[[@YHRK]] [[@Spiritual]]

Ganapathi Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


అధర్వణ వేదాంతర్గత

7     గణపత్యుపనిషత్

(అధర్వగణపతి శీర్షోపనిషత్)

శ్లోక తాత్పర్య పుష్పమ్

శ్లో।। యన్నత్వా మునయః సర్వే నిర్విఘ్నం యాన్తి ‘‘తత్పదమ్’’
‘గణేశోపనిషత్’ వేద్యం తత్ బ్రహ్మైవాహమస్మి సర్వగమ్।।

ఎవరికి నమస్కరిస్తూ మునిగణము ‘తత్‌పదము’ జేరు మార్గములో సర్వ విఘ్నములు జయిస్తున్నారో, అట్టి ‘గణేశోపనిషత్’ అధ్యయనము చేయుచున్నాను. ‘‘సర్వగతమగు బ్రహ్మమే నేను’’ - అను సిద్ధికై శ్రీమత్ గణపతి భగవానునికి నమస్కారము.

1. ఓం। లం।
నమస్తే గణపతయే।
(త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి।)
త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి।
త్వమేవ కేవలం కర్తాసి।
‘ఓం। లం’ - అను బీజాక్షరములతో ఉపాసించబడుచున్న ఓ గణపతి దేవా! మీకు నమస్కరిస్తున్నాను. ఈ కనబడుచున్న సమస్తము మీరే। మీరు బ్రహ్మము యొక్క ప్రత్యక్షరూపులు. ప్రత్యక్షముగా కనబడుచున్న తత్త్వ (త్వమేవ తత్) - ఆనంద స్వరూపులు.

ఈ బాహ్య- అంతరంగములుగా కనిపిస్తున్న సమస్తమునకు కేవల స్వరూపులగు మీరే కర్త।
త్వమేవ కేవలం ధర్తాసి।
త్వమేవ కేవలం హర్తాసి।
త్వమేవ సర్వం ఖలు ఇదం బ్రహ్మాసి।
త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం।
ఋతం వచ్మి। సత్యం వచ్మి।
ఈ సమస్తము మీ యొక్క ధారణయే అయి ఉన్నది. (విష్ణురూపులై) సమస్తము ధరిస్తున్నారు.
(రుద్రరూపులై) సమస్తము హరిస్తూ ఉన్నది కూడా మీరే! ఈ సమస్తము తిరిగి మీయందే లయిస్తున్నది।
ఈ కనబడేదంతా మీ యొక్క పరబ్రహ్మ స్వరూపమే। ద్రష్ట-దర్శనము - దృశ్యములుగా కనిపిస్తున్న సమస్తము మీ స్వరూపమే।
మీరు స్వయముగా సాక్షాత్తు నిత్యాత్మానందస్వరూపులు। నిత్యానందులు. స్వానుభవులగు సత్యద్రష్టలు.
ఋక్కులు చెప్పు ‘ఋతము’, సత్యద్రష్టలు వర్ణించు ‘సత్యము’ మీరే అయి ఉన్నారు.
అవ త్వం మామ్। అవ వక్తారమ్।
అవ శ్రోతారమ్। అవ దాతారమ్।
అవ ధాతారమ్।
అవ అనూచానమ్ అవశిష్యమ్।
అవ పురస్తాత్। అవ దక్షిణాత్తాత్।
అవ పశ్చాత్తాత్। అవ ఉత్తరాత్తాత్।
అవ చ ఊర్థ్వత్తాత్। అవ అధరత్తాత్।
స్వామీ! సంసారము నందు మునిగితేలుచున్న) నన్ను మీరు రక్షించండి. నాకు పరమ సత్యమును తెలుపుచూ ఉన్నట్టి సద్గురువులగు వక్తారులను కూడా రక్షించ ప్రార్థన. (వక్తారులు = ఆత్మతత్త్వవక్తలగు గురువులు)
ఆత్మతత్త్వము గురించి వినిపించువారు, సమస్తము ప్రసాదించునది, సమస్తమునకు ధాత (సృష్టికర్త) కూడా మీరే। ఈ జగత్తు ధరిస్తున్న విశ్వదేవతలను కూడా అనుగ్రహించెదరు గాక।
వినయుడనై మీకు శిష్యుడను అగుచున్నాను. మీరు నాకు గురువు.
స్వామీ! మీ భక్తుడనగు నన్ను ముందు, వెనుక, తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర, ఊర్థ్వ, అథో స్థానముల నుండి రక్షించండి.
సర్వతో మాం పాహి। సర్వతో మాం పాహి।
పాహి సమంతాత్।
ఓ మహాగణపతి భగవన్!
అన్నివైపులా అంతటా నన్ను దయతో కాపాడండి. ఎల్లప్పుడు అన్ని వేళలా మీరే నాకు శరణ్యము. నాయొక్క సమదృష్టిని (లేక) ఆత్మ దృష్టిని (చిట్టచివరి వరకు) పరిరక్షించండి.
త్వం వాఙ్మయః।
త్వం చిన్మయః।
త్వం ఆనందమయః।
త్వం బ్రహ్మమయః।
త్వం సచ్చిదానంద-అద్వితీయోఽసి।
మీరు సమస్త వాక్కులతో కూడిన వాఙ్మయ స్వరూపులు. చిన్మయులు. చిత్-(ఎరుక) అను విన్యాసము సమస్త జీవులలో ప్రదర్శించువారు. ఆత్మానందమయులు. బ్రహ్మమయులు.

