[[@YHRK]] [[@Spiritual]]

yōgaSikha Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


కృష్ణ యజుర్వేదాంతర్గత

23     యోగశిఖోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। యోగజ్ఞానే యత్ పదాప్తి, సాధనత్వేన విశ్రుతే,
తత్రైపదం బ్రహ్మతత్త్వం, స్వమాత్రమ్ అవశిష్యతే।।

యోగ-జ్ఞాన సాధనముల అంతిమ ప్రయోజనముగా ఏ పదము విశ్రుతము అగుచున్నదో, అదియే బ్రహ్మతతత్త్వపదముగా (లేక) (నాలోని నేనైన నేనేగా) అగు స్వస్వరూపముగానే శేషించుచున్నది. అట్టి త్రైపదమగు బ్రహ్మతత్త్వము మన అఖండ - స్వరూపమునకు అన్యమైనది కాదు. అనన్యము।

ప్రథమాధ్యాయము

ఓం! (హిరణ్యగర్భౌవాచ।)

1. సర్వే జీవాః సుఖైః దుఃఖైః
మాయాజాలేన వేష్టితాః।
తేషాం మక్తిః కథన్, దేవ!
కృపయా వద, శంకర!
సృష్టికర్తయగు హిరణ్యగర్భుడు :
ఓ దేవాది దేవా! పరమశివా! శంకర భగవాన్! మీరు ప్రసాదించిన సృష్టి సామర్థ్యము వలన నాచే సృష్టించబడుచున్న జీవులంతా కూడా సుఖ- దుఃఖములు అనబడే రెండు వరసల పురికొసలతో నిర్మితమైన మాయాజాలముచే చుట్ట చుట్టుకొనబడినవారై ఉంటున్నారు. హే దేవా! వారు దృశ్య సంబంధ రూపములగు సంసార దుఃఖముల నుండి ముక్తి (RELIEF) పొందేది ఎట్లా? కృపతో వివరించమని ప్రార్ధిస్తున్నాను.
సర్వ సిద్ధికరం మార్గం
మాయాజాల నికృన్తనమ్,
జన్మ మృత్యు జరా వ్యాధి
నాశనం, సుఖదం వద।


- ఇతి హిరణ్యగర్భః పప్రచ్ఛ।। -
స్వామీ! సర్వసిద్ధికరము, మాయాజాలము (వల) నుండి విడుదల ప్రసాదించునది, జన్మ - మృత్యు - జరా - వ్యాధి రుగ్మతలను నశింపజేయునది, పరమ సుఖప్రదమైనది అగు ‘ముక్తిమార్గము’ను దయతో ప్రవచించండి. (అని హిరణ్యగర్భుడు అడిగారు)
2. సహోవాచ మహేశ్వరః
నానా మార్గైస్తు దుష్ప్రాపం
కైవల్యం పరమం పదమ్।
మహేశ్వరభగవానుడు :
పరమాశయముపట్ల సుస్పష్టమైన అవగాహన లేకుండా - అనేక మార్గములలో వెళ్లుతూ ఉంటే పరమపదమగు కైవల్యము. ఉపాయం లభించదు. దుష్ప్రాప్యము కూడా. ఈ జీవుడు కేవలీ స్వస్వరూపమగు కైవల్యము కొరకై యత్నం లేకపోతే అందుకోజాలడు. (Multiple Approaches without clarity of main objective lead to no where).
‘సిద్ధి’ మార్గేణ లభతే,
న అన్యథా, పద్మసమ్భవ!
ఓ పద్మసంభవా! బ్రహ్మ భగవాన్! కేవలాత్మానంద స్వరూపమగు కైవల్యము ‘సిద్ధి’ మార్గము చేతనే సులభము. (ఏ మార్గములో ‘‘సోఽహమ్, తత్త్వమ్’’ భావనలు స్వాభావికమౌతాయో- అదియే సిద్ధి మార్గము.)
పతితా శాస్త్ర జాలేషు
ప్రజ్ఞయా తేన మోహితాః,
స్వాత్మ ప్రకాశరూపం తత్
కిం శాస్త్రేణ ప్రకాశ్యతే?
అట్టి సిద్ధి మార్గము (లేక) అట్టి కైవల్యపదము కొరకై శాస్త్రపుటలలో వెతికితే లాభమే ముంటుంది? శాస్త్రజాలములో పడినవాడు ప్రజ్ఞామోహితుడు అగుచున్నాడు. ప్రకాశరూపమగు స్వాత్మ అంతరముననే వేంచేసి యుండగా అట్టి ఆత్మపదము బయట గల శాస్త్రములు ఎట్లా ప్రకాశింపజేస్తాయి? ఆత్మ ప్రకారము అనుభవమవవలసినది అంతరముననే.
నిష్కళం నిర్మలం శాన్తం
సర్వాతీతం, నిరామయమ్,
తదేవ ‘జీవ’ రూపేణ
పుణ్య-పాప ఫలైః వృతమ్।।
కేవలీ స్వస్వరూపమగు ఆత్మ నిష్కళంకమైనది. (కళంకరహితమైనది)। అత్యంత నిర్మలము। పరమశాన్తము। ఈ దృశ్య-దేహ-మనో-బుద్ధి- -చిత్త అహంకారాది సర్వమునకు అతీతమైనది। నిర్విషయ-నిరామయమైనది। అట్టి కేవలీ ఆత్మయొక్క అంశయే ‘జీవుడు’. తన అంశవంటి రూపమును స్వీకరించినదై ఉండగా, అట్టి జీవరూపము పాప-పుణ్యఫలములగు సుఖ-దుఃఖములచే కేవలాత్మ ఆవరించబడుచున్నది. ఆత్మయొక్క ‘అంశ’ అగు జీవునికి సంబంధించినదే జగదనుభవము! ఆత్మకు ఎట్టి ఫలములతో సంబంధమే లేదు.
బ్రహ్మోవాచ :-
పరమాత్మ పదం నిత్యం,
తత్ కథం జీవతాఙ్గతమ్
తత్త్వాతీతం? మహాదేవ!
ప్రసాదాత్ కథయ, ఈశ్వర!
బ్రహ్మభగవానుడు :
అట్టి సర్వాతీతము, నిత్యనిర్మలము అగు ఆత్మ ఎందుచేత, ఏ విధంగా జీవిత్మత్వము పొందినదిగా అగుచున్నది? హే మహాదేవా! ఈశ్వరా! తత్త్వాతీతమగు ఆత్మ నిత్యనిర్మలము కదా! అది జీవుడుగా అవటమేమిటి? ఎంతటి చమత్కారం? ఎందుచేత? ఆత్మయొక్క అంశ ఆత్మను బంధించటమేమిటి?
ఈశ్వరౌ వాచ :-
సర్వభావ పదాతీతం,
జ్ఞానరూపం, నిరంజనమ్,
వాయువత్ స్ఫురితం
స్వస్మిన్ తత్ర ‘‘అహంకృతిః’ ఉత్థితా।
ఈశ్వరుడు :
అవును. సర్వభావములకు, సర్వపదములకు అతీతమైనది, కేవల జ్ఞానరూపము, దోషమే లేనట్టిది. నిరంజనము అయినట్టి ఆత్మాకాశము నందు - ఆకాశంలో వాయువు, వాయు తరంగములు స్ఫురిస్తున్న విధంగా - ‘అహంకారము’ (అహంకృతి - నేను దీనికి కర్తను →అను భావస్ఫూర్తి) బయల్వెడలుచున్నది. కర్తృత్వము ఏర్పడుచున్నచోట భోక్తృత్వము కూడా వచ్చిపడుతోంది.
పంచాత్మకమ్, అభూత్ పిణ్డం
ధాతు బద్ధం, గుణాత్మకమ్
సుఖ-దుఃఖైః సమాయుక్తం
జీవ భావనయాకురు।
అహమ్‌కృతమ్’ కల్పన నుండి - భూ, జల, అగ్ని, వాయు, ఆకాశ సమ్మేళన రూపమగు పంచాత్మక దేహత్వము (అభూతపిండము) జనిస్తోంది.
‘అభూతపిణ్డము’ అగు దేహిని ఆశ్రయించి అంతరంగము - అంతరంగ చతుష్టయం (మనో-బుద్ధి-చిత్త-అహంకారములు),
- ధాతువులకు సంబంధిత బద్ధము,
- సత్వ-రజో-తమో త్రిగుణాత్మకము
- సుఖ దుఃఖ భావ సంయుక్తము
అగు జీవభావము అంకురించుచున్నది. (అభూతపిండము = భావనారూప ఉత్సుకత)
తేన ‘జీవాభిదా’ ప్రోక్తా, విశుద్ధే పరమాత్మని!
కామ క్రోధ భయం చ అపి
మోహ లోభ మదో రజః;
జన్మ మృత్యుశ్చ కార్పణ్యం
శోకః తన్ద్రా క్షుధా తృషా
తృష్ణా లజ్జా భయం దుఃఖం
విషాదో హర్షఏవ చ..
ఏభిః దోషైః వినిర్ముక్తః
సజీవః ‘శివ’ ఉచ్యతే।।
ఫలితంగా,.. సర్వదా విశుద్ధుడగు ‘పరమాత్మ’ యందు ‘జీవాత్మ’ అనబడు ఆరోపణ (Attribution) బయల్వెడలుచున్నది. ఇది ‘జగత్తు’ అనే నాటకంలో పాత్రధారణ వంటిది.
జీవాత్మ యొక్క లక్షణ విశేషములు - ఏదో ఇంకా కావాలనే రూపముగల కామము; సుదీర్ఘ కోపరూపమగు క్రోధము; ఎప్పుడు ఏమౌతుందోననే భయము; కొన్ని కొన్నిటి పట్ల ఇచ్ఛ; సత్యవిచారణ చేయకుండా ఏర్పడే అభిప్రాయ ఆవేశరూపమగు మోహము; ‘‘నేను తదితరుల కంటే ప్రత్యేకమైనవాడినిగా ఉండాలి’’ - అనే రూపమైన మదము; జన్మ-మత్యు-వార్ధక్య-మమకారములు; శోకము; అలసత్వము, ఆకలి-దప్పికలు; తృష్ణ; లజ్జ, భయము; దుఃఖము; విషాదము; హర్షము.. ఈ మొదలైనవన్నీ జీవుని దోష లక్షణములు. భ్రమాత్మకమగు ఈ ఈ దోషములన్నిటినీ వదిలించుకుంటే.. ఈ జీవుడే శివుడు.
3. తస్మాత్ దోష వినాశార్ధం
‘ఉపాయమ్’ కథయామి తే!
అందుచేత ఓ చతుర్ముఖ బ్రహ్మ భగవన్! ఈ జీవాత్మపరంగా మనము చెప్పుకొన్న దోషములు పూర్తిగా నశించటానికి ఉపాయములేమిటో చెప్పుకుందాము. ఇది మీరు అడిగిన దానికి సమాధానము కాగలదు. ఈ జీవునిపట్ల ఉపాధి పరంపలుగా ఏర్పడుచున్న మానసికమైన భ్రమ బంధము (సంసార బంధము) తొలగగలదు.
‘జ్ఞానం’ - (ఇతి) కేచిత్ వదతి।
అన్యత్ర కేవలం తత్ న సిద్ధయే-
యోగహీనం కథం జ్ఞానం
మోక్షదమ్ భవతి ఇహ భోః?
‘‘జీవదోష నివారణకై జ్ఞానము మాత్రమే ఉపాయము మరొక ఉపాయమేదీ లేదు’’ అని కొందరు చెప్పుచున్నారు. అయితే జ్ఞానము మాత్రమే జీవునికి సిద్ధిని ప్రసాదించగలదా? అనగా, తెలుసుకొంటే సరిపోతుందా? లేదు. జీవుడు దృశ్య సంబంధ భ్రమలను జయించి, అతీతుడుకావద్దూ? యోగాభ్యాసం లేకుండా జ్ఞానము మోక్షమును ఎట్లా ఇవ్వగలుగుతుంది? ఇవ్వలేదు. (జ్ఞానము = తెలుసుకోవటము. యోగాభ్యాసము = అనిపించటానికి చేసే ప్రయత్నము)
యోగోఽపి జ్ఞాన హీనస్తు
న మోక్షో (క్షమో) మోక్ష కర్మణి।
తస్మాత్ జ్ఞానం చ యోగం చ
ముముక్షుః దృఢమ్ అభ్యసేత్।।
అదేవిధంగా, కేవలమూ ‘యోగము’నకు మాత్రమే పరిమితమైతే కూడా (జ్ఞానము లేకుండా - కేవలం కర్మలకు పరమితమైతే కూడా) - మోక్షము లభించదు.
అందుచేత ముముక్షువు (1) జ్ఞానము (2) యోగము - ఈ రెండూ దృఢంగా ఒకే సమయంలో అభ్యాసం చేయాలి.
జ్ఞాన స్వరూపమేవ ఆదౌ।
జ్ఞేయం జ్ఞానైక సాధనం।
‘అజ్ఞానం కీదృశం చ?’
ఇతి ప్రవిచార్యం ముముక్షుణా।
జ్ఞాతం యేన నిజం రూపం
కైవల్యం పరమం పదం।
మొట్టమొదట ‘జ్ఞానము’ గురించే బోధించబడుతోంది. సంసారము అనగా తెలుసుకొని ఉండకపోవటము - అను రూపము గల అజ్ఞానమే. కాబట్టి, తెలుసుకొనవలసిన ఆత్మ (జ్ఞేయము)కొరకై జ్ఞానమే మొదటి సాధనమే.
జ్ఞానముచే ఆత్మానుభవం తప్పక సిద్ధిస్తుంది. ముముక్షువు అయినవాడు ముందుగా ‘‘ఈ అజ్ఞానము అనగా ఎట్టిది? ఎట్టి స్థితి కలిగి ఉన్నది? ఈ దృశ్యజత్తంతా స్వతఃగా ఏదిగా అయి ఉన్నది’’ - ఈఈ ప్రశ్నలకు సమాధానముతో ఈ జీవుడు తన నిజరూపం తెలుసుకొంటేనే కైవల్య పదమును చేరగలడు. తనయొక్క నిజరూపము గురించిన ఎరుకయే జ్ఞానము. తెలుసుకొంటున్నది అనునిత్యంగా అనిపించటానికి అభ్యాసమే - యోగము)
4. అసౌ దోషైః వినిర్ముక్తః
కామ క్రోధ భయాదిభిః
సర్వదోషైః (ఆ)వృతో జీవః
కథం జ్ఞానేన ముచ్యతే?
అభ్యాసవశంగా అనేక దోషములచే ఆవృతుడైయున్న ఈ జీవుడు జ్ఞాన సమాచారము సంపాదించినంత మాత్రంచేత కామ-క్రోధ- భయముల నుండి విముక్తుడు కాగలడా? అవలేడు. ఆయా సంసార దోషములను తొలగించుకోవటానికి యోగాభ్యాసము కూడా అవసరము. అత్యవసరము
స్మాత్మరూపం యథా జ్ఞానం
పూర్ణం తత్ వ్యాపకం తథా।
కామ క్రోధాది దోషాణాం
స్వరూపాత్ నాస్తి భిన్నతా।
పశ్చాత్ తస్య విధిః కిన్ను?
నిషేధోఽపి కథం భవేత్?
అయితే ‘జ్ఞానము’చే, దేనిని గురించి తెలుసుకోవటం? తన రూపం గురించే కదా! స్వాత్మరూపము ఏతీరుగా (1) తనకు తానే పూర్ణమో, (2) సర్వవ్యాపకమో - ఎరుగుటయే జ్ఞానం. ఆ విధంగా పూర్ణ- సర్వవ్యాపక స్వస్వరూపాత్మ సర్వదా ఏకము, అఖండము అయి ఉండగా, అందులో స్వరూప - భేదములే ఉండజాలవు. ‘‘స్వరూపతః భిన్నత్వమే లేదు. కామక్రోధములు కూడా ఆత్మకు భిన్నంగా లేవు’’ - అని ఎరిగిన తరువాత ఇక విధి-నిషేధాలు మాత్రం ఎక్కడుంటాయి? వాటికీ స్ధానము ఉండదు.
వివేకీ సర్వదా ముక్తః,
సంసార భ్రమవర్జితః।
పరిపూర్ణ స్వరూపం
తత్ సత్యం, కమల సమ్భవ!
ఓ కమల సంభవా! బ్రహ్మదేవా! అవివేకము చేతనే ఈ జీవుడు సంసార భ్రమను కొనసాగిస్తూ, తత్ఫలితంగా బద్ధుడు అయి ఉంటున్నాడు. ‘‘ఆత్మ పరిపూర్ణ స్వరూపము. పరమ సత్యము’’ అని స్వస్వరూపము గురించి, అద్దాని సర్వాత్మకత్వము గురించి తెలుసుకున్న వివేకియో? సంసారభ్రమ తొలగించుకొని నిత్యముక్తుడగుచున్నాడు. పరిపూర్ణమగు తత్ సత్యమే తానగుచున్నాడు. (బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి)
5. సకలం నిష్కళంచైవ
పూర్ణత్వాచ్చ తదేవ హి।
కలినా స్ఫూర్తి రూపేణ
సంసార భ్రమతాం గతమ్।
(1) స-కలము (సంసారమగ్నమున మునిగి తేలుచున్న జీవాత్మ). (2) నిష్కళము - (నిర్మలుడు అగు కేవలాత్మ) ఈ రెండూ పూర్ణము అయియే ఉన్నాయి. అజ్ఞానములో మునిగి తేలుచున్నంత మాత్రం చేత జీవాత్మ తన యొక్క నిష్కళ - నిర్మల ఆత్మస్వరూపము పోగొట్టుకొని ఉండలేదు. కేవలమగు నిర్మలాత్మయే తన యొక్క స్ఫూర్తి (Inclination) చే కలనము (కల్పన)ను ఆశ్రయించి తన కల్పనయగు సంసారమునందు (మందనుండి విడివడిన కోతిలాగా) తిరుగాడుచున్నది.
నిష్కలం నిర్మలం సాక్షాత్।
సకలం గగనోపమమ్,
ఉత్పత్తి స్థితి సంహార స్ఫూర్తి
జ్ఞాన వివర్జితమ్।
ఏతత్ రూపం సమాయాతః
స కథం మోహసాగరే
నిమజ్జతి, మహాబాహో!
-త్యక్త్వా విద్యాం పునః పునః?
నిష్కలము, నిర్మలము సాక్షాత్ స్వరూపము, ఆకాశమువలె నిష్క్రియము, అనంతము అగు ఆత్మయే తాను. కానీ, ఈ జీవుడు తన యొక్క అఖండ - అప్రమేయ- నిత్యత్వాది ఆత్మలక్షణములను ఏమరిచి, లీలగా జ్ఞాన వర్జితము అగుచున్నాడు.
హే మహాభాహో! బ్రహ్మదేవన్! అటువంటి అఖండతతత్త్వమగు ఆత్మ తన యొక్క ఉత్పత్తి - స్థితి-లయస్ఫూర్తిని కలిగియున్నప్పటికీ.. తన యొక్క స-కల (కల్పనా, భావనా) రూపము (జీవాత్మత్వము) నకు పరిమితమై చరిస్తోంది. తన విద్యత్వమును ఏమరచినదై, మోహసాగరంలో మునుగుతోందే? ఏమి చమత్కారము!
సుఖ దుఃఖాది మోహేషు
యథా సంసారిణాం స్థితిః,
తథా జ్ఞానీ యథా తిష్ఠేత్
వాసనా వాసితః తథా।
ఒక సంసారి (అజ్ఞాని) ఏ విధంగా అయితే సుఖము - దుఃఖము మొదలైన మోహములలో ఉండి ఉంటున్నాడో, అట్లాగే శాస్త్ర సంబంధమైన జ్ఞానము తెలిసి కూడా ఆ (శాస్త్ర) జ్ఞాని-వాసనా సహితుడైయ్యే ఉంటున్నాడు. ‘వాసనలు’ అనే సంసార భావనల విషయంలో ఆ ఇద్దరికి తేడా ఏమీ లేదు. ఆత్మ గురించి ఎరిగినంత మాత్రంచేత సంసార దోషము తొలగదు. ఎందుకంటే, తెలుసుకుంటే చాలదు. అనిపించాలిగా!
తయోః నాస్తి విశేషో
అత్ర, సమా సంసార భావనా।
జ్ఞానం చేత్ ఈదృశం జ్ఞాతమ్
అజ్ఞానం కీదృశం పునః।।
‘‘ఇక్కడ కనబడేదంతా సర్వదా సహజము - కేవలము- అఖండము అగు ఆత్మస్వరూపుమే’’ అని తెలుసుకున్నంత మాత్రం చేత కూడా, ఆ తెలుసుకున్న వాని యొక్క మనో-బుద్ధి సంబంధమైన సంసార చేష్టలు (అజ్ఞానము) ఇంకా వీడవు. (అభ్యాసము కావాలిసిందే). లేదా, అజ్ఞానము మరల వచ్చి పడగలదు.
‘జ్ఞాననిష్ఠో విరక్తోఽపి
ధర్మజ్ఞో విజితేంద్రియః
వినా దేహేఽపి యోగేన
న మోక్షం లభతే, విధే!
ఓ విధీ! ఒకానొకడు - ఆత్మ గురించిన సమాచారము చదువుట, వినుట మొదలైన వాటిచే తెలిసియున్నవాడు, విరక్తుడు, ధర్మజ్ఞుడు ఇంద్రియములు కట్టి చేయ కలిగినవాడు అయినప్పటికీ కూడా యోగాభ్యాసము లేకపోతే ఆతనికి మోక్షము లభించదు. (రోగము గురించి తెలుసుకున్నంత మాత్రాన ఏమి లాభము? మందు వాడాలి కదా!)
అపక్వాః పరిపక్వాశ్చ
దేహినో ద్వివిథాః స్మృతాః।
‘అపక్వా’ యోగహీనాస్తు,
‘పక్వా’ యోగేన దేహినః।।
ఈ దేహధారులు రెండు తీరులుగా విభజించి చెప్పబడవచ్చును.
(1) అపక్వుడు - యోగాభ్యాసమును నిర్వర్తించనివాడు.
(2) పక్వుడు - యోగాభ్యాసముచే తాను తెలుసుకొన్న జ్ఞానమును ‘అనుభవము’గా తీర్చిదిద్దువాడు. సమస్తము బ్రహ్మముగా అనిపిస్తూ ఉన్నవాడు.
6. సర్వో యోగాగ్నినా దేహో హి, అజడః శోక వర్జితః
జడస్తు పార్థివో జ్ఞేయో హి, అపక్వో దుఃఖదో భవేత్।
ధ్యానస్థో అసౌ తథాపి ఏవమ్
ఇంద్రియైః వివశో భవేత్।
యోగాభ్యాసఫలమగు ‘యోగాగ్ని’చే ఈ భౌతిక దేహము తన జడత్వము త్యజించి మానసికంగా చైతన్యవంతము, తేజోవంతము అగుచున్నది. అట్టి యోగి-శోకము (Worry and meloncholy)ను మొదలంట్లా తొలగించు కొనగలుగు చున్నాడు. యోగాభ్యాసము లేని వాడు అగు అపక్వుడు - ఆత్మగురించినది పాఠముగా తెలిసినా కూడా, ఆత్మ గురించిన ధ్యాని అయినా కూడా, ఇంద్రియములకు వివశకుడుగానే ఉండిపోవుచున్నాడు. జడమగు పార్ధివ దేహబద్ధుడగుచున్నాడు.
తాని గాఢం నియమ్యాపి
తధాపి అన్యైః ప్రబాధ్యతే।
శీతోష్ణ సుఖ దుఃఖ ఆద్యైః
వ్యాధిభిః మానసైః తథా
అన్యైః నానావిధైః జీవైః
శస్త్రాగ్ని జలమారుతైః, శరీరం పీడ్యతే।
తైస్తైః చిత్తం సంక్షుభ్యతే తతః।।

జ్ఞానసమాచారము మాత్రము కలిగి యోగాభ్యాసి కాకపోతే,…అట్టివాడు ఇంద్రియములను గాఢంగా నియమించినప్పటికీ, అవి బాహ్య విషయములతో ప్రభావము పొందటము మానవు. విషయములు బాధిస్తూనే ఉంటాయి.
ఈ జీవుని యొక్క ఈ భౌతిక శరీరము→ శీత-ఉష్ణ సుఖ-దుఃఖ ఇటువంటి వాటిచే తను, శారీరక వ్యాధుల చేతను, మానసికమైన ఆథిలచేతను, శాస్త్ర నియమముల చేతను, అగ్నిచేతను, జలము చేతను, గాలి చేతను→బాధలుపడటం జరుగుతోంది. దానితో చిత్తము కూడా సంక్షోభము పొందసాగుచున్నది.
తథా ప్రాణవిపత్తౌ తు
క్షోభం ఆయాతి మారుతః।
తతో దుఃఖ శతైః వ్యాప్తం
చిత్తం క్షుబ్ధం భవేత్ నృణామ్।
దేహావసాన సమయే చిత్తే
యత్ యత్ విభావయేత్,
తత్ తదేవ భవేత్ జీవః।
ఇత్యేవం జన్మకారణమ్।।
ప్రాణములకు విపత్తు భావములు కలుగుచున్నప్పుడు దేహములోని వాయువు కూడా క్షోభ పొందుచున్నది. ఫలితంగా వందల దుఃఖములతో వ్యాప్తిని పొంది ఈ జీవుని మనస్సు/చిత్తము - అనేక రుగ్మతల వలన క్షుబ్దము పొందటం జరుగుచూనే ఉంటోంది.
ఈ జీవుడు - దేహము యొక్క అవసానస్థితిలో (At the Point of this Physical Body getting perished) - ఆతని చిత్తములో ఏఏ విశేషములు ప్రకాశమానమై ఉంటాయో, ఆయా భావములను అనుసరించేయే మరొక భౌతికదేహము సంక్రమించటం జరుగుతోంది. చిత్తములోని దృశ్యసంబంధిత విశేషములే మరుజన్మ యొక్క తీరుకు కారణమగు చున్నాయి. జ్ఞాని అయి ఉండి కూడా (యోగాభ్యాసము లేకపోతే) ఆతడు వాసనలకు తలవంచి ప్రవాహపతితుడు అగుచున్నాడు.
దేహాన్తే కిం భవేత్ జన్మ
తత్ న జానన్తి మానవాః।
తస్మాత్ జ్ఞానం చ వైరాగ్యం
జీవస్య కేవలం శ్రమః।
‘‘దేహము అంతమైన తరువాత ఈ జీవునికి ఏ జన్మ రానున్నది?’’. ఇది ఈ మానవుడు ఎరిగియుండటం లేదు. ఈ విధంగా యోగసాధనలతో కూడి ఉండనట్టి జ్ఞాన, వైరాగ్యములు ఈ జీవుని పట్ల శ్రమయే అగుచున్నాయి. ఇంద్రియములకు సంబంధించిన అభ్యాసములే పెత్తనం చెలాయిస్తున్నాయి. యోగాభ్యాసము చేతనో? - అవన్నీ జీవునికి వశమై ఉంటాయి.
పిపీలికా యథా లగ్నా
దేహే ధ్యానాత్ విముచ్యతే,
అసౌ కిం వృశ్చికైః దష్టో
దేహాన్తే వా కథం సుఖీ?
తన యొక్క దేహము గురించిన ధ్యానములో మునిగి తేలుచున్న ఒక చీమ (పిపీలికము) శరీరముపైకి ప్రాకుచూ, క్రిందకు త్రోసివేయపడగానే,.. ఎక్కడో పడి మరెటోగా అగుచున్నది చూచారా! ఆవిధంగా, అసంఖ్యాత వస్తు-రూప-నామ-సందర్భ విషయములతో మునిగి తేలుచున్న ఈ జీవుడు-ఈ దేహము శిధిలమగుచుండగా - ‘విషయములు’ అనే తేళ్లతో కుట్టబడుచున్న తీరుగా బాధలు పొందుచున్నాడు. ఇక ఈ దేహం పోయిన తరువాత మాత్రం సుఖం ఎక్కడిది? ఏవేవో సంస్కారములు (వాసనలు), ప్రభావము చూపుతూ ఏవేవో ఉపాధులలోకి ఈ జీవుని త్రోసివేస్తున్నాయి
7. తస్మాత్ మూఢా న జానన్తి
మిథ్యా తర్కేణ వేష్టితాః
అహంకృతిః యదా యస్య
నష్టా భవతి, తస్య వై।
దేహస్తు అపి భవేత్ నష్టో
వ్యాధయశ్చ అస్య కిం
పునః? జలాగ్ని శస్త్ర
ఘాతాది బాధా కస్య భవిష్యతి?
అందుచేత మూఢత్వము - మూర్ఖత్వము ఆశ్రయించి, తర్కములతో కప్పుకొని ఉన్న జీవుడు తన యొక్క వాస్తవ స్వరూప-స్వభావములను ఎరుగుచుండుటయే లేదు.
అయితే, ఎవ్వరి పట్లయితే అహంకారము (నాకు చెందినది-అను భౌతిక-మానసికాత్మక భావన) తొలగిపోవుచున్నదో, వారి పట్ల ఈ భౌతిక దేహము కూడా మొదలే, వర్తమానంలోనే నశించిపోయినదిగా అగుచున్నది. దేహమే లేనప్పుడు ఇక వ్యాధులు మాత్రం ఎక్కడుంటాయి? జలము- అగ్ని- శస్త్రఘాతముల వలన బాధలు మాత్రం ఏమి ఉంటాయి? యోగాభ్యాసముచేతనే దేహముపట్ల ఏర్పడి ఉంటున్న ‘మోహము’ తొలగ గలదు.
యదా యదా పరిక్షీణా
పుష్టాచ ‘అహంకృతిః
భవేత్, తమ్ ‘అనేన’
అస్య నశ్యన్తి ప్రవర్తన్తే రుగాదయః।
కారణేన వినా కార్యం
న కదాచన విద్యతే,
‘అహంకారం వినా తద్వత్
దేహే దుఃఖం కథం భవేత్?
అపరిశీలన చేత- బలముగా పుష్టిగా ఇప్పుడు కనిపిస్తున్న అహంకారము- యోగ బలముచే ఎప్పుడు క్షీణిస్తుందో, ఆ వెనువెంటనే శారీరక మానసిక రుగ్మతలు కూడా నశించినవే అగుచున్నాయి.
ఒక కార్యమునకు కారణము నశిస్తే ఆ కార్యము కూడా తొలుగుచున్నది కదా! (అజ్ఞానకార్యమగు) అహంకారము - ‘‘ఆత్మానుభవము’’చే తొలగితే, ఇక - ఈ దేహము, ఆ దేహముతో స్నేహము వలన కలుగుచున్న దుఃఖము - మిగిలి ఉంటాయా? ఉండవు. రహితమైపోగలవు. అటువంటి ‘‘నాకు దేహమనునది మొదలే లేదు’’ - అను రూపముగల దేహరాహిత్యము యోగాభ్యాసము చేతనే సుసాధ్యము. ఆత్మగురించి ఎరిగినంత మాత్రం చేత సరిపోదు.
శరీరేణ జితాః సర్వే।
శరీరం యోగిభిః జితమ్।

తత్ కథం కురుతే తేషాం
సుఖదుఃఖాదికం ఫలమ్?
సర్వజనులు శరీముచేత జయించి వేయబడుచున్నారు. అయితే ఒక్క యోగి మాత్రం శరీరమునే జయించివేసినవాడై ఉంటున్నాడు. శరీరమునే జయించివేసి ఉండటంచేత, ఇక ఆపై యోగికి సుఖ-దుఃఖాది ఫలములేమి ఉంటాయి? జ్ఞానముతో బాటుగా యోగము అభ్యసిస్తూ ఉంటేనే కర్మల వలన ఏర్పడే సుఖ-దుఃఖ ద్వంద్వములు జయించబడగలవు. అధిగమించబడగలవు.
ఇంద్రియాణి మనో బుద్ధిః, కామక్రోధాదికం జితమ్,
తేనైన విజితం సర్వమ్, న అసౌ కేనాపి బాధ్యతే।
ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, కామ-క్రోధములను ఏయోగి అయితే జయించి, తన వశం చేసుకొని ఉంటాడో, అట్టివానిని ఇక ఇక్కడ బాధించగలిగినది ఏముంటుంది? అవి జయించబడాలంటే అభ్యాసము అవసరము.
మహాభూతాని తత్త్వాని
సంహృతాని క్రమేణ చ,
సప్త ధాతుమయో దేహో
దగ్ధో యోగాగ్నినా శనైః
దేవైరపి న లక్ష్యేత, యోగదేహో మహాబలః।।
యోగాభ్యాసి పట్ల పంచమహాభూతములు, వాటి వాటి తత్త్వవిశేషములతో సహా క్రమంగా జయించబడి, ఆతనిని సేవించునవిగా అవుతాయి. యోగాగ్నిచేత సప్తధాతు మయమగు ఈ దేహము నెమ్మదిగా దగ్ధమైనదిగా అగుచున్నది. ఆతడు దుర్గ్రాహ్యుడు! ‘‘ఆతని యోగబలము ఇట్టిదికదా’’ అని దేవతల చేత కూడా తెలుసుకోబడటము లేదు. అందుచేత భౌతిక దేహం కంటే యోగదేహమే మహా బలవంతము, మహత్తరము కూడా!
8. భేద బన్ధ వినిర్ముక్తో, నానా శక్తి ధరః పరః
యథా ఆకాశః తథా, దేహ - ఆకాశాదపి నిర్మలః,
సూక్ష్మాత్ సూక్ష్మతరో దృశ్యః
స్థూలాత్ స్థూలో, జడాత్ జడః।
పరాత్మ→ సర్వభేద-బంధములు లేనట్టిది. నానా శక్తియుతమైనది.
యోగీశ్వరుని ఆత్మ దేహము - ఆకాశము వలె ఆద్యంతములు లేనిది అగుచున్నది. ఆకాశము కంటే కూడా అత్యంత నిర్మలము.
దృశ్యము కంటే సూక్ష్మాతిసూక్ష్మము. స్థూలములన్నిటికంటే స్థూలమైనది. జడవస్తువులన్నిటి కంటే కూడా జడమైనది. అందుచేత యోగాభ్యాసిని ఈ దృశ్యము అడ్డుకోజాలదు.
ఇచ్ఛారూపో హి యోగీన్ద్రః
స్వతంత్రస్తు అజరామరః
యోగీంద్రుడు దేహానంతరము తాను ఇష్టము వచ్చిన రూపము పొందుటయందును, జరామరణముల పట్ల కూడా సర్వస్వతంత్రుడై ఉంటున్నాడు. యోగాభ్యాస బలము లేకుంటే ఈ జీవుడు కర్మలకు, సంస్కారములకు వశుడై అస్వతంత్రుడు అగుచున్నాడు.
క్రీడతే త్రిషులోకేషు
లీలయా యత్ర కుత్ర చిత్
అచిన్త్య శక్తిమాన్ యోగీ
నానా రూపాణి ధారయేత్।
సంహరేచ్చ పునస్తాని
స్వేచ్ఛయా విజితేంద్రియః।
యోగాభ్యాసముచే సిద్ధిపొందినవాడు…
→ త్రిలోకములూ క్రీడామైదానములుగా కలిగి ఉండగలడు.
→ లీలగా సర్వత్రా స్వతంత్రంగా సంచరించువాడవగలడు.
→ అచిన్త్యమగు శక్తిమంతుడై ఆ యోగి అన్ని రూపములు తానే అయి ధారణ చేస్తున్నాడు. ఏ రూపమైనా ధరించగలిగే యోగిని ‘రూపపరిమితము’ ఏముంటుంది? ఈ భౌతిక దేహాకార - దేహ స్వభావములకు ఆతడు పరిమితుడై ఉండడు.
→ ఇంద్రియములను జయించుటచే ‘స్వేచ్ఛ’ (Freedom) పొందిన వాడగుచున్నాడు.
ఇంద్రియములు తనకు వశమై ఉన్నవాడు - ఏ రూపమైనా పొందగలడు, ఇచ్ఛానుసారము ఉపసంహరించగలడు. ఉత్తరోత్తర జన్మలు ఆతనికి అధీనము.
న అసౌ మరణమ్ ఆప్నోతి
పునః యోగబలేన తు
హరేన మృత ఏవ అసౌ,
మృతస్య మరణం కుతః?
తనయొక్క యోగబలము చేత మృత్యువును హరించివేసిన వాడై ఉంటాడు. అందుచేత ఆతనికి మరణము ఉండదు. ‘‘ఈ దేహముతో ఇప్పుడు ఉన్నట్లే దేహ పతనము తరువాత కూడా ఆత్మగా నేను యథాతథము’’ అని సిద్ధి పొందిన వానికి, ఈ శరీరమును ‘‘ఇప్పటికిప్పుడే మృతించిన వస్తువు’’గా దర్శించిన వానికి - ఇక మరణమెక్కడిది?
మరణం యత్ర సర్వేషాం
తత్ర అసౌ పరిజీవతి
యత్ర జీవతి మూఢస్తు
తత్ర అసౌ మృత ఏవ వై।।
అందరికీ ఎక్కడ మరణము సంఘటితము అవుతోందో, అక్కడ యోగి జీవించియే ఉంటాడు. ఎక్కడ మూఢుడు జీవించియే ఉంటాడో, అక్కడ ఎల్లప్పుడు మృత్యువు ఉండియేఉంటున్నది అగుచున్నది.
యోగి → నిత్య జీవనుడు అయోగి → నిత్య మృతుడు
కర్తవ్యం నైవ తస్య అస్తి।
కృతేన అసౌ న లిప్యతే।
జీవన్ముక్తః సదా స్వచ్ఛః,
సర్వదోష వివర్జితః।।
ఆత్మాఽహమ్ భావన, సిద్ధించుకున్న యోగికి ‘కర్తృత్వము’ (నేను ఇది చేయాలి అనే తపన) ఉండదు. ‘‘ అహంకర్తా’’ అనునది మొదలంట్లా లేకుండటం చేత, ‘ఏదో పొందాలి’ అనేదీ ఉండదు. అందుచేత ఆతనికి కర్మల దోషము అంటదు. ఆతడు సర్వదోషములు తొలగినవాడై ‘జీవన్ముక్తుడు’గా ప్రకాశించుచున్నాడు.
9. విరక్తా జ్ఞానినశ్చ అన్యే
దేహేన విజితాః సదా,
తే కథం యోగిభిః తుల్యా
మాంసపిండా కుదేహినః,
దేహాన్తే జ్ఞానిభిః పుణ్యాత్
పాపాచ్చ ఫలమ్ ఆప్యతే?
యోగాభ్యాసముచే యోగసిద్ధిని పొందక, ఈ భౌతిక దేహమును ‘జయించని’ వారి గురించి ఇంకా కూడా ఈ తీరుగా ఉంటుంది.
కొందరు శాస్త్రజ్ఞానముచే విరక్తి పొంది ఉండి కూడా, వారు - యోగాభ్యాసము లేని కారణంగా - దేహములచే జయించబడుచున్నారు. మాంసపు ముద్దల రూపమగు కుత్సిత దేహమునకు వశులై జీవిస్తున్నారు. ఈ దేహము నశించిపోయిన తరువాత కూడా జ్ఞాని (శాస్త్రజ్ఞాని) విషయములో పాప-పుణ్య ఫలములు ఫలీకరిస్తూనే ఉంటాయి. యోగి విషయంలోనో? ఫలీకరించలేవు. యోగి సమస్త ఫలములను నిష్పలము చేసివేయగలుగుచున్నాడు.
ఈదృశస్తు భవేత్ తత్ తత్
భుక్త్వా జ్ఞానీ పునర్భవేత్।
పశ్చాత్ పుణ్యేన లభతే
సిద్ధేన సహ సంగతిమ్।
ఆ పాప-పుణ్యఫలములగు దుఃఖములను, సుఖములను అనుభవించ టానికి జ్ఞాని మరల దేహధారి అవవలసి వస్తుంది. పునఃజన్మ పొందవలసి వస్తోంది. యోగియో? దేహ పరంపరలను జయించి ‘సిద్ధుడు’ అగుచున్నాడు. సాక్షిత్వము సిద్ధించుకుంటున్నాడు. (జాగ్రత్-స్వప్న- సుషుప్తులు నాచేతనే సిద్ధింపబడుచున్నాయి’’ అని అనుభూతుడగు చున్నాడు)
ఒకనికి పుణ్య కార్యముల ఫలితంగా యోగసిద్ధపురుషులతో సాంగత్యము (గురుసామీప్యము) లభించుచున్నది.
తతః సిద్ధస్య కృపయా
యోగీ భవతి, న అన్యథా।
తతో నశ్యతి సంసారో
న అన్యథా, శివభాషితమ్।
అనగా, ఆ యోగ-సిద్ధపురుషుని కృపచేత (గురుకృపచే) యోగసేవకుడు ‘యోగసిద్ధుడుగా అగుచున్నాడు. అట్టి గురు ఆశ్రయము, యోగాభ్యాసముల సిద్ధిచే ‘సంసారము’ నశిస్తోంది. ‘శివము’ అని భాషితము (చెప్పబడు) స్థానమును ఆ యోగాభ్యాసి చేరుచున్నవాడగుచున్నాడు. ఇది శివప్రవచిత భాష్యము.
యోగేన రహితం జ్ఞానం
న మోక్షాయ భవేత్, విధే!
జ్ఞానేనైవ వినా యోగో
న సిద్ధ్యతి కదాచన।
కాబట్టి ఓ సృష్టికర్తా! మహాప్రాజ్ఞా! బ్రహ్మదేవా! యోగాభ్యాసము, యోగసిద్ధి లేకుండా కేవలము జ్ఞానముచే మోక్షము లభించదు.
అట్లా అయి ఉండి కూడా, ‘జ్ఞానము’ లేకుండా కేవలము యోగము మాత్రమే వలన మోక్షము సిద్ధించదు. ముముక్షు ఈ రెండు విషయములను సుస్పష్టపరచుచుకొని ఉండాలయ్యా.
జన్మాన్తరైశ్చ బహుభిః
యోగో జ్ఞానేన లభ్యతే।
జ్ఞానం తు జన్మని ఏకేన
యోగాత్ ఏవ ప్రజాయతే।।
అనేక జన్మల జ్ఞానసముపార్జన యొక్క ఫలప్రదముగా యోగాభ్యాసము లభిస్తోంది. అయితే జ్ఞానమో? ఒక్క జన్మలో యోగము యొక్క అభ్యాసముచే లభించగలదు. యోగ-జ్ఞానముల సిద్ధిచే ఈ జీవుడు మోక్షాకాశములో విహరిస్తున్నాడు.
(అనగా ‘సిద్ధి’ లేక ‘మోక్షము’-లభించాలంటే జ్ఞానమార్గములో అనేక జన్మలు ఆవస్యకమౌతున్నాయి. యోగాభ్యాసికి ఒక్క జన్మలో అది సిద్ధించగలదు)
10. తస్మాత్ యోగాత్ పరోనాస్తి।
యోగమార్గస్తు మోక్షదః।
ప్రవిచార్య చిరం జ్ఞానం
‘ముక్తోఽహమ్’ ఇతి మన్యతే।
కిమ్ అసౌ-మననాత్ ఏవ
ముక్తో భవతి తత్ క్షణాత్।।
అందుచేత ‘యోగము’ను మించినది ఏదీ లేదు. యోగమార్గమే త్వరితంగా మోక్షప్రదాత. చిరకాలము జ్ఞానవిశేషములను దీర్ఘ- తీవ్రవిచారణ చేయుచుండగా ‘నేను ముక్తుడనే’ అను భావన జనిస్తోంది.
‘‘నేను ఎట్లాముక్తుడను?’’ అని ‘మననము’ చేయుచూ, తత్ యోగ- మార్గముగా తక్షణమే ముక్తుడు అగుచున్నాడు. ఈవిధంగా యోగ - జ్ఞానములు పరస్పరము అన్యోన్యత పొందినవై, ముక్తికి దారి తీయగలవు.
పశ్చాత్ జన్మాంతర శతైః, యోగాత్ ఏవ విముచ్యతే
న తథా భవతో యోగాత్, జన్మమృత్యూః పునః పునః।
జ్ఞానము సంపాదించుకున్న తర్వాత.. వందజన్మల తరువాత అయినా కూడా చివ్వరికి ‘యోగము’ చేతనే ముక్తుడు అగుచున్నాడు. యోగసిద్ధి లభించగా, ఇక ఆపై పునఃపునః జన్మ-మృత్యువులు అనేవి ఉండవు.
ప్రాణ-అపాన సమా యోగః
చంద్ర-సూర్య ఏకతా భవేత్।
సప్తధాతుమయన్ దేహమ్
అగ్నినా రంజయేత్ ధృవమ్।
వ్యాధయః తస్య నశ్యంతిః
ఛేద ఖాతాధికాః తథా।
తత్ అసౌ పరమాకాశరూపో దేహీ అవతిష్ఠతి।।
‘‘ప్రాణ-అపానముల సమానము’’ అను యోగమార్గములో చంద్ర-సూర్యుల (శీత-ఉష్ణముల) ఏకత్వము (ఐక్యము) రూపుదిద్దుకొనుచున్నది.
అందుకుగాను సప్తధాతుమయమగు ఈ దేహమును యోగాగ్నిచే ధృవముగా రంజింపజేయాలి. యోగాగ్నిచే కాల్చి పరిశుభ్రము చేయాలి.
అట్టి ప్రాణ-అపానముల సమానయోగము వలన జనించిన అగ్నిచే దేహములోని ‘ఛేత(Inner cuts)- పిత్త -ఖాత (వాత)’ మొదలైన అధిక-అల్ప దోషములు తెచ్చుచున్న వ్యాధులు నశించుచున్నాయి. ఈ జీవుడు భౌతికత్వమును అధిగమించి ‘పరమాకాశరూపుడు’గా అవతిష్ఠితుడు అగుచున్నాడు.
కిం పునః బహునా ఉక్తేన?
మరణం నాస్తి తస్య వై।
దేహివత్ దృశ్యతే లోకే
దగ్ధ కర్పూరవత్ స్వయమ్।
చిత్తం ప్రాణేన సంబద్ధం
సర్వ జీవేషు సంస్థితమ్।।
ఇన్ని మాటలెందుకు? ఆతని పట్ల ‘మరణము’ అనునది ‘లేనిదే’ అగుచున్నది. దేహ-దేహాంతరములుగా స్వస్వరూపము వదలక ‘‘మరణముతో నేను ముగియను. జన్మతో ఆరంభంకాను’’ - అను దేహసంబంధమైన సునిశ్చిత స్వానుభవమును పుణికిపుచ్చుకొనుచున్నాడు. ఆతడు వర్తమానదేహమును కూడా దగ్ధమైన కర్పూరము వలె నశించిపోయిన వస్తువుగా దర్శించుచున్నాడు.
సర్వ జీవులలోను (1) చిత్తము (2) ప్రాణము పరస్పరంగా సంబద్ధము కలిగినవై ఉంటున్నాయి. (Mutually tangled)
రజ్జ్వా యత్‌వత్సు సంబద్ధః
పక్షీ తత్‌వత్ ఇదం మనః।
నానా విధైః విచారైస్తు
న బాధ్యం జాయతే మనః।।
ప్రాణాయామాభ్యాసముచే ఈ చిత్తము -త్రాడుచే కాలుకట్టబడిన పక్షి వలె - ఆ అభ్యాసికి వశమై ఉంటుంది. ఇకప్పుడు ఆ చిత్తము (లేక) మనస్సు అనేక దృశ్యసంబంధమైన విచారములు (Worries) పొంది కూడా బాధింపబడజాలదు. (దర్పణము తనలోని ప్రతిబింబిత దృశ్యములకు సాక్షిగా, వేరుగా ఉండు తీరుగా, వాటిచే బాధించబడనట్లుగా) మనస్సు నానా విచారణ విషయములతో సంబంధము కలిగి ఉండి కూడా, దేనిచేతనూ బాధింపబడజాలనిదై ఉండగలదు.
11. తస్మాత్ తస్య జయ-ఉపాయః (జయోపాయః)
ప్రాణ ఏవహి, న అన్యథా।
తర్కైః జలైః, శాస్త్ర జాలైః
యుక్తిభిః మంత్ర భేషజైః
న వశోజాయతే ప్రాణః
‘సిద్ధి’ ఉపాయమ్ వినా, విధే!
ఉపాయం తమ్ అవిజ్ఞాయ యోగమార్గే ప్రవర్తతే
ఖండ జ్ఞానేన సహసా జాయతే క్లేశవత్ తరః।।
అందుచే, చిత్తమును (లేక ఈ మనస్సును) జయించుటకు ఉపాయము ఏది? ప్రాణయోగమే। మరొక ఉపాయమేదీ లేదు.
ప్రాణము వశమైతే, మనస్సు సులభంగా వశమౌతుంది. అట్టి ‘ప్రాణము’ వశమయ్యేది ఎట్లా? యోగసిద్ధి చేతనే!
ప్రాణాయామము గురించిన చర్చ - వర్ణనములచేత, తర్క-వితర్కముల చేత, శాస్త్రజాలములచేత, యుక్తులు - ఉపాయములచేత, మంత్రతంత్రముల చేత ప్రాణసిద్ధియోగాభ్యాసము లేకుండా (లేక ప్రాణనిశ్చలములేకుండా) ప్రాణము వశము కాదు. మరొక విషయం కూడా. ఉపాయములు తెలుసుకోకుండా, అఖండాత్మజ్ఞానాశయము అర్ధం చేసుకోకుండా కేవలము యోగమార్గములో ప్రవర్తించటం చేత క్లేశములు ఇంకా అధికమౌతాయి. ఖండజ్ఞానము కొనసాగిస్తూ అఖండజ్ఞానమును అర్ధం చేసుకోకపోతే ఆ యోగ-అభ్యాసము వృధాయే!
యో అజిత్వా పవనం మోహాత్
యోగమ్ ఇచ్ఛతి యోగినామ్
సో- ‘‘అపక్వం కుమ్భమ్’’-
ఆరుహ్య సాగరం తర్తుమ్ - ఇచ్ఛతి।
ఎవ్వడైనా (ప్రాణ యోగాభ్యాసముచే) వాయురూపమగు మనస్సును జయించకుండా, ‘‘యోగుల యోగస్థానము నాకు సిద్ధించాలి’’ - అని కోరుకోవటము → ‘‘పచ్చికుండ (కాల్చనికుండ)ను చేతపట్టుకుని సముద్రంలోకి ఉరికి ‘నేను ఆవల ఒడ్డుచేరుతాను’’ - అని ఇచ్ఛగించటము (కోరుకోవటము)’ వంటిది.
యస్య ప్రాణో విలీనో
అన్తః సాధకే జీవితే సతి,
పిణ్డో న పతితః తస్య
చిత్తం దోషైః ప్రబాధ్యతే,
శుద్ధే చేతసి తస్యైవ
‘స్వాత్మజ్ఞానం’ ప్రకాశతే।
ఏ యోగి యొక్క ప్రాణము ఆతడు జీవించి ఉండగానే విశ్వ ప్రాణమునందు ‘‘సంవిలీనము’’ పొందుచున్నదో, అట్టివాడు పిండపతనము (సంసారము నందు దేహములుగా పడిపోవటము) జరుగదు. ఆతని చిత్తము దోషములచే బాధించబడదు. యోగాభ్యాస బలముచే సమస్తమునకు సాక్షి అయి ఆనందముగా చూస్తూ ఉండగలడు.
ఆతని చిత్తము యోగాభ్యాస ప్రయోజనంగా పరిశుద్ధమౌతూ ఉండగా, స్వాత్మజ్ఞానము స్వయముగా ప్రకాశించగలదు.
తస్మాత్ జ్ఞానం భవేత్ యోగాత్ జన్మని ఏకేన, పద్మజ!
తస్మాత్ యోగం తమేవ ఆదౌ సాధకో నిత్యం అభ్యసేత్।
ఓ పద్మజా! బ్రహ్మదేవా! ‘యోగాభ్యాసము’ చేత ఒక్క జన్మలోనే జ్ఞానము సిద్ధించవచ్చును. అందుచేత ముముక్షువైనవాడు మొట్టమొదటగా సాధకుడై జ్ఞానముతో కూడిన యోగమును నిత్యము అభ్యసించును గాక.
ముముక్షుభిః ప్రాణజయః, కర్తవ్యో మోక్షహేతవే।
యోగాత్ పరతరం పుణ్యం। యోగాత్ తత్ పరతరం శివం।
యోగాత్ పరతరం సూక్ష్మం। యోగాత్ పరతరం నహి।
ప్రాణజయమే ముముక్షువులకు మోక్షము కొరకై కర్తవ్యము. ప్రాణయోగాభ్యాసము మహత్తరమగు మోక్షోపాయము.
యోగమును మించిన పుణ్యము, శివము, సూక్ష్మ మార్గము మరింక ఏదీ లేదు. యోగముచే సిద్ధించనిదంటూ ఏదీ ఉండదు.
12. యో అపాన-ప్రాణయోః ఐక్యం
స్వ రజో-రేతసోః తథా
సూర్యా-చంద్రమసోః యోగో
జీవాత్మ-పరమాత్మనోః,
ఏవన్తు ద్వంద్వ జాలస్య
సంయోగో-‘యోగ’ ఉచ్యతే।।

యోగము = ఏ ప్రయత్నము చేత
✤ అపాన - ప్రాణములు,
✤ స్వకీయ రజో - తేజస్సులు (రేతస్సులు)
✤ సూర్య - చంద్రమసములు,
✤ జీవాత్మ - పరమాత్మలు
… ఇటువంటి ద్వంద్వజాలము సంయోగము పొందగలవో, ఏకత్వము సంతరించుకోగలవో, అట్టి అభ్యాసమే ‘యోగము’
అధ ‘యోగశిఖాం’ వక్ష్యే
సర్వజ్ఞానేషు చ ఉత్తమామ్।
యదా అనుధ్యాయతే మన్త్రమ్
గాత్ర కమ్పో అథ జాయతే।
ఓ మహాప్రాజ్ఞుడవగు చతుర్ముఖ బ్రహ్మదేవా! ఇప్పుడిక సర్వజ్ఞానములలో ఉత్తమమైనదగు ‘యోగశిఖ’ గురించి వివరించుకుంటున్నాము.
మొట్టమొదట మంత్రముతో ధ్యానము చేయుచుండగా గాత్ర (శరీర) కంపనము కలుగుచూ ఉంటుంది. (అందుచేత స్థిరము అయిన సుఖాసనము ఆవశ్యకము).
ఆసనం పద్మకం బధ్వా
యచ్చ అన్యదపి రోచతే।
నాసాగ్రే దృష్టిమ్ ఆరోప్య
హస్త పాదౌచ సంయతౌ।
మనః సర్వత్ర సంగృహ్య
‘ఓం’ కారం తత్ర చిన్తయేత్।
⌘ పద్మాసనము గాని, (లేక) యోగికి సానుకూల్యమైన మరేదైనా ఆసనముగాని ధరించి,
⌘ దృష్టిని నాసాగ్రము (ముక్కుకు పైభాగమున) ఆరోపించి (నిలిపి)
⌘ పాదములను చేతులతో పట్టుకొని ఉండి,
⌘ మనస్సును విషయముల నుండి ఉపసంహరించి,
⌘ (జాగ్రత్-స్వప్న-సుషుప్తుల కేవల సాక్షీ స్వరూప పరమాత్మ సంజ్ఞయగు) ‘ఓం’కారమును చిన్తన చేయునుగాక!
ధ్యాయతే సతతం ప్రాజ్ఞో
హృత్ కృత్వా పరమేశ్వరమ్।।
ప్రాజ్ఞుడు తన హృదయకమలము నందు వేంచేసియున్న పరమేశ్వరుని ధ్యానము చేస్తూ ధ్యాసను నిలుపుచుండాలి.
13. ఏకస్తమ్భే నవద్వారే త్రిస్థూణే పంచదైవతే
ఈదృశే తు శరీరే వా మతిమాన్ న ఉపలక్షయేత్।।
ఆదిత్య మండలాకారం, రశ్మిజ్వాలా సమాకులమ్
తస్య మధ్యగతం వహ్నిం, జ్వాలయేత్ దీపవర్తి వత్।
(1) ఒక స్తంభము (2) ‘9’ ద్వారములు(3) ‘3’ స్థూణములు (స్థూల - సూక్ష్మకారణములు) (4) ‘5’ గురుదేవతలు (పంచేంద్రియములు)- ఇవి తన యందు కలిగి ఉంటున్న ఈ శరీరము నందు బుద్ధిమంతుడైనవాడు లక్ష్యమును ఉంచడు. ఒక చీకటి గదిలో దీపపు ఒత్తిని వెలిగించు విధంగా- ఆదిత్య మండలాకారమైనట్టిది, కిరణ జ్వాలలతో కూడినట్టిది - అగు జ్ఞాన-తేజస్సును శరీరమునందే ప్రజ్వలింపజేయాలి. దేహము మధ్యగా వెలిగించి, ఈ దేహ పరిమితభావ అజ్ఞాన చీకట్లను పారత్రోలాలి.
దీపశిఖా తు యా మాత్రా, సా మాత్రా పరమేశ్వరే!
భిన్దన్తి యోగినః సూర్యం, యోగాభ్యాసేన వై పునః।।
గదిలో దీపపుశిఖ ఎటువంటిదో, ఈ దేహమునందు పరమేశ్వరుడు అటువంటివారు.
యోగాభ్యాసముచే యోగులు దేహములోని సూర్యుని (సూర్యనాడిని) ఛేదించుచున్నారు. (యోగాభ్యాసముచే ‘పింగళ’ను అధిగమిస్తున్నారు)
14. ద్వితీయగ్ం సుషుమ్నా ద్వారం
పరిశుభ్రగ్ం సమర్పితమ్।
కపాల సంపుటం పీత్వా
తతః పశ్యతి ‘తత్’ పదమ్।।
రెండవది : సుషుమ్ననాడీ ద్వారమును పరిశుభ్రపరచి కుండలినీ శక్తిని సుషుమ్నకు అంతరమును - ఊర్ధ్వంగా గమనమును చేయిస్తున్నారు. కపాల సంపుటమునకు జేర్చుచున్నారు. కపాలమును (బ్రహ్మరంధ్రమును) చేరిన సుషుమ్న కపాల సంపుటమును మ్రింగివేసి (దాటివేసి) (సహస్రారములో) తత్‌పదమును దర్శించుచున్నది. (కుండలిని = ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తి ; తత్ పదం = సహస్రారం)
అథ తత్ ధ్యాయతే జన్తుః
ఆలస్యాచ్చ ప్రమాదతః,
యది త్రికాలమ్ ఆగచ్ఛేత్
స గచ్ఛేత్ పుణ్య సంపదమ్।।
కపాల సంపుటిలో ప్రవేశించిన యోగి అలసత్వము, ప్రమాదము (బద్ధకము) పొందుచున్నాడు. పై త్రికాలములలోను కపాల సంపుటమును ప్రవేశము చేయు యోగాభ్యాసముచే వాటిని జయిస్తూ పుణ్య సంపదాఫలము సంపార్జించుకోవాలి.
పుణ్యమ్ ఏతత్ సమాసాద్య
సంక్షిప్య కథితం మయా
లబ్ధయోగో అథ బుధ్యేత
ప్రసన్నం పరమేశ్వరమ్।
పరమశివుడినగు నేను సహస్రారస్థానమున సర్వదా వేంచేసిఉన్నాను. త్రికాల యోగాభ్యాసముచే పుణ్యఫలంగా కపాల సంపుటమునకు కుండలినిని జేర్చిన యోగి, నాచే సంక్షిప్తంగా బోధించబడి, సత్యమును ఎరిగి ప్రసన్నుడై పరమేశ్వర సంబంధమైన స్వీయతత్త్వమును ఎరుగుచున్నాడు.
జన్మాంతర సహస్రేషు యదా క్షీణన్తు కిల్బిషమ్,
తదా పశ్యతి యోగేన సంసారోచ్ఛేదనమ్ మహత్।
(బ్రహ్మరంధ్రమునకు కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా చేర్చటము అనే) యోగముచే వేలాదిజన్మల కర్మదోషములు నశించిపోగా, మహత్ రూపమగు సంసారము యొక్క విచ్ఛేదనము (cut off)ను - పశ్యేత్ - చూచుచున్నాడు.
అధునా సమ్ప్రవక్ష్యామి, యోగాభ్యాసస్య లక్షణమ్।
మరుత్ జయో యస్య సిద్ధః, సేవయేత్ తత్ గురుం సదా।
గురువక్త్ర ప్రసాదేన కుర్యాత్ ప్రాణజయం బుధః।
యోగాభ్యాస లక్షణములు - ఓ పద్మసంభవా! ఇప్పుడు మనము జీవులకు సర్వశుభములు కలుగజేయు ‘‘యోగాభ్యాసలక్షణములు’’ గురించి, చెప్పుకుంటున్నాము.
‘వాయుజయము’ సముపార్జించుటకు సంసిద్ధుడగుచున్న ముముక్షువు (లేక) యోగాభ్యాసి ముందుగా గురువును సేవించునుగాక!
గురుముఖతః యోగ విధానమును నేర్చి, వారి ప్రసాదముచే బుధులు ‘పాణజయము’ను యోగాభ్యాసముగా నిర్వర్తించుచున్నారు.
వితస్తి ప్రమితం దైర్ఘ్యం
చతరంగుల విస్తృతమ్,
మృదులం ధవళం ప్రోక్తం
వేష్టన అమ్బర లక్షణమ్।
నిరుద్ధ్య మారుతం గాఢం శక్తిచాలన యుక్తితః
అష్టధా కుండలీభూతా(త్వా)మ్
ఋజ్వీం కుర్యాత్తు కుండలీమ్।
8 మెలికలతో చుట్టచుట్టుకొనియున్న కుండలినీ శక్తిని నిదురలేపి ఋజు మార్గంగా కదల్చాలి. అందుకుగాను 4’’ల వెడల్పు, (12’’ పొడవు) గల తెల్లటి వేష్టనము(వస్త్రము)ను పరచి మూలాధారములోని కుండలినీ శక్తియొక్క యోగాభ్యాసం కొరకు సంసిద్ధము చేయాలి.
‘‘శక్తిచాలనము’’ - అనే యుక్తిచే వాయువును దృఢగముగా నిరోధించాలి. (ప్రాణ-అపానముల ఏకత్వ రూపమగు ‘కుంభకము’ను అభ్యసించాలి). అష్టవిధ ప్రకృతి రూపమగు కుండలినీ శక్తిని - ఋజ్వాం కుర్యాత్తు। - ఋజుమార్గంగా (Straight forward) చేయాలి.
15. పాయోః ఆకున్చనమ్ కుర్యాత్
కుండలీం చాలయేత్ తదా।
మృత్యువక్త్ర గతస్య అపి
తస్య మృత్యుభయం కుతః?
‘‘పాయువును (మూలాధార స్థానమును)ఆకుంచనము (బిగింపు) చేస్తూ కుండలినీ శక్తిని చలింపజేయటము’’- అనే యోగవిధానమును అభ్యసించాలి. ఏ యోగి కుండలినీ శక్తి చాలనమును సిద్ధింపజేసు కుంటాడో,.. అట్టివాడు మృత్యువు యొక్క ముఖము ఎదురైనప్పుడు కూడా మృత్యుభయము పొందడు. స్వస్వరూపమునందు అచ్యుతుడై ఉంటాడు.
ఏతత్ ఏవ పరం గుహ్యం, కథితస్తు మయా తవ।
వజ్రాసనగతో నిత్యమ్, ‘ఊర్థ్వాకున్చనమ్’ అభ్యసేత్।
వాయునా జ్వలితో వహ్నిః, కుండలీమ్ అనిశం దహేత్
సంతప్తాసా అగ్నినా, జీవశక్తిః - త్రైలోక్యమోహినీ,
ప్రవిశేత్ చంద్రఖండే తు సుషుమ్నా వదవాన్తరే।
అట్టి ‘కుండలినీ చాలనవిద్య’ అను యోగ రహస్యము నాచే మీతో చెప్పబడుతూ వస్తోంది.
[పాదములను చేతులతో గట్టిగా పట్టుకొని, చీలమండలముచే ఆసనమును (కందమును, మూలాధార క్రింద ప్రాంతమును)నొక్కి ఉంచి, ఎడమవైపుగా ఉదరమును నిలిపి ఉంచి, హృదయమును గళము వైపుగా లాగి ఉంచటము అనబడు] ‘‘వజ్రాసనము’’ ధరించి, క్రిందకు ప్రయాణించు అపాన వాయువును పైకి లాగుట’’ అను ‘‘ఊర్ధ్వ అకున్చనము’’ను నిత్యము అభ్యసించాలి.
ప్రాణ-అపాన సంయోగముచే (ప్రాణాయామముచే) జనించు అగ్నితో కుండలినీ శక్తిని ఎప్పుడూ దహిస్తూ ఉండాలి.
త్రిలోకములను మోహింపజేయు ‘జీవశక్తి’ అగు కుండలినీ శక్తి సుషుమ్న నాడి యొక్క ముఖద్వారము ద్వారా ‘చంద్రఖండము’ నందు (సుషుమ్నలోని చల్లటి ప్రదేశములో) ప్రవేశము పొందుచున్నది.
వాయునా వహ్నినా సార్థం
బ్రహ్మగ్రన్థిం భినత్తి సా।
విష్ణుగ్రన్థిం తతో భిత్వా
రుద్రగ్రన్థౌ చ తిష్ఠతి।
వాయు-అగ్నిలతో కూడిన స్పర్శచే కుండలినీ శక్తి బ్రహ్మగ్రంథి (The tinge and emotional sense pertaining to creation)ను భినత్తి→ ముందుగా ఛేధించుచున్నది. తరువాత విష్ణుగ్రంథిని (The tinge and Emotional sense of maintaining creation) కూడా ఛేదించి ‘రుద్రగ్రంథి’లో తిష్ఠించుచున్నది (Taking seat)
తతస్తు కుమ్భకైః గాఢం, పూరయిత్వా పునః పునః
అథా అభ్యసేత్ సూర్యభేదమ్, ఉజ్జాయీం చ అపి శీతలీమ్।
భస్త్రాన్చ సహితో నామస్యాత్ చతుష్టయ కుంభకః।
బన్ధ త్రయేణ సంయుక్తః
‘‘కేవల ప్రాప్తి’’ కారకః।।
అథ అస్య లక్షణం సమ్యక్
కథయామి సమాసతః।
ఈ విధంగా కుండలినీ శక్తి → రుద్రగ్రంథిలో ప్రవేశించి, స్థితి కలిగియుండగా ‘కుంభక ప్రాణాయామము’చే రుద్రగ్రంథిని మరల మరల పూరించుచూ, క్రమంగా సూర్యభేదనముచే (By consciously reducing Heat) ‘‘ఉజ్జాయీ శీతలి’’ని అభ్యసించాలి.
ఇక్కడికి ‘4’ కుంభకములు అగుచున్నాయి. (1) ప్రణా-అపానముల కలయిక కుంభకమగు భస్త్రి (2) బ్రహ్మగ్రంథి కుంభకము (3) విష్ణుగ్రంథి కుంభకము (4) రుద్రగ్రంథి కుంభకము.
కుంభకము → (మూలబంధ, ఉడ్డీయాణ, జాలంధర) త్రిబంధకములతో కూడి ‘‘కేవలప్రాప్తి’’ అను దానికి కారకమగుచున్నది. అట్టి ‘కేవల ప్రాప్తి’ యొక్క యోగ (సమ్యక్) లక్షణముల గురించి సంక్షిప్తంగా చెప్పుచున్నాను వినండి.
16. ఏకాకినా సముపగమ్య వివిక్త దేశం,
ప్రాణాదిరూపమ్ అమృతం పరమార్థ తత్త్వమ్
లఘ్వాశినా ధృతిమతా పరిభావితవ్యం
సంసారరోగ హరమ్ ఔషధమ్, అద్వితీయమ్।।
పూరక - కుంభక- రేచక → అభ్యాసము
- ఏకాకిగా (Lonely) ఏకాంత ప్రదేశము (Isolated place) చేరి,
- ఇంద్రియ విషయములను తగ్గించుకొని, ‘లఘ్వాశి’ అయి, ధైర్య - ఉత్సాహములను కలిగియున్నవాడై,
- ‘పరమార్ధతత్త్వము’ - ఆశయముగా కలిగియున్నవాడై
- సంసార రోగమునకు మహత్తరమగు ఔషధము. అమృత ప్రాణరూపము అగు, ‘ప్రాణాయామ యోగాభ్యాసము’ను ఆత్మయొక్క మాధుర్యమును ఆస్వాదిస్తూ అభ్యాసము ఈ క్రింది విధంగా నిర్వర్తించాలి.
(1) సూర్యనాడీ భేదక ప్రాణాయామము
సూర్యనాడ్యా సమాకృష్య
వాయుమ్ అభ్యాస యోగినా,
విధివత్ కుమ్భకం కృత్వా
రేచయేత్ శీతరశ్మినా।
ఉదరే బహురోగఘ్నం
క్రిమిదోషం నిహంతి చ।
ముహుర్ముహుః ఇదం కార్యం
‘సూర్యభేదమ్’ ఉదాహృతమ్।।
Ⅰ. సూర్యనాడీ భేదక ప్రాణాయామము
‘వెన్నెముక’కు మధ్యగా సుషుమ్ననాడి. కుడివైపు - పింగళ (సూర్యనాడి). ఎడమవైపు - ఇడ (చంద్రనాడి).
(1) అభ్యాసయోగి → సూర్యనాడి ద్వారా వాయువును (కుడి ముక్కు రంధ్రము ద్వారా) పీల్చి - పూరకం చేయలి.
(2) యధావిధిగా (ముఖమునందు, గుండెనిండా) కుంభకము చేసి (‘3’ గ్రంధులలో) వాయువును నిలిపి ఉంచాలి.
(3) ఆ తరువాత చంద్రనాడీ ద్వారా (ఇడ ద్వారా) - ఎడమ ముక్కు పుటము ద్వారా - గాలిని వదలాలి. (రేచకము చేయాలి).
ఈ విధమైన ప్రాణాయామముచే ఉదరములోని ఆయా అనేక రోగములను, క్రిమిదోషములను పోగొట్టగలదు.
ఈ విధమైన ప్రాణాయామమును మరల మరల నిర్వర్తించటమును ‘‘సూర్య భేదము’’ - అని అంటారు.
(2) ఉజ్జాయి కుంభక ప్రాణాయామము :
నాడీభ్యాం వాయుమ్ ఆకృష్య
కుండల్యాః పార్శ్వయోః క్షిపేత్।
ధారయేత్ ఉదరే పశ్చాత్
రేచయేత్ ఇడయా సుధీః।
Ⅱ. ఉజ్జాయి కుంభక ప్రాణాయామము :
ఇప్పుడిక : ఇడ-పింగళ.. ఉభయనాడులలో వాయువును నింపి కుండలినీశక్తికి ఉభయ పార్శ్వములుగా ప్రతిక్షేపించి కుంభకం చేసి ఉంచాలి. ఆ తరువాత ఆ వాయువును ఉదరములో (పొట్టలో) కూడా ధారణ చేసి, అప్పుడిక ‘ఇడనాడి’ ద్వారా వదలాలి. (రేచకము చేయాలి)
కంఠే కఫాది దోషఘ్నం
శరీరాగ్ని వివర్ధనమ్।
నాడీ జలావహం
ధాతుగత దోష వినాశనమ్।
గచ్ఛతః తిష్ఠతః కార్యమ్
ఉజ్జాయ్యాఖ్యన్తు కుమ్భకమ్।।
ఈ విధమైన ప్రాణాయామయోగాభ్యాసముచే కంఠములోని కఫదోషము తొలగుచున్నది. శరీరములో అంతటా అగ్ని, తేజస్సు వృద్ధి చెందుతాయి. నాడులలో జలము పేరుకోవటము తొలగుతుంది. ధాతువులలో దోషము నశిస్తుంది.
ఇటువంటి ‘ఉజ్జాయీ కుంభకప్రాణాయమము’ - ఒకచోట కూర్చునే (ఆసనము స్వీకరించియే) చేయనఖర్లేదు. నడుస్తున్నప్పుడు మామూలుగా కూర్చుని ఉన్నప్పుడు కూడా నిర్వర్తించవచ్చును.
(3)శీతలీకరణ ప్రాణాయామము :
17. ముఖేన వాయుం సంగృహ్య
ఘ్రాణరంధ్రేణ రేచయేత్।
శీతలీకరణం చ ఇదమ్ → హన్తి
పిత్తం, క్షుధాం తృషమ్।।
Ⅲ. శీతలీకరణ ప్రాణాయామము :
నోటితో గాలిని పీల్చటము.
ముక్కు రంధ్రముతో (ఒకసారి కుడి మరొకసారి ఎడమ ముక్కు రంధ్రముతో, ఆ తరువాత రెండు ముక్కుపుటములతో) విడవటము - ఇది శీతలీకరణ ప్రాణాయామము. దీనివలన ఆకలి, దాహము స్వాధీనమవుతాయి. వాత పిత్తదోషములు (వాయు అధిక - అల్ప దోషములు, శరీరములో చెడు పదార్ధములు నిలువ ఉండటము) - తొలగుతాయి.
(4) భస్త్రీ కుంభక ప్రాణాయామము
స్తనయో రథ భస్త్రేవ
లోహకారస్య వేగతః
రేచయేత్ పూరయేత్
వాయుమ్→ఆశ్రమం దేహగన్ధియా
యథా శ్రమో భవేత్ దేహే,
తథా సూర్యేణ పూరయేత్।।
Ⅳ. భస్త్రీ కుంభక ప్రాణాయామము :
ఒక లోహకారుడు వేగముగా గాలి పీల్చి, వెంటనే తోలు తిత్తి నుండి అగ్ని రగిల్చుచోటికి వాయువును వదులుతాడు కదా! ఆ విధంగా -
(1) వేగంగా (రెండు ముక్కుపుటముల ద్వారా)గాలిని బయటకు రేచకము చేసి, ఆ తరువాత పూరకము చేసి అప్పుడు రెండు స్తనముల సమీపంగా గాలిని నిలపాలి.
(2) శ్రమ అనిపించేంత వరకు సూర్యనాడి (కుడివైపు పింగళలో) పూరించి ఉంచాలి.
కణ్ఠ సంకోచనం కృత్వా
పునః చన్ద్రేణ రేచయేత్।
వాత పిత్త శ్లేష్మ హరం।
శరీరాగ్ని వివర్ధనమ్।
కుండలీ బోధకం
వక్త్ర దోషఘ్నం శుభదం, సుఖమ్।।
(3) కంఠమును సంకోచింపజేసి చంద్రనాడి (ఇడ, ఎడమవైపు ముక్కుపుటము) ద్వారా రేచకము చేయాలి. (గాలిని వదలాలి). ఈ విధంగా మరల మరల (10 ని।। నుండి 15 ని।। వరకు) చేస్తూ ఉండాలి. ఈ విధమైన భస్త్రీ ప్రాణాయామము వలన కూడా →
→ వాత (దోష వాయు), పిత్త (దోష పదార్ధముల) శరీరాంతర్గత దోషములు తొలగుతాయి.
→ శరీరాగ్ని వివర్ధనము పొందుతుంది. (The fire in the Body improves). కుండలినీ శక్తి ప్రబోధము పొందుచున్నది.
ముఖములోని (వక్త్ర) దోషములు తొలగి, ముఖము తేజోవంతమగుచున్నది.
బుద్ధి శుభప్రదము, మనస్సు సుఖప్రదము అగుచున్నాయి.
బ్రహ్మనాడీ ముఖాన్తస్థ
కఫ - ఆది యత్ గళ నాశనమ్।
సమ్యక్ బంధ సముద్భూతం
గ్రంథిత్రయ విభేదకమ్।
విశేషేనైవ కర్తవ్యం
భస్త్రాఖ్యం కుమ్భకం తు ఇదమ్ (కుంభకంత్విదమ్) ।।
‘బ్రహ్మనాడీ’ ప్రవేశమార్గములో పేరుకొని ఉంటున్న కఫము తొలగి పోతుంది. తదితర అడ్డంకులు గళము నుండి బ్రహ్మనాడి వరకు తొలగుతాయి.
బాగుగా భస్త్రీ కుంభకము నిర్వర్తిస్తూ ఉండటము వలన.. బ్రహ్మ-విష్ణు - రుద్ర త్రిగ్రంధులు త్వరగా విభేదము చెందుతాయి. కుండలినీ శక్తి కపాలము వైపుగా విస్తరించుటకు ప్రతిబంధకములు త్వరత్వరగా తొలగిపోతాయి. అందుచేత ఈ భస్త్రీకుంభక ప్రాణాయామము విశేషంగాను, అధికంగాను చేయుటము యోగాభ్యాసికి కర్తవ్యముగా చెప్పబడుతోంది.
బంధత్రయము
బంధత్రయమ్ అతః ఇదానీం ప్రవక్ష్యామి
యధా క్రమమ్।।
బంధత్రయము
ఓ మహామతీ! బ్రహ్మ భగవాన్! ఇప్పుడు మనము బంధత్రయము గురించి యథాక్రమంగా చెప్పుకుందాము.
18. నిత్యం కృతేన తేన అసౌ
వాయోః జయమ్ అవాప్నుయాత్।
చతుర్ణామ్ అపి భేదానాం కుమ్భకే సముపస్థితే,
‘బన్థత్రయమ్’ ఇదం కార్యం వక్ష్యమాణం మయా హి తత్।
ప్రథమో .. మూల బన్థస్తు।
ద్వితీయా .. ఉడ్డీయణాభిధః
జాలంధరః .. తృతీయస్తు।
లక్షణం కథయామి అహమ్।
((1) రేచకము (2) పూరకము (3) కుంభకము (4) పునఃరేచకము అనబడు) నాలుగు విధములగు ప్రాణాయామ- అభ్యాస విభాగములతో కూడిన యోగాభ్యాసముచే వాయు జయము సిద్ధించగలదు. ఈ విధమైన చతుర్విధములైన విభాగములతో కూడిన ప్రాణయోగము కొంత అలవాటు అయిన తరువాత, ఇక ఆపై నేను చెప్పుబోవుచున్న ‘బంధత్రయము’ను చక్కగా అర్ధం చేసుకొని నిర్వర్తించాలి.
(1) మూలబంధము (2) ఉడ్డీయాణ బంధము (3) జాలంధర బంధము
ఈ మూడిటిని ‘‘బంధత్రయము’’ అని పిలుస్తున్నారు.
ఈ మూడింటి లక్షణములను వివరించుచున్నాను. వినండి.
(1) మూలబంధము
గుదం పార్ష్యాతు సంపీడ్య వాయుమ్ ఆకున్చయేత్ బలాత్।
వారం వారం యథా చ ఊర్థ్వం సమాయాతి సమీరణః।
ప్రాణ-అపానౌ, నాద-బిన్దూ
మూలబంన్థేన చ ఏకతామ్।
గత్వా యోగస్య సంసిద్ధిం యచ్ఛతో,
న అత్ర సంశయః।।
(1) మూలబంధము :
గుదస్థానమును ఎడమకాలి మడమ (Toe) తో త్రొక్కిపెట్టి వాయువును ఆకుంచనము (రేచక - పూర్వక -కుంభక- పునఃరేచకములను) చేయాలి.
మాటిమాటికీ - వాయువు పైకి వచ్చు విధంగా - (మూలాధారము నుండి బయటకు వెళ్లువాయువు వెనుకకు మరలి, పైకి రావటం రూపంగా) యోగాభ్యాసం చేయాలి.
అప్పుడు ప్రాణ-అపానములు, నాద-బిందువులు మూలబంధ కుంభకముతో ఏకము పొంది, ఆ అభ్యాసి యోగసిద్ధిని పొందగలడు.
ఆ యోగి యోగమునందు త్వరగా విజయము పొంగలడు. ఇందులో సందేహమే లేదు.
(2) ఉడ్డియాణబంధము
కుమ్భక-అంతే.. రేచక ఆదౌ
కర్తవ్యస్తు ఉడ్డియాణకః
బన్ధో యేన సుషుమ్నాయాం
ప్రాణస్తు ఉడ్డీయతే యతః।।
తస్మాత్ ఉడ్డీయణాఖ్యో
అయం యోగిభిః సముదాహృతః।
(2) ఉడ్డీయాణ బంధము :
కుంభక అంతే - రేచక ఆదౌ।
కుంభకము అంతమయిన తరువాత → రేచక ప్రారంభము ఇంకా ప్రారంభం కాకముందు → అక్కడ బంధమును (ప్రాణ మనో చిత్త కుంభకమును) అభ్యసించటమును ‘ఉడ్డియాణబంధము’ అని అంటారు.
అటువంటి ‘‘కుంభకాంత - రేచక ఆదౌ’’ స్థానములో నిర్వర్తించు కుంభక ప్రాణాయామముచే సుషుమ్ననాడి యందు ప్రాణము ఊర్ధ్వముఖమై పైకి లేచుచుండటం చేతనే అద్దానికి ‘ఉడ్డీయాన బంధము’ అనే పేరుతో యోగశాస్త్రజ్ఞులచే పిలువడం జరుగుతోంది.
ఉడ్డీయాణస్తు సహజం
గురుణా కథితం సదా।
అభ్యసేత్ తత్ అతన్ద్రస్తు
వృద్ధోఽపి తరుణో భావేత్।
కుంభక - రేచక మధ్య స్థానయోగాభ్యాసము - సహజముగా నిర్వర్తించటం (పూరక రేచక ప్రయత్నములు లేకుండా అభ్యసించటం) - గురుముఖతః నేర్చుకోవటం చేత, అద్దానిని ఎల్లవేళలా (All times and in all contents / positions) - సహజముగా అభ్యాసం చేయవచ్చు. ఆలస్యము, అశ్రద్ధ లేకుండా అధికంగా అభ్యసిస్తే, అట్టి యోగి వృద్ధాప్యంలో కూడా యువకునివలె ఉత్సాహ, సాహస, సమన్వయ ప్రజ్ఞలు కలిగి ఉంటాడు.
19. నాభేః ఉర్ధ్వమ్ - అధశ్చాఽపి, ప్రాణం కుర్యాత్ ప్రయత్నతః।
షణ్మాసమ్ అభ్యసేత్, మృత్యుం జయత్యేవ। న సంశయః।।
నాభికి(బొడ్డుకు) క్రింద-పైనగా కుంభక ప్రాణాయామము ప్రయత్న పూర్వకంగా 6 నెలల కాలము అభ్యసించటం చేత, అట్టివాడు (మార్పు- చేర్పుల రూపమగు) మృత్యువును జయించగలడు. సందేహం లేదు.
(3) జాలంధరబంధము
పూరక - అంతేతు కర్తవ్యో
బన్ధో జాలన్ధరాభిధః।
కంఠ సంకోచ రూపో
అసౌ, వాయుమార్గ నిరోధకః
కంఠమ్ ఆకుంచ్య హృదయే
స్థాపయేత్ దృఢమ్ ఇచ్ఛయా।
బన్ధో ‘జాలంధర’ ఆఖ్యో
(అ)యమ్ అమృతాప్యాయ కారకః।
అధస్తాత్ కున్చనేనాశు కంఠ సంకోచనే కృతే,
మధ్యే పశ్చిమతానేన స్యాత్, ప్రాణో బ్రహ్మనాడిగః।
(3) జాలంధర బంధము - పూరక అంతే।
పూరకము ముగియగానే నిర్వర్తించు ప్రాణబంధమును ‘జాలంధర బంధము’ అని పిలుస్తున్నారు. ఇందులో రెండు ముఖ్య విశేషదశలు.
(1) కంఠ సంకోచ రూపము (2) వాయు మార్గ నిరోధకము
కంఠమును అకుంచనము (పూరక-కుంభకములు)చేసి హృదయుములో దృఢముగా స్థాపించాలి.
ఈ విధంగా పూరకం ముగిస్తూ ఉన్న తత్‌క్షణంలో ధారణ చేయు వాయు జాలంధర బంధము మరియు ఇచ్ఛాపూర్వకంగా కంఠమును ఆకుంచించి హృదయములో ప్రాణ-స్థాపనము-అమృతప్యాయకరము.
కంఠమును సంకోచింపజేసి, క్రిందకు కుంచింపజేసి, మధ్యగా ‘‘పశ్చిమ తానము’’చే ప్రాణము శిరస్సు ఉపరిభాగమున గల బ్రహ్మనాడిని చేరుచున్నది.
వజ్రాసన స్థితో యోగీ
చాలయిత్వాతు కుణ్డలీమ్
కుర్యాత్ అన్తరతో భస్త్రీం
కుణ్డలీమాశు బోధయేత్।
యోగి ‘వజ్రాసనము’ను ధరించి కుండలినీ శక్తిని ఊర్ధ్వముగా కదల్చుచూ భస్త్రి మధ్యగా (గాలి పీల్చు-వదలు ఊర్ధ్వగత ప్రదేశంలో) వాయు సంచనలనము చేయుచుండగా ‘కుండలిని’ లేపబడుచూ ఊర్ధ్వగామి అగుచున్నది.
భిద్యన్తే గ్రన్థయో వంశే
తప్తలోహ శలాకయా।
తథైవ పృష్ఠవంశస్స్యాత్
గ్రన్థి భేదస్తు వాయునా।
కాల్చిన లోహపు కడ్డీలో వెదురు యొక్క కణుపులు పగిలిపోవు తీరుగా
జాలంధర బంధముచే బ్రహ్మ-విష్ణు-రుద్ర త్రిగ్రంధులు భేదనము పొందుచున్నాయి.
పిపీలికాయాం లగ్నాయాం
కణ్డూః తత్ర ప్రవర్తతే,
సుషుమ్నాయాం తథా అభ్యాసాత్
సతతం వాయునా భవేత్।।
పిపీలికము (చీమ) లగ్నమయి (చిక్కి) పైకి ఎగబాకు విధంగా- సుషుమ్న యందు వాయువును అభ్యసించుచుండగా బ్రహ్మ-విష్ణు-రుద్ర గ్రంధుల పరిధులను దాటుచూ, కుండలిని (చీమ వలె) వెన్నెముక నుండి పైగా ఎగబాకగలదు.
20. రుద్రగ్రన్ధిం తతో భిత్వా, తతో యాతి శివాత్మకమ్।
చంద్ర-సూర్యౌ సమౌ కృత్వా, తయోః యోగః ప్రవర్తతే।
గుణత్రయం అతీతం స్యాత్, గ్రంథిత్రయ విభేదనాత్।
శివశక్తి సమాయోగే, జాయతే పరమా స్థితిః।
కుండలిని→సుషుమ్ననాడిలోని రుద్రగ్రంధిని భేదించి, సుషుమ్న నాడి ద్వారా ఊర్ధ్వగామి అయి, కపాల మండలము (zone of circle around skull) చేరి, బ్రహ్మరంధ్ర ఆకాశము దాటి ఊర్ధ్వంగా శివాత్మకత్వము సంతరించుకొనుచున్నది.
సూర్య-చంద్ర (పింగళ - ఇడ) నాడులు యోగాభ్యాసముచే ఏకత్వము పొందినవగుచున్నాయి. గ్రంధులు (సృష్టి స్థితి లయ పరిధులు) భేదించుచూ ఉండగా ఆ యోగి త్రిగుణములను దాటివేయుచున్నాడు. శివశక్తుల సమాయోగముచే ఆ రెండింటికి ఆవల స్థితి యోగికి సిద్ధించుచున్నది.
యథా కరీ కరేణైవ పానీయం ప్రపిబేత్ సదా,
సుషుమ్నా వజ్రనాళేన పవమానం గ్రసేత్ తథా।
వజ్రదణ్డ సముద్భూతా మణయశ్చ ఏకవింశతిః(21)
సుషుమ్నాయాం స్థితాః సర్వే సూత్రే మణిగణా ఇవ।
ఏనుగు తొండముతో ఏ విధంగా జలమును త్రాగుచూ ఉంటుందో, ఆ విధంగా సుషుమ్న వజ్ర నాళముగా అయి వాయువును పీల్చటము జరుగు చున్నది. వజ్ర దండము (వెన్నెముక)లో 21 ప్రకాశమాన స్థానములగు మణిపూసలు (వెన్ను పూసలు) దారమునుకు గ్రుచ్చబడిన మణులవలె ఉంటున్నాయి. అవన్నిటియందు మధ్యగా ‘సుషమ్ననాడి’ విస్తరితమై యున్నది.
21. మోక్షమార్గే ప్రతిష్ఠానాత్, సుషుమ్నా విశ్వరూపిణీ,
యథైవ నిశ్చితః కాలః, చంద్ర-సూర్య నిబన్థనాత్,
ఆపూర్య కుమ్భితో వాయుః, బహిః నో యాతి సాధకే,
పునః పునః తత్ వదేవ, పశ్చిమద్వార లక్షణమ్।
పూరితస్తు స తత్ ద్వారైః, ఈషత్ కుమ్భకత అంగతః।
ప్రవిశేత్ సర్వ గాత్రేషు, వాయుః పశ్చిమ మార్గతః।
రేచితః క్షీణతాం యాతి, పూరితః పోషయేత్ తతః।
విశ్వ-సుషుమ్న : సుషుమ్నయే ఈ విశ్వమంతా తన యొక్క రూపముగా కలిగి ఉన్నది. విశ్వరూపిణి యగు సుషుమ్న దేహములో మోక్షమార్గమున ప్రతిష్ఠితమైయున్నది.
చంద్ర-సూర్యనాడులలో యోగి పూరించి, కుంభకము నిర్వర్తించిన వాయువు - (కాలము స్థబ్దమై ఆగిపోయిన విధంగా), ఉభయనాడుల బంధనములో నుండి ఇక బయల్వెడలక, అను నిత్య కుంభకము జరుగగలదు. మరల మరల పశ్చిమ ద్వార ప్రవేశముగా పూరించబడిన వాయువు అచ్చటనే కుంభకత్వము పొంది కొంచము కొంచముగా నిలిచిపోవటం జరుగుతూ ఉంటుంది.
పశ్చిమ మార్గమును అనుసరించిన వాయువు దేహములోని సర్వాంగములలో ప్రవేశము పొందినదై రేచకముచే → క్షీణత్వము పొందుచూ, పూరకముచే→ వృద్ధి పొందుచూ అంగాగములలో వాయువు యోగాభ్యాసంచే వాయుయామము జరుగసాగుచున్నది.
యత్త్రైవ జాతం స కళేబరం
మనః తత్రైవ లీనం
కురుతే స యోగాత్।
స ఏవ ముక్తో నిరహంకృతిః సుఖీ।
(ప్రాణాయామ అభ్యాసముచే) దేహములో మనస్సు యొక్క జనన స్థానము ఆ యోగికి అనుభవమగు చున్నది. యోగాభ్యాసంచే మనస్సు ఎక్కడ జనిస్తోందో, అక్కడనే లీనము పొందుచున్నది. అట్టి యోగి మనోలయము పొందినవాడై, ముక్తుడై, నిరహంకారుడై, సర్వసంసార బంధములు త్రెగిపోగా, ‘సుఖి’ అగుచున్నాడు. మనోలయంతో బాటే సంసారలయము కూడా జరుగుచున్నది.
మూఢా న జానన్తి హి పిణ్డపాతినః।
చిత్తం వినష్టం యది భాసితం స్యాత్,
తత్ర ప్రతీతో మరుతోఽపి నాశః।।
యోగాభ్యాసము లేనప్పుడు ఈ జీవుడు ‘సంసారము’ నందు పిండపాతుడగుచున్నాడు. అట్టి మూఢుడు చిత్తమును నశింపజేయలేడు. యోగి,- చిత్తము ఎక్కడ జనిస్తోందో అది గమనించి, అచ్చోటనే చిత్తమును లయింపజేస్తూ ఉండగా మనోలయమును కూడా సిద్ధింపజేసు కుంటున్నాడు. అట్టివాడు స్వస్వరూపమునుండి దిగజారడు.
న చేత్ యదిస్యాత్।
న తు తస్య శాస్త్రం।
న ఆత్మ ప్రతీతిః।
న గురుః। న మోక్షః।
మనో జనన స్థానమును, చిత్తప్రారంభ స్థానమును యోగాభ్యాసముచే (సుషుమ్న యందు కుంభకాభ్యాసముచే) ఎరిగి, అద్దానియదు లయింపజేయు యోగసిద్ధిని ఆశ్రయించనివాడు..,
- శాస్త్రములు విని మాత్రం ప్రయోజనమేమి? -ఆత్మతత్త్వము తెలుసుకొని మాత్రం లాభమేమి?
- ఆత్మాభావన ఎట్లా లభిస్తుంది? విశ్వరూపిణియగు సుషుమ్నయందు నిలకడ ఎక్కడిది?
- ఆతనికి గురువు చెప్పి ఏ ప్రయోజనం?
‘‘చిత్తమును జనన స్థానము నందు లయింపజేయు యోగము’’ను సిద్ధించుకొన్నవానికి ఇక క్రొత్తగా -శాస్త్ర, ఆత్మ ప్రతీతి, గురు పాఠ్యాంశములతో ఇంకేమి పని?
22. జలూకా రుధిరం యద్వత్
బలాత్ ఆకృష్యతి స్వయమ్,
బ్రహ్మనాడీ తథా ధాతూం తు
సంతత అభ్యాసయోగతః।
ఆనేన అభ్యాస యోగేన
నిత్యమ్ ఆసన బన్ధతః,
చిత్తం విలీనతామ్ ఏతి।
బిన్దుః నో యాతి అధః తథా।।
జలగ శరీరమును పట్టుకొని దేహములోని రక్తమును స్వయముగా లాగి బలవంతంగా పీలుస్తుంది కదా! ఆ విధంగా సంతత అభ్యాస యోగము వలన బ్రహ్మనాడి (సుషుమ్న) ధాతువులను తన వైపు ఆకర్షించి, వాటి ప్రభావములను స్వీకరించుచున్నది.
నిత్యము పద్మాసనము (లేక) ఏదైనా సుఖాసనమును స్వీకరించి, ఆసన బంధముతో ధ్యానము అభ్యసిస్తూ ఉండగా, చిత్తము చిత్‌యందు విలీనము పొందుచున్నది. (అనగా, ‘ఇష్టము’ అనునది కేవలమగు ‘ఎరుక’ యందు లయమును పొందుచున్నది). అప్పుడు ఇక బిందువు యధాస్థానంలోనే ఉంటుంది. కానీ, (సంసార బంధరూపముగా) క్రిందకు జారదు.
రేచకం పూరకం ముక్త్వా,
వాయునా స్థీయతే స్థిరం।
నానా నాదాః ప్రవర్తంతే,
సంస్రనేత్ చంద్రమండలమ్
నశ్యన్తి క్షుత్- పిపాసాద్యాః,
సర్వ దోషాః తతః సదా।।
రేచక - పూరకముల అవసరము ఏ మాత్రము లేకుండానే సమాన వాయువుచే తనే (కుంభకరూపంగా) బిందువు క్రిందకు జారక, స్థిరముగా నిలబడుచున్నది. ధ్యాస నిలకడ పొందుచున్నది. (పరమాత్మభావన జీవాత్మత్వముగా దిగజారదు)
చంద్రమండలము స్రవించుచుండగా అనేక నాదములు ప్రవర్తించుచున్న వౌతాయి. ఆకలి దప్పిక మొదలైన శరీర దోషములన్నీ నశించుతాయి.
[చంద్రమండలము - ఆలోచన (లేక) మనస్సు జనించి సంచరిస్తూ ఉన్న మండల స్థానము]
23. స్వరూపే సత్-చిత్-అనన్దే
స్థితిమ్ ఆప్నోతి కేవలమ్।
కథితస్తు తవప్రీత్యా హి
ఏతత్ అభ్యాస లక్షణమ్।
అప్పుడు ఆ యోగి కేవలమగు సత్-చిత్-ఆనంద స్వరూపమును పొంది, అట్టి స్థితి యందు సంస్థితుడగుచున్నాడు.
ఓ సృష్టికర్తా! జగత్ పితామహా! యోగ పరాకాష్ఠకు సంబంధించిన ఈ ఈ లక్షణములన్నీ మీమీద, సమస్త జనులపైన నాకు గల ప్రీతిచే ఈ విధంగా వివరించి నాచే చెప్పబడుచున్నాయి.
మన్త్రో లయో హఠో
రాజయోగో
అన్తర్భూమికాః క్రమాత్,
ఏక ఏవ→చతుర్ధాఽయం
‘మహాయోగో’ అభిధీయతే।
‘హ’ కారేణ బహిః యాతి
‘స’ కారేణ విశేత్ పునః।
‘‘హంస హంస’’
ఇతి మంత్రో-యం
సర్వజీవైశ్చ జప్యతే।
ఓ బ్రహ్మభగవాన్! ఇప్పుడు మనము (1) మంత్ర యోగము (2) హఠయోగము (3) లయయోగము (4) రాజయోగము - అని చెప్పబడువాటి గురించి వివరించుకుందాము.
ఈ నాలుగు కూడా క్రమంగా ‘‘మహాయోగము’’ యొక్క అంతర్భూమికలుగా చెప్పబడుచున్నాయి. (The 4 stages within).

