[[@YHRK]] [[@Spiritual]]

Sarva Sāra Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


కృష్ణ యజుర్వేదాంతర్గత

29     శ్రీ సర్వసారోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। సర్వసారం నిరాలంబం రహస్యం వజ్రసూచికమ్,
తేజో నాద ధ్యాన విద్యా యోగతత్త్వ-ఆత్మబోధకమ్!

ఈ సర్వసారోపనిషత్-‘సర్వము’ యొక్క సారమైయున్నది. స్వా-తంత్ర స్వరూపము అగు నిరాలంబము గురించి వివరించు చున్నది. పరమ రహస్యమైనది. వజ్రసూచిక వలె సాక్షాత్ తత్త్వము గురించి చెప్పుకొస్తున్నది. తేజో-నాద-ధ్యాన విద్యా ప్రతిపాదకము. యోగ తత్త్వమును బోధించుచున్నది. ఇక శ్రవణ, అధ్యయనము చేద్దాము.

‘‘ఓం’’
1. కథం బంధః? కథం మోక్షః?
కా విద్యా? కా అవిద్యా చ-ఇతి?
జాగ్రత్ స్వప్న సుషుప్తిః
తురీయం చ కథమ్?
అన్నమయ ప్రాణమయ మనోమయ
విజ్ఞానమయ ఆనందమయ కోశాః కథమ్?
కర్తా జీవః పంచవర్గః
క్షేత్రజ్ఞః సాక్షీ కూటస్థో
అంతర్యామి ఇతీ చ కథమ్?
ప్రత్యగాత్మా పరమాత్మా
మాయా చ ఇతి కథమ్?
కిం బ్రహ్మ? కతి పదార్థాః?
కా మాయా చ? ఇతి।।
‘ఓం’ అను ఏక-అక్షర పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ..
తపోధనుడు, సునిశితబుద్ధి సమన్వితుడు అగు శిష్యుల (12) ప్రశ్నలు:
(1) బంధము ఎటువంటిది?
(2) మోక్షము అనగా ఏమి?
(3) ఏది విద్య?
(4) ఏది అవిద్య?
(5) జాగ్రత్, స్వప్న, సుషుప్తి,, తురీయముల స్వరూప-స్వభావములు ఎటువంటివి?
(6) అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ- పంచకోశములు ఏమేమి అయి ఉన్నాయి?
(7) కర్త; జీవుడు; పంచవర్గము; క్షేత్రజ్ఞుడు; సాక్షి; కూటస్థుడు; అంతర్యామి - ఈ ఈ పేర్లతో దేనిదేనిని ఉద్దేశ్యిస్తున్నారు?
(8) ప్రత్యగాత్మ అనగా ఎవరు?
(9) పరమాత్మ అనగా? మాయ-అనగా ఏమి?
(10) బ్రహ్మము అనగా ఏది?
(11) ‘పదార్థము’ అనగా ఏమి? ఎన్ని విధములు
(12) ‘మాయ’ ఎక్కడిది? ఎవరిది?
2. బంధమోక్షములు:
ఆత్మేశ్వర జీవో..
అనాత్మనాం దోహాదీనామ్
ఆత్మత్వేన అభిమన్యతే,
సో అభిమాన ఆత్మనో ‘‘బంధః’’।।
తత్ నివృత్తిః - ‘‘మోక్షః’’।।
స్వయముగా ‘ఆత్మేశ్వరుడే’ అయిఉన్నట్టి ఈ జీవుడు - జీవాత్మ, ఈశ్వరుడు, దేహము, ఇంద్రియములు, దృశ్య విషములు మొదలైనవాటి పట్ల - అవియే తాను [అత్మ (లేక) ‘‘నేను’’ అయినట్లు] అభిమానించు చున్నాడు. అట్టి ఆత్మకు అన్యమగు తదితర కల్పితమాత్ర విషయముల పట్ల గల ఆగని అభిమానమే “బంధము”. ఈ జీవుడు అట్టి స్వాభిమానముల నుండి నివృత్తుడు (Completely non-bounded, relieved, non-avocative) అయితే, అదియే ‘‘మోక్షము’’.
అవిద్య:
యా తత్ అభిమానం కారయతి
సా హి ‘‘అవిద్యా’’!
సో అభిమానో యయా
నివర్తతే సా ‘విద్యా’।।
అవిద్య : అటువంటి శరీరాభిమానము, దృశ్యాభిమానముల కారణంగా ఆత్మ, ఈశ్వర-జీవ-దృశ్యములు వేరువేరనుకొనే దృష్టికి కారణములుగా అగుచున్నాయో - అదియే ‘‘అవిద్య’’. దృశ్యముపట్ల గల ‘మమ’ రూప అభిమానమునకు కారణమయేదంతా ‘అవిద్య’.
విద్య : ఏఏ ప్రయత్నములు - భేదములకు సంబంధించిన అభిమానము యొక్క నివృత్తికి కారణమౌతూ ఉంటున్నాయో అదియే ‘‘విద్య’’.
జాగరణము (జాగ్రత్):
‘మన’ - ఆది చతుర్దశ (14) కరణైః
పుష్కలైః ఆదిత్యాది అనుగ్రహీతైః
శబ్దాదీన్ విషయాన్ స్థూలాన్
యదా ఉపలభతే, తదా ఆత్మనో ‘‘జాగరణమ్’’।।
జాగ్రత్ : మనస్సు మొదలైన 14 కరణములు (మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు) - ఇవన్నీ స్ఫూర్తి- పుష్కలత్వము పొంది వాటి వాటి విషయములను స్వీకరించినవై, శబ్ద -స్పర్శ- రూపరస-గంధములను బాహ్యంగా ఉపలబ్దము (పొందుచూ) ఉండటమే- ఆత్మ యొక్క జాగరణము. ఇంద్రియములను ఉపయోగిస్తున్నప్పటి మనస్సుయొక్క బాహ్య విషయానుభవమే - జాగ్రత్.
స్వప్నం
3. తత్ వాసనా సహితైః చతుర్దశ కరణైః
శబ్దాది అభావే-పి, వాసనామయాం శబ్దాదీం
తాత్కాలికానామ్ యదా ఉపలభతే
తత్ ఆత్మనః ‘‘స్వప్నం’’।
స్వప్నము : వాసనా సహితమైనట్టి ఆ 14 ఇంద్రియములు మరొకప్పుడు శబ్ద-స్పర్శ-రూప-రస గంధములను బాహ్యత్వము పొందనివి అగుచున్నాయి. అయితే, వాసనామయములైన శబ్దస్పర్శ రూప-రస గంధములను తాత్కాలికంగా ఊహామాత్రంగా పొందటం జరుగుచూ ఉన్నప్పుడు (అభిమానము కొనసాగుచూ, బాహ్యాభిమానము తొలగి అంతరాభిమానము ప్రారంభమైనప్పుడు) - అది ఆత్మయొక్క ‘స్వప్నము’. విషయముల అంతర భావనయే స్వప్నము.
సుషుప్తి
చతుర్దశ(14) కరణ ఉపరమాత్
విశేష విజ్ఞాన అభావాత్ యదా శబ్దాదీన్
న ఉపలభతే, తదా ఆత్మనః ‘‘సుషుప్తమ్’’।
సుషుప్తి : 14 కరణములు పూర్తిగా ఉపరమించినవై (Having been completely withdrawn) - తనకు ‘అన్యము’ అనబడు విశేష విజ్ఞానమంతా అభావించబడుచూ, శబ్దస్పర్శ రూప రసగంధములు తమయొక్క ‘కారణము’లో ప్రవేశించినవై, పూర్తిగా వాసనా సంబంధమైన మౌనము వహించినప్పుడు- అది ఆత్మ యొక్క సుషుప్తి.
తురీయం
4. అవస్థాత్రయ భావ-అభావ
సాక్షీ, స్వయం భావరహితం,
నైరంతర్యం చైతన్యం
యదా, తదా (తత్) ‘‘తురీయం చైతన్యమ్’’
ఇతి ఉచ్యతే।।
తురీయ చైతన్యము
ఎప్పుడైతే ఆత్మ- జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు సంబంధించిన భావ సమూహములకు కేవల సాక్షిత్వము వహించినదై ఉంటూ, భావరహిత మగుచు, అంతరంగ చతుష్టయము (మనోబుద్ధి చిత్త అహంకారములను) తన యందు తన ఉపకరణమాత్రంగాను, తాను నిర్విషయంగాను చేసుకొన్నదై ఉంటుందో, కేవల చైతన్యత్వము అవధరించినదై ఉంటోందో - అప్పుడు ఆత్మ ‘‘తురీయ చైతన్యము’’గా చెప్పుకోబడుతోంది.
అన్నమయ కోశము
అన్న కార్యాణాం కోశానాం
సమూహో ‘‘అన్నమయః కోశ’’ ఇతి ఉచ్యతే।।
ప్రాణమయ కోశము
ప్రాణాది చతుర్దశ వాయుభేదా (దశవాయుభేదా)
అన్నమయకోశే యదా
వర్తన్తే, తదా ‘‘ప్రాణమయ కోశః’’ ఇతి ఉచ్యతే।।
అన్నమయ కోశము : ‘ఆహారము’ చేత నిర్మితమైన ఈ భౌతిక దేహదృష్టిచే పరిమితత్వము, మూఢత్వము కలిగియుండు స్థితి- ‘అన్నమయకోశము’ అనబడుచున్నది. అన్నమయ కార్యముల సమూహములు అన్నమయ కోశము.
ప్రాణమయ కోశము: (ప్రాణ-అపాన-ఉదాన-సమాన-సప్రాణములనే) పంచప్రాణములు, (నాగ-కూర్మ-కృకర-దేవదత్త-దనంజయములనే) పంచ ఉప - ప్రాణములు- మనో-బుద్ధి-చిత్త-అహంకారములకు కదలిక కలిగించు ప్రేరణ వాయువులు - అన్నమయ కోశములో (శక్తిస్వరూపమై) వర్తిస్తూ ఉన్నప్పుడు అది ‘ప్రాణమయకోశము’ - అని చెప్పబడుతోంది.
మనోమయ కోశము
5. ఏతత్ కోశద్వయ సంసక్తం, ‘మన’ ఆది చతుర్దశ కరణైః
ఆత్మా - శబ్దాది విషయ సంకల్పాదీన్
ధర్మాని యదా కరోతి,
తదా ‘‘మనోమయః కోశ’’
ఇతి ఉచ్యతే।।
మనోమయ కోశము : అన్నమయ-ప్రాణామయ - రెండు కోశములతో కూడుకొన్న ఆత్మ (జీవాత్మ) మనస్సు మొదలైన 14 కరణములతో శబ్దస్పర్శ రూప రస గంధ-విషయములను ‘‘సంకల్పించటము’’ అను ‘ధర్మము’ (Characteristic feature/function)ను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు, అది ‘మనోమయ కోశము’ అని పిలువబడుతోంది. భావనచేయు (లేక) సంకల్పించు (లేక) ఆలోచించు ధర్మము - మనోమయకోశ రూపము.
విజ్ఞానమయకోశము:
ఏతత్ కోశత్రయ, విశిష్ట - అంతఃకరణే-సంసక్తం,
తద్గత విశేష ధ్యాన-మననాది వృత్తయో, యదా ఉత్పద్యంతే,
సంసక్తం తద్గత విశేషజ్ఞో యదా భావతే (భాసతే)
తదా ‘‘విజ్ఞానమయః కోశ’’ ఇతి ఉచ్యతే।
(- విశిష్ట - అంతఃకరణే, తత్‌గత విశేష ధ్యాన - మనన ఆది వృత్తయో యత్ ఉత్పద్యంతే-తత్ విజ్ఞానమయ కోశః।)
విజ్ఞానమయ కోశము : ఆత్మ (జీవాత్మ) - అన్నమయ- ప్రాణమయ - మనోమయ త్రికోశములను వెంటబెట్టుకొని, వాటి యందలి విశేషములను ఎరుక (Knowing Awareness)చే ‘ఎరుగుట’ అను విశేష-జ్ఞాతత్వమును భావిస్తూ ఉన్నప్పుడు - అది ‘విజ్ఞానమయకోశము’’గా అభివర్ణించ బడుతోంది. వాటి గురించి ధ్యాస, ధ్యాసవృత్తులు - విజ్ఞానమయకోశము. ఎరుగుట, నిర్ణయించుట - ఇవి విజ్ఞానమయకోశ ముఖ్య ధర్మములు.
ఆనందమయకోశము:
6. ఏతత్ కోశ చతుష్టయ కారణ జ్ఞాన సంసక్తం (సంపృక్తం), స్వకారణ-
జ్ఞానం స్వరూప సుఖే వటధానాసు వటవృక్ష ఇవ,
వటకణికాయమ్ (వటవృక్ష) ఇవ, వృక్షో యదా వర్తతే,
తత్ ‘‘ఆనన్దమయః కోశ’’ ఇతి ఉచ్యతే।
కోశా ఉపాధి (ఏతా) ఉపహిత ఏవ
‘ఆత్మాకోశ’ ఇతి ఉపచర్యతే
ఆనన్దమయ కోశము : ఆత్మ - అన్నమయ + ప్రాణమయ + మనోమయ + విజ్ఞానమయ కోశములను కలిగియున్నదై (వెంటనంటి ఉన్నదై) - వాటినన్నిటినీ కూడా ఒక మర్రి (వట) వృక్షపు బీజములో వటవృక్ష ధర్మములన్నీ కలిగియున్న తీరుగా - (ఆ నాలిగిటి యొక్క కారణ జ్ఞానమును) తనయందు అణిగి ఉన్నప్పుడు ‘‘ఆనందమయకోశము’’గా చెప్పుకోబడుచున్నది.
ఆత్మాకోశ : సమస్తకోశములు దేనికి ఉపాధి మాత్రమో అదియే ఆత్మ।
సుఖదుఃఖములు:
సుఖదుఃఖ బుద్ధ్య, ఆశ్రయా
తత్‌తత్ ఇచ్ఛయా ‘దేహాన్తః కృతిమత్ కర్తా।
శ్రేయో అన్తః కర్తా
యదా తదా - ఇష్టవిషయే బుద్ధిః ‘‘సుఖబుద్ధిః’’।
‘ఇష్టం ఇతి వృత్తిః సుఖ బుద్ధిః।
అనిష్ట విషయే బుద్ధిః ‘‘దుఃఖబుద్ధిః’’।।
(‘అనిష్టం’ ఇతి వృత్తిః దుఃఖబుద్ధిః।।)
సుఖదుఃఖములు : ఆత్మ తన యొక్క బుద్ధిచే సుఖ-దుఃఖ సంబంధమైన కర్తృత్వము - భోక్తృత్వము కలిగియున్నప్పుడు, బుద్ధితో సుఖ-దుఃఖముల పట్ల ప్రియమైన భావన కలిగి ఉన్నప్పుడు - ఇష్ట విషయములచే సుఖబుద్ధి, -అనిష్ట విషయములచే దుఃఖబుద్ధి కలిగి ఉంటోంది.
బుద్ధి యొక్క ఇష్ట-అయిష్ట భావములే సుఖ-దుఃఖముల అంతఃకర్త. (వాటికి సాక్షియే ఆత్మ). అనగా సుఖ దుఃఖములు స్వకీయ బుద్ధి నిర్వచనములే గాని, బాహ్య సంగతి, సందర్శనములు కారణం కాదు.
జీవ ఉపహిత:
శబ్ద స్పర్శ రూప రస
గంధాః సుఖ-దుఃఖ హేతవః।
పుణ్య-పాప కర్మానుసారీ భూత్వా,
- ప్రాప్త శరీర సంయోగమ్,
-అప్రాప్త శరీర సంయోగమ్ ఇవ
కుర్వాణో యదా దృశ్యతే, తదా ‘ఉపహిత జీవ’
ఇతి ఉచ్యతే। కుర్వాణః (ప్రాణధ్యాసీ జీవః।।)
జీవుడు : ఆత్మ ఎప్పుడైతే - శబ్ద స్పర్శ రూపరస గంధములను సుఖదుఃఖహేతువులుగా భావన చేస్తూ కర్మ - కర్మఫలములను అనుసరించుచూ - ప్రాప్తించిన శరీరముతో సంయోగము, (జాగ్రత్) ‘ప్రాప్తించని శరీర సంయోగము’ (స్వప్నము) భావించుచూ, కర్మలు చేయుట యందు మునిగి తేలుచున్నట్లు కనబడుచున్నదో, అదియే ‘‘జీవత్వము పొందిన జీవుడు’’-అని (ఆత్మయే) వివరించుకో బడుచున్నది.- దేహాత్మ బుద్ధి కలవాడు జీవుడు. దేహముతో, జీవించటముతో అవినాభావత్వము, అభిమానము కలిగియున్నప్పుడు ‘‘ఉపహిత జీవుడు’’ అనబడుచున్నాడు.
మన ఆదిశ్చ, ప్రాణాదిశ్చ, సత్త్వాదిశ్చ, భూతాదిశ్చ,
పుణ్యాదిశ్చ ఏతే పంచవర్గాః ఇతి।
ఏషాం, పంచవర్గాణాం ధర్మీ భూతాత్మా
జ్ఞానాదృతేన, అజ్ఞానేన దృశ్యతి।
జ్ఞానేన వినశ్యతి।
పంచవర్గములు :
(1) అంతరంగ చతుష్టయమగు మనోబుద్ధి చిత్తా అహంకారములు, వాటిపట్ల గల ఇచ్చలు.
(2) ప్రాణ -అపాన-వ్యాన- ఉదాన-సమానములనబడే పంచప్రాణములు.
(3) సత్త్వ రజో తమములనబడే త్రిగుణములు.
(4) భూమి-జలము-అగ్ని- వాయువు-ఆకాశము అనబడే పంచభూతములు.
(5) పుణ్యపాపద్వయం
- ఈ ఐదు ‘‘పంచవర్గములు’’. ఇవి జ్ఞానాజ్ఞాన సమన్వితమై ఉంటూ, ఆత్మజ్ఞానముచే ‘లేనివే’ అగుచున్నాయి.
హృదయగ్రంథి:
ఆత్మ సన్నిధౌ నిత్యత్వేన ప్రతీయతేచా, ప్రతీయమాన,
మూలావిద్యేతు ఆత్మా ఉపాధిః
యస్తదేవ ‘లింగశరీరం’ బీజగ్ం
- ‘‘హృత్‌గ్రంథిః’’ ఉచ్యతే।
హృత్ గ్రంథి : ఏదైతే →
- పంచవర్గములను తన ధర్మముగా కలిగియుంటున్నదై,
- జ్ఞాన దర్శనముచే (లేక) జ్ఞానధారణచే నశించుపోవు స్వభావము కలిగియున్నట్టిదై,
- ఆత్మకు సమీపముగా ఉండటం చేత ‘నిత్యము’ అయినదానివలె కనబడుచూ, ఆత్మకు ‘ఉపాధి’గా చెప్పబడునది అగుచున్నదో
దానినే ‘‘లింగశరీరము’’ అని, ‘‘హృదయగ్రంథి’’ అని పిలుస్తున్నారు.
క్షేత్రజ్ఞుడు: తత్ర యత్ ప్రకాశతే చైతన్యం
స ‘‘క్షేత్రజ్ఞ’’ ఇతి ఉచ్యతే।
(తత్ ప్రతి ఫలం
చైతన్యం యత్ ప్రకాశతే, స ‘‘క్షేత్రజ్ఞః’’।)
క్షేత్రజ్ఞుడు : అట్టి హృదయ గ్రంథి యందు ప్రకాశమానమగుచున్నట్టి (That which is present like light) చైతన్యమును- ‘క్షేత్రజ్ఞుడు’- అని పలుకుచున్నారు. సమస్తమును చేతనముగా చేయునది ‘చైతన్యము’. చైతన్యస్వరూపుడై సమస్తము ఎరుగుచూ తనయొక్క ఎరుకచే నింపి ఉంచువాడు, నింపుచున్నవాడు ‘క్షేత్రజ్ఞుడు’. ఎరుగుట - తనదైనవాడు క్షేత్రజ్ఞుడు.
సాక్షి: జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయానామ్, యత్ న
ఆవిర్భావ తిరోభావ (జాతా) జ్ఞాతా,
స్వయమ్ తత్ ఆవిర్భావ సహితః,
స్వయమ్ ఆవిర్భావ - తిరోభావ రహితః,
స్వయం జ్యోతిః, (చేతనో) ‘‘సాక్షీ’’ - ఇతి ఉచ్యతే।
కూటస్థుడు: బ్రహ్మాది పిపీలికాంత పర్యన్తం సర్వప్రాణి బుద్ధిషు
అవశిష్ట తయో ఉపలంభ్యమానః, సర్వప్రాణబుద్ధి సాక్షిః,
సర్వప్రాణి బుద్ధిస్థో యదా, తదా ‘‘కూటస్థ’’ ఇతి ఉచ్యతే।।
సర్వప్రాణ బుద్ధి సాక్షిః అధిష్ఠాన ఆత్మా,
అస్తి, భాసతే చ స కూటస్థః।।
స్వయం జ్యోతి। సాక్షి:
(1) జ్ఞాత- (తెలుసుకుంటూ ఉన్నవాడు - the knower,
(2) జ్ఞానము (తెలుసుకోవటం, the knowing),
(3) తెలియబడునది (All that being known)"
- ఈ మూడిటి రాక- పోకలు ఎవరి చేత ఎరుగబడుచు, అవన్నీ తనవే అయి ఉండి కూడా, తాను మాత్రం రాక-పోకలు (ఆవిర్భావ- తిరోభావములు) లేనిదై ఉన్నదో అద్దానిని ‘‘స్వయంజ్యోతి’’ అని ‘సాక్షి’ అని చెప్పుచున్నారు.

