[[@YHRK]] [[@Spiritual]]

Suka Rahasya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


కృష్ణ యజుర్వేదాంతర్గత

26     శుక రహస్యోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। ‘ప్రజ్ఞాన’ - ఆది మహావాక్య రహస్య ఆది కళేబరమ్
వికలేవర కైవల్యం త్రిపాద్ ‘రామపదం’ భజే।।

‘ప్రజ్ఞానం బ్రహ్మ’ మొదలైన మహావాక్యముల రహస్య రూపము, వాచ్యార్థము, లక్ష్యార్థములను ఎరిగినవారమై కలనము తొలగి ఆది స్వరూపానుభవమగు కైవల్యము (కేవలీస్వరూపము) సిద్ధించుకోవటానికై త్రివిక్రమావ తారుడగు శ్రీరామచంద్రమూర్తిని భజించుచున్నాము.

ఓం
1. అథ అతో ‘‘రహస్యోపనిషదం’’
వ్యాఖ్యాస్యామో।
‘ఓం’ ప్రణవ - మంగళాచరణ పూర్వకంగా -
ఇప్పుడు ఇక మనము (శుకమహర్షియొక్క) ఆత్మతో సామీప్య రహస్యము గురించి వ్యాఖ్యానించుకుంటున్నాము.
దేవర్షయో బ్రహ్మాణం సంపూజ్య,
ప్రణిపత్య, పప్రచ్ఛుః।
భగవన్। అస్మాకం
రహస్య ఉపనిషదం బ్రూహి। ఇతి।।
(నారదుడు మొదలైన) దేవర్షులు ఒకరోజు సృష్టికర్తయగు బ్రహ్మదేవుని దర్శనార్ధమై బ్రహ్మలోకం వచ్చారు. జగద్గురువగు బ్రహ్మదేవుని భక్తితో పూజించి, ప్రణిపాతులై ఇట్లు ప్రశ్నించసాగారు.
భగవన్! తండ్రీ! బ్రహ్మదేవా! మాకు ఇప్పుడు విదేహముక్తుడగు శ్రీ శుక మహర్షి యొక్క ఆత్మజ్ఞాన విశేష వివరాణాత్మకమగు ‘‘శ్రీ శుక రహస్య ఉపనిషత్’’ - విషయము గురించి బోధించండి - అని అర్థిస్తున్నాము.
సో అబ్రవీత్
పురా వ్యాసో, మహాతేజాః,
సర్వవేద తపో నిధిః
ప్రణిపత్య శివం సాంబం
కృతాంజలిః ఉవాచ హ।।
బ్రహ్మ భగవానుడు : నారదాది దేవర్షులారా! చెప్పుచున్నాను. వినండి.
పూర్వము ఒక సందర్భంలో మహాతేజో సంపన్నుడు, సర్వవేద పారంగతుడు, తపోనిధి అగు వేదవ్యాస మహర్షి భగవానుడగు సాంబశివుని సమీపించి, కృతాంజులుడై నమస్కరించి, వారిని ఇట్లా అర్థించారు.
2. శ్రీ వేదవ్యాస ఉవాచ:
దేవ దేవ! మహాప్రాజ్ఞ!
పాశచ్ఛేద దృఢవ్రత!
శుకస్య మమ పుత్రస్య
వేద సంస్కార కర్మణి।।
శ్రీ వేదవ్యాస మహర్షి : హే దేవతలకే దేవుడైన దేవదేవా! మహాప్రాజ్ఞా! ‘‘జీవుల సంసార పాశములను ఛేదించివేయుట - అను వ్యాజమునందు దృఢవ్రతులగు స్వామీ! నా కుమారుడగు శుకుని ‘వేద సంస్కార కర్మ’ అగు బ్రహ్మోపదేశ సమయము సమీపించింది.
3. బ్రహ్మోపదేశకాలో అయం
ఇదానీం సముపస్థితః
బ్రహ్మోపదేశః కర్తవ్యో
భవతా ఆద్య-జగద్గురో!
హే జగద్గురూ! లోకగురూ! ఆది గురూ! దేవాది దేవా! మీ చేతననే నా కుమారుడైనట్టి శుకునకు బ్రహ్మోపదేశము నిర్వర్తించబడుటకై మిమ్ములను ప్రార్థన చేస్తున్నాను. అర్థిస్తున్నాను.
4. ఈశ్వర ఉవాచ:
మయా ఉపదిష్టే కైవల్యే
సాక్షాత్ బ్రహ్మణి శాశ్వతే।
విహాయ పుత్రో నిర్వేదాత్
ప్రకాశం యాస్యతి స్వయమ్।।
ఈశ్వర భగవానుడు : హే వేదవ్యాస మహర్షీ! అట్లాగే! సాక్షాత్ ‘‘శాశ్వత బ్రహ్మము’’ అను కైవల్యము గురించి బ్రహ్మోపదేశము చేస్తాను. అయితే, అప్పుడేమౌతుందో తెలుసుకదా! నీ పుత్రుడు ఇక- తండ్రి, కొడుకు మొదలైన సర్వ సంసార సంబంధములను దాటివేసి, నీ సన్నిధిలోనే స్వయమాత్మ ప్రకాశ సుసంపన్నుడు కాగలడు కదా! సరియేనా మరి?
5. శ్రీ వేదవ్యాస ఉవాచ:
యథా తథా వా భవతు హి ఉపనయన కర్మణి।
ఉపదిష్టే మమ సుతే బ్రహ్మణి త్వత్ ప్రసాదతః।।
6. సర్వజ్ఞో భవతు క్షిప్రం మమ పుత్రో, మహేశ్వర!
తవ ప్రసాద సంపన్నో, లభేత్ ముక్తిం చతుర్విధామ్।
వేదవ్యాసులవారు : తండ్రీ! పరమశివా! కరుణామూర్తీ! దయతో నా కుమారునికి మీరు ఉపనయన కర్మ సందర్భంగా జ్ఞానబోధ ప్రసాదించండి. నా కుమారుడు మీచే బ్రహ్మతత్త్వము ఉపనయన కర్మ ద్వారా ఉపదేశించబడును గాక! మీ ప్రసాదముచేత, అనుగ్రహముచేత నా కుమారుడు త్వరగా సర్వజ్ఞుడై సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్య - ‘చతుర్విధ’ ముక్తిని పొందటము నాకు సంతోషమే! అటు తరువాత ఏది ఎట్లా అయినప్పటికీ నాకు ఆనందమే! హే మహేశ్వరా! ఈతడు నన్ను విడచి వెళ్ళినా సరే!
7. తత్ శ్రుత్వా వ్యాస వచనం
సర్వ దేవర్షి సంసది, ఉపదేష్టుం
స్థితః శంభుః, సాంబో దివ్యాసనే ముదా।।
వేదవ్యాసుని సమాధానము వినిన శంభు భగవానుడు సంతోషించారు. ఆ సాంబశివులవారు శుకునికి ఉపదేష్టగా సంతోషంగా సుఖాశీనులైనారు. దేవర్షులు కూడా సమావేశమైయున్న సభలో బ్రహ్మోపదేశము ప్రసాదించారు. సవివరంగా బ్రహ్మము గురించి బోధించండి.
8. కృతకృత్యః శుకః తత్ర
సమాగత్య సుభక్తిమాన్।
తస్మాత్ స ప్రణవం లబ్ధ్వా
పునః ఇతి అబ్రవీత్ శివమ్।
పరమశివుని నుండి ఉపనయన సంస్కార - బ్రహ్మోపదేశము పొంది శుకుడు ధన్యుడైనాడు. భక్తితో ప్రణవ మంత్రార్ధమును ఎరిగినాడు. శివభగవానుని సమీపించి భక్తితో త్రిప్రదక్షిణ నమస్కారములు సమర్పించి ఈవిధంగా స్థుతించారు.
9. శ్రీ శుక ఉవాచ:
దేవాది దేవ! సర్వజ్ఞ! సత్-చిత్-ఆనంద లక్షణ।
ఉమా రమణ। భూతేశ। ప్రసీద కరుణానిధే।
శ్రీ శుకులవారు : హే పరమశివా! దేవాది దేవా! సర్వజ్ఞా! సచ్చిదానంద స్వరూపా! ఉమారమణా! భూతేశ! స్వామీ! నా ఈ సాష్టాంగ దండ ప్రణామము స్వీకరించండి! ఓ కరుణానిధీ! నా పట్ల దయతో ప్రసన్నులవండి.
10. ఉపదిష్టం పరంబ్రహ్మ
ప్రణవ-అంతర్గతమ్, పరమ్।
‘తత్ త్వమ్ అసి।’
ఆది వాక్యానాం ప్రజ్ఞాదీనాం విశేషతః।।
మహాత్మా! పరబ్రహ్మము గురించి చెప్పారు. ‘అ’కార - ‘ఉ’కార - ‘మ’కారములు విశేషములుగా కలిగిన ప్రణవము (ఓం) గురించిన (Finest Meaning) పరమార్థమును వివరించి యున్నారు.
‘తత్త్వమసి’ మొదలైన మహావాక్యముల తాత్త్వికార్ధము, వాటికి సంబంధించిన విశేషాలు, ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ ఇత్యాది గూఢార్ధములు మీరు బోధించగా తెలుసుకున్నాను.
11. శ్రోతుమ్ ఇచ్ఛామి తత్త్వేన
(షట్ (6) అంగాని) యథాక్రమమ్।
వక్తవ్యాని రహస్యాని
కృపయా ఆద్య, సదాశివ!
అయితే ప్రభూ! ఇంకా కూడా ‘బ్రహ్మోపదేశము’లో ఉదహరించబడిన ‘షట్ (6) అంగములు’, వాటి యథాక్రమార్థమును మీనుంచి వినాలని అభిలాషపడుచున్నాను. ఓ సదాశివా! ఇంకనూ నేను వినుటకు అర్హమైయున్న రహస్యములగు బ్రహ్మజ్ఞాన తత్త్వార్థములు నాకు బోధించమని వేడుకొనుచున్నాను. ‘తత్త్వమసి’ యొక్క షడంగన్యాసము వివరించండి.
12. శ్రీ సదాశివ ఉవాచ:
సాధు సాధు। మహాప్రాజ్ఞ!
శుక! జ్ఞాననిధే! మునే!
ప్రష్టవ్యం తు త్వయా పృష్టం
రహస్యం వేదగర్భితమ్।।
శ్రీ సదాశివ భగవానుడు : ఓ శుకదేవా! మహాప్రాజ్ఞా! సాధువులకే సాధూ! మునీశ్వరా! జ్ఞాననిధీ! నీవు అడిగిన విషయం నాకు చాలా సంతోషం కలుగజేస్తోందయ్యా! వేద గర్భితమైన పరమ రహస్యము గురించియే నీవు అడుగుచున్నావు. ‘తత్త్వమసి’ యొక్క అనుభవము సిద్ధించటానికై ఉపాయమైయున్న వేదాంతమార్గమైయున్న షడంగన్న్యాసము చెప్పుచున్నాను.
13. ‘రహస్యోపనిషత్’ నామ్నా
స ‘షడంగమ్’ ఇహ ఉచ్యతే,
యస్య విజ్ఞాన మాత్రేణ
మోక్షః సాక్షాత్। న సంశయః।।
నీవు వినాలని కోరుకున్న ‘షడంగము’ రహస్యోపనిషత్ అని పిలువబడుచున్నది. అట్టి షడంగ రహస్యోపనిషత్ తెలుసుకొన్న మాత్రం చేతనే జీవునకు సాక్షాత్ మోక్షము లభించగలదు. ఇందులో సందేహం లేదు. ‘‘నీవు’’ అను రూపంలో ఎదురుగా కనిపిస్తూ ఉన్నదంతా ‘తత్ పరమాత్మయే’ అను స్వానుభవము స్వాభావికము కాగలదు.
14. అంగహీనాని వాక్యాని
గురోః న ఉపదేశేత్ పునః ।
స షట్ (6) అంగాని ఉపదిశేత్
మహావాక్యాని కృత్స్నశః।।
1. ఋషి 2. ఛందస్సు 3. దేవత 4. బీజము 5. శక్తి 6. కీలకము - అనబడే ఆరు అంగములు లేకుండా ఉన్నట్టి వాక్యములు సద్గురువులు ఉపదేశించరు. ఉపదేశించరాదు. ఏ మంత్రమైనా ‘6’ అంగములతో పూర్తిగా కూర్చియే ఉపదేశిస్తారు. అట్లాగే, మహావాక్యములను కూడా గురువు షడంగయుక్తంగా ఉపదేశించాలి. శిష్యుడు ఉపాసించాలి. అప్పుడే ఉత్తమోత్తమ ప్రయోజనం.
15. చతుః (4) నామపి వేదానాం యథా ‘ఉపనిషత్’ శిరః,
ఇయం ‘రహస్యోపనిషత్’, తథా ఉపనిషిదామ్ శిరః।।
నాలుగు(4) వేదములకు వాటిలోని ఉపనిషత్తులే శిరస్సు వంటివి, సారము అయి ఉన్నాయికదా! అట్లాగే ఈ మనం చెప్పుకొంటున్న ‘రహస్యోపనిషత్తు’ - ఉపనిషత్తులన్నిటికీ శిరస్సు వంటిది, సారము అయి ఉన్నది.
16. రహస్య - ఉపనిషత్ బ్రహ్మ ధ్యాతం
యేన విపశ్చితా,
తీర్థైః, మంత్రైః, శ్రుతైః, జప్యైః
తస్య కిం పుణ్య హేతుభిః?
ఏ విపశ్చిత్తులు (విశేషణ పశ్చితః-ప్రాజ్ఞులు, దార్శినికులు, సారాసారములు ఎరిగినవారు) అయితే ఈ రహస్యోపనిషత్ ప్రతిపాదిస్తున్న ధ్యాన వస్తువగు పరబ్రహ్మము యొక్క ధ్యానవిధిని అనుసరించువారై ఉంటారో, వారికి ఇక తీర్ధ, మంత్ర, శ్రుత (వినికిడి, వేదమంత్ర పారాయణ), జపముల వంటి పుణ్య హేతువులతో పని ఏముంటుంది? బ్రహ్మజ్ఞాన ఫలము అన్నిటియొక్క ఆత్యంతిక ప్రయోజనం.
17. వాక్యార్థస్య విచారేణ,
యత్ ఆప్నోతి శరత్ శతమ్,
ఏకవార జపేనైవ ఋష్యాది ధ్యాన తశ్చ యత్।।
100 సంవత్సరముల ఆయుర్దాయం గడపి అనేక సార్లుగా ‘సోఽహమ్’ (తీర్థ - మంత్ర శ్రుతుల) పారాయణ - జపములు చేసిన ప్రయోజనము - ఋష్యాది షడంగములతో సహా, ఒక్కసారి షడంగన్న్యాసంగా మహావాక్యార్ధ ఉపాసన విచారణచే మానవునకు కలుగగలదు.
18. అస్య ‘శ్రీమహావాక్య’ మహామంత్రస్య,
‘హంస’ ఋషిః।
‘అవ్యక్త గాయత్రీ’ ఛందః।
‘పరమ హంసో’ దేవతా।
‘హం’ బీజం। ‘సః’ శక్తిః।
‘సోఽహమ్’ కీలకం।
మమ ‘పరమహంస’ ప్రీత్యర్థే,
‘మహావాక్య జపే’ వినియోగః।
షడంగ పూర్వక వివరణ : ఇప్పుడు ఇక ‘శ్రీ మహావాక్య’ మహామంత్ర జపారంభము:

