[[@YHRK]] [[@Spiritual]]

Dēvi Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


అధర్వణ వేదాంతర్గత

10     దేవ్యుపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్

శ్లో।। శ్రీదేవి ఉపనిషత్ విద్యా వేద్య
అపార సుఖాకృతీ।
త్రైపదం బ్రహ్మచైతన్యం
రామచంద్రపదం భజే।।

శ్రీ దేవి ఉపనిషత్ అధ్యయనముచే ఏ అపారమైన ‘ఆత్మసుఖము’ ప్రాప్తించగలదో, ఏ బ్రహ్మ చైతన్య త్రైపదము లభించగలదో, - అట్టి అత్యుత్తమ ఫలప్రాప్తికై శ్రీరామచంద్రుని భజించుచున్నాము.

హరిః ఓం!
1. సర్వే వై దేవా
దేవీమ్ ఉపతస్థుః।
‘‘క్వాసి త్వం మహాదేవి?’’
ఓంకార - (సచ్చిదానంద స్వరూపిణి - అగు) జగజ్జననికి నమస్కారము.
ఒక సందర్భములో దేవతలు జగజ్జనని, లోకమాత అగు దుర్గాదేవిని సమీపించారు. నమస్కరించి ఇట్లు ప్రశ్నించారు.
ఓ మహాదేవీ! నీవు ఎవరు? ఎవరై ఉన్నావు? (జగత్తుకీ, సమస్త జీవులకు జననివని ఆరాధించబడుచున్న) - నీయొక్క వాస్తవ రూపము ఏమిటి? నీ రూపము ఏదై ఉన్నదని మేము ఆరాధించాలి? (సాకరమా? నిరాకారమా? స్త్రీ - పురుష ఇత్యాది ఏదైనా రూపమా?)
సా బ్రవీత్:
అహం బ్రహ్మస్వరూపిణీ।
మత్తశ్చ సంప్రవర్తతే - (ఇదం)
ప్రకృతి - పురుషాత్మకం జగత్-
శూన్యన్చ - అశూన్యన్చ।।
త్రిలోకపావని, జగదీశ్వరి అగు దుర్గా మహాదేవి ఈ విధంగా సమాధానంగా చెప్పసాగారు.

బిడ్డలారా! దేవతలారా? నా యొక్క వాస్తవ రూపమేమిటో తెలుసుకో దలచుకొన్నారా? అయితే శ్రద్ధగా, అత్యంత సూక్ష్మ-వివేక దృష్టితో వినండి.
1. నేను స్వయముగా ‘బ్రహ్మమే’ స్వరూపముగా కలిగియున్నదానను. అహం బ్రహ్మాస్మి।
2. ప్రకృతి-పురుషాత్మకమగు ఈ సమస్త జగత్తు నా వలననే ప్రవర్తన శీలము అవుతోంది.
3. నేను సమస్తమునకు మునుముందే సమస్తమునకు పరమైయున్నాను.
4. ఈ సమస్తము నేనే అయి ఉన్నాను. కనుక పూర్ణ (అశూన్య) స్వరూపిణిని. నాయందు ఎప్పుడూ ఈ జగత్తులనబడేవేవీ లేవు కాబట్టి-శూన్య స్వరూపిణిని కూడా!
అహమ్ ఆనన్ద - అనానందౌ।
అహం విజ్ఞాన - అవిజ్ఞానే।
అహం బ్రహ్మా బ్రహ్మణీ వేదితవ్యే। =
= ఇతి ఆహ అథర్వశ్రుతిః।।
- ఆనంద స్వరూపిణిని. అయితే నా ఉనికి చేతనే ‘ఆనన్దము’ ఉనికి కలిగియున్నది కాబట్టి ఆనందమునకు ఆవలి స్వరూపినికాబట్టి ‘అనానన్దము’ను కూడా! ‘ఆనందము’ - నానుండి బయల్వెడలే ఒకానొక విలక్షణ లక్షణము.
- విజ్ఞానము (తెలియబడేదంతా) నేనే! తెలియబడనిది కూడ నేనే। తెలియబడేది, తెలియబడనిది కూడా నా ‘తెలివి’యొక్క ప్రదర్శనా చమత్కారములే! అట్టి ‘తెలివి’ నాయొక్క ప్రదర్శనమే।
- బ్రహ్మము నేనే! ఆ బ్రహ్మమును తెలుసుకొంటున్నదీ నేనే। బ్రహ్మముగా తెలియబడేదీ నేనే. బ్రహ్మము గురించి ఏ మాత్రము తెలియనివాడు కూడా నేనే! నేనే బ్రహ్మమై ఉండగా నాకు బ్రహ్మము తెలియబడటమనే ప్రసక్తి ఎక్కడిది?

ఈవిధంగా అథర్వణ శ్రుతి (అథర్వణవేదము) నాగురించి స్తుతించుచున్నది.
2. అహం పంచభూతాని - అపంచభూతాని।
అహమ్ అఖిలం జగత్।
భూమి - జలము - అగ్ని - వాయువు - ఆకాశముగా ఉన్నది నేనే! అపంచ భూతములైనట్టి దేహి-మనో-బుద్ధి-చిత్త-అహంకారములు కూడా నేనే! ఈ జగత్తుగా కనబడేదంతా నా స్వరూపమే। ఈ జగత్తంతా నేనే।
వేదోఽహమ్। అవేదోఽహమ్।
విద్యాహమ్। అవిద్యాహమ్।
అజాహమ్। అనజాహమ్।
(కథ-కథా రచయితకు వేరుకానితీరుగా) -తెలియబడేదంతా నేనే! అయితే తెలియ బడేదానికి సంబంధమే లేనిది నా స్వరూపము. అందుచేత తెలియబడేదాని పరిమితము కాదు. తెలుసుకుంటున్న స్వరూపమే నేనై ఉండగా-తెలియబడేది నేనెట్లా అవుతాను? నాటకంలో ఒక పాత్రకు తెలిసినది, తెలియనిది కూడా రచయితకు చెందినదే కదా!
విద్యను నేనే! అవిద్యను నేనే! తెలియనివాడు కూడా నా రూపము కాని క్షణమే లేదు. విద్య - అవిద్యా స్వరూపుణిని।
నాకు జన్మలే లేవు. జన్మరహితను. కానీ, జన్మలన్నీ నాకు చెందినవే కాబట్టి అనజాస్వరూపినిని - జన్మసహితను కూడా!
అథశ్చ ఊర్థ్వన్చ తిర్యక్ చ అహగ్ం।
(అహగ్ం) రుద్రేభిః వసుభిః చరామి।
అహమ్ ఆదిత్యైః ఉత విశ్వదేవైః।
అహం మిత్రా వరుణా ఉభౌ బిభర్మి।
ఈ సమస్త జగద్దృశ్యమునందు పైన, క్రింద, వెనుక, ముందు అంతటా నిండిఉన్నది నేనే. ఏకాదశ రుద్రులతో, అష్ట వసువులతో కూడి ఈ లోకములన్నీ సంచారములు చేస్తూ ఉంటున్నాను.
నాకు ఏమాత్రము అన్యము కానట్టి - ఆదిత్యునితోను, విశ్వేదేవునితోను, మిత్రా వరుణులతోను (సూర్య జలరూపములతో) కూడి లోకములన్నీ పాలిస్తూ, ఉన్నదానను. వీరందరిని ధారణ చేస్తూ భరిస్తూ ఉన్నట్టిదానను.
(అహమ్) ఇంద్ర-అగ్నీ, అహమ్ అశ్వినా ఉభే।
అహగ్ం సోమం త్వష్టారం
పూషణం భగం దధామి అహమ్।
(అహం) విష్ణుమ్ ఉరుక్రమం
బ్రహ్మాణమ్ ఉత ప్రజాపతిం దధామి।
ఇంద్ర, అగ్ని, అశ్వినీ దేవతలుగా ఉన్నది నేనే। అవన్నీ నా స్వరూపమే।
సోముని (చంద్రుని), త్వష్టను, పూషణుని, భగుని ధరించుచున్నట్టిదానను.
అట్లాగే ఆత్మస్వరూపిణిగా నేనే - విష్ణువును. ఉరుక్రమునిని (త్రివిక్రముని, వామనుని). బ్రహ్మను. ప్రజాపతిని. అస్మత్ స్వరూపములుగా నన్ను నేనే ప్రదర్శించు చున్నట్టి దానను.
నా ధారణ (Holding Activity) యొక్క సంప్రదర్శనా - విశేషములే వారంతా
అహం దధామి ద్రవిణగ్ం
హవిష్మతే సుప్రావ్యేయే
యజమానాయ సున్వతే।
అహగ్ం రాష్ట్రీ సంగమనీ వసూనామ్।
యాగము నిర్వర్తించటానికి సిద్ధపడుచున్న యజ్ఞకర్తకు యాగఫలము, సంపదలు - ఇవన్నీ హవిష్మంతనగు నాచేతనే ప్రసాదించబడుచున్నాయి.
రాష్ట్రిని. లోకములన్నిటికీ యజమానిని. అష్టవసువులకు సంగమనీని నేనే!
వస్తువులన్నీ సంగమము (Get Lost into) పొందునది నాయందే!
అహగ్ం సువే పితరమ్ అస్య మూర్ధన్।
మమ యోనిః అప్సుః అన్తః సముద్రే।


య ఏవం వేద, స దేవీపదమ్ ఆప్నోతి।

పిత్రులోకములోని పిత్రుదేవతలందరినీ నా యొక్క మూర్థము (ముఖము యొక్క ఊర్థ్వభాగమునందు-నుదురు నందు) కలిగియున్నదానను.
నా గర్భమునందే సప్త సముద్ర జలము ఏర్పడి ఉన్నది.

ఎవరు ఈ విధంగా నన్ను తెలుసుకుంటారో అట్టివారు ‘‘దేవీపదము’’ను పొందగలరు.

