[[@YHRK]] [[@Spiritual]]

atharvaSikha Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


అధర్వణవేదాంతర్గత

1     అథర్వశిఖోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్



ఓంకారార్థతయా భాతం తుర్యోంకారాగ్రభాసురం .
తుర్యతుర్యంత్రిపాద్రామం స్వమాత్రం కలయేఽన్వహం ..
శ్లో।। ‘ఓం’ కారార్థతయా భాతం।
తుర్య ‘ఓం’ కార అగ్రభాసురమ్।
తుర్య తుర్య త్రిపాద్ రామం
స్వమాత్రం కలయే అన్వహమ్।।
‘ఓం’కార పరమార్థ స్వరూపులు, ఈ జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు ఆవల నాలుగవ (తురీయ) పురుషులైనట్టివారు, మూడిటియొక్క ప్రకాశక ఓంకార స్వరూపులు, - తురీయాతీత త్రిపదా సమన్వితులు - అగు రామచంద్ర పరమాత్మ సర్వదా స్వస్వరూపమాత్రులే। నాలో ‘నేను’గా కనిపించుచున్నది - వారే। రామోఅహమస్మి। అహం రామః।



ఓం అథ హైనం పైప్పలాదోఽఙ్గిరాః సనత్కుమారశ్చాథర్వణమువాచ
ఓం
1. అథ హి ఏనం (అథ హైనం)
పైప్పలాదో, అంగిరాః, సనత్కుమారశ్చ
అథర్వణమ్ ఉవాచ:
ఒకానొక సందర్భంలో పైప్పలాదుడు, అంగీరసుడు, సనత్కుమారుడు - వీరంతా శిష్యభావముతో అథర్వ మునీశ్వరుని సమీపించి, నమస్కరించినవారై ఇట్లు ప్రశ్నించారు.

భగవన్కిమాదౌ ప్రయుక్తం ధ్యానం ధ్యాయితవ్యం
కిం తద్ధ్యానం కో వా ధ్యాతా కశ్చ ధ్యేయః .
2. ‘‘భగవన్! కిమ్ ఆదౌ ప్రయుక్తం?
ధ్యానం, ధ్యాయితవ్యం?
కిం తత్ ధ్యానం?
కోవా ధ్యాతా?
కశ్చ ధ్యేయః?’’
హే భగవన్!

- మొట్టమొదట ఏది ఉపయోగించబడి సృష్టికర్తచే ఇదంతా సృష్టించబడింది?
- ‘ధ్యానము’ అనగా ఏమి? ధ్యానింపతగినది ఏది?
- ధ్యానమునకు సాధనము ఏది?
- అసలీ ధ్యానించువాడెవ్వడు?
- ధ్యానింపబడునది ఎవ్వరు, ఏది? ధ్యాత-ధ్యేయముల పరస్పర సంబంధము ఎట్టిది?


స ఏభ్యోథర్వా ప్రత్యువాచ .
ఓమిత్యేతదక్షరమాదౌ ప్రయుక్తం ధ్యానం
ధ్యాయితవ్యమిత్యేతదక్షరం
పరం బ్రహ్మాస్య పాదాశ్చత్వారో
వేదాశ్చతుష్పాదిదమక్షరం పరం బ్రహ్మ .
3. స ఏభ్యో అథర్వా ప్రత్యువాచ :-
‘ఓం’ ఇతి ఏతత్ అక్షరం
ఆదౌ ప్రయుక్తమ్ -
ధ్యానమ్, ధ్యాయితవ్యమ్। ఇతి।
ఈ ప్రశ్నలు విని వారికి అథర్వమహర్షి ఈ విధంగా సమాధానం చెప్పసాగారు.
‘ఓం’ అని ఏది వేద శబ్ద ప్రతిపాదితమో, అట్టి ప్రణవాక్షరార్థమే మొట్టమొదటగా అక్షరమై, సర్వదా యథాతథమై ఉన్నది.
అట్టి ప్రణవాక్షరముయొక్క పరమార్థము గురించిన ధ్యాసయే ధ్యానము. ధ్యానింపవలసినది కూడా, అద్దాని అర్థముగా చెప్పబడేదే. ధ్యాత - ధ్యానము - ధ్యేయము (ధ్యానించ బడునది)ల ఏకరూపము (The line of Thinker, Thought and that basing thought) - ఓంకార సంజ్ఞ.
4. ఏతత్ అక్షరమ్ పరంబ్రహ్మ।
అస్య పాదాః చత్వారో ।
వేదాః చతుష్పాత్।
ఇదమ్ అక్షరమ్ పరంబ్రహ్మ।।
పరం బ్రహ్మమే ‘ఓం’ కార ప్రణవము యొక్క ఉద్దేశ్యార్థము.
ప్రణవముయొక్క నాలుగు పాదములు నాలుగు వేదములు.
నాలుగు పాదములతో కూడిన ‘ఓం’ అక్షరము పరబ్రహ్మ స్వరూపము.
(అ + ఉ + మ + అర్ధమాత్ర)



పూర్వాస్య మాత్రా పృథివ్యకారః
ఋగ్భిరృగ్వేదో బ్రహ్మా వసవో గాయత్రీ గార్హపత్యః .
5. పూర్వ అస్య మాత్రా ‘‘పృథివిః’’।
- ‘అ’ కారః।
- స ఋగ్భిః।
- ఋగ్వేదో। బ్రహ్మా।
- వసవో। గాయత్రీ।
- గార్హపత్యః।
ప్రణవము యొక్క మొదటి మాత్ర - ‘అ’కారము.
‘అ’ కారమునకు భౌతికము → పృథివి (Solid).
- ఋక్కులతో (మంత్రములతో) కూడి ఉన్నట్టి ఋగ్వేద రూపము.
- అధి దేవత → బ్రహ్మ.
- పితృదేవతలు → అష్టవసువులు.
- ఛందస్సు → గాయత్రీ.
- అగ్ని → గార్హపత్యాగ్ని (శ్రౌతాగ్నులలో / త్రేతాగ్నులలో మొదటిది).

ద్వితీయాంతరిక్షం స ఉకారః
స యజుభిర్యజుర్వేదో విష్ణురుద్రాస్త్రిష్టుబ్దక్షిణాగ్నిః .
6. ద్వితీయ ‘‘అంతరిక్షగ్ం’’।
- స ‘ఉ’ కారః ।
- స యజుర్భిః,
- యజుర్వేదో।
- విష్ణూ రుద్రాః।
- త్రిష్టుప్।
- దక్షిణాగ్నిః।
ప్రణవము యొక్క రెండవ మాత్ర → ‘ఉ’కారము
- ఇద్దాని భౌతికము→ అంతరిక్షము (ఆకాశము).
- ఇది యజుస్సు (స్తోత్రములు)లతో కూడిన యజుర్వేద రూపము.
- అధి దేవత → విష్ణువు.
- పితృదేవతలు → ఏకాదశ రుద్రులు.
- ఛందస్సు → త్రిష్టుప్.
- యజ్ఞాగ్ని → దక్షిణాగ్ని. (శ్రౌతాగ్నులలో / త్రేతాగ్నులలో రెండవది)

తృతీయః ద్యౌః స మకారః
స సామభిః సామవేదో రుద్రా ఆదిత్యా జగత్యాహవనీయః .
7. తృతీయా ‘‘ద్యౌః’’।
- స ‘మ’ కారః।
- స సామభిః।
- సామ వేదో।
- రుద్రా ఆదిత్యా।
జగతీ।
ఆహవనీయః।
ప్రణవము యొక్క మూడవ మాత్ర → ‘మ’కారము
- ఇద్దాని భౌతికము → ద్యులోకము, స్వర్గము.
- ఇది సామగానములతో కూడిన సామవేద రూపము.
- అధిదేవత → రుద్రుడు.
- పితృదేవతలు → ద్వాదశ ఆదిత్యులు.
- ఛందస్సు → జగతీ.
యజ్ఞాగ్ని → ఆహవనీయాగ్ని. (శ్రౌతాగ్నులలో / త్రేతాగ్నులలో మూడవది)

యావసానేఽస్య చతుర్థ్యర్ధమాత్రా సా సోమలోక ఓంకారః
సాథర్వణమంత్రైరథర్వవేదః సంవర్తకోఽగ్నిర్మరుతో
విరాడేకర్షిర్భాస్వతీ స్మృతా .
8. యా అవసానే అస్య - ‘‘అర్థమాత్రా’’
- చతుర్థ - ‘‘అర్ధమాత్రా’’।
- స సోమలోక।
- ‘ఓం’ కారః।
- స అథర్వణ మంత్రైః।
- అథర్వ వేదః।
- సంవర్తకో అగ్నిః।
మరుతో విరాడే కర్షిః భాస్వతీః స్మృతాః।।
ప్రణవము యొక్క చివర - నాలుగవది ‘అర్థ మాత్ర.’
- అద్దాని భౌతికము - సోమలోకము.
- ఇది ‘ఓం’ కారోచ్ఛారణ-ఉపసంహరణ మౌనరూపము.
- అథర్వణ మంత్రములతో కూడినది. అథర్వణ వేద రూపము.
- యజ్ఞాగ్ని → సంవర్తకాగ్ని. (ప్రళయాగ్ని).
- ఇద్దాని విరాట్టు → మరుత్తులు.
- ఏక ఋషి - భాస్వతి. (సమస్తము భాసింపజేయునది) - అని పిలువబడుతోంది.
అకార - ఉకార - మకారముల చివర అతిసూక్ష్మమై ఉండే ఈ ‘అర్ధమాత్ర’యే నాదస్వరూపము. (మరియు) నాదోప-సంహార మౌన రూపము కూడా.

