[[@YHRK]] [[@Spiritual]]

Rudra Hrudaya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


కృష్ణ యజుర్వేదాంతర్గత

31     రుద్రహృదయోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। యత్ బ్రహ్మ ‘రుద్రహృదయ మహావిద్యా’ ప్రకాశితమ్
తత్ ‘బ్రహ్మమాత్ర-అవస్థాన’ పదవీమ్ అధునా భజే।।

ఏ బ్రహ్మము అయితే ‘రుద్ర హృదయ మహావిద్య’గా ప్రకాశితము అగుచున్నదో, అట్టి బ్రహ్మమాత్రము యొక్క అవస్థాన (అధిష్ఠాన) పదవిని (లేక) స్థానమును సేవించుచున్నాను. భజించుచున్నాను.

ఓం
01. హృదయం కుండలీ
భస్మ రుద్రాక్షగణ దర్శనమ్।
తార సారం మహావాక్యం
పంచ బ్రహ్మాగ్నిహోత్రకమ్।।
ఏకము అక్షరము అగు ‘ఓం’ సంజ్ఞార్థ పరబ్రహ్మమును హృదయమునందే దర్శించటము-భస్మభూషితాంగుడగు ‘‘రుద్రాక్ష గణ దర్శనము’’.

పరమాత్మను హృదయములో దర్శించటమే ఈ జీవుడు తరించు తారసారము. అదియే ‘సోఽహమ్’ తత్త్వమ్ అసి, త్వమేవాఽహమ్, ‘అయమాత్మా బ్రహ్మ’, ‘తదేవ ఇదమ్ సర్వమ్’ మహావాక్యసారం. దృశ్య - మనో - బుద్ధి - చిత్త - అహంకార పంచాగ్నిహోత్రకము.
ప్రణమ్య శిరసా పాదౌ
శుకో వ్యాసమ్ ఉవాచ హ।।
అట్టి పరబ్రహ్మతత్త్వమును మరికొంత సుస్పష్టముగా, నిర్దుష్టముగా ఎరుగుటకై శ్రీ శుకమహర్షి ఒకరోజు పితృదేవులగు భగవాన్ వ్యాసమహర్షిని సమీపించారు. వారి పాదములను శిరస్సుతో స్పృశిస్తూ ప్రణామములు సమర్పించారు. ఈ విధంగా అడుగసాగారు.
కో దేవః సర్వ వేదేషు?
కస్మిన్ దేవాశ్చ సర్వశః?
కస్య శుశ్రూషణాత్ నిత్యం
ప్రీతా దేవా భవంతి మే?
తస్య తత్ వచనగ్ం
శ్రుత్వా ప్రత్యువాచ
పితా శుక్రమ్।
శుకుడు : తండ్రీ! వేదవ్యాసభగవాన్! నాపైదయతో కొన్ని విషయముల గురించి అనుగ్రహభాషణము ప్రసాదించవేడుకొనుచున్నాను.

(1) మీరు విభాగించి ప్రసాదించిన - 4 వేదములలో (తెలియబడుచున్న అంతటిలో) అంతర్లీనుడై వేంచేసి, స్తుతించబడుచున్న దేవాది దేవుడు ఎవ్వరు?
(2) దేవతలంతా ఏ దేవదేవునియందు నిత్యనివాసులై ఉంటున్నారు?
(3) ఎవ్వరి శుశ్రూష (సేవించుట)చే దేవతలు కూడా ప్రీతి పొందగలరు?

శ్రీ శుకుని ఈ ప్రశ్నలను ఆలకించిన వారి పితృదేవులగు భగవాన్ శ్రీ వేదవ్యాసమహర్షి - ఈ విధంగా సమాధానము ప్రసాదించసాగారు.
02. సర్వ దేవాత్మకో రుద్రః।
సర్వే దేవా శివాత్మకాః।
రుద్రస్య దక్షిణే పార్శ్వే రవిః।
బ్రహ్మా త్రయో అగ్నయః।
వామ పార్శ్వే ఉమాదేవీ।
విష్ణుః సోమో అపి తే త్రయః।।
ప్రియ శుకా! విను, రుద్రుడే సర్వదేవాత్మకుడు. సర్వదేవతలను ఆత్మస్వరూపముగా కలిగియున్నవారు. సర్వ దేవతలు శివాత్మస్వరూపులే! సమస్తము శివాత్మకమే। భిన్నమైనదేదీ లేదు.

అట్టి రుద్ర దేవదేవునికి :
దక్షిణము (కుడి) వైపుగా (పార్శ్వంగా) రవి, బ్రహ్మ,‘త్రి’ అగ్నులు (దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, అహవనీయాగ్ని) స్థానముగా కలిగి ఉన్నారు.
వామపార్శ్వంగా (ఎడమవైపుగా) ఉమాదేవి, విష్ణుదేవుడు, సోముడు (చంద్రుడు) - ముగ్గురు వేంచేసి యున్నారు.
ఒకవైపు పురుషుడు మరొకవైపు ప్రకృతి. తాను మాత్రం నిర్విషయుడు.
యా ఉమా సా స్వయం విష్ణుః।
యో విష్ణుః స హి చంద్రమాః।
యే నమస్యంతి గోవిందం,
తే నమస్యంతి శంకరమ్।
యే అర్చయంతి హరిం భక్త్యా,
తే అర్చయంతి వృషధ్వజమ్।
యే ద్విషంతి విరూపాక్షం,
తే ద్విషంతి జనార్దనమ్।
ఎవ్వరైతే ఉమ (అ+ఉ+మ లోని ‘ఉమ’ (లేక) ప్రకృతి స్వరూపిణి) అయి ఉన్నారో, వారే స్వయముగా విష్ణుదేవుడు. విష్ణువే చంద్రుని (సోముని) రూపుడు కూడా.సమస్తము రుద్రుడే। కనుక విష్ణువుగా ఉన్నది రుద్రుడే। రుద్రుడుగా ఉన్నది విష్ణువే।

ఎవరు గోవిందునికి నమస్కరించుచున్నారో, వారు శంకరునికి భక్తితో నమస్కరిస్తున్నట్లే.
ఎవరు భక్తితో ‘హరి’ని అర్చించుచున్నారో, వారు వృషభధ్వజుడగు శంకరుని భక్తితో అర్చించుచున్నట్లే.
ఎవరు విరూపాక్షుని (శివుని) ద్వేషిస్తున్నారో, వారు జనార్దనుని (విష్ణువు)ను ద్వేషించుచున్నట్లే అగుచున్నది.
యే రుద్రం న అభిజానంతి,
తే న జానంతి కేశవమ్!
ఎవరు రుద్రుని గురించి (రుద్రతత్త్వమును) సరిగ్గా తెలుసుకొని ఉండరో, వారికి కేశవతత్త్వము కూడా ఏమాత్రము తెలియనట్లే. (విష్ణుతత్త్వమును ఎరిగినవారికి, శివతత్త్వము తెలిసినట్లే।)
రుద్రాత్ ప్రవర్తతే బీజం।
బీజ యోనిః జనార్దనః।
యో రుద్రః సః స్వయం బ్రహ్మా।
యో బ్రహ్మా స హుతాశనః।
బ్రహ్మా - విష్ణుమయో రుద్రః।
అగ్నీ సోమాత్మకం జగత్।
‘పుం’ లింగగ్ం సర్వం ఈశానాం,
‘స్త్రీ’ లింగం భగవతి ఉమా।।
రుద్రుని వలన (ఈ జగత్ ఉత్పత్తి సంబంధమైన) బీజము (origin) ప్రవర్తించుచుండగా, అట్టి బీజమునకు యోని స్థానము (where it is situated, placed) జనార్ధనుడు.
ఎవ్వరైతే రుద్రరూపుడై యున్నారో, ఆయనయే స్వయముగా (సృష్టికర్త, ప్రజాపతియగు) బ్రహ్మదేవుడుగా అయి ఉన్నారు. ఎవరు బ్రహ్మయో ఆయనయే అగ్నిదేవుడు.
రుద్రుడు → బ్రహ్మ, విష్ణుమయుడు. ఈ జగత్తు - అగ్ని - సోమాత్మక మైనది. (It is combination of Heat and cool). ఈ జగత్తు రుద్రస్వరూపమే! రుద్రప్రత్యక్ష రూపమే! రుద్రుడు-జగత్తు అభిన్నులు. ఎందుకంటే రుద్రునికి అన్యమై ఎక్కడా ఏదీ లేదు కదా!
ఈ జగత్తులోని పుంలింగము (Male Feature) అంతా ఈశ్వరుడు అయితే, స్త్రీలింగమంతా (Female feature) భగవతియగు ఉమయే! (ఈ రెండింటి అభేదమగు ‘లింగము’ - రుద్రుడు)
ఉమా రుద్రాత్మికాః సర్వాః,
ప్రజాః స్థావర జంగమాః।
వ్యక్తగ్ం సర్వం ఉమారూపమ్।
అవ్యక్తం తు మహేశ్వరమ్।।
ఈ ప్రజలంతా (జీవులంతా), ఇక్కడి స్థావర - జంగములన్నీ స్త్రీ పురుష సంయోగమే. ఉమా- రుద్రాత్మికమే! స్వభావి + స్వభావమే! గుణి + గుణములే!
వ్యక్తమై కనిపిస్తున్నదంతా ఉమారూపము. అవ్యక్తమై ఉన్నదంతా మహేశ్వరరూపమే! (వ్యక్తావ్యక్తములు అభేదరూపమైనవి.)
03. ఉమా శంకరయో యోగః
స యోగో ‘విష్ణుః’ ఉచ్యతే,
యస్తు తస్మై ‘నమస్కారం’
కుర్యాత్ భక్తి సమన్వితః।।
ఏదైతే ఉమా-శంకర (స్త్రీ-పురుష) సంయోగమైయున్నదో, ఆ యోగమునకే వ్యక్తా వ్యక్త స్వరూపమ్-‘విష్ణుః’ అను పేరు (‘విష్ణుయోగము’ అని కూడా అంటారు) ఎవరు విష్ణువుకు దోసిలియొగ్గి భక్తితో నమస్కరిస్తూ ఉన్నారో, ఆ నమస్కారము ఉమా-శంకర యోగమునకే అగుచున్నది.
‘ఆత్మానం’ ‘పరమాత్మానం’
‘అంతరాత్మానం’ ఏవ చ
జ్ఞాత్వా త్రివిధం ఆత్మానమ్,
పరమాత్మానమ్ ఆశ్రయేత్।।
ఆత్మ మూడు విధములుగా ఎరుగబడుచున్నది. (1) జీవాత్మ (2) అంతరాత్మ (3) పరమాత్మ.
ఈ మూడింటి తత్త్వమును తెలుసుకొని, జీవాత్మ - అంతరాత్మలను దాటి, ఆవలగల ‘పరమాత్మ’ను ఆశ్రయించాలి.

(జీవాత్మ: వ్యష్టిగతము. అంతరాత్మ = ‘అనేక దేహములు తనవి. అయి ఉన్న ‘ఈశ్వరుడు’
పరమాత్మ = ‘దేహి’ అవటానికి మునుముందే ఉన్న పరస్వరూపము కేవల స్వరూపము).
అంతరాత్మా భవేత్ బ్రహ్మా।
పరమాత్మా మహేశ్వరః।
సర్వేషామ్ ఏవ భూతానాం
‘విష్ణుః’ ఆత్మా సనాతనః।।
అంతరాత్మ → బ్రహ్మదేవుడు (సృష్ట్యభిమాని)
పరమాత్మ → మహేశ్వరుడు (కేవలుడు)
సమస్త జీవులు విష్ణువు యొక్క ఆత్మస్వరూపులే। సర్వజీవుల భావములకు, జన్మకర్మలకు మునుముందే ఉన్నట్టి ఆత్మయే విష్ణురూపము. ఆయనయే సనాతనుడు. అనేకమునకు మునుముందే ఉన్న ఏకస్వరూపమే ‘విష్ణువు’. కనుక ‘సనాతనుడు’.
అస్య త్రైలోక్య వృక్షస్య,
భూమౌ విటప శాఖినః।
అగ్రం మధ్యం తథా మూలం
విష్ణు బ్రహ్మా మహేశ్వరాః।।
కార్యం విష్ణుః క్రియా బ్రహ్మా
కారణం తు మహేశ్వరః
‘త్రిలోకములు’ అనబడే వృక్షము భూమిపై కొమ్మలుగా విస్తరించినదై యున్నది (భూమి = భావనయొక్క భౌతికరూపము)
ఈ సృష్టి (లేక సంసార) వృక్షమునకు : -
అగ్రభాగాన → విష్ణువు।
మధ్యగా → బ్రహ్మ।
మూలమున → మహేశ్వరుడు।
కార్యము → విష్ణువు। (The Functioner Function)
క్రియ → బ్రహ్మ। (The Executant of Acts))
కారణము → మహేశ్వరుడు। (The Root cause Both)
ప్రయోజనార్థం రుద్రేణ
మూర్తిః ఏకా - త్రిథా స్థితా।
ధర్మో రుద్రో। జగత్ విష్ణుః।
సర్వ జ్ఞానం పితామహః।।
లోక కల్పన - పరిపోషణ ఉపసంహరణ (creating, maintaining and with-drawing) కొరకై -(రుద్ర పరమాత్మ ‘సర్వదా ఏకమే’ అయినప్పటికీ) త్రి(3) విధములుగా ప్రదర్శనము అగుచుండటం జరుగుతోంది.
- కథను ఊహించటం, రచించటం, ముగించటం ఈ మూడూ వేరువేరుగా ఉన్నా కూడా, రచయిత ఎల్లప్పుడూ ఒక్కడే (అయినట్లు).

