[[@YHRK]] [[@Spiritual]]

Sree Saraswathi Rahasya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


కృష్ణ యజుర్వేదాంతర్గత

28     శ్రీ సరస్వతీరహస్యోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। ప్రతియోగి వినిర్ముక్త బ్రహ్మవిద్యైక గోచరమ్
అఖండ నిర్వికల్పం తత్ రామచంద్రపదం భజే।।

ప్రతియోగి (Opposite Arguments) వినుర్ముక్తము, (అంతరంగములో ఆత్మౌన్నత్యము పట్ల ఆజ్ఞాన వీచికలను తొలగించునది), బ్రహ్మవిద్యచే మాత్రమే దర్శించగలిగేది, అఖండ నిర్వికల్ప స్వభావయుతము - అగు ‘‘శ్రీరామ చంద్రపదము’’ను ఉపాసిస్తున్నాము.

ఓం మహద్భ్యో ఋషిభ్యోన్నమః।
ఓం భగవంతమ్ శ్రీ అశ్వలాయన ఋషిభ్యో నమో నమో నమో నమః
ఓం శ్రీ భరద్వాజ ఋషిభ్యో నమో నమో నమో నమః
ఓం శ్రీ అత్రి ఋషిభ్యో నమో నమో నమో నమః
ఓం శ్రీ మధుచ్ఛంద ఋషిభ్యో నమో నమో నమో నమః
ఓం శ్రీ ఉచత్థ్య పుత్రో దీర్ఘతమా ఋషిభ్యో నమో నమో నమో నమః
ఓం శ్రీ భార్గవ ఋషిభ్యో నమో నమో నమో నమః
ఓం శ్రీ బృహస్పతి ఋషిభ్యో నమో నమో నమో నమః
ఓం శ్రీ గృత్స్నమద ఋషిభ్యో నమో నమో నమో నమః


ఓం
1. ఋషయో హ వై భగవంతమ్
అశ్వలాయనమ్ సంపూజ్య పప్రచ్ఛుః :-
‘‘కేన ఉపాయేన తత్ జ్ఞానమ్,
తత్ పదార్థావభాసకమ్?
యత్ ఉపాసన యా తత్త్వమ్
జానాసి? భగవన్! వద।’’
సర్వము - అఖండము - నిత్యము అగు ‘ఓం’కార సంజ్ఞార్థతత్త్వమునకు నమస్కరిస్తున్నాము.
ఒకానొక సందర్భములో కొందరు ఋషులు మహనీయుడగు అశ్వలాయన మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆ మహర్షిని దర్శించారు. వారిని పూజించారు. ఆ తరువాత, వారంతా సుఖాశీనులై అశ్వలాయన మహర్షిని ఈవిధంగా పరిప్రశ్నించసాగారు.
స్వామీ! మహర్షి వరేణ్యా! అశ్వలాయన భగవన్! మీరు పరతత్త్వమును పూర్ణముగా ఎరిగి పరమానందాస్వాదులై ఉన్నారని లోక ప్రసిద్ధము. ఏ ఉపాయంచేత, దేనిని ఉపాసించినవారై ఈ సర్వ జగత్ పదార్ధములుగా ప్రతిబింబిస్తున్న పరతత్త్వమును తెలుసుకొని ఆస్వాదిస్తున్నారు? దయతో మాకు కూడా ఆ ఉపాయమును, ఉపాసనావిధిని బోధించండి.
భగవన్ అశ్వలాయనౌవాచ:
సరస్వతీ దశ శ్లోక్యా, స ఋచా
బీజ మిశ్రయా,
స్తుత్వా జప్త్వా పరాం సిద్ధిమ్ అలభం
ముని పుంగవాః!
భగవంతుడగు అశ్వలాయన ఋషి: ‘ఋషి పుంగవులారా! బీజాక్షరములచే నిర్మితమై, సంపుటితమై, ఋక్కులరూపముగా విరచించబడి, వర్ణితమైయున్న ‘‘సరస్వతీ దశ శ్లోకీ’’ని జపించసాగాను. ఓ మహనీయులారా! అట్టి సరస్వతీ దశశ్లోక స్థుతి-జపములచే కష్ట సాధ్యమని చెప్పబడే పరాంసిద్ధి అగు ‘‘పరాత్మాహమ్-పరతత్త్వమ్’’లను ఆస్వాదించ గలుగుచూ ఉన్నాను.
ఋషయ ఊచుః :-
కథం సారస్వత ప్రాప్తిః?
కేన ధ్యానేన, సువ్రత!
మహా సరస్వతీ యేన తుష్టా భగవతీ? వద।
ఋషి పుంగవులు: అట్లాగా స్వామీ! హే సువ్రతా! అయితే మరి అటువంటి సరస్వతీ కరుణా కటాక్ష-వీక్షణ రూపమగు సారస్వత (సా-రస్వత) ప్రాప్తి ఎట్లా కలుగగలదు? ఏవిధంగా ఏ వ్రతము ఆచరించాలి? ఎద్దాని గురించి ఎట్లా ధ్యానించాలి? ఏ వ్రత-ధ్యానములచే భగవతియగు ఆ మహా సరస్వతీదేవి తృప్తి పొంది సారస్వతమును ప్రసాదించగలదు? దయతో వివరించండి.
సహో వాచ అశ్వలాయనః :-
అస్య శ్రీ ‘‘సరస్వతీ దశ శ్లోకీ’’
మహామంత్రస్య, అహమ్-అశ్వలాయన ఋషిః।
‘అనుష్టుప్’ ఛందః।
శ్రీ వాగీశ్వరీ దేవతా। యత్ ‘వాక్’ ఇతి బీజమ్।
‘దేవీం వాచమ్’ ఇతి శక్తిః,
‘ప్రణో దేవీ’ ఇతి కీలకమ్,
వినియోగః తత్ ప్రీత్యర్థే।
శ్రద్ధా మేథా ప్రజ్ఞా ధారణా వాగ్దేవతా
మహాసరస్వతీ ఇతి ఏతైః అంగన్యాసః।
అశ్వలాయన మహర్షి : ఋషీశ్వరులారా! వినండి!
అట్టి ‘‘సరస్వతీ దశ శ్లోకీ’’ మహా మంత్రమునకు ‘నేను’ సరస్వతీ భక్తుడగు అశ్వలాయనుడను - ఋషిని-ఈవిధంగా అనుష్టిస్తున్నాను.
‘అనుష్టుప్’ … ఈ ‘దశశ్లోకీ’ యొక్క ఛందస్సు.
ఈ ‘సరస్వతీ దశశ్లోకీ’కి
దేవత → శ్రీ వాగీశ్వరి!
వాక్కు → బీజము!
దేవీం వాచమ → ఇతి శక్తి!
ప్రణో దేవీ → ఇతి కీలకము
…. ఇవి ఆ దేవి ప్రీతి పొందటానికి వినియోగము చేయుచున్నాను.
శ్లో।। నీహార హార ఘనసార సుధాకరాభామ్,
కల్యానదాం కనక చంపక దామ భూషామ్,
ఉత్తుంగ పీన కుచ కుంభ మనోహరాంగీమ్,
వాణీం నమామి మనసా వచసాం విభూత్యై।।
శ్రద్ధ’ - ‘మేధ’ - ‘ప్రజ్ఞ’ - ‘ధారణ’ - ‘వాగ్దేవతా’ - ‘మహాసరస్వతి’ … ఈ ఆరు నామములతో మొట్టమొదట అంగన్యాసము, కరన్యాసము చేయాలి.
మంచువలె తెల్లటి రతనాల హారము, పచ్చ కర్పూరము, పూర్ణచంద్రులను దీపించుచున్నది, లోక కల్యాణము ప్రసాదించునది, బంగారు చంపకములను అలంకరించుకున్నది, ఉత్తుంగ-పీన కుచములతో మనోహరముగా ప్రకాశించునది అగు జగన్మాత వాణీ దేవికి-నాకు వాక్ విభూతిగా ప్రసాదించుటకొరకై మనసా-వాచా నమస్కరించు చున్నాను.
2. ‘‘ఓం ప్రణో దేవీ’’
ఇతి అస్య మంత్రస్య।
భరద్వాజ ఋషిః।
గాయత్రీ ఛందః।
శ్రీ సరస్వతీ దేవతా। ప్రణవేన
బీజ। శక్తి। కీలకమ్।
ఇష్టార్థే వినియోగః।
మంత్రేణ న్యాసః।
‘‘ఓం ప్రణో దేవీ నమః’’ అను సరస్వతీ మాతను మననము చేయు మంత్రమునకు -
ఋషి - భరద్వాజ మహర్షి
ఛందస్సు - గాయత్రీ
దేవత - శ్రీ సరస్వతీ దేవి
ప్రణవము - బీజాత్మశక్తి కీలకము (ఓం)
ఇష్టార్థములు ప్రసాదించుటకై వినియోగమగు గాక!
‘‘ఓం ప్రణో దేవీ’’ నమః।’’
అంగన్యాసము - కర న్యాసము

(1) శ్లో।। యా వేదాంతార్థ తత్త్వైక స్వరూపా పరమార్థతః,
నామ-రూపాత్మనా వ్యక్తా, సా మాం పాతు సరస్వతీ।।


ఏ దేవి అయితే పరమార్ధముగా చూచినప్పుడు (తెలుసుకొనుచున్నవాని గురించి తెలియజేయు) వేదాంతార్థ-తత్త్రైక స్వరూపిణియో, కేవల ‘తత్’ స్వరూపిణి, ఏకాత్మరూపిణి అయి కూడా, నామరూపాత్మకంగా కూడా వ్యక్తమగుచున్నదో - అట్టి సరస్వతీమాత నన్ను రక్షించును గాక!

ఓం ప్రణోదేవీ సరస్వతీ
వాజేభిః వాజినీవతీ
ధీనామ్ అవిత్ర్యవతు।।
‘ఓం’ - ప్రణవ స్వరూపిణియగు సరస్వతి - వాక్ స్వరూపిణి, వాక్కుచే జనించునది కూడా! అట్టి వాజేభి-వాజినీవతి… అగు సరస్వతీదేవి మాకు ఉత్తమ ధీశక్తిని ప్రసాదించి రక్షించును గాక! మాయొక్క బుద్ధికి రక్షకురాలై ఉండును గాక! సునిశితముగా తీర్చిదిద్దును గాక!
3. ‘ఆ నో దివ’ ఇతి మంత్రస్య।
అత్రి ఋషిః। ‘త్రిష్టుప్’ ఛందః।
సరస్వతీ దేవతా।
‘హ్రీం’ ఇతి బీజ। శక్తి। కీలకమ్।
ఇష్టార్థే వినియోగః।
మంత్రేణ న్యాసః।


(2) యా సాంగ-ఉపాంగ వేదేషు
చతుర్ష్వ - ఏకైవ గీయతే,
అద్వైతా బ్రహ్మణః శక్తిః
సా మాం పాతు సరస్వతీ।

‘హ్రీం’ ఆ నో దివో బృహతః పర్వతాదా
సరస్వతీ యజత ఆగంతు (యజ్ఞతా గంతు) యజ్ఞమ్,
‘హవమ్’ దేవీ జుజుషాణా ఘృతాచీ
శగ్మాన్ నో వాచమ్
ఉశతీ శృణోతు।
‘‘ఆనోదివ (సంగీత స్రవంతిగా/గంగా స్రవంతిగా) వాక్ ప్రసాదిని’’
ఇతి - మంత్రము
అత్రి - ఋషి
త్రిష్టుప్ - ఛందస్సు
దేవత - సరస్వతి
హ్రీం - బీజశక్తి
శక్తిః - కీలకమ్
ఇష్టార్థములు పొందుటకు - వినియోగము.
‘‘ఓం। ఆనోదివ నమః’’ - అంగ-కర న్యాసము చేయవలెను.

ఏ దేవత అయితే 4 వేదముల సాంగ-ఉపాంగములలో ఏకస్వరూపిణిగా గానము చేయబడుచున్నదో, స్వస్వరూపమునకు ద్వితీయము కానట్టి పరబ్రహ్మ శక్తియై ప్రతి ఒక్కరిలోను సర్వదా వేంచేసియే ఉన్నదో…, అట్టి సరస్వతీ దేవి మమ్ములను ఎల్లప్పుడు రక్షించుచుండును గాక!
‘హ్రీం’ - మహత్తరము - సువిశాలము అగు బ్రహ్మలోకమునుండి, పర్వత శిఖరములనుండి ఆ సరస్వతీ దేవి మా ఈ యజ్ఞకార్యము దిగ్విజయము చేయుటకై వేంచేయును గాక!
మా ఈ హవమును (హోమము చేయుచున్న దానిని) స్వీకరించును గాక! ఘృతము (నేయి)ను స్వీకరించి మాకు ఆత్మసుఖము ప్రసాదించును గాక! మాకు ‘వాక్‌శక్తి’ని ప్రసాదించుచున్న ఆ సరస్వతీదేవి మా ఈ స్తోత్రములను వాత్సల్యముతో వినుచుండును గాక!
శ్లో।। ‘పావకాన’ ఇతి మంత్రస్య।
మధుచ్ఛంద ఋషిః
గాయత్రీ ఛందః। సరస్వతీ దేవతా
‘శ్రీం’ ఇతి బీజ। శక్తి। కీలకమ్।
ఇష్టార్థే వినియోగః। మంత్రేణ న్యాసః।


(3) యా వర్ణ పద వాక్యార్ధ స్వరూపేణైవ వర్తతే।
అనాది నిధన అనంతా, సా మాం పాతు సరస్వతీ।

‘శ్రీం’ పావకానః సరస్వతీ।
వాజేభిః వాజినీవతీ।
యజ్ఞం వష్టు ధియా వసుః।।
‘‘పావకాన’’ - పవిత్రముగా చేయు
‘‘పావకాన’’ …. ఇతి మంత్రము
మధుచ్ఛందా - ఋషి
గాయత్రీ - ఛందస్సు
సరస్వతీ - దేవత
శ్రీం - ఇతి బీజశక్తి
శక్తిః - కీలకమ్
‘ఓం పావకానః నమః’ - అంగ - కర న్యాసము.

ఏ దేవి అయితే వర్ణములకు, పదములకు, వాక్యములకు, వాటివాటి అర్ధ స్వరూపిణియై వర్తించుచున్నదో, అనాది నిధన అనంతమో (ఆది - సమాప్తి - అనంతము) కూడా అయి ఉన్నదో, ఆద్యంతములు లేనట్టిదో - అట్టి శ్రీ సరస్వతీ దేవి మమ్ములను రక్షించును గాక!
‘‘శ్రీం’’-అన్న స్వరూపిణియై, అగ్నిరూపిణి అయి, అన్నమును ప్రసాదించు నదై సర్వము పవిత్రముగా తీర్చిదిద్దు ఆ సరస్వతీ దేవి మా యజ్ఞ కార్యక్రమములను, హవిస్సులను స్వీకరించి, మాకు సర్వ సంపదలు ప్రసాదించును గాక! ‘వాజినీవతి’ అగు ఆ తల్లి మాకు వాజినము (బలము, శౌర్యము) ప్రసాదించును గాక!
‘‘చోదయత్రి’’ ఇతి మంత్రస్య।
మధుచ్ఛంద ఋషిః।
గాయత్రీ ఛందః।
సరస్వతీ దేవతా।
‘బ్లూమ్’ ఇతి బీజ। శక్తి। కీలకమ్।
మంత్రేణ న్యాసః।


(4) అధ్యాత్మమ్, అధిదైవం చ,
దేవానామ్ సమ్యక్ - ఈశ్వరీ।
ప్రత్యగాః తే వదంతీ యా
సా మాం పాతు సరస్వతీ। ‘‘బ్లూం’’

‘‘చోదయిత్రీ’’ - ప్రేరేపించు-వెలిగించు-నడిపించు దేవి
చోదయత్రీ - మంత్రము
మధుచ్ఛందనుడు - ఋషి
గాయత్రీ - ఛందస్సు
సరస్వతీ - దేవతా
‘బ్లూమ్’ - ఇతి బీజశక్తి, కీలకము

‘‘ఓం బ్లూమ్ చోదయత్రీ నమః’’ మంత్రముతో అంగన్యాసము - కర న్యాసము
సర్వ జీవాత్మలకు, సర్వ దేవతలకు ప్రేరణ అయి, పరాత్మ స్వరూపిణియై, సర్వము తనయందు ధరించునదైయున్నది. దేవతలకు కూడా సమ్యక్ స్వరూపిణి, ఈశ్వరి, ప్రత్యగ్ రూపిణి అయి ఉన్నది. సర్వమునకు వేరై - ‘సర్వము’ తానే అని చెప్పబడుచున్నది. ఏ దేవి అయితే సర్వశబ్దములు - ఉచ్ఛారణలు తానే అయి ఉన్నదో, అట్టి సరస్వతి ‘బ్లూమ్’ బీజోచ్ఛారణతో ఉపాసించు మమ్ము రక్షించు గాక!

4. ‘చోదయత్రీ’ సూనృతానామ్
చేతంతీ సుమతీనామ్।
యజ్ఞం దధే సరస్వతీ।
‘మహో అర్ణ’ - ఇతి మంత్రస్య।
మధుచ్ఛందా ఋషిః।
‘‘గాయత్రీ’’ ఛందః।
‘‘సరస్వతీ’’ దేవతా
‘సౌః’ ఇతి బీజ। శక్తి। కీలకమ్।
ఇష్టార్థే వినియోగః।
మంత్రేణ న్యాసః।


(5) అంతర్యామ్యాత్మనా విశ్వం
త్రైలోక్యం యా నియచ్ఛతి,
రుద్ర-ఆదిత్యాది రూపస్థా
యస్యామ్ ఆవేశ్యతాం పునః,
ధ్యాయంతి సర్వరూప ఏకా
సా మాం పాతు సరస్వతీ।


సూనృత-సత్యవాక్కును ప్రేరేపించునది, ఉత్తమ సుమతి (బుద్ధి)ని కలిగించునది అగు సరస్వతీ దేవియే ఈ జగత్ యజ్ఞధారిణి! యజ్ఞ పురుష స్వరూపిణి. ఆ తల్లి మా ప్రజ్ఞలను ముందుకు నడుపును గాక!
‘మహో అర్ణ’ - తేజో స్వరూపి (జీవులందరు తరంగములు - ఆ దేవి సముద్రము). (అర్ణము = జలము, ప్రవాహము).
మహో అర్ణ - ఇతి మంత్రము
మధుచ్ఛందుడు - ఋషి
గాయత్రీ - ఛందస్సు
సరస్వతీ - దేవత
సౌః
‘సౌః’ - ఇతి బీజశక్తి కీలకము, బీజాక్షర నాద శబ్దము ఇష్టార్థములు పొందుటకై వినియోగము.
‘ఓం సౌః మహో అర్ణ నమః’ మంత్రముతో అంగన్యాసము - కర న్యాసము

ఏ దేవదేవి అయితే ఈ విశ్వమంతటికీ ‘అంతర్యామి’ అయి త్రిలోకములను నియమించుచున్నదో, రుద్రుడు-ఆదిత్యుడు మొదలుగా గల దేవతలందరూ ఏ దేవియొక్క బాహ్యవిభవముగా ఆవేశించి ఉన్నారో, వారంతా ఏదేవిని దర్శిస్తూ మరల-మరల ధ్యానిస్తున్నారో, సర్వస్వరూపిణిగా ఉపాసిస్తూ- సేవిస్తున్నారో…., తరంగములన్నిటిలో జలమువలె ఏ దేవి జీవులందరి అంతరహృదయ నివాసియో, - అట్టి శ్రీ సరస్వతీదేవి మమ్ములను (అజ్ఞాన మార్గముల నుండి) రక్షించును గాక!


