[[@YHRK]] [[@Spiritual]]

Gopāla (Uttara) Tāpini Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


అధర్వణ వేదాంతర్గత

6(Ⅱ)     గోపాల ఉత్తర తాపిన్యుపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్

శ్లో।। ఏకో దేవః - సర్వ భూతేషు గూఢః।
సర్వవ్యాపీ। సర్వభూత అంతరాత్మా!
కర్మాధ్యక్షః, సర్వభూత అధివాసః।
సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ।।

‘‘సర్వదా ఏకమే’’ అయి ఉన్న ఆ ఆత్మదేవాది దేవుడు సర్వజీవుల యందు సమముగా రహస్యరూపులై, వేంచేసి ఉన్నారు. ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నట్టి వారు. సమస్త కర్మలకు అధ్యక్షుడు ఆయనయే. సర్వభూతములుగా ఉన్నవారు. సర్వసాక్షిగా, బుద్ధి రూపముగా కేవలుడై, గుణములకు ఆవలివాడై, నిర్గుణుడై ఉన్నారు. అట్టి ఆ ఆత్మ దేవునికి నమస్కారము.

1. ‘‘ఓం’’
ఏకదా హి వ్రజస్త్రియః
సకామాః శర్వరీమ్ ఉషిత్వా
సర్వేశ్వరం గోపాలం కృష్ణమ్ ఊచిరే।
ఒకానొకరోజు వ్రజ గోపికలు ‘‘ఏమైనా సరే, మేము సంకుచిత సంసార భావాలన్నీ జయించి, సర్వాత్మకుడగు శ్రీకృష్ణ పరమాత్మతో - (సాగర జలంలో తరంగం ఉపశమించుతీరుగా) మమేకమవాలి’’ - అను కామోత్కంఠతలు పొందారు. వ్రతం ప్రారంభించారు. రాత్రంతా జాగరణం చేస్తూ ఉపవాసములు ఉన్నారు. ఆ తరువాత సర్వేశ్వరుడగు గోపాలకృష్ణుని సమీపించారు. ‘‘స్వామీ! ఈ ‘వ్యష్టిత్వము’ అనే జాడ్యము తొలగించుకొని, సమష్టిత్వము కూడా అధిగమించి, మీయొక్క ‘సర్వేశ్వర్వత్వము’తో మమేకమవటము ఎట్లా? చెప్పండి’’ - అని అభ్యర్ధించారు.
ఉవాచ తాః కృష్ణ :
ఆముకస్మై బ్రాహ్మణాయ
భైక్షం దాతవ్యమ్ ఇతి। దుర్వాసస ఇతి।
(దుర్వాసుడు అత్రి - అనసూయలకు రుద్రాంశగా పుట్టిన కుమారుడు. త్రి-సోదరులగు సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు, బ్రహ్మ - విష్ణు - రుద్రుల అంశలు- అని
పౌరాణిక ప్రవచనము)
శ్రీకృష్ణభగవానుడు : ప్రియ వ్రజగోపికలారా! మీ వ్రతము, ఉపవాసముల ప్రయోజనము సిద్ధించి నాయొక్క సర్వాత్మత్వముతో (జలములో ప్రవేశించిన ఉప్పుబొమ్మవలె) - మమేకము ఎట్లా అవాలో - ఒక ఉపాయము వినండి.
యమునా నదికి ఆవల వేంచేసి యున్న దూర్వాస మహర్షికి ‘భిక్ష’ సమర్పించి పునీతులవండి.
సర్వజ్ఞుడు, తత్త్వవేత్త అగు ఆ మహనీయునికి ‘భిక్ష’ సమర్పించటంచేత - మీ వ్రతఫలముయొక్క సర్వ విఘ్నములు తొలగగలవు.
(వ్రజస్త్రీ ఉవాచ :)
కథం యాస్యామో జలం తీర్త్వా
యమునాయా యతః
శ్రేయో భవతి కృష్ణా? ఇతి।।
(భగవాన్ శ్రీకృష్ణౌవాచ:)
‘‘బ్రహ్మచారీ।’’
ఇతి ఉక్త్వా।
= మార్గం వో దాస్యతి।।
వ్రజ గోపికలు : ఓ! తప్పకుండ, మేము యమునానదికి ఆవలవడ్డున ఉన్న భగవాన్ దూర్వాసమహర్షికి భిక్ష సమర్పించటానికి అన్నీ సిద్ధమే. అయితే మాకు ఒక క్రొత్త చిక్కు వచ్చిపడింది. యమునానది అత్యంత వేగంతో కూడిన నదీ తరంగాలుతో పరవళ్ళు త్రొక్కుతోంది. మరి మేము నదిని దాటటమెట్లా? దుర్వాసమహర్షిని సమీపించి ‘భిక్ష’ సమర్పించటమెట్లా? ప్రేమతో మాకు ఉపాయం చెప్పండి, కృష్ణయ్యా!

శ్రీకృష్ణభగవానుడు : చెపుతాను. వినండి. ‘‘ఓ యమునా నదీ దేవీ! మా కృష్ణయ్య బ్రహ్మచారి. ఇది నిజమైతే - మేము ఆవలివడ్డుకు చేరటానికి నీవు మాకు త్రోవ ప్రసాదించు’’ - అని ప్రార్థించండి. అప్పుడు యమునా నదీమతల్లి మీకు త్రోవ ఇస్తుంది.
2. యం మాగ్ం స్మృత్వా
అగాథా గాథా భవతి। -
యం మాగ్ం స్మృత్వా
అపూతః పూతో భవతి। -
యం మాగ్ం స్మృత్వా
అవ్రతీ (స)వ్రతీ భవతి। -
యం మాగ్ం స్మృత్వా
సకామో నిష్కామో భవతి। -
యం మాగ్ం స్మృత్వా
అశ్రోత్రియః శ్రోత్రియో భవతి। -
యం మాగ్ం స్మృత్వా
అగాథతల స్పర్శ రహితాపి
సర్వా సరిద్గాధా భవతి।।
‘‘నాయొక్క సర్వాత్మక కేవల సాక్షీ -స్వాభావికానంద స్వరూపము’’ స్మరిస్తూ ఉండగా,,,
🌹 లోతైన అగాథములు కూడా (గోష్పాదజలముతో సమానంగా) గాథలు (చిన్నిగుంటలు వంటివి) అవుతాయి.
🌹 అపూతుడు (అపవిత్రుడు) కూడా పవిత్రత సంతరించుకొని - పూతుడు (పవిత్రుడు) అవుతాడు.
🌹 ఏ వ్రతము చేయనివాడు కూడా వ్రతములన్నీ చేసిన ఉత్తమ ప్రయోజనము పొందగలడు. (అవ్రతుడుకూడా సువ్రతుడు అవుతాడు),
🌹 ‘‘దృశ్యంలో ఇంకా ఏదో పొందాలి’’ అను రూపముతో కూడిన ‘సకాముడు’ కూడా ‘నిష్కాముడు’ కాగలడు.
🌹 శ్రుతులు (వేదములు) శాస్త్రీయంగా పఠించనినాడు కూడా వేద హృదయము తెలుసుకొని శ్రోత్రియుడు అవుతాడు.
అగాధములతో కూడిన (లోతైన గుంటలతో కూడిన), దాటటానికి కూడా వీలుగాని సుడులలో కూడిన సంసార నదీ ప్రవాహము కూడా దాటటానికి సులభమైపోతుంది.
అట్టి నా నామ-రూపములు ఆశ్రయించండి. ఇది రౌద్రమంత్రము.
నన్ను స్మరించండి. భవసాగర తరంగములను తేలికగా దాటివేయగలరు. ఇక యమునా నదీ ప్రవాహములు ఎందుకు దాటలేరు?
శ్రుత్వా తత్‌వాక్యగ్ం హి వై
రౌద్రగ్ం స్మృత్వా, తద్వాక్యేన తీర్త్వా,
తత్‌సౌర్యాగ్ం హి వై గత్వా,
శ్రమగ్ం పుణ్యతమగ్ం హి వై నత్వా,
మునిగ్ం శ్రేష్ఠ తమగ్ం హి వై రౌద్రం చ - ఇతి।।
ఆ వ్రజ గోపికలు కృష్ణయ్య చెప్పిన రౌద్రమంత్ర - మంత్రార్థమును జపిస్తూ, రుద్రమగు తరంగములుగల యమునానదిని దాటి ఆవల ఒడ్డును చేరారు.
శ్రమతో గట్టు, ఇసుక తిన్నెలు దాటారు. పుణ్యపరాకాష్ఠనిష్ఠుడు, పుణ్యతముడు, రుద్రాంశ సంభూతుడు అగు - దుర్వాస మహర్షి ఆశ్రమం చేరి, మహర్షికి నమస్కరించారు. (దుః = At a Distance)
దత్వాస్మై బ్రాహ్మణాయ క్షీరమయం,
ఘృతమయమ్, ఇష్ట తమగ్ం
హి వై మృష్ట తమగ్ం హి।
తుష్టః స్నాత్వా భుక్త్వా
హిత్వా ఆశిషమ్।
ప్రయుజ్యాన్నం జ్ఞాత్వాదాత్।।
ఆ దుర్వాస మహర్షులవారికి క్షీరమయము (పాలతో చేసిన వంటకములు), ఘృతమయము (నేతితో చేసిన మధురములు), రుచిగా ఉండేవి, తినటానికి హాయిగా ఉండేవి - మొదలైన వాటితో కూడిన మృష్టాహారము (రుచికరమైన భోజనము) సమర్పించారు.
దుర్వాస మహర్షి ఎంతో సంతోషించారు. స్నానం చేసి వచ్చి వారు సమర్పించిన మధురమగు ఆహారపదార్థములు భుజించారు. ఆశీర్వదించారు. ఆ వ్రజగోపికలను ప్రేమగా, ఆశీర్వాదపూర్వకంగా శేషాన్న పదార్థములను ప్రసాదంగా ఇచ్చారు.
తా ఊచుః :
కథం యాస్యామో తీర్త్వా సౌర్యామ్?
వ్రజగోపికలు : హే దుర్వాసమహర్షీ! ఇక మాకు శెలవు ఇప్పించ ప్రార్థన. అయితే యమునానది అత్యంత వేగవంతమగు తీవ్ర తరంగములతో ప్రవహిస్తోంది. మేము నదిని దాటటానికి తగిన సామర్థ్యము ప్రసాదించం&
స హో వాచ మునిః : దూర్వాశినమ్ (దూర్వ-అశినమ్) - మాగ్ం
స్మృత్వా, వో దాస్యతి ఇతి మార్గమ్।
దుర్వాసమహర్షి : దూరముగా వసిస్తూ, అశనమునకు (తినటానికి) దూరంగా ఉండి, ఏమాత్రము ఏమీ తిననట్టి నన్ను స్మరిస్తూ యమునను దాటి వేయండి. నేను ఏమీ తినని మాట నిజమైతే యమునా నదీ దేవత మీకు మార్గము (త్రోవ) ప్రసాదిస్తుంది.
తాసాం మధ్యే హి శ్రేష్ఠా, గాంధర్వీ హి ఉవాచ :
తగ్ం హి వై తాభిరేవమ్? (వైత అభిరేవం)?
కథం కృష్ణో బ్రహ్మచారీ?
కథం దూర్వాశనో (దూర్-వ-అశనో)
మునిః తాగ్ం హి?
వ్రజ గోపికలలో శ్రేష్ఠురాలు, పెద్దావిడ అగు గాంధర్వి : అది ఎట్లా అవుతుంది? అష్టభార్య సమేతుడగు మా శ్రీకృష్ణుడు ‘బ్రహ్మచారి’ అనునది నిజము ఎట్లా అవుతుంది? మీరు ఏమీ తినక, తినటానికి దూరంగా ఉన్నవారు (దూర్-వ-అశనో) ఎట్లా అవుతారు?
ముఖ్యాం విధాయ పూర్వమను
కృత్వా తూష్ణీమ్ ఆసుః।।
తక్కిన వ్రజ గోపికలు ‘‘పెద్దావిడ గాంధర్వి అడుగుచున్నారు కదా! మహర్షి ఏం చెపుతారో విందాం।’’- అని నిశ్శబ్దంగా వినసాగారు.
3. శబ్దవాన్ ఆకాశః।
శబ్ద - ఆకాశాభ్యాం భిన్నః।
తస్మిన్ న ఆకాశః తిష్ఠతి,
ఆకాశే తిష్ఠతి।
సహి ఆకాశః తత్ న వేద।

స హి ఆత్మా అహమ్।,
కథం భోక్తా భవామి?
దుర్వాసమహర్షి : కొన్ని దృష్టాంతముల సహాయంతో ‘‘నేనేమీ తినలేదు’’ - అను సత్యము యొక్క అంతర్లీన రహస్యమేమిటో - చెపుతున్నాను. ఓ ధన్యులగు వ్రజగోపికలారా! శ్రద్ధగా వినండి!
ఆకాశము నుండి శబ్దము పుడుతోంది. అయినా కూడా నిశ్శబ్దమగు ఆకాశము శబ్దముగా అవుతోందా? అవటంలేదు. శబ్దము కంటే ఆకాశము ఎప్పుడూ భిన్నమే. సర్వదా నిశ్శబ్దమే. శబ్దములో ఆకాశము ఉండదు. ఆకాశములో శబ్దము ఉండదు. (ఎవరైనా దూషిస్తే ‘ఆకాశం దూషించింది’ అనము కదా!)
ఆకాశము శబ్దములో ప్రవేశించి, శబ్దములో అంతర్భాగమౌతోందా? లేనే లేదు. ఆకాశము ఆకాశములోనే ఏర్పడి ఉన్నది కదా! అదేవిధంగా నేను సర్వదా నిశ్శబ్దమగు ఆత్మస్వరూపుడను. నానుండి భోక్త (అనుభవము పొందువాడు) అనే శబ్దరూపము (సశబ్దము) బయలుదేరవచ్చుగాక. అంతమాత్రంచేత ఆత్మస్వరూపుడునైయున్న నేను భోక్తను అవుతానా? అవను. సర్వదా వేరుగానే ఉంటాను.
స్పర్శవాన్ వాయుః-
‘స్పర్శ’ వాయుభ్యాం భిన్నః।
తస్మిన్ వాయుః తిష్ఠతి। వాయౌ తిష్ఠతి।
వాయుస్తం (వాయుః తమ్) న వేద।

స హి ఆత్మాహమ్!
కథం భోక్తా భవామి?

వాయువు నుండి ‘స్పర్శ’ అనే గుణము బయల్వెడలుతోంది. అయితే, స్పర్శ వాయువుకంటే భిన్నముగా ప్రదర్శనమౌతోంది. స్పర్శయందు వాయువు ఉండదు. వాయువు స్పర్శానుభవము పొందటము లేదు. వాయువు సర్వదా వాయువునందే ఉంటోందిగాని, స్పర్శయందు ప్రవేశించునదై ఉంటోందా? లేదు. స్పర్శకు వాయువు తెలియదు. ‘‘వాయువు శబ్దానుభవముగా దిగివస్తోంది’’ - అని అనము కూడా!
నేను సర్వదా ఆత్మనే అయి ఉండగా, ‘‘ఈతడు భోక్త అయ్యాడు’’ - అని మీరు ఎట్లా అంటారు? భోగము (The Experiencing) యొక్క చర్యలు నావి ఎట్లా అవుతాయి?
రూపవత్ ఇదం తేజో -
రూప అగ్నిభ్యాం భిన్నః।
తస్మిన్ అగ్నిం తిష్ఠతి।
అగ్నిః తం న వేద। (అగ్నిస్తం న వేద)

స హి ఆత్మాహం,
కథం భోక్తా భవామి?

తేజస్సు ‘రూపము’గా ప్రదర్శనమౌతోంది. అయితే వెలుగు వేరు. ఆ వెలుగులో కనిపిస్తున్న వస్తువు యొక్క సాకారమంతా-వేరు. ‘‘వెలుగు తాను వెలిగిస్తున్న ఆకాశములో రూపాత్మకమై ఉంటోంది’’ - అని అంటామా? అనము కదా! అగ్ని ఎప్పుడు అగ్నిలోనే ప్రతిష్ఠితమై ఉంటుందిగాని ‘రూపము’లో తిష్ఠించదు. రూపమునకు తేజస్సు గురించి తెలియదు.
అట్లాగే ‘జీవుడు’ అనునది సంకల్పితము, ఆపాదితము కూడా. నేను సమస్తమును వెలిగించు ఆత్మనేగాని నామ రూపాత్మకమైన జీవుడు, ఆతని అనుభవములు నేనవను. అవన్నీ నాయందు ఉండవు కూడా.
రసవత్ య ఆపో -
రసాద్భ్యాం భిన్నః।
తాసు అప్సు తిష్ఠతి। ఆపః తిష్ఠంతి।
ఆపః తత్ న విదుః।

స హి ఆత్మాహమ్।
కథం భోక్తా భవామి?

జలము నుండి ‘రుచి’ అనే ధర్మము బయల్వెడలుతోంది. అయితే ‘రసము’ (లేక) రుచి కంటే జలము భిన్నమైనది. జలమునందు (త్రాగుచున్నప్పుడు) రుచి ఉండవచ్చు గాక! అయినా కూడా జలము జలమునందే ఉన్నది. రుచికి జలము గురించి తెలియదు. రసములో జలము లేదు. జలమునందే రసము ఉన్నది. ‘జలము’ రుచి అనే అనుభవమేదీ పొందటము లేదు. ఇక రుచికి జలము బద్ధము ఎట్లా అవుతుంది.
ఆత్మనగు నేను భోక్తకు వేరై ఉన్నాను. భోక్త (జీవుడు The Experiencer)కు ఆత్మయగు నా గురించి తెలియదు. జీవాత్మయొక్క ‘రుచి’ అనే అనుభవమునకు నేను బద్ధుడనయే ప్రసక్తి ఎక్కడిది?
గంధవతి ఇయం భూమిః।
గంధ భూమిభ్యాం భిన్నా। తస్యాం,
భూమౌ తిష్ఠతి। భూమిః తిష్ఠతి।
భూమిస్తం (భూమిః తం) న వేద।

స హి ఆత్మాహం।
కథం భోక్తా భవామి?

భూమి గంధము (Smell) అను వాసనను కలిగి ఉంటోంది. అయితే కూడా, గంధము భూమికి వేరై ఉన్నది. గంధము భూమియందే ఉన్నప్పటికీ గంథమునందు భూమిలేదు. భూమియందు భూమియే ఉన్నది.


నాయందు భోక్త ఉన్నప్పటికీ, భోక్త నాయందు లేదు. భోక్త యొక్క గుణములుగాని, లక్షణములుగాని ఆత్మనగు నాపట్ల ఆపాదించవీలు లేదు. నేను ఆత్మనేగాని, గంధమునకు భోక్త మాత్రుడను కాను.
ఇదగ్ం హి మన ఏవ-ఇదం మనుతే।
తాన్ ఇదగ్ం హి గృహ్ణాతి।
యత్ర సర్వమ్ ఆత్మైవా అభూత్,
తత్ర వా కుత్ర మనుతే?
కథం వా గచ్ఛతి? ఇతి।
‘మననము’ చేతనే మనస్సు నిర్మితమౌతోంది. మననమునకు ముందే మననము చేయుచున్నట్టి - ‘నేను’ ఉండనే ఉన్నాను. ఈ మనస్సు ఆయా విషయములపై వ్రాలుతూ ఉండవచ్చుగాక। అయినా నేను విషయరూపముగా అవటం లేదు. మనస్సు సంచారము చేస్తూ విషయములు స్వీకరిస్తూ త్యజిస్తూ ఉన్నప్పటికీ నేను ఎక్కడినుండి ఎక్కడికీ వెళ్ళటం లేదు.
సమస్తము ఆత్మయే అయి ఉండగా, మరి మనస్సుకు నాకంటే వేరే స్థానం ఎక్కడుంటుంది? మనస్సు ఎక్కడికి వెళ్ళగలదు? (తరంగము జలమును విడచి ఎటూ వెళ్ళదుకదా!)
స హి ఆత్మాహమ్।
కథం భోక్తా భవామి?