★ ధర్మము (The creative function) రుద్రుడు.
★ జగత్తు (The creative scenario) విష్ణువు.
★ ఇందలి సమస్త జ్ఞానము (knowing) పితామహుడగు బ్రహ్మ.
శ్రీ రుద్ర రుద్ర రుద్రేతి
యః తమ్ బ్రూయాత్ విచక్షణః।
కీర్తనాత్ సర్వదేవస్య,
సర్వ పాపైః ప్రముచ్యతే।।
‘శ్రీ రుద్ర రుద్ర రుద్ర’ అని ఏ విచక్షణాశీలుడైతే సృష్టి - స్థితి - లయ అభిమానులను, కర్తలను భావన చేసి సర్వదేవతలను, సర్వ సహజీవులను, కీర్తిస్తూ ఉంటాడో, అట్టివాడు సర్వపాపములనుండి విముక్తుడు అగుచున్నాడు. ఎవ్వరు ఏ పేరుతో ఎవ్వరిని కీర్తిస్తున్నా కూడా, పరమాత్మ సర్వదా ఒక్కడే।
రుద్రో నర, ఉమా నారీ।
తస్మై తస్యై నమో నమః।।
రుద్రో బ్రహ్మా, ఉమా వాణీ।
తస్మై తస్యై నమో నమః।।
రుద్రో విష్ణుః ఉమా లక్ష్మీ।
తస్మై తస్యై నమో నమః।।
రుద్రః సూర్య, ఉమా ఛాయా।
తస్మై తస్యై నమో నమః।।
రుద్రః సోమ, ఉమా తారా।
తస్మై తస్యై నమో నమః।
👉 రుద్రుడే నరుడు (పురుషుడు. భావన తనదైనవాడు. స్వభావి) ఉమయే - నారి (ప్రకృతి, భావన, స్వభావము), స్వామికి, మాతకు నమో నమః। నర-నారీస్వరూపములకు రుద్రో-ఉమా ఉపాసనా నమస్కారములు.
👉 ఏ రుద్రుడైతే బ్రహ్మయో, ఏ ‘ఉమ’ అయితే వాణియో - అట్టి రుద్రునికి, రుద్రాణికి నమస్కరించుచున్నాను. బ్రహ్మీ-వాణీలకు నమోనమః
👉 రుద్రుడే విష్ణువు. ఉమయే లక్ష్మి. ఆ స్వామికి, ఆ అమ్మకు మరల మరల నమస్కారములు. విష్ణు-లక్ష్మీ తత్త్వములకు వందనములు.
👉 రుద్రుడే సూర్యుడు. ఉమయే ఛాయ. రుద్ర - ఉమా స్వరూపములగు సూర్య - ఛాయాదేవిలకు ప్రణామములు. నమస్కరిస్తున్నాము.
👉 రుద్రుడే సోముడు (చంద్రుడు). ఉమయే తార. శ్రీ రుద్ర - ఉమల చంద్ర తారా అంశలకు నమస్కారము.
04. రుద్రో దివా, ఉమా రాత్రిః।
తస్మై తస్యై నమో నమః।।
రుద్రో యజ్ఞ, ఉమా వేదిః।
తస్మై తస్యై నమో నమః।।
రుద్రో వహ్నిః ఉమా స్వాహా।
తస్మై తస్యై నమో నమః।।
👉 రుద్రుడే పగలు. ఉమయే రాత్రి. పగలు - రాత్రులను రుద్రా - ఉమా - ఉపాసా పూర్వకముగా దర్శిస్తూ నమోవాక్కములు.
👉 రుద్రుడే యజ్ఞము. ఉమయే యజ్ఞవేదిక. యజ్ఞ - యజ్ఞవేదికలకు రుద్ర - ఉమా భావనాయోగ నమస్కారము.
👉 రుద్రుడే అగ్ని. ఉమయే స్వాహాదేవి. అట్టి అగ్ని - స్వాహాదేవిలకు నమో నమః
రుద్రో వేద, ఉమా శాస్త్రం।
తస్మై తస్యై నమో నమః।।
రుద్రో వృక్ష, ఉమా వల్లీ।
తస్మై తస్యై నమో నమః।।
రుద్రో గంధ, ఉమా పుష్పం।
తస్మై తస్యై నమో నమః।।
రుద్రో అర్ధ, అక్షరః సోమా।। (స-ఉమా)
తస్మై తస్యై నమో నమః।।
రుద్రో లింగం, ఉమా పీఠం।
తస్మై తస్యై నమో నమః।।
సర్వ దేవాత్మకగ్ం రుద్రం
నమస్కుర్యాత్ పృథక్ పృథక్।
👉 రుద్రుడు వేదము. ఉమ శాస్త్రము. అట్టి వేద-శాస్త్రములకు నమస్కృతులు.
👉 రుద్రుడు వృక్షము. ఉమా - వల్లీ (పూతీగ). (లేదా భూమి)
అట్టి వృక్ష - పూతీగలకు (లేక భూమికి) నమస్కారము.
👉 రుద్రుడు పుష్పసువాసన. ఉమ పుష్పము. అట్టి సువాసన - పుష్పములకు రుద్ర - ఉమా ఉపాసనపూర్వక నమస్కారము.
👉 రుద్రుడు అర్థము (The meaning). ఉమ అక్షరము (The word). అట్టి అర్థ - శబ్దములకు రుద్ర - ఉమా భావనా నమస్కారము.
👉 రుద్రుడు లింగము. ఉమ పీఠము. అట్టి లింగ-పీఠములకు రుద్ర- ఉమా (అహమ్ - ఓం) భావనా - నమస్కారము.
‘సర్వ దేవతల ఆత్మస్వరూపుడు రుద్రుడే’ అని ఎరిగి సర్మాత్మకుడగు రుద్రునికి మరల మరల ఎల్లప్పుడు నమస్కరిస్తూ ఉన్నాము.
పునః పునః నమో నమః।।
ఏభిః మంత్ర పదైః - ఏవ
నమస్యామి ఈశ - పార్వతి।
యత్ర తత్ర భవేత్ స అర్థమ్
ఇమం మంత్రమ్ ఉదీరయేత్
బ్రహ్మహా, జలమధ్యేతు
సర్వ పాపైః ప్రముచ్యతే।
మనము చెప్పుకున్న ‘తస్మై తస్యై’ మంత్ర వాక్యములతో ఈశ్వరునికి పార్వతికి సదా నేను నమస్కరించుచున్నాను.
ఎక్కడెక్కడ అనుభవరూపమగు స + అర్థము ఉంటే అక్కడక్కడ ఈ మంత్రమును బుద్ధి మనస్సులతో ఎలుగెత్తి అర్ధ-మనన పూర్వకంగా గానం చేస్తూ చెప్పుకోవాలి.
జలము మధ్య స్నానం చేయుచున్నతీరుగా ‘బ్రహ్మము’ అనే జలమధ్యగా ఉండి ఈ మంత్రమును చెప్పుకొనెదము గాక।
అట్టి మననశీలుడు సర్వ పాపములనుండి విముక్తుడు కాగలడు.
సర్వాధిష్ఠానమ్ అద్వంద్వం
పరంబ్రహ్మ సనాతమ్।
సత్ - చిత్ - ఆనంద రూపం తత్
అవాక్ - మానస గోచరమ్।
తస్మిన్ సువిదితే,
సర్వం విజ్ఞాతగ్ంస్యాత్
ఇదగ్ం, శుక!
ఓ ప్రియకుమారా! శుకా! ఈ దృశ్యములో జన్మ జన్మాంతరములుగా సంచరిస్తూ ఈ ఇంద్రియ జగత్తులలో ఎంతగా వెతికినప్పటికీ కేవలమగు రుద్రతత్త్వము తెలియజాలదు. కథా రచయిత కథలో కనిపిస్తాడా? లేదు కదా! మరి ఏమి చేయాలి? రుద్రతత్త్వము (ఆభరణమునకు బంగారమువలె తరంగమునకు జలమువలె, నవలకు నవలా రచయితవలె) ఈ కనబడే 14 లోకసంబంధమై సర్వమునకు అధిష్ఠానము. అద్దానికి ద్వితీయమైనది ఎక్కడా ఏదీ లేనట్టిది. సనాతనమగు పరబ్రహ్మతత్త్వమే రుద్రతత్త్వము.

అట్టి బ్రహ్మతత్త్వము జన్మ కర్మ వ్యవహార రూపములకు మునుముందే ఉన్నది. కాబట్టి సనాతనము. అవాక్ - మానస గోచరము.
అట్టి బ్రహ్మము (లేక) పరబ్రహ్మతత్త్వము (లేక) పరమాత్మను చక్కగా ఎరిగినప్పుడు - ఇక ఈ సంసార రూప దృశ్యమంతా కూడా - ఏది ఏమిటో తెలిసిపోగలదు.

‘‘రుద్రతత్త్వమునకు వేరై సంసారము లేదు. బంధము లేదు’’ - అను (సోఽహమ్) స్వానుభవమవగలదు.
తత్ ఆత్మకత్వాత్ సర్వస్య।
తస్మాత్ భిన్నం నహి క్వచిత్।।
ద్వే విద్యే వేదితవ్య ఏహి।
పరాచైవ - అపరాచ తే।
అట్టి పరబ్రహ్మమే (ఆ రుద్ర పరమాత్మయే) మనందరియొక్క మరియు సర్వజీవులయొక్క సర్వాత్మకమగు ఆత్మస్వరూపము. ఆయనకు భిన్నమనునది ఎక్కడా ఏదీ లేదు. శివాత్ పరతరమ్ నాస్తి. (అనగా) మనమంతా శివానంద స్వరూపులమే।
ఓ శుకా! (వేద) విద్య రెండు విధములైనవి. అవి తెలుసుకొని ఉండెదవు గాక.
(1) పరావిద్య (2) అపరావిద్య.
తత్ర అపరా తు విద్యా ఏషా - ఋగ్వేదో
యజురేవ చ, సామవేదః,
తథా అథర్వవేదః।
శిక్షా, మనీశ్వర!
కల్పో వ్యాకరణం చ ఏవ
నిరుక్తం ఛంద ఏవ చ।
జ్యోతిషం చ
తథా అనాత్మ విషయా
అపి బుద్ధయః।।
ఇహ విద్య / అపరా విద్య
Ⅰ. ఋక్ - యజుర్ - సామ - అథర్వణ చతుర్వేదములు. వాటి అంతర్గత విధి విధానములు.
Ⅱ. వేదాంగములైనట్టి (షట్ అంగములైనట్టి)
(1). శిక్ష (కర్త పాణిని) = బోధన. (The Training)
(2) కల్పము = న్యాయశాస్త్రము. వ్రత కల్పశాస్త్రము. నిబంధనముల నిశ్చయములు. పద్ధతులు. కాలనిర్ణయము (వేయి యుగములు మొదలైనవి). అట్లాగే తదితర అనాత్మ విషయ శాస్త్రములు (ఆత్మగురించి చెప్పనట్టి శాస్త్రములు (The Physics, Chemistry, Mathematics, etc.,)
(3) వ్యాకరణము (పాణిని) = శబ్ద శాస్త్రము, వాక్య విభజన
(4) ఛందస్సు (పింగలముని) = అర్థనిర్వచనము. అలంకార శాస్త్రము. శబ్దముల శాస్త్రీయత.
(5) నిరుక్తము (యాస్కముని) = పదముల అవయవార్ధ వివరణ. పరమార్థ విశ్లేషణము. శబ్ద - వాక్య ఉత్పత్తులు.
(6) జ్యోతిష్యము (ఆదిత్యుడు) = సూర్య - తదితర గ్రహ, నక్షత్ర గమనములను, కాల ప్రమాణములను సూచించు శాస్త్రము. ‘స్థూలము’లో అంతర్గతమయి ఉండే భౌతికశక్తి తత్త్వములు.

