[[@YHRK]] [[@Spiritual]]

GāruDa Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


అధర్వణ వేదాంతర్గత

8     గారుడోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్

శ్లో।। విషం బ్రహ్మ-అతిరిక్తం స్యాత్।
అమృతమ్ బ్రహ్మసూత్రకమ్।
బ్రహ్మాతిరిక్త విషహృత్।
బ్రహ్మమాత్ర ఖగేడహమ్।।

పరబ్రహ్మముగా కాకుండా వేరైనదిగా (అన్యముగా) తెలియబడేదంతా ‘విషము’తో సమానమే. ‘‘బ్రహ్మమునకు వేరుగా అనిపించే విషమునకు విరుగుడు ‘‘బ్రహ్మసూత్ర గారుత్మంతమే’’ - అని పలుకు గరుత్మంత భగవానుని తోడు వేడుకొనుచున్నాము. శరణువేడుచున్నాము.

(గ = సర్వ శ్రేష్ఠమైనట్టి, ఋత్‌మంతమ్ = ఆత్మానుభవమంతులు-పరమ సత్యమగు ఆత్మానుభవులు)

1. ఓం
గారుడ బ్రహ్మ విద్యాం ప్రవక్ష్యామి -
- యాం బ్రహ్మవిద్యాం నారదాయ ప్రోవాచ।
నారదో బృహత్సేనాయ।
బృహత్సేన ఇంద్రాయ।
ఇంద్రో భరద్వాజాయ।
భారద్వాజో జీవత్కామేభ్యః।
శిష్యేభ్యః - ప్రాయచ్ఛత్।।
సద్గురువు :
‘ఓం’ - ఏకాక్షర స్వరూప పరమాత్మకు నమస్కరిస్తూ…
ప్రియ శిష్య - మమాత్మ స్వరూపులారా! ఇప్పుడు మనము ‘‘గారుడ బ్రహ్మవిద్య’’ చెప్పుకుంటున్నాము.

అనాత్మ దృష్టి అనే విషమునకు ‘విరుగుడు’ అయినట్టి గారుడాత్మక- అమృతాత్మకమగు-ఈ మహావిద్య- ఒకప్పుడు నారద మహర్షికి బ్రహ్మభగవానునిడు బోధించారు. శ్రీనారద మహర్షి - బృహత్సేనులకు వారికి, బృహత్సేనులు ఇంద్రదేవులకు, ఇంద్రుడు భరద్వాజుల వారికి, భరద్వాజులు జీవత్కామేభ్యులకు, ఆయన తన శిష్యులకు, ఆపై పరంపరగాను బోధింపబడుచూ వస్తోంది.

అస్యాః ‘‘శ్రీ మహాగరుడ బ్రహ్మవిద్యాయా’’।

బ్రహ్మా - ఋషిః।
గాయత్రీ - చ్ఛందః।
శ్రీ భగవాన్ మహాగరుడో - దేవతా।
శ్రీ మహాగరుడ ప్రీత్యర్థే
మమ సకల విష వినాశనార్థే
జపే వినియోగః।।
‘‘శ్రీ మహాగరుడ మహావిద్య’’

‘‘ఓం ఈం ఓం నమో భగవతే మహాగరుడాయ।
పక్షీంద్రాయ। విష్ణు వల్లభాయ।
త్రైలోక్య పరిపూజితాయ।
ఉగ్ర భయంకర కాలానల రూపాయ నమో నమః।।

ఈ మహాగరుడ విద్యకు:
ఋషి→ సృష్టికర్త, జగత్ పితామహుడు అగు బ్రహ్మభగవానుడు।
ఛందస్సు - గ్రాయత్రీ!
శ్రీ మహాగరుడు భగవానుడు → దేవత।

అట్టి శ్రీ గరుడభగవానుడు ప్రీతి చెందినవారై మా యొక్క (ఇంద్రియ విషయములనే) విషసర్పముల విషము తొలగించుటకై, అమృతత్వము సిద్ధింపజేయుటకై-మంత్రోపాసన (జపము) చేయడానికి సిద్ధపడుచున్నాము. [‘దృశ్యవిషయములు’ అనే విషసర్ప బంధనములనుండి (నాగబంధనముల నుండి) విడిపించి, మాకు ‘‘ఆత్మయేవాఽహమ్’’ - అను అమృతమును అందించెదరు గాక।]
కరన్యాసము
‘‘ఓం నమో భగవతే’’ - అంగుష్ఠాభ్యాం ‘‘నమః’’
‘‘శ్రీ మహాగరుడాయ’’ - తర్జనీభ్యాం ‘‘స్వాహా।’’
‘‘పక్షీంద్రాయ’’ - మధ్యమాభ్యాం ‘వషట్’।
‘‘శ్రీ విష్ణువల్లభాయ’’ - అనామికాభ్యాం ‘హుం’।
‘‘త్రైలోక్య పరిపూజితాయ’’-కనిష్ఠికాభ్యాం ‘‘వౌషట్’।
ఉగ్ర భయంకర కాలానల రూపాయ -
కరతల -కర - పృష్ఠాభ్యాం - ‘ఫట్’।
ఏవం హృదయాది న్యాసః
అంగన్యాసము - (ఏవం హృదయాదిన్యాసః)
ఓం నమో భగవతే - హృదయాయ ‘నమః’।
శ్రీమహా గరుడాయ - శిరసే ‘స్వాహా’।
శ్రీ పక్షీంద్రాయ - శిఖయాయ ‘వషట్’।
శ్రీ విష్ణువల్లభాయ - కవచాయ ‘హుం’।
త్రైలోక్య పరిపూజితాయ - నేత్రత్రయాయ ‘వౌషట్’।
ఉగ్ర భయంకర కాల అనల రూపాయ - అస్త్రాయ ‘ఫట్’।
(→ హృదయాయ నమః। శిరసే స్వాహా। శిఖయాయ వషట్। కవచాయే హుమ్। నేత్ర త్రయాయవౌషట్। అస్త్రాయఫట్।)
భూర్భువస్సువరోమ్
(భూః భువః సువః ‘ఓం’)
ఇతి దిగ్బంధః
→ భూ-భువర్-సువర్ -లను గరుడ భగవాన్ రూపముగాను, ఆత్మ సాక్షాత్కారముగాను (ప్రత్యక్షరూపంగా) భావిస్తూ - (మనో-వాక్- కాయములను, బుద్ధి-చిత్తములను) - దిగ్బంధనము చేయుచున్నాము. (చాంచల్యములను నిరోధిస్తున్నాను)
2. ధ్యానమ్
‘స్వస్తికో’ దక్షిణం పాదం।
వామపాదం తు ‘కుంచితమ్’।
ప్రాంజలీకృత దోర్యుగ్మం।
గరుడం హరివల్లభమ్।
అనంతో వామకటకో।
యజ్ఞసూత్రం తు ‘వాసుకిః’।
ధ్యానమ్
కుడిపాదమును స్వస్తికాసన విధిగా మడచి, తొడపై భాగమును తాకిస్తూ, ఎడమ పాదమును కుంచితము (ముడుచుకున్నట్లు) గాను ధరించి రెండు హస్తములతోను శ్రీహరికి నమస్కరిస్తూ ఉన్నట్టి - గారుడాయ నమః।

శ్రీహరికి అత్యంత ప్రియుడగుచున్నట్టి - శ్రీమన్ గరుడ భగవానునికి హృదయపూర్వక నమస్కారము. సమస్తము

విష్ణుతత్త్వముగా దర్శిస్తూ ఆనందిస్తున్న శ్రీమత్ గరుడస్వామికి నమస్కారము.

మహాసర్ప భూషణాయ నమః

అనంత సర్పమును ఎడమ భుజముపై అలంకారముగా కలవారు. వాసుకిని యజ్ఞసూత్రముగా ధరించినవారు.
‘తక్షకః’ కటి సూత్రం తు,
హారః ‘కార్కోట’ ఉచ్యతే।
‘పద్మో’ దక్షిణ కర్ణేతు
‘మహాపద్మ’స్తు వామకే।
‘శంఖః’ శిరః ప్రదేశేతు।
‘గుళిక’స్తు భుజాంతరే।
- తక్షక మహాసర్పమును మొల సూత్రముగా కలిగియున్నవారు,
- కర్కోటక మహాసర్పమును హారముగా ధరించుచున్నవారు,
- పద్ముని కుడి చెవిని, మహాపద్ముని ఎడమచెవికి, శంఖవలె సర్పమును శిరోప్రదేశమునందు, గుళికుని భుజస్కంధములపైన
ఆయాసర్పములను ఆభరణముగా ధరిస్తున్న గరుడుని సేవించుచున్నాము.

మహాసర్ప భూషణాయ నమో నమో నమో నమః।।

‘పౌండ్ర కాళిక’ నాగాభ్యాం।
చామరాభ్యాం సువీజితమ్।
‘ఏలాపుత్రక’ నాగాద్యైః।
సేవ్యమానం ముదాన్వితమ్।।
పౌండ్ర కాళిక నాగులను (సర్పములను), చామరములు వీచువారుగాను,
ఏలాపుత్రక నాగము మొదలైన సర్పములు సేవకులుగాను, - కలిగియున్న ఆనందస్వరూపులగు గరుడ భగవానుని స్తుతిస్తున్నాము.
కపిలాక్షం గరుత్మంతం
సువర్ణ సదృశ ప్రభమ్।
దీర్ఘబాహుం బృహత్ స్కంధం
నాగాభరణ భూషితమ్।।
కపిల వర్ణ (ఎర్రటి) కనులుగలవారు, బంగార రంగుతో ప్రకాశించువారు, దీర్ఘమైన బాహువులతో, ఎత్తైన భుజములతో పాములను ఆభరణములుగా కలిగి వర్తించువారు - అగు గరుడ భగవన్। నమో నమః।। రక్షమాం। పాహి మాం।
ఆజానుతః సువర్ణాభమ్
ఆకట్యోః తుహిన ప్రభమ్।
కుంకుమారుణమ్ ఆకంఠం
శతచంద్ర నిభాననమ్।
నీలాగ్ర నాసికా వక్రం
సుమహత్ చారు కుండలమ్।
దంష్ట్రా కరాళ వదనం, కిరీటమకుటోజ్వలమ్।
కుంకుమారుణ సర్వాంగ కుందేందు ధవళానన।
విష్ణువాహ! నమస్తుభ్యం।  
క్షేమం కురు సదా మమ।।

మోకాళ్ళ నుండి బంగారు రంగుగా మెరయువారు, కటి (మొల) వద్ద తెల్లటి ప్రభలతో వెలుగొందువారు,
కంఠము వరకు కుంకుమ రంగుతో ప్రకాశించువారు,
శతపూర్ణ చంద్రకాంతులతో ప్రకాశించు ముక్కు గలవారు,
నీలముగా వెలుగొందు ముక్కు తుది (చివర) కలవారు,
ఉత్తమమైన మహత్ గల (సుమహత్) - మహిమతో కూడిన అందమైన దీర్ఘకుండలము కలవారు,
కోరలతో భీకరమైన వదనముతో కిరీటధారులై, జాజ్వల్యమానులు,
కుంకుమ రంగుతో సర్వాంగ సుందరులు, మల్లెమొగ్గలవలె పూర్ణచంద్రునివలె ముఖము కలవారు,-

అయి విష్ణువాహనమగు శ్రీగరుడ భగవాన్। మీకు నమస్కారము. దయతో మాకు క్షేమము కలుగజేయ ప్రార్థన.