3. తే దేవా అబ్రువన్:
నమో దేవ్యై। మహాదేవ్యై। శివాయై - సతతం నమః।
నమః ప్రకృత్యై భద్రాయై, నియతాః ప్రణతాః స్మతామ్।।
దేవతలు అమ్మతో ఇట్లా పలికారు.
మహాదేవి, శివానందిని - అగు దేవికి సతతము (ఎల్లప్పుడు) నమస్కరిస్తున్నాము. ప్రకృతి స్వరూపిణి అయి, మాకు భద్రము కలిగించగల ‘భద్ర’ అయినట్టి దేవదేవికి నియతముగా, నిష్ఠతో ప్రణామములు సమర్పిస్తున్నాము. మాలోని ఆ భద్రస్వరూపిణికి నమస్కారము.
తామ్ అగ్నివర్ణాం తపసా జ్వలంతీం,
వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్।
దుర్గాం దేవీగ్ం శరణమ్ అహం ప్రపద్యే
సుతరాం నాశయతే తమః।।
అగ్నివర్ణముతో వెలుగొందుచున్నట్టిది, తపోశక్తిచే ప్రకాశించుచునది, తన పట్ల తపన గల తాపసుల హృదయములలో ప్రకాశించునది, కర్మ ఫలములములను స్వీకరించి ఆత్మజ్ఞానము రోచనము (ప్రకాశమానము) చేయునది, అజ్ఞానాంధకారమును మొదలంట్లా (పూర్తిగా) పటాపంచలు చేసి జ్ఞానజ్యోతిని మా యందు వెలిగించునది - అగు శ్రీ దుర్గాదేవిని స్తుతిస్తూ శరణువేడుచున్నాము. తరింపజేయు తల్లీ! నమస్కారము.
దేవీం వాచమజనయంత
దేవాస్తాం విశ్వరూపాః
పశవో వదంతి।
సా నో మంద్రేషమ్ ఊర్జం దుహానా
ధేనుః వాక్ అస్మాన్ ఉపసుష్టుతైతు।
మాతా! దేవతలు నిన్ను ‘జన్మరహిత’ గాను, ‘విశ్వరూపిణి’గాను దర్శిస్తూ స్తుతిస్తున్నారు. ఓ దేవీ! నీవు అవాగ్మానస గోచరమై (మాటకు యోచనకు అందనిదానివై) ఉండి కూడా, - వాక్కుకు జనన స్థానమై, వాక్కుగా ప్రదర్శన మగుచున్నావు. పశువులము (జీవులము) అగు మేము నిన్ను దేవతలకు నివాస స్థానముగాను, సమస్త దేవతా స్వరూపిణిగాను, విశ్వరూపిణిగాను దర్శించు చున్నాము. నమస్కరిస్తున్నాము.
మంద్రము (గంభీరమైన స్వరము)తో వాక్ ధేనువువై వేగముగా రమ్ము. మేమున్న చోటికి వచ్చి ఆశీనురాలవై మాకు ఆప్తవాక్కు వినిపించెదవుగాక। మాచే ఉత్తమ వాక్కు పలికించెదవు గాక!
కాళరాత్రిం బ్రహ్మాస్తుతాం
వైష్ణవీగ్ం స్కందమాతరమ్।
సరస్వతీం అదితిం
దక్ష దుహితరం నమామః, పావనాగ్ం శివామ్।
కాళరాత్రీదేవిగా, బ్రహ్మదేవునిచే కూడా స్తుతించబడుదానివి, విష్ణు స్వరూపిణివి (వైష్ణవి), దేవతా సేనాని అగు స్కందునికి తల్లివి - అగు నీకు నమస్కారము.
సరస్వతి అయి విరాజిల్లుచున్నట్టి దానివి, దేవతలకు తల్లి అగు అదితివి, దక్షప్రజాపతి యొక్క పుత్రికవు (దాక్షాయణివి), శివానందస్వరూపిణివి, మమ్ము పావనము చేయుదానివి - అగు దుర్గాదేవీ! నమో నమః।

మహాలక్ష్మీం చ విద్మహే
సర్వ సిద్ధాశ్చ ధీమహి।
తన్నో దేవీ ప్రచోదయాత్।
అమ్మా! ఈ విశ్వమంతా నీదే! నీవే! ఈవిదంగా నీ యొక్క మహాలక్ష్మీ స్వరూపమును, మహిమను ఎరుగుచున్నాము. కీర్తిస్తున్నాము. సర్వసిద్ధి ప్రదాతవగు నిన్ను బుద్ధితో ధ్యానిస్తున్నాము.
అట్టి దేవి మా బుద్ధిని వికసింపజేయును గాక!
అదితిః ఇహ జనిష్ట దక్ష యా
దుహితా తవ।
తాం దేవా అన్వజాయంత
భద్రా అమృత బంధవః।
(దేవతలకు జనని అగు) అదితి నీకు కూతురుగా పుట్టి, ఆ తరువాత దేవతలగు మాకు జనని అయి - మాకు జననము ప్రసాదించినది. అట్టి మాతామహివగు నీకు నమస్కరిస్తున్నాము.
భద్ర, అమృత, లోక బాంధవి, దేవతలకే దేవత, దేవతలను సృష్టించు దానివి - అగు నీకు నమస్కారము. త్రిలోక బాంధవీ! త్రిలోక పావనీ! నమో నమః।)
కామో యోనిః కామ కలా
వజ్రపాణిః గుహా హస
మాతరిశ్వ అభ్రం ఇంద్రః।
- ఈ సమస్తము ఎవరి ‘ఇష్టము’ నుండి జనిస్తోందో అట్టి ‘కామయోని’కి నమస్కారము.
- కళాస్వరూపిణి అగు ‘కామకల’కు నమస్కారము. ఈ జగత్తులన్నీ నీ ఇష్టములోనుంచి పుట్టినవే!
- వజ్రపాణి స్వరూపిణివై, సర్వహృదయ స్వరూపిణివై, వాయు స్వరూపిణివై, మేఘస్వరూపిణివై, మేఘనాధుడగు ఇంద్రునివై విరాజిల్లుచున్న జననీ। నమోనమః।
- పునః గుహా సకలా మాయయా చ।
- పునః కోశా విశ్వమాతాది
విద్యోమ్ (విద్ య ఓం)।
సమస్త జీవుల హృదయగుహలలో మాయాస్వరూపిణివై నీవు ప్రత్యక్షమైయ్యే ఉన్నావు.
- (అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయ) పంచకోశములలో వేంచేసియున్న దానవు. విశ్వమాతవు. సమస్తమునకు ఆది స్వరూపిణివి. విత్ (ఎరుక) స్వరూపిణివి. ఓంకార స్వరూపిణివి। అట్టి దేవికి నమస్కారము.
ఏష ఆత్మశక్తిః। ఏషా విశ్వమోహినీ।
పాశ - అంకుశ-ధనుర్భాణ ధరా।
ఏషా శ్రీ మహావిద్యా।
య ఏవం వేద, స శోకం తరతి।।
ఈ దేవాది దేవియే సర్వజీవులలోని ఆత్మశక్తి। ఆత్మౌన్నత్య స్వరూపము।
తన విశ్వరూపముతో జీవులందరినీ మోహింపజేయు దేవి।
అట్టి ఆత్మశక్తి స్వరూపిణి, విశ్వమోహిని, పాశ-అంకుశ ధనుర్బాణములు ధరించినది అగు దేవీ। నీకు నమస్కారము. నీవే మహా విద్యాస్వరూపిణివి.
అట్టి ఈ దేవీతత్త్వము తెలుసుకొన్నవాడు సమస్త శోకముల నుండి తరించగలడు. (Gets relieved of all worries)
4. నమస్తే అస్తు భగవతి
భవతీ। మాతః అస్మాన్
పాతు సర్వతః।
సైషాష్టౌ(స ఏషా అష్టౌ) వసవః।
స ఏషా ఏకాదశ రుద్రాః।
స ఏషా ద్వాదశాదిత్యాః।
స ఏషా విశ్వే దేవాః।
‘న’ = పరపాత్మవై , ‘మ’ = జీవాత్మగా కూడా అస్తే = ఉన్నదానా!
నమస్తే = తే నమః। అట్టి జీవాత్మగా కూడా ఉన్న దేవికి నమస్కారము సమస్తమును వెలిగించు ఓ భగవతీ। సమస్తముగా ప్రదర్శనమగుచున్న ఓ భవతీ! మాతా! నమోనమః। అట్టి ఈ తల్లి నన్ను అన్నివైపుల నుండి రక్షించునుగాక।

(అపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు అను పేర్లు గల) అష్టవసువులుగా ఉన్నది - ఈ దేవదేవియే।

(అజుడు, ఏకపాదుడు, అహిర్బుద్న్యుడు, హరుడు, శంభుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు, త్వష్ట (విశ్వకర్మ), రుద్రుడు - అనుపేర్లుగల) ఏకాదశ రుద్రులుగాను, వరుణుడు, అంశుమంతుడు, భగుడు, త్వష్ట, సవిత, విష్ణువు, ఇంద్రుడు - అను పేర్లుగల ద్వాదశాదిత్యులు గాను వెలుగొందుచున్నది ఈ మహాదేవియే.

సర్వతత్త్వ స్వరూపిణి అగు ఈ దేవియే విశ్వేదేవుడు. (The Design Engineer of the Universe) రూపమును దాల్చి విశ్వమును రచించుచూ నడిపిస్తోంది.
సోమపా అసోమపాశ్చ।
స ఏషా యాతుధానా అసురా,
రక్షాగ్ంసి పిశాచా యక్షాః సిద్ధాః
స ఏషా సత్త్వ రజః తమాగ్ంసి।
స ఏషా ప్రజాపతి, ఇంద్ర, మనవః।
యజ్ఞమునందు సోమము పానము చేయు యజ్ఞకర్త, సోమపానము చేయని తదిత అధ్వర్యులు కూడా ఈ దేవియే। యజ్ఞరూపిణి అయి ఆయా యజ్ఞాంతర్భాగములుగా వెలయుచున్నది.
ఈ దేవియే అసురులుగా, రాక్షసులుగా, పిశాచములుగా, యక్షులుగా, (ఇదంతా నేను సిద్ధించుకొనుచున్నదే కదా!’’ అను సిద్ధభావన గల) సిద్ధులుగా ప్రదర్శనమగుచున్నది.
సత్త్వ రజో తమో గుణములు → త్రిగుణాతీత అగు ఈ దేవీ గుణ విశేషములే.
ఈ తల్లియే ప్రజాపతి, ఇంద్ర, మనువు రూపములు దాల్చి సృష్టికి కార్యకర్త అగుచున్నది.
స ఏషా గ్రహ నక్షత్ర జ్యోతీగ్ంషి,
కలా కాష్ఠాది కాలరూపిణీ।
తామ్ అహం ప్రణౌమి నిత్యమ్,
తాపహారిణీం దేవీం
భుక్తిముక్తి ప్రదాయినీమ్।
ఈ దేవియే జ్యోతిర్మండల రూపిణి అయి గ్రహ, నక్షత్ర పాలపుంతల రూపములుగా విరాజిల్లుచున్నది.
కల (మార్పు చెందునది - Changing Factor), కాష్ఠ (మార్పు చెందనిది - Constant Factor) అగు కాలః కాలస్వరూపిణి ఈ దేవియే।
అట్టి దేవదేవీ! నీకు అనుక్షిణికంగా నమస్కరిస్తునాము. నిత్య సత్యమగు నీకు నమో వాక్కములు.
సర్వతాపములు తొలగించునది. భుక్తిముక్తి ప్రదాయిని అగు దేవాది దేవికి స్థుతులు సమర్పిస్తున్నాము.
అనంతాం విజయాగ్ం
శుద్ధాగ్ం శరణ్యాగ్ం శివదాగ్ం శివామ్।
వియదీకార (వియత్ ‘ఈ’ కార) సంయుక్త
వీతిహోత్ర సమన్వితమ్।
అనంత విజయ ప్రసాదిని. శుద్ధ స్వరూపిణి. ‘శివా’ నామధేయిని. ‘శరణు’ - అన్నవారిని శివత్వము ప్రసాదించునది! వియత్తు (ఆకాశ) ‘ఈ’ ఆకారస్వరూపిణి. వీతిహోత్రునితో (అగ్ని, సూర్యునితో) కూడుకొన్నట్టిది. అట్టి జననీ! నమో నమః।
అర్థేందులసితం దేవ్యా బీజగ్ం సర్వార్ధ సాధకమ్।
ఏవం ఏకాక్షరం మంత్రం యతయః శుద్ధ చేతసః
ధ్యాయంతి పరమానందమయ జ్ఞానాంబురాశయః।
అర్థచంద్రునితో అలంకరించబడి ప్రకాశించుదేవి. ళీష్టమీచంద్ర వీహ్రాజ దళికస్థల శోభితా। - (లలితాసహస్రం)రి చతుర్విధ పురుషార్ధ సాధకములకు బీజ స్వరూపిణి. ‘‘ఓం! ఇత్యేకాక్షరమ్ బ్రహ్మ’’ అను దేవీతత్త్వము - ‘శుద్ధము’ అయిన బుద్ధి గలవారిచే, తమ పరమానందమయమైన జ్ఞాన గాన జలతరంగములతో ధ్యానించబడుతోంది.
వాఙ్మయీ బ్రహ్మభూః,
తస్మాత్ షష్ఠం వక్త్ర సమన్వితమ్।
సూర్యో వామః శ్రోత్రబిందుః।
సంయతి అష్ట తృతీయకమ్,
నారాయణేన సంయుక్తో
వాయుశ్చ అధర సంయుతః
విచ్చే నవార్ణకో అర్ణస్స్యాత్
మహదానంద దాయకః।
ఈ దేవి వాక్కు స్వరూపిణి. వాక్‌మయి. బ్రహ్మము స్వరూపముగా కలిగియున్నట్టిది. అట్టి వాఙ్మయి స్వరూపిణి సృష్ట్యభిమాని యగు బ్రహ్మతోను, భూమితోను ‘6’ (దృశ్య-దర్శన-ద్రష్ట-జీవ-ఈశ్వర- తురీయ-తురీయాతీత) ముఖముల సమన్వితమై భక్తుల హృదయాలలో ప్రత్యక్షమగుచున్నది.
సూర్యుడు, వామదేవుడు, శ్రోత్ర బిందువు. 3వ రూపముగా అష్టవిధ ప్రకృతి కలిగియున్నది. శ్రీమన్నారాయణునితో కూడుకొని ఉన్నది, వాయువు అధరము (క్రింద పెదవి)గా కలిగియున్నట్టిది. (‘‘ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే’’- అను) నవార్ణవ మహామంత్రరూపిణి అగు ఆ శ్రీదేవి జీవులకు మహానందప్రదాత అయి ఉన్నది.
5. హృత్ పుండరీక మధ్యస్థాం
ప్రాతః సూర్య సమప్రభామ్।
పాశ అంకుశ ధరాగ్ం సౌమ్యాం
వరదాభయ (వరద అభయ) హస్తకామ్।
త్రినేత్రాగ్ం రక్త వసనాం
భక్త కామదుఘాం భజే।
నమామి త్వాం అహం దేవి
మహాభయ వినాశినీమ్।।
ఓ దేవదేవీ! దేవాది దేవీ! జగజ్జననీ! లోక బాంధవీ!
సమస్త ప్రాణుల హృదయ పద్మముల మధ్యగా వేంచేసియున్నట్టిదానవు, ఉదయించుచున్న ప్రాతఃకాల సూర్యునితో సమానంగా కాంతిపుంజములు వెదజల్లుదానవు.
పాశము - అంకుశము ధరించుదానవు. పరమ శాంతమగు సౌమ్య స్వరూపిణివి. భయమును పోగొట్టి వరద ప్రదానము చేయు అభయ హస్తముద్ర కలిగి ఉన్నట్టిదానవు. త్రినేత్రములు కలిగినట్టిదానవు, ఎర్రటి వస్త్రములు ధరించినట్టిదానవు. సంసార మహా భయము నుండి మమ్ములను కాపాడగల గౌరీదేవీ! నమామి త్వాం అహందేవీ। నీకు నేను నమస్కరిస్తున్నాను. నమో నమో నమో నమః।। సమస్త జీవులలో ‘నేను’-రూపంగా ఉన్న దేవీ! నమో నమః।।
మహాదుర్గ ప్రశమనీం
మహాకారుణ్య రూపిణీమ్।
= యస్యాః స్వరూపం బ్రహ్మాదయో
న జానంతి, తస్మాత్
ఉచ్యతే ‘‘అజ్ఞేయా’’।
= యస్యా అంతో న విద్యతే,
తస్మాత్ ఉచ్యతే ‘‘అనంతా’’।
(అజ్ఞాన కారణంగా మాపైకి వచ్చి పడుచున్న) బహు కష్టములు అనబడే మహా దుర్గములను (ఆపదలను) ప్రశమింపజేయు దేవీ దుర్గా!
గొప్ప కరుణను వర్షింపజేయు మహాకారుణ్య స్వరూపిణీ! నమస్కారము!