ప్రథమా రక్తపీతా మహద్బ్రహ్మ దైవత్యా .
9. ప్రథమా ’రక్తపీతా’ -
మహత్, బ్రహ్మదైవత్యా।
‘అ’ శబ్ద ప్రథమమాత్ర యొక్క →
రంగు → రక్తపీతా - ఎరుపు.
(మహత్) శక్తి → స్వర్ణకాంతివంతము.
అధిదేవత → మహత్ బ్రహ్మ. (ఈ సమస్తము తనయొక్క మహత్తుగా కలిగి ఉండుటకు ఆత్మకు ‘సంజ్ఞ’). (బ్రహ్మ దైవత్వము). బ్రహ్మదేవుడు.

ద్వితీయా విద్యుమతీ కృష్ణా విష్ణుదైవత్యా .
ద్వితీయా ‘విద్యుమతీ’-
కృష్ణా, విష్ణు దైవత్యా।
రెండవదగు ‘ఉ’ మాత్ర యొక్క →
రంగు → నలుపు.
శక్తి → విద్యుత్ కాంతి.
అధిదేవత → శ్రీవిష్ణుమూర్తి (విష్ణు దైవత్వము)

తృతీయా శుభాశుభా శుక్లా రుద్రదైవత్యా .
తృతీయా శుభ - అశుభా
శుక్లా,
రుద్రదైవత్యా।
మూడవదగు ‘మ’ మాత్ర యొక్క →
రంగు → శుభాశుభములను ఏకము చేయు తెలుపు.
దాని శక్తి → శుక్ల (తెలుపు) వర్ణము.
అధిదేవత - రుద్రమూర్తి. (రుద్ర దైవత్వము).

యావాసానేఽస్య చతుర్థ్యర్ధమాత్రా
సా విద్యుమతీ సర్వవర్ణా పురుషదైవత్యా .
యావసానే। (య అవసానే)
అస్య చతుర్థ అర్ధమాత్రా।
సా విద్యుమతీ।
సర్వవర్ణా।
పురుష దైవత్యా ।।
నాలుగవదగు అర్ధమాత్రయొక్క →
- కేవల శబ్దముగా చివరిలో పలుకబడునది.
- రంగు - విద్యుమతీ, లక్ష్మీదేవి.
శక్తి → అన్ని రంగులు కలసి ఉన్నట్టి సూర్యకాంతివర్ణము
అధిదేవత → జీవాత్మకు సాక్షి, నియామకుడు అగు పురుషుడు. (పురుష దైవత్యా). కేవల పురుషాకార స్వరూపము.

స ఏష హ్యోంకారశ్చతురక్షరశ్చతుష్పాదశ్చతుఃశిరశ్చతుర్థమాత్రః
స్థూలమేతద్హ్రస్వదీర్ఘప్లుత ఇతి ..
10. స ఏష హి ‘ఓం’కారః
- చతురక్షరః।
- చతుష్పాదః।
- చతుశ్శిరః।
- చతురర్థమాత్రః।
- స్థూలమ్ ఏతత్ హ్రస్వ - దీర్ఘ - ప్లుత ఇతి।
ఓం (1) ఓం (2) ఓం (3) ఇతి।।
నాయనలారా! ఇదియే మనము ధ్యానింపతగినది - ధ్యానింపవలసినది అగు ‘ఓం’కారము. పైన చెప్పబడిన బ్రహ్మ-విష్ణు-రుద్ర పరమ పురుష దైవత్యములు కలిపి ఓంకారము.
- ఇది నాలుగు అక్షరములు కలిగి ఉన్నది (అ+ఉ+మ +అర్ధమాత్ర)
- నాలుగు శీర్షములు కలిగి ఉన్నట్టిది. (జాగ్రత్, స్వప్న, సుషుప్తి- తురీయములు).
- అద్దాని సూక్ష్మము అర్ధమాత్ర. (సర్వాంతర్యామి భావన).
- స్థూలమైనప్పుడు - శబ్ద ఉచ్చారణ
(1) హ్రస్వము (2) దీర్ఘము (3) ప్లుతము….అని చెప్పబడుతోంది.
(1) (2) (3) అంతా ఓంకార రూపమే!
(ఫ్లుతము = సమముగా పోవునది. ఒకే ప్రవాహము).


ఓం ఓం ఓం ఇతి త్రిరుక్త్వా చతుర్థః శాంత ఆత్మాప్లుతప్రణవప్రయోగేణ
సమస్తమోమితి ప్రయుక్త ఆత్మజ్యోతిః సకృదావర్తతే సకృదుచ్చారితమాత్రః
స ఏష ఊర్ధ్వమన్నమయతీత్యోంకారః .
ప్రాణాన్సర్వాన్ప్రలీయత ఇతి ప్రలయః .
ప్రాణాన్సర్వాన్పరమాత్మని ప్రణామయతీత్యేతస్మాత్ప్రణవః .
చతుర్థావస్థిత ఇతి సర్వదేవవేదయోనిః సర్వవాచ్యవస్తు ప్రణవాత్మకం .. 1..
11. త్రి రుక్త్వా (త్రిః ఉక్త్వా)
చతుర్థః శాంత ఆత్మా ప్లుత
ప్రణవ ప్రయోగేన సమస్తమ్
‘ఓం’ ఇతి ప్రయుక్త, ఆత్మజ్యోతిః
సకృత్ ఆవర్తతే।।
ఈ విధంగా త్రిమాత్రలు + చతుర్థ మాత్ర గల ప్రణవమును క్రమముగా ఉచ్ఛరిస్తూ ఉపాసించాలి. ‘‘‘ఆ…..ఉ…..మ…..మ్‌మ్‌మ్……ఓం’’. నాలుగవసారి ఐదు మాత్రల ప్రణవోచ్చారణ ఉచ్చరించబడు గాక! అట్టి రీతిగా ఉచ్చరించు వానికి, ఉపాసించువానికి - ‘‘పరమ శాంతస్వరూపము, సమస్తము తానే అయినది, ఆత్మస్వరూపము….’’అగు ఆత్మజ్యోతి అనుభవరూపముగా క్రమక్రమంగా ప్రకాశమానము కాగలదు.
12. సకృత్ ఉచ్చారిత మాత్ర
స ఏష ఊర్ధ్వమ్
ఉన్నామయతీతి
‘ఓం’కారః।।
ఉచ్చరించిన మాత్రము చేతనే అట్టి ప్రణవము ఆ సాధకుని ఊర్థ్వరూపమగు పరమపదమునకు, ఉత్తమస్థానమునకు తీసుకొని పోవుచున్నది కాబట్టియే ‘ఓం’కారము….అని అనబడుచున్నది.
13. ప్రాణాం తు సర్వాన్ ప్రలీయత-
ఇతి ‘ప్రళయః’।

ప్రాణాం తు స సర్వాన్ పరమాత్మని
ప్రణామయతి -
ఇత్యేతస్మాత్ ‘ప్రణవః’।

చతుర్థ అవస్థిత ఇతి
సర్వ దేవ వేద యోనిః
సర్వ వాచ్య వస్తు ప్రణవాత్మకమ్।
ఓం = ప్రళయము, ప్రణవము, తారము, తురీయము, విష్ణు, బ్రహ్మ, ప్రకాశము, వ్యాపీ, మహేశ్వరః। అదియే ఆత్మ.
ప్రళయము: అట్టి ఓంకార సంజ్ఞయందు ప్రాణతత్త్వముతో సహా సమస్తము లయించినది అగుచున్నది. కాబట్టి ప్రణవమును ‘ప్రళయము’ అని కూడా పిలుస్తున్నారు.
ప్రణవము: ఓంకారోచ్చారణ సకల ప్రాణములను, ప్రాణులను పరమాత్మయందు చేర్పించుచున్నది కాబట్టి → ప్రణామయతి ప్రణవమ్…అని వర్ణించబడుచున్నది.
(జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయములనబడే) 4 అవస్థలను ఆస్వాదించుచున్నట్టిది - కాబట్టి ప్రణవము.
సర్వ దేవతలకు, సర్వ వేదములకు (తెలియబడే సర్వ విషయములకు) యోనిస్థానము (లేక) ఉత్పత్తిస్థానము అయి ఉన్నది. సర్వ వాక్ విషయ (వాచ్య) వస్తువులకు ప్రణవాత్మకమైనది. కాబట్టి ప్రణవము.