మీరు అద్వితీయమగు (ప్రతిజీవుని స్వస్వరూపుమునకు అన్యముకానట్టి) సత్-చిత్-ఆనంద స్వరూపులు.
త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి।
త్వం జ్ఞానమయో విజ్ఞానమయోఽసి।
సర్వం జగత్ ఇదం త్వత్తో జాయతే।
సర్వం జగత్ ఇదం త్వత్తః తిష్ఠతి।
సర్వం జగత్ ఇదం త్వయి లయమ్ ఏష్యతి।
ఈ సమస్త జగత్తుగా ప్రత్యక్షమైయున్న బ్రహ్మమే మీరై ఉన్నారు.
(పరాత్మ సంబంధమైనట్టి) జ్ఞాన విజ్ఞాన (Theoritical as well as Applicational) స్వరూపులు.
ఈ జగత్తంతా కూడా మీ వలననే, మీ యందే, మీ స్వరూపమే అయి జనిస్తూ, (జలంలో తరంగంలాగా) మీయందే ఉన్నదై, చివరకి - మీయందే లయిస్తోంది.
2. సర్వం జగత్ ఇదం త్వయి ప్రత్యేతి। (ప్రతి యేతి)
త్వం భూమిః ఆపో అనలో అనిలో నభః।
ఈ జగత్తంతా మీ వైపుగానే ఎక్కుబెట్టబడి, (తరంగము జలములో లయమగునట్లు) మిమ్మే జేరుచున్నది.
మీరు అనన్యులు. అందుచేత, భూ-జల-అగ్ని-వాయు ఆకాశములనే పంచభూతములు మీరే అయి ఉన్నారు. వాటివాటి ధర్మములు మీయొక్క తేజోవిభవములే।
త్వం చత్వారి వాక్ పరిమితా పదాని।
త్వం గుణత్రయ-అతీతః।
త్వం దేహత్రయ-అతీతః।
త్వం కాలత్రయ-అతీతః।
త్వం మూలాధారే స్థితోఽసి నిత్యమ్।।
- అ - ఉ - మ - అర్ధమాత్రలు, జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయ శబ్దార్థములు మొదలైన చత్వారి (4) వాక్ పరిమితములు మీరే. తురీయా తీతమగు వాక్కుకు అందని పరమ సత్యము కూడా మీరే!
సత్త్వ-రజో-తమో గుణత్రయమునకు ఆవల గుణి (లేక) గుణాతీత స్వరూపులు. సగుణులు, నిర్గుణులు కూడా మీరే!
స్థూల-సూక్ష్మ-కారణ త్రిదేహములకు ఆవల దేహత్రయాతీతులు. త్రిదేహములకు ‘దేహి’ - స్వరూపులు.
- భూత-వర్తమాన-భవిష్యత్ త్రికాలాతీతులు, త్రికాల స్వరూపులు కూడా. మూడు కాలములయందు యథాతథమై ఉన్నవారు.
- మూలా ధారములో నిత్యస్వరూపుడవై వేంచేసిఉన్నవారు.
త్వం శక్తి త్రయాత్మకః।
త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్।
త్వం బ్రహ్మా। త్వం విష్ణుః। త్వం రుద్రః।
త్వం ఇంద్రః। త్వం అగ్నిః। త్వం వాయుః।
త్వం సూర్యః। త్వం చంద్రమాః।
త్వం బ్రహ్మ భూర్భువస్సువరోమ్।
(భూః భువః సువః ఓం)
(ఇచ్ఛా-జ్ఞాన-క్రియా) త్రయాత్మక శక్తి స్వరూపులు. ఆ త్రి-శక్తులన్నిటికి → శక్తి తనదైనవారు మీరే.
యోగులు సర్వదా ధ్యానిస్తూ ఉన్నది, చివరికి సంయోగము పొందేది, అఖండానందమగు (కేవలమగు) మీ స్వరూపమునందే।
నీవే (సృష్టికర్తయగు) బ్రహ్మవు. (ఈ సమస్త దృశ్యమును స్థితింపజేయుచున్న) విష్ణువువు. కాలక్రమంగా సమస్తము లయింపజేయుచున్న రుద్రుడవు. (సమస్త ఇంద్రియములకు అధినేతవగు) ఇంద్రుడవు. సమస్తము తేజోమయము చేస్తున్న ‘అగ్ని’వి. సంచాలన శక్తిచే సమస్తము చలింపజేయుచున్న వాయు స్వరూపుడవు. జగత్తంతా వెలగించుచున్న సూర్యుడవు. (ఓషధి- ఆహార ప్రదాత అగు) చంద్రమసుడవు. భూ-భువః - సువర్లోకములను సంప్రదర్శనము చేయు బ్రహ్మమువు. సర్వము తానై, సమస్తమునకు సాక్షిగా వేరైన బ్రహ్మమే మీరు.
‘గణ’ (గం) ఆదీన్ పూర్వమ్ ఉచ్చార్య।
వర్ణాదీన్ తదనంతరమ్।
అనుస్వారః పరతరః
అర్థేందులసితం (అర్థ ఇందు లసితం) తథా।
తారేణ యుక్తమ్ ఏతదేవ
తవ మను స్వరూపమ్।
ఓం ‘‘గం’’।।
‘‘గణ’’। ఆది (మొదట)గా। ‘గ్’ ఉచ్ఛారణ। (గ్)
తర్వాతి వర్ణాది = ‘అ’రూపము-‘‘గ’’ (గ్ + అ = గ)
ఆపై అనుస్వారము = ‘0’ (గ + ⍥ = గం)
అటు తారువాత అర్దేందులసితము (అర్థచంద్ర ప్రకాశము) - ‘మ్’।
(అర్ధమాత్ర) = ‘‘మ్…’. తారయుక్తంగా (సుషిరగవాద్యయుక్తంగా) పలకటము. ఇది మీ మూలమంత్ర మనన స్వరము.
(1) ‘గ్’ కారః పూర్వ రూపమ్।
(2) ‘అ’ కారో మధ్యమ రూపమ్।
(3) ‘అనుస్వారః’(ం) అంత్య రూపమ్।
(4) ‘బిందుః’ ఉత్తర రూపమ్।
(5) ‘నాదః’ సంధానమ్।
‘సంహితా’ సంధిః।
‘గ్’కారము - పూర్వరూపము
‘అ’కారము - మధ్యమరూపము (గ)
‘0’ - అనుస్వారము - అంత్య రూపము (గమ్)
బిందువు - తరువాతి రూపము ‘‘మ్…’’ (‘‘గమ్’’….)
నాదము - ఆత్మతో అనుసంధానము ‘‘ఓం గమ్ ….’’
సంహిత - సంధి. ఆత్మయందు సంధించుటము చేకూర్చబడటము (‘గమ్‌మ్…’) - (‘‘గరిష్ఠమగు ఆత్మయే నేను’’ - అను మమేకత్వము).
వర్ణసంయోగము
ఇది గణపతి మూలమంత్ర ధ్యానము
సైషా (స ఏషా) గాణేశీ విద్యా।
‘గణక’ ఋషిః।
‘నృచత్ గాయత్రీ’ ఛందః।
శ్రీ మహాగణాధిపతిః దేవతా।
‘‘ఓం గం గణపతయే నమః’
ఏకదంతాయ విద్మహే  
వక్రతుణ్డాయ ధీమహి।  
తన్నో దంతిః ప్రచోదయాత్।  
దీనినే ‘‘గణపతి’’ విద్య అని కూడా అంటారు. (గాణేశవిద్య)
ఋషి - గణకుడు.
ఛందస్సు - నృచత్ గాయత్రీ।
‘‘ఓం ।గం। గణపతయే నమః।
ఓం గం గణపతీ। నీకు ప్రణామములు.
ఏకదంతుడు (ఏకత్వము ప్రసాదించువారు) వంక్రతుండుడు (తొండముతో వక్రములను / దోషములను పీల్చివేయువారు) అయిన దంతి (గణపతి) యొక్క మహిమను ధ్యానించుచున్నాము. (మా ఈ ధ్యానము స్వీకరించి) ఆయన మా బుద్ధిని వికసింపజేయుదురు గాక।
3.
ఏకదంతం చతుర్హస్తం  
పాశమ్ అంకుశ ధారిణమ్।  
రదంచ వరదం హస్తైః  
బిభ్రాణం మూషికధ్వజం।।

(అన్యపాఠము)  
ఏకదంతం చతుర్హస్తం  
బిభ్రాణం పాశమ్ - అంకుశమ్।  
అభయం వరదం హస్తైః  
దధానమ్। మూషిక ధ్వజమ్।।  

మంత్రముతో గణపతి యొక్క ఉపాసనాస్వరూపము ధ్యానించటము.
- ఒకే దంతము గలవారు. (ఏకాక్షర స్వరూపులు),
- నాలుగు చేతులు (హస్తములు) కలవారు,
- ఒక చేతితో పాశము, మరొక చేతితో అంకుశము ధరించినవారు,
- మిగిలిన రెండు చేతులతో అభయముద్ర, వరద (వరప్రదాత) ముద్ర ధరించినవారు,
ఎలుక (మూషికము) ధ్వజముగా ధరించినవారు అగు గణపతిని ఉపాసిస్తున్నాము.