‘సౌః’ - మహో అర్ణః సరస్వతీ।
ప్రచేతయతి కేతునా।
ధియో విశ్వా విరాజతి।
సౌః
‘‘సౌః’’ బీజశబ్దముగా మాచే ఉపాసించబడుచున్న శ్రీ సరస్వతీదేవి బుద్ధి స్వరూపిణియై, సముద్రంలో జలంవలె విశ్వమంతా నిండి ఉండి, సర్వజీవుల బుద్ధులందు విరాజిల్లుచున్నది. సంకల్ప-వికల్పములను సర్వత్రా చేయుచున్నది. సమస్తమునకు కారణ కారణము. ఈ సమస్త విశ్వముగా విరాజిల్లుచున్న ఆ సరస్వతీదేవికి ‘సౌ’ శబ్దార్ధపూర్వక నమస్కారము.
‘‘ఐం।’’
‘చత్వారి వాక్’ ఇతి మంత్రస్య।
ఉచత్థ్య పుత్రో, దీర్ఘతమా ఋషిః।
త్రిష్టుప్ ఛందః। సరస్వతీ దేవతా।
‘ఐం’ - ఇతి బీజ। శక్తి। కీలకమ్।
మంత్రేణ న్యాసః


(6) యా ప్రత్యక్ - దృష్టిభిః జీవైః
వ్యజ్యమాన - అనుభూయతే,
వ్యాపినీ జ్ఞప్తిరూప ఏకా, సా మాం పాతు సరస్వతీ।।

‘‘ఐం।’’
చత్వారి వాక్ (అనుభూతి, వ్యాపిని, జ్ఞప్తి, ఏక రూపిణి)
(సోఽహమ్। తత్త్వమ్। జీవో బ్రహ్మేతి నాపరః। సర్వం ఖల్విదం బ్రహ్మ।।)
‘చత్వారి వాక్’ - ఇతి మంత్రము
ఉచత్థ్య పుత్రుడగు దీర్ఘతముడు - ఋషి
త్రిష్టుప్ - ఛందస్సు
సరస్వతీ - దేవత
‘ఐం’ ఇతి బీజశక్తి। కీలకము।
‘ఓం ‘ఐం’ చత్వారివాక్ నమః’ మంత్రముతో అంగన్యాసము - కరన్యాసము.

ఏ దేవాది దేవి ‘ప్రత్యక్ దృష్టి’చే సమస్త జీవులుగా వ్యావహారికమగు చున్నట్లు జీవబుద్ధికి అనుభూత మగుచున్నదో, జగత్ వ్యావహారికమై ఉన్నదో, సర్వవ్యాపిని, జ్ఞప్తిరూపిణి, ఏకస్వరూపిణి కూడా అయి ఉన్నదో, అట్టి శ్రీ సరస్వతీదేవి మమ్ములను సదా రక్షించును గాక!

‘ఐం’ - చత్వారి వాక్ - పరిమితా పదాని
తాని విదుః బ్రాహ్మణా యే మనీషిణః
గుహా త్రీణి నిహితా నేంగయంతి
తురీయం వాచో మనుష్యా వదంతి।
‘యత్ వాక్ వదంతీ’ - ఇతి మంత్రస్య।
బార్గవ ఋషిః। త్రిష్టుప్ ఛందః। సరస్వతీ దేవతా।
‘క్లీం’ ఇతి బీజ। శక్తిః। కీలకం। మంత్రేణ న్యాసః।।


(7) నామ-జాత్యాదిభిః భేదైః అష్టధా యా వికల్పితా
నిర్వికల్పాత్మనా వ్యక్తా సా మాం పాతు సరస్వతీ।

‘‘ఐం’’ (పర-పశ్యంతి-మధ్యమ-వైఖరి)
‘ఐం’ - బీజాక్షర శబ్దము - పర-పశ్యంతి-మధ్యమ-వైఖరి అను నాలుగు రీతులైన ప్రదర్శితములగుచున్నది - అని బుద్ధిమంతులగు బ్రహ్మజ్ఞులు…. ఎరిగియే ఉంటున్నారు. ‘పర-పశ్యంతి-మధ్యమ’ … అనునవి హృదయ గుహలో దాగి ఉంటున్నాయి. అందుకే బుద్ధిమంతులు మాత్రమే దర్శిస్తున్నారు. (‘వైఖరీ’-అనబడు)నాలుగవది మానవులు వాక్కుగా పలుకుచున్నారు.
యత్‌వాగ్వదంతీ
‘‘యత్ వాక్ వదంతీ’’ - ఇతి మంత్రము
భార్గవ మునీశ్వరుడు - ఋషి
త్రిష్టుప్ - ఛందస్సు
సరస్వతీ - దేవతా
‘క్లీం’ … బీజ శక్తి కీలకము।
‘ఓం ‘క్లీం’ యత్ వాగ్వదంతీ నమః’….. అంగన్యాస-కరన్యాసము.

ఏ దేవదేవి అయితే - జన్మము- నామము - రూపము - జాతి - కులము - గోత్రము - ఆహారము - ప్రదేశముల సంబంధమైనట్టి ఎనిమిది విధములైన కల్పిత భేదములచే (అజ్ఞాన దృష్టిచే) చూడబడుచున్నదో, స్వతఃగా అవ్యక్తమగు నిర్వికల్పాత్మగానే సర్వదా సర్వత్రా వేంచేసినదై ఉన్నదో…, ఆ సరస్వతీ దేవి మమ్ములను రక్షించును గాక!

‘క్లీం’ - యత్ వాక్ వదంతి అవిచేతనాని
రాష్ట్రీ, దేవానాం నిషసాద మంద్రా
చతస్ర ఊర్జం (య) దుదుహే పయాంసి
క్వస్విత్ అస్యాః పరమం జగామ।।
‘‘క్లీం’’
ఏ దేవదేవి యొక్క మహిమచే అచేతనము, జడము అగు కంఠపు ప్రేగులు - వాయువు మొదలైనవి దేహ విభాగములలో దివ్య దేవతాతత్త్వములు కలసి గొప్ప నిషాద-మంద్ర, పర-పస్యంతి-మధ్యమ-వైఖరీలతో కూడిన శబ్ద సౌందర్యమంతా ఈ పాంచభౌతిక జడదేహము నుండి వెలువడుచున్నదో, అట్టి సరస్వతీదేవి ఎక్కడో బ్రహ్మలోకంలోనే ఉన్నదా? కాదు, అంతటా ఉన్నది. నిండు కుండలోని నీరువలె ఈ దేహమంతా, ఈ దృశ్యమంతా నిండి ఉన్నది. ఆ తల్లి ఉపాసన చేతనే ‘పరము’లో ప్రవేశించగలము.
5. ‘‘దేవీం వాచమ్’’ ఇతి మంత్రస్య।
భార్గవ ఋషిః। త్రిష్టుప్ ఛందః।
సరస్వతీ దేవతా।
‘‘సౌః’’ ఇతి బీజ। శక్తి। కీలకమ్।
మంత్రేణ న్యాసః।।




(8) వ్యక్త అవ్యక్త గిరః సర్వే
వేద ఆద్యా వ్యాహరంతి యాం
సర్వకామ దుఘా ధేనుః
సా మాం పాతు సరస్వతీ।।

‘‘దేవీవాచమ్’’
ఈ దృశ్య జగత్‌రూప బ్రహ్మాండాలన్నీ దేవీవాక్ వైభవ స్వరూపమే!
దేవీ వాచమ్ - ఇతి మంత్రము
భార్గవముని - ఋషి
త్రిష్టుప్ - ఛందస్సు
సరస్వతీ - దేవతా
సౌః - బీజము, శక్తి, కీలకము।
‘ఓం। సౌః। దేవీ వాచమ్ నమః’ మంత్రము యొక్క అంగన్యాస - కరన్యాసము.

వేదములన్నీ కూడా వ్యక్త-అవ్యక్త వాక్ - అర్థ - ఉపాసన రూపములుగా ఏ దేవి గురించి ఎలుగెత్తి గానము చేయున్నవో, ఏ దేవియొక్క ఉపాసన కామధేనువై మాకు సకలము ప్రసాదించగలదో, అట్టి సరస్వతి మమ్ములను సదా రక్షించును గాక! ‘తెలివి’ మాకు మొదట కలుగటానికి ఆ దేవియే చైతన్య రూపిణి।


‘‘సౌః’’ - దేవీం వాచ మజనయంత దేవాః
తామ్ విశ్వరూపాః పశవో వదంతి।
సా నో మంద్రేషమ్ ఊర్జం
దుహానా ధేనుః వాక్
అస్మాన్ ఉపసుష్టుతైతు।।
సౌః
‘‘సౌః’’। దేవతలు వాక్ యజ్ఞ గుండము నుండి వాగ్దేవతను జనింప జేయగా ఆ వాక్‌దేవీ వైభవ శబ్దములను పశువులవంటి విశ్వములోని జీవులు పలుకుచుండటము జరుగుతోంది.
మంత్రము - అన్నము - బలము తననుండి పాలవలె ప్రసాదించు ఆ వాక్‌దేవతా ధేనువు మమ్ము చేరి, వాత్సల్యముగా ఆవుదూడలవంటి మమ్ములను స్వీకరించును గాక!
‘ఉతత్వ’ ఇతి మంత్రస్య
బృహస్పతి ఋషిః। త్రిష్టుప్ ఛందః।
సరస్వతీ దేవతా।
‘సం’ ఇతి బీజ। శక్తి। కీలకమ్। మంత్రేణ న్యాసః


(9) యాం విదిత్వ అఖిలం బంధం
నిర్మథ్య అఖిల వర్త్మనా
యోగీ యాతి పరం స్థానం
సా మాం పాతు సరస్వతీ।।

ఉతత్వ-ఉద్ధరించునది, బంధము తొలగించునది!
‘ఉతత్వ’ - ఇతి మంత్రము
బృహస్పతి - ఋషి
త్రిష్టుప్ - ఛందస్సు
శ్రీ సరస్వతీ - దేవత
‘‘సం’’
‘సం’ …. బీజ శక్తి కీలకము
‘ఓం। ‘సం’। ఉతత్వ నమః’ మంత్రముతో అంగన్యాసము - కరన్యాసము

ఏ దేవీతత్త్వ రహస్యమును తెలుసుకొన్నవారై పరమయోగులు సకలమార్గముల రహస్యమును ఎరిగి, సర్వ సంసార శృంఖలములను, బంధములను త్రెంచి వేసుకొని, ‘పరము’ అగు స్ధానమును సముపార్జించుకొనుచున్నారో, అట్టి సరస్వతీదేవి మమ్ములను రక్షించును గాక!

‘సం’ - ఉత త్వః పశ్యన్ నద్ర దర్శ
వాచమ్। ఉత త్వః శృణ్వన్
న శృణోతి ఏనామ్।
ఉతోత్వస్మై (ఉతో తవత్ అస్మై।) తన్వా ‘అం’ విసస్రే
జాయేవ పత్య ఉశతీ సువాసాః।
‘‘సం’’ ‘‘ఉత త్వః’’
ఏ దేవీతత్త్వమైతే చూస్తూ కూడా చూడలేకపోతున్నామో, - ‘వాక్కు’గా వింటూ కూడా వినని వారమై ఉండిపోతున్నామో,
ఆ దేవి-దయతో మాయొక్క ఈఈ ‘ప్రార్థన’ - ‘ఉపాసన’లను ప్రేమగా స్వీకరించినదై తన తత్త్వస్వరూపమును సంవిశదపరచును గాక! పతి ఇంటి ఇల్లాలికి విశేషములను విశదపరచు రీతిగా, మాకు తన బ్రహ్మతత్త్వమును సంతోషముగా సుస్పష్టపరచును గాక! పిల్లలకు తల్లి సరిచేసి సర్ది చెప్పు రీతిగా మాకు బోధించును గాక!
6. ‘అంబితమ’ ఇతి మంత్రస్య। గృత్స్నమద ఋషిః।
అనుష్టుప్ ఛందః। సరస్వతీ దేవతా ।
‘ఐం’ ఇతి బీజ। శక్తి। కీలకమ్। మంత్రేణ న్యాసః।


(10) నామరూపాత్మకమ్ సర్వమ్
యస్యాం ఆవేశ్యతాం పునః
ధ్యాయంతి బ్రహ్మరూప ఏకా
సా మాం పాతు సరస్వతీ।

‘ఐం’ - అంబితమే, నదీతమే
దేవితమే సరస్వతి।
అప్రశస్తా ఇవ స్మసి
ప్రశస్తిమ్ అంబ న స్కృధి।

శ్లో।। చతుర్ముఖ ముఖాంభోజ వన హంసవధూః, మమ-
మానసే రమతాం నిత్యమ్ సర్వశుక్లా సరస్వతీ।।

అంబితమ
‘అంబితమ’ - ఇతి మంత్రము
గృత్స్నమదుడు - ఋషి
అనుష్టుప్ - ఛందస్సు
సరస్వతీ - దేవతా
‘ఐం’ - ఇతి బీజ శక్తి కీలకము.
‘ఓం। ‘ఐం’ అంబితమ నమః’-మంత్రముతో అంగన్యాసము- కరన్యాసము

నామ-రూపాత్మకమైన ఇదంతా కూడా ఏ దేవాది దేవి చేత సాకార రూపముగా ఆదేశించబడినదై ఉన్నదో, తిరిగి ఏ దేవిని సదా ఇదంతా ధ్యానించుచున్నదో, అట్టి అఖండ-ఏకైక బ్రహ్మరూపిణియగు శ్రీ సరస్వతీదేవి మమ్ములను రక్షించును గాక!
ఓ జగదంబా! అంబితమే! నదీ దేవతా స్వరూపిణీ! దేవీ! శ్రీ సరస్వతీ జగన్మాతా! అంబా! మాయందు అప్రశస్తమును (సంకుచితత్వమును) పోగొట్టుము. ప్రశస్తత్వమును ఆవిష్కరించుటకై మీకు నమస్కరిస్తున్నామమ్మా!

