[[@YHRK]] [[@Spiritual]]

Vāsudēva Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


సామవేదాంతర్గత

8     వాసుదేవోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। యత్ సర్వ హృదయాగారం, యత్ర సర్వం ప్రతిష్ఠితమ్,
వస్తుతో యత్ నిరాధారం వాసుదేవపదం భజే।।

ఏది సర్వజీవుల హృదయగృహము సర్వదా నివాస స్థానముగా కలిగియున్నదో, ఎద్దాని యందు సర్వము (లోకములు, లోకస్థులు, లోకేశులు) ప్రతిష్ఠితమైయున్నదో, ఏది వస్తుతః దేనిపైనా ఆధారపడనిదై, నిరాధారమైయున్నదో.., అట్టి‘‘వాసుదేవ పదము’’ను సమాశ్రయించుచున్నాము. ధ్యానించుచున్నాము.

ఓం
1. నమస్కృత్య భగవాన్ నారదః
సర్వేశ్వరం వాసుదేవం పప్రచ్ఛ:
‘‘అధీహి భగవన్।
ఊర్ధ్వ పుండ్ర విధిమ్,
ద్రవ్య - మంత్ర స్థానాది సహితం
మే బ్రూహి’’ - ఇతి।।
‘ఓం’ పరమాత్మ సంజ్ఞాక్షరమునకు నమస్కరిస్తూ….,
ఒక సందర్భములో బ్రహ్మమానసపుత్రుడు, సర్వలోక శ్రేయోభిలాషి అగు శ్రీ నారదదేవర్షి - సర్వేశ్వరుడగు వాసుదేవుని దర్శించి, నమస్కరించి, ఈ విధంగా పరిప్రశ్నించ సాగారు.

శ్రీ నారద మహర్షి: హే భగవాన్! వాసుదేవా! శరణు। నమో నమః। ద్రవ్య- మంత్ర - స్థాన మొదలైన వివరములతో సహా ‘‘ ఊర్ధ్వ పుండ్ర విధి’’ గురించి దయతో నాకు వివరించమని ప్రార్థిస్తున్నాను.
2. తంహోవాచ భగవాన్!
వాసుదేవః:
వైకుంఠస్థానాత్ ఉత్పన్నం,
మమ ప్రీతికరం,
మత్ భక్తైః బ్రహ్మాదిభిః ధారితం।
విష్ణుచందనమ్।
మమాంగే ప్రతిదినమ్ ఆలిప్తం,
శ్రీ వాసుదేవ భగవానుడు : బిడ్డా! ముముక్షువుల శ్రేయస్సును ఉద్దేశించి అడుగుచున్నావు. చాలా సంతోషమయ్యా! ఇప్పుడు చెప్పుచున్నాను విను.

గోపీచందనము (లేక) విష్ణు చందనము:
→ వైకుంఠ స్థానమున ఉత్పన్నమైనట్టిది.
→ నాకు అత్యంత ప్రీతికరము.
→ నా భక్తులగు సృష్టికర్త - బ్రహ్మ మొదలైన వారంతా నన్ను ఉపాసించు దీక్షతో ధారణ చేస్తూ ఉంటారు.
→ నేను కూడా అట్టి విష్ణు చందనమును ప్రతిదినము ధరిస్తూ ఉంటాను - కాబట్టి ‘విష్ణు చందనము’.
గోపీచందనము ధరించిన వారిని ‘నిర్మలము’గా తీర్చిదిద్దు స్వభావము కలిగి యున్నట్టిది - కాబట్టి గోపీచందనము.
గోపీభిః ప్రక్షాళనాత్
‘గోపీచందనమ్’ - ఆఖ్యాతమ్।
మత్ అంగలేపనం, పుణ్యం।
చక్రతీర్థ అంతస్థితం।
చక్ర (తీర్థ) సమాయుక్తం।
పీతవర్ణం (పసుపురంగు)
ముక్తి సాధనం భవతి।।
వ్రజ గోపికలు అట్టి చందనమును నా యొక్క బాలకృష్ణ దేహమంతా ప్రతిరోజు పూసి, మరల ప్రక్షాళనం చేస్తూ ఆనందిస్తూ ఉండటం చేత ‘‘గోపీచందనము’’ అనే పేరుతో ప్రసిద్ధము.
నా అంగములను అలంకరించునదై ఉన్నట్టి - గోపీచందనము:
- పుణ్యభావములు ప్రసాదించునది.
- విష్ణు చక్రమునకు మధ్యస్తమై ఉండునది. చక్రతీర్థ సమన్వితము.
- పసుపు పచ్చని రంగులో ప్రకాశించునది. (సంపద జ్ఞానములకు ప్రదీక).
అథ గోపీచందనం
నమస్కృత్య, ఉద్ధృత్య,
‘‘గోపీచందన పాపఘ్న!
విష్ణుదేహ సముద్భవ!
చక్రాంకిత! నమస్తుభ్యమ్।
ధారణాత్ ముక్తిదో భవ।।’’
అట్టి ఊర్ధ్వ పుండ్ర - గోపీచందనము ముముక్షువులకు ముక్తిసాధకమై యున్నది.