హంస - ఋషి
అవ్యక్త గాయత్రి - ఛందస్సు
పరమహంస - దేవత
హం - బీజమ్
సః (పరమాత్మ) - శక్తి
సోఽహమ్ - కీలకమ్
‘పరమహంస’ల ప్రీతికొరకై సోఽహమ్ పరమమ్ సిద్ధికొరకై- ‘మహావాక్య’ జపము జపించటము ప్రారంభిస్తున్నాము.
‘సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ’
అంగుష్ఠాభ్యాం నమః।
‘నిత్యానందో బ్రహ్మ’
తర్జనీభ్యాగ్ం స్వాహా।
‘నిత్యానంద మయం బ్రహ్మ’
మధ్యమాభ్యాం వషట్।
‘యోవై భూమా’
అనామికాభ్యాం హుం।
కరన్యాసము
1. ‘‘సత్య జ్ఞానమనంతం బ్రహ్మ’’ అను అర్థమును బొటనవ్రేలునందు దేవతారూపంగా ఆహ్వానించి నమస్కరిస్తున్నాను.
2. ‘‘నిత్యానందో బ్రహ్మ’’ అను అర్థమును చూపుడు వ్రేలునందు దేవతాహ్వానము (స్వాహా) పలుకుచున్నాను.
3. ‘‘నిత్యానందమయం బ్రహ్మ’ - మధ్యమ వ్రేలులో(గా) దేవతల హవిస్సు సమర్పణ శబ్ధమగు ‘వషట్’ ఆహ్వానము పలుకుచున్నాను.
‘యోవై భూమాధిపతిః’
కనిష్ఠికాభ్యాం వౌషట్।
‘ఏకమేవ - అద్వితీయం బ్రహ్మ’
కరతలకర పృష్ఠాభ్యాం ఫట్।
4. ‘యోవై భూమా’ ఉంగరపు వ్రేలులో(గా) ఆహ్వాన శబ్దమగు ‘హుం’ తో సుస్వాగతిస్తూ ఆసన సమర్పణ చేస్తున్నాను.
5. ‘యోవై భూమాధిపతిః’ ను కనిష్ఠ వ్రేలులోనికి (గా) ఆహ్వానిస్తూ సమస్తమునకు అధిపతిగా భావిస్తున్నాను.
6. ‘ఏకమేవాద్వితీయా బ్రహ్మ’ను చేతి వ్రేళ్ళముందు వెనుక - ‘సమస్తము’ అయిన దేవిగా ఏకము, అద్వితీయము అగు బ్రహ్మమును ఉపాసిస్తున్నాను.
‘సత్యం జ్ఞానమ్ అనంతమ్ బ్రహ్మ’
హృదయాయ నమః।
‘నిత్యానందో బ్రహ్మ’ శిరసే స్వాహా।
‘నిత్యానందమయం బ్రహ్మ’
శిఖాయై వషట్।
‘యోవై భూమా’ కవచాయ ‘హుం’।
‘యోవై భూమాధిపతిః’
నేత్ర త్రయాయ వౌషట్।
‘ఏకమేవ అద్వితీయం బ్రహ్మ’
అస్త్రాయ ఫట్।
‘భూర్భువస్సువరోమ్’ ఇతి (భూ భువః సువః ఓం) దిగ్బంధః।
అంగన్యాసము
1. ‘‘సత్య జ్ఞానమనంతం బ్రహ్మ’’ గా హృదయములోనికి ఆహ్వానం పలికి నమస్కరిస్తున్నాము.
2. ‘‘నిత్యానందో బ్రహ్మ’’ గా శిరస్సునందు దేవతాహ్వానము.
3. ‘నిత్యానందమయం బ్రహ్మ’ - వషట్‌కారంగా శిఖయందు యోగోపాసన.
4. ‘యోవై భూమా’ గా (ఇంద్రియ) కవచ స్వరూపముగా స్థిరోభవము.
5. ‘యోవై భూమాధి పతిః’ త్రినేత్రధారుడగు యజ్ఞపురుషునికి ‘వౌషట్’
6. ‘ఏకమేవా ద్వితీయా బ్రహ్మ’ ను అనేకత్వము తొలగిస్తూ శిరస్సును చుట్టి ఉండు శబ్ద బ్రహ్మోచ్ఛారణ.
భూః - భువః - సువర్లోకముల స్వరూపుడుగా పరమాత్మను బుద్ధి కొరకై దిగ్బంధనము చేస్తున్నాను. (Unity of Matter, Thought and Divine Self)
ధ్యానం -
నిత్యానందం। పరమ సుఖమ్। కేవలం జ్ఞానమూర్తిం।
విశ్వాతీతం। గగన సదృశం। ‘తత్ త్వమ్ అసి’ ఆది లక్ష్యం।
ఏకం నిత్యం విమలం అచలం సర్వ ‘ధీ’ సాక్షిభూతం।
భావాతీతం త్రిగుణ రహితం
సద్గురుం తన్నమామి [తత్ (తన్) నమామి] ।।
‘సత్’ (ఉనికి) స్వరూప గురువు (మహత్తరమగు ఆత్మ) ధ్యానం
(భూత - వర్తమాన - భవిష్యతులను తన ఆనందము కొరకై కల్పించుకొనువాడు కాబట్టి) - నిత్యానందులు.
- పరము (ఆవల)గా ప్రకాశించుచున్న ఆత్మ సుఖ ప్రదాత,
- జ్ఞేయములకు (తెలియబడే అన్నిటికి) మునుముందుగా మూర్తీభవించుటచే కేవలం-జ్ఞానమూర్తి,
- ఈ విశ్వమునకు అతీతుడై (అత్యతిష్టత్ దశాంగులమ్) ఉండుటచే విశ్వాతీతులు.
- ఆకాశమువలె అనంతుడు, విషయాతీతులు.
- నీవుగా కనిపించేది అదియే, ‘తత్త్వమసి’ - ఇత్యాది మహావాక్యములు లక్ష్యముగా కలిగి ఉన్నవారు.
- ఏక స్వరూపుడు, నిత్యుడు, నిర్మలుడు, సర్వుల బుద్ధికి సాక్షీభూతుడైనవారు.

భావమునకు అతీతమై, మునుముందే ఉండి, భావమునకు ‘పుట్టినిల్లు’ అయినట్టిది, త్రిగుణరహితము అయినట్టిది అగు తత్ సత్ ఆనంద సద్గురువులు సర్వదేహములలో దేహిగా పరాకాష్ఠయగు సత్-ఆనంద స్వరూపులు అగు పరమాత్మకు నమస్కరించుచున్నాను.
19. అథ మహావాక్యాని చత్వారి (4)।
యథా…,
(1) ఓం ప్రజ్ఞానం బ్రహ్మ।
(2) ఓం అహం బ్రహ్మాస్మి।
(3) ఓం తత్ త్వమ్ అసి।
(4) ఓం అయమ్ ఆత్మా బ్రహ్మ।
‘తత్త్వమసి’ ఇతి అభేదవాచకం
ఇదం యే జపంతి,
తే శివసాయుజ్య ముక్తిభాజో భవంతి।
ఇప్పుడిక చతుర్ (4) మహావాక్యములు
1. ప్రజ్ఞయే బ్రహ్మము. ఏ తెలివిచే (లేక) ప్రజ్ఞచే తదితరమైనదంతా తెలియ బడుచున్నదో-అట్టి కేవలమగు ‘ప్రజ్ఞ’ బ్రహ్మమే! అదియే ‘ఓం’.
2. ఏదైతే జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు ఆధారంగా ‘నేను-నేను-నేను’ రూపముగా ప్రకాశమానమై యున్నదో, అట్టి ‘నేను’ బ్రహ్మమే! అదియే ‘ఓం’!
3. ‘నీవు’గా ఏది కనిపిస్తూ, అనిపిస్తూ ఉన్నదో, అదంతా తత్ బ్రహ్మమే! అదియే ‘ఓం’! నీవుగా కనబడుచున్నది బ్రహ్మమే!
4. ఈ జీవుడు బ్రహ్మమే. ఏది నాకు సంబంధించిన ‘జీవాత్మ’గా దృశ్యానుభవం పొందుచున్నదో, అట్టి ‘జీవుడు’ అనబడునది బ్రహ్మమే! అదియే ‘ఓం’.

ఎవ్వరైతే సర్వభేదములను దాటి జయించి - ‘‘నీవుగా కనిపిస్తున్నది నా ఉపాసనా తత్త్వమగు పరబ్రహ్మము యొక్క ప్రత్యక్ష రూపమే’’ - అను మనన జపము జపిస్తూ ఉంటారో (అనుకుంటూ, అనుకుంటూ ఉంటారో), అట్టివాడు శివసాయుజ్యము (శివోఽహమ్ స్థానము) పొంది, సర్వ బంధములనుండి విముక్తుడై ముక్తిభాజుడగుచున్నాడు. స్వయముగా ‘త్వమ్’తో అనన్యుడు అగుచున్నాడు. ‘అహమ్ బ్రహ్మ’ను స్వాభావికంగా సిద్దించుకుంటున్నాడు.
‘తత్’ పద మహా మంత్రస్య,
‘హంస’ ఋషిః।
‘అవ్యక్త గాయత్రీ’ ఛందః।
‘పరమ హంసో’ దేవతా।
‘హం’ బీజం। ‘సః’ శక్తిః।
‘సోఽహమ్’ కీలకమ్
మమ ‘సాయుజ్య ముక్తిః’ అర్థే (సాయుజ్య ముక్త్యర్థే )
జపే వినియోగః।
‘తత్’ పద మహా మంత్రము
(‘‘తత్త్వమసి’’ మహావాక్యములో ‘తత్’ పదము)
ఈ ‘తత్ పద’ మహా మంత్రమునకు
ఋషి - హంస. (సోఽహమ్)
ఛందస్సు - అవ్యక్త గాయత్రి.
దేవత - పరమహంస (సోఽహమ్ పరమమ్)
బీజము - హమ్ (అహమ్-‘సమస్తము నేనైన నేను’)
శక్తిః - సః (అన్ని నేనులు నేనైన నేను)
కీలకము - సోఽహమ్ ‘నేను’గా ఉన్నది పరమాత్మయే!
ఈ భావములన్నీ ‘తత్’పద జపమునందు వినియోగమగుచుండును గాక!
20. తత్పురుషాయ అం।। (అంగుష్ఠాభ్యాం) నమః।
ఈశానాయా త।। (తర్జనీభ్యాగ్ం) స్వాహా।
అఘోరాయ మధ్య।। (మధ్యమాభ్యాం) వషట్।
సద్యోజాతాయ అనా।। (అనిమికాభ్యాం) హుం।
వామ దేవాయ క।। (కనిష్ఠికాభ్యాం) వౌషట్।
తత్పురుష ఈశాన అఘోర సద్యోజాత
వామ దేవేభ్యోః నమః కర।। (కరతల కర పృష్ఠాభ్యాం) ఫట్।
ఏవం హృదయాది న్యాసః।
‘భూర్భువస్సువరోమ్’ (భూః భువః సువః ఓం)
ఇతి దిగ్బంధః।
‘‘తత్పురుషాయ’’ - అంగుష్ఠాభ్యాం నమః।
‘‘ఈశానాయ’’ - తర్జినీభ్యాం స్వాహా।
‘‘అఘోరాయ’’ - మధ్యమాభ్యాం వషట్।
‘‘సద్యోజాతాయ’’ - అనాహతాభ్యాం హుం।
‘‘వామదేవాయ’’ - కనిష్ఠికాభ్యాం వౌషట్।
‘‘తత్పురుష ఈశాన అఘోర సద్యోజాత వామదేవేభ్యో నమః - కరతలకరపృష్ఠాభ్యాం నమః - అస్త్రాయ ‘ఫట్’
పై వాటిచే హృదయాది (హృదయాయ నమః… మొదలైన) న్యాసము
భూ-భువర్-సువర్ త్రిలోకములను లోకేశ్వరియగు ఆత్మ దేవీ ఉపాసనా విశేషంగా దిక్-బంధము.
(ఉపాస్య దేవదేవి - స్థూల సూక్ష్మ కారణ ప్రదర్శనములు తనవైయున్న ఆది-పరా శక్తి స్వరూప-స్వస్వరూపి। సర్వస్వరూపి)
ధ్యానం - ‘‘తత్’’ పదము
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యాత్ అతీతమ్,
శుద్ధం బుద్ధం ముక్తమపి అవ్యయం చ,
సత్యం జ్ఞానం సత్-చిత్- ఆనంద రూపమ్,
ధ్యాయేదేవం (ధ్యాయేత్ ఏవం) తత్ మహోఅహ్రాజ మానమ్।।
ధ్యానం
‘‘తెలివి, తెలుసుకొనుచున్నట్టిది, తెలియబడునది’’ (Knowledge, Knower, that being known) - ఈ మూడింటికి అతీతమైనవాడు, పరమశుద్ధుడు, బుద్ధి తనదైనవాడు, నిత్యముక్తుడు, అవ్యయుడు, సత్యజ్ఞాన స్వరూపుడు, సత్-చిత్-ఆనంద ప్రత్యక్షుడు, తనయొక్క మహోరూపముచే సర్వే సర్వత్రా సర్వముగా వీహ్రాజమానుడు అగు తత్ పరమాత్మ దేవదేవుని ధ్యానించుచున్నాను.
‘‘త్వం’’ పదము
21. ‘త్వం’ పద మహా మంత్రస్య।
‘విష్ణుః’ ఋషిః।
‘గాయత్రీ’ ఛందః।
‘పరమాత్మా’ దేవతా।
‘ఐం’ బీజం । ‘క్లీం’ శక్తిః।
‘సౌః’ కీలకం।
మమ ముక్త్యర్థే జపే వినియోగః।
వాసుదేవాయ - అం।। (అంగుష్ఠాభ్యాం) నమః।
సంకర్షణాయ - త।। (తర్జనీభ్యాం) స్వాహా।
ప్రద్యుమ్నాయ - మధ్య।। (మధ్యమాభ్యాం) వషట్।
అనిరుద్ధాయ - అ।। (అనామికాభ్యాం) హుం।
వాసుదేవాయ - కని।। (కనిష్ఠికాభ్యాం) వౌషట్।
సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న
అనిరుద్ధేభ్యః - కర।। (కరతలకర పృష్ఠాభ్యాం) ఫట్।
(ఏవం హృదయాది న్యాసః।)
‘భూర్భువస్సువరోమ్’ - ఇతి దిగ్బంధః।
‘త్వం’ పద మహా మంత్రము
(‘తత్త్వమసి’ మహావాక్యములో ‘త్వం’ పదము)
మహామంత్రము - త్వం పదము।
ఋషి - విష్ణుభగవానుడు
ఛందస్సు - గాయత్రీ
దేవత - పరమాత్మా
బీజము - ‘‘ఐం’’
శక్తిః - ‘‘క్లీం’’
కీలకము - ‘‘సౌః’’
నాయొక్క సంసారబంధ విముక్తి కొరకై భావనచేసి వినియోగించు చున్నాను.
‘‘వాసుదేవాయ’’ - అంగుష్ఠాభ్యాం నమః।
‘‘సంకర్షణాయ’’ - తర్జినీభ్యాం స్వాహా।
‘‘ప్రద్యుమ్నాయ’’ - మధ్యమాభ్యాం వషట్।
‘‘అనిరుద్ధాయ’’ - అనామికాభ్యాం హుం।
‘‘వాసుదేవాయ’’ - కనిష్ఠికాయ వౌషట్।
సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధేభ్యః-కరతల కరపృష్టాభ్యాం నమః
(పై ‘కరన్యాసము’ తరువాత హృదయన్యాసము.)
ధ్యానమ్ - ‘‘త్వం’’ పదము
జీవత్వం సర్వభూతానాం,
సర్వత్ర అఖండ విగ్రహమ్।
చిత్త-అహంకారయం తారం
జీవాఖ్యం ‘త్వం’ పదం భజే।।
ధ్యానము
💐 సర్వజీవుల జీవనత్వ స్వరూపుడు,
💐 అఖండ విగ్రహుడు అయి, సర్వత్రా ప్రత్యక్షమై యున్నవాడు,
💐 చిత్త - అహంకారములను స్వసంకల్పితంగా కల్పన చేసి నియమించుచున్నట్టివాడు,
💐 ‘జీవుడు’ గా స్వీయ తత్త్వమునే సంప్రదర్శించువాడు - అగు ‘త్వం’ పరమ పురుష స్వరూపుని పదమును భజించుచున్నాను.
‘‘అసి’’
‘అసి’ పద మహామంత్రస్య। ‘మనః’ ఋషిః।
‘గాయత్రీ’ ఛందః। ‘అర్థనారీశ్వరో’ దేవతా।
‘అవ్యక్తాదిః’ బీజమ్। ‘నృసింహః’ శక్తిః।
‘పరమాత్మా’ కీలకమ్।
జీవ బ్రహ్మైక్యార్థే (జీవ-బ్రహ్మ ఐక్యార్థే) జపే వినియోగః।
‘అసి’ పద మహా మంత్రము
(‘తత్త్వమసి’ మహావాక్యములో ‘అసి’ పదము)
మహామంత్రము - అసి (అయి ఉన్నావు)
ఋషి - మనస్సు / మనువు
ఛందస్సు - గాయత్రీ
దేవత - అర్థనారీశ్వరి
బీజము - అవ్యక్తము
శక్తి - నృసింహుడు
కీలకము - పరమాత్మ
జీవ-బ్రహ్మముల ఏకత్వ/ఐక్యత కొరకై జప వినియోగమును ఉద్దేశ్యిస్తు న్నాను. జీవాత్మను బ్రహ్మమునకు అనన్యముగా ఉపాసించుచున్నాను.
పృథ్వీద్వ్యణుకాయ - అం।। (అంగుష్ఠాభ్యాం) నమః।
అబ్ద్యః (తు) అణు కాయ - త।। (తర్జనీభ్యాం) స్వాహా।
తేజోః (తు) అణు కాయ - మధ్య।। (మధ్యమభ్యాం) వషట్।
వాయుః (తు) అణు కాయ-అనా।। (అనామికాభ్యాం) హుం।
ఆకాశ తు అణు కాయ - కని।। (కనిష్ఠకాభ్యాం) వౌషట్।
పృథివిః - ఆపః - తేజో - వాయుః - ఆకాశాత్
అణు కేభ్యో నమః।
కర ।। (కరతల కరపుష్ఠాభ్యాం) ఫట్।
(ఏవం హృదయాది న్యాసః)
‘భూర్భువస్సువరోమ్’ ఇతి దిగ్భంధః।
‘‘పృధ్వి (భూమి) అణుకాయ’’ - అంగుష్ఠాభ్యాం నమః।
‘‘అబ్ద్య (జల) అణుకాయ’’ - తర్జినీభ్యాం స్వాహా।
‘‘తేజో (అగ్ని) అణుకాయ’’ - మధ్యమాభ్యాం వషట్।
‘‘వాయు’’ అణుకాయ - అనామికాభ్యాం హుం।
‘‘ఆకాశము’’ అణుకాయ - కనిష్ఠికాభ్యాం వౌషట్।
(పంచభూతములను తన ఏక అణు శరీరముగా కలిగియున్న పరమాత్మకు నమస్కారము)
పృథివి - జల - అగ్ని - వాయు - ఆకాశముల అణు స్వరూపమునకు నమస్కరిస్తూ
కరతల కర పృష్ఠాభ్యాం నమః। భూ - భువర్- సువర్ త్రిలోకములను పరమాత్మరూపముగా దిగ్భంధనము చేయుచున్నాను.
ధ్యానమ్ - ‘‘అసి’’
జీవో బ్రహ్మేతి వాక్యార్థమ్
యావత్ అస్తి మనః స్థితిః,
ఐక్యం తత్త్వం లయే కుర్వన్
ధ్యాయేత్ ‘అసి’ పదం సదా!
ఏవం మహా వాక్య షట్ (6) అంగాని ఉక్తాని।।
ధ్యానము
‘‘ఈ జీవుడు బ్రహ్మమే! బ్రహ్మమే జీవుని వలె అజ్ఞాన దృష్టికి అనిపిస్తోంది’’ - అను వాక్యార్థము స్వాభావసిద్ధంగా అనిపించే ‘మనో సిద్ధి’ (అకృత్రిమంగా బుద్ధికి నిశ్చయము) లభించే వరకు - ‘‘జీవ బ్రహ్మైక్యము’’ అను లయ తత్త్వరూపమగు ‘అసి’ - అగు పదమును నిరంతరము ధ్యానించుచున్నాను.
ఈవిధంగా మహావాక్యముల షట్ (6) అంగముల ఉపాసన ఆత్మజ్ఞులచే చెప్పబడుచున్నది.
అథ ‘రహస్యోపనిషత్’ విభాగశో
వాక్యార్థ శ్లోకాః ప్రోచ్యంతే।
యేన ఈక్షతే, శృణోతి ఇదం,
జిఘ్రతి, వ్యాకరోతి చ,
స్వాదు - అస్వాదు విజానాతి
తత్ ‘ప్రజ్ఞానమ్’ ఉదీరితమ్।।
ఇక ‘రహస్యోపనిషత్’ లోని తరువాత విభాగంగా వాక్యార్థములు చెప్పు శ్లోకములు చెప్పుకుంటున్నాము.