చతుర్ముఖుని (బ్రహ్మదేవుని) ముఖము అనే అంభోజవనములో (సరస్సులో) విహరించు ఓ పరమహంసా! హంసరూపిణీ! తెల్లటి ప్రకాశముతో సర్వశుక్లవై, నా మానస సరోవరమున సదా రమించవలసినదిగా నీకు విజ్ఞాపనములు చేస్తున్నామమ్మా! అట్టి సరస్వతీదేవి కరుణను ప్రసరించును గాక!
శ్లో।। నమస్తే శారదే దేవి। కాశ్మీర పుర వాసిని।
త్వామ్ అహమ్ ప్రార్థయే నిత్యమ్, విద్యా దానం చ దేహి మే।
అక్షసూత్ర అంకుశ ధరా। పాశ పుస్తక ధారణీ।
ముక్తాహార సమాయుక్తా। వాచి తిష్ఠతు మే సదా।
కంబుకంఠీసు తామ్రఓష్ఠీ। సర్వాభరణ భూషితా।
మహా సరస్వతీ దేవీ। జిహ్వాగ్రే సన్నివేశ్యతామ్।
యా శ్రద్ధా ధారణా మేధా వాగ్దేవీ విధి వల్లభా।
భక్త జిహ్వాగ్ర సదనా। శమాది గుణదాయినీ।
నమామి యామినీనాథ రేఖాలంకృత కుంతలామ్।
భవానీమ్ భవ సంతాప నిర్వాపణ సుధా నదీమ్।
యః కవిత్వం నిరాతంకమ్ భుక్తీ-ముక్తీ చ వాంఛతి,
సో అభ్యర్చ్య ఏనాం దశశ్లోక్యా నిత్యం స్తౌతి సరస్వతీమ్।
తస్యైవమ్ స్తువతో నిత్యమ్ సమభ్యర్చ్య సరస్వతీమ్।
ఓ శారదాదేవీ! కాశ్మీరపురవాసినీ! నీకు నమస్కారమమ్మా! నాకు విద్యను బిక్షగా ఇచ్చుటకొరకై నిన్ను నిత్యమూ ప్రార్థన చేయుచున్నాను.
జపమాల చేత ధరించిన మాతా! అంకుశమును ధరించినదానా! పాశ-పుస్తకములు ధరించిన జననీ! ముత్యాలహారమును అలంకరించు కొన్న తల్లీ! నీవు ఎల్లప్పుడు నా వాక్కునందు ఉండవలసినదిగా ప్రార్థన.
నెమలి వంటి కంఠము కలిగి, ఎర్రని పెదిమలతో, సర్వ ఆభరణ భూషిత అయి ఉన్నట్టి శ్రీ మహా సరస్వతీదేవి - నా నాలుక చివర ఎల్లప్పుడు సన్నివేశ్యమై, నెలకొని ఉండు గాక!
ఆ దేవి శ్రద్ధా - ధారణా - మేధాస్వరూపిణి। వాగ్ధేవి। సృష్టికర్తయగు బ్రహ్మ దేవుని ప్రియ వల్లభి! భక్తులంటే ఆ సరస్వతీదేవికి ఎంత ఇష్టమో। భక్తులకు శమ-దమాది ఉత్తమగుణములను ప్రసాదిస్తూ వారి జిహ్వకు చివర గృహము కలిగి ఉంటున్నది కదా।
చంద్ర రేఖలచే అలంకృతమైన కుంతలములు కలది, భవాని, భవ (సంసార) సంతాపములన్నీ కడిగి హృదయమును మధురము చేయు అమృత నదీ స్వరూపిణియగు సరస్వతీ దేవికి ఇవే మా నమస్కృతులు!
ఎవ్వరైతే నిరాతంకము అగు కవిత్వము, భుక్తి, ముక్తి కోరుకుంటారో, అట్టివారు ఎవ్వరైనా సరే, సరస్వతీ దేవిని దశశ్లోకములతో నిత్యము స్థుతించుటచే… తప్పక ఇహమందు సమృద్ధి, పరమందు ముక్తి పొందగలరు. వారు నిత్యము సరస్వతీ సమర్భ్యర్చన చే ఆ సరస్వతీదేవి అనుగ్రహము ను అతిత్వరగా పొందుచున్నారు.
భక్తి శ్రద్ధ అభియుక్తస్య, షాణ్మాసాత్ ప్రత్యయో భవేత్,
తతః ప్రవర్తతే వాణీ స్వేచ్ఛయా లలితాక్షరా।
గద్య పద్యాత్మకైః శబ్దైః అప్రమేయైః వివక్షితైః
అశ్రుతో బుధ్యతే గ్రంథః, ప్రాయః సారస్వతః కవిః।।
ఎవ్వరైతే జగజ్జనని - జగత్ స్వరూపిణియగు శ్రీ సరస్వతీదేవిని ‘6’ నెలలు శ్రద్ధగా ఈ దశశ్లోకీ పూర్వకంగా ఉపాసిస్తారో, వారిలో ఉత్తమమైన ఆత్మ విశ్వాసము రూపుదిద్దుకోగలదు. వారియందు లలితాక్షరములతో కూడిన వాణి స్వేచ్ఛాశబ్ద ప్రదర్శిని అయి ఉండగలదు. వారిలో గద్య-పద్య సాహిత్యము, అప్రమేయము అగు పరమాత్మ సంబంధమైన పరిభాష వివక్షితమై (బోధ) రూపమై ప్రకాశించగలదు. వారికి ఇప్పటి వరకు చదువని గ్రంథములలోని విశేషములు కూడా కరతలామలకమై, శ్రేష్ఠులై, తత్త్వజ్ఞులు కాగలరు. చిన్నతనంలోనే సారస్వత కవి కాగలరు.
7. ఇత్యేవం నిశ్చయం విప్రాః,
సాహో వాచ సరస్వతీ:-
‘‘ఆత్మవిద్యా మయా లబ్ధా బ్రహ్మణైవ సనాతనీ।
బ్రహ్మత్వం మే సదా నిత్యమ్ సచ్చిదానంద రూపతః।
ప్రకృతిత్వం తతః సృష్టం సత్వాది గుణ సామ్యతః।
సత్యేవ ఆభాతి చిచ్ఛాయా దర్పణే ప్రతిబింబవత్।
తేన చిత్-ప్రతిబింబేన త్రివిధా భాతి సా పునః।
ప్రకృతిః అవచ్ఛిన్నతయా పురుషత్వం పునశ్చ మే।
ఇటువంటి నిశ్చయమును జగన్మాతయగు సరస్వతీదేవి విని తనకు తానే ప్రకటించుటకై ప్రత్యక్షమైనది.
శ్రీ సరస్వతీదేవి: నాచే ఆత్మ విద్యను పొందినవాడై ఈ జీవుడు సనాతనమగు బ్రహ్మమును సిద్ధించుకొని ‘‘బ్రాహ్మణుడు’’ కాగలడు. వ్యష్టి - సమిష్టులను అధిగమించగలడు. (సనాతనము = జన్మ-కర్మల కంటే మునుముందే వేంచేసి యున్న సత్-స్వస్థి స్థితి।)
చిత్-ఆనంద రూపమగు పరబ్రహ్మమే నా అనునిత్య సత్య స్వరూపమై ఉన్నది.
నాచేతనే సత్వ-రజో-తమో గుణ సామ్యత్వముల రూపమగు ప్రకృతి సృష్టించబడుచున్నది.
దర్పణములో వాస్తవానికి దృశ్యము అనునది లేకపోయినప్పటికీ ప్రతిబింబ న్యాయముచే అగుపిస్తున్నట్లుగా, సత్యమగు నేనే చిత్-ఛాయా రూపమగు ప్రకృతిగా కనిపిస్తున్నది నేనే। ‘‘త్రిగుణ రూప ప్రకృతి’’ రూపినై త్రిలోకముల సృష్టిగా నాకు నేనై భాసిస్తున్నాను. ప్రకృతి అవిచ్ఛిన్నమై ఉండగానే ప్రకృతి-పురుషులుగా కూడా తిరిగి అగుచున్నాను. నా నుండి వేరే అవకుండానే ఆ వేరైనవన్నీ నేనే అగుచున్నాను! నేను సర్వదా అవిచ్ఛిన్న స్వరూపిణినే।
శుద్ధ సత్త్వ ప్రధానాయాం మాయాయాం బింబితో హి అజః
సత్త్వప్రధానా ప్రకృతిః మాయేతి ప్రతిపాద్యతే।
సా మాయా స్వ-వశ ఉపాధి సర్వజ్ఞస్య ఈశ్వరస్య హి।
వశ్య మాయత్వం ఏకత్వం సర్వజ్ఞత్వం చ తస్య తు।
సాత్వికత్వాత్ సమష్టిత్వాత్ సాక్షిత్వాత్ జగతామ్ అపి।
జగత్ కర్తుమ్ - అకర్తుం వా చ, అన్యథా కర్తుమ్ ఈశతే
యః స ‘ఈశ్వర’ ఇత్యుక్తః
‘సర్వజ్ఞత్వ’ ఆదిభిః గుణైః।
నాయొక్క శుద్ధ సత్వ ప్రధానమగు మాయ (నవలా రచయితయొక్క - రచన చేయాలి అనే గుణములకు ముందున్న భావన వంటిది) నుండి ‘సృష్టికర్త’ అగు ‘అజుడు’ - జనించుచున్నాడు. సత్వ ప్రధానమగు నా ప్రకృతియే ‘మాయ’ … అని వేదాంత-తత్త్వ శాస్త్రముచే ప్రతిపాదించ బడుతోంది.
(జీవునకు ఈ దేహము ఉపాధి అయిన తీరుగా) ‘సర్వజ్ఞుడు’ అయి ఉండటం చేత ఈశ్వరునికి ‘మాయ’ స్వ-వశములోని ఉపాధి. అట్టి ఈశ్వరుడు ‘3’ లక్షణములు కలిగి ఉంటున్నాడు. (1) వశ్య-మాయత్వము (2) ఏకత్వము (3) సర్వజ్ఞత్వము.
ఈశ్వరుడు (ఒక నవలా రచయిత నవలా రచనకు ముందుగా ఉన్న ఊహా శక్తి రూపమువలె) శుద్ధ సాత్వికుడు అయి ఉన్నాడు. ఆతడు (1) శుద్ధ సాత్వికుడు (2) సమష్టి రూపుడు (3) జగత్‌సాక్షి కూడా! ఈ మూడు విలక్షణ-లక్షణ విశేషముల కారణంగా…. అట్టి ఈశ్వరుడు (1) జగత్తుకు కర్త కాలగడు (2) అకర్త కాగలడు. (3) జగత్తును మరొక రీతిగా చేసివేయగలడు… కూడా! అయితే ఈ మూడూ కూడా నేనే!
జీవుడేమో (నాటకములోని ఒకపాత్ర వలె) కించిజ్ఞుడు. ఇక ఈశ్వరుడో, కళాకారునివలె సర్వజ్ఞుడు-సమిష్టి భావకుడు - సాక్షి కూడా! కాబట్టే ఈశ్వరుడు అనబడుచున్నాడు.
శక్తి ద్వయం హి మాయా యా ‘విక్షేప’, ‘ఆవృతి’ రూపకమ్,
విక్షేప శక్తిః లింగాది, బ్రహ్మాండాంతమ్ జగత్ సృజేత్।
అంతర దృక్-దృశ్య యోః భేదం। బహిశ్చ బ్రహ్మ సర్గయోః,
ఆవృణోతి అపరాశక్తిః సా సంసారస్య కారణమ్।
సాక్షిణః పురతో భాతమ్ లింగ దేహేన సంయుతమ్।
ఇక మాయ గురించి చెప్పుకుందాము. అద్దానికి ‘2’ శక్తులున్నాయి. (1) విక్షేప శక్తి. (2) ఆవృతి శక్తి. (ఆవరించు/ఆవరణ శక్తి).
మాయయొక్క విక్షేప శక్తి - (ఒక నవలా రచయిత నవలలో అనేక వేరు వేరైన స్వభావములు గల పాత్రలను కల్పించు విధముగా)… లింగ భేదములతో కూడిన అనేక జగత్ రూప బ్రహ్మాండములను మాయ సృజించగలదు.
మాయయొక్క ఆవరణ ఆకర్షణ శక్తి : లోపల దృక్-దృశ్యముల భేదమును, వెలుపల- సృష్టికర్తయగు బ్రహ్మ - సృష్టిల భేదమును ఏది ఆవరించి ఉన్నదో…, అది ‘‘ఆవరణ శక్తి’’. అదియే ‘అపరాశక్తి’ అని కూడా చెప్పబడుచున్నది. అట్టి ఆవరణ (లేక) అపరాశక్తియే ‘‘సంసారము’’ అను దానికంతటికీ కారణమైయున్నది. ఆ ఆవరణ - అపరాశక్తి లింగ (గుణ) దేహముతో కూడినదై, సాక్షియొక్క సమక్షములోనే భాసిస్తోంది.
‘చితిః-ఛాయా’ సమావేశాత్ జీవస్స్యాత్ వ్యావహారికః।
అస్య జీవత్వమ్ ఆరోపాత్ సాక్షిణ్యపి అవభాసతే।
ఆవృతౌతు వినష్టాయామ్ భేదే భాతే ప్రయాతి తత్।
తథా సర్గ - బ్రహ్మణోశ్చ భేదమ్ ఆవృత్య తిష్ఠతి।
యా శక్తిః తత్ వశాత్ బ్రహ్మ వికృతత్వేన భాసతే।
అత్రాపి ఆవృతి నాశేన విభాతి బ్రహ్మ-సర్గయోః।
భేదః తయో వికారస్స్యాత్ సర్గే - న బ్రహ్మణి క్వచిత్।।
జీవుడు = చిత్ ం ఛాయ (సహజ ం సందర్భ, బింబము ం ప్రతిబింబము)…ల సమావేశముచేత ‘జీవుడు’ అని వ్యవహరించ బడుచున్నాడు.
జీవుడు (లేక) జీవత్వములయొక్క చిత్-ఛాయా ఆరోపనచేత- కేవలసాక్షియే అవభాసించుచున్నాడు. ‘‘దర్పణంలో ముఖం చూస్తూ ఈ దర్పణంలో నా ముఖము ఉన్నది’’ - అనుకొనటమే మాయ.
ఆవృతత్వమును వినష్టమయిందా (తొలగిందా) అప్పుడు చిత్-ఛాయ భేదము తొలగుచున్నది.
చితి-ఛాయల భేదమువంటిదే సర్గము (సృష్టి) - సృష్టికర్త (బ్రహ్మ)ల భేదము కూడా! ఆవరణ దోషము చేతనే భేదము ఉంటోంది.
వాస్తవానికి బ్రహ్మము-సర్గము (సృష్టి) అని వేరుగా రెండు లేవు. బ్రహ్మమే సృష్టి. సృష్టియే బ్రహ్మము. తత్ బ్రహ్మము యొక్క స్వీయ వికృతి రూపమై ఏ శక్తి భాసిస్తోందో, అది బ్రహ్మమే. అట్టి శక్తియొక్క అవగాహనకు సంబంధించిన ఆవృతి నాశనముచే బ్రహ్మ - సర్గ భేదము తొలగిపోయి సర్గ (సంసార) వికారములు లేనివిగా అగుచున్నాయి. అనగా ఏకమగు బ్రహ్మమే శేషించినదై సృష్టి భేదమే లేకుంటోంది. ఏ క్షణంలోను బ్రహ్మము-శక్తి-అనబడు రెండు లేవు. ఏకమే ఉన్నది. దృష్టియే సృష్టి. దృష్టియొక్క సర్వసమత్వమే ఆత్మభావనయొక్క ఆవిష్కరణ.
8. ‘అస్తి’ ‘భాతి’ ‘ప్రియం’ ‘రూపమ్’ ‘నామ’ చేత్ అంశ -పంచకమ్।
ఆద్య త్రయమ్ (అస్తి-భాతి-ప్రియం) బ్రహ్మరూపమ్।
జగద్రూపమ్ తతో ద్వయమ్ (రూపమ్-నామమ్)।
ఉపేక్ష్య నామరూపే ద్వే
సత్-చిత్-ఆనంద తత్పరః
సమాధిం సర్వదా కుర్యాత్
హృదయేవ, అథవా బహిః।।
ఇక్కడ ‘5’ మాత్రమే ఉన్నాయి. 1. ఆస్తి (ఉనికి) 2. భాతి (ప్రకాశకములు, తెలియబడటటం, తెలియుట) 3. ప్రియము (ఆనందించటము) 4. నామము 5. రూపము. ఈ ఐదు కూడా బ్రహ్మముయొక్క అంశలు. (అంశ పంచకము). ఇందులో అస్తి-భాసి-ప్రియము - ఇవి మూడు నిశ్చలమగు బ్రహ్మము యొక్క ‘అంశలు’. నామము-రూపము - ఈ రెండూ మార్పు చేర్పులు చెందు ‘జగత్తు’ (జనించుచూ, గతించుచూ మధ్యలో కనిపించే చమత్కారము) యొక్క అంశలు. చంచల బ్రహ్మరూపములు. ఓ బిడ్డలారా! మీరు మీ అంతరమునందు, బాహ్య దృశ్య జగత్తునందు కూడా,
- నామ-రూప అంశలను ఉపేక్షిస్తూ
- సత్-చిత్-ఆనంద అంశలను మాత్రమే ఆశ్రయిస్తూ :-
ఎల్లప్పుడూ అట్టి సమాధియందు సర్వదా నిష్టా తత్పరులై ఉండండి.
సత్-చిత్-ఆనంద అంశలను సర్వదా ఆశ్రయిస్తూ నామ-రూప అంశలను సందర్భ పరిమితముగాను, సందర్భము లేకుంటే అవీ లేనివిగాను… దర్శించుచుండటమే సమాధి అభ్యాసము.
అట్టి అభ్యాసము హృదయములోను - బాహ్యములోను నిర్వర్తించండి.
‘‘సవికల్పో’’, ‘‘నిర్వికల్పః’’ సమాధిః ద్వివిధో హృది।
‘దృశ్య’ ‘శబ్ద’ అను భేదేన
సవికల్పః పునః ద్విధా।
కామాది యాః చిత్తగా దృశ్యాః
తత్ సాక్షితు ఏన చేతనమ్
ధ్యాయేత్ దృశ్య-అనువిద్ధో-యం
‘సమాధిః సవికల్పకః’।
‘‘అసంగ సత్-చిత్-ఆనందః
స్వ-ప్రభో, ద్వైత వర్జితః-
‘అస్మి’ ఇతి శబ్ద విద్ధో - అయం
సమాధిః సవికల్పకః।
సమాధి
హృదయములో నిర్వర్తించి (అభ్యసించు) సమాధి రెండువిధములైనవి. 1. సవికల్పము 2. నిర్వికల్పము.
1. సవికల్ప సమాధి
అట్టి సవికల్ప సమాధి తిరిగి రెండువిధములుగా ఆశ్రయించబడుతోంది. 1. దృశ్య భేద 2. శబ్దభేద. చిత్తములో ఏఏ ‘కామము’ (కోరిక) ఇత్యాదులుగా ఉన్నాయో, అవియే దృశ్యముగా అనుభవమగుచున్నాయి. ఏదేదైతే చూడబడుచున్నదో అది ఆ ప్రక్కగా పెట్టి ఇక ఆ ‘చూచువాడు’ అగు సాక్షిని గమనించండి. దృశ్యము జడము. సాక్షియో? చేతనము (చూచువాడు, కదల్చువాడు). జడమగు దృశ్యమును వదలి, చేతనుడగు సాక్షి (ద్రష్ట)ను ఎప్పటికప్పుడు తెరపి లేకుండా ధ్యానిస్తూ ఉండటమే ‘సవికల్ప సమాధి’.
‘‘ఆలోచనలలో ఉండటము’’ నుండి ఈవలకు వచ్చి, ఆలోచించువానిని గమనిస్తూ ఉండటమే - సమాధి అభ్యాసము.
అట్లు చేతనుడగు ‘సాక్షి’. స్వరూపమును (సత్-చిత్-ఆనంద లక్షణుడుగా) ధ్యానిస్తూ ఉండగా, ‘‘నేను-అను శబ్దార్ధమును - అసంగము (దేనిచేతా సంగము లేనిది). సత్-చిత్-ఆనంద స్వరూపము, తనకు తానే నియామకము. మరొకరెవరో నన్ను నియమించటము లేదు’’- అని గ్రహిస్తున్నాడు. ఈవిధంగా ‘అహమ్’ స్వరూపమును అసంగము, సచ్చిదానందము, స్వయం ప్రభువు…. అని గ్రహిస్తూ ఉండువానిని సవికల్ప సమాధి నిష్టుడు - అనబడుచున్నాడు.
స్వానుభూతి రస ఆవేశాత్
‘దృశ్య’ శబ్ద అన పేక్షితః।
నిర్వకల్ప సమాధిస్యాత్
నివాత స్థిత దీపవత్।।
హృదివా, బాహ్య దేశే అపి,
యస్మిన్ కస్మింశ్చ వస్తుని,
సమాధిః ఆదృక్ (సమాధిరాత్ దృక్) - సన్మాత్రా
నామరూప పృథక్ కృతిః।
స్తబ్ధీభావో, రసాస్వాదాత్
తృతీయః పూర్వవత్ మతః।।
ఏతైః సమాధిభిః షడ్భిః (6)
నయేత్ కాలం నిరంతరమ్।।
2. నిర్వికల్ప సమాధి
‘స్వస్వరూపానుభూతి’ యొక్క ప్రియాతి ప్రియమగు కేవల ఆత్మయొక్క ఆపేక్ష (ఇష్టము)చేత, ఇక దృశ్యము - దృశ్యములోని శబ్ద స్పర్శాది విషయములు కావాలనే కోరిక కించిత్ కూడా కలుగక (ఒక నటుడు పాత్రయొక్క సంబంధ బాంధవ్యములపట్ల అపేక్ష లేకయే నటించు తీరుగా)- గాలి కదలని చోటుగల నిశ్చల దీపమువలె ‘స్వస్వరూపానుభవ శీలుడై ఉండటము’… అను స్థితిని ‘నిర్వికల్ప సమాధి స్థితి’ అని అంటారు.
3. స్తబ్ధీభావ-రసాస్వాద సమాధి
హృదయమునందు, బాహ్యమునందు కూడా ఏదో ఒక్క వస్తువుపై (గురువు-ఇష్టదైవము ఇటువంటి ఒక్కటే దానిపై) ఏకాగ్రరూపమైన సమాధిని అభ్యసించి,
- వేరు వేరైన రూపాత్మకమైనదంతా స్తబ్ద భావములో లయింపజేసివేసి,
- రసాస్వాదనను ద్రష్ట-దృశ్యముల కావల మునుముందుగానే ఉన్న ‘దృక్’తో ఏకం చేసి ఉంచటం.