దేవాశ్చేతి సంధత్తాం సర్వేభ్యో దుఃఖభయేభ్యః సంతారయతీతి
తారణాత్తారః . సర్వే దేవాః సంవిశంతీతి విష్ణుః . సర్వాణి
బృహయతీతి బ్రహ్మా . సర్వేభ్యోఽన్తస్థానేభ్యో ధ్యేయేభ్యః
ప్రదీపవత్ప్రకాశయతీతి ప్రకాశః . ప్రకాశేభ్యః సదోమిత్యంతః శరీరే
విద్యుద్వద్ద్యోతయతి ముహుర్ముహురితి విద్యుద్వత్ప్రతీయాద్దిశం దిశం భిత్త్వా
సర్వాంల్లోకాన్వ్యాప్నోతి వ్యాపయతీతి వ్యాపనాద్వ్యాపీ మహాదేవః .. 2..
14. దేవాశ్చ ఇతి సంధత్తాం,
సర్వేభ్యో దుఃఖ భయేభ్యః సంతారయతి
ఇతి తారణాత్ ‘తారః’।।
తారమ్: సమస్త దేవతలు ‘ఓం’ (ప్రణవ) స్వరూపులే!
సర్వ దుఃఖ - భయములనుండి శాశ్వతముగా తరింపజేస్తున్నది కనుక తారము. ‘‘సంతారయతి ఇతి తారణాత్ తారమ్’’.
15. సర్వే దేవాః సంవిశంతి ఇతి విష్ణుణాః।
సర్వాణి బృంహయతి ఇతి బ్రహ్మా। (బ్రహ్మ)।
సర్వస్య అంతః స్థానేభ్యో
ధేయ్‌భ్యో ప్రదీపవత్
ప్రకాశయతి - ఇతి ‘‘ప్రకాశః’’।
‘ఓం’ కారము - వర్ణన
విష్ణుః: సర్వ దేవతలు కూడా ఎక్కడ-సంవిశంతము- విశ్రామము - ప్రశాంత పొందుచున్నారో ఆ స్థానమే ‘విష్ణు’ అనబడుతోంది. ఓంకారమే విష్ణువు.
బ్రహ్మ: సకల ప్రాణులు ఎక్కడ మరల సృష్టించబడుచున్నారో, ఆ స్థానమే ‘బ్రహ్మ’! ఓంకారమే బ్రహ్మదేవుడు.
ప్రకాశము: సకల ప్రాణులయొక్క (జీవులయొక్క) హృదయస్థానము నందు ధ్యాన పరాకాష్ఠ అయిన పరమాత్మ - దీపమువలె సర్వదా ప్రకాశించుచుండుటచేత, ‘ఓం’ తత్త్వము ‘ప్రకాశము’ అని అంటున్నారు.
16. ప్రకాశేభ్యః ‘సత్-ఓం’
- ఇతి అంతఃశరీరే విద్యుత్‌వత్
ద్యోతయతి ముహుర్-ముహుర్
- ఇతి విద్యుత్‌వత్ ప్రతీయాత్
దిశం దిశం భిత్వా
సర్వాన్ లోకాన్ వ్యాప్నో-తి,
వ్యాపయతీతి వ్యాపనాత్ వ్యాపీ మహాదేవః।।
విద్యుత్: ‘ఓం సత్’ స్వరూపంగా సమస్త ప్రకాశకములకు ప్రకాశకమై సర్వదేహములలోను మరల మరల ద్యోతకమగుచు ప్రకాశించుచుండటం చేతను…., (యోగాభ్యాసులగు యతుల అంతరంగ దృష్టికి) మెరుపువలె ప్రకాశించుచుండుటచేతను ‘విద్యుత్’ అని వర్ణించబడుతోంది.
వ్యాపీ-మహాదేవ: సర్వదిక్కులయందును అంతర్యామిగా ప్రవేశించినదై, సర్వలోకములందు వ్యాపించి ఉండటంచేతను, సర్వమును వ్యాపింపజేస్తూ ఉండటంచేతను (వ్యాపకత్వమును వ్యాపింపజేయుచుండటచేతను)- ‘మహాదేవుడు’ అని అభివర్ణించబడుచున్నది!

పూర్వాస్య మాత్రా జాగర్తి జాగరితం ద్వితీయా స్వప్నం తృతీయా
సుషుప్తిశ్చతుర్థీ తురీయం మాత్రా మాత్రాః ప్రతిమాత్రాగతాః
సమ్యక్సమస్తానపి పాదాంజయతీతి స్వయంప్రకాశః స్వయం బ్రహ్మ
భవతీత్యేష సిద్ధికర ఏతస్మాద్ధ్యానాదౌ ప్రయుజ్యతే .
17. పూర్వ అస్య-మాత్రా జాగర్తి జాగరితం,
ద్వితీయా స్వప్నం। తృతీయా సుషుప్తిః।
చతుర్థీ తురీయం।
(మాత్ర = State, Phase, స్థానము, దశ) ఓం = ఆత్మ
ఓంకారముయొక్క మొదటి మాత్ర → జాగరిత రూపమగు జాగృత్,
రెండవ మాత్ర → స్వప్నము,
మూడవ మాత్ర → సుషుప్తి,
నాలుగవ మాత్ర → (చ) తురీయము.
మాత్రా మాత్రాః ప్రతిమాత్రా గతాః
సమ్యక్ సమస్తానపి
పాదాన్ జయతి-ఇతి, స్వయంప్రకాశః
స్వయం బ్రహ్మ భవతీతి ఏష సిద్ధికర
ఏతస్మాత్ ధ్యాన - ఆదౌ ప్రయుజ్యతే।।
ఒక్కొక్క మాత్ర తదితర మాత్రలయందు లయించుచున్నది. లయకారి అగు ఆత్మ స్వయం ప్రకాశకము. దానిని ప్రకాశింపజేయునది మరొకటేదీ లేదు! ఆత్మయే త్రిపాదములకు ఊర్థ్వమున ఉదయించు పురుషుడు. స్వయంబ్రహ్మ స్వరూపము. అట్టి ‘ఓం’కార ధ్యానము ‘పూర్వ-తత్‌పూర్వ స్వస్థానము’ను సిద్ధింపజేయగలదు. అందుచేత సిద్ధికరము.
ఓంకారము ఈ కారణముగా ధ్యాన సమాధులందు వినియోగించబడుచున్నది!