ఏవం ధ్యాయేత్ త్రిసంధ్యాసు
గరుడం నాగభూషణం।
విషం నాశయతే శీఘ్రం
తూలరాశిమ్ ఇవ అనలః।।।
ఈ విధంగా త్రిసంధ్యలలోను నాగాభరణులగు గరుడ భగవానుని ఉపాసించుటచే - పెద్ద దూదికుప్ప అగ్నికణముచే భస్మమైపోవు విధంగా - (సాంసారిక దృష్టుల వలన కలుగు) విషము అతి శీఘ్రంగా నశించిపోగలదు. తులారాశి ప్రవేశించగానే శీలాకాల ప్రారంభంచేత మంచువర్షంచే యండ యొక్క ఉష్ణముచే మంచుకరగిపోవునట్లు - శమించువిధంగా ఇంద్రియ (విషయపరంపరా రూప) విషము తొలగగలదు. అగ్ని కరణముచే దూది భస్మము అగునట్లు మాపట్ల విషము నశించగలదు.

ఓం ఈం ఓం నమో భగవతే।
శ్రీ మహాగరుడాయ, పక్షీంద్రాయ।
విష్ణు వాహనాయ (వల్లభాయ)। త్రైలోక్య పరిపూజితాయ।
ఉగ్ర భయంకర కాలానల రూపాయ।
వజ్ర నఖాయ। వజ్ర తుండాయ।
వజ్ర దంతాయ। వజ్ర దంష్ట్రాయ।
వజ్ర పుచ్ఛాయ। వజ్ర పక్షాలంకృత శరీరాయ।
ఓం ఈం ఏహి ఏహి।।
ఓ గరుడ దేవాదిదేవా! భగవతే।

‘ఓం ఈం ఓం’ బీజాక్షరములచే పలుకబడుచున్న నీ దివ్య భవగవత్ ఐశ్వర్యమునకు నమస్కారము!
శ్రీ మహాగరుడదేవా! పక్షీంద్రా! విష్ణువాహనా! త్రిలోకవాసులచే పూజింపబడువాడా! కాలాగ్నివలె ఉగ్ర భయంకర రూపా! వజ్రమువంటి గోళ్ళు (Nails), తుండము, దండము, దంష్ట్రములు (పలు చివరలు,), తోక గల స్వామీ! వజ్రము వంటి పక్షిశరీరాలంకృతుడా!

‘ఓం ఈం ఓం’ - బీజాక్షరములతో సమర్పించు మా ఈ హృదయ- కైంకర్యమును స్వీకరించి మమ్ములను రక్షించండి.

శ్రీ మహాగరుడ అప్రతిహత శాసన!
అస్మిన్ ఆవిశావిశ। విశావిశ। దుష్టానాం
విషం దూషయ దూషయ।
స్పృష్టానాం విషం నాశయ। నాశయ।
దంద శూకానాం విషం దారయ। దారయ।
ప్రలీనం విషం ప్రణాశయ। ప్రణాశయ।
సర్వ విషం నాశయ। నాశయ।
ఓ మహాగరుడ భగవాన్! మీరు శాసించనిదే ఎవ్వరూ మీ మాయను దాటలేరు. మీరు దాటబడ జాలరు కాబట్టి ‘‘అప్రతిహత శాసనులు’’.

స్వామీ! మా హృదయమందు మీరు మీ తేజస్సుతో ప్రవేశించండి. మేము దుష్టమైన (చెడు మాట్లాడటము, చూడటము, భావించటటము మొదలైన) ‘విషయములు’ అనే విషజ్వాలలో చిక్కుకున్నాము. భీతిల్లి ఉన్నాము. దండ శూక (రెండు తలలపాము-ద్వంద్వ భావముల) విషము వదిలించండి. మమ్ము తాకుచున్న ద్వంద్వ మోహ విషయములు నశింపజేయండి.
రెండు తలల పాముల విషమును (మమ్ము పట్టుకొన్న ద్వంద్వ మోహమును) చీల్చివేయండి.

మా శరీరములోను, రక్తములోను, (మనోబుద్ధులలోను) ప్రలీనమై లోతుగా కలిసిపోయి ఉన్న (విషయ) విషప్రభావములను త్రోసివేయండి. విషమునంతా తొలగించివేయండి. మీ స్మరణచే మాలోని విషమంతా విరిగి పోవును గాక। అమృతదృష్టి అలవడును గాక। అమృతము వర్షించును గాక!

హన। హన। దహ। దహ।
పచ। పచ।
భస్మీకురు। భస్మీకురు।
హుం ఫట్ స్వాహా।।
విషయ విషవాసనలను విషసర్పములను చంపి వేయండి. హననము చేయండి. దహించివేయండి. మసి చేయండి। (మాలోని మూర్ఖత్వమును) పచనము చేసి వేయండి. వండివేయండి. (మాపాప దృష్టులను) భస్మము చేసివేయండి. భస్మము చేయండి. బూడిదగా చేసివేయండి.

మీయొక్క ‘హుమ్’ అను ధ్వనిచే మా విషదోషములన్నీ పారిపోయేట్లు చేయండి.

‘ఫట్’ శబ్దముచే మా మొండితనమును పగులగొట్టండి. ‘స్వాహా’ శబ్దపూర్వకంగా మా వినతులు స్వీకరించండి।
3. చంద్రమండల సంకాశ!
సూర్యమండల ముష్టిక!
పృధ్వీమండల ముద్రాంగ!
శ్రీ మహాగరుడ!
విషం హర హర।
హుం ఫట్ స్వాహా।
ఓం క్షిప స్వాహా।
- చంద్రమండలము వలె ప్రశాంత స్వరూపా! ‘‘దేహమనోరోగ ఓషధీ’’ సంప్రసాదా!
- సూర్య మండలము వంటి ముష్టిక (సమృద్ధి) స్వరూపా!
- భూమండలమంతా చిన్ముద్రగా ధరించినవాడా!
- శ్రీమహాగరుడ భగవాన్! మాలోని విషబీజములను హరించివేయండి. ‘హుం’ శబ్దముతో, ‘ఫట్’ శబ్దముతో దుష్టత్వము తొలగించి మా ప్రార్థనలు స్వీకరించండి.
- మమ్ములను క్షిపించి (ప్రేరేపించి) ఉత్సాహపరచుటులకై మేము సమర్పిస్తున్న ఈ ఆహుతులను స్వీకరించండి.
ఓం ఈం స చరతి। స చరతి।
తత్కారీ మత్కారీ। విషాణాం చ
విష రూపిణీ। విష దూషిణీ।
విష శోషిణీ। విష నాశినీ।
విష హారిణీ। హతం విషం।
నష్టం విషమ్ అంతః ప్రలీనం।
విషం ప్రణష్టం। విషం హతం।
తే బ్రహ్మణా విషం హతం-
ఇంద్రస్య వజ్రేణ స్వాహా।।
‘ఓం’కార ‘ఈం’కార స్వరూపుడై ఆ గరుడభగవానుడు తన తేజస్సుచే ప్రదర్శనమగుచున్నారు. సర్వత్రా చేతనులై చలనము కలిగి ఉన్నారు. సమస్తమునకు కర్త ఆ మహాగరుడ భగవానుడే! ఆ సర్వాత్మకుడే. -
సమస్తమునకు కార్య కారణ కర్త! విషమునకే విషము వంటివాడు. సమస్తము ఆ గరుడ స్వామికి అనన్యము కాబట్టి విశ్వరూపి! విషమును దూషింప జేయువారు! విషమును ఎండింపజేయువారు! విషమును నశింపజేయువారు! విషమును హరించువారు. అట్టి శ్రీమన్ గరుడస్వామిని స్మరించుచున్నాము. ఆయన యొక్క స్మరణచే సర్వదోషముల ప్రభావము తొలగిపోగలదు. విషము విషహరుడగు గరుడినిలో కరిగిపోగలదు.
ఆ గరుడ దేవుని స్మరణచే, ఇంద్రుని వజ్రము కొండలను పిండిచేయు విధంగా, - మాలోని దుర్భుద్ధిరూపమగు విషము నశించిపోగలదు. ఆయన ప్రసాదించు బ్రాహ్మీ దృష్టిచే విషముయొక్క విషత్వము తొలగి, ఈ సమస్తము అమృతత్వము సంతరించుకోగలదు.