ఇదంతా ‘‘అపరా విద్య’’ - అని చెప్పబడుతోంది.
05. అధ ఏషా పరమా విద్యా
యయ ‘ఆత్మా’ పరమాక్షరమ్-
యత్ తత్ అద్రేశ్యం, అగ్రాహ్యం,
అగోత్రగ్ం, రూపవర్జితమ్।
అచక్షుః-శ్రోతమ్,
అత్యర్థం తత్ అపాణి-
పాదం తథా।
నిత్యం, విభుగ్ం, సర్వగతగ్ం
సుసూక్ష్మం చ, తత్ అవ్యయమ్।।
పరమావిద్య (లేక) పరా విద్య
ఏ విద్య అయితే ఈ జీవాత్మత్వమునకు, ఇంద్రియ దృశ్య వ్యవహారమునకు పరమై, అక్షరమై యున్న ‘ఆత్మ’ గురించిన విద్యయో, అదియే ‘పరావిద్య’.

ఏ విద్య అయితే :-
✤ దేశ కాలములకు సంబంధించనిదై అద్రేశ్యమైయున్నదో,
✤ అగోత్రా : గోత్ర - జాతి సంబంధమైనదిగాని, రూప సంబంధమైనది గాని- కానట్టిదో,
✤ అగ్రాహ్యో - ఇంద్రియములకు విషయము కానట్టిదో,
✤ ఆత్యంతికమైన అర్థమై యున్నదో,
✤ ఇంద్రియములకు, ఇంద్రియార్థములకు, ఇంద్రియ విషయములకు సంబంధించనిదో,
✤ కాళ్లతో నడచి వెళ్ళవలసినది కాదో,
✤ ఒకచోటే ఉన్నట్టిది కాదో…, మరొకచోట ఎక్కడో చేతులకు అందునది కాదో,
✤ నిత్యమో, సర్వ నియామకమగు విభుస్వరూపమో,
✤ సర్వత్రా విస్తరించినదై ఉన్నదో, అవ్యయమో,
✤ అత్యంత సూక్ష్మమో ‘అదియే ఆత్మ’!

అట్టి (స్వస్వరూపమగు) ఆత్మ గురించి చెప్పునదే ‘పరావిద్య’.
తత్ భూతయోనిం పశ్యంతి
ధీరా ఆత్మానమ్ ఆత్మని।
ఉత్తమబుద్ధిగల ధీశాలురు సర్వభూతజలమునకు ఉత్పత్తి (ప్రారంభ) స్థానమగు ఆత్మను-(తమ) ఆత్మయందే - (అనగా) తమయొక్క అంతరముగానే అనుక్షణికంగా, అనునిత్యంగా సందర్శించుచున్నారు. ఆత్మస్వాభావికులై ఆత్మస్వభావులై ఉంటున్నారు. ఆత్మయందే ఆత్మగా జగద్దృశ్యమును చూస్తున్నారు.
యః సర్వజ్ఞః, సర్వ విద్యో (సర్వ విదో),
యస్య జ్ఞానమయం తపః,
తస్మాత్ అత్ర సరూపేణ
జాయతే జగదావళిః।
ఎవ్వరైతే ఈ దేహము-దేహిల పూర్వ - వర్తమాన - తదనంతర స్థితులన్నీ ఎరిగి ఉండుటచే సర్వజ్ఞుడో, ఎదురుగాగల దృశ్యతత్త్వము ఏమిటో- ఎరిగియున్నవాడో, ఎవని గురించిన తపన (తపస్సు) జ్ఞానమయమో-
ఆయన నుండియే ఈ సరూపాత్మకమైన (నామ రూపాత్మకమైన) జగత్తు అంతా బయల్వెడలు చున్నది.
సత్యవత్ భాతి తత్ సర్వగ్ం
‘‘రజ్జు సర్పవత్’’ ఆస్థితమ్।
తత్ ఏతత్ అక్షరగ్ం సత్యం
తత్ విజ్ఞాయ విముచ్యతే।
ఇదంతా సత్యస్వరూపుడగు రుద్రభగవానుని యందు రజ్జుసర్పాహ్రాంతి వలే సత్యములాగా ఉండి, ‘నిజము’వలె ప్రకాశమానమగుచున్నది.

ఓ మునీశ్వరా! శుకా! రుద్ర స్వరూపమగు ఆత్మమాత్రమే అక్షర - సత్యము. అద్దానిని ఎరుగుటచే ఈ జీవుని సర్వ బంధములు తెగిపోతాయి.
జ్ఞానాత్ ఏవహి సగ్ంసార వినాశో,
నైవ (న ఏవ) కర్మణా।
శ్రోత్రియం బ్రహ్మనిష్ఠగ్ం
స్వగురుం గచ్ఛేత్ యథావిధి।
గురుః తస్మై పరాం విద్యాం
దద్యాత్ బ్రహ్మాత్మ బోధినీమ్।
‘ఆత్మజ్ఞానము’ చేత మాత్రమే (అఖండాత్మఽహమ్ జ్ఞానముచేత మాత్రమే) ఈ సంసార బంధమంతా వీగిపోగలదు. అంతేగాని కర్మలచేత సంసార బంధము తొలగదు.
అటువంటి స్వయమాత్మా - బ్రహ్మవిద్య లేక ‘తత్త్వవిద్య, సోఽహమ్ విద్య’ యొక్క అనుభవసిద్ధికొరకై శ్రుతుల హృదయమును ఎరిగినట్టి శోత్రియుడు, బ్రహ్మతత్త్వమునందు నిష్ఠాపరుడు అగు సత్ గురువును యధావిధిగా ఆశ్రయించాలి.
06. గుహాయాం నిహితగ్ం సాక్షాత్
అక్షరం వేదచేత్ నరః,
ఛిత్వా అవిద్యా మహా గ్రన్థిగ్ం,
శివం గచ్ఛేత్ సనాతనమ్।
గురువు-శిష్యుని అర్హతను అనుసరించి ఆతని ఆత్మగురించి సువిదపరచు తత్‌బ్రహ్మమగు ‘పరావిద్య’ను బోధించునుగాక!
ఆ విధంగా సద్గురువు వద్ద ‘ఆత్మజ్ఞానము’ గురించిన శ్రవణము తరువాత ఆ శిష్యుని స్వకీయ మనన, నిధిధ్యాస సమాధిలచే (అనుకోవటం, అనిపించటం, అదే తానవటం చేత) స్వహృదయములోనే పరమాత్మను దర్శించుచున్నాడు. హృదయము నందే సాక్షాత్కరించునదైనట్టి అక్షరమగు స్వస్వరూపమును సర్వస్వరూపంగా ఎరుగుచున్నాడు. అవిద్యా మహాగ్రంథులు విచ్ఛిన్నమై, సనాతనమగు శివ స్వరూపమును సంతరించుకొనుచున్నాడు.
తత్ ఏతత్ అమృతగ్ం సత్యం
తత్ బోధవ్యం ముముక్షుభిః।
ముముక్షువులంతా అట్టి అక్షరమగు, అమృతతుల్యమగు సత్యమును ఎరుగుటకే నిత్యము ప్రయత్నశీలురై ఉండాలి. అట్టి అర్హుడగు ముముక్షువుకు గురువు ‘ఆత్మ’ గురించి బోధించునుగాక।
‘ధనుః తారగ్ం। శరో హి ఆత్మా।
‘బ్రహ్మ’ - తత్ లక్ష్యమ్’ - ఉచ్యతే।।
అప్రమత్తేన వేద్ధవ్యగ్ం
శరవత్ తన్మయో భవేత్।
తారము (చూపు (దృష్టి) perception) → ధనుస్సు
శరము → జీవాత్మత్వము
లక్ష్యము → సర్వాత్మకమగు పరబ్రహ్మము
విలుకాడు లక్ష్యమువైపు బాణమును విడచి లక్ష్యమును భేదించు విధంగా ముముక్షువు అప్రమత్తుడై, జీవాత్మను పరమాత్మత్వమునందు ప్రవేశింపజేయుచు, తన్మయుడు అగునుగాక।
లక్ష్యగ్ం సర్వగతం చ ఏవ
శరః సర్వగతో ముఖః।
వేద్ధా సర్వగతశ్చైవ
శివలక్ష్యం। న సగ్ంశయః।
లక్ష్యము → సర్వగతమగు స్వస్వరూపాత్మయే।
శరము → పరిమితరూపము - ‘సర్వగతమువైపు సంధించబడుచున్న ‘జీవాత్మహమ్’ లేక ‘దేహాత్మహమ్’ స్వరూపము.
తెలియబడునది - సర్వగతము. ‘చిదానందరూపమ్, శివోఽహమ్, శివోఽహమ్!’

మహదాశయము: ఈ జీవుడు శివుడవటమే! నరుడు నారాయణుడు అవటమే! అది స్వస్వరూపమునకు సంబంధించిన నిస్సందేహ స్థితి/స్థానము. ఈ జీవుని పట్ల సర్వదా ఏర్పడియున్న ‘పరమసత్యము’.
న తత్ర చంద్ర - అర్క వపుః
ప్రకాశతే। న వాంతి వాతాః। సకలా దేవతాశ్చ।
స ఏష దేవః కృతభావభూతః।
స్వయం విశుద్ధో విరజః ప్రకాశతే।।
ద్వౌ సుపర్ణౌ శరీరే అస్మిన్
‘‘జీవ, ఈశ’’ ఆఖ్యౌ సహ స్థితౌ।
తయోః జీవః ఫలం భుక్తే కర్మణో।
న మహేశ్వరః।।
కేవలగ్ం సాక్షిరూపేణ
వినా భోగం మహేశ్వరః।।
అట్టి పరబ్రహ్మ స్వయమాత్మా స్థానమునందు, ఈ భౌతిక ఆకాశంలో కనిపించి సూర్యచంద్రులు ప్రకాశించరు. వాయు ప్రసరణములు, సకల దేవతలు - ఇవన్నీ ఉండవు. అవన్నీ స్వస్వరూపాత్మ-భగవానుని కిరణ చమత్కారములుగా తెలియవస్తాయి.
అట్టి ఆత్మ భగవానుడు సర్వభావములకు ఉత్పత్తి స్థానము కాబట్టి కృతభావభూతుడు. స్వయముగా విశుద్ధుడు. నిరంజనుడైనట్టి స్వరూపుడు.
ఈ జీవుని దేహములో (నీ దేహములో నా దేహములో కూడా) భౌతికదేహమునకు వేరై రెండు పక్షులు ఉన్నాయి. అవి కలిసియే జడదేహమునకు ‘జీవనత్వము’ను ప్రసాదిస్తున్నాయి.