ఉపాసించువిధి :
గోపీ చందనమునకు నమస్కరిస్తూ, చేతితో తాకుచూ…,
‘‘ఓ గోపీ చందనమా! నీకు నమస్కరిస్తూ చేతులలోనికి స్వీకరించు చున్నాను. నీవు సర్వపాపదృష్టుల నుండి దుష్ట కర్మల నుండి మమ్ములను రక్షించు స్వభావము కలదానవు. విష్ణుదేహము నుండి జనించిన దానవు.
చక్రాయుధముపై పూయబడి ఉన్నదానవు. విష్ణుచక్రప్రభావము సంతరించుకుని ఉన్నదానవు. నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. ధరించబోవుతున్నాను. నాకు అపార సంసార బంధముల నుండి ముక్తిని ప్రసాదించ వేడుకొనుచున్నాను. - అని ప్రార్థించెదరు గాక.
ఇమం మే గంగేతి జలమ్ ఆదాయ
‘‘విష్ణోర్నుకమ్’’ - ఇతి మర్దయేత్!
‘‘అతోదేవా అవంతు న’’
ఇతి ఏతైః మంత్రైః విష్ణుగాయత్ర్యా,
‘కేశవా’ ఆది నామభిర్వా ధారయేత్।।
ఈ విధంగా గంధమును అరచేతిలో ధరించి‘‘ఇమం గంగేతి’’ అని గంధముపై జలమును సంప్రోక్షించాలి. (చల్లాలి) ‘‘విష్ణోర్నుకమ్’’ అని విష్ణురూపమును మననము చేస్తూ రెండు చేతుల వ్రేళ్ళతో మర్ధన చేయాలి. ‘విష్ణువు’ నుండి బయల్వెడలిన విష్ణుతేజో రూపంగా భావించాలి.
‘‘అతోదేవా అవన్తు న’’ అను మంత్రమును పలుకుతూ
- ‘‘ఓం నారాయణాయ విద్మహే। వాసుదేవాయ ధీమహి। తన్నో విష్ణుః ప్రచోదయాత్।।’’ అను విష్ణుగాయత్రిని చెప్పుకొంటూ,
‘‘ఓం కేశవాయనమః। నారాయణాయ నమః।.. మొదలైన కేశవనామములు సముచ్చరిస్తూ, ‘‘గోపీచందనము’’ను ధరించాలి.
3. బ్రహ్మచారీ, వానప్రస్థో వా
లలాట హృదయ కంఠ
బాహుమూలేషు వైష్ణవ గాయత్ర్యా,
‘కృష్ణా’ ఆది నామభిః వా ధారయేత్।
ఇతి త్రివారమ్ అభిమంత్ర్య -
‘‘శంఖ చక్ర గదా పాణే।
ద్వారకా నిలయ। అచ్యుత।
గోవింద। పుండరీకాక్ష।
రక్షమాం శరణాగతమ్’’
ఇతి ధ్యాత్వా, గృహస్థో
‘లలాట’ - ఆది ద్వాదశ (12) స్థలేషు
అనామిక-అంగుల్యా వైష్ణవ గాయత్ర్యా
‘కేశవా’ ఆది నామభిర్వా ధారయేత్।।
బ్రహ్మచారి, వానప్రస్థులు - ఇరువురు - లలాటము (foreface)పై, హృదయము (గుండె)పై కంఠముపై, బాహుమూలములయందు (భుజములపై),
→ వైష్ణవ గాయత్రి చదువుచూ,
→ కృష్ణ మొదలైన నామములు పలుకుచూ
గోపీ గంధమును ధారణ చేసెదరుగాక।
ఇక గృహస్థుడు, మూడుసార్లు అభిమంత్రిస్తూ..,
‘‘హే శంఖచక్రగదాపాణీ! ద్వారకా నివాసా! అచ్యుతా! గోవిందా! పుండరీకాక్షా! మేము మీకు శరణాగతులము. పాహిమాం! రక్షమాం!’’
ఈ విధంగా ధ్యానిస్తూ ‘లలాటము మొదలైన దేహములోని 12 ప్రదేశములలో అనామికాంగుల్యము (బొటనవ్రేలు నుండి క్రిందగా నాలుగవ వ్రేలు)తో స్వీకరించి వ్రాయాలి. వ్రాస్తూ ఉన్నప్పుడు వైష్ణవగాయత్రీ మంత్రము, కేశవాది 24 నామములు పలుకుచూ గోపీచందనము ధారణ చేయుదురు గాక!
బ్రహ్మచారీ, గృహస్థోవా
లలాట హృదయ కంఠ
బాహుమూలేషు వైష్ణవ గాయత్ర్యా
‘కృష్ణా’ ఆది నామభిర్వా ధారయేత్।।
ఈ విధంగా బ్రహ్మచారిగాని, గృహస్థుడుగాని
‘‘లలాట- హృదయ- కంఠ- బాహుమూల’’ ప్రదేశములలో వైష్ణవగాయత్రి - ‘‘కృష్ణా-గోవిందా-గోపాలా-గోపీ జనలోలా - అచ్యుతా - అనంతా - నారాయణా -మొదలైన నామములు ఆయా అంతరార్ధముల మనస్సుతో స్మరిస్తూ గోపీగంధమును ధారణ చేయుదురుగాక.
4. యతిః → తర్జన్యా-శిరో, లలాట హృదయేషు
ప్రణవేనైవ ధారయేత్।।
బ్రహ్మాదయః త్రయో మూర్తయః।
తిస్రో వ్యాహృతయః।
యతులు - తర్జనీవ్రేలుతో (చూపుడు వ్రేలుతో) శిరోభాగంలోను, లలాటము నందు, హృదయ ప్రదేశములలో ‘ఓం’ అను ప్రణవము పలుకుచూ గోపీచందనమును ధరించెదరు గాక!
త్రీణి ఛందాంసి।
త్రయో అగ్నయః -
ఇతి జ్యోతిష్మంత (త్రయః)।
త్రయః కాలాః।
తిస్రో అవస్థాః।
త్రయ ఆత్మానః।
పుండ్రాః త్రయ ఊర్థ్వా -
‘అ’ కార ‘ఉ’కార ‘మ’కార
ఏతే ప్రణవమయ
ఊర్ధ్వ పుండ్రాః
తత్ ఆత్మా।
సత్ ఏతత్ ‘ఓం’ ఇతి।
త్రిపుండ్రములు దేనిదేనికి గుర్తు (లేక) సంజ్ఞ (లేక) ప్రతీక?
త్రిమూర్తులగు బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులకు
త్రి - వ్యాహృతులకు (భూః। భువః। సువః।),
ఋక్ - యజుర్ - సామ - త్రివేదములకు,
దక్షిణ - గార్హపత్య - అహవనీయములకు (యజ్ఞములోని త్రి-అగ్నులకు),
.. వీటిని వెలిగించుజ్యోతి తత్త్వమునకు,
భూత - వర్తమాన-భవిష్యత్ త్రికాలములకు,
జాగ్రత్ - స్వప్న - సుషుప్తి త్రి-అవస్థలకు,
జీవాత్మ - అంతరాత్మ - పరమాత్మ అనబడే త్రైవిద్యకు
- ‘అ’కార-‘ఉ’కార-‘మ’కారములో అంతర్గతమైయున్న ప్రణవమయ మగు ఏకాక్షరమునకు, ఓం తత్ సత్ నకు,
… వీటన్నిటికీ ఊర్ధ్వపుండ్ర త్రిరేఖలు చిహ్నములు.
తాని ఏకథా సమభవత్।
ఊర్ధ్వమ్ ఉన్నమయత
ఇతి ‘ఓం’ కారాధికారీ।
తస్మాత్ ఊర్ధ్వపుండ్రం
ధారయేత్।।
అట్టి మూడు పుండ్రములు ఏకగంధమే అయినట్లు - పైన చెప్పిన మూడు - మూడిటితో కూడినదే ‘ఓం’. ‘‘ఏకమే అనేకముగా కంపడుచున్నది’’ - సమభవత్। ఊర్ధ్వమునకు జేర్చునది కనుక ఊర్ధ్వ పుండ్రము. ‘ఓం’ అను ‘ఏక, అక్షర స్థానం’ యొక్క ఉపాసనకు సాధికారము కాబట్టి ఊర్ధ్వ పుండ్రము. అందుచేత బ్రహ్మతత్త్వము ఆశయముగా గల ముముక్షువు - అంతరార్థ ఉపాసనా పూర్వకంగా (తాత్త్వికార్థభావనతో) ఊర్ధ్వ పుండ్రము ధరించును గాక.
5. పరమహంసో.. లలాటే ప్రణవేన
ఏకమ్ - ఊర్ధ్వ పుండ్రం వా ధారయేత్।
తత్త్వ ప్రదీప ప్రకాశం
స్వాత్మానం పశ్యన్ యోగీ
మత్ సాయుజ్యమ్ అవాప్నోతి।

పరమ హంస (సోఽహమ్ ‘పరమమ్।। నేను సర్వదా సమస్తమునకు ఆధారమైయున్న కేవలాత్మ స్వరూపుడనే - అను స్వానుభవము సిద్ధించుకున్నవాడు) లలాటముపై ప్రణవ పూర్వకంగా ఏకపుండ్రమును ధరించునుగాక!

⌘ తత్ త్వమ్ → ‘నీవు’గా ఏదేది కనిపిస్తోందో, అదంతా పరమాత్మకు అనన్యము.
⌘ సోఽహమ్→ నేను స్వతఃగా, సహజముగా తత్ (పరమాత్మ) స్వరూపుడనే!

ఎవ్వడైతే మమాత్మయే ‘తత్’గా, ‘త్వమ్’గా ‘అహమ్’గా అఖండమగుచున్నదని,
అట్టి ఏకాక్షరాత్మ స్వాత్మయేనని గమనిస్తాడో,
అట్టివాడు నా సాయుజ్యమును (విష్ణుసాయుజ్యమును) పొందుచున్నాడయ్యా!