ఓం అజ్ఞేయా! : ఈ దేవి యొక్క సర్వాత్మకానంద స్వరూపము - బ్రహ్మ మొదలైన వారికికూడా ‘తెలియనిదే’ అగుచుటచేత ఆ తల్లి ‘అజ్ఞేయా’ అనబడుచున్నది.

ఓం అనంత దేవీ స్వరూపిణీ!
ఆది - అంతములు లేనట్టిది కాబట్టి ‘‘అనంతా।’’ - అనబడుచున్నది.
= యస్యా గ్రహణం నోపలభ్యతే,
తస్మాత్ ఉచ్యతే ‘‘అలక్ష్యా’’।
= యస్యా జననం న ఉపలభ్యతే, (నోపలభ్యతే)
తస్మాత్ ఉచ్యత ‘‘అజా’’।
= ఏకైవ సర్వత్ర వర్తతే
తస్మాత్ ఉచ్యత ‘‘ఏకా’’।
ఓం అలక్ష్యా! దేవి యొక్క కేవల రూపము ఇంద్రియములకు విషయమే కాదు కనుక ‘‘అలక్ష్యా!’’ - అని పిలుస్తున్నాము.
అజా ! ‘ఆ దేవి యొక్క జననము ఇది’ అనునది అలభ్యము కాబట్టి అజా! (జన్మకర్మలకు ఆవల పరమశాంతమై స్వస్వరూపముగా వేంచేసియున్నది).
ఏకా ! ఏకమే అయి ఉండి సర్వత్రా (అనేకముగా) వర్తిస్తూ ఉండటం చేత ‘‘ఏకా’’ అని పిలువబడుచున్నది.
= ఏకైవ విశ్వరూపిణీ
తస్మాత్ ఉచ్యతే ‘‘అనైకా’’।
అత ఏవ ఉచ్యతే →
అజ్ఞేయా అనన్తా అలక్ష్యా చ
ఏక అనైక-ఇతి।।
అనేకా! అనేకముగా కనిపిస్తున్నదంతా ఆ దేవీ స్వరూపమే కాబట్టి ఆ దేవి విశ్వరూపిణిగా ‘అనేకా’ అనబడుతోంది.
ఈ విధంగా దేవి గురించి ‘‘అజ్ఞేయా, అనన్తా, అలక్ష్యా, ఏకా, అనేకా’’ -గా చెప్పబడుచూ ఉండగా, ఆ మహాదేవికి అవన్నీ సార్ధకనామములు అగుచున్నాయి. ఆ దేవియే మనందరి రూపముగా- ‘‘వినోదిని’’ అయి వేంచేసి ఉన్నది.
మన్త్రాణాం మాతృకా దేవీ।
శబ్దానాం జ్ఞానరూపిణీ।
జ్ఞానానాం చిన్మయాతీతా।
శూన్యానాగ్ం శూన్య సాక్షిణీ।
యస్యాః పరతరం నాస్తి,
సైషా (స ఏషా) ‘‘దుర్గా’’ - ప్రకీర్తితా।
ఓ దేవీ! సమస్త మంత్రములకు నీవు మాతృకవు. మాతృదేవతవు.
సమస్త - శబ్దముల అర్థము, ఆ అర్ధముతో తెలియవచ్చే పరాకాష్ఠజ్ఞాన రూపము నీదే। జ్ఞానములన్నిటికీ చిన్మయాతీతవు (తెలియటమునకు ఆవల తెలుసుకొనుచున్నవాని రూపము) నీవే।

శూన్యమునకు కూడా (ఆలోచనా రాహిత్యమునకు, భావనారాహాత్యమునకు) సాక్షి అయి వెలుగొందుచున్నట్టిదానవు. నమో నమః।

దేనికైతే ఇంక ఏదీ శేషించి లేదో, అట్టి పరతరమగు - ‘దుర్గ’ అని ఆత్మతత్త్వజ్ఞులచే బహుకీర్తించబడుచున్నది. ఎద్దానికి ‘వేరు’ అనునది ఏమాత్రము లేదో, అదియే దుర్గాదేవి।

దుర్గాత్ సంత్రాయతే యస్మాత్
దేవీ దుర్గేతి కథ్యతే।।
ప్రపద్యే శరణం దేవీం
‘దుం’-దుర్గే
దురితం హర।
దుర్గమముల నుండి (కష్టతర సందర్భముల నుండి) ఎవరైతే తరింపజేయగలరో (Solving at its core), వారే ‘‘దేవీ దుర్గ’’ అని మాచే పిలువబడుతోంది.

‘దుం’। దుఃఖములను, దురితములను హరింపజేయు దుర్గాదేవిని స్తుతిస్తున్నాను. శరణువేడుచున్నాము.
6.
తాం దుర్గాం దుర్గమాం దేవీం
దురాచార విఘాతినీమ్।
నమామి భవభీతో అహగ్ం
సంసారార్ణవ తారిణీమ్।
అజ్ఞానము చేత అనేక దురాచారములు నిర్వర్తించిన మేము, ఆ దుష్ట-సంస్కారములు జయించలేక దుర్గమమైన దురాచార నివారణార్థమై, ఈ దుర్గాదేవికి నమస్కరిస్తున్నాము.

‘‘ఈ జగత్తు నిజముగానే ఉన్నది’’ అను భవభీతిరూప దుర్వ్యసనముచే ప్రాప్తించిన భవరోగమునకు భయభీతులమై సంసార సాగరమును దాటించగల నిపుణత గల దుర్గాదేవికి నమస్కారము చేస్తున్నాము.
ఇదం అథర్వశీర్షం యో అధీతే,
స పంచాథర్వణశీర్ష (పంచ - అథర్వణశీర్ష)
జపఫలం అవాప్నోతి।
ఈ ‘అథర్వశీర్షము’ ఎవరైతే అధ్యయనము చేసి అంతరార్థమును ఎరుగుచున్నారో - అట్టివారు ‘పంచాథర్వణశీర్ష జపము’ను చేసిన ఫలమును పొందగలరు.
ఇదం అథర్వశీర్షం జ్ఞాత్వా
యో అర్చాగ్ం స్థాపయతి,
శతలక్షం ప్రజప్త్వా-పి,
సో అర్చాసిద్ధిం చ విందతి।।
ఈ అథర్వ శీర్షము’ యొక్క పరమార్థమును తెలుసుకొని ఎవరైతే ఆ దేవదేవి యొక్క అర్చనా ప్రతిమను (విగ్రహమును) స్థాపించి అర్చిస్తారో, వారు శత లక్షసార్లు జపించినవానితో సమానముగా ‘అర్చనసిద్ధి’ని పొంది ఆనందరూపి అగు దేవదేవితో మమేకమై ఆనందించగలరు.
శతమ్ అష్టోత్తరం చ అస్యాః
పురశ్చర్యావిధిః స్మృతః।
దశవారం పఠేద్యస్తు
సద్యః పాపైః ప్రముచ్యతే।
మహాదుర్గాణి తరతి
మహాదేవ్యాః ప్రసాదతః।
ఈ అథర్వ శీర్షదేవీ ఉపనిషత్ - 108సార్లు పునశ్చరణ విధిగా (108 సార్లు అర్థ పూర్వకంగా చదవటము) - ఉపాసనకై ఉపాయముగా చెప్పబడుతోంది.
10 సార్లు ఈ ఉపనిషత్తును పఠనము చేసినవాడు సర్వపాపముల నుండి సద్యోముక్తుడు (Relieved here and now) కాగలడు.
ఈ ‘‘దేవ్యుపనిషత్’’ను ఉపాసించువారు మహాదేవి యొక్క కరుణచే భయానక మహాదుఃఖముల నుండి, పెద్దకష్టముల నుండి తరించగలరు.
ప్రాతః అధీయానో
రాత్రికృతం పాపం నాశయతి।
సాయమ్ అధీయానో
దివసకృతం పాపం నాశయతి।
ఉదయము యొక్క అధ్యయనముచే రాత్రి చేసిన పాపములు నశించగలవు.
సాయంకాలము చేయు అధ్యయనముచే పగలు చేసిన పాపముల దుష్టఫలములు సమసిపోగలవు.
తత్ సాయం ప్రాతః
ప్రయుంజానః పాపో అపాపో భవతి।
నిశీథే తురీయ సన్ధ్యాయాం
జప్త్వా వాక్ సిద్ధిః భవతి।
నూతన ప్రతిమాయాం జప్త్వా
దేవతా సాన్నిధ్యం భవతి।
ఉదయము సాయంకాలముల దేవ్యుపనిషత్ ఉపాసనలచే పాపి కూడా పాపదృష్టుల నుండి విడివడి ‘‘అపాపి’’ కాగలడు.
తురీయ సంధ్యయందు [6 am; 12 Noon; 6 pm; 12 Midnight లయందు] దేవీ మహాత్మ్యము చెప్పుకొంటూ ఈ ఉపనిషత్ జపించటం చేత ‘వాక్‌సిద్ధి’ లభించగలదు. వాక్కు శుద్ధి పొందగలదు.
క్రొత్తగా తయారైన ప్రతిమకు ఎదురుగా జపించటం చేత శ్రీ దేవీ దేవతా సాన్నిధ్యము పొందగలరు.
ప్రాణప్రతిష్ఠాయాం జప్త్వా
ప్రాణానాం ప్రతిష్ఠా భవతి।
సాన్నిధ్యము పొందగలరు.
దేవీ ప్రతిమ (లేక) విగ్రహము వద్ద ‘ప్రాణప్రతిష్ఠ’ సందర్భములో ఈ దేవీ ఉపనిషత్తును పారాయణము చేస్తే, విగ్రహము (లేక) ప్రతిమయందు దేవీ ప్రాణప్రతిష్ఠ దిగ్విజయంగా జరుగగలదు. మహత్తరమగు మహిమగల విగ్రహము రూపొందగలదు.
భౌమ అశ్విన్యాం మహాదేవీ
సన్నిధౌ జప్త్వా,
మహా మృత్యుం తరతి। -
- య ఏవం వేద।।
భౌమవారము (మంగళవారము), అశ్వనీ నక్షత్రము (మొదలైన) పరవడి రోజులలో ప్రారంభించి - ఈ ఉపనిషత్ తాత్పర్యమును ఎరుగుచూ ఎలుగెత్తి మహాదేవీ విగ్రహము సమక్షములో జపించటంచేత, అట్టివాడు ‘మహామృత్యువు’ నుండి తరించగలడు.