‘‘నేను ఆత్మను.’’ నేను భోక్తగా అవటమనే ప్రసక్తి ఎక్కడిది. [ దర్పణం (అద్దం)లో దృశ్యము కనబడుచున్నప్పటికీ, ఆ కనబడే వస్తుజాలము దర్పణములో లేనట్లే ] - నేను సర్వదా నిర్విషయుడను.
అయగ్ం హి కృష్ణో,
యో హి శ్రేష్ఠః,
శరీర ద్వయ కారణం భవతి।
ఏది నాయందు కేవలము, పరము అగు ఆత్మాయి ఉన్నదో, అదియే నాయొక్క కృష్ణతత్త్వము. ఆయనయే నాలోని కృష్ణుడు. ఆయనయే శ్రేష్ఠుడు. ఆయనయే స్థూల-సూక్ష్మ శరీరములకు, జీవాత్మ-పరమాత్మ ద్వయమునకు కారణమగు చున్నాడు. ఆయనయే నాయందలి నాయొక్క ఇహ-పర స్వరూపుడు. సమస్తమునకు కారణమగు శ్రీకృష్ణుడే జీవాత్మ-పరమాత్మలుగా (ద్వయముగా) సర్వత్రా అగుచున్నారు.
4. ద్వౌ సుపర్ణౌ భవతో బ్రహ్మణోఽహగ్ం సంభూతః।
తథా ఇతరో ‘భోక్తా’ భవతి।
అన్యో హి ‘సాక్షీ’ భవతి। ఇతి।
- వృక్ష ధర్మే తౌ తిష్ఠత।
బ్రహ్మమగు నేను రెండు పక్షులుగా ఈ దేహవృక్షముపై ఏర్పడి ఉన్నాను. అందులో ఒక పక్షి సర్వదా భోక్త. ఇంకొక పక్షి సర్వమునకు ‘సాక్షి’. ఆ ఇద్దరు ఒకే (శరీర) వృక్షములో సంతిష్టితులై (నివాసము కలవారై) ఉన్నారు. (జలము-తరంగము, బంగారము-ఆభరణము, మట్టి-ప్రతిమలవలె దేహగృహంలో నివాసము కలిగి ఉన్నారు)
అతో ‘భోక్త’ ‘భోక్తారౌ’ పూర్వోహి ‘భోక్తా’ భవతి।
తథేతరో (తథా ఇతరో) భోక్తా కృష్ణో భవతి। ఇతి।
యత్ర విద్య అవిద్యే న విదామో,
విద్యా అవిద్యాభ్యాం భిన్నో,
విద్యా మయో హి
యః సః కథం విషయీ భవతి? ఇతి।।
అట్టి భోక్తృత్వము భోక్తించు (The Experiencer of the Experiences) సాక్షి - భోక్తలకు వేరుగా ఇరువురుకి మహాభోక్తగా నాయందు మూడవవాడై శ్రీకృష్ణభగవానుడు సర్వత్రా బాహ్య-అభ్యంతరములలో వేంచేసి ఉన్నారు.
ఎక్కడ విద్య - అవిద్యలు ఉభయము ఉండవో, విద్య - అవిద్యలు - రెండిటికీ ఎవడు భిన్నుడో, సర్వము ఎరుగుచూ విద్యామయుడో, అట్టి ఆత్మభగవానుని సమక్షంలో విషయములకు చోటెక్కడ ఉంటుంది? విషయ ప్రపంచమునకు స్థానము ఎక్కడిది? నేను సదా నిర్విషయుడను. సమస్త విషయములను ఆవలివాడను. శ్రీకృష్ణ చైతన్యమే నా సహజరూపము.
యో హ వై కామేన కామాన్
కామయతే, స ‘‘కామీ’’ భవతి।
యో హ వై తు అకామేన
కామాన్ కామయతే సో, ‘‘అకామో’’ భవతి।
ఎవ్వడైతే సకాముడై (కోరికలు కలవాడై) కోరికలు (తన కొరకై) కలిగి ఉంటాడో, అట్టివాడు ‘కామి’ లేక ‘సకామి’ అగుచున్నాడు.
ఎవ్వడైతే ‘అకామి’ అయి (కోరికలు లేనివాడై) కోరికలు (లోక కళ్యాణము కొరకై మాత్రమే) కలిగి ఉంటాడో - ఆతడు ‘అకామి’ యే। నేను ‘అకామకామి’ని.
జన్మ జరాభ్యాం భిన్నః, స్థాణుః।
- అయమ్ అచ్ఛేద్యో।
- అయమ్ యో అసౌ సూర్యే తిష్ఠతి।
- యో అసౌ గోషు తిష్ఠతి।
- యో అసౌ గోపాన్ పాలయతి।
- యో అసౌ సర్వేషు దేవేషు తిష్ఠతి।
- యో అసౌ సర్వైః దేవైః గీయతే।
- యో అసౌ సర్వేషు భూతేష్వా
విశ్వ, భూతాని విదధాతి
స వో హి స్వామీ భవతి।।
- ఎవ్వడైతే జన్మ - దేహము - వార్థక్యము మొదలైనవాటికి భిన్నులో,
- ఎక్కడి నుండి ఎక్కడికి కదలక స్థాణువు (unmoved) అయి ఉన్నారో,
- జీవాత్మ - ఈశ్వరుడు - నీవు - నేను - జగద్దృశ్యము - మొదలైన వాటిగా ఏమాత్రము విభాగము పొందటమే లేదో,
- ఎవ్వరైతే సూర్యబింబమునందు, గోవులందు, సమస్త దేవతలందు సర్వదా సమస్వరూపులై వేంచేసి ఉన్నారో,
- సర్వదేవతలు ఎవ్వరిని అనునిత్యము గానము చేస్తూ ఉన్నారో,
- ఎవ్వరు సమస్త జీవులందు ప్రవేశించి సమస్త జీవులుగా అగుచున్నారో, ఈ విశ్వమంతా తన స్వరూపముగా కలిగియున్నారో, వారే మన శ్రీకృష్ణ స్వామి సుమా!
అట్టి దర్శనముచే ఈ జీవుడు స్వయముగా తాను ‘స్వామి’ - అగుచున్నాడు
(సాహోవాచ) సా హ ఉవాచ గాంధర్వీ :
కథం వా స్వస్మాసు జాతో,
గోపాలః కథం వా
జ్ఞాతో అసౌ, త్వయా మునే?
గాంధర్వి (వ్రజగోపికలలో పెద్ద) : హే దుర్వాసమునీంద్రా! మామధ్యలో పుట్టి పెరిగియున్న మా గోపాలుడు మీచేత మీరు వర్ణించబడినవాడుగా మీకు ఎట్లా తెలియవస్తూ ఉన్నారు? మీరెట్లా మీరు చెప్పుచున్నవిధంగా తెలుసుకోగలిగారు?
కృష్ణః కో వా? అస్య మంత్రః (కిం)?
కిం స్థానం? కథం వా దేవక్యాం జాతః?
కో వా అస్య జాయా గ్రామో భవతి?
కీదృశీ పూజా-అస్య గోపాలస్య భవతి?
మావాడై, మా వ్రజ గోపికలలో - గోపాలబాలురలో ఒకడుగా ఉన్న మా ప్రియ శ్రీకృష్ణుడు అసలు ఎవరు? ఆయనకు సంబంధించిన మంత్రమేమిటి? ఆయన ఉన్న అసలైన స్థానము ఏది? మా దేవకికి ఎట్లా వచ్చి జన్మించి మామధ్యే ‘కృష్ణ’ నామధేయంతో వెలుగొందుచున్నాడు? ఆయన భార్యలెవరు? వారెక్కడినుండి వచ్చారు! ఆ గోపాలుని ఎట్లా పూజించితే ఆయనకు మేము ప్రియము అవుతాము? - ఈ విషయాలు సద్గురువై మాకు దయతో బోధించండి.
సాక్షాత్ ప్రకృతిపరో అయమాత్మా
గోపాలః కథం తు
అవతీర్ణో భూమ్యాగ్ం హి వై?
- సా గంధర్వీ మునిమ్ ఉవాచ :-
కేవల- ఆత్మపురుషుడగు ఆ పరాత్పరుడు -ప్రకృతికి ‘పరుడు’ (Beyond) అయిఉండికూడా. భూమిపై గోపాలుడుగా, మా శ్రీకృష్ణుడుగా ఎవరి కొరకై ఎందుకు అవతరించారు?
మహాత్మా! ఈఈ విశేషాలన్నీ దయతో వివరించండి.
5. సహోవాచ (దుర్వాసౌ వాచ) :
తాగ్ం హి వై పూర్వం నారాయణో
యస్మింల్లోకా ఓతాశ్చ - ప్రోతాశ్చ।
తస్య హృత్ పద్మాః జాతో
అబ్జయోనిః తపః తప్త్వా,
తస్మై హ పరం దదౌ స మమ ప్రశ్నమేవ వవ్రే -
తగ్ం హస్మై దదౌ।
శ్రీ దుర్వాస మహర్షి : వ్రజగోపికలారా! వినండి. వస్త్రములో దారములాగా ఎవ్వరైతే ఈ సమస్త లోకములకు ఓత - ప్రోతమైయున్నారో, ఈ లోకాలకు మునుముందే చైతన్య స్వరూపులై ఉన్నారో - అట్టి శ్రీమన్నారాయణుడే ఈ మన శ్రీకృష్ణుడు.
సమస్తమునకు మునుముందే ఉన్న ఆ నారాయణుని హృదయపద్మము నుండి ముందుగా లీలా -క్రీడా-వినోదంగా సృష్టి- అభిమాని యగు బ్రహ్మదేవుడు పుట్టారు. ఆయన తపస్సు చేయగా నారాయణుడే ఆయనను సృష్టి కాముడుగా తీర్చిదిద్ది, ఆ తరువాత ఆ బ్రహ్మదేవునికి సృష్టి కల్పనా సామర్థ్యము ప్రసాదించారు. అట్టి సృష్టియందు శ్రీమన్నారాయణుడే క్రీడా - లీలా వినోదంగా అవతరిస్తున్నారు.
స హోవాచ (గాంధర్వ వ్రజగోపికౌ వాచ) :
అబ్జ యోనిర్యో వా అవతారాణాం
మధ్యే శ్రేష్ఠో - అవతారః కో భవతి?
యేన లోకాః తుష్టా భవంతి?
యగ్ం స్మృత్వా ముక్తా అస్మాత్ సంసారాత్ భవంతి?
కథం వా అస్య అవతారస్య బ్రహ్మతా భవతి?
గాంధర్వ వ్రజగోపిక : మహర్షీ! బ్రహ్మ సృష్టిలోని పరమాత్మయొక్క అవతారములలో - శ్రేష్ఠ అవతారములు ఏవి? ఏ ముఖ్యావతారముచే లోకములు ‘అసంతృప్తి’ని త్యజించి తృప్తి, తుష్టి - పొందగలవు? ఎవరిని స్మరించినప్పుడు సృష్టిలోని జీవులు సంసార బంధములనుండి విముక్తులు కాగలరు? ఆ అవతారములకు అట్టి బ్రహ్మత్వము ఎట్లా కలిగింది? ఈ వివరాలన్నీ తెలియజేయండి.
స హోవాచ (దుర్వాసౌ వాచ) :
తగ్ం హి వై నారాయణో దేవః స కామ్యో।
మేరోః శృంగే యథా ‘‘సప్తపుర్యో’’ భవంతి, -
తథా నిష్కామ్యాః, సకామ్యా
భూగోళచక్రే సప్తపుర్యో భవంతి।
తాసాం మధ్యే సాక్షాత్ బ్రహ్మ గోపాలపురీ భవతి।
సకామ్యా నిష్కామ్యా దేవానాగ్ం
సర్వేషాం భూతానాం భవతి।
అథ అస్య భజనం భవతి।।
శ్రీ దుర్వాసమహర్షి : సమస్తమునకు మునుముందే నారాయణ పరతత్త్వమే ఉన్నది. అట్టి నిర్విషయ ఆదిస్వరూపము, ఏకము, కేవలము - అయి ఉండి కూడా కల్పనకు సంబంధించి ‘సకామి’ అయింది.
(మేరుపర్వతముపై శిఖరములు ఏర్పడి ఉన్న తీరుగా- శిఖరములవంటి సప్త (7) పురములు సకామకల్పనయందు ఏర్పడుచున్నాయి.
ఈ భూగోళచక్రములో నిష్కామ్యమైనవి, సకామ్యమైనవి అగు భూతజాలమునకు, దేవతలకు - ఆ సప్తపురములు నివాసస్థానము.
వాటి మధ్యగా బ్రహ్మ - గోపాల పురము. అట్టి గోపాలపురములో నిష్కామ్య దేవతలు, సకామ్యులగు దేవతలు పరమాత్మను భజించువారై - సృష్టి సంకల్పానుసారముగా నివాసులై ఉన్నారు.
యథా హి వై సరసి పద్మం తిష్ఠతి,
తథా భూమ్యాం తిష్ఠతి,
చక్రేణ రక్షితా మధురా।
సరస్సులో పద్మము ఉండి ఉంటున్న తీరుగా ఈ భూమి జలములో ఉన్నది. అందు చక్రముచే రక్షించబడే మధురానగరము.
తస్మాత్ గోపాలపురీ భవతి।
బృహత్ బృహత్ వనం। (బృహద్వనం)।
మధోః మధువనం।
తాళః తాళవనం।
కామ్యం కామవనం।
బహుళా బహుళవనం।
కుముదః కుముదవనం।
ఖదిరః ఖదిరవనం।
భద్రో భద్రవనం।
- భాండీర ఇతి।।
అందులో గోపాలపురము ఉన్నది.
ఆ గోపాలపురములో వనములు
బృహత్ - బృహత్ వనము.
మధో- మధు వనము.
తాళంః - తాళ వనము.
కామ్యము - కామ్య వనము.
బహుళా - బహుళ వనము.
కుముదః - కుముద (తామర) వనము.
ఖదిర - ఖదిర (పోకచెక్క) వనము.
భద్ర - భద్ర వనము.
ఈ విధంగా అవి భండారము (బిందె) ఆకారముగా ఆ గోపాలపురంలో ఉన్నాయి.
6. భాండీరవనగ్ం శ్రీవనం
లోహవనం బృందావనం
ఏతైః ఆవృతా పురీభవతి।
తత్ర తేషు ఏవ గగనేషు ఏవం దేవా,
మనుష్యా గంధర్వా నాగాః
కిన్నరా గాయంతి, నృత్యంతి - ఇతి।।
(చిదాకాశ (లేక) ఆత్మాకాశ సమానమగు) ఆ గోపాలపురము - భాండీర వనము, శ్రీవనము, లోహవనము, బృందావనములచే ఆవరించబడి ఉన్నది.
అక్కడ ఆ గగనము నందు (చిదాకాశమునందు) సమస్త దేవతలు, మానవులు, గంధర్వులు, నాగులు (నాగదేవతలు), కిన్నరులు కేవలాత్మానంద స్వరూపమగు కృష్ణతత్త్వము గురించి గానము చేస్తూ, నృత్యము చేస్తూ ఉంటారు.
తత్ర-ద్వాదశాదిత్యా, ఏకాదశరుద్రా,
అష్టౌ వసవః, సప్త మునయో,
బ్రహ్మా, నారదశ్చ పంచవినాయకా,
విశ్వేశ్వరో, రుద్రేశ్వరో అంబికేశ్వరో,
నీలకంఠేశ్వరో, గోపాలేశ్వరో,
భద్రేశ్వర ఇతి। -
అష్ఠౌ అన్యాని లింగాని।
- చతుర్విగ్ంశతి (24) (చ) భవంతి।
అట్టి గోపాలపుర స్థానములో
- (ధాత, మిత్రుడు, అర్యముడు, శుక్రుడు, వరుణుడు, అంశుమంతుడు, భగుడు, వివస్వంతుడు, త్వష్ట, పూషుడు, సవిత్తు, విష్ణువు-అనబడు) ద్వాదశాదిత్యులు,
- (బ్రహ్మ మానస పుత్రులగు అజుడు, ఏకపాదుడు, అహిర్బుధ్యుడు, హరుడు, శంభుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు, త్వష్ఠ, రుద్రుడు - అనబడే) ఏకాదశరుద్రులు,
- (అవుడు, ధ్రువుడు, సోముడు, అధర్వుడు, అనిలుడు, ప్రభాసుడు- అను) అష్టవసువులు,
- (మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు అను) సప్త ఋషులు (సప్త బ్రహ్మేతి),
- సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు (ప్రజాపతి),
- దేవర్షి నారదులవారు,
- పంచ వినాయకులు,
- విశ్వేశ్వర - నీలకంఠేశ్వర, గోపాలేశ్వర -భద్రేశ్వర (ఈశ్వర) ప్రదర్శనములు, తదితర అష్టలింగములు,
- (పంచ ప్రాణ, పంచ భూత, పంచ ఇంద్రియ, పంచ ఉపప్రాణ, అంతరంగ చతుష్టయములనే) 24 తత్త్వములు
వెల్లివిరుస్తున్నారు.
ద్వే వనే స్తః - కృష్ణవనం, భద్రవనం।।
తయోః అంతరః ద్వాదశ వనాని-
పుణ్యాని, పుణ్య తమాని।
తేషు ఏవ దేవాః తిష్ఠంతి।।
అక్కడ (ఆగోపాలపురములో) 2 వనములు.
(1) కృష్ణవనము (2) భద్రవనము
ఆ వనముల అంతరముగా (లోపలగా) పుణ్యములు, శ్రేష్ఠ పుణ్యములు (పుణ్యతమములు) అయినట్టి ‘12’ ఉపవనములు వాటియందు అనేక మంది దేవతలు వేంచేసి సుస్థితులై ఉన్నారు.
సిద్దాః సిద్ధిం ప్రాప్తాః।
అక్కడ సిద్ధయోగులు ళిఈ జాగ్రత్ - స్వప్న - ‘‘సుషుప్తులు, ఈ దేహములు, ఈ లోకములు - ఇవన్నీ కూడా శ్రీకృష్ణ చైతన్యానంద పురుషుడనగు నేనే నా పురుషకారముచే సిద్ధించుకొంటున్నాను’’ - అని ఎరిగినవారై, సిద్ధిని ప్రాప్తింపజేసుకొంటున్నారు.
తత్ర హి :-
రామస్య రామమూర్తిః।
ప్రద్యుమ్నస్య ప్రద్యుమ్న మూర్తిః।
అనిరుద్ధస్య అనిరుద్ధమూర్తిః। కృష్ణస్య కృష్ణమూర్తిః।
వనేషు ఏవం మధురా సేయం
ద్వాదశ మూర్తయో భవంతి।।
అక్కడ (గోపాలపురములో) బలరాముని రామమూర్తిత్వము, ప్రద్యుమ్నుని యొక్క ప్రద్యుమ్నమూర్తీ విభవము, అనిరుద్ధుని యొక్క అనిరుద్ధమూర్తీ వైభవము, శ్రీకృష్ణభగవానుని శ్రీకృష్ణమూర్తీ మహదత్వము మూర్తీభవించినవై ఉంటున్నాయి. సాకారముగా కొలువబడుచున్నాయి.
అక్కడి వనములలో శ్రీకృష్ణ పరమాత్మయొక్క ‘‘12’’ మూర్తులు ఉన్నాయి. అవన్నీ అక్కడ ఉపాసించబడుచూ ఉన్నాయి.
ఏకాగ్ం హి రుద్రా యజంతి।
ద్వితీయం బ్రహ్మా యజతి।
తృతీయాం బ్రహ్మజా యజంతి।
చతుర్థీం మరుతో యజంతి।
పంచమీం వినాయకా యజంతి।
షష్ఠీం వసవో యజంతి।
సప్తమీం ఋషయో యజంతి।
అష్టమీం గంధర్వా యజంతి।
నవమీం అప్సరసో యజంతి।



దశమీవై హి ‘‘అంతర్థానే’’ తిష్ఠతి।



ఏకాదశీతి - ‘‘స్వపదానుగా।’’



ద్వాదశీతి - భూమ్యాం తిష్ఠతి।
అట్టి శ్రీకృష్ణ భగవానుని ద్వాదశ (12) మూర్తులలో :
- మొదటి మూర్తిని రుద్రులు పూజిస్తున్నారు.
- రెండవదానిని సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు పూజిస్తూ ఉన్నారు.
- మూడవమూర్తిని బ్రహ్మమానసపుత్రులు అగు సనక, సనంద సనత్కుమార సనస్సుజాతాదులు, బ్రహ్మతత్త్వజ్ఞులు పూజిస్తున్నారు.
- నాలుగవ ‘మూర్తి’ని మరుత్తులు ఉపాసిస్తున్నారు.
- ఐదవది వినాయకుడు సేవిస్తున్నారు.
- ఆరవ రూపము (మూర్తి)ను వసువులు,
- ఏడవ మూర్తిని సప్తఋషులు,
- ఎనిమిదవ మూర్తీ వైభవమును గంధర్వులు
- తొమ్మిదవ రూపమును అప్సరసలు
ధ్యానిస్తున్నారు.

శ్రీకృష్ణ భగవానుని యొక్క 10వ మూర్తి - అంతర్థానమైనదై (ఇంద్రియములకు అవిషయమై) ఉంటోంది.


11వదిగా మూర్తీభవించినట్టి రూపము స్వపదానుగా, ‘‘తనయొక్క, తదితర సమస్త జీవులు యొక్క ఈ దృశ్య జగత్తు యొక్క సహజమగు స్వస్వరూపముగా బృందావన కృష్ణులని తెలుసుకొంటూ ఆరాధించునది. ‘‘స్వపదానుగా’’ అను ఉపాసన. స్వస్వరూపముతో సహా - సమస్తముగాను మూర్తీభవించిన శ్రీకృష్ణపరమాత్మ వైభవోపాసన. (ఇది అన్నిటికీ పరాకాష్ఠ)

ఇక ‘12వ’ మూర్త్యుపాసన ‘‘ఈ సమస్తము నాయొక్క ఆత్మవిన్యాసమే’’ అను ‘భౌమాభావన’ యందు స్వాభావికంగా తిష్ఠించటము ‘‘ఇది సప్తమ భూమిక’’ లేక ‘‘భూమ్యాతిష్ఠతి’’ అనబడుతోంది. అనన్యోపాసన.
7. తాగ్ం హి యే యజంతి,
తే మృత్యుం తరంతి।
ముక్తిం లభంతే।
ఎవ్వరైతే అట్టి ‘‘ఈ సమస్తము నా ఆత్మయందే ఉన్నది. ఈ సమస్తము నందు మమాత్మయే ఏర్పడినదై ఉన్నది - (సర్వభూతస్థం ఆత్మానం! సర్వభూతానిచ ఆత్మని) - అను సప్తమభూమిక యందు ప్రవేశము పొందినవారై ఉంటారో, - అట్టివారు, ‘‘మృత్యువు నా సమక్షంలో జరిగే ఒక స్వాభావిక దైనందిక సంఘటన’’ అను దృష్టిచే జన్మమృత్యు చక్రపరి భ్రమణభావననుండి తరించుచున్నారు. అమృతత్వము సిద్ధించు కుంటున్నారు. వారి దృష్టిలో ఇక్కడి జన్మ-కర్మలు స్వతఃగా లేనివి, కల్పనచే మాత్రమే ఉన్నవి అవుతాయి. వారు ముక్తిరూపులు.
గర్భ జన్మ (కర్మ) జరామరణ
తాపత్రయాత్మక దుఃఖం తరంతి।
తదపి ఏతే శ్లోకా భవంతి।।
అట్టి శ్రీకృష్ణుని -సమస్తముగా మూర్తీభవించినట్టి మూర్తీవిభవమును ఉపాసించువారు గర్భనరక - జన్మ - కర్మ - జరామరణరూపములగు శారీరక దుఃఖములను, (ఆధిభౌతిక-ఆధి దైవిక, ఆధి-ఆత్మికములు అనబడే) మానసిక దుఃఖరూపమగు తాపత్రయములనుండి తరించగలరు.
అట్టి గోపాలపురములో వేంచేసిన శ్రీకృష్ణమూర్తి రూపము శ్లోకములుగా వర్ణించబడుచున్నది. (అవి చెప్పుకుంటున్నాము)
శ్లో।। సంప్రాప్య మధురాగ్ం రమ్యాగ్ం
సదా బ్రహ్మా-ది వందితామ్।
శంఖ చక్ర గదా శాఙ్గరక్షితాం ముసలాదిభిః।
యత్ర అసౌ సంస్థితః కృష్ణః, స్త్రీభిః శక్త్యా సమాహితః।
రమ అనిరుద్ధ ప్రద్యుమ్న రుక్మిణ్యా సహితో విభుః।
మధురలో రమ్యముగా వేంచేసియున్నవారు, బ్రహ్మ మొదలైన దేవతలచే ఎప్పుడు నమస్కరించబడువారు, శంఖ-చక్ర-గదా-విల్లు-ముసల సాయుధులు, శ్రీకృష్ణావతారులై గోపికా స్త్రీలతోను, ఆదిశక్తితోను (ఆదిలక్ష్మితోను) వెంటనంటి ఉన్నవారు, రమ అనిరుద్ధ ప్రద్యుమ్న రుక్మిణీ సహితులు, - అగు ‘సర్వాత్మక-పరమాత్మ’కు నమస్కారము.
చతుః శబ్దో భవేత్ ఏకో హి ‘‘ఓం’’ కారస్య ఉదాహృతః।
తస్మాత్ ఏవ పరోరజసేతి।
‘‘సోఽహమ్’’ - ఇతి అవధార్య
‘‘ఆత్మానం గోపాలోఽహమ్’’
ఇతి - భావయేత్, స మోక్షమ్ అశ్నుతే।।

నాలుగు వేదముల హృదయమగు ‘ఓం’కారముగా చెప్పబడు ఏక-అక్షర పరమార్థ అత్మానందస్వరూపులు అగు-శ్రీకృష్ణ స్వామియే సమస్త జీవుల పరస్వరూపులై విరాజిల్లుచున్నారు.
ఆయన అనన్యులు కాబట్టి అట్టి గోపాలుడే మామాత్మ స్వరూపులు.
‘‘ఆత్మగా నేను ఆ గోపాల స్వరూపుడనే’’ - అని భావనను ఆశ్రయించువారు ఇప్పుడే, ఇక్కడే మోక్షము సిద్ధించుకోగలరు. అట్టి భావనయొక్క ఆశ్రయముచేతనే మనమంతా పునీతులు కాగలము.
స బ్రహ్మత్వమ్ అధిగచ్ఛతి।
స ‘బ్రహ్మవిత్’ భవతి।
స గోపాన్ జీవాన్ ఆత్మత్వేన

సృష్టి పర్యంతమ్ ఆలాతి -
స గోపాలో భవతి హి।। ।।ఓం।।
అట్టివాడు ‘జీవత్వము’ నుండి విడివడి, ‘బ్రహ్మత్వము’ సిద్ధించు కుంటున్నాడు. ఆతడు ‘బ్రహ్మవేత్త’ అగుచున్నాడు. (బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి)
ఈ జీవులంతా గోవులు. వీరందరినీ తనయందు సృష్టించుకొని లీలా క్రీడా వినోదంగా తనకు అనన్యముగా సృష్టిపర్యంతము కలిగియున్న అఖండాత్మయే గోపాలుడు.
గోవులనబడే ఇంద్రియములను, జీవులను తన పరిపాలన యందు కలిగి ఉన్నవారవటంచేత గోపాలుడు. అట్టి గోపాలకృష్ణుని గానము చేయువాడు తానే గోపాలుడు అగుచున్నాడు.
ఓం తత్ సోఽహమ్
పరంబ్రహ్మ కృష్ణాత్మకో
నిత్యానందైక స్వరూపః।
సమస్తమునకు పరమైయున్న కేవలమగు ‘అహం’ రూపంగా - నిత్యానందైక స్వరూపుడగు శ్రీకృష్ణ పరబ్రహ్మమే నాయందు సర్వదా వేంచేసి యున్నారు. సమస్తము ఆయనయే కాబట్టి ‘నేను’గా వేంచేసియున్నది ఆయనయే। అనన్యమగు శ్రీకృష్ణతత్త్వమునకు అన్యమై నేనెక్కడ ఉంటాను?
సోఽహమ్ ఓం
తత్ సత్ గోపాలో అహమేవ -
పరగ్ం సత్యమ్ అబాధితం
సోఽహమ్। ఇతి -
ఆత్మానం ఆదాయ
మనసః ఐక్యం కుర్యాత్।

‘‘సమస్త జీవాత్మలు తానే అయి ఉన్న తత్-సత్ (కేవలుడు, సమస్తముగా ఉన్నవాడు) అగు గోపాలుడను నేనే! సమస్తమునకు పరమై, సమస్త కల్పనలకూ అవల సత్ స్వరూపుడై, జన్మ-జీవన్-మరణ-మనో-బుద్ధి- చిత్త- అహంకారములచే స్పృశించబడనివాడై, అబాధితుడైనట్టి శ్రీకృష్ణపరమాత్మను నేనే! ‘నేను’గా ఉన్నది ఆయనయే’’ - అని స్వస్వరూపమును దర్శిస్తూ మనస్సును సమస్త భేదముల నుండి వెనుకకు మరల్చాలి.

