[[@YHRK]] [[@Spiritual]]

Varāha Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


కృష్ణ యజుర్వేదాంతర్గత

23     వరాహోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। శ్రీమత్ వరాహోపనిషత్ వేద్య అఖండ సుఖాకృతీ।
త్రిపాత్ నారాయణాఖ్యాంత రామచంద్రపదం భజే।।

శ్రీమత్ ‘వరాహోపనిషత్’చే తెలియబడుచున్న పరమసత్యము అఖండ సుఖాకృతి అయినట్టిది. అట్టి త్రిపాత్-నారాయణ బోధకమగు ‘శ్రీరామబ్రహ్మతత్త్వము’నకు నమస్కరిస్తున్నాము.

ప్రథమ అధ్యాయము

01. అథ ఋభుర్వై మహామునిః,
దేవమానేన, ద్వాదశ వత్సర తపశ్చ ఆచార।
తత్ అవసానే వరాహరూపీ భగవాన్ ప్రాదురభూత్।
‘ఋభువు’ అనే మహాముని 12 దేవమాన సంవత్సరముల కాలము ఇష్టదైవమగు శ్రీవిష్ణు అవతారుడు - శ్రీమన్ ఆదివరాహమూర్తి గురించి తపస్సు చేశారు. చివరికి ఒకానొకరోజు శ్రీ వరాహమూర్తి స్వామి ప్రత్యక్షమైనారు.
సహోవాచ :(భగవాన్ వరాహౌవాచ)
ఉత్తిష్ఠ! ఉత్తిష్ఠ!
వరం వృణీష్వ - ఇతి।।
ఆదివరాహమూర్తి : బిడ్డా ఋభూ! భక్తి - శ్రద్ధలతో కూడిన నీ తపస్సుకు మెచ్చానయ్యా! లే! ఉత్తిష్ఠ! నీకు ఇష్టమైన వరం ఏదైనా సరే, కోరుకో. ప్రసాదించటానికి సంసిద్ధుడనై ఉన్నాను.
సోదతిష్ఠత్ (స ఉదతిష్ఠత్), తస్మై
నమస్కృత్య, ఉవాచ:
భగవానుని ఆ వాక్యములు చెవినబడిన ఋభుఋషి లేచి నిలుచున్నారు. స్వామిని చూచి భక్తి పారవస్యంతో నమస్కరించారు.
భగవన్!
కామిభిః యత్ యత్ కామితం
తత్ తత్ త్వత్ సకాశాత్ స్వప్నేఽపి న యాచే।
సమస్త వేద శాస్త్ర ఇతిహాస
పురాణాని, సమస్త విద్యాజాలాని,
బ్రహ్మాదయః సురాః సర్వే
త్వత్ రూపజ్ఞానాత్ ముక్తిమ్ ఆహురతః।
ఋభుమహర్షి : భగవన్! పరమాత్మా! మీరు సర్వజ్ఞులు. ఈ దృశ్యములో ఏమేమి కోరుకొన్నాకూడా, అదంతా తమ ‘సామీప్యత’తో ఏమాత్రము సమానం కాదు. ప్రపంచంలో ఏదేది పొందినా అదంతా స్వప్న సదృశేమే కదా! కనుక ఇష్ట దైవమగు మిమ్ములను లోకసంబంధమైనదేదీ కోరుకోను. కలలో కూడా యాచించను. సమస్త వేదములు, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు, సమస్త విద్యలు మీ గురించే వివరిస్తున్నాయి. బ్రహ్మ మొదలైన సర్వదేవతలు మీ రూపజ్ఞానము పొంది ‘ముక్తి’ని పొందాలని మాత్రమే కోరుకొనుచున్నారు కదా! నేను కూడా ఆ బాటలోనే నడుస్తాను.
త్వత్ రూప ప్రతిపాదికాం
బ్రహ్మవిద్యాం బ్రూహి। ఇతి।

కాబట్టి మీయొక్క రూప ప్రతిపాదితమగు ‘బ్రహ్మవిద్య’ను ప్రసాదించ వలసినదిగా మిమ్ములను వరం కోరుకొనుచున్నాను. అనుగ్రహించండి.

సహో వాచ వరాహరూపీ, భగవాన్:
చతుర్విగ్ంశతి (24) తత్త్వాని
కేచిత్ ఇచ్ఛంతి వాదినః।
కేచిత్ షట్ త్రిగ్ంశత్ (36) తత్త్వాని।
కేచిత్ షట్ నవతీని (96) చ। (షణ్ణవతీని చ)।

తేషాం క్రమం ప్రవక్ష్యామి।
సావధాన మనాః శ్రుణు।
భగవానుడగు శ్రీ వరాహమూర్తి :
ప్రియ ఋభూ! అవును. ‘‘ఈ మాయా ప్రపంచంలో ఏదో పొందితేగాని దుఃఖము పోదు’’ అనునదంతా అజ్ఞానముచేతనే ఈ జీవుడు భావిస్తున్నాడు. అఖండము, అప్రమేయము, నిత్యము, అమృతము అగు ఆత్మతత్త్వము (లేక) బ్రహ్మతత్త్వము యొక్క జ్ఞానము, తత్ అనన్యానుభవముల చేతనే సర్వసాంసారిక దుఃఖములు పరిష్కరించ బడగలవు. అట్టి ఆత్మ (లేక) బ్రహ్మముయొక్క అన్య కల్పనా రూపము (ప్రకృతి) కొందరు ఆత్మశాస్త్రవేత్తలచే → ‘26’ తత్త్వాలుగా విభజించబడి ఆత్మజ్ఞానబోధ చేయబడుతోంది.
మరికొందరు గురువులచే - ‘36’ తత్త్వములుగా వివరించబడుతోంది. ఇంకొందరు ‘96’ తత్త్వములుగా చెప్పుచున్నారు.
ఓ ఋభూ! ఆయా విశేషములు క్రమము ఏమిటో, మునుముందుగా విశదీకరిస్తున్నాను. సావధాన మనస్కుడనై వినెదవు గాక!

02. జ్ఞానేంద్రియాని పంచైవ
శ్రోత్ర త్వక్ లోచన ఆదయః। (5)
కర్మేంద్రియాణి పంచైవ
వాక్ పాణి అంఘ్రి ఆదయః క్రమాత్। (5)
ప్రాణాదయస్తు పంచైవ। (5)
పంచశబ్దాదయః తథా। (5)
మనో బుద్ధి అహంకారః చిత్తం చ
ఇతి చతుష్టయమ్। (4)
(5 + 5 + 5 + 5 + 4 = 24)
Ⅰ. జ్ఞానేంద్రియ పంచకము (5)
(1) శ్రోత్రేంద్రియము, (2) ‘త్వక్’ ఇంద్రియము, (3) చక్షురింద్రియము, (4) జిహ్వేంద్రియము, (5) ఘ్రాణేంద్రియము (వినికిడి, స్పర్శ, చూపు, రుచి, వాసన)

Ⅱ.కర్మేంద్రియపంచకము (5)
(1) వాక్ ఇంద్రియము, (2) హస్తేంద్రియము, (3) పాదేంద్రియము, (4) ఉపస్థేంద్రియము, (5) పాయు ఇంద్రియము.

Ⅲ. ప్రాణ పంచకము (5)
(1) ప్రాణము, (2) అపానము, (3) వ్యానము, (4) ఉదానము, (5) సమానము

Ⅳ. ఇంద్రియ విషయ పంచకము (5)
(అ) శబ్దము (ఆ) స్పర్శ (ఇ) రూపము (ఈ) రసము, (ఉ) గంథము

Ⅴ. అంతరంగ చతుష్టయము (4)
(క) మనస్సు (గ) బుద్ధి (చ) చిత్తము) (జ) అహంకారము

చతుర్వింశతి (24) తత్త్వాని
తాని బ్రహ్మవిదో విదుః
ఈ విధంగా ‘24’ తత్త్వములుగా బ్రహ్మవిదులచే గమనించబడి, తత్త్వ శాస్త్రీయంగా వివరించబడుతోంది.
ఏతైః తత్వైః సమం
పంచీకృత భూతాని పంచ చ
పృథివీ ఆపః తథా తేజో
వాయుః ఆకాశ ఏవ చ। (5)
వీటితోబాటుగా…
Ⅵ. పంచీకృత భూతములు (5)
(ఎ) పృథివి (Solid) (బి) ఆపః (జలము) (Liquid) (సి) తేజస్సు (అగ్ని)(Heat/Light) (డి) వాయువు(Vapour) (ఇ) ఆకాశము (Space).
దేహ త్రయగ్ం
స్థూల సూక్ష్మ కారణాని
విదుః బుధాః (3)।
Ⅶ. దేహత్రయమ్ (3)
(1) స్థూలదేహము (Matter) (2) సూక్ష్మ శరీరము (Thought & Feelings) (3) కారణశరీరము (Causation) అని బుధులు, గమనించి విడమర్చి చెప్పుచున్నారు. (ఆవలది ‘కేవలాత్మ’)
అవస్థా త్రితయంచైవ
జాగ్రత్ స్వప్న సుషుప్తయః। (3)
ఆహత్య, తత్త్వ జాతానాం
షట్ త్రిగుంశత్ (36)
మునయో విదుః।
Ⅷ. అవస్థాత్రయము
(1) జాగ్రత్ అవస్థ (Awakened) (2) స్వప్నావస్థ (Dreamy) (3) సుషుప్త్యవస్థ (Dead Sleepy)
ఈ 35 + జీవాత్మ = 36 (G) ఈశ్వరుడు+పరమాత్మ = 36/38…. అని మునులు దర్శించుచున్నారు.
పూర్వోక్తైః తత్త్వజాతైస్తు
సమం తత్త్వాని యోజయేత్।
షట్ (6) భావ వికృతిశ్చ
అస్తి జాయతే వర్థతేఽపి చ,
పరిణామం క్షయం నాశగ్ం
షట్ భావ వికృతిం విదుః। (6)
Ⅸ. భౌతిక దేహమునకు సంబంధించిన-షట్ భావ వికృతములు
ఇప్పటివరకు చెప్పినవే కాకుండా, తత్త్వ వివరణ కొరకై షట్ భావ వికారములు - (1) అస్తి (ఉనికి), (2) జాయతే (పుట్టుక), (3) వర్ధతే (పెరుగుదల), (4) పరిణమతే (పరిణామములు పొందటము (stage by stage changing factors) (5) క్షయము (క్షీణించటము),(6) నాశనము అనబడే షట్ వికారములు. ఈ దేహములు ఆయా సర్వ వస్తువులు కలిగినదై ఉంటున్నది. [6]
అశనా చ పిపాసా చ శోక
మోహౌ జరా మృతీ
ఏతే ‘షట్ ఊర్మయః’
ప్రోక్తాః। (6)
Ⅹ. షట్ ఊర్ములు : ఈ జీవుడు దేహము యొక్క సంబంధము కారణంగా
(1) ఆకలి (2) దప్పిక (3) శోకము (Worry) (4) మోహము (Illusions, Misconceptions) (5) జర (Old Age) (6) మరణము (Death) అనే అనివార్యములను పొందుచున్నాడు. ఇవి షడూర్ములు అని అనబడు చున్నాయి. [6]
షట్ కోశాన్ అథ వచ్మి తే।
త్వక్ చ రక్తం మాగ్ంస
మేదో మజ్జా అస్థీని
నిబోధత। (6)
Ⅺ. షట్ కోశములు : శరీరములో ‘6’ కోశములు (1) చర్మము, (2) రక్తము, (3) మాంసము, (4) మేదస్సు (క్రొవ్వు, వప, మెదడు) (5) మజ్జ (ఎముకలలోని నూనెవంటి, పొడివంటి పదార్థము) (6) బొమికలు (Bones) [6]
కామ క్రోథౌ లోభ మోహౌ
మదో మాత్సర్యమేవ చ
ఏతే అరి షట్కాః। (6)
(అరిషట్ వర్గము)
Ⅻ. అరిషట్ వర్గము : (ఆరు శత్రువర్గములు)
ఇవి జీవునికి ఆత్మానందమునకు, ఆత్మభావనలకు దూరం చేయుటచే ‘శత్రువర్గములు’గా చెప్పబడుచున్నాయి. (1) కామము (Desires & Expectations) (2) క్రోధము (Retaining of Anger and sentiment of Revengefulness) (3) లోభము (Miserly) (4) మోహము (Illusion) (5) మదము (Being Proud) (6) మాత్సర్యము (ఇతరులకు బాధాకరంగా, తక్కువ చేసి వర్తించు స్వభావము (Sadism) [6]
03. విశ్వశ్చ తైజసః ప్రాజ్ఞ ఏవ చ
జీవ త్రయగ్ం। (3)
సత్త్వ రజః తమాగ్ంసి చ
గుణత్రయమ్। (3)
ప్రారబ్ధ ఆగామి ఆర్జితాని
(సంచితాని)
కర్మ త్రయమ్ ఇతీరితమ్। (3)
ⅩⅢ. స్వకీయ త్రి పురుష కారములు
(1) విశ్వుడు (జాగ్రత్ అభిమాని, అనుభవి) (2) తేజసుడు (స్వప్నాభిమాని, స్వప్నానుభవి), (3) ప్రాజ్ఞుడు (సుషుప్త్యభిమాని, సుషుప్త్యనుభవి) [3]

ⅩⅣ. గుణత్రయము : (1) సత్వగుణము, (2) రజోగుణము, (3) తమోగుణము [3]

ⅩⅤ. కర్మ త్రయము :
(1) సంచితము : ఇతఃపూర్వపు అనేక జన్మలలోని కర్మల ఫలముల, సంస్కారముల స్వభావముల, వాసనల సంచయము
(2) ప్రారబ్ధము : వర్తమాన జన్మలో ఫలించటానికి నిర్దేశితమైన కర్మఫలములు, వాసనలు, సంస్కారములు
(3) ఆగామి : సంచితశేషము + వర్తమాన జన్మలోని కర్మఫలములు - వాసనలు, సంస్కారముల ఫలములు -ముందు జన్మకు వెంటవచ్చేవి. [3]
వచన ఆదాన గమన విసర్గ
ఆనంద పంచకమ్। (5)
సంకల్పో అధ్యవసాయశ్చ
అభిమానో అవధారణా,
ⅩⅥ. పంచ కర్మేంద్రియ విషయములు ఆనంద పంచకము
వచనము (speaking) బీ ఆదానము (Hands - functions) బీ గమనము (walking)బీ విసర్గ (Let out)బీ ఆనందము [5]

ⅩⅦ. కల్పనాచతుష్టయము : (1) సంకల్పము (2) అధ్యవసాయము (అభిప్రాయము) (3) అభిమానము (4) అవధారణ (Holding) [4]
ముదితా కరుణా మైత్రీ
ఉపేక్షా చ చతుష్టయమ్।
ⅩⅧ. విషయ సంబంధ చతుష్టయము
(1) ముదితము (సంతోషము పొందటం), (2) కరుణ (Kindness) (3) మైత్రి (4) ఉపేక్షించటము (Ignoring)
దిక్, వాతా, అర్క, ప్రచేతో, అశ్వి,
వహ్ని, ఇంద్ర, ఉపేంద్ర, మృత్యుకాః,
తథా చంద్ర, చతుర్వక్త్రో,
రుద్రః, క్షేత్రజ్ఞ, ఈశ్వరాః
ఆహత్య తత్త్వజాతానాం
ⅩⅨ. ప్రకృతి (బాహ్య జగత్) తత్త్వములు
(1) దిక్కులు, (2) వాయువు), (3) అర్క(సూర్యుడు), (4) ప్రచోతుడు (వరుణుడు), (5) అశ్వినీదేవతలు, (6) అగ్ని, (7) ఇంద్రియాధినేత - ఇంద్రుడు, (8) ఉపేంద్రుడు, (9) మృత్యుదేవత, (10) చంద్రుడు, (11) చతుర్వక్త్రుడగు బ్రహ్మ, (12) రుద్రుడు, (13) క్షేత్రజ్ఞుడు (knower), (14) ఈశ్వరుడు.
షణ్ణవత్ యస్తు (96)
కీర్తితాః।
తత్వజ్ఞానులగు మహనీయులు ఈ (96) తత్త్వములను జీవుని సంబంధితమైనవిగా చెప్పుకొస్తున్నారు.
పూర్వోక్త తత్త్వజాతానాం వై
లక్షణ్యమ్ అనామయమ్।
వరాహరూపిణం మాం
యే భజంతి మయి భక్తితః,
విముక్త అజ్ఞాన తత్కార్యా,
‘జీవన్ముక్తా’ భవంతి తే।
ఎవ్వరైతే ఇప్పుడు చెప్పుకొన్న ‘96’ తత్త్వములు ఎరిగియున్నవారై ఉంటారో, వారు ‘అహమ్’ గురించి ఎరుగగలరు.
నేను ఎట్టివాడను?
❆ వీటన్నిటికంటే విలక్షణమైనట్టిది, సర్వ విషయములకు అతీతమైనట్టిది, నిర్విషయమైనట్టిది అగువాడను.
❆ ఈ కల్పితమగు వరాహ రూపమునకు సంప్రదర్శకుడను, కేవాలత్మరూపిని.
ఈవిధంగా ఎవ్వరైతే నన్ను భక్తితో భజిస్తారో, అట్టివారు అజ్ఞానమునుండి, అజ్ఞాన కార్య -కారణముల నుండి విముక్తులై జీవన్ముక్తులు - అగుచున్నారు.
యే షణ్ణవతి (96) తత్త్వజ్ఞా, యత్ర-కుత్ర ఆశ్రమే రతాః,
జటీ ముండీ శిఖీవాఽపి ముచ్యతే,
న అత్ర సగ్ంశయ। ఇతి।।

ఇతి ప్రథమోఽధ్యాయః।।
ఈ విధంగా 96 తత్త్వములను ఎరిగి ఎవరు వాటన్నిటికీ ఆవల కేవలమగు నన్ను ఆశ్రయిస్తారో - అట్టివారు జటీ-జటాధారులైనా (లేక) ముండీ-శిఖధరించినవారైనా, (లేక) శిఖ ధరించనివారైనా సరే…, ఏ ‘ఆశ్రమములకు’ సంబంధించనట్టి నన్ను ఎరిగినవారై, సంసార బంధములనుండి విముక్తులగుచున్నారు. ఇందులో సందేహం లేదు.

ఇతి ప్రథమోఽధ్యాయః।।

ద్వితీయ అధ్యాయము - ఆత్మ నిష్ఠ

01. ఋభుః నామ మహాయోగీ
క్రోడరూపం రమాపతిమ్, వరిష్ఠామ్! -
బ్రహ్మవిద్యాం త్వమ్ అధీహి, భగవన్! మమ।
ఏవగ్ం సపృష్టో, భగవాన్
ప్రాహ భక్తార్తి భంజనః।।
మహాయోగియగు ఋభుమునీంద్రుడు (వరాహరూపుడగు రమాపతితో) : ‘‘స్వామీ! భగవాన్! నాకు బ్రహ్మవిద్యను ఇంకా కూడా బోధించండి!…’’ అని అడిగారు.
అప్పుడు భక్తుల ఆర్తిని తొలగించు స్వభావియగు శ్రీ ఆది వరాహమూర్తి ఇంకా ఇట్లా చెప్పసాగారు.
స్వవర్ణాశ్రమ ధర్మేణ, తపసా,
గురుతోషణాత్,
సాధనం ప్రభవేత్ పుగ్ంసాం
వైరాగ్యాది చతుష్టయమ్।
నిత్య - అనిత్య వివేకశ్చ,
ఇహ - ఆముత్ర విరాగతా,
‘శమ’ ఆది షట్క సంపత్తిః
ముముక్షా తాం తు సమభ్యపేత్।।
శ్రీ వరాహస్వామి : బ్రహ్మచారి, గృహస్థ - వానప్రస్థ - సన్న్యాస ఆశ్రమములలో తానున్న ఆశ్రమ ధర్మమును చక్కగా నిర్వర్తించి, తపస్సు నిర్వర్తించి గురుసేవ చేస్తూ ఉండగా, అట్టి సాధనలచే ఈ జీవుడు వైరాగ్యము మొదలైన ‘‘సాధనచతుష్టయము’’ సిద్ధించుకోగలడు.

సాధనచతుష్టయము
(1) దృశ్య విషయములపట్ల, నామ రూపముల పట్ల రాగమును (Attachment) తొలగించుకొని విరాగి అవటము - వైరాగ్యము.
(2) ఏది నిత్యమో, ఏది అనిత్యమో గమనించు బుద్ధిని వృద్ధిపరచుకోవటము - నిత్యానిత్య వివేకము.
(3) ఇహ ఆముత్ర (ఊర్థ్వలోక విషయముల పట్ల) రక్తిలేకపోవటము - ఫలభోగ నిరసన. (మరియు) గురు ఆశ్రయము.
(4) శమము (శాంతి), దమము (బాహ్యేంద్రియ నిగ్రహము) మొదలైనవి - శమాది షట్క సంపత్తిలను చక్కగా అభ్యసించటము.
ఏవం జితేంద్రియో భూత్వా
సర్వత్ర మమతా మతిమ్ విహాయ
సాక్షి చైతన్యే మయి కుర్యాత్ అహం మతిమ్।।
ఇంద్రియములను, విషయభేదములను జయించును గాక. సర్వత్రా - ‘‘నేను దీనికి చెందినవాడను. ఇది నాకు చెందినది’’ అను మమకారమును వదిలి ఉండునుగాక! ‘మమతామతి’ని అధిగమించి, ‘అహం మతి’ని ఆశ్రయించును గాక! జితేంద్రియుడై, విషయములపట్ల, దృశ్యము పట్ల మమకారము, వదలి - తనయందలి సాక్షి చైత్య స్వరూపుడనైయున్న నాపట్ల ‘అహం’ మతిని (స్వామియే నాయందు నేనుగా ఉన్నారు - అని జగదతీత నిర్మల బుద్ధిని) పెంపొందించుకొనును గాక.
దుర్లభం ప్రాప్య మానుష్యం,
తత్రాపి నర విగ్రహం,
బ్రాహ్మణ్యం చ మహా విష్ణోః
వేదాంత శ్రవణాదినా,
‘‘అతివర్ణాశ్రమం రూపమ్,
సత్-చిత్-ఆనంద లక్షణమ్,
-యో న జానాతి, సో అవిద్వాన్
కదా ముక్తో భవిష్యతి?
ఓ ఋభూ!
⌘ దుర్లభమగు మానవ జన్మను పొంది,
⌘ అందులో కూడా-ఇంద్రియము సమర్థముగా పనిచేయు ‘నరవిగ్రహము’ (పురుషకారము) పొంది, (సామర్థ్యము గల మానవ దేహము పొంది),
⌘ ఇంకా కూడా ‘బ్రహ్మము’ గురించిన పాఠ్యాంశములు గల ‘బ్రాహ్మణ్యము’-అనే అవకాశము కలిగియుండి శాస్త్ర విద్వాంసుడై కూడా…,
ఇప్పుడిక వేదాంతశ్రవణము (తెలుసుకొనుచున్నవానిని తెలుసుకోవటం, ఉపనిషత్ సాహిత్యము) మొదలైన అవకాశములను ఉపయోగించు కోకపోతే ఎట్లా?
వర్ణాశ్రమములకు అతీతమైనది (సంబంధించనిది), సత్ - చిత్ - ఆనంద లక్షణ సమన్వితమ్ అగు తనయందలి ‘ఆత్మతత్త్వము’ తెలుసుకోవటానికి ప్రయత్నించకపోతే ఈ జీవునికి ముక్తి లభించేది ఎట్లా? అందుచేత జీవుడు ఆలోచించాలి. జీవితమును ‘ముక్తి’ కొరకై సద్వినియోగ పరచుకోవాలి.
అహమేవ సుఖం,
న అన్యత్! అన్యచ్చేత్ నైవ
తత్ సుఖమ్।
ఓ ఋభు మహాతపోధనా! నేను సర్వజీవులలోను సమస్వరూపుడనై సర్వదా, సర్వత్రా సర్వముగా ‘వేంచేసి’యే ఉన్నాను. అట్టి కేవలమగు ‘అహమ్’ స్వరూపుడనైయున్న నన్ను ఆశ్రయించుటచేతనే - ఈ జీవుడు నిత్యమగు సుఖము పొందగలగుతాడు. అనన్యుడగు నన్ను ఏమరిచి, అన్యమైన దేనిని ఆశ్రయించినా కూడా అది ఆతనికి సుఖముకాదు. అన్యమైన దేనిలోనూ సుఖము లేదు. అనన్యుడనగు నన్ను ఆశ్రయించుటయే సుఖప్రదము.
అమదర్థం నహి ప్రేయో,
మదర్థం న స్వతః ప్రియమ్।
పర ప్రేమాస్పదతయా,
మా న భూవమ్ అహగ్ం సదా।
భూయాసమ్ ఇతి యో దృష్టః
సోఽహం విష్ణుః, మునీశ్వర!
ఓ మునీశ్వరా! ఈ జీవునికి అంతరాత్మ స్వరూపుడనైన నన్ను పొందు ఆశయముతో కాకుండా, లౌకికమైన ప్రయోజనములకొరకై చేయు కర్మలు ప్రియమైనవి కావు. అవన్నీ అప్రియమైన ప్రయోజనములే అగుచున్నాయి.
‘‘వ్యష్టిగత అభీష్ఠములకు పరిమితుడనై, వాటి కొరకై నేను కర్మలు నిర్వర్తిస్తాను’’ అని ఉద్దేశ్యించువానికి, ఆ కర్మల ఫలములు స్వతఃగా ప్రియము కాదు. వాస్తవానికి నేనే ఆతనియొక్క ప్రియ వస్తువును.
నేనే నీయందు పరప్రేమాస్పదుడను. అందుచేత వ్యష్టిగత అహంకారము నకు లోను అవకుండా ఆత్మగత దృష్టితో కర్మలు నిర్వర్తించెదవు గాక!
‘నాయందు నేనైన నేనే ఈ సర్వ జీవులు, ఈ సమస్త జగత్తూ కూడా’ అను ‘‘సోఽహమ్ విష్ణుభావము’’ను ఆశ్రయించుచుండెదవు గాక!
‘‘న ప్రకాశో అహమ్!’’ ఇత్యుక్తిః
యత్ ప్రకాశైక బంధనా।
స్వప్రకాశం తమ్ ఆత్మానమ్।
అప్రకాశః కథం స్పృశేత్?
స్వయం భాతం నిరాధారం
యే జానంతి సునిశ్చితమ్,
తే హి విజ్ఞాన సంపన్నా,
ఇతి మే నిశ్చితా మతిః।
‘నాకు పరమాత్మ ప్రకాశకుడు అవటంలేదు’ అని తలచుచున్నది ఎవరి గురించి? స్వస్వరూపమగు ఆత్మగురించియే. జీవాత్మ - జగత్తులతో సహా, పైన చెప్పుకొన్న ‘96’ తత్త్వములను ప్రకాశింపజేయుచున్న ‘ఆత్మప్రకాశము’ను గమనించకపోవటమే - ఈ జీవునిపట్ల ‘బంధము’గా అగుచున్నది.
ఈ జీవుని సహజ స్వరూపమగు ‘ఆత్మ’ సర్వదా స్వయంప్రకాశకమై యుండగా, ఆత్మయొక్క తేజస్సుచే వెలగించబడుచూ, స్వయం ప్రకాశకములు కానట్టి - జ్ఞానేంద్రియ - కర్మేంద్రియ - శబ్దాది, విషయాది పంచకములు, అంతరింద్రియ చతుష్కము, పంచభూతములు, షట్ కోశములు, బాహ్యతత్త్వములు మొదలైనవి ఆత్మను ఎట్లా స్పృశిస్తాయి? (సూర్యకిరణములు పడుచున్న వస్తువులు సూర్యుని ప్రకాశింపజేయటమనే ప్రసక్తి ఎక్కడిది?)
స్వయం ప్రకాశస్వరూపమైనది, దేనిపై ఆధారము కలిగియుండక నిరాధారమైనట్టిది అగు సహజ - స్వస్వరూపాత్మ గురించి - సునిశ్చితంగా ఎరిగినవాడే ‘విజ్ఞాన-సంపన్నుడు’ - అని నా నిశ్చయము.
స్వపూర్ణాత్మాతిరేకేణ
జగత్-జీవ-ఈశ్వర ఆదయః
న సంతి। నాస్తి మాయా చ।
తేభ్యశ్చ అహం విలక్షణః।।
అజ్ఞానాంధ తమో రూపం
కర్మ, ధర్మ - ఆది లక్షణమ్
స్వయం ప్రకాశమ్ ఆత్మానం
నై వ మాం స్ప్రష్టుమ్ అర్హతి।
స్వయం పూర్ణాత్మ స్వరూపుడనైయున్న నాకు వేరుగా జగత్తు లేదు. జీవుడు లేడు. ఈశ్వరుడు లేడు. మాయ లేదు. అయితే వాటన్నిటికీ నేను నేనుగా విలక్షుణడనై ఉన్నాను. (కథా రచయిత కథకు వేరుగా ఉన్నట్లు, కానీ కథ ఆతనికి అనన్యమైనట్లు, చిత్రలేఖనము చిత్రకారునికి వేరు కాకపోయినా, చిత్రకారుడు సర్వదా వేరే అయి ఉన్నట్లు) - నేను సర్వమునకు విలక్షుణుడనై సర్వగతమమై ఉన్నాను.
కర్మ వ్యవహారములు, ధర్మ వ్యవహారములు పుణ్య - పాపములు మొదలైనవన్నీ కూడా అజ్ఞానాంధ తమోరూపములు. స్వయంప్రకాశుడగు సూర్యుని చీకటి ఆవరించగలదా? లేదు కదా! అట్లాడే స్వయంప్రకాశ - ఆత్మరూపుడనగు నన్ను కర్మ-ధర్మ-పుణ్య-పాప - ఇంద్రియ - జన్మ -జీవన-మరణ-ఈశ్వరాది వ్యవహారములు స్పృశించలేవు. కప్పి ఉంచ జాలవు. (అట్లాగే, నీ ఆత్మస్వరూపమును - అవేవి స్పృశించలేవు).
సర్వసాక్షిణమ్ ఆత్మానం,
వర్ణాశ్రమ వివర్జితమ్।
బ్రహ్మరూపతయా పశ్యన్,
బ్రహ్మైవ భవతి స్వయమ్।।
మహాశయా! ఈ జీవుడు ‘‘ఆత్మ స్వరూపమగు బ్రహ్మమే’’ అయి ఉన్నాడు. స్వస్వరూపమే అయి ఉన్న ఆత్మను -
❋ సర్వమునకు (96 తత్త్వములకు) కేవల సాక్షిగాను,
❋ వర్ణాశ్రమ ధర్మములచే పరిమితము కానట్టిదిగాను,
❋ స్వయముగా కేవలమూ ‘బ్రహ్మమే’ అయి ఉన్నట్లుగాను →
దర్శిస్తూ ఉండగా, ఈ జీవుడు స్వయముగా ‘బ్రహ్మమే’ అగుచున్నాడు.
భాసమానమ్ ఇదగ్ం సర్వం,
భాసరూపం పరం పదమ్।
పశ్యన్ వేదాన్త మానేన
సద్య ఏవ విముచ్యతే।
(సద్యోముక్తి)
ఈ దృశ్య మానమై కనిపిస్తున్న జగత్తులు, జీవుడు, ఇందలి 96 విశేషములు ఇవన్నీ వెలిగించబడుచున్నట్టివి (Passive). ఆత్మయొక్క వెలుగు (Enlightenment)లో కనిపించేవి.
పరమ పదమగు ఆత్మయే సర్వమును వెలిగించు స్వయం ప్రకాశ స్వరూపము (Active). వేదాన్తస్వరూపము. తెలుసుకుంటూ ఉన్నట్టి, ద్రష్టను కూడా నియమించునట్టి దృక్ స్వరూపము (స్వప్నము తనదైనవాడు స్వప్నమును - స్వప్నములోచూచు వానిని నియమించుతీరుగా)
ఈ సత్యమును వేదాంత శాస్త్ర ప్రమాణమును దర్శించుచున్నవాడు ‘సద్యోముక్తుడు’. అనగా ఇప్పటికిప్పుడే ముక్తుడు.
దేహాత్మజ్ఞానవద్ జ్ఞానం
దేహాత్మజ్ఞాన బాధకమ్,
ఆత్మన్యేవ భవేత్ యస్య
స న ఇచ్ఛన్నపి ముచ్యతే।।
‘దేహమే నేను. ఈ దేహమునకు సంబంధించిన ఇంద్రియ విషయములచే నేను పరిమితుడను’-అనునదే దేహాత్మజ్ఞానము. పరాత్మజ్ఞానముచే ‘దేహాత్మజ్ఞానము’ బాధించబడుతోంది. ఎవ్వడు ‘నేను కేవలమగు ఆత్మను’ అను భావన / ఎరుకను ఆశ్రయించి ఉంటాడో, అట్టివాడు తాను కోరనప్పటికీ - సర్వసంసార బంధములనుండి విముచ్యుడు, విముక్తుడు కాగలడు. ‘‘నేను దేహిని. దేహమును కాను’’ - అను అభ్యాసముచే ఈ జీవుడు ముక్తుడు కాగలడు.
సత్యజ్ఞానానంద పూర్ణ లక్షణం
తమసః పరమ్,
బ్రహ్మానందగ్ం సదా పశ్యన్,
కథం బధ్యేత కర్మణా?
ఆత్మ-పరిమిత జ్ఞానానంధకారమునకు ఆవల (ప్రాపంచక పరిమిత జ్ఞానమునకు ఆవల) సత్య (ఉనికి) - జ్ఞాన (ఎరుక) - ఆనంద (అనుభూతి) - కేవల స్వరూపమై, పూర్ణలక్షణయుక్తమై - యున్నది.
ఈ జగత్తును, నీవు-నేనులను కూడా బ్రహ్మానంద స్వరూపముగా ఎల్లప్పుడూ దర్శించు వాడు - ఇక కర్మ - కర్మ ఫలములకు బద్ధుడు ఎట్లా అవుతాడు? అవడు.
02. త్రిధామ సాక్షిణగ్ం
సత్య-జ్ఞాన-ఆనందాది లక్షణమ్,
త్వం-అహగ్ం శబ్దలక్ష్యార్థం
అసక్తగ్ం సర్వ దోషతః।
జ్ఞానచక్షువులు: ఆత్మ ఎటువంటిదంటే - ‘జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు కేవలము సాక్షి అయి ఉన్నట్టిది. సత్య జ్ఞానానందము మొదలైనవి స్వభావ లక్షణములుగా కలిగి ఉన్నట్టిది. ‘‘త్వమ్-అహమ్’’ అను శబ్దముల ‘‘లక్ష్యార్థము’’ అయి ఉన్నట్టిది. మనో బుద్ధి-చిత్తముల దోషములచే స్పృశించబడక, దేనితోను సక్తత (Attachment) లేనట్టిది. నిర్మలమైనట్టిది.
సర్వగగ్ం సత్ - చిత్ ఆత్మానం
జ్ఞాన చక్షుః నిరీక్ష్యతే।
అజ్ఞాన చక్షుః న ఈక్షేత, భాస్వంతం
భానుమ్ అంధవత్।।
సర్వత్ర విస్తరించి - అంతా తానే అయినట్టిది, ‘ఆత్మ’యే ఈకనబడేదంతా! ‘‘అట్టి ఆత్మయే నేను! నేనే ఇదంతా అయి (ఆభరణమునకు బంగారమువలే) వేరై ఉన్నాను’’ అనునది ‘జ్ఞానచక్షువులు’ కలవాడు దర్శించుచున్నాడు.
అజ్ఞాన చక్షువులతో ఈ జగత్తును చూచువాడు ఈ సమస్తమును ఆత్మగా దర్శించలేడు. గ్రుడ్డివాడు సూర్య తేజస్సును చూడగలడా? ఇదీ అంతే.
ప్రజ్ఞానమ్ ఏవ తత్‌బ్రహ్మ।
‘సత్య’ - ‘ప్రజ్ఞాన’ లక్షణమ్।
బ్రహ్మము అనగా ఏది?
ఈ జీవుడు సత్ (ఉనికి), ప్రజ్ఞ (వరుక) కలిగియే ఉన్నాడు కదా! అట్టి సత్య-ప్రజ్ఞానలక్షణమగు, తెలియబడే అంతటికీ, విలక్షణమైన ప్రజ్ఞ (The Absolute Form of knowing)యే బ్రహ్మము. అంతేగాని బ్రహ్మము నీకంటే, నాకంటే వేరుగా ఎక్కడో లేదు. (‘‘కేవలమగు తెలివి’’యే బ్రహ్మము)
ఏవం బ్రహ్మ పరిజ్ఞానాత్ ఏవ
మర్త్యో అమృతో భవేత్।
తత్ ‘బ్రహ్మానందమ్’
అద్వంద్వం, నిర్గుణమ్,
సత్య, (నిత్య) చిద్ఘనమ్
విదిత్వా ‘స్వాత్మనో రూపం’
న బిభేతి కుతశ్చన।
అట్టి సత్య - ప్రజ్ఞాన లక్షణ కేవల స్వస్వరూపమగు బ్రహ్మమును ఎవ్వడు ఇప్పుడే ఇక్కడే తెలుసుకొంటాడో, అట్టి మానవుడు (మర్త్యుడు) ఇప్పుడే ఇక్కడే అమృతస్వరూపుడు (మృతికి విషయమే కానివాడు) అగుచున్నాడు.
ఆనంద లక్షణ సమన్వితమగునదే బ్రహ్మము (బ్రహ్మానందము). వేరుగా కనిపించేదంతా తానే అయినట్టి అద్వంద్వము (అద్వితీయము). త్రిగుణములకు జననస్థానమైయుండి కూడా త్రిగుణాతీతమై గుణ రహితమై, నిర్గుణమై ఉన్నట్టిది. తదితరమైయున్నదంతా బ్రహ్మమునందు కల్పనామాత్రము, అసత్యము, అయి ఉండగా, బ్రహ్మము మాత్రమే సత్యము. ఈ దృశ్య వ్యవహారమంతా అనిత్యమైయుండగా (ఆత్మగా) తాను మాత్రమే నిత్యము. ఘనీభూత కేవల చిత్ (ఎరుక) స్వరూపము. ‘‘బ్రహ్మము అనగా ఆత్మనగు నేనే, నా ఆత్మయే! ఇదంతా కూడా నాలోని నేనైన నేనే’’ అని ఎరిగినవాడు, ఇక దేనికీ భయము పొందడు.
చిన్మాత్రగ్ం సర్వగం నిత్యం
సంపూర్ణమ్ సుఖమ్ అవ్యయమ్
‘సాక్షాత్ బ్రహ్మైవ।
న అన్యో అస్తి।’
ఇత్యేవం బ్రహ్మవిదాం స్థితిః।।
బ్రహ్మమును ఎరిగిన బ్రహ్మవేత్త (లేక) బ్రహ్మవిదుడు → ‘‘చిత్‌మాత్రము, సర్వగము, నిత్యము, సంపూర్ణము, సుఖప్రదము, అవ్యయము - అగు బ్రహ్మము మాత్రమే ఉన్నది. బ్రహ్మమున అన్యమై (వేరై) ఎక్కడా ఏదీ లేదు’’ → అను భావన, అవగాహన, అనుభూతి, అనుభవముల యందు - సంస్థితుడై ఉంటున్నాడు.
అజ్ఞస్య దుఃఖౌఘమయం,
జ్ఞస్య-ఆనందమయం జగత్।
అంధం భువనమ్ అంధస్య।
ప్రకాశంతు సుచక్షుషామ్।।
ఆత్మ గురించి తెలియనివానికి ఈ దృశ్యమంతా అనేక దుఃఖములతో, దోషములతో అనుభవమవుతోంది. బ్రహ్మమును ఎరిగిన విజ్ఞునికి (ఆత్మజ్ఞానికి) ఇదే జగత్తు నిత్య ఆనందమయమై అనుభూతమౌతోంది.
ఎట్లాగంటే (దృష్టాంతంగా) - గుడ్డివానికి ఈ దృశ్యమంతా చీకటిమయం గాను, చక్కటి చూపుగలవానికి ప్రకాశవంతంగానూ కనబడుతీరుగా!
అనంతే చిద్ఘనానందే
మయి వారాహరూపిణి
స్థితే అద్వితీయ భావస్స్యాత్
కో బంధః? కస్య ముచ్యతే?
ఓ ఋభూ! నీవు నాయొక్క ఏ వారాహరూపము గురించి సుదీర్ఘంగా తపస్సు చేసి ఉన్నావో, అట్టి అనంతము, చిద్ఘనానంద మయము అగు వారాహ రూపము నీవే అయి ఉన్నావు. నేనే నీవు! నీవు నేనే! ఇప్పడు చెప్పు. బంధము అనగా ఏమి? బంధము ఎవరికి? నీవు ఆత్మవే! ఆత్మకు బంధము లేదు. కనుక నీకు బంధమనునదే లేదు. ఈ జీవాత్మత్వము నీయొక్క ‘కల్పిత-అంశ’ - మాత్రమే. కల్పనకు బంధముండటమేమిటి? నాటకంలోని పాత్రకు బంధమేమి? మోక్షమేమి?
స్వస్వరూపం తు చిన్మాత్రగ్ం
సర్వదా సర్వదేహినామ్,
నైవ దేహాది సంఘాతో
ఘటవత్ దృశి గోచరః।
బ్రహ్మము అనగా నాయొక్క సర్వసాక్షియగు స్వస్వరూపమే! అట్టి చిన్మాత్రమగు (కేవల ఎరుక రూపమగు, ప్రకాశింపజేయు) స్వస్వరూపము సర్వదా సర్వదేహి స్వరూపమైయున్నది. అట్టి స్వస్వరూపమునకు దేహములు మొదలైన వాటితో సంఘాతమే లేదు. మట్టి నిరాకారమై యుండగా, మట్టితో కుండను తయారు చేసినంత మాత్రంచేత మట్టి కుండలతో సంఘాతము పొందినట్లు అవుతుందా? అవదు కదా!
స్వాత్మనో అన్యతయా
భాతం,….చరాచరమ్
ఇదమ్ జగత్।
స్వాత్మమాత్ర తయా బుద్ధ్వా,
‘తత్ అస్మి’’ ఇతి విభావయ।
స్వస్వరూపగ్ం స్వయం భుంక్తే
నాస్తి భోజ్యం పృథక్ స్వతః।
స్వాత్మ (స్వకీయ ఆత్మ చైతన్యము) తనకు తానే అనన్యమై కూడా, ఈ చరాచర జగత్తును - అన్యమైన దానివలే వెలిగిస్తోంది. అనగా, ఈ చరాచర జగత్తుగా కనిపించేదంతా స్వాత్మకు వేరు కాదు. కథలోని పాత్రల విన్యాసమంతా ఆ కథా రచయితకు వేరు కాదు కదా! కానీ, ఆ రచయిత సర్వదా వేరే కదా!)
ఇదంతా స్వాత్మ మాత్రమే! అట్టి స్వాత్మగా ప్రకాశించునది, ప్రకాశింప బడునది కూడా నేనే! ఈ విధంగా ‘ఈ దృశ్యజగత్తంతా స్వస్వరూపమే’ అని బుద్ధితో తెలుసుకుంటూ ఆస్వాదించు వానికి - ఇక తనకు వేరైన భోజ్యము (అనుభవించబడునది) ఎక్కడ ఉంటుంది? స్వతఃగా ఉండదు. భోగించబడునదంతా ఆత్మస్వరూపమే! ఆత్మ సర్వదా అనన్యము కదా!
(పృథక్) అస్తిచేత్ అస్తితా రూపం
బ్రహ్మైవ అస్తిత్వ లక్షణమ్।
బ్రహ్మవిజ్ఞాన సంపన్నః, ప్రతీతమ్ అఖిలమ్ జగత్,
పశ్యన్ అపి, సదా నైవ పశ్యతి స్వాత్మానః పృథక్।
‘ఉన్నది’ - అని దేనినైనా అనుకోవటం జరిగితే ఆ ఉన్నదంతా ఆత్మయొక్క అస్థిత్వ లక్షణమే! ఓ ఋభూ! ఎప్పుడైతే ఈ జీవుడు బ్రహ్మవిజ్ఞాన సంపన్నుడౌతాడో, ఆ మరుక్షణం ‘‘ఈ వేరు వేరుగా కనబడుచున్నదంతా స్వాత్మయే! అనేకంగా కనిపిస్తూ ‘ఒక్కటి’గా అనిపిస్తూ, ఆ ఒక్కటీ నేనే! మమాత్మయే!’’….. అనునది అకృత్రిమ స్వానుభవముగా కలిగి ఉంటున్నాడు.
03. మత్ స్వరూప పరిజ్ఞానాత్
కర్మభిః న స బధ్యతే।
ప్రియ ఋభూ! ఎప్పుడైతే నాయొక్క (లేక నీయొక్క) అఖండ - బ్రహ్మానంద స్వరూపము ‘బాగుగా ఎరుగుట’ జరిగిందో, ఇక ఆపై నీవు కర్మలకు ఏమాత్రము బద్ధుడవు కావు.
యః శరీర - ఇంద్రియాదిభ్యో
విహీనగ్ం సర్వసాక్షిణమ్,
పరమార్థైక విజ్ఞానగ్ం
సుఖాత్మానగ్ం స్వయం ప్రభమ్,
స్వస్వరూపతయా సర్వం
వేద స్వానుభవేన యః,
స ధీరః। సతు విజ్ఞేయః।
సోఽహమ్ తత్త్వం,
ఋభో! భవ।
ఎవ్వడైతే →
→ ఈ శరీరము, ఇంద్రియములు, ఇంద్రియ విషయములు, ఇంద్రియ దృశ్యము… వీటన్నిటికీ ‘సర్వసాక్షి’ అయి
→ సర్వమునకు పరమార్థము (The Final Meaning) అగు ఏకైక విజ్ఞానస్వరూపుడై, స్వయం ప్రకాశకుడై,
స్వయం ప్రభతో, ఈ సమస్తమును పరమసుఖాత్మకమగు స్వస్వరూపముగా ఎరుగుచున్నాడో, స్వభాసిద్ధంగా స్వానుభవం పొందుచున్నాడో, ఆతడే ధీరుడు. తెలుసుకోవలసినది తెలుసుకున్నవాడు. కాబట్టి ఆతడే ‘సవిజ్ఞేయుడు’. ఓ ఋభూ! అట్టి అఖండ సర్వస్వరూప పరమాత్మయే నేను! సోఽహమ్! ‘నీవు’గా కనిపిస్తున్నదంతా అఖంఢ ప్రియాత్మయే! తత్‌త్వమ్’! ఈవిధంగా అనుకుంటూ, అనుకుంటూ - అదియే నీవగుము.
అతః ప్రపంచానుభవః సదా
నహి। స్వరూప బోధానుభవః
సదా ఖలు।
అందుచేత ఓ ఋభు మహాశయా! ఈ పాంచభౌతికమైన ప్రపంచమును ఎప్పుడూ ప్రపంచముగా చూడవద్దు. ఈ దృశ్య జగత్తు పట్ల (స్వప్నము - స్వప్న ద్రష్టస్వరూపములవలె) స్వస్వరూపానుభవిగా అయి ఉండుము.
ఇతి ప్రపశ్యన్ పరిపూర్ణ వేదనో,
న బంధ ముక్తో।
న చ బద్ధ ఏవ తు।
స్వస్వరూపానుసంధానాత్
నృత్యం తగ్ం
సర్వసాక్షిణమ్।
నేనే నీవై ఉండుము! ఇట్టి పరిపూర్ణ స్వరూపము గురించి 1. వినటము, 2. ఎరుగుటము, 3. దర్శనము, 4. అదే నీవటములను - ఆశ్రయించి ఉండు. అప్పుడిక బంధము లేదు. ముక్తియు లేదు. జీవాత్మత్వమంతా నీ అంశయే అయి ఉండగా, ‘బద్ధుడు’ ఎవరు? ఎవరికి బద్ధుడు? నటునికి పాత్ర యొక్క బంధము తనదవదు కదా! స్వస్వరూప - అనుసంధానుడవై, సర్వమునకు సాక్షివై, ఈ జగత్ వ్యవహారమంతా స్వకీయ నటరాజ - తాండవ నృత్యముగా నిర్వర్తించెదవుగాక!
ముహూర్తం చింతయేత్ మాం యః,
సర్వబంధైః ప్రముచ్యతే।
సర్వభూత అంతరస్థాయ,
నిత్యముక్త చిదాత్మనే,
ప్రత్యక్ చైతన్య రూపాయ,
మహ్య మేవ నమో నమః।
త్వం వా అహమస్మి భగవో
దేవతేహం వై త్వమసి।
(అప్రమేయము, నిత్యము, సత్యము, అమృతము అగు) నాయొక్క కేవలానంద-అద్వయ స్వరూపమును ముహూర్త కాలము (12 క్షణముల కాలము) చింతనచేసిన మాత్రం చేతనే నీవు సర్వబంధములనుండి ప్రముచ్యుడవు కాగలవు.
సర్వజీవుల అంతస్థుడను, సర్వాంతర్యామిని, నిత్యముక్తుడను చిదాత్మను ప్రత్యక్ చైతన్యరూపుడను కూడా అగు నా ఆత్మ స్వరూపమునకు నేను నమస్కరిస్తున్నాను.
హే భగవాన్! నీవే నేనై ఉన్నాను. అట్టి నేను సర్వదేవతా స్వరూపడనై ఉన్నాను. అట్టి నేనుగా ఉన్నది నీవే. ఈ సమస్తము నీయొక్క, నాయొక్క అఖండాత్మ సంప్రదర్శనా చమత్కారమే.
తుభ్యం మహ్యం అనంతాయ
మహ్యం తుభ్యం చిదాత్మనే।
నమో మహ్యం పరేశాయ
నమస్తుభ్యగ్ం శివాయ చ।
నీవే నేనై, అనంతుడవై, నేనే నీవై, చిదాత్మస్వరూపడనై ఇరువురము అఖండ రూపులమే। సర్వమునకు పరము, నియామకుడు పరేశ్వరుడు అయి ఉన్న ‘మమాత్మ’కు నమస్కారము. నేనైయున్న పరమశివునికి నా నమస్కారము. నీవై ఉన్న పరమశివునికి నమస్కారము.
కిం కరోమి? క్వ గచ్ఛామి?
కిం గృహ్ణామి? త్యజామి కిం?
యత్ మయా పూరితం విశ్వం
మహాకల్పాంబునా యథా।
ఈ విశ్వమంతా నేనై, ఆత్మస్వరూపుడనై మహాకల్పములన్నీ నిండియున్న నేను ఇంకా క్రొత్తగా ఏమి చేయాలి? సముద్రమంతా జలమయమై యుండగా సమద్ర జలమునకు మరొక చోటికి వెళ్ళటమనేది ఏముంటుంది? తరంగం ఒకచోటి నుండి మరొక చోటికి వెళ్ళినా కూడా సముద్ర జలం ఎక్కడినుండి ఎక్కడికీ వెళ్ళదు కదా। నేను స్వీకరించ వలసినదే ముంటుంది? త్యజించవలసినదేమి? ఇదంతా సర్వదా ఆత్మ స్వరూపుడనగు నాచేతనే నిండియున్నది కదా! ఈ కనబడేదంతా నా కల్పనా తరంగములు. నేను సాగరస్వరూపుడను।
అంతః సంగమ్, బహిః సంగమ్,
ఆత్మసంగం చ యః త్యజేత్,
సర్వ సంగ నివృత్తాత్మా
స మామ్ ఏతి। న సగ్ంశయః।।
అంతఃసంగము, బాహ్య సంగము, జీవాత్మత్వముతో సంగము ఎవ్వడైతే అధిగమించివేస్తాడో అట్టి సర్వసంగములు వదలిన జీవుడు శివుడే అగుచున్నాడు. ఆతడు ఆదివరాహమూర్తియగు నేనే అగుచున్నాను. సందేహం లేదు. నేనే అతడు। ఆతడే నేను. (జ్ఞానేతు ఆత్మైవ మే మతమ్)
అహిః ఇవ జనయోగగ్ం
సర్వదా వర్జయేత్ యః,
కుణపమివ సునారీం
త్యక్త కామో విరాగీ,
విషమివ విషయాదీన్
మన్యమానో, దురాంతాన్ జగతి
పరమ హంసో వాసుదేవో అహమేవ।।
ఎవ్వడైతే….
ఒక ‘పాము’ వలె జనులతో సంసర్గమును సర్వదా త్యజించినవాడై,
ఒక పీనుగ (శవము) వలె సుందర శరీరములపట్ల కామమును త్యజించి, విరాగి అయి, విషయములు మొదలైనవానిని విషమువలె చూచుచూ, జగత్తుతో మనోసంబంధములను దురభ్యాసంగా భావిస్తూ ఉంటాడో, అట్టివాడు (సోఽహం పరమమ్ - ఈ సర్వమునకు పరమైన ఆత్మయే నేను - అను ఎరుకను అనుక్షణం చేసుకొన్న) పరమహంసయే! అందరిలో వసించు వాసుదేవుడే! నేనే సర్వ దేహములలో వసించువాడను. వాసుదేవుడను. ఇటువంటి ఆత్మాఽహమ్ భావన కలవానికి - నాకు భేదమే లేదు.
ఇదం సత్యం। ఇదం సత్యం।
సత్యమ్ ఏతత్ ఇహ ఉచ్యతే।
అహమ్ సత్యమ్ పరం బ్రహ్మ
మత్తః కించిత్ న విద్యతే।।
ఇదంతా ఆత్మయే కాబట్టి సత్యమే। సత్యమే కాబట్టి నిత్యమే। ఆత్మయే ఇదంతాగా విస్తరించి ఉన్నది కదా। ఈ సమస్తముగా ప్రదర్శనమగు చున్నదంతా నేనే। ఆత్మయే। మమాత్మయే। నేను ఆత్మస్వరూపుడను. కనుక సర్వదా సత్యమే। నిత్యమగు పరబ్రహ్మ స్వరూపుడను. అందుచేత ఎక్కడా ఏదీ నాకు వేరై లేదు. సత్యము కానిది లేదు.
ఉపసమీపే యో వాసో
జీవాత్మ పరమాత్మనోః
ఉపవాసః స విజ్ఞేయో।
నతు కాయస్య శోషణమ్।।
ఉపవాసము : ఎవ్వరు జీవాత్మ-పరమాత్మల ఏకత్వము (అఖండత్వము)తో సామీప్యతను కలిగి ఉంటారో అట్టి ఏకత్వభావన, ఎరుకయే ఉపవాసము. అంతేగాని, ఆహారము స్వీకరించకుండా దేహమును శోషింపజేయుటము ఉపవాసము కాదు.
కాయ శోషణ మాత్రేణ
కా తత్ర హి అవివేకినామ్?
వల్మీక తాడనాత్ ఏవ
మృతః కిన్ను మహోరగః?
ఆహారము మానివేసి దేహమును శోషింపచేసినంతమాత్రముచేత ఆ అవివేకికి ‘సోఽహమ్ అనుక్షణికబుద్ధి రూపమగు అనినిత్యానుభవం’ లభిస్తుందా? లేదు. పుట్టపై కర్రతో కొట్టినంత మాత్రం చేత పుట్టలోని పాము చస్తుందా? లేదు కదా! ఇదీ అంతే!
‘అస్తి బ్రహ్మ’ ఇతి చేత్ వేద
‘పరోక్షజ్ఞానమ్’ ఏవ తత్।
‘అహం బ్రహ్మ’ ఇతి చేత్ వేద
‘సాక్షాత్కారః’ స ఉచ్యతే।
బ్రహ్మము ఉన్నది’ అని తెలుసుకోవటము - అదంతా పరోక్షజ్ఞానము (Just like knowing as third person)
‘‘ ‘ఆ బ్రహ్మము’ అనబడునది నేనే అయిఉన్నాను’’ - అని తెలుసుకొంటేనే అది ‘సాక్షాత్కారము’ అనబడుచున్నది. ఆత్మగా ఆత్మను దర్శించటమే ఆత్మసాక్షాత్‌కారం. (స-అక్షాత్‌కారమ్)! (Knowing as first person)
04. యస్మిన్ కాలే స్వమాత్మానం, యోగీ జానాతి కేవలమ్,
తస్మాత్ కాలాత్ సమారభ్య, ‘జీవన్ముక్తో’ భవిత్యసౌ।
‘అహమ్ బ్రహ్మ’ ఇతి నియతం మోక్షహేతుః మహాత్మనామ్।
ఏ సమయమందైతే యోగి కేవలమగు స్వస్వరూపమే అయి ఉన్న స్వాత్మయొక్క స్వాభావిక ఔన్నత్యమును ఎరిగినవాడౌతాడో, అప్పుడే ఆ యోగి జీవన్ముక్తుడు.
‘అహమ్ బ్రహ్మాస్మి! నేనే బ్రహ్మమును’ అను నియతియే (స్వకీయ నిర్ణయమే) - మహాత్ములచే మోక్షహేతువుగా చెప్పబడుచున్నది.
ద్వేపదే బంధ మోక్షాయ-
‘నిర్మమేతి!’ ‘మమేతి చ’।
మమేతి బధ్యతే జంతుః।
నిర్మమేతి విముచ్యతే।
బంధ మోక్షములకు రెండు మార్గములు. (1) మమ (మమకారము) (2) నిర్మమమ (మమకార రాహిత్యము - నిర్మమకారము).
‘‘నాది - నాకు చెందినది’ అను భావనచే ఈ జీవునికి ‘బంధము’ ఏర్పడుచున్నది.
‘నిర్మమ’ (ఏదీ నాకు చెంది లేదు) అను భావముచే బంధవిముక్తి సిద్ధిస్తోంది.
బాహ్య చింతా న కర్తవ్యా,
తథైవ అంతర చింతికా,
సర్వ చింతాం సముత్మృజ్య, స్వస్థో భవ సదా, ఋభో!
సంకల్ప మాత్ర కలనేన జగత్ సమగ్రం।
సంకల్పమాత్ర కలనే హి జగత్ విలాసః।
ఓ ఋభు మహాశయా! మునీశ్వరా! బాహ్య చింతనల కర్తృత్వము వదలివేయి. అట్లాగే క్రమంగా అంతర - చింతనలను కూడా వదలాలి. సర్వచింతనలు మొదలంట్లా వదలినవాడవగుము. స్వస్థుడవగుము.
సంకల్ప రూపంగానే (సంకల్పించుట చేతనే) ఈ జగత్తు అంతా ఏర్పడినది అగుచున్నది. ఈ జగత్-విలాసమంతా స్వకీయ కల్పనా మాత్రమే!
సంకల్ప సూత్రం ఇదం ఉత్సృజ।
‘నిర్వికల్పమ్’ ఆశ్రిత్య
మామక పదగ్ం హృది భావయస్వ।।
ఈ జగత్ విలాసమంతా సంకల్పములనుండే బయల్వెడలుతోంది. అందుచేత ఓ ప్రియమునీశ్వరా! ‘సంకల్పించటము’ అనే సూత్రపు త్రాడును వదలి ‘నిర్వికల్పము’ను ఆశ్రయించు. హృదయమునందు నా స్థానమును భావన చేయి. అట్టి స్వస్థానమునందు ఈ సర్వమును స్వకీయ ‘కథాకల్పన’ వలె దర్శించు.
మత్ చింతనం, మత్ కథనమ్,
అన్యోన్యం మత్ ప్రభాషణమ్,
మదేక పరమో భూత్వా
కాలం నయ, మహామతే!
ఓ మహామతీ! ఆత్మానంద స్వరూపుడను, ప్రకృతిగా మూర్తీభవించిన అవతార మూర్తిని అగు నా గురించి చింతన, నా గురించిన కథనములు వినటము, నా గురించి ఒకరికొకరు సంభాషించుకోవటము, నన్నే పరము(Final State)గా, మహదాశయముగా కలిగియుండటము - ఈ విధంగా నిర్వర్తిస్తూ కాలమును గడుపుచుండెదవుగాక!
చిత్ ఇహ అస్తి-ఇతి చిన్మాత్రం।
ఇదం చిన్మయమేవ చ।
చిత్ ‘త్వమ్’। చిత్ ‘అహమ్’।
ఏతే చ ‘లోకాః’ చిత్ - ఇతి భావయ।
రాగం నీరాగతాం నీత్వా
నిర్లేపో భవ సర్వదా।
చిత్ ఇక్కడే ఉన్నది. ఇదంతా కూడా చిత్ స్వరూపమే అయి ఉన్నది. ఈ కనబడేదంతా చిన్మయమే! స్వకీయమగు ‘ఎరుక’ యొక్క విస్తరణ చమత్కారమే!
‘‘నీవు చిత్ స్వరూపుడవే! నేను చిత్ స్వరూపుడనే! ఈ లోకము చిత్ స్వరూపమే’’ - అని భావించెదవుగాక!
పరిమిత రాగమును త్యజించి సర్వత్రా అనురాగంగా రూపము దిద్దుకో. సర్వదా సర్వత్రా నిర్లేపుడవు (విషయాతీతుడవు) అయి ఉండెదవు గాక!
అజ్ఞాన జన్య ‘కర్తృ’ - ఆది
‘కారకా’ ఉత్పన్న కర్మణా,
శ్రుతి ఉత్పన్న
ఆత్మవిజ్ఞాన
ప్రదీపో బాధ్యతే కథమ్?
ఆత్మ సర్వదా పరము అయి ఉన్నది. అది జ్ఞాన-అజ్ఞానములకు సంబంధితమై, పరిమితమై ఉండునది కాదు. కర్తృత్వ భోక్తృత్వములచే బాధించబడేది కాదు.
అజ్ఞానముచే జనించే కర్తృత్వ - కార్య - కారణముల వ్యవహారము - ‘‘శ్రుతులచే నిర్వచింపబడుచున్న ఆత్మ విజ్ఞాన ప్రదీపము’’ను బాధించగలదా? లేదు. దీపమునకు వస్తు సంబంధము లేనట్లే ఆత్మకు కర్తృత్వ - భోక్తృత్వ-కార్యకారణ సంబంధమైనది లేదు. (తద్వారా పొందబడేది) కాదు. ఆత్మ సర్వదా సిద్ధించినదే అయి ఉన్నది.
అనాత్మతాం పరిత్యజ్య
నిర్వికారో జగత్ స్థితౌ,
ఏకనిష్ఠతయా అంతస్థ
సంవిన్మాత్ర (సత్‌విత్‌మాత్ర) పరో భవ।
మరి ఆత్మజ్ఞానానుభవానందమునకు ఉపాయం ఏమిటి? ‘ఆత్మకు ఇది వేరు’ అను అనాత్మత్వమును పరిత్యజించి జగత్తులో నిర్వికారముగా ఉంటూ, ఏకైక నిష్ఠ(The only objective, The only determination)తో సంవిన్మాత్రపరుడవగుము.
ఘటాకాశ మఠాకాశౌ
మహాకాశే ప్రతిష్ఠితౌ,
ఏవం మయి చిదాకాశే
జీవ - ఈశౌ పరికల్పితౌ।
యా చ ప్రాక్ ఆత్మనో మాయా
తథా అంతేత చ తిరస్కృతా।
ఆకాశము (Space) సర్వదా ఏకము, అఖండము అయినప్పటికీ లోకంలో…
ఇది కుండలోని ఆకాశము
ఇది గృహములోని ఆకాశము
ఇది గృహ బాహ్యాకాశము
ఇది మహాకాశము
ఈ విధంగా ప్రసిద్ధమైయున్నది కదా! అన్నీ కూడా మహాకాశంలో అంతర్లీనమే కదా! అట్లాగే నా చిదాకాశ స్వరూపము పట్ల - మాయకు మునుముందే ‘ఆత్మ’ ఉన్నది. ఆ మాయ చివరికి ‘యా మా! లేనే లేనిది’ అనురూపంగా తిరస్కరించబడుచున్నది. ‘‘ఇది జీవుడు, ఇది ఈశ్వరుడు’’ మొదలైనవన్నీ కేవలాత్మ పట్ల పరికల్పించ బడుచున్నాయి. అవన్నీ కూడా ‘పరాత్మ’లో అంతర్లీనమయ్యే ఉన్నాయి.
బ్రహ్మవాదిభిః ఉద్గీతా
సా మాయేతి వివేకతః।
మాయా తత్కార్య విలయే
న-ఈశ్వరత్వం, న-జీవతా।
బ్రహ్మము’ గురించి ఎరిగియుండి ప్రసంగించు బ్రహ్మవాదులు - ‘వివేకముచే మాయ సమసిపోగలదు, లేనిదిగా అవగలదు’ - అని గానం చేస్తున్నారు.
మాయ విలయము పొందితే, మాయా కార్యములు కూడా విలయము పొందుతాయి. అప్పుడిక ‘జీవుడు’ అనబడునది ఉండదు. ‘ఈశ్వరుడు’ అనబడునది లేనిది - అగుచున్నది. అఖండాత్మయే శేషించినదగుచున్నది.
తతః శుద్ధః చిదేవా అహమ్
వ్యోమవత్ నిరుపాధికః।
జీవ-ఈశ్వరాది రూపేణ
చేతన-అచేతనాత్మకమ్,
ఈక్షణాది - ప్రవేశాంతా
సృష్టిః ఈశేన కల్పితా।।
ఈశ్వర అహ్రాంతి కల్పితము: సమస్తముగా ఆకాశమువలె ‘ఉపాధి’ రహితమగు శుద్ధ చిత్ స్వరూపమే నేనై ప్రకాశించుచున్నవాడనగుచున్నాను. ఉపాధి రహితుడను (నిరుపాధికుడను) అగు నేను జీవ-ఈశ్వర రూపమును ధారణ చేయుచున్నాను. చేతనాత్మకంగా (కదిలించునదిగా), - అచేనాత్మకంగా (కదిలించబడునది)గా అనేక ఈక్షణము (Perceptions)ల రూపముగా ధారణ చేస్తున్నాను. ఒక కవికి కవన రూపము వంటిదగు ఈశ్వరకల్పిత సృష్టియందు చైతన్యరూపుడనై ప్రవేశించుచున్నాను. అప్పుడు కూడా సమస్తమునకు ఆవల కేవలుడనై ఉన్నాను. ఈక్షణము (Begining of Perceptions) నుండి ‘‘బ్రహ్మమునందు ప్రవేశము’’ వరకు ఈశ్వర మాయా కల్పితము.
జాగ్రత్ ఆది - విమోక్షాంతః
సగ్ంసారో జీవకల్పితః।
‘త్రిణాచక’ ఆది - యోగాంతా
ఈశ్వర అహ్రాంతిమ్ ఆశ్రితాః।
లోకాయతాది → సాంఖ్యాంతా
జీవ వీహ్రాంతిమ్ ఆశ్రితాః।
జీవ-కల్పిత అహ్రాంతి: జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు మొదలైనవన్నీ (జీవునికి) జీవకల్పితమై ‘సంసారము’ అనునది బయల్వెడలుతోంది. అట్టి సంసారము - త్రిణాచకయోగసిద్ధి (ప్రాణాయామాది యోగసిద్ధి) వరకు (అనగా) మోక్ష పర్యంతము ఈశ్వర కల్పిత అహ్రాంతిని ఆశ్రయించి ‘మోక్షము’ వరకు కొనసాగుచున్నాయి.
లోకసంబంధములనుండి - సాంఖ్యయోగత్వము వరకు ఈశ్వరమాయను జీవాహ్రాంతి ఆశ్రయించినదై వీహ్రాంతి రూపంగా ప్రదర్శనమగుచున్నది.
తస్మాత్ ముముక్షుభిః నైవ మతిః -
జీవ-ఈశ వాదయోః కార్యాః।
కింతు బ్రహ్మతత్త్వమ్
నిశ్చలేన విచార్యతామ్।
అందుచేత మోక్షానందము కోరుకొను ముముక్షువు - ‘జీవ’ - ఈశ్వర’ భేదవాదమంతా ఆవలబెట్టి, మనస్సును సర్వభేదముల నుండి ఈవలకు తెచ్చి, ‘నిశ్చలత’ను సంపాదించుకొని, ‘బ్రహ్మతత్త్వము’ గురించియే ఏకాగ్రతగా విచారణ (Analysing) చేయాలి.
అద్వితీయ బ్రహ్మతత్త్వం
న జానంతి యథా-తథా,
అహ్రాంతా ఏవ అఖిలాః, తేషాం క్వ ముక్తిః?
క్వ ఇహ వా సుఖమ్?
ఉత్తమ - అధమ భావశ్చేత్
తేషాగ్ంస్యాత్ అస్తి తేన కిమ్?
అద్వితీయము (విచారణ చేస్తున్నవానికి వేరైనది కానట్టిది) అగు బ్రహ్మతత్త్వమును ఎవ్వడైతే ఉన్నది ఉన్నట్లుగా (యథాతథంగా) ఎరుగడో, తనయొక్క కేవలీతత్త్వ ధ్యానమును స్వీకరించడో, అట్టివానిపట్ల అన్యమగు వ్యవహారచర్చ అంతా అహ్రాంతియే అగుచున్నది. అట్టివానికి ముక్తి ఎక్కడిది? బంధము కొనసాగుచుండగా అట్టి అధ్యయనికి సుఖమెక్కడిది?
అన్యమునందు అధ్యయనము చేస్తూ కాలము గడుపు వారికి ఉత్తమ - అధమ భావములు ఉండి మాత్రం ఏమి ప్రయోజనము?
స్వప్నస్థ రాజ్య భిక్షాభ్యాం
ప్రబుద్ధః స్పృశ్యతే ఖలు?
అజ్ఞానే బుద్ధి విలయే
నిద్రా సా మన్యతే (ఫణ్యతే) బుధైః।
ఒకడు కలలో రాజు అయ్యాడు. లేక భిక్షకుడై వీధులలో తిరిగాడు - అనునవన్నీ తెల్లవారి లేచినతరువాత ఎందుకు పనికివస్తాయి? ఏమి ప్రయోజనము? అవన్నీ ఆ కల కనేవాడిని స్పృశించి ఉండవు కదా!
‘బుద్ధి అజ్ఞానమునందు మునిగి ఉన్నప్పుడు ఈ జీవుడు కల్పనలో గాఢనిద్రను పొందుచున్నాడు’ అని బుధులు చెప్పుచున్నారు.
విలీనా (అ)జ్ఞాన తత్కార్యే
మయి నిద్రా కథం భవేత్?
బుద్ధేః పూర్ణ వికాసో-యం జాగరః పరికీర్త్యతే।
వికారాది విహీనత్వాత్ జాగరో మే న విద్యతే।।
ఆత్మభావనచే అజ్ఞానము, తత్-కార్యములు ఆత్మయందు లీనమగుచుండగా, ఇక నాకు జడస్థితియగు ‘నిద్ర’ అనునది ఏమున్నది?
బుద్ధి పూర్తిగా వికసించినప్పుడు అది ‘జాగ్రత్ స్థితి’గా పరికీర్తించ బడుతోంది. ఆత్మనగు నాకు ఏ వికారములు లేవు. అప్పుడిక నాకు జాగ్రత్ అనునది ఎక్కడున్నది? ఆత్మగా నాకు జాగ్రత్ దశ, స్వప్నదశ, గాఢనిద్రాదశ ఇవేవీ లేవు. అవన్నీ బుద్ధియొక్క వికారములు మాత్రమే. సకల కల్పనలకు సర్వదా నేను వేరై ఉన్నాను.
05. సూక్ష్మనాడీషు సంచారో, బుద్ధేః స్వప్నః ప్రజాయతే।
సంచార ధర్మ రహితే, మయి స్వప్నో న విద్యతే।
దేహములోని బుద్ధియొక్క సూక్ష్మనాడులలో సంచారముచే ‘స్వప్నము’ ఏర్పడుచున్నది. ఆత్మగా ఒకచోట నుండి మరొక చోటికి సంచారములు చేయు ధర్మమే లేదు. మరింక ‘స్వప్నదశ’ అనునది నాకు ఎక్కడున్నది? నా స్వప్నములో ఇంకొక చోటికి వెళ్ళుతూ ఉంటే నేను వెళ్ళినట్లు కాదు కదా!
సుషుప్తి కాలే సకలే విలీనే తమసావృతే,
స్వరూపం మహదానందం, భుంక్తే దృశ్య వివర్జితః।
సుషుప్తికాల సందర్భములో సకలము కూడా చీకటి (Ignorance, Non-knowing)చే ఆవృతమై, నాయందు విలీనమైపోవుచున్నది. అప్పుడు దృశ్యరహితుడనై స్వస్వరూప సంబంధమైన మహదానందమును (లేక) మౌనానందమును ఆస్వాదించుచున్నాను.
అవిశేషేణ సర్వం తు
యః పశ్యతి చిదన్వయాత్
స యేవ సాక్షాత్ విజ్ఞానీ।
స శివః। స హరిః। విధిః।
ఎవ్వడైతే సర్వమును సవిశేషంగా కాకుండా, అవిశేషంగా, చిత్ (స్వకీయమైన ఎరుకకు అనన్యంగా) దర్శించు దృష్టిని సంపాదించుకొనియే ఉంటాడో ఆతడే సాక్షాత్ విజ్ఞాని. ఆతడే శివుడు. ఆతడే హరి. ఆతడే విధి (బ్రహ్మదేవుడు).
దీర్ఘ స్వప్నమ్ ఇదం యత్ తత్
దీర్ఘం వా చిత్తవిభ్రమమ్।
దీర్ఘంవాపి మనో రాజ్యగ్ం
సగ్ంసారం దుఃఖసాగరమ్।
ఇక్కడి ‘సంసారము’ అనురూపంగా ఏది తారసబడుచున్నదో, అదంతా కూడా…
✤ ఒక సుదీర్ఘమైన స్వప్నమువంటిది.
✤ దీర్ఘమైన చిత్తవిభ్రమము.
✤ దీర్ఘమైన ఊహావ్యవహార రూప మనోరాజ్యము.
✤ ఈ సంసారము (దుఃఖ) సాగరమువంటిది.
సుప్తేః ఉత్థాయ → సుప్త్యంతం
బ్రహ్మైకం ప్రవిచింత్యతామ్।
ఆరోపితస్య జగతః - ప్రవిలాపనేన,
చిత్తం మదాత్మకతయా పరికల్పితం నః।
శత్రూన్ విహత్య గురుషట్క గణాన్, నిపాతాత్
గంధ ద్విపో భవతి కేవలమ్ అద్వితీయః।।
అందుచేత ఓ ఋభూ! నిద్రలేచినది మొదలు, మరల నిద్రపోవునంత వరకు ‘బ్రహ్మము’ గురించి మాత్రమే సర్వదా చింతన చేయాలి. ఆరోపితము మాత్రమే అయినట్టి ఈ జగత్ వ్యవహార- ప్రవిలాపనమంతా (A song sung) చిత్తమునందు నా రూపముగా పొందగా, ఆత్మేశ్వరుడ నగు నాయందు ఆ చిత్తము లీనము అగుచున్నది.
చిత్తము లయమొందుచుండగా గొప్ప శత్రువులగు కామక్రోధలోభమోహ మదమాత్సర్యములు జయించివేయబడతారు. గొప్ప శత్రువులను జయించి విశ్రాంతి తీసుకొంటున్న మత్తగజము వలె బుద్ధి ప్రశాంతత పొందుచున్నది. సర్వగంధములను జయించిన ఆత్మ ‘కేవలము, అద్వితీయము’ అయి ప్రశాంతమగుచున్నది.
అద్య అస్తమేతు, వపుః
ఆ శశితారమ్ ఆస్తాం,
కస్తావతాపి మమ చిత్
వపుషో విశేషః?
ఈ భౌతిక శరీరము ఇప్పుడే అస్తమించవచ్చుగాక! లేదా ఆచంద్ర తారార్కము కొనసాగితే కొనసాగవచ్చును గాక! సర్వదా చిత్ స్వరూపుడ నగు నాకు నా సమక్షంలో తద్వారా పోయేదీ లేదు. వచ్చేది లేదు. నా చిత్ స్వరూపము పట్ల దృశ్య విశేషమంతా ‘విశేషము’ కాదు. ‘విషయము’ కాదు. అవిషయము కాదు.
కుంభే వినశ్యతి చిరం
సమవస్థితే వా, కుంభ - అంబరస్య
నహి కో అపి విశేషలేశః।
ఒకచోట ఒక కుంభము (కుండ) ఉన్నది. కుండకు లోపల ఆకాశం (కుంభాకాశము) బయట గృహాకాశం. (మఠాకాశము). ఆ బయట మహాకాశము. ఒకరోజు ఏదో కారణం చేత ఆ కుండ పగిలిపోయింది. అప్పుడు కుంభములోని ఆకాశమునకు ఏమి నష్టం? ఏమి లాభం? కుంభాకాశానికి ఏ విశేషమూ లేదు. బాహ్యాకాశానికి లేదు.
అహినిర్ల్వయినీ సర్ప నిర్మోకో
జీవ వర్జితః, వల్మీకే
పతితః తిష్ఠేత్తగ్ం
సర్పో న అభిమన్యతే।
ఏవగ్ం స్థూలం చ సూక్ష్మం చ
శరీరం న అభిమన్యతే।
పాము ఒక పుట్టలో కుబుసమును వదలి ఎటో బయటకు వెళ్ళింది. నిర్జీవమైన ఆ కుబుసము పట్ల ఆ పాముకు ‘నా కుబుసము నాసొమ్ము కదా! ఏమౌతుందో ఏమో?’ అనే అభిమానము కలిగి ఉంటుందా? ఉండదు. అట్లాగే ‘ఆత్మ’ గురించి తెలుసుకొని, ఆత్మత్వము సంతరించుకొన్న యోగి (లేక) ముముక్షువునకు ఇక ఈ ‘స్థూల శరీరము’ గురించిగాని, భావకల్పనారూపమగు సూక్ష్మశరీరము గురించిగాని అభిమానము, అభినివేశము ఉండవు.
ప్రత్యక్ జ్ఞాన శిఖిధ్వస్తే
మిథ్యాజ్ఞాన సహేతుకే।
నేతి నేతీతి రూపత్వాత్
అశరీరో భవతి అయమ్। (భవత్యయమ్)।
సహేతుకమైన మిధ్యాజ్ఞానము గురించిన విచారణచే ప్రత్యక్జ్ఞానము అనే అగ్నిశిఖ (వ్యష్టిత్వ పరిమిత- సంబంధమైన జ్ఞానము) నశించిపోవుచుండగా, ‘నేను ఇది కాదు. నేను ఇది కాదు’ అను రూపమగు పరిశీలనాత్మక దృష్టిచే ఈ జీవుడు స్థూల శరీరి కాడు. సూక్ష్మశరీరి కాదు. స్వయముగా అశరీరుడై ప్రకాశించుచున్నాడు. కేవల స్వరూపుడై చెన్నొందుచున్నాడు.
06. శాస్త్రేణ నశ్యేత్
పరమార్థ దృష్టిః।
కార్యక్షమం నశ్యతి చ
అపరోక్ష్యాత్।
శాస్త్రములు పరిశీలిస్తూ, పఠిస్తూ, అర్థం చేసుకుంటూ ఉండగా ‘పరము వేరు - ఇహము వేరు’ అను (కేవలాత్మ) పట్లగల, అర్ధ మాత్రమే అగు దృష్టి (Half Hearted view / understanding) తొలగుతూ వస్తుంది.
అపరోక్షము (ఆత్మ ఇంద్రియములకు ప్రత్యక్షమైనదీ కాదు. ఈ జీవునికి వేరుగా ఎక్కడో పరోక్షమైనదీ కాదు) అను దృష్టిచే - కార్య - కారణ - కర్తృత్వ పరిమిత భావాలు ప్రక్కకు పోతాయి!
ప్రారబ్ధ నాశాత్ ప్రతిభాన నాశ।
ఏవం త్రిథా నశ్యతి చ
ఆత్మ మాయా।
‘‘పరమాత్మ స్వరూపుడనగు నాకు నా అంశ అగు జీవాత్మకు సంబంధించిన ప్రారబ్ధ - అగామి - సంచిత విషయములతో ఏమి సంబంధము?’’ అను ప్రతిభాన నాశనము’ వలన ‘ప్రారబ్ధము’ అనునదంతా మొదలే రహితమైనదగుచున్నది. ఈ ‘3’ విధములైన మార్గములలో ఆత్మను ఆవరించిన మాయ నశించగలదు.
బ్రహ్మత్వే యోజితే స్వస్మిన్
జీవ భావో న గచ్ఛతి।
అద్వైతే బోధితే తత్త్వే
వాసనా వినివర్తతే।
జీవునిపట్ల ‘బ్రహ్మభావన’ జత చేసి దర్శించు ‘తత్ త్వమ్ అసి’ - అను తత్త్వదృష్టి’ చేత స్వస్వరూపము పట్ల ‘నేను జీవుడను మాత్రమే’ అను భావన ఇక ప్రవర్తించదు.
‘ఈ జీవుడుగా కనిపిస్తున్నది అఖండరూపుడగు పరమాత్మయే! పర-ఇహ-జగత్-వాస్తవ రూపములు సర్వదా ఏకమగు పరమాత్మయే’ -అను ‘అద్వైతబోధిత తత్త్వము’చే సర్వ దృశ్య వాసనలు శమించగలవు.
ఆరబ్ధ-అంతే (ఆరబ్ధాంతే) దేహ హానిః
మాయేతి క్షీయతే అఖిలా।
ఈ దేహముయొక్క ఉత్పత్తి, ఇందలి విభాగములగు ఇంద్రియములు, తద్వారా అనుభవమగు స్వసంకల్పిత ఇంద్రియ విషయములు - ఇవన్నీ మాయాకల్పనలు’ అను భావన అభ్యసిస్తూ ఉండగా, దేహభావన హాని పొందినదై, ‘మాయ’ అనబడునది లేనిదే అగుచున్నది. ‘‘ఆత్మ (లేక) బ్రహ్మము సర్వమునకు వేరై, కానీ సర్వమునకు ఆధారమై ఉన్నది’’ -
అస్తి ఇత్యుక్తే జగత్ సర్వం
సద్రసం బ్రహ్మ తత్ భవేత్।
భాతి - ఇత్యుక్తే జగత్ సర్వం
భానం బ్రహ్మైవ కేవలమ్।
‘‘అస్తి’’ - (ఆత్మయొక్క ఉనికియే ఇదంతా - అని) అనుభావనను అనేకసార్లుగా భావన చేస్తూ ఉండగా అట్టి ‘ఆస్తి’చే ఈ జగత్తంతా ‘తత్‌బ్రహ్మ। తత్ రసమ్।’ అగుచున్నది.
‘‘భాతి’’ - ‘‘ఆత్మయొక్క వెలుగు విశేషమే ఈ జగత్తు ఆత్మయే జగత్తుగా భాసిస్తోంది’’ - అను భావనా అభ్యాసముచే ఈ సర్వజగత్తు కేవలము బ్రహ్మముయొక్క వెలుగు (లేక) ఎరుక రూపంగా అనుభవమవగలదు.
మరుభూమౌ జలగ్ం సర్వం
మరుభూమాత్రమేవ తత్।
జగత్రయమ్ ఇదం సర్వం
చిన్మాత్రం స్వవిచారతః।
మరుభూమి (ఎడారి)లో సూర్యకిరణముల - వాయుతరంగముల మిశ్రమముచే జలము ఉన్నట్లే కనిపించురీతిగా, ఈ జగత్తు బ్రహ్మమునందు మరుభూమి (ఎడారి - యండమావులు) వంటిది. ఇక్కడి మర్త్య - పాతాళ - స్వర్గ త్రిలోకముల ప్రదర్శనమంతా ఆత్మయొక్క చిత్ (ఎరుక) మాత్రవిలాసమే! విచారణచే చిన్మాత్రమే అగుచున్నది.
అజ్ఞానమేవ న కుతో జగతః ప్రసంగో?
జీవ-ఈశ దేశిక వికల్ప కథాతి దూరే?
ఏకాంత కేవల చిదేక రస స్వభావే,
బ్రహ్మైవ కేవలమ్ అహమ్ పరిపూర్ణమస్మి!
సర్వదా ఏకాంతము(Alone), కేవలము(Absolute), చిదేకరస స్వభావము (Oneness of knowing is taking appearences of multiplicity) అగు బ్రహ్మమే - నేను. ఈ సమస్తము కేవలబ్రహ్మము, పరిపూర్ణము అయి ఉండగా, ఇక జగత్తు అనునది ఎక్కడున్నది? అదంతా అజ్ఞాన ప్రసంగ వ్యవహారమే! జీవుడు - ఈశ్వరుడు మొదలైన కథనమంతా నాకు అతి దూరము. అదంతా వికల్పమాత్రమే!
బోధచంద్రమసి పూర్ణవిగ్రహే,
మోహ రాహుమ్ ఉషితాత్మ తేజసి,
స్నాన దాన యజనాదికాః
క్రియా, మోచనావధి
వృథైవ తిష్ఠతి।
భూమిపై ఉండి సూర్యుని - చంద్రుని చూస్తూ ఉంటున్నప్పుడు ఒక సమయంలో రాహుకేతువులు అడ్డుకున్నట్లుగా కనిపించవచ్చుగాక! అంతమాత్రంచేత సూర్యచంద్రుల స్వతః తేజస్సు తరుగుతుందా! లేదు కదా! రాహు - కేతువుల రాకపోకలు నీడల కదలికవలె వృధా ప్రయాసయే కదా! - అట్లాగే స్వయముగానే పూర్ణబోధ విగ్రహమగు మమాత్మ స్వరూపమును అజ్ఞానము ఆవరించటమేమిటి? అది తొలగుటకై, స్నాన - దాన - యజన క్రియాదుల ఆవస్యకత ఎక్కడిది? అవన్నీ అనునిత్యాత్మస్వరూపుడనగు నాపట్ల వృథా ప్రసంగమే!
సలిలే సైంధవం యద్వత్
సామ్యం భవతి యోగతః,
తథా ఆత్మ మనసో
ఐక్యగ్ం ‘సమాధిః’ ఇతి కథ్యతే।
సమాధి : సైంధవ లవణము (ఉప్పుగడ్డ) సముద్రజలంలో వేసినప్పుడు, ఆ ఉప్పు గడ్డయొక్క ఆకారము, ఉప్పతనము - ఇవన్నీ ఏమౌతున్నాయి? సముద్రజలముతో సామ్యము (ఏకత్వము, సంయోగము) పొందుచున్నాయి. అట్లాగే ఈ మనస్సు సర్వమును ఆత్మగా దర్శించు అభ్యాసముచే మనస్సు (సముద్రజలంలో ఉప్పుగడ్డవలె) ఆత్మతో ఐక్యము పొందటమే ‘సమాధి’గా చెప్పబడుచున్నది.
దుర్లభో విషయ త్యాగో।
దుర్లభం తత్త్వదర్శనమ్।
దుర్లభా సహజావస్థా-
సద్గురోః కరుణాం వినా।।
సద్గురు కరుణ : ఓ ఋభూ! ఏది ఎరిగిన తరువాత ‘నేను అఖండమగు ఆత్మనే’ అను తత్త్వబోధను గురువు ప్రసాదిస్తున్నారో - అట్టి సద్గురువును ప్రణిపాతి అయి ముముక్షువు శరణు వేడాలయ్యా. సద్గురు కరుణలేకపోతే, విషయములను త్యజించటము, తత్త్వదర్శనము ‘ఆత్మాఽహమ్’ అనబడు సహజావస్థ - ఇవి దుర్లభమైన విషయాలే సుమా!
ఉత్పన్న శక్తి బోధస్య
త్యక్త నిశ్శేష కర్మణః,
యోగినః సహజావస్థా
స్వయమేవ ప్రకాశతే।
సద్గురువు బోధిస్తూ ఉండగా ఆ ముముక్షువు ఆత్మశక్తి బోధ సంపన్నుడై ‘కర్మలు నాకు గాని, నేను కర్మలకు గాని చెందిన వారము కాము’ అని ఎరుగుచూ, కర్మలను నిశ్శేషముగా త్యజించినవాడగుచున్నాడు. అట్టియోగి ‘సహజావస్థ’ను సిద్ధించుకొని స్వస్వరూపాత్మగా ప్రకాశించుచున్నాడు.
రసస్య మనసశ్చైవ
చంచలత్వగ్ం స్వభావతః,
రసో బద్ధో మనోబద్ధం
కిం న సిద్ధ్యతి భూతలే?
పాదరసమువలె (Like mercury)ఈ మనస్సు రసస్వభావము (The Feature of experiencing) చేత - స్వభావతః అతి చంచలముగా సంచారములు నిర్వర్తిస్తోంది. అట్టి రసాస్వాదన (Experiencing)ను విషయముల నుండి విరమింపజేయాలి. ‘ఆత్మరసాస్వాదన’ అను ఉపాయముచే రసబద్ధము, తద్వారా మనోబద్ధము సిద్ధిస్తున్నాయి. అట్టి వానికి ఈ భూమిపై సిద్ధించనిది ఏమి ఉంటుంది?
మూర్ఛితో హరతి వ్యాధిం
మృతో జీవయతి స్వయమ్।
బద్ధః ఖేచరతాం ధత్తే
బ్రహ్మత్త్వగ్ం రస చేతసీ।।
‘‘బ్రహ్మమే నేను’’ అనబడు బ్రహ్మత్వరససిద్ధి చేత ఈ జీవుడు
- మూర్ఛితుడు అయి కూడా ఆ వ్యాధి నుండి విముక్తుడు కాగలడు.
- మరణించిన తరువాత కూడా స్వయంజీవితుడు కాగలడు.
- బద్ధుడై ఉండి కూడా పక్షివలె ఆకాశమున విహారములు చేయగలడు.
ఇంద్రియాణాం మనో నాథో।
మనో నాథస్తు మారుతః।
మారుతస్య లయో నాథః।
తం నాథం లయం ఆశ్రయ।।
ఇంద్రియములకు ప్రభువు (లేక) నాథుడు ఎవ్వరు? మనస్సు.
మరి మనస్సుకు నాథుడు? ప్రాణశక్తి.
ప్రాణములకు నాథుడు? లయము. (ఆత్మయందు అంతర్లీనత్వము).
అందుచేత ‘లయము’ అనే నాథుని సర్వ ప్రయత్నములతో ఆశ్రయించాలి.
నిశ్చేష్టో నిర్వికారశ్చ
లయో జీవతి యోగినామ్।
ఉచ్ఛిన్న సర్వ సంకల్పో
నిశ్శేష అశేష చేష్టితః।
స్వావగమ్యో లయః కోఽపి
మనసాం వాక్ అగోచరః।
‘లయము’ను ఉపాసించి, సిద్ధించుకున్న యోగి సర్వ కర్మలకు సంబంధించనివాడు అవటం చేత నిర్వికారుడై, లయయోగి అయి, ఈ భూమిపై జీవిస్తున్నాడు.
అట్టి లయయోగి - సర్వ సంకల్పములను వదలివేసినవాడై, సర్వచేష్టలను నిశ్శేషముగా మొదలంట్లా త్యజించి ఉన్నవాడై, స్వస్వరూపాత్మను ఆశ్రయించుటచే స్వావగమ్యుడై, ‘ఈతడు ఇట్టివాడు’ అనుకోవటానికి మనోవాక్కులకు అందనివాడై ఉంటున్నాడు. ఎందుకంటే, ఆతనికి ఈ సమస్తము స్వస్వరూపాత్మ స్వరూపమే!