బిడ్డలారా! ఈ విధంగా

  1. సవికల్ప సమాధి
  2. నిర్వికల్ప సమాధి
  3. ఏకవస్తు సమాధి

  1. హృదయంలోను
  2. బాహ్యములోను

3 x 2 = 6

ఈ ఆరు సమాధులలో ఏదో ఒకటి నిరంతరము ఆశ్రయిస్తూ కాలమును గడుపుతూ ఉండటము మీకు శ్రేయోదాయకము. ఉచితము. లేదా అన్నిటినీ మిశ్రమం చేసి అభ్యసించండి. ఎప్పటికి ఏది ప్రస్తుతమో, అది అభ్యాసిస్తూ, క్రమంగా ‘కేవలమగు దృక్’ భావనను సర్వే సర్వత్రా సర్వదా నిశ్చలం చేసుకోండి.
దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని,
యత్ర యత్ర మనో యాతి
తత్ర తత్ర పరామృతమ్।
దేహాభిమానము: ‘‘ఈ దేహమునకు ముందే ఉన్నాను. తరువాత కూడా ఉంటాను’’ - అనునది ఏమరచి, ‘‘ఈ దేహముచేత నేను పరిమితుడను. ఈ దేహము చేతనే నాకు ఉనికి’’ …. అను అభిమానమే-దేహాభిమానము.
ఓ ప్రియ బిడ్డలారా! పై (6) విధములైన సమాధుల అభ్యాసము సహాయంతో దేహాభిమానము తొలగిపోవుచుండగా, మీ పరస్వరూపమగు పరమాత్మత్వము విషయమై తెలుసుకొనుచున్నవారై (విజ్ఞాతులై) ఎప్పుడు ఉంటారో, అప్పుడిక బంధము లేదు. మనోవైకల్యము ఉండదు. అప్పుడు మీ మనస్సు ఎక్కడెక్కడికి వెళ్ళినాకూడా, అక్కడక్కడ పరామృతమునే పొందుచున్నది.
భిద్యతే హృదయ గ్రంథిః,
ఛిద్యంతే సర్వ సంశయాః,
క్షీయంతే చ అస్య కర్మాణి
తస్మిన్ దృష్టే పరావరే।
ఎప్పుడైతే పరావర (పరతత్త్వ, పరమాత్మత్వ) - సమున్నత దృష్టిని మీరు సంపాదించుకుంటారో…, అప్పుడిక హృదయములోని (దృశ్యము-జీవుడు- ఈశ్వరుడు-జన్మ-కర్మ…. ఇవన్నీ ఉన్నాయి - అను రూపమైన) సర్వ చిక్కుముడులు వీడిపోతాయి.
సర్వ కర్మ బంధములు వాటికవే త్రెగిపోతాయి (నటుడికి పాత్ర సంబంధమైన కర్మలు - బంధుత్వములు - గుణములు తనవి కానివిధంగా) - అట్టివాడు జగన్నాటకంలో పాత్రధారుడై స్వస్వరూపము యొక్క స్వానుభూతిని వీడక ఉంటాడు.
మయి జీవత్వమ్-ఈశత్వమ్ కల్పితమ్।
వస్తుతో నహి।
ప్రియమైన శ్రోతలారా! భక్తజనులారా! తదితర సర్వజీవులారా!
చివ్వరిగా, అంతిమ వాక్యరూపంగా చెప్పుచున్నాను. ఈ మాట వినండి.
ఇతి యస్తు విజానాతి స ముక్తో।।
న అత్ర సంశయః।।

‘‘నాయొక్క జీవత్వము - ఈశ్వరత్వము’’…. ఈ రెండూ కూడా నాపట్ల కేవలము స్వయం కల్పితము మాత్రమే!

వస్తుతః జీవుడు లేడు. ఈశ్వరుడు లేడు. అస్మత్ ఆత్మానంద స్వరూపమే ఇదంతా.

నేను ఈ రెండిటికి పరమైనట్టి వాస్తవ స్వరూపమును. సత్ స్వరూపమును.
తదితరమైనదంతా కల్పితము.
ఈ విషయము ఎవ్వరు గ్రహిస్తారో, తెలుసుకుంటారో,…. అట్టివాడు నిత్యముక్తుడే!
అఖండ అప్రమేయ ఆత్మానంద స్వరూపుడే!
నాయనలారా! ఇందులో సందేహించవలసిన పనేలేదు.

ఇతి కృష్ణయజుర్వేదాంతర్గత సరస్వతీ రహస్యోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।




కృష్ణ యజుర్వేదాంతర్గత

28     శ్రీ సరస్వతీ రహస్య ఉపనిషత్

అధ్యయన పుష్పము


ఓంకారార్థము, సత్యము, నిత్యము, అమృత స్వరూపము, పరమ వాత్సల్యరూపము - అయి ఉన్న శ్రీ సరస్వతీ జగన్మాతకు భక్తి - జ్ఞాన - యోగ పూర్వకముగా ఆత్మప్రదక్షిణ నమస్కారము।

ఒకానొక సందర్భములో కొందరు ఋషిపుంగవులు తత్త్వజ్ఞానార్ధులై శ్రీ అశ్వలాయన మహర్షి తపస్సు చేస్తున్న ఆశ్రమానికి వచ్చారు. మహర్షిని దర్శించారు. భక్తి - ప్రపత్తులతో వారి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించారు. తాము తెచ్చిన పుష్ప ఫలాదులను ప్రేమపూర్వకంగా సమర్పించారు. ఆ తరువాత వారంతాకూడా ఆ ఆశ్రమములోగల ఒక ప్రశాంత స్థలములో సుఖాసీనులైనారు.

ఋషి పుంగవులు : హే మహర్షి వరేణ్యా! అశ్వలాయనా! తమరు దేవీసిద్ధిని పొంది, అట్టి దేవీ ఉపాసనచే దేవీ సంబోధితులై పరతత్త్వజ్ఞాన సంపన్నులైనారని ఋషి గణములు చెప్పుకుంటూ ఉంటారు. పరమానంద మానసులగు మిమ్ములను దర్శించుటచే ధన్యులమైనాము. మిమ్ములను శరణు వేడుచూ తత్త్వజ్ఞానాశ్రయులమై, మేము తెలుసుకోవలసిన ఒక విషయం తెలుసుకొనదలచాము.

ఏ ఉపాసనచే ఏఏ ఉపాయములతో మీరు పరతత్త్వమును ప్రసన్నం చేసుకొన్నారు? ఏ విధంగా ఈ జగత్ పదార్థములన్నీ ప్రతిబింబిస్తున్నట్టి అపరములని తెలుసుకొని, బ్రహ్మతత్పరులై ఉంటున్నారు? మేము ఏ మార్గములో తత్త్వవిషయమై బోధితులము కాగలము? దయతో వివరించండి.

అశ్వలాయన మహర్షి : బ్రహ్మజ్ఞులగు ఋషి పుంగవులారా! అవును. నేను - బీజాక్షరములతో నిర్మితమై, ఋషి సత్తములచే సంపుటితమైనట్టి ఋక్కులచే గానము చేయబడుచు ‘సరస్వతీ దశశ్లోకీ’ ధ్యానమును ఆశ్రయించాను. అట్టి ధ్యానము స్థుతి - జపముచే - మంగళప్రదాయని, లోకమాత, కరుణామయి అగు శ్రీ సరస్వతీదేవి ప్రేమచే పరతత్త్వ జ్ఞాన విశేషాలు నాకు బోధించింది. ఆ తల్లి వాత్సల్యముచేతనే కృతకృత్యుడను అయ్యాను. నన్ను నేను సుస్పష్టముగా ఎఱిగి, ఆస్వాదిస్తూ ఉన్నాను.

ఋషి పుంగవులు : అట్లాగా స్వామీ! అయితే, మరి అటువంటి శ్రీ సరస్వతీ కరుణారస వీక్షణారూపమగు సారస్వత (సా-రసత్వత) మార్గ మోక్ష స్థితి లభించటానికి మార్గమేమిటి? హే సువ్రతా! ఏ ధ్యానముచే మాకు అది సుసాధ్యమవుతుంది? కధం సారస్వత ప్రాప్తిః, కేన ధ్యానేన? సువ్రత! ఏ విధి విధానంగా భగవతియగు మహాసరస్వతీదేవి సంతోషించినదై మాకు ఆత్మ జ్ఞానమును ప్రసాదించగలదు? దయతో వివరించండి. మహా సరస్వతీ యేన తుష్టా భగవతీ, వద।

శ్రీ అశ్వలాయనమహర్షి : పరమ పవిత్ర హృదయులారా! ఋషి పుంగవులారా! చెప్పుచున్నాను, వినండి. నేను ‘‘శ్రీ సరస్వతీ దశశ్లోకీ’’ అను మహనీయులగు మహర్షుల ‘‘దేవతా - బుషి - చందోబద్ధ - బీజ శక్తి కీలక’’ మహామంత్రమును ఎల్లప్పుడూ ధారణ - మనన - ఉపాసనలను నిర్వర్తిస్తూ శ్రీ మహా సరస్వతీదేవియొక్క వాత్సల్యమునకు పాత్రుడనగుచూ వస్తున్నాను. తల్లి దయ ఉంటే మనకు తక్కువేముంటుంది చెప్పండి?

మంత్రము ‘‘సరస్వతీ దశ శ్లోకో’’ ఋషిః అహమ్ అశ్వలాయన ఋషిః చందస్సు అనుష్టుప్ దేవతా వాగేశ్వరీ ఇతి బీజమ్ శక్తి కీలకమ్ యత్‌వాక్
(1) ఓం ‘‘ప్రణోదేవీ’’ భరద్వాజ ఋషిః గాయత్రీ శ్రీ సరస్వతీ దేవతా ప్రణవేన
(2) ‘‘ఆ నో దివ’’ అత్రి త్రిష్టుప్ శ్రీ సరస్వతీ దేవతా హ్రీం
(3) ‘‘పావకాన’’ మధుచ్ఛందా ఋషిః గాయత్రీ శ్రీ సరస్వతీ దేవతా శ్రీం
(4) ‘‘చోదయత్రీ’’ మధుచ్ఛందా ఋషిః గాయత్రీ శ్రీ సరస్వతీ దేవతా బ్లూమ్
(5) ‘‘మహో అర్ణ’’ మధుచ్ఛందా ఋషిః గాయత్రీ శ్రీ సరస్వతీ దేవతా సౌః
(6) ‘‘చత్వారి వాక్’’ ఉచత్థ్యపుత్రో దీర్ఘతమా ఋషిః త్రిష్టుప్ శ్రీ సరస్వతీ దేవతా ఐం
(7) ‘‘యత్ వాక్ వదంతీ’’ భార్గవ ఋషిః త్రిష్టుప్ శ్రీ సరస్వతీ దేవతా క్లీం
(8) ‘‘దేవీం వాచమ’’ భార్గవ ఋషిః త్రిష్టుప్ శ్రీ సరస్వతీ దేవతా సౌః
(9) ‘‘ఉత త్వా’’ బృహస్పతి ఋషిః త్రిష్టుప్ శ్రీ సరస్వతీ దేవతా సం
(10) ‘‘అంబితమ’’ గృత్స్నమద ఋషిః అనుష్టుప్ శ్రీ సరస్వతీ దేవతా ఐం

శ్లో।। అస్యశ్రీ సరస్వతీ ‘దశ శ్లోకీ’ స ఋచా బీజమిశ్ర యా
స్తుత్వా జప్త్వా పరామ్ సిద్ధిమ్ సులభమ్, మునిపుంగవాః।

శ్లో।। నీహార హార ఘనసార సుధాకరాభాం
కల్యాణదాం కనక చంపక దామ భూషామ్
ఉత్తుంగ పీన కుచకుంభ మనోహరాంగీం
వాణీం నమామి మనసా వచసాం విభూత్యై।।

  1. శ్లో।। యా వేదాంతార్థ తత్త్వైక స్వరూపా పరమార్థతః
    నామరూపాత్మనా (అ)వ్యక్తా సామాం పాతు సరస్వతీ।।
    ‘‘ఓం’’ ప్రణోదేవీ సరస్వతీ వాజేభిః వాజినీవతీ।
    ధీనామ్ అవిత్ర్యవతు।।

  2. శ్లో।। యా సాంగ-ఉపాంగ వేదేషు చతుర్ష్య (చతుర్ధ్య) ఏకైవ గీయతే
    అద్వైతా బ్రహ్మణః శక్తిః సామాం పాతు సరస్వతీ।
    ‘‘హ్రీం’’ ఆ నో దివో బృహతః పర్వతాదా సరస్వతీ
    యజత ఆగంతు యజ్ఞమ్, హవం దేవీ జుజుషాణా
    ఘృతీచీ శగ్మాన్ నో వాచమ్ ఉశతీ శృణోతు।।

  3. శ్లో।। యా వర్ణ పదవాక్యార్థ స్వరూపేణైవ వర్తతే
    అనాది నిధన అనంతా సా మాం పాతు సరస్వతీ।
    ‘‘శ్రీం’’ పావకానః సరస్వతీ వాజేభిః వాజినీవతీ।
    యజ్ఞం వష్టు ధియా వసుః।।

  4. శ్లో।। అధ్యాత్మమ్ అధిదైవం చ దేవానాం సమ్యక్ ఈశ్వరీ
    ప్రత్యగాస్తే వదంతీ యా, సా మాం పాతు సరస్వతీ।।
    ‘‘బ్లూం’’। చోదయత్రీ సూనృతానాం చేతంతీ సుమతీనామ్
    యజ్ఞం దధే సరస్వతీ।।

  5. శ్లో।। అంతర్యామి ఆత్మనా విశ్వం త్రైలోక్యం యా నియచ్ఛతి,
    రుద్ర - ఆదిత్యాది రూపస్థా యస్యాం ఆవేశ్యతాం పునః,
    ధ్యాయంతి సర్వ రూపైకా సా మాం పాతు సరస్వతీ।।
    సౌః మహో అర్ణః సరస్వతీ ప్రచేతయతి కేతునా
    థియో విశ్వా విరాజతి।।

  6. శ్లో।। యా ‘ప్రత్యక్’ దృష్టిభిః జీవైః వ్యజ్యమాన - అనుభూయతే
    వ్యాపినీ జ్ఞప్తి రూపైకా సా మాం పాతు సరస్వతీ।।
    ‘‘ఐం’’ చత్వారి వాక్ పరిమితా పదాని తాని విదుః బ్రాహ్మణా యే మనీషిణః,
    గుహాత్రీణి నిహితా నేంగయంతి
    తురీయం వాచో మనుష్యా వదంతి।।

  7. శ్లో।। నామ జాత్యాదిభిః భేదైః అష్టధా యా వికల్పితా
    నిర్వికల్పాత్మనా (అ)వ్యక్తా సా మాం పాతు సరస్వతీ।।
    ‘‘క్లీం’’ యత్ వాక్ వదంతి అవిచేతనాని రాష్ట్రీ
    దేవానాం నిషసాద మంద్రా
    చతస్ర ఊర్జం దుదుహే పయాంసి క్వస్విత్
    అస్యాః పరమం జగామ।

  8. శ్లో।। వ్యక్తావ్యక్త గిరిః సర్వే వేదాద్యా వ్యాహరంతి యామ్
    సర్వకామ దుఘా ధేనుః సా మాం పాతు సరస్వతీ।
    ‘‘సౌః’’ దేవీం వాచమ జనయంత దేవాః
    తాం విశ్వరూపాః పశవో వదంతి,
    సా నో మంద్రేషు మూర్జం దుహానా ధేనుః
    ‘‘వాక్’’ అస్మాన్ ఉపసుష్టుతైతు।

  9. శ్లో।। యాం విదిత్వ అఖిలం బంధం నిర్మథ్యాఖిల వర్త్మనా
    యోగీ యాతి పరం స్థానం సా మాం పాతు సరస్వతీ।
    ‘‘సం’’ - ఉత త్వః పశ్యన్ న ద దర్శ వాచమ్ ఉతత్వః
    శృణ్వన్, న శృణోతి ఏనామ్, ఉతో తు అస్మై తన్వా
    అం వినస్రే జాయేవ పత్య ఉశతీ సువాసాః।

  10. శ్లో।। నామ రూపాత్మకం సర్వం యస్యాం ఆవేశ్యతాం పునః
    ధ్యాయంతి బ్రహ్మరూపైకా సా మాం పాతు సరస్వతీ।।
    ‘‘ఐం’’ - అంబితమే నదీతమే దేవితమే సరస్వతి,
    అప్రశస్తా ఇవ స్మసి ప్రసస్తిమ్ అంబ న స్కృధి।।

స్తుతి

శ్లో।। చతుర్ముఖ ముఖాంభోజ వన హంసవధూః మమ
మనసే రమతాం నిత్యం సర్వ శుక్లా సరస్వతీ


శ్లో।। నమస్తే శారదా దేవి। కాశ్మీరపురవాసిని।
త్వామ్ అహం ప్రార్థయే నిత్యం। విద్యాదానం చ దేహిమే।

శ్లో।। అక్షసూత్ర అంకుశధరా। పాశపుస్తక ధారిణీ।
ముక్తాహార సమాయుక్తా। వాచి తిష్ఠతు మే సదా।
కంబు కంఠీ సు తామ్రోష్ఠీ। సర్వాభరణ భూషితా।
మహా సరస్వతీ దేవీ, జిహ్వాగ్రే సన్నివేశ్యతామ్।।

శ్లో।। యా శ్రద్ధా ధారణా మేధా, వాగ్దేవీ। విధి వల్లభా।
భక్త జిహ్వాగ్ర సదనా। శమాది గుణదాయినీ।
నమామి యామినీనాథ రేఖాలంకృత కుంతలామ్।
భవానీం। భవసంతాప నిర్వాపణ సుధా నదీమ్।

శ్లో।। యః కవిత్వం నిరాంతకం భుక్తీ ముక్తీ చ వాంఛతి,
సో అభర్చ్య ఏనాం దశశ్లోక్యా నిత్యం సౌతి, సరస్వతీమ్।।
తస్య ఏవం స్తువతో నిత్యం సమభ్యర్చ్య సరస్వతీమ్।
భక్తి శ్రద్ధ అభియుక్తస్య షణ్మాసాత్ ప్రత్యయో భవేత్।।
తతః ప్రవర్తతే వాణీ స్వేచ్ఛయా లలితాక్షరా
గద్య పద్యాత్మకైః శబ్దైః అప్రమేయైః వివక్షితైః
అశ్రుతో బుధ్యతే గ్రంథః ప్రాయః సారస్వతః కవిః

శ్రీ అశ్వలాయన మహర్షి : ఓ మహావివేకవంతులగు ఋషి పుంగవులారా! శ్రీ సరస్వతీ దేవిని తమ భక్తి - యోగ - జ్ఞాన - వైరాగ్య అభ్యాసములచే హృదయమునందు దర్శించినట్టి మహనీయులు బీజాక్షర సంపుటిచే ఉచ్ఛరిస్తూ గానము చేసినట్టి ‘‘శ్రీ సరస్వతీ దశశ్లోకీ మహామంత్రము’’ను భక్తితో సేవించి ఆ జగజ్జనని యొక్క వాత్సల్యమును, కరుణను పొందుచూ తత్త్వజ్ఞానమును పొందుచున్నవాడనగుచున్నాను. అటువంటి నేను నిత్యము ఆశ్రయిస్తున్న ధ్యానోపాసనా విధి, స్తోత్ర విశేషములను మీరు కోరారు కాబట్టి చెప్పుకుంటున్నాము. ఆ శ్రీ సరస్వతిదేవి అమృతవీక్షణ మనందరిపైన వర్షించును గాక. ఆ అమ్మ ప్రత్యక్షమై తత్త్వవీక్షణ మనపై ప్రసరించాలనే లోకకల్యాణ - లోకశ్రేయస్సులను ఉద్దేశ్యించి వివరిస్తున్నాను. దయచేసి వినండి.

