజ్యము (2) తత్ - త్వమ్ జ్ఞానము (3) సోఽహమ్ అనుభవము కష్టతరమైనవే. ఎందుకంటే, ఇతఃపూర్వమునకు సంబంధించిన వ్యతిరిక్తాభ్యాసముల ప్రభావము చేత మనస్సును నియమించటమనేది కష్టతరమే కదా!

ఋభు మహర్షి : అవును. కష్టతరమే. అయితే ఈ మూడు కూడా సాధనచే సుసాధ్యమే. అట్టి సాధనకు తత్త్వజ్ఞుడగు గురువు యొక్క సాన్నిధ్యము, బోధ యొక్క శ్రవణము, యోగాభ్యాసము, ధ్యానము యొక్క నియమనిష్ఠలు - అత్యావస్యకం.

శ్లో।। దుర్లభో విషయత్యాగో, దుప్లభమ్ తత్త్వ దర్శనమ్,
దుర్లభా సహజావస్థా, సద్గురోః కరుణాం వినా।।

అందుచేత తత్త్వదర్శి అగు సద్గురువును ప్రశ్నిస్తే ఆయన నీ సహజ స్వరూపము ఎట్టిదో ఎంతటిదో చెప్పుతారు. సమస్తమైన ‘అన్యము’ కూడా అంతర్గతమై, నీ యొక్క అనన్యత్వము నందు అప్రతిహతంగా ఏవిధంగా అంతర్విభూతిగా ఏకమే అయి ఉన్నదో - నీకు విశదపరుస్తారు. అప్పుడు నీవు గురువు ప్రసాదించిన విచక్షణా జ్ఞాన - పరిశీలన - విజ్ఞానపూర్వక అభ్యాసములచే జీవాత్మత్వముతో సహా నీ యొక్క సమస్త సందర్భమాత్ర పురుషకారములను దాటి వేయుచు, పరమ పురుషార్థమగు ‘సహజావస్థ’లో ప్రవేశితుడవు కాగలవు. అవ్యాజము, పరము అగు ఆత్మానందమునందు ఈ సమస్త జగత్తును దర్శించగలవు. ఆత్మానంద సాగరంలో జనించిన ఒక తరంగము వంటిదే ఈ నీ ‘‘సమస్త జగత్ దర్శనము’’ అవగలదు. (అయిఉన్నది).

సహజావస్థ

‘‘ఇక్కడి దృశ్యమానమగుచున్న సమస్తము మమాత్మానంద స్వరూపమే’’ - అనునదే సహజావస్థ.

సర్వకర్మఫలములను త్యజించు అభ్యాసముచేతను, ఈశ్వరానుగ్రహముచేతను, సర్వసంశయముల నివృత్తిచేతను - అట్టి యోగికి (యోగాభ్యాసి/యోగసిద్ధునికి) ‘‘సహజావస్థ’’ స్వయముగా సిద్ధించగలదు.

⌘ సమస్త భూతజాలమును తన యొక్క ఆత్మయందును,
⌘ తన ఆత్మనే సమస్త భూతజాలమునందును,
- స్వాభావికంగా (అకృత్రిమంగా), అనుక్షణికంగా, అన్యమైన ఎద్దానికీ సంబంధము (Conditioning) లేకుండా - దర్శించగలగటమే ‘సహజావస్థ’.

సర్వే సర్వత్రా సమముగా తిష్ఠించియున్న అఖండమగు ఆత్మయొక్క అనుష్ఠానమే సహజావస్థ.

భేదదర్శనమే బంధము. సమదర్శనమే మోక్షము.

శ్లో।। యదా హి ఏవైష ఏతస్మిన్ అల్పమపి అన్తరం నరః
విజానాతి, తదా తస్య భయం స్యాత్। న అత్ర సంశయః।।

ఓ నిదాఘా। ఎంతెంత వరకు ఎక్కడెక్కడ ఆత్మకు వేరైన దర్శనము (లేక) ఆత్మకు వేరైనదిగా కొంచమైనా ఎరుగబడటము జరుగుతూ ఉంటుందో, అప్పుడిక ఈ జీవునికి ‘భయము’ తొలగదు. తొలగదు. ఇందులో సందేహమే లేదు. అందుచేత ‘‘భేద దర్శనము’’ను నీవు జయించు ‘‘సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్’’ - రూపమగు అభేదదర్శనమును అభ్యాసముచే సిద్ధించుకో.

జ్ఞాన చక్షువులు

సూర్యుడు ప్రకాశిస్తూ అంతటా వెలుగు నింపుతూ ఉన్నప్పటికీ గ్రుడ్డివాడు ఆ వెలుగుగాని, ఆ వెలుగులో వస్తువులను - వాటి ఆకారములను గాని చూడలేడు కదా! అట్లాగే జ్ఞాన చక్షువులు (Common sense Eye - achieved through Gnana) కలవాడే సర్వవ్యాపకము, సత్-చిత్-ఆనంద స్వరూపము అగు స్వస్వరూపాత్మను సర్వత్రా సర్వదా దర్శించగలడు. అజ్ఞాన చక్షువులకు అది సందర్శనము కాదు. జ్ఞాన చక్షువులకు అది ఇక్కడే తప్పక కనిపిస్తూనే ఉంటుంది.

‘‘ప్రజ్ఞానమేవ తత్ బ్రహ్మ’’

ఏ ‘తెలివి’చే ఈ దృశ్యము జీవునకు తెలియబడుచూ ఉన్నదో - అదియే ‘ప్రజ్ఞ’. ఆ ప్రజ్ఞయే బ్రహ్మము. ‘‘సత్ (ఉనికి)’’ - అనబడునది బ్రహ్మము యొక్క స్వభావము. అనగా ‘‘సత్-చిత్’’ - ఈ రెండూ బ్రహ్మము యొక్క స్వాభావిక లక్షణములు. అట్టి ప్రజ్ఞానము యొక్క స్వరూప లక్షణమే - (1) తెలుసుకొనువాడు (సత్) (2) తెలుసుకోవటము (3) తెలియబడునది (The Knower, Knowing and All that being known) - కూడా అయి ప్రదర్శనమౌతోంది.

ఈ విధంగా త్రిలక్షణయుతమగు ‘‘ప్రజ్ఞానము’’ (The Absolute feature of ‘knowing’ in every being)ను ఎవ్వడు ‘బ్రహ్మము’గా ఎరుగుచున్నాడో, అట్టి ‘‘పరిజ్ఞానము’’చేత (By virtue of its ‘Knowledge’) ఈ జీవుడు ‘అమృతుడు’ అగుచున్నాడు. అనగా ‘సహజము, నిత్యము, సత్యము అగు ఆత్మస్వరూపుడనగు నాకు దేహమము యొక్క జనన- మరణ ధర్మములు కించిత్ కూడా లేవు. దేహముతో జనించను. దేహముతో మరణించను’’ - అను ఇంగిత జ్ఞానముచే సునిశ్చితుడు, సునిశ్చలుడు అగుచున్నాడు.

అట్టి పరావర దృష్టియే ఈ జీవునికి సర్వదా గుర్తుండవలసిన మహదాశయము. అదియే సిద్ధి. అదియే మోక్షము. అదియే ‘‘జన్మరాహిత్యము’’.

శ్లో।। భిద్యతే హృదయ గ్రంథిః, ఛిద్యంతే సర్వ సంశయాః
క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే।।

ఈ సమస్త జగత్తు పరబ్రహ్మము యొక్క యథాతథ సం ప్రదర్శనా స్వరూపమే. ‘‘నీవు - జగత్తు - ఆతడు నేను’’ ఇవన్నీ బ్రహ్మము యొక్క అమృతానంద రసస్వరూపమే। ఆత్మామృతముయొక్క మాధుర్య విశేషమే।

‘‘అస్మత్ ఆత్మయే అమృత స్వరూపమై ఈ సమస్తమును తన తేజస్సుగా ప్రదర్శించుచూ, ఈ సమస్తము అయిఉన్నది’’
అను పరాత్‌పర (లేక) పరావర దృష్టిని నీవు సిద్ధించుకొనెదవుగాక!

అట్టి అఖండాత్మ దృష్టిచే హృదయ గ్రంథులు (ఈ దృశ్యము గురించి సృష్టించబడినది - అను బ్రహ్మగ్రంథి, పరిపోషించబడుచున్నది - అను విష్ణుగ్రంధి; లయించబడుచున్నది - అను రుద్రగ్రంథి) తెగిపోగలవు. జీవాత్మ - పరమాత్మ - దృశ్యముల పరస్పరత్వమునకు సంబంధించిన సర్వ సందేహములు సమసిపోతాయి. (All Doubts get smashed). సమస్త కర్మలు (నేను కర్తను. భోక్తను. నాకు సంచిత ఆగామి పారబ్ధ కర్మల వ్యవహారము ఉన్నది - మొదలైనదంతా) - మొదలంట్లా క్షీణించగలదు.

అందుచేత బిడ్డా! అనాత్మత్వమునకు సంబంధించిన సర్వభావములు, సర్వ సంకల్పములు ఇప్పుడే త్యజించి వేయి. ఈ జగత్తు, ఇద్దాని విషయ పరంపరల సందర్భములలో అంతరమున నిర్వికారుడవు (Unaffected and non-responsive)గా ఉండెదవుగాక.

ఏక నిష్ఠతయ అంతస్థః ‘సంవిత్’ - మాత్ర పరోభవ।
సర్వదా ‘‘సంవిన్మాత్రపరుడవు’’ (I am the absolute ‘BEING’ and ‘knowing’) - అయి ఉండుము.
→ మరుభూమి (ఎడారి)లో కనిపించే మృగతృష్ణ (లేక యండమావులలో కనిపించే జలము) వాస్తవానికి మరుభూమియే కదా!
→ అట్లాగే జాగ్రత్-స్వప్న-సుషుప్తులలో కనిపించేదంతా {‘ఆత్మ’ (అనే యడారి)లో కనిపించేదంతా} ఆత్మకు ఏ క్షణమందునూ ఏ మాత్రము భిన్నము కాదు.
సమస్తము ఆత్మయే। ‘‘నేను, నీవు, నీది, నాది, అది, ఇది’’ - అంతా ఆత్మస్వరూపమే। ఇక్కడ ఉన్న సత్యము ఇది।

సాక్షాత్ శివత్త్వమ్

ఎవ్వడైతే లక్ష్యము - అలక్ష్యము (My aim - not my Aim) - ఈ రెండిటినీ ప్రక్కకుపెట్టివేసి, ‘‘కేవలమగు ఆత్మ’’యందే సుతిష్ఠితుడు అయి ఉంటాడో, అట్టి ఉత్తముడగు బ్రహ్మవేత్త - ఇక ‘జీవుడు’ అని అనిపించుకోడు. సాక్షాత్ శివుడే అగుచున్నాడు. ‘‘శివోఽహమ్’’ ‘‘శివతత్త్వజ్ఞానమ్’’ మొదలైన మాటలు మహదర్థము సిద్ధించినది అగుచున్నది. శివయేవ స్వయం సాక్షాత్ అయం బ్రహ్మవిత్ ఉత్తమః।। ఆతడు ఉత్తముడగు ‘బ్రహ్మవేత్త’ అగుచున్నాడు.

అధిష్ఠానమ్ పరంబ్రహ్మ

బ్రహ్మము ఎట్టిదో - విను.
→ బంగారు ఆభరణములన్నిటికీ బంగారమే అధిష్ఠానమై ఉంటున్న తీరుగా,… ఇక్కడి ద్రష్ట-దర్శన-దృశ్యములు, అంతరంగ-బహిరంగములు మొదలైన సమస్తమునకు బ్రహ్మమే అధిష్ఠానమైయున్నది.
→ బ్రహ్మమును ఉపమానముల సహాయముతో నిరూపించి చెప్పగలిగేది కాదు. అనౌపమ్యమ్।
→ వాక్కుకు మనస్సుకు కూడా విషయము కాదు. అవాక్ మానస గోచరమ్।
→ నిత్యమైనది. సర్వగతమైనది. విభువు. సుసూక్ష్మము. అవ్యయము. (Always present, Al pervading. Everything is its Vitality only. Subtle, Changeless.).

సంసారము శాంతించేది ఎట్లా?

సర్వశక్తిమంతుడగు ఆ మహేశ్వరుని విలాసమే ఈ మనోజగత్.

‘‘ఆత్మకు అన్యము’’ అను దృష్టియే సంసారము. అట్టి సంసారము యొక్క సంయమము (Control of Indrias) చేతనే అట్టి సంయమి పట్ల సంసారము శమించగలదు. (లేక) శాంతించగలదు. ‘సంసారము’ అనునది ‘మనోవ్యాధి। (లేక) ‘‘మనోవ్యసనము’’ - అనియే గమనిస్తూ ఉండు.

నిదాఘుడు : స్వామీ! అట్టి ‘సంసారము’ అనే మనోవ్యాధి (లేక - మనోవ్యసనము) తొలగేది ఎట్లా?

మనోవ్యాధికి చికిత్స- ఉపాయము

ఋభు మహర్షి : అవును. ‘సంసారము’ అనే మనోవ్యాధి శమించటానికై ఈ జీవుడు ‘చికిత్స’కు తప్పక ఉపక్రమించవలసిందే। అందుకు ‘ఉపాయము’ ఒకటి చెప్పుతాను. విను.

యత్ యత్ స్వాభిమంతం వస్తు, తత్ తత్ - త్యజన్ మోక్షమ్ అశ్నుతే।
ఏఏ వస్తువులు నీకు ‘‘అనివార్యము, ఆవశ్యకము’’ - అని అనిపిస్తూ → ప్రియముగా, ఇష్టముగా అనిపిస్తూ ఉన్నదో - వాటిని మానసికంగా త్యజించివేసి ఉండుము. ఒకవేళ ‘‘అది ఎట్లా?’’ అంటావేమో. ఈ మాటవిను. ఎవ్వడైతే తన యొక్క స్వాధీనములోనే ఉన్నట్టిది. తనకు అత్యంత శ్రేయస్సు కలిగించునది అగు ‘‘ఇష్టవస్తు పరిత్యాగము’’ - అను మానసిక ప్రయత్నము చేయడో, అట్టివాడు సర్వదా ‘బద్ధుడు’ అయియే ఉంటాడు. ‘ఇష్ట వస్తు త్యాజ్యము’’ - అనే విషయంలో ‘‘అబ్బే! అది మాకెక్కడ కుదురుతుందండీ? మేము ఇష్ట వస్తువులను మానసికంగా విడువలేము।’’ అని అంటారా? అట్లా అయితే, ఆత్మజ్ఞుల దృష్టిలో అట్టివారు ‘‘పురుషాకారముగా ఉన్న కీటకముల వంటివారు. ‘‘ఇష్ట వస్తు త్యాజ్యము’’ అనే ఉత్తమ ప్రయత్నమునకు సిద్ధపడనివారికి ధిక్కారమగు గాక!

అట్టి ఇష్ట వస్తు మనో పరిత్యాగము (Mentally leaving aside the attractions) - అనేది ఎవరికి వారికే స్వకీయ పురుషకారముతో కూడిన ప్రయత్నము చేతనే సాధ్యము. అట్టి స్వకీయ ‘ఈప్సిత త్యాగము’నకు సిద్ధపడనివానికి ‘‘ఆత్మతత్త్వానుభూతి’’ - అను శుభగతి సుదూరము అగుచున్నది.

ఓ నిదాఘా! నీకు సర్వత్రా సంప్రదర్శనమైయున్న ఆత్మయే సర్వదా ఇష్టవస్తువు - అగుగాక। ఇదియే - ‘‘ఇష్ట వస్తుభ్రమ’’ అనే జాడ్యమునకు ఏకైక ఉపాయము.

అసంకల్పము

వస్తువుల గురించి, విషయముల గురించి, సందర్భముల గురించి, ప్రాపంచక సంబంధ - అనుబంధముల గురించి ఏ మాత్రము సంకల్పించక, సర్వదా ‘‘మౌనము, అతీతము’’ - వహించి ఉండటమే ‘‘అసంకల్పము’’.

‘‘సంకల్పించకపోవటము’’ అనే సునిశితమైన బుద్ధి రూపమగు శస్త్రము (లేక) చురకత్తితో ‘చిత్తము’ అనే అడ్డును (Hindrence) ఛేదించాలి. చిత్తము (Interestedness in worldly events)ను ఛేదించినప్పుడు మాత్రమే ‘‘సమస్తము తానే అయి ఉన్నట్టిది, సర్వదా విస్తరించి - సర్వగతము అయిఉన్నట్టిది, పరమ శాంతము అయినట్టిది - అగు ‘‘కేవలాత్మ’’ అనుభవమునకు రాగలదు.

మరల చెప్పుచున్నాను.
→ లోకమునకు సంబంధించిన విషయ భావనలను విడచి ఉండుము.
→ మనస్సును నిగ్రహిస్తూ, అదే మనస్సుతో బ్రహ్మభావమును ఆశ్రయించి ఉండుము.
→ శాంత మనస్కుడవై బ్రహ్మభావనతో మనస్సును మ్రింగివేసి, ‘మనోనిగ్రహము’ అనే అభ్యాసముచే ‘‘ఆత్మత్వము’’ అనే అమనస్కమును ఆశ్రయించెదవుగాక।

శ్లో।। భవ భావనయా ముక్తో యుక్తః పరమయా ధియా,
ధారయ ఆత్మానం అవ్యగ్రో గ్రస్త చిత్తం ‘‘చితః పదమ్।।

తరంగము సముద్ర జలములో లయించినప్పుడు - ఆపై సముద్ర జలమే శేషించు విధంగా, భావనాతరంగరూపములగు మనస్సు ఆత్మయందు లయించినప్పుడు శేషించునదే బ్రహ్మము. మనస్సును ఆత్మయొక్క తేజోవిభవముగా గమనించూండటమే మనోలయము.

‘‘భవభావన’’ను (ఈ జగత్తు నిజముగా ఉన్నది - అను భావనను) ఎవ్వడైతే - యుక్తుడై ఉత్తమమైన బుద్ధితో విడచి, అద్దాని నుండి ముక్తుడు అవుతాడో, - ఉద్వేగము లేకుండా చిత్తమును (అభిరుచి రూపములగు విషయములను ఆశ్రయించి స్వభావమును) విడచి ఉంటాడో,… అట్టివాడు చిత్తమును ‘‘చిత్’’తో మ్రింగివేసి ‘‘చిత్‌పదము’’ను ధరించుచున్నాడు. మంచుగడ్డ వెచ్చటి నీళ్ళలో కరిగినట్లు చిత్తము ‘చిత్’లో లయము అగుచున్నది.

ఓ నిదాఘా! పురుషకారమును (భక్తి-జ్ఞాన- యోగ-సర్వసమర్పణా భావనలను) సమాశ్రయించుము. ప్రయత్నశీలత్వమును, ఆశ్రయించి చిత్తమును ‘అచిత్తము’గా చేసివేయుము. విష్ణు భగవానుడు చక్రమును ధరించు విధంగా నీవు హృదయము నందు చిత్తమును స్మరించుచూ, అట్టి చిత్తమును చిత్‌ధారణా చక్రముచే ఖండించివేయుము. అప్పుడు మనస్సు అనే మన్మథుడు నిన్ను ‘కామము’ అనే బాణములచే - ఏమాత్రము కూడా బంధించలేడు. ‘మనోబంధము’ అనే శంకయే తొలగిపోగలదు.

‘‘మనస్సు’’ అంటే ఏమిటి?

అయం, సోఽహం, ఇదం తత్, మే’’ ఏతావత్‌మాత్రకం మనః।
నాది - నేను - నేను ఇది - అది కాదు - ఈ ఈ రూపంగా ఆలోచనల ప్రవర్తనయే మనస్సు.

‘‘నేను-నాది-మావారు-కానివారు’’ అను భావనలు త్యజించి ఉన్నామా, ఈ మాత్రపు ‘అభావన’ చేతనే మనస్సు (ఆత్మయందు) విలీనము అయిపోగలదు.

శరత్కాలంలో వాయువీచికలచే మబ్బులు తునాతునకలు అయి ఎటో వెళ్లిపోవురీతిగా ‘‘సమస్తము ఆత్మ చమత్కారమే’’ అనే భావనావీచికలచే ‘‘నేను-నాది-అది-అట్టిది-ఇట్టిది’’ మొదలైన రూపములుగా దట్టముగా ఆత్మభావనలను ఆవరించియున్న మనస్సు ఆత్మజ్ఞానముచే, ఆత్మతత్త్వ మనన-అనుభవ వీచికలచే చిన్నాభిన్నమైపోగలదు. ఇదియే ‘మనస్సు’ యొక్క అంతర్ధానము.

సర్వము అఖండము-అప్రమేయము అగు ఆత్మగా అనిపించటమే ‘అమనస్కము’. అదే ‘మనోజయము’ ‘మనోనిలయము’ కూడా. ‘తత్’ భావన మాత్రేణ దాత్రేణేవ విలీయతే।।

అంతేగాని, ‘‘ఆలోచించకుండా కూర్చుని ఉండటము’’- మనోలయముయొక్క ‘పరమార్థము’ కాదు.

ఈ విధంగా సమస్తము స్వయముగా అఖండ - అప్రమేయ ఆత్మస్వరూపమై, కేవలాత్మ భావనా-లీలా మాత్రమై ఎవరియొక్క అవగాహన - అనుభూతి సుస్థిరము, నిశ్చలము అవుతాయో,..
అట్టివాడు →
- ప్రళయకాల వాయువీచికలు వీచటము ప్రారంభమైనా,
- సప్త సముద్రజలములు ఏకమౌతున్నప్పటికీ (కలిసిపోతున్నప్పటికీ),
- ద్వాదశ (12) అదిత్యులు తపించటం అన్ని వైపులా ప్రజ్వలనమగుచున్నప్పుడు - ప్రారంభమైనా కూడా..,
‘ఆత్మభావన- అనుభూతి - ఆత్మమేవాఽహమ్-త్వమ్ ఆత్మ’’.. స్థానము నుండి ‘చ్యుతి’ పొందడు. అట్టి మహత్తర నిశ్చల బ్రాహ్మీస్థితి ఎట్లా సిద్ధిస్తుంది? - కేవలము సంకల్పించకపోవటము (అసంకల్పన) మాత్రం చేత సిద్ధించగలదు.

ఓ నిదాఘా! ‘అసంకల్పన’ (Non Assuming and Non - Prasuming) అనే మోక్ష సామ్రాజ్యమును స్వాధీనము చేసుకొని ఆత్మ స్వరూప చక్రవర్తికై సుఖాసీనుడవై ఉండెదవుగాక.
అభవము ఉండజాలదు’’ - అను అంతర్ - దృష్టియే అసంకల్పము.

దేని గురించీ ఆలోచించకపోవటమో, దేనికీ సంకల్పించకపోవటమో-అసంకల్పము లేక అమనస్కము ఏ మాత్రముకానే కాదు. ‘‘నేను మనస్సును చలన రహితం చేస్తాను’’ అనేది కుదిరేపని కాదు. ఎందుకంటావా? అగ్ని నుండి ఉష్ణమును తీసి ప్రక్కన పెట్టటము జరిగే పనియేనా? లేదు. ఉష్ణము అగ్ని యొక్క ధర్మము. అట్లాగే మనస్సు ఎప్పుడూ కూడా తన ధర్మమగు ‘చంచలత్వము’ను ఏక్షణమూ వదలి ఉండదు. అయితే కదలుచున్న మనస్సుకు ఆధారము ఏది? కదిలే చేతిని - కదిలించేవాడు ‘నిశ్చలుడు’ అయినట్లుగా, కదిలే మనస్సుకు చంచలత్వమును - ‘చిదాత్మ’ యొక్క స్పందన శక్తియే ప్రసాదిస్తోంది.
→ కేవలము, నిశ్చలము అగు ‘చిచ్ఛక్తి’ నుండి → స్పందన శక్తి। (చిత్-శక్తి)
→ చిత్ స్పందన శక్తి నుండి → మనో చలన శక్తి।
→ మనోచలన శక్తి నుండి → ఈ జగదాడంబరము।
కాబట్టి ఏ జగద్దృశ్యము అనుభవమౌతోందో అదంతా ‘‘మనో చలనరూపము’’ మాత్రమే. అయితే మనస్సే మనస్సును ధారణ చేస్తోంది.

మనస్సు (1) చంచలము (2) నిశ్చల విభాగము - అను రెండు విభాగములుగా ఉన్నది.

మనస్సు యొక్క చలనముచే ఏ జగత్తు అనుభవమగుచున్నదో - అది ఆత్మస్వరూపమే. కనుక ఓ నిదాఘా! మనస్సుకు ఈవల-ఆవల నిశ్చలమగు ఆత్మయే సర్వదా వేంచేసి ఉండగా ఇక మనోచాంచల్యము గురించి దిగులు దేనికి?

చంచలమైన తరంగములో నిశ్చలమగు జలమే ‘అధిష్ఠానము’ అయి వేంచేసి ఉన్న తీరుగా, మనోచంచలమునకు ఆధారము నిశ్చలమగు ఆత్మయే. ఈ విధంగా, చంచలమనస్సు యొక్క ఆధారమైయున్న నిశ్చలమగు ఆత్మ యొక్క సందర్శనమే తపస్సు, ధ్యానము, యోగము, శాస్త్రజ్ఞానము, విచారణ మొదలైన సర్వప్రయత్నముల అంతిమ లక్ష్యము. కదిలే సమస్తమునకు ఆధారమైయున్న కదలని ఆత్మయొక్క అనునిత్య సందర్శనమే యోగము, మోక్షము కూడా. యోగి (లేక) జ్ఞాని - కదిలే శరీరములకు ఆధారమైయున్న కదిలించే శక్తిని, ఆశక్తిని ప్రదర్శిస్తున్న ఈశ్వరుని - అందరిలోనూ దర్శిస్తూ ఉంటాడు.

అవిద్య

మనస్సు యొక్క ఏ అభ్యాసముచే దృశ్య వస్తువులు ‘‘సత్యము-నిత్యము-ప్రియము’’ అని అనిపిస్తోందో, అది వాసనల చేతనే ఏర్పడుతోంది. వాసనలు (Tendencies) ఎట్లా రూపుదిద్దుకుంటున్నాయి? నిరంతరం ‘‘సత్యమే। నిత్యమే। ప్రియమే।’’ - అను రూపముగా నామ-రూపముల పట్ల మానసికమైన వ్యసనరూప అభ్యాసమే కారణం. దృశ్య మననము అభ్యాసముగాను, అభ్యాసము సంస్కారముగాను, సంస్కారము వాసనలుగాను అగుచున్నది.

ఓ అనఘా! నిదాఘా! ఇప్పుడు పురుష ప్రయత్నముచే అదే మనస్సు యొక్క అభ్యాసముచే నామ-రూపాత్మకమైన ప్రియ-అప్రియత్వముల నుండి అభ్యాసపూర్వకంగా మనస్సును వెనుకకు మరల్చి ‘‘ఆత్మగా అగుపించటము. ఆత్మగా అనిపించటము।’’ అనే మార్గములో నియమించు అనుకుంటూ ఉంటే, అనిపిస్తుంది. ఈ విధంగా నిర్వికల్పుడవు, పరమ పురుషుడవు అయ్యెదవు గాక! ఆత్మగా భావన చేయు అభ్యాసికి ప్రపంచము సర్వదా ఆత్మగానే శేషించగలదు. ఇక దృశ్యమో? బంగారమునకు ఆభరణత్వము వంటిది అగుచున్నది. ఆత్మగా భావనయే తత్పదము అదియే బ్రాహ్మీస్థితి.

చిత్తము
|- శుద్ధచిత్తము (కేవల విభాగము)
|- మలిన చిత్తము (సందర్భ స్పందనా విభాగము)

పురుషకారమును ఆశ్రయించి, చిత్తము యొక్క (ఇష్టవిభాగము యొక్క) శుద్ధ విభాగమును ‘‘ఉపకరణము’’ (washing material)గా తీసుకొని, మలిన విభాగమును ఆక్రమించివేయుము. అప్పుడిక విశోకమగు (where there happens to be not even a blink of worry) అవలంబించి, నిరాతంకము (No distraction from absolute sense of self) నందు సుస్థితుడవై ఉండుము.

మనస్సును జయించగలిగేది మనస్సు మాత్రమే

మన ఏవ సమర్థంహి మనసో దృఢ నిగ్రహే। రాజును రాజే నిగ్రహించటానికి సమర్థడు కదా! రాజు కానివాడు రాజును ఎట్లా నిగ్రహించగలుగుతాడు? అట్లాగే మనస్సును నిగ్రహించాలంటే మనస్సునే ఉపయోగించాలి. అరాజాః కః సమర్థ స్యాత్ రాజ్ఞో నిగ్రహ కర్మణి? మనస్సుకు వేరైన మరొక వస్తువుతో మనస్సును నిగ్రహించలేము.

‘‘సంసారము’’ అనే సముద్రంలో ‘తృష్ణ’ అనే పాశములతో ‘గ్రహించటము’’ అని సుడులలో చిక్కుకొన్న ఈ జీవునికి‘‘శుద్ధమనస్సు’’ అనునదే ‘నావ’ (Boat) అయి ఒడ్డుకు చేర్చగలదు.‘నిశ్చలమైన మనస్సు’తో చంచలమనోతరంగాలను ఎదుర్కొనాలి. ‘గ్రహించటము’ను నిగ్రహించటమే ఉత్తమ ఉపాయము.

మనస్సు యొక్క ‘వివేకాభ్యాసము’ అనే విభాగముతో బంధము కలుగజేస్తున్న మనోరజ్జువులను ఖండించి, సంసార సాగరము నుండి నిన్ను నీవే రక్షించుకోవాలి. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. (ఉద్ధరేత్ ఆత్మని ఆత్మానమ్). భ్రమమాత్రమే అయి ఉన్న సంసార బంధముల నుండి నీ మనస్సు తప్పితే, మరింకెవరో వచ్చి నిన్ను రక్షించలేరు. ప్రాజ్ఞుడైనవాడు - ఏవేవి దృశ్యసంబంధమై ‘ఇష్టము’ రూపంగా జనించుచూ, ‘సంబంధము’ రూపముగా ప్రవృద్ధము అవుతోందో, అదంతా - మునుముందుగా గమనిస్తున్నాడు. ‘‘అది అంతా అవిద్యయేకదా’’ అని నిర్ణయించుకొంటున్నాడు. గమనించి, వాటిని తొలగించే పురుషకారమునకై→మనస్సునే ఉపకరణముగా చేసుకొనుచున్నాడు. ‘త్వమ్’గా ప్రదర్శనమగుచున్న ‘తత్’ వైపుగా మాత్రమే దృష్టిని సారిస్తున్నాడు.

⌘ ‘భోగించాలి’ అనే వాసనలను ముందుగా ‘త్యాజ్యము’ అనే మార్గములో జయిస్తున్నాడు.
⌘ ఆ తరువాత భేదవాసనలను (అదివేరు- ఇది వేరు అనే భావావేశమును) క్రమంగా పురుషకారముచే (with regular and constant effort)చే త్యజిస్తున్నాడు.
⌘ ఏ భావముతో తదితర భావములన్నిటినీ త్యజిస్తున్నాడో, - అట్టి భావాతీతభావనను కూడా వదలి, ప్రశాంతుడగుచున్నాడు.
⌘ ఆ క్రమంగా భావ-అభావములను కూడా త్యజించివేస్తున్నాడు.

ఈ విధంగా నీవు ‘త్యాజ్యము’ అను మార్గములో అడుగులు వేస్తూ క్రమంగా ‘‘నిర్వికల్పుడవు’’ అయ్యెదవు గాక! ‘‘నిర్వికల్ప సుఖి’వి అగుము. నిర్వికల్ప సుఖీభవ।
- ఇదియే మనో నాశనము.
- ఇదియే అవిద్యానాశనము కూడా.

ఏదేది నీకు తెలియబడుచూ ఉన్నదో, ఆ సమస్తమును ‘‘ఆత్మభావన’’ అను భౌమావిద్యచే కడిగివేసుకొనుము. ఆక్రమించివేయి. ఈ సమస్తము అగుచున్న ఆత్మవే నీవై ఉండుము.

దృశ్య విషయ త్యాజ్యము

సమస్త దృశ్య విషయములను హృదయాంతరంగములో (In the zone of Inner recess of heart) పరిత్యజించి ఉండటమే ‘‘నిర్వాణము’’. ‘‘దృశ్య విషయములను ‘‘నిజమే। నిత్యమే। సత్యమే’’ - అని నమ్మిక పరిగ్రహించి ఉండటమే - బంధ దుఃఖము. పరిత్యజించటమే ‘మోక్షము’. ఆహా! ఎంతటి చమత్కారం। అవిద్య అవిద్యమానైవ। ‘అవిద్య’ అనునది స్వతఃగా లేదు. అయితే ఏం? స్వతఃగా లేనట్టి అవిద్య ప్రజ్ఞచే పరిశీలించనిచోట రూపుదిద్దుకొని ఉంటోంది. అవిద్యమానైవ నష్ట ప్రజ్ఞేషు దృశ్యతే।

సమ్యక్ ప్రజ్ఞ : సర్వత్రా సమరూపమైయున్న బ్రహ్మమును దర్శించు ప్రజ్ఞ (Intelectual level by virtue of which all -equal absolute self is being enjoyed).

ఎవ్వరైతే అట్టి ‘సమ్యక్ ప్రజ్ఞ’ను సిద్ధించుకుంటారో, అట్టి వారికి ‘‘అవిద్యాః నామ్నైవ అంగీకృతాకారా। అవిద్య నామకః! ఉన్నట్లు (పేరుకు ఉన్నట్లు) చెప్పబడుతోందేగాని, ‘‘అసలు అవిద్య ఉన్నదెక్కడ?’’ - అని నిస్సంశయముగా అనిపిస్తోంది.

అజ్ఞానిని అవిద్య ఈడ్చుకుంటూ వెళ్లి అనేక దుఃఖ సంకటములలో పడవేస్తోంది. ఆందోళనలను కొనసాగింపజేస్తోంది.

‘సమ్యక్‌ప్రజ్ఞ’ కలవారికో? అద్దాని ఉనికియే కనిపించటము లేదు. ‘‘భేదరూపముగా చెప్పబడే అవిద్య ఎక్కడున్నదయ్యా?’’ - అని వారు అజ్ఞానిని నిలబెట్టి ప్రశ్నిస్తున్నారు. ‘‘సమస్తము అఖండమగు ఆత్మయే కదా!’’ - అని గుర్తెరుగుచున్నారు. గుర్తు చేస్తున్నారు.

అవిద్య ఎప్పటివరకు కొనసాగుతుంది?

ఎప్పటివరకైతే - ‘‘నేను ఈ దృశ్యబంధనము నుండి విడివడి, సత్యము - నిత్యము అగు స్వరూపానందమును సిద్ధించుకోవాలి’’ - అనే ఆత్మావలోకనమునకై ఇచ్ఛ పొందడో, అంతవరకు అవిద్య కొనసాగుతూనే ఉంటూ, క్రొత్త - క్రొత్త చిలువలు -పలవలుగా హృదయములో ఉత్పత్తి అయి విస్తరిస్తూనే ఉంటుంది.

స్వయమాత్మావలోకేచ్ఛా మోహ సంక్షయకారిణీ। స్వయముగా ‘‘ఆత్మావలోకనము’’ యొక్క ఇచ్ఛ వలన, ‘సమస్తము’ అయి ఉన్న ‘‘స్వస్వరూపము’’ గురించిన సామీప్యత సిద్ధించుచుండగా మోహము తొలగిపోగలదు. మోహము తొలగటమే ‘‘మోక్షము’’ యొక్క స్వరూపము. భ్రమ తొలగితే బ్రహ్మమే ఇదంతా।

‘‘పరతత్త్వ దర్శనము స్వాత్మనాశనము’’ అని కూడా చెప్పబడుచున్నది. ఎందుకంటే పరబ్రహ్మదృష్టి ఘనీభూతమగు చుండగా, .. ‘వ్యష్టిత్వము’ యొక్క పరిమితము పటాపంచలమవటము చేత. సర్వగతమైన ‘బోధ దృష్టి’చే వ్యక్తిగత పరిమితమంతా తనకు తానే సర్వాత్మకము నందు స్వాభావికముగా విలీనము అగుచున్నది.

ఇచ్ఛామాత్రం అవిద్యేయమ్। అనుక్షణికము మార్పుచెందే స్వభావము గల దృశ్యము పట్ల - ‘‘ఇచ్ఛ’’యే అవిద్య.
తన్నాశో ‘మోక్ష’ ఉచ్యతే। జగత్ వ్యవహారముల పట్ల అంతరంగము నందు ‘‘ఇచ్ఛ (Interestedness & Expectations)" లేకుండటమే ‘మోక్షము’ అని చెప్పబడుతోంది.

ఓ మునీశ్వరా! అట్టి ‘‘ఇచ్ఛారాహిత్యము, ముక్తి, మోక్షము’’ అనునవి - సంకల్పములు క్షయించుట చేతనే, (సంకల్ప రాహిత్యము చేతనే, అసంకల్పము చేతనే) - సిద్ధించగలవు.

చిత్తాకాశములో చిత్ సూర్యోదయము

చిత్తాకాశములో ఇంద్రియ విషయముల పట్ల ‘‘దట్టముగా ఏర్పడిన వాసనలు’’ - అనే చీకటి తొలగగా, అప్పుడిక చిత్ సూర్యోదయము అగుచున్నది. సూర్యుడు ఉదయించుచుండగా ఆకాశంలో చంద్రుడు వెలవెల పోవుచున్నట్లు, హృదయాకాశంలో జ్ఞానసూర్యుడు ఉదయిస్తూ ఉండగా, విషయ పరంపరలలో వ్రాలే మనస్సు వెలవెలపోగలదు. చిత్తములో ‘భేదభావములు’ అనే మేఘములు తొలగితే ఆత్మసూర్యుని ప్రకాశము సర్వత్రా వెలయగలదు.

చైతన్యము (ఇంద్రియములకు తెలియబడుచున్నది; that being known) అనే మంచుపాతము లేనట్టిది, సర్వత్రా సమస్వరూపమై సర్వత్రా వెలయుచున్నట్టిది, వాక్కుచే వ్యాఖ్యానింపలేనట్టిది అగు చిత్-తత్త్వమే - ‘ఆత్మ’ అని, ‘పరమేశ్వరుడు’ అని అభివర్ణించబడుచూ, స్తుతించబడుతోంది. అనగా, ఈ చిత్తము సమస్త ఇంద్రియ విషయములను దాటివేసినప్పుడు (లేక, త్యజించి ఉన్నప్పుడు) - అప్పటికీ శేషించే చిత్తమే - ‘చిత్’ లేక ‘ఆత్మ’।

సర్వం చ ఖలు ఇదం బ్రహ్మ, నిత్య చిద్ఘనమ్, అక్షతమ్। ఇదంతా నిత్యచిద్ఘనము, అక్షయము అగు బ్రహ్మమే అయి ఉన్నది. సమస్తము బ్రహ్మమే అయి ఉండగా, ఇక ‘మనస్సు’ అనబడు వేరొక వస్తువు ఎక్కడి నుండి వస్తుంది? మనస్సు అనబడేది నామకః కల్పన మాత్రమే. వ్యావహారిక నామమే గాని, ‘మనస్సు’ అనబడే ఒక వస్తువే లేదు.