మంత్రయోగము (వాయువులయొక్క బాహ్య-అంతర రాకపోకల గమనిక)
సర్వజీవుల పట్ల కూడా ‘హ’కారముచే వాయువు బయటకు వెళ్లటము..,
‘స’ కారముచే తిరిగి వాయువు లోనికి రావటము జరుగుచూ ఉన్నది.
‘‘హం-స’’ ‘‘హం-స’’ అను ఈ మంత్రము సర్వజీవులచేతనూ (అసంకల్పితంగా) జపించబడుచూనే ఉన్నది.
(1) మంత్రయోగము
గురువాక్యాత్ సుషుమ్నాయాం
విపరీతో భవేత్ జపః।
‘సోఽహమ్’, ‘సోఽహమ్’
ఇతి ప్రోక్తో ‘మన్త్రయోగ’ ఉదాహృతః।
(1) మంత్ర యోగము : గురువాక్యానుసారం యోగాభ్యాసము చేయు యోగ సాధకుని విషయంలో ఈ ‘హంస’ జపము సుషుమ్ననాడి యందు విపరీరముగా జరుగుచున్నది. ‘సోఽహమ్। సోఽహమ్’ అను మననమే ‘మంత్ర యోగము’ అని చెప్పబడుచున్నది. ‘‘అదియే నేను’’ అను అర్థము గల జపభావన సుషుమన్న యందు - బ్రహ్మ రంధ్రము వరకు విస్తరిస్తూ నిండు కుండలోని జలంలాగా - నిండి ఉండటమే ‘మన్త్ర యోగము’. (సో= సహజము, హం = సందర్భము, మంత్రము= ఆ రెండిటి గమనిక)
(2) హఠయోగము
24. ప్రతీతిః మంత్ర యోగాచ్చ
జాయతే పశ్చమే పథి।
‘హ’ కారేణ తు సూర్యస్స్యాత్
‘స’ కారేణ ఇన్దుః - ఉచ్యతే।
సూర్యా-చంద్రమసోః ఐక్యం
‘హఠ’ ఇత్యభిదీయతే।
మంత్రయోగము వలన క్రమంగా పశ్చమ పథము (The wordly side of yogi) ప్రతీతి (Effective, potentiality) పొందుచున్నది.
(2) హఠ యోగము (ప్రాణ-అపానముల ఐక్యత)
‘హ’ కారము..అనునది ‘సూర్యుడు’ అని (సర్వత్రా ఏర్పడినదై ఉన్న ‘నేను’)
‘స’కారము.. అనునది ‘చంద్రుడు’ (దేహిగా దేహములో ఏర్పడి ఉన్న నేను) - అని చెప్పబడుచున్నది. సూర్య-చంద్రమండలముల ఐక్యము (బయటకు పోవు - లోనికి వచ్చు వాయువులు ఐక్యము) - ఏకము చేసి ధారణ చేయటమును ‘హఠయోగము’ అని పిలుస్తున్నారు. అదియే ఈ జీవునిపట్ల ఇహ-పరముల ఐక్యము అయి ఉన్నది.)
హఠేన గ్రస్యతే జాడ్యం
సర్వదోష సముద్భవమ్
హఠయోగము యొక్క అభ్యాసము వలన ఇంద్రియ విషయసంబంధమైన సర్వదోషముల కారణంగా జనించే జాడ్యమంతా తొలగిపోగలదు.
(3) లయయోగము :
క్షేత్రజ్ఞః పరమాత్మా చ
తయోః ఐక్యం యదా భవేత్,
తత్ ఐక్యే సాధితే, బ్రహ్మన్!
చిత్తం యాతి విలీనతామ్।
(3) లయ యోగము (జీవాత్మయొక్క పరమాత్మయందు లయము)
హే బ్రహ్మన్! ఈ సాధకుని యొక్క వ్యష్టి క్షేత్రజ్ఞుడు ఎప్పుడైతే సర్వక్షేత్రములలోని (సర్వ-దేహములలోని) క్షేత్రజ్ఞునితో (దేహితో లేక పరమాత్మతో) ఐక్యము పొంది విశ్వక్షేత్రజ్ఞునితో అఖండము-ఏకము అయినప్పుడు, ఆ మరుక్షణం చిత్తము లయించినదగుచున్నది. పరమాత్మయందు వ్యష్టిగతమైన ఎరుక లయించటమే లయయోగము.
పవనః స్థైర్యం ఆయాతి
లయ యోగ-ఉదయే సతి।
లయాత్ సంప్రాప్యతే సౌఖ్యం
‘‘స్వాత్మానందం, పరంపదమ్’’।
అటువంటి లయయోగము సిద్ధించగానే చిత్తముతో బాటే వాయువు స్థిరము (స్థైర్యము) పొందుచున్నది. అనగా ప్రాణచలనము పరమాత్మతో మమేకముచే స్వాభావికంగానే నిశ్చలమవగలదు.
వాయు స్థైర్యము, చిత్తలయములచే ‘‘స్వాత్మానందరూపమగు పరమ పదము’’ - అను స్వాత్మసుఖము లభించగలదు. ‘‘వ్యష్టిగతమైన (Incidental) ‘నేను’ మొదలేలేదు. సర్వగతమైననేనే నేనై ఉన్నాను’’ - అనునదే లయయోగము.
(4) రాజయోగము :
యోని మధ్యే మహాక్షేత్రే
జపాబన్థూక సన్నిభమ్।
రజో వసతి జంతూనాం
దేవీతత్త్వం సమావృతమ్।
రజసో-రేతసో యోగాత్
‘‘రాజయోగ’’ ఇతి స్మృతః

అణిమాది పదం ప్రాప్య రాజతే రాజయోగతః।
4. రాజ యోగము (భావించువాడు-భావనల ఏకత్వము)
‘‘మహాక్షేత్రము’’ అనుబడు ఈ శరీరము యొక్క యోని మధ్యగా (Central Zone) మంకెనపువ్వుతో సమానమగు - దేవీతత్త్వము (ప్రకృతి, భావన, కళ, సంకల్ప, ఊహ అగు) ‘రజస్సు’ - సర్వ జీవుల హృదయాకాశములో ఏర్పడి ఉన్నది.
అట్టి ‘రజస్సు’ రేతస్సుతో ఏకమగు యోగాభ్యాసము చేత బుద్ధికి ప్రకాశమైనప్పుడు ‘రాజయోగము’ సిద్ధిస్తోంది.
[రజము = అంతరంగ చతుష్టయముతో సహా ఈ సమస్త సంప్రదర్శనము. ‘‘ఇదంతా నా ప్రదర్శనమే! నేనే!’’ అనునదే రాజయోగము].
అట్టి రాజయోగముచే ప్రాప్తించే రాజపదము వలన అణిమ మొదలైన అష్టాంగ యోగ సిద్ధులు ప్రాప్తించగలవు.
ప్రాణ- అపాన సమాయోగో
జ్ఞేయం ‘యోగచతుష్టయమ్’।।
ఈ విధంగా మంత్ర-హఠ-లయ-రాజయోగములనబడే యోగ చతుష్టయము - ప్రాణ- అపాన సమాయోగము చేతనే లభించగలవు - అని తెలుసుకొనబడునుగాక।’’
25. సంక్షేపాత్ కథితం, బ్రహ్మన్।
న-అన్యథా శివభాషితమ్।
క్రమేణ ప్రాప్యతే ప్రాప్యమ్
అభ్యాసాత్ ఏవ। న అన్యథా।
హే బ్రహ్మ భగవాన్! ఈ విధంగా యోగచతుష్టయము గురించి సంక్షిప్తంగా చెప్పుకున్నాము. వీటిచేతనే ఈ జీవుడు శివస్వరూపుడు అగుచున్నాడు. మరి వేరే మార్గం లేదు. ఇది శివ భాషితము.
ఇవన్నీ కూడా అభ్యాస వశంచేతనే (By regular Practice only) క్రమంగా సిద్ధిస్తున్నాయి. మరే విధంగానూ కాదు.
మర్కటక్రమము
ఏకేనైవ శరీరేణ యోగాభ్యాసాత్ శనైః శనైః,
చిరాత్ సంప్రాప్యతే ముక్తిః, మర్కట క్రమ ఏవ సః।
మర్కటక్రమము (సద్యో ముక్తి)
నెమ్మది నెమ్మదిగా చిరకాల-యోగాభ్యాసము చేత ఒక శరీరముతోనే (అనగా ఇప్పుడే, ఇక్కడే) ముక్తి ఈ జీవునికి సిద్ధించగలదు. ఇది మర్కట క్రమము(లేక) మర్కట న్యాయము. (కోతి పిల్ల తల్లి మెడను పట్టుకొనుచుండగా, కోతి చెట్లపై దుముకుచున్నట్లుగా) - అనబడుతోంది.
కాక మతము (క్రమముక్త)
యోగిసిద్ధిం వినా దేహః ప్రమాదాత్ యది నశ్యతి,
పూర్వ వాసనయా యుక్తః, శరీరం చ అన్యథా ఆప్నుయాత్।
తతః పుణ్యవశాత్ సిద్ధో గురుణా సహ సంగతః।
పశ్చిమ ద్వార మార్గేణ జాయతే త్వరితం ఫలమ్।।
క్రమ ముక్తి
ఒకవేళ ఒకానొక యోగాభ్యాసి విషయంలో - యోగసిద్ధి సిద్ధించకపూర్వమే ఈభౌతిక దేహము (ఆతని పట్ల) నేల కూలటం జరిగితే?
పూర్వవాసనాయుక్తుడగు ఆ యోగాభ్యాసి (లేక) ముముక్షువు మరొక (యోగసాధనకు అర్హమైన) శరీరమును పొందుచున్నాడు.
అట్టి నూతన శరీరముతో ఆ ముముక్షువు పుణ్యవశంగా గురువుతో సమాగమము పొందినవాడై, - పశ్చిమ ద్వారా మార్గంగా (In the path of worldly practices) అతి త్వరలో ఫలములను (అష్టాంగ యోగ సిద్ధులను, ఆత్మసిద్ధిని) పొందుచున్నాడు.
26. పూర్వజన్మ కృత అభ్యాసాత్
సత్వరం ఫలం అశ్నుతే।
ఏత దేవ హి విజ్ఞేయం।
తత్ ‘కాకమతమ్’ ఉచ్యతే।
నాస్తి కాకమతాత్ అన్యత్।
‘‘అభ్యాసాఖ్యమ్’’ అతః పరమ్।
తేనైవ ప్రాప్యతే ముక్తిః, న అన్యథా శివభాషితమ్।
క్రితం జన్మలలో నిర్వర్తించిన అభ్యాసమును అనుసరించి ఆతడు సత్వరము ఫలములను పొందుచున్నాడు.
ఇది ముముక్షువు ఎరిగి యుండునుగాక! దీనిని కాకమతము అని కూడా అంటారు. ఇతః పూర్వపు అభ్యాసవశంగానే ఇప్పుడు ఈ తీరుగా తెలియబడుతోంది’’ అను దానికి వేరుగా (కాక మతమునకు వేరుగా) ఏదీ లేదు. ఏదైనా అభ్యాసము చేతనే సిద్ధించగలదు. అయితే వర్తమాన అభ్యాసము-కాకమతము (ఇతః పూర్వపు అభ్యాస ఫలము) కన్నా గొప్పది.
‘‘అభ్యాసము చేతనే ముక్తి లభించగలదు. మరింకేవిధంగానూ కాదు’’ - అనునదే శివభాషితము. అందుచేత వర్తమాన అభ్యాసమే కాకమతము (The influence of the past) నకు ఔషధం.
హఠయోగక్రమాత్ కాష్ఠా, సహజీవ లయాదికమ్।
నాకృతం మోక్షమార్గంస్యాత్, ప్రసిద్ధం పశ్చిమం వినా।
‘‘హఠయోగము’’ యొక్క క్రమము - అనే పరిశ్రమ చేతనే జీవలయము, ‘జీవుడు’ అనునది అఖండాత్మతో ఏకము చేయటం - ఇదియే ‘పశ్చిమ మార్గం’. పశ్చిమ మార్గము వినా వేరైన మోక్షమునకు మార్గము లేదు. (పశ్చిమమార్గము, ఉత్తరోత్తర గతులనుండి ఉపసంహారము)
ఆదౌ రోగాః ప్రణశ్యన్తి,
పశ్చాత్ జాడ్యం శరీరజమ్।
తతః సమరసో భూత్వా
చంద్రో వర్షతి అనారతమ్।
(హఠము మొదలైన యోగ చతుష్టయము వలన) → మొట్టమొదట - రోగములు తొలగుతాయి. తరువాత - శరీరముతో జనించే జాడ్యములన్నీ తొలగుతాయి. (శరీరములో గల మనోబంధము తొలగుతుంది).

ఆపై - చంద్రుడు సమరసమగు అమృతమును అవిచ్ఛిన్నముగా కురిపించుచున్నాడు. [మనస్సు అమృతభావనను (Changeless seage) సంతరించుకొనుచున్నది].
27. ధాతూంశ్చ సంగ్రహేత్ వహ్నిః
పవనేన సమంతతః।
నానా నాదాః ప్రవర్తంతే।
మార్దవంస్యాత్ కళేబరమ్।
జిత్వా వృష్ట్యాదికం జాడ్యం।
ఖేచరః స భవేత్ నరః।
సర్వజ్ఞో అసౌ భవేత్,
కామరూపః పవన వేగవాన్।
క్రీడతే త్రిషు లోకేషు
జాయన్తే సిద్ధయో అఖిలాః।
కర్పూరే లీయమానే
కిం కాఠిన్యం తత్ర విద్యతే?
అహంకార క్షయే తద్వత్
దేహే కఠినతా కుతః?
ఇంకా కూడా, ప్రాణ-అపాన సమయోగము (లేక) ప్రాణయోగము అభ్యసిస్తూ ఉండగా →
❋ అగ్నిచేతను, వాయువుచేతను ధాతువులు స్పృశించబడి, సమత్వము పొందుతాయి. శరీరములో ధాతువుల అధిక - అల్ప దోషములు తొలగుతాయి.
❋ దేహములో పలు రకములైన సంగీత నాదములు బయల్వెడలుతాయి.
❋ శరీరము మృదువుగా అగుచున్నది.
❋ దేహములో జాడ్యము (Disease) వలన ఏర్పడే వృష్టులు (పైత్య-జఠర రస ప్రవాహ దోషములు) తొలగుతాయి.
❋ అట్టి సాధకుడు యోగాభ్యాసముచే ‘ఆకాశ సంచారము’ మొదలైన సిద్ధులు పొందుతాడు.
‘‘ఈ దేహమందు నేనెవరు? ఇప్పుడు నేను ఎవరు? ఈ దేహము తొలగిన తరువాత నేనెవరు? నాకు ఈ దేహ-దృశ్యాలకు సంబంధం ఏమిటి? ఎట్లా కలుగుతోంది?’’ ఈఈ ప్రశ్నలకు సమాధానములు తెలియుచుండగా - సర్వజ్ఞుడు అగుచున్నాడు.
❋ కోరుకొన్న రూపము ధరించగలుగుచున్నాడు. ‘‘వర్తమాన దేహానంతరము దేహము తరువాత ఏ దేహము పొందాలి?’’అను విషయంలో స్వతంత్రుడగుచున్నాడు.
❋ వాయు వేగమును సంతరించుకుంటున్నాడు.
❋ ఆతనికి స్వర్గ-మర్త్య-పాతాళ త్రిలోకములు ఆతనికి తాను వినోదముగా విహరించే క్రీడా స్థలముల వలె అగుచున్నాయి.
❋ సమస్త సిద్ధులు ఆతనికి సిద్ధిస్తున్నాయి. ‘‘ఈ సమస్తము సిద్ధించుకొనుచున్నది నేనే’’ - అనే సిద్ధత్వము లభిస్తోంది.
❋ కరిగిపోవుచున్న కర్పూరమునకు ఇక కాఠిణ్యము ఉండదు కదా! అట్లాగే యోగాభ్యాసి పట్ల ‘అహంకారము’ కరిగి పోవుచుండగా, ఇక ఆతనియందు కాఠిణ్యము ఇంకేముంటుంది? ఉండదు.
సర్వ కర్తా చ యోగీన్ద్ర స్వతంత్రో అనన్తరూపవాన్।
జీవన్ముక్తో మహాయోగీ జాయతే। న అత్ర సంశయః।
ఆ యోగీంద్రుడు ‘‘సర్వమునకు కర్తను నేనే’’ అని గ్రహిస్తున్నాడు. ‘‘నేను ఎవరిపైనో ఆధారపడి ఉన్నవాడను కాను. స్వతంత్రుడను. అనంతరూపుడను’’ - అని గమనిస్తున్నాడు. ఆ మహాయోగి జీవన్ముక్తుడై ఈభూమిపై విహరిస్తున్నాడు. ఇందులో ఏ మాత్రం సంశయము లేదు. (Sense of Independence)
ద్వివిధాః సిద్ధయో లోకే,
కల్పితా- అకల్పితాః తథా।।
ఈలోకంలో సిద్ధులు రెండు రకములైనవి.
(1) కల్పితములు (సందర్భ మాత్రములు), (2) అకల్పితములు (సహజములు, స్వాభావికములు).
రస ఔషధి క్రియా జాల
మన్త్ర అభ్యాసాది సాధనాత్
సిద్ధ్యన్తి సిద్ధయో యాస్తు
కల్పితాస్తాః ప్రకీర్తితాః।
అనిత్యా అల్పవీర్యాస్తాః
సిద్ధయః - సాధన ఉద్భవాః।
(1) కల్పితసిద్ధులు : ప్రకృతిలోని కొన్ని ఆకు రసములు, ఓషధులు స్వీకరించటం చేత, హఠమునకు సంబంధించిన ఆయా (యోగ సూత్రములలో చెప్పిన) క్రియా జాలము వలన, మంత్ర-తంత్ర అభ్యాస-సాధనముల వలన ఏఏ సిద్ధులు సిద్ధిస్తాయో → అవన్నీ కూడా ‘‘కల్పిత సిద్ధులు’’. అటువంటివన్నీ అనిత్యము. కృత్రిమమైనవి. వాటి శక్తి అల్పము అయినట్టివి. సాధనచే (లేక) సేవనచే ఉద్భవిస్తాయి. సాధన విరమిస్తే కొంతకాలానికి తొలగిపోతాయి. అవన్నీ ఆత్మానందమును ప్రసాదించజాలవు.
సాధనేన వినాపి ఏవం
జాయంతే స్వత ఏవ హి।
(2) సహజ సిద్ధులు / అకల్పిత సిద్ధులు : వాటి కొరకు ఉద్దేశ్యించకుండానే, తమకు తామే వచ్చి యోగిని ఆశ్రయిస్తాయి. ఇవి ఉత్తమమైన సిద్ధులు.
28. స్వాత్మయోగైక నిష్ఠేషు, స్వాతన్త్ర్యాత్ ఈశ్వర ప్రియాః
ప్రభూతాః సిద్ధయో యాస్తాః, కల్పనా రహితాః స్మృతాః।
స్వాత్మ-యోగైక నిష్టవలను, ఆత్మస్వాతంత్ర్యాభ్యాసము వలను, సహజీవులను ఆత్మాభావనతో అవ్యాజప్రేమ కలిగియుండుట వలను అట్టి వారు ఈశ్వర ప్రియములై వారిని సిద్ధులు ఆశ్రయిస్తూ ఉంటాయి. అటువంటి సిద్ధులు కల్పనారహిత సిద్ధులు. స్వాభావిక సిద్ధులు అనబడుచున్నాయి.
సిద్ధా నిత్యా మహావీర్యా ఇచ్ఛారూపాః స్వ యోగజాః,
చిరకాలాత్ ప్రజాయంతే వాసనా రహితేషు చ।
తాస్తు గోప్యా మహాయోగాః పరమాత్మపదే అవ్యయే
వినా కార్యం సదా గుప్తం, యోగ సిద్ధస్య లక్షణమ్।
యోగి ‘వాసనారహితుడు (One Relieved of worldly Tendencies) అగుచుండగా, స్వభావసిద్ధంగా సిద్ధించేవి వాస్తవమైన సిద్ధులు. స్వకీయ యోగాభ్యాసముచే తమకు తామే లభించేవి ఇచ్ఛాసిద్ధులు. అవి చిరకాలము ఆ యోగిని అనుసరించి, ఆశ్రయించి ఉంటాయి. విశ్వాసముగల సేవకులవలె ఆశ్రయించి, లోక కళ్యాణ కారకములౌతాయి.
మహాయోగములన్నీ - అవ్యయమగు పరమాత్మ పదమునకు వెనుకగా - రహస్యముగా దాగినవై ఉంటాయి. ‘‘అట్టి సిద్ధులు రహస్యముగాను, తదితర జనులయందు ప్రదర్శించబడనివిగాను ఉండటము’’ - మహాయోగుల పట్ల, యోగసిద్ధుల పట్ల - సహజ లక్షణము.
29. యథా ఆకాశం సముద్దిశ్య
గచ్ఛద్భిః పథికైః పథి,
నానా తీర్థాని దృశ్యంతే
నానా మార్గాస్తు సిద్ధయః,
స్వయమేవ ప్రజాయన్తే
లాభ-అలాభ వివర్జితే,
యోగమార్గే తథై వేదం (తథైవ ఇదం)
సిద్ధిజాలం ప్రవర్తతే।
పరీక్షకైః స్వర్ణకారైః
హేమ సంప్రోచ్యతే యథా,
సిద్ధిభిః లక్షయేత్ ‘సిద్ధం’,జీవన్ముక్తం తథైవ చ।
ఏ విధంగా అయితే ఆకాశము దేవతల, అనేక తదితరుల, అనేక వాహనముల రాకపోకలకై అనేక పధములు (paths) (పధికుల పట్ల) కలిగి ఉంటుందో, సిద్ధపురుషులు ఉన్నచోట సర్వతీర్ధములు, నానా యోగ-మోక్షమార్గములు-రూపుదిద్దుకొని ఉంటాయి. వారున్నచోటే తీర్ధము.
(తీర్థీ కుర్వాని తీర్థాని। సుకర్మీ కుర్వాన్తి కర్మాణి।)
లాభా లాభ వివర్జితులగు యోగులను స్వయముగా తీర్థములు ఆశ్రయిస్తాయి. ఒక సుదీర్ఘ బాటసారికి మార్గమధ్యంలో తీర్థములు తీర్ధమార్గములు తారసపడుచున్న తీరుగా యోగ మార్గములో సంచరించు వారి పట్ల సిద్ధులు సిద్ధిస్తూ ఉంటాయి.
ఒక స్వర్ణకారుడు పరీక్షకుడై సంప్రోచన (గీయటం మొదలైనవి) నిర్వర్తించి, ‘‘ఇది బంగారమా? కాదా?’’ అని పరీక్షించి, బంగారము అయితేనే తదితర స్వర్ణకార్యములకొరకు స్వీకరిస్తాడు కదా?
అట్లాగే జీవన్ముక్తియే ఆశయముగా గల మహదాశయుడు తనను సమీపించిన సిద్ధులను ‘‘అవసరమా? అనవసరమా?’’ - అని పరీక్షించి లోక కళ్యాణార్థం మాత్రమే స్వీకరిస్తాడు. తన కొరకు కాదు.
అలౌకిక గుణః తస్య
కదాచిత్ దృశ్యతే ధృవమ్।
సిద్ధిభిః పరిహీనస్తు
నరం బద్ధన్తు లక్షయేత్।
అజరామర పిండో యో
జీవన్ముక్తః స ఏవ హి।।
అయితే యోగుల పట్ల అలౌకిక (లోకమునకు పరిమితముగాని) ఉత్తమ గుణములు స్వభావసిద్ధంగానే ప్రదర్శితమౌతూ ఉంటాయి.
సిద్ధులు స్వల్పమైన విశేషములని, అవి బంధహేతువులని వారు (ఉత్తమ యోగులు) భావించియే ఉంటున్నారు. కృత్రిమమైన సిద్ధులు బంధమేగాని, ముక్తిని కలిగించేవి కావు.
‘జరామరణములు లేనట్టి ఆత్మ పిండముయొక్క అనుభవము కలవాడే జీవన్ముక్తుడు. జీవన్ముక్తత్వమే ఉత్తమ యోగాశయముగాని, సిద్ధులు కానే కాదు.
30. పశు కుక్కుట కీటాద్యా
మృతిం సంప్రాప్నువన్తి వై
తేషాం కిం పిండపాతేన
ముక్తిః భవతి, పద్మజ?
న బహిః ప్రాణ ఆయాతి
పిణ్డస్య పతనం కుతః?
‘ముక్తి’ అనునది దేహముల రాకపోకలకు సంబంధించినది కాదు. ఓ బ్రహ్మదేవా! పద్మజా! మృత్యువు భౌతిక శరీర సంబంధమైనది మాత్రమే! సిద్ధులు భౌతికమైనవి మాత్రమే! జీవన్ముక్తుడు దేహసంబంధములను జయించినట్టివాడు కదా! పశువులు, కుక్కుటములు (కోళ్ళు), కీటకములు దేహములను పొందటం, కోల్పోవటం జరుగుచున్నది.
దేహము నశించినంత మాత్రం చేత (పిండపాతము చేత)ముక్తి లభిస్తుందా? ప్రాణములు దేహములు బహిర్గతం అయినంతమాత్రం చేత దేహ పరిమితత్వము లేక పిండత్వము తొలగుతుందా? ముక్తి లభిస్తుందా? లేదు. మరణించిన వానికి మరొక దేహము సిద్ధమే అగుచున్నది కదా!
పిణ్డ పాతేన యా ముక్తిః
సా ముక్తిః న తు హన్యతే।
దేహే బ్రహ్మత్వమ్ ఆయాతే
జలానాం సైన్ధవం యథా,
అనన్యతాం యదా యాతి
తదా ‘ముక్తః’ స ఉచ్యతే।
శరీరము పతనము చేత ఏ ముక్తి శరీరము నుండి కలుగుచున్నదో, అది ముక్తి కాదు. అది పరిస్థితుల మార్పు-చేర్పుల వంటిది మాత్రమే.
సైంధవ లవణము నీటిలో వేసినప్పుడు అద్దాని నామరూపాలు నీటిలో ఏ విధంగా కరిగిపోతాయో, ఆ విధంగా - దేహత్వము బ్రహ్మత్వము నందు లయమగుచుండటమే ‘ముక్తి’. ఎప్పుడైతే అన్యత్వమంతా తొలగిపోతుందో (అనగా) ‘‘ఈ దృశ్యమంతా ఆత్మగా నా స్వరూపమే’’ అను అనన్యత్వము సిద్ధిస్తుందో, అప్పుడు మాత్రమే ముక్తి సిద్ధించినట్లు. అంతేకాని, సిద్ధులు లభించినప్పుడు కాదు.
విమతాని శరీరాణి ఇంద్రియాణి తథైవ చ,
బ్రహ్మదేహత్వమ్ ఆపన్నం
వారి బుద్బుదతామ్ ఇవ।
ఈ భౌతిక దేహ స్వభావమును దాటివేసిన యోగి యోగాభ్యాస ప్రభావం చేత బ్రహ్మము-అను పరదేహత్వము సంతరించుకొనుచున్నాడు. అట్టి బ్రాహ్మీదేహాత్మకునికి ఈ దేహము, ఇంద్రియములు, అతీత శక్తులు - ఇవన్నీ నీటిలో బుడగలవలె అగుపిస్తాయి.
దశద్వారపురం దేహం
దశ నాడి మహాపథమ్,
దశభిః వాయుభిః వ్యాప్తం
దశేన్ద్రియ పరిచ్ఛదమ్।
షట్ ఆధార అపవరకం,
షట్ అన్వయ మహావనం,
చతుః పీఠ సమాకీర్ణం
చతుః ఆమ్నాయ దీపకమ్।
బిన్దు నాద మహాలింగమ్
శివశక్తి నికేతనమ్।।
ఈ దేహము దేహికి యోగ సిద్ధిని ప్రాప్తింపజేయగల దేవాలయము. ఇది సిద్ధాలయము. సిద్ధిని పొందింపజేయ గలిగినట్టిది.
శరీరము
ఈ దేహము ఎటువంటిదంటే…
✤ దశద్వారములు (10 Entrances) గల పురము.
✤ దశ ముఖ్యనాడులతో కూడిన అనేక రహదారులు కలిగిన మహాపథము.
✤ ‘‘పంచప్రాణ+పంచ ఉపప్రాణము’’లచే (దశవాయువులచే) ఇది వ్యాపించబడియున్నట్టిది.
✤ ‘‘పంచకర్మేంద్రియ+ పంచజ్ఞానేంద్రియ’’ పరిచ్ఛేదముల (Partitioned) చే ప్రదర్శితమైయున్నట్టిది.
✤ ‘‘మూలాధారము - స్వాధిష్ఠానము- మణిపూరకము - అనాహతము - విశుద్ధము - ఆజ్ఞా - అనబడు షట్ ఆధారములు కలిగియున్నట్టిది.
✤ ‘పంచభూతములు+మనస్సు’ అనే ‘6’ అన్వయములు గల మహావనము. అన్నమయ-ప్రాణమయ-మనోమయ -విజ్ఞానమయ- ఆనందమయ - జీవాత్మల సమన్వయము.
దేహం శివాలయం (దేవాలయం)
ప్రోక్తం, సిద్ధిదం
సర్వ దేహినామ్।
✤ మనోబుద్ధి చిత్త అహంకారములనబడే ‘4’ పీఠములు కలిగి ఉన్నట్టిది.
✤ చర్మము - రక్తము - మాంసము - మజ్జ అను ‘4’ ఆమ్నాయములు కలిగి దీప్తించుచున్నది. చతుర్వేదయుతము.
ఇందులో బిందు నాద మహాలింములతో శివ+శక్తి సమేతము ప్రదర్శితమైయున్నది. ఈ దేహములో సర్వదా ‘సిద్ధిప్రదాత’ అయి శివుడు వేంచేసియున్నాడు. దేహమే దేవాలయము.
31. గుద మేఢ్రాంతరాళస్థం
మూలాధారమ్ త్రికోణకమ్,
శివస్య జీవరూపస్య
స్థానం తద్ధి ప్రచక్షతే।
యత్రకుణ్డలినీ నామ
‘పరాశక్తిః’ పతిష్ఠితా।
(1) మూలాధార చక్రము - పరాశక్తి
ఈ శరీరములో గుదము - మేఢ్రముల అంతరాళమున (Inner Recess) - త్రికోణాకారముగా మూలాధార చక్రము ప్రతిక్షేపించబడి ఉన్నది. ‘‘ఇది శివుడు జీవుడుగా ఉంటున్న స్థానము’’ అని తత్త్వజ్ఞులు చెప్పుచున్నారు. [Three Phassed (Perceiver, Object and Perciving)]
అట్టి మూలాధారచక్రము (లేక) మూలా ఆకాశములో ‘కుండలినీ శక్తి’ అనిపిలువబడుచున్న పరాశక్తి ప్రతిష్ఠితమై యున్నది.
యస్మాత్ ఉత్పద్యతే వాయుః,
యస్మాత్ వహ్నిః ప్రవర్తతే,
యస్మాత్ ఉత్పద్యతే బిన్దుః,
యస్మాత్ నాదః ప్రవర్తతే,
యస్మాత్ ఉత్పద్యతే హంసో,
యస్మాత్ ఉత్పద్యతే మనః
తత్ ఏతత్ కామరూపాఖ్యం
పీఠం, కామఫలప్రదమ్।।
అట్టి మూలాధారములో ప్రతిస్థితిమైయున్న పరాశక్తి నుండియే -
✡︎ వాయువు (చలనములు) బయల్వెడలుచున్నది.
✡︎ వహ్ని (అగ్ని) జనించినదై ప్రజ్వలితమౌతోంది.
✡︎ అద్దాని నుండియే చిత్తప్రదర్శములగు బిందు-నాదములు ఉత్పన్నములై ప్రదర్శనమగుచున్నాయి.
✡︎ అద్దాని నుండే ‘హంస’ (జీవాత్మ, సోఽహమ్) కూడా బయల్వెడలుతోంది.
✡︎ ఆలోచన, మనస్సులు.. అద్దాని నుండే బయలుదేరుచున్నాయి.
అది సర్వకామఫలప్రదమగు దేవీశక్తి స్థానము. కామరూపాఖ్యము (ఇచ్ఛాశక్తి పీఠము) - ఇతి విశ్వ మూలాధారస్థానః।
‘‘స్వాథిష్ఠానా’’ హి అయం (స్వాధిష్ఠానాహ్వయం) చక్రం
లింగమూలే షడశ్రకే।
(2) స్వాధిష్ఠాన చక్రము
- ఇది లింగమూలమున స్థానము కలిగియున్నది. షట్(6) కోణాకారమైయున్నది.
నాభిదేశే స్థితం చక్రం
దశారం ‘‘మణిపూరకమ్’’।
(3) మణిపూరక చక్రము
నాభి ప్రదేశములో దశారంగా సంస్థితమైయున్న చక్రము. 10 రేకుల చక్రము.
ద్వాదశారం మహాచక్రమ్
హృదయేచాపి చ ‘‘అనాహతమ్’’।
తదేతత్ ‘‘పూర్ణగిరి’’, ఆఖ్యం పీఠం, కమలసంభవ!
(4) అనాహత చక్రము
12 రెక్కలు గల ‘మహాచక్రము’. హృదయస్థానము. దీనిని ‘‘పూర్ణగిరి పీఠము’’ అని కూడా అంటారు.
కంఠకూపే ‘‘విశుద్ధ’’ ఆఖ్యం
యత్ చక్రం షోడశాశ్రకమ్।
పీఠం ‘‘జాలంధరం’’ నామ
తిష్ఠతి అత్ర, సురేశ్వర!
(5) విశుద్ధ చక్రము
కంఠకూపములో ఉన్నది. ‘16’ దళములు గల చక్రము. హే సురేశ్వరా! కమల సంభవా! ఇక్కడ ‘‘జాలంధర పీఠము’’ ఉన్నది.
‘‘ఆజ్ఞా’’ నామ భ్రువోః మధ్యే
ద్విదళన్ చక్రమ్ ఉత్తమమ్।।
ఉడ్యాణాఖ్యం మహాపీఠమ్
ఉపరిష్టాత్ ప్రతిష్ఠితమ్।।
(6) ఆజ్ఞాచక్రము
భ్రూమధ్యగా గల చక్రము. రెండు దళముల చక్రము ఇక్కడ ఉన్నది.
దీనికి పై ప్రదేశములో ‘‘ఉడ్యాణ మహాపీఠము’’ ప్రతిష్ఠితమైయున్నది.
చతురశ్రం ధరణి అదౌ
బ్రహ్మా తత్ర అధిదేవతా।
అర్థ చంద్రాకృతి జలం
విష్ణుః తస్య అధి దేవతా।
త్రికోణ మండలం వహ్నీ
రుద్రః తస్య అధి దేవతా।
వాయోః బింబన్తు షట్కోణమ్
ఈశ్వరో అస్య అధి దేవతా।
ఆకాశమండలం వృత్తం
దేవతా అస్య సదాశివః।
నాద రూపం భృవోః మధ్యే
మనసో మండలం విదుః


ఇతి ప్రథమోఽధ్యాయః
మహా పంచభూత అధి దేవతలు
ఆదౌ (మొదట) ధరణి (భూమి)
చతురశ్రాకారమండలము
అధిదేవత : బ్రహ్మ దేవుడు
జలము : అర్థ చంద్రాకృతి ఆకార మండలము
అధిదేవత = విష్ణువు
వహ్ని (అగ్ని) = త్రికోణ ఆకార మండలము
అధిదేవత : రుద్రుడు
వాయువు : బింబము. షట్‌కోణ ఆకారమండలము.
అధిదేవత = ఈశ్వరుడు
ఆకాశమండలము: వృత్తమండలాకారము
అధిదేవత = సదాశివుడు
నాదరూపము : భ్రూమధ్య స్థానము. (నాద బ్రహ్మము) ఇది మనో మండలము.


ఇతి ప్రథమోధ్యాయము

ద్వితీయో అధ్యాయః - యోగమహత్మ్యము

1. బ్రహ్మౌ వాచ:
పునః యోగస్య మహాత్మ్యం, శ్రోతుమ్ ఇచ్చామి, శంకర!
యస్య విజ్ఞాన మాత్రేణ, ఖేచరీ సమతాం వ్రజేత్।
బ్రహ్మభగవానుడు :
ప్రభూ! శంకరభగవాన్! యోగమహాత్మ్యము గురించి మరికొంతగా వినాలని ఉన్నది. దేనిని తెలుసుకున్నంత మాత్రం చేత వాయు సమత్వము ఈ జీవునికి సిద్ధించగలదో, అట్టి ‘ఖేచరీ సమతత్త్వము’ గురించి మరికొంచము వివరించ ప్రార్థన.
యోగమహత్మ్యము
శంకరౌ వాచ:
శృణు బ్రహ్మన్! ప్రవక్ష్యామి, గోపనీయం ప్రయత్నతః।
‘ద్వాదశాబ్దంతు శుశ్రూషాం యః కుర్యాత్ అప్రమాదతః
తస్మై వాచ్యం యథాతథ్యం దాన్తాయ బ్రహ్మచారిణే।
శంకర భగవానుడు :
హే బ్రహ్మన్! రహస్యమగు యోగ మహత్మ్యము గురించి చెప్పుకుంటు న్నాము. ప్రయత్నతః వినండి.
ఎవ్వడైతే 12 సంవత్సరముల పూర్తికాలము అప్రమత్తుడై శ్రద్ధగా గురుశుశ్రూష నిర్వర్తిస్తాడో, ఇంద్రియ నిగ్రహము కలిగి దాంతుడై ఉంటాడో, బ్రహ్మ విద్యకొరకై ‘విద్యార్థి’ అయి ఉంటాడో, అట్టివాడికే ఇది బోధించబడును గాక!
పాండిత్యాత్ అర్థలోభాద్వా
ప్రమాదాద్వా ప్రయచ్ఛతి,
తేన అధీతం శ్రుతం,
తేన తత్ న సర్వమ్ అనుష్ఠితమ్।
ఎవ్వరైనా - తన పాండిత్యము ప్రదర్శించటానికో, ధనము లభిస్తుందనో, అర్ధలోభము చేతనో, గొప్పలు చెప్పుకోవటానికో, ఏదో పొరపాటుగానో మరొకరికి ఈ విద్యను చెప్పనారంభిస్తే - ఆ రెండవ వాడు (వినువాడు) పుచ్చుకొన్నట్లు కాదు. అనుష్ఠించినట్లు కూడా కాదు.
మూలమన్త్రం విజానాతి
యో విద్వాన్ గురు దర్శితమ్,
శివ-శక్తి మయం మంత్రం
మూలాధారాత్ సముత్థితమ్।
తస్య మంత్రస్య వై, బ్రహ్మన్।
శ్రోతా వక్తా చ దుర్లభః।।
హే బ్రహ్మదేవా! యోగాభ్యాసి (లేక) ముముక్షువు గురువును సమీపించి
- మూలాధారము నందు సంస్థితమైయున్న శివశక్తి మయమగు మంత్రము గురించిన మూలమంత్రము (మననము), మూలతత్త్వమును ఎరుగటం మోక్షమునకు గొప్ప ఉపాయము. అందుకు శిష్యుడుగా గురువును ఆశ్రయించాలి.
అట్టి శివ-శక్తి సమన్వితమగు మూలాధారముల మంత్రమననము గురించి చెప్పటము, వినటము కూడా దుర్లభమే!
ఏతత్ ‘పీఠం’ ఇతి ప్రోక్తమ్
నాద లింగం చిదాత్మకమ్।
తస్య విజ్ఞాన మాత్రేణ
జీవన్ ముక్తో భవేత్ జనః।
అణిమాదికమ్ ఐశ్వర్యమ్
అచిరాదేవ జాయతే।।
అట్టి మూలాధార స్థానము ‘‘నాద-లింగ-చిదాత్మక పీఠము’’ గా చెప్పబడుచున్నది.
అట్టి మూలాధారమును తెలుసుకొనుటచేత జీవులు జీవన్ముక్తులు కాగలరు.
మూలాధారము నందు బుద్ధిని నిలుపుటచే త్వరగా అణిమాది సిద్ధులు - అను ఐశ్వర్యము లభించగలదు.
2. మననాత్ త్రాణనాత్ చ ఏవ
మత్ రూపస్య అవబోధనాత్,
‘మంత్రమ్’ ఇతి ఉచ్యతే,
బ్రహ్మన్!
మత్ అధిష్ఠానతోఽపి వా।
హే బ్రహ్మన్!
మంత్రము → మననముచే రక్షిస్తుంది కాబట్టి, (మరియు) మత్ శివతత్త్వ స్వరూపము అవబోధము అగుచుండటం చేతను ‘మంత్రము’ - అనబడుచున్నది. నేను మంత్రమునందు అధిష్ఠితుడనై ఉన్నాను. మననముతో కూడిన మంత్రమునకు వశుడను.
మూలత్త్వాత్ సర్వమన్త్రాణాం, మూలాధార సముద్భవాత్,
మూలస్వరూప లింగత్వాత్, ‘‘మూలమంత్ర’’ ఇతి స్మృతః।
సూక్ష్మత్వాత్ కారణత్వాచ్చ లయనాత్ గమనాత్ అపి,
లక్షణాత్ పరమేశస్య, ‘‘లింగమ్’’ ఇతి అభిధీయతే।
సర్వమంత్రములకు ‘మూలము’ అగుటచేతను, మూలాధారము నందు జనించుటచేతను, మూలస్వరూప లింగము కాబట్టి - ‘మూలమంత్రము’ - అని అంటున్నారు.
లింగము : పరమాత్మతత్త్వము సూక్ష్మము, సర్వకారణము. సర్వము నడిపించునది, లయింపజేయునది కూడా! అట్టి పరమేశ్వర లక్షణములను ‘లింగము’ అని పిలుస్తున్నారు.
సన్నిధానాత్ సమస్తేషు, జంతుషు అపి చ సంతతమ్,
సూచకత్వాచ్చ రూపస్య ‘సూత్రమ్’ ఇతి అభిధీయతే।
సూత్రము : సమస్త జీవుల యందు ఎల్లప్పుడు సామీప్యత, సన్నిధానత్వము కలిగి ఉండటం చేతను, రూపమునకు సూచకముగా ఉండటంచేతను ‘‘సూత్రము’’ - అనబడుతోంది.
మహామాయా, మహాలక్ష్మీ,
మహాదేవీ, సరస్వతీ,
ఆధారశక్తిః అవ్యక్తా,
యయా విశ్వం ప్రవర్తతే,
సూక్ష్మాభా బిందురూపేణ
పీఠరూపేణ వర్తతే।
బిందుపీఠము
దేనిచేతనైతే ఈ విశ్వము ప్రవర్తమానమై ఉంటోందో,
- ఏది మహామాయ, మహాలక్ష్మి, మహాదేవీ, సరస్వతీ చతుర్ పీఠములు కలిగి ఉన్నదో,
- ఏది అవ్యక్తమగు ఆధారశక్తిగా ఉన్నదో,
- బిందురూపము, సూక్ష్మము అయి ఉన్నదో
అట్టి శక్తితత్త్వమే ‘పీఠము’ రూపము అయి ఈ విశ్వమును తనపై ధరించి ఉన్నది.
బిన్దుపీఠం వినిర్భిద్య
నాదలింగమ్ ఉపస్థితమ్।
ప్రాణేన ఉచ్చార్యతే, బ్రహ్మన్!
షణ్ముఖీ కరణేన చ।।
హే సృష్టికర్తా! బ్రహ్మదేవా!
‘బిందుపీఠము’ను ఛేధించుచూ నాదలింగము (The Emanation of Sound) ఉపస్థితమైయున్నది.
అట్టి నాదలింగము→ షణ్ముఖ (6 ముఖములు) కలిగిన కరణములతో, ప్రాణస్వరూపముగా ఉచ్ఛారణ కలిగి యున్నది.
3. గురూపదేశ మార్గేణ, సహ స ఏవ ప్రకాశతే।
‘స్థూలం, సూక్ష్మం, పరం’ చ ఇతి
త్రివిధం బ్రహ్మణో వపుః।
పరబ్రహ్మము గురూపదేశ మార్గముచే స్వయముగా ముముక్షువు పట్ల ప్రకాశమానమగుచున్నది.
పరబ్రహ్మము→ (1) స్థూలము (2) సూక్ష్మము; (3) పరము - అని త్రివిధ ప్రదర్శనములు కలిగి ఉంటోంది.
పంచ బ్రహ్మమయం రూపం, స్థూలం ‘వైరాజమ్’ ఉచ్యతే।
హిరణ్యగర్భం సూక్ష్మస్తు
నాదం బీజత్రయాత్మకమ్।
(1) స్థూలము : పంచ బ్రహ్మమయము, రూపసమన్వితము. స్థూల రూపము ‘వైరాజము’ (That being physically manifested) అని కూడా అంటారు.
(2) సూక్ష్మము : హిరణ్యగర్భము అని కూడా అంటారు. నాదస్వరూపం. బీజత్రయాత్మకము.
పరమ్ బ్రహ్మ। పరమ్ సత్యమ్।
సత్-చిత్- ఆనంద లక్షణమ్।
అప్రమేయమ్। అనిర్దేశ్యమ్।
అవాక్-మానస గోచరమ్।
శుద్ధం। సూక్ష్మం। నిరాకారం।
నిర్వికారం। నిరంజనమ్।
అనన్తమ్। అపరిచ్ఛేద్యమ్।
అనుపమమ్। అనామయమ్।
‘ఆత్మమంత్ర’ సదాభ్యాసాత్
పరతత్త్వం ప్రకాశతే।
(3) పరము : స్థూల సూక్ష్మములకు ఆధారము. (నాటకంలో కనిపించే పాత్రకు, నటనకు పాత్రధారుడు ఆధారమైనట్లుగా),
- అదియే పరంబ్రహ్మము. పరమ సత్యము.
- సత్ (ఉనికి), చిత్ (ఎరుక) ఆనందము (అనుభూతి) అను లక్షణములు కలిగి ఉన్నట్టిది.
- దేనికీ సంబంధించినది కాదు. అప్రమేయము (మట్టితో కోతి బొమ్మ చేసినంతమాత్రం చేత మట్టి కోతిగా అవకపోవటం వంటిది).
- అనిర్దేశ్యము (Undefinable).
- వాక్కుకు, మనస్సుకు అందనిది.
- శుద్ధము; సూక్ష్మము; నిరాకారము నిర్వికారము, నిర్మలము (నిరంజనము).
- ఆద్యన్తరహితము.
- అపరిచ్ఛేద్యము (Unpartitionable)
- ఉపమానములతో చెప్పరానిది, అనుపమము.
- అనామయము. పరిధి లేనిది.
ఈ రీతిగా ఆత్మ మంత్రము(మననమును)ను ఎల్లప్పుడూ అభ్యసించుటచే పరతత్త్వము ప్రకాశించగలదు.
సిద్ధి ద్వారే తత్ అభివ్యక్తి చిహ్నాని
సిద్ధి ద్వారాణి మే శృణు।

దీపజ్వాల, ఇన్దు, ఖధ్యోత, విద్యుత్ నక్షత్ర భాస్వరాః
దృశ్యంతే సూక్ష్మరూపేణ సదా యుక్తస్య యోగినః।
అట్టి పరబ్రహ్మము యొక్క అభివ్యక్తి చిహ్నములగు సిద్ధిద్వారముల గురించి వినండి.
యోగము అభ్యసించుచున్న యోగాభ్యాసికి
→ దీపజ్వాల; చంద్రబింబము,ఖద్యోతము (మిడుగుఱు పురుగు మెరుపులు); విద్యుత్ (తేజస్సు), నక్షత్రములు.. ఇవి సూక్ష్మరూపంగా హృదయాకాశంలో భాసిస్తూ ఉంటాయి.
అణిమాదికమ్ ఐశ్వర్యమ్
అచిరాత్ తస్య జాయతే।
అట్టి → ద్వీపజ్వాల, ఖద్యోతము, విద్యుత్తు, నక్షత్రములు - హృదయాకాశములో దర్శనమగుచున్న యోగాభ్యాసికి → (ఆతను కోరుకుంటే) అణిమ మొదలైన అష్టసిద్ధులు లభించగలవు.
నాస్తి నాదాత్ పరో మన్త్రో। న దేవః స్వాత్మనః పరః।
న అనుసన్ధేః పరా పుజా। నహి తృప్తేః పరం సుఖమ్।
స్వాత్మ దేవుడు ‘నాదము’నకు మించిన పరమంత్రము లేదు. స్వాత్మకన్నా వేరైన దేవుడు లేడు.
అట్టి ఆత్మతో ‘అనుసంధానము’నకు మించిన పూజ లేదు. పరస్వరూపమునకు మించిన తృప్తి, సుఖము మరొకటి లేదు.
గోపనీయం ప్రయత్నేన సర్వదా సిద్ధిమ్ ఇచ్ఛతా।
మద్భక్త ఏతత్ విజ్ఞాయ, కృతకృత్యః సుఖీ భవేత్।
యస్య దేవే పరా భక్తిః, యథా దేవే తథా గురౌ।
తస్య ఏతే కథితా హి అర్థాః, ప్రకాశంతే ‘మహాత్మనః’
ఇతి।।


ఇతి ద్వితీయోఽధ్యాయః
సిద్ధిని సంపాదించుకోవాలనుకునేవాడు సర్వదా ప్రయత్నపూర్వకంగా స్వాత్మానుసంధానమును ఇష్టంగా ఉపాసించవలసినట్టిది (గోపనీయము).
ఎవ్వడైతే నా పట్ల భక్తి కలవాడై స్వస్వరూపాత్మోపాసనను తెలుసుకొని నిర్వర్తిస్తాడో, అట్టివాడు కృతకృత్యుడు. సర్వదా సుఖవంతుడు.
ఎవనికి→ దైవభక్తి ప్రవృద్ధము అగుచూ ఉంటుందో,
ఎవడు పరాభక్తి కలిగిఉంటాడో, గురువు పట్ల పరమాత్మతో సమానంగా ఉత్తమమైన శ్రద్ధ - ప్రణిపాతము కలిగి ఉంటాడో..,
అట్టి మహాత్మునికి మనము చెప్పుకొన్న మహత్ విశేషములన్నీ ప్రకాశించ గలవు.


ఇతి రెండవ అధ్యాయము

తృతీయ (3వ) అధ్యాయము-యోగసిద్ధి

యోగ చిత్ సిద్ధికారణమ్
1. యోగమ్ అస్య చిత్ - ఆఖ్యాతమ్
యత్ సిద్ధీనాం చ కారణమ్,
యేన విజ్ఞాత మాత్రేణ జన్మ బంధాత్ ప్రముచ్యతే।
అక్షరం పరమో నాదః, ‘‘శబ్ద బ్రహ్మ’’ ఇతి కథ్యతే।
హే బ్రహ్మభగవాన్! మోక్షము సిద్ధించటానికై ‘యోగము’ ఏవిధంగా కారణమగుచున్నదో చెప్పుకున్నాము.
దేనిని తెలుసుకున్నంత మాత్రం చేత ఈ జీవుడు జన్మ-జరా బంధముల నుండి విముక్తుడు (ప్రముచ్యుడు) అవుతాడో, అట్టి అక్షరము, పరము అగునాదమే- ‘శబ్ద బ్రహ్మము’ - అని పిలువబడుచున్నది.
మూలాధారగతా శక్తిః,
స్వాధారా బిన్దు రూపిణీ।
తస్యామ్ ఉత్పద్యతే నాదః
సూక్ష్మబీజా-దివాం అంకురః।
తాం పశ్యన్తీం విదుః విశ్వమ్
యయా పశ్యంతి యోగినః।
అక్షరమగు ఆత్మయే ఆధారముగా అయి ‘శక్తి’ మొదట ప్రదర్శనమగుచూ ‘మూలాధారము’గా చెప్పబడుతోంది. ఆత్మయే ఆధారముగా బయల్వెడలు శక్తియే మూలాధారశక్తి. సూక్ష్మబీజము నుండి అంకురము జనిస్తున్నట్లుగా ఆ మూలాధార బిందురూపము నుండి నాదము (Sound) జనిస్తోంది. (ఇది ‘పరా’ అని ప్రసిద్ధము)
‘‘పశ్యన్తి’’ : మూలాధారమునుండి స్వాభావికమై జనించుచున్న నాదము యొక్క తదనంతర ప్రదర్శనమే ఈ విశ్వము.
ఈ విధంగా దేనిచే యోగులు విశ్వమును స్వస్వరూపాత్మానంద స్వరూపంగా చూచుచున్నారో, అదియే ‘పశ్యంతి’ అని విజ్ఞులు పిలుస్తున్నారు. విశ్వమును నాదరూపంగా దర్శించటం - పశ్యన్తీ.
హృదయే వ్యజ్యతే ఘోషో
గర్జత పర్జన్య సన్నిభః।
తత్ర స్థితా, సురేశానః
‘మధ్యమా’ ఇతి అభిధీయతే।।
మధ్యమా : ఓ సురేశ్వరా! హృదయము నందు వర్షపు శబ్దము వలె గర్జన ఘోష - యోగాభ్యాసముచేస్తూ ఉండగా వినబడుచున్నది. అట్టి హృదయ స్థానము నుండి ఏ వర్ష శబ్దము వినబడుచున్నదో, అది ‘మధ్యమా’ అని చెప్పబడుచున్నది. నాదమును వినసొంపుగా చేయు వంపుసొంపులే మధ్యమము.
2. ప్రాణేన చ స్వరాఖ్యేన
ప్రథితా వైఖరీ పునః।
శాఖా పల్లవ రూపేణ
తాల్వాది స్థానఘట్టనాత్।
‘అ’ కారాది → ‘క్ష’ కార అన్తాని
అక్షరాణి సమీరయేత్।
అక్షరేభ్యః పదానిస్యుః, పదేభ్యో వాక్య సమ్భవః।
వైఖరీ : ‘స్వరము’ అనునదే ప్రాణరూపంగా ‘వైఖరీ’గా ప్రసిద్ధమైయున్నది. మూలాధారశక్తి (పరాశక్తి) ‘వైఖరీ’గా శబ్దత్వము వహిస్తోంది. స్థానము → గొంతు.
ఆ మూలాధారశక్తి ‘తాలు’ (నాలుక) మొదలైన ఆయా స్థానములలో, వృక్షశాఖలు, ఉపశాఖలు విస్తరించు రీతిగా (శాఖాపల్లవరూపంగా) శబ్దమును జనింప జేస్తోంది. ‘అ’ మొదలుకొని ‘క్ష’ వరకు అక్షర శబ్దములన్నీ సమీకరిస్తోంది.
‘అ-క్ష’ అక్షర ఉచ్ఛారణల నుండి శబ్దములు, శబ్దముల నుండి పదములు, బయల్వెడలుచున్నాయి. పదముల నుండి వాక్యములు సంభవిస్తున్నాయి.
సర్వ వాక్యాత్మకా మన్త్రా
వేదశాస్త్రాణి కృత్స్నశః
పురాణాని చ కావ్యాని భాషాశ్చ
వివిధా అపి, సప్త స్వరాశ్చ గాధాశ్చ
సర్వే నాద సముద్భవాః।
మూలాధారశక్తి వైఖరీరూపంగా స్వరరూపంగాను, నాలుక గొంతు స్థానములలో కలిగించు ఘట్టనలచే ‘అ’ నుండి ‘క్ష’ వరకు శబ్దములుగాను, శబ్దములు పదములుగాను, పదములు వాక్యములుగాను అగుచుండగా, సర్వమంత్రములు, వేదములు, శాస్త్రములు, పురాణములు, కావ్యములు, వివిధ భాషలు, సప్త స్వరములు (స-రి-గ-మ-ప-ద-ని), గానములు.. ఇవన్నీ ‘‘నాదము’’ నుండి సముద్భవించినవి అగుచున్నాయి.
3. ఏషా సరస్వతీ దేవీ
సర్వభూత గుహాశ్రయా।
వాయునా వహ్ని యుక్తేన
ప్రేర్యమాణా శనైః శనైః,
తత్ వివర్త పదైః వాక్యైః
ఇత్యేవం వర్తతే సదా।
ఈవిధంగా పరాశక్తి (లేక) మూలాధారశక్తి ‘స’ ‘రస’ వతీ = శబ్దరసవతీ = సరస్వతీ = శబ్దము+అర్ధము+భావన రూపిణిగా, సరస్వతీదేవి → సర్వజీవుల (‘‘నోరు-హృదయము’’ అనే) గుహలను ఆశ్రయించి ఉన్నది.