ప్రజ్ఞానం
ప్రజ్ఞానము=ఈ జీవుడు దేనిచేత (వలన) చూస్తున్నాడో, వినుచున్నాడో, వాసన చూస్తున్నాడో, (ఆలోచనలచే) విస్తరిస్తున్నాడో, వ్యవహరిస్తున్నాడో విభజన చేస్తున్నాడో - అదియే ‘ప్రజ్ఞానము’ అను శబ్దముతో ఉద్దేశ్యించ బడుతోంది. అట్టి ప్రజ్ఞానము బ్రహ్మమే. ప్రజ్ఞానమే బ్రహ్మము.
22. చతుర్ముఖ - ఇంద్ర - దేవేషు,
మనుష్య అశ్వ గవాదిషు
చైతన్యమ్ ఏకమ్ బ్రహ్మ
అతః ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ మయ్యపి।
ప్రజ్ఞానం బ్రహ్మ (అహమస్మి)
ఈ సృష్టికి కర్తయగు చతుర్ముఖ బ్రహ్మయందు, త్రిలోకాధిపతియగు ఇంద్రుని యందు, సృష్టిని నిర్మించి నడిపించు అభౌతిక రూపులగు దేవతలయందు, భౌతికరూపులగు మనుష్యులందు, గుర్రములు, పశువులు మొదలైన సర్వజంతు, కీటక, వృక్షజాలమునందు ఏ చైతన్యము ఏకరూపమై ప్రకాశించుచున్నదో, ఆ ఆఖండ చైతన్యమే బ్రహ్మము. ప్రజ్ఞానము కూడా బ్రహ్మమే! నాయందలి ప్రజ్ఞ బ్రహ్మమే! నేను ప్రజ్ఞాన స్వరూప బ్రహ్మమే అయి ఉన్నాను. బ్రహ్మము నుండి పురుగు వరకు జగదనుభవమంతటికీ ‘సాక్షి’ అయి ఉన్నదే ‘నేను’.
పరిపూర్ణః పరాత్మ
అస్మిన్ దేహే విద్యాధికారిణి,
బుద్ధేః సాక్షితయా స్థిత్వా
స్ఫురన్ ‘అహమ్’ ఇతి ఈర్యతే।
అహమ్
ఆత్మ జ్ఞాన సాధనకు మహత్తరంగా ఉపయుక్తమగుచున్న ఈ భౌతిక దేహమునంతా ఆక్రమించి ‘నేను’ను, స్ఫురింపజేస్తూ ఉన్నదో, బుద్ధికి సాక్షిగా ప్రత్యక్షమైయున్నదో, అదియే - పరిపూర్ణము (Complete by itself), పరాత్మ (That which is beyond all) అగు - ‘అహమ్’, అహమ్ బ్రహ్మాస్మి!
స్వతః పూర్ణః పరాత్మ అత్ర
‘బ్రహ్మ’ - శబ్దేన వర్ణితః।।
బ్రహ్మము -
ఏది స్వతః సిద్ధమో (It exists by itself), పూర్ణమో(Complete by itself), జీవ-జగత్తులను కలుపుకుని సంపూర్ణమై యున్నదో, బుద్ధికి సాక్షియో, సర్వమై, పూర్ణమైయున్నదో అదియే ‘బ్రహ్మము’ అను శబ్దముతో అభివర్ణించబడుతోంది.
‘అస్మి’ ఇతి ఐక్య పరామర్శః,
తేన ‘బ్రహ్మ’ భవామి అహమ్।
ఏకమేవ అద్వితీయం సత్
నామ రూప వివర్జితమ్,
సృష్టేః పురాధునాపి అస్య
తాదృక్త్వం ‘తత్’ ఇతి ఈర్యతే।
అస్మి -
‘అహం బ్రహ్మాస్మి’ అను మహావాక్యములో ‘అస్మి’ - జీవ-బ్రహ్మముల ఐక్యము (ఏకత్వము) తెలుపుచున్నది. అట్టి పరామర్శచే ‘‘అహమ్-నేను’’ - ‘‘బ్రహ్మమే’’ అయి ఉన్నాను - అనునది నిరూపితము.
ఏదైతే ‘సృష్టి’ అను అనుభవమంతటికీ మునుముందే ఏకము- అద్వితీయము అయి, నామ రూప వివర్జితమై (నామ రూపములే లేనిదై) - ‘సత్’ (కేవలమగు ఉనికి)గా ఉండి ఉన్నదో, అది (అస్య) ‘తత్’ పదముగా చెప్పబడుచున్నది. అద్దాని స్వానుభవమే, అద్దాని సర్వత్రా సందర్శనమే ‘తత్‌పదము’. (బ్రహ్మమే నా స్వాభావిక స్వరూపము).
23. శ్రోతుః దేహ-ఇంద్రియాతీతం
వస్తు అత్ర ‘త్వం’ పద ఈరితమ్।
ఏకతా గ్రాహ్యతే ‘అసి’ ఇతి।
తత్ ఐక్యమ్ అనుభూయతామ్।
స్వప్రకాశ-అపరోక్షత్వమ్
‘అయమ్’ ఇతి ఉక్తితో మతమ్।
తత్ త్వమ్ అసి
త్వమ్ - ‘నీవు’ను చూస్తున్నప్పుడు ఏ వస్తుతత్త్వము శబ్ద స్పర్శ రూప రస గంధములకు, దేహ-ఇంద్రియములకు ‘అతీతం’గా ఉన్నదో అదియే (మహావాక్యములోని) ‘త్వమ్’ యొక్క పరమార్ధము, అర్థము.
అసి - ఏకమగు బ్రహ్మముగా గ్రహిస్తూ ఉంటే (‘నీవు’గా కనిపిస్తున్నదంతా సర్వదా ఏకమగు బ్రహ్మమే - అని అనుకుంటూ ఉంటే) - ‘అసి’ అనురూపము గల జీవ-బ్రహ్మైక్యము అనుభూతమగుచున్నది.

అయమాత్మా బ్రహ్మ
అయమ్ - ఆత్మ స్వయం ప్రకాశము. ప్రత్యక్ష - పరోక్షములకు వేరైన అపరోక్షము (ఎదురుగా వస్తువు కాదు. ఎక్కడో ఉన్నది కాదు) - అను అర్ధము చెప్పబడుతోంది. అట్టి ఈ జీవాత్మ బ్రహ్మమే.
అహంకారాది-దేహాంతం (అహంకార ఆది-దేహ అంతమ్)
‘ప్రత్యగాత్మా’ ఇతి గీయతే।
దృశ్యమానస్య సర్వస్య
‘జగతస్సత్త్వమ్’ (జగతః సత్త్వమ్) ఈర్యతే।
‘బ్రహ్మ’ శబ్దేన తత్ బ్రహ్మ
స్వప్రకాశ ఆత్మ రూపకమ్।।
అనాత్మ దృష్టేః అవివేక నిద్రామ్,
‘అహమ్-మమ’ స్వప్నగతిం గతోఽహమ్।
స్వరూప సూర్యే అభ్యుదితే స్ఫుటోక్తేః,
గురోః మహావాక్యపదైః ప్రబుద్ధః।।
ప్రత్యగాత్మ - అహంకారము మొదలుగా గలిగినది, ఈ స్థూల దేహము చివ్వరిగా కలిగి ఉన్నదియే ప్రత్యగాత్మ. దృశ్యమానమగు సర్వ దృశ్య జగత్తుగా ఉనికి ‘స్వరూపిణి’ - అని చెప్పబడుతోంది ప్రత్యగాత్మ.
తత్ - స్వయం ప్రకాశకము, సర్వమునకు ఆత్మరూపకము - అయినట్టిదే ‘తత్’ అనబడు బ్రహ్మము.

ప్రబుద్ధము - జగత్తును ‘ఆత్మదృష్టి’తో కాకుండా ఆత్మకు వేరైన దృష్టితో చూస్తూ ‘నాది-నేను’ అను స్వప్నలోకంలో విహరిస్తూ ఉన్నాను.

వివేకము - గురువుయొక్క మహావాక్యములు (తత్ త్వమ్, సోఽహమ్, జీవో బ్రహ్మేతి నాపరః-ఇత్యాది వాక్యముల) ప్రభావముచే స్వస్వరూప సూర్యుడు ఉదయిస్తూ ఉండగా చీకటి రాత్రి తొలగి భళ్ళున తెల్లవారు చున్నది. ప్రభుద్ధుడగుచున్నాను. ఈ సమస్తమును నాలోని నేనైన నేనుగా పరమానంద దర్శనము చేస్తున్నాను.
24. వాచ్యం లక్ష్యమ్ ఇతి
ద్విధ అర్థసరణీ।
వాచ్యస్య హి ‘త్వం’ పదే।
వాచ్యమ్ భౌతికమ్ ఇంద్రియాదిరపి,
‘త్వం’ పదముల అర్ధములు రెండు తీరులైనవి. (1) వాచ్యార్ధము (2) లక్ష్యార్థము.

‘త్వం’ యొక్క వాచ్యార్థము : పాంచభౌతికమైన కాళ్ళు-చేతులు కలిగిన దేహము, ఇంద్రియములు, అంతరింద్రియములు లౌకిక విశేషములు మొదలైనవి.
యత్ లక్ష్యం ‘త్వం’ అర్ధశ్చ ‘సః’।
వాచ్యం తత్ పదమ్ ఈశతాకృతమ్
అతిర్లక్ష్యం తు (ఆకృతమతిర్లక్ష్యం తు)
సత్ చిత్ సుఖ ఆనంద బ్రహ్మ
తదర్థ ఏష చ, తయోః
ఐక్యం త్వ అసి - ఇదమ్ పదమ్।।
‘త్వమ్’ ఇతి ‘తత్’ ఇతి
కార్యే-కారణే ‘సత్’ ఉపాధౌ
ద్వితయమ్ ఇతరథా ఏకం
‘‘సత్-చిత్-ఆనందరూపమ్’’।।
‘త్వం’ యొక్క లక్ష్యార్థము : పరమ లక్ష్యము. ఈశ్వరసంబంధమగు ‘తత్’ పదము.
సత్ - చిత్ - సుఖ ఆనంద బ్రహ్మము.
తత్ తాత్త్వికార్థము.
‘‘తత్ - త్వమ్ - అసి’’.
అదియే నీవు అయి ఉన్నావు. పరబ్రహ్మమే నీవు’’ .
అసి = తత్ త్వమ్‌ల కలయిక.
త్వమ్ = నీవు. తత్ = అది. ఈ రెండూ అభేదమే అయి ఉండి కూడా - కార్యకారణ రూప ఉపాధి వలన వేరువేరైనట్లు అగుపిస్తోంది. ఆ రెంటి కార్య-కారణ భేదం విచారణచే తొలగిస్తే (లేక) తిరస్కరిస్తే - అద్వితీయ సచ్చిదానంద బ్రహ్మమే అఖండమై, అద్వితీయమై యున్నది - అని అనుభవమవగలదు.
ఉభయ వచన హేతూ, దేశ-కాలౌ చ హిత్వా,
జగతి భవతి సో-యమ్, దేవచత్తో యథా ‘ఏకః’।
కార్య-ఉపాధిః అయం జీవః।
కారణ-ఉపాధిః ఈశ్వరః।
కార్య-కారణతాం హిత్వా
పూర్ణబోధో అవశిష్యతే।
‘దేవదత్తుడు’ అనువాడు ఒక్కడే అయినప్పటి దేశ-కాలములచే (ఆ ఊరి వాడు, ఆ ఊరిలో ఉన్నాడు. ఆతడు బాలుడు, యువకుడు, ముదుసలి వాడు మొదలైనవిగా) భేదముగా చెప్పబడుచున్నాడు. తాత, తండ్రి, కొడుకు, మిత్రుడు మొదలైన భేదమదృష్టులచే చూడబడుచున్నాడు.
కార్య ఉపాధిగా - ఈ జీవుడు, కారణ ఉపాధిగా - ఈశ్వరుడు, కార్య-కారణములను తిరస్కరించి, దూరంగా వదలివేస్తే, అప్పుడు ‘నీవు’ అనువాడు (దేవదత్తుడు) - పూర్ణబోధ స్వరూపుడుగానే శేషిస్తున్నాడు.
శ్రవణం తు గురోః పూర్వం।
మననం తదనంతరమ్।
నిదిధ్యాసనమ్ ఇతి ఏతత్
పూర్ణబోధస్య కారణమ్।
అన్యవిద్యా పరిజ్ఞానమ్
అవశ్యం నశ్వరం భవేత్।
ముందుగా ‘కోఽహమ్ - నేను ఎవ్వరు?’ అను పరిప్రశ్నతో, ప్రణిపాతి అయి సద్గురువును ఆశ్రయిస్తే, ఆయన - ‘తత్ త్వమ్ అసి’ మహా వాక్యార్థమును బోధిస్తున్నారు. ఇది శ్రవణం. గురువాక్య మహావాక్యార్ధాన్ని గ్రహించి ముముక్షువు స్వయముగా తన స్వరూపము గురించి ఏకాంత విచారణ చేయాలి. ఇది మననము. ఈవిధంగా శ్రవణ - మననములు చేసిన తరువాత అదియే తానుగా అనిపించాలి. ఇది నిదిధ్యాస. ఆపై ‘‘ఈ సమస్తము నేనైన నేను’’ - అనునది సమదర్శన రూపమగు సమాధి. ఇది పూర్ణబోధకు కారణము అగుచున్నది. అప్పుడిక అన్యములగు అవిద్యా పరిజ్ఞానమంతా అవశ్యము తమకు తామే నశించగలవు. ‘‘ఈ సమస్తము నేనైన నేనే నేను’’ అనియే సిద్ధిస్తోంది.
బ్రహ్మవిద్యా పరిజ్ఞానమ్
బ్రహ్మ ప్రాప్తి కరం స్థితమ్।
మహావాక్యాని ఉపదిశేత్
స షట్ (6) అంగాని దేశికః,
కేవలం నహి వాక్యాని
బ్రహ్మణో వచనం యథా।
‘‘బ్రహ్మము’’ గురించిన పరిజ్ఞానముచే బ్రాహ్మీస్థితియందు ఈ జీవుడు సంస్థితుడగుచున్నాడు. బ్రహ్మమే తానై వెలయుచున్నాడు. (బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి).
మహా వాక్యములు ఉపదేశించు సందర్భములో కేవలము ‘‘తత్త్వమ్, సోఽహమ్, అయమాత్మా బ్రహ్మ, జీవో బ్రహ్మేతి నా పరః’’…… మొదలైనవి పలికి ఊరుకోరాదు.
షట్ (6) మహామంత్రోపాసనను అభ్యసింపజేస్తూ - షడంగములు కలిపి గురువు బోధించాలి. బుద్ధిని శుద్ధి చేసుకుంటేగాని మహావాక్యములు పరమార్థ పూర్వకంగా హృదయములో వికసించవు.
(పునః) ఈశ్వర ఉవాచ -
ఏవమ్ ఉక్త్వా మునిశ్రేష్ఠ, రహస్యోపనిషత్, శుక!
మయా పిత్రా అనునీతేన
వ్యాసేన బ్రహ్మవాదినా।।
ఇంకా ఈశ్వరుడగు పరమ శివులవారు ఈవిధంగా ఉపదేశించసాగారు.