‘‘సర్వాత్మకుడగు శ్రీకృష్ణపరమాత్మను నేనే। ‘నేను’గా ఉన్నది ఆయనయే’’ - అని స్వస్వరూపమును దర్శిస్తూ మనస్సును సమస్త భేదములనుండి వెనుకకు మరల్చి సర్వాత్మకుడగు శ్రీకృష్ణ పరమాత్మతో ఏకం చేసివేయుచుండెదము గాక।
‘‘ఆత్మానం గోపాలోఽహమ్’’
- ఇతి భావయేత్।।
‘‘ఆత్మగా గోపాలుడనే నేను’’ అని భావన చేయుదురు గాక। [ గోపికలు ఒకప్పుడు ఉద్దవునితో ‘‘మాకు గోపాలుడు వేరు కాదు కదా! ఎట్లా ఉపాసిస్తాము?’’ - అని ఎదురితిరిగి ప్రశ్నించటమనే - గోపికా తన్మయ అనన్యానందము। ]
స ఏవ అవ్యక్తో అనంతో
నిత్యో గోపాలః।।
ఎవరైతే సమస్త జీవులందు అవ్యక్తుడై (సమస్తమును వ్యక్తీకరిస్తూ తాను వేరుగా ఉన్నవారై), అనంతుడై (జన్మలచేతను, 14 లోకములచేతను పరిమితుడు కానివాడై), (మూడు కాలములలో ఒకే స్వరూపము కలవాడవటం చేత) నిత్యుడై, (మనందరిలో సర్వదా మనకు వేరుకానివాడు కాబట్టి) అనన్యుడై వేంచేసి ఉన్నారో, - ఆయనయే గోపాలుడు. ఆయనయే మన శ్రీకృష్ణపరమాత్మ। అంతేగాని, ఆయన ఒక వ్యక్తి కాదు. ఇదంతా ఆయనయొక్క లీలామానుష వేషధారణ.
8. మధురాయాగ్ం స్థితిః, బ్రహ్మన్!
సర్వదా మే భవిష్యతి।
శంఖ చక్ర గదా పద్మ వనమాలా ధరస్య వై।
విశ్వరూపం పరం జ్యోతిః।
స్వరూపగ్ం। రూపవర్జితమ్।
శ్రీకృష్ణ ప్రియ వచనములు
శ్రీకృష్ణ భగవానుడు : ఓ బ్రహ్మదేవా! శంఖ చక్ర గదా పద్మ వనమాలా ధారుడనై శ్రీకృష్ణావతారుడనై మధురలో సర్వదా వేంచేసి ఉంటున్నాను.
మమానందస్వరూపులగు సమస్త ఆప్త - ఆశ్రితజనులారా! వినండి.
ఈ సమస్త విశ్వము నా రూపమే అయి ఉన్న విశ్వరూపుడను. సమస్త రూపములు నాకు చెందినవే కాబట్టి రూపవర్జితుడను కూడా.
మధురా మండలే యస్తు జంబూద్వీప స్థితో-పి వా,
యో అర్చయేత్ ప్రతిమాం మాం చ,
స మే ప్రియతరో భువి।
మధురామండలములో శ్రీకృష్ణుడనై అవతరించినవాడను అగు నన్ను - జంబూద్వీపస్థితుడను అయి ఉండియే ఎవ్వరైతే, ఎక్కడైనా సరే - నా ప్రతిమను మమాత్మభావనతో అర్చిస్తారో అట్టివారు నాకు ప్రియాతి ప్రియులగుచున్నారు.
తస్యాం అధిష్ఠితః కృష్ణరూపీ
పూజ్యః త్వయా సదా,
చతుర్దా చ అస్య అవతార
అభేదత్వేన యజంతి మామ్।
యుగానువర్తినో లోకా
యజంతి ఇహ సుమేధసః।
నా తత్త్వము ఎరిగిన బుద్ధిమంతులు సర్వమునందు అధిష్ఠితుడు (welplaced comprehensively) గాను, నాలుగవదగు జాగ్రత్-స్వప్న- సుషుప్తులకు ‘సాక్షి’ అగు తురీయునిగాను (4వ వానిగాను), తమకు అనన్యుడుగాను ఆరాధిస్తున్నారు. ఉపాసిస్తున్నారు. పూజిస్తున్నారు.
నా ప్రతిమను సహకారికంగా తీసుకొని, నన్ను యుగముల రూపముగా అనువర్తించువాడుగాను (విస్తరించు వాడనుగాను) భావిస్తున్నారు. నిర్మలము, సునిశితము, విస్తారము, సమగ్రముతో కూడిన బుద్ధితో ప్రార్థనలు సలుపుచున్నారు.
గోపాలగ్ం స-అనుజం కృష్ణగ్ం
రుక్మిణ్యా సహ తత్పరమ్।
బలరామునితోను (ఆదిశేష స్వరూపముతోను), (శ్రీకృష్ణావతార విజయము తప్పించే మరేకాంక్ష లేనట్టి) రుక్మిణితోను - కూడుకొనియున్న వాడను, సమస్త జీవాత్మలను పాలించు గోపాలుడనగు నన్ను - ‘తత్’ గాను ‘పరమ్’ గాను - తత్పరుడుగాను భావిస్తూ ‘ప్రతిమ’ను ఉపాసించుచున్నారు.
గోపాలోఽహమ్ అజో నిత్యః।
ప్రద్యుమ్నోఽహమ్ సనాతనః।
రామోఽహమ్।
అనిరుద్ధోఽహమ్।
ఆత్మానం చ అర్చయేత్ బుధః।
శ్రీకృష్ణ చైతన్యానందోపాసన = జన్మకర్మాదులు లేనట్టివాడను, నిత్యుడను. గోపాలుడను. గోపాలపుర శ్రీకృష్ణుడుగా ఉన్నది నేనే (విష్ణుమూర్తియే).
సమస్త జన్మలకు మునుముందే ఉన్నట్టి సనాతన ప్రద్యుమ్న స్వరూపుడను.
‘‘సర్వజీవులలోను, సర్వజీవులుగాను ప్రకాశిస్తున్న ఆత్మారాముడనే నేను’’ (అని బలరాములవారిని భావించుచున్నారు).
దేనిచేతనూ నిరోధింపబడజాలని అనిరుద్ధుడను అని అర్చిస్తున్నారు - (తెలివితో కృష్ణతత్త్వమును, జగత్ రూపమును ఎరిగిన - బుధులు సమస్తమును అర్పించుచున్నారు).
మయోక్తేన (మాయా ఉక్తేన) సధర్మేణ
నిష్కామేన విభాగశః
తైః అహం పూజనీయో వై
భద్ర కృష్ణ నివాసిభిః।
నేను వివరించి చెప్పుచున్న స్వస్వరూప స్వాభావిక ధర్మమును-నిష్కాములు (ఎట్టి ప్రాపంచిక కోరికలు లేనివారు), జగత్తు నుండి తమ స్వరూపమును విభాగించి చూచువారు - అగు కృష్ణతత్త్వోపాసనకులు ‘‘భద్రకృష్ణనివాసి’’గా నన్ను (తమయందు భద్రముగా సారూప్యుడనై ఉన్నవానిగా) దర్శిస్తూ, భావిస్తూ ఉపాసిస్తున్నారు.
తద్ధర్మ గతి హీనా యే
తస్యాం మయి పరాయణాః
కలినా గ్రసితా యే వై
తేషాం తస్యామ్ అవస్థితిః।।
తత్ బ్రహ్మాండాత్మస్వరూపుడనగు నాయొక్క తత్‌ధర్మము పట్ల శ్రద్ధతో మత్‌పరాయణులై ఉండనట్టి వారికి, గతి తెలియని వారికి కలికల్మష దోషములచే గ్రసితులైనవారికి - దుఃఖ బంధ నివారణకొరకై నేను సాకార- శ్రీకృష్ణావతారుడనై ప్రదర్శితుడను అగుచున్నాను. ఆశ్రితులగు సంసార దోషజనుల సముద్ధరణ కొరకై సంకల్పితమైనట్టిదే (మధుర-వ్రేపల్లె- ద్వారకలలోని) నాయొక్క ప్రకృతి సిద్ధమగు (లేక) ప్రకృతిగతమగు గోపాలకృష్ణావతారము.
యథా త్వగ్ం సహ పుత్రైస్తు,
యథా రుద్రో గణైః సహ,
యథా శ్రియ అభియుక్తోఽహమ్
తథా భక్తో మయి ప్రియః।
ఓ బ్రహ్మదేవా! మీకు మానసపుత్రులగు నారదుడు, భృగు, సనకుడు సనందనుడు, సనత్కుమారుడు, సనస్సుజాతుడు మొదలైనవారంతా ఎంత ఇష్టమో,
ఒక తండ్రికి ఆతని సంతానమంటే ఎంతగా ఇష్టమో, రుద్రభగవానునికి రుద్రగణమంతే ఎంతగా ప్రియమో,
‘నేను ఎంతగా లక్ష్మీదేవిని హృదయమున కలిగి ఇష్టపడతానో,
అంతగానూ భక్తులంటే నాకు ఇష్టము, ప్రియము కూడా.
స హోవాచ అబ్జ యోనిః।
చతుర్భిః దేవైః కథం
ఏకో దేవస్య, యత్
ఏకమ్ అక్షరం యత్-
విశ్రుతమ్, అనేకాక్షరం
కథం సంభూతమ్?
బ్రహ్మదేవుడు : హే శ్రీకృష్ణ పరబ్రహ్మమూర్తీ! ఒక చిన్న సందేహం. పరమాత్మ అగు నీవు సర్వదా ఏకము, అక్షరము అయి ఉన్నావు కదా! అట్టి నీయొక్క ఏకాక్షరతత్త్వము - అనేకముగాను, క్షరవిభాగముతోను కూడుకొన్నదిగా - ఎట్లా, ఎందుకు అవుతోంది?
{(జన్మకర్మరహితుడగు) గోపాలుడవు, (సనాతునుడవు అగు) - ప్రద్యుమ్నుడవు, (సరమస్తమును రమిస్తున్న) రాముడవు, నిరోధము ఉండజాలని అనిరుద్ధుడవు అగు} - నాలుగు దేవతా రూపములు ఎట్లా ఎందుకు పొందుచున్నావు?
9. స హోవాచ :
హి తం (తం హి) పూర్వమ్
‘‘ఏకమేవ అద్వితీయం బ్రహ్మ’’ అసీత్।
తస్మాత్ - ‘అవ్యక్తమ్’ ‘ఏకాక్షరమ్’।
తస్మాత్ అక్షరాత్। - ‘మహత్’।
మహతో - అహంకారః।
తస్మాత్ అహంకారాత్
పంచ తన్మాత్రాణి।
తేభ్యో - భూతాని।
తైః ఆవృతం అక్షరమ్।
విష్ణు భగవానుడు : సమస్తమునకు మునుముందుగా (అన్యములు అనునదేదీ లేనట్టి స్థానము నందు) ఏకము, అద్వితీయము అగు కేవలమే ఉండి ఉన్నది।
అట్టి కేవలము నుండి ఏకాక్షరరూపమగు (ఏకము, అక్షరము అగు) ‘అవ్యక్తము’ జనించింది. వ్యక్తీకరణను చేయగల, వ్యక్తీకరణమునకు మునుముందే గల - ‘‘ధర్మము’’ - అవ్యక్తము.
అట్టి అక్షరము నుండి సమస్తము తానే కల్పించు స్వభావమగు ‘మహత్’ బయల్వెడలింది. అట్టి మహత్ నుండి అహంకారము రూపుదిద్దుకొన్నది.
అట్టి అహంకారము నుండి ‘‘శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములు’’ అనబడే అనుభూతి రూపములగు ‘‘పంచతన్మాత్రలు’’ పుట్టుకొచ్చాయి.
పంచతన్మాత్రలనుండి పంచ సూక్ష్మ భూతములు - (స్థూల-ద్రవ-ఉష్ణ-చలన-స్థాన తత్త్వములు) - బయల్వెడలాయి.
అవన్నీ కూడా ‘అక్షరము’ చేతనే ఆవృతము (Encompassed) అయి ఉంటున్నాయి.
అక్షరోఽహమ్।
ఓంకారోఽహమ్।
అజరో। అమరో।
అభయో। అమృతో।
- ఓ బ్రహ్మదేవా! నేను అక్షరుడును. కేవలుడను.
- వేదములలో ‘సంజ్ఞ’గా చెప్పబడుచున్న ‘ఓం’ కార స్వరూపుడను.
- జరామరణ ధర్మములు లేనట్టివాడను.
- అభయుడను। అమృత స్వరూపుడను।
బ్రహ్మా చ। -
యం హి వై, స ముక్తో
అహమస్మి।
అక్షరోఽహమస్మి।।
- సృష్టియొక్క అభిమాని, కర్త అగు బ్రహ్మదేవుడనునేనే। త్వమేవాహమ్।
అక్షరుడనగు నేను నా సంకల్పమునుండి బయల్వెడలుచున్న సృష్టి ధర్మముచే బద్ధుడనుకాను. నిత్యముక్తుడను. దృశ్యాతీతుడను. సృష్టి, క్షర ధర్మములు కలిగి ఉండియున్నప్పటికీ సర్వదా కేవలుడను. సృష్టికి సాక్షిని. అక్షరుడను.
సత్తా మాత్రం,
చిత్ స్వరూపం,
ప్రకాశం వ్యాపకం తథా।
- ‘నేను ఉన్నాను’ అను కేవల భావముతో కూడిన సత్తామాత్రుడను.
- ఎరుగబడుచున్న సమస్తమునకు ఆవల ‘‘కేవల ఎరుక’’ (Absolute knowing) స్వరూపుడను.
- సమస్తము ప్రకాశింపజేయువాడను.
- సమస్తముగా విస్తరించుచూ సర్వవ్యాపకుడను.
ఏకమేవ అద్వయం బ్రహ్మ
మాయయా చ చతురష్టయమ్।
బ్రహ్మము సర్వదా ఏకము, అక్షరము అయి ఉన్నది. అయితే మాయచేత (1) ఈశ్వరుడు, (2) జీవుడు, (3) పంచతన్మాత్రలు, (4) దృశ్యము అనబడేవిగాను, జాగ్రత్-స్వప్న-సుషుప్త-తురీయ పురుషులుగాను - ‘4’ రూపములు దాల్చుచున్నాను.
విశ్వుడు : రోహిణీ తనయో ‘‘విశ్వ’’।
‘అ’ కారాక్షర సంభవః।।
(1) రోహిణీ దేవికుమారుడగు బలరాముడు విశ్వుడు ‘‘ఓం’’ మొదటిదగు ‘అ’ కార అక్షరమునుండి సంభవించుచున్నారు. (జాగ్రత్ పురుషుడు).
తైజస : తైజసాత్మక ‘ప్రద్యుమ్న’
‘ఉ’ కారాక్షర సంభవః।।
(2) తైజసాత్ముడగు ప్రద్యుమ్నుడు ‘ఓం’లోని రెండవదగు ‘ఉ’కారము నుండి రూపము దిద్దుకొనుచున్నారు. (స్వప్న పురుషుడు).
ప్రాజ్ఞ : ప్రాజ్ఞాత్మకో ‘అనిరుద్ధో’ అసౌ,
‘మ’ కారాక్షర సంభవః।।
(3) ఆత్మయొక్క ప్రాజ్ఞత్వమే అనిరుద్ధడై ‘మ’ కారమునుండి సంభవించుచున్నారు. (సుషుప్తి పురుషుడు).
అర్ధమాత్ర: అర్ధమాత్రాత్మకః ‘కృష్ణో’,
యస్మిన్ విశ్వం ప్రతిష్ఠితమ్।।
(4) ఎవరియందైతే ఈ సమస్త విశ్వము ప్రతిష్ఠితమైయున్నదో అట్టి అర్ధమాత్ర స్వరూపుడే శ్రీకృష్ణుడు. (తురీయ పురుషుడు).
కృష్ణాత్మికా జగత్ కర్త్రీ
మూల ప్రకృతి - రుక్మిణీ।
🙏 కృష్ణాత్మికము, జగత్‌కర్త్రి యగు మూల ప్రకృతి రూపిణియే రుక్మిణీదేవి
వ్రజ స్త్రీ జనసంభూత
శ్రుతిభ్యో బ్రహ్మసంగతః।
🙏 వేదములలోని, వేద ఉపాంగములగు ఉపనిషత్తులలోని ‘బ్రహ్మతత్త్వము’ గురించిన మహావాక్యాది ఆయా వివరణ విశేషములే వ్రజగోపికలు.
ప్రణవత్వేన ప్రకృతి ‘త్వం’
వదంతి బ్రహ్మవాదినః।
‘త్వం’ రూపముగా (‘నీవు’ అనుభావనాసిద్ధిగా) కనిపించేదంతా ప్రకృతిరూపప్రణవమే. ఓంకారము యొక్క ప్రకృతి (ప్రకాశ +కృత +తిరోగమన) రూపమే ఇదంతా - అని బ్రహ్మతత్త్వజ్ఞుల ప్రవచనము.
తస్మాత్ ‘ఓం’ కార సంభూతో
గోపాలో విశ్వ సంస్థితః
ఎ ‘ఓం’కార స్వరూపుడు, ఓంకార సంభూతుడు అగు గోపాలకృష్ణుడే ‘‘విశ్వము’’ రూపముగా ‘‘సంస్థితుడు’’ అయిఉన్నాడు.
‘క్లీం’ ‘ఓం’కారస్య ఏకతత్త్వం (ఓంకారస్తైకతత్త్వం)।
వదంతి బ్రహ్మవాదినః।
మధురాయాం విశేషణ మాం ధ్యాయన్ మోక్షమ్ అశ్నుతే।
‘‘క్లీం’’ ‘‘ఓం’’కారముల పరమార్థము - ఆత్మయొక్క ఏకత్వ స్వరూపముగా బ్రహ్మవేత్తలు చెప్పుచున్నారు.
10. అష్టపత్రం వికసితం
హృత్ - పద్మం తత్ర సంస్థితమ్।
దివ్య ధ్వజ ఆతపత్రైస్తు
చిహ్నితం చరణద్వయం।
సాకారోపాసన : (ఆత్మయే సహజస్వరూపముగా గలిగినట్టి) ఈ జీవునిలో ‘8’ దళములు గల హృదయ పద్మము ఉన్నది.
అట్టి హృదయములో దివ్యమైన ‘‘ధ్వజ, ఛత్రము’’ల చిహ్నములుగల రెండు పాదములు కలిగి ఉన్న పురుషుడు వేంచేసినవారై ఉన్నారు.
ఆతపత్రము (గొడుగు, ఛత్రము) - ధ్వజముగా కలిగి ఉన్నారు.
శ్రీవత్స లాంఛనం హృత్‌స్థం।
కౌస్తుభం ప్రభయా యుతమ్
అట్టి హృదయస్థ శ్రీకృష్ణ చైతన్య భగవాన్ రూపము శ్రీవత్సలాంఛనము (రొమ్ముపై మచ్చ)తో కూడుకొని ఉన్నట్టిది. కౌస్తుభమణితో అలంకరించబడి ఉన్నట్టిది. ఆ మణి తేజోప్రభలు వెదజల్లుచున్నట్టిది.
చతుర్భజమ్। శంఖ చక్ర
శార పద్మ గదాన్వితమ్।
కేయూరాన్విత సద్బాహుం।
కంఠమాలా సుశోభితమ్।
(జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయములుగా చెప్పబడే) చతుర్భుజుడు. 4 భుజములు కలిగి ఉన్నట్టిది. శంఖము, చక్రము, విల్లు, పద్మము గదలచే సాయుధ సాలంకృతమైనది.

(చతుర్భుజముల మరొక అర్థం - సత్త్వ - రజో - తమో-అహంకారములు)

కేయూరములు ధరించిన బాహువులు కలిగియున్నట్టిది, కంఠమునందు కౌస్తుభ మాలను అలంకరించుకున్న రూపము.
ద్యుమత్ కిరీటం, అభయం,
స్ఫురత్ మకర కుండలమ్,
హిరణ్మయం సౌమ్యతనుం
స్వభక్తాయ అభయ ప్రదమ్। -
ధ్యాయేత్ మనసి మాం నిత్యం
వేణుశృంగ ధరం తు వా।।
కాంతిపుంజములు వెదజల్లు కిరీటము ధరించినది, సమస్త భయములు తొలగించునది, మెఱయుచున్న కుండలములు ధరించనట్టిది-అగు కృష్ణసారూప్యము - ఉపాసించబడుగాక।
బంగారు రంగుతో వెలుగుచున్న సౌమ్యమగు శరీరము కలది, భక్తులకు అభయ ప్రదము అగు రూపము,
వేణుశృంగ (చేతిలో పిల్లనగ్రోవి) ధరించినది -అగు నా రూపము హృదయము నందు భావించెదరు గాక!
మథ్యతేతు జగత్ సర్వం బ్రహ్మజ్ఞానేన యేన వా
మత్ సారభూతం యద్యత్‌స్యాత్ మథురా సా నిగద్యతే।।
ఈ ‘జగత్తు’ అనే పెరుగును ‘బ్రహ్మజ్ఞానము’ అనే కవ్వముచే మధించగా, ఈ జగత్తుయొక్క సారముగా సర్వాత్మకమగు ‘ఆత్మమాధుర్యము’ అనే వెన్న లభిస్తోంది.
అష్టదిక్పాలకైః భూమిం పద్మం వికసితం జగత్
సంసారార్ణవ సంజాతం సేవితం మమ మానసే।।
అష్టదిక్పాలకులచే పాలించబడు ‘భూమి’ అంతర్విభాగమై, ‘సంసార జలము’లో (సంసార సముద్రజలములో) పుష్పమువలె పుట్టి వికసించినట్టి ఈ జగత్తు - పరమాత్మనగు నాయొక్క మనోకల్పిత చమత్కారముగా ఎరుగబడు గాక।
చంద్ర సూర్య త్విషో దివ్యా।
ధ్వజా మేరుః హిరణ్మయః।
ఆతపత్రం బ్రహ్మలోకం।
తత్ ఊర్ధ్వం చరణం స్మృతమ్।।
శ్రీవత్సం చ స్వరూపం చ।।
వర్తతే లాంఛనైః సహ
‘‘శ్రీ వత్సలక్షణం’’
తస్మాత్ కథ్యతే బ్రహ్మ వాదిభిః।।
శ్రీవత్సలక్షణము :
- సూర్యచంద్రుల తేజస్సుతో దివ్యమై వెలుగొందుచున్నట్టిది.
- హిరణ్మయమైన మేరుపర్వత స్వరూపమైనట్టిది.
- బ్రహ్మలోకమే గొడుగుగా (ఆతపత్రముగా) కలిగినది.
- అట్టి ఈ విశ్వమునకు ఆవల (పైన) నా చరణములు సమస్త శుభములు కలుగజేయు స్వరూపము. శ్రీవత్సలాంఛనము కలిగియున్నట్టిది,
సమస్త లాంఛనములు అలంకారముగా కలిగియున్నట్టిది - కాబట్టి ‘శ్రీవత్సలక్షణము’ అని బ్రహ్మజ్ఞులచే అభివర్ణించబడుతోంది.
యేన సూర్య అగ్ని వాక్ చంద్ర తేజసా
స్వస్వరూపిణా, వర్తతే ‘‘కౌస్తుభ’’ ఆఖ్యం
మణిం వదంతి ఈశమానినః।।
కౌస్తుభమణి :
ఏ స్వరూపముయొక్క విభవముచే సూర్య, చంద్ర, అగ్ని, వాక్, తేజస్సులు వెలుగొందుచున్నాయో - అట్టి ప్రకాశమును ఈశ్వర తత్త్వవేత్తలు - ‘‘అదంతా కౌస్తుభ మణి వర్తనమే’’ - అని స్తుతిస్తున్నారు.
‘‘సత్వం’’ ‘‘రజః’’ ‘‘తమః’’ - ఇతి
‘‘అహంకారః’’ చతుర్భుజః।
చతుర్భుజములు :
‘సత్వము, రజము, తమము, అహంకారము’ - ఇవియే - శ్రీకృష్ణ చైతన్య - చతుర్భుజములుగా (వేద-ఇతిహాస పురాణములచే) వర్ణించబడుచున్నాయి.
పంచతన్మాత్రకం శంఖం
కరే రజసి సంస్థితమ్।
శంఖము :
హస్తములో అలంకరించబడియున్న శంఖము → రజోరూపమగు ‘‘శబ్ద స్పర్శ రూప రస గంధములు’’ - అనే పంచతన్మాత్ర చమత్కారము.
బాలస్వరూపమ్ ఇత్యంతం
‘‘మనశ్చక్రం’’ నిగద్యతే।
చక్రము :
మనస్సు యొక్క బాలచాపల్యమువంటి పరిభ్రమణ చమత్కారమే చేతిలో ధరించబడే ‘విష్ణుచక్రము’.
ఆద్యా మాయా భవేత్ శారం।।
పద్మం విశ్వకరే స్థితమ్।।
శారము : ఆది స్వరూపిణి, అనాది యగు ‘‘మాయ’’యే చేతిలోని ధనస్సు.
పద్మము : ఈ విశ్వనిర్మాణ చమత్కార-సౌందర్యమే నాచేతిలోని పద్మముయొక్క సంజ్ఞ.
(మాయాంతు ప్రకృతిం విద్ధి మాయినంతు మహేశ్వరః)
11. ఆద్యా విద్యా గదా వేద్యా
సర్వదా మే కరే స్థితా।।
గద : ఎల్లప్పుడు చేతిలో సంస్థితమైన గదయే-ఆత్మ విద్య. వేద - ఉపనిషత్ - ఇతిహాస - పురాణములలో వర్ణించబడుచున్న ‘‘ఆత్మవిద్య’’ (బ్రహ్మవిద్య)- యొక్క చిహ్నము - ‘‘గద’’.
ధర్మ అర్థ కామ కేయూరైః
దివ్యైః దివ్యమయేరితైః।
కంఠం తు నిర్గుణం ప్రోక్తం।
కేయూరములు : స్వామి భుజములపై ధరిస్తున్న దివ్యాతి దివ్య కేయూరములు - (భుజకీర్తులు) - ధర్మ - అర్ధ - కామములు.
కంఠము : నిర్గుణ (త్రిగుణాతీత సాక్షీస్వరూప) సంజ్ఞ.
మాల్యతే ఆద్యయా అజయా।
మాలా నిగద్యతే, బ్రహ్మన్!
తవ పుత్రైస్తు మానసైః।।
మాల : మాల (వనమాల/పుష్పమాల) అజేయమగు ‘‘ఆది’’ స్వరూప చిహ్నము. ఓ బ్రహ్మదేవా! (సనత్కుమార, సనస్సుజాత, సనక, సనంద, నారద, వసిష్ఠాదులు) మీ మానసపుత్రులే నాకు మాలలు.
కూటస్థం సత్త్వరూపం చ
కిరీటం ప్రవదన్తి మామ్।
క్షీరోత్తరం ప్రస్ఫురంతం
కుండలం యుగళం స్మృతమ్।
కిరీటము : కిరీటము సత్త్వగుణమునకు, ‘కూటస్థరూపము’నకు సంజ్ఞ - (A symbol of ‘sath’ and root of “SELF”).
కుండలములు : క్షీరసముద్రముగా ప్రస్ఫురించే తత్త్వమే (భావనలకు ఆవలి తత్త్వమే) చెవుల కుండలములు. భావన చేయువాని (ఆత్మ) తత్త్వము- కుండలముల సంజ్ఞ.
ధ్యాయేత్ మమ ప్రియం నిత్యం
స మోక్షమ్ అధిగచ్ఛతి।
స ముక్తో భవతి।
తస్మై స్వాత్మానం తు దదాతి వై।
పై విశేషములతో నా రూపము (సారూప్య శ్రీకృష్ణ ప్రతిమ - విగ్రహము)ను పైన చెప్పబడిన భావనలతో కూడి అర్చించువాడు ‘‘ఆత్మ స్వరూపుడనగు నేను దేనిచేతనూ బద్ధుడనుకాను’’ - అను మోక్షము సిద్ధించుకోగలడు. అట్టివాడు ‘ముక్తుడు’ అగుచున్నాడు. పై విధమైన శ్రీకృష్ణతత్త్వోపాసకునికి నేను అఖండ స్వాత్మానంద సిద్ధి ప్రసాదించుచున్నాను.
ఏతత్ సర్వం మయా ప్రోక్తం
భవిష్యత్ వై, విధే! తవ।
స్వరూపం ద్వివిధం చ ఏవ -
సగుణమ్, నిర్గుణాత్మకమ్।
ఓ విధీ! సృష్టికర్తా! ఇప్పుడు మీకు చెప్పిన ‘‘శ్రీకృష్ణ ప్రతిమ - భావనోపాసన’’ మనము చెప్పుకొన్న ఫలశృతి తప్పక సిద్ధించగలదు.
ఓ బ్రహ్మదేవా! నాయొక్క స్వరూపము రెండు విధములైనవిగా ఉంటోంది. (1) సగుణము (2) నిర్గుణము
సహోవాచ అబ్జయోనిః।
వ్యక్తీనాం మూర్తీనాం ప్రోక్తానాం
కథం త్వ ఆభరణాని భవంతి?
కథం వా దేవా యజంతి?
రుద్రా యజంతి?
బ్రహ్మా యజంతి? బ్రహ్మజా యజంతి?
వినాయకా యజంతి?
ద్వాదశాదిత్యాః యజంతి?
వసవో యజంతి?
గంధర్వా యజంతి?
సపదానుగా అంతర్థానే తిష్ఠంతి?
కాం మనుష్యా యజంతి?
బ్రహ్మదేవుడు :

స్వామీ! నారాయణావతారా! శ్రీకృష్ణా! నాదొక సందేహము, వ్యక్తులకు, మూర్తీభవించిన వారికి అన్వయమయే విశేషములు మీయొక్క శరీరభాగములు, ఆభరణములు (చతుర్భుజములు, శంఖము, చక్రము, విల్లు, పద్మము, గద, భుజకీర్తులు, కంఠము, కుండలములు, మొదలైనవి) వాటికి ఎట్లా సమన్వయము అవుతాయి? రుద్రుడు, బ్రహ్మ, బ్రహ్మమానస పుత్రులు, వినాయకుడు, ద్వాదశాదిత్యులు, వసువులు, గంధర్వులు, మానవులు ఏ విధంగా ఉపాసించుచున్నారు? ‘సపదానుగా’ అయి, అంతర్ధానరూపమై ఉంటున్నది ఏది?

