[[@YHRK]] [[@Spiritual]]

ātma Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


అధర్వణ వేదాంతర్గత

4     ఆత్మోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। యత్ర అనాత్మ ప్రపంచోఽయమ్ అపహ్నవ పదం గతః।
ప్రతియోగి వినిర్ముక్తః ‘‘పరమాత్మ’’ అవశిష్యతే।।

అజ్ఞాన-అవిచారములవశంగానే - బాహ్య అన్య భేదరూపమగు అనాత్మక ప్రపంచ భావన ఈ జీవుని ఆత్మ దృష్టిని అపహ్న పరచుచున్నది (మరగుపరచుచున్నది. కప్పి ఉంచుచున్నది). అట్టి ఆవరణ దృష్టి దోషము తొలగిపోగా, ఇక అప్పటి నిర్మల దృష్టికి, - సర్వే సర్వత్రా, సర్వదా ఈ సమస్తమూ “అమృత-అఖండ స్వస్వరూప పరమాత్మానుభవము” అయి - అవశేషించగలదు.

ఓం
1. అథ అంగిరాః (అంగిరసముని వరేణ్యులు):
త్రి విధః పురుషో అజాయత।
(1) ఆత్మా (బాహ్యాత్మా)
(2) అంతరాత్మా
(3) పరమాత్మా చ ఇతి।
‘ఓం’కార సంజ్ఞార్థుడగు పరమాత్మకు నమస్కరిస్తూ…
అంగిరస మహర్షి (ప్రవచనము):
సమస్తము తన పురుషకారముగా కలిగియున్న (పరమ) లేక (ఉత్తమ) పురుషుడు (The Absolute ‘I’ of prior to all else) మూడు విధములైన రూపములు దాల్చుచున్నాడు.
(1) ఆత్మ (బాహ్యాత్మ), (2) అంతరాత్మ (3) పరమాత్మ
(అథ బాహ్యాత్మా నామ।) త్వక్ చర్మ మాగ్ంస
రోమ అంగుష్ఠ అంగుల్యః
పృష్ఠ వంశ నఖ గుల్ఫ ఉదర నాభి
మేఢ్ర కటి ఊరు కపోల
శ్రోత్ర భ్రూ లలాట బాహు పార్శ్వ శిరో అక్షీణి -
భవంతి, - జాయతే, మ్రియతే -
ఇతి ఏష ‘‘బాహ్యాత్మా’’ ।।
బాహ్యాత్మ (భౌతికము) : ఇది ఈ జీవునియొక్క పుట్టుక - జీవనము - మరణము అనబడే ధర్మములు కలిగి ఉన్నట్టి పురుషాకార విభాగము. ఇదియే ‘‘బాహ్యాత్మ’’ అనబడుతోంది.
ఇది భౌతిక సంబంధమైనది. త్వక్కు (తోలు), చర్మము, మాంసము, వెంట్రుకలు, బొటనవ్రేలు, తదితర వ్రేళ్ళు (Fingures), వీపు, వెన్నెముక, చీలమండలము, పొట్ట, బొడ్డు, మేఢ్రము, మూత్ర విసర్జనావయము, నడుము, తొడలు, చెక్కిలి, చెవులు, (రెండు కనుబొమ్మల మధ్యగల) భ్రూమధ్యము, నుదురు, చేతులు, భుజములు, శిరస్సు, కళ్ళు గల ఈ భౌతిక రూపము- ‘‘బాహ్యాత్మ’’. (Physical side of the Functioner)
2. అథ ‘‘అంతరాత్మా’’ నామ। :-
పృథివి ఆపః తేజో వాయుః ఆకాశమ్।
- ఇచ్ఛా ద్వేష సుఖ దుఃఖ కామ మోహ
వికల్పన - ఆది,
స్మృతి లింగ, ఉదాత్త అనుదాత్త
హ్రస్వ దీర్ఘ ప్లుత స్ఖలిత గర్జిత
స్ఫుటిత ముదిత నృత్త గీత వాదిత్ర
ప్రళయ విజృంభిత - ఆదిభిః। …,
అంతరాత్మ :
పంచభూతములు (భూమి, జలము, తేజస్సు, /అగ్ని, వాయువు, ఆకాశము)- (Sold, Liquid, Light / Fire, Vapour, Space)
మనో వికల్పములు : ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, కామము, మోహము మొదలైన మనోవికారముల పురుషకారము,
స్మృతి = జ్ఞాపకము, ఎరుక, స్మరించు విషయములు పురుషకారము,
లింగము = ప్రకృతి, మూలప్రకృతి రూపము, స్వభావము,
శ్రోత్ర శ్రవణము (Hearing): = హ్రస్వమైన (చిన్న), దీర్ఘమైన స్వరములను, జాలువారు (మరియు) బిగ్గర గర్జనలను, స్పష్టమైన శబ్దములను, సంతోషముతో కూడి నృత్య గీత వాద్యములను, ప్రళయ విజృంభిత శబ్దములను, నినదములను వినునది, అనుభవములుగా పొందునది.
శ్రోతా, ఘ్రాతా, రసయితా, నేతా, బోద్ధా,
కర్తా, విజ్ఞానాత్మా, పురుషః
పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్త్రాణి ఇతి,
- శ్రవణ ఘ్రాణ ఆకర్షణ కర్మ విశేషణం
కరోతి - ఏషో ‘‘అంతరాత్మా’’।
వాసనానుభవి. రసానుభవములను పొందునది. ఇంద్రియములను నియమించునది. బోధించునది. కర్మలకు కర్తృత్వము వహించునది. సర్వ విషయములను తెలుసుకొనుచున్నట్టిది. పురాణ - న్యాయ - ధర్మశాస్త్రముల విశేషములకు పురుషకారము వహించుచున్నది. సర్వము వినునది, వాసన చూచునది, కర్మ విశేషములచే ఈడువబడునది - ఇది ‘‘అంతరాత్మ’’.
3. అథ పరమాత్మా నామ :-
యథా అక్షర ఉపాసనీయః।
స చ ప్రాణాయామ ప్రత్యాహార
ధారణా ధ్యాన సమాధి యోగాత్,
అనుమాన-ఆత్మ చింతక ।
పరమాత్మ : ఇంద్రియములకు విషయముయే వస్తువు వంటిది కాదు. మనస్సుకు అనుభవమయే విషయము వంటిది కాదు.
క్షరము (హెచ్చుతగ్గులు) లేనిది. (1) యమ, (2) నియమ, (3) ఆసన, (4) ప్రాణాయామ, (5) ప్రత్యాహార, (6) ధారణ, (7) ధ్యాన, (8) సమాధి అనబడే అష్టాంగ యోగములచేతను, అనుమాన (By differentiation) ప్రత్యక్ష ప్రమాణములచేతను, చింతన చేయబడుచున్నట్టిది.
వటకణికా వా, శ్యామాక తండులో వా,
వాలాగ్ర శత సాహస్ర వికల్పన - ఆదిభిర్వా
స లభ్యతే।
న ఉపలభ్యతే।
న జాయతే। న మ్రియతే।
న శుష్యతి। న క్లిద్యతే। …,
వట బీజములో రహస్యంగా దాగిన అంకుర శక్తివలెను, శ్యామ (తండుల) ధాన్యపు గింజ యొక్క చిట్ట చివరి భాగముయొక్క - వెయ్యో వంతువలె సూక్ష్మాతి సూక్ష్మము. సమస్త సంకల్ప-వికల్పనలకు మును ముందుగా ఏర్పడినదై ఉన్నట్టిది. సంకల్ప - వికల్పనలలో లభించనిది. ప్రయాణించి పొందవలసినది కాదు.
అట్టి పరమాత్మ జన్మించదు, మరణించదు, శుష్కించదు, తడుపబడదు.
జాగ్రత్-స్వప్న- సుషుప్తులలోను, జన్మ-జన్మాంతరములలోను ‘నేను’ - అను ఉపకరణమును వెంటనిడుకొని సంచారములు చేస్తూ ఉన్నట్టిది.
న దహ్యతే। న కంపతే।
న భిద్యతే। న స్విద్యతే।
నిర్గుణ సాక్షీభూత శుద్ధో
నిరవయవాత్మా।
కేవలః సూక్ష్మో। …,
అట్టి ‘‘నేను’’ రూపి అగు పరమాత్మ యొక్క స్వరూపము దహించబడదు, (కాలదు). కంపనము పొందదు. ఖండించబడదు. భేదించబడదు. (భౌతికదేహము వంటిది కాదు).
గుణములకు ముందే ఉన్నట్టిది కాబట్టి ‘‘నిర్గుణము’’. (దృశ్యమునకు ద్రష్టవలె) సమస్తమునకు ‘‘సాక్షీభూతము’’. ఏ దోషములు అంటవు. ‘పరమశుద్ధము’. అవయవములను కదిల్చునట్టిదేగాని అవయవ రూపము కాదు. ‘‘నిరవయవి’’.
సమస్త సందర్భములకు ఆవల కేవలసత్యమై ఉన్నట్టిది. ఇంద్రియములకు అవిషయము కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మము.
నిర్మమో। నిరంజనో। నిర్వికారః। …,
శబ్ద స్పర్శ రూప రస గంధ వర్జితో।
నిర్వికల్పో, నిరాకాంక్షః।
సర్వ వ్యాపీ।
సో అచిన్త్యో।
అనిర్వర్ణ్యశ్చ।
పునాతి అశుద్ధాని, అపూతాని।
నిష్క్రియః।
తస్య సగ్ంసారో నాస్తి।।
(తత్ - ఆత్మ సంజ్ఞః)।
‘నాది’ కి సంబంధించని కేవలసాక్షియగు ‘నేను’ స్వరూపము కాబట్టి నిర్మమము. దోషములు అంటవు. నిరంజనము. ఎట్టి వికారములు లేనట్టిది. నిర్వికారము. ఇంద్రియార్థములైనట్టి శబ్ద స్పర్శ రూప రస గంధముల సంబంధము కలిగి ఉండనట్టిది. ‘ఇంద్రియార్థ వివర్జితము.’
సంకల్పములకు మునుముందే ఉన్నట్టిది. నిర్వికల్పము.
ఒకడు - తన రాత్రి కలలో కనిపించిన ఒక వస్తువును కాంక్షిస్తూ తెల్లారి బద్ధుడై పోతాడా? పోడు. అట్లాగే దృశ్యము ఆత్మకు స్వకీయ కల్పిత స్వప్నమువంటిదే కాబట్టి ఆకాంక్షలు లేనట్టిది.
- (కథా రచయిత కథలోవలె) పరమాత్మ సర్వవ్యాపి. ఆలోచనలు అద్దానివేగాని, ఆలోచనలకు (మనస్సుకు) అందనిది. వర్ణించి చెప్పబడ జాలనిది కాబట్టి అనిర్వర్ణ్యము. అట్టి పరమాత్మయొక్క జ్ఞానము అశుద్ధుని శుద్ధిగాను, అపవిత్రుని పవిత్రునిగాని చేయునదై ఉన్నది. కర్మలచే పరిమితము కాదు. నిష్క్రియము. పరమాత్మకు సంసారము అనే బంధము గాని, పరిమితముగాని లేవు. ‘‘అపరిమితము. అప్రమేయము’’.