అస్య ‘‘శ్రీ సరస్వతీ దశశ్లోకీ’’ మహా మంత్రస్య। అహమ్ అశ్వలాయన ఋషిః। ‘అనుష్టుప్’ ఛందః। శ్రీ వాగీశ్వరీ దేవతా। ‘యత్ వాక్’ ఇతి బీజమ్। ‘దేవీం వాచమ్’ - ఇతి శక్తిః। ‘ప్రణోదేవీ’ - ఇతి కీలకమ్। వినియోగః తత్ ప్రీత్యర్థే। శ్రద్ధా మేధా ప్రజ్ఞా ధారణా వాక్ దేవతా మహా సరస్వతీ - ఇతి ఏతైః అంగన్యాసః।।

ఈ ‘సరస్వతీ దశశ్లోకీ’ స్తోత్రమును అశ్వలాయన నామధేయుడనగు నేను ఋషిని। ఛందస్సు అనుష్టుప్ శ్రీ వాగీశ్వరీ సరస్వతీ అమ్మవారే దేవత। ‘యత్ వాక్’ అనునది బీజము. ‘‘దేవీ వాచం - దేవి పలుకులు నాకు లభించుగాక’’….అనునది శక్తి। ఆ వాగీశ్వరి ప్రీతిని పొందినదై, తన హృదయమును విశదపరచుటకై - ఈ ‘దశశ్లోకా’ యొక్క వినియోగము.

(1) శ్రద్ధ (2) మేధ (3) ప్రజ్ఞ (4) ధారణ (5) వాగ్దేవతా (6) మహాసరస్వతీ…. వీటితో అంగన్యాసము, కరన్యాసము నిర్వర్తిస్తున్నాము.

శ్రీ సరస్వతీ స్తోత్రము

శ్లో।। నీహార హార ఘనసార సుధాకరాభాం
కల్యాణదాం కనక చంపక దామ భూషామ్
ఉత్తుంగ పీన కుచ కుంభ మనోహరాంగీం
వాణీం నమామి మనసా వచసాం విభూత్యై।।

మంచువంటి తెల్లటి రంగుతో ప్రకాశించుచూ, తళతళ మెరుస్తున్న ముత్యాహారము ధరించి, పచ్చ కర్పూరము వంటి - పూర్ణచంద్రునివంటి ముఖముతో దేదీప్యమానముగా వెలుగుచూ, భావనా మాత్రము చేత సర్వశుభములు ప్రసాదించుచూ, బంగారు సంపంగి పుష్పమాలికను ధరించినదై, ఎత్తైన పీన కుచ కుంభములతో (పాలిండ్లతో) మాతృవాత్సల్య అయి ఉన్నది. సుమనోహరమైన అంగములు గలిగియున్నట్టి ఆ తల్లి నాయొక్క వాక్ విభూతిని స్వీకరించి ఆస్వాదించును గాక! చక్కటి వచనములను పలికించవలసినదిగా మనసా - వాచా - కర్మణా నమస్కరిస్తున్నాను.


1.) ఓం ఓం ప్రణోదేవీ నమః।

ఓం ‘‘ప్రణో దేవీ’’ ఇతి అస్య మంత్రస్య। భారద్వాజ ఋషిః। గాయత్రీ ఛందః।
శ్రీ సరస్వతీ దేవతా। ప్రణవేన బీజ శక్తి కీలకమ్। ఇష్టార్థే వినియోగః।।

శ్లో।। యా వేదాంతార్థ తత్త్వైక స్వరూపా పరమార్థతః
నామరూపాత్మనా (అ)వ్యక్తా సామాం పాతు సరస్వతీ।।
‘‘ఓం’’ ప్రణోదేవీ సరస్వతీ వాజేభిః వాజినీవతీ।
ధీనామ్ అవిత్ర్యవతు।।

ఏ దేవాదిదేవి పరమార్థంగా, వేదాంతార్ధతత్త్వైక స్వరూపముగా…,

💐 పరమార్థంగా….‘సర్వమునకు ఆవలగల స్వస్వరూప కేవలసాక్షి’’ అయినదై,
💐 వేదాంతార్థ….. (తెలుసుకొనువానిని ఆవల ఉండి తెలుసుకొంటున్నట్టి) స్వరూపార్థంగా…,
💐 తత్త్వైక…. ‘త్వమ్’ (నీవు) రూపముగా ఉన్న సర్వ సర్వనామముల ఏకస్వరూపంగా….,
….. ఉండి, సర్వ నామ రూపములుగా వ్యక్తమగుచూ ఉన్నదో… అట్టి సరస్వతీదేవి మనలను రక్షించుచుండును గాక!

‘ప్రణో’ - ‘అన్న’ (That being consumed, experienced) స్వరూపదేవి, వాక్ స్వరూపిణి, వాక్ పరిపాలన చేయుతల్లి అగు శ్రీ సరస్వతీదేవి మా బుద్ధులను పవిత్రము చేస్తూ, బుద్ధిని నిర్మలము - సునిశితము - విస్తారము - దివ్యము చేయుచుండును గాక!


2.) ఓం ‘హ్రీం’ అనో దివ నమః।

ఓం ‘అ నో దివ’ ఇతి మంత్రస్య। అత్రి ఋషిః। త్రిష్టుప్ ఛందః।
సరస్వతీ దేవతా। ‘‘హ్రీం’’ ఇతి బీజ శక్తి కీలకం। ఇష్టార్థే వినియోగః।।

శ్లో।। యా సాంగ-ఉపాంగ వేదేషు చతుర్ష్య (చతుర్ధ్య) ఏకైవ గీయతే
అద్వైతా బ్రహ్మణః శక్తిః సామాం పాతు సరస్వతీ।
‘‘హ్రీం’’ ఆ నో దివో బృహతః పర్వతాదా సరస్వతీ
యజత ఆగంతు యజ్ఞమ్, హవం దేవీ జుజుషాణా
ఘృతాచీ శగ్మాన్ నో వాచమ్ ఉశతీ శృణోతు।।

ఏ దేవీతత్త్వము అయితే 4 వేదములచేతను, వాటి సాంగ ఉపాంగములచేతను సర్వదా గానము చేయబడుచున్నదో (4 వేదముల సంహిత - బ్రాహ్మణ - ఆరణ్యక ఉపనిషత్తులు ఒకచోటికి చేరి ఏ తత్త్వమును ఎలుగెత్తి పొగుడుచూ పలుకుచున్నాయో), ఏ దేవి స్వస్వరూపమునకు వేరు కానిదైనట్టి బ్రాహ్మీశక్తియో, అట్టి ఓ సరస్వతీ దేవీ! మమ్ములను సర్వదా మాతృదేవి అయి రక్షించును గాక! హే మాతా! మహత్తరము - బృహత్తరము అగు బ్రహ్మ లోకమునుండి, పర్వత శిఖర ఉపరిభాగములనుండి - (జీవితము అను) యజ్ఞమునకు సంసిద్ధులమగుచున్న మేమున్న చోటికి మీరు విచ్చేయండి. ఓ సరస్వతీ మాతా! మా యొక్క జీవిత యజ్ఞమును (మరియు) వేదవిహితమైన యజ్ఞయాగ క్రియలను దిగ్విజయము చేయండి.

మేము యజ్ఞములో సమర్పించు హవనములను (హోమములో సమర్పించు ఘృతము (నేయి) మొదలైనవానిని) యజ్ఞపురుష స్వరూపిణి అయి శ్రీ సరస్వతీదేవి స్వీకరించును గాక! మేము యజ్ఞభావముతో చేయు సర్వ కర్మలను - విద్యుక్త ధర్మములను - ఉపాసనా క్రియలను హవిస్సు (ఘృతము) రూపముగా స్వీకరిస్తూ తృప్తిని పొందినదై, మమ్ములను రక్షించెదరు గాక!


3.) ఓం ‘శ్రీం’ పావకాన నమః

ఓం ‘‘పావకాన’’ ఇతి మంత్రస్య। మధుచ్ఛంద ఋషిః। గాయత్రీ ఛందః।
సరస్వతీ దేవతా। ‘‘శ్రీం’’ ఇతి బీజశక్తి కీలకమ్। మంత్రేణ న్యాసః।।

శ్లో।। యా వర్ణ పదవాక్యార్థ స్వరూపేణైవ వర్తతే
అనాది నిధన అనంతా సా మాం పాతు సరస్వతీ।
‘‘శ్రీం’’ పావకానః సరస్వతీ వాజేభిర్వాజినీవతీ।
యజ్ఞం వష్టు ధియా వసుః।।

మాకు వాక్కును ప్రసాదించిన వాక్‌దేవత మా స్తోత్ర వాక్యములు వినునుగాక! విని, స్వీకరించి ఒకతల్లి తన చిన్న పిల్లవాని మాటలను విని ఆనందించి రక్షించుచున్న తీరుగా మా పట్ల వాత్సల్యము చూపును గాక! తల్లివలె విద్యా బుద్ధులను నేర్పుచు, సరిదిద్దుచూ సన్మార్గమునందు నడిపించునుగాక! ఏ దేవి - వర్ణ (Discriptive sentence), వాక్యార్థ (Meaning of a sentence) స్వరూపియై వర్తించుచున్నదో, అనాది నిధన (A source with infinite energy) అయి ఉన్నదో, ఆద్యంతరహిత స్వరూపిణియో…, అట్టి శ్రీ సరస్వతీదేవి మనలకు ఎల్లప్పుడు సర్వదా తోడు అగుచుండును గాక!
‘శ్రీం’! వాక్ స్వరూపిణి - వాక్ ప్రసాదిని, సిరి - శ్రియ స్వరూపిణి అగు ఆ శ్రీదేవీ సరస్వతి మా యజ్ఞహవిస్సులను స్వీకరించి మాకు బుద్ధి సంపద ప్రసాదించునుగాక! వివేకవంతులుగా తీర్చిదిద్దునుగాక!


4.) ఓం। ‘బ్లూం’ చోదయత్రీ నమః।

ఓం ‘‘చోదయత్రి’’ ఇతి మంత్రస్య। మధుచ్ఛంద ఋషిః। గాయత్రీ ఛందః।
సరస్వతీ దేవతా। ‘‘బ్లూం’’ ఇతి బీజ శక్తి కీలకమ్। మంత్రేణ న్యాసః।।

శ్లో।। అధ్యాత్మమ్ అధిదైవం చ దేవానాం సమ్యక్ ఈశ్వరీ
ప్రత్యగాస్తే వదంతీ యా, సా మాం పాతు సరస్వతీ।।
‘‘బ్లూం’’ చోదయత్రీ సూనృతానాం చేతంతీ సుమతీనామ్
యజ్ఞం దధే సరస్వతీ।।

ఏ వాణి సర్వజీవుల ఆత్మస్వరూపిణి అగుటచే ఆధ్యాత్మముగాను, సర్వదేవతాస్వరూణి అగుటచే అధిదైవముగాను, దేవతలకే ఆది - జన్మస్థానమగుటచే దేవదేవిగాను, సర్వజీవులలో స్వ-స్వరూపిణియై సమముగా విస్తరించి ఉండటంచేత సమ్యక్ ఈశ్వరిగాను, సర్వమునకు సాక్షిగా వేరుగా ఉండటంచేత ప్రత్యక్ రూపిణిగాను తత్త్వము ఎరిగిన విజ్ఞులచే అభివర్ణించబడుచున్నదో,…అట్టి శ్రీ సరస్వతీదేవి మమ్ములను (అజ్ఞాన భావముల నుండి) కాపాడునుగాక! మాయందు అసత్యత్వమంతా ఊడ్చివేసి, సత్యవాక్కులను ప్రేరేపించునట్టిది, ఉత్తమమగు సునిశిత - విస్తార - నిర్మల - పవిత్రబుద్ధులను తీర్చిదిద్దు చేతన స్వరూపిణియు, యజ్ఞరూపిణియు అగు ఆ సరస్వతీదేవి మమ్ములను యజ్ఞ నిష్ఠులుగా తీర్చిదిద్దును గాక!


5.) ఓం। ‘సౌః’ మహో అర్ణ నమః।

ఓం ‘‘మహో అర్ణ’’ ఇతి మంత్రస్య। మధుచ్ఛంద ఋషిః। గాయత్రీ ఛందః।
సరస్వతీ దేవతా। ‘‘సౌః’’ ఇతి బీజ శక్తి కీలకమ్। ఇష్టార్థే వినియోగః। మంత్రేణ న్యాసః।।

శ్లో।। అంతర్యామి ఆత్మనా విశ్వం త్రైలోక్యం యా నియచ్ఛతి,
రుద్ర - ఆదిత్యాది రూపస్థా యస్యాం ఆవేశ్యతాం పునః,
ధ్యాయంతి సర్వ రూపైకా సా మాం పాతు సరస్వతీ।।
సౌః మహో అర్ణః సరస్వతీ ప్రచేతయతి కేతునా థియో విశ్వా విరాజతి।।

ఏ దేవదేవి ఈ విశ్వంమతటికీ అంతర్యామి, విశ్వరూపిణి అయి, ఈ స్వర్గ - భూ - పాతాళ త్రిలోకములను, లోకపాలకులను, లోకాంతర్గత జీవప్రజ్ఞలను నియమించుచున్నదో…, రుద్రుడు, ఆదిత్యుడు మొదలైన సృష్టి శక్తి సంపన్నులగు దేవతలంతా కూడా ఏ దేవియందు తమ రూప నామములతో అంతర్గతులై ఉన్నారో, వారు శ్రీదేవిని ధ్యానము చేసి తిరిగి ఏ తత్త్వరూపముతో ఏకమగుచున్నారో.., అట్టి ‘‘స్వస్వరూపిణి - సర్వస్వరూపిణి’’ కూడా అయినట్టి శ్రీ సరస్వతీదేవి మా ధ్యాసలను తనవైపు త్రిప్పుకొనును గాక! మమ్ములను దృశ్యబంధ సంకుచిత భావాలనుండి పరిరక్షించునుగాక!
‘సౌః’ మహాతేజోరూపముతో జడమగు దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారములను ప్రచేతనముగా చేయుచున్నట్టిది. ఇచ్ఛా జ్ఞాన క్రియా రూప (కుండలినీ) సంజ్ఞ అయి యోగులకు ఆజ్ఞా, సహస్రారస్థానములలో దర్శనము ప్రసాదిస్తోంది. ఏ దేవి సర్వజీవుల బుద్ధులందు జ్యోతిస్వరూపంగా ప్రకాశమానము అయి ఉత్తేజపరచుచున్నదో …. అట్టి ‘‘సౌః’’ స్వరూపిణికి నమస్కారము.


6.) ఓం। ‘ఐం’ చత్వారి వాక్ నమః।

ఓం ‘‘చత్వారి వాక్’’ ఇతి మంత్రస్య। ఉచత్థ్య పుత్రో దీర్ఘ తమా ఋషిః। ‘త్రిష్టుప్’ ఛందః।
సరస్వతీ దేవతా। ‘‘ఐం’’ ఇతి బీజ శక్తి కీలకమ్। మంత్రేణ న్యాసః।।

శ్లో।। యా‘ప్రత్యక్’ దృష్టిభిః జీవైః వ్యజ్యమాన - అనుభూయతే
వ్యాపినీ జ్ఞప్తి రూపైకా సా మాం పాతు సరస్వతీ।।
‘‘ఐం’’ చత్వారి వాక్ పరిమితా పదాని తాని విదుః బ్రాహ్మణా యే మనీషిణః,
గుహా త్రీణి నిహితా నేంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి।।

ఏ విజ్ఞుడగు జీవుడైతే ఈ నామ రూపాత్మక వ్యవహారిక జగత్ దృశ్యమునకు ఆధారమై, పరమై, అప్రమేయమై, మార్పు చేర్పులకు లోను కానట్టిదగు తత్త్వమును మననముచేయుచున్నాడో, ఏ సర్వవ్యాపిని, జ్ఞప్తిరూపిణియగు దేవాదిదేవిగా తనకు అనుభూతమగుచున్నదో అతడే ధన్యుడు. జీవునియందు ప్రత్యక్ (జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు వేరైన) రూపంగా, వ్యాజ్యమానంగా (వ్యావహారికంగా) ఉంటూ, ‘జ్ఞప్తి’ రూపంగా ‘ఐం’ సంజ్ఞచే వేంచేసియున్నదో..,
అట్టి శ్రీ సరస్వతీ జగన్మాత మనలను సర్వదా వాత్సల్యముతో కాపాడును గాక! సంరక్షించును గాక!

చత్వారి వాక్ పరిమితా పదాని

(1) పర తురీయ పరమేశ్వరుడు అక్షరము
(2) పశ్యంతీ సుషుప్తి ఈశ్వరుడు శబ్దము
(3) మధ్యమ స్వప్న జీవుడు వాక్యము
(4) వైఖరీ జాగ్రత్ ప్రకృతి అర్థము

ఉత్తమ బుద్ధితో పరిశీలించనప్పుడు ‘వైఖరీ’ (దృశ్యతత్త్వము అగు ప్రకృతి) మాత్రమే జీవుల ఇంద్రియములకు విషయమై ప్రాప్తిస్తోంది. శ్రీ సరస్వతీ దేవిని ‘ఉపాసిస్తూ ఉన్న ధన్యునికి పర, పశ్యంతి, మధ్యమ - ఈ నాలుగిటి తత్త్వము సుస్పష్టము కాగలదు.

బ్రహ్మమును విని, తెలుసుకొని, ఉపాసించి, మమేకమైనట్టి బ్రాహ్మణులు ఈ నాలుగు పదములను ఎరిగినవారై, నాలుగవదగు తురీయమును మిగిలిన మూడు పదములలోను (జాగ్రత్ - స్వప్న - సుషుప్తులలో నిండి ఉన్న దానిగా) గమనిస్తున్నారు. బ్రహ్మజ్ఞులు - ఆ తురీయము (చతురీయము)నకు సాక్షిగా ఉన్నదానిని ‘ఐం’ (ఐదవది)గా వర్ణిస్తూ, ఆ ‘ఐం’ శబ్ద స్వరూపమే సరస్వతీతత్త్వముగా ఎరిగినవారై ఉపాసన చేస్తున్నారు. గానం చేస్తూ, మార్గాణ్వేషకులగు మనందరికీ ఎలుగెత్తి తెలియజేయుచున్నారు.

