[[@YHRK]] [[@Spiritual]]

Avyakta Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


సామవేదాంతర్గత

1     అవ్యక్తోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్

ఓం ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్।
నృసింహ భీషణమ్ భద్రం మృత్యుర్మృత్యుమ్ నమామ్యహమ్।।


శ్లో।। స్వాజ్ఞాన (స్వ-అజ్ఞాన) అసురరాట్ గ్రాస, స్వజ్ఞాన నర కేసరీ, ప్రతియోగి వినిర్ముక్తం, బ్రహ్మమాత్రం కరోతు మామ్।।

స్వకీయ స్వస్వరూప అజ్ఞానము అను అసురుని చీల్చివేయువారు, ద్వైతవాదముల నుండి విముక్తి కలిగించువారు, స్వస్వరూప జ్ఞానానందులు అగు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిని బ్రహ్మజ్ఞానము కొరకై శరణువేడుచున్నాము.

ఓం।
1. పురా కిలా ఇదం న కించన ఆసీత్।
న ద్యౌః। న అంతరిక్షం। న పృథివీ।
కేవల జ్యోతీరూపమ్। అనాది - అనన్తమ్।
అనణ్వ స్థూల రూపమ్,
అరూపమ్। రూపవత్ అవిజ్ఞేయమ్।
జ్ఞానరూపమ్ - ఆనందమయమ్ ఆసీత్।
‘‘ఓం’’ ప్రణవస్వరూపుడగు పరమాత్మను ఉపాసిస్తూ,
ఈ అనేక భేదములతో కూడి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యజగత్తు మొట్టమొదట లేనేలేదు. సృష్టికిపూర్వము దివ్యమగు దేవలోకము లేదు. అంతరిక్షము లేదు. పృథివీ లేదు. మునుముందుగా మరి ఏమున్నది?
- కేవల తేజో (జ్యోతి) స్వరూపము, ఆది-అన్తము లేనట్టిది. సూక్ష్మము గాని-స్థూలము గాని కానట్టిది. అపురూపమైనది. రూపాత్మకముగా తెలియబడనట్టిది. కేవల జ్ఞానానందరూపము అగు ‘కేవలాత్మ’ మాత్రమే। (Merely Absolute self is present) సర్వ లక్షణములకు విలక్షణము, వేరు, కేవలము అయిన ‘నేనైన నేను’ మాత్రమే ఉన్నది. ‘నాది అనునది’ అంటూ ఏదీ లేదు. ఇవన్నీ మన ‘కేవలాత్మ’ యొక్క జన్మల మునుముందటి స్వాభావిక లక్షణములు.
తత్ అన్యత్ తత్
ద్వేధా (2) ఆభూత్।
అద్దానికి ‘అన్యము’ అనునది ఎప్పుడూ లేదు! అట్టి ఏకము - అనన్యము అగు ఆత్మ రెండు విధములుగా ప్రదర్శనమవసాగుచున్నది.
‘హరితమ్’ ఏకమ్।
‘రక్తమ్’ అపరమ్।
(1) హరితము (ఆకుపచ్చనిది) - (మాయారూపము). (Feelings)
(మాయా = కల్పన; ఊహ; భావన; యోచన; అనుభూతి).
(2) ఎర్రనిది (రక్తవర్ణము)-(మాయి, పురుషరూపము (లేక) పురుషకారము). (Feeler).
(పురుష = కల్పించువాడు; ఊహించువాడు; భావించువాడు; యోచించువాడు; అనుభూతి తనదైనవాడు. మాయ = కల్పన)
తత్ర యత్ ‘రక్తం’, తత్ పుంసోరూపమ్ అభూత్।
యత్ హరితమ్, తత్ మాయయాః।
తౌ సమాగచ్ఛతః, తయోః వీర్యమేవమ్ అనందత్।
తత్ అవర్ధత।
అట్టి (1) పురుషుడు (పురుషకారము-మాయ) (2) కల్పనారూపమగు ‘‘మాయ’’ రెండూ కల్పనచే రూపుదిద్దుకోసాగాయి.
ఆ రెండిటి సమావేశముచే వీర్యము (క్రియాశక్తి) రూపుదాల్చి వృద్ధి చెందసాగాయి.
తత్ అండమ్ అభూత్ హైమమ్।
తత్ పరిణమమానమ్ అభూత్।।
ఆ వీర్యము (క్రియాచైతన్యము). అ + హమ్ = అహమ్ రూప-హైమ (బంగారు) అండముగా (గ్రుడ్డుగా) అయి పరిణామము (Change Factor) స్వీకరించసాగింది. (నిష్క్రియమగు ఆత్మనుండి సక్రియము + పరణామము ప్రదర్శనమవసాగుచుండటం జరుగుతోంది.
(హైమ = మహైవ = నాకే చెందినది)
2. తతః పరమేష్ఠీ వ్యజాయత।
సో అభిజిజ్ఞాసత -
‘‘కిం మే కులమ్?
కిం మే కృత్యమ్?’’ - ఇతి।
తం హ వాక్ అదృశ్యమాన
అభ్యువాచ:
‘‘భో!భో! ప్రజాపతే!
త్వమ్ అవ్యక్తాత్ ఉత్పన్నోఽసి।
వ్యక్తమ్ తే కృత్యమ్।’’ ఇతి।
అట్టి ‘కేవలము + క్రియావిశేషము + పరిణామము’ల సమాగమముచేత రూపముపొందిన అండము నుండి సృష్టిచేయు కర్తృత్వాభిమానియగు పరమేష్ఠి (సృష్టికర్త । బ్రహ్మ) జనించారు.
అట్టి కల్పనకు సంబంధించిన - అభిమానముతో కూడిన పరమేష్ఠి (కర్తృత్వాభిమాని) ఈవిధంగా అభి-జిజ్ఞాస (గొప్ప జిజ్ఞాస) పొందసాగారు.
- నేను ఎవరై ఉన్నాను? నేను ఏ కులము (స్వభావము) వాడను?
- ఎందుకు, ఎక్కడి నుండి జనించాను?
- నేను ఏమి చేయాలి - కిమ్ మే కృత్యమ్?

అప్పుడు అదృశ్యవాణి (అదృశ్యవాక్కు)….ఇట్లా వినిపించింది.
ఓ…ఓ…. ప్రజాపతీ। నీవు ‘అనేకులు’ అనే కల్పనకు అధిపతివి. అవ్యక్తము నుండి పుట్టావు. అవ్యక్తము (లేక) అదృశ్యమే నీ స్వభావము. వ్యక్తము (వక్తీకరణము)-నీవు చేయవలసిన పని. కనుక ‘వ్యక్తీకరణము’ అనబడే సృష్టిని నిర్వర్తించు.
‘‘కిం అవ్యక్తమ్?యస్మాత్ అహమ్ ఆసిషమ్?’’
కిం తత్ వ్యక్తం, యత్ (యన్) మే కృత్యమ్? ఇతి।
ప్రజాపతి : ఓహో। అవ్యక్తము నుండి నేను జనించానా? అట్టి అవ్యక్తము అనగా ఏమి? ఎట్టిది? నేను వక్తీకరించవలసిన వ్యక్తము ఏమిటి? ఎట్టిది? ఎందుకు? ఎవరి కొరకు? ఎవరి గురించి?
సా అబ్రవీత్
‘‘అవిజ్ఞేయం హి తత్, సౌమ్య!
తేజో యత్ అవిజ్ఞేయం, తత్ అవ్యక్తమ్।
తత్ చేత్ జ్ఞాస్యసి, మా అవగచ్ఛేతి।
అదృశ్యవాక్కు(లేక) వాణి : ఓ సౌమ్యా। బిడ్డా। ఏది తెలియబడజాలని తేజోరూపమో - అదియే అవ్యక్తము. ‘తెలుసుకోవటము’ అనుదానికి మునుముందే ఉన్న నీ రూపమే అవ్యక్తము.
అట్టి తెలియబడజాలనితత్త్వము చేత - ఏది తెలుసుకోబడుచున్నదో అదియే వ్యక్తము. అట్టి అవ్యక్తము తెలుసుకోవటానికై నన్ను (‘నేను’ను) తెలిసికొనుము. ‘అవ్యక్తము’ తెలియాలంటే ‘నేను’ ఏమిటో తెలుసుకోవాలి.
సహోవాచ :
కై షా (క ఏషా) త్వమ్
బ్రహ్మవాక్ యత్ అసి?
శంసాత్మానమ్। - ఇతి।
సా తు అబ్రవీత్ :
తపసామా విజ్ఞాసస్వ! - ఇతి।।
సహస్రం స బ్రహ్మచర్యమ్
- అధ్యువాస। - అధ్యువాస।।
ప్రజాపతి : ఓహో। నన్ను (నేనైననీవును / నీవైన నేనును) తెలుసుకోవాలా? ‘నీవు’ ఎవరు? అశరీరవాక్కుగా బ్రహ్మవాక్కుగా వినబడుచున్న నీవు ఎవరని నేను తెలుసుకోవాలి? ‘శం’ - శబ్దముగా వినబడు ఆత్మవగు మిమ్ములను ఎట్లా తెలుసుకోవాలి.
అదృశ్యవాక్కు / అశరీరవాణి : నన్ను తెలుసుకోవటానికై ఉపాయం తపనరూపమగు తపస్సే. కనుక తపస్సు చేసి నేనెవ్వరో తెలుసుకో।

అప్పుడు ‘ప్రజాపతి’ అని సంబోధించబడిన ప్రప్రథమ ప్రజ్ఞాస్వరూప పురుషుడు వేయివత్సరములు ‘‘బ్రహ్మము అనగా ఏమిటి?’’- అనుబ్రహ్మచర్య నిష్ఠతో తపస్సు చేశారు. ‘నేను’ అనబడు బ్రహ్మము గురించి సుదీర్ఘంగా ‘అధ్యయనుడు’ అయ్యారు.
3. అథ అపశ్యత్ ఋచమ్
అనుష్టుభీం పరమాం విద్యామ్,
యస్య అంగాని అన్యే మంత్రాః,
యత్ర బ్రహ్మ ప్రతిష్ఠితమ్।
విశ్వేదేవాః ప్రతిష్ఠితాః,
- యః తామ్ న వేద, (యస్తాం న వేద)
కిమ్ అన్యైః వేదైః కరిష్యతి?
అప్పుడు వెయ్యేళ్ళ బ్రహ్మచర్యముతో కూడిన తపన (లేక) తపస్సుకు ప్రయోజనంగా- అనుష్టుప్ ఛందస్సుతోగల పరమమగు విద్య (లేక) పరావిద్యను ‘‘ఋక్’’ గాన మంత్ర రూపముగా కనుగొన్నారు (లేక) దర్శించారు (అపశ్యన్).

అట్టి సర్వోత్పత్తి స్థానమే (మంత్రమే) ప్రథమ ఋక్ - ప్రణవము. (‘ఓం’).

అన్యమంత్రములన్నీ ఏ ‘‘ప్రథమ ఋక్ - ప్రణవము - ఓం సంజ్ఞ’’ నకు అంగములుగా, ఎద్దానియందు ప్రప్రథమ సృష్టికర్తృత్వాభిమానియగు బ్రహ్మచే గమనించబడినాయో, సర్వదేవతలు కూడా అట్టి ఎద్దానిలో ప్రతిష్ఠితులై ఉన్నారో - అట్టి కేవలీ తత్త్వమును తెలుసుకోకుండా, అన్యములైనవి ఎన్ని తెలుసుకొని ఏమి ప్రయోజనము? తెలియబడేది ఎంత తెలిసి ఏమి లాభం? తెలుసుకొనువానిని తెలుసుకోవాలి.
తాం విదిత్వా స చ
రక్తం జిజ్ఞాసయామాస।
తామ్ ఏవమ్ అనూచానాం
గాయన్ నాసిష్ట।
సహస్రం సమా ఆద్యంత నిహిత
‘ఓం’ కారేణ పదాని అగాయత్।
సహస్రసమాః తథైవ అక్షరశః।
అట్టి కేవలమును తెలుసుకొనుచున్న ప్రజాపతి ‘‘తెలుసుకోవటము’’అనే క్రియారూపమగు రక్తము (రజో కేవలీ గుణము) నందు జిజ్ఞాస (Inquisitiveness) పూర్వకంగా ఉంటూ-రక్తమైనది (రజోరూపంగా ఉన్నది ఏమిటి’’) అని తెలుసుకునే జిజ్ఞాస కొనసాగించారు. అనుచానముగా (అనుకరణముగా, భృత్యునివలె) గానంచేస్తూ ఉండి పోయారు.

సహస్రసమంగా ఆద్యంత పూర్వకంగా ‘ఓం’ కార పదమును వేయి దివ్య వత్సరములుగానం చేస్తూ ఉండిపోయారు. సహస్ర సమంగా (వేయిసార్లు) ‘‘ఓం’’ అను శబ్దముతో - క్షరము కానిది, సర్వాతీతము, అనునిత్యము, కేవలము - అగు తత్త్వమును ఉపాసించసాగారు.
తతో జ్యోతిర్మయం, శ్రియాలింగితమ్।
సుపర్ణ రథమ్। శేష ఫణ - ఆచ్ఛాదిత మౌళిమ్।
మృగ ముఖమ్। నర వపుషం।
శశి సూర్య హవ్యవాహనాత్మక నయనత్రయమ్।
తతః ప్రజాపతిః ప్రణిపాత, ‘‘నమో నమ।’’ ।।ఇతి।।
తథైవ అర్చాథ। తమస్తౌత్।
అప్పుడు ఆ ప్రజాపతికి ఎదురుగా ఒక దివ్యతేజోరూపము సాకారమై కనిపించింది. ఆ రూపము…
-జ్యోతిర్మయము. దివ్యతేజస్సుతో వెలుగొందుచున్నట్టిది; ‘శ్రీదేవి’ అగు (శక్తి-ప్రకృతిరూప) లక్ష్మీదేవిచే ఆలింగనము చేసుకొనబడినట్టిది; సుపర్ణుని (గరుడుని) రథముగా అధిరోహించబడినట్టిది; ఆదిశేషుని వేయి పడగలచే ఆచ్ఛాదితమైన శిరస్సు కలిగియున్నట్టిది; మృగముఖము - నరశరీరముకలిగి నృసింహరూపము గలది; చంద్ర - సూర్య - అగ్నులను నయనములుగా కలిగి ఉన్నట్టిది.