ఆ రెండు పక్షులు:
(1) (కర్మ) ఫలములను ఆస్వాదిస్తున్నది పక్షి → ‘జీవుడు’
(2) కేవల సాక్షి మాత్రుడై భోగించక (without experiencing) చూస్తూ ఉన్నట్టి పక్షి → ‘మహేశ్వరుడు’ (లేక) ఈశ్వరుడు
ప్రకాశతే స్వయం భేదః
కల్పితో మాయయా తయోః।
ఆ రెండూ వేరైన రూపులు కాదు. ఏకరూపులే. అయితే ‘స్వకీయమగు మాయాకల్పన’యే ఆ రెండింటికి మధ్య ‘భేదము’. భావనా-కల్పనగా ఏర్పడినదై ఉన్నదే మాయ.
ఘటాకాశ మఠాకాశౌ
యథా ఆకాశ ప్రభేదతః
కల్పితౌ పరమౌ జీవ
శివ రూపేణ కల్పితౌ।
కుండలోని ఆకాశము - మఠము (ఇల్లు)లోని ఆకాశము వేరువేరా? కాదు.
కాని ఒకదానిని ఘటాకాశమని, మరొకదానిని మఠాకాశమని, సర్వత్రా ఉన్న దానిని ‘మహాకాశము’ అని పిలుస్తున్నాం.
అట్లాగే మహాకాశము వంటి ‘పరమాకాశము’ లో ‘ఇది జీవుడు, ఇది శివుడు’ అనునది కల్పితమై దర్శించబడుతోంది.
‘‘ఆవల-ఈవల, పరమాత్మ-జీవాత్మ’’ మొదలైనవన్నీ ఆత్మాకాశములో కేవలము కల్పితము.
తత్త్వతశ్చ శివః సాక్షాత్
చిత్ - జీవశ్చ స్వతః సదా!
చిత్ చిదాకారతో భిన్నా
న భిన్నా చిత్త్వ హానితః।।
తత్త్వార్థంగా పరిశీలిస్తే సాక్షాత్ శివుడే స్వయముగా సర్వదా చిత్ జీవుడుగా పరిమితమైన ఎరుకతో కూడి కనిపిస్తున్నాడు. (The original Consciousness is appearing in a context as contextual Consciousness).
అఖండ చిత్ ఒకానొక చోట పరిమితమైన ‘ఎరుక’గా ఉన్నంతమాత్రంచేత కేవలమైన ఎరుకకు వచ్చే లోటేమీ లేదు. చిత్తు - చిదాకార భిన్నత్వము వలన కేవల చిత్ యథాతథము కాకపోదు. బంగారమునకు ఆభరణాకారము వలన వచ్చే లోటేమున్నది? ఆభరణము బంగారము కాకుండా పోతోందా?
చితిశ్చేత్ న చిదాకారా
భిద్యతే జడరూపతః
భిద్యతే చేత్ జడో భేదః
చిత్ ఏకా సర్వదా ఖలు।।
‘చిత్’ (ఎరుక) ఎప్పుడూ స్వయముగా చేతనాస్వరూపమే. ఎరుగబడేది-(చిదాకారము)గా అవదు. జడరూపము పొందదు. (“The knowing is always intutive and never takes this form of what is being known”)
జడ భేదమును ఖండించుకుంటూపోతే, తెలియబడే (జడమైనది) అంతా కూడా చిత్ స్వరూపమునకు (ఎరుకకు) భిన్నమైనది కాదు.
ఎరుకయొక్క ఏకరూపములే (1) తెలుసుకొనునది, (2) తెలియబడునది కూడా!
07. తర్కతశ్చ ప్రమాణాచ్చ
చిత్ ఏకత్వ వ్యవస్థితే।
‘చిత్ ఏకత్వ’ పరిజ్ఞానే
న శోచతి। న ముహ్యతి।
‘అద్వైతం పరమానందగ్ం
శివం’ - యాతితు కేవలవ్
గురువు చెప్పుచున్న తర్కము(logic) చే, శాస్త్రముల ప్రమాణములచే- ‘‘తెలుసుకొనుచున్నవాడు. తెలియబడునది తెలివి’’ల ఏకత్వమే। - (చిత్ ఏకత్వముగా) సర్వత్రా సర్వదా వ్యవస్థితమగుచున్నది. చిత్ ఏకత్వమును బాగుగా తెలుసుకున్నవాడు దేనికీ శోకించడు. దేనికీ మోహము చెందడు. జీవ-శివత్వముల ఏక రూపము అగు ‘కేవల శివతత్త్వము’ను పుణికిపుచ్చు కొనుచున్నాడు. పరమానందరూపమగు అద్వైత స్థానమును అనుక్షణికం చేసుకుంటున్నాడు.
‘‘అధిష్ఠానగ్ం సమస్తస్య
జగతః సత్య చిద్ఘనమ్,
అహమస్మి!’’ ఇతి నిశ్చిత్య
వీత శోకో భవేత్ మునిః।
ఓ మునీ! శుకా!
‘‘కేవల శివస్వరూడునగు నేను సమస్త జగత్తుకు (కథకు రచయితవలె, ఆభరణమునకు బంగారమువలె) అధిష్ఠాన స్వరూపుడను. ‘సత్’ ఘనీభూత రూపుడను’’-అని నీవు ఎప్పుడైతే సర్వభేదములపట్ల - మౌనము, అతీతత్వము వహించుచూ సునిశ్చితుడవై ఉంటావో, అప్పుడు శోకరహితుడవు కాగలవు. (All worries naturally vanish)
స్వ శరీరే స్వయం జ్యోతిః
స్వరూపగ్ం సర్వసాక్షిణమ్
క్షీణదోషాః ప్రపశ్యంతి
నేతరే (న-ఇతరే) మాయయ ఆవృతాః।
ఎవ్వరైతే మనస్సు బుద్ధి - చిత్తములను ఆశ్రయించి ఉన్న దోషదృష్టులను పరిశుభ్రపరచుకొంటున్నారో, తత్త్వదృష్టిని ఆశ్రయిస్తారో, వారు స్వశరీమునందే - స్వయం జ్యోతి స్వరూపము, సర్వసాక్షి అగు ఆత్మను దర్శించుచున్నారు.
ఎవ్వరు దోషదృష్టులను జయించరో, వారు మాయచే కప్పబడినవారై స్వాత్మ సందర్శనమును సిద్ధించుకోలేకపోవుచున్నారు.
ఏవగ్ం రూపపరిజ్ఞానం
యస్యాస్తి (యస్య అస్తి) పరయోగినః
కుత్ర చిత్ గమనం నాస్తి
తస్య సంపూర్ణ రూపిణః।।
అట్టి స్వస్వరూప పరిజ్ఞానమును సిద్ధించుకొన్న పరమయోగి - ఇక ఆత్మతత్త్వము కొరకై - మరెక్కడికీ వెళ్లవలసిన పనియేలేదు. తనయొక్క ఇహ పర స్వరూపములచే పరిపూర్ణుడై ‘సంపూర్ణరూపి’గా అగుచున్నాడు. దృశ్యమంతటినీ తనకు అనన్యముగా ఆస్వాదించుచున్నాడు. అనన్యముగా సమన్వయించుకుంటున్నాడు.
ఆకాశమ్ ఏకగ్ం సంపూర్ణం
కుత్ర చిత్ నైవ గచ్ఛతి,
తద్వత్ స్వాత్మ పరిజ్ఞానీ
కుత్ర చిత్ నైవ గచ్ఛతి।।
ఆకాశము (spare) అంతటా వేంచేసియుండగా అట్టి ఆకాశము ‘‘ఒకచోట నుండి మరొకచోటికి వెళ్ళటము’’ అనే ప్రసక్తియే ఉండదు కదా। ఆ విధంగానే ఆత్మను ఎరిగినట్టి పరిజ్ఞానికి దేహ దేహాంతరముల దృష్ట్యాగాని, త్రికాలముల దృష్ట్యాగాని, జాగ్రత్ స్వప్నముల దృష్ట్యాగాని ‘ఒకచోట నుండి ఇక్కడికి రావటము, ఇక్కడి నుండి మరెక్కడికో పోవటము’ అను ప్రసక్తియే లేదు. ఆత్మగా ఈ జీవుడు సర్వదా సర్వత్రా యథాతథస్వరూపుడు - అయియే ఉన్నాడు.
స యో హవై తత్
‘పరమం బ్రహ్మ’,
యో వేద వై మునిః,
బ్రహ్మైవ భవతి స్వస్థః -
‘సత్ చిత్ ఆనంద మాత్రక’
ఏ పరమాత్మను మునులు, ఋషులు తమ తపస్సుచే గమనించి జనులందరికీ ఎలుగెత్తి ‘త్వమ్‌తదేవ’ అని గానము చేసి చెప్పుచున్నారో, అది శ్రవణము చేయు బ్రహ్మజ్ఞాని - తానే ‘బ్రహ్మము’ అయి స్వస్థత చెందుచున్నాడు.

సత్ చిత్ ఆనంద మాత్రక- బ్రహ్మైవ భవతి స్వస్థః।।

ఇతి రుద్ర హృదయోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



కృష్ణ యజుర్వేదాంతర్గత

31     రుద్ర హృదయ ఉపనిషత్

అధ్యయన పుష్పము

స్వస్వరూప - సర్వస్వరూప పరబ్రహ్మము ‘రుద్ర హృదయ మహావిద్య’గా బ్రహ్మసూత్రములచే, పురాణములచే ఉపనిషత్తులచే ప్రసాదించబడుచున్నది. ‘బ్రహ్మమాత్ర అవస్థానము’గా సర్వత్రా వెలయుచు, స్వ - అనన్యమగుచున్న రుద్రభగవానునికి నమస్కరించుచున్నాను. చిదానంద రూపమ్। శివోఽహమ్! శివోఽహమ్!

రుద్ర భగవత్ దర్శనము = హృదయ కుండలినీ దర్శనము.
రుద్రాక్ష దర్శనమ్ = హృదయమునందు సర్వమును ‘రుద్రప్రత్యక్ష స్వరూపం’గా దర్శించటము.

సర్వాత్మకుడగు పరమాత్మను హృదయమునందు దర్శించటమే సంసారము నుండి తరించు ఉపాయము. ‘తత్ త్వమసి’, ‘అహమ్ బ్రహ్మాస్మి’ ‘సోఽహమ్’, ‘అయమాత్మా బ్రహ్మ’, ‘జీవోబ్రహ్మేతి నా పరః ’. ఇత్యాది మహావాక్యముల పరమార్థమే తారసారము. (దృశ్య - దేహ - జీవ - ఈశ్వర పరబ్రహ్మము అనబడే) పంచాగ్నిహోత్ర - రుద్రాత్మకుడగు - పరమాత్మ యొక్క పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తున్నాను.

శ్రీ వ్యాసమహర్షి కుమారుడగు శ్రీశుకుడు ఏకాంతముగా తపస్సు ఆచరిస్తూ ఉన్నారు. ఒకానొకరోజు, బుద్ధిని మరింత సునిశితముగాను, నిర్మలముగాను, విస్తారముగాను ఆత్మ సందర్శనోత్సాహ సమన్వితముగాను తీర్చిదిద్దుకున్నారు. అట్టి సమయంలో ఆయనకు: -
🌺 ‘హృదయకుండలీ భస్మ రుద్రాక్షగణ సందర్శన యోగము’ - గురించి,
🌺 జగత్తును ఆత్మ తత్త్వముగా సందర్శనయోగమునకు సంబంధించిన అభ్యాసము గురించి,
🌺 ‘‘తరింపజేయు వేదమహావాక్యములగు ‘‘తత్ త్వమ్ అసి - అఖండమగు శివానందస్వరూపుడవే నీవు’’… అను అవగాహన గురించి, ‘సోఽహమ్ అస్మి’ గురించి…, (మరియు)
ఇంకా కూడా ఏవో సందేహాలు కొన్ని తనయందు పొడచూపుచుండటమును గమనించారు.
‘జ్ఞానస్సంచ్ఛిన్న సంశయః’ అను ఆర్య వ్యాక్యానుసారం తనలోని సంశయములను తొలగించుకో నిశ్చయించారు.
తపస్సు చాలించి, తపోవనము నుండి బయల్వెడలారు.

తనకు ప్రియమైనవారు, వేదోపనిషత్ సంస్కర్త, మానవాళి క్షేమం కోరి భాగవతాది అష్టాదశ పురాణ ప్రవక్త, బ్రహ్మసూత్ర రచయిత, లోకకళ్యాణమూర్తి, కలిదోష భిషజుడు, సాక్షాత్ నారాయణావతారముగా మునిలోకములో శ్లాఘించబడువారు - అగు శ్రీ వ్యాసమహర్షిని సమీపించారు. పితృదేవులు, గురుదేవులు అగు శ్రీ వ్యాసమహర్షి పాదపద్మములు స్పృశించి, భక్తితో కళ్ళకద్దుకొని, ప్రణామములు సమర్పించారు.

శ్రీ శుకదేవులు : భగవన్! పితృదేవా! అస్మత్ సద్గురూ! తండ్రీ! ఇప్పుడు మీవద్ద కొన్ని ప్రశ్నలకు సమాధానములు శ్రవణం చేయటానికై మిమ్ములను వినమ్రుడనై వేడుకుంటున్నాను.

(1) కో దేవః సర్వ వేదేషు? సర్వ వేద వాఙ్మయములో ఏ స్వామి వేదవేద్యుడుగా, దేవదేవుడుగా స్తుతించబడుచున్నారు?
(2) దేవతలందరు ఏ పరంధామునియందు నిత్యనివాసులై ఉంటున్నారు? కస్మిన్ దేవాశ్చ సర్వశః?
(3) కస్య శుశ్రూషణాత్ నిత్యం ప్రీతా దేవా భవంతి మే? ఎవనికి నేను శుశ్రూష చేయటంచేత దేవతలందరు నాపట్ల అనునిత్యముగా ప్రీతిపొందగలరు?

ఈ ప్రశ్నలు విన్న శ్రీవ్యాసమహర్షి శ్రీ శుకుల వారికి ఈ విధంగా బోధించసాగారు.

శ్రీ వేదవ్యాసులవారు : ఓ తపోధనా! ప్రియపుత్రకా! శుకా! విను.