కూటస్థము : ‘‘సృష్టికర్త’’ అయినట్టి బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక పురుగువరకు సర్వప్రాణుల బుద్ధికి ‘సాక్షి’ అయి ఉన్నట్టి తత్త్వము- ఏది తానైయున్నదో, సర్వ ప్రాణుల బుద్ధియందు ప్రకాశమానమై యున్నదో,-అట్టి ఆత్మజ్యోతి స్వరూపమును ‘‘కూటస్థము’’-అని పిలుస్తున్నారు.
7. అంతర్యామి: కూటస్థో (కూటస్థ-ఆది) ఉపహిత భేదానామ్
స్వరూపలాభ (భే) హేతుర్భూత్వా, మణిగణే సూత్రమివ,
సర్వక్షేత్రేషు యత్ అనుస్యూతత్వేన యదా,
యదా అనుస్యూత అంతర్యామియన్
(సో) యదా ప్రకాశతే హి ఆత్మా
తదా ‘‘అంతర్యామి’’ ఇతి ఉచ్యతే।
ప్రత్యగాత్మ: సో అంతర్యామీ…,
సత్యం జ్ఞానం అనన్తమ్
ఆనన్దగమ్, (సర్వశరీర)- సర్వ - ఉపాధి వినిర్ముక్తమ్।
కటక మకుటాది ఉపాధి రహిత, సువర్ణ ఘనవత్
విజ్ఞాన - ఘన చిన్మాత్ర స్వభావాత్మా,
సభావం ఆత్మ చైతన్యం బ్రహ్మయత్ అవభాసతే,
ఆత్మ యదా భాసతే, తత్ అవిద్యా ఉపాధికమ్-
తదా ‘త్వమ్’ పదార్థః, సః ప్రత్యగాత్మా।।
అంతర్యామి : దృశ్యము నుండి - కూటస్థుడు వరకు గల సర్వ భేదములను (స్వస్వరూప భావన/ప్రాప్తి చేత) - సూత్రములోని దారమువలె సర్వక్షేత్రములలో (దేహములలో) అనస్యూతంగా (అంతర దారమువలె) అంతరంగా - ప్రకాశిస్తూ ఉన్న (విస్తరించియున్న) భావము కలిగి యుండునప్పుడు-ఆత్మయే ‘‘అంతర్యామి’’గా నిర్వచించబడుచున్నది.
ప్రత్యగాత్మ: అట్టి అంతర్యామి-:
→ సత్య జ్ఞాన అనంత ఆనంద స్వరూపంగా ‘కేవలము’ (The Absolute) అయి ఉన్నది.
→ సర్వ ఉపాధులకు నిబద్ధము కానిదై, వేరై, వినిర్ముక్తమైయున్నది.
→ ఆభరణములుగా ఉండి కూడా ఆభరణ సంబంధమైన ఆకారములకు సంబంధించని ‘బంగారు లోహము వలె,
సర్వము అయిఉంటూనే సర్వమునకు వేరై యున్నది.
అట్టి విజ్ఞాన-చిత్‌మాత్ర స్వభావాత్మ ఈ జీవునికి స్వానుభవమై, భాసిస్తూ ఉన్నప్పుడు, ‘నీవు’, ‘ఆతడు’, ‘అది’ కూడా తానే అయిఉన్నదగుచున్నది. అదియే ‘‘ప్రత్యగాత్మ’’ గా పలుకబడుచున్నది.
8. సత్యం జ్ఞానం అనంతం ఆనందం బ్రహ్మ।
సర్వజ్ఞత్వాది ఉపేతం, మాయోపాధికం,
తత్ పదార్ధః పరమాత్మా।
సత్యమ్ → అవినాశి।
‘అవినాశి’ నామ:
దేశ కాల వస్తు నిమిత్తేషు
వినశ్యత్సు, యత్ న వినశ్యతి- తత్ ‘‘అవినాశి’।।
‘‘సత్యం। జ్ఞానమ్। అనంతమ్। ఆనందమ్। సర్వజ్ఞత్వము।’’
-ఇవన్నీ కూడా కేవలాత్మ (లేక) బ్రహ్మము యొక్క స్వాభావిక లక్షణములు. ఆత్మకు మాయయే ఉపాధి.
సత్యమ్ : దేనికి - నశించటము అను ధర్మమే లేదో, అట్టిది.
అవినాశి అనగా దేశ (Place factor), కాల (Time factor), వస్తు (factor of matter), నిమిత్త (Inter-related cause & effects factor) -ఇవన్నీ నశించినప్పటికీ ఏది వినాశనము పొందక, ఎప్పటి అట్లే ఉండి ఉంటోందో, అది ‘అవినాశి’. ఆత్మ సర్వదా సత్యము, అవినాశి కూడా!
9. జ్ఞానం నామ:
ఉత్పత్తి - వినాశన రహితం। నైరన్తర్యం।
చైతన్యం - ‘జ్ఞానమ్’ ఇతి ఉచ్యతే।
జ్ఞానము : దేనికైతే ఈ తెలియబడుచున్న సమస్తమునకు సంబంధించినట్టి ఉత్పత్తి, వినాశనములనునవి ఏమాత్రము లేవో, ఎద్దానికి ‘లోన -బయట’ అనునవి ఉండవో,… అట్టి బాహ్యభ్యంతర స్థితచైతన్యమును ‘జ్ఞానము’ అంటున్నాము. ఇదికూడా ‘సత్’ వలె కేవలాత్మయొక్క స్వాభావికలక్షణము.
అనన్తమ్ నామ:
మృత్ వికారేషు మృదివ,
స్వర్ణవికారేషు స్వర్ణమివ,
తంతు వికారేషు తంతురివ,
అవ్యక్త - ఆది సృష్టి ప్రపంచేషు పూర్ణం,
వ్యాపకం, చైతన్యం, ‘‘అనన్తమ్’’ ఇతి ఉచ్యతే।
అనన్తమ్ : మట్టికుండకు మొదలు - మధ్య - చివర (పగిలిన తరువాత కూడా) ‘మట్టి’యే స్వభావముగా కలిగియున్న విధముగా, ‘ఆభరణము’ అను వికారము బంగారమునకు లేని తీరుగా, దారముల ‘ఒకానొక అమరిక’ అను వికారమే వస్త్రమగుచున్నట్లు
అవ్యక్తము నుండి - ఈ సృష్టిరూప ప్రపంచము వరకు ఏ చైతన్యము పూర్ణమై, సర్వవ్యాపకమైయున్నదో.. అట్టి లక్షణము ‘అనన్తము’-గా పిలువబడుతోంది.
10. ఆనందం నామ:
సుఖచైతన్య స్వరూపో, అపరిమిత ఆనన్ద సముద్రో,
అవశిష్ట సుఖ స్వరూపశ్చ ‘ఆనంద’ ఇతి ఉచ్యతే।
ఆనన్దము : కేవలమగు ‘చైతన్యము’తో అనుసంధానమే ఆనందము. అప్రయత్నంగా, స్వాభావికంగా సిద్ధించు స్వయంచైతన్య స్వరూపము సంతరించుకోవటమే అది. అట్టి చైతన్యత్వము అపరిమితము, స్వాభావికము, అవ్యవహారికము అగు ఆనందసముద్రము నందు సుఖరూపముతో అవశిష్టుడై ఉండటము-ఆనందముగా చెప్పబడుచున్నది.
11. పరమాత్మ నామ:
ఏతత్ వస్తు చతుష్టయం యస్య లక్షణం
దేశ-కాల-వస్తు-నిమిత్తేషు
అవ్యభిచారీ తత్ పదార్థః
‘‘పరమాత్మ’’ అతి ఉచ్యతే।।
పరమాత్మ : దేశ-కాల-వస్తు-నిమిత్తములు (Place, Time, Matter, Reason) అను నాలుగిటి యొక్క విశిష్ట లక్షణ విశేషములు తన ప్రదర్శనముగా కలిగి యున్నట్టిది. ఆ నాలిగిటికి ఆవల ఉన్నట్టిది. ఏదైతే స్వస్వరూపము నుండి చ్యుతి పొందక ‘అవ్యభిచారి’ (Non - displaced) - అయి ఉన్నట్టిది. అది ‘పరమాత్మ’ అను శబ్దముచే తాత్పర్యపరచ బడుచున్నది.
12. పరబ్రహ్మ నామ:
‘త్వం’ పదార్థాత్ ఔపాధికాత్।
‘తత్’ పదార్థాత్ ఔపాధిక భేదాత్
విలక్షణమ్। ఆకాశవత్ సూక్ష్మమ్।
కేవల సత్తామాత్ర స్వభావమ్,।
‘‘పరబ్రహ్మ’’ ఇతి ఉచ్యతే।।
(అంతేకాకుండా), ఏది ‘నీవు’ (మధ్యమ పురుష)గా ఉపాధి సహితంగా (ఔపాధికంగా) అగుపిస్తోందో, ఏది ‘తత్’ పదార్ధ ఔపాధిక రూపంగా కనిపిస్తోందో- ఆ రెండింటి భేదములకంటే పరబ్రహ్మము - విలక్షణమైనది. పంచభూతములలోని ‘ఆకాశము’ వలె అత్యంత సూక్ష్మమైనది. కేవల సత్తామాత్రము (Mere - Absolute Existence form) అయినట్టిదే ‘పరబ్రహ్మము’ అని శాస్త్రీయము చేయబడుచున్నది.
13. మాయా నామ:
అనాది-అన్తవతి। ప్రమాణ-అప్రమాణ సాధారణాత్-
న సతీ। న అసతీ।
న సత్-అసతీ। స్వయమధికా। వికార రహితా।
నిరూప్యమాణా సత్-ఇతర లక్షణ శూన్యా -
సా ‘మాయా’ ఇతి ఉచ్యతే।।
మాయా: ఆది-అంతము అనునది లేనట్టిది. ‘ఇది మాయ’ అని ప్రమాణపూర్వకంగా సృష్టీకరించి చెప్పనూలేము. అది సర్వత్రా వ్యావహారికమే కాబట్టి సాధారణమైనదేగాని, అసాధారణం కాదు. ‘మాయ’ ఉన్నదనీ అనవచ్చు. ‘యా మా-అది లేదు’ అని చెప్పవచ్చు. అది స్వయముగా ఆధిక్యత పొందుచున్నట్టిది. మరొకరు ఈ జీవునకు కల్పించటం లేదు. అద్దానికి ఏ వికారములూ లేవు. అది ఇతరమైనది (మరొకరి కల్పన) అనటానికి లక్షణము లేనిది. మాయ ఇట్టి విలక్షణమైనది - అని చెప్పుకోబడుచున్నది. నాటకములో పాత్రల-భార్య-భర్త సంబంధము ఉన్నట్లా? లేనట్లా? ఉండీ లేనట్లా? ఈ జగత్తు కూడా అంతే!
14. అజ్ఞానం నామ:
తుచ్ఛాపి అసతీ, కాలత్రయే-పి,
పామరాణాం వాస్తవీ చ।
సత్త్వ బుద్ధిః లౌకికానాం-
‘ఇదమ్ ఇత్థమ్’ ఇతి (ఇదమిత్థమితి)- అనిర్వచనీయా, వక్తుమ్ న శక్యతే।
అజ్ఞానము : అజ్ఞానము ‘‘తుచ్ఛము, త్రికాలములలోను లేనిది’’ - అయినప్పటికీ కూడా, పామరదృష్టికి ‘‘అజ్ఞానము ఘనీభూతమైఉన్నది’’ - అనియే అనిపిస్తోంది. సాత్త్విక (సత్త్వ) బుద్ధి కలవారికి ‘లోకదృష్టి’ (లౌకిక దృష్టి)యే అజ్ఞానముగా భావించబడుతోంది. ‘‘ఇది ఇట్టిది’’ అని చెప్పటానికి వీలుకానిది. అనిర్వచనీయమ్! ఒకడు ఒక కథ చదువుతూ ఆనందిస్తూ ఉంటే, - అది అజ్ఞానమనుకోవలా? అక్కడ అజ్ఞానము ఉన్నట్లా? లేనట్లా?
మరికొంత విశేషార్ధములు
15. పరమాత్మా।
సత్యం జ్ఞానమ్ అనంతమ్
ఆనందగ్ం సర్వజ్ఞత్వాది ఉపేతం,
మాయా-ఉపాధికం
తత్ పదార్థః - ‘పరమాత్మా’!
మరికొన్ని విశేషార్ధములు
పరమాత్మ: (సత్-యతేతి సత్యమ్।)
సత్యము, జ్ఞానము, ఆనందము, అనంతము, సర్వజ్ఞత్వము- ఇత్యాది మహత్ లక్షణములతో కూడుకొని ఉన్నది. ‘మాయ’ను ఉపాధిగా కలిగియున్నట్టిది. ‘తత్’గా చెప్పబడుచున్నది. ఈ జీవుని సహజ రూపమై ఉన్నట్టిది- ‘‘పరమాత్మ’’। అదియే ‘తత్’। (తత్ త్వమ్ అసి।)
బ్రహ్మమ్
సర్వ ఉపాధి విముక్తం, నిర్విశేష చిన్మాత్రం
సత్-అద్వైత ఆనందమయం ‘బ్రహ్మ’ ।
బ్రహ్మము
- సర్వ ఉపాధి - విముక్తమైనట్టిది (That which is not bound by any physical holding)
- సర్వ విశేషములకు మునుముందే ఉండి ఉండటం చేత నిర్విశేషమైనది.
- కేవల స్వరూపమై సర్వమును వెలిగించుచున్నట్టిది (That which enlightens all else) కాబట్టి ‘చిన్మాత్రము’.
- నా-నీ-మనందరియొక్క వాస్తవ స్వరూపమే అయి ఉన్నట్టిది - ‘బ్రహ్మము’.
ఔపాధికము। అవినాశి।
తద్ధి (తత్ విద్ధి) ‘త్వం’ పదార్థ ఔపాధికాత్,
అట్టి తత్ బ్రహ్మము ‘త్వమ్’ (నీవు)ను ఉపాధిగా ఆశ్రయించుచూ, లీలావినోది అయి ఉన్నది. బ్రహ్మము యొక్క ఔపాధికత్వ చమత్కారమే జగత్ కల్పన.
అవినాశి
‘తత్’ పదార్థాశ్ఛ ఔపాధిక బేధాత్-
విలక్షణమ్। అభేదమ్ ।
అధిష్ఠానత్వ-ఉపలక్షితం।
శుద్ధం। పారమార్థికం। సత్తామాత్రమ్
‘‘అవినాశి।’’
అవినాశి
‘త్వమ్’ - ‘తత్’ (నీవు - ఆత్మ) అనునవి ఔపాధిక ఆత్మయొక్క ఉపాధి కల్పనా సంబంధ భేదములే.
పరమాత్మ ఆ రెండింటికీ విలక్షణమై యున్నట్టిది.
- (బంగారము ఆభరణమగు విధంగా) అధిష్ఠానత్వము ఉపలక్షితముగా కలిగియున్నట్టిది.
- ‘‘పరమశుద్ధము, పారమార్థికము, కేవల సత్తామాత్రము’’ - అయినట్టిది ‘‘అవినాశి’’
విశేషార్ధములు
16. కిం సత్యమ్?
కిం తత్ సత్యమ్ ఇతి?
‘సత్’ ఇతి, ‘శ్రౌత పతి’ - ఇతి లక్ష్యం ‘సత్యమ్’।
అసత్-ఇతి అవాచ్యం సత్యమ్।
త్రికాలాబాధ్యం (త్రికాల-అబాధ్యం) సత్యమ్।
- త్రికాల అనుస్యూతం సత్యమ్।
- యత్ అస్తి - తత్ సత్యమ్।
- ఏకమేవాద్వితీయం (ఏకమేవ-అద్వితీయం) సత్యమ్।
- సజాతి విజాతి భేద రహితం సత్యం।
- సర్వకల్పన అధిష్ఠానం వా సత్యమ్।
- అవినాశికమ్ ఇతి।।
- దేశ-కాల-వస్తు-నిమిత్తాషు వినశ్యత్సు,
‘‘యత్ న వినశ్యతి’’ - ఇతీతి।। (-సత్యమ్।)
విశేషార్థములు
సత్ : ఏది సత్యమైయున్నది?
✩ ఏదైతే సత్ (ఉనికి)’’ అను రూపంగా ఆత్మజ్ఞులచే నిర్ణయించబడుచు, ‘శ్రుతులు’ ప్రమాణముగా కలిగియున్నట్టిదో అది ‘సత్’.
✩ ఏది ఎరిగిన తరువాత ‘అసత్’ అనునది అవాచ్యము అగుచున్నదో (చెప్పటానికి శేషించి ఉండదో) అది ‘సత్’.
✩ భూత - వర్తమాన-భవిష్యత్‌లచే కించిత్ కూడా మార్పు చెందనిది (అబాధ్యమ్) సత్యము.
✩ త్రికాలములలో, అంతర్లీనమై, అనుస్యూతమై ఏర్పడి ఉన్నది సత్యము.
✩ ఏకమే అయి, (స్వస్వరూపమునకు) అద్వితీయమైనది సత్యము.
✩ సజాతి - విజాతి విభేదరహితమైనది సత్యము.
✩ సర్వకల్పనలకు అధిష్ఠానమైయున్నది ‘సత్యము’.