ఓ శుక మునీంద్రా! మునిశ్రేష్ఠా! మీ పిత్రుదేవులవారు శ్రీ వేదవ్యాస మహర్షి కోరిన ప్రకారము, బ్రహ్మవాదులగు ఆయన సంతోషము కొరకై రహస్యోపనిషత్ నీకు ఇప్పటి వరకు బోధించటం జరిగింది.
తతో ‘బ్రహ్మ’ ఉపదిష్టం వై
సత్-చిత్-ఆనంద లక్షణమ్
జీవన్ముక్తః సదా ధ్యాయన్
నిత్యః త్వం విహరిష్యసి।
యో వేద - ఆదౌ స్వరః ప్రాక్తో,
వేదాంతే చ ప్రతిష్ఠితః,
తస్య ప్రకృతి లీనస్య
యః ‘పరః’ స మహేశ్వరః।।
ఈవిధంగా బ్రహ్మోపదేశముగా సత్-చిత్-ఆనంద లక్షణమగు బ్రహ్మతత్త్వము విన్నావు కదా! నీకు బోధించిన బ్రహ్మ తత్త్వమును ధ్యానిస్తూ, తత్-ధ్యాసతో జీవన్ముక్తుడవై ఈ లోకమున విహరించుము.
- ఏదైతే వేదములలో ఆదియందు స్వరయుక్తంగా చెప్పబడినదో,
- వేదాంతముగా (తెలుసుకొనువానిని తెలుసుకొనటంగా), వేద శిరస్సుగా, ఆత్మశాస్త్రంగా ప్రతిష్ఠితమై యున్నదో,
- అట్టి పరమాత్మయందే జనించి, ‘ప్రకృతి’ తిరిగి పరమాత్మయందే లీనము అగుచున్నది.
ఏది శబ్ద బ్రహ్మమగు ఓంకారమునకు, ప్రకృతికి పరమై చిట్ట చివ్వరిగా శేషించియున్నదో, సర్వము ‘తానే’ (తత్) అయి ఉన్నదో అదియే ‘‘మహేశ్వరుడు’’ ‘‘పరమాత్మ’’ అని గ్రహించు. తత్ త్వమేవ। అదియే నీవు.
25. ఉపదిష్టః శివేన ఇతి
జగత్ తన్మయతాం గతః,
ఉత్థాయ - ప్రణిపత్య ఈశం,
త్యక్తాశేష పరిగ్రహః।।
పరబ్రహ్మపయో రాశౌ
ప్లవన్ ఇవ యయౌ తదా।
ఈ రీతిగా శ్రీ శుక మునీంద్రుడు పరమ శివునిచే బోధింపబడినారు. అనన్యముగా కనిపిస్తున్న జగత్తును అనన్యమగు ఆత్మతో ఏకత్వమును ప్రస్ఫుటించుకొన్నారు. ఆసనమునుండి లేచి సర్వతత్త్వ స్వరూపుడగు ఈశ్వరునకు ప్రణిపాత సాష్టాంగ నమస్కారము సమర్పించారు. సర్వ పరిగ్రహణములను అప్పటికప్పుడే త్యజించివేసారు. అభిమానములన్నీ వదలివేసారు. (పరబ్రహ్మానంద) సాగర జలంలో పడవపై వెళ్ళువారు లాగా అక్కడినుండి పరివ్రాజకుడై బయల్వెడలారు.
ప్రవ్రజతం తమ్ ఆలోక్య
కృష్ణ ద్వైపాయనో మునిః,
అనువ్రజన్ నా జుహావ
పుత్ర, విశ్లేష కాతరః।
ప్రతినేదుః తదా సర్వే
జగత్ స్థావర జంగమమ్।।
అప్పటికప్పుడే సన్న్యసించి నడచి వెళ్ళుచున్న పరమ వైరాగ్యమూర్తియగు కుమారుడు శుకునిచూచి వ్యాసమహర్షి వేదన చెందినవారై ‘‘పుత్రా! ఓ కుమారా! ఓ కుమారా!’’ అని ఎలుగెత్తి పిలువసాగారు.
అప్పుడు సర్వ స్థావర-జంగమములు ‘‘ఓయ్’’ అని బదులు పలికాయి.
తత్ శృత్వా సకలాకారం
వ్యాసః సత్యవతీ సుతః,
పుత్రేణ సహితః ప్రీత్యా
పరానందమ్ ఉపేయివాన్।।
అప్పుడు సత్యవతీ పుత్రుడగు వేదవ్యాస మహర్షి
‘‘ఆహా"! ఇప్పుడు నా కుమారుడు సర్వాత్మకుడు, అఖండాత్ముడు, కేవలుడు అయి వెలుగొందుచున్నాడు కదా! ఎంతటి సంతోషకరమైన విషయము!’’
అని పరమానందము పొందారు.
యో రహస్యోపనిషదమ్
అధీతే గురు-అనుగ్రహాత్,
సర్వ పాప వినిర్ముక్తః।
సాక్షాత్ కైవల్యమ్ అశ్నుతే।
సాక్షాత్ కైవల్యమ్ అశ్నుత- ఇతి।। ఉపనిషత్।।
ఫలశృతి
ఎవ్వరు ఈ రహస్యోపనిషత్‌ను గురు అనుగ్రహం పొంది అధ్యయనము చేస్తాడో అట్టివాడు సర్వ దోషములనుండి వినిర్ముక్తుడై సాక్షాత్ కైవల్యమును పొందుచున్నాడు. ముమ్మాటికీ కైవల్యమును సిద్ధించుకొన గలడు.

ఇతి కృష్ణయజుర్వేదాంతర్గత శుకరహస్యోపనిషత్।।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।




కృష్ణ యజుర్వేదాంతర్గత

26     శుక రహస్య ఉపనిషత్

అధ్యయన పుష్పము


కృష్ణద్వైపాయన వేదవ్యాస మహర్షి గురించి

శుకరహస్య-ఉపనిషత్-వేదవ్యాసమహర్షి
శ్రీ వేదవ్యాసుడు। శ్రీ వసిష్ఠ మహర్షి వంశజుడు। పరాశరాత్మజుడు। (మత్సగంధి, యోజనగంధి నామధేయి అగు) సత్యవతీ పుత్రుడు। సద్యోగర్భజనితుడు।
వారే కృష్ణద్వైపాయనుడు!

చుట్టూ నీరు ఉన్నచోట (ద్వీపము) నందు (పరాశర - సత్యవతులకు సద్యోజాతుడై) జన్మించారు కాబట్టి ద్వైపాయనుడు. నల్లగా ఉంటారు కాబట్టి ‘కృష్ణ’. ఈ విధంగా కృష్ణద్వైపాయన నామ లోక ప్రసిద్ధులు. శ్రీవిష్ణు భగవాన్ అవతారులు.
ఆయనయే వేదవ్యాసులు.

వేదములను ఋక్ - యజుర్ - సామ - అధర్వణములుగా విభజించారు. ఇంకా 1180 శాఖలుగా విభజించి, 1180 ఉపనిషత్తులు ప్రక్షిప్తం చేసినవారు. సుమంత, జైమిని, పైల, వైశంపాయన, అసిత, దేవలుడు మొదలైనవారు వ్యాసశిష్యులు. 1180 ఉపనిషత్తులలో మరల వ్యాసుల వారే 108 ఉపనిషత్తులు అతి ముఖ్యమైనవిగా ప్రవచనం చేసారు. ఇంకా కూడా, కలియుగంలో మోక్షప్రాప్తికై జనులకు మార్గమును చూపి వేద, పురాణ, ఇతిహాస, ఉప పురాణములు ప్రసాదించిన మార్గదర్శి. ఆయన ఆవిధంగా లోకాలకు ప్రాతఃస్మరణీయులు అయ్యారు. ఉపనిషత్ వాఙ్మయములోని శబ్దములను నిర్వచిస్తూ ‘బ్రహ్మసూత్రములు’ ప్రసాదించారు. మహాభారతంలో మధ్యగా యుద్ధపర్వములో ‘ఉపనిషత్’ సారముగా శ్రీకృష్ణార్జున సంవాదరూపము ‘శ్రీమద్భగవద్గీత’ను ‘700’ శ్లోకములలో అందించారు. ఈవిధంగా ప్రాతః స్మరణీయులు. నమస్కరించినంత మాత్రంచేత జ్ఞాన ప్రదాత.


శుకమహర్షి - జన్మ వృత్తాంతం
(దేవీ భాగవతము)

అట్టి వేదవ్యాసమహర్షి ఒకానొక రోజు యజ్ఞ నిర్వహణకై అరణిలో (యజ్ఞము కొరకు నిప్పు పుట్టించే కొయ్యలో) అగ్ని కొరకై మధనము చేస్తూ యాదృచ్ఛికంగా ఆకాశంలోకి దృష్టి సారించారు. ఆ సమయంలో ఆకాశంలో విహరిస్తున్న ‘ఘృతాచి’ అనే అప్సరస ఆ మహర్షికి కనిపించింది. విధివశంగా, ఘృతాచిని చూచిన వ్యాసమహర్షి హృదయమంతా కామావేశముతో నిండిపోయింది. అది గమనించి, ఘృతాచి అప్సరసాధర్మంగా మహర్షిని ఆనందింపజేసే యత్నంలో సమీపించసాగింది. తనను సమీపిస్తున్న ఘృతాచి సౌందర్యమునకు పరవశుడై వ్యాసమహర్షి మరింత కామావేశము పొందసాగారు. అప్పుడు వ్యాసులవారు తన అంతరమున ఈవిధముగా ఆలోచించ సాగారు.

శ్రీ వ్యాస మహర్షి (తనలో): ‘ఇదేమిటి? ఈ కామ వికారము నన్ను ఆవహిస్తున్న దేమిటి?
ఒకప్పుడు ఊర్వసి పురూరవ చక్రవర్తులు కామమోహితులై కొంతకాలం దంపతులైనారు.

పురూరవుడు చక్రవర్తిగా వంశపారంపర్యములైనట్టి యజ్ఞ - రాజ ధర్మాలన్నీ విడచిపెట్ట ఊర్వశీ సాంగత్యంలో ఉండిపోయారు.
ఆ తరువాత కొంతకాలానికి ఇంద్రుని ఆజ్ఞానుసారం ఊర్వసి పురూరవుని విడచి స్వర్గమునకు వెళ్ళవలసి వచ్చింది.

అప్పుడైనా ఆయన చక్రవర్తి ధర్మము స్వీకరించాడా? లేదు. కామమోహితుడై, విలపిస్తూ దేశదేశాలు తిరుగాడసాగారు.

కురుక్షేత్రంలో ఊర్వశి పురూవ చక్రవర్తికి దర్శనమిచ్చి, - ‘ఇంత అమాయకుడివేమయ్యా! మేము దేవదాసీలము. ఏ ఒక్కరికి చెందినవారము కాదు. మమ్ములను విశ్వసించి నీ స్వధర్మములన్నీ విడచిపెట్టమని ఎవరు చెప్పారు? వెళ్లండి. నన్ను మరచిపొండి. జన్మయొక్క సార్థకతకై, మోక్షమార్గమును అనుసరించండి’ - అని బోధించింది.

ఇప్పుడు నేను ఈ ఘృతాచిని చూచి కామమోహితుడను అయి ‘కామము’ యొక్క వలలో పడటమంటే, పతనమేకదా!
… అని ఊర్వసి - పురూరవుల సంఘటను శ్రీ వ్యాసమహర్షి తలచుకొన్నారు.

ఘృతాచి దైవప్రేరణచే కామమోహిత అయి వ్యాసులవారిని ఇంకా ఇంకా సమీపించసాగింది. వ్యాసులవారు మరింత కామ వికారం పొందసాగారు. అయితే ఘృతాచి మాత్రం, ‘‘ఈ మహాతపశ్శాలి శపిస్తే నాగతి ఏమిటి? దుర్గతియే కదా!’’….అని భయపడసాగింది. వెంటనే వ్యాసమహర్షి దృష్టిని మరల్చడానికి ‘చిలుక’గా మారి అక్కడే సంచరించసాగింది. వ్యాసమహర్షి ఘృతాచి యొక్క అప్సరసా సౌందర్యమును గుర్తు చేసుకొంటూ ఆ చిలుకను కామావేశముతో చూస్తూ ఉండసాగారు. ఆయన సర్వాంగాలు కామవశమైనాయి. గొప్ప ధైర్యంతో చిక్కబట్టుకున్నప్పటికీ ఆయన తనను తాను నిలువరించుకోలేకపోయారు. హృదయమంతా ‘‘ఘృతాచీ’! ఘృతాచీ’’! అను పేరు ప్రతిధ్వనించసాగింది. అప్పుడు అగ్ని మథనపు వేగము పెరిగింది.
వీర్య స్కలనలం అయింది. అరణి (కొయ్య)లో పడింది. చిలకడం కొనసాగింది.

ఆ అరణిలోంచి ఒక మగబిడ్డ జనించాడు. ‘ఎందుకిలా జరిగింది?’….అని కొద్ది క్షణములు యోచించారు. అంతకుముందు ‘‘నీకు నిర్వికల్ప సమాధి నిష్ఠుడు, మహాప్రాజ్ఞుడు, లోక కళ్యాణమూర్తి యగు పుత్రుడు కలుగుతాడు’’- అని పరమశివుని వరం ఇవ్వటము అప్పుడు జ్ఞాపకమొచ్చింది. ఆ అరణిలో జన్మించిన పిల్లవాడు అచ్చు వ్యాసుని రూపురేఖలే కలిగి ఉన్నాడు. ‘ఆహా! అరణీగర్భ సంభూతుడు, మహా తేజస్వి అగు పుత్రుడు నాకు కలిగాడు కదా!’….అని వ్యాసులవారు ఎంతో సంతోషించారు.

అప్పుడు ఆ పిల్లవానిని మహర్షి గంగాజలంలో స్నానం చేయించారు. వెంటనే జాతక కర్మలు నిర్వర్తించారు.
ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది.
దేవతలు దుందుభులు మ్రోగించారు.
గంధర్వులు వేంచేసి ఆ ప్రదేశంలో తండ్రీ కొడుకులను స్తుతిస్తూ గానం చేశారు.

ఘృతాచి చిలుక రూపము దాల్చిన సంఘటన చేత ఆ పిల్లవానికి ‘శుకుడు’ అని పేరు పెట్టబడింది.
ఆ పిల్లవాడి తపస్సు కొరకై ఆకాశము నుండి దండ కమండలువులు, కృష్ణా జినము (జింక చర్మము) ఆవిర్భవించాయి.
ఈ ఈ విశేషాలు ‘దేవీ భాగవతము’ నుండి మనము చెప్పుకుంటున్నాము. ఇక మనము తిరిగి రహస్యోపనిషత్‌లో ప్రవేశిస్తున్నాము.



శుకరహస్య ఉపనిషత్ ప్రారంభం

‘ఓంకార’ ప్రణవస్వరూపుడగు పరమాత్మకు నమస్కరిస్తూ, ఇప్పుడు మనము ‘రహస్యోపనిషత్’ విశేషములను వ్యాఖ్యానించుకుంటున్నాము.

నారదమహర్షి మొదలైన దేవర్షులు, మహర్షులు, మునిజనులు కొందరు బ్రహ్మలోకమునకు వచ్చారు. సృష్టికర్త, సర్వాత్మకుడు అగు చతుర్ముఖ బ్రహ్మను దర్శించారు. ప్రణిపాతులై ఈ విధంగా అభ్యర్థనము చేయసాగారు.

భగవన్! మాకు ‘రహస్యోపనిషత్’ అని మునిజనులుచే సంభాషించుకోబడే ‘రహస్యోపనిషత్’ హృదయమును దయతో వివరించండి.

చతుర్ముఖ బ్రహ్మ : అస్మత్ మానసపుత్రులగు నారద, సనక, సనందనాది మునివరులారా! సమస్త దేవర్షి, మహర్షి, మునివరేణ్యులారా! ఈ రహస్యోపనిషత్ గురించి ఒక సందర్భంలో పరమ శివ భగవానుడు ప్రవచించటం జరిగింది. ఆ విషయం మనం ఇప్పుడు సంభాషించుకుందాము. మీరందరూ శ్రద్ధగా వినండి.

పురాణ ప్రవక్త, మహాతేజోసంపన్నులు, సర్వవేద తపోనిధి అగు మహర్షివేద వ్యాసులవారు ఒక సమయంలో ప్రియపుత్రుడగు శుకునికి వేదసంస్కార కర్మయగు ‘ఉపనయనము’ను (బ్రహ్మోపదేశ సంస్కారము అని కూడా అంటారు) - జరిపించదలచారు. అందు నిమిత్తమై కైలాసానికి వెళ్లి పరమశివుని దర్శించి, ఇట్లు ప్రార్థన చేయసాగారు.

శ్రీ వేదవ్యాసమహర్షి : దేవతలకు కూడా దైవము అయినట్టి ఓ దేవదేవా! మహాదేవా! దేవతలకంటే మునుముందే ఉన్న దేవాది దేవా! మహాప్రాజ్ఞా! జీవుల సంసార పాశములను, వారు నమస్కరించినంత మాత్రం చేతనే - ఛేదించి వేయుట యందు దృఢవ్రతులైన స్వామీ! మీరు జగద్గురువులు. నా ప్రియకుమారుడగు చిరంజీవి శుకునికి వేదసంస్కార కర్మ అయినట్టి ‘బ్రహ్మోపదేశము’ అనబడు ‘ఉపనయన సంస్కారము’నకు సమయము ఆసన్నమైనది. లోక శుభంకరులగు మీ చేతనే నా కుమారునికి బ్రహ్మోపదేశము చేయబడటానికై అభ్యర్ధన చేస్తున్నాను’’ - అని విన్నపము సమర్పించుకొనుచున్నారు. ‘‘దయతో అనుగ్రహించండి’’ - అని ప్రార్థించారు.

ఈశ్వరుడు : నాయనా! వ్యాసమహర్షీ! నీ అభ్యర్థనను నేను నిరభ్యంతరంగా అంగీకరిస్తున్నాను. అయితే, దాని పర్యవసానము గురించి తెలుసుకదా? నాచే బ్రహ్మోపదేశము పొందటం చేత నీ కుమారుడు చిరంజీవి శుకుడు సర్వ సంసార వేదనలను మొదలంట్లా త్యజించినవాడు కాగలడు.