4. ఆత్మసంజ్ఞః :-
శివ శుద్ధ ఏకఏవ
అద్వయః సదా।
(సదా) బ్రహ్మరూపతయా
బ్రహ్మ కేవలం ప్రతిభాసతే →
‘‘జగత్’’ రూపతయా - అపి,
ఏతత్ బ్రహ్మైవ ప్రతిభాసతే।
ఆత్మయొక్క సంజ్ఞ ఇంకా ఎట్టిదంటే…,
శుభప్రదము. శివము. శుద్ధము. ఆదియందు, ఆ తరువాత కూడా ఎల్లప్పుడు ఏకము, అద్వయము అయి ఉన్నట్టిది. (It is always as it is).
బ్రహ్మమే సర్వదా బ్రహ్మమునందు ప్రకాశించుచున్నది. అద్దానియందు ఊర్ధ్వ అథోలోకములు మొదలైనవి లేవు. (అద్దములో అద్దమే ఉంటుందిగాని, వస్తు జాలములు ఉండవు కదా)!
ఈ జగత్తు ఆత్మయందు (దర్పణములో దృశ్యమువలె) ప్రతిబింబిస్తోంది. అయితే బ్రహ్మమే బ్రహ్మమునందు జగత్ - రూపంగా (దృష్టియందు) ప్రతిబింబిస్తోంది.
విద్య - అవిద్యాది భేదేన,
భావ - అభావాది భేదతః,
గురు - శిష్యాది భేదేన →
బ్రహ్మైవ ప్రతిభాసతే।
విద్య - అవిద్య మొదలైన భేదరూపములుగాను, భావము - అభావము మొదలైన రూపములుగాను, గురువు - శిష్యుడు అను భేదములుగాను - పరమాత్మయే (లేక) బ్రహ్మమే ప్రతిభాసిస్తోంది.
బ్రహ్మైవ కేవలం శుద్ధం
విద్యతే తత్త్వదర్శనే।
న చ విద్యా। న చ అవిద్యా।
న జగత్ చ। న చ అపరమ్।
తత్త్వదర్శనముచే (తత్ త్వమేవ - అను నిర్మల ఆత్మదృష్టిచే) సర్వత్రా శుద్ధమగు బ్రహ్మమే అనుభూతమవగలదు. తత్త్వజ్ఞుల అనుభవములో సమస్తము ఆత్మయే।
(కలలో వాస్తవానికి ఏ వస్తువు లేని తీరుగానే) ఇక్కడ విద్యలేదు. అవిద్య లేదు. జగత్తు లేదు. పర-అపరములనబడే రెండు వేరైనవి లేవు.
సత్యత్వేన జగత్ భాసం (నం)
సంసారస్య ప్రవర్తకమ్।
అసత్యత్వేన భానం తు
సంసారస్య నివర్తకమ్।
(కలలో కనిపించిన ఇల్లు, వస్తువులు సత్యమా? కాదు కదా! అట్లాగే) ‘‘ఈ జగత్తు సత్యమే’’ అని భాసించటమే ‘సంసారము’ అనబడుదాని ప్రవర్తనము (Appearence ). అదియే భవ బంధము కూడా। (భవమివ బూసతియేన, తత్సంబంధమితి భావబంధః)।।
(కథలోని కొండల వర్ణనవలె) ఈ జగత్తు సత్యముకాదు. అసత్యము అని భాసించటమే (తెలియటమే) సంసారముయొక్క నివర్తకము.
‘‘ఘటో అయమ్’’ ఇతి విజ్ఞాతుం
నియమః కో అన్వపేక్షతే?
(కో ను అపేక్షతే?)
‘కుండ’గా ఉన్నదంతా మట్టియే. కానీ మట్టిలో ‘కుండ’ అనునది ఏదీ లేదు. ‘‘మట్టికుండ’’ అనుదానిలో మట్టికి వేరై ‘కుండ’ అనబడేదీ లేదు. ఈ విషయాలు తెలుసుకోవటానికి నియమము, నిష్ఠల అవసరము ఏముంటుంది? పరమాత్మను తెలుసుకోవటానికి యజ్ఞము, వ్రతము, ఉపవాసము మొదలైన నిష్ఠలతో పని ఏమి?
వినా ప్రమాణ సుష్ఠుత్వం యస్మిన్ సతి పదార్థ ధీః,
అయమాత్మా నిత్య సిద్ధః ప్రమాణే సతి భాసతే।।
న దేశం, న అపి కాలం వా,
న శుద్ధిం వాపి అపేక్షతే।
మట్టి గురించి తెలుసుకొన్న తరువాత ఇక ‘‘కుండ మట్టికి వేరైన పదార్థము’’ అనునది ఏమాత్రము ధీమంతునిపట్ల (తెలివికలవానిపట్ల) శేషించి ఉండదు కదా!
ఆత్మ నిత్యశుద్ధము (Ever Established) అని ప్రమాణముల సహాయంతో బుద్ధికి భాసించిన తరువాత, ఇక ఆపై ‘‘దేశ-కాల ప్రమాణములు కావాలి. బుద్ధి శుద్ధి అవాలి.’’ అనే అపేక్షలు (Pre-Conditions) శేషించవు.
‘దేవదత్తో అహమ్’ ఇతి ఏతత్
విజ్ఞానం నిరపేక్షకమ్,
తద్వత్ బ్రహ్మవిదోఽపి
అస్య ‘‘బ్రహ్మాహమ్’’
ఇతి వేదనమ్।।
‘దేవదత్తుడు’ అనువాడు ఉన్నాడు. ఆతనిని పిలచి, ‘‘నీవే దేవదత్తుడవు’’ - అని ఎవరైనా ప్రమాణములతో నిరూపించి చెప్పవలసిన అవసరమున్నదా?
‘నేను ఉన్నాను’ అని నాకు మరొకరు శాస్త్ర ప్రమాణములతో నిరూపించి చెప్పాలా? నేను ఉన్నానని నాకు తెలియదా?
అట్లాగే బ్రహ్మవేత్తకు, (బ్రహ్మము గురించి శ్రవణం చేసినవానికి) ‘‘నీవే బ్రహ్మము’’ అని ఎవరైనా వచ్చి చెప్పవలసిన పనేమున్నది? ‘బ్రహ్మము’ అనునది - ప్రతి జీవునియొక్క సహజ-స్వాభావికమైనట్టిది, సర్వదా స్వస్వరూపమే అయినట్టి ‘నగ్న సత్యము’. దానిని ‘‘నిరూపిస్తేనే నమ్ముతాను’’ - అనుమాటకు అర్థమేమున్నది.
5. భానునేవ జగత్ సర్వం
భాస్యతే యస్య తేజపా,
సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండగా అట్టి సూర్య ప్రకాశ తేజస్సుచే ఈ దృశ్య జగత్తు (కళ్లకు) ప్రకాశమానమై ఉంటుంది కదా!
అనాత్మకమ్, అసత్ - తుచ్ఛం, -
కిం ను తస్య అవభాసకమ్।
వేద శాస్త్ర పురాణాని భూతాని
సకలాన్యపి, యేన అర్థవంతి,
తం కిం ను విజ్ఞాతారం ప్రకాశయేత్।
అట్లాగే ఆత్మయొక్క ప్రకాశము చేతనే అనాత్మకము, అసత్-స్వరూపము అగు జగత్తు ప్రకాశమానము అవుతోంది. ఆత్మయే లేకపోతే జగత్తును తెలుసుకొనేది ఎవరు? తెలియబడుచున్నదంతా ఆత్మయొక్క సంద్రర్శనమే! జగత్తును తెలుసుకొనుచున్నట్టిదే ఆత్మ!
వేద శాస్త్ర పురాణములు, సమస్త భూతజాలము దేనిచేత ఆయా రీతులుగా అర్థవంతముగా (As meaningful) తెలుసుకోబడుతోందో, ఆ తేలుసుకుంటూ ఉన్నట్టిదే ‘ఆత్మ-ప్రకాశము’. విజ్ఞాతము-విజ్ఞాని కూడా ఆత్మస్వరూపమే।
క్షుధాం దేహవ్యథాం త్యక్త్వా
బాలః క్రీడతి వస్తుని,
తథైవ విద్వాన్ రమతే,
నిర్మమో నిరహం సుఖీ।
ఒక పిల్లవాడు ఆకలి, దేహబాధలను కూడా మరచిపోయి ఆటవస్తువులతో ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు చూచారా? ఆ విధంగా ఆత్మతత్త్వము తెలిసిన విద్వాంసుడు మమకారము - అహంకారమును వదలి ఈ జగత్తులో (క్రీడా మైదానంలోలాగా) ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు.
కామాన్ నిష్కామరూపీసన్
చరతి ఏకచరో మునిః।
స్వాత్మనైవ సదా తుష్టః
స్వయం సర్వాత్మనా స్థితః।।
(జగద్విషయములపట్ల నిశ్శబ్దము ఆవహించి, ఆత్మసంగతి పట్ల మాత్రమే సశబ్దుడైనవాడు - ముని). అట్టి ముని సమస్త ఇంద్రియ విషయములపట్ల నిష్కామి అయి, ఆత్మపట్ల మాత్రమే ఏకాంత సకామియై, ‘స్వాత్మ’ చేతనే సదా తుష్టుడు(Completely satisfied) అయి, స్వయముగా ‘అందరిలోని నేనైన నేను’ గా సర్వాత్మత్వమునందు ‘‘స్థితి’’ పొందినవాడై ఉంటాడు.
నిర్ధనోఽపి సదా తుష్టో।
అపి అసహాయో మహాబలః।
నిత్యతృప్తస్తు అభుంజానోఽపి।
అసమః సమదర్శనః।
కుర్వన్నపి న కుర్వాణశ్చ।
అభోక్తా ఫలభోగ్యపి।
ఆత్మదర్శనముచే ఆత్మయందు సంతుష్టుడైనట్టి తత్త్వజ్ఞుడు:-
- పేదవాడైనా కూడా సర్వ సంపదలచే సంతుష్టి పొందినవాడితో సమానుడై, ‘‘జగత్-జీవిత వినోది’’ అయి ఉంటాడు.
- నిస్సహాయుడు అయికూడా, (ఎవ్వరి సహాయము పొందనివాడైనప్పటికీ), (మనస్సునందు) ‘మహాబలవంతుడు’ అయి ఉంటాడు
- సర్వకర్మలు నిర్వర్తిస్తూ కూడా, ఏ కర్మ చేయనివాడై - అకర్త - అయి ఉంటాడు.
- కర్మఫలములు అనుభవిస్తూ కూడా సమస్త కర్మఫలములకు ‘అభోక్త’ అయి ఉంటాడు. (Neither the subject and predicate, nor the object for all events of the world)
6. శరీర్యపి అశరీరి ఏష।
పరిచ్ఛిన్నోఽపి సర్వగః।
అశరీరగ్ం సదా అనంతం
ఇమం బ్రహ్మవిదం క్వచిత్।
బ్రహ్మవేత్త బ్రహ్మముతో మమేకమగుచు, అప్పుడిక శరీరము కలిగియుండి కూడా శరీరము లేనివానివలెనే ఉంటాడు.