ఏకదంతము కలవారు, 4 హస్తములు కలవారు, పాశ-అంకుశములు ధరించువారు, అభయము-వరప్రసాదము అగు హస్తాభినయము (చేతిముద్రలు) ధరించినవారు, మూషిక ధ్వజము కలవారు - అగు గణపతికి నమస్కారము.
రక్తం లంబోదరం। శూర్ప సుకర్ణం రక్తవాసనమ్,
రక్త గంధ-అనులిప్తాంగమ్।
రక్త పుష్పైః సుపూజితమ్।
భక్త అనుకంపినం దేవం।
జగత్ కారణమ్। అచ్యుతమ్।
ఎర్రటి రక్తవర్ణము కలవారు, పెద్ద బొజ్జ-పెద్దచెవులు కలవారు, ఎర్రటి వస్త్రములు ధరించినవారు, శరీరమంతా రక్తచందనమును పులుముకొన్నవారు, ఎర్రటి పుష్పములతో పూజించబడు గణేశుని ఆరాధిస్తున్నాము.
ఆయన → భక్తులపై కరుణ, అనుగ్రహము ప్రసాదించు దివ్య స్వరూపులు.
జగత్తుకు కారణులు - ఆత్మభావననుండి చ్యుతి లేనివారు. అచ్యుతులు.
ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ
ప్రకృతేః పురుషాత్ పరమ్।
ఏవం ధ్యాయతి యో నిత్యం
స యోగీ యోగినాం వరః।
సృష్టియొక్క అవిర్భూతమునకు మునుముందే ఆది స్వరూపులై ఉన్నవారు.
స్రస్ట మీ స్వరూపము. సృష్టి మీ స్వభావము. అయితే, మీరు ప్రకృతికి సర్వదా ‘పరము’ (Beyond) అయినట్టివారు. ఈ సమస్తము తమయొక్క పురుషకారము కలిగియున్నట్టి, - ప్రకృతి - పురుషులకు ఆవలగల ‘పరమ పురుష స్వరూపులు’.
ఏ యోగి అయితే అట్టి గణపతిని పరమపురుష తత్త్వముగా ధ్యానిస్తాడో - అట్టివాడు యోగులందరిలో శ్రేష్ఠుడు.
నమో వ్రాతపతయే।
నమో గణపతయే।
నమః ప్రమథపతయే।
నమస్తే అస్తు లంబోదరాయ,
ఏకదంతాయ, విఘ్న వినాశినే,
శివసుతాయ వరదమూర్తయే
నమో నమః।
హే వ్రాతపతీ (The Authority of all writings)! సృష్టికి ఆవల సమష్టి స్వరూపులై ఉన్న స్వామీ! వ్రాత = సమూహమునకు పతి!
ఓ గణపతీ (The head of all Groups of this Universe)!
ఓ ప్రమథ గణమునకు నాయకుడా! భక్తి-యోగ జ్ఞాన వైరాగ్య గణ నాయకా! పెద్దపొట్ట గలవాడా! లంబోదరా! బొజ్జనిండా విద్యలు కలవాడా! ఏకత్వమును ప్రసాదించు ఏకదంతా! విఘ్నములన్నీ తొలగించు విఘ్ననాశా!
శివకుమారా! వరప్రసాదుడా! సమస్తము ప్రసాదించు వరదా।
నమస్తే। నమస్తే। నమో నమః।
ఏతత్ అథర్వశిరో యో అధీతే, -
స బ్రహ్మ భూయాయ కల్పతే।
స సర్వతః సుఖమ్ ఏధతే।
స సర్వ విఘ్నైః న బాధ్యతే।
స పంచమహాపాతక- ఉపపాతకాత్ ప్రముచ్యతే।
‘‘అథర్వ మహర్షి స్వాత్మ సంబంధమై పొందిన దివ్యానుభవము’’ అగు ఈ ‘‘గణపతి అథర్వ శీర్షము’’ను అధ్యయనము చేయువాడు సమస్తమునకు పరాకాష్ఠ అగు బ్రహ్మమును పొందగలడు.
సమస్త సుఖములు వాటికవే ఆతనిని చేరగలవు. ఇక ఏ విఘ్నములు ఆతనిని బాధించవు. ఇతఃపూర్వము పంచమహాపాతక - ఉపపాతక దోషముల దుష్టఫలములు కూడా ఆతని పట్ల తొలగగలవు.
సాయమ్ అధీయనో
దివసకృతం పాపం నాశయతి।
ప్రాతః అధీయానో
రాత్రి కృతం పాపం నాశయతి।
ఈ గాణేశ విద్యను సాయంకాల అధ్యయనము చేస్తే (పఠిస్తే) ఉదయము చేసిన పాపములు తొలగగలవు.
ప్రాతఃకాలంలో (ఉదయము) అభ్యసిస్తే రాత్రి చేసిన పాపములు తొలగగలవు.
సాయం ప్రాతః ప్రయుంజానో అపాపో భవతి।
ధర్మ అర్థ కామ మోక్షం చ విందతి।
ఇదమ్ అథర్వ శీర్షమ్
అశిష్యాయ న దేయమ్।
యో యది మోహాత్ దాస్యతి,
స పాపీయాన్ భవతి।
సహస్ర ఆవర్తనాత్
యం యం కామమ్ అధీతే
తం తం అనేన సాధయేత్।।
ఉదయము, సాయంకాలము కూడా ఈ ఉపనిషత్‌ను అధ్యయనము చేయుటచే, అట్టివాడు అపాపి (పాపపు ధ్యాసలు తొలగినవాడు పుణ్యవంతుడు) కాగలడు. చతుర్విధ పురుషార్థములైనట్టి ధర్మ-అర్థ-కామ-మోక్షములు సిద్ధించుకోగలడు.
ఈ - ‘‘గణపతి అథర్వ శీర్షము’’ గురించిన బోధను శిష్యుడు కానివానికి చేయకూడదు. (చెప్పరాదు).
ఎవరైనా - మోహము కారణంగా అర్హత లేనివారికి ఈ బోధను ఇచ్చితే, - ఆబోధించినవాడు తప్పు (పాపము) చేసినట్లు.
వేయిసార్లు దీనిని పారాయణము చేసినవాడు - తాను ఏదేది కోరుకొంటే - అవన్నీ సిద్ధించగలవు.
4. అనేన గణపతిమ్ అభిషించతి,
స వాగ్మీ భవతి।
చతుర్థ్యామ్ అనశ్నన్ జపతి।
స విద్యావాన్ భవతి।
ఎవ్వరైతే ‘‘గం గం గం గణపతియేనః’’ - అను గణపతి గాయత్రీ మంత్రము మొదలైన వాటితో గణపతికి అభిషేకము చేస్తారో, అట్టివారు ఉత్తమ వాక్కు గల వక్తలు కాగలరు.
ఎవరు ఇంద్రియాహారములను వదలి ఏకాగ్రతతో రోజుకు 4 సార్లు జపిస్తారో, వారు విద్యావంతులు కాగలరు. జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయములకు ఆవల తురీయాతీత విద్యావంతులగుచున్నారు.