4 వేదములు కూడా -
సర్వదేవాత్మకోరుద్రః - ‘సర్వదేవతల ఆత్మస్వరూపుడు రుద్రుడు’।
సర్వేదేవాః శివాత్మకః - దేవతలందరు శివాత్మ స్వరూపులే।

అని మంత్రముగ్ధంగా ఉచ్ఛైస్వరముతో గానము చేస్తున్నాయయ్యా। శివుడే-సర్వాత్మకుడు. సర్వతత్త్వస్వరూపుడు. ఉమా (ప్రకృతి) సహితుడు. మనందరియొక్క ఆత్మేశ్వరుడు, ఆత్మస్వరూపుడు రుద్రభగవానుడే।

రుద్రునికి - కుడివైపుగా → సూర్యుడు, బ్రహ్మ, త్రి-అగ్నులు (దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని)।
ఎడమవైపుగా → ఉమాదేవి, విష్ణువు, సోముడు. (చంద్రుడు).

ఈ విధంగా ‘యజ్ఞ యాగ’ విధానములలో సాంగ - సవాహన - సాయుధ - సభక్త జన సమేతంగా ఆహ్వాన - స్తుతి - ఉపాసనలు (విశ్వజిత్, అశ్వమేధాది యజ్ఞవిధులు) అభివర్ణించుచున్నాయి. వేదవాఙ్మయములో అనేకచోట్ల ఇట్టి దేవతాహ్వానలాంఛనముల గురించి చెప్పబడటం జరుగుతోంది. ఇంకా ఈ రీతిగా అంతరార్థము ఉద్దేశ్యించబడుతోంది.

యా ‘ఉమా’ - సా స్వయం విష్ణుః। ఓంకారములో ‘అ’కారము శివుడుగా, ‘ఉమ’ ప్రకృతిగా చెప్పబడుతోంది. ఈ విధంగా ఏ మూలప్రకృతి తత్త్వాన్ని ‘ఉమ’ అని పిలుస్తున్నారో, ఆ ఉమాదేవి స్వయముగా విష్ణువే!

యో విష్ణుః సహి చంద్రమా! ఎవ్వరైతే విష్ణువో, వారే స్వయముగా చంద్రమసుడు (మనో అధిష్ఠాన దేవత) అయి ఉన్నారు.

➤ ఈ విధంగా ఉమ - బ్రహ్మ - విష్ణు - చంద్ర - ఇంద్రాది దేవతలు శివునికి అభిన్నులు. అనన్యులు.
➤ ఈ జీవులంతా శివస్వరూపులే।
➤ వారి వారి స్వభావములన్నీ ఉమాస్వరూపం।
➤ శివాత్ పరతరమ్ నాస్తి। శివునికివేరుగా ఎక్కడా ఏదీ లేదు।
➤ ఆబ్రహ్మాది పిపీలికము వరకు మనమంతా, సర్వకాలములలోను సర్వదా శివస్వరూపులమే।

ఇంకొక ముఖ్య విషయం. ఇక్కడ గమనించాలి.

యే నమస్యంతి గోవిందం, తే నమస్యంతి శంకరమ్। ఎవ్వరు గోవిందునికి నమస్కరిస్తున్నారో, వారు శంకరునికి నమస్కరించినవారే అగుచున్నారు. ఎవరు హరిని భక్తిపూర్వకంగా అర్చిస్తున్నారో వారు వృషభధ్వజుడగు హరుని అర్చించుచున్నవారే। (శివాయ విష్ణురూపాయ! శివరూపాయ విష్ణువే! శివస్య హృదయం విష్ణుః। విష్ణుశ్చ హృదయగ్ం శివః। - స్కందోపనిషత్)।
యే ద్విషంతి విరూపాక్షం, తే ద్విషంతి జనార్దనమ్। ఎవ్వరు విరూపాక్షుని (శివుని) ద్వేషిస్తూ ఉంటారో, వారు జనార్దనుని (విష్ణువుని) ద్వేషిస్తున్నట్లే అవుతుంది.

‘రుద్రుడు అనగా ఎవ్వరు?’ అను ప్రశ్నకు సరి అయిన సమాధానము ఎవ్వరు ఎరుగరో, అట్టివారు - ఏమే రుద్రం నాభి జానంతి, తే నజానంతి కేశవమ్। వారు కేశవునికూడా తెలియనివారే. (యథా అంతరమ్ న పశ్యామి, తథా మే స్వస్తిః ఆయుషి।)
రుద్రాత్ ప్రవర్తతే బీజమ్। రుద్రుని నుండియే ఈ ‘జగత్’ అను బీజము ప్రవర్తమానమగుచున్నది. బీజ యోనిః జనార్దనః। అట్టి జగత్ బీజమునకు యోని (స్థానము, కారణము) జనార్దనుడే!

యో రుద్రః సః స్వయం బ్రహ్మ। ఎవరు రుద్రుడుగా సంప్రదర్శనమగుచున్నారో, వారే స్వయముగా సృష్టికర్తయగు ‘బ్రహ్మ’ కూడా అయి ఉన్నారు. యో బ్రహ్మా స హుతాశనః।। ఎవరు బ్రహ్మగా అయి ఉన్నారో, వారే అగ్నిదేవుడు కూడా!

♠︎ బ్రహ్మా విష్ణుమయో - రుద్రః। రుద్రుడు → బ్రహ్మ, విష్ణుమయుడు (ఆభరణమునందు బంగారమువలె) అయి ఉన్నారు.
♠︎ అగ్నీ సోమాత్మకం జగత్।- ఈ జగత్తో? అగ్ని-సోమాత్మకము (ఉష్ణశీతల సమన్వయము. పురుషుడు - ప్రకృతిల సమావేశము).

జగత్తులో కనిపించే పుంలింగము - ఈశ్వరుడు. స్త్రీ లింగము - భగవతి అగు ‘ఉమ’. (పుంలింగం = Doer; స్త్రీలింగం= Doings) (స్త్రీ =సత్+రతీ।।)

ఈ జగత్తులో కనిపించే జీవులు, స్థావర - జంగములు (Non movings and movings) ఉభయము కూడా ఉమా-రుద్రాత్మకములే!

వ్యక్తముగా కనిపించేదంతా ఉమ. వ్యక్తీకరిస్తూ, అవ్యక్తమైయున్నది - మహేశ్వరుడు!

శరీరి = శివుడు। శరీరము = ఉమ।
పురుషుడు = శివుడు। స్వభావము / ప్రకృతి = ఉమ।
కదిలించువాడు = రుద్రుడు। కదిలించటము / కదులుచున్న సమస్తము = ఉమ।
చూచువాడు = రుద్రుడు। చూడబడుచున్న సమస్తము, చూపు = ఉమ।

‘‘నమః’’-నమస్కారము

నః = అందరిలోని నేనైన ‘నేను’.
మః = వ్యష్టిలోని ‘నేను’। ‘ప్రకృతి’ తెలియబడునది. ఉమ।
నమః = పురుషుడు+ ప్రకృతి, నేను + నాది.

కదల్చువాడు + కదలునది, తెలుసుకొనువాడు + తెలియబడునది

భావికుడు + భావన, చూచువాడు + చూడబడునది
ఊహించువాడు + ఊహ.
ఈ రెండింటి సంయోగ ఏకత్వమును సూచించు శబ్దమే ‘‘నమః’’।

‘నమస్కారము’: నకార - మకారములు తనవైన పరమశివ - శివా! నమస్కారము! ‘పై ద్వంద్వములు సంయోగ - ఏకత్వము’ యొక్క ధారణ, ఉపాసన, సందర్శనములే ‘నమస్కారము’।

విష్ణు శబ్దార్థము

ఓ శుకా! ఇప్పుడు ‘విష్ణువు’ అను శబ్దతత్త్వ నిర్వచనము విను.

ఉమా శంకరయో యోగః స యోగో ‘విష్ణుః’ ఉచ్యతే। ‘విష్ణు’ శబ్దమునకు అర్థము - ఉమాశంకర సంయోగ అభేదత్వమే! అందుచేత ‘విష్ణువే నమః’ అని నమస్కరించుచున్నప్పుడు - తెలుసుకొనుచున్న ‘శివతత్త్వము’ మరియు తెలియబడుచున్న ‘ఉమా తత్త్వము’ల ఏకత్వమునకే నమస్కరిస్తున్నామని గ్రహించి ఉండాలి. అట్లాగే, ‘ఉమా నమస్కారము - విష్ణు నమస్కారమే అగుచున్నది’ సర్వ నమస్కారములు ఆత్మ నమస్కారములే!

శ్లో।। ఆత్మానమ్, పరమాత్మానమ్, అంతరాత్మానమ్ ఏవచ,
జ్ఞాత్వా త్రివిధమ్ ఆత్మానమ్ ‘పరమాత్మనమ్’ ఆశ్రయేత్।।

ఓ ప్రియకుమారా! ఉత్తమ తపస్వీ! శుకా! ‘ఆత్మ’! - అన్నదానిని ‘3’ రకములుగా ఎరిగి ఉండెదవు గాక!

(1) ఆత్మ = జీవాత్మ. దేహము + దృశ్యము + దేహి = దేహముగా, జీవాత్మగా నేనైన ‘నేను’’.

(2) అంతరాత్మ: జాగ్రత్ స్వప్న సుషుప్తుల, జన్మ - జన్మాంతరముల అంతర్లీనమైయున్నట్టిది అంతరాత్మ. జాగ్రత్-స్వప్న-సుషుప్తులు నావైన నేను। జన్మ - జన్మాంతరములు నావైన ‘నేను’.

(3) పరమాత్మ: జీవాత్మ - జగత్తులను ‘స్వీయకల్పన’గా కలిగి ఉండి, వినోదించుచున్నవాడు. లోకములు, లోకేశులు, లోకస్థులు.
తనయందు తానే స్వకీయ మాయా విశేషములుగా కలిగి ఉండి, తాను కేవల సాక్షియై, కారణకారణమై వెలుగొందుచూ ఉన్న సహజ స్వస్వరూపము. సమస్త జీవులకు, సమస్త జగత్తుకు ఆత్మగా నేనైన నేను। కారణకారణమై వెలుగొందుచూ ఉన్న స్వస్వరూపము. సమస్తము నేనైన ‘నేను’.

ఈ విధంగా స్వస్వరూపాత్మను ‘3’ రీతులుగా ఎరిగి ఉండి, ‘‘సమస్తము నేనే అయిఉన్నట్టి ‘నేను’ - అను ‘పరమాత్మత్వము’ను ఆశ్రయించినవాడవై ఉండుము. అట్టి ఆశ్రయమే నిర్వికల్ప సమాధి. తక్కిన రెండిటిని అధిగమించి, 3వ దానిని మననము చేయువాడవై ఉండుము.

అంతరాత్మ: అంతరాత్మా భవేత్ బ్రహ్మ! అంతరాత్మయే - బ్రహ్మదేవుడు (సృష్టికర్త)గా అగుచున్నది. అనగా, సృష్ట్యభిమాని అయి, మనో, బుద్ధి, చిత్త, అహంకార - ధర్మములన్నీ సృష్టి యందు ‘సంకల్పన’గా కల్పన చేస్తున్నారు.

పరమాత్మ: పరమాత్మా మహేశ్వరః। సృష్టికి ఆవల, (నటుని యొక్క పాత్రకు ఆవలగల సహజరూపమువలె) సర్వమునకు పరమై ఉన్నట్టి తత్త్వము-పరమాత్మ. సమస్తమునకు ఆవల-కేవల స్వరూపమై (ఆభరణమునకు బంగారమువలె) యున్న నేనైన నేనే- నేను.

విష్ణువు: సర్వేషాం ఏవ భూతానాం విష్ణుః ఆత్మా సనాతనః। జన్మ - జగత్తులకు మునుముందే ఉన్న ప్రతి ఒక్క జీవునియొక్క సనాతనమగు ఆత్మయే విష్ణువు. సర్వ జీవులు తానే అయి, సమస్తమునకు సాక్షిగా వేరై కూడా ఉన్నట్టి స్వస్వరూపతత్త్వమే ‘‘విష్ణుతత్వము’’।

త్రైలోక్య వృక్షము

(ఊర్ధ్వ మూలమ్ - అధః శాఖః। కొమ్మలు క్రిందగా - మూలము పైపైన)

అస్య త్రైలోక్య వృక్షస్య భూమౌ విటపి శాఖినః। ఒక మహావృక్షము ఉన్నది. అద్దాని కొమ్మలు క్రిందగాను, మూలముపైన ఉన్నది. అదియే ‘త్రైలోక్య వృక్షము’ లేక ‘సంసార వృక్షము’.

ఈ స్వర్గ - మర్త్య - పాతాళ త్రైలోక్య వృక్షమునకు - క్రిందగా భూమి (భూలోకము) - భౌతికరూపంగా కనిపిస్తున్నదంతా ఆ వృక్షము యొక్క విస్తరణ.