సర్వకరణోపసంహారత్వాద్ధార్యధారణాద్బ్రహ్మ తురీయం .
సర్వకరణాని మనసి సంప్రతిష్ఠాప్య ధ్యానం విష్ణుః
ప్రాణం మనసి సహ కరణైః సంప్రతిష్ఠాప్య ధ్యాతా రుద్రః
ప్రాణం మనసి సహకరణైర్నాదాంతే పరమాత్మని
సంప్రతిష్ఠాప్య ధ్యాయీతేశానం ప్రధ్యాయితవ్యం
18. సర్వకరణ ఉపసంహారత్వాత్
ధార్య - ధారణాత్
బ్రహ్మ ‘‘తురీయమ్’’।
సర్వ కరణాని మనసి
సంప్రతిష్ఠాప్య ధ్యానం ‘‘విష్ణుణాః’’।।
తురీయము: సర్వ ఇంద్రియ - ఇంద్రియ విషయములు ఉత్పన్నమగుచున్న, (మరియు) ఉపసంహరించబడుచున్న సంస్థానము అవటం చేతను, సమస్తము తన ధారణ కావడం చేతను-బ్రహ్మమును ‘తురీయము’ అని కూడా అంటూ ఉన్నారు.
విష్ణువు: ఈ స్థూల దేహముయొక్క పంచ జ్ఞానేంద్రియములను, పంచ కర్మేంద్రియములను మనస్సునందు ప్రతిష్ఠింపజేసి, మనస్సుచే చేయు ఆత్మధ్యానముయొక్క రూపమే/విషయమే ధ్యానమే విష్ణువు. ఆ ధ్యాని కూడా విష్ణువే।
19. ప్రాణం మనసి సహకరణైః సం ప్రతిష్ఠాప్య
ధ్యాతా రుద్రః। ప్రాణం మనసి సహకరణైః
నాదాంతే పరమాత్మని
సంప్రతిష్ఠాప్య ధ్యాయీత్
ఈశానం ప్రధ్యాయితవ్యగ్ం।।
ప్రాణములను, మనస్సును ఇంద్రియములతో సహా ఆత్మయందు స్థాపించు ధ్యాసగలవాడే రుద్రుడు. అధ్యాసయే శివధ్యానము.
ప్రాణ - మనో - ఇంద్రియములలో నాదముయొక్క చిట్టచివర వేంచేసియున్న పరమాత్మ యందు సంప్రతిష్ఠితుడైయున్న ఈశానుని ధ్యానము చేయుదురు గాక! విశేషంగా అట్టి ఈశానుని ధ్యానము చేయుటచే ఆ ధ్యాని ఈశానుడు అగుచున్నాడు.

సర్వమిదం బ్రహ్మవిష్ణురుద్రేంద్రాస్తే సంప్రసూయంతే సర్వాణి చేంద్రియాణి సహ భూతైర్న
కారణం కారణానాం ధ్యాతా కారణం తు ధ్యేయః సర్వైశ్వర్యసంపన్నః
శంభురాకాశమధ్యే ధ్రువం స్తబ్ధ్వాధికం క్షణమేకం క్రతుశతస్యాపి
చతుఃసప్తత్యా యత్ఫలం తదవాప్నోతి
20. సర్వమ్ ఇదమ్ బ్రహ్మ, విష్ణు, రుద్ర -
ఇంద్రాః। తే సంప్రసూయంతే।
సర్వాణి చ ఇంద్రియాణి
సహ భూతైః న కారణం।
కారణానాం ధాతా। ధ్యాతా కారణం తు।
ధ్యేయః। - సర్వైశ్వర్య సంపన్నః సర్వేశ్వరః
శంభుః ఆకాశ మధ్యే।
ఓ పైప్పలాద (మరియు) తదితర మునీంద్రులారా! ఇది వినండి! బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు…వీరందరు కూడా (ఒకానొక జీవుని ధారణా- ఔన్నత్యమే కనుక)…పుట్టుక గలవారు సకారణులు. ఈ సర్వ ఇంద్రియములకు భూత సృష్టికి మునుముందే ఉన్నట్టి ఓంకార సంజ్ఞాత్మతత్త్వమునకు పుట్టుకయే లేదు. అకారణము ఈ విధంగా సమస్త కారణములకు కారణమైనవాడు, సర్వసృష్టులు తనయొక్క సంపదయే అయినవాడు, సర్వేశ్వరుడు, శంభుడు, ఓంకారుడు అగు పరమాత్మయే ధ్యేయవస్తువు.
ఆయనయే భావాభావముల మధ్యగా ఆకాశ స్వరూపుడై సమస్త జీవులందు, సమస్త జీవులుగా సర్వదా వేంచేసి ఉన్నవారు.
21. ధ్రువం స్తబ్ధ్వాధికం
క్షణమేకం, క్రతుశతస్యా-పి
చతుస్సప్తత్యాయత్ ఫలం
తత్ అవాప్నోతి।।
ఈ విధంగా సర్వాత్మకుడు, సర్వతత్త్వస్వరూపుడు అగు పరమాత్మను ఒక్క క్షణము ధ్రువముగా ధ్యానించువాడు - వంద క్రతువులను 74 సార్లు నిర్వర్తించిన ఫలము లభించగలదు. అట్టి మహత్ ఫలమును సముపార్జించుకుంటున్నాడు.

కృత్స్నమోంకారగతిం చ సర్వధ్యానయోగజ్ఞానానాం
యత్ఫలమోంకారో వేద పర ఈశో వా శివ ఏకో
ధ్యేయః శివంకరః సర్వమన్యత్పరిత్యజ్య సమస్తాథర్వశిఖైతామధీత్య
ద్విజో గర్భవాసాద్విముక్తో విముచ్యత ఏతామధీత్య ద్విజో
గర్భవాసాద్విముక్తో విముచ్యత
ఇత్యోగ్ం సత్యమిత్యుపనిషత్ .. 3..
22. కృత్స్నమ్ ‘ఓం’కార గతిం చ
సర్వధ్యాన యోగజ్ఞానానాం
యత్ ఫలమ్ ‘ఓం’కారో వేద పర ఈశోవా।।
ఓంకార ధ్యానము చేయువాడు సమగ్రముగా ప్రణవస్వరూపమును ఎరుగుచున్నాడు. సకల ధ్యాన - యోగ - జ్ఞానముల అంతిమ ఫలము ఓంకార ధ్యానముగా పొందబడుచున్నాయి.
23. శివ ఏకో ధ్యేయః, శివంకరః
సర్వమ్ అన్యత్ పరిత్యజ్య,
సమస్త అథర్వ శిఖా ఏతామ్ అధీత్య
ద్విజో గర్భవాసాత్ విముక్తో విముచ్యత।
- ఏతామ్ అధీత్య,
ద్విజో గర్భవాసాత్ విముక్తో విముచ్యత।
ఓ ముని శ్రేష్ఠులారా! బ్రహ్మమానస పుత్రులారా! సర్వమును త్యజించి ఏకస్వరూపుడగు (జీవో శివః - శివో జీవః రూపమగు) శివపరమాత్మనే ధ్యేయముగా కలిగి ఉండెదరు గాక!
ఈ సమస్తము ఓంకార స్వరూపమే అని త్రోవచూపు ఈ అథర్వ శిఖోపనిషత్ పఠించి అర్థం చేసుకొను ద్విజుడు జనన - మరణ - గర్భవాస దుఃఖములనుండి విముచ్యుడు అగుచున్నాడు.
అట్టి రెండవ (ఉత్తర) జన్మ (ఆత్మ ధ్యాస) పొందుచున్న ద్విజుడు గర్భవాస దుఃఖము మరల పొందక, కైవల్యము పొందుచున్నాడు.
ఇతి ‘ఓగ్ం’ సత్యమ్।
ఇతి ఉపనిషత్
ఓం సత్యమ్। ‘ఓం’ ఏవ సత్యమ్।

ఇతి అథర్వశిఖోపనిషత్।।
ఓం శాంతిః శాంతిః శాంతిః




అధర్వణ వేదాంతర్గత

1     అథర్వశిఖ ఉపనిషత్

అధ్యయన పుష్పము


ఓం
  • ‘ఓం’కారము యొక్క పరమార్థము అయి ఉన్నవారు,
  • ఓంకారము యొక్క అగ్రముగా (పరాకాష్ఠగా) ప్రకాశించువారు

  • తురీయమునకే తురీయముగా త్రిపాదులైనట్టి వారు అగు ఆత్మారాముని శరణు వేడుచున్నాము.

ఒకప్పుడు మునిశ్రేష్ఠులగు (దేవతలకు వజ్రాయుధము సిద్ధించటానికై, తన భౌతికదేహమును సమర్పించిన ‘త్యాగమూర్తి’ అగు దధీమహర్షి మనుమడు, పిప్పలాదమహర్షి కుమారుడు అగు) పైప్పలాదుడు, బ్రహ్మ మానసపుత్రులగు అంగీరస సనత్కుమారులు - ఆత్మజ్ఞానాధ్యయన సముత్సాహులై ధ్యానము గురించి విశేషాలు వినాలనే ఉద్దేశ్యంతో, భక్తి - ప్రపత్తులతో కూడిన శిష్యోఽహమ్ భావనతో, ప్రజ్ఞావంతుడు - మహనీయుడు అగు అథర్వణ మహర్షిని సమీపించారు. హృదయపూర్వక ప్రదక్షిణ - నమస్కారములు సమర్పించారు.