అథవా
న్యస్త హృదయపుండ్ర మధ్యే వా,
హృదయ కమల మధ్యే వా,
తస్య మధ్యే వహ్ని శిఖా
అణీయ ఊర్థ్వా వ్యవస్థితా।
నీల తోయద మధ్యస్థా
విద్యుల్లేఖేవ భాస్వరా,
నీవార శూకవత్ తన్వీ
పరమాత్మా వ్యవస్థిత ఇతి।
అతః పుండ్రస్థం
హృదయపుండరీకేషు
తమ్ అభ్యసేత్।
క్రమా దేవం (క్రమాత్ ఏవం) స్వమ్ - ఆత్మానం
భావయేత్ మాం పరం హరిమ్।
ఇంకా కూడా….,
- ఎక్కడ భావన (లేక) అనుభూతి ఉత్పత్తి అయి బయల్వెడలుచున్నదో అదియే హృత్-అయమ్ = హృదయమ్, (అహమ్ + ఋత్ = ‘‘నేను’’ యొక్క జననస్థానము, ఋత్ + అహమ్ = ‘‘అహమ్’’ యొక్క వాస్తవ/పర స్వరూపము. ఆవల నేనైన నేను’’).
హృదయ పుండ్రము మధ్యగా హృత్ పద్మము (కమలము). అట్టి హృదయ కమలము మధ్యగా - నీల తోయదము (నీలి మేఘము)
మధ్యగా నీవారధాన్యపు గింజ (వడ్లగింజ) సూక్ష్మమైన చివ్వరికొనవలె - విద్యులేఖనము, మెరుపు బిందు స్ఫురణ స్ఫూర్తి. ఆ మెరుపుగా పరమాత్మ వ్యవస్థితమై ఉన్నారు. అట్టి పరమాత్మ కొరకు అనుక్షణికమైన ధ్యాస-భావన - ఉపాసనలు ఆశ్రయించబడుగాక!
ఈ విధంగా పరమాత్మను హృదయ ప్రదేశములో గల పుండరీకము (స్వహృదయ పద్మము)నందు ‘అహమ్’ స్వరూపులై మెఱపు కణము వలె ఉంటూనే,
సర్వాత్మకుడు - అక్షరుడు - ఏకస్వరూపుడు - జగత్ రూపుడు - జగదాధారుడుగా కూడా వ్యవస్థితుడై ఉన్నారు. ఆ పరాపర స్వరూపుడగు హరిని గమనిస్తూ, హృదయంలో ఉపాసించెదరు గాక!
ఏకాగ్రమనసా యో మాం ధ్యాయతే
హరిమ్ అవ్యయమ్,
హృత్ పంకజే చ స్వాత్మానం
స ముక్తో। న అత్ర సంశయః।।
ఈ విధంగా ఎవ్వడైతే ఏకాగ్రతతో కూడిన మనస్సుతో స్వస్వరూపాత్మను, సమస్తమునకు పరుడను, అన్వయుడను అగు ‘హరి’గా స్తుతించబడు చున్నాను. నన్ను హృదయ పద్మమునందు అహమ్ స్వరూప స్ఫురణగా ఎవరు ప్రదర్శనమగుచున్నట్లు దర్శించి ఉపాసిస్తాడో,
- ‘స్వాత్మయే శ్రీమన్నారాయణుడు’’ అని ఆస్వాదిస్తాడో - అట్టివాడు నిత్యముక్తుడే. ఇందులో సందేహం లేదు.
6. ‘మత్ రూపం, అద్వయం బ్రహ్మ
ఆది-మధ్య-అంత వర్జితం,
స్వప్రభం, సత్-చిత్-ఆనందం,
భక్త్యా జానాతి చ అవ్యయమ్।
ఏకో విష్ణుః అనేకేషు, జంగమ స్థావరేషు చ
అనుస్యూతో వసతి ఆత్మా
భూతేషు అహమ్ అవస్థితః।
ఓ నారదా! ‘‘నేను’’ ఎట్టివాడనో, తత్త్వమేమిటో, నామరూపాదుల విశేషమేమిటో చెప్పుచున్నాను. దేనికి ‘‘ద్వితీయము’’ అనునదే లేదు కాబట్టి అద్వయమో, - అట్టి ‘‘కేవలాద్వయ, ఆదిమద్యాంత రహిత పరబ్రహ్మమే’’ నా రూపము. అట్టి అవ్యయము, స్వయం ప్రకాశుడను, సత్-చిత్-ఆనంద రూపుడను అగు నన్ను ‘భక్తి’చేతనే ‘‘సోఽహమ్ హరిః। హరిః తత్త్వమ్’’- గా తెలుసుకోగలరు.
సర్వత్రా సమముగా వేంచేసియున్న ఏకో-విష్ణురూపుడను. ఏకో- అక్షరుడనగు నేను స్థావర-జంగమములగు అనేక రూపములుగా సంప్రదర్శితుడను. పూదండలో దారము వలె సమస్త జీవులలో వారి వారి జాగ్రత్-స్వప్న-సుషుప్తుల అంతరమున అహమ్ స్ఫూర్తిగా అవస్థితుడనై ఉన్నట్టివాడను.
తైలం తిలేషు, కాష్ఠే వహ్నిః,
క్షీరే ఘృతం యథా, గంథః పుష్పేషు,
= భూతేషు తథా ఆత్మా
అవస్థితో హి- అహమ్।
బ్రహ్మరంధ్రే భృవోః మధ్యే
హృదయే ‘చిత్’ రవిం హరిమ్,
గోపీచందనమ్ ఆలిప్య
తత్ర ధ్యాత్వా ఆప్నుయాత్ పరమ్।
ఏ విధంగా ఈ సమస్త జీవులలో, సమస్త స్థావర-జంగములలో అంతరంగా హృదయాంతరంగుడనై ఉన్నానో, దృష్టాంత పూర్వకంగా విను.
తిలలో.. తైలము వలె, కట్టెలలో.. అగ్ని అంతర్లీనమై ఉన్నట్లు, పాలలో.. నేయివలె, పుష్పములలో.. గంధము వలె-సర్వ జీవులలో అఖండాత్మగా అహమ్ చైతన్య స్వరూపుడుగా అవస్థితుడనై వెలయుచున్నాను.
→ (కొండనాలుకకు ఊర్థ్వంగా సూటిగా శిరో ఉపరిభాగమున గల) బ్రహ్మరంధ్రమునందును,
→ రెండు కనుబొమ్మల మధ్యగా నుదిటియందు గల భ్రూమధ్య ప్రదేశమునందు,
→ ఆలోచనలు, భావనలు, అనుభూతులు, అనుభవములు జనించుచోటు-అగు హృదయ స్థానమునందును - బుద్ధిని నిలిపి,
చిత్ సూర్యుడు (లేక) చిదాదిత్యుడు అగు హరిని ధ్యానిస్తూ పైన వివరించుకొన్న విధంగా గోపీచందనమును ధరించువాడు సర్వదృశ్య వ్యవహారములను దాటినవాడై పరమపదమును పొందగలడు.
7. ఊర్ధ్వ దండ, ఊర్ధ్వ రేతాశ్చ, ఊర్ధ్వ పుండ్ర, ఊర్ధ్వ యోగవాన్
ఊర్థ్వం పదమ్ అవాప్నోతి, యతిః ఊర్ధ్వ చతుష్కవాన్।
ఇతి ఏతత్ నిశ్చితం జ్ఞానమ్, మత్‌భక్త్యా సిధ్యతి స్వయమ్।
నిత్యమ్ ఏకాగ్రభక్తి స్స్యాత్, గోపీ చందన ధారణాత్
బ్రాహ్మణానాం తు సర్వేషాం, వైదికానామ్ అనుత్తమమ్।
గోపీ చందనవారి భ్యామ్, ఊర్ధ్వపుండ్రం విధీయతే।
(1) ఊర్ధ్వ దండమును చేతులలో ధరించటము -
(2) ఊర్ధ్వ రేతస్సు (తేజో పాసనను)
(3) ఊర్ధ్వ పుండ్రములను ధరించటము
(4) ఊర్ధ్వ యోగము (బ్రహ్మరంథ్రమును చీల్చి సహస్రారరమును చేరు యోగాభ్యాసము)
అనబడు ఊర్ధ్వచతుష్టయమును అభ్యాసముగా ఆశ్రయించువాడు ఊర్ధ్వస్థానము (లేక) కేవలాత్మానందస్థానము, (లేక) సోఽహమ్ స్థానము పొందగలడు. (సహస్రారములో శివునితో జీవైక్యము సిద్ధించుకోగలడు).
(భక్తిః జ్ఞానమ్ ప్రజాయతే।) ‘‘అఖండము. అప్రమేయము - నిత్యము - సత్యము-సర్వాత్మ స్వరూపము కేవలము అగు ఆత్మయే నేను’’- అనే నిశ్చిత జ్ఞానము ఈ జీవునియందు- ‘‘భక్తి’’చేతనే స్వయముగా సిద్ధించ గలదు. (తత్ స్వయమ్ యోగ సంసిద్ధః కాలేక ఆత్మని విందతి) అందుచేత నిత్యము ఏకాగ్ర భక్తితో గోపీచందన ధారణను నిర్వర్తించాలి. భక్తి ప్రవృద్ధ మగుచుండగా, ఆత్మజ్ఞానము తనకు తానై యథాకాలంలో సిద్ధించ గలదు.
యో గోపీ చందన-అభావే,
‘‘తులసీ మూల మృత్తి కామ్’,
- ముముక్షుః ధారయేత్ నిత్యం
అపరోక్ష - ఆత్మశుద్ధయే (సిద్ధయే)।
ఒకవేళ గోపీచందనము లభించకపోతే, అట్టి సందర్భములో తులసీవృక్షము ఉన్నచోట, వ్రేళ్ళకు మూలగా ఉన్న మృత్తిక (మట్టిని) తీసి నిత్యము ధారణ చేయుటచే ఆత్మశుద్ధి, అపరోక్ష జ్ఞానము ముముక్షువుకు తప్పక లభించగలదు. నేను తులసీ ప్రియుడను కదా!
8. అతిరాత్ర అగ్నిహోత్ర భస్మనా అగ్నే
భసితం ఇదమ్ విష్ణుః’’
‘‘త్రీణి పదేతి’’
మంత్రైః వైష్ణవ గాయత్ర్యా
ప్రణవేన ఉద్ధూళనం కుర్యాత్।
ఏవం విధినా గోపీచందనం చ ధారయేత్।।
ఆ మరునాడు → చేయవలసినది
అగ్నేః భసితం ఇదమ్ విష్ణుః ‘‘త్రీణి పదేతి’’। ‘‘నారాయణాయవిద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్’’
(వైష్ణవ గాయత్రి)…. అని చదువుచూ అతిరాత్రాగ్నిహోత్ర భస్మమును ఉద్ధూళనము (Removing) చేసి, విధిపూర్వకంగా గోపీచందనమును మరల ధారణము చేయాలి.
యస్తు అధీతే వా
సర్వపాతకేభ్యః పూతో భవతి।
పాపబుద్ధిః తస్య న జాయతే।
స సర్వేషు తీర్థేషు స్నాతోభవతి।
స సర్వైః యజ్ఞైః యాజితో భవతి।
స సర్వైః దేవైః పూజ్యో భవతి।
శ్రీమన్నారాయణే మయి అచంచలా భక్తిశ్చ భవతి।
ఈ విధంగా ఎవ్వరైతే ఊర్ధ్వ పుండ్ర - శ్రీగంథధారణ వివరములతో కూడిన వాసుదేవోపనిషత్తును విధి - విధాన- అంతరార్థపూర్వకంగా అధ్యయనం చేస్తారో.., శ్రీ గంథ ధారణ చేస్తారో…,
- అట్టివారు సర్వపాపముల నుండి పునీతులు అవగలరు.
- పాపబుద్ధికి వారి యందు ఇకచోటు ఉండదు.
- సర్వ తీర్థములలో స్నానము చేసి పుణ్యఫలము వారికి లభించగలదు.
- సర్వ యజ్ఞములు చేసిన యజనఫలము వారు పొంద గలరు.
- సర్వ దేవతలను పూజించిన పుణ్యఫలము వారికి సిద్ధించగలదు.
- శ్రీమన్నారాయణుడనగు నాయందు అచంచలమైన భక్తి రూపుదిద్దుకోగలదు.
స ‘సమ్యక్జ్ఞానం’ చ లబ్ద్వా
‘విష్ణు సాయుజ్యం’ అవాప్నోతి।
న చ పునరావర్తతే।
న చ పునరావర్తతే।
ఇత్యాహ భగవాన్ వాసుదేవః
యస్తు ఏతత్ వా అధీతే,
సోఽపి ఏవమేవ భవతి।।
ఇతి ‘ఓగ్ం’ సత్యమ్।।
ఇతి ఉపనిషత్।।
సర్వత్రా సమస్వరూప- అఖాండాత్మ సందర్శన ప్రజ్ఞతో కూడిన ఆనంద రూపమగు ‘‘సమ్యక్ జ్ఞానము’’ సిద్ధించినదై, అట్టి అధ్యయనశీలుడు విష్ణు సాయుజ్యమును పొందుచున్నాడు. అట్టివానికి పునః పునరావర్త దోషము కలుగదు.
ఈ విధంగా వాసుదేవ భగవానుడు నారద మహర్షికి విష్ణు సాయుజ్య సిద్ధికి ఉపాయమైన ఉత్తమ - అవగాహన గీతములతో కూడిన ఊర్ధ్వ పుండ్ర- శ్రీగంధ ధారణా విధి - విధానోపాయమును ఉపదేశించారు. ఎవరు ఈ ‘‘వాసుదేవోపనిషత్’’ పఠిస్తారో, వారు వాసుదేవ ప్రోక్తమైన ఫలశ్రుతిని తప్పక సిద్ధించుకోగలరు.
।।ఇతి ఓ గ్ం సత్యమ్।।