అందుచేత సత్యము అవినాశనమైనది.
ఈ ఎదురుగా ఉండే దేశ, కాల, వస్తు, నిమిత్తములు ‘వినాశము’ అను ధర్మము కలిగియున్నాయి. దేనికి ‘వినాశనము’ అనే ధర్మమే లేదో, అన్ని అన్యవినాశనములకూ కేవల సాక్షి అయి చెన్నొందుతోందో,
అదియే ఆత్మ। అదియే సత్। అదియే సత్యమ్।
కిం జ్ఞానమ్?
కిం జ్ఞానమ్ ఇతి? స్వప్రకాశం జ్ఞానమ్।
స్వ ప్రకాశం జ్ఞానమ్। సర్వ ప్రకాశం జ్ఞానమ్।
నిరావరణ చిన్మాత్రం జ్ఞానమ్।
అనాది - అనంతమ్
నిరంతరమ్ అవృత్తి- సాక్షి చైతన్యమేవ జ్ఞానమ్।
జ్ఞానము అనగా?
ఆత్మయొక్క స్వయం ప్రకాశ విశేషమే జ్ఞానము.
ఆత్మయొక్క సర్వమును (మనో బుద్ధి చిత్త అహంకార-జీవాత్మ - ఈశ్వర-దృశ్య.. ఇత్యాది సర్వమును) ప్రకాశింపజేయు విలక్షణ లక్షణమే జ్ఞానము. ఆవరణములు (Limitations) లేనట్టి కేవలచిత్ (ఎరుక, వెలిగించు) యే జ్ఞానరూపము.
ఆత్మనగు నాకు ఎట్టి ఆవరణములు లేవు - అనునదే జ్ఞానము.
ఆద్యంతరహితము, నిరంతరమైనది (అనునిత్యము), వృత్తి (Avocation)కి ఆవల (అద్దానికి జననస్థానమైయున్న) అవృత్తి, సాక్షి చైతన్యము గురించిన సమాచారమే → జ్ఞానము.
17. కిమ్ అనన్తమ్?
కిం ‘అనన్తమ్’ - ఇతి?
ఉత్పత్తి-వినాశ రహితమ్ అనన్తమ్।
షట్ (చ (6)) భావ (షడ్భావ) వికార రహితమ్-అనన్తమ్।
సర్వోపాధి వినిర్ముక్తమ్ - అనన్తమ్।
మృత్ వికారేషు మృత్ ఇవ,
స్వర్ణ వికారేషు స్వర్ణమివ,
తంతు వికారేషు తంతురివ-
అవ్యక్తాది సృష్టి ప్రపంచేషు వ్యాప్య పూర్ణమ్,
అవినాశి చైతన్యమ్ ‘అనన్తమ్’!
అనన్తమ్ : ఆత్మ అనన్త (Infinite) స్వభావమైనది.
✤ ఉత్పత్తి - వినాశన ధర్మము లేనట్టిది. కాబట్టి- ‘‘అనన్తమైనది ఆత్మ’’!
✤ ఉత్పత్తి కామము - ఉత్పత్తి - పెరుగుదల - తరుగుదల - వినాశనము - పునరుత్పత్తి స్వభావము - అను షట్ (6) భావ వికారములు లేనట్టిది - అనన్తము.
✤ దృశ్య-స్థూల - ఇంద్రియ సూక్ష్మ-కారణ-మహాకారణ ఉపాధులకు పరిమితము కానిది, వాటిచే నిబద్ధము కానిది ‘అనన్తము’.
✤ మట్టియే మట్టికుండ (మృత్-పిండము)గా అగుచున్నప్పటికీ, ‘‘కుండ యొక్క పొడవు - వెడల్పు - చుట్టూ కొలతలు’’ - అనే వికారములు మట్టికి లేవు.
✤ బంగారమే ఆభరణములుగా అగుచున్నప్పటికీ ‘‘గాజు- ఉంగరము-గొలుసు-ఇది వారివి, వీరివి కాదు- ఇత్యాది వికారములుగా అవటము’’ అనే ధర్మము బంగారమునకు లేదు.
✤ దారమే ‘‘అంగవస్త్రము - చొక్క - ధోవతి’’ మొదలైనవిగా అగుచున్నప్పటికీ దారమునకు వస్త్ర ఇత్యాది ఆకారములు అనే వికారములు ఆపాదించలేము.
అట్లాగే, అనన్తమగు చైతన్యమే - అవ్యక్తము మొదలుకొని ఈశ్వర, జీవ, మనో, బుద్ధి, చిత్త, అహంకార, దృశ్య, జడవస్తువులతో సహా అగుచూ ఉన్నప్పటికీ, ఆయా వికారములన్నీ అనన్తమగు ‘ఆత్మ’కు లేవు. ఆత్మ అనన్తము।
కిం ‘ఆనన్దమ్’ ఇతి?
అంభసామ్ అర్ణవ ఇవ సుఖ చేతనానామ్
అధిష్ఠానమ్, నిత్యశుద్ధ -
అఖండ అద్వైత - చిదానంద -
ఏకరసమ్ ‘ఆనన్దమ్’।
ఆనన్దమ్ :
సముద్ర తరంగములకు సముద్ర జలమే అద్ధిష్ఠానము. సుఖ-చేతనములకు ఆనందమే అధిష్ఠానము.
నిత్య శుద్ధము, అఖండము, అద్వైతము అగుచిదానంద ఏకరసమే ఆనన్దము. ‘‘నేను ఆత్మను’’-అనునది స్వాభావికానంద స్థానము.
18. కతి పదార్థా?
అథ కతి పదార్థా ఇతి?
సత్-అసత్-మిధ్యా చ ఇతి త్రయః।
సదేవ తత్ర బ్రహ్మ।
అసత్ తుచ్ఛం।
జగత్ కల్పితం బ్రహ్మణి-
- అసత్యం। మిథ్యా।
పదార్థము అనగా?
పదార్థములు ‘3’ విధములు : (1) సత్ (2) అసత్ (3) మిధ్య
సత్తు → బ్రహ్మమే ఇక్కడ సత్।
అసత్తు → కల్పితమైనది. స్వయముగా చూస్తే లేనట్టిది కాబట్టి తుచ్ఛము.
మిధ్య → బ్రహ్మము పట్ల ఆరోపించి చూచుచుండగా కనబడు జగత్తు. వాస్తవానికి బ్రహ్మమునకు వేరుగా జగత్తు లేదు. కానీ వేరుగా ఉన్నట్లుగా భావించబడి, భావించబడు విధంగా పొందబడుచున్నట్టిది.
(యత్ భావం, తత్ భవతి। తదేవ భావం, తత్ భవతి।)
బ్రహ్మము - ఆత్మ - అనాత్మ
బ్రహ్మైవ ఆత్మా - జ్ఞేయః।
బ్రహ్మజ్ఞానం సమూలాన్, ఆత్మవివర్తకం
సత్ బ్రహ్మణి విలీయతే।।
అనాత్మా తు సజీవో ‘వియత్’ ఆది ప్రపంచః।
అనాత్మమూలం మాయా।
సా చ బ్రహ్మణి ఆకాశే మేఘాదిరివ దృశ్యతే।
‘‘ఆత్మ బ్రహ్మమే అయి ఉన్నది’’ - (‘I’ am Brahman) అనునది పరమసత్యము. అది తెలియబడేది కాదు. తెలుసుకొంటున్నదే అది.
కల్పనయొక్క ధారణచే ఆత్మనుండి వివర్తమయిన (అవ్యక్త జీవాత్మ, జాగ్రత్ స్వప్న సుషుప్తులు మొదలైనవన్నీ కూడా) తిరిగి మరొకప్పుడు ఆత్మయందే (లేక) బ్రహ్మమునందే విలీనమయిన వగుచున్నాయి.
జీవుడు మొదలుకాని- ఆకాశము మొదలైన - ప్రపంచమంతా కూడా మాయయే! ఆత్మకు అన్యమైన అనాత్మ అంతా మాయయే। ఆకాశములో మేఘములు ఆవరించి, ఉండుతీరుగా, బ్రహ్మాకాశము నందు జగత్తులు, జీవులు, స్వభావములు ఆవరించినవై కనిపిస్తున్నాయి.
19. మాయా
మాయా నామ: అనాది-అంతవతీ। (న ఆది అంతవతీ)
ప్రమాణ- అప్రమాణ - సాధారణా।
న సతీ। న అసతీ। న సత్-అసతీ।
అనిర్వాచ్య అధిష్ఠాన ఏవ।
అవిద్యమాన, అంతర్వాణి।
వికల్ప నిరూప్యమాణోః చ।
అవచ వ్యవహార భేదవతీ।
-యా న విద్యతే వస్తుతః, స ‘మాయా’।
మాయ
మాయ → ‘అనాది’ అయినట్టిది. దానికి ‘అంతము’ లేదు.
ప్రమాణ - అప్రమాణములకు పొత్తైనది, విషయమైనది కాదు.
❆ అది ఉన్నదీ కాదు, లేనిదీ కాదు. సత్తు కాదు, అసత్తు కూడా కాదు.
❆ ఆ ఉభయధర్మ సంబంధమైనదీ కాదు. ఉండీ లేనిది కాదు.
❆ మాయ ‘ఇట్టిది’ అని నిర్వచించి చెప్పజాలము. అద్దాని అధిష్ఠానము ‘ఇది’ అని అనలేము. ‘‘కల్పన’’యొక్క రూపము ఏమని చెప్పగలం?
❆ అది హృదయమునందే భ్రమగా కనబడుతోంది కాబట్టి అవిద్యామానము. అంతర్వాణి యొక్క వికల్పముగా ఆత్మజ్ఞులచే ప్రవచనము చేయబడుతోంది.
❆ ‘‘ఇది ఇట్టిది’’ అని నిర్వచించి చెప్పలేని వ్యవహార భేదత్వముతో కూడుకొని ఉన్నది.
❆ వస్తుతః ఏదైతే లేదో, అదియే మాయ (‘‘యా మా-సా మాయా।’’)
తత్ స్వరూపమ్ అజ్ఞానమ్।
తదేవ మూల ప్రకృతిః।
గుణసామ్యమ్।
అవిద్యేతి ఆద్య అనేక ఆకారా
‘జగత్’ ఆకారేణ పరిణతా।
తత్ ఏవం బ్రహ్మ
విజానాతి, అనుభవతి చ।।
తత్ర ఏతే శ్లోకాః।।
‘‘మాయ యొక్క వాస్తవ స్వరూపము ఏమిటి?’’ - అని పరిశోధిస్తే,
‘‘అజ్ఞానమే!’’ - అని తెలియవచ్చుచున్నది.
అదియే మూలప్రకృతి (The root zone area of swabhavam, prakruthi). త్రిగుణములగు సత్త్వ రజో తమో గుణ మిశ్రమమే మాయ.
మొట్టమొదట ‘అవిద్య’గా బయల్వెడలి, అనేక ఆకార - వికారములు పొంది, చివరికి ‘జగత్’ ఆకారంగా పరిణమించినదగుచున్నది.
అయితే, ‘మాయ’ బ్రహ్మమే గాని, బ్రహ్మమునకు వేరుకాదు. బ్రహ్మము అనన్యము కదా! అందుచేత మాయను పరిశీలిస్తే బ్రహ్మముగానే శేషించుచూ (తెలియబడుచూ), స్వానుభవం కాగలదు - అని ఋషిగానం.
కోఽహమ్? సోఽహమ్।
20. నైవం భవామి అహం దేహే।
న ఇంద్రియాణి దశైవతు।
-న బుద్ధిః - మన - ఈశశ్చ।
-న అహంకారః తథైవ చ।
అప్రాణో హి అమనాః శుభ్రో।
బుద్ధ్యాదీనాం హి సర్వదా ।
సాక్షి-అహమ్, సర్వదా నిత్యః।
చిన్మాత్రో- హమ్, న సంశయః।।
నేను ఎవరు? అదీ నేను।
నేను ఏక్షణంలోను ఈ భౌతిక దేహముగా గాని, ఇందులోగల పంచ కర్మేంద్రియ-పంచ జ్ఞానేంద్రియములుగా గాని అవటం లేదు.
- నిర్ణయించు ధర్మమును నిర్వర్తించు ‘బుద్ధి’గా గాని, ఆలోచనలు జనించు మనస్సుగాగాని, అనేక వైపులుగా విస్తరించు ఈశ్వరుడుగా గాని, ‘నేను-నాది’ అనుభావనారూపిగా అయిఉన్న ‘అహంకారము’గా గాని అగుటయే లేదు.
- ప్రాణశక్తిరూపుడనుకాను। మనోరహితుడను। నిత్యపరిశుద్ధుడను।
- బుద్ధికి - మనస్సుకు, చిత్తమునకు, అహంకారమునకు కేవలసాక్షిని. సర్వమును వెలిగింపజేయు నిత్య చిన్మాత్రుడను. ఇందులో సంశయమే లేదు. అవన్నీ నా ప్రదర్శనలే అయి ఉండి కూడా, అవేవీగా నేను అవటమే లేదు. (నాటకములో నటుని ముఖకవళికలు నటుని స్వరూపము కాదు కదా!)
న అహమ్ కర్తా। నైవ భోక్తా!
ప్రకృతేః సాక్షి రూపకః।
మత్ సాన్నిధ్యాత్ ప్రవర్తంతే
దేహాది యా ‘అజడా’ ఇవ।
(నాటకంలో నేను నటిస్తున్న పాత్రయొక్క చర్యలకు నేను కర్తను కాదు, భోక్తను కాదు) అట్లాగే, - సర్వదా కేవలాత్మ స్వరూపుడనగు నేను దేనికీ కర్తను కాదు. దేనికీ భోక్తను కాదు. అవి రెండూ ప్రకృతికి (జగన్నాటక మునకు) సంబంధించినవి. మరి నేనో? ప్రకృతికి (లేక) జగన్నాటకమునకు సాక్షిరూపుడను.
ఈ దేహము స్వయముగా జడవస్తువే (మరొకటి కదలిస్తేగాని ప్రవర్తించజాలనట్టిది) అయినప్పటికీ, చైతన్యస్వరూపుడనగు నా యొక్క సాన్నిధ్యం చేత అది అజడముగా (చేతనమువలె) అగుపిస్తోంది.
స్థాణుః నిత్యః సదానందః
శుద్ధో జ్ఞానమయో అమలః,
ఆత్మాహమ్ సర్వభూతానామ్,
విభుః, సాక్షీ - న సంశయః।
బ్రహ్మైవాహమ్, సర్వవేదాన్త వేద్యమ్।
నాహమ్ వేద్యమ్ వ్యోమ, వాతాది రూపమ్।।
(కలలో ఒకడు ఒకచోటి నుండి మరొక చోటికి వెళ్లినా కూడా, ఆ కల తనదైనవాడు ఎక్కడినుండీ ఎక్కడికీ వెళ్లని విధంగా) → ఆత్మనగు నేను ఎచ్చట నుండి ఇక్కడి రావటం లేదు. ఇక్కడి నుండి ఎక్కడికీ వెళ్లటం లేదు. స్థాణువును. ఎప్పటికీ ఉండేవాడిని. నిత్యుడను. ఈ జన్మ-కర్మల ప్రహసనమంతా నాకు వినోదము! సదానందుడను. దేహ-మనో-బుద్ధుల దోషములు నాకు. అంటవు. నిత్యశుద్ధుడను. కేవల జ్ఞాన స్వరూపుడను. అమలుడను.
సర్వభూతజాలముల ఆత్మస్వరూపుడను. సర్వనియామకుడను కాబట్టి విభుడను. సర్వమునకు సాక్షిని. సందేహమే లేదు.
సర్వవేదాంతముల (ఉపనిషత్తుల) ప్రతిపాదకములచే తెలియచెప్ప బడుచున్న బ్రహ్మమే నేను. తెలుసుకొంటున్నవాడినే నేనై ఉన్నాను. ఆకాశ - వాయు - అగ్ని - జల - భూరూపముల ద్వారా గాని, మనో బుద్ధి చిత్త అహంకారము ద్వారా గాని తెలియబడేవాడిని కాను.
రూపం నాహమ్। (న అహమ్)।
నామ నాహమ్। న కర్మ।
బ్రహ్మైవ అహగ్ం
సత్-చిత్ -ఆనంద రూపమ్।
నాహమ్ దేహో
జన్మ మృత్యూ కుతో మే?
నాహం ప్రాణః। క్షుత్-పిపాసే కుతో మే?
నాహం చేతః। శోక మోహౌ కుతో మే?
నాహం కర్తా! బంధ మోక్షౌ కుతో మే?
ఈ భౌతిక రూపముగాని, నామముగాని, కర్మవ్యవహారములుగాని నేను కాదు.
సత్ చిత్ ఆనంద రూపము, కేవలము అగు బ్రహ్మమే నేను।
నేను ఈ భౌతిక దేహము ఏ మాత్రం కాదు. కాబట్టి నాకు జన్మ-మృత్యువులు ఎక్కడివి? అవేమీ లేనట్టివాడను.
ప్రాణమును కాదు. నాకిక ఆకలి దప్పికలు ఎక్కడివి?
నేను చిత్తమును కాదు. మరి శోక-మోహములు నాకెక్కడివి?
నేను దేనికీ కర్తను కాదు. ఇక బంధ-మోక్షములు నాకెక్కడివి?