🙏 ఇతి శ్రీ దేవ్యుపనిషత్।।
(అథర్వశ్రుతి - అథర్వశీర్షము)
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।


అధర్వణ వేదాంతర్గత

10     దేవి ఉపనిషత్

(శ్రీ దుర్గాదేవ్యుపనిషత్)

అధ్యయన పుష్పము

ఈ దేవ్యుపనిషత్ తెలియజేయు ఆత్మ సుఖాకృతి రూపమగు ‘‘బ్రహ్మానంద-రామచంద్రపదము’’ లేక ‘‘ఆత్మారామ పదము’’ను సేవించుచున్నాము.

- - -

ఒకానొకరోజు దేవతలు కైలాసంలో ఏకాంతంగా ఉన్న శ్రీ దుర్గా జగన్మాతను సందర్శించి, ‘‘జగజ్జననీ! నమోనమః।’’ అని త్రిప్రదక్షిణములు చేసి పాదాభివందనములు సమర్పించారు.

- - -

దేవి : బిడ్డలారా! దేవతలారా! రండి. సుఖాసీనులు కండి. దేవలోకంలో మీరంతా సుఖముగా ఉన్నారు కదా?

దేవతలు : అమ్మా! అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. నీ కరుణ చేత మేమంతా స్వర్గలోకంలో సుఖంగా ఉన్నాము.

దేవి : సంతోషము. ఇంకేమి విశేషాలు? నన్ను దర్శించటానికి వచ్చిన ప్రత్యేకమైన కారణము ఏదైనా ఉన్నదా?

దేవతలు : మాతా! ఒక కారణము చేత మిమ్ములను దర్శించుకుంటున్నాము.

దేవి : ఏమిటా కారణము?

దేవతలు : మీరు శివభగవానుని అర్ధాంగి అని, ‘‘అర్థభాగము చోటుచేసుకొని, శివానందమును ఆస్వాదించుచున్నారు’’ అని - పురాణ ద్రష్టలు వర్ణిస్తున్నారు.

సతీదేవి, పార్వతి మొదలైన మీ జన్మల గురించి కొందరు వర్ణిస్తూ మిమ్ములను ఉపాసిస్తున్నారు.

ప్రకృతి స్వరూపిణిగా మిమ్ములను కొందరు భావిస్తున్నారు.

సమస్త సృష్టికి జననివని కొందరు అంటున్నారు.

కొందరు దుర్గాసురాది రాక్షస సంహారివని, ‘కాళి’గా భయంకరాకారివని అంటూ ఉంటారు కూడా!

‘‘వరప్రదాతవు’’ అని కొందరు, ‘‘శివునికి జేర్చు జగద్గురువు’’ అని మరికొందరు, నామరూపముల కావల గల ‘‘ఆదిశక్తి’’-వని ఇంకొందరు, వాస్తవానికి నీవు రూపరహితవని, ఈ జగత్తంతా మీరూపమేనని, - అంటూ ఉంటారు.

ఆయా ఉపాసకులచే దేవివగు మీ గురించి ఈఈ విధాలుగా అభివర్ణించబడుచూ ఉన్నది.

కొందరైతే ‘‘యోగమయి’’వని, ‘‘అవ్యక్త’’వని ‘పరాత్పర’ అని, సమస్తము నీవేనని - ఈ విధంగా అనేక విధాలుగా స్తుతిస్తున్నారు.

అమ్మా! నీవు అసలు ఎవరు? రూపరహితవా? రూపసహితవా? గుణివా? నిర్గుణివా? నీ యొక్క అసలైన వాస్తవమైన స్వరూప-స్వభావ తత్త్వములు ఎట్టివి?

ఈ విషయము మీ వద్దనే శ్రవణం చేయాలని మేమంతా జగన్మాతవగు మిమ్ములను సమీపించాము.

దయతో వివరించమని అర్థిస్తున్నాము.

– దుర్గాదేవి ఉవాచ –

దుర్గా దేవి

దేవి : ఓహో! నా వాస్తవ తత్త్వమేమిటో తెలుసుకోవాలని ఉత్సాహపడుచున్నారా? మంచిది. ఓ దేవతలారా! మీరంతా దైవీ సంపత్తి కలవారు. మీ రహస్యకర్మలచే లోకములను ప్రేమగా సేవించువారు. భక్తితో నన్ను సమీపించుచున్నారు. అందుచేత మీరు అడిగిన ప్రశ్నకు తప్పక సమాధానము చెపుతాను.

బిడ్డలారా! శ్రద్ధగా, ఆసక్తిగా, అధ్యయన దృష్టితో వినండి.

అహం బ్రహ్మ స్వరూపిణీ।

చతుర్వేదములు దేనిని ‘బ్రహ్మము’ అని అభివర్ణించి చెప్పుచున్నాయో, అట్టి బ్రహ్మమే నేను.

మత్తశ్చ సంప్రవర్తతే ప్రకృతి - పురుషాత్మకం జగత్।

ఈ దృశ్యము కనిపిస్తున్న - పురుషుడు (The Experiencer) - ప్రకృతి (All that being experienced), (లేక) దేహి - దేహము, (లేక) క్షేత్రజ్ఞుడు-క్షేత్రము = రెండూ కూడా/(అనగా)/(ప్రకృతి- పురుషాత్మకమైనదంతా) - నావలననే ప్రవర్తించుచున్నది. దీపపు కాంతితో వస్తువులు మెరుస్తున్నట్లు-నా ఉనికిచే అవి చేతనమగుచున్నాయి. (ప్రకృతి = The functions; పురుషుడు = The functioner).

అహమానంద - అనానందౌ।

ఈ జగత్ సృష్టి - స్థితి - లయ వ్యవహారమంతా కూడా నా చేతనే, నా వినోదము కొరకై కల్పించుకొనబడుతోంది. నేను సహజముగానే ఆనంద స్వరూపిణిని. ఆనందమునకు కూడా సాక్షిని కాబట్టి అనానంద స్వరూపిణిని కూడా.

‘‘ఇది ఆనందము - ఇది దుఃఖము’’ - అనునది నా క్రీడా వినోదాంతర్గత విశేషాలు మాత్రమే. నాటక రచయిత నుండి పాత్రలు, వాటి వాటి సుఖదుఃఖాలు రచించబడినవైనప్పటికీ కూడా, పాత్రల యొక్క గుణములు రచయితకు చెందినవై ఉండవు కదా! ఈ జగత్తులన్నీ నా కల్పనయే అయిఉండి కూడా, ఇందులో విశేషములేవీ నా యొక్క ధర్మముగాని, స్వభావముగాని కాదు.

‘‘శూన్యన్చ - అశూన్యన్చ।’’

ఒక కథ వ్రాసేవాడు కథలోని పాత్రలు, సంఘటనలు, పరస్పర సంబంధములు - ఆతని కథా రచనా కల్పన/భావన నుండియే వెలువడుచూ ఉంటాయి. కానీ ఆ పాత్రలు ఆతని యందు లేవు. ఆతడు పాత్రలలోను లేడు.

అట్లాగే, ఈ బ్రహ్మాండములన్నీ నానుండే వెలువడుచున్నప్పటికీ, ఇందలి లోకములు, లోకపాలకులు, లోకపాలితులు మొదలైనవన్నీ ‘‘ఆత్మస్వరూపిణి’’, ‘‘బ్రాహ్మీస్వరూపిణి’’నగు నాయందు లేనేలేవు. అందుచేత నా స్వరూపమును ‘శూన్యము’ అని వర్ణిస్తున్నారు.

అయితే ఈ బ్రహ్మాండములన్నీ నా నుండే వెలువడచుండగా నేను శూన్యమునెట్లా అవుతాను?. కాబట్టి - పూర్ణస్వరూపిణిని కూడా! అందుచేత ‘‘అశూన్యస్వరూపిణి’’ - అని కూడా చెప్పబడుచున్నాను.

ఎందుకు వెలువడుచున్నాయి?

ఈ ప్రకృతి, పురుషుడు, జీవులు వారివారి అంతరంగ బహిరంగములు - ఇవన్నీ కూడా ‘‘స్వయముగా సహజముగా బ్రహ్మమే’’ అయి ఉన్న నా నుండే వెలువడుచున్నాయి. ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానము వినండి.

సమాధానము: ‘‘అది నా క్రీడ ఆనందము, వినోదము’’ - అనబడుతోంది. అందుచేత ‘‘నీవు ఎవరు?’’ అను ప్రశ్నకు ‘‘నేను ఆనంద స్వరూపిణిని’’.. అనునది సమాధానమగుచున్నది.

ఇదంతా నా ‘ఇష్టము’లో నుండే బయల్వెడలుతోంది. కాబట్టి, ‘కామాక్షీ’ - అని చెప్పుకోబడుచున్నాను.

అయితే, అట్టి ఆనందమునకు మునుముందే నేను ‘ఆనందించువాడు’ - రూపమున ఉండి ఉండాలి కదా!’’ ‘‘ఆనందము నాది! నేను ఆనందమునకు పరమై ఉన్నాను’’ అనునది కూడా యుక్తియుక్తమే. అందుచేత నేను ‘‘అనానందస్వరూపిణి’’ని కూడా!

‘‘అహం విజ్ఞానా! అవిజ్ఞానే!’’