న జాయతే మ్రియతే కించిత్ అత్ర జగత్రయే।

ఈ మూడు లోకములలో ఏదీ జనించటమూ లేదు. గతించుట/నశించటమూ లేదు. ‘‘భావ వికారము-జగత్ కల్పన’’ అనునవి కూడా వాస్తవమైన ఉనికి కలిగి లేదు. ఇక్కడ సర్వదా చిదాభాసముగా (In the form of reflaction as dual) ఉన్నది కూడా- కేవలము, సర్వ సామాన్యము, అక్షయము, చైత్యరహితము (తెలియబడునది - అనే అన్యమైనది లేనట్టిది) - అగు కేవల చిన్మాత్రయే (The Abslolute Form of knowing sans that being known) .

మనోవిహారము : అటువంటి నిత్యము, శుద్ధము, చిన్మాత్రము, ఉపద్రవరహితము, పరమశాంతము నిర్వికారము అగు ‘చిన్మాత్రము’’ నందు - ఊహ, భావన, అనుభూతి వంటి స్వరూపము గల ‘మనస్సు’ అనబడునది విహారము చేస్తోంది. అటువంటి మనస్సు తనకు ఏమి ఇష్టమైతే అది కల్పించుకొని 10 దిక్కులకు పరుగులు తీస్తోంది. ఆయాసము పొందుతోందేగాని విరామము పొందటం లేదు.

మనస్సు అనగా → మననము చేయుచుండు అభ్యాస పరంపరా చమత్కారమే। అంతకుమించి మనస్సుకు వేరే రూపము లేదు. వస్తువు కాదు. త్రాడు - వంటి వస్తువే కానప్పుడు - అది చైతన్యరూపుడగు జీవుని బంధించడమేమిటి? ఆలోచనలు - ఆ ఆలోచించువానిని బంధించటమేమిటి?
- మనస్సు సంకల్పము చేతనే సిద్ధిస్తోంది.
- అందుచేత అసంకల్పము చేతనే లయించగలదు. అందుచేత - ‘సంకల్పించకపోవటము’ను ఆశ్రయించు.

అతః సంకల్ప సిద్ధేయం సంకల్పేనైవ నశ్యతి।। ‘అన్యము’ రూపముతో ఏర్పడుచున్న, సంకతల్పముల బంధము. ‘‘ఆత్మకు ఈ సమస్తము అనన్యము’’ అను మహత్ సంకల్పముచే బంధము త్రెంచివేయబడగలదు.

బంధము - బంధవిముక్తి

‘నాహమ్ బ్రహ్మ’ ఇతి సంకల్పాత్ సుదృఢాత్ బధ్యతే మనః। ‘‘నేను బ్రహ్మమును - కాను. జీవుడను. ఈ దేహమునకు సంబంధించినవాడను. దేహముతో కృశించుధర్మము కలవాడను. అనేక దుఃఖములచే బద్ధుడను. ఈ కాళ్ళు - చేతులు మొదలైనవి నా స్వరూప- స్వభావములు.’’ - ఇటువంటి అభిమాన భావములను ఆశ్రయించు అభ్యాసము చేత ఈ జీవుడు దృశ్య వ్యవహార బద్ధుడు అయి ఉండటం జరుగుతోంది.

విముక్తుడు:
‘‘సమస్తము సర్వదా బ్రహ్మము’’ అను భావన అభ్యాసవశంగా సుదృఢమగుచూ ఉండగా, ఈ జీవుడు ముక్తుడు కాగలడు.
‘‘నేను దుఃఖినికాదు. నేను ‘‘దేహి’’ (One who uses (or) operator of the body)ను. అంతేగాని దేహమును కాను. ఇంద్రియములు కాదు. అవి నాకు బంధము కాదు. సర్వదా ఆత్మస్వరూపుడను. ఆత్మకు దేహము, ఇంద్రియములు ఉపకరణములు మాత్రమే. ఆత్మకు బంధము ఎట్లా ఉండగలదు? ఉండదు. ఆత్మగా నాకు - దేహము, ఆలోచన, భావన, ఇష్టాఇష్టములు మొదలైనవి ఉపకరణములు మాత్రమే.

ఇట్టి నిశ్చయము దృఢమగుచుండగా, ఈ జీవుడు అవిద్య నుండి విముక్తుడు కాగలడు.

కల్పిత మాత్రమగు అనాత్మయందు (‘‘నేను’’ దృశ్యములోని వాడను -అను రూపముగల) ఆత్మయొక్క భావన చేతనే ‘అవిద్య’ - రూపము పొందుతోంది. అందుచేత ఓ నిదాఘా! తీవ్రమైన ‘‘పురుషకారము’’ను ఆశ్రయించి సునిశితము - విస్తారము అగు బుద్ధి బలముతో ‘‘ఈ దృశ్యములో ఇంకా ఏదో పొందాలి. లేకపోతే నా పట్ల ఇంకా లోపము ఉన్నట్లే’’ - అను భోగేచ్ఛను సుదూరంగా త్రోసివేసి సుఖవంతుడవగుము.

ఆహా! ఈ జగత్తు నిండా ఎన్నో భ్రమలు. అవి ఈ జీవుని యొక్క ‘అవగాహన’ను స్వకల్పితంగా చుట్టుముట్టినవై ఉంటున్నాయి. నేను - నావాళ్లు - నాది - నీది మొదలైనవి ఇంద్రజాలములోని కల్పితవస్తువులై ప్రవర్తమానమగుచున్నాయి.

ఓ ఇంద్రజాలికుడు ‘ఛూఛూ’ వంటి శబ్దములు చేస్తూ ప్రేక్షకుల కళ్ళను, దృష్టిని భ్రమింపజేస్తూ, ‘లేనివి’ కల్పించి, ‘ఉన్నట్లే’ అనుభూతిని కలుగజేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరచి తికమక చేస్తూ ఉంటాడు. ‘‘ఆహా! ఓహో! అయ్యో! ఏమి ఏమి ఏమి?.. అనే అనేక భావ - ఉద్వేగాలు జనింపజేస్తూ ఉంటాడు. ‘‘ఇంద్రజాలికుడు రంగముపై (on the Stage) దృష్టిని, మనస్సును మరల్చి ఎక్కడి నుండో ఏదో వస్తున్నట్లు, ఎక్కడికో ఏదో పోతున్నట్లు, ఒక వస్తువు మరొకటి అగుచున్నట్లు, అరచేతిలో చిలక పుట్టుకొస్తున్నట్లు, ఖాళీగా ఉండే ‘తలపాగా’ (శిరస్త్రాణము)లో నుండి పేకమేడలు పుట్టుకొస్తున్నట్లు చూపిస్తాడు. ఆ ఇంద్రజాలప్రదర్శనము చూస్తూ ఉన్నప్పుడు జనులు చప్పట్లు కొట్టి కేరింతలు పెట్టవచ్చుగాక! ఇంద్రజాల ప్రదర్శన అయిన తరువాత అది ‘నిజము’ అని అనుకుంటామా? ఆ ఇంద్రజాలకుడిని మన ఇంటికి పిలచి, మన ఇంటిలోని ఒక పాత్ర ఇచ్చి ‘‘అయ్యా! మాకు చిలకలంటే ఇష్టము. ఇందులోంచి రెండు చిలకలు పుట్టించి ఇవ్వండి’’.. అని అడిగితే? ఆయన పకపకా నవ్వడా?

శ్లో।। మమ పుత్రో। మమ ధనమ్। అహం సోఽయమ్। ఇదం మమ! - ఇతీయమ్ ఇంద్రజాలేన వాసనైవ వివల్గతి।।

‘‘…. అయ్యా! ఇది మా ఇల్లు, వాకిలి, పొలము, పుట్ర! అదంతా ఆభరణములు, ఖరీదైన వస్త్రములు మొదలైన సంపద! ఇది మా ధనము! నేను అది (పదవులు, జాతులు మొదలైనవి)। వీరు నా భార్య। వారు నా కొడుకులు, కూతుళ్ళు, మనుమలు । ఇదిగో ఇంతవరకు మనది! అది మనం సంపాదించి తీరాలి! అది మనది కాదు!’’
… ఇటువంటి జగత్తు అనే రంగములో కనిపించే ఇంద్రజాలములోని సంగతి - సందర్భము - సంఘటనలను చూస్తూ జీవులు తెలిసితెలిసి భ్రమలు చెందుచున్నారు. కారణం? అపరిశీలనాత్మకంగా అనేక విషయములు పట్ల-వ్యసనపూర్వకంగా - నిర్వర్తిస్తూ ఉన్న మనస్సు యొక్క సుదీర్ఘ అభ్యాసములు కారణంగా ఏర్పడిన దట్టమైన ‘‘వాసనలు’’ చేతనే.

ఓ నిదాఘా!

మా భవ అజ్ఞో। భవ జ్ఞః త్వమ్! ఆత్మకు ‘అన్యము’ వలె అనిపిస్తూ ఉన్న ఇంద్రియ ప్రపంచమంతా ఇంద్రజాలము వంటిది. ఇది చూచి నీవు అజ్ఞుడవై ‘‘నిజమే! ఉన్నదే!’’ అను అజ్ఞాన దృష్టి (లేక), సాంసారిక దృష్టికి పరిమితుడవై ఉండకూడదు సుమా! భవ (ఉన్నది) బంధము పొందవద్దు. ఆత్మదృష్టిని సునిశిత పరచుకొని జ్ఞానివై ఉండాలయ్యా।

‘జ్ఞానబలము’తో సంసారభావములను మొదలంట్లా జయించివేయి. జహి సంసార భావనామ్।

అనాత్మని ఆత్మభావేన కిమ్ ‘అజ్ఞ’ ఇవ రోదిషి? మొదటే సత్యము కానట్టి, సందర్భములచే కల్పించబడుచున్నట్టి ‘అనాత్మ’ అయిన విషయములను, భావములను గట్టిగా పట్టుకుని అజ్ఞునివలె ఎందుకు దుఃఖము పొందాలి చెప్పు?

జడము (that which is merely passive, but not active by itself), మూగది (Dumb), రక్త-మాంసమయము, అశుచి అయినది అగు ఈ పాంచభౌతిక శరీరముల గురించి సుఖ-దుఃఖ వ్యవహారములకు వశుడవై ఎందుకు ‘తీవ్రాందోళన’ చెందుచున్నావో నాకు చెప్పు!

ఇటు నాశనమే స్వభావముగా కలిగియున్న, స్వతఃగా సత్యమే కానట్టి - ఈ భౌతిక శరీరము గురించి, అద్దానితో ఏర్పడే (జడమగు) పరిమిత సంబంధ, అనుబంధ బాంధవ్యముల గురించి ఎల్లప్పుడు ఈజనులు మననము చేస్తూ…,
ఏది సత్యమో, నిత్యమో, నిర్మలమో, అప్రమేయమో… అటువంటి ఆత్మను ఏమరుస్తున్నారే! ఇంతకన్నా చిత్రమేముంటుంది?
అందుచేత, ఓ నిదాఘా! లౌకిక వ్యవహారములు నీపై ‘‘రాగము’’ అనే బురదను చల్లకుండును గాక!

-నీవు (ఆత్మగా) పర్వతము వంటివాడివి. ఇక్కడి లౌకిక వ్యవహారములన్నీ తామరతూడులలోని సన్నటి ధారములు వంటివి.

ఆహా! ఆశ్చర్యం కాకపోతే, తామరతూడు దారములు మహాపర్వతమును బంధించటమేమిటి?

అవిద్యమాన యా అవిద్యా తయా విశ్వం ఖిలీకృతమ్!
అవిచారణచే జనించుచున్న అవిద్యా తంతువులచే ఈ విశ్వమంతా ముక్కలుగా ఖండనము పొందుచున్నదే! గడ్డిపరకతో పోల్చతగినట్టి, అవిద్యమాత్రంగా ప్రదర్శనమగుచున్నట్టి ఈ మూడు లోకాలు అవిద్యయే అయి ఉండి కూడా,…. వజ్రతుల్యంగా, బయటపడటానికి అసాధ్యమైనవిగా కనిపిస్తున్నాయే! ఇంతకన్నా ఇంద్రజాలము, చమత్కారము, చిత్రము ఇంకేమి ఉంటుంది?

-ఇతి ఉపనిషత్-


5వ అధ్యాయము
సప్త అజ్ఞాన భూమికలు - సప్త జ్ఞాన భూమికలు

నిదాఘుడు : మహాత్మా! ఇప్పుడు దయచేసి సప్త - సప్త (7–7) అజ్ఞాన-జ్ఞాన భూమికల గురించి దయచేసి వివరించ ప్రార్థన.

ఋభుమహర్షి : సరే! ‘అపర విద్య’ అను సప్త-సప్త ‘‘అజ్ఞాన, జ్ఞాన’’ భూమికల గురించి యథాతథంగా చెప్పుకుందాము. అట్టి భూమికల నుండి ఒక పెద్ద మర్రి చెట్టు యొక్క శాఖ-ఉపశాఖలవలె అనేకమైన వేరువేరు ఉప-భూమికలు కూడా సంసార వృక్షమునకు విస్తరించినవై ఉంటున్నాయి.

⌘ స్వస్వరూప స్థితియే - ముక్తి.
⌘ స్వస్వరూపము నుండి భ్రంశము (చ్యుతి) పొందటమే - అహమ్- త్వమ్ భావనాపరంపరలు. అట్టి చ్యుతియే బంధము.

స్వస్వరూపము సర్వదా శుద్ధ - సత్‌మాత్రము. కేవలమగు ‘ఉనికి’చే అలంకరించబడినట్టిది, సత్ -విత్ (ఉనికి-ఎరుక)లతో సర్వదా సమన్వితమైయున్నది.

అట్టి ఈ జీవుని ‘‘కేవలము (The Absolute)’’ అను స్వరూపము నుందు, వాస్తవానికి ‘‘దృశ్యము-దృశ్యము పట్ల రాగద్వేషములు’’.. మొదలైనవేవీ ఉనికిని కలిగి యుండజాలవు, సంభవించజాలవు కూడా!. ‘అజ్ఞానము’ అనబడు దానికి వాస్తవానికి చోటు లభించజాలదు. ఒక రచయిత తాను రచించిన పాత్రయొక్క స్వరూప స్వభావములచే నిబద్ధుడు కాడుకదా।

స్వరూప భ్రంశము : నిర్మలము, నిత్యము, సర్వాతీతము - అగు దృక్ (కేవల ద్రష్ట స్వరూపము)→ దృశ్య కల్పనయందు నిమగ్నము అగుచూ ఉండటమే ‘‘స్వరూపము యొక్క భ్రంశము’’ - అనబడుచున్నది. నిజానికి పరస్వరూపము పరమునందే ప్రకాశము అగుచూ ఉన్నది. అది దృశ్యములోకి దిగిరాదు. దృశ్యముచే బంధింపబడదు.‘స్వప్నము తనదైనవాడు’ స్వప్నములోని గృహము(House)లో బంధితుడౌతాడా?

‘‘నిర్మలుడగు దృక్→ ‘‘దృశ్యము’’ నందు నిమజ్జనము అగుచూ, తన కేవల రూపము ఏమరచటము’’ - అనునదే ‘అపరము’ అని ‘మోహము’ అని కూడా పిలువబడుతోంది.

అంతకుమించి వేరైన మోహము (మోహమును మరెక్కడి నుండియో వచ్చిపడటము) అనునదేదీ ఇతఃపూర్వకము లేదు. ఇక ముందు ఉండబోదు.

స్వరూప స్థితి

శ్లో।। అర్థాత్ అర్థాన్తరమ్ చిత్తే యాతి మధ్యే తు యా స్థితిః
సా ధ్వస్త మనన ఆకారా ‘‘స్వరూప స్థితి’’ ఉచ్యతే।।

ఈ చిత్తము ఒక ‘యోచన’ నుండి - ‘మరొక యోచన’కు ప్రయాణిస్తూ ఉండగా - అట్టి అర్థ - అర్థాంతరముల (భావన- అభావములమధ్యగా) ఏ ‘‘మనన రహిత స్థితి’’.. ఏర్పడినదై ఉన్నదో,.. అదియే ‘‘స్వరూప స్థితి’’. సర్వ సంకల్పములు శమింపజేయబడగా, ఏ ‘శిల’ వంటి అంతర హృదయమౌనస్థితి ఉన్నదో, ఏ స్థితి అయితే జాగ్రత్ -స్వప్న-సుషుప్తులచే కించిత్ కూడా పరిమితము కానిదై, వాటికి పట్టుబడనిదై ఉన్నదో- అదియే పరా - స్వరూపస్థితి’’. అదియే మనందరియొక్క-‘శాశ్వతము, వాస్తవము’-అగు ఆత్మస్వరూపము.

‘అహమ్’ (నేను - నాది రూపమగు) వృత్తి నివృత్తి అయిపోవుచుండగా, భేదముల భావనలు నిష్పందము(Non provocative) అగుచుండగా - ‘‘జడము కానట్టిది, నిత్య చేతనా కేవలరూపము’’, అయి ఏది సర్వదా శేషించినదై ఉన్నదో - అదియే ‘‘స్వరూపస్థితి’’.

సప్త అజ్ఞాన భూమికలు: సప్త మోహములు (లేక సప్త అవస్థలు)

మోహము యొక్క ఏడు (7) ప్రదర్శనములు ఈ విధంగా చెప్పబడుచున్నాయి.

(1) బీజ జాగ్రత్ - అవస్థ (2) జాగ్రత్ - అవస్థ (3) మహాజాగ్రత్ - అవస్థ (4) జాగ్రత్ స్వప్న - అవస్థ (5) స్వప్న - అవస్థ (6) స్వప్న జాగ్రత్ - అవస్థ (7) సుషుప్తి - అవస్థ.

ఈ ‘7’ కూడా మరల అనేక పరస్పర సమ్మేళనములు జరుగుచూ, అనేక అసంఖ్యాక ఉపమోహరూపములుగా దృశ్యములో ప్రదర్శనమవటం జరుగుతోంది. వివిధ రూపములతో ప్రదర్శనము అవుతూ ఉన్నట్టి మోహసప్తముల గురించి చెప్పుకొందాము.

(1) బీజ జాగ్రత్ : మొట్టమొదట సృష్టి యొక్క అనుభూతి-భావన- అనుభవము పుట్టుకముందే, ఏ కేవల చైతన్యము-చేతనము (కదలిక) జనించక ముందే ఉండి ఉన్నదో - అట్టి పరమశాంత, కేవల చైతన్యము అనాఖ్యాతము (మాటలలో ‘ఇట్టిది’ అని చెప్పజాలము). అట్టి చైతన్యమునందు - (కళాకారుడు కళను ఇంకా ప్రదర్శించనప్పటి కళారూపమువలె) - జీవుడు మొదలైన నామరూపాత్మకమైనదంతా - అప్రదర్శన శీలమైయున్నది. ‘జాగ్రత్’లోని సమస్తము ఎద్దానియందు బీజరూపమై (బీజములో భవిష్యత్ మహావృక్ష వ్యవహారమంతా మౌనము దాల్చి ఉన్న రీతిగా) ఉన్నదో, భవిష్యత్ ప్రదర్శనా చమత్కారము అప్రదర్శితంగా (బీజరూపంగా) ఉన్నదో.. అట్టి కేవలచైతన్యమును ‘బీజ జాగ్రత్’ అని అంటారు. ఇదియే జ్ఞప్తి, అహంకారము మొదలైన క్రొత్త విశేషములకు జనన స్థానము.

(2) జాగ్రత్: అట్టి కేవలమగు ‘బీజ జాగ్రత్’ నుండి అహం-మమ (నేను-నీవు-అతడు-నాది..మొదలైన) వృత్తులు (Avocations) బయల్వెడలుచున్నాయి. ఆ నూతన స్థితిని ‘జాగ్రత్’ అంటారు. భావనలకు ముందే ఉన్న బీజ జాగ్రత్ చైతన్యము నుండి భావనల రూపమగు జాగ్రత్ ప్రజ్ఞ-అనుభవములు బయలుదేరి ‘జాగ్రత్’ రూపము ధరిస్తోంది. ‘‘అనుభవి-అనుభవింపబడు వస్తువు- అనుభవము’’-అనబడే ‘3’ చమత్కారములు బయల్వెడలుచున్నాయి. అవి బీజ జాగ్రత్ కేవల స్థితికి ‘‘అన్యము’’ - వలె భాసిస్తూ ప్రదర్శనమగుచున్నాయి.

(3) మహా జాగ్రత్ : ఆ జాగ్రత్→ ఒక జన్మ, ఆ జన్మ తరువాత మరొక జన్మగా (దేహదేహాంతరములుగా) ‘‘నేను - నీవు- నాది’’ మొదలైన వృత్తులు కొనసాగుచూ ఉండటమును ‘‘మహాజాగ్రత్’’.. అని పిలుస్తున్నారు.
‘‘జన్మ-కర్మలు, కర్మఫలములు, మరల కర్మఫలములుగా జన్మ జన్మాంతరములు, పునర్జన్మ, పునఃకర్మలు’’ - ఈ విధమై జన్మకర్మ చక్ర పరిభ్రణము సుదీర్ఘమై, అంతులేనిదై, ఈ జీవుని పట్ల కొనసాగటమే - మహా జాగ్రత్.

(4) జాగ్రత్ స్వప్నము : జాగ్రత్‌తో ఇంద్రియములచే పంచభూత నిర్మిత వస్తువులను విషయములుగా అనుభవిస్తూ ఉన్న ఈ జీవుడు,అలసిపోయి కొంతసేపు విరామము కొరకై ‘నిద్ర’కు ఉపక్రమిస్తున్నాడు. అప్పుడు జాగ్రత్‌లో నుండి -జాగ్రత్‌కు వేరైన ‘స్వప్నము’ అనే రంగమును స్వయముగా కల్పించుకొని, అందులో ఊహానిర్మితంగా అనేక విశేషాలను అనుభవముగా పొందుచున్నాడు.

అట్టి స్వప్న రంగములో:-
→ ఆరూఢమైనవి : జాగ్రత్ సిద్ధించు దృశ్యములు సంఘటనలు - మొదలైనవి.
→ అథవా అనారూఢమ్ : మరియు జాగ్రత్‌లో లేనట్టివి. ఊహచే నూతనంగా కల్పించబడినవి.
సంఘటనా మిశ్రమములు వేరు వేరైన, వేరు వేరు కాలములలోని - సంఘటన, అనుభూతుల అర్ధరహితమైన ‘కలగలుపు’.

⌘ జాగ్రత్ వ్యవహారములకు సంబంధించినవి, సంబంధించనివి,
⌘ జగత్ వికారముల వంటివి (అనగా) ‘‘భావనతో తన్మయము అవటము’’ అనే జాగ్రత్‌ధర్మముతో కూడినది
జాగ్రత్ అనుభవమునకు వేరైన మరి వేరే (జన్మ-జన్మాంతర సంబంధమైన) భావనలు-మొదలైనవన్నీ సరూపం పొందుచున్నాయి.

ఆయా దృశ్య విషయాలు స్వప్నములో పొందుచూ, సుఖదుఃఖములు, బంధ-మోక్షములు అభౌతికమగు స్వప్నముగా చూస్తూ తన్మయవటం జరుగుతోంది. ఇదియే ‘‘జాగ్రత్ స్వప్నము’’.

(5) స్వప్నము :

ఆత్మయందు -భౌతికమైన ఇంద్రియముల సహాయము లేకుండానే - దృశ్యము వివిధ భంగిమలో మనస్సుకు అనుభూతమగుచుండటమే స్వప్నము.

➤ కంటి దోషముచే ఆకాశంలోని ఒకే చంద్రుడు ఇద్దరు చంద్రులుగా కనిపించటము..,
➤ ముత్యపుచిప్పలో విలువైన ‘వెండి’ ఉన్నట్లుగా అనిపించటము…,
➤ మరుభూమి (ఎడారి)లో (ఎండమావులులో) జలము సమృద్ధిగా కలిగి ఉన్నట్లు కనిపించటము,
ఇవన్నీ సందర్భమవటం ఎటువంటిదో, స్వప్నములో కనిపించే ‘దృశ్యము’ అటువంటిదే.

అభ్యాసముచేత ప్రాప్తించిన జగదనుభవమే స్వప్నములో అనేక విధములైన వస్తు-సంఘటనానుభవములయి, నానా విధములుగా స్వప్నములో ప్రాప్తిస్తున్నాయి. స్వప్నము మొత్తము స్వకీయ కల్పనయే.

అయితే, మరొక చమత్కారమైన విశేషము :

💐 జాగ్రత్తులో కనిపించేవి ‘‘ఇవి మాత్రమే నిజము’’. స్వప్నములోని కావు’’ - అని జాగ్రత్తులో అనిపిస్తోంది.
💐 స్వప్నములో కనిపించేవి- ‘‘ఈ స్వప్నములోవే నిజము. జాగ్రత్‌లోనివి కావు’’ - అని స్వప్న సమయములో ఉద్దేశ్యము కలిగి ఉండటం జరుగుతోంది.

స్వప్నసమయంలో ఈ జీవుడు ‘‘స్వప్న దృశ్యము నిజమే’’ అని అనుకుంటూనే అనుభవిస్తున్నాడు. మెలకువ వచ్చిన తరువాత మాత్రం, ‘‘అల్పకాలము ఊహలో ఏదో ఎక్కడో చూచాను. అది ఎక్కడా ఏ మాత్రమూ ఎప్పుడూ లేనేలేదు’’. అని తలచుచున్నాడు. బుద్ధిలో పరామర్శ చేసి, ‘‘అబ్బే! ఎప్పుడూ ఎక్కడా జరుగనిదే కలలో కనిపించింది. అటువంటి స్వప్నదృశ్యమునకు ఉదయము లేదు. అస్తమయము లేదు’’ - అని ఊరుకొని, ఇక జాగ్రత్ దృశ్యములో అనుభూతిని (నిద్రలేచిన తరువాత) కొనసాగిస్తున్నాడు.

(6) స్వప్న జాగ్రత్ : ఈ జాగ్రత్‌లో సంఘటనలు, సందర్భములు, సంబంధములు ఎప్పటికప్పుడు మార్పుచెందేవే అయి కూడా, ఆవర్తమానంలో ‘‘సత్యమే! స్థిరమే!’’ అని అనిపిస్తూ ఉండటమే జాగ్రత్ అనుభవ చమత్కారము. చాలాకాలము తన్మయమై జాగత్-దృశ్యమును దర్శిస్తూ ఉండటము - అనే అభ్యాసముచేత.., ‘‘ఇదంతా స్వకీయ కల్పనా మాత్రమే’’ - అనేది ఆరూఢవము కావటం లేదు. ‘‘వేదాంత శ్రవణం చేయటం, గురువాక్య విచారణ’’.. మొదలైనవి ఆశ్రయిస్తూ ఉన్నప్పటికీ జీవునికి ఈ దృశ్యము గురించిన సత్యదృష్టి పోవటం లేదు. అయితే అసత్‌ను అధిగమించి ‘సత్’ కొరకు చేయు అభ్యాసమే అందుకు ఉపాయము.

(i) బహుకాలము ప్రయత్నపూర్వకంగా సత్యాసత్య-నిత్యానిత్య వివేచన చేయటం చేత,
(ii) ‘‘తత్త్వమ్-సోఽహమ్’’ వంటి మహావాక్య విచారణ చేత,
(iii) మహనీయులు జగత్తును సందర్శించుచున్న విధానమును పరిశీలించటముచేత
- ‘‘ఈ ఘనీభూతమై అనుభవమగుచున్న జాగ్రత్ స్వప్నము వంటిదే’’ అని ఆరూఢమవగలదు.
- అట్టి జాగ్రత్‌ను స్వప్నము వంటిదే - అను దృష్టియే ‘‘స్వప్నజాగ్రత్’’ గా చెప్పబడుతోంది.

(7) సుషుప్తి : ఇప్పటిదాకా మనము చెప్పుకొన్న - బీజ జాగ్రత్, జాగ్రత్, మహాజాగ్రత్, జాగ్రత్ స్వప్నము, స్వప్నము, స్వప్నజాగ్రత్ - షట్(6) అవస్థలను పరిత్యజించి ఉన్నట్టి - ఈ జీవుని యొక్క ఒకానొక జడస్థితి - సుషుప్తి.

‘‘అటువంటి గాఢనిద్రాస్థితిలో జాగ్రత్-స్వప్న దశలలోని దుఃఖము శేషించి ఉంటుందా? ఉండదా?’’ - అనే ప్రశ్నకు సమాధానం విను.

భవిష్యత్ దుఃఖ బోధాఢ్యా సౌషుప్తిః స ఉచ్యతే గతిః।। ఈ ‘సుషుప్తదశ’ - అనేక భవిష్యత్ దుఃఖములకు సంబంధించిన సందర్భములను తన యందు కలిగియే ఉంటుంది. వాస్తవానికి ఇది దుఃఖము - దుఃఖము మధ్య ‘విరామము’ మాత్రమే. అందుకే, ‘‘సుషుప్త స్థితి జడస్థితియే గాని సుఖ స్థితి కాదు’’ - అని కూడా చెప్పబడుతోంది.

ఈ సుషుప్తిలో సర్వజగదనుభవములు దాగినవై ఉంటాయి. పునః ప్రదర్శనమునకు సంసిద్ధమై, (కానీ) మౌనం వహించి ఉంటాయి. సుషుప్తి వీడగానే - తిరిగి వచ్చిపడసాగుతాయి.

ఓ ద్విజోత్తమా! ఇప్పటివరకు మనము ఈ జీవుని యొక్క ‘అజ్ఞానభూమికలు’ గురించి చెప్పుకున్నాము. ఇవన్నీ ఒక్కొక్కటీ అంతరంగా ఆయా విషయములతో సమన్వయమై, సంయోగము పొంది - బహు-అనంతసంఖ్యగా ఈ జీవుని సమక్షంలో ప్రవర్తనము కలిగినవై ఉంటున్నాయి. అట్టి వందలాది అవస్థలు వర్ణనాతీతము. అయితే ఈ సప్తభూమికల విభాగమును అర్ధం చేసుకొంటే,.. తక్కినవన్నీ దైనందికానుభవమే కాబట్టి శ్రోత చక్కగా గ్రహించగలడు.


ఇక సప్త జ్ఞాన భూమికల గురించి చెప్పుకుందాము.

సప్త - జ్ఞాన భూమికలు

ఋభుమహర్షి : ఓ అనఘా! నిదాఘా! ఈ సప్త జ్ఞాన భూమికల గురించి శ్రవణం చేసినంత మాత్రం చేతనే ఇక ఆ శ్రోత ‘మోహము’ అనే బురదలో ఇరుక్కోడు - అని ఆర్య వాక్యము.

యోగ భూమికావేత్తలు ఈ సప్త భూమికలను అనేక విభాగములుగా (‘9’గా ‘12’గా ‘27’గా ‘108’గా.. ఈ విధంగా) ఆయా భేదముతో చెప్పుతూ ఉంటారు. నీ శ్రవణము యొక్క ఉత్తమ ప్రయోజనమును, ప్రస్తుత సందర్భమును దృష్టిలో పెట్టుకొని వీటిని ఈ ‘సప్తభూమికలు’గా మనము గమనించి క్రోడీకరించి చెప్పుకుందాము. ఇది నీకు శుభమగు ప్రయోజనము కలిగించగలదని నా అభిప్రాయము.

‘‘సప్తభూమికల జ్ఞానమే యథార్థ జ్ఞానము’’ అని మహాత్ముల ప్రవచనము.

మనము చెప్పుకోబోవు ఈ సప్త భూమికలకు ఆవల జ్ఞేయవస్తువు (That which is knowing all else) అగు ‘‘స్వస్వరూప - పరమాత్మ’’ సమస్తమును తేజోమయము చేయుచు, సర్వదా విద్యమానము - ప్రకాశమానము అయిఉన్నది.

సప్తజ్ఞాన భూమికలు - (1) శుభేచ్ఛ (2) విచారణ (3) తనుమానస (4) సత్త్వాపత్తి (5) అసంసక్తి (6) పదార్థభావన (7) తుర్యగ

ఈ సప్త భూమికల అభ్యాసముచే వీటిని దాటిపోవాలి. ఆసాం అంతస్థితా ముక్తిః, యస్యాం భూయో న శోచతి। వీటికి ఆవల గల ‘‘ముక్తి స్థానము’’ (A State where all else is crossed) … చేరినవాడు ఇక దేనికీ దుఃఖించడు. ఆదుర్దాపడడు. అందుచేత ఈ సప్తజ్ఞాన భూమికల నిర్వచనము ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము.

(1) శుభేచ్ఛా భూమిక :

శ్లో।। స్థితః కిం మూఢ ఏవాస్మి? ప్రేక్షేఽహం శాస్త్ర సజ్జనైః,
వైరాగ్య పూర్వం ఇచ్ఛేతి - ‘శుభేచ్ఛ’ - ఇతి ఉచ్యతే బుధైః।।

‘‘అరె! క్షణానికి ఒక విధంగా ఉండే ఈ దృశ్య సంగతులలో నేను మూఢుడనై ఎందుకు సంచారములు చేస్తూ ఉన్నాను? ఇక చాలు. నేను శాస్త్రములను అధ్యయనము చేస్తాను. మహనీయుల వద్ద (సజ్జనుల వద్ద) శ్రవణం చేస్తాను. ఇంద్రియ విషయముల పట్ల విరాగినై, సత్యము, నిత్యము అగుదాని గురించి ప్రయత్నశీలుడను అవుతాను’’ - అను ప్రయత్నశీలత్వమే ‘‘శుభేచ్ఛ’’.

(2) విచారణ భూమిక:

శ్లో।। శాస్త్ర-సజ్జన సంపర్క వైరాగ్య -అభ్యాసపూర్వకమ్
సదాచార ప్రవృత్తిర్యా ప్రోచ్యతే సా ‘‘విచారణా’’।।

శాస్త్రములతోను, సజ్జనులతోను (ఆత్మతత్త్వజ్ఞులతోను) సంపర్కము కలిగి యుండటము, అభ్యాసపూర్వకంగా వైరాగ్యము కలిగి ఉండటము (Non attatchment as a practice) (దయ - ప్రేమ-స్నేహము -అమానిత్వము, అదంభిత్వము - అహింస-శాంతి మొదలైన) సదభ్యాసముల పట్ల ప్రవృత్తి కలిగి ఉండటము - ఇది రెండవ జ్ఞాన భూమిక అగు ‘‘విచారణ’’.

(3) తనుమానసీ భూమిక:

శ్లో।। విచారణా శుభేచ్ఛాభ్యామ్ ఇంద్రియార్థేషు రక్తతా
యత్ర సా తానుతామ్ ఏతి ప్రోచ్యతే ‘‘తనుమానసీ’’।।

విచారణ, శుభేచ్ఛల అభ్యాస ప్రభావము చేత (శబ్ద స్పర్శ రూప రస గంధములు అనబడే) ఇంద్రియార్థముల పట్ల అనురక్తి (Fondness) తరుగుచూ ఉండటము - ‘‘తను మానసీ’’ - అనబడుతోంది.

(4) సత్వాపత్తి భూమిక:

శ్లో।। భూమికా త్రితయ అభ్యాసాత్ చిత్తే తు విరతేః వశాత్
సత్వాత్మని స్థితే శుద్ధే ‘‘సత్వాపత్తిః’’ ఉదాహృతా।।

ఆ విధంగా శుభేచ్ఛ, విచారణ, తనుమానసలను అభ్యాసము చేస్తూ ఉండగా, చిత్తము ఆ అభ్యాసి యొక్క వశము అగుచూ, ఇంద్రియ విషయముల పట్ల అనురక్తి త్యజిస్తూ విరక్తి పొందసాగుచున్నది. ఆతడు విషయములలో రమించటము తగ్గించుకొని ‘‘సమస్తము ఆత్మయే’’ - అనబడు (‘‘విషయానురక్తి’’ నుండి) → ఆత్మతత్త్వానురక్తి’’ యందు ప్రవేశమును పొంది, దృశ్యము పట్ల ఆత్మభావన బలపడసాగుతుంది.. అట్టి శుద్ధమగు ‘‘సత్వాత్మ’’ యందు స్థితిని పొందటము - ‘‘సత్వాపత్తి’’ అనబడుతోంది. చిత్తము విషయము లందు వైరాగ్యము కలిగియుండి ‘‘స్వాత్మ’’ యందు ఈ దృశ్య జగత్తును ఆత్మకు అనన్యంగా చూడటమే ‘‘సత్వాపత్తి’’ యొక్క ఆరూఢత (Constant application).

(5) ‘‘అసంసక్తి’’ భూమిక:

శ్లో।। దశా చతుష్టయ (4) అభ్యాసాత్ అసంసర్గ ఫలాతు యా,
రూఢ సత్వ చమత్కారా ప్రోక్తా ‘‘అసంసక్తి’’ నామికా।।

‘‘శుభేక్ష, విచారణ, తనుమానసీ, సత్వాపత్తి’’ - అను (పైన చెప్పుక్ను) 4 భూమికలు అభ్యాసము చేస్తూ ఉండగా క్రమంగా ఆ ముముక్షువు ‘అసంసక్తి’ అనే పంచమ భూమికలో ప్రవేశము పొందుచున్నాడు.

మొదటి 4 భూమికల అభ్యాసముచే క్రమంగా ఆ అభ్యాసి తమో-రజో గుణములను అధిగమించి సాత్విక గుణములైనట్టి ప్రేమ, స్నేహము, సేవ, దైవోపాసన, ‘నీవు’ను దైవభావముగా చూడటము, కరుణ, దానము, ధర్మనిరతి, అహింస మొదలైన వాటితో కూడిన సత్వగుణ-అభ్యాసి అగుచున్నాడు. అట్టి సత్వ ఆరూఢతచే (Having come out of Dull / Gloomy state and work - holic tendency) ఆతని యందు దృశ్య విషయములతో సంగము (Relatedness), దానితో బాటే సక్తత (attatchment) సన్నగిల సాగుతాయి. ‘‘ప్రపంచములోని ఈ భౌతిక పదార్థములపైన, ఇక్కడి జనుల పరస్పర సంబంధములపైన ఆధారపడి ఉన్నవాడను కాను. పరిమితుడనుకాను. (Neither I am dependent upon nor restricted to worldly matters and relationships). అవన్నీ నిశ్చలాత్మ యొక్క సమక్షములో వస్తూ-పోతూ ఉండే దృశ్య నాటక కథాకల్పిత సంఘటనలవంటిది. వాటితో సక్తత (Attachment), ఆసక్తి (Inquisitiveness) నాకు ఉండవలసిన అవసరము, అగత్యము (Necessity and Inevitability) లేనే లేదు’’ - అను భావము పెంపొందసాగుతుంది.

ఈ రీతిగా అసంగస్థితిలో ఈతడు ఉండటం చేత, అది ‘‘అసంసక్తి’’ అనబడుతోంది.