• పరిచ్ఛిన్నుని (Bifurcated) వలె ఉండి కూడా సర్వగతుడై (సర్వులకు అంతర్యామి అయి, అంతటా నిండినవాడై, ఏకస్వరూపుడై) - ఉంటాడు.

• సర్వదా అశరీరుడై. దేహ మనో బుద్ధి చిత్త అహంకార దృశ్యములచే పరిమితుడు కాక, - ‘అనంతుడు’ అయి ఉంటాడు.
ప్రియ - అప్రియే న స్పృశతః
తథైవ చ శుభ - అశుభే।
తమసా గ్రస్తవత్ భానాత్
అగ్రస్తోఽపి (అగ్రస్ధా అపి) రవిః జనైః,
‘గ్రస్త’ ఇతి ఉచ్యతే భ్రాన్త్యా
హి అజ్ఞాత్వా వస్తులక్షణమ్।।
• ప్రియ - అప్రియములచే, అవి కలిగించే శుభ - అశుభములచే స్పర్శించబడనివాడై ఉంటాడు. నిర్లిప్తుడై ఉంటాడు.

సూర్యుడు సర్వదా స్వయం ప్రకాశకుడై ఉండగా ‘‘అప్పుడు సూర్యుడు అస్తమించి చీకటిలోకి వెళ్లాడు. ఇప్పుడు ఉదయించి వెలుతురుకు వస్తున్నాడు’’ - అని అనుకుంటూ ఉంటారు. భ్రాంతి చేతమాత్రమే సూర్యునికి చీకటి వెలుగులు ఆపాదించ బడుచున్నాయి. నిత్య-స్వయం ప్రకాశకుడగు సూర్యుడు చీకటిలోకి వెళ్లటమేమిటి? సూర్యునికి స్వతఃగా ఉదయాస్తమయములు ఉండవు కదా!
తద్వత్ దేహాది బంధేభ్యో
విముక్తం బ్రహ్మవిత్తమ్।
పశ్యంతి దేహివత్ మూఢాః
శరీర - అభాస దర్శనాత్।
అహి నిర్ల్వయనీవ అయం
ముక్త - దేహస్తు (న్తు) తిష్ఠతి।
ఉదయాస్తమయములు లేని స్వయంప్రకా సూర్యునివలె- బ్రహ్మవేత్త బ్రహ్మమే తానై ప్రకాశించుచున్నాడు.

ఇక ఆత్మ - ‘దేహి’గా అగుచున్నట్లు దేహము పొందుచున్నట్లు, ఆ దేహముచే విషయములు పొందుచున్నట్లు అవి బంధములు అగుచున్నట్లు- మూఢుడు, మాత్రమే ఆత్మకు ఆపాదించు చున్నాడు.

బ్రహ్మము ఎరిగినవానికి దేహము బంధమే అవటంలేదు. పాము ఏవిధంగా కుబుసమును విడచి వేస్తుందో ఆ విధంగా ఆత్మజ్ఞాని దేహభావము విడచి దేహియొక్క సహజరూపమగు ‘‘ఆత్మభావము’’ నందు తిష్ఠితుడై ఉంటున్నాడు. దేహముయొక్క దృశ్యముయొక్క రాక - పోకలు అతనిపట్ల విషయమే కాదు.
ఇతస్తతః (ఇతః తతః) చాల్యమనో
యత్ కించిత్ ప్రాణవాయునా
స్రోతసా నీయతే దారు
యథా నిమ్న - ఉన్నత స్థలమ్।
దైవేన నీయతే దేహో
యథా కాల ఉపభుక్తిషు।
గంగాజలము వేగముగా ప్రవహిస్తూ ఎత్తుపల్లములను సమానముగా చేసివేస్తోంది కదా। ఆ విధంగా యోగాభ్యాసి, తత్త్వవేత్త పట్ల - ప్రాణశక్తి సర్వత్రా ప్రవహిస్తూ ఎక్కువ - తక్కువలన్నీ ఏకము చేసివేస్తోంది.
ఇక, దైవికంగా సంప్రాప్తించిన ఈ దేహము జన్మ-జరా-మరణములను యథాకాలముగా పొందుచూ ఉండవచ్చుగాక! ఉపభుక్తుడు (అనుభవి) అగుచుండవచ్చు గాక।
లక్ష్య - అలక్ష్య గతిం త్యక్త్వా
యః తిష్ఠేత్ కేవలాత్మనా,
శివ ఏవ స్వయం సాక్షాత్,
అయం బ్రహ్మవిత్ ఉత్తమః।।
ఈ దేహ దృశ్య లక్ష్య - అలక్ష్య (Targets, Non Targets) ములన్నీ వదలి (సందర్భములను దాటివేసి) కేవలము, సహజము అగు ఆత్మయందు తిష్ఠితుడై ఉండువాడు - స్వయం - సాక్షాత్ శివుడే! ఆతడే ఉత్తమమగు బ్రహ్మవిదుడు। బ్రహ్మవేత్త। బ్రహ్మమే ఆతడు।
సమస్తమును ‘‘సమము, ఏకము’’ చేసివేసి - సమస్వరూపమగు ‘‘సాక్షాత్ శివోఽహమ్’’ను ఉత్తమ బ్రహ్మ-తత్త్వవేత్త ఇక్కడే సిద్ధించుకుంటున్నాడు
7. జీవన్ ఏవ సదా ముక్తః
కృతార్థో ‘‘బ్రహ్మవిత్తమః’’।
ఉపాధి నాశాత్ - బ్రహ్మైవసన్
బ్రహ్మాప్యేతి నిర్ద్వయమ్।
‘‘బ్రహ్మమే నేను’’ అని ఎరిగిన బ్రహ్మవిత్తముడు (బ్రహ్మవిత్-తముడు) - ఈ దేహము ఉన్నప్పుడే కృతార్థుడై ‘‘సదా ముక్తస్వరూపుడు’’ - అయి ఉంటున్నాడు.
ఆతని భావన - ఉపాధి పరిధులను, దృశ్యపరిధులను, లోక పరిధులను, త్రీవస్థల పరిధులను దాటివేసినదై ఉండటముచేత - ఆతడు ఈ ఉపాధిని నశించిన వస్తువుగా దర్శిస్తూ, బ్రహ్మమునందే వసించుచున్నాడు. ద్వంద్వ రహితమగు బ్రహ్మమును పొంది ఉంటున్నాడు. ఆతడే బ్రహ్మచారి
శైలూషో వేష సద్భావ (శైలూషి=ఆటకత్తె స్త్రీ పాత్రధారి)
అభావయోశ్చ యథా పుమాన్,
తథైవ ‘‘బ్రహ్మవిత్ శ్రేష్ఠః’’
సదా బ్రహ్మైవ నాపరః। (న-అపరః)।
విశిష్టతగల ఒక నటుడు నాటకములో శైలూషి (స్త్రీ) వేషము ధరిస్తూ, స్త్రీయొక్క హావ-భావములు ప్రదర్శిస్తూ కూడా ‘‘నేను పురుషుడను’’ అను ఎరుక పోగొట్టుకోడుకదా! అట్లాగే ‘‘బ్రహ్మవిత్ శ్రేష్ఠుడు’’ - ఈ జగన్నాటకములో ‘శరీరి’ పాత్ర ధరిస్తూ కూడా ‘‘నేను సదా బ్రహ్మమునే! మరొకటేదీ కాదు’’ - అని ఎరిగియే ఉంటాడు.