ఇతి కృష్ణయజుర్వేదాంతర్గత సర్వసారోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।




కృష్ణ యజుర్వేదాంతర్గత

29     శ్రీ సర్వసార ఉపనిషత్

అధ్యయన పుష్పము


అనేక బంధములకు దుఃఖములకు సాకారము, దేహాదేహాంతరములుగా సుదీర్ఘమై వెంటనంటి వస్తున్నది - అగు ‘‘సంసార వికలము’’ నుండి తరింపజేయగల శ్రీరామచంద్రమూర్తి పాదపద్మములను శరణు వేడుచున్నాను.

శ్లో।। సర్వసారం నిరాలంబం రహస్యం వజ్రసూచికమ్,
తేజో నాద ధ్యాన విద్యా యోగతత్త్వ ఆత్మ బోధకమ్।।

ఈ ‘‘సర్వ సారోపనిషత్’’ - సర్వ వేదోపనిషత్తుల సారము అయి ఉన్నది. నిత్యస్వాతంత్ర్య సమన్వితమగు ఈ జీవునియొక్క రహస్య - సావలంబ-నిజరూపము గురించి ఎలుగెత్తి గానం చేయుచూ గుర్తు చేస్తున్నది. పరమ రహస్యమైనట్టిది. వజ్ర సూచికవలె సాక్షాత్ స్వస్వరూపతత్త్వము గురించి విశదీకరించుచున్నది. బిందు తేజో నాద ధ్యాన విద్యావిశేషముల అంతిమ లక్ష్యమును సుస్పష్టపరచుచున్నది. ఆత్మతో సంయోగతత్త్వమును బోధించుచున్నది.

భక్తి జ్ఞానయోగ సాధన సంపత్తి గల శిష్యుడు బ్రహ్మతత్త్వమును అనునిత్యము చేసుకొన్న తత్త్వదర్శి అగు సద్గురువును సమీపించి, ప్రణిపాతుడై ‘ఆత్మశాస్త్రము’ గురించి పరిప్రశ్నించనారంభించుచున్నారు.

⌘⌘⌘

శిష్యుడు : హే బ్రహ్మజ్ఞా! తత్త్వజ్ఞా! సద్గురువరేణ్యా! సర్వము సర్వదా ‘ఆత్మ’గా (లేక) ‘బ్రహ్మము’గా స్వానుభవం అవాలనే దీక్షతో మిమ్ములను సందేహ నివృత్తి కొరకై పరిప్రశ్నించుచున్నాను. అమృతతుల్యమగు మీయొక్క కరుణతో నన్ను సందేహ నివృత్తునిగా తీర్చిదిద్దవలసినదిగా అభ్యర్ధిస్తున్నాను. దయతో నా సందేహములను ఆలకించండి. నివృత్తి చేయండి.
‘‘ఓం’’ కారస్వరూపమగు - (ఇతి) ఏకము- అక్షరము- అనన్యము అగు పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ !

❓ కథం బంధః? బంధము అనగా ఏమి? ఎవరికి? ఎందుకు?
❓ కథం మోక్షః? మోక్షము అనగా?
❓ కా విద్యా? కా అవిద్యా చ ఇతి? విద్య అనగా ఏమి? అవిద్య అనగా?
❓ జాగ్రత్ స్వప్నసుషుప్తి తురీయములు-ఎటువంటివి? ఏ తీరైనవి?
❓ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ-పంచకోశములు-అని వేటిగురించి చెప్పబడుచున్నాయి?
❓ ‘కర్త’, ‘జీవుడు’, ‘పంచవర్గము’, ‘క్షేత్రజ్ఞుడు’, ‘సాక్షి’, ‘కూటస్థుడు’, ‘అంతర్యామి’ - అనగా ఏమి? ఎవరు?
❓ ‘ప్రత్యగాత్మ’, ‘పరమాత్మ’, ‘మాయ’ - అని దేనిదేనిని పిలువటం జరుగుతోంది?
❓ కిం ‘బ్రహ్మ’? కతి ‘పదార్ధా’? కా ‘మాయా’ చ? ‘‘బ్రహ్మము, పదార్థము, మాయ’’ - అనగా ఏవేవి?
❓ ‘నేను’ ఎవరు? నాకు ఈ జగత్తుకు, దేహమునకు, సర్వజీవులకు గల పరస్పర సంబంధము వాస్తవానికి ఏమై ఉన్నది?

ఈఈ విశేషములను [‘వేదాంతశాస్త్రము’ దృష్ట్యా (లేక) అధ్యాత్మశాస్త్రము దృష్ట్యా] ప్రవచించవలసినదిగా మిమ్ములను ప్రార్థిస్తున్నాను.

సద్గురువు : బిడ్డా! ఆత్మబంధూ! స్వయమాత్మానంద స్వరూపా! నీవు నాముందు ఉంచినవన్నీ కూడా తత్త్వదర్శకములు, రహస్యములలోకెల్లా రహస్యము. ఈ జీవుని సహజ రూపమగు ‘బ్రహ్మము’నకు సంబంధించిన పరిప్రశ్నలు. ఈ జీవులు తప్పక అధ్యయనము చేయాలి. సరి అయిన సమాధానమును సముపార్జించుకోవాలి కూడా. శాస్త్ర ప్రవచనముల సహాయంతో స్వానుభవపూర్వకంగా అఖండస్వరూపుడగు ఆత్మభగవానుని అనుగ్రహము కొరకై సేవించుచూ చెప్పుకుందాము. శ్రద్ధగా విను.

బంధము : దేహాదీనామ్ ఆత్మత్వేన అభిమన్యతే - సో అభిమాన ఆత్మనో బంధః। స్వయముగా, సహజముగా ‘ఆత్మేశ్వరుడే’ అయి ఉన్న ఈ జీవుడు ‘అనాత్మ’ అనతగినట్టి ఈ దేహము, ఈ దృశ్యములో తారసబడే సంబంధములు మొదలై వాటి పట్ల ఆత్మత్వముగా అభిమానమును అనేక జన్మలుగా పెంపొందించుకొన్నవాడై ఉంటున్నాడు. ఆత్మయొక్క ‘అన్యము’నకు సంబంధించిన అభిమానముతో కూడిన భావనలే ఈ జీవునికి ‘బంధము’. ఆత్మతో అనన్యదర్శనమే ‘‘బంధ-విముక్తి’’.

మోక్షము : దేహాదీనామ్ ఆత్మత్వేన అభిమన్యతే - తత్ నివృత్తిః మోక్షః। అటువంటి కల్పితములగు దృశ్య విషయముల పట్ల గల ‘అభిమానము’ - ఉపసంహరించబడి, నివృత్తి పొందినప్పటి స్థితియే ‘మోక్షము’. ఎప్పుడైతే ఈ జీవుడు ‘‘నేను ఈ దేహ, దృశ్య విషయములచే నిబద్ధుడను అయ్యే ప్రసక్తి మొదలే లేదు’’ - అని గ్రహించి, సమస్త బాహ్యవిషయములపట్ల మౌనస్వరూపుడై ఉండియే వ్యవహరిస్తూ ఉంటాడో, అప్పుడిక ఈతడు మోక్షస్వరూపుడే! ‘‘ఆత్మ స్వరూపుడనగు నాకు బంధము ఏమాత్రము ఉండజాలదు’’ - అను నిశ్చితావగాహనయే మోక్షము.

అవిద్య : యా దేహాదీనామ్ ఆత్మత్వేన తత్ అభిమానం కారయతి - సా హి ‘‘అవిద్యా’’। ఏఏ అభ్యాసములు దృశ్యాభిమానమును ప్రవృద్ధపరచటానికి కారకములు అవుతూ ఉంటాయో, వాటికి సంబంధించిన ప్రవృత్తులు, అభ్యాసములు ‘అవిద్య’ అనుబడుచున్నాయి.

విద్య: సో అభిమానో యామా నివర్తతే। సా ‘విద్యా’। అట్టి దృశ్యాభిమానమునకు సంబంధించిన వృత్తులు ఏఏ (జ్ఞాన-యోగ-భక్తి) అభ్యాసములచే నివృత్తమగుచూ ఉంటాయో - అది ‘విద్య’.

జాగ్రత్ : (I) అంతఃకరణ చతుష్టయం (మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము (4), (II) పంచ (5) కర్మేంద్రియములు (III) పంచ (5) జ్ఞానేంద్రియములు - ఈ 14 కరణములను ఉపయోగించి స్థూలములగు శబ్ద-స్పర్శ-రూప-రస-గంధముల అనుభవములను బాహ్య విషయములుగా ఆత్మ స్వకీయ భావనచే పొందుచూ ఉన్నప్పుడు అది ‘జాగ్రత్’. అగుచున్నది. అనగా, ఆత్మ 14 కరణములను ఉపయోగిస్తూ శబ్ద స్పర్శాది విషయములను బాహ్యమున స్థూలముగా ‘అనుగ్రహీతము’ అను క్రియయందు నిమగ్నమై యుండటమే - జాగ్రత్। ఇంద్రియ విషయములచే నిర్మితమగుచున్న దృశ్యముయొక్క అనుభూతులలో రతించటమే ‘జాగ్రత్’ (జాగ-రత్).

మన-ఆదిచతుర్దశ (4) కరణైః పుష్కలైః ఆదిత్యాది అనుగ్రహీతైః, శబ్దాది విషయాన్ స్థూలాన్ యదా ఉపలభతే, తత్ ఆత్మనో ‘జాగరణమ్।

‘ఆత్మ యొక్క జాగ్రత్’
14 - కరణములు

కర్మేంద్రియములు ఇంద్రియ గోళకములు ఇంద్రియ విషయములు
వాగింద్రియము నోరు వచనము
పాణీంద్రియము చేతులు ఆదానము
పాదేంద్రియము కాళ్ళు గమనము
పాయు-ఇంద్రియము గుదము విసర్జనము
ఉపస్థేంద్రియము గుహ్యము ఆనందము
జ్ఞానేంద్రియములు ఇంద్రియ గోళకములు ఇంద్రియ విషయములు
శ్రోత్రేంద్రియము చెవులు శబ్దము
త్వగింద్రియము చర్మము స్పర్శ
చక్షురింద్రియము కళ్ళు రూపము
జిహ్వేంద్రిము నాలుక రసము
ఘ్రాణేంద్రియము ముక్కు గంధము
అంతఃకరణ చతుష్టయము క్రియారూపము అనుభూతి
మనస్సు ఆలోచన, భావన ఆలోచించబడుచున్న,
భావించబడుచున్న,
విశేషాలు/విషయములు
బుద్ధి తెలివి. విశ్లేషణ, విచక్షణ తెలియబడు, విచక్షించబడు
విషయములు
చిత్తము ఇష్టము. అభిమానము. ఇష్టపడు/అయిష్టబడు
అభిమానించబడు/అభిమానించబడని
విశేషములు/విషయములు
అహంకారము ‘నేను’ అను భావన ‘నావి’ అని భావించబడునవి

14 కరణ ధర్మములు (లేక) క్రియలు + ఊహ, అపోహ కలగలపుగా ‘‘జాగ్రత్’’ నిర్మితము అవుతోంది.
వాటి వాటి పట్ల ‘‘ఇవియే / నేను’’ - అను అభిమాన రూపమే ‘జాగ్రత్’ అయి ప్రాప్తిస్తోంది.


ఆత్మయొక్క స్వప్నము

ఆ విధంగా 14 కరణములు స్థూలములగు శబ్దము - స్పర్శ మొదలైన విషయములను భావనచే జాగ్రత్‌రూప-అనుభవముగా పొందుచూ, ఒక సమయము నందు అలసిపోయి, ఈ జీవుడు బాహ్య విషయ స్వీకరణముల పట్ల బాహ్యముగా ‘భావించటము’ యొక్క ‘‘విరామము’’ను ఆశ్రయించుచున్నాడు.

అయితే విషయములలో నియోగించబడిన 14 కరణములను ఈ జీవుడు బాహ్యముగా ఉపయోగించటము విరమించినప్పటికీ, ((లేక) ఈతడు భావించటమును ఆపివేసి ‘అభావన’ను ఆశ్రయించి ఉన్నప్పటికీ),, వాసనా సహితమైన 14 ఇంద్రియములు (Indrias that tend to be avocative) సంబంధించిన సంస్కారములు కారణంగా (because of tendency or habit) శబ్దాది విషయములను ‘ఊహ’యందు కల్పించుకొని దృశ్య వ్యవహారములను పొందుచూ ఉంటున్నాడు. అనగా, బాహ్య విషయములు లేకుండానే ఊహామాత్రంగా విషయానుభవములను కల్పనగా పొందటము జరుగుతోంది. ‘‘స్వయంకృతమగు ఊహ-అపోహలు + అంతరంగములోని వాసనలు (లేక) సంస్కారములు’’ - ఇవి తాత్కాలికమగు స్వప్నదృశ్యానుభవమునకు కారణములగుచున్నాయి.

తత్ వాసనా సహితైః చతుర్థశ (14) కరణైః, శబ్దాది అభావేఽపి, వాసనామయాం శబ్దాదీం తాత్కాలికాన్ యదా ఉపలభతే, - తత్ ఆత్మనః స్వప్నమ్।

(ఇది ఎట్లా అంటే, ఒకడు ఒక దారమునకు (లేక) పురికొస త్రాడుకు ఆటబొమ్మను కట్టి, చేతితో అటూ ఇటూ ఊపుతూ, కొంత సేపైన తరువాత చేతిని కదల్చటం ఆపివేసినప్పటికీ, ఆ త్రాడుకు (లేక) దారమునకు వ్రేలాడుతూ ఉన్న ఆట బొమ్మ అటూ ఇటూ కదలుచూ ఉండటము వంటిది).

ఈ విధంగా బాహ్య శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములను భావించటము ఆపివేసినప్పటికీ 14 కరణములు- వాసనలు (Tendencies) కారణంగా శబ్ద-స్పర్శ-రూపాదులను బాహ్య వస్తు రహితంగా (ఊహామాత్రంగా) పొందటము కొనసాగిస్తూ ఉన్న సందర్భము - ‘‘ఆత్మానః స్వప్నమ్। ఆత్మయొక్క స్వప్నస్థితి’’ - అగుచున్నది.