‘‘ఓం నమో భగవతే మహాగరుడాయ।
విష్ణువాహనాయ। త్రైలోక్య పరిపూజితాయ।
వజ్రనఖ వజ్రతుండాయ।
వజ్రపక్షాలంకృత శరీరాయ ఏహ్యేహి। (ఏహి ఏహి)।
మహాగరుడ। విషం ఛింధి। ఛింధి।
ఆవేశయ। ఆవేశయ।
హుం ఫట్ స్వాహా’’।।
ఓంకార స్వరూపా! భగవంతుడా! మహాగరుడ దేవా! విష్ణు భగవానుని వాహనమా! త్రిలోకములచే భక్తి ప్రపత్తులతో పూజింపబడువాడా! నమో నమః।

వజ్రము వంటి గోరులు, వజ్రము వంటి ముక్కు, వజ్రము వంటి రెక్కలచే అలంకృతమైన శరీరము ధరించిన స్వామీ! సుస్వాగతము! దయచేయండి. ఓ మహాగరుడా! మా (విషయ భ్రమలరూప) విషమును ఛేదించి వేయండి. మీ జ్ఞాన భక్తి ప్రజ్ఞలతో మా మనో బుద్ధులను ఆవేశించి ఉండండి. హుం ఫట్ స్వాహా!
సుపర్ణోఽసి గరుత్మాన్
త్రివృత్తే శిరో గాయత్రం।
ఓ గరుత్మంత భగవాన్! మీరు మీ గొప్ప రంగులతో కూడిన రెక్కలతో మెరుస్తూ ఉన్న సువర్ణ-సుపర్ణులు. మీ శిరస్సు - త్రివృత్ గ్రాయత్రీ మంత్ర హృదయము.
(త్రివృత్తులు = దృశ్యము, ద్రష్ట, సాక్షి).
చక్షుః స్తోమ, ఆత్మా సామ,
తే తనూః వామదేవ్యం
బృహద్రథంతరే పక్షౌ। (బృహత్ రథంతరే పక్షౌ)।
మీ చక్షువులు చల్లటి చూపులు గల చంద్రబింబ సమానము (సోమము). మీ ఆత్మయే సామవేదము! మీ తనువు (శరీరము) వామదేవ (శివ) స్వరూపము. మీ రెక్కలు బృహద్రథంతరములు (అంతరమగు బృహదాత్మ స్వరూపము).
యజ్ఞా యజ్ఞియం పుచ్ఛం।
ఛందాంసి అంగాని।
ధిష్ణియాః శఫా యజూంషి నామ।
సుపర్ణోఽసి గరుత్మాం
దివంగచ్ఛ సువః పత।
మీ పుచ్ఛము (తోక) యజ్ఞాయ యజ్ఞీయము (యజ్ఞ పురుష స్వరూపము) వేదములు (ఛందస్సులు) మీ అంగములు.
యజుర్వేదము మీరు అంకుశముతో వేంచేసియున్న గృహము.
హే గరుత్మన్! మీరు సుపర్ణులు। గొప్ప అందమైన, బలమైన రెక్కలతో సువర్లోకము వరకు ఎగురుచు మమ్ములను ఉద్ధరించగలిగినట్టివారు.
ఓం ఈం బ్రహ్మ విద్యామ్
అమావాస్యాం పౌర్ణమాస్యాం పురోవా చ।
స చరతి। స చరతి। తత్కారీ। మత్కారీ।
విష నాశినీ। విష దూషిణీ। విష హారిణీ। హతం విషం।
విషం నష్టం। విషం ప్రణష్టం।
విషం హతం। ఇంద్రస్య వజ్రేణ విషం హతం।
‘ఓం’కార ‘ఈం’కార స్వరూపులగు మీరు మమ్ములను అమావాస్య -పౌర్ణమిలకు (కాలమునకు) ఆవల ఆత్మ ప్రసంగులై మాకు సిద్ధించండి.
ఆ గురుడ భగవానుడే సర్వజీవులలో ఆత్మస్వరూపులై చరిస్తున్నారు. సమస్తమునకు కారణమగు తత్ స్వరూపులు. ‘మత్’ (‘నేను’ ‘నేను’ అను రూపంగా) సర్వజీవులలో వేంచేసివున్నారు. విషమును నశింపజేయువారు, తొలగించువారు, విషప్రయోగములను వినష్టము చేయువారు. స్మరణచే ఇంద్రుని వజ్రమువలె విషమును హతము చేయగలుగువారు.
తే బ్రహ్మణా విషమ్ ఇంద్రస్య
వజ్రేణ స్వాహా। తతః త్రయమ్ (తతన్త్రయమ్)।
యది అనంతక దూతోఽసి
యదివా అనంతకః స్వయమ్,
స చరతి। స చరతి।
తత్కారీ। మత్కారారీ। విషనాశినీ।।
ఇంద్రుని వజ్రము వలె ‘విషమును తొలగించి బ్రహ్మజ్ఞానము ప్రసాదించు మీకు ఈ త్రి- ఆహుతులు సమర్పిస్తున్నాము. (నేయి యజ్ఞములో వేయాలి). మీరు త్రిమూర్తి స్వరూపులు. అనంతుడగు పరమాత్మకు దూత!
మీరే స్వయముగా అనంతులు (అనంత స్వరూపులు). ఇక-అనంతకసర్ప దూతగాని, స్వయముగా అనంతకసర్పముగాని మీస్మరణచే మారు సానుకూల్యమవుతారు. మాకు హాని చేయదు.
ఆ గరుడాత్మ భగవానుడే సర్వత్రా సర్వరూపి అయి చరిస్తున్నారు. వారే తత్‌గా సమస్తమునకు కర్త! నాలో నేనై ఉన్నవారు ఆయనయే! ‘విషయములు’ అను విషములను (ఆత్మకు అన్యభావములను, ఇంద్రియాకర్షణలనే విషయములను) నశింపజేయ గలవారు. అట్టి గరుడ దేవా! నమో నమః!
విషదూషిణీ, హతం విషం, నష్టం విషం,
హతమ్ ఇంద్రస్య వజ్రేణ విషం హతం తే
బ్రహ్మణా విషమ్ ఇంద్రస్య వజ్రేణ స్వాహా।
ఓ గరుడ దేవాది దేవా!
మీరు విషదూషిణి అయి విషమును హతము చేయండి. ఇంద్రుని వజ్రము కొండలను ఖండించు తీరుగా మాలో విషబీజములు తొలగించండి. విషభావములను సంస్కరించి, బ్రాహ్మీ భావములను చిగురింపజేయండి. ఇంద్రుని వజ్రము వలె మాలో దుష్ట సంస్కారములు ఖండించివేయుటకై (మేము చేయు కర్మఫలములను) ఆహుతులుగా మీకు సమర్పిస్తున్నాము. (నేయి అగ్నిలో వేయాలి).
4. యది వాసుకి దూతోఽసి, -
యదివా వాసుకిః స్వయం - స చరతి। స చరతి।
తత్కారీ। మత్కారీ।
విష నాశినీ। విష దూషిణీ।
హతం విషం నష్టం।
విషం హతం ఇంద్రస్య వజ్రేణ।
విషం హతం తే బ్రహ్మణా, విషమింద్రస్య వజ్రేణ స్వాహా।
నన్ను సమీపించు (విషయ) విష సర్పములు వాసుకీ సర్పము యొక్క దూత అయినప్పటికీ, (లేక) సాక్షాత్తూ వాసుకీ సర్పమే అయినప్పటికీ కూడా, అది మీ నామస్మరణచే నన్ను వదలిపోగలదు. అది తత్కారి, మత్కారి అయి (నాలో తత్-మత్ ఏక స్వరూపిణి అయి) విషనాశని, విషదూషిణి అయి విషమును పోగొట్టుకోగలదు. వాసుకీ సర్ప విషము కూడా ఇంద్రుని వజ్రము వలె మీ స్మరణచే హతమై పోగలదు. బ్రహ్మీభావులగు మీ సామీప్యముచే బ్రాహ్మీభావములు ఉదయించుటకై - ఆహుతులు సమర్పిస్తున్నాము. (నేయిని అగ్నిలో సమర్పిస్తున్నాము).
యది తక్షక దూతోఽసి, యదివా తక్షకః స్వయమ్,-
స చరతి। స చరతి।
తత్కారీ। మత్కారీ।
విష నాశినీ। విష దూషిణీ।
హతం విషం నష్టం విషం
హతమ్ ఇంద్రస్య వజ్రేణ విషం హతం।
తే బ్రహ్మణా విషమ్ ఇంద్రస్య వజ్రేణ స్వాహా।
తక్షక సర్పదూత అయినా, (లేక) సాక్షాత్ తక్షకుడే అయినా, ‘‘తత్‌కారి, మత్‌కారి’’ అగు మీ స్మరణచే చరించిపోగలదు. మీ అనుగ్రహముచే ఆ పరమాత్మ నాలోని ‘‘తత్‌కారి-మత్‌కారి’’ అయి- వెలుగొందగలరు.
ఓ తత్కారీ! మత్కారీ! విషనాశనీ! విషదూషణీ! బ్రహ్మదేవ సంకల్పముచే విషము హతమై వినష్టమైపోగలదు. ఇంద్రుని వజ్రఘాతము వలె విషమును తొలగించగలదు. మీకు ఇంద్రవజ్రస్వరూపులగు ఈ ఆహుతులు సమర్పిస్తున్నాము. విషయమునకు వ్యతిరిక్తమగు బ్రహ్మభావము మాకు ప్రసాదించెదరు గాక. (నేయిని అగ్నిని సమర్పిస్తున్నాము). ఈ హోమద్రవ్యములు స్వీకరించండి. ‘‘స్వాహా’’!
యది కర్కోటక దూతోఽసి -
యది వా కర్కోటకః స్వయమ్, -
స చరతి। స చరతి। తత్కారీ। మత్కారీ।
విష నాశినీ। విష దూషిణీ।
హతం విషం। నష్టం విషం।
హతమ్ ఇంద్రస్య వజ్రేణ విషం హతం।
తే బ్రహ్మణా విషమ్ ఇంద్రస్య వజ్రేణ స్వాహా।
కర్కోటక దూత అయినా, (లేదా) స్వయముగా కర్కోటక మహాసర్పము అయినాకూడా, మీ స్మరణచే విషభావములు వీడగలరు. సచరతి! బ్రహ్మాత్మకమగు తత్కారి, మత్కారి, విషనాశనీ, విషణదూషిణి, విషము తొలగించునది కాగలదు. ఇంద్రుని వజ్రమువలె వేంచేసి మీయొక్క నామస్మరణము-మమ్ములను బాధించు విషమును హతము చేయగలరు.
విషమునకు ఇంద్ర వజ్రఘాతము వంటి మీ నామమును స్మరిస్తూ ఆహుతులను సమర్పిస్తున్నాము. ‘‘స్వాహా’’!
యది పద్మక దూతోఽసి -
యది వా పద్మకః స్వయమ్। -
సచరతి। సచరతి। తత్కారీ। మత్కారీ।
విషనాశినీ। విషదూషిణీ। హతం విషం। నష్టం విషం।
హతమ్ ఇంద్రస్య వజ్రేణ విషగ్ం హతం।
తే బ్రహ్మణా విషమింద్రస్య వజ్రేణ స్వాహా।
అది పద్మక దూత అయిన విషసర్పము కావచ్చు, (లేక) స్వయముగా పద్మకమహాసర్పమే కావచ్చు గాక। మీ నామస్మరణచే ఇక్కడి నుండి చరించగలదు. (వెళ్ళిపోగలదు). బ్రహ్మదేవుని కృపచే తత్కారి, మత్కారి, విషనాశని, విషదూషిణి, విషహతి, విషనష్టి అవగలదు. ఇంద్రుని వజ్రాయుధము వంటి గరుడ నామస్మరణ - బాహ్మీ దృష్టి భావన, బ్రహ్మత్వము ప్రసాదించగలదు. అట్టి మీకు ఆహుతులు సమర్పిస్తున్నాము. ‘‘స్వాహా’’!
యది మహాపద్మక దూతోఽసి, -
యది వా మహాపద్మకః స్వయమ్, -
స చరతి। స చరతి। తత్కారీ। మత్కారీ।
విష నాశినీ। విష దూషిణీ।
హతం విషం। నష్టం విషం।
హతమ్ ఇంద్రస్య వజ్రేణ విషం హతం।
తే బ్రహ్మణా విషమింద్రస్య వజ్రేణ స్వాహా।
మమ్ములను (సంసారిక విషయములలో గాయపరచటానికి వచ్చిన) మహాపద్మక సర్పదూత అయినా, లేక మహా పద్మక మహాసర్పమే స్వయముగా అయి ఉన్నప్పటికీ, మీ నామము రక్షించగలదు. విషనాశి, విషదూషిణి, వజ్ర సమానము అగు మీ మంత్ర మననముచే విషము హాని కలిగించక, ప్రక్కకు వెళ్లిపోగలదు. మాలో నిరాటంకముగా బ్రాహ్మీదృష్టి ఏర్పడుటకై మీకు హోమద్రవ్య ఆహుతులు సమర్పిస్తున్నాము. ‘‘స్వాహా’’!
యది శంఖక దూతోఽసి,