పుంఖానుపుంఖ విషయ ఈక్షణ తత్పరోఽపి
బ్రహ్మావలోకన ధియం న జహాతి యోగీ,
సంగీత తాళ లయ వాద్య వశం గతాపి,
మౌళిస్థ కుంభ పరిరక్షణ ధీర్నటీవ।।
అట్టి లయయోగిపట్ల విషయములు ఉండవా? ఉంటే ఉంటాయి. అయితే ఆతడు పుంఖానుపుంఖముగా (ఒక విషయం తరువాత వెనువెంటనే మరొకటి) విషయములను చూస్తూ తత్పరుడై (Deeply involved) ఉంటున్నప్పటికీ ‘ఇదంతా సర్వదా కేవలమగు బ్రహ్మమే కదా!’ - అనబడు ‘బ్రహ్మావలోకనము’ అనే బుద్ధిని ఈషణ్మాత్రమూ వదలి ఉండడు. ఎట్లా (దృష్టాంతంగా) అంటే, ఉత్తమబుద్ధిశాలియగు ఒక నాట్యకారుడు నృత్యనటనను నిర్వర్తిస్తూ కూడా, సంగీత - తాళ - లయ - వాద్య-నృత్య వశంగా కాళ్ళు - చేతులు కదల్చుచున్నప్పటికీ, తలపై ధరించిన కుంభమును (పాత్రను, బిందెను, పళ్లెము , దీపములను) క్రిందపడిపోకుండా పరిరక్షించుకుంటూనే ఉంటాడు కదా! యోగి ఎక్కడ ఏమి చేస్తూ ఉన్నా ‘బ్రహ్మము’ యొక్క భావనను వదలడు.
సర్వ చింతాం పరిత్యజ్య
సావధానేన చేతసా,
నాద ఏవ అనుసంధే యో
యోగ సామ్రాజ్యమ్
ఇచ్ఛతా ఇతి।।

ఇతి ద్వితీయ అధ్యాయః।
ఓ ఋభూ!
సర్వ అన్య చింతనలను వదలివేయి.
సావధానముతో కూడి బుద్ధితో (సావధానచిత్తుడవై) యోగాభ్యాసముచే (చెవులు వ్రేళ్ళతో మూసినప్పుడు వినబడు) నాదముతో అనుసంధానం చేయి.
అట్టి యోగి యోగ సామ్రాజ్యమునకు స్వకీయ ఇచ్ఛచే ‘సామ్రాట్టు’ అయి ప్రకాశించుచున్నాడు.

ఇతి ద్వితీయ అధ్యాయః।

తృతీయ అధ్యాయము - తత్ సదా అహమ్ అనే ‘మౌనము’

01. నహి నానా స్వరూపంస్యాత్
ఏకం వస్తు కదాచన।
తస్మాత్ అఖండ ఏవ అస్మిన్।
మత్ - అన్యత్ న కించన।
దృశ్యతే శ్రూయతే యద్వత్
బ్రహ్మణో అన్యత్ న తత్ భవేత్।।
ఏది సర్వదా ఏకవస్తువే అయిఉన్నదో, అది అనేక వస్తువులుగా ఎప్పుడూ అవదు. (బంగారము ఏకవస్తువే. అనేక ఆభరణములుగా అవటం కారణంగా బంగారము అనేకములుగా అవుతోందా? లేదు. ఎల్లప్పుడు ఏకమే).
అందుచేత అఖండాత్మ స్వరూపుడనగు నాకు అన్యముగా ఏదీ ఎక్కడా ఎప్పుడూ కించిత్‌గా కూడా లేదు. అవటం లేదు.
ఏదేది కనబడుతోందో, వినబడుతోందో - అదంతా ఏమాత్రము కూడా బ్రహ్మమునకు వేరుగా అగుటలేదు. స్వప్న చైతన్యము (ఊహా చమత్కారమునకు) వేరై స్వప్నములో ఏదీ లేదు కదా!
నిత్యశుద్ధ, విముక్త, ఏకమ్,
అఖండానందమ్ అద్వయమ్।।
సత్యం జ్ఞానం అనంతమ్
యత్ ‘‘పరంబ్రహ్మ’’ అహమేవ తత్।
ఏదైతే అన్నీ తానై, సర్వమునకు వేరుగా ‘సాక్షి’ అయి ఉన్నదో - అట్టి పరంబ్రహ్మము (సర్వమునకు పరము) నిత్యశుద్ధము. అది దేని చేతనూ బంధింపబడదు కాబట్టి నిత్యముక్తము. ఏకమే కాని అనేకము కాదు. అఖండము ఆనందస్వరూపము. అద్దానికి ద్వితీయమై ఏదీ లేదు కాబట్టి అద్వయము. బ్రహ్మము సర్వదా సత్య జ్ఞాన అనంతము. అట్టి పరబ్రహ్మమే నేను - అయి ఉన్నాను.
ఆనంద రూపోఽహమ్ అఖండ బోధః।
పరాత్పరోఽహమ్ ఘనచిత్ ప్రకాశః।
మేఘా యథా వ్యోమ న చ స్పృశంతి,
సగ్ంసార దుఃఖాని, నమాం స్పృశంతి।
అట్టి అఖండ - బోధ - ఆనంద స్వరూపుడను నేను.
పరమునకు ఆవల సర్వస్వరూపడను. కాబట్టి, పరాత్పరమును ఇంద్రియములకు కనిపించేదంతా నా ఘనీభూతమైనట్టి చిత్ ప్రకాశమే. ఆకాశంలో మేఘములు కనబడుచున్నంత మాత్రంచేత మేఘములు ఆకాశమును స్పృశించగలవా? లేదు. అట్లాగే సంసార దుఃఖ వ్యవహారము లన్నీ ఆత్మాకాశ స్వరూపుడనగు నన్ను ఎట్లా స్పృశిస్తాయి? స్పృశించలేవు.
సర్వగ్ం సుఖం విద్ధి సుఖ-దుఃఖ నాశాత్,
సర్వం చ సద్రూపమ్, అసత్త్వనాశాత్।
ఓ ఋభూ! దుఃఖములు తొలగుటానికి ‘సర్వము ఆత్మసుఖమే’ అని ఎరిగి ఉండటమే ఉపాయము. అప్పుడు ‘అసత్తు’కు సంబంధిత సుఖ- దుఃఖ భావన నశించిపోవుచూ ‘సర్వము సత్స్వరూమే’-అనునది భావనాభ్యాసముచే సిద్ధిస్తోంది. ‘‘అంతా ఆత్మానందమే’’-అని ఆస్వాదించబడ గలదు.
‘చిత్’ రూపమేవ
ప్రతిభాసయుక్తం।
తస్మాత్ అఖండం మమ
రూపమ్ ఏతత్।
‘చిత్’ (ఎరుక / ఎరుకచే Enlightening చేయు) కేవల రూపమే ఈ అనేక రూపములతో కూడిన, మార్పు చేర్పులు పొందుచున్న జగత్తుగా (బింబము దర్పణంలో ప్రతిబింబించు తీరుగా) ప్రతిబింబిస్తోంది. కాబట్టి నా స్వస్వరూపము సర్వదా అఖండమైయున్నది.
నహి జనిః మరణం,
గమన-ఆగమో,
న సమలం విమలం, న చ వేదనమ్।।
చిన్మయం హి సకలం విరాజతే
స్ఫుటతరం పరమస్య తు యోగినః।
సత్య చిద్ఘనం అఖండం,
అద్వయం, సర్వదృశ్య రహితం,
నిరామయమ్।।
తత్‌పదమ్ ఇతిమౌనమాశ్రయ్
ఓ ఋభూ! ఆత్మానందరూపా! నేను చెప్పు విధంగా ఆత్మ(Absolute Self) గురించి భావన చేస్తూ ఉండెదవు గాక.
⌘ ఆత్మస్వరూపుడనగు నాకు జనన - మరణములు లేవు. గమన - ఆగమనములు (రాక - పోకలు) లేవు.
⌘ నాకు దోషము, నిర్మలము - ఈ రెండూ లేవు.
⌘ దేని గురించీ వేదనము (తెలుసుకోవటం, తెలుసుకోకపోవటం అనునదీ లేదు)
పరమయోగులు దేనిని సర్వే - సర్వత్రా విరాజమానమై స్ఫుటతరంగా, సుస్పష్టంగా, నిర్ద్వంద్వంగా, నిస్సందేహంగా దర్శిస్తున్నారో…,
తత్ సదాఽహమ్ ఇతి మౌనమ్ ఆశ్రయ।।
యత్ పదం విమలమ్
అద్వయగ్ం శివం
‘తత్ సదా అహమ్’ ఇతి-
మౌనమ్ ఆశ్రయ।।
అటువంటి సత్యము, చిద్ఘనము, అఖండము, అద్వయము, సర్వదృశ్య రహితము, నిరామయము అగు ‘తత్ బ్రహ్మమే నేనై యున్నాను’ ఇది గ్రహించి మౌనము వహించి ఉండుము. (ఇదియే మౌనవ్రతము). ఏ పదమైతే (The state of self) విమలము, అద్వయము, శివము అయి ఉన్నదో, అట్టి ‘ఆత్మ’ అనబడే పరబ్రహ్మమే సర్వదా నేనైయున్నాను - అను రూపమును ఆశ్రయించి ఉండుము (ఇదియే మౌనవ్యాఖ్య)
జన్మ - మృత్యు సుఖ - దుఃఖ వర్జితమ్,
జాతి నీతి కుల గోత్ర దూరగమ్,
చిత్ వివర్త జగతో అస్య కారణమ్
తత్ సదాఽహమ్ - ఇతి
మౌనమ్ ఆశ్రయ।।
ఎద్దానికైతే….,
జన్మ-మృత్యు-సుఖ-దుఃఖములు మొదటి నుంచి కూడా లేనే లేవో, ఇక్కడి విశేషములై కనిపించే జాతి, నీతి, కుల, గోత్రములకు అత్యంత దూరమో,
ఏది ఈ జగత్తుకు అసలైన కారణము చిత్-వివర్తము, (స్వకీయమైన ఎరుకయొక్క యథాతథ కల్పిత పరిణామము) అయి ఉన్నదో,… అట్టి ‘తత్’యే నేను…అని గ్రహించినవాడవై మౌనమును (Grand Silence) ఆశ్రయించి ఉండుము. (ఇదియే మౌనధ్యానము)
పూర్ణమ్ అద్వయమ్, అఖండ చేతనమ్,
విశ్వభేద కలనాది వర్జితమ్,
అద్వితీయ పర సత్ చిదగ్ం శకం
తత్ సదాఽహమ్ ఇతి-మౌనమ్ ఆశ్రయ।।
‘స్వయముగానే అద్వయమైనట్టిది, (సం)పూర్ణమైనది, సర్వచేతనములు తనవై అఖండమైయున్నట్టిది, విశ్వ భేద కలనములేమీ లేనట్టిది, పరమై - సత్ చిత్ లక్షణములచే, తనకు ద్వితీయమే లేనట్టిది, - ‘అదియే సదా నేను’ అని గమనిస్తూ మౌనమును ఆశ్రయించి ఉండుము (ఇదియే మౌన తపస్సు)
02. కేనాపి అబాధితత్వేన
త్రికాలేఽపి ఏకరూపతః
విద్యమానత్వమ్ ‘అస్తి’,
(య)ఏతత్ సద్రూపత్వగ్ం సదా మమ।
ఏదైతే - దేని చేతనూ ఏమాత్రమూ బాధించబడక, భూత్ - వర్తమాన - భవిష్యత్తులలో సదా సర్వదా ఏక రూపమే అయి ఉన్నదో….
‘అస్తి’ (నేను ఉన్నాను)’ అనురూపంగా సర్వ దేహములలోనూ సంప్రదర్శనమానమై యున్నదో, అటువంటి సద్రూపరూపమే నాయొక్క సదారూపము. (అట్టి సద్రూపమే నీవు సదా అయి ఉన్నావు కూడా!)
నిరుపాధిక నిత్యం యత్
సుప్తౌ సర్వసుఖాత్ పరమ్
సుఖరూపత్వమపి
ఏతత్ ఆనందత్వగ్ం సదా మమ।।
ఏ ఆనందమైతే ఉపాధికి సంబంధించనిదైయున్నదో, నిత్యము - అనునిత్యమో, పరమసుఖ స్వరూపమై యున్నదో, అటువంటి ఆనందరూపమే నాయొక్క సదా - రూపము.
దినకర కిరణైర్హి శార్వరం తమో నిబిడతరం
ఝడితి ప్రణాశమేతి।
ఘనతర భవ కారణం తమోయద్ధరి దిన కృత్
ప్రభయా న చ అంతరేణ।
మమ చరణ స్మరణేన పూజయా చ
స్వక తమసః పరిముచ్యతే హి జంతుః।
రాత్రిపూట కలిగిన ‘నిబిడాంధకారము’ సూర్యుని కిరణముల ప్రకాశముచేగానీ ఏమాత్రం తొలగదు కదా! అట్లాగే,
ఘనతరమైన భవ - కారణంగా ఏర్పడిన తమస్సు (ఈ దృశ్యము భవమే। - నిజంగానే ఉన్నది అను అజ్ఞాన తమస్సు) చేత అంతరంగములో ఏర్పడిన అజ్ఞాన నిబిడాంధకారము ఈ భౌతికమైన సూర్యకాంతిచే తొలగేది కాదు,.. మరి? నన్ను స్మరించటంచేత, పూజించటం చేత మాత్రమే - తమస్సు (అజ్ఞానంధకారము) నుండి ఈ జీవుడు విముక్తి పొందగలడు.
నహి మరణ ప్రభవ ప్రణాశ హేతుః
మమ చరణ స్మరణాదృతే అస్తి కించిత్।
ఆదరేణ యథా స్తౌతి
ధనవంతం ధనేచ్ఛయా,
తథా చేత్ విశ్వకర్తారం
కో న ముచ్యేత బంధనాత్?
ఇక్కడి జనన - మరణ - పునర్జన్మ కేతువుల వలన ఈ జీవునికి కలుగుచున్న దుఃఖపరంపరలు - నా చరణ స్మరణ - శరణా గతులచే ఇక శేషించినవై ఉండజాలవు. (ఇక మిగలవు)
ఒక ధనాశాపరుడు - తనను ధనవంతుని చేయు సంపదకొరకై ఎంతటి తీవ్రేచ్ఛతో స్తుతిస్తాడో, - ఆ విధంగా విశ్వకర్తనగు నన్ను బంధవిముక్తికై తీవ్రేచ్ఛతో ఆశ్రయిస్తే, అట్టివాడు ఎందుకు బంధవిముక్తుడు కాడు? తప్పక అవుతాడు. అనుమానం లేదు’.
ఆదిత్య సన్నిధౌ లోకః
చేష్టతే స్వయమేవ తు
తథా మత్ సన్నిధానేవ
సమస్తం చేష్టతే జగత్।
శుక్తికాయాం యథా తారం
కల్పితం మాయయా తథా,
‘మహత్’ ఆది జగత్ మాయా
మయం మయ్యేవ కేవలమ్।
ఋభుమునీంద్రుడు : స్వామీ! ‘ఈ జగత్తుకు కారణకారణులు మీరే’ - అని స్తుతించబడుచున్నారు కదా! మీరు ‘అకారణులు’ (దేనికీ కారణము కాదు) అని కూడా వర్ణించబడుచున్నారు. మీరు సకారణులా? అకారణులా?

శ్రీ వరాహస్వామి : సూర్యుని సన్నిధానంలో (వెలుతురుతో) జనులంతా వారి వారి పనులన్నీ నిర్వర్తించుకొంటూ ఉంటున్నారు కదా! అట్లాగే నాయొక్క సన్నిధానంలో ఈ సమస్త జగత్తు కూడా చేష్టత్వము పొందుచున్నది. సూర్యుని వెలుగులాగానే నేను దేనికీ కారణం కాదు.
‘ముత్యపు చిప్పలో వెండి ఉన్నది’ అని కొందరు చూడటము ఏ విధంగా కల్పితంగా సిద్ధిస్తోందో, అదే విధంగా మహత్తుతో సహా ఈ జగత్తంతా కేవలము నేనే అయి ఉండగా మాయచే నాకు వేరైన దానివలె దర్శించబడు చున్నది. నాయందు జగత్తు ఆపాదించబడి దర్శించబడుతోంది.
చండాల దేహే, పశ్వాది, స్థావరే, బ్రహ్మ విగ్రహే
అన్యేషు తారతమ్యేన, స్థితేషు న తథా హి అహమ్।।
ఒక అమానుష లక్షణములు కనిపించే చండాలుని దేహమునందు, పశువు మొదలైన సర్వజంతువులయందు, స్థావరములయందు, బ్రహ్మదేవుని యందు తదితర సర్వమునందు ఏమాత్రము తర-తమ భేదము, తారతమ్యము లేకుండా నేను సమముగా సంస్థితుడనై ఉన్నాను.
వినష్ట దిక్ భ్రమస్యాపి
యథా పూర్వం విభాతి దిక్,
తథా విజ్ఞాన విధ్వస్తం
జగత్ మే భాతి తత్ నహి।।
ఒకానొకడు ఎక్కడో తెలియనిచోట చిక్కుకున్న సందర్భములో ‘నేను ఎక్కడున్నాను? ఏది ఎటువైపు ఉన్నది?’ అనే దిగ్భ్రమ తొలగిన మరుక్షణం, ఇక దిక్కులన్నీ యథాపూర్వంగా (ఇదివరకు ఎట్లా ఉంటే అట్లాగే) తెలిసిపోతుంది కదా! అదేవిధంగా స్వస్వరూపజ్ఞాన - విజ్ఞానములు వికసించగానే ఇకప్పుడు ఈ జగత్తు జగత్తుగా నాపట్ల భాసించదు.
న దేహో, న ఇంద్రియ ప్రాణో।
న మనో బుద్ధి - అహంకృతిః।
న చిత్తం, నైవ మాయా చ।
న చ వ్యోమాదికం జగత్।।
న కర్తా, నైవ భోక్తా చ।
న చ భోజయితా తథా।
కేవలమ్ చిత్ సదానంద
బ్రహ్మైవాహమ్ జనార్దనః।।
నేను దేహమును కాదు. ఇంద్రియములు, ప్రాణము కాదు. మనోబుద్ధి చిత్త అహంకారములూ కాదు. మాయ కూడా కాదు. ఈ ఆకాశ - వాయు - అగ్ని-జల-భూ…పంచభూతముల స్వరూపుడను కూడా కాదు. నేను దేనికీ కర్తనుకాదు. దేనిపట్లా భోక్తను కూడా కాదు। భోగింపబడువాడను కాను।
కేవల చిత్ - సదానంద స్వరూపమగు బ్రహ్మమే అయి ఉన్నాను. (సర్వజీవులను సంప్రదర్శనముగా కలిగియున్నాను కాబట్టి) - జనార్దనుడను.
జలస్య చంచలాత్ ఏవ
చంచలత్వం యథా రవేః,
తథా అహంకార సంబంధాత్
ఏవం సంసార ఆత్మనః।
ఓ ఋభూ! ఆత్మకు బంధముగాని, సంసార దోషముగాని లేనే లేదు. జలంలో తరంగములు కదలుచూ ఉండగా, జలములో ప్రతిబింబించే సూర్యబింబము కదలుచూ ఉన్నట్లు కనబడుచూ ఉంటుంది కదా! అట్లాగే ‘అహంకారము’తో సంబంధము వలన ఆత్మకు సంసారబంధమంతా ఏర్పడుచున్నట్లు తోచుచున్నది. అయితే, నీళ్లలోని సూర్య ప్రతిబింబ కదలికలు సూర్యుని తాకుతాయా? లేదు కదా! అట్లాగే సంసారబంధము ఆత్మను స్పృశించదు.
03. చిత్త మూలం హి సంసారాత్।
తత్ ప్రయత్నేన శోధయేత్।
హంత। చిత్త మహత్ తాయాం
కైషా విశ్వాసతా తవ?
ఓ ఋభూ! సంసారమునకు మూలము చిత్తమే!
చిత్తమే సంసారము. అంతకుమించి సంసారమునకు వేరే రూపమేదీ లేదు. అందుచేత ఈ చిత్తమును మొదలంట్లా శోధించి, అద్దానితోగల దోషవిషయములన్నీ తొలగించి పరిశుభ్రపరచుకోవాలి.
బిడ్డలారా! సకల జనులారా! ఆహా"! ఈ చిత్తము వ్రాలుచున్న విషయములపై మీకెంత విశ్వాసము? ఎంతటి మమకారము? ఈ రెండూ తొలగితే సంసారమెక్కడిది? దృశ్యములో చూస్తున్న వస్తువులవలెనే, ఆత్మయందు ధ్యాస ఎందుకు కుదరటం లేదు? మీరు చిత్తమును నమ్మినంతగా ఆత్మను నమ్మటం లేదెందుకు?
క్వ ధనాని మహీపానాం?
బ్రహ్మణః క్వ జగంతి వా?
ప్రాక్తనాని ప్రయాతాని
గతాః సర్గ పరంపరాః।
కోటయో బ్రహ్మణాం యాతా
భూపా నష్టాః పరాగవత్।
ఎక్కడి సంపదలు? ఎక్కడి రాజులు? ఎక్కడ బ్రహ్మ? ఎక్కడ తాను సృష్టించుకొన్న జగత్తులు? ఎన్నో సృష్టులు అసంఖ్యాకంగా ఇది వరకు బయలుదేరాయి. కాలగర్భంలో కలిసిపోయాయి.
కోట్లకొలది బ్రహ్మలే గతించిపోయారు. పూలతకు అనేక పుష్పములు, ఆ పుష్పములలో ఒక్కోదానికి సుగంధమువలె, కాలము అనే పూలతావనంలో లెక్కపెట్టజాలని సంఖ్యలో మహారాజులంతటివారు, చక్రవర్తులంతటివారు వస్తున్నారు. పోతున్నారు.
స చ అధ్యాత్మాభిమానోఽపి
విదుషోఽపి ఆసురత్వతః
విదుషోఽపి ఆసురత్వేస్యాత్
నిష్ఫలం తత్త్వ దర్శనమ్!
కొందరు ఆధ్యాత్మ విద్యపట్ల అభిమాని (Well interested) అయి ఉండి, ఆ విద్యపట్ల విదుషులు (Expert) అయి ఉండి కూడా ఆసురత్వము వదలలేకపోవుచున్నారే. (అహంకారము, దర్పము, క్రోధము, దుష్పూరమైన కామము మొదలైన లక్షణములుగల) ఆసుర సంపదను వదలకపోవటంచేత, ఆతని బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన శాస్త్రజ్ఞానమంతా బూడిదలో పోసిన పన్నీరువలె నిష్పలమే అగుచున్నది.
ఉత్పాద్యమానా రాగాద్యా, వివేక జ్ఞానవహ్నినా,
యథా తథైవ దహ్యంతే, కుతః తేషాం ప్రరోహణమ్?
ఎవ్వడైతే తనయందు బయల్వెడలుచున్నట్టి రాగ -ద్వేషములను బయలుదేరీ - బయలుదేరక ఉన్నప్పుడే మొదలంట్లా ‘జ్ఞానాగ్ని’తో దహించివేస్తాడో, అట్టివానికి ‘పునరావృత్తి - ప్రరోహణ - పునర్జన్మ’ అనే దోషాలు ఎక్కడ ఉంటాయి? ఉండవు.
స్వగుణ దోష విచారణ
యథా సునిపుణః సమ్యక్
పరదోష ఈక్షేణ రతః,
తథా చేత్ నిపుణః స్వేషు
కో న ముచ్యేత బంధనాత్?
తనయొక్క గుణ దోష విచారణ
ఒకానొకడు ఏ విధంగా అత్యంత నైపుణ్యంగా (సునిపుణుడై), తెలివిగా ఇతరుల దోషములను చూస్తూ, మాట్లాడుతూ ఉంటాడో, అదే తెలివి - నైపుణ్యములతో, సమ్యక్ దృష్టములతో తన దోషములను గమనిస్తూ ఉంటే, అట్టివాడు ఎందుకు సంసారబంధములనుండి విముక్తుడు కాడు? తప్పక విముక్తుడౌతాడు.
సిద్ధులు
అనాత్మవిత్ అముక్తోపి
సిద్ధిజాలాని వాంఛతి,
ద్రవ్య మంత్ర క్రియా కాల
యుక్త్య అప్నోతి,
మునీశర్వ!
సిద్ధులు
ఋభు : హే భగవాన్! ఈ జీవుడు తపస్సు, యోగము ఇత్యాదుల ద్వారా ఆత్మజ్ఞాని (ఆత్మవేత్త అగుచుండగా, ఆతనిని సిద్ధులు కూడా సమీపిస్తాయి కదా)

ఆదివరాహస్వామి : ఓ మునీశ్వరా! ఆత్మజ్ఞానానికి సిద్ధులకు ఏ పరస్పరమైన సంబంధమూ లేదు. ఎందుకంటే,
ఒకడు అనాత్మవేత్త (ఆత్మజ్ఞాన రహితుడు) అముక్తుడు (విషయములకు బద్ధుడు) అయి ఉన్నప్పుడు కూడా, ఆతడు సిద్ధులు కావాలని కోరుకొంటూ ఉంటే, ద్రవ్య - మంత్ర - క్రియ - కాలయుక్తంగా అవి లభిస్తూ ఉంటాయి.
యే కేచేన జగత్ భావాః
తాన్ ‘అవిద్యామయాత్’ విదుః।
కథం తేషు కిల ఆత్మజ్ఞః
త్యక్తా విద్యో నిమజ్జతి?
(త్యక్త అవిద్యో - నిమజ్జతి?)
ఏఏ జగత్ భావములు (జగత్తులో కనిపించే సహజీవులపట్ల, వస్తువుల పట్ల భేదపూర్వకమైన భావనలు, అభిప్రాయములు, ఆవేశములు), హృదయంలో ఏర్పడినవై ఉంటున్నాయో, అవన్నీ కూడా ‘అవిద్యామయములే కదా’ - అని ఎరిగి ఉండుము.
ఆత్మజ్ఞుడు స్వభావరీత్యా ‘అవిద్య’ను వదలి ‘విద్య’ యగు ఆత్మయందే రమిస్తూ ఉంటాడు. అటువంటివాడు అవిద్యయే అగు లౌకిక సిద్ధులనే తెచ్చిపెట్టకొని వాటిలో మునుగాలనుకుంటాడా? లేదు.
ద్రవ్య మంత్ర క్రియా కాల
యుక్తయః సాధుసిద్ధిదాః,
పరమాత్మ పదప్రాప్తౌ
న ఉపకుర్వన్తి కాశ్చన।
ద్రవ్యము చేత, క్రియలచేత (యోగాభ్యాసములచేత), కాలమహిమ చేత (కాలం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క సిద్ధిని ప్రకృతి క్రీడా వినోదంగా ఒక్కొక్కరికి ఇచ్చి మరల తీసివేసుకోవటం), కాలకృతంగా సాధనపరులను సిద్ధులు ఆశ్రయిస్తూ ఉంటాయి. అవన్నీ ఎక్కడా కూడా ‘పరమాత్మ పదప్రాప్తి’కి ఏమాత్రం ఉపయోగపడేవి కావు.
సర్వేచ్ఛా కలనా శాంతా వా (తు)
ఆత్మలాభ ఉదయాభిదః।
స కథగ్ం సిద్ధి వాంచ్ఛాయాం?
కథమ్ అర్హతి అచిత్తకః? - ఇతి।।
‘‘ఇతి తృతీయ అధ్యాయః’’
సర్వ ఇచ్ఛాభ్రమలు సశాంతించినప్పుడు మాత్రమే ‘ఆత్మలాభము’ అనేది ఉదయిస్తుంది.
‘‘ఈ జాగ్రత్-స్వప్న-సుషుప్తి అంతర్గతములన్నీ నేను వినోదముగా సిద్ధించుకొంటున్నవే’’ - అనురూపంగా (ఆత్మతత్త్వానుభవ) సిద్ధి కోరుకొనేవాడు లౌకిక సిద్ధులు ఎందుకు కోరుకుంటాడు? కోరుకోడు. ఆతడు చిత్తమును ‘చిత్’ యందు లయింపజేసే ప్రయత్నంలో మాత్రమే ఉంటాడు కదా?
చిత్తమే లేనివాడికి, ‘చిత్తమే అఖర్లేదు’ అనుకొనేవాడికి (అచిత్తకునికి) ఇక లౌకికమైన అణిమ - గరిమ - మహిమ - లఘిమ - ఈశిత్వ - వశిత్వ - ప్రాకామ్య - ఇచ్ఛాది సిద్ధులు వచ్చి ఏం చేసుకుంటాడు? లేనంతమాత్రం చేత నష్టమేమిటి? ఉంటే మాత్రం ఆత్మసమక్షంలో క్రొత్తగా వచ్చిపడేదేమున్నది?
‘‘ఇతి తృతీయ అధ్యాయః’’
‘‘ఇతి తృతీయ అధ్యాయః’’

చతుర్థ అధ్యాయము - ఋభు-నిదాఘ సంవాదము
‘ఋభూ - నిదాఘ - సంవాదము :: శరీరములు - భూమికలు - జీవన్ముక్తుడు’

01. అథ ఋభుం భగవంతం
నిదాఘః పప్రచ్ఛ:
‘‘జీవన్ముక్తి లక్షణమ్
అనుబ్రూహి!’’ …ఇతి।।
పై విషయాలన్నీ భగవంతుడగు ఋభువు ఒకానొక సందర్భములో తనను ఆశ్రయించిన నివాఘడు అనే శిష్యునికి చెప్పుకుంటూ వస్తున్నారు.