నెమ్మది నెమ్మదిగా వాయువు - అగ్నిలతో కూడి ప్రేరణాశక్తి అయి ప్రకాశిస్తోంది.
సరస్వతీశక్తియే కుండలినీ దేవి, మూలధారశక్తి కూడా! ఆశక్తి ఈ విధంగా నాదములుగా, శబ్దములుగా, అక్షరములుగా, పదములుగా, వాక్యములుగా వర్తించుచున్నది. వాక్యములే వేద-మంగళ శ్లోకములుగా సంప్రదర్శమగుచున్నాయి. శబ్దము, అర్థము కూడా నాదస్వరూపములే.
య ఇమాం వైఖరీం శక్తిం, యోగీ స్వ-ఆత్మని పశ్యతి,
స వాక్ సిద్ధిమ్ అవాప్నోతి, సరస్వత్యాః ప్రసాదతః।
వేదశాస్త్ర పురాణానాం, స్వయంకర్తా భవిష్యతి।
ఏ యోగి అయితే ఈ వైఖరీ అనబడే సరస్వతీ - ‘‘మూలాధార - మూలశక్తి’’ని తన ఆత్మయందు ఆత్మగా చూచుచున్నాడో, అట్టివాడు సరస్వతీ ప్రసాదముగా ‘వాక్‌సిద్ధి’ని పొందుచున్నాడు. ‘వాక్ స్వరూపము’ను సంతరించుకొను ప్రజ్ఞాసహితుడు - అగుచున్నాడు.
వేదశాస్త్ర పురాణలకు ఆతడు స్వయంకర్తగాను, వాటి వాటి గానములకు తన స్వస్వరూపమే విషయమైనట్లుగా లక్ష్యసిద్ధిని పొందుచున్నాడు.
అక్షర సూత్రాత్మ
యత్ర బిన్దుశ్చ నాదశ్చ,
సోమ-సూర్య- అగ్ని - వాయవః
ఇన్ద్రియాణి చ సర్వాణి
లయం గచ్ఛన్తి, సువ్రత!
→ వాయువో యత్ర లీయంతే,
→ మనో యత్ర విలీయతే,
→ యం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే న అధికం తతః,
→ యస్మిం స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే,
→ యత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా,
→ యత్ర చ ఏవ ఆత్మనా ఆత్మానమ్ పశ్యన్
ఆత్మని తుష్యతి,
→ సుఖమ్ ఆత్యన్తికం యత్ తత్
‘‘బుద్ధిగ్రాహ్యమ్, అతీంద్రియమ్’’,
→ ఏతత్ క్షర - క్షరాతీతమ్
‘అనక్షరమ్’ ఇతి ఈర్యతే,
→ క్షరః సర్వాణి భూతాని।
సూత్రాత్మా ‘‘అక్షరమ్’’ ఉచ్యతే।
క్షర అక్షరాతీత సూత్రాత్మ
ఓ సువ్రతా! బ్రహ్మదేవా! కేవలాత్మ (లేక) సూత్రాత్మ ఎట్టిదంటే….,
➤ ఎక్కడ బిందువు, నాదము, సోమ- సూర్య- అగ్ని -వాయువులు, (చూపు - రుచి - వినికిడి - రుచి - స్పర్శ మొదలైన) సర్వేంద్రియములు తిరిగి పుట్టింటికి చేరినట్లుగా ‘లయము’ పొందుచున్నాయో,
➤ ప్రాణశక్తి రూపమగు వాయువు, ఆలోచనాశక్తి రూపమగు మనస్సు తిరిగి ఎద్దానిలో విలీనము పొందుచున్నాయో..,
➤ ఏది లభించిన తరువాత ఇక ఈ జీవునికి ఇంక పొందవలసిన దంటూ మరింకేదీ కించిత్తు కూడా అంతకుమించినదై శేషించి ఉండదో..,
➤ ఏ స్థితినైతే ఈ జీవుడు తన యందు సిద్ధించుకున్న తరువాత ఇక గొప్పదుఃఖ సందర్భములలో కూడా వేదన, దిగులు చెందడో..,
➤ ఎచ్చట చిత్తము సంయోగము చెందుతూ నిరుద్ధము (నిరోధము) పొంది ఉపరమిస్తుందో, (ఉప్పుగడ్డ నీళ్లలో జారినప్పుడు అద్దాని ఆకారమువలె) ఉపశమిస్తుందో, సశాంతిస్తుందో,
➤ ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మ దర్శనముచే అఖండాత్మత్వము పొంది పరమానందిస్తుందో..,
➤ ఇంద్రియములకు సంబంధించనిది, ఇంద్రియాతీతమైనది, బుద్ధిచేతనే ఆస్వాదించబడునది అగు ఏ ఆత్యంతిక సుఖము స్వయముగా అనుక్షణికమై అనుభూతమౌతుందో,
అదియే క్షర-అక్షరములకు కూడా అతీతమైన ‘అనక్షరము’ అనబడు స్వస్వరూపాత్మ!!

ఓ బ్రహ్మదేవా! ఇక్కడి సర్వ పాంచభౌతికమైన దృశ్యమంతా సర్వ జీవ-భేదములన్నీ నశించబోవుచున్నాయి. (యత్ దృశ్యమ్ తత్ నశ్యమ్). పూదండలోని దారము వలె సర్వజీవులలో ఏకస్వరూప-అంతర్యామి యగుదానిని ‘‘అక్షరము’’-అని అంటారు. అది క్షరము కాదు. నశించదు.
4. అక్షరం పరమం బ్రహ్మ
నిర్విశేషం నిరంజనమ్।
అలక్షణమ్, అలక్ష్యం తత్।
(తత్) అప్రతర్క్యమ్, అనూపమమ్।
అపారపారమ్, అచ్ఛేద్యమ్।
అచిన్త్యమ్, అతినిర్మలమ్।
ఆధారం సర్వభూతానామ్।
అనాధారం, అనామయమ్।
అప్రమాణమ్, అనిర్దేశ్యమ్।
అట్టి అక్షరమగు పరబ్రహ్మము-సమస్తము లయించిన తరువాత కూడా శేషించినదై ఉంటుంది. కాబట్టి → నిర్విశేషము;
ఎట్టి దోషములు అద్దానిని స్పృశించజాలవు కాబట్టి → నిరంజనము.
కథలోని పాత్రల లక్షణములు కథా రచయితకు ఆపాదించలేని రీతిగా → అలక్షణము.
అద్దానికి మరొక అన్యమగు లక్ష్యము ఏదీ లేదు. కాబట్టి → తత్ - అలక్ష్యమ్.
తర్క - వితర్కములచే అనుభవమయ్యేది కాదు. అప్రతర్క్యము.
ఉపమానము(Comparative example) లేనిది. అనూపము.
అంతు దొరకనిది. అపారపారమ్.
ఛేదము పొందనిది. అచ్ఛేద్యము.
అప్రమేయమ్, అతీన్ద్రియమ్।
అస్థూలమ్, అనణుః, (అ)హ్రస్వమ్।
అదీర్ఘమ్, అజమ్, అవ్యయమ్।
అశబ్ద స్పర్శ రూపః తత్,
అచక్షుః శ్రోత్ర నామకమ్।
సర్వజ్ఞం, సర్వగం, శాంతం।।

సర్వేషాం ‘హృదయే’ స్థితమ్।

✡︎ చింతనలకు జననస్థానము. అందుచేత చింతనలకు అందనిది. అచిన్త్యము.
✡︎ దోషరహితమైనది. అతినిర్మలము.
✡︎ సర్వజీవులకు ఆధారము.
✡︎ అద్దానికి ఆధారము మరొకటి ఏదీ లేదు. అనాధారము.
✡︎ అద్దాని యందు అన్యమై మరొకటేదీ కించిత్ కూడా లేదు. అనామయము.
✡︎ ప్రమాణములు ఏవీ సరిపోవు. అప్రమాణము.
✡︎ దేనికీ సంబంధించినది కాదు. అప్రమేయము.
✡︎ స్థూలము కాదు. సూక్ష్మము కాదు.
✡︎ జన్మరహితము. అజము.
✡︎ శబ్ద-స్పర్శ-రూప-రస-గ్రంధ-చక్షు-శ్రోతములు కానట్టిది. నిరవయవము.
✡︎ నిర్వచించవీలు కాదు. అనిర్దేశ్యము.
✡︎ ఇంద్రియములకు విషయమే కాదు. అతీంద్రియము.
✡︎ (అస్థూలమ్)। అణువు కూడా కాదు. చిన్నది కాదు. పెద్దది కూడా కాదు.
✡︎ వ్యయమనునది లేదు. అవ్యయము.
✡︎ ఆత్మ→ సర్వము ఎరిగి ఉన్నట్టిది. సర్వజ్ఞము.
✡︎ (కథారచయిత యొక్క భావనయే కథంతా నిండి ఉన్నట్లు, స్వప్నము తనదైనవాడు స్వప్నమంతా నిండి ఉన్నతీరుగా) ఆత్మ సర్వగతము.
✡︎ సర్వ హృదయములలో సర్వదా సంస్థితమై ప్రకాశించుచున్నట్టిది. నిత్య ప్రకాశకము.
5. సుసంవేద్యం గురుమతాత్
సుదుర్బోధమ్ అచేతసామ్।
నిష్కళం। నిర్గుణం।, శాంతమ్।,
నిర్వికారమ్। నిరాశ్రయమ్।
నిర్లేపకం। నిరాపాయం।
కూటస్థమ్। -అచలం। ధృవమ్
జ్యోతిషామపి తత్ జ్యోతిః।
తమః పారే ప్రతిష్ఠితమ్।
భావ అభావ వినిర్ముక్తం
భావనామాత్ర గోచరమ్।
భక్తి గమ్యం పరం తత్త్వమ్
అన్తర్లీనేన చేతసా।
భావనామాత్రమేవ
అత్ర కారణం, పద్మసంభవ!
ఓ పద్మసంభవా! బ్రహ్మభగవన్! ఇంకా కూడా ఆత్మగురించి విను.

గురువుల (ఆత్మానుభవజ్ఞుల)బోధచే ఆత్మ సులభముగా తెలియగలదు. బుద్ధికుశలత లేకపోతే అది తెలియటము బహుకష్టసాధ్యము. సుదుర్బోధము.
స్వస్వరూపమే అయి ఉన్న పరస్వరూపము.
కళంకరహితము. నిష్కళము.
ఒక రచయిత ఆతని రచనలోని ఏ పాత్ర యొక్క గుణములు కూడా - ‘తనవి’గా కలిగి ఉండడు కదా! అట్లాగే ప్రపంచ రచనకు కారణమగుచూ కూడా- ఆత్మ నిర్గుణము.
పరమశాంతము. నిర్వికారము. నిరాశ్రయము.
ఆత్మ దేనిచేతనూ కప్పబడదు. నిర్లేపము.
అపాయము పొందునదికాదు. నిరాపాయము.
సర్వకాలములలోను, సర్వ అవస్థలలోను ఒకేతీరుగా ఉంటుంది. కూటస్థము.
ఒకచోట నుండి మరొకచోటికి కదలునది కాదు. అచలము. ధృవము.
ఆత్మజ్యోతిలన్నిటికీ కూడా జ్యోతి.
అంధకారమునకు ఆవల ప్రతిష్ఠితమైయున్నది. ఒకడు కళ్లు మూసుకుంటే చీకటి. ఆ చీకటిని కూడా చూచేదే ఆత్మ. (తమసః పరస్తాత్).
ఆత్మ భావ-అభావముల నుండి విముక్తము. అతీతము.
ఆత్మనుభావనతోనే చూడగలము. భావనామాత్రగోచరము.
సర్వమునకు పరమైన అట్టితత్త్వము భక్తికి గోచరము. భక్తిగమ్యము.
బుద్ధిచే అంతర్లీనంగా తెలియవచ్చునది. అంతర్లీనేన చేతసా!
అద్దానిని అంతర్లీన భావన చేయటమే కారణముగా కలిగియున్నది.
మరొక కారణము కలిగిలేదు. భావనామాత్రమేవ అత్ర కారణమ్!
6. యథా దేహాన్తర ప్రాప్తేః
కారణం భావనా నృణాన్,
విషయం ధ్యాయతః పుంసో,
విషయే రమతే మనః।
మామ్ అనుస్మరతః చిత్తం
మయ్యేవ అత్ర విలీయతే।
ఈ జీవుడు ఈ దేహమును కలిగి ఉండటానికి, దీనిని వదలి మరొక దేహము పొందటానికి కూడా కారణము ఆతనియొక్క స్వకీయ భావనా పరంపరలే!
ఈ జీవుడు విషయములను గురించి ధ్యానము చేస్తూ ఉండగా, ఆతని మనస్సు సదా విషయములందే రమించటం జరుగుచున్నప్పుడు విషయములందే దేహముల రాకపోకలను అనుభవంగా పొందుచున్నాడు.
ఆతని చిత్తము (సర్వతత్త్వ స్వరూపుడనగు) నన్నే తలచుచూ ఉండగా నాయందే ఈ జీవుని చిత్తము విలీనము పొందగలదు. ‘నేను’ అను నిశ్చల స్మరణమునందే ‘నాది’ అనబడు సంచలనమంతా విలీనము పొందుచున్నది.
సర్వజ్ఞత్వం పరేశత్వం
సర్వ సంపూర్ణ శక్తితా,
అనన్త శక్తిమత్వన్చ
మత్ అనుస్మరణాత్ భవేత్।
నన్ను స్మరించుచుండగా ఈ జీవుడు స్వయముగా శివస్వరూపుడు అగుచున్నాడు. అటువంటి స్వస్వరూపాత్మ గురించి ఎరిగినవాడు - సర్వజ్ఞత్వము, పర- ఈశ్వరత్వము, సర్వ సంపూర్ణ శక్తిత్వము, పొందగలడు.
అనంతాత్మశక్తి సమన్వితుడు అగుచున్నాడయ్యా!

చతుర్థో అధ్యాయము

‘‘ఓం’’
1. చైతన్యస్య ఏకరూపత్వాత్
భేదో యుక్తో న కర్హిచిత్।
జీవత్వం చ తథా జ్ఞేయం
‘రజ్జ్వాం సర్పగ్రహో’ యథా।
అయం ప్రపంచో బ్రహ్మైవా-స్తి। న చ ఇతరమ్।।
‘చైతన్యము’ సర్వదా ఏకరూపమే కానీ, అద్దాని యందు భేదము అయుక్తమే। యుక్తమేకాదు. (భేదము లేదు).
మరి అఖండ చైతన్యమునందు ఈ జీవాత్మ ఎవరు? త్రాడులో పాము అగుపడటం ఎటువంటిదో… జీవత్వముగా చైతన్యమే అజ్ఞాన దృష్టిచే చూడబడుచున్నది.
రజ్జ్వ జ్ఞానాత్ తత్ క్షణేనైవ
యద్వత్ రజ్జుర్హి సర్పిణీ,
భాతి తద్వత్ చితిః సాక్షాత్
విశ్వాకారేణ కేవలా।
ఒకడు ఒక త్రాడును చూచి క్షణం కాలంలో ఆ త్రాడును ‘పాము’ అనుకొని, మరుక్షణం అనేక వికారములు పొందుచున్నాడు కదా!
అదేవిధంగా సాక్షాత్ చిత్ స్వరూపమగు ఈ కనబడేదంతా అనేక భేదములతో కూడిన విశ్వాకారముగా క్షణములో కనబడటం జరుగుతోంది.
ఉపాదానం ప్రపంచస్య
బ్రహ్మణో అన్యత్ న విద్యతే,
తస్మాత్ సర్వ ప్రపంచో-యమ్
బ్రహ్మైవ అస్తి। - న చ ఇతరత్।
భేదములతో కూడిన విశ్వాకారముగా క్షణములో కనబడటం జరుగుతోంది.
ఈ ప్రపంచమునకు బ్రహ్మమునకు వేరైన ఉపాదాన కారణము మరింకేదీ లేదు. అందుచేత ఈ సర్వప్రపంచము బ్రహ్మమే అయి ఉన్నది. మరింకేదీ అయి ఉండలేదు.
ప్రపంచము పొందుచున్న ఈ జీవుడు కూడా బ్రహ్మమే! ఆ జీవుని తన అంశగా కలిగి ఉన్నది. బ్రహ్మము అనగా? - ‘‘వ్యాపించునది, వ్యాపింపజేయునది’’ అని శబ్దార్థం.
2. వ్యాప్య-వ్యాపకతా మిథ్యా, సర్వమ్ ఆత్మేతి శాసనాత్।
ఇతి జ్ఞాతే పరే తత్త్వే, భేదస్య అవసరః కుతః?
అయితే, ‘‘సర్వము ఆత్మయే’’ అను శాసనము (Thumb-Rule) ను అనుసరించి ‘‘వ్యాపింపజేయునది - వ్యాపించునది’’.. అను వివరణా వ్యవహారమంతా మిధ్యయే! ఈ విధంగా పరతత్త్వము తెలుసుకున్న తరువాత ఇక ‘‘జీవుడు - శివుడు; విశ్వముగా వ్యాపించునది - విశ్వమును వ్యాపింపజేయునది’’ - అను భేదముతో అవసరమేముంటుంది? ఆ భేదమే లేనిదగుచున్నది.
బ్రహ్మణః సర్వభూతాని, జాయన్తే పరమాత్మనః ।
తస్మాత్ ‘‘ఏతాని బ్రహ్మైవ భవంతి’’
ఇతి విచిన్తయ।
సర్వభూతజాలము ‘పరమాత్మ’ యగు బ్రహ్మమునండే బయల్వెడలు చున్నది. ‘‘అందుచేత వివిధంగా కనిపిస్తున్న భూతజాలమంతా (సర్వజీవులు) అఖండమగు బ్రహ్మమే’’ అనే విషయము విచిన్తనము చేయాలి.
బ్రహ్మైవ సర్వనామాని, రూపాణి వివిధాని చ।
కర్మాణ్యపి సమగ్రాణి భాసన్తీవ - ఇతి భావయ!
ఈ దృశ్యంగా కనిపిస్తున్న సర్వకర్మ వ్యవహారములు, సర్వ నామములు, సర్వ రూపములు ఈఈ విధంగా కనిపిస్తున్నప్పటికీ సర్వదా ఏకమగు బ్రహ్మమే అయి ఉన్నది - అని భావించబడుగాక! ఇదియే సత్యము. అనునిత్యమైనట్టి వాస్తవము.
సువర్ణాత్ జాయమానస్య
సువర్ణత్వన్-చ శాశ్వతమ్,
బ్రహ్మణో జాయమానస్య
బ్రహ్మత్వన్చ తథా భవేత్।
బంగారము ‘‘గాజులు, గొలుసులు, ఉంగరములు, అరవంకెలు’’ మొదలైన అనేక ఆభరణములుగా కనిపిస్తున్నప్పటికీ వాటన్నిటిలో సువర్ణత్వమే సత్యము, శాశ్వతము కదా! అదేవిధంగా బ్రహ్మము నుండి బయల్వెడలుచున్న ఈ ప్రపంచమంతా కూడా ‘బ్రహ్మత్వము’ - అనునది సహజ స్వభావముగా కలిగియే ఉన్నది. అన్యంగా అనిపించేదంతా సందర్భకల్పన మాత్రమే! ఊహించువానియొక్క ఊహాజనిత దృశ్యానుభవము వంటిదే! బ్రహ్మముయొక్క సమక్షములో ‘నేను జీవుడను’ - అనునది కల్పనామాత్రమే!
3. స్వల్పమపి అన్తరం కృత్వా
జీవాత్మ పరమాత్మనోః,
యః తిష్ఠతి స మూఢాత్మా
భయం తస్యాపి భాషితమ్।
అందుచేత హే బ్రహ్మభగవాన్!
(1) జీవాత్మ (2) పరమాత్మ - ఈ రెండింటిలో కొంచెము భేదము కల్పించుకొనినప్పటికీ కూడా, ఆతడు మూఢాత్ముడే అగుచున్నాడు. ఆతని పట్ల భయము ఉండనే ఉంటుంది.
యత్ అజ్ఞానాత్ భవేత్ ద్వైతమ్
‘ఇతరః’ తత్ ప్రపశ్యతి,
ఆత్మత్వేన తదా సర్వం
న ఇతరః తత్ర చ అణ్వపి।
ఏది అజ్ఞాన కారణంగా (లోకములు, లోకపాలకులు, దైవము మొదలైన) ఇతరమును ద్వైతముగా చూస్తున్నాడో, అదంతా కూడా ఆత్మగానే చూడబడునుగాక! ఆత్మకు వేరుగా తత్ - ఇతరమై అణువంత కూడా ఎక్కడా ఏదీ లేదు.
అనుభూతోఽపి అయం లోకో
వ్యవహారక్షమోఽపి సన్,
అసత్‌రూపో,
యథా స్వప్న ఉత్తర క్షణ బాధితః।
ఈ దృశ్యము, ఈ లోక వ్యవహారము - ఇదంతా కూడా ప్రత్యక్షంగా అనుభూతము అగుచూ ఉన్నప్పటికీ (లేక) వ్యవహారికమై కంపట్టుచున్నప్పటికీ → ఇదంతా అసత్‌రూపమే!
నిదుర లేచిన మరుక్షణం స్వప్నదృశ్యమంతా అదృశ్యమగు రీతిగా, ఈ జగత్ దృశ్యమంతా కూడా
(1) దేహానంతరము (లేక) (2) ఆత్మజ్ఞానాంతరము బాధితమే అగుచున్నది. కల్పనంతా కల్పించువానియందే లయమును పొందుచున్నది.
స్వప్నే జాగరితం నాస్తి।
జాగరే స్వప్నతా నహి।
ద్వయమేవ లయే నాస్తి,
లయోఽపి హి అనయోః న చ।
→ స్వప్నసమయంలో జగ్రత్తు నాస్తి (లేనిది) అగుచున్నది.
→ జాగ్రత్తులో స్వప్నము నాస్తి. (లేనిది) అగుచున్నది.
→ లయ సమయంలో అవి రెండు లేకుండాపోతున్నాయి.
అందుచేత స్వప్న జాగ్రత్తులు రెండూ కూడా స్వతఃగా లేవు. (ఆత్మజ్ఞానముచే) జీవాత్మ-పరమాత్మ అను రెండూ లేనివై ఏకత్వము పొంది, కేవలాత్మయే శేషిస్తోంది.
4. త్రయమేవ భవేత్ మిథ్యా
గుణత్రయ వినిర్మితమ్।
అస్య ద్రష్టా గుణాతీతో
నిత్యో హి ఏష చిదాత్మకః।
‘గుణత్రయము’ అని పిలువబడుచున్న సత్వ-రజో-తమోగుణములచే ఈ జగదనుభవము నిర్మితమౌతోంది. అయితే, త్రిగుణములు గుణాతీతాత్మ సమక్షంలో మిధ్యయే అయి ఉన్నాయి.
గుణాతీత దృష్టిచే అట్టి గుణాతీత చిదాత్మయే నిత్యము.
యద్వత్ మృది ఘటాహ్రాంతిః,
శుక్తౌ హి రజత స్థితిః,
తద్వత్ బ్రహ్మణి జీవత్వం
వీక్షమాణే వినశ్యతి।
ఏవిధంగా అయితే, మట్టి దృష్ట్యా ‘మట్టి కుండ’ అను దానిలో కుండ అహ్రాంతి మాత్రమే అయి ఉన్నదో.., (మట్టికి వేరు కాదో),
ముత్యపు చిప్పలో ‘వెండి’ అనునది అహ్రాంతి మాత్రమేనో,
…. అదేవిధంగా బ్రహ్మము నందు కనబడుచున్న జీవత్వము భ్రమ మాత్రమే.
బ్రహ్మజ్ఞానముచే జీవత్వము అనబడునది సమూలంగా వినశ్యమగుచున్నది.
యథా మృది ‘ఘటో’ నామ,
కనకే కుండలాభిదా,
శుక్తౌహి రజత ఖ్యాతిః
‘జీవ’ శబ్దః తథా పరే।
→ ‘మట్టి కుండ’- అగుదానిలో ‘కుండ’ అనునది వలెను,
→ ‘‘బంగారపు కుండలము’’ - అనుదానిలో ‘కుండలము’ అనబడేవలెను,
→ ‘‘ముత్యపు చిప్పలో వెండి మెరపు’’ - అను దానిలో వెండి వలెను, బ్రహ్మము నందు జీవుడు అనబడునది లోక ప్రసిద్ధమై ఉంటోంది. (ఈ జీవుడు బ్రహ్మమునకు వేరు కాదు).
యథైవ వ్యోమ్ని నీలత్వం,
యథా నీరం మరుత్ స్థలే,
పురుషత్వం యథా స్థాణౌ,
తద్వత్ విశ్వం చిదాత్మని।
యథైవ శూన్యో వేతాళో,
గంధర్వాణాం పురం యథా,
యథా ఆకాశే ద్వి-చంద్రత్వం, -
తద్వత్ సత్యే జగత్ స్థితిః।
ఆకాశంలో నీలత్వము వలెను, యండమావులలో నీటి తరంగముల వలెను,
చీకటిలో చూచిన బండరాయిలో దొంగ (పురుషుడు) కనబడినట్లు
చిదాత్మయందు ‘విశ్వము’ అనునది ‘ఉన్నది’గా అగుచున్నది.
శూన్యములో భేతాళుడు (బాలునికి) స్ఫురించు తీరుగా,
(ఊహాకల్పనలో) గంధర్వనగరము వలెను,
(మెల్లకన్ను కలవానికి) ఆకాశంలో రెండవ చంద్రుడు కనిపించునట్లుగా..,
ఈ జగత్తు సత్యమే అని అజ్ఞాన దృష్టికి అనిపించుచూ స్థితించుచున్నది.
యథా తరంగ కల్లోలైః,
జలమేవ స్ఫురతి అలమ్,
ఘటనామ్నా యథా పృథ్వీ,
పట నామ్నా హి తన్తవః,
జగత్ నామ్నా చిత్ ఆభాతి,
సర్వం బ్రహ్మైవ కేవలమ్।
ఏవిధంగా అయితే, నిశ్చలజలంతో కల్లోలితంగా కనిపించే తరంగాలు ప్రదర్శితమై కనిపిస్తూ ఉన్నాయో,
మట్టియే ‘ఘటము (కుండ)’ అను పేరుతో ఏ విధంగా లోక ప్రసిద్ధమై ఉంటోందో…
ప్రత్తిధారపుపోగులే పంచ, ఉత్తరీయము’’ మొదలైనవిగా కనబడుచున్నాయో,
చిత్‌యే, ‘జగత్తు’ అను పేరుతో చెప్పబడుచున్నది. సర్వము సర్వదా కేవలము ‘‘బ్రహ్మమే’’ - అయి ఉన్నది.
5. యథా వన్ధ్యా సుతో నాస్తి,
యథా నాస్తి మరౌ జలమ్,
యథా నాస్తి నభో వృక్షః,
తథా నాస్తి జగత్ స్థితిః।
గొడ్రాలికి రెండవ కుమారుడు ఉంటాడా?
మృగతృష్ణలో (ఎండమావులలో) నీరుంటుందా?
ఎక్కడైనా ‘ఆకాశవృక్షము’ అనునది ఉంటుందా? నీలాకాశంలో వృక్షము ఎట్లా? అట్లాగే జగత్తుకు స్థితియే లేదు.
గృహ్యమాణే ఘటే యద్వత్
మృత్తికా భాతి వై బలాత్,
వీక్షమాణే ప్రపంచే తు
బ్రహ్మైవ ఆభాతి భాసురమ్।
‘‘మట్టికి వేరుగా కుండగా ఏమున్నది?’’ అని గ్రహించుటకై సిద్ధమగువానికి
‘‘అంతా మట్టియే! మట్టియే కుండ అయి ఉన్నది’’ - అని తెలియవస్తోంది కదా!
ఈ ‘‘ప్రంచముగా ఉన్నది ఏది?’’ అని పరిశీలించి చూస్తే, ఇదంతా బ్రహ్మమే అయి భాసిస్తోంది.
సదైవ ఆత్మా విశుద్ధో-స్మి హి,
అశుద్ధో భాతి వై సదా,
యథైవ ద్వివిధా రజ్జుః
జ్ఞానినో - అజ్ఞానినో అనిశమ్।
నిత్య నిర్మలము, శుద్ధము అగు ఆత్మయే ఎప్పుడో ఒక సమయంలో అశుద్ధమైనదానివలె అగుపిస్తోంది,
జ్ఞానికి ఏది శుద్ధబ్రహ్మముగా, అజ్ఞానికి ఏది అశుద్ధబ్రహ్మముగా కనిపిస్తుందో,.. అది ఎటువంటిదంటే→ ఒకే త్రాడు- తెలిసినవానికి త్రాడుగాను, తెలియనివానికి పాముగాను అగుపించటం వంటిది.
యథైవ మృణ్మయః కుమ్భః
తద్వత్ దేహోఽపి చిన్మయః
ఆత్మ-అనాత్మ వివేకో అయం
వృథైవ క్రియతే బుధైః।
కుంభము (కుండ) సర్వదా మృణ్మయము (మట్టిచే మయము) అయినట్లే.
ఈ దేహము సదా చిన్మయమే! (అనగా, వాస్తవానికి ఈ దేహము మృణ్మయము కాదు).
‘ఇది ఆత్మ- ఇది అనాత్మ’ అనే వివేకముతో కూడిన విభజన బుధులచే చేయబడటము కూడా వృధాయే! ఎందుకంటే ఆత్మయే ఉన్నది. అనాత్మ అనునదే వస్తుతః లేదు. ఉన్నదాని నుండి ‘లేనిది’ విడదీసి విడమర్చి చెప్పుకోవలసిన పనేమున్నది?
సర్పత్వేన యథా రజ్జూ,
రజతత్వేన శుక్తికా,
వినిరీణాతా విమూఢేన
దేహత్వేన తథా ఆత్మతా।।
త్రాడు యొక్క రజ్జుత్వము (పాముగా కనిపించటము),
ముత్యపు చిప్పలో రజతత్వము (వెండి కనిపించటము),
నిర్ణయించబడుచున్న తీరుగా - మూఢునిచే ఆత్మ దేహరూప మగుచున్నట్లుగా నిర్ణయించుకోబడుచున్నది.
ఘటత్వేన యథా పృథ్వీ,
జలత్వేన మరీచికా,
గృహత్వేన హి కాష్ఠాని,
ఖడ్గత్వేనైవ లోహతా,
తద్వత్ ఆత్మని దేహత్వం
పశ్యతి→అజ్ఞానయోగతః। ఇతి।।


ఇతి చతుర్థో అధ్యాయః।।
మట్టిలో కుండ ఉన్నట్లు,
మరీచిక (యండమావులలో)నీరు ఉన్నట్లు,
కొయ్య నిర్మిత గృహంలో కొయ్య (wood) ఇల్లుగా అగుచున్నట్లు,
ఇనుము ఖడ్గముగా అగుచున్నట్లు,
అజ్ఞాన యోగము చేత మాత్రమే ఆత్మయందు దేహత్వము (అజ్ఞానిచే) చూడబడుచున్నది. (అవన్నీ ఆవిధంగా అగుటయే లేదు. అట్లాగే ఆత్మ జీవుడుగా అవటమే లేదు).


ఇతి చతుర్థోధ్యాయము

పంచమో అధ్యాయః-యోగాభ్యాసము

ఓం।।
1. శ్రీశంకరౌవాచ:
ఓం। పునః యోగం ప్రవక్ష్యామి
గుహ్యం బ్రహ్మస్వరూపకమ్।
సమాహిత మనా భూత్వా
శృణు బ్రహ్మన్! యథాక్రమమ్।
శ్రీశంకర భగవానులు : హే బ్రహ్మన్! ఓ హిరణ్యగర్భా! చతుర్ముఖ బ్రహ్మభగన్! జగత్ పితామహా! మరల మనము బ్రహ్మస్వరూపకమగు ‘యోగము’ గురించి మరికొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాము. వినండి.
ఇప్పుడు ఆయా యథాక్రమము (The sequential path)గా చెప్పుకుంటున్నాము. ‘సర్వసమత్వ దర్శనము’ అనే గుణ విశేషముతో సమాహిత చిత్తులై వినండి.
దశ ద్వారపురం దేహమ్,
దశ నాడీ మహా పథమ్,
దశభిః వాయుభిః వ్యాప్తం,
దశేన్ద్రియ పరిచ్ఛదమ్,
ఈ దేహము ఎటువంటిది?
→ 10 ద్వారములు గల పురము - (2 కళ్లు; 2 చెవులు; 1 నోరు ‘2’ ముక్కు పుటములు; గుదము; శిశ్నము; బ్రహ్మరంధ్రము)
→ దశ (10) నాడులతో కూడిన మహాపథము కలిగి ఉన్నది. (ఇడ; పింగళ; సుషుమ్న; (సుషుమ్న నుండి) అలంబుస, కుహూ నాడులు; (సుషుమ్నకు దక్షిణంగా) గల పింగళ, (మధ్యగా) పూస; పయశ్వని; సుషుమ్నకు (పశ్చిమంగా) సరస్వతీ; శంఖిణి; గాంధారి; హస్తి జిహ్వ; విశ్వదర → దశ(10) వాయువులతో వ్యాప్తమై యున్నది).

దశ వాయువులు
(‘5’ ప్రాణములు = ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు
‘5’ ఉపప్రాణములు = నాగము; కృకరము, కూర్మము, ధనంజయము, దేవదత్తము).
→ దశ (10) ఇంద్రియములచే ఆచ్ఛాదితమై అతికించబడి ఉన్నది.

జ్ఞానేంద్రియములు = శ్రోత్రము (చెవులు) త్వక్కు (చర్మము); చక్షువులు (కళ్ళు); జిహ్వ (నోరు), ఘ్రానేంద్రియము (ముక్కు)
కర్మేంద్రియములు : వాక్ ఇంద్రియము; హస్తేంద్రియము; పాదములు; ఉపస్థ; పాయు ఇంద్రియము;
షడాథారాపవరకం,
షడన్వయ మహావనమ్,
చతుష్పీఠ సమాకీర్ణం,
చతురామ్నాయ దీపకం,
బిన్దు నాద మహాలింగం,
విష్ణు లక్ష్మీ నికేతనమ్।
ఇంకా ఈ శరీరము…,
→ షట్(6) ఆధారములు అనే ముసుగు కలిగియున్నట్టిది (మూలాధారము; స్వాధిష్ఠానము; మణిపూరకము; అనాహతము; విశుద్ధము; ఆజ్ఞా);
→ షట్ (6) అన్వయములు కలిగిన మహావనము. (చెప్పటము; వినటము; మాట్లాడటము, రుచిచూడటము; చూడటము; సమన్వయించుకోవటము).
4 పీఠములచే సమాకీర్ణమైయున్నది (స్థూల; సూక్ష్మ; కారణ; మహాకారణ
… దేహం విష్ణ్వాలయం ప్రోక్తం,
సిద్ధిదం సర్వ దేహినామ్।।
4 ఆమ్నాయములచే ఉద్దీపితమైయున్నది.
(వేదము; సంప్రదాయము; ఉపదేశము; పరిశీలన)
బిందు-నాదములచే మహాలింగస్వరూపము
విష్ణువు (ఉనికి) - లక్ష్మీ (జ్ఞానముల) సమేతము
సర్వ దేహులకు సిద్ధిని ప్రసాదించునదై, ఈ దేహమే ‘‘విష్ణ్వాలయము’’ అనబడుతోంది.
గుద-మేఢ్రాన్తరాళస్థం, మూలాధార త్రికోణకమ్     ⃤
శివస్య జీవరూపస్య, స్థానం తద్ధి ప్రచక్షతే।
- యత్ర ‘కుండలినీ’ నామ ‘పరాశక్తిః’ ప్రతిష్ఠితా,
- యస్మాత్ ఉత్పద్యతే వాయుః,
- యస్మాత్ వహ్నిః ప్రవర్తతే,
- యస్మాత్ ఉత్పద్యతే హంసో,
- యస్మాత్ నాదః ప్రవర్తతే,
- యస్మిన్ విలీయతే హంసో,
- యస్మాత్ ఉత్పద్యతే మనః,
.. తత్ ఏతత్ కామ రూపాఖ్యం
పీఠం, కామఫలప్రదం,
ఇంకా ఈ దేహంలో షట్ చక్రాలు ఉన్నాయి.
(1) మూలాధారము :
గుదము - మేఢ్రముల అంతరముగా త్రికోణకము అగు ‘‘మూలాధార చక్రము’’.. ఏర్పడియున్నది.
‘‘ఈ మూలాధారము జీవరూపుడుగా ఉన్న శివునికి స్థానము’’ - అని చెప్పబడుచున్నది.
ఈ మూలాధారచక్రము ఎట్టిది?
→ ఎక్కడ ‘కుండలినీ’ అను పేరు గల పరాశక్తి ప్రతిష్ఠితమైయున్నదో,
→ ఎక్కడ వాయువు ఉత్పన్నమగుచున్నదో,
→ దేనివలన అగ్ని దేహములో ప్రవర్తనశీలమగుచున్నదో..,
→ దేనియందు ‘హంస’ (సోఽహమ్) రూప కదలిక ఉత్పన్నమగుచున్నదో,
→ దేనియందు ‘నాదము’ ప్రవర్తించుచున్నదో,
→ దేనియందు హంస (ఊపిరి)విలీనము పొందుచున్నదో..,
→ దేనియందు ఆలోచనారూపమగు మనస్సు ఉత్పన్నమగుచున్నదో..,
అదియే ‘కామరూపము’ అని, ‘కామఫలప్రదము’ అని చెప్పబడుచున్న చక్రస్థానము.
స్వాధిష్ఠాన ఆహ్వయం చక్రం
లింగం మూలం షడశ్రకమ్।।
(2) స్వాధిష్ఠాన చక్రము : లింగ మూలమున ఉన్నది, 6 కోణములు గలది.
2. నాభిదేశే స్థితం చక్రం
దశారం మణిపూరకం।
(3) మణిపూరక చక్రము : నాభి (బొడ్డు) స్థానములో ఉన్నట్టిది. 10 రెక్కలు (కోణములు) కలిగినది.
ద్వాదశారం మహాచక్రం
హృదయే చ అపి అనాహతమ్।
తదేతత్ ‘పూర్ణగిరి’-ఆఖ్యం
పీఠం, కమల సంభవ!

(4) అనాహత చక్రము : హృదయ స్థానమున ఉన్నట్టిది.
12 రెక్కలు (రేకులు) కలిగి ఉన్నట్టిది.
దీనిని ‘‘పూర్ణ గిరిపీఠం’’ అని కూడా అంటారు.

కంఠకూపే ‘విశుద్ధాఖ్యం’, యత్ చక్రం షోడశాశ్రకమ్।
‘పీఠం’ జాలంధరం’ నామ, తిష్ఠతి అత్ర, చతుర్ముఖ!
‘ఆజ్ఞా’ నామ భృవోః మధ్యే
ద్విదళన్ చక్రమ్ ఉత్తమమ్।
ఉడ్యాణాఖ్యం మహాపీఠమ్
ఉపరిష్టాత్ ప్రతిష్ఠితమ్।
స్థానాని ఏతాని దేహే-స్మిన్
శక్తిరూపం ప్రకాశతే।
(5) విశుద్ధ చక్రము : కంఠమూలస్థానములో సంస్థితమైయున్నది. ‘16’ రేకులతో ప్రకాశించుచున్నది.
ఓ చతుర్ముఖా! ఇక్కడ చతుర్ముఖము అయినట్టి ‘జాలంధరము’ అనే పీఠము ప్రతిష్ఠితమైయున్నది.
(6) ఆజ్ఞా చక్రము : భ్రూమధ్య స్థానమున ఉన్నట్టిది. రెండు దళములు గల ఉత్తమ చక్రము ఉన్నది.

ఉడ్యాణ మహాపీఠము : ఇది భ్రూమధ్యకు పైభాగంగా (Fore face) ప్రతిష్ఠితమై యున్నది.
దేహమునందు ఇవన్నీ శక్తిరూపాలుగా ప్రకాశితము అగుచున్నాయి.
చతురశ్రా ధరణీ ఆదౌ
‘బ్రహ్మా’ తత్ర అధి దేవతా।
అధిదేవతా నిర్ణయము :

ధరణీ (భూ) : పంచభూతములలో మొదటిది. చతురస్ర మండలాకారము అధి దేవత = బ్రహ్మదేవుడు (బ్రహ్మ)
అర్ధ చంద్రాకృతి జలం
‘విష్ణుః’ తస్య అధి దేవతా।
జలము (ఆపః): ఆకృతి = అర్ధచంద్రాకృతి మండలాకారము. (Half Solid) అధి దేవత = విష్ణువు
త్రికోణ మండలం వహ్నీ
‘రుద్రః’ తస్య అధి దేవతా।
అగ్ని (వహ్ని) : త్రికోణమండలాకారము
అధిదేవత = రుద్రుడు.
వాయోః బింబస్తు షట్‌కోణమ్
సంకర్షో అత్ర అధి దేవతా।
వాయు బింబము : షట్కోణ మండలాకారము.
అధి దేవత = సంకర్షణుడు.
ఆకాశ మండలం వృత్తం
పరవస్తు అధి దేవతా।
ఆకాశము : వృత్త మండలాకారము.
అధి దేవత= పరదేవత; పరతత్త్వము। పరమాత్మ!
నాద రూపం భృవోః మధ్యే
మనసో మండలం విదుః।
‘శాంభవ స్థానం’ ఏతత్
తే వర్ణితం, పద్మసమ్భవ!
ఓ పద్మసంభవా!
భ్రూమధ్య ఆకాశంలో నాదరూపమగు ‘మనోమండలము’ ఉన్నది. ఇది గమనించ బడుగాక! అది ‘శాంభవీ స్థానము’ అని అభివర్ణితము అయి ఉన్నది.
3. అతఃపరం ప్రవక్ష్యామి
నాడీ చక్రస్య నిర్ణయమ్।
మూలాధార త్రికోణస్థా
సుషుమ్నా ద్వాదశాన్తగా।
మూలార్థఛిన్న వంశాభా
‘బ్రహ్మనాడి’ ఇతి సా స్మృతా।
ఇడా చ పింగళా చ ఏవ
తస్యాః పార్శ్వే ద్వయ స్థితే।
విలంబినామ్ అనుస్యూతే
నాసికాన్తమ్ ఉపాగతే।
ఓ బ్రహ్మభగవాన్! ఇక మనము నాడీ చక్రముల నిర్ణయము గురించి చెప్పుకుంటున్నాము.

నాడీ చక్రము
త్రికోణాకారమగు మూలాధారము నుండి ‘సుషుమ్న’ అను నాడి - ద్వాదశాంతగతమైన (బ్రహ్మకపాలము 12 అంగుళముల వరకు) విస్తరించినదై ఉన్నది.
→ మూలాధారంలో సుషమ్న సగము తెగ గొట్టబడిన వెదురుపుల్ల వలె ఉంటోంది. ఇది బ్రహ్మరంధ్రము వరకు విస్తరించి యున్నది. కాబట్టి ‘బ్రహ్మనాడి’ అని పిలువబడుతోంది.
అట్టి సుషుమ్న నాడికి ఇరువైపులా (కుడివైపుగా) పింగళ నాడి, (ఎడమవైపుగా) ఇడా నాడి ఉన్నాయి.
ఈ పింగళనాడిని అనుసరిస్తూ మరొక నాడి నాశిక (ముక్కు) చివర (ముక్కుకు పైభాగము) వరకు విస్తరించి, ‘విలంబిని’ అని పిలువబడుచున్నది.
ఇడాయాం హేమరూపేణ
వాయుః హేమేన గచ్ఛతి।
పింగళాయాస్తు సూర్యాత్మా
యాతి దక్షిణ పార్శ్వతః।
‘విళంబిని’ ఇతి యా నాడీ
వ్యక్తా నాభౌ ప్రతిష్ఠితా।
ఇడా హేమ (బంగారు) ఛాయ కలిగినదై, ఇద్దాని యందు వాయువు హేమరూపంగా సంచారము కలిగియున్నది.
ఇక పింగళానాడి సూర్యాత్మకమై సుషుమ్నకు కుడివైపుగా ఉన్నది.
‘విలంబినీ’ అని పిలువబడు నాడి వ్యక్తముగా నాభీ ప్రదేశము నందు ప్రతిష్ఠితమై యున్నది.
తత్ర నాడ్యః సముత్పన్నాః
తిర్యక్-ఊర్థ్వమ్ - అధోముఖాః।
తత్ ‘నాభిచక్రం’ ఇత్యుక్తం
కుక్కుటాండమివ స్థితమ్।
అట్టి నాడి (బొడ్డు) ప్రదేశము నందు అనేక ఉప-నాడులు ఉత్పన్నమై అడ్డముగాను, పైకి, క్రిందకు విస్తరించినవై ఉన్నాయి.
అనేక నాడులు బయల్వెడలు నాభిస్థానము. కోడిగ్రుడ్డు ఆకారంగా ఉన్నదై, ‘నాభిచక్రము’ అని పిలువబడుతోంది.
‘గాన్థారీ’ ‘హస్తి జిహ్వా’ చ, తస్మాత్ నేత్రద్వయం గతే
‘పూషా’ చ ‘అలంబుసా’ చ ఏవ, శ్రోత్ర ద్వయమ్ ఉపాగతే।
‘‘గాంధారి’’, ‘‘హస్తిజిహ్వ’’ అను నాడులు నాభినుండి రెండు కళ్ల వరకు విస్తరించి ఉన్నాయి. ‘పూషా’, ‘అలంబుసా’ నాడులు చెవులలోని స్థానమును పొంది ఉన్నాయి.
‘శూరా’ నామ మహానాడీ, తస్మాత్ భ్రూమధ్యమ్ ఆశ్రితా।
‘విశ్వోదరీ’ తు యా నాడీ, సా భుంక్తే అన్నం చతుర్విధమ్।
‘సరస్వతీ’ ఇతి యా నాడీ, సా జిహ్వాన్తం ప్రసర్పతి।
‘శూరా’ అని పిలువబడే మరొక మహా నాడి (నాభి నుండి) భ్రూమధ్యస్థానము వరకు విస్తరించి ఉన్నది.
‘విశ్వోదరి’ అనే ఇంకొక నాడి నోటిలో ఉండి భక్ష్య - భోజ్య - లేహ్య-చోహ్య చతుర్విధములైన అన్నమును పచనము చేస్తోంది.
సరస్వతీ నాడి నాలుక చివరి వరకు ప్రసరించినదై ఉన్నది.
‘రాకాహ్వయా’ తు యా నాడీ
పీత్వా తు సలిలం క్షణాత్।
క్షుతమ్ ఉత్పాదయేత్ ఘ్రాణే,
శ్లేష్మాణం సఞ్చనోతి చ।
కణ్ఠ కూప-ఉద్భవా నాడీ
‘శంఖిని’ ఆఖ్యా అధోముఖీ,
అన్నసారం సమాదాయ మూర్ధ్ని సంచినుతే సదా।
‘రాకాహ్వయా’ నాడి క్షణంలో నీటిని త్రాగటానికి ఉపయోగిస్తోంది.
ఈ నాడి ముక్కు నందు క్షతము (తుమ్ము) కలిగిస్తూ, శ్లేష్మజనకము అయి ఉంటోంది.
కంఠ కూపమున పుట్టిన నాడి ‘శంఖిణి’ అని పిలువబడుచూ, అధోముఖముగా ప్రవర్తన శీలమగుచున్నది.
ఆ శంఖినీ నాడి అన్నసారమును స్వీకరించి, సారరసమును మూర్ధ్నియందు ఎప్పుడూ కూడబెట్టుచున్నది.
4. నాభేః అధోగతాః తిస్రో నాడయస్స్యుః అధో ముఖాః।
మలం త్యజేత్ ‘కుహూ’ నాడీ।
మూత్రం మున్చతి ‘వారుణీ’।
చిత్రాఖ్యా సీవనీ నాడీ, శుక్ల మోచనకారిణీ।
‘నాడీ చక్రం’ ఇతిప్రోక్తమ్।।
నాభికి క్రిందగా ‘3’ నాడులు అదోముఖములై ఉన్నాయి.
‘కుహూ’ నాడి మలత్యాజ్యమును, ‘వారుణీ’ నాడి మూత్ర విసర్జనమును నిర్వర్తిస్తూ ఉన్నాయి.
‘చిత్రఖ్యా’ అనే సీవనీ నాడి శుక్ల విమోచనమునకు కారణమగుచున్నది.
ఇవన్నీ ‘నాడీచక్రము’లో అమర్చబడినవై ఉన్నాయి.
బిందురూపమ్ అతఃశృణు।
బిందురూపము-పంచాగ్న్యౌపాసన
బ్రహ్మ భగవాన్! ఇప్పుడు ‘బిందురూపము’ గురించి వినండి.
బిన్దు రూపం
5. ‘స్థూలం’, ‘సూక్ష్మం’ ‘పరం’ చ ఏతి
త్రివిధం బ్రహ్మణో వపుః।
→ స్థూలం శుక్లాత్మకం బిన్దు।
→ సూక్ష్మం పంచాగ్ని రూపకమ్।
→ సోమాత్మకః పరః ప్రోక్తః
సదా సాక్షీ। సదా అచ్యుతః।।
బిన్దు రూపవివరణ..
బ్రహ్మము యొక్క శరీరములు మూడు విధములు..
స్థూల శరీరము → శుక్లాత్మకమైన బిందురూపము
సూక్ష్మ శరీరము → పంచాగ్నిరూపకము
పరశరీరము → సోమాత్మకము (ప్రకృతితో కూడినది)
ఇది సమస్తమునకు సాక్షి. సర్వదా చ్యుతిలేని అచ్యుతరూపము.
పాతాళానామ్ అధో భాగే
‘కాలాగ్నిః యః ప్రతిష్ఠితః,
స ‘మూలాగ్నిః’ శరీరే - అస్మిన్,
యస్మాత్ నాదః ప్రజాయతే।
పంచాగ్నులు
బ్రహ్మము ఎల్లప్పుడు సాక్షి అయి, చ్యుతి ఏ మాత్రము లేనిదై ఉన్నది.
(1) కాలాగ్ని - మాలాగ్ని : అధోలోకములగు పాతాళములో ఏ కాలాగ్ని సంప్రతిష్టితమై యున్నదో, అదియే ఈ పాంచభౌతిక శరీరములో కూడా సంప్రతిష్ఠితమై యుండగా అది మాలాగ్ని అనబడుతోంది. అద్దాని నుండి ‘నాదము’ బయల్వెడలుచూ ఉన్నది.
‘బడబాగ్నిః’ శరీర స్థో హి, అస్థి మధ్యే ప్రవర్తతే,
కాష్ట-పాషాణయోః వహ్నిహిః అస్థి మధ్య స్థితో యథా,
(2) బడబాగ్ని - పార్ధివము : - కాష్టము (కొయ్య), పాషాణము (రాయి)లో ఏ విధంగా అగ్ని సంస్థితమై యున్నదో, అట్లాగే శరీర మధ్యగా అస్థికలలో (బొమికలలో) అగ్ని సంస్థితమై ప్రవర్తన శీలమగుచున్నది.
కాష్ఠ పాషాణజో వహ్నిః
‘పార్థివో’ గ్రహణం గతః।
అంతరిక్ష గతో - వహ్నిః
‘వైద్యుతః’, స్వాంతరాత్మకః।
కొయ్య- రాయిల నుండి జనిస్తున్న అగ్నిని ‘పార్థివము’ అని అంటారు.
(3) వైద్యుతాగ్ని - స్వ-అంతరాత్మకము : అంతరిక్షములో ఉన్న అగ్ని → వైద్యుతము (విద్యుత్-మెరుపు శరీరము). ఇది స్వాంతరాత్మకముగా కూడా దేహములో ఉన్నది.
నభస్థః సూర్యరూపో-అగ్నిః
‘నాభి మండలమ్’→ ఆశ్రితః।
విషం వర్షతి సూర్యో-సౌ
స్రవతి అమృతమ్ ఉన్ముఖః।
(4) సూర్యాగ్ని-అమృతవర్షిణి : ఆకాశములోని సూర్యరూపముగా ఉన్న అగ్నియే - ఈ దేహములో నాభి మండలమును కూడా ఆశ్రయించి ఉన్నది. సూర్యుడు విషమును వర్షించు స్వభావము కలిగి యుండి కూడా, నాభి వద్ద ఉన్ముఖుడై అమృతమును వర్షించుచున్నారు.
తాలుమూలే స్థితః చంద్రః
సుధాం వర్షతి అధోముఖః।
భ్రూమధ్య నిలయో బిన్దుః
‘శుద్ధ స్ఫటిక సన్నిభః’, మహావిష్ణోశ్చ దేవస్య
తత్ ‘సూక్ష్మం రూపం’ ఉచ్యతే।।
(5) చంద్రమసాగ్ని - సుధాసారాభివర్షిణి : తాలుమూలమున సంస్థితుడైన చంద్రుడు అదోముఖముగా సుధను వర్షించుచున్నారు.
భ్రూమధ్యలో బిందువు ఉన్నది. అది శుద్ధస్ఫటికము వలె ప్రకాశమానమైయున్నది. అట్టి భ్రూమధ్యమున గల బిందువు ‘‘మహావిష్ణువు యొక్క సూక్ష్మరూపము’’ అని చెప్పబడుచున్నది.
6. ఏతత్ పంచాగ్ని రూపం యో
భావయత్ బుద్ధిమాన్ ధియా,
తేన భుక్తం చ, పీతం చ
‘హుతమ్’ ఏవ। న సంశయః।
సుఖ సంసేవితం స్వప్నం
సు జీర్ణమ్ ఇతి భోజనమ్।
స్థూలము → శుక్లాత్మకము; బిందురూపము
సూక్ష్మాగ్ని = (1) నాదజనన స్థానమగు కాలాగ్ని = ‘‘మూలాగ్ని’’ (2) అస్థి (బొమికల) మధ్య గల బడబాగ్ని / పార్థివాగ్ని (3) అంతరిక్ష వైద్యుతాగ్ని, స్వాంతరాత్మాగ్ని (4) నాభి ప్రదేశంలో సూర్యరూపాగ్ని (5) తాలు మూలంలో చంద్రరూపాగ్ని - శరీరంలోని ఈ పంచాగ్నులను - తింటూ, త్రాగుతూ ఉన్నప్పుడు సమయములలో కూడా ఏ యోగాభ్యాసి అయితే బుద్ధిమంతుడై ధీశక్తితో → భావనాపూర్వకంగా ఉపాసిస్తూ ఉంటాడో, - ఆతని ‘‘తినటము, త్రాగము’’ కూడా ‘‘యజ్ఞహుతము’’తో సమానం. సంశయము లేదు - స్వప్నము భోజనము సుఖమయమౌతాయి.
యోగాభ్యాసము
శరీర శుద్ధిం కృత్వా ఆదౌ,
‘సుఖమాసనమ్’ ఆస్థితః।
పాణస్య శోధయేత్ మార్గం,
రేచ పూరక కుంభకైః।
గుదం ఆకుంచ్య యత్నేన
మూలశక్తిం ప్రపూజయేత్।
యోగాభ్యాసము
ఆత్మతో సం-భావనా యోగము సిద్ధించటానికి ఈ జీవుడు యోగాభ్యాసమును ఆశ్రయించాలి.
(1) శరీరశుద్ధి : మొట్టమొదట శరీర శుద్ధి కావాలి. అందుకు నియమితమైన నిద్ర, తేలికగా అరిగే ఆహారము స్వీకరించనారంభించాలి.
(2) సుఖాసనమ్: శరీర శుద్ధిని అభ్యసిస్తూ ఇక దేహము అధిక కాలము.. ధ్యాన- యోగాభ్యాసములకు అనువుగా ఉండే సుఖాసనము స్వీకరించసాగాలి.
(3) ప్రాణశోధనము : ‘ప్రాణ నిరోధము’నకు ప్రాణమును ఉపాసనా వస్తువుగా ఉపయోగించుకోవాలి. ప్రాణనియామకము ద్వారా బుద్ధిని పరిశుద్ధ పరచుకొనుటకై ప్రాణశోధన విధానము లైనట్టి రేచక - పూరక - కుంభకములను అవలంబించాలి.
నాభౌ లింగస్య మధ్యే తు
ఉడ్యాణాఖ్యన్చ బన్ధయేత్।
ఉడ్డీయ యాతి తేనైవ
శక్తితః ఉడ్యాణపీఠకమ్।
కఠం సంకోచయేత్ కించిత్
బన్ధో ‘జాలంధరో’ హి అయమ్।।
బంధయేత్ ఖేచరీ ముద్రాం
దృఢచిత్తః సమాహితః।
కపాల వివరే జిహ్వా
ప్రవిష్టా విపరీతగా।
భృవోః అంతర్గతా దృష్టిః
ముద్రా భవతి ‘ఖేచరీ’।
ఖేచర్యా ముద్రితం యేన
వివరం ‘లంబిక-ఊర్ధ్వతః’।
కుండలినీ ఉపాసన : గుద స్థానంలో ఇచ్ఛ - ప్రజ్ఞాశక్తుల రూపమగు కుండలినీ శక్తి సంప్రదర్శితమై యున్నది. అట్టి మూలాధారంలో ప్రక్షిప్తమైయున్న మూలశక్తిని) బాగుగా ఉపాసించాలి. ప్రపూజించాలి.

ఉడ్డీయాణము : (1) మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తిని - ఉత్-డీయాణము → ప్రయత్న పూర్వకంగా గుద - ఆకుంచన ద్వారా నాభి- లింగములను బంధించటము. శక్తిని మూలాధారం నుండి పైకి అభ్యాస బలముతో తెచ్చి లింగ-నాభిల మధ్య నిలిపి ఉంచటము.
(2) అట్టి స్వాథిష్ఠాన - మణిపూరకముల మధ్య ‘‘ఉడ్యాణపీఠము’’ → అని అంటారు.

జాలంధరముద్ర : ఇప్పుడిక గాలిని పైకి పీల్చుట ద్వారా కంఠమును సంకోచింపజేయాలి. ఇది జాలంధరముద్ర.

ఖేచరీముద్ర :
(1) పళ్లు కలువకుండా నాలుకను దవడకు తాకించుచూ, క్రమంగా నాలుకను మడతగా దవడలో భాగమును స్పృశించి ధారణ చేయటం. (ఇట్టి అభ్యాసముచే నాలుక యొక్క చిట్టచివర) విపరీతంగా వెళ్లి కపాల కుహరము (క్రింద రంధ్రము)న ప్రవేశింపజేయటము.
(2) అప్పుడిక ధ్యాసను భ్రూమధ్య స్థానంలో నిలిపి ఉంచాలి. ఇదియే ఖేచరీ ముద్ర. పై వివరస్థానము ఖేచరీముద్రితం అవుతుంది. (కొండ నాలుకకు చివరగా ఉన్న రంధ్రమును మడచిన నాలుక చివరతో మూసి ఉంచి, ధ్యాసను భ్రూమధ్యలో నిలపటం ఖేచరీ ముద్ర).
న పీయూషం పతతి అగ్నౌ
న చ వాయుః ప్రధావతి।
న క్షుధా న తృషా నిద్రా
నైవ ఆలస్యం ప్రజాయతే।
న చ మృత్యుః భవేత్ తస్య
యో ముద్రాం వేత్తి ఖేచరీమ్।
‘‘అట్టి - నాలుకను మడచి, కొండనాలుకను స్పృశిస్తూ ఉంచి, ధ్యాసను భ్రూమధ్యలో ఏర్పరచి ఉంచటము’’ అనే ఖేచరీ ముద్రాభ్యాసముచే (లేక) ఖేచరీముద్రచే (1) బ్రహ్మరంధ్రము నుండి స్రవిస్తున్న అమృతము అగ్నిలో పతనము పొందదు. (2) వాయుచలనము నిరోధించబడగలదు (3) ఆకలి - దప్పికలు, నిద్ర, బద్ధకము.. ఇవన్నీ వశంలో ఉంటాయి. ఆ యోగిని బాధించవు. (4) ఆత్మతో సంయోగానుభవము సిద్ధించగలదు.
ఖేచరీముద్రను ఎరిగి అభ్యసించువానికి ‘మృత్యువు’ అనునది ‘లేనిదే’ అగుచున్నది. మృత్యువుకు పరిమితము, విషయము కానట్టి స్వస్వరూపమును ఆస్వాదించువాడై ఉంటాడు.
తతః పూర్వాపరే వ్యోమ్ని
ద్వాదశాన్తే, ‘అచ్యుతాత్మకే’।
ఉడ్యాణ పీఠే నిర్ద్వన్ద్వే నిరాలమ్బే నిరన్జనే,
తతః పంకజ మధ్యస్థం
చంద్రమండల మధ్యగమ్,
నారాయణమ్ అనుధ్యాయేత్
స్రవన్తం అమృతం సదా।।
(అమృతము స్రవించు బ్రహ్మరంధ్రమునకు) ఆవల 12 అంగుళముల చివర ఈవల-ఆవల గల పూర్వాపర ఆకాశముగా అచ్యుతాత్ముడు (ఆత్మభావన నుండి చ్యుతి లేనివాడు) అగుచున్నాడు. అది నిరాలంబస్థానము.
‘సహస్ర పద్మము’ అనబడే 12 అం।। అంత్యస్థానమున ఉడ్యాణ పీఠము అధిష్ఠించి (ఆశ్రయించి) యున్నది. చంద్రమండల మధ్యగతమైనది - అగు అట్టి నిరాలంబ-నిరంజన ఆత్మానారాయణుని ధ్యానించాలి. అట్టి ఆత్మానారాయణుని నుండియే అమృతము సదా స్రవించుచున్నది.
(చంద్రమండల మధ్యగతము = The Zone where from thought and inclination commence)
7. భిద్యతే హృదయ గ్రన్థిః
ఛిద్యన్తే సర్వ సంశయాః,
క్షీయన్తే చ అస్య కర్మాణి
తస్మిన్ దృష్టే పరావరే।।
పరము (ఆవల గల జీవుని స్వరూపమునకు) కూడా పరమై (పరాత్పరమై, సర్వాంతర్యామియై)యున్న అఖండ స్వస్వరూపాత్మ దర్శనముచే →
→ సృష్టి - స్థితి - లయ సంబంధమైన హృదయగ్రంధులు ముడివీడతాయి.
→ సర్వ సంశయములు సమసిపోతాయి.
→ సర్వ కర్మ బంధములు తెగిపోతాయి.
సిద్ధులు
అథ సిద్ధిం ప్రవక్ష్యామి
సుఖోపాయం, సురేశ్వర!
జితేంద్రియాణాం శాన్తానాం,
జిత శ్వాస విచేతసామ్,
నాదే మనోలయం
బ్రహ్మన్! దూరశ్రవణకారణమ్।
యోగసిద్ధులు
ఓ సురేశ్వరా! ఇప్పుడిక యోగ సిద్ధులు సిద్ధించటానికి సులభమైన ఉపాయముల గురించి చెప్పుకుంటున్నాము.

దూరశ్రవణ సిద్ధి
(1) ఇంద్రియములను జయించి ఉండటము (ఇంద్రియములకు సేవకుడు అవకుండా, ఇంద్రియ విషయములను ఉపకరణములుగా భావించి, వాటిని సరీయిన రీతిగా నియమించటము);
(2) పరమ శాంతముతో కూడిన స్వభావము కలిగి ఉండటము;
(3) శ్వాసపై నిఘా. శ్వాసను జయించి ఉండటము. శ్వాసను మౌనంగా ధ్యాసపూర్వకంగా గమనిస్తూ ఉండటము.
(4) నాదము నందు (నాదము జనిస్తున్న స్థానములో) మనస్సును లయింపజేయటము
ఈ అభ్యాసముల వలన దూరశ్రవణశక్తి సిద్ధిస్తోంది. దూరముగా వినిపించే శబ్దములను ఆ యోగి వినగలడు.
బిన్దౌ మనోలయం కృత్వా దూరదర్శనమ్ ఆప్నుయాత్।
కాలాత్మని మనోలీనం త్రికాలజ్ఞాన కారణమ్।
పర కాయ -మనో యోగః,
పరకాయ ప్రవేశ కృత్।
అమృతం చింతయేత్ మూర్ధ్ని
క్షుత్-తృషా విషశాన్తయే।
పృథివ్యాం ధారయేత్ చిత్తం
పాతాళ గమనం భవేత్।
సలిలే ధారయేత్ చిత్తం
న అమ్భసా పరిభూయతే।।
దూరదర్శన సిద్ధి : మనస్సు (త్రిపుటిస్థానంలో) బిందువు నందు లయం చేయు అభ్యాసముచే ‘దూరదర్శన సిద్ధి’ లభించగలదు.
మనస్సున ‘కాలాత్మ’ యందు లయింపజేయుటచే - త్రికాల జ్ఞానమునకు కారణము కాగలదు. (కాలాత్మ = త్రికాలములు నా ఆత్మస్వరూపమేనని ఉపాసించటము)
పరకాయ (ఆత్మదేహ) - మనస్సులతో యోగము చేయుటచే ‘‘పరకాయ ప్రవేశసిద్ధి’’ → కలుగగలదు. కేవల స్వరూపమునందు ధ్యాస నిలుపుటచే పరకాయప్రవేశ సిద్ధి లభిస్తోంది.
మూర్ధ్ని (Upward part of Foreface) నందు అమృతస్వరూపమగు ఆత్మను (మార్పు చేర్పులు లేని స్వస్వరూపమును) చింతన చేయుటచే - ఆకలి, దప్పికలు, విషప్రభావములు సశాంతించగలవు.
పాతాళ గమనము : చిత్తమును పృథ్వి (భూమి)యందు ధారణ చేయుటచే పాతాళము ప్రవేశించు సిద్ధి లభిస్తోంది.
జలస్తంభన విద్య : చిత్తమును జలము యందు ధారణ చేయటం చేత జలము వలన హాని జరుగదు.
అగ్నౌ సన్ధానయేత్ చిత్తమ్ అగ్నినా దహ్యతే న సః।
వాయౌ మనోలయం కుర్యాత్ ఆకాశ గమనం భవేత్।
ఆకాశే ధారయేత్ చిత్తమ్
అణిమదికమ్ ఆప్నుయాత్
అగ్నియందు చిత్తమును సంధానము చేసినప్పుడు అట్టివానిని అగ్ని దహించదు.
వాయువు నందు మనోలయము చేయుటచే ‘ఆకాశ గమనము’ లభిస్తోంది.
చిత్తమును ఆకాశము (Vacant space) నందు ధారణ చేయుటచే అణిమ - మొదలైన అష్టసిద్ధులు లభిస్తున్నాయి.
8. ‘విరాట్’ రూపే మనో యుంజన్
మహిమానమ్ అవాప్నుయాత్।
చతుర్మఖే మనో యుంజన్ జగత్ సృష్టికరో భవేత్।
ఇన్ద్ర రూపిణిమ్ ఆత్మానం భావయన్ భోగవాన్ భవేత్।
విష్ణురూపే మహాయోగీ పాలయేత్ అఖిలం జగత్।
రుద్రరూపే మనో యుంజన్ సంహరత్యేవ తేజసా।
నారాయణే మనోయుంజన్, నారాయణమయో భవేత్।
‘విరాట్’ రూపము నందు మనస్సును ఏకాగ్రపరచి యుంచు యోగాభ్యాసముచే ఆ యోగి అనేక మహిమలు పొందగలడు. చతుర్ముఖుడగు సృష్టికర్త బ్రహ్మదేవుని యందు మనస్సును లగ్నము చేయు అభ్యాసముచే ‘‘జగత్ సృష్టి నిర్మాణ శక్తి’’ పొందగలడు.
‘‘నేను ఇంద్రియములకు అధినేత అగు ఇంద్రుడను’’.. అను భావనతో కూడిన ఏకాగ్రతచే అట్టి అభ్యాసయోగి భోగవంతుడు కాగలడు.
విష్ణుతత్త్వము నందు సుదీర్ఘముగా భావన చేయుటచే అఖిల జగత్తును పాలించువాడగుచున్నాడు. (బుద్ధిని విష్ణుతత్త్వమునందు నిలిపి ఉంచటం).
యోగి రుద్రభగవానుని యందు మనస్సు నిలిపి అభ్యాసము చేయటం చేత జగత్ సంహార (ఉపసంహరణ) సామర్ధ్యము పొందగలడు.
నారాయణుని యందు మనస్సును నిలిపి ఉంచుటచే, ఈ జగత్తంతా తానే అయి (లేక) నారాయణమయుడై విలసిల్లుచున్నాడు.
వాసుదేవే మనో యుంజన్ సర్వసిద్ధిమ్ అవాప్నుయాత్।
యథా సంకల్పయేత్ యోగీ యోగయుక్తో జితేంద్రియః,
తథా తత్ తత్ అవాప్నోతి భావ ఏవ అత్రకారణమ్।
వాసుదేవునియందు మనస్సును నియమించి - ఏకాగ్రము చేయు యోగాభ్యాసి సర్వసిద్ధిని పొందుచున్నాడు. (సర్వ సిద్ధులు ఆశ్రయించగలవు)
యోగి యోగాభ్యాసములచే యోగయుక్తుడై, జితేంద్రియుడై ఏది సంకల్పముచేస్తే అదియే తానగుచున్నాడు. ఆతని భావనయే అందుకు కారణముగా అగుచున్నది. సమస్తమునకు ‘భావన’యే కారణము.
గురుబ్రహ్మా। గురుర్విష్ణుః। గురుద్దేవః సదా అచ్యుతః।
న గురోః అధికః కశ్చిత్ త్రిషులోకేషు విద్యతే।
దివ్య జ్ఞానోపదేష్టారం దేశికం పరమేశ్వరమ్,
పూజయేత్ పరయా భక్త్యా, తస్య జ్ఞాన ఫలం భవేత్।
యథా గురుః తధైవ ఈశో,
యథైవ ఈశః తథా గురుః।
పూజనీయో మహా భక్త్యా
న భేదో విద్యతే అనయోః।
న అద్వైత వాదం కుర్వీత
గురుణా సహ కుత్ర చిత్।
గురుభక్తి - జ్ఞానఫలము
గురువే బ్రహ్మ। గురువే విష్ణువు। గురువే దైవము। ఆయనయే సదా అచ్యుతుడు। గురువుకన్నా అధికుడు మరొకడు త్రిలోకములలోను ఉండడు.
దివ్యజ్ఞాన- ఉపదేశము చేయు గురువును పరయాభక్తి (పరాభక్తి)తో ఎవ్వరు పూజిస్తారో, వారికి జ్ఞానఫలము తప్పక లభించగలదు.
గురువు ఎట్టివారో ఈశ్వరుడు అట్టివారు. ఈశ్వరుడు ఎట్టివారో, గురువు అట్టివారే! ఇరువురిని గొప్ప భక్తితో పూజించెదరుగుగాక! ఆ ఇరువురికి భేదము లేదు.
గురువుతో ఏ సమయంలో కూడా ‘‘మీరు నేను అదే కదా!’’.. మొదలైన అద్వైతవాదములు చేయరాదు. ‘‘మీరు చెప్పకుంటే నాకు తెలిసేది కాదు కదా!’’ - అనే ప్రపత్తి కలిగి ఉండాలి.
9. అద్వైతం భావయేత్ భక్త్యా, గురోః దేవస్య చ ఆత్మనః।
యోగ శీర్షం మహాగుహ్యం, యో జానాతి మహామతిః,
న తస్య కించిత్ అజ్ఞాతమ్, త్రిషు లోకేషు విద్యతే।
న పుణ్య పాపే, న స్వస్థో,
న దుఃఖం, న పరాజయః,
న చ అస్తి పునరావృత్తిః -
అస్మిన్ సంసార మండలే।
సిద్ధౌ చిత్తం న కుర్వీత, చంచలత్వేన చేతసః,
తథాఽపి జ్ఞాత తత్త్వో
అసౌ ముక్తయేవ। న సంశయః।


ఇతి ఉపనిషత్
గురువు పట్ల, దైవము పట్ల భక్తి కలిగియుండాలి. పరమాత్మభావనతో భక్తి తత్పరతలు ప్రదర్శించాలి. గురువును పరమాత్మకు అద్వితీయుడుగా భావన చేయాలి.
యోగము యొక్క శీర్షము (పరాకాష్ఠ స్థితి) ‘ఇట్టిది’ అని వర్ణించి చెప్పలేము. ఏ మహామతి అట్టి యోగపరాకాష్ఠ స్థానమును చేరుతాడో అట్టివానికి త్రిలోకములలోను తెలియనిది ఏమీ ఉండదు.
యోగశీర్షము (పరాకాష్ఠ)చే స్వస్థుడైనవాడు →
❋ పుణ్యపాపముల ద్వంద్వమునకు అతీతుడౌతాడు.
❋ ఆతని పట్ల ‘‘దుఃఖ-పరాజయములు’’- అనునవి ‘లేనివే’ అగుచున్నాయి.
❋ ఆతడు సంసార మండలముచే పునరావృత్తి పొండడు.
చిత్తము చంచలమైన స్వభావము కలిగి ఉండటం స్వభావం కాబట్టి, సిద్ధులందు లక్ష్యము ఉంచరాదు.
నిశ్చలత, ‘చిత్’ భావన - చిత్తమునందు సిద్ధిస్తూ ఉండగా అట్టివాడు తత్త్వజ్ఞాని అయి, ఆతడు నిత్యముక్తుడే అవుతాడు. ఇందులో సంశయమే లేదు.


।।ఇతి ఉపనిషత్।।

షష్ఠమ (6వ) అధ్యాయము

1. బ్రహ్మౌవాచ:
ఉపాసనా ప్రకారం మే ప్రబ్రూహి, పరమేశ్వర!
యస్య విజ్ఞాన మాత్రేణ, ముక్తో భవతి సంసృతేః।

శ్రీశంకరౌవాచ :
ఉపాసనా ప్రకారం తే, రహస్యం శ్రుతి సారకమ్,
హిరణ్యగర్భ! వక్ష్యామి, శ్రుత్వా సమ్యక్ ఉపాసయ।
సుషుమ్నాయై, కుండలిన్యై, సుధాయై చన్ద్రమండలాత్,
మన-ఉన్మన్యైః నమస్తుభ్యం, మహాశక్త్యై చిదాత్మనే!

బ్రహ్మదేవులవారు: హే పరమేశ్వరా! దేనియొక్క విజ్ఞానమాత్రం చేత (తెలుసుకున్నంత మాత్రం చేత) ఈ జీవునికి ‘సంసృతి’ నుండి (సంసారము నుండి) విముక్తి లభిస్తుందో, అందుకు సహకరించగల ‘‘ఉపాసనా మార్గము’’ గురించి దయతో చెప్పండి.