ఈ వట వృక్షమునకు - అగ్రం మధ్యం తథా మూలం - ‘‘విష్ణు బ్రహ్మ మహేశ్వరః।।
అగ్రము - విష్ణువు। మధ్య - బ్రహ్మ। మూలము - మహేశ్వరుడు.

ఈ త్రైలోక్య రచనా - కల్పనా చమత్కారమంతటికీ…
కార్యము = విష్ణువు,
క్రియ (కర్తృత్వము) = బ్రహ్మ,
కారణము = మహేశ్వరుడు.

ఇదంతా రుద్ర చమత్కారమే. ఒకే రుద్ర మూర్తిత్వము (మనోకల్పనచే) కార్య - క్రియా - కారణములుగా అనుభూతమగుచున్నది.
అనగా, కార్య-కారణ-కర్తృత్వములకు కారణ కారణము - ‘‘ఏకము-అఖండము’’ అగు ‘‘ఆత్మతత్త్వమే।’’ సృష్టి ప్రయోజనమునకై రుద్రుడే మూడు రూపములు దాల్చుచున్నారు.

దీనికంతటికీ :
ధర్మో రుద్రో। జగత్ విష్ణుః। సర్వజ్ఞానం పితామహః।
ధర్మము (Feature) - రుద్రుడు
జగత్తు (The changing Factor) - విష్ణువు
సర్వజ్ఞానము - పితామహుడగు బ్రహ్మ

విచక్షణులగు తత్త్వజ్ఞులు ఈ మూడింటిని ఏక స్వరూపంగా గ్రహించుచున్నారు.

‘శ్రీ రుద్ర రుద్ర రుద్రేతి’

అను మంత్రము సూచిస్తూ భిన్నత్వంలో ఏకత్వమును దర్శిస్తూ మహనీయులు మనకు ఏక-అఖండ తత్త్వమగు ఆత్మగురించి విశదీకరిస్తున్నారు.

బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులు,
సృష్టి - స్థితి - లయములు,
ద్రష్ట - దర్శన - దృశ్యములు,
భావించువాడు - భావన - భావించబడునవి,
ఊహించువాడు-ఊహ-ఊహించబడునది-సర్వము కేవల రుద్రతత్త్వమే! విష్ణుతత్త్వ చమత్కారమే। బ్రహ్మ చైతన్యమే! అఖండమే!

ఈ విధంగా అఖండాత్మతత్త్వముగా - ఎవ్వరెవ్వరు ఏ ఏ దేవతను ఉపాసిస్తూ ఉంటే ఆ దేవతను ఆ విధంగా ఉపాసించటంచేత, ఆ ఉపాసకుడు సర్వ పాపములనుండి, దోష దృష్టులనుండి విడివడుచున్నాడు. - కీర్తనాత్ సర్వదేవస్య సర్వపాపైః ప్రముచ్యతే।।

‘రుద్రో ఉమా ఇదమ్ సర్వమ్ ప్రోతమ్।’

రుద్రో నర - ఉమా నారీ। తస్మై తస్యై నమో నమః।। రుద్రుడే పురుషుడు. ఉమయే స్త్రీ. ఇరువురికి నమస్కారము।।
రుద్రో బ్రహ్మా - ఉమా వాణీ। తస్మై తస్యై నమో నమః।। రుద్రుడే బ్రహ్మ, ఉమయే సరస్వతి। ఉభయులకు నమో వాక్కములు.।।
రుద్రో విష్ణుః - ఉమా లక్ష్మీ। తస్మై తస్యై నమో నమః।। రుద్రుడే విష్ణువు। ఉమయే లక్ష్మి।।
రుద్రః సూర్యః - ఉమా ఛాయా। తస్మై తస్యై నమోనమః।। రుద్రుడే సూర్యుడు। ఉమయే ఛాయ।।
రుద్రః సోమః - ఉమా తారా। తస్మై తస్యై నమోనమః।। రుద్రుడే చంద్రుడు। ఉమయే తార।।
రుద్రో దివా - ఉమా రాత్రిః। తస్మై తస్యై నమోనమః।। రుద్రుడే పగలు। ఉమయే రాత్రి।।
రుద్రో యజ్ఞ - ఉమా వేది। తస్మై తస్యై నమోనమః।। రుద్రుడే యజ్ఞము। ఉమయే వేదిక।।
రుద్రో వహ్నిః - ఉమా స్వాహా। తస్మై తస్యై నమోనమః।। రుద్రుడే అగ్ని। ఉమయే స్వాహాదేవి।।
రుద్రో వేదః - ఉమా శాస్త్రమ్। తస్మై తస్యై నమోనమః।। రుద్రుడే వేదము। ఉమయే శాస్త్రము।।
రుద్రో వృక్ష - ఉమా వల్లీ। తస్మై తస్యై నమోనమః।। రుద్రుడే వృక్షము। ఉమయే పూతీగ।।
రుద్రో గంధ - ఉమా పుష్పమ్। తస్మై తస్యై నమోనమః।। రుద్రుడే సువాసన। ఉమయే పుష్పము।।
రుద్రో అర్థ - అక్షరః సోమా! తస్మై తస్యై నమోనమః।। రుద్రుడే అర్థము (meaning). స-ఉమయే అక్షరము (word).
రుద్రో లింగమ్ - ఉమా పీఠం। తస్మై తస్యై నమోనమః।। రుద్రుడే లింగము। ఉమయే పీఠము।।

సర్వ దేవాత్మకగ్ం రుద్రం నమస్కుర్యాత్ పృథక్ పృథక్।। ఏ దేవతకు నమస్కరించినా కూడా, సర్వదేవాత్మకుడగు రుద్రునికి మరల మరల నమస్కరించుచున్నట్లే.

ఏభిః మంత్ర పదైః ఏవ నమస్యామి ఈశ - పార్వతీ।। ఈ మంత్ర - పదములతో ఈశ్వరునికి పార్వతీదేవికి నమస్కరిస్తున్నాను.

వారికి వారికి నమో నమః। నమస్కారము।

శ్లో।। యత్ర యత్ర భవేత్ స-అర్థమ్, ఇమమ్ మంత్రమ్ ఉదీరయేత్।
బ్రహ్మహా, జల మధ్యే తు, సర్వపాపైః ప్రముచ్యతే।।

ఓ శుకా! ముముక్షు ఎక్కడెక్కడ ఏఏ స్థితిలో ఉన్నా కూడా ఈ మంత్రమును దీనిపై అంతరార్థమును సర్వదా దేహ-మనో-బుద్ధులతో ‘మననము’ చేస్తూ ఉండగా, (అట్లాగే) జలమధ్యగా (స్నానం చేస్తూ) ఉచ్ఛరిస్తూ ఉండగా కూడా అట్టివాడు బ్రహ్మహత్య మొదలైన సర్వ పాపములనుండి కూడా విముక్తుడు, నిష్కృతుడు కాగలడు. బుద్ధి మనస్సు క్రమంగా నిర్మలము కాగలవు. సర్వత్రా సర్వము కూడా శివ - పార్వతుల ప్రకృతి-పురుషుల నాట్య - విన్యాసముగా అనునిత్యానుభవము, అనుక్షణికానుభూతము కాగలదు. ‘బ్రహ్మము’ అనే మహాసముద్రములో అలలవంటివే ఈ బ్రహ్మాండములు.

సర్వము రుద్ర స్వరూపమే। సర్వమునకు అధిష్ఠానము రుద్రుడే! రుద్రుడే పరబ్రహ్మము! అట్టి పరబ్రహ్మము అద్వంద్వము. అద్వితీయము. ఆయనకు ద్వితీయమేదీ లేదు. నేను, నీవు, ఈ సర్వజీవులు పరబ్రహ్మ స్వరూపులమే!

అందుచేత, సత్ చిత్ ఆనంద స్వరూపము, అవాక్ - మానసగోచరము అగు ‘పరబ్రహ్మము’ను ఎరిగిన మరుక్షణం ఈ సర్వము సువిదితమే (wel = known, wel - understood) అగుచున్నది.

ఆ పరబ్రహ్మమే ఈ జగత్తులన్నిటికీ ‘ఆత్మ’. అందుచేత రుద్ర పరబ్రహ్మమునకు వేరై ఎక్కడా ఏదీ లేదు. అట్టి పరబ్రహ్మము ఇంద్రియ విషయరూపమగు ఈ దృశ్య జగత్తులో కనిపించేది కాదు. ఈ 14 లోకముల కల్పనకు ఆవల నీ స్వస్వరూపంగా దర్శించవలసిందే! నీవే రుద్రుడవు. ఎరుగుచున్నవాడు రుద్రుడే! నా రుద్రో రుద్ర మర్చతి। రుద్రుడే రుద్రుని ఎరుగుచున్నాడు. రుద్రుడే రుద్రుని అర్చించుచున్నాడు.

ద్వే (2) విద్యా

‘ద్వే (2)’ విద్యే వేదితవ్య। ఏ హి। ‘పరా’ చ ఏవ ‘‘అపరా’’ చ తే।

ఓ మునీశ్వరా! శుకా!

(వేద) విద్య (The learning) అనునది రెండు విధములైనవి. (1) అపరా విద్య, (2) పరా విద్య.

అపరావిద్య : దేహము, దృశ్యములకు సంబంధించిన విద్య. దృశ్య-ఆస్వాదన, సాధన సంపత్తి - మొదలైన వాటికి సంబంధించినది.
(1) చతుర్వేదములు : ఋక్, యజుర్ సామ అథ్వర్వణ. ఋక్కులు, యజ్ఞములు, గానములు, అధ్యయనములు.
(2) వేదాంతర్గత షడంగములు (6)

శిక్ష : బోధనా విధానము (రచయిత - పాణిని).

వ్యాకరణము : శబ్దార్థ శాస్త్రము, వాక్య విభజన, పదముల సూత్రీకరణము (రచయిత - పాణిని).

ఛందస్సు : పద్య లక్షణ శాస్త్రము (పింగళముని).

నిరుక్తము : శబ్దార్థ నిర్వచనములు, పదముల అవయవార్థ వివరణలు, అలంకార శాస్త్రము (యాస్కముని).

జ్యోతిష్యము: సూర్య-చంద్ర కదలికలు, నక్షత్ర గమనములు, గ్రహణ వివరణములు, ప్రకృతి, కాల ప్రమాణము సూచించు శాస్త్రము.

కల్పము : వ్రత కల్పములు, న్యాయశాస్త్రము, నిబంధనములు, నిశ్చయములు, పద్ధతులు, యుగ - మహాయుగ నిర్ణయములు. యుగ ధర్మములు. మనువుల చరిత్ర మొదలైనవి.

ఇవన్నీ ద్రష్ట యొక్క ‘కేవల స్వరూపము’ గురించి కాదు కాబట్టి ‘అపరావిద్య’ అనబడుచున్నవి. ‘పరమాత్మ’ గురించి కాదు కాబట్టి [‘అన్యము (వేరు)’ అనురూపముగలవి కాబట్టి] అన్యవిద్య.
అట్లాగే - కనుక అపరావిద్యయే।

పరావిద్య (లేక) పరమా విద్య - ఆత్మ విద్య :: ‘దేహి-ద్రష్ట’ - గురించిన విద్య.

ఈ దేహమునకు ఆవలగా ప్రవర్తించుచూ, ఈవలిదగు ఈ భౌతిక దేహమును కదలించే జీవుని స్వకీయ ‘చైతన్య రూపము’ (The one who is using and moving the body) గురించి చెప్పే విద్య. కేవలమగు నేను గురించి వివరించే విద్య. దృశ్యమునకు, దేహమునకు, దేహికి పరమై, సర్వదా యథాతథమై ఉండటంచేత అక్షరమైయున్న ‘ఆత్మ’ గురించిన విద్య. ఈ జీవుని జాగ్రత్ స్వప్న సుషుప్తులకు వేరైన, ‘‘కేవలమగు సాక్షి’’ గురించి కాబట్టి - ‘‘పరా (Beyond) విద్య’’.

ఆత్మ యొక్క (లేక బ్రహ్మము యొక్క) విలక్షణ లక్షణములు

అద్రేశ్యము-అకాలము : ఆత్మ దేశ - కాల పరిమితమైనది కాదు. కాల సంబంధమైనది కాదు. దేశ కాల కల్పనలకు ఆవల సర్వవ్యవహారములను ప్రకాశింపజేయునదై ఉన్నట్టిది.