ఆత్మయొక్క సుషుప్తి

చతుర్దశ (14) కరణ ఉపరమాత్, విశేష విజ్ఞాన అభావాత్, యదా శబ్దాదీన్ న ఉపలభతే, తత్ ఆత్మనః సుషుప్తమ్। ఈ జీవుడు అన్య-విశేషముల రూపములగు జాగ్రత్ స్వప్నవిజ్ఞానమంతా ‘అభావన’చే పూర్తిగా ఉపసంహరించి, దాచిపెట్టినప్పటి స్థితి. 14 కరణములు కూడా శబ్ద-స్పర్శాది విషయములను ఏ మాత్రమూ పొందనప్పుడు (న ఉపలభతే)-తత్ ఆత్మనః సుషుప్తిః। అది ఆత్మ యొక్క సుషుప్తి. భావనలకు విశ్రాంతి ఇచ్చినప్పటి జడస్థితియొక్క అనుభవమే ‘‘సుషుప్తి’’.

ఆత్మయొక్క తురీయము

🙏 అవస్థాత్రయ సాక్షీ। ఏదైతే జాగ్రత్ స్వప్న సుషుప్త అవస్థలకు కేవలము ‘సాక్షి’ అయి చూస్తూ, వాటిని తన సంచార స్ధానములుగా కలిగియున్నదో…, తనయొక్క అనురూపములుగాను, తన ప్రేరణా చమత్కారములుగాను ప్రదర్శించుచున్నదో,
🙏 భావాభావ సాక్షీ। స్వయం భావ రహితం। భావములకు ఆవల భావరహితమైయున్నదో, భావతీత స్వరూపమో,
🙏 నైరంతర్యం చైతన్యం - నిరంతము కేవల చైతన్యరూపమైయున్నదో, (అనగా) తాను కదలక ‘కదల్చువాడు’ అయి ఉన్నదో,
🙏 (జాగ్రత్-స్వప్న-సుషుప్తులనబడే) త్రి-అవస్థల సందర్భములో సర్వదా యథాతథమై, ఎప్పటివలనే కార్య-కారణాతీత స్వరూపమైయుంటోందో…, యదా, - తదా తత్ తురీయం చైతన్యం ఇతి ఉచ్యతే।
అదియే ఆత్మ యొక్క తురీయ చైతన్య స్వరూపము.

పంచ కోశములు

(1) అన్నమయకోశము (Zone of matter): పంచభూతములచే నిర్మితమగుచూ, ‘అన్నము’ను కారణముగా కలిగి రూపుదిద్దుకొంటున్న కార్యముల సమూహములన్నీ కలిపి - ‘అన్నమయకోశము’ అని పిలుస్తున్నారు. అన్న కార్యాణాం, కోశానాం సమూహో - అన్నమయకోశః। ఈ భౌతికంగా కనిపించే శరీరము ‘అన్నము’చే నిర్మితమౌతోంది కాబట్టి - ఇది ఆత్మయొక్క ‘అన్నమయ కోశము’. ఇంద్రియములు, (మరియు) ఇంద్రియానుభవముల సమన్వయము కూడా ‘అన్నమయకోశము’లో అంతరభాగమే.

(2) ప్రాణమయకోశము (Zone of Energy): ప్రాణాది దశవాయవో అన్నమయకోశే యదా వర్తంతే తదా ‘ప్రాణమయకోశా’।వాయు (ప్రాణ) పంచకములు : ప్రాణము; అపానము; వ్యానము; ఉదానము; సమానము; (5)

ఉపవాయు(ప్రాణ)పంచకములు : నాగము; కూర్మము; కృకరము; ధనంజయము; దేవదత్తము (5)
వాటి వలన ఏర్పడు చర్యలు : సువచన/దుర్వచన; దానపరిగ్రహణ; గమన/ఆగమన; విషయానందముల చర్యలు (4) - ఇదంతా ‘ప్రాణమయకోశము’. (మనో బుద్ధి చిత్త అహంకారములకు కదలిక కలిగించు ప్రేరణ వాయువులు (4) - ఇది మరొక నిర్వచనము).

ఒకే వాయువు ఆయా (14 విధములైన) ప్రకంపనములు, చర్యలు ఈ అన్నమయ కోశమునందు నిర్వర్తిస్తున్నాయి. అట్టి ‘ప్రాణము’ యొక్క అన్నమయకోశములోని వర్తనములన్నీ కలిపి - ‘ప్రాణమయకోశము’గా పిలువబడుచున్నది. ప్రాణమయకోశచర్యలు (లేక) కార్యములకు కారణము సర్వచైతన్యస్వరూపమగు ఆత్మయే! అందుచేత ‘‘ఆత్మయొక్క ప్రాణమయకోశము’’ - అని గ్రహించబడుతోంది.

(3) మనోమయ కోశము (Zone of Thought) : తన యొక్క అన్నమయ-ప్రాణమయ కోశములతో కూడినదై (కలుపుకొని) ఆత్మ(జీవాత్మ) - శబ్ద స్పర్శ రూప రస గంధవచన ఆదాన గమన విసర్జన ఆనంద విషయములను తన యొక్క ‘సంకల్పించటము’ అను ధర్మము (Function/Feature) ద్వారా పొందుచూ ఉన్నప్పుడు, - అది ‘‘ఆత్మ యొక్క మనోమయ కోశము’’ అగుచున్నది.

(4) విజ్ఞానమయ కోశము (Zone of Wisdom): విశిష్టాంతః కరణే, తద్గత విశేష ధ్యాన, మననాది వృత్తయో యదా ఉత్పద్యంతే, తదా విజ్ఞానమయకోశే। ఎప్పుడైతే ఆత్మ తన యొక్క అన్నమయ-ప్రాణమయ-మనోమయ ‘త్రి’కోశములను కలుపుకొని, అంతఃకరణముచే ధరించినదై, ‘‘విశేషములను తెలుసుకోవటము’’ - అనబడే విశేషత్వమును భావించుచున్నదో, అది ‘‘ఆత్మ యొక్క విజ్ఞానమయ కోశము’’ అని చెప్పబడుతోంది.

(5) ఆనందమయకోశము(Zone of Enjoying) : ఏతత్ కోశ చతుష్టయ కారణ అజ్ఞాన సంపృక్తం స్వకారణ జ్ఞానం స్వరూపసుఖే యదా వర్తతే తత్ - ఆనందమయకోశ। అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయములగు ‘4’ కోశములను ఒకచోట జేర్చి, సంపృక్తము చేసుకొని (కలుపుకొని) ఆత్మ- తనకు తానే (స్వకారణంగా) - (లీల, క్రీడ, సరదా రూపమగు) -అజ్ఞానమును కల్పించుకొని వినోదించుచూ ఉన్నది. ఒక మర్రి విత్తనములో (వట విత్తనంలో) వట వృక్షపు ధర్మములన్నీ కలిగియుండురీతిగా- ఈ 14 లోకముల సంచార వినోదమును అజ్ఞానపూర్వకంగా ఆత్మ తన యందు కలిగియుంటూ, వాటి యందు, తనను తాను ఏ మరచి తిరుగాడుచున్నది.

ఒకడు స్వప్నభూమి (Field of dream)ని కల్పించుకొని, ‘‘ఇదంతా నా యొక్క స్వప్నకల్పనయే’’ అనునది ఏమరచి, ఆ స్వప్నమునందు అజ్ఞానపూర్వక - స్వకల్పితవినోదముగా తిరుగాడు చుండటమే - (ఆత్మయొక్క 14 లోకముల స్వకల్పముల అంతరంగ సంచారమునకు) దృష్టాంతము. ఈ విధంగా స్వకల్పన యందు స్వకల్పనా వినోదియై ఆత్మ నిర్వర్తిస్తున్న భావనాంతర్గత సంచారమును ‘ఆత్మ యొక్క ఆనందమయ కోశము’ అని పిలుస్తున్నారు.

పంచకోశములను ‘ఉపాధి’గా - కలిగియుండు ఆత్మ యొక్క స్వకీయ - ఉపహిత (By its own involvment) విశేషమును ‘ఆత్మకోశము’ - అని అంటారు. అదియే ‘‘హృదయము’’ కూడా.

సుఖ-దుఃఖములు

ఆత్మ-తనయొక్క ‘బుద్ధిః అను ఉపకరణమును ఉపయోగిస్తూ ఆ బుద్ధియందు ‘సుఖ-దుఃఖ భావ విభాగము’ను కల్పించుకొంటోంది. అట్టి సుఖ-దుఃఖ బుద్ధియే ‘‘శ్రేయము-శ్రేయముకానిది, దేహము-దేహాంతరములు’’- మొదలైన అన్నిటికీ ‘కర్త’ అగుచున్నది.

అట్టి బుద్ధి….
➤ వేటివేటిని ‘ఇవి నాకు ఇష్టము’ అని భావన చేస్తూ ఉంటోందో, అవి పొందుచున్నప్పుడు అవన్నీ ఆత్మకు ‘సుఖకరములు’గా అనిపించుచున్నాయి.
➤ వేటివేటిని ‘‘ఇవి నాకు అయిష్టము’’ అని ఆత్మ భావనచేస్తూ ఉన్నదో, అవి పొందుచున్న సందర్భములో ‘‘ఇవి నాకు దుఃఖకరములు’’ అను భావనచే అవన్నీ ఆత్మకు ‘దుఃఖములు’గా అనుభవమగుచూ ఉన్నాయి. (లేక) అనుభూతమగుచున్నాయి.

ఉపహిత-జీవుడు

ఆత్మ తనకు తానై శబ్ద-స్పర్శ-రూప రస-గంధానుభవములను పొందుటమును భావన చేస్తోంది. వాటిని సుఖ-దుఃఖములుగా పొందుటకై అభినివేశముతో కూడిన ‘అంశ’ను సంభావించుకొనుచున్నది.

ఏ ఆత్మయొక్క ‘అంశ’ అయితే పుణ్య, పాపకర్మ పరంపరలను ఆశ్రయించినదై, వాటివాటి కర్మఫలములుగా ప్రాప్తించిన-ప్రాప్తించని శరీరములతో సంయోగ-వియోగములను పొందుచూ కనబడుచున్నదో, అట్టి సందర్భమును ‘‘ఆత్మయొక్క ఉపహిత జీవత్వము’’ అని చెప్పుచున్నారు. అదియే ‘జీవాత్మ చమత్కారము’. ఆత్మయొక్క ‘‘ప్రియత్వము’’నకు సంబంధించిన ఘనీభూతరూపమే ‘ప్రాణము’.

అట్టి ప్రాణముల పట్ల అధ్యాసియే (ధ్యాస కలిగి ఉండటముచే) - ‘జీవుడు’గా పిలువబడుచున్నాడు. అనగా ‘‘నేను జీవితము - అను సందర్భమునకు పరిమితుడను’’ అను భావనను ఆశ్రయించినప్పుడు - ఆత్మయే ‘జీవుడు’ - అను పేరుతో పిలువబడుతోంది.

పంచ వర్గములు

మన ఆదిశ్చ, ప్రాణ ఆదిశ్చ, సత్త్వాదిశ్చ, భూతాదిశ్చ, పుణ్యాదిశ్చ ఏతే పంచవర్గాః।।

Ⅰ. ‘మన’ ఆదిశ్చ’ : - మనో-బుద్ధి-చిత్త-అహంకారము అనబడే అంతరంగ చతుష్టయము.

Ⅱ. ప్రాణాదిశ్చ : ‘ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన-సమానములు’. అనబడే పంచ ముఖ్య ప్రాణములు; నాగ, కూర్మ, కృకర, దనంజయ దేవదత్తములు అనబడే పంచముఖ్య ఉపప్రాణములు; తదితర శరీరాంతర్గత వాయుధర్మములు.

Ⅲ. సత్త్వాదిశ్చ : సర్వకల్పనలకు మూలపదార్థములు (Raw-material) అయినటువంటి సత్త్వ, రజో తమో - ‘త్రిగుణములు’.

Ⅳ. భూతాదిశ్చ : భూమి (Solid), జలము (Liquid), అగ్ని (Heat, Light), వాయువు (Vapour), ఆకాశము (Spacing Timing) - అనబడు ‘‘పంచభూతములు’’.

Ⅴ. పుణ్యాది : పుణ్య-పాప ద్వంద్వములు.

వీటిని ‘పంచ వర్గములు’ - అని అంటున్నారు. ఈ పంచవర్గములు కలిపి, ఆత్మయొక్క ‘‘లింగశరీరము’’ - అని (తత్త్వశాస్త్రముచే) చెప్పబడుచున్నది.

లింగశరీరము - హృత్ గ్రంథి

ఆత్మ-అటువంటి ‘పంచవర్గములను’ ఏ అంశతో ధారణ చేస్తోందో, అది లింగశరీరము.

అట్టి లింగశరీరము ప్రవర్తించుచున్న ప్రదేశమును ‘హృత్‌గ్రంధి’ అనుపేరుతో చెప్పుచున్నారు.

అయితే ఏ ఆత్మయొక్క ఒకానొక కల్పిత విభాగములనకు ‘పంచవర్గము’ → ధర్మము (Characteristic feature) అయి ఉంటోందో, … అదంతా కూడా ఆత్మ-తన స్వస్వరూప జ్ఞానముతో చేయు లీలా-ధారణయే.

జ్ఞానామృతముచే వాస్తవానికి (స్వకీయ కలనయే కాబట్టి) - ‘లేనివే’ అగుచున్నాయి.

ఆత్మజ్ఞానముచే పంచవర్గము (కథలోని కల్పనవలె) ‘వినాశనము’ చెందు ధర్మము కలిగియున్నాయి. అనగా, స్వకీయ కల్పిత మాత్రములే - అను భావనతో ఆత్మజ్ఞానిచే ఆస్వాదించబడుచున్నాయి.

ఈ జీవునికి భౌతిక శరీరము ఉపాధి అయి ఉన్న తీరుగా, ‘‘హృత్ గ్రంధి, లింగ శరీరము’’ ఆత్మకు ఉపాధి వంటివి అని వర్ణించబడుతోంది.

ఏ ధారణచే ఆత్మ 14 లోకములను పొందటము, వాటియందు సంచారములు చేయుటము జరుగుతోందో అది ‘‘లింగ శరీరము’’. అద్దాని స్థానము హృదయాకాశము. అనగా 14 లోకములలో వన సంచారము చేస్తున్న ఈ జీవునియొక్క హృదయములోనే - ఆ 14 లోకములు స్వకీయ కల్పితములై ప్రదర్శనమగుచున్నాయి.

క్షేత్రజ్ఞుడు

ఏ చైతన్యము (That which causes all kinds of movements) అయితే ప్రకాశకరూపమై (That which is enlightening all) పంచవర్గములందు, లింగశరీరము నందు, హృదయాకాశము నందు ప్రతిబింబిస్తోందో (That which reflects), - అట్టి ఆత్మ యొక్క ‘‘చైతన్య ప్రకాశ-ప్రతిఫల ప్రతిబింబత్వము’’ను ‘క్షేత్రజ్ఞుడు’-అని అంటున్నారు.

స్వయంజ్యోతి - సాక్షీ

జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయానామ్ ఆవిర్భావ తిరోభావ జ్ఞాతా, స్వయమ్ తత్ ఆవిర్భావ సహితః, స్వయమ్ ఆవిర్భావ - తిరోభావ రహితః, స్వయం జ్యోతిః, (చేతనో) ‘‘సాక్షీ’’।। ఈ దృశ్యము-జ్ఞాతృ (తెలుసుకొనుచున్నవాడు), జ్ఞేయ (తెలియబడుచున్నది), జ్ఞానములు (తెలుసుకోవటం) - అను త్రిపుటిచే నిర్మితమై ఉంటోంది. ఆ మూడూ కూడా ‘ఆత్మ’ అను జ్యోతియొక్క వెలుగులుచే కనబడుచున్నాయి.

అదియే స్వయంజ్యోతి!

వెలుగుచున్న దీపమును చూపటానికి మరొకదీపం అవసరం లేనట్లే, ఆత్మయొక్క ‘స్వయంజ్యోతిత్వము’ను చూపటానికి మరొక జ్యోతి (దీపము) యొక్క అవసరం లేదు. ఈ జీవుడు స్వయముగా ఆత్మానంద జ్యోతి స్వరూపుడే!

సర్వమును - మౌనముగా, ప్రశాంతముగా, ఆనందముగా, స్వకీయచిద్విలాసముగా దర్శిస్తూ, సర్వమునకు పరమైయున్న ఆత్మయొక్క కేవలీతత్త్వమును ‘సాక్షి’ అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ జీవునియందు ‘సాక్షిత్వము’ అను విభాగము (లేక) స్థితి సర్వదా యథాతథము.

కూటస్థము

బ్రహ్మాది-పిపీలికాంత పర్యంతం సర్వ ప్రాణి బుద్ధిషు అవశిష్టతయా ఉపలంభమానః, సర్వ ప్రాణ బుద్ధి సాక్షి అధిష్ఠాన ఆత్మా అస్తి-భాసతే యదా, తదా కూటస్థః।।

ఈ కనబడే 14 లోకములు తన యొక్క కల్పనా చాతుర్యమై దర్శించుచున్న సృష్టికర్తయగు బ్రహ్మదేవుని నుండి → ఆహార నిద్రా-మైధున-సంతాన రక్షణలలో తలమునకలైయున్న ఒక చిన్న పురుగు వరకు - సర్వ ప్రాణుల బుద్ధికి ఏది ‘‘కేవలసాక్షి’’ అయి చెన్నొందుతోందో, సర్వప్రాణుల మనో- బుద్ధులలో ‘ఎరుక’ అను రూపముగా సర్వదా వెలుగొందుచున్నదో, సర్వజీవుల బుద్ధులందు సర్వదా వేంచేసినదైయున్నదో, అదియే కూటస్థము. (యా బ్రహ్మాది పిపీలికాది తనుషుః ప్రోక్తా జగత్ సాక్షిణః - సైవాహమ్ - మనీషాపంచకము = శ్రీ శంకర భగవత్ పాదులవారు)

ఏది ఏర్పడియున్నదో - అదియే కూటస్థాత్మ!