ఘటే నష్టే యథా వ్యోమ
వ్యోమైవ భవతి స్వయమ్,
తథైవ ఉపాధి విలయే
బ్రహ్మైవ ‘‘బ్రహ్మవిత్ స్వయమ్’’।
కుండ కుండగా ఉన్నప్పుడు, ఆ కుండ పగిలినప్పుడు కూడా ఘటాకాశము - బాహ్యాకాశము ఏకముగానే ఉంటుంది కదా! అట్లాగే ఈ ఉపాధి ఉన్నా (లేక) ఇది నశించినా కూడా, బ్రహ్మవేత్త ‘బ్రహ్మము’ గానే (తన గురించి, తదితరులగురించి) ఎరిగినవాడై ఉంటున్నాడు.
క్షీరం క్షీరే యథా క్షిప్తం
తైలం తైలే జలం జలే,
సంయుక్తం ఏకతాం యాతి
తథా ఆత్మని ‘‘ఆత్మవిత్ మునిః’’
‘పాలు’ లో‘పాలు’ పోస్తే అంతా కలిపి ఒకేపాలు అవుతుంది. నూనెలో నూనె పోస్తే అంతా ఒకే ‘నూనే’ అవుతుంది. అట్లాగే ఆత్మవిత్ ముని జీవాత్మను పరమాత్మయందు ఏకం చేసి ఏకాత్మ స్వరూపుడై ఉంటాడు.
(వ్యష్టి - సమిష్టి - కేవలాత్మలను ఏకంచేసి అఖండాత్ముడై ఉంటాడు).
ఏవం విదేహ కైవల్య
సన్మాత్రత్వమ్ అఖండితమ్,
బ్రహ్మభావం ప్రపద్య ఏష
యతిః నావర్తతే పునః।। (న ఆవర్తతే పునః)।।
అట్టి ‘‘అఖండాత్మతో ఏకత్వము’చే తాను అఖండితమగుచున్నాడు. ‘విదేహ కైవల్యము’ అనబడే ‘‘కేవల సన్మాత్రత్వము’’ ను సిద్ధించుకొన్న ఆత్మవేత్త - జీవాత్మత్వము, దృశ్యానుసంధానము మొదలైన ఎట్టి పరిమిత దృష్టులను పొందడు. అంతా స్వకీయ కల్పనగా చూస్తూ ఉంటాడు. (సమస్తము తానే అయి ఆస్వాదిస్తూ ఉంటాడు).
‘సత్’ ఆత్మకత్వ విజ్ఞాన
దగ్ధ అవిద్యాది వర్ష్మణః
అముష్య బ్రహ్మభూతత్వాత్
బ్రహ్మణః కుత ఉద్భవః?
తనయొక్క సత్ - ఆత్మకత్వమును సుస్పష్టముగా, నిర్దుష్టముగా, నిస్సందేహముగా ఎరిగినవాడై సమస్త తదితర అన్యశాస్త్ర విద్యల భ్రమలను అవిద్యా విషయ సమూహములను ఆత్మజ్ఞానాగ్నిచే దగ్ధము చేసినవానికి, - ఇక ఐహిక - ఆముష్యముల తేడా ఏముంటుంది? అట్టి బ్రహ్మస్వరూపుడు మరల జన్మించటమనే ప్రసక్తి ఎక్కడిది? ఆతనికి వర్తమాన జన్మ కూడా ‘లేనిదే’ అగుచున్నది.
మయా క్లప్తౌ బంధమోక్షౌ
న స్తః స్వాత్మని వస్తుతః।
యథా రజ్జౌ నిష్క్రియాయాం
సర్వా భాస వినిర్గమౌ।
ఆవృతేః సత్ అసత్త్వాభ్యాం
వక్తవ్యే బంధమోక్షణే।
అట్టి వానికి ఆత్మపట్ల వస్తుతః బంధము, మోక్షము మొదలైనవి ‘‘మొదలే లేనివి’’ అగుచున్నాయి.
‘‘ఇది పాము కాదు. త్రాడు మాత్రమే’’ అని తెలుసుకొన్న తరువాత, ఇక ఆపై అంతకు ముందటి (పాముగా అనుకున్నప్పటి) వికారములు ఉంటాయా? ఉండవు. ‘‘సమస్తము మమాత్మస్వరూపమే’’ అని తెలుసుకొన్న తరువాత సత్ - అసత్, బంధ - మోక్షముల ఆవృత్తులు ఇంకెందు కుంటాయి? ఉండవు.
(న ఆవృతిః) నావృతిః బ్రహ్మణః కాచిత్
అన్య - అభావత్ అనావృతమ్।
“అస్తి” ఇతి ప్రత్యయో యశ్చ
యశ్చ “నాస్తి” ఇతి వస్తుని?
బుద్ధేరేవ గుణావేతౌ న తు నిత్యస్య వస్తునః।
అతస్తౌ మాయయా క్లప్తౌ
బంధమోక్షౌ న చ ఆత్మని।
- ‘‘ఇక్కడ భౌతికంగా కనిపించే వస్తు సమూహములు ఉన్నాయి! లేవు’’ - అనునవన్నీ బుద్ధియొక్క త్రిగుణమాయా లక్షణములు.
బ్రహ్మభావనయందు అన్యమే ఉండదు. అన్యమే లేనప్పుడు బ్రహ్మమును పదార్థ (వ్యావహారిక) ఆవృత్తులు ఆవరించుచున్నాయనే ప్రసక్తి ఎక్కడిది? దృశ్య బుద్ధికి కనిపించే వస్తుజాలము ఆత్మయందు ఆత్మకు వేరై లేనేలేవు.
‘‘మాయ’’చే ఏర్పడే బంధమోక్ష వ్యవహారములు బుద్ధికి చెందినవేగాని (బుద్ధియొక్క స్వకీయ కల్పనయేగాని) వాస్తవానికి ఆత్మకు బంధమే లేదు. బంధమే లేనిదానికి మోక్షమెక్కడిది?
నిష్కళే నిష్క్రియే శాంతే
నిరవద్యే నిరంజనే,
అద్వితీయే పరే తత్త్వే
వ్యోమవత్ కల్పనా కుతః?
ఆకాశములె ఆత్మాకాశము సర్వదా నిష్కళంకము. నిష్క్రియము. పరమశాంతము. దేనిచేతను జయింపబడజాలనిది, దోషరహితము (నిరంజనము). తనకు ద్వితీయమే లేని అద్వితీయము కూడా। అట్టి కేవల పరతత్త్వ స్వరూపమునకు ‘జీవాత్మ’ మొదలైన కల్పనలు ఎక్కడ ఉంటాయి? కనుక ఆత్మకు వేరుగా ‘జీవాత్మ’ లేదు. జగద్దృశ్యము లేదు.
న నిరోధో న చ ఉత్పత్తిః।
న బద్ధో న చ సాధకః।
న ముముక్షుః న వై ముక్తః।
- ఆత్మను నిరోధించగలిగేది ఏదీలేదు.
- ఆత్మను ఉత్పత్తి చేయగలిగేదీ లేదు. బద్ధుడు లేడు. సాధకుడు లేడు.
- ఆత్మకు ముక్తి కలిగించాలనే ముముక్షువు లేడు. (ఆ ముముక్షువు ఆత్మయే అయి ఉన్నాడు)
- ఆత్మకు బంధమే లేదు.
- బంధమే లేని దానికి ముక్తి ఎక్కడిది?
ఇత్యేషా పరమార్థతా।।
ఇతి ఉపనిషత్
ఆత్మౌపనిషత్ సమాప్తా।।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।
పరమార్థముగా - మన కేవల స్వరూపము ‘నిత్యముక్తము’. సందర్భ స్వరూపము వచ్చి- సహజమగు ఆత్మను ఎట్లా బంధించగలదు?
స్వకీయకల్పన ఉన్నప్పుడుగాని, లేనప్పుడు గానీ, - ‘‘ఆత్మగా మనమంతా నిత్యముక్తులము’’

ఇతి ఆత్మౌపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।




అధర్వణ వేదాంతర్గత

4     ఆత్మ ఉపనిషత్

అధ్యయన పుష్పము

(బ్రహ్మ మానస పుత్రాయ బ్రహ్మజ్ఞే అంగిరసాయ నమః)



ఎక్కడైతే ‘ఆనాత్మ’ అనునదిగాని, ‘‘ప్రపంచము’’ అనుబడునదిగాని, ఆత్మను కప్పిపెట్టి ఉంచ గలిగినది (అపహ్నవపదము) - ఏవీ మొదలే లేవో, - అట్టిచోట ఇక వాదించటానికి, వ్యతిరేకించటానికి విషయముగా ప్రతియోగి శేషించదు. సర్వత్రా పరమాత్మయే శేషించినదై ఉంటుంది.


ఒకానొక సందర్భములో ఆత్మతత్త్వజిజ్ఞాసులు, తపోధనులు అగు మునీశ్వరులు కొందరు, అంగిరసమహర్షి ఆశ్రమానికి వచ్చి వారికి హృదయపూర్వక నమస్కారములు సమర్పించారు.

[శ్రీ అంగిరసుడు బ్రహ్మమానస పుత్రులలో ఒకడు. ఆయనకు (1) బృహస్పతి (2) ఉతథ్యుడు (లేక) సంవర్తుడు అను పేర్లు గల ఇద్దరు కుమారులు. ఆయన కుమార్తె పేరు యోగసిద్ధి. ఆ యోగసిద్ధి అష్టవసువులలో ఒకరైన ప్రభాసునికి ధర్మపత్ని. యోగసిద్ధి - ప్రభాస దంపతుల కుమారుడు - దేవశిల్పి అయినట్టి విశ్వకర్మ(!) - దేవీపురాణము].
20 మంది ప్రజాపతులలో అంగిరసులవారు కూడా ఒకరు (భారతము).

- - -

అంగిరస మహర్షి : తపోధనులగు మునివర్యులారా! వేంచేయండి. సుస్వాగతము. మా శిష్యగణముచే మీకు అతిథిదేవపూజగా సమర్పించబడుచున్న ఈ ఈ పండ్లు, ఫలహారములు, పానీయములు మొదలైనవి దయచేసి స్వీకరించండి. సుఖాసీనులవండి.
ఇప్పుడు చెప్పండి. ఊరకరారు మహాత్ములు. ఏమి పనిమీద వచ్చారు?

మునులు : మహాత్మా! బ్రహ్మమానసపుత్రా! బృహస్పతీ పితృదేవా! తత్త్వదర్శీ! బ్రహ్మజ్ఞుడుగా మునికులముచే కీర్తించబడువాడా! అంగిరస మహామునీ! మేము కొన్ని ఆత్మతత్త్వ విశేషాలు మీవద్ద శ్రవణం చేసి తెలుసుకోవాలని వచ్చాము. సమిత్పాణులమై (యజ్ఞపరికరముల చేబూని) గురుతుల్యులగు మీకు సమర్పిస్తూ ఆధ్యాత్మిక విద్యాధ్యయనులుగా మీవద్ద ఆత్మ గురించి శ్రవణం చేయవచ్చాము. దయతో మమ్ములను అనుగ్రహించండి.

అంగిరసమహర్షి : అట్లాగా"! చాలా సంతోషము. సత్సంగము సర్వులకు శుభప్రదముకదా! అడగండి. నాకు స్వానుభవమై తెలిసి ఉన్నంతవరకు ప్రవచనము చేసుకుందాము.

మునులు : గురువర్యా! ‘పురుషుడు’ అనగా ఎవరు? ‘ఆత్మ’ అనగా ఏమి? ఈ రెండు విశేషములు మాకు విశదీకరించండి.

అంగిరసమహర్షి : మునీశ్వరులారా! మీరు అడిగిన విశేషములు - పితృదేవులగు బ్రహ్మదేవుని బోధ, వేదోపనిషత్‌సారము, మహనీయుల ప్రవచనములు, స్వానుభవము రంగరించుకొని వక్త, శ్రోతల సౌలభ్య - మననపూర్వకంగా మనము చెప్పుకుందాము.

- - -

పురుషుడు = ఎవ్వరైతే తనకు అన్యమైనదంతా (జాగ్రత్ స్వప్న సుషుప్తులను, జన్మ-జన్మాంతరములను, లోక-లోకాంతరములను) తనయొక్క పురుషకారము చేతనే సిద్ధింపజేసుకొని లీలగా, క్రీడగా ఆస్వాదిస్తూ ఉన్నట్లు గమనించువారై ఉన్నారో - అట్టి ఎరుకగలవానిని (ఆత్మవిద్యా శాస్త్రజ్ఞులు) ‘పురుషుడు’ అనే పేరుతో పిలుస్తున్నారు.

ఆత్మపురుషుడు స్వతఃగా అన్యమును తానే కల్పించుకొనుచూ, తనయొక్క పురుషకారముగా అన్యమైనదంతా కల్పించుకొనుచున్నాడు.

అట్టి పురుషుడు మూడు రూపములు ధరిస్తున్నాడు.
త్రివిధః పురుషో అజాయత। (1) బాహ్యాత్మ (2) అంతరాత్మ (3) పరమాత్మ
ఈ మూడుగా మూర్తీభవిస్తూ ఆత్మభగవానుడే ‘త్రిమూర్తి’ గా అనబడుచున్నారు.

ఈ మూడిటి గురించి ముందుగా వివరించుకుందాము.