‘కేవలీ స్వరూపసిద్ధి’ అనే కైవల్యమును సిద్ధించుకోగలడు. నశ్వరములైన వాటినన్నిటినీ దాటివేసి సాక్షాత్ పరబ్రహ్మత్వమును పుణికి పుచ్చుకోగలడు.

అప్పుడేమి కానున్నది? ‘తండ్రీ కొడుకుల అనుబంధము’ మొదలైన సంసారబంధములన్నీ పాము కుబుసము వలే త్యజించివేసి, నీ కుమారుడు సర్వాత్మత్వమునందు సునిశ్చితుడు, సుస్థితుడు అయి వెలుగొందగలడు. అందుకు నీవు సంసిద్ధుడవేనా? నీకు ఇష్టమేనా మరి?

శ్రీ వేదవ్యాసుడు : అట్లాగా స్వామీ? ఈ ఉపనయన సమయంలో తమ ప్రసాదముచే నా కుమారుడగు శుకుడు బ్రహ్మోపదేశము పొందినవాడై సాక్షాత్ బ్రహ్మమే స్వరూపముగా పొందినవాడైతే, నాకు అంతకన్నా కావలసినది ఏముంటుంది? అటుపై ఏది ఎట్లా పరిణమించి ఉండబోయినప్పటికీ, నాకు సంతోషమే.

హే మహేశ్వరా!
✤ మీ బోధ విన్న తర్వాత దృశ్య-దేహ-జీవ-ఈశ్వర-పరబ్రహ్మ తత్త్వములను ఎరుగుటచే ‘సర్వజ్ఞుడు’గా అవటము,
✤ తమ ప్రసాదముచే ‘సారూప్య - సాలోక్య - సామీప్య - సాయుజ్య’ - ‘చతుర్విధ ముక్తి’ని పొందినవాడవటము,
✤ బ్రహ్మజ్ఞానము పొంది, బ్రహ్మవేత్త అయి, స్వయంప్రకాశకమైనట్టి స్వయం పరబ్రహ్మమై వెలుగొందటము… ఇవన్నీ నాకు ఇష్టమే.

నన్ను విడచి వెళ్ళినా నాకు సమ్మతమే! కనుక మీరు వేంచేసి ఉపనయన సంస్కార సందర్భములో నా కుమారునకు బ్రహ్మోపదేశమును అనుగ్రహించుటకై హృదయపూర్వక సుస్వాగతము పలుకుచున్నాను’. తండ్రీ! దయా సాగరా! అనుగ్రహించండి!

వ్యాసమహర్షి చెప్పిన పలుకులు విని భగవానుడు సాంబశివులవారు ఎంతో సంతోషించారు.

✤ సదాశివులవారు (ఉపదేష్టగా - బోధకుడై దివ్యాసనమున) గురుస్థానంలో ఎత్తైనచోట ఉపవిష్టులైనారు.
✤ శుకుడు బ్రహ్మతత్త్వోపాసకుడై, బోధితుడై విద్యార్థి స్థానములో ఆశీనుడైనాడు.
✤ తదితర బ్రహ్మోపాసకులగు శ్రోతలు, దేవర్షులు, దేవతలు, భక్తులు మొదలైనవారు ఉచిత స్థానములను అలంకరించారు. బ్రహ్మర్షులు, దేవర్షులు, గురుస్థానము అలంకరించిన మహనీయులు మొదలైనవారు ఎందరో అక్కడ సమావేశమైనారు.

పరబ్రహ్మోపాసనము, బ్రహ్మోపదేశము, ఉపనయన అంతరార్థము, ద్విజత్వము, సంసారము, బంధమోక్షములు మొదలైన వాటి గురించి స్వామి ప్రవచించిన విశేషములను శ్రద్ధగా విని శుకుడు, తదితర శ్రోతలు లక్ష్యశుద్ధిని పొందుచూ ‘ఓం’కార ప్రణవ అంతరార్థమును గ్రహించినవారై ఆత్మ సంతృప్తులు కాసాగారు.

అప్పుడు శుకుడు లేచి, నిలుచుని, ముకుళిత హస్తములతో భక్తి ప్రపన్నమనోవిలాసుడై స్వామిని సమీపించారు. త్రిప్రదక్షిణములు చేసి, సాష్టాంగ దండ ప్రణామమములు సమర్పించారు. మరల ఆ శుకుడు సాంబశివస్వామికి ప్రణతి పూర్వకంగా ఇట్లు విన్నవించుకోసాగారు.

శ్రీ శుకుడు : హే ఆత్మానంద స్వరూపా! సర్వజ్ఞా! సచ్చిదానంద రూపా! ఉమారమణా! భూతేశా! హే కరుణానిధే! ప్రసీద! నా పట్ల ప్రసన్నుడవయ్యెదరుగాక స్వామీ!

🙏 ప్రణవస్వరూపము
🙏 ప్రణవ - వాచ్యార్థమగు పరబ్రహ్మము
🙏 ‘తత్‌త్వమ్ అసి’, ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ మొదలైన మహావాక్యముల అంతరార్థము…

ఇవన్నీ సవివరంగా, దృష్టాంత, విశ్లేషణ పూర్వకంగా, చ్ఛిన్న - సంశయంగా విశదీకరించారు. చాలా కృతజ్ఞుడను.

నా వంటి అల్పజ్ఞుడిని విజ్ఞుడిగా తీర్చిదిద్దిన మీ వివరణములు ఔన్నత్యమును మాటలలో వర్ణించలేను. కృతజ్ఞతలు తెలుపుకోవటానికి నా ఈ దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారములు ఏమాత్రము సరిపోవు. చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాను. శంభో! లోకగురో। నమో నమో నమో నమః। 🙏

శివభగవానుడు : బిడ్డా! శుకా! శ్రద్ధాళుడవై విన్నావు. నాకు ఆనందము కలిగించావు. ఇంకేమైనా తెలుసుకోవాలని అనుకుంటున్నావా? నిరభ్యంతరంగా అడుగవచ్చునయ్యా!

శ్రీ శుకుడు : శ్రోతుమ్ ఇచ్ఛామి తత్త్వేన షడంగాని యథాక్రమమ్! హే సదాశివా! మహావాక్యముల గురించి మరికొంత వినటానికి కుతూహలుడనై ఉన్నాను. మహావాక్యముల షడంగములు ళిషట్(6) అంగములురి వాటి వాటి రహస్యములను - రహస్యార్థములను ఎరిగిన మహామహనీయులుగా మిమ్ములను వేదవేదాంగములు సన్నుతిస్తూ ఉంటాయి. అట్టి మహావాక్య షడంగముల గురించి విశదీకరించవలసినదిగా నా విన్నపము.

శ్రీ సదాశివుడు : బిడ్డా! జ్ఞాన నిధీ! మునీశ్వరా! మహాప్రాజ్ఞా! శుకా! నీవు అడిగిన ప్రశ్న సాధవులచే మెచ్చుకోబడేది. సముచితము. సమస్త వేదములలో మర్మగర్భితమైయున్నట్టి రహస్యము. అందరూ తెలుసుకోవలసినది. సకల ఉపనిషత్ రహస్యమగు విషయమును ఇప్పుడు షడంగములతో కూర్చి చెప్పుచున్నాను. ఇది తెలుసుకొన్నంత మాత్రం చేతనే సాక్షాత్ ముక్తి (లేక) సద్యోముక్తి లభించగలదు. (క్రమముక్తి కన్నా స్వాభావికమైనది పొందబడగలదు). సాక్షాత్ మోక్షము పొందగలడు. ఇందులో సందేహమే లేదు. మహావాక్యములను బోధించేడప్పుడు సద్గురువు - శిష్యునికి వాటిని షడంగములతో జేర్చి మాత్రమే ఉపదేశించాలి-అనేది వేదహృదయము. అప్పుడే మహావాక్యబోధ సంపూర్ణమౌతుంది. ఏమంత్రమైనా కూడా గురువు షడంగములతో ఉపదేశిస్తేనే, శిష్యుడు షడంగములతో ఉపాసిస్తేనే పూర్ణమగు ప్రయోజనం. త్వరగాను, నిండుగాను ఫలము లభిస్తుంది. ఇది చతుర్వేదముల, వేదశిరస్సులగు ఉపనిషత్తుల ప్రవచనము కూడా!

షడంగములు : (1) ఋషి, (2) ఛందస్సు (3) దేవత (4) బీజము (5) శక్తి (6) కీలకము

షడంగ పూర్వక మహావాక్యోపాస చెప్పుచుండటం చేత ఈ రహస్యోపనిషత్తు సర్వ ఉపనిషత్తుల శిరస్సు వంటిదిగా చెప్పబడుచున్నది.

హే విపశ్చిత్! (విశేషేణ పశ్చిత్) ప్రాజ్ఞుడా! సత్యద్రష్టా! ఈ రహస్యోపనిషత్ సూచించు షడంగ ధ్యాన - ఉపాసనా మార్గంగా మహావాక్యోపాసన - ప్రతిపాదకమగు బ్రహ్మతత్త్వమును ఎరిగి, అనుక్షణిక భావనాసిద్ధి పొందుచున్నాడో, అట్టి వానికి ఇక వేరే తీర్థయాత్రలతోను, మంత్రోపాసనా విధులతోను, వేదపఠణములతోను, జప తప హోమములతోను క్రొత్తగా వచ్చే పుణ్యమేముంటుంది? బ్రహ్మమును - ఆత్మాఽహమ్ గా ఎరిగిన వానికి బాహ్యవస్తువులతో నిర్వహించే పుణ్యఫలములతో పని ఏమి?

ఆత్మ గురించిన వాక్యార్థములు (దృశ్యము, దేహము, ఇంద్రియములు, ఇంద్రియార్థములు, మనస్సు,బుద్ధి, చిత్తము, అహంకారము, జాగ్రత్, స్వప్నము, సుషుప్తి…ఇటువంటి వాక్యార్థములను) ఎరుగుచుండగా ఏ అంతిమ ప్రయోజనం (లేక) ఫలము (The state of one’s own Self) లభిస్తుందో, అదంతా కూడా….

→ ఏకవార జపేనైవ ఋష్యాది ధ్యానతశ్చ యత్,
‘‘ఋషి, ఛందో, దేవతా, బీజం, శక్తి’’, కీలకమ్।।

షడంగ పూర్వకంగా ఆత్మను ధ్యానం చేస్తూ (ధ్యాస అంతా ‘‘సర్వము ఆత్మమయము’’ అను స్థానమునందు నిలుపుతూ) ‘మహావాక్య జపము’ను రోజుకు ఒక్కసారి చేయుట చేతనే అతి త్వరగా సిద్ధి లభించగలదు.

క్రమంగా ధ్యాసతో కూడిన నిరంతరాభ్యాసికి కలుగు ప్రయోజనము వర్ణనాతీతము. ‘శివోఽహమ్’ స్వాభావికము అగుచున్నది.


బ్రహ్మము - మహావాక్యమంత్రములు

Ⅰ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ :

బ్రహ్మము ప్రతి జీవునియందు ‘3’ ముఖ్య లక్షణములతో ప్రదర్శితమై యున్నది.

(i) సత్యమ్ బ్రహ్మ : యమ్ సత్! ‘నేను ఉన్నాను. (I am Present) - అను ‘‘మూల ‘సత్’ తత్త్వము’’. ఈ జీవుడు ఉనికి కలిగి యుండి జాగ్రత్ స్వప్న సుషుప్తులను భావన చేసి, వాటికి ‘‘ఉన్నవి’’ అను ‘సత్’ను తోడుగా చేసి రూపము కలిగిస్తున్నాడు. రచయితను ఆశ్రయించి రచనలు, రచనలలోని పరస్పర వ్యక్తి ఉండుతీరుగా, జాగ్రత్ స్వప్న సుషుప్తులు, జన్మ జన్మాంతరములు - ఇవన్నీ కూడా జీవుని ‘కేవల సత్’ (The Absolute Quality of) ను ఆశ్రయించి ఉన్నాయి. బ్రహ్మము కేవల సత్ స్వరూపమై యుండుటచే సత్- అనునది బ్రహ్మమే అయి ఉన్నది. ఈ కనబడేదంతా ‘సత్’ యొక్క ప్రదర్శనమే! సత్‌యే మూలాధారముగా కలిగియున్నది. అయితే సత్ సర్వదా యథాతథము. అనగా, ఈ జీవుడు ‘సత్’గా సర్వదా యథాతథుడు. ఎప్పటికీ ‘ఉనికి’ కలిగి ఉండునట్టివాడు.

(ii) ‘జ్ఞానమ్’ బ్రహ్మ : తెలుసుకునేవాడుంటేనే కదా ‘తెలియబడేది’ అనునది ఉంటుంది! స్వప్నములో తెలుసుకొనేవాడే (one who is knowing) - ‘‘తెలియబడేదంతా (As that being known)’’ స్వయంగా ధారణ చేసి, ఎప్పటికప్పుడు పొందుచున్నాడు కదా! జాగ్రత్ కూడా ద్రష్టయొక్క స్వయం ధారణా స్వరూపమే। ద్రష్టకు దృశ్యము అన్యము కాదు. అన్యులచే నిర్మితము కాదు.
‘తెలుసుకొనుచున్నవాడు’+‘తెలియబడేది’ కలిపి జ్ఞానము. ఈ దృశ్యమంతా ఆత్మయొక్క చిదానంద (లేక) జ్ఞానానంద స్వరూపమే। బ్రహ్మమే। అదియే చిత్। ఈ ‘జగత్తు’ అనబడేదంతా సత్‌స్వరూపాత్మయొక్క చిదానంద సంప్రదర్శనమే।

(iii) అనన్తమ్ బ్రహ్మ : ఈ జీవుడు దేహము, ఆలోచన, బుద్ధి, చిత్తము, అహంకారము, త్రిగుణములు మొదలైనవాటితో కూడుకొని ఉండవచ్చునుగాక! కాని తాను స్వయముగా బ్రహ్మస్వరూపుడవటంచేత, ఆత్మగా వాటి వేటిచేత కూడా పరిమితుడు కాడు. కనుక బ్రహ్మము అనన్తమ్। తాను బ్రహ్మమే। ఈ జీవుడు సదాశివ బ్రహ్మమే।

Ⅱ. నిత్యానందమ్ బ్రహ్మ :

బ్రహ్మముచే జీవాత్మ - జగత్తులుగా పొందబడుచున్నదంతా స్వయం - అనుభూతి స్వరూపమే। కల్పనానంద చమత్కృతియే। స్వస్వరూపమగు ఆత్మ నిత్యానందమైయున్నది. అట్టి ఆనందము యొక్క కించిత్ బాహ్య-రూపంగా ఈ దృశ్య జగత్- దేహ - ఇంద్రియ - మనో - బుద్ధి - చిత్త - అహంకారములుగా బయల్వెడలి, ఆనందమునందే లయిస్తున్నాయి.

Ⅲ. నిత్యానందమయో బ్రహ్మ :

ఆనందమయో బ్రహ్మ। బ్రహ్మము నిత్యానందముతో మయమై ఉన్నది. అద్దాని ఆనందస్ఫురణా విశేషాలే లోక-లోకాంతరములు, వాటియందు సంచారములు కూడా।

Ⅳ. యోవై భూమాధిపతి :

ఎద్దానికి అన్యమైనదంతా ‘‘అద్దాని వైభవము, అద్దాని భౌమాధిపత్యమునకు చెందినదే’’ అయి ఉన్నదో… అదియే బ్రహ్మము. బ్రహ్మమే ‘జీవుడు’ అను స్వకీయ సంపదావిశేషమును కల్పించుకొని, స్వానుభవ విశేషమగు జగత్‌ను (మార్పుచెందే, జనించి-గతించే, క్షరధర్మముగల విశేషమును) కల్పన చేసుకొనుచున్నది. బ్రహ్మముయొక్క వైభవమే ఈ కనబడేదంతా కూడా।

Ⅴ. ఏకమేవాద్వితీయం బ్రహ్మ :

ఈ జీవుని నిత్యసత్యరూపమగు బ్రహ్మమునకు ద్వితీయము లేదు. జీవునితో సహా ఈ సమస్తము సర్వదా ఏకమే అయి ఉన్నది. దర్పణంలో కనిపించే వేరు వేరు వస్తువులన్నీ, దర్పణముయొక్క ప్రతిబింబ విశేష ఏక - అద్వితీయ రూపమే కదా! అట్లాగే ‘జీవాత్మ, జగత్తు మొదలైనవన్నీ బ్రహ్మము’ అనే దర్పణాంతర్గత ప్రతిబింబిత విశేషము మాత్రమే. కనుక, బ్రహ్మము ఏకము। అద్వితీయము కూడా।


ప్రథమ షడంగన్యాసము - ‘‘తత్’’ పదము - ‘‘తత్’’ పురుషాయ

అస్య శ్రీ మహావాక్యమంత్రస్య।
(1) ఋషి = హంస (సోఽహమ్)
(2) ఛందస్సు = అవ్యక్త గాయత్రి. ఏది సర్వమును ‘వ్యక్తీకరించటము’ అను గానమును ప్రదర్శిస్తూ ఉన్నదో, తాను అవ్యక్తమైయున్నదో అదియే అవ్యక్త గాయత్రీ’ ఛందస్సు.
(3) దేవత = పరమహంస। సోఽహమ్ పరమమ్। ఆ పరమమే ‘నేను’ సర్వదా అయి ఉన్నాను।
(4) బీజము = హంసలోని ‘హం’ ‘నేను’ అను జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు తనవైన నేను (నాలోని నేనైన నేను)
హంసలోని సః = తత్ (అందరిలోని నేనైన నేను)
(5) శక్తి = ‘అన్యము’గా ప్రదర్శనా చమత్కృతి.
(6) కీలకము - సోఽహమ్…ఈ దేహములో స్ఫురించే ‘నేను’ యే ‘అందరిలోని నేనైన నేను’.