మీరు అనేక దేవతలుగా, రుద్రుడుగా, బ్రహ్మదేవునిగా, సరస్వతిగా, వినాయకునిగా, ద్వాదశాదిత్యులుగా, అష్టవసువులుగా, గంధర్వులుగా, అవ్యక్తులుగా, మనుష్యులుగా కూడా ఎట్లా ఉపాసించబడుచున్నారు?
12. స హోవాచ
తం హి వై నారాయణో దేవః -
ఆద్యా వ్యక్తా ద్వాదశమూర్తయః,
సర్వేషు లోకేషు, సర్వేషు దేవేషు
సర్వేషు మనుష్యేషు తిష్ఠంతీతి।।
నారాయణావతార శ్రీకృష్ణుడు : ఏకోనారాయణుడే దేవాది దేవుడు.
కేవలుడు, ఏకాక్షరుడు, నిర్వషయుడు అగు నా శ్రీమన్నారాయణ తత్త్వమే ద్వాదశ (12) మూర్తులను (రూపములను) ధరించి సమస్త లోకములలోను, సమస్త వేదములలోను, సర్వ మానవులందు, సమస్త జీవులందు సుతిష్ఠితము (wel seated) అయి ఉన్నది.
రుద్రేషు ‘‘రౌద్రీ’’। బ్రహ్మణి ‘‘బ్రాహ్మీ’’।
దేవేషు ‘‘దైవీ’’। మనుష్యేషు ‘‘మానవీ’’।
వినాయకేషు ‘‘విఘ్న వినాశనీ’’।
ఆదిత్యేషు ‘‘జ్యోతిః’’।
గంధర్వేషు గాంధర్వీ।
అప్సరః స్వ-ఏవం ‘గౌః’। (స్వేవం గౌ)।
వసుషు ఏవం కామ్యా।।
అంతర్ధానేషు-అప్రకాశినీ।
ఆవిర్భావ - తిరోభావాః
స్వపదే తిష్ఠన్తి।
అట్టి నాయొక్క శ్రీకృష్ణ చైతన్య కేవల ఆత్మానందమే
★ ఏకాదశ రుద్రులలో (సమస్తము రౌద్రముచే శమింపజేయు) - రౌద్రీతత్త్వమై యున్నది.
★ సృష్టి సంకల్పుడగు బ్రహ్మదేవునియందు బ్రాహ్మీ స్వరూపముగా ప్రకటనమౌతోంది.
★ దేవతలలో ఆశ్రితులకు శుభము కలుగజేయు దివ్యమగు దైవీ స్వరూపముగా వేంచేసి ఉన్నది.
★ మానవులలో మానవత్వమైయున్నది.
★ ఆదిత్యునియందు (సూర్యునియందు) తేజస్సుగా వెలుగొందు చున్నది.
★ గంధర్వులయందు గాంధర్వ (గాన) రూపమై ఉంటోంది.
పాట, వాక్కు, భాష స్వరూపమై ఉంటోంది.
★ అప్సరసలయందు ‘గౌః’ (సత్యమును చూపు రూపము)గా ఉన్నది. సౌందర్య రూపమైయున్నది. సర్వము ప్రసాదించు గో- రూపమై యున్నది.
★ (అష్ట) వసువులలో - (ప్రియమగు) వసించటము (Being) అను చమత్కారమై యున్నది.
(యత్ భావం తత్ భవతి - అను) కామ్యరూపమై ఉన్నది.
★ అంతర్థానమునందు సమస్తము ప్రకాశింపజేయుచు, తాను అప్రకాశమానమై ఉన్నది. అట్టి నా శ్రీకృష్ణ పరతత్త్వము ఈ దృశ్యము యొక్క రాక - పోకలకు ఆవల స్వస్థానమునందే ఏర్పడి ఉన్నది.
తామసీ రాజసీ సాత్త్వికీ
మానుషీ విజ్ఞానఘన ఆనంద సత్ చిత్ ఆనంద ఏక రసే, భక్తియోగే తిష్ఠతి।।
తామస - రాజస - సాత్విక త్రిగుణాత్ముడను. మానుషీ (Manhood) స్వరూపుడును. ఘనీభవించిన ఎరుకరూపుడను. విజ్ఞాన ఘనుడను, స్వయమానందస్వరూపుడను. సత్-చిత్-ఆనంద ఏకరసుడను.

శ్రీకృష్ణ పరమాత్మను అగు నేను భక్తియోగమునందు వేంచేసియుండి భక్తులకు వశుడనై ఉంటాను. భక్తుల ప్రేమ హృదయమునకు దాసుడనై ఉండటము - నా స్వభావము.
ఓం ప్రాణాత్మనే।
ఓం తత్ సత్ భూః భువః సువః (భూర్భువ-స్సువః)
తస్మై ‘‘ప్రాణాత్మనే’’ నమో నమః।
ఓం శ్రీకృష్ణాయ గోవిందాయ
గోపీజన వల్లభాయ
ఓం తత్సద్భూర్భువస్తస్మై వై నమో నమః।।
(ఓం తత్ సత్ భూః భువః సువః తస్మైవై నమో నమః)
దూర్వాసుడు:
అట్టి పంచ ప్రాణాది స్వరూప పరమాత్మకు నమస్కరిస్తున్నాను.
ఓంకార స్వరూప ప్రాణాత్మస్వరూపా! సమస్తమునకు ఆవల ‘తత్’ స్వరూపమై సమస్తము తానే అయి ఉన్న సత్ స్వరూపా! మీ ప్రాణాత్మ స్వరూపమునకు వందన సహస్రములు. ‘ఓం’ పరమాత్మ- స్వరూప శ్రీకృష్ణా! గోవిందా! గోపీజన వల్లభా! భూ భువ సువ త్రిలోకములు నిండియున్నవాడా! సమస్తము నీవే అయి ఉన్నవాడా! నమో నమః।।
‘‘ఓం అపానాత్మనే’’।
ఓం తత్సత్ భూర్భువస్సువః।
తస్మై అపానాత్మనే నమో నమః।
ఓం శ్రీకృష్ణాయ అనిరుద్ధాయ
ఓం తత్సద్భుర్భువస్సువః
తస్మై వై నమో నమః।।
ఓంకార - అపానప్రాణాత్మస్వరూపా। తత్ (That) సత్ (At Present Entity) భూ (Matter) భువః (Thought) సువః (self) స్వరూప అపానప్రాణాత్మకుడనైన నీకు నమస్కరిస్తున్నాను.
దేనిచేతనూ నిరోధించబడజాలనివాడా! అనిరుద్ధా! భూర్భువస్సువ త్రిలోకస్వరూపా! అట్టి నీకు నమో నమః।
‘‘ఓం వ్యానాత్మనే।’’
ఓం తత్ సత్ భూర్భువస్సువః
తస్మై వ్యానాత్మనే నమో నమః।
ఓం శ్రీకృష్ణాయ రామాయ
ఓం తత్ సత్ భూర్భువస్సువః
తస్మై వై నమో నమః।।
ఓ వ్యానప్రాణ స్వరూపా। వ్యానాత్ముడవై భూ-భువః - సువర్ (భౌతిక మాసిక ఆధ్యాత్మిక) లోకములన్నీ నిండియున్న వ్యానాత్మదేవా! నమో నమః।
‘‘భగవాన్ స్వయమ్’’ అగు హే కృష్ణా! అవతారమూర్తివగు బలరామా! తత్ (ఆవల) సత్ (అంతటా ఉనికి-ప్రేరణ) - భూ భువర్ సువర్లోకములలో (Matter, Sense and self in all) స్వయంప్రకాశమానుడవై ఉన్నవాడా। అట్టి నీ తత్త్వమునకు నమో నమః।
‘‘ఓం ఉదానాత్మనే’’।
ఓం తత్ సత్ భూర్భువస్సువః
తస్మై ఉదానాత్మనే నమో నమః।
ఓం శ్రీకృష్ణాయ దేవకీనందనాయ
ఓం తత్సత్ భూర్భువస్సువః
తస్మై వై నమో నమః।।
ఓంకార ఉదాన ప్రాణాత్మకా!
తత్ (కేవల) సత్ (సత్య-నిత్య) స్వరూపుడవై భూ-భువ-సువర్‌లోకములలో (పాతాళ-భూ-స్వర్గలోకములలో) సర్వప్రేరకుడవైనవాడా నమో నమః।
హే శ్రీకృష్ణభగవాన్! దేవకీనందనా! త్రిలోకధారుడా!
భూ భువః సువః లోకములు తమకు అనన్యమైనవాడా! నమో నమః।।
‘‘ఓం సమానాత్మనే।’’
ఓం తత్ సత్ భూర్భువస్సువః (భూః భువః సువః)
తస్మై సమానాత్మనే నమో నమః।
ఓం శ్రీ గోపాలాయ నిజస్వరూపాయ
ఓం తత్సత్ భూర్భువస్సువః
తస్మై వై నమో నమః।।
ఓ సమానప్రాణాత్మ భగవాన్! ‘ఓం’ కార, తత్‌స్వరూప, సత్ స్వరూప భూ-భువర్-సువర్ స్వరూప సమానాత్మ ప్రాణదేవా! నమస్తే।
ఇంద్రియములనే గోవులను కల్పించి, నియమించి, పాలించు పరబ్రహ్మ ‘ఓం’ కారమా! సమస్త జీవుల నిజస్వరూపమా! (The original Self of All) ! ఓం తత్ సత్ భూ భువర్ సువర్లోక ఆనంద స్వరూపుడవైన నీకు - నమో నమః।।
ఓం యోఽసౌ ప్రధానాత్మా గోపాల।
ఓం తత్ సత్ భూః భువః సువః (భూర్భువస్సువః)
తస్మై వై నమో నమః।।
సమస్త జీవులలో ప్రధానాత్ముడవై (The sole main self) సమస్తమును కల్పించి, పాలించుచున్న గోపాలస్వామీ। మీయొక్క ఓంతత్‌సత్ భూర్భువస్సువ సమగ్ర స్వరూపమునకు నమో నమః।।
(సప్రాణాత్మకా! నమస్తే।)
ఓం యోసాః
ఇంద్రియాత్మా గోపాల।
ఓం తత్‌సత్ భూర్భువస్సువః
తస్మై వై నమో నమః।।
సమస్త జీవులను, వారి వారి పంచేంద్రియములను కల్పించి సమస్తమున పాలించువాడా! ‘ఇంద్రియములు’ అనే ఆవులకు ‘దృశ్యము’ అనే ఆహారమును ఇచ్చి మేపువాడా! జీవులకు ఇంద్రియములను విషయములను ప్రసాదించి పాలించువాడా! ఓంకార తత్ - సత్ స్వరూప - భూర్భువస్సువ స్వరూపా! నమో నమః।।
ఓం యోఽసౌ భూతాత్మా గోపాల।
ఓం తత్ సత్ భూః భువః సువః
తస్మై వై నమో నమః।।
భూ-జల-అగ్ని-వాయు-ఆకాశ (Solid - liquid - Fire - Air-spacing) - పంచ భూతములకు ఆత్మ స్వరూపుడవగు భూతాత్ముడా! వాటిని పాలించు గోపాలుడా! ఓం తత్ సత్ భూర్భువ స్వరూపములు ప్రదర్శించు శ్రీకృష్ణస్వామీ! నమో నమః।।
ఓం యోఽసౌ (యోఽసా)
ఉత్తమ పురుషో గోపాల।
ఓం తత్ సత్ భూర్భువస్సువః
తస్మై వై నమో నమః।।
- సమస్త జీవులలో ‘‘నేను-నేను’’ (I am, I am) అను స్ఫురణగా వేంచేసియున్న ఉత్తమ పురుషా! (The First person in all beings)! పురుషోత్తమా! అట్టి ఉత్తమ పురుషత్వముచే ‘భూభువర్‌సువర్’ సమస్త లోకములను నింపుచుచున్నవాడా! అట్టి నీకు నమో నమో నమః। [ నాలోని ‘నేను’ అయి, సమస్తము ‘నేను’గా అగుచున్నవాడా! నమస్కారము। ]
ఓం యోఽసౌ
బ్రహ్మా పరంవై బ్రహ్మ।
ఓం తత్ సత్ భూః భువః సువః
తస్మై వై నమో నమః।।
సృష్టికి అభిమాని, కర్త అయిన బ్రహ్మదేవ స్వరూపా! (పాత్రకు ఆవలగల నటుని స్వరూపమువంటి) ‘‘పరమ్’’ - బ్రహ్మమూర్తీ! ఓంకారనంద తత్‌సత్ భూర్భువస్సువ స్వరూపుడవై ప్రదర్శనమగుచున్న శ్రీకృష్ణానందస్వామీ! మీకు నమస్కారము। నమస్కారము। నమస్కారము।
ఓం యోఽసౌ సర్వభూతాత్మా గోపాల।
ఓం తత్ సత్ భూః భువః సువః
తస్మై వై నమో నమః।।
ఏ పరాత్పర స్వరూపుడైతే సమస్త జీవులలో కేవలుడుగా, అఖండుడుగా , అంతరాత్ముడుగా విరాజిల్లుచున్నారో - అట్టి ఓం తత్‌సత్ భూర్భువస్సువ స్వరూప సర్వభూతాత్మ గోపాలునికి నమో నమో నమో నమః
ఓం జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయ - అతీతో,
అంతర్యామీ గోపాల
ఓం తత్ సత్ భూః భువః సువః
తస్మై వై నమో నమః।।
ఎవ్వరైతే జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు ఆవలివాడై, వాటికి జననస్థానమై, ప్రేరకుడై, అంతర్యామిగా వ్యవహరిస్తూనే - సమస్తమునకు అతీతుడై ఉన్నారో - అట్టి ఓం తత్సత్ భూర్భువస్సువ శ్రీకృష్ణ పరబ్రహ్మమునకు నమస్కారము! నమో నమో నమో నమః।।
13. ఏకోదేవః - సర్వభూతేషు గూఢః।
సర్వవ్యాపీ। సర్వభూతాంతరాత్మా।
కర్మాధ్యక్షః సర్వ భూతాధివాసః।
సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ।।
(అన్ని దీపములలోను ఒకే అగ్ని వలె, నాటకములోని అగ్నిపాత్రల భావికుడు - ఒకే రచయిత అయి ఉన్నతీరుగా)
ఒకే దేవాది దేవుడు సమస్త జీవులలో గూఢముగా వేంచేసి ఉన్నారు.
ఇంద్రియములకు అవిషయుడు కాబట్టి ‘రహస్య స్వరూపుడు’గా వర్ణించబడుచున్న ఆ అధి దేవుడు ఏకమేగాని అనేకముగా అగుటలేదు.
(నవలారచయిత నవల అంతా విస్తరించి ఉన్న తీరుగా) ఆ పరమాత్మ సర్వవ్యాపి। సర్వ జీవరాసుల అంతరాత్మ ఆయనయే।
ఆయన సమస్త కర్మలకు అధ్యక్షుడు. (Presides over all Functions of total creation ). సర్వభూతములలో అధివాసుడు (dwells in all ).
(నాటకదీపమువలె) సర్వమునకు సాక్షి. కేవల బుద్ధిస్వరూపుడై వెలుగొందుచున్నవాడు. త్రిగుణములకు కారణకారణుడు. త్రిగుణములకు ఆవల నిర్గుణుడై ప్రకాశించుచున్నవారు.
ఓం రుద్రాయ నమః।
ఓం ఆదిత్యాయ నమః।
ఓం వినాయకాయ నమః।
ఓం సూర్యాయ నమః।
ఓం విద్యాయై నమః।
✤ సమస్తమున తన చైతన్య స్ఫూర్తితో ఉత్సాహపరచు ఆత్మ స్వరూప రుద్రునికి నమస్కారము. (Inspires all).
✤ సమస్తమునకు ఆది (The Basic Begining) అయి వెలుగొందు ఆ ఆదిత్యునికి నమస్కారము.
✤ సమస్త జగదంతర్గత గణములకు విశేషనాయకుడగు ఆ వినాయకునికి నమస్కారము (The Group leader of all Groups).
✤ సమస్త జీవులు తన కిరణములుగా కలిగియున్న ఆత్మసూర్యునికి నమస్కారము.
✤ సర్వవిద్యలకు అధిష్ఠానము అయి ఉన్న విద్యాదేవీ స్వరూప (సరస్వతీస్వరూప) ఆత్మ భగవానునికి నమో నమః, ‘తెలుసుకోవటము, తెలియబడటము కూడా తానే అయి ఉన్న స్వామికి నమో నమః।।
(స రసత్ వతీ స్వరూప దేవదేవీ నమః)
ఓం ఇంద్రాయ నమః।
ఓం అగ్నయే నమః।
ఓం యమాయ నమః।
ఓం నిరృతయే నమః।
✤ సర్వేంద్రియ - ఇంద్రియ విషయ పరిపాలకుడగు ఇంద్రభగవానుని రూపముగా వేంచేసియున్న కృష్ణపరమాత్మకు నమస్కారము.
✤ సమస్తమునకు తన ఉష్ణశక్తి ఉనికిని ప్రసాదిస్తున్న అగ్నిదేవరూప ఆత్మ భగవానునికి నమస్కారము.
✤ సమస్తమును తన చేతనముచే లయింపజేయు యమభగవాన్‌రూప ఆత్మకు నమస్కారము.
✤ దక్షిణ - పశ్చిమముల నడిమి దిక్ స్వరూపుడు, చతుర్ధదిక్పాలకుడుగా ఉన్న నిరృతి ఆత్మభగవానునికి నమస్కారము.
ఓం వరుణాయ నమః।
ఓం వాయవే నమః।
ఓం కుబేరాయ నమః।
ఓం ఈశానాయ నమః।
ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః।
✤ బల-వర్షదేవత, ద్వాదశ ఆదిత్యులలో ఒకడు అగు వరుణాత్మ స్వరూప శ్రీకృష్ణ భగవానునికి నమస్కారము.
✤ సమస్త జీవుల త్రాణాయి, ప్రచేతనము (Basic Ignition) ప్రసాదిస్తున్నట్టి శ్రీకృష్ణ స్వరూప వాయుదేవునికి నమో నమః
✤ అష్టదిక్పాలకులలో ఒకడు, ఉత్తర (దిక్ పట్టణ అలంకారపురీ పాలక, చిత్రలేఖాపతి, ఐశ్వర్యదేవత అగు) కుబేర-ఆత్మ శ్రీకృష్ణ భగవానునికి నమస్కారము.
✤ (ఈశాన దిక్‌పతి, సమస్తమునకు అధినేత, ఐశ్వర్యశీలుడు, సమస్తముగా విస్తరించువాడు, శివుని ఐదు ముఖములో ఒకటైనవాడు అగు) ఈశాన ఆత్మ శ్రీకృష్ణ భగవానునికి నమస్కారము.
✤ ఓంకార స్వరూపులై లోకపాలకులై యున్న సమస్త దేవతలకు, ముక్కోటి దేవతా స్వరూప శ్రీకృష్ణపరమాత్మకు నమస్కారము.
దత్వా స్తుతిం పుణ్యతమాం
బ్రహ్మణే స్వస్వరూపిణే।
కర్తృత్వం సర్వ భూతానామ్
అంతర్థానే బభూవ సః।।
స్వస్వరూపమే అయి ఉన్న శ్రీకృష్ణ పరబ్రహ్మమునకు పుణ్యకార్యక్రమములు, పుణ్యతమమైన స్తుతులు సమర్పిస్తున్నాను.
సర్వభూతజాలమునకు కర్త అయి, తాను అప్రత్యక్షుడు (అంతర్థాన స్వరూపుడు), ఆశ్చర్యము కలిగించువారు - అగు పరబ్రహ్మమూర్తికి ఆశ్చర్యపూర్వక నమస్కారము.
బ్రహ్మణే బ్రహ్మపుత్రేభ్యో
నారదాత్తు శ్రుతం మునేః
శ్రీ దుర్వాసమహర్షి : ఓ గోపికలారా! ఈ విధంగా శ్రీమన్నారాయణుని నుండి బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ పరబ్రహ్మతత్త్వము శ్రవణం చేసారు. బ్రహ్మ దేవుడు బోధించగా బ్రహ్మ మానసపుత్రులగు శ్రీ నారదుడు మొదలైనవారు శ్రవణం చేశారు. మునులు విన్నారు. వారి వద్ద మేమంతా శ్రవణం చేశాము
తథా ప్రోక్తం తు గాంధర్వీ
గచ్ఛ త్వం స్వాలయాంతికమ్। ఇతి।।
ఓం గాంధర్వీ! భక్తిరస పారవశ్యులగు మీ వ్రజగోపికలంతా ధన్యులు.
నేను చెప్పినదంతా విన్నారు కదా!
ఇక మీరు తిరిగి యమున దాటి బృందావనమునకు వెళ్ళండి. మీ వ్రతఫలము లోకకళ్యాణార్థం శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు హృదయపుష్ప సమేతంగా సమర్పించి ధన్యులు అయ్యెదరు గాక।
మీ హృదయాలయములలో శ్రీకృష్ణునితో అభేదత్వము సిద్ధించుకొనెదరుగాక।

🙏 ఇతి గోపాల ఉత్తర తాపిన్యుపనిషత్ సమాప్తా।।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।


అధర్వణ వేదాంతర్గత

6(Ⅱ)     గోపాల ఉత్తర తాపిని ఉపనిషత్

అధ్యయన పుష్పము

దుర్వాస మహర్షి - కొన్ని పౌరాణిక విశేషాలు / వృత్తాంతములు

మార్కండేయ మహా పురాణము :

అత్రి - అనసూయ దంపతులు త్రి-అంశల పుత్రులు కావాలని త్రిమూర్తులగురించి తపోనిష్ఠులు అయినారు. అప్పుడు బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు ప్రత్యక్షమై ‘‘మేము ఏకాంశులమే గాని వేరు వేరు కాదు. అందుచేత మూడు అంశల ఏకరూపుడుగా మీకు ఒక కుమారుని ప్రసాదిస్తున్నాము’’ అని అనుగ్రహించారు. ఆ బిడ్డయే దత్తాత్రేయుడు.

దత్తాత్రేయుడు గర్భమున ఉన్నప్పుడు ‘హైహయుడు’ అనే రాక్షసుడు అనసూయాదేవి గర్భమునకు నిరోధములు కలిగించసాగాడు. అది గమనించిన శివభగవానుడు హైహయుని నిర్దగ్ధుని (నిర్వీర్యుని) చేయటానికై తానే అనసూయా గర్భములో ప్రవేశించి ఆమెకు జన్మించారు. ఈవిధంగా దుర్వాసుడు శివావతారుడు.


భాగవతము :

త్రిమూర్తుల అంశలుగా - (1) సోముడు (బ్రహ్మదేవుని అంశ), (2) దత్తాత్రేయుడు (విష్ణు అంశ), (3) దుర్వాసుడు (శివాంశ) - అను ముగ్గురు కుమారులు జన్మించారు.


భారతము :

శివుడు త్రిపురాసురులను సంహరించిన తరువాత, వారిని చంపిన బాణములను ఒక బాలుడు తన చంకనబెట్టుకొని తేసాగాడు. దేవతలు - ‘‘ఈ మహాతేజోవిలాసుడగు బాలుడు ఎవరు?’’ అని ఆశ్చర్యపడుచూ ఉండగా, ‘‘ఈతడు నా అంశ అగు దుర్వాసుడు’’- అని శివభగవానుడు దేవతలతో పలికారు.


బ్రహ్మాండ పురాణము :

ఒక సందర్భములో గంధ మాదన పర్వతముపై దుర్వాసమహర్షి ప్రశాంతముగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు అక్కడ తిలోత్తమ-సాహసికుడు అనువారు ఆహ్లాదంగా ప్రణయ సంచారములు చేయసాగారు. దుర్వాసుని ఏకాగ్రతకు భంగమైనది. ఆయన కోపగించి ‘‘మీరు రాక్షసులు అవండి!’’ - అని శపించారు. ఆ సాహసికుడే ‘గార్ధభాసురుడు’’.

అయితే ఇక అప్పటినుండి దుర్వాసునికి సంసారవాంఛ జనించింది. ఇది తెలుసుకొని, ‘ఔర్వుడు’ అనే ఆయన తన కుమార్తె అగు ‘కందళి’ని తెచ్చి దుర్వాస మహర్షికి వినయముతో ఇచ్చి వివాహం చేసారు. ఆమెతో మహర్షి కొన్నాళ్లు క్రీడించారు. అయితే ఆ కందళికి కోపము చాలా ఎక్కువ. కోపము చూపించటం చాలా తేలిక. కానీ, కోపం భరించటము చాలా కష్టము కదా!

దుర్వాస మహర్షి ఆ కోపమును భరించలేక, ఇక ఆమెను విడచి తపస్సు ప్రారంభించారు. కానీ కందళి భర్తవెంటనే ఉండసాగింది. కొన్నాళ్లకు, ఒక బ్రాహ్మణ బాలుడు వచ్చి, దుర్వాసునివద్ద వేద-వేదాంత విశేషాలు శ్రవణం చేయసాగాడు. ఒకరోజు ‘‘గురువుగారూ! భార్య అర్ధాంగి కదా! అమ్మగారు కందళిని తిరస్కరించటము ఉచితమా? అట్లా అయితే ఈమెయే జనన్మాంతరాలుగా భార్య అవుతుందని శాస్త్రము కదా!’’ అని పలికారు. అది విని చిరునవ్వుతో ‘‘ఓ కందళీ! నీకు కోపము తొలగుగాక! నీనుండి భూలోకములో కదళీజాతి (అరటిచెట్లు) ఏర్పడి పూజింపబడునవి అగు గాక!’’ … అని వరము ఇచ్చారు.