అప్పుడు ప్రజాపతి తపస్సు విరమించి, లేచి ఆ దివ్యరూపమునకు సాష్టాంగనమస్కృతులు ‘‘నమో నమః’’ అని ఉచ్ఛరిస్తూ సమర్పించారు. అర్చించారు. స్తుతులు సమర్పించారు.
4. ‘ఉగ్రమ్’ ఇతి ఆహ ఉగ్రః।
ఖలువా ఏషః మృగరూపత్వాత్।
‘వీరమ్’ ఇతి ఆహ వీరోవా, ఏష వీర్యవత్త్వాత్।।
ప్రజాపతియొక్క నృసింహ స్తుతి।।
మృగరూపులై ఉగ్రరూపంగా కనిపిస్తూ ఉండటంచేత ‘‘ఉగ్రమ్’’! అని, నాతో సహా ఈ సమస్తము మీ సామర్థ్యమే అయి, వీర్యవంతులై కనిపిస్తూ ఉండటంచేత ‘‘వీరమ్’’! - అని సంస్తుతించుచున్నాను.
‘మహావిష్ణుమ్’ ఇతి అహ, మహతాం వా
అయం మహాన్ రోదసీ వ్యాప్య స్థితః।
‘జ్వలంతమ్’ ఇతి ఆహ
జ్వలన్ ఇవ ఖలు అసావత్ స్థితః।
‘‘సర్వతోముఖమ్’’ ఇతి ఆహ,
సర్వతః ఖలు అయం ముఖవాన్
విశ్వరూపత్వాత్।
సమస్తముయొక్క ‘నేనైన నేను’’ కాబట్టి - మహత్ స్వరూప సంపన్నులు. సర్వత్రా ఆక్రమించుకొన్న స్వరూపము కలవారు. మహత్ ఆదిస్వరూపులు, సమస్తమునకు జననస్థానము అయి ఉన్నారు. మీరు మహాన్‌తత్త్వస్వరూపులై భూమి - ఆకాశములలో అంతటా వ్యాపించి సంస్థితమైయుండటంచేత - ఈ మీ దివ్యరూపమును ‘మహావిష్ణుమ్’ అని అభివర్ణితము.

సర్వత్రా వ్యాప్తులై ఆసావత్ స్థితులై, మీ తేజస్సుతో సర్వమును వెలిగించుచుండటంచేత - జ్వలన్ ఇవ ఖలు ‘జ్వలంతమ్’ అని ప్రస్తుతి.

సర్వత్రా మీయొక్క ముఖమే అయి, విశ్వమంతా మీ ప్రదర్శమగు చుండటంచేత ‘‘సర్వతోముఖమ్’’ - అని స్తుతించుచున్నాను.
‘నృసింహమ్’ ఇతి ఆహ,
యథా యజురేవ ఏతత్। (యజురేవైతత్)
‘భీషణమ్’ ఇతి ఆహ,
భీషా వా అస్మాత్ ఆదిత్య ఉదేతి।।
అన్నివైపులా భీకరరూపములు - సందర్శనములు కలిగి ఉండటంచేత ‘‘నృసింహమ్’’ అని యజుర్వేద వాక్కు (యజుస్వరం)తో సన్నుతి. సమస్త తరంగాలలో శ్రేష్ఠమగు జలము వలె (నార=జలము) సర్వశ్రేష్ఠులు. (నారసింహమ్).

సర్వత్రా ముఖములలో వేంచేసి ప్రకాశమానుడైయున్న మీ కేవల దివ్య చైతన్యమూర్తికి భయపడియే → సూర్యుడు ఆకాశంలో కాల నిర్ణయాత్మకంగా ఉదయించుచున్నారు.
భీతః చంద్రమా।
భీతో వాయుః వాతి।
భీతో అగ్నిః దహతి।
భీతః పర్జన్యో వర్షతి।
‘భద్రమ్’ ఇతి ఆహ,
భద్రః ఖలు వయం।
శ్రియా జుష్టః।
మీ మూర్తీభవించిన దివ్య చైతన్య చమత్కృతికి భయపడియే చంద్రుడు ఆకాశములో ప్రకాశించుచు నలువైపులా ఓషధులను వెదజల్లుచున్నారు.
- మీకు భీతిల్లియే వాయువు వీచుచున్నది. అగ్ని వస్తువులను దహించుచున్నది. వర్షదేవతాభిమానీగు పర్జన్యుడు వర్షమును కురిపించుచున్నారు. అందుచేత ‘‘భీషణమ్’’ అని వర్ణన.

ఈ విధంగా, సర్వజగత్ రక్షక వ్యవహారశీలతను గమనిస్తూ తేజోమయరూపులగు మీకు ‘‘భద్రమ్’’ - అని అభివాదము. ‘క్షేమము’ను ప్రసాదిస్తూ భద్రరూపులగుచున్నారు.
‘‘మృత్యోః మృత్యుః’’ ఇతి ఆహ,
మృత్యోర్వా అయం మృత్యుః (మృత్యోర్మృత్యుం)।
అమృతత్త్వం।
‘ప్రజానామ్ అన్నాదానాం (అన్నాదం)।
‘నమామి’ - ఇతి ఆహ,
యథా యజుః ఏవైతత్।
‘అహమ్’ ఇతి ఆహ,
యథా యజుః ఏవై తత్।।
సర్వజగత్ సంపదలకు మీరే ప్రదాత. జగత్ విశేషములన్నీ, సమస్తము కూడా మీనుండియే బయల్వెడలుచున్నది. మిమ్ములను ఆశ్రయించి ఉన్నాయి. ఇది గమనించి ‘‘శ్రియాజుష్టమ్’’ అని స్తోత్రం.

సర్వమార్పు - చేర్పుల కారణ - కారణుడై వ్యవహరించటము చేతను, సర్వ మార్పులను తమయొక్క అమృతతత్వముచే నింపివేయటం చేతను - ‘మృత్యోర్వా అయం మృత్యుః - మృత్యోర్మృత్యుః అమృత స్వరూపమ్’’ అని గానం చేస్తున్నాను.

సర్వజీవరాసులకు ఇంద్రియములను, ఆ ఇంద్రియము లకు ‘విషయములు’ అనే ఆహారము ప్రసాదించుచుండటం చేత ‘‘ప్రజానామ్, అన్నదానం - నమామి’’ అని యజుర్వేద గానపూర్వకంగా నమస్కారము. సమస్తము మీ నుండియే జనించుచుండటంచేత ‘‘యః జుః ఉ’’ - యజుర్వేదులు.
5. అథ భగవాన్ తమ్ అబ్రవీత్:
ప్రజాపతే (హే)! ప్రీతో-హం।
కిం తవ ఈప్సితం తత్ ఆశంసేతి।
ఆ ప్రజాపతియొక్క సంస్తుతిలకు సంతోషించి భగవానుడు ఈ విధంగా పలికారు:-

హే ప్రజాపతీ। నీయొక్క ‘‘ఓం। ఈం। హం। ఉగ్రమ్। వీరమ్। మహావిష్ణుమ్। జ్వలంతమ్ సర్వతోముఖమ్। నృసింహ। భీషణమ్। భద్రమ్। మృత్యుర్మృత్యుమ్। నమామ్యహమ్’’ అని పలుకుచున్నట్టి మననార్థ- మంత్రస్తుతికి నేను ప్రీతి పొందానయ్యా। నీ ఈప్సితమేమిటో అడుగు. సంతోషంగా ప్రసాదిస్తాను.
స హోవాచ :
భగవన్! అవ్యక్తాత్ ఉత్పన్నో-స్మి,
వ్యక్తం మమ కృత్యమ్ ఇతి పురా శ్రావి।
తత్ర అవ్యక్తం భవాన్ - ఇత్యజ్ఞాయి। (ఇతి అజ్ఞాయ)।
వ్యక్తం మే కథయ!’’ - ఇతి।।
ప్రజాపతి → ఇట్లు అభ్యర్థించసాగారు.

హే భగవాన్! ‘‘నేను ఎక్కడి నుంచి పుట్టాను?’’ అనే ప్రశ్న నాయందు ఉదయించింది. నేను సమాలోచన చేసే ప్రయత్నంలో ఉండగా,‘‘అవ్యక్తము నుండి నీవు పుట్టావు. వ్యక్తమును వ్యక్తీకరించటమే నీ పని’’ - అని అదృశ్యవాణి నాకు వినిపించింది. ఆ అశరీరవాణి, సూచనను అనుసరించి తపస్సు చేశాను. మీరు ఇప్పుడు నా అనుభూతికి ప్రత్యక్షమైనారు. అందుచేత ‘‘మీరే అవ్యక్తము’’ అనునది నాకు తెలియవచ్చింది. మరి వ్యక్తము అంటే ఏమిటి? ఏవిధంగా? దయచేసి తెలియజేయండి.
భగవాన్ ఉవాచ
వ్యక్తం వై విశ్వం చరాచరాత్మకమ్।
యద్‌వ్యజ్యతే తత్ వ్యక్తస్య-
‘వ్యక్తత్వమ్’ - ఇతి।
శ్రీ భగవాన్ : చరాచరాత్మకమైన విశ్వమే ‘వ్యక్తము’. ఏదైతే ప్రదర్శనమై (Manifestaion), ఏది ‘‘అనుభవము-అనుభూతి’’ల రూపంగా సుస్పష్టము కాగలదో - అదియే వ్యక్తము. వ్యజ్యతే వ్యక్తస్య వ్యక్తత్వమ్। వ్యక్తీకరించబడి, వ్యక్తమగుచున్నదే అభివ్యక్తము. కనుక (నాక్రీడా - లీలా వినోదంగా) మీరు వ్యక్తీకరణమును నిర్వర్తించండి. జగత్ సృష్టిని నిర్వర్తించండి.
సహోవాచ : (ప్రజాపతిః ఉవాచ)
న శక్నోమి జగత్ స్రష్టుమ్
ఉపాయం మే కథయ-ఇతి।।
ప్రజాపతి : అవ్యక్తమునుండి బయల్వెడలిన నేను మీ ఉద్దేశ్యానుసారంగా వ్యక్తీకరణ రూపమగు జగత్ సృష్టి ని నిర్మించటానికి సంసిద్ధుడనై ఉన్నాను. మీ ఆజ్ఞప్రకారం అట్లాగే చేస్తాను. అయితే అది నావలన అవటమెట్లా? దయతో ఉపాయమును భోదించండి.
తమ్ ఉవాచ పురుషః
ప్రజాపతే! శృణు!
సృష్టేః ఉపాయం పరమం, యం విదిత్వా
సర్వం జ్ఞాస్యసి। సర్వత్ర శక్త్య (క్ష్య)సి।
సర్వం కరిష్యసి।
మయి అగ్నౌ స్వాత్మానం ‘హవిః ధ్యాత్వా,
తయైవ అనుష్టుభ్ - అర్చా।
ధ్యాన యజ్ఞో అయమేవ।
ఏతత్ వై మహోపనిషత్,
దేవానాం గుహ్యమ్।
న హ వా ఏతస్య
సామ్నాన్ అర్చాన,
యజుష అర్థోనువిద్యతే।
య ఇమాంన్, వేద స సర్వాన్ కామాన్
అవాప్య, సర్వాన్ లోకాన్ జిత్వా
మామేవ అభ్యుపైతి।
న చ పునరావర్తతే,
య ఏవం వేద। ఇతి।।
పరమపురుషుడగు భగవానుడు : హే ప్రజాపతీ। అయితే, సృష్టికల్పనకు పరమోపాయమేమిటో చెపుతాను, వినండి. ఇది శ్రద్ధగా వింటే సర్వము ఎరిగినవారై, సర్వశక్తిమంతులై. సర్వమును నిర్వర్తించగలరు.

నాయొక్క (విష్ణుతత్త్వము అనే) అగ్నియందు స్వస్వరూపమగు ‘స్వాత్మ’ను హవిస్సుగా ధ్యానము చేయండి. స్వాత్మనే ‘అనుష్టుప్ ఋక్’గా అర్చనకు ఉపక్రమించండి. అదియే ధ్యానయజ్ఞము.
ఇది దేవతలకు కూడా రహస్యమై యున్నట్టి మహోపనిషత్.

అట్టి ‘‘స్వాత్మహవిస్సు’’ స్వరూప, ‘‘మహోపనిషత్’’ రూప - ‘‘స్వస్వరూప ధ్యానయజ్ఞము’’ - ఋగ్వేద ఋక్కులచేగాని, యజుర్వేద యజ్ఞ కార్యములచేగాని, సామవేద గానములచేగాని సిద్ధించగలిగేది కాదు. నేను చెప్పుచున్న స్వస్వరూప జీవాత్మ సమర్పిత రూపమగు యజ్ఞమును ఎరిగినప్పుడు, అనుక్షణికంగా నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు,
→ సమస్త కోరికలు తీరగలవు.
→ సర్వలోకములు జయించబడగలవు.
→ నన్నే పొందటము జరుగగలదు.
→ మరల పునరావర్తదోషము ఉండదు.

(వేదములలో చెప్పిన భౌతిక ఉపకరణములతో చేసే యజ్ఞఫలము కాలబద్ధమైనది. పైగా, యజమానికి పునరావర్తదోషము తొలగదు. స్వస్వరూపమును సమస్తము అయి ఉన్న పరమాత్మతో ఏకము - అనన్యము చేయుటయే వాస్తవమైన యజ్ఞము, ప్రాణాయామము కూడా). వ్యష్టిగతమైన ‘నేను’ పట్ల ‘సమష్ఠగత నేనుకు చెందినదే కదా!’’ అను ధారణయే ‘‘స్వాత్మానమ్ హవిర్యజ్ఞము’’.