నిదాఘుడు : హే భగవాన్! గురుదేవా! ఋభుమహర్షీ! దయామయా! జీవుడనగు నేను జీవన్ముక్తుడను కావాలి కదా? అందుచేత ‘జీవన్ముక్తి లక్షణములు’ గురించి దయతో విశదీకరించండి.
తథేతి సహో వాచ (ఋభౌవాచ):
సప్తభూమిషు జీవన్ముక్తాః చత్వారః।
‘శుభేచ్ఛా’ ప్రథమా భూమికా భవతి।
‘విచారణా’ ద్వితీయా।
‘తనుమాససీ’ తృతీయా।
‘సత్వాపత్తిః’ తురీయా। (చతురీయా)।
‘అసంసక్తిః’ పన్చమీ।
‘పదార్థ భావనా’ షష్ఠీ।
‘తురీయగా’ సప్తమి। ఇతి।।
ఋభుమహర్షి (శిష్యుడగు నిదాఘనితో) :
ఓ ప్రియశిష్యా! సోఽహమ్ ఆత్మస్వరూపా! నిదాఘా! వినండి!
జీవన్ముక్తి సిద్ధించటానికై - సప్త [7] భూమికలు
(1) శుభేచ్ఛ (2) విచారణ (3) తనుమానస - ఈ ‘3’ కూడా ఉపాసనా (లేక) ముముక్షు భూమికలు.
(4) సత్వాపత్తి, (5) అసంసక్తి , (6) పదార్థభావన, (7) తురీయగము
ఇవి అనుభవ భూమికలు.
(జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయములనే 4 అవస్థలతో కూడిన ప్రణవస్వరూపుడగు ఈ జీవుని గురించి, ఆతని ఆత్మానుభవము కొరకై ఈ ఏడు ‘జ్ఞానభూమికలు’ శాస్త్రములచే విశదీకరించబడుచున్నాయి).
ప్రణవాత్మికా భూమికా
‘అ’ కార, ‘ఉ’కార, ‘మ’కార అర్ధమాత్రాత్మికా,
స్థూల సూక్ష్మ బీజ సాక్షి భేదేన
అకారాదయః చతుర్విధాః।
తత్ అవస్థా జాగ్రత్ స్వప్న సుషుప్తి
తురీయాః।
‘అ’కారాది చతుర్విధ [4] ప్రణవాత్మ భూమికలు
(1) ‘అ’కారాత్మికా (2) ‘ఉ’కారాత్మికా (3) ‘మ’కారాత్మికా (4) అర్ధమాత్రాత్మికా
‘స్థూల’ ఆది చతుర్విధ అవస్ధలు
(1) స్థూల (2) సూక్ష్మ (3) బీజ (4) సాక్షీ - భేదేన.
వాటి అవస్థలు (చతుర్విధ అవస్ధలు).
(1) జాగ్రత్ (2) స్వప్న (3) సుషుప్తి (4) తురీయము.
‘అ’కార స్థూలాంశే ‘జాగ్రత్’ - విశ్వః।
సూక్ష్మాంశే తత్ తేజసో।
బీజాంశో తత్ ప్రాజ్ఞః
సాక్ష్యంశే తత్ తురీయః।।
(జాగ్రత్ → స్థూలము
స్వప్నము → సూక్ష్మము,
సుక్షిప్తి → బీజము,
తురీయము → సాక్షి)
చతుర్విధ జాగ్రత్ పురుషులు
Ⅰ. ‘అ’కార → ప్రణవాంశ - జాగ్రత్‌వస్థ - ఆత్మాంశ → ‘విశ్వుడు’
‘ఉ’కార → ప్రణవాంశ - స్వప్న అవస్థ - ఆత్మాంశ → ‘తేజసుడు’
‘మ’కార → ప్రణవాంశ - సుషుప్తి అవస్థ - ఆత్మాంశ → ‘ప్రాజ్ఞుడు’
అర్ధమాత్ర → ప్రణవాంశ - సాక్షి - ఆత్మాంశ →‘తురీయుడు’
ఈవిధంగా ‘అ’కార స్థూలాంశ యందలి చతుర్విధ జాగ్రత్ పురుషులు
‘అ’కారస్థూలాంశగా → జాగ్రత్ విశ్వుడు
సూక్ష్మాంశగా → జాగ్రత్ తేజసుడు
బీజాంశగా → జాగ్రత్ ప్రాజ్ఞుడు
సాక్ష్యాంశగా → జాగ్రత్ తురీయుడు
‘ఉ’కార స్థూలాంశే స్వప్నః।
విశ్వః సూక్ష్మాంశే తత్ తేజసో।
బీజాంశే తత్ ప్రాజ్ఞః।
సాక్ష్యంశే, తత్ తురీయః।।
Ⅱ. ‘ఉ’కార స్థూలాంశ యందలి చతుర్విధ స్వప్న పురుషులు
‘ఉ’కార స్థూలాంశగా - స్వప్నవిశ్వుడు (స్వప్న స్థితి)
సూక్ష్మాంశగా - స్వప్నతేజసుడు (జాగ్రత్)
బీజాంశగా - స్వప్నప్రాజ్ఞుడు (గాఢ నిద్రాస్థితి)
సాక్ష్యంశగా - తత్ (స్వప్న) తురీయుడు (తురీయము)
(III) ‘మ’కారః స్థూలాంశేషు సుప్తః।
విశ్వః సూక్ష్మాంశే।
తత్ తేజసో బీజాంశే।
తత్ ప్రాజ్ఞః।
సాక్ష్యంశే తత్ తురీయః।
Ⅲ. ‘మ’కార స్థూలాంశయందలి చతుర్విధ సుప్త పురుషులు
మకార స్థూలాంశలో - సుషుప్తి - సుప్త విశ్వుడు
సూక్ష్మాంశలో - జాగ్రత్ - సుప్త తేజసుడు
బీజాంశలో - స్వప్నము - సుప్త ప్రాజ్ఞుడు
సాక్ష్యంశలో - తురీయము - సుప్త తురీయుడు
02. (IV) అర్థమాత్రా స్థూలాంశే తురీయ।
విశ్వః సూక్ష్మాంశే।
తత్ తైజసో, బీజాంశే।
తత్ ప్రాజ్ఞః సాక్ష్యంశే।
తురీయ తురీయః।।
Ⅳ. అర్ధమాత్ర స్థూలాంశయందలి చతుర్విధ అర్ధమాత్ర పురుషులు
అర్ధమాత్ర స్థూలాంశలో - తురీయ విశ్వుడు
సూక్ష్మాంశలో - తురీయ తేజసుడు
బీజాంశలో - తురీయ ప్రాజ్ఞుడు
సాక్ష్యాంశలో - తురీయ తురీయుడు
‘అ’కార తురీయాంశాః
ప్రథమ ద్వితీయ తృతీయ భూమికాః।
‘ఉ’కార తురీయాంశా చతుర్థీ భూమికా।
‘మ’కార తురీయాంశా పంచమీ!
అర్థమాత్రా తురీయాంశా షష్ఠీ!
తత్ అతీతా సప్తమీ।

ప్రణవాంశలు - సప్త భూమికలు
‘అ’కార తురీయాంశలో → ప్రథమ భూమిక (శుభేచ్ఛ), ద్వితీయ భూమిక (విచారణ), తృతీయ భూమిక (తనుమానస)।
‘ఉ’కార తురీయాంశలో → 4వ భూమిక - సత్త్వాపత్తి
‘మ’కార తురీయాంశలో → 5వ భూమిక - అసంసక్తి
‘అర్ధమాత్ర’ తురీయాంశలో → 6వ భూమిక - పదార్థ అభావనా
పై వాటికి ఆవల - అతీతమై సప్తమీ భూమిక - తురీయగము।

భూమి త్రయేషు విహరన్ -
‘ముముక్షుః’ భవతి।
తురీయ భూమ్యాం విహరన్
‘బ్రహ్మవిత్’ భవతి।
ముముక్షువు : (‘శుభేచ్చ, విచారణ, తనుమానస’ అనబడే) మొదటి ‘3’ భూమికలలో విహారము చేయచున్నవాడు ‘ముముక్షువు’ అగుచున్నాడు.
బ్రహ్మవిత్ : (‘సత్త్వాపత్తి’ అనబడే) ‘4’వ భూమికలో విహరించువాడు - ‘బ్రహ్మవిత్’ అనబడుచున్నాడు.
పంచమ భూమ్యాం విహరన్
బ్రహ్మవిద్వరో భవతి।
షష్ఠ భూమ్యాం విహరన్
బ్రహ్మవిద్వరీయాన్ భవతి।
సప్తమ భూమ్యాం విహరన్
బ్రహ్మవిద్వరిష్ఠో భవతి।
తత్ర ఏతే శ్లోకా భవంతి।
బ్రహ్మవిద్వరుడు : (‘అసంసక్తి’ అనబడే) ‘5’వ భూమికలో విహరించుచున్నవాడు ‘బ్రహ్మవిద్వరుడు’ అని చెప్పబడుచున్నాడు.
బ్రహ్మవిత్ వరీయుడు : (‘పదార్థ అభావన’ అనబడు) ‘6’వ భూమికలో ప్రవేశించి విహారములు చేయుచున్నవాడు. ‘బ్రహ్మవిత్ వరీయుడు’ అని పిలువబడుచున్నాడు. (‘తురీయగము’ అనబడే) ‘7వ’ భూమికలో ప్రవేశించి విహరిస్తున్నవాడు.
తురీయాతీతుడు : ‘బ్రహ్మవిత్-వరిష్ఠుడు’గా నిర్వచించబడుచున్నాడు.
జ్ఞానభూమిః ‘శుభేచ్ఛా’ స్యాత్
ప్రథమా సముదీరితా।
‘విచారణా’ ద్వితీయా తు।
తృతీయా ‘తనుమానసీ’।
‘సత్త్వాపత్తిః’ చతర్థీస్యాత్।
తతో ‘అసంసక్తి’ నామికా।
‘పదార్థ భావనా’ షష్ఠీ।
సప్తమీ తుర్యగా స్మృతా।
ఈవిధంగా సప్త జ్ఞాన భూమికలు చెప్పబడుచున్నాయి.
‘శుభేచ్ఛా, విచారణ, తనుమానసీ’ అనబడు మూడు ‘జ్ఞాన విహార భూమికలు’గా ఆత్మతత్త్వజ్ఞులచే గానము చేయబడుచున్నాయి.
(4) ‘సత్త్యాపత్తి, (5) అసంసక్తి, (6) పదార్థా భావన, (7) తుర్యగము అనునవి అనుభవ రూపమగు ‘తుర్యగా విహార భూమికలు’ అగుచున్నాయి.
‘‘స్థితః కిం మూఢఏవాస్మి?
ప్రేక్ష్యేఽహమ్ శాస్త్ర సజ్జనైః,
- వైరాగ్య పూర్వమ్ ఇచ్ఛా’’ - ఇతి।।
- ‘శుభేచ్ఛా’ ఇతి ఉచ్యతే బుధైః।।
(1) శుభేచ్ఛ : ‘ఇదేమిటిరా బాబూ! అశాశ్వతము, కాలబద్ధము అగు ఈ జీవితంలో ఇంద్రియ విషయ పరంపరలకు, ఇంద్రియ ప్రియములకు అపేక్షలకు వెచ్చిస్తూ, ‘పంచేంద్రియములు’ అనే ఉపకరణములను క్రమంగా వృధా చేసుకుంటున్నాను? ఇకనుంచైనా శాస్త్రములను, సజ్జనులను ఆశ్రయించి, రాగమును త్యజిస్తూ (విరాగినై) - శాశ్వతము, దేహానంతరము కూడా ఉత్తమ ప్రయోజనకరము అగు మార్గములను అన్వేషిస్తాను’ అను వైరాగ్య పూర్వకమైన ‘ఇచ్ఛ’ను - బుధులు ‘శుభేచ్ఛ’ - అని పిలుస్తున్నారు.
శాస్త్ర సజ్జన సంపర్క
వైరాగ్య అభ్యాసపూర్వకమ్
సదాచార ప్రవృత్తిర్యా
ప్రోచ్యతే సా ‘విచారణా’।।
(2) విచారణా : ఎప్పుడైతే వైరాగ్యముతో కూడిన ‘శుభేచ్ఛ’ ప్రారంభమైనదో, అది క్రమంగా తీవ్రతరమగుచుండగా, ఆ జీవుడు ప్రేమ-కరుణ-ఓర్పు-దానము-ధర్మము ఇటువంటి సదాచారములపట్ల, శాస్త్ర - సజ్జనసంపర్క - వైరాగ్య - ఇత్యాది కార్యక్రమముల పట్ల ప్రవృత్తుడగుచున్నాడు. ఇప్పుడాతడు క్రమంగా ‘విచారణ’ - అను భూమికలో ప్రవేశించినవాడగుచున్నాడు. పఠనము, శ్రవణము, అధ్యయనము ప్రారంభిస్తున్నాడు.
విచారణా శుభేచ్ఛాభ్యామ్
ఇంద్రియార్థేషు రక్తతా
యత్ర సా తనుతామ్ ఏతి
ప్రోచ్యతే ‘తనుమానసీ’।
(3) తనుమానసీ : విచారణ, శుభేచ్ఛల అభ్యాసముచే ఆ జీవునికి శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ రూపములగు ఇంద్రియ విషయములపట్ల ‘అభినివేశము’- (Involvement, Engagement) తనుతము (తగ్గటము) జరుగుచూ ఉండగా, ఆతడు ‘తనుమానసీ భూమిక’ లో ప్రవేశించినట్లు చెప్పబడుచున్నాడు.
భూమికా త్రితయాభ్యాసాత్
చిత్తే అర్థనిరతేః వశాత్।
సత్త్వాత్మని స్థితే శుద్ధే
‘సత్త్వాపత్తిః’ ఉదాహృతా।।
(4) సత్త్వాపత్తి : ‘శుభేచ్ఛ - విచారణ - తనుమానసి’ అను ‘3’ భూమికలు అభ్యసిస్తూ ఉండగా ఆతని చిత్తము ఆతనికి వశము అగుచూ, ఇంద్రియార్థములనుండి వెనుకకు మరల సాగుతుంది. శుద్ధి అగుచూ సాత్వికత, దైవీగుణములు సంతరించుకోసాగుతుంది. చిత్తము సాత్త్విక శుద్ధి పొందుచుండగా, ఆ జీవుడు ‘సత్త్వాపత్తి’ అనే నాలుగవ భూమికలో సంచరించువాడగుచున్నాడు.
దశా చతుష్టయాభ్యాసాత్
‘అసంసర్గ’ ఫలా తు యా।
రూఢసత్త్వ చమత్కారా
ప్రోక్తా ‘అసంసక్తి’ నామికా।।
(5) అసంసర్గ : పై నాలుగు అభ్యాసముల వలన క్రమంగా ‘అసంసర్గ’ అను ప్రయోజనము సిద్ధిస్తోంది. ‘సత్త్వ (Positive, Divine) భావనయందు ఆరూఢత్వము’ అనే చమత్కారము ‘అసంసక్తి’ అను భూమికకు దారితీస్తోంది. దృశ్య విషయములపట్ల సత్యదృష్టి తొలగుచూ అనిత్యముగా ఎరిగి ఉండటము, వాటితో సర్గము (Attachment) లేకపోవటం అసంసర్గము.
03. భూమికా పంచకాభ్యాసాత్
స్వాత్మారామతయా భృశమ్
అభ్యంతరాణాం బాహ్యానాం
పదార్థానామ్ అభావనాత్,
(6) పదార్థ అభావన : ‘శుభేచ్ఛ - విచారణ - తను మానసి - సత్త్వాపత్తి - అసంసర్గ’ ….అనే అయిదు భూమికలు ‘సాధనా ప్రదేశములు’ అగుచుండగా, ఇక ఈ జీవుడు ‘స్వ-ఆత్మారాముడు’ అగుచున్నాడు. ‘ఆత్మ’యందు క్రమంగా అనుక్షణిక సంచారుడగుచున్నాడు. ఆత్మ మాత్రమే అతనికి ‘పదార్థము’ అగుచున్నది.
అట్టి స్థితిలో ఆ జీవుడు, (1) బాహ్యమున నామ-రూప-వస్తు-సంఘటన మొదలైన వ్యవహారములన్నీ, (2) అంతరమున కామ-క్రోధ-లోభ-మద- మాత్సర్య-ఇత్యాది అజ్ఞానజనిత భావాలన్నీ- ‘అభావన’ చేయటం ప్రారంభిస్తాడు. ‘అభావన’ అనే అగ్నితో విషయవాసనలను దగ్ధం చేయనారంభిస్తాడు.
పరప్రయుక్తేన చిరం
ప్రయత్నేన అవబోధనమ్,
‘పదార్థభావనా’ నామ
షష్ఠీ భవతి భూమికా।।
‘ఇహము’(This side of self)ను అధిగమించి ఆవల గల పరస్వరూపము (లేక) ‘పరమాత్మ’యొక్క భావన - అవబోధనలయందు ప్రయత్నశీలుడై ఉంటాడు. పరమును ఆశ్రయిస్తూ, ద్రష్ట - దృశ్యములకు ఆవలగల ‘దృక్’ స్వరూపధారి అగుచున్నప్పుడు ‘పదార్థ - అభావన’ అనబడు ‘6’వ భూమికలో హాయిగా సంచరించుచున్నాడు. (ఇది జగత్ పదార్థ అభావన-ఆత్మపద అర్ధభావనా రూపము).
షట్ భూమికా చిరాభ్యాసాత్
భేదస్య అనుపలంభనాత్,
యత్ స్వభావైక నిష్ఠత్వం
సా జ్ఞేయా ‘తుర్యగా గతిః’।
(7) తుర్యగము : (పైన చెప్పిన) ‘6’ భూమికల సుదీర్ఘమైన అభ్యాసముచే, సర్వభేద భావములు రహితమగుచూ, సహజము-అనునిత్యము అగు’ స్వస్వభావ-నిష్ఠత్వము సిద్ధించుటచే తుర్యగా గతి గా ఇది చెప్పబడుతోంది. ఇది జీవుని స్వాభావిక స్థితి/స్థానం. సర్వము స్వాత్మతో ఏకము అవటమే తుర్యగము.
శుభేచ్ఛ - ఆది త్రయం భూమి
భేద - అభేదయుతం స్మృతమ్।
‘శుభేచ్ఛ’ ‘విచారణ’ ‘తనుమానసి’ అనబడే మొట్టమొదటి ‘3’ భూమికలు (1) భేదయుతము (2) అభేదయుతము - అని రెండు స్థితులుగా చెప్పబడుతోంది.
యథావత్ వేద బుద్ధ్యా ఇదమ్
జగత్ జాగ్రతి దృశ్యతే
అద్వైతే స్థైర్యమ్ ఆయాతే
ద్వైతే చ ప్రశమం గతే।
ఈ దృశ్యమానమగుచున్న జాగ్రత్ జగత్తు ఏ బుద్ధిచే తెలియబడుచున్నదో (Object being known) , అట్టి దృశ్య జగత్తు - వేరువేరుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ, అద్వైత ఆత్మజ్ఞాన-అవగాహన-అనుభూతులచే-అతీత అఖండ దృష్టిగా ప్రతిఫలిస్తోంది. స్వప్నంలో కనిపించే వేరువేరైనవన్నీ స్వప్నము తనదైనవాడి స్వప్నచైతన్య ములో ఏకమగునట్లు -అన్ని ద్వైతములు ప్రశమనము పొందుచున్నాయి.
పశ్యంతి స్వప్నవత్ లోకం,
తుర్యభూమి సుయోగతః।।
ద్వైతమంతా శాంతించగా, తురీయభూమికను చేరిన యోగి ఈ జాగ్రత్ దృశ్యమంతా స్వప్నంలో కనిపించే [(మెలకువరాగానే) అదృశ్యమవబోయే] ‘స్వప్నదృశ్యము’వలె (సుయోగత్వముచే) చూచుచున్నాడు.
విచ్ఛిన్న శరదాహ్రాంశ విలయం
ప్రవిలీయతే।
సత్త్వ అవశేష ఏవ అస్తే,
హే నిదాఘ! దృఢీకురు।
ఆకాశంలో శరత్కాలంలో కనిపించే మేఘాలు విడిపోగానే, అప్పటివరకు ఆకాశంలో కనబడిన మేఘముల ఆకారమంతా ఏమౌతోంది? ఆకాశంలో లయమగుచున్నది కదా! ఓ పుణ్యచరితుడా! పాపరహితుడా! నిదాఘా! ఈ కనబడే జాగ్రత్ జగత్తు అంతా ఆత్మయందే కనిపిస్తూ తిరిగి ‘కేవల సత్త’గానే అవశేషిస్తోంది. ఈ జగత్తు, ఇందలి సాకారత గురించి అటువంటి అనుభావనను దృఢీకరించుకో. ఇది సత్త్వావశేషము.
పంచభూమిం సమారుహ్య
‘సుషుప్తిపద’ నామికామ్।
శాంతాశేష విశేషాంశః
తిష్ఠతి అద్వైత మాత్రకే।।
ఈ జీవుడు - శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్త్వాపత్తి, అసంసక్తి అనబడే మొదటి ‘5’ భూమికలలో సంచరిస్తూ, 5వ భూమికలో ఉండగా, అది ‘సుషుప్తి పదము’ వంటిదిగా చెప్పుతారు. ఎందుకంటే ఆ పంచభూమికలో లౌకిక విశేషాంశలు అన్నీ కూడా నిశ్శేషంగా సశాంతించిన వగుచున్నాయి. ఆ యోగి ‘ఇదంతా సర్వదా మమకేవల ఆత్మస్వరూపమే’ అనబడు అద్వైత స్థితి - స్వాభావికానుభవములయందు క్రమక్రమంగా సుశిక్షితుడై, తిష్ఠితుడు అగుచున్నాడు.
అంతర్ముఖతయా నిత్యం
బహిర్వృత్తిపరోఽపిసన్,
పరిశ్రాంతతయా నిత్యం
‘నిద్రాళుః’ ఇవ లక్ష్యతే।
అట్టివాడు బహిర్వృత్తులు కలిగి ఉంటున్న సమయ, సందర్భములలో కూడా సర్వదా అంతర్ముఖత్వమును కొనసాగిస్తూనే ఉంటాడు. జాగ్రత్తులో వ్యవహరిస్తూనే, గాఢనిద్రలో ఉన్నవానివలె పరమశాంతుడై, ఊరట, విశ్రాంతిలను అనుభవిస్తున్నవాడై ఉంటాడు.
కుర్వన్ అభ్యాసమ్ ఏతస్యాం
భూమ్యాం సమ్యక్ వివాసనః
సప్తమీ గూఢ సుప్త్యాఖ్యా
క్రమ ప్రాప్తా పురాతనీ।।
‘6’వ భూమికయగు పదార్థ - (అ)భావన యందు సమ్యక్ - సర్వత్రా సమభావనా నిరతుడై ఉండటము బాగుగా అభ్యాసము అవుతూ ఉంటుంది.
క్రమంగా సర్వమునకు ఆది, (జన్మ-కర్మలకంటే మునుముందైనది కాబట్టి) పురాతనము, రహస్య సుప్తస్వరూపము అగు సప్తమ భూమిక సిద్ధించినదగుచుచున్నది.
యత్ర న అసత్, న సత్ రూపో
నాహం, నాపి అనహం కృతిః,
కేవలం క్షీణమనన ఆస్తే
(అ)ద్వైతే-తి నిర్భయః।
ఎక్కడైతే
- ఇది సత్తు, ఇది అసత్తు అనురూపముగా ఏదీ శేషించదో,
- ఏది ‘అహమ్’ కృత రూపముగా గాని, న - అహమ్ కృతమైగాని లేదో,
- మనస్సు క్షీణించినదై, ఈ జీవుడు కేవలీ స్వరూపుడై తనకు ద్వితీయమనునదేదీ ఎక్కడా కించిత్ కూడా లేనివాడగుచున్నాడో - అదియే ద్వైతము తొలగగా, దాటిపోయి అద్వైత నిర్భయుడు అగు స్థితి.
శూన్యకుంభము
అంతశ్శూన్యో బహిః శూన్యః
శూన్యకుంభ ఇవ అంబరే।

పూర్ణకుంభము
అంతఃపూర్ణో బహిః పూర్ణః
పూర్ణకుంభ ఇవ ఆర్ణవే।
- ఒక ఖాళీగా ఉన్న కుండకు లోపల - బయటా కూడా శూన్యమే ఉన్న తీరుగా, ఎవ్వడు ఈ దేహము పట్ల ఈ సమస్త దృశ్యము పట్ల అంతఃశూన్యుడు - బహిఃశూన్యుడు (Nothing inside and nothing outside) అయినవాడై ఆకాశమువలె వెలయుచున్నాడో,
జలములో ముంచి ఉంచబడిన కుండ ఏ విధంగా లోపల జలముచే పూర్ణముగా, బయట అదే జలముచే పూర్ణముగా ఉన్న తీరుగా, ఏ యోగి దేహ - విశ్వములను లోన బయట ఆత్మచే పూర్ణముగా దర్శిస్తాడో అదియే తురీయానుభవము.
మా భవ గ్రాహభావాత్మా।
అగ్రాహకాత్మా చ మా భవ।।
అందుచేత ఓ నిదాఘా! ఈ దృశ్య జగత్తును అన్యముగా గ్రహించినవాడవు (Taker) అవవద్దు. గ్రహించనివాడవు (Non Taker) కూడా అవవద్దు. (గదిలోని దీపపు కాంతి ఏదీ గ్రహించదు, త్యజించదు కదా!)
భావనాం అఖిలాం త్యక్త్వా
యచ్ఛిష్టం (యత్ శిష్టం) తన్మయో భవ।
ద్రష్టృ దర్శన దృశ్యాని
త్యక్త్వా వాసనయా సహ
దర్శన ప్రథమ ఆభాసమ్
ఆత్మానం కేవలం భజ।।
నిదాఘుడు : స్వామీ! మరి నేను ఏదిగా ఉండాలి? గ్రాహ్య - త్యాజ్యరహితత్త్వమంటే ఏమిటి?

ఋబు : భావనలన్నీ దాటిపోయి త్యజించివేసి ‘భావాతీతుడవు’ అగుము. అభావిస్తూ ఉన్నప్పుడు కూడా ఏది శేషించియే ఉంటుందో, భావములకు ఆవల- ఈవల కూడా ఉన్నదో,- అదియే నీవు అయి ఉండుము. ద్రష్టు - దర్శన - దృశ్యములను (The Perceiver The Perception and The Object) వాటి వాటి వాసనలతో సహా త్యజించి వేసి, వాటిని ఆత్మయొక్క ఆభాసగా (దర్పణంలోను, జలములోను ప్రతిబింబిస్తూ కనిపించే ఆకాశము వలె) చూడుము. ఆత్మదర్పణంలో కనిపించే ఆభాసన వలె ఎరిగి కేవలము ఆత్మను మాత్రమే సేవించుము. ఆత్మవై ఆత్మగా ఆత్మను దర్శిస్తూ సేవిస్తూ ఆస్వాదిస్తూ ఉండుము.
జీవన్ముక్తుడు
యథాస్థితమ్ ఇదమ్ యస్య
వ్యవహారవతోఽపి చ
అస్తంగతం స్థితం చిత్తం
స ‘జీవన్ముక్త’ ఉచ్యతే।
జీవన్ముక్తుడు
ఇక్కడి యథాస్థితంగా ఎప్పుడు ఎక్కడ ఎట్లా వ్యవహరించాలో, అట్లా వ్యవహరిస్తూ ఉంటూనే…. (ఒక నటుడు తన సహజమగు -నాటకమునకు సంబంధించని వ్యక్తిగత రూపము సర్వదా నాటకమునకు వేరుగా కలిగి ఉంటున్న విధంగా)….,
ఎవ్వడైతే అంతర హృదయాకాశంలో సహజమగు సంస్థితి (ఉనికి) కలిగి ఉండి, ఈ జగన్నాటకమును నాటకంగానే చూస్తాడో - ఆతడు జీవన్ముక్తుడు.
04. న ఉదేతి, న అస్తమ ఆయాతి
సుఖ దుఃఖే మనః ప్రభా।
యథా ప్రాప్త స్థితిః యస్య
స ‘జీవన్ముక్త’ ఉచ్యతే।।
ఎప్పుడు ఏఏ స్థితి గతులు ప్రపంచంలో పొందుతున్నప్పటికీ కూడా, ఎవడి మనసైతే ఇక్కడ సుఖ దుఃఖములలో ఉదయించక, అస్తమించక, (నాటకపాత్రవలె) సర్వదా సర్వమునకు వేరై ఉంటుందో, ఆతడు జీవన్ముక్తుడు.
యో జాగర్తి సుషుప్తిస్థో
యస్య జాగ్రత్ న విద్యతే
యస్య నిర్వాసనో బోధః
స ‘జీవన్ముక్త’ ఉచ్యతే।
ఎవ్వనికి యొక్క జాగ్రత్ వ్యవహారానుభవమంతా సుషుప్తి (గాఢనిద్ర)యందు ఉన్నవానివలె అవిషయమై, ‘జాగ్రత్’గా (ఇంద్రియ విషయసమూహ సమన్వితంగా) అవకయే ఆతడు ఉంటాడో,
ఎవ్వని బోధ స్వరూపము (కేవలమగు ‘‘చిత్ స్వరూపము’’), ‘‘అన్యమును వెలిగించు (Enlightening) స్వరూపము’’ అయి దృశ్య సంబంధమైన వాసనలు ఏమాత్రము లేనిదై ఉంటుందో, ఆతడే - జీవన్ముక్తుడు.
రాగ ద్వేష భయాదీనామ్
అనురూపం (మనురూపం) చరన్నపి,
యో అంతర్వ్యోమవత్ యత్యచ్ఛః
స ‘జీవన్ముక్త’ ఉచ్యతే।
ప్రాపంచకంగా చూస్తే (ఇహమునందు) రాగము - ద్వేషము - భయము మొదలైనవి సందర్భానుసారంగా ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ, అంతరమున శూన్యాకాశమువలె (పడవ నీళ్ళలో ఉన్నప్పటికీ, పడవలో నీళ్ళు ఉండని తీరుగా) - అత్యంత స్వచ్ఛముగా దృశ్య విషయరహితుడై ఉంటాడో, ఆతడు జీవన్ముక్తుడు.
యస్య నాహంకృతో భావో,
బద్ధిః యస్య న లిప్యతే,
కుర్వతో - అకుర్వతోవాపి
స ‘జీవన్ముక్త’ ఉచ్యతే।।
ఒక రచయిత ‘రచన’ చేస్తూ ‘‘ఈ పాత్రల పరస్పర ప్రవర్తనలు నేనే నిర్వర్తిస్తున్నాను’’ - అని అనుకుంటూ వ్రాస్తాడా? లేదు. పాఠకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని పాత్రలను, ఆ పాత్రల స్వభావములను కల్పన చేస్తూ, తాను వేరుగానే అయి ఉంటాడు. పాత్రగా అవడు. అట్లాగే ‘ఈ ప్రపంచంలో ఏది నేను చేస్తున్నా, (లేక) చేయకున్నా కూడా దీనికంతటికీ నేను చేస్తున్న వాడిని కాదు. చేయని వాడిని కాదు’…అను అవగాహనతో, అతని బుద్ధి దోష రహితమై (కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్య రహితమై) ఉంటుందో, అట్టివాడు - కర్మలు నిర్వర్తించినా, (లేక) నిర్వర్తించకున్నా కూడా సర్వదా - ‘జీవన్ముక్తుడు’ అని చెప్పబడుతోంది. పాత్ర ఎట్లా రచించబడినా కూడా ఆ స్వభావము రచయితను స్పృశించదు కదా!
యస్మాన్ న ఉద్విజతో లోకో
లోకాత్ న ఉద్విజతే చ యః,
హర్ష - అమర్ష - భయ ‘ఉన్ముక్తః’
స ‘జీవన్ముక్త’ ఉచ్యతే।।
ఎవ్వడైతే,
- లోకములో (లేక) దృశ్యములో సందర్భములగుచున్న - వ్యక్తులతో, వస్తువులతో సంఘటన, సంబంధ, అనుబంధ, బాంధవ్య - ఇత్యాది వ్యవహారములు చూస్తూ కూడా అంతరంగమున ఏమాత్రము ఉద్వేగము (Becoming emotionaly related) పొందడో,
- తన వలన సహజీవులకు ఉద్వేగము కలుగకుండా చూచుకుంటాడో,
- సంతోష - దుఃఖ - భయములనుండి ఉత్ - ముక్తుడై (Always Beyond and always well relieved) అయి ఉంటాడో, అట్టివాడు ‘జీవన్ముక్తుడు’ అనబడుచున్నాడు.
యః సమస్త అర్థ జాలేషు
వ్యవహార్యపి శీతళః
పరార్థేషు ఇవ పూర్ణాత్మా
స జీవన్ముక్త ఉచ్యతే।।
ఎవ్వడైతే, ఆయా ప్రాపంచకార్థములలో, వ్యవహార పరంపరలలో వ్యవహరిస్తూ ఉండి కూడా, మంచుగడ్డవలె ప్రశాంతంగా, చల్లగా (Very cool calm and pleasant inwardly) ఉంటూ పరమాత్మ - జీవాత్మ- జగత్తుల ఏకస్వరూపముచే పూర్ణాత్ముడై ఉంటాడో….ఆతడు జీవన్ముక్తుడు.
ప్రజహాతి యదా కామాన్
సర్వాం చిత్తగతాన్, మునే!
మయి సర్వాత్మకే తుష్టః
స ‘జీవన్ముక్త’ ఉచ్యతే।।
ఓ నిదాఘ మునీశ్వరా! ‘ఇది ఇట్లా ఉండాలి. అది ఆ విధంగా పరిణమించాలి. ఇది పోవాలి. అది పొందాలి’….ఇత్యాది చిత్తగతమైన సర్వకామములు (Expectations, Pre-requisites, Dependence on the concerned evantualities) మొదలంట్లా అంతర్గతంగా వదిలివేసి ఉంటాడో, తనయొక్క ‘సర్వాత్మత్వము’ను ఎరిగి సంతుష్టుడై ఉంటాడో, ఆతడు జీవన్ముక్తుడు. అంతరమున ఎప్పుడు ఈ సమస్తముపట్ల మౌనము వహించి ఉంటాడో, ఆతడే జీవన్ముక్తుడు.
చైత్యవర్జిత చిన్మాత్రే
పదే పరమ పావనే
అక్షుబ్ధచిత్తో, విశ్రాంతః
స ‘జీవన్ముక్త’ ఉచ్యతే।
కదలుచూ ఉన్న ఆలోచనలు, భావనలు, దేహములు, విషయములు’ - అనబడే ‘చైత్యము’ను ప్రక్కగాబెట్టి, వాటిని కదల్చుచూ ఉన్నట్టి పరమపావనము (పవిత్రము) అగు ‘చిన్మాత్రపదము’ను ఆశ్రయించి, ఎట్టి క్షుబ్దము(Disturbance, Distraction, perturbence, worry) లేనట్టి చిత్తములో పరమవిశ్రాంతుడై ఉండువాడే జీవన్ముక్తుడు.
ఇదం జగత్ అహం సో-యం
దృశ్యజాతం అవాస్తవమ్,
యస్య చిత్తేన స్ఫురతి
స జీవన్ముక్త ఉచ్యతే।
‘ఈ జగత్తంతా కూడా సర్వదా ఎవ్వరి స్వరూపమై యున్నదో అదియే నేనై ఉన్నాను’ అని తనయొక్క నిత్యమగు ‘సత్యరూపము’ను ఎరిగి, ఎవరి చిత్తమునకైతే ఈ దృశ్యజాతమంతా కలలోని దృశ్యమువలె స్వతఃగా అవాస్తవము (న తు సత్యమిహ అణ్వపి) - అని సుస్పష్టముగా స్ఫురిస్తుందో, - ఆతడే జీవన్ముక్తుడు.
సత్ బ్రహ్మణి స్థిరే స్ఫారే
పూర్ణే విషయ వర్జితే ,
ఆచార్య శాస్త్ర మార్గేణ
ప్రవిశ్యాశు స్థిరో భవ।
ఓ నిదాఘ మహాశయా! ఆచార్యులు, శాస్త్రములు కూడా నీయొక్క - నాయొక్క సత్ స్వరూపము, బ్రాహ్మీస్వరూపము, పూర్ణము, సర్వదా సుస్థిరము, స్ఫారము అయిఉన్న స్వకీయ-అనన్యరూపము గురించి చెప్పుచున్నారు. ‘అన్యము’ అయినదంతా ఆత్మయొక్క స్వయం ప్రకాశకము సూచిస్తూ గుర్తుచేస్తున్నాయో-అవి విను. గురువులు శాస్త్రములు చూపు వర్గంలో అట్టి ఆత్మస్వరూపంలో ప్రవేశించి సుస్థిరుడవయ్యెదవుగాక!
శివో గురుః। శివో వేదః।
శివో దేవః। శివః ప్రభుః।
శివో-స్మ్యహమ్। శివః సర్వమ్।
శివాత్ అన్యత్ న కించన।
(ఇతి శివతత్త్వజ్ఞానమ్)।
శివుడే సద్గురువు. శివుడే వేదము (తెలియపరచుగురువు, తెలియబడే దృశ్యజగత్తు - శివుడే). శివుడే దేవాది దేవుడు. శివుడే సర్వమునకు నియామకుడు, యజమాని (సొంతదారు) అగు ప్రభువు. నాలోని నేనైన నేను శివుడే! సర్వము శివుడే! శివమయమే! శివునికి వేరై - ఎక్కడా ఏదీ కించిత్ కూడా లేదు. (కనుక నీవు శివుడవే. ఇదియే శివతత్త్వ జ్ఞానము).
తమేవ ధీరో విజ్ఞాయ
ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః।
ఉత్తమ బుద్ధి గల ధీమంతుడు అట్టి శివతత్త్వము ఎట్టిదో తెలుసుకొని స్వకీయ ప్రజ్ఞచే బ్రహ్మీభూతుడగు ‘బ్రాహ్మణుడు’ అగుచున్నాడు. (బ్రాహ్మణముల హృదయము ఎరిగినవాడు బ్రాహ్మణుడు).
న అనుధ్యాయాత్ బహూన్ శబ్దాన్
వాచో విగ్లాపనం హి తత్।
ఓ నిదాఘా! పెద్దగా శబ్దజాలాన్ని అధ్యయనము చేసి కాలమును, సందర్భములను వృధా చేసుకోవటం కూడా ఉపాయం కాదయ్యా. అదంతా అధికంగా అవుతుంటే వాచా విగ్లాపనమే (వాచాదోషమే) అవుతుంది.
శుకో ముక్తో। వామదేవోఽపి ముక్తః।
తాభ్యాం వినా ముక్తి భాజో న సంతి।
శుకం మార్గం యే
అనుసరంతి ధీరాః
‘సద్యోముక్తాః’ తే భవంతి ఇహ లోకే।
సద్యోముక్తి-క్రమముక్తి :: శుక మార్గ ముక్తి-వామదేవమార్గ ముక్తి
శుకమహర్షి ముక్తుడు. వామ దేవుడు కూడా ముక్తుడే. వారిరువురి మార్గం కాకుండా వేరై వాచామార్గములో పోయి ఒకడు ముక్తి భాజుడుకాలేడు.
సద్యోముక్తి - ‘‘ ఎప్పుడూ కూడా నేను భౌతిక దేహపరిమితుడను కాను. ఈ విశ్వమంతా నా దేహమై, నేనే అయి ఉన్నాను’’ అను శుకభగవానుని విదేహముక్తి మార్గమును ఏ ధీరుడైతే అనుసరిస్తాడో అట్టివాడు ఇప్పుడే, ఇక్కడే సద్యోముక్తుడౌతాడు. ‘సర్వలోకములు నాలోనే ఉన్నాయి. నేనే సర్వము అయి ఉన్నాను’ అనునది సద్యోముక్తి. (లోకములలోని నేను - నాలోని లోకముల అనన్యత్వము).
05. వామదేవం యే అనుసరంతి
నిత్యం మృత్వా జనిత్వా చ
పునః పునః తత్ తేవై లోకే ‘‘క్రమముక్తా’’
భవంతి, యోగైః సాంఖ్యైః కర్మభిః సత్త్వయుక్తైః।।
క్రమముక్తి - ఎవ్వరైతే క్రమక్రమంగా ముక్తిమార్గంలో ప్రవేశించి సాధనపరులై వామదేవుడు చెప్పుమార్గమును అనుసరిస్తారో, వారు మరల మరల అనునిత్యంగా జన్మ మరణములు పొందుతూ యోగ - సాంఖ్య - కర్మ మార్గములు ఆశ్రయిస్తూ ఉన్నవారై - చివరికి ముక్తి స్థానమును చేరుచున్నారు. ఇది ‘క్రమముక్తి’ అని పిలువబడుతోంది.
శుకశ్చ వామదేవశ్చ
ద్వే సృతీ దేవ నిర్మితే।
శుకో ‘విహంగమః’ ప్రోక్తో।
వామదేవః పిపీలికా।।
ఈ విధంగా
(1) శుకమార్గముక్తి (సద్యోముక్తి) - (విహంగ మార్గము)
(2) వామదేవమార్గముక్తి (క్రమముక్తి) - (పిపీలీకా మార్గము)
అను ఈ రెండుమార్గములు శ్రుతులచే మనకు విశదీకరించి ప్రతిపాదిస్తూ చెప్పబడుచున్నాయి. ఇవి సృష్టిలోని చమత్కారంగా దైవీ నిర్మితము.
సద్యోముక్తి (లేక) శుకమార్గముక్తిని ఆకాశంలో పక్షివలె ఎగరటం ‘విహంగమార్గము’ అని కూడా అంటూ ఉంటారు. క్రమముక్తి (లేక) వామదేవమార్గ ముక్తిని పిపీలికామార్గము - చీమవలె ప్రయాణించటం’ అని పిలుస్తున్నారు.
అతత్ వ్యావృత్తిరూపేణ,
సాక్షాత్ విధిముఖేన వా,
మహావాక్య విచారేణ
సాంఖ్యయోగ సమాధినా,
విదిత్వా స్వాత్మనో రూపమ్
అసంప్రజ్ఞా సమాధితః
శుకమార్గేణ విరజాః
ప్రయాంతి పరమం పదమ్।।
ఆ ‘పరతత్త్వము’ పట్ల వ్యావృత్తి రూపములుగా సాధనములు చేస్తూ
✤ సాక్షాత్ విధి (వేదములు) సూచించు యజ్ఞ - యాగ - స్థుతి - ఉపాసనా క్రమములచేతగాని,
✤ సోఽహమ్’, ‘తత్‌త్వమ్’ ‘అయమాత్మా బ్రహ్మ’ ‘అద్వితీయమ్ తత్ ఆత్మాహమ్’ ఇత్యాది మహావాక్యముల పరమార్థమును పునఃపునః విచారణ చేతగాని,
✤ ‘మనో బుద్ధి - చిత్త - అహంకార, పంచకర్మేంద్రియ, జ్ఞానేంద్రియ విషయములు, పంచప్రాణ - జీవాత్మ - ఈశ్వర - పరమాత్మ - ఇత్యాది విశ్లేషణలతో కూడిన సాంఖ్యయోగ శాస్త్ర పరిశీలనచేగాని
✤ తెలుసుకోవటం అనుకోవటం - అనిపించటం, అదే తానవటం అనబడు శ్రవణ - మనన - నిధిధ్యాస, సమాధిలచేగాని,
✤ అసంప్రజ్ఞాసమాధి చేతగాని
చిట్టచివరికి శుకమార్గ సద్యోముక్తిగా ఈ జీవుడు, పరమపదమును తప్పక పొందగలడు.
‘యమా’ ఆది ఆసన జాయా
స హఠాభ్యాసాత్
పునః పునః,
విఘ్న బాహుళ్య సంజాత
అణిమాది వశాత్ ఇహ,
అలబ్ధాఽపి ఫలం సమ్యక్
పునః భూత్వా మహాకులే,
పూర్వ వాసనయైవ అయం
యోగాభ్యాసం పునశ్చరన్।
అనేకజన్మ అభ్యాసేన
‘వామదేవేన’ వై పథా,
సోఽపి ముక్తిం సమాప్నోతి
తద్విష్ణోః పరమం పదమ్।।
యమము (ఇంద్రియ నిగ్రహము), నియమము (ఇంద్రియములను నియమించటము) ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, సమాధి మొదలైనవి మరల మరల హఠపూర్వకంగా అభ్యసించటము చేత క్రమముక్తి తప్పక లభించగలదు. అయితే అట్టి క్రమంలో విఘ్నాలు బాహుళ్యంగా కూడా ఉంటాయి. అటువంటి విఘ్నములలో ముఖ్యమైనవి. అణిమ - గరిమ - మహిమ - లఘిమ….ఇత్యాది అష్టసిద్ధులు తారసపడటము కూడా.
అటువంటి అడ్డంకులు (లేక) చ్యుతి (Hurdles or Distractions) వలన ఆత్మసిద్ధి / యోగసిద్ధి లభించకపోవటం జరిగితే? (‘వామ దేవపధము’ అను సిద్ధాంతమును (మార్గమును) అనుసరించి)- అట్టి యోగాభ్యాసి యోగసిద్ధిని పొందకయే దేహము ముగియటము జరగవచ్చు. అట్లా జరిగితే కూడా ఆతడు (ఆ యోగభ్రష్టుడు) నష్టపోడు.
సమ్యక్ సిద్ధి (సర్వసమస్వరూపాత్మానుభవం) కొరకై మరల మహనీయుల కులంలో జనిస్తున్నాడు. అక్కడ పూర్వ వాసనలు కారణంగా యోగాభ్యాసమును పునశ్చరణ చేసుకొని, ఇక అక్కడి నుండి యోగసాధన మొదలైనవి కొనసాగిస్తున్నాడు.
ద్వావిమా (ద్వా ఇమా) పథ పంథానౌ
బ్రహ్మప్రాప్తి కరౌ శివౌ।
సద్యోముక్తి ప్రదశ్చ - ఏకః।
క్రమ ముక్తి ప్రదః - పరః।
అత్ర కో మోహః? కో శోకః?
ఏకత్వం అనుపశ్యతః।।
ఈ విధంగా వామదేవమార్గం (క్రమముక్తి)ని అనుసరించిన వాడు కూడా అనేక జన్మల అభ్యాసముచే ‘విష్ణుపరమపదము’ అనే ముక్తిని పొందుచున్నాడు.
ఈ విధంగా రెండు మార్గములలోను శివస్థానము అను ముక్తి పదము ఈ జీవుడు పొందగలడు. రెండూ (క్రమముక్తి, సద్యోముక్తి) ఒకచోటికే చేరుస్తున్నాయి.
ఓయీ, నిదాఘా! ఓ సర్వజనులారా! అట్టి ఉభయములగు సద్యోముక్తి - క్రమముక్తి మార్గములలో ఏదో ఒకటి ఆశ్రయించి ఉండండి. లక్ష్యము సిద్ధించిన తరువాత ఇక శోకమెక్కడిది? మోహమెక్కడిది? అట్టివాడు సర్వత్రా ఏకత్వమే దర్శించుచున్నాడు.
యస్య అనుభవపర్యంతా
బుద్ధిః తత్త్వే (సత్త్వే) ప్రవర్తతే
తత్ దృష్టి గోచరాః సర్వే
ముచ్యంతే సర్వ పాతకైః।।
ఎవని బుద్ధి ఆత్మభావన సిద్ధించేవరకు, ఆత్మానుభవము అనుక్షణికమయ్యే వరకు సత్త్వమార్గములో (సత్త్వగుణాశ్రయముతో) ప్రయత్నశీలుడై ఉంటాడో, అట్టివాడు ఇక తన దృష్టికి గోచరమయ్యేదంతా ఆత్మగా భావన సిద్ధించుకొన్నవాడై, సర్వదోషముల నుండి పాతకముల నుండి విముక్తుడు కాగలడు.
ఖేచరా భూచరాః సర్వే
బ్రహ్మవిత్ దృష్టిగోచరాః
సద్య ఏవ విముచ్యంతే
కోటి జన్మార్జితైః అఘైః। ఇతి।।
ఎవ్వడు సర్వ ఖేచరులను (ఆకాశంలో సంచరించే దేవతలు మొదలైనవారిని), భూచరులను (సర్వమానవ - జంతు ఇత్యాదులను) ఆత్మజ్ఞాన దృష్టితో చూడటము చేస్తూ ఉంటాడో, సదా సర్వదా అభ్యసిస్తూ ఉంటాడో, - అట్టివాడు కోటి జన్మలలో నిర్వర్తించిన పాపకర్మల నుండి కూడా విముక్తుడై ‘సద్యోముక్తుడు’ కాగలడు.
ఇతి చతుర్ధోఽధ్యాయః
ఇతి 4వ అధ్యాయము

పంచమ అధ్యాయము - యోగాభ్యాస విధి - విధానములు

01. అథ హి ఏనం ఋభుం
భగవంతం, నిదాఘః పప్రచ్ఛ :
‘యోగాభ్యాస విధిమ్’ అనుబ్రూహి - ఇతి।।
తథేతి సహో వాచ
పంచభూతాత్మకో దేహః, పంచమండల పూరితః।
కాఠిణ్యం పృథివీం ఏకాం।
పానీయం తత్ ద్రవాకృతిః।
దీపనం చ భవేత్ తేజః।
ప్రచారో వాయు లక్షణమ్।
ఆకాశః సత్త్వతః సర్వం।
జ్ఞాతవ్యో యోగమ్ ఇచ్ఛతా!
నిదాఘుడు : హే సద్గురూ! ఋభు మహాత్మా! భగవాన్! ఇప్పుడిక ‘యోగాభ్యాస విధి’ గురించి వివరించమని ప్రార్థిస్తున్నాను.

ఋభుమహర్షి : ఓ నిదాఘ - ఆత్మానంద స్వరూప మహాశయా! వినండి.
ఈ భౌతికదేహము ‘మట్టి-నీరు-అగ్ని-గాలి-ఆకాశము’-అనే పంచ భూతములతో తయారౌతోంది. ఇది పంచమండలములో పూరితమై యున్నది.
- కాఠిణ్యమైనదంతా ఏక పృథివీతత్త్వము. ఘనతత్త్వము.
- పానీయమై ఉన్నదంతా ద్రవాకృతి - జలతత్త్వము.
- దీపమురూపంగా వెలిగేదంతా తేజస్సు - అగ్నితత్త్వము.
- వాయువు అంతటా ప్రసరించియుండు లక్షణము కలిగియున్నది- ప్రసరణతత్త్వము.
- ఆకాశము సత్వ (ఉనికి) లక్షణముగా కలిగియున్నది. (ప్రచారతత్త్వము)
యోగాభ్యాసమునకు ఉపక్రమించువాడు ఈ పంచభూతముల లక్షణము ఎరిగి, యోగభ్యాసశీలుడగును గాక!
షట్ శతాని అధికాని అత్ర
సహస్రాణి ఏక వింశతి (21600)
అహోరాత్రవహైః శ్వాసైః
వాయుమండల ఘాతతః।
తత్ పృథ్వీమండలే క్షీణే
వలిరాయాతి దేహినామ్।
ఉచ్ఛ్వాస నిశ్వాసలు
ఒక అహోరాత్రము (పగలు - రాత్రి కలిపి) 21600 శ్వాసలు వాయు మండలమును ఛేదిస్తూ (ఘాతతంగా) ఈ శరీరములో జరుగుచున్నది.
(కాలముచేత ఈ జీవునిపట్ల భౌతికదేహము జనించి, వృద్ధి చెంది, క్షయిస్తూ క్రమంగా నశించు స్వభావము కలిగియున్నది).
ఈ శరీరములో పృథ్వీమండలము (Solid Division) క్షీణించుచుండగా దేహమంతా ముడతలు కనిపించ ప్రారంభిస్తాయి.
తద్వత్ ఆపోగణాపాయే
కేశాస్స్యుః పాండరాః క్రమాత్।
తేజః క్షయే క్షుదా కాంతి నశ్యేతే।
మారుతక్షయే వేపథుః సంభవేః,
నిత్యం నాభసేనైవ జీవతి।
అట్లాగే జలవిభాగము తగ్గుచుండగా వెంట్రుకలు నెరవటం (తెల్లబడటం) ప్రారంభిస్తాయి.
అగ్ని (తేజస్సు) తగ్గుతూ ఉంటే శరీరములో కాంతి తగ్గనారంభిస్తుంది. ఆకలి తగ్గిపోసాగుతుంది.
గాలి శక్తి శరీరంలో తగ్గుతూ ఉండగా, శరీరంలో అనేకచోట్ల వణుకు, (కంపనములు) ప్రారంభం కాగలవు.
అనునిత్యంగా ఆకాశముతోగల సంబంధము చేతనే ఈ దేహము జీవించటమును కొనసాగించ గలుగుతోంది.
ఇత్థం భూతక్షయాత్ నిత్యం, జీవితం భూతధారణమ్।
ఉడ్యాణం కురుతే యస్మాత్, అవిశ్రాంతం మహాఖగః।
ఉడ్డియాణం తదేవస్యాత్ తత్ర ‘బంధో’ అభిధీయతే।
ఉడ్డియాణో హి అసౌ బంధో ‘మృత్యు మాతంగ కేసరీ’।
తస్యముక్తిః తనోః కాయాత్, తస్య బంధో హి దుష్కరః।
ఈ దేహముపట్ల ఇటువంటి ‘భూతక్షయము’ అనే ధర్మము జరగటం - ‘మరణము’ అగుచున్నది. భూతధారణము ‘జీవితము’ అగుచున్నది.
అవిశ్రాంతంగా ఎగురుచూ ఉండే ‘మహాఖగము’ అనబడు ప్రాణవాయు సంచాలనమును ‘‘ప్రాణాయామయోగ సాధన’’తో నిశ్చలముచేయటమే కుంభక ప్రాణాయామము) అగు ‘ఉడ్డియాణ బంధము’.
అటువంటి ప్రాణాయామ కుంభకరూప ‘ఉడ్డీయాణ బంధము’
మృత్యువు అనే ఏనుగుకు సింహము వంటిది అగుచున్నది.
అ ఉడ్డీయాణబంధము (యోగాభ్యాసము) వలన ఈ జీవుడు దేహబంధములనుండి విముక్తుడగుచున్నాడు. దుష్కరమగు శరీరబంధము నుండి అతీతతత్త్వమును సాక్షిత్వమును అనుభవమునకు తెచ్చుకొనుచున్నాడు.
అగ్నౌతు చలితే కుక్షౌ
వేదనా జాయతే భృశమ్।
న కార్యా క్షుధితేనాపి
నాపి విణ్మూత్ర వేగినా।
జఠరాగ్ని పొట్టలో జ్వలిస్తున్నప్పుడు ఈ శరీరమునకు ‘ఆకలి’ అనే వేదక కలుగుతోంది.
‘ఆకలి’గా ఉన్నప్పుడు యోగాభ్యాసము కుదరదు. మలమూత్ర వేగము సందర్భములలో యోగాభ్యాసము తగిన సమయం కాదు.
హితం మితంచ భోక్తవ్యం
స్తోకం స్తోకం అనేకథా।
మృదుమధ్యసు మంత్రేషు
క్రమాత్ మంత్రం లయం హఠం।
లయ మంత్ర హఠా యోగా,
యోగో హి అష్టాంగ సంయుతః।।
యోగాభ్యాసియొక్క ఆహార నియమము
హితంగా ఉండేవి మితంగా భుజించాలి. కొంచము ఆహారము రోజులో ఎక్కువసార్లు తీసుకోవాలి.
మంత్రము - అర్థము
మంత్రమును మృదువుగా మననము చేస్తూ, క్రమంగా మంత్రమును లయం చేస్తూ మంత్రార్ధభావనను ఆశ్రయించాలి. ఈ జగత్తును ఆత్మయందు లయింపజేయటమే ‘లయమంత్ర - లయయోగము’. అట్టి యోగమునకు అంగములు ‘8’.
యమశ్చ నియమశ్చైవ, తథా చ ఆసనమేవ చ।
ప్రాణాయామః తథా పశ్చాత్, ప్రత్యాహారః తథా పరమ్।
ధారణా చ తథా ధ్యానం, సమాధిశ్చ అష్టమో భవేత్।।
అష్టాంగ యోగములు
(1) యమము (2) నియమము (3) ఆసనము (4) ప్రాణాయామము (5) ప్రత్యాహారము (6) ధారణ (7) ధ్యానము (8) సమాధి.
02. అహింసా సత్యమ్ అస్తేయం
బ్రహ్మచర్యమ్ దయ ఆర్జవమ్
క్షమా ధృతిః మితాహారః శౌంచం - చ
ఇతి ‘యమా’ దశ (10)।
దశ (10) విధ యమములు
(1) అహింస (2) సత్యము (3) అస్తేయము (తనది కానిది స్వీకరించకపోవటం) (4) బ్రహ్మచర్యము (5) దయ (6) ఆర్జవము (మనసా, వాచా, కర్మణా ఏకత్వము) (7) క్షమ (8) ధృతి (9) మితాహారము (10) శౌచము. ఇవి ‘యామా దశ’.
తపః సంతోషం ఆస్తిక్యం, దానం ఈశ్వరపూజనమ్
సిద్ధాన్తశ్రవణం చ ఏవ, హ్రీః మతిశ్చ జపో వ్రతం
ఏతే హి ‘నియమాః’ ప్రోక్తా
దశధైవ (10) మహామతే!
దశవిధ నియమములు (10)
(1) తపస్సు (2) సంతోషము (3) ఆస్తిక్యభావనలు (4) దానము (5) ఈశ్వరపూజనము (6) సిద్ధాంత శ్రవణము (7) హ్రీ (8) మతి (9) జపము (10) వ్రతము.
ఏకాదశ ఆసనానిస్యుః, చక్రాద్యా, మునిసత్తమ!
చక్రం పద్మాసనం కూర్మం, మయూరం కుక్కుటం తథా
వీరాసనం స్వస్థికం చ, భద్రం సింహాసనం తథా
ముక్తాసనం గోముఖం చ, కీర్తితం యోగవిత్తమైః।।
ఏకాదశ ఆసనములు
(1) చక్రాసనము (2) పద్మాసనము (3) కూర్మాసనము (4) మయూరాసనము (5) కుక్కుటాసనము (6) వీరాసనము (7) స్వస్థికాసనము (8) భద్రాసనము (9) సింహాసనము (10) ముక్తాసనము (11) గోముఖాసనము
సవ్య ఊరు దక్షిణే గుల్ఫే,
దక్షిణం దక్షిణేతరే,
నిదధ్యాత్ ఋజుకాయస్తు,
‘చక్రాసనం’ ఇదం మతమ్।
చక్రాసనము
- ఎడమ తొడపై కుడి చీలమండలమును ఉంచి
- కుడి తొడపై ఎడమ చీలమందలమును ఉంచి,
- ప్పష్టము నుండి శిరో ఉపరిభాగములోని కొండ నాలుకకు సూటిగా పై శిరో ఊర్ధ్వభాగమునగల బ్రహ్మరంధ్రము వరకు శరీరమును నిఠారుగా ధారణ చేసి యోగమునకు సిద్ధబడటము. ఇది చక్రాసనము.
పూరకః కుంభకః తద్వత్
రేచకః పూరకః పునః
ప్రాణాయామః స్వనాడీభిః
తస్మాత్ నాడీ ప్రచక్షతే।।
ప్రాణాయామము :
(1) పూరకము (గాలిలోనికి పీల్చటము)
(2) కుంభకము (ధారణ చేయటం)
(3) రేచకము (వదలటము)
(4) పునఃపూరకము (తిరిగి పూరించటం)
ప్రాణాయామాభ్యాసముచే ఆ అభ్యాసియొక్క సూక్ష్మనాడులు నిర్మలమగుచూ, ప్రత్యుత్సాహము పొందుచున్నాయి.
శరీరం సర్వజంతూనాం
షణ్ణవత్ (96) అంగులాత్మకమ్।
తత్ మధ్యే పాయుదేశాత్తు
ద్వయ-అంగులాత్ పరతః పరమ్
మేఢ్రదేశాత్। అధస్మాత్తు,
ద్వయ అంగులాత్ ‘మధ్యమ్’ ఉచ్యతే।
మేఢ్రాత్ నవ (9) అంగులాత్
ఊర్థ్వం నాడీనామ్ ‘కందమ్’ ఉచ్యతే।
చతుర (4) అంగులమ్ ఉత్సేధం
చతుర (4) అంగులమ్ ఆయతమ్।
అండాకారం పరివృతం
మేదో మజ్జా అస్థి శోణితైః
తత్రైవ నాడీ చక్రం తు, ద్వాదశారం ప్రతిష్ఠితమ్।
శరీరము ప్రాణులందరికీ (జీవులకు, మానవులకు) (సామాన్యంగా) ‘96’ అంగులముల పొడుగు (లేక) 96 బొటనవ్రేళ్ళ పరిణామము ఉంటుంది.
మేఢ్రము - అట్టి ఈ దేహము మధ్యలోగల ‘పాయువు’ (గుదము, ముడ్డి)నకు ‘2’ అంగుళములకు పైవైపుగా మేఢ్రము. (పొత్తి కడుపునకు) ‘2’ అంగుళములు క్రిందగా ‘మధ్యప్రదేశము’. అట్టి ‘మేఢ్రము’నకు 9 అంగులము ఊర్థ్వంగా ‘కందము’.
దానిపై నాడీ కందము 4 అంగుళముల ఎత్తు, 4 అంగులముల విస్తారము (పొడవు) అండాకారగము (కోడిగ్రుడ్డు ఆకారం) అగు ఈ నాడీకందమును - మేదస్సు (క్రొవ్వు, వప), మజ్జ (ఎముకలలో కనిపించే గుజ్జు), అస్థి (బొమికలు), శోణితము (రక్తము) మొదలైనవన్నీ పరివృతమై ఆవరించినవై (Round up and covering) ద్వాదశార నాడీచక్రము రూపుదిద్దుకొని ఉంటోంది.
శరీరం ధ్రీయతే యేన
వర్తతే తత్ర కుండలీ।
శరీరధారణకు మూలాధార స్థానమై, మూలాధార చక్రాకాశములో ‘కుండలిని’ అనే ఇచ్ఛా - ప్రజ్ఞా విశ్వధారిణీ శక్తి వేంచేసినదై స్థానము కలిగియున్నది.
బ్రహ్మరంధ్రం సుషుమ్నాయా
వదనేన పిధాయ సా।।
శరీరములో నాడీ కందము నుండి బయల్వెడలుచున్న తేజోపుంజములతో కూడి ఒక చేతనమగు శక్తినాడి - వెన్నెముక మధ్య నుండి, మెడ, పాలభాగములనుండి, కొండ నాలుకకు ఊర్థ్వంగా శిరో కఫాల భాగమునకు (తలడిప్పకు)పైనగల శరీరముయొక్క దశవ (పదవ) రంధ్రమును మూసి ఉంచుతోంది. ఆ మూసి ఉంచబడు రంధ్రము ‘బ్రహ్మరంధ్రము’. ఆవిధంగా (నాడీకందము నుండి) బ్రహ్మ రంధ్రము వరకు విస్తరించినదైయున్న అతిముఖ్య శక్తినాడి ‘సుషుమ్న’.
ఆలంబుసా సుషుమ్నాయా, కుహూః నాడీ వసతి అసౌ।
అనంతరార యుగ్మేతు, వారుణా చ, యశస్వినీ।
దక్షిణారే (కుడిగా) సుషుమ్నాయాః
పింగళావర్తతే క్రమాత్.
తత్ అంతరారయోః ‘పూషా’ వర్తతే చ ‘పయస్వినీ’।
సుషుమ్నా పశ్చిమే చారే, స్థితా నాడీ ‘సరస్వతీ’।
అట్టి ‘సుషుమ్ననాడి’ని వెంటనంటినవై ‘అలంబుస, కుహు’ అనే రెండు నాడులు ఉంటున్నాయి. లోపలి వైపుగా ‘వారుణి’ ‘యశశ్విని’ - అనే మరో రెండు నాడులు. దక్షిణంగా (కుడిగా) ‘పింగళ’ అనే నాడి సుషుమ్ననాడిని వెంటనంటి ఉన్నది.
దానికి అంతరముగా ‘పూషా’, ‘పయస్వినీ’ అనుసరించి వర్తించుచున్నాయి.
సుషుమ్నకు పశ్చిమంగా ఆకు ఆకారంగా ‘సరస్వతీనాడి’ స్థితి కలిగియున్నది.
03. శంఖినీచైవ ‘గాంధారీ’
తదనంతరయోః స్థితే।
ఉత్తరే తు సుషుమ్నాయా
ఇడాఖ్యా నివసతి అసౌ।
అనంతరం ‘హస్తిజిహ్వా।
తతో ‘విశ్వోదరీ’ స్థితా।
పై నాడులకు తదనంతరగా (పైపైగా) ‘శంఖినీ’, ‘గాంధారీ’ నాడులు.
సుషుమ్నకు ‘ఉత్తరం’గా (ఎడమగా) ‘ఇడా’ అనే పేరుగల నాడి ఉన్నది.
ఇడానాడికి అనంతరంగా (ప్రక్కగా) ‘హస్తి జిహ్వ’ ,‘విశ్వోదరి’ నాడులు.
ప్రదక్షిణ క్రమేణైవ చక్రస్య
అరేషు నాడయః
వర్తన్తే ద్వాదశ హి ఏతా
ద్వాదశ అనిల వాహకాః।
పటవత్ సంస్థితా నాడీ
నానావర్ణాః సమీరితాః
పటమధ్యం తు యత్ స్థానం
‘నాభిచక్రం’ తత్ ఉచ్యతే।।
ఈ అలంబుస - కుహూ - వారుణీ - యశశ్వినీ - పింగళ - పూస - యశశ్వినీ - సరస్వతీ - శంఖినీ - గాంధారీ - ఇడ - హస్తిజిహ్వ - అను పేర్లతో మనము చెప్పుకున్న ‘12’ నాడులు వాయువాహకములు (Carriers of Prana Energy) అయి ఉన్నాయి. ప్రదక్షిణ క్రమంగా నాడీ చక్రముయొక్క ఆకులలో ప్రవర్తన శీలమై యున్నాయి. వస్త్రము ధరించుతీరుగా అనేక వర్ణములతో (రంగులతో) ఈ నాడీపటలము నాడీ కందమును ఆవరించి / సంస్థితమై యున్నాయి.
ఆ పటము మధ్యస్థానములో ఉన్నదే ‘నాభీచక్రము’ అని పిలువబడుతోంది.
నాదాధారా సమాఖ్యాతా, జ్వలంతీ నాదరూపిణీ,
పరరంధ్రా సుషుమ్నా చ, చత్వారో రత్నపూరితాః
కుండల్యా పిహితం శశ్వత్, బ్రహ్మరంధ్రస్య మధ్యమమ్।।
ఏవమేతాసు నాడీషు ధరంతి ‘దశవాయవః’।
కుండలినీ : నాదరూపిణి అయి వెలుగుతూ, నాదమునకు ఆధారమై ‘సుషుమ్న’కు పరరంధ్రమై, ‘4’ రత్నముల పూరితమైయున్నది.
బ్రహ్మరంధ్రమును కుండలినీ శక్తి చే మూతవలె మూసి ఉంచబడుతోంది.
ఈ విధంగా నాడులచే దశవాయువులు ధరింపబడినవై ఉన్నాయి.
ఏవం నాడీ గతిం, వాయు గతిమ్
జ్ఞాత్వా విచక్షణః।
ఏ యోగి అయితే విజ్ఞాన విచక్షణలచే ఈ నాడీ గత వాయువుల సంచారములను ఎరిగినవాడై ఉంటాడో (Consciously), అట్టివాడు యోగాభ్యాసి అయి కేవలమగు ఆత్మ స్వరూపముతో ఏకత్వము సిద్ధించుకొనుచున్నాడు. నాడీగతి - యోగ గతిలను ఎరుగుటకు యోగాభ్యాసమే ఉపాయము.
సమగ్రీవ శిరః కాయః
సంవృతాస్యః సునిశ్చలః।
నాసాగ్రే చ ఏవ హృత్ మధ్యే
బిందు మధ్యే తురీయకమ్।
స్రవంతమ్ అమృతం పశ్యేత్
నేత్రాభ్యామ్ సుసమాహితః।
అపానం ముకుళీ కృత్య
పాయుం ఆకృష్య చ ఉన్ముఖమ్
ప్రణవేన సముత్థాప్య
‘శ్రీ’బీజేన నివర్తయేత్।।
- ‘మెడ’, శిరస్సు, కాయమును సమస్థితిగా నిట్టనిలువు ఆకారంగా ధరించి
- పళ్ళు కలువకుండా, పెదవులను ఒకచోటికి చేర్చి,
- శ్రద్ధ, సునిశ్చలత్వము (concentration) ఆశ్రయించినవాడై,
- (1) ముక్కుకు అగ్రభాగస్థానము (The Upper Point of nose) (2) హృదయ మధ్యగాను, (3) బిందు మధ్యగాను నేత్రములను చూపును సుమాహితము (Wel - fixed) చేసి,
- జాగ్రత్ - స్వప్న - సుషుప్తులను తనయొక్క తురీయస్థానమునుండి దర్శించుచూ, తురీయకరూపంలో స్రవించు ‘అమృతము’ (మార్పునకు విషయమేకానట్టి రూపము) దర్శించుచు,
అపానమును [బాహ్యముగ ప్రవహించు ప్రాణ (వాయు) ప్రసరణమును] ముకుళింపజేసి (లేక) ముడుచుకొనునట్లు చేసి,
- పాయువును (మలవిసర్జన ప్రదేశాకాశమును) ఉన్ముఖం(as upward facing)గా సమాకర్షించి,
- ప్రణవములో సముత్థాప్యం (Inspiring) చేస్తూ,
‘శ్రీం’ బీజముచే నివర్తింపజేయాలి. సమస్తమునకు బీజమైన ‘ఆత్మ’ను ‘శ్రీం’ అక్షరోచ్ఛాఱణతో ఉపాసించాలి.
స్వాత్మానం చ శ్రియం ధ్యాయేత్
అమృతప్లావనం తతః,
కాలవంచనమ్ ఏతద్ధి
సర్వముఖ్యం ప్రచక్షతే।।
శ్రియము (సర్వశ్రేయో - శుభప్రదము) అగు అమృతము స్రవించు తత్ ఆత్మనే ధ్యానించాలి. స్వస్వరూపమగు ఆత్మయే ధ్యాన వస్తువు.
ఇది కాలమునకు అతీతమైనది. ‘సర్వముఖ్యము’.
మనసా చింతితం కార్యం
మనసా యేన సిద్ధ్యతి,
జలే అగ్ని జ్వలనాత్
శాఖా పల్లవాని భవంతి హి।।
నాధన్యం జాగతం వాక్యం
విపరీతా భవేత్ క్రియా।
మార్గే బిందుం సమాబధ్య
వహ్నిం ప్రజ్వాల్య జీవనే,
శోషయిత్వా తు సలిలం
తేన కాయం దృఢం భవేత్।
అట్టివాడు (యోగశక్తిచే) మనస్సుతో చింతనము చేసిన ఏకార్యమైనా మనస్సుతోనే సిద్ధించుచున్నది. జలములో అగ్ని జ్వలితమై, ఆ అగ్ని శాఖోపశాఖలుగా అగుచున్నది. (మనస్సుతోనే మనస్సు సిద్ధిపొందు చున్నది). మనస్సుతో సిద్ధింపలేని లేదు.
జలములో అగ్ని జ్వలకమై శరీరము దృఢముగా అగుచున్నది. జలముతోనే బీజము వృక్షము అగుచున్నది.
యోగిపట్ల జాగరితమైన వాక్యము ‘అధన్యము’ కాదు. (చెప్పింది చెప్పినట్లు జరుగగలదు). క్రియలన్నీ విపరీతములుగా అవుతాయి.
సుషుమ్నయందు కుండలినీ శక్తి ప్రయాణించు) మార్గమునందు ‘బిందువు’ను సమాబంధనము చేసి,
(హృదయ స్థానంలో గల) ‘జీవనము’ నందు వహ్ని (అగ్నిని ప్రజ్వలింపజేసి), జీవాత్మత్వమును తేజోభావన చేసి,
సలిలము (జలము)ను శోషింపజేసి చేయు యోగాభ్యాసముచే ఆయోగియొక్క శరీరము దృఢముగా అగుచున్నది.
గుదయోని సమాయుక్త
ఆకుంచతి ఏకకాలతః
అపానమ్ ఊర్థ్వగం కృత్వా
సమానేన నియోజయేత్।।
(1) గుదయోనిని సమాయుక్తము చేయుటము (గట్టిగా బుద్ధి - శక్తితో ధారణ) (2) ఆకుంచనము (పైకి కదలించటము)
ఈ రెండూ ఏకకాలంలో నిర్వర్తిస్తూ అపానమును (Down moving prana Energy)ని ఊర్ధ్వగతంగా చేసి ‘సమానప్రాణము’ (Energy placed in all parts of the body equally) నందు నియమించాలి.
04. స్వాత్మానం చ శివం ధ్యాయేత్
అమృత ప్లావనం తతః।
బలం సమారభేత్ యోగీ
మధ్యమ ద్వార భాగతః।
‘నా ఆత్మ ఆ శివస్వరూపమే’ అనునదే క్రమంగా ధ్యానముయొక్క ముఖ్య లక్షణము. స్వాత్మను సమస్త జీవులలోని అంతరాత్మగా (శివస్వరూపముగా) ధ్యానము చేయుచుండగా అమృతప్లావనము (జన్మ - మృత్యువులకు అవిషయమగు ఆత్మభావన) స్రవించగలదు.
మధ్యమ (నడిమి) విభాగమునందు (అపాన-సప్రాణ ఏకత్వము అనే) యెగాభ్యాసముచే- యోగి ఆత్మతో యోగము సంకల్పించాలి. ఆతడు యోగబలవంతుడు కాగలడు
భావయేత్ ఊర్థ్వగతి - అర్థం
ప్రాణ - అపాన సుయోగతః।
ఏష యోగపరో దేహే
సిద్ధి మార్గ ప్రకాశకః।।
(కుండలినీ శక్తియొక్క) ఊర్ధ్వగతి కొరకై ప్రాణ-అపానముల సంయోగత్వమును భావబలయోగంతో అనువర్తింపజేయాలి.
ఇటువంటి యోగపరునిపట్ల (యోగాభ్యాసిపట్ల) సిద్ధిమార్గము ప్రకాశింపజేయగలదు.
యథైవ అపాంగతః సేతుః
ప్రవాహస్య నిరోధకః
తథా శరీరగాత్ ఛాయా
జ్ఞాతవ్యా యోగిభిః సదా।
సర్వాసామేవ నాడీనామ్ ఏష ‘బంధః’ ప్రకీర్తితః।।
ఏవిధంగా అయితే వేగముగా ప్రవహించు జల ప్రవాహము సేతువు (ఆనకట్ట)చే నిరోధించబడుచున్నదో, ఆ విధంగా శరీరసంబంధమైన విషయములు (జగత్తు మొదలైనవి - ‘ఇవి సత్యమే! నిత్యమే’ - అను భావన వెనుకకుమరలుచూ, ఇదంతా) ఛాయామాత్రంగా యోగికి అనుభవమగు చున్నది.
సర్వనాడులలో ప్రాణము సమానముగా ధారణ ‘నాడీబంధము’ అనబడుచున్నది.
బంధస్య అస్య ప్రసాదేన
స్ఫుటీ భవతి దేవతా।
ఏవం చతుష్పథో బంధో
మార్గత్రయ నిరోధకః।
ఏకం వికాసయత్ మార్గం
యేన సిద్ధాః సుసంగతః।।
‘నాడీబంధ అభ్యాసము’ యొక్క ప్రసాదముచే దేవతలు ప్రసన్నులగు చున్నారు.
ఈ విధంగా ((1) పూరకము (2) కుంభకము (3) రేచకము (4) పునఃపూరకము అను రూపముగల చతుష్పథయోగసాధనచే మార్గత్రయము (ప్రాణ - అపాన - వ్యానములను) నిరోధకము అగుచున్నది.
ఏ ఏకైక మార్గములో సిద్ధులు సుసంగతులగుచున్నారు. వారి బుద్ధి వికసించి, వారియొక్క జీవాత్మ సర్వాత్మత్వము సంతరించుకోగలదు. వారియొక్క బుద్ధి ‘నాడీ బంధనము’చే వికాసము పొందగలదు.
ఉదానం ఊర్థ్వగం కృత్వా
ప్రాణేన సహ వేగతః
బంధో-యం సర్వనాడీనామ్
ఊర్థ్వం యాతి నిరోధకః।
‘ప్రాణాయామాభ్యాసముచే - ‘‘నాడులలో ప్రసరించు ప్రాణశక్తిని నిశ్చలముగా ధారణ చేయు కుంభకము’’ - అనే నాడీ బంధన యోగాభ్యాసముచేస్తూ ‘ఉదానప్రాణము’ను బుద్ధితో ఊర్ధ్వముగా నడుపుచుండగా, కుండలిని బ్రహ్మరంధ్రమును సమీపించుచున్నది. (మూతను తెరచినట్లు) బ్రహ్మరంధ్రపు మూతను తొలగించుటకై - కుండలిని ఊర్ధ్వయానము జరుగ గలదు.
అయం చ సంపుటో యోగో
మూలబంధోఽపి అయం మతః।
బంధత్రయమ్ అనేనైవ సిద్ధ్యతి అభ్యాస యోగతః।।
ఈ ‘మూలబంధయోగము’ను ‘సంపుటయోగము’ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ అభ్యాసముచే (1) ప్రాణ (2) అపాన (3) వ్యాన ప్రాణ ప్రసరణలను ఏకం చేస్తుంది. (1) ద్రష్ట (2) దర్శన (3) దృశ్యములను - ఆత్మతో సంపుటం చేస్తుంది. ఆత్మయొక్క ఏకము, అఖండములు అనుభవమవగలదు.
దివారాత్రం అవిచ్ఛిన్నం
యామే యామే యదా తదా
అనేన అభ్యాసయోగేన
వాయుః అభ్యసితో భవేత్।
వాయావభ్యసితో వహ్నిః
ప్రత్యహం వర్థతే తనౌ।।
రాత్రి-పగలు, యామ-యామము (జామ జాముకు) ‘మూలబంధ యోగము’ అనే ‘ప్రాణాయామాభ్యాసము’చే మూలాధారములోగల కుండలినిని ఉదాన (బంధన) ప్రక్రియ ద్వారా సుషుమ్న ఉర్థ్వగతిగా నడిపించి, శిరో ఉపరిభాగమునగల బ్రహ్మరంధ్రపు మూత తొలగించటము’ అనే అభ్యాసముచే వాయువు అభ్యాసితము (ప్రాణ శక్తి ఉత్తేజితము) అవుతుంది.
వాయువు (ప్రాణశక్తి) దేహమంతా సమత్వము పొందుచూ ఉత్తేజితము అగుచుండగా, దేహంలో సర్వత్రా తేజోరూపమగు అగ్ని ప్రజ్వలితము, దేదీప్యమానము అగుచూ వృద్ధి చెందసాగుతుంది.
వహ్నౌ వివర్థమానే తు
సుఖమ్ అన్నాది జీర్యతే।
అన్నస్య పరిపాకేన రసవృద్ధిః ప్రజాయతే!
రసే వృద్ధిం గతే నిత్యం
వర్థంతే భాతవత్ తథా।
దేహంలో ‘వహ్ని (అగ్ని)’ సమత్వంచేత అట్టి ‘తేజోవృద్ధి’ వలన ఆహార పదార్థములు (భోజ్యములు) తేలికగా జీర్ణము కాసాగుతాయి.
శరీరంలో ప్రవేశించిన అన్నము (ఆహారము, భోజ్యము) పరిపాకము (త్వరగా జీర్ణము) అవటంచేత శరీరంలో ‘రసవృద్ధి’ బాగుగా జరుగగలదు.
‘రసవృద్ధి’ యొక్క చర్య వలన శరీరంలో ప్రకాశత్వము అధికమై ధాతువృద్ధి, ధాతునిర్మలత్వము జరుగగలదు.
ధాతూనాం వర్ధనేనైవ
ప్రబోధం వర్ధతే తనౌ।
దహ్యంతే సర్వ పాపాని
జన్మకోటి ఆర్జితాని చ।
ఎప్పుడైతే ధాతువులు నిర్ధోషత్వము, సమవృద్ధి జరుగుతూ ఉంటుందో, అప్పుడు శరీరము, మనస్సు, బుద్ధి ప్రబోధనము (Positively, Inspired, Inclined) - వర్ధనము పొందసాగుతాయి. ఆత్మప్రబోధము వర్ధిల్లుతుంది.
ఎప్పుడైతే ఆత్మప్రబోధము వర్ధిల్లసాగుతుండదో, అప్పుడు జన్మ - జన్మాంతరములుగా సంపాదించుకొన్న పాపకర్మ ఫలములు, అల్పదృష్టులు మొదలంట్లా భస్మము కాసాగుతాయి.
గుద - మేఢ్రాంతరాళస్థం
మూలాధారమ్ త్రికోణకమ్।
గుదము - మేఢ్రముల మధ్యగా (పొత్తికడుపు క్రింద గుదముపై వైపుగా) ‘మూలాధారము’ అనే త్రికోణాకార స్థానము ఈ దేహములో ఉన్నది.
శివస్య బిందురూపస్య స్థానం తద్ధి ప్రకాశకమ్।
యత్ర ‘కుండలినీ’ నామ పరాశక్తిః ప్రతిష్ఠితా,
యస్మాత్ ఉత్పద్యతే వాయుః,
యస్మాత్ వహ్నిః ప్రవర్థతే,
యస్మాత్ ఉత్పద్యతే బిందుః,
యస్మాత్ నాదః ప్రవర్థతే,
యస్మాత్ ఉత్పద్యతే హంసో,
యస్మాత్ ఉత్పద్యతే మనః।
అట్టి మూలాధారచక్రము శివునియొక్క మహాప్రకాశమగు ‘బిందురూపము’నకు స్థానము.
అట్టి మూలానామ శివప్రకాశక మహాబిందువు నందు- ‘కుండలినీ’ అనే పేరుతో చెప్పబడే ‘పరాశక్తి’ - ప్రతిష్ఠితమైయున్నది.
ఆ మూలాధారాంతర్గత శివ ప్రకాశక బిందువు నుండి వాయువు (ప్రాణశక్తి), అగ్ని ఉత్పన్నమై దేహమంతా విస్తరిస్తూ ప్రవర్థమానమగు చున్నాయి.
‘బిందువు’ ఉత్పన్నమగుచున్న చోటునుండే ‘నాదము’ కూడా జనించి ప్రవర్థమానమగుచున్నది.
అక్కడి నుండే హంస (జీవుడు), ఆ జీవునియొక్క మననశక్తి రూపమగు ‘మనస్సు’ కూడా ఉత్పాదకమై విశ్వమంతా విస్తరించినదై ఉంటున్నది.
05. మూలాధారాది షట్(6) చక్రం
‘శక్తిస్థానమ్’ ఉదీరితమ్।
కంఠాత్-ఉపరి మూర్థాంతం
‘శాంభవంస్థానమ్’ ఉచ్యతే!
‘మూలాధారము’ నుండి బయల్వెడలి
స్వాధిష్ఠానము → మణిపూరకము → అనాహతము→విశుద్ధము→ ఆజ్ఞాచక్రములు స్థానముగాగల షట్ (6) చక్రస్థానములను కలిపి ‘శక్తిస్థానము’ అని పిలుస్తున్నారు.
కంఠము నుండి ప్రారంభమై, ఊర్థ్వంగా (పైవైపుగా) మూర్ధ్నిని వరకు ‘శాంభవీస్థానము’ - అని పిలువబడుతోంది.
యోగశిఖ-ఉపనిషత్-ఉడ్డీయాణ-కుంభకం
నాడీనామ ఆశ్రయః పిండో।
నాడ్యః ప్రాణస్య చ ఆశ్రయాః।
జీవస్య నిలయః ప్రాణో।
జీవో హంసస్య చ ఆశ్రయః।
హంసః శక్తేః అధిష్ఠానం
చరాచరమ్ ఇదగ్ం జగత్।।
నాడులకు ‘పిండము’ ఆశ్రయము.
నాడులు ‘ప్రాణమునకు’ - ఆశ్రయము.
జీవునకు ‘ప్రాణము’ - నిలయము (ఆశ్రయము).
హంసకు ‘జీవుడు’ - ఆశ్రయము.
శక్తికి ‘హంస’ - అధిష్ఠానము! (ఆశ్రయము).
ఈ చరాచర జగత్తు - హంస స్వరూపము. (హంస = సోఽహమ్)
నిర్వికల్పః, ప్రసన్నాత్మా
ప్రాణాయామమ్ సమభ్యసేత్।
అట్టి ఉత్తరోత్తర సారూప్యస్వస్థితి కొరకై యోగాభ్యాసి నిర్వికల్పుడై (సర్వజగత్ కల్పనలను వదలినవాడై, ప్రసన్నాత్ముడై ఉత్సాహ-ధైర్య- సాహస- మహదాశయములతో) ప్రాణాయామమును శ్రద్ధగా, ప్రతిదినము అనేకసార్లు శ్రద్ధగా ఆచరించును (అభ్యసించును) గాక!
సమ్యక్ బంధ త్రయస్థోఽపి
లక్ష్య - లక్షణ కారణమ్,
వేద్యం సముద్ధరేత్ నిత్యం
సత్య సంధాన మానసః।
రేచకం పూరకంచైవ
కుంభ మధ్యే నిరోధయేత్।
యోగి సమ్యక్ భావనతో బంధత్రయము ఆచరిస్తూనే, అంతటితో తృప్తిపడి ఊరుకోకూడదు. మనస్సును పరమసత్యమగు సర్వత్రా ఆత్మదర్శన - అనుసంధానమును చేస్తూ, ఆత్మయొక్క అప్రమేయత్వ - నిత్యత్వ - సత్యత్వ ధర్మములను బుద్ధితో ఎరుగుచూ, జీవాత్మత్వమును సముద్ధరించి - పరమాత్మతో ఏకత్వమును సదా సిద్ధించుకోవాలి. (అనుక్షణికం చేసుకోవాలి).
రేచక (గాలి వదలటం) - పూరకం (గాలి నింపటం)…అను ప్రక్రియ మధ్యగా కుంభకముచే ప్రాణమును నిరోధించాలి. వాయువును నిలిపి ఉంచటము అభ్యసించాలి.
దృశ్యమానే పరే లక్ష్యే
బ్రహ్మణి స్వయమ్ ఆశ్రితః
బాహ్యస్థ విషయం సర్వమ్
‘రేచకః’ సముదాహృతః।।
పరమార్థములు
రేచకము : కేవలము ‘గాలిని వదలటము’ అని శరీర సంబంధంగా అర్థపరిమితము కాకూడదు. మరి? ‘ఈ దృశ్యమానమై కనబడేదంతా స్వయముగా సర్వదా పరబ్రహ్మమే’ - అనే మనో మననము, బుద్ధి నిశ్చయములతో - బాహ్యముగా కనిపించే సర్వ విషయములు భాహ్యముననే వదలి ఉండటము రేచకము.
పూరకం శాస్త్ర విజ్ఞానం।
కుంభకమ్ స్వగతమ్ స్మృతమ్।
ఏవమ్ అభ్యాస చిత్తశ్చేత్
స ముక్తో। న అత్ర సంశయః।।
పూరకము : ‘ఆత్మ’ గురించి శాస్త్రములు చెప్పు విజ్ఞానమును సముపార్జించుకోవటమే పూరకము.
కుంభకము : ఆత్మను అంతరముగా దర్శిస్తూ, కేవలమగు ఆత్మయే తానై ఉండటము. ‘‘ఈ సమస్తము నేనైన నేను’’ అను అను భావనయే కుంభకము.
ఎవ్వడు ఈ విధములైన రేచక - పూరక -కుంభకములను చిత్తముతో అభ్యాసముగా కలిగి ఉంటాడో, ఆతడు ముక్తుడే. సందేహమే లేదు.
‘కుంభకేన సదా ఆరోప్య
కుంభకేనైవ పూరయ్‌త్’।
కుంభేన కుంభయేత్ కుంభమ్
తదంతస్థః పరం శివమ్।
పునరాస్ఫాలయేత్ అద్య (ఆస్ఫాలయే దద్య)
సుస్థిరం కంఠముద్రయా।
ఓ నిదాఘ మహాశయా!
ఎల్లప్పుడూ కూడా → కుంభకముతో కుంభకమును ఆరోపించి (భావించి, బుద్ధితో సమన్వయించుకొని) కుంభకములో సర్వమును పూరించి వేసి ఉండాలయ్యా! ‘‘నాతో సహా మనందరము పరమాత్మ స్వరూపమే’’ - అనే కుంభక కుంభకమును భావన చేయాలి.
కుంభముతో-అంతరహృదయ ఆహ్రాంత మధ్య- హృదయాంతరంగుడగు, సర్వస్వరూపుడగు పరమశివుని - కుంభస్వరూపముగా కుంభకము చేయాలి. ‘‘నేనైన నేనుగా సందర్శించాలి’’.
తిరిగి కంఠముద్రతో (పైన చెప్పుకొనియున్న ‘శాంభవీముద్ర’తో) - పునః (మరల) శివభావన, శివస్వరూపములను ఆస్ఫాలనము చేయాలి. (పీఠముపై శివలింగము వలె కంఠముపైగల ముఖమును శివలింగముగా భావన చేయాలి)
వాయూనాం గతిమ్ ఆవృత్య
ధృత్వా పూరక కుంభకౌ,
సమహస్త యుగం భూమౌ
సమం పాదయుగం తథా,
వేధక క్రమ యోగేన
చతుష్పీఠం తు వాయునా,
ఆస్ఫాలయేత్ మహామేరుం
వాయువక్త్రే ప్రకోటిభిః।
వేదక (మార్గ) త్రయయోగము (లేక) చతుష్పీఠయోగము
➤ వాయువుయొక్క గతి (Its routine movement)ని త్రిప్పి వెనుకకు మరల్చి, (లేక) స్వా-అధీనములోకి తెచ్చుకుంటూ….
➤ వాయు పూరక - కుంభకములతో (Air inward pulling and holding) ధారణచేస్తూ….
➤ రెండు చేతులను భూమిపై సమముగా ఆనించి ఉంచుతూ
➤ అట్లాగే రెండు పాదములను కూడా సమంగా నేలపై ఆనించి ఉంచుచూ
➤ ఇటువంటి ‘వేధకత్రయ - అభ్యాసము’తో
➤ వాయువుతో ‘మహామేరువు’ అనబడు వాయు వక్త్రమును (గాలిచే ముఖమును పూరించి) ధారణ చేయాలి. (ప్రాణతత్త్వమును ప్రాణ - అపాన - వ్యాన - సమానములను) ఆస్ఫాలనము (వణికించటము, ఒరిపిడి) చేయాలి. (వాయువును ముఖములో నిశ్చలంచేసి, మిగతా శరీరములో ‘చాలనము’ చేయాలి.
పుట ద్వయం సమాకృష్య
వాయుః స్ఫురతి సత్వరమ్।
సోమ సూర్య అగ్ని సంబంధాన్
జానీయాత్ అమృతాయ వై,
మేరు మధ్యగతా దేవాః
చరంతే మేరుచాలనాత్।।
పుట ద్వయమును (ప్రాణ - అపానములను) పరస్పర సమాకర్షణము చేయుచుండగా సత్వరము ప్రాణశక్తి అనుభవరూపంగా స్ఫురించసాగుతుంది.
మార్పు-చేర్పులు లేనట్టి ‘అమృతము’యొక్క అనునిత్యానుభవము కొరకై సోమ (చంద్ర / ఇడ) - సూర్య (పింగళ) - అగ్ని (పింగళ)….తత్త్వములను దేహములో గుర్తిస్తూ తెలుసుకొని ఉండాలి. భావించాలి. ఉపాసించాలి. ‘మేరుచాలనము’ అను యోగాభ్యాసముచే మేరువును (వెన్నెముకను) చలింపజేయు చుండగా మేరుగతులైన దేవతలు కూడా కదులసాగుతారు.
అదౌ సంజాయతే క్షిప్రం
వేధో అస్య బ్రహ్మ గ్రంథితః।
బ్రహ్మ గ్రంథిం తతో భిత్వా
విష్ణు గ్రంథిం భినత్త్యసౌ।
విష్ణు గ్రంథిం తతో భిత్వా
రుద్ర గ్రంథిం భినత్త్యసౌ।
యోగాభ్యాసము కొనసాగుచుండగా వేధ (మార్గము) నిర్మితమై, (సుషుమ్నలో ప్రవేశించిన కుండలినీ దివ్యక్తి ఊర్థ్వగతమగుచుండగా) మొదట బ్రహ్మగ్రంథి (‘ఈ సృష్టి ఎవ్వరో బాహ్యంగా ఉండి సృష్టించారు కదా!’ అనే కల్పన) భేదనము పొందగలదు.
ఆ తరువాత కుండలినీ శక్తి కంఠ ప్రదేశము వరకు విస్తరించుచుండగా, ‘ఈ సృష్టి సంరక్షించు అభిమానము’ అనే విష్ణుగ్రంథి విభేదనమగు చున్నది. విష్ణుగ్రంథి భేదనము తరువాత (శాంభవీస్థానము చేరిన) కుండలినీశక్తి రుద్రగ్రంథిని కూడా భేదనము చేస్తోంది.
06. రుద్రగ్రంథిం తతో భిత్వాత్,
ఛిత్వా మోహమలం తథా,
అనేక జన్మ సంస్కార
గురుదేవ ప్రసాదతః।
యోగాభ్యాసాత్ తతో వేధో
జాయతే తస్య యోగినః।
ఆ విధంగా రుద్రగ్రంథి భేదమైన తరువాత, గురుదేవుల అనుగ్రహం సంపాదించుకొని ‘మోహము (Illusion, Misconceptions, Distractions)’ అనే అనేక జన్మార్జితమలమును (దోషమును) కడిగివేసుకోవాలి.
యోగాభ్యాసముచే యోగికి ‘వేధ’ (మోక్షస్థితికి, అఖండాత్మాఽహమ్ స్థానమునకు మార్గము)….సులభతరమవగలదు. (వేధము = మార్గము)
ఇడా పింగళయోః మధ్యే
సుషుమ్నా నాడి మండలే
ముద్రా బంధ విశేషేణ
వాయుం ఊర్థ్వం చ కారయేత్।
‘ఇడ’- ‘పింగళ’ నాడులకు మధ్యగా ఉన్నట్టి అగ్నితేజోరూపమగు ‘సుషుమ్న’ నాడి మండలము (Zone of Inner Recess of Sushumna) నందు (ప్రాణ-అపాన సమత్వముతోకూడిన) ముద్రాబంధన విశేషముతో వాయువును ఊర్ధ్వముఖంగా గమనము చేస్తూ రావాలి.
హ్రస్వో దహతి పాపాని।
దీర్ఘో మోక్ష ప్రదాయకః।
ఆప్యాయనః ప్లుతోవాపి
త్రివిధ ఉచ్ఛారణేన తు,
తైలధారమ్ ఇవ అ(వి)చ్ఛిన్నం,
దీర్ఘ ఘంటా నినాదవత్,
అవాచ్యం ప్రణవస్య అగ్రం
యస్తం వేద స వేదవిత్।।
ప్రాణాపానముల సమరస రూప హ్రస్వ (చిన్న) అభ్యాసము (‘ఓం’ను హ్రస్వముగా ఉచ్ఛరిస్తూ ఉండగా అట్టి హ్రస్వప్రణవము) సర్వపాపములను దహించివేస్తుంది. దీర్ఘమైన ప్రాణోపాసన ప్రణవోచ్ఛారణ ఈ జీవునికి మోక్షప్రదము - అగుచున్నది. ప్రారంభంలో పాపాలు తొలగుతాయి. దీర్ఘ కాలం అభ్యాసిస్తే మోక్షమే లభించగలదు.
ప్రణవోచ్ఛారణలోని ‘మ్‌మ్‌మ్’ అనుప్లుతము, - ఆప్యాయమును విస్తరింపజేస్తుంది. ఇవి ‘3’ విధముల ఉచ్ఛారణలు. (ప్లుతము - స్వరము)
(1) తైలధారవలె అవిచ్ఛినంగాను, (2) గంటయొక్క సుదీర్ఘ నినాదంగాను
(3) ప్రణవముయొక్క చిట్టచివర అవాచ్యము (కేవల మౌనము) గాను రూపు దిద్దుకుంటుంది.
అట్టి ప్రణవోచ్ఛారణవిధి ఎరిగిన వాడు వేదవేత్త.
హ్రస్వం బిందుగతమ్ ధైర్ఘ్యం
బ్రహ్మరంధ్రగతం ప్లుతమ్।
ద్వాదశాంతగతం మంత్రం
ప్రసాదం మంత్ర సిద్ధయే।।
మంత్రసిద్ధికై, పవిత్రతకొరకై ప్రణవమును - హ్రస్వముగాను బిందుగతంగాను, దీర్ఘగతంగాను చేస్తూ స్వరమును -అజ్ఞానచక్రము నుండి బ్రహ్మ రంధ్రము వరకు - ఆవలగల ద్వాదశాంతమువరకు ప్రవేశింపజేయాలి. ఈవిధమైన సాధనచే మంత్రసిద్ధిరూపంగా హృదయ పవిత్రత సిద్ధించుచున్నది.
సర్వవిఘ్న హరశ్చ అయం
ప్రణవః సర్వదోష హా।
ఆరంభశ్చ ఘటశ్చైవ
తథా ప్రచయః (పరిచయః) తథా।
నిష్పత్తిశ్చేతి కథితాశ్చ తస్రః తస్య భూమికాః।।
‘ఓం’కార ప్రణవోచ్ఛారణోపాసన → సర్వ విఘ్నములను, సర్వ దోషములను హరించివేయగలదు.