అగ్రాహ్యమ్ : జగత్తులో కనిపించే వస్తువుల వలె - ఇంద్రియములకు, మనస్సుకు ‘విషయము’గా గ్రహించవీలులేనిది. బుద్ధికి కూడా జననస్థానముగా గమనించబడేది. దృశ్య సంబంధమైన బుద్ధిని మౌనంగా తీర్చిదిద్దుకొనుచుండగా, - ఆత్మకే ఆత్మగా తెలియబడునది. (మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వము)

అగోత్రగ్ం, రూప వివర్జితమ్: ఆత్మ-గోత్రము, జాతి, మత, రూప సంబంధమైనది కాదు. నామ రూపాత్మకము కాదు. సాంఘికములైనవన్నీ (జగత్ దృశ్యము యొక్క) క్రీడా విశేషాలు అగుచుండగా, పరమగు ఆత్మ - స్వకీయ-జగత్ కల్పనా-లీలా క్రీడా వినోది. (The one which is visualizing and then enjoying).

అచక్షుః శ్రోత్రం, అపాణిపాదమ్ : అది పంచ జ్ఞానేంద్రియములకు, పంచ కర్మేంద్రియములకు, వాటి వాటి వ్యావహారిక ధర్మములకు, విషయములకు సంబంధించినది కాదు. వస్త్రము - అద్దానిని ధరించువాని రూపముగా అవుతుందా? కాదు కదా! ఆత్మ సర్వేంద్రియముల నియామకమైనది. దేహములను, ఇంద్రియ విషయములను కదల్చునది. ఇంద్రియ విషయములన్నీ ఆత్మకు తాను రచించి తానే ఆనందిస్తున్న కథ, నవల, చిత్రలేఖనములు వంటిది.

నిత్యమ్ : త్రికాలములలో యథాతథము.

సత్యమ్ : జాగ్రత్ స్వప్న సుషుప్తులకు, దేహ దేహాంతరములకు, జన్మ - జన్మాంతరములకు, జన్మల వ్యవహారములకంతటికీ కూడా మునుముందే ఉన్నట్టి ‘కేవలసత్’ (The Absolute Presence) స్వరూపము. సర్వదా వెంటనంటి ఉండేది. ఆత్మ సత్‌స్వరూపమై ఉండటంచేతనే అన్యమైనదంతా ఉనికిని పొందుచున్నది.

బిడ్డా! శుకా! ఉత్తమ ఆశయ సంసిద్ధుడా! నీవు ఆ ‘కేవల సత్’ యే అయి ఉన్నావయ్యా! త్వమేవ రుద్రో! త్వమేవ ఉమా! త్వమేవ సర్వమ్! నీవులేనిది ఎప్పుడూ లేదు. ఎప్పటికీ ఉంటావు. నిత్యుడవు. సర్వదా సత్-చిత్-ఆనంద స్వరూపుడవు!

విభుగ్ం : ఆత్మ సర్వమునకు నియమించునది. ఈ సర్వము తనయొక్క విభవముగా కలిగియున్నట్టిది. సర్వమునకు యజమాని.

సర్వగతగ్ం : సర్వమునందు, సర్వముగా విస్తరించియున్నట్టిది. విశ్వమునందు కాంతివలె, దేహమునందు ‘నేను’ వలె సర్వగతం.

సుసూక్ష్మమ్ : ఆకాశముకంటే అత్యంత సూక్ష్మమైనది. భౌతికాశము సూక్ష్మముగా దృశ్యమంతా నిండి ఉన్నట్లు, ఆత్మ సర్వత్రా స్థూల-సూక్ష్మ-చిదాకాశరూపమై వెలయుచున్నది.

అవ్యయమ్ : నవలా రచయిత యొక్క రచనా కళా విన్యాసము - ఆతడు రచించుచున్న నవల చివరికి వచ్చినంతమాత్రం చేత - కళ (The Art of writing) ముగియటము జరగదు కదా! ఒక కళాకారుడు ఒక చిత్రమును చిత్రించటం పూర్తి అయినంత మాత్రం చేత ఆతనియందలి చిత్రకళ ముగియదు కదా! ఒకడు ఒక భాషలో సుదీర్ఘమైన కావ్యము రచించటం పూర్తి అయినంతమాత్రం చేత ఆ భాషలోని అక్షరములు తరగవు, పెరగవు కదా! అట్లాగే ఆత్మ కూడా సర్వదా జగత్తుల రాక - పోకలచే తరుగదు, పెరుగదు. దేహములచే ఏదీ పొందదు. కోల్పోదు. కనుక అవ్యయము!

నిర్మలము, సునిశితము, విస్తారము, ప్రశాంతము అయినట్టి బుద్ధిగల ధీమంతులు - తమయందే అట్టి ఆత్మను దర్శించుచున్నారు. సర్వజీవులు బయల్వెడలుచున్న ‘భూతయోని (జనన) స్థానమును ఎరుగుచున్నారు. సర్వమును స్వస్వరూపమునుండి బయల్వడలుచున్న కల్పనా చమత్కారంగా సందర్శించుచున్నారు.

🌺 ఎవ్వడైతే భూత - వర్తమాన - భవిష్యత్తులను తనయొక్క ‘ఎరుక’ అను విన్యాసముచే నింపివేస్తూ ఉండటంచేత సర్వజ్ఞుడో..,
🌺 సర్వమును తాను ఎరుగుచున్న రీతిగానే తనకు తెలియబడుచూ ఉండుటచే (యత్ జ్ఞాతే, తదేవజాయతి। యత్ భావయతే, తదేవ భవతి। యత్ భావమ్ తత్ భవతి।) ‘సర్వవిదుడు’ అయి ఉన్నాడో…,
🌺 ఏది ఎరిగిన మరుక్షణం తపస్సు (తపన) జ్ఞానమయం అయి ఉంటుందో.

అట్టి ఆత్మతత్త్వము అరూపమే అయినప్పటికీ, అద్దానినుండి ఈ సరూప జగత్ దృశ్య వ్యవహారములన్నీ బయల్వెడలుచున్నాయి.

నిరాకారమగు జలము నుండి సాకారమగు తరంగములు బయల్వెడలి, తిరిగి నిరాకార జలమునందే లయమొందుచున్న రీతిగా… నిర్విషయ పరబ్రహ్మము నుండి సవిషయ జగత్ వ్యవహారమంతా బయల్వెడలి, తిరిగి అట్టి స్వాత్మ పరబ్రహ్మమునందే - స్వప్నములోని విశేషములవలె - లయము పొందుచున్నది. స్వాత్మ సర్వదా యథాతథమై ఉంటోంది.

శ్రీ శుకుడు : తండ్రీ! ఘనీభూతమై కనిపిస్తున్న ఈ జగత్తు సత్యమా? అసత్యమా? ఉన్నదా? లేనట్టిదా?

శ్రీ వ్యాస భగవానుడు : ఈ జీవునికి అనుభవమగుచున్న దృశ్య జగత్తు స్వకీయభావనా వైభవమే! కనుక స్వతఃగా ఉన్నది కాదు. ఎవ్వరు దేనిని ఏ రీతిగా భావిస్తే, అది ఆ రీతిగా అనుభవమగుచున్నది. కాబట్టి - ‘కల్పన’ (లేక) ‘భావన’గా నిర్వచించబడుచున్నది. దృష్టిని బట్టి సృష్టి ఉండి ఉంటున్నప్పుడు ఇద్దానికి ఇత్థమిత్థమైన సత్యము ఏముంటుంది? దృష్టియే సృష్టి.

అయితే స్వకీయ భావనచే నిర్మితమగుచున్న ఈ జగద్దృశ్యమంతా ‘సత్యమువలెనే’ (ఆత్మసామీప్యతచే) భాసిస్తోంది.
ఒకడు త్రాడును చూచి పాము అని అనుకుంటూ ఉంటే, అక్కడ పాము ఉన్నట్లు అవుతుందా? అవదు. కానీ, పాముగా భావించినవానికి ‘పామే’ అని అనిపిస్తుంది, కనిపిస్తుంది కూడా. ఆతనికి అది సత్యమే అవుతుంది. అట్లాగే ఈ ‘జగత్తు’ అనబడునది - త్రాడు యందు పాము కనబడటం, ఎలాగో - అటువంటిదే.

మొదలే లేని ఈ జగద్దృశ్యము ఆత్మ సమాచారము సముపార్జించని అజ్ఞానికి ‘భవబంధము’ లేక ‘సంసారబంధరూపము’ అగుచున్నది. తత్ ఏతత్ అక్షరగ్ం సత్యమ్, తత్ విజ్ఞాయ విముచ్యతే!
(1) అక్షరము, సత్యము అగు ఆత్మను సత్యముగా,
(2) జగదనుభవము అసత్తుగా-భావనగా-ఊహగా- స్వీయకల్పనగా ఎరిగినప్పుడు - (త్రాడులోచూచిన పాము, త్రాడుగా ఎరుగగానే మటుమాయమైనట్లుగా)
- ఆ ఆత్మవిజ్ఞానికి జగత్ బంధము స్వయముగా మొదలంట్లా తొలగిపోయినదే అగుచున్నది.

అయితే బిడ్డా! శుకా! ముముక్షువులందరి దృష్టికి ఒక ముఖ్యమైన విషయము తెస్తున్నాను.

జ్ఞానాత్ ఏవ హి సగ్ంసార వినాశో। నైవ కర్మణా।

ఆత్మజ్ఞానము చేతనే సంసారబంధము విడివడగలదు. ఆత్మ గురించి తెలుసుకొంటేనే, అంతా తెలిసిపోతుంది. అట్లా కాకుండా, ఆత్మజ్ఞానమును ప్రక్కకుపెట్టి, కేవలము ‘కర్మలను’ ఆశ్రయిస్తూ మాత్రమే ఉంటాము - అను నిర్ణయము కలవానిపట్ల సంసారబంధములు, సంసార భ్రమలు తొలగవు.

మరి జ్ఞానము లభించేది ఎట్లా? ఆత్మ జ్ఞానులమై, ఆత్మపట్ల జన్మజన్మలుగా వెంటనంటి వస్తున్న భ్రమలు తొలగాలి. అందుకు ముఖ్యమైన ఉపాయము చెప్పుచున్నాను. విను.

సద్గురు శుశ్రూషయే అందుకు మహత్తరమగు ఉపాయము।

అందుచేత సంసార దుఃఖమునుండి తరించాలనే మహదాశయముగల ముముక్షువు - ‘శ్రుతి హృదయమును ఎరిగిన శ్రోత్రియుడు, ‘త్వమ్ తత్ అసి’ అను రుద్ర హృదయమును నిరూపించగల బ్రహ్మనిష్ఠుడు - అగు గురువును ఆశ్రయించాలి. ఆత్మతత్త్వము గురించి శ్రవణం చేయాలి. శ్రోత్రియం బ్రహ్మనిష్ఠగ్ం స్వగురుం గచ్ఛేత్ యథా విధి।

సద్గురువు యొక్క విధి

శ్రద్ధ - ఆసక్తి - తపస్సు - గురుభక్తిగల శిష్యుడు సమీపించినప్పుడు, ఆ సద్గురువు ‘బ్రహ్మాత్మబోధిని - అహమ్ బ్రహ్మాస్మి’ అగు పరావిద్యను తప్పక సవివరంగా, నిర్ద్వంద్వంగా, సర్వసందేహములు నివృత్తమయ్యేటట్లుగా బోధించాలి. అందుకు కావలసిన మనన, నిదిధ్యాస, సమాధులకు కావలసిన సాధన - భావన మొదలైనవి మార్గదర్శకం సూచించాలి.

గురుః తస్మై పరాం విద్యాం దద్యాత్ బ్రహ్మాత్మ బోధినీమ్।

ఏ జీవుడైతే తన హృదయగుహయందే తేజో-జ్ఞాన-జ్యోతి రూపమై వెలుగొందుచున్న (లేక సర్వమును ప్రకాశింపజేయుచున్న) అక్షరుడగు రుద్రపరమాత్మయొక్క ఉనికిని తెలుసుకొని, దర్శించి మమేకమౌతాడో, ఆతడు {(‘సృష్టి ఉన్నది’ అను) బ్రహ్మగ్రంథి, (సృష్టి కొనసాగుచున్నది అను), విష్ణుగ్రంథి (‘సృష్టిలయము కావాలి’ అనే) రుద్ర గ్రంథి అనబడేఊ మహాగ్రంధులను ఛేదించినవాడై - సనాతనుడగు శివతత్త్వమునందు ప్రవేశించగలడు. ‘తత్‌తో -మమేకము’ అగుచున్నాడు. ఈ జీవుని అమృత స్వరూపమగు శివతత్త్వమే సత్యము. అట్టి శివోఽహమ్ తత్త్వమ్ ముముక్షువు యొక్క బోధవ్యమైన (తెలుసుకోవలసియున్న) స్వస్థానము.