(ఇది చెప్పి విష్ణుభగవానుడు అంతర్థానమైనారు.)
6. ప్రజాపతిః తం యజ్ఞాయ
వసీయాంసమ్ ఆత్మానం మన్యమానో
మనోయజ్ఞేన ఏజే।
మానసిక యాగం
అప్పుడు ప్రజాపతి జీవాత్మను యజ్ఞకర్తగా, పరమాత్మను యజ్ఞపురుషునిగా భావన చేసి మనోయజ్ఞము చేయటానికి సంసిద్ధులైనారు. మానసిక యాగం ప్రారంభించారు.
స ప్రణవయా తయైవ అర్చా
హవిః ధ్యాత్వా ‘ఆత్మానమ్ ఆత్మని’
అగ్నౌ జుహుయాత్।
సర్వమ్ అజానత్। సర్వత్రా శకత్। సర్వమ్ అకరోత్।
‘‘ఓం’’ - అనే ప్రణవ ఋక్కుతో, (జీవ) ఆత్మస్వరూపము (స్వాత్మను) హవిస్సుగా ధ్యానము చేయుచూ (పరమ) ‘ఆత్మ’ అనే అగ్నియందు (జీవ) ఆత్మను హోమము చేయనారంభించారు.

అప్పుడు ప్రజాపతి సర్వము ఎరిగినవారై, సర్వత్రా శక్తిమంతులై, సర్వ సృష్టిక్రియా సామర్థ్యమును సముపార్జించుకొన్నవారయ్యారు.
య ఏవం విద్వాన్ ఇమం ‘ధ్యానయజ్ఞమ్’
అనుతిష్ఠేత్, సర్వజ్ఞో, అనంత శక్తిః,
సర్వకర్తా భవతి।
స సర్వాన్ లోకాన్ జిత్వా
బ్రహ్మ పరం ప్రాప్నోతి।
జగద్గురువగు నృసింహస్వామిచే బోధించబడినవారై, ప్రజాపతి నిర్వర్తించిన ధ్యానయజ్ఞమును ఏ వివేకి అనుష్టించుచూ ఉంటాడో, అట్టివాడు తెలుసుకోవలసినది తెలుసుకొన్నవాడై ‘‘సర్వజ్ఞుడు’’ కాగలడు. సర్వశక్తిమంతుడగుచున్నాడు. సర్వమునకు తానే ‘కర్త’గా ఎరుగుచున్నాడు. అట్టివాడు సర్వలోకములను జయించి, పరంబ్రహ్మపదమును పొందగలడు. స్వాత్మను సమస్తము - అయి ఉన్న కేవలీ ఆత్మ స్వరూపము గా దర్శించి, ఆత్మానందమును సిద్ధించుకోగలడు.
అథ ప్రజాపతిః లోకాన్ సినృక్షమాణః, తస్యా ఏవ విద్యాయా,
యాని త్రింశత్ (30) అక్షరాణి, తేభ్యః త్రీన్ లోకాన్।
అథ ద్వేద్వే అక్షరే తాభ్యామ్ ఉభయతో దధార।
తస్యా ఏవ అర్చో ద్వాత్రింశద్భిః (32)
అక్షరైః తాం దేవాః నిర్మమే।।
అప్పుడిక ప్రజాపతి లోకములను సృష్టించటము ప్రారంభించారు. ‘‘సృష్టివిద్య’’-కు సంబంధించిన 30 అక్షరములనుండి (From) (constant / unchanging Functions / Factors) 3 లోకములను సంకల్పించారు. వాటికి రెండు రెండు అక్షరములను అటు ఇటు చేర్చారు. 32 అక్షరముల ఋక్కు నుండి దేవతలను పరికల్పించారు. (32 అక్షరములు ఒక ఋక్కుగా రచించబడింది)
సర్వైః ఏవ స ఇంద్రో అభవత్।
తస్మాత్ ఇంద్రో దేవానామ్ అధికో అభవత్।
య ఏవం వేద, సమానానామ్ అధికో భవేత్।
అందరు దేవతలకు, త్రిలోకములకు పాలకుడుగా, ఇంద్రియ నియామకుడుగా ఇంద్రుని స్థానమునుకల్పించారు. ఇంద్రుడు సర్వదేవతలకు పాలకుడైనారు. ఎవ్వరైతే ఈ తత్త్వవిశేషమును (తత్త్వతః) తెలుసుకుంటాడో, అట్టివాడు సరిసమానులలో అధికుడు అగుచున్నాడు.
తస్యా ఏకాదశభిః పాదైః, ఏకాదశ రుద్రాః నిర్మమే।
తస్యా ఏకాదశభిః - ఏకాదశ ఆదిత్యాన్
నిర్మమే। సర్వైః ఏవ, స విష్ణుః - అభవత్।
తస్మాత్ విష్ణుః ఆదిత్యానామ్ అధికో అభవత్।
య ఏవంవేద, సమానానామ్ అధికో భవేత్।।
తన సృష్టికళ యొక్క 11 పాదముల నుండి ఏకాదశ రుద్రులను నిర్మించారు. ఆ 11 రుద్రుల నుండి 11 మంది ఆదిత్యులను కూడా సంకల్పించారు. అందరిలోకి విష్ణువు మొదటివాడు. అందుచేత విష్ణువు ఆదిత్యులలోకెల్లా అధికుడు అయినారు. ఇది తత్త్వార్థకంగా తెలుసుకొన్నవాడు - సమానులలో అధికుడుగా అగుచున్నాడు.
7. స చతుర్భిః చతుర్భిః అక్షరైః
అష్టౌ వసూన్ అజనయత్। (అష్ట వసువులు)
స తస్యా ఆద్యైః ద్వాదశభిః (12)
అక్షరైః బ్రాహ్మణమ్ అజనయత్।
ఆయన పలికిన 32 అక్షరములలో (32 మార్పులు చేర్పులు లేని కేవలతత్త్వములలో) ‘నాలుగేసి-నాలుగేసి’ → అక్షరములనుండి ‘అష్ట వసువులు’ కల్పించబడ్డారు.
మొదట ‘12’ అక్షరముల నుండి బ్రహ్మమును స్తుతించుచూ, బ్రహ్మమునందు నిష్ఠ కలిగి, బ్రహ్మతత్త్వజ్ఞానాభిమానముతో కూడిన బ్రాహ్మణులు సృజించబడ్డారు.
దశభిః దశభిః విట్ క్షత్రే।
తస్మాత్ బ్రాహ్మణో ముఖ్యోభవతి।
ఏవం తన్ముఖ్యో భవతి,
య ఏవంవేద,
తూష్ణీం ‘శూద్రమ్’ అజనయత్।
తస్మాత్ శూద్రో నిర్విద్యో అభవత్।
పది-పది-అక్షరముల నుండి కార్యసామర్థ్యాభిమానులు, కార్యఫల అభిమానులు (లేక) అభిముఖులు అగు క్షుత్రియులు వైశ్యులు సృజించబడ్డారు. బ్రహ్మజ్ఞానాభిమాన ఆధిక్యత కలిగినట్టి బ్రాహ్మణ లక్షణులు (జీవాత్మ-పరమాత్మ- జ్ఞానసంబంధమైన) రెండు అక్షరముల ఆధిక్యతచే శ్రేష్ఠులైనారు.

బ్రహ్మతత్వాభిమానులు (1) కార్య సామర్థ్యాభిమానులకంటే (మరియు) (2) ఫలాభిలాషుల కంటే కూడా - శ్రేష్టులు - (జీవాత్మ - పరమాత్మల జ్ఞానం జోడించబడటముచేత). ఇంద్రియాభిమానులగు ఇంద్రియానుభవములకు పరిమితులు అగు జీవులు శూద్రులుగా చెప్పబడుచున్నారు. ఇంద్రియానుభవములకు పరిమితులగువారు తూష్ణీకరించబడుతారు. ఇంద్రియాభిమానులకంటే కార్యదక్షాభిమానులు (క్షత్రియులు) శ్రేష్ఠులు. ఫలాభిమానులకంటే, (వైశ్యులు) కంటే, కార్యదక్షాభిమానులకంటే సర్వత్రా సమదర్శులగు (జీవాత్మ-పరమాత్మ- జ్ఞానము జోడించు) బ్రహ్మతత్త్వ జ్ఞానాభిమానులగు జీవులు శ్రేష్ఠులు - అగుచున్నారు.
న వా ఇదం దివా, న నక్తమ్ ఆసీత్ అవ్యావృత(త్త)మ్।
స ప్రజాపతిః అనుష్టుభాభ్యామ్,
అర్ధర్చాభ్యామ్ ‘అహోరాత్రాః’ అకల్పయత్।
అవ్యావృతమగు కేవలీ విష్ణుతత్త్వము సమక్షములో ఇది పగలు, ఇది రాత్రి అనునవి లేవు. అయితే సృష్టి రచనా చమత్కారము కొరకై అనుష్టప్ ఛందో - గానపూర్వకంగా అర్చనకు ఉపక్రమించి రాత్రింబవళ్లను -(Night & Day) కల్పించారు.
తతో వ్యైచ్ఛత్‌వ్యేవాస్మాత్ ఉచ్ఛతి।
అథో తమ ఏవ అపహతే
‘ఋగ్వేదమ్’ అస్యా ఆద్యాత్ పాదాత్ అకల్పయత్।
ఈ విధంగా (జ్ఞాన - అజ్ఞాన రూపములగు) పగలు - రాత్రులను విడదీసి కల్పించి, ఇక తమస్సు (అజ్ఞానాంధకారము)ను తొలగించగల మార్గములను కూడా సృష్టిలో ప్రవేశింపజేశారు.
‘యజుః’ ద్వితీయాత్। ‘సామ’ తృతీయాత్।
‘అథర్వ - అంగిరసః’ చతుర్థాత్।
యత్ ‘అష్టాక్షర(8)పదా’ తేన ‘గాయత్రీ’।
యత్ ‘ఏకాదశ(11)పదా’ తేన ‘త్రిష్టుప్’।
యత్ చతుష్పదా (4), తేన ‘జగతీ’।
యత్ ద్వాత్రింశత్ (32) అక్షరా తేనామ్ ‘అనుష్టుభ్’।
నవా ఏవ(9) సర్వాణి ఛందాంసి।
య ఇమాని సర్వాణి ఛందాంసి వేద,
సర్వం జగత్ ఆనుష్టుభ ఏవ
ఉత్పన్నమ్, అనుష్టుభి ప్రతిష్ఠితమ్।
ప్రతితిష్ఠతి యశ్చ ఏవం వేద।।
ఆ ప్రజాపతి ప్రథమపాదముగా (ఋక్కుల ప్రాధాన్యమగు) ఋగ్వేదమును, రెండవపాదముగా (యజ్ఞ యాగ మంత్ర-తంత్ర సూక్తులతో కూడిన) యజుర్వేదమును, మూడవపాదముగా (గానములతో స్థుతులతో కూడిన) సామవేదమును, నాలుగవ పాదముగా (ప్రకృతి ఉపాసనలతో కూడిన) అథర్వ అంగీరస (వేదము)ను ఉచ్ఛరించారు.

ఇంకా కూడా… అష్ట (8) అక్షర - పదములుగల గాయత్రీ ఛందస్సును, ఏకాదశ (11) అక్షర పదముగల త్రిష్టుప్ ఛందస్సును, చతుః (4) అక్షర - పదములుగల జగతీ ఛందస్సును, ద్వాత్రింశత్ (32) అక్షర - పదములు గల ‘అనుష్టుప్’ ఛందస్సును, ఇంకా కూడా (9) అక్షరములతో అనేక తదితర ఛందస్సులను సంకల్పించి సృష్టియందు ప్రతిక్షేపించారు. ఈ విధమైన సర్వవిధములైన అక్షర- పద సంయుతమైన సర్వఛందోబద్ధములను సృష్టియందు సంకల్పము చేశారు.