యది వా శంఖకః స్వయమ్,
స చరతి। స చరతి। తత్కారీ। మత్కారీ।
విషనాశినీ। విషదూషిణీ। విషహారిణీ।
హతం విషం। నష్టం విషం।
హతమ్ ఇంద్రస్య వజ్రేణ విషం హతం,
తే బ్రహ్మణా విషమ్ ఇంద్రస్య వజ్రేణ స్వాహా।
శంఖక సర్పదూత అయినా, స్వయముగా శంఖక మహాసర్పమే అయినా కూడా - వజ్రతుల్యమగు మీ నామస్మరణచే వాటి విషము తొలగిపోగలదు. తత్కారి, మత్కారి, విషనాశిని, విషదూషిణి, విషహారిణి అగు మీరు విషమును హరించివేయగలరు. ఇంద్రవజ్రము వలె విషభావావేశములను మాలో తొలగించి బ్రహ్మతత్త్వము రూపుదిద్దుకోవటానికై మీకు ఆహుతులను సమర్పిస్తున్నాము. మీ అనుగ్రహముచే సృష్టికర్త అగు బ్రహ్మ తోడవగలరు. భక్తితో హోమద్రవ్యములు సమర్పిస్తున్నాము. ‘‘స్వాహా’’!
యది గుళిక దూతోఽసి, -
యదివా గుళికః స్వయమ్, -
స చరతి। స చరతి।
తత్కారీ। మత్కారీ।
విషనాశినీ। విషదూషిణీ। విషహారిణీ।
హతం విషం । నష్టం విషం।
హతం ఇంద్రస్య వజ్రేణ విషం హతం।
తే బ్రహ్మణా విషమింద్రస్య వజ్రేణ స్వాహా।।
గుళిక మహాసర్పము యొక్క దూత అయినప్పటికీ, స్వయముగా దుళికమహాసర్పమే అయినప్పటికీ అది, మీ నామస్మరణచే మాకు సానుకూలము అయి చరించగలదు. మేము బ్రహ్మదేవుని కృప కూడా పొందగలము.
ఇంద్రవజ్రము వంటి గరుడ భగవానుని కృపచే విషము హతము, వినష్టము కాగలదు.
తత్కారీ - మత్కారీ అగు గరుడ భగవానుని చల్లటి చూపుచే ఇంద్రియ విషయరూపములగు విషములు తొలగి బ్రహ్మతత్త్వము ఇంద్రుని వజ్రమువలె మాయందు ప్రకాసించగలదు.
యది పౌండ్రకాళిక దూతోఽసి, -
యదివా పౌండ్రకాళికః స్వయమ్, -
స చరతి। స చరతి। తత్కారీ। మత్కారీ।
విషనాశినీ। విష దూషిణీ। విషహారిణీ।
హతం విషం। నష్టం విషం, హతమ్
ఇంద్రస్య వజ్రేణ, విషం హతం।
తే బ్రహ్మణా విషమింద్రస్య వజ్రేణ స్వాహా।।
అట్లాగే ఫౌండ్రకాళిక సర్పము యొక్క దూతగాని, స్వయముగా పౌండ్రకాళిక మహాసర్పముగాని తత్కారీ-మత్కారీ స్వరూపులగు గరుడ దేవాదిదేవుని మననముచే - వారి విషము నశించగలదు. విషమంతా దూషనము పొందగలదు. వినష్టమై హతమై పోగలదు. మాయందు ఇంద్రుని వజ్రమువలె బ్రహ్మతత్త్వము తేజోవంతమవగలదు.
యది నాగక దూతోఽసి, -
యదివా నాగకః స్వయమ్, -
స చరతి। స చరతి। తత్కారీ। మత్కారీ।
విష నాశినీ। విషదూషిణీ। విషహారిణీ।
హతం విషం। నష్టం విషం।
హతమ్ ఇంద్రస్య వజ్రేణ
విషం హతం తే బ్రహ్మణా
విషమింద్రస్య వజ్రేణ స్వాహా।।
అదేవిధంగా నాగసర్పము యొక్క దూతగాని, స్వయముగా నాగక మహాసర్పముగాని మీ నామస్మరణముచే, మా మనస్సు మీ యందు చరించుచున్నప్పుడు విషము వినష్టము కాగలదు. బ్రహ్మదేవుని కృప వలె, ఇంద్రుని వజ్రము వలె మాయందు బ్రాహ్మీతత్త్వ భావన ఘనీభూతమవగలదు. ఆహుతుల సమర్పిస్తున్నాము. స్వాహా!
5. యది లూతానాం, ప్రలూతానాం, -
యది వృశ్చికానాం, యది ఘోటకానాం,-
యది స్థావర జంగమానాం -
స చరతి। స చరతి। తత్కారీ, మత్కారీ।
విషనాశినీ। విషహారిణీ। విషదూషిణీ।
హతం విషం। నష్టం విషం।
హతమ్ ఇంద్రస్య వజ్రేణ విషం హతం,
తే బ్రహ్మణా విషమ్
ఇంద్రస్య వజ్రేణ స్వాహా।।
సాలె పురుగు విషమైనా, రాక్షస సాలెపురుగు విషమైనా, తేలు, ఘోటకము (గుర్రము) స్థావర జంగమముల విషము కూడా గరుడ భగవానుని స్మరణచే - సచరత్వము పొందగలదు. ‘తత్కారి-మత్కారి’ అయిన గరుడునికి నమస్కరించగా విషము నాశనము కాగలదు. హరించుకుపోగలదు. వజ్రఘాతమునకు కొండవలె విషము విషత్వము కోల్పోగలదు. ఇంద్ర వజ్రము వంటి బ్రాహ్మీ తత్త్వమును గరుడోపాసనచే మేము పొందగలము. స్వామీ! మేము సమర్పిస్తున్న ఈ ఆహుతులను స్వీకరించండి. ప్రేమతో మాకు రక్షకులై ఉండండి.
అనంత వాసుకి తక్షక కర్కోటక
పద్మక మహాపద్మక శంఖగుళిక
పౌండ్రకాళిక నాగక ఇత్యేషాం
(ఇతి ఏషాం) దివ్యానాం మహానాగానాం
మహానాగాది రూపాణాం విషతుండానాం
విష దంష్ట్రాణాం విషాంగానాం విషపుచ్ఛానాం
విశ్వచారాణాం, వృశ్చికానాం,
లూతానాం, ప్రలూతానాం మూషికాణాం,
గృహ గౌళికానాం గృహగోధికానాం
ఘ్రణాసానాం, గృహ-గిరిగహ్వర
కాలానల వల్మీకోద్భూతానాం,
అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పద్మక, మహాపద్మక, శంఖగుళిక, పౌండ్ర, కాళిక, నాగక మొదలైన దివ్యసర్పముల, విషతుండుల, మహా విషనాగుల, విషపుచ్ఛల, విశ్వచారుల, త్రేళ్ల, సాలెపురుగుల రాక్షస సాలెపురుగుల వలన, బెరడుల, బంక (జిగురుల), ఆకు-ఎలుకల, గృహ గోళికల, గృహ గొధికల (బల్లుల). పురుగుల, ఘ్రాణాపాసుల (గాలిలో విషము విడచు జంతువుల) ఇల్లు-కొండ-గుహ-అగ్ని-పుట్టలో పుట్టిన వాటివలన కలుగు విషభయము మా పట్ల మీ అనుగ్రహము వలన తొలగగలదు.
మిమ్ములను స్మరిస్తూ, మేము అమృత - తుల్యులము అగుచున్నాము.
తార్ణానాం, సార్ణానాం,
కాష్ఠ దారు వృక్ష కోటర లతానాం,
మూల త్వక్ దారు నిర్యాస పత్ర
పుష్ప ఫల-ఉద్భూతానాం,
దుష్ట కీటక కపి శ్వాన
మార్జాల(ర) జంబుక వ్యాఘ్ర వరాహాణాం,
జరాయుజ అండజ ఉద్భిజ స్వేదజానాం,
శస్త్ర బాణ క్షత స్ఫోట
వ్రణ మహావ్రణ కృతానాం,
గడ్డిపురుగులవలన, (గొంతెమ మొదలైన) చెట్టు ముళ్ల వలన, కట్టెలవలన, దారువుల(దేవదారు మొదలైన చెట్ల వలన), చెట్టు తొర్రల వలన, లతల వలన, - వాటి యొక్క మొదలు - బెరడు - రసము (జింక) - ఆకు- పుష్ప ఫలముల, కాయలలో పుట్టెడి వాటి వలన, మీ అనుగ్రహముచే ‘మాకు విష బాధ కలుగుకుండునుగాక।
విష పురుగులు, కోతులు, కుక్క, పిల్లి, నక్క, పులి, పందుల వలన, విష-హాని బాధలు కలుగకుండుగాక!
మావి (గర్భము) నుండి పుట్టే మానవులు, జంతువులు, అండజములు (గ్రుడ్డు నుండి పుట్టే పక్షులు), నేల నుండి పుట్టే పురుగులు, చెమట నుండి పుట్టే సూక్ష్మక్రిములు మొదలైన జీవుల వలన బాధ మీ దయచే మాకు ఉండకుండు గాక!
శస్త్రములచే బాణములచే కలిగే దెబ్బలు, స్ఫోటకము, వ్రణముల - (రాచపుండు వంటి) మహారణములు కలుగజేయు బాధల నుండి విడివడుదుముగాక.
కృత్రిమాణాం అన్యేషాం
భూత బేతాళ కూశ్మాండ.
పిశాచ ప్రేత రాక్షస
యక్ష భయప్రదానాం
విషతుండ దంష్ట్రాణాం
విషాంగానాం విషపుచ్ఛానాం
విషాణాం విషరూపిణీ విషదూషిణీ
విషశోషిణీ విషనాశినీ విషహారిణీ
హతం నష్టమ్। విషమ్ అంతః।
ప్రలీనం విషం। ప్రణష్టం విషం। హతస్తే బ్రహ్మణా।
విషమ్ ఇంద్రస్య వజ్రేణ స్వాహా।।
ఇతరులచే హానికలిగించే (పెట్టుడు మందుల) విష ప్రభావముల వలన, భూత, బేతాళ, కూశ్మాండ (కుష్మాండ), పిశాచ, ప్రేత, రాక్షస యక్ష - మొదలైన భయప్రదమైన వాటివలన మీ స్మరణ రక్షణ ప్రసాదించుటకై మిమ్ములను శరణువేడుచున్నాము.
విషముతో కూడిన ( పిచ్చికుక్కల వంటి) దంష్ట్రముల (కొరకుట, గోరుట) వలన, కలుగు విషములకు బాధలకు -
- విషశోషిని, విషనాశని, విషహారిణి, విషనష్టిని అగు వజ్రము వంటిది ఈ శ్రీ గారుడస్తుతి. శ్రీగరుడ భగవానుని స్మరించినంత మాత్రం చేత దోషములు తొలగ గలవు. విషజంతువులు కూడా హాని చేయు ఉద్దేశ్యము మాపట్ల త్యజించగలవు.
య ఇమాం బ్రహ్మ విద్యాం
అమావాస్యాం పఠేత్
శృణుయాద్వా,
యావత్ జీవం
న హింసంతి సర్పాః।
ఈ గారుడోపాసన, బ్రహ్మ విద్యకు సంసిద్ధము చేసి అట్టి ఉపాసకుని బ్రహ్మమును ప్రసాదించగలదు. ఎవ్వరైతే ఈ బ్రహ్మ విద్యను అమావాస్యనాడు పఠించటంగాని, శ్రవణంగాని చేయనారంభిస్తారో, - అట్టివారు జీవించి ఉన్నంతకాలము వారిని సర్పములు మొదలైన విష-హ్రింసక జీవులు హింసించవు.
అష్టౌ బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా
తృణేన మోచయేత్।
శతం బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా
చక్షుషా మోచయేత్।
సహస్రం బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా
మనసా మోచయేత్।।
శ్రీ గారుడ వ్రతముగా ‘8’ బ్రాహ్మణులకు తృణపూర్వకంగా (గడ్డిపరకలతో) తాంబూలము, సంభావన ఇచ్చి గౌరవించెదరు గాక!
100 మంది బ్రాహ్మణులను కళ్లతో దర్శించి నమస్కరించెదరుగాక!
‘1000’ మంది బ్రాహ్మణులను మనస్సుతో తలచుకొని నమస్కరించెదరుగాక!
సర్పాన్ జలే న ముంచంతి।
తృణే న ముంచంతి।
కాష్ఠాన్ న ముంచంతి।
ఇతి ఆహ భగవాన్ బ్రహ్మా।।