ఏ ఏకము - అఖండము అగు దేవేశి, ఆయా భేదములచే-ఎనిమిది విధములుగా (అష్టవిధ అపరా ప్రకృతిగా-పంచభూతములు, మనో - బుద్ధి - చిత్తములుగా) - వికల్పించబడుచున్నదో, (Being attributed and divisioned),
ఏ దేవీ తత్త్వము వాస్తవానికి సర్వకల్పనలకు ఆవల వేంచేసియున్నదో,….,
అట్టి శ్రీ సరస్వతీ దేవి మనలను సర్వదా అజ్ఞానదృష్టి నుండి విజ్ఞాన దృష్టికి నడిపించుచూ, కాపాడును గాక!

ఏ విధంగా కథారచయిత కథలో లేడో, కానీ-కథ ఆయన కల్పననుంచే వస్తూ ఉన్నదో.., కథకు ఆవల సర్వ కల్పనలకు సంబంధించనివాడో…శ్రీ సరస్వతీదేవి ఆ తీరుగా నిర్వికల్పము, అవ్యక్తము, వ్యక్తము కూడా! అట్టి నిర్వికల్ప - అవ్యక్త (సర్వము వ్యక్తీకరించుచూ తాను వ్యక్తములోని విభాగము కానట్టి) జగజ్జననీ! మమ్ములను సర్వదా వెంటనంటి ఉండి, అపమార్గములనుండి కాపాడవమ్మా!


7.) ఓం। ‘క్లీం’ యత్ వాక్ వదంతి నమః।

ఓం ‘‘యద్వాగ్వదంతి’’ ఇతి మంత్రస్య। భార్గవ ఋషిః। ‘త్రిష్టుప్’ ఛందః।
సరస్వతీ దేవతా। ‘‘క్లీం’’ ఇతి బీజ శక్తి కీలకమ్। మంత్రేణ న్యాసః।।

శ్లో।। నామజాత్యాదిభిః భేదైః అష్టధా యా వికల్పితా
నిర్వికల్పాత్మనా (అ)వ్యక్తా సా మాం పాతు సరస్వతీ।।
‘‘క్లీం’’ యత్ వాక్ వదంతి అవిచేతనాని రాష్ట్రీ
దేవానాం నిషసాద మంద్రా
చతస్ర ఊర్జం దుదుహే పయాంసి క్వస్విత్
అస్యాః పరమం జగామ।

క్లీం - ఏ దేవత యొక్క చైతన్య మహిమచే అచేతనము - జడము అగు కంఠనరముల నుండి వాయవు మొదలైన (చేతన రూపులగు) దేవతల క్రియలచే గొప్ప నిషాద - మంద్రరూపముగా పర - పశ్యంతి - మధ్యమ - వైఖరీ నాలుగు పదవిన్యాసములతో కూడిన శబ్ద సౌందర్యమంతా వెలువడుచున్నదో,… అట్టి సరస్వతీదేవి శబ్ద-శబ్దార్థములుగా కూడా వెలయుచున్నది. ఎక్కడికి వెళ్ళి ఆ తల్లిని దర్శించాలి? బ్రహ్మలోకమా? కాదు! ఆ దేవీ చైతన్యమే సర్వదేహాలలోని స్వరపేటికలలోను, దేహములందు అంతటా చేతన రూపమై వేంచేసి ఉన్నది. శబ్ద-అర్థ-పరమార్థ రూపిణి అయి మనకు సాక్షాత్కరిస్తోంది. అట్టి సర్వలోకనివాసినియగు చైతన్యరూపిణికి నమస్కారములు సమర్పిస్తున్నాము!


8.) ఓం। ‘సౌః’। దేవీ వాచమ్ నమః।

ఓం। ‘‘దేవీ వాచమ’’ ఇతి మంత్రస్య। భార్గవ ఋషిః। ‘త్రిష్టుప్’ ఛందః।
సరస్వతీ దేవతా। ‘‘సౌః’’ ఇతి బీజ శక్తి కీలకమ్। మంత్రేణ న్యాసః।।

శ్లో।। వ్యక్త-అవ్యక్త గిరిః సర్వే వేద ఆద్యా వ్యాహరంతి యామ్
సర్వకామ దుఘా ధేనుః సా మాం పాతు సరస్వతీ।
‘‘సౌః’’ దేవీం వాచమ్ అజనయంత దేవాః
తాం విశ్వరూపాః పశవో వదంతి,
సా నో మంద్రేషమ్ ఊర్జం దుహానా ధేనుః
‘‘వాక్’’ అస్మాన్ ఉపసుష్టుతైతు।

ఆ దేవి వ్యక్త-అవ్యక్త స్వరూపిణి. సర్వవేదముల వ్యక్త శబ్దములను, రహస్యార్థరూపమగు అవ్యక్తతత్త్వముగానూ కూడా ఏ దేవత గురించి చెప్పుచున్నాయో,… సర్వకామములు ప్రసాదించు కామధేనువు అగు ఆ సరస్వతీదేవి మనలకు ఎల్లవేళలా దిక్కయి, వెలుగై దారి చూపును గాక!

‘సౌః’….లోక శ్రేయోభిలాష ప్రవృత్తులగు దివ్యశక్తి స్వరూప దేవతలు ‘చిదగ్నిగుండము’ నుండి వాగ్దేవతా శబ్దచైతన్యమును జనింపజేయుచున్నారు. విశ్వములోనివారగు పశువులు (జీవులు) ఆ వాక్కును ‘అ’కారాది - ‘క్ష’కారాంత శబ్దములచే నిర్మితమైన పలుకుల రూపమున పలుకుచున్నారు. అట్టి వాణీ కామధేనువుచే ప్రసాదితమగు మంత్రము, బ్రహ్మ తత్త్వస్వరూపమగు ‘అన్నమ్’….అగు వేదాంత వాఙ్మయ శబ్దజాలము సర్వదా మా వాక్కును చేరినదై ఉండునుగాక! (అన్నమ్ = బ్రహ్మము)


9.) ఓం। ‘సం’। ఉత త్వ నమః।

ఓం ‘‘ఉత త్వ’’ ఇతి మంత్రస్య। బృహస్పతిః ఋషిః। ‘త్రిష్టుప్’ ఛందః।
సరస్వతీ దేవతా। ‘‘సం’’ ఇతి బీజ శక్తి కీలకమ్। మంత్రేణ న్యాసః।।

శ్లో।। యాం విదిత్వ అఖిలం బంధం నిర్మథ్యాఖిల వర్త్మనా
యోగీ యాతి పరం స్థానం సా మాం పాతు సరస్వతీ।
‘‘సం’’ - ఉత త్వః పశ్యన్ నద దర్శ వాచమ్,
ఉత త్వ శృణ్వన్ న శృణోతి ఏనామ్, ఉతో తు అస్మై తన్వా
అం వినస్రే జాయేవ పత్య ఉశతీ సువాసాః।

ఏ దేవీ తత్త్వమును తెలుసుకొనుటచే యోగి అన్ని మార్గములలోని బంధములన్నీ త్రెంచివేసి, ఏ పరస్థానమును చేరుచున్నాడో, అట్టి కేవలము - దివ్యము అగు పరత్మానంద స్వరూప స్థాన దేవతయగు శ్రీ సరస్వతీదేవి మాపై కరుణ, వాత్సల్యము ప్రసరింపజేసి కాపాడునుగాక! అక్కునకు జేర్చుకొనును గాక!

ఏదేవి కరుణించకపోతే,
💐 ఈ దృశ్యజగత్తంతా ఆ దేవీ స్వరూపమై ఉండి కూడా….జగత్తు మాత్రమే చూడగలంగాని దేవీ స్వరూపంగా చూడలేమో,
💐 శబ్దములన్నీ వాక్‌దేవతా రూపిణి స్వరూపమే అయినప్పటికీ మాటలను వినగలముగాని, వాటికి ఆధారమైన వాగ్దేవతను దర్శించలేమో….,
ఆ వాగ్దేవత - తీయ తీయటి మాటలతో సంతోషింపజేయు పతివలె - మా వాక్కును చేరి ఉండునుగాక! ఆ దేవి మా ప్రార్థనను, మాయొక్క ఉపాసనా శబ్దజాలార్థములను ప్రేమాస్పదయై స్వీకరించునుగాక! అట్లు స్వీకరించి, అతి రహస్యమగు తన సర్వాత్మతత్త్వమును గురువై విశదపరచునుగాక! బ్రహ్మతత్త్వమును మా బుద్ధికి సుస్పష్టపరచును గాక! ఆ తల్లి ప్రత్యక్షమై బోధించును గాక।


10.) ఓం। ‘ఐం’। అంబితమ నమః।

ఓం ‘‘అంబితమ’’ ఇతి మంత్రస్య। గృత్స్నమద ఋషిః। ‘అనుష్టుప్’ ఛందః।
సరస్వతీ దేవతా। ‘‘ఐం’’ ఇతి బీజ శక్తి కీలకమ్। మంత్రేణ న్యాసః।।

శ్లో।। నామ రూపాత్మకం సర్వం యస్యాం ఆవేశ్యతాం పునః
ధ్యాయంతి బ్రహ్మరూపైకా సా మాం పాతు సరస్వతీ।।
‘‘ఐం’’ - అంబితమే నదీతమే దేవితమే సరస్వతి,
అప్రశస్తా ఇవ స్మసి ప్రసస్తిమ్ అంబ న స్కృధి।।

నామ రూపాత్మకంగా కనిపిస్తూ వస్తున్నట్టి ఈ సమస్త జగత్తును ఏ దేవత సర్వదా ఆవేశ్య ఇయి (ఆవేశించినదై) ఉన్నదో…., ఇదంతా బ్రహ్మము రూపముగానే ఎవరిచేత తెలియజేయబడుచున్నదో…., అట్టి జగద్గురువు, ప్రేమమూర్తి, మాతృవాత్సల్య స్వరూపిణి, బ్రహ్మము అగు శ్రీ సరస్వతీదేవి మనకు సర్వదా రక్షకురాలై, బోధకురాలై, దిశానిర్దేశకురాలై మనలను నడుపునుగాక!
అమ్మా! జగదంబా! నీవే మమ్ములను పవిత్రము చేయు నదీ దేవతవు. ఓ దేవదేవీ! శ్రీ సరస్వతీ జగజ్జననీ! అంబా! మాపై కరుణ ప్రవహింపజేయుము. మాలోని అప్రశస్తమును (సంకుచితత్త్వమును) తొలగించి ‘పరబ్రహ్మతత్త్వ జ్ఞానకాంతి’ అనే ప్రశస్తత్వమును ఆవిష్కరించవమ్మా! అందులకై మీకు చేతులెత్తి మ్రొక్కుచున్నాము.


స్తుతి

చతుర్ముఖ ముఖాంభోజ వన హంసవధూః మమ
మనసే రమతాం నిత్యం, సర్వ శుక్లా సరస్వతీ।।

ఓ చతుర్ముఖ బ్రహ్మయొక్క ‘ముఖములు’ అనే పద్మపుష్పములుగల సరస్సునందు సంచరించు ఓ పరమహంస స్వరూపిణీ! ఓ సరస్వతీ దేవీ! తెల్లటి ప్రకాశముతో దీపించు తల్లీ! మమ మానసే రమతాం నిత్యమ్! నా మనోసరోవరములలో నిత్యము రమించవమ్మా! నీ ప్రేమాస్పద తెల్లని కాంతి పుంజములతో మా హృదయసరోవరములోగల చీకటిని పారత్రోలివేయి!

శ్లో।। నమస్తే శారదా దేవి। కాశ్మీరపురవాసిని।
త్వామ్ అహం ప్రార్థయే నిత్యం। విద్యాదానం చ దేహి మే।
అక్షసూత్ర అంకుశధరా। పాశ పుస్తక ధారిణీ।
ముక్తాహార సమాయుక్తా। వాచి తిష్ఠతు మే సదా।
కంబు కంఠీ సు తామ్రోష్ఠీ। సర్వాభరణ భూషితా।
మహా సరస్వతీ దేవీ, జిహ్వాగ్రే సన్నివేశ్యతామ్।।

శ్లో।। యా శ్రద్ధా ధారణా మేధా, వాగ్దేవీ। విధి వల్లభా।
భక్త జిహ్వాగ్ర సదనా। శమాదిగుణ దాయినీ।
నమామి యామినీనాథ రేఖాలంకృత కుంతలామ్।
భవానీం। భవసంతాప నిర్వాపణ సుధా నదీమ్।
యః కవిత్వం నిరాంతకం భుక్తీ ముక్తీ చ వాంఛతి,
సో అభ్యర్చ్య ఏనాం దశశ్లోక్య నిత్యం స్తౌతి, సరస్వతీమ్।।
తస్య ఏవం స్తువతో నిత్యం సమభ్యర్చ్య సరస్వతీమ్।
భక్తి శ్రద్ధాభియుక్తస్య షాణ్మాసాత్ ప్రత్యయో భవేత్।।
తతః ప్రవర్తతే వాణీ స్వేచ్ఛయా లలితాక్షరా।
గద్య పద్యాత్మకైః శబ్దైః అప్రమేయైః వివక్షితైః (విపక్షితైః)
అశ్రుతో బుధ్యతే గ్రంథః ప్రాయః సారస్వతః కవిః।।

ఓ శారదా దేవీ! కాశ్మీరపు వాసినీ! నమస్తే। నమస్తే। నమో నమః। నిన్ను ఎల్లప్పుడు జగత్ రూపిణిగా భావిస్తూ, ప్రార్ధిస్తూ మాయొక్క సర్వకర్మలు సమర్పిస్తున్నాము. ‘అజ్ఞానము’ అనే పేదరికములో మ్రగ్గుతూ ఉన్న మేము మిమ్ములను జ్ఞానభిక్ష అర్ధిస్తున్నాము! మాకు ఆత్మవిద్యను, దైవీ సంపదా అభ్యాసములను భిక్షగా ప్రసాదించు! విద్యా దానం చ దేహి మే!

ఒక చేతిలో రుద్రాక్ష జపమాలను, అంకుశమును, మరొక చేతితో పుస్తకమును ధరించినట్టి దేవీ! ముత్యాలహారము ధరించిన జననీ! నీవు ఎల్లప్పుడు నా వాక్కునందు నివసించమని ఆహ్వానము పలుకుచున్నాము. నెమలి కంఠము గలదానా! ఎర్రటి పెదిమలతో శోభిల్లు జననీ! సర్వ ఆభరణములు అలంకరించి ఉన్నదానా! హే మహాసరస్వతీ దేవీ! దయతో, కరుణతో, వాత్సల్యముతో నన్ను ఉద్ధరించటానికి, సర్వలోకములకు శుభ శాంతి ఐశ్వర్య ఆనందములు కలుగజేయటానికి నా నాలుకపై నివసించవలసినదిగా, సన్నివేశ్యమై ఉండవలసినదిగా నా ప్రార్థన, అభ్యర్థన!

ఏ దేవి అయితే
➤ శ్రద్ధ - మేధ - ధారణలను ప్రసాదించు దివ్యచైతన్య స్వరూపిణియో,
➤ వాక్కుకు దేవతయో, చైతన్య స్వరూపిణి ఆయి తల్లివలె మాటలను పలికించుచున్నదో,
➤ సృష్టికర్తయగు బ్రహ్మ దేవుని పట్టమహిషియో, సమస్త సృష్టికి శ్రీదేవియో,
➤ స్వభావం చేతనే భక్తుల నాలుక చివర ఎల్లప్పుడు ప్రేమాస్పదమగు భక్తి - జ్ఞాన - యోగ - విజ్ఞాన శబ్దముల, భావముల రూపముగా వికాసమును కలిగించుచున్నదో,
➤ చేతులెత్తి నమస్కరించినంతమాత్రముచేత శమము - దమము మొదలైన దివ్యగుణములను ప్రసాదించుచున్నదో….
అట్టి సరస్వతీ దేవికి నమస్కారము.

చంద్రరేఖలుగల కుంతలములను ధరించినట్టి భవానీ! భావనా స్వరూపిణీ! (ఈ జగత్తు నిజంగానే జగత్తుగా ఉన్నది …అనే) భావ బంధ సంబంధమైన సంతాపములను తొలగించు భావాతీత స్వరూపిణీ! అమృత నదీస్వరూపిణీ! భవ సంతాప నిర్వాపణ సుధానదీం। శ్రీ సరస్వతీ దేవీ! నమస్కారము! నమామి! నమోనమః! నమస్తే! నమస్కరోమి!

ఫలస్తుతి

ఎవ్వరైతే నిరాతంకమైన కవిత్వమును, సమృద్ధమగు భుక్తిని, అనునిత్యము-స్వాభావికము అను ముక్తిని కోరుకుంటారో, అట్టివారికి ఈ దశ శ్లోక పాఠము చక్కటి దివ్యమైన మార్గము. దశ శ్లోకములను తాత్పర్యార్థ సహితముగా నిత్యము పఠిస్తూ ఉండగా, శ్రీ సరస్వతీదేవి యొక్క కరణారసమును పొందగలరు.

ఈ విధంగా ఎవరు దశశ్లోకీ సరస్వతిని భక్తి - శ్రద్ధ తాత్పర్యపూర్వకంగాను, మహత్యపూర్వకంగాను ఉపాసిస్తారో, వారికి ఆరు (6) నెలల్లో అనిర్వచనీయమైన ‘ఆత్మవిశ్వాసము’ తనకు తానై మనస్సునందు వికసించగలదు. లలితాక్షరములతో కూడిన ‘వాణి’ స్వేచ్ఛగా హృదయమునందు, కంఠమునందు ప్రకాశమానమవగలదు. సాంస్కృతికములు, ఒక పక్షమునకు పరిమితము కానివి, సంస్కారయుక్తములు, వివేకియుక్తములు అగు గద్య - పద్యములు తమకు తామే హృదయమునందు ప్రవేశించి ఆతని పెదమల నుండి జాలువారగలవు. తాను చదువని, వినని గ్రంథములలోని సారవిశేషాలు కూడా…ఆతనియందు స్రవంతి వలె బయల్వెడగలవు. ఆతడు సారస్వత యుక్తుడగుచున్నాడు. అందరిలో శ్రేష్ఠుడు (కవి) అగుచున్నాడు.