‘‘సర్వజగత్తు’ ‘అనుష్టుభ్’నందు ప్రతిష్ఠితము. ఇది అభ్యాసి అయిన ఎరిగినవాడు, ‘‘సర్వము ఆత్మయందే ప్రతితిష్ఠితము’’ అని ఎరుగుచున్నాడు.
8. అథ యదా ప్రజాః సృష్టా న జాయంతే
ప్రజాపతిః। ‘‘కథన్ను ఇమాః ప్రజాః
సృజేయమ్?’’ ఇతి చింతయన్।
‘ఉగ్రమ్’ ఇతి ఇమామ్ ఋచం
గాతుమ్ ఉపాక్రామత్।
అప్పుడు ప్రజాపతికి ‘ప్రజలను సృష్టించేది ఎట్లా?’ - అనునది ఆలోచించారు. ‘‘జీవులసృష్టి ఎట్లాగూ?’’ - అని చింతన చేస్తూ, ‘‘ఉగ్రం వీరం మహావిష్ణుం, జ్వలంతం సర్వతో ముఖమ్। సృసింహ భీషణమ్ భద్రమ్। మృత్యుర్మృత్యుమ్ నమామ్యహమ్’’…. అను ఋక్కును గానము చేయ ఉపక్రమించారు. (32 అక్షరముల మంత్రము)
తతః ప్రథమాత్ పాదాత్
‘ఉగ్ర’ రూపో దేవః ప్రాదుః అభూత్।
ఏకః శ్యామః। పురతో రక్తః, పినాకీ స్త్రీ-పుంస రూపః।।
తం విభజ్య, స్త్రీ షు। తస్య స్త్రీ రూపం,
పుంసి చ పుం రూపం వ్యధాత్।
అప్పుడు ‘‘ప్రథమపాదము’’ (స్టెప్–1) అగు ‘ఉగ్రమ్’ నుండి ఉగ్రరూపుడగు దేవుడు (రుద్రుడు) ఉద్భవించారు. ఏకస్వరూపుడు, శ్యామలా (నల్లని) వర్ణుడు, మరొకవైపుగా చూస్తే ఎర్రనివాడు,పినాకుడు (మట్టిరూపుడు), స్త్రీ -పురుషరూపుడు బుద్ధికి అగుపించారు. ప్రజాపతి ఆ పరతత్త్వ స్వరూపుని స్త్రీ విభాగమును ‘స్త్రీలు’ గాను, పురుష విభాగమును ‘పురుషులు’గాను విభజించి స్త్రీ - పురుషులను సృజియించసాగారు. (పురుషకార-ప్రకృతి విభాగములు)
(సః) ఉభాభ్యామ్ అంశాభ్యాం సర్వం ఆదిష్టః।
తతః ప్రజాః ప్రజాయంతే।
య ఏవం వేద, ప్రజాపతేః
సో-పి ‘త్ర్యంబక’ ఇమామ్ ఋచం ఉద్గాయన్
ఉద్గ్రథిత జటాకలాపః
ప్రత్యక్ జ్యోతిషి ఆత్మన్యేవ రన్తారమ్ ఇతి।
రెండు అంశలను సృష్టికొరకై నిర్మితముచేసి సృష్టిలో ప్రవేశింపజేశారు. ఈ విధంగా ప్రజాపతి సృష్టిలీలను కొనసాగించసాగారు. ఈ కనబడేదంతా ప్రజాపతియొక్క ఆత్మయందు కల్పనా చమత్కారమే. ‘‘ఎవ్వరైతే ఈ సృష్టి చమత్కారమును ఆది నారాయణ ప్రసాదిత చైతన్య చమత్కారముగాను, జటాకలాపము పైకి ముడికట్టుకొన్న త్ర్యంబకుని యందు - ఆత్మజ్యోతిరూప కాంతి పుంజముగాను ఎరుగుచున్నాడో, ఆతడు ఆత్మయే అయి ఆత్మయందేరమించగలడు’’ - అని నియమబద్ధము (ప్రజాపతి) చేశారు.
ఇంద్రోవై కిల దేవానామ్ అనుజావర ఆసీత్।
తం ప్రజాపతిః అభ్రవీత్।
గచ్ఛ దేవానాం అధిపతిః భవ - ఇతి।
సః (సో) అగచ్ఛతం, (అగచ్ఛత్తం) దేవా ఊచుః :-
‘‘అనుజావరో అసి త్వమ్ అస్మాకమ్, కుతః తవ ఆధిపత్యమ్?’’ ఇతి।
ఆ తరువాత దివ్యతత్త్వములగు (అశరీర శక్తిరూపులగు) దేవతలను సృష్టించారు. దేవతల సృష్టి తరువాత, దేవతలకు నాయకుడుగా ఇంద్రుని ప్రజాపతి నియామకం చేశారు. అయితే, దేవతలు ఇంద్రునితో ఇట్లు పలికారు. ‘‘ ఓ ఇంద్ర దేవా। మీరు ఇప్పుడు వచ్చారు. మేము ముందుగానే వచ్చి ఉన్నాము. మామీద మీ ఆధిపత్యము ఏమిటి?’’ -
స ప్రజాపతిమ్ అభ్యేతి ఉవాచ।
‘‘ఏవం దేవా ఊచుః
అనుజావరస్య కుతః -
తవ ఆధిపత్యమ్?’’ - ఇతి।
అది విని ఇంద్రుడు ప్రజాపతిని సమీపించి, ‘‘మీరు దేవతలపై ఆధిపత్యము - అనే బాధ్యత నిర్వర్తించవలసినదిగా నియమించారు. కానీ, ‘నీకన్నా ముందునుంచే మేముండగా మాపై మీ ఆధిపత్యమేమిటి?’ - అని నన్ను దేవతలు ప్రశ్నిస్తున్నారు. ఏమి చేయమన్నారో ఆజ్ఞాపించండి’’ - అని పలికారు.
తం ప్రజాపతిః ఇంద్రం
త్రి-కలశైః అమృత పూరైణాః
‘ఆనుష్టుభ్’
అభిమంత్రితైః అభిషిచ్య,
తం సుదర్శనేన దక్షిణతోర రక్ష,
పాంచజన్యేన వామతో
ద్వయేనైవ
సురక్షితో అభవత్।।
అప్పుడు ప్రజాపతి → ఇంద్రుని అమృతముతో నిండిన ‘3’ కలశములతో అభిమంత్రించారు. ‘3’ లోకములకు అధిపతిగా అభిషేకించారు.
‘విష్ణు అలంకారములయినట్టి - సుదర్శన చక్రము మీకు కుడివైపుగాను, పాంచజన్యము మీకు ఎడమవైపుగాను మీ అధికారమునకు రక్షణగా ఉండుగాక। - రెండువైపులా సుదర్శన - పాంచజన్యములచే రక్షితులై ఉంటూ త్రిలోకములను పాలించు బాధ్యతను నిర్వర్తించుము’’ - అని దీవించారు.
ఈ విధంగా ‘‘త్రిలోకములు, దేవతలు, త్రిలోకపాలకుడగు ఇంద్రుడు’’ - మొదలైనదంతా సృష్టి వినోదము’ అనే కార్యక్రమ నిర్వహణకై నియమితమైనది.
9. రౌక్మే ఫలకే సూర్యవర్చసి
మంత్రం అనుష్టుభమ్ విన్యస్య
తదస్య కంఠే ప్రత్యముంచత్।
తతః సుదుర్నిరీక్షో భవత్।
ఇంకా కూడా ప్రజాపతి ఇంద్రుని సమీపించి…,
సూర్య తేజస్సుతో, వర్చస్సుతో ప్రకాశించే బంగారు ఫలకముపై ‘అనుష్టుభ్’ మంత్రమును వ్రాసి, ఆ ఫలకముతో కూడిన దండను ఇంద్రునికి పూదండవలె వేశారు.
అట్టి తేజస్సు చేత ఇంద్రుడు తేరిపార చూచుటకు వీలు లేనంతగా దుర్నిరీక్షుడుగా అయ్యారు.
తస్మై విద్యామ్ ‘ఆనుష్టుభీం’ ప్రాదాత్।
తతో దేవాః తమ్ ఆధిపత్యాయ
ఆనుమేనిరే। స స్వరాట్ అభూత్।
ఇంద్రునికి ‘అనుష్టుప్’ విద్యను ఉపదేశించారు కూడా. అప్పుడు దేవతలు ఇంద్రుని త్రిలోకాధిపత్యమును అంగీకరించారు. ఆయన ‘స్వరాట్’ అయ్యారు.
య ఏవం వేద, ‘స్వరాట్’ భవేత్।
సో అమన్యత - పృథివీమ్ అపి
కథమ్ అపాం-జయేయమ? ఇతి।
స ప్రజాపతిమ్ ఉపాధావత్।
తస్మాత్ ప్రజాపతిః కమఠాకారమ్
ఇంద్ర నాగ భుజగేంద్ర ఆధారం
భద్రాసనం ప్రాదాత్।
ఎవ్వడైతే కేవల తేజోమయము, అందులోంచి సృష్ట్యభిమానుడగు ప్రజాపతి, ఆ ప్రజాపతిచే కల్పించబడిన దేవతలు - జీవులతో కూడిన త్రిలోకములు, ప్రజాపతిచే నియమితమైన త్రిలోకాధిపతితత్త్వము - గురించి ఎరుగుతాడో, అట్టివాడు ‘స్వరాట్’ అగుచున్నాడు.
అప్పుడు ఇంద్రుడు, ‘‘నేను ఈ పృథివిని, జలమును జయించటము, పరిపాలించటము ఎట్లా నిర్వర్తించాలి?’’ - అని ఆలోచించసాగారు. ఆయన ప్రజాపతిని సమీపించి ‘‘నేను ఎట్లా పరిపాలించగలనో ఆజ్ఞాపించండి!’’ …అని అడిగారు.
అప్పుడు ప్రజాపతి తాబేలు ఆకృతి కలిగియున్నట్టిది, ఇంద్రమణి - నాగ - భుజగేంద్రము (ఆదిశేషుని అంశ)లను ఆధారముగా కలిగి ఉన్నట్టిది అగు ‘‘భద్రాసనము’’ను ప్రసాదించారు.
స పృథివీమ్ అభ్యజయత్।
తతః స ఉభయోః లోకయోః
అధిపతిః అభూత్।
య ఉభయో లోకయోః
అధిపతిః భవతి,
స పృథివీం జయతి।
యో వా అప్రతిష్ఠితం శిథిలం
అహ్రాతృవ్యేభ్యః
పరమాత్మానం మన్యతే।।
అప్పుడు ఇంద్రుడు భూమిని ఆక్రమించి జయించివేశారు.
ఊర్థ్వ - అధో - మధ్య త్రిలోకములకు అధిపతి అయినాయి.
ఎవ్వడైతే - సర్వత్రా సర్వదా ప్రకాశమానమై వేంచేసి ఉన్నట్టిది, సంప్రతిష్ఠితము అగు ‘‘పరమాత్మయొక్క సంప్రకాశకరూపము’’గా - ఈ అప్రతిష్ఠ శిధిలస్వభావ భూ-ఆకాశాదులతో కూడిన ఈ సమస్తమును మననము చేస్తాడో అట్టివాడు పృథివీజయమును పొందుచున్నాడు.
సృష్టితత్త్వమును ఈ విధంగా ఎరిగినవాడు తాను పృథివీ తత్త్వమునకు పరిమితుడు కాక అధిగమించివేయగలడు. పరతత్త్వమునందు ప్రవేశించగలడు.
స ఏతమ్ ఆసీనమ్ అథితిష్ఠేత్।
ప్రతిష్ఠితో శిథిలో
అహ్రాతృవ్యేభ్యో వసీయాత్ భవతి -
యశ్చ ఏవం వేద। యశ్చ ఏవం వేద।।
ఎవ్వడు ఆత్మను శిధిలము అగుచున్నదానిగాను, అప్రతిష్ఠితముగాను భావన చేస్తాడో ఆతడు అహ్రాతములచే (జగత్ ప్రదర్శనములతోబాటు) శిధిలత్వమును అనుభవముగా పొందుచున్నాడు. ఎవ్వడైతే పరబ్రహ్మము యొక్క ఇహ - పర చమత్కార తత్త్వమును నిత్యము సంప్రతిష్ఠిమైనదిగా ఎరుగుచున్నాడో,….అట్టివాడు
- కూర్చున్నచోటన ఉండియే బ్రహ్మతత్త్వమునందు ఆసీనుడు కాగలడు.
- దృశ్య శిధిలత్వమునకు అతీతుడై, సర్వమును అధీనమునందు కలవాడై పరబ్రహ్మమునందు సుప్రతిష్ఠితుడు కాగలడు.
10. య ఇమాం విద్యాం అధీతే
స సర్వాన్ వేదాన్ అధీతే।
స సర్వైః క్రతుభిః యజతే।
స సర్వ తీర్థేషు స్నాతి।
స మహాపాతక -ఉపపాతకైః ప్రముచ్యతే।
ఎవ్వరైతే అవ్యక్తముయొక్క వ్యక్తీకరణ చమత్కార సంబంధమైన ఆత్మవిద్యను అధ్యయనము చేస్తాడో….
అట్టివాడు →
✤ సర్వవేదములను అధ్యయనము చేసిన ప్రయోజనము పొందుచున్నాడు.
✤ సర్వక్రతువులు నిర్వర్తించిన ఫలితము లభిస్తుంది.
✤ సర్వతీర్థములలో స్నానం చేసిన పవిత్రత సిద్ధిస్తుంది.
✤ ఆత్మవిద్యను అధ్యయనము చేసి స్వస్వరూపముయొక్క ఆత్మౌన్యత్వము ఏమిటో ఎరిగినవాడు ఆతని ఇతఃపూర్వపు మహాపాతక ఉపపాతకముల నుండి వినిర్ముక్తుడు అగుచున్నాడు. నిత్యనిర్మల ఆత్మానంద స్వరూపుడై విరాజిల్లగలడు.
స బ్రహ్మవర్చసం మహత్ ఆప్నుయాత్।
ఆ బ్రహ్మణః పూర్వాన్ - ఆకల్పాత్ చ,
ఉత్తరాంశ్చ వంశ్యాన్ పునీతే।
నైనమ్ ‘అపస్మార’ ఆదయో రోగా ఆదిధేయుః।
స యక్షాః స ప్రేత పిశాచా అప్యేనం స్పృష్ట్వా, దృష్ట్వా,
శ్రుత్వా వా పాపినః పుణ్యాన్ లోకాన్ అవాప్నుయుః।
- మహత్తరమైన బ్రహ్మవర్చస్సు పొందుచున్నాడు.
- బ్రహ్మమొదలుకొని పూర్వాపర వంశములు పునీతమగుచున్నాయి.
- ‘అపస్మారము’ మొదలైన మానసిక - శారీరక ఆధి - వ్యాధులు ఆతనిని ఆక్రమించవు.
యక్ష-ప్రేత-పిశాచములు కూడా అట్టి ఆత్మజ్ఞానతత్పరుని స్పృశించినా, చూచినా, ఆతని నోటి నుండి ఆత్మ సమాచారము వినినా కూడా,….వారి వారి పాపములులేమైనా ఉంటే, అవన్నీ తొలగి - పుణ్యలోకములు పొంది సుఖించగలరు.
చింతిత మాత్రాత్ అస్య
సర్వే అర్థాః సిద్ధ్యేయుః।
పితరమ్ అవైనం సర్వే మన్యంతే।
రాజానశ్చ అస్య ఆదేశికారిణో భవంతి।
న చ ఆచార్య వ్యతిరిక్తం శ్రేయాంసం దృష్ట్వా నమస్కుర్యాత్।
అట్టి ఆత్మతత్త్వ - సో-హమ్ అనుభవి - చింతించినంత మాత్రంచేతనే సర్వ అర్థములు సిద్ధించగలవు.
అట్టివానిని జనులు తమ తండ్రిగా భావనగా చూస్తూ ఉంటారు.
రాజ్యమును పాలించేవారు కూడా అట్టివానిని తమను ఆదేశించువానిగా భావిస్తూ ఉంటారు.
ఆత్మతత్త్వజ్ఞులగు ఆచార్యుల తత్త్వజ్ఞానవాక్యములకు వ్యతిరిక్తమైన శ్రేయస్సు గురించి పలుకువారు నమస్కరించుటకు అర్హులు కారు.
న చ అస్మాత్ ఉపావరోహేత్।
జీవన్ముక్తశ్చ భవతి।
దేహాంతే తమసః పరంధామ ప్రాప్నుయాత్।
యత్ర విరాట్ నృసింహో అవభాసతే, తత్ర ఖలు ఉపాసతే।
అట్టి ఆత్మజ్ఞులగు మహనీయులు కంటే ఎత్తైన స్థానంలో కూర్చుని సంభాషించరాదు. వారిని ఎత్తైన స్థానంలో ఆసీనులను చేసి భక్తి - ప్రపత్తులతో సంభాషించాలి.
ఎవ్వరైతే ….ఈ ‘అవ్యక్తోపనిషత్’ చెప్పు (1) ‘‘అవ్యక్త’’ (2) వ్యక్తీకరణ ప్రజ్ఞా-కర్తృత్వాభిమాన) ప్రజాపతి (3) వ్యక్తీకరణరూప-ప్రజాసృష్టి-స్థితి - లయముల చమత్కారమును) ఎరుగుచున్నాడో….అట్టివాడు జీవన్ముక్తు డవగలడు. దేహాంతము-పరంధామమును ప్రాప్తించు కొనుచున్నాడు.
తత్ స్వరూప ధ్యానపరా
మునయ ఆకల్ప-అంతే
తస్మిన్ ఏవ ఆత్మని లీయంతే।
న చ పునరావర్తంతే।
ఏ స్థానమునుండైతే విరాట్ రూపుడగు నృశింహస్వామి అవభాసించుచున్నారో, అట్టి స్థానమును - ఉపాసకుడగు బ్రహ్మవిద్యా అధ్యయని - చేరుకొనగలడు.
‘తత్’ అనబడు విష్ణుతత్త్వము (లేక) నృశింహతత్త్వమును ఎరిగినవాడు - సర్వ కల్పనలకు ఆవలగల - తత్ ఆత్మ తత్త్వము నందే లీనమై ఉంటున్నాడు. పునరావృత్తికి సంబంధించిన దోషము ఆతడు పొందడు.
న చ ఇమాం విద్యామ్
అశ్రద్ధదానాయ బ్రూయాత్,
న అసూయావతే, న అనూచానాయ,
న అవిష్ణుభక్తాయ, న అనృతినే,
న అతపసే, న అదాంతాయ,
న అశాంతాయ, న అదీక్షితాయ,
న అధర్మశీలాయ
న హింసకాయ,
న అబ్రహ్మచారిణ।।
ఈ అవ్యక్తోపనిషత్ ఆత్మవిద్యను
→ శ్రద్ధ లేనట్టివానికి,
→ అసూయను వదలనివానికి,
→ గురు, శాస్త్ర సంప్రదాయముల పట్ల గౌరవము లేనివానికి,
→ విష్ణుభక్తుడు (దైవభక్తుడు) కానివానికి,
→ సత్య దృష్టిలేని వానికి, అసత్యము పట్ల (ఇంద్రియ విషయ పరంపరల పట్ల) నమ్మిక వదలనివానికి,
- ఆత్మజ్ఞాన - ఆత్మా-హమ్ భావనలకొరకై తపనతో కూడిన తపస్సు యొక్క అభ్యాసము లేనివానికి,
- ఎప్పుడూ ప్రాపంచిక సంగతి - సందర్భ - సంబంధములపై అశాంతితో కూడిన ధ్యాసలు కలవానికి,
- దీక్ష, పట్టుదల లేనివానికి,
- స్వధర్మ నిరతి లేనివానికి, అధర్మశీలము కలవానికి,
- ఇతరులను బాధించు హింసా స్వభావము వదలనివానికి,
- బ్రహ్మ విద్యపట్ల ఆచార తత్పరత (Studentship) లేనట్టి అబ్రహ్మచారికి బోధించకపోవటమే ఉచితము.