ఇట్లు ప్రశ్నించారు!

తండ్రీ! భగవన్! అథర్వణమహర్షీ! సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు సృష్టికి ముందుగా దేనిని ధ్యానం చేసి సృష్టికి ఉపక్రమించారు?

అదంతా విని అథర్వ మహర్షి చిరునవ్వు చిందిస్తూ ఇట్లు సమాధానము చెప్పసాగారు.

అథర్వణ మహర్షి:

మొట్టమొదట సృష్టికి ముందే ఏది సత్‌స్వరూపమై (కేవలమగు ‘ఉనికి’ రూపమై), అఖండమై ఉన్నదో:-

మరల చెప్పుచున్నాను -

‘ఓం’ అను శబ్దముచే ఉపాసించబడునది-మీయొక్క, నాయొక్క, సమస్త జీవులయొక్క స్వస్వరూపము, సహజరూపము అగు ఆత్మయే!

అట్టి పరబ్రహ్మమునకు - అస్య పాదాత్ చత్వారో వేదా!

ఋక్‌వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము - 4 వేదములు నాలుగు పాదములు.

నాలుగు వేదములు ‘ఓం’ అను ఉచ్ఛారణను ప్రసాదిస్తున్నాయి.

ప్రణవమునకు (ఓం) శబ్దపూర్వకంగా నాలుగు పాదములు (అ+ఉ+మ +అర్ధమాత్ర) కలిగి ఉన్నది. ఇది గ్రహించి ఓంకారమును ధ్యానిస్తూ ఉపాసించాలి.

ఇంకా కూడా, అట్టి ప్రణవముయొక్క చతుష్పాదములగురించి వివరించుకుంటున్నాము.

నాలుగు మాత్రలు. జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయ మాత్రలు - అని కూడా గ్రహిస్తూ, అప్పుడు ఆశ్రయిస్తూ ఉండాలి.

ప్రణవము యొక్క (ఓంకారముయొక్క) మొదటిపాదము (లేక) మాత్ర (అ-ఉ-మ-అర్ధమాత్రలలో మొదటిది)। ‘‘అ’’

ప్రణవముయొక్క రెండవ పాదము (లేక) మాత్ర : ‘‘ఉ’’

(పౌరాణిక నామములు : అజుడు, ఏకపాదుడు, అహిర్బుధ్న్యుడు, హరుడు, శంభుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు, త్వష్ఠ, రుద్రుడు)’’.

[
ఏకాదశరుద్రులు పాఠాంతరములు:

బ్రహ్మవైవర్త పురాణము : మహత్తుడు, మహాత్మా, మతివంతుడు, భీషణుడు, భయంకరుడు, ఋతధ్వజుడు, ఊర్థ్వకేశుడు, పింగళాక్షుడు, రుచి, శుచి కాలాగ్నిరుద్రుడు.

భారతము : అజపాదుడు, అహిర్భుధ్న్యుడు, త్ర్యంబకుడు, వృషాకపి, శంభుడు, జపాలి, దైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు.
]

ప్రణవము యొక్క మూడవ పాదము / మాత్ర : ‘మ’కారము. ‘‘మ’’

(త్రేతాగ్ని = యజ్ఞ వేదికకు తూర్పు దిక్కుగా నాలుగు మూలలు కుండలలోనికి ఆహ్వానించే త్రి-అగ్నులు. యజ్ఞమునందు ఆహుతులు సమర్పించటానికి మునుముందుగా ఋత్త్విక్కులు త్రేతాగ్నులను ఆహ్వానించి ప్రతిక్షేపించేవి).

ప్రణవము యొక్క చివ్వరి - నాలుగవ మాత్ర : అర్ధమాత్ర-మ్ (నిశ్శబ్దము) ‘‘అర్ధమాత్ర’’

ఇది అకార - ఉకార - మకారములకు ముందు - మధ్య - చివ్వర కూడా ప్రకాశిస్తూ నాదరూపమైయున్నది.
నాద బిందు - కళాతీతమై కూడా ఉన్నది.

- - -

అంతేకాదు! ‘ఉపాసన’ కొరకై ఈ విధంగా ‘సూచన’ చేయబడుతోంది.

ప్రథమమగు ‘అ’కార మాత్ర : రంగు → రక్తపీతము, ఎరుపు.
కాంతి → స్వర్ణము.
అధిదేవత → మహత్ బ్రహ్మము / బ్రహ్మదేవుడు.

రెండవదగు ‘ఉ’కార మాత్ర : రంగు → కృష్ణము, నలుపు.
కాంతి → విద్యుత్ మెరుపు కాంతి.
అధిదేవత → విష్ణుదేవుడు.

మూడవదగు ‘మ’కారమాత్ర : రంగు → తెలుపు.
రూపము → శుభాశుభములను ఏకము చేయు తెలుపు రూపము. శివము.
అధిదేవత → రుద్రభగవానుడు.

నాలుగవది, చివరగా ఉన్న అర్ధమాత్ర : రంగు → విద్యుత్‌మతి ఎరుపు. లక్ష్మీరూపము. (రంగు) సర్వవర్ణ - సర్వవర్ణాశ్రయీ.
అధిదేవత → జీవాత్మ నియామకుడగు పురుషుడు. పరమపురుషుడు. స్వస్వరూపాత్మ.

ఈ విధంగా….వేద - వేదాంత - వేదాంగములు ఉపాసనకొరకై అర్ధసహితంగా సూచిస్తున్న ప్రణవము లేక ఓంకారమును ఈ ఈ లక్షణములను ఎరిగి ఉచ్ఛరిస్తూ ఉపాసించుదురు గాక। (ఆత్మయే ఆ ఉపాసన వస్తువు).

ఆత్మయే = ప్రణవము. ఓంకారము.
చతురక్షరః = అ + ఉ +మ + అర్ధమాత్ర అనబడే 4 అక్షరముల సమగ్రరూపముగాను
చతుష్పాదః = జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయములనే నాలుగు సంచార స్థానములుగా గలదిగాను,
చతుశ్శిరః = మనో - బుద్ధి - చిత్త - అహంకారములనబడే నాలుగు శిరస్సులు కలిగియున్నట్టిదిగాను,
చతుర్‌రూపములు : స్థూలము - హ్రస్వము - దీర్ఘము - ప్లుతము (మూడు మాత్రలకాలము గల స్వరము)
(లేక) స్థూలము - సూక్ష్మము - కారణము - కేవలసాక్షిగాను

ఓం ఓం ఓం ఇతి : పైన చెప్పబడుచున్న వివరణలు దృష్టిలో కలిగి ఉంటూ ఓం ఓం ఓం త్రి ఉచ్చారణచే ఉపాసించబడుగాక!

ఈ విధంగా….

అకార - ఉకార - మకారములు త్రిరుక్తములను, నాలుగవదగు కేవల శబ్ద మాత్రమగు ‘మ్‌మ్…..’ నిశ్శబ్దములతో కూడినది -
అగు ప్రణవమును…..,
- సమస్తము ప్రణవస్వరూపముగాను,
- ప్రణవము నుండి ఉత్పత్తి - స్థితి - లయము - మౌనము కలిగి ఉన్నట్టిదిగాను,
- పరమ శాంతము, సమస్తము - ఆత్మస్వరూపము గాను,

అవగాహనతో ఓంకారమును ఉచ్ఛరిస్తూ - ఉపాసిస్తూ ఉండగా….సర్వము జ్యోతి స్వరూపముగా అనుభవమునందు ఆవిష్కరించబడ గలదు.

‘ఇదంతా మమాత్మయొక్క తేజోరూపమే’ అని అనిపించటము ప్రారంభమవగలదు.

ప్రణవము ఉచ్ఛరించుచుండగా తత్సమయంలోనే ఆ సాధన - సాధకుని క్రమంగా పరమపదమునకు, ఆత్మోన్నతస్థానమునకు చేరుస్తోంది. ఉన్నామయతి! (It is uplifting జీవాత్మ to the state of పరమాత్మ). అదియే ప్రణవముయొక్క శబ్దార్థము.