శ్రీ శంకర భగవానుడు: ఓ హిరణ్యగర్భా! బ్రహ్మభగవన్! రహస్యమగు శ్రుతి సారవర్ణిత - ఉపాసనాక్రమమును చెప్పుచున్నాను. శ్రోతలగు సమ్యక్ - ఉపాసకులు దీనిని ఉపాసించెదరుగాక!
సుషుమ్న, కుండలినీ, చంద్రమండల సుధ (అమృత స్రవంతికి), మనో ఉన్మనీ దేవతా రూపములుగా ఉన్న ‘‘చిదాత్మరూప మహాశక్తి’’కి మునుముందుగా నమస్కరిస్తున్నాను.
2. శతం చ ఏకా చ హృదయస్య నాడ్యః।
తాసాం మూర్థానమ్ అభినిస్సృతి ఏకా।
తయా ఊర్థ్వమ్ ఆయన్ అమృతత్వమ్ ఏతి।
హృదయ స్థానము నుండి బయల్వెడలుచున్న 101 నాడులలో ఒక్క నాడి మాత్రమే మూర్ధ్నస్థానమునకు విస్తరించి ఉన్నది. (అట్టి ఊర్ధ్వమును అనుసరించువాడు ‘‘శతంచ ఏక-ఏకైక ఊర్ధ్వగమనశీల నాడీ-సిద్ధుడు’’
నియోగాభ్యాసముచే అట్టి ఊర్ధ్వ గమన ధర్మము గల ఏకైకనాడిని గుర్తించి, బుద్ధిని అద్దానిని అనుసరించుటను అభ్యసించువాడు - మార్పు చేర్పులచే పట్టుబడని ఆత్మాస్వాదనచే ‘అమృతత్వము’ను పొందుచున్నాడు.
విష్వన్ అన్యా ఉత్క్రమణే భవన్తి।
ఏకోత్తరం నాడి శతం
తాసాం మధ్యే ‘పరా’ స్మృతా।
సుషుమ్నాతు పరే లీనా
విరజా, బ్రహ్మరూపిణీ।।
ఇతర నాడులలో ప్రవేశించువాడు ఇంద్రియ విషయములచే బద్ధుడై మరల మరల దేహధారుడై విష్వక్ (ఇంద్రియ) విషయ పరంపరలో మగ్నుడగుచున్నాడు. (అదియే సుషుమ్ననాడి). విరజ, పరనాడి, బ్రహ్మనాడి మొదలైనవన్నీ అద్దానికి శాస్త్రీయమైన పేర్లు. ఏకైక ఊర్ధ్వగమన నాడి (101వది) ని ‘పరానాడి’ అని అంటారు. అట్టి సుషుమ్న నాడి - విరజము, బ్రహ్మరూపిణి. అది పరస్వరూపము నందు లీనమగుచున్నది.
ఇడా తిష్ఠతి వామేన। పింగళా దక్షిణేన తు।
తయోః మధ్యే పరం స్థానం
య స్తం వేద స వేదవిత్।
అట్టి (- బ్రహ్మరంధ్రము వరకు విస్తరించినదైయున్న) ‘‘సుషుమ్న’’కు - వామేన (ఎడమవైపు) → ‘‘ఇడ’’, దక్షిణే (కుడివైపు) → ‘పింగళ’నాడులు ఉంటాయి. ఆ రెండు నాడుల మధ్యగా సంస్థితమై, ప్రకాశమానమైయున్న ‘పరం’ స్థానమునకు ‘సూటి’ అయిన మార్గము అయి ఉన్న ‘సుషుమ్న’ను ఎవ్వరు తెలుసుకుంటారో, వారే వేదవిత్. తెలుసుకోవలసినది తెలుసుకున్నట్టివారు.
ప్రాణం సంధారయేత్ అస్మిన్
నాసాభ్యన్తర చారిణః,
భూత్వా తత్రాయత ప్రాణః
శనైః ఏవ సమభ్యసేత్।
నాసాభ్యంతర చారిణి (ముక్కులోపల) సంచార ధర్మము నిర్వర్తిస్తున్నట్టిది -అగు పంచార ప్రదేశములో ప్రాణసంధారణ (వాయు కదలికలను నిశ్చలం చేసి కొంతసేపు ఉంచటము)ను అభ్యసించాలి. ప్రాణ నిశ్చలధారణను నెమ్మనెమ్మదిగా, ప్రశాంత చిత్తముతో సమభ్యసించాలి. అట్టి ప్రాణ నిశ్చలము క్రమంగా చిత్త చాంచల్యమును నిరోధించగలదు.
గుదస్య పృష్ఠభాగే అస్మిన్
వీణాదణ్డః స దేహ భృత్,
దీర్ఘా అస్థి - దేహ పర్యంతమ్
‘బ్రహ్మనాడి’ ఇతి కథ్యతే।
ఈ శరీరంతో గుదము (మలవిసర్జకావయవము)నకు వెనుకగా వీణాదండము (వంటి ఆకారముతో) (కుండలినీ శక్తి) ఉన్నది. అదియే ఈ దేహమును నిలుపుచున్నట్టి ‘మూలశక్తి’. దీర్ఘమగు అస్థి (వెన్నెముక) మధ్య నుండి - దేహ పర్యంతము (నఖ-శిఖ పర్యంతము) ఆక్రమణము కలదై ఈ దేహమునందు గల నాడిని ‘బ్రహ్మనాడి’ అని అంటారు.
తస్య అన్తే సుషిరగ్ం సూక్ష్మం
బ్రహ్మనాడి-ఇతి సూరిభిః।
ఇడా - పింగళయోః మధ్యే
సుషుమ్నా- సూర్యరూపిణీ।
సర్వం ప్రతిష్ఠితం తస్మిం తు
సర్వగం విశ్వతో ముఖమ్।
అట్టి బ్రహ్మనాడికి చిట్ట చివ్వరిగా (కపాలముయొక్క ఉపరిభాగంగా) ‘సూక్ష్మము’ అయినట్టి రంధ్రము ఉన్నది అదియే బ్రహ్మరంధ్రము (లేక) సుషిరగము - అని పిలువబడుచున్నది
ఇడఽపిగళల మధ్య గల ‘‘సుషుమ్న నాడి’’- సూర్యరూపిణిగా ఉన్నది.
ఇది సర్వగము. సర్వత్రా విస్తరించియున్న శక్తిస్వరూపము. విశ్వతోముఖమైనదంతా ఆ సుషుమ్నయందు చివరగా (బ్రహ్మరంధ్రము వరకు) ప్రతిష్ఠితమైయున్నది. ఈ విశ్వమంతా సుషుమ్నయొక్క ముఖము.
తస్య మధ్య గతాః సూర్య-సోమ-
అగ్ని-పరమేశ్వరాః,
భూతలోకా, దిశః, క్షేత్రాః,
సముద్రాః పర్వతాః, శిలాః,
ద్వీపాశ్చ నిమ్నగా వేదాః
శాస్త్ర విద్యా కల అక్షరాః,
సర్వమంత్ర పురాణాని గుణాశ్చ
ఏతే చ సర్వశః।
సుషుమ్నయందు మధ్య గతులై (మధ్యగతమై) →
→ సూర్య-చంద్ర అగ్నిలు,
→ పరమేశ్వరుడు
→ ఈ భూతలోకములు, దిశలు, క్షేత్రములు, సముద్రములు, పర్వతములు, శిలలు, ద్వీపములు, నదులు, వేదములు, శాస్త్రములు, విద్యలు, కల్పనలు, కళలు,
→ అక్షరములు, స్వరములు, మంత్రములు, పురాణములు,
→ సత్త్వ రజో తమో గుణములు
ఇవన్నీ ఉన్నాయి. (సుషుమ్ననాడి- చివ్వర బ్రహ్మ రంధ్రము వరకు విస్తరించినవై ఉన్నాయి).
బీజం బీజాత్మకః తేషాం, క్షేత్రజ్ఞః ప్రాణవాయవః
సుషుమ్న అంతర్గతం విశ్వం, తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్।
అనగా, (1) బీజము (2) బీజాత్మకుడగు క్షేత్రజ్ఞుడు (3) ప్రాణవాయువులు - వీటితో కూడిన ఈ విశ్వమంతా ‘సుషుమ్న’ యందు అంతర్గతమై యున్నది. అద్దాని యందే సర్వము ప్రతిష్ఠితమైయున్నది.
3. నానా నాడీ ప్రసవగ్ం సర్వభూతాన్తరాత్మని,
ఊర్ధ్వమూలమ్, అధః శాఖం, వాయుమార్గేణ సర్వగమ్।
ద్విసప్తతి సహస్రాణి (72000)
నాడ్యస్స్యుః వాయుగోచరాః,
సర్వభూతాంతరాత్మ యందే నానా నాడుల ప్రవిస్తరణ, ప్రసరణ కలిగినవై ఉన్నాయి. ప్రాణవాయుతత్త్వము ఊర్ధ్వముగాను (బ్రహ్మరంధ్రము వరకు), శాఖలుగా శరీరమంతటనూ, వాయు ప్రసరణ మార్గములు రూపమై, సర్వగతంగా విస్తరించి ఉన్నది.
దేహములో వాయు సంచారము గల అట్టి నాడులు ‘72000’ ఉన్నాయి.
సర్వమార్గేణ సుషిరాః
తిర్యన్చః సుషిరాత్మకాః,
అధశ్చ-ఊర్ధ్వన్చ కుండల్యాః
సర్వద్వార నిరోధనాత్,
వాయునా సహజీవ-ఊర్ధ్వగామీ
మోక్షమ్ అవాప్నుయాత్।
సర్వ మార్గములలోను సుషిరగములు (సూక్ష్మరంధ్రములు) ఉన్నాయి. సుషిరాత్మకమై (సూక్ష్మరంధ్రములు కలిగి ఉన్న) నాడులు దేహములలో అడ్డదిడ్డముగా ఉన్నాయి.
సుషమ్న యొక్క పైన-క్రింద గల సర్వ ద్వారములు (విషయలవైపుగా దారితీస్తున్న ద్వారములు) వాయు నిరోధముతో నిరోధించటం చేత అట్టి అభ్యాసము గల జీవుడు మోక్షము పొందగలడు.
జ్ఞాత్వా సుషుమ్నాం తత్ భేదం
కృత్వా వాయున్చ మధ్యగమ్।
కృత్వా తు చ ఐన్దవ స్థానే
ఘ్రాణ రన్ధ్రే నిరోధయేత్।

- సుషుమ్న నాడిని ‘ఎరుక’లోకి తెచ్చుకొని..,
- దానిని భేదించి,
- వాయువును మధ్యగతంగా వెళ్ళునట్లు చేసి
- చంద్రస్థానమగు ఘ్రాణ రంధ్రమును నిరోధించాలి.
ద్విసప్తతి సహస్రాణి (72000)
నాడీ ద్వారాని పంజరే,
సుషుమ్నా శాంభవీ శక్తిః।
శేషాస్తు అన్యే నిరర్థకాః।।
72000 నాడీ (ప్రసరణ) ద్వారముల పంజరములో ‘సుషుమ్న’యే - (బ్రహ్మనాడి అయి) బ్రహ్మ రంధ్ర ప్రవేశమునకు ద్వారమగుచున్నది. కాబట్టి - (అదియే) ‘శాంభవీశక్తి’ అని అంటారు. అది శివైక్యమునకు మార్గము. ఇక తక్కిన నాడీ ద్వారములు ఇంద్రియ ప్రపంచము వైపుగా దారితీస్తున్నాయి కాబట్టి నిరర్ధకము. ఎందుకంటే, పునః పునః జన్మ-కర్మలకు కారణము కాబట్టి.
హృత్ లేఖే పరమానందే
తాలుమూలే వ్యవస్థితే,
అత ఊర్ధ్వం నిరోధే తు
మధ్యమం మధ్య మధ్యమమ్,
ఉచ్చారయేత్ పరాం శక్తిం
బ్రహ్మరంధ్ర నివాసినీమ్,
యది భ్రమర సృష్టిస్స్యాత్
సంసార భ్రమణం త్యజేత్।
తాలు (దవడ) మూల-ఆకాశములో ‘హృత్ లేఖి’ యగు పరమానందము వ్యవస్థితమైయున్నది.
అట్టి తాలు మూలమునకు పై ప్రదేశంలో ప్రాణమును నిరోధించటంలో మధ్యమధ్యమమైన ‘మధ్యమము’ అనుభవమగుచున్నది.
అట్టి మధ్యమము నుండి బ్రహ్మరంధ్రనివాసిని యగు పరాశక్తిని మనస్సుతో కేకవేస్తూ, ఆహ్వానిస్తూ, ఆరాధిస్తూ ఉచ్ఛారణ (పైకి నడపటం) చేయాలి. క్రమంగా భ్రమరము వలె సృష్టియందు వ్రాలుచున్న బుద్ధియొక్క సంసార భ్రమణమును త్యజించటము సుసాధ్యము.
4. గమ-ఆగమస్థం, గమనాది శూన్యం
చిద్రూప దీపం, తిమిరాపహారమ్,
పశ్యామి తే సర్వజన - అన్తరస్థం,
నమామి హంసం
పరమాత్మ రూపం।।
పరమాత్మ ఎట్టివాడంటే….!
→ రాక -పోకలలో (గమన-ఆగమనములలో) అంతస్థుడైనవాడు.
→ ‘‘ఒకచోట నుండి ఇంకొక చోటికి వెళ్ళటము’’ అనే ధర్మమే లేనట్టివాడు.
అట్టి పరమాత్మ రూపమును, సర్వజనుల అన్తరస్థుడుగా దర్శిస్తూ ఆ హంస (సోఽహమ్) స్వరూపునికి సదా నమస్కరిస్తున్నాను! సమస్తము ‘తానే’ అయినట్టి ‘కేవలానంద అఖండాత్మ’యే నా ఉపాస్య వస్తువు.
అనాహతస్య శబ్దస్య।
తస్య శబ్దస్య యో ధ్వనిః।
ధ్వనేః అంతర్గతం జ్యోతిః।
జ్యోతిషో అంతర్గతం మనః।
తన్మనో విలయం యాతి,
తద్విష్ణాః పరమం పదమ్।
కేచిత్ వదంతి చ ‘ఆధారం’
‘సుషుమ్నా’, చ సరస్వతీ।
ఆధారాత్ జాయతే విశ్వం।
విశ్వం తత్రైవ లీయతే।
ధ్వని-జ్యోతి-మనస్సు-పరమపదము
వాయు స్థానమగు హృదయము నుండి, వెన్నముక మధ్యగా గల ‘అనాహతము’లో శబ్దము జనిస్తోంది. (‘‘నిశ్శబ్దమగు స్వస్వరూపము’’ అను ధర్మముగల)
→ అట్టి అనాహతములో ధ్వని।
→ అట్టి ధ్వనిలో మధ్యలో ‘జ్యోతి’।
→ ఆ జ్యోతికి అంతర్గతమై ఆలోచనల రూపమగు మనస్సు।
అట్టి భావనా రూప మనస్సు విలయము పొందినప్పుడు కేవలమై శేషించి ఉన్నట్టిదే విష్ణువు’ అని చెప్పబడు పరమపదము।

‘‘సుషుమ్న రూపమగు సరస్వతియే సర్వమునకు ఆధారము’’ అని కొందరు సిద్ధాంతీకరించి చెప్పుచున్నారు. (ఆత్మయొక్క కేవల- శక్తిరూపమే సుషుమ్నగా ప్రసిద్ధము)
→ అట్టి ‘సుషుమ్న అనబడు ఆధారము నుండియే ఈ విశ్వమంతా జనిస్తోంది.
→ ఈ విశ్వమే సుషుమ్న స్వరూపము.
→ ఈ విశ్వము తిరిగి సుషుమ్నయందే లీనమగుచున్నది. (ఆధారము, సుషుమ్న, సరస్వతిగా ఉపాసించబడుతోంది)
తస్మాత్ సర్వ ప్రయత్నేన
గురుపాదం సమాశ్రయేత్।
ఆధారశక్తి నిద్రాయం
విశ్వమ్ భవతి నిద్రయా।
తస్యాం శక్తి ప్రబోధేన
త్రైలోక్యం ప్రతిబుద్ధ్యతే।
(అట్టి విశ్వజనన - లయ స్థానమగు సుషుమ్న యొక్క స్వానుభవము కొరకై) ఆత్మానుభవము గల గురువు యొక్క పాదములను ఆశ్రయించాలి.
అట్టి ఆధార శక్తి నిద్రించటము జరుగుచున్నప్పుడు విశ్వము కూడా నిదురిస్తున్నదే అగుచున్నది.
ఆ ఆధార శక్తి ప్రబోధ సమన్వితమై ఉంటే, త్రిలోకములు పతిబుద్ధ్యము (Awakened / actively manifesting) అగుచున్నది.
ఆధారం యో విజానాతి
తమసః పరం అశ్నుతే,
తస్య విజ్ఞాన మాత్రేణ
నరః పాపైః ప్రముచ్యతే।
ఎవ్వరైతే ‘ఆధారము’ గురించి వివరంగా, సుస్పష్టంగా తెలుసుకుంటారో, వారు తమస్సుకు ఆవలి ఒడ్డు చేరుచున్నారు.
(1) మూలాధారశక్తి, (2) సుషుమ్నాంతర్గత శక్తి, (3) సుషుమ్నలో విశ్వజనన - లయములు, (4) సుషుమ్నతో మమేకత్వము - ఇది తెలుసుకున్నంత మాత్రం చేతనే ఈ నరుడు సర్వపాపములనుండి, దోషముల నుండి విముక్తుడు కాగలడు.
5. ఆధార చక్రమహసా
విద్యుత్ పుంజ సమప్రభా।
తథా ముక్తిః, న సందేహో
యది తుష్టః స్వయం గురుః।
(‘సుషుమ్న’ అనే) ఆధార చక్రము యొక్క తేజస్సు - మెరుపుతీగల సమూహం వెదజల్లు కాంతి పుంజముల వంటిది.
ఎవ్వరు సుషుమ్న-అను ఆధార చక్రము యొక్క తత్త్వము ఎరుగుచున్నారో, తుష్టి చెందుచున్నారో, → వారు ముక్తులే. స్వయంగురువులే. (ఆత్మైవహి గురుః ఇతి।)
ఆధార చక్రమహసా
పుణ్యపాపే నికృన్తయేత్।
ఆధార వాత రోధేన
లీయతే గగనాన్తరే।
మహత్తరమగు ఆధారచక్రము యొక్క అభ్యాససిద్ధిచే ‘‘పుణ్య-పాపములు’’ అనే ద్వంద్వ మోహము తొలగిపోతుంది.
వాయువు యొక్క నిరోధముచే (ప్రాణాయామాభ్యాసముచే) ఆధారము గగనము (ఆత్మాకాశము) యొక్క అంతరమున విలీనము అగుచున్నది.
ఆధార వాతరోధేన
శరీరం కంపతే యదా।
ఆధారవాత రోధేన
యోగీ నృత్యతి సర్వదా।
ఆధార వాత రోధేన
విశ్వం తత్రైవ దృశ్యతే।
వాయువు యొక్క నిరోధముచే యోగి ఆధారము నందు బుద్ధి నిలుపుటచే ఆ యోగి నటరాజ నృత్యము సలుపుచున్నాడు. ఆధార - వాత(వాయు) నిరోధముచే ఈ విశ్వము ‘ఆధారము’ నందే కనబడగలదు.

తానే ఆత్మస్వరూపుడుగా సమస్తమును ఆధార స్వరూపముతో వ్యక్తీకరిస్తున్నట్లు గ్రహించగలడు. సుషమ్నయొక్క (కుంభకాభ్యాసపూర్వక) ధారణచే, ‘‘ఈ విశ్వమంతా నా తాండవమే’’ అనునది స్వానుభవమవ గలదు.
సృష్టేః ఆధారమ్ ఆధారమ్।
ఆధారే సర్వదేవతాః।
ఆధారే సర్వవేదాశ్చ।
తస్మాత్ ఆధారం ఆశ్రయేత్।
(నిర్విషయాత్మయే సర్వాధారము. అదియే సుషుమ్న). ఈ సృష్టికి ఆధారము ఆధారచక్రమే!
ఆధార చక్రమునందు (సుషుమ్న యందు) - → సర్వ దేవతలు, సర్వ వేదములు, సంస్థితమై ఉన్నాయి. అందుచేత యోగులు యోగాభ్యాసము కొరకై ఆధార చక్రమును ఆశ్రయించి ఉండాలి.
ఆధార పశ్చిమే భాగే
త్రివేణీ సంగమో భవేత్।
తత్ర స్నాత్వా చ పీత్వా చ
నరః పాపాత్ ప్రముచ్యతే।
ఆధార చక్రమునకు పశ్చిమంగా త్రివేణీ సంగము (ద్రష్ట-దర్శన- దృశ్యముల ఏకరూపము) అగు ఆజ్ఞాచక్రము ఉన్నది. (భృకుటి). అట్టి త్రివేణీ సంగమునందు స్నానము చేయుటచే, జలము త్రాగుటచే ఈ జీవుడు సర్వపాపముల నుండి ముక్తి పొందుచున్నాడు.
ఆధారే పశ్చిమం లింగం,
‘కవాటం’ తత్ర విద్యతే।
తస్య ఉద్ఘాటన మాత్రేణ
ముచ్యతే భవ బన్ధనాత్।
ఆధార చక్రము (సుషుమ్న)కు పశ్చిమ భాగము లింగము, మోక్షము ద్వారము (కవాటము) అని చెప్పబడుతోంది. ఆ ద్వారమును ఊర్థ్వముగా ఉద్ఘానం చేసినంత మాత్రం చేత (తెరిచినంత మాత్రంచేత) ఈ జీవుడు భవబంధములను త్రెంచివేయగలడు. (బ్రహ్మరంధ్రఛేదనము)
ఆధార పశ్చిమే భాగే
చంద్ర సూర్యౌ స్థిరౌ యది,
తత్ర తిష్ఠతి విశ్వేశో
ధ్యాత్వా బ్రహ్మమయో భవేత్।
ఆధార పశ్చిమ విభాగంలో సూర్య-చంద్రులు స్థిరస్వరూపులగుచున్నారు. (ఇడ-పింగళల ఏకత్వముచే) అక్కడ విశ్వేశ్వరుడు తిష్ఠితుడై ఉంటారు. అట్టి విశ్వేశ్వర ధ్యానముచే ఈ జీవుడు బ్రహ్మమయుడు అగుచున్నాడు.
ఆధార పశ్చిమే భాగే
మూర్తిః తిష్ఠతి సంజ్ఞయా।
షట్ చక్రాణి చ నిర్భిద్య
బ్రహ్మరంధ్రాత్ బహిర్గతమ్।
ఆధార చక్ర పశ్చిమంగా సంజ్ఞగా (ఈ జగత్తుగా మూర్తీభవించిన) మూర్తి సుతిష్టితులై ఉంటారు.
సుషుమ్నోపాసకుడు షట్ చక్రములను ఛేదించి బ్రహ్మరంధ్రము నుండి బహిర్గతులై (సహస్రారమునందు) ఊర్థ్వగతుడై ప్రవేశించుచున్నాడు.
వామదక్షే నిరున్ధన్తి
ప్రవిశన్తి సుషుమ్నయా।
బ్రహ్మరంధ్రం ప్రవిశ్యాన్తః
తే యాన్తి పరమాం గతిమ్।
వామ-దక్షిణములను (ఎడమ-కుడి :: ఇడ-పింగళ) నిరోధించి ఆ యోగి ‘సుషుమ్న’యందు ప్రవేశము పొందుచున్నాడు.
బ్రహ్మరంధ్రమున ప్రవేశించిన యోగి బ్రహ్మరంధ్రమును దాటివేసి ‘పరము’ (కేవలమగు ఆత్మస్వరూపము) యొక్క గతిని పొందుచున్నాడు.
6. సుషుమ్నాయాం యదా హంసస్తు
అథశ్చ ఊర్ధ్వం ప్రధావతి,
సుషుమ్నాయాం యదా ప్రాణం
అహ్రామయేత్ యో నిరన్తరమ్,
సుషుమ్నాయం యదా ప్రాణః
స్థిరో భవతి ధీమాతామ్,
సుషుమ్నాయాం ప్రవేశేన
చంద్ర సూర్యౌ లయం గతౌ,
తదా సమరసం భావం
యో జానాతి స యోగవిత్।
ఏ యోగి పట్ల →
➤ సుషుమ్న యందు హంస ప్రాణోపాసన సమయములో సోఽహమ్ భావము ఎల్లప్పుడూ క్రిందికి పైకి (మూలాధారము నుండి సహస్రారము వరకు) (ఎరుకగా) వెళ్లి వస్తూ ఉంటుందో,
➤ ఎప్పుడైతే సుషమ్న యొక్క యోని అంతరమునకు ప్రాణ సంచారము అనుభవమగుచున్నదో,
➤ ఏ ధీమంతుని బుద్ధి ప్రాణచలనమును ఆశ్రయించి సుషుమ్న యందు స్థిరముగా పొందుచున్నదో,
➤ ఎప్పుడైతే చంద్ర-సూర్యులు సుషుమ్నయందు (యోగాభ్యాసముచే) లయము పొందుచున్నారో,
అప్పటి ‘సమరస భావము’ను ఏ యోగి తెలుసుకొని ఉంటున్నాడో, ఆతడే యోగవేత్త.
సుషుమ్నాయాం యదా యస్య
మ్రియతే మనసో రయః,
సుషుమ్నాయాం యదా యోగీ
క్షణమేకం చ తిష్ఠతి,
సుషుమ్నాయాం యదా యోగీ
క్షణార్థమపి తిష్ఠతి, సుషుమ్నాయం సదా యోగీ
సులగ్నో లవణాంబువత్,
సుషుమ్నాయాం యదా యోగీ
లీయతే క్షీరనీరవత్….
భిద్యతే చ తదా గ్రంథిః।
ఛిద్యన్తే సర్వ సంశయాః।
క్షీయన్తే, పరమాకాశే
తే యాన్తి పరమాం గతిమ్
➤ ఎవనిచే సుషుమ్న యొక్క అంతరమున మాత్రమే మనస్సు యొక్క వేగము లెక్కపెట్టబడుచున్నదో,
➤ ఎవని మనస్సు సుషుమ్నయందు లయము పొందినదగుచున్నదో,
➤ ఏ యోగి అయితే సుషుమ్నయందు ఒక్క క్షణకాలము తిష్ఠితుడై ఉంటాడో,
➤ ఉప్పుగడ్డ నీటిలో కరగిపోవు విధంగా ఎప్పుడైతే యోగి సుషుమ్నయందు సంలగ్నుడై, సుషుమ్నయే తానౌతాడో,
➤ పాలు - నీరు వలె (క్షీర-నీరన్యాయంగా) ఏ యోగి సుషుమ్నతో ఏకము అగుచున్నాడో,
→ అట్టి యోగి యొక్క హృదయ గ్రంధులన్నీ తెగిపోతాయి.
→ సర్వ సంశయములు వీగిపోతాయి.
సర్వము పరమాకాశమున క్షీణించినవై, ఆతడు ‘పరమాం గతి’ని పొందుచున్నాడు.
7. గంగాయాం సాగరే స్నాత్వా,
నత్వాచ మణికర్ణికామ్,
మధ్యనాడీ విచారస్య
కలాం నార్హంతి షోడశీమ్,
శ్రీశైల దర్శనాత్ ముక్తిః
వారాణస్యాం మృతస్యచ,
కేదారోదక పానేన
మధ్యనాడీ ప్రదర్శనాత్,
అశ్వమేధ సహస్రాణి
వాజపేయ శతాని చ,
సుషుమ్నాధ్యాన యోగస్య
కలాం నార్హన్తి షోడశీమ్।
గంగలో మునగటము, సాగరంలో స్నానము చేయటము, మణికర్ణికకు నమస్కరించటము.. ఇవన్నీ కూడా ‘‘మధ్య నాడీ విచారణ’’ అనబడే సుషుమ్న యందు యోగాభ్యాసము నిర్వర్తించుటకు 16వ వంతుతో కూడా సమానము కాదు. (అర్హము కాదు)
- శ్రీశైల దర్శనము వలన ముక్తి,
- వారణాసిలో మరణించటము,
- కేదారములో ఉదకము త్రాగటము,
- వేయి అశ్వమేధ యాగములు,
- వంద వాజపేయ యజ్ఞములు,
ఇవన్నీ కూడా మధ్య నాడీ ప్రదర్శనా రూపము అగు సుషుమ్నా ధ్యాన యోగము యొక్క ప్రయోజనములో 16వ వంతు కూడా అవజాలవు.
సుషుమ్నాయాం సదా గోష్ఠీం
యః కశ్చిత్ కురుతే నరః,
స ముక్తః సర్వ పాపేభ్యో
నిశ్రేయసమ్ అవాప్నుయాత్।
ఏ నరుడైతే ‘సుషుమ్న’ యందు ఎల్లప్పుడూ గోష్ఠి (సంభాషించటం, యోచించటం, దృష్టి కలిగి యుండటం మొదలైనవి) కలిగి ఉంటాడో, ఆతడు అన్ని పాప-దోష దృష్టుల నుండి విముక్తి పొందినవాడై పరమ శ్రేయోస్థానము పొందగలడు.
సుషుమ్నైవ పరం తీర్థం।
సుషుమ్నైవ పరో జపః।
సుషుమ్నైవ పరం ధ్యానం।
సుషుమ్నైవ పరా గతిః।
సుషుమ్నయే మహత్తరమగు తీర్థము. సుషుమ్నయే గొప్ప జపము, గొప్ప ధ్యానము, గొప్ప ‘గతి’ కూడా అయి ఉన్నది.
అనేక యజ్ఞ దానాని, వ్రతాని,
నియమాః తథా,
సుషుమ్నా ధ్యాన లేశస్య
కలాం న అర్హన్తి షోడశీమ్।।
అనేక యజ్ఞములు, దానములు, వ్రతములు, నియమములు - ఇవన్నీ కూడా…, సుషుమ్నా ధ్యానము (ఈ విశ్వమంతా ఎందులో జనించి, ఉండి లయిస్తోందో - అట్టి పరాశక్తి స్థానము) యొక్క ఒక చిన్న లేశము (Piece)లో 16వ వంతు ఫలముతో కూడా సమానము కాదు.
బ్రహ్మరంధ్రే మహాస్థానే
వర్తతే సతతం శివా।
చిచ్ఛక్తిః పరమాదేవీ
మధ్యమే సుప్రతిష్ఠితా।।
సుషుమ్న మూలాధారము నుండి బ్రహ్మరంధ్ర మధ్య స్థానము వరకు చిచ్ఛశక్తి రూపముగా పరమాదేవి అయి ప్రకాశమానమైయుండగా, (ప్రకృతి)
→ మహాస్థానమగు సుషుమ్నా ఊర్ధ్వ- బ్రహ్మరంధ్రము నందు మధ్యగా శివభగవానుడు, చిత్‌శక్తి, పరమాదేవి సుప్రతిష్ఠుతులై ఉన్నారు. (పురుషుడు)
మాయాశక్తిః లలాట అగ్రభాగే
వ్యోమామ్బుజే తథా।
నాదరూపా పరాశక్తిః
లలాటస్యా పరాంశకే।
బిందుమధ్యే చ జీవాత్మా
సూక్ష్మరూపేణ వర్తతే।।
మాయాశక్తి (కల్పనా - భావనా - ఊహాశక్తి) → లలాటము యొక్క పైభాగంలో గల ఆకాశ పుష్పమున ప్రదర్శనమగుచున్నది.
‘‘నాద రూప పరాశక్తి’’ → లలాటము యొక్క అపరాంశమున (క్రిందగా) ఉంటున్నది. (నాద జననస్థానం)
బిందు మధ్యగా జీవాత్మ (భావనా, ఊహా విభాగంలో ‘అనుభవి’గా కల్పించబడిన ఆత్మాంశ), సూక్ష్మరూపముగా వర్తిస్తున్నారు.
8. హృదయే స్థూల రూపేణ
తను మధ్యే చ మధ్యమా,
ప్రాణ-అపాన వశో జీవో హి
అధశ్చ ఊర్ధ్వంచ ధావతి।
ఇక ఈ జీవుని స్థూల రూపము
శరీర మధ్య గల హృదయస్థానము నందు స్థూలరూపుడై ఉన్నాడు. ప్రాణ-అపానములకు వశుడై, ఈ భౌతిక దేహమునందు పైకి, క్రిందికి తిరుగాడుచున్నాడు.
వామ-దక్షిణ మార్గేణ
చన్చలత్వాత్ న దృశ్యతే।
కుడి -ఎడమల మార్గములలో (పింగళ - ఇడనాడులలో) అనుక్షణమూ తిరుగాడుచూ, ఎక్కడా ఒకచోట ఉండటము లేదు. ఒకచోట అంటూ అగుపించటమూ లేదు.
ఆక్షిప్తో భుజదండేన
యథా ఉచ్చలతి కందుకః,
ప్రాణ-అపాన సమాక్షిప్తః
తథా జీవో న విశ్రమేత్।
భుజదండముతో కొట్టబడి పైకి క్రిందికి ఎగిరిపడుతూ ఉండే పూలబంతి లాగా, ప్రాణ-అపానములచే సమాక్షిప్తము అయినవాడై (మోదించబడినవాడై) ఈ జీవుడు ఎక్కడా ఒకచోట విశ్రాంతిగా విశ్రమించినవాడై ఉండటం లేదు.
అపానః కర్షతి ప్రాణం
ప్రాణో అపానన్చ కర్షతి।
‘హ’ కారేణ బహిః యాతి
‘స’ కారేణ విశేత్ పునః।
అపానము ప్రాణమును ఆకర్షిస్తోంది. ప్రాణము అపానమును ఆకర్షించటం జరుగుతోంది. ‘హ’ కారముచే వాయువు (ప్రాణశక్తి) బయటకు వెళ్ళుతోంది. ‘స’కారముచే వాయువు లోనికి వస్తోంది. (ఇది సందర్భరూపము - కేవల స్వరూపముల మధ్యగా జరుగుచున్న అవిశ్రాంత విహారము). (సో = కేవలము, హమ్ = సందర్భము)
‘హంస’ ‘హంస’ ఇతి అముం
మన్త్రం జీవో జపతి సర్వదా!
తత్ విద్వాన్ అక్షరం నిత్యం
యో జానాతి స ‘యోగవిత్’।
కంఠ ఊర్ధ్వే కుండలీ శక్తిః
ముక్తి రూపా చ యోగినామ్।
బన్ధనాయ చ మూఢానాం
యః తాం వేత్తి స యోగవిత్।
ఈ విధంగా ఈ జీవుడు ‘హంస’ ‘హంస’ మంత్రమును ఎల్లప్పుడూ (వాయువును వదలటము - పీల్చటము అను క్రియలచే) జపిస్తూ ఉన్నాడు.
ఏ విద్వాంసుడైతే, ప్రాణ-అపానములకు, ‘హంస’కు పరమార్థమై, ఆధారమైయున్న - ‘సోఽహమ్’ను తెలుసుకొని ఉంటున్నాడో ఆతడే యోగవేత్త! అక్షరము, నిత్యము అగు ఆత్మయే అది. అది తానే!
కంఠమునకు ఊర్ధ్వ భాగంగా ఉన్న కుండలినీ శక్తి యోగులకు ‘ముక్తిరూపము’గా అనుభూతమగుచున్నది.
‘యోగాభ్యాస ధ్యాస’ లేనట్టి మూఢులకు అదియే బంధనముగా అగుచున్నది. అట్టి - కంఠ ఊర్థ్వ మోక్షప్రదాయక కుండలినీ శక్తిని ఎరిగినవాడు యోగవేత్త.
‘భూర్భువస్వః’ ఇమే లోకాః
చంద్ర-సూర్య-అగ్ని దేవతాః,
యాసు మాత్రాసు తిష్ఠన్తి
తత్ పరంజ్యోతిః ‘ఓం’ ఇతి।।
ఎందులో అయితే, భూ-భువర్-సువర్ త్రిలోకములు, చంద్ర-సూర్య- అగ్ని దేవతలు - మాత్రలుగా సుతిష్ఠితులై ఉన్నారో, అదియే ‘పరంజ్యోతి’ అగు ‘ఓం’ - అను శబ్ద సంజ్ఞకు పరమార్థము.
త్రయః కాలాః, త్రయో దేవాః,
తయో లోకాః, త్రయః స్వరాః,
త్రయో వేదాః స్థితా యత్ర,
‘‘తత్ పరంజ్యోతిః’’
‘ఓం’ ఇతి।
భూత- వర్తమాన - భవిష్యత్ → త్రికాలములు,
భూ-భువర్-సువర్ → త్రిలోకములు,
ఉదాత్త (ఊర్ధ్వ) - అనుదాత్త (అధో) - మధ్యమ → త్రిస్వరములు,
ఋక్ - యజుర్ - సామ → త్రివేదములు
… ఇవన్నీ ఎందులో, ఎక్కడ సంస్థితమైయున్నాయో, అదియే ‘ఓం’ అని పిలువబడు పరంజ్యోతి స్వరూపమగు అఖండాత్మ! కేవలమగు స్వస్వరూపాత్మ!
చిత్తనిశ్చలత్వము
9. చిత్తే చలతి, సంసారో
(తత్) నిశ్చలం ‘మోక్ష’ ఉచ్యతే।
తస్మాత్ చిత్తం స్థిరీ కుర్యాత్ ప్రజ్ఞయా పరయా, విధే!
చిత్తం కారణం అర్థానామ్, తస్మిన్ సతి జగత్రయమ్।
తస్మిన్ క్షీణే జగత్ క్షీణం।
తత్ చికిత్స్యం ప్రయత్నతః।।
చిత్తము యొక్క చాంచల్యానుభవమే సంసారము. చిత్తము యొక్క నిశ్చలత్వమే - ‘మోక్షము’ - అనబడుతోంది. ఓ విధిదేవా! బ్రహ్మదేవా! లోక పితామహా"! గొప్ప ప్రజ్ఞా-ప్రయత్నములతో ఈ చిత్తరమును ‘స్థిరము’ చేయాలి. సర్వ అర్థములకు అనర్థములకు చిత్తమే కారణం. అందుచేత ఈ చిత్తము నందే త్రిలోకములు ఏర్పడి ఉన్నాయి.
చిత్తము క్షీణిస్తే, జగత్తులు క్షీణిస్తాయి. అందుచేత ఈ చిత్తమునకు ప్రయత్నపూర్వకంగా ‘చికిత్స’ చేసుకోవాలి. చిత్త నిశ్చలత్వమే యోగాభ్యాస మూలాధారము.
మనోఽహం గగనాకారమ్।
మనోఽహం సర్వతో ముఖమ్।
మనోఽహం సర్వమ్ ఆత్మా చ।
న(స) మనః కేవలః పరః।
ఆకాశాకారమగు మనస్సు నేనే!
సర్వత్రాముఖములు కలిగిన మనస్సు నేనే!
మనస్సే ఆత్మ! మనస్సే సర్వము.
అయితే మనస్సు కేవలము కాదు. నాకు వేరైనది కాదు.
అయితే మనస్సు బ్రహ్మమే కూడా!
మనః కర్మాణి జాయన్తే
మనో లిప్యతి పాతకైః
మనశ్చేత్ ఉన్మనీ భూయాత్
న పుణ్యం। న చ పాతకమ్।
(ఉన్మనీ = తాను కదలక, ఆలోచనలను కదలిస్తున్న మనో విభాగము)

మనస్సు నుండే కర్మలు (Functions, Acts) - అన్నీ పుట్టుచున్నాయి.
- మనస్సే దోషములచే, పాతకములచే పూయబడినదై ఉంటోంది.
- మనస్సు ఉన్మనీ స్థానము జేరితే (ఆలోచనలు ఆలోచనల జనన స్థానమును చేరినవై ఉంటే)-అప్పుడు ఇక పుణ్యము లేదు. పాపము లేదు.
మనసా మన ఆలోక్య, వృత్తి శూన్యం యదా భవేత్,
తతః పరం పరబ్రహ్మ, దృశ్యతే చ సుదుర్లభమ్।
ఎప్పుడైతే మనస్సు ప్రాపంచకవృత్తులను అధిగమించి, మనస్సుతో మనస్సే చూడబడుచున్నదో ఆపై సుదుర్లభమగు ‘‘పరబ్రహ్మము’’ దృశ్యమానమవగలదు.
10. మనసా మన ఆలోక్య, ముక్తో భవతి యోగవిత్।
మనసా మన ఆలోక్య, ఉన్మన్యంతం సదా స్మరేత్।
మనసా మన ఆలోక్య, యోగనిష్ఠః సదా భవేత్।
మనసా మన ఆలోక్య, దృశ్యన్తే ప్రత్యయా దశ।
యదా ప్రత్యయాదృశ్యన్తే, తదా యోగీశ్వరో భవేత్।
బిన్దు నాద కలా జ్యోతిః
(అ)బిన్దు ధృవ తారకమ్।
శాంతం చ తత్ అతీతం చ
‘‘పరం బ్రహ్మ’’ తత్ ఉచ్యతే।।
మనస్సుతో మనస్సును దర్శించటం చేత (దృశ్యమును స్వకీయ మనో రూపముగా మననము కలిగి ఉండటం చేత), అట్టి యోగవేత్త స్వయముగా ముక్తుడు అగుచున్నాడు. (ఇది మనస్సుయొక్క సాక్షీ విభాగములతో ఈ జగన్నాటకములోని పాత్రధారునిగా (నటించు) మనస్సును చూస్తూ ఉండటము వంటిది).
‘‘మనస్సుతో మనస్సును అవలోకనము’’ అనే ఉన్మనీత్వమును ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి.
మనస్సుతో మనస్సును దర్శిస్తూ ఎల్లప్పుడూ అట్టి యోగనిష్ఠుడై ఉండాలి.
మనస్సుతో మనస్సును అవలోకనం చేస్తూ ఉండగా ఈ జగత్తుకు ప్రత్యయము, ఆధారము అగు ‘‘కేవలము’’ - అనుభూతమౌతోంది. (The Abosolute Comes into Experience). ఎప్పుడైతే ఈ దృశ్యమునకు ప్రత్యయమైయున్న ఆత్మ దృశ్యమానమౌతుందో, అట్టివాడు ‘యోగీశ్వరుడు’ అగుచున్నాడు.
బిందువు, నాదము, కల, జ్యోతి-ఇవన్నీ కూడా అబిందువు అగు ధృవమగు తారకములు. (తరింపజేయునవి).
శాంతమునకు కూడా ఆవల అతీతమై ఏ పరమ మౌన-ప్రశాంతము సంస్థితమైయున్నదో, అదియే పరబ్రహ్మము.
హసతి, ఉల్లసతి ప్రీత్యా,
క్రీడతే, మోదతే తదా।
తనోతి జీవనం బుద్ధ్యా
(తే) బిభేతి సర్వతో భయాత్।
రోధతే బుద్ధ్యతే శోకే
ముహ్యతే న చ సంపదా।
కంపతే శత్రు కార్యేషు
కామేన రమతే హసన్।
స్మృత్వా కామరతం చిత్తం
విజానీయాత్ కళేబరే।
ఈ చిత్తము -
ప్రీతిగా ఉంటుంది. నవ్వుతుంది. ఉల్లాసము పొందుతుంది. క్రీడిస్తుంది. మోదము పొందుతుంది.
బుద్ధితో ‘జీవిస్తున్నవాడను’ అనునదంతా పొందుతోంది.
- అనేక భయ-ఉద్వేగములతో భౌతికత్వమంతా అనుభవిస్తోంది.
బాధ, శోకముల బుద్ధి పొందుతోంది. రోదిస్తోంది.
శత్రువుల కార్యములకు కంపనములు పొందుచున్నది.
నవ్వుచూనే అనేక కామములందు (కోరికలందు, Expectations) రమించుచున్నది. స్మృతులచే కామరతమైన ఈ చిత్తము యొక్క శరీరమును తెలుసుకోవాలి. చిత్తమును నిరోధిస్తే ‘చిత్’ అనుభవమవగలదు.
యత్ర దేశే వశేత్ వాయుః, చిత్తం తత్‌వసతి ధృవమ్।
మనః చంద్రో। రవిః వాయుః।
దృష్టిః అగ్నిః ఉదాహృతః।
బిన్దు నాద కలా, బ్రహ్మన్!
విష్ణు బ్రహ్మ ఈశ దేవతాః। - సదా
నాద అనుసంధానాత్, సంక్షీణా వాసనా భవేత్।
ఏ ప్రదేశమున వాయువు (ప్రాణశక్తి) ఉండటం జరిగితే ఈ చిత్తము కూడా ధృవముగా అక్కడే ఉన్నదిగా అగుచున్నది.
మనస్సు (దేహములోని) చంద్రుడని, వాయువు ‘రవి’ అని, దృష్టి అగ్ని అని ఉదహరించబడుచున్నాయి.

హే బ్రహ్మన్! ‘బిందువు’ నందు, ‘నాదము’ నందు, ‘కల’యందు, విష్ణు - బ్రహ్మ - ఈశ దేవతల పట్ల - భావన, ఉపాసలచేతను, నాదానుసంధానము చేతను వాసనలు సంక్షీణము పొందగలవు.
11. నిరంజనే విలీయేత
మరుత్ మనసి, పద్మజ!
యో వై ‘‘నాదః’’ స వై ‘‘బిన్దుః’’
తద్వై ‘చిత్తం’ ప్రకీర్తితమ్।
నాదో బిన్దుశ్చ చిత్తన్చ
త్రిభిరైక్యం ప్ర-సాధయేత్।
ఓ పద్మజా! యోగి పట్ల వాయువు - నిరంజనమగు (నిర్మలమగు) మనస్సు నందు, విలీనము పొందుచున్నది.
- ఏది ‘నాదము’ అయి ఉన్నదో, అదియే ‘బిందువు’ కూడా అయి ఉన్నది.
- అదియే ‘చిత్తము’ అని కూడా ప్రకీర్తించబడుచున్నది.
నాదము, బిందువు, చిత్తము - ఈ మూడింటి యొక్క యోగ- ఐక్యత్వమును యోగి సంపాదించుకోవాలి సుమా!
మన ఏవ హి బిన్దుశ్చ
ఉత్పత్తి స్థితి కారణమ్।
మనసా ఉత్పద్యతే బిన్దుః
యథా క్షీరం ఘృతాత్మకమ్।
షట్ చక్రాణి పరిజ్ఞాత్వా
ప్రవిశేత్ సుఖ మణ్డలమ్।
మనస్సే బిందువు. సమస్తమునకు ఉత్పత్తికి, స్థితికి కారణము..
ఏవిధంగా పాలు ఘృతాత్మకమై (లోన నిండా నేయి కలిగినదై) ఉన్నదో, అట్లాగే మనస్సు నుండి బిందువు బయల్వెడలుతోంది.
యోగి (మూలాధారము, స్వాధిష్ఠాన, మణిపూరకము, అనాహతము విశుద్ధము, ఆజ్ఞా - అనబడే) షట్ చక్రములను ఎరుగుటచే సుఖమండలమును ప్రవేశించగలడు.
ప్రవిశేత్ వాయుం ఆకృష్య, తథైవ ఊర్ధ్వం నియోజయేత్।
వాయుం బిన్దుం తథా చక్రం, చిత్తం చ ఏవ సమభ్యసేత్।
సమాధిం ఏకేన సమమ్
అమృతం యాన్తి యోగినః।
యథా అగ్నిః దారు మధ్యస్థో
న ఉత్తిష్ఠేత్ మథనం వినా,
వినా చ అభ్యాస యోగేన
జ్ఞాన దీపః తథా నహి।

ప్రవేశింపజేసిన వాయువును ఆకర్షించి అద్దానినే ఊర్ధ్వముగా నియోగించాలి.
వాయువును, బిందువును, చక్రమును, చిత్తము సమరూపముగా సమభ్యసించాలి.
సమాధి నందు వాటిని సమము, ఏకము చేయుటచే యోగులు ‘అమృతము’ను పొందగలరు. అనగా, మృత్యువు, దేహ దేహాంతరములు వారికి అవిషయము అగుచున్నాయి.
ఏ విధంగా అయితే కొయ్య యందు మధ్యగా ఉన్న అగ్ని మధనము లేకుండా ఉత్తిష్ఠత్వము పొందదో (బయట పడదో), ఆ విధంగానే అభ్యాసయోగము లేకపోతే జ్ఞానదీపము ఉత్తిష్ఠత్వము పొందదు.
ఘటమధ్యే యథా దీపో
బాహ్యే న ఏవ ప్రకాశతే,
భిన్నే తస్మిన్ ఘటే చ ఏవ
ద్వీప జ్వాలా చ భాసతే।
స్వ కాయం ‘ఘటమ్’ ఇత్యుక్తం।
యథా జీవోహి ‘తత్’ పదమ్,
ఘటములో (కుండలో) వెలుగుచున్న దీపము, బాహ్యమున కనబడదు. కుండకు భిన్నమై ద్వీపజ్వాల భాసిస్తోంది కదా! అట్లాగే, ఈ ‘కాయము’ ‘ఘటము’ అని చెప్పబడుతోంది. గురువాక్యమైనట్టి ‘‘తత్-త్వమ్’’ యొక్క పరమార్ధముచే → ఈ జీవుడే తత్‌పదము అధిరోహించినట్టి కేవల తత్ స్వరూపుడు. ఈ జీవుడు సర్వదా దేహమునకు వేరై ఆత్మజ్యోతి స్వరూపుడుగా వెలుగొందు చున్నాడు.
గురువాక్య సమం భిన్నే
బ్రహ్మజ్ఞానం ప్రకాశతే।
ఈ దేహమునకు భిన్నమై దేహి స్వరూపమగు తత్ పదాత్మ → గురువాక్య తాత్పర్యముచే బ్రహ్మజ్ఞాన ప్రకాశమై లభిస్తోంది.
కర్ణధారం గురుం ప్రాప్య
‘తత్’ వాక్యం ప్లవవత్
దృఢమ్।
పడవకు - ప్రజ్ఞ, సామర్ధ్యము గల కర్ణధారుడు (Boat Driver) ఉంటే, పడవ ప్రయాణం సుఖంగా, ప్రశాంతంగా హాయిగా సాగుతుంది కదా! గురువు, గురువాక్యములు - ‘‘నావను నడుపువాడు’’ - వంటివి.
‘‘తత్ త్వమ్ (నీ సహజ’ స్వరూపము - ఆత్మయే’’) - అను భావన, ‘సోఽహమ్’ అను అనునిత్య స్వాభావికానుభవము సిద్ధించటానికి గురువే మహత్ సామర్ధ్యము గల కర్ణధారుడు.
అభ్యాస వాసనా శక్త్యా
తరన్తి భవసాగరమ్।
యోగాభ్యాస-జ్ఞానవాసనల శక్తిచే - ఈ జీవుడు భవసాగరమును తప్పక దాటివేయగలడు. న తు సందేహః। ఇందులో సందేహమే లేదు.

ఇతి కృష్ణయజుర్వేదాంతర్గత యోగశిఖోపనిషత్ సమాప్తా
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।




కృష్ణ యజుర్వేదాంతర్గత

23     యోగశిఖ ఉపనిషత్

అధ్యయన పుష్పము


ప్రమాధ్యాయము

యోగ-జ్ఞాన సమన్వయము

ఒకానొక సందర్భములో హిరణ్యగర్భుడు, కమల సంభవవుడు, లోక పితామహుడు, సృష్టికర్త అగు బ్రహ్మదేవుడు → లోక కల్యాణమూర్తి, సర్వశుభంకరుడు, జగదీశ్వరుడు అగు పరమశివుని దర్శించారు. నమస్కృతులు సమర్పించారు.

హిరణ్యగర్భుడు : హే పరమశివ భగవాన్! లోకగురూ! అస్మత్ భక్తి యుక్తమగు ప్రణామములు స్వీకరించండి.

స్వామీ! నాచే సృష్టించబడుచున్న ఈ సర్వలోకములలో జీవులు ‘సుఖ-దుఃఖములు’ అనే మాయాజాలములో చిక్కుకుని, దారి కానక చరిస్తున్నారు. జన్మ-కర్మల పరంపరలతో ప్రయాణిస్తూ అనేక మానసిక జాడ్యములలో చిక్కుకొని ఉంటున్నారు.

ఓ దేవాదిదేవా! వారి యొక్క ముక్తికి మార్గమేమిటి?
- మాయాజాలము నుండి బంధవిముక్తి ప్రసాదించగల సర్వసిద్ధికరమగు మార్గము ఏది?
- జన్మ-మృత్యు-జరా-వ్యాధి బాధలను ఉపశమింపజేయు సుఖప్రదమైయున్న త్రోవ ఏది?

హే శంకర భగవాన్! దయతో వివరించండి.

మహేశ్వరుడు : అవును! ఈ జీవుడు ఆయా సందర్భ మాత్ర సంబంధమైన స్వీయకల్పిత ప్రకృతి స్వరూపములలో తదాత్మ్యము చెందుచూ, అనేక ఉపాధులలో ప్రవేశ-నిష్క్రమణములను చేస్తూ ఉన్నాడు. ఏవేవో ఏక-అనేక మార్గముల వెంట వెళ్లటం జరుగుతూ ఉంటోందయ్యా! అనేక మార్గాణ్వేషణములలో నిమగ్నుడు అవటం చేతనే తన యొక్క కేవలీస్వరూపమునకు సంబంధించిన ‘కైవల్యము’ అనే పరమపదమును పొందలేకపోవుచున్నాడు. ఓ పద్మసంభవా! ఈతడు సిద్ధిమార్గంలో ఏకాగ్రతగా ప్రయత్నశీలుడు కావాలి. అట్లా కాకుండా, ఏకాగ్రత లేకుండా, నడుస్తూ ఉండటంచేతనే కైవల్యము లభించటం లేదు.

అట్టి మోక్షపదమును సిద్ధించుకోవటానికి శాస్త్రజ్ఞానం ఒక్కటే సరిపోదు. యోగాభ్యాసము తప్పక కావాలి.

కొందరు శాస్త్రములను మాత్రమే ఆశ్రయిస్తూ ‘తెలుసుకోవటం’ అనే సుదీర్ఘప్రయత్నంలో నిమగ్నమై ఉపాధులు గడుపుచూ ఉన్నారు. ‘‘అనుకోవటము’’, ‘‘అనిపించటము’’ అనే మార్గంలో అభ్యాసమును ఆశ్రయించకపోతే ఎట్లా? అట్టి ‘‘ప్రజ్ఞ (తెలివి)’’ (లేక) ‘తెలుసుకోవాలి’ అనే ప్రయత్నంలో మోహితులై, శాస్త్రములకు పరిమితులై ఉండిపోతున్నారు. ఆత్మ శాస్త్రములలో ఉన్నదా? లేదు. మరెక్కడున్నది? వాటిని పఠించే ఆ పాఠకునియందు సర్వదా స్వయం ప్రకాశరూపమై ఉన్నది. మరి ఆత్మ శాస్త్రముల చేత ఎట్లా ప్రకాశించబడుతుంది చెప్పు?

బ్రహ్మదేవుడు : ఆత్మానుభూతి - శాస్త్రములలో లభించదంటారా? ప్రభూ!

మహేశ్వరుడు (మహాదేవుడు) : శాస్త్రములు ఆత్మ గురించి సూచిస్తున్నాయి. అభివర్ణిస్తున్నాయి. దారిచూపుచున్నాయి. అయితే ఆత్మ ఉన్నదెక్కడ? దర్శించుకోవలసినది, సాక్షాత్కారము పొందవలసినది ఎందులో? వినండి.

‘‘నిష్కళము, (కళంకరహితము), అత్యంత నిర్మలము, పరమ శాంతము, దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారాదులన్నిటికీ సర్వాతీతము, సర్వ విషయములకు మునుముందే ఉన్నట్టిదగుటచే నిర్విశేషము- నిరామయము..’’ అగు ‘తత్’ శబ్దార్ధమగు పరమాత్మయే ‘జీవరూపము’ అనే అంశను స్వయముగా స్వీకరించుచున్నది. (It is like accepting a ‘Role’ in a Drama, or a Role in office - home - playground - group of Friends etc.). పరమాత్మ నుండి బయల్వెడలిన అంశరూపుడగు జీవుడే పుణ్య-పాప కర్మఫలములను అనుభవిస్తున్నాడు. అంతమాత్రంచేత ఆత్మ తన యొక్క స్వరూప - స్వభావములు కోల్పోవుచున్నదా? లేదు. ఏ మాత్రమూ ఆత్మ పరిమితము అగుటలేదు. తనయొక్క స్వాభావికములగు అఖండత్వ, అప్రమేయత్వ, నిత్యత్వ, సత్యత్వములను యథారీతిగా కలిగియే ఉంటోంది.

బ్రహ్మభగవానుడు : పరంధామా! శివభగవాన్! ఇప్పుడు రెండు విషయాలు నాకు చమత్కారంగా కనిపిస్తున్నాయి.

(1) పరమాత్మపదము నిత్యము అయినది కదా! మరి అట్టి పరమాత్మ ఏ విధంగా జీవాత్మత్వము, జీవాత్మపరిమిత సుఖ-దుఃఖ-జీవన్- మరణాది లక్షణములు- ఇవన్నీ ఆపాదించుకొని పొందుచుండటం జరుగుతోంది?

(2) తత్త్వాతీతమగు నిర్మలాత్మకు దోషములు ఎందుకు, వచ్చిపడుచున్నాయి? ఎందుకు అల్ప-అజ్ఞాన దశలు, అల్ప జన్మలు సందర్భమౌతున్నాయి?

హే మహాదేవా! ఈశ్వరా! ఈ విషయాలు దయతో - కథయ! - వివరించి చెప్పండి.

పరమశివుడు : వస్తురహితము, నిర్మలము, శూన్యము (పదార్థరహితము) అగు ఆకాశమునందు వాయువు, వాయుతరంగాలు ప్రదర్శితమగుచూ బయల్వెడలుచున్నాయి కదా! (శూన్యంలో చలనములు). అట్లాగే, సర్వభావములకు ఆవల భావనలకు ఆది రూపము, భావనారహిత రూపము, సర్వపదములకు మునుముందే ఉన్నట్టిది (That which is prior to all positional aspects), కేవలము (Absolute) - అగు ‘ఆత్మాకాశము’లో అహంకారము, ఆ అహంకారము నుండి ‘‘నేను కర్మలను నిర్వర్తించువాడను కర్తృత్వము కలవాడను, కర్తను’’ అను రూపంగా - వ్యవహార సరళి అంతా బయల్వెడలుతోంది. అట్టి ‘అహమ్‌కృతమ్’ లేక ‘అహంకారము’ - అనేక కల్పిత వస్తువులకు జనన స్థానమగుచున్నది.

→ భూ (Solid)-జల (Liquid)-అగ్ని (Heat)-వాయు (Vapour, movement) - ఆకాశ (Placement, space) రూపములగు పంచాత్మకములు, వాటి సమ్మేళనముల రూపమగు భౌతిక రూపములు, దేహపిండములు. (Materialistic Forms),

→ ఆలోచన (Thought)-తెలివి (Intelectual)-ఇష్టా యిష్టములు (Likings)-‘నాది’ అనే భావము గల భావనలు (Possessing) , వాటివాటిని తమ ప్రదర్శనములుగా కలిగియున్న మనో-బుద్ధి-చిత్త-అహంకారములు-(అభూతంపిడములు-Non-materialistic Formations),

→ చర్మము, రక్తము, మాంసం, బొమికలు, మజ్జ, క్రొవ్వు-మొదలైన రూపములు గల ధాతువులు, వాటి వాటి ధర్మ విశేషములు (Functional Features),

→ సత్త్వము - రజము - తమము అని చెప్పబడుచున్న త్రిగుణములు, గుణాత్మకమైన విశేషపరంపరలు,

→ ఇష్ట-అయిష్టములు, వాటి వలన ఏర్పడే సుఖ-దుఃఖములు - ఇవన్నీ రూపము పొందుచున్నాయి.

జీవభావము

వీటన్నిటితో కూడిన జీవభావము అంకురించుచున్నది. ‘‘నేను జీవుడను. పరమితుడను. బద్ధుడను. అల్పుడను. స్వల్పుడను, దోషుడను’’.. మొదలైనవన్నీ ‘జీవ-భావన’ చుట్టూ అలుముకోసాగుచున్నాయి. నిరాకారము అగు సముద్రజలంలో సాకారములగు తరంగములు బయలుదేరు విధంగా అపరిమితము - మహత్తరము అగు ‘పరమాత్మ’ అనే మహాసముద్రంలో ‘జీవాత్మలు’ అనే తరంగాలు బయల్వెడలుచున్నాయి. ఆ జీవాత్మ అనేక సుఖ-దుఃఖభావనలచే, ఆశయములచే, అనుభూతములచే నిబద్ధము అగుచున్నది.

ఈ విధంగా విశుద్ధుడగు పరమాత్మ పట్ల ‘జీవబద్ధుడు’ అనే ఆపాదన (Attribution) చేయబడుతోంది. నాటకము జరుగుచుండగా, నాటకములోని పాత్ర యొక్క గుణములు, ధర్మములు నటుడిపై ఆరోపించి జనులు చూచువిధంగా, అనంతుడగు పరమాత్మ యొక్క ఒక అంశ అగు ఈ జీవాత్మ ధర్మములు పరమాత్మపై ఆరోపించబడి, పరమాత్మను జీవాత్మగా చూస్తూ ఉండటము జరుగుతోంది.

జీవాత్మ దోషములు

కామము : లేనిదేదో కావాలి. వాళ్లు అట్లా ఉండాలి. వీళ్లు ఇట్లా ఉండకూడదు. ఇది ఇట్లా జరగాలి. అది అట్లా జరగకూడదు - మొదలైన అభినివేశములు (Wishes, expections, desires, Anticipations, wants etc.)

క్రోధము : (ఆవేశపూరితమైన రాగ-ద్వేషములు. ఏదైనా ఒకే సందర్భముపై మూడుసార్లు కోపం వస్తే అది ‘క్రోధము’గా చెప్పబడుతోంది).

భయము : ‘‘ఉన్నదేదో పోతుందేమో ! అనుకున్నవి జరుగవేమో! అనుకోని విపత్తులు వస్తాయేమో! నాది నాది కాకుండా పోతుందేమో! ఎవ్వరివలనన్నా నష్టం వస్తుందేమో!’’ మొదలైన అనేక ఉద్వేగతాపముల రూపము.

ఇచ్ఛ : కొందరంటే ఇష్టం. మరికొందరిపై అయిష్టం. ఏదో పొందాలనే తపన. ఏదైనా లేకపోతే బాధ. ‘నాది’ అనే భావన.

మోహము : కొన్ని పరిమిత విషయములను బద్ధుడై భ్రమించి ఉండటం. అసమగ్రమైన అవగాహన. లేనిది ఉన్నట్లుగాను, ఉన్నది లేనట్లుగాను దర్శించటము, స్పందించటము.

లోభము : ‘నాది’ అని దాచుకోవటము. ఇతరులతో పంచుకోవలసినది పంచుకోకపోవటము. ఉన్నది పోతుందేమోనన్న తపన. వస్తు- విషయ-బంధు జన విషయాలలో ‘‘నాకే / చెందినది’’ - అను ఉద్వేగము.

మదము : తనకు ఉన్న దానిని చూచి గర్వించటము. ఇతరులను చిన్నచూపు చూడటము. తనను తాను ప్రత్యేకమైనవాడిగా భావించటం.

మాత్సర్యము : ఇతరులను బాధించటము. హింసించటము. అవమానించటము. ఇతరులపై పగ, ద్వేషము, అసూయ.

రజము : ‘‘ఏదో చేయాలి! తిరగాలి! పొందాలి! కావాలి!’’ - అను రూపము గల పనిచేయాలనే వ్యసనము.

జన్మ-మృత్యుశ్చ స్థితిగతులు : ‘‘నేను పుట్టుచున్నాను. చచ్చుచున్నాను. పుట్టేవాడిని. చచ్చేవాడిని’’ - అను దేహసంబంధమైన వివశత్వము, విహ్వలము.

కార్పణ్యము : ‘‘నా వారికి ఏమౌతుందో, ఏమో? ఎట్లాగో? ఏమో?’’.. అనే రంధి. బెంగ. మమకారము. జాలితో కూడిన వేదన- భయములు. ఎప్పుడేమౌతుందోననే అనుమానము. తనపై తానే జాలిపడటం ‘‘ఇక ఏం గతి?’’ అని ఆదుర్దా పడటం.

శోకము : బాధపడటం. ఈసురోమంటూ కూర్చుని ఉండటం. ఏవేవో జ్ఞాపము తెచ్చుకొని దుఃఖము, వేదన కలిగి ఉండటము.

తన్ద్రా : అలసత్వము. బద్ధకము. అశ్రద్ధ. అతినిద్ర.

క్షుధా-తృషా : ఆకలి-దప్పికలు. ఏదో తినాలని, వేదన పడటం. ఎల్లప్పుడు లేనిపోని వాటి కోసం ఆతృత.

తృష్ణా : అంతులేని కోరికలు. దాహము. పొందలేదనే వేదన.

లజ్జా భయమ్ : ‘‘నేనింతేనా? ఇంత తక్కువవాడినా? ఏం, వాళ్లు అంతటివారే! మరి నేను ఇదేమిటి?’’.. అని సిగ్గుపడటం. తనను తాను తక్కువ చెప్పుకోవటం. ఇతరులను చూచి భయపడే స్వభావం.

దుఃఖమ్ : ఏదో లేదనే వేదన. ఎప్పుడు బాధపడుచూ ఉండటం. ప్రతి దానికీ ఆదుర్దా (Worry) పొందటము.

విషాదో : దుఃఖ - అవమాన సంఘటనలను మననం చేస్తూ అసంతృప్తిగా ఉండటం.

హర్షము : వాటిని వీటిని చూచుకొని గొప్పగా భావించటం. అతి సంతోషము. సంపదలను, పాండిత్యము మొదలైన వాటిని చూచుకొని మురియటము.

ఓ బ్రహ్మదేవా! ఇవన్నీ కూడా ఈ జీవుడు తన పట్ల తెచ్చిపెట్టుకొన్న దోషములు. ఎవ్వడు ఈఈ దోషముల నుండి విముక్తుడౌతాడో, ఆ జీవుడే ‘శివుడు’ అని చెప్పబడతాడు. జీవో శివః।।


స జీవో ‘శివ’ ఉచ్యతే।

బ్రహ్మదేవుడు : అవును. మీరు చెప్పుకొస్తున్న దోషములన్నీ ఈ జీవుడు కలిగి ఉంటున్నాడు. మరి ఆ దోషములు పోయేది ఎట్లా? ఈ జీవుడు నిర్మలుడు, దుఃఖరహితుడు అయ్యేది ఏతీరుగా? తన సహజానంద స్వరూపమును గమనించి ఎట్లా ఆనందించగలడు?

పరమశివుడు : హే బ్రహ్మ భగవాన్! ఈ జీవుని పట్ల పరిస్థితి దుఃఖభూయిష్టమై యున్నది కాబట్టి, అటువంటి (ఇప్పుడు మనము చెప్పుకొన్న) దోషముల నివారణ కొరకై ఈతడు ఉపాయము తప్పక ఆశ్రయించాల్సిందే! అట్టి ఉపాయముల గురించి చెప్పుకుందాము. అందుకు రెండు ఉపాయాలు.

(1) జ్ఞానము - శాస్త్ర సమాచారములు సంపాదించుకోవటము. ఆత్మ గురించి ఆత్మజ్ఞులు ఏమి చెప్పుచున్నారో విని, ఆకళింపు చేసుకోవటము (Getting wel-informed) . విచారణ - సత్సంగము, జిజ్ఞాస.
(2) అభ్యాసము : (Practising) యోగాభ్యాసము. (భక్తి-క్రియా-కర్మ-భావనా యోగాభ్యాసములు)

బ్రహ్మదేవుడు : జ్ఞానము - యోగ-అభ్యాసములలో ఏది సులభము? దేనివలన ఈ జీవుడు త్వరగా, తేలికగా ‘‘నిర్మలమగు ఆత్మయే నేను’’ - అనే అనుభవము సిద్ధించుకోగలడు? జ్ఞానము గొప్పదా? యోగాభ్యాసము గొప్పదా? ఏది తేలిక? దేనితో తక్కువ శ్రమతో ‘‘ఆత్మానుభవి’’ కాగలడు?

పరమశివుడు : కొందరు ‘‘జ్ఞానమే శ్రేష్ఠము. జ్ఞానాదేవతు కైవల్యమ్।। జ్ఞానము వలననే మోక్షము’’…. అని నొక్కివక్కాణించి చెప్పుతూ ఉన్నారు. ‘‘ఇంక వేరే మార్గము లేదు. జ్ఞానమే ఉపాయం’’.. అని వారి ప్రగాఢమైన ఉద్దేశ్యము. ‘‘తెలుసుకోవటము వలననే మోక్షము’’ - అని సిద్ధాంతీకరిస్తున్నారు.

అయితే…,
ఒకడు గ్రంథముల నుండియో, గురువులు మొదలైనవారు ‘ఆత్మ’ గురించి చెప్పుతూ ఉండగానో, చదువుటచేతనో, వినుటచేతనో - తెలుసుకుంటూ ఉంటే సరిపోతుందా? ఆత్మ గురించి తెలుసుకొన్నది స్వయముగా తనకు స్వాభావికంగాను, అనుక్షణికంగాను కారణాతీతంగాను అనిపించాలి కదా? తనకు అనిపించకుండా తెలుసుకొని, విని, మాట్లాడగలిగినంత మాత్రంచేత ఏమి ప్రయోజనం? యోగ హీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ఇహ భో? ఆత్మ విషయం విని, తెలుసుకొని, (అటుపై) ‘యోగసాధన’కు ఉపక్రమించకపోతే, అప్పుడు దృశ్యవిషయములతో బంధవిముక్తిరూపమగు మోక్షము ఎట్లా లభిస్తుంది, చెప్పండి? అందుచేత మరికొందరు ‘‘యోగాభ్యాసము లేకుండా, కేవలము జ్ఞానము వలన సిద్ధి లభించదు’’ - అని సిద్ధాంతీకరిస్తున్నారు. ఇది కాదనటానికి వీలు లేదు. విన్నది అనుకోవాలి. అనుకున్నది అనిపించాలి. అనిపించటటానికి ‘యోగాభ్యాసము’ అత్యవసరమే!

యోగాభ్యాసం నిర్వర్తిస్తూ - జ్ఞానముతో పనిలేదని అనగలమా? లేనేలేదు. ‘యోగాభ్యాసము’ మాత్రమే ఆశ్రయిస్తూ, ఆత్మజ్ఞానము పొందకపోతే ‘మోక్షము కొరకు కర్మలు’ అను దానికి అంతుఎక్కడ? అందుచేత, యోగోఽపి జ్ఞానహీనస్తు న మోక్ష క్షమో మోక్షకర్మణి! యోగి జ్ఞానహీనుడైతే యోగాభ్యాసములకు ముగింపు ఎక్కడ? అంతు అనేదే ఉండదు.

జ్ఞానం చ - యోగం చ

అందుచేత…, తస్మాత్ జ్ఞానం చ యోగం చ ముముక్షుభిః దృఢమ్ అభ్యసేత్! ముముక్షువు (1) జ్ఞానము (2) యోగము → ఈ రెండిటినీ కూడా ఒక్కసారే దృఢముగా అభ్యసించవలసిందే. పక్షి రెండు రెక్కలతో ఆకాశంలో విహరించు తీరుగా, ఈ జీవుడు జ్ఞాన-యోగముల సహాయం చేతనే మోక్షాకాశంలో విహరించగలడు.

జ్ఞానైక సాధనం జ్ఞేయమ్!

మొట్టమొదటిది జ్ఞానమే అయి ఉన్నది. ఎందుకంటే జ్ఞేయము అయినట్టి ఆత్మ తెలియబడేది జ్ఞానము చేతనే. జ్ఞానమే ముఖ్యసాధనము. ఆత్మ జ్ఞానస్వరూపమే అయి ఉన్నది కదా! ఆత్మను ‘అజ్ఞానము’ ఆవరించి ఉండటం చేతనే ఆత్మానుభవము అనుభూతమవటం లేదు. ‘‘అజ్ఞానము అనగా ఏమి? అద్దాని రూపమేమిటి?’’ అని ముముక్షువు మొట్టమొదట సుదీర్ఘవిచారణకు ఉపక్రమించాలిసిందే.
- ఏది సందర్భమాత్ర రూపము?
- ఏది నిజరూపము?
అని పరిశీలించి, అప్పుడు తన నిజరూపము ఏమిటో తెలుసుకొన్నప్పుడే ‘కేవలము’ అయినట్టి ‘‘కైవల్య-పరమపదము’’ను ఈజీవుడు సిద్ధించుకోగలుగుతాడు.

‘ఆత్మమేవాఽహమ్’ భావన నిర్ద్వంద్వంగా సంకోచ రహితంగా సిద్ధించేది ఎట్లా?
ఈ జీవుడు కామ-క్రోధ-భయ ఇత్యాది దోషములు తొలగినప్పుడే కైవల్యమును సిద్ధింపజేసుకోగలడు. అటువంటి అనేక దోషములచే ఈతడు ఆవృతుడు (sorrounded) అయి ఉండగా, ఆత్మతత్త్వ సమాచారము సంపాదించుకొని మాత్రం ఏం లాభం? జ్ఞానమాత్రం చేత క్రోధము, భయము, ఆవేశము, ఆశ-నిరాశ-దురాశలు-ఇవన్నీ తొలగిపోతాయా? లేదు. మరి అట్టి సంసార దోషములను మొదలంట్లా తొలగించుకోవాలి కదా! ‘‘ఇది మనస్సు. ఇవి మానసిక దోషములు, ఇది బుద్ధి. ఇవి బుద్ధి దోషములు’’ - అని తెలుసుకుని కూడా, అవి తొలగనంత వరకు - తెలిసి మాత్రం ఏం ప్రయోజనము?

విధి-నిషేధములు :

‘‘జ్ఞానము’’ (తెలుసుకోవటము) అనునది దేని గురించి? (ముముక్షువు యొక్క) స్వస్వరూపము గురించే కదా?

❆ ‘స్వాత్మ’ యొక్క రూపము - కేవల జ్ఞానరూపము. (That which is knowing all else . Is beyond knowing as well as beyond what is being known.)
❆ స్వస్వరూపము సర్వదా పూర్ణము. సర్వము తానే అయినట్టిది. సర్వవ్యాపకము.
❆ కామక్రోధ - ఇత్యాది దోషములు కూడా స్వాత్మకు భిన్నము కాదు. అనగా, ఆత్మకు అవి భిన్నత్వము కలిగించలేవు. ఆత్మ సర్వదా అఖండము. అప్రమేయము. నిత్యము. యథాతథము కూడా.

ఈ విధంగా ఎప్పుడైతే ఈ జీవుడు స్వస్వరూపాత్మ యొక్క ఔన్నత్యమును తెలుసుకొని అనునిత్య-స్వానుభావముగా చేసుకుంటాడో, ఆ తరువాత, పశ్చాత్ తస్య విధిః కిన్ను? నిషేధోఽపి కథం భవేత్? ఆత్మ స్వరూప జ్ఞానము సిద్ధించుకున్న వానికి, ఇక ఆతడు- ‘‘ఈ ఈ కర్మలు, సాధనలు నిర్వర్తించాలిసిందే!’’ - అని విధి ఏముంటుంది. ‘‘ఇదిగో! ఈఈ కర్మలు చేయకూడదు’’ అనే నిషేధము మాత్రం ఏమి ఉంటుంది?

నిత్యానిత్య వ్యవహారముల తత్త్వమేమిటో తెలిసికొనియున్న వివేకి- నిత్యముక్తుడు. యోగి - ‘‘ఆత్మగా నేను నిత్యముక్తుడను’’ అని ఎరిగినవాడై ఉంటున్నాడు. తత్‌పూర్ణుడు గా తానే అగుచూ సర్వమునకు స్ఫూర్తి రూపుడుగా తనను తానే ఎరుగుచున్నాడు. సంసార భ్రమంతా తొలగిపోవుచున్నది. ఈ సంసారము నందు (లేక) జగత్ దృశ్యమునందు దోషములు ఉండవచ్చు (లేక) ఉండకపోవచ్చుగాక! ఆత్మకు ఏ దోషము అంటదు. మనస్సు దృశ్యములో ఇటూ అటూ తిరుగాడుచున్నది. ఆత్మ ఎప్పుడూ కూడా తిరుగాడు ధర్మమే లేనట్టిది. స్వప్నములో ఒకడు ఎక్కడికో వెళ్లి వచ్చినంత మాత్రం చేత ఆతడు అక్కడికి వెళ్లి వచ్చినట్లా? కాదుకదా! అట్లాగే ఆత్మకు రాకపోకలు లేవు. సంసారిక దోషములు అంటజాలవు. సమస్తమునకు అప్రమేయము కూడా.

Ⅰ. జీవాత్మగా → ‘‘స-కలము’’. దృశ్య సహితము. ద్రష్ట సహితము - ‘కలినా స్ఫూర్తి రూపేణ సంసార భ్రమతాంగతమ్’
[జీవాత్మ → కల్పనచే స్ఫూర్తి రూపంగా సంసారము నందు అనేక భ్రమభావములతో తిరుగాడుచున్నది. అయితే, ఆకాశమువలె సర్వము తనయందే కలిగి యున్నది। గగనోపమమ్।]

Ⅱ. పరమాత్మగా → నిష్కలము దృశ్య-ద్రష్టల రహితము. కేవలము - నిర్మలము - సాక్షాత్ స్వరూపము. ఆత్మ సర్వదా పూర్ణము. కనుక ఉభయరూపములు సర్వదా కలిగియే ఉన్నది. అయ్యే ఉంటోంది.

నిష్కళము, నిర్మలము, ఉత్పత్తి స్థితి సంహార సామర్థ్యము కలిగియున్న కేవలాత్మ - స-కలము, అయి, ఉత్పత్తి స్థితి సంహార వివర్జితము అగుచున్నది. ఆత్మ విద్యను మరల మరల త్యజించి సంసార మోహ సాగరంలో ఎట్లా పడుతోంది? ఎంతటి చమత్కారం?