ప్రణవముయొక్క భూమికలు
(1) ఆరంభము (2) ఘటము (3) పరిచయము (4) నిష్పత్తి
ఈ నాలుగు ప్రణవముయొక్క భూమికలు.
07. కరణత్రయ సంభూతమ్
బాహ్యం కర్మ పరిత్యజన్
అంతరం కర్మ కురుతే
యత్ర ‘ఆరంభః’ స ఉచ్యతే।
(1) ఆరంభ భూమిక :
‘మనస్సు - వాక్కు - కాయము’ అనబడే ‘కరణత్రయము’చే నిర్వర్తించబడు బాహ్యకర్మలన్నీ బాహ్యముననే వదలివేసి (స్పర్శాన్ కృత్వా బహిర్ బాహ్యాన్, చక్షుః చ ఏవ అంతరో భృవే) అంతరంగమున ‘కర్మ’ నిర్వర్తించటమును ‘ఆరంభ భూమిక’ - అని పిలుస్తారు. సమస్త కర్మలు అత్యవసరమైనంత వరకే పరిమితము చేస్తూ, వాటినికూడా ‘సంగము’ త్యజించి, ‘‘కర్తవ్యమితి’ భావనతో పరమాత్మకు సమర్పించుచూ ఉండటము - ‘‘ఆరంభ భూమిక’’ అనబడడుచున్నది.
వాయుః పశ్చిమతో వేధం
కుర్వన్ ఆపూర్య సుస్థిరమ్
యత్ర తిష్ఠతి, సా ప్రోక్తా
ఘటాఖ్యా భూమికా బుధైః।
(2) ఘటాఖ్య భూమిక :
వాయువును పశ్చిమముగా (ఇడలో) ‘వేద’ (Pull) చేయుచు, నింపి స్థిరముగా ధారణ చేసి ఉంచు స్థితిని - ‘ఘటభూమిక’ - అని బుధులచే (విజ్ఞులచే) చెప్పబడుతోంది. (వాయుకుంభకము).
న స జీవో, న నిర్జీవః
కాయే తిష్ఠతి నిశ్చలమ్
యత్ర వాయుః స్థిరః
ఖే స్యాత్
సేయం ప్రచయ భూమికా।
(3) ప్రచయా భూమిక :
ఎప్పుడైతే యోగి - సజీవుడు (బ్రతికియున్న వాడు) గాని, నిర్జీవుడు (మరణించినవాడు) గాని ఏ మాత్రము కానివాడై, నిశ్చల మనో శరీరయుతుడై ఉంటాడో, శరీరమున వాయువు స్వాభావికంగానే నిశ్చలమై, స్థిరత్వము పొందినదై యుంటుందో, దేహ-దృశ్యములకు అతీతమైన మనో స్థితిని సిద్ధించుకొని ఉంటాడో, -
అట్టి యోగి ‘ప్రచయభూమిక’లో ఉన్నవాడగుచున్నాడు.
యత్ర ఆత్మనా సృష్టిలయౌ
జీవన్ముక్తి దశాంగతః
సహజః కురుతే యోగం
సేయం నిష్పత్తి భూమికా ఇతి।।
(4) నిష్పత్తి భూమిక :
ఎప్పుడైతే యోగియొక్క దృష్టి - అవగాహనలలో ఈ సమస్త సృష్టి కూడా స్వభావముగా, సహజంగా లయమై, ఇదంతా సర్వదా ఆత్మకు అభిన్నమై ఉంటుందో, అట్టి సహజయోగస్థితి పొంది, ఈ జీవుడు ‘జీవన్ముక్తదశ’కు చేరినవాడగుచున్నాడు. అట్టి జీవన్ముక్త స్థితిని ‘నిష్పత్తి భూమిక’ అని పిలుస్తున్నారు.
ఏతత్ ఉపనిషదం యో అధీతే…
సో అగ్నిపూతో భవతి।
స వాయుపూతో భవతి।
సురాపానాత్ పూతో భవతి।
స్వర్ణస్తేయాత్ పూతో భవతి।
స ‘జీవన్ముక్తో’ భవతి।
తదేతత్ ఋచ అభ్యుక్తమ్
ఎవ్వరైతే ఈ వరాహోపనిషత్ ప్రవచించు తత్త్వమును - అధ్యయనం చేస్తారో, అట్టివారు….
- అగ్నివలె వాయువు వలే పవిత్రులౌతారు.
- సురాపానము, బంగారము దొంగిలించటము మొదలైన మహాపాపములనుండి విముక్తులై బుద్ధిని శుద్ధి చేసుకోగలరు.
అట్టివాడు జీవన్ముక్తుడగుచున్నాడు.
వేదములచే గానము చేయబడినదే ఈ ఉపనిషత్‌లో వివరించబడింది.
తద్విష్ణోః పరమమ్
పదగ్ం సదా పశ్యంతి సూరయః
దివీవ చక్షుః ఆతతమ్।।
తత్ విప్రాసో విపన్యవో
జాగృవాగ్ం సః సమింధతే
విష్ణోః యత్ పరమమ్ పదమ్।।
దివ్యమగు, పవిత్రమగు చక్షువులు (జ్ఞానమయమగు దృష్టి)ని సంపాదించుకొన్న సూరులగు ప్రాజ్ఞులు - సర్వస్వరూపమగు, పరమమగు ‘విష్ణుతత్త్వము’నే అంతటా, అన్నిటా దర్శించుచున్నారు.
వేదాధ్యయనము చేసిన విప్రులు సర్వ అడ్డంకులు తొలగించుకొన్నవారై ఆత్మయందు సర్వదా జాగృతులై పరమపదమగు విష్ణుతత్త్వమునందు ప్రవేశించి ‘సోఽహమ్ విష్ణుమ్’ సిద్ధించుకొనెదరు.

ఇతి కృష్ణయజుర్వేదాంతర్గత వరాహోపనిషత్ సమాప్తా।।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।




కృష్ణ యజుర్వేదాంతర్గత

24     వరాహ ఉపనిషత్

అధ్యయన పుష్పము


శ్రీమత్ ‘శ్రీ వరాహోపనిషత్’ రూపంగా శ్రీ ఆదివరాహ స్వామిచే, (మరియు) ఋభుమహర్షిచే ముముక్షుజనులకు సుస్పష్టపరచబడుచున్న ‘అఖండ ఆత్మసుఖాకృతి’ లేక ‘త్రిపాద శ్రీమన్నారాయణాఖ్యానము’ మా బుద్ధికి సువిదితమగు గాక! మాకు అనునిత్యము స్వానుభవమవటానికై శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ శరణువేడుచున్నాము.

ప్రథమ అధ్యాయము - వివిధ తత్త్వములు - ఆవలగల పరమాత్మ

ఒకానొక సమయంలో మహామునీశ్వరుడగు ఋభువు ఇష్టదైవము, శ్రీమన్నారాయణావతారుడు అగు శ్రీ ఆదివరాహమూర్తియొక్క కరుణాకటక్షవీక్షణకొరకై భక్తి - శ్రద్ధ - ప్రపత్తులతో తపస్సు చేయనారంభించారు. 12 దేవమాన సంవత్సరములు కాలము ఆయన తపస్సు కొనసాగించారు.

ఒకానొక శుభవేళ - ఋభుమునీంద్రుని తపస్సుకు మెచ్చి సహస్ర శీర్‌షా పురుషుడు, కరుణాంతరంగుడు అగు శ్రీ ఆదివరాహమూర్తి ఋభువుయొక్క కనులకు ఎదురుగా సాకారుడై ప్రత్యక్షమైనారు. ‘బిడ్డా! ఉత్తిష్ఠ। ఉత్తిష్ఠ।’ అని మృదువుగా పలికారు. అప్పుడు ఋభువు పరమానందము పొందినవారై, లేచి నిలుచుని, స్వామికి సాంగ - సాయుధ - సపరివారసమేతంగా సుస్వాగతము పలికి, సుఖాశీనులను చేసి, స్వామి పాద పద్మములకు షోడషోపచారములతో పూజించి, త్రిపదక్షిణ నమస్కారములు సమర్పించారు.

శ్రీ ఆదివరాహస్వామి : వత్సా! ఋభూ! భక్తి శ్రద్ధలతో అత్యంత ప్రేమాస్పదంగా నీవు నిర్వర్తించిన తపస్సుకు నేను బహు సంతోషించానయ్యా! బిడ్డా। ఇక తపస్సు చాలించు. వరం వృణీస్వ। నీకు ఏమి వరంగా కావాలో కోరుకో. నీకు ప్రియమైనది ప్రసాదించటానికి సిద్ధంగా ఉన్నాను. నా యీ సృష్టిలో ఏపదమైనా తప్పక ఇస్తాను. కోరుకోవయ్యా!
అది విని ఋభువు స్వామికి భక్తి పారవశ్యంగా మరల నమస్కరించారు. ఇట్లా పలుకసాగారు.

ఋభు మునీంద్రుడు : హే భగవాన్! పరమాత్మా! శ్రీమన్ ఆదివరాహస్వామీ! సర్వజ్ఞులగు మీకు తెలియనిది ఏముంటుంది? కామభిః యత్ యత్ కామితం, తత్ తత్ సకాశాత్ స్వప్నేఽపి, న యాచే। మేము మీ సృష్టి కల్పనలో ఏదైనా కోరుకొన్నా కూడా, అదంతా స్వప్నసదృశ్యమే కదా! కలలో చూచినవి మెలకువ తరువాత మిగిలి ఉంటాయా? లేదు. మీ ‘మహత్ దర్శనము’ తరువాత ఇంక మేము పొందవలసినది ఏముంటుంది? సమస్తవేదములు ఇతిహాసములు, పురాణములు…ఇవన్నీ మిమ్ములను దర్శింపజేయుటయే లక్ష్యముగా కలిగి ఉన్నాయి. సమస్త విద్యలు మీ సందర్శనానందము నిమత్తమే ఉద్దేశ్యించబడినవై ఉంటున్నాయి. బ్రహ్మాది దేవతలంతా కూడా - మీ గురించిన ‘రూపజ్ఞానము’ చేతనే ముక్తిని పొందగలుగుచున్నారు. కనుక మావంటి మానవాకార భౌతిక దేహులకు మీరు కాక మరెవ్వరు దిక్కు?

అందుచేత మిమ్ములను దర్శించి పునీతుడనైన నేను ఈ 14 లోకాలలో ఏ ఒక్కటీ వరంగా కోరుకోవలసిన అగత్యమే నాకు కనిపించటం లేదు. హే జగద్గురూ! అనేక జన్మలుగా మనో వాక్ కాయములచే సంపాదించుకొన్న అజ్ఞాన వ్యాపక సంబంధమైన దృష్టులలో నిబద్ధుడనైయున్న నాకు మీరు నాకు మీ దర్శనము ప్రసాదించారు.

అయితే…, వేదములచే బ్రహ్మాది దేవతలచే మీ తత్త్వరూప ప్రదిపాదితమైనట్టి ‘బ్రహ్మవిద్య’ను మాత్రమే నాకు ప్రసాదించవలసినదిగా జగద్గురువులగు మిమ్ములను వేడుకొనుచున్నాను. తదితరమైనదంతా ఏది మీరు ఎట్లా ఉద్దేశిస్తే అట్లాగే అగుగాక! నాపై కరుణతో ‘కోఽహమ్’ అను ప్రశ్నకు పరాకాష్ఠసమాధానమగు ‘తత్త్వ విద్య’ను వాత్సల్య హృదయులై నాకు బోధించ ప్రార్థన.

శ్రీ ఆది వరాహస్వామి: బిడ్డా! ఋభూ! నీవు ‘బ్రహ్మవిద్య’ను కోరుకోవటము నాకు మహదానందమును కలుగజేస్తోందయ్యా!
ఎందుకంటే ఈ 14 లోకముల సంబంధమైన మాయా దృశ్య ప్రపంచంలో ఏఏ స్థితి గతులు లభించినా, ఏఏ సంపద, అధికారము మొదలైనవి పొందినాకూడా, - ఈ జీవుని హృదయములో పేరుకొనియున్న జన్మ - జన్మాంతరార్జితమైన దుఃఖము, వేదన (Meloncholy and worry) పోవు. మరల మరల ఏదో రూపంగా చిగురిస్తూనే ఉంటాయి. అందుకు నీవన్నట్లుగా ఏకైక ఉపాయము - ‘కోఽహమ్ - నేను ఎవ్వరు?’ అను ప్రశ్నకు తత్త్వజ్ఞులచే తత్త్వశాస్త్రవిధానంగా అందించబడుచున్న బ్రహ్మవిద్యయే. ఇందులో సందేహమే లేదు. అందుచేత తత్త్వశాస్త్రబోధ రూపమగు ఆయా కొన్ని విశేషాలు చెప్పుకుందాము. శ్రద్ధగా వినెదవు గాక!

కొందరు తత్త్వజ్ఞులు ‘ఈ జీవుడు ఎవ్వరు?’ అను ప్రశ్నకు సమాధానంగా ‘26’ తత్త్వములుగా వివరిస్తున్నారు. మరికొందరు మహనీయులు ‘96’గా బోధిస్తున్నారు. ముందుగా ఈ విభజనకు సంబంధించిన కొన్ని కొన్ని వివరణలు విను.

(1) జ్ఞానేంద్రియ పంచకము : (1) శ్రోత్రేంద్రియము (చెవులు) (2) ‘త్వక్’ ఇంద్రియము (చర్మము) (3) చక్షురింద్రియము (కనులు) (4) జిహ్వేంద్రియము (నాలుక) (5) ఘ్రాణేంద్రియము (ముక్కు) - [5]

(2) జ్ఞానేంద్రియ గుణములు (లేక) జ్ఞానేంద్రియ విషయపంచకము: (1) శబ్దము (2) స్పర్శ (3) రూపము (4) రసము (5) గంధము
వాటి భేదములు (1) అక్షరము, నాదము (2) చల్ల దనము, ఉష్ణము, మృదువు, కఠినము (3) తెలుపు, ఎరుపు, అందమైనట్టి - కానట్టి రూపములు మొదలైనవి (4) తీపి, పులుపు, చేదు, కారము, వగరు, ఉప్పు మొదలైనవి (5) సువాసన, దుర్వాసన మొదలైనవి [మొత్తం 5]

(3) కర్మేంద్రియ పంచకము (i) ‘వాక్’ - ఇంద్రియము (ii) హస్త - ఇంద్రియము (iii) పాద - ఇంద్రియము, (iv) ఉపస్థ - ఇంద్రియము (v) పాయు - ఇంద్రియము - [5]
కర్మేంద్రియ విషయ పంచకము : (i) వచనము (ii) దానము (iii)గమనము (iv) ఆనందము (v) విసర్జనము - [5]

(4) ప్రాణాది పంచకము : (i) ప్రాణము, (ii) అపానము (iii) వ్యానము (iv) ఉదానము (v) సమానము - [5]

(5) అంతరంగ చతుష్టము : (i) మనస్సు (ఆలోచన) (ii) బుద్ధి (వివేచన, విశ్లేషణ శక్తి), (iii) చిత్తము (ఇష్ట - అయిష్టములు) (iv) అహంకారము (వ్యష్టిగతమైన ‘నాది - నేను’) - [4]
(జ్ఞానేంద్రియ (5) + కర్మేంద్రియ (5) + పంచప్రాణ (5) + శబ్దాది పంచక (5) + అంతరంగ చతుష్టయము (4) = 24 తత్త్వాలుగా కొందరు బ్రహ్మతత్త్వ వేత్తలు విభజించి చెప్పుచున్నారు)

(6) పంచీకృత భూతములు = (i) పృథివి (Hard Solid) (భూమి) (ii) ఆపః (జలము - liquid) (iii) తేజస్సు (light, heat) (iv) వాయువు (vapour) (v) ఆకాశము (Mutual Placement - spacing, space) - [5]

(7) దేహత్రయము : (i) స్థూల దేహము (Matter Related) (ii) సూక్ష్మదేహము (Thought, Feeling & Emotions related Body) (iii) కారణదేహము (సంస్కార (లేక) వాసనా దేహము)
(అ) జీవుడు: (The Experiencer) (ఆ) అభ్యాసవశంగా నిర్మితమైన స్వభావదేహం - (By long habit through series of bodies) - (ఇ) పరమాత్మ - [3]

(8) అవస్థాత్రయము (1) జాగ్రత్ అవస్థ (Awakened State) (2) స్వప్నావస్థ (Dreamy State) (3) సుషుప్త్యవస్థ (Dead Sleep State) - [3]
(పైన చెప్పిన (24) అవస్థలకు + పంచభూతములు (5) + దేహత్రయము (3) + అవస్థాత్రయము (3) + వ్యష్టిగతమగు అహమ్ (నేను) - [36] అవస్థల విభాగంగా కొందరు ఆత్మ తత్త్వ విశ్లేషకులు విభాగిస్తున్నారు)
ఇంకా కూడా ‘‘తత్త్వమ్ (అది నీవే అను) బోధ’’ కొరకై మరికొన్ని విశేషాలుగా విశ్లేషించబడుతోంది.

(9) వికృత - షట్ భావములు : (i) అస్తి (ఉనికి) (ii) జాయతే - దేహముతో పుట్టుక (iii) వర్థతే - దేహసంబంధమైన ఎరుగుదల (iv) పరిణామము - కాలముచే జరుగు మార్పులు - బాల్య కౌమర యౌవన వార్థక్యములు (v) క్షయము - తరుగుదల, శరీరములో ఆయా నడిపించే శక్తుల క్షీణత (vi) నాశనము (Distruction) - [6]

(10) షట్ ఊర్ములు : (i) నొప్పి. కలత కలుగజేయు భౌతిక దేహములో జనించే విశేషాలు (ii) ఆకలి (iii) దాహము (iv) శోకము (v) మోహము (పరిమితమైన పరిశీలనచే ఏర్పడు అవగాహనలు) (vi) జరా - [6]

(11) షట్ భౌతిక వస్తుతత్త్వములు : (i) చర్మము (ii) రక్తము (iii) మాంసము (iv) మేద (క్రొవ్వు, వప, మెదడు) (v) మజ్జ (ఎముకలలో నూనె వంటి పొడి) (vi) బొమికలు (Bones) - (6)

(12) అరిషట్ వర్గములు (6) :

(i) కామము - ఇంకా ఏదో కావాలి, పొందాలి, జరగాలి, తేవాలి…అప్పుడుగాని పొందవలసినది పొందినట్లు కాదు → అను రూపంగా ఉండే ఆశించే, కోరే ఆవేశము. (లేక) స్వభావము.

(ii) క్రోధము : కోప సంఘటనలను మరల మరల మరల గుర్తు చేసుకొని ద్వేషించు, దూషించు, తప్పులు పట్టుకొను, బాధించు అలవాటు. ఎక్కువగా తప్పులనే గుర్తుపెట్టుకొని తిరస్కారపూర్వకంగా సంభాషించు స్వభావము (Maintaining the habit of teasing, revenging, bothering, Fault Finding etc. Anger towards events, Incidents and persons)

(iii) లోభము : ఇతరులలో పంచుకోవలసినది దాచి దాచి, ఇతరుల విభాగము వారికి ఇవ్వకపోవటం. దాచుకోవటములో మమకారముతో కూడిన అభిరుచి (The Selfish sense of being miserly)

(iv) మోహము : అసమగ్రమైన సమాచారము, దృష్టి, అభిప్రాయములతో ఊహ - అపోహలు కలిగి యుండటము. పూర్ణసత్యమును పరిశీలించని దృష్టి (Illusions, Misconceptions, Non-examining of truth comprehensively). లేనిది కల్పించుకొని చూచు దృష్టి (సంబంధ-బాంధవ్యములు ఈ తీరైనవే).

(v) మదము : తనకు కలిగియున్నది, పొందినది, స్వకీయ పాండిత్యము, దేహబలము, రూపము, పేరు - ప్రతిష్ఠలు → ఇటువంటివి చెప్పుకుంటూ తదితరులకన్నా తన గొప్పతనము చూపి గర్వించటము, పటాటోపము. (Being Proud of ones own self)

(vi) మాత్సర్యము : తనయొక్క బల, దర్ప, పదవులతో ఇతరులను తక్కువ చేసి చూస్తూ - ఇతరులను బాధించటము. ఓర్వలేకపోవటం. ఇతరుల బాధలను చూచి సంతోషపడటం. (Teasing and troubling others. sadism). ఇతరులపై దురభిప్రాయములను వదలలేక పోవటము.

(13) ఆత్మపురుషుని ‘అంశ’ పురుషకారములు (3) (1) విశ్వుడు - జాగ్రత్ ‘అభిమాని’
(2) తేజసుడు - స్వప్నానుభవ ‘అభిమాని’
(3) ప్రాజ్ఞుడు - గాఢనిద్రానుభవ ‘అభిమాని’
ఈ త్రిప్రదేశముల అభిమాన పురుషకారములకు బయల్వెడలు స్థానమగు మహాభిమానపురుషుడు - తురీయుడు. పరస్వరూపుడు। ఆవల ఉన్న స్వస్వరూపము।

(14) గుణత్రయము : (3)

(i) సత్వగుణము : (Positive Qualities) - స్నేహము, దయ, ప్రేమ, ఐకమత్య భావనలు, దైవీగుణములు

(ii) రజోగుణము : ఏదో చేయాలి, వెళ్ళాలి, రావాలి, తిరగాలి, నిర్వర్తించాలి….ఇటువంటి కర్మలు చేయాలనే వ్యాపక గుణ స్వభావము (Avocation to do something, work-holic)

(iii) తామసిక గుణము : బద్ధకము. కోపము వంటి ఆవేశపూరిత భావపరంపరలు. భ్రమించటం. తపించటం. (Drowsy. Getting restricted to feelings and emotions without examining).

(15) కర్మత్రయమము :

(i) సంచిత కర్మలు : ఇతః పూర్వము జన్మ - జన్మలుగా నిర్వర్తించిన (మనో వాక్ కాయ సంబంధితమై ‘ఫలప్రదము’) (Ready to give Fruits) అవటానికి సంసిద్ధమైయున్న కర్మపరంపరలు (Groups of Acts done with Body, thought, talk etc., that are emotionally waiting to take shape as eventualities). దేహి ఈ వర్తమాన దేహమునకు మునుముందే మూటలాగా కలిగియున్నట్టి కర్మ సంస్కారములు (లేక) కర్మ స్వభావములు (లేక) కర్మవాసనలను ‘సంచిత కర్మలు’ అంటున్నారు.

(ii) పారబ్ద కర్మలు : ఈ వర్తమాన దేహము ఈ జీవునికి ఒక సందర్భమువంటిది మాత్రమే! ఈ జీవునిపట్ల వర్తమాన దేహ సందర్భము కొరకై అనేక జన్మల కర్మ వాసనలు, కర్మఫలప్రదములలో ‘కొన్ని’ మాత్రమే ఫలదీకరణము అగుచున్నాయి. అట్టి వర్తమాన దేహముతో ఫలప్రదము అగుచున్న సంస్కారములు, కర్మఫలములు ‘ప్రారబ్ధకర్మలు’గా చెప్పబడుచున్నాయి. ‘ప్రారబ్ధము’ - అనుభవించక తప్పదు…అని చెప్పబడుతోంది.

(iii) ఆగామి కర్మలు : ‘సంచితకర్మలు ప్రారబ్ధకర్మలు’ - ఇవి రెండూ వర్తమాన దేహముతో చేసిన శుభ - అశుభ కర్మలవలన కొంత కొంత మార్పు - చేర్పులు పొందగా, దేహపతనము అగుచున్నప్పుడు ఈ జీవుని వెంటనంటివచ్చే కర్మల సంస్కారములు (లేక) దేహపతనానంతరం శేషించి ఉండు ‘వాసనా సమూహములు’.

(16) ఆనంద పంచకము

(i) వచనము - నోటికి సంబంధించన కర్మ విశేషములు (Talking).
(ii) ఆదానము - చేతులతో చేయు పనులు - చేతలు (Behaviour).
(iii) గమనము - కాళ్ళతో చేయు పనులు - నడకలు (నడతలు) (Wonderings / conducts).
(iv) విసర్గ - విసర్జన కర్మలు (Discarding / Leaving Aside).
(v) ఆనందము - శిశ్నమునకు సంబంధించినవి (శృంగార కర్మలు) (Sense of enjoying).

(17) సంకల్పనా చతుష్టయము : (i) సంకల్పము (Visualizing), (ii) అధ్యవసాయము (Opinions) (iii) అభిమానము (Fondness, interestedness) (iv ) అవధారణ (Remembering, Holding).

(18) విషయ సంబంధ చతుష్టయం : (i) ముదితము (eTT]సిపోవటము, సంతోషము పొందటం) (ii) కరుణ (Being kind with certain things) (iii) మైత్రీ (స్నేహబంధము కలిగి ఉండటము) (iv) ఉపేక్ష (Maintaining as non concerned with certain things).

(19) జగత్ సంబంధ విశేషములు : దైవీ (దివ్య) ప్రజ్ఞలు) (అశరీర ప్రజ్ఞలు)
(i) దిక్కులు (Dimensions) (ii) వాతా (వాయువు) (iii) అర్క (సూర్యుడు) (iv) వరుణుడు (లేక) ప్రచోతుడు (జలముతో సంబంధములు) (v) అశ్వినీ దేవతలు (ఓషధ దేవతలు) (vi) అగ్ని, (vii) ఇంద్రుడు - ఇంద్రియాధినేత (viii) ఉపేంద్రుడు (ఇంద్రియశక్తులు) (ix) మృత్యువు (ఒక స్థితి నుండి మరొక స్థితికి గతి పొందటము) - యముడు (మృత్యువు) (x) చంద్రుడు - మనో అధిదేవత, భూమికి ఓషధతత్త్వప్రదాత (xi) రుద్రుడు - లయకారుడు. సర్వము ఎందులో లయిస్తుందో అట్టి లయ విశేషమునకు అధిదేవత (xii) క్షేత్రజ్ఞుడు - దృశ్య, దేహ, ఇంద్రియ, మనో - బుద్ధి - చిత్త - అలంకారములను ‘ఇవి నావి’ అని ఎరుగుచున్నట్టి కేవల ప్రజ్ఞ. ఇంద్రియ విషయములను ఎరుగుచున్నట్టి వాడు.

ఓ ఋభు మహర్షీ! ఈ మనము చెప్పుకొన్న ‘96’ తత్త్వములు ఈ జీవునికి సంబంధించినవై, జీవుని ఆశ్రయించి ఉంటున్నాయి - అని తత్త్వవేత్తలు విశదీకరించి తత్త్వశాస్త్ర విశేషాలుగా చెప్పుచున్నారు.

అయితే ఈ 96 విశేషాలకు విలక్షణుడనై, వాటన్నిటికీ అతీతుడనై, వాటికి ఆధారుడనై, కేవల సాక్షినై సర్వ జీవులలోను సర్వదా ‘పరమాత్మ’గా సంస్థితుడనై ఉన్నాను. ఈ విధంగా సర్వాకార - నిరాకార, - నిర్గుణ పరతత్త్వమై ఉండియే, నన్ను భజించు నీవంటి భక్తజనులకు ప్రియము కలుగజేయటానికై స్వకీయ మాయచే ఈ వరాహరూపము మొదలైనవి ధరించి నామాయ యందు నేనే ప్రదర్శితుడను అగుచున్నాను. ఎవ్వరైతే నాయొక్క మాయయందు విలసితమగుచున్న అవతార రూపములను భక్తి - శ్రద్ధలతో ఉపాసిస్తారో, భజిస్తారో - అట్టివారు అజ్ఞానము నుండి, అజ్ఞాన కార్యపరంపరలతో కూడిన సంసార చక్రమునుండి విముక్తులై ‘జీవన్ముక్తులు’ అగుచున్నారు. నాయొక్క పైన వివరించబడిన ‘96’ తత్త్వములను చక్కగా పరిశీలించి, వాటిని ఆత్మయొక్క మాయావిభాగములోని అంతర్లీన - అనన్య చమత్కారములుగా ఎవ్వరు ఎరుగుచున్నారో వాటన్నిటికీ వేరుగా నిత్యప్రకాశకుడనైయున్న- వారివారి ఆత్మానంద స్వరూపుడనే అయి ఉన్న నన్ను తెలుసుకొనుచున్నారు.

అట్టివారు →
- జటీ (జడలు ధరించిన) (సన్న్యాసి) అయినా,
- ముండీ - జుట్టును ముండనము చేయించుకొన్నవాడైనా,
- శిఖ, పిలక ధరించినవాడైనా,
- బ్రహ్మచారి - గృహస్థ - వానప్రస్థ - సన్న్యాస ఆశ్రమములలో ఏది ఆశ్రయించి ఉన్నవాడైనా, అట్టివాడు సర్వ ఆశ్రమ బంధములనుండి విడివడినవాడై నన్నే చేరుచున్నాడు.
(జన్మ-కర్మ చ మే దివ్యం యేవం యో వేత్తి తత్త్వతః
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి ప్రాప్నోతి - భగవద్గీత)

కనుక ఓ ఋభూ! ఈ 96 తత్త్వలను ఎరిగి, వాటికి ఆవల ఉన్న మమస్వరూపముతో భక్తి - జ్ఞాన - యోగ సమన్వితుడవై - మమేక మవటమే - నీవు అడిగిన ‘బ్రహ్మ విద్య’ లేక ‘తత్త్వ విద్య’ యొక్క అంతిమసారమయ్యా!


ద్వితీయ అధ్యాయము - అనునిత్యమగు ఆత్మ నిష్ఠ

అప్పుడు ఋభువు భక్తితో - యోగీశ్వరుడు, క్రోడ (వరాహ) రూపమును స్వకీయ మాయచే భక్తులను అనుగ్రహించటానికి ధరించినట్టి వారు, శ్రీ రమాపతి అగు ఆది వరాహస్వామిని - ఈ విధంగా అడిగారు.

స్వామీ! సర్వాత్మకా! సర్వకారణ కారణుడా! శ్రీమన్ వరాహస్వామీ! మీరు వివరించి చెప్పిన 96 తత్త్వములచే జన్మ - జన్మాంతరములుగా సంసార జీవులమగు మేము కప్పబడి, తలమునకలై ఉన్నాము. పరము, దివ్యము - అగు మీ స్వరూపమును ఏ విధంగా చేరుకోగలమో, అట్టి ‘బ్రహ్మవిద్యామార్గము’ను నాకు బోధించమని విన్నపము చేస్తున్నాను. దయతో త్రోవచూపండి.

భక్తుల ఆర్తిని తొలగించు స్వభావముగల భగవానుడగు ఆదివరాహమూర్తి ప్రియభక్తుడగు ఋభువు అడిగినది విన్నారు. జీవుల స్వకల్పిత సంసార బంధముల కార్య-కారణ వ్యవహారమంతా ఎరిగినట్టి సర్వజ్ఞులు కదా! భక్తుడగు ఋభువు ప్రశ్నకు సంతోష పూర్వకంగా జగన్ - మోహనమగు చిరునవ్వు చిందిస్తూ….ఈ విధంగా ప్రవచనము చేయసాగారు.

శ్రీ ఆది వరాహస్వామి:

ఓ ఋభు మహాశయా! అల్పమైన ఆశలు, ఆశయముల వలననే ఈ జీవుడు - కేవలాత్మ స్వరూపుడే అయి ఉండి కూడా, ఇంద్రియ దృశ్యబద్ధుడై అనేక జన్మ మృత్యురూపమలగు సంసార బంధనములలో నిష్కారణంగా (అనవసరంగా) తనకు తానే చిక్కుకుంటున్నాడు. అందుచేత, ‘అజ్ఞానముచే జనిస్తున్న బంధములనుండి విడివడి, నాయొక్క సర్వాతీతము - అఖండము - అప్రమేయము అగు ‘ఆత్మ’ యొక్క ఔన్నత్యమును ఎరిగి, ఆత్మానంద స్వరూపుడను కావాలి!’…అను ఆశయమును ఆశ్రయించాలి. ‘మహదాశయుడు’ కావాలి. అట్టి ఉత్తమ ఆశయముచే ఈ జీవుడు మొట్టమొదట ‘ముముక్షువు’ అగుచున్నాడు. ఇక ఉపాయములు ఆశ్రయించాలి.

(1) తాను ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమమునకు సంబంధించిన (బ్రహ్మచారి - గృహస్థ - వానప్రస్థ - సన్న్యాస) ధర్మములను శ్రద్ధగా, భగవత్ - సమర్పణ భావముతో నిర్వర్తించును గాక.
(2) సర్వాత్మకుడగు పరమాత్మ గురించిన ‘తపన’ రూపమగు తపస్సుకు ఉపక్రమించును గాక.
(3) సేవక భావముతో గురుశుశ్రూషను అభ్యసించును గాక.

ఇట్టి ప్రయత్నములలో ఈ జీవుడు ముముక్షు మార్గములో ప్రయాణమును ప్రారంభించుచుండగా, ఈతడు వైరాగ్యము మొదలుగాగల ‘సాధన చతుష్టయము’లో క్రమ క్రమంగా ప్రవేశము పొందుచున్నాడు.

సాధన చతుష్టయము

(1) నిత్య - అనిత్య వివేకము : ‘‘ఏది సందర్భముగా మాత్రమే సత్యము? ఏది సహజ సత్యము? ఏది నాకు సంబంధించి నిత్యము (Permanently with me)? ఏది అనిత్యము (That which is just temporarily with me)?

ఉదాహరణ : నటించు కళ సత్యము / నిత్యము. ఒక నాటకంలో నేను నటించే పాత్ర అనిత్యము.
ఎదుటివాడు → బంధువుగా అనిత్యము. ఆత్మగా సత్యము
- నేను-తండ్రి; కొడుకును; భర్తను; భార్యను; - ఇత్యాది బంధువుగా, స్నేహితుడుగా, గుణిగా, మంచిగా, చెడుగా-ఇవన్నీగా సందర్భ పరిమితము మాత్రమే కాబట్టి అసత్యము. అనిత్యము.

నేను ఆత్మగా నిత్యము. అనునిత్యము. జీవాత్మ - అనుభవి - జగదనుభవము మొదలైనవన్నీ సందర్భమాత్ర చమత్కారములు.
ఇటువంటి నిత్య - అనిత్య వివేకముతో నిత్యమైనది బుద్ధికి సిద్ధించటానికి - నిత్యమైన ప్రయత్నముతో, అనిత్యమైన దానికి అనిత్యమగు (సందర్భమాత్రమగు ప్రయత్నములతో యత్నశీలమై ఉండటము) (Temporary approaches for the temporary things and permanent approach for the permanent) - ఇది ‘నిత్యానిత్యవివేకము’గా చెప్పబడుతోంది. వివేకి అయినవాడు - అనిత్యమైనదంతా - నిత్యమగు ‘‘ఆత్మభావనా సంసిద్ధి’’ - కొరకై వినియోగించుచుండును గాక!

(2.) ఇహ - అముత్ర ఫలభోగ విరాగము: ‘‘ఇహలోకంలో ‘పొందాలి’ అనే రూపముగా అనిపిస్తున్న సంపదలపట్ల గాని, పరలోక స్వర్గసుఖ విశేషములపట్లగాని-రాగము తొలగించుకొని, వాటియొక్క నిత్య-అనిత్యము లేమిటో ఎరిగి, వాటిపట్ల ‘ఏవి ఎట్లు ఉంటూ ఉన్నాయో అవి అట్లే ఉండుగాక! లేదా మరొకతీరుగా అయితే అగు గాక! ఆత్మ స్వభావుడనగు నేను అంతరంగా ఉభయ సందర్భములలోనూ వేదన పొందవలసిన అవసరం ఈషన్మాత్రం కూడా లేదు’’. - అనురూపముగల భావన - ‘విరాగము’. ఆత్మభావనచే విరాగము స్వాభావికము అగుచున్నది.

(3) శమాది షట్క (6) సంపత్తి:
(i) శమము - కామక్రోథములు దరిరానీయకుండా ‘శాంతి’ని వహించి ఉండటము. (మనో బుద్ధి చిత్తములను విషయముల వైపునుండి అతీతము చేయటము).
(ii) దమము - బాహ్య ఇంద్రియములను విషయములనుండి విరమింపజేయటము. సాధనమార్గంగా నియమించటము.
(iii) తపస్సు - పరమాత్మ గురించిన తపన.
(iv) ధ్యానము - ‘సర్వము పరమాత్మ స్వరూపమే’ అను ధ్యాస.
(v) యోగాభ్యాసము - ప్రాణాయామము, కుండలినీ సంచాలనము. (కుండలినీ రూప ఇచ్ఛా-జ్ఞాన-క్రియా శక్తిని సుషుమ్ననాడి ద్వారా బ్రహ్మరంధ్రమును ఛేదించి సహస్రారము ప్రవేశింపజేయటము).
(vi) తితిక్ష - ఓరిమి.
ఈ విధంగా సాధన సంపత్తిని పెంపొందించుకోవటము.

(4) ముముక్షుత్వము : మనస్సును, బుద్ధిని, చిత్తమును విషయములనుండి మరల్చి మోక్షమార్గములో నియమించాలనే ఆశయము.
(సాధన చతుష్టయము - యోగవాసిష్ఠము)
(1) శమము : ఇంద్రియములను విషయములనుండి, (లేక) అభిలాష - వేదనములనుండి ‘శాంతము’ను స్వభావముగా కలిగి ఉండటము.
(2) సాధుసంగము : ఆత్మజ్ఞుల వద్ద శ్రవణము, ఆత్మ శాస్త్రముల మననము. మహదాశయులతో సంభాషణము.
(3) విచారణ : విన్నది మననము చేస్తూ విచారణ ద్వారా నిత్యానిత్య వివేకమును ఆశ్రయించటము.
(4) సంతోషము : తృప్తిగా, సంతోషముగా ఉండటము, సంతృప్తి, ఉత్సాహములను అలవాటు చేసుకొని ఉండటము.

ఓ ఋభూ! ఈ విధంగా స్వధర్మనిరతి, తపస్సు, గురుసేవ, శమాది సాధన చతుష్టయ సంపదను ముముక్షువు ఆశ్రయించాలి. క్రమంగా ఇంద్రియములను జయించి, భేదదృష్టులను త్యజిస్తూ, సర్వ మమకారములను సుదూరముగా వదలి, ‘‘సాక్షి చైతన్య స్వరూపము’’ను ధారణచేస్తూ ఉండాలి. సర్వదా సదాత్మకుడగు నాయందు బుద్ధిని నిలపటమును అభ్యాసము చేయాలి.
బిడ్డా! (74 లక్షలు జీవరాసులలో) ఈ మానవజన్మ దుర్లభమైన సందర్భము. ఈ మనుష్యత్వము అనునది ‘పరమాత్మత్వము’ అనబడు సంసిద్ధి పొందుటకు మహత్తరమైన అవకాశంగా ఈ జీవుడు భావించాలయ్యా! పైగా, ఈ అవకాశము అనిర్దేశ్య - కాలబద్ధము (unknown - Time bound) సుమా!

దుర్లభం ప్రాప్య మనుష్యం : దుర్లభమగు మానవజన్మ లభించి,

తత్రాపి నర విగ్రహం : చక్కటి సమర్ధ్యపూర్వకమగు అవయవములు పొందికూడా,

బ్రహ్మణ్యంచ మహావిష్ణో : మహావిష్ణు సంబంధమైన బ్రహ్మతత్త్వము శ్రవణం చేస్తూ చదువుచూ కూడా, వేదాంత శాస్త్రము లభ్యమగుచూ ఉండగా కూడా -

→ వర్ణాశ్రమధర్మములకు అతీతమై యున్నట్టిది
→ సత్ - చిత్ - ఆనంద (ఉనికి - ఎరుక - అనుభూతి) లక్షణ సహజ లక్షణ సమన్వితము..,

అగు ‘పరబ్రహ్మము’ను - అనునిత్యానుభవముగా పొందకపోతే మరి అట్టి విద్వాంసుడు ఇంకెప్పుడు ముక్తిని పొందేది?

సర్వ జీవులలో ‘అహమ్’గా సమస్వరూపుడనై ప్రకాశించుచున్న నన్ను ఆశ్రయించుట చేతనే ఈ జీవుడు వాస్తవమగు సుఖమును పొందగలడు. ప్రతి జీవునికి అనన్యుడనైయున్న నన్ను ఏమరిచి, అన్యమగుదేనిని ఆశ్రయించినప్పటికీ అది శాశ్వత సుఖము కాదు. వాస్తవమగు ప్రశాంతత అయి ఉండదు.

ఓ మునీశ్వరా! ఈ జీవుడు అంతర్యామినగు నన్ను చేరుకొనాలనే ‘మమేకమగు ఆశయము’తో కాకుండా కర్మలు చేయటం, ఏవేవో లోక సంబంధమైన ప్రయోజనములు మాత్రమే ఉద్దేశ్యించటము - ఈతనికి శ్రేయమగు ప్రియమును చేకూర్చదు. లోకసంబంధమైన ఆశయములు, కర్మఫలములు - శాశ్వతమగు, వాస్తవమగు ప్రియమును చేకూర్చలేవు. సర్వజీవులకు సర్వదా ఆత్మ - విష్ణుస్వరూపుడనగు నేనే! నేనే ఆత్యంతిక ప్రియమైనవాడను! పరాప్రేమతో నన్ను నీయందు, సర్వజీవులయందు దర్శించవయ్యా! సర్వజీవులలో చూచుచున్నది - చూడబడుచున్నది నేనే! ద్రష్ట - దర్శన - దృశ్య - దృక్ విష్ణు స్వరూపుడనై ప్రతిఒక్కరిలో ప్రకాశించుచున్నాను.