(6) పదార్థ అభావన భూమిక:

శ్లో।। ‘‘భూమికా పంచక’’ - అభ్యాసాత్ స్వాత్మారామతయా దృఢమ్,
అభ్యన్తరాణాం బాహ్యానాం పదార్థానామ్ అభావనాత్
పర ప్రయుక్తేన చిరం ప్రయత్నేన అవబోధనమ్
‘‘పదార్థభావనా’’ నామ షష్ఠీభవతి భూమికా।।

ఐదు భూమికల అభ్యాసము కొనసాగుచూ ఉండగా, అట్టివాడు పదార్థాముల అభావనా స్థితికి చేరుచున్నాడు. పదార్థములను దాటివేసిన భావనాస్థితిని (A state of thought where thought objects are side - lined) చేరుచున్నాడు. పదార్థములలో విహరించటమును విరమిస్తూ స్వాత్మారామము (In the Zone / House of absolute self) నందు విహరించటము ప్రారంభిస్తున్నాడు.

దృఢమగు ఆత్మభావనను ఆశ్రయిస్తూ బాహ్య - అభ్యంతరములలో పదార్థముల అభావనచే (లేక ఆత్మభావనచే) ఆతని యందు ఆత్మారామభావన ప్రవృద్ధమవసాగుతుంది. పదార్థములుగా కనిపించేది ‘సత్యము’ కాదు. ‘‘ఆత్మగానే సత్యము’’ అను ఉత్తరోత్తరా ఉత్తమ భావన సిద్ధిస్తోంది.
- పదార్థముల వాస్తవ రూపభావనచే ‘‘పదార్థభావన’’ అని
- పదార్థముల ఆవల దర్శనముచే ‘‘పదార్థాభావన’’ అని కూడా ఈ 5వ భూమిక పిలువబడుతోంది.

‘‘పరమాత్మ ఈ సర్వజీవులలోను (అంతేకాకుండా) సమస్త జీవులుగాను కూడా ఉన్నారు కదా!’’.. అను రూపము గల ‘‘చిరకాలము అనుకోవటము’’ - అనే ప్రయత్నముచే ఏర్పడే ‘‘అవబోధన’’ (Constantly learned state)చే ‘పదార్థాభావన’ - అనే 6వ భూమిక సునిశ్చితము, సుస్థిరము అవుతోంది.

(7) తురీయ/తుర్యగా గతిః భూమిక:
శ్లో।। భూమి షట్క చిరాభ్యాసాత్ భేదస్య అనుపలంభనాత్
యత్ ‘స్వభావైక’ నిష్ఠత్వం సా జ్ఞేయా తుర్యగా గతిః।।

(పైన చెప్పిన) ఆరు భూమికల చిరకాల - అభ్యాసము చేత భేద దృష్టులన్నీ ‘సమదృష్టి’ యొక్క ‘‘విజ్ఞత’’యందు విలీనమై పోసాగుతాయి.

అనేకముగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఈ సమస్తము సర్వదా ఏకముగా అనిపించటము-పరిఢవిల్ల సాగుతుంది.

♠︎ పాత్రలు వేరువేరైనా - నాటకము ఒక్కటే అయినట్లు।
♠︎ నవలలో సంఘటనలు వేరువేరైనా కూడా, రచయిత యొక్క ‘రచనాకళ’ (The Art of writing) ఒక్కటే అయినట్లు।
♠︎ వాయువు అనేకచోట్ల అనేక వేరువేరైన ప్రదర్శనా విశేషములు కలిగియుండి కూడా, వాయువు ఏకమే అయినట్లు।
♠︎ తరంగములు వేరే అయినప్పటికీ సముద్రజలము ఒక్కటే అయినట్లు।…..,
తరంగములలో జలమును, వాయు వీచికలలో వాయువును, కథలోని పాత్రల వెనుక రచయితను దర్శించుతీరుగా ఈ భూమికలో ‘‘ఆత్మయొక్క స్వభావమే ఇదంతా’’ అను స్వభావైక నిష్ఠత్వ దృష్టి, దర్శనములను వీడక ఉండటము - ‘‘తుర్యగా గతి’’ అనబడుతోంది.

అట్టి తుర్యావస్థ జీవన్ముక్తులయందు స్వాభావికమై, అనునిత్యమై, అకృత్రిమమై ఉత్తరోత్తర స్థితికి దారితీయునదై ఉన్నది.


తురీయాతీతము

ఇక ఈ ‘7’ భూమికలకు ఆవల తురీయాతీతము. ఇప్పటివరకు చెప్పుకున్నది ‘జీవన్ముక్తి’కి సంబంధించినవై ఉండగా, ఇక ఆపై ‘తురీయాతీతము’→ విదేహముక్తికి సంబంధించినది.

తురీయమును కూడా దాటినట్టిది - తురీయాతీతము.

హే నిదాఘమహాశయా! మహాభాగా! 7వ భూమికను ఆశ్రయించినవారు -
ఆత్మా-రామాం : - సర్వదా అఖండాత్మ భావన యందు నిర్ద్వంద్వంగా రమించుచున్నవారై, ఆత్మయే ఆరామముగా కలవారై,
మహాపదమ్ ఆగతాః - ‘ఆత్మమేవాఽహమ్’ - నేనే ఆత్మను - అనే మహాపదమును అధిష్ఠించి,
మహాత్మాన్ అస్తే - ఈ సమస్తము ఏ కేవలాత్మ యందు అలంకారప్రాయమై కనబడుతోందో, అట్టి ఆత్మయే (లేక) బ్రహ్మమే నేను - అయినట్టి ‘నిశ్చలానుభవము’ పొందినవారగుచున్నారు.

జీవన్ముక్తా న మజ్జన్తి సుఖ-దుఃఖ రస స్థితే - అట్టి జీవన్ముక్త పరాకాష్ఠులు- ఇక ప్రకృతి స్వాభావికములగు సుఖ-దుఃఖ రసములలో మునుగరు.

నిదాఘుడు : మహనీయా! అట్టి విదేహముక్త స్థితి సిద్ధించుకున్నవారు కర్మలు నిర్వర్తిస్తారా? లేక అన్నీ వదలివేసి ఉంటారా?

ఋభుమహర్షి : వారు ప్రాప్తించిన కార్యములను కించిత్ నిర్వర్తిస్తూ ఉండవచ్చు. లేక ఏదీ నిర్వర్తించకనూపోవచ్చు. ‘కర్మలు చేయటము, మానటము’ - ఈ రెండూ కూడా విదేహముక్తుల పట్ల ఆచరణ నియమము కాదు. నిషిద్ధము కాదు. అసలు విదేహముక్తి కర్మలకు సంబంధించినదే కాదు.

ఒకడు నిద్రపోతూ ఉండగా ప్రక్కవారెవరైనా నిదురలేపి ఏదో చిన్న సహాయము (Help) అడిగితే అది నిర్వర్తించి, మరల వెంటనే నిదురలోకిజారుకుంటాడు చూచావా? సత్పురుషులగు జీవన్ - విదేహముక్తులు కూడా తోటివారి సానుకూల్యత-ప్రాతికూల్యతలను దృష్టిలో పెట్టుకొని నిర్వర్తించటము స్వాభావికము. ఎందుకంటే, ఆత్మభావనచే వారు పరాప్రేమస్వభావులై ఉంటారు.

ఓ నిదాఘా! పశువులు, మ్లేచ్చులు అయి ఉన్నప్పటికీ, ఎవ్వరైతే మనము చెప్పుకున్న సప్త (7) జ్ఞాన భూమికలను అభ్యాసము చేయటము ప్రారంభిస్తారో, వారు జీవన్ముక్తులు, విదేహముక్తులు తప్పక కాగలరు. అట్టి ఈ సప్త జ్ఞాన భూమికల వరకు ప్రయత్నించి సంచరించువారు ముక్తులే! ఇందులో సందేహమే లేదు.

సదేహముక్తులు : ‘‘దేహము కలిగి ఉన్నప్పటికీ ‘దేహి’గా ఆత్మనే! అఖండాత్మనే! సర్వదా అప్రమేయ నిర్మల-కేవల - సర్వగత- సర్వాతీత-ఆత్మని కానిక్షణమే లేదు’’

విదేహముక్తులు : నేను భౌతిక దేహరహితుడును. విశ్వమంతా నాదేహమే. విశ్వరూపుడను. అన్ని రూపములు నావేకాబట్టి రూపరహితుడను. సమస్తము నేనే అగుచూ కూడా ఏదీ ఏక్షణములోను కానట్టివాడను! జగత్ రహితుడను, జగత్ సహితుడను కూడా!

గ్రంథి = ముడి

ఈ సృష్టి సృష్టించబడినది - బ్రహ్మగ్రంథి
ఇది కొనసాగుచున్నది - విష్ణుగ్రంథి
ఇప్పుడు ఇది లయమగుచున్నది - రుద్రగ్రంథి

జ్ఞప్తిర్హి గ్రంథి విచ్ఛేదః। తస్మిన్ సతి విముక్తతా। ‘‘ఈ విశ్వము కల్పనామాత్రము. ఈ జీవుడు కేవలస్వరూపుడు. ఈతడు సమస్తము కల్పించువాడు. సర్వదా పరమై, నిత్యముక్తుడై ఉన్నాడు. ఈ సృష్టి స్వతఃగా ఎప్పుడూ లేదు. భావనచే కల్పించబడేది మాత్రమే! భావనకు ఆవల ‘భావన’ జనించుస్థానమే నేను’’ - అను స్వానుభూతియే గ్రంథి విచ్ఛేదము (లేక) గ్రంథి విముక్తి. అట్టి హృదయగ్రంథి విముక్తియే ఆత్మజ్ఞానము.

‘‘మృగతృష్ణలో జలము ఉన్నదా? లేనే లేదు. అట్లాగే సమష్టి అహంకారము మొదలుకొని, ‘ఈ దేహమునకు చెందిన ‘నేను’ అను ‘‘వ్యష్టి అహంకారము’’ వరకు, ఇంకా ‘నీవు’.. ఇవన్నీ కూడా స్వతఃగా లేవు. అహ్రాంతిచే కల్పించబడి పొందబడుచున్నాయి’’ - అను ఎరుక నిశ్చలము అవగా, అహ్రాంతులన్నీ నశించినప్పటి స్థితియే ముక్త స్థితి. అదియే జీవన్ముక్తి, విదేహముక్తి కూడా. అది సమస్తము ఆత్మయందు భావనగా శమించినట్టి పరమ శాంత స్థితి. ఎవ్వరైతే సర్వాహ్రాంతులు తరంగముల వలె ప్రవహిస్తున్న ‘‘మోహము (Illusion)" అనే సముద్ర జలమును దాటుతారో - వారే పరమ పదమును ప్రాప్తించుకోగలరు.

ఎవ్వరైతే -‘‘ఈ జగద్విషయములను జయించి నా యొక్క స్వభావసిద్ధమైయున్న ఆత్మ గురించి అధ్యయనము చేస్తాను. ఆత్మతత్త్వము ఎరిగినవాడనై ఆత్మస్వరూపుడనై ఆత్మానందమును పొందుతాను’’ - అను రూపంగా స్వాత్మారామ పరాయణులౌతారో, వారే సప్తజ్ఞాన భూమికలలో ప్రవేశము పొందుచున్నారు.

యోగము

మనస్సును ఆత్మయందు సశాంతింపజేయుటమునకు ఉపాయమే ‘యోగము’ అని చెప్పబడుతోంది. మనః ప్రశమన - ఉపాయో ‘యోగ’ ఇతి అభిధీయతే।। అట్టి యోగము యొక్క అభ్యాసమే మనము సప్తజ్ఞాన భూమికలుగా విడదీసి, అభివర్ణించి సక్షిప్తంగా చెప్పుకొన్నాము. అట్టి సప్తజ్ఞాన భూమికల అంతిమ లక్ష్యము - ‘‘పరబ్రహ్మపదమే’’ గాని, మరింకొకటేదీ కాదు.

అట్టి పరబ్రహ్మపదము (లేక) స్థానము ఎటువంటిది?

అదియే జీవన్ముక్తులు, విదేహముక్తులు కూడా విహారము చేయుచుండునట్టి ఆత్మపదము (లేక) పరబ్రహ్మస్థానము.

పరబ్రహ్మానుభవము ఎట్టిది?

ఇంకా కూడా అట్టి ‘పరబ్రహ్మము’ లేక పరమాత్మతత్త్వము (సదేహ-విదేహ ముక్తుల స్వానుభవంగా) ఎటువంటిదంటే,…

⌘ అది సత్ (ఇంద్రియములకు విషయమై ఉన్నది) కాదు. అసత్ (లేనట్టిది) కాదు. సత్ (ఉన్నది) - అసత్ (లేనిది)ల మధ్య (In Between) కూడా కాదు.
న సత్। న అసత్। న మధ్య-అన్తమ్। (సదసత్ = ‘‘సత్-అసత్ కూడా’’ - అయినది కాదు. సత్తుకు గాని, అసత్తుకుగాని ఆవలగానో (లేక) ఈవలగానో ఉన్నది కాదు (నాన్తమ్)।
⌘ ఈ దృశ్యములో ఒక వస్తువు కాదు. ఈ సమస్త దృశ్యము పరబ్రహ్మము కాని క్షణము లేదు. - న సర్వం, సర్వమేవ చ।
మనో వచోభిః అగ్రాహ్యం। మనస్సుచేత, వాక్కుచేత గ్రహించబడనిది. గోచరము కానిది. అవాక్ మానస గోచరము. మాటలకు, ఆలోచనలకు విషయమేకాదు. అయితే ఆ రెండు ఉపకరణములుగా-అగుచూ ఉండగా, అవగాహనగా బుద్ధికి సిద్ధించగలిగేది.
⌘ అది శూన్యమా? కాదు. పూర్ణము. పూర్ణమునకే పూర్ణము. పూర్ణాత్ పూర్ణమ్।
ఈ జగత్తులన్నీ అందులోంచే ప్రదర్శనమౌతూ ఉంటే, అది శూన్యమెట్లా అవుతుంది?
⌘ సుఖమునకే సుఖము. సుఖాత్ సుఖమ్।
⌘ తెలియబడే - చూడబడే ఏ వస్తువు వంటిదీ కాదు. అసంవేదనమ్। అది స్వహృదయమునందే అనుభవైకవేద్యము.
⌘ శాంతిరూపము కూడా కాదు. అశాంతమ్। ‘శాంతి’కే సాక్షి।
⌘ ప్రతి జీవుని స్వస్వరూపముగా స్వ-అంతరముననే తెలియబడునది. ఆత్మవేదనమ్। సూచనలు, సాధనలు, ధారణలు- అందుకు ఉపాయములు. అది ఎవరికివారే తమకు తాముగా తామై తెలుసుకోవలసినది.
⌘ సర్వత్రా సర్వదా వేంచేసియే ఉన్నట్టిది. ఆతతమ్। అద్దానికొరకై మర్కెడికో వెళ్ళవలసిన పనిలేదు.
⌘ సర్వ పదార్థముల సత్తాస్వరూపమే - అయ్యది! ఈ దృశ్యమునకు వేరై ఎక్కడో ఉన్నది కాదు. సత్తా సర్వపదార్థానాం, న - అన్య సంవేదనా దృతే। ఈ కనబడే సమస్తము అదియే అయి ఉన్నది. వేరుగా మరెక్కడో ఉన్నది కాదు. కనిపించేదంతా అదే అయి ఉండగా కన్నుమూతలెందుకు?
⌘ ద్రష్ట (perceiver) - దృశ్యము (Object)ల సంబంధము యొక్క మధ్యగా దృష్టి చైతన్యరూపముగా ఏర్పడినదై ఉన్నట్టిది - సంబంధే ద్రష్టృ దర్శన దృశ్యానాం మధ్యే దృష్టిర్హి యత్ వపుః। విషయ రహిత దృష్టి (నిర్మలదృష్టి)యే అద్దాని ఉనికి - ప్రదర్శనల స్వరూపసూచకము.
⌘ ఇక్కడ కనిపిస్తూ ఉన్నట్టి ద్రష్ట - దర్శన - దృశ్యములకు (Perceiver - Perception - Object being perceived)లకు పరమై, ఆ మూడూ కూడా లేనట్టిది. అందుచేత ‘దృక్’ స్వరూపము. కేవల సాక్షి. సమస్తము బయల్వెడలేస్థానము.

ఓ నిదాఘా! ‘‘నీవు, నేను’’ కూడా అట్టి అఖండమగు పరబ్రహ్మ స్వరూపలమేనయ్యా! ఆ తత్-పరబ్రహ్మమే - మన యొక్క సమస్త సందర్భ స్వరూపములకు ఆధారమై, సహజస్వరూపమై, సమస్తమునకు అప్రమేయమై అనునిత్యముగా వెలుగొందుచున్నది. అది నిర్మలబుద్ధికి స్వానుభవ విషయము.

అట్టి పరమాత్మను బుద్ధితో దర్శించటానికై, ఒకానొక స్థానము సూచనగా చెప్పుచున్నాను. విను.
✷ ఈ చిత్తము ఒక విషయము నుండి మరొక విషయమువైపుకు ప్రయాణిస్తూ ఉండగా ఆ ఉభయ విషయముల మధ్యగా విషయ రహితమై - ఏ ‘చైతన్యము’ కేవలమైయున్నదో,… అట్టి అజాడ్యము (జడము కానట్టిది), సత్-విత్ (కేవలమగు ఉనికి-ఎరుక) స్వరూపము, ఉత్తేజితరూపముగా ప్రకాశమానమై ఉన్నదో..,

ఒక విషయము → { మధ్యగాగల విషయరహిత ‘యోచనా చైతన్యము’ } → మరొక విషయము

✷ ఎద్దాని రూపము జాగ్రత్- స్వప్న-సుషుప్తులకు ముందే ఉండి ఉండటం చేత ‘సనాతనము’ అని చెప్పబడుతోందో, ‘పరము’ అనబడుతోందో,
✷ మనో దేహ బుద్ధి సంబంధమైన సర్వ కదలికలకు కారణమగుచు తాను ఏ మాత్రము కదలిక లేనట్టిది కాబట్టి ‘అచేతనము’ అని కూడా అనబడుచున్నదో..,
✷ ఏది - జాగ్రత్‌లోనికి, స్వప్నములోనికి, సుషుప్తిలోనికి, దేహ-దేహాంతరములలోనికి ‘రావటము - పోవటము’ అను ధర్మమే లేనిదై, సర్వదా యథాస్థితమో,
✷ అది శిలవలె నిశ్చలమై ఉన్నప్పటికీ సర్వచేతనములకు కారణ-కారణము కాబట్టి ‘చైతన్యరూప శిలా-హృదయము’ అని అభివర్ణితమో,
✷ సర్వ ఆలోచనలకు మునుముందే ఆలోచించువానిని (The Thinker) కల్పించుకొనుచున్న చేతన రూపమవటంచేత ‘అమనస్కము’ అయి ఉన్నదో..,
అట్టి ఆత్మను బుద్ధితో గ్రహించి, అదియే నీవు అయి ఉండును.

నీవే బ్రహ్మమై (ఆభరణములో బంగారమువలె) తన్మయుడవై ప్రశాంతుడవగము. చిత్తము (ఇష్టము+ఆలోచనలను) దూరముగా పరిత్యజించి, అప్పటికీ ఏది అది అయి ఉన్నవో అదియే అయి సుస్థిరుడవై ఉండెదవుగాక. ప్రశాంత-అవ్యాజానంద స్వభావుడవు అయ్యెదవుగాక. చిత్తం దూరే పరిత్యజ్య, యోఽసి సోఽసి స్థిరోభవ।।

ఈ జగద్దృశ్యము ఎటువంటిది?

ఆకాశము శూన్యమే (Has no matter) అయినప్పటికీ, ఆకాశములో వస్తు ధర్మము అయినట్టి ‘నీలము’ - దృష్టి యొక్క ఉల్లసిత్వముచేత- కంటికి అగుపిస్తూ ఉంటుంది కదా! అదేవిధంగా నిర్విషయమగు పరమాత్మతత్త్వము నందు మనస్సు యొక్క ఉల్లాసము చేతను, స్వకీయ భావనా విశేషముచేతను-సవికల్ప జాలమయినట్టి ఈ దృశ్య జగత్తు మహత్తర విశేషమైనట్లుగా అగుపిస్తోంది. ‘నీలము’ అనునది శూన్యకాశమే అయిన తీరుగా, ఈ జగద్దృశ్యము శూన్యము - పూర్ణము కూడా అయి ఉన్న ఆత్మయే.

♠︎ పరమాత్మతత్త్వము నుండి ముందుగా మనస్సు జనిస్తోంది.
♠︎ మనస్సు చేతనే దృశ్య రూప జగత్తు వ్యాప్తరూపముగా విజృంభింప జేయబడుతోంది.

‘‘ఆకాశములో నీలము ఉన్నది’’ - అని ఎవ్వరైనా అంటే, అది అధ్యారోపము (Illusionary attribution) మాత్రమే! అట్లాగే ‘‘ఆకాశము ఉన్నది’ - అనటము అపవాదము (mis-conception) మాత్రమే! అట్లాగే..,

సర్వదా చిదాకాశమే ఉన్నది. ‘మనస్సు’ అనబడునది మొదలే లేదు. ‘ఉన్నది’ అని అనటము అధ్యారోపము మాత్రమే! (లేక) అపవాదము మాత్రమే।

చిత్తము (లేక) మనస్సు యొక్క రూపము ‘‘సంకల్పించటము’’ అనే (ఆత్మయొక్క) క్రియావిశేషము మాత్రమే, (లేక) కల్పనా చాతుర్యము మాత్రమే!

సంకల్పముల సంక్షయిస్తేనో? చిత్తము కూడా లేనిదై సంక్షయిస్తుంది. సంకల్పములు ఉంటే చిత్తము, ఆ చిత్తమునకు విషయమై (ఆత్మకు అన్యముగా అనిపించే) జగత్తు ఉంటుంది. కనుక చిత్తమే జగత్తు.

శరత్కాలంలో ఆకాశము, మేఘరహితమై నిర్మలంగా ప్రకాశిస్తుంది కదా! అట్లాగే సంకల్పములు ‘రహితము’ అయినప్పుడు - ఏకము, అజము (జన్మరహితము), ఆది- అంత రహితము, ఆది- అంత-మధ్య స్వరూపము-అగు ఆత్మ నిర్మలముగా, ప్రశాంతముగా అనుభవమవగలదు. అట్టి అనంత - అఖండ - కేవలాత్మయే మన సహజ స్వరూపము.

ఎవ్వరియొక్క ఏకర్తృత్వమూ లేకుండానే, ఏ రంగము (Place / Canvass) లేకుండానే, చిత్రకారుడు - రంగులు లేకుండానే-ఆకాశములో అనేక చిత్ర విచిత్రములన్నీ భౌతికమైన కంటికి కనిపిస్తూ ఉంటాయి కదా!

ఈ జగత్తు కూడా,.. ద్రష్ట లేకుండానే (అద్రష్టం) దృశ్యము వచ్చినట్లుగాను, నిద్రపోయేవాడు లేకుండానే స్వప్నదృశ్యము రూపము చెంది ఉన్నట్లుగాను - సాకారంగాను, అనుభవైక వేద్యముగాను, ఉన్నట్లుగాను అగుపిస్తోంది.

ద్రష్ట లేకుండా దృశ్యము ఉండదు. కల కనేవాడు లేకుండా ‘కల’ ఉండదు. అట్లాగే జగత్తు స్వతఃగా లేదు. అనుభవియొక్క కల్పనయే ఇదంతా.

దర్పణం - నిరిచ్ఛ ప్రతిబింబము

దర్పణము యొక్క ఇచ్ఛగాని, వస్తువు యొక్క ఇచ్ఛగాని లేకుండానే దర్పణములో దృశ్యము ప్రతిబింబిస్తూ కనబడుచూ ఉన్నవిధంగా - కేవల సాక్షిభూతము, సర్వసమము, స్వచ్ఛము, నిర్వికల్పము అగు చిదాత్మ అనే దర్పణమునందు ఎట్టిఎవ్వరి ఇచ్ఛ లేకుండానే ‘జగత్తు’ అనే సాకార దృశ్యము, అందులో అనేక విశేషాలు కనిపిస్తున్నాయి. స్వప్నంలో దృశ్యమువలెనే జాగ్రత్ దృశ్యము నిరాలంబమై నిర్విషయాత్మ యందు సవిషయమై అగుపిస్తోంది. చిత్తము తన చంచలత్వమును జయిస్తే ‘‘ఇదంతా ఆత్మయొక్క విన్యాసమే। శివతాండవమే’’ - అనునది బుద్ధికి సుస్పష్టమవగలదు.

చిత్త చాంచల్య జయము

ఓ నిదాఘా!

చిత్తము యొక్క చాంచల్యము చేతనే ఈ జగద్దృశ్యము, ద్రష్ట కూడా అఖండాత్మకు వేరైన ఉనికి పొందినట్లు అగుపిస్తున్నాయి.

అట్టి ‘‘ఆత్మ వేరు - దృశ్యము వేరు’’ అనే మనో-చిత్త కల్పితమగు భేదదృష్టిని జయించటానికై ఉపక్రమించు. ‘‘ఏకము, అఖండము, సర్వాత్మకము అగు బ్రహ్మమే ఈ దృశ్య జగత్తు యొక్క వాస్తవ రూపము, స్వభావము కూడా!’’ - అను భావనను అనుక్షణికంగా ప్రయత్నపూర్వకంగా ఆశ్రయించినవాడివై ఉండెదవు గాక!

శిలపై రేఖలు - ఆత్మశిలపై లోకములు : ఒక పెద్దశిల. ఆ శిలపై అనేక చిన్న - పెద్ద రేఖలు. అయితే ‘రేఖలు’ ఉన్నచోట, రేఖల - రేఖల మధ్యగా ఉన్న ప్రదేశము - సమస్తము శిలయే కదా! శిలయొక్క ఈ చివర - ఆ చివర, ఈ ఆకారము - ఆ ఆకారము -> సమస్తము శిలయే కదా! శిల్పముగా మలచబడి, సాకారముగా (శివ, విష్ణు ఇత్యాది విగ్రహములుగా) కనిపిస్తున్నదంతా శిలయే కదా!

‘ఏకము’ అయి ఉన్న ‘పరబ్రహ్మము’ అనే ఒక మహాశిల ‘లోకములు’ అనే శిలయే. (మరియు) ‘అనేక జీవులు’ అనే అసంఖ్యాక చిన్న-పెద్ద రేఖలతో నిండియున్నప్పటికీ, సమస్తము సర్వదా పరబ్రహ్మమే.

జగత్తుకు జనన స్థానము ఏది?

ఆత్మ అద్వితీయము. అద్దానికి ‘ద్వితీయము’ (Something secondary or next) అనునది ఉండటానికే వీలులేదు. ‘ఆత్మ అద్వితీయము’ అనునని వేద-వేదాంత-ఋషి-ఆత్మతత్త్వజ్ఞుల మహావాక్య సిద్ధాంతము. ‘ద్వితీయము’ అను కారణము అభావము (లేనిది) అవటం చేత అనుత్పన్నం ఇదం జగత్। ఈ జగత్తు అనునది ఉత్పన్నమవనే లేదు.

ఆహా!
→ ఇప్పుడు తెలుసుకోవలసినది తెలుసుకున్నాను. జ్ఞాతం జ్ఞాతవ్యం అధునా।
→ చూడవలసినదగు ‘ఆత్మ’ అను అద్భుతమును దర్శించుచున్నాను. దృష్టం ద్రష్టవ్యమ్ అద్భుతమ్।
→ అనేక జన్మలుగా దృశ్యముచే సంబంధీకుడనై అనేక భేద దృష్టులను కొనసాగిస్తూ వచ్చిన శ్రమంతా శమించగా ‘‘సమస్తము స్వకీయ ‘‘ఎరుక’’ యొక్క విస్తరణ రూపము మాత్రమే. అట్టి చిన్మాత్రమునకు వేరై కించిత్ కూడా ఎక్కడా ఏదీ లేదు’’ - అను ఆత్మతత్త్వజ్ఞానముచే పరమ విశ్రాంతి ఇప్పుడు నాకు లభిస్తోంది.
→ సందేహములన్నీ విశ్రాంతి పొందగా, కౌతుకమంతా విగతము (Passed away completely) అవగా కల్పనాజాలము నిరస్తము అవగా (రహితమైపోగా) - అప్పటికీ శేషించియుండునదే ‘నేను’. అదియే ‘నీవు’. అదియే ఈ ‘జగత్తు’।

‘‘పరమ పదము’’

ప్రశాంతించిన ‘చిత్తము’ కలవారు, స్వధర్మోపాసనానిష్ఠులు, అల్ప-దుష్ట ధ్యాసలతో కూడిన కర్మల నుండి విరమించినవారు, ఉత్తమ బుద్ధి-శాంత బుద్ధి కలవారు, మనస్సును ఆత్మాభావనచే అమనస్కము (లేక) విమనస్కనము చేసినవారు - ‘భౌమాస్థానము’ అగు ‘సర్వాత్మక మహాత్మత్వము’ను ప్రాప్తించుకొనుచున్నారు.

ఎవ్వరైతే ఆత్మ విచారణ యందు శ్రద్ధ - భక్తి - ఆసక్తులతో తమను తాము నియమించుకుంటారో, బుద్ధియొక్క జగత్ సంబంధమైన సర్వ వృత్తులను (భేదవృత్తులను) త్యజించి ఉంటారో, మనన రూపమగు మనస్సును కించిత్ పరిణతము (Matured) అగు మనో విభాగముతో ఆక్రమించి ఉంటారో - అట్టి వారికి బ్రహ్మభావము స్వాభావికమై అనుభవము కాగలదు.

ఇంకా కూడా..,
స్వాభావికమగు విజ్ఞానరూప కేవల స్వస్వరూపము ఎవరి పట్ల సంప్రీతమగుచున్నదో - విను.

తత్త్వజ్ఞుని స్వాభావిక విలక్షణ లక్షణములు:
⌘ వదలవలసినది (దృశ్యమును) వదలవలసినంతగా వదలినవాడు-అగుచున్నాడు. ఆశ్రయించవలసిన - పట్టుకోవలసినట్టి (ఉపాదేయము అయినట్టి) సమస్తమునకు పరమైనది (ఆవల) అయి యున్న ఆత్మను పట్టుకొనవలసినంతగా పట్టుకున్నవాడై ఉంటున్నాడు.
⌘ ద్రష్టనే దర్శించుచు, అన్యము అయినదంతా (ద్రష్టకు వేరైనదంతా) సంపూర్తిగా త్యజించినవాడు అగుచున్నాడు.
⌘ విజ్ఞాతవ్యము (అవశ్యము తెలుసుకోవలసినది) అయినట్టి ‘‘పరతత్త్వ జ్ఞానము’’ గురించి జాగరుకుడై జీవితమును సద్వినియోగపరచుకొనుచున్నాడు.
⌘ ఇంద్రియములకు విషయములుగా కనిపిస్తున్న సమస్త విషయములపై రాగ-ద్వేషములుగాని, సంగముగాని, అసంగముగాని లేనివాడు, (నిరుపాసంగం) - అగుచున్నాడు.
⌘ పరమాత్మకు ద్వితీయముగా ఎక్కడా ఏదీ దర్శించనివాడు. దేనియొక్క ఆశ్రమమునకూ ఏ మాత్రము పరిమితము కానివాడు (నిరుపాశ్రయుడు) - అయి ఉంటున్నాడు.

వినిర్యాతి మనో మోహాత్ విహంగః పంజరాత్ ఇవ। అట్టివాడు పంజరములో చిక్కుకున్న పక్షివలె ప్రవర్తించు మనస్సు యొక్క మోహపంజరము నుండి విడివడినవాడవగలడు.

ఏ హృదయము శాంతము వహించినదై, సందేహములన్నీ తొలగగా-కౌతుకములన్నీ తొలగి ఆత్మభావనచే ఆత్మగా పరిపూర్ణము అగుచున్నదో - అట్టి హృదయము పున్నమినాటి పూర్ణచంద్రునివలె పరమప్రశాంతముగాను, తేజోసమన్వయముగాను విరాజిల్లగలదు.

‘‘అహమ్(నేను)’’గాని, ‘‘త్వమ్-నీవు’’ గాని వాస్తవానికి ఆత్మకు వేరై లేవు. సర్వే సర్వత్రా సర్వదా నిరామయమగు బ్రహ్మమే ఉన్నది. అట్టి బ్రహ్మమే నేను అయి ఉన్నాను. (అహంబ్రహ్మాస్మి). అదియే నీవు కూడా (తత్‌త్వమ్)!

ఈ విధంగా -

మహ-ఉపనిషత్-సత్-నేను-బ్రహ్మము

సత్ - అసత్‌ల మధ్యగా (నీవు-నేను మధ్యగా) ఏ కేవలమగు సత్తామాత్రస్థితి (The Absolute presence with absolute sense Viz, "I am existent)గా వెలుగొందుచున్నదో - అద్దానినే సర్వత్రా జగత్తుగా, నీవుగా వెలుగొందుచూ ఉన్నట్లుగా దర్శించువాడే - సరి అయిన దృష్టి, దర్శనము గల ‘జ్ఞాని’. ఆతడే ఉన్నది ఉన్నట్లుగా చూస్తున్నట్టివాడు.

ఆత్మదృష్టిని విడువకయే కర్మల నిర్వహణ

నిదాఘుడు : మహర్షీ! పితృదేవా! ఋభుదేవా! భావన-భావనల మధ్యగా, ద్రష్ట-దృశ్యముల మధ్యగా, ‘నీవు-నేను’ల మధ్యగా, సత్-అసత్‌ల మధ్యగా ఏ ‘‘నిర్వికల్ప చిదానంద సత్తాచైతన్యము’’ (లేక) ‘‘సత్తాసామాన్యము’’ ఉన్నదో, అద్దాని దర్శనమే పరమాత్మ దర్శనము’’ - అని మీరు దయతో సూచిస్తూ ఉన్నట్లుగా నేను గమనిస్తున్నాను. అవునుకదా?

ఋభుమహర్షి : అవును. అట్టి కేవలమగు ఆత్మ చైతన్యదర్శనము→ జన్మ-కర్మల వంటి సమస్త సంసార వ్యవహారములను దాటివేసినట్టిది. కేవలమగు స్వస్వరూపమే సమస్తము అయి, ‘పరమాత్మ’గా వేద-ఇతిహాస-పురాణములచే అభివర్ణించబడుతోంది.

నిదాఘుడు : జన్మించినది మొదలు ఆయా అవేక అనునిత్య కర్మ వ్యవహారములలో అనివార్యంగా నిమగ్నమౌతున్న మా మనోబుద్ధులకు అట్టి ‘‘ద్రష్ట - జగద్దృశ్యరహిత అహం-త్వమ్ రహిత ఆత్మచైతన్యము’’ అనుభవమై లభించటము దుర్లభమేకదా?

ఋభుమహర్షి : దుర్లభము కాదు. ‘‘ఈ ప్రపంచంలో అనివార్యంగా నిర్వర్తించవలసి వస్తున్న కర్మ వ్యవహారములు నిర్విషయ-కేవలాత్మ భగవానుని దర్శనమునకు అడ్డుగోడలు - అనునది ….
(1) ఆత్మ తత్త్వము యొక్క అధ్యయనము (2) ఆత్మోపాసన (3) ఆత్మాతాదాత్మ్యము
అనే త్రిపుటీస్థానమునకు సిద్ధమే కానప్పటి ఒకానొక బలహీనమైన అభిప్రాయము మాత్రమే.

జీవన్ముక్తి-విదేహ ముక్తులకుగాని, మోక్షము - కేవలాత్మాహమ్ స్థానమునకు గాని ‘ఇక్కడి నియమిత కర్మలు అడ్డు’ అని ఎక్కడా చెప్పబడనేలేదు. కర్మలను సన్న్యసించటమంటే ‘‘అల్పమైన దృశ్య-ఆశయములను త్యజించండి. మహదాశయముతో, ఆత్మోపాసనాభావముతో స్వధర్మసంబంధమైన కర్మలు నిర్వర్తించబడు గాక’’ - అనునదే శాస్త్రముల, తత్త్వజ్ఞుల హృదయము.

శ్లో।। అయత్న ఉపనతేషు అక్షిః దృక్ ద్రవ్యేషు యథా మనః
కళ్ళలో గల ‘చూపు’ అనే ఇంద్రియము ఎదురుగా గల ఒక దృశ్య వస్తువుపై ప్రసరించినప్పుడు మనస్సు ఆ వస్తువును ‘ఇదికదా’ అని రాగము లేకుండానే గుర్తించగలదుకదా!
నీరాగమేవ పతతి తద్వత్ కార్యేషు ధీరధీః
అట్లాగే, ధీరుని (ఉత్తమ ‘ధీ’శక్తి గలవాని) బుద్ధి- ఆయా నిర్వర్తించబడుచున్న - నిర్వర్తించని కార్యములలో, ఎట్టి రాగము లేకుండా - నిర్వికారంగా పాల్గొన గలదు.

మనమంతా కూడా మనస్సును, బుద్ధిని కొన్ని కొన్ని విషయాలలో రాగ రహితంగా నియమిస్తూనే ఉన్నాము. కొన్ని విషయాలలో మాత్రమే రాగము కలిగి ఉండటము జరుగుతోంది. కనుక ఈ జీవుడు సమస్త కార్యవ్యవహారములలో రాగా-ద్వేషరహితుడై వ్యవహరిస్తూ ఉండటము సుసాధ్యమే!

ఇక ఇంద్రియ విషయముల గురించి అంటావా? నిత్యానిత్యములు, ఆత్మతత్త్వము ఎరుగకుండానే ఇంద్రియ-విషయలోలుడై భోగించబడేదంతా ఈ జగత్తులో దుఃఖమే పర్యవసానముగా కలిగి ఉంటోంది. పరిజ్ఞాయ ఉప భుక్తోహి భోగో భవతి తుష్టయే। ఆత్మ గురించి పరిజ్ఞానము కలిగియుండి ఇంద్రియములతో విషయములను భోగించువాడు మాత్రమే ఇక్కడ దృశ్యములో ‘‘తుష్టి-సంతుష్టి-సంతృప్తి’’ పొందగలడు సుమా! (జ్ఞానవానేవ బలవాన్! జ్ఞానవానేవ జీవతి। జ్ఞానవానేవ సుఖవాన్।)

ఎవ్వరు తత్త్వమును ఎరిగి ఇంద్రియములను తమ అధీనములో ఉంచుకొని ధర్మబద్ధంగా విషయములను సేవించువారై ఉంటారో, వారికి మాత్రమే ఈ జగద్విషయములు ‘‘సంతోషము కలిగించటము’’ అనే ధర్మమును వదలక ఉంటాయి. లేదా, ఆ విషయములే శాశ్వత సంతోషము కలిగించకపోగా, ‘విష సమానము’ - అవుతాయి. ఒక దొంగ తన ప్రియమైన స్నేహితునితో మైత్రి-సేవ భావాలే కలిగి ఉంటాడుగాని, బాధించాలనో, దొంగిలించాలనో అనుకోడు కదా! అట్లాగే ఆత్మతత్త్వోపాసకుని పట్ల ఈ ఇంద్రియములు (అనే దొంగలు) ప్రేమభావము, సేవాభావమే కలిగి ఉంటాయి. ఆత్మజ్ఞాని పట్ల ఇంద్రియములు, ఇంద్రియ విషయములు అణకువ (Humbleness) కలిగి ఉంటాయి. భక్తిశ్రద్ధలు గల సేవకులు అవుతాయి.