అట్టివారు సర్ప-జల గండములనుండి విమోచనము పొందగలరు. గడ్డి మొదలైన వాటి నుండి విమోచనులవగలరు. కాష్ఠముల నుండి బాధలు ఉండవు.
ఈ విధముగా ‘గారుడోపనిషత్తు’ ను బ్రహ్మదేవుడు సమస్త జీవుల క్షేమము కోరి ప్రసాదించారు.

🙏 ఇతి గారుడోపనిషత్!
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।


అధర్వణ వేదాంతర్గత

8     గారుడ ఉపనిషత్

అధ్యయన పుష్పము

శ్లో।। విషం ‘బ్రహ్మ’ అతిరిక్తంస్యాత్। అమృతం బ్రహ్మసూత్రకమ్।
బ్రహ్మ - అతిరిక్త విషహృత్-బ్రహ్మమాత్ర ఖగేడహమ్।।
‘విషము’ అనగా ఏమి? ఈ దృశ్య వ్యవహారమంతా బ్రహ్మమునకు అన్యముగా (వేరుగా) అనిపించటమే విషముతో సమానము. ఈ దృశ్య విశేషములను కూడా బ్రహ్మమునకు వేరుగా చూడటమే - ‘మృతము’. సమస్తము ‘బ్రహ్మసూత్రము’గా దర్శించటమే ‘అమృతము’. అట్టి ‘బ్రహ్మమునకు వేరుగా అనిపించటము’ అనే విషమును తొలగించి, ‘సమస్తము బ్రహ్మమే’ అను రూపమగు పాఠ్యాంశమును అమృతముగా దివ్యలోకముల నుండి తెచ్చి ప్రసాదించు కార్యము నిర్వర్తించు శ్రీగరుడ జగద్గురు భగవానునికి నమస్కరిస్తున్నాము.

బ్రహ్మభగవానుడు : ‘ఓం’।। ఓ నారదాది సమస్త మునిజనులారా! సమస్త జీవులారా! ఇప్పుడు ‘అనేకము’ అనే విషమునకు ఔషధముగా సమస్త విషములను ఖండించు, దూషింపజేయు, నశింపజేయు ‘‘గారుడ బ్రహ్మవిద్య’’ను బోధిస్తున్నాను.‘‘అన్యము, మృత్యువు’’ అనే విషమునకు విరుగుడు అయినట్టి ‘‘అనన్యము, అమృతము’’లను ప్రసాదించు గారుడ మంత్రరూప మహాగారుడోపాసన గురించి వినండి.

ఈ విధంగా బ్రహ్మవిద్య అగు ‘గారుడవిద్య’ను పితామహులగు బ్రహ్మ భగవానుడు బ్రహ్మ మానసపుత్రులగు శ్రీమన్ నారద, సనక, సనందన, సనత్కుమార సనత్సుజాతాది బ్రహ్మ మానసపుత్రులకు, మునులకు, ఋషులకు కూర్చోబెట్టి బోధించారు. అట్టి గారుడోపనిషత్‌ను నారదమహర్షి బృహత్సేనునికి, బృహత్సేనుడు త్రిలోకాధిపతి అగు ఇంద్రదేవునికి, ఇంద్రుడు భరద్వాజమునికి, భరద్వాజుడు తనను (తమ ఇంద్రియ విషయ విషముల నుండి విముక్తి కొరకై) ఆశ్రయించిన జీవత్ కామేభ్యునికి, వారి శిష్యగణమునకు-బోధించటం జరిగింది.

ఆ విధంగా ముముక్షువులకు ‘‘శ్రీమహాగరుడ బ్రహ్మవిద్య’’- బ్రహ్మము గురించిన సిద్ధికై సాధనగా - ‘పరంపర’ అయి, తత్త్వ వాఙ్మయ - తత్త్వసాధనలలో ప్రసిద్ధమైయున్నది.

శ్రీ మహాగారుడ బ్రహ్మవిద్య

అస్యాః శ్రీ మహాగరుడ విద్యాయా…,
‘బ్రహ్మా’ ఋషిః। గాయత్రీ ఛందః ।।

శ్రీ భగవాన్ గరుడో దేవతా। - ‘‘శ్రీ మహాగరుడ ప్రీత్యర్థే’’ మమ ‘‘సకల విష వినాశనార్థే’’ జపే వినియోగః।।

‘ఇంద్రియ విషయములు’ అనే ‘అన్యము’ రూపమగు ‘విషయ విషము’ (The Poison of Bondage because of irresistable relatedness with worldly scenary, events, contexts, relationships, expectations etc.,) విరుగుటకై గరుడ మంత్రమును ఆశ్రయిస్తున్నాము. ఋషి ‘బ్రహ్మగాను, ఛందస్సు గాయత్రీ గాను, దేవత - భగవంతుడు శ్రీ గరుడ భగవానునిగాను - శ్రీ మహాగరుడుని ప్రీతికొరకై వినియోగిస్తూ ధ్యానము ప్రారంభిస్తున్నాము :

ఓం నమో భగవతే। అంగుష్ఠాభ్యాన్నమః।
ఓం నమో భగవతే। హృదయాయ నమః
శ్రీ మహా గరుడాయ తర్జనీభ్యాం స్వాహా।
శ్రీ మహా గరుడాయ శిరసే ‘స్వాహా’।
పక్షీంద్రాయ మధ్యమాభ్యాం ‘వషట్’
పక్షీంద్రాయ శిఖాయ ‘వషట్’।
శ్రీ విష్ణువల్లభాయ అనామికాభ్యాం ‘హుం’।
శ్రీ విష్ణువల్లభాయ కవచాయ ‘హుం’।
త్రైలోక్య పరిపూజితాయ కనిష్ఠికాభ్యాం ‘వౌషట్’।
త్రైలోక్య పరిపూజితాయ నేత్రతయాయ ‘వౌషట్’।
ఉగ్రభయంకర కాలానల రూపాయ కరతల కర పృష్ఠాభ్యాం ‘ఫట్’।
ఉగ్రభయంకర కాలానల రూపాయ అస్త్రాయ ‘ఫట్’।

భూర్భువస్సువః ‘ఓం’ ఇతి-దిక్ బంధః। (దిగ్బంధః)

‘‘భూ భువ సువర్లోకములు (“Matter, Thought, Sense of Self” Zones) - ఈ మూడూ కూడా ఓంకారమగు ఆత్మ విన్యాస ప్రదర్శనమే’’ అని - మననము చేయుచు, - దిక్కులను బంధించి (Sans Distractions) ఉపాసన ప్రారంభిస్తున్నాము (Commencing the concentration).