మరి నేను తెలియబడేది ఎట్లా? ఈ తెలియబడే సమస్తము నాయొక్క రూపమే. అనగా, మీకు దృశ్యముగా ఇంద్రియములకు తెలియబడేదంతా నేనే! ఈ విధంగా సమస్త జీవులకు తెలియబడుచూనే ఉన్నాను. కాబట్టి ‘‘విజ్ఞానా!’’ అని పిలువబడుచున్నాను.

అయితే ఒకడు వ్రాసిన నవల చదివి ఈ మాత్రం చేత-‘‘ఆ రచయిత నాకు తెలుసు’’ అనునది కొంతవరకే నిజము. ఇది- యుక్తియుక్తమే అయినప్పటికీ, నవలలోని విషయాలు ‘‘రచయిత యొక్క స్వభావము ఇటువంటిది’’-అని నిర్ణయించగలవా? లేదు. అట్లాగే, ఈ సృష్టి అంతా నా స్వరూపమే అయినప్పటికీ (‘దేహము’నకు ‘దేహి’ వలె) దీనికి ఆవల బ్రహ్మము రూపముగా వెలుగొందుచున్న నేను సృష్టియొక్క సంగతి-సందర్భములచే తెలియబడజాలను. ఇంద్రియములకు విషయమే కాను. అందుచేత ‘‘అవిజ్ఞానే!’’-అనబడుచున్నాను.

అయితే బ్రహ్మము గురించిన జ్ఞానముచే నా యొక్క (సమస్తమును ఆక్రమించుకొనియున్న) ఉనికి (సత్) రూపము విశ్వేశ్వరీ దృష్టిచే (Common sense) స్వానుభవముగా లభిస్తూనే ఉన్నాను. అందుచేత నేను విజ్ఞాతను, అవిజ్ఞాతను కూడా!

సృష్టికి రూపము ఉన్నప్పటికీ, నేను రూపరహితను.

‘‘అహం బ్రహ్మా! బ్రహ్మణీ వేదితవ్యే!’’

ఈ జగత్ కల్పనను, కర్తను నేనే. కనుక సృష్టికర్తయగు బ్రహ్మదేవుడను నేనే।

అంతేకాదు. ‘‘(1) తెలుసుకొంటూ ఉన్నది, (2) తెలియబడుచూ ఉన్నది’’ - ఈ రెండూ కూడా నేనే! ఈ విధంగా జగత్తుగా తెలుసుకొంటున్నది, జగత్తుగా తెలియబడుచున్నది, ‘బ్రహ్మము’గా తెలుసుకొంటున్నది, బ్రహ్మముగా తెలియబడుచున్నది కూడా - అందరిలో ‘నేను’గా ఉన్న నేనే!

ఇతి హ అథర్వ శ్రుతిః ।

ఈ విధంగా నేను చెప్పినదంతా ‘‘అథర్వశ్రుతి’’ అనే పేరుతో నా గురించి బ్రహ్మజ్ఞుల సభలో, (లేక) తత్త్వవేత్తల పరస్పర సంభాషణలలో సశాస్త్రీయంగా సిద్ధాంతీకరించబడుచూనే ఉన్నది.

ఓ దేవతలారా! ఇంకా కూడా వినండి.

అహం పంచభూతాని। అపంచ భూతాని।

ఋగ్వేదము, తదితర వేదములు కూడా ‘‘ఆత్మాత్ ఆకాశమ్। ఆకాశాత్ వాయుః। వాయోరగ్నిః। అగ్నిః - ఆపః। ఆపః పృథ్వి’’ - అని చెప్పుచూ, - ‘‘మమాత్మానంద స్వరూపము నుండే పంచభూతములు బయల్వెడలుచున్నాయి’’ - అవి సుస్పష్టపరచుచున్నాయి కూడా।

ఈ విధంగా నా యొక్క ‘‘బ్రాహ్మీ’’ లేక ‘‘ఆత్మ’’ స్వరూపము నుండే పంచభూతములు వెలువడుచున్నాయి. విశ్వముగా చెప్పబడేది పంచభూతాత్మికమే కాబట్టి, ఇదంతా నా నుండే బయల్వెడలుచున్నదగుచున్నది. అందుచేత ‘‘పంచభూతాత్మికా!’’ అని వర్ణించబడుచున్నాను. ఈవిధంగా, ఈ సమస్త పాంచభౌతిక దృశ్య-దృశ్యానుభవమంతా నాయొక్క స్వస్వరూపమునకు ‘అనన్యము’.

ఈ జగత్తులన్నీ నా పాంచభౌతాత్మిక-కళా విశేషమే అయి ఉండి, (కళాకారుడు కళకు వేరుగా ఉండి ఉన్న తీరుగా),-ఈ సమస్తమునకు వేరుగా, పరముగా, నియామకురాలిగా ఉండి ఉన్నాను. అందుచేత నేను ‘అపంచ భూతాత్మిక’ను కూడా! చిత్రకళ (Painiting) - చిత్ర కళాకారుడు (Painter Artist) వలె ఉభయము నా పట్ల యుక్తియుక్తమే. (The Artist is different from the pieces of Art. But the Piece of Art is the creation of the Artist - himself)

‘‘అహం అఖిలం జగత్!’’

కలలో కనిపించేదంతా కూడా కల తనదైనవాని కళాచైతన్య- భావనావిశేషమే కదా! భావన భావించువానికంటే వేరుకాదు. నాటకంలోని పాత్రలన్నీ నాటక రచయితకు వేరుకాదు. ఈ విధంగా ఈ సమస్త జగత్తు నేనే! అందుచేత ‘‘జగదంబికే, జగత్‌మాతృకే, జగదీశ్వరీ’’ అని కూడా చెప్పబడుచున్నాను.

ఇంకా కూడా, పరబ్రహ్మస్వరూపిణినగు నేను ‘‘జగజ్జనని। లోకబాంధవి। బాలాత్రిపురసుందరి’’… అని కూడా స్తుతించబడుచున్నాను. ఈ విధంగా ఈ జగత్తుగా కనిపిస్తున్నదంతా నేనే। స్వకీయ బాలాలీలా వినోదమే।

‘‘వేదోఽహమ్। అవేదోఽహమ్’’

[ ఒకని యొక్క (సోమరాజు అనబడే వాని యొక్క) ‘దేహము’ - కంటికి కనిపిస్తోంది. ‘దేహి’ కంటికి కనిపిస్తున్నాడా? లేదు. ఆ రెండూ కలిపియే ‘సోమరాజు’ అనువానిగా చూస్తున్నాము కదా! ]

(అట్లాగే) పంచేంద్రియములకు తెలియబడేదంతా (That being known) నేనే! పంచేంద్రియములకు తెలియబడక - పంచేంద్రియముల ద్వారా తెలుసుకొంటూ ఉన్నరూపము (The Knonwer) కూడా నేనే! ‘‘తెలుసుకొంటూ ఉన్నవానిని తెలుసుకొనుచున్నది’’ కూడా నేనే! తెలియబడనిది నేనే! (I am the knower of all that being known. I am all that being not known even).

‘‘విద్యాహమ్-అవిద్యాహమ్’’।

ఆత్మస్వరూపిణినగు నా యొక్క సృష్టి కల్పనా వినోదమే ఇదంతా కూడా! (నాటక రచయితయే పండితుని, పామరుని పాత్రలు కల్పించు తీరుగా) నా కల్పనయగు ఈ జగత్తులో విద్యాస్వరూపము, అవిద్యాస్వరూపము కూడా నావే! అందుచేత ‘‘విద్యావిద్యా స్వరూపిణీ’’ - అని వర్ణించబడుచున్నాను.

‘‘అజాహమ్ - అనజాహమ్’’

(అజోపిసన్, అవ్యయాత్మా భూతానామ్ ఈశ్వరోపిసన్)। చక్రవర్తి ఉన్నత సింహాసనముపై సుఖాసీనుడై ఉండగా ఆతనికి ఎదురుగా జనులు వచ్చి, విన్నపములు సమర్పించి వెళ్లు తీరుగా నా సమక్షంలో దేహములన్నీ వస్తూ, పోతూ ఉంటున్నాయి. (దేహేజాతే న జాతోఽసి। దేహే నష్టే న నశ్యసి - అనియోగవాసిష్ఠములో వసిష్ఠమహర్షి శ్రీరామునికి చెప్పుతీరుగా).

నేను దేహములతోగాని, లోకములతోగాని పుట్టను. అందుచేత నేను ‘అజ’ను. ‘జన్మించటము’ అనే ధర్మము బ్రహ్మమగు నాకు లేనేలేదు.
అయితే ఈ జన్మించినట్లు కనిపించేదంతా నాకు చెందినవే! నాకు వేరై ఎక్కడా ఏదీ జనించదు-నశించదు. అనన్యను!

‘‘ఈ సమస్త జీవులుగా జన్మిస్తున్నదంతా ఆత్మయే’’ అనునది యుక్తియుక్తమే కాబట్టి ‘అనజా’ కూడా అయి ఉన్నాను.

‘‘అధశ్చ - ఊర్థ్వశ్చ - తిర్యక్ చ అహమ్।’’

(ఒకడు తన ఊహలో ఒక గొప్ప ‘‘దృశ్యము’’ను లేక ‘‘నగరము’’ను, లేక ‘‘ఇల్లు’’ను కల్పించుకొని చూస్తూ ఉన్నాడనుకోండి. ఇప్పుడు - ఆ ఊహలోని నగరములో (లేక) ఇంటిలో క్రింద, పైన, వెనుక, ముందు ఉన్నది ఆతని ఊహయేకదా! అట్లాగే) ఈ సమస్త దృశ్య జగత్తు నా యొక్క భావనా రూపమే కాబట్టి, ఇద్దాని యొక్క క్రింద - పైన - ప్రక్కల అన్ని వైపులా ఏర్పడి ఉన్నది నేనే!

(బంగారపు ఆభరణములలో లోపల, బయట, ప్రక్కలా-బంగారమే అయి ఉన్నట్లు) - ఈ జగత్తుకు పది దిక్కులా ఏర్పడి ఉన్నది నేనే!

[ ఒక మహారాజు తన ఉద్యానవములో మందిమార్బలంతో ఆంతరంగికులతో విహరించుతీరుగా (Just like a king enjoying a trip in his own garden along with own people)] - నేను కల్పించుకొన్న ‘విశ్వము’ అనే ఉద్యానవనములో - నేను ఏకాదశ (11) రుద్రులతోను, అష్ట (8) వసువులతోను, ద్వాదశ (12), ఆదిత్యులతోను, విశ్వేదేవతలతోను వినోదినై సంచారములు చేస్తూ ఉన్నాను. అట్టి సమస్త రూపములుగా - అగుచున్నది అయిఉన్నది నేనే।

ధారణ

మిత్ర (సూర్య) - వరుణులను, ఇంద్ర - అగ్నులను, అశ్వనీ దేవతలను, సోముని (చంద్రుని), త్వష్టను (విశ్వకర్మ-ద్వాదశాదిత్యులలో ఒకడు), పూషను, భగుని (ద్వాదశాదీత్యులలో ఒకడు, వెలుగురూపుడు), విష్ణువును, ఉరుక్రముని (వామనుని), విష్ణు అవతారములను, సృష్టికర్తయగు బ్రహ్మను, (ప్రజాభిమాని అగు) ప్రజాపతిని, వారందరినీ ‘‘ధారణ’’ (Holding) చేయుచున్నది. నేనే ఆభరణములుగా ధరించుచున్నది నేనే. వారంతా నా రూపములే। నేనే!

హవిష్మతే।

యజ్ఞ యాగములు నిర్వర్తించు యజమానికి యజ్ఞఫలము ప్రసాదిస్తున్న హవిష్మంతను (యజ్ఞపురుషుడను) నేనే. యజ్ఞద్రవ్యము కూడా నా నుండే లభిస్తోంది. ప్రకృతి రూపినిగా జీవులందరికీ కర్మఫల ప్రసాదిని అయి జగత్ పాలన నిర్వర్తిస్తూ ఉన్నాను. సమస్త కార్యముల కార్యకర్తను, కార్యవిధిని, ఫలభోక్తను కూడా నేనే। (I am the Producer, Director, Actor and also spectator for the entire work of THE CREATION).