జ్ఞాని - అజ్ఞాని - సంసారము

‘అజ్ఞాని’ ఏ విధంగా సుఖ-దుఃఖాది మోహ సంసారంలో పడుచున్నాడో, అదే తీరుగా (ఆత్మ సమాచారము విని, తెలుసుకొని ఉన్న) ‘జ్ఞాని’ కూడా ఆత్మ విచారణ చేస్తూ ఉన్నప్పటికీ, వాసనల కారణంగా సంసార పరిధుల నుండి బయల్వెడలలేకపోవుచున్నాడు. యోగాభ్యాసము లేకపోయినప్పుడు ఆత్మ సమాచారము లేని అజ్ఞాని, ఆత్మసమాచారము గల జ్ఞాని…. ఇరువురిలో సంసారబంధములు ఒకే తీరుగా ఉంటున్నాయి. ఇద్దరికీ తేడా లేదు. ఆత్మసమాచారము తెలిసినంతమాత్రం చేత (ఇదంతా ఆత్మయేకదా - అని తెలిసియున్నప్పటికీ) పూర్వజన్మ-పునర్జన్మ సంస్కారాలు కారణంగా సంసారిక చేష్టలు మరల మరల వెంటనంటియే ఉంటున్నాయి.

ఒక ఆత్మజ్ఞాన నిష్ఠకలవాడు - విరక్తుడు అయి కూడా, ధర్మజ్ఞుడు అయి ఉండి కూడా, ఇంద్రియములను జయిస్తూ ఉండి కూడా, ‘యోగనిష్ఠ’ లేకపోవటం చేత, మరల మరల ఇంద్రియ- ఇంద్రియ విషయ పరంపరలచే జయించి వేయబడుచూనే ఉంటున్నాడు. ‘‘నేను ఇంద్రియములకు నియామకుడను. అంతేగాని,, బద్ధుడను కాదు. సర్వదా నిత్య నిర్మలము - సర్వము - అఖండము అగు ఆత్మ స్వరూపుడనే నేను!’’ - అను అవగాహన స్థితి కేవలము జ్ఞాన సముపార్జనచే సిద్ధించేది కాదు. అందుకు యోగాభ్యాసము తప్పక అవసరము. శ్రవణము మాత్రమే సరిపోదు. మనన, నిదిధ్యాస, సమాధిస్థితులు సిద్ధింపచేసుకోవాలి, మరి!
ఈ దేహధారులు రెండు తీరులు అయి ఉంటున్నాయి.

(1) ‘‘అపక్వా’’ : ఆత్మ జ్ఞానము తెలుసుకొంటున్నవారు. కానీ, బుద్ధి యోగశుద్ధిచే పరిపక్వము కానట్టివారు. తెలుసుకొన్న ఆత్మజ్ఞానము ఇంకా స్వానుభవము కానట్టివారు.
(2) ‘పక్వా’ : జ్ఞానము యోగాభ్యాసముచే జ్ఞేయముగా (అనునిత్య - స్వానుభవముగా) తీర్చిదిద్దుకున్నవారు. ‘‘మత్తః పరతరమ్ నా నాన్యత్ కించిదస్తి! అహమ్ సర్వస్య ప్రభావో’’ - అని ఎరిగి), ఆస్వాదించువారు.

యోగాభ్యాసముచే - దేహములో యోగాగ్ని జనిస్తోంది. క్రమంగా ఆ యోగి పక్వుడు, అజడత్వముచే శోకరహితుడు (Win over all kinds of worries) - అగుచున్నాడు.

అపక్వుడో, ‘జ్ఞేయుడు’ (జ్ఞాన సమాచారము కలిగియున్నవాడు) అయినప్పటికీ జడత్వముచే పార్ధివదేహము వలన దుఃఖములను పొందుచున్నాడు. ధ్యానస్థుడు అయి కూడా ఇంద్రియములకు వివశత్వము వదులుటలేదు. గాఢమైన ఇంద్రియ నియములు (ఉపవాసము, ఆహార నియమములు, వ్రతదీక్షలు మొదలైనవి) ఆశ్రయిస్తూ ఉన్నవాడై కూడా, బాహ్య (ఇంద్రియ) విషయములచే బాధింపబడుచూనే ఉన్నాడు. అయోగి యొక్క శరీరము శీత-ఉష్ణముల చేతను, సుఖ-దుఃఖములచేతను, ఆధి (మానసిక రుగ్మతలు) - వ్యాధి (శారీరక రోగములు) చేతను బాధింపబడుచున్నది. మానసికమైన, తదితర సాంఘికమైన ఆయా బాధించే సంగతి - సంబంధ - సందర్భములచేతను, ఇంకా అనేక అన్యమగు నానావిధ బాధల చేతను ఆతని చిత్తము సంక్షోభితము అగుచూనే ఉంటోంది. ప్రాణాపాయములు బాధిస్తూనే ఉంటున్నాయి. ఈ విధంగా జ్ఞాన సమాచారము కలిగి ఉన్నప్పటికీ ఆతని చిత్తము వందలాది దుఃఖ వ్యవహారములలో వ్యవహరిస్తూ, జీవించి ఉన్నంతకాలము అనేక సంక్షోభములు పొందుచూనే ఉన్నది.

ఇది ఇట్లా ఉండగా, ఈ భౌతిక దేహము నశించబోవు సందర్భము ఉండనే ఉన్నది కదా! అట్టి దేహావసాన సమయములో ఏమగుచున్నది? దేహావసాన సమయే చిత్తే యత్ యత్ విభావయేత్, తత్ తత్ ఏవ భవేత్ జీవ, ఇత్యేవం జన్మకారణమ్!

దేహము అవసానము (The end) పొందుచున్న సమయానికి ఈ జీవుడు - ఏఏ గుణములు, లక్షణములు, స్వభావములతో కూడిన చిత్తము - కలవాడై ఉంటాడో,.. ఆ చిత్తమును అనుసరించియే పునః పునః జన్మలు పొందటము కొనసాగుతోంది. తదనంతర ఉపాధులు ఏఏ రీతులుగా ఉండబోవుచున్నాయో.. ఈ జీవునికి వర్తమానంలో ఊహకు అందటమే లేదు. తస్మాత్ జ్ఞానం చ వైరాగ్యం జీవస్య కేవలం శ్రమః! కాబట్టి యోగభ్యాసము లేకుండా కేవలము జ్ఞానము, వైరాగ్యము (విరాగము) సంపాదించి ఊరుకుందామని అనుకుంటే, అదంతా ఈ జీవునికి వృధా శ్రమయే - అవగల అవకాశమున్నది.

ఒక చీమ ఆహారం కోసము, దేహరక్షణ కోసము పరితాపాలు పొందుచూ ఒకాయన దేహముపై ప్రాకుచూ ఉండగా, ఆ స్పర్శకు స్పందించిన ఆయన చేతితో విదిలించగానే ఆ చీమ ఎటో పడిపోతూ ఉంటుంది కదా! అట్లాగే అనేక లోకసంబంధమైన ‘విషయములలో మునిగితేలుచున్న ఈ మానవుడు ఆ విషయ వృశ్చికములచే (తేళ్లచే) బాధలు పొందుచూ, దేహపతనానంతరం ఏవేవో తెలియరాని ఉపాధులలోకి విసరివేయబడుచున్నాడే! అందుచేత మూఢత్వము, మూర్ఖత్వము వదలక, మిథ్యాతర్కములు (Logics that lead to some more illusions) కొనసాగిస్తూ జీవితము గడపువాని పట్ల, ఆయుష్షు, అవకాశములు వృధా అగుచున్నాయి. ఆత్మలాభమునకు అవకాశమున్న మానవ దేహము పొంది కూడా, ఆతడు ‘ఆత్మ’ గురించి స్వానుభవముగా ఎరుగక ‘మూఢుడు’ గానే దేహము వదలుచున్నాడు.

ఎప్పుడైతే ‘అహంకారము’ - నశించినదిగా అగుచున్నదో, అట్టివానికి దేహభావము కూడా నశించుచున్నది. యోగాభ్యాసముచే దేహమే నశించిన వస్తువుగా దర్శించువాని పట్ల ఇక దేహవ్యాధులు ఏమి చేస్తాయి? దేహమును భస్మమాత్రంగా, భస్మభూషితాంగములుగా చూచువానిని- శస్త్ర-జల-అగ్ని ఘాతములు కూడా బాధ కలిగించలేవు. ఏ ‘‘నేను - నాది’’ రూపమగు ‘వ్యష్టి అహంకారము’ జన్మ-జన్మల సంకల్పరూప సంసారవృక్షమును ఆశ్రయించి అనేక దుఃఖపరంపరలను పొందుచున్నదో, అట్టి సంకుచిత (పరిమితాహంకారము) క్షీణించుచుండగా, క్రమంగా సర్వ శారీరక, మానసిక, బుద్ధి సంబంధమైన రుగ్మతలు నశించగలవు. ఎక్కడైనా కూడా, కారణము నశిస్తే, దానితో బాటే కార్యము కూడా నశిస్తుంది కదా? కారణేన వినా కార్యం న కదాచన విద్యతే! ‘‘శరీరము యొక్క ఉనికి (ఉన్నది- అను భావన) - అనే కారణమే నశించిన తరువాత ‘శరీర బాధలు’ అనుదానికి ఉనికి ఎక్కడుంటుంది? ‘అహంకారము’ నశిస్తే దేహము యొక్క ఉనికి, అది బాధించగలగటం కూడా స్వభావంగానే తోక ముడుస్తాయి.

హే బ్రహ్మ భగవాన్! అయోగికి ఈ శరీరము సర్వ సంసార బంధములకు ముఖద్వారము అగుచున్నది. యోగికో? ఇదే భౌతిక దేహము సర్వసంసార బంధములు త్రెంచివేయుటకు మహత్తరమగు ఉపకరణం. అందుచేత యోగ్యాభ్యాసం అత్యవసరం.

శరీరేణ జితాః। సర్వే, శరీరం యోగిభిః జితమ్।। జీవులందరూ ‘శరీరము’ అనుదానిచే జయించివేయబడుచున్నారు. యోగి శరీరమునే జయించినవాడై ఉంటున్నాడు.

శరీరమే జయించబడిన తరువాత, ఇక అట్టి యోగికి కర్మఫల సంబంధమైనట్టి సుఖ-దుఃఖములు ఎక్కడివి? అవి జాడలేనివిగా అగుచున్నాయి. ఎవ్వడైతే యోగాభ్యాస బలంచేత ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, కామ-క్రోధములను జయించి తన చెప్పుచేతలలో ఉంచుకుంటాడో, అట్టివాడు సర్వమును జయించివేసినట్లే. ఇక ఆతనిని బాధించగల సత్తా దేనికి ఉంటుంది? దేనికీ ఉండదు. యోగబలము గలవానికి మరణం ఎక్కడిది? ‘జన్మ’ అనునదే ఆతని పట్ల లేని వస్తువగుచున్నది. ‘‘నాకు దేహము వస్తూ పోతూ ఉండవచ్చు గాక! నేను దేహముతో పుట్టను. దేహముతో చావను’’.. అనునది యోగబలం చేతనే ‘‘స్వకీయ సునిశ్చిత - అనుక్షణికానుభవము’’ అవుతోంది. హరేన మృత ఏవా సౌ, మృతస్య మరణం కుతః! ఆతడు యోగాగ్నిచే మరణమునే హరించి వేసి ఉంటాడు. ఇక ఆతనిపట్ల మరణం అనునది ఎక్కడుంటుంది?

శ్లో।।  మరణం యత్ర సర్వేషాం, తత్రాసౌ పరిజీవతి!  
    యత్ర జీవతి మూఢస్తు తత్రాసౌ మృత ఏవ వై।।

అజ్ఞాన-జీవులంతా ఎక్కడ మరణానుభవము పొందుచున్నారో, అక్కడ - జ్ఞానసమాచారమును యోగాభ్యాసముతో అనుభవముగా తీర్చిదిద్దుకొన్న యోగి, యోగ-జ్ఞానముల బలముచే ముక్తిని సిద్ధించుకున్నవాడై- జీవించియే ఉంటున్నాడు. ఎక్కడ అయోగులగు, అజ్ఞానులగు జీవులు ‘మేము జీవిస్తున్నాము’ అను అనుభవముతో ఉంటున్నారో, అక్కడ వారు, ‘సర్వదా ఆత్మ లేనిదే’ - అను దృష్టితో చూస్తూ ఉండటం చేత - ‘మరణానుభవి’ (మరణించినవాడు)గా ఉంటున్నాడు. యోగాభ్యాసి క్రమంగా ‘జీవన్ముక్తుడు’ అయి, స్వచ్ఛుడై, సదా నిర్మలుడై స్వయం ప్రకాశమానుడై ఉంటున్నాడు. అట్టివాడికి ఎటువంటి కర్తవ్యములు ఉండవు. ఒకవేళ ఆయా ఏవేవో సందర్భములలో ఏవైనా క్రియలు నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ వాటి దోషములు ఆతనికి అంటవు. తాకవు. ఎందుకంటే ఆతడు యోగాభ్యాస బలముచే అకర్తృత్వము, అభోక్తృత్వము వహించగలిగినవాడై ఉంటున్నాడు.

తదితరులగు కొందరు జ్ఞాన సమాచారము తెలుసుకొనియుండి, సంభాషించగలిగి యుండి కూడా, యోగాభ్యాసముచే బుద్ధిని నిశ్చలము, విషయాతీతము, కేవలము చేసికొని యుండకపోతే, అటువంటప్పుడు పర్యవసానమేమిటి? వారు విషయముల పట్ల విరక్తులై ఉండికూడా, ‘దేహము’ చేత జయింపబడినవారై ఉండిపోవుచున్నారు. ‘మాంస పిండము’ అయి ఉండి, అనేక దోషములతో కూడినది అగు ఈ పాంచభౌతిక దేహమునకు దాసులైనట్టివారు - యోగాభ్యాసముతో ఈ దేహమును జయించినవారితో సమానము - కాగలరా? లేదు. ‘అయోగి అగు జ్ఞాని పట్ల పుణ్య-పాప ద్వంద్వముల ఫలములను పొందటముకొరకై ఒక ‘దేహము తరువాత మరొక దేహము’ (అను రాకపోకలు) కొనసాగుతూనే ఉంటోంది. పుణ్యఫలము చేత ఎప్పుడైతే ఆత్మ-అనాత్మ సమాచార శీలుడగు జ్ఞాని యోగసిద్ధుని సామీప్యతను పొందుతాడో, అట్టి సిద్ధుడగు గురుదేవుని సామీప్య-సాంగత్యము చేత సిద్ధిని (సంసార శృంఖలముల నుండి విముక్తిని) పొందుచున్నాడు. యోగసిద్ధుని కృపచేత ఆతడు యోగి, తత్త్వజ్ఞాని కూడా అయి, ‘సంసారము’ను నశింపజేసుకొనుచున్నాడు. ఇదియే ముముక్షువుకు క్షేమమగు, శుభమగు, శివభాషితమగు మార్గము. ఇక వేరే త్రోవలేదు.

ఈ విధంగా ఒకడు జ్ఞాని మాత్రమే అయినంత మాత్రం చేత సరిపోదు. ‘యోగి’ కూడా కావాలి. అంతేకాదు. ‘యోగాభ్యాసి’ అయినవాడు ‘జ్ఞాని’ కూడా అయి ఉండాలి. యోగసాధనచే సంయోగ-వియోగాతీత స్థితి సిద్ధించుకోవాలి. ‘యోగి’ అయినా కూడా సరిపోదు. ఆత్మజ్ఞాని కూడా కావాలి.

యోగేన రహితం జ్ఞానం న మోక్షాయ భవేత్, విధే! జ్ఞానేనైవ వినా యోగో న సిద్ధ్యతి కదాచన! ఓ విధీ! బ్రహ్మదేవా! ‘జ్ఞానము’ కలిగియుండని యోగి గాని, యోగాభ్యాసమును ఆశ్రయించని జ్ఞానికాని - ‘మోక్షము’ అను సిద్ధిని సిద్ధింపజేసుకోలేరు. అయితే వంద జన్మలలో జ్ఞానమును సంపాదించుకొన్నప్పటికీ చివరికి యోగి అయినప్పుడే (యోగాభ్యాసము చేతనే) విముక్తి పొంది, విముచ్యుడు (రిలీవుడు) కాగలుగుతాడు. జ్ఞానముతో బాటుగా యోగి అయినవానికి, యోగఫలంగా ఇక ‘‘జన్మ-మృత్యుపరంపరలు’’ అనే వ్యసనం నుండి (పునఃపునః జన్మల చక్రము నుండి) విడివడగలడు. ‘తెలుసుకోవటము’, ‘అనుకోవటము’ అనునవి జ్ఞాన-యోగములు అయి ఉండగా, ‘ఆత్మౌపమ్యేవ సర్వత్రా’ - అని అనిపించటమే యోగ-జ్ఞానముల మధురఫలము. ‘‘ఆత్మగా ఇదంతా సర్వదా నేనే!’’.. అను అకృత్రిమ - అనునిత్య స్వాభావానుభూతియే ‘సిద్ధి’గా చెప్పబడుతోంది.

సూర్య-చంద్ర - ప్రాణ అపానములు

ఈ జీవుడు క్షణక్షణము (విశ్వమంతా నిండియున్నట్టి) వాయువును ముక్కుపుటముల ద్వారా పీల్చుచు-వదలుచున్నాడు. అట్టి వాయువు దేహములో ప్రవేశించి, ఆయా ధర్మములను నిర్వర్తించి, తిరిగి బయటకు వెడలుచున్నది.

ప్రాణము : లోనికి వచ్చుగాలి - ఉష్ణధర్మము (సూర్యతత్త్వము) - కలిగి ఉంటోంది.

అపానము : బయటకు పోవు గాలి - శీతల ధర్మము (చంద్రతత్త్వము) కలిగి ఉంటోంది.

అట్టి ‘‘ప్రాణ-అపానములను ఏకము చేసి ధారణ చేయుటము’’ - అనే అభ్యాసముచే దేహములోని సూర్యచంద్రులు (ఉష్ణ-శీతలములు) ఏకస్థితి పొందినవై ఉంటాయి. అటువంటి ‘‘సమాన యోగాభ్యాసము’’ వలన సప్తధాతువులచే వివిధములైన పరస్పర సానుకూల్య - వ్యతిరిక్త రసాయనిక చర్యలు సమరసత్వము పొందుచున్నాయి. భౌతిక శరీరములో - ప్రాణాపాన సమస్వముచే జనించిన ‘యోగాగ్ని’చే - దేహము సమతుల్యము (Wel Balanced) చేయబడుచున్నది. అటువంటి ‘ప్రాణ - అపానముల సమస్థితి’ - అను యోగాభ్యాసముచే (యోగాగ్ని- అను ఉష్ణము కారణంగా) - దేహములోని ఛేత (పిత్త) - ఖాత (వాత)…. మొదలైన వాటి యొక్క ఎక్కువ - తక్కువలు సరిచేయబడగలవు. వాటి దోషములు నివారింపబడుచుండగా, శరీరములో ఉన్న, శరీరములోకి ప్రవేశించయత్నించుచున్న వ్యాధులు, వాటి వాటి లక్షణములతో సహా సమసిపోతాయి.

అంతేకాదు.
తత్ అసౌ పరమాకాశ రూపో దేహీ అవతిష్టతి! ఆ ప్రాణయోగాభ్యాసముచేత ఆ దేహి పరమాకాశరూపము (The Original state of Al-pervading and Al-Beyond Absolute self) నందు అవతిష్ఠితుడు అగుచున్నాడు. కిం పునః బహునా ఉక్తేన? ఇన్ని మాటలు చెప్పుకోవటమెందుకు? ప్రాణ-అపానముల సమాన యోగమును అభ్యసిస్తున్న యోగికి ‘మరణము’ అనునది ఉండదు. దేహముల రాకపోకలు ఆతనికి ‘‘మెలకువ నుండి గాఢ నిద్ర, గాఢ నిద్ర నుండి మెలకువ’’ - వంటివిగా అగుచున్నాయి. ఆతనికి స్వయముగా లోకములో కనిపిస్తున్న దేహిత్వము దగ్ధమయిపోయిన కర్పూరము వలె కనిపిస్తుంది. దేహివత్ దృశ్యతే లోకే దగ్ధకర్పూరవత్ స్వయమ్!

ఈ జీవునికి సంబంధించినవై రెండు ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. (1) చిత్తము (2) ప్రాణము. ఈ రెండూ కూడా జీవునియందు పరస్పరము అవినాభావ సంబంధము కలిగినవై ఉంటున్నాయి. ప్రాణము శక్తిరూపము. చిత్తము ఇష్ట-యోచనా రూపము.

అయోగి పట్ల ఈ చిత్త-ప్రాణములు ఈ జీవునికి స్వాధీనం కావటం లేదు. జన్మ-జన్మల దురభ్యాసములచే ఎటెటో పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు ‘ప్రాణ-అపాన-సమత్వము’ను అభ్యసించుచున్నట్టి యోగాభ్యాసి విషయంలో - చిత్తము (లేక) మనస్సు కాలుకు త్రాడుచే కట్టబడిన పక్షివలె స్వాధీనమై ఉంటుంది. ఇతఃపూర్వం పిచ్చిపిచ్చిగా వందల వేల విషయములలో విహరిస్తున్న మనస్సు యోగాభ్యాసి పట్ల - ఆయా విచారములన్నీ (Worried wonderings) మానివేస్తోంది. ఇక ఆ మనస్సు ఆతనిని బాధించదు. అణకువ గల సేవకునివలె సేవిస్తుంది. కాబట్టి, అట్టి సంచార పరంపరలలో చంచలమై అనేక రుగ్మతలను అంతర్గతంగా కలిగి ఉంటున్నట్టి ఈ మనస్సును నిరోధించాలంటే, వశంలో ఉంచుకోవాలంటే ‘ప్రాణధారణ’యే ఉపాయం. ఇంక వేరే ఏదీ ఉపాయం లేదు. అనేక శాస్త్ర విషయములను తర్క - వితర్కము చేయటం చేతగాని, మంత్ర - తంత్ర భేషజములచేత గాని మనస్సు నిలకడ పొందదు. అందుకు సరియగు ఉపాయమును ఆశ్రయించాలి. హే బ్రహ్మభగవాన్! విధీ! అట్టి మనో నిశ్చలసిద్ధికి ప్రాణోపాసనయే సులభమార్గం. అదికాక వేరు మార్గం లేదు.

మరొక్క విషయం.

‘‘నేను యోగాభ్యాసం చేస్తున్నాను. వారు చేయటం లేదు. అందుచేత, నేను అధికుణ్ణి’’… ఇటువంటి ఖండజ్ఞానమును కొనసాగిస్తూ ‘యోగాభ్యాసము’ను చేసుకొంటూ పోతామంటే.. అదంతా కూడా క్లేశములను ఇంకా అధికం చేసుకోవటమే అవుతుంది. ‘అఖండ జ్ఞానము - అఖండానుభవము’ - ఇవి ఆశయంగా (As the end objective) కలిగి ఉండకుండా, కేవలము ‘యోగాభ్యాసము’ నందే కాలము గడుపుతూ ఉంటామంటే, అది వృథాశ్రమయే! యోగభ్యాస సమయంలో మోక్షోపాయం ఎరిగియే ఉండాలి.

ఎవ్వడైనా, యోగాభ్యాసమునకు ఉపక్రమించకుండానే ‘‘యోగులు ఆస్వాదిస్తున్న యోగస్థానము నాకు లభించాలి’’… అని అనుకుంటూ ఉంటే, .. అది ‘‘కాల్చని (పచ్చి) కుండను చేతితో పట్టుకొని సాగరమును దాటివేస్తాను’’ అని అనుకోవటము వంటిది.

ఏ యోగి యొక్క ప్రాణ-అపానములు. సమత్వ యోగాభ్యాసముచే - ఆతడు జీవించి ఉండగానే, ‘‘పరస్పర విలీనము’’ అను సమరసస్థితి పొందుచున్నదో, అట్టి యోగి యొక్క పిండము (జీవాత్మ) పతితము (Down fall) పొందదు. చిత్తము దోషములచే బాధించబడదు. నిర్మలమౌతుంది. అట్టి నిర్మల చిత్తములో ‘స్వాత్మజ్ఞానము’ స్వయముగా ప్రకాశించగలదు.

హే పద్మజా! ‘‘యోగాభ్యాసము’’చే ఒక్క జన్మలోనే కూడా ‘జ్ఞానసిద్ధి’ లభించగలదయ్యా! ఈ జీవుడు సర్వ దుఃఖములను, రుగ్మతలను, వేదనలను జయించటానికై ఇప్పటికిప్పుడే ‘యోగసాధన’కు ఉపక్రమించాలి. ముముక్షువైనవాడు ‘‘నాకు బంధమే లేదు. సర్వదా కేవలమగు ఆత్మస్వరూపుడనే’’ - అనే చిత్తప్రశామ్య-స్థితిని సిద్ధించుకోవటానికై ప్రాణజయమే కర్తవ్యమై యున్నది. యోగాభ్యాసమునకు మించిన పుణ్యము, సుఖప్రదము, శివము, సూక్ష్మమైనది మరొక్కటేదీ లేదు.

యోగము : ఎట్టి ప్రయత్నముచే → ప్రాణ - అపానములు, ఉష్ణ-శీతల రూపములగు సూర్య-చంద్రమసములు, జీవాత్మ- పరమాత్మలు, తదితర సర్వ ద్వంద్వజాలములు (The fisher-Nets of all kinds of Dualites) ‘ఏకత్వభావన’లో కరిగిపోగలవో, అటువంటి సంయోగ- వియోగాతీత స్థితికి సంపాదించుకోవటానికి చేయుప్రయత్నమే ‘యోగము’-అని చెప్పబడుతోంది.

ఓ బ్రహ్మభగవాన్! ఇప్పుడు లోక కల్యాణార్థమై, ముముక్షువుల సౌలభ్యము కొరకు - సర్వజ్ఞానములలో ఉత్తమోత్తమమైనది అని చెప్పబడు ‘యోగశిఖ’ - అను పాఠ్యాంశము గురించి చెప్పుకుంటున్నాము.

యోగశిఖ

ముందుగా - శాస్త్ర - గురు ప్రవచితమగు ఇష్టదైవ సంబంధమైన ‘మంత్రము’ను అభ్యసించటం ప్రారంభించాలి. ఆ విధంగా మంత్రోపాసన చేస్తూ ఉండగా, అట్టి ‘అనుధ్యానము’ (లేక) ‘అనుధ్యాస’ చేత శరీరములో ఒకానొక మంద్రమైన నాదము బయల్వెడలసాగుతుంది. ఇకప్పుడు ఆ ముముక్షువు ఇక ఉత్తరోత్తర యోగాభ్యాసమునకు ఉపక్రమించాలి.

ఆసనము : ఆసనం పద్మకం బధ్వా, (అథవా) యచ్చ అన్యపి రోచతే। పద్మాసనము ధరించటము సామాన్యముగా సానుకూల్యము. లేదా, ఇంకేదైనా తనకు సుఖము - స్థిరము కలిగించు ఆసనమును- దేహస్థితిని అనుసరించి - స్వీకరించవచ్చు.

అభ్యాసము :
- నాసాగ్రే దృష్టిమ్ ఆరోప్య। ముక్కుకు చివరగా (నాసాగ్రే) (ఆజ్ఞాచక్ర స్థానమునకు క్రిందగా) ధ్యాస (Concentration)ను నియమించాలి.
- హస్తపాదౌ చ సంయతే। చేతులను, కాళ్లను ఒక నియమానుసారంగా ధారణ చేయాలి.
- మనః సర్వత్ర సంగ్రహ్య। మనస్సును సర్వదృశ్య సంబంధమైన విషయముల నుండి విరమింపజేస్తూ వెనుకకు మరల్చాలి.
- ‘ఓం’ అను ఏకము-అక్షరము అగు శబ్ద-అర్ధముల చింతనయందు మనస్సును నియమించాలి.
- ధ్యాయతే సతతం ప్రాజ్ఞో, హృత్ కృత్వా పరమేశ్వరమ్। సర్వాంతర్యామి, సర్వ తత్త్వస్వరూపుడు-అగు పరమాత్మకు హృదయములో ధ్యానపూర్వకంగా ఆహ్వానము పలకాలి.
- ప్రాజ్ఞుడై అట్టి పరమాత్మను హృదయములో ఎల్లప్పుడు ధ్యానము చేస్తూ ఉండాలి. ధ్యాసయే ధ్యానము. సర్వాత్మకుని గురించిన చింతనయే ధ్యానము, ధ్యాస కూడా. ధ్యాసయే తపస్సు. అదియే భక్తి కూడా.

యోగి అయినవాడు ఈ పాంచభౌతిక శరీరముపై ధ్యాసము జయిస్తూ ఉండాలి.
1 స్థంభము - వెన్నెముక
‘9’ ద్వారములు - కనులు, చెవులు, ముక్కుపుటములు, గుదము, శిశ్నము, బ్రహ్మరంధ్రము
‘3’ స్థూణములు - (ప్రతిమలు - కట్టెలు) - (రక్తము, మాంసము, క్రొవ్వు; జాగ్రత్ స్వప్న సుషుప్తులు; జన్మ-జరా-మరణములు)
‘5’గురు దేవతలు - (పంచ ప్రాణములు; శబ్ద, స్పర్శ, దూప, రస, గంథములు; దృశ్యము, ద్రష్ట, జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ)

ఇటువంటి అనేక వస్తువులతో కూడిన భౌతిక దేహముపై బుద్ధిమంతుడైనవాడు యోచనావేశమును కలిగి ఉండడు. ఈదృశేతు శరీరేవా మతిమాన్ న ఉపలక్షయేత్! అటువంటి ‘‘చీకటిగది’’ వంటి ఈదేహములో గల హృదయంలో - గదిలో దీపం వెలిగించు విధంగా - ఆత్మజ్ఞాన దీపం వెలిగించాలి. ఆదిత్య మండలాకారమైనట్టి (వేలాది కిరణములతో భౌతికమైనదంతా వెలుగుతో నింపుచుండుట వంటిది. - అగు) యోగ-జ్ఞాన దీపము వెలిగించాలి.

Ⅰ. దీప శిఖా తు యా మాత్రా, సా మాత్రా పరమేశ్వరే! దీప శిఖ వలె దేహములో పరమేశ్వర జ్యోతి ఉంటుంది. యోగులు యోగాభ్యాసముచే సూర్యనాడిని ఛేదించి, అధిగమించి అట్టి పరమాత్మ-దీపశిఖను సమీపిస్తున్నారు. జ్యోతితో జ్యోతి ఏకమగువిధంగా ఆత్మతో ఆత్మను ఏకం చేస్తున్నారు.
Ⅱ. ఇంటిలో దేవుడి గదిని పరిశుభ్రము చేయువిధంగా ఇడ-పింగళల మధ్యగా వెలుగు రూపమై అగ్నిశిఖగా ప్రకాశించుచున్న ‘సుషుమ్ననాడి’ యొక్క ప్రవేశద్వారమును పరిశుభ్రపరచుకొనచున్నారు. ‘‘శక్తి + బుద్ధి + చిత్త’’ రూపమగు కుండలినీ దేవిని సుషుమ్న ద్వారా ఊర్థ్వముఖము చేస్తూ, ఊర్థ్వంగా నడిపిస్తూ కపాలమునకు జేర్చుచున్నారు.
Ⅲ. కపాల సంపుటము వద్ద అమృతధారను త్రాగి ఊర్ధ్వముగా ‘తత్పదము’ యొక్క దర్శనము చేయుచున్నారు. ‘జీవాత్మ’ను మార్పులేని పరమాత్మతో ‘‘మమేకము’’గా నిశ్చల పరస్తున్నారు.

కపాల సంపుటమును చేరుచున్నప్పుడు, ఆ యోగి కొంత ఆలస్య - బద్ధకములను పొందుతున్నాడు. అయితే, త్రికాలములలో ‘కపాల సంపుటములో ప్రవేశ’ అభ్యాసముచే క్రమంగా అటువంటి అడ్డంకులన్నీ తొలగుతాయి. పుణ్యసంపద యొక్క వృద్ధిచేత కపాల ప్రవేశము సులభతరమౌతోంది.

ఓ బ్రహ్మదేవా! పరమ శివుడను, ఈ జీవునకు అనన్యుడను అగు నేను ఈ జీవుని సహస్రారస్థానములో సర్వదా తేజోమయుడనై వేంచేసినవాడనై ఉన్నాను. అనేక జన్మలలో నిర్వర్తించిన పుణ్యకార్యముల ఫలితంగా పాపదృష్టులు, పాపవృత్తులు సన్నగిలుచుండగా, ఆ యోగి సంసారభ్రమ నుండి బయల్వెడలి యోగసాధనచే (సహస్రారములో వేంచేసియున్న) నా ‘‘మహత్‌స్థానము’’ను చేరుచున్నాడు.

ఓ పద్మసంభవా! ఇప్పుడు యోగాభ్యాసము యొక్క లక్షణములను వివరిస్తున్నాను. వినండి.

యోగాభ్యాస లక్షణములు

ముముక్షువు మొట్టమొదట ‘వాయుజయము’ను (To Bring Prana Movement under conscious control) సముపార్జించుకొనటానికి సంసిద్ధుడు కావాలి. అందుకుగాను ముందుగా గురువును ఆశ్రయించునుగాక! గురుముఖతః యోగ విధానమును శ్రవణం చేయాలి. తరువాత వారు చెప్పినట్లు ‘అభ్యాసము’ను నిర్వర్తించాలి. గురువు చెప్పిన పాఠ్యాంశములను ఏకాగ్రతలతో విని, గురువుచే ప్రసాదించబడు జాగరూకత - మెలకువలను శ్రద్ధగా అర్థం చేసుకొని, సూక్ష్మదృష్టితో, మహదాశయముతో యోగాభ్యాసమునకు సంసిద్ధుడు కావాలి.

యోగాభ్యాసాశయము :
(1) అష్టధా కుండలీభూత్వా ఋజ్వీం కుర్యాత్తు కుండలీమ్। 8 చుట్టలుగా చుట్టుకొని మూలాధారాకాశంలో కునుకులు తీయుచున్న కుండలినీ శక్తిని (ఉమాశక్తిని) ‘‘ప్రాణ-అపాన ఏకత్వము + దేహములోని ఉష్ణము’’ల స్పర్శచే నిదురలేపి, (2) సుషుమ్న నాడి యందు ప్రవేశింపజేసి (3) ఋజుత్వముగా (Streight forwardness), శక్తి చాలనయుక్తితో ఊర్ధ్వముఖం చేయాలి. (4) సుషుమ్ననాడి ద్వారా మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక అనాహత, విశుద్ధ చక్రములను దాటిస్తూ - ఆజ్ఞాచక్రమునకు జేర్చాలి. (5) కుండలీని శక్తిని ఆజ్ఞాచక్రము ద్వారా కపాల స్థానమునకు చేర్చాలి. (6) కపాల ఊర్థ్వమునగల బ్రహ్మరంధ్రమును ఛేదించి సహస్రార స్థానములో ‘శివ-కుండలినీ ఐక్యము’ లేక ‘శివైక్యము’ సిద్ధించుకోవాలి.

బ్రహ్మదేవుడు : అందుకు (యోగ) మార్గం ఏది?

శంకర భగవానుడు : వినండి.

(1) ఆసీన ప్రదేశము : యోగాభ్యాసమునకు కూర్చొనుటకై ఎన్నుకొనే ప్రదేశము (The place selected to take seating for the purpose of Yoga practice) పరిశుభ్రముగా ఉండాలి. 4 అం x 6 అం।। వెడల్పు గల శుభ్ర వస్త్రము ఉపరిగా (పీట వంటి ఆసనముపై) పరచుకోవలి. ఆసనము బల్లపరుపుగా ఉండటము యోగాభ్యాసమునకు సానుకూల్యము.

(2) పాయువు స్థానమును ఆకుంచనము చేస్తు (బిగదీయుచూ) (మూలాధారంలో గల) కుండలినీ శక్తిని చాలనము చేయాలి (చలింపజేయాలి). మృత్యువక్త్ర గత స్యాపి తస్య మృత్యుభయం కుతః? కుండలినీశక్తిని చాలనము చేయు అభ్యాసముచే ఆ యోగి మృత్యుముఖములో ఉన్నప్పుడు కూడా మృత్యుభయమును పొందడు. ‘‘నేను దేహముల రాకపోకలకు ఆనందరూప సాక్షిని’’ అని గమనించువాడై ఉండగలడు. ఓ బ్రహ్మదేవా! అట్టి కుండలినీ చాలన విధానము గురించి మనము (ఇతఃపూర్వమే) సంభాషించుకొని ఉన్నాము. మరల చెప్పుకుంటున్నాము.

ఆసనము = ఎడమకాలి చీలమండలముతో ఆసనమును (గుదస్థానమును) నొక్కిఉంచి, పొట్టను ఎడమవైపుగా నిలిపిఉంచి హృదయమును ‘గళము’ వైపుగా (గొంతువైపుగా) లాగి ఉంచటము - ‘వజ్రాసనము’ అనబడుతోంది.

అటువంటి వజ్రాసనము గాని, (లేదా) మరేదైనా సుఖాసనముగాని ధరించి, క్రిందకు ప్రయాణించుచున్న అపానవాయువును పైకి లాగటము - అను ఊర్థ్వచాలన-కుంభకమును రోజూ అభ్యసించాలి.

కుండలినీ శక్తి చాలనము

కుండలిని శక్తి = ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తి, నిదురిస్తూ ఉండటము = అనన్యమగు స్వస్వరూపమును ఏమరచి అన్యమగు ఇంద్రియ విషయములవైపు ప్రసరిస్తూ ఉండటం. ప్రాణ - అపాన సంయోగము (కదలికలను నిలిపి ఒక దానితో మరొకటి తాకించు) ప్రాణాయామము చేస్తూ, వాయుజ్వలనములో జనించిన అగ్నితో ‘కుండలిని’ని ఎల్లప్పుడూ స్పృశిస్తూ, (క్రమంగా) అధోముఖము నుండి ఊర్థ్వముఖము చేస్తూ ఉండాలి. అట్టి ఊర్థ్వముఖ ప్రయత్నమే ‘‘కుండలినీ చాలనము’’.

  1. మర్త్య-పాతాళ-స్వర్గ త్రిలోకవాసులను (సర్వులను) మోహింపజేయునది, దేహములో జీవశక్తి అయినట్టిది అగు-కుండలినీ శక్తిని మూలాధారము వరకు విస్తరించియున్న ‘సుషుమ్ననాడి’ యొక్క ముఖద్వారములో ప్రవేశింపజేయాలి.
  2. ఆ తరువాత సుషుమ్నయందలి చంద్రఖండము (చల్లటి ప్రదేశము)లో ప్రవేశింపజేయాలి.
  3. వాయు - అగ్నిలతో కూడినదై, ప్రాణ-అపాన సంయోగ సాధనచే ఆ కుండలిని బ్రహ్మగ్రంధిని ఛేదింపజేయాలి.

అటు తరువాత, ప్రాణ - అపాన సమత్వము (eT]యు) అగ్నియు కలిసి బ్రహ్మగ్రంధి ఛేధించిన తరువాత విష్ణుగ్రంథిలో కుండలినీశక్తి ప్రవేశించి, అద్దానిని కూడా ఛేదించుచున్నది. రుద్రగ్రంధిలో ప్రవేశించుచున్నది. రుద్రగ్రంథిలో మరల మరల కుంభకముచే ప్రాణశక్తిని పూరించి
- సూర్య (ఉష్ణ) భేదమును
- ఉజ్జాయీ (శీతలిని) భేదమును అభ్యసించాలి. (అనగా శీతల-ఉష్ణములను కుంభకముతో కంఠాకాశములో ఏకరూపము చేయాలి). ఇక్కడికి 4 రకములగు కుంభకములు.

గ్రంథి = భావన, నమ్మకము

  1. బ్రహ్మ గ్రంథి = “ఇదంతా సృష్టించబడుతోంది”. (స్థానము = హృదయము)
  2. విష్ణు గ్రంథి = “ఇదంతా స్థితించబడుతోంది”. (స్థానము కంఠము)
  3. రుద్ర గ్రంథి = “ఇదంతా లయించబడుతోంది”. (స్థానము నుదురు)

(1) ప్రాణ-ఆయనముల సమత్వకుంభకము (భస్త్ర కుంభకము). (2) బ్రహ్మగ్రంథి కుంభకము (3) విష్ణు గ్రంథి కుంభకము (4) రుద్రగ్రంథి కుంభకములను యోగాభ్యాసం చేస్తూ ఉండెదరుగాక।

భస్త్రీ కుంభకము - కమ్మరి గొట్టము నుండి కొలిమి వైపు గాలి వదలి, వేగంగా పీల్చి మరల వేగంగా వదలురీతిగా చేయు వాయు అభ్యాసము. అది త్రిబంధకములను దాటిన ‘కేవల ప్రాప్తి’ - కి కారణమగుచున్నది. (కేవల స్వస్వరూపానుభవము సిద్ధించుచున్నది).

సూర్యభేద ప్రాణాయామాభ్యాసము

ఏకాకినా సముపగమ్యస్య : ఏకాకిగా ఏకాంత ప్రదేశము మ చేరి.., అల్పాహారి అయి, ధైర్యముతో కూడిన బుద్ధికలవాడై,

- ‘‘సంసారము రోగమును హరించు పరమౌషధము..’’,
- ‘‘ప్రాణము మొదలైన రూపము’’- తానే అయి ఉన్నట్టిది,
- అమృతరూపము,
- పరమార్థ తత్త్వము,

    - అగు ‘ఆత్మ’ను పరిభావించటమే ‘కేవలప్రాప్తి’. అట్టి ఆశయముతో ‘‘ కుడి ముక్కు రంధ్రము ద్వారా వాయువును పీల్చి, పింగళనాడిలో వాయుకుంభక-అభ్యాసము’’- నకు ఉపక్రమించాలి.

అభ్యాసయోగి సూర్యనాడి (పింగళ)ని వాయువుతో నింపి, విధి విధానానుసారంగా కుంభకమును చేయుచు, చంద్రనాడి (ఇడ) ద్వారా రేచకమును (గాలిని వదలటమును) నిర్వర్తించాలి.

ఈ విధంగా (1) సూర్యనాడిలో వాయు కుంభకము, (2) చంద్రనాడిలో రేచకము చేయుచుండటంచేత క్రిమిదోషములు తొలగి ఉదరములోని అనేక రోగములు శమించగలవు. మరల మరల ఈ కార్యము చేయుటమును ‘సూర్యభేదము’ అని పిలుస్తున్నారు.

ఉజ్జయీ కుంభకము

నాడులలోకి (ఇడ-పింగళ-సుషుమ్నలలో) వాయువును పీల్చి ‘కుండలిని’ యొక్క ప్రక్కలందు నిలపాలి. తరువాత పొట్టలో వాయువును ధారణ (కుంభకము) చేయాలి. ఆ తరువాత ఇడనాడి ద్వారా గాలిని వదలాలి. (రేచకం చేయాలి). ఇది కంఠములోని కఫ దోషము తొలగించి శరీరాగ్నిని వృద్ధి చేస్తుంది. నాడీజలమును పోగొట్టుతుంది. ధాత గత దోషములు తొలగిస్తుంది. ఈ ఉజ్జయీ కుంభకమును నిలబడి, నడుస్తూ కూడా నిర్వర్తించవచ్చు.

శీతలీకరణ ప్రాణాయామము

ముఖేన వాయుం సంగృహ్య → (1) పళ్ళు-పళ్ళు కలవకుండా, నోటితో గాలిని పీల్చి, పెదమలను అదిమి ఉంచి,

ఘ్రాణ రంధ్రేణ రేచయేత్ → (2) ఒకసారి ఇడ - ముక్కు యొక్క ‘ఎడమపుట’తోను మరొకసారి ‘కుడి ముక్కుపుట’తోను ఇంకొకసారి రెండు ముక్కు పుటలతోను గాని వదలటము. దీనివలన ఆకలి, దాహములు స్వాధీనంలో ఉంటాయి. ఆ యోగాభ్యాసిని ఆకలి - దప్పికలు బాధించవు.

శరీరములో చేరుచున్న చెడు పదార్థముల వలన, అవి ఆయా శరీర విభాగాలలో పేరుకుపోయి ఉండటం చేత, వాత-పిత్త దోషములు ఏర్పడుచున్నాయి. నోటిలో నిండుగా గాలిపీల్చి, (పొట్టయందు కుంభకము చేసి) రెండు ముక్కు పుటములతో వదలుచుండటం చేత అట్టి వాత-పిత్త దోషాలు తొలుగగలవు.

భస్త్రీ కుంభక ప్రాణాయామము

ఒక లోహకారుడు (కంసాలి) గాలిని లోపలికి పీల్చి ధారణ చేసి, ఒక్కసారిగా తోలు తిత్తిలోనికి (లేక) ఏదైనా గొట్టము ద్వారా వేగంగా గాలిని వదలుచూ అగ్నిని రగిల్చుచున్నాడు కదా! ఆ విధంగా →
(1) రెండు ముక్కుపుటములలో గాలిని రేచకము చేసి,
(2) ఆ తరువాత రెండు ముక్కుపుటములతో పూరకముచేసి,
(3) గొంతును క్రిందకు కుచింపజేస్తూ, గాలిని రెండు స్థనములలో కుంభకము చేసి,
(4) క్రమంగా ఆ వాయువును సూర్యనాడి (పింగళ కుడివైపు నాడి)లో ప్రవేశింపజేయాలి.
(5) సూర్యనాడిలో (పింగళలో) కుంభకము చేయాలి. ‘శ్రమ’ అనిపించనంత వరకు ధారణ చేయాలి.
(6) అటు తరువాత, కంఠమును సంకోచింపజేస్తూ ఇడనాడి (ఎడమవైపు నాడి చంద్రనాడి) ద్వారా వాయువును రేచకం చేయాలి (వదలాలి).

ఇట్టి అభ్యాసము వాత-పిత్త-శ్లేష్మములను హరించివేయగలదు. శరీరమంతా సమముగా అగ్నిని వివర్ధనము (Wel-balanced Distribution) చేయగలదు. కుండలినిని ప్రబోధించగలదు. ముఖములోని దోషములను తొలగించి, తేజోవంతము చేయగలదు. మూలాధారము నుండి బ్రహ్మనాడి వరకు గల దోషములను తొలగించి, కుండలినీ ఊర్థ్వగమనమును సుసుఖము చేయగలదు. యోగబంధనమును తేలిక చేయగలదు. బ్రహ్మ-విష్ణు-రుద్రగ్రంధుల ఛేదనము సులభతరమౌతుంది. అందుచేత, విశేషైనైవ కర్తవ్యం భస్త్రాఖ్యం కుంభకం తు ఇదమ్! యోగులకు ‘భస్త్రకుంభకము’ మహత్తర అభ్యాస-ఉపాయము.

బంధత్రయము

పరమశివుడు : ఓ హిరణ్యగర్భా! బ్రహ్మదేవా! ఇప్పుడిక మనము ‘బంధత్రయము’ గురించి సంభాషించుకుందాము.

Ⅰ. (1) బాహ్యముగా రేచకము (2) (అంతరముగా) పూరకము (3) (అంతరమున) కుంభకము (4) పునఃబాహ్యముగా రేచకము -
Ⅱ. (i) సూర్యనాడీ కుంభక ప్రాణాయామము (ii) ఉజ్జాయీ కుంభక ప్రాణాయామము (iii) భస్త్రకుంభక ప్రాణాయామము (iv) ప్రాణ-అపాన సమానత్వ కుంభక ప్రాణాయామము.

ఈ ఈ చతర్కుంభకముల నిత్యాభ్యాసముచే ‘వాయుజయము’ సంభవిస్తోంది. అట్టి అభ్యాసములు కొంతకాలము కొనసాగించిన తరువాత ఆ యోగాభ్యాసి ఇక క్రమంగా ‘‘బంధత్రయము’’ను స్వీకరించాలి. అవి ఏమంటే…., (1) మూల బంధము (2) ఉడ్డీయాణ బంధము (3) జాలంధర బంధము. ఈ మూడింటి లక్షణములు వినండి.

(1) మూలబంధము

‘ఇదియే మూలబంధ కుంభకము’ అని అనబడుచున్నది.

ఇట్టి ‘యోగాభ్యాసము’చే ప్రాణ-అపానములు, నాద-బిన్దువులు (మూలబంధనముచే) ఏకస్థితికి తేబడతాయి. అట్టి ఏకస్థితి పొందబడుచూ ఉండగా, ఆ యోగి అతి త్వరగా ప్రాణములను జయించి ‘యోగస్థితి’ యొక్క పరాకాష్ఠను (సర్వజగత్ భావములను స్వవశం అగు సంస్థితిని) చేరుచున్నాడు. న అత్ర సంశయః!

ప్రాణ జయము = తాను ప్రాణేశ్వరుడై జగత్ దృశ్యమంతా, తదితర జీవులందరినీ - ప్రాణేశ్వరీ ప్రియ, సమరూపదర్శనముగా, (అనగా) విశ్వమంతా తన ప్రాణస్వరూపంగా అనిపిచటం. అప్పుడిక - (1) ఈ సమస్త జగద్దృశ్యము నాదైన ‘నేను’ (శివము) (2) ఇదంతా నేనైన నేను (శక్తి)ల ‘స్వాభావిక ఏకత్వము’ స్వానుభవము అవగలదు.

(2) ఉడ్డీయాణ కుంభకము

మొదటగా ………….. రేచకము - రెండు ముక్క పుటలతో గాలిని వదలటము.
రెండవ దశ …………….. ముక్కు - కుడి పుటను కుడి బొటనవ్రేలుతో మూయుటము
మూడవ దశ …………….. ముక్కు యొక్క ఎడమ పుటతో గాలిని గుండెలోనికి పీల్చటము. ఇప్పుడు గుండె, రెండు భుజములు ఊర్ధ్వ ముఖముగా, వాయు సమేతంగా ధారణ చేయటము.
నాలుగవ దశ : కుంభకాంతే - రేచకాదే కర్తవ్యస్తు ఉడ్డీయాణకః !

యోగశిఖ-ఉపనిషత్-ఉడ్డీయాణ-కుంభకం

అట్టి ఉడ్డీయాణక స్థానంలో ….,
- కొందరు జ్యోతి (లేక) వెలుగును దర్శిస్తున్నారు.
- మరికొందరు - దీపపు ఆకారము - పొగలేని అగ్నిని చూస్తూ ఉన్నారు.
- ఇంకొందరు - ఇష్టదైవము సుఖాశీనులైనట్లు అనుభూతి పొందుచున్నారు.
- ఇంకా కొందరు - గురువు రూపమును, గురు - పాద పద్మములను భావన చేయుచున్నారు.
- కొందరైతే-కేవలము, నిర్మలము, సర్వస్వము, సర్వగతము, అగ్న్యాత్మకము అగు కేవల చైతన్యమును అనుభూత పరచుకొనుచున్నారు.
- మరికొందరు - ఈ‘విశ్వము’ అనబడు విశ్వేశ్వర విన్యాసమును వినోదపరచుకొనుచున్నారు.
- కొందరు - విశ్వ విన్యాసమును, నాదమును, బిందువును చూస్తూ, వింటూ ఉన్నారు.
- ఇంకొందరు - కేవల మౌనమును; ప్రశాంతతను, నిర్విషయ - అనిర్వచనీయానందమును పొందుచూ…. మనో వాక్కులచే అందనివారై ఉంటున్నారు. అవిషయులై ఆనందించుచున్నారు.

ఈ విధంగా ఆయా స్వకీయ - స్వానుకూల్యము, స్వ - అభ్యాస భావనాఫలము అగు విధానంగా జగదతీత ఏక-అఖండ తత్త్వమును ధారణ చేస్తున్నారు. మనో - బుద్ధులను నియమించి సముత్సాహ - కేవలానంద పూరితులై ‘ఉడ్డీయాణము’ను అభ్యాసం చేస్తూ ఉంటున్నారు. వారి స్వానుభవము అనిర్వచనీయమే. అయినప్పటికీ యోగసాధకులకు సూచనాపూర్వకంగా అనువర్తించి పైరీతిగా వర్ణిస్తూ ఉన్నాను.

ఈ యోగసాధనకు ‘ఉడ్డీయాణము’ అని ఎందుకు అంటారు? శబ్దార్థమేమిటి?

బ్రహ్మభగవాన్! వినండి!

బంధో యేన సుషుమ్నాయాం ప్రాణస్తు ఉడ్డీయతే యతః, తస్మాత్ ‘ఉడ్డీయణ-ఆఖ్యో అయం’; యోగిభిః సముదాహృతః।

‘‘కుంభకాంతక (End) - రేచకాది (Begining)’’ల మధ్య నిశ్చల ప్రాణ - మనో - బుద్ధ్యోపాసనచే (ఉడ్డీయాన బంధముచే) - ఇడ-పింగళల మధ్య అగ్ని-జ్యోతిస్వరూపమై సరసర వెలుగొందుచున్న సుషుమ్నయందు ప్రాణశక్తి ప్రవేశించినదై, మూలాధారలలో గల కుండలినీ మహాశక్తిని ఊర్ధ్వముఖముగా చేసి (స్వభావంగానే, అప్రయత్నంగానే) నడిపిస్తుంది. కాబట్టి ఉడ్డీయాణము (An operation of upward - Travelling) అనబడుచున్నది.

ఈ విధంగా కుంభక - రేచక (ఉభయముల) ప్రారంభ స్థానము, ఆ రెండిటి మధ్యస్థానమునందు ఉడ్డీయాణక బంధమును కొంతకాలము గురుముఖతః అభ్యాసము చేస్తూ ఉండగా…, అప్పుడు ఆ యోగి రేచక - పూరక - కుంభకముల అవసరము లేకుండానే ఉడ్డీయాణమును అవధరించగలడు. అనగా బుద్ధిమాత్రం చేత ఉడ్డీయాణబంధమును అవధరించటము అను - ‘స్వాభావికమగు సహజత్వము’ ఆతని పట్ల సంతరించుకోగలదు. అట్టివాడు అనేక లోకవ్యవహారములలో పాల్గొనునచూ, నిర్వర్తిస్తూ, చక్కదిద్దుతూచే, అదే సమయంలో (భుజస్కంధములను, హృదయమును ఊర్థ్వధారణ చేస్తూ) - ఉడ్డీయాణ బంధమును అవధరించగలడు.

ఏ యోగి అయితే అతన్ద్రస్తుడై (బద్దకము, ఆలస్యము, అశ్రద్ధ, నిరుత్సాహములను దరిచేరనీయనివాడై) ఉడ్డీయాణ బంధమును - ఉత్సాహంగా, సాహసపూరితంగా, బుద్ధి-శక్తియుతంగా, పరాక్రమోపేతంగా అభ్యాసిస్తూ ఉంటాడో - అట్టివాడు వృద్ధుడవడు. వయసుచే వృద్ధుడై కూడా యువకుని వలె బుద్ధ్యుత్సాహ, ఆనందములు పరవళ్లు త్రొక్కురీతిగా - ఉంటాడు.

నాభి స్థాన ప్రాణయోగాభ్యాసము

ఉడ్డీయాణ బంధ సహితంగా (లేక, రహితంగా కూడా) నాభిస్థానమునకు ఊర్ధ్వంగాగాని, అధోప్రదేశంగాని (లేక) ఆ రెండిటిని కూడుకొన్న స్థానంలోగాని - ఎవ్వడైతే ప్రయత్నతః కుంభక ప్రాణాయామమును నిర్వర్తిస్తూ ఉంటాడో.. అట్టివాడు ఆవిధంగా 6 నెలలు అభ్యసిస్తే.. మృత్యువును జయిస్తాడు. అనగా, మార్పు-చేర్పులకు విషయమేగాని ఆత్మను ధారణను చేస్తూ మృత్యు-జన్మ-జీవన విశేషములకు అతీతత్వము, సాక్షిత్వము, అప్రమేయత్వములను బుద్ధితో సిద్ధించుకోగలడు.

నాభిస్థాన-కుంభక యోగాభ్యాసికి ఈ విశ్వమంతా తన నాభికమలము నుండి బయల్వెడలిన విశ్వప్రజ్ఞ (బ్రహ్మ) యొక్క ప్రజ్ఞా ప్రదర్శనమై, ఆతనికి ఈ సమస్తము అత్యంత ఆప్యాయరూపమగుచున్నది.

(3) జాలంధర బంధము

పూరకము యొక్క చిట్టచివరి తరువాత → రేచకము ఇంకా ప్రారంభించనప్పుడు - ఆ మధ్య గల స్థానంలో అభ్యాసించు బంధన స్థితిని ‘జాలందర బంధము’ అని అంటారు. ఇందులో రెండు ప్రక్రియలు ఇమిడి ఉన్నాయి.

అవి (1) కంఠమును సంకోచింపజేయుటము. (2) వాయు మార్గనిరోధనము.

కంఠమునందు ఆకుంచ్యము చేసి (పూరక - కుంభకములను చేసి) హృదయములో భావాతీత మౌనమును దృఢముగా ఇచ్ఛా పూర్వకంగా అవధరించటము - జాలంధర బంధము యొక్క అంతర్-సారము. ఇట్టి ‘జాలంధరము’ అనే అభ్యాసము అమృతత్వమును సిద్ధింపజేయగలదు.

కంఠమును సంకోచనము + కంఠంలో అకుంచనము నిర్వర్తిస్తూ ఉండగా, ‘పశ్చిమతానము’ (forcing from left) వలన ప్రాణశక్తి (సుషుమ్న ద్వారా) బ్రహ్మరంధ్రమును చేరుచున్నది.

యోగి వజ్రాసన సంస్థితుడై భస్త్రీ యోగాభ్యాసముచే (వేగముగా నోటితో గాలిని పీల్చి, ఒకసారి ముక్కు కుడి పుటతోను, రెండవసారి ఎడమ ముక్కు పుటతోను, వేగముగా ఆ గాలిని వదలటముచే).. కుండలినీ శక్తిని చాలనము చేయుచుండగా, ఆతని శక్తి బోధత్వము (Inspiration to move upward) పొందుచున్నది. అప్పుడు - కాలిన ఇనుపఖడ్డీ సమ్మెట దెబ్బకు తేలికగా విరుగచుండునట్లుగా - ఆతని గ్రంధులు (బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులు) సులభంగా జాలంధర బంధము వలన జనించిన వేడి వాయువుచే త్రెంచివేయబడుచున్నాయి. నడుముపై ప్రాకు చీమ పైపైకి వెళ్ళుచుండువిధంగా కుండలినీ బ్రహ్మరంథ్రము వైపుగా (సుషుమ్న ద్వారా) ఎగబాకుచున్నది. సుషుమ్నయందు వాయుకుంభకమును అభ్యసించుచుండగా కుండలిని చీమవలె పైకి వెళ్లుచున్నది.

ఊర్ధ్వగామి యగు కుండలిని రుద్ర గ్రంథిని ఛేదించి, కపాల మండలమును ప్రవేశించి ఆక్రమించుకుంటోంది. అటుపై బ్రహ్మరంధ్రమును చేరుచున్నది. అక్కడి నుండి ‘శివాత్మక - శివోఽహమ్’ స్థానమగు సహస్రారమునందు ఇచ్ఛ - జ్ఞాన - క్రియా స్వరూపిణిగాను, స్వానందస్వరూపిణిగాను అయి ప్రవేశించుచున్నది. అది పురుష-ప్రకృతుల శివ-శక్త్యైకానుభవము.

ఇడ-సుషుమ్న-పింగళల ఏకత్వము

యోగాభ్యాసం కొనసాగుచుండగా ఇడ-పింగళలు సుషుమ్నతో అభేదము పొందుచున్నాయి. అడ్డు గోడలు తొలగుచున్నాయి. అట్టి స్థితిలో చంద్ర-సూర్యులను (ఇడ-పింగళలను) సమత్వము చేయు యోగ స్థితి ప్రవర్తమానమగుచున్నది. ఆ యోగి గ్రంథిత్రయములను జయించి, దాటివేయుటచే సులభముగా త్రిగుణాతీతుడగుచున్నాడు. ‘శివ-శక్తి’ సమాయోగము (The unity of ‘I’ and ‘My’) పొందుచున్నాడు. ‘పరమస్థితి’ని పొందుచున్నాడు. అప్పుడిక ‘‘విశ్వమంతా నేనైన నేను’’ - స్వాభావికమై, అప్రతిహతమై, ప్రయత్నముయొక్క ఆవశ్యకత లేనిదై…. స్వయం ప్రకాశమగుచున్నది.

వజ్రనాళీ జయము

ఏనుగు తన తొండముతో జలమును పీల్చువిధంగా వజ్రనాళి (వెన్నెముక)లోని వాయువును సుషుమ్నలోనికి పీల్చి కుంభకముచేయుటము - వజ్రనాళీజయము అంటారు.

వజ్రనాళి (వెన్నెముక)లో 21 ప్రకాశమానమగు స్థానములు ఉన్నాయి.

ఆ 21 ప్రకాశక స్థానములు పూలదండలో పూలు గ్రుచ్చబడినరీతిగా ఉంటున్నాయి. అయితే - ‘‘ఆ 21 ప్రకాశక స్థానములు ‘సుషుమ్న’ యందు మణులవలె గ్రుచ్చబడినవి’- అని యోగికి స్వానుభవమగుచున్నది.

అట్టి సుషుమ్నయే ఈ విశ్వమంతా తన రూపముగా కలిగియున్నది. అందుచేత సుషుమ్నను ‘విశ్వరూపిణి’ అని అంటారు. అట్టి సుషుమ్న - ఈ జీవుని యొక్క మోక్షమార్గమునకు రాచబాట. (As a path of all relief and salvation). ‘‘విశ్వరూప యోగము సిద్ధించుటకు మహత్తరమగు ఉపకరణము’’ - అని కూడా అనబడుతోంది.

స్వాభావిక కుంభక దశ

కుంభకము పూరక-రేచకములతో ప్రాణయోగమును అభ్యసిస్తూ ఉండగా, క్రమంగా కొంతకాలానికి కుంభకము స్వాభావికమౌతుంది. అనగా, రేచక, పూరకముల ఆవస్యకత లేకుండానే, కుంభకము అనుక్షణికమౌతుంది.

యథైవ నిశ్చితః కాలః చంద్ర-సూర్య నిబంధనాత్ - ఏవిధంగా అయితే చంద్ర-సూర్యులను నిబంధనముచేస్తే కాలమే నిశ్చలము అవుతుందో, అట్లా కుంభకము ఉత్తమ అభ్యాసికి - అపూర్య కుంభితో వాయుః బహిః నో యాతి సాధకే। కుంభకము పొందిన వాయువు, ఇక ఆ కుంభకత్వమును వీడదు. ఇది ‘స్వాభావిక కుంభక దశ’ అని యోగులు ప్రశంసిస్తూ ఉంటారు. అట్టి దశలో కాలపరిధులను దాటిపోయి ఆ యోగి కాలమునకు నిత్య సాక్షిత్వము సిద్ధించుకొనుచున్నాడు. ఇది ‘‘ఆలోచనలన్నీ ఆలోచించు వానిలో లయమగు కేవల స్వసత్తా’’-స్థితి.

ఆత్మీయ మనో మహదత్వము - జగత్ రూపమనోమాధుర్యము

మరల మరల ‘పశ్చిమ ద్వార లక్షణము’ (ఇడ మార్గంగా) పూరించబడిన వాయువు, ఆ పశ్చిమ ద్వారములలో కొంతకొంతగా కుంభకత్వము పొందుతూ ఉంటుంది. పశ్చిమ మార్గము పొందిన వాయువు, అట్టి పశ్చిమ మార్గంగా (గుండె, భుజములు, పొట్ట మొదలైనచోట్ల) అన్ని అవయవములకు చేరుచున్నది.
- రేచితంగా వాయువు క్షీణించటము,
- పూరకముచే వాయువు పెరుగుచుండటము - జరుగుతూ ఉంటుంది.

ఇట్టి అభ్యాసముచే ఆ యోగికి తనయందు ఆలోచన (లేక, మనస్సు) ఎక్కడ జనిస్తోందో, ఆ హృదయ కుహరస్థానము అనుభవమౌతోంది. ఆతడు అభ్యాస పూర్వకంగా ఆ మనస్సును అద్దాని ‘జనన స్థానము’ నందే విలీనము చేయుచున్నాడు.

మనస్సు ఆత్మయందు లీనమగుచుండగా ఆతడు నిరహంకారుడగుచున్నాడు. ముక్తుడు (Al - relieved), సుఖి అగుచున్నాడు. ‘‘ఈ సమస్త జగత్తు నా మనో మాధుర్యమే’’ - అను ‘‘ఆత్మీయ మనో మహదత్వము’’ నకు యోగాభ్యాసము కారణభూతమగుచున్నది.

యోగాభ్యాసము లేనివాడు పిండపాతుడు (మనస్సు దృశ్య విషయములలో చిక్కుకున్నట్టివాడు)గానే మిగిలిపోవుచున్నాడు.

చిత్త లయమే ప్రాణలయము కూడా!

(1) చిత్తము (2) ప్రాణము (వాయు) ఈ రెండిటికి అవినాభావ సంబంధము ఉన్నది. చిత్తము లయిస్తే ప్రాణ చలనము నిరోధించ బడుచున్నది. అనగా ప్రాణ - సంయమనము జరుగగలదు. మనో చాంచల్యము ఉపశమించగలదు. యోగముచే మనోజయము, జ్ఞానము చేత చిత్తశుద్ధిలకై యత్నించనివాడు, (అట్టివాడు) శాస్త్రములు పఠించి మాత్రం ఏమి ప్రయోజనం? స్వాత్మయొక్క అఖండత్వము, అప్రమేయత్వము, నిత్యత్వము, సత్యత్వము, దృశ్యాతీతత్వము, నిర్గుణత్వము, సకలత్వము, కేవల సాక్షీత్వము మొదలైన దివ్య లక్షణములను స్వానుభవంగా సిద్ధించుకునే ప్రయత్నము చేయనివాడు ఆత్మ గురించి విని, తెలిసి ఏమి ఉపయోగము? ప్రతీతి ఏముంటుంది! ఆత్మయందు చిత్తమును లయింపజేయు ప్రయత్నము చేయనివానికి శాస్త్ర-శాస్త్రప్రతీతి-గురుపాఠ్యాంశములవలన ఏమి లాభం?

‘‘ఆత్మత్వము’’ అవధరించుచున్నవానికి క్రొత్తగా శాస్త్రములతో, ప్రతీతితో, గురుబోధలతో పనేముంటుంది?

చిత్త లయము తెలియనివానికి శాస్త్రములు తెలిసి ప్రయోజనం లేదు.
చిత్త లయము తెలిసినవానికి శాస్త్రములతో పనిలేదు.

యోగాభ్యాస ఔన్నత్యము

జలగ వంటికి పట్టుకొని నెమ్మది నెమ్మదిగా శరీరములోని రక్తమంతా తనవైపుగా లాగుకొని పీలుస్తూ ఉంటుంది చూచారా! అట్లాగే, బ్రహ్మనాడియందు అభ్యాస పూర్వకంగా కుండలినీ ఊర్థ్వయానము.. చేయు యోగి విషయంలో - బ్రహ్మనాడి ధాతువులను తనవైపుగా ఆకర్షించుచున్నది.
సుఖాసనము స్వీరిస్తూ….,
చతుర్విధములగు రేచక - పూరక - కుంభక- పునఃరేచక ప్రాణాభ్యాసములు నిర్వర్తిస్తూ,
త్రైబంధనములగు మూల-ఉడ్డీయాణ -జాలంధరములను, తదితర భస్త్రీ ఇత్యాది యోగాభ్యాసముల నిర్వర్తిస్తూ యోగి ఊర్ధ్వగతుడు (ఆత్మగతుడు) అగుచున్నాడు. శ్రద్ధతోను దైనందికంగాను అభ్యాసియై నిర్వర్తించు యోగి పట్ల చిత్తము క్రమంగా శమించగలదు. చిత్తము శమిస్తూ ఉండగా ఇక ‘‘ఆత్మాహమ్ (లేక) చిదహమ్ (నేను కేవల చిత్ స్వరూపుడను) భావన’’ - అనబడే బిందు స్థానము నుండి ఆతనికి పతనము ఉండదు. చిత్తము ‘చిత్’ నందు కరిగినదై మటుమాయమగుచున్నది. ఆ జీవుడు ‘కేవల చిత్ స్వరూపుడు’ అయి, జగత్తులను లీలగా చూస్తూ ఉంటాడు.

స్వాభావిక కుంభకము

‘రేచక - పూరక - కుంభక -పునఃరేచక’ ప్రాణాయామాభ్యాసము కొనసాగుచుండగా, తదనంతర దశలో (In the next stage) - రేచక పూరకములు అగత్యము లేకుండానే కుంభక రూపమగు వాయు స్థిరీకరణము (ప్రాణనిశ్చలత్వము) స్వాభావికమై (అప్రయత్నమై) సిద్ధించగలదు. అట్టి యోగి- అనేక లౌకిక క్రియలందు ఉండవలసి ఉన్నప్పటికీ - అను నిత్యమగు ప్రాణబంధము, ప్రాణ సమత్వము కొనసాగిస్తూ ఉండగలడు. దేహములోని ‘‘మెడ-వక్ష స్థలము - పొట్ట-ముఖము - నుదురు-బ్రహ్మరంధ్రము’’ - మొదలైన ఆయా అనేక ప్రదేశములలో మార్చి మార్చి స్వాభావిక కుంభకమును ధారణ చేయగలడు. ‘‘ఈ విశ్వమంతా మమాత్మానంద రూపమే’’- అనునది స్వాభావిక బుద్ధి-కుంభకముయొక్క అంతిమాశయము, పరాకాష్ఠ కూడా! ‘‘నాలోని నేనైన నేనే ఇదంతా’’ - అనునది స్వాభావిక - కుంభక పరమార్థము.

యోగాభ్యాసము కొనసాగుచుండగా, అనేక నాదములు, జ్యోతి దర్శనము, నక్షత్ర - నక్షత్ర మండల దర్శనము.. ఇవన్నీ (యోగాభ్యాస సమయంలో) అనుభవముగుచూ వస్తాయి. నాదశ్రవణము, జ్యోతి దర్శనములచే యోగము ఏకాగ్రమగుచూ వస్తుంది. అట్టి యోగాభ్యాసి పట్ల
✤ కపాల స్థానములో గల చంద్రమండలము నుండి అమృతము స్రవించటము, అప్రమేయమగు స్వస్వరూపానుభూతి - ఇవన్నీ అనుభవమగుచూ ఉంటాయి.
అమృతము = మార్పు-చేర్పులకు విషయమేకాని స్వస్వరూపానుభవము.
✤ క్రమంగా ఆకలి -దప్పికలు, మనస్సు యొక్క వేదన సంచారములు, దిగుళ్లు, అనిశ్చితత్వములు, బుద్ధి యొక్క విరహములు, చాంచల్యములు మొదలైన సాంసారిక దోషము కడిగివేయబడి, తొలగిపోతాయి.

అభ్యాసవశంగా - స్వరూపే ‘సత్ చిత్ ఆనన్దే స్థితిమ్’ ఆప్నోతి కేవలమ్! ఆ యోగి సత్‌చిత్ ఆనంద రూపమగు కేవలీ స్థితిని సముపార్జించుకొనుచున్నాడు.

సత్ : జాగ్రత్ - స్వప్న-సుషుప్తులచే, దేహముల రాక - ఉనికి - పోకలచే చెక్కుదరని స్వకీయమగు ‘నేను ఉన్నాను’ అను రూపమగు నిత్యసత్ భావన. (I never miss my own presence any where, any time)

చిత్ : తెలుసుకొనబడు సర్వమునకు వేరైన ‘కేవల ఎరుక’ (Absolute knowing) స్థితి. ‘‘తెలియబడేదంతా నా ‘‘తెలివి’’ - యొక్క విస్తరణయే’’ …. అను కేవలీ స్ధానము. (My own knowing is always getting extended as ‘All that being known’)

ఆనందము : ‘సర్వము నా అనుభూతి రచనలోని అంతర్భాగము’ - అను దర్శనము. ఒక కళాకారుడు తాను రచించిన కళాఖండమును చూచి ఆనందించుతీరుగా - విశ్వ సందర్శనము. ఒక నాటక రచయిత - ఆ నాటకమును ప్రదర్శిస్తున్నప్పుడు ‘‘ఈఈ పాత్రలన్నీ నా రచనా విశేషమే కదా!’’ - అనే తీరుగా - ఈ దృశ్య - జగత్ దర్శనము. (All this is my own art of enjoying)

కేవలము → సర్వమునకు వేరై, సర్వము తానే అయి ఉన్నట్టిది (ఆత్మ). ఆభరణంగా అగు స్వభావమే బంగారమునకు లేని తీరుగా - స్వస్వరూపానుభవంయొక్క సర్వదా యథాతథత్వము. (పరమాత్మ జీవుడుగా అగుటలేదు - అను అవగాహన)

ఓ సృష్టికర్తా! మహాప్రజ్ఞా దురంధరా! బ్రహ్మభగవాన్! మీ ప్రీతి కొరకై అట్టి యోగాభ్యాస దశల- లక్షణముల గురించి మనమిప్పుడు చెప్పుకుందాము.

యోగాభ్యాస దశల లక్షణములు

శివ భగవానుడు : ఓ బ్రహ్మదేవా! యోగాభ్యాస లక్షణములు నాలుగు విధములుగా వర్ణించబడుచున్నాయి.
(1) మంత్రము (2) లయము (3) హఠయోగము (4) రాజయోగము.

ఈ నాలుగు కూడా ‘మహాయోగము’ యొక్క అంతర్ భూమికలు. ఇప్పుడు ఈ నాలిగింటి గురించి వినండి.

(1) మంత్రము

ఈ భౌతిక దేహములో ‘హం-స’ అను ప్రక్రియ అసంకల్పితంగాను, అనుక్షణికంగాను జరుగుతోంది.

శ్లో।। ‘హ’ కారేణ బహిర్యాతి। ‘స’ కారేణ విశేత్ పునః।
‘‘హం స, హం స’’ - ఇతి మంత్రో అయం సర్వజీవైశ్చ జప్యతే।।

సర్వ జీవుల పట్లా కూడా జీవిస్తూ ఉన్నంత కాలము
→ ‘హ’ కారముచే వాయువు బయటకు వెళ్లటము - (సందర్భములలో ప్రవేశము)
→ ‘స’ కారముచే వాయువు దేహములోనికి రావటము - (‘సహజము’లోనికి మరలటము)
→ అనగా, ‘‘హంస - హంస, ‘సోఽహమ్’
అనబడు ‘సో’హమ్’’ అనుక్షణం జరుగుచూ ఉన్నది

ఇక యోగి విషయానికి వస్తే.., గురువాక్యానుసారంగా ‘‘సోఽహమ్-అదియే నేను - సయేవ అహమ్- ఆత్మయే నేను - పరమగు పరమాత్మ నేనే’’.. అను భావనతో కూడుకొనినదై ఉంటోంది. ‘హం స’ జపము ఇడ - పింగళనాడుల మధ్యగా ఉన్న - అగ్ని తేజోరూపమై కేవల ప్రకాశమై ఉంటోంది. ఆతనియందు వెలుగొందుచున్న ‘‘సుషుమ్న’’యందు బుద్ధిపూర్వకంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా బుద్ధి పూర్వకంగా నిర్వర్తించు ‘సోఽహమ్’ను ‘మంత్రయోగము’ అని పిలుస్తున్నారు.
→ అదీ (తత్) నేనే! నీవు (త్వమ్)గా ఉన్నది నేనే! అహమ్ (జీవుడు)గా ఉన్నది నేనే!
→ జీవుడుగా ఉన్న నేను పరమాత్మనే!
→ పరమాత్మనైన నేను జీవుడను కూడా!
అనునదే సో → అహమ్ మంత్రము. అట్టి యోగి పట్ల జీవుడు - బ్రహ్మము ఏకము, పరస్పర సానుకూల్యము అయి ఉంటాయి. ఒకదానితో మరొకటి వ్యతిరిక్తత కలిగి ఉండవు.

(2.) హఠయోగము

ప్రతీతిః మంత్రయోగాచ్చ జాయతే పశ్చిమే పథి।। అటువంటి ‘సోఽహమ్’ మంత్రయోగముచే (నేను- నీవు ఆ పరమాత్మ నుండియే బయలుదేరుచున్నాము అను మననము, యోగభావనలచే) - పశ్చిమపథము (The path towards worldly scenario) ప్రతీతి (effective, potential, wel-overtaken) పొందుచున్నది. దేహములో చంద్రసూర్యుల దర్శనము అగుచున్నది. ‘హ’కారేణతు సూర్యస్స్యాత్ ‘స’కారేణ ఇన్దు ఉచ్యతే!