అందుచేత, అట్టి అర్థమును ఉద్దేశ్యిస్తూ ‘ఓంకారము’గా చెప్పబడుతోంది. ‘ఓం’ ఉచ్ఛారణలో ప్రభవమగు ఊర్థ్వనాదము జీవుని ఊర్థ్వముఖం చేస్తూ ఈశ్వరస్థానమునకు, ఈశ్వరత్వమునకు చేరుస్తోంది. అందుకే ‘ఓంకారము’గా వర్ణించబడుతోంది! ఏష ఊర్థ్వమ్ ఉత్‌నామయతి - ఇతి ఓంకారః।

ప్రాణాం తు సర్వాన్ ప్రలీయతే ఇతి ప్రలయః

‘‘శక్తి’’ ప్రాణరూపమును దాల్చినదై, ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమాన - సప్రాణ రూపములతో ఈ జగత్తులకు ధారణగా, - ఆధారముగా అగుచున్నది. అట్టి ప్రాణశక్తి ఆత్మయందే బయల్వెడలి, తిరిగి ఆత్మయందే ప్రలయము (Dissolved) పొందుతోంది. అందుచేత ఆత్మను ఊర్థ్వముగాగల ‘ఓం’ కారముగాను, ప్రణవముగాను ‘ప్రలయము’ (That in which Prana Sakthi dissolves) అని కూడా పిలుస్తున్నారు.

ప్రాణాంతు స సర్వాన్ పరమాత్మని ప్రణామయతి ఇత్యేతస్మాత్ ‘ప్రణవః’।

ఓంకారణోచ్ఛారణ - సకల ప్రాణులను పరమాత్మయందు చేర్పించుచున్నది. అనగా ‘సకల ప్రాణులు నాయొక్క ఆత్మరూపమే’ అని అనుభూత పరచుచున్నది. అందుచేత ప్రణామయతి - ప్రణవః। ఆత్మయందు సర్వము ఏకము చేస్తున్నదగుట చేత కూడా ‘ఓం’కారమును ప్రణవము - అని పిలుస్తున్నారు.

చతుర్ధావస్థిత ఇతి ప్రణవః।

ఏది జాగ్రత్‌కు, స్వప్నమునకు (అట్లాగే) సుషుప్తికి కూడా కేవల సాక్షియో, అద్దానిని అనుక్షణికానుభవంగా ప్రసాదిస్తోంది. కాబట్టి - ప్రణవము అని చెప్పబడుతోంది. [ చతురీయము = తురీయము = ప్రణవము ].

సర్వదేవ - వేదయోని - కారణేన ప్రణవః।

సర్వదేవతలు, 4 వేదములు….వీటన్నిటియొక్క ఉత్పత్తి స్థానము అయి ఉండటంచేత కూడా ‘ప్రణవము’ అని చెప్పబడుతోంది.

సర్వ వాచ్య వస్తుః ప్రణవాత్మకమ్।

వాక్‌కు విషయమగు సర్వశబ్దములు, వాటి అర్థములు ‘ఓం’కారము నుండి బయల్వెడలుచు, ఓంకార రూపములే అయి ఉన్నాయి.

అందుచేత ఈ సర్వము ఓంకార రూపమే! ప్రణవాత్మకమే! ఆత్మాత్మకమే।

ఇది ఉచ్ఛారణ - ఉపాసనలచే ఆత్మానుభూతమౌతోంది. కాబట్టి ‘ప్రణవము’ అని చెప్పుకుంటున్నాం!

ఇంకా కూడా : -

సర్వదేవతలు ఓంకార స్వరూపులే! ప్రణవాత్మకులే! అందుచేతనే ఏ దేవతా ఉపాసన అయినా సరే….‘ఓం’ అను ప్రణవోచ్చారణతో ప్రారంభిస్తున్నాము.

అంతే కాదు.

తారమ్

ప్రణవం - సర్వేభ్యో దుఃఖ-భయేభ్యః సంతారయతి। ఇతి తారణాత్ ‘తారః’।

సర్వ దుఃఖ - భయములనుండి సర్వదా సర్వత్రా తరింపజేస్తోంది. కనుక ‘ఓం’….శబ్ద బ్రహ్మ ప్రణవమును ‘తారమ్’ → తరింపజేయునది (తారకమ్)….అని వర్ణించుచున్నారు.

సర్వే దేవాః సంవిశంతి ఇతి ‘విష్ణుః’।

సర్వదేవతలు ప్రణవమునందు ప్రవేశించి ప్రశాంతతను ఆస్వాదిస్తున్నారు. అందుచేత ప్రణవమే విష్ణువు. విష్ణువు ప్రణవస్వరూపుడే అయి ఉన్నారు. అందుకే…,
- శాంతాకారమ్, భుజగశయనమ్।
- శాంతానందమయమ్ విష్ణుణాః।
- విశ్వమ్ విష్ణుః।
ఇత్యాది వర్ణనలతో ప్రణవమే విష్ణు రూపముగా, విష్ణు తత్త్వముగా చెప్పబడుతోంది.

సర్వాని బృంహయతి ఇతి బ్రహ్మ।

సకల ప్రాణలు ఎందులోంచి బయల్వెడలి, వృద్ధిని పొందుచున్నారో, ఆ స్థానమే ప్రణవము. అందుచేత ప్రణవమే బ్రహ్మము. (మరియు) సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు ప్రణవస్వరూపుడే అయి ఉన్నారు. ఆయన యొక్క సృష్టి కూడా బ్రహ్మ స్వరూపమే।

ఇతి → పరబ్రహ్మయేవ ప్రణవః। ప్రణవమునుండియే సృష్టికర్త, సృష్టి బయల్వెడలుచున్నాయి.

ప్రకాశము

సర్వస్య అంతః స్థానేభ్యో ధ్యేయేభ్యో ప్రదీపవత్ ప్రకాశయతి…ఇతి ప్రకాశః।

ప్రణవము ‘ప్రకాశము’ అని కూడా పిలువబడుతోంది. సర్వప్రాణుల యొక్క (సర్వజీవుల యొక్క) హృదయ స్థానములో నిశ్చల దీపమువలె ప్రకాశించుచున్న ఆత్మయే ప్రణవార్థము. అందుచేత ప్రణవమును ‘‘ప్రకాశము (మరియు) సర్వ ప్రకాశకము కూడా’’ - అని అంటున్నారు. ‘‘నేను నేను’’ అను ఆత్మజ్యోతి ప్రకాశరూపమే ప్రణవము.

(ప్రకాశము అనగా ‘భౌతికమైన వెలుగు’ అని పరిమితంగా అర్థంగా తీసుకోకూడదు. మరి?) ఈ ప్రణవతత్త్వమగు ఆత్మ సర్వశరీరాలలోను అంతరంగా - విద్యుత్ (తేజో-వెలుగు) శక్తిగా ప్రకాశిస్తోంది. సమస్తమును తెలివి (Enlightenment) చే అనుభవముగా రూపమవ్వటంచేత ప్రకాశము అట్టి ప్రకాశమే ‘ప్రణవము’.

ఈ సర్వ దేహాలలోను

సర్వదా ప్రకాశిస్తున్నదియే ప్రణవము. యోగులకు ధ్యానములో సర్వతత్త్వస్వరూపముగా కనబడు ప్రకారమే ప్రణవము.

‘‘మెరుపు తీగవలె మరల మరల జగత్తంతటా, సర్వభౌతిక దేహాలలోను ద్యోతకమగుచున్నదే ప్రణవము’’ - అనే అవగాహన, భావనను జోడించి ప్రణవోచ్ఛారణ చేయాలి! మెరుపువలె ప్రకాసిస్తోంది కాబట్టి ‘వైద్యుతము’ అని ఓంకార సంజ్ఞయగు ఆత్మ గురించి (ప్రణవము గురించి) చెప్పుచున్నారు!

- - -

అట్టి ప్రణవము (లేక) ఓంకారము (లేక) ఆత్మచైతన్యము -
- విద్యుత్‌వలె (మెరుపువలె) ప్రకాశిస్తూ….,
- సర్వ దేహముల యందును, అణువణువునందు, ఈ దృశ్యమునందు సర్వ దిక్కులందు తనయొక్క చైతన్య ఘన స్వరూపముతో నింపి ఉంచుతూ….,

సర్వాన్ లోకాన్ వ్యాప్నోతి, వ్యాపయతీతి -
సర్వ లోకములందు సర్వదా ఆక్రమించుకొని ఉన్నది.

ఆభరణములలో బంగారమువలె, తరంగములలో జలమువలె, శిల్పములో శిలవలె సర్వత్రా ఆత్మయే వ్యాపించినదై ఉన్నది. ఈ దృశ్యానుభవరూపమైనదంతా అన్నివైపులా వ్యాపింపజేస్తూ ఉన్న ఆత్మయే ప్రణవము.