నిదాఘుడు : ఆత్మజ్ఞానుల విషయంలో ఇంద్రియ భోగములు ఏవిధంగా వారిచే చూడబడతాయి?

ఋభుమహర్షి : ఒక బాటసారి తనకు అత్యంత ప్రియమైన ప్రదేశమును చూడటానికి, అక్కడ ఉండటానికి ఉత్సాహ- సాహస-విజ్ఞానములతో కూడుకొని బయలుదేరాడు. త్రోవలో ఏవేవో కొంచము ఆశ్చర్యకరమైన, సుందరమైన విశేషాలు కనబడ్డాయి. వాటిని చూచి తన ప్రయాణం విరమించి, ఆ బాటలో కూర్చునిపోతాడా? లేదు. చిరునవ్వుతో చూస్తూనే తాను వెళ్లవలసిన గమ్యమునకు నడక కొనసాగిస్తాడు కదా!

అట్లాగే, అఖండమగు ఆత్మను ఉపాసించి, సిద్ధింపజేసుకొనే కార్యక్రమములో నిమగ్నమై ఉన్న (యోగ-జ్ఞాన-భక్తి ఇత్యాది) ఉపాసకునకు మార్గమధ్యంలో సుఖ-దుఃఖ-సుందర విషయాలు తారసబడవచ్చుగాక। మనో నిగ్రహము కలవాని పట్ల అవన్నీ వచ్చేపోయే మార్గమధ్యంలోని విశేషాలుగా స్వల్పమాత్రమే అగుచున్నాయి.

ఇక్కడ ఇంకొక ముఖ్య విషయము. ‘మనో నిగ్రహము’ కలవానికి ఈ సమస్త జగద్విషయము (కర్మలు, దృశ్య విషయములు మొదలైనవి) ఉపకరణములే అవుతాయిగాని, అపకారకములు కావు.

శ్లో।। మనసో నిగృహీతస్య లీలా భోగో అల్పకో-పి యః
తమేవా లబ్ధ విస్తారం క్లిష్టత్వాత్ బహు మన్యతే।।

మనస్సును నిగ్రహించినట్టి మనోవిజయుల విషయంలో-భోగములు లేకున్నా, ఉన్నా కూడా.. వారి ఆనందమునకు లోటు ఉండదు. అనాయాసంగా లభించిన కొంచమునకే వారు విస్తారముగా, బహుగా తృప్తి -ఆనందములను కలిగి ఉండగలరు.

ఉదాహరణకు :-

ఒక మహారాజుగారు శత్రువులచే ఎక్కడో దట్టమైన అడవిలో కట్టివేయబడ్డారు. చాలాసేపు గడచింది. ఆకలితో నీరసించసాగారు. ఆకలితో విలవిల్లాడుచుండగా, ఎవ్వరో ఆటవికుడు అటువైపుగా వచ్చి చూడటం జరిగింది. ‘‘ఎవ్వరో కట్టివేయబడి ఆకలితో అలమట్టిస్తున్నారు పాపం’’… అని తలచి గబగబ వెళ్లి ఆతడు కట్లు విప్పి, రాజుగారిని బంధము నుండి విడిపించి చూశాడు. అప్పుడు గుర్తించాడు - ‘‘వీరు మన మహారాజు కదా!’’ అని!

ఆటవికుడు : ప్రభూ! మీరు ఆకలిగా ఉన్నారనుకుంటాను.

రాజుగారు : అవునయ్యా! అవును. నీవు నాకు కట్లు విప్పావు - సంతోషమే. కానీ ఆకలితో నాకు నోట మాట రావటల్లేదయ్యా! ఏమైన ఆహారము ఉన్నదా?

ఆటవికుడు : మహారాజా! ఆహారమైతే ఉన్నది. అయితే గడ్డిపచ్చడితో కలిపిన ఆహారము. మీరా, దేశమును పాలించే మహారాజు. అందుచేత, పదండి మిమ్మల్ని అంతఃపురానికి తీసుకువెళ్తాను.

రాజుగారు : వద్దులేవయ్యా! నీ దగ్గిర ఉన్న గడ్డిపచ్చడితో ఉన్న అన్నము, తోలుత్తిత్తి లోని నీరు ఇవ్వు.

బంధముక్తో మహీపాలో గ్రాస మాత్రేణ తుష్యతి।
ఆటవికుడు గడ్డిపచ్చడి కలిపి అందించిన అన్నపు ముద్దలను తింటూ, ఆ రాజుగారు - ‘‘ఇదేమిటయ్యా! ఇంతటి మధురమైన, అమోఘమైన, రుచికరమైన ఆహారము నేను ఎప్పుడూ తిననే లేదు’’ అని ఎంతో తృప్తిని ప్రకటించాడు. ఆహారము తింటూ, శత్రువులే లేనట్టి రాజ్యమును పాలించిన ఆనందం పొందాడు. సర్వసంపద ఆ ఆనందం పట్టలేక, ఆటవికుని గృహమును సంపదలతో ముంచివేశాడు.

ఈ కథలో వలెనే -
సంసార శృంఖములను ‘‘శాస్త్ర-గురు-విజ్ఞుల వాక్యములు’’.. అనే సహాయముతో త్రెంచివేసుకున్న ఆత్మతత్త్వానుభవి.. ఇక ఆపై ఏ కొంచెమునకు కూడా తృప్తి కలిగి ఉంటాడు. సర్వదా మహదానందమును విడువక, ఆత్మసుఖమునందే తేలియాడుచూ ఉంటాడు.

మనోజయము

అందుచేత ఓ నిదాఘా! మొట్టమొదట నీవు నీ మనస్సును జయించి నీ వశం చేసుకోవాలయ్యా!

శ్లో।। హస్తం హస్తేన సంపీడ్య, దంతైః దంతాన్ విచూర్ణ్య చ
అంగాని అంగైః ఇవ ఆక్రమ్య, జయేత్ ఆదౌ స్వకం మనః।।

చేతులు చేతులు నొక్కిపట్టి, పళ్ళతో పళ్లను కొరికి, శరీర అంగములను అంగములతో ఘర్షణ చేసి అయినా సరే, ముందుగా నీవు నీ మనస్సును జయించివేయాలి. సంసార సాగరమును దాటటానికి ‘‘మనస్సును జయించటము’’ తప్పితే వేరే ఉపాయమే లేదు. ఇక తక్కినవన్నీ మనస్సును జయించటానికి సహకారి-ఉపాయములు మాత్రమే!

చావు పుట్టుకల పరంపరలతో కూడిన ‘‘మహానరకము’’ అనే సామ్రాజ్యంలో ‘‘దుష్కృతములు (Bad Deeds), వాటి దుఃఖ పరిణామములు’’ అనే మదించిన ఏనుగులు విచ్చలవిడిగా అటూ-ఇటూ పచార్లు చేస్తున్నాయి. ఇక ఈ ఈజీవుని ఇంద్రియములు అనేక విషయములపై వ్రాలటం, అనేక ఆశలను కలిగి ఉండటం చేస్తున్నాయి. ‘‘ఆశలు తీర్చడం’’ అనే ధారణచే ఇంద్రియ శత్రువులను జయించటమనేది సాధ్యమైయ్యేది కాదు. (న జాతు కామః కామానామ్ ఉపభోగేన శామ్యతే)।

‘‘ఇంద్రియ విషయములను అంతరంగమున స్వీకరించకపోవటము’’ అనే అభ్యాసము చేత మాత్రమే చిత్తము యొక్క దర్పము క్షీణించగలదు. చిత్తము జయించబడుచూ ఉండగా హేమంత ఋతువులో పద్మమువలె భోగవాసనలు క్షీణించగలవు.

భేదవాసనలు త్యజించి ఏకతత్త్వమగు ఆత్మయొక్క దృఢ-అభ్యాసము లేకపోతే హృదయములో ‘వాసనలు’ అనే బేతాళుడు లొంగడు. భేదదృష్టులు ఉన్నంత వరకు మనస్సు జయించబడదు. భేదదృష్టులే సర్వత్రా పెత్తనం చెలాయిస్తాయి.

ఆత్మజ్ఞానముచే వివేకవంతుడై ఉన్న మనస్సు →
- ఆ జీవుని అభిమతములను (ఇష్టములను) నెరవేర్చటములో ‘సేవకుడు’గాను,
- సర్వ అర్థములు నెరవేర్చటములో ‘మంత్రి’ వలెను,
- ‘ఇంద్రియములు’ అనే శత్రుసేనను ఆక్రమించటములో రాజభక్తిగల సామంతరాజులవలెను,
సహకారము అందించునదై ఉండగలదు.

వివేకవంతుని (ఆత్మనిశ్చయము సిద్ధించినవాని) బుద్ధి - స్నేహశీలి అగు లలన (lady servant) వలెను, పాలించటములో ‘తండ్రి’ వలెను, ఉత్తమ కార్యములు చేయించటములో శ్రేయోభిలాషి (మంచి స్నేహితుని) వలెను ఉండగలదు.

శుద్ధ మనస్సు తండ్రివలె - (1) శాస్త్ర అధ్యయనము (2) బుద్ధిని సునిశితము చేయుటము (3) ఆత్మభావన (4) స్వానుభవమునకు దారిచూపునది - అయి, ఉత్తమ విషయములలో ప్రవేశింపజేయగలదు.

విషయముల నుండి వెనుకకు మరలి ఆత్మయందు (సమస్తము ఆత్మగా భావించుట యందు) నియోగించబడిన ‘మనస్సు’ అనే మణి - హృదయములో స్వచ్ఛముగా, దృఢముగా, జ్ఞానైశ్వర్యవంతముగా, ఆత్మలక్షణ సమన్వితంగా, రమణీయంగా ప్రకాశిస్తూ ఉండగలదు.

ఓ అనఘా! బ్రహ్మన్ ! నిదాఘా! ఒక విలువైన రత్నము బురదలో పడిపోతే ఏమి చేస్తాము? అట్లాగే వదలి ఉంటామా? లేదు. బయటకు తీస్తాము. బూడిదవంటి పదార్థములతో అనేకసార్లు తోమి, కడిగి, శుభ్రమైన వస్త్రముతో పరిశుభ్రము చేసి,.. అప్పుడు మెడలో ఆభరణముగా ధరిస్తాము కదా! అట్లాగే మనస్సు - అనే మణిని ‘‘వివేకము’’ అనే జలముతో ‘అవివేకము’ అనే బురదను తొలగించి, యోగాభ్యాసముతో ప్రక్షాళన చేసి, ‘ఆత్మభావన’ అనే కాంతి పుంజములు వెదజల్లునట్లుగా శుభ్రపరచి, ఇకప్పుడు ధరించాలి. అప్పుడు దృశ్యమంతా ఆత్మానందమయమై, ఆత్మకు అభిన్నమై (అట్టి శుభమగు మనస్సుచే) ఆస్వాదించబడగలదు.

పరమగు (ఆత్మస్వరూప-స్వభావ అధ్యయనమగు) వివేకమును ఆశ్రయించి, బుద్ధితో ‘సత్యము’ను దర్శించుచూ, ఇంద్రియములనే ‘శత్రువును జయించి భవసాగరమును {భవము = ఈ జగత్తు బాహ్యముగా (ఆత్మకు వేరుగా) - నిజముగానే ఉన్నది అనే భావతరంగములను} దాటి ఆవలి ఒడ్డుకు చేరెదవుగాక।

→ ‘‘ఈ జగత్తు నిజముగానే ఉన్నది. అస్తి’’.. అనుభావనా మాత్రం చేత అది సమస్త దుఃఖములు తెచ్చిపెడుతోంది - అని గమనించు.

→ (ఇదియే భవబంధము). ‘అనాస్తి’ (జగత్తు వాస్తవానికి లేదు) - అను భావనా మాత్రం చేత అట్టి భావన సర్వ సుఖాలకు ఆలయము అగుచున్నది. అందుచే ఓ నిదాఘా। ‘‘ఇంద్రియములకు విషయమై కనిపిస్తున్న ఈ జగత్తుగా ప్రకాశమగుచున్నది - ‘నేనే! మమాత్మయే!’’ - అను అభ్యాసమును - అట్లా అనిపించే వరకు - నిర్వర్తించు.

వాసనలు - ఆశ

ఈ జీవులు - ‘‘వాసనలు (Tendencies)’’ - అనే తంతువులచే బంధించబడి ‘‘జగత్తులు’’ అనే నిస్సార మరుభూమిలో (ఎడారిలో) దిక్కుతోచక ‘ఇటు నుంచి అటు - అటు నుంచి ఇటు’ పరుగులు తీస్తున్నారు. వాసనలు ‘‘ఆశించటము’’ నుండి బయల్వెడలుచున్నాయి. ‘ఆశ’ ఉన్నచోట దుఃఖములన్నీ (All worries) జట్టుకట్టుకొని వచ్చిపడతాయి. వివేక దృష్టి యొక్క సునిశితత్వముచే ‘ఆశ’ అనునది ఖండించబడిందా,.. సర్వ సుఖాలు వెతుక్కుంటూ వచ్చి ఈ జీవుని ఆశ్రయిస్తాయి.

‘‘స్వప్నములో కొన్ని కొన్ని విలువైన వస్తు జాలములు లభించాలి’’ అని ఆశించి ఎవ్వడైనా నిద్రకు ఉపక్రమిస్తున్నాడా? లేదుకదా! జాగ్రత్ కూడా స్వప్నము వంటిదే! ఇది గ్రహించినవాడు జాగ్రత్తులో కూడా ‘‘ఇంకా ఏదో కావాలి. పొందాలి’’-అని ఆశకు నిబద్ధుడు కాడు.

ఒకానొకడు ఎంతో తెలివి కలవాడు (ధీరుడు) అయినప్పటికీ, అనేక శాస్త్ర-లౌకిక విషయాలన్నీ తెలిసియున్నప్పటికీ, గొప్ప కులములో పుట్టినవాడు - సూక్ష్మగ్రాహి, చురుకుగలవాడు అయి ఉండి కూడా - ఒక సింహము బోనులో బంధించబడువిధంగా - ఆశల బోనులో చిక్కుకుంటున్నాడు. బంధములన్నీ నెత్తిమీదికి తెచ్చిపెట్టుకున్నవాడు అగుచున్నాడు.

ఎవ్వడైతే పురుషకారముచే ఉద్యమించి శాస్త్రము చెప్పు మార్గములో అనుద్వేగంగా యత్నశీలుడౌతాడో, జాగ్రత్‌ను స్వప్నతుల్యంగా త్యజించినవాడై ఉంటాడో, అట్టివాడు ఎవ్వడైనా సరే, - సిద్ధిని ఎందుకు పొందడు? తప్పక పొందుతాడు.

అహంకార త్రయము

అహంకారములు మూడు రీతులై ఉంటున్నాయి.
Ⅰ. సర్వమహమేవ-అహం కారము
Ⅱ. అతఃపరమహమ్ కారము
Ⅲ. దేహమేవాహమ్-కారము

Ⅰ. ‘‘సర్వమహమేవ-అహంకారము’’ (All this is what I am / I am all this) :
నేను-నీవు- అది-ఇది-ఆతడు -ఈతడు - సమస్తము పరమాత్మస్వరూపమే! పరమాత్మ నుండి ఏదీ ఎన్నడూ చ్యుతి పొందక, సర్వదా అచ్యుతమైయున్నది. కనుక ‘నేను స్వయముగా పరమాత్మనే।’ సంవిత్ స్వరూపుడనగు నాకు వేరుగా ఎక్కడా ఏదీ కించిత్ కూడా లేదు. ఎందుకంటే నేను సహజంగా పరమాత్మ స్వరూపుడనే’’.

అహం సర్వం ఇదమ్ విశ్వమ్: ఈ విశ్వమంతా నాయొక్క స్వరూపచమత్కారమే! నా యొక్క విశ్వరూపమే ఇదంతా। (ఇదియే విశ్వరూప సందర్శన యోగము కూడా).

పరమాత్మాఽహమ్ అచ్యుతః। నేను సర్వదా ‘పరమాత్మ’ను అయిఉండి, అట్టి పరమాత్మత్వము నుండి కించిత్ కూడా జీవుడుగా గాని, విశ్వముగా గాని చ్యుతి (Distraction from what I am) ఏ మాత్రము పొందటమే లేదు.

ఇదంతా నా యొక్క సంవిత్ ఆనంద స్వరూపమే. ఇది సర్వోత్తమమైన ‘అహంకారము’. ఇది జీవన్ముక్తుని యందు స్వాభావిక లక్షణమై ఉంటుంది.

(భగవద్గీత - మత్తః పరరతరం నాన్యత్ కించిదస్తి। మయి సర్వమిదమ్ పోత్రమ్ సూత్రే మణిగణా ఇవ)। ‘‘నేను ఈ సమస్తమునకు వేరై, ఈ సమస్తము నాయందే జనించుచున్నదై - నాకు ఈ సమస్తము అనన్యమై - ఉన్నది’’ - అనునదే సర్వమహమ్-కారము. అట్టివాడు ‘‘ఇదంతా నేనే’ - అను ఆనందము నుండి చ్యుతి పొందకయే ఈ జగత్ - ఉద్యానవనంలో తదితరుల వలెనే సంచరిస్తూ ఉంటాడు.

Ⅱ. అతః పరమ్ - అహంకారము / సర్వస్మాత్ అంతోఽహం కారము (I am always separate from all this) :
‘‘నేను ఈ దృశ్యము ఏ ఒక్క వస్తువును కాదు. ఈ సమస్త దృశ్యము, ఇంద్రియములు, శబ్ద-స్పర్శ-రూప-రస గంథములు, మనో-బుద్ధి-చిత్త అహంకారములు - వీటన్నిటికంటే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపుడను.

ఈ సమస్తమునకు సర్వదా అతీతుడను. కేవల ప్రజ్ఞాస్వరూపుడను. తెలియబడే సమస్తమునకు వేరై, సమస్తము ఎరుగుచుండువాడను. (దృష్టాంతంగా - స్వప్నములో కనిపించే సమస్తమునకు - ‘స్వప్నము తనదైనవాడు’ సర్వదా వేరే కదా!)
నా యొక్క సమస్తమునకు పరమైన ఆత్మస్వరూపము వెంట్రుక యొక్క చిట్టచివరి అణుమాత్రము కంటే కూడా లక్షవవంతువలె - మహాసూక్ష్మము.

ఇట్టి ‘‘సమస్తమునకు వేరైన నేనే నేను’’ అనునది రెండవ తీరైన అహంకారము. ఈ విధమైన పరస్వరూప-సంకల్పము కూడా శుభప్రదమైనదే. పై రెండు అహంకారములు మోక్షమునకు మార్గములై జీవన్ముక్తుని స్వాభావిక లక్షణములు అయి ఉన్నాయి.

Ⅲ. ఇదం శరీర మాత్ర-అహంకారము। (I am bound to body and its relevant mental context only)
‘‘కాళ్ళు-చేతులు మొదలైన విశేషములతో కనిపిస్తున్న ఈ భౌతిక దేహమే (లేక) రూపమే నేను’’ - అను అహంకారము. ఇది లోక సంబంధమైనది. ‘3’ విధములైన అహంకారములలో తుచ్ఛమైనది (Low state of Comprehension). ఇది సంసార దోషమునకు కారణమై, (ఆత్మను తిరస్కరించటంచేత), దురాత్మకము. అనేక దుఃఖములకు, అపార్థములకు, బంధములకు కారణం.

అందుచేత ఈ భౌతిక దేహాహంకారము మొదలంట్ల త్యజించి ఉండవలసినది అయి ఉన్నది. ఇట్టి ‘‘దేహమాత్రమేవా ఇహమ్ - నేను దేహమును మాత్రమే’’ - అను అహంకారము ఈ జీవుని అధోగతి పాలు చేయగలదు - అని ఆత్మ తత్త్వజ్ఞులు ‘జాగరూకత’ను చేతులెత్తి ప్రకటించుచున్నారు. ‘‘నాయనలారా! నిమ్నగతులను తెలిసి తెలిసి అనుసరించకండి! అవి అత్యంత దుఃఖ స్థానముల యొక్క స్వయంకృతము’’ - అనునది వేదవాణి.

చిరకాలముగా (బహుకాలముగా) ఈ జీవుడు ‘‘నేను దేహమును మాత్రమే’’ అనే దురభిమానమును ఆశ్రయించి, అభ్యసించుటచేతనే - అట్టి దేహాహంకార భ్రమ ఘనీభూతమై ‘అనిపించటము’ (ఈ జీవుని పట్ల) జరుగుతోంది. ‘‘ఆత్మను కదా!’’ అని అనిపించటమును - ‘‘దేహమునే కదా!’’ అనే దట్టమైన ఆవరణ వచ్చి ఆవరించి వేస్తోంది. అట్టి దేహాత్మభావనను మొదలంట్లా త్యజించి, ఆపై శేషించే చైతన్యరూపమగు, పరిశుద్ధమగు కేవల - అహంకారమును ఆశ్రయించాలి.

(1) ఈ సమస్తము ఆత్మయే. నేను ఆత్మయే। కనుక ఇదంతా నేనే!

(2) ఆత్మదృశ్యముగా అగుటయే లేదు. సమస్తమునకు నాటక దీపములాగా ఇచ్ఛకు కూడా అతీతమైన ఆత్మయే నేను.

అందుచేత దేనిచేతను బద్ధుడుకాక. సర్వదా పరమ్ (ఆవల గల) ఆత్మనై ఉన్నాను.
… ఈ రెండింటి సమాశ్రయముచే ఈ జీవుడు పరమశాంతుడై, ముక్తిని పొందగలడు.

ఓ నిదాఘా! అలౌకికమగు మొట్టమొదటి రెండు అహంకారములను అంగీకరించి, లౌకికమగు (లోక సంబంధముచే ఏర్పడుచున్నదగు) మూడవ అహంకారమును నీవు తిరస్కరించివేయుము. ఎందుకంటే, అదియే సర్వదుఃఖములు తెచ్చిపెట్టే అహంకారము కాబట్టి. ఆ విధంగా పట్టుదలగా అభ్యాసము చేసిన తరువాత, ఇక..,

సర్వాహంకార త్యాజ్యము

శ్లో।। అథ తే అపి సంత్యజ్య సర్వాహంకృతి వర్జితః
స తిష్ఠతి తథా అతి ఉచ్ఛైః, పరమేవ అధిరోహతి।।

ఆ తరువాత మొదటి రెండు అహంకారములు కూడా మొదలంట్లా త్యజించివేయి.. ఆ విధంగా సమస్త అహంకారములు త్యజించినవాడు సర్వోత్తమము అగు పరమపదమును అధిరోహించగలడు.

బంధము - ముక్తి

⌘ భోగముల పట్ల ఇచ్ఛ కలిగి ఉండటమే ‘బంధము’
⌘ అట్టి భోగేచ్ఛను హృదయము నందు త్యజించి ఉండటమే ‘మోక్షము’.
మనో అభ్యుదయో నాశో - మనస్సు యొక్క వృద్ధియే (ఆత్మజ్ఞానము యొక్క ఏమరుపురూపమగు) నాశనము.
మనోనాశో మహోదయః - మనో నాశనమే (ఆత్మసూర్యుని) మహోదయము.
జ్ఞ మనోనాశమ్ అభ్యేతి - జ్ఞానియందు మనస్సు నాశనము స్వాభావికంగానే జరుగుతుంది.
⌘ జ్ఞాన సమన్వితమైన మనస్సే ఆత్మ సాక్షాత్కారము అనే అభ్యుదయము ప్రసాదిస్తోంది.
మనో అజ్ఞస్య హి శృంఖలా - అజ్ఞానముతో కూడిన మనస్సే జీవునికి బంధము.

జ్ఞాని యొక్క మనస్సు ఎట్టిదంటే..,
- ఆనందము కాదు. అనానందము (నిదానందము) కాదు। (Neither pleasant nor un-pleasent)
- అది చలించునది కాదు. చలించనిది (అచలము) కాదు. (స్థిరము కాదు) (Neither fixed nor variable)
- సత్తు కాదు. అసత్తు కాదు. (Neither existent, Nor Non - existent). ఆ రెంటి మధ్యలోది కాదు. (Nor-dual).

సత్తు-అసత్తుల మధ్య ‘నిశ్చలతత్త్వము’గా ఉన్నదే జ్ఞానియొక్క మనస్సు. పంచభూతములన్నిటిలో ఆకాశము అత్యంత సూక్ష్మము కాబట్టి అది కళ్ళకు కనిపించదు. అట్లాగే అంశరహితము (నిరంశము) అగు చిత్ తత్త్వము తన యొక్క భావనారూపంగా సర్వత్రా విస్తరించినదై ఉన్నప్పటికీ, అది కళ్ళకుగాని, మనస్సుకుగాని - ఒక వస్తువు వలె తెలియబడదు.

సర్వ సంకల్పములు లేనట్టిది. సంకల్పములకంటే మునుముందే ఉన్నట్టిది. ఏ సంజ్ఞ చేతనూ నిర్వచించి చెప్పబడజాలనిది. చిత్ (ఎరుక) స్వరూపము. అట్టి చిదాకాశము ఈ జీవుని ‘స్వాత్మ’ గానే వెల్లివిరుస్తోంది.

బ్రహ్మజ్ఞుల అనుభవములో ఆత్మ →
- ఆకాశము కంటే వందవందలంతగా సూక్ష్మమైనది.
- నిత్యము, శుద్ధము, నిర్మలము.
- ఇక్కడి సంసార దోషమునకు వేరైనట్టి అనునిత్య - ‘‘ఆత్మయేవ ఇదగ్ం సర్వమ్’’ సందర్శన రూపము.

ఆత్మ యొక్క విశేషణములు

ఇంకా కూడా :-
అట్టి నేను - నీవు - ఈ సమస్త జగత్తులను - తన ప్రదర్శనముగాను, ‘తనకు అనన్యము’ గాను కలిగి ఉన్నట్టి ఆత్మ (లేక) నిత్యోదిత చైతన్య- ఆత్మస్వరూపము - ఎటువంటి విశేషణములు కలిగి ఉన్నదో చెప్పుకుంటున్నాము. విను :-

న అస్తమేతి। న ఉదేతి। భూమిపై మనకు సూర్యుని ఉదయము - అస్తమయము అనేవి, తద్వారా రాత్రి - పగలు అనేవి కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి అనునిత్య స్వయం ప్రకాశకుడై ఉండగా సూర్యునికి ఉదయ - అస్తమయములు ఉన్నాయా? ఎక్కడున్నాయి? అట్లాగే ఈ జీవుని కేవల - సత్య -నిత్య - అఖండ - అప్రమేయ స్వరూపమగు ఆత్మకు ‘ఉదయించటము’ - అనే ధర్మమే లేదు. ‘అస్తమించటము’ అనే ధర్మము కూడా లేదు.

న చ యాతి। న చ అయాతి। ‘‘ఈతడు ఒక ఊరు వదలి మరొక ఊరు వెళ్ళివచ్చాడు’’ అని అంటున్నప్పుడు ఆతని శరీరము ‘‘ఉన్నచోటు’’, ‘‘వెళ్లినచోటు’’ - ‘‘తిరిగి వచ్చినచోటు’’… ఈ మూడూ ఉండవచ్చుగాక! కానీ ఆ సందర్భములలో ‘నేను’ అనునది - ఎక్కడికీ వెళ్ళదు - ఎక్కడ నుండో ఇక్కడికి రాదు. ఆ మూడు సందర్భములలో ‘నేను’ అనునది సర్వదా ‘నేను’గానే ఉంటోంది కదా!

అట్లాగే, ఆత్మ ఇక్కడి నుండి ఎక్కడికీ వెళ్ళదు. ఎక్కడి నుండి ఇక్కడికి రాదు.

కలలో ఒకడు మరొక ఊరు వెళ్లినా కూడా, కల తనదైనవాడు కలలో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడి నుండి ఎక్కడికి రాడు కదా!

న చ నేహ - న చ ఇహ చిత్। చిత్ స్వరూపమగు ఆత్మ ‘‘ఇక్కడ లేదు’’ అనలేము. ‘‘ఇక్కడే ఉన్నది’’. అనలేము. ‘ఇక్కడ - అక్కడ’ అనునది భూమి మొదలైన పంచభూతములకు ఉండవచ్చు గాక! ఆకాశమునకే జనన స్థానమగు ఆత్మకు - ఆకాశము యొక్క ధర్మములు అగు ‘ఇక్కడ - అక్కడ’ అనే ధర్మములు ఏ మాత్రము లేవు.

ఓ నిర్మలహృదయా! ఆత్మకు ఎట్టి దోషములు అంటజాలవు. నిర్వికల్పము. ఎట్టి సంకల్ప వికల్పములు లేనట్టిది. ఉభయము కంటే మునుముందే ఉన్నట్టిది. కల్పముల ఆదికి అంతమునకు సాక్షి అయి, పరమై ఉన్నట్టిది. నిరాస్పదా। నిత్య నిర్మల స్వభావము కలిగి ఉన్నట్టిది.

గురువు - శిష్యునికి ఆత్మ బోధ

అట్టి ఆత్మ గురించిన తత్త్వశాస్త్రసారము - గురుముఖతః ‘‘నీవు ఆత్మవు! దేహము మొదలైన మరింకేమీ కావు। అఖండాత్మ కాని క్షణము ఎప్పుడూ లేదు। సదా శివుడవు!’’ - అను మహత్తర - పరమ సత్యమును శ్రవణం చేయాలి. ఆ తరువాత ‘‘జన్మకర్మలకు సంబంధించని పరస్వరూపము స్మరణం చేయాలి. ‘‘ప్రాపంచక ద్వంద్వములు (పాప పుణ్యములు మొదలైనవి), బంధుత్వాదులు మొదలైనవి ఆత్మగా నాకు నియమితము కాదు’’ అను గురువాక్యమహార్థ మననం చేయాలి.

అయితే గురువు శిష్యునికి పరాకాష్ఠ - పరమాత్మకమగు పరతత్త్వమును శిష్యునికి బోధించటానికి ముందుగా..,

ఆదౌ శమ దమ ప్రాయైః గుణైః శిష్యం విశోధయేత్। శిష్యుని యొక్క శమమును, (అంతరింద్రియ - మనో చిత్త - బుద్ధుల ప్రశాంతతను), దమము (బాహ్యేంద్రయముల నియామక సామర్ధ్యము)ను పరిశీలించి ఆత్మ విద్యను బోధించాలి.
(శమము = Withdrawn from outer worldly events
దమము = Appointing ‘Indriyas’ towards Absolute SELF)

‘‘శిష్యుడు మహత్తరమగు సత్యమును తనయొక్క స్వధర్మముల పట్ల తిరస్కారము లేకుండానే ప్రజ్ఞావంతుడై, గమనించి, ఆకళింపు చేసుకొని, అనువర్తించగలడు.’’ - అని తృప్తి చెందిన తరువాత గురువు అప్పుడిక - పశ్చాత్ ‘‘సర్వమ్ ఇదం బ్రహ్మ శుద్ధః త్వమ్’’ ఇతి బోధయేత్।, ‘‘ఓ బిడ్డా! ఈ కనబడేదంతా నీ యొక్క శుద్ధమగు పరబ్రహ్మస్వరూపమే! అంతేగాని, ఇది ఏదీ నీకు అన్యము కాదు. సమస్తమునకు అనన్యమైయున్న ఆత్మయే సర్వదా నీ నిజ సహజ - వాస్తవ స్వరూపము’’ అనే అఖండాత్మ గురించిన సత్యమును యుక్తియుక్తంగా బోధించాలి.

అజ్ఞస్య, అర్థ ప్రబుద్ధస్య ‘సర్వం బ్రహ్మేతి’ యో వదేత్, మహానరక జాతేషు, స తేన వినియోజితః।

అజ్ఞానికి, అర్ధజ్ఞానికి (ఏమీ తెలియనివానికి, కొన్ని సిద్ధాంతములకో, సూత్రములకో పరిమితమై, మహత్ సత్యమునకు సంసిద్ధత లేనివానికి), (అనగా) ‘‘నాకు తెలిసిందే సత్యము. ఇంతకుమించి ఎవ్వరు చెప్పినా వినను. ఎవ్వరికీ తెలియదు’’- అనే పరమార్ధ సమాచారమునకు సిద్ధపడని వానికి (మూర్ఖబుద్ధి కలవానికి) ‘అంతా బ్రహ్మమే’ అని చెప్పబూనటమనేది - ఆ చెప్పేవాడు కూడా తన ‘తత్త్వమార్గము’ నుండి దారితప్పి, ‘మహానరకమార్గము’ను ఆశ్రయించటము అవగల ప్రమాదము.

గురువు బోధింప తగిన - బోధింప వలసిన శిష్యుడు

అట్టి వానికి స్వస్వరూప-ఔన్నత్యము, స్థానము, గాంభీర్యము, సమస్తమునకు పరము, సమస్తము అగు-ఆత్మ గురించి తప్పక బోధించాలి.

‘తత్ త్వమ్’ అను ‘‘నిరూపణ, జాగరణ’’లతో నిండిన పూర్ణార్థముతో గురువులు బోధించెదరుగాక.

ఇక శిష్యుడో,…శ్రవణ మననములు చేసి, - అనుకోవటము - అనిపించటము’ అను మనన-నిది ధ్యాసలకు ఉపక్రమించాలి. ఆత్మయే తానై ఆస్వాదించాలి (సమాధి).

చిత్ సత్తయే జగత్ సత్త

సతి దీప ఇవ అలోకః। దీపము వెలుగుచున్నప్పుడే చీకటిలోని వస్తువులు సాకారమై కనిపిస్తాయి.

సతి అర్క ఇవ వాసరః। సూర్యుడు ఉంటేనే రాత్రి - పగలు, వారములు మొదలైన వాటికి ఉనికి.

సతి పుష్ప ఇవ ఆమోదః। - పుష్పము ఉంటేనే ‘సువాసన’ ఉంటుంది.

అట్లాగే… చిత్ సత్తయే - జగత్తు యొక్క సత్త అయి ఉన్నది.

చితి సత్ యాం జగత్ తథా। చిత్ ఉంటేనే జగత్తు ఉంటుంది.

ఈ జగద్దృశ్యమంతా కూడా అద్దములోనో, నీటిలోనో ప్రతిభాస (Reflection and Refraction) వంటిది మాత్రమే. పరమార్థతఃగా → సర్వదా బ్రహ్మమే ఉన్నది.

జగత్తు అనబడునది స్వతఃగా ఉన్నది కాదు. ‘‘భావన’’ యొక్క చమత్కారం చేత స్వతఃగా ఉన్నట్లే అగుపించటము, అనిపించటము జరుగుతోంది.

ఓ నిదాఘా! ‘‘ఈ జగత్తు స్వతఃగా ఉన్నది కాదు. ఇదంతా ద్రష్ట యొక్క ఊహారచన మాత్రమే" అని నేను చెప్పుచున్న ఈ వాక్యము యొక్క మహదర్థము - జ్ఞాన దృష్టిచే నీ యొక్క ప్రసన్నమైన, ప్రబోధము వికసించగా, నీ యొక్క బుద్ధికి స్వాభావికమై, స్వానుభవమవగలదు. నేను చెప్పు - ‘‘జగత్తు మనో కల్పితము మాత్రమే’’ - అను నా వాక్ దృష్టి యొక్క ‘‘స్వకీయ అవగాహనా బలాబలములను’’ అనుసరించి, నీవు ఆత్మతృప్తిచే ‘స్వస్థుడవు’ (లేదా) ప్రబుద్ధుడవు అగుచుండగలవు.

హే బ్రహ్మన్!
ఆత్మజ్ఞానోదయముచే ఈ ఇంద్రియ జగద్దృశ్య సంబంధమైన ‘‘స్వప్నమాత్ర కల్పితత్వము’’ యొక్క బుద్ధి నిశ్చయమును నిశ్చలముగా పొందగలవు. నా యొక్క ‘‘తత్ త్వమేవ’’ అను గురువాక్యము యొక్క విశ్వాసముచే బుద్ధి నిశ్చలము కాగలదు. ‘నేను - నాది’ మొదలైన రూపములతో ప్రదర్శనమగుచున్నదంతా అవిద్యయే! ఆత్మవిద్యయే సర్వ మానసిక రోగములకు నివారణోపాయము.

శామ్యతి హి అస్త్ర మంత్రేణ : శత్రువు ప్రయోగిస్తున్న అస్త్రము - తిరిగి అస్త్రమంత్రము చేతనే శమిస్తోంది.

మలేన క్షాళ్యతే మలమ్: పాత్రకు అంటిన ధూళి వంటి మలము - బూడిద వంటి మలము చేతనే తొలగగలదు.

శమం విషం విషేణైతి। : విషము విషము చేతనే విరుగగలదు.

రిపుణా హన్యతే రిపుః : శత్రువును శత్రువే నిర్జించగలడు. మాయా సాధనములచేతనే మాయను ఎదుర్కోగలం.

ఈదృశీ భూతమాయే అయం యా స్వనాశేన హర్షదా। ఈ ఎదురుగా కనిపిస్తున్న పాంచభౌతిక సాకారమాయా దృశ్యబంధమంతా తనను తానే నశింపజేసుకొన్నప్పుడు (బంధము తొలగి) హర్షము పొందుచున్నది.

మాయ యొక్క అసలైన రూపమేమిటి?

వెలుతురు లేకుండటమే చీకటి కదా! ఆత్మ యొక్క స్వరూపము గురించి ఏమరచి ఉండటమే మాయ.

‘‘అసలు మాయ యొక్క వాస్తవ స్వరూపమేమిటి?’’ అని అధ్యయనము చేసి, పరిశీలించి చూస్తే ‘‘స్వకీయ కల్పనకు వేరుగా ‘మాయ’ అనునది మొదలే లేదు’’ - అనియే తెలియవస్తోంది. భావనచే అనుభవమగుచున్న మాయ పరమార్థంగా చూస్తే నిలువజాలదు. సర్వం ఖల్విదం బ్రహ్మ - ‘‘సమస్తము బ్రహ్మమే - అని వేదవచనమై ఉండగా, బ్రహ్మమునకు వేరై ‘మాయ’ గాని, మరొకటిగాని ఎక్కడ ఉంటుంది?’’ - అను అవగాహన ముక్తిదాయకము.

అవిద్య

నిదాఘుడు : గురుదేవా! ‘మాయ’ యొక్క చమత్కారమంతా ‘అవిద్య’ చేతనే రూపుదిద్దుకోబడుచున్నది - అని శాస్త్ర వచనం కదా! మరి అవిద్య యొక్క అసలైన రూపము ఏదై ఉన్నదని ముముక్షువులమగు మేము సమన్వయించుకోవాలి?