(1) బాహ్యాత్మ (భౌతికమైనది) :

ఈ పురుషుడు ఈ భౌతిక శరీరమును ఒక ఉపకరణమువలె ఇచ్ఛానుసారంగానో, అభ్యాసవశంగానో, కర్మఫలంగానో స్వీకరించుచున్నాడు. బాహ్యాత్మ దేహమును స్వీకరించి ‘దేహి’ అగుచున్నది.

బాహ్యమగు విశేషాలను విషయములుగా పొందుచుండటంచేత ఈ శరీరము ‘బాహ్యాత్మ’ - అని పిలువబడుతోంది. అట్టి సారూప్యమైన ఆత్మయొక్క (పురుషునియొక్క) బాహ్యాత్మ గురించిన లక్షణములు ఏవేవో చెప్పుకుందాము.

బాహ్యాత్మ → తోలు, చర్మము, మాంసము, వెంట్రుకలు, కాళ్ళు, చేతులు, బొటనవ్రేళ్ళు (Thumb). తదితర వ్రేళ్ళు (Other Fingers) నడుము (Back), వెన్నెముక, గోళ్ళు, చీలమండలము, పొట్ట, బొడ్డు, లింగావయవము, నడుము, తొడలు, చెక్కిలి, ముక్కు, భ్రూమధ్యము, లలాటము, భుజములు, శిరస్సు, కళ్ళు, చెవులు, మొదలైనవన్నీ కలిగి ఉంటోంది. సాకారంగా ప్రకృతిలో దృశ్యమానమై కనిపిస్తూ ఉన్నట్టిది.

జాయతే మ్రియాతే చ ఇతి। ఇది ఒకప్పుడు జనించి, మరొకప్పుడు మరణించు ధర్మము కలిగియుండి, ‘‘పురుషునియొక్క బాహ్యాత్మ’’ - అని పిలువబడుతోంది. ‘‘పురుషుడే బాహ్యాత్మ స్వరూపుడై ప్రదర్శనమగుచున్నాడు’’ - అనునది సూక్ష్మార్థము.

(2) అంతరాత్మ (సూక్ష్మదేహము / మనోశరీరము) :

పురుషుడే అంతరాత్మ స్వరూపుడై కూడా వెలయుచున్నాడు. (ఆత్మస్వరూపుడగు ఈ జీవుని పురుషకారమే అంతరాత్మ).
అట్టి అంతరాత్మ (సూక్ష్మ శరీరము) : - ఈ క్రిందివన్నీ తనయందు కలిగి ఉంటోంది.

సూక్ష్మభూతరూపములు : భూమి - జల - అగ్ని - వాయు - ఆకాశముల సూక్ష్మభూత రూపము ధరించునది. (అపంచీకృతములగు పంచభూత రూప ధారణ).
స్మృతులు: జ్ఞాపకములు. అవి → ఇచ్ఛ-ద్వేషములుగాను, సుఖ - దుఃఖభావనలుగాను, కోరికలు (కామము)గాను, మోహము (లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు దర్శించునది)గాను, స్త్రీ-పురుష-నపుంసక లింగ భేదభావ దృష్టులు మొదలైనవిగా ఉంటున్నాయి.
• లింగ సంస్కార శారీర విభాగము కలిగి ఉంటోంది. (The psychological Body of Tendencies)
అనుభూతులు : హ్రస్వ దీర్ఘ అనుభూతులు, రస భావములు ఆశ్రయించునదై ఉంటోంది.
శబ్దానుభవములు : బిగ్గర, నెమ్మది, ప్లుతములు (స్వరములు), స్పష్ట శబ్దములు కలిగి ఉన్నట్టిది. ఉదాత్త (పైన) - అనుదాత్త (క్రింద) శబ్దోచ్ఛారణలు.
కళాత్మిక : నృత్య గీత వాద్య విద్యలు చూచి ఆనందించటము ప్రదర్శించునది.
విజృంభిత : ప్రళయము తరువాత కూడా విజృంభించునట్టి స్వాభావికత. సందర్భ సంఘటనలకు ప్రతిస్పందనములు చేయునది.
శ్రోతా : వినికిడికి ముందే ఉండి సమస్తము శ్రవణము చేయునది.
ఘ్రాతా : ‘వాసన’ (Smell) ను అనుభవముగా పొందుచున్నట్టిది.
రసయితా : రసానుభవానందము (Taste) పొందునట్టిది.
నేతా : ఇంద్రియములకు నాయకురాలు, నియమించునది. తన కొరకై ఉపయోగించుకొనునది.
బోద్ధా : బోధింపబడగలిగినది. బోధస్వరూపమైనట్టిది. (Form of Enlightenment)
కర్తా : సమస్తమునకు ‘కర్త’ అయి ఉన్నట్టిది. కర్తృత్త్వ - భోక్తృత్త్వ భావనా విశేషము కలిగియున్నట్టిది.
విజ్ఞానాత్మ పురుషా : సమస్తమునకు విజ్ఞతగా (తెలుసుకొని) అనుభవరూపము పొందు పురుషకారము.
పురాణ మీమాంసాది ధర్మ శాస్త్రాని విజ్ఞాత పురుషః : పురాణములను, మీమాంసలను, ధర్మశాస్త్రములను తెలుసుకొను పురుషకారము కలిగినట్టిది.
• సమస్తము వినటము, పుష్పము మొదలైనవి వాసన చూడటము, విషయములకు పట్టుబడటము, విడవబడటము, కర్మ విశేషణములను భావించటము - ఇవన్నీ, అంతరాత్మ (సూక్షాత్మ) వ్యవహారములు.

(3.) పరమాత్మ (కేవలాత్మ / సాక్షీ ఆత్మ) :

పురుషుడు పురుషకారముగా కలిగియున్న మూడవ రూపము ‘పరమాత్మ’।

ఈ రూపము మార్పు చేర్పులు (క్షరము లేని) అక్షరము.

మొదటిదగు బాహ్యాత్మ, రెండవదగు అంతరాత్మ మార్పు-చేర్పులు పొందుచున్నట్టివి అయి ఉండగా, పరమాత్మ సమస్తమునకు పరమై (ఆవల ఉండి), మార్పు చేర్పులు పొందనిది అయి ఉన్నవి.

అట్టి పరమాత్మ స్వరూపము ఇంద్రియములచే అనుభవముగా విషయమయేది కాదు. మరి అనుభవమవదా? తప్పక అవగలదు. ‘‘యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులు’’ - అనే అష్టాంగ యోగాభ్యాసముల చేతను, ప్రమాణ - అనుమాన - విచారణల (స్వకీయ విచార విమర్శనల) చేతను, బుద్ధికి తెలియబడేది.

బీజములోని అంకురశక్తివలె అత్యంత సూక్ష్మము. ధాన్యపుగింజ యొక్క చిట్టచివరి బిందువులో వెయ్యవవంతువలె సూక్ష్మాతి సూక్ష్మము. సంకల్ప - వికల్పములకు విషయముకానిది. (వికల్పనాదిభిర్వా న లభ్యతే)। దృశ్యములో రూపమాత్మకంగా ఉపలబ్ధమయేదికాదు. అయితే, బుద్ధికి తెలియవచ్చేది.

భౌతిక శరీరమునకు జనన మరణాలు ఉండవచ్చుగాక! పరమాత్మయో? శరీరియొక్క ‘నేను’ అను రూపములో ప్రదర్శనమగుచున్నట్టిది. అట్టి పరమాత్మ స్వరూపమునకు జనన - మరణాలు లేవు. ఈ జీవుని సహజరూపము పరమాత్మత్వమే।

ఈ జీవుని పరస్వరూపము - ఎండకు ఎండదు. శుష్కించదు. అగ్నిచే దహించదు. కంపనము (Shaking) పొందదు. కదిలించబడేది కాదు. భేదించబడదు.

అట్టి పరమాత్మ స్వరూపము గుణములకు ముందే ఉండి ఉండటంచేత, గుణములకు బద్ధము కాదు. అది ‘నిర్గుణము’.

ఇంకా కూడా : ఆత్మ ఎట్టిదంటే…,
సాక్షి : జగత్ - జీవాత్మ మొదలైనవాటికి కేవల సాక్షీభూతము. (Mere unparticipative witness).
భూతభావన : భావనలకు మునుముందే ఉండి ‘భావన’ చేయునట్టిది. అద్దాని ‘‘భావన’’ నుండియే భూతజాలము ‘‘ఉనికి’’ పొందుచున్నది.
శుద్ధము : ఆత్మకు గుణదోషములు అంటవు.
నిరవయవాత్తు : (శక్తికి - ఇదే ‘అవయవము’ అనేదేమీ ఉండనితీరుగా), ఆత్మ నిరవయవి.
ఆత్మయొక్క చైతన్యశక్తిచే అవయవములు కదులుచున్నాయి.
కేవలము : జీవుని సహజ, అనునిత్య, సందర్భాతీత, ‘కేవలీ’ స్వరూపము.
సూక్ష్మము : బాహ్యాత్మ, అంతరాత్మలకంటే సూక్ష్మాతిసూక్ష్మము.
మమకార రహితము : సమస్తము ఆత్మయే కాబట్టి పరమాత్మకు ‘ఇది నాది’ ‘ఇది నాది కాదు’ - అనురూపమైన మమకారము లేనట్టిది.
నిరంజనము : కేవలాత్మ నిత్య నిర్మలము. దోషములు అంటనిది.
నిర్వికారము : మనోధర్మమైన వికారములు పరాత్మకు లేవు.
ఇంద్రియార్థరహితము : కేవలాత్మ శబ్ద స్పర్శ రూప రసగంధ రహితమైనట్టిది. అవన్నీ తనయొక్క ప్రదర్శనములై, తాను వాటన్నిటికీ వేరై ఉన్నట్టిది.
నిర్వికల్పా : వికల్పనలు (Attributions, Tendency of Assumptions and presumptions) లేనట్టిది.
నిరాకాంక్ష : ఈ సమస్తము ఆత్మకు వేరైనది కాదు కాబట్టి, ఆత్మ ఎటువంటి ఆకాంక్షలు (Expectations) దేనిపట్లా ఉండనట్టిది. (స్వప్నద్రష్ట స్వప్నములో దేనినీ ఆకాక్షించకుండానే (without direction) స్వప్నము కలిగి ఉంటాడు కదా।)
సర్వవ్యాపీ : నవలా రచయితయొక్క కల్పనా సృష్టియే నవల అంతా నిండి ఉన్న తీరుగా, తరంగములన్నీ జలము చేతనే వ్యాపించి ఉన్నట్లుగా, ఆత్మయే → శరీర, దృశ్యములందు అంతరంగ - బహిరంగములందు, దేహ - దేహాంతర స్థితి గతులందు మౌనముగా వ్యాపించినదై ఉన్నది.
అచింత్యో : లౌకిక విషయములవలె పరమాత్మ చింతన చేయగలిగేది కాదు. సమస్త చింతనలు తనవే అయిఉంటూనే, చింతలన్నిటికీ ఆవల ఉన్నట్టిది.
అనిర్వర్ణ్యశ్చ : పరమాత్మ → వర్ణింపజాలనిది. వర్ణ - కుల - మత - జీవజాతి - లోక భేదములు కించిత్ కూడా లేనట్టిది. సమస్త దేహములలలో ఏకస్వరూపమై వెలయుచున్న ఆత్మకు ‘‘జాతి కుల మత’’ ఇత్యాది భేదములు ఎట్లా ఆపాదిస్తాము?
పునాతి అశుద్ధాని : పరమాత్మ స్వరూపము నిత్యశుద్ధము. అంతరాత్మ మనోరూపము కాబట్టి భావ ఆలోచనా సమన్వయ దృష్టి దోషాలు భేద భావనలచే ఏర్పడినవై ఉండవచ్చు. సమస్తజీవుల సమస్వరూపమగు పరమాత్మ జ్ఞానము అట్టి దోషములన్నీ కడిగివేస్తుంది. సర్వత్రా పరమాత్మభావనను అభ్యాసము చేయువారియొక్క సమస్త అశుద్ధలములను తొలగించి వేయగలదు. ఆతనిని పునీతుని (పవిత్రుని) చేయగలదు.
నిష్క్రియా : ఈ జీవునియొక్క (పురుషునియొక్క) పరమాత్మస్వరూపమునకు - జన్మించటము, కర్మలు నిర్వర్తించటము మొదలైన ధర్మములు లేవు.
దీపపుకాంతి వెలుగుచుండగా ఆ వెలుగులో జనులు ఆయా కార్యక్రమములు నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ, అట్టి కాంతి ఆయా క్రియలు నిర్వర్తిస్తూ ఉన్నట్టిది అవుతుందా? అవదు కదా। అట్లాగే పరమాత్మ తేజోమయమై ఉండగా, విశ్వములు ఆవిర్భావ తిరోభావములు జరుగుచున్నాయి. అయినా కూడా పరమాత్మ ‘‘ఏమీ చేయనివాడు, నిష్క్రియుడు’’ అయి ఉన్నారు. సమస్తమునకు సాక్షి అయి ఉండగా, తన తేజస్సుయొక్క చైతన్య శక్తి చేతనే దేహి, దేహము, అంతరంగమగు మనో బుద్ధి చిత్త అహంకారములు, బాహ్యరంగమగు జగద్విషయాలు చేతనమై ప్రవర్తిస్తున్నాయి.