మహాదేవుడు

వ్యాపనాత్ వ్యాపీ ఇతి ‘‘మహాదేవః’’। ప్రణవ స్వరూప ఆత్మయే - తాను అంతటా చైతన్యరూపమై, పూర్ణమై ఉంటూనే ఈ జగత్ రూపంగా కనిపింపజేసేదంతా ప్రదర్శిస్తోంది. తనయొక్క వ్యాపకత్వమును సర్వే సర్వత్రా వ్యాపింపజేయుచున్నది కాబట్టి ఆత్మను ‘‘మహాదేవుడు’’….అని అంటున్నాం!

- - -

ఇంకా ఓంకారము లేక ప్రణవము యొక్క మాత్రల విషయమై ఆత్మజ్ఞుల (మరొకతీరైన) దర్శన, ఉపాసనల గురించి చెప్పుకుంటున్నాము - వినండి.

ప్రణవము యొక్క……,

మొట్టమొదటి మాత్ర → జాగరితము : విశ్వవిన్యాస రూపము. ఈ జాగృత్ రూపముగా ప్రదర్శనమగుచున్నదంతా కూడా పూర్వమాత్ర! ఆత్మయొక్క ‘‘జాగర్తి - వర్తన’’ రూపమగు జాగ్రత్. ఇది భౌతికమైన ఇంద్రియానుభవము. (‘విశ్వుడు’ - అను ఆత్మ పురుషుని పురుషకారము). ఇంద్రియములతో బాహ్య విషయ సంబంధరూపము (లేక) అనుసంధానము.

రెండవ మాత్ర → స్వప్నము : స్వప్నాంతర్గమైనదిగా అనుభూతమగుచున్నదంతా ఆత్మయొక్క ద్వితీయ విన్యాసస్వరూపము. ఆత్మయొక్క స్వకీయ ఊహాకల్పనారూప ఇంద్రియ భావనా విన్యాసము. ఆత్మపురుషుని స్వకీయ కల్పనయే ‘తేజసుడు’ అను హృదయాకాశభావనా నిర్మిత, (స్వప్న) విషయ - సంబంధరూపము.

మూడవ మాత్ర → సుషుప్తి : సర్వ ఇంద్రియానుభవములను, (ఆవేశ-కావేశ-ఆశ-అభిప్రాయాది ప్రదర్శనములను), (అట్లాగే) ఊహా విన్యాసానుభవములను - తనయొక్క ‘మౌనము’ అనే విభాగములో (అంతరమున) దాచి ఉంచి, ఇక నిర్విషయానందముతో ద్వితీయ రహితంగా (అద్వితీయంగా) ఉండి ఉంటున్నట్టి ఆత్మ యొక్క ఒక విన్యాసము. స్వకీయ విషయ రహిత నిశ్చబ్ద - మౌన - జడ ధారణరూపము. (ఆత్మయొక్క ‘ప్రాజ్ఞ’ - పురుషకారము).

నాలుగవ మాత్ర→తురీయము : జాగృత్ మాత్రను, స్వప్నమాత్రను, సుషుప్తిమాత్రను స్వయంకృతముగా కల్పించుకుంటూ ఉన్నట్టిది. వాస్తవానికి తాను యథాస్థానమునందే ఉండి ఉంటున్నప్పటికీ…, ఏది జాగ్రత్ - స్వప్న - సుషుప్తులలోనికి నడచివెళ్ళి - వస్తూ ఉన్నదో అట్టి త్రిమాత్రా సంచార కేవల ప్రజ్ఞారూపము.

‘ప్రణవము’గా అభివర్ణించబడే ఆత్మ….

అట్టి అప్రమేయ - అఖండ - స్వయం ప్రకాశకమగు ఆత్మయే మనందరి సహజ - స్వస్వరూపము. ‘ఓం’ శబ్దముతో (ప్రణవము ద్వారా) ఉచ్చరించబడుతూ, ఉపాసించబడుచూ రాగా మనకు (సాధకునికి) అట్టి ఆత్మత్వము సిద్ధిస్తోంది. అందుచేతనే, ‘ప్రణవోపాసన’ - ఆత్మస్థాన సిద్ధికరముగా చెప్పబడుతోంది.

‘‘అ-ఉ-మ’ ల సమగ్రమగు ‘ఓం’ కారమే ప్రణవము. ఆత్మయే ప్రణవము. అందుచేతనే ధ్యానమునకు, దేవతా ఉపాసనకు, సమాధి నిష్ఠకు, సర్వ సాధనలకు మొట్టమొదట ‘ఓం’ అనే శబ్దోచ్ఛారణతో అవన్నీ ప్రారంభించటము, ఉపక్రమించటము జరుగుతోంది.

బ్రహ్మమే ఓంకారార్థము. ‘తురీయము’ అని విష్ణు - బ్రహ్మ - రుద్ర - ఇత్యాది దేవతా రూపమని ఎందుకు అంటున్నారో, ఇంకొక విశేషము వినండి!

ఓంకారము యొక్క ఉపాసనచే ఈ సాధకుడు తురీయుడుగా, సర్వాత్మకమగు విష్ణువుగా, రుద్రుడుగా, ఈశానుడుగా అగుచున్నాడు.

తురీయ రూపము: సర్వ కరణ ఉపసంహారత్వాత్ ధార్య-ధారణాత్ ఇతి బ్రహ్మ తురీయమ్ : సర్వ ఇంద్రియ విషయములను ఉపసంహరించ బడినప్పటికీ,…అప్పటికీ కూడా ‘‘ధారణ చేయువాడు - ధారణ’’ రూపమై సర్వత్రా ప్రకాశించుచుండటం చేత ప్రణవమే తురీయము. అదియే ఆత్మ! ఈ జీవుడు వాస్తవానికి సహజమగు తురీయ స్వరూపుడే. ఇందులో ఎవ్వరిపట్లా ఎప్పుడూ కూడా సందేహించవలసిన పనియేలేదు.

విష్ణువు

స్థూలదేహము యొక్క పంచ జ్ఞానేంద్రియములను, పంచ కర్మేంద్రియములను మనస్సునందు ప్రతిష్ఠింపజేసి, ఇకప్పుడు ధ్యానము నిర్వర్తించెదరు గాక। అట్టి ఆ ధ్యానమునకు ఏది ధ్యేయమైయున్నదో (That which is becoming there as subject for chanting / adoring) …. అదియే విష్ణువు. అట్టి ఆ విష్ణు ధ్యానము చేయు జీవుడు విష్ణువే అగుచున్నాడు. సర్వకరణాని సం ప్రతిష్ఠాప్య ధ్యానమ్ - విష్ణుణా। ‘విష్ణువే’ అయి ఉన్న ఈ జీవుడు తిరిగి తన విష్ణుత్వమును ధ్యేయముగా కలిగి, ధ్యానము చేసి తిరిగి ‘విష్ణువే’ అగుచున్నాడు.

రుద్రుడు

ప్రాణం మనసి సహకరణైః సంప్రతిష్ఠాప్య, ధ్యాతా - రుద్రః।
ఎవ్వరైతే ఓంకారోపాసనా ప్రభావంచేత ప్రాణములను, ఇంద్రియములను, మనస్సును కూడా ఆత్మయందు ప్రతిష్ఠింపజేస్తాడో, ఆతడే రుద్రుడు అయి, రుద్రస్థానము చేరి, రుద్రలోకము నందు స్థిరనివాసులగుచున్నాడు. రుద్రుడైనవాడే రుద్రుని అర్చిస్తూ రుద్రత్వము తిరిగి పొందుచున్నాడు (నా రుద్రో రుద్రమర్చతి।).

ఈశానుడు

ప్రాణం మనసి సహ కరణైః నాదాంతే పరమాత్మ సంప్రతిష్ఠాప్య, ‘ధ్యాయీ’త్ ‘ఈశానం’ ప్రధ్యాయితవ్యగ్ం।

ప్రాణము, మనస్సు, ఇంద్రియములు, ఇంద్రియ విషయములను ‘ఓం’ కారోపాసన ద్వారా నాదాంతము (The other end of sound)నకు జేర్చి, ఆవల (పరమ్)గల ఆత్మయందు (లేక, పరమాత్మయందు) సర్వమును లయింపజేస్తూ నిర్వర్తించే మార్గమే ఈశానము.