ఋభుమహర్షి : ఓ నిదాఘా! సర్వత్రా ఆత్మ దృష్టిని ఆశ్రయించి, అద్దానిని అనుక్షణికం చేసుకొనే ప్రయత్నమే విద్య. భేద దృష్టియే అవిద్య. ‘‘సమస్తము పరబ్రహ్మస్వరూపముగా అనుకుంటూ ఉండటము’’ ద్వారా - అవిద్యను సాధనాక్రమంగా విసర్జించి వేయాలి సుమా! అవిద్యచే స్వస్వరూప భావనను చేజార్చుకొనబడుతోంది. విద్యచే సమస్తము స్వస్వరూపముగా పొందబడుతోంది. అట్టి పరబ్రహ్మము అక్షయమగు పదము.

‘‘మాయ’’

నిదాఘుడు : ఈ జీవుడు సర్వదా ఆత్మస్వరూపుడే అయి ఉండగా, మరి మాయ అసలు ఎక్కడి నుండి జనించి, బయల్వెడలుతోంది? ఎందుకు? ఎప్పటి నుండి ఎవ్వరు కారణంగా ‘మాయ’ ప్రారంభమగుచున్నది?

ఋభుమహర్షి : ఓ మునీ! ద్విజశ్రేష్ఠా!
‘‘కుతో జాతేయమ్?’’ - ఇతి తే మాస్తు విచారణా! ‘‘మాయ ఎప్పటినుండి, ఎట్లా జనించింది?’’ - అనేది నీవు విచారణ చేయవలదు. ఎందుకంటే సమాధానము దొరకదు కూడా. అందుకు ఆవశ్యకత కూడా లేదు.

‘‘ఒక రోగము ఏతీరుగా ఎక్కడి నుండి ఏఏ కారణల వలన, ఏఏ ఆహారాదుల వలన వచ్చిపడింది?’’ - అనే ప్రశ్న కంటే కూడా, ‘‘ఆ రోగము ఉపశమించటానికి వైద్యము ఏమిటి?’’ - అనేదే ముఖ్యమైన ప్రశ్న కదా! అందుచేత, ‘‘ఇమాం కథమ్ అహం హస్మి?’’ - ఇతి ఏషా తే అస్తు విచారణా! ‘‘ఈ మాయను నేను ఎట్లా జయిస్తాను? సాధనలేమిటి? ఉపాయాలు ఏమిటి?’’ - అని నీవు విచారణ చేయటమే అవసరము. నీకు శోభాయమానము.

ఆత్మ విచారణచే మాయ (లేక) అవిద్య నశిస్తూ ఉండగా, నీవు పరమదము తప్పక (యోగ సంసిద్ధః కాలేన) నీయందే ఎరుగ గలవు. ఇక్కడే ఇప్పుడే తత్‌పదమును సిద్ధించుకోగలవు.

సహజము, కేవలము, నిత్యము అగు నీ స్వస్వరూపాత్మ యొక్క ఔన్నత్యమును గ్రహిస్తూ ఉండగా, అప్పుడిక ‘మాయ’ ఎప్పుడు, ఎట్లా జనించిందో నీకే తెలిసిపోతుంది. ఎటు పోతోందో కూడా చెప్పలేము. దీపం వెలిగిస్తే చీకటి ఎటుపోతోంది? - ఏమని నిర్వచించగలం?

శ్లో।। యత ఏషా యథా చ ఏషా యథా నష్టేతి అఖండితమ్,
తత్ అస్య అరోగశీలాయా యత్నం కురు చికిత్సనే,
యథ ఏషా జన్మదుఃఖేషు న భూయః త్వాం నియోక్ష్యతి।

వ్యాధి యొక్క చికిత్స కొరకై వైద్యుని సమీపించినప్పుడు, ‘‘అయ్యా! వైద్యుల వారూ! ఈ వ్యాధి నాకు ఎట్లా ఎప్పుడు ఏమి తినటం చేత నాకు వచ్చిందో పరిశోధన చేసి చరిత్ర అంతా చెప్పండి. అదంతా నేను ముందుగా తెలుసుకోవాలి!’’.. అని తీరికగా కూర్చుని అంటామా? అనము. ‘‘అయ్యా! ముందు రోగం ఏమిటో కనిపెట్టి ఔషధం ఇవ్వండి. ఏఏ కారణాల సమూహములచేత ఎప్పటి నుండి ప్రారంభం అయి ఇప్పటికి ఇట్లా ‘రోగము’గా అయినా కూడా, ముందు ఇది ఉపశమిస్తే గాని బాధ తొలగదు కదా!’’.. అని అంటాము / అనుకుంటాము.

అట్లాగే ఓ నిదాఘా! సంసార రోగము (ఆత్మను ఏమరచి ఉండటం, దృశ్యములోని భేదమునంతా చూస్తూ క్రింద -మీదా అగుచూ-ఇదంతా సత్యమే। భవమే’’-అను సత్యదృష్టితో సుఖదుఃఖాలు అనుభవిస్తూ జన్మ-జన్మాంతర చక్రములో తిరుగాడటము) నకు చికిత్సను ఆశ్రయించటం ముందుగా చేయవలసిన పని.

అటు తరువాత సంసారరోగము శమిస్తూ ఉంటే.., ‘‘అవిద్య అనేది ఏ లీలా-క్రీడా క్రమంగా (ఏకుగా వచ్చి మేకుగా అయింది? - మొదలైన) ఆయా విశేషాలు నీకే తెలిసిపోతాయి.. ‘‘లేనిది ఉన్నదనుకోవటం, ఉన్నది ఏమరచి ఉండటమే మాయ’’ (లేక) సంసారము (లేక) అవిద్య - అనునది సుస్పష్టమౌతుంది. ఇక ఆపై జన్మ కర్మ దుఃఖములందు తిరిగి మరల ప్రవేశించవు. నీ నిర్మలమగు కేవల స్వరూపముపై జన్మ-కర్మ-దుఃఖములను ఇక మరల ఆపాదించవు.

ఏకము - అఖండము - అద్వితీయము

సముద్ర జలంలోనే తరంగములు జలమునకు అనన్యమై అసంఖ్యాకంగా బయల్వెడలుచున్నాయి. ఎన్ని తరంగములు ఎంతగా బయలుదేరి సంచరిస్తూ ఉన్నా కూడా, ఆ సంచారమంతా జరుగుచున్నది ఎక్కడ? జలములోనే కదా! జలమే తరంగములుగా అవుతోంది. అంతేకాదు. సముద్రంలో ఎన్ని తరంగాలు బయల్వెడలుచూ కనిపిస్తూ ఉన్నప్పటికీ సముద్రజలము సర్వదా ఏకము-అఖండము కూడా!

అట్లాగే,
స్వాత్మయే అయి ఉన్న చిత్ ఆనంద మహాసముద్రములో పరిస్పందములు (Waves of Inspirations / Responses) చిత్ ఆనంద స్వరూపములే-అయి, బయల్వెడలుచున్నాయి. ఈ జగత్ రూపస్పందనలు తిరిగి చిత్ సాగరములోనే లయిస్తున్నాయి. అయినప్పటికీ చిత్ చైతన్యము (The Blossoming of knowing of self / As self) సర్వదా ఏకము, అఖండము కూడా! తెలియబడేది అనేకము అయినప్పటికీ అవన్నీ కేవలమగు ‘ఎరుక’ నుండియే బయలుదేరుతూ ఉన్నాయి.

‘‘ఎరుగబడేదంతా స్వకీయమగు ఎరుకకు అనన్యము కూడా!’’ - అను దృఢమైన అభ్యాసమును సర్వదా ఆశ్రయించి ఉండుము.

‘‘చిద్రూప సాగరమునందు - చిద్రూపమే - ‘జగత్తులు’ అనే తరంగరూపాలుగా స్పందిస్తోంది. ‘ఎరుక’యే ఎరుగుబడుచున్న సమస్తముగా అయి, అనేక రూపములు దాల్చుచున్నది.

వాయువే వాయు తరంగాలుగా అగుచున్నట్లు, స్వస్వరూపాత్మయే స్వస్వరూపము నందు జగత్తులుగా అగుపిస్తోంది.
చిచ్ఛక్తియే తనయందుతాను ఈ అనేకములతోకూడిన సమస్త దృశ్యముగా వెలయుచున్నది.

చిచ్ఛక్తి! చేతనా రూపా! జడశక్తిః! జడాత్మికా!

ఓ నిదాఘా! నీ యొక్క ఆత్మచైతన్యమునందే ఆత్మశక్తి బయల్వెడలుతోంది. ఆత్మలోని ఆత్మశక్తియే ‘స్పందనశక్తి’ కూడా!
- అట్టి స్పందనరూపము సర్వశక్తిమయమై, అనునిత్యంగా ప్రత్యుత్సాహ సమన్వితమైయున్నది.

‘‘ఆది స్వరూపము’’ అగు నీ చిదాత్మయందు మొట్టమొదట దేశ-కాల-క్రియలు (The place factor, the time factor and the function factor) లేవు. అనగా ఏ నీయొక్క మహోన్నత స్థానములో దేశ-కాల-క్రియాదులు ఏమాత్రము స్ఫురించవో,… అదియే చిచ్ఛక్తి.

శ్లో।। దేశకాల క్రియాశక్తిః న యస్యాః సంప్రకర్షణే
స్వస్వభావం విదిత్వ ఉచ్చైః అపి అనంత పదే స్థితా।

అట్టి చిచ్ఛక్తి తన యొక్క స్వస్వభావము ఎట్టిదో ఎరుగుచూ ఉన్నప్పుడు ‘‘అత్యుత్తమము, అనంతము’’ అను పదమును అధిష్ఠించినదై ఉంటోంది. స్వస్వభావమును ఏమరచి ఉన్నప్పుడో,.. జీవుడు, ద్రష్ట - దర్శన - దృశ్యములు, వస్తు - విషయప్రియత్వము మొదలైన ఆయా విశేషాలతో (స్వస్వరూప ఔన్నత్యము విడువకుండానే) తన్మయమై ఉంటోంది.

అనగా, స్వస్వభావమను సంభావించకుండా.. ఏ సమయ-సందర్భములలో ఏ రూపమును భావన చేస్తూఉంటే, ఆ సందర్భ - సమయములలో ఆరూపమే - అత్యంత ఉత్సుకతో, రమ్యముగా - ధరించి, ‘అదియే తానై’ - ఉంటోంది. ఎప్పుడు, ఎంతవరకు ఇష్టాపూర్వకంగా భావన చేస్తూ ఉంటే..,
🌺 అంతవరకు తనను గురించిన అఖండాత్మ భావనను ఏమరచుచున్నది.
🌺 అంతంత వరకు నామ-రూప-సంఖ్యాత్మకమైన అనుభూతులతో, సంకల్ప - వికల్పములకు ఆకాశము (స్థానము) అయి అద్దానిపై తన యొక్క సత్యత్వము - నిత్యత్వములను ఆపాదించి, అట్లే అనుభవముగా పొందుచున్నది.

క్షేత్రజ్ఞుడు। అహంకారము। మనస్సు। బంధము।

హే బ్రహ్మన్! చిద్రూపముగా ‘‘ఏది ఎట్లు సత్యత్వమును ఆపాదించి ఎరుకగా పొందుచున్నదో - అట్టి ప్రజ్ఞయే ‘‘క్షేత్రజ్ఞుడు’’ (The one who is knowing the field of all else)గా పిలువబడుతోంది.

అట్టి చిచ్ఛక్తిరూప క్షేత్రజ్ఞుడు ‘‘ప్రియ-భావ-ఆవేశముల’’ రూపములగు వాసనలను తనకు తానే వినోదముగా సృష్టించుకొని ‘‘-నేను వీటికి చెందినవాడను. ఇవన్నీ నాకు చెందినవి!’’ అను రూపము గల ‘‘అహంకారము’’ (I and My)ను పొందుచున్నాడు.

→ అహంకారము దృశ్యమునకు సంబంధించిన ‘‘కలిగియుండటము (Possessing)’’ అనే దోషము (లేక) కళంకముతో కూడి ఉంటున్న సందర్భములో, పరిమితత్వము, సంకుచితతత్వము సంతరించుకుంటోంది.

→ ఆ అహంకారము విధి నిషేధములను, నిశ్చయముగా కలిగియుండగా - కలనము. ‘‘నిశ్చయాత్మకమగు బుద్ధి’’ (The opinion and decision maker-form of Inteligence)’’ - అని చెప్పబడుతోంది.

→ ఆ బుద్ధి ‘‘సంకల్పించటముచే - వస్తువుతో సంకల్పితాకారము’’ సంతరించుకొంటున్నప్పుడు ‘‘మనస్సు’’ అని పిలువబడుతోంది.

→ మనస్సు యొక్క ఘనీభూతమై (strongly materialized) సంకల్ప వికల్పముల కారణంగా ఆత్మ చైతన్యమే → చూపు - వినికిడి - స్పర్శ - రుచి - సువాసన → ఇత్యాది ఇంద్రియార్థములు, ( + ) ఇంద్రియరూపము దాల్చుచున్నది.

క్రమక్రమంగా మెల్లమెల్లగా కాళ్ళు-చేతులు, కళ్ళు-చెవులు మొదలైన కర్మేంద్రియ-జ్ఞానేంద్రియ ప్రదర్శనములను (Delivery points)కు ఆధారమైయున్నదే భౌతికదేహము దాల్చుచున్నది -అని బుధులు - ఆత్మయొక్క సంకల్పచమత్కారము గురించి అభివర్ణించి చెప్పుచున్నారు.

ఈ విధంగా ఆత్మయొక్క ‘సంకల్పము’ అనే అంశచే ఉత్పన్నమగుచూ, రూపము దిద్దుకొంటున్న ఈ ‘జీవుడు’ (జీవితము - అనే స్థితి యొక్క అభిమాన స్వరూపుడు) ‘‘చమత్కారమా!’’ అను విధంగా, ఇంద్రియ విషయ దృశ్యమునకు ‘బద్ధుడు’ అగుచున్నాడు.

సంకల్పముల - అభ్యాసవశంగా రూపుదిద్దుకొంటున్న వాసనలు. (Tendencies that are formed because of operation of thought attached to interest and fondness) - అనే పాశములలో (Ties of Ropes) బంధించబడుచున్నాడు.

క్రమంగా అంతులేని దుఃఖములలో (In Uncountable series of worries)లో చిక్కుకొని స్వస్వరూపము గురించిన అపార్థములతో కూడిన అనేక నీచ స్థానములు పొందుచున్నాడు.

శ్లో।। ఇతి శక్తిమయం చేతో ఘన - అహంకారతాం గతమ్,
కోశకార క్రిమి - ఇవ స్వేచ్ఛయా యాతి బంధనమ్।।

ఈ విధంగా సర్వత్ర వెలయు స్వరూపము గల-మహత్ శక్తిగల చైతన్యము-అహంకారమును (వ్యష్ఠిగతమైన నేను-నాదిలను) అనుసరించిన కారణముచేత, ఇంద్రియ భోగముల ధ్యాసలలో చిక్కుకొని బంధమును తెచ్చిపెట్టుకుంటోంది.{భూతమయ(Matter)- ప్రాణమయ- మనోమయ-విజ్ఞానమయ-ఆనందమయ} కోశములలో చిక్కుకొని సర్వశృంఖలములను (Bondages) తెచ్చిపెట్టుకొని మరీ అనుభవిస్తోంది.

స్వసంకల్పితమైన పంచతన్మాత్ర (శబ్ద స్పర్శ రూప రస గంధ నిర్మితమైన) పంజరంలో బద్ధము అగుచున్నది. బోనులో చిక్కిన సింహమువలె అనుభూతులు - అనుభవములలో చిక్కుకొని ఉంటోంది.

చిచ్ఛక్తియే ఒక్కొక్కసారి ‘‘మనస్సు’’ రూపముగాను, ‘‘బుద్ధి’’ రూపముగాను, ‘‘జ్ఞాన’’ రూపముగాను, ‘‘క్రియా’’ రూపముగాను, ‘‘అహంకార’’ రూపముగాను, ‘‘చిత్తము’’ రూపముగాను.. ఆయా రూపములన్నీ (ఒకే మనస్సు వినటము, చూడటముచేయు విధంగా) అగుచున్నది.

చిచ్ఛక్తియే ఆయా ఒక్కొక్క సందర్భములో ‘ప్రకృతి’ రూపముగాను, ‘మాయ’ రూపముగాను, ‘మలదోషము’ రూపముగాను, ‘కర్మ’ రూపముగాను ‘బంధము’ రూపముగాను, పుర్యష్టకము (పంచభూతములు + మనో - బుద్ధి - చిత్తములు) రూపంగాను చెప్పబడుతోంది.

ఒక సందర్భములో చిచ్ఛక్తియే ‘అవిద్య’. మరొక సందర్భములో అదియే ‘ఇచ్ఛ’.

ఒక చిన్న మట్టి విత్తనము అంకురించి - అనేక ధర్మములతో (ఆకులు - కొమ్మలు - పిందలు మొదలుగా) కూడిన మహావృక్షముగా అగుచున్నది కదా! చిచ్ఛక్తి యొక్క కించిత్ ‘స్ఫురణ’యే ఈ విస్తార దృశ్యము. అద్దానికి పాశముల చమత్కారము ఏర్పడుతోంది. జీవుడు, బంధములు ఇవన్నిటితో కూడి ఈ సమస్త సంసార చమత్కారమంతా సారూప్యముగా అగుచున్నది.

ఓ సుబుద్ధీ! ‘‘సంసారము వేరు - మనస్సు వేరు’’ - కానే కాదు. మనస్సే సంసారము. (మనయేవ మనుష్యాణాం కారణం బంధ-మోక్షయో). అట్టి మనస్సు ‘‘ఇదంతా సత్యమే! నిత్యమే!’’.. అనే కల్పనను కల్పించుకొని, దృశ్యముల ప్రవేశిస్తోంది. బంధమంతా తెచ్చిపెట్టుకుంటోంది. అయితే ఏం? మనస్సు యొక్క జనన స్థానము నిత్యముక్తము. మనస్సు నిత్య బంధము.. ఆత్మ నిత్యముక్తము.

ఈ ‘మనస్సు’ యొక్క సాంసారికమైన స్థితి ఎట్టిదంటే..,
→ చింతా - అనల శిఖా దగ్ధం!… ‘చింతలు’ అనే అగ్ని శిఖలచే నిత్యము దగ్ధము అగుచున్నది.
→ కోప అజగర చర్వితము।… ‘‘కోపము’’ అనే కొండ చిలువచే దిగమ్రింగబడుచున్నది.
→ కామాబ్ధి కల్లోల రతం। ‘‘కోరికలు’’ అనే భీకర తరంగములచే కల్లోలితమైన ‘సముద్ర జలములో రమిస్తూ (చరిస్తూ) ఉన్నట్టిది.
→ విస్మృతాత్మ పితామహమ్ : ఆత్మను మరపింపజేయటములో మహాశ్రేష్ఠమైనవి. ‘‘జగత్తు, జీవుడు’’లను ఆశ్రయించి, పరమాత్మను ఏమరపింపజేయుచున్నది.

ఓ నిదాఘా! బురదగుంటలో ఇరుక్కున్న ఏనుగును బయటకు తీసి రక్షించు తీరుగా - ఈ మనస్సును విషయ లంపటముల నుండి అతిత్వరగా (Urgently) ఉద్ధరించాలి. మనో కల్పితమైన సంసార కల్పిత భావములు ఈ జీవుని పట్ల అల్ప జన్మలకు కారణమవటంచేత - ‘‘మనస్సే శత్రువు’’. అట్టి ఈ మనస్సే మోక్షమార్గములో ఏకైక ఉపకరణము కూడా।

భావములు

భావములన్నీ ఎక్కడి నుండి బయల్వెడలుచున్నాయి?

జగత్ సంబంధింత భావములన్నీ ‘‘సమష్టి సూక్ష్మ శరీరాభిమాని’’ - అగు హిరణ్యగర్భుని నుండే బయల్వెడలుచున్నాయి.

అట్టి భావముల లక్షల కోట్ల సంఖ్యలో అసంఖ్యాంగా సృష్టియందు ప్రవేశించి ప్రవర్తమానము అగుచున్నాయి.

అట్టి అసంఖ్యాక భావనా పరంపరలన్నీ సృష్టి ప్రారంభము నుండి పుట్టి, సృష్టి కొనసాగేంతవరకు - కొనసాగుచూనే ఉంటున్నాయి.

సెలయేరు (జలపాతము)లో ఎప్పటికప్పుడు జలకణములు, జలప్రవాహములు బయలుదేరు రీతిగా ఈ సృష్టిలో అనేక మంది శరీరధారులు, అనేక శరీరములు పుట్టినాయి. పుట్టుచున్నాయి. పుట్టబోతున్నాయి.

సముద్రంలో అసంఖ్యాక తరంగములవలె, ఆత్మజలములో ఈ ‘జీవులు’ అనే తరంగములు, బిందువులు బయలుదేరుచున్నాయి.

జీవన తరంగాలు - భావనా తరంగాలు

చిచ్ఛక్తి (లేక) ఆత్మ సర్వదా అఖండము. సమస్త భేదములకు అప్రమేయము. ఏకము. సమము. ఈ విధంగా అయి ఉండి కూడా, సృష్టిలో కనిపిస్తున్న అసంఖ్యాక లక్షల కోట్ల జన్మలలో (ఉపాధులలో / జీవాత్మలలో) ఎంతో పరస్పర వ్యత్యాసములతో - ఒకే జలములో అనేక తరంగముల ఆకారముల వలె - ప్రదర్శనమగుచూ అనుభూతమగుచున్నది.

ఈ జీవులు, ఉపాధులు, పరస్పరము ‘భేదరూము’. వీటన్నిటి యొక్క వాస్తవ రూపము బ్రహ్మమే।

అట్టి బ్రహ్మానంద సాగరములో కనిపిస్తున్న జీవాత్మ తరంగాలలో

ఓ నిదాఘా! ‘‘ఇవన్నీ అఖండాత్మ నుండి బయల్వెడలుచున్న అసంఖ్యాక భావనా తరంగములు’’ అని గమనించిన వాడవై ఉండుము.

ఇంకా విను → :

ఒక నవలా రచయిత యొక్క కవిత్వపు స్రవంతి (The flow At of story - writing) → నవలలో అనేక పాత్రలు (Roles), పదార్థములు (Matters), స్వభావములు (Features)… పాత్రల పరస్పర సానుకూల్య - ప్రాతికూల్య ప్రవర్తనలుగా ప్రదర్శనమగుచున్నట్లే, ‘‘కేవలము - అప్రమేయము - నిర్మలము’’ అగు పరమాత్మ నుండి ఈ అనేకరీతులైన జీవాత్మల ప్రహనమంతా అనేక భావనా తరంగముల చమత్కారంగా సారూప్యము పొందటము, కొనసాగటము, గతించిపోవటము కూడా జరుగుతోంది.

ఇంకా ఆ భావనా చమత్కార స్రవంతులలో…
✤ కొన్ని మహేంద్ర, మలయ, సహ్య, మందర మేరు పర్వతాలుగాను,
✤ మరికొన్ని ఉప్పు-పాలు-పెరుగు-చెరకురస సాగరములుగాను,
✤ కొన్ని ఆత్మ యొక్క భావనలు సువిశాలమై సుదూరంగా విస్తరించియున్న (తూర్పు-పడమర-ఉత్తర-దక్షిణ, ఈశాన్య, వాయువ్య, ఆగ్నేయ, నైరుతీ, ఊర్ధ్వ, అధో) పది దిక్కులుగాను,
✤ కొన్ని నదీ నదములుగాను,
✤ కొన్ని ఆత్మ యొక్క భావనా తరంగములు - ఆకాశంలో ఎత్తు ప్రదేశాలలోను, నేలపైన, కొండలపైన ఎగురుచూ ఉండే పక్షులుగాను, కీటకములుగాను,

ఈ విధంగా అనంత భేదములతో అనంతభావములు అనేక అసంఖ్యాక రూపములు ధరిస్తూ - చేతులతో అదిలించబడు పక్షులవలె - లోక లోకాంతరములు, దేహ-దేహాంతరములతో మాటిమాటికీ తిరుగాడుచున్నాయి.

భుక్త్యా జన్మ సహస్రాణి భూయః సంసార సంకటే। - అట్టి ఆత్మ భావనారూప తరంగములే స్వస్వరూపముగా కలిగియున్న కొందరు జీవాత్మలు ‘‘ఇంద్రియానుభవములు’’ - అనే సంసార లంపటములో మునిగి వందల వేల ఉపాధి పరంపరలతో ప్రవేశ- నిష్క్రమణములను నిర్వర్తిస్తూ ‘అజ్ఞానము’ను సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్నారు.

పతంతి కేచిత్ అబుధాః సంప్రాప్యాపి వివేకతామ్।। మరికొందరు శాస్త్ర పఠన - గురువాక్య శ్రవణములు చేసి వివేకమును సంపాదించుకొని కూడా,… తెలివి తక్కువ వారై అనేక ఉపాధులలో ప్రవేశ-నిష్క్రమణములు కొనసాగిస్తూనే ఉంటున్నారు. ఆత్మతత్త్వానుభవమును ‘అలక్ష్యము’ చేస్తూ మరల మరల సంసార సంకటములను ఆహ్వానించుకొంటున్నారు.

‘‘భవ సాగరము’’ అనబడే (దృశ్యములోని విశేషములు నిజమే అనే) భావనా పరంపరల తరంగములలో మరల మరల మునిగి తేలుచున్నారు. ఈ విధంగా భావికుడు తనను తాను తన భావనలలో వెతుకుచున్నాడు. ఎంతటి చమత్కారం!

చిచ్ఛక్తికి ‘అభిన్నమే’ అయిఉన్నప్పటికి కూడా, మనోశక్తి లీలవలె, (క్రీడా వ్యసనములాగా) - వాసనలచే సంకలితము అయిన ఆవేశమును ధరించి స్వయంకల్పిత - స్వస్వరూప ‘‘దృశ్యము’’లో సంకల్ప-వికల్పములుగా ఉన్ముఖమై ఉంటోంది.

అనంతశక్తి స్వరూపి అగు ఈ జీవుని స్వాత్మచైతన్యము - క్షణకాలంలో అనంత దృశ్యమును లీలగా కల్పించుకొని, కొంతసేపు సంచారము చేసి, ఇక అటుపై,…
- ఇదంతా ఎట్లు దాపరించింది?
- ఎట్లా తొలగుతుంది?
- నేనెవ్వరు?
అనే ‘వెతకటము’ను (To search ‘Answer’ for “what I am?” - అత్యవసరముగా భావిస్తోంది.

తన కొరకు తానే తన కల్పనయందు వెతుకుతోంది. ఇదంతా, ‘‘కలలోని నేను’’ - ‘‘కల నాదైన నేను’’ - కొరకై వెతకటము వంటిది.

ఎప్పుడో ఒకప్పుడు ఆత్మయే ఒక్క క్షణంలో ‘‘నిర్మలాత్మాకాశ స్వరూపము’’ను కూడా మననము చేయగలదు. సిద్ధించుకోగలదు కూడా!

మనో భావనా చమత్కారము

ఈ జీవుడు ఆత్మస్వరూపుడే కాబట్టి, సర్వదా సత్యస్వరూపుడే.

సత్యస్వరూపుడగు ఈ జీవుడు ‘మనస్సు’ అనే ఉపకరణముతో ఏది ‘సత్యము’ అని భావిస్తూ ఉంటే, అది అట్లే సిద్ధించటము జరుగగలదు.

అందుచే ‘ఈ జీవుడు (ఆత్మగా) ‘సత్య సంకల్పుడు’ - అనబడుచున్నాడు.

అట్టి మనస్సు ఏది ఎక్కడ ‘భావన’ చేస్తే అక్కడ అది ఆ రీతిగా - సత్యభావనను అనుసరించి - సిద్ధించగలదు. [యత్ భావో తత్ భవతి!]

సమస్తము మనస్సే

→ ఆకాశమునకు బీజము ఆత్మయొక్క శబ్దరసోన్ముఖత్వమే. మనస్సే ఆకాశరూపముగా ఘనీభూతమై, అద్దానియందు క్షణములో ‘స్పందన’ రూపము దాలుస్తోంది.

→ అటు తరువాత మనస్సే ‘‘స్పర్శబీజ రసోన్ముఖము’’ - అయి క్షణములో వాయురూపము, వాయు స్పందనరూపము సంతరించుకుంటోంది.

→ ఆ తరువాత ఆకాశ-వాయువుల శబ్ద- స్పర్శకార్యముల దృఢ అభ్యాసము చేస్తూ తత్ఫలితంగా వాయు తరంగముల సంఘర్షణ నుండి అగ్ని జనిస్తోంది. అగ్ని - శబ్ద, స్పర్శ, రూపములుగా క్షణములో అవటము కూడా - మనస్సు చేస్తున్న పనే.

→ శబ్ద స్పర్శ రూపముల అభ్యాసముచే మనస్సు రసస్వరూపముగా అగుచున్నది.

→ శబ్ద-స్పర్శ-రూప-రసగుణసమన్వితంగా అగుచున్నదంతా మనస్సు యొక్క భావనా చమత్కారమే.

→ శబ్ద-స్పర్శ - రూప-రసముల సంఘర్షణచే గంధతన్మాత్ర బయల్వెడలి భూమి (Solid) రూపమును (మనస్సే) సంతరించుకుంటోంది. ఇదియే మనస్సు యొక్క పృథ్వీ అనుభవము.

ఈ విధంగా మనస్సే పంచతన్మాత్రల రూపము దాల్చినదై, సూక్ష్మతత్త్వము నుండి స్థూలమగు స్థూల పంచభూతములుగా విస్ఫురణము అవుతోంది.

పుర్యష్టకము

అహంకార కలనము + బుద్ధి బీజసమన్వితము + జీవాత్మ + పంచతన్మాత్రలు (శబ్ద స్పర్శరూప రసగంధ సూక్ష్మతత్త్వములు) కలిపి ‘‘పుర్యష్టకము’’ (A Township of Eight factors) - అని పిలుస్తూ ఉంటారు. అట్టి పుర్యష్టక స్వరూపిణి అయి మనస్సే ‘‘హృదయము’’ అనే పద్మములో ‘తుమ్మెద’ వలె నివాసము కలిగి ఉంటోంది.

హృదయములో పూర్యష్టకరూపము దాల్చిన మనస్సు యొక్క తీవ్రమైన ‘సంభ్రమము’ను ఆశ్రయించి, సంకల్పబలము వలన - బిల్వ వృక్షమునకు బిల్వ ఫలము వలె - స్థూలత్వమును మననము చేస్తూ ‘స్థూలాకారము’ యొక్క భావనా ఫలమును పొందుతోంది. అప్పుడు మూసలో కరిగించిన బంగారము వలె నిర్మలాకాశములో ‘తేజస్సు’ అను స్వస్వభావ చమత్కారముగా రూపుదిద్దుకుంటోంది.

సన్నివేశమ్ అథా దత్తే తత్ తేజః స్వస్వభావతః।। ఆ తేజస్సే స్వస్వభావన చేత ‘సాకారము’గా ప్రదర్శనము అవుతోంది. అది మూర్తీభవించి ‘భౌతికరూపము’ దాల్చుచున్నది.

అట్టి మూర్తి (దేహాకారము యొక్క / పిండమయము) యొక్క
- ఊర్ధ్వం శిరః। పై భాగమున శిరస్సు
- మధ్యన పొట్ట.
- క్రింద భాగము నందు కాళ్ళు
- రెండుప్రక్కల చేతులు
క్రమంగా ఈ మూర్తీభవించిన భౌతిక శరీరముగా నిర్మల నిగ్రహరూపమై ప్రస్ఫుటం అవుతోంది.

అట్టి మూర్తీభవించినట్టి మూర్తియే..,
- శరీరము అను భౌతిక రూపముగాను,
- అంతరమున బుద్ధి - సత్త్వము (తెలివి) - బలము - ఉత్సాహము- విజ్ఞానములను తన ఐశ్వర్యములుగాను
ఆత్మయే దేహమున ప్రవేశమానమై ఉంటోంది.

ఇట్టి మొట్టమొదటి పూర్యష్టక సమన్విత సాకార రూపమే - సృష్టికర్త, సర్వలోక పితామహుడు, సృష్టిభావనా సంకల్ప సమన్వితుడు, సృష్ట్యభిమాని - అగు ‘‘బ్రహ్మదేవుడు’’.

అట్టి ప్రథమ సాకారుడు - సారూప్యడు, త్రికాలములు తెలిసిన త్రికాలజ్ఞుడు అగు బ్రహ్మ - తన పుర్యష్టకసాకారమును చూచుకొన్నారు. ‘‘కేవల చిన్మాత్రరూపము, పారము (Long extended), కంటికి కనబడనట్టిది, సమస్తమునకు ప్రప్రథమము అగు పరమాకాశము నందు నా ఈ ‘‘సాకారము’’ అసలు ఏమై ఉన్నది?’’ అని యోచిస్తూ ధ్యానము చేయసాగారు. ‘‘బ్రహ్మమే బ్రహ్మముగా అయి బ్రహ్మము గురించి చింతన చేయనారంభిస్తోంది!’’ - అన్నమాట। - అని గమనించసాగారు.

అట్టి ధ్యానము యొక్క ప్రయోజనముగా సృష్టి సంకల్పాభిమాని అగు బ్రహ్మదేవ చైతన్యము (లేక) బ్రహ్మదేవుడు నిర్మల హృదయుడు అయ్యారు. అట్టి నిర్మలమగు ఆత్మదృష్టిచే ఇతఃపూర్వపు సర్గములను (సృష్టులను) సందర్శించు సామర్థ్యము పొందారు. ‘‘నేను కూడా ఆ విధంగానే సృష్టులను సంకల్పించెదనుగాక’’ - అను రూపంగా ‘సృష్టి సంకల్పుడు’ అయ్యారు. స్వధర్మ-స్వగుణ క్రమములను అనుసరించి ఆయన యందు ఈ సృష్టి సంరంభమంతా - మానసిక నగరము అయిన గంధర్వనగరం లాగా - (లీలగా, క్రీడగా, సరదాగా) బయల్వెడలసాగింది. అంతా సంకల్ప/ఊహామాత్రమే.

అప్పుడు ఆయన….

… ఇవన్నీ కల్పించసాగారు.

కనుక,
➤ ఈ సమస్త దృశ్యజగత్తు ఒక నవల వ్రాసే నవలా రచయితలాగా - విరించి (బ్రహ్మదేవుని) యొక్క (సమిష్టి) మనస్సుచే సంకల్పించబడి - కల్పించబడినట్టిదే।
➤ సమష్టి మనస్సు ఉన్నంతవరకు ‘జగత్తు’ యొక్క ఉనికి కొనసాగుచూనే ఉంటుంది.
➤ సంకల్పము ఉపశమించటమే మనో ఉపశమనము.
➤ మనస్సు యొక్క ఉపశనము జరిగిందా, జగత్తు నశించినదే అవుతుంది.
➤ ‘జగత్తు’ అనబడునది ఊహ-భావనారూపమగు మనస్సు యొక్క కల్పన మాత్రమే.
➤ మనస్సు అనునది - జలంలో సాకార తరంగంలాగా - సమస్తమునకు ఆవల గల నిరాకారమగు ఆత్మ నుండి సాకారమై సారూప్యమగుచున్నది. తరంగము జలమునకు అభిన్నమైనట్లే, జగత్తు ఆత్మకు అభిన్నము.

న జాయతే, న మ్రియతే క్వచిత్ కించిత్ కదాచన।

హే బ్రహ్మన్! మహాశయా! నిదాఘా! ఈ జగత్ దృశ్యమై ఒకానొక ముఖ్యమైన విషయము గమనించెదవుగాక। పరమార్ధముగా గమనిస్తే ఇచ్చట దృశ్యమానమగుచున్న దృశ్యము-అనబడుదానిలో,-ఏదీ పుట్టటములేదు. నశించటమూ లేదు. ఇదంతా ఇంద్రజాలమువలె ‘‘మిథ్యాదృశ్యము’’ వంటిది మాత్రమే. అందుచే ‘‘ఆశలు’’ అనే విషయ సర్పములతో నిండియున్నట్టి సంసారాడంబరమును (The magic show of worldy appearence) నీవు మొదలంట్లా మునుముందుగానే బుద్ధితో త్యజించిన వాడివై ఉండెదవు గాక!

‘‘అసత్ ఏతత్’’ ఇతి జ్ఞాత్వా, మాతృభావం నివేశయ।। ఓ నిదాఘా! ఈ సమస్త త్రిలోక దృశ్యము స్వతఃగా అసత్తే (Not individually and indepently existant)’’ అని ఎరిగినవాడివై, (తరంగమునకు జలమువలె) అద్దాని జనన స్థానము (The origin) అగు ‘ఆత్మ’యందు ‘‘మాతృభావము’’ (The sense of understanding that all this is always that) కలిగియుండెదవుగాక! మనోభ్రమచే దర్శించబడే గంధర్వనగరం (Illusionary Township)లో కనిపించే వస్తువులు భూషితము (Decorative) అయితే ఏమున్నది? అభూషితములు అయితే ఏమున్నది? ఇక్కడి పుత్రులు మొదలైనవన్నీ మాయానగరంలోని వస్తుజాలమువంటివి మాత్రమే। కః క్రమ సుఖ దుఃఖయో? స్వతఃగా లేనట్టి వస్తువులు కలిగించే సుఖ-దుఃఖములు ఏముంటాయి?

ధన దారేషు వృద్ధేషు దుఃఖ యక్తం। న తుష్టతా! ధనము - భార్య - భర్త - పుత్రులు మొదలైన వాటిలో సంబంధములు వృద్ధి చెందటము - అనేది అనేక దుఃఖములు తెచ్చిపెట్టేవేగాని, సుఖప్రదము కానేకాదు. మోహము, మాయ (Illusionary; Actually not there) అయి కనిపిస్తున్న వస్తు- విషయములపై విశ్వాసము కలిగి ఉండటమేమిటి?

శ్లో।। యైరేవ జాయతే ‘‘రాగో’’ మూర్ఖస్య అధికతాం గతైః,
తైరేవ భోగైః ప్రాజ్ఞస్య ‘‘విరాగ’’ ఉపజాయతే।।

మూర్ఖునికి ఏఏ ప్రాపంచక విషయాలు, సంగతులు, సంపత్తులు, సంబంధములు, అనుబంధములు, బాంధవ్యములు, మొదలైనవాటి పట్ల, ‘‘ఆహా! ఇవి నాకు లేకపోతే ఎట్లా? ఇవి లేకుంటే నేను ఉండగలనా?’’ - అను రూపము గల ‘రాగము’ ఏర్పడుతోందో,..
వాటన్నిటి పట్ల ప్రాజ్ఞుడైనవాడు ‘‘ఇవన్నీ కల్పిత ప్రపంచమునకు (జగన్నాటకమునకు) సంబంధించినవేగాని, ఆత్మస్వరూపుడనగు నాకు మొదలే సంబంధించినవి కావు. ఈషణ్మాత్రము కూడా కాదు’’ - అనే ‘‘విరాగము’’ కలిగి ఉంటాడు.