ఇతి అవ్యక్తోపనిషత్ సమాప్తా।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



సామవేదాంతర్గత

1     అవ్యక్త ఉపనిషత్

అధ్యయన పుష్పము

ఓం ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్। (16)
నృసింహ భీషణమ్ భద్రం మృత్యుర్మృత్యుమ్ నమామ్యహమ్।। (16)
[ద్వాత్రింశతి (32) అక్షర నృసింహ మంత్రము]

బ్రహ్మజ్ఞానము, బ్రహ్మతత్త్వానుభవము సిద్ధించటానికై →
- స్వయంకల్పిత స్వస్వరూప - అజ్ఞానము అనే హిరణ్యకశిపుని (అసురుని) గోళ్ళతో చీల్చివేయునది,
- ద్వైత వాదోపవాదములనుండి విముక్తిని ప్రసాదించునది,
- స్వస్వరూపానందమును ప్రసాదించునది -
అగు నరకేశరీ (నృసింహ) భగవానుని భక్తి - ప్రపత్తులతో శరణువేడుచున్నాను.

మొట్టమొదటగా (At its basic begining) - ఈ ఇంద్రియములకు అనుభవముగా అగుచున్న భౌతిక - దృశ్య జగత్తుగాని, దీని నిర్మాణమునకు ఆధారంగా ఉన్న అశరీర - దివ్య ప్రజ్ఞల నివాసస్థానమగు దివ్య (దేవతా) లోకములుగాని, ఆకాశము - పృథివి మొదలైనవిగాని లేవు. మరి మొట్టమొదట ఉన్నదేది?

జ్యోతిస్వరూపము (తేజోరూపము), అనాది - అనంతము అయినట్టిది, అణు-స్థూలరూపము కానట్టిది, నామరూపాత్మకము కానట్టిది, జ్ఞానానందమయము - అగు కేవల పరబ్రహ్మతత్త్వము మాత్రమే సర్వత్రా ప్రకాశమానమై యున్నది.

ఇవన్నీ మనలోని ప్రతి ఒక్కరి - జన్మ, కర్మలకంటే మునుముందే ఉన్న - కేవలాత్మయొక్క స్వాభావిక లక్షణములు.

అది జీవులందరి కేవలీ - స్వయంప్రకాశ ఆత్మానంద స్వరూపము. అద్దానికి ద్వితీయమనునది ఎప్పుడూ లేదు.

అట్టి అవ్యక్తము, ఏకము, సర్వదా (ఈ జీవుని సహజ స్వరూపమునకు) అనన్యము → అగు కేవలాత్మ స్వకీయ లీలా - మాయా వినోదంగా రెండు రూపములు వ్యక్తీకరించుకొనుచున్నది.
(1) మాయారూపము → ఏకము, హరితము (ఆకుపచ్చనిది).
(2) పురుషకారరూపము → పురుషరూపము (క్రియా నిర్వహణ రూపము. క్రియాభిమాని) రక్తవర్ణము.

అట్టి (1) మాయ (లేక) కల్పన (లేక) ఊహ (మరియు) (2) పురుషుడు (లేక) మాయి (లేక) కల్పించువాడు (లేక) ఊహించువాడు - ఈరెండూ ఒకదానితో మరొకటి కలిసి ఏకమగుచున్నాయి. ఆ రెండింటి సమావేశముచే క్రియాశీలమగు వీర్యత్వము (Executionship) ఆవిర్భవిస్తోంది. అట్టి వీర్యము (క్రియాచైతన్యము)- అహమ్ (అ+హమ్) రూప (హైమ - మహిమరూప) అండముగా అగుచు, పరిణామము (The Factor of Change) అను స్వభావమును స్వీకరించుచున్నది. నిష్క్రియమగు కేవలాత్మనుండి సక్రియము, పరిణామయుతము - ఉభయము ఏకమై సంప్రదర్శనమగుచున్నాయి.

అట్టి సక్రియము, - పరిణామయుతము అగు వీర్యము నుండి సృష్టికల్పనకు సంబంధించిన కర్తృత్వాభిమానియగు ప్రజ్ఞ బయల్వెడలుతోంది. అట్టి ప్రజ్ఞయే సృష్టికర్తయగు బ్రహ్మ (లేక) హిరణ్యగర్భుడు- అని (పౌరాణికంగా) వ్యవహారనామము.

అట్టి కల్పనాభిమానియగు పరమేష్ఠి (లేక) బ్రహ్మదేవుడు ఈ విధంగా అభి - జిజ్ఞాస (Deep inquisitiveness) పొందసాగారు.
→ కిం మే కులమ్? నేను దేనికి సంబంధించినవాడిని?
→ ఇప్పుడు నేను చేయవలసినదేమిటి? కిం మే కృత్యమ్?

ఈ విధంగా తీవ్రంగా యోచన చేస్తూ ఉండగా ఒక అదృశ్యవాక్కు ఈ విధంగా పలుకసాగింది.

(1) హే ప్రజాపతీ! త్వమ్ అవ్యక్తాత్ ఉత్పన్నోఽసి। నీవు ‘అవ్యక్తము’ (Un-manifestive Absolute) నుండియే జనించి బయల్వెడలుచున్నావయ్యా! కనుక నీవు ‘అవ్యక్తము’నకు చెందినవాడవే సుమా!

(2) వ్యక్తం తే కృత్యమితి। వ్యక్తము (Manifestation) ను నిర్వర్తించటమే నీయొక్క విద్యుక్త కార్యక్రమము.

ప్రజాపతి : ఓహో! అవ్యక్తము నుండే నేను జనించుచున్నానా? సంతోషము. కిం అవ్యక్తమ్? ‘అవ్యక్తము’ అనగా ఏమి? యస్మాత్ అహమ్ ఆసిషమ్? కిం తత్ వ్యక్తమ్, యత మే కృత్యమ్? నేను వ్యక్తీకరించవలసిన ‘వ్యక్తము’ ఏమై ఉన్నది.

అదృశ్య వాక్కు : బిడ్డా! సౌమ్యా! ఏదైతే సర్వమును వ్యక్తీకరించు సామర్థ్యమును తనయందు కలిగియుండి, తాను మాత్రము సర్వదా అప్రదర్శనరూపముగా (అవ్యక్తముగా) ఉండి ఉన్నదో, - అదియే ‘అవ్యక్తము’. ఏది తేజోమయమై, సర్వమును తనయొక్క తేజస్సుచే వెలిగించుచున్నదో అదియే అవ్యక్తము. తాను ‘తెలియబడనిది’ అయి, తదితరమును తనయొక్క ‘తెలివి’ యందు ‘తెలియబడుచున్నట్టిది’గా కలిగియున్నదో - అదియే అవ్యక్తము.
→ తెలియబడేది ‘వ్యక్తము’! (That being known)
→ తెలుసుకొనుచున్నట్టిది (లేక) తెలివి - అవ్యక్తము. (The knowner)

దృష్టాంతంగా : నటనకు సంబంధించిన కళ - ‘అవ్యక్తము’. పాత్రధారుడు రంగస్థలముపై ప్రదర్శించేది - ‘వ్యక్తము’.
అయితే, అట్టి అవ్యక్తము ఎట్టిదో తెలుసుకోవటానికై ముందుగా నన్ను (‘నేను’ను) తెలుసుకో.

ప్రజాపతి : ఓహో! ముందుగా మిమ్ములను (నేనైన నీవును, నీవైన నేనును) గురించి తెలుసుకోవాలా? అశరీరవాక్కుగా వినబడుచున్న మిమ్ము ఏమని తెలుసుకోవాలి? ‘శం’ శబ్దముగా వినికిడికి అనుభూతమగుచున్న మిమ్ములను ఎట్లా తెలుసుకోవటము?

అదృశ్యవాక్కు : తపసా విజిజ్ఞాసస్వ। నన్ను తెలుసుకోవటానికి మార్గము తపస్సే. కనుక తపస్సు చేసి తెలుసుకో।

అప్పుడు ‘‘ప్రజాపతి’’ - (అని అవ్యక్తమగు ‘ఆకాశవాణి’ వాక్కుచే పిలువబడిన ప్రప్రధమపురుషుడు), ‘‘అవ్యక్తబ్రహ్మము అనగా ఏమి?’’ అనునది స్వానుభవము అవటానికై వేయి దివ్యవత్సరములు బ్రహ్మనిష్ఠతో తపస్సు చేశారు. వేయి బ్రహ్మవత్సరముల తపసానంతరము ‘పరతత్త్వము’ యొక్క అవగాహనను - అనుష్టుప్‌ఛందోరూప ఋక్ గాన స్వరూపంగా దర్శించారు. స్వానుభవముగా చేసుకున్నారు.

అట్టి ప్రధమఋక్ శ్రవణముగా ‘ఓం’ అను ప్రణవమై విరాజిల్లసాగింది. అందుచేత తరువాత ప్రవచించబడిన మంత్రములన్నీ కూడా ప్రధమ ఋక్ - ప్రణవమగు ‘ఓం’ కారముతో ప్రారంభము కాసాగాయి. అనన్యమగు ఆత్మయొక్క అ-కార ఉ-కార మ-కార కేవలీ స్వస్వరూపమును సూచించు ఓంకారమును తెలుసుకోకుండా పరమాత్మను అన్యుడుగా (Something different from me / at some distance from me - అను రీతిగా) మాత్రమే ఉపాసించటానికి ఉపక్రమిస్తే ప్రయోజనం ఏమున్నది?

యస్య అంగాని అన్యే మంత్రాః - ఏ అఖండాత్మతత్త్వమగు ‘ఓం’ కారమునుకు సర్వ తదితర మనన-రూప మంత్రములు అంగములు అయి ఉన్నాయో…

యత్ర బ్రహ్మప్రతిష్ఠితమ్ - ఎద్దానియందు పరమార్థముగా పరబ్రహ్మతత్త్వము ప్రతిష్ఠితమైయున్నదో….,

యత్ర విశ్వే దేవాః ప్రతిష్ఠాః - ఎద్దానియందు లౌకిక - అలౌకిక దివ్యప్రజ్ఞారూపులగు విశ్వేదేవతలంతా ప్రతిష్ఠితమై ఉన్నారో…,

అట్టి ‘ఆత్మ’ యొక్క జ్ఞాన - విజ్ఞానములే (స్వానుభవమే) అన్నిమంత్రముల ప్రయోజనము.

ఆవిధంగా కేవలుడగు పరమాత్మగురించి స్వానుభవ - స్వస్వరూపముగా ఎరిగిన ప్రజాపతి ‘‘తెలియబడునదంతా (అనురక్తమైనది)… ఎట్లా నిర్మించటము?’’ అని యోచిస్తూ, అనుచానమైన (అనుసరణపూర్వక, ఉపాసనా విధాన) ఋక్కును గానం చేస్తూ ఉండిపోయారు. ‘ఓం’ కారమును ప్రతి అక్షరము (అ నుండి క్ష వరకు) ఆది → అంతములలో ఉంచి ఋక్కుల పదములను పాడసాగారు. వేయి వత్సరములు గడచాయి. వేయిసార్లు అక్షరోపాసన చేశారు. క్షరము కాని తత్త్వమును ఉపాసించారు. అనుచరణము (Following up) నిర్వర్తించారు.

అప్పుడు ఆ ప్రజాపతికి ఎదురుగా దివ్యమగు తేజోరూపము సాకారమై కనిపించసాగింది.
- జ్యోతిర్మయము; శ్రీదేవిచే ఆలింగనము చేయబడినట్టిది; సుపర్ణ (గరుడు) వాహన (రథ) - అధితిష్ఠితము; ఆదిశేషుని వేయిపడగలను ఆచ్ఛాదనముగా శిరస్సుపై కలిగి ఉన్నట్టిది; సింహముఖము - నరదేహము ధరించి, చంద్ర సూర్య అగ్ని త్రినేత్ర సమన్వితము అగు నారసింహస్వామి యొక్క సాకారరూపము ప్రత్యక్షమైనది.