‘హ’కారము (outgoing Prana or వాయువు) ‘సూర్యుడు’ అని చెప్పబడుతోంది.

‘స’కారము (incoming Prana or వాయువు) ‘చంద్రుడు’ అని చెప్పబడుచున్నాయి.

హఠము = సూర్య-చంద్రమసో ‘ఐక్యం’ - ‘‘హఠా’’ ఇతి అభిధీ యతే!

సూర్య-చంద్రమసముల (లేక) బయటకు వెళ్ళు వాయువు యొక్క - లోనికి వచ్చు వాయువు యొక్క ఐక్యము సిద్ధింపజేయు అభ్యాసము ‘హఠయోగము’ అని చెప్పబడుతోంది. ఇటువంటి ప్రణ-అపానముల (లేక) ‘హ’ - ‘స’’ల (లేక) సూర్య-చంద్రుల ఐక్యత - అను ‘హఠయోగము’చే దేహ-మనస్సులలో జనిస్తూ ఉంటున్న సర్వదోషముల జాడ్యము తొలగిపోగలదు. అప్పుడు ఆ యోగికి ‘‘దృశ్యములో గల, విశ్వమంతా నిండియున్న తన యొక్క క్షేత్రజ్ఞత్వము స్వయముగా తనయందు అనుభవము కాగలదు. అట్టి స్వకీయ క్షేత్రజ్ఞత్వము పరమాత్మత్వముతో ఐక్యము పొందుచున్నది. అట్టి యోగి బాహ్య-అభ్యంత ఏకస్థితి యగు ‘హంస’ - యోగ ఏకీభూతుడు అగుచున్నాడు.

జగత్తుకు తనకు భేదము లేనివాడగుచున్నాడు.
→ లోనికి వచ్చు-బయటకుపోవు వాయువుల ఐక్యతచే ‘ఒక దేహములోని నేను’ అనే పరిమితస్థితి రూపమగు జాడ్యము తొలగి
→ పరమాత్మతో ఐక్యము లభిస్తోంది. అట్టి సూర్య-చంద్రుల ఐక్యతచే జగద్విషముల అభిలాష రూపమగు చిత్తము పరమాత్మ భావనయందు - జలము నందు తరంగము వలె - విలీనము పొందగలదు.

(3.) లయ యోగము

ప్రాణ-అపానముల సమత్వ ధారణచే విశ్వ క్షేత్రజ్ఞత్వము సిద్ధించుచుండగా, ఈ ‘జీవాత్మ భావన’ జీవపరిమితత్వమును త్యజించి, ఛేదించి-సర్వాంతర్యామి, సర్వతత్త్వ స్వరూపుడు అగు పరమాత్మ యందు (పరమాత్మ భావనయందు) లయం అయిపోవుచున్నది. యోగాభ్యాసము యొక్క అట్టి లయ స్థితినే ‘లయయోగము’ - అని పిలుస్తున్నారు.

పవనః స్థైర్యం ఆయాతి లయయోగ - ఉదయే సతి! జీవాత్మత్వ వ్యవహారమంతా పరమాత్మతో ఐక్యము (నటుడు- పాత్రల వలె పరమాత్మతో ఏకత్వము) పొందుచుండగా, ప్రాణ దేహములో పవనము (ప్రాణశక్తి) - స్థైర్యము పొందుచున్నది. లయాత్ సంప్రాప్యతే సౌఖ్యం స్వాత్మానందమ్ పరం పదమ్!

ఉండవు!

జలము, బంగారము, మట్టి, పాత్రధారణ సర్వదా యథాతథము కదా। అట్లాగే సర్వక్షేత్రములలోని (సర్వదేహములలోని) క్షేత్రజ్ఞత్వానికి వేరుగా వ్యష్టిగతమగు విశేషములకు స్వకీయమగు ఉనికి లేదు. - ఇదియే లయయోగము.

‘‘వ్యష్టిత్వము’’ - అను ఉప్పుగడ్డ దొరలి, ‘‘సమష్టిత్వము’’ అనే సముద్రజలములో ప్రవేశించి, ఏకమై ‘‘సర్వాత్మత్వము’’ సంతరించుకోవటమే ‘‘లయయోగము’’.

(4.) రాజయోగము

ఈ దేహమే ఒక మహాక్షేత్రము.- ఇందులే దేవతాప్రజ్ఞలు, ఆసురీప్రజ్ఞలు, ఆత్మ స్వరూపుడగు జీవుడు, 64 కళాదేవతలు మొదలైనవన్నీ ఆయా కార్యక్రమములు యజ్ఞభావితులై నిర్వర్తిస్తున్నారు. చక్రవర్తి యొక్క అధికారములో ‘‘మంత్రులు, సేనానాయకులు’’ మొదలైనవారివలె ‘పరమాత్మ’ యొక్క వెలుగులో అవన్నీ వర్తిస్తున్నాయి.

అటువంటి ‘‘యజ్ఞశాల’’ అనతగినట్టి ఈ శరీరము యొక్క యోని మధ్యగా (In the inner zone of central space of the physical body) - మంకెన పువ్వు వంటి ‘రజోతత్త్వము’ సంస్థితమై సంప్రవర్తితమైయున్నది. రజో వసతి జంతూనాం దేవీ తత్త్వం సమావృతమ్! ఈ రజోసంవృత్తమే (దేవీతత్త్వమే) ప్రకృతిగా, భావనగా, కళగా, సంకల్పముగా, ఊహగా-మొదలైనవన్నీగా దేహమునందు సంప్రదర్శనము అగుచున్నది.

అట్టి ‘రజోతత్త్వము’ నందు బుద్ధిని నిలిపి ఏకాగ్రచిత్తంతో యోగాభ్యాసము చేయుటచే రాజయోగము సిద్ధించుచున్నది.

అట్టి ప్రకృతితత్త్వోపాసనా ఫలమగు రాజయోగముచే ఆ యోగికి తాను కోరుకున్న ‘అణిమ, గరిమ, మహిమ’ ఇత్యాది సిద్దులు లభిస్తున్నాయి. సిద్ధులు లభించురూపముగా రాజయోగము విరాజమానమగుచున్నది. అయితే అవన్నీ అల్పమైన విశేషాలు. రాజుగారు సభను తన అధికారముతో అంతటా నింపి ఉంచు తీరుగా ‘‘ఈ జగద్దృశ్యమంతా నాయొక్క స్వరూప ప్రదర్శనయే’’ - అను సందర్శనమే రాజయోగము. ‘‘ఇదంతా నాలోని నేనైన నేను।’’ - అను దృశ్యసంభావనయే రాజయోగము.

ఈ విధంగా - ‘‘ప్రాణ అపానముల సమతస్థితి’’ అను అభ్యాసము చేతనే (1) మంత్ర యోగము (2) హఠయోగము (3) లయ యోగము (4) రాజయోగము - అనబడు యోగచతుష్టయము సిద్ధించుచున్నది.

హే బ్రహ్మభగవాన్! ఈ విధంగా యోగచతుష్టయము గురించి సంక్షిప్తంగా ఇప్పుడు చెప్పుకున్నాము. ఈ ఇవన్నీ కూడా అభ్యాసము (By constant practice) చేతనే సిద్ధించగలవు. మరింకే విధంగానూ కాదు. ఈ 4 యోగముల అభ్యాసము చేత జీవునికి సిద్ధించనిది ఏదీ ఉండదు. ఈ జీవుడు శివుడే అగుచున్నాడు. అందుకు గాను ఈ జీవుడు మర్కటక్షీరన్యాయమును ఆశ్రయించవలసిందే! ఏ విధంగా తల్లికోతి చెట్లపై ఎగురుతూ ఉంటే, పిల్లకోతి తల్లి కోతి యొక్క మెడను ఆశ్రయించి ఉంటుందో, ఆ విధంగా ముముక్షువు యోగచతుష్టయమును తనకుతానే శ్రద్ధ - అనునిత్యాభ్యాసము - సర్వప్రయత్నములతో కూడి ఆశ్రయించాలి. ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా (కానీ) దిన దినాభ్యాసంగా యోగచతుష్టయమును అభ్యసిస్తూ ఉండగా, ఈ జీవుడు ఈ వర్తమాన దేహముతోనే ఇక్కడే ముక్తిని పొందగలడు. ‘‘ఆత్మగా నేను నిత్యముక్తుడను. జీవాత్మత్వము నా యొక్క అంశ. సూర్యకిరణము తాను ప్రసరించువస్తువుచే బంధింబడుతుందా? లేదు కదా! అట్లాగే నేను జీవాత్మత్వముచే పరిమితుడనుకాను! సర్వదా అపరిమితుడను’’ - అను స్వానుభవమే ‘ముక్తి’.

యోగాభ్యాసి పట్ల యోగసిద్ధికి ముందే వర్తమాన భౌతిక దేహము నశిస్తేనో?

ఒకవేళ ఒకడు శ్రద్ధ, పట్టుదల, లక్ష్యశుద్ధి కలిగి దైనందికంగా యోగాభ్యాసము చేస్తూ ఉన్నప్పటికీ కూడా ‘‘ఆత్మ-యోగసిద్ధి’’ లభించకయే ప్రకృతి సిద్ధమగు ఈ భౌతిక దేహము నేల కూలటం జరిగినప్పుడో? ఇంతా కష్టపడి నిర్వర్తించిన యోగాభ్యాసము వృధా అవుతుందా?

ఈ ప్రశ్నకు సమాధానం వినండి.

శ్లో।। యోగసిద్ధిం వినా దేహః ప్రమాదాత్ యది నశ్యతి,
పూర్వవాసనయా యుక్తః శరీరం చ అన్యథా ఆప్నుయాత్।।
తతః పుణ్యవశాత్ సిద్ధో గురుణా సహ సంగతః
పశ్చిమద్వార మార్గేణ జాయతే త్వరితం ఫలమ్।।

యోగసిద్ధి పొందకుండానే ఏదైనా కారణంచేత కాలచమత్కారంగా అనుకోకుండా ఈ భౌతికదేహము నశించటం జరిగినా కూడా, ఆ యోగికి శుభమే జరుగుతుంది.
❆ ఆతని ఇతఃపూర్వపు జన్మల సంసారవాసనల స్థానంలో యోగాభ్యాస వాసనలు చేరి, అభ్యాసము ఎంతగా ఉంటే, అంతగా సంసార వాసనలను బయటకు త్రోలివేస్తూ ఉంటాయి.
❆ యోగాభ్యాస ‘అభిరుచి’, ‘అభ్యాసము’ పట్ల ‘తపన’ కారణంగా, ఆ యోగి ‘‘యోగాభ్యాసమునకు సానుకూల్యము, యోగాభ్యాస సరంజామా లభించగలది’’ - అగు మరొక ఉపాధిని పొందుచున్నాడు. ఆతని ఉత్తర ఉపాధి (The next body) యోగాభ్యాస ఉత్తరోత్తిర గతికి సానుకూల్యమై ఉంటుంది. అనగా ఆతని తదనంతర శరీరము సంసార వాసనలచే కాకుండా, యోగాభ్యాస వాసనలచే నిర్ణయించబడినదిగా అగుచున్నది.
❆ అట్టి నూతన శరీరముతో ఆ ముముక్షువు పుణ్యవశంగా.. యోగసిద్ధుడైన గురువుతో సమాగమము (Association with yoga sidha) లభించుచున్నది.
❆ ఆ అభ్యాసి గురువు యొక్క సామీప్యతకు అర్హుడగుచున్నాడు. గురువు చెప్పు యోగాభ్యాస సూచనలను ఆకళింపు చేసుకొనుచున్నవాడై పశ్చిమ ద్వారమార్గంగా త్వరితగతిని ‘యోగసిద్ధి’ అను ఫలమును పొందుచున్నాడు.

(పశ్చిమద్వారమార్గము = సాంసారిక ఉత్తరోత్తర జన్మలకు వ్యతిరిక్తమైనట్టిది.
పశ్చిమద్వారం → జ్ఞాన సమాచారముగా తెలుసుకొని, ఆ తెలుసుకొన్నది అనిపించే వరకు అనుకోవటానికి దారితీయు యోగమార్గము.
తూర్పుద్వారం → జ్ఞాన సంమాచారము వినటం).

కాకమతము (లేక) గురుమతము

పూర్వ జన్మకృత అభ్యాసాత్ సత్వరం ఫలం అశ్నుతే! ఇతః పూర్వపు జన్మలలో చేసిన అభ్యాసము చేతనే ఒకనికి ఇప్పుడు జ్ఞాన-యోగ ఫలమగు ‘ముక్తి’ లేక ‘మోక్షము’ స్థాపితమౌతోంది. ఎవ్వడూ కూడా ప్రయత్నించకుండా ఏదీ పొందటం లేదు. ‘ముక్తి’ కూడా క్రితం జన్మల ప్రయత్నము చేతనే ఇప్పుడు లభించటం జరుగుతోంది. ‘‘ప్రయత్నిస్తేనే ప్రయోజనము’’ - అను సిద్ధాంతమును ‘కాకమతము’ అని పిలుస్తున్నారు. ‘‘కాక..’’ = ఏదైతే పొందాలని అనుకుంటున్నావో అట్టి యోగసిద్ధి పొందటానికి ఉపాయము. యోగాభ్యాస యత్నములు.

తెలుసుకుంటే సరిపోదు. అనుకోవాలి. అనిపించాలి. అనుకోవాలంటే బుద్ధియొక్క సునిశ్చలత కావాలి. సునిశ్చలత కావాలంటే యోగాభ్యాసమే ఉపాయం. నాస్తి కాకమత్ అన్యత్ అభ్యాసాఖ్యమ్ అతః పరమ్! ‘అభ్యాసము చేయి’ అనునదే సర్వజ్ఞాన వాక్యముల సారము. అభ్యాసమునకు వేరుగా కాకమతము (జ్ఞాన వాక్యముల సూచన) మరింకేదీ అయి ఉండలేదు. తేనైవ ప్రాప్యతే ముక్తిః, న అన్యథా శివభాషితమ్। ‘‘ఆత్మతో యోగము (కలయిక)’’ అను అభ్యాసమే యోగాభ్యాసము. ‘‘ప్రాణ సంయమము, కుండలినీ ఊర్థ్వయానము, గ్రంథి జయము, బ్రహ్మరంథ్రం - ఊర్థ్వగమనము’’ మొదలైన ఉపాయములతో శాస్త్రములచే, గురువులచే బోధింపబడుచూ, మార్గదర్శకము చేయబడుచున్నాయి. దృశ్య-దేహ-ఇంద్రియ-మనో-బుద్ధి-చిత్త-అహంకారములతో ఏర్పడు యోగము (Relationship) ను అభ్యాసపూర్వకంగా దాటివేసి ‘ఆత్మతో యోగము’ సిద్ధించుకోవాలి.

జీవాత్మయొక్క ‘కేవలస్వస్వరూపము’తో అనన్యత్వమే ‘యోగము’.

వీటినే ‘‘యోగమార్గము, హఠయోగము, కాకమతము, పశ్చిమ మార్గము’’ అని పిలుస్తున్నారు. ఇట్టి హఠయోగి (లేక) పశ్చిమమార్గము చేతనే ముక్తి ప్రాప్తించగలదు - అనునదే శివ భాషితము. శివ వాక్కు.

కాష్ఠా సహజీవనము - లయ యోగము

ఈ జీవుడు తనయొక్క ‘దేహిత్వము’ను ఏమరచి, - ‘‘భౌతిక దేహమునకు నేను పరిమితుడను’’ అను భావన యందు మునిగి తేలుచున్నాడు. భౌతికదేహముతో సాంగత్యము పొందుతూ అసంఖ్యాక ఉపాధి పరంపరల సంయోగమును-వియోగమును పొందుచున్నాడు. మార్పు చెందు వస్తువులతో సాంగత్యము ఈతని దుఃఖ పరంపరలను వృద్ధి చేసుకుంటూపోతున్నది. ఈవిధంగా ఈ జీవుడు దృశ్యవ్యవహారములలో ఎక్కడో మునిగి, మరెక్కడో తేలుచున్నాడు.

ఇప్పుడు ఉపాయమేమిటి?

హఠయోగ క్రమాత్ కాష్ఠా సహజీవ లయాదికమ్! హఠయోగ క్రమము. [\ ప్రాణ - అపానముల సమస్థితి - అను అభ్యాసయోగము (లేక) ‘హఠయోగము’ ] చేతనే ‘దేహముతో తాదాత్మ్యము’ అనే రోగము కుదురగలదు. అట్టి ‘పశ్చిమ మార్గము’ తప్పించి వేరే ఉపాయం లేదు. ఈ శరీరముల ‘‘జనన-మనన - మరణముల’’ మార్గంలో వచ్చిపడియున్న సంసార రోగము - మంత్ర-లయ-హఠ-రాజయోగములనబడే యోగచతుష్టయం చేతనే - అదౌ రోగాః ప్రణస్యంతి పశ్చాత్ జాడ్యం శరీరజమ్। → మొదలంట్లా తొలగగలదు. యోగ చతుష్టయము చేతనే కపాల ప్రదేశమున సంస్థితమైయున్న చంద్రమండలము నుండి అవిచ్ఛిన్నముగా ‘అమృతత్వము’ అనబడే ఆత్మత్వము స్రవించగలదు.

ప్రాణ-అపానముల (లేక) సూర్య-చంద్ర తత్త్వముల సమత్వయోగ ధారణాభ్యాసము చేత →
✤ శరీరములోని ధాతువులు యోగాగ్ని చేత స్పృశించబడినవై, వాటి వాటి వికారములను త్యజించి, శరీరములో సమత్వము పొందసాగుతాయి. ధాతువుల అల్పత్వ-అధికత్వ దోషములు తొలగుతాయి.
✤ శరీరము సరళత్వము, సౌమ్యత్వము (మార్దవము) పొందటం జరుగుతుంది. (అనేక యోగశాస్త్ర సూచిత) శబ్దములు శరీరములో వినబడసాగుతాయి. అవి యోగసాధనములుగా మలచబడతాయి. (‘ఉమ్’, ‘మమ్’, ‘ఓం’, మొదలైనవి).
✤ శరీరములో పైత్య-జఠర రసముల అతివృష్టి, అనావృష్టి తొలగి, వాయువు (లేక ప్రాణశక్తి) యొక్క ప్రసరణము, సంచారము సుఖకరముగా అగుచున్నది. ఆ యోగికి ఆకాశ గమన సామర్ధ్యం లభిస్తోంది. జిత్వా వృష్ట్యాదికం జాడ్యం ఖేచరః స భవేత్ నరః।
✤ ఆతడు వాయువేగమును సంతరించుకొనుచున్నాడు.
✤ ఈ దేహముల ముందు వెనుకలు ఎరిగినవాడగుచున్నాడు. సర్వజ్ఞుడగుచున్నాడు. తాను కోరుకున్న ఉత్తరోత్తర శరీరములను పొంది ‘కామరూపి’ అగుచున్నాడు. సర్వజ్ఞో అసౌ భవేత్ కామరూపః పవన వేగవాన్।
✤ సిద్ధయోగి అయి మూడు లోకములలోను వినోదముగా, క్రీడా విశేషంగా సంచారములు చేయగల సామర్థ్యమును పొందుచున్నాడు. లోకములన్నీ ఆతనికి క్రీడాస్థలముల వలె, చక్రవర్తి యొక్క స్వీయ అంతఃపుర ఉద్యానవన సంచారమువలె అగుచున్నాయి.
✤ ఆతనికి లోకభావములన్నీ - కర్పూరము అగ్నిస్పర్శను పొందిన రీతిగా - జనిస్తూనే సమసిపోతున్నవగుచున్నాయి. ఆతనిలో కార్పణ్యము ఉండదు. ఇక కాఠిణ్యము ఏముంటుంది? ఏ మాత్రమూ ఉండదు.

అట్టి యోగి యందు వ్యష్టిగతమైన అహంకారమంతా ‘‘వెలిగించిన మైనపు వ్రత్తి’’…. వలె కరిగిపోతుంది. ఇక దేహకాఠిన్యం ఉండదు.

అట్టివాడు ‘యోగీంద్రుడు’ అయి -
→ సర్వకర్త (సర్వమునకు - మనోబుద్ధి చిత్త అహంకారములకు, వాటి వాటి వాటి విషయములకు తానే కర్తగా) అగుచున్నాడు.
→ సర్వ స్వతంత్రుడగుచున్నాడు. స్వాతంత్రుడుగా విరాజిల్లుచున్నాడు.
→ జీవన్ముకుడు (జీవితము ఒకవైపు కొనసాగుచుండగా, రెండవ వైపు నిత్యముక్తుడు) అగుచున్నాడు. న అత్ర సంశయః! ఇందులో సంశయము లేదు. జీవాత్మత్వపు ‘‘నిత్య బద్ధత్వము’’ → తన పరస్వరూపముయొక్క ‘‘నిత్యముక్తత్వము’’నకు కించిత్ కూడా విఘాతము కలిగించజాలదు - అని ఎరిగి సంచరిస్తున్నాడు.

ద్వివిధములైన సిద్ధులు

ఈ లోకంలో సిద్ధులు రెండు తీరులవై ఉంటున్నాయి.

(1) కృత్రిమ-కల్పిత సిద్ధులు : ఈ కల్పిత (Internationally intended, matter related) సిద్ధులు - మంత్ర శాస్త్రము చెప్పుచున్నది. రససేవనము చేతను, ఓషధుల చేతను, క్రియాజాలము చేతను, మంత్ర-తంత్రముల చేతను- వాటి వాటి సాధనల వలన సిద్ధించేవి. ఇవన్నీ ఎదుటి వాని దృష్టిని ఆకర్షించటానికి సంబంధించినవి. ఎదుటివాని దృష్టిదోషములను, బలహీనతలను ఉపయోగించుకుని కల్పించబడేవి. అందుచేత ఈ సిద్ధులను ‘కల్పిత సిద్ధులు’ అని పిలుస్తున్నారు.
ఇవి నిత్యములైనవి కావు. అనిత్యములు (They are confined to addressing certain assumptions, situations and pressumption of others). అల్పవీర్యములైనవి (Their potential is of lower state). ఇవన్నీ కూడా సాధనచే ఊద్భవిస్తూ ఉంటాయి. సాధన కొనసాగనప్పుడు కరిగిపోవటం ప్రారంభిస్తూ ఉంటాయి.

(2) స్వాభావిక-అకల్పిత సిద్ధులు : ఇవి- వాటి కొరకై లక్ష్యసాధన లేకపోయినప్పటికీ- సిద్ధించేవి. వాటికవే స్వయముగా యోగిని ఆశ్రయిస్తూ ఉంటాయి. ఇవి స్వాత్మయోగము (తనను, తదితరులను, ఆత్మతత్త్వస్వరూపులుగా సంభావించటము చేత), ఆత్మ-స్వాతంత్ర్యత చేతను, ఈశ్వర ప్రియము చేతను యోగిని సమీపిస్తాయి. తదితర జీవుల పట్ల ఆత్మీయ భావన, అవ్యాజమైన ప్రేమ వలన స్వతః సిద్ధంగా కలుగుతూ ఉంటాయి. ‘‘సర్వము ప్రియమగు పరమాత్మ స్వరూపమే’’ - అని భావించి, సహజీవులను పరమాత్మ స్వరూపంగా దర్శించి ఉపాసించువారి పట్ల ‘‘ఈతడు ప్రియమగు పరమాత్మ స్వరూపుడే!’’… అనే భావన తదితరులకు కలుగుతూ ఉంటుంది.
అట్టి సర్వజన శ్రేయోపూర్వకము, స్వాభావికము అగు ఆప్యాయతతో కూడిన యోగి పట్ల ఏర్పడు జనుల దివ్యభావములు ‘‘స్వాభావికసిద్ధులు’’.

యోగి ఆత్మీయ భావనచే సర్వ భేదవాసనలను దాటివేయుచున్నాడు. చిరకాలము ‘తత్ త్వమ్’ భావనను ఆశ్రయించినవాడై స్వభావంగానే ఆకర్షణుడు, సిద్ధి పొందినవాడు,మహావీర్యుడు, సర్వులకు ఇష్టరూపుడు అగుచున్నాడు. యోగాభ్యాస ప్రభావముచే సహజ సిద్ధయోగి అయి, సిద్ధులచే ఆశ్రయించబడుచున్నాడు.

అయితే, అట్టి మహాయోగి తన మహాయోగ సిద్ధులను రహస్యంగా ఆత్మజ్ఞాన-ఆత్మభావనల వెనుకగా దాచి ఉంచుతాడు. ‘‘నేను ఈ ఈ సిద్ధులచే వారికంటే వీరికంటే గొప్పవాడను’’ - అను భావన - అభిప్రాయములకు, ప్రలాపములకు చోటివ్వడు.

తాస్తు గోప్యా మహాయోగాః పరమాత్మపదే అవ్యయే! అవ్యయమగు పరమాత్మ పదము సిద్ధించుకోవటమే రహస్యమగు మహాపదము. అదియే సమస్త సిద్ధులసారము.

వినా కార్యం సదా గుప్తం యోగసిద్ధస్య లక్షణమ్! దైనందికమైన లౌకిక కార్యక్రమములలో ప్రదర్శించకుండా ఎల్లప్పుడు సిద్ధులను దాచి ఉండటము అకల్పిత యోగ-సిద్ధయోగి యొక్క స్వాభావిక లక్షణము.

అట్టి ఆత్మసిద్ధ యోగి సర్వదా - ‘‘సమస్తమునందు తనను, తనయందే సమస్తమును’’ దర్శిస్తూ ఉంటాడు. ఏ విధంగా అయితే, ఆకాశము దేవతల రాకపోకలతోను, పక్షుల - విమానముల గమన ఆగమనములతోను, అనేక పధములు (మార్గములు) అంతర్నిర్మితమైయున్నదో, అట్లాగే అకల్పిత సిద్ధుడగు మహాయోగి - ఉన్నచోటే నానా తీర్ధములు, నానా మోక్షమార్గములు ఆశ్రయించినవై ఉంటాయి. లాభాలాభ వివర్జితుడగు ఆయోగిని సుకర్మలు, సుక్షేత్రములు వెంటనంటి ఉంటాయి. సిద్ధజాలమంతా అట్టి ఆత్మభావనా సిద్ధయోగులు నడిచి వెళ్లుచున్న మార్గములో తమకు తామే వెంటనంటి ఉంటున్నాయి.

★★★

ఒక ప్రావీణ్యము గల స్వర్ణకారుని వద్దకు చేరిన ఆభరణమును ‘‘ఇది అసలైన-సిసలైన బంగారము అవునా? కాదా?’’ అని పరీక్షించి, బంగారము అయితేనే ఆభరణముగా చేయటానికి సిద్ధుడౌతాడు కదా! అట్లాగే, ఆత్మతత్త్వము ఆశయముగా కలిగియున్న యోగి-సిద్ధులు తనను సమీపిస్తూ ఉన్నప్పుడు, - ‘‘జీవన్ముక్తికి అవసరమా? కాదా?’’ - అనునది పరిశీలించి, పరీక్షించి,.., జగత్తును ఆత్మగా ఉపాసించుటకు ఉపకరణము కానివాటిపట్ల ఉదాశీనుడై ఉంటాడు.

అయితే జీవన్ముక్తుని పట్ల - యోగమార్గములో సాత్వికగుణములు (ప్రేమ, ఆప్యాయత, కరుణ, దయ, దాక్షిణ్యము మొదలైనవి) స్వాభావికం అగుచూ ఉంటాయి. ‘‘నాకు జరామరణములు స్వాభావికమే కావు. అవి ఆత్మస్వభావమునకు సంబంధించినవి అవజాలవు’’ - అను నిశ్చల నిశ్చితత్త్వము కలవాడే జీవన్ముక్తుడు.

★★★

బ్రహ్మ భగవానుడు : స్వామీ! ఈ జీవుడు దేహపంజరముల నుండి విడివడి, దేహభావ పరిమితముల నుండి విముక్తుడు అవటం ఎట్లా?

పరమ శివ భగవానుడు : ‘ముక్తి’ అనునది బుద్ధికి సంబంధించినది మాత్రమే. అంతేగాని, దేహముల రాక-పోకలకు సంబంధించినదే కాదు. ‘మృత్యువు’ అనునది భౌతిక శరీరమునకు, భౌతిక భావనకు సంబంధించినది మాత్రమే - అనునది సునిశ్చయమగు గాక।

యోగ సాధన జరుగుచున్నప్పుడు ఆ యోగిని సమీపిస్తూ వచ్చే అణిమాది అష్టసిద్ధులు భౌతిక దేహపరమైనవి మాత్రమే. ముక్తియో? దేహాతీతమైనది. దేహపతనము ముక్తికి సూచనము కాదు. దేహము పతనమైనంత మాత్రం చేత (మనస్సు దేహానంతరం కూడా కొనసాగుచూనే ఉంటుంది. కనుక) జీవుని యొక్క సంసార బంధనము తొలగుట లేదు. హే పద్మజా! పశువులు, కుక్కుటములు (కోళ్ళు), కీటకములు మొదలైనవన్నీ కూడా మరణమును పొందుచున్నాయి కదా! మరణించిన మాత్రం చేత వాటికన్నిటికీ ముక్తి లభిస్తోందా? లేదు. ప్రాణములు భౌతిక - దేహము నుండి బహిర్గతము అయినంత మాత్రం చేత చిత్తము యొక్క దేహచింతన, దేహత్వముతో అవినాభావత్వము తొలగునది కాదు.

అందుచేత ఆ జీవుడు దేహత్వము, దృశ్యత్వము యొక్క ధ్యాసచే - జీవన్ముక్తత్వము సిద్ధించనంతవరకు - మరొక ప్రవాహ పతితమైన దేహము పొందటము అనివార్యం. కనుక దేహబంధనము ఎక్కడికీ పోనిదే - అగుచున్నది.

యోగాభ్యాసి విషయములో, ఆతడు దేహము యొక్క పరిధులను దాటివేస్తున్నాడు. ‘‘దేహిత్వము (లేక) దేహ-ప్రాణములు నాకు ఆభరణములు’’ - అను దేహాతీతత్వము, (లేక) దేహసాక్షిత్వము సిద్ధించుకొనుచున్నాడు. ఆతడు ప్రాణశక్తిని దేహిగా తనయందు కలిగి ఉండి, ఆ ప్రాణశక్తితో దేహమును నింపి ఉజ్జీనింపజేయువాడుగా తనను తాను ఎరుగుచున్నాడు. అనగా ప్రాణములు ఆతని నుండి ఎటూ వెళ్లటం లేదు. అందుచే ఆతడు దేహప్రవేశ-నిష్క్రమణములు తనపై, తన యొక్క ప్రాణములపై (స్వకీయమగు ప్రాణశక్తిపై) ఆపాదించుకోడు.

న బహిః ప్రాణం ఆయాతి। పిణ్డస్య పతనం కుతః? యోగసిద్ధుడగు జీవన్ముక్తుని అవగాహన విషయంలో ఆతని ప్రాణములు ఆతని యందే ఉన్నవగుచున్నాయిగానీ, బహిర్గతమై శరీరమునందో, మరొక చోటికో ప్రయాణమవటం లేదు. ‘‘నేను నా ప్రాణశక్తితో ఉత్పత్తి - స్థితి-వృద్ధి - పతన శీలమగు ఈ శరీరమును వస్త్రమువలె ధరిస్తున్నాను. నా ప్రాణశక్తితో ఈ దేహము యొక్క అణువణువు నింపుచున్నాను. ఇది శిధిలమగుచున్నది. ఎప్పటిలాగానే నా ప్రాణములు (లేక శక్తి) నన్ను అనుసరించియే యథాతథమై ఉంటున్నాయి।’’ - అని ఎరిగి ఉంటున్నాడు. అట్టి వానికి ‘పిండ పతనము’ - ఈ శరీరము ఉన్నప్పుడూ లేదు. ఇది నశించినప్పుడూ లేదు. ఆతనికి పిండపతనము స్వకీయ ‘అంశ’ విశేషమే అయి, అద్దానికి పరమై, పరమాత్మగా ప్రకాశమానుడగుచూ ఉంటున్నాడు.

యోగసిద్ధుడు జీవన్ముక్తుడై ప్రకాశించుచున్నాడు. దేహము ఉన్నప్పుడే దేహము - దేహత్వములను జడసంబంధమైనవిగాను, వాటి కావల గల కేవలత్వము ఆత్మ చైతన్యత్వముగాను యోగీశ్వరుడు స్వానుభవము చేసుకొనుచున్నాడు. అందుచేత.., ‘‘కేవలుడుగా నాకు జడ శరీరముచే ‘పిండ పాతము’ అనునదే లేదు’’ అను కైవల్యస్థితిని సిద్ధించుకొనుచున్నాడు.

యోగయుక్తుని దృష్టిలో శరీరము యొక్క ‘పతనము’ ముక్తి కాదు. శరీరము యొక్క ‘రాక’ బంధమూ కాదు.

ముక్తి అనగా ఏమిటి? మరికొంత వివరిస్తున్నాను.
శ్లో।। దేహే బ్రహ్మత్వమ్ ఆయాతే జలానాం సైన్ధవం యథా,
అనన్యతాం యదా యాతి, తదా ముక్తః స ఉచ్యతే।।

ఒక సైంధవ లవణము గడ్డను (A piece of salt) నీటిలో వేసినప్పుడు, ఆ గడ్డ నీటిలో కరిగిపోవుచుండగా, అద్దాని ఆకారము, రంగు, రూపు, లవణత్వము ఇవన్నీ ఏమౌతున్నాయి? నీటిలో కరగిపోయి, నీటితో మమేకమగుచున్నాయి కదా! అట్లాగే, యోగాభ్యాసి యోగసిద్ధి పొందుచుండగా దేహము, దేహత్వము, స్వభావము, ప్రాణము, ప్రాణత్వము → ఇవన్నీ కూడా ఎప్పుడైతే ‘బ్రహ్మత్వము’తో ‘అనన్యత్వము’ పొందుతాయో, అప్పుడు ఆతడు ‘‘ముక్తుడు’’ అని చెప్పబడుచున్నాడు. అనగా
జీవునికి నిత్యానుభవమగుచున్న అన్యత్వమంతా (ఉప్పుగడ్డ జలమునందు వలె) జీవన్ముక్తునిపట్ల ఆత్మగా అనన్యత్వము సంతరించుకొన్నదై ఉంటోంది।

ఒక చోట జలములో బుడగలు బయల్వెడలినవై కనిపిస్తున్నాయి.

నీటి బుడగలు జనించేది ఎందులో? జలములో! సంచరించేది ఎందులో? జలములో! లయించేది ఎందులో? జలములో! జలమునకు వేరుగా నీటి బుడగలు కనిపించవచ్చుగాక! కానీ అవన్నీ జలమునకు భిన్నమా? ఎన్నటికీ కాదు.

అట్లాగే..,
జీవన్ముక్తుని స్వానుభవములో-ఈ శరీరము, దేహత్వము, ఇంద్రియములు, వాటి వాటి అనుభవశీలమగు దృశ్య-అదిగా గల వస్తుజాలము, (ఇంద్రియములకు అనుభవమగుచున్నవి), అష్టసిద్ధులు, తదితర జీవులు - ఇవన్నీ కూడా తన యొక్క కేవలత్వము (లేక) పరబ్రహ్మత్వము (అనే జలము)లో బుడగల వంటివి. ఆతనికి తదితరమైనదంతా ఆత్మకు అనన్యభావనగా సిద్ధించుచున్నది. అట్టివాడే యోగసిద్ధుడు.

అనన్య చింతనచే అనన్యత్వము సిద్ధించటమే వాస్తవమైన సిద్ధి. అదియే సిద్ధపురుష లక్షణము.

దేహం దేవాలయమ్ ప్రోక్తమ్

చిత్తలయము గురించి ప్రయత్నించనివానికి ఈ దేహము, ఈ ఇంద్రియ విషయములు జాలమువలె (Like a Fisher Net) బంధమే అగుచున్నాయి. ఆతనికి దేహపతనము - (అనేక దృశ్య ధ్యాసలు కారణముగా) అనేక దఃఖములకు (Many worries) - సందర్భముగా అగుచూ ఉన్నది. అనేక యోనులలో ప్రవేశ-నిష్క్రమణముల గతులకు ‘ద్వారము - (Entrance gate) - అగుచున్నాయి.

ఇక, యోగాభ్యాసము స్వీకరించి, ఈ దేహమును ‘‘యోగోపకరణముగా ఉపయోగించటము’’ అను ప్రయత్నశీలునికి - ఈ దేహము ‘‘మహత్తరమగు, తరింపజేయగల’’ - అవకాశము, సందర్భము కూడా.

దశ ద్వారపురం దేహమ్ - ఈ దేహము - (రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కుపుటములు, నోరు, శిశ్నము, గుదము, బ్రహ్మరంథ్రము.. అనబడు) - 10 ద్వారములు (10 entrances or 10 quit points) …. కలిగియున్నది.

దశ నాడీ- మహాపథమ్ : (5) నాడులు ఇంకా (5) ఉపనాడులు కలిగి ఉన్నది. వాటన్నిటితో దేహములో అనేక రహదారులు ఏర్పడినవై ఉన్నాయి. (ఇడ; పింగళ; విళంబినీ; గాంధారి; పూష; అంబుష; శూర, విశ్వోదరీ; రాకాహ్వయ; హస్తిజిహ్వ)

దశభిః వాయుభిః వ్యాప్తమ్ : (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములనబడే) పంచప్రాణములతో, (నాగము, కూర్మము, కృకరము, ధనంజయము, దేవదత్తములనబడే) పంచ ఉపప్రాణములతో దేహము వ్యాప్తమైయున్నది.

దశేన్ద్రియ పరిచ్ఛదమ్ : (శ్రోత్ర (చెవులు)-త్వక్ (చర్మము)-చక్షుః (కళ్ళు)-జిహ్వ (నాలుక)-ఘ్రాణ (ముక్కులు) వాక్ (నోరు) - పాద (కాళ్ళు)-పాణి (చేతులు)-పాయువు (గుదము)-ఉపస్థ (గుహ్యము)-అనబడే)- 10 ఇంద్రియ పరిచ్ఛేదములు కలిగి ఉన్నట్టిది.

షట్(6) ఆధారాపవరకమ్ : - (మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞా - అనబడే) ‘6’ ఆధారములు కలిగి ఉన్నట్టిది.

షట్ అన్వయ మహావనమ్ : 6 అన్వయములు కలిగి ఉన్నట్టిది (దృశ్యము -దేహము - ఇంద్రియములు - మనస్సు - బుద్ధి-చిత్తము)

(పంచభూతత్వములు + మనస్సు)

(అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయ-ఆనందమయకోశములు + జీవాత్మ) - ఈవిధములై ‘6’ సంచార విశేషములు కలిగియున్న మహావనము.

చతుఃపీఠ సమాకీర్ణం : ‘4’ పీఠములు కలిగియున్నట్టిది (స్థూల-సూక్ష్మ-కారణ-మహాకారణ. దేహములు) (మనో-బుద్ధి - చిత్త-అహంకారములు).

చతుః ఆమ్నాయ దీపకమ్ : నాలుగు వేద వాక్కులతో దీపించునది. (సోఽహమ్; తత్‌త్వమ్; త్వమేవాఽహమ్; అయమాత్మా బ్రహ్మ), ఋక్కులు, మంత్రములు, స్తోత్రములు, ఉపాసనలతో ప్రకాశించునది.

బిందునాదమహాలింగమ్ : - దృశ్యము - దేహము - దేహసాక్షి
- బిందువు-నాదము -మహాలింగము (pin point-sound-Absolute self) ఇవన్నీ కలిగి ఉన్నట్టిది.

శివ-శక్తి నికేతనమ్ : ఈ దేహమే శివ-శక్తులకు, (పురుష-ప్రకృతులకు; (I & my) - వేంచేసియున్న గృహము.

శ్లో।। దేహం శివాలయం (దేవాలయం) ప్రోక్తం, సిద్ధిదం సర్వదేహినామ్।

సర్వ దేహుల యొక్క దేహము జీవన్ముక్తత్వము (లేక) మోక్షత్వము (లేక) విదేహముక్తత్వములను - సిద్ధింపజేయగలిగినదే. కాబట్టి ఈ దేహమే దేవాలయము. బాహ్య-అభ్యంతరములన్నీ, (దృశ్య దేహ మనో బుద్ధి చిత్త అహంకారములతో సహా) - ‘‘దేవాలయ ప్రాంగణములు’’. ఈ దేహములోని ‘దేహి’యో?, దేహ దేవాలయములో వేంచేసియున్న ‘దైవము’ (లేక) ‘పరబ్రహ్మము’ (లేక) ‘పరమాత్మ’.

కుండలినీ శక్తి

(1) మూలాధార చక్రము: ఈ శరీరములో ‘‘గుదము - మేఢ్రము (మేహనము, మూత్రవిసర్జనావయము)ల మధ్య అంతరమున (In the inner recess)      ⃤   త్రికోణాకారముగా ‘మూలాధారచక్రము’ ప్రతిక్షేపించినదై ఉన్నది.

ఈ మూలాధారచక్ర స్థానములో శివుడే జీవుడై వెలయుచున్నాడు - అని తత్త్వజ్ఞులచే సవివరించబడుచున్నది. అటువంటి మూలాధారమునందు (మూలాకాశములో) ‘కుండలిని’ అని పిలువబడే మహత్తరమగు మహాశక్తి (లేక) ప్రకృతి శక్తి స్వరూపిణి వేంచేసియున్నది. ఇది ఇచ్ఛా-జ్ఞాన-క్రియా శక్తి రూప దేవీపీఠము. దివ్యమగు ప్రజ్ఞానంద స్వరూపశక్తి స్వరూపిణీ దేవి.

కుండలినీ దేవి
❋ ఏ మహత్తర శక్తి నుండి వాయువు సంచలన శక్తిని పొందినదై విశ్వమంతా ప్రసరణము కలిగియున్నదో.., యస్మాత్ ఉత్పద్యతే వాయుః..,
❋ ఏ మహాదేవి నుండి అగ్ని - ఉష్ణరూపమును పొందినదై శరీరములలో సంచరించుచూ, విశ్వమునందు దహనశక్తిని ప్రదర్శించుచూ, యజ్ఞమునందు సమర్పించు హవనములను దేవతలకు జేర్చు క్రియావిశేషము ప్రదర్శించుచున్నదో, - యస్మాత్ వహ్నిః ప్రవర్తతే…,
❋ ఏ మహాదేవీ వైభవమునుండి నాదము ఉత్పన్నమగుచున్నదో (The origin where sound is generating)-యస్మాత్ నాదః ప్రవర్తతే..,
❋ ఏ ఆదిదేవి నుండి ‘నేను -నేను ఉన్నాను’ (Yes! I Exist) అను రూపము గల ‘హంసో-సోఽహమ్’ బయల్వెడలి ప్రవర్తన శీలమగుచున్నదో, యస్మాత్ ఉత్పద్యతే హంసో,
❋ ‘‘ఆలోచన’’- ఎచ్చోట నుండి ఉత్పన్నమగుచున్నదో, ఏది మనస్సుకు జనన స్థానమగుచున్నదో.., యస్మాత్ ఉత్పద్యతే మనః, తదేవ తత్ కామరూపాఖ్యం, పీఠం కామ ఫలప్రదమ్। అదియే మూలాధావములో వేంచేసినదైయున్న కామరూపాఖ్యపీఠం. ఈ జగత్ వ్యవహారమంతా అద్దాని దృష్టాదృష్ట లీలయే! అది కామఫలప్రదమైయున్నది. అద్దాని ఇచ్ఛారూపమే ఈ జగత్తు. కనుక జగత్తు కామపీఠము-అనబడుతోంది. అదియే కుండలినీశక్తి. కామేశ్వరీ స్థానము।

(2). స్వాధిష్ఠాన చక్రము : ఇది లింగమూలమున స్థానము కలిగియున్నది. ఇది     ⬡     ‘6’ (షట్) కోణాకరమైయున్నది. స్వాధిష్ఠానాహ్వయం చక్రం లింగమూలే షడశ్రకే।

(3). మణిపూరకచక్రము : బొడ్డుచుట్టూ 10 రేకుల చక్రము వలె ప్రవర్తనమానమగుచున్నది. నాభిదేశే స్థితం చక్రం దశారం మణిపూరకమ్।।

(4). అనాహత చక్రము : హృదయభాగంగా సంస్థితమైయున్నది. 12 రేకుల         మహాచక్రము. ఓ కమల సంభవా! దీనిని ‘పూర్ణగిరి’ పీఠము - అని కూడా అంటారు. యోగులకు అనాహతముతో ‘‘స్వయం సంపూర్ణత్వము’’ - స్వానుభవమగుచున్నది. ద్వాదశారం మహాచక్రం హృదయే చ అపి అనాహతమ్। తదే తత్ పూర్ణగిర్యాఖ్యమ్ పీఠమ్।

(5). విశుద్ధ చక్రము : కంఠకూపస్థానములో షోడశ రేకులు కలిగియున్నట్టిది. ఓ సురేశ్వరా! అద్దానియందు ‘జాలంధరపీఠము’ అనుపేరుతో ప్రసిద్ధము. రసతత్త్వము ప్రక్షిప్తమైయున్న స్థానము. కంఠకూపే విశుద్ధాఖ్యం యత్ చక్రం షోడశాశ్రకమ్। పీఠం ‘జాలంధరం’ నామ తిష్ఠతి అత్ర।।

(6) ఆజ్ఞాచక్రము : ఇది భ్రూమధ్యగా ఉన్నట్టిది. రెండు దళములు కలిగి ఉన్నట్టిది. ఉత్తమ స్థానము. ఆజ్ఞా నామ భ్రువోర్మధ్యే ద్విదళన్ చక్రమ్ ఉత్తమమ్।

ఉడ్యాణ మహాపీఠము : ఇది ఆజ్ఞాచక్రమునకు ఉపరితలముగా (పైనగా) నుదురు నందు ఉన్నట్టిది. ఉడ్యాణాఖ్యం మహాపీఠమ్ ఉపరిష్ఠాత్ ప్రతిష్ఠితమ్।

పంచభూతములు - అధిదేవతలు

ధరణి (భూ) :     ▭     చతురస్రాకారం. అధి దేవత → బ్రహ్మ. చతురశ్రం ధరణి ఆదౌ। ‘బ్రహ్మ’ - తత్ర అధిదేవతా।

జలము :     ◗     అర్థచంద్రాకృతి గలది అధిదేవత → విష్ణువు. అర్థచంద్రాకృతి జలం। విష్ణుః, తస్య అధిదేవతా।

వహ్ని (అగ్ని) :      ⃤     త్రికోణ మండలము. అధి దేవత → రుద్రుడు. త్రికోణ మండలం ‘వహ్నీ’। రుద్రః తస్య అధిదేవతా।

వాయువు :     ⬡     షట్ (6) కోణముల బింబాకారము. అధి దేవత → ఈశ్వరుడు. వాయోః బింబన్తు షట్కోణమ్। ఈశ్వరో అస్య అధిదేవతా।

ఆకాశమండలము :      ⃝     వృత్తాకారము.. దేవత → సదాశివుడు. ఆకాశమండలం వృత్తం। దేవతా అస్య సదాశివః।

మనో మండలము : భ్రూమధ్యగా గల నాదరూపము. నాదమునకు, ఆలోచనలకు ఉత్పత్తి స్థానము. నాదరూపం భ్రువోర్మధ్యే మనసో మండలం విదుః।

ఇతి ప్రధమోధ్యాయః


2వ అధ్యాయము

‘‘ఖేచరీ సమత్వయోగము’’ - ‘‘స్థూల-సూక్ష్మ-పరములు’’

బ్రహ్మదేవుడు / హిరణ్యగర్భుడు : హేశంకర భగవాన్! దేనిని తెలుసుకొన్నంత మాత్రంచేతనే ‘ఖేచరీ సమత్వము’ యోగికి సిద్ధిస్తూ ఉండగలదో, అట్టి యోగమహత్మ్యము గురించి ఇంకా కొంత తెలుసుకోవాలని ఇచ్ఛగిస్తున్నాను. దయతో వివరించ ప్రార్థన.

శంకర భగవానుడు : హే ప్రియ సృష్టిరచనా మహాప్రాజ్ఞా! హిరణ్యగర్భా! ఏది ప్రయత్నపూర్వకంగా గోప్యము (రహస్యము)గా ఉంచవలసినట్టిదో అట్టి అతి రహస్యమగు ‘‘ఖేచరీ సమత్వ’’ యోగము గురించి చెప్పుచున్నాను. వినండి.

ఈ విద్య - గుహ్యాత్ గుహ్యతమమ్! రహస్యములలో కెల్ల అత్యంత రహస్యమైనది. రహస్యంగా ఉంచాలి. ఎవ్వడైతే 12 సంవత్సరాల కాలము నిర్దోషముగా శుశ్రూష చేసి, (శూశ్రూషాం అప్రమాదతః) ఇంద్రియ నియమములచే దాంతుడై, బ్రహ్మమును ఎరుగుట - ఆచరించుట - మమేకమగుటపట్ల పూర్తి శ్రద్ధగల ‘బ్రహ్మచారి’ అగుచున్నాడో, - తస్మై వాచ్యం యథాతథ్యం। - అట్టి వానికే యథాతథంగా ఈ ఖేచరీసమత్వయోగమును బోధించటము ఉచితము. అంతేగాని, పాండిత్య ప్రదర్శనము కొరకో, ‘ధనము లభిస్తుంది కదా’ - అనో, ధనలోభం చేతనో, ఒకడి యొక్క ధన-బల-పదవీ సంపదలకు భయపడియో, ఆశ్చర్యపడియో, ఈ విద్యను ప్రసాదించ (బోధించ)కూడదు. ఆ విధంగా తపో-శుశ్రూషు-బ్రహ్మతత్త్వ విద్యార్థిత్వ-మహదాశయములు గమనించకుండా.. ధన-కుల-అధికార-స్వపాండిత్య ప్రదర్శనల వంటి దృష్టులతో ఈ విద్యను బోధిస్తూ ఉంటే..

👉 ఆ చెప్పు గురువు విద్యను అనుష్ఠించినట్లూ కాదు.
👉 ఆ శిష్యుడు విద్యను పొంది విద్వాంసుడు విని, తెలుసుకొని కూడా, స్వానుభవముగా సిద్ధించుకోనూ లేడు.

ఆత్మయోగము - ఆత్మతత్త్వము

ఈ ఖేచరీ సమత్వ రూపమగు ‘యోగ-జ్ఞాన పూర్వక యోగవిద్య’ యొక్క మూలమంత్రము (లేక) మూలతత్త్వము ఎవడు గురువును శరణువేడి, గురుముఖతః నేర్చుకొంటాడో, ఆతడు మూలాధారము నుండి బయల్వెడలుచున్న ‘శివ-శక్తి’ తత్త్వమును, (మూలతత్త్వమును) ఎరిగిన వాడగుచున్నాడు. హే బ్రహ్మన్! అట్టి మూలాధార-శివశక్తి సముత్థిత సమన్వయ మంత్రతత్త్వమును బోధించువక్త, తెలుసుకోవటానికి సిద్ధపడుశ్రోత కూడా దుర్లభమే! ఎక్కడోగాని ఉండరు.

మనం చెప్పుకొను మూలాధార విశేషము ‘‘నాదలింగ- చిదాత్మక పీఠము’’ అని కూడా పిలువబడుతోంది. అట్టి నాద లింగ-మూలాధార మూలతత్త్వము, శివ-శక్తి ప్రకటిత స్థానము (తత్త్వము) ఎరిగినంత మాత్రం చేత జీవులు జీవన్ముక్తులు కాగలరు. ఈ విద్య యొక్క ‘తెలుసుకోవటము - ఉపాసన’లచే ఆ యోగి అణిమాది అష్టైశ్వర్యములు పొందగలడు.

మూలాధార మంత్ర - నాద - లింగ చిదాత్మక పీఠము

మంత్రము : హే బ్రహ్మన్! శివుడనగు నాయొక్క స్వరూప - తత్త్వములు మననము చేయుట కొరకై మంత్రము - మననాత్ త్రాయతే మంత్రము. పరమాత్మ యొక్క తాత్త్విక వైభవమును మననము చేయుటకే మంత్రము. మననమునకు మంత్రము ఉపకరణము. నేను మంత్రము నందు అధిష్ఠితుడనైయున్నాను. మననాత్ త్రాణనాత్ చ ఏవ మత్ రూపస్య అవబోధనాత్, ‘మంత్రమ్’ - ఇతి ఉచ్యతే, బ్రహ్మన్! ‘‘మంత్రము నాయందు - నేను మంత్రము నందు’’ ఉనికి కలిగి యున్నాము. మత్ అధిష్ఠానతోఽపి వా!

మూలమంత్రము : మూలత్వాత్ సర్వమన్త్రాణాం, మూలాధార సముద్భవాత్, మూల స్వరూప లింగత్వాత్ - ‘మూలమంత్ర’ - ఇతి స్మృతః।।

(1) సర్వ మంత్రములకు (మననములకు) ఆదిమూలము అయినట్టిది, జన్మ-కర్మలకు మునుముందే ఉన్న కేవలాత్మ సూచకము కాబట్టి,
(2) మూలాధారము నుండి జనించి బయల్వెడలునది కాబట్టి..,

‘మూల మంత్రము’ అను పేరుతో ఆత్మయోగమును పిలుస్తున్నారు. ‘మూలమంత్రము’ అనునది సూచిస్తున్నది పరమాత్మనే।

లింగమ్ - నేను లింగ స్వరూపుడను. భక్తులు నన్ను లింగ స్వరూపముగా ఉపాసించుచూ, మూలతత్త్వమును చేరుచున్నారు.

లింగము = సూక్ష్మత్వాత్, కారణత్వాచ్చ, లయనాత్ గమనాత్ అపి, లక్షణాత్ పరమేశస్య ‘లింగమ్’ ఇతి అభిధీయతే।। లింగము ‘‘కేవల-సహజస్వరూపము’’ అయినట్టి పరమేశ్వర చిహ్నము. పరమేశ్వరతత్త్వము అత్యంత సూక్ష్మమైనది.
కారణములన్నిటికీ కారణమైనది (కారణకారణాత్) సర్వము బయల్వెడలి తిరిగి లయించేది కూడా. కాబట్టి, అట్టి పరమేశ్వర లక్షణములను ‘లింగము’ అని పిలుస్తున్నారు. ఈ విధంగా పరతత్త్వము - మంత్రరూపము, మూల మంత్రతత్త్వము లింగముగా సూచించబడుతోంది. ‘లింగము’ అని చెప్పబడుచున్నది, సూచించబడుచున్నది పరమాత్మనే!

సూత్రము : సన్నిధానాత్ సమస్తేషు జంతుషు అపి చ సంతతమ్, సూచకత్వాచ్చ రూపస్య ‘సూత్రమ్’ - ఇతి అభిధీయతే।। ఇంకా, అట్టి పరబ్రహ్మతత్త్వము పూదండలో ‘దారము’వలె సమస్త జీవుల హృదయములలో సర్వదా సన్నిధానము (Close placement) కలిగియున్నదై, సర్వత్రా వెలయునదై యుండుట చేతను, అద్దాని సూచకమే సర్వరూపము అఖండాత్మరూపము అయి ఉండుటచేతను, సర్వరూపాత్మకమై ఉండుటచేతను - పరతత్త్వమే ‘సూత్రము’ - అను శబ్దముతో చెప్పబడుతోంది. ‘సూత్రము’ అను శబ్దార్ధము సర్వాంతర్యామి యగు పరమాత్మయే!

బిందురూపేణ - పీఠరూపేణ

ఆధారశక్తి-మూలాధారమునందు బిందురూపంగా సంస్థితమై ప్రకృతిగా, మహామాయగా (Mesmerism), మహాలక్ష్మిగా (Knowledge), మహాదేవిగా (Divinity), సరస్వతీదేవిగా (will) ఉపాసించబడుచున్నది. సూక్ష్మకాంతిచే బిందురూపము. పీఠరూపంగా నర్తిస్తున్న శక్తి తత్త్వమే ‘పీఠము’ అను శబ్దముగా చెప్పుకోబడి, ఉపాసించబడుతోంది.

నాద లింగము: బిన్దుపీఠమ్ వినిర్భిద్య నాదలింగమ్ ఉపస్థితమ్। ‘బిందు’ అను పీఠమును ఛేదించుచూ నాదలింగము (The Expression of sound at its root) ఉపస్థితము (Wel -placed) అయి, సంప్రదర్శన శీలమై ఉంటున్నది. అట్టి నాదలింగము - షణ్ముఖములు (షట్‌చక్రములు) కలిగియుండి, ప్రాణస్వరూపముగా ఉచ్ఛారణ కలిగియున్నది.

నాదము యొక్క ఉచ్ఛారణయే → ప్రాణము!  
నాదమునకు జనన స్థానము → ఆత్మాకాశము।

⌘⌘⌘

బ్రహ్మభగవానుడు : హే జగదీశ్వరా! ఈ జీవునికి ఈతని కేవలాత్మ స్వస్వరూపము ప్రకాశమానమయ్యేది ఎట్లా? ఏ తీరుగా?

శివభగవానుడు: గురూపదేశమార్గంలోనే ఆత్మ ప్రకాశమానము కాగలదు. అట్టి స్వస్వరూప-సర్వస్వరూప అఖండబ్రహ్మము త్రివిధములైన (3) సంప్రదర్శనములు కలిగియున్నది.
(1) స్థూలము (2) సూక్ష్మము (3) పరము

(1) స్థూలము : పంచబ్రహ్మమయము (పంచభూతమయము) అయి, స్థూలముగా విరాజమానమైయున్నట్టిది. ‘‘వైరాజము’’ అని కూడా అంటారు. (All that being manifested physically).

(2) సూక్ష్మము : భావనారూపము. జాగ్రత్ - స్వప్న - సుషుప్తులనబడే ‘3’ బీజములు కలిగి యున్నట్టిది. బీజత్రయాత్మకము. హిరణ్యగర్భము (సృష్టి సంపత్తి రూపము).
(1) హిరణ్యగర్భము-సృష్టి భావన।
(2) నాదము - శబ్దరూపము - శబ్ద భావన।
(3) బీజము - సర్వసృష్టిలకు బీజరూపమైనది - బీజభావన।
(4) త్రిగుణముల రూపము.
(5) కల్పనా పురుషరూపము.
(6) ‘‘భావనా - అనుభూతి - జ్ఞప్తి’’ల రూపము.

(3) పరమ్ : సర్వభావములకు, ఆవల భావించువాని రూపము. నాదములకు ఆవల నాదములు-వినువాని రూపము. సర్వబీజములకు ఆవల కేవలసాక్షి. అదియే పరాకాష్ఠ. అదియే ఈ జీవుని వాస్తవ-సహజ స్వస్వరూపము. అద్దాని విశేషములు వినండి.

పరరూప లక్షణములు

పరమ్ బ్రహ్మ : అట్టి తత్త్వము సర్వమునకు పరమై, సర్వము తనకు అభిన్నమై, సర్వమునందు వేంచేసినదై యున్నది. కాబట్టి పరమ్ బ్రహ్మ! ఈ జీవునికి సంబంధించిన పరాకాష్ఠ రూపముకాబట్టి ‘బ్రహ్మము’.

పరమ్ సత్యమ్ : తదితరమైనదంతా సాపేక్షసత్యము మాత్రమే (Relatively true). ఆత్మఒక్కటే పరమసత్యము. (Absolutely true). అట్టి పరము సర్వదా ‘‘సహజము’’ అయి ఉండగా, తదితరమైనదంతా ‘‘సదర్భమాత్రము’’.

సత్ చిత్ ఆనంద లక్షణమ్ : అట్టి పరస్వరూపమగు ఆత్మ, ఉనికి, ఎరుక, అనుభూతి అను త్రిలక్షణములు కలిగియున్నట్టిది.

అప్రమేయము : దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకార-జాగ్రత్-స్వప్న-సుషుప్తి మొదలైన వాటితో సంబంధమే లేనిది. ‘‘ఈ ఆభరణము నాదా? నీదా? ఎప్పుడు ఎవరి దగ్గర ఎట్లా కొన్నాము?’’…. మొదలైనవాటిలో బంగారు లోహమునకు ఏ సంబంధమూ లేదుకదా! ఆత్మకు (పరస్వరూపమునకు) సంగతి, సందర్భము సంఘటనలకు సంబంధించినదేదీ చెందినదై ఉండనే లేదు.

అనిర్దేశ్యమ్ : ఆత్మ పైన చెప్పిన దేనితోనూ పోల్చి, నిర్దేశ్యించి చెప్పబడజాలనిది. అద్దానిని నిర్దేశించునది మరొకటేదీ లేదు. ‘‘పర స్వరూపమనగా ఇది మాత్రమే’’ - అని ముగించి చెప్పజాలము. క్రోడీకరించలేము కూడా।

అవాక్-మానస గోచరం : వాక్కుకు (మాటలకు), మనస్సుకు (విషయమువలె ఆలోచనలకు) లభించునది కాదు. ఆలోచనలకు మునుముందే ఉండి ఆలోచనలకు జననస్థానమై యున్నట్టిది. బుద్ధిచే మాత్రమే గ్రహించబడేది. వాక్ - మనస్సులు ఎద్దానికి చెందినవో - అదియే ‘ఆత్మ’. అదియే బ్రహ్మము. అదియే పరస్వరూపము..అదియే పరమాత్మ.

శుద్ధమ్ : మనోబుద్ధి చిత్త అహంకారముల దోషము ఆత్మకు అంటవు. ఒక స్థలములోని ఆయూ వస్తు దోషములు ఆకాశమును (space) అంటవు కదా? ఆత్మ నిత్య నిర్మలము. సర్వదా శుద్ధము.

సూక్ష్మమ్ : ఆత్మ → ఆకాశము కంటే కూడా సూక్ష్మాతిసూక్ష్మము.

నిరాకారమ్ : సర్వ ఆకారములు అద్దానివే! అందుచేత ఆకారముచే పరిమితము కాదు. నిరాకారము. దేహమునకు ఆకారమున్నది దేహికి ఆకారమేమున్నది? నిరాకరమైనది కాబట్టి అపరిమితమై ఉంటుంది.

నిర్వికారమ్ : బుద్ధికి విమర్శనా వికారములు, చిత్తమునకు ఇష్టా-అయిష్ట వికారములు, మనస్సుకు రాజసిక- తామసిక ఆలోచనలు-మొదలైన ఆయా వికారములు ఉండవచ్చునుగాక। ఆత్మకు ఎటువంటి వికారములు ఉండవు. నాటకంలో పాత్రకు సంబంధించిన వికారములు నటునికి అంటవు కదా! రచయితకు చెందినవి కావు. దర్శకునివి కావు. ప్రేక్షకులకు ఆపాదించలేము. ఆత్మ ఈ సర్వ దేహములలో నాటకదీపము వంటిది. అసలే అంటవు.

నిరంజనమ్ : దృష్టి దోషములచే స్పృశించబడదు. వస్తు దోషము సూర్యకాంతికి అంటదు కదా।

అనన్తము : ఆత్మకు అది-అంతములు లేవు. దేహములచే, లోకములచే అన్తము పొందదు. (Infinite).

అపరిచ్ఛేద్యమ్ : నీవు - నేను - ద్రష్ట - దృశ్యము - దృక్ - జీవుడు - శివుడు → ఇత్యాదులుగా ఆత్మ ఏ క్షణంలోనూ ‘పరిచ్ఛేదన’ పొందటమే లేదు.

అనుపమమ్: ఆత్మ యొక్క అనుభవమును ఒకడు మరొకరికి అందించటానికి ఏ ఉపమానము లేదు. చాలదు. ఆత్మకు ఉపమానమే లేదు. అయితే శాస్త్రములు ఉపమానముల సహాయముతో ‘సూచన’ అందిస్తున్నాయి.

అనామయమ్ : ఆత్మయందు ఆత్మకు అన్యమైనది ఎప్పుడూలేదు. ఎక్కడాలేదు.
హే బ్రహ్మ భగవాన్! ఆత్మమంత్ర సదాభ్యాసాత్ పరతత్త్వం ప్రకాశతే! అటువంటి లక్షణములతో విలక్షణమైయున్న ‘ఆత్మమంత్రము’ యొక్క సదా - అభ్యాసము చేతనే ఆత్మతత్త్వము బుద్ధికి ప్రకాశమానమగుచున్నది.

ఆత్మసిద్ధి ద్వారములు

బ్రహ్మ దేవుడు : పరమేశ్వరా! పరతత్త్వమునకు అభివ్యక్త చిహ్నములు (Indicative exhibitions of Al-present self) - అయినట్టి ‘సిద్ధి’కి ద్వారములు (Entrance Door - openers) ఏమిటేమిటో వివరించమని వేడుకొంటున్నాడు.

శ్రీ శివభగవానుడు : హే బ్రహ్మభగవాన్! చెప్పుచున్నాను. వినండి. ఉపాయము యోగాభ్యాసమే. అట్టి యోగ ఏకాగ్రత పెంపొందుచుండగా,

శ్లో।। ద్వీపజ్వాల ఇన్దు ఖద్యోత విద్యుత్ నక్షత్ర భాస్వరాః
దృశ్యంతే సూక్ష్మరూపేణ సదా యుక్తస్య యోగినః।।

(1) ద్వీపజాల (2) చంద్రుడు (3) ఖద్యోతము (మిణుగుడు పురుగు యొక్క మెఱుపులు) (4) విద్యుత్తు (5) నక్షత్ర కాంతులు - ఇవన్నీ కూడా సదా యోగయుక్తుడైన (యోగాభ్యాసముచేయు) యోగికి కనిపిస్తూ ఉంటాయి. క్రమంగా ఆయోగికి అణిమ మొదలైన (అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య, ఇచ్ఛా) అష్టసిద్ధులు, అష్ట ఐశ్వర్యములు, మహిమలు - ఇవన్నీ - అచిరాత్ తస్య జాయతే - ఆతని యందు ప్రవేశించసాగుతాయి.

(1) నాస్తి నాదాత్ పరోమంత్రో : → ‘నాదము’ (ఓం శబ్దము; యోగాభ్యాసంలో రెండు చెవులు చూపుడు వ్రేళ్ళతో మూసుకున్నప్పుడు లోపలి ఉండి వినబడు శబ్దము)నకు మించిన మంత్రము ఎక్కడా లేదు. ‘నాదము’ జనిస్తున్న స్ధానమును ఉపాసించు చుండటమును ‘‘నాదయోగోపాసన’’ - అనుచున్నారు. నాదము జనిస్తున్నది ‘బిందురూపము’గా వర్ణించబడు ఆత్మయందే.

(2) న దేవః స్వాత్మనః పరః। → స్వకీయమగు ‘‘కేవల, పర ఆత్మ’’.. కు (కేవల స్వస్వరూపమునకు) మించిన దేవుడు వేరే ఎక్కడా లేడు. స్వస్వరూపాత్మయే బ్రహ్మ, విష్ణువు, శివుడు.. మొదలైన సర్వదేవతల ‘సహజము - వాస్తవము - శాశ్వతము - అఖండము’ అగు అసలైన రూపము. ‘‘స్వస్వరూపాత్మయే సర్వుల ఆత్మ స్వరూపము కూడా’’- అనునదే నిజమైన ఆత్మదేవోపాసన.

(3) న అనుసంధే పరః పూజా → (అఖండము, సర్వము, అప్రమేయము, నిత్యము అగు) ఆత్మతో అనుసంధానమునకు మించిన పూజ మరింకేదీ లేదు. ఈ జగత్తులో ‘నీవు’గా తదితర సమస్త దృశ్యముగా కనిపించేదంతా ఆత్మతో ఏకముచేయు ‘పూజ’ కంటే గొప్పది కాదు. ‘వ్యష్టిత్వము’ను పాము కుబుసమువలె త్యజించి - ‘‘సమిష్టికి ఆవలగల కేవలమే నేను’’ తో మమేకమవటమే ‘‘త్యాగేనైవతు కైవల్యమ్’’ యొక్క గూడార్థము.

(4) న హి తృప్తేః పర సుఖమ్ → తృప్తికి మించిన సుఖము లేదు.

గోపనీయం ప్రయత్నేన సర్వదా సిద్ధమ్ ఇచ్ఛతా। సిద్ధిని కోరుకొనువాడు పై నాలుగు సూత్రములను సర్వదా రహస్యముగాను, అత్యంత ఇష్టముగాను (ఇచ్ఛాపూర్వకంగా) సర్వదా అనుష్ఠిస్తూ - దాచుకొని ఉండును గాక!

ఓ హిరణ్యగర్భ మహాశయా! ‘తత్ త్వమ్’ అనునదే గురు వాక్యసారము అయి ఉన్నది.

మద్భుక్త ఏతత్ విజ్ఞాయ కృతకృత్యః సుఖీభవేత్। ఎవ్వడైతే నాకు భక్తుడై పై విషయములను తెలుసుకొని ఉంటాడో, అట్టివాడు కృతకృత్యుడు, సుఖి అవగలడు.

ఎవ్వరైతే….,
➤ దేవుని యందు ఎంత భక్తి కలదో,
➤ అంతటి భక్తిని ఆత్మయొక్క స్వాభావిక - ఔన్నత్యమును విశదపరస్తున్న సత్-గురువు నందు కలిగి ఉంటాడో…
అట్టివాడు ‘‘ఆత్మ స్వాభావికత్వము’’ అనే మహార్థమును తప్పక సిద్ధించుకోగలడు. అట్టి జీవుడు దేహాత్మత్వము, వ్యష్టాత్మత్వములను అధిగమించి, సర్వాత్మకుడై ‘మహత్మత్వము’ పునికిపుచ్చుకొనుచున్నాడు.

అట్టి వాని హృదయమునందు యోగాభ్యాసముచే అతి త్వరగా
(1) నాస్తి నాదాత్ పరోమన్త్రో
(2) న దేవః స్వాత్మనః పరః
(3) న అనుసంధే పరా పూజా
(4) న హి తృప్తేః పరం సుఖమ్
- అను నాలుగు వాక్యముల ఆత్యంతికార్థము స్వయముగా సహజమై, అనునిత్యమై ప్రకాశించగలదు.

ఆ మహాత్మునియందు
(i) ఈ సర్వము ఉన్నది నాయందే।
(ii) ఈ సర్వమునందు ఉన్నది నేనే।
(iii) ఈ సర్వముగా ఉన్నది నేనే।
(iv) ‘అహమ్ (నేను)’గా ఉన్నది త్వమేవ। నీవే ‘నేను’గా కూడా ఉన్నావు.
(v) సమస్తము సర్వదా బ్రహ్మమే। - నేను - నీవు ఇత్యాది సమస్తము సర్వదా ‘అఖండ బ్రహ్మమే’
- అను పంచ పూరెక్కలు గల జ్ఞాన-విజ్ఞాన పుష్పము ఇప్పుడే, ఇక్కడే స్వీయ హృదయాకాశమునందు వికసించగలదు.

ఇదియే ఉపనిషత్ పరాకాష్ఠసారము.


3వ అధ్యాయము - పరా - పశ్యంతీ - మధ్యమా - వైఖరీ

ఏ యోగాభ్యాసమైతే ‘‘ఆత్మమేవాఽహమ్, సోఽహమ్, తత్ త్వమ్’’ అను అఖండాత్మ భావన సిద్ధించటానికి కారణమో, ఆ యోగమునకే ‘చిత్’ అని మరొక పేరుగా కూడా చెప్పబడుతోంది. ఏది ఎరుగటచే (‘చిత్ స్వాభావి’ అగు) (లేక) (విజ్ఞానమాత్రము అగు) - ఈ జీవుడు ‘‘నాకు మొదలే జన్మలు లేవు’’… అను అనుభవముచే జన్మబంధముల నుండి విముక్తుడగుచున్నాడో, - అదియే యోగము. ‘యోగమ్’ అస్య ‘చిత్’ ఆఖ్యాతం, యత్ సిద్ధీనాం చ కారణమ్। ‘‘ఎరుగబడేదంతా ద్రష్టయొక్క ఎరుక స్వరూపమే’’ - అని ఎరిగి ఉండటమే ‘సిద్ధి’కి కారణము.

శబ్ద బ్రహ్మము

ఏ అక్షరము, పరము అగు బ్రహ్మము గురించి శబ్దములు, అర్ధములు చెప్పబడుచున్నాయో, వినబడుచున్నాయో, ఏది ఎరిగినంత మాత్రం చేత ఈ జీవుడు జన్మబంధముల నుండి విడివడగలడో, అదియే ‘శబ్దబ్రహ్మము’గా చెప్పబడుతోంది.

పర-బిందు-నాదోపాసన

మూలాధారగతాః శక్తిః స్వాధారా బిందురూపిణీ। ఆత్మయే ఆధారముగా కలిగియుండి, ఆత్మ నుండి బయల్వెడలుచూ ఆత్మకు వేరుకానిదే మూలాధారశక్తి. ఈ విశ్వమంతా తన ప్రదర్శనముగా కలిగియున్న ‘ఆదిశక్తి’ (లేక) ‘మూలశక్తి’ ఈ జీవుని దేహములో మూలాధార స్థానమునందు తనకు తానే ఆధారమై బిందు (l) రూపముగా వేంచేసియున్నది. ఒక సూక్ష్మమగు బీజమునుండి అంకురము బయల్వెడలువిధంగా ఆ మూలాధారగతమై స్వాధారమై బిందురూపిణియై యున్న - మూలశక్తి నుండి ‘నాదము’ ఉత్పన్నమగుచున్నది. తస్యాం ఉత్పద్యతే నాదః సూక్ష్మబీజా దివాంకురః। ఏ సూక్ష్మాతి సూక్ష్మ స్ధానము నుండి భావన, భావన నుండి నాదము, నాదము నుండి శబ్దము బయల్వెడలుచున్నాయో - అద్దాని గమనికయే నాద-బిందోపాసన. ఆత్మ, మూలాధారశక్తి, నాదము - అన్యము, ఏకమేగాని వేరు వేరు కాదు. ఇదియే ‘‘పర’’ అనబడుతోంది.

పశ్యంతీ

అట్టి అఖండ ‘మూలాధారగత శక్తి’గా ఈ విశ్వమును యోగులు సర్వదా సందర్శిస్తున్నారు. అనగా, ఈ విశ్వమంతా ఏకమగు శక్తి యొక్క దివ్యలీలా ప్రదర్శనమే! ఏ విజ్ఞానముచే ఈ విశ్వమంతా ఏకము-అఖండము అగు మూలశక్తికి అభిన్నంగా చూస్తున్నారో, అద్దానినే బ్రహ్మవిదులు- ‘పశ్యంతి’ అను శబ్దముతో పిలుస్తున్నారు. తాం పశ్యన్తీం విదుః విశ్వమ్ యయా పశ్యన్తి యోగినః। యోగులకు ఈ కనబడేదంతా స్వస్వరూపాత్మకు అభిన్నము. ఎందుకంటే - ‘‘స్వస్వరూపముగా వేంచేసినదై ఉన్నది - అట్టి మూలాధార శక్తియే’’ - అనునది యోగులకు స్వాభావిక స్వానుభవము. సమస్తము నేనైన నేనే (మరియు) సమస్తము నీవైన నీవే ఇదంతా!’’ - అనునదే తత్త్వదర్శులు సిద్ధించుకొని ఉంటున్న ఆత్మసాక్షాత్కారము.

మధ్యమా

హృదయే వ్యజ్యతే - ఘోషో, గర్జ పర్జన్య సన్నిభః, తత్ర స్థితా సురేశానః మధ్యమ’ ఇత్యభిదీయతే। ఓ సుర నాయకా! బ్రహ్మ భగవాన్! హృదయము నుండి వర్షము పడుచున్నప్పటి ‘ఘోష’వలె గర్జనఘోష ప్రదర్శనమగుచున్నది. అట్టి హృదయము నుండి ఏ వర్షశబ్దము వినబడుచున్నదో, అద్దానిని ‘మధ్యమ’ అని అంటారు. ‘మధ్యమా’ అను పేరుతో చెప్పబడు ఘోష శబ్దము - ప్రాణశక్తియొక్క దేహములో సంచారములే. అవి ‘స్వరము’ రూపముగా దేహములో జనిస్తున్నాయి. (రెండు చెవులు మూసుకొన్నప్పుడు వినబడగలదు).