బాహ్యంగా ప్రకాశించు ‘96’ తత్త్వములలో నాకొరకై వెతికితే సులభముగా తెలియబడను సుమా! అందుచేత ‘‘96 తత్త్వములను వెలిగించే తేజోస్వరూపము’’….అగు నా కేవలీ స్వరూపము యొక్క దర్శన ఉపాసనలచే సోఽహమ్ విష్ణుస్వరూపుడవగుము. అట్టి దృశ్య - దేహ - అంతరంగ - జాగ్రత్ - స్వప్న - సుషుప్త్యాదులను వెలిగించు స్వస్వరూప విష్ణాత్మస్వరూపమును ఎరుగకపోవటం చేతనే (వాస్తవమగు ‘అహమ్’ ప్రకాశక ఆత్మను గురించి సంవిజ్ఞాతము కొరవడుటచేతనే) - ఈ జీవుడు ‘నేను బద్ధుడను’ అనుభావమునకు పరిమితుడు అగుచున్నాడు.

ఆత్మను ఆత్మయే ప్రకాశింపజేయగలదు

స్వప్రకాశం తమ్ ఆత్మానం అప్రకాశః కథమ్ స్పృశేత్? ఆత్మ సర్వదా స్వయంప్రకాశము. అద్దానిని ప్రకాశింపజేయునదంటూ మరొకటేదీ లేదు. అటువంటప్పుడు, స్వయం ప్రకాశకము కానట్టి, మరొకటిచే ప్రకాశింపజేస్తేనే ఉనికిని పొందునట్టి మనో - బుద్ధి - చిత్త - అహంకారములు, ఇంద్రియ జగత్తు, జడదేహము’ మొదలైనవి ఆత్మను ఎట్లా స్పృశిస్తాయి? స్పృశించనే లేవు. మరి, అవి ఆత్మను ఎట్లా ప్రకాశింపజేయగలవు?

శ్లో।। స్వయం భాతం నిరాధారం యే జానంతి సునిశ్చితమ్,
తేహి విజ్ఞాన సంపన్నా। ఇతి మే నిశ్చితా మతిః।।

ఎవ్వరైతే స్వయంప్రకాశమై, సర్వమును తానే ప్రకాశింపజేయునదై, తాను దేనిపై ఆధారపడక నిరాధారము - అయి ఉన్న ఆత్మను తనయందే తెలుసుకుంటారో, దర్శిస్తారో ఆస్వాదిస్తారో, మమేకమౌతారో,… అట్టివారే విజ్ఞాన సంపన్నులు - అని నా నిశ్చితమగు అభిప్రాయము.

ఋభువు : స్వామీ! మీ తత్త్వము ఎట్టిది? ఈ జీవుడు (Individual form) మరియు ఈశ్వరుడు (One to whom a number of bodies belong, one who is operator of ‘Body after Body’) అనునవి ఎక్కడి నుండి బయల్వెడలుచున్నాయి? మీరే ఆ ఉభయముగా అగుచున్నారా? ఈ జగత్తుగా అగుచున్నది మీరేనా? ఒకవేళ ఈ జీవ - ఈశ్వర - జగత్ రూపాలుగా అగుచున్నది మీరే అయితే, ఈ ఈ రీతులుగా ఎందుకౌతున్నారు? ఈ జీవుడు బ్రహ్మమే! మరింకేమీ కాదు. (జీవో బ్రహ్మేతి నా పరః) - అని మహావాక్యము కదా! పరబ్రహ్మ స్వరూపులై ఉండి ఎందుకు ఇవన్నీగా అగుచున్నారు? ‘మాయ’ మీ నుండి వేరైనదా? అది ఎందుకు ఎవరిచే కల్పించబడుతోంది?

శ్రీ వరాహస్వామి : ఓ ఋభూ! నీకు జీవుడుగా, ఈశ్వరుడుగా, జగత్తుగా కనిపిస్తూ-అనిస్తున్నదంతా కూడా అఖండ - అప్రమేయ - అనునిత్యమగు నాయొక్క పరబ్రహ్మస్వరూపమే! అట్టి నాయొక్క కేవలీస్వరూపమే అజ్ఞానదృష్టిచేత జీవ - ఈశ్వర - జగత్తులుగా అగుపిస్తోంది. బ్రహ్మమును బ్రహ్మమునకు వేరని భావించి, నామ రూపాత్మక భేద జగత్తుగా దర్శించటమే ‘మాయ’.

✤ బ్రహ్మమును బ్రహ్మముగా చూస్తే - బ్రాహ్మీ దృష్టి।
✤ బ్రహ్మమును అన్యముగా (జనిస్తూ-గతిస్తూ ఉండే జగద్విషయములుగా) చూస్తే - మాయా దృష్టి।

అనగా….
(1) జీవ ఈశ్వర జగత్తులుగా నీకు కనిపిస్తున్నది ‘నాయొక్క (1) దేహము (2) జాగ్రత్ (3) స్వప్నము (4) సుషిప్తి (5) జీవుడు (6) ఈశ్వరుడులకు - ఆవల గల సప్తమ - సహజరూపమగు బ్రహ్మమే’. అట్టి బ్రహ్మమే నీయొక్క వాస్తవ - సహజసిద్ధ రూపము కూడా.
(2) బ్రహ్మము బ్రహ్మముగానే సర్వదా ఉన్నది. అది మరొకటేదీ అవటం లేదు. కల తనదైనవాడు కలలోని ‘ద్రష్ట - కలలోని దృశ్యము’ అవకుండానే సర్వదా వేరుగానే ఉన్నాడు కదా! ఒక నటుని నటనాకౌశలము నాటకములోని పాత్రగా అవకుండా విడిగానే ఉన్నది కదా! కథా రచయిత కథవ్రాస్తూ, కథలోని పాత్రలుగాను, సందర్భములుగాను అగుచున్నాడా? లేదే!

అదేవిధంగా, - స్వపూర్ణాణాత్మాతిరేకేణ ‘జగత్ జీవ ఈశ్వర ఆదయః న సన్తి। ఆభరణములన్నీ బంగారమే అయి ఉన్న తీరుగా నీచే దర్శించబడుచున్నదంతా నీ ఆత్మస్వరూపమే. ఈ సర్వము త్వమాత్మానందమే. ‘‘నాయొక్క పూర్ణాత్మత్వ చమత్కారము దృష్ట్యా - ‘జీవుడు’ అనబడునదిగాని, ‘ఈశ్వరుడు’ అనబడునదిగాని, ‘జగత్తు’ అనబడునదిగాని (స్వకీయ కల్పనచే కనిపిస్తున్నప్పటికీ) - వాస్తవానికి లేవు. (లేక) స్వతఃగా స్వతంత్రించి ఉన్నవి కావు’’ - అని గమనిస్తూ, సునిశ్చితము చేసుకొనెదవు గాక!
ఇక నీవు అడిగిన మాయ గురించి వస్తే, ‘‘యా మా….ఏదైతే వస్తుతః లేదో!’’…. అని కదా శబ్దార్ధం? కనుక ‘మాయ’ అనునది నాకు వేరుగా లేదు. ఒకవేళ ఉన్నదనుకుంటే అది కేవలాత్మస్వరూపులమగు నీయొక్క, నాయొక్క స్వకీయకల్పనా విభాగము మాత్రమే!

తేభ్యశ్చ అహం విలక్షణః। ఈ జీవ ఈశ్వర జగత్తులనబడే వాటికి వేరై, విలక్షణుడనై ఉన్నాను. ఒక బంగారు ఆభరణము - ‘గాజుయా? గొలుసా? ఉంగరమా! వారిదా! వీరిదా? నాదా?’…. అను వివరములన్నిటికీ బంగారు లోహము సర్వదా వేరే కదా! అట్లాగే బ్రహ్మీ స్వరూపముగా గమనిస్తూ ఉన్నప్పుడు - నేను నీవు సర్వదా కూడా ఈ సమస్త దృశ్యమునకు వేరేగా విలక్షణులమై ఉన్నాము.

ఋభువు : స్వామీ! మీరు కర్మలకు సంబంధించినవారా? కాదా? ఏఏ ప్రయత్నములచే (లేక) కర్మలచే మీరు మాకు లభ్యమౌతారు? ఏఏ ధర్మములు మీరు లక్షణములుగా కలిగియున్నవారు? ఏఏ కర్మ-ధర్మములచే మేము మీ స్థానమును చేరుకోగలము?

శ్రీ వరాహస్వామి : ఓ ఋభూ! కర్మ ఉన్నదంటే, ఆ కర్మ నిర్వర్తించువాడు మునుముందుగా ఉండాలి కదా! ఇక ధర్మములంటావా? అవి కూడా సృష్టికల్పనలోని సందర్భములకు (Situations) సంబంధించినవి. పరమాత్మనగు నేను జన్మ - కర్మ - ధర్మములకంటే వేరై, మునుముందుగానే ఉన్నట్టి ‘కేవలసత్’ స్వరూపుడను. ఇక ఈ ‘కర్మ - ధర్మ - జన్మ - దృశ్య’….ఇత్యాదులతో ఆత్మనగు నాకు గల సంబంధములు ఎటువంటివంటావా? విను.

శ్లో।। అజ్ఞానాంధ తమో రూపం ‘కర్మ, ధర్మ’ ఆది లక్షణమ్।
సూర్యకాంతికి, ఆ కాంతిలో కనబడేరూపములకు ఏమి సంబంధము? నాటక దీపమునకు, నాటకములోని పాత్రల గుణ - లక్షణములకు ఏమి ముడి? కర్మలు (Acts, Functions) , ధర్మములు (Duties) మొదలైనవన్నీ అజ్ఞానముచేత మాత్రమే - ‘ఉన్నాయి’ అని అనిపిస్తున్నాయని గ్రహించు.

➤ వృత్తిరీత్యా కర్మలు, ధర్మములు,
➤ భార్య - భర్త - పిల్లలు - తల్లి తండ్రిలు మొదలైన సంబంధముల దృష్ట్యా కర్మలు, ధర్మములు,
➤ పిత్రుదేవతలు, అతిథులు, భూతఋణముల దృష్ట్యా కర్మలు, ధర్మములు,
ఇవన్నీ దృశ్యజగత్తులో సందర్భానుచితంగా ఈ జీవుని వెంటనంటి ఉంటున్నాయి.

అయితే “జగత్తు కల్పన” దృష్ట్యా? కర్మలు, ధర్మములు మొదలైనవి కూడా కల్పనలోని విభాగములే. జన్మ - ధర్మ - కర్మలు సందర్భ పరిమిత సత్యములేగాని, సహజసత్యములై ఉండలేదు. అందుచేత అవన్నీ ‘అజ్ఞానము’ అనే రాత్రియందు చిమ్మ చీకటిలో కనిపించే రూపములు. ‘అజ్ఞానాంధ తమోరూపము’ అని పరాకాష్ఠార్థంగా నిర్వచించి చెప్పబడుచున్నాయి.

ఎందుకంటే,
స్వయంప్రకాశం ఆత్మానం నై వ మాం స్రష్టుమ్ అర్హతి’। పరమాత్మనగు నేను మాత్రమే స్వయంప్రకాశకుడను. ఆత్మకు వేరైనదంతా అన్యప్రకాశకము. మరొకటి చేత ప్రకాశింపజేయబడునది. మరి స్వయం ప్రకాశక ఆత్మ చైతన్యస్వరూపుడనగు నన్ను తదితరములైన మనో - బుద్ధి - జీవాత్మ - దృశ్యాదులు ఎట్లా అంటుతాయి? వస్తుదోషాలు సూర్యకిరణములను అంటవు కదా! ఆకాశము (Place) - గృహముగా మారదు కదా! ‘ఆభరణము బంగారమును సృష్టిస్తోంది!’ - అని అంటామా? లేదుకదా! నన్ను సృష్టించునది మరొకటేదీ లేదు.

బ్రహ్మైవ భవతి స్వయమ్

ఓ ఋభూ! సర్వసాక్షిణమ్ ఆత్మానం, వర్ణాశ్రమవివర్జితమ్, బ్రహ్మరూపతయా పశ్యన్ బ్రహ్మైవ భవతి స్వయమ్। (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య,శూద్ర) సర్వ వర్ణములను, (బ్రహ్మచర్య - గృహస్థ - వానప్రస్థ - సన్న్యాసాది) సర్వ ఆశ్రమములను దాటివేసిన దృష్టితో సర్వజీవులలో సాక్షిగా వేంచేసియున్న ఆత్మను ఎవ్వరు గమనిస్తూ ఉంటారో, సర్వులను, సమస్తమును ‘బ్రహ్మము’గా - ఎవ్వరు దర్శిస్తూ ఉంటారో….అట్టి వారు స్వయముగా బ్రహ్మమే అగుచున్నారు. బ్రహ్మైవ భవతి స్వయమ్।

ఈ జీవాత్మ దృశ్యములతో కూడిన జగత్తంతా కూడా ఆత్మ తేజస్సుచే వెలిగించబడు చమత్కారముచే భాసమానము. పరమపదమగు పరబ్రహ్మము - తేజోభాసరూపము. తెలియబడుచున్నదంతటికీ తెలుసుకొను వేదాన్తరూపముగా వేరుగా ఉండి, భాసించబడుచున్నదంతా ఆత్మయే అయి ఉంటోంది. అట్టి అకారణ - స్వాభావిక - అనునిత్య సందర్శనము ఎవ్వరు కలిగియుంటారో, అట్టివారు ‘‘సద్యోముక్తి సిద్ధులు’’ అనబడుచున్నారు. వారిపట్ల ఇక సాధనములు, విశ్లేషణలు, భాష్యములు మొదలైనవన్నీ అగత్యము కావు. ‘తెలియబడేది - తెలుసుకొనుచున్నది’ - ఉభయము పరబ్రహ్మస్వరూపముగా దర్శించువారికి, అట్టి దర్శనమే ధ్యానము, యోగము, భక్తి, జ్ఞానముగా అగుచున్నది.

‘‘ఈ దేహాత్మత్వమంతా పరబ్రహ్మము యొక్క లీలా - క్రీడా వినోదప్రదర్శనమే’ - అను భావన సుస్థిరపరచుకొనువానికి ‘‘దేహమే నేను’’ అనే సంకుచితమగు ‘దేహాత్మభావన’ స్వయముగా మొదలంట్లా తొలగిపోవుచున్నది.

ఆత్మన్యేవ భవేత్ యస్య, స న ఇచ్ఛన్నపి ముచ్యతే! ఎవ్వరి భావన ‘ఈ సర్వము పరబ్రహ్మస్వరూపమే’… అను అవగాహనతో కూడి ఉంటుందో అట్టివాడు తనకు తానుగా కోరుకోకపోయినప్పటికీ ‘ముక్తుడు’ అగుచున్నాడు.

ఎవ్వడైతే అంతటా ఎల్లప్పుడూ సత్యజ్ఞానానంద పూర్ణ లక్షణము, అజ్ఞానంధకారమునకు ఆవల గల బ్రహ్మానందలక్షణము దర్శిస్తాడో, అట్టివాడు కర్మలచేత బద్ధుడయ్యే ప్రసక్తియే ఉండదు. బ్రహ్మానందగ్ం సదా పశ్యన్ కథం బధ్యేత కర్మణా? సర్వత్రా బ్రహ్మమును దర్శించు వానికి కర్మబంధమే ఉండదు. కర్మలు నిర్వర్తించినా, నిర్వర్తించకున్నా ఆతని పట్ల ఒక్కటే అగుచున్నది.

జ్ఞానచక్షువులు

ఈ భౌతికమైన కళ్ళకు ఇక్కడ కనిపించేదంతా అనేకముగా తెలియబడవచ్చును గాక! కానీ జ్ఞానచక్షువులతో ‘త్వమ్, అహమ్ (నీవు - నేను)’ అనురూపంగా శబ్దార్థమై కనిపిస్తున్నదంతా అఖండాత్మయే! జాగ్రత్ - స్వప్న - సుషుప్తిలకు కేవల సాక్షి → సత్యజ్ఞానానంద లక్షణ సమన్వితముగా అనిపించటమే - ‘‘జ్ఞానచక్షువులతో ఆత్మసందర్శనము (లేక) ఆత్మసాక్షాత్కారము’’. సాంసారిక దృష్టిలో కనిపించే సర్వదోషములపట్ల ఆత్మదృష్టి (లేక) బ్రాహ్మీదృష్టిచే అనాసక్తుడై ఉండటమే జ్ఞాన చక్షు దృష్టి (నిర్దోషం హి సమమ్ బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితః।).

సూర్యకాంతిలో వస్తువులన్నీ వెలుగుతూ ఉన్నప్పటికీ గ్రుడ్డివానికి ఆ వస్తువులు కనిపించవు కదా! సాంసారిక దృష్టిచే జ్ఞానచక్షువులు తెరువకపోవటం చేతనే సర్వమును వెలిగిస్తున్న స్వస్వరూపాత్మ అజ్ఞాన జీవునికి కనబడటం లేదు.

ఋభుమహర్షి : స్వామీ! కరుణామయుడవగు శ్రీ వరాహ భగవాన్! ఏది తెలుసుకొంటే సత్యజ్ఞానానంద లక్షణ సమన్వితమగు ఆత్మ తెలియబడగలదు?

శ్రీ వరాహస్వామి : బ్రహ్మమును తెలియబడే దానిలో వెతికితే అది దుర్లభము, దుస్సాధ్యమే మరి? దేనిచే సర్వము తెలియబడుచున్నదో, తెలియబడే సర్వమునకు మునుముందే ఉన్నదో - అదియే బ్రహ్మము. కేవలమగు ఎరుక ‘ప్రజ్ఞానము’ అనబడుచున్నది. ప్రజ్ఞానమేవ తత్ బ్రహ్మ, సత్య ప్రజ్ఞాన లక్షణమ్। ‘సత్’ ఉన్నచోట ప్రజ్ఞ (ఎరుక) - స్వాభావికంగానే ఉండి తీరుతుంది. ప్రజ్ఞ ‘సత్’ను లక్షణముగా కలిగి ఉంటుంది. అట్టి కేవల ప్రజ్ఞానము (“Knowing” - at its original form) ను బ్రహ్మముగా సుస్పష్టముగా (సందేహరహితంగా) ఎరుగుటచే ఈ జీవుడు ‘అమృతస్వరూపుడు’ అగుచున్నాడు.
అదియే ఆత్మ! ఈ జీవుడు-అఖండము, అపరిమితము అగు ఆత్మ స్వరూపుడే గాని, ‘జీవితము’ అను సందర్భముచే పరిమితుడైనవాడు కాడు.

అట్టి ఆత్మ ఇంకా ఎటువంటిది? విను.

అద్వంద్వము → దేనికైతే ద్వితీయమనునదే లేదో,

నిర్గుణమ్ → పాత్రల గుణములు నాటక రచయితకు సంబంధించినవి కాదు కదా! అట్లాగే ఎద్దానికైతే త్రిగుణముల వ్యవహారమును ఆపాదించలేమో,

సత్యమ్ → సర్వదా ‘సత్ (ఉనికి)’ - స్వరూపమై ఉన్నదో…,

నిత్యమ్ → భూత వర్తమాన భవిష్యత్తులలో, జాగ్రత్ - స్వప్న - సుషుప్తి సందర్భములలో క్రితం జన్మ - ఈ జన్మ - తదుపరి జన్మ సందర్భములలో ఎల్లప్పుడూ వేరై ఉండియే ఉండుటచే ‘నిత్యము’ - అయి ఉన్నదో….,

చిద్ఘనమ్ → ఏది ఘనీభూతమైన ఎరుక(Enlightening)గా కేవల రూపమైయున్నదో …,

తత్ బ్రహ్మానందమ్ అద్వందమ్, నిర్గుణమ్ సత్య చిద్ఘనమ్ - విదిత్వా స్వాత్మనో రూపం - అట్టి తనయొక్క ‘స్వస్వరూపాత్మ’ను ఎరిగినవాడు - న బిభేతి కుతశ్చన - ఇక దేనికీ ‘భయము’ అనునది పొందడు.

అట్టి బ్రహ్మవేత్త →
‘‘ఈ కనబడేదంతా అస్మత్ చిన్మాత్రముయొక్క (ఎరుకయొక్క) విస్తరణ చమత్కార బాహ్యరూపమే! చిన్మాత్ర స్వరూపమగు మమాత్మ పూర్ణమైనది। ఆత్మసుఖస్వరూపము। ఇక్కడ ఇదంతా సాక్షాత్ బ్రహ్మమే। → అను స్థితిని అనుక్షణికంగా కలిగి ఉంటున్నాడు.

ఓ ఋభూ!
✤ అజ్ఞానికి ఈ జగత్తు అనేక బంధములతో దుఃఖములతో కూడినదై ఉంటోంది.
✤ ఆత్మజ్ఞానికో? ఇదంతా స్వకీయ ప్రజ్ఞానందమయమే కాని, మరింకేమీ కాదు. తానే తనయందు సంచరించు క్రీడా - లీలా వినోద ప్రదేశమగుచున్నది.

దృష్టాంతానికి - అంధం భువనమ్ అంధస్య ప్రకాశం తు సుచక్షుసామ్। గ్రుడ్డివానికి ఈ జగత్తు చీకటిమయంగాను, కళ్ళు చక్కగా పనిచేస్తున్న వానికి అనేక రూపముల సమాహారములవలె తెలియవస్తుంది కదా! ఇదీ అంతే. ఆత్మజ్ఞానికి ఈ దృశ్య ప్రదర్శనమంతా స్వకీయ జ్యోతి స్వరూపమే!

ఓ ఋభు మహదాశయా! వారాహ రూపంగా కనిపిస్తూనే నేను ఆద్యంతములు లేనివాడను (అనంతుడను), చిద్ఘనానందుడను కూడా! నీకు, ఈ సర్వమునకు అద్వితీయుడనై ఉన్నాను.

ఇక నీయొక్క బంధము గురించియా? స్థితే అద్వితీయ భావస్యాత్ కో బంధః? కశ్య ముచ్యతే? నీవు నేనే అయి ఉండగా, నీవు ఆత్మవే అయి ఉండగా - ఇక బంధమెవరి? ముక్తి ఎవరికి? నీయొక్క జీవాత్మకా? అది నాటకములోని పాత్రవలె కల్పితమాత్రము. నీయొక్క పరమాత్మకా? అది నిత్యముక్తము! నీవు నీ ఆత్మకు వేరుగా లేవు. నేను నీ ఆత్మకు వేరుగా లేను. ‘మట్టికుండ’ తయ్యారైన మట్టిని ‘కుండ’ అనే ఆకార ధర్మము ఉన్నదనగలమా? కుండ అనే ఆకారముచే మట్టి బంధించబడుతోందా? లేదే! మట్టితో పిడత, మూత, కుండ, గోడ మొదలైన అనేక ఆకారాలు తయారగుచున్నప్పటికీ ‘మట్టికి ఆకారము కలదు’ అని అనము కదా!

అట్లాగే, స్వస్వరూపం తు చిన్మాత్రగ్ం సర్వదా సర్వదేహినామ్, నైవ దేహాది సంఘాతో! నీ ‘చిన్మాత్రము’ (కేవలమగు ఎరుక) - అను ‘స్వస్వరూపము’నకు దేహము, దృశ్యము - మొదలైన వాటితో సంఘాతమే లేదు. అట్టి ఆత్మ ఒక దృశ్యమువలె భౌతికమైన కనులకు కనిపించేది కాదు. దేహమును కదిలించే ‘నేను’ అనే చైతన్యమునకు ఆకారమెక్కడిది?

కథలో కనిపించే ఆయా పాత్రలు, ఆ పాత్రల పరస్పర సంబంధములు రచయిత కల్పనే అయినప్పటికీ, ‘రచయిత ఇటువంటివాడు’ అని ఆ పాత్ర గుణములను ఆపాదించలేము కదా! అట్లాగే జీవాత్మ ధర్మములేవీ, (లేక) జగత్‌లోని విశేషములేవీ - ఆత్మకు అంటవు. ఆత్మను తాక లేవు. ఆత్మకు దేనితో సంఘాతము లేదు. అంతే కాదు. స్వాత్మకు ‘అన్యము’వలె ఏదేది అభాసించుచున్నదో (Whatever reflecting like in a mirror), అట్టి ఈ చరాచర జగత్తు స్వాత్మ మాత్రమే. కలలో కనిపించే చర - అచరములన్నీ స్వప్నము తనదైనవాని స్వప్న చైతన్యరూప ఊహ అపోహలే కదా! అందుచేత, ‘‘ఏది ఈ జగత్తుగా ప్రకాశమానమౌతోందో, అట్టి ఇదంతా నా ఆత్మయే’’ అని గ్రహించు.

👉 ఇదంతా స్వాత్మయే! స్వాత్మవిభవమే!
👉 అట్టి స్వాత్మయే నా నిత్య, సత్య, వాస్తవ స్వరూపము!

‘ఈ దృశ్య జగత్తంతా నా యొక్క ఆత్మస్వరూపమే’! అను ఆత్మసాక్షార దృష్టిని సిద్ధించుకున్నవానికి ఇక భోగింపబడునది - భోగించువాడు అనునవి వేరువేరైనవిగా ఉండవు. ‘భోగించబడునది’ అను రూపమైనదంతా స్వాత్మకు అనన్యమే అవుతుంది.

ఏదేది ‘ఉన్నది’ అని అనిపిస్తూ ఉన్నదో, అదంతా ఆత్మయొక్క అస్థిత్వ రూపమే. బ్రహ్మము యొక్క అస్తిత్వ విశేషమే అది. బ్రహ్మవిజ్ఞాన సంపన్నః ప్రతీతమ్ అఖిలమ్ జగత్, పశ్యన్నపి సదా నైన పశ్యతి స్వాత్మనః పృథక్! ఈ ప్రతీతమై (ప్రసిద్ధమై) ఇంద్రియానుభవములుగా కనిపిస్తున్న అఖిల జగత్తు కూడా -‘‘స్వస్వరూప బ్రహ్మము‘‘గానే బ్రహ్మజ్ఞాని చూస్తున్నాడు. అంతేగాని, వేరుగా చూడటము లేదు.

ఓ ఋభూ! మత్ స్వరూప పరిజ్ఞానాత్ కర్మభిః న స బద్ధ్యతే। పరబ్రహ్మ స్వరూపుడనగు నాయొక్క తత్త్వస్వరూపము ఎవడు పరిజ్ఞాతుడై (బాగుగా ఎరిగినవాడై) ఉంటాడో, అట్టివానిని కర్మలు బంధించజాలవు. కర్మలు ఉండాలంటే వాటిని నిర్వర్తించేవాడు ఉండాలి కదా!

జన్మలకన్నా కర్మలకన్నా మునుముందే ఉండి ఉన్నదే ఆత్మ! అట్టి ఆత్మయొక్క ఒక అంశవంటివాడు ఈ జీవుడు. తరంగాలన్నీ జలమే ధర్మముగా కలిగియున్నది కదా! ఈ జీవుడు ఆత్మ కాని క్షణమే లేదు. మరి అట్టి ఆత్మస్వరూపుడు - సందర్భమాత్ర జగన్నాటక పాత్ర వంటి ‘జీవుడు’ అనే ‘అంశ’చే బద్ధుడెట్లా అవుతాడు? సూర్యకిరణము సూర్యుణ్ణి బంధించగలదా? కలలోని విషయాలు బయటకువచ్చి ఆ కల తనదైనవానిని త్రాళ్ళతో బంధించగలవా? అట్లాగే ఆత్మకు ఎప్పుడూ బంధము లేదు.

ఎవ్వడైతే…
★ ‘శరీరము, ఇంద్రియముల-ఇంద్రియ విషయముల’చే పరిమితుడు కాడో, వాటికి తాను కేవలము ‘సాక్షి’ అని సుస్పష్టముగా, అకృత్రిమంగా, నిత్యానుభవంగా సర్వదా ఎరిగి ఉంటాడో…,
★ స్వయంప్రకాశకుడై పరమార్థ స్వరూపమును చూస్తూ, ఆత్మచే ఆత్మయందు ఆత్మసుఖానుభవుడో,
★ సర్వము స్వస్వరూపముయొక్క స్వకీయమగు స్వానుభవముగా ఎరిగి ఉంటాడో,
★ ‘‘స్వప్నమంతా నా భావనాను భవమే! నాకు అన్యము కాదు. అట్లాగే జాగ్రత్‌లో కూడా ఈ ఇంద్రియ విషయప్రపంచము స్వానుభూతి చమత్కారమే!’’- అని దర్శిస్తూ ఉంటాడో,
ఆతడే ధీరుడు! ఆతడే సవిజ్ఞేయుడు! తెలుసుకోవలసినది తెలుసుకున్నవాడు! ఓ ఋభూ! నేను ఆత్మనే! సోఽహమ్! తత్ త్వమ్! నీవు అదియే! ఆత్మకానివాడు లేడు. ఆత్మకానిదీ ఏదీ లేదు.

ఇది గ్రహించి, సర్వజీవులను ఆత్మకు అనన్యంగా, నీ స్వస్వరూప-స్వానుభవ-స్వకీయాత్మానంద సంప్రదర్శనముగా సర్వదా దర్శించు.

ప్రపంచమును పాంచభౌతికమాత్రంగా చూడవద్దు, స్వస్వరూప బోధానుభవంగా సందర్శించు. ఈ విధమైన పరిపూర్ణమైన ఎరుకచే దర్శించువానికి ఇక బంధమెక్కడిది? బంధమే లేనప్పుడు ‘ముక్తి’ ఎవరికి? ఇతి ప్రపశ్యన్ పరిపూర్ణ వేదనో, న బంధ ముక్తో। న చ బద్ధ ఏవ తు। అట్టి ‘‘ఆత్మజ్ఞాన విజ్ఞాని’’ → స్వస్వరూపాను సంధానమును అనునిత్యము చేసుకొని, సర్వమునకు సాక్షియై, ఆత్మ యొక్క తాండవ నృత్యముగా → జగత్తును ఆస్వాదిస్తున్నాడు.

ఒక ముహూర్తకాలము (12 క్షణముల కాలము) ‘‘నాయొక్క ఆత్మతత్త్వమేమిటి? స్వభావమేమిటి’’ అను ప్రశ్నయొక్క పరమవాస్తమగు సమాధానకరమగు - ‘‘స్వస్వరూపాత్మ ధారణ’’ చేత ఈ జీవుడు సర్వబంధములనుండి విముక్తుడు కాగలడు.

‘ఆత్మాఽహమ్’ అను పరమ సత్యమును ధారణచేయువాడు ఎట్లా గానం చేస్తాడో, అది విను.

♠︎ నేను ఈ శరీరము - జీవుడు ఇత్యాదులచే పరిమితుడనైనవాడిని కానే కాను.
♠︎ సర్వమును ‘ఎరుక’ (ప్రజ్ఞ) అను స్వకీయ విన్యాసముచే వెలిగించు చిదాత్మ స్వరూపుడను.
♠︎ నేను దేనిచేతనూ, దేనికీ బద్ధుడను కాను. ఈ దేహ మనో - బుద్ధి - అహంకారములకు వేరైన కేవల సాక్షిని. నాకు బంధమనునదే లేదు. నిత్యముక్తుడను.
♠︎ ఏ విధంగా - ఒక నాటక రచయిత నాటకములోని పాత్రలన్నిటికీ అంతరాత్ముడో, ఒక చిత్రకారుడు తాను రచించిన అనేక చిత్రములలోని ఆకారములన్నిటికీ అంతర్గతుడో, ఒక కల కనేవాడు తన కలలో కనిపించిన రూపనామములన్నిటికీ అంతర్యామియో, నేను ఆ తీరుగా, అదే విధంగా-ఈ సర్వభూతజాలముల అంతర్యామిని. సర్వ భూత - అంతస్థుడను.
♠︎ ఆలోచన, భావన మొదలైనవాటిని కదల్చువాడను. వాటికి వేరైనవాడను. కదిల్చేవాడు తాను కదిల్చే అన్నిటికీ వేరై ఉంటాడు కదా! నేను ప్రత్యక్ చైతన్య రూపుడను.

నాకు ఆత్మగా అన్యమైనదే లేనప్పుడు నేను ఎవరికి నమస్కరించాలి? ఆత్మనగు నాకు ఆత్మ అయిన నేను (నాకు నేనే) నమస్కరించుచున్నాను. మహ్యమేవ నమో నమః

ఓ ఋభు మహర్షీ!
త్వం వా అహమస్మి - ‘నీవు’గా ఉన్నది నేనేనయ్యా! నాకు నీవు వేరు కానే కాదు.
అహమస్మి సర్వ దేవతా - సర్వదేవతల రూపముగా ఉన్నది ‘నేనే’!
అహం వై త్వమసి - ‘ నేను’గా ఉన్నది నీవే! నేను నీవు కూడా అనంతస్వరూపులము. ‘అనంతము’- అన్నప్పుడు రెండవది ఉండదు కదా! నేను నీవు కూడా ఏకైక చిదాత్మస్వరూపులమే.

పరేశ్వరుడనైయున్న, శివస్వరూపుడనై యున్న నాకు నేను నమస్కరించుకొనుచున్నాను. (నమస్కృతమహమ్ సోఽహమ్)।
మహాసముద్ర తరంగములన్నీ సముద్ర జలముతో నిండియున్న తీరుగా ఈ సమస్తము మమాత్మస్వరూపముచే నింపివేయబడినదై యున్నది.

అంతటా నా స్వరూపముచే నిండియుండగా ఇక నేను చేయవలసినదేమున్నది! ఎక్కడికి వెళ్ళాలి? ఏది స్వీకరించాలి? ఏది త్యజించాలి? సర్వదా సర్వమైయున్న ఆత్మయే నేనై ఉన్నాను. ఇంతకు మించి వేరే వ్యవహారమే లేదు.

సంగ త్యాజ్యము

ఋభువు: ఈ జీవుడు స్వతఃగా ఆత్మానంద స్వరూపుడే కదా! మరి అట్టి ఆత్మకు ‘జీవాత్మత్వము, బంధత్వము’…అనునవి ఎట్లా సంక్రమించుచున్నాయి? ఎందుకు ఏర్పడుచున్నాయి?

శ్రీ వరాహమూర్తి : ఓ ఋభూ! ఈ జీవునికి ‘సంగము (Relatedness Presumed)’ వలననే బంధము - సంబంధము కల్పితమై ఉంటున్నాయి. ఆకాశమును మేఘములు కప్పు విధంగా స్వస్వరూపాత్మానందానుభవమును - జగత్ భావావేశమేఘములు కప్పి ఉంచుతున్నాయి. అందుచేత, ‘అఖండాత్మానుభవము’ అను మహదాశయముగా

(1.) అంతః సంగము (Attachments inside - ఆలోచనా పూర్వకం)

(2.) బహిః సంగము (Attachment outside బాహ్యవస్తు సంబంధమైనది)

(3.) జీవాత్మ సంగము - జీవాత్మతో సంబంధము

ఈ మూడిటిని దాటివేసినవాడవై ఉండు.

(ఈ విధంగా) ఎవ్వడైతే సర్వసంగములనుండి నివృత్తుడౌతాడో, అట్టివాడు విష్ణురూపుడే. అస్మత్ రూపుడే! నేనే అగుచున్నాడు! ఇందులో సందేహమే లేదు.

ఎవ్వడైతే…. ఆత్మ దృష్టిచే,
→ ఒక ‘పాము’ వలె జనులతో సంసర్గము (Association, లోకసంబంధమై లాభ - నష్ట - కష్ట వ్యవహారములే సరళి)కి సర్వదా సుదూరుడై…,
→ ఒక ‘శవము’ వలె సర్వకామములుకు (కోరికలకు) సంత్యక్తుడై, (వదలినవాడై), విరాగి అయి…,
→ సర్వ ఇంద్రియ విషయసంబంధమైన లోక సమాచారముల వ్యవహారమును ‘విషము’తో సమానంగా చూస్తూ….
→ దుష్టప్రవర్తనలను అల్పజన్మలకు దారిచూపే దుష్ట మార్గముగా గమనిస్తూ ఉంటాడో,
…. అట్టివాడు - ‘సోఽహమ్ పరమమమ్’ అనబడు ‘పరమహంస’గా, సర్వజీవుల ప్రదర్శనములు తనవే అయినట్టి వాసుదేవునిగా (వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయమ్, సర్వభూత నివాసోఽసి వాసుదేవ) అగుచున్నాడు.
అట్టివాడు అఖండాత్ముడగు నా స్వరూపమే। నేనే।

ఇంకొక విషయం -

💐 ఈ జగత్తు పరమసత్యమే. ఎందుకంటే, పరమాత్మకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు. అందుచే ‘ఇహము’ రూపముగా పరముయొక్క ప్రదర్శనావిన్యాసమే. అందుచేత ఈ కనిపించేది సత్యమే! ఇహమ్ సత్యమ్, ఇహమ్ సత్యమ్ సత్యమ్ ఏతత్ ఇహ ఉచ్యతే। బ్రహ్మమే ఇహము. కాబట్టి బ్రహ్మమువలెనే ఇది నిత్య సత్యమే!
💐 నేనే బ్రహ్మమును! నేనే సత్యమును। పరబ్రహ్మమును। నాకు వేరైనదంటూ ఎక్కడా ఏదీ లేదు.
ఈ ఉభయముల సమన్వయమే యోగము.

ఋభువు : మహాత్మా! పరమాత్మా! ‘జీవాత్మ భావన’లో మునిగి తేలుచూ, మాయొక్క ‘వరాహతత్త్వము’ను మేము స్వానుభవముగా సిద్ధించుకోలేక పోవుచున్నాము. ఎట్టి ‘ఉపవాసము’ మొదలైన ప్రయత్నములచే మేము మాయను దాటివేసి, మాయొక్క అభిన్నమగు విష్ణుతత్త్వమును నిత్యానుభవముగా పొందగలము? మీ యొక్క అఖండ అప్రమేయ తత్త్వముతో మేము ఎట్లా మమేకవగలము?

శ్రీ వరాహస్వామి : ఉపవాసమే అందుకు ఉపాయము. ఉపవాసము అనగా?

శ్లో।। ఉపసమీపే యో వాసో జీవాత్మ - పరమాత్మనో
‘‘ఉపవాసః’’ స విజ్ఞేయో। న తు కాయస్య శోషణమ్ ।।

ఓ ఋభూ!! ‘ఉపవాసము’ అనగా ఏమి? భోజనము చేయకుండా ఒక రోజో, రెండు రోజులో ఉండటమా? అది కానే కాదు. ఉప = దగ్గిరగా. వాసము = వసించటము. దేనికి దగ్గిరగా వసించటం? ‘‘ఈ జీవాత్మయే పరమాత్మ’’ అను సత్‌భావనను సమీపించి ఉండటము.

అంతేగాని, న తు కాయస్య శోషణమ్। అన్నము తినకుండా రోజంతా ఉండటము, ఈ దేహమును శోషింపజేయటము ఉపవాసము కాదు. కాయ శోషేణ మాత్రేణ కా తత్ర అవివేకినామ్? దేహమును ఆహారము లేకుండా ఎండగట్టినంత మాత్రంచేత తత్ విష్ణు పదము లభిస్తుందా? లేదు. భోజనం మానివేస్తే ఆత్మతత్త్వభావన సిద్ధిస్తుందని అనుకోవటము అవివేకమే. వల్మీక తాడనాత్ ఏవ మృతః కిన్ను మహోరగః? ఒకడు పుట్టలోని పెద్ద త్రాచుపామును చంపటానికి పుట్టపై కర్రతో తాడించి ఏమిలాభము? అంతమాత్రము చేత, పుట్టలోని భయంకరమైన పాము చావనట్లే, ఆహారము తీసుకోనంతమాత్రంచేత పరమాత్మ లభించడు.

మరి ఆత్మసాక్షాత్కారము లభించేది ఎట్లా?

శాస్త్రములు పరిశీలించాలి. సద్గురువును ఆశ్రయించి ‘తత్ త్వమేవ’ అను పరమ విశేష శ్రవణమును చేయాలి. తెలుసుకోవాలి. అనుకుంటూ ఉండాలి (స్మరించాలి). అనిపించేంత వరకు, అదే తానుగా అనుభవమయ్యేవరకు సాధనలు ఆశ్రయించ వలసిందే.

❋ ‘అస్తి బ్రహ్మము’ - ‘బ్రహ్మము కలదు’ - అనునది పరోక్షజ్ఞానము మాత్రమే!
❋ ‘నేనే బ్రహ్మమును’ అని నిస్సందేహంగా తెలుసుకొన్నప్పుడు అది ‘సాక్షాత్కారము’ లేక ‘ఆపరోక్షజ్ఞానము’ అగుచున్నది.

జీవన్ముక్తుడు

ఎప్పుడైతే ఈ జీవుడు యోగి అయి, స్వాత్మయొక్క స్వాభావికమైన ఔన్నత్యమును సర్వాత్మకం గాను, సర్వజీవుల ఆత్మను మమాత్మకంగాను ఎరుగుచున్నాడో,… ఆ మరుక్షణం ఆతడు ‘జీవన్ముక్తుడు’ అగుచున్నాడు. అట్టి మహాత్మునకు ‘అహమ్ బ్రహ్మ’ అను జ్ఞాన-విజ్ఞానములే మోక్ష హేతువు. ఆతనికి మోక్షహేతువులుగా ప్రత్యేకం భక్తి-జ్ఞాన-క్రియా యోగాభ్యాసముల ఆవశ్యకత ఇక ఉండదు. ఆత్మగా తనను-తదితరులను నిస్సందేహుడై సందర్శించటమే ఆతనిపట్ల భక్తి-జ్ఞాన-యోగ-వైరాగ్యముల అభ్యాసము, అంతిమ ఫలము కూడా అగుచున్నాయి. ఆ తదనంతరము అవి ఆతనిపట్ల స్వాభావికములు అవుతాయి.

బంధము - మోక్షము

ద్వే పదే బంధ మోక్షాయ। నిర్మమేతి, మమేతి చ।

బంధము = ‘నాది’ (మమేతి) …. అనునదే బంధము. మమేతి బద్ధ్యతే జంతుః। ‘నాది’ అను భావనచే జీవుడు బద్ధుడుగా అగుచున్నాడు.
మోక్షము = ‘న మమ - నిర్మమేతి’ - నాది అనునది ఈ పాదార్థిక జగత్తులో ఏదీ లేదు - అనునదే మోక్షము.
‘నాది కాదు’ అనుకుంటే మోక్షము। ‘నాది’ అనుకుంటే బంధము.

ఓ ఋభూ! బాహ్యచింతా న కర్తవ్యా! బాహ్య చింతనలన్నీ సందర్భ పరిమితముగా చేసివేయుచూ, బాహ్యముననే వదలి ఉంచబడును గాక! పడవ నీళ్ళలో ఉన్నప్పటికీ పడవలోనికి నీళ్ళు రానీయము కదా! అట్లాగే బాహ్య విషయముల ‘చింతన’కు అంతరంగమున చోటు ఇవ్వకుండెదవు గాక! తథైవ అంతర చింతకా। అంతర విషయములగు ఆలోచన, తెలివి, ఇష్టము, మమత్వము మొదలైనవి కూడా చింతన (Chanting) చేయకుండెదవు గాక!
సర్వ చింతనలు పూర్తిగా వదిలి, స్వస్థుడవై ప్రశాంతముగా, హాయిగా ఉండటమును అభ్యాసపూర్వకముగా నిర్వర్తిస్తూ ఉండుము.

ఋభువు: స్వామీ! వరాహ భగవన్! కేవలాత్మయే సహజస్వరూపముగా గల ఈ జీవుడు ఎందుచేత ఈ దృశ్యపరంపరలచే పరిమితత్వమునకు నిబద్ధుడై ఉపాధులలో సుదీర్ఘంగా కాలము గడపుచున్నాడు?

శ్రీ ఆదివరాహస్వామి: ఈ ప్రశ్నకు సమాధానం ఇతఃపూర్వం చెప్పుకున్నాం. అయినా మరల విను. అన్నిటికీ కారణము ధ్యాసలచే నిర్మితమైన సంకల్పమే - అనునదే సమాధానము.

❋ స్వకీయ సంకల్పమాత్ర కలనయే (కల్పనయే) ఈ సమస్త జగదనుభవము కూడా.
❋ ఈ జగత్ విలాసమంతా కేవలము సంకల్పనామాత్రమే.
❋ ‘సంకల్పనా సూత్రము’నకు గ్రుచ్చబడిన పూదండ వంటిది ఇదంతా! సంకల్పములనుండే ఇదంతా జనిస్తోంది. సంకల్పములలోనే కనబడుచూ, అనుభవమౌతోంది. ‘సంకల్పము’ అనునది ఆత్మనుండి ప్రదర్శితమై, ఆత్మయందే ఉండి, ఆత్మయందే లయిస్తోంది.
❋ ఒక దారముతో నిర్మితమైన పొడవైన పూదండ యొక్క దారమును త్రెంచితే పూలన్నీ జలజలా రాలిపోతాయి కదా! అట్లాగే ‘నిర్వికల్పము’ను (కల్పన / భావనా రహితత్వము, కేవల మనోతత్త్వమును) ఆశ్రయించుచూ, అఖండము, అప్రమేయము అగు నాయొక్క సర్వాత్మక - స్వరూపమును హృదయమున భావన చేయి.

హే మహామతీ!
🙏 నాయొక్క అవతార కథనమును అన్యోన్యము సంభాషించుకొనుచూ ఉండగా ‘సంకల్పత్యాజ్యము’ యొక్క అభ్యాసము సులభము కాగలదు.
🙏 ‘‘అంతరాత్మ, సర్వాత్మ’’ అగు నన్నే పరమలక్ష్యముగా, మహదాశయముగా కలవాడవై కాలమును వెచ్చించుచుండుము.

‘పరమాత్మ భావన’ అనగా?

ఇట్టి భావనను ఆశ్రయించి, అంతరంగములోని ‘రాగము’ను ‘విరాగము’గా చేసివేయి. సర్వదా నిర్లేపుడవై (విషయరహితుడవై) ఉండుము.

ఋభువు : మమాత్మానంద స్వరూపా! ప్రియ వరాహ భగవానుడా! ‘నేను దీనికి కర్తను। దానికి భోక్తను’ అనునదంతా మమ్ములను పట్టి జాడ్యమువలె పీడిస్తూ ఉన్నది. ఇట్టి మనో - బుద్ధి సంబంధమైన దోషములు తొలిగేది ఎట్లా?

శ్రీ వరాహస్వామి : ఈ జీవుడు ప్రకృతి యొక్క ప్రేరణచే (Inspiration given by the a running Drama to the respective role players regarding the Role - Playing) కర్మలు చేస్తూ ఉండగా…
‘‘- నేను కారకుడను! ఇది కారణము! అది ప్రయోజనము.
- నేను కర్తను, నేను భోక్తను!’’
…..మొదలైనవన్నీ రూపుదిద్దుకొనుచున్నాయి. ఇట్టి కారక - కర్తృత్వ - భోక్తృత్వ భావనా సంస్కారములే ‘సంసారము’ అని అనబడుతోంది. ఇవన్నీ ‘అజ్ఞానము’ అనే చీకటిలో కనబడే భ్రమాకారములు వంటివి. చీకటి గదిలో దీపము వెలిగించగానే అన్ని వస్తువుల యొక్క యథార్థమగు ఉనికి, ఆకారములు, స్థానములు సుస్పష్టముగా తెలిసిపోతాయి కదా! శ్రుతులచే (వేదాంగములగు ఉపనిషత్తులచే) ఆత్మవిజ్ఞానము (Knowledge of one’s own / every body’s “Absolute Indivisible self”) - అనే దీపపు ‘ప్రజ్ఞా-వెలుగు’లో ‘‘వస్తు భావన, కర్తృత్వ - భోక్తృత్వ - కారక -కారణ - ప్రయోజన’’ భావములన్నీ బాధింపబడక ఏమి చేస్తాయి?

ఓ ప్రియభక్తా! ఋభూ! ఆత్మకు ‘అన్యము (Something quite different)’ - అని అనిపించేదంతా ‘అనాత్మ’ అని పిలువబడుచున్నది. అటువంటి అనాత్మకమైనదంతా మొదలంట్లా పరిత్యజించివేస్తూ ‘సర్వము ఆత్మకు అనన్యము’ అను సమున్నతమగు భావనను మాత్రమే ఆశ్రయించుము. ఏకైక నిష్ఠ కలిగియుండుము. అంతర దర్శనము (Looking at the actual basis for everything in you as well as in everybody including Devine Energy beings like Devathaas) కలిగిన దృష్టితో అంతస్థుడవై ఉండుము. కేవలమగు ‘ఉనికి - ఎరుక - అనుభూతి’ రూపములగు సత్ - విత్ ఆనందమాత్రుడవై ఉండుము. సంవిత్ పరోభవ!

చిదాకాశము

ఏ దీపము ఎక్కడెక్కడ ఉండి ఏమేమి (ఆ దీపపు) వెలుగునందు కలిగి ఉన్నప్పటికీ అన్ని దీపములలోని ‘అగ్నితేజస్సు’ ఒక్కటే కదా! వెలుగు ఏకమేగానీ ఎప్పుడూ కూడా దేశ - కాలముల కారణంగా కానీ, (లేక) వెలుగులో కనిపించే వివిధ వస్తుజాలము కారణంగా కానీ అనేకము అగుట లేదు కదా!

ఒక జల్లెడ (చిల్లులుగల బియ్యము చెరగు తడికపాత్ర లేక రేకు పళ్లెము వంటిది) ద్వారా అనేక కిరణ పుంజములు ఎదురుగా గోడపై పడుచున్నప్పటికీ,….వెలుగు సర్వదా ఒక్కటే కదా.

ఈ త్రి ఆకాశములు ‘3’గా చెప్పబడుచున్నప్పటికీ ఆకాశము సర్వదా (1) ఏకము (2) అఖండము (3) ప్రత్యేకము (4) అప్రమేయము కదా!

అట్లాగే చిదాకాశము కూడా।

(1) జీవుడు → (ఒక దేహమునకు సంబంధించిన వ్యష్టిగత ‘నేను’)
(2) ఈశ్వరుడు → ఇతః పూర్వపు - ఇప్పటి - ముందు ముందటి అనేక దేహములకు సంబంధించిన ‘నేను’
ఈ జీవ - ఈశ్వరులనబడేవి - ‘అఖండ చిదాకాశము’ నందు ‘పరికల్పితము’ (Attribution by mind) అయి ఉన్నాయి.

మాయ

ఆత్మజ్ఞానమునకు మునుముందుగా ‘మాయ’ ఉండవచ్చుగాక! ఆత్మను ఎరిగిన తరువాత ఆద్యంతమూ మాయ స్వతఃగా ఏమాత్రము మొదలే లేనిదిగా (యా మా - ఏదైతే మొదలే లేనిదో) అగుచున్నది.

బ్రహ్మతత్త్వజ్ఞులు - వివేకముచే సర్వత్ర సమస్వరూపమై విరాజిల్లుచున్న బ్రహ్మతత్త్వమునే దర్శించుచున్నారు. ‘మాయ’ అనునది ఆత్మచే ఒకానొకప్పుడు స్వకీయమగు ‘ఊహ’ (Visualization) వలె బయలుదేరుచున్నది. సముద్ర జలములోని ఒక తరంగమువలె బయల్వెడలి తిరిగి బయల్వెడలిన స్థానమునందే (ఆత్మయందు) విలయమగుచున్నది.

నేను అట్టి శుద్ధచిత్ స్వరూపుడను। ఆకాశమువలె ఉపాధి రహితుడను। అట్టి నేను నా యొక్క స్వాభావిక చమత్కారముచే చేతన - అచేతనాత్మకమైనట్టి జీవ - ఈశ్వర రూపముతో ‘‘వీక్షణము(perceiving)’’ను ఆశ్రయించుచున్నాను. అట్టి నాయొక్క ఈశ్వర రూపముచే ‘సృష్టి’ అనబడునదంతగా పరికల్పతము అగుచున్నది. సృష్టిని ఆస్వాదించు నా అంశయే ఈ జీవుడు. అనగా, ఈ జీవుడు పరమాత్మనగు నాకు ఏ క్షణమందూ అన్యము కానే కాదు.

అట్టి జీవుడు ‘జాగ్రత్’ మొదలుగా ‘సంసారబంధము’ నందు చిక్కుకొన్నవాడగుచున్నాడు. అటువంటి జీవకల్పితమగు అహ్రాంతి (దృశ్యములో నేను చిక్కుకున్నాను. నేను దృశ్యముచే బద్ధుడను) - అనునదంతా ‘త్రిణాచక’ ఇటువంటి యోగాభ్యాసములచే, భక్తిమార్గములచే మోక్షము సిద్ధించేవరకు - కొనసాగుచూనే ఉంటుంది. లోక సంబంధములతో ఆరంభమై - సాంఖ్యయోగాంతము (ఆత్మజ్ఞాన సిద్ధి) వరకు ఈశ్వరునికి (ద్రష్టకు) ‘జీవాహ్రాంతి’గా కొనసాగుచూనే ఉంటుంది.

జీవ-ఈశ్వరులు రెండూ అహ్రాంతి జనితములే! అందుచేత, ముముక్షువు జీవ - ఈశ్వరవాద - ప్రతివాద భేదమంతా విడచి, ఆ రెండిటికీ ఆవల సంస్థితమై యున్న బ్రహ్మతత్త్వమునందే నిశ్చలత్వము కొరకు విచారణచేయటము ఉచితము.

ఎవ్వడైతే ‘నేను-నీవు’ మొదలైన వాటన్నిటికీ సర్వదా అద్వితీయమగు ‘బ్రహ్మతత్త్వము’ను యథాతథంగా ఎరుగడో, అట్టివానిపట్ల అహ్రాంతి కొనసాగుచూనే ఉంటుంది. అహ్రాంతి ఉండనే ఉండగా, ఆ జీవునికి ‘ముక్తి’ ఎక్కడిది? అహ్రాంతి కొనసాగుతున్నంతకాలం ఇక్కడ సుఖమెక్కడుంటుంది? సర్వత్ర సమస్త రూపమైయున్న బ్రహ్మమును ‘వీరేమో ఉత్తములు - వారు తక్కువవారు - ఇంకా వారు వారు అధములు’ అను దృష్టులతో చూస్తే, అటువంటప్పుడు ఇక బ్రహ్మము గురించి విని, తెలిసి, సంబోధించి, ఎవరెవరికో బోధించి మాత్రం ఏమి ప్రయోజనం? ‘నేను ఆత్మ జ్ఞానిని. ఆతడు కాదు. నాకు ఆత్మగురించి తెలుసు. వారికి అంతగా తెలియదు. ఆయన ఒకాయనకు ఇంకా తెలుసు’…. మొదలైనవన్నీ ఈ జీవుని సహజ స్వరూపమగు ఆత్మకు సంబంధమే లేదు.

ఒకడు స్వప్నంలో భిక్షకుడు అయితే ఏమున్నది? రాజ్యాధికారి అయితే మాత్రం ఏమున్నది? స్వప్నమునుండి నిదురలేచి ప్రబుద్ధుడైన తరువాత రాత్రి కలలోని విషయాలు స్పృశిస్తాయా? లేదు కదా! స్వప్నస్య రాజ్య, భిక్షాభ్యాం ప్రబుద్ధః స్పృశ్యతే ఖలు? ఒక భిక్షకుడు రాత్రి (కలలో) తాను ఒక మహారాజు అయినట్లు కలకన్నాడు. తెల్లవారింది. మెలకువ వచ్చింది. లేచాడు. ‘‘నేను ఒక మహారాజును కదా? ఇక భిక్షాటనతో పనేమున్నది?’’ అని ఊరుకుంటున్నాడా? లేదు. లేవగానే, ‘‘ఈ రోజు భిక్షాటన ఎటువైపు?’’ అనియే తలచుచున్నాడు కదా! (ఒక రాజు తాను భిక్షకుడు అయినట్లు కల కనటము కూడా ఇటువంటిదే).

అందుచేత నీవు ఆత్మయొక్క ‘నిత్యత్వము, కేవలత్వము’లను గ్రహించినవాడవై ఉండు. అంతేగాని, ‘నేనింకా జ్ఞానినైతేనేగాని ‘ఆత్మత్వము’ సిద్ధించదు కదా! ఇంకా చాలా చూడాలి! నేర్వాలి! చదవాలి! చేయాలి’ - అను భావాలన్నీ దూరంగా నెట్టివేయి. ఈ విధంగా ‘ఆత్మమేవాహమ్ గానము’ను ఎలుగెత్తి, చేతులెత్తి ప్రకటించుము. ఎందుకంటే (భిక్షకుని భిక్షాటనవలె) నీ పట్ల ఆత్మత్వము సహజము. ఆత్మకు అన్యమైనదంతా (భిక్షకుడు కలలో మహారాజు అవటమువలె) - ‘‘కల్పిత సందర్భము మాత్రమే’’.

ఆత్మనగు నా పట్ల నిద్రా - జాగ్రత్ - స్వప్నములు అవిషయములు।

ఆత్మగా నాకు జడమగు ‘నిద్ర’ అనే అవస్థయే లేదు. ఎందుచేతనంటే…..‘అజ్ఞానము చేత బుద్ధి లయించటం జరగటమే గాఢనిద్ర’….అని బుధులు అంటూ ఉంటారు. అయితే నాయొక్క ‘‘కేవల - నిర్మల - అద్వితీయ ఆత్మత్వము’’ - ఒక సందర్భములో ఉండి, మరొక సందర్భములోకి ఎక్కడికో పోయి, ఇంకొక సందర్భమునకు తిరిగి వచ్చేది కాదు. సర్వదా ఆత్మ చైతన్య స్వరూపుడనై ఉండగా, అజ్ఞానముచే బుద్ధి విలీనమవటం, నిద్రలో ఆత్మను కోల్పోవటం….ఇటువంటివేమీ లేనేలేవు. విలీనా జ్ఞాన తత్కార్యే మయి నిద్రా కథం భవేత్? జ్ఞాన-అజ్ఞానములనబడేవి కార్యక్రమముల రూపములుగా నానుండి బయల్వెడలి నాయందే లయిస్తున్నాయి. అంతేకాని, నేను గాఢనిద్రయందు లయమవటమనే ప్రసక్తి ఎక్కడిది?

ఆత్మకు జాగ్రత్ కూడా విషయమై ఉండదు!

బుద్ధేః పూర్ణ వికాసోఽయం ‘జాగరః’ పరికీర్త్యతే। ‘బుద్ధి నిద్రాణత్వము లేనిదై, పూర్ణ వికాసమును సంతరించుకొని ఉన్నప్పుడు, అదియే - జాగ్రత్ అని పరికీర్తించబడుతోంది. అయితే….వికారాది విహీనత్వాత్ జాగరో మే న విద్యతే।
- ఆత్మకు ‘బుద్ధి’ అనే వికారమే లేదు.
- నేను సర్వదా ఆత్మ స్వరూపుడను.
- అందుచేత నాకు బుద్ధి - వికారములే లేవు.

అనగా, నాకు ‘జాగ్రత్’ అనబడు ఒకానొక నాకు వేరైన సందర్భమేదీ నాకు ఎప్పుడూ లేదు. ఒకవేళ్ళ ‘జాగ్రత్’ అనేది ఉంటే, అది ‘బుద్ధియొక్క వికాస చమత్కారము’ మాత్రమే! నా స్వరూపముయొక్క ‘మార్పుగా’ కాదు.

ఆత్మనగు నాకు స్వప్న వికారము కూడా లేదు.

సూక్ష్మనాడీషు సంచారో బుద్ధేః స్వప్నః ప్రజాయతే। బుద్ధి సూక్ష్మనాడులలో సంచారము చేస్తూ ఉన్నప్పుడు అట్టి సందర్భమగుచున్న అనుభూతి (లేక) అనుభవమును ‘స్వప్నము’ అని పిలుస్తున్నారు. అయితే, సంచార ధర్మ రహితే, మయి స్వప్నో న విద్యతే। ఆత్మ సర్వత్రా సర్వమై వెలయుచున్నది కదా! ‘నేను సర్వదా ఆత్మస్వరూపుడనే’ - అనునది వేద - వేదాంత శాస్త్రములు (‘తత్‌త్వమ్’ ‘జీవోబ్రహ్మేతి నా పరః’ మొదలైన) మహావాక్యములను సునిశ్చితంగా ప్రకటిస్తూ ఉన్నాయి కదా! ఆత్మకు ఒకచోటి నుండి మరొక చోటికి వచ్చి - వెళ్ళు ధర్మమే కలిగి లేదు. మరప్పుడు ఆత్మనగు నాకు ‘‘సూక్ష్మనాడీ సంచారము వలన సిద్ధించే స్వప్నావస్థ’’ - అనునది ఎక్కడ? కనుక నా పట్ల ‘స్వప్నదశ’ - అనునదేమీ లేదు.

ఆనందమే నా స్వరూపము

సుషుప్తి (గాఢనిద్ర) సమయములో సకలము (ఇంద్రియ కల్పన అంతా) విలీనమై పోవుచున్నది. ‘అన్యము’ అనునదే లేకుండా పోతోంది. అప్పుడు జాగ్రత్ లేదు. స్వప్నము లేదు. జాగ్రత్‌లో అనుభవములన్నిటికీ కారణమగుచున్న ఇంద్రియములు ఉపయోగించబడక ఉన్నాయి. వాటి వాటి విషయములేవీ - సుషుప్తిలో లేవు. అట్లాగే ఈ జీవుడు సూక్ష్మనాడులలో బుద్ధితో సంచరించే వ్యవహారమంతా కూడా (స్వప్న వ్యవహారమంతా కూడా) సుషుప్తిలో (అంతరముననే మరింకెక్కడో) దాచివేయబడుచున్నది. దూరంగా ఉంచి వేయబడుచున్నది. అట్టి సుషుప్తి సమయంలో సకలము (జాగ్రత్ - స్వప్న వ్యవహారములను ఆశ్రయించే ఉపకరణములు, విషయములు - ఇవన్నీ) స్వస్వరూపమునందు విలీనము అగుచున్నాయి. అప్పుడు ఈ జీవుడు - దృశ్య వివర్జితః - దృశ్యవివర్జితుడై (దృశ్యమనునదే లేనివాడై) ‘స్వస్వరూప మహదానందము’ను ‘భుంక్తే’ - అనుభవించుచున్నాడు.

అనగా? ‘‘ఏ ఆనందముకొరకై ఈ జీవుడు జాగ్రత్‌లోను, స్వప్నములోను మనస్సుతో వెతికి వెతికి వేసారి, అలసిపోవుచున్నాడో, అట్టి మహదానందము (లేక) ఆత్మానందము తనయందే వేచి ఉండగా ఈతడు ఎక్కడెక్కడో వెతకుచున్నాడు, - బిడ్డను చంకన పెట్టుకొని తల్లి బిడ్డ కోసం వెతుకు తీరుగా!’’ - అని తత్త్వజ్ఞులచే సిద్ధాంతీకరించబడుతోంది.

ఓ ఋభూ! ఎవ్వడైతే ఈ కనబడే దృశ్యమంతా ‘అనేక విశేష సముదాయములు కదా!’….అనే రూపముగల ‘సవిశేషము’గా కాకుండా
‘ఆహా"! ఈ కనబడేదంతా నాయొక్క చిత్ అనబడే ఎరుకయే. నా ఎరుక యొక్క విస్తరణమే ఈ అనేక తీరులైన ‘ఎరుగబడే విశేషాలు కదా!’ అను ‘చిత్ అన్వయదృష్టి’తో చూస్తాడో…. సయేవ సాక్షాత్ విజ్ఞానీ! ఆతడే -
సాక్షాత్ జ్ఞానమును అనుభవముగా మలచుకొన్నట్టి విజ్ఞాని! ఆతడే శివుడు! ఆతడే హరి! ఆతడే విధి (బ్రహ్మ).


ఈ సంసారము ఎటువంటిది? ఈ ప్రశ్నకు సమాధానం విను.
❋ ఇదంతా అతిదీర్ఘమైన (దేహ - దేహాంతర వ్యవహార సరళితో కూడిన) స్వప్నము వంటిది.
❋ సుదీర్ఘమైన చిత్త విభ్రమము (An experience of prolonged Illusion).
❋ ఒక దీర్ఘమైన పెద్ద నవలా రచయిత రాత్రింబవళ్లు నవలారచన యందు నిమగ్నమై రోజులు - రోజులు గడుపు తీరుగా - సుదీర్ఘమైన మనోరాజ్యము (A long extended thought operation).

ఒక రచయిత ఒక నవలను ముగించి, మరొక ‘కథారచనను ప్రారంభించు రీతిగా ఈ జీవుడు జన్మ-జన్మాంతరములు పొందుచున్నాడు. ఈ సంసారము గొప్ప సుదీర్ఘ అజ్ఞానజనిత దుఃఖసాగరము (A Ocean of worries).