అట్టి చిత్ర విచిత్ర సాకారరూపమునకు ప్రజాపతి ‘‘నమో నమః’’- అని పలుకుచూ సాష్టాంగ దండప్రణామములు సమర్పించి, ఆ ఎదురుగా ప్రత్యక్షమైన దివ్యరూపమును విధాత ఈ విధంగా స్తుతించసాగారు.

శ్రీమన్నారసింహ స్తుతి

హే వ్యక్తమై కనిపిస్తున్న దివ్య - కేవలానంద స్వరూపీ! మీకు నమస్కారము. నాకు కనబడుతూ అర్చనరూపము ప్రసాదిస్తున్న మీకు కృతాంజలుడను.

ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్।
నృసింహ భీషణమ్ భద్రం మృత్యుర్మృత్యుమ్ నమామ్యహమ్।।

ఉగ్రమ్ : సింహ ముఖులై ఉగ్రముగా, ప్రచండముగా, పరమ ఉత్తేజితులై కనిపిస్తున్నారు కనుక ‘ఉగ్రమ్’ అని స్తుతి - ‘‘ఖలువా ఏష మృగరూపత్వాత్’’।

వీరమ్ : సమస్తము మీ వీర్యత్వము చేతనే విరాజిల్లుచున్నది కనుక ‘వీర్యమ్’ అని సంస్తుతి - ‘‘వీరమ్ ఇతి ఆహ వీరోవా - ఏష వీర్యవత్వాత్’’।

మహావిష్ణుమ్ : మహత్ స్వరూపులై, భూమ్యాకాశములన్నీ నింపివేసి, సర్వమూ తమరై (All present and All pervading) అగుపిస్తున్నారు. కాబట్టి - మహావిష్ణుమ్ ఇత్యాహ, మహతాం వా, అయమ్ మహాన్ రోదసీ వ్యాప్య స్థితః।।

జ్వలంతమ్ : మీ తేజస్సు సర్వత్రా విస్తరించి సర్వమును వెలిగిస్తూ ఉండటం చేత, సర్వము మీ ‘వెలుగు’యే అయి ఉండటం చేత - జ్వలంతమ్ ఇతి ఆహ, జ్వలన్ ఇవ ఖలు అసావవత్ స్థితః।। సమస్తము మీ ‘ఎరుక’ యొక్క విన్యాస - సంప్రకాశమే కాబట్టి జ్వలంత (వెలిగించు) స్వరూపులగుచున్నారు. ‘ఎరుక’ అను తేజస్సులో సమస్తమును వెలిగించుచుండటమే ఈ విశ్వము యొక్క రూపము.

సర్వతోముఖమ్ : సమస్తము మీ ముఖమే. 10 దిక్కులలో అనంత ముఖములతో వెలయుచున్నారు. ‘సర్వతోముఖః’ ఇతి ఆహ। సర్వతః ఖలు అయం ముఖవాన్ విశ్వరూపత్వాత్। వేలాది ముఖములతో విరాజిల్లుచున్నారు.

‘నృసింహమ్’: ‘‘యజ్-యజ్‌రేవ’’ స్వరంతో సింహ-నర ముఖులై కనిపిస్తున్నారు. ‘నృసింహమ్’-ఇతి ఆహ, యథా యజురేవ ఏతత్।

భీషణమ్ : మిమ్ములను చూచి భయముచేత మీ కనుసైగలు ప్రకాశించటంచేత సమస్తము ప్రవర్తమానమౌతోంది. భీషణమ్ ఇతి ఆహ, భీషా వా అస్మాత్ ఆదిత్య ఉదేతి। మీ భయము చేతనే సూర్యుడు ఆకాశంలో స్వయం ప్రకాశకుడై సంచరిస్తున్నారు. అట్లాగే చంద్రుడు మీ భయముచే ఓషధ ప్రదాతగా అయి వర్తిస్తున్నారు. మీపట్ల, భయముచే వాయువు వీచుచున్నది. భీతః చంద్రమా, భీతో వాయుః వాతి, భీతో అగ్నిః దహతి। భీతః పర్జన్యో వర్షతి. మీకు భయపడి అగ్ని దహిస్తోంది, వర్షము వర్షిస్తోంది.

భద్రమ్ : మీరే సర్వజగత్ - సమస్త సంరక్షకులు. మీ రక్షణలోనే సర్వము ప్రదర్శితమౌతోంది. భద్రమ్ ఇతి ఆహ, భద్రః ఖలు వయమ్।

శ్రియా జుష్టమ్ : సర్వ సంపదలు మీచేతనే ప్రసాదితము. సర్వము మిమ్ములనే ఆశ్రయించుటచే శ్రేయస్సు కలిగించునవై ఉన్నాయి.

మృత్యోర్మృత్యుః : మార్పు - చేర్పులన్నిటికి ఆధారాలు మీరే। కారణ కారణులు. అమృతప్రదాత. మృత్యోః మృత్యుః। అమృత స్వరూపమ్ త్వమ్। మృత్యువుకే మృత్యువు. మృత్యువుకే ‘సాక్షి’ అయి ఉన్న స్వస్వరూపముయొక్క జ్ఞానప్రదాత।

ప్రజానామ్ అన్నదానమ్ : సర్వులకు ఆహార స్వరూపులై మిమ్ములను మీరే సమర్పిస్తూ పరిపోషకులగుచున్నారు. ఇంద్రియములకు ‘‘అనుభవిత దృశ్యము’’ రూపంగా ఇద్రియాహారస్వరూపులు. ‘అన్నాదమ్’ అయి ఉన్నారు.

అహమ్ ఇతి : సర్వే సర్వత్రా ‘అహమ్’ స్వరూపులై ద్రష్ట - దర్శన - దృశ్యములను ఆస్వాదిస్తున్నారు.

అట్టి మీ కేవల నిత్యానందతత్త్వమునకు నమస్కరిస్తున్నాను. సమస్త జీవులలో ‘నేను’గా ఉన్నది మీరే। తత్త్వమ్। సోఽహమ్

ఉగ్రం వీరం మహావిష్ణుమ్ జ్వలంతమ్ సర్వతో ముఖమ్। నృసింహ భీషణమ్ భద్రమ్। మృత్యుర్మృత్యుం నమామ్యహమ్।।
- ఈ విధంగా యజుస్వరంతో యజుర్వేద స్తుతులతో ప్రజాపతి గానం చేశారు. దివ్యతేజోమూర్తులగు నృశింహభగవానుడు చిరునవ్వుతో ఇట్లు పలుకసాగారు.

భగవాన్ మహావిష్ణు నృసింహస్వామి : హే ప్రజాపతీ! బిడ్డా! నీ ‘‘ఉగ్రం వీరం…’’ స్తుతికి సంప్రీతుడనయ్యాను. నీకు ఈప్సితమైనది ఏమిటో అడుగు. సంతోషంగా ప్రసాదిస్తాను.

ప్రజాపతి : హే భగవాన్। అవ్యక్తమునుండి జనించి నేను వ్యక్తీకరణమును నిర్వర్తించవలసినదిగా మీయొక్క అశరీరవాణిచే ఆజ్ఞాపించబడినాను. ‘‘అవ్యక్తము ఎట్టిది?’’ అనే జిజ్ఞాసతో తపస్సు ఆచరించాను. అవ్యక్త స్వరూపులైనట్టి మీరు నా తపోఫలంగా ఈ విధంగా చిత్ర-విచిత్ర వ్యక్తీకరణమై సాక్షాత్కరించారు. సాకారరూపంగా దర్శనము ఇచ్చారు. స్వామీ! నేను ‘వ్యక్తీకరణము’ చేయవలసినది దేనిని? ఏరీతిగా? ఎందుకు? - దయతో ఆజ్ఞాపించండి.

భగవానుడు : మీరు వ్యక్తీకరించవలసినది → ‘‘చర-అచరాత్మకమగు విశ్వము।’’ యత్ వ్యజ్యతే తత్ వ్యక్తస్య - ‘వ్యక్తత్వమ్’ ఇతి। ఏదైతే ‘అనుభూతి-అనుభవము’గా వ్యక్తీకరణమౌతుందో, అదియే వ్యక్తము. నాయొక్క క్రీడా-లీలా వినోదంగా అనుభవి - అనుభవము - అనుభూతము (The Experiencer, The Experiencing and The object of Experience) - అను మూడిటి సమావేశమే మీరు నిర్వర్తించవలసిన వ్యక్తీకరణము.

ప్రజాపతి : హే పరమాత్మా। మీరు చెప్పిన మూడిటి సమావేశరూపమగు జగత్తును ఎట్లా సృష్టించాలో నాకు సామర్థ్యమగుట లేదు. చేతగావటంలేదు. అందుకు ఉపాయము ఏమిటో చెప్పి నన్ను సృష్టికర్తగా రూపొందించండి.

పరమపురుష భగవానుడు : ఓ ప్రజాపతీ! ఏది తెలుసుకోవటం చేత సర్వము తెలియగలదో, సర్వశక్తిమంతులు కాగలరో, సర్వము నిర్వర్తించు సామర్థ్యము సిద్ధించగలదో - అట్టి పరమోత్కృష్టమగు ‘‘సృష్టి సంకల్పనా విద్య’’ను చెప్పుచున్నాను. వినండి.

(1) మునుముందుగా…. ఆయా విశేషణములతో ధ్యానించినట్టి నాయొక్క విశ్వమూర్తిత్వము, - సాకార (మరియు) నిరాకార స్వరూపముగా భావిస్తూ నన్ను ధ్యానించండి. ధ్యాసను ప్రవృద్ధి పరచుకొండి. ఏకాగ్రత సంతరించుకొనుచుండెదరు గాక.

(2) క్రమంగా, ‘‘అట్టి ధ్యానవస్తువు నాయొక్క ఆత్మస్వరూపమే’’ అను బుద్ధితో నన్ను కేవలస్వస్వరూపంగా భావన చేయండి.

(3) అప్పుడిక…, సర్వత్రా ఏర్పడినదైయున్న ‘‘అహమ్ విష్ణుమ్’’ అను అగ్నియందు ‘జీవాత్మత్వము’ను హవిస్సుగా సమర్పిస్తూ….,

(4) ఇక ఆపై…, మీరు ఇతఃపూర్వము గానము చేసినట్టి ‘‘అనుష్టుబ్ ఛందోఋక్కులు’’తో అర్చించండి. దృశ్య-జీవ-ఈశ్వర తత్త్వములను పరతత్త్వముతో ఏకార్చన చేయండి.

అయమేవ జ్ఞాన యజ్ఞో। ఈ రీతిగా ‘జ్ఞాన యజ్ఞమ్’ నిర్వర్తించండి.

మనము చెప్పుకుంటున్న విష్ణు-ప్రజాపతి సంవాద రూపమగు ‘మహోపనిషత్’-దేవతలకు కూడా అతి రహస్యమైయున్న విధి- విధానము.

ఇటువంటి ‘‘సర్వతత్త్వ స్వరూపమునందు ధ్యానపూర్వకంగా వ్యష్టిహంకారమును హవిస్సుగా సమర్పించు - ఆత్మజ్ఞాన యజ్ఞము’’ - అనునది ఋగ్వేద-సామవేద-యజుర్వేద మంత్ర (శాస్త్ర) పాండిత్యముతో ఒనగూడేది కాదు.

‘‘హే పరాత్మా! నాది అనిపించేదంతా వాస్తవానికి సర్వదా నీదే।’’ అను సర్వము ఆత్మార్పణము చేయు శ్రద్ధ - అవగాహన-ధ్యానయోగము’’చేతనే సానుకూల్యము. సుసాధ్యము. ‘‘నేను’’ అను వ్యష్ఠిని ‘‘సర్వాంతర్యామియగు నేను’’కు హవిస్సుగా సమర్పించటమే ‘‘ధ్యానయజ్ఞము’’ లేక ‘‘యోగయజ్ఞము’’.

భగవానుడు ఇంకా ఇట్లా చెప్పటం కొనసాగించారు.

య ఇమామ్ వేద →
ఎవ్వరైతే ఇట్టి వ్యక్తిగతమైన ‘నేను’ను ‘‘సర్వగతమగు నేను’’ - అనబడు (జాగ్రత్, స్వప్న-సుషుప్తి సాక్షిరూప) విష్ణుతత్త్వమునందు భక్తి-ధ్యాన-యోగ-జ్ఞానపూర్వకంగా సమర్పించటమును ఎరిగి నిర్వర్తిస్తూ ఉంటారో….,
⌘ అట్టివారు కోరుకున్నవన్నీ తమకు తామే సిద్ధించగలవు.
⌘ అట్టివాడు లోకములన్నీ జయించి, వాటినన్నిటినీ దాటివేసి, అలౌకిక స్వరూపుడనగు నన్నుచేరగలడు.
⌘ లోకాంతర్గతమైన ప్రయోజనములు ఉద్దేశ్యించువానికై…..వేదవిధులతో కూడిన యజ్ఞములు నిర్వర్తించి ఊర్థ్వలోకములు సిద్ధించుకొన్నప్పటికీ పునరావృత్తిదోషము అనివార్యము. అట్లా కాకుంటే, ‘‘సర్వసమర్పణపూర్వక-అహమ్-సమర్పణారూప’’ ఆత్మోపాసనచే - పునరావృత్తిదోషమును పొందడు.

అప్పుడు ప్రజాపతి నృసింహరూపముగా ప్రత్యక్షమైన విష్ణుభగవానుని ‘‘స్వాత్మపరత్త్వ ధ్యానము’’ యొక్క బోధనా ప్రభావంచేత సమర్థతను పొంది ‘సృష్టికార్యము’నకు ఉపక్రమించారు. ‘అక్షరము’ అయి ఉండినట్టి ‘30’ అక్షరములను ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ స్వర్గ-మర్త్య-పాతాళ త్రిలోకములను ‘ఓం’ అను అక్షరమును జేర్చి (ఓం అం ఓం। ఓం ఆం ఓం-ఇత్యాదిగా) 32 అక్షరములను ఏక ఋక్కుగా రచించారు.