అంతర్యామి

కూటస్థాం ఉపహిత భేదానామ్ స్వరూపలాభే హేతుర్భూత్వా, మణిగణే సూత్రమివ, సర్వక్షేత్రేషు యత్ అనుస్యూతత్వేన యదా ప్రకాశతే హి ఆత్మా తదా ‘‘అంతర్యామి’’।।

ఎప్పుడైతే ఆత్మ తన యొక్క ‘‘స్వస్వరూపలాభము’’ అను సిద్ధిచే - ‘కూటస్థము’ మొదలు, సర్వ తదితర భేదములందును - పూదండలోని దారము వలె - తనను తాను అనుస్యూతముగా (సూత్రపుదారముగా) దర్శిస్తూ, ప్రకాశించుచూ, స్వానుభవము పొందుచున్నదో, అప్పుడు అది ‘‘ఆత్మ యొక్క అంతర్యామిత్వము’’గా కీర్తించబడుచున్నది.

మొదలైనవన్నీ దాటిపోయి,

ఆత్మ ఎప్పుడైతే ఈ సర్వమునందు తనను తాను అనుస్యూతముగా దర్శిస్తుందో..,

❆ మత్తః పర తరమ్ న అన్యత్ కించిదస్తి ధనంజయ! మయి సర్వమ్ ఇదమ్ ప్రోతమ్ సూత్రే మణిగణా ఇవ।
❆ మయా తతమ్ ఇదమ్ సర్వమ్ జాగత్ అవ్యక్తమూర్తినా! మస్థాని సర్వ భూతాని!
❆ అహం సర్వస్యప్రభవో - గీతాచార్య వాక్యములు.

అప్పుడు - ‘‘ఇది ఆత్మ యొక్క అంతర్యామిత్వము’’ - అని సిద్ధాంతీకరించబడుతోంది.

పత్యగాత్మ

సత్యం జ్ఞానం అనందగ్ం, ఆననం, సర్వ-ఉపాధి వినిర్ముక్తం, కటక-మకుటాది ఉపాధి రహితం, సువర్ణ ఘనత్ విజ్ఞాన ఘన చిన్మాత్ర స్వభావమ్, ఆత్మచైతన్యం ‘బ్రహ్మ’ - యత్ అవభాసతే, తత్ అవిద్యా-ఉపాధికం, ‘త్వం’ పదార్థః స ‘‘ప్రత్యగాత్మ’’।।

ఎప్పుడైతే ఆత్మ తనను తాను..,

💐 సత్యమ్ (కేవలమగు ఉనికి), జ్ఞానమ్ (కేవలమైన ఎరుక), అనన్తమ్ (అన్యమైన దేని చేతనూ పరిమితము కానట్టిది), ఆనందమ్ (సర్వమును స్వకీయలీలా-క్రీడా- వినోద కల్పనగా దర్శించునట్టిది)గా స్వభావసిద్ధమైన అనునిత్య స్వానుభవము కలిగియుంటుందో,
💐 స్థూల - సూక్ష్మ-కారణ-మహాకారణ సంబంధితమైన సర్వ ఉపాధులకు, వాటివాటి అంతర-అన్యోపాధులకు వేరై, అవన్నీ, ‘తానే’ కూడా అయి సర్వదా వినిర్ముక్తమై ఉంటుందో,
💐 (1) బంగారమునకు ఆభరణత్వ పరిమితి లేనట్లు, (2) దారమునకు (చొక్కా, పంచ మొదలైన) వస్త్రముల ధర్మము లేనట్లు, కానీ అవన్నీ (1.బంగారమే, 2.దారమే) అయి ఉన్నట్లు ‘‘ఇదంతా నేనే!’’ ‘‘ఇదేమీ నేను కాదు’’ అను పరాకాష్ఠ భావన పుణికి పుచ్చుకుని ఉంటుందో..,
💐 కేవలం ఘనీభూత విజ్ఞానాత్మగా, కేవల చిత్‌మాత్రంగా (వస్తువుల ఆకారములను వెలిగించు సూర్యకాంతి-ఆయా వస్తువుల ఆకారములను పొందని విధంగా) ప్రకాశమానమై ఉంటుందో,
💐 ‘త్వమ్’ అనునది అవిద్యచే వేరుగా, విద్యచే స్వయం స్వస్వరూపమునకు వేరుకానట్లుగా(అనన్యముగా) గమనించుచున్నదై ఉంటుందో,

అట్టి ఆత్మ యొక్క స్వానుభవము ‘‘ప్రత్యగాత్మ’’ అని స్తోత్రము చేయబడుచున్నది.

అవినాశి

ఈ దృశ్యములో నామరూపాత్మకమై, భౌతికమై ఏదేది కనిపిస్తోందో, ఇదంతా కూడా ‘వినాశనము’ - అనే ధర్మము కలిగి ఉన్నది.

ఏదైతే సత్యము, జ్ఞానము, అనంతము అయి ఉన్నదో, అదియే ఈ జీవుని సహజ, వాస్తవ, అనునిత్య రూపము.
అద్దానికి మార్పు-చేర్పులు లేవు. కాలబద్ధము కాదు.
కాబట్టి అవినాశి.

ఏదైతే (మరియు) దేనిచేత ఈ సమస్తముగా విస్తరించినదై ఉన్నదో, అట్టి ఆత్మ అవినాశి. (అవినాశితు తత్ విద్ధి - ఏన సర్వమిదమ్ తతమ్ - భగవద్గీత)

ఏ స్వస్వరూపమైతే →
అన్యములగు దేశ (place) కాల (Time) వస్తు (Matter) నిమిత్త (Causation)ములన్నీ జనిస్తూ, నశిస్తూ ఉన్నప్పటికీ, తాను మాత్రం కించిత్ కూడా ‘వినాశనము’ అనునది పొందుట లేదో అట్టి ఈ జీవుని యొక్క స్వస్వరూమే అవినాశి.

‘సత్యమ్’ నామ? ‘అవినాశి’ నామ?

ఏది త్రికాలములో, జాగ్రత్-స్వప్న-సుషుప్తి త్రిదశలలో, జన్మ-జన్మాంతరములలో, దేహ-దేహాంతరములలో, దేహస్థితి-దేహరహిత సర్వ సందర్భములలో తన ‘‘సత్(ఉనికి)’’ అను ధర్మము వదలక, కలిగియే ఉంటోందో, వినాశన ధర్మము లేనట్టిదో -
అట్టి ఆత్మ (Absolute I) - సత్యము.‘‘యమ్ సత్ - ఇతి సత్యమ్’’.

అవినాశి: దేశకాల వస్తు నిమిత్తేషు వినశ్యత్సు, యత్ న వినశ్యతి - తత్ ‘అవినాశి’। దేశకాల వస్తు నిమిత్తములు నశిస్తున్నప్పటికీ, తాను నశించటములేదో - అదియే ‘అవినాశి’।

‘‘జ్ఞానమ్ - నామ’’?

దేనికైతే అద్దాని అన్తరమున ‘‘ఉత్పత్తి స్థితి వినాశనములు’’ - అను విశేషములే లేవో, (ఒక పుస్తకము చదువు తెలివి-పుస్తకముతో ప్రారంభమై, పుస్తకము చదువటం ముగియగానే తొలగిపోదుకదా! అట్లాగే) ఏదేది ఎంతెంతవరకు తెలుసుకున్నప్పటికీ, ‘తెలుసుకోవటము’ అనునది తరుగదో, పెరుగదో, -
అదియే (సత్య-జ్ఞాన-ఆనందములలోని) ‘‘జ్ఞానము’’.

అనన్తమ్ - నామ?

👉 మట్టి కుండ నిండా నిరాకారమగు మట్టియే ఉన్నట్లు, మట్టి యొక్క సాకారమునకు సంబంధించిన విశేలక్షణమే/వికారమే ‘కుండ’ అయినట్లుగా,
👉 బంగారు ఆభరణమంతా బంగారముతో నిండినట్లుగా, బంగారము యొక్క వికారమే ‘ఆభరణము’ అయిఉన్నట్లుగా,
👉 దారముల వికారరూపమే వస్త్రము అయినట్లు,
- ఆత్మ అనన్తమై కూడా. మార్పుచెందు సమస్తములో అంతర్లీనమైయున్నది.

ఇక్కడి అవ్యక్త, ఆది సృష్టి, ప్రపంచములు ఇవన్నీ ఏ వ్యాపక చైతన్యముచే విస్తరించబడి, ఇవి అద్దాని వికారమే అయి ఉన్నాయో, అదియే అనన్తము.

ఇక్కడి బాహ్యరంగ, అంతరంగములచే ఏది అంతము పొందటము లేదో - అది ‘‘అనన్తము’’.

ఆనందో - నామ?

సుఖ చైతన్య స్వరూపో, అపరిమిత - ఆనంద సముద్రో, అవశిష్ట సుఖ స్వరూపశ్చ - ‘‘ఆనందః।। కేవలమగు అఖండాత్మస్వరూపముతో స్వస్వరూప ఏకత్వ-అనన్యత్వములను సిద్ధించుకొన్నప్పుడు, అట్టి స్థితిలో - ఆత్మ ఆస్వాదించు నిర్విషయ- అకారణ-అవశిష్ట సుఖ స్వరూపమే - (సత్, చిత్, ఆనందములలోని) - ‘ఆనందము’ యొక్క స్వరూపము.

పరమాత్మా- నామ?

ఏతత్ వస్తు చతుష్టయం యస్య లక్షణం, దేశ కాల వస్తు నిమిత్తేషు అవ్యభిచారీ, తత్ పదార్థః ‘‘పరమాత్మా’’।।

అట్టి - ఆత్మ యొక్క అవ్యభిచార- తత్ పదార్థ స్వానుభవమే ‘పరమాత్మ’గా గానము చేయబడుతోంది.

(దృష్టాంతము: నటునియొక్క స్వస్వరూపము - పరమాత్మకు దృష్టాంతము. నాటకములో అంతర్గతంగా పాత్రయొక్క ప్రవర్తనాశీలము - జీవాత్మకు దృష్టాంతము)

పరబ్రహ్మమ్-నామ?

‘త్వం’ పదార్ధాత్ ఔపాధికాత్ - ‘‘తత్’’ పదార్థ ఆది ఔపాధిక భేదాత్ విలక్షణమ్। ఆకాశవత్ సూక్ష్మం, కేవల సత్తామాత్ర స్వభావం - ‘‘పరబ్రహ్మ’’।।

(ఈ రెండింటికీ) విలక్షణమై, ఈ రెండిటి అభేదస్థానమై, ఆకాశమువలె అత్యంత సూక్ష్మత్వమును, కేవల సత్తామాత్రమును - ఆత్మ సంతరించుకొనుచున్నప్పుడు అట్టి ఆత్మయొక్క జీవ-బ్రహ్మైక్య అఖండరూపభావము ‘‘పరబ్రహ్మము’’ - అనబడుచున్నది.

మాయా-నామ?


- ‘మాయ’ అనునది- అనాద్యంతవతీ- ఆది-అంత-అంతరములు ‘ఇవి’ అనునవేవీ లేనట్టిది.
- ప్రమాణ పూర్వకంగా చెప్పుకోనూవచ్చు. ప్రమాణములతో నిర్వచించనూ లేము. ప్రమాణ-అప్రమాణ సాధారిణా।
- న సతీ। న అసతీ। న సదసతీ। మాయ ఉన్నది; లేనిదీ కూడా। సత్తు, అసత్తు కూడా? ఉండి లేనిది, లేకయే ఉన్నది కూడా।

💐 నాటకంలో పాత్రల పరంపర (భార్య - భర్త - కొడుకు - తండ్రి.. ఇత్యాది) సంబంధాలు ఉన్నాయా? ఉన్నాయి. లేవని ఎట్లా అంటాం?
💐 వాస్తవంగా ఉన్నాయా? నాటకమే కల్పన. ఇక పరస్పర సంబంధాలు కల్పనయే కదా! కల్పన ‘ఉన్నది’ ఎట్లా అవుతుంది? లేనివే కూడా!
💐 ఈ జగన్నాటకములోని పరస్పర సంబంధాలు కూడా అటువంటివే! జగత్ దృష్ట్యా ఉన్నాయి. ‘వాస్తవము’గా చూస్తే, లేనివి.
మాయ ఉన్నట్లుగా ఉన్నప్పటికీ, ‘యా మా’ - ఏది లేదో అదియే మాయ!

- మాయ స్వయముగానే ఆత్మయందు ఆధిక్యత పొందుచున్నది. ఆత్మకు వేరైన మరొకరెవరూ వృద్ధి చేయుచున్నట్టిది కాదు. కాబట్టి స్వయమధికా!
- స్వయముగా ఎట్టి వికారము లేనట్టిది. మాయ జీవుని బంధించదు. జీవుడే ఆత్మను ఏమరచినప్పుడు, అప్పటి అట్టి స్థితియే మాయ.
- ‘మాయ ఎటువంటిది?’ అని పరిశీలించబోతే నిరూపణకు దొరకదు. ‘‘ఒకనికి ఒక క్రీడ పట్ల (లేక) ఒక సంఘటన పట్ల ప్రీతి ఎందుకు? అప్రీతి ఎందుకు?’’-అను దానికి కారణం ఏముంటుంది? ఒకవేళ ఏదైనా కారణము ఉంటే, అదీ మాయయే! అందుకని లక్షణ శూన్యమైనది - మాయ.

అజ్ఞానమ్ నామ?

అజ్ఞానం తుచ్ఛాపి, అసతీ, కాలత్రయేఽపి, పామరాణాం వాస్తవీ చ। అఖండము, సత్యము, నిత్యము, సర్వము అగు ‘ఆత్మ’ను ఏమరచినట్టి సందర్భములో - ఈ జీవుని ‘‘జగత్ - దేహ-వ్యష్టి’’ భావనలను ‘అజ్ఞానము’ అని అంటున్నారు.

‘అజ్ఞానము’ వలన ఏర్పడి, అనుభవమగుచున్నదంతా వాస్తవ దృష్టిచే తుచ్ఛమే అయినప్పటికీ, అసత్తే (వాస్తవానికి లేనిదే) అయినప్పటికీ, (ఒకప్పుడు ఒకతీరుగా, మరొకప్పుడు మరొక తీరుగా అనుభవమగుటచే) - త్రికాలబద్ధమే అయనప్పటికీ, ఆత్మతత్త్వము అనుభవమయ్యే వరకు ‘‘అజ్ఞానము ఉన్నది। పోవాలి।’’ అనునదే సిద్ధిస్తూ ఉంటోంది.

సత్త్వ బుద్ధిః లౌకికానామ్….,
లౌకికమైన (లోక సంబంధమైన) సత్త్వబుద్ధికి ఇది ఇటువంటిది (ఇదమిత్థమ్) - అని నిర్వచించి చెప్పవీలుకానిది. అనిర్వచీనయము.

వక్తుమ్ న శక్యతే! మాటలకు అందనిది - మాయ.


మరికొన్ని విశేషార్థములు

ప్రియ పరబ్రహ్మానంద స్వరూపా! ప్రియశిష్యా! ఇప్పుడు మనము చెప్పుకొన్న వాటిలో కొన్ని కొన్ని విశేషార్థములు మరికొంత సుస్పష్టత కొరకై, మరికొంతగా వివరించి చెప్పుకొందాము. శ్రద్ధగా వినిదెవు గాక!

పరమాత్మ

సత్య జ్ఞాన, అనన్త ఆనంద స్వరూపమ్! సత్యము, జ్ఞానము, ఆనందము, అనంతత్వము లక్షణములుగా కలిగి ఉన్నట్టిది. దేహముల మునుముందు - తరువాత తరువాత కూడా ఉన్నట్టిది. ‘సర్వజ్ఞత్వము’ అనే లక్షణము వెంటనంటి ఉన్నట్టిది.

తత్ : ఈ జీవుని సహజరూపమే- ‘తత్’ అను శబ్దముచే చెప్పబడుచున్నట్టిది. అది కేవలము, సహజము, సర్వదా యథా తధముకూడా!

త్వమ్: ఈ జగత్తులో కనిపించే ‘జీవుడు’ అనునది - అనేక నాటకములలో నటించే ఒక నటుని యొక్క ఒకానొక నాటకములోని ఒక పాత్రలాగా - సందర్భ సత్యము మాత్రమే. కల్పితము, అసహజము, మార్పు-చేర్పులకులోను అగుచున్నట్టిది.

బ్రహ్మము సత్యము - అవినాశి

బ్రహ్మము సర్వ ఉపాధులకు వినిర్ముక్తము. (Not bound by any physical form).
- సర్వ విశేషములకు మునుముందే ఉన్నట్టిది. నిర్విశేషము. లోక సంబంధమైన విశేషములకు ఏమాత్రము సంబంధించనిది.
- సర్వమునకు వెలిగిస్తూ ఉన్నట్టిది.
- నా యొక్క సత్-అద్వైత - ఆనందమయ స్వరూపమే బ్రహ్మము. ‘‘నేను’’, ‘‘నీవు’’, ‘‘జగత్తు’’ మొదలైనదంతా బ్రహ్మమునకు అనన్యము. బ్రహ్మమే తత్। బ్రహ్మమే ‘త్వమ్’ కూడా।

‘త్వమ్’ అనునది బ్రహ్మమునకు లీలామానుష వేషధారణము వంటిది. ఉపాధి వంటిది. స్వీయకల్పనా వైశిష్ట్యములోని అంతర్విభాగము.

మూల ప్రకృతి: స్వభావము. బ్రహ్మమే మూల ప్రకృతి రూపముగా (దర్పణములోని ప్రతిబింబమువలె) ప్రదర్శనము అగుచున్నది.