భారతము :

దుర్వాసుడు ఒకసారి కుంతిభోజుని రాజ్యమునకు వెళ్లారు. ఆయన కుమార్తె కుంతీదేవి సమర్పించిన సేవలకు సంతోషించి - ‘నీకు ఒక మంత్రము ప్రసాదిస్తాను. ఈ మంత్రము ఉపాసిస్తే, ఏ దేవుడు కోరితే, - ఆతడు వచ్చి నీకు తన అంశతో కూడిన పుత్రుని సద్యోగర్భంగా ప్రసాదించగలరు’’ - అని చెప్పి మంత్రము ఉపదేశించారు.

ఇది సూర్యపుత్రుడగు కర్ణుని జన్మకు కారణమైనది.

విష్ణు పురాణము :

ఒకసారి దుర్వాస మహర్షి లోక సంచారము చేస్తున్నారు. మార్గమధ్యంలో ఒక విద్యాధర స్త్రీ ఎదురుపడి, దుర్వాసునికి పాదాభివందనము చేసి, భక్తి ప్రపత్తులతో ఒక పుష్పమాలికను సమర్పించింది. అది స్వీకరించిన ఆ మహర్షి, ఆ విద్యాధర స్త్రీని ఆశీర్వదించి, తన ప్రయాణం కొనసాగిస్తూ, స్వర్గలోకములో ప్రవేశించారు. ఆ సమయంలో ఇంద్రుడు సపరివారంగా ఐరావతముపై విహరిస్తున్నారు. అప్పుడు దూర్వాసుడు, ‘‘ఓ త్రిలోకాధిపతీ! నీ సౌందర్యమును చూచి ఆనందిస్తున్నానయ్యా!. ఇదిగో! ఈ పుష్పమాలను స్వీకరించు’’ … అని చేతికి ఇచ్చారు. అది చేత ధరించిన ఇంద్రుడు - ‘‘ఇటువంటివి నా దగ్గర ఎన్ని లేవు?’’ … అని తలచుచూ ఐరావతముపై విసరివేసారు. ఆ ఏనుగు దానిని క్రిందిపారవేసింది. అది చూచి ఇంద్రుడు, ఆయన పరివారములోని దేవతలు నవ్వుకోసాగారు. అది చూచి ‘‘నేను దండ ఇస్తే అవమానించావు కదా! ఇదే నా శాపము. నీ సిరి అంతా సముద్రములో పడిపోవు గాక!’’ … అని శపించారు. అప్పుడే అమృతము మొదలైనవన్నీ సముద్రములో పడిపోయాయి.

భాగవతము :

నాగభాగుని కుమారుడు అంబరీషుడు. గొప్ప విష్ణు భక్తుడు. ఆయన ద్వాదశీ వ్రతము చేస్తూ ఉండగా, ఆతని గృహము దుర్వాసుడు ప్రవేశించారు. అంబరీషుడు అర్ఘ్యపాద్యములు సమర్పించి ‘‘గురుదేవా! మా ఆతిథ్యము స్వీకరించండి. దయచేసి త్వరగా స్నాన-సంధ్యలు ముగించుకొని రమ్మని ప్రార్థన. ద్వాదశీ ఘడియలు ఇంకా మిగిలి ఉండగా మనము భోజనము స్వీకరించాలి!’’ - అని పలికారు.

అంబరీషుడు నదీ స్నానానికి వెళ్ళి ఎంతసేపైనా రాకపోవటము చేత… ‘‘వ్రతఫలము - అభ్యాగతిసేవ’’లను దృష్టిలో పెట్టుకొని ద్వాదశి ఘడియలు ముగియకముందు జలము పానము చేసారు. అప్పుడే వచ్చిన దుర్వాసుడు అది చూచి కోపగించి అంబరీషౌని శపించసాగారు. (చేప-తాబేలు- పంది-శింహ శిరస్సు గల మానవుడు - పొట్టివాడు - రాజసము గల బ్రాహ్మణుడు - అజ్ఞాని అగు రాజు - రాజ్యయోగము లేని రాజు - కర్మల తిరస్కారి - క్రూరుడగువాడు - అగు) పది జన్మలు ఎత్తవలసినదిగా శపించారు. విష్ణుమూర్తి అడ్డుగా నిలచి ఆ శాపాలన్నీ తన భక్తుడగు అంబరీషుని తరఫున తానే స్వీకరించారు. అవే దశావతారములు.

ఇంకా కూడా శపించబోవుచుండగా, విష్ణుచక్రము ప్రత్యక్షమై దుర్వాసమహర్షి వెంటబడింది. అప్పుడు దుర్వాసుడు త్రిమూర్తులలో ఎవ్వరినీ శరణువేడి, ప్రయోజనములేక, చివరికి భక్తుడగు అంబరీషుని శరణువేడి విష్ణు చక్రమునుండి రక్షణ పొందారు. ఈవిధంగా భక్తుని ప్రభావాన్ని గురించి విష్ణుభగవానుడు లోకాలకు చాటిచెప్పారు.

భాగవతము :

ఒకసారి ‘‘ఈ శ్రీకృష్ణుని మహిమను నేను పరీక్షించెదను గాక!’’ అని అనుకుంటూ దుర్వాసమహర్షి తలచి ద్వారకానగరము ప్రవేశించారు. శ్రీకృష్ణుడు మహర్షిని భక్తితో పూజించి పంచభక్ష్య పరమాన్నములు సమర్పించారు. ఇక దుర్వాసుడు ఒకసారి ‘‘తింటాను’’ అని, ఇంతలోనే ‘తినను’ అని పలుకుచూ సుముఖత, విముఖత ప్రదర్శించసాగారు.

‘ఓ శ్రీకృష్ణా! పాయసము తీసుకొచ్చి నావంటి నిండా పూయి’ - అని దూర్వాసుడు పలుకగా, శ్రీకృష్ణుడు ‘‘మహర్షీ! తమ ఆజ్ఞ!’’ అని పలికి అట్లాగే చేసారు. ఆ పాయసమును దుర్వాసుడు రుక్మిణీదేవిని పిలచి, ఆమె దేహమునకు పూసారు.

కృష్ణుడు ఏమాత్రము కోపగించలేదు. చిరునవ్వు, భక్తి చెదరలేదు.

అప్పుడు దూర్వాసుడు ఒక రథమును అడిగి తెప్పించి, రుక్మిణీ దేవిని రథమునకు బంధించి కట్టారు. అయినాకూడా శ్రీకృష్ణుడు చిరునవ్వు వీడక, మహర్షిని సేవిస్తూనే ఉన్నారు.

అప్పుడు శాంతించి దూర్వాసుడు -

అని పలికి, శ్రీకృష్ణుని స్తుతించి, అక్కడినుండి బయల్వెడలారు.

రామాయణము :

అనేక సంవత్సరములు శ్రీరామ పాలన వైభవముగా జరిగిన తరువాత ఒకరోజు యమధర్మరాజు ఒక బ్రాహ్మణుని రూపములో రామావతార ప్రాకృతిక ఉపసంహారము గురించి సంభాషించటానికి శ్రీరాముని అంతఃపురమునకు వచ్చారు. శ్రీరాముడు లక్ష్మణుని పిలచి ‘‘ప్రియ లక్ష్మణా! అంతఃపుర ద్వారము వద్ద నిలచి ఉండు. ఎవ్వరూ లోపలకు రాకూడదు సుమా! ఎవ్వరైనా వచ్చారా, - నగర బహిష్కరణ తప్పదు’’ - అని ఆజ్ఞాపించారు.

కొంత సమయమైన తరువాత దుర్వాసుడు శ్రీరామ దర్శనముకోసమై రామాంతఃపుర ద్వారము సమీపించారు.

‘‘మహర్షీ! క్షమించండి. ఇప్పుడు అంతఃపుర ప్రవేశము రామాజ్ఞానుసారము నిషేధము. కొంచముసేపు ఆగండి’’ - అని లక్ష్మణుడు పలికారు. అది విని దుర్వాసుడు కోపగించి ‘‘ఏమి లక్ష్మణా! నేను ఆకలిగొన్న బ్రాహ్మణుడను. భిక్ష ఇవ్వాల్సిందే! నీవు వెళ్ళి శ్రీరామచంద్రునికి నా రాక తెలియజేయి. లేదా నేను నిన్ను, శ్రీరాముని, అయోధ్యావాసులను శపిస్తాను’’ - అని పలికాడు. అప్పుడు లక్ష్మణుడు లోనికి వెళ్ళి బ్రాహ్మణరూప యమునితో సంభాషిస్తున్న శ్రీరామునితో దుర్వాసముని భిక్షకై రాక గురించి, శపిస్తానన్న బెదిరింపు గురించి తెలియజేసారు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో ‘‘లక్ష్మణా! రాజాజ్ఞను ఉల్లంఘించి నీవు అంతఃపురములో ప్రవేశించావు. నియమానుసారముగా నీకు నగర బహిష్కరణను విధిస్తున్నాను. ఇదంతా విధి చిద్విలాసమని నీకు తెలుసుకదా!’’ - అని శ్రీరామచంద్రుడు పలికారు.
ఈవిధంగా రామావతార ప్రాకృతిక (ప్రకృతి సంబంధమైన) అవతార పరిసమాప్తికి దుర్వాస మహర్షి ‘నాంది’ పలికారు.

🥀 ఓం గురుదేవాయ శ్రీ దుర్వాస మహర్షిభ్యోన్నమః।
🥀 శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః।

ఇక మనము ‘‘గోపాలోత్తరతాపిన్యుపనిషత్’’ - అధ్యయనములో ప్రవేశిస్తున్నాము.


గోపాల ఉత్తర తాపిని ఉపనిషత్

అధ్యయన పుష్పము

ఒకప్పుడు మునిజన అవతారులగు వ్రజగోపికలు ‘‘ఈ ప్రియ గోపాలకృష్ణునితో చ్యుతి (Distraction) లేనట్టి అనునిత్య ఏకత్వము’’, సిద్ధింపజేసుకోవాలని కామ సంకల్పులైనారు. సమస్త మనోచాంచల్యములు జయించి అనునిత్యము, అనుక్షణికము అయినట్టి శ్రీకృష్ణ సాంగత్యమును సిద్ధింపజేసుకోవాలనే ఆశయము వారిలో దృఢపడసాగింది. ‘‘సాంసారిక దోషములను తొలగించుకొని శ్రీకృష్ణ సాయుజ్యము పొందటమెట్లా?’’ - అనే ప్రశ్నించుకొని సంభాషించుకోసాగారు. ఎంతో చర్చించుకోవటము, వాదించుకోవటము మొదలైన ప్రయత్నములు చేసి కూడా అట్టి ‘నిష్కళంక సాయుజ్యస్థితి’కి సరి అయిన ఉపాయములు వారికి లభించలేదు.

అప్పుడు గోపికలు వ్రతదీక్ష స్వీకరించినవారై, రోజంతా ‘ఉపవాసము’ ఉన్నారు. కృష్ణునిపట్ల ఉపాసన కలవారయ్యారు. ఆ మరునాడు ఉదయము శ్రీకృష్ణుని మందిరమునకు వెళ్లారు.

శ్రీకృష్ణుడు : ప్రియ గోపికలారా! ఏమిటి ఇటు వచ్చారు? అంతా కుశలమే కదా?

వ్రజగోపికలు : కృష్ణయ్యా! ఏమి చెప్పమంటారు? నీవా, అఖండాత్మానంద స్వరూపుడవు. మేమేమో ఈ ‘వ్యష్టి’ పంజరములలో చిక్కుకుని ఉన్నాము. అన్యమగు సమస్తమును త్యజించి నీతో అనన్యత్వమును మేము అనుక్షణికం చేసుకోలేకపోతున్నాము. జగద్దృశ్యములో సంబంధము వలన ఏర్పడే దుఃఖ-సుఖ-వేదనలతో కూడిన ‘‘అవినాభావ సంబంధములు’’ త్రెంచుకోలేకపోతున్నాము.

అందుచేత వ్రతదీక్ష పూనాము. దయచేసి నీతో మమేకమవటానికై ఏమి చెయ్యాలో చెప్పు. ఈ జన్మ-కర్మ పరంపరలతో కూడిన పంజరము నుండి విడివడేది ఎట్లాగో దారిచూపు.

గోపాలకృష్ణుడు : గోపికలారా! మీయొక్క ఆశయము మహత్తరమైనది. అయితే, అట్టి పరమాత్మ స్వరూపుడనగు నాతో అనన్యత్వ సిద్ధికై గురు-ఆశ్రయము అత్యంత శ్రేయోదాయకము. అది సులభమార్గదర్శకము. సమస్త సంశయములను తొలగించునది కూడా! అందుకు ఉపాయము, మార్గము చెపుతాను వినండి.

(1) బ్రహ్మజ్ఞులగు బ్రాహ్మణుని గురుదేవా భావనతో దర్శించండి. (మహాపురుష సంశ్రయము).
(2) వారికి భిక్ష ప్రదానంగా సేవ, సమర్పణలు చేసి వారికి సంతోషము కలుగజేయుడి. (సర్వసమర్పణ).
(3) భక్తిశ్రద్ధలతో కృష్ణ చైతన్యతత్త్వము (లేక) ఆత్మారామతత్త్వము గురించి శ్రద్ధ-ఆసక్తి-భక్తిలతో ‘‘శ్రవణం’’ చేయండి. (వినటము).
(4) శ్రవణం చేసిన కృష్ణానంద ఆత్మతత్త్వమును ‘మననము’ చేయండి (‘‘మననము’’).
(5) మననము చేస్తూ, సమస్త అన్య సాంసారిక స్వభావములను జయించివేసి సర్వే సర్వత్రా కృష్ణతత్త్వదర్శనమును నిశ్చయము చేసుకోండి. నాకంటే అన్యము దర్శించు చంచలత్వమును త్యజించివేయండి. (‘‘నిదిధ్యాస’’).
(6) సమస్త బేధములు జయించి, అట్టి మమాత్మానంద కృష్ణతత్త్వమే మీరై, సోఽహ బ్రహ్మానందమును, పరబ్రహ్మతత్త్వమును స్వాభావికం చేసుకోండి. ఆముష్మిక సుఖము సిద్ధించుకోండి. ప్రయత్నించిన వారికి అది సులభసాధ్యమే। ఎవ్వరికైనా సాధ్యమే। మరి ఇంతటి ప్రేమ - భక్తి తత్పరులగు మీకెందుకు సిద్ధించదు చెప్పండి?

గోపికలు : అంతేనా? అయితే ఇప్పుడు మమ్ములను ఏమి చేయమంటావు?

శ్రీకృష్ణుడు : ఆముకస్మై బ్రాహ్మణాయ భైక్షం దాతవ్యమ్ ఇతి। ఐహికమైన దృష్టి - ధ్యాసలు బంధముల నుండి విడివడి, ‘‘ఇదంతా కృష్ణానందతత్త్వమే’’ - అని చెప్పబడే ‘‘ఆముష్మికత్వము’’ కొరకై ఆముకముతో (తీవ్ర ప్రయత్నముతో) బ్రహ్మజ్ఞుడగు బ్రాహ్మణుని దర్శించి, వారి అనుగ్రహం పొందండి. వారికి ‘భిక్ష’ సమర్పించండి. (భి = అంధకారము; క్ష = క్షయింపజేయు ఆశ్రయము). అట్టి ‘భైక్షదానవ్రతము’ ఆచరించండి.

గోపికలు : ఓహో! ఇప్పుడు మేము బ్రహ్మజ్ఞుడగు బ్రాహ్మణుని దర్శించి భిక్ష సమర్పించు ఉపాయం ఆశ్రయించమంటావా! ‘భైక్షవ్రతము’ నిర్వర్తించమంటావా? బాగానే ఉన్నది. నీవు చెప్పినట్లే చేస్తాము. కానీ, అట్టి మహనీయుడు మాకు ఎక్కడ లభిస్తాడు? మరి అది కూడా నీవే సూచించాలి కదయ్యా! ఏదారిని వెళ్ళమంటావో చెప్పు.

శ్రీకృష్ణుడు : అదీ నేనేచెప్పాలా! సరే! నేను గోపీజనమానసలోలుడను కదా! చెపుతాను, వినండి. యమునానదికి ఆవల ఒడ్డున ఒక మహనీయుడు అగు ‘తత్త్వదర్శి’ వేంచేసి ఉన్నారు. ఆయనయే దుర్వాసమహర్షి। ఆయన మీ ‘భైక్షవ్రతము’ నకై ‘భిక్ష’ స్వీకరించటానికి, మీ వ్రతము దిగ్విజయము చేయటానికి అర్హులైన మహామహితాత్ములు. వారిని శరణువేడి భిక్షములు సమర్పించి పునీతులవండి.

గోపికలు : ఓ! అట్లాగే! ఇప్పటికిప్పుడే బయలుదేరుతాము.

ఈ మాట చెప్పి గోపికలు తమ తమ ఇళ్లకు చేరారు. బ్రహ్మతత్త్వజ్ఞుడగు బ్రాహ్మణునకు భిక్ష సమర్పించు ‘భైక్షదానవ్రతము’ నిర్వర్తించటానికి ఉద్యుక్తులైనారు. దీక్ష స్వీకరించారు. జున్ను, వెన్న, పాలు, పెరుగు, నెయ్యి మొదలైన పదార్థములతో కూడిన మధురమగు వంటకములు ఎవరికివారే తయారుచేసి పాత్రలలో నింపుకున్నారు. (మౌళిస్త కుంభ పరిరక్షణ ధీర్నటీవ’’ వలె) పాత్రపై పాత్రలు తలపై ధరించాలి. యమునా నదిని సమీపించారు.

యమునానది నిండు నీరు - ప్రవాహములతో పరవళ్ళు త్రొక్కుతోంది.

అయ్య బాబోయ్! ఈ వేగంగా ప్రవహించే తరంగములుగల ఈ యమునను దాటి ఆవలకు వెళ్ళటమెట్లాగా? అడుగు పెట్టగానే మన తలలపై దాల్చిన మధుర పదార్థములతో నిండిన కుంభములు (కుండలు) కదిలి నేలపడిపోతాయేమో కదా?….అని ఆదుర్దా పొందసాగారు. ఆలోచించి, ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. శ్రీకృష్ణునే ఉపాయం అడగ తలచారు. శ్రీకృష్ణ మందిరమునకు వెళ్ళి పరివేష్టితులైయున్న శ్రీకృష్ణుని సమీపంగా నిలుచున్నారు.

శ్రీకృష్ణుడు గోపికలవైపు సమస్త జీవరాసులను మోహింపజేయు చిరునవ్వు చిందిస్తూ చూచారు.

- - -

శ్రీకృష్ణుడు : ప్రియ గోపికలారా! మళ్లా వచ్చారేమిటి? ఇంకా భైక్ష దాన వ్రతము ప్రారంభించలేదా?

గోపికలు : ప్రారంభించాము. జున్ను, వెన్న, నెయ్యి, పెరుగు, పాలు, చల్లలలోను, తదితర మధుర పదార్థములతోను అనేక వంటకములు చేసి, సద్గురువులగు శ్రీ దుర్వాసులవారి దర్శనమునకై బయలుదేరాము.

శ్రీకృష్ణుడు : ఓహో"! అవన్నీ దుర్వాస మహర్షుల వారికి సమర్పించారు కూడానా?

గోపికలు : లేదు. లేదు ఇంతలో ఒక చిక్కు వచ్చి పడింది.

శ్రీకృష్ణుడు : చిక్కు (Hurdle) వచ్చిందా? ఏమిటా చిక్కు?

గోపికలు : యమునా నదికి వెళ్ళాము. అయితే యమునా తరంగాలు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి. నదిని దాటాలి. కానీ, తలపై పదార్థములు నింపిన కుంభములు నిలిచి ఉండేటట్లు కనబడటం లేదు. పైగా, మేమే కొట్టుకుపోతామేమో కూడా। మేము ఏమి చేయాలి? ఏమి పాలుపోక, నీదగ్గరకు వచ్చాము. కథం యస్యామో జలం తీర్త్వా యమునాయా యతః శ్రేయో భవతి? కృష్ణా। ఇతి।। మేము క్షేమంగా యమున ఆవలి వడ్డుకు చేరటమెట్లా? ‘భైక్షదాన వ్రతము’ నిర్వర్తించి నీతో మమేకమవటమనే శ్రేయస్సు పొందటమెట్లా? = తెలియక నిన్ను శరణువేడుచున్నాము.

శ్రీకృష్ణుడు : అదా సంగతీ? అయితే ఒక పని చేయండి. కృష్ణేతి ‘బ్రహ్మచారి’ ఇతి ఉక్త్వా, మార్గంవో దాస్యతి। ‘మాకృష్ణుడు బ్రహ్మచారి’ - అని యమునానదీ దేవికి గుర్తుచేసి చెప్పండి. అప్పడు ఆ దేవి మీకు మార్గం ప్రసాదిస్తుంది.

వ్రజ గోపికలు : కృష్ణా! ఏమిటీ? అష్టభార్యలున్న మాకృష్ణుడు ‘‘బ్రహ్మచారి’’ అని త్రోవ ఇవ్వటానికి యమునానదికి విన్నవించాలా? ఏమి చెప్పుచున్నావు. నిన్ను ఏమని అర్థం చేసుకోవాలి?

శ్రీకృష్ణుడు : యం మాగ్ం స్మృత్వ అగాథా గాథా భవతి। అప్రమేయము (unattached), నిత్య సత్యము అగు నన్ను స్మరించటంచేత లోతైన అగాథములు గాథములు (లోతులేనివి) కాగలవు. అపూతో పూతో భవతి। అపవిత్రమైనవన్నీ పవిత్రముగా అవగలవు. సకామో నిష్కామో భవతి। కోరికలన్నీ నిష్కామములు - (దృశ్యముపై ఆధారపడకపోవటము) అవగలవు. అశ్రోత్రియః శ్రోత్రియో భవతి। శ్రుతులు (వేదములు) తెలియనివాడు కూడా వేదహృదయము, వేదసారము తెలిసినవాడు అగుచున్నాడు. నన్ను తలచుచూ ఉండగా అగాథముల స్పర్శలు కూడా - తేలికగా దాటి వేయగల సరిర్గాధలు (తక్కువ నీళ్ళున్న సెలఏళ్ళుగా, గోష్పాదముగా) - మారగలవు.

కనుక ఓ వ్రజగోపికలారా! మీరంతా కూడా క్షేమంగా వెళ్ళి మహానుభావుడగు దుర్వాసమునిని సందర్శించుకొని, మీమీ బ్రాహ్మణ భైక్షదానవ్రతములను దిగ్విజయంగా నిర్వర్తించుకున్న వారై, లాభంగా తిరిగి రండి. ఇది ‘రుద్రవాక్యము’గా స్మరించుచూ నది దాటండి.

రుద్రాంశుడే ఆ దుర్వాసమహర్షి।

అది విని వ్రజగోపికలు యమునా నదీతీరం చేరారు. ‘‘అమ్మా! నదీ దేవీ। నమస్తే। మాకృష్ణుడు బ్రహ్మచారి। ఇది రుద్రవాక్యం’’ అని రుద్రవాక్యముగా స్మరిస్తూ పలికారు. వెంటనే యమునా జలము విభాగమై వ్రజగోపికలు ఆవలి వడ్డుకు వెళ్ళటానికి త్రోవ ఇచ్చింది. వారు ఆవలి వడ్డు చేరగానే మరల యమునానదీ జలము యథావిధిగా ప్రవహించసాగింది. ఆవలివడ్డుకు చేరిన గోపికలు కృష్ణుడు చెప్పిన రుద్రవాక్యములను మననం చేస్తూ హుషారుగా ఆవలి గట్టున బసచేసియున్న దుర్వాసమహర్షి ఆశ్రమమునకు వెళ్ళారు. పుణ్యతముడు (మహత్తరమైన పుణ్యకార్యములు నిర్వర్తించియున్నవారు), శ్రేష్ఠతముడు, రుద్రాంశ సంభూతుడు అగు దుర్వాసమహర్షిని సమీపించి ప్రణతులు సమర్పించారు.

వ్రజగోపికలు : మహర్షీ! నమో నమః। మేము వ్రజగోపికలము. మా కృష్ణుని సూచనను అనుసరించి ‘‘భైక్ష దానవ్రతము’’ చేబట్టాము. వ్రత విధానుసారము మేము బ్రహ్మతత్త్వము స్వానుభవముగా కలిగియున్న మహనీయునికి (బ్రాహ్మణునకు) భిక్షాదానం సమర్పించాలి. మా కృష్ణయ్య మిమ్ములను భిక్షా స్వీకారము కొరకై అభ్యర్ధించవలసినదిగా చెప్పారు. అందుచేత మిమ్ములను శరణువేడుచున్నాము. మాపై దయతో మా సమర్పణలను అంగీకరించండి. మేము పాలు - పెరుగు - వెన్న - నేయి - జున్నులతోను, తదితర అనేక రుచికర పదార్థములతోను స్వయముగా పాకము చేసి తెచ్చాము. మేము తెచ్చిన ఈ ఈ మధురమైన ఆహార పదార్థములను మాపై అనుగ్రహముతో స్వీకరించండి. మా వ్రతమును సువ్రతము చేయండి.

దుర్వాసమహర్షి : ఓ వ్రజ గోపికలారా! శ్రీకృష్ణ ప్రేమచే మీరు పునీతులు. మీరు తెచ్చిన పదార్థములన్నీ నేను శిష్య సమేతంగా భుజించగలము. మీరు చక్కగా విస్తర్లు పరచండి. కొద్ది నిమిషములలో మేము స్నాన-అనుష్ఠానములను నిర్వర్తించుకొని వస్తాము.

ఇట్టి ప్రియవచనములు పలికి దుర్వాసమహర్షి శిష్యసమేతంగా యమునానదికి వెళ్ళి, స్నాన-అనుష్ఠానములు ముగించుకొని వచ్చారు. గోపికలు ప్రేమపూర్వకంగా సమర్పించిన ఆహార పదార్థములన్నీ తృప్తిగా తిని ఆనందించారు. గోపికలకు ఆశీర్వాదవచనములు పలికారు.

మహర్షి చిరునవ్వుతో సంతోషముగా ఆశీర్వదించిన తరువాత - ఇకప్పుడు గోపికలు మహర్షికి నమస్కరిస్తూ ఇట్లా పలికారు.