నాయకి।

నేనే జగత్తులు అనే సేనకు నాయకురాలిని. వివిధ ‘వస్తువులు’ అనబడు వేరుతత్త్వములను ఒకచోటికి జేర్చి క్రియాశీలకము చేస్తున్న ‘సంగమని’. (Like a Mechanic who assembles the Machine that runs the Manufacturing). పిత్రులోక దేవతలను (The Divinities that maintain structures of Badies in the Mother’s womb and also take charge of the maintainence as well as and of Bodies), దేహ పరిపోషకులను - మూర్ధమున (నుదుటన) ధరిస్తున్నదానను. సప్త సముద్రములను గర్భమున దాల్చుచున్నదానను.

అట్టి నా యొక్క ‘‘మహాదేవీ తత్త్వము’’ ఎరిగినవారు దేవీస్వరూపులు కాగలరు.

ఈవిధంగా మృదుమధురంగా పలికి జగన్మాత అగు దుర్గాదేవి మాట్లాడుచూ, మాట్లాడుచూనే - అంతర్థానమైనారు.

‘‘దేవతల దేవీస్తుతులు’’

దేవతలు : హే దేవీ! మహాదేవీ! శివా! సతతం నమః। ఓ ప్రకృతి స్వరూపిణీ। రహస్య రూపిణివై ఈ దేహములను, ఈ సృష్టిలోని సమస్తమును సంరక్షిస్తూ ఉన్న భద్రా! సర్వమునకు నియామకురాలా! ప్రణతులు సమర్పిస్తున్నామమ్మా। నమో నమో నమో నమః।।

అగ్నివలె స్వయం ప్రకాశకమైనది, తపశ్శక్తిచే సమస్తము వెలిగించునది, దుష్టకర్మఫలములను ఇచ్చి శిక్షించునది, (వైరోచని) అగు శ్రీ దుర్గాదేవిని - మాలోని, తమస్సు (Darkness, Ignorance)ను తొలగించుటకై - శరణువేడుచున్నాము. స్తుతించుచున్నాము. వినతులు (Our Requests) సమర్పిస్తున్నాము.

ఓ దేవీ! నీ వాక్కు నుండి వ్యష్టిధారులమగు (Individual Forms) మేమంతా (లేక) జీవులమగు మేము జనించుచున్నాము. ఈ విశ్వమంతా నీ రూపమే! సమస్త జీవులు నీ ప్రదర్శనమే. నీవు గోవుల వంటి జీవులను పాలించు దేవివి, గోపాలవు! సా నో మంద్రేషమ్ ఊర్జం దుహానా ధేనుః వాక్ అస్మాన్ ఉపసుష్టు తైతు। నీ గురించిన మంద్రమగు వేదఋక్కుల గానములు - మహత్ వాక్ ప్రవాహమై మాయందు వేంచేసి ఉండునుగాక! నీ తత్త్వము మా బుద్ధికి విశదమగు గాక।
మాలో వేంచేసియే ఉన్న నీవు మా అనుభూతికి లభించెదవు గాక।

నీవు కాళరాత్రీ దేవివి! ఈ సమస్తము లయముకాగా, ఏ ‘‘నిర్విషయ కేవలము’’ మాత్రమే శేషించి ఉంటుందో - అదియే నీ ‘కాళరాత్రీ స్వరూపము’గా పౌరాణిక వర్ణితము. జగత్ రహితవు, విశ్వరహితవు, ఏక స్వరూపిణివి కాబట్టి ‘‘కాళరాత్రీదేవి’’ - అని కవులచే ప్రసగించబడుచున్నావు.

బ్రహ్మస్తుతాం : సృష్టికర్త అగు బ్రహ్మచే స్తుతింపబడుదానవు. నీ మానసపుత్రుడే బ్రహ్మ।
వైష్ణవీం : సమస్తముగా సర్వత్రా విస్తరించి ఉన్నట్టిదానవు. విష్ణురూపిణివై సమస్తముగా ప్రదర్శనమగుచున్నావు.
స్కందమాతరమ్ : సమస్త దైవీప్రకృతికి, దైవీ సంపత్తికి, దేవతలకు సేనానాయకుడగు స్కందుని - పుత్రునిగా కని, దైవీ సంపత్తికి అధినాయకునిగా ప్రసాదించినదానవు (కుమారస్వామికి తల్లివి).
సరస్వతీదేవివి : ‘‘సత్’’ (కేవలమగు ఉనికి, The Absolute presence) అను-రసస్వరూపిణీదేవివి. (సత్-రసత్-వతి).
అదితిం : దేవతలకు తల్లి అగు అదితిని కన్నదానవు. (అత్-ఇతి = అదితి - ‘‘న దత్ ఇతి’’ = (Beyond all this being seen with physical eyes). అదితిగా ఉన్నది నీ ప్రదర్శనమే.
దక్ష దుహితరం : దక్ష ప్రజాపతి కుమార్తెగా అవతరించిన దాక్షాయణీదేవివి. సతీదేవివి.
పావనాగ్ం : తలచినంత మాత్రం చేతనే వేంచేసి - మాహృదయములను పావనము చేయుదానవు.
శివాం : శివుని అర్ధాంగిగా ఉన్నదానవు. సమస్త జీవులకు శుభప్రదాతవు. ఇహ-పరస్వరూపిణివి।

అట్టి దేవదేవివగు నీకు సమస్కరిస్తున్నామమ్మా! పాహిమాం। రక్షమాం!

మహాలక్ష్మీం చ విద్మహే సర్వసిద్ధాశ్చ ధీమహి, తన్నో దేవీ ప్రచోదయాత్।।

ఆ దేవీ మహాలక్ష్మి యొక్క సర్వసిద్ధిత్వమును తెలుసుకొంటున్నాము. ఈ సమస్తము ఆ దేవియొక్క సిరి-సంపదలే. అట్టి దేవి మాయందు తన యొక్క సర్వాత్మకమగు, కేవలమగు - దేవీతత్త్వమును ప్రేరేపించును గాక!

అమ్మా! దేవతల తల్లి అగు అదితి నీకు కూతురు. దక్ష ప్రజాపతికి కుమార్తెగా సతీదేవివై అవతరించినదానవు. అట్టి నీ దర్శనముచే మేము భద్రులము (Safe) అగుచున్నాము. అమృత రూపులము అగుచున్నాము.

కామోయోనిః : కాముని (మన్మథుని) గర్భమున కలదానవు. ఈ సమస్తము నీ ఇచ్ఛా స్వరూపమే కాబట్టి ‘కామకల’వు.
వజ్రపాణియగు కుమారస్వామిని మాకు రక్షగా ప్రసాదించినదానవు. వాయువు, మేఘము, ఇంద్రుడు, గుహుడు (కుమారస్వామి) నీ నుండి బయలుదేరిన కల్పనా విశేషములే. నీ యొక్క మాయాకోశ విశేషములే ఈ సమస్తము కూడా!

విశ్వమాతా ఆది విద్యాస్వరూపిణీ! ఓంకారస్వరూపిణీ! ఇదంతా నీ ఆత్మశక్తియే। ఈ విశ్వమంతా నీయొక్క మోహన స్వరూపమైయున్న విశ్వమోహినీ! పాశ (Relatedness), అంకుశ (for Punishing the mental Ills), ధనుర్బాణములను (To Protect us all) ధరించిన ఆది శక్తీ! దేవీ! నిన్ను స్మరిస్తూ శరణు వేడుచున్నాము! పాశ అంకుశ బాణధరీ దేవీ! రక్షమాం! మాలోని ఆసురీ స్వభావములను తొలగించి, నిన్ను చేరుటకై ‘దైవీ సంపద’ను పరిరక్షించండి!

ఏషా శ్రీ మహావిద్యా। య ఏవం వేద, స శోకం తరతి। ఎవ్వరైతే మీ గురించిన ఈ మహావిద్యను తెలుసుకొని, మీ పాదపద్మములను ఆశ్రయిస్తారో, అట్టివారు సమస్త శోకముల నుండి తరించగలరు.

భగవతీ-జగద్రక్షకీ। భవతీ!

సమస్తమును వెలిగించు (Enlightening) ఓ భగవతీ! సమస్తము నీవే అయి ఉన్న ఓ భవతీ! మాతా! నీకు నమస్కరిస్తున్నాము. మమ్ములను దశ దిక్కుల నుండి (అన్ని వైపుల నుండి) కాపాడెదవు గాక! ‘‘సమస్తముగా ఉన్నది నీవే’’ - కాబట్టి ‘భవతి’వి.

మాయొక్క భవబంధములు తొలగిపోయి, భవతివి (సమస్తము అయి ఉన్నదానివి) అగు నీ పాదపద్మములు మేము ఆశ్రయించెదము గాక।

స ఏష అష్టవసవః

అట్టి ఈ దేవదేవియే - ప్రజాపతి సంతానమగు (ధరుడు, ధ్రువుడు, సోముడు, అహుడు, అనిలుడు, అగ్ని, ప్రత్యూషుడు, ప్రభాసుడు అను పేర్లు గల) రహస్య సృష్ట్యంతర్గత శక్తులగు) - ‘‘అష్టవసువులు’’గా ఉన్నది.

స ఏష ఏకాదశ రుద్రః। ఆ దేవియే ఏకాదశ రుద్రుల రూపము ధరించి సమస్తమును ఉత్తేజ పరచుచున్నది.

స ఏష ద్వాదశ ఆదిత్యాః। ఈ జగజ్జనినియే ద్వాదశ (12) ఆదిత్యుల రూపముగా వెలుగొందుచున్నది.

స ఏష విశ్వేదేవాః। ఆ లోకమాతయే విశ్వేదేవత (The Genetic Engineer of the Whole World) అయి సమస్తమును శుభకరము చేయుచున్నది.

సోమ పా-అసోమపాశ్చ। ఆ లోక బాంధవియే సోమప అసోమపములు (సోమపానము చేయు యజ్ఞకర్త, అసోమపానులగు యాజ్ఞీకులు కూడా). సృష్టి యజ్ఞము చేయువారు, చేయించువారు (ఆధ్వర్యులు) ఆ దుర్గా జననియే।

స ఏష యాతుధానా అసురా రక్షాగ్ంసి పిశాచా యక్షాః సిద్ధాః। ఆ లోకరచయిత యగు దేవియే - యాతుధానులు (ఒక అసురజాతి)గా, (మృత్యుదేవుని భార్య అగు నిరృతి)గా, అసురులుగా, రాక్షసులుగా, పిశాచులుగా, యక్షులుగా, సిద్ధులుగా కూడా సృష్టికల్పనయందు ప్రదర్శనమగుచున్నది. (నవలలోని ప్రతినాయకుడు కూడా నవలా రచయితయొక్క కల్పనా చమత్కారమే అయి ఉన్నట్లు).

స ఏషా సత్త్వ రజః తమాగ్ంసి : ఆ విశ్వస్వరూపిణియే సత్త్వ రజో తమో త్రిగుణ రూప నాటకీయ రస చమత్కారమై, జగన్నాటక ప్రదర్శనకు కారణభూతమగుచున్నది. త్రిగుణాతీత అయి, త్రిగుణధారణచే ‘సృష్టి’ అనే కథాగమనమునకు రచయిత ఈ దుర్గాదేవియే।

స ఏష ప్రజాపతి, ఇంద్ర, మానవః। ఆ జగదంబయే సృష్టికర్తయగు ప్రజాపతిగాను, ఇంద్రియాధిపతి - త్రిలోకాధిపతియగు ఇంద్రునిగాను, మానవులుగాను, సమస్త జీవులుగాను ఏర్పడి ఉన్నది.