అందుచేత తత్త్వజ్ఞా! నిదాఘా! ‘‘అపేక్ష’’ను (Desire and fondness) త్యజించి ఉండుము.

సంసార వ్యవహారములలో ఎటువంటి లాభ-నష్టములు, కష్ట-సుఖములు కలిగి ఉన్నప్పటికీ, అంతకుముందే సమస్త దృశ్యము పట్ల ‘‘ఉపేక్ష (Just Ignoring)" కలిగి యుండెదవుగాక! నష్టం నష్టం ఉపేక్షస్వ।

ప్రాప్తం ప్రాప్తం ఉపాహర। ఏది ఎంతవరకు ఆయాచితంగా ప్రాప్తిస్తే అంతమాత్రం చేతనే స్వీకరిస్తూ ‘సంతృప్తి’ని స్వాభావికంగా కలిగి ఉండుము. ‘సంతృప్తి’ని స్వాభావికంగా చేసుకొనెదవుగాక. సంతోషముగా ఉండటమును ఎట్టి పరిస్థితులలోను విడువవద్దు.

పండిత లక్షణము

శ్లో।। అనాగతానాం భోగానామ్ అవాంఛనమ్, అకృత్రిమమ్
ఆగతానాం చ సంభోగ। - ఇతి పండిత లక్షణమ్।।

→ లభించని భోగముల గురించి ‘వాంఛ’ (Desire and dependence on its materializing) కలిగి ఉండకపోవటము.
→ లభించిన దానిని అకృత్రిమ బుద్ధితో తృప్తి పడి సంతోషముగా ఆస్వాదించటము.
ఈ రెండు నిత్యానిత్య వివేకులగు పండితులలో స్వాభావికంగా కనిపించే లక్షణములు.

┄┄┄

ఓ నిదాఘా!

సత్-అసత్ (I - my)ల మధ్యగా ఏ శుద్ధము - కేవలము అగు స్వస్వరూపము పదము (A state of self) వేంచేసి ఉన్నదో, అద్దానిని తెలుసుకొన్నవాడవై అవలంబించి ఉండుము.

ఇక ఈ బాహ్య-అభ్యంతరములలో సందృశ్యమై కనిపిస్తున్న సమస్తమును స్వీకరించనూ వద్దు. విడువనూ వద్దు. ఈ సమస్త జగద్దృశ్య వ్యవహారమంతా కల్పనామాత్రమే.’’ - అని గమనించినవాడవై, ఇద్దాని యందు రాగము (fondness) కలిగి ఉండవద్దు. ద్వేషము (Dislikingly hetridness) కూడా కలిగియుండనే వద్దు.

ఎవ్వడైతే కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ ‘ఇచ్ఛ - అయిచ్ఛ’ (Desire or Desirelessness) కలిగియే ఉండడో, అట్టివాడు - జలములో ఉండి కూడా జలమును స్వీకరించని పద్మము యొక్క పూరెక్కవలె (పద్మపత్రమివ అంభస) - ఆ కర్మల యొక్క కర్తృత్వముగాని, కర్మఫలముల భోక్తృత్వముగాని కలిగియుండడు: అట్టివాడే ‘జ్ఞాని’. (తస్మాత్ జ్ఞానమయో భవ।)

భవసాగరము దాటటము ఎట్లా?

భవము = ‘ఈ జగత్తు నిజంగానే ఉన్నది’ అను భ్రమ భావన.

సాగరము = అనేక దృశ్యవిషయ పరంపరా తరంగములు హృదయములో ‘నిజమే’ అనే దృష్టితో పరస్పరం ముడివడి ఏర్పడినవై ఉండటము.

ఓ ద్విజోత్తమా! నిదాఘా! ఎప్పుడైతే నీకు హృదయములో శబ్ద - స్పర్శ-రూప-రస -గంథ సంబంధమైన సమస్త ఇంద్రియార్థములు (లేక) ఇంద్రియ విషయములు రుచింపకయే ఉంటాయో, ఇకప్పుడు నీ యందు ఆత్మజ్ఞానము వెల్లివిరియగలదు. అట్టి ‘జ్ఞానము’ అనే నావ సహాయముతో నీవు ఈ భావసాగరమును (ఇంద్రియార్థములతో పెనవేసుకొన్న ఇచ్ఛా-ద్వేష-కామ-క్రోధ-లోభములను) దాటివేయగలవు.

పుష్పము నుండి గంధమును వేరు అగుచున్న రీతిగా, నీవు చిత్తవృత్తుల రూపమున ఉన్న వాసనా సమూహములను ప్రజ్ఞతో వేరుచేసి ‘పరము’న (సమస్తమునకు ఆవల) గల అత్యుత్తమమగు ‘‘ఆత్మపదము’’ను సిద్ధించుకొనెదవుగాక!

పడవ జలములోనే ఉంటూ ఉన్నప్పటికీ, పడవ లోనికి జలమును రానీయముకదా! అట్లాగే వాసనలు అనే సంసార సాగరజలములో ‘ప్రజ్ఞ’ లేక ‘ఆత్మజ్ఞానము’ అనే పడవను అధిరోహించి, మహాత్ములు జగత్ విషయములను, ఇచ్ఛ- అనిచ్ఛ సంబంధమైన ఇంద్రియ విషయవాసనలను దాటివేసి - ఆవల గల ‘సోఽహమ్ ఆత్మ’ అను ఒడ్డుకు సులభముగా చేరుచున్నారు. హృదయములో జగద్విషయములను చోటివ్వనివారై ఉంటున్నారు.

శ్లో।। యే ‘‘ప్రజ్ఞా-నావమ్’’-ఆరూఢాః, తే తీర్ణాః పండితాః పరే।।

‘ప్రజ్ఞ’ అను నావ (Boat)ను అధిరోహించి, ఈ సంసార సాగరమును దాటి, ‘‘కేవలము-అఖండము’’-అగు ఆత్మతత్త్వమును ఎరిగి ‘ఆత్మమేవాహమ్’ సిద్ధించుకొన్నవారే ‘‘పరతత్త్వజ్ఞులగు పండితులు’’.

అట్టి మహనీయులగు బ్రహ్మతత్త్వజ్ఞులు
- న త్యజంత్తి, న వాంఛన్తి, వ్యవహారమ్ జగద్గతమ్ - జగత్-విషయములను వాంఛించరు. త్యజించరు.
- సర్వమేవ అనువర్తన్తే పారావారవిదో జనాః। సర్వము ఎరిగి, సర్వత్రా ఆత్మదర్శనము చేస్తూనే యధా -ఉచితమైన ఆయా స్వధర్మములగు కార్యములు నిర్వర్తిస్తూ ఉంటారు.

అప్పుడు కర్మలు అట్టివారిని తమ ఆత్మభావన యొక్క సుస్థిరత్వము నుండి చ్యుతి కలిగించలేవు.

అగ్ని ఏచోట, (తగులబెట్టటము, యజ్ఞవాటిక మొదలైన) ఏ ఏ విధులు నిర్వర్తించవలసి వస్తున్నప్పటికీ, తనయొక్క ‘ఉష్ణము-తేజస్సు’లను విడచి ఉంటుందా? ఉండదు, అట్లాగే, ఆత్మజ్ఞాని తనయొక్క - ‘‘నిత్యత్వము, సత్యము, అఖండత్వము, అప్రమేయత్వము’’ మొదలైన ఆత్మానంద లక్షణములు - విడచి ఉండడు.

సంకల్పమాత్ర జగత్ - సంకల్పమే బంధము

‘ఆత్మ’ యొక్క తత్త్వము అనంతము (The origin of SELF neither begins nor ends up with physical or mental (Thought) zones).

అట్టి ‘‘నేను ఉన్నాను కదా’’ అను సత్తా సామాన్య రూపము (As a sense of presence form) సర్వజీవులలోను, సమస్తమునందు సమముగా వేంచేసినదై ఉన్నది. అట్టి ఆత్మ - ‘‘దృశ్యము (అన్యము)ను ఎఱుగుట’’ అను మూలరూపముతో కూడిన ‘చిచ్ఛక్తి’ని ఆశ్రయించినదై ఉన్నది. (The Self accompanies existence and energy. Energy takes form of knowing).

❋ ఆత్మ యొక్క అట్టి చిచ్ఛక్తియే సంకల్పమునకు అంకురము.

❋ (విత్తనము యొక్క అంకురించటము అనే ధర్మమువలె) చిచ్ఛక్తి యొక్క సంకల్పాంకుర లేశము (A bit of it) ‘సత్త’ (ఉనికి - అనే ధర్మము)ను తీసుకొని - ఆకాశమంతా మేఘము ఆక్రమించురీతిగా - సర్వత్రా వ్యాపించి (ఆపూర్యముచేసి) ఘనీభూతమై ‘‘చిత్తత్వము (ఇష్టము, అభిరుచి)’’ అను (దృఢచిత్త) భావనారూపము పొందుచున్నది. సత్ యే చిత్తముగా అగుచున్నది ‘ఉనికి’ నుండియే ఇష్టము బయల్వెడలుతోంది.

❋ అప్పుడు - భావయన్తి చితిః చైత్యం వ్యతిరిక్తమివ ఆత్మనః। చిత్తము స్వయముగా భావనను జనింపజేసుకొని, అట్టి భావించబడు వస్తువుతో తన్మయమగుచున్నది. క్రమంగా తనయొక్క జనన స్థానమగు ఆత్మను ఏమరచుచున్నది. ‘‘ఈ నాకు అనుభవమగుచున్న భావనా స్థానమంతా ఆత్మకు (లేక) ఆత్మనే అయి ఉన్న నాకు వ్యతిరేకముగా వేరై ఉన్నది’’ - అను ఆత్మకు ‘వ్యతిరేక’ (లేక) వేరైన భావనా రూపము పొందుచున్నది. అనగా ‘‘నేను వేరు! నాకు భావనగా ప్రాప్తిస్తున్న అనుభవవస్తువగు ఇంద్రియ-దృశ్యము వేరు’’ - అను ‘‘ఆత్మవ్యతిరిక్త భావన’’ను ఆశ్రయించి ఉంటోంది. సంకల్పము నందు తన్మయమవుతోంది. సంకల్పము అంటే? కల్పన (Attributive Visualization)నే ‘‘సంకల్పము’’ అని అంటున్నాము.

ఆత్మయే- చిచ్ఛక్తిగాను అటు తరువాత ‘మనస్సు’గాను, ఆపై సంకల్పముగాను అగుచున్నది. సంకల్పమే శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ విషయములుగా రూపమును (నటుడు పాత్రగా రంగముపై కనబడుతీరుగా) అగుచున్నది.

ఆత్మయే స్వయముగా కల్పన చేసి ‘‘కల్పనా రూపమగు జగత్తు - జగదభిమాని (The fondness by the perceiver of the scenary)’’ - అగుచూ, ఆస్వాదించటం ప్రారంభించుచున్నది. ‘‘ఇదంతా స్వయముగా నా కల్పనయే కదా!’’ - అనునది పూర్తిగా ఏమరచి, ‘అన్యము’ అనే జాలములో పడుతోంది.

వర్ధతే స్వయమేవాశు దుఃఖాయ। న సుఖాయయత్। అట్టి ‘కల్పన’ అనునది సుఖము కొరకు కాదు. దుఃఖము కొరకే అయిఉన్నది. అనగా, ఆత్మకు అన్యముగా కనిపించేదంతా-కల్పనగా, లీలగా ప్రారంభమై, ‘బంధము, దుఃఖము’ - గా పరిణమించినదగుచున్నది.

ఓ నిదాఘా! ‘కల్పన’ వలన జనించిన దుఃఖము (Worry) తొలగటానికి ఉపాయము ఏమిటి?

మా సంకల్పయ సంకల్పం। సంకల్పమును సంకల్పించవద్దు. ‘సంకల్పించటము’ అనే జాడ్యముచే జనించే దుఃఖము తొలగాలంటే సంకల్పించటము మానివేయటమే ఉపాయము. భావనచేతనే సమస్తమును అభావన చేసివేయి. (లేక) భావించటమును మానివేసి అప్పుడు ఇంకా శేషించిన దానితో (స్వస్వరూపమునందు) సంస్థితుడనై ఉండుము.

మ అభావమ్ భావయ స్థితే। అభావమును కూడా భావించవద్దు.

సంకల్పించువాడే సంకల్పించకుండా ఉండగలడు కూడా.

‘‘సంకల్పము, భావన’’ - ఈ రెండూ కూడా స్వస్వరూపము, కేవలము అగు ఆత్మయందు స్వతఃగా ఉన్నవి కావు.

అందుచే ప్రియ నిదాఘా! నీవు సంకల్పిస్తూ ఉన్నప్పుడు, సంకల్పించనప్పుడు కూడా - ఆ రెండింటికీ సంబంధించక, ఆవల ఉన్నట్టి సంకల్పరాహిత్య (లేక) సంకల్ప రహిత (లేక సంకల్పాతీత) ఆత్మచైతన్యము నందు సదా సంస్థితుడవై ఉండటమును అభ్యసించు. అప్పుడు సంకల్పములు తమకు తామే ‘స్వయముగా లేనివి’ అవుతాయి. అవి మరల నిన్ను అనుసరించవు.

భావనా అభావమాత్రేణ సంకల్పః క్షీయతే స్వయమ్। భావనలను భావించకపోయినంతమాత్రం చేతనే సంకల్పములు (Assumptions and presumption or assuming and presuming) - క్షీణించగలవు.

మనస్సును మనస్సుతో జయించి, అప్పుడిక - మనస్సు ఎందులో లయిస్తోందో - అట్టి ‘స్వాత్మ’ యందు తిష్ఠితుడవై యుండుము.

ఓ మునీశ్వరా! సంకల్పించటములోనే శ్రమ మొదలైనవి ఉన్నాయి. నీలో నీవు ఉండటములో కష్టము ఏమున్నది? స్వాత్మని తిష్ఠత్వాం కిం ఏతావతి దుష్కరం?

యథైవ ఇదం నభః శూన్యం? జగత్ శూన్యం తథైవ హి।।

ఏ విధంగా ఆకాశము స్వతఃగానే శూన్యమో, ఈ జగత్తు కూడా అదేవిధంగా (ఆకాశము నుండే జనించింది కాబట్టి) - శూన్యమే. ఈ జగత్తు స్వతఃగా లేనేలేదు. అయితే ఏది ఎట్లా దృఢముగా భావన చేస్తే, అది అట్లే జగదనుభవముగా సంతరించుకొని అనుభవమగుచూ ‘‘ఆత్మ వేరు. నేను వేరు. జగత్తు వేరు’’ - అనే భ్రమ (అవిచారణ కారణంగా) సిద్ధిస్తోంది.

‘‘దృశ్యము’’ యొక్క అన్యదర్శన వ్యసనమే దృష్టిదోషముగా రూపము పొంది, అఖండము, స్వాభావికానందము, అగు వాస్తవ స్వస్వరూపమును ‘అనుభవ విషయము’ కాకుండా చేస్తోంది.

నిదాఘుడు : హే మహానుభావన్! సద్గురూ! అవును మీరు సూచిస్తున్నట్లుగా ఆత్మస్వరూపులమగు మేము స్వయం కల్పిత జగత్ దృశ్యములో మనస్సుతో ప్రవేశించి క్రమంగా రాగద్వేషములు, మమకార-అహంకారములు - అనే ‘మలము’ (Impurity) బుద్ధియందు నింపుకొని, ఈ జగత్ సంఘటనలకు నిబద్ధులమగుచున్నాము. ఈ ‘మలము’ తొలిగేది ఎట్లా?

ఋభుమహర్షి : అభ్యాసదోషము వలన వచ్చిన మలదోషము అభ్యాసము చేతనే పోగలదు. సత్యము - నిత్యము - సహజము అయినట్టి స్వస్వరూపాత్మ యొక్క స్వాభావికానుభవమును తిరిగి సముద్ధరించుకోవటానికే శాస్త్రములచే, శాస్త్ర ప్రవక్తలచే, ‘‘యోగాభ్యాసము; భక్తియోగము; కర్మయోగము; జ్ఞానయోగము;’’… మొదలైన ఆయా సాధనా క్రియలు మార్గదర్శకంగా సూచించబడుచున్నాయి.

ఓ నిదాఘా! నిరుత్సాహము పడటమెందుకు? ఈ వర్తమాన మానవ జన్మ ‘కర్మభూమి’ అనుబడుచున్నది. అందుచేత సత్ ప్రయత్నములకై ఉద్యమించాలి. ‘‘అశ్రద్ధ, బద్ధకము, దుర్విమర్శలు’’ మొదలైనవాటిని దరిజేరనీయరాదు.

బిడ్డా! ‘‘మలదోషము రాగద్వేష-లోభ-మోహముల రూపంగా ఉన్నది కదా! ఎందుకుంటోందబ్బా?’’.. అను విశేషమై దిగులును, వేదనను వదలివేయి.

జీవస్య తండులస్యైవ మలం సహజమపి అలమ్! ధాన్యమునకు పొట్టు ఏ విధంగా స్వాభావికమో, ఈ జీవుని పట్ల కూడా - కర్మలు అనివార్యము. కర్మలు కొంత దోషము తెచ్చిపెట్టక మానవు. అవి ఆ విధంగానే స్వాభావికం. ‘‘ఎందుకు వచ్చాయిరా?’’ అనే ప్రశ్నను ప్రక్కకుపెట్టి ‘‘ఈ రాగద్వేషాది మలదోషము తొలగిపోయేది ఎట్లా?’’.. అనే ఉపాయం గురించే మరల మరల ఆలోచించాలి. ఉపాయములను అనుసరించాలి. మలదోషము మొదలంట్లా తొలగించుకోవాలి.

తండులస్య యథా చర్మ - ధాన్యమునకు పొట్టూంటుంది. అప్పుడు ఏమిచేస్తాము? ధాన్యమును యథాతథంగా వండుకొని తినము. చక్కగా దంచుతాము. అప్పుడు బియ్యము-పొట్టు వేరౌతాయి. పొట్టు తొలగించి, బియ్యమును మాత్రమే వండుకొని అన్నము తింటాము కదా!

యథా తామ్రస్య కాళిమా:- రాగి చెంబుకు చిలుము పట్టటం సహజం. అప్పుడేమి చేస్తాము? పాత్రను అట్లాగే (As it is) వాడుతామా? లేదు. అట్లాగే వాడితే తినుబండారములు చేదుమయము అవుతాయి. అందుచేత బూడిద తెచ్చి, రాగిపాత్రను తోమి, నిర్మల జలముతో కడిగి, తుడిచి… శుభ్రముగా మెరయున్నట్లు చేసి, అప్పుడు త్రాగునీళ్లు మొదలైన వాటికోసము వాడుకుంటాము.

అట్లాగే..,
నశ్యతి క్రియయా విప్ర! పురుషస్య తథా మలమ్। పురుష ప్రయత్నముచే మలదోషము (రాగ-ద్వేష-మమకార- అహంకార- కామ-క్రోధ-లోభ-ఇత్యాదులు), విక్షేపదోషము (Distraction from fundamental truth) తప్పక తొలగుతాయి.

ప్రయత్నశీలుడు ఆత్మతత్త్వానుభవమును తప్పక సిద్ధించుకోగలడు. ఇందులో సందేహమే లేదు.

అందుచేత ఓ నిదాఘా! ఓ శ్రోత మహాజనులారా! మీరు ప్రయత్నశీలురై, అభ్యాసపరులై ఉండండి. ‘‘కర్మ-భక్తి-జ్ఞాన-ప్రాణాయా-గురుశుశ్రూష-శాస్త్ర పరిశీలన’’ - ప్రయత్నములను విడువనేవద్దు. ఇకప్పుడు ‘‘ఆత్మజ్ఞానము, అఖండాత్మత్వము’’ అనునవి ఎవ్వరికైనా సరే - లభించదనే ప్రసక్తియే లేదు.

మలం నశ్యతి। ఇత్యేవ న సందేహః। తస్మాత్ ఉద్యోగవాన్ భవ।
ఉద్యమించి ఉద్యోగవంతులు అవండి. సహజమగు ఆత్మ తప్పక స్వానుభావమౌతుంది. ‘‘అబ్బే। ‘అఖండాత్మభావనాసిద్ధి’ రూపమగు మోక్షము మా వల్ల ఎట్లా అవుతుంది?’’ - అనే సందేహ, బద్ధక (Doubtful, Lazy) రూపమగు మాటలు కట్టిపెట్టండి.

ఇతి ఉపనిషత్


6వ అధ్యాయము
ఆత్మయే నీవై ఉండుము (యోఽసి-సోఽసి) స్థిరో భవ।

ఋభు మహర్షి :

ఓం। అంతరాస్థామ్ పరిత్యజ్య భావశ్రీం భావనామయీమ్,
యోఽసి సోఽసి జగత్ యస్మిన్ లీలయా విహర అనఘ।।

పాపదృష్టులు, లేనట్టి ఓ నిదాఘా!

దృశ్య విశేషములకు కర్త ఎవరు? కర్తయే లేడు!

ఒక నాటకములో ఒక సంఘటనకు కర్త ఎవ్వరు?

→ పాత్రధారులు కర్తయా? - కాదు.
అక్కడ పాత్రధారులు నాటకములో నటిస్తున్నారు. అంతవరకే! అందుకు కారణం వారిపై ఆపాదించలేము.
అవును కూడా ఎందుకంటే…,
ఆ రసమును ప్రదర్శించి, రక్తి కట్టిస్తున్నారు కదా।

→ ప్రేక్షకులు కర్తయా? : కాదు.
పేక్షకులు నాటకమును చూచి ఆనందించేవారు మాత్రమే. ‘‘వారు సంఘటనకు కర్త’’ - అని కర్తృత్వము ఎట్లా ఆపాదిస్తాము?
అవును కూడా!
ఆ రసమును ఆతీరుగా కోరుకొని ఆనందిస్తున్నారుగా"!

→ దర్శకుడు కర్తయా? కాదు.
దర్శకుడు వ్రాయబడియున్న (Already written) నాటకమును రచయితయొక్క ఉద్దేశ్యమును ప్రదర్శితమయ్యేతీరుగా, ప్రేక్షకులను రంజింపజేసే విధంగా దర్శకత్వం (Direction) వహిస్తారు. అంతవరకే. నాటకములోని సంఘటనను ఆతనిపై ఆపాదించలేము.
అవును కూడా!
రచయిత యొక్క భావనను రసాత్మకంగా ప్రదర్శించబడునట్లుగా చిత్రగతిని నడుపుచున్నాడుకదా! ఆతను చెప్పిందే, నేర్పిందే పాత్రధారు నిర్వర్తిస్తున్నారు కదా!

→ పోనీ రచయిత కర్తయా?
అవును : ఆతని రచన వల్లనే పాత్రలు ప్రవర్తిస్తున్నాయి కదా! అయితే, ఆతడు ప్రేక్షకులనురంజింపజేయటానికి రచనా కళాత్మకంగా రచించాడు. అంతవరకు కర్తయే!
కాదు : కానీ, పాత్రల యొక్క చెడునో, మంచినో ‘రచయిత యే కర్త। ఆతనే చేస్తున్నాడు’’ అని ఆపాదించగలమా? పాత్రల మంచి-చెడులను రచయితయే కారణము - అని చెప్పగలమా? (అనగా) నాటకములోని ఒక ‘పాత్ర’ చాలా మంచివాడు కాబట్టి ‘‘రచయిత మంచివాడు’’ - అనిగాని, (లేక) మరొక పాత్ర చెడ్డవాడు కాబట్టి ‘‘రచయిత చెడ్డవాడు’’ - అనుగాని ఆపాదించి చెప్పగలమా? లేదు. అట్లా చెప్పటం కుదరదు.

ఆత్మస్వరూపుడు అగు ఈ జీవుడే వాస్తవానికి తన యొక్క జగదనుభవమునకు రచయిత, నిర్మాత, దర్శకుడు, నటుడు, ప్రేక్షకుడు కూడా! ‘‘అయినాసరే ఆత్మస్వరూపుడే అయి ఉండియుండటంచేత - ఈ జీవునికి మంచి, చెడు - ఇత్యాదులు ఆపాదించలేము. ఈ విధంగా తత్త్వజ్ఞులు జగత్‌విషయమై, ఆత్మపట్ల ‘అకర్తృత్వము’, ‘కర్తృత్వము’ కూడా గమనిస్తున్నారు.
ఈ జగన్నాటకమునకు కర్తృత్వము ఎవరిపై ఆపాదించాలి? సృష్టకర్తకుగాని, జీవునికిగాని, మరెవ్వరికిగాని ఆపాదించలేము.


‘‘నాహం కర్తా।’’ నాహం భోక్తా।

అందుచేత ఓ నిదాఘా! ‘‘నేను దేనికీ కర్తను కాదు. భోక్తను కూడా కాదు. మరొకరు కూడా కర్త కాదు. భోక్త కాదు’’ - అను ఎరుక, దృఢభావన నిస్సందేహముగా కలిగియున్నవాడివై, ఇక ఆపై ‘‘జీవితము’’ అనే సందర్భమును పురస్కరించుకొని.. ఈ లోకములో విహరించుము. ఇదంతా జగన్నాటకం. పాత్రలకు కర్తృత్వమేముంటుంది? ‘కర్తయే లేడు. అన్న తరువాత ‘భోక్త’ కూడా ఉండడు కదా! భోక్తయే లేనప్పుడు బంధమెవరికి?

సమతా సర్వభావేషు!

పరమామృత నామ్నీ సా ‘సమతా’ (ఏవ) అవశిష్యతే।
‘‘నాహం కర్తా-భోక్తా’ భావనచే, ఇక ఆపై నీపట్ల’’ ‘‘పరమామృతము’’ అని పిలువబడే ‘సర్వత్రా సమదర్శనము’. అనునిత్యమై సిద్ధించగలదు.

‘‘ఇది సుఖము- ఇది దుఃఖము’’ - అను భేద - ఉల్లాస వ్యవహారమంతా కేవలము మనస్సుచే కల్పించబడునదై ఉంటోంది. మనస్సుకు ఆధారమైనట్టి ‘ఆత్మ’కు సంబంధించి కాదు. నీవో? సర్వదా ఆత్మ స్వరూపుడవు. మనస్సో? సంకల్పముల రూపమే కదా!

కనుక ‘‘సంకల్పించటము’’ అనే క్రియా వ్యవహారము తొలగించుకొంటే,.. అప్పుడిక శేషించేది నీయొక్క కేవలము, నిర్మలము, సమస్తమునకు పరము, అఖండము అగు ఆత్మ స్వరూపమే! మననమునకు ముందే ఉన్న నీ (మునుముందు) రూపమును మననము చేయి. ఇప్పుడు నీకు అన్యముగా కనిపించేదంతా ఆత్మగా భావన చేయి.

ఓ మునివర్యా! ఎప్పుడైతే నీయొక్క చిత్తము భేదదృష్టిని మొదలంట్లా త్యజించి, సర్వభావముల పట్ల సమతత్వము (భావనారాయణత్వము) వహించినదై ఉంటుందో, .. అట్టి ‘‘నిర్మలమైన - సమున్నతమైన’’ చిత్తము సిద్ధించుకొన్నవాడు - ఇక - పునః జన్మలలో చిక్కుకోడు. ‘జన్మరాహిత్యము’ - సిద్ధించుకొంటాడు.

అథవా, సర్వకర్తృత్వం చ, త్యక్త్వా స్థిరోభవ। (లేదా) ‘నేను సర్వదా అకర్తను’ - అనేది కాకుండా మరొక మార్గము వివరించి చెప్పుచున్నాను. విను. ‘‘సమస్తము మనస్సు యొక్క కల్పనయే। మనస్సు నా నుండి బయల్వెడలే భావనా రూపమే. కాబట్టి సమస్తమునకు నేనే కర్తను’’ - అను భావనను ఆశ్రయించు. ‘‘సమస్తము నాకర్తృత్వమే’’ అనే భావనతో మహాకర్తృత్వము వహించి ఆస్వాదించు. ‘‘స్వప్నమునకు కర్తను నేనే అయినట్లు, జాగ్రత్ కూడా కర్తను నేనే’’ అని భావించి, అప్పుడు-ఈ జగద్దృశ్యమును ఆహ్వానించు.

కర్తృత్వ - అకర్తృత్వాతీతము!

శ్లో।। అథవా సర్వకర్తృత్వం(చ) - అకర్తృత్వం చ వై, మునే!
సర్వం త్యక్త్వా, మనః పీత్వా యోఽసి సోఽసి స్థిరోభవ।।

ఓ మునీశ్వరా! క్రమంగా, (1) సర్వకర్తృత్వములు (2) సర్వ అకర్తృత్వములు - ఈ రెండూ మనస్సుతో త్యజించి వేయి. దేనితో ఆ రెండూ త్యజిస్తున్నావో, అట్టి త్యజిస్తున్న మనస్సును కూడా నీలోనికి ఉపసంహరించు. అప్పుడు ఏది శేషిస్తుందో అట్టి ‘‘స్వస్వరూపాత్మ’’ యందు సుస్థిరుడవై ఉండెదవు గాక.

(అనగా), దేనితో కర్తృత్వ-అకర్తృత్వములు త్యజిస్తున్నావో అద్దానిని కూడా (ముల్లు గుచ్చుకున్నవాడు మరొక ముల్లు తెచ్చి, గ్రుచ్చుకున్న ముల్లును బయటకు తీసి - ఆపై రెండు ముళ్ళు ఆవల సారవేస్తున్న విధంగా) - త్యజించిన వాడవై ఉండుము. అప్పటికీ శేషించిన ఆత్మయందు సమాధానము కలవాడవై (Having answered all types of differences) ఉండుము. ఆత్మస్వరూపుడవై మనస్సును శీతలపానీయమువలె పీల్చివేయుము.

మనస్సును ఏ అహంకారముతో త్యజిస్తున్నావో, అట్టి అహంకారమును త్యజించి, నీయందు నీవే ప్రశాంత - ఆనంద చిత్తుడువై ఉండెదవుగాక!

పై విధంగా తీర్చిదిద్దుకొనుచూ - ఎవ్వరైతే,

ఆత్మానందము
చిదానందరూపమ్। శివోఽహమ్। శివోఽహమ్।

ఋభు మహర్షి : హృదయమునందు ఆత్మానందజ్యోతిని వెలిగించి, ‘సర్వప్రాపంచక దృష్టులు - ఈషణములు’ అనే చీకటిని తొలగించుకొని,ఈ సమస్త బాహ్య- అభ్యంతరములను స్వకీయ శివానంద స్వరూపముగా దర్శిస్తున్న మహనీయుని బ్రహ్మానంద గానామృతమును విను.

ఆహా! (1) నాయొక్క, (2) తదితర ‘‘నీవు-ఆతడు-ఈతడు’’ మొదలైన సమస్త జీవుల యొక్క, (3) ఈ సమస్త జగద్దృశ్యము యొక్క ‘‘వాస్తవ-స్వాభావిక-సహజ-అనునిత్య’’ రూపము ‘ఆత్మ’యే-అని దర్శించుచున్నాను. అట్టి స్వాభావిక సిద్ధియే ఆత్మ సాక్షాత్కారము. ‘‘అనుకోవటము’’ యొక్క అవసరం లేకుండానే సమస్తము స్వాభావికంగా స్వస్వరూపాత్మయే’’- అని అనిపించటమే ఆత్మసాక్షాత్కారము.

దృష్టం ద్రష్టవ్యమ్ అఖిలమ్। - చూడవలసిన సమస్తమును చూచిన వాడను అగుచున్నాను.

ఇంతవరకు అహ్రాంతితో ‘‘ఏదో పొందాలి! చేయాలి! చూడాలి! అప్పటికి గాని పొందవలసినది పొందినట్లు కాదు’’.. అని, ‘‘ఎక్కడో ఏమిటో? ఏదియో?’’ అని చెప్పుకుంటూ పది దిక్కులలోన సంచారాలు చేస్తూ అనేక ఉపాధులతో వెతికాను. చివ్వరికి ‘‘అది నాయొక్క స్వస్వరూపాత్మయే’’ అని ఇప్పుడు హృదయములో జ్ఞానజ్యోతి వెలుగుచుండగా, చీకట్లు తొలగి, సత్యము అత్యంత సుస్పష్టము అయింది.

యుక్త్యా వై చరతో జ్ఞస్య సంసారో గోష్పదాకృతిః। ఆత్మ గురించి ఎరిగి, కించిత్ ఉపాయముతో ఎవ్వరు సంసారము నందు చరిస్తూ ఉంటారో, అట్టివారికి - ‘అపారము’ అని చెప్పబడే సంసార సాగరము - గోవుపాదముద్ర దాటటమంత సులభము అవుతుంది. ఇక ‘‘సంసారసాగరము, భవబంధము’’ మొదలైన మాటలన్నీ కూడా ‘ఉత్తుత్తివే’ అవుతాయి.

ఏ ఇంద్రియ జగత్తు జాగ్రత్ -స్వప్నములలో ఎదురుగా తారసబడుచూ ‘‘అపారము, దాటరానిది. బంధము మోక్షము అతిదుర్లభము’’ - అని ఇంతకాలము అదంతా కూడా అనిపిస్తూ ఉన్నదో…అదంతా కూడా ‘‘మొదలే లేదు’’.. అని తెలియవస్తోంది.

ఎందుకంటే..,

శ్లో।। స బాహ్య-అభ్యన్తరే దేహే హి, అధ ఊర్ధ్వన్చ దిక్షు చ
ఇత ఆత్మా! తతోఽపి ఆత్మా। నాస్తి అనాత్మమయం జగత్।।

ఈ దేహము యొక్క లోపల - వెలుపలి, క్రింద-పైన, సమస్త దిక్కులలో - ఆత్మయే సమస్తముగా వ్యాపించి సంప్రదర్శితమై ఉన్నది. అందుచేత ‘అనాత్మ’అనుదానికి చోటెక్కడ? చోటేలేదు. ‘జగత్తు’ అనబడేదేదీ ఆత్మకు వేరై కించిత్ కూడా లేదు. సమస్తము ఆత్మయే అయి ఉండగా ‘ఇది ఆత్మ। అది అనాత్మ’’ - అనే ప్రసక్తి ఎక్కడిది? ఇది ఆత్మయే। అదీ ఆత్మయే।

అహమాత్మా! సోఽహమ్। నేను సర్వదా ఆత్మయే అయి ఉన్నాను. దృశ్యము, దేహము, ఇంద్రియములు, ఇంద్రియార్థములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము - ఇవన్నీ ఆత్మ స్వరూపుడనగు నాకు వేరై లేవు. ఎక్కడ ఏదీ నేను కానిదిగాని, నాచే ‘తన్మయము’ కానిదిగాని లేనే లేదు.

సర్వం సత్-చిత్ -మయమ్ తతమ్। కిమ్ అన్యత్ అభివాంఛామి? సమస్తము నా సచ్చిన్మయస్వరూపమే అయి ఉండగా, దేనిని వేరుగా కోరుకోవాలి.

సమస్తం ఖలు ఇదం బ్రహ్మ। ఈ ఇంద్రియముల జగత్తుగా కనిపిస్తున్న సమస్తము స్వయముగా బ్రహ్మమే అయి ఉన్నది. ఈ సమస్తముగా ఆత్మయే విస్తరించినదై ఉంటోంది. సర్వమ్ ఆత్మా ఇదమ్ ఆతతమ్।

ఓ అనఘా! నిదాఘా మహాశయా! సమస్తము సర్వదా వ్యాపక బ్రహ్మమే అయి ఉండగా, ఇక అద్దానిలో ‘‘అహమ్-నేను। అన్యమ్।- నాకు వేరైనది! నేను వేరు! ఇదంతా వేరు’’.. అనిపించటమనేది ‘అహ్రాంతి’యే అయి ఉన్నది. ఘనీభూతమైనట్టి ‘‘బ్రహ్మము’’నకు మాత్రమే ‘ఉనికి’ ఉన్నది. బ్రహ్మమునకు అన్యమైనదంతా ‘కల్పితము’ మాత్రమే! అందుచేత వస్తుతః స్వకీయమైన ఉనికి లేదు. ఆత్మ యొక్క భావనచేతనే ‘‘అన్యము ఉన్నది’’- అని పరికల్పించబడుతోంది. అట్టి పరికల్పన(Deep attribution)చే ఉన్నదానివలె అగుచున్నది.

‘‘స్వతఃగా ఈ జగద్దృశ్యము ఉన్నదా?’’ అనే పరిశీలనాత్మక దృష్టితో చూస్తేనో?

శ్లో।। న శోకోఽస్తి। న మోహోఽస్తి। న జరాఽస్తి। న జన్మనా।
ఇక్కడ స్వతఃగా (భావన-అనునది లేకుండా) శోకము లేదు. మోహము లేదు. జన్మలేదు. వార్ధక్యము లేదు. మరణము లేదు.

మరి? యత్ అస్తి ఇహ, తదేవ అస్తి। ఏదైతే స్వతఃగానే ఉన్నదో, అదియే ఇక్కడ ఇదంతాగా ఉన్నది.

కాబట్టి ఓ నిదాఘా! అన్ని వేదనలు త్యజించివేయి. విజ్వరుడవై సర్వదా ఆత్మస్వరూపుడవై ఉండెదవుగాక! ‘‘సర్వదా సర్వత్రా సమస్తము స్వయముగా బ్రహ్మమే!’’ అను దృష్టిని కలిగియుండి, ఏది ప్రాప్తిస్తే అది సద్బ్రహ్మ భావనతో ఆస్వాదించు. ‘‘ఏదో లేనిది కావాలి. ఉన్నది వదలాలి’’.. అనునదంతా త్యజించి ఉండు. త్యాగా దాన పరిత్యాగీ విజ్వరో భవ సర్వదా।

💐 ‘‘నేను వదలాలి। - ఇచ్చివేయాలి।’’ - అను ప్రయత్న వ్యవహారము కూడా వదలివేయి.
💐 సమస్తమును స్వాభావికంగానే త్యజించినవాడవై ఉండు.
💐 దేనితో పరిత్యజిస్తూ ఉన్నావో, అట్టి ‘త్యాగము’ అనుదానిని కూడా త్యజించినవాడవై, రుగ్మతలన్నీ రహితము చేసుకొని ఉండు.

ఓ మహామతీ! ‘‘జన్మలే నాకు లేవు’’ అని తెలుసుకొన్న నాకు, ‘‘ఇదియే -అంతిమ జన్మ’’ అను భావముతో మాత్రం పనియేముంటుంది? జన్మ-కర్మలకంటే ముందేగల ఆత్మగా - ‘‘ఆత్మతత్త్వానుభవి’’ - అయి ఉండుము.

మౌక్తికములు (ముత్యములు) నుంచి వెదురుకర్రతో చేసిన ‘వేణువు’కు అలంకరించబడువిధంగా దృశ్యము పట్ల అనురక్తిని జయించిన మనస్సు సంపాదించుకొన్నవారు ‘స్వస్వరూపాత్మ’ అనబడు సమ్యక్ స్థానమును సిద్ధించుకొంటున్నారు. ఆత్మయొక్క ప్రసంగముచే విషయముల పట్ల విరక్తి (అనురక్తి రాహిత్యము) స్వాభావికము అగుచున్నది.