అట్టి ఈ పురుషుని (జీవుని) పరాత్మ స్వరూపమునకు ‘సంసారబంధము’ అనునది ఉండే ప్రసక్తియే లేదు. తస్య సగ్ంసారో నాస్తి। (సంసార బంధమంతా మనసుకు సంబంధించి ఉన్నట్టిది మాత్రమే।)

- - -

‘‘ఆత్మ’ - గురించిన ఇంకా కొన్ని విశేషాలు :

అంగీరస మహాముని : ఇప్పుడు మనము ‘ఆత్మ’ గురించిన ఆయా మరికొన్ని విశేషాలు చెప్పుకుందాము.

ఈ జీవుని ఇహము లోని రూపము - ‘‘ఇహస్వరూపము’’ - నాటకములో పాత్రవంటిది.
ఈతని ఆవలి రూపము - పర స్వరూపము. శివ స్వరూపము. నటుని సహజరూపము వంటిది.
ఇహపర స్వరూపము ఎద్దానివో అదియే ‘ఆత్మ’.
అట్టి ఈ జీవుని సహజస్వరూపమే - శివస్వరూపము అని ‘శివుడు’ అని ‘పరమాత్మ’ అని ‘పరాత్మ’ అని - వర్ణించబడుతోంది.

ఆత్మ (సహజమగు కేవలాత్మ) ఇంకా కూడా ఏతీరైనదంటే :

శివః : ‘జీవుడు’ - ‘శివుడు’ అను సందర్భ - కేవల స్వరూపములలో కేవలస్వరూపము (Absolute “I”) ‘శివుడు’ అయి ఉన్నది. (చిదానందరూపం, శివోఽహమ్। శివోఽహమ్।). (సందర్భ రూపము - ‘జీవుడు’గా పిలువబడుతోంది). పరమాత్మయే ‘శివస్వరూపము’గా చెప్పబడుతోంది.

శుద్ధము : అట్టి (ప్రతి ఒక్క జీవుని) శివస్వరూపము నిత్యశుద్ధము. అద్దానిని మనో, ఇంద్రియ సంబంధమైన ఏ దోషములు అంటజాలవు.

ఏక ఏవ। అద్వయః సదా। : సమస్త దేహములలోని ఆత్మ సర్వదా ఏకము. అద్దానికి ద్వితీయమై ఏదీ లేదు. జీవుడు - బహిరంగము (బాహ్యాత్మ), అంతరాత్మ (అంతరంగము), దృశ్యజగత్తు మొదలైనవిగా చెప్పబడేవన్నీ ఆత్మభగవానునికి వేరై ఉండలేదు. సమస్తము ఆత్మయొక్క సంప్రదర్శనా, విశేషణా చమత్కారమే।

‘‘బ్రహ్మ రూపతయా బ్రహ్మ కేవలం ప్రతిభాసతే।’’
దర్పణము (Mirror) లో దర్పణమే ఉన్నది గాని, ప్రతిబింబిత వస్తువులేవీ వాస్తవానికి లేవు కదా!

‘‘తత్ త్వమ్ - నీవుగా కనిపించేది తత్ బ్రహ్మమే।’’ అను దృష్టిని సిద్ధించుకొన్న తత్త్వదర్శనముచే ఈ జగత్తు శుద్ధమగు ఆత్మ స్వరూపముగా అనుభవమౌతోంది.

ఇక్కడ విద్య లేదు. అవిద్య లేదు. ఆత్మకు వేరై జగత్తు (జనించి గతించేది) అనబడేది ఏదీ లేదు.

‘‘మరి మాకు జగత్తు అనుభవమౌతోంది కదా?’’ అని ప్రశ్నిస్తారా?

‘‘ఈ జగత్తు నిజంగానే ఉన్నది’’- అనునదే భవబంధము.
(భవము = ఉన్నది, బంధము = ఉన్నది కాబట్టి నాకు బంధమగుచున్నది).

ఇదంతా వ్యావహారరీత్యా - సంసారముగా భావనామాత్రమై సత్యమువలె అనిపించటం జరుగుతోంది.
పారమార్థికంగా చూస్తే కథలోని పులివలె, కలలోని బండరాయివలె ‘‘మొదలే లేనిది’’ అగుచున్నది (అసత్యమే అగుచున్నది).
ద్రష్టయే సత్యమై, నిత్యమై ఉన్నాడు. దృశ్యమంతా మనో కల్పితానుభవమే।

ఆత్మోపాసన

ప్రమాణం తత్ న అపేక్షతే। ‘మట్టి కుండ’ అను దానిలో ఉన్నదంతా మట్టియే అయినప్పటికీ మట్టియొక్క ఒక ఆకారమునకు ‘కుండ’ అను పేరుతో చెప్పుకుంటున్నాము. అంతేగాని - ‘‘మట్టివేరు. కుండవేరు. మట్టి కుండగా మారింది’’ అని మన ఉద్దేశ్యము కాదు. మట్టిని కుండను వేరు వేరు చేసి, వేరువేరైన ఇద్దరికి ఇచ్చి పంపగలమా? లేదు. ‘‘మట్టి, కుండ ఒక్కటే. మట్టియే కుండగా (ఘటముగా) కనిపిస్తోంది’’ - అను దానికి ఎవ్వరైనా నిరూపణ అడగరు కదా। ‘‘ఘటో అయమ్’’ ఇతి విజ్ఞాతుం నియమః కోన్వపేక్షతే?

‘‘ఈ సమస్తము ఆత్మయే’’ అని నిరూపించటానికి అటువంటి వేరే ప్రమాణము ఏదీ లేదు. అవసరం కూడా లేదు. ప్రమాణమునందు కూడా ఆత్మయే ఆ రీతిగా ప్రకాశమానమై ఉన్నది.

ఆత్మను తెలుసుకోవాలంటే, ‘‘అది ఎక్కడో, ఎన్నటికో శుద్ధబుద్ధిచేతగాని తెలియదు’’ అని అనవలసినదేమున్నది?
ఆత్మగురించి తెలుసుకోవటానికి (నేను ఆత్మను - అని ఎరుగటానికి) వేరే దేశ - కాల - వస్తు ప్రమాణములతో పనేమున్నది?

"దేవదత్తోఽహమ్’’ - ఇతి ఏతత్ విజ్ఞాననం నిరపేక్షకమ్।
ఒకనిని పిలిచి ‘‘ఎవరునువ్వు?’’ - అని మరొకాయన అడిగారు. అప్పుడా రెండవవాడు ‘‘నేను దేవదత్తుడను’’ అని చెప్పాడు.
అప్పుడు మొదటివాడు ఆ రెండవవాడిని ‘‘నేవు దేవదత్తుడవేనని - నీవు ఏ ప్రమాణముల చేత గ్రహించావో నాకు చెప్పు’’ - అని అడిగాడు.
అప్పుడు ఆ రెండవవాడు ‘‘నేను దేవదత్తుడనని నాకు తెలియటానికి మరొక సాక్షీక ప్రమాణమెందుకు? నాకు నెనెవరో తెలియదా? ఎవరైనా వచ్చి ‘‘నీవు దేవదత్తుడవే’’ అని నాకు నిరూపించి చెప్పాలా?’’ అని తిరిగి ప్రశ్నించాడు.

తద్వత్ బ్రహ్మ విదోఽపి అస్య ‘‘బ్రహ్మాహమ్’’ ఇతి వేదనమ్।
అదే విధంగా బ్రహ్మము గురించి శాస్త్ర - గురు పాఠ్యాంశములు అధ్యయనము చేసిన బ్రహ్మవేత్త ‘‘ఆహా"! నేనే బ్రహ్మమును’’ అని తెలుసుకొంటాడు. అందుకు మరొకరి సాక్ష్యము గాని, ఎవరో నిరూపించి చెప్పవలసిన ప్రమాణములు (Explanation with examples) గాని ఇక అవసరము ఉండదు.
‘‘ఆ సిద్ధాంతము, ఈ ప్రమాణము’’ - మొదలైనవి ‘‘నేను ఆత్మను’’ అని తెలుసుకోవటానికి - అవసరమే లేదు.

ఆత్మతేజస్సు - ఆత్మదర్శి (తత్త్వదర్శి)

ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా భూమిపై వస్తువులు ప్రకాశమానమై కనిపిస్తూ ఉంటాయి. చీకటిలో ఆయా వస్తువులు సరిగ్గా కనిపించవు.