వ్రజ గోపికలు : మహర్షీ। శలవా మరి? మేము తిరిగి యమునానదిని దాటి మా నందనందుని దర్శనం చేసుకుని వ్రతఫలము సమర్పిస్తాము.

దుర్వాసమహర్షి : శుభమగుగాక! వెళ్ళిరండి.

వ్రజగోపికలు : మహాత్మా! మేము శ్రీకృష్ణ - బ్రహ్మచారి రుద్రమంత్రము చదువుతూ ఉండగా యమునానది త్రోవ వచ్చింది. ఇప్పుడు తిరిగి వెళ్ళాలంటే, తరంగములు అత్యంత వేగంగా ప్రవహిస్తున్నాయే। మహర్షులగు మీరే దిక్కు-మాకు. ఆవలి వడ్డు క్షేమంగా జేరటానికి ఏదైనా ‘మంత్రము’ ఉపదేశించండి.

దుర్వాసమహర్షి : మంత్రమా? సరే। ఒక మననము చెపుతాను. (మననాత్ త్రాయతే ఇతి మంత్రః). మునిః దూర్వ-అశినమ్ మాగ్ం స్మృత్వా, వో దాస్యతీతి మార్గమ్। ఏమాత్రము కొంచము కూడా ఆహారము స్వీకరించనట్టి ఈ దూర్వాసుని స్మరిస్తూ వెళ్ళండి. అప్పుడు మీకు యమునా నదీమతల్లి ‘‘నిజము చెప్పారు’’ - అని సంతోషించి మీకు త్రోవ ఇవ్వగలదు.

ఆ మాటలు విని ఇక గోపికలు శ్రీకృష్ణుని ధ్యానిస్తూ, గానం చేస్తూ బయలుదేరారు.

గోవిందా…జయగోవిందా…! గోకుల నందన గోవిందా।
ఘనఘననీలా గోవిందా। బాలముకుందా గోవిందా।
హే ఘన శ్యామా గోవిందా। గోకులనందన గోవిందా।

అని అడుగులు వేయసాగారు. నాలుగు అడుగులు వేసారో, లేదో…గోపికలకు ఒక అనుమానం వచ్చింది.

గోపికలు : ఇదేమిటి? అక్కా! దూర్వ-అశనమ్? నేను తినటానికి దూరంగా ఉండి, ఈ మహర్షులవారు తిననివాడనైతే!’’… అని అంటారేమిటి? మనము తెచ్చి మధుర పదార్థములు, తినుబండారములు మనముందే ఈయన తిన్నారుగా"?

గోపికల శ్రేష్ఠులగు గాంధర్వి : అవును. మీరు అన్నది నిజమే. ‘‘ఏమీ తినని వాడనైతే’’…అని అంటారేంటి? అయితే మహర్షులు అబద్ధము, అల్పశబ్దము పలుకరు. ఇందులో మనము గ్రహించవలసిన గూడార్థమేదో ఉండి ఉంటుంది. మనకు ఏదో సందేహం రానే వచ్చింది కదా। తీర్చుకునే వెళ్దాము. ఈ విషయం ఆ మహాత్ముడినే అడుగుదాం.

ఇట్లా అనుకున్న తరువాత ఆ వ్రజగోపికలు మరల మహర్షిని సమీపించి నమస్కరించారు.

దూర్వాసమహర్షి : బిడ్డలారా, శ్రీకృష్ణ భక్తపారవశ్యులు అగు వ్రజగోపికలారా! ఏమిటి తిరిగి వచ్చారు? ఏమికావాలి?

వ్రజగోపికలు : స్వామీ। మాకు ఏదో చిన్న సందేహము। మీరు అనుగ్రహిస్తానంటే అడుగుతాము.

దూర్వావసమహర్షి : సందేహమా! సంతోషం. శ్రీకృష్ణప్రియస్వరూపులగు వ్రజగోపికలతో కొంతసేపు సంభాషించటము మాయొక్క తపోఫలమే। మీరంతా సుఖాశీనులవండి. ఇక ఇప్పుడు అడగండి. మీకొచ్చిన అనుమానమేమిటి?

గోపికలలో శ్రేష్ఠురాలు, పెద్దవయసుగలది అగు గాంధర్వి అడగటం ప్రారంభించారు. తక్కిన గోపికలు నిశ్శబ్దము వహించి శ్రవణమునకు (వినటానికి) సంసిద్ధులైనారు.

గాంధారీ గోపిక : బ్రహ్మతత్త్వజ్ఞా! దుర్వాసమహర్షీ! మేము అమాయకులైన వ్రజగోపికలము. శాస్త్రజ్ఞానము, తత్త్వజ్ఞానము తెలియనివారము. తెలిసీ, తెలియక ఏమైనా అమాయకపు ప్రశ్నలు అడిగితే క్షమార్హులము. మాకు రెండు సందేహాలు వచ్చాయి. అవి రెండూ మీ సమక్షంలోఉంచుతాము. మాకు మీ వివరణ ప్రసాదించండి.

(1) కథం కృష్ణో బ్రహ్మచారీ? మా కృష్ణునికి అష్టభార్యలు ఉన్నారు. ‘‘నేను బ్రహ్మచారిని - అని పలకండి’’ అని మా కన్నయ్య ఎట్లా చెప్పారు? ఆ వాక్యము యమునా దేవి ఎట్లా అంగీకరించి మాకు త్రోవ ప్రసాదించింది?

(2) కథం దూర్వ అశనో మునిస్తాగ్ం? ‘‘మీరు ఏమీ తినక మౌనము వహించి ఉన్నారు’’ - ‘‘దూర్వ - ఆశనమ్’’ అని అంటున్నారే? న-అశనులు ఎట్లా అవుతారు? మేము తెచ్చిన పదార్థములను మా విన్నపమును అంగీకరించి తినియే ఉన్నారు కదా? ఇందులోని రహస్యము ఏదో ఉండి ఉంటుంది. దయతో మాకు వివరించి చెప్పండి.

దుర్వాసమహర్షి : ఓహో! ఇదా మీ సందేహం? అయితే ఇందలి తాత్త్విక సత్యమును కొన్ని దృష్టాంతముల సహాయంతో చెపుతాను. అందరూ శ్రద్ధగా వింటారా మరి?

దుర్వాసమహర్షి : ఆకాశము నుండి ‘శబ్దము’ - అనే తత్త్వము (లేక) గుణచమత్కారము జనిస్తోంది. అయితే శబ్దము ఆకాశమునకు వేరై వినబడుతోంది కదా! ఆకాశములో శబ్దము లేదు. శబ్దములో ఆకాశములేదు. శబ్దముల కర్తృత్వము ఆకాశమునకు లేదు. ఆకాశము ఆకాశము నందే ఉన్నదిగాని శబ్దములో చిక్కుకున్నదని అంటామా? అనము కదా। శబ్దమునకు ఆకాశము గురించి తెలియదు. ‘‘ఆకాశము మాటలు పలుకుతోంది’’ అని కూడా ఎవ్వరూ అనరు.

అట్లాగే, నేను సర్వదా ఆత్మాకాశ స్వరూపుడను. మరి నేను నా నుంచి (ఆకాశమునుండి శబ్దతత్త్వమువలె) జనించిన జీవాత్మ ఏదైనా అనుభవిస్తే - నేను అనుభవించినవాడిని. ఎట్లా అవుతాను? స హి ఆత్మాఽహమ్ కథం ‘భోక్తా’ భవామి? కనుక నేను దూర్వాశి (దూర్య-అశి) గా అనుభవించక, దూరముగా ఉన్నవాడిని మాత్రమే। దేనికీ భోక్తను కాను। కర్తను కాను। అకర్తాహమ్। అభోక్తాహమ్।

వాయువు నుండి ‘స్పర్శ’ అనే అనుభూతి (ఇంద్రియార్థము/ ఇంద్రియ విషయము) జనిస్తోంది. అయితే ‘స్పర్శ’ అనే అనుభవము వాయువు కంటే వేరై, వాయువుకు భిన్నమై - ఉంటోంది. స్పర్శయందు వాయువు లేదు. వాయువు నందు స్పర్శ లేదు. స్పర్శానుభవమును వాయువు పొందటము లేదు. ఆత్మనగు నేను జీవాత్మయొక్క అనుభవం ఎట్లా పొందుతాను? పొందను. సర్వాత్మనగు నాకు సందర్భమాత్రమగు జీవాత్మ యొక్క అనుభవములన్నీ సంబంధితమైనవి కావు.

తేజస్సు వలన కళ్ళకు రూపం కనిపిస్తోంది. అయితే, రూపము → అగ్ని (తేజము) కంటే భిన్నమయ్యే ఉంటోంది. (Form of an article in quite different from the light). రూపము అగ్ని (తేజస్సు) వలననే కనిపించటం జరుగుచున్నప్పటికీ - తేజస్సు రూపముయొక్క అనుభవి - కాదు. మరి నేను మాత్రం జీవాత్మ యొక్క రూపానుభవం ఎందుకు పొందుతాను? రూపములను వెలిగిస్తున్నంత మాత్రము చేత వెలుగు రూపముల ఆకారముగా అవనట్లే - నేను జీవాత్మ పొందుచున్న సాకారానుభవములకు భోక్తను కాను నాయొక్క ఆత్మ తేజస్సులో జీవాత్మ అనుభవములు స్వీకరిస్తున్నప్పటికీ, అవన్నీ నాకు చెందవు.

భూమి - గంధవతి అయి ఉంటోంది. భూమి నుండి అనుభవమయే గంధము (Smell) కంటే భూమి సర్వదా వేరే కదా. భూమి వలన గంధమున్నప్పటికీ, భూమి భూమిగానే ఉంటుంది. (భూమి గంధమునకు వేరుగా ఉంటుంది).

ఆత్మనగు నేను జీవునియొక్క గంధానుభవమునకు వేరై, ఆత్మధర్మము వీడక ఉన్నాను. భూమికి గంధముయొక్క అనుభవము లేనట్లే, ‘జీవాత్మ’ యొక్క కర్తృత్వ - భోక్తృత్వములు (ఆత్మగా నేను) లేనట్టివాడను.

❋ సమస్తము ఆత్మయే అయి ఉండగా - (1) ఇది మననము చేయునది, (2) ఇదేమో మననము చేయబడునది - అను రెండు వేరువేరైనవి ఎక్కడ ఉన్నాయి? అంతా నేనే అయి ఉండగా (స్వప్నము తనదైనవాడు వలె) నేనుఎక్కడినుండి ఎక్కడికి వెళ్తాను? కథ వ్రాయువాడు కథలో చెప్పబడిన ఒక ఊరి నుండి (తాను వ్రాస్తున్న కథలోని) మరొక ఊరికి వెళ్ళుతాడా? వెళ్ళడు. నా నుండి జగదనుభవి అయినట్టి జీవాత్మ నా కల్పిత స్వరూపమే అగు జగత్తులో సంబరాలు చేస్తూ, ఆయా క్రియలు నిర్వర్తిస్తూ ఉంటే అవన్నీ చేయువాడు నేనెట్లా అవుతాను? అవను. కథలోని పాత్రలు నిర్వర్తిస్తున్న పనులను రచయితయే చేస్తున్నట్లు ఆపాదించము కదా!

అట్లాగే, మనస్సు నిర్వర్తిస్తున్న మననముల వ్యవహారమునకు (ఆత్మనగు) నేను కర్తను కాదు. భోక్తను కాదు.

❋ మనస్సు ఏదేది అనుభవిస్తూ ఉంటే, అదంతా మనస్సుకు అనుభవమేగాని, మనస్సుకు ఆవల కారణ-కారణుడనై ఉన్న నాకేమి సంబంధము? మనస్సు పొందుచున్న విషయాలకు కూడా ఆత్మనగు నాకు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు.

అట్టి ఆత్మ స్వరూపుడే మన శ్రీకృష్ణుడు. ఆయనయే రెండు శరీరములకు కారణభూతుడు (1) ఆత్మ (2) జగదనుభవి
[ (1) Individual Self (2)Experiencer of the worldly things ]

ఒక కొమ్మకు రెండు ఆకులు ఉన్నతీరుగా, బ్రహ్మమే స్వరూపముగాగల నన్ను ఆశ్రయించి రెండు సుపర్ణములు (రెక్కలు)
(1) భోక్త (2) సాక్షి
ఇద్దరు ఈ ‘శరీరము’ నందు ప్రత్యక్షమైయున్నారు.

‘‘భోక్త’’→ భోక్తారమునకు (భోగించబడుదానికి) మునుముందే ఉన్నట్టివాడు. (The Experiencer has been there prior to the event of experiencing). కనుక ఆతడు భోక్త, అభోక్త కూడా అయి ఉన్నాడు. భోక్తతత్త్వమునకు వేరైన జీవునికి చెందిన సాక్షీతత్త్వమే కృష్ణతత్త్వము.
అభోక్తకృష్ణతత్త్వము భోక్త భోగించబడుచున్న ఈ సమస్త ఇంద్రియ విషయ ప్రపంచము

భోక్త

యత్ర (ఎక్కడైతే) ….,

విద్య-అవిద్యే న విదామో, -
తెలుసుకోవటము. తెలియకపోవటము అను ఉభయములకు స్థానము లేదో,
విద్య-అవిద్యాభ్యాం భిన్నో।
విద్య అవిద్యలకు భిన్నమైనట్టిదో, (ఆ రెండిటికి సంబంధించనిదో),
విద్యామయో హి। -
‘‘ఎరగటము’’ యొక్క కేవలస్వరూపమే- (The Absolute Form of knowing)-అయి ఉన్నదో,

అట్టి ‘ఆత్మ’ - విషయముల రూపము పొందుతుందా? పొందదు.

ఇక మన కృష్ణుడు ఎట్టివాడో చెపుతాను వినండి.
(1) యో హ వై న కామేన కామాన్ కామయతే, స‘కామీ’। భవతీ। ఎవ్వరైతే కోరికలు కలిగి ఉండి కోరికలు కోరుకుంటూ ఉంటారో ’వారే ‘కామి’ (సకామి) అవుతారు.
(2) యో హ వై తు ‘‘అకామేన’’ కామాన్ కామయతే - సో ‘‘అకామీ’’ భవతి।।

ఎవరైతే అంతరమున కోరికలు లేని వారై బాహ్యమున కోరికలు కలిగి ఉంటారో, వారు అకాములే।

మన కృష్ణయ్య అంతరమున నిర్విషయ ప్రశాంతాత్మానందులు. కోరికలు లేనివారై బాహ్యమున కోరికలు ప్రదర్శిస్తూ ఉండువారు. కాబట్టి అకామియే. ‘అకామకామి’ - అనబడుచున్నారు.


శ్రీకృష్ణుని స్వాభావికమగు స్వానుభవము ఎట్టిదంటే…,
✳︎ జన్మ జరా మరణ వ్యవహారములకు సర్వదా భిన్నమై (వేరై), ఆవలగా ఉన్నట్టిది. (All-Beyond)
✳︎ మార్పు చేర్పులకు విషయమే కానట్టిది. సర్వదా నిశ్చలము. స్థాణువు. (Always ‘As it is’)
✳︎ జీవ - ఈశ్వర భిన్నము లేనట్టిది. అఖండితమైనది. (Indivisible/unpartitionable)
✳︎ సూర్యునియందు కూడా తేజోస్వరూపమై ప్రకాశించుచున్నట్టిది. (All Enlightening)
✳︎ గోవులయందు గోతత్త్వముగా వేంచేసి ఉండినట్టిది. (The basic sense of Experiencing)
✳︎ గోవులను పాలించునట్టిది, గోపబాలురయందు కూడా ప్రకాశించునది. (The Rular of ‘Indriams’ and Jeevathma)
✳︎ సర్వ భూతములయందు ప్రవేశించి విశ్వమంతా తన స్వరూపముగా కలిగి ఉన్నట్టిది. (Manifesting as all this)
ఆయనయే మన స్వామి శ్రీకృష్ణుడు।

గాంధార్వీ వ్రజగోపిక : మా కృష్ణుడు సమస్త జీవులలో ఉనికి గలవాడై విశ్వమంతా తన స్వరూపముగా కలిగి ఉన్నట్టివాడా? ఆశ్చర్యం! మా గోపబాలురలో ఒకడుగా పుట్టి పెరిగి, మా మధ్యలో మాతో క్రీడిస్తూ మాకు ఆనందము కలుగజేస్తున్నాడే। మా మధ్యలో పుట్టి, పెరిగిన మా కృష్ణుని గురించి మీరు ఆయా మీరు చెప్పుచున్న విశేషాలుగా మీరు ఎట్లా తెలుసుకొన్నారు? మాకే తెలియదే, మీరు చెప్పే విశేషాలు?

సరే! ఈ విషయాలు చెప్పండి।

కృష్ణః కో వా? అస్య మంత్రః (కిం)? దేవాది దేవుడని మీరు వివరించి చెప్పే మా కృష్ణుని తెలుసుకొనే మంత్రమేది?
కిం స్థానమ్? ఈ కృష్ణుడు ఏ స్థానము లోనివాడు? ఎక్కడి నుండి మా మధ్యకు వచ్చాడు? అసలు ఈయన ఎవరు?
కథం వా దేవక్యాం జాతః। మా దేవకీదేవి గర్భంలో ఎందుకు ఎట్లు జన్మించాడు?
కోవా అస్య జాయో గ్రామో భవతి? ఆయన భార్యలు ఎవరెవరై ఉన్నారు? వాళ్ళు ఎక్కడెక్కడివాళ్లు?
కీదృశీ పూజా అస్య గోపాలస్య భవతి? అట్టి పరమునకే పరమని మీరు చెప్పుచున్న మా గోపాలకృష్ణుని మేము ఏవిధంగా పూజించాలి, ధ్యానించాలి?

దుర్వాసుడు : మన కృష్ణుడు ప్రకృతికి పరమైనవాడు. ప్రదర్శన-కృత-తిరోగమనములకు ఆవలివాడు. అంతేగాని, ప్రకృతిలోని వాడు కాదు.

గాంధర్వీ గోపిక : మహర్షీ! ఈఈ వివరాలన్నీ మేము మీవద్ద వినాలనుకుంటున్నాము. దయచేసి చెప్పండి. ప్రకృతికి పరుడైనట్టి పరమాత్మ గోపబాలుడై భూమిమీద ఎందుకు జనించారో కూడా చెప్పండి.

దుర్వాసమహర్షి : ఓ గాంధర్వీ గోపికా। తదితర వ్రజగోపికలారా! వినండి. చెపుతాను. తాగ్ం హి వై పూర్వం నారాయణో యస్మింల్లోకా ఓతాశ్చ - ప్రోతాశ్చ।
- ఆభరణములన్నిటిలో బంగారమే ఓత ప్రోతమై ఉన్నట్లు, వస్త్రములన్నిటిలో ప్రత్తిదారమే ఓతప్రోతమై ఉన్న తీరుగా - ఎవనిలో ఈ సమస్త లోకములు ఓతప్రోతమై ఉన్నాయో,
- ఏ సర్వాత్మకుడు సమస్త జీవులలో పూలదండలో దారమువలె అంతర్గతుడై ఉన్నారో,..

ఆయనయే మన శ్రీకృష్ణుడు. ఆవిధంగా పరమాత్మయగు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణావతారుడు. ఆయనయే ఈ ఇంద్రియములకు కనిపించే సమస్తమునకు ఓతప్రోతమై ఉన్నారు.

ఈ సమస్త లోకములు, లోక దృశ్యములు నారాయణ కల్పితములు. అనగా జగత్ - కల్పనలకు మునుముందే నారాయణుడు కల్పనారహిత చైతన్యస్వరూపుడై ఉండి ఉన్నారు.

✡︎ నారాయణుడే నిర్వికల్ప - నిరాకార - నిర్విషయ కేవలానంద స్వరూపుడై ఉన్నారు.

✡︎ అట్టి కేవల సత్ - చిత్ - ఆనంద స్వరూపుడగు నారాయణుని హృదయపద్మమునుండి ఏకారణము లేకుండానే (లేదా) లీలా క్రీడా వినోద సంకల్పనా భావన కారణంగా, - సృష్ట్యభిమానియగు బ్రహ్మదేవుడు జనించారు. తస్య హృత్ పద్మాత్ జాతో అబ్జయోనిః। నారాయణ హృదయము (లేక) యోని నుండి ‘సృష్టించెదనుగాక’ అనే భావనాపురుషుడు (లేక) సృష్ట్యభిమానిగా జనించారు.

✡︎ అట్టి భావనా కల్పనా రూపుడగు బ్రహ్మదేవుడు (లేక) హిరణ్యగర్భుడు ‘‘నేనిప్పుడు ఏదో ఒకటి చేయాలి। ఏమి చేయాలి?’’ అను తపన పొంది, ఇక తపన రూప తపస్సు చేయనారంభించారు.

అట్టి బ్రహ్మదేవుడు లోకములను, జీవులను, వారి వారి బహిరంగ - అంతరంగములను కల్పించారు.

★ ఈ లోకములన్నీ - క్రీడారంగములు (Amusement Parks) వంటివి.
★ జీవులందరు - ఆ క్రీడారంగములో ఆడుకునే బాలురవంటివారు.

అట్టి బ్రహ్మదేవుడు జీవులంతా క్రీడా వినోదులవటం, క్రమంగా ఆ క్రీడా వినోదములో పరిమిత సంబంధ - బాంధవ్యములు కలిగి ఉండటము, వాటిచే సుఖ దుఃఖములు, మృత్యు - జన్మ - జన్మాంతరములు పొందటం గమనించారు. సృష్టిలోని జీవుల దుఃఖములు చూసి వారి హృదయము ద్రవించింది. అప్పుడు జీవుల దుఃఖములు తొలగటానికై శ్రీమన్నారాయణుని ఉపాసించగా ఆ ‘‘కేవల-నిర్వికార-సర్వకారణ-సాక్షీ’’ స్వరూపుడగు నారాయణుడు అనేకసార్లు లోకములలో అవతరిస్తూ ఉండసాగారు. ఆయా భక్తవత్సలుడు. భక్త పరాధీనుడు.

శ్రీమన్నారాయణ ప్రవచనము

ఓ గోపికలారా! ఇప్పుడు కొన్ని విశేషములతో కూడిన - ‘నారాయణ ప్రవచనము’ గురించి చెపుతాను. వినండి.

ఒక సందర్భములో స్వకీయ ఉపాసనగా బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుని దర్శనముకొరకై భక్తితో తపస్సు చేయగారు. శ్రీమన్నారాయణుడు ఆయన ముందు ప్రత్యక్షమైనారు.

శ్రీమన్నారాయణుడు : కుమారా! బ్రహ్మదేవా! ఏమికోరి నన్ను స్మరించారు? అడగండి. ప్రసాదిస్తాను.

బ్రహ్మదేవుడు : స్వామీ! నాపై, నేను సృష్టించిన జనులపై అవ్యాజమైన ప్రేమతో మా సంసార దుఃఖములు తొలగించటానికై
(పరిత్రణాయ సాధూనాం, వినాశాయచ దుష్కృతమ్। ధర్మసంస్థాపనార్ధాయ, సంభవామి యుగే యుగే। భగవద్గీతా వాక్యానుసారము…)
సృష్టికి ఆవల తేజోరూపులై ఉన్న మీరు నా ‘సృష్టి’ అనే దృశ్యములో ప్రకృతిరూపులై అవతరిస్తున్నారు.
అవన్నీ నాకు, నాచే సృష్టించబడుచున్న సమస్త జీవులకు ఉపాస్యములగుచున్నాయి.

అయితే పరమాత్మా। ఇప్పుడు నేను అడుగుచున్న ప్రశ్న :

యో వా అవతారాణాం మధ్యే శ్రేష్ఠోవతారః కో భవతి? మీ అవతారములన్నిటిలో శ్రేష్ఠమైనది ఏది? ఎందుచేత? ఏది ఉపాసించుటచే మేమంతా సంసార దుఃఖములన్నీ తేలికగా జయించివేయవచ్చును? ఏ అవతారముచే లోకములన్నీ తుష్టి (తృప్తి) పొందుచున్నాయి? ఏ అవతారము స్మరించినంతమాత్రము చేతనే సమస్త జీవులకు మోక్షము లభించగలదు?
అట్టి అవతారము యొక్క కథనము (sequence) ఎట్టిది? దయతో వివరించండి.

శ్రీమన్నారాయణుడు : బ్రహ్మదేవా! వినండి, చెపుతాను.

నిష్కాముడను, నిర్విషయుడను, సర్వాత్మకుడను, ఆత్మానారాయణుడును అగు నేను ఒకానొకప్పుడు లీలగా, క్రీడావినోదంగా ‘సకాముడను’ అగుచున్నాను.

మేరో శృంగేః యథా సప్తపుర్యోభవంతి, తథా నిష్కామ్యాః సకామ్యా భూగోళ చక్రే సప్త పుర్యో భవంతి। అట్టి మేరు పర్వతశిఖరముపై సప్త (7) పురములు (Seven Townships) ఉన్నతీరుగా - సకామ - నిష్కామ క్షేత్రములు (లేక) సప్త భూగోళచక్రము. ఆ సప్తపురముల మధ్యలో సాక్షాత్ ‘బ్రహ్మగోపాలపురము’. అట్టి గోపాలపురములో ఆ గోపాలపురిలో సకాములు, నిష్కాములు అగు జీవులు, దేవతలు, సమస్త భూతజాలము నివాసము కలిగి ఉంటున్నారు.

అథ అస్య భజనం భవతి : ఆ గోపాలపురములో పరమాత్మయే ఎల్లప్పుడు భజించబడుచున్నారు.

యథా హి వై సరసి పద్మం తిష్ఠతి - ఏ విధంగా అయితే సరస్సు నందు పద్మము ప్రదర్శనమై ఉంటోందో…

తథా భూమ్యాం తిష్ఠతి। - ఆ విధంగా భూమి.

చక్రేణ రక్షితా మధురా తస్మాత్ ‘గోపాలపురీ’ భవతి। - స్వర్గలోకంలో అమృతము విష్ణుచక్రముచే రక్షించబడుతీరుగా ఆ (గో)భూమిపై ‘గోపాలపురము’. ఆ పురము సర్వదా దేవతలచే రక్షించబడుచూ ఉన్నది.