ఇతి వాసుదేవోపనిషత్ సమాప్తా।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



సామవేదాంతర్గత

8     వాసుదేవ ఉపనిషత్

అధ్యయన పుష్పము

ఒక సందర్భములో బ్రహ్మ మానసపుత్రులు, లోక కల్యాణమూర్తి త్రిలోకసంచారి, మానవాళికి నారదభక్తి సూత్రప్రదాత అగు దేవర్షి శ్రీ నారదులవారు వాసుదేవుడగు శ్రీకృష్ణస్వామి దర్శనార్ధమై వచ్చారు. భగవానుడగు వాసుదేవునికి ప్రార్థనా-స్తుతి-స్తోత్ర-ప్రదక్షిణ- సాష్టాంగ దంద ప్రణామములు సమర్పించారు. వాసుదేవులవారు శ్రీనారదులవారిని చిరునవ్వుతో ఆహ్వానించి సుఖాశీనులుగా చేశారు.

శ్రీ వాసుదేవుడు : మహర్షీ! నారదా! క్షేమమేకదా? మహాత్ములు ఊరక రారు కదా! చెప్పండి. ఏమిటి విశేషము?

శ్రీ నారద మహర్షి : స్వామీ! వాసుదేవభగవాన్! భక్త సులభులగు మీకు, మరల మరల నమస్కారము.

హే అఖండజ్యోతి స్వరూపా! స్వామీ!

మీ ముఖము ఊర్ధ్వపుండ్రముతోను, దేహమంతా గోపీచందనముతోను ప్రకాసిస్తూ ఉండగా, మీరు బ్రహ్మానందస్వరూపులై మీ భక్త జనులమగు మాకు దర్శనమిస్తున్నారు. మిమ్ములను సందర్శిస్తూ జన్మజన్మల జాడ్యము తొలగిపోతోంది. మేము త్రిపుండ్ర - గోపీచందన సువాసనలచే ధన్యులమగుచున్నాము. మా హృదయములు గోపీచందన మలయమారుత వీచికలచే మధురాతి మధుర మగుచున్నాయి.

శ్రీ వాసుదేవులు : అవునయ్యా! విష్ణుచందనము ప్రతినిత్యము వ్రజగోపికలు నా దేహమునందు అలంకరించి, మరల పరిశుద్ధము చేస్తూ ఉండటము చేతనే దీనికి ‘గోపీచందము’ అనే పేరుతో లోక ప్రసిద్ధమగుచున్నది. ఇదంతా గోపస్త్రీల భక్తి పారవశ్యమాధుర్యమే. భక్తికి, అనురక్తికి వశుడనై ఉంటాను కదా!

శ్రీ నాదరమహర్షి : అధీహి భగవాన్! వాసుదేవా! ఊర్ధ్వపుండ్ర విధిమ్ - ద్రవ్య మంత్ర స్థానాది సహితం మే బ్రూహి। ఇతి।। పరంధామా! వాసుదేవా! ద్రవ్య-మంత్ర-స్థాన ఇత్యాది సహితంగా ‘‘ ఊర్ధ్వ పుండ్రవిధి - విధానము’’ గురించి ముముక్షువుల ఉపాసనా సౌకర్యార్థమై, విష్ణు సాయుజ్యసిద్ధిని ఉద్ద్యేశ్యించి వివరించవలసినదిగా మీకు అభ్యర్థన సమర్పిస్తున్నాను. ఎందుకంటే అట్టి అలంకారముచే గోపికలు పరాప్రేమను సిద్ధించుకుంటున్నారు కదా!

శ్రీ వాసుదేవ భగవానుడు : హే త్రిలోక లోక పావన సంచారీ! ప్రియ నారదమహర్షీ! ఈ విష్ణు చందనము వైకుంఠ లోకములో ఉత్పన్నమైనట్టిది. నాకు ఎంతో ప్రీతికరము. నా భక్తులగు బ్రహ్మదేవుడు మొదలైనవారిచే కూడా ధరించబడుచూ ఉన్నది. అవ్యాజ పరాప్రేమ సిద్ధులగు గోపికలు నా బాలకృష్ణ-అంగాగములు అలంకరించి మురిసిపోతూ ఉండేవారు. అందుచేత మరింతగా నాకు ఇష్టమగుచున్నది.

నేను కూడా ఇప్పటికీ ప్రతిదినము విష్ణు - చందనాలంకృతుడనై ఆనందమును పొందుచూ ఉంటాను..

అట్టి విష్ణు చందనము :-

విష్ణు చందన (లేక) గోపీచందన - ధారణోపాసన

గోపీచందనమునకు ముందుగా చెండు చేతులతో నమస్కరించి, అప్పుడు చేతిలోనికి తీసుకోవాలి.

శ్లో।। గోపీచందన! పాపఘ్న। విష్ణుదేహ సముద్భవ।
(తే) చక్రాంకిత। నమస్తుభ్యం। ధారణాత్ ముక్తిదో భవ।।

‘‘ఓ దివ్యస్వరూపమగు గోపీచందనమా! మాతా! నీకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు చేతులలోకి తీసుకొనుచున్నాను. నీవు సువాసనలచే- మాయొక్క దుర్భావములను, దుష్కృత్యములను, దురభ్యాస వ్యసములను - తొలగించగలవు. విష్ణు దేహము నుండి జనించియుండుటచే దోషములను తొలగించి నన్ను పవిత్రునిగా తీర్చిదిద్దగలవు. విష్ణు చక్రమును కూడా అలంకరించి ఉన్నావు. శ్రీచక్రాంకితవు. నీకు నమస్కరిస్తున్నాను. నీ యొక్క ధారణకై అనుజ్ఞను ప్రసాదించు. జన్మకర్మల పట్ల బంధ భావన తొలగి, ముక్తిభావన సిద్ధించుటకై అనుగ్రహించుము!’’.

ఈ విధంగా ‘విష్ణుగంధము’నకు హృదయపూర్వకంగా ముందుగా నమస్కరించాలి.

‘‘ఇమం మే గంగేతి!’’ అని పలుకుచూ నీటి చుక్కలను పొడిగంధముపై చల్లాలి. ‘‘విష్ణుపాదముల నుండి జనించిన ఈ గంగానదీ జలము అయి, ఈ విష్ణుగంధమునకు మరింత శోభ జతజేర్చును గాక!’’ అని భావించాలి.

‘‘విష్ణోర్నుకమ్ నమస్తుభ్యమ్’’ అని పలుకుచూ,, ‘‘విష్ణుభగవానుని దేహస్పర్శచే పవిత్రమైన ఓ విష్ణుగంధమా! నన్ను పవిత్రునిగా తీర్చిదిద్దుటకై మాతృమూర్తివై వేంచేయుము’’ - అని భావన చేస్తూ రెండు చేతులతో తడి గంధమును మర్దించాలి. (కలిపిరాయాలి). ‘‘అతో దేవా అవన్తు న’’ - మమ్ములను పరమాత్మ సామీప్యమునకు సన్నిధికి జేర్చెదవుగాక - అని శబ్దార్థ పూర్వకంగా ఆరాధన పూర్వకంగా మర్దించాలి.