ఇది అథర్వణ మహర్షి వాక్యము.
ఇతి అథర్వణ (వేద) వాక్యమ్।।
బ్రహ్మాది ఆచరణం విద్యాత్,
న బిభేతి కదాచన - ఇతి।।
గణపతి అథర్వ శిరోమంత్రమును (నమో వ్రాత పతయే। నమో గణపతయే। నమప్రమథ పతయే। నమస్తే అస్తు లంబోదరాయ। ఏకదంతాయ। విఘ్నవినాశినే। శివసుతాయ। వరద మూర్తయే నమః। మొదలైన మంత్రముల) ఆచరణను ఎరిగినవారై, బ్రహ్మ మొదలైనవారు కూడా సర్వభయముల నుండి విముక్తులగుచున్నారు. ‘‘బ్రహ్మము’’ నందు ఆచరణసిద్ధి పొందుచున్నారు.
యో దుర్వాంకురైః యజతి,
స వైశ్రవణోపమో భవతి।
యో లాజైః యజతి
స యశోవాన్ భవతి।
స మేధావాన్ భవతి।
శ్రీ గణపతి యొక్క సాకారరూపమును దూర్వార అంకురములతో పూజించువాడు కుబేరునితో సమానమైన సంపదలు పొందగలడు.
ఎవ్వరైతే లాజములతో (వట్టివేరు, పేలాలు, నానబియ్యములతో) పూజిస్తాడో, అట్టివాడు యశోవంతుడు, మేధావంతుడు కాగలడు.
యో మోదక సహస్రేణ యజతి,
స వాంఛిత ఫలమ్ అవాప్నోతి।
యస్సాజ్య (యః స ఆజ్య) సమిద్భిః యజతి,
స సర్వం లభతే।
స సర్వ లభతే।
ఎవడు గణపతిని వేయి మోదకపుష్పములతో పూజిస్తాడో, ఆతడు తాను కోరుకున్న ఫలము పొందగలడు.
ఎవడు నేయితో తడిపిన సమిధలతో ‘గణపతి హోమము’ నిర్వర్తిస్తాడో, అట్టివానికి సర్వము లభిస్తుంది. ఆతడు సమస్తము పొందగలడు. ఇహ-పరములలో సిద్ధించుకోవలసినదంతా సిద్ధించుకోగలడు.
అష్టౌ బ్రాహ్మణాః సమ్యక్
గ్రాహయిత్వా ‘సూర్యవర్చస్వీ’ భవతి।
సూర్యగ్రహణే మహానద్యాం
ప్రతిమా సన్నిధౌ వా జప్త్వా
స సిద్ధమంత్రో భవతి।।
ఎనిమిది బ్రాహ్మణులతో (బ్రాహ్మణములతో) కూడి గణపతి యజ్ఞము నిర్వర్తించువాడు. సూర్యవర్చస్సుతో శోభిల్లగలడు.
(8-బ్రాహ్మణములు-తాత్త్వికార్థము తత్త్వమ్। తదిదమ్। తదహమ్। తత్సః। తత్‌మమ। తత్సర్వమ్। తత్‌సత్। సోఽహమ్।।)
సూర్యగ్రహణ సమయమునందు (మరియు) పవిత్ర నదుల వద్ద, గణపతి మహామంత్రమును ఎవడు జపిస్తాడో, అట్టివాడు - మంత్రసిద్ధుడు కాగలడు.
🙏 మహావిఘ్నాత్ ప్రముచ్యతే।
🙏 మహా దోషాత్ ప్రముచ్యతే।
🙏 స సర్వవిత్ భవతి। →
🙏 స సర్వవిత్ భవతి। →
య ఏవం వేద।।
ఈ అథర్వగణపతి శీర్షము పఠించువాడు-
సర్వవిఘ్నముల నుండి ప్రముచ్యుడు (Relieved) కాగలడు.
సర్వదోషముల నుండి విముక్తుడు అగుచున్నాడు.
- య ఏవం వేద = సమస్తము ఎరిగినవాడై ఆత్మదర్శి అవగలడు.

🙏 ఇతి గణపత్యుపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।


అధర్వణ వేదాంతర్గత

7     గణపతి ఉపనిషత్

(అధర్వగణపతి శీర్షోపనిషత్)

అధ్యయన పుష్పము

శ్రీ గణపతి మహామంత్రము
‘‘ఓం గం గం గం గణపతయే నమః’’
శ్రీ గణపతి గాయత్రీ మంత్రము
‘‘ఏక దంతాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి।
తన్నో దంతిః ప్రచోదయాత్।।’’
‘‘తత్పురుషాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి।
తన్నో దంతిః ప్రచోదయాత్।।’’
శ్రీ గణపతి ప్రాతః స్మరణము (శ్లోకత్రయము)
శ్లో।। ప్రాతస్సరామి గణనాధం అనాధ బంధుమ్।
సిందూర పూగ పరిశోభిత గండయుగ్మమ్।
ఉద్దండ విఘ్న పరిఖణ్డన చణ్డ దణ్డమ్।
ఆఖణ్డలాది సురనాయక బృంద వంద్యమ్।।
శ్లో।। ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానమ్।
ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్।
తం తున్దిలం ద్విరసనాధిప యజ్ఞ సూత్రం।
పుత్రం విలాస చతురం శివయోశ్శివాయ।।
శ్లో।। ప్రాతర్భజామి అభయదం ఖలు భక్తశోక -
దావానలం గణవిభుం వరకుంజరాస్యం।
అజ్ఞానకానన వినాశన హవ్యవాహం।
ఉత్సాహవర్ధనమ్ అహమ్ సుతం ఈశ్వరస్య।।
శ్లోకత్రయమిదం పుణ్యం సదా సామ్రాజ్య దాయకం
ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్ ప్రయతః పూమాన్।।
శ్రీ గణపతి ప్రార్థన
(1) గణానాం త్వా గణపతిగ్ం హవామహే
కవిం కవీనామ్ ఉపమ శ్రవస్తవమ్।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆనః శ్రుణ్వన్నూతిభిస్సీద సాదనమ్।।
ఓం శ్రీ గణాధిపాయ నమః।।
విఘ్న వినాశకుడవు, గణాధిపతివి అగు ఓ గణేశ్వరా! మీరు పరిపూర్ణ జ్ఞానసంపన్నులు. సర్వజ్ఞులు. ఘనుడవైన మిమ్ములను శరణు వేడుచున్నాము. మీరు చక్రవర్తులందరికీ చక్రవర్తి. సాక్షాత్ పరబ్రహ్మమువు. వేదమంత్రములచే మీ యొక్క ఘనతను కీర్తిస్తున్నాము. స్తుతిస్తున్నాము. మాకు సత్-సంకల్పములను సిద్ధింపజేయగల సమర్ధుడవు. సమస్త నిధులకు పెన్నిధివి. ఐహిక - ఆముష్మిక ఉభయములను ప్రసాదించువాడవు. మీకు ప్రణామములు । నమో నమో నమో నమః।
(2) ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ। ధీనామవిత్ర్యవతు।
శ్రీ గణేశాయ నమః। శ్రీసరస్వత్యై నమః। శ్రీ గురుభ్యో నమః। హరిః ఓం।।
వాగ్దేవి అగు సరస్వతిని స్తుతిస్తున్నాము. వేద హృదయమును ఎరుగుచు, వేద మంత్రములను చక్కటి ఉచ్ఛారణతో పఠించుటకై మా బుద్ధిని వికశింపజేయమని శ్రీ సరస్వతీ దేవికి వినతి సమర్పిస్తున్నాము.
శ్రీ గణేశునకు, శ్రీసరస్వతీ దేవికి, గురుదేవులకు, ఓంకార స్వరూపుడగు శ్రీహరికి నమస్సుమాంజలులు.
ఘనపాఠము
గణానాం త్వాత్వా గణానాం గణానాం త్వాగణపతిం త్వా గణానాం గణానాం, త్వా గణపతిం।
త్వా గణపతిం గణపతిం త్వాత్వా గణపతిగ్ం హవామహే హవా మహే। గణపతిం త్వాత్వా గణపతిగ్ం హవామహే।
గణపతిగ్ం హవామహే హవామహే।
గణపతిం గణపతిగ్ం హవామహే। కవింకవిగ్ం హవామహే।
గణపతిం గణపతిగ్ం హవామహే। కవిమ్ గణపతిమితిగణ- పతిమ్।।
ఓం శ్రీ గణపతిభ్యోం నమః