ఆ గోపాల పురములో అనేక వనములు (Public Gardens)
= బృహత్తు అయినట్టి బృహద్వనము (సువిశాలమైనది).
= మధువు గురించిన మధురవనము.
= తాళవృక్షములతో కూడిన తాళవనము.
= కుముదము (తెల్లకలువలతో కూడిన) - కుముదవనము.
= ఖదిరములతోకూడిన - ఖదిరవనము.
= భద్రములతో కూడిన - భద్రవనము.
= భాండీరము - భాండీరవనము.
ఇంకా శ్రీవనము, లోహవనము, బృందావనము…ఇవన్నీ గోపాలపురమును ఆవరించి ఉన్నాయి.

ఆ గోపాలపుర గగనము (ఆకాశము)లో దేవతలు, గంధర్వులు, కిన్నెరులు మొదలైనవారు నృత్యము, గానము చేస్తూ ఉంటారు.

ఇంకా అక్కడ
(I) ద్వాదశ (12) ఆదిత్యులు। (II) ఏకాదశ (11) రుద్రులు। (III) అష్ట (8) వసువులు। (IV) సప్త (7) ఋషులు।
(V) బ్రహ్మ। నారదుడు। పంచ (5) వినాయకులు।
విశ్వేశ్వరుడు। రుద్రేశ్వరుడు। అంబికేశ్వరుడు। నీలకంఠేశ్వరుడు। గోపాలేశ్వరుడు। భద్రేశ్వరుడు। అష్టలింగములు - ప్రదర్శనమగుచున్నాయి.

‘‘పౌరాణిక - వర్ణనలు’’

ద్వాదశ ఆదిత్యులు

ఆదితియందు కశ్యప ప్రజాపతికి కలిగిన కుమారులు.

ధాత, మిత్రుడు, అర్యముడు, శుక్రుడు, వరుణుడు, అంశుమంతుడు, భగుడు, వివస్వంతుడు, పూషుడు, సవిత, త్వష్ట, విష్ణువు. (ఇవన్నీ సూర్యునికి నామాంతరములు కూడా!)

ఏకాదశ రుద్రులు

బ్రహ్మ మానస పుత్రులు - (1) అజుడు (2) ఏకపాదుడు (3) అహిర్బుథ్న్యుడు (4) హరుడు (5) శంభుడు (6) త్ర్యంబకుడు (7) అపరాజితుడు (8) ఈశానుడు (9) త్రిభువనుడు (10) త్వష్ట (11) రుద్రుడు - వీరంతా జగద్రచనను పర్యవేక్షిస్తూ ఉంటారు.

అష్ట వసువులు

భారతములో చెప్పి ఉన్న ప్రకారము - వీరు ప్రజాపతి కుమారులు.

ధరుడు, ధ్రువుడు, సోముడు, అహుడు, అనిలుడు, అగ్ని, ప్రత్యూషుడు, ప్రభాసుడు. ఆఖరివాడగు ప్రభాసుడు వసిష్ఠ హోమ ధేనువు దొంగిలించిన కారణంగా శపించబడి - భీష్ముడుగా జన్మించారు.

అష్ట మూర్తులు

(బ్రహ్మయొక్క భ్రూమధ్యము నుండి వెలువడిన రుద్రునియొక్క రూపములు)
నామము స్థానము/రూపము భార్య పుత్రుడు
భవుడు జలము ఉష శుక్రుడు
శర్వుడు మహి సుకేశి అంగారకుడు
ఈశానుడు వాయువు శివ హనుమంతుడు
పశుపతి వహ్ని స్వాహా స్కందుడు
భీముడు ఆకాశము దిశ స్వర్గము
ఉగ్రుడు స్వధర్మనిష్ఠుడైన బ్రాహ్మణుడు దీక్ష సంతానుడు
మహాదేవుడు సోముడు రోహిణి బుధుడు
రుద్రుడు సూర్యుడు సువర్చల శనైశ్వరుడు

సప్త ఋషులు

  1. మరీచి, అంగీరసుడు, పులహుడు, వసిష్ఠుడు, అత్రి, పులస్త్యుడు, క్రతువు
  2. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వసిష్ఠుడు

ఈ విధంగా చతుర్విగ్ంశతి (24) తత్త్వములు ఆ గోపాలపురములో వేంచేసి ఉన్నాయి.

అందులో ఇంకా రెండు వనములు (1) కృష్ణవనము (2) భద్రవనము.
వాటిలో పుణ్యములు, పుణ్య శ్రేష్ఠములు (తమములు) అయినట్టి 12 ఉపవనములు.
వాటియందు దేవతలంతా ఉన్నారు.

మూర్తములు :-
    బలరామునియొక్క - బలరామమూర్తి,
    ప్రద్యుమ్నుని - ప్రద్యుమ్నమూర్తి,
    అనిరుద్ధుని - అనిరుద్ధమూర్తి,
    కృష్ణుని - కృష్ణమూర్తి -
మూర్తీభవించినవై ఆ వనములలో ఉపాసించబడుచున్నాయి.

ఆ వనములలో - వనేష్వేవం మధురా సేయం ద్వాదశమూర్తయో భవంతి। - మధుర అని పిలువబడుచూ, ద్వాదశ (12) మూర్తులు కలిగి ఉన్నది.

  1. మొదటి మూర్తిని రుద్రులు,
  2. రెండవ మూర్తిని బ్రహ్మ,
  3. మూడవ మూర్తిని బ్రహ్మజ్ఞులు,
  4. నాలుగవ మూర్తిని మరుత్తులు,
  5. ఐదవ మూర్తిని వినాయకులు,
  6. ఆరవమూర్తిని వసువులు,
  7. ఏడవమూర్తిని సప్తఋషులు,
  8. ఎనిమిదమూర్తిని గంధర్వులు,
  9. తొమ్మిదవమూర్తిని అప్సరసలు పూజిస్తూ ఉన్నారు.
  10. 10వ మూర్తి - నిరాకారమై, అంతర్థాన (Disappeared) రూపముగా ఉంటుంది. మూర్తీభవించి కనిపించే సమస్తమునకు ఆధారమైయున్న తేజోరూపము.
  11. 11వ మూర్తి - స్వపదానుగా (స్వస్వరూపధ్యానరూపము)
  12. 12వ మూర్తి - ‘‘భూమి’’ (గోభూమి) అని అంటారు.

అట్టి మూర్తులను పూజించువారు కేవలమును (Changeless form of SELF) సంతరించుకొంటున్నారు. ‘‘ఆత్మస్వరూపుడునగు నాకు దేనిచేతను బంధము మొదలే లేదు’’….అను ముక్త స్థితిని సిద్ధించుకుంటున్నారు.

గర్భవాసము, జనన, వార్ధక్య , మరణ, తాపత్రయ (ఆధి భౌతిక - ఆధి దైవిక - ఆధ్యాత్మిక) దుఃఖములనుండి తరించుచున్నారు.

అట్టి గోపాలపురములో శ్రీకృష్ణుడు వేంచేసి ఉన్నారు.

        సంప్రాప్య మధురాగ్ం రమ్యాగ్ం, సదా బ్రహ్మాది వందితమ్ ।  
        శంఖ చక్ర గదా శార రక్షితాం ముసలాదిభిః ।  
        యత్రాసౌ సస్థితః కృష్ణః స్త్రీభి శక్త్యా సమాహితః।  
        రమా అనిరుద్ధ ప్రద్యుమ్న రుక్మిణ్యా సహితో విభుః।।

అట్టి మధురా నగరం రమ్యాతి రమ్యము. బ్రహ్మదేవుడు మొదలైనవారిచే నమస్కరించబడునది. శంఖ-చక్ర-గద-బాణ-ముసలములచే పరిరక్షించబడు స్థానము. అక్కడ కృష్ణుడు రమా-అనిరుద్ధ, ప్రద్యుమ్న - రుక్మిణీ సమేతంగా విభుడై ఉన్నారు.

ఆ శ్రీకృష్ణుడు ‘ఓం’ కార స్వరూపుడు

అట్టి ‘ఓం’ = అ (జాగ్రత్)+ ఉ (స్వప్న ) + మ (సుషుప్తి) + అర్ధమాత్ర (తురీయ)-గా శ్రీకృష్ణుడు చతుశ్శబ్దీయుడు.

చతుశ్శబ్దో భవేత్ ఏకో హి ‘ఓం’ కారస్య ఉదాహృతః। ‘ఏకరూపుడే’ అయినప్పటికి ఆ శ్రీకృష్ణుడు చతుశ్శబ్దములుగా (4 శబ్దములుగా) ప్రదర్శనమగుచున్నారు.

ఆయనయే ‘పరోరజసుడు’ ప్రతి ఒక్క జీవుని పర (సాక్షీ - Beyond) స్వరూపుడు.

ఓ బ్రహ్మదేవా! అట్టి గోపాలపురములోని శ్రీకృష్ణుని ‘‘సోఽహమ్’’ - ఇతి అవధార్యాత్ ఆత్మానం ‘‘గోపాలోఽహమ్’’ - ఇతి। - నాలో సమస్తమునకు పరమై, కేవలమై వేంచేసి యున్నవారే ఆ గోపాలకృష్ణుడు. ఆపరస్వరూపమే నేను. నేను ఆగోపాలకృష్ణ స్వరూపుడనే।’’ - అని అంతరముగా భావనను ఆశ్రయించి ఉపాసించెదరుగాక।

గోపాల బ్రహ్మోపాసన

స గోపాన్ జీవాన్ ఆత్మత్వేన సృష్టిపర్యంతం ఆలాతి - స ‘గోపాలో’ భవతి।।

ఎవ్వరైతే - ‘‘సృష్టి పర్యంతము (సృష్టి ఉన్నంతవరకు) ఆత్మపురుషుడనై, - జీవాత్మ అనబడు గానము చేయుచున్నాను.
ప్రకృతియందు జీవాత్మత్వమును ప్రదర్శించుచున్నాను’’ అను భావన కలిగి ఉంటాడో, ఆతడు గోపాలుడు (జీవాత్మలను పాలించు వాడు) అగుచున్నాడు. (The Ruler of Individual Self-related all)

ఓం తత్ సోఽహమ్ పరబ్రహ్మ కృష్ణాత్మకో
నిత్యానందైక స్వరూపః। సోఽహమ్।।

నేను ‘ఓం’ అను సంజ్ఞతో చెప్పబడు పరబ్రహ్మమగు కృష్ణాత్మకుడను। నిత్యానంద స్వరూపుడను। ఆ కృష్ణ స్వరూప ఓంకారమును నేనే అయి ఉన్నాను।

ఓం తత్ సత్ గోపాలో అహమేవ।
పరగ్ం సత్యం అబాధితం సోఽహమ్।

నాలో నేనై ఉన్న ఆ తత్-సత్ గోపాలుడను నేనే! ఈ సమస్తమునకు వేరై ఉన్న (జన్మ-కర్మ-మనో-బుద్ధి-చిత్తములచే) బాధింపబడజాలని పరమ సత్యమగు శ్రీకృష్ణ తత్త్వమే నేను!

ఓ బ్రహ్మదేవా! ఓ సమస్త శ్రోతలారా! తత్త్వజ్ఞాన అధ్యయనులారా।

ఓ బ్రహ్మదేవా!

మధురాయాగ్ం స్థితిః, బ్రహ్మన్! సర్వరామే భవిష్యతి।
నేను ఎల్లప్పుడు మధురలో స్థిర నివాసుడనై ఉంటాను.

శంఖ-చక్ర-గదా-పద్మ-వనమాలలు ధరించి, విశ్వరూపుడనై పరంజ్యోతి స్వరూపుడనై, రూపవర్జితుడనై సంచరించువాడను.

ఎవ్వరైతే మధురలోగాని, జంబూద్వీపమునందుగాని నాయొక్క పవిత్రమగు ప్రతిమను అర్చిస్తూ ఉంటారో, అట్టివారు నాకు ప్రియాతి ప్రియులు అగుచున్నారు.

మధురలో అధిష్ఠితమై యున్న శ్రీకృష్ణావతార రూపము మీకు (ఎల్లప్పుడు) సదాపూజ్యము (పూజింపతగినది).

కాలచమత్కారము ఎరిగిన సుమేధులగు జనులు - నాయొక్క చతుర్ధావతారముగా (పూర్ణావతారముగా) - శ్రీకృష్ణావతారమును తెలుసుకొని ఉపాసించుచున్నారు.

- నేనే గోపాలబాలకులతో కూడిన గోపబాలుడను।
- శ్రీకృష్ణానంద స్వరూపుడను। అనుజుడు (అన్న) అగు బలరామునితో కూడుకొని ఉన్నవాడను.
- నాయొక్క తత్ స్వరూపిణియే రుక్మిణి।
- జన్మ రహితుడు, నిత్యుడు అగు గోపాలుడను। సనాతనుడగా ప్రద్యుమ్నుడను। ఆత్మారాముడను। అనిరుద్ధుడను।
ఈ విధంగా నన్ను తెలుసుకొని అర్చించెదరు గాక।

పైన చెప్పుకొన్న ధర్మములు (Features) విడివిడిగా భావిస్తూ నిష్కాములై (దృశ్యములో ఏదో పొందాలనే తపనతో కాకుండా ఆత్మభావనా సిద్ధికై) ఎవరు పూజిస్తారో, అట్టివారు శ్రీమన్నారాయణుడనగు నన్ను ‘భద్రకృష్ణ నివాసి’గా పూజించుచున్నట్లు - అగుచున్నది.

ఎవ్వరైతే ధర్మము ఆచరించక కలిధర్మమునకు తలవంచి (దురభ్యాసములచే) జీవితము గడిపియున్నారో, వారికి ఇప్పటికైనా శ్రీకృష్ణావతారుడనగు నన్ను శరణువేడెదరుగాక। వారికి నేనే శరణాగతిని అయి ఉన్నాను.

ఓ బ్రహ్మదేవా! నీకు ఏ విధంగా నారదుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు (సనకుడు, సనందనుడు) మొదలైన వారంతా ప్రియమైన మానస పుత్రులో, ఏ విధంగా అయితే గణపతి రుద్రభగవానునికి ప్రియమైనవాడో, ఏవిధంగా నాకు హృదయేశ్వరి అగు లక్ష్మీదేవి ప్రియమో, అంతంతగా తథా భక్తో మయి ప్రియః। భక్తులంటేనాకు అంతప్రియము.

బ్రహ్మదేవుడు : పితృదేవా! ఆదినారాయణా!
చతుర్భిః దేవైః కథమ్ ఏకో దేవస్స్యాత్। నలుగురు దేవతలు ఏవిధంగా ‘ఏకదేవుడు’ (ఒకే దేవుడు) అవుతారు?
ఏకమ్ అక్షరం యత్ విశ్రుతమ్ అనేకాక్షరరం కథం సంభూతమ్। ఏకము, అక్షరము అగు తత్త్వము అనేకాక్షరముగా ఎట్లా అవుతోంది?
ఏకము అనేకముగా అవటము గురించి (సంభవించటము గురించి) నాకు దయతో బోధించండి.

శ్రీమన్నారాయణుడు : బ్రహ్మదేవా! చెప్పుచున్నాను. వినండి.

❆ నేనే ‘అక్షరమగు ఓంకారమును.
❆ జరామరణములు లేనివాడను. అజరుడను. అమరుడను.
❆ ఆత్మకు ద్వితీయమే లేదు కనుక అభయుడను. (ద్వితీయం వై భయం భవతి)।
❆ మార్పు చేర్పులు లేని అమృత స్వరూపుడను.
అహంబ్రహ్మాస్మి। బ్రహ్మము - అని వేదోపనిషత్తులచే చెప్పబడేది ‘నేనే’ అయి ఉన్నాను.
❆ జన్మ- కర్మ- కర్మఫలములుగాని, జాగ్రత్ - స్వప్న - సుషుప్తులుగాని, పుణ్య-పాపకర్మవ్యవహారములుగాని, మనో - బుద్ధి - చిత్త- అహంకారాదులు గాని ఆత్మను బంధించలేవు. అందుచేత నిత్యముక్తుడను।
❆ ‘క్షరము’ అనునది లేని ‘నేను’ - కేవలమగు ఆత్మస్వరూపుడను. అక్షరస్వరూపుడను.
❆ ‘‘నేను ఉన్నాను (I Exist)’’ అను విశేషణము స్వాభావికమైయున్న ‘సత్తా’ మాత్రుడను (Absolute form / sense of “I am present”). సత్ స్వరూపుడను. (Form of ‘BEING’).
❆ ‘ఎరుగుట’ (లేక) ‘తెలుసుకొనుట’ అనునవి స్వాభావిక లక్షణములుగా కలవాడను. చిత్‌స్వరూపుడను. (Form of ‘knowing’).
❆ సర్వము బుద్ధి - మనస్సులచే అనుభవముగా మూర్తీభవింపజేయు ప్రకాశ (Enlightenment) మాన స్వరూపుడను.
❆ (నవలా రచయితయే నవల - అంతా వ్యాపించి ఉన్న తీరుగా, స్వప్న ద్రష్టయొక్క స్వప్నచైతన్యమే స్వప్నమంతా నిండి ఉన్న తీరుగా) - సమస్తముగా విస్తరించియున్న సర్వవ్యాపకుడను.
❆ ఏకము, అద్వితీయము అగు బ్రహ్మమును. మమస్వాభావికములగు సత్ - చిత్ - ప్రకాశములకు అన్యమైనదంతా నా యొక్క మాయా చమత్కారమే।

ఓ బ్రహ్మ దేవా! తత్త్వత్। త్వమేవాహమ్। అహమేవ ఇదమ్ - సర్వమ్। అట్టి ఏకాక్షరమగు ఆత్మ అనబడే ‘తత్’యే నీవు. నీవుగా ఉన్నది నేనే। ఈ సమస్తముగా ఉన్నది నేనే। కనుక, ఈ సమస్తముగా ఉన్నది నీవే కూడా!

అది విని బ్రహ్మదేవుడు ఆత్మానందానుభవులయ్యారు.

వ్రజ గోపికలు : మహర్షీ! మీవంటి మహనీయులు అగు మునీశ్వరులు మొదలైనవారు కృష్ణతత్త్వమును ఏరీతిగా ఉపాసిస్తున్నారు?

దుర్వాసమహర్షి : ఓ వ్రజ గోపికలారా। మన శ్రీకృష్ణ తత్త్వమును సాంగ - సపరివారపూర్వకంగా మునులమగు మేము ఏవిధంగా ఉపాసనా - భావములచే ఆరాధిస్తూ ఉన్నామో చెప్పుకుందాము.

రోహిణీ కుమారుడగు బలరాముడు

రోహిణీ తనయో వికార అకారాక్షర సంభవః।
‘‘విశ్వుడు’’ (జాగ్రత్ అభిమాన పురుషుడు).

‘అ’ కారాక్షర సంభవుడుగా భావిస్తున్నాము.
ప్రద్యుమ్నుడు
- ‘తేజసాత్మక’ - పురుషుడు, (స్వప్నాభిమాన పురుషుడు) ‘ఉ’ కారాక్షర సంభవుడు.
అనిరుద్ధుడు
- ప్రాజ్ఞాత్మక (సుషుప్తాభిమాన) పురుషుడు। ‘మ’ కారాక్షర సంభవుడు.
శ్రీకృష్ణుడు
- ఎవనియందు ఈ విశ్వమంతా ప్రతిష్ఠితమైయున్నదో అట్టి అర్థమాత్రాత్మకుడు.
రుక్మిణీదేవి

(కృష్ణాత్మికా, జగత్కర్త్రీ మూలప్రకృతిరూపిణీ।)
- కృష్ణాత్మిక। జగత్తుకు కర్త। మూలప్రకృతి స్వరూపిణి।
వ్రజగోపికా స్త్రీలు (వ్రజ స్త్రీజన సంభూత శ్రుతిభ్యో బ్రహ్మసంగతః)
- బ్రహ్మమునకు సంబంధించిన మహావాక్యముల రూపులు. శ్రుతుల సవివరణ రూపులు.

ప్రణవత్యేన ప్రకృతి = ‘త్వం’ వదంతి బ్రహ్మవాదినః। బ్రహ్మతత్త్వజ్ఞులు ప్రణవము గురించి వివరించి చెప్పేటప్పుడు ‘‘త్వం’’-యొక్క అనుభవమే ప్రకృతి అని చెప్పుతూ ఉంటారు. కాబట్టి ‘ఓం’కార సంభూతుడైన మన కృష్ణుడు విశ్వమంతా అహం-త్వం స్వరూపమై ఉన్నవారు (‘‘ఓం త్వం ప్రకృతి’’ - ఇతి మంత్రః।। ).

క్లీం = ‘ఓం’కారముతో ఏకత్వమే ‘క్లీం’ అని బ్రహ్మవాదులు పలుకుచున్నారు.

‘మధుర’లో వేంచేసిన క్లీంకార రూపుడగు శ్రీకృష్ణ భగవానుని విశేషముగా ధ్యానించటము చేత ఈ జీవునకు మోక్షము సిద్ధించగలదు.
(మధుర = ఈ కనబడే సమస్తము పరబ్రహ్మముయొక్క మాధుర్య స్వరూపమే (The Taste of the Divinity) - అను భావనను ఉపాసించటము).

సాకార ధ్యానము

గాంధారీ వ్రజగోపిక : మహర్షీ! అఖండాత్మ స్వరూపమగు శ్రీకృష్ణ చైతన్యతత్త్వము అనిర్వచనీయము, మనోవాక్ - అగోచరము కదా!

దుర్వాసుడు : అవును. ఆ విధంగా వేద - ఉపనిషత్తులు అభివర్ణిస్తున్నాయి కూడా।

గాంధర్వీ వ్రజగోపిక : అట్టి మనస్సుకు అందని శ్రీకృష్ణ బ్రహ్మతత్త్వమును మేము ఉపాసించటానికి ఉపాయము ఏమిటి?

దుర్వాసుడు : ఓ గాంధర్వీ! ఓ వ్రజ గోపికలారా। వాస్తవానికి మీరంతా ధన్యులు. మీరు కృష్ణ ప్రేమతో మునిగి తేలుచున్నారు. మీవంటి భక్తి పారవశ్యులకు (లేక) కృష్ణునితో ‘‘సమాగమ - విరహము’’ కలవారికి సిద్ధించగల కృష్ణతత్త్వము గొప్ప తపోధనులగు మాకు కూడా లభించేది కాదు. అయినా ‘ఉపాసించేది ఎట్లా?’ అని ప్రశ్నించారు కాబట్టి ‘సాకారధ్యానము’ ఎట్లా చేసి కృష్ణతత్త్వము సిద్ధించుకోవచ్చునో చెపుతాను. వినండి।

ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవునితో ఇట్లా చెప్పసాగారు.

శ్రీమన్నారాయణుడు : ఓ బ్రహ్మదేవా! భక్తజన ఉపాసనా సౌలభ్యము కొరకై సాకార ప్రకృతిగతమగురూపమును ఈ విధంగా దాల్చినవాడనై ఉంటున్నాను.

సాకార రూప వర్ణన

➤ అష్టదళములతో (8 రెక్కలతో) వికసితమైనట్టిది. (1) పంచమహాభూతములు, (2) పంచ జ్ఞానేంద్రియములు (3) పంచ జ్ఞానేంద్రియార్థములు (విషయములు) (4) పంచకర్మేంద్రియములు (5) పంచ కర్మేంద్రియార్థములు (6) పంచప్రాణములు (7) పంచ ఉపప్రాణములు (8) అంతరంగ చతుష్టయముల కళల హృత్ పద్మము.
- (అష్టవిధ ప్రకృతి = దృశ్యము; దేహము; ఇంద్రియములు; జీవాత్మ; ఈశ్వరుడు; మనస్సు; బుద్ధి; చిత్తము)
అష్ట పత్రం వికసితం హృత్మద్మం - తత్ర సంస్థితమ్।అష్టదళ వికసిత-హృదయ పద్మము గలది

➤ దివ్యమైన ధ్వజ - ఛత్రముల చిహ్నములుగల పాదములు కలిగియున్నట్టిది,
➤ శ్రీవత్స లాంఛనము కలిగియున్నట్టిది,
➤ హృదయముపై కౌస్తుభమణి ధరించినట్టిది, ఆ మణితో విరాజిల్లు హృదయస్థానము కలిగిఉన్నట్టిది,
➤ (కర్మ భక్తి యోగ జ్ఞానములు అనే) 4 భుజములు కలిగి ఉన్నట్టిది,
➤ శంఖ - చక్ర - శాఙ్గ (ఖడ్గ) - పద్మ - గదలను ధరించినట్టిది.
➤ బాహువులపై ‘కేయూరములు’ అనే ఆభరణములు ధరించినట్టిది.
➤ పుష్పమాల ధరించిన కంఠముతో శోభితమైనది,
➤ కాంతి పుంజములు వెదజల్లు కిరీటము ధరించినట్టిది,
➤ అభయము ప్రసాదించు హస్త ముద్రిక కలిగియున్నట్టిది,
➤ చెవులకు మకర కుండలములు ధరించినట్టిది,
➤ బంగారు రంగుతో శోభిల్లు సౌమ్యమైన తనువు (శరీరము) కలిగియున్నట్టిది.
➤ భక్తులకు అభయము ప్రసాదించునది,
➤ చేతులందు వేణుశృంగమును (పిల్లనగ్రోవి) ధరించునది,
- అగు నా శ్రీకృష్ణావతారరూపమును ధ్యానించెదరు గాక।
శ్రీకృష్ణ సాకార ధ్యాన రూపం

ఈ సర్వ జగత్తు యొక్క సారభూతము బ్రహ్మజ్ఞానము. అట్టి బ్రహ్మజ్ఞానముయొక్క మాధుర్యమే మధుర. నారాయణతత్త్వసారమే మధుర. అష్టదిక్పాలకులతో పరివేష్టితమైన ఈ జగత్తంతా నా మధురా రూపమే। అస్మత్ కృష్ణ చైతన్యానందమే। అందుచేత ఈ ప్రపంచమును ‘మనస్సు’ అనే సరోవరములో వికసించిన పద్మముగా సేవించెదరు గాక।

ఓ బ్రహ్మదేవా!

నాయొక్క నారాయణ-శ్రీకృష్ణ సాకార ఉపాసనారూపములోని కొన్ని కొన్ని విశేషముల గురించి వివరణలు చెప్పుకుందాము. వినండి.