అవినాశి : బ్రహ్మము ‘‘త్వమ్ (నీవు) - తత్ (అది)’’ - అను రెండింటికీ విలక్షణమై ….
- సర్వమునకు అధిష్ఠానమై (తానే సర్వమునకు మూలస్వరూపము అయి),
- పరమశుద్ధము, పారమార్థికము (The finest meaning of every thing else), కేవల సత్తామాత్రము (Absolute presence) అయి ఉన్నది.
మార్పు-చేర్పులు లేక, వినాశన ధర్మము లేనిదై వెలుగొందుటచే ‘‘అవినాశి’’। అదియే ‘ఆత్మ’!

ఆత్మ సత్యమ్। ఆత్మయే బ్రహ్మము।

కిం సత్యమ్?
✤ ‘సత్’ ఇతి శ్రౌత ప్రతీతి సత్యమ్। ఏదైతే నిత్యసత్యమై ఉన్నట్టిదని, శ్రుతుల ప్రమాణంగా ‘సత్’గాను ఆత్మజ్ఞులచే నిర్ణయించి చెప్పబడుచున్నదో.., అది సత్యము.
✤ ‘అసత్’ ఇతి అవాచ్యం సత్యమ్। దేనిని ఎరిగిన తరువాత ‘అసత్’ అనునది ఉనికిని మొదలంట్లా కోల్పోవుచున్నదో…, అది సత్యము.
✤ త్రికాలాబాధ్యం సత్యమ్। ఏది త్రికాలములలో ఏకరీతిగా ఉండటం చేత త్రికాలాబాధ్యమో - అది సత్యము।
✤ ఏది జాగ్రత్-స్వప్న - సుషుప్తులలో ఏకరూపమై, పరమైయున్నదో - అది సత్యము.
✤ ఏది త్రికాలములలో పూదండలోని దారము వలె అనుస్యూతమో (పూదండలోని దారము వంటిదో) - అది సత్యము.

ఏది ‘అస్తి’ (Being) యో అది సత్యము। సజాతి - విజాతి భేదరహితమైనది సత్యము। సర్వకల్పనలకు అధిష్ఠానము, దేశ కాల వస్తువులు నశించినా శేషించి ఉండేది సత్యము.
దేశ-కాల-వస్తు-నిమిత్తాషు వినశ్యత్సు, యత్ న వినశ్యతి-ఇతి సత్యమ్।

కిం జ్ఞానమ్?

తెలియబడే సమస్తమునకు ఆవల ఉండి, సమస్తము ‘తెలుసుకుంటూ ఉన్నట్టిది’’-జ్ఞానము. స్వయం ప్రకాశకమైనది. సర్వమును ప్రకాశింప జేయునది జ్ఞానము. ఎరుకయే జ్ఞానము.

విషయములకు, దృశ్యములకు సంబంధించిన ఏ ఆవరణలు (Limitation, end liner) లేనిది. అనాద్యంతము. నిరంతర-వృత్తి రహిత-సాక్షి చైతన్యమే-జ్ఞానము. (వృత్తి సహితమైనప్పుడు అది ‘ద్రష్ట’గా ప్రదర్శనమగుచున్నది). స్వప్రకాశకమ్। సర్వ ప్రకాశకమ్। నిరాకరణ చిన్మాత్రం। అనాద్యంతం। నిరంతరమ్-అవృత్తి। సాక్షి చైతన్యమ్- ఇతి జ్ఞానమ్।

అనంతము

అనన్తా నామ। మృత్ వికారేషు మృత్ ఇవ, స్వర్ణ వికారేషు ‘స్వర్ణం’ ఇవ, తంతు వికారేషు ‘తంతు’ ఇవ అవయక్త ఆది - సృష్టి ప్రపంచేషు పూర్ణమ్, వ్యాపకమ్, చైతన్యమ్, అనన్తమ్ - ఇతి ఉచ్యతే।
ఆత్మ లేక బ్రహ్మము అనన్తమైనది!

ఇంకా ఆత్మ ఎట్టిదంటే:
❋ ఉత్పత్తి వినాశన రహితము; (ఉత్పత్తి కామము - ఉత్పత్తి - పెరుగుట - తరగటం - వినాశనము - పునరుత్పత్తి అనే) షట్ (6) భావములకు సంబంధించనిది.
❋ సర్వ ఉపాధులకు సంబంధించనిది, ‘‘మట్టి, బంగారము, దారము’’ లకు (తదనంతర) ‘‘బొమ్మ- ఆభరణము - వస్త్రము’’ వికారములు మొదలే లేని తీరుగా, జగత్తు, జీవుడు, దేహముల రాకపోకలు మొదలైన వికారములు మొదలే లేనట్టిది.
❋ అవ్యక్తము మొదలుకొని - సృష్టి (ప్రపంచము) వరకు తానే స్వస్వరూపముచే నింపి ఉంచునట్టిది.
❋ బ్రహ్మము పూర్ణము. సర్వవ్యాపకము. అట్టి చైతన్యమునకే ‘అనంతము’ అను మరొక లక్షణ నామము.

ఆనందమ్

తరంగమునకు జలము వలె సర్వమునకు తానే అధిష్ఠానమై, నిత్య - శుద్ధ - అఖండ - అప్రమేయ- చిదానంద - ఏకరసమే ఆత్మానందము! అవ్యాజము అయినట్టి ఆత్మానందము నుండియే తరంగమువలె దృశ్యము బయల్వెడలుతోంది. నటునియొక్క ‘నటించాలి’ అనే ఉత్సాహమునుండే నవరసములు బయలుదేరుచున్నట్లు, ఆత్మానందమునుండే సమస్త అనుభవములు ప్రదర్శనమగుచున్నాయి.

పదార్థము - సత్ - అసత్ మిథ్యలుగా త్రివిధములు

పదార్థము సత్: పదార్థము ఉనికి ఉను ధరము కలిగి యున్నది. ‘ఉనికి’ కలిగియున్నదే బ్రహ్మము. (న అభావో విద్యతే సతౌ।) సత్‌కు ‘లేకపోవటము’’ అనేదే లేదు।

‘సత్’కు జాగ్రత్ - స్వప్న-సుషుప్తులప్పుడుగాని, జన్మ-జన్మాంతరములు సందర్భములో గాని, జగత్తులకు మునుముందేగాని, జగత్తులు ప్రదర్శనమగుచున్నప్పుడు గాని - జగత్తులు నశించిన తరువాతగాని ‘లేకపోవటము’ అనే ధర్మమే లేదు.

బ్రహ్మమే (లేక) సత్‌యే వాస్తవ స్వరూపముగా గల ఈ జీవుడు ఒకప్పుడు ఉండువాడు - మరొకప్పుడు లేనివాడు కాడు. (న జాయతే, (q) మ్రియతేవా కదాచిత్).

కనుక ప్రియశిష్యా! ‘‘బ్రహ్మముగా (లేక) ఆత్మగా నేను నిత్యసత్ స్వరూపుడను’’ అని, నీ యొక్క కేవల సత్ స్వరూపము గురించి ఎరుగుచున్నవాడవై ఉండుము.

పదార్థము - ‘అసత్’: వ్యావహారికంగా పదార్థమును దర్శించటము-అసత్। సందర్భంగా చూస్తే ‘ఉన్నట్లుగా’ వ్యవహారికంగా అనిపించవచ్చు గాక! కానీ, వేరు వేరు దృష్టులకు ‘వేరువేరు’ గా అనిపించటము సత్।

ఉదాహరణకు ఇక్కడ పరస్పరంగా కనిపించే భార్య - భర్త; తండ్రి - కొడుకు; గురువు - శిష్యుడు; అప్రియము - ప్రియవస్తువు → ఇవన్నీ బహుదూరపు బాటసారులకు - ‘జగత్తు’ అనే కించిత్ ‘విశ్రాంతి స్థలము’లో కొద్దిసేపు తారసబడుచున్నట్టివి. మరల ఎవరికి వారే వారి వారి వేరువేరైన గమ్యస్థానముల వైపుగా బయల్వెడలటానికై విడిపోయే సంబంధాలే। అందుచేత, జగత్ దృష్ట్యా సత్యమని అనిపించినా - వస్తుతః అసత్తే!
→ నాటకంలోని పాత్రల పరస్పర సంబంధములు - ఒకనికి ఆతని పాత్రముగియగానే - అసత్తే కదా!

పదార్థము-మిథ్య

🌺 ‘‘ఈ జగత్తు ఉన్నది’’ అని తలచి, నమ్మి ఉంటే ఇది ‘భయము’, ‘భవము’ అవుతుంది. అప్పుడు ఇది ‘‘భవబంధము’’ - అవుతోంది.
🌺 ‘‘ఈ జగత్తు జగన్నాటకము మాత్రమే! కనుక వాస్తవానికి లేదు’’ - అని ఎరిగియే ఇందులో జీవించువానికి? - ఇది ‘అభయము, అభవము’, అభావము అగుచున్నది. అట్టివానికి భవబంధము (భావబంధము) ఎక్కడిది?

అందుచేత - ‘‘బ్రహ్మసత్యమ్ ! జగత్ మిథ్య।’’ అని ఎరుగుటచే జగత్తు బ్రహ్మమే అగుచున్నది. ఒకడు ఒక నవల చదువుచున్నప్పుడు ‘రచన’ రచయిత యొక్క కల్పన యే కదా - అని జ్ఞప్తియందు ఉంటే దుఃఖము, భయము కలిగించదు. లేదా, ‘నిజమే’ అనే భావనగల వానికి దుఃఖ, భయాలు కలుగుతాయి.

జగత్ మిథ్యా! బ్రహ్మ సత్యమ్! ఇత్యేవ సత్యమ్! ‘జగత్తు కల్పనయే’ - అను జ్ఞప్తి కలవానికి ఇక్కడ దుఃఖము, భయము ఇక ఉండవు. పదార్థము యొక్క ‘‘సత్-అసత్’’ - మిథ్యయలను ఏకకాలంలో యుక్తియుక్తముగా ఎఱిగిన వాడే - బ్రహ్మమును ఎఱిగినవాడు।

బ్రహ్మము - ఆత్మ -అనాత్మ

అందుచేత ఆత్మకు వేరుగా జగత్తు లేదు. ఊహించువానికి వేరుగా ఊహ ఉండదు కదా! ఈ ఆకాశాది పంచభూతముల ప్రదర్శనమంతా మాయయే. ఆత్మ నుండి బయల్వెడలినవే! (ఆత్మాత్ ఆకాశమ్।) కనుక ఆత్మకు భిన్నమైనవి కావు.

ఇదంతా ఆత్మతో ఏకమేగాని అనేకము కాదు. అన్యముకాదు. అన్యముగా అనిపించటమే మాయ। బ్రహ్మముగా అనిపించటమే సత్యము।

‘అనాత్మ’ అనేది ఎక్కడైనా ఉంటే అది మాయయే (యా మా - వాస్తవానికి లేనిదే). నిర్మలాకాశము కనబడక, మేఘావృతమైతే ఆకాశము కనబడకపోవచ్చు గాక! అయితే ఆకాశము లేకుండా పోతుందా? లేదు కదా!

అట్లాగే;
ఈ ‘జగత్తు’ (లేక జగత్ అనుభవము, జీవాత్మ భావనలతో కూడిన మాయ) - ఆత్మాకాశమును కప్పి ఉంచలేదు. ఎందుకంటే
మేఘములు కొద్ది ప్రదేశమును ఆక్రమించి ఉండగలవు - ఆకాశమో? అనన్తము. అట్లాగే, జగత్- జాగ్రత్‌భావన- జగత్ భావికుడు (జీవాత్మ)లు కాల దేశ సందర్భ పరిమితములు.

ఆత్మాకాశమో? అనన్తము। అప్రమేయము। నిత్యము। సత్యము। ఈ జీవుడు అట్టి అఖండ - ఆత్మాకాశ స్వరూపుడే! ఆత్మను జగత్తులు, జన్మలు మొదలైనవి బంధించగలిగే ప్రసక్తియే లేదు.

మాయ ఎటువంటిది?

అనాద్యంతవతీ। మొదలు - మధ్య - చివర అనునవి లేనిది. దృష్టాంతాలకు దొరకనిది. ఉన్నదని అనలేము. లేదని అనలేము. మాటలకు అందనిది. అద్దాని అధిష్ఠానము (దేనితో తయారైనదో) చెప్పలేము. అవిద్యారూప అంతర్వాణి-వికల్పరూపమైనది. ‘ఇది’ అని చెప్పుటకు, నిర్వచించుటకు వీలులేదు. (భేద దృష్టిచే ‘ఇది’ అని సమగ్రంగా చెప్పజాలము).

వస్తుతః ఏ మాత్రం లేనట్టిది మాయ!

⌘ అజ్ఞానమే అద్దాని స్వరూపము।
⌘ అదియే ‘మూల ప్రకృతి’ కూడా।
⌘ త్రిగుణముల సామ్యరూపము కూడా అదే।
⌘ ‘‘అవిద్యారూపము’’ - అని కూడా చెప్పబడుచున్నది।
⌘ అనేకమైన ఆకారముల సమన్వితము.

మాయకు ఆధారమైన ‘తత్’ స్వస్వరూపమును ఎరుగుటచే, అనుభవముచే ‘మాయ’కు - ‘మొదలే లేదు’ - అనునదే సిద్ధిస్తోంది. ‘‘ఆత్మ సర్వదా అనన్యము’’ అని స్వానుభవమగుచున్నది.

ఇత్యహమ్ - ‘ఇది నేను’ - శ్లోకాః

గురవర్యులు : ప్రియ శిష్యా! స్వయమాత్మానంద స్వరూపా! ఆత్మతత్త్వము ఎరిగిన మహనీయుల గానము ఏమిటో చెప్పుచున్నాను.

బ్రహ్మము యొక్క స్తుతి (The song of “Self”) - నాహమ్ ఇతి।

నేను ఏక్షణంలో కూడా ఈ ‘భౌతికదేహము’ అయి ఉండలేదు, అయి ఉండుట లేదు, అయి ఉండబోను. నైవం భవామి అహం దేహే!

♠︎ ఈ ‘‘చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు’’ - అగు పంచేంద్రియగోళములుగాని,
♠︎ ‘‘శ్రోత్ర (చెవులు)-త్వక్ (చర్మము)-చక్షు (కళ్ళు)-జిహ్వ (నాలుక)-ఘ్రాణ’’ (ముక్కు)- అగు పంచజ్ఞానేంద్రియములు గాని,
♠︎ ‘‘నోరు - చేతులు -కాళ్లు - గుదము- గుహ్యము’’ అయినట్టి పంచ కర్మేంద్రియ గోళకములు గాని,
♠︎ ‘‘వాక్ పాణి - పాద - పాయు - ఉపస్థ’’లనబడు పంచ కర్మేంద్రియములు గాని
♠︎ ‘‘శబ్దము - స్పర్శ-రూప-రస-గంధములనబడే’’ పంచజ్ఞానేంద్రియ విషయములు గాని,
♠︎ వచన ఆదాన గమన విసర్జన ఆనందములనబడే పంచ కర్మేంద్రియ విషయములు గాని - నేను కాదు।

న ఇంద్రియాణి దశైవతు. వాటికి నేను వేరు అయి ఉన్నాను.

❋ నిర్ణయములు నిర్వర్తించు బుద్ధి, ఆలోచనలు చేయు మనస్సు, జాగ్రత్ స్వప్నసుషుప్తులలోను, జన్మజన్మాంతరములోను విస్తరించి యున్న ఈశ్వరుడు - ఇవన్నీ ‘నేను’ అయి ఉండలేదు.
❋ జాగ్రత్ అహంకారము స్వప్నములో లేదు. స్వప్న అహంకారము సుషుప్తిలో ప్రవర్తితమవటం లేదు కానీ ఆ మూడు సందర్భములలో నేను ఉన్నాను. కనుక, ‘అహంకారము’ కూడా నేను కాను.
❋ పంచ ప్రాణములు గాని, మనస్సుగాని నేను కాదు.

ఆత్మగా ప్రాణ-మనో (ఆలోచనలకు) ఆవలివాడను. మనో రహితుడను కూడా. బుద్ధి మొదలైనవాటికి సర్వదా వేరైనవాడను.

అప్రాణో అమానాః శుభ్రో। బుద్ధ్యాదీనాం హి సర్వదా, సాక్ష్యహమ్ సర్వదా నిత్యః చిన్మాత్రోఽహమ్! న సంశయః।

శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి,మొదలైనవాటికి సర్వదా నిత్యమగు సాక్షిని. సూర్యకాంతిలో ఆయా వస్తువులు సాకారమై కనిపిస్తున్నట్లు, వాటిని వెలిగించు చిన్మాత్ర స్వరూపుడను. కాంతి వలన వస్తువులు వెలుగుతో కనబడతాయి. కాంతి వస్తువులపై ఆధారపడి ఉండదు కదా! ప్రాణ మనో బుద్ధి మొదలైనవాటికి వేరైన తేజో-చైతన్య చిన్మాత్ర స్వరూపుడను. ఇందులో సందేహమే లేదు!

❋ నాటకంలో ఒక పాత్రగా నటించేడప్పుడు ఆ పాత్ర యొక్క కర్తృత్వ - భోక్తృత్వాలు నావిగా అవుతాయా? కావు కదా! అట్లాగే, ఈ జగన్నాటకంలో మనోబుద్ధి చిత్త అహంకారాలతో పాత్ర వహిస్తూ ఉన్నప్పుడు కూడా నేను ‘జగత్తు’ అనే నాటకంలో దేనికీ కర్తను కాను. భోక్తను కాను. జగన్నాటకంలోని ఈ వర్తమాన - ‘జీవుడు’ అను పాత్రకు - నేను సాక్షిని. ప్రకృతికి (స్వభావమునకు) సాక్షిరూపుడను. నాహమ్ కర్తా, నైవ భోక్తా, ప్రకృతే సాక్షిరూపకః।

కోఽహమ్? సోఽహమ్?