ఉపనిషత్ ప్రారంభం

స్తుతి :
యన్నత్వా మునయస్సర్వే నిర్విఘ్నం యాతి తత్పదమ్।
‘గణేశోపనిషత్’ వేద్యం తత్ బ్రహ్మైవాస్మి సర్వగమ్।

మునులంతా కూడా ఎవరికి నమస్కరించి ‘తత్‌పదము’ చేరటానికై సమస్త విఘ్నములను ‘‘నిర్విఘ్నము’’గా చేసుకోగలుగుచున్నారో, అట్టి ‘‘గణేశోపనిషత్’’ను అధ్యయనము చేస్తున్నాము. ఈ అధ్యయనముచే ‘‘సర్వగతమగు బ్రహ్మమే నేనై ఉన్నాను’’ - అని అవిఘ్నముగా స్వానుభవము చేసుకొనగలము.

- - -

ఓమ్…। ఓం లం। నమస్తే గణపతయే। సమస్త లోకములలోని గణములకు పతి (The Main Leader of all Groups) అయిన మీకు నమస్కారము.
ఈ జగత్తు రూపంగా కనిపిస్తున్నది మీరే కనుక నాకు ‘‘త్వమ్-నీవు’’గా కనిపించేదంతా మీరే। త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి। ఈ జగత్తంతా కలిపి మీ స్వరూపమే అయి ఉన్నది. తత్ త్వమ్ అసి।।
- మీరు కేవల (Absolute) స్వరూపులై ఈ జగత్తులన్నిటికీ కర్త (The worker of the Universe) అయి ఉన్నారు.
- ఈ లోకాలన్నీ ధారణ చేయుచున్నట్టి ‘‘ధర్త’’ మీరే। ధరించువాడవు (All this is your ornament).
- ఈ సమస్తము ఒకానొకప్పుడు మీయందే లయమౌతోంది. కాబట్టి దీనికంతటికీ లయకారులు కూడా మీరే। (It dissolves in You only)
- ఈ సమస్తము బ్రహ్మమే అయి ఉండగా, అట్టి బ్రహ్మము మీరే అయి ఉన్నారు. త్వమేవ ఖల్విదం బ్రహ్మాసి।
- మీరు సాక్షాత్తు ఆత్మస్వరూపులు।

బ్రహ్మజ్ఞులగు మహనీయుల స్వానుభవమగు ఋతమును, సత్యమును గమనించి-‘‘మీరు మాత్రమే నిత్యము। త్రికాలములలో సర్వదా సర్వత్రా వేంచేసినవారై ఉన్నారు’’ - అని ఎలుగెత్తి గానము చేస్తున్నారు.

స్వామీ! గణపతి దేవాదిదేవా। ఈ సంసార కూపము నుండి, భవబంధముల నుండి నన్ను రక్షించండి.

అట్లాగే మాకు ప్రవచనములు ప్రవచించి, మా ‘అజ్ఞానము’ - అనే దుమ్ము దులుపుచున్న వక్తారులను (మాకు ఆత్మబోధ ప్రసాదిస్తూ ఉన్న గురువులను) కూడా కరుణతో రక్షించండి. ఆత్మ ప్రవచనములు వింటున్న శ్రోతలగు మమ్ములను రక్షించండి. అధ్యయనులగు వేదమును ధారణ చేయుచున్న సహ-శిష్య జనులందరిని రక్షిస్తూ ఉండండి.

గణపతి భగవాన్! మీకు ముందునుండి, వెనుకనుండి, ఎడమ నుండి, కుడినుండి, పశ్చిమ-ఉత్తర వైపుల నుండి, పై నుండి, క్రింద నుండి, - అన్ని వైపుల నుండి నమస్కరిస్తున్నాము. అన్ని వైపులుగా, సర్వదిశ-ఉపదిశల నుండి మమ్ము కాపాడండి. (సంసారసాగరము నుండి) రక్షించ వేడుకొంటున్నాము. సాంసారిక భ్రమలు అన్నివైపులా విస్తరించి మమ్ములను లాగుచున్నాయి కదామరి? మీరే మాకు దిక్కు।

హే విఘ్న వినాయకా! మహాగణపతీ! వాక్ స్వరూపడవు. వాక్కుగా విస్తరించియున్నది మీరే! వాఙ్మయుడవు. వాక్కుకు అధినేతవు.

సమస్తము మీ యొక్క ‘ఎరుక (Knowing)’ అను విశేషము నుండియే విస్తరిస్తోంది కాబట్టి చిన్మయ - స్వరూపులు. ఆనందమయులై ఈ సమస్త లోకములను కల్పించుకొని మీకు మీరే వినోదిస్తున్నవారు.

‘బ్రహ్మము’ స్వరూపము కలవాడవై బ్రహ్మమయుడవు. ‘‘ఉనికి - ఎరుక - అనుభూతి’’ (“Presence - Awareness - Experience” Absolutely) స్వరూపుడవు, సర్వ జీవులలో అట్టి సచ్చిదానంద స్వరూపులై, సమస్త జీవుల సహజ స్వరూపమై వేంచేసి ఉన్నారు కాబట్టి సమస్తము మీకు ద్వితీయము కాదు. మీరు అద్వితీయులు. ఓం అద్వితీయాయ నమః। ‘‘అహమ్-త్వమ్-ఇదమ్’’లతో కూడిన ఈ సమస్తము మీకు అనన్యము.