అట్లాగే ఆత్మయొక్క తేజస్సుచేతనే అనాత్మకమైన, తుచ్ఛమైన జగద్దృశ్యము అనేక రూపములుగా, నామములుగా అగుపిస్తోంది. ఆత్మయొక్క ఉనికి చేతనే ‘జగదనుభవము’ ఏర్పడినదగుచున్నది. ఆత్మయే అయి ఉన్న నేనే - లేకపోతే జగదనుభవము ఎవరికి? సకల వేద శాస్త్ర పురాణములు, తదితరమైన సమాచారము మొదలైనవన్నీ అర్థవంతములై ఎద్దాని ప్రకాశము (Feature of Enlightenment)చే తెలియవస్తున్నాయో అదియే మనందరి స్వస్వరూపమగు ‘ఆత్మ’.

- - -

ఒక పిల్లవాడు ‘‘అమ్మ దగ్గరకు వెళ్ళి ఏమైనా తినుబండారములు అడిగి తినాలి, త్రాగాలి’’ అని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వస్తూ ఉండగా ఆతనికి త్రోవలో కొన్ని చిత్ర విచిత్రములైన ఆటవస్తువులు అగుపించాయి. ఇంటికి వెళ్ళుచున్నవాడల్లా రహదారి పక్కకు వెళ్ళి ఆ ఆటవస్తువులతో (ఆకలి దప్పికలు మరచి) ఆడుకోసాగాడు. అక్కడివారితో హుషారుగా గంతులు వేయసాగాడు.

ఆ పిల్లవాడిలాగానే…,

ఆత్మ గురించి తెలుసుకొన్న విద్వాంసుడు, జగత్తులో ఏదోపొంది రమించాలనుకోవటము ఆపివేసి (ముని) - ఆత్మయందే రమించుచున్నాడు.

మమకార, అహంకారములన్నీ బాహ్యముననే వదలివేసి, ఆత్మ యందు ‘సుఖి’ అయి ఉంటున్నాడు.

ప్రాపంచక సంగతి - సందర్భ - సంబంధములపట్ల మౌనము వహించినవాడై (‘ముని’ అయి) - ‘‘సమస్తము మమాత్మానంద స్వరూపమే’’ అను ఆత్మానందైక రసమును అవిఘ్నంగా, అవ్యాజముగా ఆస్వాదించుచున్నాడు.

అట్టి అఖండాత్మానుభవి :-

బ్రహ్మవిదుడు - అనంతుడై, అశరీరుడై ఉంటాడు.

ఆత్మభావనచే సర్వత్రా తన స్వరూపమును దర్శిస్తూ ఉంటాడు. సదా అశరీరుడై, శరీరపరిమితములు లేనివాడై (ఆత్మశరీరి అయి) ఉంటాడు. వర్తమానములోను, భవిషత్‌లోను, ఆయా జన్మ-జరా-మరణ సందర్భములలోను ‘‘సాక్షిత్వమును, పూర్ణత్వమును’’ వీడక ఉంటాడు. ప్రియ - అప్రియములచే శుభ - అశుభములచే స్పృశించబడనివాడై ఉంటాడు.

సూర్య తేజస్సు ఆకాశంలో సర్వత్రా వ్యాపకము (Extended), నిత్యము స్వయంప్రకాశకము అయి ఉండి కూడా, భూమిపైగల జనులచేత ‘‘ఇప్పుడు సూర్యుడు అస్తమించాడు. చీకట్లు కమ్ముకున్నాయి. అప్పుడు సూర్యుని మేఘములు కప్పివేశాయి. ఇంకొకప్పుడు తిరిగి తేజోరూపుడై ఉదయిస్తున్నాడు’’ - మొదలైన వాక్యములన్నీ లోకప్రసిద్ధమై ఉంటున్నాయి కదా!

ఆత్మగురించిన సమాచారము పరిశీలించక, ఆత్మస్వరూపమేమిటో ఏమరచినప్పుడు జనులు దృశ్య విషయములచే భ్రమలు పొందుచూ, ‘‘ఇవి సత్యము. నిత్యము’’ - అని విభ్రమము చెందుచున్నారు. ‘‘నేను దేహముచే బద్ధుడను. దృశ్య సంబంధములలో చిక్కుకున్నవాడను. ఎవరైనా వచ్చి, నాకు మోక్షము ప్రసాదించెదరు గాక’’ - మొదలై ‘‘ఆధారపడియున్న (Dependent) భావములు’’ జన్మజన్మాంతరములుగా కొనసాగిస్తున్నారు.

బ్రహ్మతత్త్వము అధ్యయనము - అభ్యాసము చేయువాడో? బ్రహ్మవిత్తముడై దేహాదిబంధముల నుండి ‘విముక్తుడు’ అగుచున్నాడు. ‘‘సర్వదా ఆత్మస్వరూపుడనగు నేను సర్వదా బంధరహితుడను. సమస్త సందర్భములకు ఆవలగల ఆత్మయే నా నిజ స్వరూపము’’ అని గ్రహించి ఉంటున్నాడు. (He is getting convinced of his own “Independence” Vis-a-Vis all - else).

మూఢుని దృష్టి : అభాస అయినట్టి శరీరముతో సంబంధము పెట్టుకొని ‘‘నేను దేహిని। దేహమాత్రుడను।’’ అని తలుస్తున్నాడేగాని ‘‘సమస్త భావములకు ఉత్పత్తి స్థానమగు భావాతీత కేవలసాక్షీ ఆత్మస్వరూపుడను’’ - అని గమనించటము లేదు.

జ్ఞానదృష్టి : పాము కుబుసము విడచిన తీరుగా ఆత్మజ్ఞాని దేహభ్రాంతిని విడచివేసి, సర్వదా ‘‘ఆత్మమేవాహమ్’’ భావనను సిద్ధింపజేసుకొని ఉంటున్నాడు.

ప్రాణము : గంగాజలము ప్రవహిస్తూ ఎత్తు - పల్లవ ప్రాంతములను ఏకము చేసి వేస్తుందికదా। అట్లాగే, ప్రాణవాయువు సర్వత్రా సంచరిస్తూ సమస్తమును ఏకము చేయుచున్నది. ఇంక వ్యష్టి ప్రాణము, ఆ ప్రాణమును కాపాడుకొంటూ బ్రతుకుచున్న జీవుడు - మొదలైనవన్నీ ఆత్మకు వేరై ఎక్కడున్నాయి?

ఈ దేహము ప్రకృతి సిద్ధము. (ప్రకృతి కల్పితము). జగన్నాటకంలో దైవవశంగా రూపుదిద్దుకుంటోంది. మరల నాటకీయంగానే నశిస్తోంది. ఆత్మకు ఈ దేహముల రాకపోకలతో సంబంధమే లేదు. అనుబంధమూ లేదు. ఇక బంధమెక్కడిది?
బ్రహ్మవేత్త ఈ దేహముయొక్క, దృశ్యముయొక్క లక్ష్య - అలక్ష్యములను, రాక - పోకలను విడచివేసి కేవలమగు ఆత్మస్వరూపమును ధారణ చేస్తూ ఉండి ఉంటున్నాడు.

అట్టి ఉత్తమ బ్రహ్మవిదుడు స్వయముగా సాక్షాత్ శివుడే। శివోఽహమ్। శివ ఏవ స్వయం సాక్షాత్ అయం బ్రహ్మవిదుత్తమః।

బ్రహ్మవిత్ - తముడు

[బ్రహ్మవిత్ = బ్రహ్మము ఎరిగినట్టి, తముడు = శ్రేష్ఠాతి శ్రేష్ఠుడు (superlative Degree)]

జీవన్ ఏవ సదా ముక్తః కృతార్థో బ్రహ్మవిత్తమః। బ్రహ్మమును సర్వశ్రేష్ఠముగా, స్వయం ప్రకాశముగా, స్వస్వరూపముగా ఎరిగినవాడు జీవించి ఉండగానే - నిత్యముక్తుడు.

ముక్తుడు : ‘‘ఈ జగత్తు, దేహము మొదలైనవి - ఆత్మస్వరూపుడనగు నాకు బంధములు కావు. అవన్నీ నేను చూస్తున్న క్రీడ-లీల-కథ-నాటకములోని సంఘటనలు వంటివి’’ - అని దర్శించువాడు ముక్తుడే। ఆత్మస్వరూపుడునగు నాకు బంధము అనునది ఎన్నడూ లేదు’’ - అని నిర్ద్వంద్వముగా ఎరిగియున్నవాడు - ముక్తుడు.

కృతార్ధో : పొందవలసినది పొందినవాడు - అయి ఉంటాడు.

ఆతని దృష్టిలో ఈ ఉపాధి (భౌతిక శరీరము) సర్వదా నశించినదే అయిన వస్తువు. ఈ భౌతికదేహమును జడవస్తువుగా దర్శించు అభ్యాసముచేత ఆతడు నిర్ద్వయము (ద్వితీయమే లేనట్టి) బ్రహ్మమును పొంది, తాను ‘బ్రహ్మమే’ అయి ఉంటున్నాడు.

- - -

మునులు : మహాశయా! అంగీరసమునీంద్రా! జీవిస్తూ ఉండగానే మేము బ్రహ్మము ఎట్లా సిద్ధించుకోగలుగుతాము? దేహము ఉన్నంత వరకు మేము ఇంద్రియ విషయములలో ప్రవర్తించటము అనివార్యము కదా? సంబంధ - అనుబంధ - బాంధవ్యములవంటి ఆయా విషయములు మమ్ములను వదులునవి కావు కదా?

అంగీరస మహర్షి : మునివర్యులారా! ఇందులో విశేషమేమున్నది? దేహముంటే మాత్రం బాహ్మీస్థితి ఎందుకు సిద్ధించుకోరాదు? ఒక దృష్టాంతము ద్వారా ఈ విషయము చెపుతాను. వినండి.

నటుడు - స్త్రీ పాత్రధారణ దృష్టాంతము :

శైలూషో వేష సద్భావ-అభావయోశ్చ యథా పుమాన్। -

ఒక పురుషుడు (Male Actor) నటుడై స్త్రీగా ఒక నాటక పాత్ర ధరిస్తూ (స్త్రీ వేషము ధరించి) రసయుక్తంగా స్త్రీ యొక్క ముఖకవళికలు, సుదిమెత్తని స్వరము, స్త్రీ సంబంధమైన హావభావములు (కూచిపూడి-భామాకలాపము - శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మగారి వలె) ప్రదర్శిస్తూ ఉన్నాడనుకోండి. ‘నేను పురుషుడను’ అని మరచిపోతాడా? ‘‘నేను స్త్రీని అయ్యాను’’ - అని భావిస్తాడా? లేదు కదా!