కేవల చైతన్య స్వరూపుడనగు నా యొక్క సాన్నిధ్యం చేత మాత్రమే ఈ ‘దేహము’ మొదలైనవి అజడములై (స్వయంగా చైతన్యములయినట్లు) ప్రవర్తిస్తున్నాయి.

మత్ సాన్నిధ్యాత్ ప్రవర్తంతే దేహాత్ యా అజడా ఇవ।

✤ నవలలో నాయకుడు ఒక చోటనుండి మరొక చోటికి వెళ్లుచూ ఉంటే, ఆ నవలా రచయిత ఆ విధంగా మరొక చోటికి వెళ్లుచున్నట్లా? కాదుకదా! ఆ నవలా సంఘటన సందర్భంలో రచయిత స్థాణువు వలె ఎక్కడికీ వెళ్లక, ఉన్నచోటే ఉంటాడు కదా! అట్లాగే నేను సర్వదా స్థాణువునై, నిత్యుడనై యధాతథంగా ఉండి ఉండగా, ఈ దేహదేహాంతరములు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు నాయొక్క కల్పనా వైభవము నందు కనబడుచున్నవై ఉన్నాయి. ఇదంతా నా వినోదమే! కనుక, ‘‘సదానందుడను’’. తెలియబడుగానికి మునుందే ఉన్న ‘తెలివి’ (ఎరుక/చిత్) స్వరూపుడను. కేవలము, నిర్మలము అగు శుద్ధ జ్ఞానానంద స్వరూపుడను. స్థాణుః నిత్యః సదానందః శుద్ధో, జ్ఞానమయో అమలః।

✤ ‘సర్వ జీవుల ఆత్మ’యే నా వాస్తవ స్వరూపము. సర్వజీవులను నియమించునది, సర్వజీవులుగా విస్తరించి ఉన్నది, సర్వజీవులకు కేవల సాక్షిని నేనే. సంశయమే లేదు. ఆత్మాహమ్ సర్వభూతానామ్ విభుః సాక్షీ న సంశయః।

✤ సర్వ వేదాంత శాస్త్ర రూపములగు ఉపనిషత్-ద్రష్టలు దేనిని ‘బ్రహ్మము’ అంటున్నారో, అట్టి బ్రహ్మమే నేను. బ్రహ్మైవాఽహమ్, సర్వవేదాంత వేద్యమ్! వేదాంత శాస్త్ర సిద్ధాంతములన్నీ నా యొక్క బ్రాహ్మీస్వరూపము గురించే అయి ఉన్నాయి.

✤ ఆకాశము - వాయువుల వలె నేను తెలియబడువాడను కాను. సర్వము తెలుసుకొనుచూ ఉన్న కేవల జ్ఞాన-కేవల చిత్ స్వరూపుడను. నాహమ్ వేద్యమ్ వ్యోమ వాతాది రూపమ్। వైద పురుషుడను। సమస్తము తెలుసుకొనుచున్న ‘తెలివి-చిత్’ స్వరూపుడను. అంతేగాని, తెలియబడే వాటిలో ఒక ‘వస్తువు’ వంటివాడను కాను.

✤ ఈ నామ రూపములు నేను కాను. ఏ మాత్రమూ కర్మలకు సంబంధించినవాడనే కాను. సచ్చిదానంద రూప పరబ్రహ్మమే సర్వదా అయి ఉన్నాను. సదాశివ బ్రహ్మమును.
నాహమ్ దేహో। బంధ మోక్షో కుతో మే? నేను దేహమే కానప్పుడు నాకు ‘‘బంధము’’ అనే ప్రసక్తి ఎక్కడిది? బంధమే లేనప్పుడు మోక్షమెక్కడిది?

ఒకడు ఒక వస్త్రమును ధరిస్తే, ఆ వస్త్రము ఆతడు అవుతాడా? కాడు. ఒకడు ఒక వాహనమును నడుపుతూ ఉంటే, ఆ వాహనము అతను అగుచున్నాడా? అవటమే లేదు. ఒకడు ఒక దృశ్యమును చూస్తూ ఉంటే, ఆ దృశ్యముగా ఆతడు మారిపోతాడా? మారిపోడు. ఈ దేహము నేను ధరించు వస్త్రము వంటిది. నేను నడుపు వాహనము వంటిది. నేను కళ్లతో చూస్తున్న దృశ్యములోని ఒక వస్తువు వంటిది. నేను దేహమును కాను.

ఈ దేహమును ఉపయోగిస్తూ, దీనిని కదలునట్లుగా, సచేతనముగా చేయుచున్న దివ్యమగు చైతన్యమూర్తిని. చైతన్యస్ఫూర్తిని. దీనిని ఉపకరణముగా ఉపయోగిస్తున్న ‘దేహి’ని. ఉపయోగించువాడు -ఉపయోగించబడు వస్తువు సర్వదా వేరే కదా! ఆటగాడు ఆటకొరకై ఆట వస్తువు (say, a cricket Bat)ను ఉపయోగిస్తూ ఉన్నప్పటికీ ఆటగాడు ఆట వస్తువుగా (As a cricket Bat) అవటం లేదు కదా!

➤ నాహమ్ దేహో। నేను ఈ దేహముగా అగుటయే లేదు. సర్వదా అఖండాత్మ స్వరూపుడను। ఆద్యంత రహితుడను। జన్మ-మృత్యుః కుతో మే? మరి దేహ ధర్మములు అయినటువంటి జన్మ-జరా-మృత్యువులు నావి ఎట్లా అవుతాయి?
➤ దేహము దేహికి ఉపాధి. దేహియో, ఆత్మకు ఉపాధి. దేహముయొక్క ధర్మములను దేహికి గాని, ‘దేహి’ని ఉపాధిగా కలిగియున్న ఆత్మకుగాని ఆపాదించి దర్శించటము - ఎటువంటిదంటే :-
➤ వస్త్రము చిరిగితే వస్త్ర ధారి చిరిగిపోతాడు।
➤ వాహనము చెడితే వాహనము నడుపువాడు చెడిపోతాడు।
➤ దృశ్యము మారితే ద్రష్ట ఆ మార్పు పొందుతాడు।
➤ కదిలే వస్తువు చేతి నుండి జారిపడటం చేత, చేయి జారిపోతుంది. ఆ కదిల్చే వ్యక్తి కూడా జారిపడిపోతాడు!
➤ అచేతనము (జడము) అగు కర్ర విరగగానే ఆ కర్రను అంతసేపూ పట్టుకున్న సచేతనుడు కూడా విరిగిపోతాడు.
అని చెప్పటము వంటిది.

అది ఎంత అర్థరహితమో,
‘‘ఈ దేహములో నేను జన్మిస్తున్నాను. దేహముతో మరణిస్తున్నాను’’ - అని నా గురించి నేను గాని, మరొకరుగాని తలచటము అంతగానూ అర్థరహితము.
నేను మరొకరి గురించి అట్లా అనుకోవటం కూడా అంతే అర్థరహితము.

ఈ జగత్తును, ఈ దృశ్య భావములను, ఈ ఇంద్రియములను, ఈ ఇంద్రియార్థములను కదల్చు (లేక) ఉపయోగించు ‘‘చైతన్య స్ఫూర్తి’’ (లేక) ‘‘కేవల జ్ఞాన’’ స్వరూపుడనగు నాకు ఈ దేహ ధర్మములైనట్టి జన్మ - మృత్యువులు ఎట్లా ఆపాదించబడలగవు? జన్మ మృత్యుః కుతో మే? ఉండవు. ఉండజాలవు. మరి?

నాయొక్క పూర్ణత్వము సర్వదా యథాతథమై ఉండగా, ఒకానొక కించిత్ విభాగమునందు చంచలరూప చమత్కారమంతా చోటు కలిగి ఉంటోంది.

కనుక ప్రియ శిష్యా! ఆత్మదేవా!
➤ దేహే జాతే న జాతోఽసి! దేహముతో నీవు పుట్టువాడవు కావు.
➤ దేహే నష్టే న నశ్యఽసి! దేహముతో నశించువాడవుకావు.
➤ త్వమాత్మా అకలంకాత్మ। నీ ఆత్మ దోషము. పొందనిది. - (యోగవాసిష్ఠము)
➤ దేహస్తవ న కశ్చన। నీవు ఎప్పుడూ కూడా దేహముగా అవటం లేదు.
ఏ ఒక్క జీవుడు దేహముగా అవటానికి వీలే లేదు. అవడు. అవజాలడు. ఎందుకంటే ఆత్మ సర్వదా నిత్యము, అప్రమేయము కదా! ఈ జీవుడు సర్వదా సహజముగా ఆత్మ స్వరూపుడేగాని, మరింకేదీ ఆతని కేవల-శాశ్వత స్వాభాకం కాదు.

నాహమ్ ప్రాణో।

➤ నాకు ఈ దేహమున్నంత వరకూ ఈ దేహము యొక్క నఖ-శిఖ పర్యంతరము నాయొక్క ప్రాణశక్తితో సంచాలనము చేస్తూ ఉన్నాను. మరొకప్పుడెప్పుడో ఈ దేహము నుండి నా ప్రాణశక్తిని నేనే ఉపసంహరించుచున్నాను. అయితే నేను ప్రాణ స్వరూపుడనా? కాదు. ప్రాణము నా యొక్క శక్తిరూపము మాత్రమే! మరి నేనో? ప్రాణేశ్వరుడను। ప్రాణమునకు విభువును।

➤ శక్తి వేరు. ఆ శక్తి కలవాడు వేరు-కదా। అయినా కూడా, శక్తి శక్తిమంతునికి శక్తి అభిన్నము. కనుక నేను శివ-శక్తి ఐక్య రూపుడను. చిత్రలేఖన ‘కళ’ వేరు. ఆ ‘కళ’ తన దైనవాడు వేరు వేరేకదా। కథా రచనా శైలివేరు. ఆ శైలి తనదైనవాడు వేరు కదా।
ఆకలి - దప్పికలు ప్రాణముల ధర్మములు.

ఆ ప్రాణములు నావైన నేను ప్రాణధర్మములకు సంబంధ-పరిమితుడను కాను. ప్రాణములు నాయొక్క అంతర్‌శక్తి చమత్కారము.
నాహమ్ ప్రాణః। క్షుత్ పిపాసే కుతోమే? నేను ప్రాణ స్వరూపుడను కాను. ప్రాణములు కూడా దేహము వలెనే జడమే। ఆ ప్రాణములను కూడా స్ఫూర్తిని ఇచ్చు, చేతన పరచు చైతన్యాత్మ స్వరూపుడను.

శరీరము యొక్క కండబలము నేను కానట్లే, పంచప్రాణములు కూడా నేను కాదు. కనుక క్షుత్-పిపాసలగు ప్రాణ ధర్మములు కేవలాత్మ స్వరూపుడనగు నా యొక్క ధర్మములు (Features) కావు. శరీరముయొక్క ఆకారము ‘శరీరి’ యొక్క ధర్మము అని అనలేము కదా! ఇదీ అంతే।

నాహమ్ చేతో!

➤ ఈ చిత్తము అనేక విషయములపై, సంగతులపై సంఘటనలపై, సందర్భములపై, సంబంధములపై, అనుబంధములపై, బాంధవ్యములపై వ్రాలుచూ, … ‘‘ఇవి ఇష్టం! ఇవి అయిష్టం’’… అనే స్ఫూర్తిని కలిగి ఉంటోంది.

అయితే..,
‘ఇష్టము’ నాది. అంతేగాని నేను ఇష్టము - స్వరూపుడను కాను. నేనుంటే ‘ఇష్టము’ అనేది, ‘అయిష్టము’ అనేది ఉంటాయి. అవి ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా నేను ఉంటాను. కనుక ఇష్టము (లేక) చిత్తము, మరియు నాచే చేతనము చేయబడుచున్న మనస్సు మొదలైనవి-ఇవన్నీ కూడా నా స్వరూపము కాదు. నా వాస్తవ స్వభావము కాదు. అవన్నీ నాపట్ల సందర్భానుచితమైన ఆరోపితములు మాత్రమే!

కనుక,
నేను చిత్తమును కాను. కనుక చిత్తము యొక్క ధర్మములైనటువంటి..,
✤ శోకము, దుఃఖము, ఆదుర్దా, వేదన, రోదన మొదలైనవి,
✤ మోహము (Illusion) కలిగియుండి ప్రవర్తించటము,
మొదలైనవన్నీ చిత్తమునకు ఆవల కేవలాత్మానంద స్వరూపుడను - అగు నా ఆత్మ ధర్మములు (లేక) నా ధర్మములు ఎట్లా అవుతాయి? అవవు. నాహమ్ చేతః। శోక మోహౌ కుతో మే?

నాహమ్ కర్తా

🎭 ఒకడు ఒక నాటకంలో ఒక పాత్రగా నటిస్తూ ఉంటే, ఆ పాత్రగా నిర్వర్తించేవన్నీ, పాత్రధారుడు నిర్వర్తించేవి అవుతాయా? అవవు కదా?

అట్లాగే జగన్నాటకంలో ‘జీవుడు’ అను పాత్ర యొక్క కర్తృత్వ-అకర్తృత్వాలు నావి ఎట్లా అవుతాయి? నేను (నటుని సహజ స్వస్వరూపమువలె) - సర్వదా కేవలాత్మ స్వరూపుడను! నాహమ్ కర్తా! నేను దేనికీ ఆత్మగా కర్తను కాదు. భోక్తను కాదు.

నాటకంలో నాయక పాత్ర యొక్క ప్రవర్తనలు ఎవరివి నటుడివా? కావు. పోనీ, రచయితవా! అస్సలు కాదు. లేక, ప్రేక్షకులవా! అదీ ఏ మాత్రం కాదు. కాక, నాటక రంగానివా? అదీ కాదు. మరి? ఎవ్వరివీ కాదు. నాటక కల్పనా చమత్కారములు. అంతే। అదంతా ప్రేక్షకుల, నటుల, దర్శకుల, రచయితల వినోద చమత్కారము మాత్రమే!

అట్లాగే, ఈ జగన్నాటక దృశ్యము కూడా! నాయొక్క ‘జీవాత్మ’ కూడా జగన్నాటకములోని పాత్రధారి మాత్రమే।

బంధ మోక్షో కుతో మే?
సర్వదా ఆత్మస్వరూపుడను, ‘‘చిదానంద రూపమ్ - శివోఽహమ్, శివోఽహమ్’’ - అయి ఉన్న నేను జగన్నాటకములోని అంతర్గత పాత్ర యగు ‘జీవుడు’గా - పిలువబడువాడు నిర్వర్తించు నా పాత్రకు - కర్తను కాను. భోక్తము కాను. కర్మలకు సంబంధించనివాడను. నాహమ్ కర్తా!

నాకు కర్మలే లేనప్పుడు, నేను కర్మలకు సంబంధించినవాడినే కానప్పుడు నాకు బంధమెక్కడిది? మోక్షమెక్కడిది?
బంధ మోక్షో కుతోమే? జీవాత్మగా - జగన్నాటకానుసారంగా ‘ముక్తి’ ఏముంటుంది? అది జగన్నాటకానికి సర్వదా బద్ధమే అయి ఉంటుంది. కనుక సందర్భపరిమితమగు జీవాత్మగా ‘ముక్తి’ అనే ప్రసక్తియే ఉండదు. ‘నాటకంలో నేను నా పాత్రకు ముక్తిని కలిగించాలి!’ - అనే వ్యవహారము ఎక్కడిది?

జగన్నాటకానికి, జీవాత్మత్వమునకు ఆవల గల నా ఆత్మస్వరూపము నిత్యముక్తము. నిత్యముక్తమైనదానికి ఇప్పుడు క్రొత్తగా ‘మోక్షము’ కలిగించే వ్యవహారమేముంటుంది? కనుక నాకు బంధము లేదు. మోక్షము లేదు.

నైవం భవామి అహం దేహే న ఇంద్రియాణి దశైవ తు। న బుద్ధిః మన ఈశశ్చ। న అహంకారః తథైవ చ। అ ప్రాణో హి। అ మనాః

శుభ్రో, బుద్ధ్యాదీనాం హి సర్వదా। ‘సాక్షి’ అహమ్ సర్వదా। నిత్యః। చిన్మాత్రోహమ్, న సంశయః। నాహం కర్తా। నైవ భోక్తా, ప్రకృతేః ‘సాక్షి’ రూపకః। మత్ సాన్నిధ్యాత్ ప్రవర్తంతే దేహాది యా అజడా ఇవ। స్థాణుః నిత్యః। సదానందః। శుద్ధో జ్ఞానమయో అమలః। ఆత్మాహమ్ సర్వభూతానామ్, విభుః సాక్షీ, న సంశయః। బ్రహ్మైవాహగ్ం, సర్వవేదాంత-వేద్యమ్। నాహం వేద్యం - వ్యోమ వాతాది రూపమ్। రూపం నాహం (న-అహమ్)। నామ నాహం। న కర్మ। బహ్మైవాహగ్ం సచ్చిదానంద రూపం। నాహం దేహో। జన్మ మృత్యూ కుతో మే? నాహం ప్రాణః। క్షుత్ పిపాసే కుతో మే? నాహం చేతః। శోక మోహౌ కుతో మే? నాహం కర్తా। బన్ధ మోక్షౌ కుతో మే? - ఇతి ఉపనిషత్।।


🙏 ఇతి సర్వసార ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।