ముందుగా ప్రజాపతి-తనయొక్క ‘‘భావన,అనుభూతి,రచనా’’ కళను సిద్ధింపజేయటానికై అశరీరులగు దివ్యప్రజ్ఞలను (శబ్ద స్పర్శాది ఇంద్రియార్థ అభిమానులను శక్తి తత్త్వములను) సంకల్పించి నియామకం చేశారు. వారంతా లోకముల భౌతిక-అంతరబాహ్యముల నిర్మాణసామర్థ్యము (ప్రజాపతిచే) ప్రసాదించబడ్డారు.

అప్పుడు….‘ఈ త్రిలోకములకు ఒక అధినాయకుడూండాలి కదా!’- అని యోచించి త్రిలోకపాలనాబాధ్యత నిర్వర్తించటానికై త్రిలోకపాలనా-అభిమాన-విశేష ప్రజ్ఞతో కూడినట్టి ఇంద్ర దేవుని కల్పించి నియమించారు. ఆయన సర్వదేవతలలో శ్రేష్ఠుడుగాను, అధికుడుగాను ప్రకాశమానుడైనారు.

ఈ సృష్టి కల్పనా చమత్కారక్రమమును ఎరిగినవాడు, సమానులందరిలో అధికుడై ప్రకాశించగలడు. ఇంకా కూడా →
-‘‘ఇంద్రియములకు తారసబడుచున్నదంతా నాయొక్క కల్పనాపురుషుడగు ప్రజాపతిచే నియమితుడైన ఇంద్రియాధినేత త్రిలోకాధినేత అగు ఇంద్రుని ఇంద్రజాలమే’’ అని ఎరుగగలడు. ‘‘సమానామ్-అధికోభవేత్!’’ సర్వసమత్వము (మరియు) సర్వము కంటే అధికమైన ఆత్మత్వమును ఆస్వాదించగలడు. కేవలత్వము సంతరించుకోగలడు.

ప్రజాపతిచే సృష్టికొరకై గానము చేయబడిన ‘ఋక్కు’ యొక్క (లేక) ప్రజాపతియొక్క ఏకాదశపాదముల (11 స్టెప్స్)చే ఏకాదశరుద్రులు గా సముత్తేజింపబడ్డారు.

ద్వాదశ (ఏకాదశ + కేవలము) = ఆదిత్యులను కల్పన చేశారు.
(ద్వాదశాదిత్యుల పురాణనామములు = ధాత, మిత్రుడు, ఆర్యముడు, శక్రుడు, పూషుడు, సవిత, తృష్ణ, విష్ణువు, ఇంద్రుడు మొదలైనవారు.

అయితే అవ్యక్తస్వరూప-కేవలుడగు విష్ణు సంప్రదర్శనమే ఇదంతా కూడా. సర్వైః ఏవ స విష్ణుః అభవత్। ఆయనయే మొట్టమొదటి ఆత్మస్వరూపుడు కనుక ‘ఆదిత్యుడు’ అనబడుచున్నాడు. అందుచేత విష్ణువే ఆదిత్యుడుగా ప్రప్రధముడు.

అట్టి సమస్త అనుభవములకు మునుముందుగానే ఉండి ఉండి, సర్వముగా విస్తరించుచున్న స్వస్వరూపాత్ముడగు ఆదిత్యనామ విష్ణుతత్త్వమును ఎరిగినవాడు సమానులందరిలో ‘అధికుడు’గా గుర్తించబడుచున్నాడు.

ఇంకా
అష్టవసువులు = ‘4’ + ‘4’ అక్షరములనుండి అష్ట-వస్తువులు కల్పించబడ్డారు. (వారి పౌరాణికనామములు : అవుడు; ధ్రువుడు; సోముడు; అధర్వుడు; అనిలుడు; ప్రత్యుషుడు; అనలుడు; ప్రభాసుడు).

(1) బ్రాహ్మణములు : బ్రహ్మమును స్తుతించు బ్రాహ్మణములు మొదటి ‘12’ అక్షరముల నుండి బయల్వెడలాయి. బ్రాహ్మణములను స్తుతించువారు (పారాయణము చేయువారు) బ్రాహ్మణులు. ‘సోఽహమ్’ భావనచే ఈ జీవుడు ‘బ్రాహ్మణుడు’ అగుచున్నాడు. (బ్రహ్మణి యతేతి బ్రాహ్మణః। ఇదమ్‌త్వమ్ బ్రహ్మమేవ భావయేతి బ్రాహ్మణః।)

(2) క్షత్రే : ‘10’ ‘10’ అక్షరములనుండి క్రియా సామర్థ్యము (లేక) ప్రజ్ఞలు బయల్వెడలువారు. భక్తి-జ్ఞాన-వైరాగ్య-యోగాభ్యాసములచే సంపద పెంపొందించుకొనుచున్నవారు - క్షత్రియులు.

‘12–12’ అక్షరములచేత నిర్మితమైన బ్రహ్మతత్త్వజ్ఞులగువారే కార్య-సాధనా నిర్వహణా సామర్థ్యాభిమానులకంటే (క్షాత్ర-అభిమానులకంటే) అధికులు - అగుచున్నారు.

(3) వైశ్యులు : క్షత్రియ సంకల్ప - నిర్ణయములను కార్యరూపముగా నిర్వర్తించువారు. ఇది ఎరుగుటచే - ఆయావారున్నచోట ‘ముఖ్యులు’గా అగుచున్నారు.

(4) శూద్రః : ఇంద్రియానుభవములందు ‘అభిమానమునకు పరిమితులగువారిని శూద్రులు’ అని, తూష్ణీగుణ స్వభావులని అనబడుచున్నారు. ‘ఆత్మవిద్య’ పట్ల నిర్విద్యులై ఉండువారు శూద్రులు. (ఇవన్నీ బుద్ధి సంబంధమైన విభాగములేగాని, జన్మసంబంధమైనవి, సాంఘిక సంబంధమైనవి కావు).

ఇవన్నీ సృష్టి కార్యక్రమములో వివిధ లీలా వినోద విశేషములు.

💐 ఆత్మవిద్యను ఎరిగి సర్వత్ర ఆత్మదర్శనము సిద్ధించుకొనువారు - ‘బ్రాహ్మణులు’.
💐 ఆత్మవిద్యకై సాధన సంపత్తిని పెంపొందించుకొనుమార్గములో ఉన్నవారు-క్షత్రియులు.
💐 సాధనములపట్ల శ్రద్ధ - ఆసక్తులు కలవారు - వైశ్యులు!
💐 ఆత్మ విద్యపట్ల తూష్ణీభావముకలవారై, నిర్విద్యాపరులై, ఇంద్రియానుభవముల కొరకై కాలము వెచ్చిస్తున్నవారు - శూద్రులు.

ఈ ఈ బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య - శూద్ర స్వభావులంతా ప్రజాపతి సృష్టిలోని కల్పనా చమత్కారములే. (జన్మనాజాయతే శూద్రః। కర్మణా జాయతే ద్విజః।)

⌘ ⌘

ఇప్పటివరకు సృష్టించబడినట్టి అవ్యావృత-విస్తరణ సృష్టిలో ‘రాత్రి-పగలు’ అనునవి లేకుండినవి. ఇప్పుడిక ప్రజాపతి అనుష్టుభ్ ఛందో-ఋక్‌గాన ప్రభావముతో అహోరాత్రములు (Day and Night) కల్పించారు.

అజ్ఞానరూపమగు రాత్రి, సుజ్ఞానరూపమగు పగలు - ప్రజాప్రతి సృష్టికల్పనా-అంతర్గత విశేషములే.

ఈ విధంగా సృష్టిలో అజ్ఞానము కూడా కల్పించబడింది. ‘‘జబ్బు కల్పించబడినప్పుడు, ఆ జబ్బుయొక్క ఉపశమనమునకు మందు (ఔషధము) కూడా కల్పించబడాలికదా!’’ - అని యోచించిన ప్రజాపతి అజ్ఞానము తొలగించుకోవటానికై మార్గములను కూడా (లీలావినోదంగా) కల్పించసాగారు. భక్తి-జ్ఞాన-యోగ-యజ్ఞ-ఇత్యాది సాధనా పరికరములన్నీ నిర్మించారు. తత్త్వమార్గాణ్వేషకులకు మార్గదర్శకంగా ఋతము (ఆత్మను) సేవించు ఋక్కులను సృష్టిలో ప్రతిష్ఠించారు. ఇవి త్రిలోకజీవులకు మార్గదర్శకములు (Like Path Finders) అగుచున్నాయి.

ఈ విధంగా ఆత్మతత్త్వ మార్గదర్శకము, తత్త్వనిర్ణయ వాఙ్మయరూపము గా ఋక్కులకు →
మొదటి పాదము - ఋగ్వేదము
రెండవ పాదము - యజుర్వేదము
మూడవ పాదము - సామవేదము
నాలుగవ పాదము - అధర్వణవేదము లేక అధర్వ అంగీరసము

‘8’ అక్షరముల (అష్టాక్షర) పదరూపంగా - గాయత్రీ ఛందస్సు,
11 (ఏకాదశ) అక్షరముల పదరూపంగా - తిష్టుప్ ఛందస్సు.
4 (చతుః) అక్షరముల పదరూపంగా - జగతీ ఛందస్సు,
32 (ద్వాత్రింశత్) అక్షరముల పదరూపంగా - అనుష్టుప్ ఛందస్సు,
‘9’ (నవా) అక్షరముల - పదరూపంగా - సర్వ తదితర ఛందస్సులు

….ఇవన్నీ వేదమంత్ర వాఙ్మయమునందు సిద్ధాంతీకరణ (లేక) వ్యాకరణ విధానములుగా శబ్దజాలము కొరకై సంకల్పించబడ్డాయి.
ఎవ్వడైతే ‘ఛందోబద్ధ’ వేదమంత్ర విధానమును పై విశేషములతో ఎరుగుచున్నాడో,

అట్టివాడు →
- సర్వ జగత్తు అనుష్టుప్ ఛందస్సు నుండియే ఉత్పన్నమగుచున్నదని….
- సర్వ జగత్తు అనుష్టుప్ ఛందస్సునందే ప్రతిష్ఠితమైయున్నదని….
తెలుసుకొనుచున్నవాడై…
→ నేను అనుష్టుప్ ఛందస్సు నుండి జనించి, ‘అనుష్టుప్’ (అక్షరము) నందే ప్రతిష్ఠితమైయున్నాను.
→ ఆత్మయందే సర్వదా ప్రతిష్ఠితుడను - అని తనను గురించి తాను ఎరుగుచున్నాడు.

అప్పుడు ప్రజాపతి ఇట్లా యోచించసాగారు. ‘‘సరే! ఇప్పటివరకు ‘30’+‘2’- నాదస్వరూప అక్షరములను, శబ్ద-స్పర్శ-రూప-రసగంధ అభిమాన తత్త్వులగు దివ్యదేవతా (అశరీర) ప్రజ్ఞలను, వారికి అధినాయకుడుగా ఇంద్రుని, ఆ ఇంద్రుడు పరిపాలన కొనసాగించటానికై ఋక్-యజుర్-సామ-వేదములను, వాటియందలి వాఙ్మయ విధి-విధానములను, ఛందోబద్ధంగా గాయత్రీ, త్రిష్టుప్, జగతీ, అనుష్టుప్‌లను ప్రవర్తింపజేసాను.

నవా ఛందస్సులను కల్పించి - సృష్టియందు ప్రకాశింపజేసాను.

ఇప్పుడిక ఏమి సృష్టించాలి? వీటన్నిటినీ అనుభవముగా పొందు జీవాత్మప్రజ్ఞారూపమగు ప్రజలను సృష్టించాలి. ఎట్లా?’’
ప్రజలను (The Experiencers) ఎట్లా సృష్టించాలో వెంటనే తట్టనేలేదు. అథ యదా ప్రజా సృష్టా న జాయంతే। ‘‘కథన్ను ఇమాః ప్రజాః సృజేయమ్? - ఇతి ప్రజాపతిః - చింతయన్। - ప్రజలను సృష్టించేది ఎట్లా? - అని యోచించసాగారు. వెంటనే ‘ఉగ్రమ్….’ మహామంత్రమును ఇతఃపూర్వమువలెనే పెద్ద గొంతుకతో ఉచ్ఛరించసాగారు.

ఉగ్రమ్ వీరమ్ మహావిష్ణుమ్ జ్వలంతమ్ సర్వతోముఖమ్।
నృసింహమ్ భీషణమ్ భద్రమ్ మృత్యుర్మృత్యుమ్ నమామ్యహమ్।।
అని గానం చేయసాగారు.

అప్పుడు ప్రథమపాదము - ‘ఉగ్రమ్’….నాదము నుండి ఉగ్రరూపుడగు దేవదేవుడు సాకారుడై ఆవిర్భవించారు.
- (ఏకస్వరూపుడు) ఒకవైపునుండి శ్యామలా (నల్లటి) వర్ణుడు ; మరొకవైపుగా రక్తపురంగు ఎర్రనివాడు ; మట్టితో చేసిన ఆకారమువలె ఉన్నట్టివాడు. స్త్రీ-పురుష ఏకరూపుడై ఉన్నారు.
- ఆయన స్త్రీ విభాగం నుండి స్త్రీలు, పురుషవిభాగం నుండి పురుషులు మూలపదార్థరూపంగా రూపుదిద్దుకోసాగారు.
- ప్రజాపతి అట్టి స్త్రీ - పురుష విభాగముల నుండి స్త్రీ - పురుషుల సృష్టిని నిర్వర్తించసాగారు.

ఈ విధంగా ఎరిగినవాడు - ఋక్కులను గానం చేస్తూ, జటా కలాపమును ధరించి, ప్రత్యక్ష జ్యోతిషి స్వరూపుడై ‘ఆత్మ’ యందే సర్వదా రమించువాడగు శివ భగవానుని తత్త్వజ్ఞానము పొందగలడు.