అట్టి సమయములో →

(1) విష్ణుగాయత్రి : ‘‘ఓం। నారాయణాయ విద్మహే వాసుదేవాయ దీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్’’

(2) కేశవనామములు : ఓం కేశవాయనమః। నారాయణాయ నమః। మాధవాయ నమః। గోవిందాయ నమః। విష్ణువే నమః। మధుసూదనాయ నమః। త్రివిక్రమాయ నమః। వామనాయ నమః। శ్రీ ధరాయ నమః। హృషీకేశాయ నమః। పద్మనాభాయ నమః। దామోదరాయ నమః। సంకర్షణాయ నమః। వాసుదేవాయ నమః। ప్రద్యుమ్నాయ నమః। అనిరుద్ధాయ నమః। పురుషోత్తమాయ నమః। అధోక్షజాయ నమః। నారసింహాయ నమః। అచ్యుతాయ నమః। జనార్దనాయ నమః। ఉపేంద్రాయ నమః। హరవే నమః। శ్రీకృష్ణాయ నమః। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ఈ రెండూ గానము చేయుచుండును గాక. ఈ విధంగా పలుకుతూ విష్ణు గంధమును ధారణ చేయాలి.

‘బ్రహ్మచారి’ ఆశ్రమ వాసి అయి ఉన్నప్పుడుగాని, ‘వానప్రస్త’ ఆశ్రయవాసి అయి ఉన్నప్పుడుగాని లలాటము హృదయము కంఠము ఉభయభుజములపై - వైష్ణవ గాయత్రీమంత్రము, కేశవ నామములు చదువుచూ,
‘‘శ్రీకృష్ణా, పరాత్పరా! అచ్యుతా! భగవన్ స్వయమ్!’’ - ఇత్యాది స్తోత్రములు చేస్తూ విష్ణుగంధధారణ చేయాలి.

గృహస్థుడు - పై మంత్రములు చదువుచూ

శ్లో।। శంఖ చక్ర గదా పాణే। ద్వారకా నిలయా। అచ్యుతా।।
గోవిందా। పుండరీకాక్షా। రక్షమాం శరణాగతమ్।’’

అని పలుకుతూ లలాటము మొదలైన దేహములోని 12 ప్రదేశములలో విష్ణుగంథమును ధారణ చేయును గాక!

ధారణా పద్ధతి : అనామిక వ్రేలుతో (అంగుళీక వ్రేలుతో) వైష్ణవ గాయత్రి - కేశవాదినామములు - సంస్తుతిస్తూ, శ్రీకృష్ణ నామములు పలుకుచూ ‘12’ చోట్ల శ్రీగంధమును ధారణ చేసెదరుగాక.

బ్రహ్మచారి - గృహస్థుడు - కూడా - అంతరార్థ పూర్వకంగా శ్రీకృష్ణా- గోవిందా - గోపాలా- గోపీజనలోలా - అచ్యుతా - అనంతా - నారాయణా- నామములలో - లలాట హృదయ కంఠమూలేషు వైష్ణవ గాయత్ర్యా, శ్రీకృష్ణాది నామభిర్వా ధారయేత్।।

యతులు : సన్న్యాసాశ్రమ ధారి (లేక) యతి తర్జనీ (చూపుడు) వ్రేలుతో శిరస్సు - లలాటము, హృదయప్రదేశములో ‘ఓం’ (ప్రణవము) ఉచ్చరిస్తూ ధారణ చేయును గాక.

త్రిపుండ్రముల సంజ్ఞ - ‘మూడు’ రేఖలతో 12 దేహ ప్రదేశములతో ఉంగరపు వ్రేలుతో ధారణను ‘త్రిపుండ్రము’ అని అంటారు.

ఊర్ధ్వ-త్రి-పుండ్రములు వేటివేటికి ప్రతీకలు?

🌺 బ్రహ్మ - విష్ణు - మహేశ్వర → త్రిమూర్తులకు, (సృష్టి-స్థితి-లయములకు)।
🌺 త్రి -వ్యాహృతులకు, (భూ-భువర్-సువర్)।
🌺 ఋక్ -యజుర్ - సామ → త్రి-వేదములకు,। (ఋతము పలుకు ఋక్కులు, యజ్ఞయాగములు, గానములు (స్తుతులు)।
🌺 దక్షిణ - గార్హ పత్ర్య - (ఆహారరూప) ఆహవనీయ → త్రి -అగ్నులకు।
🌺 జగత్ జ్యోతి - ప్రజ్ఞా జ్యోతి - ఆత్మజ్యోతి → త్రి - జ్యోతులకు।
🌺 భూత - వర్తమాన - భవిష్యత్ - త్రి - కాలములకు।
🌺 జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - త్రి - అవస్థలకు।
🌺 జీవాత్మ - అంతరార్మ - పరమాత్మ - ఆత్మత్రయమునకు।
→ వీటన్నిటికీ ఊర్ధ్వత్రిపుండ్రముల సంజ్ఞార్థములు.

ఇంకా కూడా. -

… ఈ విధంగా ‘‘ఓం’’కారాధికారికి ఊర్ధ్వపుండ్ర సంజ్ఞగా, ఊర్ధ్వస్థానమునకు చేర్చు మార్గము / సూచనగా అగుచున్నది.

అందుచేత ముముక్షువు ఊర్ధ్వ పుండరీక ధారణము - శుభప్రదము.

ఇంకా విను.

పరమహంసలు → లలాటమునందు ‘ఓం’ ప్రణవోచ్చారణతో ఏకపుండ్రమును ధరించుచున్నారు.

ఇట్టి విధాన - అవగాహనలతో విష్ణుగంధ- పుండరీక ధారణను నిర్వర్తించు యోగి - స్వాత్మానం తత్త్వదీపప్రకాశమ్ పశ్యన్, యోగీ మత్ సాయుజ్యం ఆప్నోతి। ‘త్వమ్’గా కనబడుచున్నదంతా స్వాత్మ యొక్క తత్త్వదీప ప్రకాశమే - అను రూపమగు నాయొక్క సాయుజ్య స్థానమును చేరుచున్నాడు.

‘‘మమాత్మయే (1) తత్‌గా (పరమాత్మగా), (2) త్వమ్‌గా (నీవుగా) (3) ఎదురుగా కనిపిస్తున్న ఈ సమస్త జగత్తు’’ అని దర్శిస్తూ -ఆత్మయొక్క ఏక-అక్షరత్వమును, అఖండత్వమును, అప్రమేయత్వమును బుద్ధితో ఎప్పుడు ఈ జీవుడు స్వానుభవం చేసుకుంటాడో - అట్టి స్థితియే ఈ జీవునియొక్క విష్ణుసాయుజ్యము. అదియే ‘‘సోఽహమ్ సః’’ స్థానముగా కూడా అభివర్ణించబడుతోంది. ‘విష్ణు తత్ త్వమ్’గా గానము చేయబడుతోంది.

హృదయాంతర్గత శ్రీమన్నారాయణ ధ్యానము

ఎక్కడ నుండి అహమ్ - త్వమ్ - జగత్ ఇత్యాది భావనలు బయల్వెడలుచున్నాయో అదియే హృదయము.
- హృదయ పుండ్రము మధ్యగా (లేక) - న్యస్త హృదయ పుండ్ర మధ్యే వా,
- హృదయ కమల మధ్యగా, హృదయ కమల మధ్యేవా,

తస్య మధ్యే వహ్ని శిఖా అణీయ-ఊర్థ్వా వ్యవస్థితా, నీల తోయద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా।

నీల తోయద (నీలి మేఘముల) మధ్య విద్యులేఖ (విద్యుల్లత, మేఘపు మెరపు) వంటిదిగాను, నీవారము (ధాన్యపు గింజ) యొక్క చిట్ట చివర కొనవలెను.

అతి సూక్ష్మరూపుడను, సర్వాంతర్యామిని, సర్వ తత్త్వ స్వరూపుడను-అగు నేను సమస్త జీవుల హృదయ పుష్పమునందే వేంచేసి ఉన్నాను. అట్టి నన్ను సర్వదా ధ్యానించటమును అభ్యసించాలి సుమా!

ఎవ్వడైతే తన హృదయపుష్పము (పుండరీకము) నందే - పుండరీక వరదుడుగా నన్ను దర్శిస్తూ, మననమును అభ్యసిస్తాడో, ఆతడు నన్ను తెలుసుకోగలడు. సర్వమునకు పరము అయినట్టి, సర్వము హరించు హరి స్వరూపునిగా భావిస్తూ ఉండునుగాక.

ఏకాగ్రచిత్తముతో తన హృదయ పద్మమునందే స్వాత్మకు అనన్యమని నన్ను తెలుసుకొని, అట్టి అనన్యత్వము తానే సంతరించుకుంటాడో, అట్టివాడు నిత్యముక్తుడే। ఇందులో సందేహము లేదు.

నారద మహర్షి : మీయొక్క సహజ - తాత్విక రూపము ఎట్టిదో చెప్పండి. నా బుద్ధి యొక్క కుశలత కొరకై దయచేసి మరికొంత విశేషంగా వివరించండి స్వామీ!

వాసుదేవుడు : ఓహో ! నారదా! ఈ ప్రకృతి గత రూపమునకు వేరైన నాయొక్క కేవలీరూపము గురించి వినాలనుకుంటున్నావా! సరే!