జగత్తు : ఈ జగత్తును బ్రహ్మ జ్ఞానముచే బ్రాహ్మీదృష్టిచే దర్శించెదరుగాక। అష్టదిక్పాలకుల పరిరక్షణచే ప్రదర్శనమగుచున్న ఈ భూమిని నా మనోసరోవరములో వికసించిన పద్మ పుష్పముగా భావించండి.

{అష్ట దిక్పాలకులు} (పౌరాణిక విశేషయుక్తంగా)

పాలించువారు దిక్కులు సపత్నీ
ఇంద్రుడు - తూర్పు (East) శచీదేవి
అగ్ని - పూర్వ దక్షిణము (ఆగ్నేయము) (South-East) స్వాహాదేవి
యముడు - దక్షిణము (South) శ్యామలాదేవి
నిరృతి - దక్షిణ - పశ్చిమము (నైరృతి దిక్కు) (South-West) దీర్ఘాదేవి
వరుణుడు - పడమర (West) శూనాదేవి
వాయువు - పశ్చిమోత్తరము (వాయువ్యము) (North-West) అంజన
కుబేరుడు - ఉత్తరము (North) చిత్రలేఖ
ఈశానుడు - పూర్వోత్తరము (ఈశాన్యము) (North - East) ఈశ్వరి

సంసార సముద్రంగా కనిపించే ఈ జగత్తును పద్మనాభుడనగు నాయందు వికసిత పద్మముగా చూడండి.

చరణములు : నా పాదపద్మములయందు సూర్యచంద్ర కాంతులు. మేరువులవంటి బంగారు ధ్వజములు. బ్రహ్మ లోకము గొడుగు (ఆతపత్రము) వంటిది. బ్రహ్మలోకముపై నాచరణములు భావించండి. సర్వాలంకారయుక్తంగా భాస్తిస్తూ ఉన్నట్లు (ఈ విశ్వమంతా శ్రీవిష్ణు పాదముల అలంకారమగు పారాణి).

శ్రీవత్సము : శ్రీవత్సం చ స్వరూపం చ వర్తతే లాంఛనైః సహ, శ్రీవత్సలక్షణం - తస్మాత్ కథ్యతే బ్రహ్మవాదిభిః। సమస్త లాంఛనములతో, శ్రీవత్స (ప్రేమ, కరుణ, మైత్రీ ఇత్యాది) లక్షణములతో భాసిస్తున్నది కాబట్టి ‘‘శ్రీవత్సాంకితుడు’’ - అని పరమాత్మనగు నా నారాయణ స్వరూపమును బ్రహ్మవేత్తలు స్తుతిస్తున్నారు. శ్రీ విష్ణు భగవానుని ఱొమ్ముపై మచ్చ - శ్రీవత్సము).

కౌస్తుభమణి : యేన సూర్య అగ్ని వాక్ చంద్ర తేజసా స్వస్వరూపిణా, వర్తతే కౌస్తుభాఖ్యం మణిం వదంతి ఈశమానినః। ఏదైతే సర్వజీవులలో సూర్య - అగ్ని - వాక్ - చంద్ర తేజస్సులతో కూడి ‘స్వస్వరూపముగా’ ప్రకాశిస్తోందో, అట్టి ఆత్మప్రకాశిని కాబట్టి ఈశ్వర సేవ చేయువారు ‘కౌస్తుభమణి’ని నా అలంకారంగా వర్ణిస్తున్నారు. (కౌస్తుభమణి = సముద్రములో పుట్టి శ్రీవిష్ణు భగవానుని వక్షస్థలము అలంకరించిన మణి. భూమిని నిలిపి ఉంచు విష్ణు తేజము).

చతుర్భుజములు : సత్త్వం రజః తమః - ఇతి అహంకారః చతుర్భుజః। ప్రకృతి విశేషములగు సత్త్వ రజ తమో త్రిగుణములు, అహంకారము - ఈ ‘4’ నాయొక్క చతుర్భుజములు. (స్థూల-సూక్ష్మ-కారణ-మహా కారణములని, ప్రకృతి-పురుష-మహాపురుషులని కూడా వర్ణించి చెప్పబడింది).

శంఖము : పంచభూతాత్మకం శంఖం కరే రజసి సంస్థితమ్। చేతిలో ఉన్న శంఖము పంచమహాభూతములకు (భూమి-ఆపో- తేజో-వాయు-ఆకాశములకు), వాటివాటి ధర్మములకు (Functions) - సంజ్ఞగా భావిస్తున్నారు. (శం = ఈ సృష్ఠి మొత్తానికి సమన్వయము కలుగజేయు, ఖం = ఆకాశము).

చక్రము : మనస్సుకు సంజ్ఞ। బాల స్వరూపం ఇత్యంతం ‘మనః’ చక్రం నిగద్యతే। బాలకృష్ణుని లీలా వినోదములు ‘‘మనఃచక్ర చమత్కారములు’’గా చెప్పబడుచున్నాయి. (సుదర్శన చక్రము = సమస్తమును దర్శించుచున్న మనస్సుకు సంజ్ఞ).

శాఙ్గము : (ధనస్సు) ఆద్యా మాయా భవేత్ శాఙ్గమ్। మాయ యొక్క ప్రథమోత్పత్తి - చమత్కారమునకు ధనస్సు ప్రతీక. జీవులను కల్పనయందు రమింపజేస్తూ, ‘ఏమరుపు’ కలిగిస్తూ ఉన్నట్టిది.

పద్మము: పద్మమ్ విశ్వకరేస్థితమ్। ఈ సమస్త విశ్వముయొక్క ధారణయే-శ్రీమన్నారాయణ ప్రతిమయొక్క చేతిలో ధరించిన పద్మము. పరమాత్మ అనే సముద్రంలో విరిసిన పద్మమే ఈ విశ్వ దృశ్యము.

గద: ఆద్యా విద్యా గదా వేద్యా। ఆది విద్యాయగు ఆత్మవిద్యయే ‘గద’ - అని స్తుతించబడుతోంది. ‘అవిద్య’ అనే భీకరమైన (అడ్డుగా ఉన్న) శిలను పగలగొట్టి ‘‘పొడి’’ చేసివేయునది.

కేయూరములు : ధర్మ-అర్థ-కామములే భూజాలంకారములగు కేయూరములుగా దర్శించబడుచున్నాయి.

ఆభరణములు : దివ్యమయమగు గుణసంపదలు.

కంఠం : కంఠం తు నిర్గుణం ప్రోక్తం। నిర్గుణ బ్రహ్మము కంఠము, కంఠాభరణములుగా చెప్పబడుతోంది. (లింగము = నిర్గుణ బ్రహ్మము. నిర్గుణ స్వరూపము). (గుణములకు మునుముందే ఉన్నట్టి - ఈ జీవునియొక్క - కేవల చైతన్యరూప సౌందర్యము).

మాల్యం : మాల్యతే ఆద్యయా అజయా। మాయాలంకారమే ‘మాల’. ‘ప్రకృతి, మాయ’ అనే ఆత్మయొక్క అలంకారమే ‘మాల’.

మాల - మాలా నిగద్యతే, బ్రహ్మన్। తవ పుత్రైస్తు మానసైః। ఓ బ్రహ్మదేవా! తమ మానస పుత్రులగు నారదుడు మొదలైనవారు నాయొక్క ‘మాలాంకారము’గా (Decoration of Garlands) స్తుతించబడుచున్నారు. సనక-సనంద-సనత్కుమార-సనత్కుమార- సనస్సుజాత-వసిష్ఠాది బ్రహ్మమానస పుత్రులు నాకు మాలలు.

కిరీటము : సత్త్వ (The Presence) రూపమగు కూటస్థునికి గుర్తు. ‘సత్’కు సంజ్ఞ.

కుండల యుగళము : బ్రహ్మమానస సాగరము, క్షీరోత్తరము నాకు కుండల ద్వయము. (ఇహ-పరములు నాకు రెండు కుండలములు).

ఎవ్వరైతే నాయొక్క సాకార ప్రతిమను పైవిధములుగా భావించి ధ్యానిస్తూ ఉంటారో, అట్టివారు నాకు ప్రియులు. వారికి మోక్షము కరతలామలకము కాగలదు. అట్టివాడు ముక్తుడు అగుచున్నాడు. ఇక్కడి దృశ్య - దేహ - జగత్ - అంతరంగము మొదలైన ఆయా సమస్త విషయములు ఆతనికి బంధములు కావు. పైగా, అలంకారప్రాయములు అవుతాయి. అట్టివారికి నాయొక్క అఖండాత్మస్వరూపము సంప్రకటితమౌతూ ఉంటుంది.

ఓ విధీ। బ్రహ్మదేవా। నేను మీయొక్క భవిష్యత్ సృష్టిరచనకై ఉపాసనరూపంగా పై విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను.


బ్రహ్మదేవుడు : పరమాత్మా! శ్రీమన్నారాయణా! మీ అసలైన రూపము ఎట్టిది? సగుణమా? నిర్గుణమా?

శ్రీమన్నారాయణుడు: స్వరూపం ద్వివిధంచైవ-సగుణమ్, నిర్గుణాత్మకమ్। నాకు రెండు రూపములు ఉన్నాయి. (1) సగుణరూపము (2) నిర్గుణరూపము. (సాకారమగు బంగారు ఆభరణము, నిరాకారమగు బంగారమువలె, సాకారమగు తరంగములు, నిరాకారమగు జలమువలె)।

బ్రహ్మదేవుడు: మీరు వాస్తవానికి నిరాకారులే అయి ఉండగా, తమ సాకార ఉపాసనారూపమును, అట్టి సారూప్యముయొక్క శంఖచక్ర కిరీటాది ఆభరణముల అంతరార్థములు చెప్పారు. చాలా సంతోషము. అయితే నాకు ఇక్కడ ఒక సందేహము మనస్సులో జనిస్తోంది.

⁉️ నిర్గుణ, నిరాకార, అమూర్త, నిరాలంబులగు మీకు - (వ్యక్తులకు ఆభరణములుగా అగుచూ ఉండునట్టి) కిరీటము, భుజకీర్తులు మొదలైనవి ఆభరణములుగా ఎట్లా అవుతాయి?

⁉️ ఇంకొక ప్రశ్న. మిమ్ములను బ్రహ్మ, రుద్రుడు, మొదలైన దేవతలు ఏవిధంగా ధ్యానిస్తూ ఉంటారు? సాకారంగానా? నిరాకారంగానా?

⁉️ జీవులలో బ్రహ్మజ్ఞులు, శివపార్వతుల సంకల్ప జనితులగ గణపతి, ద్వాదశాదిత్యులు మిమ్ములను ఏఏ రీతులుగా ఉపాసిస్తున్నారు?

⁉️ ఈ వివిధ దేవత - మానవ మొదలైనవారి ఉపాసనలు ఏఏ తీరులైనవి?

⁉️ ఇంకా వసువులు, గంధర్వులు, ఎట్లా పూజిస్తున్నారు?

⁉️ సపదానుగ అయి (జగత్తును ఆశ్రయిస్తూనే) అశరీరులై ఉండే సూక్ష్మ స్వరూపులగు దేవతలు, మహర్షులు మొదలైనవారు ఎట్లా ఆరాధిస్తున్నారు?

ఈ ఈ విశేషాలు నాకు తెలియిజేయండి.

శ్రీమన్నారాయణుడు : నారాయణుడగు నేను సమస్త సాకార-గుణ-సారూప్య తత్త్వములకు మునుముందే తేజో-చైతన్యకేవలరూపుడనై ఉన్నాను. అది నాయొక్క నిర్గుణ, నిరాకార విశేష చమత్కారము. అది ఎప్పటికీ చెక్కుచెదరనిది.

అట్టి నిరాకరరూపమే వ్యక్తీకరణము (Manifestation) అనే ‘లీల’ ను స్వీకరించి ద్వాదశమూర్తులుగా (ద్వాదశాదిత్యులుగా) మూర్తీభవమగుచున్నాను. సమస్త రూపములు, గుణములు నావే కాబట్టి నేను రూప -గుణరహితుడనని చెప్పబడుచున్నాను. సమస్త రూపములు నావే అయినప్పుడు ఏ రూపము నాదని చెప్పగలరు? ఆభరణములన్నీ బంగారమే అయి ఉండగా, బంగారమునకు ‘ఇది’ అనే ఆకారమేముంటుంది?

అట్టి నా అవ్యక్తము యొక్క వ్యక్తీకరణమే :- - సర్వలోకములుగా - సర్వలోకములలో,
- సమస్త దేవతలుగా - సమస్త దేవతలలో,
- సర్వ మానవులుగా - సర్వమానవులలో,
- సర్వ జీవులుగా - సర్వజీవులలో, వారి జీవనముగా - జీవనములలో
సంతిష్ఠితమై ఉన్నది (placed in all).

రుద్రులందు రౌద్రీస్వరూపుడను। బ్రహ్మయందు బ్రాహ్మీ స్వరూపుడను. దేవతలలో దివ్య-దైవీ స్వరూపుడను। మనుష్యులలో మానవత్వమును. వినాయకునిలో విఘ్నవినాశనిని। ఆదిత్యుని (సూర్యుని)యందు తేజో (జ్యోతి) స్వరూపుడనై ఉన్నాను. గంధర్వులలో గాంధర్వీరూపుడను। అప్సరసలలో ‘గో’ స్వరూపుడను। వసువులలో కామ్యస్వరూపుడను। కళ్ళకు కనబడని అంతర్ధాన జీవులలో ప్రత్యక్షము కాగల ప్రకాశమాన (Art of manifesting) తత్త్వమై ఉన్నాను!
సమస్తము ప్రకాశింపజేయువాడనై ఉన్నాను.

సమస్తమైన ఆవిర్భావ (Generatings), తిరోభావములు (withdrawing Distributions, De-Generatings) నాయందే ఏర్పడుచున్నవై ఉండగా, నేను స్వపదము నందు ప్రకాశమానమై ఉన్నాను.

దుర్వాసమహర్షి : ఒక రచయిత యొక్క రచనా కళా విశేషమే (The Art of Writing pertaining to a Novelist) కథారచనలో అనేక మంచిచెడు (Hero and Villan) పాత్రలు గుణగణములు, సంభాషణలు కల్పిస్తోంది కదా! అట్లాగే పరమాత్మయగు శ్రీకృష్ణభగవానుడే చైతన్యరూపుడై తామసులలో తామసగుణి గాను, రాజసులలో రాజసగుణి గాను, సాత్వికులలో సాత్వికుడి గాను, మానవులలో మానవుడు గాను, భక్తయోగులలో భక్తిరసముగాను ప్రతిష్ఠితుడై ఉన్నారు.

ప్రాణాత్మకుడుగా భూః-భువ-సువర్ లోకములలో విస్తరించి ఉన్నట్టి ఓం తత్ సత్ ప్రాణాత్మకునకు నమస్కరించుచున్నాము.

Ⅰ. ఓం ప్రాణాత్మనే నమో నమః

ఓం ప్రాణాత్మనే, ఓం తత్సద్భుర్భువస్సువః, తస్మై ప్రాణాత్మనే నమో నమః।
ఓం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ
ఓం తత్సత్ భూర్భువః తస్మైవై నమో నమః

భూ-భువ-సువ స్వరూపుడై, తత్-సత్ స్వరూపుడైన శ్రీకృష్ణా! గోవిందా! గోపీజనవల్లభా! నమోనమః।

Ⅱ. ఓం అపానాత్మనే నమో నమః

ఓం అపానాత్మనే ఓం తత్సత్ భూర్భువస్సువః తస్మై అపానాత్మనే నమో నమః

ఓం భూర్భువస్సువ త్రిలోకములుగా విస్తరించినవారైనట్టి ఓంతత్ సత్ స్వరూపుడు, అపానాత్మ అనిరుద్ధ స్వరూపుడు - అగు శ్రీకృష్ణునకు నమస్కారము.

ఓం శ్రీకృష్ణాయ అనిరుద్ధాయ। ఓం తత్సత్ భూర్భువస్సువః తస్మై వై నమో నమః।

ఓం తత్‌సత్ స్వరూపుడై త్రిలోకములుగా ప్రదర్శనమగుచున్న అనిరుద్ధ స్వరూప శ్రీకృష్ణునికి నమస్కారము.

Ⅲ. ఓం వ్యానాత్మనే నమః।।

ఓం ‘‘వ్యానాత్మనే’’ ఓం తత్‌సత్ భూర్భువస్సువః తస్మై వ్యానాత్మనే నమో నమః।।

వ్యానాత్మ స్వరూపుడగు పరమాత్మకు నమస్కారము.

ఓం శ్రీకృష్ణాయ రామాయ ఓం తత్సత్ భూర్భువస్సువః తస్మై వై నమో నమః

‘తత్సత్ ఓం’ స్వరూపులకు కృష్ణ బలరాములకు, వారి త్రిలోకములుగా వ్యాపించిన రూపమునకు నమస్కారము.

Ⅳ. ఓం ఉదానాత్మనే నమో నమః।।

ఓం ‘‘ఉదానాత్మనే’’ ఓం తత్సత్ భూర్భువస్సువః తస్మై ఉదానాత్మనే నమోనమః
ఓం శ్రీకృష్ణాయ దేవకీనందనాయ। ఓం తత్సర్భూర్భూవస్సువః తస్మైవై నమో నమః।।

త్రిలోకవ్యాపియై ఉదానప్రాణస్వరూపుడుగా త్రిలోకములు వ్యాపించిన ఉదానాత్మ భగవానునకు నమస్కారము.

Ⅴ. ఓం సమానాత్మనే నమః।

ఓం సమానాత్మనే ఓం తత్సత్ భూర్భువస్సువః తస్మై సమానాత్మనే నమో నమః

తత్ స్వరూప సమానాత్మ ప్రాణస్వరూపుడై త్రిలోకములలో విస్తరించి ఉన్న పరమాత్మకు నమస్కారము.

Ⅵ. ఓం నిజస్వరూపాయ నమః।।

ఓం గోపాలాయ నిజస్వరూపాయ। ఓం తత్సత్ భూర్భువస్సువః తస్మైవై నమోనమః।।

సమస్త జీవులలో నిజస్వరూపుడై ఓం తత్సత్ త్రిలోకములుగా ప్రదర్శనమగుచున్న పరమాత్మకు నమస్కారము

Ⅶ. ఓం ప్రధానాత్మ గోపాలాయ నమో నమః।।

ఓం యో-సౌ ప్రధానాత్మా గోపాల। ఓం తత్‌సత్ భూర్భువస్సువః తస్మై వై నమో నమః।

‘ఓం తత్‌సత్’ అని పిలవడు ఏ ముఖ్యప్రాణాత్ముడు త్రిలోకస్వరూపుడై ఉన్నారో- అట్టి పరబ్రహ్మమునకు నమస్కారము.

Ⅷ. ఓం ఇంద్రియాత్మా గోపాలాయన నమోనమః।।

ఓం యో-అసౌ, ఇంద్రియాత్మా గోపాల। ఓం తత్‌సత్ భూర్భువస్సువః తస్మై వై నమో నమః।।

ఏతత్‌సత్ ఇంద్రియాత్మగా త్రిలోకములలో రూపధారణ చేయుచున్నదో - అట్టి ఆత్మబ్రహ్మమునకు నమస్కారము.

Ⅸ. ఓం భూతాత్మా గోపాలతనయో నమో నమః।।

ఓం యో-అసౌ భూతాత్మా గోపాల। ఓం తత్సత్ భూర్భువస్సువః తస్మై వై నమో నమః।।

పాంచ భౌతికములగు భూతాత్మ (జీవాత్మ) తానే అయిఉన్నట్టి, త్రిలోకములు ఆక్రమించి ఉన్నట్టి గోపాల ఓం తత్ స్వరూపునికి నమస్కారము.

Ⅹ. ఓం ఉత్తమ పురుషగోపాలాయ నమః

ఓం యో-అసౌ ఉత్తమ పురుషో గోపాల। ఓం తత్‌సత్ భూర్భువస్సువః తస్మై వై నమో నమః।।

(ఉత్తమ పురుష = ‘‘నేను’’ / మధ్యమపురుష = నీవు / ప్రథమ పురుష = ఆతడు)

ఏ ఓం తత్ సత్ స్వరూప గోపాలుడైతే భూ-భువ-సువః - త్రిలోకములలో సమస్త జీవులలో ‘నేను’ ‘నేను’ రూపముగా ప్రకాశమానమగుచున్నారో అట్టి ఉత్తమపురుష గోపాలునికి నమస్కారము.

Ⅺ. ఓం బ్రహ్మా పరంవై నమోనమః।।

ఓం యో అసౌ బ్రహ్మా పరం వై బ్రహ్మ ఓం తత్‌సత్ భూర్భువస్సువః తస్మై వై నమో నమః

ఏ ఓం తత్ సత్ భూర్భవస్సువ స్వరూపుడైతే సృష్టికర్త అగు బ్రహ్మదేవుని కూడా సృష్టించువారై, పరబ్రహ్మమూర్తి అయి ఉన్నారో, అట్టి కృష్ణపరబ్రహ్మమునకు నమస్కారము.

Ⅻ. ఓం సర్వభూతాత్మాయ నమః

ఓం యో-సౌ సర్వభూతాత్మా గోపాల। ఓం తత్సత్ భూర్భువస్సువః తస్మై వై నమో నమః।

సర్వజీవులలో ఆత్మగా వేంచేసినవారై యున్న తత్‌సత్ ఓం - త్రిలోక స్వరూప కృష్ణ పరమాత్మకు నమస్కారము.

ⅩⅢ. ఓం సర్వభూతాంతరాత్మనే నమః।

ఓం జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయ, తురీయాతీతో అంతర్యామీ గోపాల। ఓం తత్‌సత్ భూర్భువస్సువః తస్మై వై నమో నమః।

ఏ ‘‘ఓంతత్‌సత్ స్వరూప త్రిలోకాంతర్గత గోపాలుడైతే’’ జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల సాక్షి యగు (4వ వాడగు) తురీయమునకు ఆవల తురీయాతీత - అంతర్యామి అయి ఉన్నారో అట్టి గోపాలకృష్ణ అంతరాంతరునకు నమస్కారము. 🙏

శ్లో।।  ఏకోదేవః సర్వభూతేషుగూఢః! సర్వవ్యాపీ। సర్వభూతాంతరాత్మా!  
    కర్మాధ్యక్షః। సర్వభూతాధివాసః।, సాక్షీ చేతా। కేవలో నిర్గుశ్చ।।

ఓ వ్రజ గోపికలారా। ఒకానొక పరమ - ఆత్యంతిక సత్యమును మనము ఎలుగెత్తి గానము చేస్తున్నాము. వినండి.

ఆ దేవాదిదేవుడు సర్వదా ఏకస్వరూపుడు. ఆయన సర్వజీవులలో రహస్యముగా (బాహ్య దృష్టిచే కనబడనివారై) ఉన్నారు. (తరంగాలలో జలమువలె, ఆభరణములలో బంగారమువలె, స్వప్నములో స్వప్నద్రష్టవలె, కథలో కథా రచయితవలె) సర్వత్రా వ్యాపించిన వారై ఉన్నారు. సర్వజీవులలో అంతరాత్మ అయి ఉన్నారు.

ఆయన సమస్త కర్మలకు సాక్షియేగాని కర్మ - కర్మఫలములలోకి దిగివచ్చువారు కాదు. (నవల చదివేవాడు నవలలో ప్రవేశించడుగదా। దృశ్యము చూచే ద్రష్ట దృశ్యములో ప్రవేశించడు కదా)।
(చక్రవర్తి సభను అధ్యక్షత వహించు తీరుగా) ఆయన సమస్త జగత్ కార్యక్రమములకు, వాటి పరంపరలకు అధ్యక్షుడు. (He presides over everything else).

ఆయన సర్వజీవులయొక్క ఆది (The begining) స్వరూపుడై మునుముందే వసించువారై ఉన్నారు.
- ఆయన బుద్ధికి కూడా సాక్షి అయి ఉన్నారు.
- సర్వదా కేవలుడై ఉన్నారు (The Absolute of ourselves)

ఆయన గుణములకు ఆవల ‘గుణి’ స్వరూపుడు। నిర్గుణ స్వరూపుడు. గుణములకంటే ముందే ఉన్నవారు.
శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మమే. కాబట్టి నిర్గుణుడు అయి ఉన్నారు. బ్రహ్మమునే ఆచరణముగా కలిగి ఉండటంచేత బ్రహ్మచారియే।
ఆయనయే నీవు।
ఆయనయే నేను।
అట్టి శ్రీకృష్ణానంద పరమాత్మకు నమో నమః।

గుణుడు - నిర్గుణుడు కూడా అయినట్టి - శ్రీకృష్ణుని రూపాత్మకములు (మరియు) రూపాంతరములు అయినట్టి…
రుద్రాయ నమః। ఆదిత్యాయ నమః। వినాయకాయ నమః। సూర్యాయ నమః। విద్యాయై నమః। ఇంద్రాయ నమః। అగ్నయే నమః। యమాయ నమః। నిరృతయే నమః। వరుణాయ నమః। వాయవే నమః। కుబేరాయ నమః। ఈశానాయ నమః। సర్వేభ్యో దేవేభ్యో నమః।

ఓ వ్రజగోపికలారా! ఈ విధంగా శ్రీమన్నారాయణుడు పుణ్యతమమైన స్తుతిని - స్వస్వరూపి, సర్వభూతసృష్టికర్త అగు బ్రహ్మదేవునికి అనేకరీతులుగా బోధించి, శ్రీమన్నారాయణుడు - ఆ తరువాత అంతర్ధానమైనారు.

ఈ విషయాలన్నీ బ్రహ్మదేవుడు నారదునికి వినిపించారు. నారదుడు మునిలోకానికి విశదపరచారు.

ఓం గాంధర్వీ! ఓ వ్రజ గోపికలారా! సర్వాంతర్యామి, సర్వతత్త్వ స్వరూపుడు అగు శ్రీకృష్ణ భగవానునికి నమస్కారము. ఆయనకు ప్రియత్వముచే అనన్యులైన మీకు నమస్కారము. ఇక మీరు క్షేమముగా వెళ్ళిరండి.

వ్రతఫలములములన్నీ శ్రీమన్నారాయణావతారుడగు శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పించి, ఆ శ్రీకృష్ణునితో అనన్యానందము సిద్ధించుకొనెదరు గాక!

🙏 ఇతి గోపాల ఉత్తర తాపిని ఉపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।