ఓ నిదాఘా! మనందరికీ ద్రష్ట - దర్శన సంయోగము చేత (The pleasure that is emanating from the coincidence of perceiver and the object of perception) ఏ ఆనందము జనిస్తోందో, - అది వస్తువులోంచి జనిస్తోందనుకుంటున్నావా? లేదు. ఆత్మనుండియే ఆ ఆనందము పుట్టుకువస్తోంది. అందుకు దృశ్యవస్తువు ‘కారణము’ కాదు, ‘కార్యమూ’ కాదు.

‘బుద్ధి’ అనే దర్పణములో ప్రతిబింబించే ఆనందము ఆత్మ నుండియే ప్రాప్తిస్తోంది. సమస్త ఆనందములు ఆత్మనుండియే బయల్వెడలుచూ ఉండగా - వస్తువు నుండి కలుగుచున్నట్లుగా (భ్రమచే) అనిపిస్తోంది. అట్టి స్వస్వరూప - సమస్త స్వరూప ఆత్మనే మేము ఎల్లప్పుడు ఉపాసిస్తున్నాము. ఈ సమస్తము సర్వ జన్మ-కర్మ వ్యవహారములతో సహా - ఆత్మగానే ఆస్వాదిస్తూ, ఆత్మానందము పొందుచున్నాము.

ద్రష్ట-దర్శన-దృశ్యములను వాటికి సంబంధించిన వాసనలతో సహా (Perceiver - perception - All that being percieved along with Tendencies) త్యజించగా, ఆ మూడింటి మధ్యగా ఏదైతే ప్రప్రధమ దర్శనము (perceiving)గా ఆభాసిస్తోందో, - అట్టి ‘ఆత్మానందము’ను మేము సర్వదా ఉపాసిస్తున్నాము. అట్టి బుద్ధి వృత్తిజ్ఞానమును ప్రకాశింపజేయునదియే ‘పరమాత్మ’గా మాచే అభ్యాసపూర్వకంగా ఆరాధించబడుతోంది.

ఉన్నది - లేదు (అస్తి-నాస్తి)ల మధ్యగా అనునిత్యముగా ‘‘ప్రకాశము (Enlightenment) రూపముగా, ఏది ప్రకాశించుచున్నదో, - అట్టి ఆత్మయే మాకు ఎల్లప్పుడు ఉపాస్య వస్తువు.

ఓ నిదాఘా!

సంత్యజ్య హృత్ గుహేశానం ‘‘దేవమ్ అన్యమ్’’ ప్రయాన్తియే,.. తే రత్నమ్ అభివాంచ్ఛన్తి - త్యక్త హస్తస్థ కౌస్తుభాః।।

ఎవ్వరైతే హృదయ గుహలో సర్వకాల-సర్వావస్థలందు ఆత్మానందరూపంగా ప్రకాశమానుడైయున్న ఆత్మభగవానుని ప్రక్కకు పెట్టి, అన్యముగా ఉన్న ‘దేవత’ కోసం ప్రయత్నశీలుడై ఉంటాడో.., అట్టివాడు చేతిలో ఉన్న ‘కౌస్తుభమణి’ని విడచిపెట్టి, ఎక్కడో ఉన్న ఒక సాధారణమైన రత్నము గురించి దేవులాడేవాడు - అగుచున్నాడు.

ఇంద్రియజయము

నిదాఘుడు : స్వామీ! మీరు చెప్పుచున్నవన్నీ అక్షర సత్యములే। సశాస్త్రీయములేకూడా। అయితే, మేము బుద్ధి యొక్క చ్యుతి (Distraction) స్వభావముతో కూడి ఉన్నవారమై, ఇంద్రియములను నియమించలేకపోతున్నాము. అవి విచ్చలవిడిగా విషయములపై వ్రాలి, మాకు అనేక బంధములు తెచ్చిపెడుతున్నాయి. మా ఆత్మ యొక్క ఔన్నత్యమును, మహత్-స్వభావమును మేము ఆస్వాదించలేకపోతున్నాము. ఏమి చేయాలి?

మహర్షి ఋభు :

శ్లో।। ఉత్థిత - అనుత్థితాన్ ఏతాన్ ఇంద్రియాదీన్ పునః పునః,
హన్యాత్ వివేకదండేన వజ్రేణేవ హరిః గిరీన్।।

బిడ్డా। నిదాఘా। ఒకానొక సందర్భములో పైకి లేచి గ్రామ-పట్టణములపై వ్రాలుచున్న పర్వతముల రెక్కలను ఇంద్ర భగవానుడు తన వజ్రాయుధముతో ఖండించి వేశారు చూచావా? ఆ విధంగా విషయముల వైపుగా మరల మరల తలలు ఎత్తుతున్న ఇంద్రియ శత్రువులను ‘‘ఆత్మజ్ఞాన వివేకము’’ - అనే వజ్రాయుధముతో అణచి, వశం చేసుకోవాలి. మాటిమాటికీ శాస్త్ర ప్రవచిత సాధనలందు ఇంద్రియములను నియమించాలి. అందుకే శాస్త్రములు, ఆత్మశ్రేయోభిలాషులు, గురువులు, సంఘ పెద్దలు కూడా విధి నిషేధములను (Dos and Don’ts) నియమించి చెప్పటము జరుగుతోంది.

సంసార రాత్రి దుస్స్వప్నే శూన్యే దేహమయే భ్రమే। రాత్రి నిద్రించినప్పుడు అక్కడ ఉన్నది ‘శూన్యమే’ అయినప్పటికీ మనస్సు అనేక దుస్స్వప్నములు ప్రదర్శించి, ఆ స్వప్నశీలునికి-భయము, ఉద్వేగము, దుఃఖము-మొదలైనవి కలుగజేస్తూ పోతోంది కదా!

అట్లాగే, సంసారము (ఇంద్రియ విషయ పరంపరలతో నిర్మలాత్మకు ఏర్పడుచున్న సంబంధ బంధము) స్వతఃగా శూన్యమే అయినప్పటికీ కూడా, ‘‘జన్మ-కర్మ- జరా-మరణ-బాధ-భయ-ఇత్యాది కల్పనచేసి ఈ జీవుని అయోమయములో ముంచి తేల్చుచున్నది.

ఈ దేహభ్రమ (దేహముతో ఏర్పడు అవినాభావ సంబంధము) రాత్రి వచ్చిన కల వలె వాస్తవానికి శూన్యమే. అయితే మాత్రం ఏం? అదంతా సంసృత-విభ్రమమంతా కలుగజేస్తూ ఉన్నది.

సంసారము అనబడు ఇదంతా కూడా (పవిత్రమగు ఆత్మభావనను మరుగునపరచునదై, ఏమరువజేయునదై) ప్రవర్తమానము అవుతోంది.

ఈ విధంగా జనన- మరణ - ఇత్యాది విశేషాలతో కూడిన సంసృతి (లేక) సంసార అహ్రాంతి ‘‘మిథ్యామాత్రమే’’ (It’s actual form is one’s own illusion only) అని తత్త్వవేత్తలు సిద్ధాంతీకరించి మరీ చెప్పుచున్నారు.

బాల్యమంతా ‘అజ్ఞానము’చే ఉపహతము (Beaten) అయి వృధా అగుచున్నది. - అజ్ఞాన ఉపహతో బాల్యే।

యౌవనే వనితా హతః। యౌవన కాలమంతా స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణ - వికర్షణ విశేషాలతో వృధా అయిపోతోంది.

శేషే కళత్ర చింతాఽఽర్తః
ఇక మిగిలిన జీవితము భార్యాబిడ్డల వ్యవహారముల గురించిన చింతనలతో (Worries) గడచిపోతోంది.

మరి స్వస్వరూపమగు ఆత్మగురించి తెలుసుకోవటం ఎప్పటికి?

ఆత్మజ్ఞానము, గురించి అప్రయత్నశీలత్వము

అవును. ఆత్మజ్ఞానము కొరకై ప్రయత్నించకుండా ఈ జీవితమంతా గడపిన నరాధమునకు (నరులలో అధమ దశకు పరిమితమైన వానికి) చివరికి ఏమి మిగిలినట్లు? పుట్టినందుకు ఏమి సాధించినట్లు? దుఃఖపరంపరలను సంస్కారరూపముగా అధికం చేసుకుపోవటమే అగుచున్నది.

‘‘ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వస్తువులు ఉన్నాయి కదా! గృహములు, గుర్రములు, ధనము, గొప్ప జన సంపద ఇవన్నీ సంపాదించుకొంటే సరిపోదా? అవన్నీ గొప్ప సుఖమును కలుగజేస్తాయి కదా!. అందుచేత అవి సంపాదించటానికి జీవితకాలమును వెచ్చిస్తే తప్పేమున్నది? ’’- అని కొందరు భావిస్తూ, ఆత్మతత్త్వజ్ఞానము గురించి ‘విముఖులు’ అగుచున్నారు. కాలమంతా వ్యావహారిక విషయాలకే అర్పించివేస్తున్నారు. అయితే, మరికొందరు ‘‘తత్త్వజ్ఞానమునకు ఇప్పుడు తొందరలేదు. వార్ధక్యంలో చూచుకుందాం’’ - అను అభిప్రాయము కలిగి ఉంటున్నారు.

సతో అసత్త స్థితా మూర్ధ్ని - ‘‘సుందరమైన గొప్ప వస్తువులు’’ అనుకున్న వాటి నెత్తిపై కొన్నాళ్ళకు ‘చెడిపోవటము నశించటము’ అనేది వ్రాసిపెట్టబడి ఉన్నది. అవన్నీ కొన్నాళ్ళకు ఎటో పోనున్నాయి.

రమ్యాణాం మూర్ధ్ని అరమ్యతా। ‘‘ఈ ఈ వస్తువులు కలిగి ఉండటము, రమించటము అమోఘము’’ అనుకుంటున్న వస్తువులపై కొన్నాళ్ళకు ‘అరుచి’ ఏర్పడుచున్నది. వాటి నెత్తి మీద ‘అరమ్యత’ వ్రాయబడియే ఉన్నది. ఇప్పుడు ‘ఎంతో బాగున్నాయి’ అని తెచ్చి ఆస్వాదిస్తూ ఉండగా, కొన్ని రోజుల తరువాత వాటిపై ‘రోత’ పుట్టటం ప్రారంభమౌతోంది. ఈ జగత్తులో ఇప్పుడు రమ్యంగా కనిపించేవన్నీ ‘అరమ్యము’ కాబోవుచున్నాయి.

సుఖానాం మూర్ధ్ని దుఃఖాని : ఏవేవి ‘‘ఇవి నాకు ఎంతో సంతోషము, బ్రహ్మాండము’’ అనుకుంటూ పొందుతామో, కొంచెము సమయమైన తరువాత వాటి ముఖము దుఃఖముగా పరిణమించటమే పర్యవసానముగా అవబోవుచున్నాయి.

అటువంటి - (స్వతఃగా లేనట్టివి బంధుత్వములు మొదలైనవి) - భ్రమచే ‘‘నిజంగానే ఎప్పటికీ ఉంటాయి’’ అని భ్రమింపజేస్తున్నాయ్। పుత్రాదుల అవినాభావ సంబంధములు-(Relationships that outwardly appear as if really existant even though originally non-existent) పైకి రమ్యముగాను, తీరాచూస్తే కొన్నాళ్ళకు బంధము కలిగించేవిగాను అగుచున్నాయి.

అటువంటి వస్తువులను ఆశ్రయించి ఏమి ప్రయోజనం? దృశ్యములో కనిపించే వస్తుజాలమంతా మార్పు-చేర్పులు పొందు స్వభావము, నశించు స్వభావము, సౌందర్యము కోల్పోయి శిధిలమగు స్వభావము కలిగియే ఉంటాయి కదా! నశించనిదంటూ దృశ్యములో ఏమున్నది?

శ్లో।। యేషాం నిమేషణ - ఉన్మేషౌ జగతః ప్రళయ-ఉదయౌ,
తాదృశాః పురుషా యాన్తి। మాదృశాం గణనైవకా?

ఎవ్వరు కనులు తెరిస్తే జగత్తులు పుట్టుకురావటం, వారు కళ్ళు మూయగానే బ్రహ్మాండములు నశించటము జగత్తులు ప్రళయమై (నశించి) పోవటం జరుగుతోందో, అట్టి సృష్టికర్తలగు బ్రహ్మ మొదలైనవారే కాలముచే దిక్కులేని వారై అంతర్హితం అగుచున్నారే! ఇక మావంటి భౌతిక మానవ దేహధారుల గురించి వేరే చెప్పేదేమున్నది? ఈ దేహములు కనులు తెరచి - మూయు సమయంలో మటుమాయమగుచున్నాయి. ఈ విధంగా శరీరములే అత్యంత క్షణికమైనప్పుడు (అశాశ్వతమైనప్పుడు), ఇక దృశ్యములోని ప్రియ అప్రియ వస్తుజాలముల గురించి, సంబంధ - అసంబంధముల క్షణికత్వము గురించి వేరే అనుకోవాలా? అటువంటి దృశ్య సంసారము యొక్క మధ్యగా కనిపిస్తున్న ఈ శరీరము ‘సుఖమైన వస్తువు’ అని ఎవ్వరైనా అనగలరా? నమ్మి ఉండగలరా? క్షణమునకు ఒక విధంగా ఉంటున్న భౌతికదేహము సుఖమయము ఎట్లా అవుతుంది?

స్వస్వరూప-ఆత్మ సందర్శన మహానందం

ఋభు మహర్షి : ఆత్మతత్త్వమును ఎరిగి ‘‘నేను - సదా శివ బ్రహ్మమునే’’ అని ఎరుగుచున్న బ్రహ్మతత్త్వజ్ఞుల బ్రహ్మానందగానము చెప్పుతాను. బిడ్డా! మునివర్యా! నిదాఘా! వినవయ్యా!

⌘⌘

మెలకువ

ప్రబుద్ధోఽస్మి। ప్రబుద్ధోఽస్మి। ఆహా! ఇప్పుడు మెలకువ తెచ్చుకొని ‘‘ప్రబుద్ధుడను’’ (Wel-clarified/wel-aware/wel-conscious) అగుచున్నాను।

నేను సదా ఆత్మస్వరూపుడనే। సదా శివుడనే!

మరి నాయొక్క అఖండ - అప్రమేయ సర్వాత్మకమైన అఖండాత్మను ఇంతవరకు ఎందుకు గమనించటంలేదు? ఎందుక ఆత్మానందమును ఆస్వాదించలేదు?

నాయొక్క ‘‘ఆత్మాహమ్ అనుభూతి’’ అనే సొత్తును ఒక గజదొంగ ఎల్లప్పుడూ దొంగిలిస్తూ వస్తున్నాడు. అది నా మనస్సే।।

(స్వకీయ మననమే రూపముగా గల) మనస్సే అన్యభావనా మనన రూపంగా నన్ను జయిస్తూ వస్తోంది.

ఇక ఇప్పుడో? ‘ఆత్మ గురించిన మననము’ నందు ఈ నా మనస్సును నియమించగానే, అది తనయొక్క రూపమే కోల్పోయి, నాచే సంహరించబడుతోంది. మరుక్షణము ‘‘ఈ సమస్త విశ్వము తన శరీరమైయున్న ఆత్మయే నేను’’ అగుచున్నాను.

ఓ నిదాఘా! స్వస్వరూపాత్మ యొక్క స్వాభావికమగు ‘ఔన్నత్యము’ను గమనిస్తూ, ‘‘అఖండాత్మ స్వాభావుడవు’’ - అయి ఉండుము. దొంగ వంటి నీ మనస్సే ‘‘కాదేమో?’’ అనే శంకను కలిగిస్తోంది సుమా! మనస్సు మాట వినకు. బుద్ధిని నిశ్చలము చేసి, అప్పుడు ఆ నిశ్చల - నిర్మల బుద్ధిచే గమనించబడేది ఆశ్రయించు.


మనస్సును వశం చేసుకోవటం ఎట్లా?

ఉపాయముచే అది సులభమే.

ఉపాయము ఆశ్రయించని వానికి ఈ మనస్సు కంటే పెద్ద సమస్య మరింకొకటేదీ ఉండదు.

నిదాఘుడు : సర్వత్రా నిశ్చలస్వరూపమైయున్న ఆత్మను ఏమరపింపజేసి, చంచలములగు దేహము- గుణములు మొదలైనవి చూపి, మురిపించి చంచలత్వమును కలిగిస్తూ ఉన్న ఈ ‘మనస్సు’ను ‘ఉపాయము’తో వశం చేసుకొని, నిశ్చలాత్మ స్వరూపముతో అనుసంధానము సిద్ధించుకోవచ్చునని మీరు సూచిస్తున్నరు కదా! హే గురువర్యా! తండ్రీ! ఋభుమహర్షీ! అట్టి ఉపాయములు ఏమిటో దయతో నాకు సూచిస్తూ, బోధించండి.

మనోజయ- ఆత్మానంద సిద్ధి ఉపాయములు

ఋభు మహర్షి : ఓ నిదాఘమహాశయా!

మనస్సు స్వయంకృతమైన మననరూప నిర్మితమే కదా! అంతేగాని, మరొకరి బలప్రయోగ రూపము కాదుకదా! అందుచే ‘‘అన్యమనము (ఆత్మమననము) (- Another half) చేత దృశ్య మనన రూపమగు మనస్సును జయించగలను’’ - అని ముందుగా ఆత్మనమ్మకము కలిగి ఉండెదవు గాక!

మా ఖేదం భజ హేయేషు। కొన్ని కొన్ని (వస్తువులు గాని, సంబంధములుగాని, లౌకికమైన సామర్ధ్యరూపములగు విశేషములుగాని) నిన్ను విడచి వెళ్ళుచూ ఉన్నప్పుడు ‘ఖేదము’ పొందవద్దు. ‘‘అయ్యో! పోవుచున్నదే!’’ - అనే మననము చేయవద్దు - ‘‘ఆత్మనగు నాయొక్క దివ్యసమక్షంలో అవన్నీ రావటం - పోవటం కల్పనలోని ఒక లీలా విశేషము మాత్రమే’’ అనే మననము కలవాడవై ఉండుము. ప్రశాంతత, చిరునవ్వులను వీడవద్దు.

న ఉపాదేయ పరో భవ। నిన్ను ఆశ్రయిస్తూ వస్తున్న ‘‘వస్తు-జన సంబంధ’’ మొదలైనవాటిని మనస్సుతో స్వీకరించకుండానే, ‘‘అవన్నీ దృశ్యములోని రాక-పోకల స్వభావము కలిగియున్న చమత్కారములు కదా!’’- అను దృష్టిని, అవగాహనను, సమన్వయమును వదలవద్దు.

హేయ ఆదేయ దృశౌ త్యక్త్వా శేషస్థః సుస్థిరో భవ। త్యాజ్య (Leaving) - గ్రాహ్య (Taking) ఉభయ భావములను త్యజించివేసి, అప్పటికీ శేషించియుండే నీ యొక్క ‘‘సర్వాతీత స్వస్వరూపము’’ నందు సుస్థిరుడవై ఉండుము.

దేనినీ వదలనూ వద్దు। స్వీకరించనూ వద్దు।

అభ్యాసముగా కలిగి ఉండవలసినవి:
★ దృశ్యములో దేనినీ ఆశించకపోవటము - నిరాశతా।
★ ‘‘ఏది వస్తుందో? ఏది పోతుందో?’’ - అనే భయము లేకపోవటము - నిర్భయతా।
★ నిత్యమగు ఆత్మనే భావన చేస్తూ, అనిత్యములైన వాటిని - ‘అనిత్యమే కదా’ అను అవగాహన కలిగి ఉండటము - నిత్యతా।
★ సర్వత్రా సమముగా ఆక్రమించియున్న ఆత్మను దర్శిస్తూ, భేదదృష్టిని జయించు జ్ఞానము కలిగి ఉండటము - సమతా జ్ఞ తా।
★ కోరికలు జయించి ఉండటము. నిష్కామత్వము. నిరీహతా।
★ సర్వక్రియలకు ఆవల సర్వకర్తా - రూపమున ప్రకాశించుచున్న ఆత్మభావనచే కర్మాతీతము వహించటము. నిష్క్రియతా।
★ సాత్వికత, ప్రశాంతత, అనుద్వేగత గల ప్రవర్తన కలిగి ఉండటము - సౌమ్యతా।
★ సర్వకల్పనలను దాటివేసి నిర్వికల్ప స్వరూపమగు ‘ఆత్మత్వము వహించి ఉండటము. నిర్వికల్పతా।
★ ఆత్మతత్త్వము పట్ల పట్టుదల కలిగి ఉండటము. ధృతి।
★ తండ్రికి బిడ్డ పట్ల గల స్నేహపూర్వక ఆప్యాయతవలె సర్వజీవుల పట్ల మైత్రీభావన కలిగి ఉండటము. మైత్రీ।
★ మనస్సును అసంతృప్తి తాకనీయకుండా, సర్వదా తృప్తి కలిగి ఉండటము. మనస్తుష్టిః।
★ మృదువైన ప్రవర్తన, మధురమైన సంభాషణ అభ్యాసముగా కలిగి ఉండటము. మృదుతా। మృదుభాషితా।
★ ‘త్యజించటము - గ్రహించటము’ అనే హేయ - ఉపాదేయముల నుండి సర్వదా వినిర్ముక్తుడవై (wel-relieved) అయి ఉండటము.
ఈ రూపమైన అభ్యాసములచే మనస్సు జయించబడుచూ, ఆత్మానందము స్వాభావికము అగుచూ ఉండగలదు.

‘‘తృష్ణ’’ అనే జాలరి స్త్రీ - ‘‘చింతలు’’ అనే తంతువులతో ‘‘వాసనలు’’ అనే చేపల వలను అందముగా అల్లి, ‘‘సంసారము’’ అనే చెరువులలో ఆ వలను విసరి ‘‘జీవులు’’ అనే చేపలను పట్టి ‘‘జన్మ-జన్మాంతరములు’’ అనే బుట్టలో వేసుకొని వినోదిస్తోంది.

చైతన్య స్వరూపుడైయున్న ఈ జీవుడు పాంచభౌతిక దృశ్యముతో ఏర్పడిన సంసార బంధము నుండి విడివడటానికి యోచించాలేగాని, ‘‘నేను బద్ధుడను’’ నా గతి ఇంతే!’’ అని తలచుచూ చూస్తూ ఊరుకుంటే ఎట్లా? వాయు వీచికల వేగముచే మేఘములు తునాతునకలై ఎటో వెళ్ళిపోతాయి చూచావా? అట్లాగే. అభ్యాసముతో కూడిన ‘‘ఆత్మజ్ఞానము’’ అనే చురుకైన, పదునైన శరము (బాణము)తో (సునిశిత బుద్ధితో) వాసనా సమూహములను (The Groups of Tendencies) మొదలంట్లా ఛేదించాలి. ‘‘తత్ పదము’’ నందు బుద్ధిని నిశ్చలం చేసి ఇప్పుడే, ఇక్కడే ఆత్మస్వరూపుడవై, నీయొక్క స్వరూపమునందు (కథా రచయిత కథయందువలె) సమస్త జగత్తును అంతర్గముగా చేసి ఆత్మానందము ఆస్వాదించెదవు గాక!

ఓ నిదాఘా! నీవు కూర్చున్నప్పుడు, లేచి తిరుగుచున్నప్పుడు, నిదురిస్తున్నప్పుడు, మేలుకొని ఉన్నప్పుడు, నిలుచుని ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు కూడా- ‘‘అసత్ ఏవ ఇదమ్ ఇతి’’- = ‘‘ఇదంతా నాటకములోని పాత్రల పరస్పర సంబంధమువలె, కథలోని సంఘటనల వలె, స్వప్నములో కనిపించిన అద్దాల మేడవలె - మొదలే అసత్తు। జగత్ భావనచే (Subject to operating the sense of the world) మాత్రమే జగత్ రూపమై (ఆత్మకు అనన్యముగా ఉండి)- అన్యము వలె సందృశ్యమౌతోంది.

‘‘అసదేవ ఇతి అంతర్నిశ్చిత్య అస్థాం పరిత్యజ।’’ - ‘ఇదంతా అసత్తే’ అని అంతరమున నిశ్చయము కలవాడవై పరిత్యజించి ఉండెదవుగాక।

ఒకవేళ..,

శ్లో।। దృశ్యమ్ ఆశ్రయ సీదం చేత్, తత్ చిత్తోఽసి బంధవాన్।।
‘‘ఈ దృశ్యము సత్యమే’’ - అని నీవు ఆశ్రయించటం జరిగితే, అట్టి చిత్తముచేతనే నీవు బద్ధుడవు కాగలవు.

శ్లో।। దృశ్యం సన్త్యజసీదం చేత్, తత్ అచిత్తోఽసి మోక్షవాన్।।
ఈ దృశ్యమును - చదువుచున్న నవలలోని ఒకానొక సంఘటన వంటిదిగా భావించి, మొదలే పరిత్యజించావనుకో, అప్పుడు చిత్తరహితుడవై మోక్షవంతుడవు అగుచున్నావు.

ద్రష్ట- దృశ్యముల మధ్య గల కేవల చైతన్యాత్మ రూపము అనుభవము అయ్యేది ఎట్లా? - విను

శ్లో।। ‘న అహమ్। న ఇదమ్।’’ - ఇతి ధ్యాయం తిష్ఠ త్వమ్ అచలాచలః
ఆత్మనో జగతశ్చ అంతః - ద్రష్టు దృశ్యదశ - అన్తరే।।

→ ‘‘నేను’’ అనునది లేదు. ఈ జగత్తు లేదు’’ అను అభ్యాసమును ఆశ్రయించుము.
ఇటువంటి నిర్ణయముచే -
- జగత్తు యొక్క మధ్యలోను,
- ద్రష్ట - దృశ్యముల మధ్యలోను,
- ద్రష్టములకు ఆవలగాను -
ఆ ఉభయముల మధ్యగా ఉన్నట్టి ‘కేవలతత్త్వము’ (The Absolute self)ను అనుభవముగా తెచ్చుకొనుచు, ఒక కొండవలె నిశ్చలుడవై ఉండగలుగుతావు.

‘‘ఆస్వాదించటము - ఆస్వాదించబడునది’’ - ఈ ఉభయములకు సంబంధించిన సంకల్పములను త్యజించివేయి.

‘‘ఆస్వాదించాలి - ఆస్వాదించబడునది-ఆస్వాదించకూడనిది’-లకు సంబంధించిన సర్వ సంకల్పములను వదలివేయి.

‘కేవలాస్వాదన తత్త్వము’ - ను ఆశ్రయించుచూ, అద్దానిని ఆత్మతత్త్వమునకు అనుసంధానము చేయి. క్రమముగా పరమాత్మానంద స్వరూపుడవై విలసిల్లెదవుగాక।

ఆలంబనము - ఆలంబన రహితము (అనాలంబనము) (Dependence and Indepence) మధ్యగా గల నిరాలంబ స్వస్వరూపమునందు, మధ్యగా సుస్థిరుడవై ఉండుము.

ఆశాపాశము / రజ్జువు

ఒకడు మామూలు త్రాళ్ళతో కట్టుబడితే ఎట్లాగైనా ముళ్ళు విప్పి విడిపించవచ్చు. కాని ‘‘ఇంకా ఏదో కావాలిసిందే! ఇంకా ఏదో పొందాలిసిందే’’ - అన్న ‘తృష్ణ’ అనే త్రాళ్ళతో బద్ధుడైనవాడిని బయటవాడెవ్వడూ కట్లు విప్పి విడిపించలేడు.

అందుచేత ఓ నిదాఘా! నీవు తృష్ణకు బద్ధుడవు కాకూడదు సుమా!

ఎందుకంటే, నీ తండ్రిగా గాని, నీ గురువుగాగాని తృష్ణచే బద్ధుడవైనప్పుడు ఎంతగా బోధించి కూడా, మరింకేమైనా చేసి కూడా నీయొక్క సంసార - బంధనముల నుండి మాత్రం నేను నిన్ను విడిపించలేను.

తృష్ణను జయించాలంటే ఒక్కటే ఉపాయం. కామ-లోభములకు సంబంధించిన సంకల్పములను త్యజించి ఉండటమే తృష్ణను జయించటానికి ఉపాయము.

‘తృష్ణ’ అనునది ‘ఆశించటము’ అనే వ్యసనముతో మొదలై, చివరకు ‘భయము - ఉద్వేగము’ అనే భీకర మృగములు సంచారములు చేస్తూ ఉన్న కీకారణ్యములో పడవేయగలదు.

తృష్ణ ఎటువంటిదంటే..,
➤ ‘అహంభావము’తో నిండియున్నట్టిది.
➤ పుణ్యకార్యముల నుండి విరమింపజేసి, పాపకార్యములందు, క్రోధ-మోహములందు నియమించగలిగినట్టిది.

అందుచేత ఓ నిదాఘా! అట్టి తృష్ణను నీవు ముందుగా ‘‘అనహంభావము (లేక) నిరహంకారము’’ అనే శస్త్రముతో జయించనారంభించాలి.

ఎట్లాగైనా సరే, ఏది ఏమైనా సరే, నీవు ‘తృష్ణ’ను జయించి తీరాలిసిందే।

మంగళప్రదమైన, దృశ్యమునకు అతీతమైన, ప్రపంచమును అధిగమించినట్టి ‘‘భూమిక’’ (State)ను సిద్ధించుకొనెదవుగాక। సర్వభయములు సశాంతించిన ‘‘ప్రశాంత స్థితి’’ని పుణికిపుచ్చుకొనెదవుగాక।

అంతరంగ సంకల్పదోషములు

ఈ జీవుని పవిత్ర హృదయములోనికి - ఎప్పుడో ‘దోషముతో కూడిన సంకల్పములు’ అనే దొంగలు ప్రవేశించి అశాంతిని కలుగజేస్తూ ఉన్నాయి.

ఇటువంటి భావాలన్నీ ‘హృదయము’ అనే ఇంటిలో ప్రవేశించి తిష్ఠ వేసుకొన్న ఇంటి దొంగలే మరి!

ఓ నిదాఘా! ఇటువంటి అంతర్-నిశ్చయమును త్యజించివేయి. ఈ సమస్తమును, దీనితో పొందుతున్న మనస్సుతో సహా చక్కగా విచారణ చేసి సత్యాసత్యములు, నిత్యానిత్యములు ఏమిటో ఉత్తమబుద్ధితో గమనించు. విచారణచే మనస్సుతో సహా సమస్త దృశ్యమును విడచిపెట్టు.

‘‘నాహం పదార్థస్య।’’ నేను పదార్థములకు, విషయములకు మొదలే సంబంధించినవాడను కాను. (I am not a matter).
‘‘న మే పదార్థ’’ - ఇతిభావతే నేను పదార్థములు (All material factors) కాను. వాటికి చెంది లేను (Neither I belong to matter nor matter belongs to me) - అని అంతరమున ప్రశాంతముగా, చల్లగా అట్టేబెట్టుకో. (Keep the Inner Heart as very peaceful and cool).

‘‘ప్రశాంతమైన బుద్ధి’’ని ఉపయోగించి, అప్పుడు ఇక ఈ జగత్తులో నీవు నిర్వర్తించవలసియున్న - కర్మలను చేస్తూ, క్రమంగా వాసనలను జయించు.

వాసనా త్యాగము

వాసనాత్యాగము సిద్ధించటమే మహదాశయముగా కలిగిఉండాలి.

హే బ్రహ్మన్। వాసనా త్యాగమే (To get rid of tendencies & samskarams) మహదాశయమై నీ పట్ల వర్తిల్లునుగాక! ‘‘వాసనా త్యాగమే సిద్ధించుకోవలసిన ధ్యేయము’’-అని విజ్ఞులచే పరికీర్తించబడుతోంది. సర్వత్రా సమబుద్ధిని కలిగియున్నవాడు అతిత్వరగా, అతి సులభంగా మమకారమును త్యజించి సమస్త వాసనలను తేలికగా త్యజించివేయగలడు. వాసనా త్యాగముచే జీవన్ముక్తి సిద్ధిస్తోంది. క్రమంగా విదేహముక్తి కూడా కరతలామలకము అవుతోంది.

అందుచేత వాసనలను క్షయింపజేసి సర్వత్రా సమబుద్ధి (లేక) ఆత్మబుద్ధి సిద్ధించుకోవటమే మహదాశయమై ఉండును గాక।

వాసనా త్యాగమునకు గుర్తు। ఫలము। → మమకారము యొక్క ప్రక్షాళనము.
సర్వత్రా సమభావన.
అంతఃశాంతి.
సమస్తము లీలగా క్రీడగా అనిపించటము.
స్వాభావికమైన ముక్తి. స్వస్వరూపము యొక్క కేవలాత్మానుభవము.

ధేయత్యాగము - జీవన్ముక్తి := ‘అహంకారము’ అనే మూలపదార్థముతో నిర్మితము అగుచున్న వాసనలను (All Tendencies) లీలగా త్యజించి, అట్టి త్యాగఫలంగా ‘‘ధ్యేయము’’ అయినట్టి సమస్త దృశ్యమును - దృశ్యముగా త్యజించి, ఆత్మగా సందర్శించటము.

నేయ త్యాగము - బ్రాహ్మణోత్తమమ్: సాంసారిక - దోషకలనములను (దృష్టులను) నిర్మూలనము చేసుకోగా, వాసనలన్నీ (దృశ్యముతో ఏర్పడిన భావనా - కర్మణా వ్యవసన సంబంధములన్నీ) శమించగా - సమస్తము దృశ్య భేదములుగా కాకుండా - ‘‘ఏకము-అఖండము’’ అగు బ్రహ్మముగా అనునిత్యంగాను- నిస్సందేహంగాను, స్వాభావికంగాను అనుభూతమగుచున్నది. ‘‘బ్రహ్మము మరెక్కడో’’.. అనే నేయం త్యాగ(న-ఇయం త్యాగం) భావనయే ‘‘ముక్తి’’. అదియే ‘‘ఉత్తమ బ్రాహ్మణము’’ లేక ‘‘అహమ్ బ్రహ్మాస్మి’’ భావన।.

సన్న్యాసి - యోగి

= కర్మలు సన్న్యసించి ఏకాంతము ఆశ్రయించువాడు - ‘సన్న్యాసి’.
= సంయోగ వియోగాతీతుడై సమర్పణ భావముతో కర్మలు చేయవాడు - ‘కర్మయోగి’

ఈ ‘‘సన్న్యాసి’’, ‘‘యోగి’’ - ఇరువురు సంసార జ్వరము (రోగము) నుండి బ్రహ్మము స్వస్వరూప-సత్యస్వాభావికత్వమును సిద్ధించుకోగలరు.

ఆపద సమయములందు, సుఖదుఃఖ సందర్భములందు కూడా దృశ్యము నందు మొదలే రతించనివాడై, సర్వదా - సర్వత్రా ఆత్మనే దర్శిస్తూ, ఆత్మయందే రమించువాడే సన్న్యాసి, యోగి కూడా.

ఇంద్రియములను జయించినవాడే → ‘‘శాంతుడు। దాంతుడు। సన్న్యాసి। యోగి।’’ కూడా!

జీవన్ముక్తుని స్వాభావికత్వము

ఎవ్వడైతే →

స ‘‘జీవన్ముక్త’’ ఉచ్యతే। అతడే జీవన్ముక్తుడు అని చెప్పబడుచున్నాడు.

తృష్ణాబద్ధుడు :: తృష్ణా ముక్తుడు

తృష్ణా బద్ధుడు: ‘‘బాహ్య దృశ్య జగత్తు నుండి పొందవలసినది చాలా ఉన్నది. అదంతా పొందాలి’’ అను బాహ్యమున ఏర్పడుచూ ఉన్న విషయ వాసనలే ‘తృష్ణ’ అని అంటున్నారు. ‘‘తృష్ణ’’ కారణంగానే ‘‘నిత్యముక్తాత్మస్వరూపుడు’’- అయి ఉండి కూడా ఈ జీవుడు ‘బద్ధుడు’ అగుచున్నాడు. విషయ వాసనల సంబంధమైన తృష్ణనే ‘బంధము’ అని పిలుస్తున్నారు.

తృష్ణా ముక్తుడు : సమస్త ఇంద్రియ విషయ వాసనల నుండి విడివడి ఉండటము - ముక్తికి హేతువు. ‘‘దృశ్యము నుండి ఇంకా ఏదో కావాలి’’ అను అంతరంగ నిబద్ధత్వము (లేక) తృష్ణను త్యజించినవాడే ‘ముక్తుడు’.

దుఃఖ జన్మ భయప్రదము : ‘‘ఇది నాకు - నాకే చెందినవి. ఇదమస్తు మమ’’.. అను ఇచ్ఛ, అంతటితో ఆగక, ‘‘ఇదంతా నాకు ఇంకా కావాలి’’ - అనే వాంఛ, యాచన (Desiring and Begging).. ఇవియే సంసార శృంఖలములు (Bondage with the scenary). అట్టి ఇచ్ఛ-తృష్ణల పర్యవసానంగా- ఈ జీవుని పట్ల దుఃఖము - భయముతో కూడిన జన్మ పరంపరలు అంతులేకుండా వచ్చిపడుచున్నాయి.

ఓ నిదాఘా! ‘‘వాంఛయే (Desire to have (or) expect and there by get disturbed) → త్రెంచుకోజాలని తీవ్రమైన సంకెళ్ళకు (Shackles, శృంఖలములకు) కారణము’’ - అని గమనించెదవు గాక!

ఎవ్వడైతే ఉన్నట్టివి - లేనట్టివి (సత్-అసత్ రూపములు) అగు సర్వపదార్థముల పట్ల, సంబంధ- అనుబంధ బాంధవ్యముల వంటి సమస్త సందర్భ-సంఘటనల పట్ల ‘భావించటము’ అనునది తగ్గించుకుంటూ ఉంటాడో, ఆతడే జీవన్ముక్తుడు. నూనె అయి పోతూ వస్తున్న దీపము వలె - ‘వాంఛలు’ అనునవి కూడా తమకుతామే సన్నగిల్లుతాయి. అప్పుడు మనస్సు - ‘మహామనస్సు’ అయి పరమోదారము’ - అయినట్టి ‘‘సర్వసమదర్శన ఆత్మానుభవ స్థానము’’ చేరగలదు.

ఓ నిదాఘా!

శ్లో।। బంధాస్థామ్ అథ మోక్షాస్థాం సుఖదుఃఖదశామ్ అపి
త్యక్త్వా సదసదాస్థాం త్వం తిష్ఠ అక్షుబ్ధ మహాబ్ధివత్।।

‘‘బంధము ఉన్నదా? మోక్షము ఇంకా పొందానా? లేదా? సుఖదశలో ఉన్నానా? దుఃఖితుడనా! ఉన్నదేది? లేనిదేది?’’ మొదలైన సమస్త స్థితులను, వాటిపై మనస్సుకు ఏర్పడే ఆధారము (Dependence)ను అధిగమించివేయి.