సమస్తము ఈశానునిలో ప్రదర్శనమై, ఈశానునియందే ‘లయము’ అగుచున్నది. ఈ జీవుడు తన ఈశానత్వమును తిరిగి ధ్యానముచే సంతరించుకుంటున్నాడు.

‘‘ఈ సమస్తము నాయందే (జలంలో తరంగములవలె) బయల్వెడలి, నాయందే ‘ఉనికి’ని కొనసాగిస్తూ, చివరికి నాయందే లయిస్తోంది’’ - అను భావనను ‘‘ఆశ్రయించటము, ఉపాసించటము, నిశ్చలమవటము’’లకు చేయు ప్రయత్నమే ‘‘ఈశానవ్రతము’’ అనబడుతోంది.
అట్టి ఈశానమే ధ్యాన వస్తువు. జీవుడు జేరవలసినది అట్టి ఈశానత్వమునకే!

ఈ జీవుడు అట్టి కేవలాత్మధ్యానముచే ‘ఈశానుడు’ అగుచున్నాడు.

- ఈ సమస్తములో నేను = ‘జీవుడు’।
- నాయందున్న ఈ సమస్తము = ‘ఈశానుడు’।
ఉభయము ఈశానాత్మదేవ ప్రదర్శనములే.

- - -

ఓ పైప్పలాది మొదలైన మునిసత్తములారా! ఇంకా కూడా ఇది శ్రద్ధగా వినండి! ఇక్కడ ఒక ముఖ్యమైన విశేషము మీ ముందుంచుచున్నాను.

బ్రహ్మ-విష్ణు-రుద్ర-ఇంద్ర….ఇవన్నీ ఒకానొక జీవునియొక్క బ్రహ్మోపాసనచే చేరుచున్న స్థానములు. ధారణయొక్క ఔన్నత్యముచే సముపార్జించుకోగల ఔన్నత్యములు. అయితే…., బ్రహ్మ - విష్ణు - రుద్ర - ఇంద్రులు కూడా పుట్టుకగలవారేనని గ్రహించండి.

ఈ సర్వభూత - ఇంద్రియ సృష్టికి ఆవల ప్రకాశమానమై వెలుగొందుచూ, ఈ సమస్తముగా వెలుగొందుచున్నట్టి ‘ఓం’కారతత్త్వము అనబడు సంజ్ఞారూపమగు ఆత్మకు పుట్టుకలేదు. అదియే పరమాత్మ. ‘జీవుడు’ అనునది అద్దాని ఒక అంశ.

ఈ కారణం చేత….

  • సర్వకారణ - అకారణములకు కారణమైనవాడు,
  • సర్వ సృష్టులు తన సంకల్ప స్వరూపముగా కలిగి ఉన్నట్టివాడు…,
  • సర్వము తనయొక్క సంపదగా కలిగియున్నట్టివాడు….,
  • సర్వేశ్వరుడు….,

    అగు స్వస్వరూప భగవానుడే ధ్యేయ వస్తువు! ఆయనయే ‘శంభుడు’ అని, బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులు అని కూడా ఉపాసించ బడుచున్నారు.

బిడ్డలారా! మీ స్వస్వరూపాత్మయే ఓంకారార్థము.

జలము నుండి బయల్వెడలి జలములో సంచరించి, జలమునందే లయము పొందే తరంగము జలము కానిదెప్పుడు?

ఆత్మనుండే సర్వము బయల్వెడలుతోంది. సర్వము ఆత్మగానే ఉంటోంది. ఆత్మయందే (జ్ఞానదృష్టిచే) లయిస్తోంది. ఇదంతా ఇట్లా కనిపిస్తూ ఉన్నా కూడా, ఇదంతా ఆత్మగాని క్షణమే లేదు. ‘‘నీవు, నేను, - మనమంతా జీవాత్మ సంప్రదర్శనములు, మన మన జీవాత్మానుభవములు’’ - ఇవన్నీ కలిపియే - ‘ఆత్మ’ అని, ‘ఆత్మయొక్క విన్యాసము’ అని ‘ఓం’ అని గ్రహించినవారై ఉండండి.

ఓ పిప్పలాద, అంగీరస, సనత్కుమారులారా! తదితర శ్రోతలారా!
ధ్యానము చేయువాడు తనయొక్క ధ్యాస చేతనే దృశ్యమును పొందుచున్నాడు. అంతకుమించి దృశ్యమునకు కారణము లేదు. అనగా ధ్యాసయే జగత్ రూపము. దృష్టియే సృష్టి.

→ అను సందర్శనమును నిర్వివాదాంశము, నిశ్చలము చేసుకోండి.

అట్టి ఆత్మపురుషుడు - ఆలోచన-ఆలోచనల మధ్య ఆకాశ స్వరూపుడై, ఆకాశ మధ్యస్థానుడై, నిర్వికారుడై చైతన్యస్ఫూర్తిగా వేంచేసి ఉన్నారు. ఆయననుండి బయల్వెడలు ఆలోచనలు ఆయనను బంధించటమేమిటి? ఒక నవలా రచయిత యొక్క రచనలోంచి బయల్వెడలిన ఏదో దృశ్యవర్ణన ఆ రచయితను బంధించటము జరుగుతుందా? ఎట్లా జరుగుతుంది?

అట్టి ఆత్మ పురుషుడే నీవు। తత్ త్వమ్ అసి।
నేనే ఆతడు। సోఽహమ్।
ఆతడే ఈ సర్వము. తదేవేదమ్ - తదేవ ఇదమ్।
మనమంతా అనునిత్యంగా ఓంకారానంద ఆత్మస్వరూపులమే!
‘కాదు’ అంటే జీవులము. ‘అవును’ అంటే ‘అప్రమేయ ఆత్మానంద’ స్వరూపులము.
ఇంతకుమించి వేరే ఏదో ఎక్కడో ఎన్నడో మరొకటి అయి లేదు.

ఫలశ్రుతి

ఈ విధంగా సర్వాత్మ స్వరూపుడు - స్వస్వరూపమునకు అభిన్నుడు, ఓంకారార్థమాత్రుడు అగు పరమాత్మను ఒక్క క్షణం ధ్యానించినా కూడా ఈ జీవాత్మ మహత్తరఫలములను పొందగలడు.

అట్టి ‘ఆత్మాఽహమ్’ను ధ్రువముగా ఒక్క క్షణం ధ్యానించినవాడు….
- వంద క్రతువులను 74 సార్లు నిర్వర్తించిన ఫలమును నిర్విరామముగా పొందుచున్నవాడగుచున్నాడు. మహత్ ఫలములను సిద్ధించుకుంటున్నాడు.

ఓంకార స్వరూపమును ధ్యానించు యోగి సమస్త జీవులయొక్క ప్రణవస్వరూపమును ఎరిగినవాడగుచున్నాడు.

సకల ధ్యాన - యోగ - జ్ఞానముల అంతిమ ఫలము ఒక్క ఓంకార ధ్యానముచే పొందబడుచున్నది.

కనుక ఓ మునులారా! సమస్త ముముక్షువులారా!

సర్వమును దేహముతో నిర్వర్తిస్తూనే, మనస్సుతో త్యజించినవారై ఉండండి. ఒక్క ‘ఏక-స్వ’ స్వరూపుడగు శివపరమాత్మనే ధ్యేయముగా కలిగి ఉండండి.

అనేకముగా ఇదంతా కనిపిస్తూ ఉన్నప్పటికీ, ఒక్కటిగా ఏకముగా అనిపించటమే ఓంకార ధ్యానము యొక్క ధ్యేయము!

ఈ అథర్వ శిఖోపనిషత్ ప్రతిపాదిస్తున్న ఓంకార ధ్యానముయొక్క అంతిమాశయమును అర్థము చేసుకొను ద్విజుడు ఇక జనన - మరణ - గర్భవాసములను పొందడు. వాటినన్నిటినుండి ‘విముచ్యుడు’ (EVER RELIEVED) అగుచున్నాడు.

తనయొక్క కేవలీ (Absolute) స్వరూపమును సర్వత్రా దర్శించుచున్నవాడై, ఆత్మధ్యాసచే కైవల్యము పొందుచున్నాడు.

జన్మ - కర్మలకు అతీతము, కేవలసాక్షి అయి - ఈ సర్వమును పరమానందాత్మ స్వరూపముగా ఆస్వాదించుచున్నాము.

ఇతి ‘ఓగ్ం’ సత్యమ్। సత్యమేవ జయతే।

ఇతి అథర్వశిఖ ఉపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।