ఈ విధంగా దశశ్లోకీ తత్త్వార్థ మహిమను శ్రీ అశ్వలాయన మహర్షి వివరించగా శ్రోతలగు ఋషి పుంగవులు పులకిత శరీరులైనారు. భక్తి పారవశ్యముతో శ్రీ సరస్వతీదేవిని నామ-రూపాత్మకంగాను, సచ్చిదానంద తత్త్వముగాను దశశ్లోకీవిధ విధానంగా స్తోత్రం చేస్తూ గానం చేయ సాగారు. వారి భక్తి పారవశ్యతకు సంతోషించినదై, జగన్మాతయగు శ్రీ సరస్వతీదేవి అక్కడ ప్రత్యక్షమైనది. అక్కడి భక్తజనులందరినీ అవ్యాజమైన ప్రేమతో, మధురాతిమధురమైన చిరునవ్వుతో పలకరించింది.


జగన్మాతౌవాచ :

ఓ బిడ్డలారా! ఋషి పుంగవులారా! విప్రవర్యులారా! గురు-శిష్య జనులారా! అస్మత్ వాత్సల్య - ఆనంద స్వరూపులారా! ఈ అశ్వలాయనమహర్షి చెప్పుతూ వస్తున్న శ్రీ సరస్వతీ దశశ్లోకీ శబ్ద - అర్ధ - ప్రతిపాదనమంతా పరమ సత్యము!

తనయొక్క విహిత కర్మలను నాకు సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో అర్చించిన జీవుడు నాచే ‘ఆత్మ విద్య’ను పొందినవాడై, సమస్త జన్మ-కర్మలకు మునుముందే స్వస్వరూపమై ఉన్న సనాతన స్వరూపమగు ‘బ్రహ్మము’గా సంతరించుకొనగలడు. వ్యష్టి - సమిష్టి ధర్మములను అధిగమించి సనాతనమగు ఆత్మస్వరూపియై, ‘సనాతన ధర్మి’ అయి ప్రకాశించగలడు. బ్రహ్మతత్త్వమును ఎరిగిన ‘బాహ్మణుడు’గా విరాజిల్లగలడు. ఇతి మంగళాశాసనమ్।

సత్-చిత్-ఆనంద రూపమగు పరబ్రహ్మమే నా నిత్య-సత్య-వాస్తవరూపము. నా చేతనే ఈ ఎదురుగా మీకు కనిపిస్తున్న సత్వ - రజో - తమో గుణ, నామ రూపాత్మక సామ్యరూపమగు ‘ప్రకృతి’ - క్రీడా వినోదరూపంగా - సృష్టించబడుచున్నది.
దర్పణము(Mirror) లో దృశ్యము కనిపించవచ్చుగాక! ‘‘దర్పణములో నా ముఖము చిక్కుకొని ఉన్నది కదా!’’ అని తలచి ఎవ్వడైనా తన ముఖము కొరకై దర్పణమునకు ముందు - వెనుక (లేక) దర్పణములో వెతుకుతాడా? లేదు కదా! దర్పణములో దృశ్యము లేకపోయినప్పటికీ, ‘ప్రతిబింబ న్యాయము’ చే మాత్రమే అగుపిస్తోంది కదా! అట్టిదే ఈ జగత్ దృశ్యము సుమా! ఇదంతా మనో దర్పణంలో కనిపించే ప్రతిబింబ మాత్రము.

అయితే,
దర్పణములో ఒకడు తన ముఖము తానే చూచుకొనుచున్న తీరుగా, ఆ ముఖము తనదే అయినట్లుగా,
💐 నిత్యసత్యమగు నేనే ప్రకృతి రూపిణిని కూడా!
💐 నాకు నేనే త్రిగుణరూపమగు సృష్టిగా వినోదినై భాసిస్తున్నాను.

ఈ విధంగా సృష్టితో ప్రదర్శనమగుచున్న సత్వ-రజో-తమో గుణములు నా భావనా చమత్కృతులే! నవలలో కనిపించే పాత్రల యొక్క గుణాలన్నీ నవలా రచయితయొక్క ఊహా చమత్కారాలే కదా! ఈ సమస్త జగత్-దృశ్యము నాయొక్క సంప్రదర్శనా చమత్కారమే! నాకు ఏదీ ఎక్కడా వేరైనది కాదు.

ప్రకృతినీ నేనే! ఆ ప్రకృతిని ఆస్వాదించుచున్న పురుషుడను కూడా నేనే! (I am the experiences as well as experiencer).

వాస్తవానికి ప్రకృతి - పురుషుడు (Experiences and Experiencer, Perceptions and perceiver, feelings and feeler) వేరు వేరు కాదు.

అందుచేత, ఏకస్వరూపిణగు నేను అనేకమును కల్పించుకుంటూ మరల ఇంతలోనే ఎప్పుడో ఆ అనేకమును నా ‘ఏకము’ నందు యథాతథంగా లయింపజేసుకుంటూ ఉంటాను. జలమునకు తరంగము వేరుకాని తీరుగా, బంగారమునకు ఆభరణము వేరుకానివిధంగా - ఈ సమస్త దృశ్యము నాకు వేరుకాదు. ఇదంతా నాయొక్క తేజోరూపమే!

ఒక కథా రచయిత ‘ఇప్పుడు నేను ఒక కథ వ్రాయాలి’….అనే ఆలోచన పొందుతీరుగా మొట్టమొదట నాయందు ‘సృష్టి అనే లీలను కల్పించాలి’….అనే ‘శుద్ధ సత్త్వ ప్రధానాంశ’ బయల్వెడలుతోంది. అంతకు ముందో! నేను నేనే అయి ఉండి ఉన్నాను. నా నుండి సృష్టి సత్త్వభావన….ప్రధమతరంగంగా బయల్వెడలుతోంది. అట్టి ప్రధమభావన నుండి సృష్టి సంకల్ప భావికుడగు అజుడు (బ్రహ్మదేవుడు) బయల్వెడలుచున్నారు. నానుండి సృష్టికర్త - సృష్టి భావన - సృష్ట్యనుభవి - సృష్టి చతుర్ముఖములుగా బయల్వెడలుచున్నాయి.

ఇంకా, నా నుండి ‘ఈశ్వరుడు, జీవుడు’ అను రెండు విశేషాలు మాయ చేత బయల్వెడలుచున్నాయి.

ఈశ్వరుడు ‘ఈ మాయ నాది కదా!’…అనే ఎరుక కలిగి ఉండటం చేత, ఆతడు సర్వజ్ఞత్వము కలిగి ఉంటున్నాడు. మాయ ఆతని స్వవశకములోని (own control) ఉపాధి. (Instrument under Eswara’s use).

మాయ = Vehicle. వాహనము.
ఈశ్వరుడు = Driver. చోదకుడు.

ఇక జీవుడో? ఆతనికి ఈ భౌతిక శరీరమే ఉపాధి. దేహ చోదకుడు. అయితే, ‘నేను మాయలో చిక్కుకున్నాను’ అను రూపముతో కూడిన కించిజ్ఞుడు.

నాయొక్క సత్త్వ ప్రధానమగు ప్రకృతియే ‘మాయ’ అను పేరుతో వేదాంత శాస్త్రము (తత్త్వశాస్త్రము)చే పిలువబడుచున్నది. అదియే కల్పన, ఊహ, భావన, మనస్సు మొదలైన పేర్లతో శాస్త్ర ప్రసిద్ధము.

యా మా - నాకు వేరుగా వాస్తవానికి లేకపోయినప్పటికీ, నాకు ద్వితీయమైనదిగా అనిపించుటమే మాయ.

నాయొక్క ఈశ్వరోపాధి మూడు (3) విలక్షణ - లక్షణములు కలిగి ఉన్నది.

(1) వశ్య మాయత్వము (మాయ తన వశమై ఉండటము)
(2) ఏకత్వము (తన కల్పనయొక్క రూపము తానే అయి ఉండటము)
(3) సర్వజ్ఞత్వము (తాను-తన ఉపాధుల ఉత్పత్తి, స్థితి లయములు-ఇవన్నీ తనకు వేరుగా ఎరిగి ఉండి, సాక్షియై దర్శిస్తూ ఉండటము)
అట్టి ఈశ్వరుడు అనేక నవలలను రచయించు గొప్ప రచయితవలె ఒక్కోసారి ఒక్కొక్క ఊహాపరంపరత్వము (Serial of thought) స్వీకరించుచు, ఆ సర్వమునకు సర్వదా వేరై ఉన్నాడు. నవలలోని ఏ పాత్ర యొక్క లక్షణాలు నవలా రచయితకు ఆపాదించలేముకదా!

దృష్టాంతంగా…..
❋ ఈ ఒక నవలలో తన్మయమై వ్రాస్తూపోతున్న సందర్భముల- జీవుడు - జగదనుభవము.
❋ అనేక నవలలు వ్రాయు నవలా రచయితగా ఈశ్వరుడు - మాయకు కర్త (మాయి).

ఇంకా కూడా మరికొన్ని ఈశ్వరత్వమును సంబంధించిన విశేషాలు:
(1) శుద్ధ సాత్త్వికత్వము
(2) సమిష్టి రూపత్వము
(3) జగత్ సాక్షి

ఇట్టి విశేషాలు కారణంగా…ఈశ్వరుడు కర్తుంవా, అకర్తుంవా చ, అన్యథా కర్తుమ్ ఈశతే।
(1) జగత్తుకు కర్త కాగలడు.
(2) జగత్తుకు అకర్త అయి ఉండగలడు.
(3) జగత్తును మరొకరీతిగా చేసివేయగలడు.

(నవలా రచయిత కథను ఎట్లా అయినా మలుపు త్రిప్పగలడు - అను విధంగా, ఒక నటుడు తనకు ఒక నాటకంలో తనకు ఇష్టమైతే నటించగలడు. లేదా, తనకు ఇష్టము లేకుంటే ఆనాటకంలో నటించడు-అనుతీరుగా)

జీవుడు ఒక నాటకము (జగన్నాటకము)లోని ఒక పాత్ర - ఆ పాత్రయొక్క లక్షణములతో మమేకమగుచుండగా, ఇక ఈశ్వరుడో?
✤ సర్వజ్ఞుడు (అనేక పాత్రలను నిర్వర్తించుటమును ఎరిగి ఉంటున్నవాడు).
✤ సమిష్టి భావకుడు.
✤ కేవల సాక్షి.

ఈ ఈ లక్షణముల చేతనే ‘ఈశ్వరుడు’ అని పిలవబడుచున్నాడు. నేనే జీవుడను। నేనే ఈశ్వరుడను కూడా। నేను పరాత్-పరమును।

మాయ

ఈశ్వరుడు ‘ఊహ’ను కల్పించుకొని, ఆ ఊహలో తన ఈశ్వరత్వమును ఏమరచి, అందులో తానే ఒక పాత్రధారి అయి ఆ ఊహలో అనేక ఉప - ఊహలతో తన్మయమై ఉండటమును ‘మాయ’ అని చెప్పుచున్నారు. అట్టి నా మాయ - రెండు (2) శక్తుల రూపముగా ప్రదర్శితమగుచున్నది.

జీవుని దృష్ట్యా చూస్తే…,
(1) జీవ - విక్షేప శక్తి (Constantly distracting from one idea to another, from one fondness to another etc.,)
(2) జీవ - (ఆవరణ) ఆవృత శక్తి : ఒక విశేషమును ఆవరించి ఉండి, ఆ విషయముతోను, సందర్భముతోను సంఘటనతోను, సంబంధముతోను మమేకమై ఉండటము. ‘‘నా పరిధి ఇంత మాత్రమే’’ - అని అనుకుంటూ ఉండటము.

(i) ఆవరించటం. ఒక విషయమును తాను ఆవరించినవాడై ఉండి ‘నేను ఇంతే, ఇంతవరకే!’ అని తలచటం తానుకొన్ని విషయములను ఆవరించి పరిమితమవటం. ప్రాపంచక ఆశయములనే గట్టిగా పట్టుకొని కాలమును గడుపుతూ ఉండటము.
(ii) ఆవరించబడి ఉండటం. కొన్ని దృశ్య విషయాలచే ఆవరించబడి (Having been covered), ఆతని జ్ఞానము అంతకు మించి చూడటానికి సిద్ధపడకపోవడం (Confining in between some beliefs, informations, situations, etc., and not prepared to examine, beyond worldly scenario).

ఈశ్వరమాయ దృష్ట్యా చూస్తే….,

ఈశ్వర మాయయొక్క విక్షేపశక్తి: విక్షేపశక్తి లింగాది బ్రహ్మాండాంతమ్ జగత్ సృజేత్। లింగము (అంతరంగము) - అను మూల ప్రకృతి నుండి బ్రహ్మాండము వరకు ఉన్నది ఈశ్వర విక్షేపణ శక్తి। ఒక నవలా రచయిత అనేక కథా - కథనములు కలిగిన వేరువేరైన నవలలను, ఆ నవలలలోని ప్రతి ఒక్కదానిలో వేరువేరైన స్వభావములు కలిగిన పాత్రలను కల్పించగలడు, ఆ పాత్రలను మధ్యమధ్యలో ముగించగలడు కూడా కదా! అట్లాగే నాయొక్క ఈశ్వర సంబంధిత మాయ నుండి లింగ (గుణ)భేదములతో కూడిన బ్రహ్మాండములు ఒకటి తరువాత మరొకటి బయల్వెడలుచూ ఉంటాయి. అదియే ఈశ్వర విక్షేపశక్తి. లింగ స్వరూపము (మూల / కేవల స్వరూపము) నుండి - బ్రహ్మాండానుభవము వరకు సమస్తము ఈశ్వర మాయయే!

ఈశ్వర మాయయొక్క ఆవరణశక్తి : ఈ ఆవరణశక్తి అంతరమున బాహ్యమున భేదము అనుభూతమగునట్లు చేయుచుండటము.

అంతర్ - దృక్ - దృశ్య యో భేదం : అంతరముగా దృక్ - దృశ్యము (చూచువాడు - చూడబడునది) ఈ రెండిటిని వేరు వేరుగా సంబంధమే లేనివైనట్లు చూచుచుండటము. అంతరమున గల మనో బుద్ధి చిత్త అహంకారములు, త్రిగుణములు, దృక్-దృశ్య-దర్శన సంస్కారములు - ఇవన్నీ ఈశ్వర - ఆవరణశక్తి మాయా రూపములే!

బహిశ్చ బ్రహ్మ-సర్గయోః : బాహ్యమున బ్రహ్మము - సర్గములను (సంసారమును) వేరు వేరైనట్లు చూపుతోంది. ‘‘ఇది నాకు బంధము. ఇది నాకు మోక్షము’’ - అను కల్పనలు.

సమస్త భేద దృష్టులు - బ్రహ్మముపట్ల భేద కల్పనలు - ఇవన్నీ బహిర్‌గత ఆవరణశక్తి రూపములే.

ఏదైతే ఆత్మతత్త్వమును ఆవరించి ఉన్నదో అద్దానిని ఆవృతశక్తి (లేక) ఆవరణశక్తి అంటున్నాము. అదియే నాయొక్క ‘అపరాశక్తి’ అని కూడా చెప్పబడుతోంది. అట్టి ఆవృతశక్తి (లేక) అపరాశక్తియే ‘సంసారము’ అనబడుదానికంతటికీ కారణము అయి ఉన్నది. అయితే ఆవరణ - అపరాశక్తి లింగ (గుణ) భేదములతో భాసిస్తున్నప్పటికీ, స్వతఃగా జడమై, అద్దాని ‘సాక్షి’ని, ‘చైతన్య స్వరూపిణి’ని అగు నాయొక్క సమక్షములో మాత్రమే భాసిస్తోంది. అనగా ఆత్మచైతన్యము యొక్క సమక్షములోనే లింగభేదరూపమగు అపరాశక్తి చైతన్యము పొంది ప్రవర్తించుచున్నది. స్వతఃగా చూస్తే అది జడము. కేవలమగు ఆత్మ మాత్రమే చైతన్యము.

ఆవరణ - విక్షేపరూప, జీవ - ఈశ్వర ‘‘మాయ’’ యొక్క ముఖ్య లక్షణములు:
1. నాచే స్వయం కల్పితము
2. స్వతఃగా చూస్తే అసత్తు.
3. క్రీడా - లీలా - వినోద రూపము
4. ఆత్మతత్త్వ స్వరూపిణినగు నాకు ‘అనన్యము’.
కేవలమగు ఆత్మనగు నాకు ఈ నాలుగు కూడా మాయా కల్పిత చతుర్ముఖములు.

జీవుడు

మరి ఈ ‘జీవుడు’ అనగా ఎవ్వరు? ఎక్కడ నుండి వచ్చాడు? ఈ ప్రయాణము ఎటు? ఈ విషయము వివరిస్తున్నాను. వినండి.

చిత్ + ఛాయా
బింబము + ప్రతిబింబము
సహజము - సందర్భము
ల సమావేశమే ‘జీవుడు’.

‘‘ఛాయా పురుషుడు’’ అనగా? వెలుగు ఆవల నీడయేగాని వేరైన ఉనికి అని కాదు. సహజ పురుషునికి (Original person) ఉనికి ఉన్నదిగాని ఛాయాపురుషునికి (Reflecting form) ఉనికి ఎక్కడిది? (అట్లాగే) ఎవరు జలమునకు ఈవలనే ఉండి, జలములోని ప్రతిబింబము తనదై ఉన్నాడో…ఆతనికి మాత్రమే ఉనికి ఉన్నది. అయితే, జలములోని ప్రతిబింబ రూపము (Feflecting form) నకు జలమునకు ఈవల గల బింబము కంటే (పురుషునికంటే) వేరైన ఉనికి ఉంటుందా? లేదు కదా!

కాబట్టి,
శ్లో।। చితిః ఛాయాత్ సమావేశాత్ జీవస్యాత్ వ్యావహారికః।
అస్య జీవత్వమ్ ఆరోపాత్ సాక్షిణ్యపి అవభాసతే।।

చిత్-ఛాయ (Original Form + Reflection) ల సమావేశమును వ్యావహారికంగా ‘జీవుడు’ అని పిలుస్తున్నాం. అనగా, నేను కేవలసాక్షిని. అట్టి నాయొక్క కేవల సాక్షిత్వము యథాతథమై ఉండగా, అద్దానియందు బంగారమునందు ఆభరణముల వ్యవహారమువలె, చిత్ - ఛాయా ఆరోపణత్వము రూపంగా జీవుడు - జీవత్వము (ఈశ్వరుడు)…ఈ రెండు అవభాసిస్తున్నాయి. (Just like reflection in water or mirror).

జలములో జలమే ఉన్నది గాని, ప్రతిబింబ వస్తువు వాస్తవానికి లేదు. ఒకడు జలములో తన ముఖము చూస్తున్నప్పటికీ, ఆతని ముఖము జలములో లేదు కదా! అట్లాగే నా యందు సర్వదా నేనే ఉన్నాను. నాకు వేరై జీవుడు లేడు. జగత్తు లేదు. ‘త్వమ్’ లేదు. ‘అహమ్’ లేదు. ‘ఈశ్వరుడు’ లేదు.