మనస్సుతోనే త్యజించి, ఆ తరువాత ఆ మనస్సును ఆత్మయందు లయింపజేసి తరంగ సంబంధమైన క్షుబ్దత్వములేని మహాసాగరమువలె - భావనాతరంగ రహిత ఆత్మానంద సాగర స్వరూపుడవై విరాజిల్లుము.

నిశ్చల-సుస్థిర- అచ్యుత- కేవల ఆత్మానంద రూపమును సంతరించుకొన్నవాడవై ఉండుము.

సముద్ర దేవత సముద్రమంతా తనయందు ప్రశాంతముగా దర్శించుకొను విధంగా అన్యమైనదంతా నీ అనన్య నిరుపమానంద స్వరూపంగా అనుక్షణము దర్శిస్తున్నవాడవై ఉండు.

చతుర్విధ నిశ్చయములు

ఓ నిదాఘా! నీవు ‘‘దేనిని ఏ తీరుగా నిశ్చయదృష్టితో దర్శిస్తావో అది అట్లే అనుభూతమవటము’’ అనేది - దృష్టి యొక్క-సృష్టియొక్క ఒకానొక చమత్కారము. అంతరంగ నిశ్చయము (How you decisively interpret) అనుదాని ననుసరించియే (ఆత్మస్వరూపుడే అయి ఉన్న) ఈ జీవుని పట్ల ‘‘బంధ-మోక్షములు’’ అనే మనోకల్పిత చమత్కారములు వర్ధిల్లుచున్నాయి.

ఓ సాధూ! అటువంటి ఈ వివిధ జీవుల యొక్క ‘‘నిశ్చయములు’’ (The ways of being perceived and interpreted) - ‘4’ విధములైనవిగా చెప్పబడుచున్నాయి.
(1) భౌతిక దేహమే నేను (2) ఈ సమస్తమునకు అతీతుడను (3) ఈ సమస్తము నేనే (4) ఈ సమస్తము శూన్యము మాత్రమే.

(1) ‘‘భౌతిక దేహమాత్రోఽహమ్’’ నిశ్చయము : ‘‘ఆపాద మస్తకమహమ్’’ నిశ్చయము :

శ్లో।। ఆపాద మస్తకమ్ ‘అహం’ - మాతా పితృ వినిర్మితః
ఇతి ఏకో నిశ్చయో, బ్రహ్మన్। బంధాయా స విలోకనాత్।

హే బ్రహ్మన్! ‘‘తల్లిదండ్రులచే ఏర్పరచబడినదై, ‘‘పాదముల (foot end) నుండి మస్తకము (End of foreface) వరకు ఏ భౌతిక దేహము ఎదురుగా కనిపిస్తూ ఉన్నదో- అట్టి ఈ జగద్దృశ్యముతో కనిపిస్తూ ఉన్న భౌతికదేహమే నేను’’ అనునది (4 టిలోని) మొదటి నిశ్చయము. ఈ ‘‘దేహమే నేను’’ అను నిశ్చయము ఈ జీవునికి సర్వ ప్రాకృతిక-మానసిక బంధములు కలుగజేస్తోంది. ఇది జీవునికి శ్రమ, ఆయాసము మొదలైన అనేక దుఃఖములకు మూలము.

(2) ‘సర్వాతీతోఽహమ్ నిశ్చయము :

శ్లో।। అతీతః సర్వభావేభ్యో వాలాగ్రాత్ అపి అహం తనుః
ఇతి ద్వితీయో। మోక్షాయ నిశ్చయో జాయతే సతామ్।।

నేను ఈ దేహమునకు, ఈ సమస్త భౌతిక ప్రపంచమునకు, వాటి వాటి అనుభవ పరిధులకు పూర్తిగా వేరైన ‘‘సర్వాతీత స్వరూపుడను’’ - అనునది రెండవ నిశ్చయము.

‘‘నా యొక్క స్వరూపము ఒక వెంట్రుక యొక్క చిట్టచివరి అణుప్రమాణము కంటే కూడా లక్షవవంతు అంత సూక్ష్మమై, దృశ్యమునందు ఏమాత్రము ప్రవేశించనిదై ఉన్నది.

- కదిలే దేహమును ‘కదిల్చేవాడు’గా,
- వచ్చే ఆలోచనలకు ‘ఆలోచించేవాడు’గా,
- జగత్ భావనలన్నిటికీ ‘‘భావించేవాడు’’గా,
ఆవల మనస్సుకుగాని, కళ్ళు-చెవులకుగాని విషయమే కానంతటి వాడను.

సర్వమునకు పరమై ‘‘పరమాత్మ’’ అనబడు కేవల చైతన్యరూపుడను… ఇట్టి రెండవ నిశ్చయము మోక్షము కొరకై - (ఈదృశ్యముగాని, మరింకేదీ గాని నాకు బంధము కాదు- అను స్థితి కొరకై) మార్గదర్శకము.

(3) ‘‘ఇదమ్ సమస్తమ్ అహమేవ’’ నిశ్చయము:

శ్లో।। జగజ్జాల పదార్థాత్మా సర్వ ఏవ అహమ్ అక్షయః,
తృతీయో నిశ్చయశ్చ ఉక్తో మోక్షాయైవ, ద్విజోత్తమా!

హే ద్విజోత్తమా! ‘‘ఈ సమస్త పదార్థములతో కూడిన, ఎదురుగా కనిపిస్తూ ఉన్న - దృశ్య జగత్తు యొక్క ఆత్మస్వరూపుడను - నేనే। నా నుండి భావనగా బయలుదేరి, సంకల్పముగా రూపుదిద్దుకొని, సంకల్ప సిద్ధికొరకై ‘‘సంకల్పించబడుచున్న సమస్తము’’గా కూడా అగుచూ ఉన్నది. కనుక, సమస్తము నేనే। (మత్తః పరతరం న అన్యత్ కించిత్ అస్తి)। ఇదంతా నా వినోదము। క్రీడ। లీల।

ఇట్టి ‘సమస్తము నేనే’ అను నిశ్చయము కూడా మోక్ష స్థానమునకు దారితీయగలదు.

(4) ‘‘అహం-జగద్వా సకలం శూన్యం’’ నిశ్చయము:

శ్లో।। అహం జగద్వా సకలం శూన్యం వ్యోమసమం సదా;
ఏవమ్ ఏష చతుర్థోఽపి నిశ్చయో మోక్ష సిద్ధిదః।।

ఒకరు ఒక కథను శ్రోతల ఆనందం కోసం కల్పించి చెప్పితే,.. అందులో పాత్రల మధ్య గల పరస్పర సంబంధం నిజమా? కాదుకదా! కలలో కనిపించే రతనాల మేడకు ఉనికి ఎక్కడిది? అట్లాగే మనస్సు అనే కవిచే కల్పించబడుచున్న కథా శ్రవణమే ఈ దృశ్యమంతా.

ఇట్టి దృష్టిచే ‘‘జగత్తు - ఆ జగత్తు యొక్క అనుభవి, జగదంతర్గత భేదములు - సమస్తము ఆకాశమువలె స్వతఃగా శూన్యమే। సర్వదా శూన్యమే।’’ - ఇది నాలుగవ నిశ్చయము. ‘‘పూర్ణుడగు నేను శూన్యమగు జగత్తుకు సాక్షిని’’ - అనునదే నాలుగవ నిశ్చయము.

ఈ నాలుగవ నిశ్చయము కూడా మోక్షసిద్ధిని ప్రసాదించగలదు. ఆత్మయొక్క తత్త్వము దృష్ట్యా ఇదంతా కల్పన మాత్రమే. వాస్తవానికి లేదు. ఒక నాటకములో ఒకడు చెడ్డవాడు కాబట్టి - రచయిత చెడ్డవాడా? పాత్రధారుడు చెడ్డవాడా? పాత్ర చెడ్డదా? - ఏదీ కాదు. ఈ విధంగా జగత్తు శూన్యమే.

⌘⌘

పై నాలుగు నిశ్చయములలో →
→ మొదటిది - భౌతిక దేహమే నేను అను అహంకారము తృష్ణకు, అనేక బంధనములకు కారణము.
→ రెండవది - దేహము కంటే వేరైన నేను - అను అహంకారము తృష్ణను తొలగించి క్రమంగా జీవన్ముక్తత్వము ప్రసాదించగలదు.
→ మూడవదగు ‘‘సర్వము నేనే కదా!’’ - అను నిశ్చయాహంకారము సిద్ధించుకొన్న వానికి ఇక విషాదము యొక్క ‘ఛాయ’ కూడా ఉండదు.
→ నాలుగవదగు ‘ఈ సమస్తము సర్వదా శూన్యమే’ అనే నిశ్చయాహంకారము - ప్రకృతి తత్త్వము బోధపరచునదై ‘బ్రహ్మజ్ఞానము’గా పరిణమించుచున్నది. ఇదంతా కల్పిత నాటకంలాగా, కలలాగా, ఊహాచమత్కారంలాగా వాస్తవానికి లేదు కాబట్టి దుఃఖార్హం కాదు.

(జడో దేహో। న దుఃఖార్హో ।) మొదటిది తప్పించి తక్కిన మూడు నిశ్చయములు మనస్సును నిర్మలముగా తీర్చిదిద్ది బ్రహ్మానుభవమునకు రాజమార్గము అగుచున్నది. బ్రహ్మానుభవము స్వాభావికము అయిన తరువాత ఆ (చివరి) మూడు నిశ్చయములు బ్రహ్మానందసాగరములో (ఉప్పుబొమ్మ వలె) కరిగి నామరూపములు త్యజించి ఏకమై సశాంతిస్తున్నాయి.

బ్రహ్మము అనగా?

సమస్త జీవులకు సంబంధించియున్నట్టి పరాకాష్ఠ (The Most and the Most Highest) స్వరూపము (లేక) పరాస్థితి కాబట్టి ఆత్మయే ‘బ్రహ్మము’ అను శబ్దముచే చెప్పబడుతోంది.

అది దృశ్యము, దేహము, ఇంద్రియములు, ఇంద్రియార్థములు (శబ్ద-స్పర్శ- రూప-రస-గంధశక్తులు), మనస్సు, బుద్ధి, చిత్తము, వ్యష్టి అహంకారము, సమష్టి అహంకారము, కేవలము - అనబడుచున్న సమస్తముకంటే శ్రేష్ఠము, మహత్తరము కూడా. పైగా, ఆ చెప్పుకొన్నవన్నీ బ్రహ్మమునకు అనన్యము. అందుచేతనే ‘బ్రహ్మము’ అని అనబడుతోంది.

అట్టి బ్రహ్మమే, ‘‘శివము; పురుషుడు; పరమ పురుషుడు; ఈశానుడు; నిత్యుడు; ఆత్మ; పరమాత్మ’’ మొదలైన పేర్లతో కూడా - ఆయా ధర్మములను అనుసరించి అభివర్ణించబడుచూ ఉన్నది.

ఆహా! నీకు, నాకు, సురాసురులకు, సమస్త ప్రాణులకు ‘‘అద్వితీయమే’’ అయి ఉన్న పరమాత్మ స్వరూప చిచ్ఛక్తీదేవి ద్వైత-అద్వైత సంకల్పములను ఉభయ హస్తములుగా చేసుకొని ఈ ‘‘జగన్నిర్మాణ లీలావినోదము’’గా సర్వే సర్వత్రా అణువణువు విజృంభించుచున్నది కదా! అట్టి చిచ్ఛక్తీ దేవి యొక్క అత్యంత చమత్కార కళావిశేషమే ఈ అనేక విధములైన మనస్తత్వములతో కూడిన జగత్ నాటక రంగమంతా కూడా!

ఒక గొప్ప కథా రచయిత యొక్క కథనమంతా అత్యంత ఉత్సుకత కలిగించి, పాఠకునిచే ‘‘ఈ పాత్రలు, సంఘటనలు నిజమే? - అని అనుకునేట్లు అనిపింపజేసి ‘భావోద్రేకము’నకు దారితీయు విధంగా…,
ఆ చిచ్ఛక్తీ దేవి ద్రష్ట యొక్క - దృశ్యము యొక్క స్వస్వరూపమునకు అభిన్నమే అయి ఉండి, స్వకీయ కల్పనా చమత్కారంగా ఈ జగత్ రచన చేసి ప్రదర్శనము చేస్తోంది. అయితే ఈ సమస్తము చిత్(ఎరుక) యొక్క ఆనంద స్వరూపమే.

ఎవ్వరు ఈ సమస్తమును చిదానంద ప్రదర్శనముగా చూడగలుగుతారు?

శ్లో।। సర్వాతీత పదాలంబీ, పరిపూరైణాక చిన్మయః
న-ఉద్వేగీ న చ తుష్టాత్మా సంసారే న అవసీదతి।।

ఎవ్వరతై,
- సర్వాతీతమగు ‘ఆత్మపదము’ను అవలంబించి,
- ‘‘నా ఎరుక యొక్క విస్తరణ రూపమే ఈ సమస్తము కదా’’ అను నిస్సందేహమైన పరిపూర్ణ - ఏక - చిన్మయ అనుభావి అయి,
- ఈ సమస్త దృశ్యము స్వస్వరూపము - సర్వాత్మకము అగు ఆత్మయొక్క వినోదరూప కల్పితముగా గమనిస్తూ,
ఉద్వేగముగాని అనురాగముగాని పొందనట్టివాడు అయి ఉంటాడో, అట్టివాడు ఎట్టి దుఃఖముగాని, దృశ్యముతో తాదాత్మ్య-ఆవేశముగాని పొందడు.

ఎప్పుడు ఏది నిర్వర్తించవలసి వస్తే, అట్టి ‘ప్రాప్త కర్మలు’ (వివాహిత కర్మలు) నిర్వర్తిస్తూ, శత్రు-మిత్ర, మాన-అవమాన, స్థుతి-నిందల ద్వంద్వములకు అతీతుడై, (లేక) వాటి పట్ల సమదృష్టిని ఏ మాత్రము వీడనివాడై, ‘‘కోరుకొన్నవి - కోరుకోనివి’’ అనే పరిధి నుండి ముక్తుడైనవాడు - ఇక దేనికీ దుఃఖించడు. ఏదీ దృశ్యము నుంచి కాంక్షించడు. ఆత్మస్వరూపానందుడై విరాజిల్లగలడు.

ఎవ్వరైనా ప్రేరేపిస్తే అందరికి అభిమతమైనది, శ్రేయమైనది అగు మాటలను మాత్రమే మాట్లాడతాడు. సర్వజీవులు కోరుకొనే విధంగా ప్రవర్తన కలిగి ఉంటాడు.‘‘సమస్తము అస్మత్ స్వరూపమే’’ అను ఎరుకచే స్వాభావికంగానే సమస్త జీవులపట్ల ప్రేమాస్పదుడై ఉంటాడు.

ఓ నిదాఘా!

జన్మ-కర్మలకు మునుముందే తేజో - ఆనంద- ప్రజ్ఞారూపమైయున్న ‘ఆత్మ’ యొక్క దృష్టిని అవలంభించి, ధ్యేయము (All Objetives of knowing)ను అధిగమించి జీవన్ముక్తుడవై, స్వస్థుడవై సర్వ వేదనలు జయించినవాడవై ప్రకాశించెదవుగాక। ఆత్మకు అనన్యము అయినట్టి ఈ ‘‘జగత్ కల్పనా ఉద్యానవనము’’ నందు హాయిగా, ఆనందముగా, స్వేచ్ఛగా (బంధరహితుడుగా) విహరించుము.

‘‘ఈ దేహ-దేహాంతర సంచారమంతా ఆత్మానంద వినోదంగా నాయందు నేనే కల్పన చేసుకొని ఆస్వాదిస్తున్నాను’’ - అను ఎరుకను తట్టిలేపుము.

దృశ్య సంబంధమైన హృదయములో నుండి సర్వ ఆశలను (All materialistic world - related expections and wishes) త్యజించినవాడవై,
- దేనిపట్లా రాగము (Attatchment) లేనివాడవై,
- దృశ్యవ్యవహారములకు సంబంధించిన సమస్త వాసనలు మొదలంట్లా అంతరమున జయించి,
బాహ్యమున మాత్రం లోకసమాచారముల పట్ల విజ్వరుడవై (Uneffected) ఉండుము. నిర్మల-ఉత్తమ-అతీత బుద్ధితో లోకములో విహరించెదవు గాక!

హృదయంలో స్వాభావికమగు సంరంభరాహిత్యము, బాహ్యము మాత్రమే లోక విహరణార్థము కృత్రిమ సంరభమును కలిగి ఉండుము.

బాహ్యమున కర్తగాను, అంతరమున అకర్తగాను ఉంటూ ఈ దృశ్యప్రపంచంలో సంచరించు.

హే శుద్ధబుద్ధీ!

ఉదారచిత్తుడు - వసుధైక కుటుంబం

ఓ నిదాఘా!

అయం బంధుః అయం నేతి గణనా లఘుచేతసామ్। ఉదార చరితానాన్తు వసుధైక(వ) కుటుంబకమ్।।
ఉదార చరితులకు (మహనీయులక) విశ్వమమంతా తమ కుటుంబమే అయి ఉంటుంది. అల్పబుద్ధి కలవారికి మాత్రమే - ‘‘వీరు నా వారు, నాకు బంధువులు. వారు నాకు బంధువులు కాదు కాబట్టి నాకు వేరైనవారు’’ - అనే భేదదృష్టి- ఉంటుంది. ఇక తత్త్వజ్ఞులగు మహనీయులకు ‘వసుధైక కుటుంబ భావన’ అన్ని వేళలా స్వాభావికము అయి ఉంటుంది.

అందుచే ఓ నిదాఘ మునివర్యా! ‘‘ఈ జగత్తు నిజముగానే ఉన్నది’’ - అను భవబంధము (లేక) భవ భావన నుండి వినిర్ముక్తుడవై - ప్రశాంత స్వరూపము అయినట్టిది, రాగము (Attachment, fondness for limited & time bound things) లేనట్టిది, అగు ‘ఆత్మపదము’ (లేక) బ్రహ్మపదమును ఆశ్రయించినవాడవై ఉండు. అటువంటి స్వచ్ఛము, నిష్కామము, ‘మాయ’ అనే దోషము లేనట్టిది, - సిద్ధించుకొని, ఇక ఆపై ఈ దృశ్యజగత్తునందు నీకు ఇష్టమైన విధంగా సంచరించు. లోకో విహర। అప్పుడు ప్రపంచములో సందర్భమగుచూ ఉండే సంకటములను చూచి నీవు ‘మోహము’ - పొందవు.

మనోలయము

ఓ నిదాఘా!

దృక్ (One who is seeing / perceiving) - దృశ్యముల (the seen / the perception) మధ్యగా ఏర్పడి ఉంటున్న సంబంధమే ‘మనస్సు’ అని కూడా చెప్పబడుతోంది.

ఆ మనస్సు అధోముఖమై, వస్తు-విషయ-సందర్భముల మధ్యగా చిక్కుకొని ఉంటోంది.

అట్టి నీ మనస్సును ఉత్తేజ పరిచి ఊర్ధ్వముఖము చేసి, సమదర్శన రూపమగు ఆత్మస్థానమునకు జేర్చి, అక్కడ మనస్సును లయింపజేయాలి.

‘సంకల్పము’ (Sense of Assumption and pressumption) చేతనే - జీవునకు ‘బంధ భావన’ వచ్చిపడుతోంది. ఇప్పుడు మనస్సుకు సర్వసమభావనను ఆశ్రయింపజేయటం చేత ‘సంకల్పము’ అనే అడ్డు తొలగి సోఽహమ్ భావమును ఈ జీవుడు సిద్ధించుకోగలడు.

ఎట్లా?

(1) వైరాగ్య ఆశ్రయము : సమస్త దృశ్య వస్తువుల, సందర్భముల పట్ల అనుబంధములు మొదలైన వాటి పట్ల ‘రాగము’ను రహితము చేసి, చేయవలసిన కర్మలను ఆత్మోపాసనా భావముగా నిర్వర్తించటమే ‘రాగరాహిత్యము’ లేక ‘విరాగము’ లేక ‘వైరాగ్యము.’

(2) ఆత్మ గురించిన శాస్త్ర అధ్యయనము.

(3) శాస్త్రములు సూచించు మార్గములను, ఉపాయములను అనుసరించటము.

(4) మహదహంకార సేవనము : ‘‘నేను ఒక శరీర పరిమితుడను కాను. అందరిలోని నేనైన నేనే నేనై ఉన్నాను’’ - అను ‘మహదహంకారము’ను ఆశ్రయించటము.

(5) ఉత్తమ గుణాశ్రయము:
దైవీగుణములగు → అద్వేష్టా సర్వ భూతానాం, మైత్రః కరుణ ఏవ చ - మొదలైనవి
గుణాతీత లక్షణములగు → ‘న ద్వేష్టి సంప్రవృత్తాని’, సుఖ-దుఃఖ సమస్థితి, చెదరని భక్తి మొదలైనవి,
దైవీ సంపత్తి అగు → అభయం, సత్త్వ సంశుద్ధి, జ్ఞానయోగవ్యవస్థితి మొదలైనవి

ఓ పాపరహితుడా! నిర్మల హృదయా! నిదాఘా!

పై విధంగా
➤ (1) వైరాగ్యం (2) శాస్త్ర అధ్యయన-అభ్యాసములు (3) మహత్ అహం-భావనము (4) ఉత్తమ గుణ సంపత్తి - ఈ నాలుగు సహాయంతో సంకల్పములను హరింపజేయటము (దృశ్య విశేషాలతో ఏర్పడుచున్న రాగద్వేషములను వెనుకకు మరల్చటమును నిర్వర్తించుము.
➤ మహదాశయముతో కర్మలు నిర్వర్తిస్తూ ఉండగా, ‘మనస్సు’ తనకు తానే ‘‘ఊర్ధ్వముఖము’’ అయి, ‘‘సమస్తమునకు మునుముందే ఉన్నట్టిది, సమస్తము ‘తానే’ అయినట్టిది’’ - అగు ‘ఆత్మ’ యొక్క భావన వైపుగా ‘ఉన్ముఖము’ కాగలదు.

వైరాగ్యాత్ పూర్ణతామ్ ఏతి మనో నాశ దశానుగమ్। రాగ-ద్వేషములను ఉపశమింపజేయు ‘వైరాగ్యము’ యొక్క అభ్యాసముచే మనస్సు ఆత్మయందు లయించి, నశించినదిగా అగుచున్నది. అప్పుడు ఈ జీవుడు - ‘అపూర్ణము - అసంతుష్టి -అసంతృప్తి’’ మొదలైన అల్పభావనలను త్యజించి, (అధిగమించి) - ‘పూర్ణత్వము’ అను రూపము గల ఆత్మభావనను సంతరించుకోగలడు.

ఆశయా రక్తతామ్ ఏతి శరదీవ సరో-మలమ్: ‘‘దృశ్యము నుండి, ఏదేదో ఆశించుచూనే ఉండటము’’ అనే వ్యసనమును కొనసాగిస్తూ, ఇంద్రియ విషయముల పట్ల అనురక్తిని కొనసాగిస్తూ ఉంటేనో? శరత్‌కాలములో సరోవరము దట్టమైన మంచుచే కప్పబడటం చేత సుందర పుష్పములతో కూడిన సరోవర ఉపరిసౌందర్యము మసకగా కనిపిస్తుంది చూచావా? ఆ విధంగా దృశ్య భావావేశములచే కప్పబడుటచే ‘‘స్వస్వరూపాత్మ’’ యొక్క సౌందర్యము, ఔన్నత్యము అనుభవమునకు రావటము లేదు. ఆ జీవుడు మల - ఆవరణములను తొలగించుకోలేక వాస్తవానందమగు ఆత్మానందమునకు సుదూరుడై ఉండిపోతున్నాడు.

ప్రాజ్ఞః కస్మాత్ న లజ్జతే?

ఒకానొకడు శాస్త్రములు చదివి, గురువు యొక్క ఆప్త బోధలను విని, జగత్తులోని నిత్యానిత్యములను ప్రత్యక్షంగా చూస్తూ కూడా,… ప్రాజ్ఞుడు అయి ఉండి కూడా..,
- ఆయా రసరహితమైన ఇంద్రియానుభవములనే మరల మరల అనుభవిస్తూ,
- ఆయా ప్రాపంచక విశేషములగు జన సంపద, ధన సంపద, పేరు ప్రతిష్టలు, ఇంద్రియ-దురభ్యాములను ఆశ్రయించటము.
- అనేవి కొనసాగటానికి సిగ్గుపడడేం? అట్టి దురాశయములవైపుగా ఉల్లాసము పొందుచూ, ‘‘అయ్యో? నేను ఎరుగుచున్నదేమిటి? నడుస్తున్నది ఎటువైపు’’ - అని తనను తాను ప్రశ్నించుకోడేం? ఆత్మ విమర్శ చేసుకోడేమి? చేసుకోవాలి!

బంధము - ముక్తి

చిత్ చైత్య కలితో బంధః। కేవలము, నిర్మలము, సమస్తమునకు పరము, మహత్ స్వరూపము, అప్రమేయము, నిత్యము, సత్యము అగు చిత్ స్వరూపమే ఈ జీవుని వాస్తవ - సహజ రూపము. అట్టి చిత్తు - ఇంద్రియములచే తెలియబడుచున్న విషయములను పొంది, ‘‘ఇంతమాత్రమే నేను’’ అనే కలనము (దోషదృష్టి) పొందటమే ‘‘బంధము’’. అనగా, వాస్తవానికి చిత్ రూపమగు ఆత్మకు స్వతఃగా బంధము లేకపోయినప్పటికీ, … చైత్యము (The Objects or subject matter of perception)తో స్వయముగా పెట్టుకొన్న ‘సంబంధము’ (Bondage relationship) చేత మాత్రమే ‘బంధము’ అనునది ఏర్పడుతోంది.

తత్ చైత్యముక్తౌ ‘ముక్తిః’ ఉచ్యతే। ‘తెలియబడుచున్న దృశ్యము’ అనబడే చైతన్యము నుండి ముక్తుడు (wel-relieved) అయి ఉండటమే ‘ముక్తి’.

♠︎ ఒకడు కథ చదువుచూ కథలోని విషయాలకు ముగ్ధుడై విషాదము పొందటము.
♠︎ నాటకం చూస్తూ కంటితడి పెట్టటము.
ఇటువంటి సందర్భములప్పుడు ఆ తరువాత - తరువాత కూడా ఆ విషాదము కొనసాగించి, అది స్వభావము అవటం సబబా? కాదు కదా!
అట్లాగే చిత్‌స్వరూపుడగు ఈ జీవుడు ‘చైత్యము’ అనబడే తెలియబడే దృశ్య విశేషములకు బద్ధుడవటము యుక్తి యుక్తమే కాదు.
బద్ధుడు అవటమే బంధము. బద్ధుడు కాకపోవటమే ముక్తి। ఇంతకుమించి వేరే బంధము లేదు. ముక్తి లేదు.

┄┄┄

ఓ నిదాఘా! ఒక పరమ రహస్యము చెప్పుచున్నాను. విను.

చిత్ (ఆత్మ) - దృశ్యమునకు అతీతముగా ఉండటమే (లేక) ఈ జీవుడు దృశ్యమునకు అతీతుడై, సమస్తమును సాక్షిగా చూడగలుగుచూ ఉండటమే ఆత్మానుభవము. ఇదియే ఆత్మకు సంబంధించి సమస్త సిద్ధాంతముల అంతిమసారము.

అందుచేత బిడ్డా! నిదాఘ మునీ। ఏతాం నిశ్చయమ్ ఆదాయ, విలోకయ యధేచ్చయా! ‘‘ఈ తెలియబడుచున్నదంతా అసత్తు. దీనికి ఆవల కేవలము సాక్షి అయి ఉన్న మమాత్మానంద స్వరూపమే సత్తు’’ అని నిశ్శబ్దంగా నిశ్చయము చేసుకో. ఆ తరువాత ఈ దృశ్యమునందు నీకు ఎట్లా ఇష్టమైతే అట్లా పాల్గొను. (లేక) త్యజించు.

⌘ ‘‘ఇదంతా స్వప్నమాత్రము’’ - అనియో,
⌘ ‘‘ఈ సమస్తమునకు నేను వేరై ఉన్నాను’’ - అనియో,
⌘ ‘‘ఈ సమస్తము నేనే’’ - అనియో,
⌘ ఇదంతా మొదలంట్లా శూన్యమే’’ - అనియో నీకు ఎట్లా ‘ఇష్టము’ అనిపిస్తే ఆ రీతిగానే దర్శనము కొనసాగించు.

స్వయముగా ఆత్మచేత ఆత్మయందు ఆత్మగా సమస్తము దర్శించు పదమును అప్పుడు తప్పక పొందగలవు. అట్టి అపరోక్ష జ్ఞాన-అనుభవ పదమును పొందిన తరువాత, … ఆపై ఈ దృశ్యమును ఆస్వాదిస్తావో, త్యజిస్తావో,… అదంతా నీ ఇష్టం. (విమృశ్య ఏతత్ అశేషేణ, యథేచ్చసి, తథా కురు। - భగవద్గీతా వాణి।)

ద్రష్టా సాక్షీ చిదాత్మకః।

నీవు ఇక కేవలాత్మరూపుడవై ఉండెదవు గాక.

చిదహమ్। నేను సర్వదా కేవలచిత్-స్వరూపుడనే।

చిత్ ఇమే లోకా। ఈ దృశ్యమానమై కనిపిస్తున్న ఈ లోకమంతా కూడా చిత్ స్వరూపమే।

చిత్ ఆకాశా। ఈ కనబడే ఆకాశము, తదాదిగా కనిపిస్తున్న సకల పదార్థములు చిత్ స్వరూపమే।

చిత్ ఇమాః ప్రజాః। నాకు ఎదురుగా కనిపిస్తూ ఉన్న ఈ జీవులంతా కూడా చిత్ స్వరూపులే!

ఇట్టి అనుక్షణికమైన సందర్శనాభ్యాసమునకు ఇప్పటికిప్పుడే ఉపక్రమించు.

→ నేను సర్వదా ద్రష్ట - దర్శనములకు బద్ధుడను కాను. ద్రష్ట (Perceiver) - దర్శనములకు (Perception) సాక్షినగు కేవలచిదానంద స్వరూపుడను.
→ సర్వదా నిర్మలమగు ఆత్మ స్వరూప-స్వభావుడను.
→ నిత్యోదితుడను (Ever-blossoming just like SUN).

నిరాభాసో। అద్దంలో నా ప్రతిబింబము కనిపిస్తూ ఉన్నంత మాత్రం చేత అద్దంలో నేను ఉన్నట్లా? కాదు కదా! అట్లాగే ఈ దృశ్యములో దేహధారినై, జీవాత్మగా పిలువబడుచూ కనిపించినంత మాత్రం చేత అట్టి ఆభాస (Reflection)గా నేను అవటం లేదు. నిరాభాసుడను.

ద్రష్టా సాక్షీ చిదాత్మకః। ఈ దృశ్యమునకు నాకు గల సంబంధము ఎటువంటిదంటే…,

{దృష్టాంతము ! ఒక రచయిత రచించిన నాటకములోని పాత్రకు ఆత్మ ఎవ్వరు? పాత్రధారుడా? కాదు. నాటక రచయిత.
ఈ జగన్నాటకమునకు నాటక రచయితా స్వరూపుడగు ఆత్మను నేనే}.

చైత్య నిర్ముక్త చిద్రూపమ్। : (1) ద్రష్ట (2) దర్శనము (3) దృశ్యము - ఈ మూడింటిలో దర్శన-దృశ్యములను తొలగించి చూస్తే, అప్పుడు శేషించే కేవల ద్రష్ట (లేక) దృక్ స్వరూపుడను నేను. అందుచేత,
తెలియబడేదంతా లయించినా కూడా. అప్పటికీ శేషించి ఉండు చిదానంద స్వరూపుడను.

పూర్ణ: స్వయముగా పూర్ణుడను. నా యొక్క పూర్ణత్వమునకు దృశ్యముగాని, మరింకేదోగాని అగత్యమేమీ కాదు. ఇక్కడి ద్రష్ట-దర్శన-దృశ్యములు, దేహ-దేహాంతరములు మొదలుగా గల సమస్తము- నా పూర్ణత్వము యొక్క పూర్ణచంద్ర కిరణ విశేషముల వంటివి మాత్రమే।

జ్యోతిస్స్వరూపకమ్ : స్వయం జ్యోతి స్వరూపుడను. సమస్తము నాయొక్క ఆత్మజ్యోతి యందు ప్రస్ఫుటమగుచున్నాయి. నన్ను వెలిగించునది మరొకటేదీ లేదు. దృశ్య-దేహ- మనో-బుద్ధి- చిత్త-అహంకార- మహదహంకారార- చిదాత్మ-సర్వాత్మ స్వరూపములన్నీ అస్మత్ తేజో విభవములు మాత్రమే!

సశాంత సర్వ సంవేద్యం - నాచే జాగ్రత్- స్వప్న- సుషుప్తులలో తెలియబడుచున్నదంతా నా నుండే బయల్వెడలి, నాయందే ప్రదర్శనమగుచూ, చివ్వరికి నాయందే సశాంతించినవి అగుచున్నాయి.

స్వస్తి

హే మునీశ్వరా!

సశాన్త సర్వ సంకల్పః। సమస్త సంకల్పములు నీయొక్క ఆత్మానందస్వరూపము నందు సశాంతించినవిగా అయిఉండును గాక!

ప్రశాన్తః సకలేషణః। దృశ్య ఈషణము, దేహ-ఈషణము, లోక-లోకాంతర ఈషణము’’.. అనబడే త్రి-ఈషణములు (All three types of fondness) నాయొక్క ప్రశాంత స్వరూపమగు కేవల-అఖండ-అప్రమేయ ఆత్మానందము నందు కరిగిపోయి, సశాంతించునుగాక।

నిర్వికల్ప పదం గత్వా : సమస్త కల్ప -వికల్పములకు (The Assumption, withdrawal of Assumptions) ఉభయములు జనించే మునుముందు నిశ్చల స్వరూపమైయున్న ఆత్మపదమును చేరినవాడవై ఉండెదవు గాక! ఆ రెండిటికీ సర్వదా అతీతుడవు, సాక్షివి అయి ఉండుము.

స్వస్థోభవ : ప్రశాంత - నిర్వికల్ప - చిదానంద స్వరూపముతో ‘‘స్వస్థుడవు’’ అగుము.
(BE IN YOU AS ALL THIS AND ENJOY THE FINEST OF PRESENCE AND CONTENTMENT).


ఫలశృతి

బ్రహ్మమును అధ్యయనము చేయు ఏ బ్రాహ్మణుడైతే (Not by caste, but by Finest objective) ఈ ‘‘మహోపనిషత్’’ను నిత్యము అధ్యయనము చేస్తూ ఉంటాడో…,

→ అట్టివాడు వేదార్థములు పరిశీలించని అశ్రోత్రయుడైనప్పటికీ,… శ్రోత్రియునితో (వేదముల అంతరార్థమును గ్రహించి, అభ్యసించువానితో) - సమానుడు అగుచున్నాడు.

→ ఉపనీతుడు (ఆత్మసామీప్యము పొందినవాడు) కానప్పటికీ, ఇప్పుడు ‘‘ఉపనీతుడు’’ అగుచున్నాడు.

సో-అగ్నిపూతో భవతి। స వాయుపూతో భవతి। స సూర్యపూతో భవతి। స సోమ పూతో భవతి।। స సత్యపూతో భవతి।  స సర్వపూతో భవతి। స సర్వైః దేవైః జ్ఞాతో భవతి।।

స సర్వేషు తీర్థేషు స్నాతో భవతి। స సర్వైః దేవైః అనుధ్యాతో భవతి। స సర్వక్రతుభిః ఇష్టవాన్ భవతి।

గాయత్ర్యాః షష్టి సహస్రాణి జప్తాని, ఫలా భవంతి। ఇతిహాస పురాణానాం రుద్రాణాం శతసహస్రాణి జప్తాని ఫలాని భవంతి। 

ప్రణవానామయుతం జప్తం భవతి। ఆచక్షుషః పక్తిం పునాతి। ఆసప్తవాన్ పురుష యుగాన్ పునాతి।

ఈ ‘‘మహోపనిషత్’’ అంతరార్థమును నిత్యము పఠించువాడు, బోధించువాడు, శ్రవణము చేయువాడు ఇందలి అంతరార్థమును హృదయస్థము చేసుకొనువాడు -
👉 ‘వేదము’ను పఠించని అశ్రోతియుడు కూడా వేదహృదయ-అంతరార్థమును శ్రవణము చేయుచున్నవాడు అగుచున్నాడు.
👉 అపవిత్ర భావములు కలవానిలో పవిత్రమగు ఆత్మధ్యానభావములు (లేక) అధ్యాత్మభావములు జనించగలవు.
👉 అగ్నివలె, వాయువు వలె, సూర్యునివలె, చంద్రుడు వలె పరమ పవిత్రుడు కాగలడు.
👉 సత్యము యొక్క సంస్పృశ్యతచే పరిశుద్ధుడు కాగలడు.
👉 సర్వదేవతల దివ్యతత్త్వము తెలుసుకొన్నవాడు అగుచున్నాడు.
👉 సర్వ పవిత్ర తీర్థములలో స్నానము చేసిన పవిత్రత, శాంతి సిద్ధించగలదు.
👉 సర్వదేవతలను ధ్యానించిన సత్-ప్రయోజనము లభించగలదు.
👉 సర్వక్రతువుల ఇష్టా-పూర్తముల అత్యుత్తమ ఫలితము పొందగలడు.
👉 గాయత్రీ మంత్రమును అరువది వేల (60,000) సార్లు జపించిన ఫలితము సంప్రాప్తించగలడు.
👉 ఇతిహాస పురాణములు అధ్యయనము చేసిన ఆత్మతత్త్వభావనా ప్రజ్ఞ ఆతడు పొందగలడు.
👉 వంద వేలసార్లు రుద్రజపము చేసిన సిద్ధి అనుభవమవగలదు.
👉 కోటి ప్రణవ జపధ్యానప్రయోజనము పొందబడగలదు.
👉 అట్టి ‘‘మహోపనిషత్’’ అధ్యయనము చేసివాని చూపు పవిత్రమై, ఆతని చూపు పడిన ప్రదేశమంతా దివ్యత్వము సంతరించుకోగలదు.
👉 అట్టివాని ఇటు ‘7’ తరములు, అటు ‘7’ తరములు తరించగలవు.

ఈ ఉపనిషత్ సృష్టికర్తయగు హిరణ్యగర్భుని వాక్ స్రవంతిగా ఆయన బిడ్డలమగు మనందరిపై అమృతవర్షమై ప్రసరించినట్టిది.

ఇదమ్ ఉపనిషదమ్ పారాయణమ్ యో అమృతత్వం చ గచ్ఛన్తి।।
ఈ ఉపనిషత్ పారాయణముచే - మృతము (మార్పు)ను దాటి ‘అమృతస్వరూపము’ స్వానుభవము కాగలదు.



🙏 ఇతి మహా ఉపనిషత్ ‌🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।