అందుచేత ఓ మహదాశయా! ప్రియ ఋభూ! సుప్తేః ఉత్థాయ - సుప్త్యంతం బ్రహ్మైకం ప్రవిచింత్యతామ్। నిదురలేచిన క్షణము నుండి మరల నిద్రపోవుచున్న క్షణము వరకు ‘బ్రహ్మతత్త్వము’ అను ఏకైక వస్తువు గురించియే విచారణ చేస్తూ ఉండాలయ్యా! ఇక ఈ ‘జగత్తు’ విషయమంటావా? ఇదంతా ఆత్మ స్వరూపముపై ఆపాదితము(Just attributed on the state of self by “one’s own self”). అట్టి ఆరోపితమై కనిపించే దృశ్య వ్యవహారమంతా ‘కేవలాత్మానంద స్వస్వరూపుడను’ అగు నాయందు లయము చేయి. ఏకము చేయి. చిత్తము నాయందు లయమగుచున్న మరుక్షణం పరికల్పతమైనదంతా ఆత్మకు అభిన్నమై, ‘అన్యము’ అయినదంతా లేనిదిగా అగుచున్నది.

చిత్తము లయము అగుచూ ఉండటానికి గొప్పశత్రువులగు అరిషట్ వర్గము (కామ - క్రోధ - లోభ - మోహ - మద - మాత్సర్య వర్గము)లపై యుద్ధము ప్రకటించి జయించనారంభించాలి. శత్రువులందరినీ పారత్రోలి ఒక ప్రశాంత స్థానములో విశ్రాంతి తీసుకుంటున్న ఏనుగువలె, అరిషట్‌వర్గమును జయించి, బ్రహ్మముగురించి తెలుసుకున్న యోగి ‘ఆత్మతో అద్వితీయత్వము’ అనుస్థానములో పరమ విశ్రాంతిని అనుభవించుచున్నాడు. అట్టివాడు ఈ భౌతిక దేహమును చూచి చిరునవ్వు చిందిస్తూ…‘‘అద్య అస్తమేతువపుః। → ఓ భౌతిక శరీరమా! నీవు ఇప్పుడే అస్తమిస్తే కూడా నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే, నీవు ఎల్లప్పుడు నాపట్ల అస్తమించిన వస్తువే అయి ఉన్నావు!’’ - అను దృష్టితో చూస్తూ ఉంటున్నాడు.

ఆ శశితారమాస్తాం! కాదూ? ఓ శరీరమా! నీవు ఆచంద్రార్కం వర్ధిల్లుచూనే ఉంటావా? అది కూడా సరియే! నాకేమీ అభ్యంతరము లేదు.

కస్తావతాపి మమ చిత్ వపుషో విశేషః? సర్వదా ‘కేవల చిత్’ స్వరూపుడునగు నాకు సంబంధించి ఏమి విశేషం? ఏమీ లేదు. నాకు ఈ శరీరము నశించటం చేతగాని, సుదీర్ఘకాలము కొనసాగుటచేత గాని ఏదీ రాదు. ఏదీ పోదు. నేను సర్వదా చిత్ (ఎరుక- Absolute knowing) స్వరూపుడనే! నటనా కళ ప్రదర్శనం దృష్ట్యా ఒక పాత్రగా నటించినంతమాత్రం చేత ‘కళ’ (The Art of acting) గా యథాతథంగానే ఉంటుంది గాని, పాత్రలో ప్రవేశించి, పాత్రతో ముగియదు కదా! (The Art of acting does not end merely because the Actor’s role ended in one Drama).

┄ ┄ ┄

ఒకచోట ఒక కుండ ఉన్నది. ఆ కుడలో ఆకాశము ఉన్నది. ఏదో కారణం చేత ఆ కుండ కాస్తా పగిలిపోతే, అంతవరకూ కుండలోగల ఆకాశమునకు వచ్చేదేమున్నది? పోయేదేమున్నది?

ఇక ఈ జీవునికి సంబంధించిన జగత్ విశేషముల సంగతేమిటంటావా? ‘శరీరమునకు అతీతత్వము’, లేక ‘కేవల శరీరిత్వము’ ధారణి చేస్తున్నప్పుడు మొదలే లేనివగుచున్నాయి? ఏ విధంగా పాము పుట్టలో కుబుసమును విడచి బయటకు వచ్చిన తరువాత, ఆ కుబుసము గురించి కించిత్ కూడా యోచించదో, ఎట్టి అభిమానమును కుబుసముపట్ల కలిగియుండదో,….ఆ తీరుగా ‘నేనే బ్రహ్మమును కదా!’ ….అని ఎరిగిన తరువాత ఈ జీవుడు తనయొక్క స్థూల - సూక్ష్మ శరీరముల పట్ల ఏమాత్రము అభిమానము కలిగియుండడు. ‘ఇవన్నీ అక్కడ ఉన్నాయా! ఇక్కడ ఉన్నాయా? ఎంతకాలం ఉంటాయి?’ - కూడా అర్థరహితమైన విశేషాలు అయి ఉంటాయి. ఏవగ్ం స్థూల సూక్ష్మం చ శరీరమ్ న అభిమన్యతే!

సహేతుకమైన పరిశీలన చేసినప్పుడు (Logically examined) ప్రత్యజ్ఞాన పరాకాష్ఠచే ‘జగత్తు’ ఆత్మకు భిన్నమైనది - అను రూపముగల మిథ్యాజ్ఞానమంతా మొదలంట్లా తొలగిపోతుంది. అప్పుడు ఈ జీవుడు ‘నేను ఇది కాదు కదా! నేను ఇది కాదు కదా! ‘నేతి - నేతి’ అను వాక్యానుభవంచేత తత్ - రూపంగా ‘నేను దేహరహితుడను’ అనబడు అశరీరత్వము సంతరించుకొంటున్నాడు. ఆతనిపట్ల మనో బుద్ధి చిత్త అహంకారముల వంటివి కూడా చిన్న చిన్న ఆభరణములవంటివి అగుచున్నాయి. జగత్తో? స్వకీయ కల్పిత సంచార ఉద్యానవనమగుచున్నది.

(1) ‘పరమార్థ దృష్టి’చే [(లేక) ‘ఈ కనబడే జీవులంతా మమాత్మానంద స్వరూపులే, నేను, నీవు, త్రిలోకవాసులు, త్రిలోకములు - అంతా ఆత్మయొక్క అనన్య - విన్యాసము’…అను దృష్టిచే] శాస్త్ర విషయాలు, చర్చలు, వాదోపవాదములు, నిర్వచనములు భేదములు - ఇవన్నీ సుస్పష్టమై, అనుభవము అంకురించసాగుతుంది. స్వానుభవమే మన ఈ సంభాషణలయొక్క అంతిమలక్ష్యము.

(2) ఆత్మ ప్రత్యక్షము కాదు. పరోక్షము కాదు. ఇంద్రియములకు దృశ్య విషయము కాదు - మరెక్కడో ఉన్నది కాదు. - నాలోని జగత్తుకు, జగదనుభవికి రెండిటికీ ఏది సాక్షియో అదియే ఆత్మ.
అందుచేత ఆత్మ ‘అపరోక్షము’గాను, ఆత్మజ్ఞానమును ‘అపరరోక్ష జ్ఞానము’గా పిలుస్తున్నారు. అట్టి అపరోక్ష జ్ఞానముచే ‘కార్య - కారణ - కర్తృత్వ’ - భ్రమలన్నీ తొలగిపోతాయి.

‘ఈ జగత్తు సత్యమే’ అనే దృఢభావన కలిగినవారికి, ‘కర్మలు - కర్మఫలములు ఉన్నాయి’…అను నమ్మికతో ఉన్నవారికి మాత్రమే ‘సంచిత-ఆగామి-ప్రారబ్ధ’ కర్మల గురించి చెప్పబడుతోంది.

కర్మలు = అభిరుచి - ఆవేశములను జోడించుచూ దేహముతోను, మనస్సుతోను, బుద్ధితోను నిర్వర్తిస్తూ వస్తున్న క్రియా వ్యవహారములు, వాటి ఫలములపట్ల నమ్మికలు.

సంచితము = వర్తమాన జన్మకు ముందునుండి పేరుకొనియున్న ఫలప్రదములవటానికి సిద్ధము కాగల అనేక కర్మ వ్యవహారములు
ప్రారబ్దము = ఈ జన్మలో సందర్భానుసారంగా ఫలప్రదము అగుకర్మలు.
ఆగామి = ఈ జన్మలో నిర్వర్తించిన కర్మలు + ఇతః పూర్వం ‘సంచితము’లో ఇంకా శేషించి…ముందు జన్మకు వెంటనంటివచ్చేవి.

ఈ సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మ వ్యవహారములన్నీ కూడా - ఈ దృశ్యము ‘సత్యము’ అనుకున్నప్పుడు మాత్రమే సత్యమువలె అనిపిస్తాయి. ‘ఇదంతా కూడా స్వప్నమువలె మొదలే కల్పన’…అని ఎరిగిన తరువారుతనో? ‘ఈ జగత్తు ప్రతిభాస (something that appears in a mirror) వంటిది’ - అని సుస్పష్టమౌతోంది. అట్టివారిపట్ల సంచిత ఆగామి ప్రారబ్ద కర్మ వ్యవహారములన్నీ మొదలే లేనివగుచున్నాయి.

ఈ విధంగా మాయా స్వరూపములగు శాస్త్రవాసనలు, కార్యక్రమవాసనలు, కర్మవాసనలు ఆత్మజ్ఞానముచే తొలగి, నిర్మలాకాశము వలె ఆత్మ ఈ జీవునికి స్వానుభవము అవగలదు.

తనయొక్క బ్రహ్మత్వము సుస్పష్టమైన తరువాత ‘జీవత్వము’ అను దాని గురించి ఇక ఈతడు వెతకడు. ‘జీవుడు’ అనబడుదానితో తన్మయుడు కాదు. సూర్యుడు ‘నాయొక్క ఒకానొక కిరణము ఎక్కడికి వెళ్ళింది?’ అని వెతుకుతాడా? ఆత్మజ్ఞునికి జీవాత్మత్వము తనయొక్క ఒక అంశ వంటిది మాత్రమే అగుచున్నది.

వాసనలు : అనేక జన్మల కర్మవ్యవహారములు కారణంగా ఘాటుగా వెంటవచ్చే ‘వాసనలు(Tendencies)’ ‘ఆత్మకు - ఈ జీవుడు, జీవునకు అనుభవమయ్యే దృశ్యము వేరు కాదు. అభిన్నమే’ - అను అద్వైతానుభవం చేత (అద్వైతబోధజ్ఞానముచేత) నశించిపోగలవు.

అస్తి: ‘ఉనికి’ అను బ్రహ్మముయొక్క లక్షణమునకు సంబంధించిన అద్వైత సిద్ధి చేత ఈ భౌతికదేహముతో ఏర్పడిన కల్పనా సంబంధమంతా ‘మాయ’గా తెలియబడగలదు. ఆ విధంగా తెలియుచుండగా ఈ దేహము యొక్క ‘మొదలు - మధ్య - చివర’ కూడా మొదలే లేనివౌతాయి. ‘మాయ’ అంతా కూడా క్షీణించిపోగలదు. ‘‘ఈ దేహము, ఇందలి ఇంద్రియములు, ఆ ఇంద్రియములవలన కనిపించే దృశ్య పరంపరలు, ఆ దృశ్య పరంపరలవలన అనుభవమయ్యే సుఖదుఃఖములు - ఇవన్నీ మాయయే!’’ → అని తెలియుచుండగా, ఇవన్నీ ‘బ్రహ్మము’ అను సత్‌రసము నందు విలీనమైపోతున్నాయి.

భాతి : ఆత్మయొక్క వెలిగించు విశేషము.
ఏ వెలుగులో ఈ జగత్తంతా కనిపిస్తోందో, తెలియబడుతోందో, అదియే ‘ఆత్మ’. అట్టి ఆత్మయొక్క వెలుగులో ఆత్మకు అభిన్నమై, కానీ అజ్ఞానదృష్టికి భిన్నమైనట్లు కనిపించేదే ‘జగత్తు’. ఆత్మయొక్క తెలుసుకొనే తెలివి రూపమే జగత్తు. (భాతి = ఎరుక అను వెలుగు)

మరుభూమి (ఎడారి)లో (ఎండమావులలో) మృగతృష్ణలో జలంగా, జలతరంగాలుగా కనిపించేదంతా మరుభూమియే కదా! అట్లాగే స్వకీయ విచారణచే ఈ త్రిలోకముల వ్యవహారమంతా చిన్మాత్ర (ఆత్మ తన ఎరుకచే వెలిగించే) స్వరూపమే.

సర్వదా ఏకాంతుడను (ఆత్మగా ఏకము అయినట్టివాడను). కేవలుడను (The Absolute) కేవల చిదేక రసమయుడను (The Flower of Awareness) అగు ‘పరిపూర్ణ పరబ్రహ్మమే’ నేను సర్వదా అయి ఉండగా -
→ ఈ ‘జగత్తు’ అనబడేదంతా అజ్ఞానవిశేష ప్రదర్శనమే కాక మరింకేమిటి?
→ జీవుడు - ఈశ్వరుడు (The Individual “I” (and) The “I” that is placed in all) అనే భేదమంతా ‘వికల్పము’ (Illusion, Misconception) కాక మరింకేమిటి?

భూమిపై జనులకు - సూర్యచంద్రగ్రహణములు, రాహుకేతువుల విన్యాసమువలన కనిపించవచ్చుగాక! వాస్తవానికి సూర్యుడు సర్వదా స్వయం - తేజోరూపుడు, చంద్రుడు సర్వదా పూర్ణ చంద్రుడు అయి ఉన్నారు కదా! అట్టి స్వయంప్రకాశక సదాశివాత్మక - నిత్యప్రకాశమగు ఆత్మ సర్వదా సిద్ధించినదైయుండగా, అద్దానికొరకు స్నాన, దాన, యజ్ఞ, క్రియ, మొదలైన విమోచన కర్మలతో పని ఏమి? అవన్నీ ‘ఆత్మసిద్ధికొరకు’ అని తలచటం వృథాప్రయాసయే.

సమాధి

ఏ విధంగా అయితే సైంధవం (లవణం) నీటిలో ఉంచినప్పుడు, అది కరిగిపోయి తన నామ రూపముల ఉనికినంతా కోల్పోవుచున్నదో,….. ఆ విధంగా ‘మనస్సు ఆత్మతో ఏకత్వము’ పొందుచుండగా, మనస్సు తన నామ రూపములు కోల్పోయి ఆత్మగా శేషిస్తోంది. మనస్సుకు సర్వము ఆత్మగా అనుభూతమవటమే మనోలయము. మనస్సు ఆత్మయందు ఏకత్వము పొందటమే సమాధి.

సద్గురు కరుణ

ఓ ఋభూ! ‘ముముక్షువు (మోక్షము ఆశయముగా కలవాడు) - బ్రహ్మతత్త్వమును ఎరిగిన తత్త్వజ్ఞానియగు గురుసత్తముని ఆశ్రయించాలయ్యా! ఆయన ‘తత్ త్వమ్’ అని నిరూపణపూర్వకంగా బోధిస్తున్నారు.
1. విషయములను త్యజించటము.
2. తత్త్వదర్శనము.
3. ఆత్మసంబంధమైన సహజావస్థ.
ఈ మూడు కూడా సద్గురు కరుణ, బోధ లేనిదే దుర్లభం సుమా! గురుబోధచే ఉత్పన్నమైన ఆత్మభావనాశక్తిచే ‘నేను కర్తను భోక్తను’ అను భావనకు సంబంధించిన కర్మవ్యవహారమంతా ఎప్పుడైతే త్యజిస్తాడో, అట్టియోగి ‘స్వయమ్ ఆత్మగా’, బ్రహ్మముగా ప్రకాశించుచున్నాడు. సర్వమునందు ఆత్మను, ఆత్మయందే సర్వమును వీక్షించుచున్నాడు.

ఈ మనస్సు-ఇంద్రియవిషయ రసాస్వాదనయందు పగలు-రాత్రి కూడా అనుబంధముతో తెంపు లేకుండా నిమగ్నమై ఉంటోంది. అయితే ఈ దృశ్య విషయములు అతి చంచలములు. అనుక్షణం మార్పు చెందుతూ ఉంటాయి. అంతేకాదు. జాగ్రత్‌లో కనిపించినవి స్వప్నదశలో కనిపించవు. స్వప్నదశలో కనిపించేవి సుషుప్తిలో ఉండవు. మనస్సు తాను పట్టుకొన్న విషయములతోనే తానూ మార్పు - చేర్పులు పొందుతూ అతిచంచలమై ఉంటోంది. అట్టి ‘విషయరసముల ఆస్వాదన’ నుండి విరమింపజేసి, ‘అనునిత్యము, నిశ్చలత్వము’ అనునవి తన స్వభావముగా కలిగినట్టి ‘ఆత్మరసాస్వాదన’కు మనస్సును సంసిద్ధము చేయాలి. అనగా - ‘‘ఈ కనబడే సర్వజీవులు, ఈ ఇంద్రియ దృశ్యములు - ఇవన్నీ నిశ్చల జలమువలె నిశ్చలమైన ఆత్మయందు ఆత్మకు అభిన్నమై, (మరియు) జలంలో తరంగాలవలె - చంచలములుగా కూడా కనిపిస్తున్నాయి’’ - అను మననమునందు మనస్సును నియమించాలి. ఎప్పుడైతే మనస్సును ‘ఆత్మరసాస్వాదన’ యందు ఈ జీవుడు నియమించి ‘మనోబద్ధము’ను సిద్ధించుకుంటాడో….అట్టి వానికి అసాధ్యం అనేదే లేదు. రసో బద్ధో మనో బద్ధం, కి న సిద్ధ్యతి భూతలే? ఆత్మానందునికి సర్వము సుసాధ్యమే!

‘బ్రహ్మమే నేను! ఈ సర్వము బ్రహ్మమే। కనుక ఈ సర్వము నేనే’ అనురూపముగల ‘బ్రహ్మత్త్వము’ అనే ‘రససిద్ధి’ పొందినవాడు -
న మూర్ఛరోగము కలవాడు ( ఆ మూర్ఛరోగమునకు ‘ఔషధము’ వంటి ఆత్మరసముచే) - అట్టి మూర్ఛరోగమునుండి విముక్తుడు అవటముతో సమానుడు.
న అట్టివాడు మృతించి కూడా జీవిస్తున్నవాడే! చచ్చి కూడా బ్రతికి ఉన్నవాడే అగుచున్నాడు. మరిష్యామి కిమ్ ఉచ్యతే? భవిష్యామి కినమోచ్యతే?). ‘చస్తాను’ అనడు. ‘చావు తరవాత కూడా నేను ఉంటాను’ - అని అంటాడు.
న బద్ధుడై ఉండి కూడా ఆకాశంలో పక్షిలాగా జగత్తులలో విహారములు చేయువాడై ఉంటాడు.

┄ ┄ ┄

ఋభువు : స్వామీ! ఏ ఇంద్రియములను జీవులమగు మేము అనేక శుభకార్యముల ఫలముగా కష్టపడి, దివ్యప్రజ్ఞలగు దేవతలచే ప్రసాదింపబడి పొందామో, ఆ ఇంద్రియములు వ్రాలుచున్న విషయములే మాకు బంధనమగుచున్నాయి. ఇంద్రియములను విషయములనుండి వెనుకకు మరల్చటము ఎట్లా?

శ్రీ వరాహస్వామి : బిడ్డా! విను, చెప్పుతాను. ఈ విషయములకు యజమాని ఎవరు? - ఇంద్రియములు. ఇంద్రియములకు నాథుడు ఎవరు? ఇంద్రియాణాం మనో నాథః। ‘‘మనస్సే’’।

మనస్సుకు ‘నాథుడు’ (లేక) నియామకుడెవ్వరు? మనో నాథస్తు మారుతః। మనస్సుకు వాయువు (లేక) ప్రాణశక్తి నాథుడు.
ప్రాణశక్తికి ప్రాణనాథుడు (లేక) పాణేశ్వరుడు ఎవరు? లయస్థానమగు ‘లయుడు’ అనబడు శివుడు! ఆత్మయే ఆ శివస్వరూపం.

అట్టి సర్వమునకు నాథుడు అగు ‘లయము’ను ఆశ్రయించవయ్యా! అట్టి ‘సర్వమును ఆత్మయందు లయింపజేయటము’…అనబడే లయమును సిద్ధించుకొన్న యోగి,
→ సర్వ చేష్టలు తన పట్ల రహితము చేసుకొన్నవాడై, నిశ్చేష్టుడై,
→ సర్వ వికారములను అధిగమించినవాడై, - నిర్వికారుడై ఉంటున్నాడు.

నీవు సర్వ సంకల్పములను వదలివేసి, నిశ్శేష - అశేష చేష్టితుడవై, ఇతరుల మనో వాక్కులకు తెలియజాలని వాడవై సర్వము లయింపజేసి ‘స్వావగమ్యుడవు’ అయి ఉండుము.

ఋభువు : మహాత్మా! ఈ విషయాలను వదలేది ఎట్లా? వీటికి దూరంగా వెళ్ళేది ఎట్లా?

ఆదివరాహస్వామి : నాయనా! ఈ జగన్నాటకములో నీవు నిర్వర్తించవలసిన పాత్ర నిర్వర్తిస్తూనే వేరుగా (ఆత్మగా) ఉండుము. గొప్పనటునివలె నీ నటనాచాతుర్యమును (కళను) ప్రదర్శిస్తూనే స్వస్వరూపమును విడిగా (ధారణ చేయువాడవై) ఎరిగియున్నవాడవై ఉండుము. నాటక రచయిత నాటకములోని పాత్రలన్నీ తన స్వకీయ కల్పనగా చూచుతీరుగా, ఈ జాగ్రత్ విశేషాలన్నీ స్వీయరచనవలె చూస్తూ ఉండు.

శ్లో।। పుంఖానుపుంఖ విషయ ఈ(వీ)క్షణ తత్పరోఽపి,
బ్రహ్మావలోకన ధియం న జహాతి యోగీ।।

యోగి అయినవాడు, అనుక్షణము విషయములను వీక్షణ (Perception)లో చాలా తీవ్రంగా (very busily)తత్పురుడై ఉన్నప్పటికీ కూడా → ‘ఇదంతా సర్వదా పరబ్రహ్మస్వరూపమే’ అను ‘బుద్ధి’ని (ధిషణమును) కించిత్ కూడా వీడకయే ఉంటున్నాడు. అదియే సంయోగ వియోగాతీత నిశ్చల-యోగస్థితి.

సంగీత తాళ లయ వాద్య వశంగతాపి,
మౌళి స్థ కుంభ పరిరక్షణ ధీర్నటీవ।।

రంగస్థలముపై నృత్యము చేస్తున్న ఒక నృత్యకళాకారుడు సూత్రధారుని నాట్యాంగముయొక్క సంగీత-తాళ-లయముల ప్రకారము నృత్య వశంగతుడై కాళ్ళు, చేతులు, కళ్ళు, కనుబొమ్మలు కదలుస్తూ ఉంటూనే, ‘శిరస్సుపై ధారణ చేసిన కుంభము (పాత్ర)’ - పడిపోకుండా చూచుకుంటాడు కదా!

అట్టి తెలివైన నటునివలె, నీవు ‘ఇదంతా బ్రహ్మముగా దర్శించటము’….అనే స్వభావమును పరిరక్షించుకోవాలి. దృశ్యవ్యవహారములలో ఎప్పుడు ఎట్లా ఉండవలసివచ్చినప్పటికీ ‘బాహ్మీదృష్టి’ వీడనేవద్దు. ఈ సమస్తము సర్వదా ‘పరబ్రహ్మముయొక్క ప్రదర్శనారూపమే’ - అయి ఉండగా, మనము ‘బ్రాహ్మీదృష్టి’ని ఎప్పుడైనా సరే - వీడవలసిన అవసరమేమున్నది?

ఓ ఋభూ!
❋ అన్ని తదితరమైన (అన్యమైన చింతనలు) పరిత్యజించివేయి.
❋ బ్రహ్మముగా దర్శించుటయందు సావధాన చిత్తుడవై ఉండు.
❋ ‘యోగ సామ్రాజ్యము’ నందు ఇష్టముగా ప్రవేశించుము.
❋ అంతరనాదముతో అనుసంధానము కలిగియుండుము.
❋ యోగముచే ఆత్మతో సంయోగము సిద్ధించుకొని ఉండెదవుగాక!

ఇతి ద్వితీయోఽధ్యాయము


3వ అధ్యాయము - ‘తత్ సదానన్దమ్ అహమేవ’ - ఇతి మౌనమ్

ఓ ఋభూ! నీవు బ్రహ్మమే అయి ఉన్నావు. ఇందులో సందేహించవలసినది ఏమాత్రమూ లేదు! ఇది వేద వాక్యం। మహనీయుల స్వానుభవ వాక్యం। ‘‘బ్రహ్మమే నేను’’ - అని అనుకోవటానికి - ఎవ్వరైనా సరే - వెనుకాడవలసిన పనేమున్నది?

బ్రహ్మము - నానా స్వరూపములు తానే అయి ఉన్నప్పటికీ సర్వదా ‘ఏకవస్తువు’గానే ఉన్నది….అట్టి అఖండమగు ఆత్మయందు ‘నీవు - నేను’ అను భేదమెక్కడ ఉంటుంది? ఉండదు. అంతే కాదు. ఆత్మ అద్వితీయము! ‘నేను’గా ఉన్నది ఆత్మయే! తస్మాత్ అఖండ ఏవాస్మి, మత్ అన్యత్ న కించన।।
- ఆత్మ నాకు వేరైన వస్తువు కాదు. ఆత్మయే ఈ దేహములో మహత్తర పరాకాష్ఠ వస్తువు కాబట్టి - ‘బ్రహ్మము’ అనికూడా అభివర్ణించబడుతోంది. (లేక) ప్రశంసించబడుతోంది.
- ఈ నా కళ్ళకు కనబడేది, చెవులకు వినబడేది, ఇదంతా కూడా బ్రహ్మమునకు వేరు కాదు. బ్రహ్మము ఈ దృశ్య జగత్తుకు వేరు కాదు. ఈ దృశ్య జగత్తు ఆత్మకు వేరు కాదు. ఆత్మ బ్రహ్మమునకు వేరు కాదు.

‘నేను’ అనునది ఎవరు?

ఏ ఆత్మ అయితే….
⌘ భూత వర్తమాన భవిష్యత్తులలో, జాగ్రత్ - స్వప్న సుషుప్తి దశలలో, క్రితం దేహం - వర్తమాన దేహం - భవిష్యత్ దేహము సందర్భములలో యథాతథము కాబట్టి ‘నిత్యము’ అయిఉన్నదో,
⌘ ఆకాశమువలె -దృశ్య - ఇంద్రియ - మనో - బుద్ధి - చిత్త - అహంకార - ఈశ్వర - జన్మ - జన్మాంతర సర్వ విశేషములచే వాటి-వాటి దోషములచే స్పృశించబడదు కాబట్టి ‘శుద్ధమో’,
⌘ దేని చేతనూ బంధించబడదు కాబట్టి నిత్యముక్తమో,
⌘ ‘నేను - నీవు - దేవతలు - మానవులు - జంతువులు’…ఇత్యాది వేరు వేరుగా అగుచుండుటయే లేదు కాబట్టి సర్వదా ఏకమే అయి ఉన్నదో,
⌘ అద్దానికి వేరుగా ఏదీ లేదు కాబట్టి ‘అఖండానంద రూపమో’,
⌘ సత్య (ఉనికి / సత్), జ్ఞాన (ఎరుక) అనంత (దృశ్య - దేహ విశేషాలచే పరిమితము కాదు) కాబట్టి అప్రమేయమో,
⌘ ఏది సర్వమునకు ‘పరము, శ్రేష్ఠము’ అవటంచేత పరబ్రహ్మమో…..,
అట్టి పరబ్రహ్మమే నేను అయి ఉన్నాను। అహమస్మి తత్।

ఓ ఋభు మహాశయా!
ఇంకా కూడా నీలోని, నాలోని, సర్వజీవులలోని ‘నేను’ అనునది ఎంతటిదో చెప్పుచున్నాను. విను.
⌘ ‘ఎరుగుచూ ఉన్నది - ఎరుగబడుచున్నది’ ఈ రెండిటి ఏకరూపము. ‘బోధరూపము’ అనబడుతోంది. నేను అట్టి ‘అఖండబోధరూపుడను’.
⌘ ద్వితీయమైనది (something different) ఉంటే భయము, దుఖము ఉండక తప్పదు. రెండు వస్తువులుంటే ఒకటి రెండవ దానిని ‘పరిమితము’ (Limited) చేస్తుంది. నేను ద్వితీయమనునదే లేనట్టి ఆత్మను కాబట్టి అద్వయుడను। అద్వితీయుడను। ఏక - అఖండానంద రూపుడను। సర్వదా మూర్తీభవించిన అఖండాత్మ తేజోస్వరూపుడను।
⌘ ఈ దేహమునకు, దృశ్యమునకు, దేహికి కూడా పరము (Beyond) అయి ఉన్నవాడను. అట్టి ‘పరము’ కూడా నానుండి బయల్వెడలిన ఒక అంశమాత్రమే! కనుక నేను పరమునకే పరమైనవాడను. పరాత్ పరుడను.
⌘ ఈ సర్వము ప్రకాశింపజేయువాడను (That which makes all else as that being KNOWN). ఘనీభూత ‘చిత్ (ఎరుక)’ అను ప్రకాశ స్వరూపుడను. ఎరుకకే ఎరుకరూపుడను! ఎరుగుచున్న - ఎరుగబడుచున్న ఉభయములకు కేవల ‘ఎరుక’నై ఉన్నవాడను.

నేను ఏది ఎట్లా తెలుసుకొంటే, అది అట్లా తెలియబడుచూ ఉండగా,….అట్టి తెలుసుకోబడుచున్న దానిచే తెలుసుకొంటూ ఉన్న మహాకర్త అగు నేను బద్ధుడను, పరిమితుడను అవుతానా? అవనే అవను. ఆకాశములో మేఘములు ఆకాశము (Space)ను స్పృశించగలవా?ఆకాశమును బంధించగలవా? లేదు కదా!

అట్లాగే,
మేఘాయథా వ్యోమ న చ స్పృశంతి,
సంసార దుఃఖాని న మాం స్పృశంతి।

ఆకాశమును మేఘములు స్పృశించలేనట్లే ఆత్మాకాశ స్వరూపుడనగు నన్ను ‘సంసారము’ అనునది ఏమాత్రము స్పృశించజాలదు. నన్ను స్పృశించని దృశ్యానుభవరూపమగు సంసారము నన్ను ఎట్లా దుఃఖితునిగా చేస్తుంది? చేయజాలదు. ఇక బంధమును కలిగించగలిగే ప్రసక్తియే లేదు.

కనుక ఓ ప్రియ ఋభూ! ‘ఈ దృశ్యము నాకు సంసారబంధము’…అని అనుకోకూడదు సుమా! వాస్తవానికి, ‘ఆత్మస్వరూపుడనగు నాకు ఈ దృశ్యమంతా స్వకీయ లీలా, క్రీడా, ఆనంద విశేషమే!’….అని భావన చేయి. ‘ఇదంతా నా ఆత్మానంద స్వరూపమే! సుఖ స్వరూపమే!’ - అని గ్రహించు. అట్టి పరమసత్యమును ‘మననము’ చేస్తూ ఉండు.

♠︎♠︎♠︎

ఋభువు: ఈ జీవుడిని - ‘నేను బద్ధుడను. ఈ వ్యవహారములు నాకు ఆదుర్దా, భయము కలుగజేస్తున్నాయి! ఎట్లారా? ఉపాయ మేమిటి?’…..అనేది బాధిస్తూనే ఉన్నది. ఇది మొదలంట్లా తొలగు సులభోపాయం ఏది?

శ్రీ వరాహస్వామి: ఓ ఋభూ! ఆ విషయమే మనము చెప్పుకుంటూ వస్తున్నాము కదా! ఈ జీవుని దుఃఖములు మొదలంట్లా తొలగాలంటే ఏకైక ఉపాయము - ఈ సర్వమును సద్రూపమగు ఆత్మగా దర్శించటము మాత్రమే. ‘అసత్‌భావము’ తొలగిస్తే ఇదంతా సర్వదా సత్ - స్వరూపమే!

ఉనికి (Presence, Entity) నుండి బయల్వెడలిన ‘స్వకీయమగు ఎరుక’ (లేక) చిత్ యొక్క విస్తారణా వినోద రూపమే ఇదంతా! అందుచేత సత్ చిత్ రూపుడనగు నేను సర్వదా అఖండరూపుడను. నా అఖండరూపమే ఇదంతా!

ఇట్టి స్వభావ సిద్ధిమగు జ్ఞానము చేత ఈ జనులు పరస్పరంగా చెప్పుకుంటూ వస్తున్న సర్వ దుఃఖములు పటాపంచలౌతాయి.
ఈ జీవుడు సందర్భవశంగా ‘జీవుడు’గా కనబడుచున్నప్పటికీ, సహజముగా ఆత్మస్వరూపుడే! ఆత్మకు జనన - మరణాలు లేవు. రాక - పోకలు లేవు. మలము, నిర్మలము మొదలైనవి కూడా లేవు. ‘తెలుసుకోబడేది’ అను వేదనము కూడా ఆత్మకు వేరుగా లేదు.

‘‘స్వకీయ-చిన్మయ తత్త్వమే (Enlightening Feature of Absolute Self) సర్వే సర్వత్రా తెలియబడే సర్వమును నిండి, నిబిడీకృతమై స్ఫుటతరమగుచున్నది’’-అని పరమయోగులు దర్శించుచున్నారు. తెలియబడేదంతా ఆత్మయే। తెలుసుకొనుచున్నవాడు కూడా ఆత్మయే। ఆ ఉభయములకు ఆవల, అమృత స్వరూపమైయున్నది కూడా ఆత్మయే। ఆత్మ సర్వదా అఖండము, అప్రమేయము అనునిత్యము కూడా। అట్టి స్వస్వరూపాత్మయే బ్రహ్మము.

♠︎♠︎♠︎

తత్ సదా అహమ్ మౌనమ్ ఆశ్రయ…..!

ఓ ఋభూ! ఈ జగత్ పట్ల మౌనము వహించి ‘మౌనివి (లేక) మునివి’ అగుము. కేవల మౌన నిశ్శబ్ద స్వస్వరూపమును అధిరోహించి ఇదంతా దర్శించుము.

ఋభు: భగవాన్! ‘ముని’గా ఎప్పుడు అగుచున్నాము?

శ్రీ వరాహస్వామి:
➤ ఏ పదము లేక స్థానము అత్యంత నిర్మలమో, అద్వయము - అద్వితీయమో, పరమశివమో, శుభప్రదమో, - తత్ సదాఽహమ్ - అట్టి ‘ఆత్మయే నేను’ అను ‘మౌనముద్ర’ను ఆశ్రయించటమే - మునివై ఉండటము.
➤ ఏది జన్మ - మృత్యు - దుఃఖ రహితమో, జాతి - నీతి - కుల - గోత్రములకు ఏమాత్రము సంబంధించినది కాదో, ఏ ‘చిత్‌తత్త్వము’ యొక్క వివర్త రూపము (బంగారము యొక్క ఆభరణరూపములె) జగదృశ్యముగా, త్వమ్‌గా కూడా అగుటకు కారణమో, అట్టి తత్‌స్వరూపమే నేను…. అని మౌనమును అంతరముగా ఆశ్రయించెదవు గాక!
➤ ‘‘ఏదిపూర్ణమో, అద్వయమో, అఖండమో, సర్వమును కదల్చుచూ ఉన్నది కాబట్టి చేతనమో, విశ్వము తానే అయి ఉండి కూడా ఎద్దానికి విశ్వభేదములన్నీ సంబంధించినవి కావో, అద్వితీయ - పర (ఆవలగల) - సత్‌చిత్ స్వరూపమో, అదియే సర్వదా నేను కదా!’’ - అను మౌనధారణము వహించి ఉండటమే ‘మునీశ్వరత్వము’.

అంతేగాని, కేవలము కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండుటు - మౌనము కాదు.

ఓ నిదాఘా!
‘నీవు’గా కనిపిస్తున్నది కూడా సర్వదా ఆ తత్ స్వరూపమే!

➤ ఏదైతే దృశ్య-దేహ-మనో-బుద్ధ్యాదులచే కించిత్ కూడా స్పృశించబడటం లేదో, త్రికాలములలో సర్వదా ఏకరూపమై ఉన్నదో, అట్టి ‘తత్‌బ్రహ్మమే’ - ‘నీవు’గా కనబడుచున్నది. నీయందలి ఆ సద్రూపమే నేనయ్యా! నిత్యము - అఖండము - అప్రమేయము అగు నేనే నీవు। నీవుగా ఉన్నది నేనే।
➤ ఏది ఉపాధిరహితమో (శరీరము ఇత్యాదులు దానికి, మొదలే లేవో), ఏది సుప్త (గాఢనిద్రా) మౌనస్వరూపమో, ‘ఏది సుఖరూపము’ అయి ఉండి కూడా ‘సర్వసుఖాత్ పరము’ అయి ఉన్నదో, అట్టి తత్ ఆనందస్వరూపమే నాయొక్క నీయొక్క ప్రతి జీవునియొక్క వాస్తవ - సహజ రూపము। అట్టి మహత్తరమగు స్వస్వరూపాత్మయొక్క సహజమగు ఔన్నత్యమేమిటో అధ్యయనము చేయకుండా, స్వానుభవముగా సిద్ధించుకోకుండా, ఎక్కడెక్కడో తిరిగి తిరిగి, వేసారితే ఏమి ప్రయోజనము? ‘‘నీలోనే సర్వదా వేంచేసియున్న పరమాత్మను ఎక్కడెక్కడో వెతకటమెందుకు?

అజ్ఞానాంధకారం తొలగేది ఎట్లా?

సూర్యుడు తన సహస్రకిరణాలతో ఉదయించగానే భూమిపై గాఢాంధకారము తొలగిపోయి, సర్వము సుస్పష్టముగా అగుచున్నది. అయితే హృదయంలో ఘనీభూతమైన ‘భవము’ (ఈ భేద దృశ్యము నిజమే అను ఘనీభూత భావన) అను అంధకారము భౌతికమైన సూర్య కిరణములచే తొలిగేది కాదు.

శరణాగతి యోగము

అందుచేత ఓ ఋభూ! నన్ను శరణువేడు. నాయొక్క కర - చరణ స్మరణ చేత, నన్ను పూజించటం చేత ఈ జీవుడు స్వకీయ కల్పితమైన తమస్సు (Darkness / Ignorence) నుండి తప్పక విముక్తుడు కాగలడు. నాయొక్క చరణ కమల స్మరణ - శరణా గతి మొదలైన వాటి చేత ఇక్కడి జనన - మరణ - పునర్జన్మల సంబంధమై హేతువుల వలన ప్రాప్తిస్తున్న సుఖ - దుఃఖములన్నీ మొదలంట్లా తొలగిపోగలవు.

ఒకడు ధనేచ్ఛచే ధార్మికుడైన ధనికుని ఆశ్రయించి ధనమును పొందురీతిగా-విశ్వాత్మకుడైన, విశ్వకర్త అయిన నన్ను శరణు వేడితే, అట్టివాడు బంధములనుండి విముక్తి ఎందుకు పొందడు? తప్పక పొందుతాడు.

ఋభువు : హే మహాత్మా! భగవాన్! ఈ చరాచర సృష్టియొక్క ప్రవర్తనములకు, కదలికలకు, చేష్టలకు కారణం ఎవ్వరు? కేవల - పరమాత్మ స్వరూపులగుమీరా? లేక, ప్రకృతికి భోక్తగా అగుచున్న జీవుడా? ప్రకృతియా? మరెవ్వరన్నానా?

శ్రీ ఆదివరాహస్వామి : నేను సర్వదా గుణాతీతుడను, కేవలుడను, సాక్షిని కదా! అందుచేత జగత్ దృశ్యములకు కారణము పరబ్రహ్మస్వరూపుడనగు నేను ఎట్లా అవుతాను? అవనే అవను। నాటకములోని సంఘటనలకు నాటకదీపము యొక్క వెలుగు కారణమెట్లా అవుతుంది?

సూర్యుని కాంతిలో లోకులు తమ కార్యక్రమములు నిర్వహించుకుంటున్నారు. అయినా కూడా, సూర్యకిరణములకు ఆయా జనుల కార్యక్రమములతోగాని, వారివారి పరస్పర ఐకమత్య - విభేదాలతోగాని ఏమాత్రం కర్తృత్వ భోక్తృత్వములు లేవు కదా! ‘తథా మత్ సన్నిధానేన సమస్తం చేష్టతే జగత్। కేవల చిదానంద స్వరూపుడనగు నాయొక్క సన్నిధానమాత్రం చేతనే ఈ ‘జగత్తు’ అనబడేదంతా చేష్టితము అగుచున్నది. ఏ విధంగా మాయచేత ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లే అనిపిస్తూ, అజ్ఞానంచేత ఆరోపించబడుతోందో,…. అదే విధంగా

కేవలుడనగు నా పట్ల మహత్తు, అహంకారము, జీవుడు, బంధము, మోక్షము, శివుడు, విష్ణువు…మొదలైనవన్నీ కల్పించబడి పొందబడుచున్నాయి. ఇదంతా నాకు ‘స్వయంకల్పిత-అసంకల్పిత’ లీలా వినోదము మాత్రమే!

నేను సర్వత్రా సమస్వరూపుడగు ఆత్మగా నిత్య ప్రకాశమానుడనై ఉన్నాను.

✤ అనేక క్రూర కృత్యములు చేసే చండాలుని దేహమునందు,
✤ పశువు మొదలైన జంతుజాలమునందు,
✤ స్థావరములయందు (కదలని చెట్లు, రాళ్ళు మొదలైన వాటియందు),
✤ ఈ సృష్టి అంతటికీ కర్త, యజమాని, అభిమాని, నిగ్రహ - అనుగ్రహ ప్రదాతయగు బ్రహ్మదేవుని యందు,
✤ తదితర సమస్త నామవాచకములందు, సర్వనామరూపములందు - తారతమ్యము (ఎక్కువ - తక్కువ) అనేవే లేకుండా, అవన్నీగా ఉన్నది నేనే! (ఆ బ్రహ్మాది - పిపీలి కాంత తనుషుః ప్రోక్తా జగత్ సాక్షిణః!) - బ్రహ్మము నుండి కీటకము వరకు సాక్షినై వెలుగొందుచున్నది నేనే!

ఒకానొకడు మత్తుగా నిదురిస్తూ తాను ఎక్కడున్నాడో, ఏ స్థలములో (లేక) స్థానములో ఉన్నాడో తెలియకపోవచ్చు. కానీ మెలకువ రాగానే తాను ఎక్కడున్నదీ తెలిసిపోతుంది కదా!

అట్లాగే ‘నేను ఆత్మను’ అని తెలిసిపోగానే దిక్‌భ్రమలన్నీ తొలగుతాయి.

భూ-సూర్య ఇత్యాది స్థానముల సంబంధమే లేని ఆత్మ - దిక్కుల మధ్య ఉన్నదనటం భ్రమయే। దిక్కులన్నీ (స్వప్నములో వలె) ఆత్మయందే కల్పితమై ఉన్నాయి.

‘స్వస్వరూపాత్మ’ గురించి తెలిసిన మరుక్షణం ఇక అట్టి జీవునిపట్ల జగత్తు అనేది భాసించదు. జగత్తు ఆత్మగానే భాసిస్తుంది.
ఓ ఋభూ! స్వప్నము తొలగగానే స్వప్నములో కనిపించినవన్నీ, స్వయముగా ‘లేనివే’ అగుచున్నాయి కదా! అట్లాగే

✤ జనార్ధనుడును (ఈ జీవులన్నీ నా స్వరూపముగా కలవాడను) అగు నేను కేవల చినానంద మాత్రుడనై, సర్వే-సర్వత్రా సత్‌స్వరూపుడనై వెలుగొందుచున్నాను.
ఇక అన్యమైనదేదీ స్వతఃగా లేదు.

✤ దేహముగాని, ఇంద్రియములుగాని, మనోబుద్ధి చిత్త అహంకారములుగాని, చిత్తముగాని, మాయగాని, ఈ ఆకాశాదులతో కూడిన పాంచభౌతిక దృశ్య జగత్తుగాని…..
ఇవన్నీ వాస్తవానికి ఆత్మకు అన్యమై లేవు. ఆత్మ తప్పితే మరింకేదీ ఎక్కడా ఏమాత్రము లేదు.

ఆత్మకు వేరుగా ఇక్కడ కర్త లేడు. భోక్త లేడు. భోగింపబడునదీ లేదు.

జలంలో చంచలమై కనిపిస్తున్న సూర్య ప్రతిబింబము యొక్క చంచలత్వములతో ఆకాశములో కనిపించే సూర్యునికి ఏమి సంబంధము? అట్లాగే ఇక్కడి ‘ప్రతిబింబిత - జీవానుభవములు’ అగు ‘అహంకారము’ మొదలైన జీవుని సంసారమంతా ఆత్మకు ఏమాత్రము సంబంధించి లేదు. ఆత్మయొక్క చిదాకాశరూపము ‘‘పరమాత్మ’’। ఆత్మయొక్క ప్రకృతియందు ప్రతిబింబిత రూపమే ‘‘జీవాత్మ’’।

చిత్తమే ‘సంసారము’నకు మూలము।

ఈ దృశ్యములోని సంఘటనలు, రూపనామములు, సందర్భములు మొదలైనవాటితో ఈ జీవుడు ఇష్ట అయిష్టరూపమైన ‘అవినాభావసంబంధము’ను స్వకీయమైన అభ్యాస - కల్పనలచే పెంపొందించుకొని ఉంటున్నాడు. అట్టి సంబంధమే ‘సంసారము’ అనబడుతోంది. అట్టి అభ్యాసముల సమ్మేళనమే చిత్తముయొక్క రూపము.

చిత్త మూలం హి సంసారాత్. జీవుని స్వకీయ భావనా - అభ్యాస రూపమగు చిత్తమే సంసారమునకు మూలము (Raw-Material). (చిత్తము = దృశ్యవిషయముల ఏర్పడిన ఇష్టము. ప్రియము మొదలైన ఆవేశములతో కూడిన ‘ధ్యాస’).

తత్ ప్రయత్నేన శోధయేత్. అట్టి చిత్తమును ప్రయత్నపూర్వకంగా శోధించాలి. అది వదిలివేసి దృశ్యప్రపంచంలో కొన్ని వస్తువులు మొదలైనవి వదలి ఉన్నంత మాత్రంచేత ‘సంసారము’ తొలగదు. వస్తు జాతమునకు సంసార కారణమును ఆపాదించి ఏం ప్రయోజనం?

బిడ్డా! ఋభు మహాశయా! సకల శ్రోతలారా! ఈ చిత్తము దేనిదేనిపై వ్రాలుచూ బంధము కల్పించుకొనుచున్నదో మీరంతా ముందుగా గమనించండి! విషయములు అనునిత్యము మార్పుచెందు స్వభావము కలిగి ఉండగా, వాటిపై ఎట్లా విశ్వాసము కలిగి ఉంటారు? అదంతా మరింత చిత్తచాంచల్యము కలిగించక ఏమి చేస్తుంది?

ఈ కాలగతిని చూస్తున్నారా? ఎక్కడి రాజులు? ఎక్కడి వారివారి సంపదలు? ఇవన్నీ ఎటు నుంచి వస్తున్నాయి? ఎటు పోతున్నాయి! ఏమి అసంఖ్యాక సృష్టి సమూహములు? ఎంతగా అసంఖ్యాక బ్రహ్మలు? ఇవన్నీ అసంఖ్యాకంగా జనిస్తున్నాయి. మరల ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోతున్నాయి. పూదోటలో అనేక పుష్పము జనించి, వికసించి నేలరాలుచున్న తీరుగా…అనేక కోటానుకోట్ల బ్రహ్మలు, కోటానుకోట్ల బ్రహ్మాండములు ఇంతకు ముందు అసంఖ్యాకంగా కనిపించాయి, వికశించాయి, గతించాయి. మరల జనిస్తున్నాయి. మరల గతిస్తున్నాయి. కాలగతి అనిర్వచనీయం! మహాశ్చర్యకరం! అప్రతిహతం!

ఓ ఋభూ! నీవు ‘ఆధ్యాత్మ విద్య’ లేక ఆత్మవిద్య పట్ల అభిమానము కలిగియున్నావు. వేదాంత విద్య పట్ల విదుషుడవు కూడా! అట్టి విదుషత్వము కలిగి ఉండి, ‘అహంకారము, అరిషట్‌వర్గము’ మొదలైన ఆసురీసంపత్తిని తప్పక త్యజించాలి. ఆత్మ గురించిన విదుషత్వమంతా భేదదృష్టిని వదలనివానిపట్ల బూడిదలో పోసిన పన్నీరే అగుచున్నది!

ఈ సంసార జీవుడు తనయందు దృశ్యముపట్ల రాగ - ద్వేషములు పొడముచూ ఉన్నప్పుడే, మొదటే గమనించి, వాటిని ‘జ్ఞనాగ్ని’తో దగ్ధం చేసివేయునుగాక! ఇక అతనికి అప్పుడు ‘పునరావృత్తి’ అనే దోషమే ఉండదు.

శ్లో।। యథా సునిపుణః సమ్యక్ పరదోష ఈక్షణే రతః,
తథా చేత్ నిపుణః స్వేషు కో న ముచ్యేత్ బంధనాత్?

ఇతరుల తప్పులు ఎంతటి ప్రావీణ్యంతో, నైపుణ్యంతో చూస్తూ ఉన్నాడో, అట్టి ‘ప్రావీణ్యత - నిపుణత’ తో తన తప్పులను, సంసార దృష్టులు గుర్తించి, తొలగించటానికి నియోగిస్తే, ఈ జీవుడు సంసార బంధములనుండి విముక్తుడు ఎందుకు కాడు? తన తప్పులు ఎరిగి ఉపాయములు ఆశ్రయించువాడు ముక్తిమార్గంలో వేగవంతుడౌతాడు. (కుర్యాత్ నరాన్ స్వగుణదోష విచారణాని - యోగవాసిష్ఠము).


సిద్ధులు - ఆత్మజ్ఞాని

ఋభువు : స్వామీ! ఈ జీవుడు యోగాభ్యాసము మొదలైన అనుసరణము వలన అటు సిద్ధులు, ఇటు మోక్షము కూడా పొందగలడు కదా!

ఆదివరాహమూర్తి : ఓ మునీశ్వరా! సిద్ధులకు, ఆత్మభావనారూపమగు మోక్షమునకు ఏమి సంబంధం? సంబంధమే లేదు. ఒకనికి ఆత్మతత్త్వ జ్ఞాన - ఆత్మానందములు లక్ష్యము కానప్పుడు కూడా - ఎవ్వరైనాసరే, అణిమ-గరిమ-లఘిమ- మహిమ- ఈశిత్వ-వశిత్వ-ప్రాకామ్య-ఇచ్ఛాసిద్ధిలు కోరుకొంటూ ఉంటే, ఆతనికి ద్రవ్య - మంత్ర - క్రియా - కాలయుక్తంగా అష్టసిద్ధులుగాని, వాటిలో కొన్నికొన్ని గాని లభించ గలవు.

అటువంటి సిద్ధులన్నీ కూడా -
- అనాత్మజ్ఞునికే గొప్ప విషయాలుగా కనిపిస్తాయి.
- ఆత్మజ్ఞునికి ‘ఆత్మదృష్టి’ తప్పించి మరేదీ అతని దృష్టిలో విశేషమే కాదు.
- ఆత్మచేత ఆత్మ యందు సంతుష్టుడై ‘అవిద్య’తో సంబంధములేనివాడై - మౌనంగా, అతీతంగా, నిశ్చింతగా, ఆనందంగా చూస్తూ ఉంటాడు (ఉపద్రష్టా).

ఏఏ జగత్ భావములు → (ఇష్ట-అయిష్టాలుగా, సుఖ-దుఃఖాలుగా, పరస్పర సంబంధ-బాంధవ్యములుగా, లింగ-జ్ఞాన ఇత్యాది) భేదములతో కూడుకొని-కనిపిస్తూ ఉన్నాయో, అదంతా కూడా ‘అవిద్య’యే. ఆత్మజ్ఞాని అవిద్యను త్యజించే ప్రయత్నములలో ఉంటాడేగాని, వాటియందు మునిగి తేలుతూ ఉండాలనుకొంటాడా? లేదు. ద్రవ్యము (certain matter related things) చేతను, యోగాభ్యాసము మొదలైన క్రియా విశేషములచేతను, యుక్తి-తపస్సుల చేతను ఏఏ సిద్ధులు ఆ యోగికి తారసబడుతూ ఉంటాయో, అవన్నీ కూడా ‘పరమాత్మ పదప్రాప్తి’కి ఉపకరించేవి ఏమీకావు. అందుచేత బ్రహ్మజ్ఞానాధ్యయునులగు ఉత్తములు తమకు తారసబడే సిద్ధులను లోకకళ్యాణము కొరకే ఉపయోగిస్తారు. ఉత్తముడగు రాజు తన అధికారములను ప్రజల క్షేమము కొరకే ఉపయోగిస్తాడు కదా!

ఆత్మలాభము కోరుకొనేవాడు చిత్తమును లయింపజేసే ప్రయత్నములలో ఉంటాడు. అష్ట సిద్ధులో? చిత్తముయొక్క ప్రవృత్తులు అధికమవటానికి కారణమయ్యేవి మాత్రమే! చిత్తము లయిస్తూ ఉండగా, చిత్తముయొక్క ఉపకరణములతో పని ఏముంటుంది? చిత్తము లయించకపోతే సిద్ధుల వలన క్రొత్తగా ఆత్మానుభవానికి ఏమి ఉపకారము? లాభమేముంటుంది? వాటియొక్క పర్యవసానము - ‘‘బంధమును కొనసాగించటమే’’ - అగుచున్నది కదా!


4వ అధ్యాయము - ఋభు నిదాఘ సంవాదము

సప్తజ్ఞాన భూమికలు - జీవన్ముక్తి లక్షణములు

ఒక సందర్భములో నిదాఘుడు అనే ముని మోక్షేచ్ఛ పొందినవాడై, జ్ఞానసిద్ధి కొరకు తన సద్గురువగు ఋభుమహర్షిని సమీపించారు. భక్తితో గురుపాదాలకు సాష్టాంగదండ ప్రణామములు సమర్పించారు.

నిదాఘుడు : హే గురుదేవా! సద్గురూ! నాపై దయతో నాకు జీవన్ముక్తుని విశేష లక్షణముల గురించి చెప్పమని అర్ధిస్తున్నాను.

శ్రీ వరాహస్వామి : జీవన్ముక్తునికి సంబంధించి (I) సప్త - (7) జ్ఞానమార్గ భూమికలు (II) చతుః- (4) ప్రణవాత్మకమైన భూమికలు - యోగగురువులచే వివరించి చెప్పబడుచున్నాయి. ఆయా విశేషాలు ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము. వినండి.

చతుర్విధ ప్రణవాత్మిక భూమికలు - చతుర్విధ అవస్థలు

చతుర్ (4) ప్రణవాత్మిక భూమికలు - అంశభేదములు - అవస్ధా భేదములు - పురుషకారములు
(1) ‘అ’కారము - స్థూలాంశ - జాగ్రత్ అవస్థ - విశ్వుడు
(2) ‘ఉ’కారము - సూక్ష్మాంశ - స్వప్నావస్థ - తేజసుడు
(3) ‘మ’కారము - బీజాంశ - సుషుప్త్యవస్థ - ప్రాజ్ఞుడు
(4) అర్ధమాత్ర - సాక్షి అంశ - తురీరాయావస్థ - తురీయసాక్షి

‘అ’కారము యొక్క
స్థూలాంశము → జాగ్రత్ → విశ్వము
సూక్ష్మాంశము → స్వప్నము → తేజసము
బీజాంశము → సుషుప్తి → ప్రాజ్ఞము
సాక్ష్యంశము → సాక్షి → తురీయము

‘ఉ’కారము యొక్క
స్థూలాంశము → స్వప్నము
సూక్ష్మాంశము → విశ్వుడు (జాగ్రత్)
బీజాంశ ము → ప్రాజ్ఞుడు
సాక్ష్యంశము → తురీయము

‘మ’కారము యొక్క
స్థూలాంశము → సుషుప్తి
సూక్ష్మాంశము → జాగ్రత్
బీజాంశ ము → స్వప్నము
సాక్ష్యంశము → తురీయము

అర్ధమాత్ర యొక్క
స్థూలాంశము → తురీయము
సూక్ష్మాంశము → తేజసుడు (స్వప్నము)
బీజాంశము → ప్రాజ్ఞుడు
సాక్ష్యాంశము → తురీయుడు

సప్త జ్ఞాన భూమికలు : (1) శుభేచ్ఛ (2) విచారణ (3) తనుమానస (4) సత్త్వాపత్తి (5) అసంసక్తి (6) పదార్థ అభావన (7) తురీయగము ఇవి సప్త జ్ఞాన భూమికలు

‘అ’కార జాగ్రత్ -తురీయాంశ భూమికలు → మొదటి మూడు భూమికలు (1) శుభేచ్ఛ (2) విచారణ (3) తనుమానస

‘ఉ’కార స్వప్న - తురీయాంశ భూమికలు → 4వ భూమిక ‘సత్త్వాపత్తి’

‘మ’కార సుషుప్తి- తురీయాంశ భూమికలు→ 5వ భూమిక - అసంసక్తి

అర్ధమాత్రా తురీయాంశా భూమిక → 6వ భూమిక పదార్థభావనా (పదార్థాభావన)

అర్ధమాత్రా అతీతా (కేవలా) → 7వ భూమిక ‘తురీయగము’

✩ ముముక్షువు: భూమిత్రయ విహరన్ (శుభేచ్ఛ, విచారణ, తనుమానసలో ప్రవేశించువాడు) - ‘ముముక్షువు’ అగుచున్నాడు.
✩ బ్రహ్మవిత్ : తురీయ (4వ) భూమ్యా విహరన్ - ‘సత్త్వాపత్తి’లో ప్రవేశించినవాడు - ‘బ్రహ్మవిత్’ (బ్రహ్మముగురించి తెలుసుకొన్నవాడు) అగుచున్నాడు
✩ బ్రహ్మవిద్వరుడు: పంచమ భూమ్యాం విహరన్ -‘అసంసక్తి’ భూమికలో ప్రవేశించినవాడు - ‘బ్రహ్మవిద్వరుడు’ అని పిలువబడుచున్నాడు
✩ బ్రహ్మవిత్ వరేణ్యుడు: షష్టమ (6వ) భూమ్యాం విహరన్ - పదార్థ - అభావన భూమికలో ప్రవేశించినవాడు - ‘బ్రహ్మవిత్‌వరేణ్యుడు’గా చెప్పబడుచున్నాడు.
✩ బ్రహ్మవిత్ వరిష్ఠుడు: సప్తవ (7వ) భూమ్యా విహరన్- తురీయగ భూమికలో ప్రవేశించువాడు - ‘బ్రహ్మవిత్ వరిష్ఠుడు’ అగుచున్నాడు.

మొదటి మూడు భూమికలు : {(1) శుభేచ్ఛ (2) విచారణ (3) తను మానసఊ ‘జ్ఞానభూమికలు’ అనబడుచున్నాయి. అయితే తెలుసుకుంటే సరిపోతుందా! ఆత్మ గురించి తెలుసుకున్నది అనుక్షణికానుభవం కావాలి కదా! అందుచేత - (4) సత్త్వాపత్తి (5) అసంసక్తి (6) పదార్థభావన (7) తుర్యగము ఈ నాలుగు కూడా యోగ (లేక) తుర్యగా విహార భూమికలు - అని పిలువబడుచున్నాయి.

నిదాఘుడు : స్వామీ! ఋభు భగవాన్! సద్గురూ! మీరు చెప్పిన ‘సప్తభూమికలు’ గురించి మరికొంత విశేషంగా వివరించమని అర్థిస్తున్నాను.

ఋభు మహర్షి : సప్త (7) భూమికల గురించి సమీక్షిస్తూ సంక్షిప్తంగా చెప్పుకుంటున్నాము. ప్రియ తపోధనా! నిదాఘా! వినండి.

Ⅰ. జ్ఞాన భూమికలు

(1.) శుభేచ్ఛా భూమిక

‘‘స్థితః కిం మూఢ ఏవ అస్మిన్? ఇదేమిటిరా బాబూ! దృశ్యప్రంచంలో ఏదో పొందాలి, చేయాలి, కావాలి, దాచాలి…ఇటువంటి అల్పాశయములలో బుద్ధిని నిలిపి రోజులు గడుపుచున్నానే! ‘‘జీవించటము’’ అనే అవకాశం యొక్క ఆశయం ఇదా? మూఢుడనై నా గురించి నేను తెలుసుకోవటం (ఆత్మగురించి), ఆత్మగా అనుకోవటం, ఆత్మగా అనిపించటం, నేనే ఇదంతా (ఆత్మస్వరూపుడుగా) అయి ఉండటము …. ఇటువంటి ఆయా మార్గములకు ఆత్మజ్ఞులు దారిచూపుచున్నారే! కాబట్టి ఇక శాస్త్రములను, సజ్జనులను ఆశ్రయిస్తాను. ఈ ప్రాపంచక విషయాలపట్ల అనురాగమును దరిజేరనీయక, విరాగినై వైరాగ్యపూర్వకంగా జీవితమును తీర్చిదిద్దుకుంటాను’’.

ఈ విధమైన శాశ్వతమగు, (దేహానంతరము కూడా ఉత్తమ ప్రయోజనకరము అగు) మార్గములను ఆశ్రయించుచుండటమును ‘శుభేచ్ఛ’ అని పిలుస్తున్నారు. దృశ్య విషయములపట్ల వైరాగ్యము పెంపొందించుకోవటమే - శుభేచ్ఛయొక్క ముఖ్య లక్షణము.
దృశ్యములో కనిపించేవన్నీ అశాశ్వతమని, దుఃఖ మిశ్రితమని గమనించి, దృశ్యమును దాటి గమనించాలనుకోవటమే శుభేచ్ఛ.

(2.) విచారణా భూమిక

‘శుభేచ్ఛ’ దృఢమగుచుండగా ముముక్షువు ఆత్మతత్త్వమును గుర్తు చేసే సచ్ఛాస్త్రములను పరిశీలించ ప్రారంభిస్తున్నాడు. క్రమంగా ఆత్మతత్త్వజ్ఞులగు మహనీయులను ఆశ్రయించటమును అధికం చేసుకొనుచున్నాడు. అభ్యాసపూర్వకం వైరాగ్యమును ఆశ్రయించుచున్నాడు. తనయొక్క రాగమును గమనించుచూ, త్యజించుచుటకు ఉద్యుక్తుడగుచున్నాడు.

వైరాగ్యము
1). ‘‘హే పరమాత్మా! ‘నావి’ అనిపించేవన్నీ వాస్తవానికి నీవే కదా!’’ అని అనుకోసాగటం.
2). జగత్తులోని విషయములకు సంబంధించిన అభిమానములను త్యజించి ఉండటము.
3). పరమాత్మయొక్క ఆరాధనను ప్రియంగా నిర్వర్తించటం.
4). మనో-బుద్ధులలోని దృశ్య పరిమిత భావావేశములను పరిత్యజించటము.
మొదలైనవి ‘‘వైరాగ్యముయొక్క అంగములు’’ - అనబడుచున్నాయి.

ఇక ఆతడు దురాచారములనుండి వెనుకకు మరలి, అద్వేష్టా సర్వభూతానాం, మైత్రః - కరుణ నిర్మమో, నిరహంకారము, సమత్వము, క్షమ, దానము, ధర్మము మొదలైన సదాచారములను ప్రవృద్ధి చేసుకొంటున్నాడు. జ్ఞాన విషయములు వైపు శ్రవణ - మననములను అధికం చేసుకొంటున్నాడు. ఇది ‘విచారణ’ భూమికా విహారము.

(3.) తను మానసా భూమిక

‘శుభేచ్ఛ, విచారణ’ల అభ్యాసముచే క్రమంగా ఈ జీవునికి శబ్ద - స్పర్శ - రూప - రస - గంథముల సంబంధమైన విషయముల పట్ల అభినివేశము (Emotional Involvement) తగ్గ సాగుచున్నది. దేహమునకు సంబంధించిన మమకారములు, అహంకారములు జయిస్తూ ‘మానసిక దేహము’ (స్థూలమునుండి సూక్ష్మము) వైపుగా ప్రయాణించుచున్నాడు. ఇది తనుమానస భూమికా ప్రవేశము అగుచున్నది. ఆతనికి మనస్సు స్వాధీనము కాసాగుచున్నది. ఆలోచనా రూపమగు మనస్సును నిరోధించటము, నియమించటము, స్వాధీనము చేసుకోవటము ప్రారంభిస్తున్నాడు.

ఈ ‘3’ భూమికలు జ్ఞాన భూమికలు (తెలుసుకోవటం)గా చెప్పబడుచున్నాయి. మనస్సు ఇంద్రియార్థములనుండి వెనుకకుమరలుచూ, చిత్తము వశము కాసాగుచున్నది.