తారము (దృష్టి) - శరము
పరబ్రహ్మము - లక్ష్యము

అని మోక్ష శాస్త్రవేత్తలచే సూచించబడుతోంది. ఈ జీవుడు అత్యంత అప్రమత్తతతో ‘ఆత్మజ్ఞానము’నకు సంసిద్ధుడై, ప్రయత్నశీలుడై, లక్ష్యమును భేదించి జీవాత్మను అధిగమించి అఖండ - కేవల - అమృత - సాక్షీ రూపమగు పరబ్రహ్మత్వముతో (లేక) రుద్రహృదయముతో ‘సోఽహమ్ భావనతో మమేకము’ అవ్వాలి.

లక్ష్యము - సర్వగతమైన స్వస్వరూపము।
శరము - సర్వగతమువైపు ఉన్ముఖత్వము (Being directed)
తెలుసుకోవలసినది (వేద్ధవ్యగ్ం) - సర్వగ్ం - సర్వగతత్వము
లక్ష్యము - శివతత్త్వము।

జ్ఞాన సాధనచే ఈ జీవుడే శివుడై ప్రకాశించుచున్నాడు. ఇందులో సందేహము ఏమాత్రం లేదు.

అట్టి పరబ్రహ్మముయొక్క సంప్రకాశస్థానమునందు (ఆత్మాకాశమునందు) - ఇక్కడి భౌతికాకాశములో కనిపించే సూర్యచంద్రుల ఉదయాస్తమయములకు, భౌతిక ప్రకాశములకు, పాంచభౌతికమగు అగ్నియొక్క కాంతి ప్రజ్వలనములకు స్థానము లేదు. వాయువు అక్కడ చలనము కలిగినదై ప్రదర్శనమవదు. దేవతలు, మానవులు - మొదలైన భేదములు ఆత్మయందు లేవు.
ఇవన్నీ అన్యములు.

ఆత్మయో, అనన్యము. అట్టి ఆత్మభగవానుడు - ‘‘సర్వ భావములు బయల్వెడలి, ఉండి, లయించు’’ - స్థానము. భావములలో ఆయన లేరు. ఆయననుండి భావాలు జనిస్తున్నాయి. కనుక కృతభావభూతుడు. స్వయంభావుడు. స్వయం భవుడు. నిత్యవిశుద్ధుడు. దోషరహితుడు. కాబట్టి విరజుడు. ఆయనయే ఆత్మభగవానుడుగా స్వయం ప్రకాశకుడై అన్యమైనదంతా ప్రకాశింపజేయుచున్నారు.

దేహవృక్షము - జీవాత్మ - పరమాత్మ పక్షులు

ఈ ‘దేహము’ అనే వృక్షముపై ఇద్దరు చైతన్యమూర్తులు పక్షులవలె వ్రాలి దేహములో నివాసము కలిగి ఉంటున్నారు. ఈ రెండు కలిసియే ఉండి, జడమగు దేహమునకు చైతన్యత్వమును ప్రసాదిస్తున్నారు.

(1) జీవాత్మ : కర్మఫలములను ఆస్వాదిస్తూ ఉన్నట్టిది.

(2) మహేశ్వరుడు : కేవలము సాక్షిగా ఉంటూ ఉన్నది. కర్మఫలములు ఏమాత్రము భోగించటమే లేదు. ప్రశాంత-పూర్ణత్వ- సమత్వభావములు కలిగి ఉంటోంది.

ఈ రెండూ ఏకరూపమేగాని, వేరు వేరు కానప్పటికీ మాయావరణ కారణంగా ఒకటి కర్మఫలభోగి అని, రెండవది కేవల సాక్షి అని ఆత్మ తత్త్వ జ్ఞానసిద్ధి కొరకై విడదీసి చెప్పబడుతోంది. కల్పితమగు మాయావరణచే రెండుపక్షులవలే కన్పిస్తున్నాయి. జీవుడు సాక్షి చైతన్యమును ఆత్మజ్ఞానముచే సమీపించిన మరుక్షణం ‘‘ఏకమే, పరస్పరము అద్వితీయమే’’ అగుచున్నాయి.

జీవ - బ్రహ్మైక్యము

రుద్రహృదయ-ఉపనిషత్-ఆకాశం

ఒక గృహము (మఠము). ఆ గృహంలో ఆకాశము (space).

ఆ గృహములో ఒక కుండ (ఘటము). ఆ కుండలో ఆకాశము (space)

ఆ గృహము బయట ‘ఆకాశము’ (బాహ్యాకాశము).

ఆకాశము (space/place) సర్వదా ఏకమే అయినప్పటికీ, మాటవరసకు :-
- ఇది ఘటాకాశము (space in the Pot).
- ఇది మఠాకాశము (space in the house).
- ఇది బాహ్యాకాశము (space out side the house). (మహాకాశము)
అని పిలుస్తున్నాం.

ఆ పేర్లన్నీ ఆకాశమునకు కల్పితములు మాత్రమే. అట్లాగే పరమార్థముగా చూచినప్పుడు, →
- ‘జీవుడు’ అనునది శివరూపమునకు కల్పితము,
- తత్త్వతః సాక్షాత్ శివుడే స్వయముగా సర్వదా ‘జీవుడు’గా (అజ్ఞాన దృష్టికి) కనిపిస్తున్నారు.

‘‘ఎరుగుచున్నవాడు - ఎరుగబడుచున్నది’’ (The knower and that being konwer)లను విశ్లేషించగా ఎరుక అనునదే నిత్యమై సిద్ధిస్తోంది. ఎరుగబడేదిగా కల్పనచే విస్తరించినదై కనిపించుచున్నప్పటికీ, ‘ఎరుక’కు లోటేముంటుంది? చిత్ → చిదాకారముగా (వెలిగించబడేదిగా, తెలియబడేదిగా) కనిపించుచున్నప్పటికీ, ఆత్మయొక్క చిత్ తత్త్వమునకు కలిగే హాని ఏమీ లేదు. చిత్ అనన్యము. జడరూపముగా కనిపించేదంతా (All that being experienced - passive voice) ఆత్మతత్త్వజ్ఞాన పరిశీలనచే - చైతన్యముయొక్క ప్రదర్శనమే! జడమును భేదించిచూస్తే ‘చిత్ చైతన్యము’ యొక్క రూపముగానే శేషించుచున్నది.

కలలో కనిపించే శిల్పము జడము కాదు. స్వప్న చైతన్యరూపమే। నవలలో వర్ణించబడే కొండ జడము కాదు. రచయితయొక్క రచనా చైతన్య రూపమే.

అన్నములో చైతన్యమున్నది కాబట్టి, శరీరములో ప్రవేశించి జీర్ణమై దేహమును జీవింపజేస్తోంది.

ఈ విధంగా తర్కము (Logic) చేతను, శాస్త్ర ప్రమాణముచేతనూ, మహావాక్యపరమార్థము చేతను ‘చిత్ ఏకత్వ వ్యవస్థితి’ (లేక) చిత్ (Enlightenment) యొక్క ఏకత్వము - సర్వే సర్వత్రా వ్యవస్థితమైయుంటోంది.

ఇక ‘జడము’ అనబడునది ఎక్కడున్నది?

ఈ విధంగా - చిత్ ఏకత్వ పరిజ్ఞాతే న శోచతి, న ముహ్యతి। ఎవ్వడైతే ‘చిత్ - ఏకరసరూపము’ గురించి పరిజ్ఞాత (wel-knowing) అయి ఉంటాడో, అట్టివాడు ఇక దేనికీ శోకించడు. దేనినీ చూచీ మోహము పొందడు. అట్టివాడు అద్వైత పరమానంద రూపమగు ‘కేవల శివత్వము’ను పొందినవాడై ఉంటున్నాడు. ఈ సమస్త జగత్తుకు అధిష్ఠానము (By what it is all made up of) సత్యమగు - (సత్‌స్వరూపమగు) ఆత్మయే! అట్టి సత్ స్వరూపమగు చిద్ఘన స్వరూపమే నేను (I am this form of entire existence factor).

‘నేను సర్వదా ఆత్మనే’ అను నిశ్చయముచే సమస్తమునకు అనన్యత్వమును మనో బుద్ధి చిత్త సమేతంగా స్వీకరించుము. ఆత్మకు అన్యమైనదంతా ఆమూలాగ్రము నిస్సందేహముగా త్యజించి ఉండుము. అట్టి అన్యమైనదానిపట్ల అంతరంగమున ‘మౌనము’ వహించిన ముని వీతశోకుడు (Relieved of all worries) అగుచున్నాడు. ఆత్మానందమునందు సునిశ్చలుడు, సునిశ్చితుడు అగుచున్నాడు.

‘అహమాత్మ!’ ‘అహమాత్మ!’ అని ప్రశాంతతో కూడిన పరమానందమయుడగుచున్నాడు. ‘‘ఈ జగద్దృశ్యమునకు అంతరమున, ఈవల, ఆవల కూడా మమాత్మయే విస్తరించి యున్నది’’ - అనునది ఆత్మతత్త్వజ్ఞుని స్వాభావికానుభవము.

శ్లో।। స్వశరీరే స్వయం జ్యోతిః స్వరూపగ్ం, సర్వసాక్షిణమ్, క్షీణదోషాః ప్రపశ్యంతి।।

ఏ ధీరుడైతే తనయొక్క మనో - బుద్ధి - చిత్తములలో ఏర్పడినవైయున్న దోషములను, దోషదృష్టులను (కర్మయోగ - క్రియాయోగ - భక్తియోగ - జ్ఞానయోగ - సర్వ సమర్పణయోగ - శరణాగతి యోగముల) ఉత్తమ ప్రయత్నములచే మొదలంట్లా తొలగించుకొని యుంటాడో, అట్టివాడు ‘స్వయంజ్యోతిస్వరూపము, సర్వసాక్షిణము, సర్వ స్వరూపము’ అగు పరబ్రహ్మ చైతన్యమును స్వశరీరమునందే ప్రత్యక్షము చేసుకొనుచున్నాడు.

అట్లు పరిశుభ్రమగు అంతరంగము లేనివాడు మాయ చేత ఆవృతుడై ఉండుటచే పరమాత్మను మరెక్కడా సిద్ధించుకోలేడు. నేతరే - మాయయావృతాః।।

అట్టి పరమాత్మయోగము కొరకై (లేక) ఆత్మభావనా సంపూర్ణయోగ సిద్ధికై ఒకడు ఎక్కడికి వెళ్లాలి? ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. మరొక లోకమునకో, ఇంకొక ఆశ్రమమునకో వెళ్ళి పొందవలసినట్టిది కాదు. ఇప్పుడు కాకుండా, మరింకెప్పటికో, ఎన్నటికో పొందవలసినది కూడా కాదు.

స్వకీయ-బుద్ధియందు గల దోషములు తొలగించుకొని ఇప్పుడే, ఇక్కడే ఆత్మరూప పరిజ్ఞానముచే తనయందు తానే పొందవలసి ఉన్నట్టిది - ఆత్మానుభవం.

దృష్టాంతానికి…,
అంతటా విస్తరించియున్న అఖండము - ఏకము అగు ఆకాశము తనను తాను పొందటానికి ఎక్కడికి వెళ్ళాలి? ఎన్నటికో పొందవలసి అగత్యమేముంటుంది? అట్లాగే, సహజముగా పరతత్త్వము తానే అయి ఉన్న ముముక్షువు తనయొక్క పరతత్త్వము (లేక) బాహ్మీస్థితి (లేక) పరబ్రహ్మత్వము సిద్ధించుకోవటానికి, ఎక్కడికి వెళ్లాలి? సర్వత్రగము, (సర్వత్ర గమనము కలిగి యున్నట్టిది), కేవలము అగు ఆత్మతత్త్వముగా స్వాఽనుభూతము చేసుకోవటానికి మరొక చోటికి వెళ్ళటమనే ప్రసక్తి ఎక్కడిది?

ఇప్పుడే ఇక్కడే ఆత్మతో ఆత్మయందే ఆత్మను దర్శించాలి.

సయో హ వై తత్ పరమం బ్రహ్మ, యో వేద వై మునిః, బ్రహ్మైవ భవతి స్వస్థః, సత్ చిత్ ఆనంద మాత్రకః।
ఎవ్వడు తత్ పరబ్రహ్మ తత్త్వమును తెలుసుకొంటాడో, అట్టి మౌని స్వస్థుడగుచున్నాడు. అటు తరువాత సత్ చిత్ ఆనందరూపమగు బ్రహ్మమే తానగుచున్నాడు.

⌘⌘⌘

వ్యాసమహర్షి ప్రవచించిన బ్రహ్మతత్త్వమును శ్రవణం చేసి శుకమహర్షి ‘ఆత్మానందము’ నందు నిశ్చలుడు, సుస్థిరుడు అయ్యారు.


🙏 ఇతి రుద్రహృదయ ఉపనిషత్। 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।