తథైవ బ్రహ్మవిత్ శ్రేష్ఠః సదా బ్రహ్మైవ నాపరః। అట్లాగే బ్రహ్మవిత్ శ్రేష్ఠుడు కూడా దేహి - దేహము - దృశ్యము కలిగి ఉన్నప్పటికీ, ‘‘ఇదంతా సందర్భ సత్యము మాత్రమే’’ అని ఎరిగియున్నవాడగుచున్నాడు. తనయొక్క, తదితర సమస్త జీవులయొక్క సహజరూపమును బ్రహ్మముగా ఎరిగి, బ్రహ్మమునందే రమిస్తూ, సమస్తమును తనకు అనన్యమగు బ్రహ్మముగా దర్శిస్తూ ఉంటున్నాడు.

ఘటాకాశ - మఠాకాశ - మహాకాశ దృష్టాంతము :

ఒకచోట ఒక ఘటము (కుండ) ఉన్నది. అందులో ఆకాశము (Space) ఉన్నది. బాహ్యమున గృహాకాశము, మహాకాశము ఉన్నాయి. ఇప్పుడు ఆ కుండ పగిలినప్పుడు లోపల గల ఆకాశము ఏమౌతోంది? నశిస్తోందా? నశించదు. గృహాకాశంలో కలుస్తుంది.

అట్లాగే దేహభావన తొలగినప్పుడు అట్టి బ్రహ్మవిత్ తముడు (బ్రహ్మవిత్ శ్రేష్ఠుడు) బ్రహ్మముతో మమేకమౌతున్నాడు. ఉపాధి నిలయము పొందినప్పుడు కూడా ఆ బ్రహ్మవేత్త (బ్రహ్మవిత్) బ్రహ్మమే అయి ఉంటాడు. తధైవ ఉపాధివిలయే బ్రహ్మైవ బ్రహ్మవిత్ స్వయమ్।
(అనగా) బ్రహ్మవేత్త తాను బ్రహ్మమే అయి ఉండటానికి దేహము ఉండటము-ఉండకపోవటము, దృశ్యము ఉండటము- ఉండకపోవటము, జాగ్రత్ స్వప్న సుషుప్తులు కలిగి ఉండటము - ఉండకపోవటము మొదలైనవి అపేక్షలు - సాపేక్షలు కానేకావు.

ఎందుకంటే ఈ జీవునియొక్క బ్రహ్మీస్వరూపము సర్వదా సహజము, కేవలము, అనునిత్యము, స్వాభావికము అయి ఉన్నది. తనకు అన్యమగు దేనిపైనా ఆధారపడి లేదు.

సర్వత్రా ‘తత్త్వమ్’ - దృష్టితో, ఈ దృశ్యమును సమస్త సహజీవులను, సమస్త సంగతి - సంఘటన - సందర్భములను అంతర్ - మనన పూర్వకంగా మననము చేయువాడు తానే - ‘బ్రహ్మము’ (సోఽహమ్) అగుచున్నాడు.

క్షీరం క్షీరే యథా క్షిప్తం : గ్లాసుడు పాలు తెచ్చి బిందెలోని పాలలో పోస్తే మొత్తము ఏకమగు పాలు (క్షీరము) అగునట్లు బ్రహ్మముతో ఏకమై, సర్వాత్మకమగు బ్రహ్మమే తానై ‘‘బ్రహ్మమునకు అభిన్నుడు’’ అగుచున్నాడు.

తైలం తైలే, జలం జలే. సంయుక్తమ్ ఏకతా యాతి : నూనె నూనెతో కలిస్తే ఏకమగు నూనె అగునట్లు, జలమును జలములో పోసినప్పుడు ఏకజలమగునట్లు, ఆత్మతో ఆత్మ ఏకమై ఏకాత్మత్వము ఆ మునిచే (ఆత్మోపాసకునిచే) పొందబడుచున్నది.

విదేహముక్తి

ఓ మునీశ్వరులారా! ‘తత్త్వభావన’ను ఆశ్రయించుచున్నవాడు క్రమంగా - అఖండాత్మానందము అనుభవించుచు విదేహముక్తుడై (కేవాలాత్మస్వరూపము నందు దేహ మనోబుద్ధులతో సహా, పాంచభౌతిక దృశ్యముతో సహా) - బ్రహ్మముతో అనన్యము అగుచున్నాడు. అనగా తన సహజమగు బ్రాహ్మీస్వరూపముతో అనన్యత్వము యొక్క స్వానుభవి అయి ప్రకాశించుచున్నాడు.

అట్టి ‘‘విదేహకైవల్యము’’ అనబడే అఖండితమగు (జీవ - బ్రహ్మముల అభేదమగు) సన్మాత్రత్వమును (కేవల సత్ స్వరూపము) (లేక) బ్రహ్మ భావమును) ఉపాసించువాడు - ఏష యతిః న ఆవర్తతే పునః। మరల జీవాత్మ భావనకు, దృశ్యాంతర్గత సాంసారిక బంధములకు తిరిగిరాడు. సర్వత్రా సర్వదా సమస్తమునకు పరమైన బ్రహ్మమే తానై ఉంటాడు.

- - -

బ్రహ్మమునందు బంధ మోక్షములు లేవు

మునీశ్వరులు : అంగీరస పరబ్రహ్మమూర్తీ! ఈ జగత్తు మాకు బంధము కాకుండటానికి ఉపాయము ఏది?

అంగిరస మహర్షి : ఒకడు మసకచీకటిలో త్రాడును చూచి ‘పాము’ అని అనుకోవటము వంటిదే - ‘ఈ జగత్తు నాకు బంధము’ అని తలచటము. ‘ఇది త్రాడు మాత్రమే’ అని తెలుసుకొన్నతరువాత ఇక ‘పాము’ అని భావించిన సందర్భమునకు చెందిన వికారములు మిగులుతాయా? మిగలవు. సర్వ అభాసలు (All Illusions) వినిర్గమము (withdrawn) అవుతాయికదా। సత్ - అసత్తులు, బంధ - మోక్షములు మొదలైనవన్నీ వృత్తులు (Illusionary Avocations) మాత్రమే. అంతేగాని ‘అన్యము’ అనునదే లేని అనన్యమగు ఆత్మయందు అన్యమగు వస్తు-సంఘటన-సందర్భ వ్యవహారములు ఎట్లా ఉంటాయి? ఉండవు.

మునీశ్వరులు : పదార్థముల గురించిన ఆవృత్తులు (Thick Avocations) మా బుద్ధియందు తొలగేది ఎట్లా?

అంగీరసమహర్షి :

శ్లో।। అస్తీతి ప్రత్యయో యశ్చ, యశ్చ నాస్తీతి వస్తువి
బుద్ధేరేవ గుణావేతౌ। న తు నిత్యస్య వస్తునః।।

‘‘పదార్థములు ఉన్నాయి - లేవు’’ అనునదంతా బుద్ధియొక్క నిర్వాహక (ప్రవర్తన) లక్షణములు (Functional Features). అవి బుద్ధియొక్క గుణవిశేషాలేగాని నిత్యవస్తువగు ఆత్మకు సంబంధించినవి కావు.

ఇక ‘‘ఆత్మకు బంధము కలుగుతోంది. ముక్తి లభిస్తోంది’’ - అని చెప్పు వాక్యములన్నీ కూడా మాయా కల్పితము. (మాయ = యామా = వస్తుతఃగా లేదు. కల్పనచే ఉన్నట్లు అగుపించునది). అయితే అవన్నీ కూడా శిష్యుని ఉద్ధరించటానికి గురువులచే ఉపాయములుగా ఆశ్రయించబడు పాఠ్యాంశములు. ముముక్షువులను ముక్తికి జేర్చటానికై శాస్త్రములు కొంత కల్పన కలిగి ఉంటాయి.

‘‘ఆత్మకు స్వతఃగానే ఎప్పుడూ కూడా బంధమే ఉండజాలదు’’ - అనునదే ముక్తస్థితి.

సమస్త జీవుల అఖండాత్మ ఎట్టిదంటే…
• నిష్కళము : కలనము లేనిది.
• నిష్క్రియము : నాటక దీపమువలె తాను ఏ హావ - భావములు ప్రదర్శించదు. వాటికి లోనుకాదు.
• శాంతే : పరమశాంతస్వరూపము.
• నిరవద్యే : అవద్యము ఆరోపణలు లేనిది. ‘‘జీవాత్మ-ఈశ్వరుడు’’-ఇత్యాది విభాగములుగా ఏమాత్రము రూపములు పొందనట్టిది.
• నిరంజనము : వక్రత లేనిది. దోషరహితమైనది.
• అద్వితీయే : తనకు వేరైనది, ద్వితీయమైనది ఎక్కడా ఏదీ లేనట్టిది.
• పరేతత్త్వే : సమస్తమునకు పరము (ఆవల)గా ఉన్నట్టిది. ‘‘నీవు’’గా కనిపించేదంతా ‘తానే’ అయినట్టిది. ఈ జగత్తును తన అనుభవముగా పొందుచున్న జీవాత్మయొక్క కేవలస్వరూపమునకు చెందిన తత్త్వమే ‘‘అఖండాత్మతత్త్వము’’.

ఆకాశమునకు ఆకారము లేనట్లే ఆత్మాకారమునకు (ఆత్మతత్త్వమునకు) ‘‘కల్పన’’ అనబడే జగత్, జీవాత్మ మనో కల్పనలు మొదలైనవి ఎక్కడుంటాయి? ఉండవు.

అందుచేత…

ఈ జీవుడు స్వయముగా ఆత్మస్వరూపుడే అయి ఉండగా….

పరమార్థముగా అవన్నీ లేవు.ఆత్మయే ఉన్నది. అది మాత్రమే ‘సత్’. తదితరమైనదంతా స్వతఃగా లేనిది కాబట్టి, సందర్భ కల్పిత స్వర (శబ్ద) విశేషాలే। అసత్తు మాత్రమే। మాటవరుసకు చెప్పుకోబడేవి మాత్రమే! ప్రాజ్ఞులచే అజ్ఞానులకు ‘ఆత్మ’ గురించి బోధించటానికై శాస్త్రముల రూపంగా ‘‘బద్దుడు, ముక్తుడు, మోక్షము, మనస్సు’’ మొదలైనవన్నీ కల్పించి చెప్పబడేవి మాత్రమే।

ఆత్మ సర్వదా స్వస్వరూప, సర్వస్వరూప, సహజస్వరూప ఆది స్వరూపము-అయి ఉన్నది. జగత్ స్వరూపము కూడా అయిఉండి ఉన్నది.

అట్టి సమస్తమునకు అప్రమేయము (unconcerned) అయిఉన్న పరమాత్మ భగవానునికి నమస్కారము.

అట్టి అఖండాత్మానంద స్వరూపుడనగు నాకు నేనే నమస్కరించుచున్నాను.

ఇతి ఆత్మ ఉపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।