త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి। ఈ సమస్తము మీ జగత్ రూప చమత్కారమే. ఈ సమస్త జగద్దృశ్యము మీ యొక్క ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపమే। ఇక్కడ సందర్భపడుచున్న, ‘‘ద్రష్ట-దర్శనము-దృశ్యము’’ - మీయొక్క సంప్రదర్శనమే।

‘‘తెలుసుకొనువాడవు - తెలియబడుచున్నదీ’’ కూడా అయి, జ్ఞాన విజ్ఞానమయులై ఉన్నది మీరే. జ్ఞానముగా తెలుసుకొనుచున్నది, విజ్ఞానముగా తెలియబడుచున్నది కూడా మీరే!

ఓ సృష్టి స్థితి లయ కారకా! పరిపోషకా!
జలంలో తరంగం బయల్వెడలి, జలములోనే స్థితి కలిగి ఉండి, జలములోనే లయించు తీరుగా - ఈ సమస్త జగత్తు మీనుండే ఉదయిస్తోంది. మీయందే స్థితి కలిగిఉంటోంది. మీయందే లయిస్తోంది కూడా। సర్వం జగదిదం త్వత్తో జాయతే। సర్వం జగదిదం త్వత్తః తిష్ఠతి। సర్వం జగదిదం త్వయి లయమ్ ఏష్యతి।। ఇదంతా మీచేతనే పరిపోషించబడుతోంది. సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి। ఈ జగత్ వ్యవహారమంతా మీపై ఆధారపడినదై ఉన్నది. మీరు మాయొక్క ‘పరస్వరూపమే’ అయి ఉన్నారు. మేమంతా మీ అభ్యంతరరూపులమే! మేమంతా మీరే అయి ఉన్నాము, స్వామీ!

పాంచ భౌతిక రూపాయ।

త్వం భూమిః ఆపో అనలో అనిలో నభః।
మీరే భూ-జల-అగ్ని-వాయు-ఆకాశ పంచభూత సంప్రదర్శనులై వేంచేసి ఉన్నారు.

త్వం చత్వారి వాక్ పరిమితా పదాని।
మీరే చతుర్విధ (4) రూపకమైన వాక్కు స్వరూపులు.

చత్వారివాక్కులు : -
1. కంఠమునుండి వెలువడే వాక్కు (భాష), (వైఖరి. వాక్యరూపమునగల వాక్కు స్వరము కంఠధ్వని. ‘అ’ కారాది ‘క్ష’ కారాంతము. శబ్దముయొక్క ఆరోహణ-అవరోహణక్రమములు)
2. అంతకుముందే మనస్సునందు జనించు ఆలోచన।
3. ఇంకా అంతకుముందు భాషాతీతమైన, భావరూపకమైన వాక్కు (భావన),
4. అంతకుముందే సంకల్ప రూపమగు వాక్కు (సంకల్పము) -

మాలోని భాష - ఆలోచన - భావన - సంకల్ప → చతుర్వాక్కు రూపములు మీరే అయి ఉన్నారయ్యా!

త్వం గుణత్రయాతీతః।
త్రిగుణములు మీయొక్క స్వభావ చమత్కారములు. అయినప్పటికీ కూడా, - సత్వ రజో తమో గుణములకు ముందే ఉన్న ‘‘గుణి’’, ‘గుణి’కి ముందే ఉన్న ‘‘నిర్గుణి’’ స్వరూపులు. గుణత్రయాతీతులు.

త్వం అవస్ధాత్రయాతీతః।
జాగ్రత్ స్వప్న సుషుప్తులు లీలగా కల్పించుకొనుచూ ఆస్వాదించువారు. ఆ మూడిటిని సిద్ధింపజేసుకొనే సిద్ధపురుషులు. ఆ మూడు తమ సంచార స్థలములుగా కలిగియున్న తురీయ స్వరూపులు. అంతేకాకుండా ‘కేవలసాక్షి’ అగు తురీయాతీతులు కూడా।

త్వం దేహత్రయాతీతః।
మీరు భౌతికమగు స్థూలదేహమునకు, భావనరూపమగు సూక్ష్మదేహమునకు, అభ్యాసనిర్మితమగు సంస్కార-వాసనల రూపమగు కారణదేహమునకు ఆవలివారు. ఆ మూడు దేహములను (జడవస్తువులను కదల్చు చేతన శక్తివలె) చైతన్య పరచు ఆత్మాకాశ స్వరూపులు. జగత్-వస్తువులను కనిపింపజేయు విధంగా - త్రిదేహములు మీయొక్క ఆత్మతేజస్సునందు వెలుగొందు వస్తువులు.

త్వం కాలత్రయాతీతః।
హే గణేశ్వరా! మీరు భూత-భవిష్యత్-వర్తమానములకు (త్రికాలములకు) ఆవలివారు. అంతేగాని కాలములోనివారు కాదు. కాలబద్ధులు కారు. కాల నియామకులు (స్వప్నములోని కాల గతికి కాలనియామకుడు - స్వప్నము తనదైన వాడే కదా!). కాలః కాల స్వరూపులు! త్రికాలములలోను యథాతథ స్వరూపులు.

త్వం మూలాధారే స్థితోఽసి నిత్యమ్।
మీరు ప్రతి జీవుని మూలాధార చక్రములో వేంచేసినవారై, యోగాభ్యాసకులకు మార్గదర్శకులు, గురువులు అయి ఉన్నారు. సమస్తమునకు మూలాధారులు (The Basic Holding) అయి ఉన్నారు.
(భూః-భువః-సువః) - త్రిలోకములకు మూలాధారులై, కళ్యాణ స్వరూపులుగా వాటిని ప్రదర్శిస్తున్నారు. (మూలాధారే హుత వ హ కళా, విశ్రుతాః ‘బూర్భువః స్సువః।) త్రిలోకములు మీనుండి ప్రదర్శనమగుచు, సమస్తమునకు ‘ఆధారుడు’ అయి ఉన్నారు.

త్వం శక్తిత్రయాత్మికః।
జగన్నిర్మాణమునకు త్రయీ శక్తులగు ఇచ్ఛా-జ్ఞాన-క్రియా శక్తుల ఆత్మ స్వరూపులు మీరే! (తత్ దైవీస్వరూపములగు సరస్వతీ - లక్ష్మీ - పార్వతీ) శక్తిశ్వరూపులై ఉన్నారు. సమస్త జీవులకు శక్తిత్రయమును ప్రసాదించువారు.

త్వం యోగినో ధ్యాయంతి నిత్యమ్।
సర్వాత్మకుడవు. పరమాత్మవు అగు మీ గురించియే యోగాభ్యాసులు, యోగసిద్ధులు నిత్యము ధ్యాసతో ధ్యానించుచున్నారు. మీయొక్క ఉపాసనచే ఈజీవుడు పరమాత్మతో సంయోగము పొందగలడు.

మీరే - సృష్టికర్త అగు బ్రహ్మ। పరిపోషకులు, సంరక్షకులు అగు విష్ణువు। లయకారులగు రుద్రుడు। ఇంద్రియములకు అధినేత అగు ఇంద్రుడు। సర్వమును దహించుచూ, దేహములను రక్షించు అగ్నిహోత్రుడు। సమస్తమునకు చలనము కలిగిస్తున్న వాయువు। కిరణములతో సమస్తము తేజోమయము, జీవన్మయము చేస్తున్న సూర్యుడవు। జీవులకు ఓషధి- వనస్పతి (ఆహార) ప్రదాత అగు చంద్రమసుడవు।

త్వం బ్రహ్మ భూర్భవః స్వః’ ఓం
భూ-భువ-సువర్లోకముల రూపము దాల్చిన ఓంకార సంజ్ఞార్థమగు ‘బ్రహ్మము’ మీరే అయి ఉన్నారు.