మమ పరమహంస ప్రీత్యర్థే, మహావాక్య జపే వినియోగః।।
నాయొక్క నాలోని సర్వాంతర్యామి, సర్వమునకు పరమైన - పరమహంస ప్రీతికొరకు పై ‘ఋషి - దేవత - బీజము - శక్తి - కీలకము’లను - షడంగములుగా అభ్యసిస్తూ ఉపాసన స్వీకరించాలి.

మహావాక్యమ్ కరన్యాసమ్ అంగన్యాసమ్
సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ
అంగుష్ఠాభ్యాం నమః
హృదయాయ నమః।
నిత్యానందో బ్రహ్మ
తర్జనీభ్యాగ్ం స్వాహా
శిరసే స్వాహా।
నిత్యానందమయం బ్రహ్మ
మధ్యమాభ్యాం వషట్
శిఖాయ వషట్।
యోవై భూమా
అనామికాభ్యాం హుం
కవచాయ హుం।
యోవై భూమాధిపతిః
కనిష్ఠికాభ్యాం వౌషట్।
నేత్రత్రయాయ వౌషట్।
ఏకమ్ ‌వాఽద్వితీయం బ్రహ్మ
కరతల కరపృష్ఠాభ్యాం ఫట్।
అస్త్రాయ ఫట్।

భూర్భువస్సువరోమ్ (భూ భూవర్ సువర్ లోకములను, త్రిలోకాంతర సర్వవిశేషములను) మమాత్మానంద స్వరూపంగా ‘దిగ్బంధనము’ చేయుచున్నాను. మమాత్మానంద స్వరూపే ఇతి దగ్బంధః।।

శ్లో।। నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం,
విశ్వాతీతం గగన సదృశం ‘‘తత్త్వమసి’’ - ఆది లక్ష్యం,
ఏకం నిత్యం విమలం అచలం సర్వ ‘ధీ’ సాక్షిభూతం,
భావాతీతం త్రిగుణ రహితం సద్గురుం ‘తత్’ నమామి।। (తన్నమామి)।।

తత్ గురుః। ఆత్మయేవ హి గురుః। నిత్యానంద స్వరూపుడు, పరమ (సమస్తమునకు ఆవలగల కేవల స్వరూప) సుఖప్రదాత, జగత్తుగా మూర్తీభవిస్తూ ఉన్న కేవలజ్ఞాన స్వరూపుడు, ఈ సమస్త విశ్వమునకు అతీతుడు, ‘‘తత్ త్వమేవ - అదియే నీవు’’ - మొదలైన మహావాక్యముల నిరూపణయే లక్ష్యముగా కలవాడు, ఏకము అయినవాడు (అనేకముగా కానివాడు), నిత్యుడు, మలరహితుడు, అచలుడు, సమస్త జీవుల బుద్ధికి ‘సాక్షి’ అయినట్టివాడు, భావములకు మునుముందే ఉన్నవాడు, త్రిగుణములకు సంబంధించనివాడు అగు ‘‘ఆత్మ గురువు’’కు నమస్కారము.


చత్వారి (4) మహావాక్యములు

ఇప్పుడు…చత్వారి (4) మహావాక్యాని…..

(1) ఓం ప్రజ్ఞానం బ్రహ్మ : ఏ తెలివిచే జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు, జన్మ - జన్మాంతరములు, తదితర త్రిలోక జీవులు తెలియబడటం జరుగుతుందో….అట్టి ‘ప్రజ్ఞ’యే బ్రహ్మము. ప్రజ్ఞానమ్ = తెలుసుకొనేది + తెలియబడేది. అట్టి ప్రజ్ఞానము బ్రహ్మము! (జ్ఞ = తెలియబడటము, ప్రజ్ఞ = తెలివి, కేవలమగు ఎరుక)

(2) ఓం అహం బ్రహ్మాస్మి : ఏ ‘నేను’ అనునది దృశ్యమును, దేహమును, జాగ్రత్ - స్వప్న - సుషుప్తులను, తదితర అన్యమైనదానినంతటినీ చూస్తూ ఉన్నదో, పొందుతూ ఉన్నదో, నాలోను - సర్వులలోనూ వేంచేసి సర్వమునకు వేరై ఉన్నదో, అట్టి నేనైన నేనే బ్రహ్మము. ‘నేను’ అను దానిని తదితరమైన దృశ్యవ్యవహారము - అంతటికీ వేరుగా చేసి చూస్తే, అట్టి ‘‘కేవల నేనే (Absolute)’’ బ్రహ్మము!

(3) తత్ త్వమ్ అసి : ‘నీవు’ అనునది దేహభేదములతో, త్రిగుణభేదములతో, పంచభూతాత్మికమై, వ్యష్టిగత మనోబుద్ధి చిత్త అహంకార భేదములతో కనిపిస్తోంది. అయితే అవన్నీ కూడా ‘నీవు’కు అన్యమైన ‘నీవి’ గాని, ‘నీవు’ కావు. అట్టి తదితరమైనవన్నీ నా దృష్టి నుండి ప్రక్కకు పెట్టి చూస్తే ఏ ‘నీవు’ శేషిస్తోందో…అది బ్రహ్మమే! అదియే బ్రహ్మము! అనేకములగు ‘నీవు’లుగా కనిపిస్తున్నదంతా - అగ్ని, వాయువు,జలము, మొదలైనవి అనేకచోట్ల కనిపిస్తూ ఏకమే అయిన తీరుగా - ఏకము, అక్షరమున అగు బ్రహ్మమే!
ఈవిధంగా, తత్ త్వమ్ అసి! నీవు బ్రహ్మమే అయి ఉన్నావు. అనేకముగా కనిపిస్తూ ఏకమే అయి ఉన్న సత్ చిత్ ఆనంద బ్రహ్మమే నీవు! - ఇట్టి దైనందిక - అనుక్షణిక దర్శనమే (‘నీవు’ ను బ్రహ్మముగా భావించటమే) తత్త్వ విద్య.
ఒక ‘నీవు’ నకు మరొక ‘నీవు’నకు కనిపించే భేదమంతా మనోకల్పితము మాత్రమే. అదియే ‘సంసారము’.

(4) అయమాత్మా బ్రహ్మ : ఒక నాటకంలో పాత్రగా (As a role in a drama) నటిస్తూ కనిపిస్తున్నది నటుడేకదా! నటుడు వేరేచోట, పాత్రధారుడు (జరుగుచున్న) నాటకంలోను ఉన్నారా? లేదు. ‘పాత్రధారుడు + పాత్రధారణ’ ఈ రెండు ‘‘తత్‌బ్రహ్మము + జీవుడు’’ లతో అన్వయ-సమమైనట్టివే!
❋ పాత్రధారుడు పాత్రగా అయినాడా? లేదు. బ్రహ్మము జీవుడుగా అగుటలేదు.
❋ మరి పాత్రగా కనిపిస్తున్నది పాత్రధారుడే కదా? బ్రహ్మమే జీవుడుగా కనిపిస్తున్నది.
❋ పాత్రయొక్క ధర్మములు పాత్రధారుడివా? లేదు. నాటకములోనివి. బ్రహ్మము జీవుడిగా కనిపిస్తున్నప్పటికీ, జగన్నాటకంలో గుణసహితంగా కనిపిస్తున్నప్పటికీ, ఈ జీవుడు గుణరహితమగు బ్రహ్మమే!
❋ నాటకంలోని పాత్ర వాస్తవానికి ఉన్నదా? లేదు. నాటకమే కల్పన. ఇక పాత్ర మాత్రం కల్పన కాదా? కల్పనయే!
జగన్నాటకంలో ‘జీవుడు’గా కనిపించేదంతా కల్పనయే! ‘కల్పన’ను ప్రక్కగా పెడితే, ‘జీవుడు’గా కనిపించేది బ్రహ్మమే.
అయమాత్మా బ్రహ్మ! జీవుడుగా ఉన్న నేను బ్రహ్మమే! అందరూ అఖండ బ్రహ్మమే!

ఈ నాలుగు వాక్యముల మహత్తరార్థనమును ఎంతెంత వరకైతే భావనాయుక్తంగా, అవగాహనతో ముముక్షువు జపిస్తూ ఉంటాడో,
ఎంతవరకు ‘తత్త్వమసి’ అభేదవాచకము (I am not different from you, you are not different from me)ను మననము చేస్తూ ఉంటాడో అట్టి భావనా పరిపక్వత, సుస్థిరతచే ‘శివసాయుజ్యము’ (శివోఽహమ్ భావము) అను ‘ముక్తి’కి దరిచేరుచున్నాడు.


‘ఓం తత్ బ్రహ్మ’ - మహామంత్రము - ప్రథమ షడంగన్యాసము - ‘‘తత్’’

  1. ‘హంస’ - ఋషి।
  2. ‘అవ్యక్తో’ (హృదయాతర్గత మౌనవ్యాఖ్యా) - గాయత్రీ ఛందస్సు।
  3. ‘పరమహంసో’ దేవత।
  4. ‘హం’ - బీజమ్।
  5. ‘సః’ - శక్తిః।
  6. ‘సోఽహమ్’ - కీలకము!

మమ ‘సాయజ్య ముక్తి’ అర్థే వినియోగః।।
నాయొక్క ‘సాయుజ్య ముక్తి’ అను ప్రయోజనము కొరకై (అర్థపూర్వకంగా) వినియోగము చేయుచున్నాను-ఇది ‘‘వినియోగము’’!

మంత్రము కరన్యాసము అంగన్యాసము
తత్పురుషాయ
(అం) అంగుష్ఠాభ్యాం నమః।
హృదయాయ నమః।
ఈశానాయ
(త) తర్జనీభ్యాం స్వాహా।
శిరసే స్వాహా।
అఘోరాయ
(మ) మధ్యమాభ్యాం వషట్।
శిఖయై వషట్
సద్యోజాతాయ
(అ) అనామికాభ్యాం హుం।
కవచాయ ‘హుం’।
వామదేవాయ
(క) కనిష్ఠికాభ్యాం వౌషట్।
నేత్రత్రయాయ ‘వౌషట్’
తత్పురుష ఈశాన అఘోర సద్యోజాత వామదేవేభ్యః
(కర) కరలతల కరపృష్ఠాయ ఫట్।
అస్త్రాయ ‘ఫట్’।

భూర్భువస్సువరో (భూ-భువర్ - సువర్‌లోక-లోకాంతర విశేషములన్నీ) - ఇతి - తత్ - బ్రహ్మ - అని దిగ్బంధనము చేయుచున్నాను - ఇతి దిగ్బంధః।।

ధ్యానము -
జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యాత్ అతీతం,
శుద్ధం బుద్ధం ముక్తమపి అవ్యయం చ,
సత్యం జ్ఞానం సచ్చిదానంద రూపం,
ధ్యాయేత్ ఏవం ‘తత్’ మహో అహ్రాజమానమ్।।

ద్వితీయ (రెండవ) షడంగ న్యాసము - ‘త్వం’ పదము

‘త్వం’ పద మహామంత్రమునకు - (ద్వితీయ) షడంగ న్యాసము - త్వం పద మహామంత్రస్య

  1. విష్ణువు - ఋషి!
  2. గాయత్రీ ఛందస్సు।
  3. పరమాత్మా - దేవాతా।
  4. ‘ఐం’ బీజమ్।
  5. ‘క్లీం’ - శక్తిః।
  6. ‘సౌః’ కీలకమ్।

మమ ముక్త్యర్థే జపే వినియోగః।
నాయొక్క ‘ముక్తి’ని ఉద్దేశించి జపవినియోగము చేయుచున్నాను.

నామము కరన్యాసము అంగన్యాసము
వాసుదేవాయ
(అం) అంగుష్ఠాభ్యాం నమః
హృదయాయ నమః
సంకర్షణాయ
(త) తర్జినీభ్యాం స్వాహా।
శిరసే స్వాహా।
ప్రద్యుమ్నాయ
(మ) మధ్యమాభ్యాం వషట్।
శిఖయాయ వషట్।
అనిరుద్ధాయ
(అ) అనామికాభ్యాం హుం।
కవచాయ ‘హుం’।
వాసుదేవాయ పురుషోత్తమాయ
(క) కనిష్ఠికాభ్యాం వౌషట్।
నేత్రత్రయాయ వౌషట్।
సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధేభ్యః
(కర) కరతలకర పృష్ఠాభ్యాం ఫట్
అస్త్రాయ ఫట్।

భూః భు స్సువరోవ్ ఇతి దిగ్బంధః (త్రిలోకములలోని సర్వ విషయములన్నీ త్వమ్ నందు ఏకము చేసి దిగ్బంధనము చేయుచున్నాను.

ధ్యానము -
జీవత్వం సర్వభూతానాం, సర్వత్ర అఖండ విగ్రహమ్,
చిత్త - అహంకారయం తారం, జీవాఖ్యం ‘త్వం’ పదం భజే।।

3వ (తృతీయ) షడంగన్యాసము ‘అసి’ పద మహామంత్రస్య

‘అసి’ (అయి ఉన్నావు) - అను పద మహామంత్రమునకు

  1. మనస్సు - ఋషి।
  2. గాయత్రీ ఛందస్సు।
  3. అర్థనారీశ్వరో దేవతా।
  4. అవ్యక్తాది బీజమ్।
  5. నృశింహః - శక్తిః।
  6. పరమాత్మా కీలకమ్।

‘జీవ బ్రహ్మైక్యము’ కొరకై వినియోగము.

నామము కరన్యాసము అంగన్యాసము
పృథ్వీతు అణుకాయ
(అం) అంగుష్ఠాభ్యాం నమః
హృదయాయ నమః
అబ్ధ్వ్యణుకాయ
(త) తర్జినీ భ్యాం స్వాహా।
శిరసే స్వాహా।
తేజోః అణుకాయ
(మ) మధ్యమాభ్యాం వషట్।
శిఖయాయ - వషట్।
వాయుద్వ్యణుకాయ
(అ) అనాహతాభ్యాం ‘హుం’।
కవచాయ ‘హుం’।
ఆకాశాద్వ్యణుకాయ
(క) కనిష్ఠికాభ్యాం వౌషట్।
నేత్రత్రయాయ వౌషట్।
పృథ్వి-ఆపః-తేజో-వాయు-ఆకాశాత్ అణుకేభ్యో
(కర) కరతలకర పృష్ఠాభ్యాం ఫట్
అస్త్రాయ ఫట్।

‘అసి’ అను జీవబ్రహ్మైక్యమునందు - భూ - భువః సువః త్రిలోకములు ఐక్యము చేసి దిగ్బంధనము చేయుచున్నాను. భూర్భువస్సువః - ఇతి దిగ్బంధః। లోకములన్నీ తత్ స్వరూపమే।

ధ్యానము :

శ్లో।। ‘జీవో బ్రహ్మేతి’ వాక్యార్థం యావత్ అస్థి మనస్థితిః
ఐక్యం తత్త్వం లయే కుర్వన్ ధ్యాయేత్ ‘అసి’ పదం సదా।।

ఈ మనస్సు - ‘జీవుడుగా ఉన్నది బ్రహ్మమే’ అను వాక్యార్థము యొక్క స్వావలంబనమును, ఎప్పటికి సంపూర్తిగా, స్వభావంగా పొందుచున్నదో, అట్టి నిశ్చయ స్థితి మనస్సుకు లభించే వరకు ‘అసి’ (అవును. ‘త్వమ్’ అనునది తత్ అయియే ఉన్నది)…అను లయ స్థానమును ధ్యానముచేసి ‘అసి పదము’ సదా పొందెదవు గాక!

వాక్యార్థ వివరణ

ఈ విధంగా మహావాక్య షడంగములు చెప్పుకున్నాము. ఇప్పుడిక - రహస్యోపనిషత్ విభాగమైనట్టి వాక్యార్థ శ్లోకములు (లేక వాక్యార్థగానము) గురించి చెప్పుకుంటున్నాము. ఓప్రియ శుకబాలకా! తదితర ప్రియ ఆత్మానంద స్వరూపులగు శ్రోతలారా! వినండి.

ప్రజ్ఞానమ్ బ్రహ్మ!

ప్రజ్ఞానము = యేన ఈక్షతే, శృణోతి ఇదం, జిఘ్రతి, వ్యాకరోతి చ, స్వాదు అస్వాదు విజానాతి తత్ ‘ప్రజ్ఞానమ్’ ఉదీరితమ్। దేనిచేత ఈ జీవుడు జీవిస్తున్నాడో, వింటున్నాడో, వాసన చూస్తున్నాడో, (స్వప్నంలో స్వప్నద్రష్ట యొక్క స్వభావన విస్తరించినట్లుగా) విస్తరిస్తున్నాడో, ‘‘ఇది మంచి - ఇది చెడ్డ, ఇది రుచికరము - ఇది కాదు, ఇది బాగు - ఇది కాదు’’ - అని ఎరుగుచున్నాడో, అట్టి - ‘ప్రజ్ఞానమే బ్రహ్మము’.