అప్పుడు ప్రజాపతి తాను సృష్టించిన ఇంద్రుని దగ్గరకు పిలిచారు. ‘‘ఓ ఇంద్రా! నీవు దివ్యప్రజ్ఞా అశరీరస్వరూపులగు దేవతలు ఉండే దేవలోకములో ప్రవేశించు. దేవతలకు అధిపతివై త్రిలోకపాలనను నిర్వర్తించెదవుగాక!’’ - అని ఆజ్ఞాపించారు. వెనువెంటనే దేవలోకంలో ప్రవేశించిన ఇంద్రుడు తనయొక్క అధిపతిత్వమును ప్రకటించారు. అప్పుడు దివ్యలోకంలోని ఇతఃపూర్వమే ఉన్నట్టి దేవతలు → (శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ ప్రజ్ఞాదివ్యులు). ‘‘అదెట్లా? మేము మునుముందే ఉండి ఉన్నాము కదా? మాపై మీరెట్లా ఆధిపత్యం చెలాయిస్తారు?’’ అని గుసగుసలాడసాగారు. అది గమనించిన ఇంద్రుడు తిరిగి బ్రహ్మదేవుని (ప్రజాపతిని) సమీపించారు.

ఇంద్రుడు: హే భగవాన్! బ్రహ్మదేవా! సర్వతత్త్వప్రదాతా! చరాచర సృష్టికర్తా! మీరు నన్ను దేవతల కార్యక్రమములపై నాయకత్వపు బాధ్యతలను నిర్వర్తించవలసినదిగా అనుగ్రహించారు. అయితే, దేవలోకములో మీచే ముందుగా సృష్టించబడిన దివ్యప్రజ్ఞస్వరూపులగు (శబ్దస్పర్శాది) అధి దేవతలు, ‘‘అది ఎట్లా? మేము మునుముందే ఉన్నాము. మీరెట్లా ఆధిపత్యం వహిస్తారు?’’…అని ప్రశ్నించటం జరుగుతోంది. నేనేమి చేయాలో దయతో ఆజ్ఞాపించండి।

అప్పుడు ప్రజాపతి ఇంద్రునికి
- ‘అనుష్టుప్’ ఋక్కుతో అభిమంత్రితమైనట్టివి,
- అమృతముతో పూర్ణమైనట్టివి.
అగు ‘3’ కలశముల అమృతజలంతో ఇంద్రుని అభిషేకించారు. కుడివైపు ‘సుదర్శనచక్రము’ను, ఎడమవైపు ‘పాంచజన్యము’ను రక్షణగా ప్రసాదించారు.

ఈ విధంగా కుడి-ఎడమలుగా సుదర్శన-పాంచజన్యములచే రక్షితులై ‘త్రిలోకపాలన’ అను బాధ్యతను స్వీకరించారు. ఇంద్రుడు, దేవతలు సృష్టివినోద కార్యక్రమమును ‘స్వధర్మనిష్ఠ’తో కూడిన భావనల సముదాయముచే పర్యవేక్షించసాగారు.

అటు తరువాత ప్రజాపతి ఇంద్రుని సమీపించారు. ఇంద్రుడు బాధ్యతాస్వీకారి అగుచూ భక్తితో ప్రజాపతికి సాష్టాంగదండ ప్రణామములు సమర్పించారు. అప్పుడు ప్రజాపతి సూర్యతేజస్సు - వర్చస్సుతో ప్రకాశించుచూ, అనుష్టుప్ ఛందస్సుతో ‘ఋక్’ మంత్రము వ్రాయబడిన ఫలకముతో కూడిన ‘రక్ష రేకుల దండ’’ను ఇంద్రుని మెడలో అలంకరించారు. అనుష్టుప్ మంత్రమును ఉపదేశించారు. అప్పుడు ఇంద్రుడు మహాప్రకాశవంతుడు, దుర్నిరీక్షణుడు అయ్యారు. అప్పుడు దేవతలు ఇంద్రుని ఆధిపత్యము అంగీకరించారు. ఆయన ‘స్వరాట్’ అను బిరుదాంకితులు అయ్యారు.

అట్టి ఇంద్రుని స్వరాట్‌తత్త్వమును ఎరిగినప్పుడు అట్టి జీవుడు ‘స్వరాట్’ అవగలడు.

ఇప్పుడు ఇక ఇంద్రుడు ‘పరిపాలించటము’ అనే బాధ్యతను నిర్వర్తించటానికి సంసిద్ధులైనారు. ‘‘మొట్టమొదగా భూమిని, జలమును వశం చేసుకోవాలి. లేకుంటే సృష్టిని పరిపాలించటం కుదరదుకదా!’’ అని తలచారు. కాని ఎట్లా ఆ ఉభయములను జయించాలో తెలియలేదు. వెనువెంటనే ప్రజాపతిని సమీపించారు.

ఇంద్రుడు :-
‘‘హే స్వామీ। ప్రజాపతీ। నేను మీ ఆజ్ఞానుసారము త్రిలోక పరిపాలనను ప్రారంభం చేస్తున్నాను. అశరీరప్రజ్ఞలగు దేవతలు నన్ను పరిపాలకుడుగా అంగీకరించారు కూడా. అయితే మరొక సమస్య వచ్చి పడింది. సాకారమగు పృథివి - జలములను నేను జయించటమెట్లా? మీరే నన్ను అందుకు సమర్థుని చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను’’.
అని ప్రజాపతిని త్రికరణశుద్ధిగా శరణువేడారు.

అప్పుడు ప్రజాపతి :-
‘‘ఓ త్రిలోకనాయకా। ఇంద్రదేవా। ఇదిగో। కమఠ (తాబేలు) ఆకృతి కలిగియున్నట్టిది, ఇంద్రమణితో అలంకరించబడినట్టిది, భుజగేంద్రుని (కాలసర్పమును) ఆధారముగా కలిగి ఉన్నట్టిది అగు ‘‘భద్రాసనము’’ నీకు ప్రసాదిస్తున్నాను. దీనిపై ఆసీనుడవై త్రిలోకములను పాలించు. నిరాకారులగు దేవతా ప్రజ్ఞలను, సాకారమగు పృథివి మొదలైనవాటిని పరిపాలించు -అధికార సామర్థ్యము నీకు లభించునుగాక। అందుకుగాను (అట్టి సామర్థ్యము కొరకై) - ‘‘ఆత్మస్వరూపుడనగు నాకు ఈ సమస్త పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, త్రిలోకములు, అస్మత్‌శరీరమే’’ అను భావనను ఉపాసించు. అప్పుడు - శరీరి శరీరమంతా ఆక్రమించి పరిపాలిస్తున్న తీరుగా - నీవు త్రిలోకములపై ఆధిపత్యము వహిస్తూ పరిపాలించ గాక!

ప్రజాపతి ప్రసాదించిన ఇంద్రసింహాసనమును అధిష్ఠించిన ఇంద్రుడు భౌతిక జగత్తును (భుమి - ఆకాశములను) జయించి, పరిపాలన కొరకై వశము చేసుకొన్నారు. ‘‘ఈ పంచభూతములు, త్రిలోకములు ఆత్మ దృష్ట్యా నాకు అనన్యము. నేనే భూమిరూపంగా, జలము రూపంగా, అగ్నిరూపంగా, వాయు రూపంగా, ఆకాశరూపంగా, త్రిలోకముల రూపంగా - వాటన్నిటికీ శరీరినై వర్తించువాడను’’ - అను ఆత్మభావనచే సృష్టిలోని భూమి, జలము మొదలైనవన్నీ ఆయనకు వశమైనాయి.

ఎవ్వడైతే ‘‘ఈ ఊర్ధ్వ అథోస్వరూపమైనదంతా కూడా - సంప్రతిష్ఠితము (సర్వత్ర ప్రతిష్ఠితము), అశిధిలము (తరుగు-పెరుగు లేనట్టిది), సర్వత్రా వ్యాపకము) అయినట్టి పరమాత్మయొక్క ‘‘సోఽహమ్’’ భావన చేతనే (ఉపాసనచేతనే) అప్రతిష్ఠితము, శిథిల స్వభావయుతము అగు పృథివి, జలము మొదలైన పంచభూతములను, దివ్యమగు దేవతల కార్యక్రమములను పరిపాలించు యోగ్యత లభించగలదు’’ - అని గ్రహించి ఉంటాడో, అట్టి పరమాత్మోపాసకుడు త్రిలోకాధిపత్యము పొందగలడు.

ఈ సర్వము పరమాత్మకు చెందినదేనని, పరమాత్మ సంబంధితమైనదేనని, పరమాత్మకు వేరుగా చూస్తే ఇదంతా లేనట్టిదని, శిధిలమైనట్టిదని గ్రహించినవాడు పృథివిని జయించగలడు. ‘‘నేను భౌతిక రూపమాత్రుడను’’ - అను సంకుచిత భావమును అధిగమించగలడు.‘‘ఈ సమస్త దృశ్యము ఆత్మయే అను అభ్యాసముచే దృశ్యముపై ఆధిపత్యము సిద్ధించుకోగలడు.

ఎవ్వడైతే ‘ఇహమ్’గా కనిపించేదంతా పరమాత్మయొక్క ప్రత్యక్షరూపముగా దర్శించు అభ్యాసమును ఆశ్రయిస్తాడో,
అట్టివాడు…
- కూర్చున్నచోట ఉండియే బ్రహ్మతత్త్వమే తానై, బ్రహ్మతత్త్వము నందు సుఖాశీనుడు కాగలడు.
- దృశ్య-అదృశ్యతత్త్వములను ఎరిగినవాడై, దృశ్య శిధిలత్వముచే పరిమితి పొందడు.

అట్లా కాకుండా, ఈ దృశ్యమును భౌతిక దృష్టితో మాత్రమే చూస్తూ ఉంటే, అట్టివాడు భౌతిక వస్తువులవలె శిధిలత్వమునే పర్యవసానముగా పొందుచున్నాడు.

।।ఫలశృతి।।

ఎవ్వరైతే, ఈ ‘అవ్యక్తము యొక్క వక్తీకరణ విద్య’ గురించి ఎరుగుచున్నాడో….
⌘ అట్టివాడు సర్వవేదములను అధ్యయనము చేసి సారమును గ్రహించినవానితో సమానుడగుచున్నాడు.
⌘ సర్వక్రతువులను నిర్వర్తించిన ఉత్తమ ప్రయోజనము పొందుచున్నాడు.
⌘ సర్వతీర్థములలో స్నానము చేసిన పుణ్యము పొందినవాడితో సమానము.
⌘ సర్వ మహాపాతక - ఉపపాతకము దోషములనుండి పునీతుడు అవగలడు.
⌘ మహత్తరమగు ‘బ్రహ్మవర్చస్సు’తో ప్రకాశించగలడు.
⌘ అట్టి బ్రహ్మజ్ఞాని యొక్క ఇతఃపూర్వపు (మరియు) భవిష్యత్ వంశములు పునీతము కాగలవు.
⌘ అట్టివాడు ‘అపస్మార’ బుద్ధి, ‘అకుశలత్వము’ మొదలైన మానసిక దోషములకు లోబడడు.
⌘ అట్టి ఆత్మత్త్వమును స్వానుభవముగా సిద్ధించుకొన్న బ్రహ్మజ్ఞానిని దర్శించునప్పుడు యక్ష-ప్రేత-పిశాచ స్వభావులగు జీవులు కూడా పునీతులు కాగలరు. అట్టి మహనీయుని స్పృశించటంచేత, చూడటంచేత, ఆయన చెప్పునది వినినంత మాత్రంచేతనే పాపి కూడా పరిశుద్ధుడై పుణ్యలోకములను పొందగలడు.
⌘ అట్టి బ్రహ్మజ్ఞాని గురించి చింతన చేసిన మాత్రం చేత సర్వ శుభార్థములు చేకూరగలవు.
⌘ సర్వత్రా ఆత్మదర్శనము చేయు మహనీయుడు సర్వులకు తండ్రివలె సంరక్షకుడు అయి కనిపిస్తాడు.
⌘ రాజ్యపాలన చేయువారు కూడా అట్టి ఆత్మజ్ఞాని యొక్క వాక్యములకు ఆనందిస్తూ ఆత్మబంధువులై ఉండగలరు.

ఆత్మతత్త్వజ్ఞులగు సమదర్శుల ఆత్మీయవాక్యములను పూర్తిగా వినకుండా, వ్యతిరేకించి సంకుచిత దృష్టితో మాట్లాడువారు నమస్కారమునకు అర్హులు కారు.

సర్వత్రా ఆత్మగా భావిస్తూ, ఈ దృశ్యమును ఆత్మతత్త్వముగా దర్శించువారు జీవన్ముక్తులగుచున్నారు. వారు ఈ దేహ పరిమిత పరిధులను, అజ్ఞానాంధకారమును అధిగమించి ‘పరంధామము’ను ప్రాప్తించుకొనుచున్నారు.

ఈ విశ్వమంతా విరాట్ రూప నృశింహస్వరూపముగా ఉపాసించువాడు, విరాట్ - ఆత్మధ్యానపరాయణుడు అగుచూ క్రమంగా సర్వాతీతుడై, ఆత్మయందే విలీనుడగుచున్నాడు. అట్టివాడు మరల పునరావృత్తి (తిరిగి భౌతిక, వ్యష్టిపరిమిత దృష్టికి) తిరిగిరాడు. సర్వత్ర సర్వదా ఆత్మదృష్టియందే సుఖాశీనుడై ఉంటాడు. ఆత్మానందము సిద్ధించుకోగలడు.

అవ్యక్తాత్మవిద్యను (ఈ వ్యక్తావ్యాక్త ఆత్మతత్త్వమును) బోధించుటకు…
శ్రద్ధలేనివాడు; అసూయను వదలనివాడు; సదాచారము పట్ల తిరస్కారభావము కలవాడు; దురాచారపరుడు; విష్ణుభక్తి లేనివాడు; అసత్యములు వెనుకాడకుండా పలుకువాడు; తపస్సు అభ్యసించనివాడు; ఇంద్రియ నిగ్రహము లేనివాడు; అశాంతి స్వభావుడు; దీక్ష - పట్టుదల లేనివాడు; అధర్మశీలుడు; స్వధర్మమును ఉపాసించనివాడు; పరులను బాధించి హింసాస్వభావి, ‘బ్రహ్మము’ గురించి అధ్యయనమునందు అభిరుచి లేనివాడు అర్హుడు కాదు.

అట్టి దోషములు తొలగించుకొను యత్నశీలుడు - గురుముఖతః శ్రవణమునకు, అధ్యయనమునకు తప్పకుండా అర్హుడే!



🙏 ఇతి అవ్యక్త ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।