Ⅱ. యోగ/తుర్యగా విహార భూమికలు

(4.) సత్త్వాపత్తి భూమిక

శుభేచ్ఛ, విచారణ, తనుమానసల సుదీర్ఘమైన అభ్యాసముచే చిత్తము విషయముల నుండి వెనుకకు మరలుచు, సునిశితము - పవిత్రము - విస్తారము కాసాగుచున్నాయి. ‘సత్ వస్తువు’ అగు ఆత్మను ఆశ్రయించసాగుతుంది. చిత్తము శుద్ధమగుచు, ‘సత్వాత్మ’ యందు స్థితిని పొందుచూ ఉండు భూమికను ‘సత్త్వాపత్తి’ - అని పిలుస్తున్నారు. సాత్వికమైన ప్రేమ, దయ, కరుణ, ఆప్యాయత మొదలైనవి ఈ భూమికలో ప్రవృద్ధము, స్వాభావికము కాసాగుతాయి. సహజీవులలో ఆత్మను దర్శించటము, అందరినీ పరమాత్మ స్వరూపులుగా భావించటము ప్రారంభిస్తున్నాడు.

(5.) అసంసర్గ భూమిక (లేక) అసంసక్తి భూమిక

‘శుభేచ్ఛ, విచారణ, తను మానస, సత్త్వాపత్తి’ అనే ‘4’ భూమికలు అభ్యాసముచే క్రమంగా ‘అసంసర్గ’ అను ఉత్తమ ప్రయోజనముగల ఐదవ భూమికలో ముముక్షువు ప్రవేశము పొందుచున్నాడు. ‘ఆత్మభావన’ లేక ఆత్మతో సంసక్తి భావనయందు ఆరూఢత్వము - ‘అసంసక్త’ అను భూమిక అగుచున్నది.

ఈ విధంగా ఎరుగుచు సర్వ దృశ్య విషయములపట్లగల సంసర్గము (Attachment, Relatedness)ను పాము కుబుసమువలె విడచివేయుచున్నాడు. జగద్విషయములన్నీ ఇక ఆతనిపట్ల ‘అవిషయములు’ అవసాగుచున్నాయి. అతని దృష్టి, ధ్యాస పరమాత్మగా దర్శనమునందు సునిశ్చితమవసాగుచున్నాయి.

‘‘ఈ ప్రాపంచిక విషయములు నాయందు లేవు. నేను వీటియందు లేను. నాటకములో ‘పాత్ర’ (Role) పొందుచున్న కష్ట - సుఖములు పాత్రధారుడు పొందడు కదా! నాటకములోని పాత్రగా నాటకరంగము (Stage) పై రాకపోకలు తన నటనా చాతుర్యమునకు ప్రారంభ - ముగింపులు కాదు కదా! అట్లాగే ఈ జగన్నాటకములో జీవాత్మగా ఉన్నంత మాత్రంచేత ఈ భౌతికదేహము నాకు ప్రారంభము కాదు. ముగింపు కాదు. ఇది నాకు సందర్భ మాత్రమే’’.

ఇది గ్రహించి ఈ ఇంద్రియములకు దృశ్యరూపంగా కనిపించేదంతా, వాటి వాటి ప్రదర్శనములను నాటకీయభావనతో దర్శించువాడు ‘అసంసక్తుడు’ (లేక) అసంసర్గభావనలో ప్రవేశించినవాడు గా చెప్పబడుచున్నాడు.

(6.) పదార్థ భావనా భూమిక

భూమికా పంచకాభ్యాసాత్ స్వాత్మా రామ తయా భృశమ్…., అభ్యంతరాణాం, బాహ్యానాం పదార్థానామ్ అభావనాత్।।

‘శుభేచ్ఛ, విచక్షణ, తనుమానస, సత్త్వాపత్తి, అసంసర్గ’ - అను 5 భూమికలు సాధన స్థానములు అగుచుండగా క్రమంగా ఈ జీవుడు ‘ఆత్మ’ అను పదార్థానుభవమును సమీపిస్తున్నాడు.

స్వ - ఆత్మారాముడై - ‘‘బంగారంలో ఆభరణమున్నట్లు, కథా రచయితలో కథా రచనా చమత్కారమంతా ఉన్నట్లు, జలములో తరంగములు ఉన్నట్లు, ఈ జగత్ దృశ్యమంతా ఆత్మనగు నాయందే ప్రదర్శనమగుచున్నది’’…. అను భావనను నిశ్చలం చేసుకొనుచున్నాడు. తనయొక్క బాహ్య - అభ్యంతరములతో (outer side as well as inner side) ఆత్మకు భిన్నమై మరొక పదార్థమే లేనట్లు గమనిస్తున్నాడు.

👉 పదార్థము - శక్తి రూపము।
👉 శక్తి - శక్తిమంతుని రూపము।
👉 శక్తిమంతుడు - ఆత్మరూపము। కనుక సమస్తము ఆత్మస్వరూపమే।

స్వప్నంలో వస్తు జాలమంతా స్వప్న చైతన్యరూపమే అయినట్లు - ఈ జగత్తంతా ఆత్మచైతన్య ఆనంద ప్రదర్శనమే।
- సర్వము పరమాత్మయొక్క సంప్రదర్శనమే।
- నేను - నీవు అనునదంతా ఆత్మారామ విన్యాసమే।
- కనుక నేను ఆత్మానందరూపుడను।
- అనగా ఇదంతా నీవు - ఆతడు - ఈతడుతో సహా - స్వాత్మారామమే।
ఈ విధంగా భావన చేయుచున్నాడు.

చిరకాలంగా ఇహంలో కనిపించే సహజీవులను ‘పరస్వరూపం’గా (ఆత్మస్వరూపులుగా) దర్శిస్తూ ‘పరమాత్మయే ఈ సర్వ రూపములుగా ప్రదర్శనమగుచున్నారు’ - అను అభ్యాసముచే నామరూపాత్మకమైనదంతా అధిగమించుచున్నాడు. ఆతని పట్ల పదార్ధ - అభావనము యొక్క అవబోధనము (అనుభవము) స్వభావసిద్ధమగుచున్నది. ఈ విధంగా ఈతడు ‘పదార్థభావన’ భూమికయందు సంస్థితుడగుచున్నాడు. ఇది ‘‘భౌతికపదార్థ అభావన- ఆత్మ పదార్థ భావన’’ - అను రెండు అభ్యాసములతో కూడిన స్థితి కాబట్టి ‘‘పదార్థభావన’’ అనబడుచున్నది.

(7.) తుర్యగా భూమిక

పైన మనం చెప్పుకొన్న ‘6’ భూమికల చిరకాల అభ్యాసము అవలంబనము చేత - సర్వ భేద దృష్టులు అనుపలంభనము (లేకుండా పోవటం) జరుగుతోంది.
(1) ‘‘జాగ్రత్ స్వప్న సుషుప్తులు నాయొక్క స్వయం కల్పిత లీలా వినోద విహార భూములు కదా!’’ - అను అనుభవము, ఆశ్రయించువాడు ‘‘తుర్యగా భూమిక’’లో ప్రకాశించినవాడుగా చెప్పబడుచున్నాడు.
(2) ‘సకల భూతజాలము తానే’ అగుచున్నాడు.
(3) సకలమునకు సాక్షిగా వేరై కూడా ఉంటున్నాడు.
(4) ‘‘ఈ సమస్తము నేనే। నాయందే। నావలననే’’ - అను కేవలరూప కైవల్యానుభూతి సిద్ధించుకొనుచున్నాడు.

ఎవ్వరు తమ ఆత్మయందే ఈ సర్వమును, సర్వమునందు తనయొక్క ఆత్మయే స్వభావంగా దర్శించుచున్నాడో అది ‘తుర్యగ గతి’ అని పిలుస్తున్నారు. ‘తుర్యగా భూమిక’లో ప్రకాశించినవానికి - తనకు అన్యమైనదంతా స్వకీయ, స్వయం కల్పిత వినోద ప్రదర్శనమే - అగుచున్నది. అయ్యది ‘తురీయానందము’గా చెప్పబడుచున్నది.

భేద - అభేదయుతములు

(1) శుభేచ్ఛ (2) విచారణ (3) తనుమానస
ఈ ‘3’ భూమికలు (1) భేదయుతము (2) అభేదయుతము - అని రెండు విధములుగా ఉంటోంది.

భేదయుతము : ‘ఎరుక’ గల బుద్ధిచే (వేదబుద్ధ్యా) ఈ జాగ్రత్ జగత్తు అంతా దృశ్య మానమౌతోందో, అట్టి ఇదంతా ఆత్మనగు నాకు ద్వితీయము. ఇదంతా అనేక భేదములు కలిగియున్న దృష్టి భేదయుతము (లేక) ద్వైత దృష్టి (భిన్నత్వ దర్శనము).

అభేదయుతము : ఈ జాగ్రత్ దృశ్య ప్రపంచమంతా నవలలో కథా గమనంలాగా నాటకంగా నడుస్తున్న వ్యవహారంగా గమనించటము. ‘‘ఇదంతా ఆత్మకు అభేదము - అను భిన్నత్వంలో ఏకత్వ దర్శనము (అభేదయుతము).

ఈ జగత్తులోని సర్వనామ -రూపములను, సంఘటనలను, సందర్భములను కలలోని వ్యవహారములుగా చూస్తూ ఉండటము తుర్యగము. పశ్యంతి స్వప్నవత్ లోకం తుర్య భూమి సుయోగతః। తురీయ భూమికను సంచారస్థలంగా కలిగి ఉంటూ అఖండాత్మతో సంయోగము సిద్ధించుకున్నవాడై - ‘ఇదంతా కేవలము స్వకీయ స్వప్న సదృశము’…అను భావనతో చూస్తున్నాడు.

శరదృతువులో ఆకాశంలో కనిపించే దట్టమైన మేఘాలు విచ్ఛిన్నమగుతాయి కదా! అప్పటివరకు ఏ ఆకాశ స్థానమును మేఘములు ఆక్రమించుకొని ఉన్నాయో - అదంతా కూడా - మేఘాలు తొలగిన తరువాత - (ఆమేఘములచే ఆక్రమించబడిన) ఆకాశ స్థానము ఏమౌతుంది? మహాకాశంలోనే ఉంటుంది కదా, ఓ నిదాఘా! అభేద దృష్టిచే సమస్త ద్వైతము అద్వైతమునందు (భావనచే) విలీనము పొందినదిగా అగుచున్నది. తుర్యగునికి ఈ సమస్తము నిర్విషయమగు స్వస్వరూపాత్మగా అనుక్షణం స్వానుభవమౌతోంది.

‘సత్’ స్వరూపమగు ఆత్మాకాశమునందు తుర్యగుడు స్వస్వరూపమును ఏకం చేసి తనను తాను ‘సర్వాంతర్యామి - సర్వ తత్త్వ స్వరూపుడు’గా గమనిస్తున్నవాడై, భౌమానందమును ఆస్వాదించుచున్నాడు.

అందుచేత ఓ నిదాఘా! నీవు కేవలము - అఖండము అగు అఖండాత్మాకాశమును స్వస్వరూపంగా భావించటము సుదృఢము చేసుకో. సర్వ ద్వైతములను అద్వైతమునందు విలీనము చేసివేయి.

నిద్రాళు యోగము (లేక) సుషుప్తి యోగము

ఈ జీవుడు మొదటి నాలుగు భూమికలగు ‘శుభేచ్ఛ, విచారణ,తనుమానస, సత్త్వాపత్తి, అసంసక్తి’….లలో సాధన పూర్వకంగా సంచరిస్తూ ఆపై 5వ భూమిక అగు ‘అసంసక్తి’ భూమికలో ప్రవేశించుచున్నాడు కదా! అటువంటి పంచమభూమికయగు అసంసక్తిభూమికలో సంచారములు చేస్తున్నప్పుడు - అది ‘సుషుప్తి పదము’ అని పిలుస్తున్నారు. పరమశాంతమును అవధరిస్తూ, అద్వితీయుడై (ఆత్మగా తనకు ద్వితీయమేలేని భావనచే) - ‘అద్వైత విశేషాంశ’ యందు ఆతడు సుతిష్ఠితుడు అగుచున్నాడు. ‘‘జగత్ విషయములు, భేదములు మొదలే లేవు’’ - అను అంతర - దర్శనమే నిద్రాళుత్వము.

అట్టివాడు బహిర్, వృత్తులను ప్రదర్శించవలసి వస్తూ ఉన్నప్పటికీ, సర్వ సమయ - సందర్భములలో అంతర్ముఖుడై ఉంటాడు. ఆత్మనే సర్వే సర్వత్రా దర్శించుచూ, ‘మమేకము’ అయి ఉంటున్నాడు. ‘జాగ్రత్తు’లో వ్యవహరిస్తూనే ‘గాఢనిద్ర’లో ఉన్నవానివలె సమస్తమునకు అతీతుడై ఉంటున్నాడు. పరమవిశ్రాంతియుతుడై ఉంటున్నాడు. ఇట్టి స్థితిని ‘సుషుప్తి యోగము’గా పిలువబడుతోంది. ఆతనికి బంధువులు, తదితరులు కూడా అభేదమగు అఖండాత్మగా దృశ్యమానమగుచున్నారు.

6వది అగు పదార్థ-భావనా భూమికయందు సర్వవాసనలు జయించి వేసి ‘సమ్యక్ స్థితి’ (All Equality experience)ని పొందుచున్నాడు.

ఇక 7వ భూమికలో అత్యంత గూఢము (రహస్యము), జన్మ - కర్మలకంటే మునుముందే ఉన్న పురాతనమగు స్వస్వరూపమును ఆస్వాదించుచున్నాడు. అట్టి ‘కైవల్యము’ అనబడే సర్వాత్మస్థితి అనిర్వచనీయం. వర్ణనలకు అతీతమగు స్వానుభవము.

⌘ ఎక్కడ అసత్ గాని, సత్ గాని ఉండి ఉండదో….,
⌘ అహంకారమనిగాని, అనహంకారమని చెప్పలేమో….,
⌘ అంతశ్శూన్యో బహిశ్శూన్యోః శూన్య కుంభ ఇవ అంబరే। ఆకాశమువలె అంతరమున శూన్యస్వరూపమో, బాహ్యమునకూడా శూన్యమో, సర్వము శూన్యము (లేనిది)గా అగుచున్నదో…, కుండలో బయట లోపల ఆకాశమే ఉన్నతీరుగా సర్వ దేహములలో లోపల-బయట ఆత్మాకాశమే కనబడగలదో,
⌘ అంతః పూర్ణో బహిః పూర్ణః పూర్ణ కుంభ ఇవ ఆర్ణవే। సముద్రము వలె ఏది అంతర్‌పూర్ణము (మరియు
) బహిర్ పూర్ణమో, సర్వము పూర్ణముగా అనుభవమగుచున్నదో…, నీటిలో మునిగిన కుండ, లోపల-బయట జలము కలిగి ఉండుతీరుగా, సమస్తము ఆత్మయొక్క ఉనికిచే పూర్ణమో…,

అట్టి స్వాత్మారామరూపుడవై ఉండుము. మా భవ గ్రాహ భావాత్మా। గ్రాహకాత్మా చ మా భవ। భావములను గ్రహించవద్దు. త్యజించనూ వద్దు. భావనలన్నీ అధిగమించినవాడవై, అప్పటికే ఏది శేషించుచున్నదో - అట్టి భావనలకు మునుముందే ఉన్న కేవలీ తత్త్వముతో మమేకమై ఉండుము. ‘‘నేను సమస్త భావనలకు మునుముందే ఉన్నట్టి కేవలీస్వరూపుడను’’ అను స్వాభావికానుభవమే ‘‘కైవల్యము’’.

(1) ద్రష్ట (Perceiver) (2) దర్శనము (3) దృశ్యము
ఈ మూడింటిని వాటి వాటి వాసనలు(Tendencies) తో సహా పరిత్యజించి వేసి, దర్శనమునకు మొదలే ఉండి, దర్శనము రూపంగా కూడా (అద్దంలో ప్రతిబింబమువలె) ఉన్న కేవలమగు ఆత్మను, నీయందు నాయందు, సర్వ సహ జనులయందు దర్శిస్తూ ఉపాసించుము. జలములో ప్రతిబింబ దృశ్యమువలె ఆత్మయందు ఈ సర్వము దర్శించుము. సర్వము ఆత్మగా సేవిస్తూ ఉండు. జీవిస్తూనే సర్వమునకు అతీతుడనై, జీవన్ముక్తుడనై విరాజిల్లుము.

జీవన్ముక్తుడు

నిదాఘుడు : జీవన్ముక్తుని యొక్క విశేష లక్షణములను, మాయొక్క మార్గదర్శనము కొరకై వివరించండి.

ఋభువు : జీవన్ముక్తుని యొక్క కొన్ని స్వభావ లక్షణములను మన మన మార్గ దర్శనము యొక్క గుర్తు కొరకై, అనుసరణము కొరకై వివరించి చెప్పుకొందాము. వినండి. ‘‘జీవితము’ - అను సందర్భము, సంఘటనచే నేను బద్ధుడను కాను, పరిమితుడను కాను’’ అను నిశ్చలమైన సందర్భాతీత అవగాహన కలవాడే ‘జీవన్ముక్తుడు’.

ఓ నిదాఘా! ఈ లక్షణములను ప్రతిజీవుడు (బ్రహ్మచారి, గృహస్త, వానప్రస్ధ, సన్యాస - ఇత్యాది) ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా అనుసరించి, స్వాభావికం చేసుకొనుచుండగా క్రమంగా జీవన్ముక్తుడై ప్రకాశించగలడు.

యథాస్థితమ్।

★ ఒక నటుడు తాను నటిస్తున్న పాత్రకు తగినవిధంగా పరస్పర సంబంధములు, సుఖ - దుఃఖములు, గుణములు, స్వభావములు కలిగియున్నట్లు నటిస్తూ ఉన్నప్పటికీ - అవన్నీ బాహ్యానికి నాటకరంగముపై కళాత్మకంగా ప్రదర్శిస్తాడు. అంతవరకే! ఆ సంబంధములు, ఆ సుఖదుఃఖములు, ఆ గుణములు, ఆ స్వభావములు - తనయందు కలిగి ఉంటాడా? లేదు కదా!
★ ఒక కథా రచయిత తాను కథలో రచించుచున్న పాత్రల గుణములు తనవిగా కలిగి ఉంటాడా? అది జరుగదు కదా!
★ పడవ నీళ్ళలో తేలుచూ ఉన్నప్పటికీ పడవలోకి నీళ్ళు రావు కదా!

అట్లాగే,
యథా స్థితమ్ ఇదమ్ యస్య వ్యవహారవతోఽపి చ, అస్తంగతం స్థితం చిత్తం, స ‘జీవన్ముక్త’ ఉచ్యతే।।

ఎవ్వడైతే క్షణక్షణము అనేక వ్యవహారములు నిర్వర్తిస్తూ, నిర్వహిస్తూ ఉన్నప్పటికీ అంతర హృదయాకాశంలో స్వభావతః అతీతంగా సర్వదా యథాతథంగా ఉండి ఉంటాడో - అట్టివాడు ‘జీవన్ముక్తుడు’ అని పిలువబడుచున్నాడు.

యథా ప్రాప్తమ్।

న-ఉదేతి న - అస్తమాయాతి సుఖ దుఃఖే మనః ప్రభా, యధా ప్రాప్త స్థితిః యస్య - ఎప్పుడు ఎక్కడ ఏఏ స్థితి గతులు పొందటం జరుగుచున్నా కూడా, ఎవ్వరి మనసైతే ఇక్కడి సుఖ - దుఃఖ సంఘటనలలో ఉదయించక, అస్తమించక ఉంటుందో, యథాప్రాప్త స్థితులచే పొంగక - కృంగక ఉంటుందో, అట్టి మనస్సు గలవాడు - స ‘సజీవన్ముక్త’ ఉచ్యతే। ‘జీవన్ముక్తుడు’ అని అనబడుచున్నాడు.

నిర్వాసనా - సుషుప్తుడు।

గాఢ నిద్రలో ఉన్నవాడు ఈ ప్రపంచములోని ఏవిషయములోను ‘కించిత్’ కూడా సంబంధము లేనివాడై ఉంటాడు కదా! యో జాగర్తి సుషుప్తి స్థో యస్య జాగ్రత్ న విద్యతే, యస్య నిర్వాసనో బోధః, స ‘జీవన్ముక్త’ ఉచ్యతే। ఎవ్వడి జాగ్రత్ అనుభవమంతా ఆతనిపట్ల సుషుప్తితో సమానమై ఉంటుందో, (అనగా) జాగ్రత్‌లో ఎటువంటి వాసనలు (పుణ్య - పాప - ఇష్ట - అయిష్ట - త్యాజ్య - స్వీకార - కష్ట - సుఖ - ఇత్యాది భావనాపరంపరలు) కలిగి ఉండకయే ప్రవర్తిస్తాడో…., అట్టివాడు జీవన్ముక్తుడు. ఆతని జాగ్రత్తు సుషుప్తితో సమానమై ఉంటుంది. ‘‘ఈ జాగ్రత్‌కు ఆవల సర్వదా కేవల సాక్షిని’’ - అను అవగాహనయందు నిశ్చలుడై, నిశ్చయుడై ఉంటాడో, అదియే ‘‘జీవన్ముక్తి’’. ఆతడు ఒక పాఠకుని వలెనే ఉంటాడేగాని, తాను చదివే నవలలో (దృశ్యములో) ఒక పాత్రగా అవడు.

అంతర్ - స్వచ్ఛత - రాగద్వేషభయాతీతమ్।

రాగ ద్వేష భయాదీనామ్ అనురూపం చరన్నపి, యో అంతః వ్యోమవత్ స్వచ్ఛం। ఎవ్వడు జీవితములోని ఆయా సందర్భములలో అనురాగము, అయిష్టత, ద్వేషము, భయము మొదలైనవి తత్ సందర్భానుసారంగా ప్రదర్శిస్తూ కూడా, అంతరంగములో సర్వదా ఆకాశమువలె స్వచ్ఛత కలిగినవాడై ఉంటాడో, ఆతడే జీవన్ముక్తుడు - స జీవన్ముక్త ఉచ్యతే।।

అకర్తృత్వ - నిర్మలబుద్ధి।

యస్య నాహం కృతో భావో, బుద్ధిః యస్య న లిప్యతే। ఎవ్వడైతే తాను ఏదేది చేయుచున్నప్పటికీ (లేక) చేయకపోవుచున్నప్పటికీ (కుర్వతో - అకుర్వతోవాఽపి) - ‘నేను చేయుచున్నాను. (లేక) చేయలేకపోవుచున్నాను’ - అనురూపముగా ఏర్పడే కర్తృత్వము త్యజించి ఉంటాడో, ఆతని బుద్ధి మహత్తరమగు అవగాహనతో (ఆత్మబుద్ధిగా) నిర్మలమై, సర్వాతీతమై ఉంటుందో అట్టివాడు జీవన్ముక్తుడు.

ఉద్విగ్న రాహిత్యము।

యస్మాత్ న ఉద్విజతో లోకో, లోకాత్ న ఉద్విజతే చ యః। ఎవ్వడు ఈ లోక వ్యవహారములను చూచి సంతోష దుఃఖ భయ ఉద్దేశ్యములను పొందక, ఇతరులను చూచి తాను ఉద్విగ్నత (వెఱపు, చింత) చెందక, తనవలన ఇతరులకు ఉద్విగ్నత కలుగనీయక ఉంటాడో…ఆతడు జీవన్ముక్తుడు. హర్ష-ఆమర్ష-భయోః ముక్తః - స జీవన్ముక్త।

అర్థజాలములలో ప్రశాంతత।

యః సమస్త అర్థ జాలేషు వ్యవహార్యపి శీతళః, పరార్థేషు ఇవ పూర్ణాత్మా। ఎవ్వడైతే ఆయా అనేక ఇంద్రియార్థ విషయములైనట్టి - శబ్ద స్పర్శ రూప రస గంథ విషయములలో వ్యవహరిస్తూ ఉంటూ కూడా, వాటికి సంబంధించిన ప్రియ - అప్రియములు కలిగి ఉండడో, పదార్థముల మధ్యగా వ్యవహరిస్తూ తనయొక్క ‘పూర్ణాత్మత్వము’ను కించిత్ కూడా వీడనివాడై ఉంటాడో - ఆతడు జీవన్ముక్తుడుగా చెప్పబడుచున్నాడు.

సర్వాత్మకే తుష్టః।

ప్రజహాతి యదా, కామాన్ సర్వాం చిత్త గతాన్, మునే! మయి సర్వాత్మకే తుష్టః। ఓ మునీశ్వరా! చిత్తములో రూపుదిద్దుకొనే సర్వ కామములను (All desires, expectations, preconceived notions, pre-requistes etc.,) మొదలంట్లా అంతరమున త్యజించి, ఆ చిత్తమును సర్వాత్మకుడనైన నాయందు ప్రతిక్షేపించి పరమానందమును, తృప్తిని పొంది ఉంటాడో, అట్టివాడు జీవన్ముకుడు.

కేవల చిన్మాత్రమ్।

చైత్య వర్జిత చిన్మాత్రే పదే పరమ పావనే, అక్షుబ్ధ చిత్తో విశ్రాంతః। ఈ మనస్సును కదిలించే ‘చైత్యము’ను వదలి కేవల చిన్మాత్రమును ఆశ్రయించువాడు; తెలియబడేది వదలి; ‘కేవల తెలివి’ని (Absolute knowing) ధారణ చేయువాడు; కదలికలన్నీ త్యజించి ‘కదిలించే కేవల చిత్’ను స్వస్వరూపముగా ఆస్వాదించు అభ్యాసి. చిత్తములోని సర్వదురభ్యాసములు, సర్వ సంశయములు బయటకు వెడలగొట్టి అక్షుబ్ద (undistracted, unperturbed) చిత్తమును ధరించువాడు - అట్టి నిర్విషయ కేవల చిత్తముతో పరమ విశ్రాంతి సర్వదా సొంతము చేసుకొని ఉన్నవాడు- జీవన్ముక్తుడు. (చైత్యము = ఇంద్రియములకు తెలియబడేది. దృశ్య విషయములు)

ఈ జగత్తు స్వప్నమువలె అవాస్తవం

ఈ జగత్తు, ఈ జగత్తులో వేరువేరైన విశేషాలుగా కనిపించే నీవు - నేను మొదలైనవి, ఆయా స్వభావాలు… వీటన్నిటితో కూడి కనిపిస్తున్న ఈ దృశ్యజాతమంతా కూడా కథలోని అరణ్యం, స్వప్నంలోని భవనము, ఊహలోని సుందరి (ఊహాసుందరి) వలె అవాస్తవం. ఎవరి చిత్తము ఇదంతా స్వప్నసదృశంగా దర్శిస్తూ, స్వప్నంవలె మాత్రమే ఎవరి చిత్తమునకు స్ఫురిస్తూ ఉంటుందో, అట్టి చిత్తము కలవాడు జీవన్ముక్తుడు. ఇదం జగత్ అహమ్ సోఽయమ్-దృశ్య జాతమ్ అవాస్తవమ్,-యస్య చిత్తేన స్ఫురతి-స జీవన్ముక్తః।।

ఓ నిదాఘా! ఈ విధంగా మనము జీవన్ముక్తుని లక్షణముల గురించి చెప్పుకున్నాము. నీవు ఆచార్యులు చెప్పుచున్న తత్ - త్వమ్ (You are always that and not merely this)ను శ్రద్ధగా శ్రవణం చేయి. శాస్త్రములు పరిశీలించి ఈ విషయం సుస్పష్టం చేసుకో. సత్ బ్రహ్మణి స్థిరే స్ఫారే పూర్ణే విషయ వర్జితే, ఆచార్య శాస్త్ర మార్గేణ ప్రవిశ్యాశు స్థిరో భవ! అత్యంత సుస్థిరము, సర్వదా ఏర్పడిన స్ఫారము, పూర్ణము, సర్వ విషయములకు అతీతము అగు ‘సత్‌బ్రహ్మము’ నందు నీ చిత్త - మనస్సులను ప్రవేశింపజేయి. ఆత్మస్వరూపముచే సశాంతుడవగుము. మానవుడుగా జన్మించిన అవకాశము సద్వినియోగము అవటము ఇదియే.

సర్వం శివమయమ్

నాయనా! నిదాఘా! ఇదంతా శివమయం! శివాత్ పరతరమ్ నాస్తి! శివునికి వేరుగా అన్యమైనది ఏదీ ఎక్కడా లేదు.
శివుడే శివతత్త్వమును బోధిస్తూ ‘జీవో శివః’, ‘తత్‌త్వమ్’ అను మహత్ వాక్యములను నిరూపించు గురువు. అట్టి గురువే శివుడు।

🙏 శివుడే వేదము-వేదస్వరూపుడు-వేద పురుషుడు కూడా! తెలియబడేదంతా శివస్వరూపమే। తెలుసుకుంటున్నవాడూ శివుడే!
🙏 శివుడే ఈ శరీర నిర్మాణ - దివ్యప్రజ్ఞాస్వరూపులగు దేవతలు. శివుడే దేవదేవుడు।
🙏 సర్వమునకు ప్రభువు, అధినేత, నియామకుడు, ఈశ్వరుడు శివుడే।
🙏 నేను నీవు శివస్వరూపులమే।
🙏 సర్వము శివుడే! శివమే! శివాత్ అన్యత్ న కించన! శివునికి వేరైనదంటూ ఎక్కడా ఏదీ లేదు।

అట్టి శివతత్త్వమును ఎరిగిన ధీరుడు (‘ధీ’శక్తి లేక బుద్ధికుశలత కలవాడు) శివజ్ఞానముచే బ్రహ్మమును ఎరిగిన ‘బ్రాహ్మణుడు’ అగుచున్నాడు. ‘శివోఽహమ్’ - స్వానుభవమును పుణికిపుచ్చుకొనుచున్నాడు.

బ్రహ్మము - బ్రాహ్మణ - ముక్తి

నిదాఘుడు : బ్రహ్మమును ఎరిగి, బ్రహ్మమునే దర్శిస్తూ బ్రహ్మమే తానగుచున్న ‘బ్రాహ్మణ’ శబ్దము గురించి మరికొంత వివరించండి. ముక్తికి మార్గములు ఏమో కూడా దయచేసి చెప్పండి.

ఋభు మహర్షి : బిడ్డా! నిదాఘా! బ్రహ్మమును తెలియజేయుటకై బ్రహ్మజ్ఞులు మనకు శబ్దజాలమును ఉపయోగించి బోధిస్తున్నారు. వాస్తవానికి ఒక్కమాటలో చెప్పాలంటే, ‘నేను’ అను దానియొక్క వాస్తవమగు ఇహ -పర - పరాత్పర - తత్త్వమే ఇదంతా। ఇక్కడ ఒక సూచన.

న అనుధ్యాయాత్ బహూన్ శబ్దాన్।
మహనీయులెందరో వేరువేరు సాంఘిక స్థితులలో అవాక్‌మానసగోచరమగు ఆత్మతత్త్వముగురించి చెప్పటానికి అనేక శబ్దములు ఉపయోగించారు. ఈ విధంగా సాంఖ్యయోగ పూర్వకంగా, ప్రాణోపాసనాపూర్వకంగా, జ్ఞానయోగపూర్వకంగా అనేక శబ్దములన్నీ వాడబడ్డాయి.

అనేకానిచ శాస్త్రాని। కల్పాయుః। విఘ్నకోటయః। అనేక శాస్త్రాలు।
అనేక శబ్దాలు. కాని ఆయుష్షు స్వల్పము. ఇక్కడే, ఇప్పుడే ఆత్మతో అనన్యత్వము సిద్ధించుకోవాలి మరి। అందుచేత శబ్దజాలమును అధికంగా చర్చిస్తూ, వాటి అర్థములపట్ల వేరువేరు అభిప్రాయములను చర్చించుచూ కాలం వృథా చేసుకోవటం ఉచితం కాదు. ఇంకొక విషయం కూడా. వాచో విగ్లాపనం హి తత్! అధికంగా మాట్లాడుకుంటూ ఉండటము ఆత్మానుభవమునకు విగ్లాపనమే అగుచున్నది.

ముక్తికి రెండు మార్గములు

ఇక నీవడిగిన ముక్తి మార్గముల గురించి చెప్పుకుందాము. ముక్తికి మార్గములు రెండు
(1) శుకమార్గముక్తి (సద్యోముక్తి) - విహంగ మార్గము (2) వామదేవ మార్గముక్తి (క్రమముక్తి) - పిపీలికా మార్గము
ముక్తిమార్గములు ఈ రెండే! మూడవది లేదు.

శుక మార్గ ముక్తి : దీనిని ‘సద్యోముక్తి’ అని కూడా అంటారు. (Direct ముక్తి). ఆకాశంలో పక్షి ఏ బంధము లేకుండా హాయిగా విహరించురీతిగా బ్రహ్మాకాశములో విహారముచేయు యుక్తితో కూడిన ముక్తి కాబట్టి ‘విహంగముక్తి’ అని కూడా అంటారు.

ఇట్టి యోగి….,

→ పరతత్త్వము పట్ల వ్యావృత్తి, తీవ్రేచ్ఛను పొందటముచేతను,

→ ఆత్మజ్ఞులగు గురువుల పట్లగల భక్తి శ్రద్ధల వలన, సేవించుచుండుట వలనను,

→ విధి ముఖ్యంగా (విధివిధానంగా) వేదములు సూచిస్తున్న మార్గంలో యజ్ఞ - యాగ - స్థుతి - ఉపాసనలచే బుద్ధి నిర్మలము, సునిశితము, సవిస్తారము అవటం చేతను, నిర్వృత్తిమార్గంగా బ్రహ్మలోకం జేరి బ్రహ్మదేవునిచే ఉపదేశించబడటంచేతను,

→ వేదసారములగు ‘తత్ - త్వమ్ అసి’, ‘అయమాత్మా బ్రహ్మ’, ‘బ్రహ్మ సత్యమ్ - జగత్ మిధ్య’, ‘సోయమాత్మా బ్రహ్మ’, ‘శివాత్ పరతరమ్ నాస్తి’, ‘సోఽహమ్’, ‘అహమ్ త్వమేవ’ మొదలైన మహావాక్యముల పరమార్థము (Finest Meaning) - అంతరార్థము(Inner meaning) లను గురుముఖతః విని, అర్థం చేసుకొని, మననము చేయుచు తనను తాను ఆత్మకు అనన్యంగా అనుభూతపరచుకోవటంచేతను,

→ సాంఖ్యయోగ మార్గంగా చెప్పబడిన పంచభూత, జ్ఞానేంద్రియ - కర్మేంద్రియ - వాటి వాటి విషయ, అంతరంగ చతుష్టయ, జీవాత్మ - ఈశ్వర - పరమాత్మల నిర్వచనములను గురుముఖతః విని ఆకళింపుజేసుకొని పరమసత్యమును స్వస్వరూపముతో ఏకము చేసి ఉండటము చేతను,

→ శ్రవణ (వినటం లేక తెలుసుకోవటం) - మనన (తనకు తానుగా అనుకోవటం) - నిదిధ్యాస (తనకు అనిపించటం) - సమాధి (అదే తానవటం) అనే శ్రవణాది చతుర్విధ ప్రయాణ పరాకాష్ఠ చేతను,

పై ‘ఒకటి’ ‘రెండు’ (లేక) కొన్ని (లేక) అన్నిమార్గముల అంతిమ ప్రయోజనంగా

ఇటువంటి స్వాభావిక - అనుక్షణిక నిశ్చల - నిశ్చిత బుద్ధి స్థితి - శుక విముక్తి మార్గము, ‘ఇప్పుడే ఇక్కడే ఇది ముక్తి!’ అని ఎరిగి, ఇప్పటికిప్పుడే ‘ఆత్మ’తో అద్వితీయమై ఉండటమును ‘సద్యోముక్తి’ లేక ‘శుకముక్తి మార్గము’ - అని అనబడుచున్నది. ‘‘తత్ - త్వమ్ - నీవు సర్వదా బ్రహ్మమే అయి ఉన్నావు’’ - అను వేద వాక్యముపట్ల పూర్ణ విశ్వాసమే సద్యోముక్తి.

వామదేవ మార్గ ముక్తి : ఇది క్రమముక్తి (Step by step and then afterwards Mukthi).

ఎవ్వరైతే యోగాభ్యాసములు విచారణమార్గము, కర్మయోగమార్గము ప్రారంభించి ‘ముక్తి’ని ఆశయముగా కలిగి ప్రయత్నశీలురై ఉంటారో,
‘ముక్తి అనేది ఇప్పుడు ఇక్కడ లభించేది కాదు. అనేక ప్రయత్నముల తరువాత ఎప్పుడో లభించివలసినదే’ - అను అభిప్రాయముతో ముక్తికొరకై అభ్యాసశీలురై ఉంటారో,
అట్టివారు వాసుదేవ మార్గములో (లేక) క్రమముక్తి మార్గంలో ఉన్నట్లు. దీనినే ‘‘పిపీలికా మార్గము’’ (చీమ మధురమైన పదార్థము వైపుగా వెళ్ళుచుండుటమువంటిది) - అని అంటారు. ఈ వామదేవమార్గములో - యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము మొదలైన అష్టాంగ యోగములతోను, పీఠ - అభ్యాసములతోను కూడినవై ఉంటాయి.

ఈ యోగ మార్గములో (1) విఘ్నము (Hurdles) (2) ప్రత్యవాయువు (Side effects) ఉంటాయి.

(1) విఘ్నములు : అనేక విఘ్నాలు కలుగుతూ ఉండి ‘అభిక్రమనాశనము’నకు కారణమౌతూ ఉంటాయి. లక్ష్యము చేరకముందే కలుగు విఘ్నములవలన (1) విరమించటం (2) మరల కొంతకాలం తరువాత కొనసాగించటం (3)మరల విరమించటం (4) మరల కొంతకాలానికి కొనసాగించటం - జరుగుతూ ఉంటుంది.

అయితే ఎవ్వరైతే అష్టాంగ యోగాలను పట్టుదలతో ఆశ్రయించి శ్రద్ధ - దైనందినకాభ్యాసము (Concentration and Regular Practice) వదలరో, అట్టివారు అతి త్వరగా ‘శుకమార్గముక్తి’లో ప్రవేశించుచున్నారు.

సర్వదా సత్యమే జయిస్తుంది. సత్యమేవ జయతే। న అనృతః। లౌకికములైన వాహనము నడుపు విద్యవంటివి వలెనే ఇవి కూడా బద్ధగించక, వెనుకాడక, భయపడక, శ్రద్ధ తగ్గించక నియమానుసారం కొనసాగిస్తూ ఉండగా, ఈ జీవుడు విఘ్నములను తప్పక జయించగలడు.

(2) విపరీత విశేషాలు (ప్రత్యవాయువు) : యమము, నియమము, ఇత్యాది అష్టాంగ యోగములు అభ్యసిస్తూ ఉండగా ఆ యోగాభ్యాసికి ‘అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య, ఇచ్ఛా’ అనబడు అష్టసిద్ధులు ఆశ్రయిస్తూ ఉంటాయి. అవి సమీపిస్తున్నప్పుడు, ‘ఓహో! నేను తదితరులకంటే కొంత ప్రత్యేకత గలవాడిని, కొంత అధికంగా సాధించియున్నవాడిని కదా! ఈ శక్తుల వలన నన్ను జనులలో ప్రత్యేకమైనవాడిగా గుర్తించబడెదరు గాక!’…అను భావనలచే కప్పబడి ఉండు అవకాశము ఉంటూ ఉంటోంది.

సర్వే సర్వత్రా సమమగు ఆత్మభావన (లేక) సమాధి స్థితి - పొందక, ప్రత్యవాయుత్వము (sidelined) ఆ యోగాభ్యాసులు కొంత పొందుతూ ఉంటారు.

నిదాఘుడు : స్వామీ! ప్రాణాయామ ప్రత్యాహార మొదలైన యోగాభ్యాస మార్గంలో ‘అఖండ -నిర్విశేష-సర్వ-సహజ ఆత్మాఽహమ్’ అను ఆత్మాసాక్షాత్కారస్థితి కష్టమని తమ ఉద్దేశ్యమా?

ఋభు మహర్షి : కాదు! అట్టి ‘వామదేవ మార్గము’ లేక ‘క్రమముక్తి మార్గము’లో వచ్చిపోగల విఘ్నములు, నిరోధములు, ప్రక్కబాటల అవకాశముల గురించి కూడా ఇక్కడ ఉదహరించుకుంటున్నాము. అంతవరకే. మనము చెప్పుకొన్న సద్యోముక్తి, క్రమముక్తి - ఈ రెండు కూడా చివరికి ముక్తి స్థానము వైపుగానే ఎక్కుబెట్టబడియే ఉంటాయి.

నిదాఘుడు : మరి యోగాభ్యాసి యోగాభ్యాస - మార్గమధ్యంగా తారసబడిన (1) ధ్యాస విఘ్నములవలన, (2) అణిమాది అష్టసిద్ధుల భౌతిక లౌకిక భావనల వలన(Materially special feeling comparatively with others) ….ఈ రెండిటివలన లక్ష్యశుద్ధి కోల్పోయి, ఆత్మసాక్షాత్కార సిద్ధి పొందలేకపోతాడంటారా?

ఋభువు : ఊహూ! యోగమార్గము కళ్యాణప్రదమే గాని, అశుభప్రదము కాదు. అరిషట్‌వర్గాలు (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు) అశుభ మార్గములు. యోగమార్గమో! మహత్తరమగు శుభప్రదమార్గము. ఇక విఘ్నములు (Failure of concentration) ప్రత్యవాయువులగు అష్టయోగసిద్ధుల మొదలైనవాటి గురించి ఏమిటంటారా? వినండి.

పై విఘ్నముల వలన, (లేక) చాంచల్యములవలన ఒక్క ఉపాధితోనే - ‘పరబ్రహ్మత్వము’ (లేక) ‘లోకములన్నీ నాయందు నాకు అభిన్నమై ఉన్నాయి! నేను అందరియందు ఆత్మస్వరూపుడుగా సర్వదా వెలుగొందుచున్నాను’ - అను ‘ఆత్మజ్యోతిస్వరూప కేవలానుభవము’ సిద్ధించక పోవచ్చునేమో! సమాధి స్థితి చేరలేకపోవచ్చునేమో! అయితే కూడా నష్టం లేదు. ఎందుకంటే… ‘8’ అంగములు గల అష్టాంగ యోగాభ్యాసము ప్రారంభించిన యోగాభ్యాసి ఒక వేళ విఘ్నములవలన అభ్యాసము కొనసాగకపోయినప్పటికీ, యోగాభ్యాసవాసనలు - రుచి మరిగిన పులివలె - అభిరుచి రూపంగా ఆతనిలో దాగియే ఉంటాయి. మరల అదే జన్మలో కొంతకాలము తరువాతనో, (లేక) తదనంతరపు ఉపాధి సందర్భములోనో ‘యోగాభ్యాస సంస్కారము’ తిరిగి ప్రవర్తించ ప్రారంభిస్తుంది. క్రితంసారి ఎట్టి అభ్యున్నతస్థితి పొందాడో, అట్టి స్థానము నుండి మరల యోగాభ్యాసము కొనసాగించుచూ ఉంటాడు. యోగాభ్యాసము యొక్క ఉత్తరోత్తర స్థితులలో అట్టివాడు మహాయోగుల కులములో జన్మలు పొందుతాడు.

అనగా? ఉత్తరోత్తర ఆ యోగాభ్యాసి - శ్రద్ధ, పట్టుదల గల వాతావరణము పొందుతాడు. ఉత్తమమార్గదర్శకులగు గురువులను సమీపిస్తాడు. యోగ మహాశయులకు ఇష్టుడౌతాడు. మహనీయులచే దారి చూపబడుతాడు. మహత్ శాస్త్రముల ఉద్దేశ్యమును బుద్ధితో గ్రహించసాగుతాడు.

పూర్వయోగాభ్యాసము పునశ్చరణ చేసుకుంటూ యోగములో ముందుకు సాగుతూ ఉంటాడు. ఈ విధంగా అనేక జన్మలు యోగాభ్యాస - విఘ్న - పునఃయోగాభ్యాస ప్రయత్నములచే అభ్యాసము వృద్ధి అగుచూ, మార్గదర్శకుల ఆదరణ, అనుగ్రహములను పొందుచూ ‘సర్వాత్మత్వము’ అను పరాకాష్ఠ స్థితి పొందుచున్నాడు.

కాబట్టి వామదేవమార్గము (లేక) క్రమముక్తి పథము కూడా - సద్యోముక్తి స్థానమునకే జేర్చుచున్నది.
సద్యోముక్తుడూ - ముక్తుడే!
క్రమముక్తుడూ - ముక్తస్థానము పొందు మార్గములో ముందుకు వెళ్ళుచున్నవాడే!

అట్టి పరమపదమగు విష్ణుస్థానము ఉభయులు చక్కగా చేరుచున్నారు. అనేక జన్మ అభ్యాసేన వామదేవేన వై పథా, సో - అపి ముక్తిం సమాప్నోతి - తద్విష్ణోః పరమం పదమ్। ‘‘ఈ సమస్తము పరమాత్మయొక్క నివాస స్థానమే! ఈ సమస్త జీవుల వివిధ సంస్కారములన్నీ సర్వాత్మకుడగు వాసుదేవుని లీలా వినోద ఆనంద చమత్కారమే’’ అను సందర్శనమే - ‘‘వాసుదేవపదము’’ లేక ‘‘విష్ణుపదము’’.


ఈ విధంగా బ్రహ్మ ప్రాప్తి రూప శివ పదమునకు (1) సద్యోముక్తి - (ఈ క్షణమే అన్నీ తానై, తనయందే ఈ సర్వము అనన్యంగా చూచుస్థితి) (2) క్రమముక్తి - (జగత్ సంస్కారాలను ఒకటొక్కటిగా దాటివేస్తూ క్రమక్రమంగా ‘‘ఆత్మాఽహమ్ సంస్కారము’’ అను నిత్య - నిస్సందేహరూపంగా సిద్ధింపజేసుకోవటం) - అనే రెండు విశేషములు ఈ జీవునిపట్ల సర్వదా సంసిద్ధమై ఉన్నాయి.

ముక్తి (లేక) సిద్ధి పొందిన తరువాత ఇక మోహమెక్కడిది? (Where is Illusion)? శోకమెక్కడిది? (Where is worry)? అత్ర కోమోహః? కో శోకః? ఏకత్వమ్ అనుపశ్యతః। తన ఆత్మయొక్క తత్త్వము, ఔన్నత్యము స్వానుభవము అయిన తరువాత సర్వభ్రమలు వాటికవే తొలగుతాయి. ఏకత్వమే సర్వత్రా అనుభవము కాగలదు. (సత్యమేవ జయతే।)

ఇక
జీవాత్మ - పరమాత్మ - జగత్తు
జన్మ - మరణము - పునర్జన్మ
లోకేశులు - లోకములు - లోకస్థులు
బంధము - సాధనలు - మోక్షము
ఇహము - పరము - పరాత్పరము
జాగ్రత్ - స్వప్నము - సుషుప్తి
పుణ్యులు - పుణ్యకార్యములు - పుణ్యము
పాపులు - పాపకార్యములు - పాపము
మొదలైన దృశ్యచమత్కార వ్యవహారాలన్నీ తాను రచించి, తానే ఆస్వాదిస్తున్న కథలోని కథన చమత్కారములై, కథా వినోదముగా ఏకత్వము పొందుతారు.

కనుక ఓ నిదాఘా! ఓ తదిత శిష్యులారా! శ్రోతలారా! ఈ సద్యోముక్తి - క్రమముక్తిలలో ఏదో ఒకటి ఆశ్రయించండి. కాదూ, రెండూ ఒక్కసారే ఆశ్రయించండి. మీ ఇష్టం! చివరికి అనేకముగా కనిపించేదానిలో అంతర్లీనమైయున్న ‘ఏకత్వము’ను దర్శించటమును సిద్ధించుకోండి. అదియే ముక్తి. అదియే మోక్షము కూడా!

ఎవ్వడైతే….
ఆత్మానుభవము సిద్ధించేవరకూ (లేక) ఈ సర్వము తన ఆత్మగా నిస్సందేహంగా భావించగలిగే వరకూ…
బుద్ధిని ‘యోగాభ్యాసము’ అనే సాత్త్విక మార్గములో - శ్రమించి అయినాసరే - నియమించి ఉంచుతాడో…,
అట్టివాడు దృష్టికి గోచరించే దృశ్యమంతా దాటివేస్తాడు. సర్వదోషములనుండి, అల్పదృష్టుల నుండి విముక్తుడగుచున్నాడు.

తత్ దృష్టిః గోచరాః సర్వే ముచ్యన్తే సర్వపాతకైః। ఆతడు చూపుచేతనే తదితరులను సర్వదోషములనుండి తరింపజేయగలడు కూడా! ఆతని దృష్టికి భూచరులు (భూమిపై సంచరిస్తూ కనిపిస్తున్న సర్వజీవులు), ఆకాశంలో సంచారములు చేసే దేవలోకములలోని దివ్యప్రజ్ఞ స్వరూపులు, పాతాళాది లోకములలో సంచరించే భౌతిక జీవులు ‘పరబ్రహ్మ స్వరూపమే!’ అగుచున్నారు.

బ్రహ్మవేత్త దృష్టికి అంతా బ్రహ్మమే! సద్య ఏవ విముచ్యంతే కోటి జన్మార్జితైః అఘైః - ఇతి।।

అట్టి సద్యోముక్తుడు ఇప్పుడే, ఇక్కడే బ్రాహ్మీస్వరూపుడై, బ్రహ్మానుభవముచే కోటి జన్మలలోని పాపములను కూడా భస్మము చేసివేస్తాడు.
- భస్మభూషితాంగుడై
- చంద్రశేఖరుడై
- పాలనేత్ర - శూల ధారుడై, శంకరుడై
- ఆత్మసామగానములచే ఆనందించువాడై,
పరమశివానంద స్వరూపుడై సర్వే సర్వత్రా సర్వము నందు సర్వదా సంప్రకాశమానుడై ఏర్పడి ఉంటున్నాడు! ‘‘చిదానంద రూపమ్- శివోఽహమ్’’ - స్ధానమును సిద్ధించుకొంటున్నాడు.


5వ అధ్యాయము - యోగాభ్యాస విధి

నిదాఘుడు: హే ఋభుమహాశయా! భగవాన్! గురుదేవా! ‘యోగాభ్యాస విధి-విధానము’ గురించిన విశేషములు దయచేసి బోధించండి.

ఋభుమహర్షి : యోగాభ్యాసం గురించి కొన్ని విషయాలు చెప్పుకొంటున్నాము. వినండి.

భౌతిక దేహము

మొట్టమొదటగా ఈ భౌతికదేహము గురించి విచారణ చేస్తున్నాము. ఇది పంచభూతాత్మకమైనది. అనగా ఐదు మండలములచే పూరించబడి నిర్మితము అవుతోంది. ‘మట్టి - నీరు - అగ్ని - గాలి - ఆకాశము’ అను ‘5’ వేరు వేరు ధర్మములుగల పదార్థములచే తయారగుచున్నది.

(1) కాఠిణ్యం పృథివీం ఏకాం - కాఠిణ్యము (Solid) - పృథివీ లక్షణము.
(2) పానీయం తత్ ద్రవాకృతిః - పానీయము (Liquid) - ద్రవము ఆకారము.
(3) దీపనంచ భవేత్ తేజః - వెలిగించునది (Light) - తేజస్సు (అగ్ని).
(4) ప్రచారో వాయు లక్షణమ్ - ప్రసరణము (Air) - వాయు లక్షణము.
(5) ఆకాశః సత్వతః - అన్నిటా (Presence) - ఆకాశ లక్షణము.

యోగాభ్యాసమునకు సంసిద్ధపడువాడు ముందుగా ఈ పృథివీ - ద్రవ - తేజో - వాయు - ఆకాశముల (Solid, Liquid, Heat, Vapour, Space) లక్షణములను, (అవి పూరించుటచే జరుగుచున్న శరీరము మొదలుగా) సర్వ వస్తు నిర్మాణముల తీరును తెలుసుకొని ఉండునుగాక. ఇది భౌతికదేహ (పాంచభౌతిక) చమత్కారము గమనిస్తున్నవాడై ఉండు గాక!

వాయు సంచలనము

ఇట్టి భౌతిక శరీరములో ఊపిరి పీల్చటము-విడవటము అనే ఒకానొక ప్రక్రియ ఎల్లప్పుడు చేతనరూపమై జరుగుతోంది. పగలు - రాత్రి కలిపి చూస్తే ఒకరోజుకు ‘21,600’ సార్లు ‘వాయుమండల ఘాతుకము’ (Shock touch of air) రూపముగా ఊపిరి ప్రవర్తిస్తోంది.
అట్టి ఊపిరి ఏ ‘శక్తి’తో ఈ విధంగా ప్రవర్తనశీలమగుచున్నదో - అట్టి ‘శక్తి’ని ‘ప్రాణశక్తి’ అని అంటున్నారు.

దేహి

ఈ దేహమును ధరించువాడు, ధారణ చేయువాడు (లేక) దేహము కలవాడు → ‘దేహి’ అనబడుచున్నాడు. ఆ దేహినే ‘‘జీవితమును పొందుచున్నట్టి జీవుడు, జీవాభిమాని’’ అని కూడా చెప్పుకొంటున్నాము. అట్టి ఈ శరీరి (లేక) జీవుని పట్ల → దేహము జీవితము రూపంగా ఒకప్పుడు జనించి, వృద్ధిచెంది మరొకప్పటికి నశించుచున్నది. దేహము వృద్ధి చెందుచున్నప్పుడు ఈ దేహములో పృథివీమండలము (Solid Zone) కూడా వృద్ధి చెందుతోంది. పృథివీతత్త్వము(Solidity) క్షీణిస్తూ ఉండగా క్రమంగా శరీరము ముడుతలు పడసాగుతుంది.

అట్లాగే శరీరములో జలతత్త్వము క్షీణిస్తూ ఉండగా వెంట్రుకలు నెఱవటం (తెల్లబడటం) ప్రారంభమగుచున్నది. అగ్ని (లేక) తేజస్సు తరుగుచున్నప్పుడు - తేజః క్షయే క్షుదా, కాంతిః నశ్యతే - ఆకలి తగ్గసాగుతుంది. కాంతి క్షీణించసాగుతుంది. వాయుచలనము యొక్క వేగము తరుగుచుండగా శరీరములోని అనేక ప్రదేశములలో వణుకు (Shivering) ప్రారంభమౌతుంది. కంపనములు కనిపించసాగుతాయి. ఆకాశముతో సంబంధము త్రెగుచుండగా ఒక రోజు ఈ శరీరమే నశిస్తుంది. ఈ విధంగా పంచభూతములచే ఈ భౌతిక శరీరము పరిరక్షించబడుచు, పర్యవేక్షించబడుచూ, వాటి ఉపసంహారముచే శరీరమే నశించిపోవుచున్నది. పంచభూతములు వాటి వాటి స్వస్థానములు చేరుచున్నాయి. ఈ విధంగా భూతధారణ - భూతక్షయము రూపంగా శరీరము నిర్మితమవటము, కొనసాగించటము, నశించటము కూడా జరుగుచూ ఉన్నది.

ఉడ్డియాణం

ఇటువంటి ఆయా కొన్నిపాళ్ళ పంచభూములచే ఆకారము పొందుచున్న ఈ భౌతిక శరీరములో ఒకానొక మహత్తరశక్తి వాయువును సంచాలనము చేయుచుండుటచే ఈ భౌతికదేహము క్రియాశీలకమై ఉంటోంది. ఆకాశంలో తన ఇష్టము వచ్చిన రీతిగా సంచరించు పెద్ద పక్షి (మహాఖగము) వలె ప్రాణశక్తి శరీరముతో అవిశ్రాంతంగా సంచాలనము చేయుచున్నది. అట్టి ప్రాణ సంచలనముము యోగ సాధనలచే నిశ్చలము చేసియుంచటమును (కుంభక ప్రాణాయామమును), ఊర్ధ్వముఖము చేయటము - ‘ఉడ్డియాణబంధము’ అని అంటున్నారు. ఉడ్డీయాణో హి అసౌ బంధో, మృత్యు మాతంగ కేసరీ। అట్టి ‘ఉడ్డియాణబంధము’ అనబడు ‘కుంభక ప్రాణాయామము’ - మృత్యువు అనే ఏనుగుకు సింహనాదము వంటిది. ప్రాణాయామాభ్యాసముచే, ఈ జీవుడు నశించే స్వభావము కలిగినట్టి ఈ పాంచభౌతిక దేహమునకు వేరైన ‘ముక్తి తనువు’ను సిద్ధింపజేసుకుంటున్నాడు. సర్వబంధములనుండి విముక్తుడగుచున్నాడు. అట్టి భౌతిక దేహమును సంబంధించక, ప్రజ్ఞ (లేక) బుద్ధికి మాత్రమే అనుభూతమగు నిత్యముక్త స్వస్వరూపమే - ముక్తిదేహము!


నిదాఘుడు : యోగాభ్యాసమునకు సంబంధించిన సరీయిన సమయము జాగరూకతలు, యోగము నిర్వర్తించు విధానము గురించి ఇంకనూ కొంత వివరించండి.

ఋభువు : ముందుగా కొన్ని సూచనలు :
ఒకడికి బాగా ఆకలి వేస్తూ ఉన్నప్పుడు, యోగం గురించి ఆలోచనలు వస్తాయా? రావు. ఆహారం గురించే ఆలోచనలు వస్తాయి. అగ్నౌతు చలితే కుక్షౌ వేదనా జాయతే భృశమ్।

అదేవిధంగా మలమూత్రముల విసర్జించాలనే వేదలో ఉన్నప్పుడు కూడా యోగం గురించిన ఆలోచనలు రావు కదా! న కార్యా క్షుధితే నాపి, నాపి విణ్మూత్ర వేగినా! కాబట్టి పొట్టలో జఠరాగ్ని జ్వలిస్తున్నప్పుడు, మల - మూత్ర విసర్జనల వేదన ఉన్నప్పుడు తప్పితే, ఇక తక్కిన సమయములన్నీ యోగాభ్యాసమునకు అర్హమే.

యోగాభ్యాసానికి ‘ఆహారము’ సానుకూల్యమై ఉండాలి. ‘హితం మితం చ భోక్తవ్యం స్తోకం స్తోకం కధా అవే’!

శరీరానికి హితమైనవి స్వీకరించబడును గాక. సాత్వికాహారము ఉచితము. మితముగా భుజించాలి. కొంచము కొంచముగా రోజులో ఎక్కువసార్లు భోజనము స్వీకరించటం యోగాభ్యాసానికి సానుకూల్యము.

మంత్ర ఉచ్ఛారణ : ఇష్టదైవ మంత్రమును మృదువుగా, మధురముగా ఉచ్ఛరిస్తూ ఉండాలి. అర్థ - పరమార్థములను కూడా గురుముఖతః తెలుసుకొని, అర్థమున భావన చేస్తూ పలకాలి. (1) మంత్రాక్షరముపై, (2) మంత్రనాదముపై, (3) మంత్ర దేవతపై, (4) మంత్రార్థముపై, (5) తనపై - ‘గురి’ (faith) తో మంత్రోపాసన చేయాలి.

క్రమంగా హఠంగా మంత్రోచ్ఛారణను అర్థభావనయందు లయింపజేయాలి. అర్థమును మాత్రమే అర్థయుక్తంగా భావన చేయాలి. అర్థమును కేవలమగు స్వస్వరూపమునందు ‘లయం’ చేయాలి. లయ మంత్ర హఠమే యోగము. శబ్దముయొక్క అవసరం లేకుండానే మంత్రముయొక్క మహదార్థభావన - ఉత్తరోత్తర దశ.

అష్టాంగ యోగములు

యోగము = ఆత్మతో సంయోగము. ఏకత్వము అనన్యత్వము. అట్టి ‘యోగము’ అను కార్యక్రమమునకు అంగములు - ‘8’.
(1) యమము (2) నియమము (3) ఆసనము (4) ప్రాణాయామము (5) ప్రత్యాహారము (6) ధారణ (7) ధ్యానము (8) సమాధి

Ⅰ. యమము - 10 అంగములు (దృశ్యము నుండి ధ్యాసను వెనుకకు మరల్చటము)

(1) అహింస = వాక్ - మనో - కాయములతో సహజీవులను బాధించకుండటం. తనవలన తదితరులకు సానుకూల్యత కలిగించటం. (పరోపకారార్థమ్ ఇదమ్ శరీరమ్)
(2) సత్యమ్ = సత్యవస్తువగు ఆత్మ జ్ఞానము పట్ల (యమ్ సత్) - ధ్యాస, లక్ష్యశుద్ధి.
(3) అస్తేయం = తనది కానిది ఆశించకుండటము. దొంగిలించే స్వభావమును దగ్గరకు రానీయకపోవటము.
(4) బ్రహ్మచర్యము = బ్రహ్మమును ఎరుగుటయందు విద్యార్థిత్వము కలిగియుండి, ఆచార్యులను ఆశ్రయించటము.
(5) దయ = తదితరులకు సహాయకుడై తాను చేయగలిగింది చేయాలనే భావన. ఇతరులపట్ల దయ, ప్రేమ, స్నేహభావము కలిగి ఉండటము.
(6) ఆర్జవము = కుటిలముగా ఉండకపోవటం. అనుకున్నదే చెప్పటం. చెప్పినదే చేయటం.
(7) క్షమ = తాను తన ఇష్ట దైవము నుండి ఏ విధంగా క్షమించమని వేడుకొంటాడో, ఆ రీతిగా ఇతరుల పట్ల క్షమించు గుణము, స్వభావముగా కలిగి ఉండటము.
(8) ధృతి = పిరికితనమును వదలటము. ‘జన్మ - జరా మరణాదులకు విషయమే కానట్టి ఆత్మయే నేను కదా!’ అను శాస్త్ర సంబంధిత సత్యమును దృష్టిలో పెట్టుకొని, సర్వదా ధైర్యము వహించి ఉండటము.
(9) మితాహారము = ఇంద్రియములను మితముగా లోకములో, ఉపయోగించటం. అతిగా ప్రాపంచక విషయములవైపు ఉద్దేశ్యించక పోవటం. మితముగా భుజించటం.
(10) శౌచము = శుచి అయిన సాత్విక భావాలు కలిగియుండటం (Opimistic about others and about live events. Positive approach)

ఇవి ‘యమ - దశకము’ అనబడుచున్నాయి.

Ⅱ. నియమ - దశకము (ఇంద్రియములను నియమించటము)

(1) తపస్సు : తపస్సుయొక్క అభ్యాసముచే చిత్తము పరిశుద్ధమౌతుంది. పరమాత్మ కొరకై, బ్రహ్మజ్ఞానముల కొరకై తపనయే తపస్సు. ఇంద్రియములను భక్తి-జ్ఞాన-వైరాగ్యములందు నియమించటమే తపస్సు.
(2) సంతోషము : మానవజన్మ లభించినందుకు, బంధు-మిత్ర - ఇత్యాదులు ప్రసాదించినందుకు పరమాత్మ పట్ల సంతోషము ప్రకటించుచుండటము. సంతోషము ఒక అలవాటు. అసంతృప్తి ఒక దురలవాటు.
(3) ఆస్తిత్వము : ఈ దేహమును పరిపోషించుచు, పరిరక్షించుచున్న దివ్యమగు ప్రకృతి రచయితయగు పరమాత్మ యొక్క ఉనికిని జ్ఞాపకము పెట్టుకొని ఉండటము. ఈ దేహము పరిరక్షించబడటములో దివ్యశక్తి స్వరూపులగు దేవతల సహకారమును గమనిస్తూ, కృతజ్ఞులై ఉండటము.
(4) దానము : తనకు పరమాత్మ ప్రసాదించిన దానిలో కొంతభాగము తిరిగి పరమాత్మకు సమర్పించటము. తదితరుల కొరకై విభాగించి ఉద్దేశ్యించటము. దానము చేయుటలో ఉత్సాహము. ‘ఇతరులకు నేనేమి మంచి చేయగలను’ - అనే సప్రయత్నపూర్వకమైన తపన.
(5) ఈశ్వర పూజనమ్ : చూపు-వినికిడి-పలకటము మొదలైన అన్ని ఇంద్రియ వ్యవహారములను ఈశ్వరారాధనకై ఉద్దేశ్యించటము.
(6) సిద్ధాన్తశ్రవణము : తత్త్వమ్, సోఽహమ్, ‘త్వమ్ శివేతి’ ఇత్యాది మహావాక్యముల అర్థములను, ఆత్మ తత్త్వ సిద్ధాంతములను శ్రవణం చేయటం. మననము చేస్తూ, ఏమరువకపోవటము.
(7) హ్రీ : పెద్దల, పూజ్యుల, విజ్ఞుల సమక్షంలో ‘నేనెంతటివాడిని?’ - అనే సిగ్గును స్వభావముగా కలిగి ఉండటము.
(8) మతి : అవివేకమును విడనాడి, వివేచనతో అర్థము చేసుకొనటము. (వివేచయంతి విబుధః, వివదన్తి అవివేకినః!)
(9) జపము : భగవన్నామ జపము. భజన.
(10) వ్రతం : శాస్త్రములు సూచించే వ్రతములు, నియమమలు గౌరవించటం.