వైఖరీ

ప్రాణేన చ స్వరాఖ్యేన ప్రథితా వైఖరీ పునః। శాఖాపల్లవ రూపేణ తాల్వాది (తాలు -ఆది) స్థాన ఘట్టనాత్। మూలాధార శక్తి ప్రాణశక్తిత్వము ద్వారా స్వరమును ప్రదర్శించటమును ‘వైఖరీ’ అంటున్నారు. అటువంటి వైఖరీ శబ్దతత్త్వము తాలు (దవడ) యందు ప్రవేశించి వృక్ష శాఖ-ఉపశాఖల వలె అనేక శబ్దములు పలుకుచూ, శబ్దత్వము ప్రదర్శిస్తోంది. దవడ ప్రదేశములో ఒత్తిడి (Touch-pressure)ని (తన యొక్క ప్రాణ విన్యాసరూపముచే) కలిగించుచున్నది. అట్టి ఘట్టణ నుండి ‘అ’కారముతో ప్రారంభమై ‘క్ష’కారము వరకు శబ్దములు జనిస్తున్నాయి. ఆ శబ్దములే సశాస్త్రీయమై (అ నుండి క్ష వరకు) అక్షరములుగా అగుచున్నాయి.
→ అక్షరముల నుండి శబ్దములు,
→ శబ్దముల నుండి పదములు,
→ పదముల నుండి వాక్యములు,
…. ఇవన్నీ ఆత్మ యొక్క బుద్ధి (అవగాహన) శక్తిచే విస్తరించబడుచున్నాయి.

⌘ ఆ వాక్యముల నుండి వాక్యాత్మకమగు మంత్రములు బయల్వెడలుచున్నాయి. అవియే ఋక్కులు -
⌘ వాక్ → మననము → ఉచ్ఛారణ - శబ్దము - మంత్రముల నుండి సర్వ వేదములు, సర్వ శాస్త్రములు, పురాణములు, కావ్యములు, వివిధ భాషలు, ‘స-రి-గ-మ-ప-ద-ని’ అనబడు సప్తస్వరములు, అనేక భావనలు ప్రదర్శితములగు చున్నాయి. ‘మోహన-గాంధారి-కల్యాణి’ మొదలైన - అనేక రాగ విన్యాసములు - ఏర్పడుచున్నాయి.

సర్వే నాద సముద్భవాః। ఇవన్నీ కూడా - ఆత్మచే ఆక్రమించబడి, ఆత్మకు అభిన్నమైయున్నాయి. హృదయము నుండి బయల్వెడలిన ‘నాదము’ ప్రాణశక్తి సమన్వితమై - ప్రదర్శనమగుచున్నది. ఎక్కడి నుండి నాదము బయల్వెడలుచున్నదో, అదియే సరస్వతీ దేవీ స్థానమగు ఆత్మ!
నాదాత్మనీ సరస్వతీ। సత్ రసవతీ - ఇతి సరస్వతీ।

‘‘సత్-రస-వతీ-దేవి!’’ = ‘‘సరస్వతీ’’

సదాత్మ నుండి నాదము రసస్వరూపంగా బయల్వెడలి తాలు స్థాన ఆకాశంలో ప్రవేశించి, తాలు స్థానమును ఉత్తేజపరచి, మధ్యమా-వైఖరీ నాదరూపములను సంతరించుకొని - వేద-పురాణ, శాస్త్ర…. ఇత్యాది బహుభాషాయుక్త విశేషమై ప్రదర్శనమగుచున్నది - ఇతి పునశ్చరణ.

అటువంటి సత్ (స్వ) రతీదేవి యగు సరస్వతీ దేవి - సత్ స్వరూపిణియై, స్వరస్వరూపిణియై, రతీ (జగత్తుగా రతించు) స్వరూపిణియై, దేవీస్వరూపిణియై - సర్వ భూతముల (జీవుల) హృదయ గుహలో చైతన్య స్ఫూర్తిగా ఆశ్రయించి ఉన్నది. నోరు, దవడ,, హృదయములలో ప్రదర్శనమై యున్నది. నెమ్మది నెమ్మదిగా వాయు-అగ్నిలతో కూడుకొని ప్రేరణ శక్తి (Inspiring Energy)గా ప్రకాశించుచున్నది. మూలాధారంలో కుండలినీ శక్తిగా, హృదయంలో జగత్ కల్పనాశక్తిగా, శిరస్సులో మాయాశక్తిగా ప్రవర్తించుచూ, బిందు - నాద - ఉచ్ఛారణ-అక్షర-శబ్ద-వాక్య-మంత్ర-వేదవాఙ్మయ-వేదాంత వాఙ్మయ-అనేక భాషా భావా స్వరూపిణియై విరాజిల్లుచున్నది. ఆ దేవి యొక్క వివర్తిత్వమే ‘పద-వాక్య’.. ఇత్యాదిగా, సదా వాక్‌రూపిణిగా సంప్రదర్శితమౌతోంది.

అట్టి వైఖరీశక్తిని ఏ యోగి అయితే ‘‘స్వీయ-ఆత్మయందే, ఆత్మకు అభిన్నంగా’’ దర్శిస్తూ ఉంటాడో,
అట్టివాడు -
⌘ సరస్వతీ ప్రసాదముచే స్వవాక్ సిద్ధిని పొందుచున్నాడు.
⌘ వేద- శాస్త్ర - పురాణములను వాక్‌శుద్ధితో అంతరార్థములను గ్రహించగలడు. జగత్‌దృశ్యమును స్వయంకర్త అయి ఎరుగగలడు.

క్షర- అక్షరాతీత అనక్షరీ- అక్షరీ దేవి

హే బ్రహ్మన్! ఆత్మయొక్క ఔన్నత్యము ఎట్టిదో ఇంకా మరికొంత వినండి.

యత్ర బిన్దుశ్చ, నాదశ్చ సోమసూర్యాగ్ని వాయవః ఇంద్రియాణి చ సర్వాణి లయం గన్ఛన్తి। ఎక్కడైతే బిందువు, నాదము, సోమ-సూర్య-అగ్ని, వాయువులు, శబ్ద స్పర్శ- రూప - రస - గంధ - వాక్ - చలన- ధారణ - స్వీకరణ - విసర్జనలతో కూడిన సర్వేంద్రియములు లయమును పొందుచున్నాయో…,
వాయువో యత్ర లీయంతే - ప్రాణశక్తి చాలనమగు వాయువు ఎందులో తిరిగి లీనము పొందుచున్నదో..,
మనో.. యత్ర విలీయతే, - దేనినుండి ‘ఆలోచన’ (The thought) బయల్వెడలి, ప్రవర్తించుచూ, -(Just like a wave in ocean water) -తిరిగి లయించుచున్నదో, దేనియందు మనస్సు విలీనమగుచున్నదో,
యం లబ్ద్వాచ అపరం లాభం మన్యతే న అధికం తధా - ఏదైతే లభించిన తరువాత, ఇక అంతకుమించిన లాభము 14 లోకములలో మరింకేదీ ఉండదో..,
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే,- ఏ స్థితిలో ఈ జీవుడు గొప్ప గొప్పదైన దుఃఖ సంఘటనలకు కూడా ఏమాత్రము చలించడో,
⌘ ఏది దృశ్యములోని సుఖములన్నిటికంటే కూడా పరాకాష్ఠ సుఖమైయున్నదో, ఏది ఇంద్రియ సుఖములకు అతీతమైనదై, బుద్ధిచే సుఖముగా ఆస్వాదించబడుచున్నదై ఉన్నదో…,

అట్టిది మార్పు చెందే క్షరమునకు - (‘నేను’ రూపంగా) మార్పు చెందనిదానికి కూడా అతీతమై యున్నదే (అక్షరాదపి ఉత్తమః) ‘ఆత్మ’గా చెప్పబడుతోంది. అదియే బ్రహ్మము ‘అదియే నేను. అదియే నీవు’. ఈ పాంచభౌతిక దృశ్యమంతా ‘నాశనము’ వైపునకే అనుక్షణము ఎక్కుపెట్టబడియున్నది. కేవలము, పరము అగు ఆత్మయో? క్షరము కాదు. అక్షరము కాదు. అందుచేత ‘అనక్షరము’ అని పిలువబడుతోంది. అది ప్రత్యక్షము కాదు. పరోక్షము కాదు. అందుచేత ‘అపరోక్షము’ అని అనబడుచున్నది.

సర్వభూతజాలము → క్షరము. ఆ సూత్రాత్మ (పూదండలో దారము వంటిది) - ‘‘అక్షరము’’ అని చెప్పబడుతోంది.

ఆత్మ స్వరూపము ఎట్టిది?

ఓ బ్రహ్మభగవాన్! అక్షర పరబ్రహ్మస్వరూపా! పరమానంద స్వరూపులగు ఓ తదితర శ్రోతలారా! అట్టి మీమీ సహజస్వరూపమగు పరబ్రహ్మము ఎట్టిదో, - మరికొంతగా వినండి! ఈ విధంగా ఎదుగుచూ, తద్విధంగా భావిస్తూ తత్ యొక్క స్వరూప-స్వభావములను అనునిత్యపరచుకొనెదరుగాక। ‘‘తదేవాహమ్’’ను భావించటమే ‘ఆత్మోపాసన’.

⌘ ఆత్మ క్షరము లేనిది. అక్షరము। (It is not subjected to factor of change)
⌘ సర్వమునకు వేరై ఉన్నది. పరము। (Beyond all that being experienced)
⌘ సర్వదేహములలో పరాకాష్ఠ అయి, మహత్తరము అయి ఉన్నట్టిది. బ్రహ్మము। (It is the finest and top most in all)
⌘ అది విషయరహితం. నిర్విశేషం। (It has no relevance to worldly incidents. It does not contain events and contexts).
⌘ దృశ్యము వలన దోషము పొందేది కాదు. నిరంజనమ్। (It is not affected by all that being seen. Is never polluted by anything)
⌘ నవలలోని పాత్రల లక్షణములేవీ రచయితకు ఆపాదించలేము. ఆత్మ అలక్షణమ్। (It is beyond all characterstic features).
⌘ ‘ఇది’ అని నిర్వచించి పొందలేము. తత్ అలక్ష్యమ్। (It is not like a target to be acheived. While you are already that, why need it be achieved)
⌘ తర్కించి, వితర్కించి చెప్పలేము. అతర్క్యము। (It is beyond range of logical interpretation).
⌘ దానికి సరిగా సరిపోయే ఉపమానము ఏదీ లేదు. అనూపమమ్। (No simile is sufficient to substantiate).
⌘ అద్దానికి ‘అంతు ఇది’ అని చెప్పలేము. అపారపారమ్। (It does not end by anything).
⌘ అద్దానిని జీవుడు-ఈశ్వరుడు మొదలైనవిగా ఎవ్వరూ ఛేదించలేరు. అచ్ఛేద్యము। (It cannot be bifurcated as individual self, collective self etc..).
⌘ చిత్తమునకు విషయము కాదు. అచిన్త్యమ్। (It is not like a subject matter for thinking).
⌘ దానికి (ఆత్మకు) ఏదోషములేదు. అతినిర్మలమ్। (It is pure by self. Impurities cannot be attributed).
⌘ ప్రతి జీవునికి ఆధారము అదియే! ఆధారమ్ సర్వభూతానామ్। (It is the prima-facie base to all).
⌘ అది దేనినీ ఆధారముగా కలిగియుండలేదు. అనాధారమ్। (It is beyond base).
⌘ అది వస్తు నిర్మితము కాదు. అనామయమ్। (It is beyond matter).
⌘ దానిని ప్రమాణములతో చెప్ప వీలు కాదు. అప్రమాణమ్। (All comparisions are ineffective to explain).
⌘ అద్దానిని నిర్దేశించి ‘ఇంతే’ అని చెప్పలేము. అనిర్దేశ్యమ్। (It is unexplainable as “that’s it”).
⌘ దేనికీ పట్టుబడేది కాదు. అప్రమేయమ్। (It is not relative. It is absolute by itself).
⌘ ఇంద్రియములకు (నామరూప దృశ్యాత్మకములకు) విషయమే కాదు. అతీంద్రియమ్। (Beyond all sensations of sensory organs)
⌘ అది స్థూలమగు విషయమేదీకాదు. అస్థూలమ్। (It is not like a solid matter).
⌘ అది అణువు వంటిది కాదు. అనణుః। (It is not like an Atom).
⌘ అది హ్రస్వము కాదు. దీర్ఘము కాదు. అహ్రస్వమ్! అదీర్ఘమ్। (It is neither short nor long).
⌘ దానికి శరీరము వలె ‘పుట్టుక’ అను ధర్మమే లేదు - అజమ్। (It has no feature of Birth like this Mundane Physical Body)
⌘ అది కాలముతో జనించేది కాదు. కాలముతో నశించేది కాదు. వ్యయమయ్యేది కాదు. అవ్యయమ్। (It is always as it is)
⌘ సర్వ దేహములలో దేహిగా సర్వదా వేంచేసియుండి, సర్వమును ప్రవర్తింపజేయుచున్న పరమాత్మ (లేక) కేవలాత్మ → శబ్దము కాదు. స్పర్శ కాదు. (That which dwells in all equally as absolute form of self - It is not a ‘Sound’ or a ‘Touch’).
⌘ చూపు, చెక్షువులు కాదు. చెవులు, వినికిడి కాదు. అశబ్ద స్పర్శరూపః తత్, అచక్షుః శ్రోత్రనామకమ్। (It is not becoming Seeing and Eyes, Hearing and Ears’ etc.)
⌘ ఇంకా కూడా ఆత్మ సర్వజ్ఞము. సర్వగతము. పరమశాంతము। (It is extending as ‘knowing’, ‘being’ and is peacefully present in all. It knows clearly what is now, what is before and what is beyond).

హే బ్రహ్మభగవాన్! అట్టి ఆత్మ అఖండము, సర్వము, సర్వస్వము కదా! అందుచేత సర్వేషాం హృదయే స్థితమ్!

ఆత్మ గురించి ఎవ్వరూ కూడా ఎక్కడికీ వెళ్లనక్కర్లేదు. ఎవ్వరినీ చూడనక్కర్లేదు. ఏ వ్రత-జప-ధ్యాన-యోగ ప్రయత్నములు చేయక్కర్లేదు.

ఎందుకంటే..,
ఆ పరమాత్మ ప్రతి ఒక్క జీవునికి సంబంధించి, – ఆతని హృదయము నందే సంస్థితమై యున్నది. తన వద్దే తనకు ఎదురుగా ఉన్న వస్తువు కోసం ఏ గృహస్థుడైనా ఊరులో ఇల్లిల్లూ వెతుకుతాడా? లేదు కదా! సమస్తమునకు అనన్యమై, అప్రమేయమై స్వ-హృదయ గుహయందు సర్వదా వేంచేసినదై ఉన్న ‘ఆత్మ’ కొరకై ఎక్కడో వెతకటమేమిటి?
బిడ్డను చంకనపెట్టుకుని, ఏ తల్లి అయినా ‘‘నా బిడ్డను చూడాలి. ఎక్కడికి వెళ్ళమంటారు?’’- అని ప్రక్కింటివారిని ఆదుర్దాగా అడుగుతుందా? లేదే।
ఆత్మ హృదయములోనే కారణకారణమై వేంచేసియుండి, బహిరంత స్థితమై కూడా ఉండి ఉండగా, ఆత్మకోసం వెతకటమేమిటి? ఎవ్వరెవ్వరినో అర్ధించటమెందుకు?ఎవ్వరో వచ్చి ఉద్ధరిస్తారేమోనని దేవురించటమెందుకు?


బ్రహ్మభగవానుడు : హే పరమానంద స్వరూపుడవగు పరమశివా! ఈజీవుడు తనయందే సర్వదా ఉపస్థితమై, సంప్రదర్శనమై సర్వకారణకారణమై వెలుగొందుచున్న శివతత్త్వము (లేక) సోఽహమ్ శివః - శివోఽహమ్(లేక) కేవలాత్మమేవాఽహమ్’ → అనునది అనునిత్యానుభవము అయ్యేది ఎట్లా?

పరమశివుడు : అవును. ఇదీ ప్రశ్న. ఓ సృష్టికర్తా! సృష్టిమహత్ ప్రజ్ఞాదురంధరా! బ్రహ్మభగవాన్! మీరు అడిగిన ‘అనునిత్య ఆత్మమేవాహమ్’ (లేక) ‘‘చిదానందరూపం శివోఽహమ్ శివోఽహమ్’’ - అనునది స్వానుభవంగా రూపుదిద్దుకోవటానికి సులభమగు ఒక ఉపాయం చెప్పుచున్నాను. వినండి.

సుసంవేద్యం గురుమతామ్।

‘‘ఆత్మాఽహమ్’’ అనుభవమును సిద్ధించుకొన్న గురువు యొక్క బోధయే అందుకు సులభోపాయము.

గురువు సూచించు ‘‘తత్-త్వమ్-(అదియే నీవయ్యా!) వాక్యార్థమును వినాలి. విని యోచించాలి. సమన్వయించుకోవాలి. గురువును ‘కోఽహమ్’ అను పరిప్రశ్నతో సమీపించి, ‘తత్ త్వమ్’ బోధను విని, ‘సోఽహమ్’ అనబడు సర్వాత్మ- సర్వతత్త్వ- సహజ- కేవల-అనునిత్యమగు ‘‘ఆత్మాఽహమ్ భావన’’ను సిద్ధింపజేసుకోవాలి.

ప్రాపంచకమైన ఆశయములు, నమ్మకములు, వృధాభావములు, వెంటనంటియున్న బుద్ధి గల (ఆత్మ గురించిన అధ్యయనము లేని) అచేతసనునికి - ఆత్మ భావన దుర్బోధకమే అగుచున్నది. అట్టివాడు ఆత్మ గురించి విని కూడా అనన్యత్వము సంపాదించుకోలేక పోవుచున్నాడు.

ఆత్మాభావన సిద్ధించటానికి కారణము ఏది అగుచున్నది? ఆత్మభావనయే!

ఆత్మను అందరిలోను అందరుగాను భావించాలి.

సర్వ దేహములలోని ‘దేహి’గా ఉన్నది తానై, సర్వసాక్షిగా వేరై ఉంటున్న ఆత్మను అవ్యాజంగా (Unconditonally, Non-business like) దర్శించటమును అభ్యసించాలి.


అట్టి ఆత్మ →

నిష్కళంకమైనది. (దోషరహితం) జగద్దృష్టికి దేహ మనో బుద్ధి చిత్త అహంకారములకు సంబంధించిన దోషములు ‘ఆత్మకు’ చెందినవే కాదు.

నిర్గుణమైనది. నాటక పాత్రల గుణములు రచయితకు చెందినవి అగుచున్నాయా? లేదు. నాటకంలో నాయక-ప్రతినాయక పాత్రల గుణములు రచయితవిగాని, నటుడివిగాని, ప్రేక్షకుడివిగాని కావు కదా. సర్వానుభవములకు ‘రచయిత’ వంటి ఆత్మకు ఏ గుణదోషములు, స్వభావములు అంటజాలవు.

పరమ శాంతమైనది. అశాంతికి అద్దానియందు చోటేలేదు. జన్మ-జరా-మృత్యు-పునర్జన్మవ్యవహారములు ఆత్మయొక్క పరమశాంత స్వరూపమును ఏమీ చేయజాలవు.

నిర్వికారమైనది. వికారములు నాటకములోనివి గాని నటునివి కావు. ఆత్మకు వికారములు ఉండవు.

నిరాశ్రయము. - అది దేనినీ ఆశ్రయించదు. ఆత్మ సూర్యుని జీవాంశ కిరణము విషయములపై వాలినంత మాత్రం చేత - ఆత్మసూర్యుడు విషయములను ఆశ్రయించినట్లు కాదు.

నిర్లేపకము - అద్దానిని ఏదీ కూడా కప్పి ఉంచలేదు. ‘మాయాబంధము, సంసారము’ మొదలైనవన్నీ ఆత్మకు ఆపాదించటము- దొంగిలించిన బంగారముపై ‘దొంగతనము’ను ఆపాదించటము వంటిది. బంగారు లోహమునకు ‘‘ఎవ్వరిది? ఎక్కడిది?’’ - మొదలైన వాటితో సంబంధమేముంటుంది?

నిరాపాయమ్ - ఆత్మకు అపాయమనునదే ఉండదు. ఆత్మకు అపాయము కలిగించగలిగినదేదీ లేదు.

కూటస్థము - ఈ లోకములు, లోకేశులు, లోకస్తులు, మొదలైనదంతా తన యొక్క గర్భమున కలిగియున్నట్టిది. ఆభరణములలో బంగారమువలె, తరంగములలో జలము వలె, మట్టిబొమ్మలో మట్టివలె సమస్తమునకు అంతరకారణమైయున్నట్టిది.

అచలమ్ - ఆత్మ ఎటూ వెళ్ళటంలేదు. ఎటునుంచీ ఇక్కడికి రావటంలేదు. సర్వదా యథాస్ధానములో యథాతథము.

ధృవమ్ - తనయందు తానే సర్వదా ఉన్నట్టిది. పురికొస త్రాడును కట్టి కొండను కదల్చగలమా? ఈ మనస్సు మొదలైనవాటిచే ఆత్మయొక్క ధృవత్వము చెక్కు చెదరదు.

ఇంకా కూడా..

జ్యోతిషామపి తత్ జ్యోతిః : సర్వదేహులు జ్యోతులై ఉండగా, అయ్యది ఆ జ్యోతులకే జ్యోతి - సర్వాత్మకము. పరంజ్యోతి.

తమసః పారే ప్రతిష్ఠితమ్ : కళ్లు మూసుకున్నప్పుడు చీకటి కనిపిస్తూ ఉంటుంది. ఆ చీకటిని కూడా చూచుచూ ఉన్నదే ‘ఆత్మ’.

అది సర్వ తమస్సులకు, అజ్ఞానమునకు ఆవల ఉన్నట్టిది. చీకటి కూడా దేనికి ఒక అనుభవ వస్తువుగా అగుచున్నదో - అదియే ‘ఆత్మ’.

భావ - అభావ వినిర్ముక్తమ్ : అద్దానిచే భావనలు జనిస్తున్నాయి. కవి నుండి కథ బయల్వెడలుతూ ఉండగా, ఆ కథలోని సంఘటనలచే కవి బద్ధుడా? కాదు. కథలోని భావ-అభావముల దృష్ట్యా రచయిత నిత్య వినిర్ముక్తుడు. అట్లాగే, పరమాత్మ నిత్య ముక్తుడు. అనగా, ఆత్మ సర్వదా ముక్త స్వరూపమే! సహజమగు పరమాత్మకు బంధము లేదు.

సందర్భమాత్రమగు జీవాత్మకు ముక్తి ఉండదు. తదితరమైన జీవాత్మలు, జగత్తులు, గుణములు, జీవాత్మల పరస్పర సంబంధములు, శరీరానుభవములు - ఇవన్నీ ‘భావన’లోనివి. అవన్నీ రావటం ‘భావన’. పోవటమో ‘అభావన’. వాటన్నిటికీ వేరుగా ఆత్మ నిత్యముక్తమైయున్నది.

భావనామాత్ర గోచరమ్ : ఆత్మ దృశ్యములో ఒక వస్తువు కాదు. కనుక కంటికి కనబడేది, చెవులకు వినబడేది కాదు. ఇంద్రియములకు, మనస్సుకు విషయం కాదు. భాషకు అందదు. అయితే, ఆత్మ యొక్క అనుభవం అసాధ్యమా? కానే కాదు. అతి సులభం. ఎట్లా? ఈ జీవుడు ‘దేహభావన’ను ‘దృశ్యభావన’ను, వ్యష్టిభావనను దాటివేసి ఆపై ‘‘సర్వాత్మభావన’’ను అభ్యసిస్తే, ఆ మరుక్షణమే అది భావనచే సులభసాధ్యము. భావనా మాత్రం చేత క్షణంలో ఆత్మ గోచరమై, అనుభవమునకు సవిషయమై సిద్ధించగలదు.

భక్తిగమ్యమ్ : పరాప్రేమ స్వరూపమగు భక్తిచే ఆత్మ భావనను తప్పక చేరవచ్చు. ‘‘పరమాత్మ సర్వ జీవులలో సర్వ జీవులుగా ఉన్నారు’’ - అనునదే పరాప్రేమ. దృశ్య వస్తువులపై గల ప్రేమను, జగత్ పాలకుడు - జగన్మోహనుడు అగు ‘విష్ణుతత్త్వము’ (లేక) ‘శివచైతన్యము’గా (లేక) ‘ఆదిపరాశక్తి’గా దర్శించు ‘పరాప్రేమ’గా మలచినప్పుడు పరమాత్మత్వము, పరబ్రహ్మత్వము ఈ జీవునికి ఇక్కడే ఇప్పుడే సిద్ధించగలదు.

‘‘తత్ భావనా మాత్రేన అనుభవసిద్ధమ్!’’

ఓ పద్మసంభవా!

భక్తి గమ్యం పరం తత్త్వం అంతర్లీనేన చేతసా!

బాహ్య దృష్టులను, గుణ దృష్టులను ప్రక్కకు నెట్టి - అంతర్లీన దృష్టిచే (సర్వజీవులను ఆత్మ ప్రదర్శముగా, ఆత్మకు అభిన్నంగా), అంతర్లీన చేతసము (బుద్ధి)చే దర్శించుటచే తన యొక్క అఖండాత్మకమగు, నిత్యముక్తాత్మకమగు పరతత్త్వము తప్పక సిద్ధించగలదు. ‘‘తత్ త్వమ్’’ యొక్క అభ్యాసమే ‘సోఽహమ్’నకు రాజమార్గము.

అందుకు ‘భావన’యే ముఖ్యకారణము. ‘అంతా విష్ణుతత్త్వమే’ - అని ఉపాసనాపూర్వకంగా, భక్తిపూర్వకంగా అనుకూంటు ఉంటే, తత్ భావనచే అనిపించగలదు. అనిపించిన అఖండాత్మతత్త్వమును - ‘సోఽహమ్’-తత్త్వమ్’ల ఏకత్వము సిద్ధించుకొనుచుండగా, ఈ జీవుడు తనకు తానే బ్రహ్మమై విరాజిల్లుచున్నాడు.

భావన - భావించువాడు

ఓ బ్రహ్మదేవ మహాశయా! శ్రీ సరస్వతీ వల్లభా!

ఈ దేహముతో జీవునకు సంబంధము ఎట్లా ఏర్పడుతోంది? భావన చేతనే! ఈ ఇంద్రియములు, భావన చేతనే నిర్మితమై ప్రకటనమగుచున్నాయి. ఇంద్రియజగత్తు, స్వప్నజగత్తులు కూడా భావనచేతనే సిద్ధిస్తూ అనుభవమగుచున్నాయి. ఈ భౌతికదేహము యొక్క నాశనము కూడా ‘‘నాకు దేహము వచ్చింది. ఇంతకాలముగా ఉంటోంది. ఇదిగో, ఇప్పుడు నశిస్తోంది’’ - అనునదంతా భావన చేతనే సంఘటితమౌతోంది. ‘‘ఇతః పూర్వపు నా దేహము నశించగా, ఇప్పుడిక ఈ మరొక దేహము నా పట్ల బయల్వెడలుతోంది’’ అనబడు పునర్జన్మానుభవము కూడా భావన నుండియే జనించుచూ ప్రవర్తితమౌతోంది. దైనందికంగా కూడా, ‘‘ఇప్పుడు నేను జాగ్రత్‌ను త్యజించి, క్రమంగా స్వప్నంలో ప్రవేశిస్తున్నాను. ఇంతదాకా పొందియున్న జాగ్రత్ సత్యంకాదు. ఇదిగో, ఈ స్వప్నదృశ్యము సత్యము’’ అనునదంతా కూడా భావనా చమత్కారమే! ఈ విధంగా ‘జీవమాత్రోఽహమ్’ అను పరిమితత్వమంతా కూడా ఈ జీవుని పట్ల స్వకీయ భావన చేతనే ఏర్పడుచున్నది. ‘భావించబడేది’ మార్పు చెందవచ్చునేమోగాని ‘భావన’ చేయు చైతన్యము అమృత స్వరూపమే! మృతము కాదు. చెక్కు చెదరదు।

శ్లో।। యథా దేహాన్తర ప్రాప్తేః కారణం భావనా నృణామ్
విషయం ధ్యాయతః పుంసో, విషయే రమతే మనః ।।

ఏది ఎట్లు భావన చేస్తూ ఉంటే, అది అట్లే సిద్ధిస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే దేహము యొక్క రాకపోకలు భావనావైచిత్ర్యమే అయి ఉన్నదో, అట్లాగే - ఈ జీవుడు తాను తెచ్చిపెట్టుకున్న ఉపకరణములు మాత్రమే (Mere instruments) - అగు ఇంద్రియములకు అనుభవమగుచున్న విషయములను ‘ధ్యానము’ చేస్తూ ఉండగా, క్రమంగా ఈ మనస్సు-ఆత్మత్వమును ఎక్కడో దాచిపెట్టి ఇంద్రియ విషయములలో ప్రవేశించి, విషయములందే రమించనారంభిస్తోంది. ఇదియే జగత్తు యొక్క ఉత్పత్తికి హేతువు.

బ్రహ్మభగవానుడు : అవును. ‘‘మనస్సు ఇంద్రియ విషయములలో రమిస్తూ, తనకు జనన స్థానము - అగు ఆత్మను ఏమరచి ఉండటము’’ - అనునది మీరు సెలవిచ్చినట్లుగా ‘భావన’ యొక్క ఫలముగా జీవుని పట్ల జరుగుచున్నది. ఫలితంగా ఈతడు అత్యంత దుఃఖితుడు, జన్మ-జరా-మరణ పరంపరా బద్ధుడు అగుచున్నాడు. హే మహేశ్వరా! సాంబశివా! సదాశివా! లోకకల్యాణమూర్తీ! ఇప్పుడు ఉపాయమేమిటి? దయచేసి మార్గదర్శనం ప్రసాదించండి.

శివభగవానుడు : (యథా) విషయే ధ్యాయతః పుంసో, విషయే రమతే మనః।, (తథా) మామ్ అనుస్మరతః చిత్తం మయ్యేవ అత్ర విలీయతే! ఏ విధంగా అయితే విషయములు ధ్యానిస్తూ ఉండగా, ఈ జీవుని మనస్సు విషయములందు రమిస్తూ ఉంటోందో….

అదేరీతిగా…..,

ఈ జీవుడు తన చిత్తమును (సర్వతత్త్వాత్మకమ్, సాంబమ్, సర్వతత్త్వవిదూరకమ్, సర్వతత్త్వ స్వరూపం చ - అగు) అస్మత్ శివతత్త్వము యొక్క ‘అనుస్మరణ’ (Constant chanting in mind) యందు నియమించునుగాక! అట్లా నియమిస్తే ఆతని మనస్సు (లేక) చిత్తము నాయందే విలీనముకాగలదు. ఈ జీవుడు శివుడు కాగలడు.

నన్ను అనుస్మరిస్తూ ఉండటంచేత..,
సర్వజ్ఞత్వము → ఈ జీవత్వము - ఈశ్వరత్వము- ఆత్మత్వములు ఆతనికి సువిశదమగుచున్నాయి.
పరేశత్వమ్ → ఈ ద్రష్ట-దృశ్యములకు పరముగా గల ఈశత్వము (The sense that I my self am extending as this all) సుస్పష్టమవగలదు. ‘‘ఇదంతాగా విస్తరించినవాడనై ఉండటము నా స్వభావము కదా!’’ అను అనుక్షణిక - స్వాభావిక పరేశత్వము సిద్ధించగలదు.
సర్వ సంపూర్ణశక్తితా → జగత్తులు ఉత్పత్తి-స్థితి-ఉపసంహార సామర్ధ్యమును పొందగలడు.
అనన్త శక్తిమత్త్వన్చ : అనంత శక్తిమంతుడు కాగలడు.

ఇవన్నీ ‘శివా’, ‘ఓం నమఃశివాయ’ ‘సర్వమ్ శిమయమ్’ ‘‘శివాత్ పరతరమ్ నాస్తి’’ - ల అనుస్ఫురణచే సిద్ధించగలవు. ‘‘చిదానందరూపమ్ శివోఽహమ్’’ స్థానమును పుణికిపుచ్చుకోగలడు.


4వ అధ్యాయము - సర్పరజ్జు భ్రాంతి

‘ఓం’ ఇతి ఏకమ్, అక్షరమ్! ఈ జగత్తు, ఈ జగదనుభవము, ఈ జీవుడు - ఇవన్నీ కూడా ఏకము అక్షరము అగు ఆత్మచైతన్యమే! చైతన్యస్య ఏకరూపత్వాత్, భేదోయుక్తో న కర్హిచిత్। ఆత్మ చైతన్యము సర్వదా ఏకమే అయి ఉన్నది. అద్దాని యందు ఇది జీవుడు. ఇవి జగదనుభవములు. ఇది జగత్తు. ఈతడు జ్ఞాని. ఆతడు కాదు. ఈతడు మనుష్యుడు. ఆతడు దేవత - ఇటువంటి భేద దృష్టి ఉచితమే కాదు.

ఇక జీవుడు - జీవత్వము అంటారా? జీవత్వం చ తథా జ్ఞేయం రజ్జ్వాం సర్పగ్రహో యథా।। ఒకానొకడు ఒకచోట ఒక త్రాడును చూచి ‘‘అయ్యబాబోయ్! ఇది ఎంతపెద్ద త్రాచు పాము?’’ అని అనుకొని వికారములు పొందటం ఎటువంటిదో,- ఆత్మపట్ల ‘జీవత్వము’ అటువంటిదిగా తెలుసుకొబడునుగాక! త్రాడు నందు పాము మొదలే లేనివిధంగా, బ్రహ్మము నందు ‘జీవుడు’ అనునది మొదలే లేదు.

రజ్జ్వజ్ఞానాత్ (రజ్జు-అజ్ఞానాత్) తత్ క్షణేనైవ యద్వత్ రజ్జుర్హి సర్పిణి,.. ఏ విధంగా అయితే త్రాడును చూడగానే త్రాడు గురించిన జ్ఞానము లేని కారణంగా ‘‘ఇది పాము’’ అను జ్ఞానము తత్‌క్షణమే ఏర్పడినది అగుచున్నదో,.. అదేవిధంగా….,
- భాతి తద్వత్ చితిః సాక్షాత్ విశ్వాకారేణ కేవలా!

చిత్ యొక్క (ఆత్మయొక్క) ఏమరపు కలిగిన మరుక్షణం, అట్టి కేవల చిత్‌తత్త్వము (In one’s own absolute knowing) నందు ఈ విశ్వమునకు (లేక) దృశ్యమునకు సంబంధించిన ఆకారానుభవమంతా ఉదయిస్తోంది. బ్రహ్మము అనన్యము కాబట్టి (బ్రహ్మమునకు వేరుగా ఏదీ లేదు కాబట్టి) - బ్రహ్మము నందు ‘విశ్వము’ అనబడునది ఉండటానికి ఉపాదాన కారణమంటూ ఏదీ లేనే లేదు. (త్రాడుయొక్క ఏమరుపే సర్వరూపము అయినట్లుగా) బ్రహ్మముయొక్క ఏమరుపే విశ్వరూపముగా అవుతోంది.

అందుచేత - తస్మాత్ సర్వ ప్రపంచో అయం బ్రహ్మైవ అస్తి! నచేతరత్। (న చ ఇతరత్!) ఈ పాంచభౌతికంగా కనిపించే ప్రపంచమంతా కూడా సర్వదా బ్రహ్మమే అయి ఉన్నది. మరింకేదీ అయి ఉండలేదు.

‘‘అంతా ఆత్మయే’’ - అనునది శాసనము (It is a thumb-Rule). అందుచేత - ‘‘ఇది వ్యాపింపజేయునది. అది వ్యాపింపబడినట్టిది. బ్రహ్మము ప్రపంచమంతా వ్యాపించినదై యున్నది’ - ఇవన్నీ మిథ్యావచనములే!

‘‘సర్వము బ్రహ్మమే’’ అని సిద్ధాంతీకరించుకున్న తరువాత (లేక సర్వము శివమే, దేవీ తత్త్వమే, విష్ణుతత్త్వమే - అని నిర్ణయించుకొన్న తరువాత) - ఇతి జ్ఞాతే పరేతత్త్వే భేదస్య అవసరః కుతః? పరతత్త్వము పట్ల ‘‘ఇది ఇహము, జీవుడు : అది పరము, పరమాత్మ’’ అను భేదము యొక్క అవసరం ఏమున్నది?

బంగారము నుండి ఆభరణము వలె, జలము నుండి తరంగము వలె, సూర్యుని నుండి కిరణముల వలె ‘పరమాత్మ’ అనబడు తత్త్వము నుండి ఈ జగత్ దృశ్యములో అగుపిస్తున్న సర్వభూతజాలము బయల్వెడలుచున్నది.

అందుచేత, తస్మాత్ ఏతాని బ్రహ్మైవ భవంతి - ఇతి విచిన్తయ।‘‘ఈ కనబడేదంతా సర్వదా బ్రహ్మమునందే, బ్రహ్మమునకు అభిన్నంగా ఏర్పడి ఉన్నది’’- అని చింతన చేయబడును గాక! సర్వనామ వాచకములు, సమస్త సర్వనామములు, రూపములు.. ఇవన్నీ కూడా సర్వదా బ్రహ్మమే అయి ఉన్నాయి. ‘‘సర్వ వ్యవహారములు, సర్వకర్మ విశేషములు - ఇవన్నీ కూడా సమగ్రంగా బ్రహ్మమునందే భాసిస్తున్నాయి’’ అని ‘భావన’ చేయబడును గాక!

✤ బంగారముతో తయారుకాబడిన ఆభరణములన్నిటిలో బంగారమే శాశ్వతమైనది. ఆభరణము యొక్క నామ-రూపములు కాదు. సువర్ణాత్ జాయ మానస్య సువర్ణత్వన్చ శాశ్వతమ్।
✤ జలము నుండి బయల్వెడలిన తరంగములలో జలమే సత్యము. తరంగము యొక్క నామరూపములు కాదు. (ఆపః సత్యమ్। న తరంగాది।)
✤ బ్రహ్మము నుండి బయల్వెడలిన ఈ ప్రపంచము (విశ్వము) నందు ‘బ్రహ్మము’ మాత్రమే శాశ్వతము. బ్రహ్మత్వమే ఈ జగత్తు (ప్రపంచము) యొక్క స్వరూపము, స్వభావము కూడా! (బ్రహ్మ సత్యమ్। జగత్ మిధ్యా।)

ద్వితీయాం భయం భవతి

శ్లో।। స్వల్పమపి అన్తరం కృత్వా జీవాత్మ పరమాత్మనోః
యః తిష్ఠతి స మూఢాత్మా, భయం తస్యాపి భాషితమ్।।

మూఢాత్ముడైతే (The one who is foolish) - ‘‘జీవాత్మ - పరమాత్మల మధ్య కొంచమైనా భేదమున్నది’’- అను భావనయందు తిష్ఠితుడై ఉంటాడో, ఆతని పట్ల ‘భయము’ అనునది ఏర్పడియే ఉంటుంది. కొనసాగుచూనే ఉంటుంది.

అందుచే, (సర్ప రజ్జు అహ్రాంతివలె) ఏది అజ్ఞానము చేత ‘‘ఇది ఆత్మకు వేరైనది. ద్వితీయమైనది’’ అని అనిపిస్తోందో, అదంతా కూడా అహ్రాంతియే! యత్ అజ్ఞానాత్ భవేత్ ద్వైతమ్ ఇతరత్ తత్ ప్రపశ్యతి - ‘‘అదంతా ఆత్మయే! ఆత్మకు వేరై ఎక్కడా ఏదీ అణువంత కూడా లేదు’’ - అను భావనతో జ్ఞానోదయమును ఆశ్రయించాలి - ఆత్మత్వేన తదా సర్వం నేతరత్ తత్ర చ అణ్వపి।

బ్రహ్మ దేవుడు : కానీ, స్వామీ! ఈ జీవునకు జగత్తు, అట్టి జగద్దృశ్యములో అనేక భేదములు ఘనీభూతమై అనుభూతమగుచున్నాయే!

శివ భగవానుడు : అనుభూతమయినంతమాత్రం చేతగాని, ఈ జగత్తు వ్యవహారశీలమైనంత మాత్రం చేతగాని- ఇదంతా ఆత్మకు వేరుకాదు. వేరుగా చూస్తే - అసద్రూపమే! వాస్తవానికి లేనేలేదు. కానీ (అజ్ఞానదృష్టిచే) ఉన్నట్లు అనిపిస్తోంది. ‘జ్ఞానము’ అను ప్రకాశముచే, ఈ ప్రపంచము ఎందుకు వేరుగా లేదో ఈ జీవుడు గ్రహించగలడు.

దృష్టాంతంగా →

(1) దూరంగా కొండ నునుపుగా కనిపిస్తుంది. దగ్గరకు వెళ్లితే? అక్కడ నునుపు (Plain appearence) ఉన్నదా? లేదు.

(2) ఒకడు కల కంటున్నాడు. ఆ కలలో అనేక వ్యవహారములు, సంబంధ - అనుబంధ-బాంధవ్యములు దర్శిస్తున్నాడు. ఆతని దృష్టిలో ఆ స్వప్న దృశ్యము అప్పటికి సత్యమే! (జాగ్రత్తు ఆ వర్తమానానికి ఆతని దృష్టిలో లేనే లేదు కదా!). ఇప్పుడు.., అసద్రూపో యథా స్వప్న ఉత్తర క్షణ బాధితః। నిదుర లేవగానే స్వప్నము లేనిదగుచున్నది. స్వప్నసమయంలో ‘స్వప్నము నిజమే’ - అని అనుకున్నంత మాత్రం చేత,…. స్వప్నంలో కనిపించినది నిజమా? ఎట్లా అవుతుంది? మెలకువ రాగానే క్షణంలో స్వప్న దృశ్యమంతా మటుమాయ మౌతోందే మరి!

స్వప్నే జాగరితం నాస్తి। - స్వప్న సమయంలో జాగ్రత్తు ‘లేనిది’గా అగుచున్నది.

జాగరే స్వప్నతా నహి। - జాగ్రత్ సందర్భములో ‘స్వప్నము’ లేనిదే అవుతోంది.

ద్వయమేవ లయే నాస్తి। - సుషుప్తి సందర్భములో జాగ్రత్ - స్వప్నములు రెండూ లయం పొంది, ‘లేనివే’ - అగుచున్నాయి.

లయోపి హి అనయో న చ। - ‘లయము’ అనునదీ లేదు. ఆత్మ నిత్య జాగరూకమై ఉండగా, తరంగం జలంలో లయం లాగా - జాగ్రత్ స్వప్న సుషుప్తులు నిత్య జాగరూకమగు చైతన్యాత్మయందు లయమగుచున్నాయి.

(3) తరంగము జలము కానిదెప్పుడు? జలము జలమునందే లయమౌతోంది. అంతా ఆత్మయే అయి ఉండగా, ఏది ఎందులో లయమౌతోంది? లయము లేదు. జననము లేదు. తరంగమునకు ఆకారము ఉన్నంత మాత్రంచేత జలమునకు ఆకారము ఉన్నట్లా? కాదు కదా!

పరమాత్మ యందు జీవాత్మ లేడు.
పరమాత్మ జీవాత్మగా అవటం లేదు.

ఈ విశ్వము, ఇక్కడి 14 లోకాలు - ఇదంతా కూడా ‘సత్వ-రజో-తమో’ అను ‘3’ గుణములచే నిర్మితమైయున్నది.

‘3’ పుల్లలను త్రికోణంగా     ⃤   అమర్చి త్రికోణము జనించినట్లు ఒకడు భావించవచ్చుగాక!
ఆ మూడు పుల్లలను ప్రక్కకు నెట్టితే త్రికోణము ఎక్కడున్నది?…
అట్లాగే, ‘త్రికోణము నశించింది’ - అని అంటామా? ‘‘ఇంతవరకు త్రికోణము నన్ను బంధించింది’’ - అని చెప్పుతామా?

త్రిగుణాత్మకమైనదంతా ఒక కథలోని సంఘటనలు, కార్యములు, పర్యవసానముల వలె మిథ్యమే. ఆ త్రిగుణములకు ఆవల ‘‘త్రిగుణములు తనవి’’- అయినట్టి ద్రష్ట ‘‘అనుభవి-పర్యవేక్షకుడు - ఉపయోగించువాడు’’గా ఉన్నాడు.

అస్య ద్రష్టా గుణాతీతో, నిత్యోహి,.. ఏష చిదాత్మకః। ద్రష్ట గుణిగా కనబడుచూ ఉన్నప్పటికీ, గుణములకు మునుముందుగానే ఉన్నాడు. గుణాతీతుడు. కాలమునకు సాక్షియై భూత-వర్తమాన- భవిష్యత్తులలో వెలయుచున్నాడు. కనుక నిత్యుడు. ఆతడే చిదాత్మ। ఏష హి ఏవ చిదాత్మకః। ఈ దేహములోని ‘అనుభవియే’ చిదాత్మ। పరమాత్మ। పరతత్త్వ స్వరూపుడు।

ఈ ద్రష్ట చిదాత్మస్వరూపుడే!

యథా మృది ఘట అహ్రాంతిః - మట్టితో తయారైన కుండయందు మట్టిని ఏమరచి ‘కుండ’ను మాత్రమే ఏ విధంగా చూస్తూ ఉంటామో,
(యద్వత్) శుక్తేహి రజత స్థితిః - ఏ విధంగా ముత్యపు చిప్ప-లోని (Inner) భాగమును ‘వెండి’ అను భ్రమతో చూస్తామో (ఒకడు ముత్యపు చిప్పను చూపి- ‘‘వెండితో తయారైనది’’.. అని తెలియనివానిని భ్రమింపజేయగలడో),
ఆ విధంగా బ్రహ్మము నందు ‘జీవుడు’ - అనబడునది అనుభూతమౌతోంది.

అయితే, వీక్షమాణే వినశ్యతి - ఏదేది ఇంద్రియములకు ‘ఇది ఇట్లు ఉన్నదికదా!’’.. అని అనిపిస్తోందో, ఆ అనిపించేదంతా ‘‘మార్పుచెందుట, నశించుట’’ - అను స్వభావము కలిగి యున్నది.

మట్టికుండలో మట్టి → ‘కుండ’ అనే పేరుతో,
బంగారపు ఆభరణము → ‘ఆభరణము’ అను పేరుతో,
ముత్యపుచిప్ప → ‘వెండి’ అనే పేరుతో
చెప్పబడు విధంగా ‘జీవుడు’ అను పేరుతో బ్రహ్మమే చెప్పుకోబడుతోంది.

ఆకాశంలో నీలిరంగువలె, యండమావులలో నీరు కనబడినట్లు, ఒక బండరాయి చీకటిలో ఎవ్వరో వ్యక్తి నిలబడినట్లు అనిపించుతీరుగా, ఆత్మయందు ‘విశ్వము’ అనబడునది కనిపించటము జరుగుతోంది. శూన్యములో వేతాళుడు (భేతాళుడు) కనిపించినట్లు, (మాంత్రికుని కల్పనవంటి) గంధర్వ నగరము వలె, మెల్లకన్నువానికి ఆకాశంలో రెండవ చంద్రుడు అగుపించినట్లు, కల్లోలమైయున్న జలములో జలమే తరంగముగా అగుపిస్తున్నట్లు, ఆ విధంగా ఈ జగత్తు. సత్యముగా స్థితమైనట్లు అనిపిస్తోంది. ‘‘ఎప్పటికీ ఈ ‘జగత్తు-నేను’ ఇట్లాగే ఉంటాము’’ అని భ్రమింపజేస్తోంది.

జలమే తరంగములుగాను, మట్టియే ఘటముగాను, దారములే (అల్లబడుటచే) వస్త్రముగాను - కనిపిస్తున్నట్లు, చిత్‌యే - ‘జగత్తు’ అనుదానిగా ఆభాసించుచున్నది. (Is Refracting). సర్వమ్ బ్రహ్మైవ కేవలమ్। సర్వము సర్వదా కేవలము బ్రహ్మమేనయ్యా!

జగత్ స్థితిః నాస్తి।

❋ ఒక వంధ్య (గొడ్రాలికి) రెండవ కుమారుడు ఉంటాడా?
❋ మరుభూమిలో (యడారిలోనియండమావులలో) నీరు ఉంటుందా?❋ ఆకాశంలో కొండ, వృక్షము, వనము ఉంటాయా?
అట్లాగే, ‘జగత్తు’ అనబడేదానికి స్థితీ లేదు. ‘గతీ’ లేదు. ఆత్మకు వేరుగా, స్వతః సిద్ధమైన ఉనికియే లేదు.

‘‘కుండలో మట్టి కాకుండా ఇంకేమైనా ఉన్నదా?’’ అని పరిశీలనగా వెతికితే మట్టి తప్పించి మరేమీ ఉండదు కదా! అట్లాగే - వీక్షమాణే ప్రపంచే తు బ్రహ్మైవాభాతి భాసురమ్! ఈ ప్రపంచము (The super combination of solid, liquid, vapour, Heat and placement)ను పరిశీలించిచూస్తే ‘‘బ్రహ్మము యొక్క తేజస్సే ప్రపంచముగా భాసిస్తోంది’’ - అని సుస్పష్టమగుచున్నది.

బ్రహ్మ భగవానుడు : స్వామీ! అజ్ఞానికి ఈ దృశ్యము తనతో విడదీయరాని బంధమే అగుచున్నదికదా!

శివ భగవానుడు : అవును. జీవులు రెండురకాలైన దృష్టులు కలిగి ఉంటున్నారు.
(1) సత్ (ఆత్మ) దృష్టి
(2) అసత్ (అజ్ఞాన/అనాత్మ) దృష్టి.

శుద్ధమగు ఆత్మ అశుద్ధత్వము (uncelan perception) స్వీకరించినప్పుడు సంసార భ్రమలు రూపము దిద్దుకొనుచున్నాయి. రజ్జువు తెలిసిన వానికి త్రాడుగాను, తెలుసుకొనని వానికి ‘పాము’గాను అగుపించు రీతిగా, జ్ఞానికి ఈ జగత్తు స్వస్వరూపాత్మరూపంగాను, అజ్ఞానికి ఇదంతా ఎవరో తనను బంధించి ఉంచుటకై కల్పించినట్టిదిగాను అగుపిస్తోంది.

→ కుండ అంతా ‘మట్టియే’ అయినట్లుగా ఈ దేహమంతా చిన్మయమే!

అంతా ఆత్మయే! ఆత్మయే అయి ఉండగా బుధులు ఏ ఆత్మ- అనాత్మ విభజనము చేస్తున్నారో అదంతా వృధాయే. పాముగా కనిపిస్తున్న త్రాడును ‘‘ఇంతవరకు, అంతవరకు త్రాడు’’ - అని విభజనము చేస్తామా? చేయము కదా! ఇది ముత్యపు చిప్ప-ఇది వెండి అని విభాగిస్తామా? ఘటము - మట్టిని వేరు చేసి చూస్తామా? దేహత్వము ఆత్మగానే దర్శించబడు గాక। ఆత్మకు అన్యముగా దేహము లేదు. దేహియు లేడు.

కుండ - అంతా కూడా మట్టియే అయినట్లు, యండమావులలో జలత్వమున్నట్లు, గృహములో కాష్ఠమే (కొయ్య) ఉన్నట్లు - ‘‘ఆత్మత్వములో దేహత్వమున్నది’’ - అని అజ్ఞాన దృష్టికి అనిపిస్తోంది. అజ్ఞానికి ఆత్మ- జగత్తులు రెండుగా అగుపిస్తున్నాయి. జ్ఞానికి ఈ సమస్తము ఏకము, అఖండము కూడా.


5వ అధ్యాయము - దేహమ్ విష్ణ్వాలయమ్ ప్రోక్తమ్!

బ్రహ్మ భగవాన్ : హే శివదేవా! బ్రహ్మము - యోగముల గురించి పరస్పరంగా ఇంకా మరికొన్ని విశేషములు చెప్పండి. (Kindly explain from the dimension of mutuality of ‘Brahmam & Yogam’).

శివ భగవానుడు : అతి రహస్యమగు బ్రహ్మస్వరూప యోగము గురించి మరికొంతగా చెప్పుచున్నాను. సమాహితచిత్తులై వినండి.

దేహమ్ విష్ణ్వాలయమ్ ప్రోక్తమ్।

ఈ దేహము..,
★ 10 ద్వారములు గల పురము. (‘2’ కళ్లు’, ‘2’ చెవులు, ‘1’ నోరు, ‘2’ ముక్కుపుటములు, గుదము, గుహ్యము, బ్రహ్మరంథ్రము.)
★ ‘10’ నాడులతోను, ఉపనాడులతో కూడా విస్తరించి ఉన్నట్టిది. అట్టి నాడులన్నీ శరీరములో అనేక పధములు (Paths) కలిగియున్నాయి.
★ దశ వాయువులతో (ప్రాణ-ఉపప్రాణములతో) వ్యాప్తమైయున్నది.
★ దశ ఇంద్రియములు (‘5’ కర్మేంద్రియములు, ‘5’ జ్ఞానేంద్రియములు) కలిగి యున్నట్టిది.
★ మూలాధారమునుండి షట్(6) ఆధారములు కలిగి యున్నట్టిది.
★ షట్ (6) అన్వయములు కలిగి యున్నట్టి మహావనము వంటిది.
★ 4 పీఠములతో సమాకీర్ణమైయున్నది.
★ 4 వేదములచే దీపింపజేయబడుచున్నట్టిది.
★ బిందువు, నాదము, మహాలింగములతో కూడుకొని ఉన్నట్టిది.
★ విష్ణు - లక్ష్మీ (ఉనికి-జ్ఞానము) సంజ్ఞలు తనయందు కలిగి ఉన్నట్టిది
అట్టి ఈ శరీరము జీవులకు సిద్ధిని ప్రసాదించుటకై సంసిద్ధత కలిగియున్నది. అట్టి ఈ దేహమే (అందుచేత) ‘విష్ణ్వాలయము’.
ఇంకా ఈ దేహము గురించి వినండి.

దేహములు - చక్రస్థానములు

దేహములో ప్రకృతిచే ప్రతిక్షేపించబడిన శక్తి కేంద్రముల గురించి ఇప్పుడు ఉదహరించుకుంటున్నాము.

  1. మూలాధార చక్రము : - గుదము - మేఢ్రము (మగగురి) మధ్య స్థానమున ఉన్న శక్తి కేంద్రము. త్రికోణాకారము. ‘‘శివుడే ఇక్కడ జీవుడై వెలయుచున్నారు’’ అని చెప్పబడు స్థానము. ఈ స్థానములో ‘కుండలిని’ అను పేరుతో పిలువబడే పరాశక్తి ప్రతిష్ఠితమై యున్నది.
  2. ఏ శక్తి నుండి వాయువు ఉత్పన్నమగుచున్నదో, ఏ శక్తి నుండి అగ్ని ప్రవర్తనశీలమగుచున్నదో, దేని నుండి నాదము బయల్వెడలుచున్నదో, ఎద్దాని నుండి హంస (ఉచ్ఛ్వాస - నిశ్వాసలు) ప్రవర్తిస్తున్నాయో, తిరిగి విలీనము పొందుచున్నాయో, ఎక్కడ ఆలోచన (మనస్సు) ఉత్పన్నమగుచున్నదో, అదియే మూలధారశక్తి. అది ‘కామరూపపీఠము’ అని, అద్దానిని ఉపాసించువారు కోరుకొన్నవి పొందుతారు కాబట్టి - కామఫలప్రదము - అని పిలుస్తున్నారు.
  3. స్వాథిష్ఠానచక్రము : లింగమూలమునకు పైస్ధానముగా - ఆరు రేకులు కలిగినదై ఉన్నది.
  4. మణిపూరకచక్రము : నాభి ప్రదేశములో సంస్థితమైయున్నది. 10 ఆరములు గల చక్రము.
  5. అనాహతమ్ : 12 ఆరములు గల మహాచక్రము. హృదయస్థానమున ప్రవర్తమానమై ఉన్నట్టిది. ఓ కమల సంభవా! దీనిని ‘పూర్ణగిరి పీఠము’ అని కూడా అంటారు.
  6. విశుద్ధ చక్రము : కంఠ ప్రదేశమున ఏర్పడి ఉన్నట్టిది. ‘16’ ఆరములు కలిగినట్టిది. దీనికి ‘‘జాలంధర పీఠము’’ అని కూడా పేరు. ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ వేంచేసియున్నారు.
  7. ఆజ్ఞాచక్రము : భ్రూమధ్య స్థానములో ఉన్నట్టిది. రెండు ఉత్తమ దళములు కలిగియున్నట్టిది. ఈ స్థానము దేహములో ‘శక్తిరూపము’ (Power house)గా ప్రకాశించుచున్నది.
  8. ఉఢ్యాణ/మహాపీఠము : ఆజ్ఞాచక్రమునకు ఉపరిభాగంగా (భ్రూమధ్యకు పైభాగంగా) ‘ఉఢ్యాణపీఠము’ అని పిలువబడే మహాపీఠము ఉన్నది. ఇది కూడా దేహంలో శక్తిస్థానమై ప్రవర్తిస్తోంది.

పంచభూతములు - span style=“color:red;”>అధి దేవతా నిర్ణయము

(1) ధరణీ (భూ) : చతురస్ర మండలాకారము కలిగి ఉన్నట్టిది. అధిదేవత = బ్రహ్మ
(2) జలము : అర్ధచంద్రాకృతి మాండలాకారము. అధిదేవత = విష్ణువు
(3) వహ్ని (అగ్ని) : త్రికోణమండలాకారము అధిదేవత = రుద్రుడు
(4) వాయువు : షట్ (6) కోణములు గల బింబమండలాకారము. అధిదేవత = సంకర్షణుడు.
(5) ఆకాశము: వృత్త మండలాకారము. అధిదేవత = పరమాత్మ

శాంభవ స్థానము

భ్రూమధ్యములో నాదరూపము. మనో మండలము. ఈ స్థానము ‘శాంభవస్థానము’ అని పిలువబడుతోంది.

నాడీచక్ర నిర్ణయము

పరమశివుడు : ఓ బ్రహ్మభగవాన్! ఇక్కడ మనము నాడీచక్రముల స్థాన నిర్ణయము గురించి కూడా వివరించుకుందాము.

సుషుమ్ననాడి : ఈ నాడి - త్రికోణాకారమగు మూలాధారము నుండి ద్వాదశాంతగతమై (ద్వయమునకు చిట్టచివరగా) విస్తరించినదై ఉన్నది. సగమున వరకు విరుగగొట్టబడిన వెదురుపుల్ల ఆకారము కలిగి ఉంటోంది. ఇది ‘మూర్ధ్ని స్థానము’ను ఛిన్నము చేసి బ్రహ్మరంధ్రము వరకు విస్తరించి ఉండటం ఏత ‘బ్రహ్మనాడి’- అని పిలుస్తున్నారు. ఆ సుషుమ్ననాడికి ఇరు పార్శ్వములలో ఇడ (ఎడమవైపు) - పింగళ (కుడివైపు) - నాడులు.

ఇడ నాడి: హేమ (బంగారు) రూపంగా ఉంటుంది. ఇందులో సంచరించువాయువు హేమ (బంగారు) రూపంగా కనబడుచున్నది. ఎడమవైపుగా ఉంటుంది. చంద్రాత్మకమైనది.

పింగళనాడి : సూర్యాత్మకమైనది. కుడివైపుగా ఉంటోంది.

విళంబినీనాడి : ఇది సుషుమ్ననాడిని అనుసరిస్తూ ముక్కుకు ఉపరిభాగము చివ్వరి వరకు విస్తరించియున్న నాడి. ఈ నాడి అభివ్యక్తమై నాభి ప్రదేశములో ప్రతిష్ఠితమై యున్నది.

నాభి స్థానము నుండి ఇంకా అనేక నాడులు బయల్వెడలుచున్నాయి. అవన్నీ పైకి - క్రిందికి - వెనుక నడుము వైపుగాను విస్తరించినవై ఉంటున్నాయి. ఈ విధంగా ‘‘నాభి చక్రము’’గా - పిలువబడుచూ కోడిగ్రుడ్డు ఆకారముగా ఉంటున్నదై అనేక నాడులకు బయల్వెడలుస్థానము అయి ఉంటోంది.

గాంధారి నాడి; హస్తి జిహ్వ నాడి : ఈ రెండు నాడులు నాభి నుండి బయల్వెడలి రెండు కనుల - కంటిపాపల చివరి వరకు విస్తరించి ఉన్నాయి.

పుషానాడి; అంబుసా నాడి : చెవులలోని చివ్వరి భాగముల వరకు విస్తరించి ఉన్న నాడులు.

శూరా నాడి : నాభి స్థానము నుండి భ్రూమధ్య ప్రదేశము వరకు విస్తరించి ఉన్నట్టిది.

విశ్వోదరీ నాడి : నాలుకలోనికి చిలువలు - పలువలుగా విస్తరించి, ఈ జీవుడు (భక్ష్య-భోజ్య-లేహ్య-చోహ్యములనబడే) చతుర్విధ ఆహారములు భుజించటానికి సహకారికమగుచున్నది.

సరస్వతి (సరత్వతి): నాలుక చివ్వరి వరకు ప్రసరించి ఉన్నది.

రాకాహ్వయ నాడి : ఈ నాడి - ఈజీవుడు క్షణాలలో నీరు త్రాగటానికి సహకరిస్తూ ఉంటున్న నాడి. ఇది ముక్కు ప్రదేశములో క్షతము (తుమ్ము)ను కలిగిస్తూ, శ్లేష్మమును కలిగిస్తూ - తొలగిస్తూ ఉంటున్నది.

శంఖిణీ నాడి : ఈ నాడి కంఠకూపములో ఉద్భవించినదై కంఠము నుండి అధోముఖము (క్రింద వైపుగా, Downwardly) నందు కూడబెట్టుచూ ఉన్నది.

నాభి - అథోగత త్రిస్రోనాడులు : నాభి నుండి జనించి అధోగతంగా ‘3’ నాడులు విస్తరించి ఉంటున్నాయి. అందులో కుహూ నాడి మలవిసర్జనకు, వారుణీ నాడి మూత్ర విసర్జనకు క్రియాశీలకమై ఉంటున్నాయి.

చిత్ర-సీవనీ నాడి - శుక్ల విమోచన కారకము అయి ఉంటోంది.

ఇవన్నీ కలిపి ‘‘నాడీచక్రము’’ అని పిలువబడుచున్నాయి.

బిందు రూపము

శివ భగవానుడు: ఓ బ్రహ్మ దేవా! పద్మ సంభవా! ‘బిందురూపము’ గురించి చెప్పుకుందాము. వినండి.

సృష్టికర్తయగు బ్రహ్మయొక్క హిరణ్యగర్భ ప్రదర్శనము ‘3’ విధములగు శరీరములుగా (దేహములుగా) విభజించి చెప్పబడుచున్నది.

(1) స్థూలము : బిన్దురూపము. శుక్లాత్మకము.
(2) సూక్ష్మము : పంచాగ్ని రూపకము.
(3) పరము : సోమాత్మకము (స-ఉపాత్మకము). ప్రకృతితో కూడి ఉన్నది. ప్రకృతి తనదైనట్టిది. ఇది సదా సాక్షి అయి, తన స్థానము నుండి చ్యుతి పొందనిదై యున్నది.

ఏ కాలాగ్ని అధో భాగమగు పాతాళము నందు సంప్రతిష్ఠితమైయున్నదో, అదియే ఈ భౌతిక దేహమునందు ‘మూలాగ్ని’గా ప్రతిష్టితమైయున్నది. అట్టి మూలాగ్ని నుండి ‘నాదము’ జనిస్తోంది. శరీరములో అది బడబాగ్ని వంటిది. అదియే బొమికల మధ్యగా కూడా ఉన్నదగుచున్నది. కొయ్యలోను, రాయిలోను మధ్యగతమై వహ్ని (అగ్ని) ఉన్నట్లే - అస్థి (బొమికల) గతమై అగ్ని ఉన్నది.

అగ్ని : కాష్ట (కొయ్య) - పాషాణము (రాయి)లలో ఉన్న అగ్నిని ‘పార్థివము’ అంటారు. అంతరిక్షములో అగ్ని (వహ్ని)ని - ‘వైద్యుతము’ అంటున్నారు. ఈ వైద్యుతమే స్వ-అంతరాత్మగతమై (In one’s own self) కూడా ఉన్నది.

సూర్యుడు : ఆకాశములో సూర్యగోళముగా ఉన్న అగ్నియే దేహములో నాభిమండలము (బొడ్డుచుట్టూ) ఆవరించినదై ఉన్నది. సూర్యుడు ఆకాశంలో విషమును (భీకరాగ్నిని) వర్షించు వారై ఉండి కూడా, నాభియందు ఉన్ముఖుడై అమృతమును వర్షింపజేయుచున్నారు. అందుచేత ‘అమృతవర్షిణి’ - అనబడుతోంది.

చంద్రుడు : తాలు మూలలో (దవడ అంతర్‌భాగంగా) అధోముఖుడై సుధ (మాధుర్యము)ను వర్షింపజేస్తున్నారు.

బిందువు : భ్రూమధ్యస్థానములో బిందువు స్థితి కలిగియున్నది. శుద్ధస్ఫటికము వలె ప్రకాశమానము, ఇది మహావిష్ణువు యొక్క సూక్ష్మరూపముగా అభివర్ణితము.

పంచాగ్నులు
(1) నాదజనన స్థానమగు కాలాగ్ని - శరీరములో మూలాగ్ని.
(2) విశ్వములో బడబాగ్ని - బొమికలలో పార్థివాగ్ని.
(3) అంతరిక్షంలో వైద్యుతాగ్ని - స్వాంతరాత్మాగ్ని.
(4) సూర్యరూపాగ్ని - పింగళినాడి.
(5) చంద్రరూపాగ్ని - ఇడనాడి.

ఏ యోగి అయితే సర్వ ప్రాపంచక వ్యవహారములలో ఉంటూ ఉన్నప్పుడు - వేరుగా ఉన్నప్పుడు కూడా, తినుచున్నప్పుడు - త్రాగుచున్నప్పుడు కూడా పై పంచాగ్నులను ఆత్మాభావనతో ఏకం చేసి భావిస్తూ ఉంటాడో, ఆతడు ఆవు నెయ్యిని యజ్ఞములో హుతము చేసిన ఉత్తమ ప్రయోజనము పొందగలడు. ఇందులో సందేహమే లేదు! అంతేకాదు. ఇట్టి పంచాగ్నిహోత్ర అనుసంధానము అనునిత్యముగా చేయువాని స్వప్నము, భోజనము కూడా సుఖమయము, రుచికరము, సుఖకరము అవుతాయి. సుఖ సంసేవితం స్వప్నం। సుజీర్ణమ్ ఇతి భోజనమ్।।

యోగాభ్యాసము

శివ భగవానుడు : ఓ బ్రహ్మదేవా! బుద్ధి యోగముచే ఆత్మత్వము సిద్ధించుకోవటానికి ఈ జీవుడు భావనా యోగమును, భావనాయోగము కొరకై క్రియాయోగాభ్యాసమును ఆశ్రయించాలి. అందుచేత క్రియా-యోగాభ్యాసము గురించిన కొన్ని విశేషాలు ఇక్కడ ఉదహరించుకొందాము.

(I) శారీరక శుద్ధి : ముముక్షువు మోక్ష లక్ష్యసిద్ధి కొరకై మొట్టమొదట శుద్ధిచే మహత్తరముగా ఉపయోగించగల ఉపకరణమగు ఈ శరీరమును సిద్ధం చేసుకోవాలి. మితాహారము, మితమగు నిద్ర, మితమగు వ్యవహారశీలత అభ్యసించును గాక! శరీరములో ‘మనస్సు’ అనే ఉపకరణము సహాయముతో ధైర్య-స్థైర్య-ఉత్సాహములను నింపి ఉంచుకోవాలి.

(II) సుఖాసనము : శారీరక శుద్ధి తరువాత రెండవ ముఖ్యమైన మెట్టు - సుఖాసనము. అధిక కాలము శరీరమును శ్రమ అనిపించకుండా నిశ్చల-ధారణ చేయగల ఆసనమును అభ్యసించాలి. అందుకుగాను యోగశాస్త్రము సూచించు దేహానుకూలమైన ఏదో ఒక ఆసనము ఆయా ప్రదేశానుకూలతల దృష్టితో, గురుముఖతః ఎరిగి స్వీకరించాలి.

(III) ప్రాణ మార్గ శోధనము : ప్రాణశక్తిని ఉపాసనా వస్తువు వలె ఉపయోగించుకొనబడుగాక! అందుకుగాను.. (1) రేచకము (గాలిని వదలటం) (2) పూరకము (గాలిని లోనికి స్వీకరించటము) (3) కుంభకము {గాలిని కదలకుండా ధారణ (భీష్మింపజేయుటము)} - (మరియు) ధ్యాసను భ్రూమధ్యమున ఆజ్ఞాచక్రము వద్ద నిలిపిఉంచటము. (4) పునఃరేచకము - వీటిని అవలంబించాలి.

(Ⅳ) కుండలినీ శక్తి ఉపాసన : గుదం ఆకుంచ్య యత్నేన మూలశక్తిం ప్రపూజయేత్। గుద, స్థానమును ఆకుంచ్యతను అభ్యసిస్తూ (నెమ్మదిగా ధ్యాసచే కదల్చుచూ) - దృశ్య ధ్యాస అనే ‘మత్తు’ను ఆశ్రయించియున్న ఇచ్ఛా జ్ఞాన ఉత్సాహశక్తి రూపమగు కుండలినిని ప్రపూజిస్తూ, ఊర్ధ్వమార్గ ప్రయాణమునకు (బ్రహ్మరంథ్రము వైపుగా) సంసిద్ధపరచాలి.

(V) ఉడ్డీయాణ బంధనము : ‘మూలధారము’ నందు విశ్వశక్తి స్వరూపిణి అయి ఉన్న కుండలినీ శక్తిని ఉడ్డీయాణబంధన అభ్యాసముచే ప్రాణ-అపాన కుంభకాభ్యాసయోగము ద్వారా ఊర్ధ్వమార్గంగా చేసి లింగ-నాభి మధ్య ఆకాశములో ధారణ చేయాలి. అనగా ఇచ్ఛా-ప్రజ్ఞాశక్తి రూపమగు కుండలినిని అభ్యాసబలంతో లింగ-నాభిల మధ్యగా నిలిపి ఉంచాలి. స్వాధిష్ఠాన - మణిపూరకముల మధ్య ప్రదేశమును ‘‘ఉఢ్యాణపీఠము’’ - అని అంటారు.

(VI) జాలంధర ముద్ర / జాలంధర బంధము : ఇప్పుడిక ప్రాణ-అపాన సమత్వమును పైపైకి తెచ్చుచూ కంఠమును సంకోచించు ధారణ చేయాలి. ఇది ‘‘జాలంధర బంధము’’ అని పిలవబడుతోంది.

(VII) ఖేచరీ ముద్ర :

శ్లో।। బంధయేత్ ఖేచరీ ముద్రాం దృఢ చిత్తః సమాహితః
కపాల వివరే జిహ్వా ప్రవిష్టా విపరీతగా,
భృవోః అంతర్గతాః దృష్టిః ముద్రా భవతి ‘ఖేచరీ’।
ఖేచర్యా ముద్రితం యేన వివరం లంచిక ఊర్ధ్వతః।।

(i) 👉 నాలుకను దవడకు నెమ్మదిగా తాకించుచూ,
👉 పై- క్రింద పళ్లు కలువనీయకుండా ధారణ చేస్తూ
👉 క్రమంగా నాలుకను మడచుచూ,.. దవడ యొక్క లోభాగము వైపుగా కదల్చుటను అభ్యాసిస్తూ
👉 జిహ్వను కొంచము - కొంచము విపరీతముగా దవడలో భాగవైపు నియమించుచూ,
👉 జిహ్వ యొక్క అంతిమ విభాగము లంబిక (కొండనాలుక) యొక్క.. చివర గల రంధ్రమును తాకిస్తూ ధారణ చేయుటము

(ii) ధ్యాసను భ్రూమధ్యలో గల ఆకాశములో (In the space between Two Eye Brows) నిలిపి ఉంచటము
ఇది ఖేచరీముద్ర. ఆ విధంగా (1) నాలుకను మడచి, నాలుక యొక్క చివరచే కొండనాలుకయొక్క బాహ్య రంధ్రమును స్పృశించి ఉంచటము, (2) ధ్యాసను భ్రూమధ్యలో నిలిపి ఉంచము, అను రెండు ముఖ్యమైన క్రియావిశేషములతో కూడిన ఖేచరీముద్ర వలన → బ్రహ్మరంధ్రము నుండి స్రవించు ‘అమృతము’ - లంబిక నుండి (కొండ నాలుక నుండి) అగ్నిలోనికి పతనము కాకుండా ఉండగలదు. అనగా, లంబిక (బ్రహ్మరంధ్రము యొక్క ఈ చివర) - శిరో ఉపరిభాగమున గల కపాలకేంద్ర బిందు స్థానముల మధ్యగా అమృతధారగా దృశ్య విషయములలో స్రవించు ధర్మమును విడచి ఉంటుంది.

ఇట్టి ఖేచరీముద్రను దీర్ఘకాల అభ్యాసముచే సిద్ధించుకొన్నవానికి →
- వాయు చలనము శరీరమంతటా సుస్థిరీకరించబడినది అవగలదు.
- ఆకలి, దప్పిక, నిద్ర, మెలకువ - ఇవన్నీ స్వవశంలో ఉంటాయి. ఇవి ఆ యోగిని బాధించనివై, సుఖప్రదాతలై ఉంటాయి.
- ఖేచరీ ముద్ర యొక్క ఉత్తమ ప్రయోజనంగా - న చ మృత్యుః భావేత్ తస్య యో ముద్రాం వేత్తి ఖేచరీమ్ - ఖేచరీముద్రను ఎరిగి అభ్యాసించువాడు మృత్యువు యొక్క పరిధులను అధిగమించుచున్నాడు. మృత్యువుకు సాక్షి అగుచున్నాడు. ఆతని పట్ల మృత్యువు - ‘లేనిదే’ అగుచున్నది. నిద్రపోతూ ‘‘అయ్యో! జాగ్రత్ చేజారుతోందే?’’ అని అనుకోడు కదా! అట్లాగే, భౌతిక దేహము నశించినంత మాత్రంచేత ఈ జీవుడు కోల్పోయేదేమీ లేదు.
- తతః పూర్వాపరే వ్యోమ్ని ద్వాదశాంతే అచ్యుతాత్మకా! అమృతమును స్రవించు బ్రహ్మరంధ్రమునకు ఈవల లంబిక (కొండనాలుక) వైపుగా, 12 అంగుళముల ప్రదేశము, - ఆవల శిరో (కపాల) ఉపరిభాగంగా 12 అంగులముల ప్రదేశము (ఆకాశము)’’లో గల చైతన్యరూపుడగు అచ్యుతాత్ముడుగా ఆ యోగి అగుచున్నాడు. అనగా ఆత్మాఽహమ్ భావన నుండి చ్యుతిపొందని వాడై ప్రకాశించుచున్నాడు. పూర్వాపర ఆకాశమును ఆత్మ భావనచే నింపి ఉంచుచున్నాడు.

‘సహస్రదళము’ అనబడే అంతరమున (సహస్రారంలో వేంచేసియున్న సహస్రదళ మధ్యగా) పీఠము అలంకృతమైయున్నది. ఆ సహస్ర దశాంతర్గత మధ్య స్థానమున (పీఠమున) ఆత్మానారాయణుడు చక్రవర్తియై అధిష్ఠించి ఉన్నారు.
- సహస్ర దళాంతర్గత మధ్యస్థాన ఉఢ్యాణపీఠ అధిష్టితుడు,
- నిరాలంబుడు, నిరంజనుడు,
- అమృత రసమును సదా స్రవింజేయువాడు అగు ఆత్మానారాయణునినే సర్వదా ధ్యానించాలి. ఆ ఆత్మానారాయణుని పట్ల అనునిత్యమగు ధ్యాస కలిగి ఉండటమే ధ్యానము, తపస్సు కూడా!

అట్టి ‘పరమునకే పరము’ - పరాత్‌పరము అఖండ స్వస్వరూపము.. యొక్క - తస్మిన్ దృష్టే పరా వరే సర్వత్రా ఆత్మదర్శనముచే ఆ యోగి యొక్క దృష్టి - ‘సృష్టి, స్థితి, లయ’ పరిమితములను దాటివేసినదై, సమగ్రమై ఉండగలదు.