ధ్యానము :

శ్లో।। స్వస్తికో దక్షిణం పాదం। వామపాదం తు కుంచికమ్।
ప్రాంజలీకృత దోర్యుగ్మం। గరుడం హరివల్లభమ్।।

కుడిపాదము ‘స్వస్తికము’ గాను, ఎడమ పాదము ‘కుంచితము’గాను (మడచి) ఉంచి శ్రీహరికి రెండు చేతులతో నమస్కరించుచున్నవారు, ఆ శ్రీహరికి బహు ఇష్టమైనవారు అగు శ్రీ గరుడ భగవానుని ధ్యానించుచున్నాను.

✤ అనంతో వామ కటకో। - ‘అనంత’ మహాసర్పమును తమ ఎడమ చేతికి కంకణము (కడియము)గాను,
✤ యజ్ఞసూత్రం తు వాసుకిః। - ‘వాసుకి’ మహాసర్పమును యజ్ఞసూత్రముగాను, (జందెము, యజ్ఞోపవీతముగాను),
✤ తక్షకః కటి సూత్రం తు। - ‘తక్షక’ మహాసర్పమును మొలత్రాడు (కటిసూత్రము)గాను,
✤ హారః కర్కోట ఉచ్యతే। - ‘కర్కోట’ మహాసర్పమును హారముగాను,
✤ పద్మో దక్షిణ కర్ణేతు। - ‘పద్మ’ మహాసర్పమును కుడిచెవి చుట్టుగాను,
✤ మహా పద్మస్తు వామకే। - మహాపద్మమహాసర్పమును ఎడమ చెవి ఆభరణము (లేక చుట్టు) గాను,
✤ శంఖః శిరః ప్రదేశేతు। - ‘శంఖు’ మహాసర్పమును తలపైన,
✤ గుళికస్తు భుజాంతరే। - ‘గుళిక’ మహాసర్పమును భుజముల మధ్యగాను,
✤ పౌండ్ర కాళిక నాగాభ్యాం చామరాభ్యాం సువీజితమ్। - ‘పౌండ్ర’ కాళిక సర్పములను చామరములు వీచువారుగాను,
✤ ఏలా పుత్రక నాగాద్యైః సేవ్యమానం ముదాన్వితమ్। - ‘ఏలా పుత్రక’ మొదలైన మహానాగులచే సేవించబడువారు,
బ్రహ్మానందమును ముఖమునందు చిందించువారు (ముదితానందులు)-అగు గరుడ భగవానుని దివ్య సాకారమునకు నమస్కారము.


★ కపిలాక్షమ్। - గోరోజనము (కపిల) రంగు కళ్ళు కలవారు,
★ గరుత్మంతమ్। - (గ) సర్వ శ్రేష్ఠమైన, (ఋత్) పరమ సత్యమును స్వానుభవముగా గలవారు,
★ సువర్ణ సదృశ ప్రభమ్ - బంగారు కాంతులతో ప్రకాసించువారు,
★ దీర్ఘ బాహుమ్। - పొడవైన బాహువులు (రెక్కలు) కలవారు,
★ బృహత్ స్కంధమ్। - పెద్ద స్కంధములు (మూపులు) కలవారు,
★ నాగాభరణ భూషితమ్। - నాగాభరణ భూషితులు (పాములను ఆభరణములుగా ధరించినవారు),
★ ఆజానుతః సువర్ణాభమ్। - బంగారు రంగులో మెరయుచున్న మోకాళ్లు కలవారు,
★ ఆకట్యోః తుహిన ప్రభమ్। - తెల్లగా మెరయుచున్న మొల కలవారు,
★ కుంకమారుణమ్ ఆకంఠం। మెరుస్తున్న ఎర్రటి కంఠము కలవారు,
★ శరత్‌చంద్ర నిభాననమ్। - శరత్‌కాల పూర్ణ చంద్రుని వలె ముఖము కలవారు,
★ నీలాగ్రనాసికా వక్రమ్। - నీలము రంగుతో ప్రకాశించు ముక్కు చివర వంకరగా కలవారు,
★ సుమహత్ చారుకుండలమ్। - సుమహత్‌గా (అందముగా) ప్రకాసించు దీర్ఘమైన కుండలములను ధరించినవారు,
★ ద్రంష్ట్రా కరాళ వదనమ్। - కోరలతో భీకరమైన నోరు కలవారు,
★ కిరీట మకుటోజ్వలమ్। - కిరీటముతో ప్రకాశమానగుచున్న నుదురు కలవారు,
★ కుంకుమారుణ సర్వాంగమ్। కుంకుమవలె ఎర్రటి సర్వాంగములు కలవారు,
★ కుందేందు ధవళాననమ్। - తెల్లటి తామర వంటి ప్రకాశమానమగు ముఖము కలవారు,
★ విష్ణువాహ। విష్ణు భగవానునికి వాహనమైనవారు,
అగు ఓ గరుడదేవా! గురుదేవా! మీకు నమస్కారము : విష్ణు వాహన నమస్తుభ్యం। క్షేమం కురు యదా మమ। స్వామీ! నమస్కారము. నాకు క్షేమమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. రక్షించమని వేడుకుంటున్నాను.

⌘ ⌘ ⌘

ఈ విధంగా త్రి సంధ్యలలోను నాగభూషణుడగు గరుడ భగవానుని ధ్యానించువారి పట్ల - తూలా రాసిలో (మంచు దట్టముచే) అగ్నిశిఖలు శమించు తీరుగా - (ఇంద్రియ విషయములు అనే) విషము యొక్క ప్రభావము శమించగలదు. ‘‘దృశ్యము నిజమే’’ అనే భవబంధరూప విషానుభవము ఖండనమవగలదు.

‘ఓం’ ఈం। ఓం నమో భగవతే। శ్రీ మహాగరుడాయ। పక్షీంద్రాయ।
విష్ణువల్లభాయ। త్రైలోక్య పరిపూజితాయ। ఉగ్రభయంకర కాలానలరూపాయ।
వజ్ర నఖాయ। వజ్ర తుండాయ। వజ్ర దంతాయ। వజ్ర దంష్ట్రాయ। వజ్రపుచ్ఛాయ। వజ్రపక్షాలంకృత శరీరాయ।
ఓం। ఈం। ఏహ్యేహి। ఓం ఈం ఓం। భగవతే।

శ్రీ మహాగరుడ స్వామీ! పక్షీంద్రా! విష్ణు వల్లభాయ। స్వర్గమర్త్య పాతాళములలో పూజింపబడువాడా! ఉగ్రభయంకరమైన కాలాగ్ని స్వరూపా! వజ్రము వంటి - గోళ్లు, తుండము, దంతములు, కోరలు (దంష్ట్రము), నుదురు (పుచ్ఛము), రెక్కలు (పక్షములు) మొదలగు విశేష లక్షణములు గల గరుత్మంతుడా! ‘ఓం’ కార సంజ్ఞా పరమార్థమగు సర్వాత్మక - పరమాత్మక- స్వస్వరూపాత్మక స్వరూపా! ‘ఈ’ సమస్తము నీవే అయి ఉన్న ‘ఈం’ స్వరూపా!

ఏహి= ఇక్కడ మేమున్నచోటికి, మా హృదయములలోకి -    (ఏహి) = వేంచేయండి!

ఓం మహాగరుడా = సర్వజీవులలో సంప్రకాశరూపముగాను, ఆరూఢముగాను, నిశ్చలముగాను, పరాకాష్ఠగాను వేంచేసియున్న ‘గరుడుడవు’. (గ - శ్రేష్ఠమగు సత్యస్వరూపుడవు). మహత్ స్వరూపుడవై (ఇంద్రియములు అనుభూతులు, అనుభవములు మొదలైన) సమస్తము నీ మహత్ స్వరూపముగా కలిగియున్నవాడవు. ఓ మహాగరుడా! విష్ణు వాహనా! నమో నమః।।

అప్రతిహత శాసనాస్మిన్: ఆత్మస్వరూపుడవై సమస్తమును అప్రతిహతంగా (Unstopably, Irresistably) శాసించువారై, వాటిని మీయందే కలిగి యుండువాడా!

నః అవిశావిశ : మాయందు ప్రవేశించండి. మా హృదయమును ఆవేశించి ఉండండి.

దుష్టానాం విషం దూషయ। దూషయ। : శ్రీమాన్ గరుడ స్వామీ! మాలోని దుష్ట స్వభావములగు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యవర్గములచే మాలో కలుగుచున్న విష స్వభావములను తొలగించండి। ‘దుష్టత్వము’ అనే విషమును దూరం చేసివేయండి.

స్పృష్టానాం విషం నాశయ। నాశయ। ఓ గరుడాత్మ దేవా! మేము ఈ ఇంద్రియములచే స్పర్శిస్తున్న వస్తు - సంగతి - సందర్భములతో ఏర్పరచుకొంటున్న దుష్ట సంబంధముల వలన అనేక భేదదృష్టులను, విషభావములను తెచ్చిపెట్టుకొని, వాటి ఫలితంగా నికృష్ట దాస్య బంధనములు తెచ్చిపెట్టుకొంటున్నాము. ఆ విధంగా మాయందు పేరుకొనియున్న విష స్వభావములను, దుష్ట వాసనలను, విష సంస్కారములను-నశింపజేయండి. శారీరక-మానసిక-బుధ్యాత్మక దుష్ట అభ్యాసములను, వ్యసనములను నాశనము చేసివేయండి. రహితము చేయండి.

దందశూకానాం విషం దారయ। దారయ। దందశూకముల (రెండు తలల విషపాముల) దందశూకల (రాక్షస స్వభావుల) - (మాలోని స్వభావ)-విషమును చీల్చివేయండి.

‘‘ద్వంద్వమోహము’’ అనే రెండు తలల పాము యొక్క విషమును మా హృదయములనుండి పిండివేయండి.