‘ప్రజ్ఞానము’ అను శబ్దముయొక్క పరమార్థము. -
శ్లో।। చతుర్ముఖ ఇంద్ర దేవేషు, మనుష్య అశ్వ గవాదిషు
చైతన్యమేకం బ్రహ్మాతః ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ మయ్యపి (ఉచ్యతే)।।

సృష్టికర్తయగు చతుర్ముఖ బ్రహ్మయందు, తదితర సర్వ దేవతల యందు, మనుష్యులందు, గుర్రములందు, గొర్రెలయందు, ఆవులయందు సర్వ జీవులయందు ప్రకాశమానమగుచున్న ‘ప్రజ్ఞ’ ఏకమేగాని అనేకము కాదు. ఒకే చైతన్యము అందరిలోను వెలుగొందుచున్నది. అదియే బ్రహ్మము. ఏ ‘ప్రజ్ఞ (లేక) ఎరుక’ అను చైతన్యము నాయందు వెలుగొందుచున్నదో, అదియే బ్రహ్మమే! నాయొక్క ప్రజ్ఞాన రూపమే ఇదంతా। పరిపూర్ణః పరాత్మా అస్మిన్ దేహే విద్యాధికారిణీ, బుద్ధేః సాక్షితయా స్థిత్వా స్ఫురన్ ‘అహమ్’ ఇతి ఈర్యతే - పరిపూర్ణ పరాత్మయేవ!

నా ఈ దేహములో ఏదైతే
- తెలుసుకొనబడుచున్నవాటికన్నిటికి అధికారిణి అయి,
- బుద్ధికి కేవల సాక్షియై
ఉన్నదో, ‘నేను’ అని నాయందు కలిగి ఉంటుందో, అది పరిపూర్ణ పరాత్మయే! ఎందుకంటే ఆత్మసర్వదా అనన్యము కదా!

ఈ నాయందు ‘స్వతః పూర్ణ పరాత్మ’యే వేదములందు ‘బ్రహ్మము’ అను శబ్దముతో అభివర్ణించబడుతోంది.

అహమ్ = పరబ్రహ్మమేవ! అహమస్మి పరంబ్రహ్మ!

‘అస్మి’ = ఈ పదముచే ‘సోఽహమస్మి’ - నేను సర్వదా బ్రహ్మమునే అయి ఉన్నాను - అను అర్థము చెప్పుచున్నది. జీవబ్రహ్మ - ఐక్యమునకు సంజ్ఞయే - ‘అస్మి’ అను శబ్దార్ధము. అందుచేత ‘నేను ఎవరు?’ అని పరిశీలిస్తూపోతే ‘నేను సర్వదా బ్రహ్మమే! అహమ్ బ్రహ్మాస్మి’ అనునది కృతనిశ్చయమగుచున్నది.

  • తత్ -

‘తత్‌బ్రహ్మమేవాఽస్మి’ అను మహావాక్యములో ‘తత్’ అనగా?

ఏది ఏకము, అద్వితీయము అగుచూ, సర్వము అద్దానికి అభిన్నమో - అదియే తత్! ‘తత్’కు అన్యము లేదు. కాబట్టి (అనన్యము కనుక) నేను తత్స్వరూపుడనే! తత్ పద స్వరూపుడునగు నాకు అన్యమై అనిపించేదంతా స్వకీయ కల్పనా చమత్కారమే।

తత్ - త్వమ్ అసి

ఏకమేవ - అద్వితీయ సన్, నామరూప వివర్జితం సృష్టేః పురాధునాపి అస్య తాదృక్ ‘‘త్వమ్ తత్’’ ఇతి అభిదీయతీ!

ఏ ఏకము - అద్వితీయము, నామరూప వివర్జితము (రహితము) అగు బ్రహ్మము సృష్టికి మునుముందే ఉండి ఉన్నదో, అదియే ‘త్వమ్’ రూపమున, తత్ రూపమున (ఉభయముగా కూడా) వెలుగొందుచున్నదని ఆత్మ-విచారణచే సుస్పష్టమగుచున్నది.

త్వమ్ = నీవు. ‘నీవు’ అనునది భౌతికదేహమునకు, ఇంద్రియములకు పరిమితమైనది కాదు. వాటన్నిటికంటే అతీతమైన పదము అయినట్టిదే ‘తత్ త్వమ్ అసి’ మహావాక్యములోని ‘త్వమ్’ పదముచే చెప్పబడుతోంది. ఏకతా గుహ్యతే ‘అసి’ ఇతి తత్ ఐక్యమ్ అనుభూయతామ్। ‘అసి’ అను శబ్దముచే - ‘త్వమ్’గా ఉన్నది ‘తత్’ పరబ్రహ్మమ్। -అను ఐక్యము ఎలుగెత్తి / చేతులెత్తి ప్రకటించబడుచున్నది.

‘అయమ్ ఆత్మా బ్రహ్మ’

ఈ మహావాక్యములో అయమ్ = స్వప్రకాశమైనది, (ప్రత్యక్ష - పరోక్షములకు వేరైన) అపరోక్షము అగు పరమాత్మయే ‘త్వం’ రూప ‘జీవాత్మ’ అని సిద్ధాంతీకరించబడుచున్నది. ‘‘జీవాత్మగా ప్రదర్శనము అగుచున్నది బ్రహ్మమే’’ - అనునది ‘అయమ్’ శబ్దముచే చూపబడుచున్నది.

ప్రత్యగాత్మ: అహంకార-ఆది-దేహాంతం ప్రత్యగాత్మా ఇతి గాయతే!
‘అహంకారము’తో ఆరంభించినదై, స్థూలదేహము చివరిగా (ఆవల వరకు) గలిగినదంతా ‘ప్రత్యగాత్మ’గా చెప్పబడుతోంది. అద్దానికి అధిష్ఠానము ‘తత్’యే! తత్‌యేవ-ప్రత్యగాత్మగా కూడా ఉన్నది.

ప్రత్యగాత్మ = దేహికి-దేహమునకు ఈవల-ఆవల సమస్త దృశ్యము తనకు అనన్యముగా కలిగి ఉన్నట్టిది.

జగత్ = దృశ్యమానస్య సర్వస్య జగతః తత్త్వమ్ ఈర్యతే। అనుక్షణము జనించు - గతించు విశేషములు కలిగిన ఈ సర్వ దృశ్య మానమైనదంతా ‘జగత్తు’గా చెప్పబడుతోంది.

ప్రత్యగాత్మకు, జగత్తుకు అధిష్ఠానము (Basic material by which formed) ‘తత్’ అయి ఉన్నది. తదేవ జగత్!

బ్రహ్మము

ఆత్మ స్వయం ప్రకాశకము. తదితరమైనదంతా స్వయం ప్రకాశమగు ఆత్మయందు కల్పనాజనితము. ఆత్మ తేజస్సు యొక్క సంప్రదర్శనా చమత్కారము. మట్టితో ‘కోతి’ బొమ్మ వేసినప్పుడు, మట్టి అధిష్ఠానము. కోతియో-కల్పన. మట్టియందు కోతి లేదు. కోతి మట్టియే అయి ఉన్నది. బ్రహ్మము తదితరంగా కాకుండానే, అనాత్మదృష్టిచే ‘అహమ్’, మమ-ఇంద్రియ జగత్ దృశ్యముల రూపంగా ‘అన్యము’ వలె అగుపిస్తున్నాయి. అవన్నీ ఆత్మరూపమే అయి ఉండికూడా, ఆత్మయందు అవేవీ లేవు. (ఆత్మయే బ్రహ్మము).

అవివేక నిద్ర

అనాత్మదృష్టేః అవివేక నిద్రా। అహం-మమ స్వప్నగతిం గతోఽహమ్।

‘‘అనాత్మ దృష్టి’’ అనే అవివేక నిద్రలోని స్వప్నంలో ‘నేను-నాది’ అనునవి స్వప్నాంతర్గత కల్పిత విశేషములవంటివై ఉంటున్నాయి. ఆహా! అనాత్మదృష్టి కారణంగా స్వప్నవిషయాలవంటి ‘అహం..మమ’ విశేషాలను పట్టుకొని ఉంటూ ఉండగా, ఈ జీవునిపట్ల ఎన్నో జన్మలు అవివేక దృష్టిచే ‘‘ఒక స్వప్నము తరువాత మరొక స్వప్నము’’ వలె గడచి పోతున్నాయి. సంగతి-సందర్భ-సంబంధ-అనుబంధ-బాంధవ్యములు తెంపులేకుండా వచ్చి పోతూ ఉండగా స్వస్వరూపమును గుర్తు పెట్టుకోక పోవటమే అవివేక నిద్ర. స్వప్నములో ఉంటూ, ‘‘ఈ స్వప్నమంతా నాదికదా’’ - అను ఏమరుపే - అందుకు దృష్టాంతము.

జ్ఞానము అను మెళుకువ

స్వరూప సూర్య అభ్యుదితే స్ఫట ఉక్తే, గురోః మహావాక్యపదైః ప్రబుద్ధః। స్వస్వరూపము (కేవలాత్మా మమస్వరూపము) అనే సూర్యుడు ఉదయించగానే అజ్ఞాననిద్ర తొలగిపోతోంది. గురు మహావాక్యములైనట్టి ‘తత్ త్వమ్ అసి! అయమ్ ఆత్మా బ్రహ్మ! జీవోబ్రహ్మేతి నాపరః। సోఽహమ్। త్వమేవాఽహమ్’ ఇత్యాది మహావాక్యముల మహార్థము హృదయమునందు ఉదయించుచూ ఉండగా - చీకట్లో కనిపించే భ్రమాకారములగు ‘అహము-మమ’ ఇత్యాది భ్రమలు మొదలంట్లా తొలగిపోతున్నాయి. ఈ జీవుడు ప్రబుద్ధుడు అగుచున్నాడు.

‘త్వం - నీవు’ అను దానికి అర్థమేమిటి?

‘త్వం’ పదమునకు (అనగా ‘నీవు’ అని అంటున్నప్పుడు) వేరు-వేరైన అర్థములు ఉన్నాయి. (1) వాచ్యార్థము (2) లక్ష్యార్థము

‘త్వం’ వాచ్యార్థము = వాచ్యార్థనమును దృష్టిలో పెట్టుకొని అంటున్నప్పుడు ‘నీవు!’ అనగా పాంచభౌతిక శరీరము, ఇంద్రియములు, నామ-రూపములు, గుణములు, స్వభావములు, లోకసంబంధమైన విద్య, అవిద్య, సంపదలు, ఆపదలు - ఈ ఈ మొదలైనవి.

‘త్వం’ వ్యక్యార్ధము = ‘త్వం’ వ్యక్త-సంబందార్ధము - అనగా, నీకు-స్థితికి-నాకు గల సంబంధము. నీయొక్క నాయొక్క వ్యక్తీకరణ చమత్కారము.

త్వం లక్ష్యార్థము = ‘నీవు’ అనగా పరమ లక్ష్యమే అయి ఉన్న సచ్చిదానంద స్వరూపమే! ‘‘మీ ఉంగరము నాకు ఇవ్వండి’’ - అన్నప్పుడు ‘‘బంగారము మాత్రమే ఉంచుకొని ఉంగరము మాత్రం ఇవ్వండి’’ - అని కాదు కదా!

‘తత్’ పదము యొక్క ఈశ్వర వాచ్యార్థము : అనేక ఉపాధులకు సంబంధించిన ‘నేను అనబడు ఈశ్వరుడు. ‘మాయ’ను ఉపాధిగా కలవాడు. గుణములకు, దేహ - దేహాంతరములకు కర్త. కృతమతిః - కర్తృత్వ భావన కలవాడు.

‘తత్’ పదముయొక్క లక్ష్యార్థము : సచ్చిదానంద పరబ్రహ్మమే!

‘త్వమ్’ యొక్క ‘తత్’ యొక్క లక్ష్యార్థము = సత్ - చిత్ - ఆనంద పరబ్రహ్మమే! అందుచేత ‘తత్ - త్వమ్ - అసి’ అన్నప్పుడు లక్ష్యార్థము దృష్ట్యా ‘త్వమ్ - తత్’లు ఏకమే గాని వేరు వేరైనవి కావు. సచ్చిదానంద సుఖ బ్రహ్మ - ‘తత్’ అర్థం ఏష చ తయో ఐక్యం త్వ - అసి - ఇదమ్ పదమ్। లక్ష్యార్థమును ఆశ్రయించుటచే ‘‘తత్ - త్వమ్ - అసి - ఇదమ్ పదము’’ సిద్ధించుచున్నది. వాటి కలయికయే తత్ సంబంధమైన యోగము. అదియే సమాధి కూడా!

‘త్వమ్’ అనునది (జీవాత్మ, ఈశ్వరుడు) ఈ రెండు కూడా కార్య కారణముల భేద దృష్టిచే (దృష్టులుగా) ఏర్పడినవై ఉంటున్నాయి. కార్యౌపాధి - కారణ ఉపాధి (The Cause & Effect aspect) తిరిస్కరించటం (లేక) ప్రక్కకు పెట్టటం జరిగితే, అప్పుడు సచ్చిదానంద - అఖండరూపమే శేషించుచున్నది. కార్య - కారణముల వలన ఏఏ భేదములు కనిపిస్తూ ఉన్నాయో, అవన్నీ కూడా సందర్భ సత్యములు (Incidental Truth in a visualised frame by virtue of Gender (male & female), Possession (poor & rich), Body (weak or rich), Country (This country man & That country man), etc., ) మాత్రమే!

‘సహజసత్యము’ దృష్ట్యా జీవ-ఈశ్వర, జ్ఞాన-అజ్ఞాన, మంచి-చెడు - ఇత్యాది ద్వంద్వములు ‘వాస్తవానికి లేనివి’ గాను, కానీ సందర్భమును అంగీకరిస్తే మాత్రం ఉన్నవిగాను - అగుచున్నాయి. దృష్టాంతానికి దేవదత్తుడు అనేవాడు ఉన్నాడు.

✤ ఏ ఊరివాడు? ఏ దేశము వాడు?…. దేశమునకు సంబంధించినది (Related to place)
✤ ఏ వయసువాడు? (బాల్యయౌవ్వన వార్థక్యములను అనుసరించి (Age related)
✤ నీకు ఏ విధమైన బంధువు? (కొడుకా? తండ్రియా?) (Inter Personal)
✤ ఏ రంగు వాడు? (రంగు, రూపు రేఖలను అనుసరించి) (Colour of Skin)
✤ ఏ కాలమువాడు? (కాలసంబంధమైనది) (Time related)
✤ ఏ ఎత్తువాడు? (పొట్టివాడా? పొడుగువాడా?) (Physic related)
✤ ఎందులో పండితుడు? (చదువును అనుసరించి) (Knowledge related).

పై వేరువేరులు ఏది ఎట్లా ఉన్నా ‘దేవదత్తుడు’ అనబడువాడు ఒక్కడే కాని చిన్నప్పుడు ఒక దేవదత్తుడు, వృద్ధాప్యంలో మరొక దేవదత్తుడు ఉండడు కదా! దేవదత్తుడు - ఒకడికి తండ్రి. మరొకరికి కొడుకు. ఇంకొకరికి భర్త. మరొకరికి బావ. ఏఏ సంబంధములున్నా దేవదత్తుడు - స్వతఃగా ఆయా సంబంధములను అనుసరించి వేరువేరైనవాడు అగుట లేదు.

అట్లాగే ఆత్మ - దేహములచే, మనో బుద్ధి చిత్త అహంకారములచే, సర్వ తదితర భేదములచే అన్యత్వము పొందదు. ఆత్మ సర్వదా ఏకము, అక్షరము, నిర్మలము, నిత్యము కూడా!

సర్వ కార్య కారణములను, సంబంధములను ప్రక్కకు పెట్టితే, ఈజీవుడు తత్ స్వరూపుడే! పరమాత్మ యొక్క సంప్రదర్శనా స్వరూపుడే!

కార్య - కారణ సంబంధముల చేతనే కార్యోపాధి సంబంధింతుడై ‘‘జీవుడు’’ - అనుభవుడగుచున్నాడు. కారణోపాధిచే ఈతడు ఈశ్వరుడే! (జీవుడు = ఒక నాటకంలో నటుడు. ఈశ్వరుడు = అనేక నాటకములలో నటిస్తున్న నటుడు)
జీవునికి శరీరము ఉపాధి! ఈశ్వరునికి మాయ ఉపాధి!

(దృష్టాంతంగా - నాటకంలోని నటించే నాటక కథా సందర్భమునకు → నాటకపాత్ర ఉపాధి. నటునికి ‘నటన’ ఉపాధి. కథలోని పాత్రకు కథ ఉపాధి! కథారచయితకు - నాటకము ఉపాధి. ఈశ్వరునికి జీవుడు ఉపాధి).

బ్రహ్మము ఉపాధి రహితము! ఈ జీవుడు బ్రహ్మమే! కార్యకారణముల ఉపాధులను తొలగించి చూచిన మరుక్షణం పూర్ణబోధ స్వరూపమే. (knowing as absolute and complete state) అవశిష్యము (శేషించినది) అగుచున్నది. ఈ జీవుడు పూర్ణబోధానంద స్వరూపుడే! సహాజీవులపట్ల అట్టి దర్శనమే ‘నిర్వికల్ప సమాధి’ యొక్క ఏకైక లక్షణము. అదియే అందుకు సోపానము కదా.

ఈ జీవుడు కార్యకారణ కల్పనా సంబంధములను, సందర్భమాత్ర పరిమిత సత్యములను అధిగమించిన కేవలీదృష్టిచే కేవలమగు అఖండాత్మయే! ఆత్మ తత్త్వజ్ఞునికి ఆత్మ దృష్టిచే తత్త్వాత్మత్వము స్వానుభవమగుచున్నది. అట్టి అనుక్షణిక పూర్ణబోధానుభవానందమునకు ఉపాయమేమిటి? - ఉపాయములేమిటో చెప్పుకుందాము.