స ఏషా గ్రహ నక్షత్ర జ్యోతీగ్ంషి। గ్రహ, నక్షత్రములతోను, పాలపుంతలతోను కూడిన జ్యోతిర్మండలము ఆ దుర్గాదేవి యొక్క విశ్వప్రదర్శినీ -స్వయం కల్పిత వినోద చమత్కారమే।

స ఏష కలా కాష్ఠాది కాల రూపిణీ। కల్పన - కాష్ఠము - కాలము అమ్మరూపములే. అట్టి దేవికి నిత్యప్రణామములు సమర్పిస్తున్నాము.

ఈ జననియే :-
❋ ఆధి భౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మికమైన సమస్త తాపములు నివారించగలిగినది.
❋ సమస్త జీవులకు భుక్తి ముక్తి ప్రదాయని - అయి ఉన్నది.
❋ అంతులేని విజయములు ప్రసాదించునది.
❋ కేవలమగు శుద్ధాత్మ స్వరూపిణి.
❋ జీవులందరికీ శరణు ప్రసాదించునది.
❋ శివత్వమును ప్రసాదించునది. ఈ జీవుని శివ స్వరూపముగా తీర్చిదిద్దగలిగినది.

ఓ శివాదేవీ! నమో నమో నమో నమః

★ ‘ఈం’ వియత్ (ఆకాశ) స్వరూపిణియై సమస్త విశ్వమునకు ‘ఆది’ అయి ఉన్నది.
★ అగ్ని, సూర్యుడు స్వరూపములచే వీతహోత్రీ దేవిగా సంప్రదర్శనమౌతోంది.
★ ఈ దుర్గాదేవి - అర్ధ చంద్రుని కిరీటమునందు అలంకారముగా ధరించునట్టిది.
★ ఈ జగన్మాతయే - సమస్త జీవుల బీజరూపము.
★ ఈ జగదంబికయే - సర్వార్ధములు ప్రసాదించునది.
అట్టి దేవదేవికి నమస్కరిస్తున్నాము.

నవార్ణ మంత్రము

[ ‘‘(ఓం) ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే’’ ]

ఈ బీజాక్షరపూర్వక దేవీనవార్ణ మంత్రము ఉపాసించువారికి ఇది మహదానంద దాయకము. బంధముక్తిప్రదము.

శ్రీదేవి - బ్రాహ్మీ స్వరూపిణి. అష్టముఖి. ‘8’ ముఖములు కలది. అష్టముఖములతో కూడిననట్టిది. (మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములతోను, బ్రహ్మరంధ్ర - సహస్రార స్థానములతోను ప్రదర్శనమగునది. పంచభూత మనో బుద్ధి చిత్త ముఖములు కలది).

సూర్య - వామ (దేవీ) - శ్రోత్ర బిందు సమన్వితము అగు మాత యొక్క తృతీయ రూపమును నారాయణునితో కూడుకొనియున్నట్టిది. నారాయణీరూపము.

వాయువు అధారముగా కలిగినట్టి కుండలినీశక్తిరూపము.

అష్టముఖములతో కూడిన సాలంకృత విగ్రహము. ‘‘ఐం-హ్రీం-కీం చాముండాయైవిచ్చె’’ అను మంత్రోపాసనచే ఉపాసించబడుగాక! అది ఆత్మానంద- మహదానంద దాయకమై సిద్ధించగలదు.

దేవియొక్క ఉపాసనా రూప మననము

హృత్ పుండరీక మధ్యస్థాం ప్రాతః సూర్య సమప్రభామ్। ఈ జీవుని భౌతిక శరీరాంతర్గతంగా ‘‘హృదయము’’ అను తెల్లతామరపూవు. అట్టి హృదయ పద్మములోపల దేవి తేజోపుంజ సమన్వితమై చిత్-చైతన్య స్వరూపిణిగా ఉన్నది.

పాశ-అంకుశ ధరాగ్ం సౌమ్యాం, వరదాభయహస్తకామ్, త్రినేత్రాగ్ం రక్త వసనాం భక్త కామదుఘాం భజే। అట్టి దేవ దేవిని పాశ-అంకుశ ధారిణిగా, సౌమ్య రూపిణిగా, వరద - అభయ హస్తములతో (వరద ప్రదాత-భయము తొలగించునది) కూడిన రూపము కలదిగా - హృదయములో ఉపాసిస్తున్నాము. ఎవరి ఇచ్ఛానుసారము ఈ జగత్తు ప్రవర్తనశీలమగుచున్నదో - అట్టి ‘‘కామదుఘమ్’’నకు నమస్కారము.

ఓ దేవేశ్వరీ! దేవదేవేశ్వరీ! ఈ దృశ్యముతో మాకు ఏర్పడినట్టి అవినాభావ రూపమగు సంసార మహాభయమును మొదలంట్లా నశింపజేయు మాతా! గొప్ప దాటరాని నిరోధములను (unassailable hurdles) ప్రశమింపజేయుదానా! (one who subsides them). కరుణాసముద్ర రూపిణివగు మహాకారుణ్యరూపిణీ! నమో నమో నమో నమః।

అజ్ఞేయా! ఆదిశక్తి స్వరూపిణియగు ఈ దేవి యొక్క రూపము సృష్టికర్తయగు బ్రహ్మ మొదలైన వారికి కూడా తెలియబడనిది కనుక ‘అజ్ఞేయ’’।

అనంతా! ఈ దేవి యొక్క ఆద్యంతములు (The Begining and The Ending) తెలియబడజాలదు కాబట్టి ‘‘అనంత’’। దేహ మనో బుద్ధి చిత్త అహంకార - జ్ఞానాత్మలచే తను కాలము చేతను పరిమితము కానిది.

అలక్ష్యా! ‘ఇది’ అని ఆ దేవిరూపము గ్రహించలేము, పట్టుకోలేము కాబట్టి అలక్ష్యా! సమస్త జీవుల లక్ష్యములన్నీ ఆ దేవీ కల్పితమే! లక్ష్యము తనదైనవాడుగా ఉన్నది ఆ దేవీ దుర్గయే। (సర్వ భూతాశయ స్థితః)

అజా! : ఆత్మ స్వరూపిణియగు ఆదేవి యొక్క జననము ఎవ్వరికీ ‘ఇది’ అని లభించదు కాబట్టి ‘అజా’! ఆ దేహమువలె ఆ తల్లి జన్మ-కర్మలకు సంబంధించినదే కాదు.

ఏకా! ఏకమే అయి ఉండి సర్వత్రా ఏకానేకముగా వర్తిస్తూ ఉండటం చేత ‘ఏకా’! ఆ దేవ దేవీ - జీవాత్మగాను, ఈశ్వరుడుగాను, పరాత్మగాను విభజనము పొందటము లేదు.

అనేకా! : అనేకముగా కనిపిస్తూ ఉన్నదంతా దేవీరూపమే కాబట్టి ‘అనేకా’! ‘‘ఆత్మజ్ఞులు ఆ తల్లిని అనేకముగా కనిపిస్తూ, ఏకముగా అయినట్టిది’’ - అని దర్శిస్తున్నారు.

మననములన్నీ ఆ దేవినుండే జనిస్తున్నాయి. అందుచేత, ఆ దేవియే మంత్రములన్నిటి జనన స్థానము, అంతిమ సిద్ధిరూపము కూడా. కాబట్టి - ‘‘మాతృకాదేవి’’. సర్వశబ్దముల యొక్క జ్ఞానరూపిణి ఆ దేవియే. జ్ఞానులకు ఆదేవి చిన్మయాతీత (చెలియబడేదానికి ఆవలి స్వరూపిణి). శూన్యమునకు ఆ జననియే సాక్షి. శూన్యసాక్షిణి.

యస్యాః పరతరం నాస్తి సైషా ‘దుర్గా’ ప్రకీర్తితా। ఆ దేవికి ఆవల ఇంక శేషించి ఏదీ లేదు. ఈవలి సమస్తమునకు ఆ దేవియే పరాకాష్ఠ. అందుచేత ‘దుర్గాదేవి’ - అని ప్రకీర్తించబడుతోంది.

దుర్గాత్ సంత్రాయతే యస్మాత్ ‘దేవీదుర్గా’ ఇతి కథ్యతే। దుర్గమముల నుండి (కష్టతరమైన వాటి నుండి) తరింపజేస్తుంది కాబట్టి ఆ దేవిని ‘దుర్గ’ అని అంటున్నారు. స్తుతిస్తూ ప్రణమిల్లితే, శరణువేడితే దురితములను హరించివేయు దేవి కాబట్టి ‘దుర్గ’। ప్రపద్యే శరణం దేవీం ‘దుం’ దుర్గే దురితరం హర। దురితములన్నీ హరించి వేసే దేవి కనుక - ‘‘దుర్గ’’. అమ్మా! దుర్గాదేవీ! శరణు।

సంసార సాగరములో చిక్కి అనేక అల్ప జన్మపరంపరలలో దుఃఖితులమై తిరుగాడుచున్న మేము - జన్మ-కర్మ బంధములకు భీతిల్లినవారమై తాం దుర్గాం దుర్గమాందేవీం దురాచార విఘాతినీమ్ దుర్గములైన దురాచారములకు విఘాతి అగు - దుర్గాదేవిని శరణువేడుచున్నాము.

ఫలశ్రుతి

ఈ అథర్వశీర్షము (లేక) దుర్గాశీర్షము (లేక) దేవ్యుపనిషత్‌ను ఎవ్వరు అధ్యయనము చేసి స్వస్వరూపాత్మకంగాను, సమస్త రూపాత్మకంగాను దేవిని తెలుసుకుంటారో.
- ‘‘పంచాథర్వణశీర్ష జపఫలము’’ను పొందగలరు. 5 సార్లు అథర్వణవేద పారాయణము చేసిన సత్ఫలితములు పొందగలరు.
- ఈ అథర్వ శీర్షముచే దేవీ తత్త్వమును ఎరిగినవారై ఎవరు అర్చించువారై ఉంటారో, అట్టివారు శతలక్ష (కోటి) జపము చేసినవారై, అర్చన యొక్క పరాకాష్ఠ సిద్ధిని పొందగలరు.

ఈ ఉపనిషత్ యొక్క అర్థ పూర్వక పారాయణము 108సార్లు పునశ్చరణము - సాధనవిధానముగా చెప్పబడుతోంది.

10 సార్లు చదివినవాని పాపములన్నీ తుడిచిపెట్టుకుపోగా - ఆతడు సద్యోముక్తుడు కాగలడు. మహాదేవి యొక్క ప్రసాదముచే సమస్తమైన మహాకష్టముల నుండి (మహాదుర్గముల నుండి) విముక్తుడు కాగలడు.

ప్రాతఃకాలములో ఈ ఉపనిషత్తు (లేక) ఈ అథర్వశీర్షమును అధ్యయనము చేస్తూ పారాయణము చేస్తే - రాత్రి కృతపాపములు తొలగగలవు. సాయంకాలము అధ్యయనము చేసినవాని యొక్క పగలు కర్మల దోషములు తొలగిపోతాయి. ప్రాతఃకాలము, సాయంకాలము కూడా ఉపాసించినవాని యొక్క సర్వపాపదృష్టులు, దోష సంస్కారములు సమసిపోగలవు. పాపి కూడా ‘అపాపి’ అవుతాడు.