మత్ రూపమ్ అద్వయ బ్రహ్మమ్ : కధారచనలో ఏదీ కూడా ఆ కథా రచయితయొక్క ‘‘రచనా కళావిశేషము’’నకు వేరై ఉండదు కదా! పాత్రల పరస్పర సంబంధములు, మంచి చెడు గుణములు మొదలైనవన్నీ రచయితయొక్క రచనా చమత్కారమే గాని వేరు కాదు. రచయితకు రచనలోని పాత్రలు అనన్యము.

అట్లాగే…,

ఈ సమస్త విశ్వము నాకు వేరు కాదు. నాకు ద్వితీయమై ఎక్కడా ఏదీ లేదు. అందుచేత నేను అద్వితీయుడను. అద్వయబ్రహ్మమే నాయొక్క అనునిత్య సహజ వాస్తవరూపము. కథారచయిత కథలో వెతికితే కనిపించేవాడు కాదు. కాని రచయితగా పాఠకునిచే గమనించబడుతూనే ఉంటాడు. అట్లాగే నేను జ్ఞాన-విజ్ఞాన దృష్టికి- 1) జగత్తుకు వేరై 2) జగత్ స్వరూపుడనై కూడా అగుపిస్తూనే ఉన్నాను.

‘ఆది-మధ్య-అంత’ వర్జితమ్। : ఈ జగత్తుకు మునుముందటివాడను. దృశ్యములో కనిపించే సమస్తమునకు ‘‘మొదలు - మధ్య - చివర’’ ఉంటాయి. ‘దృక్’ (లేక) ‘‘కేవల ద్రష్ట’’ స్వరూపుడనగు నాకు ఆది మధ్యాంతములు లేవు. జన్మ-మృత్యువులు, జన్మ-జన్మాంతరములు ‘దేహము’ యొక్క స్వభావమై ఉండవచ్చుగాక. వాటి ఆది-అంతములు ‘దేహి’నగు నాకు చెందినవే కావు. దేహమునకు రూపమున్నది. మరి దేహికి రూపమెక్కడిది? రూపమేలేని చోట నాశనమెక్కడిది?

రూప పరిధులు లేవు కాబట్టి ఆనంతుడను. అనంతుడైనవానికి మొదలేమున్నది? చివర ఎక్కడిది? అందుచేతనే, ‘‘ఆది మధ్యాంత రహితుడను’’.

స్వప్రభం : చంద్రబింబము సూర్యుని వెలుగుగా కనిపించు విధంగా కాను. నేను మరొక బాహ్య వస్తువుచే వెలిగించబడుటలేదు. (సూర్యునివలె) స్వయం ప్రకాశుడను. స్వయం సత్ స్వరూపుడను.

✤ గుణములకు - ‘గుణి’ (గుణములు కలవాడు) యే వెలిగించుచున్నాడు.
✤ భావములను - భావికుడు ఆధారము.
✤ సృష్టికి - సృష్టిని సంకల్పించువాడు కారణము.
✤ అనుభవము - అనుభవిచే ప్రదర్శించబడుతోంది.
✤ 14 లోకములు - బ్రహ్మదేవునిచే కల్పించబడుచున్నాయి.
✤ మనోచిత్త బుద్ధి అహంకారములు - జీవాత్మపై ఆధారము.
✤ జీవాత్మ - ఈశ్వరాత్మచే ప్రదర్శనమగుచున్నది.

అయితే, నేను ఏ బాహ్య (వేరైన) వస్తువుచే ప్రకాశించబడటం లేదు.

సర్వదా కేవల - అఖండ - అప్రమేయాత్మనగు నేను మరొక వస్తువుచే ఉనికిని పొందటము లేదు. ఆత్మ స్వయం ప్రభవము - స్వయం సత్ స్వరూపము. ఈ విధంగా కేవలాత్మయే స్వరూప - స్వభావముగా కలిగియున్న నేను జ్యోతిర్జ్యోతిః - స్వయః జ్యోతిః, ఆత్మజ్యోతి స్వరూపుడను.

సచ్చిదానందమ్ : ఆత్మానంద స్వరూపుడనగు నాకు ‘3’ ముఖ్య విశేష లక్షణములు.

(1) సత్ = ఉనికి = ‘నేను ఉన్నాను’ అను స్వభావము నేను ఉంటేనే అనుభవము. నా ఉనికి చేతనే-లోకములు మొదలైనవి కూడా ఉండటము జరుగుతుంది.అట్లాగే, అన్యము, అంతరము (All else and the Inner Zone) మొదలైనవి కూడా ఉనికిని (ఉండటమును) పొందుచున్నాయి. ‘అహమస్మి’ అను సత్యము దేశ-కాల-గుణ-రూప-నామాతీతము. ఎందుకంటే సత్‌స్వరూపుడనగు నేను ఉన్నప్పుడే ఆయా దేశ - కాల - గుణ - రూప - నామములు నా ఉనికిలో కల్పితమైన ఉనికిగా ఉంటాయి. ‘స్వభావి’ లేకుండా స్వభావము, జన్మించువాడు లేకుండా ‘జన్మలు’ ఉండవు కదా! కేవలాత్మ స్వరూపుడను, జాగ్రత్ - స్వప్న - సుషుప్తికి సాక్షిని అగు నేను ఉండుటచేతనే అవన్నీ ‘ఉనికి’ని (వెలుగులో కనిపించే వస్తువుల ఆకారము వలె) పొంది ప్రకటనమగుచున్నాయి.
ఈ విధంగా నేను సర్వదా కేవల సత్ స్వరూపుడను.

(2) చిత్ : ‘ఎరుగుట’ అనునది స్వభావ సిద్ధముగా కలిగియున్నవాడను. నా యొక్క ‘ఎరుగుట’ నుండి ‘ఎరుగబడునది’ అనేదంతా నాచేతనే విస్తరించబడుతోంది. ‘ఎరుగువాడు - ఎరుగబడునది’ అను ఉభయము నానుండి స్వాభావికంగాను, అనన్యముగాను బయల్వెడలుచున్నాయి. తిరిగి లయిస్తున్నాయి. ఈ విధంగా జాగ్రత్ - స్వప్న -సుషుప్తులను, లోక లోకాంతర - జన్మ - జన్మాంతర వ్యవహారములను - నేను నా చిత్ స్వరూపముచే నింపి ఉంచుటచేతనే - అవి ఎరుగటం జరుగుతోంది. ఈ విధంగా ఈ త్రిలోకములు మొదలైన దృశ్య వ్యవహారమంతా నా చిత్ సూర్యస్వరూపము నుండి బయల్వెడలు తేజస్సులో సాకారము పొందుచున్న చిత్ చమత్కారములే। ‘చిత్’ కిరణ పుంజములే।
ఈ విధంగా నేను సర్వదా కేవల చిత్ స్వరూపుడను.

(3) ఆనందమ్ : సమస్తమునకు అనన్యుడనగు నా నుండియే అనన్యమగు అన్యము బయల్వెడలి, తిరిగి అనన్యమునందు ఉపశమించుచున్నది. కారణం? అది నా లీలా వినోదము. క్రీడా చమత్కారము. ఆనందస్ఫూర్తి. ‘అనుభవము, అనుభూతి’ మొదలైనవన్నీ నా ఆనంద (Enjoying) విభాగము నందే బయల్వెడలుచున్నాయి. నా ఆనంద స్వరూపమునందే ‘స్థితి’ పొంది ఉంటున్నాయి. ఆనందమునందే లయిస్తున్నాయి కూడా!
నేను సర్వదా కేవలానంద స్వరూపుడను.

అన్యమైనదంతా ఆత్మనగు నాకు - నాయొక్క స్వయంకల్పిత అనుభూతి విన్యాసమే. ఈ విధంగా నేను సర్వదా సత్ - చిత్ - ఆనందస్వరూపుడను.

భక్త్యా జానాతి చ అవ్యయము : ఎదురుగా ఇంద్రియములకు విషయమై అనుభవమగుచున్నదంతా ‘మార్పుచెందుట’ లేక ‘నశించుట’ను స్వభావముగా కలిగి ఉన్నది.(యత్ దృశ్యమ్, తత్ నశ్యమ్) ‘వ్యయము’ను సంతరించుకోబోవుచున్నది. ఇష్టమైనవి - ఇష్టముకానివి, సామాన్యములు - ఆశ్చర్యములు, సంబంధ - అనుబంధ - బాంధవ్యములు, దేహ - దేహాంతరములు → ఇవన్నీ వస్తూ పోతూ ఉండేవి. ఆగమాపాయనో అనిత్యః।

ఇక నేనో? అవ్యయుడను. సర్వజీవులలో మార్పుచెందని కేవల చిత్ చైతన్య రూపముగా, (ఆత్మగా) - సర్వదా వేంచేసియే ఉన్నాను. అట్టి మమాత్మ స్వరూపము (లేక) విష్ణు (ఉనికి) స్వరూపము - జ్ఞాన - అజ్ఞానముల చేతనో, (లేక) జన్మ - మృత్యువుల చేతనో, (లేక) జాగ్రత్-స్వప్న-సుషుప్తుల సందర్భములవలననో మార్పు చెందేది కాదు. అందుచేత నేను ‘అవ్యయుడు’గా తత్త్వజ్ఞులచే కీర్తింపబడు చున్నాను. సర్వ దేహములలో నేను అవ్యయుడనై, అచ్యుతుడనై, అనంతుడనై, నిత్యుడనై, కేవలుడనై ‘విష్ణువు’గా ఉన్నాను.