ప్రలీనం విషం ప్రణాశయ। ప్రణాశయ। మాలో జన్మజన్మలుగా జీర్ణించుకొని, మనోబుద్ధి చిత్త అహంకారములలో పేరుకొనియున్న దుష్టరూపములగు దోష సమన్వయరూప విషమును (Poisonous interpretation) మొదలంట్లా నశింపజేయండి.

సర్వ విషం నాశయ। నాశయ। మాలోని సమస్త విషబుద్ధి - భావన - యోచనలను నశింపజేయండి. మాలోని - మమ్ము స్పృశించే విషమును హన - హరించివేయండి. (హననము చేయండి, చంపివేయండి). దహ-దహించివేయండి. పచ - మూర్ఖ ఘనీభూత అల్ప, విష భావనలన్నీ పచనము చేసివేండి. వండి వేయించివేయండి.

భస్మీకురు : మాలోని నీచ - ద్వేష - పాప వ్యసన దృష్టి - సంకల్పములను భస్మీభూతము చేయండి. కాల్చి, భస్మము చేసివేయండి.


హే ప్రభూ! చండ్రమండలము వలె జీవులకు ఓషధి-ఆహారములను ఇచ్చి సమస్తము ప్రశాంతపరచువాడా! సూర్యమండలము వలె స్వయం ప్రకాశ - సమస్త ప్రకాశక స్వరూపా! అజ్ఞానాంధకారము వలన ఏర్పడిన విష స్వభావమును ఖండించివేయు ముష్టికము (కత్తిపిడి) వంటివారా! ఈ సమస్త పృథివి మీ యొక్క అంగముగా కలిగియున్నట్టి ముద్రాంగా!

శ్రీ మహా గరుడ భగవాన్!

విషం హర - మాలో ఏర్పడి ఉండి మమ్ములను గాయపరుస్తున్న ఆధిభౌతిక-ఆధిదైవిక-ఆధ్యాత్మిక విషమును హరించివేయండి.

హుం ఫట్ స్వాహా! మీ యొక్క ‘‘హుం’’కార శబ్దోచ్ఛారణతో విషమును ‘‘ఫట్’’ శబ్దోచ్ఛారణతో దులిపి వేయుచూ, - మాలో దైవీ సంపత్తిని ప్రేరేపించండి.

ఓం క్షిప స్వాహా। మేము ఆత్మభావము నుండి అనుక్షణము విక్షేపణము (ఎగురవేయటము) పొందుచున్నాము. మాలో దైవీగుణములను ప్రేరేపించి సువర్లోక మార్గము చూపండి. స్వాహా। మా మనస్తత్వమును దివ్యలోకములకు జేర్చండి. (క్షిప = ప్రేరేపించటము. ఎగురవేయటము)

ఓం ఈం। ‘ఓం’కార పరమాత్మ స్వరూపుడగు శ్రీమన్ గరుడ భగవానుడే ఈ సమస్తముగా ప్రకాశమానుడగుచున్నారు.

స చరతి। స చరతి : ఈ సర్వముగా చరిస్తున్నది ఆ శ్రీ గరుడాత్మ భగవానుడే।

తత్కారీ : శ్రీ గరుడ గురుదేవ భగవానుడు మమ్ములను ‘తత్త్వమ్’ వాక్యార్థముచే అమృతాత్మానంద స్వరూపులుగా, తత్ స్వరూపులుగా తీర్చిదిద్దుదురు గాక। ‘‘త్వమ్-నీవు’’ - నందు ‘‘తత్ (ఆత్మ)’’ దృష్టిని నిదురలేపెదరు గాక। ‘పర’ సుఖము ప్రసాదించెదరుగాక।

మత్కారీ : నాకు సమస్తము ప్రసాదించువారు. సమస్త జీవులలో ‘‘మత్-నేను’’ స్వరూపులై ఉన్నవారు. మాలోని ‘నేను’ను సమస్త జీవులలోని ‘‘మహత్ నేను’’గా తీర్చిదిద్దెరు గాక! ఇహ సుఖ-సంపదలను కూడా అనుగ్రహించెదరు గాక।

(మతకము = మాయ. మాయాలీలా రూపధారులు. మా కొరకై ఈ సమస్తము ప్రసాదించుస్వామీ మీరే!)

‘‘విషమునకే విషము’’ అయిన అమృత రూపధారులు। విషమునకు దూషిక (కుంచె) వంటివారు. విషమును శోషింపజేయువారు. విషమును హరించువారు।

ఓ గరుడ దేవా! మీ స్మరణచే విషము హతమగుచున్నది. విషము వినష్టమగుచున్నది. విషము అంతమై ప్రలీనము (విశేషముగా కరిగిపోవటము) జరుగుచున్నది. విషము ప్రణష్టమగుచున్నది. మీ స్మరణచే సృష్టికర్తయగు బ్రహ్మదేవునిచే లీలగా కల్పితమగు విషయ పరంపరలు విషరూపముగా అవటమనేది తొలగించబడగలదు. మీ గురించిన భావనచే అమృతము (జన్మరాహిత్యము) లభించగలదు. ఇంద్రుని వజ్రము మాకు తోడై సమస్తము మా పట్ల ‘‘స్వాహా’’। (సువర్లోకస్థానము, దివ్యత్వము సంతరించుకోగలదు)।

    ఓం నమో భగవతే। మహాగరుడాయ। విష్ణువాహనాయ। త్రైలోక్యపరిపూజితాయ।  
    వజ్రనఖ వజ్రతుండాయ। వజ్ర పక్షాలంకృత శరీరాయ। ఏ హ్యేహి। మహా గరుడ।  
    విషం ఛింధి। ఛింధి। ఆవేశయ। ఆవేశయ। ‘హుం’ ‘ఫట్’ ‘స్వాహా’।

భగవానుడు, మహాగరుడుడు, స్వయముగా విష్ణు భగవానుని వాహనము, త్రిలోకములచే విశేషముగా పూజించబడువారు, వజ్రము వంటి గోళ్లు (నఖములు), తుండము గలవారు, వజ్రపు రెక్కలతో అలంకృతమైన శరీరము కలవారు-అగు శ్రీ గరుడస్వామి మేమున్నచోటికి వేంచేసెదరు గాక! వారి రాకతో విషము ఛింధము (ముక్కలు) కాగలదు.

స్వామీ। మా దృశ్య-దేహ-మనో- బుద్ధి-చిత్త-అహంకారములలో ఆత్మానంద స్వరూపులై ఆవేశించండి. ‘హుమ్’ ‘‘ఫట్’’ దివ్యధ్వనుతో మాకు సువర్లోకము ప్రసాదించెదరు గాక. విష్ణువాహనులగు మీరు - మా వద్దకు ‘‘విష్ణుతత్త్వము’’ అనే అమృతమును తెచ్చి మాకు అందించండి.

(విష్ణు తత్త్వము = All - Present and Alpervading Self of “My Self”)

సుపర్ణోఽసి గరుత్మాన్। ఓ గరుత్మంతుడా। మీరు సుపర్ణులు. గొప్పరెక్కలు కలవారు. కనుక విష్ణు తత్త్వానుభవమును తెచ్చిపెట్టగల సమర్ధులు.

త్రివృత్తము (Tri-Circular) అగు మీ శిరస్సు - గాయత్రము। (గాయత్రీ స్వరూపము)।

మీ చక్షవులు - సోమము చంద్రరూపము. (చల్లటి చూపులు కలవారు)।

ఆత్మయే - సామవేదము (The song of Athman).

మీ శరీరము - వామదేవము (సమస్తమగు ‘ఇహ’ స్వరూపము)।

రెక్కలు - బృహత్ రథంతరము (ఈ బృహత్ సృష్టి చక్ర స్వరూపములు) (The main wheels of this entire creation).

మీ పుచ్ఛము (తల పుఱ్ఱె/నుదురు) - యజ్ఞా - యజ్ఞీకములు (The Totality - work of the universe).

మీ అంగములు - ఛందస్సులు (Disciplines).

ధిష్ణియాః శఫాః యజూంషి నామ - యజుర్వేదము మీరు అంకుశముతో సహా వేంచేసియున్న గృహము.

ఓ గరుడ దేవాదిదేవా! గొప్ప అందమైన రెక్కలతో సపర్ణులై మీరు (భూలోకమునుండి) భువర్-సువర్లోకము వరకు యధేచ్ఛగా సంచరించగలుగువారు. అమావాస్య - పౌర్ణమిలను దాటించి, సమస్తమునకు మునుముందే ఏర్పడియున్న ‘‘ఓం ఈం’’ అను అక్షర సంజ్ఞయగు బ్రహ్మవిద్యనుప్రసాదించ సమర్ధులు. కనుక మాకు ‘బ్రహ్మవిద్య’ను ప్రసాదించి అనుగ్రహించండి.

తత్కారీ : ‘తత్’ కార స్వరూపులు. తత్ స్వరూపమును ప్రసాదించువారు.

మత్కారీ : సమస్త జీవులలో ‘నేను’గా వేంచేసి ఉన్నవారు. ‘‘నేను-నాది’’ల ఏకస్వరూపులు.

ఆ గరుడ పరమాత్ముడే సమస్తమునందు సంచరిస్తూ, సమస్తము నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇదంతా నిర్వర్తిస్తున్న ఆ స్వామి నాకు బ్రహ్మ జ్ఞానము కలుగజేయుదురుగాక! ఆయన విషనాశి। విషదూషిణి। విషహారిణి। ఆస్వామిని ఒక్క క్షణం స్మరించినంతమాత్రం చేత విషము హతమగుచున్నది.

ఇంద్రుని వజ్రము వంటి శ్రీమన్ గరుడ భగవానుని స్మరణము - విషనాగుల విషము కూడా హతము చేసి వేయుచున్నది.

ఆయన ‘బ్రాహ్మీదృష్టి’ అనే ‘అమృతము’ను (మృతస్థితికి అతీతత్వమును) ఆశ్రితులమగు మనకు తెచ్చిపెట్టుటలో సిద్ధహస్తులు.

ఆ గరుడభగవానుడు - అమృతమును మనకు తెచ్చిపెట్టుటలో ఇంద్రవజ్రముగాని, గొప్ప సర్పజాలములుగాని నిరోధములు కలిగించజాలవు. విష్ణు వాహనాయ! శ్రీమన్ గరుడభగవాన్। శరణు। శరణు।

మమ్ములను ‘మృతము’ అనే జనన మరణ చక్రము నుండి తప్పించుటకై సువర్లోకము నుండి అమృతము తెచ్చీచ్చుటలో పరమాద్భుత శక్తి సంపన్నులగు ఆస్వామిని నిరోధించగల శక్తి ఏదీ లేదు. అట్టి గరుడునికి భక్తి-ప్రపత్తులు సమర్పిస్తున్నాము.