చైతన్యశక్తి యొక్క ‘విషయములను ఆశ్రయించి ఉండటం’ అనే ఆవృతత్వము చేత జీవుడు - ఈశ్వరుడు - జగత్తులు …. నామరూపాత్మకంగా ప్రతిబింబిస్తున్నాయి. ఈ జగత్‌లో కనబడే అనేక భేదవిషయాలన్నీ ‘ఆవృతత్వము’ అనే మాయశక్తి చేతనే కల్పితమగుచున్నాయి. ఆవృతౌతు వినష్టాయాం భేదే భాతే ప్రయాతి తత్। అట్టి ఆవృతత్వము తొలగిందా…చిత్-ఛాయా-భేదమంతా (జీవ- ఈశ్వర - జీవానుభవభేదమంతా) తొలగిపోగలదు. అట్టి ఆది శేష్యమగు నేనే ‘పరమాత్మ’ అను పేరుతో పిలువబడుతోంది.

చిత్-ఛాయ (బింబ-ప్రతిబింబ) భేదము వంటిదే సర్గము-బ్రహ్మము (సృష్టించబడినది-సృష్టికర్త)ల యొక్క భేదము కూడా! తథా సర్గ బ్రహ్మణోశ్చ భేదమ్ ఆవృత్య తిష్టతి। మాయ యొక్క ఆవృత్య శక్తి చమత్కారము చేతనే ద్రష్ట-దృశ్యము ‘వేరువేరైనవి వలే’ అగుపిస్తున్నాయి.

వాస్తవానికి బ్రహ్మము - సర్గము (సృష్టికర్త - సృష్టి) అనునవి రెండూ వేరువేరుగా లేవు. బ్రహ్మమే సృష్టి! సృష్టి బ్రహ్మమే అయి ఉన్నది. బ్రహ్మముయొక్క ‘స్వీయవికృతి’ రూపముగా ఏ శక్తి భాసిస్తోందో, అద్దాని స్వీయశక్తి చేత ఆవరణము (ఆవృతము) నశింపజేయబడుచున్నప్పుడు బ్రహ్మము - సర్గముల భేదము తొలగిపోవుచున్నది. అప్పుడు ‘సర్గము’ లేక ‘సంసారము’ అనే వికారము ‘మొదలే లేనిది’గా అగుచున్నది. ఏకమగు బ్రహ్మమే సర్వదా శేషించినదై ఉంటోంది. ‘సృష్టి’, ‘జీవుడు’, ‘ఈశ్వరుడు’….ఇటువంటివేవీ కూడా బ్రహ్మమునందుగాని, బ్రహ్మమునకు వేరుగా కానీ…లేవు’ - అను నిశ్చల నిశ్చయము స్వానుభవంగా ఆరూఢమగుచున్నది. ‘‘దృశ్యము లయించటము’’ - అనగా ఇక్కడ ఏదో నశించటము కాదు. దృశ్యము పరమాత్మ స్వరూపిణినగు నాకు అనన్యముగా స్వాభావికంగాను, కృతనిశ్చయంగాను, అచ్యుతముగాను అనిపించటము।

బ్రహ్మము సర్వదా యథాతథమై ఉండగా…అద్దానిగురించి బోధించటానికి సిద్ధమగుచున్న ఆధ్యాత్మశాస్త్ర (ప్రవచనములు) - బ్రహ్మముయొక్క పంచ - అంశలు (Five Artistic Appeareneces) కల్పించి, తత్త్వమును విశదీకరిస్తున్నాయి.

(1) అస్థి (ఉనికి A sense of ‘I am’ - I Exist).

(2) భాతి (ప్రకాశము - The feature of Enlightenment / function of knowing).

(3) ప్రియము (ఆనందోత్సాహము Keeping entertained and enjoying).

ఆద్య త్రయమ్ బ్రహ్మరూపమ్। ఈ మొదటి మూడూ కూడా నిశ్చలమగు బ్రహ్మముయొక్క మార్పుపొందనట్టి అంశలు.

(4) నామము (5) రూపము- జగద్రూపమ్ తతో ద్వయమ్। ఈ రెండు మార్పు చెందు స్వభావముగల జగత్‌దృశ్య సంబంధమైన అంశలు. అస్థి భాతి ప్రియములు నాయొక్క సహజ రూపము. నామ రూపములో, కల్పితము (లేక) ఆపాదితము.

(జగత్ = జనిస్తూ, గతిస్తూనే మధ్యకాలంలో ఉన్నట్లే కనిపిస్తున్నట్టిది).

బాహ్య - అభ్యంతర సమాధి - ఉపాసన

శ్లో।। ఉపేక్ష్య నామ - రూపే ద్వే సత్-చిత్-ఆనంద తత్పరః
సమాధిం సర్వదా కుర్యాత్ ‘హృదయే’వ - అథవా ‘బహిః’।

ఓ బిడ్డలారా! సర్వదా వేంచేసిఉన్న పరస్వరూపిణిగా నా గురించి గురువులు చెప్పుచున్నది విని, అర్థము చేసుకోండి. మీరు నాకు ఎందుకు అనన్యమో గమనించండి. జీవ-ఈశ్వర తత్త్వములు జనించు స్థానమగు పరమాత్మతత్త్వము చేరటానికి ఒకేసారి ఆశ్రయించవలసిన రెండు ఉపాయాలు మీకు ఇప్పుడు సూచిస్తున్నాను. వినండి.

  1. దృశ్య ఉపేక్షిత్వము - జగత్ దృశ్య సంబంధమై, కాలముతో జనించి కాలముతో నశించు స్వభావము కలిగినట్టి నామరూపములను ఉపేక్షించి ఉండటము.
  2. ఆత్మతత్పరత్వము - ఈ జగత్తు యొక్క, మీ సహజీవుల యొక్క, మీ యొక్క, నాయొక్క సత్ - చిత్ - ఆనంద తత్త్వమునందే తత్పరులై ఉండటము.

పై రెండు ప్రక్రియలతో కూడిన సమాధి అభ్యాసమును నిరంతరము బుద్ధితో నిర్వర్తిస్తూ ఉండండి. అట్టి అభ్యాసమును (1) ఇంద్రియములకు విషయమగుచున్న బాహ్యమునందును (2) మనో-బుద్ధి-చిత్త-అహంకారములతో కూడిన అంతరమునందు కూడా నిర్వర్తించువారై ఉండండి.

సత్-చిత్-ఆనంద అంశలనే సర్వదా ఆశ్రయిస్తూ ఇక నామ-రూప అంశలను,
💐 సందర్భ పరిమితమైనవిగాను (Merely Incidental / Incident related).
💐 సందర్భమును దాటి చూస్తే-అవి లేనట్టివిగాను (If seen beyond incident, Form and Name, donot infact exist).
-గా చూడండి.

నామ - రూపములు స్వతఃగా ఉండినట్టివి కావు. ‘ఉన్నాయోమే’ అని -అనుకోవటంచేతనే ఉంటున్నాయి.

ఇటువంటి దృష్టి - అవగాహనలను ఆశ్రయించి ప్రవృద్ధము చేసుకోండి.

ద్వివిధ సమాధి తీరులు

సవికల్పో నిర్వికల్పః సమాధిః ద్వివిధో హృది।

(1) సవికల్ప సమాధి (2) నిర్వికల్ప సమాధి - అనునవి హృదయములో రూపు దిద్దుకొను రెండువిధములైన సమాధులు.

(1) సవికల్ప సమాధి (External) : దృశ్య శబ్దాను భేదేన సవికల్పః పునః ద్విధా। దృశ్యము - శబ్దముల భేదము చేత ఈ సవికల్ప సమాధి రెండు తీరులైనవి.

ఈ చిత్తము ఏఏ కామములను (కోరికలను) కలిగి ఉన్నదో, ఆ తీరుగానే దృశ్యమును చూడటం జరుగుతోంది. అనగా, చిత్తములో ఉన్నదే దృశ్యముగా అనుభవమగుచున్నది. చిత్తములో లేనిదేదీ దృశ్యముగా ఫలదీకరించ జాలదు.

♠︎ 1. ఏదేది చూడబడుచున్నదో,….అది పరబ్రహ్మముగా భావనచేయటము.
♠︎ 2. చూచువానిని గమనించుచూ ఆ చూచువానినే పరబ్రహ్మముగా భావనచేయటము.
ఈ రెండూ సవికల్ప సమాధి యొక్క రెండు అంగములు.

ఈ దృశ్యము ‘జడము’. ద్రష్టయో ‘చైతన్యము’.

జడమగు ‘దృశ్యము’ను వదలి, చేతనుడగు ‘సాక్షి’ని ఎప్పటికప్పుడు - ఎడతెరపి లేకుండా ధ్యానిస్తూ ఉండటమే ‘సవికల్పసమాధి’.

ఈ విధముగా చేతనుడు, సత్‌చిత్ ఆనంద లక్షణుడు, జగత్ విషయములగు నామ-రూపములకు విలక్షణుడు అగు ‘సాక్షి’ని దర్శిస్తూ - వినుచూ - ధ్యానిస్తూ ఉండగా…, అప్పుడు ‘నేను’ అను శబ్దముయొక్క కల్పితార్ధము క్రమంగా వైతొలగుచూ, వాస్తవార్ధము అవగతము అగుచున్నది. అనుభూతమగుచున్నది. అనుక్షణికభావనముగా రూపుదిద్దుకొనుచున్నది.

♠︎ ‘నేను’ దృశ్యములో దేనికీ సంబంధించని అసంగ స్వరూపుడను. అంతేగాని దృశ్యములో ఒక వస్తువు వంటివాడిని కాను.
♠︎ సత్-ఆనంద స్వరూపుడను. అంతేగాని ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేనివాడను కాను.
♠︎ చిత్-ఆనంద స్వరూపుడను. కేవలమగు నాయొక్క ఎరుక ఎరుగబడేదానిచే-బోధించబడేది కాదు. మరి? ఎరుగబడే సమస్తముగా విస్తరించి ఉన్నట్టిది.
♠︎ ప్రకృతి-స్వభావములకు నేనే నియామకుడును.
♠︎ నన్ను నేనే నియమించుకొనుచున్నవాడను. అంతేగాని, నన్ను నియమించు మరొకటేదీ లేదు.
అని మీరు గ్రహించగలరు.

ఈ విధంగా ‘అహమ్’ స్వరూపమును ‘అసంగము, సచ్చిదానందరూపము, స్వయం ప్రభువు’ అని గ్రహిస్తూ ఉండటమును ‘సవికల్పసమాధి’ అని పిలుచుచున్నారు.

(2) నిర్వికల్ప సమాధి (Internal): సవికల్ప సమాధియొక్క ప్రియరూప కేవలాపేక్ష (constant liking) చేత, ఇక క్రమంగా దృశ్యముగాని, దృశ్యములో ఉన్నట్టి శబ్ద - స్పర్శ రూప-రస-గంధ-సంబంధ-అనుబంధ ఇత్యాది సర్వ విషయములపట్ల గాని, విశేషములపట్లగాని - ‘కావాలి! పొందాలి! లేకుంటే ఎట్లాగ?’ అనే రుచి కించిత్ కూడా రూపుదిద్దుకోనట్టి స్థితియే ‘నిర్వికల్పసమాధిస్థితి’.

దృష్టాంతానికి…,
నటుడు నాటకంలో నటిస్తూ, ‘‘పాత్రగా నాకు నాటకంలో ఉండగా, నాటకము నుండి ఇంకా ఇది - అది లభించాలి’’….అని అపేక్ష ఉంటుందా? పాత్ర ఏదైనా పొందితే తాను పొందునదేమున్నది? ఆ పాత్ర ఏదైనా (నాటకంలో) కోల్పోతే, లభించకపోతే, తనకు లాభించనిది ఏముంటుంది?
(1) ‘నిశ్చలదీపము వలె ‘నేను’ అను స్వస్వరూపబ్రహ్మముగా నిత్యానుభవశీలిగా ఉండటము,
(2) జగత్-దృశ్యములు దేహములు…ఇవన్నీ ఆ స్వస్వరూపజ్యోతి వెలుగులో కనిపించు వస్తు సముదాయము వంటిది అయి ఉండటము’….ఇది ‘నిర్వికల్పసమాధి’.

వెలుగులో వస్తువులు రంగు - రూపు కదలికలతో కనిపిస్తాయిగాని, వస్తువులు ఆ వెలుగును మరొకటిగా చేయలేవు కదా!

‘నాయొక్క ఆత్మ తేజస్సులో దేహాలు, దేహాంతర విశేషాలు, దృశ్య జగత్తులు నామరూపాత్మకమై అగుపిస్తూ ఉంటాయి. వాటన్నిటిచే ఆత్మ తేజస్సు పెరగదు. తరగదు’….అను ఎరుకయే నిర్వికల్పానుభవము.

అట్టివాడు ‘నిర్వికల్పసమాధిస్థితుడు’ అగుచున్నాడు. తాను తేజోరూపుడై, తదితరమైనదంతా తనచే వెలిగించునున్నట్టిదిగా దర్శిస్తున్నాడు. ‘ఆహం జ్యోతిః। మమ జ్యోతి ప్రకాశకమ్ ఇదమ్ సర్వమ్’ … అను పరాకాష్ఠ భావనయందు సునిశ్చలుడై ఉన్నవాడే ‘‘నిర్వికల్ప సమాధి నిష్ఠుడు’’. ఆతనికి ఈ జగద్దృశ్యమంతా స్వకీయ తేజో విభవముగా స్వానుభవమగుచున్నది.

ఇక మూడవదగు మరొక సమాధి గురించి కూడా బ్రహ్మానందతత్పురులగు మహనీయులు వర్ణించి చెప్పుచూ ఉంటారు. అది కూడా సందర్భోచితంగా సూచిస్తున్నాను. వినండి.

3వది - స్తబ్ధీభావ - రసాస్వాద సమాధి

ఇది పూర్ణ సమాధి స్థితికి ఒక మెట్టు వంటిది. హృదయమున - బాహ్యమున కూడా ఏదో ఒక వస్తువుపై (గురువు - ఇష్టదైవము….ఇటువంటి వేరైనా ఒక్కదానిపై) ఏకాగ్రతారూపమైనట్టి సమాధిని అభ్యసిస్తూ….
- ఇక్కడి వేరు వేరైనట్లుగా కనిపించేదంతా (నామరూపాత్మకమైనదంతా) స్ధబ్ద భావమునందు లయింపజేస్తూ…..
ద్రష్ట - దృశ్యములకు ఆధారముగా ఆవలము మునుముందుగానే ఉన్నట్టి ‘దృక్’తో దృష్టిని ఏకము చేసి ఉంచటమును ‘స్తబ్ధీభావరసాస్వాద సమాధి’ అని అంటారు.

(దృష్టాంతంగా - ‘‘అంతా రామమయం। కృష్ణమయం। విష్ణుమయం। శివమయం। ఇత్యాది ఏదో ఒక కేవల భావనం ఇది. క్రమంగా ఈ సమస్తము నా చేతననే మయమైయున్నది’’ - అని సిద్ధించగలదు).

ఈ విధంగా (1) సవికల్ప (2) నిర్వికల్ప (3) స్తబ్ధీభావ - I. బాహ్యమున II. అంతరమున అంతరమున 3 x 2 = ‘6’ విధములైన సమాధులను ఎప్పుడు ఎక్కడ - ఎంతెంతవరకు అవకాశము ఉన్నదో, అంతంతవరకు మీచే అభ్యసించబడుచుండును గాక!

ఓ ప్రియబిడ్డలారా! ఈ దేహికి దేహము ఇహంలో మోహము కలిగిస్తూ ఉన్నది. అందుచేతనే ఈతడు ‘నేను దేహపరిమితుడను! నాకు సంబంధించిన వివరములన్నీ ఈ దృశ్య జగత్తుకు మాత్రమే పరిమితము’ …అని స్వస్వరూపమునకు సంబంధించి ఒకానొక సంకుచిత భావమునకు చోటు యిస్తున్నాడు. ఎప్పుడైతే మీరు ఈ ‘దేహాభిమానము’ను దాటివేస్తారో, ఆ మరుక్షణమే మీయొక్క పరమగు పరమాత్మస్వరూపమును ఎరుగగలరు, ఆస్వాదించగలరు, తదేకమవగలరు.

ఎప్పుడు మీకు మీయొక్క అఖండ - అప్రమేయ పరమాత్మత్వము స్వానుభవమగుచున్నదో, ఇక అప్పటి నుండి మీ మనస్సు దేనిపై వ్రాలితే, అదంతా కూడా అమృతప్రాయము, ఆత్మానందమయము అవగలదు.

ఎప్పుడైతే అట్టి ‘పరావర దృష్టి’ ని మీరు సముపార్జించుకుంటారో…

శ్లో।।  భిద్యతే హృదయగ్రంథిః చిద్యంతే సర్వసంశయాః  
        క్షీయంతే చ అస్య కర్మాణి, తస్మిన్ దృష్టే పరావరే!

అప్పుడిక హృదయములో జన్మ - జన్మాంతరముల నుండి వెంటనంటి వస్తున్న దృశ్య - జీవ - ఈశ్వర - దేహ - జన్మ - కర్మ - బాంధవ్య సంబంధమైన - సర్వ చిక్కుముడులు (హృదయగ్రంథులు) తమకు తామే వీడిపోతాయి. విడివడతాయి.

💐 సర్వ కర్మ బంధములు వాటికవే త్రెగిపోతాయి.
💐 నటుడికి పాత్ర సంబంధమైన గుణ సందర్భ బంధములు తనవి కాని విధంగా వీగిపోతాయి.

ముక్తి

ప్రియపుత్రులారా! చివ్వరిగా ఒక ముఖ్య విషయము సిద్ధాంతీకరించుచున్నాను. చక్కగా విని, మీ పరస్వరూపము గురించి సుస్పష్టపరచుకొనెదరుగాక! వినండి.

మయి జీవత్వం - ఈశత్వం కల్పితమ్। వస్తు తో నహి! నాకు జీవత్వము - ఈశ్వరత్వము…ఈ రెండూ కూడా లీలావినోదంగా నాయొక్క స్వకీయ కల్పితములు మాత్రమే.
(జీవత్వము = ఒక దేహమునకు సంబంధించిన నేను’’. ఈశ్వరత్వము - అనేక దేహములు కల్పించుకొనుచున్నట్టి ‘‘నేను’’)
అవి వస్తుతః లేవు. ఇదియే మీపట్ల సత్యము కూడా।

జీవ-ఈశ్వరత్వములు - కల్పనచే ఏర్పడి, వికల్పనచే తొలగుచున్నాయి.

ఇతి యస్తు విజానాతి సముక్తో। న అత్ర సంశయః। ఇది ఎప్పుడైతే, ఎవరైనా సరే, గ్రహిస్తారో….వారు ముక్తస్వరూపులే!

ఇంతకుమించి వేరుగా బంధము లేదు. ముక్తి లేదు.


🙏 ఇతి శ్రీ సరస్వతీ రహస్య ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।