నిశీధి యొక్క తురీయ (4వ) సంధ్యయందు ళినిర్విషయము యొక్క భావనా పరాకాష్టయందు; జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవల గల తురీయ- (4వ) స్థానములో)రి బుద్ధిని నిలిపి జపించువానికి ‘వాక్‌సిద్ధి’ లభించగలదు. (అందరికి సామాన్యముగా కనిపించే వాక్యములలోని తాత్త్వికార్థము తెలియబడగలదు).

ఉదయ - మధ్యాహ్న - సాయంకాల - రాత్రి తురీయ ‘(4)’ సంధ్యాసమయములలో జపించువాడు - వివేకముతో కూడిన ‘అఖండాత్మవగాహన’ సిద్ధించుకోగలడు. (4 A.M. 12 Noon 6 P.M. 10 P.M.)

నూతన ప్రతిమను (దేవీ విగ్రహముగాని, మరే దేవతా, గురు విగ్రహమైనాగాని) ప్రతిష్ఠించినచోట ఈ ‘అథర్వణ శీర్షము’ అనబడే దేవీ ఉపనిషత్ పఠనము, ప్రవచనము, శ్రవణము చేస్తే ఆ దేవతామూర్తికి దేవతాసాన్నిధ్యము మహత్తరంగా కొద్దిసమయములోనే ప్రవేశితము అవగలదు.

ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ఈ ‘‘దేవీ ఉపనిషత్ పారాయణము’’ చేస్తే ళి(లేక) చేయిస్తేరి ఆ ప్రతిమయందు ప్రాణప్రతిష్ఠ విశిష్టమై జరుగగలదు.

భౌమా అశ్విన్యాం - మంగళవారము, అశ్వనీ నక్షత్రము మొదలైన శుభవేళల పారాయణము ప్రారంభించెదరు గాక!

మహాదేవీ సన్నిధిలో ఈ ఉపనిషత్ పరమార్ధమును జపించుటచే ‘‘మహామృత్యువు’’ నుండి తరించగలడు.

ఇందలి పరమార్థమును ఎరుగుటయే - దేవీ ‘తత్త్వజ్ఞానసిద్ధి’ అగుచున్నది.

శ్రీ దుర్గాదేవి అనిర్వచనీయమైన విజయములను ప్రసాదించగలదు.

🙏 ఇతి దేవి ఉపనిషత్।।
(ఇతి దుర్గా దేవి ఉపనిషత్।।)
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।


యజుర్వేదాంతర్గత

దుర్గా సూక్తము

దుర్గాసూక్తమ దుర్గాసూక్తమ (అరిష్ట పరిహార మంత్రము)
జాత వేదసే సునవామ
సోమ మరాతీయతో
నిదహాతి వేదః।
స నః పర్షదతి దుర్గాణి
విశ్వా నావేవ సింధుం
దురితా-అత్యగ్నిః।।
ఓ జాతవేదా! అగ్నిదేవా! స్వామీ! మేము సోమలతను పిండి, దాని నుండి రసమును తీసి ఆ రసమును మీకు భక్తి-ప్రపత్తులతో సమర్పిస్తున్నాము. మాకు పరమాత్మను ఎరుగటలో తారసబడే అడ్డంకులను కరుణామూర్తులై తొలగించండి.

ఏ విధంగా నావ దొరికితే సముద్రంలో మునుగువాడు ఆ నావ ఎక్కి ఒడ్డుకు చేరగలడో, ఆ విధంగా మమ్ములను సమస్తమైన సంసార దోషముల నుండి (eT]యు) అన్ని పొరపాట్లు - తప్పిదముల నుండి, క్లేశముల నుండి సంసార సముద్రంలో లభించిన నావ వలె కాపాడదెరుగాక! సర్వ దురితములను తమ తేజో తత్త్వముతో భస్మము చేసివేయ ప్రార్థన.
తామ్ అగ్నివర్ణాం తపసా జ్వలన్తీం
వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్।
దుర్గాం దేవీగ్ం శరణం
అహమ్ ప్రపద్యే।
సుతరసి తరసే నమః।।
ఓ దుర్గాదేవీ! జగన్మాతా! సర్వత్రా తేజోరూపిణివై, అగ్నివై, అగ్నివర్ణముతో ప్రకాశించుదానా! తపోశక్తి రూపిణివై ప్రకాశించు దేవీ! పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణీ! సర్వజీవులకు కర్మఫలములను ప్రసాదించు లోకేశ్వరీ! నమోనమః। దుర్గమములను సుగమంగా చేసే దుర్గాదేవీ! - పాంచభౌతిక పరిమిత భావములచే నిర్మితమైన ‘‘సంసారము’’ (లేక) ప్రాపంచక దుఃఖముల నుండి ఆశ్రితులను తరింపజేసే తల్లివి కదా! నిన్ను శరణు వేడుచున్నాను. సంసార దుఃఖముల నుండి చక్కగా తరింపజేసే నీకు నమస్కరిస్తున్నాను.
అగ్నే। త్వం పారయా నవ్యో
అస్మాన్ (ధ) స్వస్తిభి రతి
దుర్గాణి విశ్వా।
పూశ్చ పృథ్వీ బహులాన ఉర్వీ
భవా తోకాయ తనయాయ
శంయోః।।
ఓ అగ్నిదేవా! నీవు మమ్ములను శ్రీదుర్గాదేవి పాదపద్మములకు జేర్చే సమర్థుడవు. అందుచేత శ్లాఘనీయుడవు. స్వామీ! మమ్ములను సమస్త కష్టముల నుండి, దుఃఖముల నుండి బహిర్గతము చేయండి. ‘కష్టములు’ అనే దుర్గమారణ్యంలో చిక్కుకున్న మాకు దేవీ పాద పద్మముల వైపుగా త్రోవచూపండి. మేమున్న ఈ స్థలము, ఈ మాతృభూమి, ఈ సమస్త ప్రపంచము-మీ కృపచే బహు సుభిక్షమగుగాక! మా యొక్క పుత్రులకు, పౌత్రులకు శుభములు కలుగజేస్తూ, కష్టములు మాకు దూరమగునట్లు అనుగ్రహించండి. సుఖ ప్రదాత అవండి.
విశ్వాని నో దుర్గహా జాతవేదః
సింధుం న నావా దురితా-తిపర్‌షి।
అగ్నే అత్రివన్ (త్) మనసా గృణానో
అస్మాకం బోధ్యవితా తనూనామ్।
ఓ జాతవేదా! అగ్నిదేవా!
మా ఈ భౌతిక శరీరములలో వేంచేసి అణువణువూ పవిత్రము చేయుచూ సర్వదా కాపాడుచున్నారు కదా! అదేవిధంగా, సముద్ర మధ్యలో చిక్కుకొని కొట్టుమిట్టాడుచున్న వానిని ‘నావ’ కాపాడువిధంగా సంసార సాగరంలో చిక్కుకొని అనేక దుఃఖములకు (Many worries) లోను అగుచున్న మమ్ములను పవిత్రత అనే నావపై (As a Boat) ఎక్కించి కాపాడండి. ఓ అగ్ని భగవాన్! లోకకల్యాణమూర్తి అయి సమస్త జనుల సుఖ-శాంతి-ఐశ్వర్య-ఆనందముల కొరకై తన తపస్సంతా సమర్పించిన అత్రి మహర్షి వలె ఎల్లప్పుడు మా శ్రేయస్సును దయతో మీ దృష్టియందు కలిగినవారై ఉండండి. మా ‘మనస్సు’ అనే పుష్పము స్వీకరించి, మా బుద్ధిని పవిత్రం చేయండి.
పృతనాజితగ్ం సహమానమ్
ఉగ్రమ్ అగ్నిగ్ం। హువేమ
పరమాత్ సధస్థాత్ (పరమాధ్సస్థాత్) ।।
స నః పర్‌షదతి దుర్గాణి
విశ్వాక్షామత్ దేవో
అతి దురితా-త్యగ్నిః।।
హే అగ్నిదేవా! మమ్ములను కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే శతృవులు చుట్టు ముట్టి ఉన్నారయ్యా!
మీరు ఉగ్రరూపులై శత్రు సైన్యమును ముట్టడించి భస్మము చేయగల మహత్ సామర్థ్యము కలవారు. అట్టి మిమ్ములను జగత్ సభ యొక్క అత్యున్నత స్థానము నుండి మేము ఉన్న చోటికి వేంచేయమని ఆహ్వానిస్తున్నాము. మా యొక్క సమస్త క్లేశముల నుండి మమ్ములను కాపాడండి. మా యొక్క గొప్ప దురితములను తొలగించండి. దేవా! మా అపరాధములను క్షమించి మమ్ములను రక్షించండి.
ప్రత్నోషికమ్ ఈడ్యో అధ్వరేషు
సనాచ్చ హోతా, నవ్యశ్చ సత్సి।
స్వాంచ అగ్నే తనువం
పిప్రయ స్వాస్మభ్యన్చ
సౌభగమాయ జస్వ।।
ఓ అగ్నిదేవా! యజ్ఞయాగాదులలో మీరు ప్రప్రధమ- ఆహ్వానితులుగా కీర్తించబడుచున్నారు. ప్రాచీన కాలము నుండి కూడా ఇప్పటివరకు ఇక ఎప్పటికీ కూడా- నిర్వహించబడు యజ్ఞ-యాగ-క్రతు-పూజా-పితృకార్య విధులలో హవ్య వాహనులై మేము స్వర్గ-దేవతలకు, పిత్రుదేవతలకు సమర్పించు హవ్యములను వారికి జేర్చుచున్నారు. మేమంతా మీ స్వరూపము చేతనే నిర్మితులము. మీకు చెందినవారమే అయి ఉన్న మాకు ఆనందము కలుగజేయండి. మాకు సర్వతోముఖమైన సౌభాగ్యములను, శ్రేయస్సులను ప్రసాదించండి.
గోభిః జుష్టమ్ అయుజో
నిషిక్తం తవ ఇన్ద్ర విష్ణోః
అనుసన్చరేమ।
నాకస్య పృష్ఠమ్ అభిసంవసానో
వైష్ణవీం లోక ఇహమ్
ఆదయనన్తామ్।।
హే భగవతీ! వైష్ణవీ! దుర్గాదేవీ!
నీవు సమస్త పాపములకు, దుఃఖములకు సంబంధించక మాయందు కేవల స్వరూపిణివై వేంచేసియున్నావు. ఇంద్ర స్వరూపిణివై సమస్త ఇంద్రియములను పాలించు రాజ్ఞివి. విష్ణు స్వరూపిణివై సర్వత్రా వ్యాపించి ఉన్నావు. ఆకాశమునకు ఆవలగా విస్తరించి ఉన్నావు. సర్వ యజ్ఞ యాగ క్రతువులందు అభిసంవసువై అంతర్లీన గానంగా వేంచేసి ఉన్నావు. పశు ధన ధాన్య సంపదకై, యోగ-మోక్ష సాధనా సంపత్తికై నీ యొక్క సర్వత్రా వెల్లివిరిసియున్న వైష్ణవీ తత్త్వమును శరణు వేడుచున్నాము. వైష్ణవీ జ్యోతివై ఈ సర్వ లోకములుగా, ‘నేను’గా వెలుగొందుచున్నది నీవే కదా!
(కాత్యానాయ విద్మహే।
కన్యకుమారి ధీమహి।
తన్నో దుర్గిః ప్రచోదయాత్।।)

శక్తి స్వరూపిణియైన కాత్యాయనీ దేవిని ఎరుగుటకై ఆ కన్యకుమారీదేవిని స్తుతించుచున్నాము. ఈ మా కొంచము స్తుతిని స్వీకరించి ఆ దుర్గాదేవి మా బుద్ధిని వికసింపజేయునుగాక!
ఓం। శాంతిః। శాంతిః। శాంతిః।।
ఓం। శాంతిః। శాంతిః। శాంతిః।।