ఆత్మదృష్టియొక్క నిశ్చలతచే -
- భిధ్యతే హృదయ గ్రంథిః। హృదయ గ్రంథులన్నీ ముడివీడుతాయి.
- ఛిద్యన్తే సర్వ సంశయాః। జీవాత్మ - పరమాత్మ, బంధ - ముక్తి, ఇహ - పర, కర్మ - అకర్మ సంబంధితమై ఏర్పడి ఉంటున్న సర్వ సంశయములు సమసిపోతాయి.
- క్షీయన్తే చ అస్య కర్మాణి।। కర్మలకు సంబంధించిన ‘‘చేయాలి! పొందాలి! చూడాలి’’ మొదలైన కర్మ సంబంధిత సంస్కారాలన్నీ క్షీణిస్తాయి. కర్మలలో అకర్మను, అకర్మయందే సర్వకర్మలను దర్శించువాడై, కర్మ పరిధులకు పరిమితమే కానట్టి ఆత్మనే సర్వే సర్వత్ర సందర్శిస్తూ ఉండగలడు.

యోగాభ్యాస సిద్ధులు

పరమ శివ భగవానుడు : హే సురేశ్వరా! పద్మ సంభవా! బ్రహ్మభగవాన్! ఇప్పుడు సుఖోపాయములుగా లభించే యోగసిద్ధుల గురించి చెప్పుకుందాము. వినండి. ఇవన్నీ ఆయా స్థానములను సంప్రదర్శనారూపంగా మనస్సుతో భావించి, ఉపాసించటమునకు సంబంధించినవే సుమా!

(1) నాదే - మనోలయమ్ - దూర శ్రవణ కారణమ్। ‘నాదము’పై (మరియు) నాదము జనించు స్థానముపై మనస్సును, ఏకాగ్రంచేయటంచేత ‘దూరశ్రవణము’ అను సిద్ధి లంభించగలదు.

(2) బిందౌ మనోలయమ్-దూరదర్శనమ్। మనస్సును విషయరహితము చేసి, బిందువు (The point where from the thought begins) నందు ఏకాగ్రపరచి ఉంచు అభ్యాసము చేత - దూరంగా ఎక్కడో ఉన్న దృశ్యమును తానున్న చోటి నుండే చూడగలడు. (బిందువు = ఈ దృశ్య జగత్తు బయల్వెడలుచున్న మూలా స్థానము).

(3) కాలాత్మని మనోలీనం - త్రికాలజ్ఞాన కారణమ్। యోగి తన మనస్సును కాలమునకే సాక్షిగా నియమిస్తూ, ‘కాలాత్మ’ యందు లీనము చేసి (సర్వము కాలముతో వచ్చి కాలముతో ఉండి, కాలముతో పోతున్నదను ఎరుకయందు మనస్సు లీనముచేయు యోగాభ్యాసముచే) - అది ‘త్రికాలజ్ఞానము’నకు కారణమగుచున్నది.

(4) పరకాయ మనో యోగః పరకాయ ప్రవేశకృత్। ఇతరుల మనో సంచలనములను, మనోరీతులను ‘‘ఆత్మయొక్క విన్యాస చమత్కారము’’గా గమనించు యోగాభ్యాసముచే క్రమంగా ఆతనికి పరకాయ ప్రవేశవిద్య అలవడుచున్నది.

(5) అమృతం చింతయేత్ మూర్ధ్ని క్షుత్-తృష్ణా-విష శాంతయే। మృతము (మార్పు-చేర్పులు) లేని అమృతమగు ఆత్మను మూర్ధ్ని ప్రదేశము (In the space of fore-face) నందు భావన చేయు యోగాభ్యాసముచే ఆకలి-దప్పిక- విషశాన్తి కలుగగల సామర్ధ్యము ఆ యోగి పొందుచున్నాడు. (అమృతము = జాగ్రత్, స్వప్న సుషుప్తులతో, త్రికాలములలో ‘ఏకము-అఖండము’ అయి ఉన్న స్వస్వరూపము).

(6) పృథివ్యా ధారయేత్ చిత్తం పాతాళగమనం భవేత్। చిత్తమును పృథివి (భూమి) యందు నిలిపి ధారణాయోగము అభ్యసించు యోగికి పాతాళగమన విద్య లభిస్తోంది.

(7) సలిలే ధారయేత్ చిత్తం న అంబసా పరిభూయతే। జల తత్త్వమునందు చిత్తమును నిలిపి యోగమును అభ్యసిస్తూ ఉండటం చేత, అట్టి యోగికి జలము వలన హాని ఉండదు.

(8) అగ్నౌ సంధానయేత్ చిత్తమ్ అగ్నినా దహ్యతే న సః। అగ్నితో చిత్తమును అనుసంధానం చేస్తూ యోగాభ్యాసము చేయు యోగిని అగ్ని దహించదు.

(9) వాయౌ మనోలయం కుర్యాత్ ఆకాశ గమనం భవేత్। మనస్సును వాయువు నందు లగ్నం చేసి యోగాభ్యాసము చేయువాడు ‘ఆకాశ గమన విద్య’ను పొందగలుగుతాడు.

(10) ఆకాశాత్ ధారయేత్ చిత్తం అణిమాదికమ్ ఆప్నుయాత్। చిత్తమును ‘ఆకాశము’ నందు ధారణ చేసి యోగాభ్యాసం చేస్తూ ఉంటే ‘అణిమ’ (అణువంతగా అవగల) సిద్ధి సిద్ధిస్తోంది.

(11) విరాట్ రూపమునందు మనస్సును నియమించు అభ్యాసము చేయుయోగికి - ‘మహిమలు’ లభిస్తాయి. ‘‘మహిమలు’’ కలవాడుగా అగుచున్నాడు. (అసామాన్యముగా కనిపించు విశేష శక్తి-సామర్థ్యములు సిద్ధించగలవు).

(12) చతుర్ముఖ బ్రహ్మయందు మనస్సును యోగాభ్యాసము చేయువాడు [సృష్టి-స్థితి-లయ-పునః సృష్టి రూపములను (అనగా) బ్రహ్మ యొక్క 4 ముఖములుగా ఉపాసించువాడు] - జగత్ సృష్టిని నిర్వర్తించగల సిద్ధిని పొందగలడు.

(13) ఇంద్రుని రూపమును ఆత్మగా భావన చేసి ఉపాసించువాడు సకలము భోగించగలుగుతాడు. ఇంద్రియ జగత్తంతా ఆతనికి భోగ్య వస్తువుగా అనుభూతమగుచున్నది.

(14) స్థితికారుడగు విష్ణుదేవుని ఉపాసించువాడు సకల లోకములను పాలించగలడు. ఒక చక్రవర్తి తన పాలనలోని సామ్రాజ్యమును దర్శించు తీరుగా 14 లోకములను దర్శించగలడు.

(15) రుద్రరూపము నందు మనోయోగము చేయువాడు సంహారశక్తి తేజస్సు కలిగినవాడై ఉంటున్నాడు. సమస్తము తనయందు సర్వదా ఆత్మగా లయమై ఉండి ఉన్నట్లు దర్శించగలడు.

(16) నారాయణుని యందు మనస్సు నిలుపువాడు తాను నారాయణమయుడై ప్రకాశించుచున్నాడు. ‘‘పరమాత్మ మహాసముద్ర జలస్వరూపుడై ఉండగా, జీవులుగా మనమంతా తరంగ స్వరూపులము’’ - అను అనుభూతి సిద్ధించుకోగలడు.

(17) వాసుదేవతత్త్వము నందు మనస్సు నియమించువాడు సర్వసిద్ధులను పొందగలడు. ‘ఈ జగత్తంతా వాసుదేవుని వాసనా చమత్కారమే’ అని గ్రహించువాడు, (వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయమ్, సర్వభూత నివాసోఽసి, శ్రీవాసుదేవ నమ్మో-స్తుతే)… ఇదంతా వాసుదేవమయంగా గ్రహించి ఉపాసించువాడు సర్వము పొందగలడు. ‘‘ఈ సమస్తము నాకు చెందినదే కదా!’’ అను ఒక చక్రవర్తి వంటి, ఒక నాటక రచయిత వంటి భావనను సిద్ధించుకోగలడు.

యథా సంకల్పయేత్, తథా భవేత్

ఓ బ్రహ్మ భగవాన్! ఈ జీవుడు దేనినైనా (దృశ్య బంధమైనా, జన్మ-కర్మలనైనా, యోగసిద్ధులనైనా, జన్మరాహిత్య రూపమగు మోక్షమైనా) పొందటానికి కారణం ఏది? ఎవ్వరు? జగత్తా? కాదు. లోకపాలకులమగు మన త్రిమూర్తులమా? కాదు? ఇంద్రాది త్రిలోకాధిపతులా? దిక్పాలకులా? లోకములా? మరొక రెవరన్నానా? ఎవ్వరూ కాదు. మరి?

స్వకీయ కల్పన చేతనే (లేక) స్వకీయ సంకల్పములచేతనే ఏదైనా ఆరీతిగా పొందబడుతోంది! (యత్ భావమ్ - తదేవ భవతి)

అయితే ఇంద్రియములకు, ఇంద్రియ విషయములకు వశుడై విషయాభ్యాసరతుడై యున్నంత వరకు ఈ జీవుని బుద్ధి విషయములచేతనే సంబంధితము, బంధితము అయి ఉంటోంది. వివేకము కూడా విషయపరిమితమైయుంటోంది. (బుద్ధిః కర్మానుసారిణీ).. విషయముల ఆశ్రయములే ఉత్తరోత్తర ఉపాధులు నిర్ణయిస్తూ ఉండగా ఈ జీవుడు బద్ధుడై ఉంటున్నాడు. పరతంత్రుడగుచున్నాడు. స్వతంత్రుడు కాలేకపోవుచున్నాడు. ‘‘నేను పరతంత్రుడను’’ - అనునదే బంధము. ‘‘స్వతంత్రుడను’’ - అనునదే మోక్షము.

ఇక యోగాభ్యాసి విషయంలో….,
శ్లో।। యథా సంకల్పయేత్ యోగీ, యోగయుక్తో జితేంద్రియః
తథా తత్ తత్ అవాప్నో-తి! భావఏవ అత్ర కారణమ్।।
(1) యోగాభ్యాసమును ఆశ్రయించటము,
(2) యోగ బలముతో ఇంద్రియములను జయించి ఉండటము.
ఈ రెండింటి వలన జీవుడు ఇంద్రియ విషయ ప్రవాహ పరంపరలను స్వయముగా జయించి, ‘‘స్వతంత్రుడు’’ అగుచున్నాడు. యోగి వర్తమాన -ఉత్తరోత్తర స్థితిగతుల పట్ల - యోగాభ్యాసబలం కారణంగా - స్వీయ నిర్ణయాధికారత్వమును స్వభావంగా సంతరించుకొనుచున్నాడు.

యోగయుక్తుడై ఇంద్రియములను జయించిన యోగి - దేనిని ఎట్లు సంకల్పిస్తే, తాను అద్దానిని అట్లే పొందుచున్నాడు. అందుచేత ఈ జీవుడు నిద్రలేచి, బద్ధకమును త్యజించి యోగాభ్యాసముచే యోగయుక్తుడు కావాలి.

గురు ఆశ్రయమ్

ముముక్షువైనవాడు యోగ-జ్ఞానముల సముపార్జన, సంసిద్ధి కొరకై గురువును ఆశ్రయించాలి. యోగమును గురుముఖతః ఎరిగిన వాడై, శ్రద్ధగా అభ్యాసమును నిర్వర్తించాలి. అప్పుడు బుద్ధి నిర్మలము, సునిశితము, విస్తారము అగుచున్నది. తత్ప్రభావం చేత గురువు బోధించు (‘తత్త్వమ్-సోఽహమ్’ మొదలైన) మహావాక్యార్థములను దైనందిక- అనుక్షణిక స్వానుభవంగా తీర్చిదిద్దుకోగలడు. అందుచేత గురువు పట్ల గురుబోధల పట్ల అచంచలమైన విశ్వాసము ఉండాలి. ఆ విశ్వాసము సర్వసందేహములను తొలగించగలవు. ‘వీర్యత్వము’నకు దారితీయగలవు. ‘‘తత్ త్వమ్ - అదియే నీవు’’ అని బోధించు గురువాక్య శ్రవణ-మననములే ‘‘సోఽహమ్’’నకు సుఖమయ సోపానములు. ‘‘విశ్వాసము లేని చోట ఏ విద్య సిద్ధించదు. ‘‘ఆత్మవిశ్వాసము’ పటిష్టమవదు.

అందుచేత హే బ్రహ్మభగవాన్! యోగ - జ్ఞాన మార్గములలో ‘గురువు’ పట్ల భక్తి ప్రపత్తుల గురించి మరల మరల ముముక్షువులందరికీ గుర్తుచేస్తున్నాను. వినండి!

శ్లో।। గురుబ్రహ్మా। గురుర్విష్ణుః। గురుర్దేవః సదా అచ్యుతః।
న గురోః అధికః కశ్చిత్ త్రిషులోకేషు విద్యతే।।

గురుదేవుడు బ్రహ్మదేవునితో, విష్ణువుతో, సదాశివునితో సమానంగా భావించెదరు గాక. స్వస్వరూపమును ఎరుగు విధానమును, మార్గమును తెలియజేసి ఆత్మభావన - యోగసిద్ధిలకు సహకరించు వస్తువుములో మరొక్కటేదీ లేదు. అందుచేత గురువుపట్ల ముముక్షువు భక్తి-శ్రద్ధలు, ప్రణిపాతిత్వము సర్వదా కలిగియుండెదరుగాక! గురువును బ్రహ్మభావనతో ఉపాసించెదరు గాక!
‘దివ్య జ్ఞానము’ అనబడు ‘ఆత్మతత్త్వజ్ఞానము’ ఉపదేశించు గురువును ఎవ్వరైతే పరమభక్తితో పూజిస్తూ ఉపాసిస్తూ ఉంటారో,.. అట్టివారికి ‘జ్ఞానఫలము’ తప్పక సులభమై లభించగలదు.

➤ గురువు ఎంతటివాడో,.. ఈశ్వరుడు (ఇష్టదైవము) అంతటివాడు!
➤ ఈశ్వరుడు ఎంతటివాడో,.. గురువు అంతటివాడే!
ఈ గురువు - ఈశ్వరులను (i.e Teacher and subject) సమానంగా పూజనీయులుగా భావించాలి. పరమాత్మతో సమానంగా సేవించాలి. గురువు-ఈశ్వరుల మధ్య భేదము కనిపించనంతటి పవిత్ర భావన కలిగి ఉండాలి. విద్యార్ధులందరికీ ఇది అనుసరణీయము.

గురువు దగ్గిర వినమ్రుడై శరణాగతుడై ఉండెదరుగాక! గురుముఖతః వినుచున్న విశేషములను శ్రద్ధాళులై ఆచరించాలి.

న అద్వైతవాదం కుర్వీత గురుణా సహ కుత్ర చిత్। గురువు వద్ద జీవాత్మ - పరమాత్మల ఏకస్వరూపమగు అద్వైతము నేర్చుకొనుచూనే, గురువుతో అద్వైత భావన ప్రదర్శించరాదు. అనగా ‘‘నేను మీరూ ఒక్కటే కదా!’’ .. అను అద్వైత భావన పలుకరాదు. ‘‘శిష్యుడుగా నేను జీవుడను. గురువుగా ఈయన నా ఉపాసనా దైవమగు పరమాత్మస్వరూపము’’ - అను భావన కలిగి ఉండాలి. భావనచే గురువుతోను, ఈశ్వరునితోను అఖండత్వం కలిగి ఉంటూనే, ‘‘జీవాత్మ భావనచే నాకు గురువు, ఈశ్వరుడు సర్వదా పూజనీయులే’’…. అను భక్తి భావన తప్పక కలిగి ఉండాలి. దేహముతో సేవకుడుగాను, మనస్సుతో ప్రపత్తుడుగాను ఉంటూనే బుద్ధితో ఈశ్వర భావనను సంతరించుకొంటూ, చిత్తమును అద్వైతము వైపుగా పరుగులు తీయించాలి.

⬡⬡⬡

‘యోగము’ యొక్క శీర్షము (Final State, పరాకాష్ట) అఖండమగు ఆత్మతో అనన్యత్వమే!

తెలుసుకోవటం → జ్ఞానము।
అనుభవమవటము → యోగము।

జగత్తుతో సంయోగ-వియోగాతీతరూపమగు ఆత్మతో యోగమే ‘యోగశీర్షము’.

శ్లో।। యోగశీర్షం మహాగుహ్యం యో జానాతి మహామతిః,
న తస్య కించిత్ అజ్ఞాతమ్ త్రిషులోకేషు విద్యతే।।

మహారహస్యమగు ఈ ‘‘ఉపనిషత్ సంబోధక - ఆత్మాఽహమ్’’ రూపమగు యోగశీర్షమును ఎవ్వడు తెలుసుకొంటాడో, అట్టి మహామతికి ఈ త్రిలోకములలో తెలియవలసింది మరింకొకటేదీ శేషించి ఉండదు. అట్టివాడు స్వస్థుడౌతాడు.. ఆతని స్వస్థత - ఆయా పుణ్యపాప విశేషములచేతగాని, సుఖ-దుఃఖ సందర్భములచేతగాని - చెడునది కాదు.

అట్టి యోగశీర్ష సంస్థితునికి - ఈ సంసార మండలములో ‘పునరావృత్తి పొందటము’ - అనే దోషము ఉండజాలదు. - ఈ చిత్తము - ప్రకృతి స్వభావం చేత చంచలత్వము కలిగి ఉండవచ్చు గాక! చిత్తము యొక్క ఊర్థ్వభాగము కేవలము - సమస్తము అగు ‘‘అఖండాత్మ’’ యందు సంస్థితమై ఉండగలదు.

యోగ సిద్ధుని విషయంలో ఆత్మజ్ఞానము చెక్కుచెదరడు. నిత్య బద్ధమగు జీవాత్మత్వమునకు కేవలము సాక్షి అయి, పరమాత్మత్వముచే నిత్యముక్తత్వము సంతరించుకొనువాడు - ముక్తుడే! న సంశయః।।

ఇత్యుపనిషత్


6వ అధ్యాయము - కుండలినీ - సుషుమ్నా దేవీ ఉపాసన

బ్రహ్మ భగవానుడు : హే పరమేశ్వరా! జగద్గురూ! యోగాభ్యాసము విషయమై (1) ‘ఉపాసనాక్రమము’ గురించి, (2) ఎద్దానిని గురించి ఎరిగినంత మాత్రం చేతనే ఈ జీవుడు సంసృతి (సంసారబంధము, దృశ్యతాదాత్మ్య దుఃఖ స్థితి) నుంచి విముక్తుడు కాగలడో, … అద్దాని గురించి దయతో వివరించమని అర్ధిస్తున్నాను.

శ్రీ శివ భగవానుడు : హే హిరణ్యగర్భా! మహాప్రాజ్ఞా! శ్రుతుల ‘సారము’గా చెప్పబడుచున్న అతి రహస్యమగు ‘ఉపాసనా ప్రకారము’ చెప్పుచున్నాను. యోగోపాసకులగువారి ‘‘సమ్యక్ ఉపాసనా ప్రయోజనము’’ను దృష్టిలో పెట్టుకొని ఇది వివరించుకుంటున్నాము. శ్రోతలు ఇందలి విషయమును గ్రహిస్తూ ఉపాసన కొనసాగించెదరుగాక.

ముందుగా,

శ్లో।। సుషుమ్నాయై, కుండలిన్యై, సుధాయై చంద్రమండలాత్,
మన ఉన్మన్యైః నమస్తుభ్యం మహాశక్త్యై చిదాత్మనే।।

ఏ మహాశక్తీదేవి అయితై సమస్త దేహములలోను, విశ్వములోను కూడా సుషుమ్నానాడీ మార్గ దేవతయై, ఇచ్ఛా జ్ఞాన సమన్వితమగు కుండలినీ శక్తి స్వరూపిణిగా ఆసనమును అలంకరించినదై, కపాలమున గల చంద్రమండలము నుండి స్రవించు అమృతానందమగు సుధాస్రావిణి అయి ఉన్నదో, అట్టి చిదాత్మ మహాతత్త్వమునకు నేను అనునిత్యము నమస్కరిస్తున్నాను.
(యోగాభ్యాసి మొట్టమొదటగా అట్టి చిదాత్మదేవికి హృదయపూర్వకముగా నమస్కరించునుగాక!)

సుషుమ్నాంతర్గతం విశ్వం - తస్మిన్ సర్వమ్ ప్రతిష్ఠితమ్।।

హృదయస్థానము నుండి బయల్వెడలుతున్న 101 నాడులు- ఇంద్రియ రంధ్రములతో సహా-దేహమంతా విస్తరించినవై ఉంటున్నాయి. అయితే, వాటిల్లో ఒకానొక శక్తివంతమగు నాడి మాత్రము ‘మూర్ధ్ని స్థానము’నకు (Towards Top portion of foreface) వెళ్లుచున్నది. అదియే ‘‘సుషుమ్న’’.

తక్కిన 100 నాడులలో ప్రవేశ-నిష్క్రమణములు చేయుజీవులు ఇంద్రియ-ఇంద్రియ విషయములలో నిబద్ధత్వము పొందుచున్నారు. వారికి మృతత్వము దైనందిక మగుచున్నది. మరల మరల దేహ-దేహాంతరములలో దారితెన్ను తెలియని బాటసారివలె ప్రయాణములు సలుపుచున్నారు.

ఇక ఊర్ధ్వముగా వెళ్ళుచున్న ఏకైక ఊర్థ్వనాడిని (సుషుమ్నను) యోగాభ్యాసముతో అనుసరించి మూర్ధ్ని స్థానము (foreface) చేరు యోగి ‘మృతము’ను అధిగమించి, అమృతత్వమును సంతరించుకొనుచున్నాడు. బుద్ధితో నిర్మలశీలుడై మార్పుచేర్పులు లేని అఖండాత్మత్వమును పునికి పుచ్చుకొనుచున్నాడు.

అట్టి 101వ - ఏకైక (‘ఊర్ధ్వగమనం’ గల) నాడిని ‘పరానాడి’ అని కూడా పిలుస్తున్నారు. ఈ జీవుని ‘ఇహ-స్వరూపము పరిమితము నుండి పరస్వరూపము యొక్క అనుభవమునకు దారి తీయగలదు కాబట్టి ‘పరానాడి’ ‘సుషుమ్ననాడి’యే → ఆ పరానాడి. ఆ పరానాడియే ‘విరజ’, ‘బ్రహ్మరూపిణి’ అని కూడా చెప్పబడుచున్నది. అది బ్రహ్మరంధ్రము వరకు విస్తరించినదైయున్నది.

ఇడా తిష్ఠతి వామేన। పింగళా దక్షిణేన తు। సుషుమ్న నాడికి- ఎడమవైపు ‘ఇడ’ నాడి, కుడివైపు ‘పింగళ’ నాడి ఏర్పడి ఉన్నాయి. ఇడ-పింగళ నాడుల మధ్య గల తేజో-అగ్ని రూపము అయినట్టిదే సుషుమ్ననాడి. అట్టి-మధ్యగా గల పరతత్త్వమును (లేక) పరంస్థానము ఎవ్వరు తెలుసుకుంటారో, - తయోః మధ్యే పరంస్థానం యస్తం వేద స వేదవిత్। - ఆతడే వేదవేత్త. తెలుసుకోవలసినది తెలుసుకొన్నట్టివాడు.

నాసాభ్యాంతర చారిణి (ముక్కులో అంతరముగా పంచారములు చేయుచున్నట్టిది) అగు వాయు (లేక) ప్రాణచలనములను ప్రాణ యోగాభ్యాసముచే నిరోధిస్తూ స్వవశం చేసుకోవటం - శివసాయుద్యమునకు ఉపాయము.

గుదస్య పృష్ఠభాగే అస్మిన్ వీణాదణ్డః స దేహభృత్। గుదము యొక పృష్ఠ (వెనుక) భాగంలో ‘వీణాదండము- (కుండలిని) ఉన్నది. అదియే ఈ దేహమును నడపుచున్న ‘మూలాధారశక్తి’ (లేక) మూలశక్తి.

⌘ అస్థి (బొమిక) - దేహపర్యంతము అతిదీర్ఘముగా బ్రహ్మనాడి ఉన్నది. అట్టి బ్రహ్మనాడి యొక్క చిట్టచివర సూక్ష్మమగు రంధ్రమున్నది. ఆ రంధ్రమును విజ్ఞులు ‘సుషిరగము’ అని పిలుస్తున్నారు. (అదియే బ్రహ్మనాడి).

ఇడా-పింగళయోర్మధ్యే సుషమ్నా ‘సూర్య రూపిణి’। ‘ఇడ-పింగళ’ నాడుల మధ్య గల తేజోనిర్మిత సుషుమ్ననాడి ‘సూర్యరూపిణి’ అని కూడా అంటారు.

సర్వం ప్రతిష్ఠితం తస్మిం తు సర్వగం, విశ్వతో ముఖమ్। అట్టి సుషుమ్ననాడియే - ఈ విశ్వమంతా తన ముఖముగా కలిగి ఉన్నది. అట్టి సుషుమ్న (లేక) బ్రహ్మనాడియందు ఈ సర్వము ప్రతిష్ఠితమై యున్నది. అట్టి సుషుమ్నయందు మధ్యగతమై - (1) సూర్య (2) సోమ (చంద్ర) (3) అగ్ని (4) పరమేశ్వరులు స్థానము కలిగి ఉన్నారు. ఈ జీవులతో కూడిన భూతలోకములు, దిశలు, క్షేత్రములు, సముద్రములు, పర్వతములు, శిలలు, ద్వీపములు, నదులు, వేదములు, శాస్త్రములు, పురాణములు, త్రిగుణములు.. ఇవన్నీ - స్థానము కలిగినవైయున్నాయి. (Every thing is placed in ‘sushumna’)

⌘ దేహమంతా ఆక్రమించి సుషుమ్న ఉండి ఉన్నది.

⌘ ఈ విశ్వము, దీని విశేషాలన్నీ సుషుమ్నయందే నిక్షిప్తమై, స్థానము కలిగి ఉన్నాయి.

⌘ బీజము, బీజాత్మకుడగు క్షేత్రజ్ఞుడు (జీవుడు), ప్రాణవాయువులు, ఆయా తదితర సర్వవిశేషములతో కూడిన ఈ విశ్వము… ఇవన్నీ కూడా సుషుమ్నయందే అంతర్గతమైయున్నాయి. తస్మిన్ సర్వమ్ ప్రతిష్ఠితమ్।

నానా నాడీ ప్రసవగ్ం సర్వ భూతాంతరాత్మని। ఈ నానా నాడులకు కారణము, ఉత్పత్తి స్థానము సర్వభూతాంతరాత్మయే! నాడులున్నీ కూడా మూలము ఉర్ధ్వముగా చైతన్య స్వరూపమగు ఆత్మయందు ఉండి, వాటి శాఖలు బయటకు శరీరమంతా విస్తరించి ఉన్నాయి. అట్టి నాడులన్నిటి యందు (ఆత్మ నుండి బయల్వెడలిన శక్తి రూపమగు) ప్రాణవాయువులు ప్రసరణ మార్గములు కలిగి ఉన్నాయి. ద్విసప్తతి సహస్రాణి నాడ్యస్సుః వాయు గోచరాః। ప్రసరణము (లేక ప్రాణ ప్రసరణము) 72000 నాడులలో ఏర్పడి ఉన్నది. అడ్డ-దిడ్డములుగా ప్రసరించియున్న నాడులన్నింటిలోని వాయు ప్రసరణ మార్గములన్ని చివరిగా సుషిరములు (నాడులలో చివర చిన్న రంధ్రములు) కలిగియున్నాయి.

కుండలినీ యోగము :
శ్లో।। అధశ్చ ఊర్ధ్వన్చ కుండల్యాః సర్వద్వార నిరోధనాత్
వాయునా సహ జీవ ఊర్ధ్వగామీ మోక్షమ్ అవాప్నుయాత్।
‘కుండలిని’కి పైన-క్రిందగా ఉన్న సర్వద్వారములు నిరోధించబడి ఉన్నాయి. (అట్టి నిరోధము తొలగాలి) ప్రాణ-అపానముల సమత్వ ధారణాభ్యాసముచే యోగశక్తి జనిస్తోంది. అట్టి జనితమైన శక్తితో కుండలినీశక్తి ఊర్ధ్వగామి (moving upward) అగుచున్నది. అట్టి కుండలినిని బ్రహ్మరంధ్రమును జేర్చు ఊర్ధ్వగమనయోగముచే ఈ జీవుడు యోగమార్గముగా మోక్షము సిద్ధించుకొనుచున్నాడు.

అందుకు ఉపాసనా మార్గము
❆ శరీరములో క్రింద మూలాధారం నుండి పై బ్రహ్మరంధ్రం వరకు విస్తరించియున్న ‘సుషుమ్న’ను తెలుసుకోవటము. ‘అనుభవము’ యొక్క పరిధి (Into range of experience) లోనికి తేవటము.
❆ ఆ సుషుమ్నను ఛేదించి, వాయువును సుషుమ్నకు మధ్యగతంగా (ప్రాణాయామ విధానంగా) ప్రవేశింపజేయుటము.
❆ అందుకుగాను చంద్రస్థానమగు ఘ్రాణ రంధ్రము నందు వాయువును నిరోధించటము.

72000 నాడులు నాడీ పంజరమువలె (పంజరములో సన్నటి ఇనుపతీగలు అల్లుకొని ఉన్న విధంగా) ఉన్నాయి. ఒక్క సుషుమ్ననాడి (బ్రహ్మనాడి) మాత్రమే కుండలినిని బ్రహ్మరంధ్రమునకు జేర్చి ఈ జీవుని సంసారము నుండి తరింపజేయ గలదు.

(కుండలిని= ఇచ్ఛ+జ్ఞాన+క్రియల సూక్ష్మశక్తిస్వరూపము).

బ్రహ్మనాడి తప్ప తక్కిన నాడీ విస్తరణములన్నీ నిరర్ధకమే। ఎందుకంటే, తక్కిన నాడీ ప్రసరణములు ఇంద్రియ విషయముల వైపుగాను, దృశ్య ప్రపంచమువైపుగాను, ఎక్కుబెట్టబడి ఉన్నాయి. 14 లోకములలో రాక-పోకలుగా సంసారగతికి ద్వారములు అగుచున్నాయి.

కనుక కుండలినికి ‘రాజమార్గము’ - సుషుమ్న మాత్రమే! సుషమ్న మాత్రమే యోగాభ్యాసిని ‘‘కేవల స్వరూప తత్త్వము’’ నకు జేర్చగలదు కాబట్టి ‘శాంభవీశక్తి’గా అభివర్ణించబడుతోంది.

‘‘మధ్యమ’’ యోగాభ్యాసము (మధ్య-మధ్యమ-యోగము) : తాలు (దవడకు లో ప్రదేశంగా) ఆత్మ-పరమానంద స్థానము వ్యవస్థితమైయున్నది. అది ‘హృత్‌లేఖి’ అని పిలువబడుతోంది. అట్టి హృత్‌లేఖి యందు (కుంభక ప్రాణయోగాభ్యాసముచే) ప్రాణ నిరోధమును నిర్వర్తించటము ‘‘మధ్యమ-మధ్యమ యోగము’’ అని పిలుస్తున్నారు.

(1) యోగి ‘మధ్యమ’ ప్రాణ నిరోధయోగం అభ్యాసిస్తూ,
(2) బ్రహ్మరంధ్రము (శిరస్సుకు ఉపరిభాగమున గల బ్రహ్మనాడి చివరగా (సుషుమ్న యొక్క చివరగా) గల రంధ్రము (సుషిరగమ్) నందు నివాసము కలిగి యున్న పరాశక్తిని ఆరాధిస్తూ,
(3) ప్రణవమును ఉచ్ఛరించుటచే - భ్రమరము వలె సృష్టియందు వ్రాలుచున్న చిత్తము యొక్క వ్యసన పూర్వక పరిభ్రమణములు నిరోధించబడగలవు.

అట్టి యోగాభ్యాసి యొక్క సంసార భ్రమలు తమకు తామే తొలగిపోగలవు. మహత్తరమగు అట్టి ‘పరాశక్తిదేవి’యే నేను సర్వదా ఉపాసిస్తున్న దైవీతత్త్వము (లేక) దివ్యతత్త్వము.

‘‘నమామి హంసమ్। పరమాత్మ రూపమ్।।’’

బ్రహ్మదేవుడు : స్వామీ! నాకు, సమస్త జీవులకు ఆరాధ్యులై ఉన్న మీరు కూడా ఉపాసిస్తూ ఉన్నారా? దేనిని ఉపాసిస్తూ ఉన్నారు?

శివ భగవానుడు : ఇప్పుడు నేను దాసానుదాసుడనై ఎవ్వరిని చూస్తూ ఉపాసిస్తున్నానో చెప్పుచున్నాను. వినండి.

శ్లో।। గమాగమస్థం, గమనాది శూన్యం, చిద్రూప దీపం, తిమిరాపహారం,
పశ్యామి తే సర్వజన అన్తరస్థం, నమామి హంసమ్। పరమాత్మ రూపమ్।।

ఏ పరమాత్మ రూపము (తత్త్వము) అయితే -
➤ సర్వుల యొక్క, సర్వము యొక్క రాక-పోకలు తనకు చెందినవే అయి ఉన్నదో.. గమ-ఆగమస్తం, ఈ జీవుల రాకపోకలు తనయందే కలిగి యున్నదో,
➤ ఏది ‘‘ఎక్కడి నుండియో ఇక్కడికి రావటము - ఎక్కడికో ఇక్కడి నుండి పోవటము’’-అను ధర్మమే కించిత్ కూడా కలిగియుండలేదో, (స్వప్నములో ఒకడు ఒక ఊరిన ఉండి మరొక ఊరికి వెళ్లి వచ్చినప్పటికీ, ఆతడు ఏ ఊరికీ వెళ్లనివాడు-ఏ ఊరు నుండి రానివాడు అయి ఉన్నాడో)..,
➤ ‘ఎరుక’ (Known) అనునదే తన రూపమై యుండటం చేత చిద్రూప-రూపుడో,
➤ ఏ వెలుగును కించిత్ ఆశ్రయించినంత మాత్రంగానే హృదయములోని సర్వ సంసారాంధకారములు మొదలంట్లా తొలగి, హృదయమంతా చిద్రూపదీప తేజస్సుతో (కేవలచిత్ రూపంగా - Absolute knowing + knownగా) వెలుగొందగలదో,
➤ ఏ పరమాత్మ సర్వజీవుల హృదయాలలో ‘‘జ్యోతిర్జోతి-పరంజ్యోతి’’ స్వరూపుడై జ్వాజ్వల్యమానంగా వెలుగొందుచూ నాయొక్క మూడవ నేత్ర - జ్ఞాన దృష్టికి ఎల్లప్పుడూ దృశ్యమానమగుచున్నారో,

సర్వాత్మకుడగు ఆయనయే పరాశక్తి। దేవి। పరమాత్మ। పరబ్రహ్మము. అటువంటి ‘‘హంసం - సోఽహమ్-హంసోఽహమ్’’ అగు పరబ్రహ్మ భగవానునికి అనుక్షణికంగా నమస్కరిస్తూ ఉన్నాను. సర్వదా సర్వత్రా ఉపాసిస్తున్నాను. ఆ పరమాత్మను నాకు - ఈ సమస్తమునకు ‘అనన్యము’గా దర్శిస్తూ శివానందానుభూతుడను అగుచున్నాను.

జ్యోతి - ఉపాసన - పరమపదము

ఆలోచన ఎక్కడ జనిస్తోందో అదియే సర్వాత్మకము, సర్వతత్త్వ స్వరూపము అగు పరమాత్మ। విష్ణుస్థానము। అదియే నేను సర్వదా ఉపాసిస్తున్న స్థానము. అదియే నేను।

సుషుమ్నా సరస్వతీ!

కొందరు, ‘‘సుషుమ్న యొక్క రూపము సరస్వతియే!’’ అని వర్ణిస్తూ ఉపాసిస్తున్నారు.

= సత్-రత్-వతీ= సత్ స్వరూపిణి అయి రతించు దేవి.

ఏ సత్‌స్వరూపిణి జగత్తుగా రతిస్తున్నదో..! - అట్టి ‘సుషుమ్న’ అను సరస్వతియే జగత్తుకు ఆధారం.

విశ్వము, జనిస్తున్నది, ఆ సుషుమ్నయందే! విశ్వమంతా ఎందులో అనుక్షణమూ లయిస్తూనే ఉన్నదో అదియే ఆరాధ్యమగు ఆత్మ! ఆత్మయే, సరస్వతి! ఆత్మయే సుషుమ్న! అట్టి జగత్ లయస్థానమగు సుషుమ్న యొక్క స్వానుభవము కొరకై యోగాభ్యాసమే ఉపాయము. ప్రాణ-అపానముల సమరస భావనచే సత్-రతత్వము రసత్వము కొరకై గురువును ఆశ్రయించి యోగాభ్యాసము నిర్వర్తించాలి. యోగాభ్యాసముచే అన్యముగా అనుభవమగుచున్న సమస్తము కూడా - ఆత్మయందు లయింపజేయబడగలదు.

సుషుమ్నయే - సర్వమునకు సృష్టి - స్థితి లయరూప ఆధారశక్తి. సమస్తమునకు ఆధారము।

అట్టి అనన్య-స్వకీయాత్మ స్వరూపమగు ఆధారశక్తి నిదురిస్తే - విశ్వము నిద్రించుచున్నది అగుచున్నది. (విశ్వభావన నిద్రితమౌతుంది). అట్టి ఆధార శక్తి ప్రబోధము పొందితే - త్రిలోకములు ప్రతిబుద్ధ్యము అగుచున్నాయి. (బుద్ధికి గోచరించినవిగా అగుచున్నాయి). అటువంటి సర్వాత్మకమగు ఆధారశక్తిని ఎవ్వరు తెలుసుకుంటారో,.. అట్టివారు అజ్ఞానాంధకారమును అధిగమించివేయగలరు.

‘సుషుమ్న’ రూపిణియగు ఆధారశక్తి గురించి తెలుసుకొన్నంత మాత్రం చేతనే ఈ జీవుడు సర్వ దోషముల నుండి విముక్తుడు కాగలడు.

అట్టి ఆధారశక్తి - ఈ దేహముతో విద్యుత్ మెరుపుతీగలు వెదజల్లు కాంతి పుంజముల వంటి ప్రభలు వెదజల్లుచున్నట్టిది. ఎవ్వరు ‘సుషుమ్న’ అనబడు ఆధారచక్రము యొక్క ప్రదర్శనమును తాత్త్వికార్థపూర్వకంగా తెలుసుకుంటారో, వారు ఈ జగత్ తత్త్వమును ఎరిగి తుష్టిని పొందుచున్నారు. ముక్తులగుచున్నారు. స్వయం గురువులు అగుచున్నారు. (ఆత్మైవహి గురుః). మహత్తరమగు ఆధారశక్తి యొక్క యోగాభ్యాస సిద్ధిచే పుణ్య-పాప-ఇత్యాది సర్వ ద్వంద్వ మోహములను యోగులు తొలగించుకొనుచున్నారు.

ఆధార వాత రోధేన లీయతే గగనాన్తరే। వాయువు వీచుచూ, వీచుచూ ఆధార గగనాంతరములో (ఆత్మాకాశాములో) విలీనము పొందుచున్నది. ఈ శరీరము కూడా అట్టి ఆధారము నుండి బయల్వెడలు వాయుకదలికల చేతనే ప్రాణశక్తి సమన్వితంగా ప్రకంపనలు (కదలికలు) పొందుతోంది. ‘‘ఆధారములో వాయువు యొక్క నిరోధము’’ అనురూపంగా బుద్ధిని నిలుపుటచే ఆ యోగి నటరాజ నృత్యము సందర్శించుచున్నాడు.

ఆధారవాత రోధేన దృశ్యం తత్రైవ దృశ్యతే। ఆధారవాత నిరోధము చేతనే ఈ విశ్వము ఈ విధంగా అగుపిస్తోంది ఈ సృష్టికి ఆధారం ఆత్మయొక్క ఆధారశక్తియే!

ఆధార చక్రమునందే సర్వదేవతలు, వేదములు సంస్థితమైయున్నాయి. ఆధారే సర్వ వేదాశ్చ।

అందుచే ‘సుషుమ్న’ అనబడు ఆధార చక్రమును యోగి ఉపాశ్రయించునుగాక! తస్మాత్ ఆధారమ్ ఆశ్రయేత్।

ఆధార పశ్చిమే భాగే త్రివేణీ సంగమో భవేత్. ఆధార చక్రము యొక్క (సుషుమ్న యొక్క) పశ్చిమభాగంలో ద్రష్ట-దర్శన-దృశ్యముల సంగము(ఏకత్వము) ఏర్పడి ఉంటోంది. అట్టి త్రివేణి సంగము నందు స్నానము చేయుటచేత, నీరుత్రాగుటచేత యోగి యొక్క సర్వపాపములు, దోషములు ప్రక్షాళనమగుచున్నాయి.

(పశ్చిమము - The external side of Self).

ఆధారము యొక్క పశ్చిమంగా జగత్తుగా మూర్తీభవించిన దృశ్యచమత్కారమంతా ప్రదర్శితమౌతోంది.

ఆధార పశ్చిమ లింగ కవాటము (జగత్ భేదభావనా రూపమగు) తెరచుకొన్న యోగియొక్క భవ బంధములు తెగిపోవుచున్నాయి.

సుషుమ్నోపాసకుడు క్రమంగా (మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా అనబడే) షట్‌చక్రములను భేదించివేసి, బ్రహ్మరంధ్రము నందు (యోగ-అభ్యాసబలముచే) కుండలినీశక్తిని జేర్చుచున్నాడు. ఏ యోగి వామదక్షిణములను (ఇడ-పింగళనాడులను) నిరోధించి సుషుమ్నమందు ప్రకాశితుడై, బ్రహ్మరంధ్రము నందు (సుషుమ్న ద్వారా) ప్రవేశము పొందుచున్నాడో, అట్టి వాడు ‘పరమాగతి’ అనబడు ఆత్మసాక్షాత్కారము పొందుచున్నాడు.

✤ ఏ యోగి పట్ల కుండలినీదేవి సుషుమ్నయందు హంస (సోఽహమ్) బ్రహ్మరంధ్రము (లేక) బ్రహ్మకపాలము వైపుగా ఊర్ధ్వముఖమై ఉంటోందో (ప్రాణా అపానముల సమత్వము సుషుమ్న యందు పైకి ఎగయుచూ ఉంటుందో),
✤ సుషుమ్న యొక్క - యోని అంతరమున ప్రాణశక్తి ప్రశాంతముగా సంచారము కలిగి ఉంటోందో,
✤ సుషుమ్న యందు ప్రాణము తనయొక్క చంచల స్వభావము వదలి స్థిరత్వము సంచరించుకుంటోందో,
✤ ఏ యోగి యొక్క సుషుమ్నయందు చంద్ర-సూర్యులు (ఇడ-పింగళనాడులు) లయత్వమును పొందుచున్నారో
✤ ఏ యోగి సర్వే సర్వత్రా సమరసమగు ఆత్మభావనను కించిత్ కూడా వీడనివాడై ఉంటాడో…, భిన్నత్వంగా కనిపిస్తున్న దృశ్యముయొక్క సమస్తములో ‘ఏకత్వము’ గమనించువాడై ఉంటాడో, -
అట్టి వాడే యోగవేత్త!

★ ఎవ్వని యొక్క సుషుమ్న నుండి ఆ యోగిచే తన మనోవేగము, మనోకదలికలు గమనించబడుచూ ఉన్నాయో,
★ ఏ యోగి ఒక క్షణకాలమైనా సుషుమ్నయందు ప్రశాంతముగా సుతిష్ఠితుడై ఉంటాడో,
★ ఒక ఉప్పుగడ్డ నీటిలో కలిసినప్పుడు అది నీటిలో కరిగిపోయి,-తన ఆకారాదులు త్యజించి-ఆ నీటితో ఏకమైపోవు విధానంగా
★ ఏ యోగి ‘సుషుమ్న’యందు సులగ్నుడు అయిపోతూ ఉంటాడో,
★ క్షీర నీరముల వలె సుషుమ్నతో మమేకమైపోతాడో,
అట్టి యోగి యొక్క (బ్రహ్మ-విష్ణు-రుద్ర) త్రిగ్రంధులు తెగిపోతాయి. (సృష్టి ‘‘సృష్టించబడిది-పరిపోషించబడుతోంది- లయించబడుతోంది’’ అను భ్రమలతో నిర్మితమైన) చిక్కుముళ్లు విడిపోతాయి.

స్వస్వరూపమునకు సంబంధించిన స్వీయకల్పిత సంశయములన్నీ తొలగిపోతాయి.
సర్వము పరమాకాశమునందు కరిగిపోతాయి.

తే యాన్తి పరమాగతిమ్! ఆ యోగి పరమగతిని సిద్ధింపజేసుకుంటున్నాడు.

సుషమ్నా ధ్యానయోగము

శివ భగవానుడు: ఓ బ్రహ్మదేవా! (1) సుషుమ్నయందు సర్వము దర్శించటము, (2) సుషుమ్నయందు కుంభక ప్రాణాయామము, (3) కుండలినీశక్తిని ప్రాణ-అపానహస్తములతో, అగ్ని సహాయంతో సుషుమ్నయందు ప్రవేశింపజేయుటము, (4) కుండలినీ శక్తిని బ్రహ్మరంధ్రము (సుషిరగము) వరకు ఊర్ధ్వముఖం చేయటము, (5) సుషుమ్నయందు ప్రాణనిరోధము, (6) సుషుమ్నయందు విష్ణుదర్శనం - సర్వదర్శనం- మొదలైన ఆయా విశేషాలన్నీ ఇప్పటిదాకా చెప్పుకున్నాము కదా! ఇప్పుడు ‘‘మధ్యనాడీ, (సుషుమ్ననాడి) ప్రదర్శనములు’’ అనబడు మహత్తర యోగాభ్యాస విశేషము గురించి చెప్పుకుందాము.

ఎంతటి మహత్తరమైనవంటే.., గంగాస్నానము; సముద్రస్నానము; మణికర్ణికకు నమస్కరించటము మొదలైనవన్నీ కూడా ‘మధ్యనాడీవిచారణ’ అనే యోగాభ్యాసఫలములో 1/16వ వంతుకు కూడా సమానము కాదు.

శ్రీశైల దర్శనాత్ ముక్తిః; వారణాస్యాం మృతస్యచ(మరణము); కేదారంలో ఉదకపానంవా…, వేయి అశ్వమేధయాగములు; వంద వాజపేయ యజ్ఞములు; ఇవన్నీ ‘‘సుషుమ్నా ధ్యానయోగము’’ యొక్క ఆత్మతాదాత్మ్య ప్రయోజనము లో 1/16వ వంతుకు కూడా సమానము కాదు.

సుషుమ్న యొక్క గోష్ఠి (Chanting, speaking, adoring) - ఏ యోగాభ్యాసి నిర్వర్తిస్తాడో,… అట్టివాడు సర్వదోషముల నుండి తనను తాను శుద్ధి పరచుకొని, గొప్పశ్రేయస్సును పొందుచున్నాడు.

సుషుమ్నయే - పరమ పవిత్ర తీర్ధము
సుషుమ్నయే - మహత్తరమగు జపము, అన్ని జపములలో గొప్పజపము.
సుషుమ్నయే - ధ్యానములలోకెల్ల గొప్ప ధ్యానము.

అనేక యజ్ఞములు, దానములు, వ్రతములు, నియమపాలనలు - ఇవన్నీ ‘సుషమ్నాధ్యానము’ యొక్క లవలేశములో 16వ వంతునకు కూడా సరితూగవు.

జీవాత్మ

యోగశిఖ-ఉపనిషత్-జీవాత్మ

జీవుని స్థూలరూపము

జీవుడు ఈ విధంగా హృదయాకాశములో స్థూలరూపుడై, తనువు యొక్క మధ్యగా ‘మధ్యమా’గా పిలువబడుచున్నాడు. ఈతడు ప్రాణ-అపానములకు వశుడై క్రిందికి-పైకి అవిశ్రాంతంగా దేహంలో తిరుగాడుచున్నాడు.

సుషుమ్న యొక్క ఎడమ-కుడి నాడీమార్గాలలో (ఇడ-పింగళలలో) అనుక్షణమూ తిరుగాడుచూ ఎక్కడా ఒకచోట నిలవటమే లేదు. భుజదండములచే ఎత్తి కొట్టబడుచూ ఉన్న పూబంతి (or like a foot-ball) ప్రాణ-అపానములచే ఎత్తెత్తి కొట్టబడుచూ ఈ జీవుడు ఎక్కడా ఒకచోట కించిత్ కూడా విశ్రాంతి లేనివాడై శ్రాంతి-శ్రమలను పొందుచూ వర్తిస్తున్నాడు. తన అశాంతిని దృశ్యముపై ఆపాదిస్తూ ఎప్పటికప్పుడు రోజులు గడుపుచున్నాడు. ‘‘ఒక విషయమును భావావేశపూర్వకంగా ఆశ్రయించటము - కామ లోభములు కలిగి ఉండటము - మరల మరొక విషయముపై వ్రాలటము-కామ లోభములు కొనసాగించటము’’ నిర్వర్తిస్తున్నాడు.

అపానః కర్షతి ప్రాణః → బయటకు వెళ్లు అపాన వాయువు లోనికి వస్తున్న వాయువును (ప్రాణమును) ఆకర్షిస్తోంది.

ప్రాణో అపానన్చ కర్షతి → లోనికి వస్తున్న వాయువు (ప్రాణము) - అపానమును (బయటకు వెళ్లుగాలిని) ఆకర్షిస్తోంది.

ప్రాణ-అపానముల పరస్పరాకర్షణల కారణంగా ప్రాణశక్తి సమన్వితుడైన ఈ జీవుడు అనిర్వచనీయమగు వేదన (An unexplainable worry)కి లోను అయి ఉంటున్నాడు.

‘హ’ కారముతో వాయువు బయటకువెళ్లుచున్నది. ‘స’ కారముతో లోనికి వచ్చుచున్నది. (హకారేణ బహిఃయాతి! సకారేణ విశేత్ పునః।)

యోగశిఖ-ఉపనిషత్-ప్రాణము-అపానము

యోగాభ్యాసి - పరంజ్యోతి

యోగి మూలాధారము నుండి కుండలినీ శక్తిని కంఠ ఊర్థ్వమునకు బుద్ధిపూర్వకంగా ప్రాణ-అపాన నిరోధయోగాభ్యాసము యొక్క ప్రయత్నములో సుషుమ్ననాడి ద్వారా నడిపిస్తున్నాడు. కంఠ ఊర్థ్వమునకు చేరిన కుండలినీ శక్తి యోగులకు ముక్తిదాయకముగా అగుచున్నది. మూఢులకు ఏ సంసారము బంధమగుచున్నదో, ఆ సంసారము (లేక) దృశ్యము యోగాభ్యాసికి ముక్తికై ‘ఉపకరణము’ అగుచున్నది.

భూః భువః సువః - త్రిమాత్రలు  
చంద్ర సూర్య  అగ్ని -  త్రిదేవతలు

ఇవన్నీ ఎద్దాని యందు మాత్రలో (అంతర విభాగ చమత్కారములో) అదియే ‘పరంజ్యోతి’! అది ‘ఓం’ - అని వేద-శాస్త్ర-ఇతిహాసములచే పిలువబడుతోంది.

కాలములు - 3   →     భూత వర్తమాన భవిష్యత్తులు;  
దేవతలు - 3  → బ్రహ్మ- విష్ణు - మహేశ్వరులు; (సృష్టి-స్థితి-లయాభిమానులు)  
లోకములు - 3   →     స్వర్గ-మర్త్య-పాతాళములు; (కేవలసత్ భావన - వ్యష్టి భావన - పాదార్థిక భావన)  
స్వరములు - 3    →     ఉదాత్త- అనుదాత్త-మధ్యమములు;  
వేదములు - 3   →     ఋక్-యజుర్-సామములు;

ఇవన్నీ సర్వదా ఎందులో సంస్థితమై, అద్దానికి సర్వదా అనన్యమైయున్నాయో,.. అదియే ‘ఓం’ సంజ్ఞచే ఉద్దేశ్యించబడుచున్న పరంజ్యోతి (లేక) పరమాత్మ (లేక) అఖండాత్మ!

సంసారము - మోక్షము

బ్రహ్మదేవుడు : స్వామీ! పరమశివా! బంధము ఏది? మోక్షము ఏదై ఉన్నది?

పరమశివుడు : చిత్తము చాంచల్యము కలిగియుంటున్నప్పుడు - అదియే ‘సంసారము’ అని అనబడుచున్నది. చిత్తే చలతి సంసారో! చిత్తము నిశ్చలత్వము వహించినదై ఉంటే - అదియే మోక్షము - నిశ్చలం ‘మోక్ష’ ఉచ్యతే।।

అందుచేత ఓ బ్రహ్మభగవాన్! విధిదేవా! ఈ జీవుడు చిత్తమును ప్రజ్ఞ సాధనలతో ‘పరము’నకు (The Absolute self beyond all this else) జేర్చాలి.

చిత్తం కారణం అర్థానామ్। సర్వ అర్ధములకు, అనర్ధములకు చిత్తమే కారణం.

తస్మిన్ సతి జగత్రయమ్! ఈ మూడు లోకములుగా కనబడుచున్నట్టిది చిత్తమే. చిత్తమే ఇదంతా.

చిత్తము క్షీణిస్తే ఆత్మకు అన్యభావనారూపమగు జగత్తు (జనించి-గతించేదంతా) క్షీణిస్తుంది. అందుచేత, ఈ చిత్తమునకు ప్రయత్నపూర్వకంగా చికిత్స చేయాలి.

(ఇహైవ నరకవ్యాధే చికిత్సాం న కరోతియః, గత్వా నిరౌషధ స్థానం స రుజః కిం కరిష్యతి?- [యోగవాసిష్ఠము] - చిత్తమునకు ‘చికిత్సలు’ అనే వసతులు గల మానవ జన్మలో చిత్తశోధనం చేసుకోకపోతే, మరెప్పటికి? ఎచ్చట? ఉపకరణములు ఉన్న స్ధానములో (మానవ జన్మలో) బద్ధగించి, ఎటో ఉపకరణములు లభించని స్థానములకు వెళ్ళి ఈ జీవుడు ఏమి చేయగలడు?)

మనస్సు - ఉన్మనీ

బ్రహ్మ భగవానుడు : శివదేవాది దేవా! ఈ మనస్సు ఎటువంటిదో, దయచేసి వివరించండి.

శివ భగవానుడు :

మనో అహమ్ గగనాకారమ్: ఆకాశము వలె అనంతాకారము అగు మనస్సు అనుబడునది ‘నేనే’! నేను అనన్యుడను! అందుచేత మనస్సు నాకు అన్యము కాదు!

మనోఽహమ్ సర్వతోముఖమ్: సర్వత్రా అసంఖ్యాక ముఖములుగల ‘మనస్సు’ అనునది నేనే!

మనోఽహమ్ సర్వ ఆత్మా చ : సర్వాత్మకమగు మనస్సు నేనే! మనస్సే ఈ అనంత జీవాత్మలుగా ప్రదర్శనమౌతోంది.

న మనః కేవలం పరః! : అయితే, నేను సర్వదా కేవలుడనై ఉండగా, మనస్సు కేవలము కాదు, (It is not absolute. It is merely relative). నేను పరమును (Iam always Beyond). కానీ మనస్సు పరము కాదు. ఇహములోనిది మాత్రమే. (అనగా) ‘మనస్సు’ అనబడునది మొదలే నాకు వేరుగా లేదు.

ఈ జగత్తులో జరుగుచున్న కర్మవ్యవహారములన్నిటికీ (All functions) జనన స్థానము మనస్సే. మనస్సు అనేక దోషములచే కప్పబడినదై ఉంటోంది.

అట్టి మనస్సు తనయొక్క జననస్థానము అగు ఆత్మను దర్శించుటచే - ఈ మనస్సు కాస్తా ‘ఉన్మనీ’ (Witness and silent operator of thought) స్థితిని పొందుచున్నది.

మనస్సు ఉన్మనీ స్థానమగు ఆత్మలో ప్రవేశించిందా,.. ఇక ‘పుణ్యము’ అనునదీ లేదు. ‘పాపము’ అనునదీ లేదు.

మనసా మన ఆలోక్య

ఒక నటుడు నాటకంలో ఒక పాత్రగా నటిస్తూ……..,

స్వగతమగు మనస్సు
‘‘సాక్షి’’
(కేవల మనస్సు)
(Acting thought)
పాత్రకు సంబంధించిన మనస్సు
‘‘పాత్రగా నటించటము’’
(నాటకములోని పాత్రకు సంబంధించిన మనస్సు)
(Role - concerned thought)

ఈ రెండింటినీ విడివిడిగా ఉంచుకొనుచున్నాడు కదా!

అట్లాగే ‘‘వృత్తి రహితమైన మనస్సు’’తో ‘‘వృత్తిసహితమైన జగన్నాటకములోని మనస్సు’’ ను సాక్షిగా సందర్శించుచున్నప్పుడు, అట్టి అభ్యాసముచే సుదుర్లభము - సర్వమునకు పరము అయినట్టి - ‘తత్ పరబ్రహ్మము’ యొక్క సందర్శనము సిద్ధించగలదు. ఆత్మతో మమేకత్వము స్వానుభవమవగలదు.

ముక్తి : మనసా మన ఆలోక్య ముక్తో భవతి యోగవిత్!

యోగాభ్యాసముచే యోగవేత్త అయినట్టి యోగి- ‘మనస్సుతో మనస్సును చూస్తూ ఉండటము’ అను అభ్యాసముచే ముక్తిని పొందుచున్నాడు. (సాక్షీ భూతమైన ‘మనస్సు’ - సందర్భములలో పాల్గొనుచున్న మనస్సును సాక్షిగా దర్శించగలగటమే ముక్తి).
(ఒక తెలివైన నటుడు తాను వేరై ఉంటూ, తాను నటిస్తున్న పాత్రను తనకు వేరుగా చూస్తున్న తీరుగా).

❆ మనస్సుతో మనస్సును ఆలోకనం చేస్తూ - మనస్సుకు మునుముందే ఉన్న ‘ఉన్మనీత్వము’ను ధారణ చేయు అభ్యాసము నిర్వర్తించాలి. (With the Help of Fixed Thought, the Variable Part of the Thoughts be observed).

❆ మనస్సుతో మనస్సును గమనించటము (observing thoughts through ‘Thought of self’) - అను ‘యోగనిష్ఠ’ యందు సర్వదా ఉండటము అభ్యసించాలి.

❆ మనస్సుతో మనో ఆలోకనముచే- ఈ దృశ్యమునకు (జగత్తుకు) ప్రత్యయము, ఆధారము, కేవలము అగు ఆత్మ- (The Absolute) - అనుభవము యొక్క పరిధిలో లభించుచున్నది. దృశ్యమును చూస్తూనే, ఈ దృశ్యమునకు ఆధారముగా అంతర్లీనంగా ఉన్న ప్రత్యయస్వరూపమును ళిప్రత్యక్ తత్త్వమగు ఆత్మను (లేక) స్వస్వరూపమునురి దర్శించువాడు - ‘‘యోగీశ్వరుడు’’ అగుచున్నాడు.

❆ ‘‘బిందువు, నాదము, కల, జ్యోతి’’ - ఇవన్నీ అబిన్దుస్థానము చేరుటకు ధృవములగు సాధన సంపత్తులు. తరింపజేసే తారకములు.

❆ ఇక పరబ్రహ్మమో? ‘శాంతము’నకు కూడా ఆవల అతీతమై, కేవల సాక్షిగా ఉన్నట్టిదే ‘పరబ్రహ్మము’గా పిలువబడుతోంది.

చిత్త విన్యాసము

ఈ చిత్తము కొంతసేపు నవ్వుతూ ఉంటుంది. ఉత్సాహంగా ఉంటుంది. క్రీడా వినోది అయి ఉంటుంది. సంతోషముతో గంతులు వేస్తూ ఉంటుంది.

❋ నేను దేహముతో జీవిస్తూ, ‘‘దేహమునకు మాత్రమే పరిమితుడనైన వాడను’’- అని పరిమితమైన దృష్టిని తెచ్చిపెట్టుకుంటోంది. అనేక భయ-ఉద్వేగములతో, ఉద్రేకములతో భౌతికత్వమంతా నెత్తిమీదకు తెచ్చిపెట్టకుని ఉంటోంది.

❋ బాధ-ఆదుర్దా-ఆవేదన-ఆశ-దురాశ-పేరాశలన్నీ ఒక్కసారిగానో, ఒకటి తర్వాత మరొకటిగానో పొందుతూ ఉంటోంది. రోదిస్తోంది. కారణం లేకుండా వేదన పొందుతోంది.

❋ శత్రువులను, వారి కార్యక్రమములను చూచి భయము, అసూయ, కోపము.. మొదలైనవన్నీ పొందుతోంది.
ఈ చిత్తము - ఒకవైపు నవ్వుతూ ఉంటూనే, మరొకవైపు కోరికలందు రమించుచూ, వాటి ఫలితములగు దుఃఖములన్నీ పొందుతోంది. అనేక ఆశయములు, అభిప్రాయములు, కోరికలను (Expectation) - అంతరంగంలో ఉద్రేకపూరితంగా కలిగి ఉంటోంది. ఈ విధంగా అనేక కామములు (Desires, expectations, etc.) తనయందు కలిగియుండి, క్షణక్షణము ‘కామాతురత’ కలిగి ఉంటోంది.

ఓ బ్రహ్మదేవా! ఒకడు శత్రువును జయించాలంటే, ఆ శత్రువు ఎట్టివాడో, ఎక్కడివాడో, ఎంతటివాడో ముందుగా తెలుసుకొని ఉంటాడు కదా! అట్లాగే, చిత్తం విజానీయాత్ కళేబరే! ఈ చిత్తశరీరము ఎట్టిదో ముందుగా తెలుసుకొని ఉండాలి. ఈ విషయమై ఒక ముఖ్య విశేషమును వినండి.

చిత్తము-ప్రాణము

ఏ ప్రదేశములో ప్రాణశక్తి వ్రాలుచున్నదో, అక్కడికి చిత్తము కూడా అప్పటికప్పుడే వచ్చి చేరుతుంది. ప్రాణమున్నచోటే చిత్తము కూడా ధృవముగా ఉనికి-వసతి పొందుచున్నది. అందుచేత ప్రాణోపాసనచే చిత్తము వశమై ఉండగలదు.
‘‘ఈ శరీరములో → మనస్సు చంద్రుడు! ప్రాణములే (వాయువే) ‘‘సూర్యుడు’’। అగ్నియే వృష్టి’’- అని చెప్పబడుతోంది.

వాయువు (ప్రాణము) - నిర్మల మనస్సులో లయం

హే బ్రహ్మాన్! ‘‘విష్ణువు - బ్రహ్మ- ఈశ మొదలైన దేవతోపాసనతో బాటు యోగాభ్యాసముచే నాదానుసంధానము చేస్తూ ఉన్న యోగి పట్ల సర్వవాసనలు సంక్షీణము చెందుచున్నాయి.

యోగి పట్ల - వాయువు (ప్రాణశక్తి) నిరంజనమగు (నిర్మలమగు) మనస్సు నందు విలీనము పొందుతోంది.

నాద-బిందు-చిత్తముల యోగ ఐక్యత్వము

ఓ బ్రహ్మదేవా! యో వై నాదః స వై బిన్దుః, తద్వై చిత్తం ప్రకీర్తితమ్। ఏది నాదమో - అదియే బిందువు. ఏది బిందువో, అదియే చిత్తముగా ప్రకీర్తింపబడుతోంది. యోగాభ్యాసముచే విజ్ఞుడగు యోగి - ఈ నాద, బిందు, చిత్తముల ఏకత్వమును స్వభావసిద్ధంగా బుద్ధితో సముపార్జించుకొనుచున్నాడు.

మనయేవ హి బిందుశ్చ! మనస్సే బిందువుకు ఉత్పత్తి స్థితికారణము. ఏవిధంగా - పాల నుండి ఘృతము (నేయి) ఉత్పన్నమగుచున్నది కాబట్టి, పాలు ఘృతాత్మకమే (నేయితో కూడినదే) అయి ఉన్నదో, అట్లాగే మనస్సు నుండి బిందువు బయల్వెడలుచున్నది.
- బిందువు నాదమునకు జనన స్థానము.
- (ధ్యానములో కనబడే జ్యోతి, నక్షత్రములు.. ఇవన్నీ బిందురూపములే)!
- అట్లాగే బిందువే మనో జనన స్థానము. మనస్సు - బిందువు - నాదము ఏకరూపములే.

షట్ చక్రములు - సుఖమండల ప్రవేశము

యోగి ‘బ్రహ్మదండము’ అగు వెన్నెముక యందు శక్తి కేంద్రములై యున్న - మూలాధార చక్రము, స్వాథిష్ఠాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞాచక్రముల స్థానములను ఎరుగుచూ సుఖమండలమగు ‘‘ఆత్మతత్త్వానుభవము’’ అను సహస్రారమునందు ప్రవేశము పొందుచున్నాడు.

ప్రవిశేత్ వాయుం ఆకృష్య, తథైవ ఊర్థ్వమ్ నియోజయేత్! శరీరములో ప్రవేశించువాయువును (ప్రాణమును) ఆకర్షించి, అద్దానిని ఊర్థ్వ మండలము (కపాల మండలము)లో నియోగించాలి. (నియమించాలి).

ఏక సమయోపాసన

ఓ హిరణ్యగర్భా! యోగి అయినవాడు ఈ క్రిందివానిని ఒకేసారి అభ్యసిస్తూ అభ్యాసపరుడు అయి ఉండాలి.

(1) ప్రాణవాయువు (ప్రాణోపాసన) (2) బిన్దోపాసన (3) షట్ చక్రోపాసన (4) చిత్త చికిత్స. ఈ నాలుగింటిని ఒకేసారి సమభ్యసించాలి. సమాధియందు వాటిని సమము, ఏకము చేయుటచే యోగి అమృతత్వము పొందుచున్నాడు. సర్వత్రా సమదర్శనమే (లేక) అఖండాత్మ దర్శనమే ‘సమాధి’.

వాసనలు తొలగించుకోవాలి-జ్ఞానజ్యోతి ప్రకాశమును దీప్తించుకోవాలి.

పరమ శివుడు : ఓ పద్మ సంభవా! భక్తజన కల్పవృక్షమా! సకల జన సమస్త ప్రదాతా! సృష్టికర్తా! బ్రహ్మభగవాన్! మన ఈ యోగ శిఖాధ్యయన సత్ విచారణను సమీక్షిస్తూ, సర్వజీవుల క్షేమమును దృష్టిలో పెట్టుకుని కొద్ది విషయాలు మరల ప్రస్తావించుకుందాము.

- జీవోబ్రహ్మేతి-నా పరః। ఈ జీవుని సహజ స్వరూపము పరబ్రహ్మమే. ఇందులో సందేహమే లేదు.
- అయితే ‘‘నేను దేహిని. దేహసంబంధితుడను. దేహపరిమితుడను. ఇంద్రియములచే నిబద్ధుడను’’ - అను కల్పనను లీలగా ప్రారంభించి, ఉపాధి పరంపరాభ్యాసముచేత దానినే సుస్థిరం చేసుకోవటం చేత ఈతడు ‘సంసారము’ అను పంజరములో నిబద్ధుడై - సకల బంధనములు, పరిమితములు, దుఃఖములు తనపై తానే స్వయముగా ఆపాదించుకొన్నవాడై ఉంటున్నాడు.
- ప్రతి జీవుని యందు ఆత్మజ్ఞాన జ్యోతి (లేక) ప్రజ్ఞాజ్యోతి వెలుగుచూనే ఉన్నది. అయితే - అజ్ఞానేన ఆవృతం -జ్ఞానం। జ్ఞాన దీపము- అజ్ఞానము అనే పొగ (లేక, మసి)చే ఆవరించబడి ఉన్నది. జ్ఞానము యొక్క వెలుగు అనుభవమవటం లేదు. అంతటా అజ్ఞానముచే ఆవరించబడి, జీవుడు తిమిరం (చీకటిలో) సమరము (సంఘర్షణములు) పొందుచూ ఆయుష్షులను గడుపుచున్నాడు.

అట్టి ఈ జీవుడు ఆత్మజ్యోతి-తత్త్వము సంతరించుకొని ఆత్మానందమును ఆస్వాదించటమే - సర్వ సాధనముల పరమోద్దేశ్యము.
అందుకు మార్గమును మరొక్కసారి సమీక్షించుకుంటున్నాము.

యథా అగ్నిః దారుమధ్యస్థో న ఉత్తిష్ఠేత్ మథనం వినా
కొయ్యలో అగ్ని దాగియే ఉన్నది. అయితే ఆ అగ్ని తనకు తానుగా బయల్వెడలుతుందా? లేదు. ఆ కొయ్య యొక్క రెండుచెక్కలు ఒరిపిడి చేత మాత్రమే ఉష్ణము(నిప్పురవ్వలుగా) బయల్వెడల గలదు.

అట్లాగే..,
వినా చ అభ్యాస యోగేన జ్ఞాన దీపః తథా నహి।
‘అభ్యాసయోగము’ - (రేచక - పూరక- కుంభకములతో కూడిన ప్రాణాయామము, సుషుమ్నయందు చిత్త నిశ్చలరూపకుంభకము చేయటము, ఇచ్ఛ-క్రియా-జ్ఞాన విశ్వశక్తి రూపిణియగు కుండలినీ శక్తిదేనిని ప్రత్యుత్సాహపరచటము, బ్రహ్మనాళమగు సుషుమ్న ద్వారా బ్రహ్మ కపాలము వరకు ఊర్థ్వగమనము మొదలైన అభ్యాసములు) ఆశ్రయించునుగాక.

జ్ఞాన దీపపు వెలుగు నలువైపులా ప్రసరించటము అను అభ్యాసము లేకపోతే ఆత్మజ్ఞాన దీపము మసగవేసి ఉండటమే - ఈ జీవుని పట్ల కొనసాగగలదు.

దేహము వేరు. ఆత్మజ్యోతి స్వరూపుడగు దేహివేరు. కుండలో దీపపు వెలుగే - కుండలోపల, కుండకు బయటకూ ప్రకాశమానమై ఉంటోంది. ఘటమునకు (కుండకు) వేరై ద్వీపజ్వాల భాసిస్తోంది కదా!
స్వకాయం ‘ఘటమ్’ ఇత్యుక్తం - ఈ భౌతిక దేహమే ఘటము (కుండ) అనబడుతోంది.

యోగశిఖ-ఉపనిషత్-ఘటం

ఈ దేహములో జీవుడే తత్ పదస్వరూపుడు. జీవుడే ‘భౌతిక దేహము’ అనే కుండలో ఆత్మజ్యోతియై వెలుగొందుచూ, బాహ్య-అభ్యంతరములలో తనయొక్క వెలుగు- తేజస్సులను నింపి ఉంచుచున్నాడు.

(బాహ్య = ఇంద్రియములచే జగదనుభవము। అభ్యంతరమ్ = మనో బుద్ధి అహంకారాదుల అనుభవము).

అట్టి ఈ ‘‘దేహమునకు - దేహమహమ్- జీవోఽహమ్’’ సంకుచిత భావనలు త్యజించబడుగాక. సముద్రంలో లయమయ్యే తరంగములవలె - జగద్భావములన్నీ ‘ఆత్మాఽహమ్’ భావన యందు లయం అవటమే సర్వసంసార భ్రమలు తొలగు మార్గము.
ఈ జీవుని పట్ల ఆత్మజ్యోతి వెలుగొందేది ఎట్లా?

అందుకు ఒక్కటే ముఖ్యోపాయము. ఆత్మతత్త్వజ్ఞుడగు సద్గురువును సమీపించి, ‘‘కోఽహమ్’’ అని వినమ్రతతో ప్రశ్నించి, వారు చెప్పుచున్న ‘తత్‌త్వమ్’ బోధను స్వీకరించటమే। గురువాక్య- సమం భిన్నే బ్రహ్మజ్ఞానం ప్రకాశతే। గురువాక్యము అగు ‘తత్‌త్వమ్’ వాక్యార్ధముచే సమరసమైయున్నట్టి, (మరియు) ఈ దృశ్యమునకు భిన్నమైయున్నట్టి ఆత్మజ్ఞానము ప్రకాశించగలదు.

✡︎ సంసారమనే సాగరంలో..,
✡︎ ‘ఆత్మ జ్ఞానార్జన’ అనే ‘బ్రహ్మచారి’ అయి, ‘బ్రహ్మచర్యత్వము’ అనే పడవను అధిరోహించి,
✡︎ ఆ పడవను నడుపు ‘కర్ణధారి’ వంటి గురువును శరణువేడాలి.
✡︎ ‘‘నేను అఖండాత్మనే’’ అనే సత్ చిత్ ఆనంద అనుభవమును ఈ జీవుని బుద్ధి సిద్ధించుకోలేనపుడు గురు బుద్ధియే శరణ్యము. వేరే త్రోవ లేదు.
✡︎ అప్పుడు ఆ జీవుని ప్రయాణము ఆత్మానందము వైపుగా చక్కగా కొనసాగుతుంది.
✡︎ ‘తత్‌త్వమ్’ ప్లవము (పడవ) ద్వారా (నీవుగా కనిపించేదంతా ఆ పరమాత్మయే - అను భావనను ధరించి), ‘సోఽహమ్’ - నేను సర్వదా కేవలమగు పరమాత్మ స్వరూపుడనే - అను ‘‘స్వయంజ్యోతీ- ఆత్మానంద స్థానము’’ను చేరాలి.

అట్టి జ్ఞానప్లవము (పడవకు) గురువే పడవను నడుపువాడు (కర్ణధారి).

(1) యోగాభ్యాసము (2) జ్ఞానవాసనలు
ఈ రెండింటి సహాయముచే ఈ జీవుడు సంసార సాగరము నుండి తప్పక తరించగలడు.

అభ్యాస వాసనా శక్త్యా భవన్తి భవసాగరమ్।।
కాబట్టి ఓ జీవులారా! ఉత్తిష్ఠ! ‘‘ఆ"! నేనింతే! ఎక్కడో మహానుభావులకే సాధ్యం!’’ ఈ ఈ పిరికితనము కట్టిబెట్టండి. ‘‘చిదానంద రూపమ్ శివోఽహమ్’’ అను ఆవలి వడ్డును చేరి, మా త్రిమూర్తులవలె ఆత్మానంద భరితులై ప్రకాశించటానికి ఇప్పుడే, ఇక్కడే నడుము కట్టండి.

➤ ఇంద్రియములను నియమించండి.
➤ వేదోపనిషత్తులు సూచిస్తున్న ప్రాణాయామము - ఆదిగా గల అభ్యాస యోగములకు ఉపక్రమించండి.
➤ సద్గురువులను శరణు వేడండి. వారు సూచిస్తున్న యోగ విధానములను శ్రద్ధగా విద్యార్ధులై విని, అభ్యాసము చేయండి.
➤ జ్ఞాన సమాచారము ఏకాగ్రతతో కూడిన నిర్మలమైన, సునిశితమైన బుద్ధితో వినండి. బుద్ధిని విస్తారము చేసుకొని అవగాహనలను హృదయములో పదిలపరచుకోండి.
➤ స్వకీయ హృదయములోనే సర్వాంతర్యామి, సర్వతత్త్వ స్వరూపుడు అగు పరమాత్మను మీ ఇష్టదైవతత్త్వముగా దర్శిస్తూ - ఆరాధించండి.
➤ ‘‘ఈ కనబడే సమస్తము పరమాత్మయొక్క విస్తరణ చమత్కారమే’’ - అని అనిపించే వరకు ‘అనుకోవటము’ను ఆశ్రయించి ఉండండి.
➤ క్రమంగా ఒకానొక శుభక్షణం నుండి ‘‘ఈ సమస్తము పరమాత్మ స్వరూపుడనగు నాయొక్క ప్రదర్శనానందమే’’ - అను ‘బ్రహ్మసాక్షాత్కారము’ను సిద్ధించుకొనుటకు ‘మానవజన్మ’ అనే మహత్తరమైన అవకాశమును ఫలప్రదము చేసుకోండి. ‘శివోఽహమ్’ను సముపార్జించుకోండి.

కేవల స్వరూపులై కైవల్యము పొందినవారవండి.

ఇతి శివగురు వాక్యమ్।

🙏 ఇతి యోగ శిఖ ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।