ఇవి ‘నియమ దశకము’ అనబడుచున్నది.

Ⅲ. ఆసనము :

ధ్యానము చేయునప్పుడు శరీరమునకు సానుకూల్యముగా ‘కూర్చొను విధానము’ - ఆసనము. అతిదీర్ఘ కాలము ఇబ్బంది లేకుండా, నిశ్చలముగా, సులువుగా ఉండునదే సుఖాసనము. కొన్ని శాస్త్ర ప్రవచితమైన ఆసనములు, యోగవేత్తలచే బోధితమై ఆసన విశేషయములు లోకప్రసిద్ధమై ఉన్నాయి.

(1) చక్రాసనము (2) పద్మాసనము (3) కూర్మాసనము (4) మయూరాసనము (5) కుక్కుటాసనము (6) వీరాసనము (7) స్వస్థికాసనము (8) భద్రాసనము (9) సింహాసనము (10) ముక్తాసనము (11) గోముఖాసనము

చక్రాసనము - సవ్య ఊరు దక్షిణే గుల్ఫే దక్షిణం దక్షిణేతరే, నిదధ్యాత్ రుజుకాయస్తు - ‘చక్రాసనం’ - ఇదం మతమ్।।
- ఎడమ తొడపై కుడి చీల మండలమును ఆన్చి,
- కుడి తొడపై ఎడమ చీలమండలమును ఆన్చి,
- పృష్ఠభాగమును, నడుమును, మెడను, తలను నిఠారుగా ధారణ చేసి,
- కొండ నాలుకకు సూటిగా శిరో ఉపరిభాగమునగల బ్రహ్మరంధ్ర స్థానము వరకు నిట్టనిలువుగా ధారణ చేస్తూ యోగాభ్యాసము నిర్వర్తించటము, (మరియు) ధ్యాసను త్రిపుటిలో నిపిలి ఉంచటము.
(తదితర ఆసనముల గురించి వేరు ఉపనిషత్తులలో సవివరంగా చెప్పబడినది)


బ్రహ్మనాడీ స్పర్శ - శివైక్యోపాసన

ప్రాణాయామము అను యోగాభ్యాసముచే
‘కుండలిని’ అను శరీరములోని మూలాధార ప్రదేశములో నిదురిస్తున్న శక్తిని యోగాగ్నిచే ఉత్తిష్ఠింపజేసి (Waking up, inspiring and keeping the same actively as moving),
సుషుమ్న అను వెన్నెముకలోని తేజోనాడి ద్వారా చక్రములను, గ్రంథులను దాటించి,
సుషుమ్నయొక్క చివ్వరగా, కపాలము యొక్క ఊర్ధ్వప్రదేశమున (కొండ నాలుకకు ఊర్ధ్వంగా, సూటిగా-కపాలమునకు ఊర్ధ్వముగా గల ‘సుషిరము’ - అనబడు దేహములోని 10వ రంధ్రమును (బ్రహ్మరంధ్రమును) సమీపింపజేసి,
కుండలినీ స్పర్శచే చివరగా మూసికొనియన్న సూక్ష్మ (సుషిరగ) రంధ్రమును (లేక) బ్రహ్మరంధ్రమును తెరిపింపజేయటము.


Ⅳ. అష్టాంగ యోగములలో 4వది అగు ప్రాణాయామము

ప్రాణాయామ యోగాభ్యాసముతో ప్రాణములను కదిలించు మూలశక్తిని (ప్రాణతత్త్వమును) ఉపాసించు మార్గము ఈ విధంగా ఉన్నది.

శ్లో।। పూరకః కుంభకః తద్వత్ రేచకః పూరకః పునః
ప్రాణాయామః స్వనాడీభిః తస్మాత్ నాడీ ప్రచక్షతే।।

ప్రాణాయామము 4 ప్రక్రియలతో కూడుకొని యున్నది.

(1) పూరకము → కుడి ముక్కు పుటమును కుడి బొటనవ్రేలుతో మూసి ఉంచి, ఎడమ ముక్కుపుటతో లోనికి గాలిని పీల్చి గుండెను వాయువుతో పూరించటము.

(2) కుంభకము → ఎడమముక్కు పుటను కుడిచేతి ‘అనామిక- కనిష్ఠిక’ అనబడు కుడిచేతి చివరిరెండు వ్రేళ్ళతో మూసి ఉంచి వాయువును (i) భౌతికముగా గుండెనిండా (ii) సంకల్పముచే శరీరమంతా - నిశ్చలము చేసి దీర్ఘంగా ధారణ చేయటము.

(3) రేచకము → లోనికి పీల్చిన గాలిని కుంభక ధారణానంతరము కుడిముక్కుపుట ద్వారా నెమ్మదిగా, పూర్తిగా బాహ్యమునకు వదలటము

(4) పునఃపూరకము → కొంతసేపు గుండెను గాలి లేని విధంగా ధారణ చేసి తిరిగి రెండు పుటముల ద్వారా గాలి పీల్చటము
రెండవమారు పై 4 పూరక - కుంభక - రేచక - పునఃపూరకములను ఎడమ ముక్కు పుట మూయుట - కుడి ముక్కుపుటము ద్వారా పీల్చుట - తిరిగి ఎడమముక్కు పుటము ద్వారా వదలటము - కుడిచేతి చివరి రెండు వ్రేళ్ళను - కుడి బొటనవ్రేలును ఉపయోగించి పైవిధంగానే నిర్వర్తించటము - ఇది ప్రాణాయామ ప్రక్రియ - అనబడుతోంది.

అటువంటి ప్రాణాయామాభ్యాసమును రోజుకు 4 సార్లు (క్రమంగా ఎక్కువసార్లు) నిర్వర్తిస్తూ ఉండగా ఆ యోగాభ్యాసి యొక్క నాడులన్నీ ఉత్తేజము, ప్రత్యుత్సాహము పొందుతాయి.

నాడుల గురించిన మరికొన్ని ప్రత్యేక విశేషాలు

శరీరం సర్వ జంతూనాం షట్‌నవత్ (96।।) - అంగులాత్మకమ్। సర్వజీవులకు వారివారి ‘శరీరము యొక్క పరిమాణము’ వారి బొటనవ్రేలు పరిమాణమునకు ‘96’ బొటనవ్రేళ్ళంత ఉండటం జరుగుతోంది.

అట్టి ఈ భౌతిక శరీరములో మధ్యగా - (తన్మధ్యే),

పాయుదేశాత్తు ద్వాంగులాత్ పరతః। గుదస్థానము 2 అంగుళములపై వైపుగా,
పరమ్ మేఢ్రదేశాత్ అధస్మాత్తు ద్వయ అంగులాత్। మేఢ్రమునకు (లింగాంగమునకు (లేక) పొత్తి కడుపుకు 2 అంగులములు క్రిందుగా మధ్య ప్రదేశము అని అంటారు.

నాడీకందము

మేఢ్రాత్ నవ (9) అంగులాత్ ఊర్ధ్వం ‘‘నాడీనాం కందమ్’’ ఉచ్యతే। అట్టి మేఢ్రము (పొత్తికడుపు మధ్య) నుండి 9 అంగుళములు ఊర్ధ్వంగా (పొట్టవైపుగా) ‘నాడీకందము’ ఉన్నది. ఈ నాడీకందము 4 అంగుళముల ఎత్తు, 4 అంగుళముల విస్తారము (పొడవు) కలిగి  🥚   అండము (గ్రుడ్డు) ఆకారంగా ఉంటుంది. ఈ నాడీకందము చుట్టు మేదస్సు (క్రొవ్వు), మజ్జ (నూనె పదార్థము వంటిది), బొమికలు, రక్తము మొదలైన ధాతువులన్నీ పరివృతమై (చుట్టుకొని) ఆవరించి ఉంటున్నాయి. తత్రైవ నాడీ చక్రం తు ద్వాదశారం ప్రతిష్ఠితమ్। అట్టి నాడీ కందములో 12 (ఆకులవంటి) రేకులు (ఆరములు) ప్రతిష్ఠితమై ఉన్నాయి.

కుండలినీ శక్తి

శరీరం ధ్రీయతే యేన, (యేన) వర్తతే తత్ర ‘కుండలీ।’
- దేనిచేత (ఏ శక్తి, సంకల్పములచేత) ఈ శరీరము - ధ్రియమాణేన - ధరించబడుచున్నదో, భరించబడుచున్నదో,
- ఏ శక్తి చేత జడమగు ఈ ‘దేహము’ అనే వస్తువు వర్తించగలుగుచున్నదో …అదియే ‘కుండలినీశక్తి’.

ఈ శరీరము మొట్టమొదట ధరిస్తూ ఉన్నప్పటి ప్రారంభ శక్తి స్థానమే ‘‘మూలాధారము’’. కుండలినీశక్తీ దేవి - శరీరము ధరించబడుచోట - మూల ప్రదేశంలో ప్రకృతిసిద్ధంగా వేంచేసి ఉండటం వలన ‘మూలాధారి’ అని కూడా పిలుస్తారు. (మూలాధారే హుతవహ కళా విసృతా భూర్బువస్సువః - మూలాధారమునందు వేంచేసియున్న ‘కళా స్వరూపి’ అగు కుండలినీ శక్తి దేవియే భూ-భువర్-సువర్ లోకములుగా విస్తరించి యున్నది).

సుషుమ్ననాడి

శరీరములోని నాడీ కందమునుండి అనేక నాడులు, ఉపనాడులు బయలుదేరి శరీరములోని మూలమూలలకు విస్తరించి, ఈ శరీరములో అనేక వ్యవహారములు జరుగుచూ ఉండటానికి కారణభూతమౌతున్నాయి.

నాడీకందము (Electrical Energy Transformer వంటిది)
నాడులు (Electronic Energy Travelling వంటివి)
కుండలిని (Electricity Energy వంటిది)

ఆ విధంగా శరీరములోని నాడీ కందమునుండి బయల్వెడలుచున్న అనేక నాడులలో ఒకానొక తేజోపుంజములతో కూడిన నాడి. అది అగ్ని - చేతనమగునాడి. ఆ నాడి వెన్నెముక మధ్య నుండి మెడ, ఫాల భాగములను దాటి - కపాల ఊర్ధ్వమున మూసివేయబడియున్న బ్రహ్మరంధ్రము వరకు విస్తరించియున్నది. ఇది ‘సుషుమ్ననాడి’ అని యోగశాస్త్రముచే పిలువబడుచున్నది.

బ్రహ్మరంధ్రం సుషుమ్నాయా వదనే పిధాయసా! ఈ ‘సుషమ్న’నాడి తనయొక్క ఊర్ధ్వముఖముచేత శిరస్సుకు ఉపరిప్రదేశములో బిందురూపమున గల ‘బ్రహ్మరంధ్రము’ను మూసివేసినదై ఉంటోంది.

సుషుమ్ననాడిని వెంటనంటినవై ‘అలంబుస’, ‘కుహు’ నాడులు.
- లోపలివైపుగా ‘వారుణి’, ‘యశశ్విని’ నాడులు.
- కుడివైపుగా (దక్షిణం)గా ‘పింగళ’ నాడి.
- దానికి తదనంతరంగా ‘పూషా’ ‘పయశ్వనీ’ నాడులు.
- సుషుమ్నకు పశ్చిమంగా ‘సరస్వతీ’ నాడి.
- దానిని అనుసరించి ‘శంఖినీ’,’గాంధారీ’ నాడులు.
- సుషుమ్నకు ఉత్తరంగా ‘ఇడ’ నాడి - ఉత్తరే తు సుషుమ్నాయా ఇడాఖ్యా నివసత్యసౌ।
- అద్దానిని అనుసరిస్తూ ‘హస్తిజిహ్వ, విశ్వోదరీ’ నాడులు.

ఈ ఈ మొదలైన నాడులన్నీ ఉన్నాయి.

ఈవిధంగా అలంబుస-కుహు-వారుణీ-యశశ్వినీ-పింగళ-పూస-యశశ్వినీ- సరస్వతి-శంఖినీ-గాంధారీ-ఇడ-హస్తిజిహ్వ…ఈ 12 ముఖ్య నాడులు శరీరములోని అనేకచోట్లకు వాయువాహకములు (Carrier of Air- Pranasakthi). ఇవన్నీ నాడీ కంద చక్రము యొక్క ఆకులలో (ఆకులలో ఈనెలవలె) విస్తరించి ఉన్నాయి. పురుషుడు వస్త్రము ధరించురీతిగా ఈ నాడులన్నీ నాడీ కందముచే ధరించబడుచున్నట్లుగా ఉంటున్నాయి. ఈనాడీ పటము మధ్యగా ఉన్నదే ‘నాభీచక్రము’గా యోగశాస్త్ర ప్రసిద్ధము.

కుండలినీ శక్తి - మరికొన్ని విశేషాలు

ఈ కుండలినీ శక్తి ఇచ్ఛ - జ్ఞాన - ప్రజ్ఞా స్వరూపిణీదేవి. ‘విశ్వస్వరూపిణి’ కూడా. తనయందు నాదము ధారణగా కలిగియున్నట్టిది. ‘నాదరూపిణి’గా ప్రకాశిస్తూ ఉన్నట్టిది.

సుషుమ్ననాడిని ‘పరనాడి’ అని కూడా అంటారు. ఇది పరరంధ్రము (బ్రహ్మరంధ్రము) వరకు విస్తరించి ఉన్నది. ఈ సుషుమ్న నాలుగు రత్నములచే పూరింపబడి ఉన్నది. (4 చక్రములతో ప్రకాశమానమై ఉంటోంది). ఈ సుషుమ్నయే బ్రహ్మరంధ్రమును (సుషిరిగమును) మూసి ఉంచుతోంది.

ఈ నాడులన్నీ (పంచ ప్రాణ - పంచ ఉపప్రాణ) దశ వాయువులచే పూరింపబడి ఉంటున్నాయి.
యోగాభ్యాస విచక్షణులు (Experts) - (1) నాడీగతి (2) దశవాయుగతులను (3) ఎరిగినవారై, సాక్షీభూతంగా బుద్ధితో గమనిస్తూ ఉంటున్నారు.

యోగభ్యాస విధి - విధానము

Ⅰ. యోగ విధి : యోగాభ్యాసరతుడైన యోగి

అప్పుడిక

Ⅱ. సమగ్రీవ శిరః కాయః - మెడను, శిరస్సును, కాయమును నిలువుగా సునిశ్చలముగా నిలిపి,

Ⅲ. నాసాగ్రంలోను (ముక్కుకు పై భాగం - ఆజ్ఞా చక్రస్థానం లోను) హృదయ స్థానములోను బిందువులను గుర్తించును గాక!

Ⅳ. అట్టి బిందువుల మధ్య నుండి స్రవించి ‘జాగ్రత్ స్వప్న సుషుప్తుల సాక్షీస్వరూపము’ అగు ‘తురీయము’ నందు ‘అమృతత్వము’ (The Changeless self) దర్శించుచూ ఉండునుగాక!

ఇంకా…

మరికొంత ఊర్ధ్వంగా ‘ప్రాణము’తో (లోనికి వచ్చుచున్న గాలితో) ఏకము చేయు ధారణ. జన్మలకు - కర్మలకు మునుముందే ఉండి ఉన్నట్టి, మార్పు చేర్పులకు విషయమే కానట్టి అమృతస్వరూపమగు, సర్వశ్రేయములకు ఆలవాలమగు (శ్రియమ్) ‘‘స్వాత్మ’’ను ధ్యానిస్తూ ఈవిధమైన యోగాభ్యాసము నిర్వర్తించును గాక! అట్టి స్వస్వరూపాత్మ కాలముచే పరిమితము కాదు. ఎందుకంటే స్వాత్న త్రికాలములలో ఏకరూపము, యథాతథము, సర్వము కూడా అయి ఉన్నది. ఆత్మకు వేరుగా ఏదైనా ఉంటే అది మిథ్యయే.

అందుచేత ‘ఆత్మ సర్వమునకు ఆవల అత్యంత ముఖ్యమైనది’ అని, (‘బ్రహ్మము’ అని) ఆత్మజ్ఞులు ఎలుగెత్తి చెప్పుచున్నారు.

కుండలినీ యోగాభ్యాసము = ప్రాణ-అపానముల ఏకధారణచే జనించు అగ్నితో మూలాధారములోని కుండలినీ శక్తిని నిదురలేపి, సుషుమ్న నాడిలో ప్రకాసింపజేసి బ్రహ్మరంధ్రమును సమీపింపజేయటము.

కుండలినీశక్తితో బ్రహ్మరంధ్రము యొక్క ముఖద్వారము తెరచు యోగాభ్యాసికి సమస్తము సుసాధ్యమే అవగలదు.

ఎవ్వడు అఖండము, ఏకము, సర్వము అగు ఆత్మతో ‘‘అదియే నేను! సోఽహమ్’’ అను స్వాభావిక - నిశ్చలబుద్ధిని అనుక్షణికంగా సిద్ధింపజేసుకొని ఉంటాడో →

ప్రాణాయామ యోగాగ్ని

మార్గే బిన్దుం సమాబధ్య → శరీరములో స్వతంత్రముగా ప్రాణ - అపాన మార్గములను (The Inward coming Air and the outward going Air as a routine in the usual course) బిందువు వద్ద సమముగా బంధించి (By binding them both at one point) → కుంభకప్రాణాయామము నిర్వర్తిస్తూ…,

వహ్నిం ప్రాజ్యాల్య జీవనే → జీవశక్తి స్వరూపమగు అగ్నిని ప్రజ్వలింపజేసి…,

శోషయిత్వాతు సలిలం = దేహములో అనేకచోట్ల పేరుకొనియున్న ‘జలతత్త్వము’ను శోషింపజేసి (చెమట మొదలైనవాటిచే అధిక జలమును దేహమునుండి బయల్వెడలుచుండగా),

అట్టి ‘ప్రాణ-అపాన సమత్త్వ- అగ్ని జనిత యోగము - సలిలశోషణము’ లచే ఈ దేహము ఎంతో దృఢతరమౌతుంది.
ఈ విధంగా ప్రాణాయామము అభ్యసిస్తూ ఉండగా శరీరంలో ప్రాణ - అపానములు ‘కుంభకము’ సమయంలో సమత్వము పొందుతూ, దేహంలో తేజస్సు (అగ్ని) వృద్ధి అగుచున్నది. దేహము తేజోమయమౌతుంది. చెమట అధికంగా ప్రదర్శనమౌతుంది. అట్టి విశేషములచే దేహము ఉత్సాహ-బల-ఆరోగ్య సమన్వితము కూడా అవుతూ వస్తుంది.

అపాన ఊర్ధ్వయానము

యోగాభ్యాసంలో మరొక ప్రత్యేకత గల యోగసాధన గురించి మనము ఇప్పుడు చెప్పుకుంటున్నాము.

(1) గుద యోని వద్ద ధ్యాస (concentration)ను నిలిపి ఉంచటము.

(2) బయటకు ప్రవహించు ధర్మమును నిర్వర్తిస్తున్న వాయువును (అపానప్రాణమును) వెనుక మరల్చు ‘అకుంచన-అభ్యాసము’.

ఈ రెండూ ఒకే సమయంలో నిర్వర్తించటము.

(3) అటు తరువాత అపానమును → దేహమంతా సమముగా ఏర్పడియున్న సమాన ప్రాణతత్త్వమునందు నిశ్చలముగా చేసి ఉంచటము.

ఇది కుంభక ప్రాణాయామమునకు సంబంధించిన అంతర్లీన స్వాభావిక ప్రక్రియ.

ధ్యానము

నిదాఘుడు : స్వామీ! మీరు చెప్పిన కుంభక ప్రాణాయామాభ్యాసముతో సంబంధము కలిగియున్న (1) ప్రాణాయామ యోగాగ్ని (2) అపాన ఊర్ధ్వ యానము….ఈరెండూ మాకు అభ్యాసము కొరకై సులభతరమైన సూచనలు. ప్రాణాయామాభ్యాసము కొరకై చాలా ఉపకరణమైన విశేషాలు. అయితే గురువర్యా! ‘ప్రాణాయామము - ధ్యానము’ ఈ రెండూ బండికి రెండు చక్రముల వంటివని, పక్షి రెండు రెక్కలనూ ఉపయోగిస్తున్న తీరుగా, - ఈ రెండూ ఒకేసారి నిర్వర్తిస్తూ ఉండాలని యోగ గురువుల వద్ద మేము ఎరుగుచూ వస్తున్నాము.

ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే,
‘ప్రాణాయామయోగము’ అభ్యసిస్తూనే, ‘ధ్యానము’ను చేయాలా? చేయాలంటే, దేనిగురించి చేయాలి? ఏ రీతిగా చేయాలి? దయచేసి వివరించండి.

ఋభుమహర్షి : ఔను (1) ప్రాణాయామ యోగాభ్యాసము (2) ధ్యానము ….ఈ రెండూ ఒక్కసారే తప్పకుండా సాధనయొక్క ‘అంతర్భాగం’గా ‘సాధన’ అను ద్విచక్రవాహనం యొక్క రెండు చక్రములుగా సర్వదా కలిగి ఉండాలి. అట్లాగే మూడవదగు ‘విచారణ’ను వదలకూడదు.

ధ్యానించవలసిన వస్తువు

స్వాత్మానం చ శ్రియం ధ్యాయేత్, అమృతప్లావనం తతః! తనయొక్క ఆత్మయే జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు జనన స్థానంగా, అందలి సర్వమునకు అభిన్నంగా, సర్వులకు కూడా అంతర్యామిగా భావించి, అట్టి ‘స్వాత్మ’నే (The Absolute witness self of one’s own self) ఉపాసించవలసిన వస్తువుగా స్వీకరించబడు గాక!

నిదాఘుడు : ప్రాణ - అపానముల సమత్వయోగాభ్యాసమునకు శరీరంలో అన్నిటికంటే శ్రేష్ఠమైన చోటు ఏది?

ఋభువు : దేహములోని మధ్యమభాగంలో (నడిమి భాగమందు - అనాహత చక్రస్థాన పరిసరములందు) ప్రాణ - అపానములను నిలపటమనే - ఏకరూప - కుంభ కాభ్యాసము’నకు అధికంగా సానుకూల్య స్థానము.

‘ప్రాణ-అపాన సంయోగము’ అనే అభ్యాసముచే ప్రాణ-అపానములు సయోధ్యత పొందుచున్నాయి. క్రమంగా ‘శిల్పియొక్క చేతిలోని ముఖ్య ఉపకరణములగు ‘ఉలి-సుత్తి-శిలలవలె, గొప్ప చిత్రలేఖకుని చేతిలోని ‘కుంచె-రంగులు-గోడవలె, ఒక గొప్ప రచయిత యొక్క కథకు సంబంధించిన ‘కథ-పాత్రలు-కథనము వలె - యోగాభ్యాసికి ‘ప్రాణము-అపానము-అగ్ని’…ఈ మూడు తన అధీనములోని ఉపకరణములవలె అగుచున్నాయి. ‘భావము’ అనునది ‘కళా నిపుణతగల చేయి’ వలె అగుచున్నది.

మధ్యమ ద్వార - అంతర్గత ప్రాణాయామం

నాడీ కందము చుట్టూ చుట్టుకొని యున్నట్టి నాడుల ప్రదక్షణక్రమంగా ఏర్పడిన నాడీ చక్ర మధ్య ద్వార విభాగంలో - మధ్యమ ద్వార భాగతః, (మధ్యగా) ఏర్పడి ఉన్నాయి. యోగాభ్యాసి ప్రాణ అపానసమత్వ అభ్యాసం చేస్తూ ‘యోగబలము’ పొందుచున్నాడు.
మూలాధారములో గల ఇచ్ఛా-జ్ఞాన-క్రియా-ప్రజ్ఞా రూపముతో విరాజిల్లు ‘కుండలినీశక్తి’ని గురుముఖతః మూలాధారములో గమనిస్తున్నాడు. అట్టి కుండలినీ శక్తి నిద్రాముద్ర వహించి ఉన్నది.

కుండలిని నిదురించటం అనగా?
- కుండలినీ శక్తి శరీరమంతా విస్తరించి సర్వరక్ష దేవతగా ఒకవైపు రక్షణ ధర్మమును నిర్వర్తిస్తూనే ఉన్నది (నిద్రాముద్రం నిఖిల జగతీమ్ రక్షణే జాగరూకామ్).
- అయితే, రెండవవైపు ధ్యాసతో ఇంద్రియ బాహ్య విషయముల గురించి ఇచ్ఛా జ్ఞాన క్రియా ప్రజ్ఞలను నియోగిస్తోంది.
తన జనన స్థానమగు ‘స్వస్వరూపాత్మ’ను ఏమరుస్తోంది.

అట్టి ఏమరుపునే ‘‘కుండలినీదేవి నిదురిస్తోంది. ‘ఆత్మాఽహమ్’ స్వానుభవము వైపుగా కుండలినీ శక్తిని ప్రయాణింపజేయాలి’’ - అని యోగభాషగా చెప్పబడుతోంది.

కుండలినియొక్క ఊర్ధ్వగతి - సిద్ధిమార్గము

భావయేత్ ఊర్ధ్వగతిః అర్థం - ప్రాణ అపాన సుయోగతః। నాడీమండలములోని నాడుల చుట్టలవలన ఏర్పడిన ‘నాభిచక్రము’లో ప్రాణ అపానముల సమయోగము అభ్యసిస్తూ ఉండగా ‘అగ్ని’ తోడగుచున్నది. అట్టి ప్రాణ - అపాన - అగ్నిల కలయిక ఉపకరణముగా అగుచున్నది.

యోగి అట్టి త్రిమూర్తుల ఉపకరణములచే ఏర్పడిన ‘భావనాబలమి’చే ‘కుండలినిని ‘సుషుమ్న’నాడి ద్వారా ఊర్ధ్వగతి (Moving path upwardly)కి తెచ్చుచున్నాడు. ఏష యోగ పరో దేహే ‘సిద్ధి మార్గ’ ప్రకాశకః। అట్టి ఉత్తముడగు యోగి - ఇహమార్గమగు పాంచభౌతిక దృశ్యజాలమును అధిగమించి - ‘పరమార్గము’ను తన దేహమునందు సిద్ధించుకొనుచున్నాడు. అనగా ‘పరమార్గము’ - సిద్ధిమార్గముగా ఈ దేహములో ఆ యోగికి ప్రకాశమానమగుచున్నది.

అట్టి పరయోగి యొక్క తదనంతరానుభవం-నాడీబంధము।

ఏ విధంగా అయితే - అపాంగతః సేతుః ప్రవాహస్య నిరోధకః - పల్లపు ప్రదేశంవైపు సరస్సులోని జలము వేగముగా ప్రవహిస్తూ ఉండగా, ఒక ‘ఆనకట్ట’ ఆ ప్రవాహమును నిరోధించి జలమును వెనుకకు మరలేటట్లు చేస్తున్నదో…., అట్లాగే ప్రాణయోగాభ్యాసి యొక్క బుద్ధి దృశ్య విషయములనుండి వెనుకకు మరలుచున్నది.

‘‘ఈ శారీక (లేక) భౌతిక సంబంధమై ప్రాప్తిస్తున్న ‘శబ్ద స్పర్శ రూప రస గంధ’ విషయములు, వాటి యొక్క అనుభవి (Experiences) అగు ‘జీవుడు’ అనబడువాడు ఛాయవంటివి అగుచున్నాయి. ఈ రెండూ కూడా ‘రహదారిలో నడుస్తున్నవాడు - ఆతని ఛాయ’ వంటివి’’ → అని ఆ యోగికి నిస్సందేహ - అనునిత్య స్వానుభవము రూపుదిద్దుకుంటోంది.

తథా శరీరగాత్ ఛాయా జ్ఞాతవ్యా యోగి భిః సదా! ఆ యోగి - ‘శరీరిత్వము’ అనబడేదంతా తనయొక్క ఛాయా మాత్రంగా - అనుకుంటూ ఉండగా, అన్ని సందర్భ సమయములందు ‘అనిపించటం’ సిద్ధిస్తోంది. అప్పుడు ఆతని శరీరములోని - ఇడ, పింగళ, సుషుమ్న, అలంబుస, కుహు, వారుణి, యశశ్విని, పూష, పయస్వని, శంఖిని, గాంధారి, హస్తిజిహ్వ, విశ్వోదరి - మొదలైన నాడులన్నీ వాటి వాటి ఉపనాడులతో సహా సామ్యత్వము (Purity, Divinity, Enlightenment, Positivity, Thrillingly active) పొందుతాయి. ఇదియే ‘నాడీబంధ సిద్ధి’ - అని కీర్తించబడుతోంది.

ఇటువంటి నాడీబంధ - అభ్యాసమువలన ‘దేహి - దేహము’లందు ఒకానొక అనిర్వచనీయమైన ‘ప్రసాదము (పవిత్రత)’ లతో రూపుదిద్దుకుంటోంది. అట్టి యోగి త్రిమూర్తులగు బ్రహ్మ - విష్ణు - మహేశ్వరుల (The Incharge Divinities Viz., creater, maintainer and withdrawer) తత్త్వముగా సుస్పష్టముగా, స్వా-అనన్యముగా సంతరించుకోసాగుచున్నాయి.


ఈ విధంగా ‘‘చతుష్పథబంధము’’ (Packing with the help of Four Practices) అగు ‘పూరక, కుంభక, రేచక, పునః పూరక అభ్యాసములు)చే →
మార్గత్రయము (ద్రష్ట-దర్శన-దృశ్యములు, అనుభవి-అనుభవము-అనుభవించబడినవి, దృశ్య-జీవ-ఈశ్వరులు, ఆలోచించువాడు-ఆలోచన-ఆలోచించబడినవి మొదలైనవి) సమరసత్వము పొందుచున్నాయి.

ఒకే ఒక్క మార్గం శేషించినదై ఉంటోంది. ఏకం వికాశయత్ మార్గః।

అట్టి తనలో వికసించిన ఏకైక మార్గము (Straight forward lone path)లో నడుచున్న ఆ యోగాభ్యాసి సర్వము సుంగతమై - (ఏన సిద్ధాః సుంగతః) - ఉంటోంది. బుద్ధి వికసించినదై ఆ యోగి జీవాత్మ - ఈశ్వరాత్మ - దృశ్యాత్మల ఏకత్వము సిద్ధించుకొన్నవాడై, ‘సర్వాత్మకుడు’గా రూపము పొందుచున్నాడు. ఆ సంసిద్ధుడు ‘సిద్ధుడు’గా అగుచున్నాడు. సిద్ధుడుగా పిలువబడుచున్నాడు. సిద్ధించుకోవలసినది సిద్ధించుకున్నవాడు కాబట్టి సిద్ధుడు.

‘‘జాగ్రత్ స్వప్న సుషుప్తులు నా చేతనే లీలావినోదంగా సిద్ధపరచుకోబడుచున్నాయి’’ - అను ఎరుకగలవారే. ‘సిద్ధపురుషుడు’గా అభివర్ణించబడుచున్నాడు. (అంతేగా అష్టసిద్ధులు కలవాడని కాదు).

ఊర్ధ్వయానము - మూలబంధ యోగము

‘ప్రాణాయామాభ్యాసము’ చే నాడులలో చిందరవందరగా ప్రవహిస్తున్న నాడీ శక్తి నిశ్చలము అవుతోంది. ‘కుంభకయోగధారణ’యే నాడీబంధ యోగాభ్యాసము. అట్టి అభ్యాసముచే కంఠములో చేరియున్న వాయురూపమగు ఉదానప్రాణము ఊర్ధ్వముగా ప్రయాణించసాగుతుంది. నాడులు ప్రాణాయామముచే శుద్ధపడుచున్నాయికాబట్టి, ఉదానము బ్రహ్మకపాలమును సుఖముగా (అడ్డులు లేకుండా without interruptions) చేరుచున్నది.

అప్పుడు ఓ సీసా మూతను తొలగించు రీతిగా ఉదానప్రాణము బ్రహ్మరంధ్రమును మూసి ఉన్న మూతను తొలగించుటకై ఊర్ధ్వయానము (upwordly moving) చేస్తూ, కపాల ఊర్ధ్వభాగమున అగ్నిశిఖారత్నమువలె ప్రకాశించుచున్న బ్రహ్మరంధ్రమును చేరుకొనుచున్నది. ఇది ‘మూలబంధ యోగము’ అనబడుచున్నది.

మూలబంధయోగము - సంపుటీకరణ యోగము

ఇప్పుడు మనం చెప్పుకొన ‘మూలబంధయోగ’ యోగాభ్యాస విశేషాలను ‘సంపుటీకరణయోగము’ అని కూడా పిలుస్తూ ఉంటారు. (‘త్రిపుటీయోగము’ అని కూడా ఇతరచోట్ల చెప్పబడుతోంది). ఎందుకంటే ఈ మూలబంధయోగవిద్య -


అందుచేత ఓ నిదాఘా! రాత్రనక, పగలనక, ఒకసారి తరువాత మరొకసారిగా, ‘ఉదయం - మధ్యాహ్నం - సాయంకాలం - రాత్రి సమయాలు’ అనే ఊసు లేకుండా,….

‘‘ప్రాణాయామాభ్యాసముచే మూలాధారంలోగల కుండలినీ శక్తి దేవిని ఉదాన ఊర్ధ్వగత విధానంగా (కంఠంలోని ప్రాణశక్తిని ఊర్ధ్వంగా విస్తరింపజేయువిధంగా) కపాలమునకు ఉపరిభాగంగా, (కొండనాలుకకు సూటిగా)గల బ్రహ్మరంధ్రమును మూత తెరవటం, ప్రజ్ఞను సహస్రారంలోప్రవేశింపజేసి సహస్ర శీర్ష పురుషుడగు పరమశివ తత్త్వముతో ఏకం చేయటం’’ అనే యోగాభ్యాసమును క్షణికం నుండి అనుక్షణికం చేస్తూ వాయు అభ్యాసనము కొనసాగించాలయ్యా!

ప్రాణాయోగాభ్యాసముచే ప్రాణశక్తి శరీరమంతా సమస్వరూపమై విరాజిల్లుతోంది.

ప్రాణశక్తి ప్రసరణ ఒడిదుడుకులవలననే దేహములో వ్యాధులు సంభవిస్తున్నాయి.

శ్లో।। వహ్నౌ వివర్ధమానే తు సుఖమ్ అన్నాది జీర్యతే।
అన్నస్య పరిపాకేన రసవృద్ధిః ప్రజాయతే।
రసే వృద్ధిం గతే నిత్యం వర్ధంతే భాతవత్ తథా।
ధాతూనాం వర్థనే నైవ ప్రబోధం వర్థతే తనౌ।।

ప్రాణ సంయమము (దేహమంతా సమరసంగా ప్రాణశక్తిని అభ్యాసపూర్వకంగా ధారణ చేయటంచేత) దీర్ఘాయుష్షు, ఉత్సాహభరితమైన బుద్ధి, వ్యాకులతలు లేని మనస్సు, ప్రసన్నతతో కూడిన చిత్తము, ఆరోగ్యమైన ఇంద్రియములు, సుఖకరమైన దేహము లభిస్తున్నాయి. దేహంలో అగ్ని (Heat) సమత్వము కలిగి ఉండటంచేత తేజోవృద్ధి, ఆహారము తేలికగా జీర్ణమవటము, శరీరములో ప్రవేశించిన అన్నము త్వరగా పరిపాకమవటము, రసవృద్ధి - ఇవన్నీ బాగుగా జరుగగలవు.

అన్నస్య పరిపాకేన రసవృద్ధిః ప్రజాయతే। రసవృద్ధి యొక్క శుభచర్యలవలన శరీరము ప్రకాశమానము(Enlightening)గా ఉంటుంది. ధాతువులు నిర్మలమౌతాయి. ధాతువులు సమవృద్ధి, నిర్మలత్వము పొందుచూ ఉండగా అప్పుడిక శరీరము, మనస్సు, బుద్ధి - ఇవన్నీ ప్రబోధము పొందటానికి (To be positively receptive, inspired, incliningly active) శుభప్రదంగా సంసిద్ధమౌతాయి.

యోగాభ్యాసముచే కోటి జన్మల పాపాలు కూడా - (ఒక్క నిప్పుకణం అసంఖ్యాక కట్టెలు భస్మము చేయువిధంగా) - భస్మీభూతమౌతాయి. ప్రక్షాళణం అవుతాయి.

శరీర - మూలాధార చక్ర ప్రాసస్థ్యం

ప్రకృతి నిర్మితమైన ఈ భౌతిక దేహములో గుదము - మేఢ్రముల (మల బహిష్కరణస్థానం - లింగస్థానం) మధ్యగా విశ్వమంతా నిండియున్న మహత్తరశక్తి ప్రక్షిప్తమై ఉంటోంది.ఇదియే ‘‘మూలాధార ‘ణ’ త్రికోణరూప చక్రము’’. అట్టి మూలాధారము యొక్క ఔన్నత్యమేమిటో చెప్పుకొంటున్నాము.

ఈ మూలాధారము నందు →
→ అనంతశక్తియుతుడు, సర్వశుభంకరుడు అగు పరమశివుని (సాంబశివుని) మహాప్రకాశరూపమగు (‘శ్రీ’)బిందువు ఉన్నది. అందుచే ‘బిందుస్థానము’ అయి ఉన్నది.

మరల విను.

♠︎ ఈ విశ్వమంతా ప్రకాశింపజేయు కేవల శివశక్తి స్థానము - మూలాధారము.
♠︎ ఈ మూలాధారాకాశంలో (ప్రదేశంలో) ‘కుండలిని’ అనే పేరుతో పిలువబడే విశ్వ - విశ్వాంతర్గతమైన ‘పరాశక్తి’ ప్రతిష్ఠితమైయున్నది.
♠︎ ఇది వాయు జనన స్థానము, వాయుచలన కారకమగు చైతన్యశక్తి.
♠︎ తేజస్సు (అగ్ని)కి సముత్పన్నస్థానము. విశ్వములో అగ్ని ఈ ‘విశ్వకుండలిని’ నుండే బయల్వెడలుచున్నది.
♠︎ ఇందులోనే ‘బిందువు’ ఉత్పన్నమై, విశ్వమునకు అధిష్ఠానమై విరాజిల్లుతోంది.
♠︎ హంస (సోఽహమ్) అగు జీవ - బ్రహ్మైక్య అఖండతత్త్వము, ‘శక్తిమంతుడు-శక్తిల’ అభేదవిశేషము ఇక్కడ సంప్రదర్శనమైయున్నాయి.
♠︎ ఈ మూలాధారమునుండే ‘ఆలోచనాశక్తి’ బయల్వెడలుచున్నది. ఇందుగల కుండలినీశక్తియే మనో ఉత్పాతక స్థానము.
ఇంకా ఈ శరీరంలో నాడులు, నాడీకందము, జీవుడు,హంస, ఈ శరీరము యొక్క బాహ్యమున ఈ చరాచర సృష్టి-ఇవన్నీ కల్పించబడినవై ఉన్నాయి.

శక్తి స్థానము : ‘మూలాధారము’ నుండి → స్వాధిష్ఠాన - మణిపూరక - అనాహత - విశుద్ధ → ‘ఆజ్ఞా’ చక్రము వరకు గల స్థానమును వరకు - వెన్నెముకకు అంతర్గత శక్తి స్థానము.

శాంభవ స్థానము : కంఠము పైనుండి - మూర్థము (Fore face) యొక్కాంతము (ఆవల) వరకు గల స్థానము.


నాడులన్నిటికీ … నాడీపిండము (లేక) నాదీ మండలము ఆశ్రయము (నివాసగృహము).
ప్రాణమునకు … నాడులు ఆశ్రయము.
జీవమునకు … ప్రాణము నిలయము. ఆశ్రయము.
హంస (గాలి, ముక్కు ద్వారా పీల్చుట - వదులుట) లేక జీవుడు ….. జీవమునకు ఆశ్రయం.
శక్తి (The Energy) …. హంసకు అధిష్ఠానము.

ఈ చరాచర జగత్తంతా శక్తియొక్క ప్రదర్శనా చమత్కారమే!

ఈ విధంగా ఉత్తరోత్తర ‘సారూప్యస్థితులు’ పొందటానికి - సర్వ కల్పనా వ్యవహారములను ప్రక్కకు పెట్టి, - సర్వ దృశ్య సంబంధమైన అసంతృప్తులను త్యజించి వేసి, ప్రసన్నాత్ముడై, ‘ప్రాణాయామము’ను చక్కగా అభ్యసించాలి.

ఒకవైపు ‘బంధత్రయము’తో కూడిన ప్రాణాయామమును ఆచరిస్తూనే, రెండవవైపు బ్రహ్మజ్ఞానము గురించి సమాచారమును విచారణ చేస్తూ ఉండాలి.

ఓ నిదాఘా! ఈ దృశ్యములోని లక్ష్య (Objectives) - లక్షణ (Features) కారణ (Causation) విశేషములను సమ్యక్ భావనతో దర్శిస్తూ, అట్టి మనస్సును క్రమముగా సత్యము వైపు అనుసంధానము చేయాలి. ఎల్లప్పుడు ఆత్మవైపు నడిపిస్తూ, మనస్సును దృశ్యభావావేశముల నుండి సముద్ధరించాలి.

చిత్త ప్రాణాయామము

చిత్తమేవ హి సంసారః! ఈ చిత్తమే సంసారము. అందుచేత వాయు సంబంధమైన ప్రాణాయామము క్రమక్రమంగా ‘చిత్త ప్రాణాయామము’గా రూపుదిద్దుకోవాలి. అది ప్రాణాయాభ్యాసముయొక్క ముఖ్యాశయము.

చిత్తము (లేక) మనస్సుతో
(1) నిర్వి కల్పమును [అలోచనలను నిరోధిస్తూ ఆలోచించువాని కేవల రూపమును (The Thinker sans thoughts)] ధారణ చేసి ఉండటము.
(2) సర్వదా ‘ప్రసన్నత’ (సంతోషము, ఉత్సాహము కలిగి ఉండటము).
అను అభ్యాసము - ‘చిత్తప్రాణాయామము’ అగుచున్నది. చిత్తమును సమరసస్థితిని అభ్యసింపజేయాలి. లక్ష్య - లక్షణకారణములతో కూడి స్థూల - సూక్ష్మ - కారణ దేహబంధములనుండి (లేక) బాహ్యములనుండి సమ్యక్ భావనతో చిత్తమును సముద్ధరించాలి. సత్యము యొక్క అనుసంధానముచే ‘వేద్యము (తెలియబడునది)’ అగుచున్న సమస్తమును ఆత్మగా దర్శించటమే చిత్తసముద్ధరణ.

చిత్త లయస్థితియే నిజమైన ప్రాణాయామము. వాయు ప్రాణాయామముచే చిత్తము నిశ్చల స్థితిని పొందగలదు. అటు తరువాత క్రమంగా రేచక - పూరకముల మధ్యగా కుంభక స్ధానమునందు చిత్తము లయించగలదు. చిత్తము ‘చిత్ తత్త్వము’ను సంతరించుకొని, మౌనము వహించినదై ఆత్మయందు ఏకత్వము పొందగలదు.

‘చిత్తలయము’ ప్రాణాయామము యొక్క ముఖ్యాశయము. అంతేగాని, కేవలము ప్రాణ నిశ్చలము మాత్రమే కానేకాదు.

అంతరంగ త్రి-ప్రాణబంధములు-‘‘చిత్త యామము’’

చిత్త - ‘రేచకము’ : ‘‘ఈ ఎదురుగా దృశ్యమానమై కనిపించేదంతా స్వయముగా సర్వదా పరబ్రహ్మమే’’ అను దృష్టితో బాహ్యవిషయాలన్నీ ఆత్మకు అభిన్నంగా చూస్తూ, అందుకు భిన్నమైన భేదదృష్టులను మనస్సులోనుండి బయటకు త్రోసివేయటం- మనో రేచకము.

చిత్త - పూరకము : చిత్తమును ఆత్మశాస్త్ర విశేషాలతో నింపి, హృదయ గతం చేసుకోవటం - చిత్తపూరకము.

చిత్త - కుంభకము : అత్యంత ప్రియమైనదిగా చిత్తముతో సర్వత్రా ఆత్మను దర్శించుచూ ఉండటమే - చిత్త కుంభకము. ‘‘ఆత్మ అనగా జాగ్రత్ - స్వప్న సుషుప్తుల సాక్షి అగు స్వస్వరూపమే’’…అను నిశ్చిత సందర్శనము. ‘‘త్వమ్’’ గా కనిపిస్తున్న సమస్తము సర్వదా అపరిచ్ఛిన్నమగు ఆత్మకు అభిన్నము - అను తత్త్వ భావనయే ‘‘చిత్త కుంభకము’’.

(అనగా) సమస్త సహజీవులను ప్రియాతి ప్రియమగు ఆత్మగా భావన చేయటమే చిత్ ఆశ్రయ స్వరూపమగు చిత్త కుంభకము.

ఎవ్వరు చిత్తముతో పై ‘బంధత్రయము’ను (చిత్త-రేచక-పూరక-కుంభకములు) అభ్యసిస్తారో అట్టి వారు ముక్తులే అగుచున్నారు. సందేహం లేదు.

కుంభక - కుంభక శివదర్శనం

కుంభకేన సదా ఆరోప్య కుంభకేనైవ పూరయేత్। కుంభేన కుంభయేత్ కుంభం తత్ అన్తస్థః పరం శివమ్।।

చంచల చిత్తముపై నిశ్చల చిత్తమును ఆరోపించి నిశ్చల చిత్తముతో పూరించాలి. (అనగా) ‘నిశ్చల చిత్’యే చంచలము కల్పించుకొని చిత్తముగా ప్రదర్శనమగుచున్నది - అను అవగాహనను సునిశ్చితం చేసుకోవాలి.

నిశ్చల - కుంభక ప్రాణాయామము (స్వభావకుంభకము)తో కుంభకమును కుంభకము చేసి తత్ - అంతస్థుడగు పరమశివ (ఆవలగల స్వస్వరూప / సహజ నిత్య స్వరూప) దర్శనం చేయటము ‘‘కుంభక శివ దర్శనము’’గా అనబడుతోంది. ‘‘నేను - నీవు - జగద్దృశ్యముతో సహా సర్వదా శివమయమే’’ - అను దర్శనమే ‘శివదర్శనము’!

కంఠముద్రా యోగము

‘కంఠమునందు కుంభక ప్రాణాయోగాభ్యాసము’ - అనబడు కంఠముద్రను ధరించటమును ‘‘కంఠకుంభకము’’ - అని పిలుస్తున్నారు.

కంఠమును నిఠారుగా నిలిపి, కంఠమునుండి - శిరో ఉపరిభాగము వరకు శివలింగ భావన చేసి, ముఖమునందు ‘సర్వతత్త్వాత్మకుడు, స-అంబుడు, సర్వతత్త్వస్వరూపుడు, సర్వతత్త్వ విదూరుడు’ అగు పరమశివుని నిశ్చిలచిత్తుడై ధ్యానము చేయు అభ్యాసము ‘‘కంఠముద్రాయోగము’’ అనబడుతోంది.

ఇట్టి ఉపాసనలో - సర్వాత్మకుడగు శివసాన్నిధ్యమును సర్వతోముఖంగా- సర్వముఖములలో చూస్తూ ఈ విశ్వమంతా శివ తాండవంగా దర్శిస్తూ….‘శివోఽహమ్’ భావము సంతరించుకోవటము - ‘కుంభక కుంభక శివోఽహమ్’నకు మార్గముగా చెప్పబడుతోంది.

వేదకక్రమ యోగము (లేక) చతుష్పీఠ యోగము

శ్లో।। వాయూనాం గతిం ఆవృత్య ధృత్వా పూరక కుంభకౌ,
సమహస్తయుగం భూమౌ, సమం పాదయుగం తథా,
వేధక క్రమయోగేన చతుష్పీఠం తు వాయునా।

ఇట్టి ఆసనములో వాయువును ముఖముగా ధారణ చేసి, ప్రాణ - అపాన - వ్యాన - ఉదానములను చతుష్పీఠం (నాలుగు కాళ్ళ పీటవలె) శరీరములో ధారణ చేయటం జరుగుతోంది.

శ్లో।। ఆస్ఫాలయేత్ మహామేరుం వాయువక్త్రే ప్రకోటిభిః, పుటద్వయం సమాకృష్య వాయుః స్ఫురతి సత్వరమ్।।

వాయు వక్త్రం (Face of Air)తో ఆస్ఫాలనము చేస్తూ వాయువుకు ఆవలగల ‘ప్రాణశక్తి’ని గమనిస్తూ ఉపాసించటం వేదక త్రయయోగము (లేక) చతుష్పీఠయోగము యొక్క అంతర్లీన సంవిధానము.

ఇట్టి ఆస్ఫాలనము ‘మహా మేరు ఆస్ఫాలనము’ అని కూడా అంటారు. ఇది అనేక జన్మలుగా మహా మేరు పర్వతమువలె పేరుకొనియున్న కుకర్మల - అల్పదృష్టుల కొండలను మొదలంట్లా పెకలించి దూరముగా విసిరివేయగలదు.

పుట ద్వయము యొక్క (ప్రాణ - అపానముల) సమీకృష్యము (ఏకము చేయుట)చేత వాయుచలనము అనుభూతమౌతుంది.

చంద్ర - సూర్య - అగ్ని (ఇడ - పింగళ - సుషుమ్న నాడుల)సంబంధమైన జ్ఞానముచే మేరు మధ్యగతమగు మహాశక్తి (వాయువును కదలించు మూలశక్తి) అనుభవమవగలదు.


వేధమార్గము - గ్రంథిభేదము

‘ప్రాణాయామ యోగాభ్యాసము’ చే బ్రహ్మగ్రంథికి మార్గము (వేధ మార్గము) ఎరుగబడుతోంది. కుండలినీశక్తి సుషుమ్నలో ప్రవేశించి ఊర్ధ్వమునకు సంసిద్ధమై, వేధ (మార్గము) నందు ప్రకాశించుచూ, ‘ఊర్ధ్వగమనము’ పొందుచుండగా → గ్రంథి భేదనము జరుగుచున్నది.

బ్రహ్మగ్రంథి భేదనము : మొట్టమొదట కుండలినీశక్తి ‘బ్రహ్మగ్రంథి’ని ఛేదించుచున్నది. ‘ఈ కనబడేదంతా నిజంగానే మరొకరెవ్వరిచేతనే సృష్టించబడి, సత్యము అయి ఉన్నది’ - అనే భ్రమ వీడటమే బ్రహ్మగ్రంథి ఛేదనము. ‘సృష్టి అభిమానము’ - తొలగుతుంది.

విష్ణుగ్రంథి భేదనము : ఆ తరువాత కుండలినీశక్తి ఊర్ధ్వంగా సుషుమ్న తేజోనాడిలో ప్రయాణించుచు ‘‘ఈ సృష్టి అనంతకాలము నా పట్ల స్థితించబడియే ఉన్నది. కొనసాగుతోంది. దాటుటకు శక్యము కాదు. (కొనసాగించు అభిమానము)’’ అనే భ్రమను తొలగుటచే విష్ణుగ్రంథి భేదనము అగుచున్నది. ‘‘ఈ దృశ్యమునకు నాకు అవినాభావ సంబంధము సర్వదా ఉన్నది’’ - అనే కొనసాగింపు ఉపశమించగలదు.

రుద్రగ్రంథి బేధనము : ఆ తరువాత ‘ఈ జగత్తు లయము పొందింపజేయు అభిమానమునకు సంబంధించిన చిక్కుముడి’ వీడుతుంది.

‘మొదలే లేనిది సృష్టించబడటమేమిటి? స్థితించబడటమేమిటి? మరొకప్పుడు లయము కావలసి ఉండటమేమిటి?’ అను అతీతస్థానము ‘ప్రాణాయామాభ్యాసము’చే సిద్ధించుచున్నది. ఇదియే త్రిగంథి భేదనముగా చెప్పబడుతోంది. ‘‘సమస్త దృశ్యము సర్వదా నాయొక్క ఆత్మస్వరూప ప్రదర్శనమే’’ - అను నిశ్చయానుభవమే ‘‘లయము’’ - యొక్క శబ్దార్థము.

ఈ విధంగా ఈ జీవుడు ‘ప్రాణాయామ’ ఇత్యాది అభ్యాసముల బలము చేత బ్రహ్మ - విష్ణు - రుద్ర గ్రంథులు భేదనము చేయుచుండగా మోహభావనలు, మోహదృష్టులు, మోహ ఆశలు, మోహకర్మలు, మోహజ్ఞానము…మొదలుగా గల మోహ మలమంతా ఛేదించివేయబడుతోంది. అదే సమయంలో గురుదేవులు చెప్పు ‘తత్ త్వమ్ - అదేనయ్యా నువ్వు!’ - అనబడే తత్త్వవాక్యాలు (మోహము సన్నగిల్లుచున్న) బుద్ధిలో ప్రవేశించి ప్రవృద్ధం కాసాగుతాయి. యోగాభ్యాసముచే ఆ యోగి ‘ఆత్మ’తో మమేకత్వము పొందుచున్నాడు. ‘ఆత్మనగు నాకు ఈ జగత్తంతా అభిన్నము’…అను మహత్తరావగాహన, అకుంఠితానుభవము స్వభావసిద్ధమై సిద్ధిస్తున్నాయి. అదియే సమస్త యోగ-జ్ఞాన-భక్తి యోగాభ్యాసముల పరాకాష్ఠ సిద్ధి.

సుషుమ్నలో హ్రస్వ - దీర్ఘ ‘ఓం’కార ప్రయోజనములు

ఎడమవైపు ‘ఇడ’ - కుడివైపు ‘పింగళ’ నాడుల మధ్యగల ‘సుషుమ్న నాడి’ అనే మహత్ తేజోవాడిని గుర్తించి, ఆ తేజో నాడిలో విశ్వకల్పనలను ఆరోపిస్తూ…కుంభక ప్రాణాయామము అభ్యసించబడుగాక! వాయువు క్రమంగా (కుండలినీశక్తితో సహా) ఊర్ధ్వముఖంగా నడిపించబడుగాక! ఇక్కడ హ్రస్వమగు ఓంకారమును (‘ఓం’ అని) అభ్యసించటం చేత సర్వభేద భావములు, పాపదృష్టలు, దుష్టకర్మాభ్యాసములు తొలగిపోసాగుతాయి.

దీర్ఘమగు ‘ఓఓఓ….మ్‌మ్‌మ్…..’ లేక
(1) ‘అ’కారొచ్ఛారణ (2) ‘ఉ’కారోచ్ఛారణన (3) ‘మ’కారోచ్ఛారణ (4) ‘మ్’…అను అర్ధమాత (5) మౌనములో శబ్దమును లయింపజేయటము అనబడు 5 విధముల వేరు వేరైన శబ్దోచ్ఛారణా - ఓంకారోపాసనచే ఈ యోగాభ్యాసికి మోక్షము సిద్ధించగలదు. ‘నేను జన్మకర్మల పరిమితుడను కాను! ‘నన్ను’ని బద్ధుని చేయుచున్నదేదీ లేదు. నాకు అనన్యమై ఏదీ లేదు’ అన్యమే లేని వానికి బంధము ఎక్కడిది? - అను స్వాభావికానుభవం అనుక్షణికమవటమే ‘మోక్షము’.

ప్రణవోచ్ఛారణలోని 4వ అంకమగు ‘మ్‌మ్….’ అనుప్లుతమును ‘3’ రకములైన ఉచ్ఛారణగా యోగులు నిర్వర్తించుచున్నారు.
(1) అవిచ్ఛిన్నంగా తైలధారవలె ‘మ్‌మ్’ అని పలకటం (ఓంకారోచ్ఛరణ దీర్ఘంగా పలకటం).
(2) దీర్ఘ ఘంటా నినాదమువలెను (ఘంటా నినాదభావన).
(3) శబ్దరహితమగు ప్రణవాగ్రము (కేవల సాక్షీ భావన). చిట్టచివ్వర కేవల మౌనము
ఈ మూడు ఎవ్వరు తెలుసుకొంటారో వారు విదిత వేద్యులు. వేదవేద్యులు.
→ తెలుసుకోవలసినది తెలుసుకొన్నవారు
→ తెలియబడుచున్నదంతటియొక్క వాస్తవ స్వరూపమేమిటో ఎరిగినవారు.

మంత్రసిద్ధి

‘ఓం’కార మంత్రసిద్ధి కొరకై, ‘ఓం’కార పవిత్రమగు ఆత్మత్త్వము సిద్ధించటానికై ప్రణవమును (1) హ్రస్వముగాను (2) దీర్ఘముగాను (3) బిందుగతంగాను (4) దీర్ఘగతంగాను చేస్తూ… ‘స్వరము’ను కంఠము నుండి ‘ఆజ్ఞాచకము’ (భ్రూమధ్య - బిందు ఆకాశంలో) ప్రవేశింపజేయుచున్నారు. అక్కడ మౌనమునందు ప్రశమింపజేస్తున్నారు.

ప్లుతమ్ (మ్‌మ్)…ను బ్రహ్మరంధ్రములో క్రమంగా ప్రవేశింపజేస్తున్నారు. నదీ జలము సముద్రంలో కలియువిధంగా - మంత్రమును బ్రహ్మరంధ్రమునకు ఊర్ధ్వంగా గల 12 అంగుళముల ప్రదేశములో భావన చేస్తున్నారు. ఆపై అంతగతము (Taking beyond) కూడా చేస్తున్నారు.

ఈ విధంగా ‘ఓం’కారసంజ్ఞయగు ప్రణవమును ఉపాశించాలయ్యా!

ఓంకార ప్రణవోచ్ఛారణ - సర్వ విఘ్నములను, సర్వదోషములను హరిస్తుంది.

బ్రహ్మరంధ్రములోంచి సహస్రార ప్రవేశము = - లోకాలన్నీ నాలోను ఉన్నాయి. (కల నాలో ఉన్నట్లు - పరమాత్మత్వము)
- లోకాలలో నేను ఉన్నాను. (కలలో నేను ఉన్నట్లు - జీవాత్మత్వము)

‘‘ఈ సమస్తము నాలో ఉన్నది। ఈ సమస్తములో నేను ఉన్నాను। అఖండమగు నేనే ఇదంతా కూడా!

ఈ జీవ - బ్రహ్మైక్యము నాకు స్వాభావికము’’ అను నిశ్చితానుభవమే ఓంకార మంత్రసిద్ధి।

ప్రణవము యొక్క భూమికలు

(1) ఆరంభము (2) ఘటము (3) ప్రచయము (4) నిష్పత్తి

(1) ఆరంభ భూమిక : ఈ జీవుడు బాహ్య ప్రపంచంలో మనస్సులోను, వాక్కులోను, కాయము (భౌతిక దేహము)తోను ఆయా అనేక కర్మలు నిర్వర్తిస్తున్నాడు కదా! ఈ విధమైన -

శ్లో।। కరణత్రయ సంభూతమ్ బాహ్యం కర్మ పరిత్యజన్,
అంతరం కర్మ కురుతే యత్ర, ‘ఆరంభః’ స ఉద్యతే

బాహ్య విషయములతో ఏర్పడుచున్న బాహ్య విషయములన్నీ బాహ్యముననే వదలివేసి ఉండటము అంతరమున ఆత్మతత్త్వజ్ఞాన - ఆత్మానుభవములపట్ల మాత్రమే మనో - వాక్ - కాయములను నియమించటము - ఇది ఆరంభ భూమిక!

(2) ఘట భూమిక :

శ్లో।। వాయుః పశ్చిమతో వేధం, కుర్వన్ ఆపూర్య సుస్థిరమ్,
యత్ర తిష్ఠతి, సా ప్రోక్తా ‘ఘలాఖ్యా’ భూమికా బుధైః।।

వాయువును పశ్చిమంగాగల త్రినాడులలో నిలిపి, స్థిరం చేస్తూ ‘కుంభకము’ నిర్వర్తించుచూ, కుండలినీ శక్తిని సుషుమ్నద్వారా మార్గమును కల్పిస్తూ బ్రహ్మరంధ్రము దాటించటము - ఘటభూమిక.

(3.) ప్రచయ భూమిక :

శ్లో।। న స జీవో, న నిర్జీవః - కాయే తిష్ఠతి నిశ్చలమ్
యత్ర వాయుః స్థిరః ఖేః స్యాత్ సేయం ‘ప్రచయ’ భూమికా।।

ఎప్పుడైతే యోగాభ్యాసి -
→ సజీవుడు - నిర్జీవుడు రెండు కానివాడై (బ్రతికియున్నవాడు కాదు, చచ్చినవాడు కాదు),
→ శరీరమును ఒక బాహ్య వస్తువువలె చూస్తూ అందులో సజీవము - నిర్జీవము కలిగి యుండడో,
→ ఆకాశంలో నిశ్చలవాయువు వలె ఆత్మాకాశమునందు స్థితి కలిగి ఉంటాడో,
( ఉదాహరణ : ఒకడు ఒక కలముతో వ్రాస్తూ ఉంటే అందులో లేనివాడు, కదల్చుచూ అందులో ఉన్నవాడు కూడా అగుతాడు కదా! కానీ, ఆ రెండు అవకుండానే తాను సర్వదా వేరే కదా)’
అట్టివాడు స్ధానము పొందిన భూమిక - ‘‘ప్రచయ భూమిక’’ - అనబడుతోంది.

ఎక్కడ ఆకాశంలో వాయువు స్థిరత్వము పొందినదిగా ధారణ చేయబడుచున్నదో అది ‘ప్రచయభూమిక’ అగుచున్నది.

(4) నిష్పత్తి భూమిక :

శ్లో।। యత్ర ఆత్మనా సృష్టి లయౌ, జీవన్ముక్తి దశాంగతః
సహజః కురుతే యోగం, సేయం ‘నిష్పత్తి భూమికా’’ - ఇతి।।

ఎప్పుడైతే ఈ దృశ్య వ్యవహారమంతా పిపీలికాది బ్రహ్మ పర్యంతము సమస్తము స్వభావతః ఆత్మమయంగా, ఆత్మరూపంగా కనిపిస్తూ, అనిపిస్తూ ఉంటోందో,
- ఆత్మయందే సర్వముగాను,
- ఈ సర్వమునందు ఆత్మగాను
- ఆత్మయే ఈ సర్వముగాను
ఆ యోగాభ్యాసి చూస్తూ ఉంటాడో, ఆతడే జీవన్ముక్తుడు.

అట్టి అభ్యాసముచే ఈ యోగి ‘నిష్పత్తి’ భూమికతో ప్రవేశించినవాడగుచున్నాడు.


ఫలశ్రుతి

ఎవ్వరైతే ఈ వరాహోపనిషత్ అధ్యయనం చేస్తారో, పవిత్రమగు ఆత్మదృష్టిని సంతరించుకుంటూ ఉంటారో….
- వారు అగ్ని - వాయువు వలె పరమ ప్రకాశమానులు నిర్మల స్వభావులు అగుచున్నారు.
- సురాపానము, బంగారమును దొంగిలించటము మొదలైన సర్వ దోషముల నుండి విముక్తులై పరమ పవిత్రులగుచున్నారు.
- అట్టి వాడు జీవన్ముడగుచున్నాడు.

ఈ సత్యమే వేదములలోని ఋక్కులచే, మంత్రములచే, గానములచే, వర్ణనములచే (4 వేదములలో) ఎలుగెత్తి ప్రకటించబడుచున్నది.

పవిత్రమగు దివ్యచక్షువులు యోగాభ్యాసముచే సముపార్జించుకొన్న సూరులు - సర్వే సర్వత్రా సర్వదా స్వస్వరూప విష్ణుతత్త్వమునే దర్శించుచూ సర్వదా పునీతులై ఉంటున్నారు. ఈ కనబడే సమస్తమును - స్వస్వరూపమే అయి ఉన్న విష్ణుతత్త్వమునకు అభిన్నంగా ఆస్వాదించుచున్నారు.

స్వస్వరూపము -
అన్యముగా నిశ్శేషించినదై,
విష్ణుతత్త్వముగా అనన్యమై,
అట్టివారు విష్ణు స్వరూపులగుచున్నారు.
వారు సర్వ నిరోధములను, అడ్డంకులను తొలగించుకొన్నవారై, వేద హృదయమును ఎరిగిన వారగుచున్నారు.

ఈ ఉపనిషత్ అధ్యయనము చేసి, పరమార్థమును గ్రహించిన విప్రులు -
→ వేదాధ్యయనము చేసిన ప్రయోజనము పొంది,
→ ఆత్మయందు సదా అనునిత్యంగా, అనుక్షణికంగా జాగృతులై,
→ ఆ పరమపదమగు విష్ణుతత్త్వమునందు ప్రవేశించి,
→ ‘‘సోఽహమ్ విష్ణుమ్’
స్థానమును పుణికిపుచ్చుకొనుచున్నారు.

🙏 ఇతి వరాహ ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।