ఈ జీవుడు సర్వదా అవ్యయమగు ఆత్మ స్వరూపుడే। మమానంద స్వరూపుడే। అయితే ‘‘నేను దేహ - మనో - బుద్ధి - చిత్త - దృశ్యములచే పరిమితముగా చేయబడుచున్నాను’’ అని సంకుచిత దృష్టిని తనపై ఆపాదించుకొనుచున్నాడు. ‘జీవుడు’ అని అనిపించుకుంటున్నాడు. తనయందు సర్వదా వేంచేసియున్న నాయొక్క విష్ణుతత్త్వమును గమనించటము లేదు. సద్గురువులు ముముక్షువుకు ఇది గుర్తు చేస్తున్నారు.

మరి అవ్యయమగు, తన సహజస్వరూపమగు - నా విష్ణుతత్త్వము ఈ జీవుడు ఎట్లా ఎరుగగలడు?

అనన్యమైన భక్తి చేత అది సుసాధ్యము. సర్వము విష్ణుమయముగా ఎరిగి, దర్శిస్తూ, ఉపాసిస్తూ ఉండగా, స్వాభావికమైన పరాప్రేమ చేతనే - విష్ణుతత్త్వమును ఎరిగి విష్ణు సాయుజ్యము సిద్ధించుకోగలడు.

ఏకో విష్ణుః అనేకేషు జంగమ - స్థావరేషు చ, అనన్య భక్త్యా జానాతి చ - అవ్యయమ్।।

ఒకడు ఒక కల కంటున్నాడు. ఆ కలలో కనిపించేవన్నీ ఎవరివి? (కలలో కనిపించుచున్న జీవులు, వస్తువులు) ఎక్కడివి? ఆ కల తనదైనవాని కలాకల్పనా చైతన్య స్వరూపములే కదా! కల కంటున్నవాడు ఒక్కడే అయి ఉండి, ….కలలో చెట్లు, రాళ్లు, కొండలు, జంతువులు, మనుష్యులు, దేవతలు మొదలైన అనేకమైన భేదములుగా కనిపిస్తూ, - కల తనదైనవాడిచే అప్పటికి అవి - సత్యమే - అన్నట్లుగా అనుభవించబడుచున్నాయి కదా!

కథా రచయిత ఒక్కడే అయి ఉండి, ఆతడు వ్రాసిన కథలో అనేక సాత్విక-రాజసిక-తామసిక పాత్రలు, వారి పరస్పర స్నేహ - శత్రుసంబంధములు, గృహవర్ణనలు మొదలైనవన్నీ అగుపిస్తాయి కదా! ఆ రచయిత-రచనలోని పాత్రలు వలెనే - నేను ఏకో విష్ణు స్వరూపుడను.

అందరిలోని నేనైన నేనే నేను. అందరిలోను ఏర్పడియే ఉన్నవాడిని కాబట్టి మహాద్భుతుడను. దృశ్యములో స్థావర - జంగమాత్మకంగా కనిపించేదంతా నాయొక్క విశ్వరూప చమత్కారమే. ‘ఏకో విష్ణుః’ అయి ఉన్న నేను - పూదండలో అంతర్లీనంగా ఉండే దారము వలె - సర్వభూతజాలములోను ‘నేను-నేను’ రూపంగా అనుస్యూతుడనై ఉన్నాను. అట్టి నా విష్ణుస్వరూపముతో అనన్యత్వమే ఈ జీవుడు సిద్ధించుకోవలసిన విష్ణుసాయుజ్యము. అది భక్తితోనే చివరికి సుసాధ్యము.

ఓ నారదా! ఇంకా కూడా విను. ఈ సమస్తమునందు ‘‘అవ్యయ - ఆనంద - విష్ణు’’ స్వరూపుడనై ఎట్లా ఏర్పడి ఉన్నానో - ఇంకా కొన్ని దృష్టాంతాల సహాయంగా వివరిస్తున్నాను. విను.

(1). తైలం తిలేషు : తిలలు (నువ్వులు) చిన్నవిగాను, సన్నవిగాను, నల్లని గింజల రూపంలోను ఉంటాయి కదా! మరి నువ్వుల నూనె తిలాతైలము ఎక్కడ ఉన్నది? నూనె కనబడదేమి? నువ్వులను గానుగలో ఆడిస్తే, అప్పుడు పిప్పి ప్రక్కకు పోయి నువ్వులనూనె (తైలము) లభించగలదు కదా! నువ్వులన్నిటిలో నూనె ఉన్నవిధంగా, నేను సర్వ జీవులలో సారవస్తువుగా, అంతర్యామిగా (విష్ణువై) ఉన్నాను. జ్ఞాన - విజ్ఞాన ప్రయత్నములచే ‘ఏకో విష్ణుః’ గా తెలియబడగలను.

(2). కాష్ఠే వహ్నిః : రెండు కాష్ఠములు (చెక్కలు) ఒరిపిడి చేస్తే (ఒకదానితో మరొకటిని సంఘాతము చేస్తూ ఉంటే) అగ్ని జనిస్తోంది. అంతకు ముందు అగ్ని ఎక్కడున్నది? కాష్ఠములలోనే (కట్టెలలోనే) ఉన్నది. ఒరిపిడిచే బయల్వెడలుతోంది. అట్లాగే నేను సర్వ జీవులలో విష్ణుస్వరూపుడుగా అంతర్లీనుడనై ఉండి, భక్తి - జ్ఞాన - యోగాభ్యాస ఒరిపిడిచే స్వానుభవముగా అగుచున్నాను. అంతర హృదయ ఆహ్రాంత మధ్య హృదయాంతరంగుడనగు నన్ను అంతరమున చూచుకోవటమే విష్ణు దర్శనము, విష్ణుసారూప్యము, విష్ణుసాలోక్యము, విష్ణుసాయుజ్యము కూడా.

(3). క్షీరే ఘృతమ్ : పాలలో నేయి ఉన్నదా? ఉన్నది. మరి పాలు చూస్తే నేయి కనబడదేం? అట్లా కనిపించదు. మరి? పాలు కాచి చల్లార్చి, తోడు వేసి, అప్పుడు లభించే పెరుగు చిలికితే ‘వెన్న’ లభిస్తుంది. ఆ వెన్నను కాచినప్పుడు నేయి పొందబడుతోంది. అట్లాగే సర్వజీవులలో నేను మహత్ - అఖండ విష్ణుతత్త్వ స్వరూపుడనై ఉన్నాను.

ఈ జీవునికి విష్ణుతత్త్వము స్వానుభవముగా లభించాలంటే?
- బుద్ధిని యోగాగ్నిలో కాచి, చల్లార్చి,
- భక్తిని ‘తోడు’గా వేసి,
- జ్ఞానముతో చిలికితే -
అప్పుడు - భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడిన ఆర్ద్ర నిర్మల హృదయ విభాగము అనుభవమౌతుంది. ఆ హృదయము ‘పరమాత్మ సందర్శనము’ అనే అభ్యాసయోగము (వేడి) చే నేయి అనే విష్ణుసాయుజ్యము (అహమేవ ఏకో విష్ణుః మహాద్భుతమ్) స్వాభావిక - అనునిత్య - అవ్యాజానుభవంగా సిద్ధించగలదు.

(4). గంధః పుష్పేషు: పుష్పములో సుగంధము ఉంటుంది. అది అనుభవము అవాలంటే? గాలి వీచి, ఆ గాలిలో ఆ సుగంధము ప్రవేశించి, సుగంధానుభవముగా అగుచున్నది. అట్లాగే సర్వజీవుల హృదయపుష్పములోగల నా యొక్క మధురానుభవము ‘భక్తి - జ్ఞాన - యోగ - వైరాగ్య సాధనలు’ అనే వాయువీచికలచే స్వానుభవమవగలదు.

ఈ విధంగా తిలలలో తైలము వలె, కాష్ఠములో అగ్నివలె, పాలలో నేయి వలె, పుష్పములో గంధమువలె - ఆత్మ అంతటా వ్యవస్థితమై ఉన్నది. ఆత్మగా ఈ దృశ్యమును దర్శించటమే విష్ణు సాయుజ్యము.

నారదమహర్షి : అవును స్వామీ! జగద్గురూ। మీరు సర్వదేహములలో విష్ణుస్వరూపులై సర్వదా వేంచేసియే ఉన్నారని వేద - పురాణ - వేదాంగములు ఎలుగెత్తి గానం చేస్తూ ఉన్నాయి. తత్త్వజ్ఞులు పెద్దగా ఈ విషయం పలుకుచు స్తుతిస్తున్నారు. అయితే, ‘ఉపాసన’ కొరకై ఈ దేహములోని ఏ ఉత్తమ ప్రదేశములో సర్వతత్త్వస్వరూపము - అగు మీ విష్ణుతత్త్వమును విశేషముగా ధ్యానించుటకు యోగాభ్యాసమునకు సానుకూలమో దయతో వివరించండి.