గణేశ విద్య (అథర్వమహర్షి విరచితము)

‘‘గం గం గం గణపతయే నమః’’

‘‘గం’’ లో =
‘గ్’ కారము పూర్వ విభాగము। - ‘గ్’
‘అ’ కారము మధ్యమరూపము। - ‘‘గ్ + అ = గ’’
‘⍥’ అనుస్వారము - అంత్యరూపము। - ‘‘గ + ⍥ = గం’’
‘మ్’ బిందువు ఉత్తరరూపము। - ‘మ్……’।
‘ఉమ్’… నాదము - అనుసంధానము. సంహిత - సంధి (ఆత్మతో ఏకము చేయటము)।

‘గం’ అనే పదమునకు ప్రణవమంత్రము (ఓం)ను ముందుగా చేర్చి (‘ఓం - గమ్….’) - మంత్రమును ఉచ్చరిస్తూ ఉండగా, అట్టి మంత్రోపాసనకు (అభ్యాసికి) గణేశుని సాక్షాత్కారము లభించగలదు.
ఋషి → గణకుడు।
ఛందస్సు → నృచత్ గాయత్రీ ఛందస్సు।
దేవత → శ్రీ మహాగణపతి।

ఓం గం గణపతయే నమః।
ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్।।

ఓం గం గణపతీ। (గణకమహర్షికి లభించిన మంత్రదేవతయగు) మీకు ప్రణామములు।

(అని మహాగణపతికి సాష్టాంగ నమస్కారము సమర్పించుచున్నాము).

ఏకదంతము, వక్రతుండము కలిగియుండి, జగత్ప్రభువు అగు శ్రీగణేశభగవానుని మహిమను ధ్యానిస్తున్నాము.
ఆయన మాకు జ్ఞాన సంపదను ప్రసాదించి, మా బుద్ధిని వికసింపజేయుదురు గాక।

ఏక దంతాయ:
జన్మజన్మలుగా వృద్ధి చేసుకుంటూ వస్తున్న ‘అనేకము’ (Multiplicity) అనే వ్యసనము పొందియున్న మా బుద్ధికి, అట్టి జాడ్యము తొలగించి, ‘ఏకత్వము’ ప్రసాదించు, స్వామి! ఒక్క దంతమేగల ఏకదంత- గణపతి. అనేకముగా కనిపిస్తున్న ఈ జగద్దృశ్యమును ఏకముగా అనిపించగలుగు మనో - బుద్ధులను ప్రసాదించగలుగు దేవాది దేవుడు శ్రీ మహాగణపతి। అందుచేతనే ఏకదంతుడు।

‘‘ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ’’।
- ‘‘ఇదంతా ఏకము-అక్షరము అగు బ్రహ్మమే’’- అను స్థానమునకు మార్గము చూపువారు. ఏకదంతుడు.

విద్మహే।
శ్రీ గణపతి యొక్క మహిమను ఎరుగుచున్నాము.

వక్రతుండాయ :
‘‘ఓం’’ - ప్రణవస్వరూపుడు. సర్వాత్మకుడు. ‘తత్త్వమ్’ సంజ్ఞాస్వరూపుడు.
‘ఓం’ కార సంజ్ఞ అగు ఆకారముతో కూడిన తుండముతో ఈ సమస్తమైన ‘అన్యము’ను అనన్యములోనికి పీల్చివేయువారు.

ధీ మహి :
ఆయన మహిమను బుద్ధితో ధ్యానించుచున్నాము.

తన్నో దంతిః ప్రచోదయాత్ :
‘ప్రజ్ఞ’కు సూచకమగు ఏనుగు శిరస్సును కలిగియుండి, ‘తత్’ స్వరూపుడగు శ్రీ గణపతి మా బుద్ధులను ‘తదాత్మజ్ఞానము’ వైపు ప్రేరేపించెదరు గాక। ప్రత్యుత్సాహపరచెదరు గాక।

- - -

నిరాకారుడు, సమస్త నామరూపములు తానే అయినవాడు అగు మహాగణపతి ఆశ్రివత్సలుడు. ఆరాధించువారి పట్ల గల అవ్యాజమైన ప్రేమచే సాకారరూపము ధరించి బాహ్య-అభ్యంతర- హృదయాంతర్గతములలో సాక్షాత్కరిస్తున్నారు.

అట్టి ఉపాస్య సాకార గణపతి రూపమును అభివర్ణించుకుంటున్నాము.

ఏకదంతమ్ :
(తన రెండు దంతములలో ఒకదానిని పెరికి లోకకంటకుడగు మూషికాసురుని సంహరించి లోకకళ్యాణము ప్రసాదించి) ఒక దంతము కలిగియున్నవారు (ఏకత్వము ప్రసాదించువారు). మ-ఉషికేతి మూషికః। ‘‘నాది-నాకు చెందినది’’ - అను మమకారమును వశము చేసుకొని, ఈ జీవునియొక్క మమకారమును ఆత్మభావనకు వాహనమాత్రంగా తీర్చిదిద్దువారు.

చతుర్హస్తం :
నాలుగు చేతులు కలవారు - భక్తి యోగ జ్ఞాన వైరాగ్యహస్తులు. (కర్మ-భక్తి-జ్ఞాన-ముక్తులు చేతులుగా కలవారు)

పాశమంకుశ ధారిణమ్ :
ఒక చేతితో పాశము (ప్రేమపాశము) ధరించినవారు. రెండవ చేతితో దుష్టగుణములు తొలగించు అంకుశము చేబూని ఉన్నవారు. (Loving and correcting).

వరదం హస్తైః బిభ్రాణం (దధానం) :
మిగిలిన రెండు చేతులతో వరద (వరప్రసాద) - అభయ (భయమునుపోగొట్టు) ముద్రలను ధరించువారు.

మూషక ధ్వజమ్ :
మూషిక(ఎలుక) ధ్వజము కలిగియున్నవారు. సమస్తము ప్రసాదించు ప్రకటన కలవారు.

రక్తం :
ఎర్రటి ఛాయగలవారు. (కార్యక్రమములందు ఉత్సాహము కలిగియుండు సంజ్ఞగా వేంచేయువారు).

లంబోదరం :
(సమస్త విద్యలు గల) పెద్దపొట్ట గలవారు.

శూర్పకర్ణకం :
పెద్ద చెవులు కలవారు. (చక్కటి శ్రవణ శక్తిని మాకు ప్రసాదించువారు).

రక్త వాససమ్ :
ఎర్రటి వస్త్రములు ధరించినవారు.

రక్త గంధానులిప్తాంగమ్ :
శరీరమంతా ఎర్రచందనము పులుముకొని యున్నవారు.

రక్త పుష్పైః సుపూజితమ్ :
భక్తులచే మందారము మొదలైన ఎర్రటి పుష్పములతో పూజింపబడువారు. స్వధర్మ పుష్పములు స్వీకరించి ‘ముక్తి’ని ప్రసాదించువారు.