కేవలబోధ స్వరూప - స్వస్వరూపానుభవమునకు ఉపాయాలు

మహావాక్య శ్రవణం : మొట్టమొదట మహావాక్యముల ‘‘తత్-త్వమ్-అసి। ప్రజ్ఞానం-బ్రహ్మ। అయమ్-ఆత్మ బ్రహ్మ। శబ్దములను విడివిడిగా ‘షడంగ యుక్తంగా రహస్యోపనిషత్ విధానంగా స్వానుభవ సిద్ధి కొరకు అభ్యాసము చేసెదరు గాక!

‘ఈ దృశ్యముతో నేను కలిగియున్న దృష్టి దోషములేమిటి? సత్యము ఎట్టిది? ‘సోఽహమ్, తత్త్వమ్’ ఇత్యాది మహావాక్యముల రహస్యార్థమేమిటి? ‘నేను ఎరుగవలసినదేమిటి? - అను లక్ష్యశుద్ధిని పెంపొందించుకోవాలి. ముముక్షు వ్యవహారి కావాలి.

అందుకుగాను
(1) ఇంద్రియ నిగ్రహ నియామక రూప ‘శమము’
(2) లౌకికంగా లభించువాటితో సంతోషము
(3) విచారణ (Analysis)
(4) సాధు జనులతో సత్సంగములను ఆశ్రయిస్తూ క్రమంగా గురోపదేశమునకు అర్హత సంపాదించుకోవాలి.

సద్గురు సామీప్యత : ఇప్పుడిక ఆత్మజ్ఞానము కొరకై ‘‘తత్త్వదర్శి - (నీవు బ్రహ్మమే అని ఎరిగిన) తత్త్వవేత్త - విద్యావేత్త’’ యగు సద్గురువును సమీపించాలి.

శ్రవణము : మహావాక్య రహస్యార్థములను శ్రవణం చేయాలి. వినాలి. వినటము, చదవటము, మాట్లాడుకోవటము, వ్రాయటము మొదలైనవన్నీ ‘‘తెలుసుకోవటము (లేక) శ్రవణము’’ లోనివే! క్రమంగా సంశయములన్నీ ఛిన్నమయ్యే వరకు గురుముఖతః వినాలి. శాస్త్రములు పరిశీలించాలి. పరస్పరం చెప్పుకోవాలి. బోధించుకోవాలి.

మననము : ఏ మహావాక్య రహస్యార్థము (లేక) తత్త్వార్థము వినుచున్నామో, ఆ వినినదంతా ఆయా సర్వ లోక సంబంధమైన సందర్భములలోను (గుర్తు తెచ్చుకొని) ‘అనుకుంటూ ఉండటము’ అనే మననము చేయాలి. ‘త్వమ్’గా (నీవుగా) కనిపిస్తున్న వాచ్యార్థమును అధిగమించి, లక్ష్యార్థమును సాధించటం అభ్యసిస్తూ ఉండాలి. పరాప్రేమ, త్యాగము, అమానిత్యాది జ్ఞాన సంపత్తి సముపార్జించుకోవాలి.

💐 ‘‘అద్వేష్టా సర్వభూతానాం’’ - ఇత్యాది భక్తి సంపత్తి।
💐 ‘‘అభయం, సత్త్వసంశుద్ధి’’ - ఇత్యాది దైవీ సంపత్తి।
💐 ‘‘న ద్వేష్టి సంప్రవృత్తాని, న నివృత్తాని కాంక్షతి, ఉదాసీనవత్ ఆసీనో’’ - మొదలైన గుణాతీత అభ్యాస సంపత్తి।
💐 ‘‘ఓ పరమాత్మా! ఈ సమస్తము నీదే కదా!’’ - అను సర్వసమర్పణా సంపత్తి।
మొదలైన ప్రయత్నములను వృద్ధి చేసుకోవాలి.

(ఉపనిషత్ సారమగు భగవద్గీత మొదలైన) తత్త్వశాస్త్ర విభాగములను, ‘తత్త్వమసి’ చెప్పు గురుబోధలను మననం చేయాలి అనుకుంటూ ఉండాలి.

నిదిధ్యాస : గురువు వద్ద శ్రవణం చేసినది, మననం చేస్తూ ఉండగా, - మననము చేసినది ‘అనిపించటము’ ప్రారంభమైతే అది ‘నిదిధ్యాస’ యొక్క ప్రారంభం. నిర్హేతుకంగా, అనునిత్యంగా అనిపించే వరకు శ్రవణ మననములు కొనసాగించవలసిందే!

ఈ విధంగా (1) శ్రవణం తు గురోః పూర్వం (2) మననం తదనంతరం (3) నిదిధ్యానమ్ - ఇతి ఏతత్ పూర్ణభోధస్య కారణమ్
‘శ్రవణ - మనన - నిదిధ్యాస - ఈ మూడు పూర్ణబోధకు కారణమగుచున్నాయి.
(1) తెలుసుకోవటం (శ్రవణం) (2) అనుకోవటం (మననం) (3) అనిపించటం (నిదిధ్యాస) (4) అదే తానవటం (సమాధి).

ఇకతదితర లోక సంబంధమైన విద్యలకు వద్దాము.

శ్లో।। అన్యవిద్యా పరిజ్ఞానమ్ అవశ్యం నశ్వరం భవేత్।
బ్రహ్మవిద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తికరం స్థితమ్।।

బిడ్డా, శుకా! తదితర శ్రోతలారా! ‘బ్రహ్మవిద్య’ అను స్వస్వరూప అవగాహన-అనుసంధానరూపమగు ఆత్మ విద్య యొక్క పరిజ్ఞానముచే బ్రహ్మ ప్రాప్తి లభిస్తోంది. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును ఎరుగుటచే ఈ జీవుడు బ్రహ్మమే అగుచున్నాడు. అట్టి ప్రయోజనము శాశ్వతమైనది, స్థిరమైనది కూడా. ఇక బ్రహ్మ విద్యకు అన్యమైన (తదితర) విద్యల గురించి చెప్పాలంటే….
వాటి వాటి ప్రయోజనములన్నీ అనుభవ కాలంలో కాలగతిచే నశించబోవుచున్నాయి. కనుక, నశ్వరము. అవశ్యము నశిస్తాయి. అవి సుస్థిర విద్యలు కావు. ఉన్న సత్యము ఇది.

అందుచేత, బిడ్డలారా! శ్రోతలారా! ఏది స్థిరమైన, శాశ్వతమైన ప్రయోజనమో, అందుకు మాత్రమే సర్వ అవకాశములను వినియోగించుకొని ‘సోఽహమ్ పరమమ్’ స్థానమును పొందుటకు సర్వదా సంప్రయత్నశీలురై ఉండెదరుగాక! శివోఽహమ్ అనబడు శివానంద సిద్ధికై ఉపక్రమించెదరు గాక! సర్వకాల సర్వావస్థలలో ‘‘తత్ పద ప్రాప్తి’’ కొరకై మహదాశయులై ఉండండి.

గురువులకు సూచన

మహావాక్యములు : శిష్యులకు బోధించుచున్న గురువులారా! మీరు కేవలము మహావాక్యముల బోధ మాత్రమే వినిపించి ఊరుకోకండి. మరి? ‘‘తత్’’, ‘‘త్వమ్’’, ‘‘అసి’’ - మొదలైన ప్రతి శబ్దమునకు విడివిడిగా షడంగములతోబాటుగా శిష్యునికి ఉపదేశించండి. బ్రాహ్మీవచనములను ధ్యాన-యోగాభ్యాసములతో ఏకంచేసి చెప్పుటచే శిష్యుడు శ్రవణముతో ఆగకుండా, మనన నిదిధ్యాసలకు మార్గం చూపువారు కాగలరు. అప్పుడే శిష్యుడు ‘సమాధి’యందు ప్రవేశించగలడు. సర్వే సర్వత్రా సర్వదా ఈ సమస్తము స్వస్వరూప దర్శనముగా స్వానుభవమవటమే సమాధి.


ఈశ్వరుడు : ఓ శుకదేవా! తదితర మునిశ్రేష్ఠులారా! గురు జనులారా! మహావాక్యభావనా సాధకమగు నాచే చెప్పబడిన ‘రహస్యోపనిషత్’ అందరూ శ్రద్ధగా విన్నారుకదా.

ఓ శుకదేవా! బ్రహ్మవాదులు, బ్రహ్మ సూత్ర రచయిత అగు మీ తండ్రిగారు శ్రీ వ్యాసమహర్షి యొక్క అభ్యర్థనను విని, ఆయనపై గల అవ్యాజమైన ప్రేమచే నీకు, ఈ సభలోని తదితర మునిశ్రేష్ఠులకు షడంగముల మహావాక్య మంత్రోపాసన, అంగన్యాస - కరన్యాసములు, మహావాక్య తత్త్వార్థము చెప్పటం జరిగింది.

ఇదియే సచ్చిదానంద లక్షణాలతో కూడిన ‘బ్రహ్మోపదేశము’ అనబడు ‘వేదసంస్కారము’ (లేక) ఉపనయనజ్ఞానోపాసనా ఘట్టము.

ఓ శుకా! ఈ రహస్యోపనిషత్‌లోని విశేషములను ఎవ్వరైతే సదా ధ్యానము చేయుచూ షడంగోపాసనను అభ్యసిస్తూ ఉంటారో అట్టివారు ఇక్కడే జీవన్ముక్తులుకాగలరు.

నీవు శ్రద్ధగా శ్రవణ - మనన - నిదిధ్యాసలు నిర్వర్తించెదవు గాక! తద్వారా సమాధిని సిద్ధించుకొనెదవు గాక! అప్పుడు బ్రహ్మమునందే ‘సదా విహారి’వి కాగలవు.

ఇంకొక సూచన. అందరూ శ్రద్ధగా వినండి

శ్లో।। యో వేదాదౌ స్వరః ప్రోక్తో, వేదాంతే చ ప్రతిష్టితః-
తస్య ప్రకృతి లీనస్య యః పరః, - స ‘‘మహేశ్వరః’’।।

ఏది శ్రవణ - మనన - నిదిధ్యాసల రూపంగా ఆత్మశాస్త్ర విశేషాలుగాను, ‘ఓం’కార శబ్ద బ్రహ్మముగాను,

✩ వేదములలో ప్రధమంగా స్వరప్రోక్తంగా పరమపురుష స్తోత్రగానంగాను (ఋక్కులుగాను), ఉపాసనా విధులుగాను (యజుర్విధులతోను), విధి విధాన పూర్వకంగాను, సామగానంగాను, అధర్వణ దర్శనంగాను చెప్పబడుచున్నదో,
✩ ఏ ‘బ్రహ్మము’ మహావాక్య సమేతంగా వర్ణాత్మక - వివరణాత్మకంగా తత్త్వవేత్తలగు మహనీయులచే గానము చేయబడుచున్నదో,
✩ ఏ వాక్యార్థము ‘వేద శిరస్సు’ అగు ఉపనిషత్తులలో ప్రతిష్ఠితమై యున్నదో,
అవన్నీ కూడా ‘బ్రహ్మమే తానైన స్థితి’యందు ‘ప్రకృతి విలీనము’ పొందుచున్నాయి. అనగా వాటన్నిటియొక్క అంతిమ ప్రయోజనము - ‘‘ఈ సమస్తము బ్రహ్మమే! నేనే బ్రహ్మమును’’ - అను నిత్యోదితి స్వస్థితియే। (సర్వం కర్మాఖిలం జ్ఞానే పరిసమాప్యతే।)

‘‘భక్తి-జ్ఞాన-క్రియా యోగ - కర్మయోగ - సమర్పణాయోగ’’ …. సమన్వయ ప్రయత్నములచే ఈ జీవుడే స్వయముగా శివుడై, సర్వభూతములు తానై, సర్వసాక్షిగా వేరై, సర్వకారణకారణుడుగా వెలుగొందుచున్నాడు.

సర్వమునకు పరమై మహేశ్వరత్వమును సంతరించుకొనుచున్నాడు.


ఈ విధంగా ఉపనయన దీక్షలో ఉన్న శుకదేవుడు - (వైదిక సంస్కారముల సందర్భమైన ‘బ్రహ్మోపదేశము’ సమయములో) శివ భగవానుని నుండి మహావాక్య మనన - వాక్యార్థ విచారణ షడంగన్యాసపూర్వకంగా ‘ఉపదేశము’ పొందారు.

కూర్చుని ఉన్నచోటు నుండి లేచి శివభగవానుడు ఆశీనుడైయున్న ఉన్నతానునమును సమీపించారు. రెండు అరచేతులు ముకుళించి నమస్కరిస్తూ ‘గురవే సర్వలోకానామ్! భిషజే భవరోగిణామ్! నిధయే సర్వవిద్యానమ్!’ అని స్తుతిస్తూ స్వామికి త్రిప్రదక్షిణములు చేశారు. సాంబశివ భగవానుని పాదములు రెండు చేతులు మునివ్రేళ్ళతోను, అరచేతులతోను స్పృశించుచూ ‘3’ సార్లు కళ్ళకు అద్దుకున్నారు. శివపరమాత్మ పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించారు.

ఆ శుకుడు సమస్త పరిగ్రహణములను అప్పటికప్పుడే మనో - వాచా - కర్మణా పరిత్యజించివేశారు.

పరమశివులవారు మనోహరమైన, లోకములన్నిటినీ సమ్మోహింపజేయు చిరునవ్వుతో ఇదంతా గమనిస్తూ, అంతర్ధానమయ్యారు.

అక్కడికి వేంచేసి సమావేశములో పాల్గొనుచున్న వ్యాసమహర్షి, తదితర మహర్షులు, మునీశ్వరులు, మునులు శుకుని ప్రవర్తనన ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారు.

శుకుడు నిరభిమాని అయి, అక్కడి సమస్తమును పరిత్యజించి, వ్రజంతుడై (పరివ్రాజకుడై) అక్కడ నుండి బయల్వెడలసాగారు.

మూర్తీభవించిన వైరాగ్యముతో కూడిన వాడై నడచి వెళ్ళుచున్న కుమారుని చూచిన వ్యాసమహర్షి ‘‘అయ్యో! లోకమే తెలియని నా కుమారునికి ఎక్కడైనా ఏదైనా బాధ కలుగవచ్చునేమో!’’ అని భయకంపితుడు కాసాగారు.

‘‘ఓహో కుమారా! శుకా! ప్రియకుమారా! అరణి సంభవా! ఆగవయ్యా! కుమారా! నా పిలుపు వింటున్నావా? బదులు పలుకవయ్యా!’’
అని కేకలు వేస్తూ శుకుడు వెళ్ళుచున్న వైపుగా అడుగులు వేయసాగారు.

ఈలోగా ఆ వ్యాసమహర్షి యొక్క ‘బిడ్డా! శుకా’! అను పిలుపులకు సమాధానంగా - ప్రతినేదుః తదా సర్వే జగత్ స్థావర జంగమాః।…..అక్కడి స్థావర జంగములు ‘ఓయ్’…అని ప్రతి సమాధానమును ఒక్కసారిగా ప్రతిధ్వనించసాగాయి.

శ్లో।। తత్ శృత్వా సకలాకారం వ్యాసః సత్యవతీసుతః,
పుత్రేణ సహితః ప్రీత్యా పరానందమ్ ఉపేయవాన్।।

సత్యవతీ పుత్రుడగు వ్యాసుడు ‘ఓయ్’ అని వృక్ష - జంతు దేహ సమూహముల నుంచి వస్తున్న ప్రతిధ్వని సమాధానమును మరల మరల విన్నారు. మరల పిలిచారు. మరల విన్నారు. ఆశ్చర్య - ఆనందములు పొందారు. ఈ విధంగా అనుకోసాగారు.

‘‘‘ఆహా! భగవానుడగు పరమశివుని రహస్యోపనిషత్ ప్రవచనమును విని నా కుమారుడు అరణీజాతుడగు చిరంజీవి శుకుడు దేహాత్మత్వమును అధిగమించాడు. విశ్వాత్మత్వమును సంతరించుకొని సర్వాత్ముడై, అఖండాత్మ స్వరూప - స్వభావుడై వెలుగొందుచున్నాడు కదా! అందుచేతనే ‘శుకా!’ అను నా పిలుపుకు స్థావర జంగమములన్నీ ‘ఓయ్!’ అని ప్రతిధ్వనిస్తున్నాయి.
‘‘ఎంతటి సంతోష ఆనందకరమైన విశేషము!’’ అని తలచి కృష్ణద్వైపాయన - వేదవ్యాసమహర్షి పరమానందమును పొందారు.


ఫలశృతి

ఎవ్వరైతే గురు అనుగ్రహము పొందినవారై ఈ ‘రహస్యోపనిషత్’ను అధ్యయనము చేస్తారో, అట్టివారు సర్వపాపముల నుండి వినిర్ముక్తులవగలరు. ‘కేవలీ ఆత్మానుభవము’ను సిద్ధించుకొనగలరు. కైవల్యమును ప్రాప్తించుకొనగలరు. అనగా ‘‘నేను సర్వదా కేవలమగు ఆత్మనే। అన్యమైనదంతా సర్వదా మమాత్మానంద స్వరూపమే!’’ - అని గ్రహించి, దర్శిస్తూ ఆత్మానందమునందు ఓలలాడుచుండగలరు.


🙏 ఇతి శుక రహస్య ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।