⌘ ⌘ ⌘

యది అనంతక దూతోఽసి
యది వా అనంతకః స్వయమ్, - అది అనంతక మహాసర్పముయొక్క ‘దూత’ అయినా (లేక) స్వయముగా అనంతక మహాసర్పమైనాకూడా,

యది వాసుకి దూతోఽసి,
యది వా వాసుకిః స్వయమ్, - వాసుకి మహాసర్పముయొక్క ‘దూత’ అయినా, (లేక) స్వయముగా వాసుకి అయినా కూడా,

యది తక్షక దూతోఽసి,
యది వా తక్షకః స్వయమ్, - తక్షక మహాసర్ప ‘దూత’ అయినా, (లేక) స్వయముగా తక్షకమహా సర్పమయినా,

యది కర్కోటక దూతోఽసి,
యది వా కర్కోటకః స్వయమ్ - కర్కోటక మహాసర్ప ‘దూత’ అయినా, (లేక) స్వయముగా కర్కోటక మహాసర్పమైనా..,

యది పద్మక దూతోఽసి,
యది వా పద్మకః స్వయమ్, - అది పద్మక మహాసర్పమునకు చెందిన ‘దూత’ అయినా, (లేక) స్వయముగా పద్మక మహాసర్పమే అయినా కూడా,

యది మహాపద్మక దూతోఽసి,
యది వా మహాపద్మకః స్వయమ్ - అది మహా పద్మకసర్ప దూతాయినా, (లేక) స్వయముగా మహా పద్మకసర్పమైనా,

యది శంఖక దూతోఽసి,
యది వా శంఖకః స్వయమ్, - అది శంఖక సర్పదూత అయినా, (లేక) స్వయముగా శంఖక మహాసర్పమైనా,

యది గుళిక దూతోఽసి,
యది వా గుళికః స్వయమ్, - అది గుళిక సర్పదూత అయినా, (లేక) స్వయముగా గుళిక మహాసర్పమే అయినా కూడా..,

యది పౌండ్ర కాళిక దూతోఽసి,
యది వా పౌండ్ర కాళికః స్వయమ్,-అది పౌండ్రకాళిక సర్పదూత అయినా (లేక) స్వయముగా పౌండ్రకాళికా మహాసర్పమైనా కూడా,

యది నాగక దూతోఽసి
యది వా నాగకః స్వయమ్…, అది నాగక దూత అయినా, (లేక) స్వయముగా నాగకమహాసర్పమైనా కూడా…,

అట్లాగే.., అది :- సాలె పురుగు విషమైనా, రాక్షస సాలెపురుగు విషమైనా, తేలు విషమైనా, స్థావర-జంగముల సంబంధమైన ఏ విషమైనా కూడా - మహాగరుడ మంత్ర స్మరణచే గరుడ భగవానునికి భక్తితో నమస్కరించుటచే - అమృతత్వము పొందుటలో మమ్ము నిరోధించలేవు.

అట్టి విషము :

తత్కారీ, మత్కారీ, విషనాశనీ విషదూషినీ విషహారిణీ హతం।
‘తత్’ కారకుడు, ‘మత్’ కారకుడు విషము నశింపజేయువాడు, విషమును హరించువాడు అగు గరుడ భగవానుని స్మరణచే హతమయిపోగలదు.
ఇంద్రస్య వజ్రేణ విషం హతమ్।
తన మాతృదేవత అగు వినతయొక్క దాస్యమును తొలగించటానికి అమృతమును దివ్యలోకము నుండి తెస్తున్నప్పుడు ఇంద్ర వజ్రమును కూడా జయించివేసినట్టి గరుడ దేవునిచే (విషయ రూప) విషము హతమవగలదు.
తే బ్రహ్మణా విషమింద్రస్య వజ్రేన స్వాహా।
బ్రహ్మదేవుని చేతను, ఇంద్ర వజ్రముచేతను, ఆ విషము తొలగించబడి, గరుడ భగవానునిచే అమృతమగు సువర్లోకము ప్రసాదించబడగలదు.

అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పద్మక, మహాపద్మక, శంఖగుళిక, పౌండ్ర కాళిక, నాగక, మొదలైన దివ్యనాగుల వలన, మహానాగుల, విషతుండుల, విషనాగుల, విషదంష్ట్రుల, విషాంగుల, విషపుచ్ఛుల, విశ్వచారుల, తేలుల, సాలెపురుగుల, రాక్షస సాలె పురుగుల, ఎముకల, బల్లుల, చిన్నపురుగుల, విషవాయువుల వలన గాని, ఇల్లు - కొండ- పుట్ట గుహ-అగ్ని మొదలైన వాటిలో నివసించే విష జీవుల వలనగాని; కట్టె-గడ్డి-చెట్టు, - చెట్టుతొర్రలలో ఉండే విష పురుగుల వలన గాని, చెట్టు మొదలు - బెరడు, బంక (జిగురు), ఆకు - పువ్వు-కాయ-పండులలో పుట్టుచున్న విష-చెడు పురుగుల విషము వలనగాని, కోతి - కుక్క - పిల్లి - నక్క - పెద్దపులి - అడవి పంది మొదలైన క్రూరజంతువుల విషము నుండి గాని కలుగు ఆపదలను, విషమును విరుగుడు చేయగలుగునది - శ్రీ భగవాన్ గరుడోపాసనామంత్రము.

ఉద్బీజముల నుండి - (నేల నుండి పుట్టే వృక్షజాలము మొదలైనవాటి నుండి),
జరాయుజముల నుండి - (‘మావి’ నుండి పుట్టే మానవులు, జంతువులు మొదలైనవాటి నుండి),
అండజముల నుండి - (గ్రుడ్డు నుండి పుట్టే పక్షులు మొదలైనవాటి నుండి),
స్వేదజములు - (చెమట నుండి పుట్టే సూక్ష్మజీవుల నుండి) -
ఏర్పడే విషము - ప్రమాదముల నుండి గరుడ భగవానుడు కాపాడుదురుగాక! స్వామీ! గరుడదేవా! గొప్ప రెక్కలుగల మీరే కాపాడగలరు!

మమ్ములను ‘విషము’ నుండి ‘అమృతము’నకు జేర్చండి. మా పట్ల మృత్యువును అమృతముగా తీర్చిదిద్దండి.

✳︎ బాణము మొదలైన ఆయుధముల దెబ్బల నుండి,
✳︎ స్ఫోటకము - వ్రణము (పుండు) - మహావ్రణము (రాచపుండు) వలన కలిగే బాధల నుండి,
✳︎ పెట్టుడు - మందుల విషము నుండి,
✳︎ భూత-బేతాల-కూష్మాండ పిశాచ-ప్రేత-రాక్షస-యక్ష మొదలైన భయంకారాకారుల వలన వచ్చిపడే భయ-బాధల నుండి,
✳︎ విషతుండముల కాటుల నుండి, విషాంగుల నుండి, విష పుచ్ఛుల నుండి
- మీ గరుడమంత్రము కాపాడగలదు.

స్వామీ! మీరు విషములకే విషము। విషమును దూరము చేయువారు। శరీరములో ప్రవేశించిన విషమును శోషింపజేయువారు. నశింపజేయువారు। హరింపజేయువారు। విషమును వినష్టముచేయుటలో విషము పట్ల వజ్ర ఘాతము వంటివారు.

గరుడ భగవానుని తలచినంతమాత్రముచేతనే - శరీరములోని, అంతరంగ చతుష్టయము, బాహ్యములోని విషము, విషభావములు, విషము వలన ప్రమాదములు సమసిపోగలవు. అవి ఇంక హాని కలిగించలేవు.

గరుడమంత్రము జన్మజరా మరణ రహితమగు అమృత ప్రదాత।

⌘ ⌘ ⌘

ఎవరైతే ఈ ఉపనిషత్‌లోని - ‘‘విషమునకు వ్యతిరేకమైనట్టి ‘అమృతము’ (జన్మరాహిత్యము, మోక్షరహస్యము)’’ ను తెలుసుకుంటారో,…, వారు సర్వత్రా సిద్ధి పొందగలరు.

ఈ జీవులు శారీరక-మానసిక-బుద్ధి చాంచల్య బాధలు పొందుచున్నప్పుడు, అట్టివారు అమావాస్యనాడు ప్రారంభించి ఈ ఉపనిషత్ పఠిస్తే, అధ్యయనము చేస్తూ ఉంటే…, అట్టివానిని - ఆతడు జీవించి ఉన్నవాళ్లు సర్పములు హింసించవు. దైనందికంగా పఠిస్తూ ఉంటే, వర్ణనాతీతములగు శుభములు చేకూరగలవు.


మహాగారుడ మంత్రోపాసకులకు వ్రతమునకు సంబంధించిన కొన్ని విధులు

అష్ఠౌ బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా తృణేన మోచయేత్।
‘8’ మంది బ్రాహ్మణులను స్పృశించి తృణములను, ప్రపత్తులను సమర్పించాలి. (తాంబూల దానము చేయాలి)
శతం బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా చక్షుషా మోచయేత్।
‘100’ మంది బ్రాహ్మణులను స్పృశించి కళ్లతో నమస్కరించాలి.
సహస్రం బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా మనసా మోచయేత్।
‘1000’ మంది బ్రాహ్మణులను మనస్సుతో తలచుకొని ఉపాసించాలి.

జలము నుండి, గడ్డి నుండి, కట్టె నుండి, కర్రపుల్ల నుండి అట్టివాడు గండములు పొందక విముచ్యుడౌతాడు. సంసార విషము అవిషమై, ఆతని పట్ల అమృతత్వము సుప్రకాశమవగలదు.

ఈ విధంగా భగవంతుడగు బ్రహ్మదేవుడు ‘‘బ్రహ్మసూత్రగారుత్మంతము’’ - నారదాది మహర్షులకు, తదితర బ్రహ్మమానసపుత్రులకు, మునులకు, ఆశ్రితులగు భక్తజనులకు బోధించటము జరిగింది.

🙏 ఇతి గారుడ ఉపనిషత్!
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।