విష్ణు భగవానుడు :

(1) బ్రహ్మరంధ్రము (2) భూమధ్య (ఆజ్ఞాచక్రస్థానము) 3. హృదయము (అనాహతచక్రస్థానము)

ఈ మూడు ప్రదేశములలో ‘గోపీచందనము’ను ఆలేపనముచేస్తూ, ఆయా ప్రదేశములలో చిత్ సూర్యుడు, చిత్ భగవానుడు, చిత్-అగ్ని తేజోరూపుడు అగు శ్రీహరిని పిలవాలి. సర్వాత్మక - సర్వతత్త్వస్వరూప - తత్త్వజ్ఞ లక్షణముల సమేతంగా, జ్ఞానస్వరూపి అగు శ్రీ లక్ష్మీసహితంగా ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానించాలి. ఆ త్రి స్థానములను (కుడిచేతి మునివ్రేళ్ళతో) స్పృశిస్తూ విష్ణుధ్యానమును చేయాలి. ఈ విధంగా త్రి-స్థానములలో సర్వాత్మకుడగు శ్రీహరిని ఆహ్వానిస్తూ విష్ణుచందన - స్పర్శతో అపరోక్షాత్మస్థికి ధ్యానించాలి. విష్ణుతత్త్వములో మమేకమగుచూ, వ్యష్టి తత్త్వమును దాటివేస్తూ ఉండాలి.

‘‘పరమాత్మ మరొకచోట కైలాసమో - వైకుంఠమో స్థానము కలిగి ఉన్నారు’’ - పరోక్ష ధ్యానము.

కళ్ళకు ఎదురుగా దృశ్యముగా ఉన్నారు - ప్రత్యక్ష ధ్యానము.

పరమాత్మ స్వస్వరూపముగా ఉన్నారు. ఆయన ఇంద్రియములకు ప్రత్యక్షము కాదు. మరొకచోట ఉన్నవారు కాదు. పరోక్షము కాదు. స్వస్వరూపచైతన్యమే కాబట్టి బుద్ధికి నిత్యప్రత్యక్షము. ఇంద్రియములకు విషయము కాదు కాబట్టి ఇంద్రియముల దృష్ట్యా పరోక్షము కూడా! - ఇది అపరోక్షధ్యానము. అపరోక్షజ్ఞానము. అపరోక్షోపాసన.

ఇట్టి అపరోక్షానుభూతిని మనోబుద్ధులతో ధ్యానము చేస్తూ, బ్రహ్మరంధ్ర - భ్రూమధ్య - హృదయ ప్రదేశములలో విష్ణుచందనము ధారణ చేయటము…అపరోక్షానుభవసిద్ధికి మార్గము.

(1) ఊర్ధ్వ దండము ( ఊర్ధ్వమగు ఆత్మభావన- షట్‌చక్రముల స్ధానములు గల ‘వెన్నెముక’ను బ్రహ్మదండముగా ‘గమనించటము’ ‘‘సమస్తము బ్రహ్మమే’’ - అను బుద్ధియొక్క అచంచల నిశ్చయము).
(2) ఊర్ధ్వ రేతస్సు (సమస్తము ఆత్మతేజోవిభావముగా సందర్శించటము)
(3) ఊర్ధ్వపుండ్రము (ఆజ్ఞాచక్రమునుండి ఊర్ధ్వముగా బ్రహ్మరంధ్రము వరకు ఉపాసన).
(4) ఊర్ధ్వ యోగము (బ్రహ్మ రంధ్రము దాటి సహస్రారమునందు నిశ్చలమగు యోగాభ్యాసము).

ఈ నాలుగు యోగాభ్యాసములు నిర్వర్తించు యోగాభ్యాసి ఊర్ధ్వపదమును సిద్ధించుకొనుచూ ‘యతి’ అను స్థానమును సిద్ధించుకొనుచున్నాడు. ఇటువంటి ధ్యాన-సాధన-కార్యక్రమపరుడు క్రమంగా నాపట్ల గల భక్తిబలముచే ‘‘నేను సర్వదా సర్వాత్మకమగు పరమాత్మ స్వరూపుడనే’’ అనే నిశ్చిత, అచ్యుత జ్ఞానము - స్వాభావికము, అనునిత్యము చేసుకొనుచున్నాడు.

నిత్యము ఏకాగ్రమగు భక్తితో (పరాప్రేమతో), గోపీచందధారణను ఉపాసనా-విజ్ఞాన-పరమార్థ దృష్టితో నిర్వర్తిస్తూ ఉండటము ఉత్తమ భక్తిమార్గము. భక్తి వలన ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞానమువలన సమస్త సంసార నిర్మూలన రూపమగు స్వ-అఖండ అవ్యాజానందము సిద్ధించగలదు.

వైదికములగు బ్రాహ్మణములను ఉపాసించు బ్రాహ్మణులు గోపీచందనమును తీర్థముతో కలిపి ఊర్ధ్వపుండ్రము ధరించాలి. ఇది శాస్త్రములచే ‘‘తప్పక అనుసరించవలసిన పద్ధతి’’గా చెప్పబడుతోంది.

తులసీ ప్రదేశ మృత్తిక:
ఒకవేళ గోపీచందనము లభ్యపడకపోవుచున్నప్పుడు, మరొక విధానము సూచించబడుతోంది. నాకు అత్యంత ప్రియమగు తులసీమొక్క మూలనుండి మృత్తికను (మట్టిని) ముముక్షువు స్వీకరించి గోపీచందనమువలెనే ‘అపరోక్షాత్మసిద్ధి’ కొరకు (గంధమువలె) ఉపయోగించటముచే కూడా ఉత్తమ ప్రయోజనము తప్పక సిద్ధించగలదు.

రాత్రి ధరించిన గంధమును తెల్లవారి: -
‘‘అతిరాత్రాగ్నిహోత్ర భస్మన, అగ్నేః భసితం ఇదం విష్ణుః త్రీణి పదేతి మంత్రైః’’ -అను మంత్రముతో, ఇంకా వైష్ణవ గాయత్రీ - ప్రణవమంత్రములతో, కేశవాది నామములతో ‘ఉద్ధూళనము’ (గంధము తొలగించటము) చేసుకొనును గాక. మరల సమయ నిర్ణయములను పాటిస్తూ (పైనచెప్పిన) విధి విధానంగా గోపీచందన ధారణము చేయుదురు గాక।
ఓ నారదమహర్షీ। ఇప్పుడు గోపీచందనధారణ యొక్క ఫలశ్రుతిని వినండి.

ఫలశ్రుతి

ఎవ్వరైతే ఈ మన సంవాదములోని విష్ణుగంధ ధారణను భక్తి జ్ఞాన వైరాగ్యములతో అంతరార్థ పూర్వకంగా ధారణ చేస్తూ, హృదయ పుండరీకమున విష్ణుదర్శనము అభ్యసిస్తూ ఉంటారో,
అట్టివారు
→ సర్వ పాతకములనుండి విముక్తులై పునీతులగుచున్నారు.
→ సర్వపాపపు బుద్ధి దోషములను తొలగించుకొనగలరు.
→ సర్వపుణ్య తీర్థములలో స్నానము చేసిన పవిత్రతను సంతరించుకొనగలరు.
→ సర్వయజ్ఞ - యాగములు యజించిన (నిర్వర్తించిన) పుణ్యలోక ప్రవేశ ఫలములను పొందుచున్నారు.
→ దేవతాలోకములో పూజ్యులు అగుచున్నారు.
→ శ్రీమన్నారాయణుడనగు నాపట్ల అచంచలమగు భక్తిని సిద్ధించుకోగలరు.
→ సర్వత్ర పరమాత్మను, సర్వము పరమాత్మయందు, సర్వమునందు పరమాత్మను దర్శించగల ‘సమ్యక్జ్ఞానము’ సంపాదించుకొన్నవారై సాక్షాత్ విష్ణుసాయుజ్యమును పొందుచున్నారు.

న చ పురనరావర్తతే। న చ పునరావర్తతే। వారికిక ‘‘ఆబ్రహ్మా భువ నార్లోక పునరావృత్తి’’ అను దోషము ఉండదు.

ఈ విధంగా భగవానుడగు వాసుదేవుడు శ్రీ నారద మహర్షికి ద్రవ్య - మంత్ర - స్థానాది విశేషముల సహితంగా ఊర్ధ్వపుండ్ర విధి గురించి బోధించారు.

ఎవ్వరైతే ఈ ‘‘వాసుదేవోపనిషత్’’ను అధ్యయనము చేస్తారో, ఇందలి పరార్థమును ఉపాసిస్తారో -
అట్టివారు శ్రీ వాసుదేవస్వామి చెప్పిన ఉత్తమ ప్రయోజనము తప్పక పొందగలరు.



🙏 ఇతి వాసుదేవ ఉపనిషత్ సమాప్తా 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।