భక్తానుకంపినమ్ దేవమ్ :
భక్తులపై అనుగ్రహము కురిపించు ఆదిదేవుడు.

జగత్కారణమ్ :
జగత్తు యొక్క పుట్టుకకు కారణభూతులు. ఈ సమస్త దృశ్యము యొక్క జనన-గతి-లయములకు కారణము, ఆధారము కూడా అయి ఉన్నవారు.

అచ్యుతమ్ :
సమస్తమును ఆత్మస్వరూపముగా దర్శించుటయందు ‘చ్యుతి’ (Distraction) ఏ మాత్రము లేనట్టివారు. సర్వదా పరబ్రహ్మస్వరూపులు. అచ్యుతత్వము భక్తజనులకు ప్రసాదించువారు.

ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ :
సృష్టికి మునుమందే ఉన్నట్టివారు. లీలావినోదులై ‘సృష్టి’ రూపంగా ఆవిర్భవించువారు.

ప్రకృతేః పురుషాత్ పరమ్ :
ప్రకృతికి ఆవల పురుషుడై వెలుగొందువారు. స్వభావమునకు ‘స్వభావి’గా ప్రకాశమానులు.

ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః।
అట్టి మహాగణపతిని ఎవరు నిత్యము ధ్యానిస్తూ ఉంటారో,… అట్టి వాడు యోగులలో ‘శ్రేష్ఠుడు’ అవుతాడు.

వ్రాతపతీ! (సమూహనాయకా!) (Group Leader)! దేవతలకు అధిపతీ! గణపతీ! ప్రమథ గణపతీ! లంబోదరా! ఏకదంతా! విఘ్ననాశా। శివసుతా! వరప్రదాతయగు వరదమూర్తీ! నమో నమో నమో నమః।।

- - -

అథర్వశిరోగణపత్యుపాసన - ఫలశ్రుతి

అథర్వ మహర్షి సందర్శితమైనట్టి ఈ ‘‘అథర్వ శిరము’’ను అధ్యయనము చేయువాడు ‘‘బ్రహ్మతత్త్వము’’ నందు ప్రవేశించగలడు. అంతటా సుఖవంతుడు కాగలడు. ఆత్మసుఖి కాగలడు. స సర్వ విఘ్నైః న బాధ్యతే।। అట్టివాడు విఘ్నములుచే బాధించుబడడు. తలపెట్టిన కార్యక్రమములను నిర్విఘ్నముగా నిర్వర్తించగలడు.

తత్త్వార్ధమును ఎరిగి గణపతిని ఉపాసించువాడు పంచ మహాపాతకముల దోషముల నుండి కూడా విముక్తుడు అవుతాడు. పగలు చేసిన పాపము రాత్రి (గణపతి) ధ్యానము చేతను, రాత్రి చేసిన పాప దోషము పగలు చేసిన ధ్యానముచే తొలగగలవు. పాపబుద్ధులు తొలగిపోగలవు. శమించగలవు. వ్యతిరిక్త భావాలు సమసిపోగలవు. అట్టివాడు ధర్మ-అర్థ-కామ-మోక్ష చతుర్విధ ఫలములు సిద్ధించుకోగలడు.

ఉదయ - సాయంకాలములు ఇందలి మంత్రములతో గణపతిని ఉపాసించువాడు ‘అపాపి’ అగుచున్నాడు. సమస్త పాపదృష్టులు ఆతనిని విడచిపోగలవు. పుణ్మకర్ముడు, పుణ్యమనస్కుడు కాగలడు.

- - -

ఈ ‘అథర్వశీర్షము’ శిష్యుడు కానివానికి (ఆత్మగురించిన అధ్యయన, అభ్యాస దృష్టిలేనివానికి) గురువులు బోధించరు. మోహము చేత (లౌకిక ఉద్దేశ్యములను, ప్రయోజనములను దృష్టిలో పెట్టుకోవటం చేత) - శిష్యలక్షణము లేనివానికి ఇందలి తాత్త్విక రహస్యములను బోధించటము దోషమే - అని చెప్పబడుతోంది.

ఈ ఉపనిషత్‌లో చెప్పబడిన గణపతి మంత్రములను వేయిసార్లు ఉపాసించువాడు కోరుకొన్నది సిద్ధించుకోగలడు.

ఈ అథర్వశిరములోని మంత్ర-ధ్యాన-ఉపాసనా విశేషములతో గణపతిని అభిషేకించువాడు గొప్ప వాక్‌చాతుర్యము పొందగలడు.
అనశ్నుడై (ఉపవాసి అయి, ఆహారము స్వీకరించక) రోజులో నాలుగుసార్లు అధ్యయనము, తత్-జపము నిర్వర్తిస్తూ ఉండగా, ఆతడు అధికాధిక విద్యావంతుడు కాగలడు.

ఇతి అథర్వణ వాక్యమ్।


అథర్వణ మహర్షి ప్రవచనము చేసిన మంగళాశాసనము।।

గణపతి బ్రహ్మము యొక్క ఆచరణ విద్య తెలుసుకొనియున్నవాడు ఇక దేనికీ భయపడడు. అభయుడౌతాడు.

ఎవడు శ్రీ వరసిద్ధి గణపతిని దూర్వార (గరిక) అంకురములలో పూజిస్తాడో, … అట్టివాడు వైశ్రవణునితో (విశ్రవోబ్రహ్మకుమారునితో /కుబేరునితో) సమానుడౌతాడు.

లాజలతో (వట్టివేర్లు, పేలాలు, నానబియ్యముతో) హోమము చేయువాడు గొప్ప యశోవంతుడు, మేధావి కాగలడు.

వేయి మోదక పత్రములతో (తాములపాకులతో) పుష్పములతో గణపతిని పూజించువాడు కోరుకొన్న ఫలము పొందగలడు.(మోదకము = కుడుము అని కూడా అర్థము కలదు)

నేయిలో తడిపిన సమిధలతో గణపతి హోమము చేయువాడు సమస్తము పొందగలడు.

ఎనిమిది మంది బ్రాహ్మణులతో (లక్షపత్రితో కూడిన) గణపతి హోమ నిర్వహణచే సమ్యక్‌గ్రాహి (ఆత్మ గురించిన జ్ఞానము), సూర్యునితో సమానమైన తేజస్సు పొందగలరు.

సూర్యగ్రహణ సమయంలోను, పవిత్ర నది ఒడ్డున, ప్రతిమా సన్నిధియందు జపము చేయువాడు - మంత్ర సిద్ధి పొందగలడు. సమస్త విఘ్నములనుండి విముక్తుడు కాగలడు. దోషము లెటువంటివైనా సరే తొలగిపోతాయి. సమస్తము ఎరిగినవాడు కాగలడు.

గణపతి యొక్క యోగాత్మతత్త్వము ఎరిగినవాడు స్వస్వరూపాత్మతత్త్వమును స్వానుభవముగా ఎరుగగలడు.

తత్త్వమ్ - సోఽహమ్ భావములను స్వాభావికము, అనునిత్యము చేసుకోగలడు.

🙏 ఇతి గణపతి ఉపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।